కొన్ని ముగింపులు

Art: Satya Sufi

Art: Satya Sufi

ఒకానొక ఆమె. పెళ్లయిన ఆమె.

ఆమె సన్నగా ఉంది,లావుగా ఉంది.  లేదూ సమంగానే ఉంది. పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉంది. కాదూ సగటుగానే ఉంది. నల్లగా, తెల్లగా, చామన చాయలో. మొహం కోల గానూ, గుండ్రంగానూ. ముక్కు మీదో, బుగ్గ మీదో పుట్టుమచ్చా. పొట్టిదో, పొడుగుదో, ఉంగరాలు తిరిగో సాఫీగానో జుట్టు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్లర్క్, టీచర్, సేల్స్ గర్ల్, మేనేజర్. లేదూ ఇంటి వద్దనే పిల్లల్ని చూసుకుంటూ చదివిస్తూ.

బస్టాండ్ లో కలిశారు మొదట. రైల్వే ప్లాట్ ఫాం మీద కూడా కావచ్చు. ఎయిర్ పోర్ట్ బయట ఎదురు చూస్తూనో. లేదూ ఆఫీస్ లో. ఏదో పార్టీలోనో, ఎవరో స్నేహితుల ఇంట్లోనో. ఫేస్బుక్ లో కూడా అయి ఉండొచ్చు. అది మొదటి సారీ కాకపోవచ్చు. ఒకప్పటి క్లాస్ మేటో, స్నేహితుడో, టీనేజ్ కాలపు ప్రియుడో మళ్లీ ఇప్పుడు. రోజూ కలిసే తోటి ఉద్యోగో, పొరుగింటి వాడో, అదే వీధి వాడో కూడా.

అప్పుడు అతన్ని చూడగానే ఆత్మీయంగా అనిపించింది. లేదూ మాటల్లో ఎప్పుడో దొర్లిన చిన్న మాటకో. చేతిలోంచి జారిపడ్డ దేన్నో ఒంగి తీసి చేతికిచ్చినప్పుడో. బహుమతి ఏదో కొని ఇచ్చినప్పుడు. అతను పక్కనున్నప్పుడు హాయిగా వీచిన ఆ సాయంత్రపు గాలి వల్ల. నాలుగు చినుకులు పడ్డందుకు. పక్కనుంచి పూల వాసనకి. ఎక్కడినుంచో వినవస్తున్న ఎప్పటిదో యవ్వనకాలపు పాటకి. ఎప్పటివో జ్ఞాపకాలు కదలాడినందుకు. అహితమైనవన్నీ మరిచిపోయేలా చేసినందువల్ల. మొత్తానికి ఒక మాంత్రిక క్షణం. శాశ్వతం అవుతుందనిపించేలా అవాలనిపించేలా.

ముందు సరదాకే కొనసాగిందది. రోజువారీ పనుల మధ్య ఆటవిడుపుగా. కాదూ ఆశపడ్డట్టుగాలేని సంసారం పట్ల అసహనం నుంచి విడుదలగా. చెప్పుకోలేని ఒంటరితనం, ఇరుకూ, ఏవో అసంతృప్తులూ. ఎవరి మీదో చెప్పలేని విసుగూ. భౌతికమైనదో, మానసికమైనదో హింసా. తెలియని వెలితి ఏదో పూడ్చుకోవడానికి. అంతకుమించి ఉద్వేగపూరితమైనదేదీ చేయడానికి లేక. కాదా ఓదార్పుగా ఒక మాట. మెచ్చుకోలుగా ఇంకో మాట. కలిసిన చూపులో, తెలిసినట్టు ఒక నవ్వో. పోగొట్టుకున్న రోజుల్ని అపురూపంగా మళ్ళీ బతుకుతున్నట్టు.

క్రమంగా అది చిలిపి సంభాషణల్లోకి దిగింది. ఒకరి తోడు ఒకరికి నచ్చింది. మాటలే మాటలు. అటు తిరిగీ ఇటు తిరిగీ దాగుడుమూతలాడీ ఎప్పటికో స్పష్టపడింది. ఆకర్షణలోని ఉద్వేగానికి కొట్టుకుపోతూ. రహస్యంగా వెతుక్కునే కళ్ళూ, వేగంగా కొట్టుకునే గుండే, ఒంట్లో కొసలదాకా పరుగులు తీసే నెత్తురూ, తిరిగొచ్చిన యవ్వనపు అలజడీ, ఎడబాటులో అతనిపైనే ధ్యానమూ.

అది ప్రేమో, అటువంటిదేదో అన్న నిర్ణయానికి వచ్చారు. తమ అదృష్టాలను తాము పొగుడుకున్నారు. తర్వాత ఒకరి అదృష్టాన్ని ఒకరు పొగుడుకున్నారు. అంతకంటే ముందే కలవనందుకు చింతించారు. ఉత్తేజపూరితమైన, ఉద్వేగభరితమైన ఆ దినాల్లో ఒకసారి అడిగిందామె. “మన కథ ఎలా ముగియబోతుంది?”

0.చివరికి ఏమీ కాలేదు. మరెందుకూ దారి తీయక మునుపే అతనికి దూరమయ్యింది. కావాలనే. అప్రయత్నంగానో. అతడికి ఇంకొక ఆమె    ఎవరో పరిచయమయ్యారు ఆశ తీరే దగ్గర దారి చూపెడుతూ. ఆమె భర్త ఉద్యోగం మారడంతోటో, వాళ్లు ఇల్లు మారడంతోటో ఆమెతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. లేదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్. కాదూ ఆమె పిల్లల చదువు గొడవలో పడిపోయింది. ఏ తెర మీదో, రోడ్డు పక్కనో ప్రేమ ప్రకటించుకుంటున్న జంటని చూసినప్పుడో, మసక చీకట్లో ఎవరో అతనిలా కనిపించినప్పుడో అతను గుర్తొస్తే కొంచెం దిగులు పడి కాసేపు పాత ఏడుపు పాటలు విని. ఏదయినా బాధ కలిగినప్పుడు ఓదార్పు గానో. కొంత అపరాధభావనా. లేదా చేతికందీ జారిపోయినట్టు చింత. లేదూ మళ్లీ అతనెప్పుడూ ఆమెకు గుర్తు రాలేదేమో కూడా.

