బ్రతుకు భయాన్నిపోగొట్టే కధ .. ‘భయం’

karalogo

నిర్వహణ: రమాసుందరి బత్తుల

 

29-raghavaబుజ్జీ!

ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడే కా.రా.కధ ‘భయం’ మరొకసారి చదివాను. అది నాలో రేపిన భావసంచలనంతో, జీవిత సాక్షాత్కారంతో, నమ్మిన ప్రాపంచిక దృక్పధం అలా అక్షరాల్లో పరుచుకుని కళ్ళెదుట నిలిచినపుడు కలిగే పారవశ్యం తో ఇదిగో .. ఇక్కడిలా మౌనంగా కూర్చుని ’సారంగ’ మాధ్యమంగా నీకు ఈ కధ ను చేరవేస్తున్నా.

‘భయం’- భలే కధ. భయాన్ని జయిస్తే ఏమవుతుందో చెప్పే కధ. భయం గుట్టును విప్పే కధ. అంతటా చీకట్లే కమ్ముకుంటున్నప్పుడు,ఆ చీకట్లకు కారణమైన పరిస్థితులు అర్ధమవుతున్నప్పుడు, భ్రమలు చెదిరిపోతున్నప్పుడు, కాటేసే పాఁవులు మీది మీదికొస్తా ఉన్నప్పుడు, మిర్రి మిర్రి చూస్తా ఉన్నప్పుడు వాటిని కొట్టాల, వొదిలిపెట్టాలో, లేక చేతుల్జోడించి దణ్ణాలు పెట్టాలో తేల్చుకోడానికి ఒక అవకాశమిచ్చే కధ.

కధ మొదలవడం మొదలవడమే అత్యంత ఆసక్తికరంగా ఉద్విగ్నభరితమైన సన్నివేశంతో మొదలవుతుంది. “ఓలమ్మ పాఁవర్రా..” అంటూ ఒక్క దాటువేసి వాకిట్లోకి వచ్చి పడింది పారమ్మ. పూరింటి గుమ్మంలో ఆమె ఎత్తిపడేసిన బుడ్డి దీపం భగ్ భగ్ మని మండుతోంది – ఇవీ కధలోని ఆరంభ వాక్యాలు.. ఇవి చదివిన ఎవ్వరైనా, ఏఁవైందా అని ముందుకెళ్ళకుండా ఆగగలరా? అద్భుతమైన ఎత్తుగడ గదా!

సర్వసాక్షి దృష్టికోణంలోంచి కధ చెబుతాడు కా.రా. ఇందుల. కానీ అది కేవలం చెప్పడమేనా అంటే కాదనిపిస్తుంది. ఫ్రేం తర్వాత ఫ్రేం గా దృశ్యాలు మనసు కళ్ళకు అలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మామూలు అర్ధంలో ’చెబుతాడు’ అని సింపిల్ గా ఎలా అంటాం? నువ్వే చూడు, పారమ్మకి పాఁవు కనబడ్డ చోటుని ఎలా చూపెడుతున్నాడో.. “అసలే సంజవేళ. దానికి తోడు పొరుగు పెరటి చింతచెట్టు జీబూతంలా పెరిగి ఉంది. ఆ అర చీకట్లో- పూరింటి ముంజూరు, ముంజూరు కింద పెల్లలు విరిగి పడ్డ పిట్టగోడ, పిట్టగోడ పక్కనున్నది కర్రల పొయ్యి, పొయ్యి వెనుక కరుదూపం పెచ్చులు గట్టిన పాత గోడ, గోడవతల మూలని పొయ్యికోసం తురిమిన కమ్మరేకులూ, తాటిగొడితెలూ…” – ఒకఛందోబద్ధ గేయం లాగ, కళ్ళముందు దృశ్యంలాగా లేదూ ఈ వర్ణన? – “ఎక్కడే?” అంది ముసలమ్మ. “అదిగాదా?…కమ్మరేకుల్లోకి తల, బైటికి తోకా!..గోడ వోరనుంది”- చూపు సరీగ్గా ఆనని ఆ ముసలమ్మ సంగతేఁవో గానీ నీకూ నాకూ మాత్రం పాఁవు కనపట్టం ఖాయం..అవునా కాదా? జలదరించే ఒళ్ళు సాక్షిగా అవునంటున్నావ్. కదూ..?

