హస్తినలో తెలుగు పూల వనం!

delhi3

ఢిల్లీ ఒక నగరంగా అవతరించి ఎంత కాలమయిందీ?!

చరిత్రకారులు వెయ్యేళ్ళంటారు.

ఐతిహాసికులు ఐదువేల ఏళ్ళనాటి పాండవుల ఇంద్రప్రస్థం ఇదేనంటారు.

ఢిల్లోలో తెలుగు వారి ఉనికి ఎపట్నించీ?

అంతకు ముందటి సంగతి ఎలా ఉన్నా – పదిహేడో శతాబ్దపు జగన్నాథ పండితరాయలు జహంగీర్, షాజహాన్ల ఆదరణలో ఉన్నాడనీ, ఢిల్లీలో నివసించాడనీ, సంస్కృత కవి అనీ, విమర్శా గ్రంథం వ్రాసిన పండితుడని – చరిత్ర చెపుతోంది. కోనసీమలోని ముంగండ (మునిఖండ) అగ్రహారానికి చెందిన ఆయన కవిత్వపు తునకలు మనకిపుడు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్‌లో దొరుకుతాయి. సినిమానుకరణకు గురి అయిన ఆయన జీవిత చరిత్ర 1946 నాటి ‘లవంగి’ అన్న తమిళ చిత్రంలో కనిపిస్తుంది. 50లూ, 60ల నాటి హిందీ సినిమాలలోనూ; మరాఠీ నాటకాలలోనూ ఆయన ఉనికి భద్రపరచబడి ఉంది.

***

ఇరవయ్యో శతాబ్దపు తొలి సంవత్సరాల నాటికి – 1739 నాటి నాదిర్షా ఊచకోతలూ, 1857 నాటి సిపాయిల తిరుగుబాటులాంటి ఘటనలతో చితికిపోయిన ఢిల్లీ నగరపు జనాభా – నాలుగంటే నాలుగే లక్షలు. అందులో తెలుగువాళ్ళు ఉన్నారా? ఓ పదీ పాతికమంది వ్యాపారులు ఉండి ఉండవచ్చు.

1931 దేశరాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారినప్పుడు ఆ నగరం జనాభా ఆరు లక్షలు. 1947 నాటికది పన్నెండయ్యింది. 2016 కల్లా అది కోటీ తొంభై లక్షలకి చేరింది. అందులో తెలుగువాళ్ళ సంఖ్య ఎనిమిది లక్షలు అని ఒక అంచనా.

స్వాంతంత్ర్యానికి ముందే నెలకొన్న పార్లమెంటు వ్యవస్థలో భాగంగా ఆచార్య రంగా లాంటి వారు ఢిల్లీలో నివసించడమన్నది సమీస చరిత్రకు చెందిన వివరం. వేలూ, పదివేలల్లో కాకపోయినా, కనీసం కొన్ని వందలమంది తెలుగువారైనా ఢిల్లీలో నివాసముండి ఉంటారు. స్వాతంత్ర్యం వచ్చాక అది వేలల్లోకి చేరింది. క్రమక్రమంగా అది లక్షలయింది. ప్రస్తుతానికి ఎనిమిది లక్షలకు చేరింది.

ఈ ఎనిమిది లక్షల్లో రాజకీయ జీవితం కోసం వచ్చిన వారున్నారు. ఉద్యోగ రీత్యా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వ్యాపారంలో స్థిరపడ్డవాళ్ళూ చాలామంది ఉన్నారు. జెఎన్‌యూ లాంటి విద్యాసంస్థలు పిలవగా వచ్చిన వాళ్ళూ ఉన్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన రెండో, మూడో తరం వాళ్ళూ ఉన్నారు. ఉద్యోగ వ్యాపారాలలో క్రియాశీలకంగా ఉండే వయసు దాటినా – ప్రదేశం నచ్చడం వల్లనో, ఇతరేతర కారణాల వల్లనో జీవితాంతం వరకూ ఇక్కడే ఉండిపోతున్న వాళ్ళు ఉన్నారు.

***

ఢిల్లీ తెలుగువాళ్ళ సాంఘిక, సాంస్కృతిక జీవనం సంగతేమిటీ?

వందలూ, వేలల్లో తెలుగువాళ్ళు ఢిల్లీలో నివసించడం మొదలెట్టాక సహజంగానే వాళ్ళు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసారు, వాళ్ళను దగ్గరకు చేర్చే ప్రయత్నాలూ మొదలయ్యాయి. అలాంటి ప్రయత్నాల భౌతిక రూపం 1935లో ఆచార్య రంగా లాంటి వాళ్ళ పూనికతో మొదలయిన ‘ఆంధ్రా అసోసియేషన్, ఢిల్లీ’.

తమ తమ పిల్లలకు తెలుగు చదువు అందుబాటులో ఉండాలన్న తపనతో, దుర్గాబాయి దేశ్‌ముఖ్ పట్టుదలతో, 1948లో ‘ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ’ ఏర్పడింది.

ఆ తర్వాత పాపులర్ ఫిలిం సొసైటీలు, తెలుగు అకాడమీలు, తెలుగు సంఘాలు ఎన్నెన్నో వచ్చాయి. మహానగరం గాబట్టి విభిన్న ప్రాంతాల్లోని వేలాది తెలుగువాళ్ళు వారి వారి ప్రాంతాల్లో పండగలూ పబ్బాలకు దగ్గరవడం సహజమయిపోయింది.

***

తెలుగు సాహిత్యం సంగతేమిటీ?!

మూడు నాలుగు శతాబ్దాల నాటి పండితరాయల గురించి చెప్పుకొన్నాం. అది గతం. అది సంస్కృతం.

ఎనిమిది లక్షల తెలుగు వాళ్ళలో తెలుగు సాహిత్యంలో, సాహితీ సృజనలో ప్రవేశం ఉన్నవాళ్ళు, రచనా శక్తి ఉన్నవాళ్ళూ ఓ పదిహేనూ ఇరవై మంది….

సీరియస్ సాహిత్యమంటే ఆసక్తి ఉన్నవారు నాకు తెలిసి – ఢిల్లీలో – ఓ వందమంది ఉన్నారు. నాకు తెలియని వాళ్ళూ, పది మంది దృష్టికీ రానివాళ్ళు మరో ఏడెనిమిది వందల మంది ఉండి ఉంటారు. ‘సీరియస్ సాహిత్యం’ అన్న మడి కట్టుకోకుండా స్వాతి నుంచి సులోచనారాణి వరకూ ఏ పుస్తకాన్నైనా ప్రేమగా చదివేవాళ్లు మరో పదివేలు ఉంటారని అంచనా.

సాహితీప్రియులు ఢిల్లీలో సంఘటితం అవడం అన్నది 1960ల ఆరంభంలో మొదలయింది.

దామోదరం సంజీవయ్య  – భారతదేశపు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి – 1962 నుంచి కాంగ్రెసు అధ్యక్షుడిగానూ, కేంద్రమంత్రిగానూ – చాలాకాలం ఢిల్లీలో గడిపారు. సంగీత సాహిత్యాలు ఆయనకు ఎంతో ఇష్టమైనవి. ఆయన పూనికతోనే అనుకుంటాను – ‘తెలుగు సాహితి’ అన్న సంస్థ ఢిల్లీలో 1962 – 63 ప్రాంతాల్లో ఆవిర్భవించింది.

వాకాటి పాండురంగారావు, మహీధర నళినీమోహనరావు, కొత్తపల్లి వీరభద్రరావు, వాడ్రేవు పతంజలి, క్రొవ్విడి లక్షన్న, వీ. ఆంజనేయ శర్మ, గంటి జోగి సోమయాజులు, రామవరపు గణేశ్వరరావు, తలశిల రామచంద్రరావు… వీరంతా నెలనెలా తెలుగు సాహితి గొడుగు నీడన సంజీవయ్య గారి జనపథ్ నివాసపు పచ్చికబయళ్ళలో కలుసుకోవడం మొదలయింది. తాము తాము రాసినవి చదివి చర్చించుకోవడం, కృష్ణశాస్త్రి, విశ్వనాథ లాంటి వాళ్ళు ఢిల్లీ వచ్చినపుడు వాళ్ళతో సమావేశమవడం – ఓ పదేళ్ళపాటు చురుగ్గా సాగింది.

బలివాడ కాంతారావు, ఉషారాణి భాటియా, అబ్బూరి వరద రాజేశ్వరరావు, అబ్బూరి ఛాయాదేవి, వారితో పాటు తన చివరి రోజుల్లో అబ్బూరి రామకృష్ణారావు ఆ రోజుల్లోనే ఢిల్లీలో ఉన్నారు. అంతకుముందు ఉన్న పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఢిల్లీ నేపథ్యంతో కొన్ని కథలు రాసారు. వాకాటి కథల్లోనూ ఢిల్లీ ఛాయలు కనిపిస్తాయి. బలివాడ ఏకంగా ఢిల్లీ మజిలీ కథలు అంటూ బోలెడు కథలు రాసారు. వాడ్రేవు పతంజలి తన పూనికతో కొన్ని తెలుగు కథలను ఇంగ్లీషులోకి తీసుకువచ్చి స్థానిక ప్రచురణకర్తలు ‘జైకో’ వారితో ప్రచురింప చేసారు… 1973లో గాబోలు – చిన్న వయసులోనే వెళ్ళిపోయిన సంజీవయ్య స్మారక ఉపన్యాసం ఆరుద్ర వచ్చి చేశారు… పుట్టీ పుట్టగానే పరుగులు పెట్టగల ‘కలసి వచ్చిన’ కాలమది – తెలుగు సాహిత్యానికి.

***

ఢిల్లీలో 1969లో స్థాపించబడిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ – జెఎన్‌యూ – పదేళ్ళు తిరిగే లోగా ఒక విలక్షణ విద్యాసంస్థగా రూపొందింది. పాలగుమ్మి సాయినాథ్ లాంటి పాత్రికేయులకీ, సీతారాం ఏచూరి లాంటి దేశనాయకులకూ పుట్టిల్లు అయింది.

ఆ కుదురుకు చెందిన మనిషే టంకశాల అశోక్.

’80ల ఆరంభంలో జంపన, బిబిజి తిలక్ లాంటి సహ విద్యార్థులతో కలసి ‘ప్రగతి సాహితి’ అన్న సంస్థ స్థాపించారు అశోక్. గద్దరు, శ్రీశ్రీ, వరవరరావు లాంటి కవులను ఆ యూనివర్సిటీలోని ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్’కు పిలిచి సమావేశాలు ఏర్పాటు చేశారు. 1977 నుంచి ’84 వరకూ ఆలిండియా రేడియోలో వార్తలు చదివిన పి. చలపతిరావు – సాహితీ రంగంలో ‘శ్రీపతి’ – ఈ ప్రయత్నాలకు తనవంతు సహకారం అందించారు. రామవరపు గణేశ్వరరావు కూడా ఓ చెయ్యి వేయగా ‘ప్రగతి సాహితి’ – కొడవటిగంటి కుటుంబరావు మీద ఆయన పోయినపుడు ప్రామాణికమైన వ్యాసాలతో ఓ పుస్తకం తీసుకువచ్చింది. అతి చక్కని సంస్మరణ సభనూ జరిపింది. అలాగే బాలగోపాల్, చాగంటి తులసి లాంటి వారితో సమావేశాలు ఏర్పాటు చేసింది. గద్దర్ పాటల కార్యక్రమాన్ని ఢిల్లీ నగరంలో ఆరేడు చోట్ల నిర్వహించింది.

***

delhi1

సంజీవయ్య అకాల నిష్క్రమణ, వాకాటి లాంటి వాళ్ళు తిరిగి ఆంధ్ర దేశానికి వెళ్ళిపోవడం లాంటి పరిణామాల వల్ల ‘తెలుగు సాహితి’ కార్యకలాపాలు ఓ దశాబ్దం పాటు సన్నబడ్డాయి. మళ్ళా 1982లో గణేశ్వరరావు, నళినీమోహనరావు, ఇలపావులూరి పాండురంగారావు లాంటివాళ్ళ పూనికతో; వేమరాజు భానుమూర్తి, శిష్ట్లా లక్ష్మీపతిశాస్త్రి, జె. లక్ష్మీ రెడ్డి, గూడూరి ఆదినారాయణ శాస్త్రి లాంటి వాళ్ళ సహకారంతో ‘తెలుగు సాహితి’ పునరుజ్జీవం పొంది మరో ఇరవై ఏళ్ళపాటు ఎంతో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగించింది.

ఈ ఎనభైలలోనే ఢిల్లీ సాహితీ రంగంలో ఇద్దరు విలక్షణ వ్యక్తులు తమ కార్యకలాపాలు ఆరంభించారు. వాడ్రేవు పాండురంగారావు గారు అందులో మొదటి వ్యక్తి.

టెలిఫోన్ డిపార్టుమెంట్‌లో చిరుద్యోగిగా జీవితంలోకి అడుగుపెట్టి, స్వశక్తితో ఆంధ్రా యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో ఎమ్మే చేసి, ఆర్కే నారాయణ్ మీద పీహెచ్‌డీ ముగించి, ఢిల్లీ లోని వెంకటేశ్వర కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన మనిషి రంగారావు. పాఠాలు చెప్పడంతో పాటు ఇంగ్లీషులో వ్యాసాలు, కథలు రాయడం మొదలుపెట్టారు. ఆర్కే నారాయణ్, కుష్వంత్ సింగ్ లాంటి వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకొన్నారు. తన కథల సంపుటిని ‘రవి దయాళ్’ సంస్థ ద్వారా ప్రచురించారు. పెంగ్విన్ వారు భారతదేశంలో తమ కార్యకలాపాలను ఆరంభించి మొదట విడతగా 1987లో ప్రచురించిన నాలుగు నవలలలో రంగారావు గారి ‘ఫౌల్ ఫిల్చర్’ (దొంగ కోళ్ళు – అనవచ్చు) ఒకటి. అతి చక్కని ఆంగ్లంలో రాసిన పరిపూర్ణమైన తెలుగు నవల ఇది.

రెండో మనిషి సుప్రసిద్ధ అనువాదకులు జె. లక్ష్మీరెడ్డి.

ఎక్కడో కడప జిల్లా జమ్మలమడుగు గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి ఒక హిందీ టీచరుగారి ప్రేరణతో ఆ భాషను ప్రేమించి, శాంతినికేతన్‌లో చదువుకొని, సాగర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి ఢిల్లీ లోని హిందీ పిల్లలకు నలభై ఏళ్ళపాటు దయాళ్ సింగ్ కాలేజీలో హిందీ పాఠాలు చెప్పారు!! జ్ఞానపీఠ్ సంస్థ కోసం విశ్వనాథ, బలివాడ రచనలను అనువదించడంతో ఆరంభమైన ఆయన కార్యకలాపం కాలక్రమేణా విస్తరించింది. వాసిరెడ్డి సీతాదేవి, కేశవరెడ్డి, ఓల్గా, పెద్దింటి అశోక్‍కుమార్ లాంటి అనేకానేకుల రచనలను హిందీలోకి అనువదించారు, అనువదిస్తున్నారు. ఆ సాహితీ యాత్రలో ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాదపు ఎవార్డు రావడమన్నది సహజ పరిణామం.

***

రంగారావు ఆంగ్ల రచనలతో పాటు తెలుగు కథలను ఇంగ్లీషులోకి అనువదించే పని మొదలుపెట్టినప్పుడు అనుకోకుండా ఓ ‘సాహితీ వేదిక’ కు పునాది పడింది.

దాసరి అమరేంద్రా, లక్ష్మీరెడ్డి ఆ యజ్ఞంలో పాలుపంచుకోసాగారు. లియోసా సంపత్ కుమార్, కథకులు తోలేటి జగన్మోహనరావు వచ్చి కలిసారు. రంగారావు గారి రెండేళ్ళ కృషి “క్లాసిక్ తెలుగు షార్ట్ స్టోరీస్” అన్న రూపాన పెంగ్విన్ వారి ద్వారా 1995లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మరో మూడు నాలుగేళ్ళకు అదే పెంగ్విన్ వారి ద్వారా రంగారావు గారు “దట్ మాన్ ఆన్ ది రోడ్ అండ్ అదర్ స్టోరీస్” అన్న మరో సమకాలీన తెలుగు కథల ఆంగ్ల అనువాద సంపుటిని వెలువరించారు. అప్పటికీ, ఇప్పటికీ తెలుగులోంచి ఇంగ్లీషులోకి కథలను పంపే ప్రయత్నాలలో ఇవి అగ్రగణ్యాలని నా అభిప్రాయం. అదే ఉరవడిలో మేమంతా కలసి సాహిత్య ఎకాడమీ వాళ్ళ ద్వైమాసిక ‘ఇండియన్ లిటరేచర్’ ఓ సంచికను తెలుగు ప్రత్యేక సంచికగా తీసుకువచ్చాం.

కథల అనువాదాల ప్రయత్నంలో తరచుగా కలుసుకొన్న మా మధ్య ఓ చక్కని సాహితీ బంధం ఏర్పడిపోయింది. ‘మన కలయికకు ఓ స్థిరరూపం ఇవ్వాలి’ అన్న ఆలోచన కలిగి ‘సాహితీ వేదిక’ అనే పేరు పెట్టుకొన్నాం. నెలనెలా తలా ఒకరి ఇంట్లో ఓ ఆదివారమంతా కలసి సాహితీపరమైన కబుర్లు, చర్చలు, పఠనాలు, వాదోపవాదాలతో గడపడం మొదలయింది. ఐఐటీలో ఉండే కల్లూరి శ్యామల, ఐఐఎస్ లైబ్రరీలో పని చేసే విజయామూర్తి, కథకులు వీవీబీ రామారావు, అప్పట్లో ఢిల్లీలో ఉన్న తాళ్ళపల్లి మురళీధర గౌడ్, సంగీతంతో పాటు సాహిత్యంలోనూ ఆసక్తి ఉన్న కాళీపట్నపు వసంతలక్ష్మి, సాహితీ ప్రియులు కోటిరెడ్డి, భూషి పూర్ణకుమార్ దాస్, కె. సుజాత – పదిహేను, ఇరవై మంది నిలకడగా, నెలనెలా కలిసిన వేదిక అది. మా చర్చలతో పాటు ఢిల్లీకి వచ్చిన ఓల్గా, అద్దేపల్లి రామమోహనరావు, రావూరి భరద్వాజ, గోపి, భరాగో, మధురాంతకం రాజారాం, గుంటూరు శేషేంద్రశర్మ, అజంతా – వీరందరితో ఇష్టాగోష్ఠులు.

***

1995 చలం శత జయంతి సంవత్సరం.

ఆంధ్రదేశమంతటా ఊరు ఊరునా 1994-95లలో ఆ ఉత్సవాలు జరిగాయి.

చలాన్ని విపరీతంగా అభిమానించే శ్రీపతికి ఒక సభ ఢిల్లీలో జరపాలన్నది గాఢ వాంఛ. ఓ దశాబ్దం ముందటివరకూ ఢిల్లీలో ఉండి వెళ్ళడం వలన ఆయనకు అప్పటి పరిచయాలు సజీవంగా మిగిలి ఉన్నాయి. ‘తెలుగు సాహితి’ సారధి రామవరపు గణేశ్వరరావును కూడగట్టుకొన్నారు. ‘సాహితీ వేదిక’ ఆధారపీఠమయింది. ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులను ఒప్పించి కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. ఆంధ్రదేశం నుంచి మహీధర రామమోహనరావు, వావిలాల సుబ్బారావు, అంపశయ్య నవీన్, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, యాకూబ్, కుప్పిలి పద్మ లాంటి వారిని ఢిల్లీకి తరలించారు. అప్పట్లో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా ఉన్న వి.ఎస్. రమాదేవి గారి సహాయ సహకారాలు సంపాదించారు…

సభ దిగ్విజయంగా జరిగింది. ఎవరూ ఆశించని రీతిలో అయిదు వందలమంది సభికులతో సభ కళకళలాడింది. అతి చక్కని ప్రసంగాలతో చలం జ్ఞాపకాల పరిమళాలు సభను ముంచెత్తాయి. ‘ఢిల్లీ నగరంలో చలం లాంటి సీరియస్ రచయితల మీద ఇన్ని వందల మందికి ఆసక్తి ఉందా?!’ అని మేమే ఆశ్చర్యపడిపోయాం.

చలం సభ స్ఫూర్తితో సాహితీ వేదికలో ఉత్సాహం పెరిగింది. మంచి కార్యక్రమాలు నిర్వహించాలన్న తపన మొదలయింది. ఆ తపనలోంచి ‘కథా సదస్సు’ అవతరించింది.

‘కథా సాహితి’ పేరిట నవీన్ – శివశంకర్‌లు అప్పటికి ఆరేడు ఏళ్ళుగా వార్షిక కథా సంకలనాలు తీసుకురావడం, ఆ ప్రయత్నం సాహితీలోకంలో చిరు సంచలనం కలిగించడం గమనించిన మేము ‘కథ 1996’ ను ఢిల్లీలో ఆవిష్కరించాలన్న ప్రతిపాదన పెట్టాం. ‘కథా సాహితి’ అంగీకరించింది. తెలుగు సాహితి ఢిల్లీ వారిని అడిగితే వారూ కలసివచ్చారు. ఆంధ్రా అసోసియేషన్ ఆర్థిక వనరులు అందించింది. ఇండియన్ లిటరేచర్ సంపాదకులూ, మళయాళ కవీ కె. సచ్చిదానందన్ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి అంగీకరించారు…

… అక్టోబరు 1997లో జరిగిందా ఏడెనిమిది గంటల కార్యక్రమం. రోజంతా కథా సదస్సు, కార్యక్రమానికి కలికి తురాయిగా చివర్లో ‘కథ 96’  ఆవిష్కరణ.

కాళీపట్నం రామారావు గారి దగ్గర్నించి కె. శివారెడ్డి దాకా, నవీన్ – శివశంకర్ దగ్గర్నించి దేవీప్రియ దాకా, వారితో పాటుగా వాకాటి పాండురంగారావు గారూ – అత్యంత అర్థవంతంగా జరిగిన సదస్సు. వస్తు విస్తృతీ, గాఢతా, ప్రసంగాల పరిణతిల దృష్ట్యా చూస్తే అది ఢిల్లీ సాహితీ గగనంలో ఒక మెరుపుతీగ అని చెప్పవచ్చు.

1998లో సాహితీ వేదిక కవితా సదస్సు నిర్వహించింది.

వజ్రాయుధం సోమ సుందర్ ఒక వేపూ, దళిత ధిక్కార స్వరపు కత్తి పద్మారావు ఇంకోవేపూ, యువ పరిణిత గళం వాడ్రేవు చినవీరభద్రుడు మరోవేపు – అదో జలపాత ఝరి.  ఆ తర్వాత నవలా సదస్సు..

***

సభలూ, సమావేశాలు సరే – సాహితీ సృజన సంగతేమిటీ?

పురాణం, వాకాటి, బలివాడ, వాడ్రేవు పతంజలి లాంటి వాళ్ళు తాము ఢిల్లీలో ఉన్న కాలంలో చేసిన సాహితీ సృజన గురించి చెప్పుకొన్నాం. అదే బాణీలో అబ్బూరి ఛాయాదేవి, శ్రీపతి, టంకశాల అశోక్‌ల గురించీ చెప్పుకోవాలి. వాళ్ళ ఢిల్లీ జీవిత నేపథ్యాలు వాళ్ళ కథలల్లోనూ, కవితల్లోనూ కనిపిస్తాయి.

ఢిల్లీలో జీవితకాలం గడిపిన సాహితీకారుల ప్రస్తావన ఇంతకుముందు వచ్చింది. వాడ్రేవు పాండురంగారావు, జె. లక్ష్మీరెడ్డి గార్ల సాహితీ వ్యాసంగం గురించి చెప్పుకొన్నాం.

ఆ కోవకు చెందిన – 70లు, 80లలో సాహితీ సృజన చేసిన మరికొందరు గురించీ చెప్పుకోవాలి: ఇలపావులూరి పాండురంగారావు, మహీధర నళినీమోహనరావు, ఉషారాణి భాటియా అందులో ముఖ్యులు.

ఇలపావులూరి ధార్మిక సాహితీకారులు. బహుభాషావేత్త. సంస్కృత పండితులు. అనువాదకులు. ‘వాల్మీకి’ మోనోగ్రాఫ్ రాసారు. ‘రామాయణంలో స్త్రీ పాత్రల’ గురించి రాసారు. ‘కామాయని’ గ్రంథాన్ని హిందీలోంచి తెలుగులోకి అనువదించారు. ‘రామాయణ పరమార్థం’ గురించి రాశారు. ‘అనువాద కళ’ వివరించారు. భారతీయ కవిత్వం గురించి, పోతన గురించి, ఉపనిషత్తుల గురించి, గురజాడ గురించి, యాజ్ఞవల్కుని గురించి, స్వాతంత్ర్యోద్యమ గీతాల గురించి – సుమారు నలభై ఏళ్ళ సాహితీ జీవనంలో నలభైకు పైగా పుస్తకాలు రాసారు. దాదాపు ఏభై ఏళ్ళు ఢిల్లీలో గడిపారు.

మహీధర నళినీమోహనరావు భౌతిక శాస్త్రవేత్త. పాపులర్ సైన్సులో అనేకానేక రచనలు చేసారు. ‘భూదేవి బొమ్మ’ గీసారు. ‘కాలెండర్ కథ’ రాసారు. వేలాది సైన్సు వ్యాసాలు రాసారు. 60లు, 70లలో విద్యార్థుల ఆరాధ్య దైవమాయన. ఆయన సాహితీ జీవితంలో – పదిమందికీ తెలియని మరో విలక్షణ కోణముంది.  ఆయన సంస్కృత పండితుడు, కవీ, గ్రంథకర్త!!

ఉషారాణి భాటియా చలం, కొడవటిగంటిల కుటుంబాలకు చెందిన వ్యక్తి. నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళ తెలుగు విభాగపు సంపాదకులుగా ఢిల్లీలో చాలాకాలం గడిపారు. సహచరుడు భాటియా గారి పేరును – అది తెలుగు పేరే అన్నంతగా – పాఠకులకు చిరపరిచితం చేసారు. తన రచనలతో ఆనాటి తరం పాఠకులను ఆకట్టుకొన్నారు. ముందువరుస రచయిత్రులలో తనకూ ఓ ఉనికిని సంపాదించుకోగలిగారు.

సాహితీ వేదిక తన కార్యకలాపాలను ఆరంభించిన 1990లలో అందులో సభ్యులుగా ఉంటూ తమదైన రచనలతో రాణించిన వ్యక్తులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. అందులో అగ్రగణ్యులు తోలేటి జగన్మోహనరావు.

కేంద్ర ప్రభుత్వపు సెక్రెటేరియల్ సర్వీసెస్ ఉద్యోగిగా దశాబ్దాల పాటు తోలేటి ఢిల్లీలో గడిపారు.  70ల నుంచీ కథలు రాసారు. హాస్యమూ, వ్యంగ్యమూ, సామాజిక ఆవేదనా సరిపాళ్ళలో మేళవించి పాఠకులలో అనేకానేక భావాలు ఒకేసారి కలిగేలా కథలు చెప్పడంలో తోలేటి మహానేర్పరి. కథా శిల్పాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొన్న అతికొద్దిమంది రచయితలలో తోలేటి ఒకరు.

‘లియోసా’ అన్న చైనా నేపథ్యపు కథతో కథా సాహిత్య లోకంలో 1990లలో చిరు ప్రకంపనలూ, చాలా ఆశలు కలిగించిన డాక్టర్ సంపత్ కుమార్ 70ల చివరి సంవత్సరాలలో జెఎన్‌యూలో పిహెచ్‌డీ కోసం ఢిల్లీ వచ్చి అప్పట్నించి ఇక్కడే ఉండిపోయిన వ్యక్తి. సమాజ సంక్షేమ కార్యకలాపాలనే వృత్తిగా ఎంచుకొని ఢిల్లీలో ఎన్‌జీవోలలో పనిచేసారు. కెనడియన్ హైకమీషన్‌లో అదే పని మీద మూడు దశాబ్దాలు దాటి ఉన్నారు. తన వృత్తిపరపు అనుభావాలను కథలుగా, ‘నానీ’లుగా మలిచారు. కంబోడియా ఘటనల గురించి ‘అనగనగా ఒక దేశం’ కథ రాసారు. జెఎన్‌యూ అనుభవంతో ఈశాన్య భారతపు నేపథ్యంతో ‘ఠించెన్’ అన్న కథా రాసారు. రెండు కథా సంపుటాలు, ఒక నానీల పుస్తకం, అనేకానేక వ్యాసాలు వెలువరించారు.

1975 నుంచి ఢిల్లీలో ఉన్న దాసరి అమరేంద్ర రచనా వ్యాసంగం 1990లలో విరివిగా సాగింది. కథలు, కవితలు, వ్యాసాలు, రూపకాలు, ఇంటర్వ్యూలు, యాత్రాగాథలు, అనువాదాలు… పరిపరి విధాలుగా సాగిన ప్రక్రియ అది. ఓ కథా సంపుటం, రెండు యాత్రా గ్రంథాలు, ఓ వ్యాస సంకలనం, ఓ సాహితీ కదంబం – అంతా కలసి గత ఇరవై పాతికేళ్ళలో పది పుస్తకాలు ప్రచురించారు. ఢిల్లీ నగరానికి – బెంగుళూరు, పూణె నగరాలకు తెలుగు సాహిత్యంతోను, తెలుగు రచయితలతోనూ గాఢమైన అనుబంధం ఏర్పడడం విషయంలో విశేష కృషి చేసారు.

