నేను నేనే నేను!

samvedana logo copy(1)నోట్ల రద్దుమీద కొంతమంది మిత్రుల అభిప్రాయాలు చూశాక ఇది రాయాలనిపించింది. నోట్ల రద్దు ఫలానా ఫలానా కంపెనీలకు లాభం చేకూర్చడానికి అని మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫలానా ఫలానా వారికి ముందే తెలుసు అని ఆరోపిస్తున్నారు. రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌భార్య ముఖేశ్‌అంబానీ భార్య ఇద్దరూ సిస్టర్స్ అని కొత్త కోణాలు వెలుగులోకి తెస్తున్నారు. ఇవన్నీ నిజమా కాదా అనేది అంతగా ప్రాధాన్యమున్న అంశం కాదు. సమస్య తీవ్రతను తక్కువగా చూస్తున్నారు. మోదీ పాలనను కాంగ్రెస్‌స్థాయికి కుదించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ అవినీతిపరుడు అయినా కాకపోయినా అది పెద్ద సమస్య కాదు. అంతకంటే పెద్ద సమస్య భావజాల పరమైనది. హిట్లర్‌తో సమస్య అవినీతి కాదు.

నేను, నేనే, నేను మాత్రమే అనేది సమస్య. ఈ దేశాన్ని నేను మాత్రమే దారిలో పెట్టగలను అని ఒక మనిషి అనుకోవడం సమస్య. తాము అనుకున్న లక్ష్యాలు చేరడానికి వ్యవస్థ-నిర్మాణాలు-నిబంధనలు అడ్డంకి అనుకోవడం సమస్య. వ్యవస్థ కంటే తాను పెద్ద వాడిననుకోవడం సమస్య. నేనే నిజాయితీపరుడిని, ఇంకెవరూ కాదు అనుకోవడం సమస్య. తాను కోరుకున్నట్టుగా వ్యవస్థను మార్చే ముళ్లకిరీటాన్ని తన మీద తానే పెట్టుకున్నవాడు అధికారంలో ఉండడం సమస్య. మన పూర్వీకుల సాంకేతికతకు పుష్పక విమానమనే పురాణ ఉదాహరణలు చూపగలిగే మనిషి, గణేశుడి తలని శస్త్రచికిత్స పరిజ్ఞానానికి ఉదాహరణగా సైన్స్‌కాంగ్రెస్‌లోనే ప్రకటించగలిగిన మనిషి అటువంటి స్థితిలో ఉండడం అసలు సమస్య.

మోదీ నిజంగానే బ్లాక్‌మనీని ఈ విధంగా అరికట్టాలని అనుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. అతనికి ఆ చిత్తశుధ్ది ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎలుకను చంపాలనుకున్నవాడు అందుకోసం ఇల్లు తగులబెడితే అతనికి ఎలుక విషయంలో చిత్తశుధ్ది లేదు అనగలమా! సమస్య అతను అవినీతిపరుడా కాదా అనేది కాదు. ఆ మాట కొస్తే కేంద్ర కేబినెట్లోనూ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులుగానూ వ్యక్తిగతంగా అవినీతి జోలికి పోనివారు అనేకులున్నారు. సో వాట్‌!

మోదీ నిర్ణయం చూస్తే కనీసం ఆర్థికమంత్రి, రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌లనైనా విశ్వాసంలోకి తీసుకున్నారా అని అనుమానం వస్తుంది. వాళ్లకి తెలీకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను నేనే నేను మాత్రమే అనుకునే మనిషి ఏమైనా చేయగలరు? ఇంత పెద్ద వ్యవస్థను నడిపే ఆర్థిక వేత్తలకు ఎటిఎంలలో కొత్త నోట్లు పెట్టడానికి ఎంతకాలం పడుతుంది అనే విషయం తెలీకుండా ఉంటుందని అనుకోలేం. 86 శాతం కరెన్సీ పోతే సిస్టమ్‌ఎలా కుప్పకూలుతుందో తెలీకుండా ఉంటుందని అనుకోలేం. కోరి కోరి ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటారని అనుకోలేం. భావజాలపరంగా విభేదించొచ్చు కానీ పరిజ్ఞానంలో వారి స్థాయిని తక్కువగా అంచనా వేయలేం. 90 లతర్వాత పెరిగిన కరెన్సీ ప్రాధాన్యం గురించి ఏ కాస్త ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవాళ్లైనా సులభంగా చెప్పేయగలరు అది ఎంత అల్లకల్లోలమో! దేశభక్తికి 56 ఇంచీల ప్రతినిధి అయిన ప్రధానుల వారు వాళ్లను సంప్రదించారా అనేది సందేహమే.

అవినీతిని దాటి ఆలోచించకపోతే చాలా విషయాల్లో బోల్తాపడే ప్రమాదం ఎక్కువ. బలమైన భావజాలమున్న శత్రువుపై ఆ అస్త్రం పూచికపుల్ల లాంటిది. చావల్‌బాబా రమణ్‌సింగ్‌అవినీతిపరుడు కాకపోవచ్చు. ఆ మనిషి నవ్వు చూస్తే ఇతను చీమకైనా హానితలపెట్టగలడా అనిపించొచ్చు. కానీ చత్తీస్‌గఢ్లో ప్రభుత్వ బలగాలు వారి వత్తాసు ఉన్న బలగాలు ఆదివాసీలపై కొనసాగించిన అరాచకాలు మాటలకందనివి. నవీన్‌పట్నాయక్‌క్లీన్‌, ఎడ్యుకేటెడ్‌, శావీ అనిపించే పెద్దమనిషి కావచ్చు. కానీ ఆయన పాలనలో ఉన్న నేలమీద జరిగిన మారణకాండ,అంతకుమించి అక్కడనుంచి బయటకొస్తున్నకోణాలు మనిషి అనే పదం సిగ్గుతో తలవంచుకునేవి. నిజాయితీ-వ్యక్తిగత అవినీతి అనేవి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రమాదం ముందు చిన్నవి. అవి కాంగ్రెస్‌స్థాయి వ్యవహారాలు.

500-rupees
అసలు సమస్య నోట్లకోసం క్యూలో ఉండడం దేశభక్తి అనే మాటలో ఉంది. తానేం చేసినా దానికి దేశభక్తి అనే పేరుపెట్టడంలో ఉంది. దీన్ని వ్యతిరేకించే వారంతా దేశద్రోహులు అనే భావజాలంలో ఉంది. మా వైపు లేకపోతే ఉగ్రవాదుల వైపు ఉన్నట్టే, మే చేసిన దాన్ని ప్రశ్నిస్తే దేశభక్తి లేనట్టే అనే వాదనలో ఉంది. ప్రతీదీ దేశభక్తే. ఎనిమిది మంది అండర్‌ట్రయల్స్‌ని చట్టవిరుద్ధంగా చంపేస్తే దేశభక్తి. చట్టం, రూల్‌ఆఫ్‌లా, మనమే ఏర్పరుచుకున్న నిబంధనలను ఇలా ఉల్లంఘిస్తూ పోతే ఎలా లాంటి ప్రశ్నలు మామూలుగా వేయగలిగే వారిమీద కూడా ఈ దేశభక్తి అనే మాట పనిచేస్తుంది,. ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన సర్జికల్‌స్రయిక్సే చేసినప్పటికీ బహిరంగంగా ప్రకటించడం అనే పని చేసినందుకు అది దేశభక్తి అవుతుంది. అదేంటి, ఎలా జరిగింది, నిజంగా మీరు చెప్పినట్టే జరిగిందా అనిప్రశ్నిస్తే మళ్లీ ఈ దేశభక్తి అనే అస్త్రం ముందుకొస్తుంది.

ఎవరో హేతువాదులపై దాడులు చేస్తారు. ఇంకెవరో బీఫ్‌తినడం దేశద్రోహం అంటారు. విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్‌-మార్క్స్‌వాదులను ఎవరో పనిగట్టుకుని వేధిస్తూ ఉంటారు. రోజూ ఎక్కడో ఏదో జరుగుతూనే ఉంటుంది. అదేదో విడిఘటనలాగా ఉండదు. మన హేతుబద్ధత, మన లాజిక్‌, మన ప్రజాస్వామికత ఓడిపోయినట్టుగా పదే పదే అనిపిస్తుంది. రాజ్యం మన అందరిమీదా కత్తికట్టినట్టుగా అనిపిస్తుంది. మనకు తెలీకుండా మన వెంటనీడలాగా వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మన నెత్తిమీదే ఒక కెమెరా పెట్టినట్టుగా మన చుట్టూ ఒక కంచె వేసినట్టుగా అనిపిస్తుంది. బాలగోపాల్‌సంస్మరణ సభలో రత్నం చాలా చక్కని మాట వాడారు. విశ్వవిద్యాలయాలను గ్రామాల స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు అని. ఈ మధ్య ఒక జర్నలిస్టు పెద్దాయనతో మాట్లాడుతుంటే ఒక పదం వాడారు. ఇతను వచ్చినప్పటినుంచి రోజూ టెన్షన్‌ఉంటోంది అని. అదీ సరైన అవగాహన. ప్రమాదాన్ని గుర్తించడమంటే అదీ.

ప్రతి సందర్భంలోనూ ఈ దేశభక్తి అనే పదాన్ని ముందుకు తేవడం అత్యంత ప్రమాదకరమైన సంకేతం. తాము చేసే ప్రతిపనిని సమర్థించుకోవడానికి భావజాలంతో ముడిపెట్టడం సిద్ధాంతం అనేది ఉన్న ప్రతి పార్టీ చేసే పనే. ఈ పని కమ్యూనిస్టు పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్న దేశాల్లో వేరే కోణంలో చేస్తాయి. భావజాలం కూడా దానికది సమస్య కాదు. కాకపోతే అది మనుషులందరికీ ఒకే విలువ ఉంటుందని నమ్మే భావజాలమా, సమానత్వాన్ని నమ్మే భావజాలమా దానికి విరుద్ధమైన భావజాలమా అనేది ముఖ్యమైనది. ఇపుడు మన దేశాన్ని పాలిస్తున్న భావజాలం మనుషులందరూ సమానమని నమ్మేదికాదు. పేదలు-దళితులు-మైనార్టీలు- ఆదివాసీలు -మహిళల హక్కులను గుర్తించేది కాదు.

పైగా ఆర్థికరంగంలో పెట్టుబడీదారీ విధానాలను పాలనా వ్యవహారాల్లో ఫ్యూడల్‌భావజాలాన్ని కలిపి కొట్టే వింత మృగం. దేశాన్ని పాలిస్తున్న మనిషి తాను అన్నింటికీ అందరికీ అతీతుడనని తానే సర్వం అని నమ్మేమనిషి. తాను కోరుకున్నట్టుగానే అందరూ ఉండాలని తాను ఆలోచించినట్టుగానే అందరూ ఆలోచించాలని కోరుకునే మనిషి. తాను చేస్తున్న పని దాని ప్రయోజనాల గురించి పరిధి గురించి వాజ్‌పేయికి కనీసం కొన్ని సందేహాలైనా ఉండేవి. ఇతనికి అలాంటివేవీ ఉన్నట్టు కనిపించడం లేదు. రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌ప్రకటించాల్సిన నిర్ణయాన్ని ప్రధాని తనంతట తాను ప్రకటించడంలోనే చాలా విషయం ఉంది. మనుషుల కంటే, మనం ఏర్పరుచుకున్న వ్యవస్థీకృత నిర్మాణాల కంటే నిబంధనల కంటే దేశం గొప్పదనేదేదో ఉంది. దేశం కోసం అంటూ నిర్ణయం తీసుకుంటున్నపుడు మిగిలినవాటిని పట్టించుకోనక్కర్లేదు అనే భావన నిలువునా జీర్ణించుకుపోతే అది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అది కూడా జాతి లాంటిదే. దేశభక్తి అనేదాన్ని నాటి యూదు జాతీయత అనే స్థాయికి తీసుకువస్తున్నారు. అరవై డెబ్భై ఏళ్లుగా సిస్టమ్స్ ఎంతో కొంత ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకా ఏమయిపోయి ఉండేదో అని భయం వేస్తుంది.

కాంగ్రెస్‌మీద గురిపెట్టినట్టుగా బిజెపి మీద అవినీతి అస్ర్తాన్ని ప్రధానం చేయలేం. మోదీ అధికారంలోకి వచ్చినపుడు ఆ అస్ర్తాన్నే ఎలా తన అధికారం కోసం ఉపయోగించుకున్నారో ఒకసారి గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్‌అవినీతి మన దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తుంది. కానీ బిజెపి మన మెదళ్లను కంట్రోల్‌చేయాలని చూస్తుంది. నీ ఆలోచనలు భిన్నంగా ఉన్నా సహించనంటుంది. నీ మెదడు మీద నీ ఆలోచన మీద, నీ హేతుబద్ధత మీద, నీ నాస్తికత్వం మీద నీ హక్కుల ప్రకటన మీద, నీ వస్ర్తధారణ మీద, నీ తిండి తిప్పల మీద యుద్ధం చేస్తుంది. ఇవన్నీ తాను కోరుకున్న పద్ధతిలో ఉండాలని భిన్నంగా ఉంటే సహించనని అంటుంది. అక్కడ ఉంది అసలు ప్రమాదం. నోట్ల రద్దులో ఉన్నది అవినీతే అయితే అదంత పెద్ద సమస్య కాదు. అపుడు ఇంత భయానక వాతావరణం ఉండదు. ఇది అహంకారం-అజ్ఞానం-అధికారం కలగలిసిన మనిషి సృష్టించిన బీభత్సం. నేను అనుకుంటే ఏదైనా చేయగలను అనే మనిషి అహంకారానికి అడ్డుకట్ట వేయడం ఎలా అనేదే ఇవాళ మన ముందున్న ప్రశ్న.

*

జ్యోతిలక్ష్మికి చీర కడితే!

samvedana logo copy(1)

jyothi-lakshmi-18045జ్యోతి లక్ష్మి పోయారు. కొందరు మిత్రుల పోస్టులు చూశాక ఏవో ఆలోచనలు.

జ్యోతి లక్ష్మి కేవలం ఐటెం గర్ల్‌ కాదు. ఆమె సంప్రదాయ నృత్య కళాకారిణి అని చెప్పాలనే ప్రయత్నం అందులో కనిపించింది. కేవలం సమాచారం ఇవ్వడం కాకుండా విలువల పరమైన విషయమేదో అంతర్లీనంగా ఉంది. ఇంత చెత్త డాన్సులే కాదు, కూసింత మంచి డాన్సులు కూడా చేసింది అని గుర్తించండి అని చెప్పడం ఉంది. అది నిజమేనా! అంతకుముందు రాజాస్థానంలో చేసిన నృత్యాల్లోనూ- పాటల్లోనూ ఉన్నది ఏమిటి? అభిరుచుల విషయంలో మన అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నదేమిటి? సినిమా పరంగా బూతు చుట్టూ అల్లుకున్న భావనల్లో ఉన్న మతలబు ఏమిటి అనేది చూడాల్సి ఉంది.

క్లబ్‌డాన్సర్‌ అనే బదులు ఇటెం గర్ల్‌అనే పదం పొరబాటున వాడుతున్నారు. కొత్త పరిభాష అలవాటైపోయాక పాత పదం మర్చిపోయి కొత్తదే వాడేస్తూ ఉంటాం. ఈ ఐటెం అనే పరిభాష 90ల తర్వాతది. రాంగోపాల్‌వర్మ శిష్యుడు నివాస్‌తీసిన శూల్‌లో చోలీకీ పీచే క్యాహై అంటూ మాధురీ దీక్షిత్‌ చిందులేసే దాకా  ఐటెంసాంగ్‌ అనే పదం మన పదకోశంలోకి రాలేదు. తెలుగులో  వర్మ మరో శిష్యులు పూరీ జగన్నాధ్‌ తన మ్యూజ్‌ ముమైత్‌ఖాన్‌తో మరో దశకు తీసికెళ్లారు.

ఇటెం, మాల్‌, చీజ్‌ అనేవి బాంబేలో ప్రబలంగా వినిపించే మాటలు. అమ్మాయిలను సెక్స్‌ఆబ్జెక్ట్స్‌గా చూసే లంపెనైజ్డ్‌ మార్కెట్‌ పరిభాష.  జ్యోతి లక్ష్మియుగానికి వాళ్లు క్లబ్‌డాన్సర్లే. అవి బీడీ కీ జలైలే, చింకీ చమేలీ రోజులు కావు. అవి డిటెక్లివ్‌లు, పోర్నో పుస్తకాలు చిన్నచిన్న దుకాణాల ముందు తీగలపై వేలాడుతున్న రోజులు. పోర్నో ప్రతి మనిషికి అందుబాటులోకి రాని రోజులు. ల్యాండ్‌లైన్‌రాజ్యమేలుతున్న రోజులు. ప్రైవసీకి కష్టపడాల్సి వచ్చే రోజులు.  యాస్పిరేషనల్‌ మిడిల్‌క్లాస్‌ఇంత పెరగలేదు కాబట్టి విలాసం అనేది నెగెటివ్ అర్థంలో స్థిరపడిపోయి ఉండేది. అప్పుడు కారు అనేది అరుదైన వ్యవహారం కాబట్టి కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడిదానా అనేది విలాసాన్ని దెప్పిపొడవడానికి సరిపోయింది. ఇవాళ ఆ పాటను అదే అర్థంలో సమాజం స్వీకరించలేదు. వర్గ రాజకీయాలను అంత కుదించి మాట్లాడడం ఇవాళ కుదరదు. అప్పటికి రిసార్టులు ఇంత లేవు కాబట్టి క్లబ్‌ విలాసానికి చిరునామాగా ఉండేది. సినిమాల్లో అలాగే చూపించేవారు. అందువల్ల క్లబ్తో ముడివేసి క్లబ్‌డాన్సర్‌ అనే పేరు పెట్టారు. లేదా క్యాబరే అన్నారు. కేవలం క్లబ్బుల్లో తాగుబోతుల మధ్య డాన్స్ వేసే వారు అని నైఘంటికార్థం తీయకూడదు.

పల్లెటూరి ప్రేక్షకుడితో పాటు పట్నపు ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకోవాల్సిన మార్కెట్‌అవసరం ఏర్పడిన సంధికాలంలో తెలుగు సినిమాలో ఆ సంధి ప్రేలాపన చాలా కనిపిస్తుంది. ఆ సంధికాలపు తొలిదశలో దాసరి ఉంటే దాని ఉచ్చదశకు ప్రతినిధిగా రాఘవేంద్రరావు కనిపిస్తారు. తెలుగు సినిమాల్లో కత్తులు కటార్లు తగ్గిపోయి దొరలు-భూస్వాములు వాళ్ల పంచెకట్లు తగ్గిపోయి గన్స్‌-పాంట్స్‌తో విలన్లు వస్తున్న కాలంలో వచ్చిన ట్రెండ్‌ ఈ క్లబ్‌డాన్సర్లు. అంతకుముందు పూర్తిగా గ్రామీణ ప్రేక్షకులే ఎక్కువగా మార్కెట్‌లో ఉన్నరోజున రాజుగారి లేదా జమీందారుగారి సంస్థానంలో పాటలను చూపించేవారు. స్త్రీని విలాసవస్తువుగాచూపే విషయంలో అవేమీ తక్కువ కాదు. ఇపుడు మిత్రులు జ్యోతిలక్ష్మి మీద గౌరవం పెంచడానికి పంచుతున్న త్యాగయ్య పాటే తీసుకున్నా అందులో ఆడువారు యమున కాడ క్రిష్ణుని గూడి..అందరు చూడగ.. ఏమేమి చేయుచున్నారో ఉంది. అలా క్రిష్ణుని గూడి చేసినా ఆధునిక హీరోను కూడి చేసినా చేసేది ఒకటే. చెప్పేది ఒకటే.అలాగే ఆ గీతంలో జ్యోతి లక్ష్మి వస్త్రధారణ కూడా భిన్నంగా ఏమీ లేదు. జ్యోతిలక్ష్మి రెండు పాటల్లోనూ తన పాత్రేదో తాను పోషించింది. ఒకదాని కొకటి తక్కువా కాదు. ఎక్కువా కాదు.

సెక్స్‌సంబంధమైన పరిభాషను నిత్యజీవితంలో సామాన్యులు వాడే పదజాలంనుంచి విడదీసి గంభీరంగా సంస్కృతంలో మాట్లాడుకుంటే అదేదో సున్నితం అనిపిస్తుంది.నేనెక్కడో దాచాను బంగినపల్లి అంటే బూతుగా కనిపించి ఆ త్యాగయ్య చిత్రం పాటలోని పాలిండ్లు కదల, కుటిలోలకములు మెదల అంటే బూతుగా అనిపించదు. అంతెందుకు మన సాహిత్యంలో కూడా అవసరమైన చోట రతి ప్రక్రియ అనో ఇంకోటో వాడగలం కానీ తెలుగుపదం వాడలేము. శిశ్నము, భగము అంటే అంత బూతుగా కనిపించదు, తెలుగు వాడితేనా, అమ్మో! ఇదంతా ఒక సంస్కృతి మన మెదళ్లపై చేసిన పెత్తనం ఫలితం. ఇపుడు ఇంగ్లిష్‌కి వద్దాం. ఫక్ అనేమాట యథాలాపంగా వాడేస్తుంటారు. షిట్‌ అనే మాటని డైనింగ్‌టేబుల్‌మీద కూడా యథాలాపంగా విసిరేస్తుంటారు. కానీ తెలుగులో వాడమనండి, ఎంత అసహ్యంగా మొకం పెడతారో అందరూ! ఇవేమో ఆ పదాలతో ముడిపడిన ఆంగ్ల సంస్కృతిలో ఉన్న పారదర్శక స్వభావానికి సంబంధించిన అంశం. అంతకంటే ముఖ్యంగా మార్కెట్‌కు సంబంధించిన అంశం. అంటే కాస్త వెనక్కు పోతేనేమో కొందరికి మాత్రమే పరిమితమైన వ్యవహారం. గాంభీర్యం లేదా లాలిత్యం అనిపిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకో భాషలోనేమో ఆ భాషలో అది కామన్‌ కాబట్టి మనకు ఏమీ అనిపించదు.

actress-jyothi-lakshmi-passes-away-63

ఒకటి ఫ్యూడల్‌ మాయాజాలం. ఇంకోటి మార్కెట్‌ మాయాజాలం.ఇక్కడ బూతు అనేది ఆ భాషతోనూ ఆ భాషతో ముడిపడిన సమాజముతోనూ ముడిపడి ఉన్నది. భాషతో పాటు అనేకానేక ఇతర అంశాలు కూడా పనిచేస్తాయి. విచ్చిన పూరేకు పచ్చల పిడిబాకు, గుచ్చుకుంటే తెలుస్తుందిరా అంటే కనిపించని బూతు వేటకత్తి ఒంట్లో దూసి సిగ్గు గుత్తి తెంచేశారు అంటే కనిపిస్తుంది. రెండూ ఒకటే . వాస్తవానికి మొదటిది రెండో దానికి ఇన్‌‌స్పిరేషన్‌కావచ్చు కూడా. పిక్చరైజేషన్‌ అప్పటి వాతావరణం అనేకం పనిచేస్తాయి. అక్కడ ఆ పాత పాటలోనైనా రాక్షసి పాత్ర కాబట్టి ఆ మాత్రం తెలుగు వాడేశారు.దేవతల ఆస్థానమైతే పెట్టేవారు కాదు.దేవతల సెక్స్‌ కూడా సంస్కృతంలోనే ఉంటుంది మరి! అంతకంటే ముఖ్యంగా అప్పటి మార్కెట్‌కి అది బాహాటంగా ఉండడం అవసరం కాదు.ఇపుడు ప్రేక్షకుడి తొడనిమిరి అరే అబ్బాయి్‌ఇది ఇందుకోసమే పొరబడనక్కర్లేదు ఇందుకోసమే అని చెప్పే మార్కెట్‌. ముసుగులు అక్కర్లేని కాలం. ఇదంతా ఎందుకంటే జ్యోతిలక్ష్మి త్యాగయ్యలో పాడిన పాటైనా, లేలేలే నారాజా పాట అయినా ఒకటే. రెండూ టిటిలేటింగ్‌ ఎఫెక్ట్‌కోసమే. ఒకప్పుడు ఏదైనా ముసుగులో మాత్రమే చెప్పాల్సిన టైం కాబట్టి ఆస్థాన నర్తకిగానూ, మేజువాణీగానూ మేలిముసుగుల్లో ఆడాల్సి వచ్చేది. పట్టణ మార్కెట్‌పెరిగే కొద్దీ కొత్త తరం ప్రేక్షకుల్లో టిటిలేటింగ్‌ఎఫెక్ట్‌కోసం వేరే రూపం తీసుకోవాల్సి వచ్చింది. అపుడైనా ఇపుడైనా మార్కెటే ప్రధాన నిర్దేశకురాలు. అపుడైనా ఇపుడైనా అనేకమంది మగవాళ్ల ముందు ఒక స్త్రీ  తనను తాను ప్రదర్శించుకోవడమే. ఆ మగవాళ్లు ఇంద్ర దర్బారులోని దేవుళ్లా, ఆధునిక పబ్బులోని మగవాళ్లా అనేదే తేడా కానీ విషయంలో తేడా లేదు.

సినిమాల్లో ఏదో చేసేద్దామని దాన్ని సామాజిక సాధనంగా భావించి కొందరు చేసిన ప్రయోగాలను మినహాయిస్తే ఇతరత్రా విషయాల్లో పాత సినిమాలు సెన్సిబిల్‌అయిపోయి కొత్త సినిమాలు ఇన్‌సెన్సిబిల్‌ అయిపోవు. స్ర్తీ శరీరాన్ని వంకర్లు తిప్పుతూ మగవారి ఆనందం కోసము చిందులేయించడం అనే విషయంలో మూడు దశలు ప్రధానంగా కనిపిస్తాయి. తొలి దశ ఆస్థాన నర్తకి లేదా మేజువాణి దశ. రెండో దశ క్యాబరే డాన్సర్‌లేదా క్లబ్బు సాంగులు అనే దశ. మూడో దశ ఇటెం సాంగ్స్. ఈ మూడు పదాలకు మూడు మార్కెట్‌దశలతో సంబంధం ఉంది. గ్రామీణ ప్రేక్షకులే ప్రధానమైపోయిన దశ ఒకటి. గ్రామాలనుంచి పట్టణాలకు వలస ప్రధాన లక్షణంగా కలిగిన దశ ఒకటి. పట్టణ ప్రేక్షకులే ప్రధాన ప్రేక్షకులుగా మారిన దశ ఒకటి. స్థూలంగా అరవైల దాకా మొదటి దశ అనుకుంటే అరవైల నుంచి 90ల దాకా రెండో దశ. ఆ తర్వాత మూడో దశ అనుకోవచ్చు.దానికి సంబంధించిన ఇతర సెన్సిబిలిటీస్ అన్నీ ఆ సినిమాల్లో ప్రతిఫలిస్తాయి. తెలుగు సినిమాల్లో విలన్‌ఎలా మారుతూ వచ్చాడో చూస్తే తెలుగు సినిమా ప్రయాణం తెలిసిపోతుంది. వైరుధ్యమే కదా మూలం దేనికైనా!లేట్‌ సిక్సిటీస్‌నుంచి 90ల దాకా నడిచిన కాలం తెలుగు సినిమాకు అటూ ఇటూ కాని నాశినపు కాలం అనిపిస్తుంది. ఆ దశలో సినిమా తనకిచ్చిన పాత్రను పోషించిన నటి జ్యోతిలక్ష్మి. సమర్థురాలు కాబట్టి ముద్ర వేయగలిగింది. తర్వాతి కాలంలో సెక్స్ చుట్టూ ఉన్న ముసుగులు తొలగిపోయి శరీరానికి కూడా ప్రదర్శనా వస్తువుగా లెజ్టిమసీ వచ్చాక హీరోయిన్లే ఆ పాత్ర పోషించడం మొదలెట్టారు. టాప్‌ హీరోయిన్లు పోటీపడుతున్నారు కూడా. నాట్యంలో వేగం వల్ల ఒకరిద్దరు స్పెషలిస్టులు మిగిలి ఉన్నారు తప్పితే సాధారణంగా ఆ ట్రైబ్‌ మాయమైపోయింది. వారి ఉపాధి పోయింది.

