అతల వితల సుతల..

 

-సత్యమూర్తి

~

కోతుల రాజ్యం పెద్దమంత్రి బవిరిగడ్డానికి కాలు ఒకచోట నిలవదు. ఆ జబ్బు వెనకటికి లంకలో ఓ కోతి పెంచిన తోకంత పెద్దదై చుట్టలు చుట్టేసుకుంది. చుట్టలు చుట్టేసుకుని కూర్చుంటే సమస్య లేకపోయేది. కానీ అది చుట్టలు విప్పుతూ మాటిమాటికి విదేశాలకు వెళ్తుండడంతో రాజ్య పరిస్థితీ, పాలనా సంక్షోభంలో పడ్డాయి.

పెద్దమంత్రి హోదాలో బవిరిగడ్డం వారానికి ఒక దేశానికి అన్ని అధికార, అనధికార లాంఛనాలతో పయనం కడుతోంది. కొండముచ్చుల రాజ్యం, కోనముచ్చుల రాజ్యం, బారెడు కోతుల రాజ్యం, మూరెడు కోతుల రాజ్యం, జానెడు కోతుల రాజ్యం, బెత్తెడు కోతుల రాజ్యం, వేలెడు కోతుల రాజ్యం వగైరా నానా వానరజాతుల రాజ్యాలన్నీ ఇప్పటికే ఒకసారి చుట్టేసింది. భూమ్మీద చూడాల్సిన రాజ్యాలన్నీ అయిపోవడంతో ఇదివరకు వెళ్లినచోటికే  రెండోసారీ, మూడోసారీ వెళ్తోంది. అయినా కొత్త ప్రదేశాలు తిరగాలనే కోరిక మాత్రం పోలేదు. ఆస్థాన శాస్త్రమర్కటాలను పిలిపించి.. అతల, వితల, సుతల, తలాతల, పాతాళ వంటి భూమికిందా, ఆకాశంలోని నానా లోకాలకు తాను వెళ్లేందుకు దారులు వెయ్యాలని ఆదేశించింది. అవి ఆ పనిలో గోతులు తవ్వుతూ, నింగికి నిచ్చెనలు వేస్తూ ఉండగా బవిరిగడ్డం తీరికనేదే లేకుండా భూమ్మీది దేశాలను దర్జాగా చుట్టబెడుతోంది. దానికి ఈ పిచ్చి ఎంత ముదిరిందంటే.. చివరకు సముద్రాల మధ్యలో కంటికి కనిపించనట్టుండే ఐదారు కోతులుండే రాజ్యాలకు కూడా రెండుమూడుసార్లు వెళ్తోంది. ఆ రాజ్యాలు తమకు తొలి ప్రాధాన్య రాజ్యాలని, వాటితో బంధం బలోపేతం చేసుకుని సమస్త లోకాన్ని సుఖశాంతులతో ఓలలాడిస్తామని నమ్మకంగా చెబుతోంది.

ఓ పక్క అతల వితల సుతల అన్వేషణ ఖర్చులు, మరో పక్క విదేశీ ప్రయాణ ఖర్చులతో రాజ్య ఖజానా తరిగిపోతోంది. కోతిస్వామ్యం ప్రకారం కోతులకు కనీసావసరాలు తీర్చడానికి కేటాయించిన పళ్లను, గింజలను, నీళ్లను, చివరికి కోతిపిల్లలు నోటిదురదతో కొరుక్కునే చెట్లబెరళ్లనూ.. వేటినీ వదలకుండా బవిరిగడ్డం విదేశాలకు అమ్మేయించి ఆ వచ్చిన డబ్బుతో షికార్లు కొడుతోంది. ఒకపక్క తన వానరానీకం ఆకులు అలములు లేక ఆకలితో అల్లాడి చస్తోంటే, మరోపక్క అది విదేశీ చట్టసభల్లో, అంతర్జాతీయ వానరమహాసభల్లో  తన రాజ్య సుభిక్షం గురించి, తన కోతుల సుఖసంతోషాల గురించీ గొప్పగా సెలవిస్తోంది. పనిలో పనిగా తన గొప్పతనాన్ని చాటుకోవడానికి నానా కారుకూతలూ కూస్తోంది. అది పెద్దమంత్రి అయితే కావొచ్చు కాని, ఎంతైనా అది గణతంత్ర కోతిస్వామ్యం కనుక, అందులో చట్టసభ, రాజ్యపెద్దా, విపక్షమూ వగైరా తగలడి ఉన్నాయి కనుక పరిస్థితి చేయి దాటింది.

బవిరిగడ్డం పద్ధతేం బాగాలేదని విపక్షం కట్టగట్టుకుని రాజ్యపెద్దకు ఫిర్యాదు చేసింది. రాజ్యపెద్ద కోతి.. విషయమేంటో కనుక్కుందామని పెద్దమంత్రికి కబురు పంపింది. కానీ అది విదేశాల్లో ఉందని సమాధానం వచ్చింది. వారం పోయాక మళ్లీ కబురు పెట్టింది. పెద్దమంత్రి అప్పుడే కోతులులాగే బండిలో విదేశానికి బయల్దేరిందని జవాబు వచ్చింది. అలాంటి చాలా జవాబుల తర్వాత.. ఇక తప్పదన్నట్టు బవిరిగడ్డం ఒకరోజు చికాకు పడుతూ రాజ్యపెద్ద ఉంటున్న చెట్టపైకొచ్చి ఓ కొమ్మల మధ్య అకులపై మల్లెపూలు పరిపించుకుని దర్జాగా కాలుమీద కాలేసుకుని కూర్చుంది.

ముసలి రాజ్యపెద్ద మొదలుపెట్టింది.

‘నాయనా, బవిరిగడ్డమూ! నీ పద్ధతేం బాగోలేదు సుమా. మితనిద్రా మితాహారో, మితవస్త్రపరిగ్రహః మితభాషణమేకైకం భూషణం బ్రహ్మచా.. వొద్దులే బావుండదు! నువ్వు పెళ్లయినవాడివేగా. ఆ సుభాషితం పక్కనపెడదాం కాని, మితవిదేశీ ప్రయాణాణి అనేదాన్నిమాత్రం నువ్వు బాగా ఒంటబట్టించుకోవాలి బాబు. లేకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతావు.. ఇప్పటికే అయ్యావనుకో.. ఓ పక్క కోతులు ఆకలితో చస్తున్నాయి..’

‘సొద ఆపి.. సూటిగా, సుత్తిలేకుండా చెప్పు! అటువైపు నేను విదేశీ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. పట్టు అంగీపైన ఈసారి నా పేరు కాకుండా నా అందచందాల ముఖంబొమ్మను వజ్రాలతో పొదిగించుకోవాలి. ఆ కాళాకారకోతి ఎదురుచూస్తూ ఉంటుంది. నేను త్వరగా వెళ్లాలి. సూటిగా సుత్తిలేకుండా..’ కసిరింది పెద్దమంత్రి.

ముసలి కోతి ఎప్పట్లాగే నొచ్చుకుని మళ్లీ గొంతు సవరించుకుంది.

‘నేను చెప్పేది నువ్వెప్పుడు విన్నావు కనుక! అయినా తప్పదుకదా. విదేశీగమనాలను కాస్త తగ్గించుకో. నీ దండగమారి ఖర్చులతో కోతుల ఊసురు పోసుకుంటున్నావు. ఒళ్లూపై తెలియకుండా నానా చెత్తా వాగుతూ మన రాజ్య పరువును, మన కోతుల పరువును పోగొడుతున్నావు.. ఇప్పటికే బజారుకెక్కిన నీ పరువును కొత్తకొత్త బాజార్లకు కూడా ఈడ్చుకుంటున్నావు..’

బవిరిగడ్డం గడ్డాన్ని నిమురుకుంటూ చిద్విలాసంగా నవ్వింది.

‘నువ్వు చెప్పుడు మాటలు విని బాగా చెడిపొయ్యావు.. ఇంతకూ ఇదేనా నువ్వు చెప్పాల్సింది.. ’

‘ఇక నేను చెప్పాల్సిందేముందిలే నా బొంద..’ అంటూ కిందికి చూసి చప్పట్లు కొట్టింది. కింది కొమ్మ మీద కూర్చున్న గుమాస్తా కోతి నాలుగు తాటాకుల కట్టలు పట్టుకొచ్చింది.

‘మన ఘనతవహించిన దేశాల తిరుగుబోతు పెద్దమంత్రిగారిపై విపక్షం చేసిన ఆరోపణలేంటో చదివి వినిపించు.. ’ రాజ్యపెద్ద గుమాస్తాను ఆదేశించింది.

చచ్చాన్రా బగవంతుడా అనుకుంటూ బగవంతుడి సాయం కోసం పైకి చూసింది గుమాస్తా కోతి. సరిగ్గా అప్పుడే  చెట్టుపైనుంచి చిన్న పచ్చివెలక్కాయ దాని గొంతులో పడింది. దాన్ని కష్టమ్మీద బయటకు తీసేసుకుని భయంతో వొణుకుతూ తాటకుల కట్ట విప్పి, ఒక ఆకు తీసి చదవడం మొదలుపెట్టింది.

‘‘శ్రీశ్రీశ్రీ పెద్దమంత్రి బవిరిగడ్డంపై మేం మనవి చేసుకుంటున్న ఆరోపణలు.. బవిరిగడ్డం విదేశాల్లో మన పరువు ఎలా తీస్తోందో విన్నవించుకుంటున్నాం. అది విదేశాల్లో ఏం మాట్లాడిందో దాని మాటల్లోనే చెబుతున్నాం..

మన బవిరిగడ్డం జానెడు కోతుల రాజ్యానికి వెళ్లినప్పుడు అక్కడికి వలసవెళ్లిన కోతులను పోగుచేసి ఇలా అంది ప్రభూ..

