గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -12

 

                                  గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -12 [ Anne Of Green Gables by L.M.Montgomery ]

ఆన్ పెట్టుకు వెళ్ళిన పూల దండల టోపీ గురించి  శుక్రవారం వరకూ మెరిల్లాకి తెలీలేదు. ఆ రోజు మిసెస్ రాచెల్ ఇంటినుంచి వస్తూనే ఆన్ ని పిలిచి సంజాయిషీ అడిగింది.

    ” మిసెస్ రాచెల్ చెప్పింది – గుట్టలు గుట్టల పూలు   నీ టోపీకి చుట్టుకుని పోయావటగా , ఏం పుట్టింది నీకు ? వెర్రిమొహం  లా ఉండిఉంటావు కదా , నా ఖర్మ ! ”

  ” అనుకుంటూనే ఉన్నాను , పసుపు రంగూ గులాబి రంగూ నాకు నప్పవని …” ఆన్ మొదలెట్టింది.

 ” నప్పటమా నీ తలకాయా ” మెరిల్లా గర్జించింది – ” అసలు పూలెందుకు టోపీకి ? అలా చుట్టుకోవాలని ఎందుకనిపించింది నీకు ? ఒక్కోసారి నిజంగా పిచ్చెక్కిస్తావు కదా ”

  ” గౌన్ లకైతే పెట్టుకోవచ్చా మరి ?  ? అక్కడ బోలెడంతమంది  గౌన్ లకి పూల గుత్తులు పిన్ లతో గుచ్చుకుని వచ్చారు తెలుసా ? టోపీకి పెట్టుకుంటే తప్పేమిటి  ”  – ఆన్ వాదించింది.

మెరిల్లా అంత తేలిగ్గా ఏమారే మనిషి కాదు .

” అలా ఎదురు సమాధానాలు చెప్పకు నువ్వు..చేసింది చాలక..! మళ్ళీ ఇలాంటి వెధవపని చేశావంటే చంపేస్తాను . నీ పిచ్చి వాలకం చూసి మిసెస్ రాచెల్ కి సిగ్గుతో చచ్చిపోవాలనిపించిందట… దగ్గరికి వచ్చి చెప్పాలంటే ఎక్కడో దూరంగా ఉన్నావట నువ్వు. ఆ లోపు అంతా చూడనే చూశారు , చెవులూ కొరుక్కున్నారు. నిన్ను అలా తయారు చేసి పంపేందుకు  నా బుద్ధేమైందా అనుకుని ఉంటారు…’’

” అయ్యో , మెరిల్లా ! ” – ఆన్ బిక్కచచ్చిపోయింది  – కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి .” నీకు అంత బాధ కలుగుతుందని అనుకోలేదు  నేను….ఆ పూలు చూట్టానికి ఎంతో చక్కగా ఉన్నాయి , టోపీకి పెట్టుకుంటే  బావుంటుందనిపించీ…చాలామంది కాయితం పూలు పెట్టుకుంటుంటారు కదా అని ..! నిన్ను ఇలాగే వేధిస్తుంటానేమో , నన్ను వెనక్కి పంపించెయ్యి పోనీ … నాకు చాలా చాలా కష్టంగానే ఉంటుంది ..ఇంత సన్నగా ఉంటాను కదా , క్షయ జబ్బు పట్టుకుంటుందేమో నాకు …అయినా సరే, వెళ్ళిపోతాలే, నిన్ను యాతన పెట్టేకంటే ”

” చాల్లే, నోరు ముయ్యి ” పిల్లని ఏడిపించినందుకు తనని తను తిట్టుకుంది మెరిల్లా. ” నిన్ను వెనక్కి పంపించేది  లేదు , ఎప్పటికీ. పిచ్చి వేషాలు వెయ్యకుండా అందరు పిల్లల్లాగా ఉండు, చాలు.  ఏడవకు ఇంక. చెప్పటం మర్చిపోయాను – డయానా బారీ ఊర్నించి వచ్చేసింది తెలుసా ! వాళ్ళమ్మ తో నాకు కొంచెం పని ఉంది, వాళ్ళింటికి వెళుతున్నాను- నువ్వూ వస్తావా ? డయానా ని చూడచ్చు కదా  ”

ఆన్ దిగ్గున లేచి నిలుచుంది. నీళ్ళు నిండి ఉన్న కళ్ళు తళ తళా మెరుస్తున్నాయి.