రామవరపు గణేశ్వరరావు ఆంగ్ల అధ్యాపకులు. అరుదుగానే రాసే రచయిత. ‘త్రిశంకుని మీద తిరుగుబాటు’ లాంటి విలక్షణమైన కథలు రాసారు. రామవరపు శాంత సుందరి తెలుగు సాహిత్యాన్ని హిందీ పాఠకులకు అందించడం విషయంలో ఎడతెగని కృషి చేసారు. ఈ మధ్యనే అనువాద రంగంలో సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నారు.

delhi2

ఏల్చూరి మురళీధరరావు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన వెంకటేశ్వర కళాశాలలో తెలుగు ఆచార్యులు. కవిపుత్రులు. స్వయానా పండితులు. సంస్కృతాంధ్రాలలో నిష్ణాతులు. ప్రాచీన సాహిత్య వ్యాఖ్యాత, విశ్లేషకులు. భాగవతం మీద బృహత్ గ్రంథ రూపకల్పనలో ఉన్నారు. అనర్గళ వక్త.

కందుకూరి మహాలక్ష్మి ఢిల్లీతో దశాబ్దాలుగా ముడిపడిన మరో వ్యక్తి. 70ల నుంచీ కథలు రాసారు, కథా సంపుటాలు తెచ్చారు. ‘వనిత’ లాంటి పత్రికలకు ఢిల్లీ ప్రతినిధిగా వ్యవహరించారు. ఢిల్లీ తెలుగు సాహితి కార్యక్రమాల నిర్వహణలో చురుకైన పాత్ర ధరించారు.

మెడికో శ్యాం దశాబ్దాల పాటు ఢిల్లీలో ఉండి కథలు రాసిన వ్యక్తి. కవీ, జర్నలిస్టు అయిన ఎ. కృష్ణారావు – క్రిష్ణుడు – వృత్తిపరంగా రెండున్నర దశాబ్దాలు ఢిల్లీలో గడిపి ఈమధ్యనే హైదరాబాద్‌కు మకాం మార్చారు. తన ఢిల్లీ నివాస సమయంలో కవితలే గాకుండా వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘ఢిల్లీగేట్’ అన్న వాడీ వేడీ ఉన్న కాలమ్ రాసారు. ‘నడుస్తున్న హీన చరిత్ర’ అనే పుస్తకం వెలువరించారు.

పబ్లికేషన్స్ డివిజన్‌లో చాలా కాలం పనిచేసిన డాక్టర్ జె. భాగ్యలక్ష్మి ఆంగ్లాంధ్ర కథకులు, కవి, అనువాదకురాలు. కేంద్రప్రభుత్వంలో పనిచేసిన పులిగడ్డ విశ్వనాథరావు మరో కథకులు. ‘ఇండియన్ లిటరేచర్’ పత్రికకు సంపాదకులుగా పనిచేసిన దుగ్గిరాల సుబ్బారావు సమీక్షకులు, విమర్శకులు, అనువాదకులు. గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’; ‘మెరుపుల మరకలు’ నవలలను ఆంగ్లీకరించిన వ్యక్తి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం అధిపతిగా పనిచేసిన ఆర్. అనంతపద్మనాభరావు వ్యాసకర్త – అనువాదకులు. ‘ఢిల్లీ ప్రముఖులు’ అన్న పుస్తకం రాసారు. సాహిత్య ఎకాడమీ లాంటి సంస్థల కోసం నవలలను తెలుగులోకి అనువదించారు.

ఢిల్లీలో చాలాకాలం గడిపిన మరో రచయిత వి.ఎస్. రమాదేవి. కథలు, నవలలు, కబుర్లు, వ్యాసాలు, నాటికలు – బహుముఖ వ్యాసంగం ఆవిడది. ‘అందరూ మనుషులే’, ‘రాజీ’ లాంటి ఏడు నవలలు రాసారు. పదీ పదిహేను పుస్తకాలు వెలువరించారు. ఎమర్జెన్సీ నేపథ్యంగా రాసిన ‘రాజీ’, నవలా రచయిత్రిగా ఆవిడకు ఓ విశిష్టమైన గుర్తింపునిచ్చింది.

వెంకటేశ్వరా కాలేజీ, ఐఐటీ ఢిల్లీలలో ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పనిచేసిన కల్లూరి శ్యామల కూడా సాహితీరంగంలో అనువాదకురాలుగానూ, కవితా సంపాదకురాలుగానూ చిరపరిచితులు. ‘చైతన్య దేహళి’ అన్న కవితా సంకలనాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం రూపొందించారు.

1990లలోనే ఢిల్లీ నుంచి ‘ఢిల్లీ తెలుగువాణి’ అన్న మాస పత్రిక వెలువడింది. ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు – వేములపల్లి కృష్ణమూర్తి, కంభంపాటి గోవర్ధనరావు – సాహితీప్రియులు. ‘సాహితీ వేదిక’ కార్యక్రమాలకు దన్నుగా నిలిచినవారు. ఆ సమయంలోనే కవి తాళ్ళపల్లి మురళీధర్ గౌడ్ ఉద్యోగరీత్యా ఢిల్లీలో దశాబ్దం పాటు ఉన్నారు. ఈయన కవే గాకుండా ‘యువభారతి, హైదరాబాద్’ వారి ప్రచురణలోను అనుభవం ఉన్న మనిషి. వీరంతా కలసి ఆరంభించిన ‘తెలుగువాణి’ తనదైన విలక్షణతో ఆరేడు సంవత్సరాలు నడిచింది. చక్కని కథలూ, వ్యాసాలూ, ఇంటర్వ్యూలూ, సమీక్షలూ ప్రచురించింది. పత్రిక ఢిల్లీ తెలుగువారికే గాకుండా దేశవిదేశాలలోని సాహితీప్రియులకు అందేలా చూసారు సంపాదకులు గోవర్ధనరావు.

ఈ సభలూ, సమావేశాలూ, సంపాదకత్వాలూ, ప్రచురణలూ మధ్య అతి నిశ్శబ్దంగా సాహితీ సృజన చేసి చిన్న వయసులోనే నిష్క్రమించిన సీవీ సుబ్బారావు గురించి చెప్పుకోవాలి. జీవితాన్ని ఓ మానవ హక్కుల ఉద్యమంగా మలచుకొన్న సురా రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన మనిషి. ఎమర్జెన్సీలో ఏడాదిన్నర విశాఖ సెంట్రల్ జెయిల్లో ఉన్నారు. 1978లో ఢిల్లీలోని ఖల్సా కాలేజీలో లెక్చరర్‌గా చేరి ’94 జనవరిలో మరణించేంతవరకూ ఢిల్లీలోనే ఉన్నారు. మానవ హక్కుల పరిరక్షణే ఊపిరిగా బతికారు. ఆర్థిక శాస్త్రవేత్తగా, విద్యార్థుల అభిమాన అధ్యాపకులుగా ఉంటూనే, వలస కార్మికులనూ, బస్తర్ ఆదివాసీలనూ, రాజస్థాన్ బీదలనూ, మతకలహాలను తన కార్యక్షేత్రంగా ఎన్నుకొన్నారు సుబ్బారావు. తన జీవన గమనంలో ఎన్నో రచనలు చేసారు. ఈశాన్య రాష్ట్రాలలో జాతుల సమస్య మీద ‘రగులుకొనే రాక్షసి బొగ్గు’ అన్న పుస్తకం రాసారు. ‘విభాత సంధ్యలు’ అన్న సాహితీ విమర్శా గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ‘రాజకీయార్థికశాస్త్రం’ మీద ఓ పుస్తకం రాసారు. ఆయన అకాల మరణం తర్వాత మిత్రులు సేకరించి ప్రచురించిన ‘సందిగ్ధ సందర్భం’ ఓ గొప్ప పుస్తకం. ఇందులో సురా రాసిన కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్షలు, లేఖలు, ఓ నాటిక ఉన్నాయి.

***

ఇరవై ఒకటో శతాబ్దం మొదటి దశాబ్దంలో ఢిల్లీలోని తెలుగు సాహితీకారుల్లో ముఖ్యమైన వాళ్ళు ఢిల్లీ వదిలి వెళ్ళడం జరిగింది.

పెంగ్విన్ రంగారావు రిటరైయ్యాక పుట్టపర్తికి మారారు. తోలేటి, గౌడ్ హైదరాబాద్ వెళ్ళారు. ఆ తర్వాత గణేశ్వరరావు – శాంత సుందరి దంపతులూ హైదరాబాద్ చేరారు. కల్లూరి శ్యామల, విజయా మూర్తి, తాత్కాలికంగా దాసరి అమరేంద్ర, పూర్ణ కుమార్ దాస్, మెడికో శ్యాం, ఉషారాణి భాటియా, వి.ఎస్.రమాదేవి, జె. భాగ్యలక్ష్మి – అనేకానేక కారణాల వల్ల వీరంతా ఢిల్లీ వదిలి వెళ్ళడంతో నగరంలో తెలుగు సాహితీ కళ వసివాడిందనే చెప్పుకోవాలి.

కానీ కొత్త నీరూ వచ్చి చేరింది.

నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులుగా కవి పత్తిపాక మోహన్ ఢిల్లీ చేరారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉప ఆచార్యులుగా గంపా వెంకట్రామయ్య వచ్చారు. విఖ్యాత చిత్రకారులు, కవి ఎస్వీ రామారావు నగరంలో ఉండసాగారు. బంజారా సాహిత్యంలో కృషి చేస్తోన్న రమేష్ ఆర్య సాహితీ బృందంలో చేరారు. సాహిత్యమంటే అనురక్తి ఉన్న ఎమ్వీలక్ష్మి, కుసుమ, కమల, శాంతిశ్రీ, సోమలత, పద్మావతి, కామేశ్వరరావు, శ్రీనివాసరావు, దేవరకొండ సుబ్రహ్మణ్యం, సురేఖ, ప్రభల జానకి లాంటివాళ్ళు బృందపు సభ్యులయ్యారు. 90ల నాటి లక్ష్మీరెడ్డి, సంపత్, తిలక్, సుజాత, మళ్ళీ వచ్చిన అమరేంద్ర ఉండనే ఉన్నారు.

2010 నాటికల్లా మళ్ళా దీపం వెలుగు సంతరించుకోసాగింది. 2012 కల్లా నిలకడగా సాహితీ పుంజాలను ప్రసరించడం మొదలుపెట్టింది. ‘సాహితీ వేదిక’ మరోసారి కాయకల్ప చికిత్స పొంది తన కార్యకలాపాలను కొనసాగించడం మొదలుపెట్టింది. నెలవారీ సమావేశ పరంపర ప్రాణం పోసుకుంది. ‘మా నాయన బాలయ్య’, ‘బోయకొట్టములు పండ్రెండు’, ‘సురపురం’, ‘భూచక్రం’, ‘కోర్ట్ మార్షల్’, ‘అమృతం కురిసిన రాత్రి’ , ‘కథా కథనం’, ‘నూరేళ్ళ తెలుగు కథ’ లాంటి విలక్షణ పుస్తకాల పరిచయం, సమీక్ష, విశ్లేషణ, విమర్శల చుట్టూ ఆ సమావేశాలు సాగాయి. ఓల్గా, రాచపాళెం, కాత్యాయనీ విద్మహే లాంటి సాహితీ ప్రముఖలతో చర్చాగోష్ఠులు జరిగాయి.

వర్తమాన సాహితీ సృజన విషయానికొస్తే దాసరి అమరేంద్ర రచనా వ్యాసంగం సాగిపోతోంది. గత రెండు మూడేళ్ళలో ఆయన మూడు పుస్తకాలు ప్రచురించారు. లక్ష్మీరెడ్డి విలక్షణ అనువాద యజ్ఞం నిరవధికంగా కొనసాగిపోతోంది. తెలుగు సాహిత్యానికి నిలకడ అయిన హిందీ పాఠకులను సమకూర్చి పెట్టారాయన. ఏల్చూరి మురళీధర రావు ప్రాచీన సాహితీ శోధన ఒక మహా యజ్ఞంలా సాగిపోతోంది. ప్రభల జానకి ఈమధ్యనే ‘భారతంలో స్త్రీ పాత్రలు’ అన్న పుస్తకం తీసుకువచ్చారు. గంపా వెంకట్రామయ్య ‘వ్యాస గంగాధరం’ అన్న పుస్తకమూ, కొన్ని కథలూ రాసారు. ఆయన సహచరి ఈడ్పుగంటి శిరీష ‘వాహిని’ అన్న విమర్శా వ్యాసాలనూ, ‘బ్రౌన్ శాస్త్రి’ అన్న జీవిత చరిత్ర గ్రంథాన్నీ వెలువరించారు. నాటకరంగం మీద కామేశ్వరరావు ఓ వ్యాస సంకలనం తీసుకువచ్చారు. కుసుమ, సురేఖ కవితలు, కథలు రాస్తున్నారు. శాంతిశ్రీ వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. రమేష్ ఆర్యకు బంజారా సాహిత్య రంగంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఎవార్డు వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నియుక్తులైన కృత్తివెంటి శ్రీనివాసరావు ఢిల్లీలోని తెలుగు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడమూ, సహాయ సహకారాలందించడమూ చేస్తున్నారు. ఈమధ్య కే.జే. కళ్యాణి అర్థవంతమైన సాహితీ సామాజిక వ్యాసాలు రాస్తున్నారు. విమానయాన రంగం నేపథ్యంతో క్రిష్ణవేణిచారి కథలు రాస్తున్నారు.

రెండేళ్ళ కొత్త నడకల తర్వాత 2013లో ‘సాహితీ వేదిక’ తన వార్షికోత్సవ కార్యక్రమంగా ‘జీవితమూ – సాహిత్యము’ అన్న విషయం మీద ఒక రోజంతా సెమినారు నిర్వహించింది. వాసిరెడ్డి నవీన్ వచ్చి కీలకోపన్యాసం చేసారు. వేదిక సభ్యులంతా ఆ విషయం మీద చిన్నవీ, పెద్దవీ పత్రాలు సమర్పించారు.

2014లో రావిశాస్త్రి కథల మీద వార్షికోత్సవ సెమినార్ జరిగింది. కృత్తివెంటి శ్రీనివాసరావు అధ్యక్షత. కాత్యయని విద్మహే కీలకీపన్యాసం. మల్లీశ్వరి, వివినమూర్తి, అట్టాడ అప్పల్నాయుడు తమ తమ వ్యాసాలు పంపారు. అమరేంద్ర, వెంకటరామయ్య, నవీన్, దేవరకొండ సుబ్రహ్మణ్యం తదితరులు పత్ర సమర్పణ చేసారు. చెప్పుకోదగ్గ ప్రమాణాలు గల ఆయా పత్రాలన్నింటినీ తర్వాత ‘సాహితీ వేదిక’ పుస్తకంగా తీసుకువచ్చింది.

2015లో జరిగిన కొడవటిగంటి సెమినార్ ఈమధ్య కాలంలో ఢిల్లీలో జరిగిన సాహితీ సభలకు తలమానికం. కాత్యాయని, మల్లీశ్వరి, నవీన్, ఎన్. వేణుగోపాలరావు, ఎ. క్రిష్ణారావు, కొకు కథల గురించీ, నవలల గురించీ, వ్యాసాల గురించీ విలువైన ప్రసంగాలు చేసారు. ఆయన రచనల ప్రస్తుత రెలవెన్సును ఎత్తి చూపారు. సాహిత్యానికి సమాజం మీద ఉన్న ప్రభావశీలత గురించి విస్పష్టంగా వివరించారు.

గత రెండు మూడేళ్ళుగా ఢిల్లీలో దేవరకొండ సుబ్రహ్మణ్యం పూనికతో ఆంధ్రా అసోసియేషనూ, తెలుగు సాహితీ విరివిగా సాహితీ కార్యక్రమాలను నిర్వహించాయి. 2014 ఆగస్టులో ఇరవై మంది రచయిత్రులు  ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ ఆధ్వర్యంలో ఢిల్లీ వచ్చి వందమంది సభికుల మధ్య రెండు రోజుల పాటు తమ సభలను జరుపుకోవడం ఈ దశాబ్దపు విశిష్ట సంఘటనగా చెప్పుకోవచ్చు. ఓల్గా, కుప్పిలి పద్మ, మృణాళిని, కాత్యాయని, మల్లీశ్వరి, వీరలక్ష్మీదేవి, కొండేపూడి నిర్మల, అనిశెట్టి రజిత, మెర్సీ మార్గరెట్, పుట్ల ‘విహంగ’ హేమలత లాంటి రచయిత్రులందరినీ ఒకేసారి చూడడం, వినడం ఢిల్లీ తెలుగు సాహితీ ప్రియులకు మరపురాని అనుభవం.

అదే ఊపులో సుబ్రహ్మణ్యం ఈ రెండేళ్లలో చిన్నవీ, పెద్దవీ మరో ఆరేడు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో ‘ఉత్తరాంధ్ర కథ’ మీది సమావేశం చెప్పదగ్గది.

***

తెలుగు భాషకు మొట్టమొదటి ఆధునిక రచనను ఇచ్చినా, సాహితీ ప్రక్రియాగా సరి అయిన గుర్తింపు పొందని  ‘యాత్రా సాహిత్యం’ గురించి ‘సాహితీ వేదిక’ నవంబరు 2016లో సెమినార్ నిర్వహించే ప్రయత్నంలో ఉంది. మహా యాత్రికుడు ఎమ్. ఆదినారాయణ 2016లో వెలువరించిన ‘తెలుగువారి ప్రయాణాలు’ అన్న గొప్ప పుస్తకం ఈ సెమినార్ కేంద్ర బిందువు. సిల్కురూటూ, ఛత్తీస్‌ఘడ్‌లో సాహసయాత్రలు చేసిన పరవస్తు లోకేశ్వర్ కీలకీపన్యాసం చేస్తారు. ‘ప్రయాణానికే జీవితం’ అన్న గొప్ప యాత్రా గ్రంథాన్ని తెలుగు చేసిన కొల్లూరి సొమ శంకర్ మరో ముఖ్య వక్త.

సాహిత్యం జీవన స్రవంతిలో ఒక ముఖ్యమైన పాయ అయినప్పుడు ఎనిమిది లక్షల ఢిల్లీ తెలుగువాళ్ళ మధ్య సాహితీ స్రవంతి  తరాల తరబడి సాగిపోవడమన్నది ఓ సహజ ప్రక్రియ. ఆ స్రవంతి ఓ సజీవ చైతన్యానికి ఆలంబనగా నిలబడి తెలుగు సాహితీ రంగంలో ఉడుతాభక్తిని – తాను సైతం సాహితీ భవనపు చిరు బావుటా అయి – రెపరెపలాడుతూ ఉంటూ ఉంటుందనడంలో సందేహం లేదు.

~ 

 

 

 

డారియో ఫో – అతని నాటకరంగం

dario1[వ్యాసానికి చిన్న పరిచయం:

13 అక్టోబరు 2016 నాడు మరణించిన డారియో ఫో కు 1997లో నోబెల్ బహుమతి వచ్చింది.

ఆ సందర్భంగా కన్నడ రచయితా, నాటకకర్తా – ఎస్. బాబురావు – ఓ విపులమైన వ్యాసం వ్రాసి “మెయిన్‌స్ట్రీమ్” పత్రికలో 1998 జనవరిలో ప్రచురించారు.

డారియో ఫో నిష్క్రమించిన సందర్భంగా ఆ వ్యాసపు అనువాదం అందిస్తున్నాం]

*

ఈ ఏడాది సాహిత్యపు నోబెల్ బహుమతిని ఇటాలియన్ నాటక రచయితా, రంగస్థల కళాకారుడూ, రాజకీయ కార్యకర్త అయిన డారియో ఫో కు ప్రకటించడం ద్వారా స్వీడన్‌కు చెందిన నోబెల్ ఫౌండేషన్ సంస్థ వాళ్ళు చరిత్ర సృష్టించారనే అనాలి; ఇప్పటివరకూ సాహిత్యానికి ఇచ్చిన నోబెల్ బహుమతుల్లో ఇది అత్యంత వివాదాస్పదం మరి!

ఈ ప్రకటన పడమటి దేశాలలోని ‘ఉన్నత తరగతి’ సాహితీ వ్యవస్థలను ఒక కుదుపు కుదిపి వదిలిపెట్టింది. ఇది కలిగించిన అలజడిని అంచనా వెయ్యడానికి ఒక మార్గముంది: ఓ శుభోదయాన మన కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు  ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ‘నౌటంకీ’ నాటకకర్తకు ఎవార్డు ప్రకటిస్తే మన కాకలు తీరిన రచయితలంతా ఎలా స్పందిస్తారూ? – అదిగో ఆ బాపతు స్పందన వచ్చింది – పాశ్చాత్య దేశాల సాంస్కృతిక సాహిత్య రంగాల్లో ‘డారియో ఫో కు నోబెల్ బహుమతి’ అన్న వార్త విని. సమకాలీన నాటకరంగపు తీరుతెన్నుల గురించి అంతగా పట్టించుకోని పెద్దమనుషులు అడిగినా అడిగి ఉంటారు – “అసలీ డారియో ఫో అనే మనిషి ఎవరూ?” అని! సాహిత్యానికి సంబంధించి ఎన్‌సైక్లోపీడియాలలోనో, చరిత్ర గాథలనో తిరగేసినా…  రచయితల జీవిత చరిత్రలూ, అకారాది క్రమ వివరాలు ఉన్న నిఘంటువులూ తిరగేసినా వాళ్ళకి డారియో ఫో గురించి వివరాలు తెలిసే అవకాశం అతి తక్కువ. ఒక వేళ కాస్తో కూస్తో వివరాలు ఉన్నా,  ‘అతనో హాస్య నాటక రచయిత, నాటకరంగపు జోకరు’ – అన్న అంటీ ముట్టని వివరం తప్పించి సమగ్రమైన సమాచారం దొరకదు. ఇంకెవరైనా మరికాస్త రాస్తే – అతనో షోమాన్, ఒక బఫూనూ అనవచ్చు. నిజమే. అతను షోమాన్, క్లౌన్ అన్న మాట నిజమే. కానీ అతని పరిచయానికి ఈ మాటలు చాలవు. మరింకెన్నో చెప్పుకోవాలి.

డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడం వల్ల నొచ్చుకొని, కోపం తెచ్చుకొన్న వ్యవస్థల్లో ఇటలీకి చెందిన ఘనత వహించిన ‘రోమన్ కాథలిక్ చర్చి’ ఒకటి. ఈ నిర్ణయం తమకెంతో విస్మయం కలిగించిందనీ, ఇది అత్యంత ఊహాతీతమైన నిర్ణయమనీ ఈ చర్చివారు ఇప్పటికే అంగీకరించి ప్రకటించి ఉన్నారు.

కానీ విశ్వవ్యాప్తంగా ఉన్న – మరో ప్రపంచానికి చెందిన – రంగస్థల అభిమానులకు ఈ ప్రకటన ఆనందహేతువే. ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ (The Accidental Death of an Anarchist) లాంటి విజయవంతమైన తన ప్రముఖ నాటకాల ద్వారా డారియో ఫో ఇండియాలాంటి తృతీయ ప్రపంచపు దేశాలలో ఎనభైల నాటి నుంచీ బాగా పేరు నలిగిన మనిషే; కానీ ఈ అభిమానులు కూడా ‘ఇలాంటి అద్భుతం ఎలా జరిగిందా’ అని ఆశ్చర్యపడక మానరు.

ఇలాంటి విభిన్న విపరీత స్పందనలకు కారణం సుస్పష్టం. మనం ఆలోచించే బాణీలోంచీ, మనం అంగీకరించే పద్ధతిలోంచి చూస్తే డారియో ఫో ఒక రచయితా, నాటకకర్తా కానే కాదు. అమెరికాకు చెందిన ఆర్థర్ మిల్లర్, బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్ బాండ్, జర్మనీకి చెందిన పీటర్ హండ్కే ల లాంటి నాటక రచయిత గాదు. అసలు అన్నిటికీ మించి డారియో ఫో ముఖ్యంగా ఒక రాజకీయ కార్యకర్త. తను తన మిగతా పార్టీ సహచరుల కన్నా ‘అతి ఎక్కువ ఎరుపైన’ కమ్యూనిస్టు. ఆయన దృష్టిలో నాటకాలు రాయడమన్నది – ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాటకాలకు స్క్రిప్టు తయారు చెయ్యడమన్నది – ఒక గమ్యం కానేగాదు; ఓ గమ్యం చేరడానికి ఉన్న ఒకానొక మార్గం మాత్రమే. షేక్‌స్పియర్, మొలిరే (MOLIERE), బ్రెక్ట్ లాంటి అప్పటి, ఇప్పటి గొప్ప నాటక రచయితలందరి లాగానే డారియో ఫో కూడా రంగస్థలంతో అత్యంత సన్నిహిత ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి. తన నాటకాలలో ప్రముఖ భూమికలను పోషించిన మనిషి. అంతే గాకుండా ఆయన రంగస్థల కార్యకలాపమంతా అసలు సిసలు రాజకీయ కార్యకలాపమే. చుట్టూ అనుదినం జరిగే సంఘటనలూ, అసంఘటనలూ అతని నాటకాలకు ముడిపదార్థాలు. అవి అతనిపై కలిగించే ప్రభావమూ, ఒత్తిడుల ఫలితమే అతని నాటకాల స్క్రిప్టులు. ఆ స్క్రిప్టులని – ఆయా నాటకాల రిహార్సళ్ళలో, తన భార్య ఫ్రాంకా రమే (Franca Rame) సాహచర్యంలో మరింత నిర్దుష్టంగా రూపొందించి పదును పరుస్తాడు డారియో ఫో.

జీవితపు ప్రయోజనం, బతుకు పరమార్థం, మానవాళి గమ్యం – ఇలాంటి గంభీరమైన, ఘనమైన విషయాల గురించి గాఢంగా ఆలోచించే మేధావి రచయితల వర్గానికి చెందిన మనిషి కాడు డారియో ఫో. అతి వేగంగా క్షీణించి పోతోన్న మానవ సంబంధాల గురించీ, తన నుంచీ, తన పరిసారాల నుంచీ క్రమక్రమంగా దూరమైపోతున్న ఆధునిక మానవుని అసహాయత గురించీ డారియో ఫోకు పట్టదు. గతంలోకి శోధించుకుంటూ వెళ్ళి ఈనాటి సమస్యలకు అలనాటి చరిత్రలోనో, పురాణాలలోనూ సమాధానాలు వెతకడం కూడా ఫో కు చేతగాదు. రచయితగా ఆయన ధ్యేయం ఒక్కటే! సమాజంలోని కాపట్యాన్ని ఎండగట్టడం… ధనవంతులూ, మతాధికారులూ దొరతనంవారితో చేతులు గలిపి సామాన్య మానవుడ్ని ఎన్ని రకాలుగా హింసలకు గురి చేస్తున్నారో – ఆ తతంగాన్ని బయటపెట్టడం. తన రచనల ద్వారా, తన రంగస్థల కార్యకలాపాల ద్వారా ప్రపంచాని కాస్తో కూస్తో మార్చి దాన్ని మాములు మనుషులు మరికాస్త సుఖంగా బతకగల ప్రదేశంగా రూపొందించడమే ఫో అభిమతం. ‘ఇది జరగాలంటే మనకు మరికాస్త మంచి ప్రభుత్వం అవసరం… మంచి రాజకీయ వ్యవస్థ అవసరం… సాంఘిక వ్యవస్థ అవసరం’ అని డారియో ఫో అంటున్నట్టు అనిపిస్తుంది.

***

dario2డారియో ఫో 1926లో ఇటలీ దేశపు లంబార్డీ ప్రాంతంలో సాన్‌జియానో అన్న చోట పుట్టాడు. వాళ్ళ నాన్న రైల్వేలో స్టేషన్ మాస్టారు; తన తీరిక సమయాల్లో సరదాగా స్థానిక నాటకల్లో పాత్రలు పోషించేవాడు. బాగా చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నని నాటకాల్లో వేషాలు వేయడం గమనించిన డారియో ఫోకు సహజంగానే నాటకరంగమంటే ఆసక్తీ, గాఢ అనురక్తీ కలిగాయి. 1950లో – తన ఇరవై నాలుగో ఏట – ఫో మిలన్ నగరం వచ్చి అక్కడే ఓ నాటక సమాజంలో చేరాడు. ఆ సమాజం వాళ్ళు తమ సంగీత రూపకాలకు వ్యంగ్య వ్యాఖ్యానాలు రాసే పని అతనికి అప్పజెప్పారు. వాటి ఉద్దేశమల్లా ప్రేక్షకులను రంజింపజెయ్యడమే. అక్కడ పని చేస్తున్నప్పుడు అతనికి ఫ్రాంకా రమే అన్న సమమనస్కురాలితో పరిచయం అయింది. అది 1953లో పరిణయానికి దారితీసింది. ఫ్రాంకా రమే ఇటలీ దేశపు ‘గిల్లారీ’ అన్న సంచార నాటక ప్రదర్శకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి. జానపద నాటక కళారీతుల బాగా తెలిసిన కుటుంబాలవి. అప్పటికప్పుడు ఆశువుగా నాటకాలు రూపొందించి ప్రదర్శించడంలో నిష్ణాతులు ఆ కుటుంబాల వాళ్ళు. వాళ్ళలో ఎక్కువగా చదువు ఉండకపోవడంతో వాళ్ళు తమ నాటకాలను రాత ప్రతుల మీద కన్నా తమ తమ (ఆశు) సృజనాత్మక శక్తి మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవారు. నటులంతా తమ తమ శక్తియుక్తులన్నీ నటనా ప్రావీణ్యాన్నీ జోడించి రంగస్థలం మీదనే అప్పటికప్పుడు ఓ నాటకాన్ని రూపొందించేవారు.