కధంతా ఇలాగే, ఏం చెప్పినా అది దృశ్యమానమయ్యేలా అత్యంత సహజమైన, నిరలంకారమైన సంభాషణలు, సన్నివేశాలు.

ఫోటో: కూర్మనాథ్

ఫోటో: కూర్మనాథ్

పారమ్మకి కనపడిన పాఁవు ఆమె పెనిమిటి గౌరేసుని కాటేసింది. పాఁవుల రాఁవులయ్య మంత్రమేశాడు. గౌరేసు బతికాడు. కానీ పురుడు వికటించి పారమ్మ చచ్చిపోయింది. మంత్రగాడి వైద్యం వికటించి గౌరేసు కాలు పుండైపోయింది. విషవైద్యుల మీద, పాఁవు కధల మీద భ్రమలు కోల్పోయిన గౌరేసు కొడుకు సత్యం తన పదిహేనోయేట మొదటిసారిగా ఒక పాముని కొట్టాడు. పాతికేళ్ళొచ్చేసరికల్లా ’పాముల సత్తెయ్య’ అనే పౌరుషనామం తెచ్చుకున్నాడు.

సత్తెయ్య తొలిసారి పాముని కొట్టే సన్నివేశంలో కోళ్ళగంపలో దూరి కోడిపిల్లల్ని పొట్టనబెట్టుకున్న పాముతో కోళ్ళు పోట్లాడతా ఉంటాయి. ముసలి నారయ్య ఎన్ని సార్లు తరిమినా కోళ్ళు ఆ చోటుని విడవట్లేదు, పాముని వొదలట్లేదు. ఇక్కడ రచయిత ఒక ఆసక్తికరమైన మాటంటాడు. “పాపిని చంపడఁవా మానడఁవా అనే మీమాంస మనుషులకే గాని కోళ్ళకున్నట్టులేదు..”. సత్తెయ్య ఆ పాముని చంపేశాక కూడా కొందరు ’భూతదయాపరులు’ ఇలా అంటారు “అయ్యో పాపం, ఎర మింగిన పాఁవర్రా..అలాంటి పాఁవుని సంపకూడదు” వ్యంగ్యంతో కూడిన ఈ కంఠస్వరం వెనుక రచయిత హృదయం మనకు అర్ధమవట్లా? మన బతుకులకు ముప్పుతెచ్చే వర్గ శత్రువు పట్ల ధర్మసూత్రాలు పాటించాలా లేక సామూహిక ప్రతిఘటనకు తెగబడాలా?..

ఇవిగో, సత్తెయ్య మాట్లాడే ఈ మాటల్లో కూడా రచయిత మనకి దొరుకుతాడు.

“పాఁవు మీకు బగమంతుడితో సమానఁవా? సెప్పండి. దండాలెట్టుకుందాం. పాఁవు మాయమైపోద్ది.- కాదు, దాన్ని సంపడం పాపమంటారా, తగువే నేదు. మీ పాఁవుని మీ ఇంటనే ఎట్టుకోండి, నానెల్లిపోతాను. అదీ ఇదీ కాదు- పాఁవు కరుస్తాదీ, అది ఇషప్పురుగూ – అంటారా, ఇక మాట్టాడకండి. సంపి అవతల పారేస్తాను. పుట్ట మీదెయ్యమన్నా యెయ్యను”

“సత్తెయ్య పాఁవుల యెడల భయభక్తులు నాశనం చెయ్యడమే కాకుండా, మంత్రతంత్రాల పట్ల విశ్వాసాలను కూడా పాడు చేసేవాడు”- సత్తెయ్య ఏ చారిత్రక శక్తులకు ప్రతినిధిగా చిత్రించబడ్డాడో మనకి అర్ధమవట్లా..?

ఇదిగో, ఒకనాడు సత్తెయ్యకీ,తన పెళ్ళాం రత్తాలుకీ జరిగిన ఈ సంభాషణ గమనిస్తే సత్తెయ్యా, సత్తెయ్యలో ఉన్న రచైతా స్పష్టంగా అర్ధమైపోతారు.

“పోనీ ఈ ఇంట్ల దూరిన పాఁవుని నువ్ సంపు, నాను కాదన్ను. ఎవళ అటకమీదో ఉన్న పాఁవుని నువ్వేల సంపాల?”