‘మన రాజ్యం విశ్వగురువు, పరమపవిత్రం, పాపనాశనం. అంతటి పుణ్యభూమిలో పుట్టినందుకు మీరూ, నేనూ గర్వించాలి. నాలాగా రొమ్మువిరుచుకుని తిరగాలి.  ప్రపంచ వానరజాతులకు చెట్లెక్కడం, పళ్లు కొరుక్కు తినడం, పేలు చూసుకోవడం, గుర్రుమనడం, కిచకిచలాడ్డం, పిల్లలను కిందపడిపోకుండా పొట్టకు కరిపించుకుని చెట్లపైన తిరగడం, మలవిసర్జన తర్వాత ఆకులతో స్వచ్ఛంగా తుడుచుకోవడం(ఇది నేను నేర్పిన విద్య) వంటి సమస్త విద్యలన్నీ నేర్పించింది మన రాజ్యపు కోతులే. అంతటి ఘనమైన గడ్డపై పుట్టినందుకు ఇదివరకు మీరు సిగ్గుతో, అవమానంతో తోకను కాళ్లకింద నించి పైకి తెచ్చుకుని నోట్లో పెట్టుకునేవాళ్లు. ఎప్పుడెప్పుడు దేశం విడిచి పారిపోదామా అనుకునేవాళ్లు. ఇప్పడు ఆ అవసరం లేదు. నేను పెద్దమంత్రినయ్యాక మన రాజ్యప్రభ మహాగా వెలిగిపోతోంది కనుక ఆ తోకలను నోట్లోంచి తీసేసి ముడ్డి వెనుక నిటారుగా ఎత్తి పెట్టుకోండి. వీలైతే నా పేరు చెక్కిన చిరుమువ్వలను వాటికి కట్టుకుని గలగల్లాడిస్తూ ఊరేగండి.. ’

మా ఆరోపణ.. మనది గొప్ప రాజ్యమంటూనే మన రాజ్యంలో పుట్టడం సిగ్గుచేటని చెప్పింది బవిరిగడ్డం. దీనికి సమాధానం చెప్పించాలి..’’ గుమాస్తా కోతి చదవడం  ఆపింది.

రాజ్యపెద్ద బవిరిగడ్డంవైపు జవాబు చెప్పమన్నట్టు చూసింది. బవిరిగడ్డం ఇరకాటంలో పడింది కానీ వెంటనే తేరుకుంది.

‘ఏదో నోటిదూలతో అలా అనేశాను. పైగా నేను చెప్పిందంతా పొల్లుపోకుండా అచ్చేసే పత్రికలు మన రాజ్యంలో బోలెడున్నాయిగా. నా వాగ్ధాటి ఏంటో అందరికీ తెలుస్తుందని అలా వాగాను. అయినా వానరాలకు సుబ్బరంగా ముడ్డి కడుక్కునే విద్యనేర్పానన్న మహత్తర సత్యాన్ని చెప్పినందుకు, మన దేశాన్ని అంత గొప్పగా పొగిడినందుకు కృతజ్ఞత చూపి, శభాష్ అనక ఉడుక్కుంటారెందుకు? ఆ ప్రశ్నకు ఇదే నా జవాబు.’

రాజ్యపెద్ద మళ్లీ సైగ చేసింది. గుమాస్తా కోతి మరో తాటాకు అందుకుంది.

‘‘బవిరిగడ్డం కొండముచ్చుల రాజ్యానికి వెళ్లినప్పుడు ఇలా అంది ప్రభూ..

‘మీ రాజ్యానికి రావడానికి ఇదివరకు మా రాజ్య పెద్దమంత్రులుగా పనిచేసినవాళ్లు ఇష్టపడలేదు. వాళ్లకు మీరంటే చులకన. కండకావరం. అసలు మీ దేశం ఏ దిక్కున ఉందో కూడా తెలియని అజ్ఞానులు. అందుకే భూమి పుట్టినప్పట్నుంచి మా రాజ్యనాయకులు ఎవరూ మీ రాజ్యానికి రాలేదు. రావడానికి పడవలున్నా, దారులున్నా, కాస్త కోతిమాంసం పడేస్తే ఎగరేసుకొచ్చే గద్దలున్నా మా రాజ్యనేతలెవరూ మీ రాజ్యానికి రాలేదు.  కానీ నేను మహాజ్ఞానిని. ఈ సమస్త విశ్వంలో నాకంటే ఎక్కువ తెలిసిన కోతి మరొకటి లేదు. ఈ లోకంలో నాకు తెలియనిదేదీ లేదు. అయినా నాకు మీరంటే మహాగౌరవం. మీరు నాకంటే గొప్పవాళ్లు. మీ రాజ్యమన్నా, మీ పాలకులన్నా కాళ్లపైన పడిపోతాను. అందుకే ఆగమేఘాలమీద దారులు వేయించుకుని మరీ వచ్చాను. మీకేం కావాలన్నా ఇచ్చేస్తాను. మా కోతుల రాజ్యంలోని చెట్లు, పుట్టలు, పిట్టలు, చేపలు, కప్పలు.. ఏదీ కావాలన్నా రాసిస్తాను. మీరెంత మహానుభావులు! మీరే లేకుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదా? మా రాజ్యసమస్యలపై మాకంటే మీకే ఎక్కువ అవగాహన. మా వాళ్లు దద్దమ్మలు, చవటలు, సన్నాసులు. మీరు పరమోత్తములు. మీరు లేందే మేం బతకలేం. దాసోహం.. దాసోహం..’

మా ఆరోపణ.. బవిరిగడ్డం అబద్ధాలకు ఇది పరాకాష్ట ప్రభూ. కొండముచ్చుల రాజ్యానికి మన రాజ్యపెద్దలు, పెద్దమంత్రులు బోలెడుసార్లు వెళ్లారు. వాళ్లు వెళ్లిన దార్లు ప్రయాణాల ధాటికి కుంగిపోతే, మళ్లీ మట్టిపోయించి ఎత్తుచేయించుకున్నాం కూడా. అందుకు సాక్ష్యంగా, ఆ దారుల ఛాయాచిత్రాలను, వాళ్లు కొండముచ్చుల రాజ్యం నాయకులతో దిగిన ఛాయాచిత్రాలను జతచేస్తున్నాం. బవిరిగడ్డం మనం అజ్ఞానులమంటూ తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ, మన పరువు తీస్తోంది. వాళ్లకు మన దేశసంపదను అప్పనంగా కట్టబెడతానంటూ సిగ్గూ ఎగ్గూ లేకుండా చెబుతోంది. దీనికి సమాధానం చెప్పించాలి’’ గుమాస్తా ఆపింది.

బవిరిగడ్డం పగలబడి నవ్వింది.

‘ఇదీ ఒక ఆరోపణే! ఇది నా అబద్ధాలకు కాకుండా నా చమత్కారానికి పరాకాష్ట అనుకుని హర్షించండి. కొండముచ్చులు మంచిగా ఆతిథ్యమిస్తాయని, నా గొప్పలు చెప్పుకోవడానికి అలా అంటే గమ్మత్తుగా ఉంటుందని అనేశాను. వాళ్ల ఆరోపణలకు ఇదే నా తమాషా జవాబు. కోతన్నాక కూసింత కళాపోసన ఉండాల.. హ్హహ్హహ్హ.. హ్హహ్హహ్హ.. ఊ తర్వాతి ఆరోపణ.. హ్హహ్హహ్హ..’

రాజ్యపెద్దా, గుమస్తా బిత్తరపోయాయి. రాజ్యపెద్దకు సర్వసత్తాక, గణతంత్ర, కోతిస్వామ్య విశేషణాలు గుర్తుకొచ్చి మళ్లీ గుమాస్తాకు సైగ చేసింది.

‘‘బవిరిగడ్డం బెత్తెడు కోతుల రాజ్యానికి వెళ్లినప్పుడు అధికార, అనధికార సమావేశాల్లో కోతిసంబంధాల గురించి ఇలా అంది ప్రభూ..

‘మీరందరూ సుఖంగా కాపరం చెయ్యాలి. భర్తకోతులు భార్యకోతులను బాగా ఏలుకోవాలి. భార్యకోతులు భర్తకోతులకు సేవలు చెయ్యాలి. మా రాజ్యంలోని వాళ్లకు ఎప్పుడూ ఇదే బోధిస్తుంటాను. పెళ్లిళ్లు స్వర్గంలో చేసినా కాపరం మాత్రం ఈ లోకంలోనే చెయ్యాలి కదా. నాతిచరామి అని అగ్నిసాక్షిగా పెళ్లాడిన పెళ్లాన్ని గాలికొదిలేయడం న్యాయమా?  ఇక అమ్మలను నిత్యం, అణుక్షణం క్షణక్షణం ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మా అమ్మ నానా కష్టాలూ పడి, కొండలెక్కి, లోయల్లోకి దిగి పళ్లుగిళ్లూ తెచ్చి నన్ను సాకింది. ఆమెను తల్చుగుంటే గన్నీళ్లు ధారాపాతంగా గారిపోతాయి. కాటికి కాళ్లుచాపుకున్న ఆమె అంటే నాకెంతో ప్రాణం. ఇప్పటికీ ఏడాది ఒక్కసారి మాత్రమే ఆమె ఇంటికెళ్లి కాళ్లు మొక్కి, ఆమె పెట్టే మిఠాయి తిని వస్తుంటా. మాతృదేవో భవ.. ఎవరు రాయగలరూ.. అమ్మా అను మాటకన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ.. ’

మా ఆరోపణ.. ఇది పూర్తిగా బవిరిగడ్డం వ్యక్తిగత విషయంగా కొట్టిపారేలేం ప్రభూ.. వ్యక్తిగత జీవితాలు మీమీ సొంతం.. పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అని మన రాజ్యాంగంలో రాసుకున్నాం కదా. బవిరిగడ్డం పెళ్లాన్ని వదిలేసి, పరాయి దేశాల్లో, మన దేశంలో సందు దొరికినప్పుడల్లా పెళ్లాలను ఏలుకోవాలని చెబుతోంది. అలా చెప్పే నైతిక అర్హత దీనికి లేదు. తన పెళ్లాం కాపరానికొస్తానని బతిమాలుతున్నా ఆమెను ఏలుకోనందుకు దీన్ని దండించాలి. అలాగే, ముసలి తల్లిని ఏడాదికోసారి చూస్తానంటూనే తల్లిని నిత్యం బాగా చూసుకోవాలని ఊకదంచింది బవిరిగడ్డం. తల్లిని గాలికి వదిలేసిన దీనికి అలా చెప్పే అర్హత లేదు. ముసలి తల్లిదండ్రులను సాకకపోతే శిక్షలు వేయాలని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. బవిరిగడ్డం దీన్నిపాటించనందుకు శిక్ష వేయాలి..’’ గుమాస్తా కంఠం వొణికింది.

