లాగ్అవుట్ అవకముందే…

69309-19072bpablo2bpicasso2b2528spanish2bartist252c2b188125e225802593197325292bnude2bhalf2blength2b1907-bmp

అక్కడ ఒక్క ముఖమే ఉందో లేక
అనేక ముఖాల  ముసుగులో ?
గుంజలు పాతి ఆ ముఖాల్ని ఆరబెడుతుంటే ఆశ్చర్యం. 

ముఖాల్లేని మనుషులని ఎప్పుడైనా చూసారా ?
ముఖం లేనోడా అని తిడుతున్నప్పుడు
ఆ ముఖాలు అలాంటి వాళ్లవేనా అనిపిస్తుంది
వాటిని అలా ఇచ్చేసి వాళ్ళు వ్యాపారమే చేస్తారో ? లేక
వ్యాపార ప్రకటనలకోసం జీవితం ఇచ్చేస్తారో ?

నడిచే మొండాల్ని చూస్తున్నప్పుడు
ఎవరెవరు, ఎవరెవరో అని ఎలా గుర్తుపడతారు
తెలుసుకోవడమూ ఆశ్చర్యమే !

ముఖాలు వేరుగా మనుషులు వేరుగా సంచరించే రోజులొస్తే
ఒక దగ్గర మొహాలు
మరో దగ్గర మొండాలు తిరుగుతూ మనుషులకి మరో అర్ధం చెపుతారా?

ఏమో
ముఖపుస్తకాల్లో ముఖాలు ఎండుతున్న శబ్దం
ఎక్కడెక్కడో మునిగే మొహాలు
ఇక్కడ ఎండబెట్టుకున్నాక తిరిగి తొడుక్కునే అంచనాలకోసం
క్వశ్చనేర్ తయారు చేస్తున్నా


సాయం కోసం ఏవైనా ముఖాలు మిగిలితే ఈ గోడపై ఎండేయండి

రాల్చని  అపక్వ భావోద్వేగాలను కవితాత్మకంగా ఒడిసిపట్టనివ్వండి   

అందరికీ గుర్తుండే ముఖమేదో తేలనివ్వండి,

జీవితం నుంచి లాగ్అవుట్ అవకముందే

-అన్వీక్ష