Archives for July 2015

దేహాలు –దేవాలయాలు – కొన్ని సందేహాలు

కొండేపూడి నిర్మల 

 

nirmalaమధ్యప్రదేశ్ లో ఏడేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదన్ లాల్, కోర్టులో శిక్ష ఖరారయన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులతో రాజీ పడ్డాడు. దీ౦తో నిందితునికి విధించిన ఏడాది జైలు శిక్ష సరిపోతుందంటూ హైకోర్టు  అతని విడుదలకు ఆదేశించీంది. ( నేరస్తుల పట్ల కోర్టులు ఎంత సహోదర ప్రేమతో వుంటాయో మనకి తెలుసు.). దీనిపై  మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి౦ది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు  మాత్రం అత్యాచార కేసుల్లో రాజీ ఒప్పందాలు చెల్లవని, మెతక వైఖరిని ప్రదర్శించడం,  నిందితులను రాజీకి అనుమతించడ౦ తీవ్రమైన తప్పిదమని అది మహిళల ఆత్మగౌరవాన్ని కీంచపరఛడమే అని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

ఇంతవరకు బానేవుంది.. మధ్యప్రదేశ్ హైకోర్టు కంటే మన సుప్రీకోర్టు కొ౦చెం విచక్షణతో వ్యవహరించింది  అని సంతృప్తి కూడా కలిగింది.

ఎందుకంటే అవిచ్చినంగా నడుస్తున్న కాఫ్ పంచాయితీల దగ్గర నుంచి సుప్రీ౦కోర్టు దాకా అత్యాచార బాధితురాల్ని, ఆ నేరం  చేసినవడు లగ్గం చేసుకు౦టే  న్యాయం జరుగిపోయినట్టే భావిస్తాయి.  . “గృహ ప్రవేశం”  సినిమా ఇదే కధా వస్తువుతో  350 రోజులు ఆడింది. కర్తవ్యం లో ఒక పోలీసు ఆఫీసరు  దగ్గరుండి బాధితురాలికి నేరస్థుడితో పెళ్లి జరిపిస్తుంది. చివరికి ఆ పెళ్ళిలో కూడా నేరస్థుడూ అతని తండ్రీ కలిసి  బాధితురాలిపై హత్యా ప్రయత్నం చేస్తారు . అయినా ఆ ప్రయత్నాన్ని  ఆ పోలీసు ఆఫీసరు తెలుసుకుని కాపాడి “ కలకాల౦ కలిసి వుండ “ మని ఆశీర్వదిస్తు౦ది. ఇలాంటివన్నీ  జనం కళ్ళకి అసహజంగా కాకుండా ఆనందబాష్పాలతో తిలకించేలా చెయ్యడానికి ఒక భావజాల౦ వుంది . మధ్యయుగాలకు చెందినట్టు కనిపించే ఈ భావజాలాన్ని చదువూ వివేకం , సాంకేతిక పరిజ్ణానమ్ ఏవీ మార్చలేవు.  అందుకు ఒక  చిన్న ఉదాహరణగా   పై కేసులో సంచలనాత్మక తీర్పు ఇచ్చిన న్యాయాకోవిదులు    అత్యాచారాల గురి౦చి  ఇచ్చిన నిర్వచనాన్ని చెప్పుకోవచ్చు. ఏమిటా నిర్వచనం ;

“ఆత్యాచారానికి పాల్పడటం  అంటే దేహాన్ని దేవాలయంగా భావించే మహిళపై దాడి చేయడమే . దానివల్ల అత్యాచార బాధితులు మాన మర్యాదలు కోల్పోతారు. అది వారి ప్రాణాలను హరించడంతో  సమానం. ‘

తీర్పు  హేతు బద్ధంగానూ ,  నిర్వచనం దానికి భిన్నంగా వుండటానికి వెనకగల కారణ౦ నాకు చాలా  ఆసక్తి కలిగించింది.  పై మాటలు  స్త్రీలందరి దేహ దేవాలయాల శీలా సంపదల  గురించి న్యాయమూర్తులూంగారు   అంటున్నప్పటీకీ సందర్భం మాత్రం ఏడేళ్ళ పాప గురించే.  అదృష్టవశాత్తూ అంత లావు భావజాల౦ ఆ పాప కెలాగూ అర్ధాంకాదు.

ఆ మాటకొస్తే తన శరీర నిర్మాణమేమిటో , ఎవడు ఎందుకు  దాడిచేశాడో,  అసలు ఏం జరిగిందో తెలుసుకునే౦త వయసుకూడా లేదు. తెల్సిందల్లా  భయానకమైన దాడి, గాయాలు, రక్తస్రావం. మానసికంగా ఒక దిగ్భ్రాంతి. ఇలాంటప్పుడు తక్షణమే వైద్యం జరగాలి. వైద్యమ౦టే  ఆస్పత్రిలో వుంచి కట్టుకట్టడం మాత్రమే కాదు.  ఏ పరిసరాలు, సంఘటనలు, మనుషులు ఆమెని అంత భీతావహురాల్ని  చేశాయో దానికి దూరంగా వుంచడం , .కుటుంబం ,సమాజం ఆమె పట్ల సానుభూతి  కాకుండా సహానుభూతి కలిగివుండటం, . క్రమక్రమంగా ఆమె మనసుని  చదువు వైపు , ఆటలపాటలవైపు, ఆమె కిష్టమయిన మరో వ్యాపక౦ వైపు మళ్ళీంచడం- ఇవి కదా  జరగాలి.. వీటివల్ల మాత్రమే బాధితురాలు కోలుకోవడానికి అవకాశం వుంది. అదే సమయంలో  నేరస్థుడికి చట్టబద్ధంగా  విచారణ, రిమాండ్ , శిక్ష ఇలాంటి లాంటివన్నీ జరగాలి.

అంటే అటు ఆ పాపకి జరిగిన అన్యాయానికి, ఇటు నేరస్థుడి చర్యకీ చట్టం  బాధ్యత వహించాలి.  కానీ  వాస్తవంలో ఏం జరుగుతోంది? ఆ  నేరస్థుడ్ని తెచ్చి బాధితురాలితో పెళ్ళి చెయ్యడం జరుగుతోంది.  దీనివల్ల ఒకసారి అత్యాచారం చేసినవాడికి జీవితాంతమూ అత్యాచారం చెయ్యడానికి బోనస్ లాంటిది  దొరుకడంలేదూ| తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి పోరాట౦ చేయాల్సిన బాధిత కుటుంబానికి  నేరస్థుడే మీసాలు తిప్పుతూ అల్లుడవుతాడు. ఎటువంటి శిక్షా, పరివర్తనా లేకుండా అటువంటి నేర ప్రవృత్తి గలవాడిని  ఇంటిలో పెట్టుకోవడం వల్ల ఆ కుటుంబంలో  ఇతర బాలికలకు , స్త్రీలకు రక్షణ కరువయ్యే ప్రమాదం లేకపోలేదు.. బాధితురాలు సైతం తన ప్రాధమిక , మానవ హక్కులమీద దాడిచేసినవాడ్ని జైలుకి పంపడానికి బదులు ప్రేమిస్తూ, సేవలు చేస్తూ , వారసుల్ని కనివ్వాలి. ఇంత రోతను భరించినా సరే ఆమె ప్రాణానికి రక్షణ వుందో లేదో తెలీదు. అప్పుడు గృహహింస బాధితురాలి చిట్టాలో ఆమే పేరు నమోదవుతుంది.  ఇన్ని చట్ట విరుద్ధ , అప్రజాస్వామ్య , పౌరుష హీన చర్యలన్నిటికీ సదరు  స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధతో అల్లిన భావజాలమే కారణం.

ప్రస్తావన కోసం మళ్ళీ నిర్వచనాన్ని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం

స్త్రీలు  తమ శరీరాల్ని దేవాలయాలుగా భావిస్తారని సామాజం భావిస్తుందిట..  ముస్లిం స్త్రీలయితే మసీదులుగా , క్రైస్తవ స్త్రీలయితే చర్చీలుగా భావించుకోవచ్చు. పోనీ కాస్సేపు నిరర్ధకమయిన ఈ పోలికతోనే ఆలోచిద్దాం. మామూలుగా దేవాలయాల్లో  ఒక పశువు బురదకాళ్లతో అడుగుపెడితే ( రేపిస్టుని నోరులేని పశువుతో పోల్చడం  నా కీష్టంలేదు ) ఏం చేస్తారు? అప్పుడు ఆ ప్రాంతమంతా శుద్ధి చేసి సంప్రోక్షం చేస్తారు. దాంతో పవిత్రత తన్నుకుంటూ వచ్చి తీరుతుంది.. కానీ స్త్రీల విషయంలో ఒకసారి పోయిన పవిత్రత మళ్ళీ రాదు. కాబట్టి ఎవడైతే నేరం చేశాడో వాడే ఆమెని చేపట్టాలి.  అలా చేపట్టేలోపు ఆమే  మాన మర్యాదలు ప్లస్ ప్రాణం కూడా పోయినట్టే భావించుకోవాలి. ఎవదైనా చేపట్టీన తర్వాత అలా భావించనవసరంలేదు.  తాళి కట్టీన తుచ్చుడే రక రకాలుగా భావిస్తాడు కనక. 

అయ్యా | బాబూ | మేము మీ సాటి మానవుల౦, మీరు ఆపాదిస్తున్న  దైవత్వాలూ, పవిత్రతలూ వద్దే వద్దు. రాజ్యాంగం మాకు ప్రసాదించిన   హక్కుల మీద ఎవరేనా దాడి చేసినప్పుడు సకాల౦లో  స్పందించండి, చాలు-  అని మహిళలు ఎప్పటినుంచో తల బాదుకుంటున్నారు. అది మాత్రం జరగడంలేదు.

*

 

ఆ ఊహే నిజమైతే…బాహుబలి!

మోహన్ రావిపాటి 

 

పెరట్లో నులక మంచం పడుకొని  మీద నాన్న చెప్పే రాజకుమారుడి కథ వింటూ , చుక్కలు చూస్తూ , ఆ చుక్కలు దాటుకుంటూ మనం నిర్మించుకున్న ఊహాలోకం లో పాత్రలన్నీ ఒక్కసారి  కళ్ళముదు మెదిలితే తట్టుకోగలమా !!

“అనగనగా రాజుగారు, ఆ రాజు గారి మీద ఆయన తమ్ముడి కుట్ర, రాజుగారికి కి పుట్టిన బిడ్డ ను అడవిలో వదిలేస్తే. ఒక పేదరాసి పెద్దమ్మ, ఆ బిడ్డడ్ని పెంచి పెద్ద చేస్తే, ఆ బిడ్డ పెరిగి ప్రజా కంటక పరిపాలన చేస్తున్న బాబాయి తో యుద్దం చేసి   చంపి ప్రజలందరికి సమ్మకమైన పరిపాలన ఇవ్వటం “ ఎంత చిన్న కథ ?? కానీ నాన్న ఇలా చెప్పాడా !! లేదే !!

ఆ రాజ్య సౌందర్యం, అక్కడి ఉద్యానవనాలు, రాజభవనాలు, హంసతూలికా తల్పాలు, , వింజామర వీచికలు,ఒక్కటా….. రెండా !! నాన్న చెప్తుంటే ఆ రాజ్యం నా కళ్ళముందు నేను నిర్మించుకున్న ఊహాలోకంలో మొత్తం కనిపించేది, కానీ దాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా నిజ జీవితంలో  చూడగలనా ! నా ఊహలన్నిటికీ ప్రాణం పోసి నా కళ్ళ ముందు కనిపిస్తుంటే అందులో నేను ఇప్పుడు ఏ భవనం ముందు నుంచోవాలి ?? ఏ ఉద్యానవన విహారం చెయ్యాలి??

దట్టమైన అడవిలో అటు ఇటు పరుగెడుతున్న లేళ్ళు, జింకలు, పురివిప్పు ఆడుతున్న నెమళ్ళు. సెలయేళ్ళు  అంతెత్తు  నుండి కిందకు దూకుతున్న జలపాతాలు,  ఆకాశాన్ని అంటుతున్న కొండలు,  వీటిలో నేను నిజంగా ప్రవేశించినప్పుడు నేను ఏ చెట్టు కింద ఆగుతాను, ఏ సెలయేట్లో స్నానం చేస్తాను ?? ఏ జలపాతం కింద నిలువెల్లా తడుస్తాను ??

రాకుమారుడు కత్తి దూసి పోరాడుతుంటే ఆ అగ్గిరవ్వలకు   గడ్డ కట్టిన హిమనగవులు కరిగి  నేలకు జారుతుంటే నేనక్కడ ఉండగలనా ?? ,పొగరు బట్టిన  అడవి దున్న ను  ఒక్క చేత్తో నిలవరించగల చేవ , తెగువ ఉన్న యువరాజు దాని కొమ్ములు వంచి నేల మీద పడేస్తే రేగిన దుమ్ము నా కంట్లో పడినప్పుడు , నేను నిజంగా కళ్ళు ముయ్యగలనా !!  మదించిన ఏనుగు కుంభస్థలం మీద ఒక్క మోదు మోది దాన్ని నేలకూల్చిన్నప్పుడు నా కళ్ళముందు అంత పెద్ద ఏనుగు ప్రాణాలోదిలేసినప్పుడు, నేనక్కడ నిజంగా ఉండగలనా ??

యుద్ద తంత్రాలను అన్నీ ఔపాసొన పట్టి , యుద్ద యంత్రాల సహాయంతో శత్రువుల మధ్య అగ్నిగోళాలు తో మంటలు మండిస్తుంటే శత్రువుల హాహాకారాలు నా చెవుల్లో వినిపిస్తుంటే , నా నోటి నుండి జయ జయ ధ్వానాలు నిలవిరించుకోవటం నాకు సాధ్యమా !! ఎప్పుడూ ఎవ్వరూ కనీ వినీ ఎరుగని యుద్దవ్యూహాలను అమలు పరచి శత్రువు ను తుదముట్టించే అవకాశం వచ్చి కూడా, తన ప్రజల రక్షించటం కోసం ఒక్క క్షణం ఆగి , మరు క్షణంలో వ్యూహాన్ని మార్చి శత్రువును చంపేసిన రాజకుమారుడు నా కళ్ళముందు నడుస్తుంటే నా రోమాలు నిక్కబొడుచుకోకుండా ఆపటం నాకు సాధ్యమా ??

ఇవన్నీ ఊహాలోకంలో నాన్న చెప్పిన కథ కాదు, నా కళ్ళముందు రాజమౌళి సృష్టించిన ఒక లోకం, ఆయన సృష్టించిన మాహిష్మతి రాజ్యం, దాని చుట్టూ అల్లుకున్న కథ, చందమామ కథ చదవటం చాలా తేలిక, ఆ కథ ను మన ఊహాలోకంలో సృష్టించుకోవటం కూడా తేలికే . కానీ ఆ సృష్టి ని నిజం చెయ్యాలంటే అది రాజమౌళి కే చెల్లింది . భారతీయ సినిమా చరిత్రలో ఇదో ప్రత్యేకమైన సినిమా . ఈ సినిమా విడుదల కు ముందు మూడు రోజులనుండి ఇండియా లో ఏ ఇద్దరు కలిసినా ఈ సినిమా గురించే మాట్లాడుకున్నారు . అంత క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా నిజంగా ఒక అధ్బుతమే .

మాహిష్మతి రాజమాత అయిన శివగామి (రమ్యకృష్ణ) ఒక చిన్న బిడ్డని రక్షించి ఒక గిరిజన తెగకు చెందిన వారికి ఇస్తుంది , అక్కడ పెరిగి పెద్ద అయిన శివుడు (ప్రభాస్ ) ఆ అడవిలో గూడెం పక్కన ఉన్న ఎక్కడో ఆకాశం నుండి పడుతున్నట్లు ఉరికే జలపాతం కేసి చూస్తూ ఆ కొండను ఎక్కాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు . ఒకరోజు ఆ జలపాతం పై నుండి ఒక మాస్క్ ఒకటి కింద పడుతుంది దానితో పైన ఎవరో ఉన్నారు అని నిర్దారించుకొని కష్టపడి ఆ కొండ ఎక్కి అక్కడ అవంతిక (తమన్నా) ని కలుస్తాడు,  తమన్నా కొంత మంది అనుచరులతో కలిసి మాహిష్మతి రాజ్యంలో బందీ గా ఉన్న దేవసేన (అనుష్కా) ను రక్షించాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది, ఆమె ఆశయ సాధన కోసం శివుడు బయల్దేరి మాహిష్మతి రాజ్యానికి వెళ్తాడు

మాహిష్మతి రాజ్యానికి అధిపతి అయిన భల్లలదేవ (దగ్గుబాటి రానా)  చేతిలో బందీగా ఉన్న దేవసేన ను విడిపించుకొనే ప్రయత్నంలో యువరాజు ( అడవి శేష్ ) ను చంపేస్తాడు శివుడు . అదే క్రమంలో శివుడు కట్టప్ప ( సత్యరాజ్ ) కూడా తలపడబోతాడు, కానీ శివుడిని చూసిన కట్టప్ప “బాహుబలి “ అని సంభోధించటంతో ఆగిపోతాడు, .మాహిష్మతి రాజ్య ప్రజలందరూ బాహుబలి ని దేవుడిలా ఎందుకు కొలుస్తారు ?? అసలు ఆ బాహుబలి ఎవరు ?? అన్నది శివుడికి వివరిస్తాడు కట్టప్ప

ఇది సాధారణ కథే , కానీ దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అమోఘం, ప్రతి ఫ్రేమ్ అధ్బుతంగా ఉంటుంది, తెరపై సినిమా లా కాకుండా మన కళ్ళముందు జరుగుతున్నట్లు ఉంటుంది . ముఖ్యంగా ఆ జలపాత దృశ్యాలు, రాజ సౌధాలు, యుద్ద దృశాలు ఇంతకు ముందు ఎప్పుడు ఏ ఇండియన్ సినిమాలోనూ చూసి ఉండము, హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి, . ఇలా విజువల్స్ తో  మనల్ని రెండున్నరగంటల పాటు కట్టిపడేస్తుంది

నటీనటుల గురించి చెప్పాలంటే, ముందుగా చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ గురించి, రాజమాత గా ఆమె కళ్ళతో నటించిన తీరు అధ్బుతం, ముఖ్యంగా రాజద్రోహి ని ఒక్కవేటుతో చంపిన వెంటనే కనీసం షాట్ కట్ కాకుండా బిడ్డను లాలించిన సమయంలో ఆ రెండు విరుద్దమైన భావాలను ఒకేసారి పండించిన తీరు చూస్తే నిజంగా ఆమె ఎంత గొప్ప నటో మనకు అర్దం అవుతుంది, ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సత్యరాజ్ గురించి, రాజు మీద ద్వేషం, రాజ సింహాసనం మీద గౌరవం, అటు ద్వేషాన్ని , ఇటు గౌరవాన్ని రెండిటినీ ఒకరి మీదే చూపించే పాత్ర. అందులో సత్య రాజ్ నటన అధ్బుతం, ఆ తర్వాత రానా, కళ్ళతోనే క్రూరత్వాన్ని చూపించాడు, ఇక ప్రభాస్ అటు శివుడిగా, ఇటు బాహుబలి గా రెండిటి మధ్య వేరియేషన్ స్పష్టంగా చూపగలిగాడు, కాకపోతే వాచకం ఇంకొంచెం గంభీరంగా ఉంటే బాగుండేది,ముఖ్యంగా బాహుబలి పాత్ర కు సరిపడా వాచకం ప్రబాస్ గొంతు కు లేకపోవటం కొంచెం నిరుత్సాహ పరిచేదే . నాజర్ కు ఇలాంటి పాత్రలు కొత్త కాదు, తనకు అలవాటు అయిన పాత్రను తేలిగ్గా నడిపించేశాడు, ఇక అనూష్కా, మొదటి భాగంలో అనుష్కా కి నటించటానికి పెద్ద స్కోప్ లేదు, ఆమె కనిపించేదే ఒక 10 నిమిషాలు, ఉన్నది మూడు డైలాగ్స్,ఇక తమన్నా విషయానికి వస్తే , తమన్నా బాగా నటించలేదు అని చెప్పలేము కానీ, మిగతా వారి నటన ముందు కొంచెం తేలిపోయింది, ముఖ్యంగా కత్తి యుద్దం చేస్తున్నపుడు, ఆ ఆగ్రహం, కోపం కళ్ళలో కనిపించలేదు, దానికి తోడు పర్సనాలిటి కూడా గ్లామర్ హీరోయిన్ కి సరిపోయేదే కానీ ఇలా ఒక వారియర్ కి పనికి వచ్చే పర్సనాలిటీ కాకపోవటం కూడా ఒక కారణం.

ఇక సాంకేతిక విషయాలకు వస్తే ఇది ఖచ్చితంగా హాలివుడ్ లో వార్ సినిమాలతో పోల్చాలి, సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ ఒక వండర్ క్రియేట్ చేశాడు, కళా దర్శకుడిగా శిబూసిరిల్  ఒక అందమైన లోకాన్ని సృష్టించాడు, కీరవాణి హాలీవుడ్ స్థాయిలో నేపధ్య సంగీతాన్ని ఇవ్వలేకపోయినా, అద్భుతంగానే ఇచ్చాడు. పీటర్ హెయిన్స్ పోరాటాలు,సినిమాకు నిజంగా ప్రాణం పోశాయి. యుద్ద దృశ్యాలు, ఆ యుద్ద యంత్రాలు, మహాద్భుతం అని చెప్పాలి,

కాకపోతే ఈ సినిమా రెండు భాగాలు గా ఉండటం, ఇది మొదటి భాగం కావటంతో కథ మధ్యలో ఆగిన ఫీలింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక సినిమా ఇంటర్వెల్ వరకు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, క్యారక్టర్స్,క్యారక్టరైజేషన్స్ , వాటి సెటప్ , ఇవన్నీ అయిపోయి అసలు కథలోకి వెళ్లకుండానే సినిమా అయిపోతుంది , ఇది ప్రేక్షకుడిని కొద్దిగా అసంతృప్తి కి గురి చేసినా, చూస్తున్నంత సేపు మరో లోకంలో ఉంటాడు . పూర్తి కథ తెలియయాలంటే రెండవ భాగం కోసం ఎదురు చూడాల్సిందే,

చిన్నప్పుడు మా నాన్న కూడా అంతే ఒకే రోజు కథ మొత్తం చెప్పే వాడు కాదు, సగం చెప్పి, మిగతా సగం నువ్వు ఊహించు అని చెప్పి, మరిసటి రోజు నా ఊహాలు విని, అప్పుడు మిగతా కథ పూర్తి చేసేవాడు, ఈ సినిమా అయిపోగానే నాకు అదే గుర్తు వచ్చింది ,

అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నా, ఇది భారతీయ తెరపై ఒక అద్భుతమైన సినిమా అనే చెప్పాలి, అందరూ ఒకసారైనా చూడాల్సిన సినిమా.

*

     3456GB

 

 

(గమనిక : పాఠకుల సాలభ్యం కోసం ఇందులోని పాత్రలన్నీ తెలుగులోనే మాట్లాడతాయని మనవి )

 

మట్టి కుండీలోని వరి మొక్క చుట్టూ ఉన్న మట్టి పూర్తిగా తడిసే లాగ తన చేతిలోని పిడతలో ఉన్న నీళ్ళలోంచి 144 మి.లీ. నీళ్ళు పోసాడు చెన్నయ్య .

చేత్తో మొక్కని తడిమాడు అపురూపంగా. మొక్కంత పాల గింజ పట్టి ఉంది. ఇంకో రెండు రోజుల్లో కోసేయ్యవచ్చు ననుకున్నాడు.

దాదాపు రెండు కిలోల వరకు తూగవచ్చు ధాన్యం ఈ సారి అనుకుంటూ తృప్తిగా మొక్కనే గమనించసాగాడు.

ఇంతలోనే తన పర్సనల్ నెట్వర్క్ లో బీప్ శబ్దం వినిపించింది.

వరి మొక్క ముందు నుంచి లేచి, పక్కన తన బెడ్ పక్కనే ఉన్న గోడ వైపు తిరిగి, తన భుజం మీదున్న చిన్న సాంకేతిక పరికరాన్ని చేత్తో తడిమాడు. అందులోంచి గోడ మీదికి ఫోకస్ అయిన మెసేజ్ చూసి చిన్నగా నిట్టుర్చాడు.

‘నైరుతి ఖండపు అధినేత అయిదు నిమిషాల క్రితం తన గదిలోని ఆక్సిజన్ జనరేటర్ ని ఆఫ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.’

ఇదీ ఆ వార్త సారాంశం.

పెద్దగా కుంగిపోలేదు కానీ, ఏదో అనిశ్చితి ఆవరించింది మనసంతా. మరుక్షణం మాములుగా అయిపోయాడు చెన్నయ్య.

ఎందుకో హఠాత్తుగా ‘లక్ష్మి’ గుర్తొచ్చింది.

వెంటనే నెట్వర్క్ ఆన్ చేసి, మార్స్ (అంగారక గ్రహం) పై నున్న లక్ష్మి కి సిగ్నల్ పంపించాడు. క్షణంలో గోడ మీద ప్రత్యక్షమయ్యింది లక్ష్మి.

చీకటి కంతల్లో, తడి ఆరిపోయిన కళ్ళల్లో రవ్వంత వెలుగు, పెదవుల పై ఆనందపు చంద్ర రేఖ.

‘తెలిసిందా?’అడిగింది లక్ష్మి.

‘ఇప్పుడే తెలిసింది…..ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది.’ చెన్నయ్య.

‘కారణమేమన్నా  కనుక్కున్నావా?’

‘ఆ  ….అదే కారణం….అలోన్ సిండ్రోమ్….ఒంటరి తనపు న్యూనత.’

‘నైరుతి ప్రెసిడెంట్ అయి ఉండీ అలా  చేస్తే….ఇక ప్రజలకి ఏ విధంగా ధైర్యం కలుగుతుంది’

‘అవును….ఇంత అనుకూల పరిస్థితుల్లో…రాబోయే మంచి రోజులకి మనకి మధ్య దూరం తరిగిపోతున్న కాలంలో….అందునా  సాంకేతికతలో ఎంతో అభివృద్ధి చెందిన నైరుతి ఖండపు ప్రెసిడెంట్…ఐ హేట్ థిస్’ అసహనం వెల్లగక్కాడు చెన్నయ్య.

‘నిజంగా భాధ కలిగించిన విషయమే అయినా …ఇంకా విషాదమేంటంటే…అప్పుడే…ఇంత వరకు ఈ వార్త విని దాదాపు రెండు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారట’ లక్ష్మి గొంతులో నీరసం ధ్వనించింది.

‘అది నేనూహించిందే లక్ష్మి…ఇంకో రెండు మూడు నిమిషాల్లో మన ప్రెసిడెంట్, మన ఆగ్నేయ ఖండంలో ఉన్న ఇరవై కోట్ల మందిలో స్పూర్తి  రగిలించడానికి పర్సనల్ వీడియో మెసేజ్ పెట్టే అవకాశమూ ఉంది’. అత్యంత వేగంగా విశ్లేషించాడు చెన్నయ్య.

‘అది సరే….నీ రిసర్చ్ ఎలా సాగుతోంది’. టాపిక్ డైవర్ట్ చేసింది లక్ష్మి.

అది వెంటనే గ్రహించిన చెన్నయ్య. ‘ ఓకే …గుడ్.’ అన్నాడు నార్మల్గా.

‘నీ వరి పంట ఎలా ఉంది…ఈ సారి మొక్కకి ఎంత  దిగుబడి ఎక్స్పెక్ట్  చేస్తున్నావు…అట్లాగే నీ కూరగాయల పరిశోధనలో ఏవైనా కొత్త సంగతులున్నాయా?’ ఉత్సాహం కళ్ళల్లోకి ప్రతిఫలింప జేస్తూ అడిగింది లక్ష్మి.

‘ఫరవాలేదు…వరి పంట కాలం 30 రోజులు నుంచి 27 రోజులకి విజయవంతంగా తగ్గించడమే కాక, మొక్కకి దాదాపు 147 గ్రా. ధాన్యం ఎక్కువ అంటే దాదాపు 2కిలోల వరకు దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను’. గొంతులో ఉత్సాహం తొణికిసలాడుతుండగా కొనసాగించాడు చెన్నయ్య.

‘టమాట మీద చేస్తున్న రిసర్చ్ ఫలితాలు బాగున్నాయి. దేశవాళీ తీగ టమాట, ఒక్కసారి మొక్క నాటితే మూడు సంవత్సరాల పాటు  రోజూ మూడు కిలోల చొప్పున కాసే దేశవాళీ రకం. పరిశోధన  దాదాపు తుది దశలో ఉంది, అలాగే భూమి లోపల పెరిగే క్యారెట్, మొక్కకు ఒక్క దుంప కాకుండా వేరు సెనెగ పంట లాగా, పెద్ద ద్రాక్ష పళ్ళoత గుండ్రని సైజులో గుత్తులుగా, అంటే మొక్కకి సుమారుగా కిలోన్నర క్యారెట్ దిగుబడి వచ్చే విధంగా చేస్తున్న పరిశోధన సక్సెస్ అయింది. పేపర్స్ మన ప్రెసిడెంట్ కి పంపిస్తే అతను విశ్వ వ్యవసాయాభివృద్ధి మండలిలో ప్రవేశపెట్టాక, ప్రజలందరికి అందుబాటులోకి వస్తుంది’. ఆగకుండా చెప్పుకుపోతున్నాడు  చెన్నయ్య.

‘రియల్లీ…గ్రేట్’ ప్రశంసించింది లక్ష్మి.

‘కాని ఒకే ఒక్క ప్రాబ్లం…సేంద్రియ ఎరువుల ఉత్పత్తి బాగా తగ్గింది…నా నెక్స్ట్ రీసర్చ్ వాటి మీదే అనుకుంటున్నాను.’

‘గ్రేట్ చెన్నయ్య!……. ఐ యామ ప్రౌడ్ ఆఫ్ యు’ మనస్పూర్తిగా అభినందనలు తెలిపింది లక్ష్మి.

‘థ్యాంక్ యు సొ మచ్ లక్ష్మి’ స్వీకరించాడు .

కొద్ది సేపు మాటల విరామం…ఎలా మొదలు పెట్టాలో ఇద్దరికీ అర్థం కాలేదు.

‘నిజంగా! నువ్వు  ఆ వార్త వినడానికి ఉత్సుకతగా ఉన్నావా?’ చొరవ చూపింది లక్ష్మి.

‘అవును. ఐ యాం రియల్లీ ఎక్సయిటెడ్  టు హియర్ దట్ న్యూస్, ఇంకా మూడు నాలుగు గంటలు పట్టేటట్టుంది, ఆ శుభ వార్త వినడానికి,’  చెన్నయ్య కళ్ళల్లోకి వెలుగొచ్చింది.

‘నాకు కూడా…’ ఉత్సుకతతో తల నిమురుకుంటూ చెప్పింది లక్ష్మి.

ఈ భూగోళo మీద నివసించే ప్రతి మనిషి కీ వచ్చే అవకాశం పిల్లల్ని కనడం. అది ప్రభుత్వమే కలిగిస్తుంది. ఆగ్నేయం ఖండంలోని చెన్నయ్యకి అవకాశం వచ్చినప్పుడు తనకూ, తన శరీర తత్వానికి సరిపడే సరైన జోడు కోసం విశ్వవ్యాప్తంగా వెతికినపుడు మార్స్ పైకి కొన్ని తరాల ముందు వలసెల్లిన లక్ష్మి తాలూకు శరీర నిర్మాణo, తత్వం, ఇంకా అనేక భోగోళ, ఖనిజాల, ప్రాంతీయ సారూప్యాతలున్న చెన్నయ్యతో కూర్చి పరిక్షించినప్పుడు, అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలియవచ్చింది. వెంటనే ఒకరికొకరు సంప్రదించుకుని ప్రభుత్వానుమతితో మార్స్ పైన ఉన్న లక్ష్మి లోని అండాన్ని, ఆగ్నేయ ఖండంలోని  చెన్నయ్య బీజాన్ని, ఈశాన్య ఖండపు నైరుతి మూలలో నెలకొల్పబడిన భావితరాల అభివృద్ధి మండలి పరిశోధనాశాలకి పంపించారు.

ఆ ప్రయోగ, పరిశోధనశాలలో వారి అండాన్ని బీజాన్ని పరీక్షా నాళికలలో సంయోగపరిచి, ఫలదీకరణ చెందించి, కృత్రిమ గర్భం ‘ఆర్టిఫిషియల్ ఊమ్బ్’లో ప్రవేశపెట్టి పెంచుతున్నారు. బిడ్డ ఆరోగ్యంగా అద్భుతంగా పెరుగుతున్నది. నెలలు పూర్తి కావచ్చాయి. ఇంకా కేవలం మూడు లేదా నాలుగు గంటల తరువాత తమకి జన్మించ బోయే బిడ్డ గురించిన తాపత్రయం వారి మాటల ద్వారా తెలుస్తూనే వుంది. అది శుభసూచకం.

లక్ష్మితో  మాటలనoతరం తన రోజు వారి కార్యక్రమాలలో మునిగిపోయేoదుకు సిద్దమయ్యాడు చెన్నయ్య. వృతి రీత్యా వ్యవసాయ శాస్త్రవేత్తయినా ప్రవృత్తి రీత్యా చెన్నయ్య చరిత్ర నిక్షిప్తకారుడు.

విశ్వవ్యాప్తంగా జరిగే ప్రతి సంఘటన చెన్నయ్య లాంటి ఎన్నుకోబడిన వెయ్యి మందికి వార్త లాగా అందించబడుతుంది. తమకి అందిన సమాచారాన్ని విశ్లేషించి ఒక చరిత్రగా రాసి విశ్వ చరిత్ర వేదికకి పంపించడం జరుగుతుంది. అక్కడ, ఉత్తమంగా, నిజాయితీగా, నిజంగా, ఉన్నదున్నట్టుగా, ఉన్నతంగా, ఉన్న వాటిని ఎన్నుకుని చరిత్ర పుటల్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది.

ఈ రోజు పొద్దున్నే నైరుతి ఖండాదినేత ఆత్మహత్య ఉదంతం తరువాత విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల వార్తలు రాయడానికి ఉపక్రమించి, వాయిస్ ట్రాన్స్లేటర్ సిస్టం ముందు కూర్చున్నాడు.

తన గొంతుతో పలికే ప్రతి మాటని స్వీకరించి అక్షరాలుగా తర్జుమా చేసే వాయిస్  ట్రాన్స్లేటర్  సిస్టం అది. అవుట్ డేటెడ్, చాలా పాతది. VTS (వాయిస్ ట్రాన్స్లేటర్ సిస్టం)ముందు కూచున్నా ఏది మాట్లాడాలనిపించక విశ్వచరిత్ర వేదిక పుటలు వెనక్కి తిప్పసాగాడు చెన్నయ్య.

దాదాపు 1500 సంవత్సరాల క్రితం మొదలయ్యింది ఈ ప్రక్రియ అంతకు ముందు అంతా సెర్చ్ ఇంజన్లు, సర్వర్లు, పుస్తకాలు,తాటాకులు, శిలా శాసనాలు. మధ్యలో కొన్ని రోజులు డివిడి లు, బ్లూ రేలు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు వెల్లువలా వచ్చి అంతే వేగంగా అంతర్దానమైపోయాయి.

విటిఎస్ ముందు మాట్లాడాలనిపించక చరిత్ర పుటల్లోకి, లోలోకి, లోతుల్లోకి వెళ్ళసాగాడు.

……………రెండో ప్రపంచ యుద్ధం తరువాత మత జాడ్యం జడలు విప్పింది. 20వ & 21వ శతాబ్దంలో నయితే ఈ విశృoఖలత్యం పేట్రేగిపోయింది.

నవనాగారికతను, సాంకేతికత పాదాల కింద పడి నలిపివేయబడింది. సాంకేతికత మునుగులో మనిషి, మానవత్వం, ప్రకృతీ…అన్నీ…అన్నీ…నాశనం…సర్వనాశనం  అయిపోయాయి. ఒక విధ్వంసం రచింపబడింది.

2000-2100 వరకు జరిగిన సాంకేతికాభివృద్ధి, సమస్త భూగోళాన్ని …ఇంకా చెప్పాలంటే ఈ విశ్వాన్నే ఒక భారీ కుదుపు కుదిపింది.

3456

2043    -మూడవ ప్రపంచ యుద్ధం కేవలం …కేవలం బలనిరూపణ కోసం మాత్రమే జరిగిన యుద్ధం అది. మతం అనే    ముసుగేసుకొని, ప్రపంచ దేశాలన్నీ వారి వారి వద్ద మేటలుగా పేరుకు పోయిన ఆర్మేషన్ గోదాములు  ఖాళీ చెయ్యడానికి, అనేక కూటములుగా ఏర్పడి, ఒకరిమీద మరొకరు విధ్వంసం రచించుకున్నారు. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే అణుబాంబులు పేలని దేశం లేదనడం అతిశయోక్తి కాదు.

 

2136-2150   -మూడో ప్రపంచ యుద్ధం లో చనిపోయిన దాదాపు 60 కోట్ల మంది ప్రజల జనాభా కంటే రెట్టింపు జనాభా ఈ కాలంలో చనిపోయారు. కారణం…కరువు.

 

2160     -నాలుగో ప్రపంచ అణు యుద్ధం కేవలం ఆరు రోజులే జరిగింది. కాని అనేక దేశాల సరిహద్దులు మారిపోయాయి. ఆక్రమించుకున్న వారెవరో, కలిసిపోయిన వారెవరో రాయ వీలుగానంత చరిత్ర.  కారణం …నీరు….నీరు….నీరు…కరువు…కరువు…కరువు.

 

2190     -అంటార్కిటికా ఖండం అంతా కరిగిపోయింది. సముద్రమట్టాలు దాదాపు 150 మీటర్లు పెరిగాయి. 27 దేశాలు పూర్తిగా మునిగిపోయాయి. భూభాగం కుచించుకుపోయింది.

 

2213      –అడవులు అంతరించిపోయాయి. ఎడారులు పెరిగిపోయాయి. పశు పక్ష్యాదులు నశించిపోయాయి. కేవలం కొద్ది ప్రదేశంలో పండించే పంటలే, ప్రపంచమంతా పంచాల్సిన పరిస్తుతులు ఏర్పడ్డాయి.

 

2229      -గొర్బీ బాదల్ జననం. ఏడుసంవత్సరాల వయసులోనే ఆయన ప్రవచనాలకి ప్రపంచమంతా అతని దాసోహం అయిపొయింది. ప్రకృతి అతని మతం. పచ్చదనం అతని అభిమతం. ప్రకృతినే దైవంగా కొలవాలనే అతని తర్కానికి భూగోళమంతా ఏకమై అతనిని అనుసరించారు.

 

2260     -అయిదవ ప్రపంచయుద్ధం మళ్ళీ అదే కారణం. వంద సంవత్సరాల తరువాత కూడా మళ్ళీ అదే కారణంతో యుద్ధం జరిగింది. నీరు…నీరు….నీరు. భూగోళం మీద కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యల్లో ఉన్న ప్రదేశాల లోనే నీరు లభించేది. ఆ ప్రదేశాల యొక్క దేశాలమీద, ఆధిపత్య దాడులకు లెక్కే లేదు.

GB గోర్బీ బాదల్ ప్రమేయంతో కొన్ని ప్రాంతాలు శాంతి తీర్థం పుచ్చుకున్నా, అది కొన్ని రోజులకే పరిమితం అయ్యింది.

 

2271GB   -GB గోర్బీ బాదల్ అస్తమయం. అప్పటికే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది. ఎవరి ప్రతిష్ట అయినా, అతని తదనంతరమే కీర్తి శిఖరాలు చేరుకుంటుంది. మనుషులకి ఏదైనా పోగొట్టుకున్నాకే గదా దాని విలువ తెలిసేది. అతని జ్ఞాపకంగా, గౌరవసూచకంగా ఈ సంవత్సరం నుంచే సంవత్సరాల చివర A.D. లు, B.C. లు తీసివేయబడి, GB ని చేర్చింది.

 

కొంచం దాహంగా అనిపిస్తే లేచెల్లి తన బెడ్ పక్కగా నున్న కుండ లోంచి నీళ్ళు తీసుకుని తాగాడు చెన్నయ్య. చల్లగా, తియ్యగా ఉన్నాయి. ఆకలిగా అనిపించి పక్క ర్యాక్ లోని రాగి బిస్కెట్స్ నాలుగు ప్లేట్లో పెట్టుకుని వచ్చి మళ్ళీ VTS ముందు కూచున్నాడు – పాత చరిత్ర పుటల్లోకి పవేశిస్తూ…

 

2300GB    భూగోళం మీద భూభాగం తగ్గిపోయింది. తూర్పు నుంచి పడమర కు విభజించబడిన భూ మధ్య రేఖ తన ప్రభావం కోల్పోయినందువల్ల దాన్ని మార్చి,  ప్రపంచ భూ భాగమంతా నిలువుగా, అడ్డంగా నాలుగు సమ భాగాలుగా విభజించి, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి మరియు వాయువ్య ఖండాలుగా మార్చడ్డాయి.

 

2322 GB  –ప్రపంచమంతా, ఇంకా చెప్పాలంటే విశ్వవ్యాప్తంగా ఒకే డబ్బు చలామణిలోకి వచ్చింది. ఎగుమతి దిగుమతుల్లో డబ్బుని నిషేదించారు. అన్ని ఖండాల ప్రభుత్వాలది ఒకటే అజెండా, తినడానికి తిండి, తాగడానికి నీరు. వ్యవసాయమే అందరి ప్రధాన పరిశ్రమగా అందరూ ఓకే మాటకు కట్టుబడాలని నాలుగు ఖండాల అధినేతలు తీర్మానించారు.

 

2350 GB    –అణు యుద్ధాల ప్రభావం ప్రకృతి మీద ప్రతిబింబించడంతో భూమ్మీద నీటి ఊటే కరువైపోయింది. వాతావరణంలోని వాయువుల్లోంచి హైడ్రోజన్ని, ఆక్సీజన్ని సేకరించి నీటిని తయారు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చి పడింది. కానీ…ఖర్చే చాలా ఎక్కువ. వాయువ్య ఖండంలో జనం లేరు, జలం లేదు. వాతావరణంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా వుండడం చేత నీటిని తయారుచేసుకునే గనిలా ఆ ప్రాంతం ఉపయోగపడుతున్నది. అక్కడినుంచి నీళ్ళు లేని ప్రాంతాలకి తరలించడం ప్రారంభించారు.

 

2500GB   -ప్రపంచ జనాభా వంద కోట్లకి పడిపోయింది. అందులో సగం జనాభాకి ఒక్క పూట భోజనం దొరకడమే గగనం అయిపొయింది. జీవించడానికి ప్రభుత్వం మీద దాదాపు వంద శాతం ప్రజలు ఆధారపడుతున్నారు.

బీప్ మన్న శబ్దానికి, వచ్చిన వార్తని చూసాడు చెన్నయ్య.

తమ ఆగ్నేయ ఖండాధినేత పంపిన సందేశం అది.

         “ఈ రోజు తెల్లవారుజామున నైరుతి ఖండంలో జరిగిన సంఘటన యొక్క ప్రభావం మీమీద తప్పకుండా చూపిస్తోందని నాకు తెలుసు. గత అయిదు వందల సంవత్సరాలుగా మానవ ఉనికిని కాపాడుకోవడానికి మనం చేస్తున్న ఈ పోరాటం నిజంగా మెచ్చుకోదగ్గది. సంతోషం, ఆనందం, ఆహ్లాదం, హాయి, సుఖం వంటి భావోద్వేగాలు మనలో నశించిపోయినా…మనం భావితరాల కోసం, మనుష్య జాతిని ఉత్కృష్ట స్థితిలో చూసే అదృష్టం కోసం మనమంతా మర మనుషుల్లా, ఏ ఫీలింగూ లేకుండా చేస్తున్న త్యాగం ఎన్నటికీ మరువలేనిదనే సంగతి అందరికీ తెలిసిందే.

          సాంకేతికంగా మన అభివృద్ధిని తక్కువగా చెయ్యలేం…కానీ…కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి కోసం తపిస్తూ…దాని ఉనికిని…మూలాలని సజీవంగా మళ్ళీ నిలపడానికి ప్రతిఫలాపేక్ష లేకుండా మనం చేస్తున్న త్యాగానికీ… ఉన్నత ఫలాలని రాబోవు తరాలకు అందించాలనే మన తపనని మనం ఎప్పటికీ తక్కువ చేసుకోకూడదు.

          ఈ రోజు తెల్లవారుజామున నైరుతి అధినేత ఆత్మహత్య మనల్ని కల్లోల పరిచింది నిజమే…కానీ…ఒక్క క్షణం ఆలోచించండి…మూడు నాలుగు గంటలు వేచి చూడండి, ఒక అధ్బుతమైన శుభవార్త మీ కోసం వేచి చూస్తున్నది.

         ఆ వార్తా మిమ్మల్ని తప్పకుండా సంబర పరుస్తుందని మీకు హామీ ఇస్తున్నాను, వేచి చూడండి. ప్రేమతో మీ ప్రెసిడెంట్.”

ప్రెసిడెంట్ సందేశం మంచి ఉత్ప్రేరకంగా పని చేసింది చెన్నయ్యకి. నైరుతి ప్రెసిడెంట్ ఆత్మహత్యని చరిత్ర పుటల్లోకి దాచడానికి ఏ ప్రయత్నం చెయ్యకుండానే తమ ప్రెసిడెంట్ ఇచ్చిన సందేశాన్ని పోస్ట్ చెయ్యడం ప్రారంభించాడు.

తరువాత మళ్ళీ… మరొక్కసారి చరిత్ర భాండాగారపు పుటల్ని వెనక్కి తిప్పాడు చెన్నయ్య.

2610GB    – GB గోర్బీ బాదల్ అస్తమయం తరువాతనే ప్రకృతిని కాపాడుకోవడానికి అంతా, విశ్వవ్యాప్తంగా మొదలైన ఉద్యమం మంచి ఊపు మీద కొనసాగింది. దాదాపు 350 సవత్సరాల క్రితం జరిగిన ఆఖరి ప్రపంచ యుద్ధం తరువాత ఇంకే యుద్ధమూ జరగకుండా అంతా ఒక్క తాటిపై నిలబడి ప్రకృతిని మళ్ళీ పునరుజ్జీవనం చేయడానికి తీసుకున్న నిర్ణయం మంచి మార్పులే తీసుకురాసాగింది. కానీ, మనిషి ప్రకృతిపై చేసిన అరాచకం మానడానికి చాలా సమయం పడుతుందని అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతిని పాడు చేసే అన్ని  వస్తువుల తయారీకి అనుమతి నిషేదించడం ఆహ్వానించ దగ్గ పరిణామం.

2772GB   –కాలుష్యం మనిషిని కాల్చేయసాగింది. ప్రతి నలుగురికీ ఒక ఇంక్యుబెటర్ కేటాయించబడింది. అందులోనే కొద్దిపాటి భూమిలో వ్యవసాయం స్వంతంగా చేసుకుని, తమ తిండి తాము ఉత్పత్తి చేసుకుని, తమ నీరు తాము తయారు చేసుకుని, తమ ఆక్సిజన్ని (ఆక్సిజన్ జనరేటర్ ద్వారా)   తాము తయారు చేసుకుని  బతకాల్సిన పరిస్తితులు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రాత్రి నిడివి చాలా తగ్గి పోయింది, ఇప్పుడు కేవలం ఆరున్నర గంటల రాత్రికే మనుష్యులు అలవాటు పడాలి.

 

2818GB     -ప్రపంచ జనాభా ఎనభై కోట్లకి పడిపోయింది. మనుషులందరూ ప్రభుత్వం కల్పించిన ఇంక్యుబేటర్లలోనే నివసిస్తున్నారు. మామూలు వాతావరణంలోమనుష్యులు బతకలేరు. ఆడ, మగలో పూర్తి నపుంసకత్వం ప్రజ్వరిల్లింది. మనుష్యజాతి శరీరం మీద రోమాలు అంతరించిపోయాయి…రోగాలు పేట్రేగిపోయాయి.

 

2835GB    -కృత్రిమ గర్భంలో మొట్టమొదటి బిడ్డ జననం. జలాన్వేషణ కొనసాగిస్తూ దాదాపు 153 గ్రహాలపై కాలు మోపాడు మనిషి. అందులోంచి మూడు గ్రహాలలో నీరు ఉనికిని కనిపెట్టగలిగారు. వలసలు మొదలయ్యాయి.

 

3012GB       -విశ్వవ్యాప్త జనాభా 40 కోట్లకి దిగజారింది. వ్యవసాయ పరిశోధనలు చాల మందికి తిండి పెట్టగలుగుతున్నాయి కానీ సమస్యంతా నీటిదే. సముద్ర జలాలు శుద్ధి చేయలేనంతగా లవణ విషంగా తయారయ్యాయి. కొద్దిలో కొద్ది ఉపశమనం ఏంటంటే భూగోళం మీద తాపం 72 డిగ్రీల నుండి 69 దిగ్రీలకి పడిపోవడం, ఆశ చిగురించసాగింది.      

 

3243GB      –ఈశాన్య ఖండపు చాన్ అనే ప్రదేశంలో చేసిన ప్రయోగంలో ఒక మొక్క మామూలుగా… ఇంక్యుబేటర్ లో కాకుండా మామూలు వాతావరణంలో చిగురించింది. ఈ సంవత్సరం సాధారణ వర్ష పాతం 171మి.మీ.  కంటే కొంచం ఎక్కువ 198మి.మీ. వర్ష పాతం నమోదు కావడం సంతోషదాయకం. ఆత్మహత్యల శాతం 60 నుండి 30 శాతానికి పడిపోవడం శుభసూచకం, అలాగే మనిషి యొక్క సగటు ఆయుర్దాయం 39 నుండి 42కు పెరగడం ఆనందకరం. రాబోవు రోజులన్నీ మంచి రోజులే.

 

సిస్టంని ఆఫ్ చేసి బద్దకంగా ఒళ్ళు విరుచుకున్నాడు చెన్నయ్య. నిద్ర రావటంలేదు. తెల్లవారుజామున మూడున్నర కావస్తూంది. సూర్యుడు ఆశలు రేకెత్తిస్తూ పైపైకి పాకనారంభించాడు. సోలార్ లైట్లు అన్నీ ఆఫ్ చేసాడు. వేకువ వెలుగు అద్వితీయంగా ఉంది. నీటి స్టోరేజి ట్యాంక్ చూసాడు. ఫర్లేదు ఇంకా వారం రోజుల వరకు సరిపోతాయి అనుకున్నాడు. గదిలోని నీటిని ఉత్పత్తి చేసే మెషీన్ని ఆఫ్ చేసాడు. వాతావరణ తాపం తానున్న ఇంక్యుబెటర్ గదిలో 30 డిగ్రీలు చూపించింది. బయటి వాతావరణం 54 డిగ్రీలుగా కనిపించింది.

మనసంతా ఆహ్లాదంగా ఉంది చెన్నయ్యకి. మొక్కలకి నీళ్ళు పట్టడానికి ఉపక్రమిస్తుండగానే బీప్ అనే శబ్దంతో లైవ్ మెసేజ్ వచ్చింది. వీడియోలో ప్రెసిడెంట్ చెన్నయ్యని చూడగానే మొదలుపెట్టాడు.

“కంగ్రాట్యులేషన్స్ చెన్నయ్యా! నువ్వు తండ్రివయ్యావు. ఇక నేను డైరెక్ట్ గా నీకు శుభాకాంక్షలు తెలుపడానికి కారణం, నీ బిడ్డ. నీ కూతురు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా కాదు కాదు, విశ్వవ్యాప్తంగా మనం సంబరాలు జరుపుకునే శుభ శకున సమాచారం ఏంటంటే… నీ కూతురి తలపైన గుప్పెడన్ని వెంట్రుకలతో పుట్టింది. అందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఇంకా ఈ వార్తా మన ఖండపు ప్రజలతో పంచుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాను. ముందు లక్ష్మితో మాట్లాడాలి. మళ్ళీ ఒకసారి కంగ్రాట్యులేషన్స్”, తన బోడి గుండు నిమురుకుంటూ ఆనందం పట్టలేకపోతున్న ప్రెసిడెంట్ని అబ్బురంగ చూస్తూ చేష్టలుడిగి నిలబడిపోయాడు చెన్నయ్య.

తన జీవితంలో ఇంత కంటే ఆనందకరమైన సంఘటన ఇంకేదీ లేదు అన్నంతగా ఉద్వేగానికి లోనయ్యాడు చెన్నయ్య. కళ్ళ నిండా నీళ్ళతో చూపు మసకబారింది.

లైన్లో లక్ష్మి, తానైతే ఆనందానికి అసలు అర్థం ఆమే ననిపించింది. ఇద్దరు కలిసి తమకి పుట్టిన బిడ్డకి అప్పటికప్పుడు ఒక పేరు కూడా పెట్టేసారు ‘హరిత’ అని.

ఎందరో… ఎందరెందరో… హితులు…సన్నిహితుల శుభాకాంక్షల వెల్లువలో తడిసి ముద్దయిపోయాడు చెన్నయ్య.

ఓ వైపు అభినందనలందుకుంటూనే మరోవైపు మొక్కలకి వాటికి కావాల్సిన నీళ్ళు పట్టాడు చెన్నయ్య.

సోలార్ గ్లాస్ ప్యానెల్ మీద టీ చేసుకుని, దాన్ని చప్పరిస్తూ వచ్చి సిస్టంని ఆన్ చేసాడు. VTSలోని చరిత్ర పుటల్లో మరొక పేజీని కలపడానికి ఉపక్రమించాడు చెన్నయ్య.

 

3456GB   -దాదాపు 650 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన మానవ శరీరం మీది వెంట్రుక తిరిగి కనిపించడం మహా అద్భుతం. విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న జనాభా అంతటికీ శుభవార్త అయిన ఈ సంఘటన మరెన్నో పాత మార్పులకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

ఈ భూగోళం మీదకి అడుగుపెట్టబోయే భావితరాలకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అందించాలనే ఈ తపన, త్యాగం ముందు ముందు తప్పకుండా ఫలిస్తుందనడానికి ఈ సంఘటన ఒక సజీవ సాక్ష్యం.

ఎప్పుడో పదిహేను వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల ముందు చూపు లేమి, భాధ్యతారాహిత్యం, స్వార్థం, అత్యాశ మనల్ని, మన జీవితాలని ఇంకా దహించివేస్తూనే ఉంది.

ప్రకృతిని కాపాడుకోలేని వాడు ప్రపంచాన్ని ఏం బాగుపరుస్తాడు. మన GB-గోర్బీ బాదల్ అన్నట్టు ‘మనం అడిగిన వన్నీ ఇచ్చేవాడే దేవుడు అయితే, మరి మనకు కావాల్సిన వన్నీ మనం అడగకుండానే, మనల్ని అడగకుండానే ఇచ్చే ఈ ప్రకృతినేమనాలి. దేవుడే ప్రకృతి – ప్రకృతే దేవుడు.’

ఇన్ని వందల సంవత్సరాలుగా మనని మనం త్యాగం చేస్తూ, ఏ సుఖానికీ, సంతోషానికీ, ఆనందానికీ నోచుకోకుండా, నిర్జీవంగా జీవిస్తూ, భావితరాల అభ్యున్నతికి పాటు పడుతున్న మనకు ఈ రోజు నిజంగా పర్వదినం.

మరిన్ని మంచి మార్పులు మన జీవితాల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ, అప్పటివరకూ మనం కలసికట్టుగా, మన పూర్వీకులని ఈ ప్రకృతి ఎన్నో సంవత్సరాలు కాపాడినందుకు ప్రతిగా ఈ సారి మనందరం కలసి ఆ ప్రకృతి మాత ఋణం తీర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన ప్రకృతిని మనం కాపాడుకుందామని, ఈ సందర్భంగా మనందరం మరొక్కసారి సంకల్పం చేసుకుందామని, ఈ శుభ దినాన్ని పండగలాగా జరుపుకోవాలని అందరినీ విన్నవిస్తున్నాను.

 

అందరికీ శుభాకాంక్షలు.

మీ

చెన్నయ్య.

VTSలో పొందుపరిచిన విషయాన్ని చరిత్ర పుటల్లోకి అనుసంధానిస్తూ…చివర ఉన్న తన పేరును చేతివేళ్ళతో మృదువుగా స్పృశించాడు చెన్నయ్య.

అది తన పూర్వీకుల పేరు.

***

 

 

 

కోకిల పాడే దీపం పాట!

మమత వేగుంట 

 

పొడుగాటి నీడలు చీకట్లోకి కరిగిపోయాయి.

గాఢమవుతున్న ఆకాశంలో దిగంతానికి ఒక చట్రం గీస్తున్నాయి సాయంత్రపు రేఖలు.

దీపాలు ముట్టించే వేళ

వేసవి పాట కోసం కోకిలకి దాహం- నాలాగే.

ప.

ఆ కోకిల పిలుపు

సప్తస్వరాల్లో అయిదో పలుకు.

suswaram

స్థిరమైన ప్రకృతి దృశ్యం లాగానే ఎంతో నిబ్బరం ఆ స్వరంలో-

వేసవిలోని గాంభీర్యం ఆ పలుకులో.

దీపాలు వెలిగించే దీప రాగం – దీపకం- “ప” ఆ రాగానికి వాది స్వరం.

ఆ దీప గీతికని పాడే కోకిల గొంతు విను

నట్టింట్లోనూ గుండె లోతుల్లోనూ జీవించే  దీపాన్ని చూడు.

ఎదురుచూస్తున్న కలల పాట పాడే కోకిలని విను

అది జీవితాన్ని వెలిగించే కల.  