బవిరిగడ్డం ముఖం ఎర్రబారింది. కాసేపు గమ్మునుండి మళ్లీ దూకుడు మొదలెట్టింది.

‘ఇదొక ఆరోపణా..? నేను పెళ్లాన్ని వదిలేశాను. అయితే ఏంటట? నాకు పెళ్లాంకంటే నా తళుకుబెళుకుల బట్టలు, నా ఊకదంపుడు, నా స్వీయఛాయాచిత్రాలంటేనే ఇష్టం. వీటికి అడ్డమొస్తుందని కాపరం చెయ్యడం లేదు. నాతో బలవంతంగా కాపరం చేయించలేరు కదా. కనుక నా హక్కునూ మీరు గౌరవించాలి. ఎంతైనా ఇది కోతిస్వామ్యం కదా. ఇక మా తల్లి సంగతి. లోకంలో తల్లిదండ్రులను వీధిన పడేసిన కోతులెన్నిలేవు? యథాప్రజా తథా రాజా. ముందు వాటిని శిక్షించాక, నన్ను శిక్షించండి.. ఇదే నా జవాబు.’

గుమాస్తా కోతి ఈసారి రాజ్యపెద్ద చెప్పకుండానే మరో తాటాకుల కట్ట అందుకుంది..

‘‘‘బవిరిగడ్డం మూరెడు కోతుల రాజ్యంలో వివేకం మరిచి మమ్మల్నిఇలా కించపరచింది ప్రభూ..

‘‘బవిరిగడ్డం వేలెడు కోతుల రాజ్యానికి వెళ్లి సోయి లేకుండా ఇలా..

‘‘బవిరిగడ్డం పొట్టితోక కోతుల రాజ్యానికి వెళ్లి బుద్ధిలేకుండా..

‘‘బవిరిగడ్డం పొడవుతోక కోతుల రాజ్యానికి వెళ్లి..

‘‘బవిరిగడ్డం ఎర్రమూతి కోతుల రాజ్యానికి..

‘‘బవిరిగడ్డం తెల్లమూతి కోతుల…’’

అన్ని ఆరోపణలకూ బవిరిగడ్డం తిరుగులేని జవాబులు చెబుతూ పోయింది. గుమాస్తా మరో కట్ట విప్పబోయింది.

బవిరిగడ్డానికి అటుపక్క విదేశీ ప్రయాణ గడియలు దగ్గర పడుతున్నాయి. అది పైకి లేచింది.

‘కట్ట విప్పకు. రాజ్యపెద్దా..! అలాంటి ఎన్నికట్టలున్నా ఒకటే జవాబు. నోటితో చెప్పను. కళ్లారా చూపిస్తా’ అంటూ తన రెండు కాళ్లూ పైకెత్తింది.

కాళ్లలోంచి నెమ్మదిగా లోహపు చక్రాలు బయటకొచ్చాయి. ఒక్కమారు కీచుమంటూ గిర్రున తిరిగాయి.

వాటికి పచ్చి నెత్తుటి మరకలు కూడా అంటుకుని ఉన్నాయి.

*

జలియన్ వాలా బాగ్ లో చంపేసుకుందాం..

 

-సత్యమూర్తి

 

వరంగల్ జిల్లాలో జరిగిన శ్రుతి ఎన్ కౌంటర్ పై ‘ఆ పిల్ల..’ పేరుతో రమాసుందరి గారు రాసిన భావోద్వేగ కవితపై కొందరి వ్యాఖ్యలు చూశాక కొన్ని అభిప్రాయాలు పంచుకోవాలనిపించింది. వ్యాఖ్యల్లో చెప్పాల్సిందంతా  వివరంగా చెప్పలేం కనుక విడిగా రాయాలనిపించింది.

శ్రుతి వంటి అమాయక పిల్లలకు మాయమాటలు చెప్పి సాయుధ పోరాటంలోకి పంపి ప్రాణాలు తీయిస్తున్నారని కొందరు కొందరిని పేర్లు ప్రస్తావించకుండా తిట్టారు. యువత ఏదైనా సాధించాలనుకుంటే అడవులకు వెళ్లకుండా, వీధుల్లోకి వచ్చి పోరాడాలని నిరాయుధ ఉద్యమ పిలుపు ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమంపై వ్యతిరేకతను ఛిద్రమైన శ్రుతి శవం సాయంతో ముసుగులేకుండా వ్యక్తీకరించుకున్నారు. చరిత్ర సంఘర్షించేటప్పడు నిజానికి ఇలాంటి స్పష్టమైన అభిప్రాయాలే రావాలి.

ఎవరు ఎలా పోరాడాలన్నది ఒకరు చెబితే తేల్చుకోవాల్సిన విషయం కాదు. పోరాట రూపం ఎంపికలో వ్యక్తిగత చైతన్యమే కాకుండా సామూహిక చైతన్యం కూడా పనిచేస్తుంది. విప్లవోద్యమంలో పీడితులు, తాడితులు మాత్రమే పోరాడరని,  సమాజంలో మార్పును ఆశించే వాళ్లు కూడా పోరాడతారని చరిత్ర చెబుతోంది.  శ్రుతి దీనికి తాజా నెత్తుటి ఉదాహరణ. శ్రుతి ఎంచుకున్న మార్గం మంచిదా, చెడ్డదా అని ప్రశ్నించుకునే ముందు ఆమెను కిరాతకంగా చంపడం మంచిదా చెడ్డదా అన్న ప్రశ్నా వేసుకోవాలి. దీనికి వచ్చే జవాబును బట్టే ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఆమెకు ఆ పోరాటాన్ని మించినదేదో సాయుధపోరాటంలో ఉందనిపించి అటువైపు వెళ్లింది. తెలంగాణ కోసం పోరాడాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా ప్రోత్సహించారు కూడా.  బహుశా ఆమె తెలంగాణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బలిదానం చేసుకుని ఉండుంటే కూడా అభ్యంతరం చెప్పకుండా ఆమె త్యాగంపై కవితలూ, పాటలూ రాసేవాళ్లు. ఇప్పుడు ఆమెను కిరాతంగా చంపేసిన ప్రభుత్వం ఆమె తెలంగాణ కోసం చట్టబద్ధంగా ప్రాణం తీసుకుని ఉంటే ఆమె కుటుంబానికి లక్షల రూపాయల పరిహారం ఇచ్చి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఆమె అడవులకెళ్లి  చచ్చిపోవడమే! ప్రాణాన్ని బట్టి కాకుండా చచ్చిన ప్రాంతాన్ని బట్టి చావుకు విలువ!

శ్రుతి విద్యావంతురాలు కనుక అడవులకెళ్లకుండా ఏ  గ్రూప్-1 పోస్టో కొట్టి, ప్రజల బాగు కోసం ప్రజాస్వామికంగా పోరాడి ఉంటే, సమాజానికి కూడా మేలు చేసే అవకాశముండేదని ‘అడవుల’ వ్యతిరేకులు అంటున్నారు. శ్రుతి పోలీసు అయ్యి నక్సల్స్ ను ఎన్ కౌంటర్ చేసి వ్యవస్థను భద్రంగా కాపాడుతూ ఉండుంటే వీళ్లకు మరింత సంతోషంగా ఉండేది కాబోలు!

ప్రభుత్వాలు, రాజ్యాంగాలు నిర్దేశించిన రూపాల్లోనే ఉద్యమిస్తూ ఉండుంటే శ్రుతి మన కళ్లముందరే తిరుగుతూ ఉండేది. కానీ ఆమెకు ఈ చక్కని మనుగడ కిటుకు తెలియదు. శ్రుతి ఆలోచనలేమిటో మనకు తెలియదు కాని, ఆమె మమేకమైన ఉద్యమం ఆలోచనలు ఆమెవి కూడా కనుక ఆమె ఎందుకు అడవులకు వెళ్లిందో వాటిద్వారా తెలుసుకోవచ్చు. దేశ స్వాతంత్ర్య పోరాటం ఎంత బలహీనంగా, అడ్డగోలుగా సాగినా, దానితోపాటు,  ‘కలసి వచ్చిన‘ రెండో ప్రపంచం యుద్ధం వంటివాటితో తెల్లదొరలను దేశం నుంచి వెళ్లగొట్టి, నల్లదొరలను గద్దె ఎక్కించాం. నల్లదొరలు మన నెత్తికెక్కి తెల్లదొరలను మించిపోయారు. తెల్లదొరల పాలనలో కనిపించని నల్లకుబేరులు ఇప్పుడు ఊరికి పదిమంది, వీధికొకరు  పుట్టుకొచ్చారు. స్వతంత్ర భారతంలో  ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరే ఒకే ఒక చట్టవిరుద్ధ ఉద్యమం కూడా నక్సల్స్ రూపంలో అవతరించింది. నల్లదొరలను గద్దెదింపి సమసమాజ స్థాపనకోసం పోరాడుతోంది. దాని పోరాట రూపంపై అభ్యంతరాలు ఉండడం తప్పేమీ కాదు. కాని బ్రిటిష్ వాళ్ల పాలనలో కూడా లేనంత ఘోరంగా, కిరాతకంగా ఉద్యమకారులను చంపడం మటుకు కచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఖండించకపోవడం, ఖండించక్కర్లేదని అనడం అమానుషం, అనాగరికం, అవకాశవాదం. ఆ చావుకు చచ్చిన వాళ్లదే బాధ్యత అని తెలివిగా మాట్లాడ్డం పోలీసుల భాష మాట్లాడ్డమే.