ఫ్యూడల్‌ సమాజపు సినిమాల్లోనైనా పూర్తిగా మార్కెట్‌ మయమైన నేటి కాలంలోనైనా స్త్రీ పాత్రల్లో చైతన్యం పరంగా మౌలికమైన తేడా అట్టే లేదు. అబరేషన్స్‌ సంగతి పక్కనబెడదాం. జేబు ఇంకా ప్రధానంగా పురుషుడికే  ఉంది కాబట్టి బహిరంగ స్థలాల్లో బహిరంగ సంచారంలో పురుషుడే ఎక్కువ కనిపిస్తాడు కాబట్టి ప్రేక్షక ప్రపచంలో అతన్ని ప్రధానంగా టార్గెట్‌ చేయడం ఒక విధిగా సినిమా వాళ్లు భావిస్తారు. దానికి తగిన ఏర్పాట్లేవో చేస్తారు. పురుషుడితో పాటు స్ర్తీ కూడా ఎంతో కొంత ఆర్థిక స్వాతంత్రం  స్వేచ్ఛ చైతన్యం పెంచుకుంటున్నదని భావించే మెట్రో అర్బన్‌ సెక్షన్‌ కోసం మల్టీ ప్లెక్స్‌లు రాబట్టి కూసింత సెన్సిబిల్‌ సినిమాలు కూడా చూడగలుగుతున్నాం. గతానికి వర్తమానానికి తేడా రూపంలోనే, సారంలో కాదు. ఫ్యూడల్‌ సమాజమే ముసుగు సమాజం కాబట్టి స్ర్తీ మరీ బహిరంగంగా బయటపడకూడదు. సిగ్గుల మొగ్గగానే ఉండాలి. సున్నితంగా చెప్పినట్టు ఉండాలి. భలే భావుకత అండీ అన్నట్టుండాలి. విద్యాగంధం కొందరిదే కాబట్టి వారు చెప్పిందే వేదం. వేదమైనా భావుకత అయినా సంస్కృతమే మరి! ఆ సినిమాల్లో అదంతా కనిపిస్తుంది. అంతకంటే ముందునుంచి వచ్చిన వారసత్వం అది.

వచ్చినవాడు వామనుడు కాదయ్యా, వాడు విష్ణుమూర్తి  అని శుక్రాచార్యుడు హెచ్చరిస్తే బలి చక్రవర్తి ఏమంటాడు?

“ఆదిన్‌శ్రీ సతి కొప్పుపై తనువుపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు కిందగుట, మీదై నాకరంబు మేల్గాదే, రాజ్యమున్‌గీజ్యమున్‌సతతమే, కాయంబు నాపాయమే’’ అన్నాడు.

అంతటి విష్ణుమూర్తి నా ముందు చేయి చాచడం కంటే ఇంకేమి కావాలి అని చెప్పడానికి ఏ ఘనత తీసుకున్నాడు? లక్ష్మీ దేవి ఒంటి మీద పాలిండ్లమీద పారాడే చేయి మన చేయికంటే కింద ఉందంటే ఇంకే కావాలి, ఎపుడైనా పోవాల్సిన ఈ దేహానిదేముంది అన్నాడు. అంటే ఏమిటిట? అంతరార్థం ఏమిటి? ఆయన దృష్టి అంతా ఎక్కడుంది? వివరించి చెబితే భక్తులు గింజుకుంటారు కాబట్టి ఇక్కడ వదిలేస్తా. అదే కాదు, కమలాకుచ చూచుక కుంకుమతో…అని పొద్దుపొద్దునే కాలర్‌ట్యూన్‌పెట్టుకుని మరీ వింటాం కదా! అంటే అర్థాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పిన ఒక భావనకు మెజారిటీ సమూహం తలవంచి ఆరాధించేలా చేయగలిగింది ఒక పర్టిక్యులర్‌  సమూహం. మళ్లీ చెప్పొచ్చేదేంటే అయ్యలారా, అమ్మలారా! ప్రతి దానికి స్త్రీ శరీరాన్ని అడ్డుపెట్టి అవమానించడం ఆధునిక నేరం కాదు, చాలా చాలా పాత నేరం. ఇంకా చెప్పాలంటే ఆధునిక కాలమే ఎంతో కొంత మెరుగు.

త్యాగయ్య జ్యోతిలక్ష్మికి ప్రేమ్‌నగర్‌జ్యోతిలక్ష్మికి ప్రేక్షక మార్కెట్‌లో వచ్చిన తేడా తప్ప విలువల పరమైన తేడా లేదు. సింబాలిజం తేడా ఉంటుంది. పళ్లూ, పూలూ కరవాలాలూ, బాకులు, మొగ్గలు, రేకులు ఇవన్నీ సున్నితమైన భావనలుగా ప్రచారంలో పెట్టి అట్లా అప్పట్లో లాక్కొచ్చారు. మధ్యరకం క్లబ్‌డాన్సర్ల టైం వచ్చేసరికి అరకోడి, చిల్లిగారె లాంటి సింబాలిజమ్ యాడ్‌అయ్యింది. ఆ తర్వాత పిడతకింద పప్పు లాంటి మరీ నాటు కూడా కలిసిపోయింది. అక్కడ ఉత్తరాదినా అంతే. ఏ మేరా దిల్‌-యార్‌కా దివానా నుంచి షీలా కీ జవానీ దాకా జరిగిన ప్రయాణం తెలుగు సినిమాల కంటే భిన్నమైన దేమీ కాదు. ఇక్కడ జ్యోతిలక్ష్మి-జయమాలిని అక్కడ హెలెన్‌-ఇరానీ. ఇక్కడ రాఘవేంద్రరావు-అక్కడ డేవిడ్‌ధావన్‌. రాజమౌలి-పూరీ జగన్నాధ్‌ టైం వచ్చేసిరికి టెన్నిస్ బంతుల పాపా, నీ బంతులకింతటి ఊపా అని మార్కెట్‌సింబల్స్‌పచ్చిగా ప్రవేశించాయి. లేటెస్ట్‌గా సాల్టెడ్‌ బటర్‌, క్రీమ్, వంటి ఆంగ్ల శృంగార ఇమేజరీ మన తెలుగు సినిమా సారస్వతంలోకి కూడా బట్వాడా అవుతున్నది. తెలుగులో పచ్చి వెన్న లాంటివి ఆల్‌రెడీ వచ్చి ఉన్నాయి. అయితే ఈ పచ్చితనం మాత్రమే బూతు అయిపోయి గతంలోది సున్నితమైన భావుకత్వం అనుకుంటే మనం ఫ్యూడల్ విలువలను మోస్తున్నట్టే అర్థం. మార్కెట్‌కు వెలుపల ఆలోచిస్తే సినిమాను అభిరుచుల వ్యవహారంగా మార్చే ప్రమాదం ఉంటుంది.

కాలంతో పాటే సింబాలిజం కూడా పాతబడుతుంది. మార్కెట్‌తో పాటు కొత్త సింబాలిజం యాడ్ అవుతూ ఉంటుంది. వర్తమానం బాగోలేదు నిజమే కానీ దానికి సమాధానం వెనక్కు పోవడంలో లేదు. ఇంతకంటే ఆరోగ్యకరంగా ముందుకెళ్లడంలో ఉంది. దానికోసం ప్రయత్నించడంలో ఉంది. టెక్నాలజీ మార్పుల వల్ల సినిమా ప్రొడక్షన్‌ ఎంతో కొంత ప్రజాస్వామికమయ్యింది. మార్కెటింగ్లో ప్రధానమైన డిస్ర్టిబ్యూషన్‌ ఇంకా ఫ్యూడల్‌ కంపు కొడుతోంది. అక్కడ ఎవరైనా మార్పు తేగలిగితే సెన్సిబిల్‌ సినిమాకు దారి వైశాల్యం పెరుగుతుంది. ఇతర రంగాల్లో మార్కెట్‌ వల్ల అది తెచ్చిన టెక్నాలజీ వల్ల కొన్ని సమూహాల గుత్తాధిపత్యానికి కొంతవరకు గండి పడింది. సినిమా రంగంలో ఆ లోటు మిగిలే ఉంది.

*

 

 

 

 

 

 

అంబేద్కర్‌ విగ్రహానికి వాస్తు పరిశీలన!

 

 

-జి ఎస్‌ రామ్మోహన్‌

~

 

అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకోసం తెలంగాణ ప్రభుత్వ వాస్తు సలహాదారు స్థల పరిశీలన చేస్తున్న చిత్రం పత్రికల్లో వచ్చింది. వాస్తు హిందూ మతానికున్న అనేక అంగాల్లో ఒకటి. అందులో కూడా మూర్ఖత్వానికి పరాకాష్ట అనదగిన ఆచారం. అంబేద్కర్‌ హిందూ మత ఆచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వాడు. అది మతం కాదు, వ్యాధి అని చెప్పినవాడు. ఎవరికి పట్టింది ఈ విషాదం?

రెండు రాష్ట్రాల్లోనూ పోటాపోటీగా అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అంబేద్కర్‌ని విగ్రహమాత్రుడిని  చేసి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం బలంగా జరుగుతున్నది. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం కన్నా హైస్కూల్‌నుంచి  పీజీదాకా కులనిర్మూలనను పాఠ్యాంశంగా చేరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. విగ్రహాల వల్ల కూడా చైతన్యం వచ్చిన దశ ఉండింది. మనం ఇపుడా దశ దాటాం.

అంతకంటే ముందుకు వెళ్లాలంటే ఆయన రచనలను జనంలోకి తీసికెళ్లడం ముఖ్యం. ఆయన పేరు ప్రచారమైనంతగా ఆయన రచనలు ప్రచారం కాలేదు. కనీసం కులనిర్మూలన అయినా జనంలోకి తీసికెళ్లడం ఇవాల్టి అవసరం. అంబేద్కర్‌ ఏ ఆధునిక మానవీయ విలువల కోసం తపన పడ్డాడో ఆ విలువలకు బద్ద శత్రువైన మనిషిని ఆంధ్రప్రభుత్వం  సలహాదారుగా నియమించుకుంది. భర్త లోదుస్తులు భార్య ఉతికితేనే ఐశ్వర్యం ఆరోగ్యం, తానే ఉతుక్కుంటే దరిద్రం అని ప్రవచించిన భయానకమైన అనాగరికుడిని అక్కడ సలహాదారుగా నియమించి ఉన్నారు. రెండు రాష్ర్టాల్లోనూ రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ ప్రవచించిన ఆధునిక విలువలను అపహాస్యం చేసే పనులు అనేకం సాగుతున్నాయి.

samvedana logo copy(1)

రాజుగారి ఆస్థానాలు, అందులో సలహాదారులు, పురోహితులకు సత్కార సన్మానాలు చాలా ఎన్టీఆర్‌ సినిమాల్లో చూసి ఉన్నాం. ఆ ఎన్టీఆర్‌కు ఒకనాడు వీరాభిమానిగా ఉన్న చంద్రశేఖరుల వారు, అల్లుడు అయినటువంటి చంద్రబాబునాయుడుగారు  తమని తాము రాజులుగానే భావించుకున్నట్టు అర్థమవుతున్నది. తాము ఆధునిక సెక్యులర్‌ సోషలిస్ట్‌ ప్రజాస్వామ్య రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులం అనే సోయి ఉన్నట్టు కనిపించడం లేదు. పట్టాభిషేకం జరిగ్గానే తెలంగాణకు ఒక తిరుమల, ఆంధ్రకు ఒక భద్రాచలం అవసరం అని తీర్మానించేసుకున్నారు. విభజన జరగ్గానే వారికి కనిపించిన ప్రధాన లోటు అది. యాదాద్రి ఒంటిమిట్టలు ఆగమేఘాల మీద ముందుకు తోసుకొచ్చాయి.

యాదగిరి గుట్ట అనే అందమైన తెలుగుపేరు సంస్కృతంలోకి మళ్లి యాదాద్రి అయిపోయింది. వందలకోట్ల ఖర్చుతో ప్రణాళికలు సిద్ధమైపోయాయి. వైష్ణవ పండితులకు రెక్కలొచ్చాయి.  రాజసూయ యాగాలను మించిన యాగాలు మొదలయ్యాయి. మనిషి పొడ తగిలితేనే మలినమైపోయినట్టు మొకం పెట్టే ఒక వైష్ణవ సోములోరు, పాదం మోపడానికి లక్షల్లో ప్రసాదం స్వీకరించే సోములోరు రాజగురువుగా వ్యవహరిస్తున్నారు. చంద్రశేఖరుల వారు పదే పదే ఆయన పాదాలపై పడి ప్రణమిల్లడం విమానాల్లో వినయంగా తిప్పుతూ ఆయన సలహాల మేరకు వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. దీన్ని మించి ఐదుకోట్ల రూపాయలతో తిరుమలకు కానుకలు సమర్పించేందుకు  ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అది సొంత సొమ్ము కాదు. ప్రభుత్వ ఖజానా. అంటే ప్రజల సొమ్ము.  ప్రజల్లో విశ్వాసులు ఉంటారు. అవిశ్వాసులు ఉంటారు. విశ్వాసుల్లో కూడా రకరకాల విశ్వాసాలు ఉన్నవారుంటారు.. వ్యక్తిగతమైన విశ్వాసానికి ప్రజాధనాన్ని ఎలా ఖర్చుపెడతావు అని అడిగేవారేరీ! సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ సంగతి సరేసరి! అంత దూరం పోకపోయినా కనీసం పాలకుడు వ్యక్తిగత మొక్కు కోసం ప్రజాధనం ఖర్చుపెట్టకూడదు అని గట్టిగా అడిగే గొంతులు ఎక్కడ?

ఏమాట కామాటే చెప్పుకోవాలి. రాజుగారి మాటలాగే ఇక్కడంతా ఖుల్లం ఖుల్లా. వైష్ణవాన్ని రాజధర్మంగా అధికారికంగా ప్రకటించడానికి రాజ్యాంగం అంగీకరిస్తుందో లేదో అనే సంశయం ఉండబట్టి కానీ లేకపోతే ఆ పని కూడా బాహాటంగా చేయగలరు. కానీ ఆంధ్రరాజ్యంలో అక్కడి పాలకుడికే తనకి తాను ఏమిటో తెలియని గందరగోళం. నాయుడుగారు విశ్వాసో అవిశ్వాసో తెలీదు. అది విశ్వాసమో ఎత్తుగడో కూడా తెలీదు. మామూలుగా ఆయన మాట్లాడేది భయానకమైన పెట్టుబడిదారీ భాష. అన్ని పాత నమూనాలను విశ్వాసాలను అభివృద్ధి రథచక్రాల కింద నలిపేసుకుంటూ వెళ్లిపోయే భాష అది. దానికి తగ్గట్టే ఆయన సెంటిమెంట్లను ఎగతాళి చేస్తా ఉంటారు. భూమి గురించి ఎవరైనా బెంగ వ్యక్తం చేస్తే అది కమోడిటీగా మారడం వల్ల రైతుకు ఎంత లాభమో చెప్తారు. పాత సెంటిమెంట్లను కడిగేసుకోవాలని చెపుతారు. సెంటిమెంట్లు చాదస్తాలు అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్తారు. వ్యవసాయంలో సాంకేతికత అయినా సెల్‌ టవర్ సిగ్నల్స్‌ అయినా ఏ విషయం ముందుకు వచ్చినా ఆయన పాత విశ్వాసాలను పాతరేసేట్టు మాట్లాడతారు.

కానీ ఆయన పట్టాభిషేకం దగ్గర్నుంచి రాజధాని శంకుస్థాపనల దాకా అన్నీ ముహూర్తాల ప్రకారం, వాస్తు ప్రకారం నడిపిస్తున్నారు.. మనం చేస్తే సెంటిమెంట్‌, అవతలివారు చేస్తే చాదస్తం అన్నమాట. తరతమ బేధాలు ఎక్కడ పాటించాలో బాగా వంటపట్టిచ్చుకున్న మనిషి నాయుడుగారు.. చాగంటి కోటేశ్వరరావు అనే పురాణ కాలపు మనుధర్మపు పెద్దమనిషి ఉన్నారు. ఆడవాళ్లను మాత్రమే కాదు, అన్ని బాధిత సమూహాలను అవమానించేట్టు మాట్లాడతా ఉంటారు. అమానవీయతను అనాగరికతను ప్రబోధిస్తా ఉంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మానవహక్కులకు విరుద్ధం. ఇంకో నాగరక దేశంలో అయితే కటకటాల వెనక్కు నెట్టేవాళ్లు. ఇక్కడ బారాఖూన్‌ మాఫ్‌. అలాంటి ఒక సామాజిక నేరస్తుడికి పద్మశ్రీ పురస్కారం ఇప్పించి ఆస్థానంలో సలహాదారుగా పెట్టుకుని సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నట్టు? మనుధర్మాన్ని విశ్వసించే కులఅహంకార పురుష అహంకార అనాగరక మనిషిని సలహాదారుగా పెట్టుకున్న రాజ్యం ఎలాంటి విలువలకు నిలబడుతుందని  అనుకోవాలి? మళ్లీ వీళ్లు అంబేద్కర్‌ -పూలే జయంతులకు వర్థంతులకు రావడం దళితులకు బిసిలకు ఏమేం చేశారో ఏకరువు పెట్టడం చూస్తే ఏమిటీ అబ్సర్డిటీ అనిపిస్తుంది.

విభజనతో పాటే మధ్యతరగతిలో గొంతున్న వర్గాలకు తక్షణ ప్రయోజనం చేకూరింది. పదవులు పెరిగాయి. గొంతున్న వారిని కోఆప్ట్‌ చేసుకోవడం సులభమైంది. ఇక కులసంఘాల్లో నాయకులు ఎవరైనా మిగిలి ఉంటే వారికోసం అడిగిందే తడవుగా నిధులు ఒక భవంతి వగైరా మంజూరు అవుతున్నాయి. తెలంగాణ పాలకులు అలనాటి విజయభాస్కరుల వారి విధానాన్ని కులసంఘాల విషయంలో పాటిస్తున్నట్టు అర్థం అవుతున్నది.

ఆంధ్రలో లెక్కల ప్రకారం అన్ని కులాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ గొంతున్న నాయకులను తన దగ్గరే పోగేసుకుని ఉండడం వల్ల ఆయనకు ఆ ఇబ్బంది కూడా లేదు. ప్రశ్నించే గొంతులు కరువు. కొందరికి తమ పుట్టలో వేలు పెట్టినపుడు తప్ప ఇతరత్రా చురుకు తగలదు. ప్రజాస్వామ్య లిబరల్‌ గొంతులకోసం దుర్భిణీ వేసి వెతుక్కోవాల్సిన స్థితి. ఎబిసిడి న్యాయమైన డిమాండే కానీ ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింది. అక్కడా గొంతున్న వారికి సంతర్పణలు  ఏదో రూపంలో ఏర్పాటు చేసి పెట్టారు. ఇవి వ్యక్తిగత విశ్వాసాలు, పట్టించుకోకూడదు,  వదిలేయాలి అని కొందరు లౌక్యంగా కృతజ్ఞతా పూర్వకంగా అనగలరు.

కానీ సాంస్కృతిక రంగం ప్రభావం చిన్నదేమీ కాదు. దానిమీద దృష్టిపెట్టకుండా  దాన్ని ఎదుర్కోకుండా సాధించేదేమీ ఉండదు. అంబేద్కర్‌ అందుకే అంత ప్రాధాన్యమిచ్చారు.. పైగా పాలనలో ఉన్నవాళ్లు అంత బాహాటంగా సమాజాన్ని వెనక్కు తీసికెళ్లే ఆచారాలను ప్రదర్శిస్తూ ఉంటే దాని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటుంది. అంబేద్కర్‌ ఆశించిన ఆధునిక మానవీయ సమాజం సంగతేమో కానీ రెండు రాష్ర్టాల్లోనూ పూర్తిగా దానికి భిన్నమైన రాజరికపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

పదే పదే చొక్కా విప్పి జంధ్యాన్ని ప్రదర్శించే గవర్నర్‌ కనుసన్నల్లో రెండు రాష్ర్టాల్లోనూ  ఆధునికత వెనక్కు నడుస్తోంది. అనేక ఉద్యమాలకు నెలవైన తెలుగు రాష్ర్టాల్లో ఇంత దుస్థితిఎన్నడూ లేదు. వాస్తు సలహాదారులు, పౌరాణిక సలహాదారుల  రాజ్యం ఇంత నిస్సిగ్గుగా ఎన్నడూ సాగింది లేదు.  రాజ్యాంగం, ఆధునిక ప్రజాస్వామ్య విలువల గురించి  పాలకులకు గుర్తు చేయాలా, వద్దా!

*

 ఇదే మహాభారతం!

-జి ఎస్‌ రామ్మోహన్‌

~

 

rammohan

యవ్వన కాలపు పురాణ పఠనానుభవాన్ని రాస్తూ ఇంటలెక్చువల్‌ స్టిములేషన్‌, షీర్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌  అని రెండు పదాలు వాడారు అమర్త్య సేన్‌. వెటకారంగానైనా రెండోది మాత్రమే నిజం అనుకున్నట్టున్నారు  రంగనాయకమ్మ. అంత గాంభీర్యమేమీ అక్కర్లేదని తీర్మానించుకున్నారు.  మొగ్గా పువ్వూ లేని, కాయా పండూ లేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్థాల, వైరుధ్యాల, వికృతాల, వికారాల, క్రూరత్వాల, అబద్దాల, కట్టుకథల పుక్కిటి పురాణాల పుట్ట! అని గుక్కతిప్పుకోకుండా శ్లోకం వలె చెప్పేశారు. భక్తి పూర్వకంగా ఎవరైనా అదాటున లోపలికి వెళ్లి ఆనక  చెంపలేసుకునే పరిస్థితి రాకుండా పుస్తకం ముఖచిత్రం మీదే అన్ని విశేషణాలూ అచ్చేశారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడడానికి భారతం రచయితలు ఎన్ని తీర్ల ప్రయత్నాలు చేశారో  అన్ని తీర్ల వారిని రంగనాయకమ్మ తిట్టిపోశారు.

‘కులాల గురించి నిర్భయంగా బరితెగించి చెప్పడమే ఈ రచనలో కనపడింది. బ్రాహ్మణులను పూజించండి! వేదాల్ని పూజించండి! అనే రెండు మాటలు తప్ప, ఆ మొత్తం కథల్లో మూడో మాట ఏదీ లేదు.! బ్రాహ్మణులను పూజించండి అన్న మాట బ్రాహ్మణులు చెప్పుకోవడమే కాదు, శూద్రులు కూడా అదే చెపుతారు! భారతంలో ఉన్న ప్రధానాంశం అంతా అదే” అని సారాంశాన్ని ముందుమాటలోనే ప్రకటించేశారు. ”నా వ్యాఖ్యానాలు నేను చేసుకున్నాను. కానీ కథలో వేలు పెట్టలేదు”. అని చెప్పారు. తన పద్ధతిలో పాటించారు కూడా. కాకపోతే మనం వాడే భాషలోనూ ధ్వనిలోనూ మన దృక్పథం ప్రతిఫలిస్తుంది. ఈ గ్రంధం రాయడం కోసం మూడు రకాల మూలాలను తీసుకున్నారు. మూడూ భక్తి సంప్రదాయంలోని వారు మౌలికమైనవిగా భావించేవే. నాస్తికులో హేతువాదులో రాసినవి కావు. ఒక రకంగా రంగనాయకమ్మ బండ చాకిరీ చేశారని చెప్పొచ్చు. దీనికోసమేనా ఇంత చాకిరీ చేసింది అనే విసుగులాంటి ధ్వని కూడా ఆమె వ్యాఖ్యానంలో ప్రతిఫలిస్తున్నదేమో అనిపిస్తుంది.

సావిత్రి తండ్రి ” కలిమికి సంతోషించనూ కూడదు, లేమికి విచారించనూ కూడదు” అన్నాడు అని రాసిన వెంటనే ‘అయితే కలిమీ-లేమి అని ఆ తేడాలెందుకు?’ అని వ్యాఖ్యానిస్తారు. సరైన తర్కాన్ని తిరస్కరించేంది ఏదైనా మూర్ఖత్వమే అని తర్క ప్రాధాన్యాన్ని ఒక చోట ఫుట్‌నోట్‌లో వివరించారు. తర్కం అన్ని వేళళా సరిపోతుందా అని అనుమానం.  విరాట పర్వంలోని   ఒక ఘట్టంలో పాండవులు  అజ్ఞాతవాసంలో ఎక్కడ తలదాచుకుని ఉండొచ్చు అని కౌరవులు చర్చిస్తా ఉంటారు. “ధర్మరాజు ఉన్న రాజ్యంలో పాడి సమృద్ధిగా ఉంటుంది. అన్ని దేశాలనూ పరిశీలిస్తే పాండవులు ఎక్కడ వున్నారో తెలిసిపోతుంది.” అని భీష్ముడు అన్న మాటను రాస్తారు. ఆ వెంటనే ”పాండవులు ధర్మాత్ములు అని ఒక పక్క చెపుతూనే ఫలానా రకంగా పరిశీలిస్తే పాండవులు దొరికిపోతారు అని ఇంకో పక్క చెపుతున్నాడు. రాజు చెప్పమన్నాడు కదా అని చెపుతున్నాను అంటున్నాడు. భీష్ముడు దుర్యోధనునికి జడవాలా..ఏం ఖర్మ” అంటూ వ్యాఖ్యానం చేస్తారు. భీష్ముడు అలా ప్రవర్తించడం న్యాయమని అనకపోయినా అలా ప్రవర్తించడాన్ని సమర్థించే రాజధర్మాలు అప్పటికే అక్కడ స్థిరపడి ఉన్నాయి. మొదటి పర్వాల్లోనే అది తేటతెల్లమైంది. మళ్లీ విరాట పర్వలోనూ ఆ ప్రశ్న వేస్తే అది సరైన తర్కం అవుతుందా!  ఆమె పాఠాన్ని అధ్యయనం చేసేటప్పుడు వ్యాఖ్యానించేటప్పుడు కాంటెక్ట్స్‌కి సరైన ప్రాధాన్యమిస్తారా అని అనుమానం. ”ఆవుల మందలను సుశర్మ తోలుకు రమ్మంటే తోలుకు పోవడం మొదలు పెట్టారు సైనికులు” అంటూ ఆ వెంటనే ‘రాజు ఏ పని చెయ్యమని చెప్తే ఆ పని ఉత్సాహంగా చేసేస్తారన్న మాట సైనికులు. సైనికుల అజ్ఞానమే శక్తి. రాజు శక్తి’ అని విసురు విసురుతారు. ఇది సరైన తర్కమేనా అని అనుమానం. అప్పుడైనా ఇప్పుడైనా రాజు లేదా ప్రభుత్వం మాట వినడం సైనికుల విధి. పాలిటిక్స్ ఇన్‌ కమాండ్‌ అని రంగనాయకమ్మగారికి మనం గుర్తుచేయనక్కర్లేదు.

samvedana logo copy(1)

“బౌద్ధమతమూ, జైనమతమూ వంటి మతాలు,హిందూ మతంలో ధర్మాల్నీ యాగాల్నీ వ్యతిరేకించాయనీ దాని వల్లనే హిందూ పండితులు తమ మతాన్ని దృఢతరం చేసుకోవడం కోసం ఈ భారతం రచనను ప్రారంభించి సాగించారనీ, హిందూ మతవాదులు చెపుతారు” అని రాశారు. రంగనాయకమ్మగారేనా ఇది రాసింది అని ఆశ్చర్యం కలిగించే మాట ఇది. ఆ రకమైన విశ్లేషణ చేసింది ప్రధానంగా ప్రజామేధావులు. హిందూ మతవాదులు కాదు. కోశాంబి అటువంటి వ్యాఖ్యానం చేశారు. ఆయన విశ్లేషణతో ఏకీభవిస్తూ అంబేద్కర్‌ మరికాస్త వివరించారు. ఇది వేర్వేరు రచయితల సృష్టి అని అంబేద్కర్‌ చెప్పారు. ప్రాచీనం అనే అమూర్త భావనను పూర్వపక్షం చేస్తూ ఇది గుప్తరాజైన బాలాదిత్య కాలంలో వచ్చిన గ్రంథంగా తేల్చారు. చాలామంది స్కాలర్ల మాదిరే ఆయన కూడా భగవద్గీత మీద ఎక్కువ దృష్టిపెట్టారు. బౌద్ధం తర్వాత ముఖ్యంగా అశోకుడి తర్వాత కుదేలైన హిందూమతం తదనంతర కాలంలో బ్రాహ్మణ రాజైన పుష్యమిత్ర కాలం నుంచి మళ్లీ తలెగరేసిందని ఆ పరిణామాల్లో భాగంగానే భగవద్గీత రూపొందిందని అంబేద్కర్‌ సాధికారంగా విశ్లేషించారు. భగవద్గీత హిందూ మతవాదుల ప్రతఘాత విప్లవపు తాత్విక సమర్థనా పత్రం  అని ఆయన తేల్చి చెప్పారు.