1.ఏదో అయ్యేలోపే ఆమెకు మరొకతను దగ్గరయ్యాడు. ఆమెని ఇంకాస్త నవ్వించేవాడు. లేక ఎక్కువ సమయమో, డబ్బో ఉన్నవాడు. ఎట్లాగో ఇంకొంచెం మెరుగయిన వాడు. లేదా ఆమె వినాలనుకున్నవే చెప్పేవాడు. కథ మళ్లీ మొదట్నుంచి. ఏదో ఒకటి జరిగి ఇంకోరకంగా ముగిసిందాకా. లేక ఆమెకు విసుగెత్తిందాకానో, వయసు ఉడిగిందాకానో, మరణించిందాకానో. ఏది ముందయితే అప్పటిదాకా.

2.ఒకరోజు పగలో, రాత్రో, రెంటి మధ్యో. అతనితో సెక్స్. చాలా పకడ్బందీ ప్లానింగ్ తోటే. ఒక్కో అడుగూ ముందుకు జరిగో, ఎప్పుడో ఎలాగో అకస్మాత్తుగానో. ఒకసారో కొన్ని సార్లో లేక దాదాపుగానో. బయట ఎక్కడో హారన్ మోత. ఎక్కడో భయం, అంతలో తెగింపు. మధ్యలో పోయిన కరెంట్, ఆగిన ఫాన్. లేక హుమ్మంటూ ఏసీ.  కాక మొదట్లోనో, మధ్యలోనో మనసు మారి తలుపు తీసుకుని పరుగు తీసి ఇంటికి వచ్చి ఏడ్చి స్నానం చేసి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామన్న ప్రశ్నే రాలేదు. అతన్ని మళ్లీ కలిసింది లేదు. ఎదురుపడ్డా ఒక పొడి హలో చూపు పక్కకి తిప్పుకుంటూ తప్పుకుంటూ. ఏమీ జరగనట్టూ, జరిగిందీ, జరగందీ మర్చిపోవాలని ప్రయత్నిస్తూ. లేదా ఆమెకు గుర్తున్నదల్లా అతని భుజమ్మీద ఎప్పటిదో మచ్చ.

2.1. తప్పు చేసిన భావన ఆమెను నిలవనీయలేదు. భర్త ఏ కొంచెమో ప్రేమ చూపినప్పుడల్లా అది ఎక్కువయ్యేది. చెప్పడమా, మానడమా అని ఊగులాడింది.

2.1.1. ఆమె తన స్నేహితురాలితో చెప్పుకుంది. ఆవిడ ఆమెని తిట్టింది “ఎందుకిలా చేశావు?” ఆవిడకూ ఎటూ తోచక ఒక ఫేస్బుక్ గ్రూప్ మొదలెట్టి అందులో ఇదంతా ఒక కథ అయినట్టు చెప్పి, ఇప్పుడా పాత్ర ఏం చేస్తే బావుంటుందని అడుగుతూ పోస్ట్ చేసింది. లేదా అప్పటికే ఉన్న గ్రూప్ లోనో. చెప్పడం నైతిక ధర్మమని కొందరూ, చెప్పకపోవడం జీవనధర్మమని కొందరూ వాదించుకున్నారు.  శాస్త్రాలనూ, సోషియాలజిస్టులనూ ఉటంకించారు. చివరికి అది కొన్ని చోట్ల విశ్వనాథ, చలం భక్తుల మధ్య జగడంగానూ, కొన్ని చోట్ల మోడీ భక్తుల మధ్యా ద్వేషుల మధ్యా గొడవగానూ పరిణమించింది. ఆమె ఫేస్బుక్ అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంది. తర్వాత 2.1.2. గానీ 2.1.3. గానీ.

2.1.2. ఒక రాత్రి నిద్రపోతున్న భర్తను లేపి చెప్పింది. “నేను తప్పు చేశాను. మీకు ద్రోహం చేశాను.” ఆమె భర్తకి అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్పింది. మౌనంగా ఉండిపోయాడు. “ఎలా జరిగిందో తెలియదు. ఏ వాలునీటిలోనో కాళ్ల కింద మట్టి జారి కొట్టుకుపోయినట్టు.” తల వంచుకుని చెప్పింది. లేదా కళ్ల వెంట నీరు. కాకపోతే అంతా వివరిస్తూ ఒక ఉత్తరం.  “ఇట్స్ ఓకే!” కాసేపటికి చెప్పాడు ఆమె చేతి మీద చేయి వేసి.  “నన్ను క్షమిస్తారా?” ఆగి అంది “నన్ను వెళ్లిపోమన్నా అర్థం చేసుకోగలను.” ఆమె భర్త ఆమెను దగ్గరకు తీసుకుని సముదాయించాడు. “ఒక్కసారి కాలంలో వెనక్కి వెళ్లగలిగితే..” అనుకుందామె. ఒక్కోసారి మళ్లీ 2.2 కి. లేదా 6 కు.

2.1.3. ఆమె ఎవరితోనూ మనసు విప్పి చెప్పుకోలేదు. చెప్పే ధైర్యం చేయలేకపోయింది. ఆ రహస్యాన్ని జీవితాంతం మోస్తూ బతికింది. చనిపోయే ముందు హాస్పిటల్లో చేయి పట్టుకుని మంచం పక్కనే కూచున్న భర్త వంక చూస్తూ నోరు తెరిచింది. “నన్ను క్షమించగలరా?” అంది. లేదా అనాలనుకుంది. అన్నాననుకుంది.

2.2. తర్వాత చాటుమాటుగా కలుసుకుంటూనే ఉన్నారు. అతనికెక్కడో వేరే ఉద్యోగం వచ్చి తనతో వచ్చేయమని గొడవ. ఆమె భర్తకు ఏదో అనుమానంగానే ఉంది. లేక అనుకోని షాక్. చెప్పిందామె “అయాం సారీ సారీ సారీ. నాది తప్పే కానీ చేయక తప్పదు. నాకోసం. అతని కోసం”  లేదా “తప్పంతా నీదే. నీమూలానే చేయవలసి వస్తూంది ఇలా!” ఏం చేయాలో పాలుపోలేదు ఆమె భర్తకి. లేదా ఎగిరి గంతేశాడు. అది అతని ఎన్నాళ్ల కలో. “పిల్లలో?” అడిగాడు.”ఫర్వాలేదు , మీరే ఉంఛుకోండి,” అంది. “లేదు లేదు, నువ్వే తీసుకుపో!” అన్నాడు. కాదూ పంచుకోవడమో, తనకే కావాలని గొడవో. పిల్లలు ఆమెను ఎప్పుడూ క్షమించలేదు. ఆపైన 7.1 గానీ 7.2 గానీ.