శ్రుతి చట్టబద్ధ హత్యను సమర్థిస్తున్న వాళ్లు అల్లూరి, భగత్సింగ్, కొమురం భీంల హత్యలను కూడా సమర్థించినట్లే అవుతుంది. ఎందుకంటే వాళ్లు కూడా శ్రుతి మాదిరే ‘చెప్పుడు మాటలు’ విని  ప్రభుత్వ ఆమోదిత రూపాల్లో పోరాడకుండా, అడవులూ, ఆయుధాల బాటలూ ఎంచుకుని అనవసరంగా చచ్చారు కనుక. ‘వాళ్లు పరాయి ప్రభుత్వాన్ని కూలదోయడానికి అలాంటి మార్గం ఎంచుకోవచ్చు. కానీ మనం చెమటోడ్చి ఓటేసి ఏర్పాటుచేసుకున్న మన ప్రభుత్వాలను కూలదోయడానికి మటుకు ఆ మార్గాన్ని కాకుండా బహిరంగ, ప్రజాస్వామ్య పోరాటాలు చేయాలి’ అని అని సెలవిస్తారా? అలా అయితే, అసలు ఆ పోరాటాలే అక్కర్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎటూ  ఐదేళ్లకు ఒకసారి మారిపోయి, కూలిపోయి.. మళ్లీ ఐదేళ్ల తర్వాత మరింత బలం పుంజుకుని వచ్చే ప్రభుత్వాలను అనవసరంగా పనులు మానుకుని, వీధుల్లోకి వెళ్లి, గొంతులు చించుకుని కూలగొట్టడమెందుకు? లేదు లేదు, ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఉద్యమించి తీరాల్సిందే అని అంటారా? అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు ఓటేయాలని ‘చెప్పుడు మాటలు’ వినే జనానికి పిలుపిస్తూ కవితలు, వ్యాసాలు రాసి, సభలు పెడితే సరిపోతుంది. ఆ పార్టీలు ప్రగతి వ్యతిరేకం అనుకుంటే సీపీఐకో, సీపీఎంకో ఓటేయమనాలి. వాటికేయడం దండగ, అవి అధికారంలోకి రావు, వచ్చినా అవి కూడా బెంగాల్ లో మాదిరి జనాన్ని పీడిస్తాయి అని అంటారా? అయితే ఎంచక్కా ఏ ప్రభుత్వమూ రావడానికి వీల్లేని ‘నోటా’ ఉండనే ఉంది. వాళ్లకు, వీళ్లకు ఓటేయాలని ఇచ్చే పిలుపులు, సభలు కూడా ఉద్యమాలకిందికే వస్తాయి అని వాదిస్తారా? అయితే అవీ అక్కర్లేదు. పార్టీలు ఆ ఉద్యమాలను దాదాపు డెబ్బై ఏళ్లుగా కన్నులపండుగగా కదం తొక్కిస్తూ నిర్వహిస్తున్నాయి కనుక..

శ్రుతి హత్యపై కవితలు, పాటలు రాయొద్దంటే అల్లూరి, భగత్సింగులపైనా, ప్రజాస్వామికబద్ధంగా హత్యకు గురయ్యే హక్కుల కార్యకర్తలపైనా రాయొద్దు. ఇలాంటి కవితల వల్లే అడవులకు వెళ్తున్నారని అడవుల వ్యతిరేకులు గుండెలు బాదుకుంటున్నారు కాని, నిజానికి వాళ్లది శుద్ధ అనసరమైన ఆందోళన. ‘మాకొద్దీ తెల్లదొరతనమూ..’, ‘పదండి ముందుకు, పదండి తోసుకు.. ’, ‘నీ త్యాగం ఉన్నతమైనది..’ వంటి పాటలు, కవితలు మనసును కదిలించి, ఆవేశం తెప్పిస్తాయంతే. నిజానికి వాటికి ఉద్యమబాట పట్టించే శక్తే ఉంటే బ్రిటిష్ వాడు 1910లలోనే మనకు స్వాతంత్ర్యం ఇచ్చిపోయుండేవాడు. 1940లలోనే ఇప్టా కళారూపాలతో ఒక్క నెత్తురుబొట్టూ చిందకుండానే దేశంలో కమ్యూనిస్టుల రాజ్యం వచ్చుండేది. 1970లలో నక్సలైట్ల రాజ్యం వచ్చుండేది.

కనుక ఈ కవితలు, పాటలు మీరనుకున్నంత ప్రమాదకరమేమీ కావు. నిశ్చింతగా ఉండండి. సందర్భం కనుక మరో మాట.. ప్రత్యేక తెలంగాణ కావాలని తెలంగాణ దుస్థితిని గుండెకరిగేలా, తెలంగాణ కోసం రోడ్లపైకొచ్చేలా చేసిన ప్రసంగాలు విని, రాసిన కవితలు, పాటలు పాడి.. తమ చావుతో అయినా తెలంగాణ వస్తుందేమోనని బలిదానాలు చేసుకున్నారు కొందరు ‘చెప్పుడు మాటలు’ వినే యువకులు. పాపం.. ఆ అమాయకులు ఆ పాటలు వినకపోయుంటే ప్రత్యేక, సుభిక్ష తెలంగాణాలో నిక్షేపంగా బతికుండేవాళ్లు. వాళ్ల చావులకు ఆ పాటలు రాసిన కవులు, పాడిన గాయకులు ఇప్పుడు బాధ్యత వహించాలి..! అడవులకు పంపేవాళ్లతోపాటు వీళ్లనూ బోనెక్కించాలి..!

సందర్భం కనుక మరోమాట.. అడవుల్లో చనిపోయిన ఎంటెక్ శ్రుతిపై మనం కవితలు రాస్తాం, ఆమెను అడవులకు తీసుకెళ్లి చంపించేశారని వలపోస్తాం కాని, అడవుల్లో శ్రుతిలాగే చచ్చిపోతున్నగిరిజన యువతుల గురించి, పల్లెటూరి రైతుకూలీల గురించి రాయడానికి మన కలాలు కదలవు, మన గొంతులు పెగలవు. కలాల సంగతి పక్కన బెడితే.. అలాంటి వాళ్లు అడవుల్లో చచ్చినా ఫర్లేదు, శ్రుతి లాంటి వాళ్లు మాత్రం చావకుండా, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకోవాలి అని అనుకుంటున్నారా జాలిగుండెల అడవుల వ్యతిరేకులు?

ప్రజాస్వామిక పోరాటాలు ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగించనంతవరకు ప్రమాదకరమేమీ కాదు. కానీ శ్రుతికి వాటిపై నమ్మకం లేదు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమెకు తెలంగాణ వచ్చాక కూడా అసంతృప్తి పోలేదు. తన కలలు కల్లలయ్యాయని భావించింది. అందుకే మరో మార్గం ఎంచుకుంది. ఆమె అడవులకెళ్లిందని తప్పుబడుతున్న మనం ఆమె అలా వెళ్లకుండా ఉండడానికి, మన మధ్యే ఉండి పోరాడడానికి ఆమెకు బహిరంగ ప్రజాస్వామ్య ఉద్యమాలపై గట్టి నమ్మకం కలిగించామా? రెండు రెండు నాలుగు అంటే జైళ్లు నోళ్లు తెరవడం కాదు.. కేసులు, హత్యల దాకా వెళ్లే మన ఘన ప్రజాస్వామ్యంలో చేస్తున్న రాజ్యాంగబద్ధ ఉద్యమాలు విజయం సాధించి తీరతాయని ఆమెకు గట్టి విశ్వాసం కలిగించామా? కలిగించడానికి ఏమన్నా చేశామా?