పేజీపేజీనా రంగనాయకమ్మ చేసిన వ్యాఖ్యానాలతో విసుర్లతో పేచీపడాల్సిందేమీ లేదు. అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, శస్ర్తంతో ఛేదించబడదు అని ఆత్మభాషలో గంభీరంగా వినిపిస్తున్నపుడు పక్కనే ఎవరైనా అబ్బ ఛా అంటే బానే ఉంటుంది. కానీ అది సరిపోతుందా అని సందేహం. మహాభారతాన్ని ప్రత్యేకంగా భగవద్గీతను విశ్లేషించిన ప్రతి మేధావీ తన దృక్పథంలోంచి సీరియెస్‌గా విశ్లేషించే ప్రయత్నం చేశారు. గాంధీ అంబేద్కర్‌ ఇద్దరూ చెరోవైపున నిలబడి వ్యాఖ్యానం చేశారు. అంబేద్కర్‌ అందులో హింసను వర్ణాధిక్య సమర్థనను చూస్తే, గాంధీ తన భావజాలానికి అనువుగా అన్వయించుకుని సత్యానికి అహింసకు సంకేతంగా భాష్యం చెప్పారు. జంతుబలులకు వ్యతిరేకంగా దాన్ని నిర్వచించే ప్రయత్నం ఆశ్చర్యకరమైన రీతిలో చేశారు. అమర్త్యసేన్‌ దాన్ని విధికి-పర్యవసానాలకు మధ్య సంవాదంగా భావించారు. అణుబాంబు పితామహుడిగా చెప్పుకునే రాబర్ట్‌ ఆపెన్‌హైమర్‌కి అది వినాశనాన్ని తాత్వికంగా సమర్థించుకోవడానికి ఉపయోగపడే సంకేతంగా కనిపించింది. భగవద్గీత ప్రాచుర్యం దేశ సరిహద్దులు దాటి చాలాకాలమైంది. అదొక వ్యక్తిత్వ వికాస గ్రంథమని మేనేజ్‌ మెంట్‌ ఉద్గ్రంధమని ప్రచారంలో ఉంది. ఒక రకంగా గాంధీ కంటే ముందు విదేశాలకు భారత్‌ ఎగుమతి చేసిన అంశాల్లో యోగ-వాత్సాయన కామసూత్రాలతో పాటు భగవద్గీతను కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. మన దృష్టిలో ఎలాగున్నా సమాజంలో దానికి అలాంటి ప్రాధాన్యమున్నపుడు దాన్ని విమర్శించే పద్ధతి ఎలా ఉండాలి?  రంగనాయకమ్మ ఎంచుకున్న టోన్‌ సరైనదేనా అని అనుమానం.

“భారతదేశంలో మెజారిటీ ప్రజల్ని సంస్కృతి పేరుతో బుట్టలో వేసే మతగ్రంధాలు రామాయణ, భారత, భాగవతాలు. వాటిలో ఉన్న నిజానిజాలు ఈ ప్రజలకు తెలిసి తీరాలి” అని చెప్పారు. ఇంకా “ఏ దేశం అయినా ఏయే తప్పుడు సంస్కృతుల్లో పీకలదాకా కూరుకుని ఉందో ఆ సంగతి ఆ దేశంలో జనాలకు నిజంగా తెలిస్తే వాళ్లు అదే రకం జీవితాల్లో ఉండిపోవాలని కోరుకోరు. అజ్ఞానం వల్ల అలా ఉండిపోతే ఆ జీవితాల్లో ఆనందంగా ఉండలేరు.” అని తేల్చారు రంగనాయకమ్మ. కేవలం తర్కంతో చూస్తే ఎలా కనిపిస్తుందో కానీ ఇది కాస్త సంక్లిష్టమైన వ్యవహారం. మనుషుల ఆచరణలోని లోటుపాట్లకు జ్ఞానం ఉండడం లేకపోవడం అనేదే కారణమవుతుందా! అలవాట్లు, అవసరాలు, ప్రయోజనాల పాత్ర, ఇంకా అనేకానేక అంశాల పాత్ర ఉండదా! తన గ్రంధ లక్ష్యాన్ని ఇంత భారీగా పెట్టుకోవడం అచారిత్రకమైన ఆశావాదమవదా!  కర్త కర్మ క్రియ అతడే, అతడి ఆజ్ఞలేనిది చీమైనా కదలలేదు అని చెపుతున్నవారికి మరి ఈ నేరాలు ఘోరాల మాటేమిటి? వాటికి కూడా ఆయనే బాధ్యుడు కదా? అనే ప్రాధమిక ప్రశ్నలు కూడా తలెత్తకుండా ఉంటాయని అనుకోగలమా! భక్తి విషయంలో మతం విషయంలో నిజానిజాల ప్రభావం ఎంత అనేది సంక్లిష్టమైన విషయం. అదలా ఉంచి, సాధారణ ప్రజలు అంటే తప్పుడు సంస్కృతుల్లో పీకలలోతు కూరుకుపోయిన ప్రజలు దీన్ని చదివి మారే అవకాశం ఎంత? అసలు మనిషి లోపలికి అడుగే పెట్టకుండా తలుపు దగ్గరే కాపు కాసి అంతపెద్ద విశేషాణాల సమ్మెటతో దెబ్బ వేశాక ఏ ధైర్యంతో వాళ్లు లోపలికి అడుగుపెట్టాలి? ఎక్కువలో ఎక్కువ అన్ని పురోగామి స్రవంతుల్లోని నాస్తికులే చదవాలి. అదొకరకంగా మోనోలాగ్‌ అవుతుంది. డీటైల్స్‌ మినహాయిస్తే వారైనా దీన్నుంచి కొత్తగా పొందే చైతన్యం ఏమిటి? కాబట్టి ఇది సరైన వ్యాఖ్యాన పద్దతే అవుతుందా అనేది ఆలోచించుకోవాల్సి ఉందేమో! వేరే ప్లేన్‌ ఎంచుకుని ఉండాల్సిందేమో!

ఈ అంశాలతో పాటు మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆ మధ్య కథా రచయితలు కొందరు కలిసినపుడు ఇపుడైతే రామాయణ విషవృక్షం సాధ్యమేనా అనే చర్చ వచ్చింది. హిందూత్వ ఉన్మాదం ఇంతగా పెచ్చుపెరిగిపోయి ప్రతీదీ వివాదమవుతున్న నేపధ్యంలో ఇపుడు అలాంటిది సాధ్యం కాదేమో అని అభిప్రాయం వెల్లడైంది. కానీ ఆ అభిప్రాయాన్ని తప్పని నిరూపించారు. అలా నిరూపించినందుకు రంగనాయకమ్మకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్సులు.

*

 

అర్చకుల ఆందోళన…ఏ ధైర్యంతో?!

 

జి ఎస్‌ రామ్మోహన్‌   

 

rammohan

అర్చకుల్లో కొందరు పేదలున్న మాట వాస్తవం. ముఖ్యంగా చిన్నదేవాలయాల్లో, శివాలయాల్లో. నిజమే. అయితే దానికి పరిష్కారమేంటి?అర్చక సంఘాలు, ట్రెజరీనుంచి జీతాలివ్వాలా? ఇవాళ వారికి వస్తున్న జీతాలు కానీ జీతాలు ఇస్తున్న పద్ధతి కానీ సక్రమంగా లేవని వాదిస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే నెలనెలా ట్రెజరీ నుంచి మెరుగైన జీతాలిచ్చే ఏర్పాటు కావాలని కోరుతున్నారు.

సమాజానికి అవసరమైన ఉత్తత్తిలో పాలు పంచుకుంటున్న రైతులు, చేనేత కార్మికులు ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉత్పత్తి చేస్తున్నవారే మాకు ట్రెజరీ నుంచి జీతాలివ్వాలని ఇంతవరకూ కోరలేదు. ఏం ఉత్పత్తి చేస్తున్నారని పూజారులకు జీతాలివ్వాలి? గ్రామీణ సమాజపు అవశేషాలైన కమ్మరి, కుమ్మరి వంటి అనేక కులవృత్తులవాళ్లు ఆ సంకెళ్లనుంచి బయటపడి వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. కూడు బెట్టని వృత్తిని పట్టుకుని వేలాడలేదు. సంఖ్య ఎక్కువవడం వల్ల కులవృత్తులకు సంబంధించి చేనేతలోనే ఎక్కువ సంక్షోభం కనిపిస్తుంది. వారెవరూ తమకు ట్రెజరీ బెంచ్‌నుంచి జీతాలిస్తే బాగుండుననుకోలేదు. డిమాండూ చేయలేదు.

ఆలయాల ఆదాయం నుంచి ప్రస్తుతం వేతనాలుగా అందరికీ సర్దుతున్నారు. అది పూజారులకు గౌరవమైన స్థాయిలో అందడం లేదు. అది నిజమే. కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు కావాలనడం న్యాయమైన డిమాండ్‌ అవుతుందా! సమాజానికి అవసరమైన ఉత్పత్తి చేసేవాళ్లు, శ్రమజీవులు ఎన్నడూ ట్రెజరీ జీతాలు అడగలేదు. పూజార్లు ఏ ధైర్యంతో అడుగుతున్నారు? ఈ ధైర్యం ఇంకా మన మెదళ్లలో పాతుకుపోయిన కుల గౌరవాల నుంచి వస్తున్నది. ఆ డిమాండ్‌ విచిత్రమైనదిగా కనిపించకపోవడంలో మనలో పాతుకుపోయిన బానిస లక్షణం దాగుంది. మనిషిని ఆచరణనుంచి కాకుండా పుట్టిన కులం నుంచి కుటుంబం నుంచి చూసే ధోరణి బానిస ధోరణి.

మన కళ్ల ముందే రైతులు, చేనేత కార్మికులు ఉసురు తీసుకుంటూ ఉండగానే ఎలాంటి ఉత్పత్తి చేయని కులవృత్తి వాళ్లు వీధినపడి మాకు జీతాలేవీ అంటే ఆ రైతులకు, చేనేత కార్మికుల్లో కూడా చాలామందికి పాపం అయ్యవార్లు కూడా రోడ్డుమీదకొచ్చారు అనిపిస్తుంది. ఈ పాపం అనిపించడంలో ఆర్థిక స్థితి, పేదరికం మాత్రమే పనిచేస్తే ఇబ్బంది పడాల్సిందేమీ లేదు. సాటి పేదవారి పట్ల ఎవరు కన్సర్న్‌ చూపించినా మంచిదే.

కానీ ఇక్కడ కులం పనిచేస్తుంది. అంతటివాళ్లు కూడా, అందర్నీ ఆశీర్వదించాల్సిన వారు కూడా వీధిన పడ్డారే అని మనలో తెలీని సానుభూతిని కలిగిస్తుంది. తలపై పెట్టాల్సిన చేయి మన చేయి కంటే కింద ఉంటే మనకే ఇబ్బంది అనిపిస్తుంది. అసుర చక్రవర్తి కాబట్టి బలి “ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై తనువుపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు క్రిందగుట-మీదై నాకరంబు మేల్గాదె…” అని భక్తి పూర్వకంగానైనా అనగలిగాడు. కానీ ఏదో ఒక కులంలో పుట్టి ఆ భావాలను ఏదో రూపంలో మోస్తున్న సామాన్యులు భూసురుల చేయి కిందయితే తట్టుకోలేరు. పేదపూజార్లకు దానమిచ్చి భోజనం పెట్టి పాదాభివందనం చేసే సంస్కృతి ఇంకా ఉంది.

ఏ పేదకైనా అటువంటి ట్రీట్మెంట్‌ ఇవ్వగలిగితే వారి దొడ్డమనసుకు నమోవాక్కములు చెప్పవచ్చును. అలా ఉండదు. ఇక్కడ కనిపించే గౌరవం వెనుక ఉన్నది కులం. పేదరికం కాదు. శ్రమ అంతకన్నా కాదు. అలాగే ఉపాధి కూలీ కన్నా తక్కువ వేతనం లభిస్తుంది అని అదేదో తక్కువ పని అన్నట్టు అర్చక సంఘాల మద్దతుదారులు రాస్తున్నారు. ఉపాధి కూలీ సమాజానికి అవసరమైన పని. పౌరోహిత్యం కన్నా తక్కువేమీ కాదు. ఆధ్యాత్మికత కూడా ఒక రకమైన ధార్మిక ఉత్పత్తిగా చూడాలి అని రైటిస్ట్‌ మేధావులు అనొచ్చు. అది భౌతిక వాస్తవాకతకు లొంగదు కానీ వాదనకోసం తీసుకుందాం. అపుడేం చేయాలి?

 

ప్రస్తుతం ఆధ్యాత్మికత, అర్చకత్వం అలౌకిక కోటాలో ఉన్నాయి. వాటిని లౌకిక పరిధిలోకి తేవాలి. మెరుగైన ప్రభుత్వ వేతనాలు కావాలంటే కుల ప్రాతిపదికను పక్కనబెట్టి ఆ పనిని ప్రజాస్వామిక ప్రక్రియలోకి తేవాలి. వైదికులకే పరిమితం చేయకుండా దానికేవో పరీక్షలు పెట్టి అర్హతలు నిర్ణయించాలి. అన్ని కులాల వారూ, మతాల వారూ ఆ పనిని చేపట్టగలిగే విధంగా మార్పులు చేయాలి. రిజర్వేషన్లు కూడా కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ట్రెజరీ జీతాలు కోరుతున్న వారు దీనికి సిద్ధమైతే చర్చించొచ్చు.
”అర్చకుడు వైదిక విభాగానికి చెందినవాడు. ఈవో పరిపాలనా విభాగానికి చెందినవాడు కానీ పూజల గురించి ఏమీ తెలియని ఈవో అర్చకుడికి బాస్‌. దేవుడినే నమ్మని, దైవభక్తిలేని, కొండొకచో ఇతర మతాలకు చెందిన వారూ అధికారుల పేరుతో ఆలయాల్లో ప్రవేశిస్తున్నారు” అని ఈసడింపుగా రాస్తున్నారు. అందులో ఉన్న ధ్వని ఏమిటి? ఏమి చెప్పదల్చుకున్నారు?

25KMPSRHI-W005__HY_2524109f

ప్రభుత్వ ఉద్యోగాలకు కొన్ని అర్హతలు, పరీక్షలు, ఇంటర్యూలు అనే పద్ధతేదో ఉంటుంది. మనకిష్టమున్నా లేకున్నా అది ప్రజాస్వామికమైన ప్రక్రియ. ఎన్ని లోపాలు, అవకతవకలున్నా ఆ పద్ధతినైతే తప్పు పట్టలేము కదా! ఆ ఉద్యోగాలు కూడా బ్రాహ్మణులకే కట్టబెట్టండి అని అడగదల్చుకున్నారా! బ్రాహ్మడిపైన ఇంకొకరు బాస్‌ ఏంటి అది అనూచానపు సహజన్యాయానికి విరుద్ధం అని చెప్పదల్చుకున్నారా! అది నేరుగానే అడగొచ్చు. ఇతర కులాలను మతాలను విశ్వాసాలను పరోక్షరీతిలో కించపర్చనక్కర్లేదు. పూజార్లను చూసి ఆలయంలో వారు చేసే అలంకరణ చూసి ఆలయానికి వస్తారు కానీ అధికారులను చూసి వస్తారా అని రాస్తున్నారు, చెపుతున్నారు. దేవుడి మీద భక్తితో వస్తారేమో అనుకుంటున్నారు చాలామంది. ఇదన్నమాట అసలు విషయం! ఇక్కడా అలంకరణే ప్రధానమన్నమాట!
”కెసిఆర్‌ పరమ భక్తుడు. బ్రాహ్మణ పక్షపాతిగా కనిపిస్తారు. …అయినా అర్చకులు మాత్రం బ్రాహ్మణులు బజారును పడవలసి వస్తున్నది” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాక్యాన్ని చెవివొగ్గి వింటే రాజాధిరాజా..రాజమార్తాండా..ధర్మం నాలుగు వర్ణాలా సాగే మీ పాలనలోనూ బ్రాహ్మణులకు ఇబ్బంది కలగడమేమిటయ్యా అని వినిపిస్తుంది. వీరికి రాజుపై ఉన్న నమ్మకం సరైనదే. కెసిఆర్‌ వ్యవహార శైలి రాజుకంటే తక్కువేమీ కాదు. ఆయన రాజులకు రాజు. నవాబులకు నవాబు. మంచీ చెడూ గురించిన చర్చ కాదు. పాలకుడి పద్దతి గురించి. అది ప్రజాస్వామికమైన పద్ధతి అని ఎక్కడా అనిపించదు. చాలామంది రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన తెలివైన వాడు, చదువుకున్నవాడు కావచ్చేమో కానీ పాలన అనేది రాజకీయ నాయకుడి తెలివితేటలకు సంబంధించిన విషయం కాదు.

ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్య స్వభావానికి సంబంధించిన విషయం. ఇతరులకు భయం కల్పించినా, అభయమిచ్చినా, చేతికి ఎముక లేనట్టు వరాలు ప్రకటించినా అన్నీ పాలకుడి వైయక్తిక ఆసక్తులకే ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తున్నది. ప్రజాస్వామిక ప్రక్రియలో భాగం అనిపించవు. వైష్ణవ సంప్రదాయంలో మావోయిజాన్ని ఎజెండాగా ప్రకటించుకున్న పాలకుడాయె! ఉద్యమ సందర్భంగా ఎంచుకున్న పద్దతుల వల్ల ఆ గందరగోళం నుంచి బయటపడలేకపోవడం వల్ల తెలంగాణ సమాజంలో పురోగామి సమాజపు వెన్నెముక కూసింత వంగిపోయి ఉన్నది. తమకు నేరుగా చురుకు తగిలితే తప్ప ఇతరత్రా స్పందించే లక్షణం తక్కువ కనిపిస్తున్నది. అది రాజరికపు వాసన ఎదురులేని రీతిలో బలపడడానికి తావిస్తున్నది. రాజును ప్రసన్నం చేసుకుంటే చాలు అనే భావన అన్ని శిబిరాల్లో నెలకొంది.

అందువల్లే బ్రాహ్మణ పక్షపాతి అయిన రాజు పాలనలో ఈ తిప్పలేల అనే వాదన తెరపైకి తేగలగుతున్నారు. ఆ వాదనను పెద్ద స్థాయిలో చేస్తున్నారు. అర్చకులైనా మరెవరైనా నిజంగా బతుకు పోరాటమే చేస్తుంటే శ్రమను గౌరవించే వారెవరైనా వారివైపు నిలవాల్సిందే. అయితే వారు చేస్తున్న శ్రమ, దాని స్వభావం కచ్చితంగా చర్చకు వస్తుంది. బతుకుపోరాటానికి అవసరమైన భాష శ్రమ భాష. మేమీ శ్రమ చేస్తున్నాం, మాకు సరైన ప్రతిఫలం దక్కడం లేదు అన్నది సరైన భాష అవుతుంది. మేము ఫలానా వాళ్లం కాబట్టి మాకు సరైన ప్రతిఫలం దక్కాలంటే సరైన భాష అవదు. కులాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మేం వైదికులం కాబట్టి మాకు మెరుగైన జీతాలివ్వాలి అంటే ప్రజాస్వామికం అనిపించుకోదు.

*

 

 

 

 

మణిరత్నం గారి మాంగల్య బలం!

జి ఎస్‌ రామ్మోహన్‌

మణిరత్నం సినిమాల్లో రైలు తరచుగా కనిపిస్తుంది. రైలు మోడర్నిటీకి చిహ్నం. నిజంగా అంతా అలా ఉంటే ఎంత బాగుణ్ణు అనిపించేట్టు ఉంటుంది ఆయన చూపించే నగర జీవితం. మణిరత్నం అంటేనే సోఫిస్టికేషన్‌. వయసు ఎంత పైబడుతున్నా నిరంతరం తన సినిమాలను యవ్వనంతో ఉంచడానికే ప్రయత్నిస్తారు. ఆయన సినిమాల నిండా ప్రేమ కనిపిస్తుంది. మాస్‌ మసాలా సినిమాల్లో మాదిరి విలనీ కనిపించదు. మనుషులంతా ఎంత మంచివాళ్లుగా ఉంటారో చెప్పలేం. ప్రేయసిని అందుకోవడానికి వేరే అమ్మాయి బైకును ఆపితే ఆ అమ్మాయి ఏమీ అనుకోకుండా లిఫ్ట్ ఇస్తుంది. పరిచయం లేని కుర్రాడు భుజం మీద చేయి వేసి కూర్చున్నా చెడుగా అనుకోదు. బ్యాంక్‌ ఉద్యోగంలో రిటైరయిన పెద్దమనిషి లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్న జంటకు ఇంట్లో ఆశ్రయమివ్వడానికి ఒప్పేసుకుంటారు. ఎప్పుడంటే అపుడు ఆఫీసునుంచి బయటకు వచ్చేసి హోటళ్లలో రెస్టారెంట్లలో ఆ జంట చెట్టాపట్టాలు వేసుకుని ఊసులాడుకోవడానికి వారిద్దరు పనిచేస్తున్న ఆఫీసులకు అభ్యంతరమే ఉండదు.

మణిరత్నం మంచి మనసుతో చేస్తున్న పనికి అందరూ సహకరిస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో ప్రేమికులకు ఆర్థిక కష్టాలు ఎప్పుడూ ఉండవు. కోట్లకు కోట్లు డబ్బు మూలుగుతున్నా దాన్ని కాదని కెరీర్‌ కోసం కష్టపడుతున్న బిడ్డ గురించి తల్లి కాస్ట్లీ బాధ తప్పితే ఒకె బంగారంలోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. పాత్రలు, వాతావరణం మాత్రమే కాదు. సబ్జెక్ట్‌, ట్రీట్‌ మెంట్‌ అంతా పూర్తి క్లాస్‌.  ఏక్‌ దమ్‌ ఏ క్లాస్‌. మ..మ..మ్మాస్‌ కాదు. సి క్లాస్‌ సెంటర్స్‌ టార్గెటే కాదు. ఓకె బంగారం ఫక్తు మల్టీ ప్లెక్స్‌ సినిమా. కాకపోతే బి క్లాస్‌ ఎప్పుడూ ఏ క్లాస్‌ జీవనశైలిని ఆరాధనతోనూ, రేపో మాపో తాను అక్కడికి చేరాలనే ఆశతోనూ చూస్తూ  ఉంటుంది. కాబట్టి బి క్లాస్‌కు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదు. క్లాస్‌ యూత్‌ను ఆకట్టుకునే అంశాలన్నీ ఉన్నాయి. వీడియోగేమ్స్‌తో పాటు, సెక్స్‌ని అన్‌ అపాలజిటిక్‌ అంశంగా చూపడం వగైరాలు యూత్‌ని పట్టేస్తాయి. ప్రకాశ్‌రాజ్‌-లీలాశాంసన్‌ జంట, వారి అనుబంధం ఎడ్యుకేటెడ్‌ మిడిల్‌ ఏజ్‌వాళ్లని థియేటర్లకు లాగేస్తుంది. అన్నింటని మించి కేవలం నిత్యామీనన్‌ను చూడడం కోసమైనా థియేటర్‌కు వెళ్లొచ్చు. వెరసి ఇది హిట్టే. మణిరత్నానికి చాలా కాలం తర్వాత కమర్షియల్‌ విజయం లభించినట్టే.

samvedana logo copy(1)

కథ రెండు ట్రాకులుగా నడుస్తూ ఉంటుంది. కెరీర్‌కు కమిట్‌మెంట్లు ఆటంకం అని భావించే ఒక అమ్మాయి-అబ్బాయి పెళ్లి చేసుకోకూడని అనుకుంటారు. అయితే అదే సమయంలో వయసు ముద్దు ముచ్చట్లకు ఆటంకం  ఉండకూడదని కూడా అనుకుంటారు. ఇద్దరూ ఎవరి కెరీర్‌ కోసం వారు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ లోపు ఉన్న ఆరునెలలు ఒకరిలో ఒకరిగా గడపాలని అనుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఆర్నెళ్లు జాలీగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉండాలని అనుకుంటారు. ఇదొక ట్రాక్‌. అల్జీమర్స్‌తో బాధపడే భార్య, బ్యాంక్‌ ఉద్యోగిగా రిటైరై ఇంట్లో వంటా వార్పూ చేస్తూ ఆమెకు  అన్నీ తానై చూసుకునే భర్త – ఈ జంటది మరో ట్రాక్‌.  వీరిద్దరి మధ్య ప్రేమానుబంధం, ఒకరికోసం ఒకరన్నట్టుగా జీవించడంలో ఉండే ఆ అనుబంధం ఆ యువజంట ఆలోచనలపై ఎలాంటి ప్రభావం చూపింది అనేది సినిమా సారాంశం. స్వేచ్ఛతో మొదలై బంధంతో ముగుస్తుంది ఈ సినిమా.

మామూలుగా కమర్షియల్ సినిమాలను చూసే దృష్టితోనే అయితే ఇందులో తప్పు పట్టాల్సింది పెద్దగా ఏమీ లేదు. మామూలు రీవ్యూయర్‌ భాషలో నాలుగు మాటలు మాట్లాడి ముగించుకోవచ్చు. మధ్యలో కాస్త బోర్‌ కొట్టించారు నాలుగైదు రీళ్లు ఎడిట్‌ చేసి ఉండొచ్చు కదా అనొచ్చు. కనీస పక్షం  రెండు పాటలను తీసేసి ఉండొచ్చు… చిన చిన కోరికలే..తప్ప మిగిలిన పాటలన్నీ వృధా. కదా అనొచ్చు. తెలుగు మసాలా సినిమాల్లో ప్రకాశ్‌ రాజ్‌ ఇరగదీశాడు అంటారు, ఇక్కడ అలాంటిదేమీ లేకుండా ఆయన పాత్రలో ఇమిడిపోయారు అనొచ్చు. ఆ మాటకొస్తే హీరో సహా అందరూ ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు అనొచ్చు.

05-1428213938-ok-bangaram-audio-launch-highlights

 

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బోర్‌ కొట్టిన సీన్లలో కూడా ఆ అమ్మాయి నిత్యా మీనన్‌ మెరుపు చూపులు రిలీఫ్‌గా పనిచేశాయి అనొచ్చు. క్రిస్టియానిటీని ఆధునికంగానూ, ఇస్లామిక్‌ ఆర్కిటెక్చర్‌ని గొప్పగా చూపించే పాజిటివ్‌ సింబాలిజమ్‌లో ఉన్న లిబరల్‌ ఎలిమెంట్‌ గురించి ప్రస్తావించుకోవచ్చు. ఇలాంటి మంచి చెడుల గురించి బోలెడు మాట్లాడుకోవచ్చు. కాకపోతే మణిరత్నం రెగ్యులర్‌ మసాలా మాల్‌ కాదు. కమర్షియల్‌కు ఎక్కువ, క్రాస్‌ఓవర్‌కు తక్కువ అనే విమర్శను కాసేపు పక్కనబెడదాం. తాను కోరుకున్న ఫీలింగ్‌ను సమర్థంగా జనంలోకి బట్వాడా చేయగల టెక్నీషియన్‌ అనైతే ఒప్పుకోక తప్పదు. ముఖ్యంగా ఇక వారంలో విడిపోతాం అనే మానసిక సంఘర్షణ ఆ యువజంటలో మొదలయినప్పటినుంచీ సినిమా నడిచే వేగం, అది కలిగించే స్పందన దర్శకుని విజయానికి సంకేతాలు. ఎఆర్‌ రహమాన్‌ తానేంటో ఇక్కడ చూపించారు.