Mamata 1

మా ఊరి పేరు యనక– ఒగ కత

సడ్లపల్లె చిదంబర రెడ్డి
మావూరి కాపోళ్లలో ఎక్కువ బాగము “సజ్జన”కాపోల్లే. అందుకే మావూరు సజ్జన పల్లయి, సడ్లపల్లిగా మారిందంట. అయితే దాన్ని ఇష్టంపడని గుంపోళ్లు మాత్రం ఉప్పర సజ్జయ్య అనే ఆయప్ప ఈడ వున్నెంట ఆయప్ప పేరుమిందనే “సజ్జయ్యపల్లి” సడ్లపల్లి అయ్యిందని అంటారు.
    అయితే దాంట్లో నిజ్జం లేదనిపిస్తుంది. ఊర్లో ఉప్పరోళ్లు వుండారుగానీ,ఈళ్లకి సెంటు బూమిగూడా లేదు. అందరూ ఎనుంపోతుల్తో మడకల్దున్ని, మన్ను మోయించి,కూలీనాలీ సేసుకోని బతుకుతా వున్నోళ్లే.
    అయితే మా జనాలు “సజ్జను”లేనా?? అని మీరడగొచ్చు!!నేతిబీరకాయలో  నెయ్యి వుందనే దానికి ఆ పేరొచ్చిందా?? అనే సిన్న అనుమానముగూడా రావల్ల!! ఎవరో యనకటి కాలము ఎర్రోళ్లు ఆ పేరు పెట్టింటారు! పేర్లని బట్టే బుద్దులుంటాయనుకొంటే ఈ దేశంలో జనాలందరూ అరిచ్చందురుడు,సీరామ శందురుడు అనే పేర్లే పెట్టుకొంటా వుండ్రికదా!!
     అదట్ల ఇడిస్తే మా గుంపోళ్లు దిగువ సీమనుంచి వొచ్చిరంట! వాళ్ల యనకనే ఒగ కమసలోళ్ల కుటింబంగూడా వొచ్చినంట.
     ఈ ఊర్లో మాత “కాపోల్లు” అని పిలుస్తారు.అంటే పంటలు పెట్టి “కాపుదల సేసే”(పెంచే) జనాలని అర్తం.(గొర్రెలు పెంచేవోల్లు,ఆవులు పెంచేవోల్లు,పందులు పెంచేవోల్లు..ఇట్ల)
    బూమ్మీద ఏట్నుంచి కాలువలు తవ్వేది,బావులూ సెరువులు కట్టేదీ జనాలు నేర్సినపుడు–యక్కడికీ కదలకుండా ఒగ తావే నివాసాలు సేసుకోని, నిలిసిపొయ్యి యగిసాయం(వ్యవసాయం) మొదలుపెట్టిన గుంపే కాపోల్లు!! ఈళ్లకి అరవై డెబ్బయ్యేండ్లకి ముందు పేరుకి యనక “రెడ్డి” అనే తోకలు ఉండ్లేదు.
   రాజులు, పాళ్లేగాల కాలంలో ఎక్కువ జమీన్లో పంటలు పెట్టే ఆయప్పని ఆ సుట్టూపక్క లుండే జనాల గుంపులమింద అజమాయిషీ సేసే  అదికరము ఇస్తావుండ్రి. అంటే  అందరిదగ్గరా దవసము(ధాన్యం) కందాయం(భూమి సిస్తు) వొసూలు సేసి కొంత బాగము వాల్లదగ్గిరే వుంచుకోని, మిగిలింది రాజుల కజానాలో జమా సేసే అదికారము. దాన్నే”రెడ్డిరికము” “రెడ్డి పదవి” అని పిలుస్తా వుండ్రి. (పూర్వపు విరాటుడు లోని”రాట్” పదమే క్రమంగా రెడ్డి గా రూపాంతరమయ్యినదని ఎక్కడో చదివినట్లు గుర్తు)
    దాని అర్తం తెలీని ఎర్రోల్లు రాజులు, ఎంగిలీసోల్ల కాలంలో తోకలిప్పుకోకుండా గమ్మనూరుకో నుండారు!! సొతంతరమొస్తూనే ఎగిసాయం సేసేవోల్లంతా రెడ్డీసే   అనే ఒగ పెద్ద ఆశతో దాన్ని తగిలిచ్చుకోనుండారు- అనిపిస్తుంది.
     అది అట్ల వుండని:
     మా గుంపోల్లు, కమసలోల్లు వొచ్చిరంటగదా!! పెన్నేటికి తూరుపుపక్క ఏరు పొంగి ఎత్తుతగ్గులు సమానం సేసి ఒండునింపిన విశాలమయిన బూముంటే ఆడే నిల్సిపోయిండారు. ఏటిగట్లో అంతా కాపోల్ల సేద్యాలు. ఊరికి ఆనుకోని పదయిదు ఇరవై యకరాల్దంకా ఉత్తరానికి కమసలోల్లది. రయితులకి కావాల్సిన కొడవలి, పార, గుద్దలి,గడారు…కాడీ, మేడీ,పలుగు, బండీ..ఇట్లా సామాన్లు సేసేవాల్లే కమసలోల్లు. వాళ్లకి ఆకాలానికే బయ్యమో,బక్కితో,అట్ల్లంటిదేదో శానా వున్నట్లుంది! వాళ్ల బూముల్లోనే పెద్ద కోనేరు తవ్విచ్చి(1967 ఆ ప్రాంతంలో దాన్ని మూసేశారు) గుడికట్టిచ్చిండారు. ఊరిజనాలకి రోగాలొస్తే మందులిచ్చేదీ, ఒడ్డీలకి అప్పులిచ్చేదీ వాల్లే.(కాలమయిపోయిన కళలు– అనే కతలో వాళ్లగురించి మరలా చదవగలరు)
     గుడి యనకాలే ఒగ సింతసెట్టు నాటిండారు. (దానికి వయసుమళ్లి బెంగళూరు రోడ్డుకు అడ్డంగా కొమ్ములు విరిగి పడ్తూంటే 1986 ఆ ప్రాంతంలో తొలగించేశారు) అది యంత పెద్దదంటే నేను ఇందూపురానికి సుట్టూపక్కల 500 మయిళ్లవొరుకూ మర్రి, రాగి,సింత సెట్లు యన్నో సూసిండానుగానీ ఇంత ఎత్తూ, ఇసరమూ(వెడల్పు) వున్న మాను సూడ్లేదు!! కాతకాలమొస్తే ఇరగ్గాసిన కాయల బరువుకే కొమ్ములు ఇరిగి పోతావుండె. ఆ కాతని సింతపండు యాపారము సేసే మావూరి పింజిరోల్లు కొంటావుండ్రి. ఆదుడ్లని కమసలోల్ల ఇండ్లు, మా సజ్జనకాపోల్ల ఇండ్లోల్లు వాటాల్లెక్కన పంచుకొంటా వుండ్రి.దీని ఆదారం సేసుకోనే సజ్జన పల్లి సడ్లపల్లి  అయ్యిదనుకోవొచ్చు!!
    ఇదే కాలంలో ఈతావుండే సెరువుల్లోన, ఏట్లోన, గుంతల్లోన శానా నీళ్లు వాట్లో దండిగా శాపలు వున్నంట వుంటే వాట్ని పట్టుకోని బదికేకి ఒగ బెస్తోల్ల కుటింబుమూ వొచ్చింది. వాళ్లు వూరికి దచ్చిణంపక్క బాయి తవ్విచ్చి ఇరవై యకరాలుదంకా  సేద్యం సేసుకోని ఈశ్వరుని గుడికట్టుకోని నిల్సి పొయ్యిండారు.ఈళ్లూ వైదీకం (వైద్యం) సేసే వాళ్లే. ఈళ్లు వొచ్చినంక కమసలోల్ల వైదీకము యనకబడి పొయ్యింది.(వీళ్ల వైద్యం గురించి “నాకు రోగం తగుల్కోనె” అనే కథలో వివరిస్తాను).
     మా వూరికి తూరుపుకి మూడుమైళ్ల దూరంలో రైలు రోడ్డుకు  అవతల ఇంగొగు సడ్లపల్లి వుంది. యనకటికి వానలు పడకుండ కరువు మూసుకొంటే మా సజ్జన గుంపోళ్లు ఆ ఊరిడిసి యగువసీమకి ఎల్లిపాయరంట గాని,వూరిపేరు మాత్రం అట్లేవుంది. దీన్ని పులమతి(పులిమృతి)పి. సడ్లపల్లి అని పిలుస్తారు.
   ఆదికాలములో వాన్లు ఇగ్గదీసి కొట్టినపుడు, ఏరు పొంగి దావని పడమరకి మళ్లిచ్చుకోనుంది. అందుకే మా వూరికి ఉత్తరానికి ఏటిగడ్డలో శానామంచి మాగాణిబూములు తయారయ్యిండివి. అక్కడ (సూగు= సుగ్గి= ధాన్యం) సూగు దండిగా పండిచ్చే దానికి దాన్ని (సూగు ఊరు) సూగూరు అని పిలిసినారు. దానికి ఆనుకోని వుండేదానికి మా ఊర్ని సూగూరు సడ్లపల్లి (యస్. సడ్లపల్లి) అని పిలుస్తారు!! (ఈ సూగూరు దగ్గర హిందూపురం పట్టణం కొత్తగా పురుడుపోసుకొంది.అది ముందుముందు వివరిస్తాను).
   మా గుంపు జనాలుండేది పెన్నేటికి రెండుపక్కలా మా వూర్నుంచి దిగువ సీమలో పెనుగొండ నుంచి, ఎగువసీమ కర్నాటకంలోని తొండేభావి రైలు స్టేసనుకు అవతల కలినాయకన హల్లి(కల్యాకనపల్లి) వొరుకూ వుండారు.
   ఇపుడు తోకలోల్లంతా కల్సిపోయిండారుగాని, అది యేరే కత!! మా సుట్టూపక్కల ఉరుల్లో
సడ్లపల్లొల్లంటా
నా మొగిని షడ్డుకులంటా
రాతిరికొస్తారంటా
జొన్న రొట్టెలు కాలల్లంటా..
అని నేను సన్నపిల్లోనిగా వున్నపుడు పాట్లు పాడ్తా వుండ్రి!!
****                    ****              ****                     ***
అయిదరాబాదు నుంచి బెంగుళూరికి రైల్లో పోతే దొడ్డబళ్లాపురానికి ముందే “మాక్లీ రైలు స్టేషన్” అని ఒగటొస్తుంది. ఆడ వూర్లే లేవు. కొండలకి నడిమద్య కట్టిండారు. యాలంటే దానికి ఆరేడు మైళ్లదూరంలో సుబ్బరమణ్యం స్వామి ఘాటీ అని వుంది.
    ఆడ డిశంబరు నెల్లో ఎద్దుల పరస జరుగుతా వుండె. అది దచ్చిన బారత దేశంలోనే శానా పెద్దదంట!! దానికి నెలరోజుల ముందుగానే లక్షాంతరం ఎద్దులు ఒస్తావుండె. అవి పాతకాలం జాతిమాదిరీ మేకలు, జింకలట్లా గిత్తలు కాదు.మైసూసు,హలికేరి జాతిలో బాగా సురుకయిన ఉక్కుశరీరం పుట్టుకవి!! దూరాబారమోల్లు వాట్ని రైల్లో తీసుకుపోతావుండ్రి అందుకే ఆడ స్టేషను.
    మనిషై పుట్టినంక ఆ పరసలో సూడల్లన్నా మూగ జీవాల అందసందాలు!! ఒగ ఎద్దును సూసిన కండ్లతో ఇంగొగు జతని సూసేకయితా వుండ్లేదు!! ఆ ఎద్దులకుండే సోగ కండ్లు, ముఖం మింద నక్షత్రం మాదిరీ మెరిసే తెల్ల సుక్కలు,కత్తులకంటే కొస్సిగా వుండే నిటారయిన కొమ్ములు. రాజులు మెరవణీసేసేకి నున్నగా మేపిన అరేబియా జాతి గుర్రాలుగూడా ఈ ఎద్దుల కాళ్లకింద దూరాల్సిందే!!
IMG_0011
    మంచి వయసు కుర్రల్ని కోడిగుడ్లు,వులవనూక,శెనగపప్పు,అగిశాకు,సెరుకు మోసులు తినిపిచ్చి ఉడుకు నీళ్లతో రెండుపూటా స్నానాలు సేయిస్తా, శాన ముతువర్జీగా(ప్రేమగా) పెంచుతావుండ్రి. కింద పండుకొంటే నేల ఒత్తుకొంటుందని లేపులు(పరుపులు) పరుస్తావుండ్రి.ఈగలు మైమింద వాలకుండా మనుష్యుల్నిపెట్టి ఇసనకర్రల్తో ఇసరిస్తావుండ్రి. ఇట్ల ఇంపుగా వుండే వాటికి కొమ్మలకి మెరిసే కొమ్ముకుప్పలు, మెడలో ఇత్తడి సైను,గంటలు,గగ్గిరీట్లు,గవ్వలు,దిష్టితగుల్కుండా నల్ల కురుబదారము. రంగుల నులకల్తో పేడిన మూతికి ముగజింబారము. కొమ్మలకి జండాల మాదిరీ గాలికెగిరే టేపులు. అరసేతెలుపు అద్దాల బిల్లలుంచి బొమ్మలు బొమ్మలుగా అల్లిండే బురికీలు ఒళ్లంతా కప్పుతావుండ్రి. ఇంట్లో జనాలు పెండ్లి కూతురుకంటే అందుముగా సంబరాలు సేసుకోని సింగారం సేస్తావుండ్రి. ఆడే టెంటుల్లో కత్తులూ, కఠారుల్తో కొట్టుకోనే సినీమాలు ఆడ్తావుండె. జాత్రకొచ్చిన జనాలు సినీమాలకంటే ఎద్దుల్ని సూసేకే సెవులుకోసుకొంటా వుండ్రి.
    వాట్ని సూస్తే నాకి సిన్నపుడు అనిపించేది– సింబాలు, పులులు ఎద్దుల్ని సంపి తింటావని సెప్పేది అబద్దమని!! సరకస్సులో సింబాలూ పుల్లూ దండిగా సూస్తావుంటి. అవిగానీ ఈ జాతెద్దుల్ని సూస్తే “ఇవి యాడ్నో మమ్మల్ని సంపి తినేకి పుట్టిండే కొత్త పసరాలు”అనుకోని, గుండె పగిలి సచ్చేటంత కోపుగా ఏపుగా రోషంగా వుంటావుండె.
    దూరాబారమొల్లు గూడ్సు రైల్లొ తీసుకుపోతే నూరూ ఇన్నూరు మైల్ల దూరమోల్లు మా ఊరిముందరి రోడ్లోనే తోలుకు పోతావుండ్రి. వూర్లో జనాలంతా కన్నురెప్పలు కొట్టకుండా,నోరుఎల్లబెత్తుకోని ఎద్దుల సొగసులు సూస్తావుండ్రి. దాని జతకి పరసల కాలమొస్తే గుడిముందర టెంకాయ గర్రుల్తో పెద్దగా సప్పరం ఏసి, వర్సగా గూటాలు బాత్తావుండ్రి. ఊర్లోని అందరి వాముల్లో గడ్డి తెచ్చి వామిమాదిరీ ఏస్తావుండ్రి. కొందరు గంపలు తీసుకోని ఇంటింటికీ పొయ్యి సంగటిముద్దలు, శార, మజ్జిగ, ఊరగాయి,పాకపట్టలు(విస్తర్ల లాంటివి=వక్క మట్టలు) తెస్తావుండ్రి. బాయిదగ్గర కట్టిండే గారు తొట్టీనిండా నీల్లు నించుతావుండ్రి.
    ఎద్దులు తోలుకోని వూర్లకు పొయ్యేవోల్లంతా రాతిరిపొద్దు మావూరిదగ్గరే నిల్సి, ఎద్దుల్ని మేపుకోని, సంగటితిని, బయ్యంలేకుండా పండుకోని పోతావుండ్రి. ఇట్ల అల్కూర్లో జనావరినెల్లో జరిగే సోమేశ్వస్వామి పర్స,ఊగాదికి యనకా ముందు విదురాస్వత్తనంలో జరిగే జాత్రవొరుకూ మా వూరిజనాలకంతా ఇదేపని. దాని జతకి యండకాలమొస్తే రోడ్డు పక్కలో సత్త్రం ఏసి పెసరబ్యాళ్లు,పాణకం,మజ్జిగని బాటసార్లకి పిల్సి పిల్సి పోస్తావుండ్రి.
   ఆ జాత్రల కాలంలో మాయట్లా పిల్లోల్లంతా పసరాలకతలే సెప్పుకొంటావుంటిమి. ఆ కతల్లో ఎద్దులే ఈరోలు. వాట్లో శానా మర్సిపొయ్యిండాను గానీ ఒగటిమాత్రం బాగా గురుతుంది.
    ఒగ దిగువసీమ రైతుకు అయిదారెకరాల మంచి సత్తువయిన బూమి వున్నంట. మేలుజాతి కుర్రలు కొనల్ల అని మున్నూరు రుపాయలు (అప్పుడు దినకూలీ 12 పైసలు.ఇప్పుడు (01.07.2015–నాడు) 300రు.లు దీని ఆధారంగా బేరీజు వేసుకొండి) తీసుకోని పర్సకి పాయినంట. పర్సంతాతిరిగి వాటముగా వుండే గట్టి కాళ్లని, ఒంటిమీద సుళ్లని,కంటిసూపుల్ని, ముడ్డిమింద సైగల్ని బాగ పరీచ్చలు సేసి, దళ్లాళి గాళ్లని పిల్సి యాపారము మొదలుపెట్నంట. అంత సేపటికి ఆపక్కలో ఊడుగుసెట్టుకింద ఒగ జుట్టుస్వామి బుర్రంతా ఈబూతి దిద్దుకోని మంత్రాలు సదువుకొంటా కండ్లు మూసుకోని శాస్త్రం సెప్పుతావున్నెంట.
    “ఈ యాడాది దిగువ సీమలో వానలు యగేసుకొంటాయి. తట్న ఒగ సినుగ్గూడా పడెల్లేదు”అని. ఆ మాట్లిన్న రైతుకు బయం సుట్టుకొన్నంట. తెచ్చిన దుడ్లంతా కర్చుపెట్టేకి దయిర్యం సాల్లేదంట.
    అందుకే నూర్రూపాయల్ని అట్లేమిగిలిచ్చుకోని ఇన్నూర్రూపాయల్కి ఎద్దులు కొన్నంట. అది ఎండిరూకల కాలమంట!! దుడ్లని “వొల్లం”లో పేర్సుకోని(నులకల్తో కాని,గట్టి బట్టతో కానీ అరచేతి వెడల్పు-వడిసెల ఆకారంలో– మూడడుగుల పొడవుతో ఉండే పట్టీవంటిది. దాన్లో నాణ్యాలనుంచి నడుముకు చుట్టుకొని, దానిమీద పంచె కట్టుకొనే వారు) నడుముకు సుట్టుకోని వూరికి యల్లబార్నంట.
    కంకర రోడ్లో బిరిబిర్న నడిపిస్తే గిట్టలకి కొట్టిండే నాడాలు సమిసి మెతువు కాళ్లు(గిట్టలరిగి రక్తం కారడం) పడతావని మెల్లిగా నడుస్తావున్నంట. ఆయప్ప జతలో వొళ్లు ముందరయిపాయిరంట. సూస్తావున్నట్లే మబ్బయిపాయనంట. ఈడొస్తుందూరు,ఆడొస్తుంది అని ముందర సూసుకొంటా పోతా వుండాడంట గానీ యాడా సన్న దీపంగూడా కనిపించలేదంట.
    కండ్లు సించుకొన్నాగూడా కనిపించుకుండా వుండే కారు సీకటంట! సుట్టురా మర్రిమాన్లూ, ఇప్పిమాన్లూ దెయ్యాలమాదిరీ కనిపిస్తా వుండివంట. ఆ సెట్టుల్లో నల్ల మిడతలు(కీచురాళ్లు) జిర్ర్ అని అరుస్తావుండివంట. దావపక్క గుంతల్లో సేరుకోని కప్పల్నక్కలు గొళో అని కూస్తావుండివంట. అంతసేపటికి ఒగ దొంగనాకొడుకు అడ్డమొచ్చి “ఏయ్! ఆడ నిలబడ్రా” అని అర్సినంట. ఎద్దులాయప్ప ఇనపిచ్చుకోలేదంట. దొంగోడు నాలుగడుగులు ముందరికొచ్చి, అంగీ కాలరుపట్టుకోని నిలేసి “దుడ్లు యాడుండివో బయటికి తియ్యరా” అన్నెంట. అపుడు ఈయప్పకి కోపమొచ్చి బుజం మిందుండే వార్ల శలకోలా తీసి ఒగటి అంటిచ్చినంట.
    ఆ ఏటు సురుక్కున తగుల్తూనే దొంగోడు నడ్డిలో ఇరికిచ్చుకోనుండే కొస్సిగా వుండే కత్తి తీసి ఎద్దులాయప్పాయ్ప కడుపులోకి కసుక్కున పొడిసినంట. ఆయప్ప “అయ్యో” అని ఒర్లుకొంటా నెట్తుతప్పి కిందకి పడిపాయనంట.
    అపుడు సూడన్నా నా సామిరంగా తమపాట్న తాము మూగ బసవణ్ణల మాదిరీ నడుస్తావున్న ఎద్దులు తోక తొక్కిన నాగుబాము మాదిరీ సర్ర్ న ఎనిక్కి తిరుక్కొన్నంట. కొమ్మల్తో వాన్ని మెలేసి పర్ర్ న సించేకి పాయనంట. సివంగిలు మాదిరీ ఎద్దులు మిందకొస్తూనే పరిగెత్తి పొయ్యి వాడు బాటపక్కలో వుండే సెట్టెక్కినంట.
    అంత సేపటికి ఇంగొగ దొంగొచ్చి  కిందపడిండే రైతు దుడ్లని ఎదికేది మొదలు పెట్నంట. ఒగెద్దు వాన్ని సూసి లగెత్తుకొచ్చి దూరము తరిమేసినంట. ఆతాకి ఇంగొగురు రాకుండా ఈనిన సిరుతపులిమాదిరీ కావిలి కాస్తా నిల్సిపాయనంట.
   సెట్లో ఎక్కిన దొంగని కిందికి దిగనీకుండా ముందరి కాళ్లతో నేలని గీరుకొంటా, కొమ్మల్తో బుడాన్ని(మొదల్ను)పొడుసుకొంటా తెల్లారేదంకా వుండిపాయనంట.
   ఎలుగయితూనే అది పోలీసోళ్లకి తెల్సి, రైతును ఆస్పత్రికి తీసుకపొయ్యి  బతికిచ్చిరంట!!సెట్లొ దాక్కోవుండే దొంగని జయిలుకేసి, ఎద్దులకి బంగారి కొమ్ముకుప్పల బోమానుముగా ఇచ్చిరంట!!
      ****                  ***                ***               ***
   బాటసార్లకీ, యాత్రీకుల్కీసాయం సేస్తే దానాలుసేస్తే దండిగా పుణ్యమొస్తుంది అని గుడ్డిగా నమ్మిన కాలమది!! అయితే ఆపుణ్యం పలాలేవీ మా పల్లిజనాలకి అందినట్ల రుజువులుమాత్రం యాడాలేవు!!
    వానలు ఏటిచ్చె. బాయిలు ఎండిపాయ. బోరింగులేసి బూమమ్మతల్లి పాతాళములో దాసుకోనుండే నీటి కణాల్నంతా తోడి పారేసిరి. టాట్టర్లొచ్చి ఎద్దుజాతిని దుంపనాశనం సేశ. జనాలంతా అచ్చరాలు నేర్సిరి. బతుకులు సదివేది మర్సిపాయిరి. పైర్లు నాటేది మర్సి సెరువులూ,కుంటలూ,ఏర్లూ,వాగులూ ఏకం సేసి ప్లాట్లు గీసి రాళ్లు నాటేది నేర్సిరి.
     ఇపుడు మాపల్లె లేదు. పేరుమాత్రమే వుంది. ముందరపుట్టిన సెవులకన్నా యనకపుట్టిన కొమ్ములు పెద్దవి అన్నట్ల, గువ్వనీ, గుడ్లనీ, గూటినీ దాసరిపాము(కొండచిలువ) మింగేసినట్ల నిన్నా మొన్నా నోట్ల కట్టల్తో  కండ్లు తెర్సిన హిందూపురమనే రంకుది పచ్చగా వున్న మాఊర్ని దిగమింగేసింది.
   ఇపుడు మా జనాల సేతుల్లో యర్రనోట్లు పెళపెళా!! మాటల్లో దుడ్లు గలగలా!!
   పంటల్ని పాడెకెక్కిచ్చి నోట్లని నెత్తికెక్కిచ్చుకోని బతికే దుర్మార్గం కాలము  ఇట్లే యన్నాళ్లుంటుందో సూడల్ల!!??
***

స్లీమన్ కథ: అతను తవ్విన దంతా బంగారం

 స్లీమన్ జీవితధారావాహిక

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మనకు వాల్మీకి, వ్యాసుడు ఎలాగో పాశ్చాత్యులకు హోమర్ అలాగ!

మనం… కనీసం మనలో అనేకమందిమి… రామాయణ, మహాభారత కథలను వింటూ, చదువుతూ, చూస్తూ, నెమరువేసుకుంటూ పెరుగుతాం. వాటిలోని పాత్రలు మన కుటుంబసభ్యులంత దగ్గరైపోతాయి. మనమే కాదు, ప్రతి దేశమూ, ప్రతి జాతీ తనకు చెందిన పురాగాథల వారసత్వాన్ని ఉగ్గుపాలతోపాటు అందుకుంటూనే పెరుగుతుంది. పాశ్చాత్యుల విషయానికి వస్తే, ఇలియడ్, ఒడిస్సేలు వారి ‘రామాయణ, భారతా’లు.

సంగతేమిటంటే, జర్మనీలో పుట్టిన ఓ కుర్రాడికి అప్పుడప్పుడే ఊహ వికసిస్తున్న వయసులో వాళ్ళ నాన్న హోమర్ ను పరిచయం చేశాడు. అప్పటినుంచీ హోమర్ ఆ అబ్బాయి హృదయస్పందనలో భాగమైపోయాడు. ఆ తర్వాత అతను తన జీవితమంతా హోమర్ తోనూ; అతని ఇలియడ్, ఒడిస్సేలతోనూ సహజీవనం చేశాడు.

అతని పేరు హైన్ రిచ్ స్లీమన్!

sliiman

ఇలియడ్ కథాస్థలి అయిన ట్రాయ్ లో, మైసీనియాలో తవ్వకాలు జరిపించి పురాచరిత్ర తాలూకు అద్భుత నిధి నిక్షేపాలను వెలికి తీసిన వ్యక్తిగా స్లీమన్(1822-1890) ప్రపంచప్రసిద్ధుడు. విచిత్రమైన మలుపులతో గొప్ప నాటకీయతను పండిస్తూ సాగిన అతని జీవితం కూడా అంతే అద్భుతం. ఆపైన అతని వ్యక్తిత్వంలోనూ, వృత్తిప్రవృత్తులలోనూ ఊహకందని  వైరుధ్యాలు. అవన్నీ కలసి ఒక ఆసక్తికరమైన ఒక ‘టైపు’గా కూడా అతణ్ణి మనకు పరిచయం చేస్తాయి.

***

రెండేళ్లపాటు ధారావాహికంగా సాగి రెండు వారాలు విరామం తీసుకున్న ‘పురా’గమనం కాలమ్ లో ముందు అనుకున్న అజెండాను పూర్తి చేయకుండానే మధ్యలో ఈ స్లీమన్ ముచ్చటేమిటనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాను. ఇప్పటికే మీకు అర్థమయ్యుంటుంది, ‘పురా’గమనం ఒక సుదీర్ఘయాత్ర.  వ్యక్తిగత కారణాలు అడ్డు రాకపోతే ఇంకో రెండేళ్ళు… ఇంకా అంతకంటె ఎక్కువ కాలమే కొనసాగగలిగిన సరుకు అందులో ఉంది. అయితే ఇది ఎలాగూ సుదీర్ఘయాత్ర కనుక స్లీమన్ అనే మజిలీ దగ్గర కొన్ని వారాలు ఆగితే ఎలా ఉంటుంది?!

quote

***

స్లీమన్ జీవితగాథ ‘పురా’గమనం శీర్షికలో ఒదిగిపోతుందన్న నమ్మకం కూడా ఈ కోరికకు ఒక కారణం. ఒక పక్క హోమర్ ను వింటూ, ఇంకో పక్క తన ఊళ్ళోని చారిత్రక శిథిలాల మధ్య తిరుగుతూ, వాటి గురించిన అద్భుతత్వ కథనాలకు ఆసక్తిగా చెవి యొగ్గుతూ బాల్యాన్ని గడిపాడు స్లీమన్.  ఇలియడ్, ఒడిస్సే లను కేవలం పురాణంగానో, ఇతిహాసంగానో కాకుండా; చరిత్రగా భావించుకోవడం ప్రారంభించాడు. ఆ చరిత్రను తవ్వి తీయాలని కలలు కన్నాడు. చివరికి ఆ కలల్ని నిజం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు.

excavations at troy

రామాయణ, మహాభారతాలలో పేర్కొన్న ప్రదేశాలలో తవ్వకాలు జరిపించి;  వాటిలోని పాత్రలు ఉపయోగించిన ఆయుధాలు, ధరించిన నగానట్రా వగైరాలను వెలికి తీసినప్పుడూ; నేటి భౌగోళిక పటం పై ఆ ప్రదేశాలను గుర్తించినప్పుడూ అది మనకు ఎంత అద్భుతంగా తోస్తుంది? స్లీమన్ అలాంటి అద్భుతత్వాన్నే అనుభవించాడు. ఇతరులను అనుభవింపజేశాడు.

“గతం తాలూకు అవశేషాలను తవ్వి తీయడాన్ని మించి మన జీవితాలలో సంతోషాన్ని నింపగలిగింది మరొకటి లే” దంటాడు స్లీమన్. ఇలా అనడం విపరీతంగా ధ్వనించే మాట నిజమే. అయితే అతని జీవితగాథలోకి వెడుతున్న కొద్దీ ఈ మాట పురాచరిత్రతో అతని తాదాత్మ్యాన్ని చెబుతుంది.  ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో ఒక అద్భుతంగా దర్శించే ఒక పసిమనసునూ బయటపెడుతుంది.

అలాంటి పసిమనసు కలిగిన వారందరినీ అతని జీవితగాథ ఆకట్టుకుంటుంది!

***

THE GOLD OF TROY  పేరుతో ROBERT PAYNE  చేసిన రచనే ఆ విశ్వాసానికి ప్రేరణ. ఆ రచన ఆధారంగా  చెప్పబోయే స్లీమన్ జీవితగాథతో అతిత్వరలోనే ‘పురా’గమనం తిరిగి కొనసాగుతుంది…

 

 

 

 

 

 

కిటికీ వెనక నిశ్శబ్దం

గుల్జార్  కవిత్వం చదువుతున్నప్పుడు నేనెప్పుడూ వొక తోటని ఊహించుకుంటాను.

వేల వర్ణాల పూలతో మాట్లాడుకుంటూ వుంటాను. అనేక రకాల ఆకుల చెక్కిళ్ళని  నా చూపులతో తాకుతూ వుంటాను. పూల మధ్య దూరంలో విస్తరించే పరిమళాన్ని కొలుస్తూ వుంటాను. ఈ తోటలో నడుస్తూ వున్నప్పుడు నా భాష మారిపోతుంది. లోకమంతా వొకే  ప్రతీకగా మారిపోయి కనిపిస్తుంది.

ఎన్ని పూలు..ఎన్ని ఆకులు…ఎన్ని పరిమళాలు…వొకటి ఇంకో దాన్ని అనుకరించనే అనుకరించదు. ప్రతి పూవూ, ఆకూ తనదైన లోకాన్ని తన చుట్టూరా ఆవిష్కరిస్తూ పరిమళిస్తుంది. 

గుల్జార్ అంటే తోట. కాని, గుల్జార్ కవిత్వమంతా ఈ తోటకి పర్యాయ పదమే!

వొక సారి ఈ తోటలోకి అడుగు పెట్టాక వెనక్కి తిరిగి వెళ్లాలని అనిపించదు. వెళ్ళినా, ఈ  తోట మన కలలనీ, వాస్తవాల్నీ వదిలి వెళ్ళదు. ఈ తోటలోని వొక్కో పూవునీ తనదైన ప్రత్యేకమైన ఎంపికతో ఇక నించి వారం వారం మన ముందు వుంచబోతున్నారు నిషిగంధ

nishigandha

నిషిగంధ

satya

సత్యా సూఫీ

నిషిగంధ ఇక్కడ కేవలం అనువాదకురాలు మాత్రమే కాదు. గుల్జార్ కవిత్వంతో ఆమెకేదో ఆత్మీయ బంధం వుంది. ఇద్దరిలోనూ వొకే గంధమేదో వుంది. అందుకే, ఈ అనువాదాల్లో రెండు ఆత్మలు వొకే భాషని వెతుక్కుంటున్న నిశ్శబ్దం వినిపిస్తుంది.

గుల్జార్ తేలిక మాటలే ఉపయోగిస్తాడు. అందరికీ తెలిసిన ప్రతీకలే వాడతాడు. సందర్భాలు కూడా మనకి తెలిసినవే కదా అనిపిస్తాడు. కాని, వొక తెలియని మార్మికతని ఆ సందర్భంలోకి లాక్కొని వస్తాడు. మనకి బాగా తెలిసిన లోకమే తెలియనట్టు వుంటుంది అతని భాషలో-  అలాంటి తెలిసీ తెలియని ఆ సున్నితత్వాన్ని నిషిగంధ ఈ అనువాదాల్లోకి చాలా సహజంగా తీసుకువచ్చారు.

అనువాదాలు వొక ఎత్తు అయితే, ఈ రెండీటికి తగ్గట్టుగా ఆ కవిత్వంలోని నైరూప్యతా, ఆప్యాయతా అందుకొని వాటిని రేఖల్లో ఎవరు బంధించగలరా అని ఆలోచిస్తున్నప్పుడు  వెంటనే తట్టిన పేరు సత్యా సూఫీ. కవితని చదువుకుంటూ దానికి రేఖానువాదం చేయడం అంత తేలికేమీ కాదు. ప్రత్యేకమైన తన నలుపూ తెలుపు వర్ణ ఛాయలతో  గుల్జార్ నీ, నిషిగంధనీ వొకే రేఖ మీదికి తీసుకువచ్చిన అరుదైన చిత్రకారిణి సత్యా.

– అఫ్సర్ 

~~

కిటికీ వెనక నిశ్శబ్దం

 

కిటికీలన్నీ మూసి ఉన్నాయి

గోడల హృదయాలూ గడ్డకట్టుకున్నాయి

తలుపులన్నీ వెనక్కి తిరిగి నించున్నాయి

ఆ బల్లా, కుర్చీ అన్నీ

నిశ్శబ్దపు తునకల్లా!

ఆ రోజుకి సంబంధించిన శబ్దాలన్నీ

నేల కింద సమాధి అయ్యాయి.

చుట్టూ అన్నిటికీ తాళాలు..

ప్రతి తాళం మీదా ఒక కరకు నిశ్శబ్దం!

gulzar1

ఒకే ఒక్క శబ్దం నాకు దొరికితే..

నీ స్వరం తాలూకు శబ్దం..

ఈ రాత్రి రక్షించబడుతుంది!

ఇక కలసి మనిద్దరం

ఈ రాత్రిని రక్షించవచ్చు!

   *****

                                                 

దేశమంటే మట్టికాదు, మోపులు

కందుకూరి రమేష్ బాబు 

 

Kandukuri Rameshమనం నివసించే చోటు గురించి ఒకసారి ఆలోచించాలి. మనం బస్సెక్కే చోటు గురించి కూడా.
అక్కడెంతో యాక్టివిటీ వుంటుంది. ప్రయాణీకులమే. కానీ, వేచి చూడటమూ ఉంటుంది.

మనతోపాటు పలుగూ పారా ఉంటే అవి. మనం తీసుకెళ్లి అమ్మే చీపుర్లు వుంటే అవి. అవి కూడా ఎదిరిచూస్తూ ఉంటాయి.

అవీ మనతో పాటు నిలబడతాయనే చెప్పడం. చూపడం.

తొలిసారిగా మనిషెత్తుగా చీపుర్లు అలా ఒక కట్టగా కట్టి నిలబెట్టడం. ఒక మోపుగా పెట్టి పక్కన ముచ్చట్లలో లీనమవడం. అట్లా వాళ్లందరూ బస్సు రాక కోసం ఎదిరి చూడటం. అంతానూ చిత్రంగానే ఉండింది. అయితే, చూడగా చూడగా యధాలాపంగా మారిపోతాం. కొన్ని చూపులు అలవాటై ఆ తర్వాత ఆశ్చర్యం అదృశ్యమే అవుతుంది. అలా కాకుండా చేసేదే కళ.

తొలిసారిగా మనిషెత్తుగా ఆ చీపుర్లని చూసింతర్వాత వాటి అందం నెమలి పించంలా విరుస్తూ ఉండగా
హృదయం పుష్ఫమే అయింది. ఇక అప్పట్నుంచి చీపుర్లను చూస్తే అవి వికసించిన మట్టి మనుషల్లా, హిమాలయాలంత ఎత్తుగా అనిపించడం తత్ఫలితంగా ఒక పరిమళ భరిత సౌందర్యారాధన మొదలైంది. జీవితం ఒక్కపరి ఎదిగి ముగ్ధులను చేయడం మొదలెట్టింది.

ఆ మనుషులు. వాళ్ల వెంట పిల్లా జెల్లా. ఆ మోపులపై తువ్వాలలు. అంతానూ ఒక పరిసరాల విజ్ఞానం ఒకటి లీలగా మాయగా కమ్ముకుని ప్రతి వృత్తీ,వ్యాపకం చుట్టూ ఉండే జీవకళ అంతానూ మనోహరంగా గోచరించడం మొదలైంది. వాళ్లపట్ల గౌరవాభిమానాలు మున్నెన్నడూ లేనంతగా పెరిగి ప్రతి ఇంట్లో ఒక మూల నక్కి వుండే చీపురు  ఆత్మగౌరవంతో తలెత్తుకునేది ఇక్కడా అని తెలిసి అదొక దర్శనమే అయింది.

ఎవరి సన్నిధిలో వస్తువు తయారవుతుందో అది ఖార్ఖానా. అక్కడ ఆ వస్తువు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో నిలబడుతుందనీ అవగతం అయింది. ఎప్పుడైతే అది ఒకరి సొంతం అయిందా ఇక అది ఏదైనా చీపురే అయి తన పాత్ర వైభవం కోల్పోతుందనీ అర్థమైంది.

అందుకే స్వచ్ఛభారతం, స్వచ్ఛ హైదరాబాద్ వంటి పేర్లతో కూడిన యాక్టివిటీ అంటే చిరాకు. చీపురు పుల్లంత గౌరవం కూడా ఉండదు. నాకు మోపులు కావాలి. జీవన సంపుటులు కావాలి. అందుకే గురజాడ అన్నట్లు దేశమంటే మట్టికన్నా మనుషులని గుర్తుకు వస్తుంది. ఆ మనుషులను వాళ్ల వైభవోపేతమైన సృజనతో కలిపి చూడకపోతే వాళ్లు వెలవెల బోతారు. ఒకవేళ వాళ్లనిలా చూడటం రాకపోతే మనం నిజంగా పారిశుధ్య కార్మికులం అయి మనల్ని మనం ఊడ్చుకోవాలి. శుభ్రం చేసుకోవాలి. నిజం.

సరే.
నాకైతే ఇవి చీపుర్లే. వాళ్లు మోపులే.
వీటిని, వాళ్లనూ చూశాక ఇక నెమలి పింఛం నన్ను ఎన్నడూ లోబర్చుకోదేమో అని ఒక ఆనందం.

అన్నట్టు, ఈ నెలవంకలను, నెమలీకలను, వీళ్లంతా ఇట్లా మోపుకట్టిన ఆ రాశులను, అలా అలవోకగా తలపై వుంచుకుని వారు దబదబా బస్సెక్కి మళ్లీ వాటిని బస్సులో నిలపడమూ చూడాలి. అదొక చిత్రం. తర్వాత వాళ్లు ఈ నలభై నాలుగో నంబర్ బస్టాప్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాక అక్కడ అందరూ దిగుతారు. ఈసారి ఎవరి దారి వారిదే. అలా విడిపోవడమూ ఒక చిత్రం. ఒకటి కాదు, ఎన్నో చిత్రాలు. ఆ తర్వాతా చూడాలి. అదొక గొప్ప చిత్రం. మోపులోంచి ఒక్కొక్కటి అమ్మతూ వుంటే వాళ్ల తలభారం తగ్గుతూ ఉంటే అదొక అందమైన చిత్రం. దిగదుడుపు చిత్రం. చివరాఖరికి, ఒక్కో తల ఒక్క మోపుతో బయలెల్లి సాయంత్రానికల్లా కాళీగా వస్తుంటే తప్పక చూడాలి. అదొక అద్వితీయ చిత్రం.

ఇట్లా దృశ్యాదృశ్యంలో జీవితాలు మహోన్నతంగా ఆవిష్కారం అవుతూ ఉంటై. యధావిధిగా సద్దుమణిగి విశ్రాంతి తీసుకుంటాయి. మళ్లీ తెల్లవారుతుంది. బస్టాపు పరిసరాల్లో మళ్లీ చెట్లు మొలిచినట్లు, చీపురు కట్టలు. వాటి పక్కన ముచ్చట్లు. బస్సుకోసం మళ్లీ వేచి చూపులు.

భారతదేశంలో సామాన్యుల చిత్రయాత్ర ముగియదు.
సశేషం.

*

చిన్నికలలని దాచి…చిట్టి పడవలో…

గరిమెళ్ళ నారాయణ 

 

Photo Narayana Garimellaపక్షిని ప్రేమించడం అంటే, దానికున్న స్వేచ్చ తో సహా ఆ పక్షిని ప్రేమించడం. పంజరం లో బంధించో, రెక్కలు నిలువరించో ఆ విహంగ జీవికి ఎన్ని భోగ భాగ్యాలు కల్పించినా అది ప్రేమ కాదు, కాలేదు. ముమ్మాటికీ స్వార్ధమే అవుతుంది.

జీవులను వాటి స్వేచ్చతో సహా ప్రేమించడం తెలిసిన వాళ్ళకు, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతల గురించి వేరే చెప్పనవసరంలేదు. ప్రతి బంధాన్ని పరిపూర్ణంగా చూడగలరు, ఆశించగలరు. ఇంద్ర-ధనుస్సులోని రంగులను తమవిగా చేసుకుని తిరుగాడే సీతాకోక చిలుకలను సైతం అంతే పరిపూర్ణంగా దర్శించగలరు. సహజ రంగులూ, రంగులలో కాంతులీనే సహజ మెరుపుల తో సహా కలలో కూడా వారి  సీతాకోక చిలుకల రంగులు మాయవు.

స్వేచ్చను గౌరవించడం తెలిసిన ఎవ్వరైనా చదవదగిన ఇరవై ఐదు కవితల సమాహారం మమత వ్రాసిన రంగులు మాయని సీతాకోక చిలుక’ కవితా సంపుటి. గుండె ఆనందంతో ఉప్పొంగినప్పుడో,  బాధతో గుక్కపట్టినప్పుడో తప్ప కవిత్వాన్ని అల్లలేనని నిజాయితీగా చెప్పిన మమత స్వగతంగా ఆవిష్కరించిన పెరటిలోని అపురూపమైన పూల మొక్కల లాంటి కవితలు ఇందులో ఉన్నాయి.

‘స్వేచ్చగా ఎగరవే చిలుకా’ అని ఒక అందమైన ఉదయానికి దారితీస్తూ రోజు ప్రయాణం మొదలౌతుంది. నీడలలో నడుస్తూ, ట్రాఫిక్ లో దూసుకుపోతూ, దారిలోని మరో మోనాలిసాల కృత్రిమ నవ్వులను దర్శించి నిర్లిప్తంగా నవ్వుకుంటూ, పదిలంగా ఇల్లు చేరడం తో ఆ ప్రయాణం లో సగ భాగం పూర్తవుతుంది. అటు తరువాత ఎవరి కోసమో ఎదురు చూసి, నిరీక్షణల నిరాశతో ఎడబాటునొకదాన్ని ఎదుర్కొని, సాయం సంధ్య కు వీడ్కోలు చెప్పి, మంచు పూల వానలో తడిసి ముద్దవ్వడం తో ప్రయాణం లో రాత్రి మొదలవుతుంది. నిద్రలో ఒక దిగులు స్వప్నాన్ని విదిలించుకుని, కొన్ని తడి ఆరిన ఇసుక రేణువులని దులుపుకుని, పక్కనే పడుకున్న పసి పాపను హత్తుకుని, ఒక దివ్య స్వప్నం గుండా మళ్ళీ స్వేచ్చగా అందమైన ఉదయానికి చేరుకునే సరికి పరిపూర్ణమయ్యే ఒక ప్రయాణం ఈ కవితల పుస్తకం. ఆ ప్రయాణం నిండా పూలు, మడుగులూ, శంఖాలు, గవ్వలూ, గువ్వలూ, తూనీగలు, సీతాకోకలు ఒక పక్క నడయాడుతూ ఉంటాయి. అంతర్లీనంగా ఒక దుఃఖ జీర కూడా వదలని ప్రేమ బాంధవ్యం లా వెన్నంటి వస్తుంది.

నీ ప్రయాణం అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవడమే. స్వ-అవగాహన లోనే, నువ్వు కోరుకుంటున్న ‘స్వేచ్చ’ కూడా తెలిసొస్తుంది.

నీవు నిర్మించుకున్న ఆశలసౌధం

పేకముక్కలతో కట్టినది కాదని

నీలో రగుల్తున్న లావా

పినటబు బురద కాదని

తెలుసుకున్న వేళ నీకు నీవే అర్ధమౌతావు

పేక మేడ కాదని’ అని క్లుప్తంగా అనెయ్యకుండా, ‘పేకముక్కలతో కట్టినది కాదని’వివరంగా అనడం వల్లే ఆశలసౌధానికి (బలహీనమైన దానితో పోలిక లేదనడం లో) బలం ఇవ్వబడుతుంది. అలాగే లోపలున్నది లావా అని తెలిసినప్పుడు, పైపైన పేరుకున్నట్టనిపించే బురద హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మౌంట్ పినటబు అనే

అగ్ని పర్వతం 1991 లో బద్దలైనప్పుడు మొదట చిమ్మిన బురదని రెండు పదాలతో ప్రస్తావించడం కవితా ప్రవాహం లో అలవోకగా వచ్చినదని అర్ధమై సరదాగా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. పద చిత్రాలను ఎన్నుకోవడమే కాదు, వాటిని అలవోకగా అల్లుకుంటూ పోవడమూ కళే.

పంజరంలోని చిలుకా

ఇక పాడవే ఒక స్వేచ్చా గీతికా!

అని అనుకున్నాక,  ‘స్వేచ్చ’నుండి మరొక కవిత ‘అందమైన ఉదయం’ లోకి ప్రయాణం సాగుతుంది. కాస్త తడిసినా చెరగని రెక్కల మెరుపులతో ఒక సీతాకోక చిలుక కు కొత్త జీవితం రూపం లో అందమైన ఉదయం సాక్షాత్కారమౌతుంది. ఆ సీతాకోక తన పాప చేతిలో రెక్కలు ఆరబెట్టుకోవడంతో తల్లీ కూతుర్లిద్దరికీ కూడా ఆ ఉదయం మధురమౌతుంది.

ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం కూడా మధురం గానే ఉంటుంది. ‘తొలిసంధ్య’ లో అవతలి అంచుకి చేరుకునే ఒక అసలైన ఆరంభాన్ని అందులోని మాధుర్యాన్ని ఇలా చూడవచ్చును.

ఆమె కల అవతలి అంచు కి

నన్ను లాక్కెళుతోంది

ఉప్పొంగుతున్న ఆశలకు అచ్చెరువొందుతూ ఆమెకు చేయి అందించి ప్రయాణమయ్యాక ….

తామరపూలు నిండిన మడుగువైపు ఎగిరిపోయాం

ఆమె తో అంత అందమైన విహారాన్ని తలపోయటాన్ని ఇంకా ఆస్వాదిస్తూ ఉండగానే

తామరతూళ్ళ నడుమ కనుమరుగవుతూ

చివరొక్కసారి అరిచిందామె

ఈసారి స్పష్టంగా

ఇదిగో! ఇదీ అసలైన ఆరంభం!”

కవయిత్రి చేయి అందుకుని ఆనందించిన సాయంకాలం నాటి నెచ్చెలి సూర్యుడే అని తెలిశాక, ఆ ఎడబాటు తాత్కాలికమే అనిపించడమే కాదు…అదే అసలు సిసలు ఆరంభం అనీ అనిపిస్తుంది. సూర్యుడి లో నెచ్చెలి ని చూడటం కుదరదనుకుంటే నెచ్చెలినే సూర్యుడిలా చూసుకున్నా ఈ అనుభవం ఇలాగే పరవళ్ళు తొక్కుతుంది.

‘ఎడబాటు అన్ని సార్లూ చక్కని ఆరంభమే అవుతుందా?’ అనే ప్రశ్న తలెత్తితే ‘ ఒకరు – రెండు జ్ఞాపకాలు’ చదవాలి.

అందులోని మొదటి జ్ఞాపకం ఇలా ఉంటుంది.

ఆనాడు రోడ్డు దాటుతూ విడిపోయినప్పుడు

నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నావు నువ్వు

భలే వీడిపోయి కలుసుకున్నాం కదా?” అని

మళ్ళెప్పుడు రోడ్డూ దాటుతున్నా

మలుపులో నీ నీడ నా వైపు చూసి నవ్వుతుంది

ఇప్పటి వరకు ఎన్ని స్నేహాలు వచ్చి వెళ్ళినా

నీ అల్లరి నవ్వు మాసిపోలేదిప్పటికీ

ఒక మనిషిని ప్రేమిస్తే…ఆ మనిషితో ముడిపడిన కొన్ని సందర్భాలు అనాలోచితంగా గుర్తుకొచ్చి కలగలసిన కొన్ని ప్రేమైక ఆలోచనలను ఇలాగే కొత్త పుంతలు తొక్కిస్తాయి.

ఈ జ్ఞాపకంలోని ప్రేమను ‘ఆహా’ అని నెమరు వేస్తూ, రెండో జ్ఞాపకం లోకి ప్రయాణిస్తే….

అప్పుడప్పుడు నువ్వు నన్ను పిలిచినట్లయ్

గడిచిపోయిన జాడలవెంట వెనక్కి రావాలని

మనస్సు ఉక్కిరిబిక్కిరవుతుంది

కానీ, ఆఖరిసారి నీ కళ్ళల్లో నేను వెదికిన ప్రేమ

ఇప్పటికీ కనిపించదు మసకగానైనా

రెండు జ్ఞాపకాలనూ పూర్తిగా చదివాక ‘గొప్పగా ప్రేమించిన కుక్కపిల్లను పోగొట్టుకున్న పసిపాప’ వంటి వ్యక్తి కవిత వ్రాసిన మమతలో కనిపించి,అసంకల్పితంగా కళ్ళు చెమరుస్తాయి. నూరేళ్ళు మాత్రమే అని లిఖించిన మానవ జీవితాలకి, ‘ప్రేమించిన జీవుల ఎడబాటు’అనే కష్టం మాత్రం ఎందుకు? అనే ప్రశ్న తొలచుకొస్తుంది. మళ్ళీ తిరిగిరాదని తెలిసిన ఎడబాటు బాధపెడితే…తిరిగొచ్చే తొలిసంధ్య లాంటి ఎడబాటు మదిని పూయిస్తుంది.

దూరమైన తన తండ్రి  ఎడబాటు ను తలపోస్తూ ఒక పసిపాప అతనికి తన సందేశాన్ని పంపినప్పటిది. తెలిసీ తెలియని ఆ పసి వయసు నుండి చూసినప్పుడు (ఎడబాటు అనే ఊహ కూడా కఠినంగానే)  అనిపిస్తుంది. అది వాస్తవమే ఐనప్పుడు కూడా ఆ కాఠిన్యం ఇలా మృదువుగా ప్రేమగా జాలు వారడం ఎంత పరిణితో కదా అనిపించక మానదు. కల్మషం లేని పసి ఆశ ని ఇంతకన్నా నిరాడంబరంగా ఆవిష్కరించడం సాధ్యం కాదేమో!?

నిన్న రాత్రి

వెన్నెల్లో దొరికిన శంఖంలో

కొన్నంటే కొన్ని నా చిన్నికలలని దాచి

చల్లగా కాళ్ళను ముద్దాడిన

చిట్టి అల ఒడిలో వదిలాను

అవి నిన్ను చేరుకోవాలని

‘సముద్రపు ఒడ్డు మీద శంఖాలు, గవ్వలు ఏరుకుంటూ చల్లగా స్పృశించే నీటి అలల తాకిడిలో తుళ్ళుతూ తూలుతూ అనందించడం’ అనేది పెద్దలు సైతం పసివాళ్ళలా చేసేది. కానీ ఈ కవితలో పసిపిల్ల అవన్నీ వదలుకుని, దాటుకుని మరీ తండ్రిని తలపోస్తుంది. తను కోల్పోతున్న తండ్రికి, అతని ప్రేమకి ఒక సందేశాన్ని పంపిస్తుంది. పాషాణుడైతే తప్ప, ఆ తండ్రి అంత మృదు మధురమైన పసి ప్రేమని కోల్పోడు అనిపిస్తుంది.

ఇలాంటి కవితలు చదివినప్పుడే ఎడబాటు గుర్తుకు రాకుండా లేదా తెలియనివ్వకుండా, మనతో పాటూ ఉన్న భార్య (లేదా భర్త) ని, పిల్లలనీ వారితో పాటే అక్కడే అందుబాటులో ఉంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు, లాంటి

వారందరినీ ఒకసారి మనసారా చూసుకుని హత్తుకోవాలనిపిస్తుంది. ఒకరు కోల్పోయిన సందర్భం తాత్కాలికమే ఐనా అది వారికి అది కల్గించిన భావావేశం ఎంతటిదో మనకి తెలిశాక, అలాంటి సందర్భం ఆ క్షణంలో మనకి లేనందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.

చిన్నికలలని దాచి చిట్టి అల ఒడిలో వదలడం చిన్నారి మాటగా చెప్పక చెప్పడం అన్నమాట.

కవిత్వమంటే వ్యక్తిగతంగా చూసేది లేదా అనుభవించేదే. పాఠకుడు భావాన్ని గ్రహించే విధానం సార్వజనీనతని నిర్దేశిస్తుంది. ‘మరో మోనాలిసా’ కవిత ఇందుకు మంచి ఉదాహరణ. న్యూయార్క్ నగర వీధులలో పొట్ట నిమురుకుంటూ కనిపించిన ఒక మెక్సికన్ యువతి నవ్విన కృత్రిమ నవ్వూ , మన దేశం లోనే మరో చోట తన చేతిలోని చిట్టి చెల్లాయిని సముదాయిస్తూ  మల్లెమాలలు అమ్మి అమ్మకూ నాన్నకూ చేదోడువాదోడుగా కనిపించిన మరొక అలాంటిదే పసి నవ్వూ ముమ్మూర్తులా మరో మోనాలిసాల నవ్వులే అనిపిస్తాయి. అలాంటి నవ్వుల ఆంతర్యం చదవడానికి ప్రత్యేక దృష్టి కావాలి. ఈ నవ్వులెప్పుడూ నిరాశల ధుఖాల్ని దాచేసినందుకు రువ్వబడే భావ ఆవిష్క్రరణలే అనిపిస్తుంది. ఆ నవ్వులను మరచి, నవ నాగరికత ఒకటి తొందరపెడుతోందని ట్రాఫిక్ గుంపు లోకి దూసుకు పోయినా, సహజత్వాన్ని మాయం చేసే యాంత్రికత వెంబడిస్తూనే ఉంటుంది.

స్వచ్చమైన ప్రాణవాయువును కాస్త

పొగచూరిన గాలిలోంచి

వడగట్టుకోవడానికి

మొఖానికి చుట్టేసుకున్న

రంగురంగుల ముసుగుపై

పూలని భ్రమపడి వాలిన

సీతాకోకచిలుకను

చిరాకుగా దులిపేసి

పక్కవాడిని తోసుకుంటూ

దూసుకుపోతూ..

జీవితాన్ని అందులోని వివిధ పార్శ్వాలను నిర్మలంగా, ప్రేమగా, భావా వేశ పూర్వకంగా, వాస్తవంగా అనేక కోణాలలో దర్శించి చూసింది చూసినట్టే కవిత్వం ఆవిష్కరించారు మమత గారు. ఇందులో గోరు వెచ్హని ఉదయాలున్నాయి, సీతాకోకను తడిపేసిన వాన చినుకులున్నాయి. అదే సీతాకోకకు ప్రాణంపోసిన చిట్టి చేతులున్నాయి. దిగులూ, నిరాశ, నిరీక్షణ ,ఎడబాటు, వాటిని ఎదుర్కొని చేసే లావా లాంటి ప్రవాహం అన్నీ ఈ కవిత్వం లో ఉన్నాయి.

జీవితం ఉగాది పచ్చడిలా అన్ని రుచులూ కలిస్తేనే బాగుంటుంది అంటారు. తలవని తలంపుగా ఒక్క రుచి ఎక్కువైనా తక్కువైనా సమతూకం లోపిస్తుంది. అధిరోహనానికి ఆశ, శక్తీ, ఉత్సాహం అన్నీ ఉంటాయి. కానీ, మనం ఎంత ఇచ్చినా కొంచెం కూడా వెనక్కి ఇవ్వ బడని ప్రేమ ఒకటి సదా నిరుత్సాహపరచి పాతాళం లోకి లాగెయ్యాలనుకుంటూ ఉంటుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకే తప్ప వెనుకకు ప్రయాణించ నివ్వని పట్టుదల ఒకటి భుజం తడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, చుట్టూ ఉన్న సమాజం పై ప్రేమని, బాధ్యతని ఒకే సారి చూపించే కవితలున్నాయి ఇందులో.

 

*

నల్ల దివిటీ 

 తిలక్ బొమ్మరాజు

 

 వొక యేకాంతం పాయలు పాయలుగా చీలి
కొంత అన్వేషణ మొదలు పెడుతుంది
కొన్ని మౌనాలు మాటలుగానూయింకొన్ని మాటలు సంభాషణలుగానూ రూపాంతరం చెందుతాయి

 

నువ్వో నేనో వో ప్రచ్చన్న దిగ్భందంలోనే వుండిపోయినప్పుడు

యిక స్వప్నాలెలా దొర్లుతాయి

కాస్త వర్షమూ మనలో కురవాలి

మరికొంత చినుకుల చప్పుడూ మనమవ్వాలి

 

మన ఆత్మలు దేహపు వంతెనల కింద కొన్నాళ్ళు మగ్గాక యెక్కడ స్థిరపడగలవు

మళ్ళా నీలోనో నాలోనోనేగా వుండిపోవాలి

 

విశ్వరూపానికి ప్రతీకల్లా యెన్నాళ్లు నిలబడి వుండగలం

యిప్పుడో ఆ పిదపో వొకళ్ళలో మరొకళ్ళం యింకిపోవాల్సిందేగా

అస్తిత్వాలు వొక్కటిగా కాస్త మానవత్వాన్నీ తోడుకుంటాంగా

వదిలి వెళ్ళకుండా

 

పయనాలు నీళ్ళలోని ప్రతిబింబాలే మనకెప్పుడూ

వొకరి ముఖంలో యింకొకరం వెన్నెల చిహ్నాల్లా వెలుగుతుంటాం

వెళదాం యిక మరో ప్రాకారంలోకి-

15-tilak

ఎవ్వలకయినా ఆశ సారూ…!

జయశ్రీ నాయుడు 
jayasriరెండు దోసిళ్ళలోకీ చెమ్మగిల్లిన  మట్టిని తీసుకున్నప్పుడు, అందులోని ఇదమిత్థంగా చెప్పలేని సువాసన ఎరుకవుతుంది. అదే నేలలోని ప్రాణ శక్తి. ఆ మట్టిని నిరంతరంగా ప్రేమించే ప్రేమికుడొకడు. అతని ప్రాణాలను ప్రణయకానుకగా అడిగినా ఇచ్చేసే సాహసి – రెండక్షరాల ప్రేమ లాగే అతడి పేరులోనూ రైతు అనే రెండు అక్షరాలే వున్నాయి.  మట్టికి మనసిచ్చిన రైతుకి పచ్చని మొలకలే కాదు మట్టిపొరల్లో దాగున్న నీటి చెలమల్లాంటి కడివెడు దుఃఖాలెన్నో. విత్తిన విత్తుకీ మొలకెత్తే వరకూ బాలారిష్టాలెన్నో. అలాగే పండిన పంట చేతికొచ్చే లోగా మరెన్నో కాలారిష్టాలు. ఒక మహా సముద్రాన్ని పిడికిట పడతాడు ఆ రైతు.
 దుఃఖం అంటే అదీ సామాన్యమైన కన్నీరు కాదు, గుండె లోతుల్లోంచి భోరుమన్న దుఃఖం — బోరు దుఃఖం . నందిని సిధారెడ్ది  రచించిన  — నదిపుట్టువడి కవితా సంకలనం లో మనం చెప్పుకునే రెండో కవిత ఇది. 
 ఆదీ అంతం వుండని సముద్రం లాగే రైతు కష్టాలకు అంతూ పొంతూ వుండదన్న విషయం మన వ్యవసాయ ఆధారిత ఆర్థిక పరిస్థితిని గమనించే ఎవరికైనా అర్థం అయ్యే విషయమే. ఆకాశం కేసి కళ్ళు చికిలించిన వేళ నీటి చుక్క కోసం చాతక పక్షి అవుతాడు. ఆరుగాలం మొదలయ్యే వేళ తెలిసీ మృత్యువుకి ఎదురెళ్ళే వీర సైనికుడిలా తన సర్వ శక్తులూ ఒడ్డి పచ్చదనాన్ని కాపాడుకునే సైనికుడౌతాడు. కష్టాలన్నీ తెలిసీ నేలని నమ్ముకునే రైతుని మించిన సాహసవంతుడున్నాడా?
నేలని చీల్చుకుని వచ్చే పచ్చని మొలకలా మొదలయ్యే కవితా వాక్యం. మనిషి ప్రయత్నాలకూ మానవ స్వభావానికి తల్లివేరు లాంటి మూలకం – ‘ ఆశ’  తో మొదలయ్యె కవితా వాక్యాలు.
ఆశ సారూ
కష్టమో నిష్ఠురమో
బతకాలె గద
మంట్లె దిగినందుకు
పొర్లాడాలె గద
ప్రేమకు వుండే స్వచ్చత నేలతోటీ నీటితోటీ రైతుకు వుండే మమమతని పలికిస్తుందీ కవిత కొనసాగింపు. మనిషి ప్రకృతికి దగ్గరగా మసిలిన రోజుల్లో రైతు నాగలి పట్టి మట్టి పెళ్ళల్ని పెకలించినప్పుడు నేలని ప్రేమతో పలకరించినట్టుండేది. అతడి మనసులో పొంగే ప్రేమకి గంగమ్మ పరుగులెత్తి వచ్చేదంటా ఆ రోజుల్లో.
అప్పు మీద అప్పు
ఆత్మ మీద అప్పు
మారిన కాలం లో మారని కష్టాలు రైతుని నిలవనివ్వవూ, కూర్చోనివ్వవూ. నిరంతరంగా గంగ ప్రవహించాలనే ఆశలో అప్పు మీద అప్పుచేస్తూ, ఆత్మనీ అమ్ముకున్నంత భారాన్ని మోసే రోజులయ్యాయి. భూమిని నమ్ముకున్నా నీటి జాడ తెలియడం లేదు. ఆకలి విశ్వరూపం ముందు రైతూ అతడి కుటుంబమూ దిక్కుతోచని పరిస్థితిలో పడటం అతడి కష్టాలకి పరాకాష్ట.
 
 మన్నుకు నెనరుండె
మనసుకు నెనరుండె
గట్టిగ లగాయించి పిలిస్తె గంగ పలికేది
వెనువెంటనే వర్తమానపు వికృతుల్ని చెప్తూ
ఎవనికెవడు పలకడు
ఒగనికంటె ఒగడెక్కువ -అంటాడు
పాతకీ కొత్తకీ వెనువెంట బొమ్మా బొరుసుల్లాంటి నిజాల్ని పరచడంలో కవి మూలాలు గ్రామీణం అని సహజ స్వభావంగా అమిరిన పదాలే చెబుతాయి.
ఎదుటి వాడి కష్టాలని చులకనగా మాట్లాడే రాజకీయ నాయకులనీ, ఉన్నత తరగతి మేధావి వర్గాన్నీ నైపుణ్యంగా నాలుగు వాక్యాల్లో చెప్పిన తీరు, కవి లోని నిశిత దృష్టికి ఉదాహరణలు గా అనుకోవచ్చు. ఓడిపోతారని తెలిసినా ఓట్లను అడగడం, వస్తాయో రావో తెలియని ఉద్యోగాల కోసం పిల్లల్ని చదివించుకోవడం ఎంత సహజమో – ఆశతో బోర్లు వేసి, నిరాశతో భోరుమనడమూ అంతే మానవ సహజమంటాడు కవి. ఇది రైతుని కవి ఆత్మతో కౌగిలించుకున్న సందర్భమనుకోవచ్చు.
 
పడదని తెలిసి బోర్లెందుకేసుడంటరు
ఓడిపోతరని 
మీరు ఓట్లకు పోకుంటున్నరా
వొస్తయో రావో తెల్వని నౌకర్లకు 
పోరగాండ్లను నల్వకుంటుంటున్నరా
ఎవ్వలకయినా 
ఆశ సారూ – అంటాడు రైతు
కేవలం నీటి కోసం ఆశపడుతూ  ఊట ఊరని బోరుబావుల పరిస్థితికి ఏమీ చెయ్యలేని అసహాయత రైతుది. అతడినే దురాశాపరుడిగా దూషించే ప్రపంచాన్ని చూసి, విరిగిన మనసుతో బ్రతుకు చావుకన్న హీనమయ్యిందనుకుంటాడు. వాళ్ళ మాటలు బల్లాలుగా గుచ్చుతుంటే, రైతుల ఆకలి చావుల్నీ తేలికగా మాట్లాడే వర్గాలని చూసి వెల వెల పోయే దీనత్వం రైతుది.  బంగారం కోసమూ, బంగ్లాల కోసమూ ఆశపడాలన్న లౌక్యం తెలియని అమాయకత్వం  అతడికి.  కేవలం నీటి మీద నెనరు పలకని గంగమ్మని పలికించాలన్న తాపత్రయం, వున్న డబ్బంతా పోసినా పంట చేతికిరాని పరిస్థితి. ఎప్పటి నుంచో కొనసాగుతున్న మన రైతు అసహాయతకి ప్రతీక యీ కవిత.
 
కవితా సంకలం పేరు: నదిపుట్టువడి
కవి: నందిని సిధారెడ్డి
శీర్షిక: బోరు దుఃఖం 
ఆశ సారూ
కష్టమో నిష్ఠురమో
బతకాలె గద
భూమ్మీద పుడ్తిమ్మరి
మంట్లె దిగినందుకు
పొర్లాడాలె గద
బోరు పడ్తదని
పోరగాండ్లు బతుకుతరని
ఆశ సారూ
అందరి మాదిరి సంసారం ఇంత తెలివిజెయ్యాల్నని
ఆశ సారూ
కాలం పాడుగాను
కంట్లె నిప్పులు వోసుకున్నది
మస్తు కాలాలు జూసిన
ఇసొంటి కాలం జూలె
మన్నుకు నెనరుండె
మనసుకు నెనరుండె
గట్టిగ లగాయించి పిలిస్తె గంగ పలికేది
కాలమే గిట్లొచ్చింది
ఎవనికెవడు పలకడు
 ఒగనికంటె ఒగడెక్కువ
ఒక్క బోరు పడకపోతదా?
 బొంబాయి సంపాదన బోరుపొక్కల వాయె
అప్పు మీద అప్పు
ఆత్మ మీద అప్పు
భూమిల తండ్లాడితే
భూమి లోతు దొరుకకపాయె
రెక్కలుండి ఏం పలం
రేషముంటె ఏం అక్కెర
పోరగాండ్లు ఉపాసం పండే కాలమచ్చె
కన్నీళ్ళు తుడుసుకోవచ్చు
కడుపుసారూ
ఏదూకున్నా అదూకోదు
కట్టుకున్నది
బడుముకు కట్టుకున్న చీర
బిగదీసి కడుపుకు కట్తుకుంటంది
ఏంజేతు
యాడికి కాళ్ళు జాపుదు
పడదని తెలిసి బోర్లెందుకేసుడంటరు
ఓడిపోతరని
మీరు ఓట్లకు పోకుంటున్నరా
వొస్తయో రావో తెల్వని నౌకర్లకు
పోరగాండ్లను నల్వకుంటుంటున్నరా
ఎవ్వలకయినా
ఆశ సారూ
బంగారం గాదు
బంగుల గాదు
బువ్వ సారూ
బుక్కెడు బువ్వ
 మేం తిండిలేక జస్తంటె
తిన్నదర్గక జస్తున్నమంటరు
మీ నాల్కెకు మొక్కాలె
తిట్లకు జస్తున్నం
బతుకు సారూ ఎప్పటికి.

గమనమే గమ్యం-5

 

olgaశారద మద్రాసు వెళ్ళిపోతోందని తెలిసి విశాలాక్షి, అన్నపూర్ణ బాగా బెంగపెట్టుకున్నారు. తన చదువు కూడా ఆగిపోతుందేమోనన్నది అన్నపూర్ణ. విశాలాక్షి మాత్రం చదువు ఆపనని కచ్చితంగా చెప్పింది. ఊళ్ళో చదువు పూర్తయ్యాక మద్రాసు వచ్చి చదువుతానంది.

శారదకు స్నేహితులను వదిలి వెళ్ళాలనే బాధ ఓ పక్క ఉన్నా మద్రాసు వెళ్ళబోతున్నందుకు సంతోషంగా కూడా ఉంది. మద్రాసు గురించి తండ్రి ఎన్నో సంగతులు చెప్తుంటే నోరు తెరుచుకుని వినేది. ఇప్పుడు ఆ ఊళ్ళో ఉండబోతోంది. చాలా మంచి బడిలో చదువుతుంది. కానీ తన పక్కన అన్నపూర్ణ, విశాలాక్షి ఉండరు. శారదకు హడావుడిగా, కంగారుగా ఉంది. పరీక్షలు పూర్తయ్యాక తీసుకెళ్తానని చెప్పి రామారావు ముందే మద్రాసు వెళ్ళిపోయాడు. అక్కడ సంసారానికి చేయవలసిన ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. నాన్న, నాన్నమ్మలిద్దరూ లేకపోవటంతో శారదకు స్నేహితుల తోడిదే లోకమయింది.