1969 నాటి ప్రత్యేక తెలంగాణ పోరులో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన 369 మంది, 1975నాటి ఎమర్జెన్సీలో జైళ్లలో చిత్రహింసలకు గురై కన్నుమూసి స్నేహలతారెడ్డి వంటి వాళ్ల నుంచి మొదలుకుని.. నిన్నమొన్నటి బషీర్ బాగ్ కాల్పుల్లో(2000) చచ్చిపోయిన ముగ్గురు, ఖమ్మం ముదిగొండ కాల్పుల్లో(2007) చనిపోయిన ఏడుగురు, సోంపేట కాల్పుల్లో(2010) చచ్చిపోయిన నలుగురు.. ఇంకా అనేకచోట్ల ప్రభుత్వం చట్టబద్ధంగా పొట్టనబెట్టుకున్న వాళ్లందరూ  ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడారు. వీళ్లలో ఎవరూ ఆయుధాలు పట్టుకోలేదు. వీళ్లెవరూ అడవుల్లో వాగు ఒడ్డున శ్రుతిలా నీళ్లు తాగుతూ.. ఢిల్లీ, హైదరాబాద్ లలోని ప్రభుత్వాలను కూలదోయడానికి ప్రయత్నించి వాళ్లు కాదు. కానీ.. శాంతిభద్రతలకు ‘భంగం’ కలిగించిన వీళ్లు, ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్టయి, జైళ్లలో ఉండాల్సిన వీళ్లు కూడా శ్రుతి మాదిరే రాజ్యాంగబద్ధంగా ఎన్ కౌంటర్ అయ్యారు. శ్రుతి ‘కాస్త తెలివైన’ పిల్ల కనుక అలా ఉత్తిపుణ్యానికి చావకుండా తన చావుపై కన్నీటి, గుండెతడి కవిత్వం, పాటలు రాయించుకోవడానికి అడవులకు వెళ్లింది!! ఆమెకు బషీర్ బాగ్, సోంపేట వంటి ప్రజాస్వామిక, చట్టబద్ధ, ప్రభుత్వామోదిత, ‘గెలుపు గ్యారంటీ’ ఉద్యమాలపై నమ్మకం కలిగించని మనం మాత్రం అడవులంటే జడుసుకుంటూ, మిగిలిన వాళ్లను జడిపిస్తూ బతుకుతున్నాం..

మనకు మన రాజ్యాంగాలు, చట్టాలు, ప్రభుత్వాలు, పాలకులు, పోలీసులు నిర్దేశించిన బాటలోనే ఒక్క అంగుళం, అటూ ఇటు కదలకుండా మనవైన ప్రెంచి, రష్యన్, చైనా మహా విప్లవాలు రావాలి. 1857లు, 1942 క్విట్ ఇండియాలు, 1946-51 తెలంగాణ రైతు పోరాటాలు.. చరిత్రను కుదిపిన అనేకానేక విప్లవాలు, పోరాటాలు అన్నీ ఒక్క నెత్తురు బొట్టు కూడా నేలరాలకుండా కొనసాగాలి. అన్యాయం, అక్రమాలపై మన నోళ్లు నిరంతరం నినదిస్తూనే ఉండాలి, మన పిడికిళ్లు బిగుస్తూనే ఉండాలి. అయితే అందుకు శక్తినిచ్చేందుకు మన చిన్ని బొజ్జలకు నిరంతరం శ్రీరామరక్ష కూడా కావాలి. దీనికి మరీ అంత తప్పనిసరైతే మన బిడ్డలు ప్రజాస్వామిక జలియన్ వాలా బాగ్ లలో చస్తే చావొచ్చు కానీ అడవులకెళ్లి మాత్రం చావకూడదు..!

*

 

 

 

 

కొత్త శాటర్న్ స్వపుత్ర భక్షణ

 

                                                           -సత్యమూర్తి

జరిగిన కథ:  దేవతల రాజైన శాటర్న్ తన తండ్రి కేలస్ ను గద్దె దింపి తను సింహాసనమెక్కుతాడు. శాటర్న్ ను కూడా అతని కొడుకుల్లో ఒకడు పదవీచ్యుతుణ్ని చేస్తాడని భవిష్యవాణి చెబుతుంది. దీన్ని అడ్డుకోవడానికి శాటర్న్ తన భార్య ఓపిస్ కు పిల్లలు పుట్టీపుట్టగానే వాళ్లను కొరికి చంపితినేస్తాడు. అలా ఐదుగురు పిల్లల్ని తినేస్తాడు. ఆరో కాన్పులో జూపిటర్ పుడతాడు. ఓపిస్ ఆ పిల్లాణ్ని క్రీట్ ద్వీపంలో దాచేసి, ఓ గుడ్డలో రాయిని పెట్టి అదే బిడ్డ అని శాటర్న్ కు ఇస్తుంది. శాటర్న్ నిజమనుకుని తినేస్తాడు. జూపిటర్ క్రీట్ ద్వీపంలో పెరిగి పెద్దయి తన తండ్రిమీద దండెత్తి తను రాజు అవుతాడు. అలా భవిష్యవాణి నిజమవుతుంది.. ఇక చదవండి..

పదవి కోల్పోయిన శాటర్న్ అధికారం కోసం అలమటిస్తూ కన్నుమూశాడు. దైవ నిర్ణయం ప్రకారం భూలోకంలోని ఒక రాజ్యంలో మానవుడిగా పుట్టాడు. ఆ రాజ్యం పేరుకే రాజ్యం కాని, రాజు లేడు. పెత్తనమంతా పక్క రాజ్యపు రాజుదే. మానవుడిగా అవతరించిన శాటర్న్ కు గత జన్మ వాసనలు ఇంకా పోలేదు. శక్తిసామర్థ్యాలు పిసరంత కూడా తగ్గలేదు. వాటికి వాచాలత కూడా తోడైంది. ఈ కొత్త శాటర్న్ కు  అధికార దాహం కూడా గత జన్మలోకంటే మరింత ఎక్కువైంది. అధికారం దక్కితే ఎలా కాపాడుకోవాలో కూడా ఆలోచించాడు.

గత జన్మలో కొడుకు వల్ల అధికారం పోయింది కనుక ఈ జన్మలో అసలు పిల్లల్నే కనొద్దని నిర్ణయించుకున్నాడు. అధికారం కోసం పావులు కదిపాడు. పక్క రాజు పెత్తనాన్ని సహించొద్దని తన రాజ్య జనానికి చెప్పి తిరుగుబాటు లేవదీశాడు. పక్క రాజు పెత్తనం పోతే జనంలోని అట్టడుగు వర్గపు ఒక మనిషిని రాజును చేస్తానని నమ్మబలికాడు. జనం నమ్మి పక్క రాజ్యపు రాజుపై తిరగబడి పెత్తనం వదిలించుకున్నారు. కొత్త శాటర్న్ తన హామీని తుంగలో తొక్కి తనే రాజయ్యాడు. తనే జనాన్ని పీడించడం మొదలెట్టాడు. రాజ్యం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడింది. జనం బాధలు ఎక్కువయ్యాయి. కొత్త శాటర్న్ అధికారం అనుభవిస్తూ మత్తుపానీయాలు గ్రోలుతూ సుఖించసాగాడు.

కొత్త రాజు పాలన గిట్టని జనం తిరుగుబాటు చేశారు. కొత్త శాటర్న్ సైన్యాన్ని వాళ్లపై ఉసిగొల్పాడు. ఆయుధ బలం చాలని తిరుగుబాటుదారులు అడవులకెళ్లి యుద్ధసన్నాహాలు ప్రారంభించారు.

కొత్త శాటర్న్ ఓ మిట్టమధ్యాహ్నం మద్యం మత్తులో జోగుతుండగా భవిష్యవాణి వినిపించింది. ‘గత జన్మలో మాదిరే ఈ జన్మలోనూ నువ్వు నీ పుత్రుల చేతిలోనే చస్తావు’ అని భవిష్యవాణి పలికింది. అసలు తనకు పిల్లలే లేరు కదా అని అడగబోతుండగా భవిష్యవాణి అంతర్ధానమైంది.

కొత్త శాటర్న్ తొలుత భయపడిపోయాడు. తనకు సంతానం లేదు కనుక భవిష్యవాణి నిజం కాబోదనుకుని కాస్త కుదుటపడ్డాడు. కానీ గత జన్మవాసనలు భయపెట్టాయి. పండితులను పిలిపించి విషయం చెప్పాడు. వాళ్లు బుర్రలు చించుకుని ఒక నిర్ధారణకు వచ్చారు. ‘ప్రభూ! మీకు పుత్రులు లేకపోవచ్చు కాని, జనమంతా మీ పుత్రసమానులే కదా. బహుశా వాళ్ల చేతుల్లో మీరు చస్తారు కాబోలు’ అని చెప్పారు. కొత్త శాటర్న్ కంగు తిన్నాడు. మామూలు జనంతో తనకు ప్రమాదం లేదని, ఉన్న ముప్పల్లా  తిరుగుబాటు చేసి అడవులకెళ్లిన జనంతోనే అని నిర్ధారించుకున్నాడు. సైన్యాన్ని రెట్టింపు చేసి.. తిరుగుబాటుదారులను చంపాలని అడవులకు పంపాడు. కానీ జంకు మాత్రం ఇంకా పోలేదు.

గత జన్మ వాసనలు వెంటాడుతూనే ఉన్నాయి మరి. ఈసారి ఎవరి చేతిలోనూ మోసపోకూడదనుకున్నాడు. తానే స్వయంగా అడవులకెళ్లాడు. సైన్యం సాయంతో అడవులను జల్లెడ పడుతూ తిరుగుబాటుదారులను పట్టుకున్నాడు. ఒక్కొక్కరిని మెడకొరికి, రక్తం జుర్రుకుని, భుజాలు కొరికి, మొండాలు కొరికి, కాళ్లు కొరికి.. సంపూర్ణంగా తినడం మొదలెట్టాడు. భవిష్యవాణి పుత్రుల చేతిలో చస్తావని చెప్పిందే తప్ప కచ్చితంగా ఎవరిచేతిలో, ఎన్నోవాడి చేతిలో చస్తావని చెప్పకపోవడంతో కొత్త శాటర్న్ తన రాజ్యంలోని అడవులన్నింటినీ గాలిస్తూ నరమాంసభక్షణ యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నాయి కాని, అడవులు తరగడం లేదు. తిరుగుబాటుదారులూ తరగడం లేదు.. (సశేషం)

(వరంగల్ జిల్లా మెట్లగూడెం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా. శాటర్న్ కథ రోమన్, గ్రీకు పురాణాల్లోనిది)

*

 

 

 

 

దేవుళ్లకు జడ్జీల శఠగోపం

 

-సత్యమూర్తి

చాలా మందికి ప్రశ్నలు గిట్టవు. అవి కొత్తవీ, ఘాటువీ అయితే అసలు గిట్టవు. ప్రశ్నలేవైనా అవి స్వీకరించేవాళ్లను బట్టి ఆలోచనో, ఆగ్రహమో పుట్టిస్తాయి. తోలు మందంగా ఉన్నవాళ్లకు ఏవీ పుట్టవనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు చెప్పుకోబోయేది వేరే వాళ్ల గురించి. కాస్త బుద్ధీజ్ఞానమూ ఉంటాయని, మంచీ చెడూ తెలుస్తాయని అని అనుకునే జడ్జీల గురించి. అయినా, రోజూ కోర్టుల్లో కక్షిదారులకు శరపరంపరగా ప్రశ్నలు వేసే జడ్జీలకు నా బోటి సామాన్యుడు వేసే ఈ ప్రశ్నలు వినబడతాయా? అని.

