అనంతం అంతు చూసిన వాడు..

 

-అరుణ పప్పు

~

 

కుంభకోణం నుంచి విజయనగరం దాకా దసరా సమయంలో పని నుంచి దొరికిన కొద్దిరోజుల ఆటవిడుపులో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలను చూసి వద్దామని బయల్దేరాం. ‘టెంపుల్ టూరిజం’ తప్ప మరేదీ అంత ప్రముఖం కాని మన పరిస్థితుల పట్ల విసుగు నాకు. అయినాగాని, ఆ సందర్శనలో మతాన్నీ సైన్సునీ మించిన విశాలత్వమేదో నా అనుభవంలోకి రావడం అత్యంత సుందరమైన భావనగా అనిపించింది.శరత్కాలపు లేత ఎండ మమ్మల్ని దారి పొడుగునా ఎక్కడా ఇబ్బంది కలక్కుండా కాపాడింది.

పాండిచేరి అరవిందాశ్రమం, చిదంబరంలోని నటరాజ దేవాలయం తర్వాత మా మజిలీ కుంభకోణం.కుంభకోణంలో ప్రసిద్ధ దేవాలయమేదో ముందుగా మాకేం తెలియదు. కాని ఇంటి నుంచి బయల్దేరే ముందే, ‘కుంభకోణం మనకు అత్యంత పుణ్యక్షేత్రం’ అన్నారు మా నాన్నగారు. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మస్థలమదే. ఆయన ఇల్లు చూద్దామని, ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలేమైనా ఉంటాయేమోనన్న ఆసక్తితో మేం కుంభకోణం ప్రయాణం కట్టాం.
మనం పోగొట్టుకున్న మేథావిగణితం తప్ప మరేదీ పట్టని రామానుజన్ ఇక్కడ ఎఫ్ఏ కూడా పాసవలేకపోయాడు. కాని జి. హెచ్. హార్డీ చొరవతో 1914లో లండన్‌కి ప్రయాణం కట్టిన ఆయన కాంపోజిట్ నంబర్స్ మీద చేసిన పరిశోధనలకు పట్టా లభించింది, లండన్ మేథమెటికల్ సొసైటీ, రాయల్ సొసైటీల్లో సభ్యుయ్యాడు. 1918లో కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ ఫెలో అయిన తొట్టతొలి భారతీయుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. శాకాహారం దొరకక, విటమిన్ లోపంతో ఆయన వ్యాధినిరోధక శక్తి క్షీణించి టీబీ బారిన పడి భారతదేశానికి తిరిగి వచ్చి 32 ఏళ్ల వయసుకే (1920లో) చనిపోయాడు రామానుజన్. ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి 1957లో రెండు సంకలనాలుగా ఆయన రచనల్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన 125 జయంతి సందర్భంగా కలెక్టర్స్ వాల్యూమ్స్ వేసింది. తమిళనాడు డిసెంబరు 22ను ‘స్టేట్ ఐటీ డే’గా జరుపుకొంటోంది. ఆయన 75 జయంతి సందర్భంగా ప్రభుత్వం ఒక తపాలాబిళ్లను విడుదల చేసింది. ప్రస్తుతానికి మనం ఆయన పుట్టిన రోజు డిసెంబరు 22ను ‘నేషనల్ మేథమెటిక్స్ డే’గా జరుపుకొంటున్నాం. రామానుజన్ కృషి నంబర్ థియరీలో, ఫిజిక్స్‌లో, స్ట్రింగ్ థియరీలో చాలా విలువైనదంటారు