“ఒకలాగనుకుందాఁవు. నేనూ, మా నాయన, ముసలోళ్ళు, పిల్లలు..మేఁవందరఁవూ ఇక్కడ తొంగున్నాం.నువ్ గడపట్ల ఉన్నావ్. తెలిగేసున్నావ్. కర్ర కూడా నీ సేతికందువిడిగింది. సూర్లోంచి పాఁవొకటి వొచ్చింది. అది నీ కాసి సూణ్ణేదు. మా మీదికి పారొస్తోంది…నువ్వేటిసేస్తావ్? సస్తే మాఁవు గదా సచ్చేదని వూరుకుంటావా? నీ పేణఁవేనా వొదిలి మమ్మల్ని కాపాడతావా?”

ఈ ప్రశ్నకి మనందర్లో మెదిలే జవాబునే రత్తాలు సులువుగా ఇచ్చేసింది “నువు – మీరంతా నాకైనట్టు ఈ లోకవంతా నీకౌద్దా?”

సత్తెయ్యే మనం ఊహించని జవాబు ఠక్ మని చెప్తాడామెకు “అవుద్ది”

-ఈ మాట మనలో చాలా మందికి నమ్మబుద్ధి కాదు గదా. “ ఏంటీమనిషి? తనవాళ్ళూ, ఊళ్ళో వాళ్ళూ ఒకటేనంటాడేమిటీ..? వాళ్ళ కోసం తన ప్రాణాల మీదకైనా తెచ్చుకుంటానంటాడేమిటీ..? ఈ పాత్రనిక్కడ చాలా అవాస్తవికంగా చిత్రించాడబ్బా రచయిత..” అనిపిస్తుంది గదా. అంతేనా? ఇది నిజంగా అంత అసంబద్ద, శుద్ధ ఆదర్శ, అవాస్తవిక చిత్రణేనా? అలాంటి వాళ్ళసలుండరా? లేరా? లేరా? లేరా?

“ఎవ్వరో ఈ బిడ్డలూ…అడవి మల్లె పువ్వులూ…” జయరాజన్న పాట గుర్తు రావట్లా? అమరులెందరో గుర్తురావట్లా?..ఇప్పుడర్ధమవట్లా ఇక్కడి ప్రతీక?…దటీజ్ కా.రా. అందుకే ఆయన ’మాస్టారు’. వల్లంపాటి చెప్పినట్లు ‘గోప్యత’ ఆయన ప్రధాన కధన శిల్పం. వాచ్యత చాలా చాలా తక్కువగా గల కధారచయిత కా.రా. కధావస్తువును మరొక వస్తువు మీద ఆరోపించి గోప్యంగా సూచన చేయడం ఆయన పద్ధతి. ఈ అవగాహన మనకుంటే .. “కా.రా. రచయితగా భయస్తుడు. పరిష్కారాలన్నీ తెలిసీ స్పష్టంగా దేన్నీ చూపడు” అన్న కె.వి.ఆర్. మాటల్తో ఏ కోశానా ఏకీభవించలేం.

మరొక అద్భుతమైన పాత్ర .. నేను, అమ్మ, అమ్మమ్మ, అంకుల్, ఆంటీ.. మాలాంటి వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించే పాత్ర ‘సుబ్బాయమ్మ గారు’. పాఁవు చావాలి. దానివల్ల తనకో, తన పిల్లలకో నష్టం కలిగే అవకాశముంది కనుక. ఐతే దాన్ని ఏ సత్తెయ్యో, సొమ్ముల గురవయ్యో చంపాలి. తానూ, తన పిల్లలూ, మనవళ్ళూ ఆ చాయలకే రాగూడదు. ఇదీ సుబ్బాయమ్మ గారి ఆలోచనా దృక్పధం.

సుబ్బాయమ్మ గారి పాత్ర ను చూస్తే బాలగోపాల్ మాటలు గుర్తొస్తాయ్. “మధ్యతరగతి బుద్ధిజీవులకు ఒక లక్షణం ఉంటుంది. న్యాయాన్యాయాల సంఘర్షణ మన నిత్యజీవితానికి ఎంత దూరాన జరిగితే మనం అంత సులభంగా న్యాయం పక్షం వహిస్తాం. ఆ సంఘర్షణ మన జీవితానుభవానికి చేరువయ్యేకొద్దీ న్యాయం పక్షం వహించడం కష్టమవుతుంది”- ఎంత సరిగ్గా చెప్పాడో బాలగోపాల్! కదా?