ఫ్రాంకా రమేతో పరిణయం ఫో కు ఓ వరంగా పరిణమించింది. నాటకరంగం సహజమూ, శక్తివంతమూ అవ్వాలంటే అది తన సంప్రదాయ రంగస్థల రీతులను అవగాహన చేసుకుని ఆ అవగాహన లోంచి పెరిగి పెద్ద అవడం అత్యవసరం అన్న విషయాన్ని ఫో అర్థం చేసుకొన్నాడు. తన భార్య ద్వారా జానపద రంగస్థల కళారీతుల్ని తెలుసుకొన్నాడు. మెళకువల్ని తెలుసుకొన్నాడు. ఆ  ఎరుక సాయంతో తన కళకు మెరుగులు దిద్దుకొన్నాడు.

సిద్ధాంతపరమైన భావ స్పష్టతకూ, తన రచనలు సాధికార రాజకీయ ప్రమాణాలు సంతరించుకోవడం కోసమూ – లెనిన్, మార్క్స్‌ల తర్వాత అంత గొప్ప వామపక్ష సిద్ధాంతవేత్త అని పేరు పడ్డ – గ్రామ్‌స్కీ అన్న ఇటాలియన్ సోషలిస్ట్ మేధావి రచనలను ఫో అధ్యయనం చేశాడు. ఐతిహాసిక సంప్రదాయాలలోనూ బ్రెక్ట్ ప్రతిపాదించిన ‘అన్యాక్రాంత ప్రభావం’ (Alienation effect) అన్న సూత్రంతోనూ పరిచయం ఏర్పరుచుకొన్నాడు. అలాగే మయకోవ్‍స్కీ నాటకాలనూ అధ్యయనం చేశాడు. వీటన్నిటి వల్ల డారియో ఫో లో గణనీయమైన పరిణామం సంభవించింది… ఒక కొత్త అభిజ్ఞత (Awareness) రూపుదిద్దుకుంది. ఆ మిలన్ నగరపు నాటక సమాజంలో పని చేయడం ద్వారా తన శక్తియుక్తుల్ని వృధా చేసుకుంటున్నానీ, మార్పుని నిరోధించే బూర్జువా వర్గపు ఆనందం కోసం సంగీత రూపకాల చెళుకులు రాయడం శుద్ధ పనికిమాలిన వ్యవహారమనీ గ్రహించాడు. 1968లో ఆ సమాజం నుంచి బయటపడి తన భార్యతోనూ, మరికొద్దిమంది కమ్యూనిస్టు మిత్రులతోనూ కలసి నువో సినా (Nuova Scena) అన్న మరో నాటక సమాజం స్థాపించాడు. అప్పటికే తను గ్రహించి, జీర్ణించుకొన్న అనేకానేక ప్రభావాల నేపథ్యంలో – అవసరమైతే ఆయా ప్రభావాలనూ, భావాలను మరి కాస్త మెరుగులు దిద్దుకుంటూ తన సాంఘిక, రాజకీయ, వ్యంగ్య నాటకాలకు రూపకల్పన చేశాడు. ‘మిస్ట్రియో బఫో’ (Mistero Buffo – 1969), ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ (The Accidental Death of an Anarchist – 1970), ‘ఇవ్వలేమూ, ఇవ్వం కూడానూ’ (Can’t Pay, Won’t Pay – 1974) – ఆ నాటకాలలో కొన్ని.

ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క నాటకరంగాన్ని నిర్మించడమన్నది డారియో ఫో లక్ష్యం. తన నాటక ప్రదర్శనల కోసం రంగస్థలాలనూ, నాటకాల హాళ్ళను అద్దెకు తీసుకోవడం మానేసి, వాటిల్ని కార్మికుల క్లబ్బుల్లో, పారిశ్రామిక ఆవరణల్లో ప్రదర్శించడం మొదలెట్టాడు. క్రమక్రమంగా తన రంగస్థల కార్యకలాపాల్లో కార్మికులని భాగస్వాములుగా చెయ్యగలిగాడు. వారి సాంస్కృతిక స్పృహను ఆ రకంగా పెంపొందించగలిగాడు.

డారియో ఫో తన నాటకాలకు ఇతివృత్తాలను తన పరిసరాల లోంచీ, సమకాలీన సమాజంలోంచీ గ్రహిస్తాడు. పోలీసుల క్రూరత్వం, రాజ్యపాలనలో ‘చర్చి’ జోక్యం, స్త్రీవాదం, తీవ్రవాదం, అవకతవక ఆర్ధిక విధానాల వల్ల పెరుగుతోన్న ద్రవ్యోల్బణం – ఇవీ, ఇలాంటివీ ఆయన ఇతివృత్తాలు. ఈ నాటకాల సాయంతో ఆయన వ్యవస్థలోని కాపట్యాలను బహిరంగపరచి ఎగతాళి చేస్తాడు. మతాధికారులూ, ధనాధికారులూ చేతులు కలిపి జనాన్ని ఎలా దోచుకొంటున్నారో చూపిస్తాడు. ఆ చూపించడం కూడా మళ్ళీ కరవవచ్చే వ్యంగ్యంతోనూ, పొట్టచెక్కలయ్యే హాస్యంతోనూ కలగలిపి చూపిస్తాడు. దాంతో ప్రేక్షకులందర్నీ నవ్వించడమూ, అలరించడమూ మాత్రమే కాకుండా వాళ్ళతో ఆయా విషయాలను గురించి గాఢంగా ఆలోచింపజేస్తాడు, కార్యాచరణకు సిద్ధపడేలా చేస్తాడు.

కాలం చెల్లిన ఊహాజనితమైన విషయాలనెప్పుడూ తీసుకోడు డారియో ఫో. ప్రజా బాహుళ్యానికి చెందిన ఏదేనీ విషయంగానీ సంఘటనగానీ జరిగినప్పుడు – దాని వాడీ వేడీ ఇంకా తగ్గకముందే – ఆ నేపథ్యంలో ఓ నాటకానికి రూపకల్పన జేసి ప్రదర్శిస్తాడు ఫో. ఉదాహరణకు పినో ఫినెల్లీ ( Pino Pinelli) అనే ప్రముఖ కమ్యూనిస్టు కార్యకర్తను అరాచకవాది అన్న ఆరోపణల మీద పోలీసులు అరెస్టు చేసి ‘లాకప్పు డెత్తు’కు గురి చేసినప్పుడు ఫో వెంటనే స్పందించాడు. పోలీసులు ఆ కేసును అణచిపెట్టి, ఆత్మహత్యగా వక్రీకరించి, తమ తమ ఆత్మరక్షణా… పధకాల రూపకల్పనకు పాల్పడినప్పుడు – ఆయా వివరాలు క్షుణ్ణంగా తెలిసిన డారియో ఫో ఇంకా ఆ కేసు కోర్టు గదుల్లో ఉండగానే ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ అన్న నాటకాన్ని రూపొందించి విజయవంతంగా ప్రదర్శించాడు. ఆ ప్రదర్శన జరిగిన చాలా రోజుల తర్వాత కోర్టువారి తీర్పు వచ్చింది. ఫో తన నాటకంలో చూపించిన విషయం నిజమని ఆ తీర్పు నిర్ధారించింది. పినెల్లీ నిర్దోషి అనీ, పోలీసు జులుం వల్లనే మరణించాడనీ ధృవీకరించింది.

తన నాటకాల ప్రదర్శనలలో ఫో – ఆ ప్రదర్శన ముగిసిన తరువాత – నాటకం గురించి చర్చ నిర్వహిస్తాడు, ప్రేక్షకులందరినీ ఆ చర్చలో భాగస్వాములు చేస్తాడు. ఆ రకంగా ప్రతి ప్రదర్శనా ప్రజాప్రదర్శనగా పరిణమిస్తుంది.

***

dario3తమ నువో సినా సమాజాన్ని స్థాపించిన కొద్ది సంవత్సరాలకే ఫో, ఫ్రాంకా రమేలు ఆ నాటక సమాజ స్థాపనా ప్రయోగం విఫలమయిందన్న సంగతి గ్రహించారు.  ఆ సమాజంలో ఉన్నది తమ తోటి కమ్యూనిస్టులే అయినా వాళ్ళు అధికారగణంతో కుమ్ముక్కై నువో సినా ధ్యేయాలనూ, లక్ష్యాలనూ దెబ్బతీస్తున్నారని ఆ దంపతులు గ్రహించారు. నువో సినా నిర్వహణలో కమ్యూనిస్టు పార్టీ అధినేతల నిరంతర జోక్యం కూడా వీళ్ళకి దుస్సహమయింది. అలా విడివడి మరో నలుగురు అతి సన్నిహితులతో కలసి ‘ల కమ్యూన్’ (LA COMMUNE) అన్న మరో చిన్న సమాజాన్ని స్థాపించారు వారు. ఆ విడివడటం పుణ్యమా అని అన్నేళ్ళుగా శ్రమపడి సంపాదించిన సంపత్తిని – లారీ, వ్యాన్లూ, ఎలక్ట్రికల్ పరికరాలు – ఫో వదులుకోవలసి వచ్చింది.

తన భావాలూ నాటకాల పుణ్యమా అని ఓ రంగస్థల సమాజాన్ని స్థాపించి కొనసాగించడమన్నది ఫోకు ఒక ఒడిదొడుకు వ్యవహారంగా పరిణమించింది. శక్తివంతమైన శత్రువర్గం ఏర్పడిందతినికి – మతాధికారులు, ప్రభుత్వ గణం, కాపిటలిస్టులు – అతను ఎవరినయితె ఎండగడుతున్నాడో వాళ్ళంతా సహజంగానే అతని మీద ధ్వజమెత్తారు. అతడినీ అతడి నాటక సమాజాన్నీ సమూలంగా నాశనం చెయ్యాలని వాళ్లంతా కంకణం కట్టుకొని ప్రయత్నించారు. అతని రాతప్రతులు ముందస్తుగా గవర్నమెంటు వారి అనుమతి పొంది తీరాలన్నారు. ఆ అనుమతి పొందే ప్రక్రియలో విపరీతమైన మార్పులకూ, కోతలకూ గురి అయ్యేవి. అలా సెన్సారయిన నాటకాలను మళ్ళీ ఏ మార్పులు చేర్పులూ చెయ్యకుండా ప్రదర్శిస్తున్నారని నిర్ధారించడం కోసమూ, అప్పటికప్పుడు రంగస్థలం మీద ఆశువుగా చేర్పులు చెయ్యడాన్ని అరికట్టడం కోసమూ ప్రేక్షక సముదాయంలో ప్రతీసారీ ఓ పోలీసు అధికారి ఉంటూ ఉండేవాడు. అయినా ఇలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు డారియో ఫో.

సంభాషణల సెన్సారు కత్తిరింపుల వల్ల కోల్పోయిన నాటక భాగాలను శరీరపు కదలికల ద్వారా, ముఖ కవళికల ద్వారా పూరించుకోడమూ నేర్చాడు. పెరోల్ మీద విడుదలయిన నేరస్థులు తమ తమ అనుదిన కదలికలను పోలీసులకు ముందస్తుగా విన్నవించుకోవలసిన రీతిలో డారియో ఫో కూడా తన నాటక సమాజం ఏ రోజు ఏ ఊర్లో ప్రదర్శన ఇవ్వబోతోందో – ఆ వివరాలు పోలీసులకు చెప్పి అనుమతి తీసుకోవలసి వచ్చేది. ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురవుతామన్న భయం వల్ల థియేటర్ల యజమానులు తమ ప్రాంగణాలను డారియో ఫో కు అద్దెకివ్వమనేవాళ్ళు. మిస్ట్రియో బఫో లాంటి ‘చర్చి వ్యతిరేక’ నాటకాలను ప్రదర్శించినపుడు ఆయా బిషప్పులు ఆ నాటకాల పోస్టర్లను గోడల మీద నుంచి చించెయ్యమని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఇవన్నీగాక భౌతిక దాడీ, హింసా ఉండనే ఉంది. అరెస్టులూ, నిర్బంధాలూ, జైళ్ళూ, లాకప్పులూ – వీటికి అంతే లేదు. డారియో ఫో నలభైసార్లు అరెస్టుకు గురయ్యాడు. కొన్నిసార్లు హత్యాప్రయత్నాలకూ గురయ్యాడు. ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’  నాటక ప్రదర్శనలో ఓసారి బాంబు పేలింది. మరోసారి ఫాసిస్టు ముఠాల వాళ్ళు ఫ్రాంకా రమేను కిడ్నాప్ చేసి నిర్బంధంలో ఉంచారు. మరొకరూ మరొకరూ అయితే ఇవన్నీ చూసి బెంబేలెత్తిపోయేవారేమో గానీ డారియో ఫో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎంతో నిబ్బరంతో ఎదుర్కున్నాడు. తన ఆదర్శాలకూ, రంగస్థల నమ్మకాలను సడలనివ్వకుండా నలభై సంవత్సరాల పాటు నిలచి ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన ఈ నోబెల్ బహుమతి అతని శత్రువుల్ని నిర్వీర్యం చేసి డారియో ఫో ను మరింత శక్తిమంతుడిని చేసే అవకాశం ఉంది.

డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడమన్నది రంగస్థల ప్రపంచానికి అనేక విధాలుగా ముఖ్యమైన విషయం. సాహిత్య రంగంలో నాటక రచన అన్నది చిన్నచూపుకు గురవుతోంది; కవిత్వం, నవల లాంటి ప్రక్రియలకున్న గౌరవం నాటక రచనకు లేదు. గత అరవై ఏళ్ళుగా సాహిత్యానికి నోబెల్ బహుమతి అందుకొన్న వాళ్ళ పట్టికను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 1936లో యుగెనీ ఓ నీల్, 1969లో శామ్యూల్ బెకెట్ – ఇప్పుడు డారియో ఫో. అంతే. అంతా కలసి ముగ్గురు. ఒక్కొక్కరికీ మధ్య దాదాపు ముప్ఫై ఏళ్ళ వ్యవధి.  బ్రెక్ట్ లాంటి లబ్దప్రతిష్ఠులు సైతం ఆ నోబెల్ ‘గౌరవాన్ని’ అందుకోలేకపోయారు; అది గౌరవమే అయిన పక్షంలో నాటకాలు రాయడం మరింత కష్టమయిన పని అవ్వడం వల్లనో లేదా ఆ నాటక రచన కళాప్రదర్శనకు ఉన్న మార్గాలు అతి పరిమితం అవ్వడం వల్లనేమో – అంకితభావంతో కథా కవిత సృష్టి చేసే వాళ్ళున్నంత విరివిగా నాటకకర్తలు ఎప్పుడూ లేరు మనకు. ఇప్పుడు ఇలా డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడమన్నది నాటక రచన ప్రక్రియకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని మనం ఆశించవచ్చు.

అలాగే డారియో ఫో బాణీ నాటకాలను ‘మోటు నాటకాలు’గా పరిగణించేవాళ్ళకూ కొదవేం లేదు. రాజకీయాలు, సాంఘిక ప్రయోజనాలు, వ్యంగ్యం, ఫార్సు, అసంబద్ధత, శ్రుతిమించిన హాస్యమూ కలగలసిన ఆయన నాటకాలను చాలామంది ఇప్పటిదాక ‘అశ్లీల’ (vulgar) నాటకాలని నిరసించారు. ఈ బహుమతి పుణ్యమా అని పరిస్థితులలో కొంత మార్పు రావచ్చు. వాటికి మరికాస్త ఆదరణా, ‘గౌరవం’ లభించవచ్చు. సాంఘిక సమస్యలను ఎత్తి చూపడానికీ, సామాజిక చైత్యన్యాన్ని కలిగించడానికీ నాటకరంగం ఒక ప్రముఖమైన మార్గం అన్న కనీస స్పృహ ప్రజల్లో రావచ్చు. సమస్యల గురించి ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించడానికీ, ఆ ఆలోచనల సాయంతో సమాజంలో మార్పును తేవడానికీ రంగస్థలం ఒక శక్తివంతమైన ఆయుధం అన్న గుర్తింపు కలగవచ్చు.

మన దేశం విషయానికి వస్తే దీని ప్రాధాన్యత ఇంకా ఎక్కువ. ఇటలీ లాగానే మన దేశంలో కూడా సాంఘిక సమస్యలు అనేకం. రాజకీయ సమస్యలకి కొదవు లేదు. ఇటలీలో ‘గిల్లారీ’ బాణీ జానపద నాటక కళారూపాలు ఉన్నట్టే మనకూ మన మన శక్తివంతమైన జానపద నాటక సంప్రదాయాలు ఉన్నాయి. నిజానికి మన ప్రతీ భాషకు తమ తమ విస్పష్ట జానపద నాటక సంప్రదాయాలున్నాయి. ఇటలీలానే మనకూ రాజకీయ నేపథ్యం గల, చైతన్యవంతమైన ‘రంగస్థలం’  ఉంది; అది ఇంకా బాల్యావస్థలోనే ఉందన్న సంగతి వేరే మాట. డారియో ఫో కు ఈ విశిష్ట పురస్కారం లభించడమన్న విషయం మనకూ మన రాజకీయ నేపథ్యపు రంగస్థల వ్యవస్థకూ; మన మన జానపద నాటక కళారీతులకూ ఒక నూతన స్ఫూర్తిని కలిగించగలగాలి.

మన రంగస్థలాన్ని మరింత చైతన్యవంతం చెయ్యాలి, శక్తివంతం చెయ్యాలి. అలా అని మనమంతా డారియో ఫో ను గుడ్డిగా అనుకరించాలనీ గాదు; అతని ధోరణీ, అతని బాణీ, అతని పద్ధతులూ పరిశీలించి వాటిని మన పరిస్థితులకు అనుగుణంగా మలచుకొని స్వీకరించాలి. అలాగే మన సాహితీవేత్తలు నాటక రచనను కూడా చేపట్టవలసిన అవసరం ఉంది. డారియో ఫో రచన పద్ధతులను అధ్యయనం చెయ్యడం ద్వారా మన మన సామాజిక సమస్యల మీద విరివిగా నాటక రచన చేసి ఓ  ‘నాటకాల నిధి’ని సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ నిధి రూపకల్పన అన్నది రంగస్థలానికి ఎంతో అవసరం. దేశానికి ఇంకా అవసరం.

 

ఆంగ్లం: ఎస్. బాబూరావు

తెలుగు: దాసరి అమరేంద్ర

*

 

నవల నడచిన దారి

 

 

-దాసరి అమరేంద్ర

~

 

మొదటి తెలుగు నవల వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రము – 1878లో వచ్చింది, దాదాపు నూట నలభై ఏళ్ళ క్రితం.

కథ జీవితపు తునక అయితే నవల ఏకంగా జీవితమే.

జీవితం గురించీ, సమాజం గురించీ తపనపడే నవలల గురించి ఈ మాటలు.

జీవితానికీ సాహిత్యానికీ గాఢమైన అనుబంధం ఉన్నది అన్న నమ్మకంతో ఈ మాటలు.

గత నూట నలభై ఏళ్ళలో నవల పోయిన పోకడలూ, ధోరణుల గురించీ, గత ఇరవై ఏళ్ళలో వచ్చిన ముఖ్యమైన నవలల గురించీ, ఈ మధ్య కాలంలో మంచి నవలలు రావడం లేదు అన్న విషయం గురించీ – అందుకు కారణాల గురించీ ఈ మాటలు.

స్థూలంగా చెప్పాలంటే నవల నడచిన దారిని రేఖామాత్రంగా పరిచయం చేసే ప్రయత్నమిది.

***

ఒకప్పుడు సాహిత్యమంటే పాండిత్య ప్రకర్ష.

రాజులూ, జమీందార్ల వ్యవస్థకు వందిమాగధ ప్రక్రియ. వారి వారి మనోరంజక వ్యాసంగం.

భూస్వామ్యం విచ్చిపోతూ, ప్రజాస్వామ్యానికి దారి ఇచ్చినప్పుడు సమాజంలో ‘మనిషి’ ముఖ్యమయ్యాడు. సాహిత్యానికీ, మనిషే కేంద్రమయ్యాడు. స్వంతంగా, స్వశక్తితో తన జీవితాన్ని నిర్ణయించుకొనే మనిషిని గురించి సాహిత్యం రాసాగింది. అందుకు అనుకూలంగా ఉందే సాహితీ ప్రక్రియలు రూపుదిద్దుకొన్నాయి. కావ్యాలూ, ప్రబంధాల స్థానంలో కథ, నవల వచ్చి చేరాయి. ఆంగ్ల సాహిత్యంలో పద్దెనిమిదో శతాబ్దంలో మొదలయితే, మరో వందేళ్ళకు భారతీయ భాషలలోకి ప్రవేశించి నిలదొక్కుకుంది నవల. ఈ ప్రక్రియకు జన జీవితమే వస్తువయింది. నవల అంటే జీవితానికి ప్రతిబింబం అయింది.

***

ముందుగా రెండు ప్రశ్నలు.

నవలలు ఎందుకు రాస్తారూ?

నవలలు ఎందుకు చదువుతారూ?

ఏ మనిషిలో అయినా ఒక నిరంతర అసంతృప్తి ఉంటుంది.

పరిసరాల మీదా, పరిస్థితుల మీదా, సమాజం మీద ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది.

పరిస్థితి మారాలనుకొంటాడు. మార్పు కోరతాడు. ఆ మార్పు ముందుకూ అవవచ్చూ, వెనకకూ అవవచ్చు. మార్పు కోరతాడు. అందుకోసం తపన పడతాడు.

చలనశీలత ఉన్న వ్యక్తి ఆ మార్పు కోసం నడుం కడతాడు. తనదైన పరిధిలో ఏదో ఒకటి చేస్తాడు – నిర్లిప్తంగా ఉండలేడు.

ఆ మనిషికి తన ఆలోచనల మీదా, అక్షరాల మీద ‘అధికారం’ ఉంటే రచయిత అవుతాడు.

పరిస్థితులను ప్రశ్నిస్తూ, ఘర్షణ పడుతూ, జీవితాలను మెరుగుపరచాలని తపిస్తూ, ఆయా సమస్యల పరిష్కారాల కోసం ప్రయత్నిస్తూ, రెబెల్‌గా మారి –

తన అనుభవాలకు తనదైన చైతన్యం జోడించినప్పుడు జీవితాన్ని నడిపించే సూత్రాల గురించి అవగాహన ఉన్నప్పుడు, గతం ఆసరాగా వర్తమనం భవిష్యత్తు వేపుకు వెళుతుంది అన్న అవగాహన కలిగినప్పుడు,

తనదంటూ ఒక దృక్కోణాన్నీ, దృక్పథాన్నీ ఏర్పర్చుకొన్నప్పుడూ – రచయిత అవుతాడు. నవలా రచయిత అవుతాడు.

మరి చదవడం?

novel6

నేను ఒక గాఢ అనుభూతి కోసం ‘హిమజ్వాల’ పదే పదే చదివాను. ఒకానొక జీవితానుభవం కోసం ‘చదువు’ నవల చదివాను. విభిన్నంగా ఆలోచించగల శక్తినిచ్చే చెలాన్ని చదివాను.

విజ్ఞానమూ, సంస్కారాల కోసం ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు – ఆమె’ లోని శాంతం, శుభ, లక్ష్మిలను పలకరించాను.

ఒక్కమాటలో చెప్పాలంటే జీవితపు చిక్కుముళ్ళు విప్పే శక్తి సాహిత్యానికీ, నవలలకూ ఉంటుందని చదివాను.

జీవితాలను సమూలంగా మార్చి, జీవితాలకు దిశానిర్దేశం చేసే శక్తి ‘జానకి విముక్తి’లకు ఉంటుందని చదివాను.

నా వరకూ నాకు ‘ది మూన్ అండ్ సిక్స్త్ సెన్స్’ అనే ఆంగ్ల నవల దీపస్తంభంలా నిలబడి దారి చూపించడం – స్వానుభవం.

ఒకే ఒక్క జీవితకాలంలో అనేకానేక జీవితాల అనుభవాలను మనకు అందించే శక్తి నవలకు ఉందని చదివాను.

ఈ నేపథ్యంలోంచి చూస్తే తెలుగు నవల నడచిన దారిలో కూడా సమకాలీన జన జీవితంలోని అన్ని పార్శ్వాలు, కోణాలూ, సంఘర్షణలు, పరిణామాలు కనిపిస్తాయి.

నూటా ఏభై ఏళ్ళ తెలుగు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, చరిత్రను మన నవలలు మన ముందు ఉంచుతాయి.

***

ప్రభువుల వ్యవస్థ మారి సామాన్యుడు సాహిత్యానికి కేంద్రబిందువవడం గురించి చెప్పుకొన్నాం. ఆంగ్ల సీమలో పద్దెనిమిదో శతాబ్దానికల్లా కథా నవలా వికసించడం గురించి చెప్పుకొన్నాం.

పంతొమ్మిదో శతాబ్దం ప్రథమ పాదానికల్లా ఆయా మార్పులు మన దేశాన్నీ తాకాయి. ఇంగ్లీషు చదువు మొదలైంది. రాజారామ్‌మోహన్ రాయ్, అతని సంస్కరణలు మనిషికీ, సమాజానికీ వెలుగుబాట పరిచాయి. అదే ఒరవడిలో అక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగార్, ఇక్కడ కందుకూరి వీరేశలింగం.

యాదృచ్ఛికమే అనిపించినా తెలుగునాట అదే సమయంలో అతి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకొన్నాయి. రెండు ఆనకట్టల పుణ్యమా అని సామాన్యుని కడగండ్లకు తెరపడింది. కడుపు నిండింది. సంపద సృష్టి ఆరంభమైంది. పట్టణాలు మొలకెత్తాయి. ఇంగ్లీషు పాఠశాలలు మొదలయ్యాయి. కొత్త ఆలోచనలకు అంకురార్పణ. కొత్త చైతన్యాలు… పరిస్థితుల మీద అసహనం… మార్పు కోసం తపన… సంస్కరణల అభిలాష…

అదిగో – అలాంటి సమయంలో వచ్చాయి తొలి తెలుగు నవలలు.

రాజశేఖర చరిత్రము – వీరేశలింగం – 1878

సహజంగానే ‘సంస్కరణ’ ఈ నవల ప్రధానాంశం. రాజశేఖరునునికి తన అజ్ఞానమంటే అసహనం కలుగుతుంది. తనలోని మూఢ విశ్వాసాలంటే ఏవగింపు కలుగుతుంది. తనలో తాను సంఘర్షించడం, పోరాడడం, జయించడం…

అదే కోవలో మరో నవల – రామచంద్ర విజయం – చిలకమర్తి.

రాజశేఖరుని సంఘర్షణ తనతోనే అయితే, రామచంద్రుని పోరాటం పక్కవాళ్ళతో, వాళ్ళ స్వార్థాలతో, పరిసరాలతో.

మనిషి తనను తాను సంస్కరించుకొంటే, పరిసరాలను మార్చే ప్రయత్నం చేస్తే పరిస్థితులు మారతాయి, ప్రపంచం మరింత బాగుపడుతుంది – అన్న నమ్మకంతో వచ్చినవీ – సంస్కరణ దశలోని నవలలు.

***

క్రమక్రమంగా – వ్యక్తి చైతన్యం, మనుషులు దగ్గరవడం, ఉమ్మడి ఎజెండాలు. 1885 నాటికి ఆ ఎజెండాలు కాంగ్రెసు సంస్థ ఆవిష్కరణకు దారితీయడం… జాతీయ భావాలు… శతాబ్దం మారేసరికి జాతిలో నవచైత్యన్యం.

ఈలోగా నవలకు తోడుగా కన్యాశుల్కాలు, ధనత్రయోదశిలు, దిద్దుబాటులు… వలపు నవలలు, చారిత్రక నవలలు, దుర్గేశ నందిని నకళ్ళు… ఏదైమైనా సాహిత్య ప్రక్రియగా నవల నిలబడటం…

సంస్కరణ బావాలకు ఉద్యమ స్ఫూర్తి తోడయితే నవలలకు కొదవ ఉండదు. అదే జరిగింది తెలుగు నవల విషయంలో.

1920ల నుంచి కనీసం 1960ల వరకూ జాతీయ ఉద్యమ నేపథ్యంగా ఎన్నో చెప్పుకోదగ్గ నవలలు వచ్చాయి.

అందులో బాలాంత్రపు వెంకటరావు రాసిన “మాతృమందిరం” – 1920 తొలి తెలుగు జాతీయోద్యమ నవల అంటారు చరిత్ర తెలిసినవారు. అందులోని ‘మాతృ’ శబ్దం మాతృ దేశానికి సంబంధించినది. గాంధీ ప్రతిపాదన కన్నా ముందుగానే మద్యపాన నిషేధం, హరిజన సమస్య, స్త్రీల సమస్యలు, వర్ణాంతర వివాహాలు, వితంతు వివాహాలు – ఇలా అనేకానేక విషయాలు చర్చించిదట ఈ నవల.