” నాకు భయంగా ఉంది మెరిల్లా ! తను ఎప్పుడొస్తుందా అని ఇప్పటిదాకా ఎదురుచూశాను, ఇప్పుడు  తనకి నేను నచ్చకపోతేనో ? గొప్ప విషాదపూరిత ఆశాభంగం నాకు ..”

” ఊరికే కిందా మీదా అయిపోకు. అంత పెద్ద మాటలు వాడద్దన్నానా , భూమికి జానెడున్నావో  లేదో  !  డయానా కి నువ్వు బాగానే నచ్చుతావులే, వాళ్ళమ్మ తోనే జాగ్రత్తగా ఉండాలి . ఆవిడకి నచ్చకపోతే డయానా కి ఎంత నచ్చినా లాభం లేదు. నీ పూలటోపీ వ్యవహారం ఈపాటికే తెలిసిపోయి ఉంటే ఆవిడ ఏమనుకుంటోందో అనుమానమే. మర్యాదగా పద్ధతి గా ఉండు అక్కడ , నీ విపరీతపు  ఉపన్యాసాల్లాంటివి ఇవ్వకు , తేడాలొస్తాయి .. . అరే, పిల్ల వణికిపోతోందే …” కంగారు పడింది మెరిల్లా.

ఆన్ నిజంగానే వణికిపోతేంది. మొహం ఉద్రేకం తో పాలిపోయింది…ఆ సంగతి ఆమెకీ తెలుసల్లే ఉంది –

” నీకు ప్రాణ స్నేహితురాలు అవబోయే వాళ్ళని నువ్వు కలుసుకోబోతూ ఉంటే, వాళ్ళమ్మకి నువ్వు నచ్చవేమోననే భయం ఉంటే – నువ్వైనా నాలాగే అవుతావు మెరిల్లా ” – టోపీ తీసుకుని బయల్దేరింది .

‘ తోట వాలు ‘ [ బారీ ల ఇంటి పేరు అది ] కి వాగు పక్కని అడ్డదారిలోంచి, ఫర్ పొదల గుట్ట ఎక్కి   వెళ్ళారు ఇద్దరూ. వెనకవైపు న వంటింటి తలుపు తట్టారు. మిసెస్ బారీ వచ్చింది- ఆవిడ పొడుగ్గా ఉంది ,  నల్లటి కళ్ళూ నల్లటి జుట్టు , పట్టుదలని సూచించే పెదవులు. పిల్లలని మంచి క్రమశిక్షణ లో ఉంచుతుందని పేరు.

” బాగున్నావా మెరిల్లా ” – పద్ధతిగా పలకరించింది . ..” లోపలికి రా. నువ్వు పెంచుకుంటున్న అమ్మాయి ఈమేనా ? ”

” అవును. పేరు ఆన్ షిర్లే ” మెరిల్లా చెప్పింది.

Mythili

” అవునండి. స్పెల్లింగ్ లో ‘ ఇ ‘ ఉండాలి ” – ఆన్ అంది. అంత ఉద్విగ్నపు స్థితిలో కూడా ఆ ‘ ముఖ్య విషయాన్ని ‘ విస్మరించకూడదని ఆన్ అభిప్రాయం.

మిసెస్ బారీ ఆ మాటలేమీ పట్టించుకున్నట్లు లేదు , ఆన్ కి షేక్ హాండ్ ఇచ్చి ” ఎలా ఉన్నావు ? ” అని కొంచెం దయ గానే అడిగింది.