3.కథ మొదలయిన సంగతి ఆమె భర్తకి తెలుసు. అసలు అతనే దోహదపడ్డాడేమో కూడా. ఏదో వ్యసనం. కాదా దురాశ. మొత్తానికి డబ్బు అవసరం. లేదా లైంగిక అసమర్థత. ఆమెకూ తెలుసు అయినా తెలియనట్టు. లేదా తెలియదు. అతనితో సెక్స్, తర్వాత దొంగచాటుగా కలవడం నుంచి అవసరమయినప్పుడల్లా అతను ఇంటికే రావడం అలవాటయింది. ఆమె భర్త చాకచక్యంగా తప్పుకునేవాడు. లేదూ అతనితో స్నేహం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోనే కూచుని కలిసి తాగే దాకా. ఆమె మీద జోకులు వేసి ఆనందించే దాకా. లేదా జోకు అనుకుంటూ ఎత్తిపొడుపు. “నీ ప్రేమ నా మీదా, నా డబ్బు మీదా? అందుకే వల వేశావు గదూ?” ఆమె వినలేదు. లేక విననట్టు నటింఛింది.

4.బట్టల్లేకుండా వాళ్లు కలిసున్నప్పుడు ఫొటో తీశారెవరో. కాదూ వీడియో. అతని ఫ్రండే. లేదా ఆమె భర్త ఫ్రండ్. కాదూ ఎవరో ముఖపరిచయస్తుడు. అనుకోకుండానో, అతని ప్లాన్ లో భాగంగానో. ఆమె ఫోన్ కి ఒక బెదిరింపు మెసేజ్. బ్లాక్ మెయిల్. ఆమె కావాలి, లేదా డబ్బు. అతను తప్పుకున్నాడు. ఆమె బ్లాక్ మెయిలర్కి అడిగిందల్లా ఇచ్చింది. చెప్పినట్టల్లా చేసింది. అయినా ఫొటోలో వీడియోలో బయటపడ్డాయి. చివరికి నెట్కి ఎక్కాయి. ఆమె ఆత్మహత్య చేసుకుంది. లేదా అతన్ని హత్య చేసింది. తప్పుకోకుంటే అతనితో కలిసేనేమో. ఏ కోర్టులోనూ కేసు లేదు. లేదా ఇంకా నడుస్తూంది. ఇద్దరూ జైల్లోనయినా. కాదూ భయపడి 2.1.2.కో.

5.అతనితో సంబంధం కొనసాగుతుండగా ఆమె భర్తకి అనుమానం కలిగింది. కొన్ని గుర్తులు ఆమె ఒంటి మీదో, ఇంట్లోనో. సమయం కాని సమయంలో ఫోన్లో మెసేజ్లు. అడిగితే చెప్పిన సమాధానాలు అతికీ అతకనట్టు. చివరికి ఆమె భయపడిపోయి అతనితో తెగతెంపులు చేసుకుంది. లేదా చుట్టుపక్కల వాళ్ల గుసగుసలు గమనించి బెదిరిపోయో. ఏ సాక్ష్యమూ దొరక్క ఆమె భర్త అనుమానాన్ని మనసులోనే అణుచుకున్నాడు. తన చిన్న కొడుకుని చూసినప్పుడల్లా అది బయటికి వస్తుంది. తమవి కాని పోలికలకోసం వాడి మొహం వంకే చూస్తాడు. అకారణంగా ఆమెపై విసుగు. లేదా వేధింపులు. ఎప్పుడయినా 2.1.2.కి.

6.ఆ రోజెందుకో ఆమె భర్త తొందరగా ఇంటికి వచ్చాడు. ఎందుకో కాదు అనుమానంతోటే. ఇద్దరూ దొరికిపోయారు.

6.1. అతను పారిపోయాడు. ఆమె భర్త ఆమెని ఒక్క మాటా అనలేదు. ఆమె ప్రయత్నించింది. ఏడ్చీ, బ్రతిమలాడీ. చుట్టాలూ, స్నేహితులూ చెప్పి చూశారు. తర్వాత విడాకులూ, పిల్లల కస్టడీ గొడవా. ఆమె భర్త మాత్రం ఆమెతో మాట్లాడింది లేదు అప్పటినుంచీ. ఆమె అసలు లేనట్టే.

6.2. అతను పారిపోయాడు. ఆమె భర్త ఆమెని చితకబాదాడు. లేదా అవమానం, దుఃఖంతో కూర్చుండిపోయాడు. ఆమె ఏడుస్తూ క్షమాపణ అడిగింది. తల గోడకేసి కొట్టుకుంది. ఆమె భర్త ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమెకు మరింత దుఃఖం పొంగుకొచ్చింది. తర్వాత వేరే ఇంటికో, ఊరికో మారిపోయారు.

6.2.1. అయినా ఆమె భర్త ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు.  మనసు తొలిచే ప్రశ్నలు అడక్కుండా ఉండలేకపోయేవాడు. ‘ఎందుకు?’,’ఎన్నాళ్ల నుంచి నడుస్తుంది?’ నుంచి వాళ్ల మధ్య నడిచిన సెక్స్కు సంబంధించిన ప్రశ్నల దాకా. ఒక్కోసారి భోరున ఏడ్చేవాడు. లేదా ఆమెను కొట్టేవాడు. ఏ వాదన జరిగినా చివరికి ‘నిన్ను క్షమించడం నా బుద్ధితక్కువ!’ తో నోరు మూయించేవాడు. ఒక రోజు ఆమె ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏవో బిళ్లలు మింగో. లేదా జీవచ్ఛవంలా బతికింది.