విశాలాక్షి తల్లి కోటేశ్వరికి శారద మద్రాసు వెళ్తోందని తెలిసిన రోజున రంగయ్యగారిని అడిగింది. ‘‘మనమ్మాయిని కూడా మద్రాసు తీసికెళ్దామా’’ అని ` రంగయ్య ఒప్పుకోలేదు.

‘‘మద్రాసులో మనం ఉండటం కష్టం. రామారావు తీరు వేరు. ఆయన సంఘంలో చాలా పలుకుబడి ఉన్నవాడు. పైగా వాళ్ళు బ్రాహ్మణులు. విశాలాక్షి సంగతి వేరు. నేనున్నానుగా. గుంటూరులో కూడా మంచిబడి ఉంది. కళాశాలా ఉంది. గుంటూరులో చదువు చెప్పించాక మద్రాసు సంగతి చూద్దాం’’ అన్నాడు.

శారద ఒక శలవరోజున స్నేహితురాళ్ళిద్దరి ఇళ్ళూ చూడాలనుకుంది. నాన్నమ్మ ఉంటే అది కుదిరే పని కాదు. ముఖ్యంగా విశాలాక్షి ఇంటికి అసలు వెళ్ళనివ్వదు. ఇప్పుడు శారదకు అవకాశం వచ్చింది. శారద తన ఇంటికి వచ్చినందుకు విశాలాక్షి పొంగిపోయింది. స్నేహితులు తన ఇంటికిరారని విశాలాక్షికి చాలా దిగులు. ఆ దిగులు ఆవేళతో తీరిపోయింది. ఇద్దరు స్నేహితులూ కరువుదీరా కబుర్లు చెప్పుకున్నారు. వాటిట్లో సగంపైగా అన్నపూర్ణ గురించే. అన్నపూర్ణకు పెళ్ళి చేస్తారు ఎట్లా ఆపగలం అనేదే వాళ్ళ దిగులు. లోలోపల ధనలక్ష్మి గుర్తొస్తున్నది గానీ ఆ పేరుపైకి చెప్పుకునే ధైర్యం చెయ్యటం లేదు. శారద ఆ రోజు అక్కడే భోజనం చేసింది. అవతల వీధిలో ఉండే బ్రాహ్మణుల ఇంట వంట చేయించింది కోటేశ్వరి. చూస్తూ చూస్తూ తన చేతుల మీదుగా బ్రాహ్మణ ఆచారాన్ని కాదనటానికి ఆమెకు ధైర్యం చాలలేదు. సాయంత్రం శారద, విశాలాక్షి కలిసి త్యాగరాజస్వామి కీర్తన’’ జగదానంద కారక’’ పాడితే కోటేశ్వరి వాళ్ళకు ఆ కీర్తన మరింత బాగా పాడే మెలకువలు నేర్పింది. విశాలాక్షికి కోటేశ్వరి  ఐదో ఏటనుంచే సంగీతం నేర్పించింది. నృత్యంతనే స్వయంగా నేర్పింది. శారదకు నరసమ్మగారు తనకొచ్చిన స్వరాలు కాసిని నేర్పింది. విశాలాక్షి పాడుతుంటే శారద ఇట్టే పట్టేసి తనంతట తనే ఎక్కువ నేర్చుకుంది. అన్నపూర్ణకు అసలు సంగీత జ్ఞానమే ఉండేది కాదు. వీళ్ళిద్దరూ పాడుతుంటే, విశాలాక్షి నాట్యం చేస్తుంటే నోరు తెరుచుకు చూసేది. మర్నాడు అన్నపూర్ణ ఇంటికి వెళ్దాం రమ్మని అడిగింది శారద. విశాలాక్షికి కూడా వెళ్ళాలనే ఉందిగానీ కోటేశ్వరి ఒప్పుకోలేదు. వాళ్ళింట కూతురికి ఎలాంటి మర్యాదలు జరుగుతాయోనని ఆమెకు సందేహం. రంగయ్య, అన్నపూర్ణ తండ్రి రాగయ్య దగ్గరి బంధువులే. రంగయ్య కోటేశ్వరితో కలిసి జీవించటం ఆమెకు రంగయ్యగారి మనిషనే గుర్తింపునివ్వటం వాళ్ళవాళ్ళెవరికీ ఇష్టంలేదు. అందువల్ల కూతురిని వాళ్ళు అవమానిస్తారేమోననే భయంతో విశాలాక్షి ఎంత బతిమాలినా అన్నపూర్ణా వాళ్ళింటికి పంపటానికి కోటేశ్వరి ఒప్పుకోలేదు. చీకటి పడుతుండగా శారదను తీసికెళ్ళటానికి పాలేరు వచ్చాడు. అన్నపూర్ణను పెళ్ళి చేసుకోవద్దని తన మాటగా చెప్పమంది విశాలాక్షి.

ఆ స్నేహితురాళ్ళిద్దరికీ శక్తి ఉంటే అన్నపూర్ణను ఆ ఇంట్లోంచి మాయం చేసి గుంటూర్లో లక్ష్మీబాయమ్మ గారింట్లో ఉండేలా చేసేవారు. ‘‘ప్రతి ఊళ్ళో లక్ష్మీబాయమ్మ ఉంటే బాగుండేది’’ అంది విశాలాక్షి.

‘‘రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ వంటి వాళ్ళు చచ్చిపోకూడదు’’ అంది శారద.

శారద ఎప్పుడొస్తుందా అని అన్నపూర్ణ తెల్లవారిన దగ్గర్నించీ ఎదురు చూస్తోంది. పొద్దున చద్దన్నాలు తిని పెద్దవాళ్ళందరూ పొలం వెళ్ళారు. అన్నపూర్ణ తల్లి హనుమాయమ్మ ఇంటిపనిలో మునిగిపోయి ఉంది. వాళ్ళది పదిగొడ్ల పాడి.ఐదారు అరకల సేద్యం, ఇంటినిండా ధాన్యం, చిరు ధాన్యాల బస్తాలు. ఇల్లంతా చాలా శుభ్రంగా ఉంచుతుంది హనుమాయమ్మ. నల్లగా నున్నగా మెరిసే నాపరాళ్ళను రోజూ తుడిపిస్తుంది. గోడల బారున ఐదడుగుల ఎత్తులో చెక్క కొట్టించారు. దానిమీద తళతళ మెరుస్తూ ఇత్తడి బిందెలు, రాగి కాగులు, ఇత్తడి రాగి పాత్రలు పొందికగా సర్దిఉంటాయి. విశాలమైన. వరండాలో నాలుగు చెక్క కుర్చీలూ, రెండు మంచాలూ వేసి ఉన్నాయి. రెండు మంచాల మీదా ఉతికిన దుప్పట్లు ఎక్కడా ఇంత మడత లేకుండా నలగకుండా పరిచి ఉన్నాయి.

ఇంటిముందు విశాలమైన ఆవరణ ఉంది గానీ పూలమొక్కలేమీ లేవు. ఒక మూలగా సన్నజాజి పందిరి మాత్రం ఉంది. పెంకుటిల్లే అయినా చాలా హుందా అయిన ఇల్లని తెలుస్తూనే ఉంటుంది.

శారదకు చూసినవెంటనే ఆ ఇల్లు చాలా నచ్చింది. శారద కోసం ఎదురుచూస్తూ కూర్చున్న అన్నపూర్ణ ‘అమ్మా శారదొచ్చిందే’ అంటూ ఒక్క కేకవేసి శారద దగ్గరకు పరిగెత్తింది.

స్నేహితులిద్దరూ మందారాల్లాంటి మొహాలతో నవ్వుకున్నారు. హనుమాయమ్మ రెండు గిన్నెల్లో జున్ను తెచ్చి పెట్టింది. ‘‘జున్నుకి అంటు లేదులే తినమ్మా’’ అన్నది. శారదకు జున్నంటే మహా ఇష్టం. గిన్నె చేతిలోకి తీసుకోవటమే ఆలస్యం. ఇద్దరూ క్షణంలో ఖాళీ చేసి మరి కాస్త కావాలని అడిగారు.

విశాలాక్షి కబుర్లు కాసేపు చెప్పి శారద అడగలేక అడిగింది.

‘‘నీకు నిజంగా పెళ్ళనుకుంటున్నారా?’’

‘‘అనుకోవటమేంటి. మా నాన్న సంబంధాల కోసం పొరుగూర్లు కూడా వెళ్తున్నాడు.’’ అన్నపూర్ణ అది పెద్ద విషయం కానట్టు చెప్పింది.

Image

‘‘మరి నీ చదువు’’.

‘‘పెళ్ళయ్యాక ఇంకా చదువంటే కుదురుతుందా? అత్తగారు వాళ్ళు ఊరుకుంటారా?’’.

‘నీకిష్టమేనా పెళ్ళి’

‘ఏమో  కానీ మా వాళ్ళు నాకు ముసలి మొగుడిని మాత్రం తీసుకురారు. నేను ధనలక్ష్మిలా చచ్చిపోను. మా నాన్న చెప్పాడు మంచివాడిని, చదువుకున్న వాడినే అల్లుడిగా చూస్తున్నానని . మరింక నేనుఎందుకు ఒద్దనాలి. ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాలిగా. అందుకే నాకు సంతోషంగానే ఉంది’’ నవ్వింది అన్నపూర్ణ.

పెళ్ళంటే సంతోషపడటానికేముందో శారదకు అర్థం కాలేదు. ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాల్సిందేనట. ఎందుకు చేసుకోవాలి అనుకుంది. బహుశ ఆ రోజుల్లో అలా అనుకున్న మొదటి ఆడపిల్ల శారదేనేమో.

‘‘నేను మద్రాసు వెళ్ళే లోపల చేసుకుంటావా? అలాగేతై నేనూ నీ పెళ్ళికి రావొచ్చు’’.

‘‘సంబంధం కుదరాలిగా’’.

సంభాషణ ఎంతసేపూ అక్కడే తిరుగుతోంది. శారదకు ఎక్కువసేపు అక్కడ ఉండాలనిపించలేదు. వెళ్తానంటే అన్నపూర్ణ అప్పుడేనా అంటుంది.

‘‘మీ ఇల్లు చాలా బాగుంది’’ మెచ్చుకోలుగా అంది శారద.

‘మీ ఇల్లంత పెద్దది కాదు’.

‘ఐనా మీ ఇల్లే బాగుంది. చాలా శుభ్రంగా మెరిసిపోతోంది. మీ ఇంట్లో ఎవరూ లేరేం?’

‘మా నాన్న, అన్న, తమ్ముళ్ళు పొలం వెళ్ళారు. మా వదిన, పిన్ని లోపల పనులు చేస్తున్నారు.

‘మీ తమ్ముళ్ళు చదువుకోరా?’

‘‘వాళ్ళని వచ్చే ఏడు బళ్ళో వేస్తారు. ఇంకా చిన్నపిల్లలేగా’’

‘‘పొలంలో ఏం చేస్తారు?’’

‘‘చాలా పనులుంటాయి. నాకూ పొలం వెళ్ళటం ఇష్టం. నేనూ వెళ్తాను. ఏదో ఒకటి చేస్తుంటాను. ఏం లేకపోతే దోసకాయలు, వంకాయలూ తెంపుకుని వస్తాను. మొన్నటిదాకా ఎన్ని బంతిపూలున్నాయో మా చేలో ` నాకు పాలు తియ్యటం కూడా వచ్చు. దూడలని విడిచి అవి పాలు తాగాక మళ్ళీ కట్టేస్తా ` రా ` మా దూడలను చూపిస్తా’’ అని ఇంటి వెనకాల దూరంగా ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకుపోయింది. శారద వాళ్ళింట్లో పశువుల కొట్టం ఉండదు. ఎక్కడో దూరంగా ఉంటుంది. పాలేర్లు రోజూ పాలు పితికి తెస్తారు. శారదకు పశువులతో అంత అనుబంధం లేదు. అన్నపూర్ణది వేరే లోకం అనుకుంది. దూడలను బుజ్జగిస్తూ ఆడుతున్న స్నేహితురాల్ని చూసి.

అన్నపూర్ణ తిరగలి విసిరి చూపింది. అన్నపూర్ణకు వచ్చిన పనులు చూసి శారద ఆశ్చర్యపోయింది. శారద ఇంట్లో, వంట ఇంట్లో పొయ్యి దగ్గర పని తప్ప, మిగిలిన పనులన్నీ దాసీలు, పాలేర్లు చేస్తారు. పండగలప్పుడైతే వంటబ్రాహ్మడిని పిలిపిస్తారు.  వెంటనే వెళ్ళిపోదామనుకున్న శారద సాయంత్రం దాకా ఉండిపోయింది. ఇంక బయల్దేరదామనుకుంటుండగా అన్నపూర్ణ తండ్రి ఇంకో పెద్దాయనతో కలిసి వచ్చాడు.

‘‘ఇదుగో ! ఏమే. ఇట్టారా. మనమ్మాయికి సంబంధం కుదిరింది’’ అంటూ కేకపెడుతూ వచ్చి మంచంమీద కూర్చున్నాడు. రెండో ఆయన కూడా ఈయన పక్కన ఆయాసపడుతూ కూర్చున్నాడు. చాలాదూరం నుంచీ నడిచి వస్తున్నట్లున్నారు.

పొలం వెళ్ళిన తండ్రి సంబంధం ఎలా తెచ్చాడా అని ఆశ్చర్యపోయింది అన్నపూర్ణ.

హనుమాయమ్మ భర్త కేకలకు సమాధానంగా తనే వచ్చి రెండో ఆయన్ని చూసి ముఖం ఇంత చేసుకుని

‘‘నువ్వా భూషయ్యన్నయ్యా. బాగున్నావా? అమ్మెట్లా ఉంది? ఉండు నీళ్ళు తెస్తా’’ అంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కోటానికి ఒక చిన్న బిందెతో నీళ్లూ చెంబూ తెచ్చింది. తెల్లటి కండువా మంచం మీద పెట్టింది.

ఇద్దరూ కాళ్ళు ముఖాలు కడుక్కునే సరికి పెద్ద కంచు గ్లాసుల్తో మజ్జిగ తెచ్చింది.

ఇదంతా అయ్యేవరకూ అన్నపూర్ణ తండ్రి ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు.

‘‘మీ అన్నయ్య స్నేహితుడి కొడుకంట. ఇంటరు చదువుతున్నాడు. ముగ్గురన్న దమ్ములు. ఇద్దరక్కచెల్లెళ్ళు. పెద్ద కుటుంబం. ఐతే ఏం? మేనత్త ఆస్తి కలిసొచ్చింది. దేనికీ లోటు లేదు. పిల్లాడు ఎర్రగా దొరబాబులా ఉంటాడంట. ప్లీడరీ చదువుతానంటున్నాడంట. మీ అన్న అన్నీ చెబుతాడులే’’ అంటూ భూషయ్యకేమీ మిగల్చకుండా అన్నీ తనే చెప్పుకుపోతున్నాడు.

ఆయన మాటలు అందరి కంటే శ్రద్ధగా అన్నపూర్ణ, శారదలే విన్నారు. అన్నపూర్ణ ముఖంలో సిగ్గు, సంతోషం చూసి శారదకూ ఏదో తెలియని సంతోషం కలిగింది.

ఇక వాళ్ళ మాటలు ఇప్పట్లో అయ్యేలా లేవని శారద బయల్దేరింది.

‘‘ఎవరూ’’ అని రాగయ్య శారద గురించి అడగటమూ.

‘‘నా స్నేహితురాలు’’ అని అన్నపూర్ణ

‘‘రామారావు గారమ్మాయి. నరసమ్మగారి మనవరాలని’’ హనుమాయమ్మ చెప్పటమూ వీధిలో నడుస్తున్న శారదకు వినపడుతూనే ఉన్నాయి.

వీళ్లింట్లో అందరూ అంత పెద్దగా ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ ఎవరికీ చెవుడు లేదు అనుకుంది శారద.

అన్నపూర్ణ పెళ్ళి చూస్తుండగానే నిర్ణయమైపోయింది. పెళ్ళి కొడుకు రాలేదు గానీ వాళ్ళ బలగం చాలామందే వచ్చి అన్నపూర్ణను చూశారు. నాలుగెకరాల పొలం అన్నపూర్ణ పేరు మీదనే కొన్నానన్న రాగయ్య మాట అందరికీ నచ్చింది. లగ్నాలెప్పుడున్నాయంటే ఎప్పుడున్నాయన్నారు. పురోహితుడిని ఆఘమేఘాలమీద పిలిపించారు. పదిహేను రోజుల్లో పెళ్ళికి మంచి ముహూర్తం కుదుర్చుకుని, నాలుగు రోజుల్లో చినలగ్నాలనుకుని అందరూ హడావుడి పడటం మొదలుపెట్టారు. మగపెళ్ళివాళ్ళు వెళ్ళాక హనుమాయమ్మ మొగుడిని పట్టుకుని సాధించింది.

olga title

‘‘ఐదు రోజుల పెళ్ళికి పదిహేను రోజుల వ్యవధిలో ముహూర్తం పెడితే పనులెట్లా అవుతాయి? అప్పడాలు వడియాలు పెట్టటానికే సమయం చాలదు. అరిశెలు లడ్లు ఎప్పుడు చెయ్యాలి? సున్నిఉండలకి పిండి విసరాలా ఒద్దా? కారం పసుపు కొట్టించాలా?’’

హనుమాయమ్మ ఆరాటమంతా విన్నాక

‘‘అన్నీ అవే అవుతాయిలే’’ అని పై పంచె భుజం మీది నుంచి తీసి తలగుడ్డలా చుట్టుకుని బైటికి వెళ్ళిపోయాడు రాగయ్య.

హనుమాయమ్మ కూడా ఊళ్ళో చుట్టాలకి చెప్పటానికి వెళ్ళిపోయింది. నిజానికి హనుమాయమ్మది కేవలం ఆరాటం. ఆందోళనే. ఊళ్ళో బంధువులు, ఇరుగుపొరుగులూ అందరూ తలా ఒక చెయ్యి కాదు రెండు చేతులూ వేస్తారు. ఎంతెంత వంటలైనా ఇట్టే చేసేస్తారు. హనుమాయమ్మకు ఇల్లు బాగుచేసి సున్నాలు కొట్టంచటమొక్కటే పని. రాగయ్య తమ్ముడు పెళ్ళి పందిళ్ళు వేయించటంలో పేరెక్కినవాడు. ఆ పని అతనికి ఒదిలేశారు. ఇంటిల్లిపాదికీ, పెట్టుపోతలకు బట్టలు తియ్యాలి. అదొక్కటే పట్నం వెళ్ళి చేసుకురావల్సిన పని. ఆ పని రామారావు గారితో కలిసి తను పట్నం వెళ్ళి చేసుకొస్తానన్నాడు రాగయ్య.

ఆ రోజు రాత్రి పడుకునే వేళకు అన్ని పనులూ అయిపోయినట్టే అనిపించింది హనుమాయమ్మకు.

‘‘ఈ మాత్రం దానికి గంట సేపు నన్ను వేసుకు పడ్డావు’’ అన్నాడు రాగయ్య.

అన్నపూర్ణకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా పెళ్ళికొడుకు ముసలివాడు కాదు. తనకంటే ఏడేళ్ళే పెద్ద. చదువుకుంటున్నాడు. ఇంకా చదువుతాడు. పిల్లవాడు తల్లిపోలిక అన్నారు. అత్తమామలిద్దరూ చక్కగా ఉన్నారు. అత్త మరీ దబ్బపండు చాయ. తనకు మంచి మొగుడే వచ్చాడని మురిసిపోయింది అన్నపూర్ణ. మంచిమొగుడు రావాలని ఆ అమ్మాయి చాలామంది దేవుళ్ళకు మొక్కుకుంది. పెళ్ళవగానే భర్తతో కలిసి ఆ మొక్కులన్నీ తీర్చుకోవాలని అదొక పెద్ద పనిలా దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది.

శారద, విశాలాక్షి కూడా అన్నపూర్ణ సంతోషంలో మనస్ఫూర్తిగా భాగం పంచుకున్నారు. చదువు మానేస్తుందేమో గాని సుఖంగా ఉంటుంది గదా అనుకున్నారు. అన్నపూర్ణకు కాబోయే భర్త పేరే వాళ్ళకు బత్తిగా నచ్చలేదు. అబ్బయ్య చౌదరి. ‘‘అన్నపూర్ణ పేరు ఎంత బాగుంది. అబ్బయ్యేంటి అబ్బయ్య’’ అంది విశాలాక్షి.

‘‘ఊరుకో  అన్నపూర్ణ బాధ పడుతుంది’’ అంది శారద.

‘‘మా ఇద్దరి పేర్లలోనూ మొదటి అక్షరం ‘అ’. పేర్లు ఎంత బాగా కలిశాయో చూడండి’’ అంది పెద్ద విషయం కనిపెట్టినంత సంబరంగా అన్నపూర్ణ. పేరు అంత నాజూకుగా లేకపోయినా దీనికి సంతోషపడొచ్చుగదా అని ఆ పిల్ల ఉద్దేశం.

చూస్తుండగానే అన్నపూర్ణ పెళ్ళి జరిగిపోయింది. ఐతే అన్నపూర్ణ వ్యక్తురాలయ్యేంత వరకూ బడికి పంపించవచ్చునన్నారు అత్తామామలు.

బి.యస్సీ చదవటానికి అబ్బయ్య మద్రాసు వెళ్తాడు. అతని చదువు పూర్తయ్యేదాకా అన్నపూర్ణ పుట్టింట్లో ఉండటానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పటికి ఆమెకు పద్దెనిమిదేళ్ళస్తాయి. రామారావుగారు తనంత తాను కలగజేసుకుని ఇరుపక్షాల వాళ్ళతో మాట్లాడి ఈ ఏర్పాటంతా చేశారు. అబ్బయ్య రామారావుగారి గురించి వినివున్నాడు. ఆయనను ప్రత్యక్షంగా చూడటం, ఆయన వ్యవహారశైలిని గమనించటంతో ఆయన మీది గౌరవం పెరిగింది. ధనలక్ష్మి వ్యవహారం తన ప్రమేయం లేకుండా అట్లా విపరీతంగా జరిగినందుకు రామారావు మనసులో ఉన్న బాధ అన్నపూర్ణ విషయంలో కాస్త ఎక్కువ జోక్యం కలగజేసుకునేలా చేసింది. రాగయ్య ఆశ్యర్యపడేంతగా ఆయన పెళ్ళిపెద్దల్లో ముఖ్యుడయ్యాడు. అన్నపూర్ణ చదువు ఆగనందుకు శారద, విశాలాక్షి ఎగిరి గంతులేశారు. మొత్తానికి స్నేహితురాలి పెళ్ళి చూసే శారద తల్లిదండ్రులతో కలిసి మద్రాసు వెళ్ళింది.

***

మద్రాసులో రైలు దిగి స్టేషన్‌ బయటకు రాగానే శారద మనసంతా హుషారుగా అయింది. చూడగానే మద్రాసులో ఏదో గొప్పదనం ఉందనిపించింది. గుర్రంబండిలో తమ ఇంటికి వెళ్తుంటే ఏదో విశాలత్వంలోకి రెక్కలు సాచుకుని పక్షిలా ఎగురుతున్న అనుభూతి కలిగింది. తన ఊరికీ ఈ పట్టణానికీ పోలికే లేదనుకుంది. వీధులే కాదు ఊరంతా విశాలంగా కనిపించింది. ఇంటికి వెళ్ళే దారిలోనే సముద్రం కనిపించింది.

‘‘నాన్నా సముద్రం అమ్మా సముద్రం’’ శారద అరుపులకు రామారావు చిరునవ్వు నవ్వుతోంటే తానూ మొదటిసారి సముద్రాన్ని చూస్తున్న సుబ్బమ్మ తండ్రీ కూతుళ్ళను పట్టించుకోకుండా, రెప్ప వెయ్యకుండా సముద్రాన్ని చూస్తోంది.

మైలాపూర్‌లో సముద్రానికి దగ్గరగానే ఇల్లు. ఇల్లు ఊళ్ళో ఇల్లంత ఆవరణలో లేకపోయినా పెద్దదే. ఇంటిముందు చిన్న పూలతోట ఉంది. అది దాటి వెళ్తే నాలుగు మెట్ల ఎత్తుమీద పెద్ద వరండా. ఎర్రని రంగులో చుట్టూ తెల్లని ముగ్గుతో ముచ్చటగా ఉంది. రెండువైపులా నాలుగు, నాలుగు కుర్చీలు ఇంటికొచ్చేవారికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉన్నాయి. లోపల విశాలమైన హాలు. అటూ ఇటూ మూడేసి గదులు వరసగా ఉన్నాయి. హాలు వెనక భోజనాల గది పెద్దదిగా ఉంది. దానికి ఒకవైపున వంటిల్లు. మరొకవైపు సామానులుంచుకునే గది. అది దాటితే మళ్ళీ పెద్ద పెరడు. నుయ్యి ` కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఉసిరి చెట్టు. మేడ మీద కూడా ఒక హాలు రెండు విశాలమైన గదులూ ఉన్నాయి. సుబ్బమ్మకు కూడా ఆ ఇల్లు పొందికగా ఉందనిపించింది. శారదకైతే చెప్పే పని లేదు. మేడమీదికి కిందికి పదిసార్లు పరుగులు తీసింది. రామారావు ఈ ఇంట్లో నాలుగేళ్ళ నుంచీ ఉంటున్నాడు. భార్యా పిల్లలను తీసుకొద్దామనుకున్నాక ఆ ఇంటిని కొని స్వంతదారుడయ్యాడు. దానికి కొంత డబ్బు జీవితంలో మొదటిసారిగా అప్పు చేయాల్సి వచ్చినా వెనుకాడలేదు.

సుబ్బమ్మ, శారద ఖాళీ ఇంట్లోకి గృహ ప్రవేశం చేస్తున్నట్లు వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో నలుగురు అతిధులున్నారు. ఏవో పనుల మీద మద్రాసు వచ్చిన పండితులు వాళ్ళు. వాళ్ళకు కావలసినవి అమర్చటానికి ఇద్దరు పనివాళ్ళు, ఒక వంట బ్రాహ్మడు హడావుడిగా పని చేస్తున్నారు.

సుబ్బమ్మ తన వెంట తెచ్చుకున్న శేషమ్మతో కలిసి తను తెచ్చిన కాసిని సామానులూ సర్దించే పనిలో పడిరది. మద్రాసు జీవితం తల్లీ కూతుళ్ళకు తేలికగానే అలవాటయింది. శలవలై పోయేలోగా మద్రాసు చుట్టుపక్కల ప్రాంతాలు పక్షితీర్థం, మహాబలిపురం, పుదుచ్చేరి వంటివి చూసి వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా సముద్రం ఉప్పొంగుతూ శారదను పిలిచేది. తల్లీదండ్రి గట్టిగా తనను పట్టుకుంటే శారద లోపలికి వెళ్ళటానికి పెనుగులాడేది.

శారద ఈత నేర్చుకుంటానని పేచీ పెట్టింది. సుబ్బమ్మ వీల్లేదంటే రామారావు తప్పకుండా నేర్పిస్తానన్నాడు. ఈతే కాదు టెన్నిస్‌, బాడ్మింటన్‌ కూడా నేర్పిస్తానన్నాడు. శారద తనొక అద్భుత ప్రపంచంలోకి వచ్చి పడ్డాననుకుంది. శరీరానికీ, మనసుకు విరామం లేని అనుభూతులు.

అన్నింటిలోనూ ప్రవేశం దొరికింది. ఇంటికి దగ్గరగా ఉన్న ఒక మిషనరీ పాఠశాలలో చేరింది శారద. ఆ బడి క్రైస్తవ సన్యాసినులు నడుపుతున్నారు. వారి దుస్తులు, తలకట్టూ అంతా ప్రత్యేకం. ఆ పాఠశాలా వాళ్ళూ పరిశుభ్రతతో, క్రమశిక్షణతో ప్రకాశిస్తుంటే పిల్లలు వాటిని భంగపరుస్తూ అటూ ఇటూ తిరుగుతుండేవారు. ఉపాధ్యాయినులు ఎక్కువమంది ఆంగ్లేయులు లేదా ఆంగ్లో ఇండియన్సు. నలుగురైదుగురే హిందువులుండేవారు. ఎక్కువమంది క్రైస్తవులవటంతో బడి ఆవరణలో ఒక చర్చి కూడా ఉంది. మొదటిసారి శిలువ మీద క్రీస్తును చూసిన శారద ఆశ్చర్యానికి అంతం లేదు. అందరు కళ్లు మూసుకొని ప్రార్ధిస్తూంటే తన పెద్ద కళ్ళతో రెప్ప వెయ్యకుండా చూసింది శారద. కాళ్ళూ చేతులకు మేకులు, రక్తాలు కారుతున్నాయి. నెత్తిమీద ముళ్ళను చుట్టారు. ముఖంలో బాధ లేదుగానీ, సంతోషమూ లేదు. శారద మనసు క్రీస్తు మీద జాలితో నిండిపోయింది.

ఇంటికి రాగానే తల్లితో ఆ విషయం చెప్పింది. ఆవిడకూ అర్థం కాక అయ్యో పాపం అంది. తండ్రి కోసం ఎదురుచూస్తూ  కూచుంది. ఆ రాత్రి క్రీస్తు కథ సంక్షిప్తంగా చెప్పి శారదను నిద్రపుచ్చే సరికి రామారావుకి అలసట అనిపించింది.

‘‘మన దేవతలు అన్ని అలంకారాలతో, పువ్వులతో సర్వాంగ సుందరంగా ఉంటారు. క్రీస్తు అలా కాదు. మానవుల కోసం తాను రక్తం కార్చినవాడు. బోధకుడు.. ఆయన బోధనలు నచ్చనివారు ఎంతో హింసించారు. మానవుల కోసం హింసపడతున్న ఆయన మూర్తిని ఆరాధిస్తారు వాళ్ళు. తోటి మనుషుల కోసం మనం ఎన్ని కష్టాలైనా పడాలని క్రీస్తు చెబుతాడు’’.

ఆయన ఎంత చెప్పినా సుబ్బమ్మకు అర్థం కాలేదు. శారద అర్థం చేసుకునే ప్రయత్నంలో అలసిపోయి నిద్రపోయింది.

మర్నాడు సులభమైన ఇంగ్లీషులో క్రీస్తు చరిత్ర ఉన్న పుస్తకాన్ని కొనితెచ్చాడు రామారావు.

శారదకు కొత్త మతం క్రమంగా పరిచయమైంది. పాఠశాలలో కూడా బైబిల్‌ బోధించడానికి ప్రత్యేకం ఒక సమయం కేటాయించారు. ఆ పాఠశాలలో తెలుగు పిల్లలు తక్కువే. ఉన్నవారిలో ఇద్దరు హాస్టలులో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళు చాలా పేద పిల్లలు. శారదకు వెరోనిక, థెరిసా అనే ఆ ఇద్దరితో మొదటిరోజు నుంచీ స్నేహం కుదిరింది. వాళ్ళు ఒంగోలు నుంచి వచ్చారు. హైస్కూలు చదువయ్యాక తాము సన్యాసం తీసుకుంటామని వాళ్ళు చెబితే శారదకు దిగులేసింది. ‘‘నేనూ పెళ్ళి చేసుకోను. కానీ జుట్టు తీయించుకుని, ఇట్లాంటి బట్టలు వేసుకోను. నాకు రంగురంగుల బట్టలంటే ఇష్టం’’ అంది శారద.

‘‘మాకూ ఇష్టమే. ఐనా సరే అమ్మగార్లమవుతాం’’ అన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా తెలివైనవాళ్ళు. చాలా కష్టపడి చదివేవారు. వాళ్ళ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవటం కష్టమని శారద మొదటి నెలలోనే గ్రహించింది. కానీ శారదకు        వాళ్ళు నేర్చుకోలేని అనేక విషయాలు నేర్చుకునే అవకాశం ఉందని వాళ్ళూ గ్రహించారు. శారద ఈత నేర్చుకుంటోంది. స్కూల్లో ఆడే ఆటలుకాక, టెన్నిస్‌ బాట్‌మింటన్‌లు నేర్చుకుంటుంది. వారానికి మూడు రోజులు సాయంత్రాలు సంగీతం మేస్టారు ఇంటికొచ్చి నేర్పుతాడు. వీటన్నిటినీ సునాయాసంగా నేర్చుకునేందుకు అవసరమైన పౌష్టికాహారం శారదకు పుష్కలంగా అందుతోంది.

ఇంటిదగ్గర రామారావు కోసం ఎంతమందో వస్తుంటారు. అందరూ పండితులు, పరిశోధకులు, దేశభక్తులు, శాస్త్రవేత్తలు. వాళ్ళు వచ్చినపుడు శారద మెల్లిగా వాళ్ళ పక్కన చేరేది. అందరూ ఆమెను ఆప్యాయంగా పలకరించేవారు. వారి మాటలు  ఒక్కక్షరం పొల్లు పోకుండా వినేది. అర్థమయినంత అయ్యేది. లేనిది లేదు. అన్నిటికంటే ఆనందం వీరేశలింగం పంతులుగారు రావటం. రాజమండ్రిలో వాళ్ళింటికి తనువెళ్ళటం, రాజ్యలక్ష్మమ్మ తనకు కథ చెప్పి, పాట పాడటం శారదకు బాగాగుర్తున్న మొదటి జ్ఞాపకం. రాజ్యలక్ష్మమ్మ పోయి ఏడేళ్ళయిపోయింది. పంతులుగారు శారీరకంగా మానసికంగా కొంత బలహీనులయ్యారు. ఆత్మకథ రాస్తున్నారు. ఆయన మద్రాసువస్తే రామారావుగారింట్లోనే బస చేస్తారు. ఆయనను కలవాలని మరెంతమందో వస్తారు. ఆ ఇల్లు సర్వస్వతీ నిలయంలా ఉండేది. అక్కడ శారద ఏ పరదాలూ లేకుండా పెరుగుతోంది.

ఒకరోజు ఉదయం బడికి వెళ్ళిన శారదకు తరగతి గదిలో వెరోనికా కన్పించలేదు. థెరిసా చెప్పింది వాళ్ళ నాన్న వచ్చాడనీ వెరోనికాను బైటికి తీసుకెళ్ళాడని. అలా బయటకు తీసికెళ్ళటానికి సామాన్యంగా అనుమతి దొరకదు. వెరోనికా సాయంత్రం వరకూ రాదు. సాయంత్రం తను ఇంటికి వెళ్ళాక వస్తే తనిక ఆ రోజు వెరోనికాను చూడలేదు. శారదకి అదేం బాగాలేదు. వెరోనికాని బడిలో చూడకుండా ఉండటం చాలా కష్టంగా అనిపించింది. సాయంత్రం లోపల వెరోనికా రావాలి రావాలి అనుకుంటూ కూచుంది.

సాయంత్రం బడి ఒదలగానే ఆవరణలో వెరోనికా కోసం ఎదురు చూస్తూ నిల్చుంది. ఒక పది నిముషాలలో వెరోనికా వాళ్ళ నాన్నతో కలిసి వచ్చింది. వెరోనికా తండ్రిని చూసి శారద ఎలాగో అయిపోయింది. ఆ అమ్మాయి తన ఊళ్ళో మాలపల్లె మనుషులను చూసింది. వెరోనికా తండ్రి అలాగే ఉన్నాడు. ఊళ్ళో అలాంటి బీదవారిని చూస్తే రాని దు:ఖం అతను వెరోనికా తండ్రి అంటే ఎందుకు కలిగిందో శారదకు తెలియదు. కానీ కలిగింది. వెరోనికా దగ్గరకు వెళ్తే, ఆయన శారదకు దూరంగా జరిగాడు. మా స్నేహితురాలని శారద గురించి చెప్తుంటే ఆయన కళ్ళల్లో భయమే కనిపించింది. అంత పెద్ద మనిషి తనను చూసి భయపడుతుంటే తనలో ఏదో తప్పుందనిపించింది శారదకు. వెరోనికా తొందరలో ఉంది. రేపు వస్తానని చెప్పి హాస్టలులోకి వెళ్ళిపోయింది. ఆయన అలాగే నించున్నాడు. శారద చొరవగా మీరు మా ఇంటికి రండి. హాస్టల్లో మిమ్మల్ని ఉండనివ్వరుగా’’ అంది.

ఆయన మరింత భయంగా శారదను చూశాడు. శారదతో ఏం మాట్లాడకుండా వెనక్కు తిరిగి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

ఆ సాయంత్రం నిర్మానుష్యంగా, నిశ్శబ్ధంగా ఉన్న ఆ పాఠశాల ఆవరణలో శారదకు ఈ ప్రపంచంలో ఏదో పెద్ద తప్పుకి తను జవాబుదారీ అన్న భావన తెలిసీ తెలియకుండా కలిగి పెద్ద దు:ఖం వచ్చింది. అంత దు:ఖం ఎందుకొచ్చిందో కూడా ఆ అమ్మాయికి స్పష్టంగా తెలియదు.

Image (2)

అసలు తెలియకుండానూ లేదు. మాల మాదిగలను ఊళ్ళోకి, ఇళ్ళల్లోకి రానివ్వరు. ఆ సంగతి కొంత శారదకు తెలుసుగానీ ఊళ్లో ఉన్నప్పుడు ఆ విషయమై ప్రశ్నలు రాలేదు. కానీ ఇక్కడ తను రోజూ కలిసి చదువుకునే, ఆడుకునే స్నేహితురాలి తండ్రి స్థితి అది అని కొట్టోచ్చినట్లు కనపడేసరికి శారద మనసు కుంగిపోయింది. అంతా? తండ్రి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తండ్రి వచ్చి భోజనం చేశాక ఆయన దగ్గర చేరి లోపలి బాధను అణుచుకుంటూ ‘‘నాన్నా. మన వూళ్లో మాలవాళ్లను మనం తాకంగదా. మన ఇంటిలోకి రానివ్వం కదా? ఎందుకు’’ అని అడిగింది.

రామారావు రెండు నిమిషాలు మౌనంగా ఉండి ‘‘మన బుద్ధిహీనత వల్లనమ్మా. వాళ్ళ కులం తక్కువని. బ్రాహ్మణ, వైశ్య కులాలు ఎక్కువని ` మాల, మాదిగలు అంటరానివారిగా ఉండాలనీ పెట్టారు’’.

‘‘ఎవరు పెట్టారు నాన్నా’’

‘‘కొన్ని వందల సంవత్సరాల నాడు బ్రాహ్మణులే పెట్టారమ్మా’’

‘‘దానిని ఇప్పుడు మనం తీసెయ్యలేమా? వాళ్ళను మనం తాకితే, ఇంట్లోకి రానిస్తే ` ’’

‘‘తప్పకుండా అలా చెయ్యాలమ్మా. ఇప్పుడు అంటరానితనం కూడదని కొందరు చెప్తున్నారు. మీ బళ్ళో అదంతా లేదుగా’’.

‘‘వెరోనికా, థెరిసాలను ఒకసారి మన ఊరు తీసికెళ్దాం నాన్నా. వాళ్ళు నాకు స్నేహితులు. వెరోనికా వాళ్ళ నాన్న ఇవాళ బడికి వచ్చారు. చాలా పేదవాళ్ళు. నన్ను చూసి దూరం జరిగారు. నాకు ఏడుపొచ్చింది’’ రామారావు శారదకు గురజాడ రాసిన ‘‘లవణరాజు కల’’ చదివి అర్థం చెప్పాడు. శారదకది చాలా నచ్చింది.

‘‘ఇట్లాంటివి చదివి క్రమంగా మనుషులు మారతారమ్మా. పైగా ఇప్పుడు వాళ్ళు చదువుకునే అవకాశం కొంత వచ్చింది. మంచి ఉద్యోగాలస్తే వాళ్లని అందరూ గౌరవిస్తారు’’.

శారదకి కులాల గురించి చెప్పగలిగినంత చెబుతూ నిద్రపుచ్చాడాయన.

కొత్త వాతావరణంలో, కొత్త స్నేహితులతో కొన్నాళ్ళపాటు విశాలాక్షి, అన్నపూర్ణ శారద మనసులో కాస్త వెనక్కు వెళ్ళారు.

మళ్ళీ వేసవి శలవలు వచ్చేంత వరకూ కాలం ఎలా గడిచిందో శారదకు తెలియదు. వేసవి శలవలకు ఊరికి వెళ్దామని సుబ్బమ్మ గొడవ చేసింది. ఇల్లు, పొలం, పాలేర్ల చేతికి, కౌలుదార్ల చేతికి అప్పగించి మళ్లీ అటు చూడకపోతే ఎలాగని పోరు పెట్టినంత పని చేసింది. నరసమ్మ కాశీ నుంచి రాసే ఉత్తరాలలో ఇల్లు, పొలం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పకుండా రాస్తుండేది.

చివరికి ఒక పదిరోజులు ఊళ్ళో గడపటానికి రామారావు వీలు కల్పించుకున్నాడు.

‘‘నాన్నా అన్నపూర్ణా, విశాలాక్షి బాగా గుర్తొస్తున్నారు. తొందరగా వెళ్దాం నాన్నా’’ అని గంతులేసింది శారద.

సుబ్బమ్మ భయపడినంతగా ఇల్లు పాడయిపోలేదు. వీళ్ళస్తున్నారని తెలిసి ఆ ఇంట్లో సగభాగంలో ఉంటున్న పురోహితుడి భార్య ఆ ఇల్లంతా దులిపించి, కడిగించింది. ఊళ్ళో బంధువులు రెండు రోజులపాటు తమ ఇళ్ళల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ లోపల సుబ్బమ్మ వంట ఏర్పాట్లు చేసుకుంది.

శారద ఊళ్ళోకి వచ్చిన రోజు సాయంత్రమే, అన్నపూర్ణ శారద కోసం వచ్చింది. అన్నపూర్ణ కాస్త పొడుగైంది. ఒళ్ళచ్చింది. రంగొచ్చింది. చాలా అందంగా ఉందనిపించింది. శారద ఆ మాట అంటే ‘‘ఉగాది పండగకు మా ఆయన వచ్చాడు. ఆయనా నీలాగే అన్నాడు’’ అంది అన్నపూర్ణ సిగ్గుపడుతూ.

‘‘మీ ఆయనంటే నీ కిష్టమేనా?’’ శారద కుతూహలంగా అడిగింది.

‘‘చాలా ఇష్టం. ఆయనక్కూడా నేనంటే ప్రాణం.ఉత్తరాలు రాస్తారు. పుస్తకాలు పంపిస్తారు. ఇంగ్లీషు బాగా నేర్చుకోమంటారు.  చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే నన్ను తన దగ్గరకు తీసుకెళ్తానన్నారు.’’

‘‘విశాలాక్షి వాళ్ళు గుంటూరు వెళ్ళారు’’. అన్నపూర్ణ చెప్పిన మాట విని నిరాశ పడిరది శారద. అన్నపూర్ణ ఇంకా చాలా కబుర్లు చెప్పింది విశాలాక్షి గురించి.

రంగయ్య హఠాత్తుగా చనిపోయాడు. కోటేశ్వరి, విశాలాక్షి చాలా ఏడ్చారు. మొత్తానికి వాళ్ళ బంధువులచ్చి ఏవేవో మాట్లాడి తల్లీ కూతుళ్ళను గుంటూరు తీసికెళ్ళారు. విశాలాక్షి అక్కడే చదువుతుంది. చదువు మాత్రం మాననని విశాలాక్షి కచ్చితంగా చెప్పిందనే సరికి శారదకు సంతోషమనిపించింది.

శారద మద్రాసు కబుర్లన్నీ చెప్పింది. వెరోనిక, థెరిసాలను గురించి చెబితే అన్నపూర్ణ ఆశ్చర్యపోయింది.

‘‘ఈసారి శలవలకు వాళ్ళను ఇక్కడికి తీసుకొస్తాను మా ఇంటికి’’ అని శారద కచ్చితంగా చెప్తుంటే అన్నపూర్ణ నోరు తెరిచింది భయంతో.

‘‘ఊళ్ళో అదంతా కుదరదు’’ అంది.

‘‘ఎందుకు కుదరదు. నువ్వు కూడా మాలవాళ్ళను ఇంట్లోకి రానివ్వాలని మీ నాన్నతో చెప్పు’’.

‘‘మా నాన్న నన్ను చంపేస్తాడు’’.

‘‘మా నాన్న చెప్తే వింటాడేమో’’.

‘‘ఏమో. ముందు మా ఆయనతో చెప్తాలే. మా ఆయన ఇచ్చే పుస్తకాలలో ఇలాంటి మాట ఒకటి చదివాను. భయం వేసింది.’’

మర్నాడు శారద అన్నపూర్ణ ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాలు చూసింది. కొన్ని పుస్తకాలు శారద దగ్గరా ఉన్నాయి. అవి ముద్రించింది రామారావే.

‘‘మీ నాన్నగారంటే మా ఆయనకు చాలా గౌరవం. ఎప్పుడూ ఆయన గురించే చెప్తారు. మనిద్దరం స్నేహితులమని ఆయనకెంత సంతోషమో’’. అన్నపూర్ణ. మాటలకు శారద మనసు తేలికపడిరది. పెళ్ళి చేసుకుని కూడా సంతోషంగా ఉన్న అన్నపూర్ణను చూసి సంతోషపడిరది. ధనలక్ష్మి జ్ఞాపకం మెల్లిగా చెరిగిపోతోంది.

‘‘వచ్చే ఏడాది మా ఆయన మద్రాసులోనే చదువుతాడట’’.

‘‘నువ్వు మద్రాసు రా’’ ఉత్సాహంగా అంది శారద.

‘‘అమ్మో నేనా! నన్ను పంపరు. అది జరిగేపని కాదం”ది అన్నపూర్ణ. పదిరోజులు అన్నపూర్ణ కలుస్తూనే ఉన్నా పదో నాటికి ఎప్పుడెప్పుడు మద్రాసు వెళ్దామా అని తహతహలాడిరది శారద.

ఆ తర్వాత రెండేళ్ళ వరకూ మళ్ళీ ఊరికి రావటమే కుదరలేదు శారదకు. రామారావు మద్రాసులో తీరిక లేని పనులు పెట్టుకున్నాడు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాడు. ఆయనకు ఎన్నో విషయాల మీద ఆసక్తి. ముఖ్యంగా ఆంధ్రజాతి చరిత్ర, తెలుగు భాషా సాహిత్యాల గురించి తలకు మించిన పనులు పెట్టుకున్నాడు. పరిశోధన, పుస్తకాలు రాయటం, రాయించటం వీటితో క్రమంగా భార్యాపిల్లలతో కూడా గడిపే సమయం తగ్గిపోయింది. పరిశోధన కోసం అనేక ప్రాంతాలకు తిరుగుతుండేవాడు. శారద తన ప్రశ్నలకు తనే సమాధానాలు వెత్తుక్కోవలసిన పరిస్థితిలో పడిరది. శారదకు చదువు, ఆటలు, సంగీతం వీటితో సరిపోయేదిగానీ సుబ్బమ్మకు బాగా విసుగనిపించేది. భర్త కోసం వచ్చే అతిథులకు వండివార్చటం తప్ప భర్త విశ్రాంతిగా తన చేతి వంట తిని ఎన్ని రోజులయిందా అని విచారించేది.

‘‘ఊళ్ళో ఉన్నప్పుడే నయం. ఉన్న నాలుగు రోజులైనా ఇంటి పట్టున, కంటికెదురుగా ఉండేవారు. ఇపుడు మద్రాసులో అందరం ఉంటున్నామన్న పేరే గారి మీరు ఇంటిపట్టున ఉండే రోజులు తగ్గిపోతున్నాయి. ఉన్నరోజుల్లో అతిథులతో పాటే భోజనం, మాటలు ` రాత్రి నేను నిద్రపోయే వరకూ మీ వాదాలు తెగవు. రాత్రి రెండు గంటల వరకూ చదువుతూనే ఉంటారు. మీ ఆరోగ్యం ఏం కాను?’’ అని సమయం దొరికినప్పుడల్లా మొత్తుకునేది.

‘‘చేయవలసిన పనులు చాలా ఉన్నాయి సుబ్బూ. ఒక జీవితకాలం సరిపోయేలా లేదు.’’

‘‘మీరు పదిమంది పెట్టుగా పని చేస్తున్నారు. పది జీవితకాలాల పని ఒక జీవితకాలంలో చేస్తే ఏమవుతుంది? నా సంగతి సరే ` శారద చదువు సంగతన్నా పట్టించుకోరా?’’

‘‘శారద బంగారు తల్లి. దాని చదువు అది చదువుకుంటుంది. పైగా మేం మాట్లాడుకునే మాటలన్నీ విని అర్థం చేసుకుంటుంది. శారద గురించి బెంగపడకు.’’

‘‘అత్తయ్యగారు పొలం గురించి రాసిన ఉత్తరం చదివారా?’’

‘‘చదివాను. అమ్మకు ఆ మమకారం ఇంకాపోలేదు. కాశీ వెళ్ళినా పొలం సంగతులే’’ తల్లి గుర్తొచ్చి రామారావు ముఖం దిగులుగా మారింది.

‘‘ఆవిడ ఒక్కత్తి అక్కడ నెగ్గుకు వస్తోంది. అక్కడందరికీ తల్లో నాలుకలా ఉంటున్నదని సర్వేశ్వర శర్మ చెప్పాడు. ఆవిడ సమర్థతే వేరు’’ సుబ్బమ్మకు కూడా అత్తగారు గుర్తొచ్చి చాలా బెంగ అనిపించింది.

‘‘నా సామర్థ్యం వేరు.నా ఆసక్తులు వేరు. నన్ను అర్థం చేసుకొని ఒదిలెయ్‌ సుబ్బూ. పనులు ఎన్నో ఉన్నాయి. సమయం చాలకుండా ఉంది’’.

నిజంగానే సమయం ఎలా గడిచిందో తెలియకుండా సంవత్సరాలు గడిచాయి. శారద స్కూలు చదువు ముగించింది. ఇన్నేళ్ళలో ఆ కుటుంబం మళ్లీ స్వంత ఊరు వెళ్ళలేదు. శారద అన్నపూర్ణకు అపుడపుడూ ఉత్తరాలు రాస్తోంది. విశాలాక్షి కబుర్లు అన్నపూర్ణ వల్ల కొన్ని తెలుస్తున్నాయి. విశాలాక్షి కూడా హైస్కూలు చదువుపూర్తి చేసిందని తెలిసింది. ఊళ్ళో హైస్కూలు లేకపోవటం వల్ల అన్నపూర్ణ చదువు ఆగిపోయిందని శారదకు ఎంతో బాధ. భార్యను తన దగ్గరుంచుకుని చదివించవచ్చు గదా అని అబ్బయ్య మీద కోపం తెచ్చుకునేది. ఐతే అన్నపూర్ణ విడిగా చదివే పుస్తకాల వల్ల శారదతో తరతమబేధం లేకుండా స్నేహం చేయగలుగుతోంది.

శారద హైస్కూలు చదువు పూర్తయ్యేలోపల ఆ అమ్మాయిని బాగా కలతపెట్టినది వీరేశలింగంగారి మరణం. రామారావు గారింట్లోనే తరచు వీరేశలింగంగారు బస చేయటంతో శారదకు మద్రాసు వచ్చినప్పటి నుంచీ ఆయనతో అనుబంధం పెరిగింది. ఆయన దగ్గర కూచుని ఎన్నో ప్రశ్నలు వేసేది. ఆయన చెప్పేవి శ్రద్ధగా విని తనకు నచ్చని విషయాలు ధైర్యంగా ఆయనతో చర్చించేది. సాహిత్యం, సంస్కరణ ఈ రెండు విషయాల పట్లా శారదకు ఆసక్తి కలిగించేందుకు వీరేశలింగంగారూ పనిగట్టుకుని ప్రయత్నించేవారు. రాజమండ్రిలో ఏవేవో చిక్కుసమస్యలను ఎదుర్కొంటున్న ఆయనకు మద్రాసులోనే ప్రశాంతంగా ఉండేది. తన పనులు చూసుకుంటూ శారదతో కొంత సమయం గడిపేవాడు. ఆయన అనారోగ్యంతో ఉంటే శారద పక్కన కూచుని సేవ చేసేది. సంఘాన్ని గురించి తప్ప తన కుటుంబాన్ని గురించి ఆలోచించని ఆయన చివరిరోజుల్లో శారద మీద పుత్రికా వాత్సల్యం పెంచుకున్నాడు. రాజ్యలక్ష్మికీ, శారద మేనత్తకూ ఉన్న స్నేహం తలుచుకున్నపుడు ఆ వాత్సల్యం మరింత పెరిగేది.

శారద తాతయ్యా తాతయ్యా అని పిలుస్తూ ఆయన బాధను తగ్గించే ప్రయత్నం ఏదో ఒకటి చేసేది. ‘‘నువ్వు డాక్టరైతే ఎంత మందిని తల్లిలా కాపాడతావో, మీ రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ సరిగానే చెప్పింది. నువ్వు తప్పకుండా డాక్టర్‌విగా. ఇంగ్లాండ్‌ వెళ్ళి చదువు.’’ అని చెప్పాడాయన. ఇంక రెండు రోజులకు మరణిస్తాడనగా కూడా ఆ మాటలే చెప్పి వాగ్దానం తీసుకున్నాడు. శారదకు ఆ వాగ్దానంతో బాధ లేదు. కానీ వీరేశలింగం పంతులు గారి మరణం బాగా బాధించింది. శారదేమిటి? ఆంధ్రదేశమే అల్లాడిపోయింది. ఒక మేరు పర్వతం లాంటి మనిషి. చరిత్ర నిర్మించిన మనిషి. ఆంధ్రదేశాన్ని అంధ విశ్వాసాల నుండి హేతువు వైపు విజ్ఞానం వైపు తిప్పిన మనిషి. అలాంటి మనిషి మరణం జాతి విపత్తులాంటిది. కానీ తప్పదు. సంతోషించాల్సిన విషయమేమిటంటే దేశంలో అన్ని రంగాలలో ఆయన తన వారసులను ఏర్పరుచుకోగలిగాడు. ఆయనతో చిన్నవో, పెద్దవో విభేధాలున్నా ఆయన మీద అందరికీ గౌరవముంది. ఎందరో ఆయన దోవలో నడిచారు. ఆ దోవను మరింత విశాలం చేయటానికి తమ వంతు కృషి చేశారు.

వీరేశలింగం గారి అసలైన విజయం అక్కడే ఉంది. ఆయన మొదలుపెట్టి జీవితమంతా చేస్తూ వచ్చిన పని ఆయన మరణంతో ఆగలేదు. అది మరింత విస్తృతమయింది. మరింత చురుగ్గా ఆయన ఆశయాలను ముందుకు తీసికెళ్ళేవాళ్ళు ఆ పనుల్లో నిమగ్నులయ్యారు.

*

 

మేథో అవినీతి…మన శత్రువు!

( మే 2015 లో ‘ విడుతలై చిరుతైగల్ కచ్చి ‘  Liberation Panthers  అనే ద్రవిడ పార్టి, బుకర్ ప్రైజ్ గ్రహీత అయిన అరుంధతి రాయ్ కు, అంబేద్కర్ ఆలోచనా విధానం విస్తృత ప్రచారానికి చేసిన కృషికి గుర్తింపుగా  ‘ అంబేద్కర్ సుదర్ ‘ అవార్డ్ ను ప్రధానం చేసింది. ఆ సందర్భంగా జరిగిన పబ్లిక్ మీటింగ్ లో అరుంధతి రాయ్ ఇచ్చిన ఉపన్యాసం. తెలుగు అనువాదానికి అనుమతించిన అరుంధతి రాయ్ కు కృతఙతలు తెలియ జేస్తూ – అనువాదకుడు )  

 

అంబేద్కర్ అవార్ద్ ఇచ్చి సత్కరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను. ఇది సంఘటించడానికి ఒక ప్రతీక. ఉధృతమౌతున్న ఫాసిజం కు వ్యతిరేకంగా రాజకీయ కూటములనేర్పరిచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నా సమయం లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను.

ఈ దేశాన్ని హిందూ జాతీయ వాద దేశం గా నిస్సిగ్గుగా మలచాలనే  అధికారం మన దేశ అగ్ర స్థానాన్ని ఆక్రమించుకుంది. అటు వేపే చక్రాలు పరిగెడుతున్నాయి ఇప్పుడు. పాఠ్యాంశాలు మారుతున్నాయి, భోధనా పద్ధతులు మారుతున్నాయి, హిందూత్వ వాదులను న్యాయవ్యవస్థ లోనే కాదు, పోలీసు, ఇంటెలిజెన్స్ మరియు సైనిక వ్యవస్థల్లో చేర్చుకుంటున్నారు.

నేను ఈ రోజు వీ హెచ్ పీ భజరంగ్ దళ్ చేపట్టిన వికారమైన వికృతమైన ‘ ఘర్ వాప్సీ కార్యక్రమం గురించి మాట్లాడ దల్చుకున్నాను. అపవిత్రతను పవిత్ర పరిచి తిరిగి హిందూత్వం లోకి అహ్వానించే ఈ కార్యక్రమం ‘ శుద్ధి ఉద్యమం ‘  గా పిలవబడేది. ఈ ఉద్యమం 150 సంవత్సరాల క్రితం మొదలయ్యింది. ఇది ఏ మతం తో నిమిత్తం లేకుండా తమ సంఖ్యను విస్తరించుకుంటూ ‘ హిందూ సంస్థానం ‘ ను ఏర్పాటు చేయాలనే కృషి చేస్తుంది. మనం ఈ రోజు దీనినే ‘ వోటు బేంక్ ‘ ఆంటున్నాము.

అసలు ‘ హిందువుల గుంపు ‘  అంటూ ఏదీ లేదు. ఇది నిజానికి కొత్తగా పుట్టుకొచ్చిన అంశం. బాబా సాహెబ్ అంబేద్కర్ ను ప్రస్తావిస్తే ” మొట్ట మొదటగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హిందూ సమాజం అన్నదే మిథ్య. మహమ్మదీయులు ఇక్కడ సింధు ప్రాంతానికి తూర్పు దిక్కున ఉన్న వాస్తవ్యులను వేరుగా గుర్తించడానికి ఇచ్చిన పేరు అది.  ”

‘ ఓటు బేంకు ‘ లను పెంపొందించే విధానం సుమారు 100 సంవత్సరాల క్రితం, రాజ్యాలు జాతీయ రాష్ట్రాలుగా , రాచరికం ప్రాతినిధ్య రాజకీయాలతో మార్పు చెందాక  మొదలయ్యింది ప్రాతినిధ్య రాజకీయాలు, సంఖ్యా బలం గురించి ఒక ఆరాటాన్ని ( anxiety ) కలుగ జేయడం తో  హిందువులుగా పిల్చుకునే వర్గాలైన అగ్ర కులాలు తామ అధికారం నిలుపుకోడానికి మెజారిటీగా ఉన్నామని చిత్రీకరించుకోవాలని నిస్పృహతో పని చేయడం  మొదలు పెట్టాయి. అంతకు మునుపు వరకు వీళ్ళందరూ వాళ్ళ కులాల పేరుతోనే గుర్తింపబడే వాళ్ళు. సంఖ్యా బలం గురించి ఆరాటం మొదలు కానప్పుడు అప్పట్లో  నిమ్న కులాలు కులం పాశం నుండి తప్పించుకోడానికి ఏ మతం పుచ్చుకున్నా వాళ్ళకు తేడా అనిపించలేదు.

ఎప్పుడైతే  సంఖ్యా బలం ప్రాముఖ్యత పెరిగిందో –  ఎవరిని తాకడాన్ని కూడా హేయంగా చూసారో, ఎవరిని ఇన్నాళ్ళు బహిష్కృతులుగా చేసారో, ఎవరి ఇళ్ళకు వెళ్ళడం నిషిద్ధం అనుకున్నారో – అప్పుడు వీరందరినీ హిందువులుగా పరిగణించాలని నిశ్చయించుకున్నారు. కుల వ్యవస్థకు , దాని నిచ్చెన మెట్ల హక్కుల సాంప్రదా యానికి వ్యతిరేకంగా  కాక ,అస్పృశ్యతకు వ్యతిరేకంగా , కేవలం ‘ అస్పృశ్యులను ‘ హిందువుల గుంపులో ఉంచుకోవడానికి బ్రహ్మాండమైన ప్రచారం జరపడం మొదలు పెట్టారు.  అదే సమయం లో ‘ ఆర్య సమాజం ‘ ఈ ‘ శుద్ధి ఉద్యమం ‘ ను చేపట్టింది. దానినే ఈ కాలం లో పెద్ద ఎత్తున తిరిగి చేపడుతున్నారు.

సవర్ణుల సమస్య ఏంటంటే అవర్ణులను బం గ్లా లోకి అహ్వానించి వాళ్ళని వేరుగా ‘ సర్వెంట్ క్వార్టర్స్ ‘ లో ఎలా ఉంచాలా అన్నదే ! ఒక పక్క కులం పవిత్రత ను కాపాడుతూ హిందూ మెజారిటీని ఎలా సృష్టించాలి అన్నదే సమస్య. ఒక పక్క అస్పృశ్యత గురించి మాట్లాడుతూ, మరో పక్క, సాంఘిక కుల ఆచారాన్ని ఎత్తి పట్టడం వాళ్ళు కార్చే మొసలి కన్నీళ్ళు తప్ప ఏమీ కాదు.

నాకు తెలిసి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆధునిక రాజకీయ నాయకుల్లో ఒక అద్భుతమైన వ్యక్తి. ఈ పద్ధతిని ఎప్పుడో గ్రహించి ఉగ్ర గొంతుకతో ద్వేషించాడు.  ఇవన్నీ ఆయనెప్పుడో తన రచనల్లో సమగ్రంగా వివరించాడు.

అయినప్పటికీ బీ జే పీ రాజకీయ నాయకులు సిగ్గు లేకుండా అంబేద్కర్ మీద ప్రేమ ప్రకటిస్తూ ప్రతి రోజు ఆయన విగ్రహాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ‘ ఆర్గనైజర్ ‘ అనే ఆర్ ఎస్ ఎస్ మేగజైన్ కు  అంబేద్కర్ బొమ్మను కవర్ పేజీ లా పెట్టుకున్నారు. వాళ్ళు ఆయన్ను అభిమానిస్తున్నట్టు నటిస్తూ , ఆయన భోధించిన రాజకీయాలను అడుగంటేలా  చేసి , అంబేద్కర్ ను హిందూత్వ చిహ్నం గా మార్చాలని చూస్తున్నారు.

చర్చ్ ల మీద వారి గూండాలు దాడులు చేయడం ద్వారా, నన్స్ పై అత్యాచారం చేయడం ద్వారా అంబేద్కర్ ఆశించిన తీరులో హిందూ మతాన్ని వదిలించుకుని,  క్రిస్టియన్ మతం స్వీకరించిన దళితులను  కాంధమాల్, బస్తర్ లాంటి ప్రాంతాల్లో నిత్యం భయభ్రాంతులతో జీవించేలా చేస్తున్నారు.

ఈ రోజు అతి కౄరంగా , అంబేద్కర్ పోరాటం చేసి సాదించిన రిజర్వేషన్లనే ఎర చూపించి హిందువుల గుంపులోకి రమ్మని ఆశ చూపుతున్నారు. అంటే అంబేద్కర్ వాడిన కత్తినే తిప్పి తిరిగి ఆయన సిద్ధాంతాలకే తూట్లు పొడుస్తున్నారు. ఆయన ప్రజల పేదరికం , దౌర్భల్యత ను – వారికే వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు.

మన దేశాన్ని ‘ సూపర్ పవర్ ‘ గా మన నాయకులు వర్ణిస్తారు. ఆ ‘ సూపర్ పవర్ ‘ దేశం లో 80 కోట్ల మంది దినానికి 20 రుపాయల కంటే తక్కువ ఆదాయం మీద బతుకుతున్నారు. అంత తక్కువ మొత్తం లో హుందాకరమైన జీవితం గడపడం సాధ్యమా ? చాలా మంది ఆఫ్రికా దేశాలు బీద దేశాలు గాను ఇండియాను ధనవంతమైన దేశం గాను ఊహించుకుంటారు. నిజానికి ఆఫ్రికా దేశాల కన్న మన దేశం లో పేదవాళ్ళు అధికంగా ఉన్నారు. మన దేశం అత్యాధిక సంఖ్యలో పోషకాహరం లేని పిల్లలకు నిలయమై ఉంది. పిడికెడు మంది కోటిశ్వరులు మన దేశం లో ఉన్న కోట్ల పేద ప్రజలకు మించిన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు. మనం అవమాన కరమైన అసమానతల సమాజం లో జీవిస్తున్నాం.