ఓకె, బంగారం. కాకపోతే సినిమాలో వీరు చెప్పదల్చుకున్న విషయం ఏమిటి?

maniratnam-2b-1_1186981158

ఇద్దరూ సహజీవనం మొదలెట్టినపుడు సాగిన చర్చల్లో ఆ పెళ్లొకటి చేసుకుంటే ఆ తాడొకటి వేసుకుంటే అన్నీ చేసేసుకోవచ్చా..దాంతో లైసెన్స్‌ వస్తుందా, లేకపోతే రాదా అనే టోన్‌తో హీరోయిన్‌ మాట్లాడుతుంది. మరి సెక్స్‌కు వర్తించే సూత్రమే అనుబంధానికి కూడా వర్తిస్తుంది కదా! కాగితాల మీద పెళ్లి సంతకాలు చేసుకుంటేనే అనుబంధం నిలుస్తుందా, లేకపోతే ఉండదా. ఆ సంతకాలు లేకుండా కూడా వారు అనుబంధాన్ని కొనసాగించలేరా…ఒకరికొకరుగా ఉండలేరా! సేమ్‌ తర్కం ఇక్కడ ఎందుకు వాడలేకపోయారు? ఆ సంతకాలు లేకపోతే పారిస్‌ వెళ్లిన అమ్మాయి అక్కడ ఇతన్ని మర్చిపోతుందా, అమెరికా వెళ్లిన అబ్బాయి ఆ అమ్మాయిని మర్చిపోతాడా. పెళ్లి సంతకం అనుబంధాన్ని కాపాడే తాలిస్మాన్‌లాగా పనిచేస్తుందా! ఆ సంతకాలు లేకుండా కూడా ఆ వృద్ధదంపతుల్లాగే వారు అనుబంధాన్ని కాపాడుకోవచ్చుకదా! అనుబంధం అనేది మనుషుల అవసరాలు, పరిస్థితులు, స్వభావాల మీద కాకుండా పెళ్లి అనే తంతుమీద ఆధారపడుతుందా!

ఇంటిమసీ విషయంలో రాడికల్‌గా ప్రశ్న వేసిన మణిరత్నం అదే ప్రశ్న అనుబంధం విషయానికీ వర్తిస్తుందని ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకంత స్టేటస్‌ కోయిస్టుగా ఉండిపోయారు అనేది ప్రశ్న. దిల్‌ దే చుకే సనమ్‌, తాళ్‌ అంత నాటుగా ఇది లేకపోవచ్చు. అబ్బాయి నోటినుంచే పెళ్లి ప్రపోజల్‌ పెట్టించడంలోనూ కాస్తంత సోఫిస్టికేషన్‌ చూపించి ఉండొచ్చు. కానీ సోఫిస్టికేషన్‌లో తప్ప సారాంశంలో ఉన్న తేడా ఎంత? పిసి శ్రీరాం అద్భుతమైన ఫ్రేమ్స్‌, పాత్రలు, సంభాషణలు అన్నీ ఫ్రెష్‌గా ఉండి సినిమా ఒక దశలో పొగలు కక్కుతున్న తమిళ సాంబారులాగా ఉంటుంది. ముగింపు వచ్చేసరికి పాచిపోయిన సాంబారులాగా ముక్క వాసన వేస్తుంది.

*

 

 

 

 

రాజ్యం మెసేజ్‌-ప్రజాస్వామిక వాదులకు ఎస్‌ఓఎస్‌!

జి ఎస్‌ రామ్మోహన్‌

 

వాళ్లు చొక్కా అవసరం లేనంత పేదవాళ్లు. ఏ కులమో ఏ మతమో మనకు తెలీదు. మనలాగా పేపర్‌ చదివి, మనలాగా రాజకీయాలు చర్చించే మనుషులు కారు. మనలాగా కేరేజీ తీసుకుని స్కూటర్‌మీదో కారులోనో ఆఫీసుకు వెళ్లే మనుషులు కాదు. మనలాంటి మధ్యతరగతి మర్యాదపురుషులు కాదు. మన భాష కాదు, మన రాష్ర్టమూ కాదు. వాళ్లు వేరే. వాళ్లు మనకు ఏలియన్స్‌. అందుకేనేమో మనకు పెద్దగా పట్టింపు ఉండదు. సివిల్‌ సొసైటీలో స్పందన కష్టం. ”భలే పని చేశారు గురూ, ఈ దెబ్బకు ఇక ఇటువైపు రారు” అనేమాట ఎక్కువగా వినిపిస్తోంది.

మనందరి ఆస్తిని ఎవరో కొట్టేసుకుపోతూ ఉంటే పోలీసులు వారికి గట్టి బుద్ధి చెప్పినట్టుగా ఉంది. చెట్లు కొట్టేయడం మనుషులను కాల్చిచంపదగిన నేరంగా ఎప్పుడు మారింది అని అడిగీ లాభం లేదు. రాళ్లు విసిరితే తుపాకులతో కాల్చేయడం ఏ విధమైన ఆత్మరక్షణ లాజిక్‌ అని అడిగి లాభం లేదు. ఆ శవాల పక్కనబెట్టిన దుంగలు ఎప్పటివో లాగున్నాయి, కొన్నింటిమీద పెయింట్‌ కూడా కనిపిస్తోంది అని ప్రశ్నించీ లాభం లేదు. ఇది ఎన్‌కౌంటరే అని నమ్మకం కలిగించాల్సిన అవసరం అంతగా లేదని, దానికోసం కష్టపడనక్కర్లేదని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ర్టాల్లో పోలీసులకు తమ సివిల్‌ సొసైటీ మీదా, నాయకుల మీదా, న్యాయవ్యవస్థమీదా నమ్మకం అంతగా పెరిగిపోయింది. ప్రజాస్వామ్య శక్తులు అంతగా బలాన్ని కోల్పోయాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడుతామని మనసావాచా కర్మణా ప్రమాణం చేసితిరి కదయ్యా అని పాలకులను ప్రశ్నించీ లాభం లేదు. అలాంటి ప్రశ్నలు వినపడే దూరంలో వారు లేరు. ముద్దు మాటలు వినలేదా! బొజ్జల వారి వివరణ చూడలేదా! అంతకుమించి అడవిలో కూలీలకేం పని అన్న వెంకయ్య నాయుడు ప్రశ్న చెవుల్లో రింగురుమనడం లేదా?
అడవిలో కూలీలకేం పని అనడంలో ఆధునిక ఆధిపత్య వ్యాపార శాస్ర్తముంది. నేటి ప్రభుత్వాలకు అడవి ఆస్తి. వనరుల గని. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ప్రభుత్వానికైతే ఎర్రచందనం మరీ కల్పతరువులాగా కనిపిస్తున్న ఆస్తి. ఒక్క ప్రభుత్వానికే కాదు. రాజకీయనాయకుల్లో చాలామందికి ఇవాళ అడవి వేలకోట్ల డబ్బుల మూట. సారాయి వేలంపాటలు, రియల్‌ ఎస్టేట్లు, ప్రాజెక్టుల్లో కమిషన్ల మీదుగా ఎదిగిన రాజకీయ నాయకత్వం చూపంతా అడవులమీదా గుట్టలమీదే ఉంది. ఇది ఆస్తి కోణం. మైదాన ప్రాంతపు ఆధునిక వృత్తులు, పనులు తెలీని ఆదివాసీల్లో చాలామందికి అడవి ఉపాధి. తునికాకో మరో ఆకో అలుమో కాయో పండో ఇచ్చే జీవన వనరు.

samvedana logo copy(1)

 

వాలులో నాలుగు గింజలు వేసుకుంటే నాలుగొందల గింజలిచ్చి పొట్టనింపే ఉపాధి. అడవి వారి జీవనాధారం. జీవనాధారం చేసుకోవడంలో ఇపుడు చనిపోయిన 20 మంది చట్టాలను పట్టించుకోకపోయి ఉండొచ్చు. వారి జీవనాధారంలో నేరకోణం ఉండొచ్చు. కానీ ఆస్తి కోణం ఉన్నవారు అందుకోసమే వేల ఎకరాల్లో ఆ చెట్లను పెంచి నరికి అమ్ముకుంటామని ఇంతకు ముందు ప్రకటించారని గుర్తుంచుకోవాలి. అదేదో వాతావరణం సహకరించదని తర్వాత ఇడియా ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఏమిటి? ఇక్కడ సమస్య చెట్లను కొట్టడం కాదు. ఎవరు కొట్టాలి? ఎవరి ఆస్తి? ఎవరు తరలించుకుపోతారు అనేదే సమస్య.

అక్రమ కొట్టివేతా-సక్రమ కొట్టివేతా తప్ప కొట్టివేత అనేది దానికది నేరమనే భావన ఇక్కడ లేదు. ఆ మాటకొస్తే నల్లమల కొండలకు ఆనుకుని ఉన్న కడప, ప్రకాశం జిల్లాల్లోని మైదానప్రాంతాల్లో చాలా ఇళ్లలో దూలాలు దంతెలు ఎర్రగాకనిపిస్తాయి. బండి గాండ్లు, ఇతరత్రా పరికరాలు ఎర్రచందనమే. ఎక్కువగా దొరికే నాణ్యమైన కర్రగా మాత్రమే వారికి తెలుసు. వారికి ఇపుడిపుడే దాని విలువ తెలుస్తున్నది. అది కర్రకాదు, బంగారం అని అర్థమవుతున్నది. తమ తాతలు తండ్రులు అన్నలు ఊ అంటే అడవిలోకి వెళ్లి నాలుగు కర్రలు నరుక్కొచ్చి ఇంటి పనికి ఉపయోగించేవారని వారు రాజ్యం చంపదగిన నేరాలు చేశారని వారికి ఇపుడిపుడే అర్థమవుతోంది. అది అంతపెద్ద నేరమెప్పుడైందో తెలిసే అవకాశం లేదు. వస్తువు ఖరీదు పెరిగితే అది నేరమవుతుంది, ఆస్తి విలువ కొద్దీ నేర స్వభావం పెరిగిపోతుంది అనే లాజిక్‌ ఇపుడిపుడే అందరికీ అర్థం చేయిస్తోంది ప్రభుత్వం. ఆ రకమైన మెసేజ్‌ని పంపించాలని భావించింది ప్రభుత్వం. మెసేజ్‌ని జనంలోకి పంపించాలనుకున్నపుడు డిమాన్‌స్ర్టేషన్‌ ఎఫెక్ట్‌ యాడ్‌ చేయగలిగితే అంతకు మించిన శక్తిమంతమైన సాధనం ఉండదు. 20 మంది శవాలతో డిమాన్‌స్ర్టేషన్‌ చేశాక ఇంకెవరైనా గొడ్డలి పట్టుకుని అడవిలోకి అడుగుపెడతారా!

20 మంది ఎవరో, ఎవరు కన్నబిడ్డల్లో ఎవరు కట్టుకున్న భర్తలో, ఎవరైతే మనకేంటి? వాళ్లెవరో పరాయివాళ్లు. ఈ మనమూ వాళ్లు అనేదాన్ని ప్రాంతం, కులం, మతం, వస్ర్తధారణ వంటివి నిర్వచిస్తాయి అనే మాట నిజమే కానీ అంతకుమించి నిజంగా నిర్వచించగలిగేది ఆస్తి. వాళ్లు ఆస్తి లేని వాళ్లు. ఆస్తే ఉంటే ఆ పనికి ఎగబడరు, అంతమందిని రాజ్యం చంపే మాటా ఉండదు. ఇక్కడ మైదాన ప్రాంతంలో గొంతుండి పత్రికల్లోటీవీల్లో మాట్లాడగలిగే రాయగలిగే, వినగలిగే, చదవగలిగే మనబోటోళ్లం ఎంతో కొంత భద్రలోకులం. కాబట్టి వారు పరాయివారే. ఆడవి ఆస్తిగా మారాక అడవుల మీద రాజ్యానికి రాజ్యంలో రక్షణ బాధ్యతలు చూసేవారికి గతంలో ఎప్పటికంటే అడవి పూర్తిగా మాదే అన్న సొంత భావన పెరిగిపోయింది. రివర్స్‌ లాజిక్‌లో ఆదివాసీలకు అడవితో ఏం పని అనే రోజులొచ్చాయి.

sheshashalam
నిజమే. వాళ్లు రాజ్యానికి చెందిన ఆస్తి అయినటువంటి చెట్లను నరికేశారు. వాళ్లు బండవాళ్లు, మొరటు వాళ్లు. నిజమే. ఆయా ప్రాంతాల్లో తిరిగి వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడానికి ప్రయత్నించిన వారితో కూడా మొరటుగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నమాట నిజమే. ఒకనాడు మన రాష్ర్టంలో స్టువర్ట్‌ పురంలా పేరుబడిన సోకాల్డ్‌ ‘నోటిఫైడ్‌’ ప్రాంతాల వారు అయిన మాట వాస్తవమే. అందరమూ అక్కడినుంచి వచ్చినవారమే. మనిషి పుట్టుకతోనే బ్రాండెడ్‌ షర్టుతోనూ బ్రాండెడ్‌ ఉద్యోగంతోనూ పుట్టలేదు. అందరమూ అడవులనుంచి ఆదిమ దశనుంచి వచ్చినవారమే. దాటి వచ్చిన దశ పట్ల అంత వ్యతిరేకత ప్రదర్శించడం మన సమాజంలోని అప్రజాస్వామిక లక్షణాల్లో ఒకటి. అడవుల అందం పట్ల అంతులేని గ్లామర్ అక్కడి ప్రజల పట్ల అంతులేని చిన్నచూపూ ప్రదర్శించుకునే వాళ్ సంఖ్య పెరిగిపోతున్నది. అడవి అనే ఆస్తి కావాలి. అడవి బిడ్డలు వద్దు. వాళ్లు ప్రజాధనాన్ని దోచుకోవాలనుకున్నారు కాబట్టి కాల్చేశామంటున్నారు కదా!

అంతకంటే దారుణంగా కమిషన్ల రూపంలో లంచాల రూపంలో ప్రజాధనాన్ని టేబుల్‌ కిందినుంచో పైనుంచో చేతులు చాచేవాళ్లను ఇలాగే కాల్చేస్తే సివిల్‌ సొసైటీ ఇలాగే మౌనం వహిస్తుందా, భలే పని చేశారు గురూ అనగలుగుతుందా అని వాదనకోసమైనా అనలేం. రకరకాల రూపాల్లో ప్రభుత్వానికి రావాల్సి పన్నులనునొక్కేసే తెల్లచొక్కాయి మనుషులను ఇలాగే పట్టుకుని కాల్చిచంపేయగలరా అని అడగలేం. వాళ్లంతా భద్రజీవితంలో ఉన్నవాళ్లు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఆఫీసర్‌ ప్రత్యక్షంగా దోపిడీ చేస్తూ పట్టుబడినా నేరం రుజువు కాకముందే నేరస్తుడెట్లా అంటారు అని వైట్‌ కాలరెగరేసి మాట్లాడగలడు. నాకు భారత న్యాయవ్యవస్థమీద నమ్మకం ఉంది గంభీరంగా మైకుల ముందు చెప్పగలడు. ఇపుడు చనిపోయిన 20 మంది ఉన్నారే వాళ్లు అలా చెప్పలేరు. వాళ్లకు మన వ్యవస్థ మీద అంత నమ్మకము ఉండదు. నమ్మకం ఎలా ఉంటుంది?

పోలీసులు తప్ప మరో శాఖ ఆ తండాలను గ్రామాలను సందర్శించకుండా ఉన్నపుడు బూతులు బెదిరింపులు తప్ప మరో మంచి మాట చెవి సోకనపుడు వారికి ఏ వ్యవస్థమీదైనా నమ్మకం ఎలా కలుగుతుంది? ఆయా ప్రాంతాలు దోపిడీదొంగల ప్రాంతాలని, వీరప్పన్‌ ప్రభావిత ప్రాంతాలని గట్టిగట్టిగా ప్రచారం చేయడం వల్ల వాళ్లు వేరే వాళ్లు వేరే అనే పరాయిభావనను అదే పనిగా జనంలోకి పంపించడం ఎత్తుగడ. ఈ ఎత్తుగడ కేవలం రాజ్యానిది మాత్రమే కాదు. ఆస్తిపరులందరిదీ. రాజ్యం కేటలిస్ట్‌ మాత్రమే. కశ్మీర్‌ను ఎలాగైతే ఆస్తిగా చూసి అక్కడ తిరగబడే వారిని ఎంతమందిని కాల్చితే అంత సంతోషపడే స్వభావాన్ని పెంచుకున్నారో ఇపుడలాగే శేషాచలం అడవులను ఆస్తిగా చూపి ఆ ఆస్తిపై కన్నేసినా చేయేసినా చంపేయొచ్చనే భావనను మధ్యతరగతిలో పెంచగలుగుతున్నది.
మన దేశంలో ప్రజాస్వామ్యం చిత్రమైనది. ఇది అవసరమైనపుడు నాలుగు పడగలు, పది తలలు తొడుక్కోగలదు. అది ఒకవైపు అమెరికాను ఆదర్శంగా చూపుతూ అక్కడ చూడండి రూల్‌ అంటే రూలే అనగలదు. ఏం కోర్టులండీ, కాల్చేస్తే గానీ బుద్ధిరాదు అని అదే నోటితో తాలిబన్ల లాజిక్‌ కూడా వినిపించగలదు. అక్కడ ఆధునిక బూర్జువా రాజ్యం ఆదర్శం కాదు. ఎక్కడ ఏది అవసరమైతే అది అనే ప్రాతిపదికన ఈ రాజ్యం నడుస్తుంది. తమకు అవసరమైనపుడు చట్టం ఒకటుంది కదండీ అనగలదు. అవసరం లేదు అనుకుంటే అన్నింటికీ చట్టాలంటే కుదరదండీ, పది మందిని వేసేస్తే గానీ పదకొండో మనిషికి తెలివిరాదు అనగలదు. రాజ్యాంగం రాసేటప్పుడు సూత్రబద్ధవైఖరుల కోసం నాటి మేధావులు అనేకానేక రాజ్యాంగాల మీద ఆధారపడ్డారు. వివిధ దేశాల్లో కాలక్రమేణా ముందుకు వచ్చిన విలువలు, నాగరికత తీసుకునే ప్రయత్నం చేశారు. ఇవాల్టి నేతలు తమ అవసరాల కోసం తమ క్రూరత్వాన్ని సమర్థించుకోవడం కోసం ఎక్కడెక్కడి అనాగరిక పద్ధతులను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

కానీ సమస్యలను తుపాకీతో పరిష్కరించాలనుకునే దేశాలు ఏమయ్యాయో ఈ దేశపు పాలకులు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది. తుపాకీ తాత్కాలికంగా గ్లామరస్‌గా కనిపించొచ్చు, తక్షణ పరిష్కారంగా కనిపించొచ్చుగానీ అది పాలకులకు ఈ వ్యవస్థకే ప్రమాదకరం అని గుర్తించాలి. ఆస్తి ప్రాతిపదికన మనుషులను శిక్షించదగినవారు- శిక్షించకూడని వారు, అందులోనూ చంపదగినవారు చంపకూడని వారు అని విభజించే ఈ విచిత్రన్యాయం ప్రమాదకరమైనది. ఈ దేశపు పేదలు ఇవాళ తెలుగువారు తమిళనాడు వారుగానో ఆదివాసీలు, మైదానప్రాంతం వారుగానో చీలిపోయి ఉండొచ్చును. ఆర్థిక అంతరాల వల్ల పేదలు కూడా తమకింద ఇంకా దరిద్రులున్నారనే భావనలో ఆధిక్యభావనలో ఉండొచ్చు. భద్రలోక భావజాలం అవసరమైన వారికంటే ఎక్కువమందిలో మాయలాగా కమ్మి ఉండొచ్చు. వారికి ఉమ్మడిగా గొంతునిచ్చే శక్తులు బలహీనంగా ఉండొచ్చును. కానీ ఏ బలహీనతా శాశ్వతం కాదు.
*

పీకె హై క్యా?

samvedana logo copy(1)పీకె గురించి. పీకె అంటే చంకల్లో సెగ్గడ్డలు వచ్చినట్టు చేతులు ఎగరేసి ఎగరేసి మాట్లాడే పీకె కాదు. ఆ పీకుడు మనకిప్పుడు అనవసరం. హిరానీ పీకె మాత్రం ఎందుకు అవసరం అంటే అది మన సమాజానికి అవసరమైన ఒక అంశాన్నిపరిమితుల్లోనైనా చర్చించగలిగింది. 300 కోట్ల వసూళ్లవైపు దూసుకెళ్తోంది అని చదివినప్పుడు కాదు గాని పీకె అంటే ఏమిటి అనేది ఐదో తరగతి పిల్లలు చర్చించుకుని చివరకు పాగల్‌ కుత్తా అని వాళ్లొక అబ్రివేషన్ ఇచ్చేసుకున్నారని తెలిశాక హిరానీ సక్సెస్‌ అయినట్టు అనిపించింది. పీకె సినిమాకు పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పెట్టుబడి పెట్టిందని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించినపుడు భలే అనిపించింది. సిటీకొచ్చి ఇన్నేళ్లయినా దేడ్‌ దిమాక్‌ అంటే సరిగా తెలిసేది కాదు. ఇపుడే తెలిసింది. కొత్త ఆశ్చర్యాలు, కొత్త విషాదాలు లేని నిస్సత్తువ కాలంలో ఎంత వినోదం, ఎంత విషాదం?

పీకెలో కొత్త అంశాలేమీ లేవు. అన్నీ మనకు తెలిసినవే. అందులోనూ మనం నాస్తికులమో హేతువాదులమో కమ్యూనిస్టులమో అయిఉంటే ఎప్పుడో ఒకసారి ఆ జోకులన్నీ వేసే ఉంటాం.అవేవీ పూర్తిగా ఏలియన్‌ విషయాలు కావు. కోడలు దిద్దిన కాపురం నాటినుంచో ఇంకా అంతకుముందునుంచో అక్కడక్కడా అపుడపుడూ కొన్ని శకలాలు చూస్తూనే ఉన్నాం.

ఓ మైగాడ్‌తో కూసింత ఎక్కువే చూశాం. కాకపోతే హిరానీ అలాంటి ఎలిమెంట్స్‌ని పూర్తిస్థాయిలో మెయిన్‌స్ర్టీమ్‌ లోకి తెచ్చి అల్లిన తీరు కొత్తది. ఈ దేశంలో మనోభావాలు అనే పదం ఒకటి ఏడ్చింది. దేవుడు లాంటి అమూర్తమైన పదార్థం అది. అది ఎవరైనా ఏలు పెడితే బొక్కడిపోయేంత సున్నితము. అత్తిపత్తి వలె అలా తాకితే ఇలా ముడుచుకుపోయేంత సున్నితము. పీకెకు దేవుని రూపరేఖా లావణ్యములు తెలీనట్టే మనకూ ఈ మనోభావాలు అనేవి ఎలా ఉంటాయో ఎందుకంత సున్నితంగా ఉంటాయో తెలీదు. కాకపోతే ఒకటి తెలుసు. ఇతరుల మీద దాడులు చేసి చంపేసేవారు, త్రిశూలాలతో తల్వార్లతో ఊరేగేవారికే ఇట్లా సున్నితమైన మనోభావాలు ఉంటాయని చరిత్ర మనకు తెలుపుచున్నది.

ఒక ఆర్టిస్టును దేశం విడిచిపోయేట్టు చేసినవారు, ఆడపిల్లలపై విధించిన స్థలకాల ఆంక్షలను ధిక్కరించినందుకు-అంటే మగవారికి మాత్రమే పరిమితమైన రాత్రిపూట రోడ్లమీద తిరుగుట, పబ్బుల్లో క్లబ్బుల్లో కనిపించుట వగైరా చేసినందుకు దాడులకు పాల్పడువారు. వాలంటైన్స్‌ డేనాడు తిట్టి కొట్టి బలవంతపు పెళ్లిళ్లు చేయువారు. ఒక నవల రాసినందుకు తలతీస్తాం అని ఫత్వా విధించినవారు, పబ్లిగ్గానే దాడులు చేయగలిగిన వారు. వీరందరి మనోభావాలూ సున్నితమైనవే. ‘అరేయ్‌, నేను చాలా సున్నితమైనవాడిని, నాకు కోపం తెప్పిస్తే నరికేస్తానంతే’ బాపతుగాళ్లన్నమాట! ఇదిగో ఈ బ్యాచ్‌ ఇపుడు రోడ్డున పడింది. ఇలాంటివారితో డీల్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.

pk1

ఇక్కడ చాలా నేర్పుగా జాగ్రత్తగా వ్యవహరించారు రాజూ హిరానీ. నేర్పుగా అంటే సబ్‌ ఠీక్‌ హై అని కాదు. సర్దుబాట్లే కాకుండా కొన్ని రాజీలు కూడా ఉన్నాయి. ఇంత జేసినా ఈ మనోభావాల గుంపులకు తృప్తి లేదు. ఊరుకుంటే మెత్తదనం అనుకుంటారేమో, పైగా మనోడు పదవిలో ఉన్నపుడు కూడా మనం హడావుడి చేయకపోతే మన ఆధిపత్యం ఏమైపోవాలి అని తీర్మానించేసుకుని బజార్న పడుతున్నారు. కడుపుకు అన్నం తినేవాడెవడూ ఇది మతాన్ని కించపరిచే సినిమా అనలేడు అని స్టేట్‌మెంట్‌ ఇవ్వచ్చుగానీ అన్నం బదులు చపాతీతింటే ఒకేనా అనొచ్చు.

అభిప్రాయాల్లో కూడా వైవిధ్యం ఉండొచ్చును. మన అభిప్రాయమే అంతిమం కావాలని   అనుకోకూడదు. విభేదాలున్నవారు రాసుకోవచ్చు. హిరానీ అనే పెద్దమనిషి ఒక సినిమా తీశాడు, నీకు నచ్చకపోతే ఇంకో సినిమా తీస్కో. లేదంటే ఒక వ్యాసంరాస్కో. నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో. “నా చేతిలో కర్ర ఉండాది కాబట్టి అందరూ నా మాట వినాలనిపిస్తాది” అంటే ఏం బాగుంటాదప్పా! అని మనం అడగాల్నా వద్దా! ఒకవైపు ప్రజాస్వామ్యంఅంటావు. ప్రజాస్వామ్యం చాలా గొప్పదని మీ నాయకుడు పార్లమెంట్‌ మెట్లకు సాష్టాంగనమస్కారాలు వగైరా పెడతాడు, నువ్వేంది స్వామీ, కర్రలు తీసుకుని వీధుల్లో పడతావ్ అని అడగాల్నా వద్దా! ఈ డ్యూయల్‌ రోల్‌ రహస్యమేంటో చెప్పమని డిమాండ్‌ చేయాలా వద్దా! ఏదో ఒకటి చెప్పండి, అట్లాగే ఖాయం చేసుకుందారి అనాల్నా వద్దా1 ఏ రోటి కాడ ఆ పాట అంటే ఎలాగబ్బా వీళ్లతో వేగడం. జ్ఞానానికి అవధి ఉంటుంది, అజ్ఞానానికి ఎక్కడా! అనుకుని ఊరుకోవడానికి లేదు. ఇది జ్ఞానాజ్ఞానాలకు సంబంధించిన విషయం కాదు. ఈ దేశం ఎదుర్కొంటున్న ప్రమాదానికి సంబంధించిన విషయం.