మేథమెటీషియన్ చిదంబరం నుంచి కుంభకోణం వరకూ – చిన్నాపెద్దా పల్లెటూళ్లు, పచ్చని వరిపైరుతో నిండిన పొలాలు, పెద్ద ముగ్గులు తీర్చిన ఇళ్ల ముంగిళ్ల మీదుగా మా ప్రయాణం సాగింది.కావేరి, అరసలార్ నదుల మధ్యలో ఉండే కుంభకోణం తెలుగులో ఒక జాతీయంగా ఎలా స్థిరపడిందో తెలియదుకాని, ప్రళయకాలంలో అమృతం ఉన్న కుంభం (కుండ) కొట్టుకుపోతూ ఉంటే బ్రహ్మ దాన్ని తెచ్చి రహస్యంగా ఇక్కడ దాచిపెట్టాడట. అందువల్ల ఇది కుంభకోణం అయింది.కుంభకోణంలోని దేవాలయాలతో పాటు
మహామహమ్ పుష్కరిణి చాలా ప్రసిద్ధమైనది. మన పుష్కరాల్లాగా పన్నెండేళ్లకోసారి మాఘ పున్నమినాడు జరిగే ‘మహామహమ్’లో మునకలెయ్యడానికి లక్షలకొద్దీ భక్తులు వస్తారు. ఇది మొన్నీమధ్యే జరిగింది.
బ్రిటిష్‌వాళ్ల కాలంలో విద్యాకేంద్రాలు విరివిగా ఏర్పడటంతో కుంభకోణం ‘కేంబ్రిడ్జ్ ఆఫ్ సౌత్ ఇండియా’గా పేరు పొందింది. ఈ ఊరు తమలపాకులు, వక్కలకీ, ప్రశస్థమైన కాఫీకీ ప్రసిద్ధి. వాటితో పాటు ఇత్తడి, కంచు విగ్రహాలు పూజాసామగ్రి తయారీకీ ప్రసిద్ధి. మన దగ్గర దుకాణదారులెక్కువమంది అక్కడినుంచే వాటిని దిగుమతి చేసుకుంటారు. అలాగే కుంభకోణంలో పట్టు పరిశ్రమ పెద్దది. ప్రసిద్ధి చెందిన త్రిభువనం చీరల తయారీలో ఈ పట్టును ఉపయోగిస్తారు. ఈమధ్యే కుంభకోణం ఎరువుల తయారీ కేంద్రంగా కూడా విస్తరిస్తోంది. 2004లో జరిగిన అగ్నిప్రమాదంలో తొంభైమందికి పైగా చిన్నారులు చనిపోయిన సంఘటన కుంభకోణం చరిత్రలో చెరిగిపోని మచ్చ.

మేమక్కడకు చేరేప్పటికల్లా విశాలమైన ఆది కుంభేశ్వర దేవాలయంలో దసరా జాతర జరుగుతోంది. ప్రాకారం లోపం కనీసం లక్షమంది ఉన్నారంటేనే అదెంత పెద్ద ఆలయమో అర్థమవుతుంది. ఆ జనసందోహంలో తప్పిపోకుండా అనుకున్న చోటికి తిరిగి రావడానికి మాకు విశ్వప్రయత్నమయింది.కుంభకోణంలో అడుగుపెడుతూనే మా నాన్నగారి ఆతృత రెట్టింపయ్యింది. ప్రయాణ బడలిక ఎంతున్నా, ఆకలి విపరీతంగా ఉన్నా కూడా ఆయన శ్రీనివాస రామానుజన్ ఇల్లెక్కడో అప్పటికప్పుడే అడిగి కనుక్కోవడానికి నిశ్చయించుకున్నారు. తిరిగి వస్తూనే ఆయన చెప్పిన సంగతిదీ.
‘నీకు తెలుసా? ఎవరో ఒక పెద్దాయనను రామానుజన్ ఇంటి గురించి అడిగాను. అది చూడటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారా అని ఆశ్చర్యపోయాడాయన. ఒక లెక్కల మేస్టారిననే గౌరవానికే ఆయన నాకు కాఫీ ఇప్పించి ఆ ఇల్లు చూపెట్టి మళ్లీ ఇక్కడ తీసుకొచ్చి దిగపెట్టి వెళ్లారు! ‘ అని.