6.2.2. ఆమె భర్త ఆ సంగతెప్పుడూ ఎత్తలేదు. తిడితేనో, కొడితేనో బాగుండుననుకునేది. అతని మంచితనాన్నీ, కృతజ్ఞతాభారాన్నీ భరించలేకపోయేది. అప్పుడప్పుడూ గొడవ పెట్టుకునేది “మీకు నామీద ప్రేమ ఉంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది?” అదే అబ్సెషన్ కావడంతో కొన్నాళ్ల సైకియాట్రీ ట్రీట్మెంట్ తర్వాత విడాకులు తీసుకుంది. లేదా ఉత్తరం రాసి వెళ్లిపోయింది. కాదూ ఆత్మహత్య.

6.2.3. మళ్లీ అతని మొహం చూడకూడదని కచ్చితంగానే అనుకుంది కానీ అతను కనిపించగానే అన్నీ మరిచిపోయింది. లేదా కొన్నాళ్లు అతను మళ్లీ వెనక పడ్డాక. అతనితో సెక్స్ వీలయినప్పుడల్లా సాగిస్తూనే ఉంది. తిరిగి 6 కి.

6.3. ఆమె భర్త కోపం పట్టలేకపోయాడు. కత్తితో వాళ్లిద్దరినీ ఎడాపెడా పొడిచాడు. లేక ఇద్దరిలో ఒక్కరినో. తర్వాత కత్తితో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, తాపీగా కూర్చుని వాళ్లనెందుకెట్లా చంపిందీ వివరంగా చెప్పి లొంగిపోయాడు. లేదా ఆ శవాన్నో శవాలనో ఎక్కడో పూడ్చో కాల్చో మాయం చేశాక తర్వాతెప్పుడో బయటపడి పోలీసులకి దొరికిపోయాడు. లేదూ ఆమె ఆనవాళ్లు ఎప్పటికీ బయటపడలేదు. కాదా ఆమె భర్త కూడా అప్పుడో కొన్నాళ్లకో ఆత్మహత్య చేసుకున్నాడు.

6.4. ఆమెని తిట్టాడు. కొట్టాడేమో. ఆమె అతన్ని కలవడం మానలేదు. భర్త ఆంక్షలూ, వేధింపులూ తట్టుకోలేక అతనితో చెప్పుకుని ఏడ్చింది.  మరో నాడు పట్టుబడినప్పుడు ఇద్దరూ కలిసి ఆమె భర్తని కొట్టో పొడిచో చంపేశారు. లేదా ప్లాను ప్రకారమే ఆమె భర్తని మట్టు పెట్టారు. తాడుతోనో, దిండుతోనో, విషంతోనో. కాదూ అతను తన స్నేహితులతో కలిసి ఆమె భర్తకు మద్యం తాగించి ఊరవతలకి తీసుకెళ్లి. లేక ఏ కారుతోనో గుద్ది. చివరికి పోలీసులకి చిక్కారు. లేదు.

7.”నీకో విషయం చెప్పాలి” అన్నాడు ఆమె భర్త ఒక రోజు. లేక ఆమే అంది. “ఏమిటి?” “నాకు విడాకులు కావాలి.” “అవునా? నేనూ అదే చెప్దామనుకున్నాను.” “అవునా? నేను ఇంకొకరితో ప్రేమలో.. ఎలా చెప్పాలో తెలియలేదు.” “నేనూ..” ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. విడాకులు తీసుకున్నారు. ఒకరి పుట్టినరోజుకొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు.

7.1. ఆమె విడాకులు తీసుకుంది కానీ అతను తీసుకోలేదు. ఏవో సాకులు. పిల్లల చదువులనో వాళ్ల ఆవిడ ఆరోగ్యం బాలేదనో. అసలు పెళ్లి చేసుకుందామని తను అనలేదనీ, ఊరికే సరదాకన్నాననీ బుకాయింపు. లేదా మొహం చాటు చేసుకుని తిరగడం. కొన్నాళ్లు ఎదురు చూసి ఒక రోజు వాళ్లింటికే వెళ్ళి తిట్టి వచ్చింది. అతని భార్య ఎదురుగానే.

7.1.1. మళ్లీ అతను ఆమె వద్దకి వస్తూనే ఉన్నాడు. ఆమె అతనికి రెండో సెటప్ అని అనుకుంటుంటారు చుట్టుపక్కల వాళ్లు. రెండో భార్యగా మిగిలిపోయేనేమిటని దిగులు పడి అతనితో గొడవపెట్టుకుంటుంది అప్పుడప్పుడూ. ఆమె జీతమూ, ఉంటే ఆస్తీ కాజేసుతున్నందుకేమో కూడా. తీసుకెళ్లి భార్యకో, పిల్లలకో పెడుతున్నందుకు కూడా.

7.2. ఆమె అతన్ని పెళ్లి చేసుకుంది. లేదా కలిసి బతకడం మొదలెట్టారు. ముందెన్నడూ లేనంత ఆహ్లాదంగా గడిచింది ప్రతి దినమూ. అతన్ని ముద్దు పెట్టుకుంటూ “మనుషులు ఇంత హాయిగా బతుకుతారని నాకు ఇప్పటిదాకా తెలియలేదు” అందామె. లేక అటువంటిదేదో.

7.2.1. మళ్లీ అదే మొనాటనీ. అసంతృప్తి. భర్త మారేడు కానీ అచ్చు ముందులాగే జీవిస్తున్నట్టు. ఒకరోజు ఇంకో అతను కలిశాడు. అదృష్టవశాత్తూ. లేదా దురదృష్టవశాత్తూ. కథ మళ్లీ మొదటికి.

7.2.2. ఒక రోజు ఆమెకి అతని జేబులో పూల రుమాలు దొరికింది. అచ్చు తన రుమాలు ఒకనాడు అతను జేబులో పెట్టుకుని మర్చిపోయి అప్పటి వాళ్లావిడకి దొరికినట్టే. లేదా అలవాటు లేని సెంట్. అడిగితే ఏదో నమ్మలేని బదులేదో చెప్పాడు. “నన్నే అనుమానిస్తున్నావా,” అంటూ బాధపడ్డాడు. దాన్ని పట్టించుకోకుండా వదిలేయడమా లేక అతన్ని వదిలేయడమా అని ఆలోచిస్తూంది.

ఎన్+1. ___________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________.