ఇపుడు కాస్త పెద్దమనిషి తరహాలో గంభీరంగా మాట్లాడుకుందాం. వీళ్ల గొడవేంటసలు. అహా, ఏంటసలు అని! అసలైతే వీళ్లతో మనం మాట్లాడలేం. వాదించలేం. మాట్లాడకూడదు, వాదించకూడదు. వాదిస్తే ఏమవుద్దో నీషే చెప్పాడు కదా! కానీ కొందరు చాలా పెద్దమనిషి తరహాగా తర్కపు ముసుగేసుకుని గొంతును బేస్‌ వాయిస్‌లోకి మార్చి ఆ రూట్లో ముందుకు వస్తుంటారు. స్వాములోర్లలో మాత్రం అందరూ సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారే ఉంటారా. అక్కడక్కడా కాస్త లాజికల్‌గా కనిపించాలని ప్రయత్నించువారు ఉంటారు. చర్చించకపోతే వీళ్లసలు ఊర్కోరు. వీళ్లేమంటారు?

images

ఈ దేశంలో హిందువులు అందరికీ చులకనైపోయారు. ఎవరుపడితే వారు నాలుగు రాళ్లు విసిరేయడమే అంటారు. అదే ఇస్లాంను అనగలరా, క్రైస్తవాన్ని అనగలరా! అమీర్‌ ఖాన్‌ అనే ముస్లిం కాబట్టి ఇలా చేశాడు అంటారు. ఈ చివరి ప్రశ్న జోలికి మనం పోకనక్కర్లేదు. అది దేడ్‌ దిమాక్‌ కంటే ఒక దిమాక్‌ తక్కువైన మాట. ఆనంద్‌ పట్వర్థన్‌ ఏ మతంలో పుట్టారని ఆయన సినిమాలను డాక్యుమెంటరీలు ఆంక్షల నడుమ నలిగిపోతున్నాయి. సంజయ్‌ కాక్‌ ఏ మతంలో పుట్టాడు? దీపా మెహతా ఏ మతంలో పుట్టింది? ఇక ఇతరత్రా విషయాల్లోకి వెళ్దాం. అదే అమీర్‌ ఖాన్‌ మసీదు లోకి మద్యం బాటిళ్లతో వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అదే అమీర్‌ ఖాన్‌ ముగ్గురు భార్యల మొగుడైన ముస్లిం వ్యక్తికి కోపం తెప్పిస్తాడు. అదే అమీర్‌ ఖాన్‌ ఇస్లామిస్ట్‌ టెర్రరిస్టుల దాడికి చలించిపోతాడు. చనిపోయిన తన మిత్రుడి చెప్పు మోసుకుని తిరుగుతాడు. అసలు ఇంత బాలెన్సింగ్‌ యాక్ట్‌ అనవసరం. ఇందులో కొన్ని అంశాల్లో ప్రత్యేకించి ముగ్గురుభార్యల సెటైర్‌లో స్టీరియోటైప్‌ వ్యవహారం ఉంది. హిరానీ ప్రమాదకరమైన పర్వతాల మధ్యలో తాడుమీద నడిచే మాదిరి విన్యాసం చేశాడు. అయినా ఈ గుంపులకు ఆనలేదు.

ఇపుడు హిందూ దేవతలే హిందూ బాబాలే దొరికారా అనే ప్రశ్న దగ్గరకు వద్దాం. ఇది హిందూ మెజారిటీ దేశం. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషైనా ఏ మతంలో ఉన్న దురాచారాల గురించి ఫోకస్‌ చేయాలి? ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లి ఇస్లాంను ఇట్లా చిత్రించగలరా అనేవారు ఈ దేశాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారా అనేదానికి సమాధానం చెప్పాలి. ఎదుటోడు కన్ను పొడుచుకున్నాడు కాబట్టి మనం కూడా పొడుచుకోవాలి అనడం   తప్ప ఇందులో ఏమైనా ఉందా! అట్లాంటి స్థాయికి తీసికెడితేనే కానీ వీళ్లు పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయించడానికి అవకాశం దొరకదు. అదీ అసలు విషయం.

ఏ దేశంలో నైనా పురోగామిగా ఆలోచించే శక్తులుంటాయి. ఏదో ఒక స్థాయిలో అక్కడి ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటాయి. క్రైస్తవ ఆధిపత్యంలోని దేశమైనా ఇస్లాం ఆధిపత్యంలోని దేశమైనా అన్ని దేశాల్లోనూ ఇలాంటి కళారూపాలు ఉంటాయి. మనం చూడదల్చుకోకపోతే వేరే విషయం. బాబాల అవతారమెత్తి ఒక్కొక్కడు ఎన్ని రకాల నీచాలకు మోసాలకు పాల్పడుతున్నారో తెలిసి కూడా మా హిందూ బాబాలను అలా అంటావా అంటున్నారంటే వీరికి కనీసం తమ మతాన్ని సంస్కరించుకోవాలనే కోరిక కూడా లేదని అర్థమవుతోంది.

అక్కడక్కడా కొన్ని మౌలిక అంశాలు లేవనెత్తినప్పటికీ మొత్తంగా చూసినపుడు వివేకానంద స్కూల్‌కు దగ్గరగా ఉండే సంస్కరణ వాద వ్వవహారం ఈ సినిమా. తిరుగుబాటు వ్యవహారం కానేకాదు. చివర్లో బాబాతో చర్చ సందర్భంగా దైవాన్ని ప్రశంసించి అది సాంత్వనకు అవసరం అని చెప్పి భక్తులను సంతృప్తి పరిచే పని కూడా చేశాడు హీరానీ. కానీ మెయిన్‌స్ర్టీమ్‌ సినిమాలో ఆ మాత్రం ప్రయత్నం చేయడం, అది ఎక్కువమందికి చేరే విధంగా చేయడం రాజూ హీరానీ సాధించిన విజయం. అభినందించాల్సిన విషయం.

   -జి ఎస్‌ రామ్మోహన్‌

 

వర్మ ప్రయోగం మసాలా సినిమాకి షాక్!

samvedana logo copy(1)
వర్మకు అభినందనలు.

సత్య, సర్కార్‌ తీసిన మనిషి ఐస్‌క్రీమ్ లాంటి సినిమాలు తీస్తున్నందుకు కాదు. సినిమా రంగాన్ని ప్రజాస్వామీకరించే దిశగా ఆలోచిస్తున్నందుకు. అతనొక సినిమా పిచ్చోడు. ఆయన సినిమాల మీద మనకు ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ సినిమా ద్వారా వచ్చే పేరును సంపదను మాత్రమే కాకుండా సినిమాను కూడా ప్రేమించేవాళ్లు అవసరం. వర్మ సినిమాను వ్యాపారంగా మాత్రమే చూడకుండా అదే జీవితంగా ఎంచుకున్నవాడు. సినిమాను దానిద్వారా సంపాదించిన పేరును అడ్డుపెట్టుకుని సర్కారీ భూములు కొట్టేసి అందులో చట్టవిరుద్ధమైన స్టుడియో ఫ్లోర్లు, సినిమా ధియేటర్టు కట్టే బాపతు కాదు. అతను ఇప్పుడు చేపట్టిన ప్రయోగం సినిమా రంగాన్ని ప్రజాస్వామీకరించడానికి అవసరమైనది.

చిన్న సినిమా నిర్మాతలు అనే పదం తరచూ వింటూ ఉంటాం. వాళ్లు ఇందిరాపార్కు దగ్గరో, ఫిల్మ్‌క్లబ్‌ దగ్గరో మరొకచోటో ఆందోళన చేయడం వగైరా చూస్తూ ఉంటాం. వారి మాటల్లో ఆ నలుగురూ అనే పదం కసికసిగా వినిపిస్తూ ఉంటుంది. స్టార్ల బలం లేకుండా సినిమా తీసే చాలామందికి ఆ నలుగురు సినిమా రిలీజ్‌ కాకుండా అడ్డుపడే సైంధవులు. ఆ నలుగురిపై ఎందుకంత మంట? వందలకొద్దీ థియేటర్లను చేతిలో పెట్టుకుని వారి పుత్రపౌత్రమిత్ర సినిమాలు మాత్రమే ఆడిస్తూ తమకు థియేటర్ ఇవ్వడం లేదనేది తరచుగా వినిపించే ఆరోపణ. సాధారణంగా సినిమా తయారీ ఆఖరి అంకంలో నిర్మాతకు సినిమా చూపించే దశలు రెండు ఉంటాయని చెపుతారు. ఒకటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌. ముఖ్యంగా ‘లాబ్స్‌’లో డబ్బాలు ఆగిపోతుంటాయి. ఎవరికివ్వాల్సిన డబ్బులు వారికిస్తే గానీ అక్కడినుంచి డబ్బాలు బయటపడవు. అనుకున్న బడ్జెట్‌ కంటే డబుల్‌ చేశాడని దర్శకుడిని, అనుకోకుండా చేయిచ్చాడని ఫైనాన్సియర్‌ను తిట్టుకుంటూ ఉంటారు. అపుడపుడు పెద్ద పెద్ద నిర్మాతలు సైతం హుస్సేన్‌ సాగర్లో దూకి దాన్ని మురికి చేస్తూ ఉంటారు. ఏవో తిప్పలు పడి అక్కడినుంచి డబ్బాలు బయటకు తేగలిగినా ఆ తర్వాత అసలైన ఆఖరి అంకం మొదలవుతుంది. థియేటర్స్‌ ఎవరివ్వాలి? అన్ని థియేటర్లలో బాబుగార్ల సినిమాలే ఆడుతుంటాయి. చిన్నసినిమా మొకం చూసే వారుండరు. ఇక్కడ డిస్ర్టిబ్యూటర్స్ అనే వ్యవస్థ ఉంటుంది. అదొక పద్మవ్యూహం.

ఇలా ఆరోపించే చిన్ననిర్మాతల్లో అన్ని రకాల చిన్న వారుంటారు. ఒంటిపై స్పృహ గానీ పట్టింపుగాని లేని ఇద్దరు వ్యాంప్‌ పాత్రలు, సినిమా పిచ్చి ఉన్న ఒక అబ్బాయి-అమ్మాయి అందుబాటులో ఉంటే బంజారాహిల్స్‌లో ఒక గెస్ట్‌ హౌస్‌ను నాలుగు రోజులు అద్దెకు తీసుకుని బెడ్‌మీద రెండు రోజుల్లో పొర్లుడు పందాలు పెట్టి ఏదో ఒక వంకర పేరుతో జనం మీదకు వదలాలనుకునే సాఫ్ట్‌ పోర్న్‌ నిర్మాతల దగ్గర్నుంచి ప్రపంచ సినిమాను అధ్యయనం చేసి మనమెందుకు ఇలా ఉన్నాం అని మధనపడి నేను సైతం అనే శలభాల దాకా చాలా షేడ్స్‌తో ఉంటారు. మధ్యలో కుర్రకారును వల్గర్గా కాకుండా మామూలుగా అర్థం చేసుకోలేని మారుతి వేషాలు కూడా ఉంటాయి. ఏదో ఒక గడ్డితిని ఏదో ఒక చెత్త చూపించి నాలుగు పరకలు సంపాదించాలనుకునేవారుంటారు. పెన్ను బుగ్గన పెట్టుకుని అది అరిగిపోయే దాకా ఆలోచించేవారుంటారు. ఎవరి తిప్పలు ఏమైనా కానీ సినిమా అంటే నిజంగా ప్రేమ- అభినివేశం ఉన్న వారు బయటకు రాకుండా ఈ డిస్ర్టిబ్యూషన్‌ సిస్టమ్ అడ్డుకుంటోంది.

rgv

సినిమా మేకింగ్‌లో ఇప్పటికే చాలా మంచి మార్పులొచ్చాయి. స్విట్జర్లాండ్‌ను స్వీడన్‌ను కాకుండా కథను నమ్ముకుని, స్టార్లను కాకుండా యాక్టర్లను నమ్ముకుని సినిమా తీయాలనుకుంటే ఇవాళ కోట్లు కుమ్మరించనక్కర్లేదు. చాలా రంగాల్లో టెక్నాలజీ తెస్తున్న సానుకూల మార్పు ఇక్కడా తెచ్చింది. డిజిటల్‌ డెక్నాలజీ, నాన్‌ లీనియర్‌ ఎడిటింగ్‌ వంటివి సినిమా మేకింగ్‌ను సులభం చేశాయి. ఇవాళ అది బాబుగార్లకు మాత్రమే సాధ్యమైన విద్య కాదు. ఈ పద్ధతిని చాలామంది ఫాలో అవుతున్నారు. తెలుగులో ‘వెండిమబ్బులు’ తేలిపోయాయి కదా అని తొలిరోజుల్లో తేలికగా మాట్లాడిన వారు ఆ తర్వాత డిజిటల్‌ బాట పట్టక తప్పలేదు. కమల్‌ హాసన్‌ ముంబై ఎక్స్‌ప్రెస్‌ ప్రయోగం చేసినపుడు, ఆనక రెడ్‌ కెమెరా వాడినపుడు ఇదేం పైత్యం అన్నవారు తర్వాత ఆ బాట పట్టక తప్పలేదు. ఇవాళ రెడ్‌ కెమెరాకు ఎంత ఢిమాండ్‌ పెరిగిందో చెప్పనక్లర్లేదు. కమల్‌, వర్మ లాంటివారు దీర్ఘదర్శులు.

ఇవాళ హిందీ సినిమాలో కశ్వప్‌లు, బెనర్జీలు, నంబియార్లు వంటి కొత్త తరం అంతా డిజిటలే వాడుతున్నారు. నాలుగు నిమిషాల రీల్‌కు వేల రూపాయలు పోసే బదులు గంటలకొద్దీ నామ్‌కే వాస్తే ఖర్చుతో సినిమా తీసే డిజిటల్‌ను ఎవరైనా అనుసరించకుండా ఎలా ఉంటారు. సినిమా రంగంలో ఇంకా ఫ్యూడల్‌ ఆలోచనలు సంప్రదాయలు బలంగా ఉండడం వల్ల సినిమా థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో డిజిటలైజ్‌ కాకపోవడం వల్ల రివర్స్‌ టెక్‌లైన్‌ అవసరమవుతోంది కానీ అది కూడా పోతుంది త్వరలోనే. డిజిటట్‌ టెక్నాలజీ సినిమా రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తుందని, ఓ స్కూల్‌ టీచర్‌- ట్రక్కు డ్రైవర్‌ సినిమా తీసే రోజు ఐదేళ్లలో రాగలదని 2001లో శేఖర్‌కపూర్‌ ఆశించారు. సినిమా మేకింగ్‌ ఫైనాన్సియర్‌ల ధృతరాష్ర్ట కౌగిలినుంచి బయటపడి సృజనాత్మకత రెక్కవిప్పుకునే రోజు వస్తుందని ఆశించాడు. ఆయన కోరుకున్న స్థాయిలో కోరుకున్నంత త్వరగా కాకపోయినా ఇపుడా ప్రాసెస్‌ అయితే జరుగుతోంది. హిందీలో మంచి మార్పులే వస్తున్నాయి.

మేకింగ్‌ ఓకె. కానీ రిలీజ్‌ ఎక్కడా? మన ల్యాప్‌టాప్లో వేసుకుని ఫ్రెండ్స్‌కి చూపించుకుని వారు ఆహా ఓహో అంటే మురిసిపోవడమే. థియేటర్లు ఇచ్చే దిక్కెవరు? ఇక్కడే వర్మ మంచి ప్రయోగానికి పూనుకున్నారు. నిర్మాతకు-థియేటర్లకు మధ్య డిస్ర్టిబ్యూషన్ అనే వ్యవస్థను సింపుల్‌గా తీసేశారు. నేరుగా సినిమాను వేలంపాటలో పెట్టారు. థియేటర్ల వారు నేరుగా పాట పాడుకోవచ్చు. మధ్యలో ఆ ఉడ్డానలుగురో నలుగురో ఎవరూ ఉండరు. ఇపుడు అనుమానంగానే చూడొచ్చు. వర్మ ఏం పీకెన్‌ అని వ్యంగ్యంగా అనుకోవచ్చు. జూద లక్షణం ఉన్న రంగంలో ప్రయోగాలను అనుమానంగానే చూస్తారు. కానీ భవిష్యత్తు అలా ఉండదు. సినిమాను ఆ ఉడ్డా నలుగురికే ఎందుకు ప్రీవ్యూలో చూపాలి. థియేటర్ల వారు వస్తారు. చూసుకుంటారు. గిట్టుబాటవుతుందనుకుంటే పాటలో పాల్గొంటారు. నీ సినిమాలో సరుకు ఉందనుకుంటే అమ్ముడు పోతుందనుకుంటే కొంటారు. లేదంటే లేదు. మార్కెట్‌కు అడ్డుపడుతున్న ఫ్యూడల్‌ పద్థతిని తొలగించే ప్రయోగం ఇది. అసలు పూర్తిగా మార్కెట్‌నే ధిక్కరించే తిరుగుబాటుదారుల సంగతి వేరే. మళయాళంలో జాన్‌ అబ్రహాం ఆరంభించిన రాడికల్‌ ప్రయోగం ఆయనతోనే అంతమైపోయింది.

సినిమారంగం కొద్దిమంది కౌగిట్లోనే బందీ అయి ఉన్నది. వారు చూపిందే సినిమాగా ఉన్నది. మిగిలిన వారు అడుగుపెట్టాలంటే అనేక అడ్డుగోడలున్నాయి. ఈ అడ్డుగోడలు బద్దలు కొడితే కానీ కొత్త నీరు రాదు. ఏ రంగమైనా ప్రజాస్వామికీకరణ కావాలంటే కొత్త నీరు అవసరం. కొత్త ఆలోచనలు అవసరం. కేవలం డబ్బు మూటలున్నోళ్లకే అది పరిమితం కావడం ఎంత మాత్రం ఆరోగ్యకరమైనది కాదు. కాబట్టి ఆ రకంగా ఇది అవసరమైన మార్పు. మేము సైతం సినిమా రంగంలోకి రావచ్చు, మా ఆలోచనలను పంచుకోవచ్చు అనే ధైర్యం కల్పిస్తే ఆరోగ్యకరమైన వారు సినిమా రంగంలోకి వస్తారు. తమతో పాటు మార్పు తీసుకు వస్తారు. డిజిటల్‌ టెక్నాలజీతో పాటు మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ కూడా వచ్చాక హిందీ సినిమాలో వచ్చిన మంచి మార్పులను చూస్తున్నాం. ఎన్ని మార్పులు! ఎన్ని ప్రయోగాలు! అక్కడ ఎందుకు సాధ్యమైంది? వాళ్లది విస్తృతమైన మార్కెట్‌. బిక్లాస్, సిక్లాస్‌లో ఆడకపోయినా అర్బన్‌ పీపుల్‌ మల్టీప్లెక్స్‌లో చూసినా వాళ్ల డబ్బులు వారికొచ్చే పరిస్థితి ఏర్పడింది. అటువంటి ధైర్యాన్ని మల్టిప్లెక్స్లులు కల్పించాయి. తెలుగులో మల్టీప్లెక్స్‌ మార్కెట్‌ అంతలేదు. మల్టీప్లెక్స్ ఆడియెన్స్తో పాటు చిన్న పట్నాల వాళ్లను కూడా కాస్తో కూస్తో ఆకర్షించే ఎలిమెంట్స్‌ కలిపి తెలివిగా తీస్తే నాన్‌ మసాలా సినిమాకు తెలుగులోనూ చోటుందని ఇటీవలే ఉయ్యాల జంపాల, ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాలు నిరూపించాయి.

డిస్ర్టిబ్యూషన్‌ వ్యవస్థలో ఫ్యూడల్‌ అడ్డుగోడలు తొలగిస్తే అంతకంటే మంచి సినిమానే మనం ఆశించవచ్చు. వర్మ ప్రయత్నం ఆ దిశగా ముందడుగు అని భావించొచ్చు.

 

జి ఎస్‌ రామ్మోహన్‌

పాత బూతుల బూజు దులపాల్సిందే!

samvedana logo copy(1)
“పనిమనిషులు దొరకడం లేదండీ. అబ్బో, రోజొక గంట పనిచేయడానికి వేలు అడగుతున్నారు. ఇళ్లలోనే ఉండి పనిచేసే అమ్మాయిలు అయితే అసలే దొరకరు.” పట్నాల్లోమధ్యతరగతి బాధ ఇది. ఇంటి నిర్వహణ ప్రధానంగా ఆడవాళ్ల బాధ్యతే కాబట్టి వాళ్లే ఎక్కువగా బాధపడుతునట్టు కనిపించినా ఈ బాధకు జెండర్‌ అంటగట్టక్కర్లేదు.

“ప్లంబరండీ, ఇంటికొస్తే చిన్న ట్యాప్‌ బిగించడానికి కూడా మూడునాలుగొందలు పోయాల్సిందే. బట్టలు ఐరన్‌ చేసే దిక్కులేదు”. ఇలాంటి మాటలు కూడా ఎడా పెడా వినిపిస్తూ ఉంటాయి.

“కూలోళ్లు దొరడం లేదండీ, వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది. ఈ గ్రామీణ ఉపాధి పథకం తెచ్చిఅందర్నీ సోమరులను చేసిపెట్టారు. మనకెందుకు పనిచేస్తారు”.ఇది పల్లెల్లో ఎక్కువగా వినిపించే మాట.

“డప్పు కొట్టే మాదిగ లేకపాయె, చాకలి, కమ్మరి, కుమ్మరి పనులు పాయె, గ్రామాలు పాడైపోయాయండి.” ఇది కూడా దాని పక్కనే వినిపించే మాట.

ఈ బాధలు ఎవరికైనా బాధలు కావచ్చు కానీ వర్కింగ్‌క్లాస్‌ తరపున మాట్లాడేవారికి  కావచ్చునా! శారీరక శ్రమకు డిమాండూ విలువా పెరగడం వర్కింగ్‌ క్లాస్‌ తరపున మాట్లాడేవారు సంతోషించాల్సిన విషయాలు. కానీ మనం చేసే మధ్యతరగతి ఉద్యోగాలకు మాత్రం వేతనాలు మెరుగ్గా ఉండాలని, మనకు సర్వీసెస్‌ అందించేవారు మాత్రం ఎప్పట్లాగే జోలె పట్టుకుని మనం ఇచ్చినంత తీసుకుని చిత్తం దొరా అనాలని చాలామంది కోరుకుంటున్నారు. గ్యాస్‌ బండమీద సబ్సిడీ తగ్గిస్తే గోలగోల చేసేసి గ్రామీణ ఉపాధి పథకాన్ని మాత్రం ఆడిపోసుకుంటుంది ఇలాంటి మధ్యతగరతి.

పేదలవైపున నిలవడమంటే పేదరికాన్ని ప్రేమించడంగా అర్థం చేసుకున్న మిత్రులు ఇంకో రకమైన ఏడుపును అవుట్‌ సోర్స్‌ చేస్తుంటారు. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి ఏమాయె, అంతా ఉంటేనే గదా ఊరు అని ఒకటే బాధ!  మనం కాలేజీలోనో, బ్యాంకులోనో, కోర్టులోనో, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనో, పత్రికా కార్యాలయంలోనో  పనిచేయాల. స్థిరమైన వేతనం తీసుకుంటూ మధ్య మధ్యలో సాహిత్య సేవ చేస్తూ ఉండాల. కానీ ఊరిలో మాత్రం నాలుగు వీధులు, ఏ వీధిలో ఆ కులాలు, మధ్యలో రచ్చబండ, దాని మీద ఓ యాపచెట్టు ఉండాల.  బాడిస చప్పుడు, మగ్గం  చప్పుడు, కుమ్మరి సారె చప్పుడు వినిపిస్తూ ఉండాల. ఊరిని ఊరిలా ఉంచడానికి చాకళ్లు, మంగళ్లు, కుమ్మర్లు, కమ్మర్లు నానా చావు చస్తూ అలానే ఉండిపోవాల! లేకపోతే సర్వనాశినం అయిపోయినట్టే!

మనం పైన ట్యాంక్‌ కట్టుకుని ఎప్పుడంటే అప్పుడు నీళ్లు తిప్పుకుంటాం‌‌, కానీ కుండలు చేసేవాడు కావాల! మనం ఖాదీ వేయం‌. ఆధునిక పరిశ్రమ చేసిన బట్టలే వేస్తాం. కానీ సాలె బట్టలు నేయాల. ఇందులో ప్రాక్టికాలిటీ ఏమైనా ఉందా. జీవితమేమైనా కె విశ్వనాధ్‌ సినిమానా! వివేకానంద సూత్రం ప్రకారం అన్ని కులాలు గౌరవంగా తమపని తాము చేసుకుంటూ అంతిమంగా బ్రాహ్మణత్వాన్ని పొందడానికి! గతాన్ని నెమరేసుకోవడం తప్పుకాదు. గతం లేకుండా వర్తమానం ఎక్కడినుంచి వస్తుంది? అమ్మమ్మ ఒడిని, ఒడిలో విన్న కథలను, చీమచింతకాయ కోయబోయి కింద పడిన దెబ్బలను, ఊరిబావిలో కొట్టిన ఈతలను గుర్తు చేసుకోకుండా ఉండడం సాధ్యమా! కానీ జ్ఞాపకాలకు విలువలు అంటగట్టి ఎత్తుపీట వేసి కూర్చోబెట్ట కూడదు. మా కాలంలో స్కూలుకు ఆరేడు కిలోమీటర్లు నడిచిపోయేవాళ్లం. ఇపుడు ఎవరైనా నడుస్తున్నారా అసలు! కూలీలు పక్కూరి చేన్లో పనులకు పోవడానికి కూడా సెవన్‌ సీటర్లు ఎక్కుతా ఉంటే!  అని ఎవరైనా గతాన్ని తీపిగా గోక్కున్నారనుకోండి. మనమేం అనాల? పండితులారా! మన పూర్వీకులు కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవారు, యోజనాల దూరం నడిచేపోయేవారు, ఇవాళ మనం యాడికైనా అలావెళ్లి ఇలాగొచ్చేస్తున్నాం. మనం సోమరులైపోయామని మనం ఎన్నడూ అనుకోలేదు. మన తర్వాతి తరానికి మన కంటే కూడా శారీరక శ్రమ తగ్గింది. శారీరక శ్రమను తగ్గించుకుని సౌకర్యాలు పెంచుకునేందుకు మనిషి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది తప్పు కాదు అనాలా! లేక భలే చెప్పావు బాస్‌ అని ఫ్యూడల్ భజన చేయాలా !

An-Indian-boy-breaks-coal-006

“మా కాలంలో మాదిరి కాదమ్మా, ఇపుడాడవాళ్లకు పనా పంగా, అన్నీ మెషీన్లే అయిపాయె” అని కోడళ్లను చూసి ఈర్ష్య పడే కొందరు పాతకాలపు అత్తల మాటలకు దీనికి తేడా ఏమైనా ఉందా! ఇదింకా చిన్నబూతే. ఆ మంగలేమాయె, చాకలేమాయె, ఊరేమైపాయె అనైదైతే బూతున్నర బూతు.
ఊరు ఊరిలాగా ఉంచడం కోసం చాకలి మన పిల్లల పీతిగుడ్డలు, ఆడవాళ్ల ముట్టుగుడ్డలు, మగవాళ్లు తాగి వాంతి చేసుకున్న గుడ్డలు ఉతుకుతూనే ఉండాలా?సాయంత్రం ఇంటిమందుకొచ్చి బిచ్చమెత్తుకున్నట్టు జోలెపట్టుకుని మనం వేసే అన్నం పచ్చడి తీసికెళ్లి తినాలా? నీ మాల్గుడి డేస్‌ ఆనందం కోసం ఈ అవమానాన్ని
భరిస్తూ మనకు వెట్టి చాకిరీ చేస్తూనే ఉండాలా? నువ్వు పిలిచినపుడల్లా మాదిగ తప్పెట తీసుకొచ్చి చాటింపు వేయాలా? నువ్వు చస్తే అతను చచ్చినట్టు వచ్చి డప్పేయాలా?
లేకపోతే పీనిగ లేవదా? కాలిస్తే కాలదా? పూడిస్తే పూడదా? పశువు చచ్చిపోతే అతనొచ్చి తీసేయాలా? లేకపోతే  ఊర్లు పాడైపోయినట్టా? ఏం నువ్వు తీయలేవా?
తిండికి లేక ఒకనాడు కళేబరాల మాంసం తిన్నందుకు అది పారంపర్యంగా అతని బాధ్యతే అవుతుందా? చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడుతూ బట్టలు నేసేవాడు బట్టలు నేస్తూ
బట్టలుతికేవాడు బట్టలుతుకుతూ వ్యవసాయం చేసేవాడు వ్యయసాయం చేస్తూ పాలించేవాడు పాలిస్తూ అప్పులిచ్చేవాడు ఎప్పుడూ అప్పులిస్తూ అప్పలు తీసుకునే వాడు ఎప్పుడూ అప్పులు తీసుకుంటూ ఉంటేనే ఊరు పచ్చగా ఉన్నట్టా? ఇదేనా మనం కోరుకునే ప్రజాస్వామ్యం?