జడ్జీలు కోర్టుల్లో పెద్దోళ్లయితే కావచ్చు కానీ బయటి మాత్రం వాళ్లు కూడా మనందరిలాంటి వాళ్లే. అందరి మాదిరే తిరుగుతుంటారు. ఉరిశిక్షల వంటి పేద్ద కఠినశిక్షలు వేసే పేద్ద జడ్జీలైతే వై ప్లస్, జెడ్ ప్లస్ గట్రా సెక్యూరిటీతో తిరుగుతుంటారు. తిరిగే హక్కు అందరికీ ఉంది. ఎక్కడైనా తిరగొచ్చు. కానీ వాళ్ల తిరుగుళ్ల వల్ల సామాన్య జనానికి ఇబ్బంది ఉండకూడదు. వాళ్ల మనసులు గాయపడకూడదు. జనం కట్టిన పన్నులతో ఉబ్బిన సర్కారు ఖజానాకు చిల్లు పడకూడదు. కానీ ఇప్పడు జడ్జీల తిరుగుళ్ల వల్ల ఇవన్నీ యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

జడ్జీలు గుళ్లకు వెళ్లారన్న వార్తలు కొన్నేళ్లుగా మన ఘనత వహించిన తెలుగు దినపత్రికల్లో విపరీతంగా వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫొటోలతో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ పాఠకులకు ‘కనువిందు’ చేస్తున్నాయి. జడ్జీలు గతంలోనూ గుళ్లకు వెళ్లేవాళ్లు. కానీ అప్పుడు ఇలాంటి వార్తలు చాలా అరుదుగా వచ్చేవి. ఏ పత్రికలకైనా వాళ్లపై ప్రత్యేక గౌరవాభిమానాలు ఉంటే లోపలి పేజీల్లో ఏ మూలో సింగిల్ కాలమ్ లో పడేసేవి. కానీ ఇప్పుడు పత్రికలు ‘అభివృద్ధి’ చెందాయి కనుక ఈ వార్తలూ అభివృద్ధి చెందాయి. ఫలానా జస్టిస్ శర్మ, ఫలానా జస్టిస్ రెడ్డి, ఫలానా జస్టిస్ చౌదరి కుటుంబసమేతంగా(కుక్కలుంటే వాటితోనూ) ఫలానా ఆలయానికి వెళ్లి ఫలానా దేవుణ్ని, దేవతను దర్శించుకుని తరించారని(తరింపజేశారని!) భక్తిప్రపత్తి పదాలు దట్టంగా రంగరించిన వార్తలు వస్తున్నాయి. కొన్నిసార్లు మొదటి పేజీల్లోనూ వస్తున్నాయి. పేద్ద జడ్జీలైతే చాలాసార్లు పేజీల్లో పైన, బుల్లి జడ్జీలైతే మధ్యలోనో, అడుగునో వస్తున్నాయి. ఎక్కడో ఒకచోట రాకుండా మాత్రం పోవడం లేదు. ఇదంతా మెయిన్ పేజీల సంగతి. జిల్లా పేజీల సంగతి మీరే ఊహించుకోండి! ఈ వార్తలు తెలుగు పత్రికలకే ప్రత్యేకం. దేశంలోని మరే ఇతర భాషా పత్రికల్లోనూ ఇంత వెల్లువలా రావడం లేదు. పాశ్చాత్య దేశాల పత్రికల్లో అసలు రావడం లేదు. వాళ్ల వెనుకబాటుతనంతో మన పురోగతిని పోల్చుకుని బోర విరుచుకుని తిరగొచ్చు.

అసలు.. ఫలానా జడ్జీ ఫలానా గుడికి వెళ్లాడన్న విషయం వార్త అవుతుందా? అవుతుందని పత్రికలు చెబుతున్నాయి కనుక ఒప్పేసుకోవాలి. మరి ఆ జడ్జీ కూరగాయల కొట్టుకో, బట్టలకొట్టుకో, బస్టాండ్ లో మరుగుదొడ్డికో పోతే వార్త ఎందుకవదు? అక్కడ దేవుడు లేడు కనుక అవదా? లేకపోతే మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది కనుక అవదా? ఈ వార్తల వెనకున్న హిందూమతాధిపత్యం గురించి కూడా చెప్పుకోకపోతే విషయం పూర్తి కాదు. పత్రికల్లో గుళ్ల జడ్జీల వార్తలే వస్తాయి కాని, మసీదులకెళ్లే ముస్లిం జడ్జీల వార్తలు, చర్చీలకు వెళ్లే క్రైస్తవ జడ్జీల వార్తలు మచ్చుకు కూడా కనబడవు( మళ్లీ మంత్రులు, సినిమా తారలు గుళ్లకు వెళ్లినా, మసీదులకు, చర్చిలకు వెళ్లినా వార్తలే! సినీ తారలు వ్యభిచారం చేస్తూ పట్టబడితే పండగే పండగ). ఆ రకంగా మన పత్రికలు లౌకికవిలువలను బొంద పెట్టడంలో తమవంతు పాత్రను బహు చక్కగా పోషిస్తున్నాయి. తెలుగునాట డ్రైనేజీ స్కీములేక డేంజరుగా మారుతున్న భక్తిని కళ్లు బద్దలయ్యేట్లు పారిస్తున్నాయి.

దేవుళ్లను, పత్రికలను, పాఠకులను తరింపజేసే ‘జడ్జీల గుళ్ల సందర్శన’ వార్తలు మీడియా విప్లవంలో భాగం అనుకోవడం అమాయకత్వం. ఈ వార్తల వెనుక.. మేధావుల మాటల్లో చెప్పాలంటే రాజకీయార్థిక, సామాజిక కారణాలు ఉన్నాయి. ప్రతిఫలాపేక్ష వీటి అసలు ఉద్దేశం. పది, పదిహేనేళ్ల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పడు ఏపీ, తెలంగాణలో పచ్చ, గులాబీ, ఎరుపు, మువ్వన్నెల నానా రంగుల  పార్టీల నాయకులపై బోలెడు అవినీతి కేసులు నమోదయ్యాయి, అవుతున్నాయి. వీళ్లలో కొందరు ఢిల్లీ లెవెల్ నాయకులైతే, కొందరు హైదరాబాద్ లెవల్, గల్లీ లెవల్ లీడర్లు. వీళ్లలో చాలామందికి సొంత పత్రికలు, కొందరికి బాకా పత్రికలు, కొందరికి అవసరార్థం ఆదుకునే పత్రికలు ఉన్నాయి. వీళ్లు తరచూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు గుళ్ల చుట్టు తిరిగినట్లు. గుళ్ల జడ్జీల ముందు వినయంగా నుంచుని వాళ్ల ప్రశ్నలకు భక్తిప్రపత్తులతో జవాబులు చెబుతుంటారు. కోర్టుల్లో ఇండియన్ పంక్చువాలిటీ మరింత ఎక్కువ కనుక విచారణ ఏళ్లూపూళ్లూ సాగుతుంది. జడ్జీల ముఖారవిందాల సందర్శన భాగ్యాలూ పెరుగుతుంటాయి. బెయిళ్లు రావాలన్నా, తీర్పులు తమకు అనుకూలంగా రావాలన్నా జడ్జీలను న్యాయమార్గంలోనో, అన్యాయమార్గంలోనో ప్రసన్నం చేసుకోవాల్సిన అగత్యం తలెత్తుతూ ఉంటుంది. ఆ క్రమంలో న్యాయమార్గంలో.. సదరు ఘనత వహించిన న్యాయమూర్తులుంగార్ల భక్తిపారాయణతను అశేష ప్రజానీకానికి వెల్లడి చేసి, వాళ్ల అజ్ఞానాన్ని తమ జ్ఞానఖడ్గాలతో  సంహరించడానికి సదరు నిందితుల తరఫు పత్రికలు కంకణం కట్టుకుని జడ్జీల గుళ్ల ఫొటోలను, వార్తలను సప్తవర్ణాల్లో అచ్చోసి వదలుతుంటాయి. సదరు ఘనత వహించిన వాళ్లు వాటిని చూసి ఆనందకందోళిత మనస్కులై ‘నాకిది, నీకది’ న్యాయం ప్రకారం తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు. అందరూ జడ్జీలు అలా ఉంటారని కాదు. దేనికైనా మినహాయింపులు ఉండి తీరతాయి.