ఎగ్జిట్ 1. ఆమె మరణించింది. సమయం తీసుకునో హఠాత్తుగానో. ఏదో కేన్సర్ వంటి తగ్గని జబ్బు. కాదా యాక్సిడెంట్. బస్ బోల్తా, పట్టాలు తప్పిన రైలు, వర్షంలో డ్రయినేజ్ హోల్.  లేదా ఎప్పుడయినా ఒక క్లిక్తోనో,కరెంట్ పోయో. లేదా బ్యాటరీ అయిపోయి.

ఎగ్జిట్ 2. ఉల్కాపాతం. లేదా మూడో ప్రపంచ యుద్ధం. మొత్తానికి మహా విలయం. మానవజాతి సమస్తం నశిస్తుంది. మిగతా ముగింపుల్నీ, వాటిని పట్టించుకునేవాళ్లనూ, ఏదీ పట్టని వాళ్లనూ మింగేస్తూ. అంతా అసంబధ్దంగా మిగిలిపోతుంది. మిగలదు.

—-చంద్ర కన్నెగంటి

 

మరణానికి ముందు “అంతర్జ్వలనం”

-వేలూరి వెంకటేశ్వర రావు
~
మిత్రుడు బ్రహ్మానందం  నన్ను ముందుమాట రాయమని అడగటం అతనికి నాపై ఉన్న అభిమానం తప్ప వేరే కారణం కాదని నేను ఘంటా పథంగా చెప్పగలను. కథలకు, కథాసంకలనాలకు, నవలికలకు, కవిత లకు ముందుమాటలు, వెనుకమాటలు, ఉపోద్ఘాతాలూ, వగైరా- కనీసం పరిచయ వాక్యాలయినా రాయగల సమర్థత నాకు లేదు. అయినా,  సాహసించి ఈ నవల గురించి నాలుగు మాటలు చెప్పదలచుకున్నాను.
ఇంతకు ముందు బ్రహ్మానందం రాసిన కథలు, వ్యాసాలు అన్నీ  చదివాను. అతనికి చక్కని కథావస్తువు ఎంపిక చేసుకోవటం తెలుసు. అంతేకాదు; చిక్కగా  కథ చెప్పటం కూడా తెలుసు. వాస్తవ జీవితంలో ఒకటో, రెండో సంఘటనలు  కథలకు పునాదులయితే, ఒక జీవితంలో ఒడిదుడుకులన్నీ స్పృశించిన రచన నవల అవుతుంది. సాంప్రదాయకంగా నవలలో చాలా పాత్రలు వస్తాయి. అయితే, అన్ని పాత్రలనీ సమానంగా పోషించడం అవసరమా కాదా అన్నది కథానేపథ్యం, భౌతిక పరిస్థితుల పై ఆధారపడుతుంది.
Gorti
అంతర్జ్వలన నేపథ్యం అమెరికా. పై చదువుల పేరుతో అమెరికాకి వలస కొచ్చి, ఇక్కడి జీవితంలోని ఒడిదుడుకులని తట్టుకొని, మరణానికి కూత వేటు దూరంలో ఉన్న ‘నందు’ తన జీవితకథ చెబుతున్నాడు. ఉత్తమ పురుషలో చెప్పిన కథ. బహుశా, ఇరవై సంవత్సరాల క్రితం అమెరికాకి  వలసకొచ్చిన వారి అనుభవాలు  కొన్ని ఈ నవలలో ప్రతిబింబిస్తాయి.  కాలపరిమితి పరంగా చూస్తే, ఈ నవల అమెరికా వలస జీవనవ్యవస్థకి  నిజమయిన  ప్రతిబింబం అని భావించకూడదు. కారణం; కథ జరిగిన కాలవ్యవధి చాలా పరిమితం కావటమేనని నా అభిప్రాయం.
నందు- మన కథానాయకుడు ఉపోద్ఘాతం ఇలా చెబుతాడు: ‘‘అందరినీ వదిలిపోతున్నానన్న బాధ; ఏదో సాధించాలన్న కోరిక, జీవితం వైపు ఎగ్నురుతున్న ఆశ, ఈ రెంటినీ విమానం అమెరికా చేర్చింది.’’ వలసకి పోతున్న ప్రతి ఒక్కరికీ ఇది సహజమైన అనుభవం. ఈ అనుభవానికి  కాలపరిమితి లేదు.
‘‘పూర్తి కాని నాస్వప్నం ఇలా అర్థంతరంగా ముగిసిపోతుందా?’’ అని చావు బ్రతుకుల మధ్య ఉన్న వాడి ఆవేదన ఈ నవలకి ఊపిరి. అయితే వెంటనే నైరాశ్యం వెన్నుతట్టి పలకరిస్తుంది.
‘‘ఏముంది? రేపు నేను పోతాను. ఇంట్లోవాళ్ళు కొంతకాలం ఏడుస్తారు. బంధువులు బాధపడతారు. స్నేహితులు పరామర్శిస్తారు. బ్రతికుండగా పైకి అనడానికి మనసొప్పకపోయినా, పోయిన తర్వాత నేనెంత మంచి వాణ్ణో అంటూ నా గుణగణాలని పెద్దవిచేసి పైకి గట్టిగా చెప్పుకుంటారు. నేనంటే గిట్టనివాళ్ళు దేముడు నాకు మంచి శాస్తి చేశాడని లోలోపల అనుకుంటూ వారిని వారు సంతృప్తి పరుచుకుంటారు.’’
ఈ నవలలో భాష సులువుగా ఉంది. నవలని ఒక్కబిగిన చదవటానికి అనువుగా ఉన్నది. ప్రతి పాత్ర  కథనానికి అవసరమయినా, పాఠకుడు, వెనక్కి వెళ్ళి, ‘ఇతనెవరు? ఈవిడ ఎక్కడ తటస్థించింది?’ అని వెదుకు లాడే అవసరంలేదు.
‘‘…నా ధ్యేయం ఒక్కటే! ఎలాగయినా డబ్బు సంపాదించాలి. ఇక్కడే స్థిరపడిపోవాలి. ఇండియా చచ్చినా వెళ్ళను…’’ వలస వచ్చిన కొత్తల్లో కొంతమంది సంభాషణల్లో తరచు దొర్లే మాటలివి. కాస్త నిలదొక్కు కున్నాక- ‘‘…ఉద్యోగ్నం వచ్చాక పిసినారితనం ఎక్కువయ్యింది. ప్రతీ డాలరూ నాకు లెక్కే! ఇంట్లో ఫోన్‌ ఉన్నా తరచు ఫోన్‌ చేసేవాణ్ణి కాదు. చేసినా ముక్తసరిగా మూడంటే మూడు మాటలు…’’ వంటి ఆలోచనా ధోరణిలో వచ్చే మార్పులూ చాలామందిలో చూస్తూనే ఉంటాం.
ఇంకా- ‘‘…మంచిపిల్లలాగానే వుంది. చచ్చేటంత డబ్బుంది. కానీ అమ్మకీ సంబంధం నచ్చుతుందో లేదో? వాళ్ళ కులం వేరు. ఆలోచిం చగా ఈ ప్రతిపాదనా బాగానే ఉందనిపిస్తోంది…’’ అన్నవీ వింటూనే ఉంటాం. డబ్బు కులాన్ని తోసి రాజంటుంది. అంతగా కాకపోతే కాదన డానికి కులం అడ్డు ఎలాగూ  ఉంది. ఆ నెపాన్ని నెట్టేయడానికి పెద్ద వాళ్ళు ఎలాగూ ఉంటారు. కొన్నివేల మైళ్ళు దాటొచ్చినా కులం నీడలు వెంటాడూనే ఉంటాయి.
పైన చెప్పిన మాటలు కొంతమందికి చురుక్కుమనిపించవచ్చు. భుజాలు తడుముకోవచ్చు. బ్రహ్మానందం ఉద్దేశ్యం అది కాదని చెప్పడానికి నేను ఏమాత్రమూ సందేహించను. ఎందుకంటే నవలలో ఒక పాత్ర తాలూకు ఆలోచన అది.
అవసాన దశలో ఉన్న వ్యక్తి, స్వీయకథ చెప్పుకునేటప్పుడు, తన ఒప్పులన్నీ ఏకబిగిని చెప్పుకుంటాడు, కానీ తన తప్పులన్నీ ఒప్పుకుంటాడా? అంటే నిజాయితీగా ఆత్మకథ చెప్పటం సాధ్యమేనా? ఆంతరంగిక విషయాలు అన్నీ పూసగుచ్చినట్టు, దాయకుండా ఎవరైనా చెప్పగలరా?  ఈ ప్రశ్నకి సమాధానం బ్రహ్మానందం తన అంతర్జ్వలన నవలలో సమర్థ వంతంగా నిర్వహించాడు. అందుకు అతన్ని అభినందించి తీరాలి.
Antarjwalana Cover
* * * 