బహిష్టు కావడమంటే అదేదో నేరమైనట్టు మూలన కూర్చొని ఏ గుడ్డలు వాడాలో తెలీక అవే చింపిరిగుడ్డలను పదే పదే వాడుతూ చివరకు గోనెసంచులను చించి కూడా వాడుతూ రోగాలు, కాన్సర్లు తెచ్చుకుని ఆడోళ్లు నానా అవస్తలు పడే రోజులు ఎంత బాగుండేవని ఆ పాత రోజులను మధురంగా తల్చుకుందామా! బహిర్భూమికి వెడుతూ నానా రోగాలు తెచ్చుకుంటూ, తెస్తూ సహజమైన జీవన క్రియను కూడా అవమానంగా దొంగదొంగగా తీర్చుకునే రోజులు బాగున్నాయనుకుందామా! బిపినో షుగరో పెరిగిపోయి హఠాత్తుగా మనిషికి చెమట్లు పట్టి స్పృహతప్పి చచ్చిపోతే అదేం రోగమో తెలీక దయ్యం పట్టిందేమో భూతం పట్టిందేమో అనుకుని కాటికి మోసుకుపోయే అన్యాయపు రోజులను అందంగా గుర్తు చేసుకుందామా! ఎవరికో ఎక్కడో ఏదో అయితే  చేతబడి, బాణామతి, చిల్లంగి అని పిచ్చిమాటలు మాట్లాడతా మంత్రగాళ్ల పేరుతో మనుషుల పళ్లు ఊడగొట్టి జుట్టు రాలగొట్టి రాళ్లతో చంపేసే ఆ గుంపున్యాయపు క్రూరత్వాన్ని తన్మయంగా నెమరేసుకుందామా!

ఊరు ఊరంతా అరె ఒరె అంటుంటే అలాగే బాబయా అని అలవాటైన భయంతో కూడిన సిగ్గువల్ల వచ్చిన నవ్వుని అభినయిస్తూ పనిచేసుకుంటూ పోయే సర్వీస్‌ కులాలు లేకుండా పోయాయని బాధపడదామా! కులవృత్తులనుంచి బయటకొచ్చినవాళ్లంతా వేరే పనుల్లో కుదురుకుంటే బాధలేదు,  నలిగిపోతున్నారు, రాలిపోతున్నారు, వారి కోసం రాస్తున్నాము అని సమర్థించుకోవచ్చు. నిజమే, ఆ బాధలో న్యాయమున్నది. కానీ అప్పుడు దాని స్వరం వేరే ఉండాలి. బ్రాహ్మణ, వైశ్య, కుమ్మరి, కమ్మరి, చాకలి అని కులవృత్తుల సంగమస్థలిగా నాలుగు వీధుల్లో  నడిచే చతుష్పాద వ్యవస్థ పోయినందుకు బాధపడకూడదు.. చాకలి ఏమాయె, కుమ్మరి ఏమాయె అని పలవరించకూడదు.

మనుషులను ప్రేమించడానికి ఆ కులవృత్తుల బానిసత్వాన్ని ప్రేమించడానికి తేడా ఉంది. వాస్తవానికి వృత్తి పనిచేసేవారిలో ఆర్టిస్ట్‌ లక్షణం ఉంటుంది. తాము చేసే పని స్వతంత్రమైనదనే భావన చాలామందిలో ఉంటుంది. కూటికి పేదోళ్లమే కానీ కులానికి కాదనే వాసన కొన్ని కులాల్లో ఉంటుంది. ‘ఒకడి కిందకు పనికిపోవడమంటే పరువుపోగొట్టుకోవడం’ అనే న్యూనత ఉంటుంది. దీన్ని వదులుకోగలిగినవారు లేదా వదులుకోక తప్పనిసరైన వారు నెమ్మదిగా వేర్వేరు పనుల్లో కుదురుకుంటున్నారు. ఆ మధ్యలో కొంత ఘర్షణ ఉంటుంది. ఏ మార్పులో మాత్రం ఘర్షణ ఉండదు?
ఒక్క వృత్తి కులాలనే కాదు, ఏ రకమైన కాయకష్టం చేసేవారయినా దానికి తగిన ప్రతిఫలం రానప్పుడు అంతకంటే తక్కువ శ్రమతోనో అదే శ్రమతోనో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించడం సరైనదనే చేతన మనం కలిగించగలగాలి. అటువంటి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఏది ఏమైనా తన పొలంలో తాను చావనైనా చస్తాడు గానీ…అన్నట్టు రాసే వాళ్లు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. “తన పొలంలో తాను రాజులాగా బతికినవాడు ఇపుడు పాపం గార్డుగా” .. చొచ్చొచ్చొ అంటూ ఫ్యూడల్‌ వాసనను ప్రేమించాలా లేక శ్రమసంస్కృతిని పెంపొందించాలా? ‘బతికి చెడడం’ మీద పురోగామి రచయితలక్కూడా ఇలాంటి భావనలుండవచ్చునా! వర్కింగ్‌ కల్చర్‌ అంటే అంత ఏహ్యభావం ఉండవచ్చునా ? నువ్వో పక్క ఇది నీచం అదితక్కువ అని ప్రచారం చేస్తూ ఉంటే మార్పుకు సిద్ధపడే వాడు కూడా అదేదో చేయకూడని పని అనుకుని దాని బదులు చావుకు సిద్ధపడతాడు. నువ్వు మేలు చేస్తున్నట్టా! కీడు చేస్తున్నట్టా! ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోబట్టే అందులో ఉన్నవారి గురించి వారి స్థితిగతుల గురించి బాధపడుతున్నాం అనొచ్చు. కానీ చేస్తున్న పని అదిస్తున్న బతుకు మిగిలిన శారీరక శ్రమల కంటే అన్యాయంగా ఉన్న విషయాన్ని గుర్తించాలా వద్దా, గుర్తింప జేయాలా వద్దా! అలవాటైన పని మిగిలిన శ్రమలకంటే మెరుగ్గా కనిపించే ధోరణి ఉంటుంది.

ఆ భావన నుంచి వారిని బయటపడేయాలంటే ఏదో ఒక వైపునుంచి ఇంటర్‌వెన్షన్‌ అవసరం. లేదంటే ఏదో ఒక టైంలో ఆకలి ఆ పని మరింత క్రూరంగా చేసి చూపిస్తుంది. ఇంటిల్లిపాదీ పనిచేసినా రోజుకు వంద రూపాయలు కూడా మజూరీ ఇవ్వని చోట మగ్గం పని గ్రామీణ ఉపాధి కూలీ కంటే ఏ రకంగా మెరుగు? మనుషులు దున్నపోతుల్లా కూర్చుని ఉంటే ఒక బక్కపల్చని మనిషి రెక్కలతో లాక్కుపోయే టాంగాను నువ్వెలా చూస్తావన్నదానిమీద నీ దృక్పథం ఆధారపడి ఉంటుంది. సాంకేతికత ఇంత పెరిగిన ఈ దశలో కూడా ఇది కొనసాగడం అమానవీయం, అన్యాయం అనే భావన నీకుంటే నీ భాష వేరే ఉంటుంది. లేకపోతే “పేదరికం, ఏం చేస్తారు” అని పరోక్షంగా సమర్థించే ప్రమాదం ఉంది. అవి ఉండడానికి వీల్లేదన్నవాళ్లంతా వాళ్లు ఆకలిచావులు చావాలని కోరుకుంటున్నవాళ్లేమీకాదు. ముందుగా అది అమానవీయం అని గుర్తిస్తే దాన్ని గట్టిగా ప్రకటిస్తే ఆ మేరకు వ్యవస్థ మీద ఒత్తిడి పెడితే ప్రత్యామ్నాయం ఏదో ఒకటి దొరుకుతుంది. ఎంతో చైతన్యవంతులం అనుకునే వారు కూడా గూడు రిక్షాలో బెజవాడలో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో అనేసుకున్నారనుకో!

ఇక అది అన్యాయమనే చైతన్యం సమాజానికి ఎక్కడినుంచి వస్తుంది? అలవాటైన మనిషి మార్పుకు సిద్ధపడే ఒత్తిడేదో ఉండాలి. చైతన్యవంతులైన వ్యక్తులు శక్తులు దానికి చోదకశక్తిలాగా పనిచేయాలి. వెనక్కు లాగ్గూడదు. ఒంటిని చర్నాకోలతో కొట్టుకుని, బిడ్డలను తాడుమీద నడిపించే అడక్కతినే విన్యాసాలను చూసి “ఆహా ఏమి ఆర్ట్‌” అనుకునే వారుంటారు. రచయితలైనా కాకపోయినా వీరిలో చాలామంది పురోగామి ముసుగులోనే ఉంటారు. వీరిలో కొందరు చివరకు కళావతులు, దేవదాసీ వృత్తులను కూడా ఆరాధిస్తారు. గొప్ప కళ అండీ అంటారు. వర్కింగ్‌క్లాస్‌ కల్చర్‌ ఉన్నోళ్లమయితే మనమేమని అడగాల? అంత మంచి ఆర్ట్‌ అయితే మీ బిడ్డలెందుకు తాడుమీద ఎక్కరు సార్‌! అంత గొప్ప ఆర్ట్‌ అయితే ఆ దేవదాసీల్లో మీ వాళ్లెందుకు కనిపించరు సార్‌! ఓ అని ఒకటే పొగిడే మీరు ఆ ఆర్ట్‌లను ఎందుకు ప్రాక్టీస్‌ చేయరు సార్‌,ఏదైనా నేర్చుకుంటే వస్తాది గదసార్‌! అని అడగాలా, వద్దా! అడక్కతినే స్థాయిలో ఉన్న అన్యాయమైన పనిని ఎవరైనా ఆర్ట్‌ పేరుతో పొగిడితే తప్పనిసరిగా కఠినంగా స్పందించాల్సిందే. కోపం రావాల్సిన చోట రాకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టే లెక్క.

మార్పు అనివార్యమైనపుడు దానికి తగినట్టుగా సిద్ధం కావడం, సిద్ధం చేయడం మన బాధ్యత. ఈ మార్పులో సానుకూలమైనవేవో ప్రతికూలమైనవేవో బేరీజు వేసుకుని దానికి అనుగుణమైన చైతన్యాన్ని పెంపొందించుకోవడం మన బాధ్యత. కొత్త ఆర్థిక వ్యవస్థ మనల్ని వస్తువుల వెంట పరిగెట్టేట్టు చేస్తుంది. ఆ వస్తువుల ఉత్పత్తి నిరంతరం అవసరయయ్యేలా చేస్తుంది. భావజాల పరంగా ఆ అవసరాన్ని కూడా అది నిరంతరం సృష్టిస్తూనే ఉంటుంది. ఆ నిరంతర వినిమయం, ఉత్పత్తిలో భాగంగా ఉపాధి పెరుగుతుంది. ఆ పరుగు ఆగితే వ్యవస్థలో సంక్షోభం ఏర్పడుతుంది.  అదే సమయంలో ఆ పరుగుకు అడ్డు వచ్చే తాబేటి వ్యవస్థను దాని తాలూకు చిహ్నాలను మార్చుకుంటూ వెడుతుంది. కొన్నింటినైతే రద్దు చేస్తూ వెడుతుంది. అందులో ఇప్పటివరకూ అణచివేతకు వివక్షకు గురైన సమూహాలకు ఊరటనిచ్చే కొన్ని విషయాలుంటాయి.

ఇప్పటివరకూ కొన్ని పనులను నీచంగా విలువ తక్కవగా చూసిన వారు కూడా ఆ  పనులను చేయాల్సిన అవసరం కల్పిస్తుంది. ఆ పనికి అంతకుముందు లేని గౌరవాన్ని ఆపాదిస్తుంది. ఒక్క ముక్కలో ఆయా పనులను మార్కెట్‌ చేయడానికి అడ్డొచ్చే అనవసరమైన న్యూనతలను, అనవసరమైన గౌరవాలను రద్దుచేస్తుంది. కనీసం తగ్గిస్తుంది. కొత్త వ్యవస్థ కేవలం పట్నాలకే పరిమితం కాదు. టీవీ ఇంటర్‌నెట్‌ వంటి సాధనాలు, మెరుగుపడిన రవాణా సాధనాలు పల్లె-పట్నాల మధ్య తేడాను చెరిపేసుకుంటూ వస్తున్నాయి. ఈ చెరిపివేయడం వల్ల కొంతమందికి అలవాటైన సౌఖ్యాలు, గౌరవాలు, మర్యాదలు తగ్గిపోతాయి. అయ్యవారు అనో రెడ్డీ అనో రాజుగారు అనో దొరా అనో గౌరవ సంబోధనలను కోల్పోయిన వారికి ఉక్కపోత ఉంటుంది. ఆ ఉక్కబోతను అలాగే ప్రదర్శించుకుంటే దాని కథ వేరే!

అలా కాకుండా శ్రామిక కులాల పాత్రలను పెట్టి పెద్ద మెలోడ్రామాలను సృష్టించి ఇంకా అవసరమనుకుంటే పాత్రలను చంపేయడం లాంటి విన్యాసాలు చేసి నాలుగు పాదాల సంస్కృతి పోయినందుకు బాధపడితే మాత్రం బాధేస్తుంది! ప్రపంచీకరణ అనే భూతాన్ని పోటీగా నిలబెట్టినంత మాత్రాన అలాంటి వాదన న్యాయమైనదైపోదు! పీడిత కులాల నుంచి వచ్చినవారు, నిజంగా వర్కింగ్‌ క్లాస్‌వైపు నిలబడేవారు ఇక్కడ కన్ఫూజ్‌ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ మాయలో పడే ప్రమాదం ఉంది. అది సాహిత్యంలో చూచాయగా కనిపిస్తున్నది. కొత్త వ్యవస్థలో ఉన్న దుర్మార్గాలను ప్రశ్నించడమూ, అంత కంటే దుర్మార్గమైన పాత వ్యవస్థను ప్రేమించడమూ రెండూ ఒకటి కావు.

కొత్త ఆర్థిక వ్యవస్థ రెండు రకాల మార్పులు తెస్తుంది. ఒకటి- కులానికి వృత్తికి మధ్య ఉన్న బంధాన్ని తెంచేయడం, రెండు- సోషల్‌ మార్కర్స్‌ను మెటీరియల్‌ మార్కర్స్‌గా మార్చడం. పల్లెలో నీ ఉనికి నీ కులంతోనే ముడిపడి ఉంటుంది. ఏ ఊరిలో నైనా ఎవరిగురించైనా అడిగితే ఏంటోళ్లు అని ప్రశ్నిస్తారు. అదే పట్నంలో అయితే ఏం చేస్తారు అని అడుగుతారు. అక్కడ గుర్తింపు నీ కులం. ఇక్కడ గుర్తింపు నీ పని. నీ గుర్తింపు నీకు సంబంధం లేని పుట్టుకతో ముడిపడి ఉండడం కంటే నువ్వు చేసే పనితో ముడిపడి ఉండడం కచ్చితంగా మెరుగైన విషయం. కొత్త వ్యవస్థ  సంప్రదాయకంగా సాగుతున్న వృత్తి పనులను మార్కెట్‌ చేసి కొత్త విలువను ఇస్తుంది. అంతకు ముందు మార్కెట్‌ చేసుకోలేని విషయాలను బ్రాండ్‌గా మార్చివేసి కొత్త మేకప్‌ వేస్తుంది. ఆరోగ్యం కాస్తా ఫిట్‌నెస్‌ అనే మార్కెట్‌ పదంగా మారుతుంది.

సంప్రదాయ వ్యాయామశాలల స్థానంలో ఆధునికమైన జిమ్‌ మార్కెట్‌ ప్రవేశిస్తుంది. చిలకజోస్యాలు పిచ్చి లాజిక్కులతో న్యూమరాలజీ-వాస్తు రూపం తీసుకుంటాయి. బాత్‌రూమ్‌లు, లెట్రిన్‌లు క్లీన్‌ చేయడమనే పని మెయిన్‌టెయిన్స్‌ అనే రూపం తీసుకుని కొత్త డ్రస్ తొడుక్కుంటుంది. యూనిఫామ్‌, మెడలో ఐడెంటిటీ కార్డు లాంటివి కొత్త ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని ఇస్తాయి. కావాలంటే ఇళ్లలో పనిచేసే వారిని పరిశ్రమల్లో అదే పనిచేసేవారిని పోల్చిచూడండి. హౌస్‌ వైఫ్‌  అనే పదం దానికున్న న్యూనతను తొలగించుకుని హోమ్‌మేకర్‌ అనే ఆధునిక రూపం తీసుకుంటుంది. దర్జీపని  బాతిక్‌ రూపమెత్తుతుంది. చాకలి పని డ్రైక్లీనింగ్‌ రూపమెత్తి పరిశ్రమగా రూపుదాలుస్తుంది.  వంటపని కొత్త గౌరవాన్ని సంతరించుకుని గౌరవనీయమైన వృత్తిగా అవతరిస్తుంది. ఈ రంగంలో సూపర్‌ స్టార్‌ సంజీవ్ కపూర్‌ స్ర్తీ కాదు. వెంట్రుకలు కత్తిరించే పని ఇంతకుముందు లాగా అగౌరవంగా ఉండదు.

అందులో కులాన్ని తీసేసి కొత్త వర్గాల్ని ప్రవేశపెడుతుంది మార్కెట్‌. ఎదురుగా అద్దం తగిలించి కబుర్లు చెపుతూ బ్లేడుతో గడ్డం గీకడం ఒక వర్గం. కత్తెర చేత్తో పట్టుకుని ఏ స్టైల్‌చేయాలి సర్‌ అని అడిగేదొక వర్గం. పిలకజుట్టో పిల్లగడ్డమో పెట్టుకుని చొక్కా ఫ్యాంటు మీద అప్పటికప్పుడు ఒక బెల్టు లాంటిది తగిలించుకుని అందులోని ఆధునిక పొత్తి లోంచి కత్తెర్లు విలాసంగా ఎగరేసి తీస్తూ మీకు సెపరేషన్‌ కంటే సెపరేషన్‌లేకుంటేనే బాగుంటుంది సర్‌ అనేదొక వర్గం. పాత మంగలి పొత్తికి ఈ పొత్తికి మధ్య చాలా దూరం ఉంది. హబీబ్‌ ఇవ్వాల నేషనల్‌ స్టార్‌. ఆయన మంగలి కాదు. ఆయన శిష్యులు ప్రశిష్యులు వేలు లక్షలుగా మారి చిన్నచిన్న పట్నాల్లో కూడా సెలూన్లు తెరుస్తున్నారు. వాళ్లల్లో మంగళ్లు ఉన్నారో లేదో వెతుక్కోవాల్సిందే. మంగలిషాపు సెలూన్‌గా మారే ప్రక్రియ ప్రజాస్వామిక మైనది. ఇది వారి వృత్తిని దోచుకున్నదేమీ కాదు. ఎక్కువమంది ఆధారపడిన వృత్తి విషయంలో మార్పుసంక్లిష్టంగా ఉంటుందనేది వాస్తవం. కానీ ఆ సంక్లిష్టతలో మనం స్టేటస్‌ కోయిస్టుల పాత్ర పోషించరాదు.

పనికి పుట్టుకకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచడం వల్ల దానికి మార్కెట్‌ కల్పించడం వల్ల అన్ని కులాల వారు అన్ని పనులు చేయడంలో పోటీ పడే పరిస్తితి వస్తుంది. అత్యంత అమానవీయమైన వేశ్యావృత్తి కూడా రూపం మార్చుకుంది. ఇంతకుముందు కొన్ని కులాలకు పరిమితమైన వృత్తి ఇవాళ సెక్స్‌ వర్కర్స్‌ రూపమెత్తింది. అందులో వర్గాల వారిగా అన్ని కులాల వారు కనిపిస్తున్నారు. చివరకు ఆధ్యాత్మికత కూడా ఇండస్ర్టీగా మారిపోయి బోధకుల్లో గురువుల్లో బాబాల్లో బ్రాహ్మణేతర కులాల వాళ్లు చాలామంది రాణిస్తున్నారు. మంచి మాటకార్లకు బోలెడంత డిమాండ్ ఉంది. అమ్మోర్ల నుంచి బాబాల దాకా చాలా దూరమే ప్రయాణించాం. కాకపోతే సంప్రదాయకంగా మిగిలిపోయిన పూజారితనంలోకి శ్రామిక కులాలు రాకుండా ఆటకం ఉంది. డ్రైనేజీలో దిగి మురికిని బయటకు తోడివేసే పనిలోకి బ్రాహ్మణులు వస్తున్న పరిస్థితి లేదు.(ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంకా మనుషులు డ్రైనేజీలోకి దిగాల్సి రావడం ఈ వ్యవస్థ శ్రామికుల పట్ల చూపిస్తున్న దుర్మార్గానికి దర్పణం) చేపలు పట్టే పనిలో  ఆధునికత తగినంత రాకపోవడం వల్ల అక్కడా లోటు కనిపిస్తున్నది. ఇలాంటి కొన్ని ఉదాహరణలు మినహాయిస్తే  మిగిలిన చాలా పనులతో కులబంధం బలహీన పడింది. ఇంతకుముందు చీప్‌గా చూసిన శ్రమలకు విలువ పెరుగుతున్నది.
ఆధునిక కత్తెర్ల పొత్తి మాదిరే మార్కెట్‌ వ్యవస్థ డబ్బు ఖర్చుపెట్టడంలో నీ శక్తి ఆధారంగా కొత్త రకమైన వర్గీకరణలను చేస్తుంది. మార్కెట్‌ కొత్త రకం కులాలను తయారుచేస్తుంది అని కూడా అనొచ్చు కానీ కులంలోఉండే పుట్టుక వ్యవహారం ఇక్కడ ఉండదని గుర్తించాలి. డబ్బు ఆర్జించడంలో నీకున్న శక్తి మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. పాతకాలపు స్టెనో గ్రాఫర్‌తో పోల్చదగిన మెడికల్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌, బిపివో, కాల్‌ సెంటర్‌ల పని కూడా ఇప్పుడు గొప్ప గ్లామర్‌ను సంతరించుకుంటుంది. డబ్బు మహిమ! సహింపరానంత అసమానతలు పెరిగిపోతూనే ఉంటాయి. నిరంతరం పోటీ పడుతూనే ఉంటావు కాబట్టి సరిపోని తనం అనేది నీకు గుదిబండలాగా కట్టేసే ఉంటుంది. లేనితనం ఒకటి అందని ద్రాక్షలాగా నిన్ను శాశ్వతంగా ఊరిస్తూనే ఉంటుంది. మార్కెట్‌- మీడియా ఈ లేనితనాన్ని సరిపోని తనాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తూనే ఉంటాయి.

న్యూనత అసంతృప్తి అనేవి ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు చచ్చేదాకా ఊపిరాడకుండా నిలువనీయకుండా చేస్తూనే ఉంటాయి.  అది టాల్‌స్టాయ్‌  “హౌ మచ్‌ లాండ్‌ డస్‌ ఏ మ్యాన్‌ రిక్వైర్‌” కథలో పరుగులాంటిది . అలాంటి ఒత్తిడి నిరంతరం మనల్ని తరుముతూ ఉంటుంది.  కోతుల్ని చేసి ఆడిస్తుంది.  కొన్ని ఆలోచనలు,కొన్ని స్పందనలు ఉన్న మనిషిగా కంటే నిరంతరం వస్తువులు కొనే వినియోగదారునిగా మాత్రమే చూస్తుంది. నిలుచుని ఆలోచించే తీరిక లేకుండా చేస్తుంది. నీకు నిన్ను పరాయివాడిని చేస్తుంది. మాయా తెరలను సృష్టిస్తుంది. తెర సౌకర్యం స్థాయిని దాటిపోయి వ్యసనమై కూర్చుంటుంది. మనిషి తోటి మనిషితో కాకుండా తెరతో సంపర్కం చేసి మాయా సంతృప్తి పొందే తెరాధునికత లక్షణాన్ని మన జీవితంలోకి తెస్తుంది. ఇవన్నీ చర్చించాల్సినవే. కథనం చేయాల్సినవే. చాలామంది చేస్తున్నారు కూడా. కొందరే ఇంకా పాత మాయను మోసుకు తిరుగుతున్నారు. అది మాయ కదా, కొత్త జీవం కడుపులోంచి బయటపడ్డాక దానికి విలువ ఉండదు. ఆ తర్వాత కూడా మోసుకు తిరుగుదామంటే కంపు కొడుతుంది. ఆ కంపును వదులుకోవాల్సిందే. పుట్టుక ఆధారంగా నీ వృత్తిని దాని గౌరవాన్ని నిర్ణయించే నాలుగు పాదాల వ్యవస్థను ఏ సాకుతో కీర్తించినా అది అన్యాయం. శ్రామిక వ్యతిరేకం.

 

-జి ఎస్‌ రామ్మోహన్‌

వెబ్‌ పత్రికలతో ఒక బెంగ తీరింది, కానీ…!

samvedana logo copy(1)

 

సీరియస్‌ సాహిత్యాన్ని ప్రచురించే పత్రికలు తగ్గిపోయాయి అనే మాట తరచుగా వినిపిస్తున్నది. కథలు రాస్తాం సరే, వేదిక ఏదీ అని ఆందోళన వ్యక్తమవుతున్నది. కథకుల సమావేశాల్లో ఈ సమస్య గురించి చర్చ జరుగుతున్నది. ఆ లోటు తీర్చడానికి వెబ్‌ మ్యాగజైన్లు వచ్చేశాయి. పత్రికల్లో వచ్చిందాంతో సమానం కాదు అనే మాట ఉండనే ఉంటుంది. అది వేరే సంగతి.

వెబ్‌ మ్యాగజైన్లు వస్తూ వస్తూ చాలామంది కొత్త రచయితలను వెంట తీసుకొచ్చాయి. కొన్ని పాత బెంగలను తీర్చేశాయి. తెలుగు చచ్చిపోతోందని కొందరు రచయితలు బోలెడంత ఆవేదన చెందేవాళ్లు. తమ బాధను ప్రపంచం బాధ చేయడానికి విశ్వప్రయత్నం చేసేవాళ్లు. కొత్త తరంలో సాహిత్యం రాసేవాళ్లే లేరని ‘మన’ తరంతోనే ఈ సాహిత్య వ్యాసంగం చచ్చిపోతుందేమో అని ఆందోళన వ్యక్తమయ్యేది. ముఖ్యంగా సింగమనేని నారాయణ లాంటి పెద్దమనుషులయితే రేపట్నించే తెలుగు మాయమైపోతుందేమో, మన గోడు పంచుకోవడానికి మనుషులను వెతుక్కోవాలేమో అన్నంత దిగులు అందరికీ పంచేవారు. ఆ బెంగను  వెబ్‌ మ్యాగజైన్లు తీర్చేశాయి.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల మీద బోలెడన్ని అపోహలుండేవి. ఐటి అనగానే తాగుడు, తినుడు, తిరుగుడు అని తా గుణింతం ఒకటి తెలుగులోకంలో ప్రచారంలో ఉండేది. వాళ్లు ఏమీ చదవరని, తమ తీపి బాధలు తప్ప ప్రపంచం బాధలు పట్టవని, వాళ్లవల్లే తెలుగునేల మీద తెలుగుదనం అంతరిస్తోందని ప్రచారం సాగుతుండేది. వెబ్‌ మ్యాగజైన్లు వచ్చాక ఈ అపోహను యథాతథంగా ప్రచారం చేసే అవకాశం పోయింది.

అంతకుముందు పత్రికల్లో కూడా అడపా దడపా సాఫ్ట్‌వేర్‌ రచయితలు కనిపించినా ఇపుడు కొత్త తరం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ వారితో పాటు చాలా రంగాల్లో పనిచేస్తున్న యువత సాహితీ ప్రపంచంలోకి దూసుకొస్తున్నది.