1922లో వచ్చిన మాలపల్లి ఈ ఒరవడిలోణి ఓ బృహన్నవల. జీవన విస్తృతి, వస్తు గాఢత ఉన్న నవల. భారతీయ సంప్రదాయం పట్ల ఎంతో అనురక్తి ప్రదర్శిస్తూ, ఆ సంప్రదాయం భౌతిక పరిస్థితులలో ఎన్ని మార్పులు వచ్చినా – ఆ మార్పులకు అనుగుణంగా తననూ ముందుకు నడిపించుకొంటోంది అన్న గొప్ప నమ్మకాన్ని వ్యక్తీకరించారీ నవలలో ఉన్నవ లక్ష్మీనారాయణ.

 

సరే రామదాసు, సంగదాసు, తక్కెళ్ళ జగ్గడు లాంటి సజీవ పాత్రలూ, గాంధీతత్వపు ప్రతిఫలన, జన జీవన సమగ్ర చిత్రణ – దాదాపు వందేళ్ళు గడిచినా ‘మాలపల్లి’ని తెలుగు నవలలకు తలమానికంగా నిలబెట్టడం అందరికీ తెలిసిన విషయమే.

మాలపల్లి నవలలో మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి.

సమాజంలోనూ, సామాజిక సంబంధాలలోనూ వస్తోన్న స్ఫుటమైన మార్పుల్ని ఆ నవల పట్టుకోగలిగింది. కొత్త చూపు, కొత్త దృక్కోణం, కొత్త దృక్పథం. సమాజాన్ని వ్యక్తిపరంగా గాకుండా సమిష్టి వ్యవస్థగా అర్థం చేసుకొని విశ్లేషించడం – దిగువ జాతులు చైతన్యం పొంది పోరాటం సాగిస్తేనే ప్రజా ప్రభుత్వం సాధ్యమవుతుంది. అలా కాని నాడు ధనస్వామ్యమే చెల్లుబాటు అవుతుందన్న అద్భుతమైన అవగాహన – వందేళ్ళ క్రితం!!

ఇదే ఒరవడిలో బాపిరాజు నారాయణరావులోనూ, విశ్వనాథ వేయిపడగలులోనూ జాతీయోద్యమం ఒక ప్రధాన పాత్ర పోషించింది. ‘అతడు-ఆమె’, ‘కొల్లాయిగట్టితేనేమి’, ‘రామరాజ్యానికి రహదారి’, ‘చదువు’ లాంటి నవలల్లోనూ జాతీయోద్యమ నేపథ్యం ప్రముఖంగా ఉంది.

అదే వలస పాలన, జాతీయ భావన, ఆధునిక జీవన విధానం – ఇవి ముప్పేటగా సాగుతోన్న సంధి దశలో – 1930లు నలభైలలో – ఈ విషయాలను చర్చిస్తూ, సంప్రదాయంలో వస్తున్న మార్పుల్ని గుర్తిస్తూ నవలా రచన సాగింది. ఉన్నవ లాంటి వాళ్ళు ‘సంప్రదాయం నిలిచి తీరుతుంది’ అంటే, విశ్వనాథ ‘ధ్వంసమయిపోయింది’ అని నిర్ధారించడం – వాస్తవ స్థితి చిత్రణ అనడం కంటే వారి వారి దృక్కోణ వైరుధ్యం అనడం సరైన పని.

ఈ మధ్యలో కొవ్వలి వెయ్యికి పైగా పాపులర్ నవలలు రాసి తెలుగు నవలలకు పాఠకులను ఏర్పరచడమన్నది నవల నడచిన దారిలో ఒక ముఖ్యమైన మైలురాయి.

***

స్వతంత్ర్యం వచ్చాకా సామాన్యుని జీవితం ఎలా పరిణమించింది? సాంఘిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆర్థిక, రాజకీయ, పరిణామాల దిశ ఎటువైపు మళ్ళుతోంది? – అన్న ఆలోచన సాహితీకారుల్లో సహజంగానే వచ్చింది. ఆయా విషయాలను నవలలో చిత్రించే ప్రయత్నమూ జరిగింది.

1953లో వచ్చిన జీవీ కృష్ణారావు గారి ‘కీలుబొమ్మలు’ ఆ కోవకు చెందిన నవలల్లో మొట్టమొదట చెప్పుకోదగ్గది.

ఇది ప్రధానంగా అస్తిత్వవాద పోకడలున్న నవల అని విమర్శకులు నిర్ధారించినా – సమకాలీన జీవిత చిత్రణా, రాజకీయాలన్నవి ఏదో అధికార పీఠాలకు చెందినవి కావు – అవి సామాన్యుని జీవితంలోని అన్ని పార్శ్వాలను తాకుతాయి అన్న బలమైన ప్రతిపాదానా ఉన్న నవల ఇది.

ఆ తాకటం మనిషిని ఎంతగా దిగజార్చుతుందో 1961లో వచ్చిన బలివాడ కాంతారావు ‘దగాపడిన తమ్ముడు’లో కనిపిస్తుంది. 1940 వ దశాబ్దపు చివరి పాదంలో నడిచిన ఈ కథలో సన్నకారు రైతులు పట్నపు కూలీలుగా మారడమూ, చివరికి బిచ్చగాళ్ళుగా దగాపడడమూ బలంగా చూపించిన నవల ఇది.

ఇదే ఒరవడిలో 1969 నాటి బీనాదేవి ‘హేంగ్ మీ క్విక్’ లో రాజమ్మ ఉరిశిక్ష కోసం త్వరపడుతుంది. 1975 నాటి అర్నాద్ ‘చీకటోళ్ళు’ లో అదే పరిణామం మరింత బలంగా కొనసాగడం కనిపిస్తుంది. అరవైలలో వచ్చిన రావిశాస్త్రి నవలల్లో పట్టణాల పేద ప్రజల కన్నీళ్ళు, కడగండ్లూ – వ్యవస్థ ఆ కన్నీళ్ళతో ధనస్వామ్యపు పంటలు పండించడం – స్పష్టంగా తెలుస్తుంది.

పట్టణీకరణ తెచ్చిన మార్పుల గురించీ, అవి మానవ సంబంధాలలో తెస్తోన్న విపరీత పరిణామాల గురించీ, జీవితాలలో ధనమూ, స్వార్థాల ప్రమేయం గురించీ మాలతీ చందూర్ లాంటి వాళ్ళు 1950ల నుంచి రాయడం మొదలుపెడితే, అప్పుడే రూపుదిద్దుకొంటోన్న మధ్యతరగతి వారి జీవితాల గురించీ అందులోని స్వార్థాలూ, త్యాగాలూ, సంవేదనల గురించీ, అరవైల తొలి దినాలలో కొమ్మూరి వేణుగోపాలరావు ‘పెంకుటిల్లు’ వచ్చింది. మరో పదేళ్ళకు కొలిపాక రమామణి ‘ఏటి ఒడ్డున నీటి పూలు’…

novel4

***

అటు తెలంగాణా వేపు దృష్టి సారిస్తే బొల్లిముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయుడు’ (1947) నవలలో అప్పటికీ తనదంటూ ఉనికే లేని తెలంగాణా సామాన్యుడు నవలా వస్తువుగా రూపొందడం కనిపిస్తుంది. మరో పదేళ్లకు వచ్చిన వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’లో ఆ సామాన్యుడి ‘కంఠం’ ప్రస్ఫుటంగా ధ్వనిస్తుంది. మరో పదేళ్ళకు వచ్చిన దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్ళు’ నవల – కథాకాలం 1930లకు చెందినదే అయినా – దొరలూ, గడీలూ, ఆడబాపల జీవితాలను కళ్ళకు కడుతుంది. మరో పదిహేనేళ్ళకు అల్లం రాజయ్య కొలిమి అంటించి జనజీవన కఠోరాలను ఆ మంటల వెలుగులో చూపించారు.

ఇటు ఉత్తరాంధ్రకు వస్తే అప్పటి రావిశాస్త్రీ, బలివాడ కాంతారావులకూ, ఇప్పటి అట్టాడ అప్పల్నాయుడికీ సామాన్యుని కతలూ, వెతలే నవలా వస్తువులు. సీమ వేపు వెడితే మధురాంతకం రాజారాం ఆనాడే సిరివాడ చిన్న ప్రపంచాన్ని సృష్టిస్తే, మొన్న కేశవరెడ్డీ, నిన్న నామినీ తమ తమ నవలలకు దిగువ తరగతి జీవితాలనే ముడిసరుకుగా తీసుకొన్నారు. ఈనాటి మధురాంతకం నరేంద్ర తిరుపతి పట్టణంలో గత వందేళ్ళుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా వేళ్ళూని విషవృక్షంగా పరిణమించిందో ‘భూచక్రం’ నవలలో ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు.

***

తెలుగు నవల అంటే అనువాద నవలలను గుర్తు చేసుకోకుండా ఉండలేం. శరత్ తెలుగు వాడా? అన్నది ఏ మాత్రమూ సందేహం లేని ప్రశ్న. బడీ దీదీ మాధవి, దేవదాసు పార్వతి, శ్రీకాంతూ మన మనుషులయ్యారు. గోర్కీ అమ్మ స్ఫూర్తితో నవలలే వచ్చాయి. రాహుల్ సాంస్కృత్యాయన్‌ని చదవని తెలుగు యాత్రాప్రేమి ఉండడు. గోపీనాథ్ మొహంతీ అమృత సంతానం – మన గిరిజనుల గురించేగదా? ‘మరల సేద్యానికి’లో శివరామ కారంత్ చెప్పుకొచ్చిన సరస్వతీ, పారోతీ తెలుగువాళ్ళు గాదూ? ప్రేమ్‌చంద్, యశ్‌పాల్, జయకాంతన్, తజకి, బిభూతిభూషణ్ బందోపాధ్యాయ, జమీల్యా, ఐతమతోవ్, నండూరి అనువదించిన ‘రెండు మహానగరాలు’; ఎన్నో ఎన్నెన్నో పరభాషా నవలలు తెలుగు నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేసాయి.

***

ప్రపంచమూ, సాహిత్యమూ, తెలుగు నవలలు మగవాడి చుట్టూ – అతని సమస్యలూ, పోరాటాల చుట్టూ తిరుగుతోన్న సమయంలో – స్త్రీలకు తమ తమ సమస్యలు లేవా? ఆకాంక్షలు లేవా? పోరాడాల్సిన విషయాలు లేవా? అన్న మౌలికమైన ప్రశ్నలను చలం 20లు, 30లలోనూ బలంగా బయటకు తెస్తే సమాజం ఉలిక్కిపడింది. తత్తరపడింది.

ఆ బాటలో మహిళా నవలాకారులు కొనసాగడం సహజ పరిణామం.

వట్టికొండ విశాలాక్షి 1956లో రాసిన ‘నిష్కామ యోగి’ నవలలో జాతీయోద్యమంలో పాల్గొనేంత చైతన్యమూర్తి అయిన ఓ మహిళ కూడా కుటుంబ వ్యవస్థ దగ్గరకు వచ్చేసరికి నిస్సహాయురాలవడం కనిపిస్తుంది.

మరో ఏడాదికే వచ్చిన డాక్టర్ శ్రీదేవి నవలలో ఇందిర, కళ్యాణిలతో పాటు వసుంధరా వైదేహిలు కూడా వ్యవస్థను ప్రశ్నించి, నిలదీసి, కాలాతీత వ్యక్తులుగా నిలబడడం కనిపిస్తుంది. ‘సహవాసి’ అన్నట్లు తర్వాత వచ్చిన స్త్రీవాదానికి ఆనాటి సజీవవాదం ఈ నవల.

తెన్నేటి హేమలత ఆలోచనలూ, వ్యక్తీకరణలూ ఒక విలక్షణ మార్గంలో సాగితే, రంగనాయకమ్మ కూలిన గోడలు దగ్గర్నించి జానకి విముక్తి దాకా తానే ఒక మార్గం ఏర్పరిచారు. ఎంతో మందికి మార్గదర్శి అయ్యారు. ఓల్గా ఎనభైలలో రాసిన ‘స్వేచ్ఛ’ స్త్రీవాద నవలలకు కొత్త దీపస్తంభం అయింది.

మరో వేపు మాలతీ చందూర్, మాదిరెడ్డి సులోచన, ద్వివేదులు విశాలాక్షి, కె. రామలక్ష్మి, వాసిరెడ్డి సీతాదేవి తమ తమ బాణీలలో మధ్యతరగతి స్త్రీల ఆలోచనలకూ, ఆకాంక్షలకూ, చైతన్యానికీ, వికాసానికీ కేంద్ర బిందువులయిన నవలలు రాసారు. ఇదే ఒరవడిలో సులోచనా రాణి ‘మీనా’ లాంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలను సృష్టించారు.

 

అదే సమయంలో స్త్రీ చైతన్యాన్నీ, అస్తిత్వ స్పృహనూ సంతరించుకొన్న ‘గీతాదేవి’ని మనకు పరిచయం చేసారు వడ్డెర చండీదాస్.

తెలుగు నవలా సాహిత్యంలో 1950లు, అరవైల నాటి తాత్త్విక, అస్తిత్వ, మనోవిశ్లేషణాత్మక నవలలు ఒక ముఖ్యమైన పాయ.

“మనిషిని అర్థం చేసుకోవాలంటే ఏ మనిషిని ఆ మనిషిగా చూడాలి. ఉమ్మడి బతుకుల సిద్ధాంతాలు మనిషి ప్రత్యేకతని దెబ్బతీస్తాయి. మనిషిని యంత్రంగా చేస్తాయి. మనిషే ముఖ్యం.” అంటుంది అస్తిత్వవాదం.

“మనిషి అన్నివేళలా ‘సహజంగా’ ప్రవర్తించడు. అతనిలో అసహజ ప్రవర్తనా ఉండవచ్చు. దానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు వెతకాలి. ఆ ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. అతనికి అప్పుడు సాయం చెయ్యగలుగుతాం” అంటుంది మనోవిశ్లేషణా మార్గం.

మనిషిలోని ఉపచేతన – సబ్ కాన్షియెస్- ను దాటి వెళ్ళి, సుప్త చేతన – అన్ కాన్షియెస్ – లోని భావధారను పట్టుకొనే ప్రయత్నం చేస్తుంది చైతన్య స్రవంతి ప్రక్రియ.

ఈ నవలా కుటుంబానికి తలమానికం 1946లో బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది’. తన జీవితానికీ, తన ప్రవర్తనకూ తాను జవాబుదారీ కాదు అని భావించే దయానిధి అంతరంగపు పొరలలోకి వెళ్ళి ఆ ధోరణికిని ఆవిష్కరించే ప్రయత్నం ఎంతో సమర్థవంతంగా జరిగింది ఈ నవలలో. తర్వాత వచ్చిన శీలా వీర్రాజు ‘మైనా’ నవలకూ, చండీదాస్ ‘హిమజ్వాల’కూ ప్రేరణ అయింది ఈ చివరకు మిగిలేది నవల.

ఈ బాణీలో రావిశాస్త్రి అల్పజీవి రాసారు. గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర రాసారు. హిమజ్వాలా, మైనాల గురించి చెప్పుకున్నాం. ఈ నవలలోని అస్తిత్వవాదం, మనో విశ్లేషణా, చైతన్యస్రవంతి ప్రక్రియలను ముప్పేటలుగా సాగితే, ‘అంపశయ్య’ నవలలో నవీన్ చైతన్య స్రవంతి ప్రక్రియను పరిపూర్ణ రూపంలో దాదాపు ఏభై ఏళ్ళ క్రితమే మనముందుంచారు.

***

ప్రతీకాత్మక నవలల గురించీ మనం చెప్పుకోవాలి.

రాజకీయాల ఊబిలో చిక్కుకుపోయిన ప్రజాస్వామ్యం దున్న గురించి రాసారు వినుకొండ నాగరాజు. కిక్కిరిసిన బస్సును దేశానికి ప్రతీకగా మార్చి స్వర్ణసీమకు స్వాగతం అన్నారు మధురాంతకం మహేంద్ర. దళిత రాజకీయాలలోని విపరీత లక్షణాలను తనదైన బాణీలో ‘నల్ల మిరియం చెట్టు’లో ఆవిష్కరించారు చంద్రశేఖరరావు. అటు చాళుక్యుల కాలాన్నీ ఇటు రాజశేఖరుల ఆవిర్భావాన్నీ ఒకే నవలలో – వీరనాయకుడు-లో చూపించారు పతంజలి శాస్త్రి. సినిమా రంగపు జీవితాలను బట్టబయలు చేసి మనముందు నిలిపారు ‘పాకుడురాళ్ళు’లో రావూరి భరద్వాజ.

***

ఇక్కడ పాపులర్ నవలల గురించి ఒక్కమాట.

అరవైల ఆరంభంలో కౌసల్యాదేవి ఆరంభించిన చక్రభ్రమణం ఈ ఏభై అరవై ఏళ్ళతో నిరంతరాయంగా యండమూరి సులోచనల సాక్షిగా సాగిపోతూనే ఉంది. ఆ నవలలన్నీ తెలిసోతెలియకో వ్యవస్థకు వంతపాడే బాణీవన్న మాట నిజమే అయినా – ఆయా నవలలూ, రచనలూ పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచాయి. కొత్త కొత్త పాఠకులనూ, యువతరాన్నీ అక్షరాల వేపు ఆకర్షించాయి. ఇది అన్ని భాషలలోనూ జరిగింది, జరుగుతోంది.

 

***

తెలుగు నవలల్లో భాష నడిచిన దారిని ఓ మారు చూద్దాం.

తొలి నవలలు – సహజంగానే – శుద్ధ గ్రాంథికంలో నడిచాయి.

ఇరవయ్యో శతాబ్దపు తొలి దినాలు వచ్చేసరికి నవలల్లో సరళ గ్రాంథికం సామాన్యమయిపోయింది.

నలభైలకల్లా శిష్ట వ్యవహారికం, ఏభైల నుంచీ ప్రజలు మాట్లాడే వ్యవహార భాష నవలలకు ఆధారపీఠమయిపోయింది.

ఎనభైలు వచ్చేసరికి నామిని లాంటి వాళ్ళ పూనిక వల్ల మాండలికం సాహితీభాష అయింది. ఒప్పుదల పొందింది.

అయినా నాలుగేళ్ళ క్రితం వచ్చిన ‘బోయకొట్టములు పండ్రెండు’ అన్న నవలను కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె సరళ గ్రాంథికంలో రాయడం, పదిమందినీ ఒప్పించడం – భాష విషయంలో పాఠకులకూ, రచయితలకూ, తెలుగు నవలా సాహిత్యానికీ ఉన్న పట్టు విడుపులకు ప్రబల నిదర్శనం అని చెప్పుకోవాలి.

***

చారిత్రక నవలలంటే ఏమిటీ?

జీవితమే నవలకు ముడి వస్తువు అయినప్పుడు ఒక రకంగా చూస్తే ప్రతి నవలా చారిత్రక నవలే. తన కాలపు సమాజానికి అద్దం పట్టే నవలే.

అయినా మనకు మొట్టమొదట్లో వచ్చిన చారిత్రక నవలలు సహజంగానే – రాజ ప్రశంస, రాజ్య ప్రశంస, జాతీయ దురభిమానాలు ప్రాతిపదికగా, అభూతకల్పనలతో – వచ్చాయి.

కానీ మానవ పరిణామ క్రమంలో కొన్ని కొన్ని సంఘటనలూ, పరిస్థితులూ నిర్వహించిన పాత్రల గురించీ అవి చరిత్ర గతిని మార్చిన విషయం గురించీ కూడా తెలుగులో నవలలు వచ్చాయి. నిన్న మొన్నటి ‘అతడు – ఆమె’, ‘కొల్లాయిగట్టితేనేమి’ లాంటి నిన్నటి నవలల గురించి చెప్పుకొన్నాం.

novel3

మధ్య యుగాల నాటి సమాజం గురించి తెలుగులో వచ్చిన రెండు నవలల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

పదమూడో శతాబ్దపు గోబీ ఎడారులలోణి ఓ తండాకు చెందిన పనినాయకుడు ప్రతికూల పరిస్థితులలో ఏభై ఏళ్ళ పాటు అలుపు లేకుండా పోరాటం చేసి మానవ చరిత్రలోనే అతి పెద్దదయిన సామ్రాజ్యాన్ని నిర్మించిన వైనాన్ని ‘చెంఘిజ్‌ఖాన్’ నవలలో చెపుతారు తెన్నేటి సూరి. ‘రక్తపు ధారల్లో మునిగి తేలిన మనిషి కథ గదా ఈ నవల’ అన్న విమర్శకులకు – “పీడన ఉంటే అగ్ని పుడుతుంది నిజమే – చెంఘిజ్‌ఖాన్ ఓ అగ్నికణం. విధ్వంసకరమైన జ్వాల పుట్టగూడదు అనేవాళ్ళు ఆ పుట్టడానికి హేతువయిన పీడన ఎందుకు ఉందో చెప్పాలి.” అని సమాధానమిచారు తెన్నేటి సూరి.

ఎనిమిది తరాల ఓ బడుగు బోయ వంశం అటు చాళుక్యులు, ఇటు చోళుళ ఒడిదొడుకుల మధ్య చిక్కడిపోయి, తట్టుకొంటూ మనుగడ సాగించినా పాండురంగడు అన్న సేనాని క్రోధానికి మసి అయిపోయిన విధానాన్ని అతి చక్కని రీతిలో చిత్రించారు ‘బోయకొట్టములు పండ్రెండు’ అన్న నవలలో బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె.

ప్రభువుల పల్లకీల గురించి కాకుండా, రాళ్ళెత్తిన కూలీల గురించి వచ్చిన అరుదైన నవలలు ఇవి.

***

నిన్న మొన్నటిదాకా వ్యవసాయ ప్రధానంగా ఉన్న తెలుగు జీవితంలో, వ్యవసాయమే జీవవ విధానంగా బతికిన సాంబయ్యల గురించీ, బక్కిరెడ్ల గురించీ నవలలు వచ్చాయి. మట్టిని తల్లిగా భావించే రోజులు మారి క్రమక్రమంగా వరూధినిలూ, వెంకటపతిలూ భూమిని వ్యాపార వస్తువుగా పరిగణించడాన్ని ‘మట్టి మనిషి’ బలంగా చిత్రించింది. అదే ఒరవడిలో కేశవరెడ్డి ‘మూగవాని పిల్లనగ్రోవి’ వచ్చింది. ఇరవై ఏళ్ళ క్రితం చంద్రలత ‘రేగడి విత్తులు’… నిన్నటికి నిన్న నల్లూరి రుక్మిణి ‘ఒండ్రుమట్టి’.

novel4

***

జీవితాలను అతి సజీవంగా, అతి సహజంగా చిత్రించిన రెండు పుస్తకాల గురించి – నవలలు కాని నవలల గురించి – చెప్పుకోవాలి.

పంతొమ్మిదో శతాబ్దపు ప్రథమ పాథంలో అర్థ అక్షరాస్యుడిగా భారతదేశంలో అడుగుపెట్టిన మెడోస్ టైలర్ అన్న బ్రిటీషు యువకుని ఆత్మకథ ‘సురపురం’. ఆ యువకుడు సమర్థవంతుడైన అధికారిగా, పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడిగా, పరిపూర్ణ మానవుడిగా భారతదేశమే తన దేశమని భావించే మట్టిమనిషిగా 1825 – 65 ల మధ్య పరిణామం చెందిన వైనమూ, ఆ కథ చెపుతోన్న క్రమంలో ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక పరిస్థితుల చిత్రీకరణా – అరుదైన ‘నవల’ ఇది.

1930ల నాటి పట్టణాల్లోని ఓ పెద్ద దళిత కుటుంబంలో ‘చదువు’ మీద ఉన్న పట్టుదల ఎంత గణనీయమైన మార్పులు తెచ్చిందో, ఆ అతి సామాన్యమైన కుటుంబం చదుపు పునాది మీద ఎలా ఎదిగి నిలబడగలిగిందో రాగద్వేషాలకు అతీతంగా నిమిత్తమాత్రంగా చెప్పుకొచ్చిన బయోగ్రఫీ ‘మా నాయన బాలయ్య’. రాసిన మనిషి ఆ బాలయ్య గారి అబ్బాయి సత్యనారాయణ.

ఈ రెండు పుస్తకాలూ ఇంగ్లీషు మూలభాషగా కలవే అయినా వాటి అనువాదాలూ, అందులోని తెలుగు జీవితం – అపురూపం.

***

తెలుగు నవలల గురించి మాట్లాడేడప్పుడు నవలాభిమానులు, ‘విమర్శకులూ’ అడిగేది ఒకటే మాట – ఈ మధ్య కాలంలో మంచి నవలలు అంటూ వచ్చాయా?!

‘వచ్చాయి – లేదు’ అన్నది నా సమాధానం.

ఒక్కసారి గత ఇరవై పాతికేళ్ళను గమనిస్తే మరో ఐరవై పాతికేళ్ళు నిలబడగలిగే నవలలు చాలా కనిపిస్తాయి.

కేశవరెడ్డి నవలలు వచ్చాయి. ‘అంటరాని వసంతం’ వచ్చింది. ‘నల్ల మిరియం చెట్టు’ వచ్చింది. మునెమ్మ, దృశ్యాదృశ్యం, వీరనాయకుడు, బోయకొట్టములు, ఒండ్రుమట్టి, భూచక్రం, నిప్పుల వాగు, వేముల ఎల్లయ్య కక్క…

“వ్యాపార (పాపులర్) నవలల వెల్లువలో కొట్టుకుపోతోన్న తెలుగు నవలకు చేయూత ఇవ్వాలనే” మంచి ఉద్దేశంతో అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ సంస్థలు – ఇరవై ఏళ్ళ క్రితమే – ప్రయత్నం చేసాయి. రేగడి విత్తులు, వలస దేవర, అయిదు హంసలు లాంటి చెప్పుకోదగ్గ నవలలు వచ్చాయి. అమెరికా నేల మీద నుంచి కూడా గొర్తి బ్రహ్మానందం రాసిన ‘అంతర్జ్వలనం’, రెంటాల కల్పన ‘తన్హాయి’ వచ్చాయి. ‘కథతో పాటు నవల కూడా అమెరికా నేల మీద వికాసం చెందుతోంది’ అన్న నమ్మకం కలిగించాయి.

kalpana

అప్పటి మాలతీ చందూర్లకు చక్కని కొనసాగింపుగా మంథా భానుమతి, గంటి సుజలలు చక్కని నవలలు రాస్తున్నారు.

గమనమే గమ్యంగా తెలుగు నవల సాగిపోతోంది.

అయినా –

ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది.

నూతన జీవన విధానాలనూ, ఆర్థిక రాజకీయ పరిణామాలనూ, సాంకేతిక సంక్లిష్టతలనూ ఈనాటి నవల పట్టుకోగలుగుతోందా?!!

లేదనే అనాలి!

ఎందుకనీ?!

నవల అంటే విస్తృత అధ్యయనం. నిరంతర పరిశీలన, విశ్లేషణ. మారుతోన్న జీవితాన్ని ‘పట్టుకోవడం’, కూలంకుషంగా అర్థం చేసుకోవడం… కార్యకారణ సంబంధం మీద మౌలికమైన అవగాహన కలిగి ఉండటం…

ఇది అనుకొన్నంత సులభంగాదు.

మన తెలుగు రాష్ట్రాలలో గత ఇరవై పాతికేళ్ళుగా కంప్యూటర్ వేగంతో మార్పులొచ్చాయి, వస్తున్నాయి. ఈ మార్పుల్ని ‘అందుకోడం’ సామాన్యులకు సాధ్యం కాదు. ఉదాహరణకు కారా గారు ఇరవై ఏళ్ళ క్రితమే తాను కథలు రాయకపోవడానికి మార్పుల్ని పట్టుకోలేకపోవడం ముఖ్య కారణమని అన్నారు. ఇదే మాట ఇంకో సందర్భంలో ఏభై ఏళ్ళ క్రితం కొడవటిగంటి అన్నారు.

ఒప్పుకున్నా లేకపోయినా మనవి ఉద్రేక స్వభావాలు. వెంటవెంటనే స్పందించే తత్వాలు. అవి కవిత్వానికీ, కథలకూ సరిపోతాయేమోగానీ నవల విషయంలో గ్రక్కున విడవాల్సిన విషయాలు. నవలకు సంయమనం, సమగ్రదృష్టి, ఆధార పీఠాలు. కొకు, ఉప్పల, మహీధర లాంటి వాళ్ళు ఆవేశకావేశాలను పక్కనబెట్టి రాసారు. తమ తమ నవలల్లో సిద్ధాంతాల ప్రకారం నడిచే జీవితాలను చిత్రించకుండా, జీవితాలు నడిచే విధానాలను సిద్ధాంతాల నేపథ్యంలోంచి చూపించారు. ఆ సంయమనం ఇప్పుడు – ఈ నూతన జీవన విధానాలలో – కొరవడుతోంది.

నవల రాయడం అంటే ఆరు నెలల తపన, ప్రేమ. కనీసం మూడు నెలల కష్టం. శ్రద్ధగా, ఓపికగా, నిబద్ధతతో, అంతంత కాలం నవల మీద ఖర్చు పెట్టడం – ఊహాతీతమయిపోతోంది!