 ఆకస్మిక అభివృద్ధి పై ఒక వెలుగు

చంద్ర కన్నెగంటి 
దశాబ్దాలుగా తెలుగ్నువారు మెరుగైన జీవితాలకై అమెరికాకు వలస వస్తూ ఉన్నారు. గత శతాబ్దపు ఆరూ ఏడూ దశకాల్లో వైద్యులు అధిక సంఖ్యలో తరలిరాగా చివరి దశకంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణుల వలస ఎక్కువ యింది. చదువుకొని, ఆ విద్యార్హతలతో ఇక్కడ ఉద్యోగ్నం సంపాదించుకునే విద్యార్థుల సంఖ్య మొదట్లో తక్కువగానే ఉన్నా క్రమేపీ అనేక రెట్లు పెరుగుతూ వస్తోంది. విద్యార్హతతో పని లేకుండా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం  సంపాదించడానికి ఇప్పుడది డొంక తిరుడుగుడు దారిగానూ, అడ్డదారి గానూ పరిణమిస్తోంది. తెలుగువారి దృష్టి ఉద్యోగాల మీద నుంచి వ్యాపారాలకు విస్తరిస్తూ ఉంది.
తొలినాళ్లలో ప్రవాస జీవితంలో వీరు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఇక్కడి తిండికీ, సంస్కృతికీ అలవాటుపడడంలో తోవచూపే ముందు తరం వాళ్లు లేనప్పుడు ఎట్లా కుదురుకోగలిగారు? అప్పటి కాలపు వర్ణవివక్ష స్పష్టంగా కనిపించేదా? వీటికీ, ఇటువంటి ప్రశ్నలకి జవాబులూ, వారి అనుభవాలూ మనకు తెలిసే దారిలేదు. ఒక దారీ, తెన్నూ దొరికాక, కొంచెం వేళ్లు నిలదొక్కుకున్నాక అప్పుడు తమ సమస్యలు కథలుగా చెప్పుకోవడం మొదలెట్టారు. కథలు కనక వారి జీవితాలపై అవి ప్రసరించే వెలుతురు పరిమితంగానే ఉంటుంది.
ఇన్నేళ్లుగా క్రమంగా కలుగుతున్న  మార్పులూ, ఇక్కడి తెలుగుజాతి ప్రస్థానమూ చరిత్రగా నమోదు కావాలంటే నవల వల్లో, జీవిత చరిత్ర వల్లో తప్ప సాధ్యం కాదు. ఒకటో రెండో నవలలూ, జీవిత చరిత్రలూ రాకపోలేదు. అయితే ఎక్కువమంది ఇక్కడికి చేరుకున్న రోజులనీ, విద్యార్థి జీవితాన్నీ, సాఫ్ట్‌వేర్‌ రంగంలో పెనుమార్పుల వల్ల కొంతమంది జీవితాల్లో కలిగిన ఆకస్మిక అభివృద్ధినీ పట్టుకున్న నవలలు లేవు. మిత్రుడు గొర్తి బ్రహ్మానందం రాసిన ఈ అంతర్జ్వలన నవల ఆ పని చేస్తుంది.
మృత్యుముఖంలోని మనిషి తలపోత ఇది. విద్యార్థిగా ఈ దేశంలో అడుగు పెట్టి స్నేహితుల, ఇక్కడి తెలుగు  కుటుంబాల సాయంతో ప్రవాస జీవితంలో ఇముడుతూ, అవకాశాల్ని అంది పుచ్చుకుని పైస్థాయికి  చేరుకున్న వ్యక్తి జీవితంలోని ముఖ్యభాగాలు ఇవి. నవల నేపథ్యం చరిత్రగా కళ్లకు కడుతుంది. ఆ కాలంలో ఇక్కడ అడుగుపెట్టిన వాళ్లను గడచిన దినాల నెమరువేతలో పడవేస్తుంది.
చేయి తిరిగిన రచయిత కనుక వాక్యం సరళంగా ఉండి సాఫీగా నడుస్తూ ఆసక్తిగా చదివిస్తుంది. అతిసాధారణమూ కాని, అసాధారణమూ కాని సంఘటనలు సహజమే అనిపిస్తాయి. మానవ సహజమైన బలహీనత లను ఎత్తి చూపుతూ చివరి ఘట్టం పాఠకుడి దృక్కోణం మారుస్తుంది.
ఈ నవల మరిన్ని నవలలను ఇక్కడి రచయితలచే రాయిస్తుందనీ, ఇక్కడి జీవితాల అన్ని కోణాల్నీ తడుముతూ మరింత విస్తృతమైన కాన్వాస్‌తో నవలలు వస్తాయనీ ఆశిద్దాం.
*

