కొన్నిసార్లు ఇలా కూడా..!

 

     – రాళ్ళబండి శశిశ్రీ

~

1.రాకపోకలన్నీ
పూర్తిగా అర్ధరహితమేమీ కాదు
ఆమోద తిరస్కారాలలో
అదుపుతప్పే గుండెలయ మాత్రమే
అర్ధరహితమైనది!

2.మోహంగా పరచుకున్న మోహనకి
నిరాశగా అలముకున్న శివరంజనికి
మధ్య ఒక్క గాంధార భేదం –
సంతోష దుఃఖాలను వేరుచేసే
చిన్నగీత మాత్రమేనా?!
అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్య
కదిలే భారమైన సంగీతం!

3.కొనగోటికి తగలని
కన్నీటిబొట్టు మహసముద్రంగా
వ్యాప్తి చెందకముందే
ఆలోచనలను ఆవిరిచేసేయ్యాలి
తడిగుండెకు ప్రవహించడమెక్కువ!

4.విస్ఫోటించిన అనుభూతుల సంలీనం
చెల్ల్లాచెదురైన గుండె శకలాల
మధ్య కూడా చిధ్రం కాని వ్యామోహాలు
సున్నితత్వానికి సమాధి కట్టడం సాధ్యం కాదేమో!?

5.అప్పుడప్పుడూ మనసుగదికి
తాళం వేయాల్సిందే
దృశ్యాలను మరుగుపరచందే
గాయాలకు మందు దొరకదు మరి!

*

  ముగిసిన తర్వాత

    రాళ్ళబండి శశిశ్రీ
               
కొన్ని యుద్ధాలు ముగిసాక
ఏర్పడ్డ నైరాశ్యపు నిశ్శబ్దం
హఠాత్తుగా ఇద్దరి మధ్యా
పెరిగిపోయిన యోజనాల దూరం
తప్పులు, ఒప్పులు, అజ్ఞానం, అమాయకత్వం,
తోసిపుచ్చలేని, తేలని కొలతలు!
 
 
తెగని అలోచనలతో
అనివార్యమైన రోదనలు
పరిపరివిధాల పోయే మనసులో
పేరుకుపోయే అస్ప్సష్టతలు
కారణాతీతంగా జరిగేదేదీలేదని తెల్సినా
సంజాయిషీలతో సరిపెట్టలేని సందర్భాలు!
 
 
విచ్ఛిన్నమై పోయాక
చేతుల్లో మిగిలేది రిక్తమే-
చూపులు మోసేది నిర్వేదమే-
కాలం కూడా కదలలేదు
భారమైన మనసును మోస్తూ!
 
 
స్తంభించిన కాలాన్ని
దాటాలనే అడుగుల ప్రయత్నం-
జీవితం నడవాలి కదా!
 sasisri