మర్నాడుదయమే మేం సారంగపాణి దేవాలయం వీధిలోని ఆ ఇంటికి వెళ్లాం.కృష్ణనీలపు రంగు వేసిన గుమ్మం, కిటికీతో పాతకాలపు పెంకుటిల్లు. మధ్యన వసారా, చివరన వంటిల్లు, పెరడు, బావి. అంతే. రోడ్డు వైపునుండే పడకింట్లో ఉన్న చెక్క మంచం, వసారాలో ప్రతిష్టించిన రామానుజన్ విగ్రహం, వెనక ఆయన గురించిన పాత ఫోటోలు. అంతే మరేమీ లేదక్కడ.

పుస్తకాల్లోనో, ఇంటర్నెట్లోనో లభ్యం కాని కొత్త వివరాలూ లేవు. శాస్త్ర యూనివర్సిటీ వాళ్లు ఉన్నంతలో బాగు చేసి నిర్వహిస్తున్న ఆ ఇంటి కి పర్యాటకులంటూ నిత్యం వచ్చిపోయేదెవరూ ఉండరు. అందువల్ల దుమ్ము కాస్త పేరుకునే ఉంటుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే అదొక రకమైన చిత్రమైన భావనేదో కలిగింది. పాదరసం వంటి మేథగల గణిత శాస్త్రవేత్తను అతి చిన్నవయసులోనే పోగొట్టుకున్న దేశ కాల పరిస్థితులను తలచుకుని మనసు దుఃఖమయమైంది.

ఆ అరుగు మీదే కూర్చుని రామానుజన్ అత్యంత కఠినమైన ఈక్వేషన్లను సాధించేవాడని, దాదాపు 3900 ఈక్వేషన్లను ప్రతిపాదించాడని గుర్తు చేసుకున్నప్పుడు శరీరం ఒకలాంటి వివశత్వానికి లోనైంది. ఎదురుగా సుమారు 150 అడుగుల ఎత్తు, 12 అంతస్తులతో ఆకాశాన్ని తాకుతూ కనిపిస్తున్న సారంగపాణి దేవాలయ గోపురం ఆయనకు స్ఫూర్తినిచ్చేదని, ఆ ప్రాకారాల్లోని గచ్చు మీద సుద్దముక్కతో ఆయన లెక్కలు చేసేవాడని గుర్తుచేసుకుంటే కళ్లు చెమర్చాయి.’దైవాన్ని గురించిన ఆలోచన ఇవ్వలేని ఏ గణిత సూత్రమూ నాకు అర్థవంతంగా అనిపించదు. ఆ కోవెల్లోని కోమలవల్లి (మహాలక్ష్మి )అమ్మవారే తనకు స్ఫూర్తి ‘ అన్న రామానుజన్ మాటలు జ్ఞాపకమొచ్చాక ఆ తల్లిని దర్శిస్తుంటే మనసు ఆ్రర్దమైపోయింది.

సారంగపాణి దేవాలయం వెనకాలే పెద్ద బజారు. గులాబి పువ్వులు, పూజా సామగ్రి హోల్‌సేల్‌గా అమ్మే చోటది.ఒకవైపు నుంచి దట్టంగా మేఘాలు కమ్ముతున్న మధ్యాహ్నపుటాకాశం తల మీద. కంటికెదురుగా గులాబీల రంగు, గాఢమైన వాటి పరిమళం, అరటినారలతో పాటు తమ మాటలనూ నవ్వులనూ కలిపి గులాబీలను పొడవాటి దండలుగా చకచకా అల్లుతున్న శ్రామికులు.. ఇవన్నీ కలిసి ఒక్క క్షణం నేను విజయనగరం గంటస్తంభం బజారులో ఉన్నానేమో అన్న భ్రాంతిలోకి నెట్టేశాయి.అదెందుకంటే కుంభకోణం రావడానికి ముందే నేను విజయనగరంలో యు.ఎ.నరసింహమూర్తిగారింటికి వెళ్లాను.