కంచికి వెళ్ళని కథలు…ఎప్పుడొస్తాయి?!

 

 చంద్ర కన్నెగంటి

 

chandraప్రపంచ కథలు చదివేవాళ్లకు తెలుగు కథలు చదివేప్పుడు రెండు విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి –  వస్తువులో కొత్తదనం అరుదనీ, దాదాపు అన్ని కథనరీతులూ కొన్ని మూసలకే పరిమితమనీ. ఇందుకు ఎక్కువ శాతం రచయితలూ, సంపాదకులూ, విమర్శకులూ, పాఠకులూ అలవాటు పడిపోయారు కూడా. పడటమే కాక అదే ధోరణి అవిచ్ఛిన్నంగా సాగడానికి దోహదపడుతున్నారు. అందుకు కారణాలు వెతకడమూ, వాటి వెనక ఆలోచనలు సరయినవేనా అని పరిశీలించడమూ ఇక్కడ నా ముఖ్యోద్దేశాలు.

ప్రాచీనకాలంనుంచీ ధర్మాన్నీ, నీతినీ బోధించే కథల వారసత్వం మనది. మరోవైపు బలమైన మౌఖిక సంప్రదాయం కూడా ఉంది. అందువల్ల ఆ కథలు బిగ్గరగా, స్పష్టంగా ఉంటాయి. సమాధానం వెతుక్కోవలసిన ప్రశ్నలూ తలెత్తనీయవు. సందేహాలకు తావునీయకుండా ఆ కథలోని ధర్మాన్నీ, నీతినీ చివరికి నొక్కి చెప్పేవి. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. కథ చదవగానే పాఠకుడు ‘అయితే ఏమిటి?’, ‘ఇందలి నీతి యేమి?’ అనే వెతుక్కుంటాడు. ‘రాకుమారిని పెళ్ళి చేసుకుని రాజ్యాన్ని అనేక యేళ్ళు సుభిక్షంగా పరిపాలించాడు ‘ వంటి కచ్చితమైన ముగింపులు లేని అస్పష్టతలు అంగీకరించలేడు.

రచయితలూ అదే ఒరవడిలో సాగుతున్నారు. రచయిత కర్తవ్యం సమాజాన్నీ, దేశాన్నీ ఉద్ధరించడమేనని ముందే నిర్ణయించబడింది. అభినందించవలసిన భావనే. అయితే ఆ భారాన్ని ఆనందంగా తలకూ, భుజాలకూ ఎత్తుకోవడంతోటే తన చుట్టుపక్కలవారి కన్నా తాను నైతికంగా, ధార్మికంగా, బౌద్ధికంగా ఒక మెట్టు పైన ఉన్న భావన కూడా రచయితలో బలపడుతుంది. తాను పూనుకోకపోతే లోకం సరయిన బాటలో నడవదన్న నిశ్చయానికి వచ్చేస్తాడు. పాఠకులంతా అయితే అమాయకుల్లానూ – వాళ్లకు దారి చూపించాలి – లేదంటే దుర్మార్గుల్లానూ – వాళ్లకు బుద్ధి చెప్పాలి –  కనిపిస్తారు. దానికోసమై రచయిత పలు అవతారాలు ఎత్తవలసివస్తుంది. ధర్మజ్ఞుడూ, నీతిబోధకుడూ, మతాధికారీ, న్యాయాధికారీ, వేదాంతీ, ఆర్థిక నిపుణుడూ, రాజకీయవేత్తా, సామాజిక శాస్త్రవేత్తా, మనోవైజ్ఞానికుడూ, సాంస్కృతికాధికారీ మొదలయిన వాళ్లు చేసే పనులూ, చూపించే పరిష్కారాలూ చేసేసి ఊరుకుంటాడు. ఆయా రంగాల్లో తన అర్హత ఏమిటన్నది ప్రశ్నించుకోడు. ఎంత నిజాయితీగా, నమ్మకంతో చేసినా తనకు అలివికాని పని నెత్తిన వేసుకున్నప్పుడు అది నిష్ప్రయోజనం.

సమాజాన్ని పీడించే సమస్యలు అనేకం. కథ అనే సుత్తి చేతిలోకి తీసుకున్నాక ఆ మేకుల కోసమే వెదుకులాట.  కొత్తవేమీ దొరకవు. వాటిని వెలుగులోకి తెచ్చి చర్చకు పెట్టడంతో ఆగిపోకుండా పరిష్కారాలూ సూచించాలంటే అందుకు క్షేత్రస్థాయిలో కృషి చేసే వాళ్ళూ, ఆయా శాస్త్రాల్లో నిపుణులూ అయి ఉండాలన్న గమనింపు ఉండదు. ఇవన్నీ తన ఆక్రోశాన్ని వెళ్లబోసుకుని తృప్తి పడడానికి తప్ప ఉపయోగపడవు. ఒక రకంగా తన అపరాధభావన కడిగేసుకుని, మనిషిగా తన బాధ్యత తీరిపోయిందనుకుని మరేదీ చేయవలసిన అవసరం లేదని నచ్చచెప్పుకున్నట్టు ఉంటుంది. ఇద్దరు తోటి ప్రయాణికులు ‘ఎంత దారుణమమ్మా!’ అంటే ‘లోకం పాడయిపోయందమ్మా!’ అని వాపోవడం కంటే ఇందులో పెద్ద తేడా ఏదీ ఉండదు.