అయినా

నవల నడిచిన దారిని మరోసారి చూసుకొంటే, గత పాతికేళ్ళ మందగమనాన్ని విస్మరించకుండానే, మనం సంతోషించవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

దాదాపు నూట ఏభై ఏళ్ళ తెలుగువారి జీవితాలకు సాక్షీభూతంగా నిలిచింది తెలుగు నవల. అనేకానేక పరిణామాలను ఒడిసి పట్టుకొని నమోదు చెయ్యగలిగింది. గొప్ప సాంస్కృతిక సంపదగా మిగిలింది. అనుమానం లేదు.

ఈనాడూ, రేపూ సంగతి అంటే –

ఆశావాదంలో తప్పు లేదు గదా!

***

ఈ మాటలన్నీ నా పరిజ్ఞాన ఫలితంగా వచ్చినవి గావు.

సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికీ, జీవితానికి అన్వయించుకోడానికీ నేను చేస్తున్న నిరంతర ప్రయత్నంలో ఒక భాగం ఈ  ‘నవల నడిచిన దారి’ కూర్పు.

కొండను అద్దంలో చూపించే ప్రయత్నమిది.

మరి అద్దంలో కొండే కనిపిస్తోందో – ఎత్తిపోతల బండరాళ్ళు కనిపిస్తున్నాయో – తెలియదు.

ఇది సమగ్రమనీ, దోష రహితమనీ, చర్చకు అతీతమనీ – ఆ భ్రమ నాకు లేదు. చర్చ అంటూ జరిగితే అందులోంచి నేను మరికాస్త నేర్చుకోగలనన్న ఆశ ఉంది.

ఈ మాటలు రాయడానికి మిత్రులు వివినమూర్తి, వాసిరెడ్డి నవీన్‌లతో జరిపిన సంభాషణలు బాగా సాయపడ్డాయి. సహవాసి వ్యాస సంకలనం – నూరేళ్ళ కథ, బాగా ఉపయోగపడింది. ఆ పుస్తకానికి కాత్యాయనీ విద్మహే రాసిన సుదీర్ఘమైన ముందుమాట ఒక సాహితీ గనిలా నా ముందు నిలబడింది. ఏ మాత్రమూ సిగ్గూ, మొహమాటాలు లేకుండా ఆ గని లోంచి మాణిక్యాలను ఏరుకొన్నాను. నా దగ్గర ఉన్న రాళ్ళను వాటితో కలిపాను.

వెరసి – ఈ ప్రసంగ వ్యాసం.

 

 

(27 మే 2016 నుంచి 29 మే 2016 వరకు మూడు రోజుల పాటు డాలస్ నగరంలో జరిగిన నాటా మహా సభలలో రెండో రోజు కార్యక్రమాలలో తెలుగు నవలా సాహిత్యం తీరుతెన్నులపై  దాసరి అమరేంద్ర చేసిన ఉపన్యాసపు పాఠం ఇది).

 

మనింటికి వుడ్‌హౌస్ వచ్చిన వేళా…

 

-దాసరి అమరేంద్ర

~

 

Dasari Amarendraవుడ్‌హౌస్  ఎవరూ?

రావుబహదూర్  సోమేశ్వరరావు  ఎవరూ?

మధ్యలో గబ్బిట కృష్ణమోహన్ ఎవరూ?

ఏవిటీ వీరి సంబంధం?

***

తొంభైమూడేళ్ళు జీవించి, అందులో డైబ్భైరెండేళ్ళపాటు రచనా వ్యాసంగం సాగించి 1975లో వెళ్ళిపోయిన  మహానుభావుడు  పి.జి. వుడ్‌హౌస్.

ఇంగ్లాండు మనిషి. అమెరికా అంటే అభిమానం.  “పన్ను” బాధల  పుణ్యమా  అని ఫ్రాన్సులో ఓ పదేళ్ళు  వున్నాడు.  రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్లకు చిక్కడిపోయి ఓ ఏడాదిపాటు వారి ఆతిధ్యం స్వీకరించాడు. పొరపాటునో, గ్రహపాటునో ఆ జర్మనీవారి రేడియోలో తన బాణీ ప్రసంగాలు  ఓ అరడజను చేసి తన స్వదేశీయల  అసహనానికీ, ఆగ్రహానికీ గురి అయ్యూడు. దాని పుణ్యమా  అని మళ్ళీ ఇంగ్లాడులో అడుగు పెట్టకుండా ఓ ముప్ఫై ఏళ్ళపాటు అమెరికాలో నివసించి, పౌరసత్వం పొంది  అక్కడే  తనువు చాలించాడు.  ఆగ్రహాలు సద్దుమణిగాక  మరణానికి కొద్దినెలలు వందు ఆంగ్లప్రభుత్వంవారి నైట్‌హుడ్ పొంది సర్ వుడ్‌హౌస్ అయ్యాడు.

***

వుడ్‌హౌస్ ఏమి రాశాడూ?

చాలా  రాశాడు. పుంఖానుపుంఖాలుగా రాశాడు. జబ్బసత్తువ వున్న రోజుల్లో మూడు నెలలకో  నవల రాశాడు. ఆ సత్తువ తగ్గినపుడు ఆరునెలలకో  నవల.

నవలలు, కథాసంకలనాలు కలిసి తొంభై రెండు పుస్తకాలు. నలభై మ్యూజికల్ కామెడీల లిరిక్సుకి సహరచయిత. ఇవికాక ఉత్తరాలు, జ్ఞాపకాలు, వ్యాసాలు .. ఎన్నో రాశాడు. కానీ ఏది రాసినా – ఎంత వేగంగా రాసినా – కృషి చేసి రాశాడు. నాణ్యతను వదలలేదు. విజయవంతంగా రాశాడు. “మనకాలపు ఉత్తమ రచయిత’ అన్నాడో సమకాలీన రచయిత – 1930లో.

నిజానికి ఆయన ఏమి రాశాడూ?

సీరియస్ సాహిత్యం రాయలేదు. సామాజిక అంశాలతో రాయలేదు. వ్యంగ్య విమర్శకూ పూను కోలేదు. పోనీ హాస్యరచనలు అందామా – అదీకాదు. “ఫార్సు’ రాశాడు అని తేల్చారు విశ్లేషకులు. నా వరకూ నాకు ఆయన రాసినది రేలంగి, పద్మనాభంల బాణీల మేలు కలయిక అనిపిస్తుంది.

***

వుడ్‌హౌస్ రచనలు పాఠకులను ఆకట్టుకొన్నాయన్నది నిజం, వాస్తవం. రాసి వందేళ్ళు దాటినా, రాసినాయన వెళ్ళిపోయి  నలభై ఏళ్ళు దాటినా అతనిని చదివేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఉన్నారు. ఇంగ్లీషులోనే  గాకుండా తమతమ సొంత భాషలలో అనువదించుకుని చదివేవాళ్ళూ వేలకొద్దీ ఉన్నారు. మన తెలుగులో బాపూరమణల  దగ్గిర్నించి గబ్బిట కృష్ణమోహన్ వరకూ ఆయన అభిమానులు అసంఖ్యాకం.

ఊరికే అభిమానించి ఊరుకోకుండా వుడ్‌హౌస్‌ను అనుసృజించి పెడుతున్నారు గబ్బిట.

***

gabbita1

సరదాగా మరికొంతసేపు అన్న వుడ్‌హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో “సినిమారంగం’కు చెందినవి నాలుగు.

వుడ్‌హౌస్  అభిమానులంతా తమ అభిప్రాయాలను కలగలిపి ఆయన కథల్లో తలమానికంగా ఎన్నుకొన్న “అంకుల్ ఫ్రెడ్ ఫ్లిట్స్ బై’ అన్న 1936 నాటి కథ ఈ సంపుటిలో “సోంబాబాయి వలస కాపురం” గా మొట్టమొదట కనిపిస్తుంది. మాతృకలోని అంకుల్ ఫ్రెడ్ అనుసృజనలో రావుబహదూర్ సోమేశ్వరరావుగా “అవతారం” ఎత్తుతాడు. తన అబ్బాయి అవతారంతో కలిసి తన చిన్ననాటి ఊరు కుందేరుకు విలాసంగా వెళ్ళి ఇరవై పేజీలూ, ఒక గంటా వ్యవధిలో “తన లౌక్యాన్నీ, బుద్ధికుశలతని, సమయస్ఫూర్తిని, చాకచక్యాన్ని” అలవోకగా ప్రదర్శించి పాఠకులను అలరిస్తాడు.

మొదటి భాగంలోని ఏడు కథల్లో నాలుగింట శశిరేఖ ముఖ్యపాత్ర ధారి. ఆమె తల్లి మహారచయిత్రి ప్రసూనాంబ  విస్మరించలేని కథావ్యక్తి. పెరిగి పెద్దయ్యాక సోంబాబాయి అంత గొప్పమనిషిగా రూపొందగల ప్రామిస్ వున్న శశిరేఖ  తాను  ఇష్టపడే  నరహరిని  కాకుండా తల్లి  సూచించి బాధించే వర్ధమాన రాజకీయు నాయుకుడు ప్రసాద్, రచయితగా అపుడపుడే నిలదొక్కుకొంటున్న గంపా శేఖర్, ఏకపక్ష  ఆరాధకుడు దూడల దివాకర్, అవ్యాజ వ్యామోహి శేషగిరులను ఎంతో చాకచక్యంతో “తెల్లవారుఝాము పాలబండి”లు ఎక్కించిన వైనం కనిపిస్తుంది ఈ నాలుగు కధల్లో.

“విధి, “అదృష్టం” అన్న కథల్లో పాత్రలు వేరైనా వాటిల్లోని అనూరాధ, సరిత – శశిరేఖకు కజిన్లే. తండ్రి గోవర్ధనరావూ, జమీందారు నీలకంఠం – ఒకే తాను ముక్కలే. వెరసి ఈ రెండు కథలూ “తాత్విక దృష్టితో’ చూస్తే మిగిలిన నాలుగు కథలకు దగ్గరి బంధువులే.

సినిమారంగపు నాలుగు కథల్లో రెండింట నరసరాజు, రాగిణిల  ఉదంతాలు  కనిపిస్తాయి. మరో కథ “కోతిచేష్టలు’లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగోకథ “మీనా దేశ్‌పాండే తారాపథం’ మొట్టమొదటి సోంబాబాయి కథలాగా మిగిలినవాటికి వేటికీ చెందని విలక్షణత గలది.

***

పరిమితుల దృష్ట్యా చూస్తే  అనువాదం సొంత రచన కన్న కష్టమైనది.

అనుసృజన అనువాదం కన్న మరింత మరింత కష్టమైన పని.

వుడ్‌హౌస్  కథల నేపధ్యం ఇంగ్లీషు గ్రామసీమలకూ, పట్టణాలకూ చెందినది. ఆయా రచనలను ఆంగ్లంలోనే చదువుకునేవాళ్ళకి అది అవరోధం కాకపోవచ్చు. ఇంగ్లీషు రానివాళ్ళ కోసమే ఈ తెలుగు ప్రయత్నం అనుకుంటే – అలాంటి పాఠకులు ఆయా పేర్లూ, ప్రాంతాలూ, ఆచార వ్యవహారాలతో మమైకం అయ్యే అవకాశం దాదాపు పూజ్యం. అందులోనూ ఆయా రచనలు హాస్యమూ, ఫార్సూ, శబ్ద అర్థాలంకారమయం అయినపుడు వాటిల్ని చదివే వాళ్ళకు అవి ఆకాశ పంచాంగాలు అయితీరుతాయి.

మరి వాటిల్ని అభిమానించి, వాటిల్ని తెలుగు మాత్రమే వచ్చినవాళ్ళకు తెలియజెయ్యాలని తపించే వారికి ఏమన్నా మార్గాంతరం ఉందా?! ఉంది!!

అనుసృజన.

గబ్బిట కృష్ణమోహన్ గత ఐదారేళ్ళుగా ఈ మార్గాన వెడుతున్నారు. విజయయాత్ర చేస్తున్నారు. ఈ పరంపరలో సరికొత్త మైలురాయి “సరదాగా మరికొంతసేపు’.

సోమేశ్వరరావు, గోవర్ధనరావు, గంపా శేఖర్, దూడల దివాకర్, శశిరేఖ, బండారు ప్రసూనాంబ, శేషగిరి, బాబ్జీ, అనూరాధ, శ్రీహరి, సరిత, జమీందార్ నీలకంఠం, నరసరాజు, కనకరాజు,రాగిణి, సుభాషిణి, రాజమాణిక్యం-ఉరఫ్-మీనా దేశ్‌పాండే – వీళ్ళ మాతృపాత్రలు ఆంగ్లదేశపు నేలకు చెందినవి అయినా, వీళ్ళంతా పదహారణాలు  తెలుగు  మనుషులు. గబ్బిటగారు ప్రాణప్రతిష్ట చేసిన మన మనషులు.

కథల్లోని  “పానకుటీరాలు” మన సంస్కృతికి చెందినవి కాకపోయినా అనుసృజన నైపుణ్యమా అని పానకంలో యాలక పలుకుల్లానే ఉంటాయి.

“పెరట్లో హాయిగా కూర్చున్న  కోడిపెట్టల్ని అదిలిస్తే రెక్కలు టపటపలాడిస్తూ పరిగెత్తినట్టు ఆడ వాళ్ళంతా బయటకి నడిచారు” (బుసబుసలు); “గుండెకు గాట్లుపడి ఆ గాట్లలోంచి గాలి బయట కొస్తున్నట్టుగా ప్రసూనాంబగారు నిట్టూర్చారు” (విశ్రాంతి చికిత్స); “అప్పుడే గుడ్డులోంచి బయటపడి వృత్తిలో ఓనమాలు దిద్దుకొంటోన్న వడ్రంగిపిట్ట చేసే చప్పుడులా ఉందది” (తల్లిగారి ఘనసత్కారం); “అది విని దివాకర్ చెట్లలోంచి దూసుకుపోయే గాలిలా మూలిగాడు” (తల్లిగారి ఘనసత్కారం) – ఇలాంటి అనే కానేక పదబంధాలూ, వాక్యాలూ అపురూపమైన దేశవాళీతనంతో గుబాళిస్తాయి. అనుసృజనకు అర్థాలు చెపుతాయి.

మూలభాషలో వుడ్‌హౌస్‌గారు ఏమని ఉంటారా అన్న కుతూహలం కలిగిస్తాయి.

ఇవన్నీ ఒక ఎత్తు – కృష్ణమోహన్ “తలాడించేవాడి కథ”లోనూ, “మిస్ మీనా దేశ్‌పాండే తారా పథం”లోనూ చూపించిన ప్రతిభ అమోఘం; అద్వితీయం.

తలాడించే భాగోతుల నరసరాజుకు ప్రేమాయణం గుంటదారుల్లో పడ్డప్పుడు మంచి కిక్కిచ్చే దానికోసం మనసు వెంపర్లాడినపుడు – అవి మద్యపాన నిషేధపు మంచిరోజులు – తనకు తెలిసిన ప్రదేశానికి వెళ్ళి తలుపు తట్టి “ఎవరికి ఎవరూ  కాపలా  బంధాలన్నీ  నీకేలా” అంటూ కోడ్ పాట పాడతాడు. తలుపు తీసిన మనిషి “ఏం సినిమా?” అని అడిగితే “ఇంటికి దీపం ఇల్లాలే” అని, “దాహమేస్తోంది” అంటాడు. ఇది చదివాక మన మనసుకు కిక్కూ  ఎక్కుతుంది. ఇంకా కావాలని దాహమూ వేస్తుంది.

ఏకచిత్ర అగ్రతార మీనా దేశ్‌పాండేగారి మాతృపాత్ర ఆంగ్లభాషలో ఏవేం పాటలు గానించిందో తెలియదుగానీ  మన  రాజమాణిక్యం (ఉరఫ్ మీనా దేశ్‌పాండే) – “పులకించని మది పులకించు” దగ్గర మొదలుపెట్టి  “కల నిజమాయెగా కోరిక తీరెగా” దాకా ఓప్పదీ ఇరవై పాటలు పాడేసి “భళిరా గబ్బిటా!” అని పాఠకులు వీరతాడు వేసేలా చేస్తుంది.

***

gabbita1వుడ్‌హౌస్ రాసినది సీరియుస్ సాహిత్యం గాకపోయినా దశాబ్దాల తరబడి, తరతరాల తరబడి పాఠకులను ఆకట్టుకొందన్న మాట నిజం.

ఏవిటా కారణం? ఏవిటా రహస్యం?

ఖచ్చితంగా చెప్పడం కష్టం.

ఎడ్వర్డియన్ యాసా, కవుల కొటేషన్లూ, అనేకానేక సాహితీ చమక్కులూ కలగలిపి తనదైన ఓ ప్రత్యేక భాషాశైలిని సృష్టించాడు వుడ్‌హౌస్. దాన్ని  కామిక్ పొయెట్రీ అన్న వాళ్ళున్నారు. మ్యూజికల్ ప్రోజ్ అన్న వాళ్ళున్నారు. ఏదేమైనా భాష విషయుంలో వుడ్‌హౌస్ రచనలు భాష పరిధుల్ని దాటుకుని వెళ్ళి కొత్త మైలురాళ్ళను పాతాయి అన్న విషయం దాదాపు అందరూ అంగీకరిస్తారు.

అయినా మూలప్రశ్న మరోరూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

హాస్య, వ్యంగ్య, ఫార్సు రచనలకు  కాలక్షేపమూ, ఉల్లాసమూ  గలిగించడాన్ని మించిన పరమావధి ఉంటుందా?

దానికి రేలంగి సమాధానం చెప్పగలడు – పద్మనాభం చెప్పలేకపోయినా.

ఛార్లీ చాప్లినయితే ఢంకా బజాయించి, గుండెలు బద్దలుకొట్టి చెపుతాడు.

కానీ ఒక్కమాట.

వుడ్‌హౌస్ గురించి మాట్లాడుతూ “సాహితీ ప్రయోజనం” అంటూ వెళ్ళడం చాదస్తపు చర్చ అయి తీరుతుంది.

అయిర పుస్తకపు శీర్షికే ఆహ్వానిస్తోంది గదా:

“సరదాగా మరికొంతసేపు” వుడ్‌హౌస్‌తో గడపమని …

ఇక ఆలస్యం ఎందుకూ – గబ్బిట వుడ్‌హౌస్ దగ్గరికి వెళదాం ..

*

ఎనిమిదో కధ

dasari1‘యజ్ఞం’ కధ రాసి ఏభై ఏళ్ళయింది. అచ్చు పడి నలభై ఎనిమిది. అచ్చు పడ్డప్పట్నించీ ఈ కధ మీద చర్చ జరుగుతూనే ఉంది. వందలాది పుటలు నిండాయి. ఇంకా నిండుతున్నాయి. అందులో కొన్ని పుస్తకరూపంలోనూ వచ్చాయి. వ్యాసాలే కాకుండా ‘యజ్ఞం తర్వాత ..” అంటూ కధలు వచ్చాయి. అడపాదడపా ఆయా వ్యాసాలు చదివాను. చర్చలు విన్నాను. ఆ కధ గురించి తాత్విక స్థాయిలో చేసిన విశ్లేషణాలూ కొన్ని చదివాను. కొన్నికొన్ని వ్యాసాలు ఆ కధ చెప్పని ‘గొప్ప తాత్విక విషయాలు’ కూడా ఎత్తిచూపాయి. ఆయా వ్యాసాలు కూడా చదివాను.

… యజ్ఞం గురించి రాయాలనుకొన్నపుడు ఆయా వ్యాసాలూ, ఆ పుస్తకం, ఓ సారి చదువుదామనిపించింది. కానీ నా స్పందనలు చెప్పడానికి అవి చదవడం అవరోధమవుతుందేమోననిపించింది. విరమించాను.

నిజానికి ఇది విమర్శా వ్యాసం కాదు. విశ్లేషణ కూడా గాదు. గత నలభై ఏళ్ళుగా ఎన్నెన్నో సార్లు ఆ కధను చదివి ఇష్టపడిన నేపధ్యంలో దానిని అందరికీ – ముఖ్యంగా ఈ తరం పాఠకులూ రచయితలకు – నా దృక్కోణంలోంచి పరిచయం చెయ్యాలనిపించింది. అప్పటి వారికి మరోసారి కధను గుర్తు చేస్తే బాగుంటుందనిపించింది.

……

శ్రీకాకుళానికి చేరువలో, సముద్రానికి దగ్గరలో ఉన్న ఊరు ‘సుందర’ పాలెం. తాటి తోపులు, కొబ్బరి చెట్లు, పచ్చని చేలు, నిండు చెరువులు – సుందరమైన ఊరే అది. హైస్కూలు, కరెంటాఫీసు, పోస్టాఫీసు, ఆసుపత్రి, పక్కారోడ్డు, ప్రపంచజ్ఞానం ఉన్న ఊరి వాళ్ళూ- వీటన్నిటితో ‘ఆ కోస్తా ప్రాంతంలో పలువురు అనాధల మధ్య సనాధలా వెలుగుతున్న’నాలుగు వందల ఇళ్ళున్న గ్రామమది. కధా కాలం 1963 నాటికి అన్ని ఇతర గ్రామాలూ అనాధలుగా ఉండి పోతే ఈ ఒక్కటీ సనాధగా ఎలా రూపొందిందీ? దేవుడేవన్నా దిగి వచ్చి మంత్రం వేశాడా?

దేవుడక్కర్లేదు. ఒఖ్ఖ మనిషి చాలు. ఆ మనిషి శ్రీరాములు నాయుడు. కొట్టొచ్చే రూపు, చెరుగని చిరునవ్వు, పట్నం చదువు, సమాజ సేవ కోసం మధ్యలో వదిలి పెట్టటం … ఎం.పీ, ఎమ్మెల్యే అవగలిగి ఉండీ గ్రామ శ్రేయస్సు కోసం ఆ పదవుల కోసం వెంటాడనితనం. అటు శ్రీరామ చెంద్రుని ‘న్యాయ నిరతి’నీ, ఇటు గాంధీ మహాత్ముని ‘నాయకత్వ శైలి’ నీ పుణికి పుచ్చుకున్న మనిషి శ్రీరాములు నాయుడు.

..దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలోనే ఊళ్ళోకి అడుగు పెట్టాడు నాయుడు. నిస్తేజంగా అనైక్యంగా ఉన్న ఊళ్ళో కదలిక తెచ్చాడు. ముందు అవమానాలకూ హేళనకు గురయ్యాడు. మెల్లిగా అందరి విశ్వాసం పొంద గలిగాడు. ముందుగా హైస్కూల్, ఆ తర్వాత చకచకా అనేకానేక అభివృద్ధి కార్యక్రమాలు – పదిహేను సంవత్సరాలలో ఊరు సనాధగా ఎదిగింది. ప్రభుత్వ వర్గాల ముద్దు బిడ్డ అయింది. ఊరి తగవులు గుడి మంటపం దాటి వెళ్ళారాదన్న కట్టుబాటుకు ఏకతాటిన ఊరిని నిలిపిన ‘న్యాయకోవిదుడు’ శ్రీరాములు నాయుడు.

…..

ఇంతకూ ఈ యజ్ఞం కధ ఏమిటీ?

మామూలే. ఓ చిన్న అప్పుల తగవు. తీసుకోడం, తీర్చలేక పోవడం, తగాదా, అది ఏళ్ళ తరబడి నలగడం, పంచాయితీ, ఆ తగవు తీర్చే పని శ్రీరాములు నాయుడి మీద పడటం…

అప్పు పడ్డ అప్పల్రావుడు ఊరి మాలల్లో పెద్ద. బంధు బలగం ఉన్నవాడు. పంచాయితీ హరిజన మెంబరు. “మాటకు నిలబడే మనిషి” అన్న ఖ్యాతి ఉన్న వాడు. అప్పు ఇచ్చిన గోపన్న ఓ చితికిపోయిన షావుకారు. సాత్వికుడు. చిన్నకారు వ్యాపారిగా మొదలెట్టి, పంటల వ్యాపారిగా ఎదిగి, వ్యాపారంలో నష్టాలు సొంతవాళ్ళ దగా వల్ల చితికిన మనిషి.

బాకీ మొత్తం రెండు వేలు – వడ్డితో రెండువేల అయిదు వందలు. అసలు మూడేళ్ళ క్రితమే పంచాయితీకి ఎక్కవలసిన కేసు. శ్రీరాములునాయుడు మధ్యస్థంతో సరి పెట్టాడు. తనకున్న పొలమంతా అమ్మితేగానీ బాకీ తీరదు గాబట్టి మరో మూడేళ్ళు గడువు అడిగాడు అప్పల్రావుడు. ఇతర పెద్దల్నీ, గోపన్ననూ ఒప్పించి ఆ గడువు ఇప్పించాడు శ్రీరాములు నాయుడు. అది రేపటితో ముగుస్తుంది.

అంతిమ నిర్ణయం వెలువరించవలసిన సమయం వచ్చేసింది.

*****

గుడి మంటపంలో పంచాయితీ. ఊరు ఊరంతా పోగు పడింది.

“నేను చితికి పోయాను. మీరు ఎంత ఇప్పిస్తే అదే మహా ప్రసాదమనుకొంటాను”. అంటాడు గోపన్న . అప్పల్రావుడు ఉలకడు. పలకడు.. అందరి సహనాలు అడుగంటే వేళ నోరు విప్పుతాడు. “మాకున్నమడిసెక్క అమ్మించేసయినా అప్పు తీరుమానం సేయాలని సబవోరికి ఉన్నట్టుంది. అదే నాయవయితే సెప్పండి. నెత్తి నెట్టుకొంటాను.” అంటాడు. “అయితే ఇది అప్పుగాదంటావా? తీర్చమనడం న్యాయంగాదంటావా” అని పెద్దలు రెట్టిస్తే – “అవునో గాదో మీరే ఆలోసించి సెప్పాల” అంటాడు!!

శ్రీరాములు నాయుడు కాసేపు ఆలోచించి “పెద్ద మనసుతో “ “రావుడూ, తగవు తీరుస్తున్నాను. ఈ నాటి నుండి నువ్వు గోపన్నగారికి నయాపైసా బాకీ లేవు. గోపన్నగారూ – ఎల్లుండి రండి. చెల్లు బెడతాను” అంటాడు.

ఇంకేం … తగవు తీరినట్టేగదా… శ్రీరామచంద్రుడంత ఉదాత్తంగానూ, గాంధీ మహాత్ముడంత న్యాయంగానూ నాయుడుగారు తీర్పు చెప్పారు గదా. కధ సుఖాంతమే గదా.

.. మరి విషయం ఇంకా ముందుకు నడిచి ఒక హింసతోనూ హత్య తోనూ, ఒక కట్టుబాటు చెల్లా చెదరవడంతోనూ, ఒక వ్యవస్థ బీటలు వారడంతోనూ ఎందుకు ముగిసినట్టూ!!

……

అసలు కధ అప్పుడే మొదలయింది గాబట్టి.

కధను శ్రీరాములు నాయుడు భుజాల మీంచి దించి అప్పల్రావుడు నడిపించాడు గాబట్టి. చివరికి అది అప్పల్రావుడి కొడుకు చేతుల్లో కత్తిగా మారి ‘ఒక తల – ఒక చిన్న దేహం’ గా మిగిలింది గాబట్టి.

శ్రీరాములు నాయుడు తీర్పు వెనుక అలకా ఆగ్రహం ఉన్నాయని ఎత్తి చూపి అందుకు కారణం చెప్పమని నిలదీస్తాడు అప్పల్రావుడు. అంతే గాకుండా నువ్వు కవుకు దెబ్బలు కొడుతున్నావంటాడు. చాప కింద నీరులా ముంచే మనిషివంటాడు. నా వేలితో నా కన్నే పొడుస్తున్నావంటాడు. “నువ్వు చెప్పిన తీరుపు నాయవయినదేనా? అసలు నాది అప్పేనా?” అని నిలదీస్తాడు.

అప్పటిదాకా శ్రీరాములు నాయుడిని అంత మాటలు అన్నవారు లేరు!

అరుదైన ఉద్రేకానికి గురి అయిన శ్రీరాములు నాయుడు “ఇది అప్పే! అప్పే!!అప్పే!!” అని ముమ్మారు ప్రకటిస్తాడు. “అసలు ఇది అప్పుగాదని ఎవరైనా ఎలా అంటారో నాకు బోధ పడటం లేదు” అంటాడు.

అప్పల్రావుడి మడి సెక్క అమ్మి అప్పు తీర్చడానికి రంగం సిద్ధమవుతుంది.

“శ్రీరావులు బాబూ నిజం నీకూ తెలిసుండదు. ఇది నాయవైన అప్పుగాదని ఎందుకన్నానో ఆ కధంతా తవరికి సెప్పి అమ్మకం కాయితాల మీద ఏలి ముద్ర పెడతాను” అంటాడు అప్పల్రావుడు.

ఏభై ఏళ్ళ నాడు తను ఆరు ఎకరాలకూ సిన్న కొంపకూ వారసుడవడం, ఊళ్ళో అందరికీ అంతో ఇంతో సెక్క ముక్కా, సరిపడా తిండి గింజలూ కట్టుకోడానికి గోచి ముక్కా ఉండటం, వాళ్ళ పిచ్చి కుంచాల వర్తక ధర్మాలకు మోసపోయినా రైతులు షావుకార్లకు మదుపు పెట్టే స్థితిలో ఉండటం…

మెల్లిగా పొగాకూ వేరుశెనగలాంటి వ్యాపారప్పంటలు రావటం, మగ్గాలు మూత పెట్టిన సాలెవాళ్ళు పంటల వ్యాపారంలో దిగి షావుకార్లవడం, వాళ్ళు కింద నుంచి పైకి లేవగా రైతులు కిందకి దిగజారడం..