అప్పటికి కొద్ది నెలలైంది ఆయన మరణించి. కన్యాశుల్కం మీద అథారిటీగా, సంప్రదాయ సాహిత్య విమర్శకుడిగా ఆయన ఎక్కువమందికి తెలిసిన పెద్దమనిషి. నాకాయన పెదనాన్నగారవుతారు.సాహితీలోకానికి ఆయన కృషి ఆయన రాసిన విమర్శనాత్మక పుస్తకాల మేరకే తెలుసు. మాకు ఆయన సాహితీవ్యాసంగాన్ని మించిన నిండైన వ్యక్తిత్వం, ఆ పుస్తకాల్లో కనిపించని జీవిత దృక్పథం, కఠిన పదజాలంతో నిండిన విమర్శలను సైతం స్థిమితంగా స్వీకరించగలిగిన నెమ్మదితనం – ఇవన్నీ తెలుసు. ఆయన లేని ఇంట్లోకి అడుగుపెడుతున్నానన్న భావనకే ఒళ్లు జల్లుమంది. ఆయన చెబుతుంటే పుస్తకాలను రాసి పెట్టేవారు ఆయన భార్య రవణ. నాకు దొడ్డమ్మ. ఆయన పుస్తకాల గదిని చూపిస్తూ ఆమె కూడా అదే అన్నారు ‘మనుషులు శాశ్వతం కాకపోవచ్చు కాని, వాళ్ల పనిలోని స్ఫూర్తి మనల్ని అంత త్వరగా వదిలిపోదు కదా’ అని.
విజయనగరం – కుంభకోణం : ఈ రెండు ప్రాంతాల సందర్శనా వెన్వెంటనే జరిగినది కావడం పూర్తిగా యాదృచ్ఛికమే. కాని వాటి నుంచి అందిన స్ఫూర్తి నన్ను రోజువారీ పేరుకునే దుమ్ము నుంచి శుభ్రం చేసింది. నా హృదయాన్ని తేటపరిచింది. అటు శ్రీనివాస రామానుజన్ – ఇటు యూఏ నరసింహమూర్తిగార్ల జీవితాలు, నెమ్మదైన స్వభావాలు, నిరంతర అధ్యయనశీలురైన వాళ్ల వ్యక్తిత్వాలు నాలోని ఏ చైతన్యాన్ని, ఏ వివేకాన్ని మేల్కొల్పాయో మాటల్లో చెప్పలేను.

 

ఈ తలపోత ఎందుకంటే రెండు కారణాలు.

మొన్నొకరొచ్చి ‘విశాఖపట్నంలో శ్రీశ్రీ, రావిశాస్త్రి ఇళ్లెక్కడున్నాయో తెలుసా, మనం చూడటానికి వీలుందా?’ అని అడిగితే తెల్లముఖం వెయ్యవలసి వచ్చింది. ఏవైనా జ్ఞాపకాలు భద్రంగా ఉంటే కద, ఏ రంగంలోనైనా గొప్పవాళ్ల గుర్తులు ఎన్నో కొన్ని తర్వాతి తరాలకు అందడానికి? రెండోది – శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా హాలీవుడ్ కిందటేడు ‘ద మేన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ అనే చిత్రాన్ని నిర్మించింది. రాబర్ట్ కనిగెల్ రాసిన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ చిత్రంలో దేవ్ పటేల్ రామానుజన్‌గా నటించాడు. టొరంటో, గోవా లాంటి చోట్ల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయి, ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 29న భారతదేశంలో విడుదలవుతోంది. అందుకని.

 

=========
ఈ సినిమా ట్రెయిలర్ లింకు

.
యూఏ నరసింహమూర్తిగారి గురించి విశాఖపట్నం సాహితీప్రేమి రామతీర్థ రాసిన వ్యాసం
శ్రీమతి రవణ గురించి జగద్ధాత్రి రాసిన కవిత ఇక్కడ.