మిగతా దేశాల్లో లా కాక , మన దేశం లో కుల వ్యవస్థ ఆశీర్వాదాలతో అసమానత వ్యవస్థీకృతమై ఉంది.

20 రుపాయలకన్నా తక్కువ భృతితో జీవితం సాగిస్తున్న ఆ 80 కోట్ల మంది ప్రజలలో అధికులు ప్రాజెక్టుల వలన భూమి కోల్పోయిన వాళ్ళు, పౌష్టికాహారం లేని పిల్లలు, భూమి ఇల్లు లేని నిరుపేదలు, నగరాల్లో మురికి వాడల్లో నివసించే వాళ్ళు, జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు. ఇందులో దళితులు, ఆది వాసీలు  ముస్లిం లు అధికంగా ఉన్నారు. ఈ హింసాత్మక దేశం లో జరిగే మారణ కాండల్లో , హత్యాచారాల్లో అధికంగా బలి అయ్యేది కూడా వీళ్ళే.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం, ప్రతి 16 నిమిషాలకు దళితుల పట్ల దళితులు కాని కులాల వాళ్ళు నేరానికి పాల్పడుతున్నారు; రోజుకు నలుగురు ‘అస్పృశ్య మహిళలు ‘ స్పృశ్య ‘ కులాల వలన అత్యాచారానికి గురౌతున్నారు;  ప్రతి వారం 13 మంది దళితులు హత్య చేయబడ్డమే కాక 6 మంది దళితులు కిడ్నాప్ కు గురి కాబడుతున్నారు.

ఒక్క 2012 లోనే , ఢిల్లీ గేంగ్ రేప్ జరిగిన సంవత్సరం లో, 1574 దళిత మహిళలు రేప్ చేయబడ్డారు, 651 మంది చంపబడ్డారు ( ఒక అనుభవ సూత్రం ఏమంటే దళితుల పట్ల జరిగిన నేరాలలో 10 శాతం మాత్రమే రిపోర్ట్ చేయబడుతున్నాయి ). ఇది కేవలం రేప్, హత్యల గురించి మాత్రమే అందిన సమాచారం. ఇవి మాత్రమే కాక వలువలూడ దీయడం, బలవంతంగా మలాన్ని తినిపించడం( అక్షరాలా !! ), భూములు లాక్కోవడం, సాఘిక బహిష్కరణ, తాగు నీటిని తిరస్కరించడం లాంటివి వేరుగా ఉన్నాయి.

బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు ” హిందూత్వం భీతావహానికి కొలువు ”

హింస కేవలం అల్లరి మూకలకు , సాయుధ దుండగులకు సంబంధించినది మాత్రమే కాదు. అది భారత దేశ రాజ్య స్వభావం లోనే ఉంది.

ముందు నెలలో , ఏప్రిల్ 7 న, ఆంధ్ర ప్రదేశ్ లో 20 మందిని  STF  కాల్చి చంపారు. ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. 42 మంది ముస్లిం లను  PAC  కిరాతకంగా చంపిన హషింపుర కేసులో లానే, కీళవేన్మని సంఘటనలానే, ఇంచుమించు దళితులపై జరిగే ప్రతి దాడి లానే , ఈ  STF  వాళ్ళకు ఏమీ కాదు. అదే రోజు తెలంగాణాలోవరంగల్ నుండి హైదరాబాదుకు సంకెళ్ళు వేసి తీసుకెల్తున్న  5 మంది ముస్లిం ఖైదీలను పోలీసులు కాల్చి చంపారు. 67 సంవత్సరాలలో ఇండియాకు సార్వభౌమత్యం లభించాక , దేశం లో ఉన్న రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి సైన్యాన్ని ఉపయోగించని సంవత్సరం ఒక్కటి కూడా లేదు.  సైన్యం కాశ్మీర్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, గోవా, తెలంగాణా, అస్సాం, పంజాబ్, వెస్ట్ బెంగాల్ లలో ప్రతి చోటా ఉంది. దానిని ఇప్పుడు ఆదివాసీలు నివసించే మధ్య భారత దేశం లో, అక్కడి భూమిని మైనింగ్ మరియు ఇంఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కు ఉపయోగించడం కోసం,  వాడడానికి సిద్ధమౌతున్నారు.  వేలల్లో ప్రజలను బంధిస్తున్నారు, చిత్ర హింసలు పెడుతున్నారు. ఎవరీ రాజ్య శతృవులు ? ఆలోచించండి….వాళ్ళు ముస్లిం లు, క్రిస్టియన్ లు, ఆది వాసీలు, సిక్కులు, దళితులు.

మనం సవర్ణ దేశం లో ఉన్నాం. అది నిరంతరం అవర్ణులపై , మైనారిటీలపై దాడి చేస్తూనే ఉంటుంది !!

మనది మైనారిటిల దేశం. మరి ఈ ఉన్నత వర్గానికి చెందిన మైనారిటీ సమూహం ( బ్రాహ్మణులు , బనియాలు 6 శతం కన్నా తక్కువ )  అధికారాన్ని , హక్కులను ఏ విధంగా పొందగలుగుతుంది ? ప్రజలను ఒకరి మీదకు ఒకరిని ఉసిగొప్లడం ద్వారా ! నాగాలను కాశ్మీరీల మీదకు, కాశ్మీరీలను చత్తీస్ గడ్ ప్రజల మీదకు, తమిళులను అస్సామీయుల మీదకు, వెనుకబడిన కులాలను దళితుల మీదకు, దళితులను ముస్లిం ల మీదకు ఉసిగొల్పడం చేస్తుంది.

1960, 1970 లలో ప్రతిఘటన ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో మీ పార్టీకి పూర్వ గాముకులైన దళిత్ పేంథర్స్ , నక్సలైట్లు న్యాయం గురించి , విప్లవం గురించి ఎలుగెత్తారు. భూ సంస్కరణల గురించి నినదించారు. ‘ దున్నే వాడిదే భూమి ‘ అనే నినాదం వారిది.

రోజు మన మెదళ్ళ నుండిన్యాయంఅనే అంశానికి బదులుగా  ‘ మానవ హక్కులుఅనబడే ఒక సంకుచిత అంశం వచ్చింది.

అంతో ఇంతో జరిగిన భూ సంస్కరణలు కూడా వెనక్కు మళ్ళబడ్డాయి. ఎంతో ఉధృతమైన మావోయిస్ట్ ఉద్యమాలు కూడా ఆది వాసీల భూములను ప్రైవేటు వ్యాపార సంస్థల పరం కాకుండా ఉండడానికి మాత్రమే పోరాటం చేసే స్థాయికి తగ్గి పోయాయి. ఈ రోజు 70 శాతం పైగా దళితులు భూమి లేని వాళ్ళు. పంజాబ్, బీహార్, హర్యానా, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఈ సంఖ్య 90 శాతం పైనే ఉంటుంది. ఇన్ని కోట్ల మంది ఈ చర్చలో భాగం కూడా కాదు.

ఎవరు మన దేశాన్ని స్వంతం చేసుకున్న ఈ వ్యాపార సంస్థలను నడుపుతున్నారు ? – భూమి ఒక్కటే కాదు, ఆడవులు, నదులు, నీళ్ళు, విద్యుత్తు . పోర్టులు, సెల్ ఫోన్ నెట్వర్క్, టీ వీ చానల్స్, ఫిల్మ్ ప్రాడక్షన్, స్పెషల్ ఎకనమిక్ జోన్ లు  అన్ని బ్రాహ్మణులు లేదా బనియాలకు సంబంధించిన  అదాని, అంబాని, మిట్టల్, సంఘ్వి, బిర్లా, జిందాల్ లాంటి వాళ్ళే .

అత్యంత అలజడి సృష్టించిన ఫ్రెంచ్ రైటర్ ప్రొఫెసర్ థామస్ పికెటీ వ్రాసిన కొత్త పుస్తకం  Capital in the 21st century  లో మనమిప్పుడు ప్రపంచం లో చూస్తున్న ఆర్థిక అసమాటితలు పురాతన యుగం తో సమానంగా చేసి చూస్తాడు. అందుకు మహత్తరమైన గణణాంకాలతో – ఈ రోజుల్లో యూరోప్, అమెరికాలలో అసమానతలను పెంపొందించే పెద్ద పెద్ద బేంకులు , సంస్థలు ఎలా ఐశ్వర్యాన్ని తర తరాలుగా సంక్రమించుకుని వాళ్ళ వంశాలకు ఎలా సంప్రాప్తించేలా చేస్తాయో చెప్తాడు. మన దేశం లో తరాలుగా సంప్రాప్తిస్తున్న ఐశ్వర్యం, ఙానం, భోగాలు ఇవన్నీ దైవాంశ సంభూతం గా కొలవబడుతున్న హిందూ కుల వ్యవస్థ వలనే జరుగుతున్నాయి.

కేపిటలిజం కు కుల వ్యవస్థ తల్లి లాంటిది.

మనం తిరిగి మైనారిటీ సమూహాలైన బ్రాహ్మణ మరియు బనియాలు ఎలా సౌభాగ్యంగా  మనగలుగుతున్నారు అనే ప్రశ్న దగ్గరకొస్తే – కిరాతకైన భౌతిక బలం ఊయోగించడం వారి టెక్నిక్.

ప్రధానంగా ఇదే బనియా సంస్థలే మీడియాను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళే ఏ విషయం ప్రచార అర్హత కలిగుందో నిర్ణయిస్తారు.  మీడియా ను నియత్రించడం ద్వారా దేశం  తలంపులను ఆలోచనలను నియంత్రిస్తారు. 4 ప్రధాన జాతీయ వార్తా పత్రికల్లో , 3 వైశ్యులు నడుపుతుండగా 1 బ్రాహ్మణులు నడుపుతునారు.

టైంస్ చానల్ నడుపుతున్నది జైన్ ( బనియా) , హిందుస్తాన్ టైంస్ నడుపుతున్నది బర్తియా ( మార్వాడి బనియా ), ఇండియన్ ఎక్స్ప్రెస్ నడుపుతున్నది గోయంకా ( మార్వాడి బనియా ) , ది హిందూ నడుపుతున్నది బ్రాహ్మణ కుటుంబం, దైనిక్ జాగరణ్ నడుపుతున్నది గుప్తా కుటుంబం, దైనిక్ భాస్కర్ నడుపుతున్నది అగర్వాల్ కుటుంబం. గుజరాత్ బనియా అంబాని నడుపుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కు 27 ప్రధాన జాతీయ , ప్రాంతీయ చానల్స్ లో షేర్స్ ఉన్నాయి. అతి పెద్ద జాతీయ చానల్ జీ నెట్ వర్క్ కూడా బనియానే నడుపుతున్నది.

గణాంకాలు చెప్తున్నదేమంటే సంస్థలు తీసుకునే జర్నలిస్టులు కూడా ప్రధానంగా బ్రాహ్మణ, బనియా మరియు అగ్ర కులాల వారే. ముస్లిం జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారో చేతి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. దళితులు, ఆది వాసీల ఐతే అసలు కనబడరు.

రిజర్వేషన్ పాలసీ ని ఉద్దేశ్యపూర్వకంగా కూలదోస్తూఇదే పరిస్థితి న్యాయ వ్యవస్థలో, బ్యూరాక్రసి లో, విద్యా వ్యవస్థలో ఉంది. దళితులు అధికంగా కనిపించే స్థానాలు ఏవంటే – 90 శాతం ప్రభుత్వ మునిసిపాలిటీ లో పరిశుభ్ర కార్మికులు ! గొప్ప రాజ్యం లో 13 లక్షల స్త్రీలు ఇంకా తమ నెత్తి మీద మలం బుట్ట పెట్టుకు తిరిగి జీవనం వెళ్ళ బోస్తున్నారు.

ప్రజాస్వామ్యం  స్వేచ్చా మార్కెట్ విధానం కులవ్యవస్థను ఆధునీకరించి పఠిష్టం చేస్తున్నాయి. అయినా సరే , పేరెన్నిక గన్న భారత మేధావులు, చరిత్ర కారులు, ఆర్థికవేత్తలు, రచయితలు, కుల సమస్యను అల్పంగా చూపడం కాని లేదా మొత్తానికి విస్మరించడం కాని చేస్తున్నారు. ఇది కంటికి కనిపించని గొప్ప పథకం. ఈ తెర లేవదీసి , ఈ ప్రపంచానికి మన గొప్ప ప్రజాస్వామ్యం లో ఏం జరుగుతుందొ చూపించడం మన విధి.

ఎలక్షన్ ల సమయం లో అన్ని రాజకీయ పార్టీలు , సవర్ణ రాజకీయ నాయకులు ‘ దళిత వెనుక బడిన కులాల ‘ ఓట్ల కోసం కొట్లాడుకుంటున్నప్పుడు మాత్రం  అడుగున కప్పేసి ఉన్న కులం ఉక్కు చట్రాన్ని బయటకు తీసి పెద్ద గొంతుకతో వికృతంగా అరవడం చేస్తారు. ఒక్క సారి ఎలక్షన్ లు అయిపోయాక తమకు తెలిసిన మేథో మూర్ఖత్వం తో ఆ సమస్యను పూడ్చి పెడతారు. ఒక ప్రధాన టీ వీ యాంకర్ ఎంతో సీరియస్ గా అంబేద్కర్ కుల వ్యవస్థకు వ్యతిరేకి కాబట్టి రిజర్వేషన్ పాలసీని వ్యతిరేకించాలి అని వాదించడం చూసాను.

ఈ రోజుల్లో ఆర్థిక అవినీతి గురించి మాట్లాడ్డం ఒక ఫేషన్ గా కనిపిస్తుంది. కాని అందులో చాలా తక్కువ మంది మాత్రమే ‘ మేథో అవినీతి ‘ గురించి మాట్లాడుతున్నారు. మేథో అవినీతి దేశం లో పాటించే ఒక ఊహకందని నైతిక లంచగొండితనం

ఈ సమాజ తీరు తెన్నులు, న్యాయం గురించి పుంఖానుపుంఖాలుగా సైద్ధాంతిక వ్యాసాలు రాస్తూ అసలు కులాన్ని మొత్తంగా పక్కకు నెట్టేసే కొంత మంది పేరెన్నిక గన్న చరిత్ర కారులు, మేధావులు ఈ అవినీతిలో కూరుకుపోయారు. ఇది ఈ సమాజం కనుగొన్న అతి కౄరమైన అణచివేత విధానం.

చరిత్రలో అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇదే ‘ మేధో అవినీతి ‘ –  కుల వ్యవస్థను నమ్మిన, శ్రామికులను , స్త్రీలను , నల్ల జాతీయులను కించ పరిచిన మోహన్ దాస్ గాంధీని ప్రపంచంలో గొప్ప సాధువుగా , పేదల మితృడిగా , నల్ల అమెరికన్ ల హీరోగా, నెల్సన్ మండేలా లా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లా చివరికి ఈ దేశానికి జాతిపిత గా ఎత్తిపట్టడం. ఈ దేశ పునాదులను అటువంటి అసత్యాల మీద నిలబడ్డాన్ని మనం సహించరాదు.  ప్రతి స్కూల్ రూం లో తప్పనిసరిగా చేయాల్సిన అంబేద్కర్గాంధి డిబేట్  విషయాన్ని చాలా చాతుర్యంగా చీకట్లో నెట్టేసి , ఇప్పుడు లిబరల్ మేధావులు మరియు చరిత్ర కారులు వారిద్దరిని మంచి సహ ప్రయాణికుల్లా ఉన్నట్టు , ఏదో వారి మధ్య చిన్న కలహాలు ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ మొత్తం అబద్ధాలే చెప్తున్నారు.

మనం అత్యవసర బాధ్యతగా పెట్టుకుని అంబేద్కర్ వారసత్వాన్ని అసత్యాలతో మార్చడాన్ని అడ్డుకోవాలి.

ఉపన్యాసం ముగించేలోపు నేను చెప్పదల్చుకున్నదేమంటే కుల వ్యవస్థను రూపు మాపడానికి మనం బ్రాహ్మినిజం, కేపిటలిజం, సామ్రాజ్య వాదం మధ్య సంబంధాన్ని గుట్టు విప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా మనం ఒక రాజకీయ సంఘటన కట్టాలి. దక్షిణ ఆఫ్రికాలో జాతి వివక్ష ఎలా నిర్మూలింపబడింది అనుకుంటున్నారు ? మొత్తం ప్రపంచం దుర్మార్గమైన వివక్షను హేయపూర్వకంగా చూడాలి. ఇండియా బయట ఉన్న వాళ్ళకు కుల వ్యవస్థ ఏంటో తెలీట్లేదు. వాళ్ళకు ఇదేదో హిందూయిజం,  శాఖాహారి ఫేషన్ సంస్కృతి, యోగా మరియు గాంధియిజం   ఫేషన్  తో కలిసిపోయిన బ్రహ్మ పదార్థం లా ఉంది.

మన లో ప్రతి ఒక్కరు మన ప్రజ్ఞా   సామర్థ్యాలు ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఉపయోగించాలి.

మన ముందు ఉన్న ప్రధానమైన సవాలు ఏంటంటే – మన రాజకీయ ఐక్యతను నిరోధించే ఈ కుల విభజనను మన ఏమరుపాటుతో బలోపేతం చేయకుండా, మనం కులాన్ని ఎదుర్కోవడం. ఇది చాలా సంక్లిష్ట పోరాటం. ఎందుకంటే మన ఐక్యతను దెబ్బ తీసే రాడికల్ నినాదాలు, ప్రత్యేక వాదాలు మీరు చూస్తారు. నాకంటే మీకు బాగా తెలుసు  – శతృవర్గం లో మీ మితృవులకు ఈ విషయం చెప్పడం చాలా కష్టం. అయినా సరే తప్పదు. చెప్పాలి. అంబేద్కర్ కున్న గొప్ప ప్రజ్ఞా పాటవాల్లో ఇదొకటి.

మన లో ప్రతి ఒక్కరు మన ప్రఙ  సామర్థ్యాలు ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఉపయోగించాలి.

మనం పొలాల నుండి మొదలుకుని, ఫేక్టరీలు, మురికి వాడలు, గుడిసెలు, తరగతి గదులు, యూనివర్సిటీలు, సినిమా, సాహిత్యం అన్నిటినీ కలుపుతూ ఒక సుధీర్ఘమైన దుర్భేధ్యమైన జాగృతి, అవగాహన, అవిరామ ఆచరణ అనే గొలుసును తయారు చేయాలి !!!

అనువాదం: పి. విక్టర్ విజయ కుమార్ 

 

 

 

 

 

 

 

 

అపరిచితులు      

      శివ్

                                                                                                                 

      shiv photo “సార్ ఐ.ఐ.టి నుంచి ప్రొఫెసర్ మోహన్ గారు మన కళాశాలలో అతిధి ఉపన్యాసం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దాని వల్లమన ఎలెక్ట్రికల్ స్టూడెంట్స్ కు బాగా ఉపయోగముంటుంది  అన్నాను”. నేను ఖరగ్పూర్ ఐ.ఐ.టిలో సెమినార్ నుంచి వచ్చినతర్వాత మా ప్రిన్సిపల్ను కలిసినప్పుడు, ఈ సంభాషణ జరుగుతోంది. “అలాగేనండి, నేను సెక్రటరీ గారితో మాట్లాడతాను,తర్వాత మీరు డేట్స్ కన్ఫర్మ్ చేద్దురుగాని” అన్నారాయన. నాలుగైదు రోజులు పోయాక ఆయన్ని వేరే పని మీద కలిసినప్పుడు ఆ విషయం మళ్ళీ ప్రస్తావించాను. “కమిటీ వాళ్ళు ఒప్పుకోవడం లేదండి. ఇప్పుడు పాతిక వేలు ఖర్చు పెట్టలేమంటున్నారు”అన్నారు. “అలాగే సార్” అనాల్సొచ్చింది నాకు.

            కొన్ని రోజుల తర్వాత ఓ నాడు మధ్యహ్నంనుంచి  కాలేజ్ లో హడావిడి మొదలయ్యింది. కమిటీ మెంబర్లు,  ప్రిన్సిపల్,ఇంకా కొందరు స్టాఫ్, అటెండర్లూ, ఏదో మహత్కార్యం జరగబోతున్నట్లు సందడిగా అటూ ఇటూ తిరుగాడుతున్నారు. ఓ ప్రక్కఎర్ర తివాచి  కొత్తది తెప్పించి, దానిని అట్టహాసంగా ఆఫీసు గది మెట్ల దగ్గర్నుంచి సెమినార్ హాల్లోకి పరుస్తున్నారు.ఇంకొంతమంది,పూలు పెద్ద బుట్టలలోంచి తీసి, తివాచీకిరువేపులా జాగ్రత్తగా అమరుస్తున్నారు. సెమినార్  హాల్లో వేదిక పైనఅసలైన ఆర్భాట కార్యక్రమం జరుగుతోంది. బయటినుంచి వచ్చిన సిమ్హాసనపు విడిభాగాల్ని అక్కడ సన్యాసుల్లాకనబడుతున్న కొంతమంది జాగ్రత్తగా,ఆసనంగా మార్చడానికి పూనుకుని ఉన్నారు. నేను తెలుసుకున్నదేమిటంటే, పొరుగురాష్ట్రం నుంచి, ఒకానొక ప్రసిధ్ధి చెందిన స్వామి వారు అక్కడికి కొద్ది సేపట్లో వేంచెయ్యబోతున్నారట. ఆయననుస్వాగతించడంకోసమే ఈ ఏర్పాట్లు. ఆయన  అనుగ్రహ భాషణా కటాక్షంకోసం నిరీక్షణ. స్టాఫ్ అందరూ కార్యక్రమంపూర్తయ్యేవరకూ ఉండాలని ఆదేశిస్తూ  సర్కులర్ కూడా వచ్చిందట. అది  నేను చూడలేదు.

            మా గ్రూపులోని ఇంకో కళాశాలకు ఎప్పటినుంచో తెలుగు పండితుడిగా,ఆస్థాన గాయకుడిగా ద్విపాత్రాభినయంచేస్తున్న ఒకాయన, పాత తెలుగు సినిమాలలోని భక్తి పాటలు, లింగాష్టకం, శివాష్టకం ఇత్యాదులు మైకు ముందు కూచుని పెద్దగొంతుతో పాడడానికి ప్రయత్నిస్తున్నాడు. హాల్లో  ఉన్నవాళ్ళకి అవి వినడం మినహా వేరే గత్యంతరం లేదు. ఆ రోజు ఆకాశం,మేఘావృతమై, నల్లటి దుప్పటి క్రింద దాక్కున్నట్లు, తల నుంచి కాళ్ళ వరకు శ్యామ వర్ణంలో ముంచి తీసినట్లు, చిక్కగా,దట్టంగా ఉంది.కొద్దిసేపట్లోనే, పట్టిన రంగును వదిలించడానికి తల్లి తన పిల్ల వాడికి అభ్యంగన స్నానం చేయిస్తున్నట్లు,పెద్ద పెద్దకుండలతో  తలపైనుంచి  నీళ్ళు దిమ్మరిస్తున్నట్లుగా వర్షం ప్రారంభమయ్యింది. మా కళాశాలలో హడావిడి ఏమాత్రంతగ్గలేదు.చాలాసేపు వేచి ఉన్నతర్వాత,”అదిగో వేంచేస్తున్నారు, తప్పుకోండి, తప్పుకోండి” అంటూ కోలాహలం మొదలయ్యింది.ఐదడుగులకంటే  తక్కువ ఎత్తులో, ఎర్రగా, దాదాపు అరవై యేళ్ళ పైచిలుకు వయసున్న ఒక కుదిమట్టపు ఆకారం, గంగాళందొర్లుకుంటూ వస్తున్నట్లు ఎర్ర తివాచీ మీద నడచుకుంటూ వచ్చింది. మా వాళ్ళు అతి వినయంగా  ఆయనకు ఒంగి దణ్ణాలుపెడుతూ, హాల్లోకి, ఆ తర్వాత స్టేజ్ పైనున్న సిమ్హాసనం మీదకు ఆయన్ను తోడ్కొని వచ్చారు.

            నేను, మరికొందరు సహోద్యోగులు ప్రేక్షకులుగా హాల్లో ఉన్నాం. సందడి సద్దుమణిగాక స్వామివారు  సుఖాశీనులై తమఅనుగ్రహ భాషణం మొదలెట్టారు.అంతలో ఎవరో మాట్లాడుతుండటం  ఆయన చెవినపడింది. వెంటనే ఆగ్రహంతో “ఎవరుమాట్లాడుతున్నారు? నేను మాట్లాడాలా, మీరు మాట్లాడతారా?” అంటూ  గద్దించారు. ఆయన కళ్ళు , కోపం ఎర్రటి గోళీల రూపం దాలిస్తే, ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఆ మాట్లాడిన వ్యక్తి బిక్కచచ్చిపోయి మాట్లాడటం ఆపాడు.నా నోరు అప్రయత్నంగా తెరుచుకుని మళ్ళీ మూసుకుపోయింది. స్వామి వారు ముందుగా  పద్యంతో మొదలెట్టారు. తర్వాత ఇలాఅన్నారు. “నరుడు ముఖ్యంగా మూడు  విషయాలమీద దృష్టి పెట్టాలి. ఒకటి,తన కోపమే తనకు శత్రువు కాబట్టి ముందుగా కోపాన్ని జయించాలి. రెండోది పరస్త్రీని ఆశించకూడదు.అలా చేస్తే వినాశనమే! రావణాసురుడు దీనికి  తార్కాణం, ఇక మూడు,ఇతరుల బాధలను మన బాధలుగా భావించాలి. అంటే మనం ఒకళ్ళని తిడితే వాళ్ళెలా బాధపడతారో,అలాగే మనంభావించి,పరులను దూషించకూడదు” అన్నారు. భాషణం ముగిసింది. చాలా మంది ఆయన కాళ్ళకు పడి, పడి మ్రొక్కారు.

            తర్వాత ఎన్నోవేలు పెట్టి తయారు చేయించిన ప్రసాదం వినియోగించబడింది. అంతకుముందు  స్వామి వారు మాకళాశాల దిన దిన ప్రవర్ధమానమవ్వాలని, మా యాజమాన్యాన్ని దీవించారు. వాళ్ళు పాదాభివందనం చేసి తమ భక్తిని చాటుకున్నారు. అంతే కాక  పది లక్షల రూపాయలు స్వామివారి ట్రస్టుకు విరాళంగా సమర్పించారని నాకు తర్వాత తెలిసింది.ఇక ఆ కార్యక్రమ ఏర్పాట్లకు భారీగానే ఖర్చయ్యింది. నాకు అప్పుడు, కొద్దిరోజుల క్రితం మా ఇంజనీరింగ్ విద్యార్ధులకోసం ఐ.ఐ.టిఆచార్యులను అతిధి ఉపన్యాసం కోసం పిలవడం గురించి, దానికయ్యే ఖర్చు సంగతి, మా ప్రిన్సిపల్తో జరిపిన సంభాషణ గుర్తుకువచ్చాయి. విద్యార్ధులకు ఐ.ఐ.టి ఆచార్యుల కార్యక్రమం వల్ల ఉపయోగముందో,లేక స్వామి వారి అనుగ్రహ భాషణం ఎక్కువమేలు చేస్తుందో నాకర్ధం కాలేదు.

Kadha-Saranga-2-300x268

#

       నేనడపా దడపా  టెన్నిస్ ఆడతాను. పని దినాలలో ఎలాగూ కుదరదు కాబట్టి కాబట్టి శెలవుల కోసం ఒకింత ఆరాటంగానేఎదురు చూస్తూ ఉంటాను.ఆట ముగిసిన తర్వాత విధిగా రెండు కొబ్బరి బొండాలు తాగుతాను.బొండాలమ్మే వ్యక్తి నాకు బాగాపరిచయస్థుడు.అదే చోట అతను తన బండిని రెండు మూడేళ్ళుగా ఉంచి వ్యాపారం చేస్తున్నాడు.ఒక్కో సారి నా దగ్గర సరిపడాచిల్లర, డబ్బులు లేకపోయినా “పర్లేదు సార్ తాగండి, ఈ సారి వచ్చినప్పుడివ్వచ్చని” ఆప్యాయంగా మంచి బొండాలతో నాఅలసట తీరుస్తాడు.

            ఓ ఆదివారం ఆటయ్యాక  యదావిధిగా బండి దగ్గర బొండాం తాగుతున్నాను.ఇంతలో ఓ అడుక్కునే  అవ్వ “అయ్యా”అంటూ చెయ్యి జాచింది. “చిల్లర లేదమ్మా” అంటూ తాగడంలో ముణిగిపోయాను.”అయ్యా” అంటూ అవ్వ ఈ సారి బొండాలమ్మేఅతని వేపు చెయ్యి చూపింది.నేను యధాలాపంగా అటు తిరిగాను. “ఎళ్ళెళ్ళవమ్మా” అంటాడనుకున్నాను. ఐతే నాకు దిమ్మతిరిగిపోయింది. “ఇదుగో తీసుకో” అంటూ అతను ఆమెకు వందరూపాయల నోటు,చాలా సునాయాసంగా,షాపులోసరుకులో,కూరగాయలో కొన్న తర్వాత డబ్బులు చెల్లించినట్లు,నిర్భావంగా అందించాడు.ఆమె ఓ నిమిషం అవాక్కయ్యి,తర్వాతసంబరంగా నోటును తడుముకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది.నాలో భిన్న భావాలు ముప్పిరిగొన్నాయి.నేనిచ్చినడబ్బులు బొండాలతను అందుకున్నాడు.అంతకు ముందు అవ్వకు అంత మొత్తమిచ్చానన్న స్పృహ ఏమాత్రం అతనిలో నాకుకనిపించలేదు. తను నా ముందు, జీవితంలో, ముఖ్యంగా అతని వ్యక్తిత్వం గురించి నేనేమాత్రం ఊహించని మరోసున్నితమైన,మహా గొప్పదైన పార్శ్వాన్ని ఆయత్నకృతంగా ఆవిష్కరించాడు. మనసులోనే అతనికి జోహార్లర్పించుకుంటూవెనుదిరిగాను.

#

            ఆమె నాకు సంవత్సరం పైగానే తెలుసు.చాలా బాగా నేను కూడా ఆమెకు తెలుసని  నేననుకుంటూ ఉంటాను.కళాశాలలో సహోద్యోగులుగా మా మధ్యన మంచి అవగాహన ఉంది.ఎప్పుడూ ముఖమంతా నవ్వుతో నాతోమాట్లాడుతుంది.నాతోనేనేమిటి?అందరితోనూ ఆవిడలాగే ఉంటుందనుకుంటా! ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ సార్లునేను ఏ పదాలు వాడతానో,వాటినే ఆమె తిరిగి అంటుంది. దాంతో నాకు,ఆమెకు నాపై గౌరవం కాస్తా ఎక్కువేనని నాకనిపిస్తూఉంటుంది.పైగా ఇద్దరమూ ఆంగ్ల పాఠాలు ఇంజనీరింగ్ విద్యార్ధులకు బోధిస్తామాయె.నేను ఉపాధి మరియు  శిక్షణా విభాగంలోఉన్నప్పటినుంచి మా మధ్యన సమన్వయం బాగానే ఉంది.ఆ ధైర్యంతోనే నేను(నేను ప్రస్తుతమున్న విభాగంలో నా సహచరుడితో నేనిమడలేకపోవడం వల్ల)హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ లో,ఆంగ్ల విభాగంలోకి మారుతానని కమిటీ మెంబర్సుకు,ప్రిన్సిపల్  గారికి చెప్పి ఆమోదం పొందాను. ఇటీవలే మారాను.

            ‘శివ’ సినిమాలో కోట శ్రీనివాసరావన్నట్లు,మొదటి నెల అంతా ఓకే.నాకు చాలా సహకారమందించింది.అంతా సజావుగా ఉన్నట్లుంది.అంతలో మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్,నన్ను లాంగ్వేజ్ లాబ్ కు ఇన్ చార్జ్ గా నియమించారు.నా కుర్చీకూడా పాత విభాగంలోంచి  లాబ్ లోకి మారింది.ఇదివరకు  నాకు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కంప్యూటర్ఉండేది.ల్యాబ్లోకి మారింతర్వాత దాన్నే నాకివ్వమని మా హెడ్నడిగాను.అతను చూద్దామన్నాడు.ఐతే అక్కడ లాబ్ లో ఒకకంప్యూటర్ని మేడం వాళ్ళు ఉపయోగించుకునేవారు.మా సిస్టం అడ్మినిస్ట్రేటర్ దాన్ని నా టేబుల్ దగ్గర ఏర్పాటు చేశాడు.ఈచిన్నమార్పు నా ఉద్యోగానికే ఎసరు పెడుతుందని నేనేమాత్రం ఊహించలేకపోయాను.

            ఆమె నా దగ్గరేమీ మాట్లాడలేదు కానీ తర్వాత,‘సిస్టం’ వాళ్ళని బెదిరించినట్లు,”దీని వల్ల ప్రశాంత్  గారు చాలాసమస్యలు ఎదుర్కోబోతున్నారు” అని వాళ్ళతో అన్నట్లు,సిస్టంస్ డిపార్ట్మెంట్లోని రాజు నాకు చెప్పాడు.నేను వెంటనే ఆమెనుకలిసి “నేను నా పాత సిస్టం నాక్కావాలని అన్నానే కానీ,మీరు వాడుతున్నదాన్ని నా కిమ్మని నేనడగలేదు,కానీ చక్రవర్తిహడావిడిగా మీరు వాడుతున్న దాన్ని నాకు కేటాయించాడు.నేను దాన్ని మళ్ళీ మీరు వాడుకునే చోటే ఉంచమని చెపుతాను”అన్నాను. “ఏం పర్వాలేదు సార్, నో  ప్రాబ్లం” అందామె.కానీ   కమిటీ మెంబర్లదీ, ఈమెదీ ఒకే కులం కావడం వల్ల, కొన్నిరోజుల్లోనే నేను కళాశాలనుంచి బయటకు పోవలసిన ఏర్పాట్లు జరిగిపోయాయి.ఆమె నాకు బాగా తెలుసు అనుకుంటున్నసమయంలో నాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.ఐతే ఆ దెబ్బనుంచి నేను మంచి గుణపాఠం నేర్చు కున్నాను.

#

       ఆమె పైకి కనిపించినంత,మాట్లాడినంత సరళమైన వ్యక్తి కాదని,ఆమే కాదు మనచుట్టూ ఉన్నవాళ్ళలో చాలా మంది అదేకోవకు చెంది ఉన్నారని నాకు ఆ చేదు అనుభవం మరొక్క సారి కాస్త గట్టిగానే గుర్తు చేసింది.పని చేసే చోట ఎవరినినమ్మాలో,ఎవరిని  నమ్మకూడదో, ఏది మాట్లాడాలో, మాట్లాడకూడదో అర్థం కావడం లేదు.

             ఆ తర్వాత నేను ఇంకో కళాశాలలో ఉద్యోగం వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురయ్యింది.ఐతే ఇప్పుడు నేనిదివరకు నేర్చుకున్నపాఠాలు కొంతమేరకు ఉపయోగపడుతున్నాయి.ఇంతవరకు నేను మా గత కళాశాల సెక్రటరీ,స్వామీజీ,కొబ్బరి బొండాలమ్మే అతను,నా సహోద్యోగి,ఇంకా తదితరుల ద్వారా పొందిన అనుభవాల మూలంగా ఇప్పుడు నాకు చాలా మంది అపరిచితులుగానూ,తర్వాత పరిచితమైనట్లుగానూ,మళ్ళీ అప్పుడప్పుడూ అర్ధం కాకుండానూ అవగతమౌతున్నారు.వెరసి నాకు జీవితం మొత్తం ఇదే సూత్రం మీద ఆధారపడినట్లు అనిపిస్తోంది,తెలిసీ తెలియనట్లు,అర్ధమౌతూ కానట్లు, చలిస్తూ అంతలోనే నిశ్చలమౌతున్నట్లు,దాదాపు ప్రతి ఒక్కరిలో ఒక జెకిల్ మరియు హైడ్ లాంటి భిన్న స్వభావాలున్నట్లు,ఇప్పుడు మరింత అనుభవమౌతూ ఉన్నది.నాలో కూడా ఇలాంటి స్వభావం ఉండే అవకాశం మెండుగా ఉంది.ఐతే నేను ఇతరులకు హానిచేసే,నష్టం కలిగించే  వాణ్ణా??? కాదనే నేననుకుంటూ ఉంటాను.

*

కుంచెకి ఆయుధ భాష నేర్పినవాడు!

పి. మోహన్

 

P Mohanచిత్తప్రసాద్ స్నేహశీలి. దేశంలోనే కాదు నానా దేశాల్లో బోలెడు మంది మిత్రులు. డెన్మార్క్ వామపక్ష కవి ఎరిక్ స్టీనస్, చెకొస్లవేకియా ఇంజినీరు ఇంగ్ ఫ్రాంటిసెక్ సలబా, ప్రాగ్ లోని ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మిలోస్లావ్ క్రాసా, సీపీఐ కార్యకర్త తారా యాజ్ఞిక్, ఆమె భర్త, పిల్లలు, పీసీ జోషి సహచరి కల్పనా దత్తా, బెంగాల్ కరువును, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కెమెరాలో బంధించిన సునీల్ జనా, లక్నో ‘బ్రదర్’ మురళీ గుప్తా, ఎంఎఫ్ హుస్సేన్.. ఇలాంటి కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో చిత్త కలసి తిరిగేవాడు. వీళ్లలో చాలామంది కలిగినవాళ్లు. చిత్త నోరు తెరిచి అడగాలేకానీ వేలు గుమ్మరించగలవాళ్లు. కానీ చిత్త ఎన్నడూ అలా గుమ్మరించుకోలేదు. చిత్తకు కొండంత అత్మాభిమానమని, డబ్బు సాయం చేస్తామంటే చిన్నబుచ్చుకునేవాడని, జాలిపడితే కోపగించుకునేవాడని మిత్రులంటారు.

‘నేను తొలిసారి చిత్త లినోకట్లు చూడగానే ముగ్ధుడిని అయిపోయాను. వాటిలో మతగాథల బొమ్మలు కాకుండా సాదాసీదా బతుకు, పేదల బాధలు ఉన్నాయి. ఇక అప్పట్నుంచి ఏ వారాంతమూ నేను అతన్ని విడిచి ఉండలేదు. అతని గదికి వెళ్లేవాడిని, లేకపోతే మా ఇంటికి పిలిచేవాడిని. కానీ అతడు దుర్భర పేదరికంతో బాధపడుతున్నాడని, పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడని చాలా నెలల తర్వాత తెలిసింది. ఆత్మాభిమానంతో అతడు ఆ సంగతిని బయటపడనివ్వలేదు. తన బొమ్మలను నాకు అమ్మడానికీ ప్రయత్నించలేదు. నేనే అతని పరిస్థితి అర్థం చేసుకుని కొన్ని బొమ్మలను కొనడానికి ప్రయత్నించేవాడిని. కానీ అతడు మొండివాడు. బొమ్మల ఖరీదు చెప్పకపోవడంతో పెద్ద చిక్కొచ్చేది. అందుకే నాకు తోచినంత చ్చేవాడిని. అతని జేబులో కాసిని డబ్బులు కుక్కడానికి నానా యాతనా పడేవాడిని.. కొన్నిసార్లు తలప్రాణం తోకకొచ్చేది. డబ్బుసాయంతో మన స్నేహాన్ని కించపరుస్తావా అని కేకేలేసేవాడు..’ అని చెప్పాడు మిత్రుడు సలబా.

‘డబ్బు సంపాదించడానికే బాంబేకి వచ్చి ఉంటే ఎప్పుడో సంపాదించి ఉండేవాడినమ్మా. మార్కెట్ ప్రకారం నడిచే ఉద్యోగాలు నాకు సరిపడవు కనుకే ఉద్యోగం చేయలేదు… చాలామంది కేవలం పెయింటింగులు వేసే మద్రాస్, ఢిల్లీ, కలకత్తా, బాంబేల్లో ఇళ్లు, కార్లు కొనిపడేస్తున్నారు. దీని వెనక ఉన్న మతలబు ఏంటంటే, ధనికులకు తగ్గట్టు మారిపోవడం, ఆత్మగౌరవాన్ని మంటగలుపుకోవడం, కళాసృజనలో దగా చేసుకోవడం. నాకు ఆ దారి తొక్కాల్సిన అగత్యం లేదు..’ అని తల్లికి రాశాడు చిత్త. అతని మదినిండా బొమ్మలు.. బొమ్మలు.. అవికూడా బాధల పాటల పల్లవిని వినిపించే గాఢమైన నలుపుతెలుపు బొమ్మలు..  ఆ బొమ్మలతోనే తను బతకాలి. బొమ్మల్లో రాజీపడకూడదు. కానీ వాటితోనే బతకాలి. ఎంతొస్తే అంత. చేతికష్టంతో నిజాయితీగా బతకాలి. ముంబై పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ కు, బెంగాల్, డెన్మార్క్, చెకొస్లవేకియాల్లోని పబ్లిషింగ్ కంపెనీలకు బొమ్మలు వేశాడు. బాంబేలోని లిటిల్ బ్యాలే ట్రూప్ కు స్క్రీన్లు, క్యాస్ట్యూములూ అందించాడు. బిమల్ రాయ్ కళాఖండం ‘దో బీగా జమీన్’ సినిమాకు లోగో వేశాడు. 1958లో ఎవరో అడిగితే పాల్ రాబ్సన్ జయంతికి నిలువెత్తు పెయింటింగ్ వేశాడు. ఏది వేసినా తనకిష్టమైందే వేశాడు.

struggle

చిత్త వర్ణచిత్రాలు కూడా అతని లినోకట్లంత శక్తిమంతంగా ఉంటాయి. 1938నాటి స్వీయచిత్రంలో ఆలోచనామగ్నుడై కనిపిస్తాడు(ఈ చిత్రం ఈ వ్యాసం తొలిభాగంలో ఉంది). పార్టీ పరిచయాల్లోకి వస్తున్న ఆ యువకుడి ముఖంలో, నేపథ్యంలో అరుణకాంతి అలుముకుపోయింది. వర్ణచిత్రాల్లోనూ అతడు శ్రమైక జీవన సౌందర్యానికే పట్టంగట్టాడు. పోరాటాలనే కాకుండా సంతాల్, కాశ్మీరీ అతివల నృత్యాలను, బాంబే రేవు పడవలను, నగర శివార్లలోని పచ్చిక బయళ్లనూ పరిచయం చేశాడు. చిత్త రంగుల ఆడాళ్ల బొమ్మలు క్యూబిజం, ఫావిజం ప్రభావాలతో పికాసో, మతీస్ లను గుర్తుకుతెస్తాయి. కానీ ఆ మనుషుల హావభావాల్లో అసలుసిసలు భారతీయ ఉట్టిపడుతుంటుంది. చిత్త పంటపొలాలు, పూలగుత్తుల బొమ్మలు అతనివని తెలుసుకోకుండా చూస్తే వ్యాన్గో వేసిన చిత్రాలేమో అనిపిస్తుంది. కానీ చిత్తకు తాను వ్యాన్గోను కానని తెలుసు. ‘నా గురించి నేను ఎక్కువ ఊహించుకుంటున్నానని నువ్వు పొరపడొద్దు మిత్రమా! నేనందుకు పూర్తి భిన్నం. నేను వ్యాన్గో అంత ప్రతిభావంతుడిని కానన్న సంగతి అందరికంటే నాకే బాగా తెలుసు. కాను కనుకే నా జీవితం, మనసూ ఈ దేశ విప్లవపోరాటాల్లో నిమగ్నమైపోయాయి..’ అంటూ మురళికి తనను ఆవిష్కరించుకున్నాడు.

1950 దశకం మధ్యలో చిత్త పపెట్ షోలపై మళ్లాడు. వ్యాపారంపై బాంబేకి వచ్చిన చెక్ మిత్రుడు సలబా పపెట్ షోలు వేస్తుండేవాడు. చిత్తకూ నేర్పాడు. తన దేశానికి వెళ్లిపోతూ పపెట్ సామగ్రినంతా చిత్తకు ఇచ్చేశాడు. చిత్త కూడా కొబ్బరి చిప్పలు, గుడ్డపేలికలు వంటి వాటితో కీలుబొమ్మలు(పపెట్స్) సొంతంగా తయారు చేసుకున్నాడు. తన ట్రూప్ కు ‘ఖేలాఘర్’ అని పేరుపెట్టుకున్నాడు. షోల కోసం కథలూ, పాటలూ రాసుకున్నాడు. ఈ బొమ్మలాట కోసం చుట్టుపక్కలున్న మురికివాడల పిల్లలు చిత్త చుట్టూ మూగేవాళ్లు. చిత్త వాళ్లకు కూడా బొమ్మలాడించడం నేర్పాడు. వాళ్లకు కథలు వినిపిస్తూ ఆ బొమ్మలు ఆడించి, నవ్వుల్లో తేలించేవాడు. వచ్చే కాస్త డబ్బునూ ఈ షోలకు ఖర్చుపెట్టేసి ఉత్త చేతులతో మిగిలిపోయేవాడు. ‘నా దగ్గర ఓ మంచి టేప్ రికార్డర్ ఉండుంటే ఈ షోలలో నాకింక అడ్డేముంది’ అని అన్నాడు చిత్త. అతడు తన బొమ్మలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడని అంటాడు సునీల్ జనా. చిత్త ఫొటోలు కూడా తీసేవాడు. మిత్రులతో కలసి చుట్టుపక్కల ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లేవాడు. కొండకోనల్లో మిత్రులను నుంచోబెట్టి ఫొటోలు తీసేవాడు.

puppets

చిత్త భారతదేశ చరిత్రలో కీలక ఘట్టాలను చూపుతూ బొమ్మలతో పుస్తకం తేవాలనుకున్నాడు. చాలా చిత్రాలు వేశాడు. పబ్లిషర్లు ముందుకురావడం, ముందుకొచ్చిన వాళ్లు డబ్బులివ్వకపోవడంతో ఆ పని ఆగిపోయింది. సలబా సాయం చేస్తానన్నాడు. అయితే వరదల్లో ఆ బొమ్మలు కొట్టుకుపోవడంతో చరిత్ర బొమ్మలు కాలగర్భంలో కలిసిపోయాయి. రామాయణాన్ని బొమ్మలకెత్తే పనికూడా డబ్బు కష్టాలతో ఆగిపోయింది. రామాయణాన్ని ఒక కథలాగే చూసిన చిత్త ఆ బొమ్మలను చాలా సరళంగా, జానపద చిత్రాల శైలిలో వేశాడు. ఇన్ని కష్టాల నడుమ.. తను ఆరాధించే నందలాల్ బోస్ తన లినోకట్లను చూసి మెచ్చుకోవడం, మురికివాడల పిల్లలకు చిట్టిపొట్టి కథలు చెప్పించి నవ్వించడం, ఆడించడం వంటి అల్పసంతోషాలూ ఉన్నాయి.

పార్టీకి దూరమై ఇలాంటి ఎన్ని కళావ్యాసంగాల్లో మునిగినా రాజకీయాలు ఎప్పటికప్పుడు విశ్వరూపంలా ముందుకొచ్చి నిలిచేవి. ఇక మళ్లీ బొమ్మల్లో కార్మికకర్షకులు, రిక్షావాలాలు, విప్లవకారులు ప్రత్యక్షమయ్యేవాళ్లు.

‘జీవితాన్నిపూర్తిగా కళకు అంకింతం చేసి, రాజకీయాలను పక్కకు నెట్టాలని ఎంత బలంగా ప్రయత్నిస్తున్నానో అంత బలంగా ఈ దేశప్రజల రాజకీయాలు తిరిగి నన్ను పట్టుకుంటున్నాయి. అదంతే. కళాకారుడు మనిషి. అంతకు మించి మరేమీ కాదు. తను పుట్టినగడ్డకు అతడు బద్ధుడు. ఈ సంగతి అతనికి తెలిసినా, తెలియకపోయినా అతడు ఈ దేశజనుల జీవితంలో భాగం.. ప్రతి కళాకారుడూ త్వరగానో, ఆలస్యంగానో, తెలిసో  తెలియకుండానో తన నైతిక, రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసి తీరతాడు. నైతికవాదుల, రాజకీయ సంస్కర్తల సంప్రదాయాన్ని నేను నా కళలో ఆచరించి చూపాను. ప్రజలకు అండగా నిలబడ్డమంటే కళకూ అండగా నిలబడ్డమే. కళావ్యాసంగం అంటే మత్యువును బలంకొద్దీ తిరస్కరించమే… రెండో ప్రపంచ యుద్ధం నన్ను సంప్రదాయకళల ప్రభావం నుంచి బయటికి రప్పించింది. నా కుంచెను పదునైన ఆయుధంలా తయారు చేసుకునేలా మార్చింది. నా కళా ఆశయాలు సమకాలీన ప్రపంచంతో సంలీనమయ్యాయి. కళ అనేది నా ఒక్కడి ఆయుధం, కళాకారుడి స్వీయ అభివ్యక్తి ప్రకటన సాధనం మాత్రమే కాదని, అతడు జీవిస్తున్న సంఘపు ఆయుధం కూడా అని అర్థం చేసుకున్నాను. ఆ సంఘంలో అతనితోపాటు, తోటి మనుషుల స్వీయ అభివ్యక్తులు కూడా ఉంటాయి’ అంటాడు చిత్త.

తలకిందుల వ్యవస్థపై అతని ధిక్కారం కేవలం బొమ్మలకే పరిమితం కాలేదు. ఓసారి శివసేన కార్యకర్తలు బాంబేలో బందు చేసి, అంగళ్లను మూయించడానికి చిత్త ఉంటున్న వీధికి వచ్చారు. అతడు కోపంతో వాళ్లముందుకు దూసుకెళ్లాడు. ‘ఏమిటీ దౌర్జన్యం? బందులతో జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ముందు ఇక్కన్నుంచి వెళ్లిపోండి’ అని కేకేలేశాడు. వాళ్లు నోరుమూసుకుని వెళ్లిపోయారు. మరో ముచ్చట చిత్త మాటల్లోనే వినండి. 1959లో ‘‘రక్షణమంత్రి మీనన్ ఎన్నికల ప్రచారం కోసం మా వీధికి వచ్చాడు. దేశం కోసం పనిచేయాలంటూ జనానికి అర్థం కాని ఇంగ్లిష్ లో ఊదరగొట్టాడు. ‘అయ్యా, మీరు చెప్పేది బాగానే ఉంది కానీ, ఈ గడ్డు పరిస్థితుల్లో మేమెలా పనిచెయ్యాలో చెప్పండి’ అని అడిగాను. ‘నీతో తర్వాత మాట్లాడతా’ అని చెప్పి మళ్లీ ఉపన్యాసం దంచేశాడు. తర్వాత ఓ పోలీసు ‘అతడు కమ్యూనిస్టు సర్’ అని మీనన్ కు బిగ్గరగా చెప్పాడు. మీనన్ ముఖంలో భయపు ఛాయలు. ఉపన్యాసం అయిపోయాక కారులో తుర్రుమన్నాడు..’

girl

చిత్తప్రసాద్ అంటే సంతోషంగా ఉండేవాడని అర్థం. ఈ చిత్తప్రసాద్ సార్థకనామధేయుడు కాదు. తన సంతోషాన్ని తృణప్రాయంగా ఎంచి సామాన్యుల ఈతిబాధలను బొమ్మకట్టడానికి తన బతుకును కొవ్వొత్తిలా కరిగించుకుని అసమాన కళాకాంతులు వెదజల్లాడు. మనిషి మనిషిగా బతకాలని సమసమాజ స్వప్నాల్లో పలవరింతలు పోయి తన బాగోగులను మరచిపోయాడు. ‘ప్రకృతి కోతిని మనిషిగా మారుస్తూ.. మానవజాతిని నిరంతరం పునర్నవం చేస్తోంది. అయితే మానవజాతి ఇప్పటికీ కోతిలా వ్యర్థవ్యాపకాలనే ఇష్టపడుతోంది. ఒక పనిచేసే ముందు కాస్త ఆగి, ఆలోచించే ఓపిక లేదు దానికి. దానికి అది కావాలి, ఇది కావాలి, ప్రతిదీ కావాలి.. తనకు దక్కిన దానితో అది తృప్తిడడం లేదు. ప్రతిదాన్నీ కొరికి అవతల పడేస్తోంది. గబగబా మింగింది అరగడం లేదు, అయినా నిరంతరం ఆకలే దానికి. మనిషి మనసులో అసంతృప్తి అనే అజీర్తి ఉంది. స్వార్థపరుడికి రెండే రోగాలు.. దురాశ, అసంతృప్తి.. ’ అని తల్లితో వాపోయాడు చిత్త.

నిత్యదరిద్రం, నిర్నిద్ర రాత్రులు, అనారోగ్యం, ప్రతిదానికి కలతపడిపోవడం, ఇల్లు ఖాళీ చేయాలంటూ యజమాని హెచ్చరికలు.. అన్నీకలసి చిత్తను శారీరకంగా కుంగదీశాయి. అసలు వయసుకంటే పది, పదిహేనేళ్లు పెద్దగా కనిపించేవాడు. 70వ దశకంలో తిండికి చాలా ఇబ్బందిపడ్డాడు. అదివరకు బొమ్మలకొచ్చిన డబ్బుల్లో పదోపరకో తల్లికి పంపుతుండేవాడు. ఇప్పుడు తనకే కష్టంగా ఉంది. ఆదుకునేవాళ్లున్నారు కానీ ఏనుగంత ఆత్మాభిమానం కనుక ఆకలికేకలు రూబీ టెర్రేస్ గది నుంచి బయటికి వినిపించేవి కావు. అరకొరా పనులతోనే కాలం వెళ్లబుచ్చేవాడు. డబ్బు విషయంలో చిత్త ఎంత ‘మొండివాడో’ చూడండి..

chittaprosadఓసారి ప్రముఖ కళావిమర్శకుడు, రచయిత ముల్క్ రాజ్ ఆనంద్.. చిత్త బొమ్మలను అతనికి తెలియకుండా  ఏదో విదేశీ పత్రికకు పంపాడు. అవి అచ్చయ్యాయి. చిత్తకు సంగతి తెలిసి కడిగేశాడు. ఆ పత్రిక పేరున్న పత్రిక కనుక అడిగి డబ్బులిప్పించమన్నాడు. ముల్క్ రాజ్ ‘వాళ్లివ్వరుగాని నా జేబులోంచి ఈ వంద ఇస్తున్నా, తీసుకో’ అని మనియార్డర్ పంపాడు. చిత్త తిప్పికొట్టాడు. తనకు రావాల్సింది ఐదొందలని, కక్కి తీరాల్సిందేనని పట్టుపట్టాడు. ఇదే చిత్త చెకొస్లవేకియా పబ్లిషింగ్ కంపెనీకి మరోరకంగా షాకిచ్చాడు. ఆ కంపెనీ చిత్తతో కవర్ పేజీలు, ఇలస్ట్రేషన్లు వేయించుకుని చెక్కు పంపింది. చిత్త ఆ మొత్తాన్ని చూసి నిప్పులు తొక్కి వెనక్కి తిప్పిపంపాడు. తనకు రావాల్సినదానికంటే పదింతలు ఎక్కువిచ్చారని, తను తీసుకోనని రాసి పంపాడు. కంపెనీ తలపట్టుకుంది. తమ దేశంలోని మార్కెట్ ప్రకారమే డబ్బు ఇచ్చామని, అంతకంటే తక్కువిస్తే మోసం చేశారంటూ అధికారులు తమను ఇబ్బందిపెడతారని రాసింది. చిత్త వెనక్కి తగ్గలేదు. చివరికి అతడు బొమ్మలను వాపసు తీసుకుంటాడనే భయంతో కంపెనీ ఏవో తంటాలు పడి చిత్త అడిగిన తక్కువ డబ్బు ఇచ్చేసింది. ఇంత అమాయకుడు ఇప్పుడు తన బొమ్మలకు లక్షలు విలువకడుతున్న నేటి ఆర్ట్ మార్కెట్ ను చూసుంటే గుండెపగిలి చచ్చుండేవాడు.

చిత్త చిత్రాలను మనవాళ్లకన్నా విదేశీయులే ఎక్కువ కొన్నారు. చిత్త ఊరికే డబ్బిస్తే తీసుకోడు కనుక కొందరు బొమ్మలను వేరేవాళ్లకు అమ్మిపెడతామని చెప్పి తామే ఉంచుకుని డబ్బులిచ్చారు. అతని చిత్రాలు మన దేశంలోకంటే విదేశాల్లోనే ఎక్కువ ఉన్నాయని ఒక అంచనా. అతడు బతికుండగా జరిగిన రెండే రెండు సోలో ఎగ్జిబిషన్లలో మొదటిది 1956లో చెకొస్లవేకియా రాజధాని ప్రాగ్ లోనే జరిగింది, నాటి మన తోలుమందం పాలకుల పరువు తీస్తూ. రెండోది 1964లో కలకత్తాలో జరిగింది. 1972లో చిత్త జీవితం, కళపై చెక్ దేశీయుడు పావెల్ హాబుల్ ‘కన్ఫెషన్స్’ పేరుతో 15 నిమిషాల డాక్యుమెంటరీ తీశాడు. అందులో చిత్త తన కళ, రాజకీయాలు, సమాజం గురించి మాట్లాడుతూ కనిపిస్తాడు. శాంతి ఉద్యమానికి ఇది దోహదమంటూ డాక్యుమెంటరీకి వరల్డ్ పీస్ కౌన్సిల్ అవార్డు కూడా వచ్చిది.

చెకొస్లవేకియా వాసులు చిత్తను తమవాడే అన్నంతగా అభిమానించారు. చేవచచ్చిన స్వతంత్ర భారతావనిలో అతని కళకు గౌరవం దక్కకున్నా, నిత్యం పోరాటాలతో వెల్లువెత్తిన తూర్పు యూరప్ దేశాల్లో అతని బొమ్మలకు జనం గుండెల్లో దాచుకున్నారు. అతని బొమ్మలను పత్రికల్లో అచ్చేసుకున్నారు. తమ పుస్తకాలకు ఎక్కడో దేశాల అవతల ఉన్న అతన్ని వెతికిపట్టుకుని బొమ్మలు వేయించుకున్నారు. అతని కవితలను అనువదించుకుని మురిసిపోయారు. అతన్ని ఎలాగైనా తమ దేశానికి తీసుకెళ్లాలని సలబా విశ్వప్రయత్నాలు చేశాడు. చిత్తతో పపెట్ షో ఇప్పించేందుకు ప్రయత్నించాడు. క్రాసా డబ్బు సర్దాడు. అన్నీ సిద్ధమయ్యాయి. కానీ చిత్తకు చెక్ లో ఏదైనా జరగరానిది జరిగితే ఖర్చులు పెట్టడానికి హామీదారు కావాల్సి వచ్చింది. సలబా బాంబేలో తనకు తెలిసిన ఒకతన్ని హామీదారుగా ఉండమన్నాడు. అతడు సరేనన్నాడు.

 

డాక్యుమెంట్లపై సంతకాల కోసం చిత్తను అతని దగ్గరికి పంపాడు సలబా. ఆ హామీదారు మాటల మధ్యలో ‘నా దయవల్లే నువ్వుపోతున్నావు..’ ధోరణిలో కించపరచేలా మాట్లాడ్డంతో చిత్త సర్రున అక్కన్నుంచి వచ్చేశాడు. ప్రయాణం ఆగిపోయింది. మరోసారి 1965లో చెక్ పపెట్రీ గ్రూప్ ‘రోదోస్త్’ కళాకారిణి ఇవా వోడికోవా ద్వారా ప్రయత్నించాడు సలబా. ఆమె భారత్ కు వచ్చినప్పుడు చిత్తను కలసి ప్రయాణానికి ఏర్పాట్లు, అనుమతులు అన్నీ సిద్ధం చేసింది. ఆమె ఏదో పనిపై ఇండోనేసియా వెళ్లి విమానంలో తిరిగొస్తూ కైరోలో విమానం కూలడంతో చనిపోయింది. తను చెక్ ను చూసే భాగ్యానికి నోచుకోలేదంటూ సలబాకు లేఖ రాశాడు చిత్త. సలబా చివరి ప్రయత్నం కూడా ఫలించలేదు. ప్రయాణానికి అన్నీ సిద్ధమయ్యాక ప్రయాణించాల్సినవాడు లోకంలో లేకుండా పోయాడు.

1976 ప్రాంతంలో చిత్తకు బ్రాంకైటిస్ సోకింది. దాదాపు 32 ఏళ్లపాటు బాంబేలో బతికి, అక్కడి మనుషుల సుఖదుఃఖాలు పంచుకుని, వాటిని బొమ్మల్లోకి తర్జుమా చేసిన ఆ అపురూప కళావేత్తను పట్టించుకునే నాథుడే లేకపోయాడు ఆ మహానగరంలో. చెల్లి గౌరి బాంబే వచ్చి అన్నను కలకత్తా తీసుకెళ్లింది. తన దేశప్రజల ఆరాటపోరాటాలను నాలుగు దశాబ్దాలపాటు అవిశ్రాంతంగా చిత్రికపట్టి, కన్నీటి వరదలు పారించి, గుండెనెత్తురులు ఉప్పొంగించి.. ప్రజాకళకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన వన్ అండ్ ఓన్లీ చిత్త 1978 నవంబర్ 13న కలకత్తాలోని శరత్ బోస్ రోడ్డులో ఉన్న రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్టాన్ జనరల్ హాస్పిటల్లో 63వ ఏట పరమ అనామకంగా కన్నుమూశాడు.

1979లో ప్రాగ్ లో, కలకత్తాలో అతన్ని స్మరించుకుంటూ ఎగ్జిబిషన్లు పెట్టారు. తర్వాత ప్రాగ్, ఢిల్లీ, హైదరాబాద్ లలో అతని బొమ్మలు ప్రదర్శించారు. 2011లో ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ అతని చాలా బొమ్మలను సేకరించి ఢిల్లీ, ముంబై, కలకత్తాల్లో ఎగ్జిబిషన్లు పెట్టింది.

చిత్త దేశానికి ఇచ్చినదానితో పోలిస్తే దేశం అతనికిచ్చింది శూన్యం. ‘నా పెయింటింగులను ఇంట్లో ఉంచుకోవడం నీకు కష్టమవుతుందమ్మా. వాటిని గంగానదిలో వదిలెయ్’ అని చిత్త తన చెల్లితో అన్నాడంటే ఈ దేశం అతని కళను అతడు బతికి ఉన్నప్పుడు ఎంత గొప్పగా గౌరవించిందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్ కరువుకు బలైన మిడ్నపూర్ లోని స్వాతంత్ర్య వీరులను తలచుకుంటూ చిత్త తన ‘ హంగ్రీ బెంగాల్’లో.. ‘నిన్న మన స్వాతంత్ర్యం కోసం తెగించి పోరాడిన దేహాలను ఇప్పుడు కుక్కలు, రాబందులు పీక్కుతుంటున్నాయి. ఒక దేశం తన యోధులకు అర్పించే నివాళి ఇదేనా?’ అని ఆక్రోశించాడు.