సుబ్బాయమ్మగారి ఇంటి వెనుక ఒక పూరిల్లు. అందులో ఒక పాము. మెల్లగా కలుగులోకి పోతూ ఉంది. తోక బయటకు పెట్టి ఉంది. బండి తోలుకుని పోతున్న సత్తెయ్యను నడి దారిలో పట్టుకుని విషయమేంటో కూడా చెప్పకుండా ఇంటికి లాక్కుపోయింది సుబ్బాయమ్మ గారు. కలుగులోకి జారుకుంటూ ఉన్న ఆ పామును తాను తోకపట్టుకుని బైటకులాగి పడవేస్తే వెంటనే ఆ పడిన చోట దాన్ని కొట్టేందుకు ఒక ధైర్యమైన చేతోడు ఉండాలంటాడు సత్తెయ్య.

తన కొడుకుని ఆ జోలిగ్గూడా వెళ్ళొద్దని హెచ్చరించి పరుగు పరుగున వెళ్ళిన సుబ్బాయమ్మ పదమూడేళ్ళ వయసున్న ఒక సొమ్ముల కాపరి, సొమ్ముల గురవడ్ని వెంట పెట్టుకొచ్చింది. ఈ గురవడు ఉషారైనోడు. ఆలోచించగలవాడు. ఇంకా ఘనీభవించని స్పందించే గుండెకాయను కలిగి ఉన్నోడు. నీలాంటి, నీ తోటి పిల్లల్లాంటి వాడు. సుబ్బాయమ్మ మాటల్ని పట్టించుకోవద్దని నచ్చజెప్పబోయిన సత్తెయ్యను “ఓయ్ ఊరుకోవయ్యా! పాఁవు దూరింది ఆళ్ళ ఇరకలోనా? సాయానికి నువ్వూ నేనా? చెయ్యి సాయం తోడుండమంటే ఎలాగ సస్తారో మీరిద్దరూ సావండి గాని, నా కొడుక్కి మాత్రం దాని గాలి కూడా తగల్నానికి ఒల్లకాదంటాదా ఆ యమ్మ..? యీయిడే కన్నాదేటి కొడుకుని! నిన్నూ నన్నూ అమ్మ కన్లేదేటి?..”అని దబాయించినోడు.

మొత్తం మీద సుబ్బాయమ్మ కొడుకునొక పక్కా, సొమ్ముల గురవడ్నొక పక్కా నిలబెట్టి రెండు చేతుల్తో తోకనందుకుంటాడు సత్తెయ్య. కానీ పాఁవు ఎత్తు మార్చేస్తుంది. అంతా కంగాళీ ఐపోతుంది. సత్తెయ్యను కాటందుకుంటుంది పాఁవు. తర్వాత ఏమవుతుంది?.. సత్తెయ్య బతుకుతాడా లేదా?..

ఊరు ఊరంతా సత్తెయ్య చుట్టూ ఉంటే అక్కడ ఉండడానికి మనస్కరించని సొమ్ముల గురవడు మాత్రం మందకేసి నడిచాడు. తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఇంతకాలం తను చూసిన లోకమే , ఊరే ఇప్పుడు తనకి కొత్తగా కన్పిస్తున్నాయ్. మందలో పశువులన్నీ వేర్వేరు వర్గాలుగా కనిపించసాగాయ్. వాడికి ’ఎపిఫనీ(జీవిత సాక్షాత్కారం)’ కలిగింది. ఏమిటా ఎపిఫనీ? అది నీకూ,నాకూ కూడా కలుగుతుందా కధ చదివితే…? లేక మన జీవితానుభవాల్లోంచి మనకది కలిగితే దాన్నిక్కడ సరిపోల్చుకోగలమా…?

“ఏంటి ఈ ప్రశ్నలు వెయ్యడం” అంటావా? బుజ్జీ! నేనెంత చెప్పినా అది అసమగ్రమే అవుతుందమ్మా. మాష్టారి కధ, అందులోని సజీవమైన భాష, పాత్రపోషణ, సంఘర్షణ, నిర్మాణసౌష్ఠవం, పీడిత జన పక్షపాతం….-ఎన్నని చెప్పగలను? నువ్వే చదువుకో…ఇదిగో ఇక్కడ కధ లంకె నీ కోసం…- ఉండనా మరి

                                                                                    ప్రేమతో

                                                                                    నాన్న.