వ్యాపారప్పంటల్లో కలిసి వేలు పెట్టిన తానూ గోపన్న అయిదేళ్ళ పాటు కలసికట్టుగా పైకి లేవడం.. తర్వాత గోపన్న పైకీ తాను కిందకీ చేరడం, తొమ్మిది ఎకరాలయిన తన ఆరెకరాల పొలం చివరికి రెండుంచిల్లరకు తగ్గి పోవడం, మాలలూ గొల్లలేగాకుండా కొందరు కొందరు కాపులూ ఈ సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరవడం …

.. అప్పులమాయ తెలిసీ రైతులు చేజేతులా అందులో చిక్కుకోవడం, చివరికి అప్పునిచ్చిన షావుకార్లూ మునిగిపోవడం, ఊళ్ళో వర్తకుల్ని బయట వర్తకులూ, వాళ్ళను ఇంకా పెద్ద వర్తకులూ ముంచేయడం, ఇదంతా “నరుడు తెచ్చిన ముప్పా; నారాయుడు బెడుతున్న సిక్కా” అన్న మీమాంస.

ఇవన్నీ చెప్పాక పదిహేనేళ్ళనాడు శ్రీరాములు నాయుడు ఊళ్ళోకి అడుగు పెట్టినపుడు తామంతా సంబరపడటం, హైస్కూలూ రోడ్డూ లాంటివి పేదోళ్ళకు కొంత కాలం పనులు కల్పించినా కొత్త పనులు లేక చతికిల పడటం, రోడ్డు వల్ల బళ్ళ వాళ్ళూ , కరెంటు వల్ల ఏతాల వాళ్ళు , మిల్లుల వల్ల దంపుడు వాళ్ళూ జీవనోపాధి కోల్పోవడం, ఊరు బాగుకోసం విరాళాలూ, భూవులూ ఇచ్చిన కామందులు బాగు పడగా – శ్రమ దానం చేసిన బీదా బిక్కి మరింత చిక్కి పోవడం చెబుతాడు. శ్రీరాములు నాయుడు పుణ్యమా అని ఒకప్పుడు దివాల తీసిన షావుకార్ల బిడ్డలంతా ఇపుడు ఎలా పుంజుకొంటున్నారో చెబుతాడు. శ్రీరాములు నాయుడు మొదలెట్టిన యజ్ఞం అందర్నీ ఎలా పాపంలోకి దింపిందో చెబుతాడు. గతరాత్రి తన కొడుకు సీతారావుడు “బూవి అమ్మితే నిన్ను నరికి నన్ను నేను నరుక్కు సస్తాను” అనడం గురించి చెబుతాడు. ఇంటెల్లపాది రెయ్యింబవళ్ళు కష్టపడినా తమకు గంజి మెతుకులు దొరక్క పోగా రుణాల ఊబిలో దిగబడటమూ – అటు ఏవీ లేనోళ్ళు ఏడాది తిరిగే లోగా కావందులవడమూ చెప్పి “ఎవరి సొమ్ము ఎవరు పడేసుకోడం వల్ల గొప్పోళ్లయిపోతున్నారో, ఎవరికెందువల్ల కూడు బుట్టకుండా పోతుందో ఆ ఇవరం మీరే చెప్పండి” అని అడుగుతాడు.

..అడిగి, శ్రీరాములుకేసి చూసి, క్షణ కాలం ఆశపడతాడు. తనది అడియాస అని తేలగా వేలిముద్ర వేస్తాడు. సీతారావుడు పరుగు పరుగున పేటకేసి వెళతాడు. అక్కడేదో జరగబోతుందని శ్రీరాములు నాయుడు గ్రహిస్తాడు. చిరునవ్వు స్థానంలో చీకట్లు కమ్ము కొంటాయి. గజగజ గజగజ వణుకు. ఆ ధీరోదాత్తుడిలో ఈ మార్పుచూసి జనంలో భయం…

.. తిరిగొచ్చిన సీతారావుడి భుజాన ఉన్న గోనె సంచిలో ఓ తల – చిన్న దేహం.. సీతారావుడి కొడుకుది. నోరు విప్పిన సీతారావుడు జనం మెప్పు కోరే అప్పల్రావుడ్నీ, తనను ఏలే దొరలు మునసబు కరణాలని గ్రహించలేని ‘ఎర్రిపీరు’ శ్రీరాములునాయుడినీ ఎండగట్టి – మునసబుకో సవాలు విసురుతాడు: మంటపం తెరిచిన రోజున ఊళ్ళో తగాదా ఊర్లోనే తీరుమానం గావాలని నువ్వు అన్నావట … ఇపుడు చెప్పు అచ్చురిపోర్టు కోస్తావా, నా కూనీ మాఫ్ చేస్తావా…

ఈ ప్రశ్నకూ ఇలాంటి లక్షలాది ప్రశ్నలకూ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వ్యవస్థ సమాధానం చెప్పదు. చెప్పలేదు.

“ధర్మ పన్నాలెంతవరకూ? … అంతా నువ్ చెప్పినట్టు వినే వరకూ …. “ అన్నవ్యాఖ్యతో “యజ్ఞం” ముగుస్తుంది.

…..

సూటిగా సాగిన కధ. ఏ మాత్రమూ క్లిష్టత లేని భాష. ‘మన ఊర్లోనే జరిగినట్లు ఉందే’ అనిపించే సహజమైన కధా మండప వేదిక . రక్తమాంసాలున్న పాత్రలు.

.. వస్తువు? భగవంతుడికి కూడా ఒక పట్టాన అర్ధం కానంత అతి క్లిష్టమయినది!!

చదివేవాళ్ళను ఉద్దేశ్య పూర్వకంగా ‘తప్పుదారి’ పట్టించి, రామరాజ్యపు సౌరభాలను చవి చూపించి, మాహాత్ముడు కలలుగన్న మరో ప్రపంచపు పొలిమేరలకు చేర్చి, ఓ తాడూ బొంగరం లేని ఊరు ఒకే ఒక్క వ్యక్తి పూనికలో ఆదర్శ గ్రామంగా ఎలా ఎదగగలదో చూపించి .. నిరూపించి…

..ఊహల ఉయ్యాలల్లో ఒళ్ళు మరచిపోతున్న పాఠకులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసి, వారి గుండెల మీద వేల సమ్మెట పోట్లు పెట్టి, రెండు తరాలు గడిచి పోయినా ఆ పోట్లు ఇంకా సలుపుతూ ఉండేలా చెయ్యడం ఎవరికన్నసాధ్యమా?

సాధ్యమేనని చెపుతుంది “యజ్ఞం”.

చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించి, పరిణామాల్ని పరిశీలించి, విపరీత లక్షణాలను గ్రహించి; ఆ గ్రహింపు ఏదో చైతన్యాన్ని మేలుకొలిపినపుడు, ఒక సంవేదనకు మూలమయిన ఒక ఆవేదనకు ప్రేరణ అయినపుడు, తన పరిశీలనకు సామాజిక ఆర్ధిక అవగాహన జోడించినపుడు, సమస్యల మూలాలను రాగద్వేష రహితంగా శోధించినపుడు, ఆయా పరిశీలనలనూ శోధనలనూ వాస్తవానికి దగ్గరగా నిజ జీవిత సంఘటనల సాయంతో అక్షర రూపంలో అరుదైన సృజనతో చిత్రించినపుడు ‘యజ్ఞం’ లాంటి కధలు పుడతాయి. సమాజపు చేతన మీద సమ్మెట పోట్లవుతాయి.

ఈ అప్రయత్న ప్రయత్నం ఆరు సారా కధల్లో కనిపిస్తుంది. ‘స్మైల్’ రాసిన ఖాళీ సీసాల్లో కనిపిస్తుంది. మరో రకంగా పద్మరాజుగారి ‘గాలివాన’, బుచ్చిబాబు ‘నన్ను గురించి కధ రాయావూ’ ల్లో కనిపిస్తుంది. కానీ ‘యజ్ఞం’కు ఓ చారిత్రక ప్రాముఖ్యత ఉంది.

“ఒకప్పుడు తెలుగు కధ వ్యక్తుల అంతరంగ జీవనాన్ని కేంద్రంగా చేసుకొని సాగింది. ఇపుడు వ్యవస్థాగత జీవన చిత్రణ ముఖ్య పాత్ర వహిస్తోంది. వ్యక్తి – సమాజం – వ్యవస్థల మధ్య ఉన్న పరస్పర సంబంధాల చిత్రణ జరుగుతోంది. బహుశ యజ్ఞం కధ అందుకు నాంది పలికిందనుకొంటాను. అందుకే ఆ కధకు ఒక ఉనికి వచ్చింది. దోపిడీ నిజరూపాన్ని బలంగా సాహిత్యపు ఎజండాలోకి తీసుకు వచ్చిన కధ యజ్ఞం” అన్నారు కాళీపట్నం 1997 నాటి ఒక ఇంటర్వ్యూలో. నిజానికి తెలుగు కధా చరిత్రను యజ్ఞంకు ముందు, యజ్ఞం తరవాత అని వర్గీకరించుకోవచ్చు.

…..

ఏభై ఏళ్ళు దాటినా ఒక రచన ఇంకా ఎంతో రెలవెంట్ గా ఉందంటే అది సంతోషించ దగిన విషయమా – ఆందోళన పడవలసిన విషయమా?

కొడవటిగంటి గారితో నేను పరిపూర్ణంగా అంగీకరిస్తాను. అది ఆందోళనదాయకం.

కానీ ఏభై ఏమిటి వందల సంవత్సరాలు గడిచినా వేమనలు ఇంకా మనకు దిశానిర్దేశకులే! అంచేత ఆందోళన కాస్తంత పక్కన పెట్టి యజ్ఞం ఎత్తి చూపిన అనేకానేక విషయాలను పరిశీలించి, అధ్యయనం చేసి, చర్చించి మనం కాస్త ముందుకు వెళ్ళవలసిన అవసరమూ అవకాశమూ లేవూ?

పుష్కలంగా ఉన్నాయి.

ఏది అభివృద్ధి? ఏది సమాజ సౌభాగ్యం? ఏది సమర్ధ నాయకత్వం? ఏది గుడిబండలాంటి మన గతం? ఏది బహుజన హితం? ఏది న్యాయసమ్మతమైనా నైతికంగా దివాళాకోరుతనం? ఏయే ప్రమాదాలను మనం దాటుకొని వచ్చాం? ఏయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి? ఎవరు తమకే తెలియని మేకవన్నెపులులు? ఎవరు తమకే తెలియని అమాయక బలిపశువులు ….

ఇలాంటి ప్రశ్నలు – మనం సుందరపాలెంలో ఉన్నా, రాబోయే రాజధానిలో ఉన్నా – గ్రహించగల అడగగల శక్తి మనకు కావాలి. ఈ విషయంలో ఇప్పటికీ దిశానిర్దేశం చెయ్యగల దార్శనికత ఉన్న రచన యజ్ఞం. విరుచుకు పడబోతున్న ప్రపంచీకరణ గురించి 1964లోనే ‘యజ్ఞం’ ప్రమాద ఘంటికలు మోగించినా ఇంకా మనం ఆ విషయంలో ఏనుగును వర్ణించే నలుగురు అంధుల్లా లేమూ?! రావి శాస్త్రి నుంచి, కాళీ పట్నం నుంచీ మనం గ్రహించి చర్చించవలసిన విషయాలు ఎన్నో లేవూ?

……

ఈ సంధర్భంగా ‘యజ్ఞం’ కధ గురించి ఒకటి రెండు విషయాలు చెప్పుకోవాలి. కధలో వ్యవస్థ చేసే పన్నాగాలనూ, దుర్మార్గాలనూ అప్పల్రావుడితో ఎంతో స్పష్టంగా సూటిగా చెప్పిస్తారు రచయిత. ఆ తర్వాత సీతారావుడితో ఆ వ్యవస్థను తిరుగులేని విధంగా సవాలు చేయిస్తారు.

కొమ్ములుదిరిగిన ఆర్ధికవేత్తలకూ, సామాజిక సంవేదన ఉన్నఅభ్యుదయాన్ని మనసారా కాంక్షించే మేధావులకూ అంతుచిక్కని వ్యవస్థాగత పద్మవ్యూహ దుర్మార్గాలు కధలో అప్పల్రావుడూ, సీతారావుడూ అరటిపండు వలచి చేతిలో పెట్టినంత సులభంగా, సమర్ధంగా ఎలా విప్పి చెప్పగలిగారు?! నిజమే ఒక జీవితకాలం ఆలోచనాశీలతతో గడిపిన కొంతమందిలో సహజ పరిజ్ఞానం – నేటివ్ విజ్డమ్ – పుష్కలంగా ఉండే మాట నిజమే. కానీ ఆ పరిజ్ఞానం సునిశిత పరిశీలన వరకూ పనికొస్తుందే గానీ సూక్ష్మ అవగాహనకూ విషయ నిర్ధారణా సీమకూ చేరుకోలేదు. మరి అంత క్లిష్టమయిన వ్యవస్థాగత విషయాలు రాత్రికి రాత్రి అప్పల్రావుడు ఎలా గ్రహించగలిగాడూ?! (నా మట్టుకు నాకు నిజం నిన్న రేత్తిరి దాకా తెలియలేదు…) అతని ఆ అవగాహనకు దోహదం చేసిన సీతారావుడికి, చుట్టం ఎర్రయ్యకూ మాత్రం అంత విచక్షణ ఎలా సమకూరిందీ? ఈ వ్యాసం కోసం కధను పదే పదే చదివినపుడు ఈ సందేహం నాకు పదేపదే కలిగింది. మళ్ళీ నిదానంగా ఆలోచిస్తే ఈ కధాపరిధిలో, ఈ కధా నేపధ్యంలో విషయాన్ని అలా అప్పల్రావుడితో చెప్పించడం కన్నా మరో మార్గం లేదనీ నాకు అనిపించింది.

అలాగే కధ చిట్టచివర సీతారాముడు – దాదాపు హఠాత్తుగా – శ్రీరాములు నాయుడిని ‘ఏలేది’ కరణమూ, మునసుబూ అన్న సంగతి స్ఫుటంగా ఎత్తి చూపుతాడు. వాళ్ళను ప్రభుత్వానికీ, రాజ్యానికీ, వ్యవస్థకూ ప్రతీకలుగా తీసుకొని రచయిత ఆ మాట చెప్పించాడన్న మాట నిజమే కానీ.. కధలో వాళ్ళిద్దరూ ‘ఏలే’ ప్రక్రియను సూచనా మాత్రంగానైనా చిత్రించకుండా ఒక్కసారిగా ఆ మాట చెప్పించడం వెలితిగా అనిపిస్తుంది. ఆ కరణం మునసబుల పాత్రలు దాదాపు మౌన పాత్రలు… ఇంకొంచం శ్రద్ధగా వాళ్ళ పాత్రలనూ, ఆ నిర్ధారణనూ చిత్రించి ప్రతిపాదించి ఉండవలసింది.

సుందరపాలెం ‘ అభివృద్ధి’ చెందిన క్రమాన్ని కధలో చెప్పినపుడూ, ఆయా అభివృద్ధి కార్యక్రమాల విష పరిణామాలను ఎత్తి చూపినపుడూ – అసలు ఈ కధ యావత్తూ అభివృద్ధిని నిరసిస్తోందా- అన్న అనుమానం కలిగింది నాకు. ( రోడ్లు వచ్చి బళ్ళ వాళ్ళు, కరెంట్ వచ్చి ….) . నిజమే – సమాజంలో ఒక్కో మార్పు సంభవించినపుడు ఒక బృందం, ఒక్కోసారి ఒక తరం యావత్తు తమ జీవనోపాధినే గాకుండా జీవన విధానాన్ని సైతం (వే ఆఫ్ లైఫ్) కోల్పోయి ఒడ్డున పడ్డ చేపలవడం ఒక చారిత్రక వాస్తవమే. కానీ అలాగే రైళ్ళూ రోడ్లూ కార్లూ విమానాలు కరెంటూ రైసుమిల్లులూ – చారిత్రక అవసరాలు. సామాజిక వాస్తవాలు. ఆ మార్పుల వల్ల అనేక మంది నిరాధారులుగా మిగిలే ప్రమాదాన్ని ముందే గ్రహించి వాళ్ళ వాళ్ళ జీవితాలను వీలయినంత సరళంగా, బాధారహితంగా చేయగల ముందస్తు ప్రణాళికలను రూపొందించి అమలు పరచడం దార్శనికత ఉన్న ప్రభుత్వాలు చేయవలసిన పని. కానీ చాలా సార్లు ప్రభుత్వాలు ఈ పని చెయ్యవు. అంత మాత్రం చేత యావత్తు అభ్యుదయాన్నే శంకించడం నిరసించడం సమంజసమా?!

……

సీతారావుడు తన కొడుకును తెగ నరకడం విషయంలో ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది. జరుగుతోంది. అందులోకి నేను వెళ్ళను. నాకు అంత శక్తి లేదు. కానీ ఒక్క మాట – ఆ సంఘటనను చిత్రించడంలో రచయిత ప్రాధమిక ఉద్దేశ్యం ఏమయినా అది వ్యవస్థ కాలరు దొరక బుచ్చుకొని నిలదీయడానికి బలంగా ఉపయోగపడింది. (రిపోర్టా – మాఫీనా?) జవాబు ఇవ్వలేని సవాలును సంధించడానికి గొప్పగా ఉపయోగపడింది. అదే ప్రశ్నను మనకు మనమూ వేసుకొని సమాధానం చెప్పవలసిన నిరంతర అవసరాన్ని కల్పించింది.

శ్రీరాములునాయుడూ, అప్పల్రాయుడూ, సీతారావుడూ, గోపన్న, మునసబు, కరణం, గుడిమంటపం, హైస్కూల్, రోడ్డు – ఇవి అసలు స్థలాలూ పాత్రలూ కావు, ప్రతీకలు – అన్నఆలోచన ఒకటి ఉంది. ఆయా ప్రతీకలను గుర్తించి వివరించి కధలోని తాత్వికతను, గోప్యతను విశదీకరించి యజ్ఞాన్ని ఇంకా ఉన్నతీకరించవచ్చు. నేను ఆ హనుమంతుడ్ని గజం బద్దతో కొలిచే పని పెట్టుకోను. నిజానికి మనం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదని నేను అనుకొంటాను. కధను ఉన్నది ఉన్నట్టుగా మన ఆలోచనల్లో, అనుభవాల్లో, సంస్కారంలో, విజ్ఞానంలో ఒక భాగం చేసుకోగలిగితే మనల్ని మనం ఎంతో ఉన్నతీకరించుకో గలుగుతాం!

……

చట్టం, న్యాయం, ధర్మం, నీతి అన్న అంశాల మూలాలలోకి వెళ్ళి ప్రశ్నించిన రచన ‘యజ్ఞం’. ఎంతో సంక్లిష్టమయిన వ్యవస్థ స్వరూపాన్ని సామాన్య పాఠకులకు కూడా అర్ధమయ్యేలా విప్పి చెప్పిన కధ ఇది. ఆ చెప్పటం కూడా ‘వేదిక’ మీది భాషణ ధోరణిలో గాకుండా ‘ మనకు తెలిసిన దానిని పది మందితో పంచుకోవడం’ అన్న ధోరణి లో సాగడం వల్ల విషయం పాఠకుల మేధస్సులకే గాకుండా మనస్సులకు సైతం సూటిగా చేరగల సౌలభ్యం సాధించింది ఈ కధ.

ప్రపంచంలో ఏడే ఏడు కధలున్నాయనీ, మిగిలిన ఏడు మిలియన్ల కధలూ – రామాయణ మహాభారతాలూ, ఇవియడ్ ఒడెస్సీలతో సహా – ఆ ఏడు కధల ప్రతిరూపాలేనని ఒక సర్వజన ఆమోదముద్ర ఉన్న సాహితీ భావన బాగా ప్రచారంలో ఉంది. అది నిజమే అయిన పక్షంలో ఆ ఏడింటికీ తప్పక జోడించవలసిన ఎనిమిదో కధ – యజ్ఞం.

                                                                                                        దాసరి అమరేంద్ర

కథా చిలుక ఇంక చేతికి చిక్కనే లేదు!

 dasari1

నాకు కథంటే ఏమిటో  తెలుసు. కథలు ఎలా రాయాలో తెలుసు.

కానీ నాకు కథలు అల్లడం రాదు. యాభైకి పైగా కథలు రాసాను గానీ కథగట్టడం చేతగాలేదు. అందులొ ఒకటీ రెండూ కథలైఉండొచ్చుగాని అది కేవలం యాధృచ్ఛికం.

నాకు 110 మీటర్ల హర్డిల్ రేసు ఎలా పరిగెత్తాలో తెలుసు. ఆ రేసు లో గెలవడమూ జరిగింది- ’72 నుంచి ’74 దాకా…కాలేజీ ఆటల్లో. ఇది యాదృచ్ఛికం కాదు.

‘కథాకథనం’ లో కాళీపట్నంగారు, ” రాసే వాళ్ళలో డెభ్భై శాతం మందికి  కథ అంటే ఏంటో తెలీదు. తెలిసిన ముప్ఫైమందిలో ఇరవైమందికి కథ అల్లే ఒడుపు తెలీదు”.అంటారు. అదిగో ఆ ఇరవై శాతం మందిలో వాడిని నేను.

***

1972.

ఇంజినీరింగు మూడో సంవత్సరం.

కాకినాడ కాలేజి వార్షిక క్రీడలు….మీటర్ల హర్డిల్ రేసు.

అంతాకలిసి ఆరుమందిమి బారుతీరి ఉన్నాం.మిగిలిన అందరూ నాకన్న పొడవు. పెద్ద. శక్తిమంతులు. వేగవంతులు.

అయినా  నేను గెలిచాను. అందులోనూ ఉసైన్ బోల్ట్ కు మించిన లీడ్ తో.ఒక్కటే కారణం.

నాకు హర్డిల్సు ఎలా దాటాలో తెలుసు. ఎడమకాలు తన్నిపెట్టి కుడికాలు మీదుగా హర్డిల్స్ పైకెగరడం. ఎడమకాలును మడిచి ఒక సరళమైన అర్థవృత్తాకారంలో హర్డిల్ మీదుగా తీసుకు వెళ్ళడం, కుడికాలు భూమిని తాకీతాకగానే ఆ ఎడమ కాలును  తడబాటు లేకుండా ఇంకా ముందు సాగనివ్వడం- ఇది నాకు తెలుసు. అంచేత శృతి ఉన్న పాటలా సాగింది నా రేసు. మిగిలిన శక్తిమంతులంతా ఒకో హర్డిల్ దాకా రావడం, ఎలాగోలా దాని మీదనుంచి దూకడం, తడబడి నిలదొక్కుకుని ముందుకుసాగడం – పదిశృతుల్లో సాగిన పాట.

నాకెలా తెలిసిందీ ఒడుపూ? నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. పోటీలకు ఓ నెల ముందు పీ.ఆర్ కాలెజిలో ట్రైనింగ్ కాంప్ నడిపితే ఓ రెండురోజులు వెళ్ళాను. రేసు ఎలా పరిగెత్తాలో తెలిసింది. తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టే ఒడుపూ సమకూరింది.

***

కథలు రాయాలంటే ఏదో ప్రేరణ ఉండాలి. డబ్బూ, పేరూ ప్రేరణ అయిన వారి గురించి నేను మాట్లాడలేను. వారికి నా శుభాకాంక్షలు.

పరిసరాలను చూసి స్పందించి, అవి మనలో కలిగించిన అలోచనలనూ, అనుభూతులనూ, అవేదనలనూ అందరితో పంచుకోవాలనుకునే వారికోసమే  ఈ నాలుగు మాటలూ. ఆ ఆలోచనలూ, అనుభవాలను  కథలుగా చెప్పాలనుకొనేవారికి ఈ వ్యాసం.

ఇలాంటి స్పందనలు నాకు కలిగి నేను కథలు  రాసాను. మొదటి కథ 1978 లో దేవీప్రియ గారి ప్రజాతంత్ర లో వచ్చింది. ఆ సంతోషంలో మరో  నాలుగైదు రాసాను. ఎందుకో సంతృప్తి కలగలేదు. ఉప్పు లేదు.ఇతివృత్తం ఉంది. సన్నివేశాలు ఉన్నాయి. సంభాషణలున్నాయి.పాత్రలున్నాయి. వర్ణనలున్నాయి. భాషా, వాతావరణం, శైలీ అన్నీ ఉన్నాయి. అయినా ఉప్పు లేదు అనిపించింది. అదృష్టవశాత్తూ ఒక కథక మిత్రుడు అవి చదివాడు. “మీరు కథలుగాదు, వ్యాసాలు రాయండి”. అన్నాడు. తాటాకు మంట కోపం వచ్చింది. కానీ ఏదో  సత్యం చెప్పాడనిపించింది. కానీ ఆ సత్యమేంటో స్పష్టమవలేదు. అతనికీ తెలియదు. కానీ కథలు కట్టడం కట్టిపెట్టడం నాకూ, దేశానికీ క్షేమకరం  అనిపించింది.

మళ్ళా  దాదాపు  పదిహేనేళ్ళ తర్వాత  ఒక సంగతి పదిమందికీ చెప్పకుండా ఉందలేని సంధర్భంలో పడ్డాను.  రాయకుండా ఉండాలేని స్థితి. ‘నాకు తెలిసిన మాధవుడు ‘ బాణీ లో ‘బ్రతక నేర్వని వాడు ‘ గురించి రాసాను. సహృదయ మిత్రులు వాకాటి దాన్ని కథాప్రభ లో ప్రచురించారు. నేను గౌరవించే కథకులో పదిమంది, ‘బావుందోయ్ ‘    అని భుజం తట్టారు.

SAM_9938

ఓ రెండేళ్ళ పాటు అదే ఊపు. పది కథలు…అందులో ‘శేఫాలిక ‘ లాంటి అప్రయత్నంగా పుట్టిన కథలూ ఉన్నయి. అన్నీ అచ్చయ్యాయి..రచన, ఆహ్వానం, సుప్రభాతం..అయిన మళ్ళా అదే మధన. ఉప్పు లేదు అన్న స్పృహ, అసంతృప్తి. అసహనం…అందులోంచి ఒక జ్ఞానం.

సమాజం గురించీ, మనుషుల గురించీ కథల రాస్తున్నప్పుడు, ఆ  సమాజం గురించీ, కథలు రాయడం  గురించీ ప్రాధమిక శాస్త్రీయ అవగాహన అవసరమన్న జ్ఞానోదయం జరిగింది.

కొంచం తడుములాడగా సమాజపుటవగాహనకు సొషియాలజి అధ్యయనం మంచిమార్గమని తెలిసింది. ఇంటర్మిడియట్ పుస్తకాల్తో మొదలుపెట్టాను. అక్కడ మొదలైన ప్రయత్నం ఓ పదేళ్ళ తరవాత ఎం.ఫిల్ దగ్గర ముగిసింది.  ఓనమాలు తెలిసాయి.’ కామన్ సెన్సు, స్పందించే హృదయము  మాత్రమే సమాజపు గతిని అర్థంచేసికొవడానికి పనికి రావు’ అన్న నా  భావం నిజమని తెలిసింది.

కథ అంటే ఏమిటో తెలుసుకోవడం మాత్రం భగీరథ ప్రయత్నం అయింది.

ఇంగీషులోనూ, తెలుగులోనూ పుస్తకాలు వెదికాను. దొరికాయి.

సహ కథకులతోను, సీనియర్ రచయితలతోనూ చర్చించాను- వాళ్ళకు విసుగు పుట్టేదాకా!

కానీ కంచికి వెళ్ళిపోయే కథల చిదంబర రహస్యం తెలియలేదు. చాలా పుస్తకాలు మాయగారడీ వాళ్ళ దొంగ మోళీలుగా పరి.మరికొన్ని పరిణమించాయి. మరి కొన్ని కొండను తవ్వితే ఎలుక తోక  దొరికిన చందం.  కథామాంత్రికుడి ప్రాణాలు దాగి ఉన్న చిలుక ఉండే చెట్టుతొర్రదాకా చేరుకోగలిగానని కొన్నిసార్లనిపించినా, – చిలుక చేతికి చిక్కనే లేదు!

***

 

అదిగో  అలాంటిదే ‘ఎడిసన్ ‘ సమయం లో కాళీపట్నం గారి ‘కథకథనం’. చాలా చిన్న పుస్తకం, దొరికింది.

రసవిద్య నేర్పే తాళ పత్రగ్రంధం దొరికితే వేమన కూడా అంత సంబరపడిఉండడు.

ఒకటికి పదిసార్లు చదివాను.

వార్తకూ, వార్తాకథకూ, వ్యాసానికీ, కథకూ మధ్యనున్న అతిసూక్ష్మమైన తేడా బోధపడింది.

వస్తువు, ఇతివృత్తం, సన్నివేశం, సంఘటనా, శిల్పం, శైలి – వీటి గురించి అవగాహన కుదిరింది. వస్తువుకూ ఇతివృత్తానికీ, సన్నివేశానికీ సంఘటనకూ, , శిల్పానికీ శైలికీ మధ్యనున్న తేడాలు తెలిసాయి.