చిత్త చరిత్రను, అని ప్రజాకళాసంపదను కన్నెత్తి చూడదల్చుకోని నేటి మన పేరుగొప్ప ప్రజాస్వామ్య పాలకులు అతనికి అర్పిస్తున్న నివాళి అంతకంటే ఘనంగా ఉందా? రవీంద్రనాథ్ టాగూరు వందో జయంతినే కాకుండా 150వ జయంతినీ కోట్లు ఖర్చుపెట్టి జరుపుకుని, అతని ‘వెర్రిమొర్రి’ బొమ్మలను దేశమంతటా తిప్పారు మూడేళ్లకిందట యూపీఏ పాలకులు. దేశజనుల బాహ్యాంతరంగాలను, దారిద్ర్యాన్ని, మౌనవేదనను ఉట్టిపడే భారతీయతతో అనితరసాధ్యంగా వర్ణమయం చేసిన అమృతమూర్తి అమృతా షేర్గిల్ శత జయంతి పండుగను అతిజాగ్రత్తగా మరచిపోయారు. అమృత బొమ్మలకంటే ప్రమాదరకమైన బొమ్మలు సంధించిన చిత్త వందో జయంతిని అతడు నరనరానా ద్వేషించిన నాగపూర్ నాజీ పాలకులు పట్టించుకుంటారనుకోవడం భ్రమ.

blue flowers

చిత్త పేరుప్రతిష్టల కోసం పాకులాడలేదు. బడుగుజీవుల సుఖసంతోషాల కోసం తపనపడ్డాడు. తన కళతో వాళ్ల కన్నీరు తుడిచి, వాళ్లతో జెండాలు, బందూకులు పట్టించి దోపిడీపీడకుల గుండెలపైన కదం తొక్కించాడు. చిత్త ఆదర్శాలు, విలువలు ఏమాత్రం ‘గిట్టుబాటు’ కాని వ్యవహారాలు కనుక అతనికి వారసులు లేరు. ‘భారత్ లో గ్రాఫిక్ కళలు, ఇప్పటికీ నిరాశాపూరితంగా, బలహీనంగా ఉన్నాయి. ప్రచారం, ఆదర్శాల వంటివాటిపై కళాకారులు మొగ్గుచూపకపోవడం కారణం కావచ్చు’ అని చిత్త 1958లో అన్నాడు. నేటికి తేడా ఏమైనా ఉందా? చిత్త రాజకీయ విశ్వాసాలు, వాటిపట్ల అతని నిబద్ధత వల్లే అతనికి బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ‘మెయిన్ స్ట్రీమ్ ఆర్ట్’ లో ఎన్నడూ చోటు దక్కలేదు.

చిత్త కలలు ఇంకా ఫలించలేదు. ఆన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం, కరువంటూ కాటకమంటూ కనుపించని కాలాలు చాలా చాలా దూరంలో ఉన్నాయి. లినోలపై, కేన్వాసులపై చిత్త గొంతుచించుకుని శఠించిన దుర్మార్గాలు, దోపిడీపీడనలు ప్రజాస్వామ్యం, దేశభక్తి ముసుగుల కింద కోట్లరెట్లు పెచ్చరిల్లి జనాన్ని కాల్చుకుతింటున్నాయి. ఆనాడు ఒక్క బెంగాల్లోనే కరువైతే, నేడు దేశమంతా తిండిగుడ్డనీడల కరువులు. ‘96 కోట్ల సెల్ ఫోన్లు’,   అధికారిక దొంగలెక్కల ప్రకారమే 40 కోట్ల మంది నిత్యదరిద్రులు ఉన్న ఘన భారతావనిలో ఈ కరువులతో నల్ల, తెల్ల కుబేరులను బలుపెక్కిస్తూ మన జీడీపీ, తలసరి ఆదాయం తెగ వాచిపోతున్నాయి. చిత్త తుపాకులు, గొడ్డళ్లు ఎక్కుపెట్టిన విదేశీగద్దలు నల్లదొరల ఆహ్వానాలతో మందలుమందలుగా ఎగిరొచ్చి మాయారూపాల్లో ఈ గడ్డ సరిసంపదలను తన్నుకుపోతున్నాయి.

అతడు తిరుగాడి బొమ్మలు వేసిన బెజవాడ నేలతల్లిని ‘రాజధాని’ మంత్రగాడు చెరపట్టాడు. చిత్తను రగిలించి, మురిపించిన సాయుధపోరుసీమలో నయా నిజాంలు తుపాకుల అండతో కొత్త గడీలు కడుతున్నారు. నైజాము సర్కరోన్ని గోల్కండా ఖిల్లా కింద గోరీ కడతామని యుద్ధగీతికలతో గర్జించిన ప్రజాకవుల, కళాకారుల వారసులు పెరుగన్నం కోసం కొత్త నిజాం పంచన చేరి అతన్ని స్తోత్రపాఠాలతో ముంచెత్తుతూ మహోన్నత పోరాట వారసత్వాన్ని పెంటకుప్పలో బొందపెడుతున్నారు. చిత్త ద్వేషించిన నిరంకుశ, స్వార్థకపటాల క్రీనీడలు మరింత ముదిరి మదరిండియా అంతటా గాఢాంధకారం అలుముకుంది.

మరి ఈ చీకటి తొలగిపోదా? అడుగు కదిపితే చాలు కత్తులు దూసి నెత్తురోడిస్తున్న ఈ తిమిరానికి అంతం లేదా? చిత్త తన నిశాగంధి(‘నైట్-కాక్టస్) కవితలో ఏమంటున్నాడో వినండి..

‘ఈ కటికచీకటి రాత్రి కదలబారుతుంది

అంతవరకు నేనిక్కడ చేయాల్సిందొకటే

ఈ తిమిరాన్ని వెలిగించి

పరిమళాలతో ముంచెత్తడం..

*

 

 

మా ఊరి తొవ్వ

విలాసాగరం రవీందర్

నేను పదోదిల లాగుదొడిగినప్పుడు మా ఊరికి కన్నారానికి
రెండు గంటల తొవ్వ

సుక్కదెగిపడ్డట్టు అచ్చే ఎర్రబస్సు

పోరగాండ్లు బొట్టగాండ్లు ముసలోళ్ళు వయిసోళ్ళకు అదొక  పుష్పక విమానం

యాభై మంది వట్టే దాంట్ల వందమందిమైనా
సోపతిగాళ్ళ  లెక్క సదురుకుంట  కూసునుడు

అత్తుంటే పోతుంటే
అటూ ఇటూ పక్కలకు
పిందె కాయలతోని
నవ్వుకుంట కనబడే మామిడి చెట్లు

ఎర్రపూల గుల్మర్ చెట్లు కదులుకుంట
వక్కడ వక్కడ నవ్వుడు

తీరొక్క చెట్ల
బంగరు పూల నాట్యం
మన్సు పిట్టలెక్క బస్సు చుట్టూ తిరుగుడు

ఎండకాలంల ఎండతెలిసేది గాదు
ఏసీ రూంలకేని పోతున్నట్టు
చెట్ల ఆకుల పందిరేసి నీడ

వాన కాలంల రోడ్డుపొంటి
నిండు కుండోలె వున్న కోపులల్ల
నీళ్లు జూసుకుంట పోతంటే
ఈత గొట్టబుద్దవుడు

పోంగ రొండు గంటలు
పచ్చదనంలో గడిచి పోయేది
రాంగ రొండు గంటలు
చిమ్మ చీకట్ల
తొవ్వ
సుక్కలెక్క గనబడేది

ఏ రాతిరయినా నిమ్మలముండేది
బస్సెక్కినమంటే ఇంట్ల గూసున్నట్టే…

నాలుగ్గంటలయినా
నాలుగు నిముషాల లెక్క గడిచేది
పొయినట్టుండేది గాదు !
అచ్చినట్టుండేది గాదు !!

♧♧♧

పచ్చీస్ సాల్
గిర్రున తిర్గినంక
తొవ్వ పొంటి
చెట్లు మాయమయినయి
ఇనుప కంచెలు మొలిచినయి

కోట్లాది పువ్వుల మొక్కల్ని బొండిగ పిస్కి
నాలుగు రాస్తాల నడుమ
గన్నేరు మొక్కల కింద పాతరేసిండ్రు

పచ్చదనమంతా
నాల్గు వరుసల
రాజీవ్ రహదారి కడుపుల బొందవెట్టి
పైకేని నల్లటి నాగుంబాములా తారేసిండ్రు

ఎర్రబస్సు ఎండల ఎల్సి
పాతసమానయింది

కొత్తగా
రొండు, మూడు నాల్గు పయ్యల బండ్లు
పుట్టుకచ్చినయి
గీరెలు బూమ్మీద ఆనుడేలేదు
తుఫాను గాలోలె ఉరుకుడే

రెండు దిక్కులా
ఒక్క సెయ్యి తో పట్టుకొని
గాల్లె దేలుకుంట
సర్కస్ ల జంతువుల లెక్క బోవుడు

పైకేని ఎండ
పొయ్యిల మంటలెక్క గాల్తది
కింద సీటు
జారుడుబండలెక్క జారుతది
చెయ్యి పట్టు ఇడిసినవా
నూకలు చెల్లినట్లే
రాతిరికి పొయ్యి ఎలుగది

కాళ్లకు గీరెలు కట్టుకున్నట్టు
రయ్యన పోవుడు పెరిగింది
గాని
పానాల మీద ఆశ తగ్గింది

ఇప్పుడు
మా ఊరు బెజ్జంకి కి కన్నారం కు
నలపై నిముషాల తొవ్వ !
కానీ
మనుసుకు మాత్రం
నలబయి గంటల్లెక్క…

*

నిదుర లేని వనాల్లో…అలుపు లేని నడకలు!

సత్యం మందపాటి

 

satyam mandapati     ఇండియానించీ మనవాళ్ళు చుట్టం చూపుగానో, స్నేహం చూపుగానో అమెరికా వచ్చాక మామూలుగా చూసేవి, న్యూయార్క్, హ్యూస్టన్, చికాగోలాంటి పెద్ద పెద్ద నగరాలూ, వాషింగ్టన్ కాపిటల్ భవనాలూ, నయాగరా జలపాతం, అటు లాస్ ఏంజలీస్, ఇటు ఫ్లారిడాలలో డిస్నీలాండూ, లాస్ వెగాస్ కసీనోల్లో ధర్మరాజుల్లా జాదాలూ, ముడుపులూ, పిట్స్బర్గ్ వెంకటేశ్వర్లుగారి గుడిలో మొక్కుబడులూ, మళ్ళీ ముడుపులూ, అమెరికాలోని ఎన్నెన్నో ఇతర గుడులూ, గోపురాలూ చూపించటం, వాటి తర్వాత మళ్ళీ భారతదేశానికి వెళ్లబోయే ముందు షాపింగ్ చేయటం… పనిలో పని అనుకుని దగ్గరలో వున్న మిగిలిన గుడులు కూడా చూసేసి విమానం ఎక్కేయటం మామూలయిపోయింది.

డిస్నీ, సీ వరల్డ్, ఎప్కాట్ సెంటర్, యూనివర్సల్ స్టూడియో, నయాగరా లాటివి ఎంతో బాగుంటాయి. అలాగే అమెరికాలో ఒక సిటీ చూస్తే, దాదాపు అన్ని సిటీలు చూసినట్టే. ఇండియానించీ వచ్చేవారికి, ఇక్కడ గుడులు చూడటం పెద్ద అవసరం అని, వాళ్ళు నన్ను కోప్పడినా కూడా, నేను అనుకోను. కానీ నా ఉద్దేశ్యంలో అమెరికాలో చూడవలసినవి, ప్రపంచంలో ఇంకెక్కడా లేనివీ చాల వున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఇక్కడి నేషనల్ పార్కులు, వనాలు. ఎన్నో ప్రకృతి వనరులతో కూడిన వనాలు. అందమైన ఉద్యానవనాలు. ఒక దానిని మించినదింకొకటి. వాటి గురించే చెప్పుకుందాం ఈసారి.

౦                           ౦                           ౦

అమెరికాలో సహజ ప్రకృతి సంపదని పరిరక్షించటం అనేది 1832లో జార్జ్ కాట్లిన్ అనే ఒక కళాకారుడి కృషి ఫలితం అని నాపుస్తకాల పరిశోధన చెబుతున్నది. ఆయన డకోటా రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు అక్కడి వన, వృక్ష, పర్వత సంపదా, వాటి అందాలూ చూసి, వాటిని పరిరక్షించకపోతే కార్చిచ్చులా వ్యాపిస్తున్న నాగరికతకి అవి ఎలా నాశనమయిపోతాయో అని భయపడ్డాడు. బాధపడ్డాడు. ఆ స్పూర్తితో నేషనల్ పార్కుల పేరుతో, ప్రభుత్వం వాటి పరిరక్షణని తమ చేతుల్లోకి తీసుకొవాలనీ, ప్రకృతి అందాలని ప్రభుత్వ సహాయంతో కాపాడాలనీ గొడవ చేశాడు. అలా మొదలైన ఆ నేషనల్ పార్కులు ఈనాడు అమెరికాలో అన్ని రాష్ట్రాలలోనూ కొన్ని వందలు వున్నాయి. ఒక్కొక్కటి కొత్త రకం ప్రత్యేకతతో కనులకి ఇంపుగానే కాక, ప్రకృతి అద్భుతాలని చూసి ఆశ్చర్యపడేలా చేస్తాయి.

1864లో కాలిఫోర్నియాలోని యోసిమిటీ పార్కు ప్రారంభమయింది. 1872లో వయోమింగ్, మోంటేనా రాష్ట్రాలలోని ఎల్లో స్టోన్ నేషనల్ పార్కు – ప్రజల ఉపకారానికీ, ఉల్లాసానికీ అంకితం చేయబడింది. అప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు లేనందున, అమెరికా ప్రభుత్వమే ఆ పార్కు బాధ్యతని తీసుకుంది. ఇలా మొదలయింది ఈ నేషనల్ పార్కుల పరిరక్షణ. దాని తర్వాత వరుసగా సెకోయా నేషనల్ పార్క్, మౌంట్ రైనర్, క్రేటర్ లేక్, గ్లాసియర్ నేషనల్ పార్కులు వచ్చాయి. ఆ అందాలను చూడటానికి వచ్చే జనానికి కావాలసిన రవాణా, వసతి, ఆహారం, ఇతర సరదాలూ మొదలైన సౌకర్యాలని కూడా సిద్ధం చేయాల్సివచ్చింది. ప్రకృతి సహజ సౌందర్యాలని పాడు చేయకుండా, అ సదుపాయాలు ఇచ్చారు. ఈనాడు ప్రతిచోటా, అన్ని రకాల ఆర్ధిక స్థోమతలకీ అనుగుణంగా ఇక్కడ హోటళ్ళూ, మిగతా సౌకర్యాలూ వున్నాయి.

ప్రకృతి అందాలనే కాక, చారిత్రాత్మకమైన శిలలూ, శిధిలాలూ, జంతువుల అవశేషాలూ, కాలగతిలో శిలలయిపోయిన వృక్షాలూ.. ఇలా చరిత్రకి ఆధారమైనవేమైనా ఈ పరిధిలోకి తీసుకువచ్చారు. అలాటి వాటిలో ఆరిజోనాలోని కేసా గ్రాండే, కోలరాడోలోని మేసా వర్డే ఈ కోవలోకి వస్తాయి. థియోడర్ రూస్వేల్ట్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు 18 నేషనల్ మాన్యుమెంట్లని ఈ పరిధిలోకి తీసుకువచ్చాడుట. వీటిల్లో చెప్పుకోదగ్గవి, న్యూమెక్సికో లోని ఎల్మోరో, ఆరిజోనాలోని పెట్రిఫైడ్ అడవి, గ్రాండ్ కాన్యన్ మొదలైనవి.

1916కి 14 నేషనల్ పార్కులూ, 21 నేషనల్ మాన్యుమెంట్లూ ప్రభుత్వపు పరిధిలోకి వచ్చినా, వాటి నిర్వహణ కోసం వేరే డిపార్ట్మెంట్ లేదు. అవసరాన్ని బట్టి ఆర్మీని పంపించేవాళ్ళు. ఆరోజుల్లో వాళ్ళే కావలసిన రోడ్లనీ బిల్దింగులనీ సమాయత్తం చేసేవారుట. ఈ పార్కుల్లో జంతువులని వేటాడటం, చెట్లని నరకటం మొదలైనవి నిషిద్ధం చేశారు. కొంతమంది స్వార్ధపరులు, అంటే రీసెర్చి కోసం తమకు కావలసిన సమాచారంతో పాటు, శిధిలాలని కూడా చెప్పాపెట్టకుండా తీసుకువెళ్లటం మొదలుపెట్టారు. మాథర్, ఆల్బ్రైట్ అనే పెద్దలు, ప్రభుత్వంతో భేటీ పడి, సాటర్డే ఈవెనింగ్ పోస్ట్ లాంటి పేపర్లో ప్రచారం చేసి, మొత్తానికి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ని ఒప్పించి ఆగస్టు 25, 1926 తేదీన నేషనల్ పార్క్ సర్వీస్ అనే సంస్థని కేంద్ర ప్రభుత్వం క్రింద వుండేటట్లు చేశారు. నేషనల్ పార్కుల్నీ, మాన్యుమెంట్లనీ, అన్నిటినీ నేషనల్ పార్కుల క్రిందకే తీసుకువచ్చారు. అంతేకాక ఈ విషయంలో ఎంతో పాటుపడిన మాథర్ని పార్క్ సర్వీసుకి మొదటి డైరెక్టరుగానూ, ఆల్బ్రైట్ని అసిస్టెంట్ డైరెక్టరుగానూ నియమించారు. వారిద్దరి ఆధ్వర్యంలో ఈ సంస్థ చాల అభివృద్ది సాధించింది. ఈ పార్కుల్లో చక్కటి రోడ్లు, బస్సు సౌకర్యాలు, హోటళ్ళు, మ్యూజియంలు, సమాచారా కేంద్రాలూ, వాటికి సంబంధమైన పుస్తకాలూ అన్నీ సమకూర్చారు.

అప్పటిదాకా అమెరికాలో పడమటి రాష్ట్రాలలోనే నేషనల్ పార్కులు అభివృద్ది చెందాయి. అందుకని 1926 నించీ తూర్పున కూడా షెనండో, గ్రేట్ స్మోకీ మౌంటెన్, మేమత్ కేవ్ మొదలైన నేషనల్ పార్కులు వచ్చాయి.

అమెరికా ఒక దేశంగా పుట్టిన మొదటి రోజుల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. వాటి చరిత్రని నిలపటానికి కొన్ని వార్ మెమోరియల్స్ని కూడా ఈ పార్కుల క్రిందకే తీసుకురావాలని, 1933లో ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్ ప్రెసిడెంటుగా పదవీ స్వీకారం చేశాక, ఆల్బ్రైట్ ఆయనని ఒప్పించాడు. దాని ఫలితమే ఈనాటి వాషింగ్టన్ మెమోరియల్, లింకన్ మెమోరియల్, వైట్ హౌస్ లాటివి. రూస్వెల్ట్ చేసిన గొప్ప పనులలో ఒకటి సివిలియన్ కన్సర్వేషన్ కార్పొరేషన్ అనే సంస్థని ప్రారంభించటం. ఎంతోమంది యువకులు దీంట్లో చేరి, పార్కుల పరిరక్షణ, వాటి అభివృద్ధితో పాటూ ప్రకృతి భీభత్సాలనించీ పార్కులనీ, ప్రజలనీ కాపాడే కార్యక్రమాల్లో కృషి చేశారు.

ఈ పార్కులలో ఒక రోజునించీ పది రోజుల దాకా గడపటానికి ఎన్నో విశేషాలు వున్నాయి. కొన్ని చోట్ల కాంపింగ్ చేయవచ్చు. పార్కుల్లోనూ, కొండల్లోనూ నడవటానికీ, సైకిల్ తొక్కటానికీ, ఈత కొట్టటానికీ, కొండలు ఎక్కటానికీ.. ఇలా ఎన్నో రకాల వ్యాపకాలకి ఆస్కారం వుంది. ఇంత వైవిధ్యం వున్న నేషనల్ పార్కులు అన్నీ చూడటానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. వాటి గురించి వివరంగా చెప్పటానికి, ఎన్నో పేజీలు పడుతుంది. అందుకని కొన్ని ముఖ్యమైన వాటి గురించి కొంచెం రుచి చూపిస్తాను. ఇహ మీ ఇష్టం…

వీటన్నిటిలోకి ఎంతో గొప్పది, ప్రపంచంలో ఇంకెక్కడా లేనిదీ గ్రాండ్ కాన్యన్. దాని గురించి ఒంకొక వ్యాసంలో చెప్పుకుందాం. దాని పక్కనే వుంది బ్రైస్ కాన్యన్. గ్రాండ్ కాన్యన్లో కనపడే ఎర్రటి కొండలూ, ఆకుపచ్చటి కోనలూ, నీలి ఆకాశపు సౌందర్యం, రంగు రంగుల రాళ్ళతో మనకి ప్రకృతి ఇచ్చిన వరాలైతే, బ్రైస్ కాన్యన్లో అదే ప్రకృతి మనకి అందించినది, గడ్డ కట్టిన ఎర్రటి మట్టి కట్టడాలు, కొన్ని మైళ్ళ తరబడి మనల్ని ఈ లోకంలో నించీ బయటకు తీసుకువెడతాయి. నారాయణరెడ్డిగారు చెప్పినట్టు ‘కారడవుల మునులవోలె’ నుంచొని కనపడతాయి.

satyam1

 

అలాగే ఆర్చస్ నేషనల్ పార్కు. ఎక్కడా చూసినా పెద్ద పెద్ద ద్వారాలు. ఎర్రటి మట్టి   రాయిగా మారి, యుగయుగాలుగా గాలి ఒరవడికి రాతి ముఖద్వారాలుగా మారి మనల్ని ఆహ్వానిస్తుంటాయి.

పెట్రిఫైడ్ అడవికి వెడితే, కొన్ని యుగాలనాటి చెట్లు, ఈనాడు ఎన్నో రంగురంగుల శిలలుగా మారి, కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుస్తుంటాయి.

ఎల్లో స్టోన్ పార్కు ప్రకృతి సౌందర్యానికి ఒక అమోఘమైన నిర్వచనం. అక్కడినించీ బయటికి వెళ్ళబుద్ది కాదు. అక్కడికి వెళ్ళేదాకా, అన్ని సహజమైన రంగులు వుంటాయని నేను కలలో కూడా ఊహించలేదు. బహుశా ఏ చిత్రకారుడి కుంచెకూ అవి అందవేమో!

భూమిలోనించీ రకరకాల రసాయనాలూ, వేడివేడిగా వాయువు, ఆవిరి, నీళ్ళ రూపంలో బయటికి వస్తూ, వాడిగా పాతిక రంగుల్లో మనవేపు చూస్తుంటాయి. కొన్ని మృదువుగా గీజర్ల రూపంలో బయటికి వస్తుంటే, కొన్ని భూమిని చీల్చుకుని ఫౌంటెన్లలాగా ఎంతో ఎత్తుకి వేడుతుంటాయి. వాటిల్లో ‘ఓల్డ్ ఫైత్ఫుల్’ (Old Faithful) అని ఒక గీజర్ వుంది. అది ఒక్కటే అక్కడ ఒక క్రమమైన సమయాలలో వస్తుంది. అందుకే దానికా పేరు పెట్టారు. అది రోజుకి ఎన్నోసార్లు, దాదాపు పదిహేను నిమిషాలకి ఒకసారి, భూమిలో నించీ దాదాపు 180 అడుగుల ఎత్తుకి ఒక ఫౌంటెన్ లాగా పైకి వెళ్లి నృత్యం చేస్తూ, వేడివేడి నీళ్ళను వెదజల్లుతుంది. ఆ నృత్యం నాలుగైదు నిమిషాలే అయినా, చూడటానికి అద్భుతంగా వుంటుంది. దాంట్లో నించీ 8400 గాలన్ల నీళ్ళు ప్రతిసారీ బయటికి వస్తాయిట. ఆ నీటి ఉష్ణోగ్రత 204 డిగ్రీలు ఫారన్హీట్ లేదా 95.6 డిగ్రీలు సెంటిగ్రేడ్.

satyam3

ఇక్కడ రకరకాల సైజుల గీజర్లు 10000 పైన వున్నాయి. పెద్ద పెద్ద గీజర్లే 300 పైన వున్నాయిట. కొన్నిటిలో నించీ వచ్చే ఆ నీళ్ళు – గంధకం, భాస్వరం లాటి రకరకాల రసాయనాల మిశ్రమంతో, లేత నీలం, సిరా రంగు, ఆకాశ నీలం లాటి ఎన్నో రకాల నీలం రంగులూ, లేతాకు పచ్చ, ముదురాకు పచ్చ, నీలం ఆకుపచ్చ కల్నేత, పసుపు పచ్చ, కనకాంబరం, కాషాయం, ఎరుపు, గులాబి.. ఇలా ఎన్నెన్నో రంగులలో కనిపిస్తుంటాయి. ఎవరో ఎన్నో డబ్బాల రంగుల పైంట్ పారబోసుకున్నారేమో అనిపిస్తుంది కొన్ని చోట్ల. సముద్రానికి 8860 అడుగుల ఎత్తుగా వున్న ఈ ఎల్లో స్టోన్ పార్కు గురించి తెలుసుకోవాలంటే చాల వుంది. మీకు ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం, కుతూహలం వుంటే, ఎన్నో విడియోలు వున్నాయి. ఇంటర్నెట్లో ఎంతో సమాచారం వుంది. ఓపిగ్గా వెతకాలి. అంతే!

అమెరికాలో అన్నిటిలోకి ముఖ్యంగా చూడదగ్గ ప్రత్యేక ప్రదేశాలు, నా ఉద్దేశ్యంలో, ఒకటి: గ్రాండ్ కాన్యన్, రెండవది: ఎల్లో స్టోన్ పార్క్.

అలాగే సెకోయా పార్కులో ప్రపంచంలో ఎక్కడాలేని 275 అడుగుల ఎత్తైన చెట్టు వుంది. ఇది ఇరవై ఐదు అడుగుల వ్యాసంతో, 2700 సంవత్సరాల వయసుతో, ఇంకా నిటారుగా నిబడే వుంది.

 

satyam4

 

అలాగే గ్రాండ్ టీటన్ పార్కులోని రెండు మంచు పర్వతాలు. సూర్యరశ్మిలో మెరిసిపోతూ, పక్కపక్కనే వుండి,  ఎంతో దూరం నించీ కనిపిస్తూ కనులకు విందు చేస్తాయి.

 

satyam5

మేమీ దేశానికి వచ్చినప్పటినించీ, అంటే మూడున్నర దశాబ్దాలుగా, చూసిన నేషనల్ పార్కులు ఎన్నో వున్నాయి, చూడవలసినవి ఇంకా ఎన్నో వున్నాయి. నేను ముందే చెప్పినట్టు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఒక చోట చూసినవి ఇంకొక చోట కనపడవు. అలాగే షియాన్ నేషనల్ పార్క్, నయాగరా, డెనోసోర్ నేషనల్ పార్క్… ఇలా ఎన్నో వున్నాయి.

చూసే వాళ్లకి చూసినంత! తర్వాత మీ ఇష్టం!

౦                 ౦                 ౦

 

 

 

 

బూతు కన్నా యమ డేంజర్… ఎస్కేపిజం!

 ‘‘బృహస్పతి’’

 

(తెలుగు సినీరంగంలో పాత ఒరవడి ఒకటి ఇప్పుడు కొత్తగా మొదలైంది. వందల కోట్లపెట్టుబడులకు తోడు అందివచ్చిన అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో భారీ చిత్రాలను హాలీవుడ్ చిత్రాలకు దీటుగా నిర్మిస్తున్నారు. దీనికి మనం గర్వించాలి. ఈ చిత్రాల కథలు, తీరుతెన్నులను చూసి అప్రమత్తం కూడా కావాలి. 65 ఏళ్ల కిందటే ఈ సమస్యపై ‘‘బృహస్పతి’’ కలంపేరుతో ఒకరు తెలుగు స్వతంత్ర వారపత్రిక(1949 సెప్టెంబర్ 16 సంచిక)లో  కళాక్షేత్రం శీర్షిక కింద రాసిన వ్యాసం ఇది. సేకరణ: వికాస్)

 

చాలా ఏళ్ల క్రితం కొత్తగా మార్క్సిజం అవగాహన చేసుకుంటున్న నా మిత్రుడొకడికి ధర్మసందేహం కలిగింది: ‘‘జన సామాన్యం(అప్పట్లో) నాదియా స్టంటు చిత్రాలు ఎగబడి చూస్తున్నారు గదా, అదే నిజమైన  ప్రజాకళ అనుకోవద్దా? వాటిని అల్పసంఖ్యాకులైన మనవంటి మేధావులు తిట్టటం ప్రజాసామాన్యానికీ వారి అభిరుచులకూ ద్రోహం కాదా?’’

ఈ ప్రశ్నకు నాకు అప్పట్లో తోచిన సమాధానం: ‘‘మేధావులు ప్రజాస్వామ్యాన్ని అభిమానించవచ్చు గాని వారి దారిద్ర్యాన్నీ తక్కువ అభిరుచులనూ అభిమానించనవసరం లేదు. ప్రజాసామాన్యం జీవితంలో అవసరమైన మార్పులు తెచ్చేదెవరు? వారిని అభిమానించే మేధావులే’’

ఇవాళ కూడా ప్రజాసామాన్యం ప్రకటించే తక్కువ తరగతి అభిరుచులు సమస్యగానే ఉన్నాయి. వాళ్లిప్పుడు ‘నాదియా’ స్టంటు చిత్రాలు చూడడం లేదుగాని ‘జానపద’ కుంటి చిత్రాలు చూస్తున్నారు. ప్రజల అభిరుచి అంతేననే సమాధానంతో తృప్తిపడనవసరం లేదు.

కళాభిరుచిలో కూడా ఇతర విషయాలలోలాగే, వ్యక్తి వైఖరీ, సముదాయ వైఖరీ ఉన్నాయి. ఈ తారతమ్యం అర్థం చేసుకోకపోతే, వెనక నా మిత్రుడికి వచ్చినట్లే అనేకమందికి అనేక ధర్మసందేహాలు కలిగి, తప్పుడు సిద్ధాంతాలు ప్రచారంలోకి వస్తాయి- ఇప్పుడు వస్తున్నాయి కూడానూ. ఇటువంటి సిద్ధాంతాలు మచ్చుకు ఒకటి, రెండు మనవి చేస్తాను.

ప్రజలకు నచ్చటమే అభ్యుదయ కళకు గీటురాయిగా పెట్టుకోవడం గురించి ఇంతకుముందే చెప్పాను. ఇంకో సిద్ధాంతమేమిటంటే, మధ్యతరగతి వాళ్ల అభిరుచులు మంచివి కనక, ఆ అభిరుచులను ఏదో విధంగా ప్రజాసామాన్యానికి అంటగట్టి అదే ప్రజాభిరుచి చేయాలని. మరో అభిప్రాయమేమిటంటే ప్రజాసామాన్యానికి కూడా కళలా అని!

ఇటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించేవాళ్లు గ్రహించని విషయమేమిటంటే, ప్రజాసామాన్యానికి కళలతో అవసరం ఉండటమే కాక, కళలను ఆస్వాదించే శక్తి కూడా ఉన్నదని. వారికి లేని శక్తి ఏమిటంటే, ‘‘శిల్పం కోసం శిల్పాన్నీ’’, ‘‘పాండిత్యం కోసం పాండిత్యాన్నీ’’ ఆరాధించటం. మధ్యతరగతి వాళ్ల అభిరుచులలో ఈ రెండు అంశాలూ తప్పిస్తే అవే ప్రజాసామాన్యం యొక్క అభిరుచులు కూడానూ. ఈ వ్యత్యాసం ఉన్నంతమాత్రం చేత ప్రజలకు కళలవసరం లేదని గాని, అవగాహన కావనిగాని భావించనవసరం లేదు. శిల్పనైపుణ్యాన్నీ, పాండితీ ప్రకర్షనూ చూసి ఆనందించటమే కళల యొక్క పరమార్థాన్ని గుర్తించటమని మధ్యతరగతివారు సంతృప్తి చెందనవసరం అంతకన్నా లేదు.

maya mahal

అయితే ఈ  మాట అనుకున్నంత మాత్రం చేత ‘నాదియా’, ‘జానపద’ చిత్రాల సమస్య తేలదు. ఈ చిత్రాలను జనసామాన్యం ఎందుకు ఎగబడి చూస్తున్నారు? శిల్పం గాని, పాండిత్యం గాని లేకపోవటం మించి వీటిలో ఇంకేమైనా ఉందా? లేదు! వీటిని కళాపిసాసతో ప్రజలు చూడడం కూడా లేదు. నిత్యజీవితం దుర్భరమైన ప్రజ తన చుట్టూ ఉన్న సాంఘిక వాతావరణాన్ని మరవడానికి ఈ అభూతకల్పనల శరణుజొచ్చుతున్నది. దీన్ని ‘‘ఎస్కేపిజం’’ అంటున్నాం. కానీ ఇందులో ‘‘ఎస్కేపిజం’’ కన్న కూడా విశేషమైన అంశం ఒకటుంది. అదేమింటంటే వ్యక్తి ప్రేరణలను తృప్తిపరచుకోవటం. ఇది అచ్చంగా ప్రజాసామాన్యం సొత్తు కాదు. ప్రబంధాలలోని పచ్చి శృంగారం ఆప్యాయంగా పఠించేవారంతా కవితా ప్రియత్వంతో ప్రేరేపించబడ్డవాళ్లే ననుకోనవసరం లేదు. అనేకమంది మేధావులు ఈ విధంగా వ్యక్తిగతమైన ఆనందాన్ని పొందుతారు కనక వాళ్లలో నిజమైన కళాపిపాస లేదనటం కూడా తప్పే.

‘‘ఎస్కేపిజం’’ కూడా వ్యక్తిగత ప్రేరణే. దాన్ని మధ్యతరగతివాళ్లు కూడా అలవంబిస్తారు. అయితే కళల ద్వారా ‘‘ఎస్కేపిజం’’ వాంఛించినప్పుడు మధ్యతరగతివాళ్లు శిల్పానికి భంగం రాకుండా చూస్తారు. సామాన్య ప్రజలకు అది అవసరం లేదు.

యుద్ధం జరుగుతున్న కాలంలో ‘‘ఆర్సినిక్ అండ్ ఓల్డులేస్’’ అనే నాటకం అమెరికాలోనూ, ఇంగ్లండులోనూ కూడా అతి విజయవంతంగా నడిచింది. ఆ నాటకంలో ఒక పిచ్చివాళ్ల కుటుంబం ఉంటుంది. వాళ్లలో ఇద్దరు వయసుమళ్లిన స్త్రీలు ఎంతో సద్బుద్ధితో జీవితంలో ఆనందం కోల్పోయిన ముసలి వాళ్లను చేరదీసి హత్యచేసి ఎంతో భక్తిశ్రద్ధలతో వారికి రహస్యంగా ఉత్తరక్రియలు చేస్తూ ఉంటారు. ఈ నాటకంలో శిల్పసమృద్ధికేమీ లోటు లేదుగానీ కళాప్రయోజనం మృగ్యం. అయినా ప్రజలు- అన్ని తరగతుల వాళ్లూ- ఈ నాటకం చూడటానికి వేలం వెర్రిగా ఎగబడ్డారు. యుద్ధకాల జీవితం గురించి మరచిపోవటానికీ, హత్యలు చేసేవాళ్లను చూసి నవ్వుకోవటానికీ ఈ నాటకం మంచి అవకాశం ఇచ్చింది.

ఈ పనినే ప్రస్తుతం ‘జానపద’ చిత్రాలు కూడా చేస్తున్నాయి. ఈ చిత్రాలను మధ్యతరగతి మేధావులు సహించలేకుండా ఉన్నారంటే వారందరూ ‘ఎస్కేపిజం’ కోరనివాళ్లని భావించరాదు. అందులో చాలా మంది ఈ చిత్రాలతో శిల్పసౌష్ఠవం ఉంటే తప్పక ఆనందించగలరు. అందువల్ల, ఏతావాతా, తేలేదేమంటే, కొందరు ప్రాజ్ఞులు ‘జానపద’ చిత్రాలనూ, వాటిని చూసే అల్పసంఖ్యాక ప్రజలనూ తిట్టటానికి నిజమైన కారణం కళాభిమానం కాదు, ప్రజాభిమానమూ కాదు.

కాని ఈ ‘జానపద’ చిత్రాలకు విరుద్ధంగా తీవ్రమైన ప్రచారం జరిగి వీటిని నిర్మూలించవలసిన అవసరం ఉంది. ఇది ప్రజాజీవితాన్ని విధ్వంసం చేసే యుద్ధకాలం కాదు, ప్రజాజీవితం నిర్మాణం కావలసిన కాలం;  ప్రజలు తమ జీవిత సమస్యల నుంచి పరారీ కావలసిన కాలం కాదు, వాటిని దృఢంగా ఎదుర్కోవలసిన కాలం. నైతికంగా తాగుడు ఎటువంటిదో ఈ తుచ్ఛమైన ‘జానపద’ చిత్రాలూ అటువంటివే. వీటి ద్వారా సాంఘిక ప్రయోజనం సాధ్యమవుతుందని ఎంత మతిమాలిన ప్రభుత్వం కూడా అనలేదు. అయినా అసంఖ్యాక ప్రజలు తాత్కాలిక ఆనందం కోసరం ఈ చిత్రాల మీద అంతులేని డబ్బు ఖర్చు చేస్తున్నారు. కాని ప్రభుత్వాన్ని నిషేధించమంటే ఈ చిత్రాలను నిషేధించదు. చిత్రనిర్మాణం ఒక పరిశ్రమ. పరిశ్రమలంటే మన ప్రభుత్వానికి భక్తివిశ్వాసాలు జాస్తి.  పెట్టుబడిదార్ల లాభాలు అతి పవిత్రమైనవి. ప్రజాక్షేమం కన్న పెట్టుబడిదార్ల లాభాలు అత్యంత పవిత్రమైనవి. ప్రభుత్వం గీసిన నీతినియమాల గిరిలో ఉండి చిత్రనిర్మాతలు ఎంత పనికిమాలిన చిత్రాలైనా తీయవచ్చు.

నన్నడిగితే చిత్రాలలో ‘‘బూతు’’ కన్నా ‘‘ఎస్కేపిజం’’ చాలా ప్రమాదకరమైనది. ‘‘ఎస్కేపిజం’’ కాకబోతే ‘‘బూతు’’లో తప్పేమీ లేదు. సినిమా చిత్రాలు చూసే వాళ్లంతా నిన్ననే కళ్లు తెరచిన పసిపాపలు కారు.

చిత్రనిర్మాతల లాభకాంక్షకూ కళాప్రయోజనానికీ ఉన్నది కేవలం బాదనారాయణ సంబంధం. ప్రజలలో ఉండే చైతన్యాన్ని అణచిపెట్టి, వారి మౌఢ్యాన్ని బలపరచే కళలను కళాభిమానులైన మేధావులు తీవ్రంగా నిరసించవలసి ఉన్నది. ఈ పనిని పత్రికలు కూడా దీక్షగా సాగించాలి.

*

 

 

 

 

రెండు సమయాల్లోంచి..

బాలసుధాకర్ మౌళి

 

ఈ మంచు కురుస్తున్న ఉదయప్పూట –
చన్నీళ్ల స్నానం చేసి
టవల్ వొంటికి చుట్టుకుని
ఆ పిల్లాడు చేస్తున్న నాట్యం
ఏ నాట్యాచార్యుని నాట్యం కన్నా
తక్కువ కాదు –

నాట్యం వికసించాలంటే
ఏ గొప్ప వేదికో
వేలాది మంది కొట్టే చప్పట్లో
పొగడ్తలో
అవసరం లేదు
నాట్యంతో తన్మయత్వం చెందాలి –

నాట్యం వికసించడానికి
చిన్న పూరిపాకలోని చిన్న స్థలమే చాలు –

ఆ రైల్వే గేటు పక్కన
ఆ చిన్న పూరిపాకలో
వాళ్లమ్మ
పొయ్యి దగ్గర కూర్చుని టీ కాస్తుంది
నాన్న
మంటని ఎగేస్తాడు
ఆ పిల్లాడు నర్తిస్తూ వుంటాడు
టీ కొట్టుకి
వొచ్చిపోయేవాళ్లంతా
ఉదయం అప్పుడే ఉదయించడాన్ని
కళ్లారా
తన్మయత్వంతో
అక్కడే చూస్తుంటారు –

ఒకానొక వేసవి మధ్యాహ్నం
అక్కడ
ఆ రైల్వేగేటు పక్కన
పూరిపాక ఉండదు
పసిపాదాల పరవళ్లతో పరవశించిన
ఆ టీ ప్రియులూ ఉండరు
రోడ్డుని తవ్వి పోశాక
ఆ టీ కొట్టు బతుకులోంచి
ఉదయం మాయమైపోతుంది

*

కలత కలతగా ఉంది
ఆ పిల్లాడి నృత్యం
తెల్లారి అనుభవం
దూరం దూరం జరిగిపోతున్నట్టే ఉంటుంది
ఈ నేల మీద
మళ్లీ ఉక్కుపాదాల బరువే
మోపబడుతున్నట్టూ
అనిపిస్తూ అనిపిస్తూ ఉంది !

బాలసుధాకర్ మౌళి

*

ఆమె ప్రవాస వేదన

 

సాహితి
  

ప్రవాస జీవితంలోని మరో స్త్రీ కోణాన్ని ఆవిష్కరించిన కథ ఇది. కల్పనా రెంటాల నవల “తన్హాయి” చదివినప్పటి నుంచీ ఆమె ప్రతి రచననీ ఆసక్తిగా చదివే చదువరిగా ఈ కథ నాకు భిన్నంగా అనిపించింది. ప్రవాస జీవన దృశ్యాలని కళ్ళ ముందు పెయింటింగ్ మాదిరిగా చూపించే కథలు కల్పన కలం నుంచి ఇంతకుముందే అనేకం వెలువడినా, ఈ కొత్త కథ మనం సాధారణంగా బయటికి చెప్పుకోలేని ఒక వాస్తవాన్ని చిత్రిస్తుంది.

రెండు కారణాల వల్ల ఈ కథ నన్ను ఆకట్టుకుంది: ఒకటి, ఈ కథలో వర్ణించిన లాంటి సంఘటనలు మామూలే అని ఇటీవలి ప్రవాస వార్తలు చదివిన వారెవరికైనా అర్థమవుతుంది, కాని, ఇందులో కథనానికి పనికొచ్చే విషయాన్ని తీసుకోవడం కల్పనకే సాధ్యమైన సాహసం. రెండు, ఇలాంటి విషయాల్ని కథకి ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు వాటిలో ఏ విషయాన్ని ఏ దృక్కోణం నుంచి చూడాలీ అన్న సందిగ్ధం సహజం రచయితల్లోనూ. లేదూ, అలాంటివి పరిశీలనకి వచ్చిన మనలోనూ. కల్పన ఈ కథలో ఒక కౌన్సిలర్ గా అదనపు బాధ్యత తీసుకొని ఈ సమస్యని లోతైన దృష్టిలో విశ్లేషించడం నాకు నచ్చింది. 

ఇక కల్పన కథన నైపుణ్యం గురించి తన్హాయి చదువరులకు వేరే చెప్పకర్లేదు కదా! మరీ ఎక్కువగా మీ కథా సమయాన్ని తీసుకోకుండా మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తాను.

**

It’s Not Okay!

 

Kalpana profile2“నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పర్సనల్. బార్న్స్ అండ్ నోబుల్ దగ్గర కలవటం కుదురుతుందా?’ ఆఫీస్ నుంచి బయలుదేరబోతుంటే వైదేహి నుంచి వచ్చిన టెక్స్ట్ మెసేజీ చూసి శృతి ఆగిపోయింది . వైదేహి ని  కలిసి దాదాపు నెల రోజులకు పైగా అయింది. ఈ మధ్య ఫోన్ కాల్స్ కూడా లేవు. అలాంటిది హఠాత్తుగా ఒక  టెక్స్ట్ మెసేజీ,  అది కూడా ముఖ్యమైన విషయం అని వచ్చేసరికి శృతి కి కొంచెం కంగారుగా అనిపించింది.

ఒక్క సారి వాచీ వంక, మొబైల్ వంక చూసింది. ఒకటి కాలం కోసం, రెండోది సెల్ ఫోన్ గుప్పెట్లో వున్న భౌతిక, మానసిక ప్రపంచాల కోసం. ఆ మొబైల్ లోనే ఆమె జీవితం మొత్తం గూడు కట్టుకొనుంది.   చేయాల్సిన పనులు,ఇంటా,  బయటా చేయించాల్సిన పనులు, అపాయింట్మెంట్ లు, రిమైండర్లు,నోట్స్, కట్టాల్సిన బిల్లులు మొత్తం గా ఆమె  జీవితపు bucket list అంతా ఆ మొబైల్ లో నిక్షిప్తమై ఉంది, రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు.

స్మార్ట్ ఫోన్ లో  ఒక్క సారి To Do List చూసింది. ఒక గంటో, ఒక రోజో ఆలస్యమైతే టోర్నాడో లో , వరదలో వచ్చే ప్రమాదమేమీ లేదని అర్థమయ్యాక,  ” see you girl,” అని వైదేహి కి  రిప్లై ఇచ్చింది.

అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం లో డాలస్, హ్యూస్టన్ లతో పోలిస్తే, ఆస్టిన్ కొంచెం చిన్న ఊరు.  ట్రాఫిక్ లేని సమయాల్లో ఊర్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఓ పావుగంట, అరగంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. రీసెర్చ్ బులవార్డ్ రోడ్డు మీద నార్త్ లో శృతి ఆఫీస్ ఉంటే, ఒక యూ టర్న్ తీసుకొని రీసెర్చ్ బులవార్డ్ సౌత్ మీదకొస్తే బార్న్స్ అండ్ నోబుల్ బుక్ స్టోర్
వస్తుంది. హైవే ఎక్కితే పది నిముషాలే కానీ ఆ ఫ్రాంటేజీ రోడ్డు మీద వెళ్లటమే శృతి కి  ఇష్టం.

హైవే ఎక్కితే తొందర తొందరగా గమ్యానికి చేరుకుంటాము. కానీ శృతి కి ఆ పరుగు పరుగు ఇష్టం లేదు. రోజూ ఆఫీస్ కి వచ్చి వెళ్లే చిన్నపాటి  కారు ప్రయాణాన్ని కూడా నెమ్మదిగా ఎలాంటి అనవసర పరుగులు లేకుండా ఇష్టమైన పాటలు వింటూ అనుభూతిస్తూ వెళ్లాలనిపిస్తుంది . వైదేహి చెప్పబోయే అంత ముఖ్యమైన , వ్యక్తిగతమైన విషయం ఏమై ఉంటుందా అని శృతి డ్రైవింగ్ చేస్తూ ఆలోచనలో పడింది .

***

వైదేహి , శృతి ల మధ్య స్నేహం విచిత్రంగా జరిగింది. సామాన్యంగా కొత్తగా ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు ఏ షాపింగ్ మాల్ లోనో, గ్రోసరీ స్టోర్ లోనో ఎదురెదురుపడితే చిన్నపాటి చిరునవ్వు నవ్వటానికి కూడా ఇబ్బంది పడుతూ , చూడనట్లు పక్కకు తప్పుకొని వెళ్లిపోతుంటారు. అలాంటిది హఠాత్తుగా గ్రోసరీ షాప్ లో కలిసిన వీళ్ళిద్దరి  స్నేహం ఓ ఏడాది గా  గా   పెరిగి
పెద్దదవుతోంది .

వైదేహి  వాళ్ళు బోస్టన్ నుంచి అప్పుడే  కొత్తగా ఆస్టిన్ కి రీలొకేట్ అయ్యారు. కందిపప్పు, కూరగాయలు కొనటానికి వైదేహి  , ఇండియన్ గ్రోసరీ షాప్ కి వస్తే అక్కడ జామపళ్లు, సీతాఫలం పళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే బోలెడు ఉత్సాహ పడిపోయింది. ఆ ఉత్సాహంతోనే అక్కడే నిలబడి అతి జాగ్రత్త గా జామపళ్ళను,సీతాఫలం పళ్లను ఎంపిక చేసుకుంటున్న శృతి తో  మాటలు కలిపింది.
కొత్తగా  వచ్చిన వైదేహి కి  ఊర్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పింది  శృతి. అలా ఇద్దరి మధ్య మొదలైన స్నేహం నెలకొకసారైనా  బయట కలిసి ఓ కప్పు కాఫీ తాగే వరకు వచ్చింది. అయితే ఎప్పుడు కలిసినా  పిల్లల చదువులు,కమ్యూనిటీ గాసిప్ లు,  లోకాభిరామం విషయాలు తప్ప ఎవరి వ్యక్తిగత విషయాలు మరీ లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం రాలేదు.

వైదేహి  ముఖ్యమైన విషయం, వ్యక్తిగతం అనేసరికి విషయం ఏదో పెద్దదని   శృతి
కి అర్థమయింది . శృతి అలా ఆలోచనల్లో ఉండగానే బార్న్స్ అండ్ నోబుల్ వచ్చేసింది. కారు పార్క్ చేసి బుక్ స్టోర్ కి వెనుక వైపు ఉన్న పార్క్ లోకి నడిచింది శృతి.

2.

అది పెద్ద పార్క్ కాదు కానీ ముచ్చటగా ఒక పక్క చిన్న సరస్సు , మరో వైపు పిల్లలు ఆడుకోవటానికి చిన్న చిన్న జారుడు బండలు ఉన్నాయి.ఒక పక్క పిల్లల్ని ఆడించే వాళ్ళు ఆడిస్తున్నారు. మరో పక్క పార్క్ లో సాయంత్రం చల్లటి వేళ ప్రకృతి ని ఆస్వాదిస్తూ నడిచే వాళ్ళు నడుస్తున్నారు. ఇంకో వైపు   సిమెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్ దగ్గర నెమ్మదిగా కాఫీ  సిప్ చేస్తూ ఏదో దీర్ఘాలోచనలో వైదేహి  కూర్చొని ఉంది. వైదేహి ని  పలకరిస్తూ ఏమిటి విషయం అన్నట్లు  చూసింది శృతి . వైదేహి   మొహం విచారంగా లేదు,సంతోషంగా లేదు. ప్రశాంతంగా లేదు, అశాంతిగానూ లేదు. కేవలం గంభీరంగా ఉంది. అలా వైదేహి ని  ఎప్పుడూ చూడకపోవటం తో శృతి కొంచెం ఆశ్చర్య పడింది .

“Is ever thing alright ?” కొంచెం ఆందోళన గా  అడిగింది.

“యెస్…” తల వూపుతూ శృతి కోసం తీసుకున్న కాఫీ కప్పు ను ఆమె చేతికి
అందించింది వైదేహి. గంభీరంగా ఉన్న వైదేహి వంకే చూస్తోంది శృతి,  ఏం మాట్లాడబోతోందా అన్నట్లు.

” డైవోర్స్ కి ఫైల్ చేశాను.” నేరుగా అసలు విషయం లోకి వచ్చేసింది   వైదేహి .

“వ్వాట్? అసలేమైంది?ఒకటే సారి ఈ  డైవోర్స్ నిర్ణయం ఏమిటి?” శృతి మాటల్లో కనిపిస్తున్న ఆందోళన ను చూసి ఇప్పుడంతా  బాగానే ఉంది,నువ్వేం కంగారు పడకు అన్నట్లు ఆమె చేతి మీద చెయ్యి వేసింది వైదేహి .
అప్పుడే తగిలిన పచ్చి గాయం లాగా , ఎప్పటికీ మర్చిపోలేని ఓ పీడ కల గా మళ్ళీ కొత్త గా కళ్ళకు కట్టినట్లు   కనిపిస్తోంది వైదేహి కి.

***

౩. ఒక శుక్రవారం ఉదయం.

ఫోన్ లో పెట్టుకున్న అలారం బీప్ కన్నా చాలా చాలా ముందే మెలకువ వచ్చేసింది వైదేహి కి.  కనురెప్పలు తెరుచుకున్నాయి కానీ ఒంట్లోని నరాల్లో ఏ మాత్రం కదలిక  లేనట్లు,కండరాలన్నీ ఎక్కడికక్కడ మంచు లో కూరుకుపోయినట్లు మొద్దు బారి పోయి ఉన్నాయి. శరీర కణాల్లో ఏ మాత్రం జీవం లేనట్లు నిశ్చింత గా నిద్ర పోతున్నాయి. ఒక్క క్షణం వైదేహి కి  తానూ బతికున్నదో, చనిపోయిందో కూడా అర్థం కాలేదు. దేహం లోంచి విడివడి పోయి తన ఆత్మ ఒక సాక్షీభూతం గా దూరం గా నిలబడి శరీరాన్ని చూస్తున్న ఫీలింగ్ వైదేహి లో. చేతి ని, కాళ్ళను కదపాలని ప్రయత్నించింది. అసలు అవి ఉన్నాయని కూడా తెలియనట్లు అనిపించింది. మానసికంగా , శారీరకంగా విశ్వ ప్రయత్నం చేసాక ఎక్కడో
చిన్నపాటి కదలిక. మెలకువ  వచ్చాక ఓ పావు గంట పట్టింది మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టడానికి.  అటు పక్కకు తిరిగి పడుకున్న రాఘవ గొంతు లోంచి
వస్తున్న గురక ను బట్టి  అతను గాఢ నిద్ర లో ఉన్నట్లు తెలుసు ఆమె కు. తన శరీరం , తన మనసు ఏం మాట్లాడుతున్నాయో అతన్ని లేపి చెప్పాలని ఉంది. కానీ
దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకాబట్టి ఆ ప్రయత్నం మానుకొని లేచి నెమ్మదిగా వెళ్ళి అక్కడున్న కిచెన్ బార్  స్టూల్ మీద తన శరీరాన్ని కూలదోసింది.

పొద్దుపొద్దుటే ఈ “ ఫైబ్రో  మయాల్జియా “ పెట్టే బాధలు ఇవాళ కొత్త కాదు వైదేహి కి . ఒళ్లంతా కండరాల నొప్పులు. శరీరమంతా ఒక బాధాసప్తసతి లాగా ఉంటుంది.  ఈ రోగానికి ప్రత్యేకంగా ఏం మందులు ఉండవు అంటూనే డాక్టర్లు ఏవో మందులు ఇస్తూ ఉంటారు. పెయిన్ మేనేజ్మెంట్ తప్ప ఇది తగ్గే రోగం కాదు అని ఆమె కు కూడా తెలుసు. కానీ  ఉదయం లేవకుండా, అమూల్య ను స్కూల్ కు పంపకుండా ఉండటం ఎలా సాధ్యం? చాలా ఉద్యోగాలతో పాటు అమెరికా లోని హాయైన జీవితానికి డ్రైవర్ ఉద్యోగం కూడా చేయాలి కదా అనుకొని నిట్టూర్చింది.

వయస్సు ముప్పై లలోనే ఉన్నా  ఉదయం పూట  ఏదో ముసలితనం వచ్చినట్లు ప్రవర్తించే శరీరం వంక చూసుకుంది వైదేహి .  అలాగే లేచి అటూ ఇటూ కండరాల పెను నిద్దర ను వదిలించే ఎక్సర్ సైజులను చేయటం మొదలు పెట్టింది. ఉన్నట్లుండి కలుక్కున ఎక్కడో పట్టేసింది. నడుం పై భాగం ఒక ముక్క గా , కింద భాగం మరో ముక్క గా  దేహం రెండు గా విడిపోయినట్లు విపరీతమైన నొప్పి.
అతి కష్టం మీద  నేల మీద కు ఒరిగి పోయింది. ఆ నొప్పి లోంచి అమ్మా అన్న కేక గట్టిగా బయటకు వచ్చింది.  కానీ అమెరికా లో అమ్మ లకు అమ్మలు ఎవరూ పక్కన ఉండరు కదా. అయిదు నిముషాలు ఆ నొప్పి ని భరించింది. నొప్పి క్షణం క్షణం ఎక్కువవుతోంది ఇక భరించలేక “ రాఘవా,రాఘవా” అంటూ గట్టిగా కేకేసింది .

ఓ పదిసార్లు గట్టిగా అరిచాక కానీ రాఘవ కు మెలకువ  రాలేదు. కళ్ళు నులుముకుంటూ కిచెన్ లోకి వచ్చాడు. నిద్రాభంగం అయిందన్న చికాకు ఆ మోహంలో స్పష్టం గా కనిపిస్తోంది.

“ ఎవరు చచ్చారని అంత కేకలేస్తున్నావు?” అంటూ వైదేహి కోసం  అటూ ఇటూ చూసాడు. నిద్ర మత్తు లోంచి కళ్ళు  ఇంకా బయటకు రానంటున్నాయి కాబోలు అంతా మసక మసక గా కనిపించింది. కళ్ళు విదిల్చుకొని సరిగా చూసాడు . అప్పుడు కనిపించింది నేల మీద ఓ మూట లా రెండు కాళ్ళు వెనక్కు మెలికపడి కూర్చొన్న వైదేహి  .

వైదేహి కి  శరీరం లోని నొప్పి ని దాటి మరింత నొప్పి పెట్టింది రాఘవ అన్న మాటలు .

“ ఏమిటీ ఎక్సర్ సైజు లు చేసావా?  ఫిజియో థెరపీ కి డబ్బులు వదిలించటం తప్ప  అవి నీకు రావు. నువ్వు చేయలేవు. “ విసుక్కుంటూ వైదేహి ని  పైకి లేపాడు.

వైదేహి కి  అక్కడే కూలబడిపోయి పైకి లేవకుండా భీష్ముడి లాగా “ స్వచ్చంద మరణం” పొందాలనిపించింది.

రాళ్ళను గుగ్గిళ్ళు గా మార్చగలిగే పతివ్రతలో కోవ లో లేదు  కాబట్టి వైదేహి చావలేక బతికి పోయింది.

వైదేహి ని  పైకి లేపి , లేచి నిలబడుతుండగానే టక్కున ఆ స్పర్శ ను అర క్షణం కూడా భరించ లేనట్లు వదిలేశాడు రాఘవ. ఆమె కళ్ళల్లోంచి ఓ సన్నటి నీటి పొర, ఎందుకీ జన్మ  అనుకుంటూ.

ఇంకా పూర్తిగా నిలదొక్కుకోకుండానే వదిలేయటం తో కాళ్ళు ఇంకా బాలెన్స్ లోకి రాక కాస్త అటూ ఇటూ ఊగిపోయింది.  గబుక్కున కిచెన్ మధ్య లో ఉన్న బార్ అంచును పట్టుకొని స్టూల్ మీద కూలబడింది.

మనసు లోని నొప్పి ముందు శరీరం లోని నొప్పి చాలా చిన్న గా అనిపించింది. అయినా ఒక్క మాట కూడా బయటకు రానివ్వలేదు  ఆమె .

కిచెన్ బార్ మీద చార్జింగ్ కి పెట్టిన ఫోన్ తీసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ “ఫకింగ్ ఇడియట్. దీన్ని కట్టుకున్నాక నిద్ర సుఖంలేదు. “ గొణుక్కున్నాడు రాఘవ. చీమలు కూడా తిరగని నిశ్శబ్దపు ఇంట్లో అతని మాటలు స్పీకర్ పెట్టినట్లు గట్టిగా వినిపించాయి.

అతన్ని నిద్ర లేపిన ఘోరమైన అపరాధం తనదే అన్నట్లు “ నువ్వు రాత్రి లేట్ గా పడుకున్నావని తెలుసు కానీ పైకి లేవకపోతే అమూల్య ను నిద్ర లేపి స్కూల్ కి తయారు చేయలేను కదా అని పిలిచాను.”

వైదేహి  మాటలకు,  చేత్తో ఇక చాల్లే అన్నట్లు చూపిస్తూ “ ఒక్క రోజైనా మొగుడి ని సుఖ పెట్టావా? ఆ సుఖం గురించి కాదు నేను మాట్లాడుతోంది . డబ్బు తెచ్చి నీ ముఖాన పోస్తున్నాను. అమెరికా లో ఇంత పెద్ద ఇల్లుంది. ఉద్యోగం చేయక్కర లేదు. నన్ను నా ఉద్యోగం చేసుకోనిస్తే చాలు. ఉన్న ఒక్క పిల్ల ను స్కూలు కు దించేస్తే రోజంతా ఖాళీ. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి తెచ్చుకోవటం. ఇది పెద్ద పనా? ఇంజనీరింగ్ చేసావు. నీ ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్ వేర్ లో ఉన్నారు. నిన్ను ఆ పని కూడా చేయమనటం లేదే. హాయి గా ఇంటి పట్టున ఉండి వంట చేసుకొని మా ఇద్దరినీ చూసుకోవటానికి ఏం పోయేకాలం?ఎప్పుడూ ఏదో ఒక  రోగం?” గురి తప్పని మాటల బాణాలు విసరటం మొదలుపెట్టాడు  రాఘవుడు.

“ ఉద్యోగం చేయొద్దన్నది నువ్వు. ఈ ఫైబ్రో మయాలజియా ఉన్నా కూడా ,మీ పనులు ఏవీ ఆపటం లేదే. అన్నీ చేస్తూనే ఉన్నాను గా. “ ఎదురు సమాధానం చెప్పింది వైదేహి, భర్త మాటలకు ఎదురాడ కూడదని తెలిసినా కూడా.

“ నీకు చేతకాదని తెలుసు కాబట్టే వద్దన్నానే. ఒక్క పని అయినా పర్ఫెక్ గా చేస్తావా? నేను నెల లో సగం రోజులు ప్రయాణం లోనే ఉంటాను. నువ్వు పిల్లను స్కూల్లో దింపటం, స్విమ్మింగ్ కి, ఆర్ట్ క్లాస్ కి, సంగీతం క్లాస్ కి తీసుకెళ్లటమేగా  చేయాల్సింది.  అసలు ఆడదానికి పిల్లల్ని పెంచటం కన్నా వేరే  ముఖ్యమైన పనులేమున్నాయి. అదికూడా కష్టమేనా?”

“ రోజంతా ఇంటి పనులు,అమూల్య పనులతో సరిపోతూనే ఉంది కదా. మధ్యాహ్నం రెండు మూడు గంటలు  ఖాళీ , అంతే కదా ” చెప్పటం అనవసరం అని తెలిసినా నోరు ఊరుకోక ఉన్న విషయం చెప్పింది.

“ మొగుడు బయట నానా గడ్డీ తిని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి తెస్తే చీరలు,మేకప్ లు,నగలు అంటూ దాన్ని ఖర్చు పెట్టడమే కదా మీ ఆడవాళ్ళు చేసే పని. అయినా నువ్వసలు ఆడదానివేనా? నువ్వొక   రోగిష్టి మారివి.  ఉన్న ఒక్క పిల్లను సక్రమం గా పెంచటం చేత కాని ఆడదానివి. ఒక్క ఆడ పని అయినా నువ్వు ఇన్నేళ్ళ లో సక్రమం గా చేసావా? ”

ఒక్కో మాటల తూటా నేరుగా వైదేహి మనసు లో దిగబడి పోతోంది. ఎన్ని సార్లు గుచ్చుకున్నాయో ఈ బాణాలు అయినా చెక్కుచెదరని ధీరత్వం తో కాపురం చేస్తూనే
ఉంది వైదేహి.

రాఘవ మాటలకు వైదేహి సమాధానం చెప్పక్కర లేకుండా ఫోన్ గణ గణ మని మోగింది.

రిసీవర్ తీసి కాలర్ ఐడి లో నెంబర్ చూసి  “ఇండియా నుంచి మీ పుట్టింటి వాళ్ళు. వాళ్ళు కాల్ చేసే ఆ వానేజీ ఫోన్ కి కూడా నేనే డబ్బులు కడుతోంది. కూతురు కి పనులు చేయటం కూడా నేర్పించ కుండా నాకు అంటగట్టి వదిలించుకున్నారు”  కార్డ్ లెస్ ఫోన్ ను  కిచెన్ టేబుల్ కు ఆ వైపున ఉన్న వైదేహి వైపు కు బలంగా విసిరేశాడు రాఘవ.

ఫోన్ ఆన్సర్ చేసి విసిరేసాడేమో, రాఘవ మాటలు అవతల వైపు కు వినిపించాయేమో అని సిగ్గుతో చితికిపోతూ ఫోన్  తీసుకుంది.  రాఘవ మాటల మధ్య కాల్ ఆపేయటాన్ని, రింగ్ ఆగిపోవటాన్ని గుర్తించ లేకపోయింది వైదేహి.
“ ఏం ఆడ పనులు చేయటం లేదు నేనీ ఇంట్లో ?  అయినా అసలు నేను ఆడదాన్ని అని నాతొ సంసారం చేయాలని గుర్తుండాల్సింది నీకు , నాకు కాదు. ”  ఆడ దానివి  కాదు అన్న మాటకు ఒళ్ళు తెలియని కోపంతో మాటకు మాట సమాధానం చెప్పింది వైదేహి.

“ ఏమిటే నీతో సంసారం చేసేది? నీకు మదమెక్కువై ఒళ్ళు కొవ్వొక్కి కొట్టుకుంటున్నావు.  సంసారం చేయాల్సింది పిల్లల్ని కనటానికే. అది జరిగాక ఇక సంసారం చేస్తే అది సంసారం కిందకు రాదు. నేను హిందువు ని. తురకోడి లాగా వందమంది పిల్లల్ని కనక్కరలేదు.” సంసారం విషయం ఎత్తేసరికి రాఘవ లో ఎక్కడ లేని కోపం వచ్చింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. మొహమంతా ఎర్రగా మారిపోయింది.