జడ్జీలు వాళ్ల మానాన వాళ్లు గుళ్లకు పోతుంటే పత్రికలు, టీవీ చానళ్లే హంగామా చేస్తున్నాయనే వాదనొకటి ఉంది. ఇది పచ్చి బూటకం. సాధారణ జనానికి మల్లే విలేకర్లకు, ఫొటోగ్రాఫర్లకు కూడా రాజకీయ నాయకుల, సినీ తారల(టీవీ సీరియల్ల పుణ్యమా అని టీవీ తారల) ముఖాలే బాగా పరిచయం. దేశానికంతా, లేకపోతే ఒక రాష్ట్రానికంతా తెలిసిన జడ్జీ ముఖం ఒక్కటీ లేదు. మరి ఈ అనామక(అముఖ!) జడ్జీలు తిరుపతి, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలకే కాక, మూరుమూల గ్రామాల్లోని అంకాళమ్మ, నూకాలమ్మ గుళ్లకు వెళ్లినా ఈ విలేకర్లకు, మీడియా ఫొటోగ్రాఫర్లకు ఎలా తెలుస్తోంది? అప్పటికప్పుడు కలాలు ఎలా చెలరేగిపోతున్నాయి? కెమెరాలు ఎలా క్లిక్కుంటున్నాయి? వీళ్లకు ఆ జడ్జీల రాక గురించి ముందస్తుగా ఏ కర్ణపిశాచాలు చెబుతున్నాయి? హైదరాబాద్ లో అయితే పెద్ద జడ్జీలను తరచూ చూసే విలేకర్లు ఉంటారని సరిపెట్టుకోవచ్చు. మరి ఆ జడ్జీలు మారుమూల గుళ్లకు వెళ్లినప్పడూ చాటంత వార్తలు, ఫొటోలు ఎలా వస్తున్నాయి? సులభంగానే ఊహించుకోవచ్చు. జడ్జీలు గుళ్లకు తమ పోకడ గురించి స్వయంగానో, అనుయాయుల ద్వారానో మీడియా చెవిన వేస్తున్నారు. అహాన్ని కొబ్బరికాయలా పగల గొట్టుకోవడానికి దేవుడి వద్దకు వెళ్లే ఆ న్యాయమూర్తులు ఇళ్ల నుంచి బయల్దేరే ముందు ‘మేమొస్తున్నామహో..’ అంటూ టాంటాం వేయుంచుకుని మరీ వెళ్తున్నారు. గుళ్లకు వెళ్లాకయినా అహన్ని చంపుకుంటున్నారా అంటే అదీ లేదు. వీళ్లకు పూజరులు పట్టుగుడ్డలతో శాస్ర్తోక్తంగా స్వాగతం పలుకుతారు. అప్పడు ఒక ఫొటో. ధ్వజస్తంభం దగ్గర మరో ఫొటో. గర్భగుడి ముందర మరో ఫొటో. తర్వాత దైవ దర్శనం(అప్పడూ దేవుడితో కలసి ఫొటో తీయుంచుకోవాలనే ఉంటుంది కాని, పాపం మరీ మొహమాటం). తర్వాత శఠగోపం పెట్టించుకుంటూ ఒక ఫొటో. ఆనక బయటకొచ్చి గాలిగోపురం ముందు కుటుంబసభ్యులతో మరో ఫొటో. అందరూ నిలబడి ఒకటి ఫోటో, నడుస్తూ స్లో మోషన్ లో మరో ఫొటో. మొహమాటానికైనా వద్దన్న పాపాన పోరు. అలా ఛాయాచిత్రగ్రాహకులు ఒకపక్క జడ్జీల ఫొటోలను తీస్తూ తరిస్తూ ఉంటే.. మరోపక్క సర్వాలంకారభూషితులైన దేవుళ్లు, దేవతలు తమవైపు కన్నెత్తి చూసే కెమెరా లేక బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఈ తతంగం మధ్యలో సాధారణ భక్తులను క్యూలలో పడేసి చిత్రవధ చేయడం.

అయితే ఈ గుళ్ల జడ్జీల వార్తల వల్ల జనానికి వచ్చిన నష్టమేంటి? ఒట్టి అక్కసు కాకపోతే అని కొందరనుకోవచ్చు. ఈ వార్తల వల్ల చాలా నష్టాలున్నాయి.

మొదటి నష్టం… పత్రికలను డబ్బులిచ్చికొనే పాఠకులకు వార్తలకు బదులు ఆ అవార్తలను, కువార్తలను చదవాల్సిన ఖర్మ పట్టడం.

రెండో నష్టం… ఆ వార్తలు పత్రికల్లో స్థలాన్ని కబ్జా చేయడంతో పాఠకులకు(ప్రజలకు) కచ్చితంగా తెలియాల్సిన  సంక్షేమ పథకాలు, తుపాను హెచ్చరికలు, రైళ్ల, బస్సుల రద్దు వంటి ప్రధానమైన వార్తలకు చోటు దక్కకపోవడం. దక్కినా అవి అరకొరగా, ఏ మూలో సర్దుకోవాల్సి రావడం. ప్రజలు ఎదుర్కొంటున్న కరువు, కొండెక్కుతున్న నిత్యావరసరాల ధరలు వంటి వార్తలకు కూడా ఇదే గతి పట్టడం. ఈ జడ్జీల వార్తలు క్రైమ్ వార్తల్లాంటివే. ఎలాగంటే.. క్రైమ్ వార్తలను సవివరంగా అచ్చేస్తున్న పత్రికలు జడ్జీల వార్తలనూ అలాగే అచ్చేస్తున్నాయి కనుక. గుడి గురించి, భక్తి గుర్తించి, ఆలయ సందర్శన భాగ్యం(దేవుడికి భాగ్యం!) గురించి సదరు జడ్జి వాక్రుచ్చిన మాటలు పొల్లుపోకుండా వస్తున్నాయి కనుక.

మూడో నష్టం… పత్రికలను ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉంచడానికి వీలుగా ప్రభుత్వం వాటికి ఇస్తున్న సబ్సిడీల లక్ష్యం దెబ్బతినడం. పత్రికలు వాడే కాగితం(న్యూస్ ప్రింట్)పై కోట్లలో సర్కారు సబ్సిడీలు ఇస్తోంది. న్యూస్ ప్రింట్లో ఎక్కువ భాగం దిగుమతి చేసుకునేదే. ఆ రకంగా విదేశీ మారక ద్రవ్యానికీ గండి. పోస్టల్ చార్జిల్లోనూ, ఇతరత్రా వ్యవహారాల్లోనూ సబ్సిడీలు ఉన్నాయి. ఈ సబ్సిడీలు ప్రభుత్వ పెద్దల కష్టార్జితంలోంచి కాక, గుళ్ల హుండీల్లోంచి కాక,  జనం కట్టే పన్నుల్లోంచి ఇస్తుండడం వల్ల అంతిమంగా ప్రజలకే తిరుపతి గుండు కొట్టడం. గుళ్ల బాపతు వార్తలు, రాజకీయ నాయకును కీర్తించే వార్తలు, జనం మధ్య చిచ్చు రేపే విద్వేష వార్తలతో, అబద్ధాలతో పత్రికలు సబ్సిడీల ఉద్దేశానికి గండికొడుతున్నాయి కాబట్టి వాటికి ఎలాంటి సబ్సిడీలూ ఇవ్వొద్దనే డిమాండ్ ఒకటి చాలా కాలం నుంచి వినిపిస్తోంది.

నాలుగో నష్టం… ఈ ప్రతిఫలాపేక్ష వార్తల వల్ల న్యాయవ్యవస్థ కొంతైనా ప్రభావితమై నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకోవడం, లేకపోతే తాత్కాలిక ఉపశమనాలు పొందడం. ఫలితంగా వాళ్ల నేరాల వల్ల దెబ్బతిన్న జనానికి న్యాయం జరక్కపోవడం. సందర్భం వేరు కావొచ్చు కానీ, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసులో సినీ నిర్మాతల వినతిపై కోర్టు అతనికి బెయిలిచ్చింది. అతడు విదేశాలకు వెళ్లి సినిమా షూటింగులు చేస్తున్నాడు. అతని సినిమాలు విడుదలై కోట్లు సంపాదిస్తున్నాయి. అతడు వీరోచితంగా కారుతో గుద్ది చంపేసిన మనిషి కుటుంబం, గాయపడిన వాళ్లు న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు, ఆకలితో మాడి చస్తున్నారు. సంజయ్ దత్ పెరోళ్లపైన పెరోళ్లపై ఇంటికీ జైలుకూ తేడా లేకుండా గడిపేస్తున్నాడు. జడ్జీలకు అన్ని సంగతులూ తెలుసు. కానీ ప్రముఖుల ప్రయోజనాలపైనే వాళ్లకు శ్రద్ధ. తమను కూడా ప్రముఖులుగా ప్రజలకు పరిచయడం చేసే గురుతర బాధ్యత తలదాల్చిన పత్రికలపై మాత్రం శ్రద్ధ ఉండదా?

***

ayalan kurdi

మొన్నామధ్య  పత్రికల్లో.. మన తెలుగు పత్రికల్లో కూడా గుండెలు మెలిపెట్టే ఫొటో ఒకటి వచ్చింది. సిరియా నుంచి యూరప్ కు వలస వెళ్తూ పడవ మునిగి చనిపోయిన సిరియా బాలుడు అయలాన్ కుర్దీ ఫొటో అది. సముద్రపుటొడ్డున విగతజీవిగా పడున్న ఆ మూడేళ్ల బాలుడి ఫొటో ప్రపంచ దేశాల మనసు కరిగించి, కన్నీరు పెట్టిస్తోంది. శరణార్థులకు ఆశ్రయమిస్తామని యూరప్ దేశాలు ముందుకొస్తున్నాయి. ఫొటో జర్నలిజం శక్తికి ఆ చిత్రం తాజా ఉదాహరణ. టర్కీ మహిళా ఫొటోగ్రాఫర్ నీలూఫర్ దెమిర్ ఆ ఫొటో తీసింది.