కాకపోతే ఏ మార్పు అయినా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా రాదు. అతి విస్తరణ, ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టత లేకపోవడం అనే ముఖ్యమైన సమస్యలైతే ఉన్నాయి. రెండోది చాలా లోతైన వ్యవహారం.రచయితల ఎక్స్‌పోజర్‌ దగ్గర్నుంచి మన చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం దాకా చాలా అంశాలతో ముడిపడిన వ్యవహారం. సాహిత్యంపై లెఫ్ట్‌-లిబరల్‌ ప్రభావం పలుచబడడం స్పష్టంగా కనిపిస్తున్నది.

కేవలం సాహిత్యానికే పరిమితం కానటువంటి విస్తృతమైన రాజకీయార్థిక కోణాలున్నటువంటి ఆ సమస్యను పక్కనబెట్టి తొలి సమస్య వరకే పరిమితమవుదాం. స్థలానికి సంబంధించిన నియంత్రణ లేకపోవడం అనేది ఒక అర్థంలో రచనకు అవసరమే కావచ్చు. కథ ఇన్ని పేజీలే ఉండాలంటే ఎలా, సృజనకు హద్దులు గీస్తారా అనే హూంకారంలో కొంత న్యాయముండొచ్చు. ప్రశ్నలో న్యాయం కనిపించినంత మాత్రాన ప్రతి ప్రశ్న వెనుక న్యాయమైన ఉద్దేశ్యమే ఉన్నట్టు భావించనక్కర్లేదు.

ప్రశ్నించినవారందరూ కోరుకుంటున్న పరిష్కారం న్యాయమైనదే అయిఉండనక్కర్లేదు.  ఫలానా పార్టీ బిసిలకు తగినన్ని సీట్లు ఇవ్వడం లేదు అనే ప్రశ్న న్యాయంగానే కనిపించొచ్చు. కానీ దగ్గరగా పరిశీలిస్తే ఆ వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం వల్ల ఆతని వైయ్యక్తిక బాధకు సామాజిక కోణాన్ని ఆపాదించాడని అర్థమవుతుంది. ఫలానా సంకలనంలో నా కవిత, నా కథ ఎందుకు రాలేదు, ఫలానా అవార్డు నాకెందుకు రాలేదు అని ప్రశ్నించే బదులు  ఏదో ఒక సామాజిక వివక్షారూపాన్ని ఆపాదించేసుకుని దళితులకు అన్యాయం జరిగిందనో, స్ర్తీలకు అన్యాయం జరిగిందనో, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందనో, తెలంగాణకు అన్యాయం జరిగిందనో చర్చను లేవదీసి అవతలివారిని బోనులో నిలబెట్టవచ్చును.

ఎందుకొచ్చిన గొడవ, ఇతని కథ అందులో పడేస్తే పోలా, ఒక అవార్డు ఇతని మొకాన కొడితే పోలా అనే స్థితిని కల్పించవచ్చును. వివక్షకు గురైన శ్రేణుల న్యాయమైన ప్రశ్నలు, ఆందోళనతో పాటే ఆ సమూహ శక్తిని వైయక్తికమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే శక్తులు ఎల్లప్పుడూ ఉంటాయి. అది కేవలం ఈ శ్రేణులకే పరిమితమైనది కాదు  కానీ వైయక్తికమైన ప్రయోజనాలు తీర్చుకోవడానికి న్యాయమైనదిగా కనిపించే సాధారణ అంశాల్ని ముందుపెట్టడమనే పెడధోరణి ఇటీవల పెరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఆ ఊబిలోకి దిగితే బయటపడలేం. ఏదో రకమైన అధికారాన్ని ఆశించని, అధికారంలో ఆనందాన్ని వెతుక్కోని వ్యక్తుల సంఖ్య స్వల్పం. అధికారం లేని రాజకీయాలు ఆశావహంగా కనిపించనపుడు ఆ రాజకీయాలతో ముడిపడిన వారిలో సైతం మార్పు కనిపిస్తుంది.

Book and internet

అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి ఉన్న రాజకీయాల్లో అధికారం కోసం పోటీపడదాం అనే ధోరణి తొంగి చూస్తుంది. అది కొన్ని సందర్భాల్లో పచ్చిగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో సోఫిస్టికేటెడ్‌గా కనిపిస్తుంది. మళ్లీ స్థల నియంత్రణ దగ్గరకు వద్దాం. నియంత్రణ అనేది  లేకపోతే ఏం జరుగుతుందో వెబ్‌మ్యాగజైన్లలో వచ్చే కొన్ని కథలను చూస్తే అర్థమవుతుంది. ఎటు తీసుకుపోతున్నారో తెలీని సుదీర్ఘప్రయాణాలు కనిపిస్తున్నాయి. చెలాన్ని ఇతరత్రా విషయాల్లో గుర్తుచేసుకుందాం కానీ ఇకానమీ ఆఫ్‌ వర్డ్స్‌ అండ్‌ థాట్స్ మాత్రం మర్చిపోదాం అనే వారు కనిపిస్తున్నారు.

వెబ్‌ అనేది బ్లాక్‌హోల్‌ అని తెలిశాక ఎంతైనా అందులో తోసెయ్యొచ్చు అనిపిస్తుంది. ఏం ఎడిట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. దానికితోడు సైబర్‌ ప్రపంచం లైకుల మీద కామెంట్లమీద నడుస్తుంది. సీరియస్‌ విమర్శకు అవకాశం తక్కువ. బాగుందండీ, చాలా బాగుందండీ దగ్గర్నుంచి అద్భుతమండీ వరకూ  భుజతాడనాలు ఎక్కువ. రచనకు అప్పటికప్పుడు స్పందన చూసుకొని ఆ చర్చలో భాగం పంచుకోవడమనే అవకాశము ఇందులోని సానుకూల కోణమైతే మన ఉనికి బయటపడకుండా కామెంట్‌ విసరగలిగే అవకాశం ఇందులోని లోపం. అజ్ఞాతంలో మనిషి స్వైరుడయ్యే అవకాశం ఎక్కువ. ఇది ఆరోగ్యకరమైన చర్చను పక్కదారిపట్టించే ప్రమాదం ఉంటుంది.
సాధారణంగా తాను రాసిన ప్రతివాక్యం సామాజిక శాసనం వంటి భావన కొందరు రచయితల్లో ఉంటుంది. పత్రికల్లో సాహిత్య పేజీల నిర్వాహకులు అపుడపుడు ఈ గాలిబుడగను సూదితో గుచ్చేవాళ్లు. వెబ్‌ మ్యాగజైన్ల నిర్వాహకులు తమ సాహిత్య సామాజిక ఆసక్తికొద్దీ శ్రమను వెచ్చించువారు. స్వయంగా సాహిత్యజీవులు. మార్పులు సూచించో, తిరస్కరించో రచయిత మోరల్‌ను దెబ్బతీయడమెందుకులే అనే సంశయం ఉండొచ్చు. అందులోనూ పత్రికల్లో అయితే స్థలాభావం పేరుతో అయినా ఎడిటింగ్‌ సూచించవచ్చు. కానీ ఇక్కడ స్థలాభావం అని చెప్సడానికి లేదు. ఫలితం, భుజబలం బుధ్దిబలాన్ని అధిగమించిన కథలు కనిపిస్తున్నాయి.

నిజమే, దిన పత్రికల సాహిత్యపేజీల నిర్వాహకుల్లో కొందరు దాన్ని బెత్తంగానో, కిరీటంగానో భావించి ఉండొచ్చు. ఏదో ఒక అధికార సాధనంగా మార్చుకుని ఉండొచ్చును. కానీ వ్యక్తులను పక్కనబెడితే స్థలనియంత్రణ అనేది రచయితలోని ఎడిటర్‌ను వెలికి తీసేందుకు ఉపయోగపడేది. సాంద్రతకు ఉపయోగపడేది. గాఢతకు ఉపయోగపడేది. స్వయం నియంత్రణ ఉన్న రచయిత కథ వేరు. ఖదీర్‌ తన కథను ఎన్నిసార్లు పునర్లిఖిస్తాడో ఎంతగా శ్రమిస్తాడో నాకు బాగా తెలుసు. తన శక్తి కథకు తప్ప మరోదానికి పెట్టాల్సిన అవసరం లేనంతగా పరిసరాలను ఏర్పరుచుకుంటాడు కూడా. అతన్ని దగ్గరగా చూసినందువల్ల సాధికారంగా ఉటంకిస్తున్నాను తప్పితే అతనొక్కడే అని కాదు. సీనియర్‌ కథకులు చాలామందిలో మనకు వారు పడిన శ్రమ అర్థమవుతుంది. ఆయా కథల మీద మనకు వేరే రకమైన విమర్శలు ఏవైనా ఉండొచ్చును కానీ వారు కథను బాధ్యతగా తీసుకుంటారు.  ఇపుడది కాస్తలోటుగా అనిపిస్తున్నది.  రాసిన ఇంకు ఆరకముందే అచ్చులో పడితే బాగుంటుందనే ఆత్రం పెరిగినట్టు అనిపిస్తోంది.
వెబ్‌ పత్రికలు చేసిన మరోమేలు భాషకు సంబంధించింది. ఆయా సందర్భాల్లో పాత్రలు పలికే సంభాషణల్ని కూడా యథాతథంగా రాయకుండా బూతుఫోబియా అడ్డుపడేది. మన సాహిత్య సంప్రదాయంలో ఇదొక అనవసరమైన అడ్డుగోడ. ఈ గోడను బద్దలు కొట్టిన రచనలు అరుదు. వసంతగీతం లాంటివి ఒకటో రెండో చెప్పుకోవచ్చు.పత్రికా మర్యాదలయితే చాలానే ఉండేవి. అతను ఆమెలోకి ప్రవేశించాడు అని మాగజైన్‌ మధ్యపేజీలో రాయొచ్చు. కానీ లంజె అని అతను తిట్టిన మాట మాత్రం వాడరాదు. బూతును భావనగా కాకుండా భాషకు పరిమితం చేసే వ్యవహారం మనకు ఎక్కువ.  ఎబికె లాంటివాడు దాన్ని బద్దలు చేసి పచ్చనాకు సాక్షిగా కొత్తగాలికి తెరలేపినా అది తెలుగు సమాజానికి నామిని అనే అద్భుతమైన రచయితను ఇచ్చింది కానీ పత్రికల్లో ఒక ధోరణిగా స్థిరపడలేదు.

గతంలో ఉమామహేశ్వరరావు ఆంధ్రజ్యోతి సండే ఇన్‌ చార్జిగా ఉన్నపుడు గాడిద ప్రస్తావనతో ఉన్న చిన్న కథను యథాతథంగా అచ్చేస్తే పత్రికలో పనిచేసే మర్యాదస్తులైన సీనియర్‌ ఉద్యోగులు ఎంత గొడవ చేశారో ఇంకా గుర్తుంది. నేను ఒక పద్యంలో కొన్ని హాండ్‌ షేకులను బురదమట్టలతోనూ, రత్యానంతర శిశ్నంతోనూ పోలిస్తే అదే సీనియర్లు ఎంత గొడవ చేశారో గుర్తుంది. ఇపుడు వెబ్‌ మ్యాగజైన్ల వల్ల ఆ మర్యాదలు తొలిగిపోయే అవకాశం వచ్చింది.

ఐరోపా, పశ్చిమదేశాల్లోని సీరియస్‌ రచయితలు సైతం ఫలానా ఫలానా వ్యక్తీకరణలను యధేచ్ఛగా వాడుతున్నారు. మనం ఎందుకు సంభాషణల్లో ఇంత మర్యాదగా అసహజంగా వ్యవహరిస్తున్నాం అనే వారు పెరిగారు.ఈ ఎరుక శుభసూచకం. అది మరీ ఫ్యాషన్‌గా మారిపోయి దానికదే ఒక విలువగా మారిపోతే ప్రమాదమనుకోండి. అది వేరే విషయం. సాధారణంగా సీరియస్‌ రచయితలు రచన తర్వాత వచ్చే స్పందన కంటే రచనను ఎక్కువ ప్రేమించారు  అనే వాస్తవాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మనం ఒక పద్యమో, కథో అచ్చేశామనుకోండి. మనకు పరిచయమున్న వారు, లేనివారు  ఓ యాభై మంది లైక్‌ చేస్తారు.  బాగుందండీ అనేస్తారు. పత్రికలో ఫోన్‌ నెంబర్‌ ఇచ్చామనుకోండి. ఓ వందమంది ఫోన్‌ చేసి బ్రహ్మండమండీ అనేస్తారు. నెట్‌లో అయితే ప్రశంస ఒక క్లిక్‌ దూరం కాబట్టి చేసేస్తారు. అదే నిజమైన స్పందన అని తృప్తి పడితే బోల్తా పడే ప్రమాదం ఉంది. అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది.

-జి ఎస్‌ రామ్మోహన్‌

నేల మీద నమ్మకం వుంటే ఈ పుస్తకం చదవండి తప్పక!

samvedana logo copy(1)

గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్‌. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్‌ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు.

నేడే చదవండి.పల్లె బతుకు లోతుల్ని తవ్వి తీసిన విద్యాసాగర్ అపురూపమైన అక్షర చిత్రం పల్లెను మింగిన పెట్టుబడి. మాయా లేదు, మర్మం లేదు. గాలిమేడలు కట్టడం అసలే లేదు.నిద్రలో ఉన్నవారిని, నిద్రనటించేవారిని మేల్కొలిపే రాత యిది. ఈ నేల గురించి ఈ నేలను నమ్ముకున్న మనుషుల గురించి  ప్రేమ ఉన్న వారు, వారికోసం ఏమైనాచేయాలనుకునే వారు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది. మా రోజుల్లో అనే తలపోతల నుంచి, పల్లెలు కూడా చెడిపోతున్నాయి అనే వలపోతల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపకరించే సాధనం ఈ పుస్తకం. పట్నవాసపు సౌఖ్యాలను అందుకుంటూ పల్లెగురించి తెలిసీ తెలీని రాతలు రాసే రచయితల వల్ల వ్యాపించిన రోమాంటిసిజమ్ అనే వ్యాధిని నయం చేసే కషాయం ఈ పుస్తకం. గ్రామీణ సమాజం,వ్యవసాయం,వృత్తులు,వలస, పెట్టుబడి, వాటి అంతస్సంబంధాల గురించి అధ్యయనం చేయాలనుకునే వారు అవశ్యం పఠించాల్సిన గ్రంధం. తిరోగామి వాదాన్ని పురోగామివాదంగా విప్లవకరంగా ప్రచారం చేస్తూ చరిత్రను, సామాజిక చలనాల్ని తలకిందులుగా చూపిస్తున్న మేధావులను సరిచేసి నిటారుగా నిలబెట్టే శక్తి కలిగిన అక్షరాయుధం. వామపక్ష రాజకీయాల్లో ఇటీవల తీవ్రస్థాయిలో సాగుతున్న  మోడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ డిబేట్‌ని ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న పుస్తకం. సాధారణ కార్యకర్తలకు సైతం సులభంగా ఆ అంశాలను వివరించగలిగిన పుస్తకం. ఆ రకంగా  సామాజిక రాజకీయ రంగాలకు విద్యాసాగర్‌ చేర్పుగా దీన్ని చెప్పుకోవచ్చు.

 

పుస్తక రచయిత విద్యాసాగర్

పుస్తక రచయిత విద్యాసాగర్

విద్యాసాగర్‌ ఏం చెప్పారు? గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌ అనే పరమ చెత్తను మోసుకు తిరుగుతున్న వారి బండారాన్ని బయటపెట్టారు. గ్రామీణ సమాజంలో స్వర్ణయుగం అనేది ఏదీ లేదని అది కొందరి స్వకపోల కల్పితమని ఆధారాలతో సహా చూపించారు.శ్రీకాకుళం జిల్లాను నమూనాగా తీసుకుని ఊరూరూ తిరిగి గొడ్డుచాకిరీ చేసి మరీ నిరూపించారు. గతంలో సుందరయ్య లాంటి వారు చేసిన సర్వేల కంటే విసృతమైనది ఇది. ఉత్పత్తి, రవాణా మెరుగుపడని సమాజాల్లో జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో నివేదికల సాక్ష్యంగా చూపించారు విద్యాసాగర్‌. గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్‌. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్‌ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి  పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు. రైలు అనే ఒక సాధారణ రవాణా సాధనం తెచ్చిన మార్పుల గురించి తెలిసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చక్రానికే అంత శక్తి ఉంటే శాటిలైట్‌కి ఎంత ఉండాలి!  పెట్టుబడికి ఒక స్వభావముంది. బూర్జువా ప్రజాతంత్ర విప్లవం షరతు ఏమీ కాదు. షరతుగా చెప్పడమంటే ఉత్పత్తి సంబంధాలకు మనిషి చైతన్యానికి మధ్య సంబంధాన్ని తిరస్కరించడం. పాత సంబంధాలను ధ్వంసం చేయకుండా పెట్టుబడి పురోగమించలేదని విద్యాసాగర్‌ తేల్చిచెప్పారు. పెట్టుబడి తనతో పాటు తీసుకువచ్చే సాంకేతికత  ఫ్యూడల్‌ సంబంధాలను నాశనం చేయడానికి ఎలా ఉపయోగ పడుతుందో చూపించారు. వాడిపడేసే ప్లాస్టిక్‌ గ్లాసులు రావడం రెండు గ్లాసుల విధానం పోవడానికి ఎలా దారితీసిందో చిన్న ఉదాహరణతో సంకేతాత్మకంగా చెప్పారు. ఇది చదువుతుంటే ఉత్తరాదిన నాగళ్లు పోయి ట్రాక్టర్లు రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కుల అణచివేతకు సంబంధించిన కొన్ని రూపాలు ఎలా అంతరించాయో చెప్పే అధ్యయనాలు గుర్తొచ్చాయి. గతంలో అనూరాధాగాంధీ లాంటివారు గ్రామీణ-కుల సంబంధాలను మార్చడంలో పెట్టుబడి పాత్ర గురించి ప్రస్తావించినా దాని ప్రాధాన్యాన్ని పట్టించుకోలేదు. వృత్తికార్మికులకు సంబంధించిన వివరణలో ట్రాప్డ్‌ అనే పదాన్ని ఉపయోగించినా దాన్ని చాలా పరిమితమైన అర్థంలో పాసింగ్‌గా వాడారు. విద్యాసాగర్‌ ఆ  ఖాళీని పూరించారు.

14844_front_cover

మెరుగైనా రవాణా సౌకర్యాలు ఏర్పడడం కూలీరేట్లు పెరగడానికి ఏ విధంగా దోహదం చేసిందో రచయిత వివరించారు. ”కులవృత్తుల విధ్వంసం అనేది పెట్టుబడి చొరబాటుకు మౌలిక అవసరం. గ్రామీణ ధనిక రైతాంగానికి అర్థబానిస రూపంలో దీర్ఘకాలం కట్టివేయబడిన ఈ కులవృత్తుల సమాజం స్వేచ్ఛగా శ్రమను అమ్ముకునే కూలీలుగా మారారు” అని తేల్చారు. వృత్తులు కొనసాగాలని కోరుకోవడమంటే మనుధర్మాన్ని కొనసాగించాలని కోరుకోవడమేనని, వామపక్ష మేధావులు కూడా అ పాట పాడడం అన్యాయమని చెప్పారు. ఎన్ని సాకులు చెప్పి ఏ రూపంలో వివరించినా అది తిరోగమనమేనని నిర్మొహమాటంగా చెప్పారు. భారత దేశంలో పురోగామివాదులు ప్రధానంగా మార్క్స్‌ అనుయాయులు. లేదంటే అంబేద్కర్‌ అనుయాయలు. ఇద్దరి లోంచి అవసరమైనవి తీసుకోవాలని భావించేవారు కూడా ఉండొచ్చు. ఆ ఇద్దరూ వృత్తులు ధ్వంసం కావాలనే కోరుకున్నారు. వృత్తులు కొనసాగాలని కోరుకున్నది గాంధీ. ఆర్థిక రంగానికి సంబంధించి ఆయన ప్రవచించిన విషయాలు ఆచరణ సాధ్యం కానివి. సమాజాన్ని వెనక్కు తీసికెళ్లేవి. కానీ విచిత్రంగా మార్క్సిస్టులని చెప్పుకునేవారు కూడా రకరకాల వాదనలతో వృత్తులను ఆరాధించడం  చూస్తూ ఉంటాం. సమాజాన్ని మార్చాలనే బాధ్యతను భుజాన  వేసుకున్న వారెవరైనా వ్యూహాలు-ఎత్తుగడలకు సంబంధించిన గాంధీ నాయకత్వ పటిమనుంచి స్ఫూర్తి పొందొచ్చు. ఆయన వాదంనుంచి కాదు.  వ్యక్తిగా ఆయన మహానాయకుడు. ఆయన జీవితం ప్రతి కార్యకర్త తప్పనిసరిగా చదివి తీరాల్సిన పాఠం. కానీ మన దగ్గర దానికి భిన్నంగా జరుగుతోంది. వ్యక్తిగతంగా ఆయన్ను దూషించడం, భావజాలంలో ఆయనను అనుసరించడం వంటి విచిత్రాలు మనం చాలాకాలంగా చూస్తున్నాం. అందుకే ఈ రచయిత మీరెటువైపు, మనువు-గాంధీవైపా, మార్క్స్‌-అంబేద్కర్‌ వైపా అనేరీతిలో అడగాల్సిన ప్రశ్నే అడిగారు.

22vzgss03-book__23_1594038e

విద్యాసాగర్‌ ఇంకా ఏం చెప్పారు? వ్యవసాయ సంక్షోభం ఏటికేడు ఎందుకు తీవ్రమవుతున్నదో వివరించారు. ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ సంక్షోభం పెరగడం వెనుక కారణాలను సరిగా పట్టుకున్నారు. ప్రధానంగా అది చెల్లింపుల సంక్షోభం అని తేల్చారు. వ్యవసాయం వ్యాపారంగా మారిపోయిందని విస్పష్టంగా వివరించారు. సేద్యంలోకి ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం దగ్గర్నుంచి రైతాంగం జీవనశైలి మార్పుల దాకా అనేకానేక అంశాలను చర్చించారు. పిల్లల చదువులకు ఎక్కువ ఖర్చుపెట్లాల్సిన స్థితితో పాటు బర్త్‌డే పార్టీల్లాంటివి పెరిగిపోవడం లిక్కర్‌ వాడుక పెరిగిపోవడం లాంటి అంశాలను మన ముందుంచారు. “తక్కువ ఖర్చుతో జీవితం గడిచినప్పటికీ అతితక్కువ ఆదాయం ఉండడంతో ఫ్యూడల్‌ సమాజం ఒకరకం సంక్షోభం సృష్టిస్తే పెరిగిన ఆదాయాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చులు పెంచి పెట్టుబడి మరో రకం సంక్షోభం సృష్టిస్తోంది” అని   ప్రకటించారు. వాస్తవానికి ఒకనాడు గ్రామీణ సమాజంలో ఖర్చు అంటే ప్రధానంగా తిండి ఖర్చే. ఇవాళ పట్టణాల మాదిరే ఇతర ఖర్చులు తిండి ఖర్చును మించిపోయాయి. ఈ మార్పు సమాజం ఒక దశ నుంచి ఇంకో దశకు వెళ్లిందనేదానికి సంకేతం. ఇవాళ గ్రామాలంటూ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, అవి పట్టణాల ఎక్స్‌టెన్షన్స్‌ మాత్రమే అని చక్కని మాట చెప్పారు. ఇళ్లలో పాల చుక్కవాడకుండా అన్నీ పాలకేంద్రాలకే పోస్తున్న ధోరణి గురించి రచయిత ఒక చోట ప్రస్తావించారు. గ్రామాల్లో పెట్టుబడి తెచ్చిన విషాదం ఇక్కడుంది. ఒకనాడు ఎదురింటి రైతుకు కుడితి నీళ్లు పోస్తే పెరుగో మజ్జిగో పోసేవారు. కూలీపని నుంచి వస్తూ వస్తూ ఏదో ఒక పొలంలో పిడికెడు గోంగూర పెరక్కొచ్చుకుని ఏదో ఒక రొట్టె చేసుకుంటే పూటగడిచేది. ఒక వీధిలో చిక్కుడు పాదుకు కాయలు కాస్తే ఆ ఆవీధిలోని ఇళ్లన్నింటా ఆ రోజు చిక్కుడు గుభాలించేది. ఏదీ లేని నాడు ఊరికే పడిఉండే మునగచెట్లనుంచి నాలుగు ఆకులు దూసి ఉడికేసుకుంటే పూటగడిచేది. అమ్మడం-కొనడం జీవితాన్ని ముంచెత్తని  దశ కావడం వల్ల ఇరుగు పొరుగు సహకార జీవనం ఒకటి ఉండేది. ఒకే సాంఘిక హోదా కలిగిన కుటుంబాల మధ్య ఆర్థిక అంతరాలతో నిమిత్తం లేకుండా ఇలాంటి ఆదాన ప్రదానాలుండేవి. అన్నీ సరుకులుగా మారి మార్కెట్‌కు వెళ్లడం వల్ల  ఇవాళ పల్లెల్లో కూడా ఈ రకమైన జీవనం కనిపించడం లేదు. గుంపు జీవనంలో ఉన్న అణచివేత తగ్గడం వంటి సానుకూల పరిణామాలతో పాటు అదే జీవనంలో కొంతవరకు అంతర్భాగంగా ఉండే  సహకార ధోరణి పోయి వ్యక్తి ఒంటరవుతున్న దృశ్యం కనిపిస్తోంది.

గ్రామీణ సమాజం సంవత్సరమంతా మట్టిగడ్డలను కౌగిలించుకుని, అర్థబానిస తరహా శ్రమను చేస్తూ పండించిన ఉత్పత్తిని మార్కెట్‌కు ‘విలువ తక్కువ’ ఉత్పత్తులుగా  ఎగుమతి చేస్తోంది. తిరిగిన తనకు అవసరం ఉన్నా లేకపోయినా ‘విలువ ఎక్కువైన’ పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థితిని మార్కెట్‌ కల్పించింది. ఈ చెల్లింపుల సంక్షోభమే నేటి రైతు సంక్షోభం” అని విద్యాసాగర్‌ వివరించారు.  వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం గురించిన ప్రస్తావన ఒక చోట చేశారు. తాను కొనుగోలు చేసే వస్తువుల రూపంలో పన్నుభారం, వ్యవసాయంపై మదుపు భారం అనే  ” ఈ రెండు పర్వతాలను మోస్తున్న భారతీయ రైతాంగం ఆ భారాన్ని వదిలించుకోవడానికి పట్టణ శ్రామిక వర్గంగా మారుతోంది.” అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు లోపించడం వల్ల తలెత్తుతున్న సమస్యలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. చాలా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఉత్ప్తత్తి ఇంకా ఎందుకు దారుణంగా ఉంటోంది? చైనాలో హెక్టార్‌కు ఆరు టన్నులకు మించి వరి పండిస్తూ ఉంటే మనం మూడు టన్నులు కూడా ఎందుకు చేరలేకపోతున్నాం అనేది ఆలోచించాలేమో! ఒక సీజన్‌లో కిలో యాభై రూపాయలు పలికే ఉల్లి, టమోటా, ఆలూ మరో సీజన్‌లో రోడ్డుమీద పారేయాల్సిన స్థితికి ఎలా వెడుతుందనే ప్రశ్నకు కూడా సమాధానం వెతుక్కోవాలేమో!  వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి అతిగా మాట్లాడే ప్రభుత్వాలు ఆచరణలో దుర్మార్గమైన నిర్ల్యక్షం చూపడాన్ని కచ్చితంగా ప్రశ్చించాలి. కోళ్లకు దాణాగా ఉన్న మొక్కజొన్న శ్రీకాకుళం జిల్లాలో 8500 ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పెరగడాన్ని ప్రస్తావిస్తూ”మనుషులు తినే ఆహారం కోసం విదేశాలవైపుకు కోళ్ల ఆహారం కోసం దేశీయ పొలాలకు అనే వ్యూహం ఏ న్యాయసూత్రాల ప్రకారం సరైనదో ఆలోచించాలి” అన్నారు. ఇక్కడ రచయిత ఒక విషయం మర్చిపోయారు. కోళ్లు కూడా మనుషులు తినే ఆహారమే. ఈ దేశంలో ఎక్కువ జనాభా తినే ఆహారం. ఒకనాడు పండక్కో పబ్బానికో లేక ఇంటికి బంధువొచ్చినపుడో మాత్రమే తినగలిగే ఆహారం ఇవాళ బ్రాయిలర్‌ కోళ్ల వెల్లువ వల్ల తరచుగా తినే ఆహారంగా మారింది. ఇది సానుకూలంగా చూడాల్సిన పరిణామమే. రచయిత చెప్పిన అర్థంలో అయినా మనుషులు తినే ఆహార ఉత్పత్తిలో మనమేం వెనుకబడిలేం. ఏటా కోట్ల టన్నుల ధాన్యం గోడౌన్లలో మగ్గిపోతోంది. ఆహారపంటల వైశాల్యం తగ్గిపోతోందని ఆందోళన పడాల్సిన అవసరమేమీ ఇవాళ లేదు. ఇలాంటి చిన్న చిన్న వివరాల విషయం పక్కనబెడితే మౌలిక మైన విషయాలన్నింటా రచయిత పూర్తిగా శాస్ర్తీయమైన దృక్పధాన్ని పాటించారు.

