





తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
~
ప్రకృతినీ-వినీలాకాశాన్నీ-వింత వింత నక్షత్రాల్నీ
వీక్షించిన బుద్ధి కుశలత ‘హోమో సేపియన్స్’ దే కదా!
విరోధాభాసమంతా స్వర్గమూనరకాల భ్రమల తర్వాతే !
జ్ఞాన వృక్షపు నిషిద్ధ ఫలాల్ని తిన్నతర్వాత
లాటిన్మృతభాషలో పారడైజ్ పిట్టకథలు తెలిసినట్లు
న్యూటన్గతి సిద్ధాంతపు కక్ష్య యంత్రగతిని జాగ్రత్తగా లెక్కించిన చోటే
ఆధునిక రోదసీ పథనిర్దేశానికి ఇస్రో తిరుపతి కొండలెక్కుతుంది…
శాస్త్రీయతను ధ్వనించే శబ్దాలతో సైంటిస్టులే
సత్తాలేని సరుకుల లేబుళ్ళకు సైన్స్ నామాలు పెడుతున్న దేశంలో
వేలెడంతలేని ‘నోబెల్’ రామకృష్ణన్
ఏనుగంత ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను వింత సర్కస్ అనేశాక
ఆవిరైపోయిన తర్కం గురించి ఎవరితో మాట్లాడతాం !
‘కఫాలా’ కు ఆధునిక బానిసత్వం పేరుపెట్టి
భాషరాని శ్రామికులను-మనసు భాషరాని ఇసుక కోతుల మధ్యకు తరిమినట్లు
భావ దాస్య ముష్కరంగా మార్చిన పుష్కరంలో
జ్ఞానస్నానం పొందాల్సిన తెలుగు జీవితాలు ఉత్తపుణ్యాన నీటిపాలు..
బౌద్ధభూముల అమరావతిలో భూసూక్తం చదివిన చందాన
అశాస్త్రీయ పద్దతిలోమాయని లాగితే చిట్లిన గర్భకోశంపై ఏం మాట్లాడగలం!
‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ లా ఫోజులు కొడుతూ
సిలికాన్ మురిక్కాలువలా ప్రవహించే కొత్త రాష్ట్రంలో
ప్రాంతీయ సామంత రాజొకడి పిలుపుమేరకు
నాలుగు దశాబ్దాల బహుజన మూలవాసీ అవిశ్రాంత పోరాటం
బ్రాహ్మణీయ భావజాలపు ప్రతీఘాత నిరర్ధక విప్లవం పాలు..
ఆల్ ఈజ్ వెల్ ! ఆగ్నేయంలో మాత్రం అగ్ని ప్రమాదం..
‘అసహనం చెంప దెబ్బకు లక్ష నజరానా’ పొందినంత ఆనందంగా
తెలంగాణ జర్నలిస్టుల జాతరకెళ్ళిన ప్రెస్ క్లబ్ స్కీటర్లు
సరళాదేశ సంధి జరిగి ‘సరళమే ఆదేశంగా’ నిష్క్రమించడం విచిత్రం..
సత్యాన్ని ప్రశ్నించని శతాబ్దాల మహాయానంలో
అసత్యం పై ఇండియన్ ఫోరంల మీద ఏంజెళ్ళలా నటించే
డక్కన్ మేధావుల వ్యూహాత్మక మౌనం మరీ విచిత్రం..
రొట్టెనడిగితే రాయి నిచ్చిన తర్వాత
కట్టని గుళ్ళూమసీదులకు నజరానాల గానా బజానా తర్వాత
నిరసన సమూహాలకు ప్రకటించనున్నది భారీ అసహాయం..
నైరుతి రుతుపవనాల్నీ ఎల్ నినో ‘చేపమందు’లా వేసుకుందని తెలిసి
విత్తిన నేలే తక్కువని సర్కారే నట్టూవాంగం వాయించాక
విత్తినవాడి గుండె పఠాన్ చెరువు కాకుండా ఉంటుందా!
బతికి బట్టకట్టిన రైతుకోసం ఖరీఫ్ పంట కత్తి దూసే ఉండదా!
ఖాళీ కడుపులతో ఏం ఫిలాసఫీ మాట్లాడతాం !
దేశమనే కంద పద్యంలో
దోషమే కనబడని ఆషా వర్కర్లు నిషిద్ధ గణం
దిశ తెలియని ఆధిపత్యం దిమ్మతిరిగే యాగాలకు ప్రాపకం!
ఆకలి ఆత్మల బుజ్జగింపుకు ఖుర్బానీలుగా- తాయెత్తులు కాశీ తాళ్ళుగా
మారే పేదల సంతలపై ఏ నిషేధాల లాజిక్కులు మాట్లాడతాం!
సంధి కుదరనప్పుడు తప్పదులా వుంది విసంధి దోషం !
రాష్ట్ర ప్రాయోజిత చీకటిలో ఇప్పుడు తెలుగు జనం !!
( హేతువాద ఉద్యమంకోసం తీవ్రంగా కృషి చేసిన దళితనేత కత్తి పద్మారావుగారికి)
-తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
09538053030

ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]

నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]

నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2026 Saaranga Publishers
తాజా కామెంట్లు