” ఆత్మ లో నలిగిపోతూ ఉన్నా, శారీరకం గా బాగానే ఉన్నానండీ, ధన్యవాదాలు ” ఆన్ గంభీరంగా జవాబిచ్చింది. తర్వాత మెరిల్లా చెవిలో రహస్యంగా –  ” పర్లేదు కదా మెరిల్లా, విపరీతంగా ఏమీ లేదు గా ”

మెరిల్లా అదృష్టం కొద్దీ ,  మిసెస్ బారీ – ఆ  మాటలూ  శ్రద్ధగా వినలేదు  …ఎందుకంటే ఆ క్షణం లోనేఎవరో తలుపు తడితే వెళ్ళింది… ఈ లోపు    డయానా  బారీ వచ్చింది అక్కడికి…. సోఫా మీద కూర్చుని పుస్తకం చదువుకుంటోంది, వీళ్ళని చూసి దాన్ని వదిలేసి లేచింది. నిజంగా అందమైన పిల్ల. తల్లి జుట్టూ కళ్ళూ గులాబి రంగు బుగ్గలూ వచ్చాయి. మొహం ప్రసన్నంగా, ఉల్లాసంగా ఉంది- అది మటుకు తండ్రి పోలిక.

” ఇది మా పాప డయానా . డయానా, ఆన్ ని తీసుకెళ్ళి తోటలో నీ పూల మొక్కలు చూపించమ్మా. నీ కళ్ళకీ కాస్త పచ్చదనం మంచిదే, ఇందాకట్నుంచీ చదువుతూనే ఉన్నావు . అస్తమానమూ చదువుతునే ఉంటుందీ పిల్ల- చూపు దెబ్బ తినదూ ? ” ఈ మాటలు మెరిల్లా తో అంది మిసెస్ బారీ. ” నేనేమీ చెయ్యలేని ఆ విషయం లో , వాళ్ళ నాన్న వత్తాసు దీనికి. పోన్లే, ఆరుబయట ఆడుకుందుకు ఒక తోడు దొరికితే నయమే ”

అప్పటికి పొద్దు కుంకుతూ ఉంది.  తోట కి పడమటి వైపున నల్లగా కనిపించే  ఫర్ చెట్లు. వాటిలోంచి ప్రవహిస్తూన్న నారింజ రంగు వెలుతురు లో ఆన్, డయానా – ఒకరి మొహాలొకరు మొహమాటంగా చూసుకుంటూ నిలుచున్నారు.

బారీ   ల ఇంటి తోట ఒక పువ్వుల అరణ్యం లాగా ఉంటుందిడయానా తో స్నేహం గురించి ఆదుర్దాగా ఉందిగానీ , . ఇంకెప్పుడైనా అయితే ఆన్ మనసు అది చూసి పొంగిపోయి ఉండేది. తోట చుట్టూరా పెద్ద పెద్ద ఫర్ చెట్లు , విల్లో చెట్లు – బాగా పురాతనమైనవి అవి. వాటి కిందని నీడ లో పెరిగేకొత్త రకం పూల మొక్కలు. చక్కగా తీర్చి దిద్దిన కాలిబాటలకి అటూ ఇటూ విసనకర్రల్లాంటి గవ్వలు అమర్చారు. ఆ కాలి బాటల మధ్యని సాంప్రదాయికమైన  పూల మళ్ళు మహా వైభవంగా ఉన్నాయి. కెంపు వన్నె లో  ధగధగమంటున్న పియొనీ లు, తెల్లగా ఘుమఘుమలాడుతున్న నార్సిసస్ లు, ముళ్ళలోంచి పరిమళిస్తున్న స్కాచ్ గులాబీలు , నీలి రంగు కొలంబైన్ లు , ఊదా రంగు బౌన్సింగ్ బెట్ లు ….గుంపు లు గుంపు లు గా సదరన్ వుడ్, రిబ్బన్ గడ్డి , పొదీనా …ధూమ్రవర్ణం లో ఆడమ్ అండ్ ఈవ్ పూలు , డాఫోడిల్ లు. గుబురు గుబురు గా క్లోవర్ గడ్డి – దాని పల్చటి   పూలు , వాటి సున్నితమైన సువాసన. సంధ్య కాంతిలో  ఎర్రబడుతూన్న శ్వేత వర్ణపు కస్తూరిపూలు . ఆ తోటలో వెలుగులు ఆగుతున్నాయి …మృదువుగా  కదిలే  గాలులతో   తేనెటీగలు జుమ్మని మాట్లాడుతున్నాయి.