అలాగే కథలో భాషా, వర్ణనలూ, పాత్రలూ, సంభాషణలూ ఎలా ఉపయోగించాలో తెలిసింది.

కథకు ఎలా పేరు పెట్టాలో, ఆరంభించాలో, ముగించాలో – ఇవన్నీ చిన్నపిల్లాడిని ఒళ్ళో కూర్చొపెట్టుకుని గోరుముద్దలు తినిపించినంత ప్రేమగా చెప్పుకొచ్చారు కాళీపట్నం.

ఇవన్నీ తెలుసుకున్న కొత్త ఉత్సాహం తో మనసులో పేరుకుపోయి ‘రాయి, రాయి ‘ అని వేధిస్తున్న వస్తువులలో నలభై, యాభై కథలు రాసాను – ఓ దశాబ్ద సమయంలో. కానీ షరమామూలే! ఉప్పు సమస్య. వాటిలో కొన్ని నిజంగా కథలే.సందేహం లేదు. రస సృష్టి కూడా జరిగిందన్న మాటా నిజమే,  కానీ అది యాదృచ్ఛికం! కథను అల్లే కట్టే నేర్పూ, కథను పండించే ఒడుపూ నాకు వంటబట్టలేదన్నది వాస్తవం!! సరే, మోళీ కట్టేసి ఉప్పుదగ్గరికి వస్తాను.

***

రెండు చేతులూ, రెండు కాళ్ళూ, ఒక తల, రెండు చెవులూ, రెండు కళ్ళూ ఒక ముక్కూ, బొట్టూ/మీసం- ఇది ఏ చిన్నపిల్లాడైనా గీయగల మనిషి బొమ్మ. ప్రయత్నిస్తే ఇదే బాణీలో పులిబొమ్మా, గుఱ్ఱం బొమ్మా, ఏనుగు బొమ్మ కూడా గీయవచ్చు. అలాగే వార్తను మించిన, కథను మించిన, వ్యాసాన్ని మించిన రచన ఎవరైనా చెయ్యవచ్చు.

కానీ ఆ బొమ్మను చిత్రం చేయడం ఎలా? రచనను కథ చేయడం ఎలా?

కీలకం ప్రాణ ప్రతిష్టలో ఉంది. కౌర్యం, హుందాతనం పులి మొహంలో కనిపించాలి. దయా, కరుణా మదర్ తెరిసా లో కనిపించాలి.  ఆక్రోశం, ఆక్రందన బడుగు జీవుల బొమ్మల్లో ప్రతిబింబించాలి. మేధస్సుని దాటి మనసుని పట్టుకు ఊపే విశేషం ఏదో కథలో పాఠకుడికి కనిపించాలి. అప్పుడవి చిత్రాలవుతాయి.కథలవుతాయి. ఆ శక్తి అలవడినపుడు అసలు రేఖలతో కూడా పని ఉండకపోవచ్చు. ఆకృతుల అవసరమూ ఉండకపోవచ్చు.కథాచట్రమే అవసరమవక పోవచ్చు. గుయోర్నికాలూ, వాంగ్మూలాలూ వస్తాయపుడు. సూటిగా గుండెను తడతాయి.

‘ఇంకా ఎంతకాలం ఈ అరిగిపోయిన సిద్ధాంతాలు ? ఎందుకా దిమ్మిసాగొట్టిన రహదారులూ ? మా స్పందనలు వేరు, మా అనుభవాలు వేరు . మేం కొత్తరకంగా రాస్తాం . నియమాలు పట్టించుకోం….. ‘ అనవచ్చు కొందరు నవతరం కథకులు.

నిజమే. నియమాలూ , సిద్ధాంతాలు కాలానుగుణంగా మార్చుకుంటూ వెల్లాలి. అవసరమైతే బద్దలుగొట్టాలి  కూడాను ! కాని ముందు అవి ఏమిటో తెలియాలి కదా… ‘ఓహ్ ! ఇదేనా కవిత్వం. ఇలా అయితే నేనూ రాయగలను, ‘ అని కథలో ఓ పిల్లాడంటే శ్రీ శ్రీ సంతోష పడటం వెనక ‘కవిత,ఓ కవిత…. ‘ పునాది ఉందన్నమాట మరిచిపోకూడదు. కథారహస్యాలు, కథల ప్రాణం ఎక్కడుందో ఆ వివరము తెలియక పోతే చిన్నపిల్లల బొమ్మలొస్తాయి, గుయర్నికాలు కాదు !

అన్నట్టు, నేను కావాలనే ‘వస్తువు, ఇతివృత్తం….’ఈ పాఠాలు చెప్పటం లెదు. కాళీపట్నం ఇప్పటికే చలాచక్కగా  ‘కథాకథనం’ లో చెప్పారు.  అది ఒకటికి పదిసార్లు చదవమనీ పాతా కొత్త కథకులందరికీ నా విన్నపం.

కథకులందరూ కొడవటిగంటిలూ , త్రిపురలూ కాగలరని నేనూ ఆశపడను. కానీ కథామూలాలు,లక్షణాలూ క్షుణ్ణంగా తెలుసుకుంటే నోటికి పదిమంది కథకులైనా తమ తమ కథల్లో ‘ ప్రాణ ప్రతిష్ట ‘ చెయ్యగలరని నా నమ్మకం.

 -దాసరి అమరేంద్ర

అదే…అదే..మణిమహేష్!

( గత వారం తరువాయి)

అలా ఓ మూడుగంటలు కబుర్లతో సాగగా  మొత్తం పది కిలోమీటర్లు గడిచి ‘సుంద్రశ్’ అన్న ప్రడేశం చేరాం, దాని పొలిమేరల్లోనే నాజూకు స్వరూపం, పల్చని శరీరం ఉన్న ఓ నలభై ఏళ్ల మనిషి కనిపించి మాటల్లో పెట్టాడు.  ‘అదిగో ఆ చిట్ట చివర ఉన్న లంగరు మాదే. మీరు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి సేద తీరాలి’ అన్నాడు. వెళ్లాం. మాటల్లో తెలిసింది.  ఈయన బెంగుళూరులో మెడిసిన్ చేసారని.  కాంగ్రా జిల్లాలో గవర్నమెంటు డాక్టరు. “మొన్న ఉత్తరాఖండ్ ఉత్పాతం వల్ల యాత్రికుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. లేకపోతే ఈపాటికి కిటకిటలాడుతూ ఉండవలసింది” అన్నాడాయన.

బడలికలూ, ఆకళ్ళూ తీర్చుకొనేసరికి మూడయిపోయింది.  భోజనంతోపాటు లౌడ్‌స్పీకర్లో శివభక్తి గీతాలు… వాటి పారవశ్యంతో చిందులు వేస్తోన్న ఆబాలగోపాలం. ఈలోగా నేనూ ఉన్నానంటూ భోరున వర్షం. అసలు అప్పటిదాకా కురవకపొవడమే విశేషం. ఏదేమైనా వర్షం పుణ్యమా అని సందిగ్ధంలో పడ్డాం. ఆలోచనలు .. చర్చలు..

“ఇంకా మూడు కిలోమీటర్లూ, రెండు గంటల ప్రయాణం ఉంది. వర్షం వెలిసిన మాట నిజమే గానీ మళ్లీ కురిసే అవకాశం ఉంది.  తెగబడి వెళ్ళడం ఎందుకూ? ఈ ప్రదేశం బావుంది. వసతి పుష్కలంగా ఉంది. రాత్రికుండిపోదాం” నా ప్రపోజలు. అందరూ ఓకే అన్నా నాయకుడు సంజయ్ వీటో చేసాడు. “పోనీ మీరూ, ముక్తా గుర్రాలమీద రండి. మిగిలిన అయిదుగురం రిస్కు తీసుకుని నడచి వస్తాం” అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అదే మంచి నిర్ణయం అని తేలింది. నలభై నిమిషాలు. ఆశ్వారోహణ చేయగా మరో రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ‘గౌరీకుండ్’ చేరాం. ‘పార్వతీదేవి స్నానాలు చేసే కుండమిది’ అని జనుల నమ్మకం.

ఇహ వెళ్లాల్సింది ఒకే ఒక్క కిలోమీటరు. వర్షం పూర్తిగా వెలిసింది. అందరం వచ్చేదాకా ఆగుదాం’ అని నేనూ, ముక్తా అక్కడ దిగాం.  మిగిలిన యాత్రికులు దాదాపుగా లేరు. ‘తన మొక్కు తీర్చుకోవడం కోసం ఆ రాళ్లల్లో, నీళ్లల్లో, మంచులో, చలిలో నగ్న పాదాలతో పైకి వెళుతోన్న ఓ పాతికేళ్ళావిడా, ఆవిడ అడుగులకు మడుగులొత్తుతూ సహకరిస్తోన్న అన్యోన్యపు భర్తా – అక్కడ కనిపించిన అపురూప దృశ్యం’ రెండు మూడు లంగర్లు … ఓ డిస్పెన్సరీ.. అరడజను ధాభాలు.. హెచ్‌పి సర్కారు వారి అత్యాధునిక టెంట్లు వంటి ముచ్చటైన ప్రదేశం ఆ గౌరీకుండ్. అల్లదిగో ఆ చిరుకొండ వెనకనే మణిమహేశ్వర్  అన్నారు.

 SAM_9371

సంజయ్, ముక్తాలతో నాది పదిహేనిరవై ఏళ్ల పరిచయం . అప్పట్లో ఓ ఆఫీసు సాంస్కృతిక కార్యక్రమానికి ముక్తా , నేనూ వ్యాఖ్యాతలుగా వ్యవహరించాం కూడానూ. స్నేహం కాకపోయినా మంచి పరిచయం, చనువూ ఉన్నాయి. మా బృందం రావడానికి మరో గంటైనా పడుతుంది గాబట్టి అక్కడి లంగర్లో చెప్పి మరీ పంచదార లేని టీ చేయించుకుని తాగాం. వంద గజాల దూరాన ఉన్న నదీ వంతెన దగ్గరకు నడక సాగించాం. మాటల మధ్యలో “ఎంతవరకు చదువుకున్నావు” అని అడిగాను. “ఎమ్మెస్సీ మాత్స్” అంది. అంత చదివి కనీసం టీచరుగానైనా ఉద్యోగం చెయ్యాలనిపించలేదా? వాటే వేస్టావ్ రేర్ టాలెంట్” అని నావైన దుడుకు బాణీలో నిష్ఠూరించాను. నవ్వేసి ఊరుకుంది. ఓ పది నిమిషాల తర్వాత వివరించింది. “నాన్న గవర్నమెంటు ఉద్యోగి. నాకు పెళ్ళి అవకముందే హృదయ రోగిష్టి అయ్యారు. అమ్మకు అంతగా వ్యవహారజ్ఞానం లేదు. ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. నా పెళ్ళి దగ్గర్నించి ఇంట్లో అన్ని వ్యవహారాలకూ  నేనే పెద్దను. అదిగాక నా భర్త, పాప, సంసారం. ఆపైన రెండువైపులనుంచి దగ్గర బంధువుల తాకిడి. వీటన్నిటి మధ్య ఉద్యోగం గురించి ఆలోచించే అవకాశం లేకపోయింది. తమ్ముడు ఆలస్యంగా  ఈ మధ్యనే జీవితంలో సెటిల్ అయ్యాడు..” పి.సత్యవతి గారు మెచ్చరేమో అనిపించినా ఇదంతా విన్నాక ఆవిడంటే గౌరవం పదిరెట్లు పెరిగింది.

అందరూ గౌరీకుండ్ చేరేసరికి దాదాపు ఆరు. మరో ముగ్గురు గుర్రాలవైపు మొగ్గు చూపారు. అప్పటికే పరిచయమయిన సురేంద్రపాల్‌గారి లంగర్లో టీలు తాగి మమ్మల్ని ఆ రాత్రికి అక్కడే ఉంచేలా ఆయన చేసిన ప్రయత్నాలను సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగాం. ఓ పంజాబు గ్రామ పంచాయితీ సెక్రటరీ అట ఆయన.

అంతా కలిసి అయిదుగురం గుర్రాలమీద, సంజయ్, ప్రధి కాలినడకన గౌరీకుండ్, మణిమహేశ్వర్‌ల మధ్య ఆ నలభై నిమిషాలలో సూర్యుడు, మబ్బులు, కొండలు, లోయలు, పచ్చని పచ్చిక, గాఢపు నీలాకాశం – అన్నీ కూడబలుక్కొని అద్భుత సౌందర్య ఆవిష్కరణకు పూనుకొన్నాయి. ఎదురుగా సువిశాలమైన లోయలో వేలాడుతూ మేఘాలు, వాటిమీద రంగులు చిమ్ముతూ అస్తమించే సూర్యుడి బంగారు కిరణాలు. ఆ కిరణాల సుతిమెత్తని స్పర్శలో ధగధగ వెలిగిపోతున్న హిమగిరి శిఖరాలు. ఓ పావుగంటా ఇరవై నిమిషాలు గుండె గొంతులోన కొట్టాడింది. గుర్రం మనిషిని అడిగి, ఆపించి రెండు మూడు ఫోటోలు తీసానేగాని అసలు ఆ క్షణాలు గుర్ర్రం మీద ఉండదగినవి కాదు. నడక అయితే బావుండేది.

ముసిరీ ముసరని చీకట్లలో ఏడుగంటలవేళ ఏడుగురమూ మణిమహేష్ సరోవర తీరం చేరాం. చిన్న తటాకమది. చుట్టూ అరకిలోమీటరు పొడవున పరిక్రమ మార్గం, ఎదురుగా నిడుపాటి మణిమహేష్ శిఖరం. శిఖరాగ్రాన మంచు తొడుగు. కొండ చరియల్లో గ్లేషియర్లు. అటు ఇటు గరుకుపాటి పర్వత శ్రేణులు. వెనక్కి తిరిగితే గౌరీకుండ్. ఇంకా ఆపైన కనిపించే  సువిశాలమైన లోయ. ప్లాస్టిక్కు, కల్మషమూ లేని  సరోవర జలాలు. అందులో ప్రతిబింబించే కైలాస పర్వతం .. చక్కని దృశ్యం. దేవుడి సంగతి దేవుడెరుగు.. నాలాటి సామాన్యునికి సరిపడే సౌందర్యం పుష్కలంగా  ఉంది. అక్కడి సంప్రదాయమేమో.. గుడి అంటూ శాశ్వత నిర్మాణం ఏమీ లేదు. సరోవర తీరంలో ఒకచోట చిన్నపాటి అరుగు. శివుని ప్రతిమ. అలంకరణ.. పూజలు.. అరడజనుకు పైగా లంగర్లూ. దాభాలూ.. విశాలమైన గుడారాల నివాసాలు. సూర్యుని అంతిమ వెలుగురేకల్లో కైలాస శిఖరాన్ని చూసి పరవశిస్తోన్న పదీ పదిహేనుమంది భక్తులు.. నిశ్శబ్ద ప్రశాంత వాతావరణం.

అందము, ఆనందమూ ఎలా ఉన్నా అందరమూ విపరీతంగా అలసిపోయి ఉన్నాం. జీరో డిగ్రీల దరిదాపుల్లో చలి. అంచేత స్నానాల ప్రసక్తి లేనేలేదు. ఉన్నంతలోనే కొంచెం ఫ్రెష్ అయ్యి. ఎనిమిదిన్నరకల్లా లంగరు భోజనాలు ముగించుకొని గుడారాలలో నిద్రకు ఉపక్రమించాం. తెచ్చిన స్వెట్టర్లన్నీ వదలకుండా వేసుకొన్నాం. వాళ్ళిచ్చిన రెండు రెండూ రగ్గులకు తోడు రెండు అడిగి పుచ్చుకున్నాం. మొత్తానికి చలిపులి బాధ తెలియకుండా రాత్రి గడిచింది.

అన్నట్టు అవి పున్నమి రాత్రులు. నేనూ సంజయ్ ముందే అనుకొని తెల్లవారుఝామున నాలుగు గంటలకు గుడారం బయటకు వచ్చాం నిండుచంద్రుడు. వందలాది తారలు. వెండి కైలాసశిఖరం. మరువలేని అనుభవం. అన్నట్టు ఆ శీఖరాగ్రాన భక్త శిఖామణులకు ఒకోసారి రాత్రిళ్లు మణీదీపాల వెలుగు కనిపిస్తుందట. శబరిమలై శైలిలో నన్నమాట. మాకా ఛాయలు కనిపించనేలేదు. విశ్వాసం ముఖ్యం గదా!

ఆగస్టు 23 ఉదయం ఆరింటికే రోజు మొదలయింది.

100_8613

సరోవరం చుట్టూ ఒకటికి రెండుసార్లు ప్రదక్షిణ. “అరే.. నీళ్లమీద  మెరుస్తూ ఏవిటదీ?’ అని వెళ్లి చూస్తే పలకలు గట్టిన మంచు. ఆ మంచునీళ్లలోనే స్నానాలు చేస్తోన్న సాహస భక్తులు. మేమంతా భయపడినా ప్రధి సాహసించాడు. అయిదారు మునకలు వేసాడు. రెండోమునక అతికష్టమయినది. ఉండేలు దెబ్బ తెలియని పిల్లకాకుల్లా మొదటి మునక చలాగ్గా వేసేస్తాం. దాంతో రుచి తెలుస్తుంది. రెండోది వెయ్యడానికి పదిరెట్లు ధైర్యసాహసాలు కావాలి’ అన్నది అతని చక్కని విశ్లేషణ.

సంజీవ్‌గారు పూజ అన్నారు. అదో అరగంట. లంగర్లో ఒకటికి రెండుసార్లు వేడివేడి అతి తియ్యని తేనీరు తాగి, అల్పాహారమూ ‘స్వీకరించి’ మరోసారి, మరోసారి  తటాకాన్నీ, అబేధ్యమైన (ఇప్పటిదాకా ఎవరూ ఎక్కలేకపోయిన ) కైలాసశిఖరాన్ని చూసి, చూసి మనసులో నింపుకొని  ఏడున్నరకు తిరుగు ప్రయాణం మొదలెట్టాం. హడ్సర్ చేరేసేరికి సాయంత్రం మూడున్నర . “ఓరిదేవుడో… ఈ దిగడం కన్నా ఆ ఎక్కడమే సుఖంగా ఉంది” అని (అసహజంగా) అనిపించిన మార్గమది!

నా కాలు (ఇదే చివరిసారిలెండి!) చిద్విలాసాలు చిందుతూ కనిపించింది. పట్టరాని ఆశ్చర్యం నాకు. భక్తులూ, ఆస్తికులూ – ఇదంతా ఆ మహాదేవుని లీల. అనే సందర్భమిది. మరి నాలాంటి అవిశ్వాసికి ఆ అవకాశం లేదాయే!!

ఉపశృతి:

1. పైకి వెళ్ళేటపుడూ, కిందకు దిగేటపుడూ ఓ అచ్చమైన పంజాబీ గ్రామీణ కుటుంబం తోడుగా వచ్చింది. భీష్మాచార్యుని వంటి తాతగారు, నాలుగేళ్ళ బుడుగులాంటి మనవడు. వాడి అమ్మా, నాన్నా, బాబాయి, అత్తయ్య, నాయనమ్మా, దారంతా మాటలు – తాతామనవళ్ళతో విడివడేటప్పుడు పచ్చబొట్ల పల్చని ముప్పై ఏళ్ల అత్త్తయ్య వచ్చి పరిచయం చేసుకొంది. ఊళ్లో టీచరట. వాళ్ల జీపు బయల్దేరుతోంటే, తాతామనవళ్ళు వీడ్కోలు చెప్పడం సరేసరి.. ఈవిడ పక్కసీట్లోంచి వంగి తల బయటపెట్టి మరీ ఆత్మీయంగా చెయ్యి ఊపింది. నాకీ పుణ్యయాత్రలో సరైన విశ్వాస స్నేహఫలం దొరికిందని అంబరమంత సంబరం.

2. ఏసీ రైళ్లు, ఇన్నోవాలూ, గుర్రాలూ – ఇన్ని హంగులతో ప్రయాణం చేసినా ‘సత్రం భోజనం – మఠం నిద్ర ‘ పుణ్యమా అని మా ఖర్చు మనిషికి నాలుగువేలే.. ఎంత చవక!!

 – దాసరి అమరేంద్ర

 

 

మణి మహేష్ ఇలా పిలిచింది మమ్మల్ని!

SAM_9392

(యాత్రాకథనాలకు ఆహ్వానం: ఎక్కడికో వెళ్ళాలి. ఏదో వెతుక్కోవాలి. ఏమేమో చూడాలి. ఎవరెవరితోనో మాట్లాడాలి.  రొటీన్ గా అనిపించే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి. ఈ తపన బహుశా వొక ప్రేరణ యాత్రలకూ…దూర ప్రయాణాలకు! అలాంటి యాత్రా సాహిత్యాన్ని అందించే ఉద్దేశంతో ‘యాత్రాస్మృతి’ అనే ఈ కొత్త శీర్షిక. మీ యాత్రా అనుభవాలను రాయండి. ‘సారంగ’కి పంపండి. ఈ వారం ఈ శీర్షిక ప్రముఖ కథా రచయిత, యాత్రా సాహిత్యకారుడు దాసరి అమరేంద్ర గారి రచనతో మొదలు పెడ్తున్నాము. చదివి, ఎలా వుందో చెప్పండి.)

“అమరేంద్రాజీ.. ఆగస్టు చివర్లో మణిమహేష్ యాత్ర ప్లాన్ చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి” జులై మొదటివారంలో ఫోను చేసాడు మా డిల్లీ బీ.ఈ.ఎన్ లో  సహోద్యోగి సంజయ్ అగర్వాల్. ఇరవై ఏళ్ళ పరిచయం… నాలాగే ట్రెక్కింగ్ అంటే ఆసక్తి.

“తప్పకుండా.. నన్ను లెక్క వేసుకో.. కానీ ఓ మాట చెప్పు. అక్కడ గుర్రాల సదుపాయం ఉందా?” ముందు జాగ్రత కోసం అడిగాను. ఉందన్నాడు.    ఇలా గుర్రాల కోసం తాపత్రయపడడం ట్రెక్కింగు స్ఫూర్తికి విరుద్ధం. కానీ ఆ మధ్య షష్టిపూర్తి కానుకగా  ప్రకృతి మోకాలి నెప్పులు ప్రసాదించింది.  మే నెలలో ఓ మూడువారాలు ఫిజియోధెరపీ తర్వాతే కాళ్ళు కొంచం చెప్పిన మాట వింటున్నాయి. ‘ఇహ ట్రెక్కింగులకు చరమగీతం పాడాలేమో’ అనుకుంటున్న సమయంలో ఈ ప్రలోభపు ఆహ్వానం.!

నెట్‌లోకి వెళ్లాను. డిల్లీనుంచి పఠాన్‌కోట్, చంబాల మీదుగా 670 కిలోమీటర్లు వెళీతే హిమాచల్ ప్రదేష్‌లోణి ‘భర్‌మౌర్’ అన్న చిరు పట్టణం వస్తుంది. మరో పదిహేడు కిలోమీటర్లు రోడ్డున వెళితే ‘హడ్‌సర్’ అన్న చిరు గ్రామం…. అక్కడ్నించి మరో పదమూడు కిలోమీటర్లు కాలి నడకన కొండదారుల్లో వెళితే మధ్య హిమాలయాల మధ్యన, సముద్ర తలానికి 4115 మీటర్ల (13,500 అడుగుల) ఎత్తున ఈ మణిమహేష్ చిరు సరోవరం. దాని పక్కనే ధీరగంభీరంగా 5775 మీటర్ల  ఎత్తున్న మణిమహేశ కైలాస శిఖరం. శివుని (రెండోదో, పన్నెండోదో) ఆవాసమట. ప్రతి ఏడాది జన్మాష్టమి నుంచి పదిహేను రోజులపాటు భక్తులు యాత్రగా వెళ్లిరావడం తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ అట.

 

* * *

 2013, ఆగస్టు 20, రాత్రి ఎనిమిదిన్నరకు అంతా న్యూడిలీ స్టేషన్లో కలిసాం. సంజయ్, అతని భార్య ముక్త, పదమూడేళ్ల కూతురు సంజక్త, తోడల్లుడు సంజీవ్, ఆయన పన్నెండేళ్ళ కూతురు రూపాంశి., ఇరవై ఏళ్ల సంజయ్ మేనల్లుడు ప్రధి, నేను . వెరసి ఏడుగురం. “మన ఈ ఉత్తర  సంపర్క క్రాంది రేపు ఉదయం నాలుగున్నరకు పఠాన్‌కోట్ చేరుస్తుంది. ఓ ఇన్నోవా  మాట్లాడి ఉంచాను. పదీ పదకొండుకల్లా భార్‌మౌర్ చేరుకొంటాం. పగలు అక్కడి గుళ్లూ గోపురాలు చూసుకొని సాయంత్రానికి హాడ్‌సర్ చేరుకొంటాం… రోజంతా ట్రెక్కింగు. మణీమహేష్వర్‌లో రాత్రి మజిలీ,  ఒక ఉదయాన పూజలూ పునస్కారాలూ ముగించుకొని క్రిందకి దిగి సాయంత్రానికల్లా హాడ్‌సర్  చేరతాం.  వెంటనే ఇన్నోవా ఎక్కి రాత్రి చంబాలో హాల్టు. 24 రోజంతా చంబాలోనూ, అక్కడికి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న ఖడ్జుయార్ పచ్చిక బయలు లోనూ, మరో ఇరవై కిలోమీటర్ల దూరాన ఉన్న డల్‌హౌస్ పట్టణంలోనూ, రాత్రికి పఠాంక్‌కోట్ చేరి డిల్లీ బండి పట్టుకొని 25 ఉదయానికల్లా గూటికి చేరతాం . టూకీగా కార్యక్రమ రూపురేఖలు వివరించాడు సంజయుడు.

SAM_9361

ఇన్నోవాలో అరగంట ప్రయాణించేసరికి వెలుగురేకలు విచ్చుకోవడం మొదలయింది. గలగలమని పారుతోన్న ‘రావి’నది ఒడ్డునే మా ప్రయాణం. తల ఎత్తి మరీ చూడవలసిన ఉన్నత గిరిశిఖరాలు. వాటి చెరియల్లో నిడుపాటి ‘పైన్’ వృక్షాలు. వర్షాకాలం గాబట్టి అన్నివైపులా పరిపూర్ణమైన పచ్చదనం. ‘ఎటు చూసినా అందమే’ అంటూ మనసు పాడటం మొదలెట్టేసింది.

సంజయ్‌తో పాటూ ముక్తకూ, వాళ్ల పాప సంజక్తకూ ట్రెక్కింగ్ అభిరుచి ఉంది. సంజీవునికి వాళ్ల పాప రూపాంశ్ కి  కూడా ట్రెక్కింగులో చెప్పుకోదగ్గ ప్రవేశముంది. ప్రధి సరేసరి. పిల్లలు ముగ్గురికీ చదివే అలవాటూ ఉంది. సంజక్త, రూపాంశి ఫేమస్ ఫైవ్, సీక్రెట్ సెవెన్లు దాటుకొని ఎనిడ్ బ్లైటమ్ దగ్గరకి చేరారు. రస్కిన్‌బాండ్ దారిలో ఉన్నారు. ప్రధీ అప్పుడే ఖాలిద్ హుస్సేనీ దగ్గర్నించి టాగోర్ దాకానూ, స్టీవెన్ స్పిల్‌బర్గ్ నుంచి సత్యజిత్ రే దాకానూ ఔపాసన పట్టేసి ఉన్నాడు. మరింకేం.. మాటలు సాగాయి. గంట గడిచేసరికల్లా స్నేహం పండింది. ఆటలు.. పాటలు.. కబుర్లూ.. కోలాహలం.

“మోకాలు ఇబ్బంది పెట్టొచ్చు. అయినా ప్రయత్నిస్తాను. అవసరమయితే గుర్రం. అదీ కుదరకపోతే మధ్యలో ఆగిపోయి మీరు తిరిగొచ్చేదాకా ఉంటాను” అని మాటల మధ్య అంటే..” అదెలా అంకుల్! ముందే అలా అనేసుకుంటే ఎలాగా? చివరిదాకా వెళ్లి తీరాలి అని సంకల్పం చెప్పుకోండి. జరిగి తీరుతుంది” అని  హితవు చెప్పింది తొమ్మిదో క్లాసు సంజక్త. భర్తృహరిగారి “ఉత్తమ పుత్రికా?” అని  అబ్బురపడ్డాను.

ఇంజనీరింగ్ చదువుతోన్న ప్రధి అడిగాడు.”ఎన్నెన్నో ట్రెక్కింగులు చేసారు గదా. అందుకు ప్రేరణ ఏమిటి? ఏం ఆశిస్తూ ఉంటారు?”  ఆలోచనలో పడ్డాను. “కారణాలు నాలుగు.. అద్భుతమైన ప్రకృతి. నాలోకి నేను చూసుకొనే అవకాశం. పదిమందినీ కలిసి తెలుసుకొనే అవకాశం. నా మానసిక, భౌతిక శక్తులను పునర్నిర్వచించుకొనే అవకాశం..”

* * *

 SAM_9381

 

ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో చంబా చేరుకొన్నాం.