[రామిరెడ్డి రాఘవరెడ్డి గారు వృత్తి రీత్యా టీచరు. “ఊగులోడు”, “ఒక బాల కార్మికురాలు, నాలుగవ తరగతి ఏ సెక్షన్ ” ఇంకా కొన్ని కధలు ఆంధ్రజ్యోతి, నవ్య, ఆంధ్ర భూమి వారపత్రికల్లో వచ్చాయి. అయితే ఆయనకు ఇష్టమైన రచనా  వ్యాసంగం కవిత్వం. వీరివి  చాలా కవితలు అనేక పత్రికల్లో వచ్చాయి. పతంజలి, శివారెడ్డి ని ఎక్కువగా ఇష్టపడతారు.]

 వచ్చే వారం ‘ఆదివారం’ కధ మీద  సి. హెచ్ వేణు గారి పరిచయం

 

 

“భయం” కథ లింక్ ఇదిగో:

వాళ్ళకు నా అక్షరాలిస్తాను..

 

రాఘవ రెడ్డి

రాఘవ రెడ్డి

ఎందుకో మరణం గుర్తొచ్చిందివాళ

ఇటీవల కాస్త అనారోగ్యం చేసింది

ఏదో ఒకనాడు చనిపోతాను గదూ-

 

చెప్పో చెప్పకుండానో కాస్త ముందుగానో వెనగ్గానో

తాపీగానో తొందరగానో మొత్తానికి చనిపోతాను

అయితే బ్రతికి చనిపోవడం నాకిష్టం

బ్రతుకుతూ చనిపోవడం నాకిష్టం

 

కొంచెం కొంచెం చనిపోతూ మిగిలుండడం

అప్పుడెప్పుడో చనిపోయీ ఇంకా ఇక్కడే

చూరుపట్టుకు వేలాడటం

చనిపోవడం కోసమే బ్రతికుండటం..

అసలిష్టం లేదు నాకు

 

***

ఎప్పుడు ఎలా చనిపోయామన్నది ముఖ్యం కాదు

ఎప్పుడు ఎలా బ్రతికామన్నది ముఖ్యం

చావుకంటే బ్రతుకు ముఖ్యం

 

***

ఎవడి పొలానికి వాడు గెనాలు వేసుకుని

ఎవడి స్థలానికి వాడు తెట్టెలు కట్టుకుని

ఎవడి పెట్టెకు వాడు తాళాలు వేసుకుని

ఎవడి పశువుకు వాడు పలుపు గట్టుకుని

ఎవడి చావు వాడు చస్తున్నప్పుడు

ఎవడి ఏడుపు వాడేడవాల్సిందే-

 

***

కానీ

వాళ్ళ చావులకు నాకేడుపువస్తున్నది

చంపబడుతున్న వాళ్ళకోసం ఏడుపు వస్తున్నది

గెనాలను దున్నేసే వాళ్ళ కోసం

తెట్టెలు కొట్టేసే వాళ్ళకోసం

యుద్ధాన్నొక పాటగా హమ్ చేస్తున్నవాళ్ళకోసం

కళ్ళు సజలమవుతున్నవి

-కానీ ఒట్టి రోదనలతో ఏమిటి ప్రయోజనం..

 

దుఃఖించడం నాకిష్టం లేదు

ఏడుస్తూ ఏడుస్తూ చనిపోతూ బ్రతకడం

ఇష్టం లేదని ముందే చెప్పానుగా-

 

బ్రతుకుతాన్నేను

బ్రతకడం కొంత తెలుసు నాకు

మాటలే చెబుతానో

పాటలే కడతానో

కధలే అల్లుతానో

వాళ్ళకోసం దారులేస్తాను

వాళ్ళను ప్రేమించేవాళ్ళను ప్రోది చేస్తాను

వాళ్ళకు నా అక్షరాలిస్తాను-

వెదురువనం పాడుతోన్న అరుణారుణ గేయానికి

సంపూర్ణ హృదయం తో ఒక వంతనవుతాను.

 

-ఆర్. రాఘవ రెడ్డి