” డయానా ” – ఆన్ పిలిచింది చివరికి ,  మెల్లిగా. ” నేను నీకు నచ్చానా , కొంచెం ? నిన్ను చూడాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాను ”

డయానా నవ్వింది…ఆ పిల్ల మాటకి ముందు నవ్వుతుంటుంది.

” నచ్చావనే అనిపిస్తోంది. నువ్వు గ్రీన్ గేబుల్స్ కి రావటం చాలా సంతోషంగా ఉంది నాకు. ఆడుకుందుకు ఎవరూ అంత దగ్గర్లో లేరు…నా చెల్లెళ్ళేమో చిన్న వాళ్ళు ”

” ఎప్పటికీ..ఎప్పటికీ నాతో స్నేహం గా ఉంటానని ఒట్టేస్తావా ? ” ఆన్ ఆత్రంగా అడిగేసింది.

డయానా కంగారుపడిపోయింది.

తేరుకుని ,  ” అలా ఒట్లూ అవీ వెయ్యకూడదు , తప్పు ” కొంచెం నిరసనగా అంది.

” లేదు లేదు. నేను చెప్పే  ఒట్టు మంచిదే. ఒట్లు రెండు రకాలు కదా .. ”

” నాకొక్క రకమే తెలుసే మరి ” – డయానా సందేహించింది.

” ఇంకో రకం ఉంది..నిజ్జంగా. అది అస్సలు చెడ్డది కాదు , మాట ఇవ్వటం లాంటిది , అంతే ”

” అయితే సరే. ఎలా వె య్యాలి ? ”

” ఇదిగో, ఇలా  – కదిలే నీళ్ళ మీద చేతులు కలపాలి. ఈ కాలిబాటని నీళ్ళుగా ఊహించుకోవచ్చులే. ముందు నేను చెప్తానూ , తర్వాత నువ్వు అలాగే నా పేరుతో చెప్పాలి …సూర్యచంద్రులున్నంత వరకూ , ఆన్ షిర్లే అనే నేను – నా ప్రాణ స్నేహితురాలైన డయానా పట్ల – విశ్వాసం తో వ్యవహరిస్తానని వాగ్దానం చేస్తున్నాను !!!!! ఊ.. ఇప్పుడు నువ్వు – ”

తెరలు తెరలుగా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ డయానా ఆ మాటలు ఆన్ పేరిట వల్లించింది .

” నువ్వు వింత పిల్లవి ఆన్ …ఎవరో అంటే విని ఏమో అనుకున్నాను గానీ… అయినా పర్వాలేదులే, నువ్వంటే నాకు     ఇష్టమే ”

కొంతసేపటికి మెరిల్లా, ఆన్ గ్రీన్ గేబుల్స్ కి తిరిగి వెళ్ళేప్పుడు డయానా వాళ్ళతో బాటు కర్రవంతెన వరకూ వెళ్ళింది. స్నేహితురాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని  నడిచారు. వాగు దగ్గర విడిపోతూ మర్నాటి మధ్యాహ్నం తప్పకుండా కలుసుకోవాలని వాగ్దానాలు చేసుకున్నారు.

తర్వాత మెరిల్లా అడిగింది – ” ఊ.అయితే డయానా నీకు సంబంధీకురాలేనా ? [kindred spirit ]  ”

మెరిల్లా వెటకారం ఆన్ కి అర్థం కాలేదు  ” ఓ , నిజంగా ” – ఆనందంగా  నిట్టూర్చింది.