It's Not Okay story 2

“ నీకు చేత కావటం లేదని చెప్పు.  నీ మగతనం పోయిందని చెప్పు. నీకు ఎరెక్షన్ సమస్య అని చెప్పు. అంతే కానీ  హిందూ ధర్మం, పురాణాల గొడవెందుకు?” వైదేహి సూటి గా అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నది ఆ మాట. ఆ చూపు లో,ఆ మాటలో ఒక తెలియని  కచ్చితనం కనిపిస్తోంది. అతని రహస్యాన్ని బట్టబయలు చేయాలన్న కసి కనిపిస్తోంది.

ఆ మాట ను విని తట్టుకోలేకపోయాడు రాఘవ.

“ బజారు ముండ, నీకు సెక్స్ కావాలటే, రా నా మగతనం చూపిస్తాను.అయినా  You know what, you are not worth to f**** “. విసురుగా దగ్గరకొచ్చి జుట్టు పట్టుకొని వైదేహి ని ఒక్క లాగు లాగాడు. అలా విసురు గా లాగటం తో స్టూల్ మీదున్న వైదేహి కిందపడి పోయింది.

కింద పడటం,    చేతిలో ఉన్న కార్డ్ లెస్ ఫోన్ ను  రాఘవ మొహం మీదకు విసిరేయటం రెండూ ఒక దానివెంట ఒకటి  ఒక్క త్రుటి లో జరిగిపోయింది.

ఫోన్  రాఘవ నుదుటిని కొట్టుకుంటూ వెళ్లి పక్కకు పడిపోయింది.

ఇందాక ఒక సారి పడిపోయిన చోటనే మళ్ళీ దెబ్బ తగిలింది. ఈ సారి నొప్పి మరింత తీవ్రంగా అనిపించింది. కానీ రాఘవ అన్న మాటల కంటే ఆ నొప్పి చాలా మాములుగా భరించగలిగేలా అనిపించింది వైదేహి కి.

“ నన్ను కొడతావా? ఏం జాతే నీది? నువ్వొట్టి బజారు ముండ వి. నువ్వు బ్రాహ్మణ పుటక పుట్టావా? ఇదేనా మీ వాళ్ళు నీకు నేర్పించింది? “ మాటలు,బూతులు అన్నీ కలిసిపోయి తిడుతూ ఆ రిసీవర్ ని తీసి మళ్ళీ వైదేహి మొహం మీదకు విసిరేశాడు.

సూటి గా వచ్చి వైదేహి నోటి కి ఫోన్  బలం గా  తగలటం తో పళ్ళు పగిలినట్లు రక్తం జివ్వున బయటకు వచ్చింది.

అప్రయత్నంగానే చెయ్యి పెదాల మీద కు వెళ్ళింది. చేతికి ఎర్రటి రక్తం. పెదాల చివర నుంచి రక్తం కిందకు ధార లా కారుతోంది.

ఎన్ని సార్లో అంతకు ముందు  అతని చేత తన్నులుతిన్నది. అయినా ఆ క్షణం భిన్నమైనది.

చేతికి అందిన రిసీవర్ ని తీసుకొని గబగబా 911 డయల్ చేసింది.  రాఘవ పెడుతున్న  హింస గురించి ఒక ప్రవాహం లా  మాట్లాడేస్తోంది  వైదేహి.

ఒక పక్క ఆవేశం, ఒక పక్క బాధ, తెలుగు, ఇంగ్లీష్ లలో కలగాపులగంగా రోప్పుతూ మాట్లాడుతోంది వైదేహి.

అటు పక్క నుంచి ఆపరేటర్ వైదేహి మాటల్ని ఆపుతూ “ మేమ్ . జస్ట్ టేక్ డీప్ బ్రెత్ . నెమ్మది గా చెప్పండి. మీ ఇంటి అడ్రెస్ ఏమిటి? ఆర్ యు సేఫ్ ? “అడుగుతున్నాడు .

ఒక్క క్షణం వైదేహి ఏం చేస్తోందో, ఎవరితో మాట్లాడుతోందో అర్థం కాలేదు రాఘవ కు.

వైదేహి కాల్ చేసినదెవరికో అర్థం అయ్యాక రాఘవ గగబా వచ్చి వైదేహి చేతిలోని రిసీవర్ ని తీసుకొని కాల్ ని ఆపేసాడు.

“ You bitch. ఇంటి విషయాల్ని బయట పెట్టడానికి సిగ్గు లేదు. నడువు,ఇప్పుడే నా ఇంట్లో నుంచి బయటకు నడు “ అంటూ జుట్టు పట్టుకొని లేపి తలుపు వైపు తోసాడు.

“ ఇది నా ఇల్లు. నేనెందుకు వెళ్ళాలి?” అంటూ ఓ విధమైన పిచ్చి ఆవేశం తో రెండు చేతులతో రాఘవ రొమ్ము మీద పిడి గుద్దులు  గుద్దింది వైదేహి. చేత్తో అతని మొహం మీద రక్కింది. రాఘవ కళ్ళకు రాక్షసి మీద కు వస్తున్నట్లు కనిపించి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేసాడు. కానీ వైదేహి బలం ముందు బలహీనుడై పోయాడు. తప్పించుకునే ప్రయత్నమో, కోపమో కానీ అతను ఆమె ను కొట్టే ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నాడు.

అలా ఇద్దరు ఒకరినొకరు మాటలతో చేతలతో హింసించుకొంటూ ఉండగా బోయ్ బోయ్ మంటూ శబ్దం చేసుకుంటూ కాప్స్ ఇంటి ముందుకు వచ్చేసారు.

“ వాళ్ళను వెళ్ళిపొమ్మని చెప్పు. ఏం జరగలేదని చెప్పి పంపేయి. లేదంటే నిన్ను ఇక్కడే నరికి చంపేస్తాను” తలుపు తీయడానికి వెళ్తున్న వైదేహి ని ఆపెస్తున్నాడు రాఘవ.

అప్పటి వరకు లేని బలం ఎలా వచ్చిందో వైదేహి కి అతన్ని తోసేసి వెళ్లి తలుపుతీసింది.

భద్రమైన వారి ఇంట్లో కి భద్రతనిచ్చే రక్షకభటులు వచ్చారు.

చెదిరిన జుట్టు, పళ్ళ నుంచి రక్తం, మొహమంతా రక్కేసిన గాట్ల తో వైదేహి అపర కాళిక లాగా పోలీసుల ముందు నిలబడింది.

“ ఆర్ యు ఓకే మేమ్ “ అంటూ ఒక పోలీసు అడిగిన ప్రశ్న కు తల ఊపింది ఆమె.

వాళ్ళను చూడగానే ఒక విధమైన ధైర్యం తో పాటు ఒక ఎంబరాస్మెంట్ ఫీలింగ్ కూడా కలిగింది. లోపల దాచిపెట్టుకున్న ఏడుపు ఒక్క సారిగా బయటకు వచ్చింది.

“ ఇట్స్ ఓకే “ అంటూ లేడీ పోలీసు ఒకామె నెమ్మదిగా వైదేహి ని నడిపించుకుంటూ తీసుకొని వెళ్లి సోఫా లో కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతావా? “ అంటే తల ఊపింది.

రాఘవ కు నోటి మాట రాకుండా స్థాణువై నిలబడి ఉన్నాడు. పోలీసుల వంక చూడలేకపోతున్నాడు. అవమానంగా అనిపించింది. పరువు బజారు పాలు చేసింది ఈ
బజారు ముండ అనుకున్నాడు.

“ సర్, ఆర్ యూ ఆల్ రైట్ ? మీకేమైనా దెబ్బలు తగిలాయా?” రాఘవ మొహం వైపు
చూస్తున్నాడు. మొహం మీద గాట్లు, రిసీవర్ మొహానికి తగిలిన దెబ్బ అన్నీ అద్దం లో కనిపించినట్లు స్పష్టం గా కనిపిస్తున్నాయి ఆ పోలీసు కళ్ళకు .

ఇంతలో వారికి ,  దూరం గా ఒక శిలా విగ్రహం లా నిలబడ్డ అమూల్య కనిపించింది. ఎప్పుడు నిద్ర లేచి వచ్చిందో, ఏం చూసిందో తెలియదు , నోట మాట, శరీరం లో కదలిక లేకుండా శిల లా నిల్చున్న  అమూల్య దగ్గరకు లేడీ పోలీసు వెళ్లి “ స్వీటీ,  ఇట్స్ ఓకే. కెన్ వుయ్ గో ఇన్ టు యువర్ రూమ్? “అమూల్య ని  గది లోకి తీసుకెళ్లింది. ఆమె అమూల్య తో మాట్లాడుతోంది.

ఇంకో ఇద్దరు పోలీసులు వైదేహి తోనూ, రాఘవ తోనూ విడివిడి గా మాట్లాడి నోట్స్ తీసుకున్నారు.

ఒక గంటకు పైగా మాట్లాడి రాఘవ మీద ఎమోషనల్ ఎబ్ యూజ్ కింద కేసు పెట్టారు. కౌంటీ రూల్స్ ప్రకారం గృహ హింస కు జీరో టాలరెన్స్ చట్టం ఉంది కాబట్టి , వైదేహి కంప్లైంట్ ఇస్తే రాఘవ మీద కేసు పెడతామని పోలీసులు చెప్పారు కానీ అతన్ని జైలు కు పంపటం ఇష్టం లేక వద్దని చెప్పింది వైదేహి.

“ ఇక్కడ మీరు సేఫ్ గా ఉండగలరా ? లేక వేరే ఎక్కడైనా ప్రొటెక్షన్ హౌస్ కి వెళ్తారా? “ అన్న పోలీసుల ప్రశ్న కు “ ఇక్కడే ఉంటామని, అవసరమైతే మళ్ళీ కాల్ చేస్తామని “ చెప్పింది వైదేహి.

ప్రొటెక్షన్ సెల్  విజిటింగ్ కార్డ్స్, సహేలి కార్డ్స్, కౌంటీ పోలీస్ స్టేషన్ నెంబర్స్ అన్నీ ఫ్రిజ్ మీద మాగ్నెటిక్  కార్డ్ తో అతికించి వెళ్ళారు.

పోలీసులు ఇద్దరికీ మరో సారి అన్నీ రూల్స్ వివరించారు.  ఇద్దరిలో ఎవరికైనా అవతలి వాళ్ళ వల్ల  ప్రాణాపాయం అనిపించినా వెంటనే కాల్ చేయమని చెప్పారు.

పోలీసుల్ని పంపుతూ  తలుపు వేయటానికి  మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళిన వైదేహి కి, సందు లో తమ ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళంతా స్లో డౌన్ చేసి  ఆ ఇంటి ముందు ఆగిన పోలీసు కార్లను చూసుకుంటూ వెళ్తున్న విషయాన్ని గమనించింది.

సిగ్గు, అవమానం, అసహ్యం , బాధ, ఏడుపు అన్నీ కలగలిసి వచ్చాయి. భారంగా అడుగులు పడుతుంటే లేచి అమూల్య గదిలోకి వెళ్ళింది వైదేహి.

***

“   నా 15 ఏళ్ల వైవాహిక జీవితం చివరకు ఇలా ముగిసింది  శృతీ . అమూల్య కోసమో, నా అనారోగ్యం వల్లనో ,  లేక ఈ కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే తాపత్రయం తోనో  ఏదో ఒక కారణంతో   ఇన్నాళ్ళూ  ఓపిక పట్టాను. ఆ 911 సంఘటన జరిగిన రోజు ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు కానీ ఒక్క సారిగా నా భయాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆ రోజు మమ్మల్ని అమూల్య చూసిన చూపు నేనెప్పటికీ మర్చిపోలేను. నేనున్న స్థితి లోనే రేపు అమూల్య ఉంటే ఏం చేస్తుంది? భర్త చేత తన్నులు తింటూ అయినా సరే ఆ కాపురాన్ని  నిలబెట్టుకోమని ,  ఆత్మ గౌరవం లేకుండా బతకమని చెప్పనా? అదేనా నేను నా కూతురికి నేర్పించాల్సిన జీవితపాఠం? ”
ఆ సాయంత్రపు నీరెండ వెలుగు లో  తనను తాను ప్రశ్నించుకుంటున్న వైదేహి కొత్త గా కనిపించింది శృతి కి. లేచి వెళ్లి వైదేహి ని హగ్ చేసుకుంది .

(నవ్య వీక్లీ లో ( జూలై 1 సంచిక లో) ప్రచురితమైన  కథ)

అభిమన్యులు

అల్లం  వంశీ

 

allam-vamsi“కష్టం రా.. మొన్ననే నాలుగు నెల్లకింద మా నాన ‘దానికి’ వచ్చిపేనగదా.. మళ్ళ ఇప్పటికిప్పుడు వచ్చుడంటే చానా కష్టంరా… ఈసారి కాదుగనీ మళ్లెప్పుడన్న వీలుచూసుకోని వస్తలే..”
ఆఫీస్ ఫోన్ ల నుంచి చాటుగ ‘గుస గుసగ’ మాట్లాడుతున్నడు రమేషు..
“అరే.. అప్పుడు నువ్వు వచ్చిన సంధర్భం వేరే, ఇప్పుడు నేన్ రమ్మంటున్న సంధర్భం వేరే.. రా.. రా..” ఊర్లో ఎస్టీడీ బూతుల నుంచి ఊరందరికి వినిపించేటట్టు మాట్లాడుతున్నడు మనోహరు..
వీళ్లిద్దరు చిన్నప్పటికాంచి మంచి దోస్తులు. పుట్టి పెరిగింది ఓ చిన్న టౌన్ ల.. రమేష్ పీజీ దాక చదివి హైదరాబాద్ ల ఏదో గవర్నమెంట్ నౌకరి సంపాదించుకోని అక్కడే ఉంటున్నడు.. మనోహర్ మాత్రం పుట్టిపెరిగిన ఆ ఊళ్లెనే ఓ బట్టల దుకాణం పెట్టుకోని నడుపుకుంటున్నడు. ప్రస్తుతం ఇద్దరికీ చెరో ముప్పయ్యైదేండ్లు ఉంటయి..
“మొన్నచ్చినప్పుడే వారం రోజులు లీవ్ పెట్టిన్రా.. మళ్లిప్పుడే లీవ్ అంటె కష్టం భై.. చానా కష్టం..”
అట్ల కాద్రా.. మన సార్ రిటైర్మెంటు ఫంక్షన్లనన్న అందరం ఓసారి కలవొచ్చని రమ్మంటున్న..
“అందరంటె” ఎందర్రా?? మా అంటె ఆడ లోకల్లున్నోళ్లు ఓ నలుగురున్నరుకావచ్చు.. అంతేకదా??

Kadha-Saranga-2-300x268
అంటే?
అంటేలేదు గింటేలేదు.. బయట నౌకర్లు చేసేటోళ్లు ఎందరస్తున్నరో చెప్పు? ఒక్కడు వస్తా అన్నా, నేను కూడ వస్తా సరేనా??
అరేయ్, అందరు ఇట్లనే అంటున్నర్రా.. ఒక్క రెండురోజులకు వచ్చిపోతె ఏమైతుంది చెప్పు??
ప్లీస్ రా భై.. తప్పుగ అనుకోకు… నేనిప్పుడు లీవ్ పెట్టే పరిస్తితిల లేను, ఈ యేడాదే నా ప్రమోషన్ గూడ ఉన్నది.. ఊకూకె ఇట్లనే లీవులు పెట్టినా అంటె అంతే ముచ్చటిగ..
అయినా అమ్మ కూడ ఇక్కడ ఒక్కతే ఉన్నట్టున్నదికదా? ఓసారి వచ్చి కల్శి పేనట్టుంటది.. రా రా..
ఇంకో నాల్ రోజులుపోతె అమ్మే ఇటస్తా అన్నదిరా.. అయినా మొన్నటిదాక అమ్మతోనే ఉంటి, అమ్మ ముచ్చట ఇడ్శిపెట్టు కని సారుకే ఏదన్నొకటి చెప్పురా.. పాపం నేనంటె మస్తు పావురపడ్తుండే, నేన్ రాలేదంటె ఫీల్ అయితడుకావచ్చు!! నా తరుపున ఓటి మంచి శాలువా ఇయ్యిరా, సరేనా? పైసల్ మనం కలిసినప్పుడిస్తా..

vamsi
******
కాలం ఓ పదేండ్లు ముందుకు కదిలింది..
“అబో కష్టం రా… ఇప్పుడెక్కడ వీలైతదిరా అయ్యా!” రమేషు, ఇంట్లోని ల్యాండ్ లైన్ ఫోన్ ల మనోహర్ తోని మాట్లాడుతున్నడు…
నువ్వు ఊకె ఏదో ఒక సాకు చెప్పకురా.. ఈసారి మాత్రం నువ్వస్తున్నవ్ అంతే.. ఇంక మాట్లాడకు…
అరేయ్.. అట్ల కాదురా.. మా పిలగాన్లకు పరీక్షల్ నడుస్తానయ్.. ఇప్పుడు వాళ్లను ఇడ్శిపెట్టి నేనటస్తె ఆమెకూ, పిల్లలకు ఇబ్బంది కాదా? వద్దు వద్దు.. నాకు వీలుకాదు..
అందరు రావాల్సిందిపొయ్యి, కనీసం నువ్వొకనివన్న రా రా అంటె అంత ఇసం చేస్తానవేందిరా? నువ్ ఫోన్ చెల్లెకియ్యి ముందు, చెల్లెతోని నేన్ చెప్తా..
అరే!! ఆమె పొమ్మన్నా నేన్ వచ్చుడు కష్టమేరా. పిల్లల పరీక్షలొక్కటేకాదు, ఈడ ఆఫీస్ ల సుత నేనిప్పుడు బయటికి కదిలేటట్టులేదు.. మార్చి నెల కదా, ఇయర్ ఎండింగ్ లెక్కలూ కతా కార్ఖానా.. అదంత పెద్ద లొల్లి రా.. చెప్పినా నీకు సమజ్ కాదుగని.. విడ్శిపెట్టు..
నా కొడుకు పుట్టెంటికలప్పుడు రాలె, బిడ్డకు చీరకట్టిచ్చినప్పుడు రాలే.. నీనేమన్న అన్ననా??
నిరుడు మా నాయిన పోతెసుత కబురుచెప్తి.. పోనీ అప్పుడన్న అచ్చినవా??
రాలేకదా?? ఈసారి మాత్రం నువ్ రాకుంటె ఊకునేదిలేదు చెప్తున్నా.. నువ్వచ్చినంకనే మేం ఇండ్లల్లకు పోవుడు.. గంతే..
అరే.. అట్లంటవేందిరా? రావాల్నని నాకు మాత్రం ఉండదా చెప్పు? కాని ఇక్కడ పరిస్తితి అట్ల ఉండదురా..
ఏం పరిస్తితిరా? పదేండ్లు దాటింది ఎర్కేనా??
అరేయ్… నాకు లేటయితుంది ప్లీస్.. ఏమనుకోకురా.. అర్థంచేస్కో.. ఇగో అమ్మ మాట్లాడుతదట, ఫోన్ అమ్మకు ఇస్తున్న.. మాట్లాడు.. నాకు లేటయితుంది నేన్ పోతున్నా… రైట్ రా… కొత్తిల్లు కట్టుకున్నందుకు మళ్లొక్కసారి కంగ్రాట్స్..
******
కాలం ఆగలేదు.. ఇంకో పది క్యాలెండర్లు మారినయ్..
“నువ్ మొన్న చెప్పినా వస్తుంటిరా.. ఇప్పుడైతె కష్టమిగ!” బయట పార్క్ లో వాకింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నడు రమేషు..
ఎందుకు? మొన్నటికీ ఇయాల్టికే ఏం మారింది?
మొన్నటిదాక నాకు పెద్దగ పనేం లేకుండ వట్టిగనే ఉంటి.. కాని ఎల్లుండి మావోడు అమెరికా నుంచి వస్తుండురా..
ఔనా? ఐతె ఇంకా మంచిది.. పిల్లల్లనూ, చెల్లెనూ అందరిని తీస్కోనే రారా మా బిడ్డ పెండ్లికి…
రావాల్ననే నాక్కూడ ఉన్నదికనీ. వాడేమంటడోరా? ఉండేదే ఒక్కనెల, అందుకే వాడెట్లంటె అట్లనే ఇగ. వానిష్టం..
పిలగాడచ్చినంక ఓసారి నాతోని మాట్లాడిపియ్.. నేన్ మాట్లాడ్త వానితోని..
చేపిస్తగనీ, అనవసరంగ వానికి అదోటి ఇదోటి చెప్పి పరేషాన్ చెయ్యకు.. ఈ ఎండలు వానికి పడ్తయో పడయో!! అమెరికాల ఉండవట్టి మూన్నాలుగేండ్లైతాందికదా, అలవాటు తప్పుంటది..
ఇంకోటేందంటే, మా బిడ్డకుసుత సంబంధాలు చూస్తున్నం.. ఒకట్రెండు మంచియే వచ్చినయ్ గని మావోడచ్చినంకనే ఏదన్నొకటి ఫైనల్ చేద్దామని ఇన్నిరోజులు ఆగినం.. ఆ పని కూడ ఓటున్నది మాకు..
సరే.. సరే చూడన్లి మరి.. కనీసం ఒక్క రోజుకోసమన్న వచ్చే ప్రయత్నం చెయ్యున్లి..
తప్పకుండా.. మంచిదిరా మరి..
******
కండ్లు మూసి తెరిచినంతల చెరి అరవయ్యైదేండ్లకు వచ్చిన్లు..
“విపరీతమైన మోకాల్ నొప్పులురా.. వచ్చేవారమే ఆపరేషన్ ఉన్నది..” ఆరాం కుర్చీలో ఒరిగి కూచోని సెల్ ఫోన్ ల లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నడు రమేషు..
మోకాల్ నొప్పులు నీక్కూడ వచ్చినయారా??
ఆ.. సర్వీస్ ల ఉన్నన్ని రోజులు ఏ రోగం, నొప్పి లేకుండేకని రిటేరైనంకనే ఇది షురూ ఐంది..
మ్మ్.. ఇయ్యాలరేపు ఇరవయ్యేండ్ల పోరగాల్లకే మోకాల్ నొప్పులస్తున్నయ్.. మనమే అదృష్టవంతులమ్రా..
ఏం అదృష్టమో ఏందోరా.. కాళ్లు మస్తు సలుపుతున్నయ్.. సులుకు సులుకున పొడిశినట్టైతుంది నాకైతే.. ఆపరేషన్ అయినంకనన్న ఏమన్న తగ్గుతదేమో సూడాలె..
తగ్గుతదిరా, మా వియ్యంపునికి అదే సమస్య ఉంటుండే.. అంతకుముందు ఒంటికిలేవాల్నన్నా ఇంకో మనిషి సాయిత పట్టుకోని తీస్కపొయ్యేది, అసొంటిది ఆప్రేషన్ అయినంక ఇప్పుడు ఒక్కడే పొద్దుకు పదిమాట్ల పొలంకాడికి పొయ్యస్తున్నడెరికేనా? నువ్వుట్టిగ రందివెట్టుకోకు.. వట్టిగనే తగ్గుతదది..
అవునా.. మంచిదే ఐతే.. ఓసారి ఆయినె నంబర్ నాకియ్యి చేషి మాట్లాడ్తా..
నంబరెందుకురా, నువ్ ఈడికస్తే ఇటు నా కొడుకు కొత్త షోరూం ఓపెనింగుకు వచ్చినట్టుంటది, అటు మా వియ్యంపునితోని మాట్లాడినట్టుంటది.. రా రా.. ఈసారన్న ఓ రెండ్రోలు వచ్చిపో..
అబ్బో.. ఇప్పుడు నాతోనికాదురా.. ఆపరేషన్ చేపిచ్చుకోని అటేంక పుర్సత్ అటే వస్తిగ.. ఇప్పుడైతె నంబర్ ఇయ్యి..
******

vamsi
మళ్లీ ఫోన్ మోగడానికి పదిహేనేండ్లు పట్టింది.. ఇటువైపు మాట్లాడేది మనోహరే కాని అటువైపున్నది మాత్రం రమేష్ కాదు..
అంకుల్.. నేను.. రమేష్ వాళ్ల కొడుకు రాహుల్ ని మాట్లాడుతున్నా..
ఎవరూ? ఏ రమేషు నాయినా?
నేనంకుల్.. రమేష్ తెల్సుకదా.. పింగని రమేషు.. వాళ్ల కొడుకు రాహుల్ నూ..
ఆ.. ఆ.. చెప్పు బిడ్డా మంచిగున్నవా?? నాయిన మంచిగున్నడా??
అంకుల్.. అదీ.. నిన్న మార్నింగ్..
ఆ??
నిన్న మార్నింగ్ డ్యాడీకి నిద్రలోనే స్ట్రోక్ ఒచ్చిందంకుల్.. మమ్మీ వాళ్లూ హాస్పిటల్ కి తీస్కెళ్లేలోపే.. దార్లోనే..
అయ్యో దేవుడా… ఎంత పనాయిపాయే.. అని మనోహర్ ఏడుస్తూ దుఃఖంలో ఏవేవో మాటలు అంటున్నడు కని రాహుల్ కు అవి వినేంత టైమూ, ఓపికా లెవ్వూ..
అంకుల్.. అంకుల్.. ప్లీస్ నేన్ చెప్పేది వినండి..
ఆ.. ఆ.. చెప్పు నాయినా… దేవుడెంతన్యాయం చేసేగదా కొడుకా… రమేషా..
ఆ.. ఆ.. అంకుల్ ప్లీస్ ఏడుపాపి వినండి…. మా డ్యాడీ చనిపోయే ముందు మమ్మీతో – తన.. ఆ “చివరి కార్యక్రమం”.. తను పుట్టి పెరిగిన ఆ ఊళ్లోనే జరిపించమన్నారట..
ఆ..
ఆ ఊళ్లో నాకు తెల్సింది మీరొక్కరే…. సో… అంకుల్.. ప్లీస్.. మీరూ… హెల్ప్…
అయ్యో ఎంతమాట నాయినా.. మీరు జల్ది బయలెల్లున్లీ.. మీరు వచ్చేలోపట నేనిక్కడ అన్నీ తయార్ చేపించి ఉంచుతా.. సరేనా..
సరే అంకుల్.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ వెరీ మచ్.. మేం బయల్దేరుతున్నం..
******
సరిగ్గా నాలుగు నెలల తర్వాత-
అమెరికాల ఉన్న రాహుల్.. ఆఫీస్ బ్రేక్ టైం లో, హైదరాబాద్ ల ఉన్న దోస్తు కౌషిక్ తోని “స్కైప్” వీడియో కాల్ లో మాట్లాడుతున్నడు-
“కష్టం రా.. మొన్ననే నాలుగు నెల్లకింద మా నాన ‘దానికి’ వచ్చిపేనగదా.. మళ్ళ ఇప్పటికిప్పుడు వచ్చుడంటే చానా కష్టంరా… ఈసారి కాదుగనీ మళ్లెప్పుడన్న వీలుచూసుకోని వస్తలే..”

*

ఘర్ వాపసీ

కొండేపూడి నిర్మల

 

ఇంతకీ నా పౌరసత్వం దేశంలో వుందా ? మతంలో వుందా?

నేనిప్పుడు దిగజారిన మానవ విలువల్ని గురించి బెంగెట్టుకోవాలా

బండరాయికి పొర్లు దండాలు పెట్టాలా

ప్రప౦చ నాగరిక దేశాల సాక్షిగా మన రాజ్యాధినేత ఘర్ వాపసీ అని గర్జించినప్పుడు-

అలా వాపసు వచ్చిన వాళ్ళకే రేషను కార్డులు అని ప్రకటీంచినప్పుడు

లెక్క ప్రకారం మనమంతా ఏ ఆఫ్రికా చీకటి అడవుల్లోకో  వలస పోవాలి కదా

భూమి కంటే ముందు  హిందూత్వ పుట్టినట్టు ఈ ప్రగల్భాలేమిటి ?

 

ఇంతకు మించిన కొమ్ములూ కోరలూ వున్న ఎన్ని మతాలు, ఎందరు దేవుళ్ళు కాలగర్భంలో కలిసిపోలేదు|

చరిత్ర అంతా రాజులు చెక్కిన రాళ్ళ ముచ్చటే అని తెలుసు కాని

తాను చెక్కిన రాయితోనే సర్వజనులూ తల బాదుకోవాలని చెప్పిన రారాజు ఇతడేనేమో

మాట వినని వాళ్ళకి మరణ దండన అనే  మాట ఒక్కటీ అనలేదు తప్ప

అంతకంటే ఎక్కువే చెయ్యగలడని మనకి తెలుసు , గుజరాత్ కి తెలుసు

రాయిని పగలదీయడమే తెలిసిన  చెమట సూర్యుడికి

ఇప్పుడు రాజు  బుర్రలో ఏ రాయి వుంటే  దానికి  మొక్కాల్సిన పని పడింది.

 

రాజ్యాంగం రాసుకున్న ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా

దేవుడనే వాడొక్కడే అని , అన్ని మతాల సారాంశమూ మానవత్వమేనని

ప్రాధమిక అవహాగాహన అయినా పె౦చని ప్రజాస్వామిక దేశంలో

ఆర్టికల్ 25  ఒక నోరు లేని గులకరాయి

మానవ హక్కులు గాలికి ఎగిరిపోయే చిత్తు కాయితాలు

మనిషిని బతకించడానికయితే   నాలుగైదు రక్త నమూనాలు సరిపోతాయి.

చంపడానికి ,చావడానికే కదా చచ్చినన్ని మత అంధ రాజ్యాలు

భక్తుల మీదనో, వారి గూళ్లలో కొలువున్న రాళ్లమీదనో , వారు సమర్పించే చీనీ చక్కెర ప్రసాదాలమీదనో

వ్యతిరేక౦తో నేనీ మాట చెప్పడంలేదు.

 

అసలు ఈ నమ్మకాలతో, అపనమ్మకాలతో ప్రమేయం లేకుండా బతకుతున్న

కోట్లాడి కష్టజీవుల చిరునామా ఏమిటని  అడగదల్చుకున్నాను.

మత౦ మరక లేకుండా  మనకొక  ముఖం వుండచ్చా  లేదా తెలుసుకోవాలనుకు౦టున్నాను

 

ఎన్ని అవమానాలు, ఎన్ని అసంబద్దతలు, ఇంకెన్ని పరాధీనతలు

మన నిత్యజీవితంలో భాగమై పోయాయో  ఎప్పుడయినా ఆలోచీంచారా?

కన్నవాళ్ళు కూడా బిడ్డల్ని  మత చిహ్నాలుగా  పెంచి పోషించారు తప్ప

మనిషిగా ఎప్పుడయినా చూశారా ?

ఇష్టమో కాదో తెలుసుకోకుండా పుట్టీన పదోరోజున నాకొక దేవుడి పేరు తగిలించడమేమిటి?

 

పసిదనపు  నుదిటి మీద  మత సంకేతాన్ని తిలకంగా  దిద్దడమేమిటి?

పంట కాలవలాంటి  బాల్యానందాల పలక మీద ఆ ఆల కంటే ముందు

అడ్డదిడ్డంగా శ్రీకారాలు చుట్టడమేమిటి

వద్దని గింజుకుటున్నకొద్దీ    తలనీలాల్ని

ఒక దేవుడి ముందు తరిగి  పరాభవింఢమేమిటి?  .

అమ్మ కడుపున పుట్టడం ఒక్కటే నాకు  తెలిసిన వాస్తవమైతే

కులాల వారీగా మనుషుల౦తా దేవుడి తొడల్లో౦చీ, భుజాల్లోంచి , పాదాల్లోంచీ పుడతారనే

అశాస్త్రీయ, అశ్లీలపు కధలు చెవులు మూసుకునేదాకా వినిపించడమేమిటి?

 

సూర్య నమస్కారాల ప్రచారం కోసం యోగాసనాల్ని  మార్కెట్ చేయడమేమిటి?

భిన్న మత సంస్కృతులున్న  దేశానికి భవద్గీతను ప్రామాణిక  చేయడమేమిటి?

ఏమిటిదంతా?

పరిపాలన ఆ౦టే ప్రజలకు శిరో ముండన చేయడమేనా ?

రాజులు రద్దయినా రాతలు మారతాయని నమ్మకం లేదు కదా

రేపు ఇంకోక రాజు  ఇంకొన్ని  కుట్రలతో  తన కుల మతాన్ని  మన నెత్తిమీద గుమ్మరించడని చెప్పలేం

ఇంత జరిగాక  మనకిప్పుడు  freedom of religion వద్దే వద్దు

Freedom from religion కావాలి

రహదారిని ఆక్రమిస్తున్న ఈ దేవుళ్ళ నుంచి, దెయ్యాలనుంచీ

తాయెత్తుల నుంచీ , విబూది నుంచీ , శని యంత్రాలనుంచీ, శవ పూజలనుంచీ

నడవటానికి ఒక దారి వేసుకోవాలి.

nirmala*

 

 

పద పదవే పావురమా!

మమత వేగుంట 

 

సప్తస్వరాల్లో –

అటు స రి గ లోతుల్లో, ఇటు ప ద ని శిఖరాల్లో- మధ్యన – మ!

ఈ స్వరం  బరువూ, గంభీరమూ కూడా – హృదయాన్ని యిట్టే పట్టేస్తుంది.

 

నేలని ముద్దాడినట్టుండే ముత్యాల ముగ్గులు చూడు.

చుట్టూ వున్న భూమికి అదొక అందమైన కేంద్రమే కదా!

అలాగే, “మ” స్వరం కూడా మధురమైన నాదానికి భూమిక.

 

అది  పావురం పలికే పాట! నింగికి ఎగిరే సన్నాహంలో వున్న పావురం.  

మిల మిల మెరిసే విశాలమైన దాని రెక్కలు చూడు.

ఆ మెరుపు రెక్కల అందం మాల్కోస్ రాగ సౌందర్యానికే చిక్కుతుంది.

 

“మ” వాది స్వరమైన పురాగానమే మాల్కోస్!

సంగీత క్షేత్రం  నట్ట నడుమ “మధ్యమం”లో పండగే మాల్కోస్!

 

జీవితంలోని చాలా భాగం ఆ మధ్యమ క్షేత్రంలోనే నడుస్తుంది – ఎక్కువగా విలంబిత లయలో, మంద్ర సప్తకమై!

ఆ మధ్యే క్షేత్రాన్ని వోపికగా శోధించినప్పుడు,

ఆసాంతం ప్రయాణించినప్పుడే విహాయస విహారం!

 

ఈ లోపు మధ్యమ సంగీత నాదంలో తేలిపో!

 

Mamata 1

ఆ చిత్రాల ముందు తుపాకులు కొయ్య బొమ్మలే!

పి. మోహన్ 

P Mohanకరువు బొమ్మల తర్వాత చిత్తప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో మునిగి తేలాడు. ఢంకను వాయిస్తున్న మనిషి బొమ్మతో ‘ఇప్టా’కు లోగో వేశాడు. 1943లో లెనిన్ జయంతి సందర్భంగా కమ్యూనిస్టు విద్యార్థి సంఘం తరఫున 43 మంది దేశవిదేశ కమ్యూనిస్టు యోధుల చిత్రాలతో ఓ ఆల్బమ్ తయారు చేసి పార్టీకి అందించాడు. ఇందులో మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావో మొదలుకొని, పుచ్చలపల్లి సుందరయ్య వరకు ఉన్నారు.

1944 మార్చి 12, 13న విజయవాడలో జరిగిన అఖిల భారత రైతు మహాసభకు చిత్త హాజరయ్యాడు. ఎన్నో చిత్రాలు గీశాడు. ఎర్రజెండాలు కడుతున్నవాళ్లను, వంటలు వండుతు వాళ్లను, లంబాడాల నాట్యాలను.. ప్రతి సందర్భాన్నీ చిత్రిక పట్టాడు. తెలుగు రైతుల హావభావాలను, ఆశనిరాశలను తెలుగువాడే వేశాడని భ్రమపడేలా పరిచయం చేశాడు. సభలను విహంగవీక్షణంలో చూపుతూ గీసిన స్కెచ్చులో ఓ బ్యానర్ పై ‘కయ్యూరు కామ్రేడ్స్ గేట్’ అని తెలుగులో రాశాడు. కయ్యూరు అమరవీరులపై చిత్త అంతకుముందే ఓ బొమ్మ వేశాడు. కేరళలోని కయ్యూరు గ్రామంలో 1942లో భూస్వాములపై కమ్యూనిస్టుల నాయకత్వలో రైతాంగం తిరగబడింది. ఓ పోలీసు చనిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచేసింది. నలుగురు యువ రైతునాయకులను ఉరితీసింది. చిత్త ఆ నలుగురిని ఉరితీస్తున్న దృశ్యాన్ని ఒకపక్క.. నేలకొరిగిన వీరుడి చేతిలోని జెండాను చేతికి తీసుకుని సమున్నతంగా పట్టుకున్న మహిళను మరోపక్క చిత్రించాడు. చిత్రం మధ్యలో ఆ వీరుడికి కమలంతో నివాళి అర్పిస్తూ, అతని పోరు వారసత్వాన్ని ఆవాహన చేసుకుంటున్న బాలుడిని నుంచోబెట్టాడు.

R0189P049-011-2318KB

R0189P049-011-2318KB

భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి(1946 -51) చిత్త చిత్ర హారతులు పట్టాడు. యావద్దేశానికి ఆశాకిరణంలా జ్వలించిన ఈ పోరాటంపై వేసిన బొమ్మల్లో వర్గకసి నిప్పులను కురిపించాడు. కాయకష్టంతో చేవదేరిన తెలంగాణ రైతు ధిక్కారాన్ని, త్యాగాన్ని నలుపు తెలుపుల్లోనే ఎర్రజెండాల్లా రెపరెపలాడించాడు. బ్రిటిష్ పాలకులు, వాళ్ల కీలుబొమ్మ నిజాం, అతగాడి రజాకార్ ముష్కరులు, యూనియన్ సైన్యం కలసికట్టుగా సాగించిన దారుణమారణకాండలో నెత్తురోడిన తెలంగాణను గుండెల్లోకి పొదువుకుని దాని వేదనను, ఆక్రోశాన్ని రికార్డు చేశాడు. సంకెళ్లు తెంచుకుంటున్న రైతులను, శత్రువు గుండెకు గురిపెడుతున్న గెరిల్లాలను, సుత్తీకొడవలి గురుతుగ ఉన్న జెండాలతో సాగిసోతున్న ఆబాలగోపాలాన్ని, రజకార్ల, యూనియన్ సైనికుల అకృత్యాలకు, అత్యాచారాలకు బలైన పల్లెజనాన్ని.. పోరాటంలోని ప్రతి సందర్భాన్నీ చిత్త ఒక నవలాకారుడిలా రూపబద్ధం చేశాడు.

ఒక చిత్రకారుడు సాయుధ గెరిల్లాలతో కలసి తిరిగి బొమ్మలేయడం మన దేశ కళాచరిత్రలో అపూర్వఘట్టం. నాటి తెలుగు ప్రజాచిత్రకారులకు చిత్త ఒక ఆదర్శం. మాగోఖలే, గిడుతూరి సూర్యం తదితరులు వేసిన తెలంగాణ సాయుధరైతు పోరాట చిత్రాలకు, కార్టూన్లకు చిత్త బొమ్మలే స్ఫూర్తి. ఈ పోరాటాన్ని గానం చేసిన గంగినేని వెంకటేశ్వరావు ‘ఉదయిని’కి చిత్త ఆరు చిత్తరువులు అందించాడు. చిత్తకు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ తెలియకున్నాఅందులోని చాలా కవితలకు అతడు చిత్రానువాదం చేశాడు! చిత్త బొమ్మలు నాటి ‘అభ్యుదయ’, ‘నవయుగ’ వంటి తెలుగు పత్రికల్లోనూ వచ్చాయి.

abyudaya

అభ్యుదయ పత్రిక 1948 ఆగస్టు సంచిక చిత్త వేసిన శ్రామికజంట ముఖచిత్రంలో వెలువడింది. అందులో ఆ బొమ్మ గురించి, చిత్త కళాసారాంశం గురించి ఇలా రాశారు.. ‘స్త్రీ పురుషుల సమిష్టి కృషి ఫలితంగా మానవ జీవితం సుఖవంతమూ, శోభావంతమూ ఔతుంది. పరిశ్రమలో, ఫలానుభవంలో సమాన భాగస్వాములైన స్త్రీపురుషులు ఒకవంక ప్రకృతి సంపదను స్వాధీనం చేసుకుంటారు. గనులు త్రవ్వుతారు. పంటలు పండిస్తారు. తాము శాస్త్రజగత్తును శోధించి సృష్టించిన యంత్రాల సహాయంతో తమ శ్రమశక్తిని సద్వినియోగం చేస్తారు. తమ హృదయాన్ని, మేధస్సును విశ్వంలోని గుప్తరహస్యాలను గ్రహించటానికి ప్రయోగిస్తారు. జంతువైన నరుడు, జగత్తునిండా వ్యాపించి, మానవుడుగా దివ్యమూర్తిగా వికసించటానికి చేసే సమిష్టి కృషికి, ప్రపంచాభ్యుదయానికి చిహ్నంగా ప్రఖ్యాత చిత్రకారుడు చిత్తప్రసాద్ ఈ చిత్రాన్ని రచించాడు.’

చిత్తకు తెలుగువాళ్లతో 1950ల తర్వాత కూడా అనుబంధం కొనసాగింది. 1959లో ముత్యం రాజు, సంజురాజే అనే ఇద్దరు తెలుగు గిరిజనుల బొమ్మలను చిత్త స్పాట్ లో గీశాడు. ఆ బొమ్మలున్న కాగితంపై వాళ్లు తెలుగుప్రాంత గిరిజన వైద్యులు, వేటగాళ్లు అని, గోండులు కావచ్చని రాసుకున్నాడు.

joy

చిత్త 1946 నుంచి బాంబేలో స్థిరపడ్డాడు. పరాయి పాలకులను గడగడలాడించిన 1946 నాటి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటును, దాన్ని ఉక్కుపాదంతో అణచేసిన వైనాన్ని బొమ్మకట్టాడు. సమ్మెకు కమ్యూనిస్టు పార్టీ మాత్రమే మద్దతిచ్చినా, ఇది దేశ సమస్య కాబట్టి కాంగ్రెస్, ముస్లిం లీగులు కూడా కలసి రావాలని ఆ చిత్రాల్లో సుత్తీ కొడవలి జెండాల పక్కన వాటి జెండాలనూ అమర్చాడు. వీటిలోనే కాదు చాలా సమ్మెల చిత్రాల్లో చిత్త ఈ మూడు పార్టీల ఐక్యత అవసరాన్ని గొంతు చించుకుని చెప్పాడు. గాంధీ రాజకీయపరంగా బద్ధశత్రువైనా అతని జనాకర్షణ శక్తి చిత్తనూ లాక్కుంది. గాంధీ నిరాయుధ మార్చింగ్  దృశ్యాలను, అతని ధ్యానదృశ్యాలను చిత్త రాజకీయ శత్రుత్వం, వ్యంగ్యం, వెటకారం గట్రా ఏవీ లేకుండా అత్యంత మానవీయంగా చూపాడు. అతి సమీపం నుంచి చూసిన నేవీ తిరుగుబాటు అతన్ని చాలా ఏళ్లు వెంటాడింది. 1962లో దీనిపై ఓ పెద్ద వర్ణచిత్రం వేశాడు. హార్బర్లో నేలకొరిగిన వీరులు, పోలీసుల దమనకాండ, మౌనంగా చూస్తున్న సామాన్య జనంతో ఆ చిత్రం నాటి పోరాటాన్ని మాటలు అక్కర్లేకుండా వివరిస్తుంది.

1946 నాటి చరిత్రాత్మక పోస్టల్ సమ్మె, 1975 నాటి రైల్వే సమ్మె, 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటం.. ఇలా ప్రతి చారిత్రక జనోద్యమాన్నీ చిత్ర బొమ్మల్లోకి అనువాదం చేశాడు. హోంరూల్, జలియన్ వాలాబాగ్, క్విట్ ఇండియా వంటి భారత స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను ‘పీపుల్స్ ఏజ్’ పత్రికలో ‘ఇండియా ఇన్ రివోల్ట్’ బొమ్మల్లో చూపాడు. చేయిపట్టుకుని కవాతు చేయించే ఈ బొమ్మలతోపాటు శత్రుమూకలను తుపాకులకంటే ఎక్కువ జడిపించే కార్టూన్లనూ వందలకొద్దీ గీశాడు. శ్రమజీవుల కష్టఫలాన్ని తన్నుకుపోయే దేశవిదేశాల గద్దలు, వాటికి కాపలాకాసే పోలీసు జాగిలాలు, గాంధీ టోపీల కుర్చీ తోడేళ్లు, నల్లబజారు పందికొక్కులు.. నానా పీడకజాతులను బట్టలను విప్పదీసి నడిరోడ్డుపైన నిలబెట్టాడు. దామీ, డేవిడ్ లో, థామస్ నాస్త్, జార్జ్ గ్రాజ్ వంటి విశ్వవిఖ్యాత కార్టూనిస్టుల, కేరికేచరిస్టుల ప్రభావం చిత్త కార్టూన్లలో మనవైన భావభౌతిక దరిద్రాలను, దాస్యాలను అద్దుకుని వెక్కిరిస్తుంది.

chitta

1947లో దేశం పెనంలోంచి పొయ్యిలో పడింది. స్వాతంత్ర్యం మామిడిపళ్లు పెదబాబుల ఇళ్లకే చేరాయి. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు చేవచచ్చి, శాంతియుత పరివర్తన అగడ్తలోకి జారిపోయాయి. చాలామంది కమ్యూనిస్టులు రంగులమారి నెవురయ్య సోషలిజం మాయలో పడిపోయారు. చిత్త తెగ ఆరాధించిన పీసీ జోషి కూడా మెత్తబడ్డాడు. 1948లో కలకత్తాలో జరిగిన పార్టీ మహాసభల్లో రణదివే వర్గం జోషిని పక్కన పెట్టేసి సాయుధ పోరాటమే తమ మార్గమంది. ఈ వ్యవహారం కుట్రపూరితంగా, కక్షగట్టినట్టు సాగడంతో చిత్త చలించిపోయాడు. రణదివేను కూడా తర్వాత అతివాద దుస్సాహసికుడంటూ పార్టీ నాయకత్వం నుంచి తప్పించారు. పార్టీలో ఇలాంటి తడబాట్లు, ఆధిపత్య రాజకీయాలు, అభ్యుదయ కళాకారుల సంఘాల్లోకి పిలక బ్రాహ్మణుల, స్వార్థపరుల చేరికలు, సినిమాల్లోకి అభ్యుదయ కవిగాయకనటకుల వలసలు, దేశవిభజన నెత్తుటేర్లు, మతకలహాలు.. చిత్త సున్నిత హృదయాన్ని కోతపెట్టాయి. పార్టీతో అనుబంధం తగ్గించుకున్నాడు.

కానీ పార్టీ రాజకీయాలపై విశ్వాసం రవంత కూడా సడల్లేదు. స్వాతంత్ర్యం తర్వాత కూడా అదివరకటికంటే జోరుగా సాగుతున్న దోపిడీపీడనలపై మరింత కసి రేగింది. ‘యే ఆజాదీ జూటా హై’ అన్న నమ్మకం బలపడిపోయింది. ‘బాబ్బాబూ, మా గడ్డకు స్వాతంత్ర్యం ఇవ్వండయ్యా అని కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వాడిని దేబిరించిన కాలం ఎంత పాడుకాలం! దీనికి బదులు స్వాతంత్ర్యాన్ని ఎదురుబొదురుగా కొట్లాడి, చచ్చి తెచ్చుకుని ఉండుంటే అదేమంత పెద్ద పొరపాటు, అమానవీయం అయ్యేదా?’ అని తల్లికి రాసిన లేఖలో ఆక్రోశించాడు. ‘రెండు నాలుకల నాయకులు రాజ్యమేలుతున్నారు. ఈ దేశానికి చరిత్రపై ఇంకెంతమాత్రం ఆసక్తి లేదు, ఒట్టి గాసిప్ లపై తప్ప. అబ్బాస్ ఏదో సినిమా కథను కాపీ కొట్టాడని మొన్న వార్తలొచ్చాయి. గాసిప్ చాలు. ఇక ఉంటాను’ అని లక్నోలోని ఆప్తమిత్రుడు మురళీ గుప్తాకు రాసిన లేఖలో చీదరించుకున్నాడు.

రెండో ప్రపంచ యుద్ధంతో గుణపాఠం నేర్చుకున్న ప్రపంచం తర్వాత శాంతిమంత్రం పఠించింది. అయితే అన్నిరోగాలకూ అదే మందని ప్రచారం చేశారు. వర్గపోరాటాన్ని చాపచుట్టేశారు. 1952లో కలకత్తాలో ఇండియన్ పీస్ కాంగ్రెస్ జరిగింది. చిత్త ఆ ఉద్యమంలోని రాజకీయాలకు కాకుండా సందేశానికే ఆకర్షితుడయ్యాడు. లోకమంతా శాంతిసౌభాగ్యాలు విలసిల్లాలని బోలెడు బొమ్మలు గీశాడు. 1950 దశకం నాటి అతని చాలా చిత్రాల్లో వీరోచిత పోరాటాలు కాస్త పక్కకు తప్పుకున్నాయి. వాటికి బదులు రెక్కలు విప్పిన శాంతి పావురాలు, మతసామరస్య సందేశాలు, పిల్లాపెద్దల ఆటపాటలు, ఆలుమగల కౌగిళ్లు, తల్లీపిల్లల ముద్దుమురిపాలు, పాడిపంటలు, పశుపక్ష్యాదులు చేరి చూపరుల మనసు వీణలను కమ్మగా మీటాయి. ఆ కల్మషం లేని మనుషులు ఇంతలేసి కళ్లతో మనవంక చూస్తూ మీరూ మాలాగే పచ్చగా బతకండర్రా బాబూ అని చెబుతుంటారు.

 

‘లవర్స్’ పేరుతో చిత్త చెక్కిన ప్రణయ గాథలు అపురూపం. స్త్రీపురుష సంగమాన్ని ప్రింట్లలోనే కాదు, పెయింటింగుల్లోనూ అంతనంత ప్రేమావేశంతో చిత్రించిన భారతీయ చిత్రకారులు అరుదు. ఆ లినోకట్లలోని వలపులు ఒట్టి దైహిక కలయికలు కావు, రెండు మనసుల గాఢ సంగమాలు. ఒకచోట తెలినలుపుల గదిలో ఊపిరాడని కౌగిలింతల్లో, ముద్దుల్లో లోకం మరచిపోయిన జంట కనిపిస్తుంది. మరోచోట పచ్చికబయళ్లలో పడుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కనిపిస్తుంది. మరోచోట.. కడుపుతో ఉన్న సహచరిని దగ్గరికి తీసుకుంటున్న మనిషి కనిపిస్తాడు. మరోచోట కడుపుపంటను తనివితీరా చూసుకుంటూ మురిసిపోతున్న జంట తారసపడుతుంది. సిగ్గులేని శృంగారం, ఆత్మాభివ్యక్తి పేర్లతో నేటి కళాకారులు కుబేరులకు వేలం వేసి అమ్ముకుంటున్నమర్మాంగాల బొమ్మలను చూసి తలదించుకునేవాళ్లు.. చిత్త ప్రణయచిత్రాలను తల ఎత్తుకుని సగర్వంగా చూడగలరు. చిత్త కల్మషం లేని కళాభివ్యక్తికి ఇది నిదర్శనం. తన చిత్రసుందరులను కూళలకిచ్చి అప్పుడప్పుడు  కూడు తినని కమ్యూనిస్టు పోతన.. చిత్త.

cartoon

చిత్త వలపు చిత్రాల్లో చాలా వాటిలో అతని పోలికలున్న పురుషుడు కనిపిస్తాడు. పెద్ద నుదరు, పొడవాటి ముక్కు, విల్లుల్లాంటి కనుబొమలు, అనురాగ దరహాసాలు.. అన్నీ చిత్తపోలికలే. అతడు చిత్త అయితే మరి అతని ప్రేయసి ఎవరు? ప్రేమాస్పదుడైన చిత్తను ఇష్టపడని ఆడమనిషి ఉండదని అతని మిత్రులు గుంభనంగా చెబుతారు. అతడు ఒకామెను గాఢంగా ప్రేమించాడని, అయితే ఆమె పెళ్లి చేసుకుని యూరప్ వెళ్లిపోయిందని అంటారు. పెళ్లి చేసుకోని చిత్త కూడా ఏమంటున్నాడో మురళికి రాసిన ఉత్తరంలోంచి వినండి.. ‘నేను సునీల్, దేవీ(మిత్రులు) వంటి వాడిని కానని నాకు తెలుసు. తండ్రి ఆస్తిపై బతికే పరాన్నభుక్కూనూ కాను. దుఃఖమన్న సౌఖ్యానికి కూడా నోచుకోలేదు నేను. ఓ గ్లాసు మందుతోనో, తాత్కాలిక ప్రేయసితోనే వెచ్చపడే సుఖమూ లేదు. అయితే నేను సన్యాసిని కూడా కాను. నాకు మా అమ్మంటే, మానవత అంటే, ఈ దేశమంటే తగని ప్రేమ. నేను ఈ దేశపు స్త్రీని ప్రేమిస్తాను. నా దేశంలోని ఎంతోమంది స్నేహితులను గాఢంగా ప్రేమిస్తాను. పెయింటింగ్ వేయడాన్ని, పెయింటింగులను చూడడాన్ని ప్రేమిస్తాను..’

అతనికి పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ల కోసం చిట్టిపొట్టి కథలు రాసి బొమ్మలేశాడు. ‘రసగుల్లా కింగ్ డమ్’ పేరుతో బడాబాబులకు చురుక్కుమనిపించే కథలు రాశాడు. కొన్ని బెంగాలీ కథలను  తిరగరాసి, బొమ్మలేశాడు. కల్లాకపటం తెలియని పిల్లల ఆటపాటలపై చిత్రాలతో పద్యాలు అల్లాడు. ఆ బుజ్జికన్నలను కాగితప్పడవలతో, సంతలో కొన్న ఏనుగు బొమ్మలతో, లక్కపిడతలతో ఆడించాడు. ఆవుపైకెక్కించి పిప్పిప్పీలను ఊదించాడు. పావురాలతో, చేపలతో ఆడించాడు. వాళ్లతో లేగదూడలకు ముద్దుముద్దుగా గడ్డిపరకలు తినిపించి కేరింతలు కొట్టాడు. వీళ్లంతా కష్టాల కొలిమి సెగ సోకని పిల్లలు. ఆ సెగలో మాడిమసైపోయే పిల్లలూ చిత్త లోగిళ్లలో కన్నీటి వరదలై కనిపిస్తారు. తిండిలేక బక్కచిక్కిన పిల్లలను, ఆకలి కోపంతో పిచ్చెత్తి రాయి గురిపెట్టిన చిన్నారిని, బూటుపాలిష్ తో కనలిపోయే చిట్టిచేతులను, చిరుదొంగతనాలతో జైలుకెళ్తున్న బాల‘నేరస్తుల’ను, తల్లిదండ్రులు పనికెళ్లగా, పసికందులను చూసుకుంటూ వంటావార్పుల్లో మునిపోయిన ‘పెద్ద’లను, ఇళ్లులేక ఫుట్ పాత్ లపై పడుకున్న చిన్నారులను, మశూచితో అల్లాడుతున్న పసిదేహాలను.. కళ్లు తడయ్యేలా చూపాడు. అంతేనా.. గోడలపై క్విట్ ఇండియా నినాదాలు రాసి, తెల్లోడి పోలీసులను హడలగొట్టే చిచ్చుబుడ్లను, తల్లిదండ్రుల వెంట సుత్తీకొడవళ్లు, ఎర్రజెండాలు పట్టుకుని కదిలే బాలయోధులను కూడా బొమ్మకట్టాడు.

beedi

చిత్త బాలకార్మికుల చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధం.  ‘చిల్ర్డన్ వితౌట్ ఫెయిరీ టేల్స్’ పేరుతో చేసిన ఈ లినోకట్లు పిల్లల ప్రపంచాన్ని పెద్దలు ఎంత కర్కశంగా కాలరాస్తున్నారో చెబుతాయి. అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు బీడీలు చుట్టడం, తల్లిఒడిలో నిదురపోవాల్సిన పిలగాడు బూట్ పాలిష్ తో అలసి రోడ్డుపైనే పడుకోవడం, బొమ్మలతో ఆడుకోవాల్సిన పిల్లలు విదూషకులై పొట్టకూటికి కోతిని ఆడించడం, సాముగరిడీలు చేయడం.. చందమామ కథలకెక్కని ఇలాంటి మరెన్నో వ్యథాగాథలకు చిత్త రూపమిచ్చి ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ ఢిఫెన్స్ ఆఫ్ చిల్డ్రన్స్’ కు అంకితం చేశాడు. వీటిని యూనిసెఫ్ డెన్మార్క్ కమిటీ 1969లో పుస్తకంగా తీసుకొచ్చింది. డెన్మార్క్, చెకొస్లవేకియా, టర్కీ.. మరెన్నో దేశాల రచయుతలు భారత్ పై రాసిన పుస్తకాలకు కవర్ పేజీ బొమ్మలు అందించాడు.

చిత్తకు మూగజీవులన్నా ప్రాణం. పిల్లులను, కుక్కలను పెంచుకునేవాడు. అవీ మనలాంటివేనని ముద్దు చేసేవాడు. ‘నికార్సైన బాధ, సంతోషం, శాంతి మనిషికి మాత్రమే ప్రత్యేకమైనవి కాదు. ఆకలిదప్పికలు, రాగద్వేషాలు జీవరాసులన్నింటికి  ప్రకృతి సహజమైనవి. అందుకే మనం జంతువుల సుఖదుఃఖాలను, మొక్కల దాహార్తిని, పూల ఉల్లాసాన్ని సహానుభూతితో గ్రహించగలం.. అవి కూడా మనలాగే జీవితంలో ఒక క్షణకాలాన్ని కోల్పోయినా భోరున విలపిస్తాయి.. వాటిలో ఏదీ ఈ అందమైన లోకం నుంచి వెళ్లాలని అనుకోదు..’ అని తల్లికి రాశాడు చిత్త.

bezwada sabha

పార్టీ పనులు లేకపోవడంతో చిత్త కు అనేక వ్యాపకాలు మొదలయ్యాయి. అంధేరీ మురికివాడలోని రూబీ టెర్రేస్ లో అంధేరా ఒంటరి గది చిత్త ఆవాసం. అందులోనే వేలాది లినోకట్లు, పేస్టల్స్, పెయింటింగులూ వేశాడు. కవితలు, కథలు, నాటకాలు రాశాడు. కిటికీ ముందు రెండుమూడు పూలకుండీలు, కిటికీ పక్కన చెక్కపై పుస్తకాలు, దానికింది చెక్కపై కీలుబొమ్మలు, భయపెట్టే ఇండోనేసియా డ్యాన్స్ మాస్కులు, ఓ మూల మంచం, వంటసమయంలో మంచం కింది నుంచి బయటి, వంటయిపోయాక మంచం కిందికి వెళ్లే  వంటసామాన్లు, చిత్రాలు, ఓ పిల్లి, పంచలో రెండు కుక్కలు, పక్కిళ్ల వాళ్లతో కలసి వాడుకునే బాత్రూమ్, ఇంకాస్త బయట కాస్త పసిరిక.. చుట్టుపక్కల అతిసామాన్య మానవులు.. ఇవీ చిత్త బతికిన పరిసరాలు.

telengana

తెలంగాణా

రేషన్ షాపులో గోధుమపిండి, కిరసనాయిల్, చిరిగిన బనీను, లుంగీ, రెండు జతల బట్టలు, వారానికో అప్పు, అప్పుడప్పుడు ఎండుచేపలు, ఉర్లగడ్డల కూర, కాస్త డబ్బుంటే గ్లాసెడు మందుచుక్క, డబ్బుల్లేనప్పుడు పస్తులు, ఎప్పుడుపడితే అప్పుడు బొమ్మలు, పుస్తకపఠనం, మిత్రులతో కబుర్లు, వాళ్లతో కలసి ‘బ్రిడ్జ్ ఆఫ్ రివర్ క్వాయ్’, ‘పథేర్ పాంచాలి’ లాంటి సినిమాలకు వెళ్లడం, తల్లికి, చెల్లికి రాజకీయాలు, సాహిత్యం రంగరించి రాసే మమతల లేఖలు, సోమరి ఉదయాల్లో పోస్టమేన్ కోసం ఎదురుచూపులు.. చిత్త జీవితం కడవరకూ సాగిపోయిందిలా.

– ముగింపు వచ్చేవారం

వినికిడి వున్న హృదయమే…..

కందుకూరి రమేష్ బాబు
Kandukuri Ramesh
శ్రవణం.
నిజం.అక్కనో చెల్లో వదిననో – మరెవరో.
తమ్ముడో అన్నో మరిదో – మరెవరో.

ఎవరో ఇద్దరు.
జన సముద్రంలో ఒక శంఖం.
వినిపిస్తూ ఉంటుంది, వింటే!

జనసమ్మర్దంలో ఇద్దరు, ఇలా దారి చేసుకుని సాగుతూ ఉంటే వారి వెంట ముచ్చట ఒకటి పూమాలలో దారంలా కనెక్ట్ అయ్యే వుంటుంది. దారి పొడవునా మాటల మూటలు. రకరకాల పుష్పాలు.
అవును మరి. ఏమేం మాట్లాడుకుంటారో మనకేం ఎరుక!

మాట- ముచ్చట మాత్రం నిజం.
అదే ఈ చిత్రం.

మాట- ముచ్చట.
భారం తెలియనీయని బాటసారి.
అందుకే ఈ చిత్రం.

నిజానికి ఫొటోగ్రఫిలో ఒక్కో భావం వ్యక్తం అవుతూ ఉంటుంటే చిత్రం మరింత ముచ్చటగా పరివ్యాప్తం అవుతుంది. కాకపోతే చూసే దృష్టి వుండాలి. వినగలిగే హృదయం వుండాలి. ఈ బొమ్మనే చూడండి. చూస్తూ ఉంటే మీరు నిదానంగా వాళ్లని అర్థం చేసుకుంటారు. ఆదరిస్తారు. డిస్ట్ర్రబ్ చేయకుండా తప్పుకుంటారు లేదా వాళ్లలో మీరే లీనమై ఏం మాట్లాడుకుంటున్నారో విన్నా వినగలుగుతారు లేదా మీ వినికిడి జ్ఞానంలోంచి, జ్ఞాపకాల దొంతరలోంచి ఒక మూట వొదులై అందలి పువ్వులు బయటకి రాలిపడ్డట్టు ఏవేవో మనసును లోలోన చుట్టుముడతై లేదా ఎన్నడో ఎవరితోనో మీరు పెట్టిన ముచ్చట్లు ఎదలో దాగిన వెన్నల్లా అలుముకుని సేద తీరుస్తయ్ లేదా ఏమీ లేదు. వెళ్లండి, వేరే పేజీకి వెళ్లండి. మీతో పని లేదు మాకు!

అవును మరి.
వినే ఓపిక ఉంటే వినాలి. లేకపోతే వెళ్లాలి.

వినికిడి బాగుంటుంది.
ఒక ఛాయా చిత్రకారుడికి ఇట్లాంటి ఫొటోలు దొరకడమూ ఒక వినికిడి జ్ఞానమే!

చాలా బావుంటుంది.

ఈ చిత్రం పనిగట్టుకుని తీసింది కాదు.
తీసే క్రమంలో పని సఫలమైతే దొరికిన కానుక.
అది మరీ బావుంటుంది.

ఎంత బావున్నారు వాళ్లు?
మరెంత ఆత్మీయంగా ఉన్నారిద్దరూ!
అందంగా లేదునా ఆ బంధం?

ఇష్టముంటేనే బంధం.
లేకపోతే ఖైదు.

వాళ్లు.

ఎవరికి ఏమవుతారో తెలియదు.
కానీ, ఆ ముచ్చట చూడు, వాళ్లనెలా కలిపిందో!
లేదా ఆ కలుపు చూడండి. ముచ్చట పెట్టించింది?
దృశ్యాదృశ్యం అంటే అదే. చూడటం.