తెలుగు నేలమీద వలస వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతున్నది. బలవంతపు వలసలను వ్యతిరేకించవచ్చు. పేదరికాన్ని ఆసరా చేసుకుని భూములు తక్కువకు కొనుగోలు చేసే దోపిడీని వ్యతిరేకించవచ్చు. ”కుండా సట్టి మూటనుగట్టి ఉండా బిడ్డల చంకనబెట్టి మాసం మాసం గాసం కోసం దేశం దేశం తిరిగే పేదల” బతుకుల గురించి ఆందోళన తోనూ ఆర్తితోనూ చర్చించొచ్చు. కానీ మొత్తంగానే వలస అనేపదాన్ని బూతుపదంగా మార్చకూడదు. ఇక్కడ రచయిత సరైన వైఖరి తీసుకున్నారు. వలస  తెచ్చిన సానుకూల పరిణామాలను చూపారు. కూలీ రేట్లలో వేతనాల్లో వచ్చిన మార్పులను చూపారు. మెరుగైన రవాణా సౌకర్యాలతో కూలీలు తమకిష్టమైన చోట శ్రమను అమ్ముకునే వెసులుబాటు కలిగిన తీరును చూపారు. తలదాచుకోవడానికి గ్రామం-శ్రమను అమ్ముకోవడానికి బస్తీ అనే పరిణామాన్ని పట్టుకున్నారు. మద్రాస్‌ పోయిన దళిత కూలీలు తమ గ్రామాల్లో రైతులకు డబ్బులు అప్పు ఇచ్చే స్థితికి చేరిన విధానాన్ని వివరించారు. “మనిషి తన వృత్తిని మార్చుకోగలగడమే అతని మనుగడకు పునాదిగా ఉందని గుర్తించాలి. అలా గుర్తించకపోతే మనిషి రాకాసి బల్లి అయ్యే ప్రమాదముంది” అని చక్కని మాట చెప్పారు. అప్పుల విధానంలో వచ్చిన మార్పుల గురించి చెపుతూ ఫాయిదాలు, ముందస్తు ధర ఖండన ,అప్పులిచ్చిన షావుకారికి పంటను అమ్మాలనే షరతులు రద్దయ్యాయి. ఆ స్థానంలో సరళమైన వడ్డీరేట్లతో అప్పులు దొరికే స్థితికి శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాలు చేరుకున్నాయి” అని  మంచి మాట చెప్పారు. సరళమైన అప్పులైనా మన వ్యవసాయ రంగంలో ఉరిత్రాడే. కాదనలేం. కాకపోతే సామాజిక సంబంధాల పరంగా చూసినపుడు గ్రామీణ వడ్డీవ్యాపారికి ముందస్తు ధరకు పంట అమ్మడం లాంటి బానిసత్వం నుంచి విముక్తి పొందడం అనేది ముఖ్యమైన పరిణామం. ”ఏ దేశంలో అయినా ఫ్యూడల్‌ వ్యవస్థను ధ్వంసం చేసేది పెట్టుబడే. ఆ పని భారతదేశంలో దాదాపుగా పూర్తయ్యింది”. అని మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఈ సమాజం స్వరూపస్వభావాలేమిటో చెప్పకనే చెప్పారు. సామాజిక సంబంధాల విషయంలో నిశిత పరిశీలన వల్ల  వాస్తవాలను వాస్తవంగా చూపే వీలు కల్పించింది. ముఖ్యంగా రచయిత  శ్రామికుల- శ్రామిక కులాల దృక్కోణం నుంచి సమాజాన్ని పరిశీలించారు. సాధారణంగా గ్రామీణ సంబంధాల్లో మార్పులను పైనించి చూసేవారికి కోల్పోయిన దర్జా గుర్తొస్తుంది. కింది నుంచి చూసేవారికి వదిలించుకున్న బానిసత్వం గుర్తొస్తుంది.  పాలేర్ల వ్యవస్థ పోవడంతో పశుసంపద అంతరిస్తున్న వైనాన్ని సాగర్‌ బాగా చెప్పారు. రైతుకు-పశుసంపదకు తల్లీ బిడ్డ సంబంధమని అదనీ ఇదనీ మనదగ్గర పురోగామివాదులనుకునే వారు సైతం బోలెడు సెంటిమెంట్లు గుమ్మరిస్తుంటారు. అనుబంధం ఉండే మాట వాస్తవమేగాని అది తన జీవికను మించి కాదు. పశుమాంసం ఎగుమతిలో మన దేశం ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్న విషయం గుర్తు చేసుకుంటే మన పశువులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరు వాటిని తరలిస్తున్నారో అర్థం అవుతుంది. గతంలో దళితులు నికర ఉద్యోగంగా లభించే పాలేరు వృత్తి దొరకడమే అదృష్టంగా భావించేవారని ఆ స్థితి ఇవాళ పోయి కాస్త మెరుగైన ఉపాధి దొరుకుతున్నదని సానుకూల పరిణామాన్ని రచయిత వివరించారు. ”గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు వృత్తిని ఉపాధిని కల్పించిన అర్థబానిస వ్యవస్థ అయిన పాలేరు వృత్తి నుంచే కాక, అర్థాకలితో మాడ్చి చంపిన వ్యవసాయ కూలీ రంగం నుంచి కూడా దళితులు నిష్ర్కమిస్తున్నారు” అని గతాన్ని వర్తమానాన్ని కలిపి వివరించారు. “స్వతంత్ర జీవనం సాగించడానికి పట్టణాల్లో ఉపాధి దొరకడం, సాంఘిక గౌరవం లభించడం” అనేవి పాలేరు వ్యవస్థ పోవడానికి కారణాలుగా దళితుల మాటల్లోనే చూపారు. సాంఘిక గౌరవమనగానే పట్నాల్లో కులం లేదా అని దీర్ఘాలు తీయనక్కర్లేదు. పల్లెల్లో కులానికి పట్నాల్లో కులానికి తేడా ఉంటుంది. ఈ మార్పు కేవలం పరిమాణాత్మకంగా మాత్రమే కొందరికి కనిపించొచ్చు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అది గుణాత్మకమార్పుగా మారుతున్నదని అర్థమవుతుంది. యాంత్రీకరణ జరిగితే ఉపాధి పోతుందని ‘సర్‌ప్లస్‌ పీపుల్‌’ పెరుగుతారని గాంధీలాగే చాలామంది ఇప్పటికి కూడా భావిస్తుంటారు. ట్రాక్టర్లు వచ్చాక కూలీలు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణబాట పట్టారని దీనితో కూలీల కొరత తీవ్రమై కూలీరేట్లు పెరిగాయని వాస్తవ స్థితిని రచయిత వర్ణించారు.

అయితే ఏమిటి? ఇంతకుముందున్నది నరకమూ, ఇప్పటిది స్వర్గమూనా అనొచ్చు. కానే కాదు. రచయితకు స్పష్టత ఉంది. విద్యాసాగర్‌ కమ్యూనిస్టు. ఎంత కమ్యూనిస్టు అంటే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం గురించి రాయాల్సి వచ్చినపుడు మహాత్మాగాంధీకి కోట్స్‌ పెట్టే అంత కమ్యూనిస్టు. కాట్‌స్కీని ఎక్కువగా కోట్‌ చేస్తే తనమీద రెనగేడ్‌ ముద్ర పడే ప్రమాదముందని తెలిసీ సదాశయం కోసం తెగింపుతో ముందుకెళ్లిన కమ్యూనిస్టు. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గమైనదే. లాభం తప్ప మరేమీ పట్టని ఈ వ్యవస్థను, మనిషిని యంత్రంగా మార్చే ఈ వ్యవస్థను, మనిషికి మనిషిని నిరంతరం పోటీ పెట్టే ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే దానికోసం ఇంతకంటే దుర్మార్గమైన గతాన్ని ఆశ్రయించరాదు అని రచయిత చెప్పారు. ఇది పాతవ్యవస్థ కాదు. దానిని తలదన్ని ఏర్పాటైన కొత్త వ్యవస్థ. కొత్త వ్యవస్థ వల్ల కొన్ని  మార్పులున్నాయి. అవి  మౌలిక మైనవి కావు. పెట్టుబడికి అవసరమైన మార్పులు మాత్రమే. అసమానతలు పోగొట్టే మౌలిక మైన మార్పుల కోసం పోరాటం సాగాల్సిందే. కాకపోతే దానికి పాత మాటలు, పాత సాధనాలు పనిచేయవు అని కూడా రచయిత చెప్పకుండానే చెప్పినట్టుగా అనిపించింది.

జి ఎస్‌ రామ్మోహన్‌

 

బుజ్జిపిల్ల-తెల్లపిల్ల

ఈ మధ్య ఒక పాట వినాల్సి వచ్చింది.  బుజ్జిపిల్ల, తెల్లపిల్ల, ఐలవ్యూ పిల్లా అనే పాట.  సినిమా పేరు కూడా తెలుగు సినిమావాళ్ల ఊత పదం మాదిరి ఎరైటీగా ఉంది. పోటుగాడు. వెరీ ఇంటరెస్టింగ్‌!

యువార్‌ సో టైటూ, ఐయామ్‌ నాట్ వైటు, ఇట్స్‌ ఆల్‌ రైటూ అనే దివ్యమైన చరణం ఈ పల్లవిని అనుసరిస్తుంది. కొలవెర్రి తగ్గింది  కానీ పాటల శైలిపై ఆ ప్రభావం మిగిలే ఉంది. ఇది సినిమా పాట మాత్రమే కాదు. స్ర్తీలకు సంబంధించి, రంగుకు సంబంధించి మన సమాజంలో వ్యాపించి ఉన్న వ్యాధులకు దర్పణం.  భారత్‌లో కొంతకాలంగా రేసిజం మీద చర్చ జరుగుతూ ఉంది. ఈశాన్య రాష్ర్టాల అమ్మాయిలమీద వివక్షగురించి లైంగిక దాడులు ఎక్కువవడం గురించి కొన్ని రోజులుగా మీడియాలో చాలా విశ్లేషణలే వస్తున్నాయి. 90ల తర్వాత ఈశాన్యం నుంచి  ‘మెయిన్‌ల్యాండ్‌’కు వలసలు పెరిగాయి. ఎక్కువగా సర్వీస్‌ రంగంలో ఉపాధి పొందుతున్నారు.  బ్యూటీపార్లర్లకు వెడితే అక్కడ మసాజ్‌ చేసేది ఎక్కువగా  వారే. హోటల్‌ రంగంలోనూ వారే. పెళ్లిళ్లలో బొమ్మల్లాగా నుంచోబెట్టేది వారినే. ఇంగ్లిష్‌ వల్ల ఆధునిక రూపమెత్తినప్పటికీ సారాంశంలో ఆదివాసీలు వారు. మనకు సేవలు చేయువారిని చులకనగా  చూచుట సంప్రదాయం. దీనికి తోడు వారు వేసుకునే దుస్తులు,  తిండితిప్పలు,  ఇతరులతో వ్యవహరించడంలో చూపే చొరవ లాంటివన్నీ కలిసి వారిపై చులకనభావం పెరిగేట్టు చేస్తున్నాయని అది నేరాలకు దారితీస్తోందని విశ్లేషణ. ఈ పోకడ కొత్తదేమీ  కాదు. పాతికేళ్ల క్రితం మన సినిమాల్లో లూసీలు, లౌసీలు రిసెస్పనిస్టులు, నర్సులుగా ఉండేవారు. మళయాళీలపై ఇలానే  చిన్నచూపు కనిపించేది. సినిమా వాళ్లు ఆ పాత్రలకు తొడిగే  చిట్టి పొట్టిగౌన్లు, ఇంగ్లీష్ కలగలపి కొట్టే తెలుగులు, అపుడపుడు వాళ్ల చేతుల్లో బ్రాందీ బుడ్లు, సిగరెట్‌ బట్లూ, వెరసి వారంటే అందుబాటులో  ఉండే సరుకు అనే చులకన. చదువుకున్న వారి భాషలో ”ఈజీ గోయింగ్ పీపుల్‌”. స్టీరియోటైపింగ్‌ మనకు కొత్తదేమీ కాదు.  అవకాశముండాలే కానీ దాన్ని ఎంత వికారమైన స్థాయికైనా తీసికెళ్లగల సాధనం తెలుగు సినిమా.
వికార ప్రదర్శనకు   ‘మనం’ కాకుండా ఇంకెవరో ఒక సమూహం కావాలి. మనమూ వాళ్లూ అనే పరిభాష కావాలి.

racism
ఈ ‘మనం’ అనేది మారుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ ‘మనం’ ప్రాంతం అవుతుంది. అపుడు ‘వాళ్లు’ నేపాలీయులో ఈశాన్యం  వాళ్లో కేరళ వాళ్లో అవుతారు. హైదరాబాద్‌లో బ్యూటీపార్లర్‌కు పరిమితం కాకుండా మన ఎక్స్‌పోజర్‌ పెరిగి ఏ ఢిల్లీలోనే నాలుగు రోజులు  ఉండాల్సి వస్తే ఈ జ్ఞానం ఇంకాస్త పెరిగి “అమ్మో పంజాబీ ఆడవాళ్లా, వాళ్లు చాలా ఫాస్ట్‌ గురూ,  ఎగేసుకుని పోతారు అని జోకొచ్చన్నమాట.  అలా కాకుండా బావి మరీ చిన్నదైపోయి జిల్లా స్థాయికొచ్చేశామనుకోండి. అపుడు ‘వాళ్లు’ పెద్దాపురం పాపలయిపోతారు.
పేట చిలకలయిపోతారు. కొన్ని సార్లు ఈ ‘మనం’ కులం అవుతుంది. అపుడు వాళ్లు భోగం వాళ్లో దళితులో అవుతారు. అయితే వ్యవస్థలో  వచ్చిన మార్పులు ఇక్కడ కులాన్ని తీసేసి మార్కెట్‌ను పెట్టడం వల్ల ఈ కోణం తగ్గిపోయింది. ఇవాళ మసాజ్‌ పార్లర్లు, రిసార్టులు, హోటళ్లమీద దాడుల్లో పట్టుబడుతున్నవాళ్లలో అన్ని కులాల వాళ్లు ఉంటున్నారు. పెట్టుబడి అక్కడ  కులాన్ని దాదాపు తీసేసింది. మిగిలిన చాలా రంగాల్లాగే ఫ్లెష్‌ మార్కెట్‌ కూడా వేరే రూపం తీసుకుంది. కాబట్టి ఈ ‘మనం’ అనేది కులాన్ని ఆశ్రయించడం తగ్గిపోయింది. కొన్ని సార్లు ఈ ‘మనం’ మతం అవుతుంది.  అపుడు ‘వాళ్లు’ క్రైస్తవులో ఇంకెవరో అవుతారు. ముస్లింలయితే చాదస్తులు. క్రైస్తవులైతే మరీ ఫాస్ట్‌ పీపుల్‌. మనం మాత్రమే కరెక్టన్నమాట. వి  ఆర్ ఆల్వేస్‌ నార్మల్‌. దే ఆర్‌ ఆల్వేస్ అబ్‌నార్మల్‌. అది ఎవరూ కాదనరాని గీత. కానీ పౌరుషేయమే.  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల మనలో  కాకుండా మనకు విడిగా ఉంటేనే అందరూ వికారాలు బాహాటంగా ప్రదర్శించుకోవడానికి వీలుంటుంది. ఏ లోపమైనా వికారమైనా మనలో  కాకుండా బయట చూడడం చాలా సుఖం.
ఇంతకీ ఈ గొడవకు ఈ బుజ్జిపిల్ల-తెల్లపిల్లా పాటకు సంబంధమేటి? మన లైంగిక సారస్వతంలో అమ్మాయి కన్నె పిల్లగా ఉండవలె.  అబ్బాయి ఎంత ముదురైనప్పటికీ ఇబ్బందేమీ లేదు. కన్యాదానమే చేయవలె. తొలిరేయి నెత్తురు కళ్ల చూడవలె. యువార్‌ సో టైటూ  అనే పవిత్రమైన చరణరాజంలో ఇలాంటి విషయం దాగున్నది. ఈ టైట్‌ లూజూ అనే పదాలు ఇటీవల  లైంగిక పరిభాషలో ఎక్కువగా  వినిపిస్తున్నాయి. మన టెన్త్‌ క్లాస్‌ ప్రేమ సినిమాలన్నింటా వీటితో ముడిపడిన బూతు జోకులు, అమ్మాయి-ఆంటీ విభజనలు చాలానే  ఉంటున్నాయి. కన్యాసంభోగంతో యవ్వనం తిరిగొస్తుంది లాంటి దారుణమైన నమ్మకాలు చాలా సమాజాల్లో ఉన్నాయి. ఆ రకంగా బుజ్జిపిల్ల లాంటి రోగాలన్నీ పాత కాలపు రోగాలు.  గంభీరమైన పరిభాషలో చెప్పుకుంటే ఫ్యూడల్‌ సమాజం నుంచి  కొనసాగుతున్న రోగాలు. లైంగిక చర్యలో పొందే ఆనందంలో  దాని  పాత్ర ఏమీ ఉండదని చాలా అధ్యయనాలే తేల్చినా తలల్ని మట్టిలో పాతేసుకున్న ఉష్ర్టపక్షులు ఆపాత చూరును పట్టుకుని  వేలాడుతున్నాయి. యంగ్‌ ఫ్లెష్‌ పట్ల వ్యామోహం చిన్నపిల్లల అమ్మకాలను ప్రేరేపిస్తున్నది. భయానకమైన సెక్స్‌రాకెట్‌ను, హింసను ప్రేరేపిస్తున్నది. .  బుజ్జిపిల్లా తెల్లపిల్ల లాంటి పాటలు ఇలాంటి రోగాలను వ్యాపింపజేయడంలో వైరస్ లాంటి పాత్రను పోషిస్తున్నాయి. ఇదొక విషవలయం.

ఎప్పటికప్పుడు తిరగబెడుతున్న బుజ్జిపిల్లా అనే పాత రోగానికి తోడుగా తెల్లపిల్ల రోగం మధ్యలో వచ్చి చేరిపోయింది. అది వారసత్వపు రోగం కాదు.  పెట్టుబడి తెచ్చిన రోగం. మన సంప్రదాయ సుందరులు తెల్లనివారు కాదు. క్రిష్ణలు. మార్కెట్‌  వ్యాపింపజేసిన ఆధునిక వ్యాధి ఇది. అయితే ఫ్యూడల్‌ ఆధిపత్య లక్షణం మాదిరి ఈ ఆధిపత్యానికి ఆరాధనీయమైన లక్షణం అన్నివేళలా ఉండదు. అదొక యావ, అంతే.  ఆరాధనే నిజమైతే తెలుపే ఆరాధనీయమైతే ఈశాన్యం అమ్మాయిలు, నేపాలీ అమ్మాయిలు, ఉక్రెయన్‌ అమ్మాయిలు అంత చులకనైపోరు. ఇక్కడ ఆధిపత్యం- చులకన అనేవి మార్కెట్‌ అవసరాన్ని బట్టి మార్కెట్‌లో వారున్న స్థితిని బట్టి ఉంటుంది.  సాపేక్షకమైన తేడాలతో గ్రడేషన్స్‌ ఎక్కువగా ఉండే భారత్‌లో వర్ణాధిక్య భావన పశ్చిమదేశాల రేసిజం కంటే ఒకింత భిన్నమైనది. ఉత్తరాది వారు అక్కడి సాపేక్షకమైన తెల్ల తోలుతో సరిపెట్టుకోలేక నేపాలీ మాంసం మీదుగా ప్రయాణించి ఇటీవల సోవియెట్‌ దేశాల ఆడమాంసం కోసం ఎగబడుతున్నారు. హైదరాబాద్లో కూడా బలిసినోళ్లు సోవియెట్‌ శరీరాల్నే దిగుమతి చేసుకుంటున్నారు.  ఎక్కడెక్కడ తెల్లగా ఉండే నిరుపేద అమ్మాయిలు దొరికితే అక్కడక్కడకు మార్కెట్‌ పరుగులు పెడుతోంది. తెలుపు ఒక మార్కెట్‌ లక్షణం, అంతే. సహజసిద్ధంగా వచ్చే లక్షణానికి లేని ఆధిపత్యాన్ని ఆపాదించడం దాన్ని కొనుగోలు చేయొచ్చు అని అవాస్తవికమైన భ్రమల్ని ప్రచారం చేయడం మార్కెట్‌ మాయ.

ఈ కొనుగోలులో సౌందర్య సాధనాలుఉంటాయి. తెల్ల ఆడశరీరాలూ ఉంటాయి. అది ఆధిపత్యానికి చిహ్నం అని భావించాక అలాంటి లక్షణం ఉన్న శరీరాన్ని పొందడం అనేది కూడా ఆ యావలో భాగమవుతుంది. బలిసినోళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తూ వాళ్లలాగే తానూ రష్యన్‌ అమ్మాయిని పొందాలన్న యావలో పడిన ఒక కుర్రాడి విషాద ఘట్టాన్ని అరవింద్‌ ఆదిగ తన వైట్‌ టైగర్‌లో అద్భుతంగా చిత్రించాడు. అందానికి తెలుపును పర్యాయపదం చేసి దాని చుట్టూ ఎన్ని వేల కోట్ల మార్కెట్‌ని అభివృద్ది చేశారో చూస్తూనే ఉన్నాం. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్స్‌ మన బానిసత్వానికి పరాకాష్ట. ఈ రోగాన్ని ఎంతగా ఇంటర్నలైజ్‌ చేసుకున్నామంటే  ఉష్ణదేశంలో నివసించే మనం, సగటు శరీర వర్ణం నలుపుగా ఉండే మనం మన సినిమాల్లో నల్లవాళ్లని బపూన్లని చేసి వారిమీద జోకులు  వేసేస్తున్నాం.

నల్లవాళ్లు మెజార్టీగా ఉండే సమాజాల్లో నలుపు మీద అంత దుర్మార్గమైన క్రూరత్వం దేనికి సంకేతం? నలుపులో కూడా నికార్సైన నలుపుకు పెట్టింది పేరైన దక్షిణాదిన తమిళంలో వడివేలు, తెలుగులో బాబూమోహన్‌  పాత్రలు దేనికి సంకేతం? పార్తీపన్‌, విజయ్‌ లాంటి వారు  హీరోలుగా ఉండే తమిళసినిమా రంగంలో వడివేలు పాత్రలు అలా ఉండడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం.  మన దేశంలో భూస్వామ్య సమాజం కులాధిపత్యాన్ని న్యూనతను ఎలా ఇంటర్నలైజ్‌  చేసుకున్నదో  పెట్టుబడి దారీ సమాజం వర్ణాధిపత్యాన్ని న్యూనతను అలా ఇంటర్నలైజ్‌ చేసుకుంటున్నది. మొదటిది సాంఘికపరమైన  ఆధిపత్యానికి అవసరమైన వ్యవహారం అయితే రెండోది మార్కెట్‌కు అవసరమైన ఆధిక్యభావన.
మళ్లీ పాట దగ్గరకు వద్దాం. ఇక్కడ పాటపాడుతున్నది దక్షిణాది హీరో పాత్రధారుడు.  ఎంత తెల్ల వ్యామోహమున్నా  దక్షిణాది హీరో ఎంతో కొంత  నల్లగా ఉండక తప్పదు. హీరోలు పెట్టుబడితో సంబంధమున్నవారు, లేదా వారి వారసులు.  వాళ్లు కథానాయకులుగా ఉండడం అనివార్యం. అందువల్ల జనంలో ముఖ్యంగా అబ్బాయిల్లో  తెల్ల తోలు పట్ల ఉన్న వ్యామోహాన్ని సొమ్ము చేసుకోవడానికి ఉత్తరాది అమ్మాయిలను దిగుమతి చేసుకోవాలి.  వాళ్లు సాధ్యమైనంత లిబరల్గా ఒళ్లు చూపించేవాళ్లై ఉండాలి. వాళ్లకు మిల్కీ బ్యూటీ లాంటి కుర్రాళ్లను ఊరించే పేర్లు పెట్టాలి. ప్రదర్శన అనేది యుగలక్షణమైన కాలంలో ఉన్నాం కాబట్టి ‘అందాల్ని’ ప్రదర్శించడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఇట్సే మార్కెట్‌ నీడ్!  ఆస్తులైనా అందాలైనా ప్రదర్శించుకోకుండా మార్కెట్‌ చేసుకోలేని దశ ఇది. అయితే శరీరం చూపించడంలో లిబరల్‌గా ఉండగలిగే వాళ్లందరూ నటించడంలో లిబరల్‌ ఉండలేరు కాబట్టి ఆ పాత్ర నామ్‌కే వస్తే అయిపోవాలి. నాలుగైదు పాటలు, రెండు రోమాన్స్‌ సీన్లు వగైరాలకు పరిమితం కావాలి. మనమెలాగూ ఉన్నట్టుండి రంగు మార్చుకోలేం కాబట్టి యువార్‌ సో టైటూతో పాటు ఐయామ్‌నాట్‌ వైటూ, ఇట్స్‌ ఆల్‌ రైటూ అని లిబరల్‌గా అనేయొచ్చు. అక్కడ మనలాంటి హీరో ఒకడు తెల్లతెల్లగా ఉన్న చిన్నఅమ్మాయి మీద అక్కడా ఇక్కడా చేతులు కాళ్లూ వేస్తూ వికారాలు చూపిస్తా ఉంటే అదేదో మనమే చేస్తున్నట్టుగా మన యువత ఆనందించే వీలుండాలి. ఈ తెల్లతోలు వ్యామోహం వల్ల తొలుత తెలుగులోనూ ఇపుడిపుడే తమిళనాట కూడా ఉత్తరాది తారలు దూసుకుపోతున్నారు. స్థానిక అమ్మాయిలకు అవకాశమే లేకుండా చేస్తున్నారు. మన హీరోల వయసును, రంగును ఎంత మేకప్‌తో నైనా పూర్తిగా మార్చలేం కాబట్టి వారి సరసన చిట్టిపొట్టి తెల్లతెల్లని అమ్మాయిలను తెచ్చిపెట్టి వారి ఒళ్లు చూపించుట, వారి ఒంటిని వర్ణించుట, అందులో లైంగికపరమైన టిటిలేటింగ్‌ భాషను ఉపయోగించుట అవశ్యమన్నమాట. ఈ అడ్డదారి మార్కెట్‌  ఇప్పటికే  స్థిరీకృతమవుతున్న దుర్మార్గమైన విలువలను మరింత పెంచిపోషించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మన సినిమా ఈ సాంస్కృతిక కాలుష్యవాహికగా పనిచేస్తున్నది. దానికి సూచికే  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల. సాంస్కృతికంగా మన మహిళలు మోస్తున్న రెండు పర్వతాలకు పోలిక. కాదంటారా!

జి ఎస్‌ రామ్మోహన్‌