నాలుగు దిక్కులు

 

 ganga
-గంగాధర్ వీర్ల
~
నడక సాఫీగా సాగినంత మాత్రాన
దిక్కులు తెలిసిపోయినట్టేనా?
సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కనుక
ఆ కనిపించే వెలుగే తూర్పు దిక్కుకావొచ్చేమో?!
మరి ఉత్తర దక్షిణ దిక్కుల్ని ఎలా కనిపెట్టాలి?
000
చేతికి కుడివైపునో..
ఎడమవైపునో దిక్కులుంటాయట
అయినా..దిక్కుల గురించి తెలియడంవల్ల ఏం లాభం?
గమ్యం కనపడేదాకా..
ఇంకా ఇంకా నడవాల్సిందేగా..
నాలో నేను నడవాలి
నడుస్తూనే వెదకాలి
జీవితంలో తెలియందేదో తెలుసుకోవాలి
000
ఆలోచనల ముద్రను దాటుకుంటూ
నడక సాగుతూనే ఉంది.
దారికి అడ్డుకట్ట వేయాలనో ఏమో..
చుట్టూ ఏవేవో కమ్ముకుంటున్నాయి
దారితెలియనంతగా చిమ్మచీకట్లు..
ఆకాశాన్నికమ్మేసినట్టుగా
మీదకు వాలిపోతున్నదట్టమైన చెట్లు
దారంతా ముళ్ళకంపలు
కానీ నడవాలి.. నడక సాగాలి
కాళ్ళకు గుచ్చుకుంటున్న ముళ్ళను
తడిమి తడిమి.. అదిమిపెడితేనే
ధైర్యంగా నాలుగు అడుగులు పడేది
000
గమ్యానికి బాటచూపే
దిక్కులు ఎక్కడోలేవు
నాలోనే ఉన్నాయి
పక్కపక్కనే కుడిఎడమగా ఉంటూ..
నాపై ప్రేమను కురిపిస్తున్నాయి
వెనకాముందు నడిచొస్తూ
కరచాలనం చేస్తున్నాయి
దిక్కులు ఎక్కడో లేవు
నాలోనే ఉన్నాయి
*