ఎంత దగ్గరి వాళ్లయితే అంత హాయిగా మాట్లాడుకుంటూ పోతారు!

ఎటు వెళుతున్నారో అడగాల్సిన అవసరం లేదు.
తెలుసు.

తెలిసి చేసే ప్రయాణంలో ఆ ముచ్చట ఉంటుంది.
ఆ నమ్మికా, స్థిమితమూ జరూరుగా వుంటుంది.

వారలా వెళ్లడంలో ఒక చూపూ ఉంది. తమకు తెలిసిన దారీ వుంది. జనసమ్మర్దంలో తమ ఉనికిని తాము కాపాడుకునే స్థితి ఒకటి, రణగొణ ధ్వనుల్లోనూ తమ గొంతును తాము వినిపించునే అద్వితీయ స్థితి ఒకటి అలవోకగా వారికి అబ్బింది మరి! ఎందుకూ అంటే చంకలోని మూటలా ఒక బిలాంగింగ్ నెస్ ఉంది మరి!  అందుకే మాటలూ ఉన్నయ్.

మళ్లీ చూడండి.
తీరుబడితో చూడండి.
వారికి ఉన్నంత తీరుబడే చిత్రీకరిస్తున్న వ్యక్తికీ వుండాలి.
అప్పుడే మానవ సంబంధాల్లో శ్రవణేంద్రియం నిర్వహించే మహత్తర ఇట్లా దృశ్యమానమై కాలంతో పాటు ఆ ముచ్చట సాగేలా చేస్తుంది.

అభిమానం. సోదర భావం. సాన్నిహిత్యం. ఒక బంధం.
ఏదో…

చూస్తూనే ఉండండి.
ఒక కన్ సర్న్.

చూస్తూనే ఉండండి.
బయటకు కూడా…
మనుషుల ప్రవర్తనలోని అందచందాలని!
ముచ్చట్లలో ఉండగా లేదా వినికిడిలో వుండగా వాళ్ల బాడీ లాంగ్వేజ్ ని!
ఎంతో బావుంటుంది.

కానీ, చూడం.
నిజం.

ఎందుకంటే, నిప్పుకోడిలా తలను దాచుకోవడం తప్పా మనుషులు బయటకి రారు. జీవితాలను అస్సలు పరికించరు. అందుకే ఛాయా చిత్రలేఖనం ఒక గొప్ప సౌలభ్యం అని నొక్కి చెప్పాలనిపిస్తుంది. మన జీవితాలు మనవే కాదనుకునే దృక్పథం ఒకటుండాలి. అవతలి వాళ్ల జీవితాలు కూడా వావి వరసలతో కూడినవి మాత్రమే కాదన్న స్పృహా ఉండాలి. సంబంధం కాదు, వట్టి బంధం. అంతే. నిజం. వాళ్లను చూస్తున్నప్పుడు కూడా రిలేషన్ గురించి వెతక్కండి. ఒకరికి ఒకరు ఏమవుతారో ఆలోచించకుండా మనుషుల అందమైన ప్రవర్తనను గమనించండి. జీవితాన్ని దర్శించండి. అపుడు నిజగానే సర్వసామాన్యమైన అనుభవాల దొంతర ఇట్లా ఒక చక్కటి దృశ్యమానంగా శోభిల్లుతుంది.

నమ్మండి.

అన్నట్టు, ఈ చిత్రం సమ్మక్క సారక్క జాతరలో తీసింది.
మేడారం. 2012.

అక్కడికి లక్షలాది జనం, కోట్లాది జనం వస్తారు.
అంత జాతరలో కనీసం ఇద్దరినైనా సరిగ్గా చూడలేకపోతే ఆ ఛాయా చిత్రలేఖనం నిజంగా ‘జాతరే’ అవుతుంది. అవును. కనీసం ‘ఇద్దర్ని’ చూడగలిగితే అప్పుడది ‘దర్శనం’ అవుతుంది.

ఈ సూత్రం తెలిస్తే ఆగుతాం.
నది ప్రవహిస్తూ ఉంటే తప్పుకుంటాం.

ఒక శంఖం దొరుకుతుంది.
అదే ఈ దృశ్యాదృశ్యం.

ఇంతకీ వారెవరనుకున్నారు?
బహుశా అతడు జంపన్న అమె సమ్మక్క.
ఒక అనాది బంధం.

*

రావే కోడల రట్టడి కోడల…

Avineni Bhaskar

   అవినేని భాస్కర్ 

మనిషి జీవితంలోని అన్ని సన్నివేశాలకీ సంకీర్తనలు రాశాడు అన్నమయ్య. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ పరమాత్మ అవతారాన్నే చూశాడు. మేమేనా ఆ సంసారంలో కొట్టుమిట్టాడాల్సినది? మీరూ రండి అని దేవుళ్ళని చేయిపట్టి లౌకిక జీవితంలోకి లాక్కొచ్చి మానవ జీవితంలోని కష్టనష్టాలను దేవుళ్ళకి ఆపాదించాడు. అలా చెయ్యడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, “మనకే కాదు దేవుళ్ళకైనా సంసార జీవితం సులువుగా సాగట్లేదు” అని చెప్పి విరక్తి కలగనియ్యకుండ ధైర్యాన్ని కలిగించడమే.

అన్నమయ్య ఎన్నో యుగళగీతాలు (డ్యూయట్లు) రాశాడు. కొన్ని బావా-మరదళ్ళు పాడుకునేవి, కొన్ని నాయికా-నాయకులు పాడుకునేవి, కొన్ని గొల్లెత-గొల్లడు పాడుకునేవి, కొన్ని నాయిక-దూతికలు పాడుకునేవి. ఈ కీర్తన అత్తా-కోడలు పడుకునే డ్యూయట్.
అత్తా-కోడళ్ళ గొడవలు నేటి మెగా సీరియల్ల బిజినెస్ కోసం పుట్టినవి కావు. ఆదిలక్ష్మి అత్తయిన రోజునుండే ఉందని సాటి చెప్పడానికే ఈ కీర్తన రాశాడేమో. బ్రహ్మదేవుడు మహావిష్ణువు బొడ్డులోనుండి పుట్టాడు. కావున బ్రహ్మ మహాలక్ష్మి-విష్ణువుల కొడుకు. బ్రహ్మ భార్య సరస్వతి, మహాలక్ష్మికి కోడలు. మహాలక్ష్మి సిరి(డబ్బు)కి ప్రతిరూపం. సరస్వతి చదువులతల్లి, కళలకు ప్రతిరూపం.
ఈ భాషేంటి ఇలా ఉంది? సరస్వతీ, మహాలక్ష్మీ ఇలా దెప్పుకుంటారా అని ప్రశ్నించేవారికి – అన్నమయ్య సరస్వతినీ, మహాలక్ష్మినీ ఒక సామాన్య కుటుంబంలోని ఆడవాళ్ళుగా చిత్రీకరించాడు. అంటే దేవుళ్ళను సామాన్య ప్రజలకు దగ్గర చేయడం అన్నమయ్య ఉద్దేశం. దేవుళ్ళంటే ఎక్కడో సామాన్యులకందనంత ఎత్తులో ఉంటారన్న భ్రమని పోగొట్టి పామరులకు దగ్గర చేసేరీతిలో పలు జానపద కీర్తనలు రచించాడు. ఈ కీర్తన కూడా అలాంటొక జానపద శైలిలో రాయబడినదే. కావున భాష, భావం ప్రజల జీవితాల్లోనుండే తీసుకున్నాడు.
ఎంతటి వాళ్లైనా అత్తాకోడళ్ళుగా ఉన్నప్పుడు చిన్నచిన్న కోపతాపాలు, పోటీలు తప్పవనడానికి ఈ కీర్తన నిదర్శనం. పైకి ఎంత సఖ్యతగా కనిపించే అత్తా-కోడళ్ళకైనా లోలోపల పోటీ, భయం ఉంటుంది. కొడుకుని తననుండి దూరం చేసేస్తుందేమో అన్న భయంతో అత్త, మొగుడు అమ్మచాడు అబ్బాయిలాగే (momma’s boy లా)  ఉంటే నన్ను ప్రేమించడేమో అన్న అనుమానంతో కోడలు మెలుగుతుంటారు. ఎవరిఅభద్రత(insecurities) వాళ్ళవి! ఎవరికి వారు ఆధిపత్యం(domination)  ప్రదర్శిస్తారు. నేను నీ మొగుడికి తల్లిని అని అత్త హెచ్చులుపోతే, నీ కొడుక్కి పెళ్ళాన్ని అని కోడలు గర్వం ప్రదర్శిస్తూ ఉంటుంది.
annamayya
ఆ అత్తాకోడళ్ళకి గొడవలొస్తే ఎలా దెప్పుకుంటారో వినండి.
|| అత్త: సుశీల || కోడలు: వాణి జయరాం || స్వరకల్పన : గుంటి నాగేశ్వర నాయుడు||
పల్లవి
రావే కోడల రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా, పొందులు నీతోఁజాలును
 
చరణాలు
రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకు గొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల
అంకెలఁ దిరిగేవు అత్తయ్యా 
 
ఈడాడ నలుగురు నేగురు మొగలతో
కూడి సిగ్గులేని కోడల
వాడకుఁ బదుగురి వలపించుకొని నీవు
ఆడాడఁ దిరిగేవు అత్తయ్యా
 
బొడ్డునఁ బుట్టిన పూఁపనికే నిన్ను
గొడ్డేరు తెస్తినే కోడల
గుడ్డముపయినున్న కోనేటిరాయని –
నడ్డగించుకొంటివత్తయ్యా
 
మూలం : తాళ్ళపాక సాహిత్యం వాల్యూం 5, పుట : 286
తాత్పర్యం ( Explanation ) :
రావే పరువుమాలిన కోడలా అని అత్తయ్య చురకేస్తే, పోవే అత్తయ్యా! నీతో సఖ్యత నాకొద్దు అని కోడలంటుంది. [ కోడలు ఎవరీ కంటా, నోటా పడకుండ గుట్టుగా ఉంటే ఆ ఇంటికి గౌరవం! అదేం విపరీతమో అందరు నీ గురించే పలవరిస్తున్నారు. ఇంటిపరువు రచ్చకెక్కింది అని కోడలు సరస్వతిని దెప్పుతుంది అత్త మహాలక్ష్మి. ఆరాధన భావానికీ, అడ్డగోలు మాటలకీ తేడా తెలియని నీతో నాకేంటి మాటలు పోవే అత్తయ్యా అని మహాలక్ష్మిని తిప్పికొడుతుంది కోడలు ]
పండితులు, కవుల రూపంలో రాజుల ముందర సంకోచించకుండ ప్రసంగాలూ, ప్రదర్శనలూ చేస్తూ ఉంటావు ఏం మనిషివి నువ్వు అని అత్త అడిగితే… అవును మరి! నన్ననే ముందు నీ కథేంటో చూసుకో అత్తయ్యా! అంకెలరూపంలో ధనవంతుల ఇళ్ళలో తిరుగుతావుగా? బురదలో పుట్టిన తామర పువ్వులాంటి ముఖమూ నువ్వూ అని కోడలు ఎదురు ప్రశ్నేస్తుంది. [కవులు పండితులకి ప్రభలిచ్చేది సరస్వతి. వారు ఎప్పుడూ రాజులదగ్గరా, కలిగినవారిదగ్గరా చేరి తమ పాండిత్యాన్ని గర్వంగా, ఠీవిగా ప్రదర్శిస్తు ఉంటారు. సిరికి దేవత మహాలక్ష్మి. డబ్బు అందరిదగ్గరా చేరదు. కొందరు దొడ్డవారిళ్ళల్లో అంకెలతో కొలవబడుతూ ఉంటుంది. ఇక్కడ “పంకజముఖి” అని సంభోదించడంలో చమత్కారమైన తిట్టు దాగుంది. పంకజం బురదలో పుడుతుంది కదా?]

ఇక్కడా అక్కడ అని సిగ్గుశరములేకుండ నలుగురైదుమంది మగవాళ్ళ సాంగత్యంలో ఉంటావు అని అత్త దెప్పితే, వాడకు పదిమంది దగ్గర చేరి వాళ్ళ మధ్యనే ఉంటావు నువ్వేం తక్కువా? అంటోంది కోడలు. [ ఏగురు అంటే ఐదుగురు అని అర్థం. వాడకు నలుగురు, ఐదుగురు పండితులు ఉంటారు. సరస్వతి వాళ్ళనే కటాక్షించి ఆదుకుంటుంది అని భావం. సిరి అయినా అంతే అందరిదగ్గరా చేరదు. ఏ కొందరిచెంతో మాత్రమే ఉంటుంది].

ఏం చూసుకుని నీకంత టెక్కు? మా ఆయన బొడ్డున పుట్టిన పిల్లాడు బ్రహ్మకి ఒక పిల్లని తెచ్చి పెళ్ళి చేసిపెడదాం అని ఏమీలేని నిన్ను పోనీలే అని కోడలిగా తెచ్చుకున్నాను అని మహాలక్ష్మి సరస్వతిని చిన్నబుచ్చింది. నన్నంత మాటంటావా? నువ్వేమో పెద్ద గొప్పా? కొండపైన మహరాజులా ఆనందంగా జీవిస్తున్న అమాయక చక్రవర్తిని మాయచేసి నీ వలలో వేసుకున్నావు అని కోడలు అత్తని నిలదీస్తుంది.
కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :
రట్టడి = అపకీర్తి, పరువుమాలిన
పొందులు = సఖ్యత, స్నేహము
రంకెలువేయుచు = ప్రగల్భాలు పలుకుతు, హెచ్చులుపోతూ, గర్జనలు చేస్తూ
కొంకుకొసరు = సంకోచము, సిగ్గుశరము
పంకజముఖి = (బురదలోపుట్టిన) తామర పువ్వులాంటి ముఖము
దొడ్డవారిండ్ల = కలవారిళ్ళలో, ధనికులైనవారి ఇళ్ళలో

అంకెల = అంకెల రూపంలో

ఈడాడ = ఇక్కడా అక్కడా, ఇటు అటు
ఏగురు = ఐదుగురు, అయిదుమంది,
మొగలతో = మగవారితో
ఆడాడ = అక్కడక్కడ
బొడ్డున = నాభిలో, బొడ్డులో
పూప = శిశువు, పిల్లవాడు (ఇక్కడ బ్రహ్మ అని అర్థం)
గొడ్డేరు = గుత్తకు, వేలం
గుడ్డము = కొండ, క్షేత్రము

అడ్డగించు = బలవంతంగా సొంతంచేసుకోవడం

గమనమే గమ్యం-4

 

19BG_VOLGA_1336248eమర్నాడు ఉదయానికి శారద ముఖం తేట పడిరది. కొంత ఉత్సాహంగా తల్లి నాన్నమ్మలతో మాట్లాడిరది. తండ్రిని ప్రశ్నలడుగుతూ బడికి తయారైంది. ‘‘ఎన్ని రోజుల తర్వాత శారద మళ్ళీ గలగలా మాట్లాడిందో. ఇన్నాళ్ళూ దానిని చూస్తుంటే గుండెల మీద బరువు పెట్టినట్టుంది’’ అంది సుబ్బమ్మ.

శారద బడికి వెళ్ళిపోయాక రామారావు కూడా ఊళ్ళోకి వెళ్ళొస్తానని బయల్దేరాడు. తీరా చూస్తే నరసమ్మ కూడా బైటికి వెళ్తోన్న సూచనలు కనిపించాయి.

‘‘పొలం దగ్గరకు వెళ్తున్నట్టున్నావు. నేనూ వస్తాను పద’’ అన్నాడు రామారావు.

‘‘పొలానికి కాదురా. పురోహితుడు గారింటికి’’ అన్నదామె.

బహుశ కూతురు పోయిన దు:ఖంలో ఉన్న ఆయనను పలకరించి వస్తుందేమోననుకున్నాడు. తను కూడా వెళ్ళి పలకరించాల్సిన బాధ్యత ఉందనిపించింది. ఆ సమయంలో ఊళ్ళో లేడుగానీ వచ్చిన తర్వాత ఆలస్యం చేయకూడదు. నిజానికి పురోహితుడు వెంకటావధానిని బాగా చివాట్లు పెట్టాలని వుందాయనకు. వెళ్తే కేవలం సానుభూతి చిలకరించి రావటం తనవల్ల కాదనుకున్నాడాయన. వెళ్ళి చివాట్లు పెట్టి రావటమా, వెళ్ళకుండా తన అసమ్మతిని మౌనంగా తెలియజెయ్యటమా అనేది తేల్చుకోలేక ఉన్నచోటే నిలబడిపోయాడు. నరసమ్మ రామారావు కోసం ఎదురు చూడకుండా వాకిలి దాటుతోంది. ‘పోనీలే. ఇప్పుడు అమ్మతో వెళ్ళటం కంటే తర్వాత వెళ్ళటం మంచిది అనుకుని తన దారిన తాను ఊళ్ళోకి నడిచాడు.

ఊళ్ళో అందరూ రామారావంటే అభిమానంగా ఉంటారు. చదువుకున్న వాడనే గౌరవం, మెప్పు ఉండనే ఉన్నాయి. పుస్తకాలు రాస్తాడు. పెద్దపెద్ద వాళ్ళందరితో పరిచయాలు పెంచుకుంటాడు. ఎవరైనా అతని కెదురుపడితే కాసేపు ఆగి పలకరించాలనిపించే మర్యాదా, మన్నన గలవాడు. మద్రాసు విశేషాలు, కాంగ్రెస్‌ వ్యవహారాలు చెప్పగలిగినవాడు.

రామారావుని చూస్తూనే రచ్చబండ దగ్గర నలుగురు పెద్దలూ చేరారు. పదిమంది కుర్రాళ్ళూ పోగయ్యారు.

స్వతంత్రం గురించి మాటలు సాగాయి. రామారావు మిత్రుడు హరిసర్వోత్తమరావు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆయన గురించి అందరూ అడిగారు. ఆంధ్రపత్రిక విశేషాలు నాగేశ్వరరావు పంతులుగారి దాతృత్వం ప్రస్తావనకు వచ్చాయి.

మధ్యాహ్నం భోజనాలవేళ మించిపోతుంటే ఒకరొకరూ ఇళ్ళకు బయల్దేరారు. రామారావు లేచి వచ్చేశాడు.

వేళమించి పోయిందని సుబ్బమ్మ ఎదురు చూస్తోంది. ఊళ్ళో ఉన్న రోజైనా భర్తకు ఇష్టమైనవి చేసి తృప్తిగా తినిపించాలని ఆమె ఆరాటం. అత్తగారి భోజనమై కాసేపు పడుకుని లేచింది. వత్తులు చేసుకోటానికి ఇంత పత్తి ముందు వేసుకుని కూచుంది.

‘‘బోలెడు వత్తులున్నాయిగా అత్తయ్యా  మళ్ళీ ఎందుకిప్పుడీ పని’’ అంది సుబ్బమ్మ.

‘‘ఇంకా చాలా కావాలి’’ అన్న అత్తగారి మాటల్లో తనకు తెలియని అర్థం ఏదో ఉన్నట్లనిపించింది.

అంతలో రామారావు వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ భోజనాల గదిలో తీరికగా కూర్చున్నారు. భర్తకు వడ్డించి తనూ వడ్డించుకుంది సుబ్బమ్మ. అలా చెయ్యకపోతే రామారావు ఊరుకోడు. అసలు తనకోసం చూడకుండా వేళకు భోజనం చెయ్యమంటాడు. అంత అఘాయిత్యం పని తను చెయ్యలేననీ, తను చేసినా అత్తగారు తనను బతకనివ్వదనీ నవ్వుతూ, నవ్వుతూ చెప్తుంది సుబ్బమ్మ. రామారావు భోజనం చేసివచ్చి మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. క్రితం రోజు తన మాటలకు నొచ్చుకున్న తల్లిని ఓదార్చాలని, తల్లి కోపం ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించాలనీ, అది తన బాధ్యత అనీ అనుకున్నాడాయన.

olga title

‘‘పురోహితుడుగారెలా ఉన్నారమ్మా?’’

‘‘బాగానే ఉన్నాడు. ఏం చేస్తాడు. కూతురితో పాటు పోలేడుగా’’.

‘‘నువ్వు ఓదార్చి వచ్చావుగా. కుదుట పడతాడులే ` ఏమంటాడు?’’

‘‘వచ్చేనెల మార్గశిర శుద్ధ ఏకాదశి గురువారం అన్ని విధాలా మంచిరోజన్నాడు’’ రామారావుకేమీ అర్థం కాలేదు.

ఇప్పుడు మంచిరోజు చూసి చేయవలసిన పనులేమున్నాయో ఆయనకు అర్థం కాలేదు.

శారద పెళ్ళి నిర్ణయించానంటుందా అనుకునే సరికి ఆయన రక్తం పోటెత్తింది.

తల్లి మీద కోపంతో ముఖం ఎర్రబడిరది.

‘‘మంచి రోజేమిటమ్మా’’ గద్దించినట్టు అంటున్న కొడుకుకి శాంతంగా సమాధానం ఇచ్చింది నరసమ్మ.

‘‘నా కాశీ ప్రయాణానికి’’

దిమ్మెర పోయాడు రామారావు. పోటెత్తిన రక్తం కుప్పకూలింది. కోపంతో ఎర్రబడ్డ ముఖం క్షణంలో నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది.

తనను తాను కూడదీసుకుని

‘‘కాశీ ప్రయాణమా? కాశీ వెళ్ళస్తావా?’’

‘‘వెళ్ళి రావటం కాదురా. వెళ్తున్నాను. ఇక అట్నించి అటే వెళ్తాను.’’

పది నిమిషాల తర్వాత గాని రామారావుకి తల్లి మాటల్లోని సారాంశమంతా ఒంటబట్టలేదు. ఒంటబట్టేసరికి ఒళ్ళంతా నీరయింది. ఎక్కడ లేని నీరసం కమ్ముకొచ్చి కాళ్ళూ చేతులు తేలిపోయినట్లయింది. ఒళ్ళంతా చమటతో తడిసిపోయింది. శారదకు బాల్య వివాహం చెయ్యకపోతే తల్లి తన ఇంట ఉండదు. ఈ అనాచారాన్ని ఆమె సహించదు. ఆ దురాచారాన్ని తను సహించడు. మార్గం ఏమిటా అని తల్లి ఆలోచించి ఉంటుంది. ఆమె కాశీ వెళ్తే సమస్య ఉండదనే నిర్ణయానికి వచ్చింది. ఇక ఆమెని ఆపటం బ్రహ్మతరం కాదు. ఆపాలంటే ఒక్కటే మార్గం. శారదకు వెంటనే పెళ్ళి చెయ్యాలి లేదా తల్లిని కాశీ వెళ్ళనివ్వాలి. తల్లి ఈ వయసులో కాశీలో ఒంటరిగా ఎలా బతుకుతుంది? ఆమెనక్కడ ఉంచి తనిక్కడ శాంతిగా ఎలా బతుకుతాడు? ఇక మళ్ళీ తల్లి తనకు కనిపించదు. కాశీ వెళ్ళి చూస్తే తప్ప కనిపించదు. ఆమెను చూడకుండా ఉండగలడా? తండ్రి చిన్నప్పుడే పోతే ఇద్దరి పాత్రా తనే నిర్వహించి పెంచింది.

తన ఇష్టప్రకారం చదివించింది. ఏం చేసినా, ఎలా తిరిగినా, కొన్ని ఆమెకు ఇష్టంలేని పనులు చేసినా సహించింది. ఎంతో ప్రేమ తనమీద. ఎంత తెలివి ఎంత సమర్థత. తనకీ సంసారం సంగతేం తెలుసు? డబ్బు పట్టుకెళ్ళి తనకు తోచిన పనులు చేయటం తప్ప డబ్బు సంపాదించటం రాదు. తల్లి వ్యవసాయం చేయిస్తుంది. ధాన్యం అమ్ముతుంది. రైతులకు డబ్బు అప్పు ఇచ్చి వసూలు చేస్తుంది. పాడీ పంటా అన్నీ ఆమె నిర్వహణ. ఇప్పుడామె వెళ్తే తను నిరాధారం అయిపోతాడు. ఎట్లా బతుకుతాడు. రామారావు ఒక్కసారి తనమీద తనే జాలిపడి దీనంగా అయిపోయాడు. అంతలోనే పౌరుషం తన్నుకొచ్చింది. తను అసమర్థుడు కాదు. ఆలోచించాల్సింది తల్లి నిరాధారమవుతుందని గానీ తన గురించి కాదు. తల్లి ఒక్కత్తే అంతదూరానా`

‘‘అమ్మా’’ అంటూ తల్లి ఒడిలో పడిపోయాడు.

‘‘నమ్మినవాటి కోసం ధైర్యంగా ఉండాలి. సాహసంగా బతకాలి. ఇట్లా ఏడిస్తే నీ పిల్లని డాక్టర్నెలా చేస్తావు? ఎంతమందితో తలపడాలి?’’

కొడుకు తల నిమురుతూ ప్రశాంతంగా చెప్పింది నరసమ్మ.

‘‘నువ్వుంటే నాకు ఎవరి భయమూ లేదమ్మా. నువ్వు లేకపోతే నేను నిలబడలేను.’’

Image (11)

‘‘నాది వెళ్ళే కాలం. నీదీ నడిచేకాలం, నీ కూతురిది రాబోయే కాలం. నువ్వు నిలబడాలి. నీ కూతుర్ని నిలబెట్టాలి. నీకే సాహసం లేకపోతే ఆడపిల్ల అది లోకంలో ఎలా నెగ్గుకొస్తుంది.’’

‘‘ఇన్ని తెలిసినదానివి. ఈ విషయంలో ఇంత మూర్ఖంగా ఉన్నావెందుకమ్మా’’.

‘‘నా నమ్మకాలు నీకు మూర్ఖంగా ఉంటాయి. నీ ఆలోచనలు నాకు వెర్రితనం అనిపిస్తాయి. నా నమ్మకాలకు తగినట్టు నిన్ను పెంచుకోలేకపోయాను. నువ్వలా పెరగలేదు. ఇప్పుడిక ఇంతకంటే మార్గం లేదు. నన్ను గౌరవంగా కాశీ పంపు. నరసమ్మ కొడుకు మీద అలిగి కాశీ వెళ్ళిందని నలుగురూ అనుకుంటే అది నీకు గౌరవం కాదు. పెద్ద వయసులో తల్లి కాశీ చూడాలనుకుంటే అన్ని ఏర్పాట్లూ చేసి పంపాడు. నరసమ్మ అదృష్టవంతురాలని అందరూ చెప్పుకోవాలి. నలుగురి మెప్పు నువ్వు పొందాలి. అందుకని నీ దు:ఖాన్ని దిగమింగు. నేను మింగేశాను. నిజంగా నాకు ఇప్పుడేబాధా లేదు. ఈ సంసార తాపత్రయం నుంచి నన్ను విముక్తం చెయ్యటానికి ఈశ్వరుడే ఈ నెపం కల్పించాడనుకుంటాను. నిత్యం గంగాస్నానం, ఈశ్వరాభిషేకం, పరమేశ్వర దర్శనం, అన్నపూర్ణాదేవి ఆలింగనం ఎవ్వరైనా కోరుకుంటారు. కానీ ఎవరికో గాని దొరకదు. నాకు దొరుకుతున్నది. అది మహాదృష్టం. నువ్వు శారదాంబ పెళ్ళికి ఒప్పుకునుంటే చచ్చేదాకా ఈ సంసారంలో పడి కొట్టుకునేదాన్ని. ఇది నా మంచికే. నా మంచికే నీకీ బుద్ధి పుట్టిందనుకుందాం. అన్ని ఏర్పాట్లూ చేసి నన్ను కాశీ పంపు నాయనా’’ తల్లి ఓర్పుగా నేర్పుగా ప్రేమగా చెప్తున్న మాటలు రామారావుని ఇంకా ఇంకా శక్తిహీనుడిని చేశాయి.

నరసమ్మ రామారావుని లేపి కళ్ళు తుడిచి.

‘‘ఇంకొక్కమాట దీని గురించి మాట్లాడటానికి లేదు. ఆఖరికి నీ భార్యతో కూడా. నా ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యటం తప్ప నీకింకో మార్గం లేదు. నా జీవితం నా ఇష్టం కాదా? నీ నమ్మకాల ప్రకారం అదంతే కదా’’.

కొడుకుని ఆలోచనలో పడేసి తనక్కడనుంచి లేచి వెళ్ళింది నరసమ్మ.

రామారావు తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. సుబ్బమ్మకు ఏం జరిగిందో అర్థం కాలేదు. తల్లీ కొడుకుల మాటలు ఆమె వినలేదు. ఆమె పెరట్లో బట్టలు తీసి, మడతలు పెట్టి, సర్ది, బడినుంచి వచ్చే శారదకు చిరుతిండి ఏర్పాటు చేసి వచ్చేసరికి తల్లీ కొడుకులు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకున్నారు. సుబ్బమ్మ హాల్లోకి మంచం లాక్కుని నడుం వాల్చింది. ఆమె ఎన్ని సమస్యలున్నా ఇట్టే నిద్రపోగలదు. సాయంత్రం శారద బడి నుంచి వచ్చేవరకూ ఆ ఇంట్లో ఇద్దరు గుండెలు పగిలేలా దు:ఖిస్తుంటే సుబ్బమ్మ హాయిగా నిద్రపోయింది.

శారద బడినుంచి ఒక్కత్తే వచ్చింది. ధనలక్ష్మి చనిపోయిన దగ్గర్నించీ స్నేహితులు ఆటలు మానేశారు. సాయంత్రం బడి ఒదలగానే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్తున్నారు. ముగ్గురూ ఒకచోట పనిలేకుండా కూచుంటే ధనలక్ష్మి గుర్తొచ్చి ఏడుపోస్తోందని ఎవరికి వాళ్ళకు తెలిసింది. ఒక్కమాట కూడా దాని గురించి మాట్లాడుకోకుండానే ఆటలు మానేశారు. ఒక్కసారిగా ముగ్గురికీ పెద్దరికం మీద పడినట్లయింది. దానికి తోడు విశాలాక్షి కటికి గర్భాదానం అంటే ఏంటో ఇంట్లో ఎవరో మాట్లాడుకున్న మాటలు విని అవి కాస్తా స్నేహితులతో చెప్పింది. దాంతో ఏదో తెలియని ఆందోళన ముగ్గురి మనసుల నిండా నిండిరది. అల్లరి, నవ్వులు, ఆటలు అన్నీ బందయ్యాయి. మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో, అసలు మొదలవుతాయో లేదో అన్న ఆలోచన కూడా లేకుండా బడికి వెళ్ళి వస్తున్నారు. బళ్ళో పాఠాలే వాళ్ళకు కాస్త ఊరటగా

ఉన్నాయి. కొత్త పద్యాలు, లెక్కలు, కాస్త చరిత్ర ఇవి వాళ్ళ పసి మెదడులను ఎక్కువ ఆలోచించనివ్వకుండా తాము స్థిరపడ్డాయి. ఆడపిల్లలు బాగా చదువుతున్నారని పంతులుగారన్నప్పుడు వాళ్ళకు చాలా సంతోషం కలిగింది. ఆ మాట ఎప్పుడెప్పుడు తండ్రితో చెబుదామా అని వచ్చింది శారద. సరిగ్గా ఆ సమయంలో రామారావు గది తలుపులు తీసుకుని బైటికి వచ్చి ముఖం కడుక్కున్నాడు. లేకపోతే ఏదో జరిగిందని శారద కనిపెట్టేదే. అక్కడికీ తండ్రిని చూడగానే అడిగింది.

‘‘నీ ముఖం ఏంటి నాన్నా అలా ఉంది?’’ అని

‘‘బాగా నిద్రపోయానమ్మా. పగటి నిద్ర అలవాటు లేదుగదా. కళ్ళుబరువెక్కాయి. తలనొప్పి వచ్చింది’’ అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు.

‘‘నాన్నా ఇవాళ పంతులు గారన్నారూ  ఆడపిల్లలే బాగా చదువుతారని. నేను పద్యాలన్నీ వప్పజెప్పాను. లెక్కలన్నీ సరిగా చేశాను. విశాలాక్షి కూడా బాగా చేసింది. నాన్నా  విశాలక్షికి నాట్యం కూడా వచ్చు. వాళ్ళమ్మ నేర్పుతుంది. నేనూ నేర్చుకోనా?’’ ఆశగా అడిగింది.

‘‘వద్దమ్మా. చదువు తప్ప మరేదీ పట్టించుకోకూడదు నువ్వు. ధ్యానం వేరే విషయాల మీదకు మళ్ళితే డాక్టర్‌వి కాలేవు. చెప్పు ` నీకు నాట్యం ముఖ్యమా? వైద్యం ముఖ్యమా?’’ గట్టిగా అడిగాడు రామారావు.

‘వైద్యమే’ అంది మరో ఆలోచనే లేని శారదాంబ.

‘‘మరి వెళ్ళి చదువుకో’’

‘‘నువ్వు మద్రాసు కబుర్లు చెప్పలేదు.’’

‘‘రాత్రికి మంచి కథ చెప్తాను. ఇప్పుడు నన్ను ఒదులు.’’

‘‘అవసరమా? కదా?’’ తండ్రి కథలు చెప్పటం చాలా అరుదు. నిజంగా జరిగేవే చెప్తాడు.

‘‘కథంటే కథ కాదు. నిజంగా జరిగిందే. చాలా బాగుంటుంది’’.

‘‘ఇప్పుడే చెప్పవా?’’ మారాం చేయబోయింది శారద.

‘‘ఇప్పుడు నేను బైటికి వెళ్ళాలమ్మా రాత్రికి తప్పకుండా చెప్తాను’’.

రామారావు శారదను బుజ్జగిస్తుంటే నరసమ్మ వచ్చి తన దగ్గరకు లాక్కుని ‘‘నేను చెప్తాను రావే’’ అంది.

‘‘నీవన్నీ పాత కథలు. నాన్న కొత్త కొత్తవి చెప్తాడు’’ శారద గింజుకుంది. రామారావు, నరసమ్మలు ఒకరినొకరు చూసుకున్నారు.

నరసమ్మ నవ్వింది.

‘‘ఔనే. నువ్వే ఒక కొత్త కథవి. పాతవి నీకెందుకు పో . పోయి పూలు కోసుకుని మాల కట్టి తీసుకురా’’ అంది.

శారద మర్చిపోయిన పని జ్ఞాపకం వచ్చినట్లు తోటలోకి పరిగెత్తింది.

‘‘అమ్మా. నేను పురోహితుడితో మాట్లాడతా. నీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేస్తా’’

నరసమ్మ ముఖం వికసించింది. ‘‘నువ్వు నా కొడుకువి కాదూ’’ అంది.

‘‘ఐతే ఇందులో ఏదన్నా తప్పుంటే అది నీదేనమ్మా’’.

‘‘తప్పేమీ లేదు. ముందు అది నమ్ము. జీవితాంతం తప్పుచేశానని బాధపడకు. నువ్వట్లా బాధపడితే నేను చేస్తున్నపని వృథా. అంతదూరం వెళ్ళి ఈశ్వరుడి గురించి కాక నీ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అది అనవసరం’’. రామారావు తల్లి తెలివికి ఆశ్చర్యపోతూ బైటికి నడిచాడు.

ఊళ్ళోని తన సన్నిహితులతో తల్లి కాశీయాత్ర తలపెట్టిందని చెప్పాడు. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని అడిగాడు. సోమేశ్వరరావు ఆనందంగా ఒప్పుకున్నాడు. అతనికి ఎప్పటినుంచో కాశీ చూడాలని ఉందట. రామారావు కూడా వస్తే బాగుంటుంది కదా అన్న ప్రశ్న కూడా వచ్చింది. తనకు మద్రాసులో అత్యవసరమైన పనులున్నాయని చెప్పాడు రామారావు. కానీ నిజం అది కాదు. తల్లిని కాశీలో ఒదిలి తనొక్కడే తిరిగి రాగలిగిన దిటవు గుండె తనకు లేదని అతనికి అనిపించింది.

ఆ రాత్రి ఆ ఇంట్లో భోజనాలు కూడా మామూలుకు భిన్నంగా హాసాలూ, పరిహాసాలూ లేకుండా నడిచాయి. భర్త అంత విముఖంగా భోజనం చెయ్యటం సుబ్బమ్మ ఎన్నడూ చూడలేదు. రామారావు పెద్ద తిండి పుష్టి కలవాడు కాదుగానీ ా తినేదేదైనా ఇష్టంగా తింటాడు. బాగుంది బాగుందంటూ దాని రుచిలో ఉన్న ప్రత్యేకత చెప్తూ తింటాడు. మౌనంగా, వీలైనంత పక్కకు తోసేస్తూ భోజనం ముగించాడు. తల్లీ కొడుకుల మధ్య ఏదో నడిచిందని సుబ్బమ్మ గ్రహించింది. రాత్రికి భర్త నడిగి తెలుసుకోవచ్చులే అని తనూ మౌనంగా ఉండిపోయింది.

తండ్రి చెబుతానన్న కథ కోసం రాత్రెప్పుడవుతుందా అని కాచుక్కూచున్న శారద భోజనాలవగానే తండ్రి పక్కన చేరి ఇంకా మొదలెట్టవేం అన్నట్టు చూసింది.

‘‘నీకొక మంచి డాక్టర్‌ కథ చెబుతానమ్మా’’ అన్నాడు రామారావు. అటుగా వచ్చిన తల్లినీ భార్యనూ పిల్చి ‘మీరూ వినకూడదు’ అని అడిగాడు. నరసమ్మ అలాగే నన్నట్లు తలాడిస్తూ వచ్చి శారద పక్కన కూచుంది. సుబ్బమ్మ తనకింకా వంటింట్లో పని ఉందన్నట్లు చేతులు తిప్పుతూ లోపలికి వెళ్ళింది.

‘‘వెల్లూరు అని మద్రాసు దగ్గర ఒక ఊరుంది. ఆ ఊరికి క్రైస్తవ మతం గురించి బోధించటానికి ఒక ఫాదరీ వచ్చాడు.

నరసమ్మ తల కొట్టుకుని ‘‘బాగుంది కృష్ణా రామా అనుకుంటూ పడుకోవలసినదాన్ని కూర్చోబెట్టి ఈ కిరస్తానపు కథా వినమంటున్నావు’’ అంటూ లేవబోయింది.

‘‘ఉండమ్మా. ఇది కిరస్తానం కథ కాదు. మానవత్వం కథ. మంచితనం కథ. ఈ ఒక్కరోజుకీ ఈ కథ వినమ్మా’’.

నరసమ్మ అసహనంగా కదిలింది గానీ కూచునే ఉంది.

‘‘ఆ ఫాదరీ అక్కడ ఒక్కడే ఉంటున్నాడు. చుట్టుపక్కల పేదవాళ్ళకు సేవజేస్తున్నాడు. వైద్యం తెలుసు. జబ్బులతో తన దగ్గరకు వచ్చే పేదవారికి వైద్యం చేసేవాడు. క్రీస్తు గొప్పతనాన్ని గురించి చెప్పేవాడు. ఆయన కుటుంబం అమెరికాలో ఉంది. ఎప్పుడన్నా వచ్చి వెళ్తారు. ఆయన కూతురు పదహారేళ్ళ పిల్ల ఒకసారి అమెరికా నుంచి వచ్చింది. తండ్రితో పాటు బీదవాళ్ళ ఇళ్ళకు తిరుగుతుండేది. ఇక్కడి ఎండలు అలవాటు లేక చికాకు పడేది. ఐనా శలవలు తండ్రితో గడపాలని అంతదూరం వచ్చింది. వెల్లూరు చుట్టుప్రక్కల ప్రాంతాలు తిరుగుతూ అక్కడి విశేషాలు తెలుసుకుంటూ సంతోషంగానే  ఉండేది. ఒకరోజు రాత్రి తండ్రీ కూతుళ్ళిద్దరూ మంచి నిద్రలో ఉండగా వారి ఇంటి బైట నిలబడి ఎవరో కేకలు వేస్తున్నట్లు అనిపించి నిద్రలోంచి లేచారు. నిజంగానే ఎవరో కేకలు వేసి పిలుస్తున్నారు. ఎవరో బాధలో, దు:ఖంలో ఉండి పిలుస్తున్నట్లుగా ఉంది. ఇద్దరూ లేచి బైటికి వచ్చారు. ఆ వచ్చిందొక పేద కుటుంబీకుడు.

అతని భార్య ప్రసవ వేదన పడుతోందట. ఈ ఫాదరీ కూతురు వచ్చి తన భార్యకు ప్రసవం చేయాలని అడుగుతున్నాడతను. ఫాదరీకి వైద్యం తెలుసు గాబట్టి వాళ్ళమ్మాయికి కూడా వచ్చని అతని నమ్మకం.

ఫాదరీ ఓపిగ్గా నచ్చచెప్పాడతనికి ‘‘మా అమ్మాయి చదువుకుంటోంది గానీ అది డాక్టర్‌ చదువు కాదు. మా అమ్మాయికి వైద్యం తెలియదు. ప్రసవం చెయ్యటం గురించి అసలేమీ తెలియదు. కావాలంటే నేనొచ్చి ఏదైనా సహాయ పడగలనేమో చూస్తాను’’ అని. అతనీ మాటలు వినిపించుకోడు. ఏడుస్తాడు. మొత్తుకుంటాడు. ఫాదరీ మొగవాడు గాబట్టి ఆడవాళ్ళ ప్రసవం దగ్గరికి రాకూడదు. మీ అమ్మాయి వచ్చి నా భార్యను కాపాడాలని కాళ్ళమీద పడి లేవటం లేదు. చివరికి తండ్రీ కూతుళ్ళిద్దరూ బయల్దేరక తప్పలేదు. దారిలో తండ్రి చెప్పాడు ఈ ప్రాంతంలో ఆడవాళ్ళ పురుడు పోసేది మంత్రసానులనీ ` మగ డాక్టర్లను ఆడవాళ్ళ దగ్గరకు రానివ్వరనీ ` తను నిస్సహాయుడననీ ` ఆ అమ్మాయి మేరీకి అది అన్యాయమనిపించింది. ప్రాణం పోయినా ఫరవాలేదుగానీ మగ డాక్టర్‌ని అనుమతించకపోవటం చాలా క్రూరమనిపించింది.

అది ఇక్కడి సంప్రదాయమని వివరించాడు తండ్రి. ప్రసవించలేక బాధపడుతూ చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ యువతిని చూసి మేరీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆ అమ్మాయి ఈ లోకంలో లేదు. మరి కాసేపటిలో పరలోక ప్రవేశం చేయబోతోంది. ఆ సమయంలో కూడా పరాయి మగవాడి నీడ ఆమె మీద పడకూడదు. పరాయి మగవాడి స్పర్శ తగలగూడదు. ఆ యువతి చనిపోవటాన్ని కళ్ళారా చూసి తట్టుకోలేకపోయింది మేరి. తండ్రితో కలిసి ఇంటికొచ్చింది.కానీ ఆ దృశ్యాన్ని మర్చిపోవటం ఆ అమ్మాయికి అసాధ్యమయింది. ఆ ఆవేదనలోంచి ఒక విషయం ఆ అమ్మాయికి అర్థమైంది. ఈ దేశంలో ఆడ డాక్టర్లుంటేనే తల్లీ పిల్లలు బతికి బట్టకడతారని అనుకుంది. ఆయుషుండి మంచి  మంత్రసాని సమయానికి అందుబాటులో ఉంటే అదృష్టం. వైద్యం లేక మరణించే ఆడవాళ్ళ సంఖ్య గురించి తండ్రి నడిగి తెలుసుకుంది.

ఈ దేశంలో ఆడడాక్టరుంటే తప్ప లాభంలేదని గ్రహించింది. ఈసారి తనదేశం వెళ్ళి నాలుగేళ్ళు వైద్యం చదివి డాక్టర్‌గా తిరిగొచ్చింది. ఈసారి తనకోసం ఆశగా వచ్చిన వాళ్ళకు ‘‘నాకు వైద్యం రాదు’’ అని చెప్పనక్కర్లేదనే ఉత్సాహంతో, ధీమాగా తిరిగొచ్చింది. నిజంగానే ఆ ధీమాతోనే పని చేయటం మొదలుపెట్టింది. పగలూ, రాత్రీ తేడా లేకుండా ఆడవాళ్ళకు పురుళ్ళు పోస్తోంది. పక్కనున్న ఊళ్ళకు తిరుగుతోంది. విరామం లేకుండా ఆడవాళ్ళ, పసిపిల్లల ప్రాణాలు నిలబెట్టటానికి శక్తంతా ధారపోస్తోంది. కానీ ఒక్కతి ఎంతకాలం ఆ పని చెయ్యగలదు? తనకు తోడుగా ఇంకొందరుంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు నిలబెట్టవచ్చనిపించింది. కానీ ఎట్లా?

అమెరికానించి తనలాగా ఎందరొస్తారు? ఇక్కడి పరిస్థితులను, వాతావరణానికి తట్టుకుని పనిచెయ్యటం తేలిక కాదు. తన దేశంలోనూ, ఆడ డాక్టర్లు ఎక్కువమంది లేరు. కాకపోతే మగడాక్టర్ల చేత ఆడవాళ్ళూ వైద్యం చేయించుకుంటారు. ఇక్కడి సమస్యకు పరిష్కారం ఒకటే. ఇక్కడి ఆడవాళ్ళే డాక్టర్లు కావాలి. ఆ ఆలోచనే సరయినదనిపించింది. కానీ ఆడపిల్లలను మద్రాసు మెడికల్‌ కాలేజీలో చేర్పించి మగపిల్లలతో బాటు కూచుని చదివించటానికి ఎవరొప్పుకుంటారు? ఏ తల్లిదండ్రులు అంగీకరిస్తారు. అది జరిగే పని కాదు. శరీరానికి సంబంధించిన విషయాలన్నీ మగవాళ్ళతో కలిసి ఆడపిల్లలు వింటారనే ఆలోచనే పెద్దవాళ్ళకు నచ్చదు. వాళ్ళు సహించలేరు. ఈ సమస్యకు పరిష్కారం ఆడపిల్లలకు వేరుగా ఒక కాలేజీ ఉండటమే. అందులో ఆడవాళ్ళే పాఠాలు చెప్పాలి. అది జరగటం సాధ్యమా? ఎందుకు కాదు? తనే ఒక కాలేజీ పెట్టచ్చు. తనే పాఠాలు చెప్పొచ్చు. ఈ ఆలోచనతో మేరీకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తన ఆలోచన మద్రాసు మెడికల్‌ కాలేజీ వాళ్ళకు చెప్పింది. వాళ్ళు నవ్వారు. నిరుత్సాహపరిచారు. ఐనా ఆమె పట్టు వదల్లేదు. తను పెట్టదలుచుకున్న కాలేజీ గురించి ప్రచారం చేసింది. సాధించింది.

పదిమంది అమ్మాయిలు వైద్యం చదవటానికి సిద్ధపడి వచ్చారు. వాళ్ళ ఆలనాపాలనా కూడా ఈమే చూడాలి. వసతి చూపాలి. అన్నిటికంటే కష్టం ఆస్పత్రి లేకుండా పాఠాలు చెప్పటం. రోగులను చూపించి రోగాల గురించి వివరించాలిగదా ` ఈమె పదిమందినీ వెంటబెట్టుకుని రోగుల ఇళ్ళకు వెళ్ళేది. ఒక ఊరు కాదు. పది ఊళ్ళు తిరగాల్సి వచ్చేది. ఎలాగైతేనేం వదలకుండా ఒక యజ్ఞంలా ఆ విద్యాదానాన్ని సాగించింది. నాలుగేళ్ళు గడిచాయి. ఈ పిల్లలు కూడా పరీక్షలు రాసి పాసయితేనే కదా డిగ్రీ చేతికి వచ్చేది, డాక్టర్లుగా గుర్తింపు వచ్చేది. పరీక్షలు పెట్టటానికి మద్రాసు మెడికల్‌ కాలేజీ ఒప్పుకుంది. ఈ పిల్లలను ఫెయిల్‌ చేసి పంపటానికి వాళ్ళకి పెద్ద అభ్యంతర పెట్టాల్సిందేమీ లేదనిపించింది. ఈ అమ్మాయిలకు భయం. పరీక్షలు మద్రాసు మెడికల్‌ కాలేజీలో చదివిన మగపిల్లలతో పాటు రాయాలి. ఆ కాలేజీలో ఎన్నో సౌకర్యాలు. మంచి ఉపాధ్యాయులు. పెద్ద ఆసుపత్రి. వాళ్ళతో పాటు సమానంగా తమకూ పరీక్షలనే ఆలోచనకే ఒణికిపోయారు. కానీ మేరీ సంతోషించింది. వీళ్ళలో ఒక్కరు పాసయినా, పాసయిన వాళ్ళకు మద్రాసు మెడికల్‌ కాలేజీ నుంచి డిగ్రీ సర్టిఫికెట్‌ ఇస్తానని ఆ కాలేజీ ఒప్పుకోవటమే తను సాధించిన విజయమని ఆమె ఆనందపడిరది.

ఈ సంవత్సరం ఒకరు పాసైతే మరుసటి ఏడాది ఇద్దరు పాసవొచ్చు. పిల్లలకూ తనకూ కూడా ఆ పరీక్ష విధానం అలవాటవుతుంది అనుకుంది ఆమె. కానీ ఆ పిల్లలు మాత్రం భయంతో ఏడ్చారు. తాము పరీక్షలకు వెళ్ళమని మొండికేశారు. మేరీ అందరికీ ధైర్యం చెప్పి తీసుకెళ్ళింది. లోపల ఆమెకీ బెదురే. ఏ సౌకర్యం, ఏ పరికరాలూ సరిగా లేకుండా చదివిన వీళ్ళు పరీక్షలేం రాస్తారు. అందరూ నవ్వుతారు. ఒక్కరైనా పాస్‌ కాకపోతే ఇంకెవరూ చేరాలనుకోరేమో ` నాలుగేళ్ళు ఇంత కష్టపడటం వృధా అనుకుంటారేమో. ఎన్నో సందేహాలు.

ఎలాగైతేనేం ఆ అమ్మాయిలు పరీక్షలు రాసొచ్చారు. ఈ డాక్టరమ్మ దైవం మీద భారం వేసి తన పని తాను చేసుకుంటోంది.

చివరికి ఫలితాలు వచ్చాయి “ శారదా  వాళ్ళు పాసయ్యారంటావా?”

‘‘కొందరైనా తప్పక పాసై ఉంటారు నాన్నా’’ శారద ఆందోళన, ఉత్సాహం కలగలసిన గొంతుతో అంది.

‘‘కొందరు కాదమ్మా. అందరూ పాసయ్యారు. పాసవటం కాదమ్మా ఫస్టున పాసయ్యారు. మద్రాసు మెడికల్‌ కాలేజీలో చదివిన మగపిల్లలెవరికీ వీళ్ళకొచ్చినన్ని మార్కులు రాలేదు. వీళ్ళు అన్నింటిలో ఫస్టున వచ్చారు. ఇక వాళ్ళ ఆనందం పట్టగలమా? ఇపుడు మన భారతదేశపు ఆడవాళ్ళ ప్రాణాలు కాపాడటానికి పదిమంది ఆడవాళ్ళు డాక్టర్లుగా  తయారై ఉన్నారు. అదెంత గొప్ప విషయం. వెల్లూరులో ఆడపిల్లల కోసం మెడికల్‌ కాలేజీ పెట్టటానికి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. సహాయం చేస్తానంది. విరాళాలు వచ్చాయి. ఇప్పుడు ఆ పని ఇంకా బాగా జరుగుతోంది’’.

శారద సంతోషం పట్టలేక తండ్రి మెడను కావలించుకుని ‘‘నేనా కాలేజీలో చదువుతాను నాన్నా’’ అంది సంబరంగా.

నరసమ్మ శారదను తన దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది.

‘‘నేను ఫస్టున పాసవుతా. అందరి ప్రాణాలు రక్షిస్తా’’ శారద నాన్నమ్మ ఒళ్ళోనించి దిగి గంతులేసింది.

‘‘నువ్వంతపని చేస్తావు. బంగారు తల్లివి పొద్దు పోయింది. పోయి పడుకో’’.

శారదకు వెళ్ళాలని లేదుగానీ నాన్నమ్మ మాట వినక తప్పదని తెలుసు. శారద వెళ్ళిపోయాక నరసమ్మ కొడుక్కి దగ్గరగా జరిగి ‘‘కథ బాగుందిరా నాన్నా. నా కోసమే చెప్పావు. నీ ఉద్దేశం మంచిదే. నాకూ అర్థమైంది. అర్థమవటం వేరు. ఆచరించటం వేరు. నన్ను కాశీ పంపించి శారదను బాగా చదివించు. డాక్టర్ని చెయ్యి.’’

‘‘అంతేనా అమ్మా’’

‘‘అంతేరా. నేను మారలేను. రేపో మాపో పిల్ల పుష్పవతై పెళ్ళి కాకుండా ఉంటే చూసి నేను భరించలేను. ఆ అనాచారపు కొంపలో నేనుండలేను. నువ్వు మంచిపనే చేస్తున్నావు. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది’’ నరసమ్మ లేచి వెళ్ళింది.

రామారావుకి కూడా గుండెలోంచి కొంత బరువు దిగినట్లయింది. తల్లిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ చాలాసేపు అలాగే కూర్చుండి పోయాడు.

ఇక రామారావు తల్లిని కాశీ పంపాకే తను మద్రాసు వెళ్ళాలని అనుకున్నాడు. అమ్మ సంకల్పం సవ్యంగా జరగాలి. తొందరగా జరగాలి. ఇంటి విషయాల్లో తనకింత కార్యదక్షత ఉందని రామారావుకి తెలియదు. ఈ విషయంలోనే తెలిసొచ్చింది. తన మిత్రులు కొందరు కాశీలో చదువుతున్నారు. వారికి ఉత్తరాలు రాశాడు. తల్లి వెళ్ళే సమయానికి ఆవిడకు వసతి సౌకర్యాలు చూసే పని వాళ్ళకు అప్పగించాడు. నెల రోజుల సమయం ఉంది. ప్రయాణాయాసమే తల్లికి కష్టం అనిపించింది గానీ చేయగలిగింది లేదు. నాగపూర్‌లో, ఇంకా ఇతర స్టేషన్లలో ఉన్న తన స్నేహితుల ఇళ్ళల్లో ఒకటి రెండు రోజులు ఆగి ప్రయాణం కొనసాగించేలా ఏర్పాటు చేశాడు. రైళ్ళు మారుతూ ఏకధాటి ప్రయాణం తట్టుకునే శక్తి తల్లికి ఉండదని అతని ఆలోచన. నరసమ్మ గుంటూరు తప్ప ఎక్కడికీ వెళ్ళిన మనిషి కాదు. రామారావు ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే నరసమ్మ వ్యవసాయం పనులు కొన్ని చక్కబెట్టి కొడుక్కి చెప్పబోయింది.

‘‘అదంతా నాకొదిలేయ్‌ అమ్మా. నువ్విక్కడి చీకు చింతలేవీ కాశీ తీసుకెళ్ళటం లేదు. సరేనా?’’ అన్నాడు రామారావు.

నరసమ్మ నవ్వి ఊరుకుంది.

సుబ్బమ్మకు ముందు చాలా దిగులనిపించింది. భర్త ఎప్పుడూ మంది మనిషే గాని ఇంటి మనిషి కాడు. ఇంట్లో అంతా సవ్యంగా ఏ లోటూ లేకుండా జరుగుతోందంటే అదంతా అత్తగారి నిర్వహణ వల్లే. ఇప్పుడావిడ లేకపోతే తను ఒంటరిదైపోదా? ఈ మాట అత్తగారితో అని చూసింది గానీ అక్కడి నుంచీ బదులేమీ రాలేదు. సరే ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందిలే అనుకుంది. అది సుబ్బమ్మ స్వభావం. దేని గురించీ ఎక్కువ ఆలోచించదు బాధపడదు. అంతమందిని చూసుకునే భర్త, తననూ, కూతుర్ని చూసుకోడా? అసలు కూతురంటే ఆయనకు ప్రాణం. ఆ పిల్ల చదువుకే తల్లీ కొడుకూ దూరమవుతున్నారు. తల్లంటే రామారావుకున్న ప్రేమ సుబ్బమ్మకు తెలియనిది కాదు. అలాంటి తల్లిని దూరం చేసుకుంటున్నాడంటే కూతురి భవిష్యత్తు గురించి ఎంత శ్రద్ధ, ముందుచూపు ఉండి ఉండాలి. ఇలా ఆలోచించి సుబ్బమ్మ నిశ్చింతురాలైంది.

మొత్తానికి ఇంకొక ఇంట్లో అయితే రచ్చ కావలసిన వ్యవహారం ఆ ఇంట్లో మనుషుల మధ్యనున్న ప్రేమానుబంధాల వల్లా, తెలివితేటల వల్లా, సంస్కారం వల్లా ఒక సంబరంలాగా జరిగిపోతోంది.

బంధువులు వచ్చి నరసమ్మను చూసి వెళ్తున్నారు. కాశీ పంపించే కొడుకుని కన్నందుకు అభినందించి వెళ్తున్నారు.

శారదకు మాత్రం నాన్నమ్మ వెళ్ళటం నచ్చలేదు.

‘‘నాన్నమ్మా. నువ్వెందుకు కాశీ వెళ్ళటం. నా దగ్గరే ఉండు’’ అని రోజూ పేచీ పెడుతూనే ఉంది.

నరసమ్మ కాశీ మహత్యాన్ని గురించి మనవరాలితో రోజూ కథగా చెబుతోంది. ఎన్ని చెప్పినా నాయనమ్మను తననుంచి లాక్కుంటున్న కాశీ అంటే శారదకు ఇష్టంగా అనిపించలేదు.

‘‘మళ్ళీ ఎప్పుడొస్తావు’’ అని శారద అడిగితే

‘‘నేను రాను. నన్ను చూడటానికి నువ్వే రావాలి. నీ పెళ్ళయ్యాక మీ ఆయనతో కలిసిరా’’ మనవరాలి బుగ్గలు ముద్దాడుతూ.

ఆ మాటలు చెబుతున్నపుడు తన కంఠంలో దు:ఖం పలకకుండా ఉండటానికి ఆమె కఠిన ప్రయత్నమే చేసి జయించింది. అది కనిపెట్టలేని శారద ‘‘నేను పెళ్ళి చేసుకోనుగా’’ అంది.

‘‘ఐతే నేను నిన్ను కాశీ రానివ్వను’’ నవ్వింది నరసమ్మ.

‘‘కాశీ నీదా? ఎవరైనా రావొచ్చు. నేను వస్తా. నాన్నను తీసుకునేవస్తా’’ అంది శారద పంతంగా.

‘‘అలాగే  మీ నాన్నతో కలిసిరా’’ ఒప్పుకుంది నరసమ్మ.

‘‘ఐతే కాశీ కథ చెప్పు’’ అన్నది నాన్నమ్మ దగ్గరగా జరుగుతూ . నరసమ్మ అగస్త్యుడు కాశీ ఒదిలి వెళ్ళాల్సిన పరిస్థితినీ, కాశీలో ఎక్కడా తినటానికి ఇంత తిండి దొరకక కాశీనే శపించాలనుకున్న తీరునీ చక్కని కథలాగా చెబుతోంది.

శారదకు అగస్త్యుడి మీద చాలా జాలివేసింది. నాన్నమ్మ చెబుతున్న కథను ఆపి

‘‘ఆకలి బాగా వేస్తున్నపుడు అన్నం లేకపోతే చాలా కష్టం కదు నాన్నమ్మ. అమ్మో ఎలా ఆపుకోవాలి ఆకలిని ` కళ్ళు తిరిగిపోతాయి కదా’’.

‘‘ఔనమ్మా ఆకలితో ఉండడం చాలా కష్టం. ఆకలేసినపుడు దానిని చల్లార్చుకోటానికి మనుషులు ఎంత పనైనా చేస్తారు. చేయకూడని పనులు కూడా చేస్తారు’’.

‘‘ఆకలేసినపుడు అందరికీ అన్నం దొరకాలి’’ శారద తీర్మానం చేసింది.

‘‘కొందరు దురదృష్టవంతులకు దొరకదు తల్లీ’’.

‘‘దొరకాలి  అంతే. మనం వాళ్ళకి అన్నం పెట్టచ్చు’’.

‘‘అందరికీ నీ అంత పెద్ద మనసుండొద్దూ, పెట్టాలనిపించొద్దూ, అగస్త్యుడంతటి వాడికే కాశీలాంటి నగరంలో అన్నం దొరకలేదు. ఇక మామూలు వాళ్ళెంత. ఒకోసారి ఎవరికీ పెట్టాలనిపించదు’’.

‘‘కాదు ఎవరైనా పెట్టటం కాదు. ఎవరూ పెట్టనక్కర్లా. వాళ్ళకి అన్నం ఉండాలి అంతే. ఈశ్వరుడు అలా చెయ్యలేడా?’’ శారద తీవ్రంగా ఆలోచిస్తోంది.

‘‘చెయ్యగలిగితే చేసేవాడేగా చెయ్యలేడేమో’’ తమాషాగా అంది నరసమ్మ. శారద దానిని తమాషాగా తీసుకునే స్థితిలో లేదు.

‘‘చెయ్యలేడా  ఐతే నేను చేస్తా’’ శారద ఆమాట అన్న తీరుకి నరసమ్మ ఆపకుండా నవ్వింది. నవ్వి నవ్వి పమిటి చెంగుతో కళ్ళల్లోకి వచ్చిన నీళ్ళు తుడుచుకుంటూ శారద వంక చూస్తే ఆ పిల్లముఖం చిన్నబోయింది. నరసమ్మ నవ్వు ఆపి ‘‘చిట్టితల్లీ  ఎందుకంత చిన్నబుచ్చుకుంటావు? నువ్వూ, మీ నాన్నా ఏమైనా చెయ్యగలమనుకుంటారు. నిన్ను డాక్టర్ని చేసి లోకంలో అందరి ప్రాణాలూ రక్షిస్తాననుకుంటాడు వాడు. నువ్వేమో ఆకలేయగానే అందరికీ అన్నం దొరికేలా చెయ్యగలననుకుంటావు. మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. నవ్వితే నీకు కోపం’’ శారదను ఒళ్ళో కూచోబెట్టుకుని ముద్దాడి మిగిలిన కథ చెప్పింది నరసమ్మ. శారద కథ వింటున్నదే గాని ఆకలేయగానే అన్నం తినేలా అందరికి అన్నం ఇచ్చే దేవుడెవరా అని ఓ పక్క ఆలోచిస్తూనే ఉంది.

మొత్తానికి ఊరంతా అన్న సంతర్పణ చేసి నరసమ్మ కాశీ వెళ్ళేందుకు రైలెక్కింది. తల్లిని రైలెక్కించి వచ్చాక ఒక రోజంతా రామారావు చాలా నిరుత్సాహంగా, దీనంగా ఉండిపోయాడు. మళ్ళీ తల్లిని చూడగలనా అనే ప్రశ్న చాలా వేధించింది. ఐతే అప్పటికే ఆయన మనసులో ఒక ఆలోచన స్థిరపడిరది. తల్లిని చూడటానికి వచ్చిన బంధువులంతా శారద పెళ్ళి గురించే మాట్లాడటం ఆయన గమనించాడు. శారద ఆ ఊళ్ళోనే ఉండిపోతే అదొక సమస్య అవుతుందనిపించింది. శారద మనసుకి ఆ సమస్య మంచిది కాదనే అనిపించింది. ఆయన మద్రాసు వెళ్ళి కూచుంటే విశాఖపట్నం, హైదరాబాదు తిరుగుతుంటే సుబ్బమ్మ ఈ బంధుగణాలకు సమాధానం చెప్పలేక సతమతమవుతుంది. బంధువులు సుబ్బమ్మనడిగి ఊరుకోరు. ఆమెను తోసుకుంటూ శారద దాకా వస్తారు. చిన్న శారదకా చికాకెందుకు? పైగా ఈ ఊళ్ళో చదువు శారద భవిష్యత్తుకు సరిపోదు. ఇప్పటినుంచే మద్రాసులోని మంచి స్కూల్లో చేర్పిస్తే గట్టి పునాది పడుతుంది. ఆ ఆలోచనతో దాదాపు వెంటనే కాపురం మద్రాసుకు మార్చాలనే నిర్ణయం తీసేసుకున్నాడు. అక్కడ ఆయన వెళ్ళినపుడు ఉండేందుకు ఒక ఇల్లు ఉండనే ఉంది. సుబ్బమ్మ శారదలని తీసికెళ్తే ఆ ఇల్లు కళకళలాడుతుంది. బంధుమిత్రులు అక్కడికి వచ్చినా ఆ వాతావరణంలో ఈ ఇరుకు ప్రశ్నలు వెయ్యలేరు. శారద జీవితం విశాలమైన రహదారిలో ప్రయాణిస్తుంది.