పోనీ, ఆ కథలు విలువయిన, నేర్చుకోవలసిన జీవిత పాఠాలే చెపుతున్నాయనుకుందాం. కాల్పనిక సాహిత్యం చదవడం వల్ల మనుషుల్లో సానుభూతీ, ఎదుటివారి స్థితిగతులను అర్థం చేసుకునే స్థాయీ పెరుగుతాయనే పరిశోధనలు తేలుస్తున్నాయి. అయితే అది తాత్కాలికం కాదనీ, ఆ ఆలోచన క్రియారూపం దాలుస్తుందనీ చెప్పడానికి ఆధారాలు లేవు. అసలు ముందే ఎక్కువ మోతాదులో స్పందించేవారే పుస్తకాలు చదివి ఆనందిస్తారనే విషయాన్నీ కొట్టిపారేయలేం. కథలూ, పుస్తకాలూ మనల్ని ఉన్నతులుగా చేస్తాయనీ, ఉదాత్తంగా మారుస్తాయనీ గుడ్డిగా నమ్మడమే కానీ స్పష్టమైన ఆధారాలు చూపలేం.

అటు ధర్మ సంస్థాపనో, ఇటు సమసమాజమో తన రాతల ద్వారా సిద్ధిస్తుందనుకోవడం ఒక భ్రమ. ఎంతగా నమ్మినప్పటికీ, అదెంత సరి అయిన ఆలోచన అయినా, ఎంతగా అభిలషించినా అది నిజం కాదు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి – ‘ఈ కథలూ పుస్తకాలూ చదవకపోతే మరోలా ప్రవర్తించి ఉండేవాడిని ‘, ‘నా నిర్ణయం వేరేలా ఉండేది ‘ అనుకున్న సందర్భాలు గుర్తున్నాయా? ‘నాలో ఇంత సహనమూ, సంయమనమూ, పరిణితీ, దయా, జాలీ, క్షమా, త్యాగబుద్ధీ పుస్తకాలు చదవకపోతే ఉండేవి కావు ‘ అని ఎప్పుడయినా అనుకున్నారా? వ్యక్తిగతంగా ఎంత ఎదిగారు అన్నది కాక సమాజం దృష్టిలో మెరుగయిన వ్యక్తిగా మారారనిపించిందా? సమాజ సేవ చేస్తున్న వాళ్లంతా పుస్తకాలు చదివి చేయడం లేదు. హిట్లర్ తెగ చదివేవాడనీ, అతని గ్రంథాలయంలో పదహారు వేల పై చిలుకు పుస్తకాలుండేయనీ తెలుస్తూంది. పాఠకుల సంగతి అటుంచి తమ రాతలు రచయితలనయినా మారుస్తున్నాయనిపించదు. అందుకు ఇంటర్నెట్ సాహితీవేదికలపై చర్చల ధోరణినే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. (కలిసొస్తే కింద కామెంట్లలోనూ ఆ ధోరణి కనిపించకపోదు.)

పోనీ, ఆ కథలు నిజంగానే పాఠకుల్లో మార్పు సాధిస్తాయనే అనుకుందాం. తొమ్మిది కోట్ల తెలుగువారిలో ఇవి చదివే వారి సంఖ్య కొన్ని వేలకు మించదు. ఆ చదివేవారిలో అది చదివేప్పటికే ఆ కథ ఉద్దేశించిన చైతన్యం కలగి ఉండని వారెంతమంది? ఒక్క మనసునో, ఒక్క జీవితాన్నో మార్చినా చాలదా అనుకోవచ్చు కానీ, అప్పుడీ రచనావ్యాసంగమంతా చాలా అసమర్థమైనదనీ, ఇంతకంటే ఫలప్రదమయిన దారులు ఉన్నాయనీ గ్రహించవలసి ఉంటుంది.

ఈ మార్చడం మీదే దృష్టంతా కేంద్రీకరించడంతో, కథ ఒక కళారూపమన్న విషయం మరుగున పడి పనిముట్టుగానే మిగిలిపోయింది. కష్టాన్నీ, బాధనూ ఎత్తిచూపడం మంచి కథకు కొలమానంగా మారింది. అది ముందెన్నడూ ఎరగనిదయితే  మరీ మంచిదిగా భావించబడుతుంది. స్పందించే హృదయాలు సానుభూతి చూపక తప్పదు కానీ కథ అందుకే పరిమితమవుతూంది. కథను కథగా నిలిపే మిగతా అంశాలేవీ గమనించే, ఆస్వాదించే వీలు రచయితలూ, పాఠకులూ కల్పించుకోలేకుండా ఉన్నారు.

పాఠకులంతా ఒకే స్థాయిలో ఉండరు. వారి పఠనావసరాలు ఒకేలా ఉండవు. ఎవరూ ఒకేలాంటి సాహిత్యం పదేపదే చదవరు. వైవిధ్యం కావాలి. రచయిత బాధ్యత ఒకటే – కథ రాయడం. కష్టాలూ, బాధల గురించి రాసినా కొత్తవాటి గురించి రాయాలి, లేదా కొత్తగా రాయాలి. కనీసం ఇంతకుముందుకంటే బలంగా రాయాలి. సమాజానికి దిశానిర్దేశం చేయడమొక్కటే ధ్యేయమనుకోరాదు. తెలుగు కథ స్పృశించని జీవితకోణాలు శోధించాలి, అనుభూతులకు అక్షరరూపమివ్వగలగాలి. కల్పనా చాతుర్యమూ, ఊహా నైపుణ్యమూ చూపాలి. పాఠకుడికీ కథలో జాగా ఇవ్వాలి. మరింతమందిని చదివించాలి.

(హ్యూస్టన్ లో గత ఏడాది అక్టోబర్ లో వంగూరి ఫౌండేషన్ జరిపిన అమెరికా కథ స్వర్ణోత్సవాలు & 9 అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చదివిన ప్రసంగ సారానికి కొన్ని చేర్పులతో)

*