కుంభమేళాలో రహస్యోద్యమం

టియర్స్ గ్యాస్

 

మోహన్ రుషి

 

Mohan Rushi

 

 

 

 

 

అతడు ఆమెకు చాలా దూరంలో నుంచి దగ్గరగా

వున్నాడు. లేదా అతను మాత్రమే అలా అనుకోవడం

లోని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. సంతోషం సగమే

బలం. దుఖ్ఖం శాశ్వత  భారం. ఒక ఖాళీ తాకడానికి

ఎంత సమయం కావాలి? ఇక దిగులు మేఘం ఆవరించి

కళ్ళు దుఖ్ఖాశ్రువులతో చిప్పిల్లడానికి ఏ మరో కారణం

కావాలి?!

 

ఆమె అతడికి చాలా దగ్గర్లో నుంచి దూరంగా వుంది. లేదా

ఆమె మాత్రమే తనకు తాను ఒక ప్రశ్న అవ్వడంలోని

సందిగ్ధ సందర్భాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోంది. లోలకాన్ని

నిశ్చలం చెయ్యడానికి ఎంతమాత్రం నిబ్బరం అవసరం? ఒక

స్థిరమైన నిశ్చయంతో హృదయాన్ని గడ్డకట్టించుకుని

వెనక్కి చూడకుండా వెళ్ళిపోవడానికి ఇంకే కొత్త వేదన

కారణం కావాలి?!

*

విక్రమ్ బేతాళ్!

309064_10150308481728559_717348232_n

painting: Rafi Haq

 

మనకేం హక్కుంటుంది, ఒకరి మీద ఫిర్యాదు చేయడానికి?

సమాధానం కాలేనివారికి ప్రశ్నగా మారే సందర్భమెలా

చిక్కుతుంది?

 

అడుగులన్నీ జాడల్ని మిగిల్చేవి కావు. ప్రయాణాలన్నీ

జ్ఞాపకాల్ని రాల్చేవి అయ్యుండాల్సిన అవసరం లేదు. తీవ్రమైన

కొన్నిక్షణాల్లో తీరినదాహానికే జీవితం దాసోహం అనదు.

 

మలుపు తిరగనిది దారే కాదు. మరపుకు రానిది

మాటే అవదు. క్షణక్షణానికీ రంగులు మారే కాలలోకంలో

అమాయకత్వానికి తావు లేదు.

 

సిద్ధమైన రంగం మీద స్థిరబిందువుగా వుండడం

అనౌచిత్యం. రంగరించుకున్న అనుభవాల్లోంచి కొత్తగా

ఎగరేసుకోవాల్సిన అనివార్యతలకు మనమెవ్వరం

అతీతులం కాము.

 

మనం కప్పుకున్న దుప్పటినే తెల్లారేవరకూ అధీనంలో

వుంచుకోలేనివాళ్ళం. మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కిందని

ఆకాశాన్నెలా నిందించగలం?!

                                                                                        -మోహన్ రుషి

Mohan Rushi

లైఫ్ ఈజ్ డ్యూటిఫుల్!

Mohan Rushi

 

 

 

 

 

 

ముఖ్యంగా నిన్ను నువ్వు అదిమి పట్టుకోవాలి. ఎల్లప్పుడూ బీ పాజిటివ్ రక్తాన్నే

ఎక్కించుకోవాలి. మొండి గోడల్లోంచి మొలాసిస్ పిండుకుని తాగాలి. రాజుగారి

కొత్త దుస్తుల్నే ధరించి చరించాలి. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆల్ ఈజ్ వెల్

పాటలనే పాడి పరవశించాలి.

 

చూసే కళ్ళల్లో అందాన్ని దిగ్గొట్టాలి. ఆకుపచ్చ కామెర్లు అంటించుకోవడానికి

ఆపరేషన్లు చేయించుకోవాలి. సంకనాకిపోయినా జీవితంలోని సౌందర్యాన్నే

కీర్తించాలి. చావుదెబ్బలు తగుల్తున్నా సమ్మదనాన్నే అభినయించాలి. జీలో

కాల్తున్నా జీమూతవాహనుడికే జిందాబాద్ కొట్టాలి.

 

ప్రేమించే హృదయాన్ని ఫ్రేము కట్టుకు తిరగాలి. నిజాల మీద నిప్పులు పోసి

పప్పులుడికే ప్లాన్లు వెయ్యాలి. మంట మండిస్తున్నా, మర్యాద రామన్న మాస్కులో

మూస్కోవాలి. ఒరిజినల్ ఫీలింగ్సన్నీ ఒజిమాండియాస్ సమాధిలో పాతిపెడ్తే,

అప్పుడు కదా, బతుకు బాగుపడేదీ, రేపటికి లేచి కూర్చునేదీ

                                                           – మోహన్ రుషి

మాట పడాలనుకుంటా

393764_176060322482234_16821319_n
మాట పడాలనుకుంటా. మనసున్న మనుషుల్తో. మానవత్వపు కొరడాల్తో.
నిబద్ధత నిప్పుల్తో.
జారుతున్నప్పుడల్లా. జాలంలో చిక్కుకుంటున్నప్పుడల్లా. చీకటి
చీల్చుతున్నప్పుడల్లా. దారి తప్పుతున్నప్పుడల్లా.
ఉండాలొక పెద్దమనిషి, గల్లా పట్టుకోడానికి. గదమాయించడానికి. చెంపలున్నది
ముద్దులు పెట్టడానికి మాత్రమే కాదని చెప్పడానికి.
నీ చావు నిచ్చావుగాను అని శపించడానికి.
అదృష్టంకొద్దీ తుడిపెయ్యడానికి రబ్బర్లుంటాయి. డస్టర్లూ. రిమూవ్
ఆప్షన్లూ.
తప్పుదిద్దుకుని బయల్దేరుతా. తెల్లమొహంతో. కొన్ని తేట పదాల్తో.