anne12-2

” ఈ ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవి మొత్తం లో నా అంత ఆనందంగా ఎవ్వరూ ఉండరు ఇప్పుడు. ఈ రాత్రి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. విలియం బెల్  వాళ్ళ బర్చ్ తోపు లేదూ , అక్కడ రేపు మేమిద్దరం బొమ్మరిల్లు కడుతున్నాం. మన కొట్టం లో పగిలిపోయిన పింగాణీ సామాను ఉంది కదా , అది తీసుకుపోవచ్చా నేను ? డయానా పుట్టినరోజు ఫిబ్రవరి లో, నాదేమో మార్చ్ లో- భలే సరిపోయాయి కదూ ?  తను నాకో పుస్తకం ఇస్తానంది…చా..లా ఆసక్తి..గా ఉంటుందట అది. ఇంకానేమో, అడవి లో రైస్ లిల్లీ లు ఎక్కడుంటాయో చూపిస్తానంది. డయానా కళ్ళు ‘ భావపూ..ర్ణంగా ‘ ఉంటాయి కదూ ? నాకూ భావపూర్ణమైన కళ్ళుంటే బావుండేది.  ‘ హేజెల్ కనుమ లో నెల్ ‘ అనే పాట నేర్పిస్తానంది నాకు. నా గదిలో తగిలించుకుందుకు మంచి కాలండర్  ఇస్తానంది.  దాన్లోనేమో,  లేత నీలం రంగు పట్టు గౌనువేసుకుని  చాలా అందమైన అమ్మాయి ఉందట ,   కుట్టు మిషన్ లు అమ్మే షాప్ వాళ్ళు డయానాకి  ఇచ్చారట దాన్ని.  తనకి ఇవ్వటానికి నా దగ్గర కూడా ఏమైనా ఉంటే బావుండేది…నేను డయానా కన్నా ఒక అంగుళం పొడుగున్నాను ..కాని తను నా కంటే బొద్దుగా ఉంది. తనూ సన్నగా ఉంటే బావుండేదని అంది , సన్నగా ఉంటే నాజూగ్గా ఉంటారట ..ఊరికే నా తృప్తి కోసం అని ఉంటుంది అలా. ఎప్పుడో ఒక రోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళి గవ్వలు ఏరుకుంటాం మేము…

ఆ కర్రవంతెన కింది వాగు కి ‘ జలకన్య సెలయేరు ‘ అని పేరు పెట్టాము , బావుంది కదూ ? ఒకసారెప్పుడో ఆ పేరుతో ఒక కథ చదివాను . జలకన్య అంటే గంధర్వ కన్య లాంటిదే..కొంచెం పెద్దది అన్నమాట….”

” డయానాని మరీ  ఎక్కువ విసిగించలేదు కదా  ? ఇంట్లో పని, చదువు అయాకే ఏ ఆటలైనా , మీ ‘ ప్రణాళిక ‘ లో ఇది గుర్తు పెట్టుకోవాలి ” మెరిల్లా అంది.

ఆన్ సంతోషపు పాత్ర అప్పటికే పూర్తిగా నిండి ఉంటే , మాథ్యూ దాన్ని పొంగి పొర్లేట్లు చేశాడు ఆ రోజు. పట్నం నుంచి అప్పుడే తిరిగి వచ్చి ఉన్నాడు వీళ్ళు వెళ్ళేప్పటికి. జేబులోంచి చిన్న పొట్లం తీసి ఆన్ కి ఇస్తూ మెరిల్లా వైపు ఏం అనద్దన్నట్లు చూశాడు.

” నీకు చాకొలెట్ లు ఇష్టం అన్నారెవరో….అందుకని ….తెచ్చాను ”

”హు ” ముక్కు చిట్లించింది మెరిల్లా. ” దాని పళ్ళూ పొట్టా రెండూ పాడైపోతాయి….ఆ..ఆ..లేదులే, మొహం  వేలాడెయ్యకు – మాథ్యూ తెచ్చాడు కదా, తినచ్చు ఈసారికి- అన్నీ ఒకేసారి లాగించెయ్యకు , జబ్బు చేస్తుంది. పిప్పరమెంట్లు తే వాల్సింది మాథ్యూ , అవైతే హాని చెయ్యవు ”

” అన్నీ తినెయ్యను మెరిల్లా. ఒక్కటే తింటాను ఈ రాత్రికి. వీటిలో సగం డయానాకి ఇవ్వచ్చా నేను ?తనకి ఇచ్చేందుకు ఏదో ఒకటి ఉండటం బావుంటుంది నాకు … ఇస్తే ఇవి రెట్టింపు తియ్యగా ఉంటాయి ..”