రామారావుకి ఆలోచన వస్తే అమలు చేయటమే తెలుసు. కాదనేవారెవరూ లేరు. పొలమంతా మంచి రైతులని చూసి కౌలుకిచ్చాడు. ఇంట్లో కొన్ని గదులలో పురోహితుడి గారి కుటుంబం ఉండేలా ఏర్పాటు చేశాడు. వాళ్లు ఇల్లంతటినీ శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకుంటారు. గంపెడు సంతానంతో ఇరుకింట్లో ఉంటున్న పురోహితుడు ఈ ఏర్పాటుకి పరమానందపడ్డాడు. ఈ పనులన్నీ అయ్యేసరికి నెలరోజులు పైనే పట్టింది. నరసమ్మతో పాటు కాశీ వెళ్ళిన సోమేశ్వరరావు వచ్చాడు. నరసమ్మ రాకపోవటం ఊరివాళ్ళను ఆశ్చర్యపరచలేదు. ఈ నెలరోజులు రామారావు చేస్తున్న మార్పులు చూసి వాళ్ళు నరసమ్మ కాశీనుంచి ఇప్పుడిప్పుడే రాదనే అనుకున్నారు. నరసమ్మకు కాశీలో మంచి వసతి దొరికిందనీ, తెలుగువాళ్ళ పొరుగునే ఉందనీ, చాలా సంతోషంగా ఉందనీ సోమేశ్వరరావు చెప్పాడు. రామారావుకి అప్పటికప్పుడు వెళ్ళి తల్లిని చూడాలనిపించింది. నిగ్రహించుకున్నాడు. తల్లికి ఉత్తరం రాశాడు. తన స్నేహితులకు తల్లి యోగక్షేమాలు చూస్తుండమని ఉత్తరాలు రాసి ఆగని కన్నీళ్ళను అడ్డుపెట్టకుండా ఉండిపోయాడు.

***

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 10

                                                                  Anne Of Green Gables By L.M.Montgomery

 మిసెస్ రాచెల్ విషయం లో అయిన గొడవ గురించి మెరిల్లా వెంటనే మాథ్యూ కి చెప్పలేదు . క్షమాపణ చెప్పదల్చుకోకపోతే గది దాటి రావద్దని మెరిల్లా ఆజ్ఞాపించింది కనుక ఆన్ తన గదిలోనే మొండికేసుకు కూర్చుండిపోయింది . మర్నాడు పొద్దున బ్రేక్ ఫాస్ట్ కి  ఆమె ఎందుకు రాలేదో  మాథ్యూ అడిగినప్పుడు  ఇక చెప్పక తప్పలేదు …ఆన్ ప్రవర్తన ఎంత విపరీతంగా ఉందో అర్థంఅవాలని  అతి వివరంగా చెప్పుకొచ్చింది మెరిల్లా.

” మిసెస్ రాచెల్ కి బాగానే అయిందిలే , ఎక్కడ లేని సంగతులూ ఆవిడకే కావాలి ” – మాథ్యూ ఓదార్పు.

” మాథ్యూ కుత్ బర్ట్ ! ఏమిటిది ?? ఆన్ అంత ఛండాలంగా చేస్తే దాని వైపు మాట్లాడతావేం ? కొంపదీసి దాన్నేమీ  శిక్షించద్దంటావా ?”

” అబ్బే, అలా అనేమీ కాదూ ” తడబడ్డాడు మాథ్యూ. ” కొద్దిగా..దండించచ్చులే. మరీ కటువుగా ఉండకు పాపం- దానికి మంచీ చెడ్డా ఎవరు నేర్పారు గనక ? నువ్వు..నువ్వు దానికి తినటానికేమైనా ఇచ్చావా ?”

” ఆ, డొక్క మాడుస్తాను మరి ” –  కస్సుమంది మెరిల్లా – ” మూడు పూట్లా వేళ కి భోజనం పెడుతున్నాను, నేనే తీసుకెళ్ళి ఇస్తున్నాను. తప్పు ఒప్పుకుని రాచెల్ కి క్షమాపణ చెబుతాననేవరకూ మాత్రం అది కిందికి రావటానికి వీల్లేదు, అది ఖాయం ”

పొద్దున , మధ్యాహ్నం , సాయంత్రం – అన్ని భోజనాలూ నిశ్శబ్దంగా సాగాయి , ఆన్ పట్టు వదల్లేదు. పళ్ళెం నిండా అన్నీ సర్ది మెరిల్లా తూర్పు గదికి పట్టుకెళుతోంది – కొంచెం మటుకే తరిగిన భోజనాన్ని వెనక్కి తెస్తోంది. ఆ సాయంత్రం , ఎలా వెళ్ళిన పళ్ళెం అలాగే తిరిగిరావటం మాథ్యూ కళ్ళబడింది. ఆన్ ఏమీ తినటం లేదా ఏం ? అతని ప్రాణం కొట్టుకుపోయింది.

ఇంటి వెనక బీడులో మేస్తున్న ఆవులని తోలుకొచ్చేందుకు మెరిల్లా వెళ్ళింది. అదను కోసం కాచుకుని ఉన్న మాథ్యూ మెల్లగా ,  దొంగలాగా మేడమీదికి వెళ్ళాడు. రోజూ వంటింట్లో భోజనం చెయ్యటం, హాల్ కి ఆనుకుని ఉన్న తన చిన్న పడకగదిలో నిద్రపోవటం – అంతకుమించి మాథ్యూ ఇంట్లో తిరిగేది లేదు. ఎప్పుడైనా టీ తాగేందుకు పాస్టర్ వచ్చి ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ వసారాలో కాసేపు కూర్చుంటాడు  . తన సొంత ఇంటి మేడ మీదికి మాథ్యూ వెళ్ళి ఇంచుమించు నాలుగేళ్ళయిపోయింది  – అప్పుడూ తూర్పుగదికి రంగులు వేసేందుకు మెరిల్లా కి సహాయంగా వెళ్ళాడంతే.

చప్పుడు కాకుండా , మునివేళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆన్ గది ముందు కాసేపు ఆగిపోయాడు. ధైర్యం తెచ్చుకుని చిన్నగా తలుపు తట్టి , ఓరగా తెరిచి తొంగి చూశాడు.

ఆన్ పసుప్పచ్చ కుర్చీలో కూర్చుని దిగాలుగా తోట లోకి చూస్తోంది. మాథ్యూ కళ్ళకి ఆమె అర్భకం గా  ,  బెంగ పడి ఉన్నట్లుగా   కనిపించి అతని మనసు కరిగిపోయింది.  శబ్దం అవకుండా తలుపు మూసి అలాగే మునివేళ్ళ మీద ఆన్ దగ్గరికి వెళ్ళాడు.

మెరిల్లాకి వినబడిపోతుందేమోనని , రహస్యంగా పిలిచాడు – ” ఆన్ ! ఏం చేస్తున్నావమ్మా ? ”

ఆన్ నీరసంగా నవ్వింది.

anne10-2

” బాగున్నాను. చాలా చాలా ఊహించుకుంటూ ఉన్నాను, అలా రోజు గడిచిపోతోంది. ఒంటరిగానే ఉంది – నిజమే , అలవాటైపోతుందిలెండి ”

మళ్ళీ నవ్వింది- ఏళ్ళ తరబడి ఎదురవబోతున్న ‘ ఏకాంత కారాగారవాసాన్ని ‘ ధైర్యం గా ఎదుర్కొంటున్నట్లు.

తను ఏమి చెప్పాల్సి ఉందో గుర్తు తెచ్చుకున్నాడు మాథ్యూ- గబ గబా చెప్పెయ్యాలి, మెరిల్లా వచ్చేసేలోపు. ” ఆ పనేదో పూర్తి చేసెయ్యకూడదూ ? ఎప్పటికైనా తప్పదు నీకు , మెరిల్లా కి మా చెడ్డ పట్టుదల , ఊరుకోదు. ఆమె చెప్పినట్లు చేసేస్తే ఒగదెగిపోతుంది కదా ? ” గుస గుసగా అన్నాడు.

” మిసెస్ రాచెల్ కి క్షమాపణ చెప్పటం గురించేనా మీరనేది ? ”

” క్షమాపణ ..ఆ , అదే, అదే. చెప్పెయ్యకూడదా ? ”

” మీకోసం…మీరు చెప్పమంటే..చెబుతానేమో ” ఆన్ ఆలోచిస్తూ అంది – ” జరిగిందానికి బాధపడుతున్నాను అని చెప్పటం లో అబద్ధం ఉండదు, ‘ ఇప్పుడు ‘ బాధ పడుతున్నానుగా ! నిన్న రాత్రైతే అలా లేను , పిచ్చి కోపంగా ఉండింది. మూడు సార్లు మెలకువొచ్చింది, ప్రతిసారీ కోపం ఎక్కువౌతూనే ఉంది. తెల్లారేసరికి…అంతా పోయింది , ఖాళీ గా అయిపోయానేమిటో. సిగ్గు పడుతున్నాను కూడా ..కాని వెళ్ళి మిసెస్ రాచెల్ కి క్షమాపణ చెప్పటం ….చా..లా అవమానకరంగా అనిపించింది. ఇక ఇలాగే ఎప్పటికీ ఈ గదిలోనే ఉండిపోదామని నిశ్చయించేసుకున్నాను… మీ కోసం అయితే – ఏమైనా చెయ్యగలను ..మీరు నిజంగా చెయ్యమంటే….  ‘’ – నసిగింది.

” చెయ్యమనే  కదా అంటున్నాను ? నువ్వు లేకపోతే కిందని ఇల్లంతా ఏమీ బాగోలేదు. వెళ్ళు, వెళ్ళి చెప్పు మెరిల్లాకి, మంచిదానివి కదూ ? ”

” సరే అయితే ” ఆన్ లొంగిపోయింది – ” మెరిల్లా రాగానే చెప్పేస్తాను ”

” నిజంగా..!  మంచిది..చాలా బాగుంది  ” సంతోషపడిపోయాడు మాథ్యూ – ” నేను చెప్పానని మటుకు మెరిల్లాకి చెప్పకూ…అనవసరంగా కలగజేసుకున్నాననుకుంటుంది ”

” చచ్చినా చెప్పను ” హామీ ఇచ్చింది ఆన్- ” అవునూ , చచ్చాక ఎలా చెప్పగలరూ ఎవరైనా ? ”

జవాబు చెప్పటానికి మాథ్యూ అక్కడ ఉంటే కదా…తన గెలుపుకి తనే జడుసుకుని – వెళ్ళే పోయాడు . మెరిల్లా కి ఏ మాత్రం అనుమానం రాకుండా గుర్రపుసాల లో ఒక మూల దాక్కున్నాడు.  ఇంట్లోకి వచ్చిన మెరిల్లా కి-  ఏడ్చి బొంగురుపోయిన గొంతుతో   ‘ మెరిల్లా ‘ అని మేడ మీదినించిపిలవటం వినిపించింది. సంతోషం..ఆశ్చర్యం .. అయినా బింకంగా ” ఆ, ఏమిటీ ” అంది.

” ఏమీ లేదూ..అదే..మరీ..నేను మిసెస్ రాచెల్ తో అలా మాట్లాడేశాను కదా, దానిగురించి సిగ్గుపడుతున్నాను- వెళ్ళి క్షమాపణ అడగమంటావా ? ”

మెరిల్లా ‘ అమ్మయ్య ‘ అనుకుంది, కాని పైకి తేలలేదు –  ఆన్ దారికి రాకపోతే ఏం చెయ్యాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉన్నా కూడా. ” సరే. పాలు తియ్యటం అయాక నిన్ను కిందికి తీసుకొస్తాలే ” అని మాత్రం చెప్పింది.

ఆ ప్రకారంగా- పాలు పితకటం ముగిశాక, మెరిల్లా  విజయగర్వం తో నిటారుగా మేడ దిగుతోంది.  ఆ వెనక ఆన్ కుంగిపోతూ వస్తోంది .  అయితే సగం మెట్లు దిగగానే  ఆ దిగులు మంత్రం వేసినట్లు మాయమైంది . తలెత్తి కిటికీ లోంచి సూర్యాస్తమయాన్ని చూస్తూ , అణుచుకుంటున్న ఉత్సాహం కనబడిపోతుండగా తేలు తూ కిందికి వచ్చింది . ఈ పరిణామం మెరిల్లాకి పెద్దగా నచ్చలేదు ..పశ్చాతాపం తో కుమిలిపోతూ క్షమాపణ అడగబోయే శాల్తీ అలాగేనా ఉండేది ?

” ఏమిటి ఆలోచిస్తున్నావు ఆన్ ? ” పదునుగా అడిగింది.

” మిసెస్ రాచెల్ తో ఏం చెప్పాలో ఊహించుకుంటున్నాను ” ఆన్ ఎప్పట్లాగా కలలు కంటూన్న గొంతుతో జవాబిచ్చింది.

ఆ మాటలు మెరిల్లాకి తృప్తి కలిగించాలి నిజానికి, కాని ఎందుకో అనుమానం తగిలింది. తను వేయబోతున్న ‘ శిక్ష ‘ బెసకబోతోందా ఏమిటి ? లేకపోతే ఆన్ కి ఆ  ఆనంద పారవశ్యం ఎందుకూ ?

మిసెస్ రాచెల్ ఇంటికి వెళ్ళే వరకూ ఆన్ అలాగే ఉంది గానీ లోపలికి వెళుతూనే ఒక్కసారిగా మారిపోయింది. మొహం లో అణువణువునా పశ్చాతాపం పొంగిపోతుండగా మిసెస్ రాచెల్ ముందు మోకాళ్ళ మీద కూలబడి ప్రార్థిస్తున్నట్లు  చేతులు చాచింది – ఆవిడ  విస్తుపోయింది.

” మిసెస్ రాచెల్ ! జరిగినదానికి నేనెన్..తో చింతిస్తున్నాను. ఎంతగా అంటే , చెప్పేందుకు ఒక నిఘంటువు మొత్తం అయినా సరిపోనంతగా..మీరే ఊహించుకోగలరు ! మీ పట్ల నేను ఘోరంగా ప్రవర్తించాను, నా ఆత్మీయులైన మాథ్యూ మెరిల్లాలకి తలవంపులు తెచ్చాను. నేను అబ్బాయిని కాకపోయినా కూడా నన్ను వాళ్ళతో ఉండనిచ్చినా కూడా ,  నేను ఇంత చెత్తగా చేశాను,కృతఘ్నురాలిని –  నన్ను మర్యాదస్తులందరికీ దూరంగా పంపివేయాలి.  మీరు నిజమే చెప్పారు, నా జుట్టు ఎర్రగానే ఉంటుంది, నా మొహం మీద మచ్చలున్నాయి..నేను పీలగా అనాకారిగానే ఉన్నాను – అయినా నాకు విపరీతంగా కోపం వచ్చింది, అలా రాకూడదు, తప్పు.

నేను మిమ్మల్ని అన్నవన్నీ కూడా నిజమే, కానీ నేను అలా అనిఉండకూడదు , తప్పు.

దయచేసి నన్ను క్షమించండి మిసెస్ రాచెల్ ! ” ఆన్ పెద్దగా శోకం పెట్టింది ..” మీరు క్షమించకపోతే, నన్ను తిరస్కరిస్తే- ఒక అనాథ కు జీవితాంతమూ దుఃఖం కలిగించినవారవుతారు , ఆమె చాలా కోపిష్టి అనాథ పిల్లే అయినా కూడా ”

ఆన్ చేతులు జోడించి , తల దించుకుని, తీర్పు కోసం ఎదురుచూస్తున్న భంగిమలో ఉండిపోయింది.

ఆమె నిజాయితీని శకించేందుకు వీల్లేదు , అది ఆమె గొంతులో ఉట్టిపడుతూ ఉంది…మిసెస్ రాచెల్, మెరిల్లా ఇద్దరికీ ఆ సంగతి అర్థమైంది. అయితే  ఆ సందర్భాన్ని ఆన్ అమితంగా ఆస్వాదించేస్తోందని మెరిల్లాకి అర్థమై గతుక్కుమంది .  తన  ‘పతనాన్ని ‘ పరిపూర్ణంగా  , నాటకీయం గా  మలచుకుని  ఆన్ సరదాగా అభినయిస్తోంది . ఇంకెక్కడి శిక్ష ?

పాపం, మిసెస్ రాచెల్ ఊహ అంత దూరం పోలేదు ..ఆన్ అంత పద్ధతిగా  క్షమాపణ చెప్పినందుకు ఆవిడ ఆగ్రహం మొత్తం శాంతించింది. ఏమాటకామాటే చెప్పాలి, కాస్త అధికప్రసంగే గానీ ఆవిడ మనసు మెత్తనిది.

” లేదు లేమ్మా, లే. పర్వాలేదు లే ” మనస్ఫూర్తిగా అంది – ” ఎందుకు క్షమించనూ, క్షమిస్తున్నాను నిన్ను . నేనైనా కొంచెం  కఠినంగానే  మాట్లాడానులే నీ గురించి. నాకు ఉన్నది ఉన్నట్లు చెప్పెయ్యటం అలవాటు మరి…అన్నట్లు నాకొక అమ్మాయి తెలుసు , దాని జుట్టు నీ జుట్టు కన్నా ఎర్ర..గా ఉండేది . పెరిగి పెద్దయ్యాక అది చక్కగా ముక్కుపొడి  రంగు[auburn ] లోకి మారిపోయింది. నీ జుట్టూ అలాగే అవుతుందేమో, ఎవరికి తెలుసు ? అయినా నాకేం ఆశ్చర్యం లేదు … ”

anne10-1

ఆన్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ లేచి నిల్చుంది – ” మిసెస్ రాచెల్ ! నాకు ఆశ కల్పించారండీ మీరు..మీ మేలు మర్చిపోను ! జుట్టు బాగుంటే మంచిగా నడుచుకోవటం ఎంతో సులువండీ ! నేను అలా మీ తోట లోకి వెళ్ళి ఆపిల్ చెట్టు కింద బెంచీ మీద కూర్చోవచ్చా ? మీరిద్దరూ మాట్లాడుకుంటారు కదా, అక్కడ కూర్చుంటే ఊహించుకోవటానికి బోలెడంత వీలుగా ఉండేలా ఉంది ”

ఆన్ వెళ్ళాక మిసెస్ రాచెల్ లేచి దీపం వెలిగించింది.

” ఇలా ఈ కుర్చీ లో కూర్చో మెరిల్లా, ఇంకొంచెం హాయిగా ఉంటుంది నీకు. ఆ..మొత్తానికి విడ్డూరపు  పిల్ల !  కాని దీనిలో ఆకట్టుకునే లక్షణమేదో ఉంది, అందుకే మీరు అట్టే పెట్టుకున్నారు… నాకు తెలిసింది.  మీ మీద జాలి పడేందుకేమీ లేదులే , బాగానే తయారయేలా ఉంది. కాకపోతే కొంచెం దూకుడెక్కువలా ఉంది, మీ దగ్గర ఉంటూ ఉంటే నెమ్మదిగా అదీ సర్దుకుంటుందిలే. కాస్త ప్రథమ కోపం ఉన్నట్లుంది- నిజానికి అలాంటివాళ్ళ కోపం ఊరికే చల్లబడిపోతుంది. పైకేమీ  మాట్లాడకుండా వెనకాల గోతులు తీసే నంగనాచులకన్నా ఇలాంటివాళ్ళు చాలా నయం …మొత్తానికి పిల్ల నాకు

నచ్చింది  ”

కాసేపాగి మెరిల్లా, ఆన్ – ఇంటికి బయల్దేరారు. మిసెస్ రాచెల్   ఇచ్చిన  తెల్లటి నార్సిసస్ పూల సువాసనని పీల్చుకుంటూ ఆన్ అడిగింది – ” బాగా చెప్పాను కదూ క్షమాపణ ? ఎలాగూ చెబుతున్నాను కదా అని పద్ధ..తి గా చెప్పాను ”

” అవునవును. బాగా చెప్పావులే ” అంది మెరిల్లా… నవ్వు రాబోయినందుకు   తనని తను తిట్టుకుంది.   మరీ అంత పద్ధతిగా చెప్పినందుకు ఆన్ ని మందలించాలేమో అనుకుంది గానీ అదెలా కుదురుతుంది ? ” ఇలా క్షమాపణ చెప్పే పరిస్థితులు ఎక్కువ తెచ్చుకోకు ” అని మాత్రం అనగలిగి సమాధానపడింది.

” నా ఆకారం గురించి ఎవరూ మాట్లాడకపోతే నేను బుద్ధిగానే ఉంటాను ”   భరోసా ఇచ్చింది ఆన్ – ” వేరే సంగతులేమీ పట్టించుకోనుగాని నా జుట్టు గురించి మాట్లాడితే…నాకు మండిపోతుంది ! అవునూ నా జుట్టు కూడా పెద్దయ్యాక  ‘ చక్కటి ముక్కుపొడిరంగు ‘  లోకి మారుతుందా ? ”

” నువ్వెలా ఉంటావూ అనేదాని గురించి అంత ఎక్కువ ఆలోచించకూడదు నువ్వు, అది మంచిది కాదు ”

” నేను సాదాగా ఉంటానని తెలిసి కూడా ఎలా చెప్పు ? ” ఆన్ ప్రతిఘటించింది – ” అందమైనవి అంటే నాకెంతో ఇష్టం..అందంగా లేని నన్ను అద్దం లో చూసుకుంటే దిగులు పుడుతుంది, నా మీద నాకు జాలేస్తుంది ”

” అందం కన్నా స్వభావమూ  ప్రవర్తనా ముఖ్యం ”  [Handsome is as handsome does ] మెరిల్లా చెప్పింది.

” చాలా సార్లు విన్నాను ఈ మాటలు, నాకంతగా నమ్మకం లేదు. ఈ పూలెంత మంచి వాసనేస్తున్నాయో , వాటిని మిసెస్ రాచెల్ నాకు ఇవ్వటం ఎంతో బావుంది కూడా. నాకు ఆవిడ మీద కోపం లేదు ఇప్పుడు. తప్పు చేశానని ఒప్పుకోవటం , క్షమించబడటం చాలా సుఖంగా ఉంటాయి నిజంగా. ఈ రాత్రి నక్షత్రాలు భలే వెలుగుతున్నాయి కదా ? నక్షత్రం లో ఉండేందుకు వీలుంటే ఎందులో ఉంటావు మెరిల్లా నువ్వు ? నేనైతే –  అదిగో, ఆ కొండ మీద పెద్ద నక్షత్రం వెలుగుతోంది చూడు….అందులో ఉంటాను ”

” కాసేపు నోరు మూసుకుంటావా ? ” మెరిల్లా విసుక్కుంది. ఆన్ ఆలోచనల వెనకాల పరిగెత్తలేక అలిసిపోయి ఉంది ఆమె.

వాళ్ళ వీధి లోకి వచ్చేవరకూ ఆన్ ఇంకేం మాట్లాడలేదు. షికారు బయల్దేరిన  గాలి పిల్ల ఒకటి వాళ్ళకి ఎదురొచ్చింది అక్కడ … మంచుకి తడిసిన ఫెర్న్ చెట్ల ఘాటైన పరిమళాన్ని పూసుకుని. చీకట్లో  దూరంగా చెట్ల మధ్యలోంచి  సంతోషం నిండిన వెలుతురు…గ్రీన్ గేబుల్స్ వంటింటి దీపం అది. ఆన్ ఉన్నట్లుండి మెరిల్లాకి దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుంది.

” ఇంటికి రావటం, అది ఇల్లని తెలియటం ఎంత బావుంటుంది ! గ్రీన్ గేబుల్స్ ని ఎంత ప్రేమిస్తున్నానో నేను..ఇదివరకెప్పుడు దేన్ని చూసినా ఇలా లేదు..ఇంకేదీ నాకు ఇల్లనిపించలేదు. మెరిల్లా ! ఎంత ఆనందంగా ఉందో నాకు, ఇప్పటికిప్పుడు ప్రార్థన చెయ్యమన్నా చేసెయ్యగలను , ఏమీ కష్టం లేకుండా ”

తన అరచేతిలో ఇమిడిన ఆ చిన్న అరచేయి మెరిల్లా మనసులోకి సున్నితమైన ఆహ్లాదాన్ని దేన్నో తెచ్చింది , అది ఆమె  పొందలేకపోయిన మాతృత్వానికి సంబంధించిందేమో .  అలవాటులేని ఆ తీయదనానికి మెరిల్లా కళవళపడి మామూలుగా అయే ప్రయత్నానికి ఒక నీతి వాక్యాన్ని ఊతగా తెచ్చుకుంది.

” నువ్వు మంచిపిల్లవిగా ఉంటే ఎప్పుడూ ఆనందంగానే ఉండగలవు. ప్రార్థన చెయ్యటం నీకు ఎప్పుడూ కష్టంగా అనిపించకూడదు ”

 

” ప్రార్థన లో వాక్యాలు వల్లించటమూ ప్రార్థించటమూ ఒకటి కావు ” ఆన్ ధ్యానిస్తూన్నట్లు అంది – ” ఆ చెట్ల  కొమ్మల్లోంచి వీచే గాలిగా నన్ను ఊహించుకుంటాను..అక్కడ చాలనిపిస్తే , ఇదిగో ఈ ఫెర్న్ చెట్ల మీదినుంచి మెల్లగా ఊగుతాను. ఆ తర్వాత మిసెస్ లిండ్ వాళ్ళ తోటలోకి ఎగిరిపోతాను, అక్కడి పూలన్నిటినీ గంతులు వేయిస్తాను … అప్పుడు తటాలున  ఆ గడ్డి మైదానం దాటి వెళతాను…ప్రకాశమానసరోవరం లో-  మెరిసిపోయే  చిట్టి అలలని రేపుతాను … ఓహ్ ! గాలిలాగా ఊహించుకుందుకు ఎంతెంత ఉందో… ఇప్పుడింకేమీ మాట్లాడను మెరిల్లా ”

” బతికించావు ” – మెరిల్లా ఉపశమించింది.

      [ ఇంకా ఉంది ]

 

 

 

 

 వర్షం వెలిశాక…

రేఖాజ్యోతి

 

Rekhaచెరొక ఊర్లో పనిచేసే అమ్మకీ, నాన్నకీ  అస్తమానం బదిలీలే అప్పుడు . వేరే దారి లేక   పదోతరగతి చదవడానికి నన్ను మా పిన్నివాళ్ళ ఊరికి పంపారు… ఆవిడ అక్కడ టీచర్.  నెల్లూరు నుంచి 24 కి.మీ. దూరం, మొదటిసారి ఆ ఊర్లో బస్సు దిగగానే ‘ఆకాశం విశాలంగా వున్నట్టు’ అనిపించింది. ఊరి నిండా కొబ్బరి చెట్లూ, చింత చెట్లూ, మట్టి రోడ్లూ, పాతకాలంనాటి ఆర్చీలున్న కిటికీలు, అరుగుల వాకిళ్ళు, అంతస్తులే లేని ఇళ్ళు, అన్నింటికీ మించి బస్సు వెళ్ళే మెయిన్ రోడ్డు మీద నుంచి కనిపించే పెద్ద వాగు, ఆ వాగులోకి ఎప్పుడోగాని నీళ్ళు రావట.. నీళ్ళు లేకపోతేనేం, బంగారు రంగు ఇసుక కనుచూపు మేరంతా!  

వాగుకి ఆవలి వైపున దూరంగా వున్న తాటి చెట్లతో అదంతా ఒక పెద్ద పెయింటింగ్ లా కనిపించింది.  పిన్ని, నేనూ ఉండబోయే ఇల్లు, మొత్తం ఇంటిలో నాలుగో వంతు పోర్షన్, ఒకే ఒక గది, దాన్నే వంట కోసం విభజిస్తూ పాతకాలంనాటి చెక్కపెట్టె లాంటి అల్మారా. టేకుగుంజలతో వసారా. ప్రహరీగోడ ముప్పావు కూలిపోగా అక్కడక్కడా నిలబడిన ఇటుకలు. కాంపౌండ్ లో  కొబ్బరిచెట్లూ వాటికి బలంగా అల్లుకున్న మనీ ప్లాంట్ తీగలు, మందారం, కస్తూరి … వేరేలోకం లోకి వచ్చినట్టు కళ్ళు పెద్దవి చేసుకొని చూడడమే సరిపోయింది. ఆ ఊరిలో ఒకే ఒక గుడి- అక్కడే రాముడూ, కృష్ణుడూ, వినాయకుడూ,నవగ్రహాలూ అందరూ వుంటారట . మేముండే వీధి చివర ‘సితార ‘ సినిమాలో భానుప్రియ బంగ్లా లాంటి ఇల్లు. ఆ రోజు రాత్రంతా ఆరుబయట నవారా మంచం వేసుకొని పిన్నీతో మాటలే మాటలు.

ట్యూషన్లు, ఎక్స్ ట్రా క్లాసులు లేని కాలం … సుదీర్ఘమైనసాయంత్రాలు. పిన్ని తప్పించి ,  స్కూల్లో పనిచేసే టీచర్లంతా నెల్లూరు నుంచి పొద్దున ఎనిమిదిగంటల బస్సుకి వచ్చి అయిదు గంటల బస్సుకి వెళ్ళే వాళ్ళు. స్కూల్లో స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఆసక్తికర విషయం ఆ ‘సితార’ సినిమా లాంటి బంగ్లాలోని ఆడవాళ్ళని ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదట, లోపలికీ బయటకీ తిరిగే కార్లు చూడడమేనట!

ఆ రోజు తెల్లవారేటప్పటికే మొక్కలూ, నేలా, గోడలూ అన్నీ తడిచి ముద్దయిపోయి ఉన్నాయి, రాత్రి ఎప్పటి నుంచి పడుతోందో వాన! తలుపు తీసుకొని వసారాలోకి వస్తే వాకిలి ముందంతా బురదమయం. ఇంటి ఓనరు ఆయన భార్యా ఇద్దరూ గొడుగు వేసుకొని ఆ బురదలో ఇటుకలు వేస్తున్నారు ‘అవసరంగా రోడ్డు మీదికి పోవలసి వస్తే పడి  ఉంటాయి’ ముసలి వాళ్ళిద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ పని పూర్తి చేశారు.

‘అమ్మాయ్,  నీకు స్కూల్ లేనట్లే, ఊర్లో వాన పడితే ముందు మునిగేది మీ స్కూలే, మెయిన్ రోడ్డుకి పది అడుగుల దిగువున కట్టాడు’ హౌస్ ఓనర్ సిద్ధి రామాచారి గారు చెప్పుకు పోతూనే ఉన్నారు.

‘’పాపాయ్, పాలవాడు రాలేదు వేడి నీళ్ళలో హార్లిక్స్ కలిపాను’’ పిన్ని నాకొక గ్లాస్ ఇచ్చి తనూ తెచ్చుకుంది.’ ‘పొద్దుట్నుంచీ బస్సులు రాలేదంటే స్కూల్ లేనట్లే’’- ‘ పిన్ని సెలవు డిక్లేర్ చేసి పుస్తకం పట్టుకుంది, తను ఇక ధ్యానం లోకి వెళ్ళినట్లే ! మధ్యాహ్నం నాలుగు వరకూ వర్షం తగ్గలేదు. దీపాలు పెట్టుకోవలసినంత చీకటి. వాకిట్లో హౌస్ఓనర్ వేసిన రాళ్ళు మునిగిపోయి చాలాసేపయ్యింది. కాంపౌండ్ లో బాగా రెండడుగుల ఎత్తు నీళ్ళు వచ్చేశాయి. వసారాలోనే కూర్చొని నేనూ పిన్ని చూస్తున్నాం. ఎవరో గొడుగులో వెళ్తూ

“ఆశారి గోరూ, యేరు ఆ పాట్నే పొంగతా ఉండాది, ఇంకో నాలుగడుగులు ఎక్కిందో, ఊరు మునిగిందే, నా మాటిని ఎగవన నీ కొడుకు ఇంటికి ఫో. సీకటి పడితే నువ్వు ఈదలేవు. మేవు ఏటి కాడికి పోతావుండాము. మునిగే దంకా రానీమనుకో! ఏమి? నేనొ చ్చేదా!” అంటూ ఆ రోడ్డు మీదికి చేరిన నీళ్ళలో హడావిడిగా వెళ్లి పోయాడు .

Kadha-Saranga-2-300x268

హౌస్ ఓనర్, ఆయన భార్యా ఇంటికి బోలెడు తాళాలు పెట్టి రెండు గోడుగుల్లో తయారయ్యారు, సిమెంట్ తో కట్టిన వారి కొడుకు ఇంటికి. “అమ్మాయ్.. మా తండ్రి గారి కాలంలో కట్టిన మట్టి ఇల్లు, మీరూ జాగ్రత్త, వస్తాం” అనేసి ఆ నీళ్ళలో వాళ్ళు బయల్దేరారు.

అప్పటివరకూ వారి మాటల సందడితో ప్రకృతి బీభత్సం అంత స్పృహకు రాలేదు కానీ, ఇప్పుడేమిటో గాలి గట్టిగా శబ్దం చేస్తున్నట్టు, మెరిసే మెరుపులు ఇక్కడే రిఫ్లెక్ట్ అవుతున్నట్టు కాస్త భయం మొదలైంది. అప్పుడే ఒక్కసారిగా మా కాంపౌండ్ కి ఆనుకొని ఉన్న కరెంటు స్తంభం పెద్దగా శబ్ధం చేస్తూ మా వసారాకి రెండు అడుగుల దూరంలో పడింది. ఇక భయం నా ముఖం మీదికి స్పష్టంగా వచ్చేసింది.

“పిన్నీ, మన మీద పడి ఉంటే?? ”

‘పడలేదు కదరా !’  పిన్ని స్థిమితంగానే వుంది ఇంకా.

ఈసారి ఒక్కరు కాదు ఇద్దరు కాదు గుంపులు గుంపులుగా గొడుగులు, లాంతర్లు, టార్చిలైట్లు పట్టుకొని ఆ గాలీ వానలో పెద్ద పెద్దగా అరుచుకుంటూ వెళ్తున్నారు ఏటి వైపుకు.

“పెద్దిరెడ్డి గోడౌన్ లో ఇసుక మూటలున్నాయి, ఓ నలుగురు నాతో రండ్రా!”

“ఒరేయ్ మీరు ఏటికాడికి పోయి ఉండండి మేము ఎనకాల్నె వస్తాం” చీకట్లో ఆ గొంతులు భయంతో వణుకుతున్నాయని తెలుస్తోంది.

మళ్ళీ వర్షం పుంజుకుంది. పిన్ని అప్పుడప్పుడూ వెళ్ళి సర్దడం గమనించాను. సూట్కేస్ లోని డబ్బులు, తనవీ నావీ సర్టిఫికేట్లు హాండ్ బ్యాగ్ లోకి, మరో కవర్ లో కాండిల్స్,అగ్గిపెట్టెలు , ఫస్ట్ ఎయిడ్ కిట్, తనవి పాత కాటన్ చీరలు  సర్దింది. మరి కాసేపట్లో వసారాలోకి కూడా నీళ్ళు వచ్చేశాయి. వసారాలోని నవారా మంచం గదిలో వేసుకున్నాం. ఆకాశంలో పెద్ద యుద్ధం జరుగుతున్నట్టు  ఉరుములు, మెరుపులు. అప్పుడే మా మీదికి ఎవరో టార్చ్ లైట్ వేసి చూస్తున్నట్టున్నారు,

“టీచరమ్మా,టీచరమ్మా…ఉండారా లోగా!! ” స్కూల్లో పనిచేసే అటెండర్ శీనయ్య అరుస్తూన్నాడు వర్షంలో నుంచి .

పిన్ని ఎలాగో వసారోలోకి వెళ్ళింది

‘ఆ ఆ ఉన్నాం, ఏంటి పరిస్థితి? ‘

‘ఏటికి గండి ఆనలేదు, నీళ్లొస్తున్నాయమ్మా ఈడుంటే కష్టం, నాతో గూడా రండి పాపను తీసుకొని, రామిరెడ్డి ఇంట్లోనే ఉన్నారు ఊరి జనమంతా, రాండి,రాండి ‘ వాన కంటే జోరుగా ఉంది శీనయ్య మాట.

ఇంటికి తాళం పెట్టి ఒకే గొడుగులో నేనూ పిన్ని శీనయ్య వెనకే బయల్దేరాం. నా బుర్రలో బోలెడు ఆలోచనలు, నీళ్ళు మోకాళ్ళకు తగుల్తున్నాయ్, ఒకవేళ ఈ నీళ్ళలో పాములు, కప్పలు, క్రాబ్స్ ..  వుంటే? నాలుగడుగులు వెయ్యగానే ఇక ఉండలేక అరిచాను ‘పిన్నీ’ అని, ‘ ఏమవుతుంది,ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలా? శీనయ్య కంటే నువ్వు పొడవుగా ఉన్నావ్ బాగా పెద్ద అడుగులు వెయ్యగలవు, నేరుగా నడువు, ఈ కాస్త , అదిగో ఆ  దీపం వెలిగే ఇంటి కే మనం వెళ్ళేది, సరేనా!’  ఎలాగో వచ్చేశాం, ఆఖరికి.  పెద్ద గేట్లు బార్లా తీసున్నాయి, అలాగే నీళ్ళలో ఉన్న ఒక ఐదు మెట్లు ఎక్కాక పొడినేల తగలగానే ప్రాణం లేచి వచ్చింది. ‘అమ్మా, అదో అటు మెట్ల పైకి వెళ్ళండమ్మా’ అని దారి చూపించి మళ్ళీ వానలోకి వెళ్ళాడు శీనయ్య, ఇంకెవరైనా ఇళ్లలోనే వుండి పోయారేమో  అని!

మెట్లెక్కి లోపలికి వెళ్తే కిక్కిరిసిన కళ్యాణ మండపంలా ఉంది. ఊరివాళ్ళంతా ఇక్కడే వున్నట్టు ఉన్నారు, అక్కడక్కడా వెలుగుతున్న కొవ్వొత్తులు, లాంతర్లు. ఏ మాటా అర్ధం కావట్లేదు ఒకరితో ఒకరు మాట్లాడుతుండడం వల్ల. పిన్నిని చూసి చాలా మంది దగ్గరకొచ్చారు

‘టీచరమ్మా, మా గుడిసె పొద్దన్నే పడిపోయింది తల్లా, ఈడనే ఉన్నాం పిల్లా జల్లా అందరం’

‘దూడని తోలుకుబోయినోడు అట్టే బోయినాడమ్మా, యాడ చిక్కు బడ్డాడో!’ పాలు పోసే శంకరయ్య అమ్మ ఏడుస్తోంది.

‘పాపాయ్, నువ్వెళ్ళి ఈ హాండ్ బ్యాగ్, కవరూ  తీసుకొని  ఆ ప్లేస్ లో కూర్చో, తడి తుడుచుకో, నేను వాళ్ళని పలకరించి వస్తాను’ అని చెప్పి పిన్ని వెళ్ళింది. ఇందాక అరుపుల్లా వినిపించినవి ఇప్పుడు ఏడుపుల్లా వినిపిస్తున్నాయి. గోడకానుకొని కవర్లోనుంచి పిన్ని పాత చీర తీసుకొని పరుచుకోవడానికీ, కప్పుకోవడానికీ కలిపి చుట్టుకొని కూర్చున్నాను. ఇక్కడికి శబ్దాలు కూడా అంతగా చొరబడట్లేదు. భయం వల్ల కలిగిన అలసటతో నిద్ర పట్టేసింది.

బాగా హడావిడిగా ఉంది, కలలోనో, నిజంగానో  అనుకుంటూ నిద్ర లేచాను. ఎదురుగా ఎవరో ఒకావిడ కళకళలాడుతూ  ఎర్రటి చీర కుచ్చిళ్ళు దోపుకొని అందరికీ బాదం ఆకుల విస్తళ్లలో వేడి వేడి ఉప్మా వడ్డిస్తోంది. ప్రతీ ఒక్కరినీ పేరుతో పిలుస్తోంది,

‘ఏమి అందరికీ వచ్చిందా! డబ్బాలేమన్నా వుంటే పెట్టుకుపొండి, చంటి బిడ్డలుంటే ఈడ వేడి నీళ్ళున్నాయ్. ఏమి గావాలన్నా పాలేరుకి  చెప్పండి. ఇచ్చి అంపుతా, ఏమి సరేనా! ‘ అందరినీ ఉద్దేశించి  అనేసి ఆవిడ మెట్లు దిగి వెళ్ళిపోయింది.

‘ఏంటిది? ఎక్కడున్నాను, వర్షం తగ్గిపోయిందా?’ నెమ్మదిగా గుర్తుచేసుకుంటూ కిటికీ దగ్గరకి వెళ్ళి చూశాను, ఊహూ .. వర్షం ఇంకా హుషారుగా పడుతూనే ఉంది. కాస్త దూరంకి చూపు సారించి చూస్తే, అదేంటి? బూడిదరంగు ఆకాశం నేల మీద కదులుతోంది! దేవుడా, నిండిన యేరు ఇదేనా?మెలికలు తిరుగుతూ నిన్న మొన్న నేను నడిచిన వీధుల్లో ప్రవహిస్తోంది. ఎక్కడికి వెళ్తోంది ఈ యేరు ఇంత హడావిడిగా ఊరి మీదుగా, తలలు విరిగిన కొబ్బరి చెట్లూ, కూలిన కరెంటు స్తంభాలూ, ఒరిగిపోయిన ఇళ్ళూ, ఇలా అవుతుందా వర్షం పడితే !!  పిన్ని కోసం వెతుక్కుంటూ మెట్లదగ్గరకి వచ్చి నిల్చున్నాను, కింద నుంచి ఇందాక మాట్లాడిన ఆవిడ ఎవరికో చెప్తోంది ,

‘ఏరా, ఎల్లకాలం వంటోళ్ళు మాత్రమే చెయ్యాల్నా? నేను చేస్తే సయించదా! కష్టం వచ్చి మడుసులు ఎడస్తా మన పంచకొస్తే మనం సుఖం చూసుకుంటామా ఏంది? ఎవరూ బళ్లె, నా చెయ్యి సాలు, వండనియ్యండి సుద్దంగా’  అని.

ఇంతలో పిన్ని వచ్చింది సగం గొడుగులో సగం తడుస్తూ డాక్టర్ గారిని తీసుకొని,

‘గోడకూలి పడిందయ్యా, నెత్తురు సూడండయ్యా’ అని జనంలోనుంచి ఒకావిడ బిడ్డని ఎత్తుకొని వచ్చింది. పిన్ని అప్పటికే వాడికి ఫస్ట్ ఎయిడ్ చేసినట్టుంది, వాడికి గాయం మీద బ్యాండ్ ఎయిడ్ వేసుంది.

పిన్నీ నన్ను పలకరించింది ‘ ఆర్ యూ ఓ కే , హోప్ యు ఆర్ …’ అని నవ్వి మళ్ళీ వెళ్ళిపోయింది వాళ్ళలోకి.

బాగా ఆకలి వేస్తోందనుకునేలోపే నాకూ ఎవరో ఉప్మా తెచ్చిపెట్టారు…తినేసి కళ్ళుమూసుకున్నాను, మళ్ళీ నిద్రపోయాను కాబోలు !

sitaram1

‘పాపాయ్, పాపాయ్’ పిన్ని పిలుపుకి  ఉలిక్కి పడి లేచాను.

‘చూడు వర్షం తగ్గింది, పై మేడ మీదకు వెళ్దాం రా, యేరు వెనక్కి వెళ్తోందట’

, వెళ్ళాం.. అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు.

‘ఏరియల్ వ్యూ కదా ఇక్కడి నుంచి ?’ పిన్ని నవ్వుతూ అడుగుతోంది

నిజంగానే అన్ని వీధులూ నీళ్ళు నీళ్ళు, చూస్తుండగానే మూడు హెలికాఫ్టర్లు అటూ ఇటూ తిరుగుతూ నీరు లేని చోట్ల కొన్ని మూటలు, అట్టపెట్టెలు పై నుంచి విడిచి పెడుతున్నారు

‘అందరి ఇళ్ళూ మునిగి పోయాయి కదా, అన్నీ సెట్ అయ్యే వరకూ అవసరమైన సరుకులు గవర్నమెంట్ ఇలా ఇస్తుంది’ పిన్ని చెప్తోంది.

‘మనం ఇక ఇంటికి వెళ్లచ్చా? ‘  ప్రమాదం తప్పినట్టే కదా ??

‘చూద్దాం’ తనేటో చూస్తూ సమాధానం చెప్పింది.

మేడ మెట్లు దిగి ఆ ఇంటి గేటు వరకూ వచ్చాక కానీ తెలియలేదు మొన్నటి నుండీ ఉన్నది ఆ ‘ సితార’ సినిమాలో బంగ్లా లాంటి బంగ్లాలో  అని. లోపల భలే ఆశ్చర్యం, అంటే ఆ ఎర్రచీర ఆవిడేనా ఈ ఇంటి ఓనర్, భలే ఉన్నారు నిజంగానే చాలా మంచిది. అనుకుంటుండగానే ఆవిడ వచ్చారు.

‘’ నమస్కారం టీచరమ్మా, సమయానికి మీరు చేసిన వైద్యం, సాయం మర్సిపోలేము. మీకు ఉండటానికి సిమెంట్ ఇల్లు పాలకేంద్రం కాడ మా తమ్ముడోళ్ళ  ఎనక పోర్షన్ ఏర్పాటయ్యింది. నేరుగా ఆడికే పోండి. ఈడ పాత ఇంట్లో పనికొచ్చే సామాను ఏమన్నా వుంటే మా పాలేరు ఆడికి తెచ్చిస్తాడు,ఏమ్మా, సరేనా!!’ ఆవిడ మొత్తం చెప్పేశాక పిన్నికి అర్ధమయినట్టుంది. నాకే లోపల పెద్ద ప్రశ్నా పత్రం!

మేము గేటు వైపు తిరిగామో లేదో, ఆవిడ ఎవర్నో పెద్దగా అరుస్తోంది

‘’ మడిసివా? ఆశబోతు పిశాచివా? ఇల్లు బోయి, బిడ్డా గొడ్డూ బొయ్యి మడుసులు అల్లాడతా ఉంటే గవర్నమెంటోళ్ళు ఏసిన బియ్యపు గింజలు ఏరుకొని తెచ్చి దాచిపెడతా వుండావే! ఎవయ్యా, మొలకా రెడ్డా, ఊరి మునిగిపోతా ఉండా కూడా నీకు బుర్రలో బుద్ది మొలవలేదే! అన్నదమ్ముడివని విడిసి పెడతావుండా, ఫో, గేటుకాడ కూర్చొని ఈ బస్తాలన్నీ పెట్టుకోని కుంచాం తో కొలిసి మడిసి మడిసికీ ఇయ్యి. ఏందీ? ఇనబడిండా, మల్లా సెప్పేదా? ‘’  ఆఖర్న ఒక్క ఉరుము ఉరిమింది అతన్ని.

పిన్ని నన్ను చెయ్యి పట్టుకొని ఆవిడ చెప్పిన అడ్రస్సుకు తీసుకొని వెళ్తోంది. అయినా అడిగాను ‘ఎక్కడికి వెళ్తున్నాం?’ అని

‘కొత్త ఇంటికి’  పిన్ని తల ఎత్తకుండా నడుస్తూ చెప్పింది

‘ఎందుకు?’

‘’ఎందుకంటే మనం ఉంటున్న ఇల్లు మొన్న రాత్రే పడిపోయింది’’’  నీళ్ళలో చూసి చూసి అడుగేస్తూ చెప్పింది.

నాకు ఒక్కసారిగా తలలో నుంచి పెద్ద ఐస్ క్యూబ్ జారినట్టు, చల్లటి నీళ్ళు మొహం మీద కుమ్మరించినట్టూ ఝల్లుమంది. ఆగిపోయాను పూర్తిగా! ఏమనాలో తెలియలేదు.

‘పిన్నీ, నా బుక్స్, నీ బుక్స్  బట్టలు .. ‘ నాముఖం ఇప్పుడు ఏ రంగులో వుందో ఖచ్చితంగా ఊహించుకోలేక పోతున్నాను.

‘పాపాయ్, మనం ఉన్నాం కదా! అవన్నీ మళ్ళా తెచ్చుకోవచ్చు’ పిన్ని వెనక్కి తిరిగి నవ్వుతూ అంటోంది.

ఆ అటెండర్ శీనయ్య వచ్చి తీసుకురాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ?? నిజమే అలా ఏమీ కాలేదు కదా, ఇంకెందుకు బాధ!!

‘మనం ఊహించలేం పాపాయ్, దేవుడు ఎలా వస్తాడు? ఏమి సహాయం చేస్తాడు? ఎలాంటి పాఠాలు నేర్పిస్తాడు? అని , ‘ప్రాణం అమూల్యం’  అని ఎన్నిసార్లు ఇంపోజిషన్ రాస్తే అర్ధం అవుతుంది? ఇప్పుడు చూడు ఇంతమందిని కూర్చోబెట్టి ఒకే పాఠం ఎంత అర్ధవంతంగా చెప్పాడో దేవుడు!! ఒప్పుకోవాలేగానీ పై వాణ్ణి మించిన గురువు లేడురా!! ‘ పిన్ని నవ్వుతూ చెప్తోంది అందంగా, హాయిగా!!

*

బొట్టు

ఎండ్లూరి మానస

 

manasa endluri“ఒక్ఖ రోజు డ్రైవర్ లేని పాపానికి పూజ సామాను తెమ్మంటే ఏదీ సరిగ్ఘ తేలేదు. పటిక బెల్లం తెమ్మంటే తాటి బెల్లం తెచ్చారు. కేజీ నుపప్పు అని రాస్తే పావు కేజీ నే తెచ్చారు. ఏవిటి చేస్కోటానికిట? తెలిసి తెలిసి చేయరాని తప్పు చేసి ఇప్పుడనుకునేం లాభం?నాది బుద్ధి తక్కువ. మళ్ళీ నేనే మార్కెట్ కెళ్ళాలి!”

అసలే కాలేజీ టైం అయిపోతుందని హడావిడిగా తయారవుతున్న కామాక్షికి సరిగ్గా బయల్దేరేటప్పుడే ఇలాంటి ఆటంకాలు ఎదురవుతాయి పాపం! రేపు వరలక్ష్మి వ్రతం. ఈ రోజు  సాయంత్రం ఆమె పని చేసే డిగ్రీ మహిళా కళాశాలలో స్టాఫ్ మీటింగ్ పెట్టాలి. ప్రిన్సిపాల్ ఆమే కాబట్టి తప్పించుకునే ప్రశ్నే లేదు. ఇంటికొచ్చేసరికి ఏ ఏడో ఎనిమిదో అవుతుంది. అలసట! నీరసం! అందులోనూ ఆమె కార్ డ్రైవర్ సెలవు! ఈ కష్టాలన్నీ తలచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది కామాక్షికి!!

“నువ్విచ్చిన లిస్టే కదా కామాక్షి, పట్టుకెళ్ళి ఇచ్చాను. వాడవే ఇచ్చాడు”. జరిగింది పెద్ద సమస్య కాదన్నట్టు కార్ తాళాలు గోడకి తగిలిస్తూ అన్నాడు భర్త సుబ్రహ్మణ్యం.

“ఇస్తాడు!వాడికేం నొప్పిట? రెండు రెట్లు డబ్బులూ నొక్కుతాడు వెధవ ! చూసేవాళ్ళు మిమ్మల్ని ‘దేవుడు’ అని ఇందుకే అంటారు కాబోలు!! కాని కుటుంబానికి కావాల్సింది ‘భర్త’! దేవుడ్ని నేనేం చేస్కోను? ఉన్న కోటిమంది చాలదన్నట్టు! ఇంటికి, ఇల్లాలికేంకావాలి? పిల్లల్ని ఏ బళ్ళో చదివించాలి? ఏం చదివించాలి? ఏ బట్టలు వేయాలి ?ఏం తినిపించాలి?…ఇవన్నీ దేవుళ్ళు చేయరు!పెళ్ళాంతో బాటు మొగుడు కూడా చెయ్యాల్సుంటుంది. నా ఖర్మ కాలి ఈ ఇంట్లో మొగుడున్నా అన్నీ నేనే చేస్కుని ఛావాలి! నా పిల్లలకి, వాళ్ళ ఇంటి పేర్లకి తప్ప దేనికి పనికొచ్చారుట? బ్యాంకు ఉజ్జోగం, ఇల్లు తప్ప మరొక్కటి తెలిస్తే ఒట్టు! ‘మంచోడు మంచోడు’ అంటే మా నాన్నారు  ఒక్క గెంతు గెంతి ఈ పెళ్లి చేసారు. ఎన్నేళ్ళు గడిచినా ‘మంచోడు’ మంచోడి లానే ఉన్నారు గాని భర్తగా, తండ్రిగా మారనేలేదు! ఛ! ఇప్పుడు నే కాలేజీకెళ్ళాలి గా!మళ్ళా తాళాలు తగిలించేస్తారేవిటి? ఇలా తగలబెట్టండి.” మొహం చిట్లిస్తూ విసురుగా సుబ్రహ్మణ్యం చేతిలోంచి తాళాలు లాక్కుంది కామాక్షి.

సుబ్రహ్మణ్యం ఎదో పక్క గ్రహం నుంచి వచ్చిన వాడిలా ఏ స్పందనా లేకుండా తన పని తను చేసుకుపోతున్నాడు.

‘డ్రైవర్ లేడు, పెళ్ళాన్ని కాలేజీలో దింపుదామన్న ఆలోచనే రాదు ఈ మనిషికి!’ మనసులో తిట్టుకుంటూ “హలో!మీ టూ వీలర్ మీద ఎంత దుమ్ముందో చూసారా? అది కూడా నేనే చెప్పాలా?”

భర్త మీద అరుస్తూ కార్లో హ్యాండ్ బాగ్, లంచ్ బాక్స్ పెట్టుకుంది కామాక్షి.

“చూసాను కామాక్షి, ఇప్పుడే తుడిచేస్తాను.పాత గుడ్డ ఎక్కడుందో వెతుకుతున్నా.” ఎప్పటిలా అమాయకంగా సమాధానమిచ్చాడు సుబ్రహ్మణ్యం.

“చాలు! ఇహ మూస్తారా నోరు? నా ఫోన్ మోగుతోంది.” హ్యాండ్ బాగ్లోంచి తన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతుంది కామాక్షి…

“హలో! గరికపాటి గారు ఎలా ఉన్నారు? చాలా రోజులకి ఫోన్ చేసారే?” ఆయన గొంతు కొద్దిగా కామాక్షి కోపాన్ని పక్కన పెట్టింది.

dot1

“ఆ! బావున్నానండి.మీరు, సారు, పిల్లలు బావున్నారా?”

“ఆ! మావులే గా!పిల్లలిద్దరూ అమెరికా లోనే చదువుకుంటున్నారు. మేవిక్కడ! వాళ్ళక్కడ! ఏవిటి మీ లేటెస్ట్ నవల?ఈ మద్జ పెద్దగా రాస్తున్నట్టు లేరు?”

“కాస్త ఇంటి పనుల్లో పడి తీరిక దొరకడం లేదండి! మా ఆవిడ పెద్దగా చదువుకోలేదు. మీకు తెలిసిందే గా! పిల్లల చదువులూ అవీ నేనే చూస్కోవాలి! ఇప్పుడా పని మీదే ఫోన్ చేసాను. పెద్ద పాప ఆశ ఇంటర్ పాసైంది. బిటెక్ లో జాయిన్ చేయమంటుంది కానీ నాకు అంత సంపాదనెక్కడిది?! ఎప్పుడో ఒక్క నవల రాస్తే నాలుగు డబ్బులొస్తాయి గాని చేసే సబ్ ఎడిటర్ ఉద్యోగం చిన్నదేగా! అందుకే అమ్మాయిని మీ కాలేజీలో డిగ్రీ చేర్పిద్దామని..”

“సరే సరే! అంతగా చెప్పాలేవిటండి? ఎంత గొప్ప నవలలు రాసారు మీరు! మర్చిపోగలమా మీ ‘ఆకాంక్ష’, ‘సంధ్య వేళలో ఎదురీత’ ముక్ష్యంగా మీ ‘పది ప్రమాణాలు’! ఇంకా ఎన్నో! మీ వీరాభిమానిని! అమ్మాయిని తీసుకుని వచ్చేయండి. తప్పకుండా తనకిష్టమైన గ్రూప్ లోనే సీట్ చూస్తాను. ప్రముఖ నవలా రచయత కూతురు మా కాలేజీ పిల్ల అంటే మాకు గర్వంగా ఉంటుంది. పైగా కాలేజీ ఫంక్షన్స్ కి మిమ్మల్నే వక్తగా అధితి గా పిలవచ్చును!ఎప్పుడొస్తారు? ఒక గంటలో వచ్చేస్తారా కాలేజీ కి?”

తనకిష్టమైన రచయిత గరికపాటి సుందర్ ని చూడాలని ఉవ్విళ్ళూరుతుంది కామాక్షి. ఆయన నవలలకి ప్రాణం పెడుతుంది. ఎప్పుడో ఎదో సాహిత్య సభ లో పరిచయమైంది తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే మాట్లాడింది. ఎంతో ఆత్మీయంగా, స్త్రీల పట్ల గౌరవంగా మాట్లాడుతాడు. సుబ్రహ్మణ్యం అంత కాకపోయినా కాస్త అందగాడే! అమాయకుడైన చేతగాని అందగాడికంటే; చిన్న జీతగాడై, కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ,అద్భుతమైన నవలలు రాసే తెలివైన సంసారి నయం అన్న అభిప్రాయం కలిగేది సుందర్ తో మాట్లాడిన ప్రతిసారి! పైగా పేరు కూడా మనిషికి తగ్గట్టే వినసొంపుగా ఉంటుంది. ఆయన కూతురు తన కాలేజీ లోనే చేరితే అడపాదడపా ఆయన కనపడతాడన్న చిన్న ఆలోచన.

ఆమె ఆలోచనల్ని చెదిరిస్తూ “లేదండి కామాక్షి గారు క్షమించాలి!ఇవ్వాళ విజయవాడ లో ఒక సాహిత్య సభ కి పిలిచారు. ఎవరిదో కథా సంపుటి ఆవిష్కరించించాలి. ఆ పని మీద వెళుతున్నాను. మళ్ళీ రేపు సెలవు కదా! సీట్లు ఉంటాయో అయిపోతాయో అని మా పాపని, వాళ్ళమ్మని పంపిస్తున్నాను. కొంచెం ఈ సాయం చేసిపెట్టాలి.”

‘హ్! నా మొగుడల్లె రోజూ ఇంటికి ఆఫీసుకి మధ్యలో మాత్రమే కొట్టుమిట్టాడే టెన్నిస్ బంతా ఈయన?ఎన్నో పనులుంటాయి!’ అనుకుని “తప్పకుండా అండి.ఇక గరికపాటి వారి గాలి వీస్తుంది మా కళాశాలలో! ఉంటానండి.కాలేజీ కి బయల్దేరుతున్నాను.” అని ముగించి మెల్లగా కార్ స్టార్ట్ చేసి ముందుకి సాగింది కామాక్షి. సుబ్రహ్మణ్యం కనీసం ఆమె వెళ్లేది గమనించలేదు. ఆమె ‘ వెళ్ళొస్తానని’ చెప్పడం ఎప్పుడో మానేసింది.

కామాక్షి కార్ నడిపి చాలా రోజులైంది.అందువల్ల కాస్త ఆలస్యంగా చేరుకుంది. ఆమె ఆఫీసు రూమ్ కి వెళ్ళే సరికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అడ్మిషన్స్ అవుతుండడంతో కళాశాల విద్యార్దినులతో, వారి తల్లిదండ్రులతో చాలా రద్దీగా ఉంది. కామాక్షి పనులు మొదలు పెట్టేలోపే అటెండర్ ఒక చీటీ ఇచ్చాడు. మడతలు విప్పి చూస్తే ‘గరికపాటి సుందర్’ అని ఉంది. వెంటనే వాళ్ళని లోనికి పంపించమంది .  అటెండర్ బయటకు వెళ్ళగానే తన కళ్ళజోడు , ముంగురులు సర్దుకుని పెదాలు తడిచేసుకుని చేత్తో పెన్ పట్టుకుని అవసరం లేకున్నా ఎదురుగా ఉన్న కాగితాల మీద ఎదో రాస్తున్నట్టు భంగిమ పెట్టింది. గరికపాటి వారి భార్యా కూతురు లోనికి రావడం గమనించి కాగితాలలోంచి ముఖం పైకెత్తి నివ్వెరబోయింది!! వాళ్ళిద్దరూ ఆమె ముందుకొచ్చి నిలబడ్డారు. కూర్చోమని చెప్పడానికి బదులు ఆమే ఆశ్చర్యంతో లేచి నిలబడింది. అర నిమిషం పాటు నిశ్శబ్దం!ఇక చేసేది లేక కామాక్షి తేరుకుని “మీరూ…?” అని అడిగింది అనుమానంగా.

సుందర్ భార్య, కూతురు నమస్కరించారు.

“గుడ్ మార్నింగ్ మేడం!మై నేమ్ ఈజ్ గరికపాటి ఆశాజ్యోతి . డాడీ మిమ్మల్ని కలవమన్నారు. ఈవిడ మా అమ్మగారు కరుణ.నేను ఇంటర్ మీడియట్ యం పి సి నైంటి టు పర్సెంట్ తో పాసైయ్యను మేడం. ఐ వాంట్ టు జాయిన్ ఇన్ బి యస్ సి కెమిస్ట్రీ. మిగతా గ్రూప్స్ లో ఆల్రెడీ సీట్స్ అయిపోయంట మేడం.

‘ఇక చెప్పాల్సింది మీరే’ అన్నట్టు కామాక్షి సమాధానం కోసం ఎదురు చూస్తుంది ఆశాజ్యోతి. కరుణ ప్రేక్షక ప్రాతకే పరిమితమైంది.

కామాక్షి వాళ్ళని ఎగా దిగా చూసి “ నీ సర్టిఫికెట్స్ ఇలా ఇవ్వమ్మా” అని అడిగింది.

ఆశా జ్యోతి చాలా ఆశ గా ఫైల్ ఇచ్చింది. కామాక్షి కూర్చోలేదు, వాళ్ళని కుర్చోబెట్టలేదు. సర్టిఫికెట్స్ అన్నీ జాగ్రత్తగా చూస్తుంది… ‘స్కూల్ ,ట్రాన్స్ఫర్,మైగ్రేషన్…ఆ…కాస్ట్! దొరికింది.’

కామాక్షి మనసులోనే నిర్ణయం ధృడంగా తీసుకుంది.

అందంగా నవ్వుతూ “సారీ రా తల్లీ! కెమిస్ట్రీ లో సీట్స్ ఇందాకే అయిపోయాయి. సివిక్స్, హిస్టరీ లో ఆఖరి సీట్స్ ఉన్నాయి. కానీ అవి కూడా ఉంటాయో లేదో చెప్పలేం. నాన్నగారితో నేను మాట్లాడుతాను. వేరే కాలేజీ లో సీట్స్ ఉన్నాయేమో నేనే కనుక్కుని చెప్తాను . ఆల్ ది బెస్ట్ అమ్మా!” అని చెప్పి ఫైల్ వెనక్కి ఇచ్చేసి ‘వెళ్ళండి’ అనే నమస్కారం చేసింది.

ఆశా జ్యోతి ఆశలు అడియాసలై ఆమె నుదుటి మీద లేని కుంకుమ బొట్టు కళ్ళల్లోంచి కన్నీటి బొట్టై రాలింది. వాళ్ళు వెనుతిరగగానే కామాక్షి గబగబా ఫోన్ ఆన్ చేసి కాంటాక్ట్స్ లిస్ట్ తీసి ‘జి’ లో గరికపాటి నెంబర్ డిలీట్ చేసింది. అతన్ని కలిసిన రెండు సార్లు మొహానికి బొట్టెందుకు  లేదో ఇప్పుడు అర్ధమైంది! ఈ గరికపాటి ఆమె అనుకున్న ‘ఘనాపాటి’ కాదని తెలుసుకుంది.

*