అక్షరాంగి

 

అర్ధరాత్రి తెలియకుండా వదిలి వెళ్ళిన

సిద్ధార్ధుని యశోధర ధు:ఖం కాదు ఆమెది

మురిపించి మైమరపించి కొంగు పట్టుకు తిరిగి

సకల సాహిత్య భువనాలు తిప్పి

అకస్మాత్తుగా రేపల్లె వీడి వెళ్ళిన

బాల కృష్ణుని యశోదా విలాపం ఆమెది

ఆమె మాటల్లో అర్ధ శతాబ్దపు దాంపత్యం

గూర్చిన మరపు రాని ముచ్చట్లు

ముత్యాల సరాల్లా దొరలి పోతున్నాయ్

మధ్య మధ్యలో ఆగలేని కన్నీటి ముత్యాలూ

చెక్కిళ్ల పై జారి కొంగులో ఇంకి పోతున్నాయి

ఏడు పదుల వయసులోనూ చంటి పిల్లాడికి మల్లే

తనతోడిదే లోకమని తిరిగిన వాడు

హఠాత్తుగా ఒంటరిని చేసి వెళ్ళి పోయాడన్నతలపు

ఆమెను నిలవనీయడం లేదు

అయినా జన్మ సంస్కారం తో అందరినీ

ఆత్మీయంగా పలకరిస్తోంది

మీరు లేనిదే వారి అక్షారాలు లేవమ్మా అన్నాం

ఆయనా అలాగే అనేవారు ప్రతి క్షణం

చుట్టుముట్టాయేమో ఆతని స్మృతులు

పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి

కళ్ళు రెండూ నీటి కుండలవుతున్నా …

అంతటి సాహితీ మూర్తికి

కలమూ , కళత్రమూ కాగలిగిన ఆమె ధన్యురాలు

భావాలన్నీ సమ్మిళితమయిన  ఆమె మాటలలో

ఎన్నెన్ని అనుభూతుల ఉద్విగ్నతలను దాచిందో

వారి ఇరువురి జ్ఞాపకాల మల్లెల పరిమళాలను

మాతో ఆప్యాయంగా పంచుకుంది

అహరహము అక్షరం తోనే సహవాసం చేసినా

సాహిత్యాన్నెప్పుడూ సవతిగా భావించలేదు ఆమె

వారి భౌతిక దాంపత్యానికి కొడుకు ఆనవాలు

వారి అలౌకిక సాహిత్యానురాగానికి

ఆయన రచనలు ప్రత్యక్ష ప్రమాణాలు

చూడటానికి వెళ్లింది ఒక కలం మూగ బోయిందని

చూసి వచ్చింది తెగిన వీణ తంత్రులతో

నిరుత్తర అయి విలపిస్తున్న సరస్వతిని

మహాభారత రచన చేస్తున్న వినాయకుడి కలాన్ని

హఠాత్తుగా విధి లాగేసుకున్నట్టు

మూగబోయిన ఆమె కలం చిందిస్తోంది కన్నీరు

సాహితీ  లోకాన అతను చిరంజీవి

ఆతని భావాలను అక్షరీకరించిన ఆమె

అనునిత్యం స్మరణీయురాలు

తల్లీ! సరస్వతి ! అని ఆమెకు

మొక్కి, ఆమె కరణాలను

కళ్ళకు అద్దుకుని

సాహిత్య క్రౌంచ ద్వయానికి ప్రణమిల్లాను

సాష్టాంగ ప్రమాణం చేసుకుని వెనుతిరిగాను

 

 

(కీ.శే. యు. ఏ. నరసింహ మూర్తి గారి భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్లినప్పుడు ఆతని భార్య శ్రీమతి రమణమ్మ గారితో కాస్త సమయం గడిపాక హృది కదిలి…ఇలా …ప్రేమతో జగద్ధాత్రి ) 8.30 (రాత్రి) 1/5/2015 శుక్రవారం