ఆన్ తన గదికి వెళ్ళాక మాథ్యూ తో అంది మెరిల్లా – ” ఇంకేమైనా అవునో కాదోగాని, పిసినారిది మటుకు కాదు ఈ పిల్ల. పిల్లలు పిసినారిగా ఉంటే అస్సలు భరించలేను నేను. ఇది ఇక్కడికొచ్చి మూడు వారాలే కదా అయింది- ఎప్పట్నుంచో ఇక్కడే ఉన్నట్లుంది నాకు ! ఆ..అలా చూడక్కర్లేదులే, ‘ నేను చెప్పలేదా ? ‘ అన్నట్లు…ఒప్పుకుంటున్నాను, దీన్ని అట్టే పెట్టుకోవటం మంచిదైందని…కాని నువ్వు నన్ను వెక్కిరించక్కర్లేదు ”

                                                           [ ఇంకా ఉంది ]

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. “ఆత్మ లో నలిగిపోతూ ఉన్నా, శారీరకం గా బాగానే ఉన్నానండీ!” ఒక్క ముక్కలో చెప్పేసింది తన గురించి!

    చాలా బావుంది మైథిలి అబ్బరాజు గారూ! తెలుగు నుడికారం లో చక్కగా ఉంది, అనువాదం లా లేదు, ఒక్క పేర్లు తప్ప!

    • Mythili Abbaraju says:

      ధన్యవాదాలండీ …ఆ ప్రయత్నమే చేస్తూ ఉన్నాను. ముళ్ళపూడి ‘ 80 రోజుల్లో భూ ప్రదక్షిణం ‘ , మార్క్ ట్వేన్ కి నండూరి రామమోహన రావు గారి అనువాదాలు ….వీటి అంచులని తాకగలిగితే అదృష్టమే !

  2. కొత్త స్నేహితురాలు డయానా కి స్వాగతం ! చిన్నప్పుడు క్లాస్ లో కొత్తగా వచ్చి చేరిన అమ్మాయిలతో సంభాషణ ఇలానే వుండేది, సహజంగా హాయిగా వుంది బారే ల ఇంటి తోట లాగా !! ” తనకి ఇచ్చేందుకు ఏదో ఒకటి ఉండటం బావుంటుంది నాకు … ఇస్తే ఇవి రెట్టింపు తియ్యగా ఉంటాయి ..” … ఈ అందమైన వాక్యం మరింత తియ్యగా !! TQQ Mam

  3. Mythili Abbaraju says:

    థాంక్ యూ రేఖా…:) ఈ పిల్ల ఒక్క క్షణం ఊరుకోదు …మనకి విసుగు రానివ్వదు !!!!

  4. ఉమాదేవి ( ఉమారవి నీలారంభం ) says:

    చాలా సంతోషం మైథిలిగారు! చాలా ఆనందాన్ని తృప్తిని కలుగ చేస్తున్నారు. ఈ ఎదురు చూడ్డం, మీరు పోస్ట్ చేసారని చూడగానే ఆనంద పడ్డం, ఆన్ తోబాటు ప్రయాణించడం, పరవశించడం, ఊహించుకోడం, కన్నీళ్ళు కార్చడం…అన్నీ బాగున్నాయి. ఈ ఊహించుకోడాలేమిటో!! అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇంతమంది పాఠకులకి ఎంతలేసి అనుభూతుల్ని పంచి పెడుతున్నారు! కృతగ్జ్నతలు!

    • Mythili Abbaraju says:

      నాకూ కొంచెం సందేహమే ఉమాదేవి గారూ ‘ ఊహ ‘ గురించి…:)

      చాలా సంతోష మండీ..

  5. ఊహించుకోవటం భలే ఉందండి. “ఆత్మ లో నలిగిపోతూ ఉన్నా, శారీరకం గా బాగానే ఉన్నానండీ!” అంత చిన్న పిల్ల ఎంత గొప్పగా చెప్పిందో !!

మీ మాటలు

*