జిల్లా కేంద్రమది. కొండలమధ్య ఊహాతీతమైన విశాల మైదానంలో ఆ పట్టణం ఊరు మధ్య ఐదారు ఫుట్‌బాల్ కోర్టులు వచ్చే బడా మైదానం. దిగువన పారుతున్న ‘రావి’ నది. ఎదురుగా కలెక్టరాఫీసు. కోర్టులు, సర్క్యూట్ హౌస్.. బ్రిటీషు కాలం నాటి బంగాళాలు.. కాస్తంత ఎగువన వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ మందిరం.  చేరువలోనే ఓ మ్యూజియం. ఊరు నాకు తెగ నచ్చేసింది. మళ్ళీ వెళ్లాలి.

చంబా దాటీ దాటగానే దిగువన పిక్చర్ పోస్ట్ కార్డ్‌లాంటి అందాలున్న చక్కని ప్రదేశమూ, అక్కడే ఓ డిగ్నిఫైడ్ మధ్యవయసు మహిళ నడుపుతోన్న  ఒక దుకాణమూ. అరగంట ఫోటోలు సరేసరి. అలా ఆడుతూ పాడుతూ, అనిపించిన చోటల్లా ఆగుతూ పదిన్నరా పదకొండు ప్రాంతంలో భర్‌మౌర్ చేరాం. వాకబు చెయ్యగా ఒకరికిద్దరు ఓ పంజాబీ ఢాభాకేసి చూపించారు. మరిహనేం. ఆనాటి ముఖ్యభోజనం అక్కడ. అన్ని పదార్థాలూ అతి రుచికరంగా ఉండగా అందరం ఒంటెల్లా భోంచేసాం!

భర్‌మౌర్ ఆలయాల నిలయం. ముఖ్యమైన భరణీ మాత మందిరం ఓ కొండ చిటారుకొమ్మన ఉందట. మణి మహేష్ వెళ్ళెవాళ్లంతా ఈ దేవి అనుగ్రహం పొంది మరీ ముందుకు సాగడం మర్యాదట. మా బృందం కొండెక్కడానికి సిద్ధపడిపోయింది. నా మోకాలును ఆచితూచి వాడుకోవాలి. రేపటికి దాచి ఉంచాలి అనేసి నేను  ఉండిపోయాను.

ఆగస్టు ఆపిళ్ళ సీజను. ఊళ్లో ఎక్కడ చూసినా యాపిలు చెట్లు. కాయలు. పళ్లు. మెల్లగా సాగగా ఊరిచివరి ఓ పేద్ద యాపిల్ తోట. ‘అపురూప ప్రదేశం’ అని అందులో తనివితీరా తిరుగాడాను.  రెండు మూడు గంటలే అనుకొన్నది మా బృందం తిరిగొచ్చేసరికి సాయంత్రం నాలుగయింది. వెంటనే హడ్సర్ ప్రయాణం చేరేసరికి ఆరు దరిదాపు. వర్షాకాలం గాబట్టి దారిలో లాండ్ స్లయిడ్లు ఉండవచ్చౌనని అనుభవజ్ఞులు అన్నారు గానీ మేం ఏ అడ్డంకి లేకుండానే చేఅరాం.

హడ్సర్ మరీ చిన్న పల్లెటూరు. అంతా కలిసి అయిదొందల జనాభా. అసలీ యాత్ర సమయంలోనే ఊరు మేల్కొనేది. అప్పుడే ఓ  లంగరు వెలిసింది. వసతి సౌకర్యం పూజ్యం. కానీ కొంచెం వెదగ్గా ఊరి పొలిమేరన ఎత్తైన కొండ చెరియన ఓ పి.డబ్ల్యూ. డి వారి గెస్ట్‌హౌస్ దొరికింది. సంబరం. రూములు బాగా విశాలంగా ఉందటమే గాకుండా వేడినీళ్ల సౌకర్యమూ ఉంది. మరిహనేం?

ఇలాంటి  యాత్రాసమయాల్లో యత్రికుల సౌకర్యం కోసం ఉచిత భోజన సదుపాయం కలిగించే ‘లంగర్లు” దారి పొడవునా విరివిగా వెలవడం ఉ త్తరభారతదేశంలో కద్దు. అలాంటి ఓ లంగర్లో డిన్నరు చేసాం. దాని నిర్వాహకుడు మాతో కబుర్లలో పడ్డాడూ. అతనికి ఏభై ఏళ్లుంటాయి. పంజాబు ప్రభుత్వ ఉద్యోగి. పఠాన్‌కోట్ నివాసి. గత ఇరవై ఏళ్లుగా ఈ దారిలో నాలుగయిదు లంగర్లు నిర్వహిస్తున్నాడట. యాత్రా సమయంలో మూడు నాలుగు వారాలు ఇక్కడే మజిలీ..

“ఏమిటి మీ ప్రేరణ?” అని అడిగాం. ” 1993లో మొదటిసారి యాత్రకు వచ్చాను. ఆ రాత్రి మణిమహేష్‌లో గడిపాం. తిండి దొరకలేదు. పైగా భయంకరమైన చలి. తలపైన ఏ కప్పూ లేదు. కంబళ్ళూ, రజాయిలూ సరేసరి. ఇదిగాదు పద్ధతి అనిపించింది. నలుగురినీ కూడగట్టుకుని ఈ లంగరు వ్యవస్థను ప్రారంభించాను. భోజనంతోపాటు ప్రాధమిక వసతి సౌకర్యమూ కల్పిస్తున్నాం” వివరించాడాయన.  సమ హృదయ భక్తులూ, స్నెహితుల పుణ్యమా అని డబ్బు సమస్యే లేదంట”

 

* * *

 

పచ్చని ప్రకృతి తోడుంటే...జీవితమే దాసోహం :దాసరి అమరేంద్ర

పచ్చని ప్రకృతి తోడుంటే…జీవితమే దాసోహం :దాసరి అమరేంద్ర

22 ఉదయం ఆరింటికల్లా ట్రెక్కింగు మొదలెట్టాం.

మామూలుగా మనం పార్కుల్లో అయితే గంటకు ఐదారు కిలోమీటర్ల వేగంతో  నడుస్తాం. సాధారణంగా అది ట్రెక్కింగులో రెండు మూడుకు పడిపోతుంది. ఎత్తులు ఎక్కాలి గాబట్టి. కాని మణిమహేశ్వర్ మార్గం మరీ ఎగుడు. హడ్సర్ ఉన్నది 2100 మీటర్లన అయితే మణిమహేశ్వర్ 4115 మీటర్లు.  అంటే మదమూడు కిలోమీటర్ల నడకలో రెండువేల మీటర్లు ఎత్తు ఎక్కాలన్నమాట. దుర్గమం. అంచేత కనీసం పదిగంటలయినా పడుతుందని తెలుసు. సాయంత్రం నాలుగు గంటలకల్లా గమ్యస్థానం చేరాలన్నది ఆనాటి మా లక్ష్యం.

“బాప్‌రే! ఆ కొండల్ని చూసారా? నిట్టనిలువుగోడల్లా ఉన్నాయి. వాటినన్నింటినీ దాటుకుని వెళ్లాలి మనం. గుండె గుభేలుమంటోంది” అన్నాడు సంజయుడు. నిజానికి మాలో అది అతి దిట్టమైన మనిషి అతనే. ముక్త బక్క పలచన. పైగా నిన్నటి భర్‌మౌర్ భ్రమణంలో జారిపడగా మోకాలు పట్టేసింది. ఆడపిల్లలు బాగా చిన్నవాళ్లు. సంజీవుడు ఒకప్పటి జాతీయ స్థాయి ఈతగాడే అయినా ఇపుడూ మాత్రం సేఠ్ జీ స్వరూపం. ప్రధి కూడా స్థూలకాయుడే. నా మోకాలు…. వద్దులెండి. ఎన్నిసార్లని దాన్ని కీర్తించడం? అయినా ఎవ్వరం గుర్రాల సంగతి ఎత్తలేదు. ఓ గంటన్నర నడక మహాచురుగ్గా సాగింది.
SAM_9351

 

దారిపక్కనే  పాలవరదలా పారుతోన్న ‘గౌరీనాలా’ అనే చిరునది. అడపాదడపా  నిడుపాటి కొండల్లోంచి పడుతోన్న  సుందర జలపాత ధారలు. ఇరవై పాటిక్ డిగ్రీల ఉష్ణోగ్రత – ట్రెక్కింగుకు అన్ని విధాల అనుకూలమైన వాతావరణమది. దారిలో కనిపించిన ఓ లంగర్లో అన్నమూ. పప్పులతో బ్రేక్‌ఫాస్ట్ ముగించాం. అందరమూ స్వేచ్చా విహంగాల్లా సాగిపోతూ ఉంటే అపశృతిలా రూపాంశ్‌ని అనవసరపు, అతి జాగ్రతల నియంత్రణలో ఉంచాలని ప్రయత్నించే  వాళ్ల నాన్నగారు.. చెలంగారుంటే సుబ్బరంగా దెబ్బలాడేవారే. నేనూ నర్మగర్భంగా చెప్పి చూసాను.

దారి నిర్ధాక్షిణ్యం రెండు గంటలు గడిచాకే స్పష్టమయింది. దారులూ, రాళ్లూ, రప్పలూ, బండలూ. వర్షాలవల్ల చిత్తడి. అదపాదడపా చీలమండలదాకా నీళ్లు. ఎత్తు ఎక్కవలసి రావడం సరేసరి. అయినా ఆ దారిలో అంతా ఉల్లాసమే. ‘బాధే సౌఖ్యం’ సన్నివేశమన్నమాట. మాతో పాటే వస్తున్న ఓ పాతిక ముప్పై మంది సహయాత్రికులు. యాత్ర ముగించుకొని వస్తోన్న వాళ్ల ప్రోత్సాహపు పలుకులు.. అలా ఆడుతూ, పాడుతూ పదిగంటల ప్రాంతంలో “ధాంభో’ అన్న  ఆరు కిలోమీటర్ల దూరపు ప్రదేశానికి చేరాం. సగం దారి గడిచిందన్నమాట. 2900 మీటర్ల ఎత్తు. చెట్లు కనుమరుగై పర్వత సానువుల్లో తుప్పలూ, పచ్చికా మాత్రమే. మిగులుతోన్న సమయం ఆ ధాంభోలో ఒకళ్ల నొకళ్ళం పరామర్శించుకొంటూ కొత్తవాళ్లను పలకరిస్తూ, సేద తీరుతూ ఓ గంట. “మా లంగరుకు రండి అంటే ఎమా లంగరుకు రండి’ అని నిర్వాహకుల ఆహ్వానాలు.

విరామం కలిగించిన ఉల్లాసంతో మళ్లా మార్గారోహణ మొదలెట్టాం. కాస్త సాగగా – ‘ధాంభో’ జలపాతం. భస్మాసురుడి బారినుంచి తప్పించుకొనే ప్రయత్నంలో పరమశివుడు ఈ జలపాతం వెనకాల దాక్కున్నాడని స్థలపురాణం. ఎక్కడా విడుపులేని ఆరోహణ ఆశ్చర్యమనిపించింది. ఏ మామూలు ట్రెక్కింగు మార్గంలో అయిన ఆరోహణలూ. అవరోహణలూ, సమతల ప్రదేశాలూ, అరుదుగా పీఠభూములూ ఉండడం సామాన్యం. ఇక్కడ మాత్రం ఒక్కటే రాగం. ఆరున్నొక్క ఆరోహణా రాగం..

ఆ కష్టమార్గంలో దొరికిన అలవోక సుఖం పిల్లల సాహచర్యం.

“మీరు వస్తోంది పుణ్యం కోసమా? ట్రెక్కింగు ఆనందం కోసమా? అని అడిగితే ఆనందం కోసమే అనేసారు రూపాంశీ, సంజక్త.

SAM_9352“అంకుల్. జీవితంలో డబ్బు పాత్ర ఏమిటి? అన్న గొప్ప ఫిలసాఫికల్ ప్రశ్న వేసి ఆశ్చర్యపరిచాడు ప్రధి. “అది మనకు బానిస అవ్వాలి. సేవలు చెయ్యాలి. డబ్బు అవసరమే. సందేహం లేదు. కానీ దాన్ని  నీ పదో ప్రయారిటీగా ఉంచు. సుఖపడతావు. మనలాంటి మహానగరపు  మధ్యతరగతి జీవులకు జీవనోపాధి సమస్య కానేకాదు. దురాశకు పోనంతవరకూ మనకు డబ్బును చిన్నచూపు చూసే శక్తి వుంటుంది. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను డబ్బు పరంగా తీసుకోకు, సుఖం కోల్పోతావు” విపులంగా హితవు పలికాను. మరో రెండు అనుబంధ ప్రశ్నలు. నా శక్తిమేర జవాబులు .. తమకు ఆసక్తి ఉన్న సంగీతం, నటన, వక్త్రుత్వం, సాహితీపఠనం గురించి సంజక్త, రూపాంశ్ ప్రశ్నలడిగారు. “మనిషి మానవుడవడానికి ఇవన్నీ సమపాళ్లలో ఉండడం చాలా చాలా అవసరం. కానీ ఎంతైన ఇవి పక్క వాయిద్యాలే. చదువన్నదే అసలు సిసలు రాగం. చదువు విషయంలో రాజీ పడకండి. రాణించడం అవసరం” అన్నాను.

(రెండో భాగం వచ్చే వారం)

– దాసరి అమరేంద్ర

స్నేహాలూ, ప్రయాణాలూ, పుస్తకాలూ …ఇదే నా లోకం!

Dasari Amarendraఅక్షరాలు ముందు నేర్చుకొన్నానో, పుస్తకాలు ముందు తిరగేశానో గుర్తులేదు. అక్షరాలతోనూ, పుస్తకాలతోనూ పని లేకుండా కథల మీద మక్కువ పెంచుకొన్నది నాలుగేళ్ల వయసులో. తాతయ్య కథా జగత్తులో, జానపద గాధల ఊహాలోకంలో, జంతుజాలాల మార్మిక గాథలలో.

బంటుమిల్లి పిల్లల గ్రంథాలయం, విజయవాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం,  హైస్కూలులో తెలుగూ, ఇంగ్లీషు పాఠ్యపుస్తకాల్లోని చక్కని కథలూ, కవితలూ, పద్యాలూ, వ్యాసాలూ నాకు సాహిత్యమంటే స్వతఃసిద్ధంగా ఉన్న ఆసక్తికి నీరు పోశాయి. ఆ ఆసక్తి మారాకు వేసి మొగ్గ తొడగడానికి కాకినాడ కాలేజీ రోజులు సాయపడ్డాయి. సాంస్కృతిక సమితి సహాయ కార్యదర్శిగా ఎంతోమంది సాహితీకారులనూ, కళాకారులనూ అతి దగ్గరగా చూడటం, వినడం, మాట్లాడటం.. అదో మైమరపు, ఎడ్యుకేషన్! టౌన్‌హాల్లోని సాహితీ సదస్సులు, జిల్లా గ్రంధాలయంలోని కార్యక్రమాలు, సూర్యకళామందిరంలోని నాటకాలు, మేం ఏర్పరచుకున్న సాహితీవేదిక సమావేశాలు .. అన్నం కన్నా మిన్న అయ్యాయి. జీవితానికి సాహిత్యానికి మధ్యనున్న పేగుబంధం బోధపడింది.

1975లో ఉద్యోగంలో చేరాక చేసిన మొట్టమొదటి పని పుస్తకాల సేకరణ. కొడవటిగంటి, రావిశాస్త్రి, చలం, రంగనాయకమ్మ, విశాలాక్షి లాంటి వాళ్ల పుస్తకాలే కాకుండా సాహిత్య అకాడెమీ వాళ్లూ, విశాలాంధ్ర వాళ్లూ, ‘రాదుగ’ వాళ్లూ, నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్లూ వేసిన అనువాద సాహిత్యమూ సేకరించాను. రెండు మూడేళ్లు గడిచేసరికి మూడు నాలుగు వందల పుస్తకాలు. అదో పెన్నిధి. పుస్తకాలు  చదువుకోవడం ఓ వ్యవసనమయిన రోజులవి. ఇప్పటికీ వదలని వ్యసనమది.

రాయాలనే కోరికెప్పుడు కలిగిందీ? 1976 ప్రాంతాలలో ఒకటీ రెండు కథలు ప్రజాతంత్ర లాంటి పత్రికల్లో వచ్చాయి. అప్పట్లో ఆంధ్రప్రభలో నడిచిన ‘ఇదీ సంగతి’ శీర్షికలో నాలుగయిదు లఘు వ్యాసాలు వచ్చాయి. కానీ ఆదే సమయంలో ‘నేను రాయకపోయినా ఎవరికీ ఏమీ నష్టం లేదు’ అన్న స్పృహ. దాని పుణ్యమా అని రాయడం కట్టిపెట్టి చదువుకోవడం మీదే దృష్టి పెట్టాను. స్నేహితులకు మాత్రం పేజీలకు పేజీలు ఉత్తరాలు రాసేవాడిని. “నీ ఉత్తరాలు చక్కగా కథల్లా ఉంటాయి. కథలే రాయవచ్చు కదా” అని ఒకరిద్దరు అన్నారు గానీ నేను పెద్దగా పట్టించుకోలేదు.

మన అనుభవాలు పంచుకోవాలన్న తపన రచనలు చేయడానికి ఉన్న అనేకానేక ప్రేరణలలో అతి ముఖ్యమైనది. నేనో ప్రయాణాల పక్షిని. ఊళ్లు తిరగడం, కొండలెక్కడం, అడవులు గాలించడం, నదులు దాటడం.. నా అభిమాన విషయాలు, అలాంటి నాకు 1989 అక్టోబరులో ఓ పదిరోజులపాటు యూరప్ వెళ్ళే అవకాశం ఆఫీసు ద్వారా దొరికింది. మూడు దేశాలు, మూడు నగరాలు తిరిగాను. పది గంటలు ఆఫీసు పనీ, మరో ఆరేడు గంటలు ఊళ్లు చూడటం.. ఆ పది రోజులూ నిర్విరామంగా గడపగా అనేకానేక అనుభవాలు మనసును నింపేశాయి. వాటిల్ని కాగితం మీద పెట్టకుండా ఉండలేని స్థితికి నన్ను నెట్టాయి. అలా రాసుకుంటూ వెళ్లాను. రాతలో అరవై డెబ్భై  పేజీలు.

మా తమ్ముడు శైలేంద్ర సీనియర్ జర్నలిస్టు హనుమంతరావుగారి అల్లుడు. ఆ కాగితాలు ఆయన కంటబడ్డాయి. ఆయన ముచ్చటపడ్డారు. అప్పట్లో ‘ఉదయం’ దినపత్రికలో పనిచేస్తోన్న దేవీప్రియగారికి అందించారు. 1990లో కొన్ని వారాల పాటు ఆదివారం అనుబంధంలో సీరియల్‌గా వచ్చింది ఆ మూడు నగరాల ట్రావెలాగ్. తెలుగుదేశం మీద నా అక్షరాల దాడికి అది నాందీ ప్రస్తావన. దాదాపు అదే సమయంలో నా అనుభవాల నేపథ్యంలో చిన్న చిన్న ఇంగ్లీషు మేనేజ్‌మెంటు వ్యాసాలు రాయగా అవి ఫైనానిషియల్ టైమ్స్, ఎకనమిక్ టైమ్స్ లాంటి దినపత్రికల్లో వచ్చాయి. అలా నాకు తెలిసి తెలియకుండానే సాహితీయాత్ర మొదలయింది.

కాకినాడ రోజుల్లోనే గొప్ప గొప్ప రచయితలను దగ్గరగా చూసి, వ్యవహరించిన అనుభవం ఉన్నా నాకు సహజంగానే ఉండే సంకోచం వల్ల గాబోలు, మళ్లా రచయితల దగ్గరికి వెళ్లలేదు. ‘వాళ్లు మనకు అందని చందమామలు. దేవలోకపు జీవులు’ అన్న గౌరవంతో కూడిన బెరుకు ఉండేది. అది దేవీప్రియగారి పరిచయంతో తగ్గింది. వాసిరెడ్డి నవీన్ కథా సంకలనాలను వెలువరించడం మొదలుపెట్టిన సమయమది. ‘అదిగో ద్వారక, కవుల మందలవిగో’ అని సాహిత్యం తెలిసినవాళ్లు సరదాగా పాడుకొంటున్న రోజులవి. అలాంటి ద్వారకా హోటల్లో ఓ సాయంత్రం పూట అడుగుపెట్టాను.

కథలతో పాటు సాహితీ వ్యాసాలూ, సమీక్షలూ నా అభిమాన విషయాలయ్యాయి. అడపా దడపా కవితలూ, విరివిగా అనువాదాలూ. మధ్యమధ్యలో ఇంటర్వ్యూలు. నాకు అతిప్రియమయిన యాత్రారచనలు సరేసరి. సాహితీ మిత్రుల పరిచయాలు అన్న వ్యాపకం మెల్లగా సాహిత్య సదస్సులకు దారి తీసింది. వేదగిరి రాంబాబు గారి ‘సరికొత్త కథ’ ఆవిష్కరణలో ఇరవై ముప్పై మందితో ముచ్చట్లు, కేశవరెడ్డి గారి నవలల ఆవిష్కరణలో ఆయనతో ఆత్మీయ పరిచయం. సాహిత్య అకాడెమీ వల్ల తెలుగు కథా సదస్సు కోసం హైదరబాదు- ఇవన్నీ ఒక ఎత్తు. అప్పాజోశ్యుల -విష్ణుభొట్ల వారు  రాజారామ్ గారికి అవార్డు ఇస్తూ మంజుశ్రీ గారి సారధ్యంలో విజయవాడలో 1996లో జరిపిన రెండు రోజుల సాహితీ సదస్సు మరో ఎత్తు. సుమారు యాభై మంది ఇష్టమయిన సాహితీకారులతో రెండు రోజులు గడపడం ఎంత అదృష్టం! తిరుమల రామచంద్ర, బలివాడ కాంతా రావు, పెద్దిభొట్ల లాంటి గొప్పవారి కొత్త పరిచయం కలిగిందక్కడే!

ఈ లోపల ఢిల్లీలోని మా సాహితీ అనుబంధానికి క్రమరూపం కల్పించాం. నేనూ, లక్ష్మీరెడ్డి గారూ, రంగారావు గారూ, సంపత్, తోలేటి – మేం అయిదుగురమే కాకుండా మాలాంటి సాహితీ ఆసక్తి వున్న మరో పదిమందిని కూడదీసి, నెలకోసారి – ఒక్కొకసారి ఒక్కొక్కరి ఇంట్లో- ఒక్కో ఆదివారం కలిసి గడిపే ఏర్పాటు చేసుకున్నాం. ఒకరి సాహిత్యకృషిలో ఇంకొకరు సాయపడడం, రాసినవి చదవడం, ముఖ్యమయిన సాహితీ వార్తలు అందరూ పంచుకోవడం, ఢిల్లీ వచ్చే రచయితలతో గోష్టి ఏర్పాటు చేసుకోవడం – ఇలా సాగింది మా బృందపు కార్యక్రమం. దాదాపు ఏడేళ్లు నిరాటంకంగా సాగిన వేదిక ఇది.

శ్రీపతి గారికి చలంగారంటే భక్తి. ఆయన శతజయంతి సభ ఢిల్లీలో కూడా నిర్వహించాలని భగీరధులయ్యారాయన. అదో గొప్ప సంఘటన. ఆయన నిర్విరామ కృషి, మా బృందపు చేయూత – సభని దిగ్విజయం చేశాయి. మహీధర, వాడ్రేవు వీరలక్ష్మి దేవి, కుప్పిలి పద్మ, అంపశయ్య నవీన్, వావిలాల సుబ్బారావు, పీ. సత్యవతి, మరో అయిదుగురు కవులూ రచయితలూ ఈ సభల కోసమే ఆంధ్ర నించి వచ్చారు. అప్పుడు రాజ్యసభ సెక్రెటరి జనరల్ గా వున్న వీ. యస్. రమాదేవి గారు ఉత్సాహంగా సభల్లో పాల్గొన్నారు.

శ్రీపతి గారి పూనిక పుణ్యమా అని ఢిల్లీ ఏపీ భవన్ సిబ్బంది యావత్తూ సభలకు ఉతమిచ్చారు.  ‘ తెలుగు సాహితి ఢిల్లీ’ రథసారథి రామవరపు గణేశ్వర రావు గారు సరే సరి. వెరసి రెండు మూడు వందల మంది ప్రేక్షకులతో సభ చక్కగా జరిగింది.అదే ఒరవడి లో నేనూ, లక్ష్మీరెడ్డి గారు చలం సభలకు విజయవాడ, హైదారాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడా పాల్గొన్నాము.

ఇది మా బృందం లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఒరవడి కోనసాగించాలనిపించింది. కథాసాహితీ నవీన్ తో అప్పటికే అంటూ వచ్చాను –” మీ పుస్తకం ఆవిష్కరణ సభ ఒకటి మా వూళ్ళో కూడా ఒకటి ఉండాలి ,”అని. అలా  ‘కథ96’ ఆవిష్కరణ అక్టోబర్ 1997 లో ఢిల్లీ లో అని నిర్ణయించుకున్నాము. అప్పుడు సాహిత్య అకాడమీ కి కార్యదర్శి గా మళయాళీ కవి సచ్చిదానందన్ ఉండేవారు. అంతకు ముందు ఆయన ‘ ఇండియన్ లిటరేచర్ ‘ కు ఎడిటర్ గా పని చేశారు. పుస్తకం ఆవిష్కరించడానికి ఆయన సంతోషంగా అంగీకరించారు. ఇది పెద్ద ప్రయత్నం కాబట్టి ఒక స్థిరమైన సంస్థ అండదండలుండాలనిపించి ఇటు గణేశ్వర రావు గారి ‘ తెలుగు సాహితి’ నీ, అటు ఢిల్లీ ఆంధ్రా ఆసోసియేషన్ కృష్ణమూర్తి గారినీ, గోవర్థనరావు గారినీ సహాయం అడిగాము. ‘ ఆర్థిక భారం మాది, ఆర్గనైజేషన్ భారం మీది, ‘ అని ఫ్రీహాండ్ ఇచ్చారు. నవీన్, శివారెడ్డి, దేవీప్రియ, కాళీపట్నం, శివశంకర్ పాపినేని , ‘కథ96’ లో ఎన్నికైన కథారచయితలు ఆరేడు మంది – అదో పండుగ. ఆవిష్కరణ తో పాటు పూర్తి రోజు కథాసదస్సు పెట్టుకున్నాము. వాకాటి ప్రత్యేక అతిధి. కళింగ కథ గురించి మాట్లాడారు కాళీపట్నం.

ఢిల్లీ లో ఉండటం వల్ల అందివచ్చిన మరో సాహితీ అవకాశం -గీతా ధర్మరాజన్ నడిపే కథాసంస్థ కు నాలుగయిదేళ్ళు తెలుగు కథల నామినేటింగ్ ఎడిటర్ గా వ్యవహరించటం. నవీన్ వాళ్ళు ఆ ఏడాది వచ్చిన మంచి తెలుగు కథలను ఏర్చికూర్చి తెలుగు కథా సంకలనాలు వెలువరిస్తే , గీతా ధర్మరాజన్ వాళ్ళు ఆ ఏడాది వివిధ భాషలలొ వచ్చిన మంచి కథలను నామినేటింగ్ ఎడిటర్ల సాయంతో గుర్తు పట్టి, వాటిల్ని ఇంగ్లీష్ లోకి అనువదింపచేసి వార్షిక సంకలనాలు వెలువరించారు. ఖదీర్ బాబు, డా. వి.చంద్రశేఖరావు, గోపిణి కరుణాకర్, శ్రీరమణ  లాంటి వాళ్ళ కథలను ఇంగ్లీష్ లోకి పంపి పదిమందికి అందించే ప్రక్రియ లో నేనూ భాగస్వామినయ్యానన్న సంతృప్తి మిగిలింది. కానీ ‘ కరడు కట్టిన పురుషాధిక్జ్య మనోహరపు పురాణశ్రేణి గాథ కు పంచదార పూత పూసి వదిలిన ” మిథునం” ను నామినేట్ చేయకుండా ఉండలేకపోయానే , అన్నచింత మాత్రం ఇప్పటికీ వదలలేదు.

ఇలా నా సాహిత్యీ యాత్రలో రకరకాల ఘట్టాలు…

ఇంతకూ నేను పాఠకుడినా? రచయితనా? సాహితీ కార్యకర్తనా?

చదివేసి వూరుకోకుండా మంచి సాహిత్యాన్ని పదిమందికీ  పంచే ప్రయత్నం చేసే పాఠకుడి ని.

సాహిత్యామూ, సాహిత్య కారులూ ఎక్కడ కనిపించినా వాళ్లను పదిమందితోనూ కలిపే వ్యసనమున్న కార్యకర్త ను.

అంతా కలిసి ఓ రెండు వేల పేజీలు రాసిన మాట నిజమే కానీ, అదంతా సాహిత్యమనీ, నేను రచయితననీ అనుకోవడానికి ధైర్యం చిక్కడం లేదు.

( దాసరి అమరేంద్ర 60 ఏళ్ల జీవన యాత్రా  సంరంభోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో మార్చి 14 న విడుదల కానున్న పుస్తకం నుంచి కొన్ని జ్ఞాపకాలు)

Image by Pinisetti