మన తెలుగు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా తలచుకుంటే అలాంటి ఫొటోలు ఎన్నో తీయగలరు. నగరాల్లో చితికిపోతున్న బాలకార్మికులు, అప్పులతో, కరువుతో పొలాల్లోనే పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకుంటున్న బక్క రైతులు, నానా చోట్ల దోపిడీపీడనలకు గురవుతున్న శ్రమజీవులు.. అనాథలు, అభాగ్యులు.. ఎంతమంది లేరు! నీలూఫర్ దెమిర్ కళ్లతో చూడాలే గాని మన చుట్టూ లక్షలాది అయలాన్లు కనిపిస్తారు! కానీ మన కెమెరా కళ్లు గుళ్ల జడ్జీలవైపు నుంచి చూపు తిప్పనంత కాలం వాళ్లు మనకు కనిపించరు. మన చెవులను కర్ణపిశాచాలు కొరుకుతున్నంత కాలం ఆ అభాగ్యుల ఆర్తనాదాలూ వినిపించవు…

*

 

కల్బుర్గి తల నవ్వింది..

 

-సత్యమూర్తి

 

ఒళ్లంతా నెత్తురోడుతున్న కల్బుర్గిని దేవదూతలు బలవంతంగా స్వర్గం వాకిట్లోకి తోసేశారు. ఆ వృద్ధుడు బలాన్నంతా కూడదీసుకుని మళ్లీ బయటకి రావడానికి ప్రయత్నించాడు. కానీ అడుగు ముందుకు పడ్డం లేదు. దేవదూతలు పగలబడి నవ్వారు.

‘అయ్యా, తమది వృథా ప్రయత్నం! ఒకసారి స్వర్గంలోకి వచ్చాక బయటికెళ్లడం అసాధ్యం. మీకు స్వర్గసుఖాల రుచి తెలియదు కనుక పారిపోవాలనుకుంటున్నారు. ఈ సాయంత్రానికి మీ మనసు మారిపోతుంది. ఆనక ఇక్కన్నుంచి వెళ్లగొట్టినా వెళ్లరు’ అని అన్నారు.

కల్బుర్గిని లక్ష యోజనాల పొడవూ, లక్ష యోజనాల వెడల్పూ ఉన్న స్వర్ణమందిరంలోకి తీసుకెళ్లి మేనకకు అప్పజెప్పి వెళ్లిపోయారు.

మేనక వగలు పోతూ కల్బుర్గి ముందు నిలబడి కొంటెగా చూసింది. అతడు ముక్కు మూసుకున్నాడు. అప్సరస వద్ద నుంచి చెమటకంపు గుప్పుమని కొడుతోంది. ఆమె కాసేపటి క్రితమే విశ్వామిత్రుడి గాఢపరిష్వంగంలో నలిగింది. విషయం గ్రహించి చప్పున పక్కనే ఉన్న పన్నీరు బుడ్డి తీసుకుని ఒంటిపై చల్లుకుంది. గాల్లోంచి పౌడరు రప్పించి ముఖానికి దట్టంగా పూసుకుంది. చెలికత్తెలు వీణలు సవరించారు. మేనక ‘మదనా మనసాయెరా..’ అని కీచు గొంతుతో పాట ఎత్తుకుని నర్తనం మొదలెట్టింది.

కల్బుర్గి చెవులు మూసుకున్నాడు. మేనక కంగారు పడిపోయింది. ఇలాగైతే పని కాదని, ఆటాపాటా ఆపి పాత అతన్ని గట్టిగా వాటేసుకుంది. కల్బుర్గి ఆమెను విసురుగా తోసేశాడు.

‘ఏమి చిత్రం? ఏమి చిత్రం? ఒక అల్పమానవ ముదుసలి నా బిగికౌగిలిని నిరాకరించుటయా?’ విస్మయంగా అందామె.

‘ఏవమ్మో, మాటలు జాగ్రత్త! అల్పుడూ గిల్పుడూ అంటే ఊరుకునేది లేదు. ముందు నన్నిక్కన్నుంచి పంపేయండి. హాయిగా మేఘాల్లో, పాలపుంతల్లో తిరుగుతూ ఉంటే మీ వెధవలు ఇక్కడికి లాక్కొచ్చి పడేశారు’ అన్నాడు కల్బుర్గి.

మేనక బుగ్గ నొక్కుకుని, మోహనంగా నవ్వింది.

‘భలే చిత్రంగా మాట్లాడుతున్నారే! నేను పుట్టి కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాలు అయ్యింది. మీలాంటి వింత మనిషిని ఎన్నడూ చూళ్లేదు..’

‘కాకి లెక్కలు చెప్పమాక. నువ్వు మేనకవూ కాదు. ఇది స్వర్గమూ కాదు. అవన్నీ పుక్కిటి పురాణాలు. ఆ మాట అన్నందుకేగా నన్ను తుపాకీతో కాల్చి చంపేసింది. ఇక్కడ.. ఇదంతా ఏదో మాయలా ఉంది. ఏదో పౌరాణిక సినిమా సెట్టింగులా ఉంది..’

మేనకకు అతను చెప్పింది బొత్తిగా అర్థం కాలేదు. అర్థం చేసుకోవాల్సిన అగత్యమూ లేదు కనుక దేవేంద్రుడి ఆజ్ఞ ప్రకారం ఆమె కల్బుర్గిని మళ్లీ వాటేసుకుని పెదవులను ముడేయబోయింది.

కల్బుర్గి ఈసారి మరింత విసురుగా తోసి ఆమె చెంప చెళ్లుమనిపించాడు.

‘ఎందుకలా మీదమీదపడిపోతున్నావ్? కోట్ల కోట్ల కోట్ల ఏళ్లుగా ఎంతమంది దగ్గర పడుకున్నావో ఏమో. ఎయిడ్సూ గట్రా సుఖరోగాలు తగిలుంటాయి. నాకు అంటించమాక.. దూరంగా ఉండు.. మీద పడితే మర్యాద దక్కదు సుమీ..’ అన్నాడు.

అప్సరస నిశ్చేష్టురాలైపోయింది.

‘మానవాధమా, నన్నే కొడతావా? వెంటనే శిలావిగ్రహమైపో!’ అని శపించింది.

కల్బుర్గి విరగబడి నవ్వాడు. అతడు రాయీ కాలేదు, రప్పా కాలేదు.

మేనక విస్తుబోయింది. మళ్లీ శపించింది.

కల్బుర్గి నిక్షేపంగా నవ్వుతూనే ఉన్నాడు.

మేనక కోపంతో చరచరా దేవేంద్రుడి వద్దకు వెళ్లింది. విషయం చెప్పి ముక్కు చీదింది. చీదింది కాసింత ఇంద్రుడిపైనా పడింది. సురపతి దానితోపాటు మూతికంటిన సురను కూడా తుడుచుకుంటూ నవ్వాడు.

‘భామినీ, కలత వలదు! అతడు హేతువాది. అందుకే నీ శాపం పనిచేయలేదు. దయ్యాలు భయపడేవాళ్లనే కదా భయపెడతాయి.. ఆ ముసలాణ్ని అలాగే వదిలేసి ఈసారి వశిష్టుడి పడగ్గదికి వెళ్లు.. ఎప్పుడూ రాజర్షితోనే పడుకుంటున్నావని వశిష్టుడు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నాడు…’ అన్నాడు.

***

కల్బుర్గికి స్వర్గంలో ఏమీ తోచడం లేదు. కొంపదీసి ఇదంతా కల కాదు కదా అనుకుని నాలుగైదుసార్లు గట్టిగా గిచ్చుకుని చూసుకున్నాడు. నొప్పి అనిపించలేదు. అయితే తను చనిపోయినట్టా? అనుమానం తీరక కల్పవృక్షం వద్దకెళ్లి ఒక కొమ్మ తెంపుకుని అరిచేతిపైనా, వీపుపైనా గట్టిగా కొట్టుకొట్టున్నాడు. నొప్పి పుట్టలేదు. రెండు రోజులుగా తనకు ఆకలేయనీ సంగతి కూడా గుర్తొచ్చి తను నిజంగా చనిపోయినట్లు నిర్ధారించుకున్నాడు. కానీ అది స్వర్గమని నమ్మలేకపోతున్నాడు. స్వర్గమైతే చచ్చిపోయిన మహానుభావులందరూ ఇక్కడే ఉండాలిగా, వాళ్లెవరూ కనిపించలేదే అని అనుమానమొచ్చింది.

ఇంతలో ఓ దేవదూత తలపై పెద్ద మధుభాండంతో అటుగా పోతూ కనిపించాడు. కల్బుర్గి అతని వద్దకెళ్లాడు.

‘ఇదుగో అబ్బాయ్. ఇది స్వర్గమేనంటావా? అయితే  మీ దేవేంద్రుడెక్కడోయ్?’ అని అడిగాడు.

దేవదూత విస్తుబోయాడు.

‘ఇది స్వర్గమేనండి. అయినా మీకా అనుమానం ఎందుకొచ్చింది?’ ఎదురు ప్రశ్న వేశాడు.

‘బతుకంతా ప్రతీదాన్నీ ప్రశ్నించి ప్రశ్నించి అలా అలవాటైందిలే. సరేగాని, తలపైన ఏమిటోయ్ తీసుకెళ్తున్నావ్? మాంచి వాసన వస్తోంది..’

‘ఇదా? మేలురకం మద్యం. దేవేంద్రుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. ఆయనగారింట్లో నిండుకుందని చెబితే పట్టుకెళ్తున్నా..’

‘సరేకానీ, నాక్కాస్త పోయవూ! ఆకలిదప్పుల్లేక నోరంతా అదోలా అయిపోయింది..’

‘అమ్మబాబోయ్. ఈ మధువా? మీకా? కుదర్దండి. ఇది దేవాధిదేవుడైన ఇంద్రులవారిది.. ఆయనే తాగాలి’

‘బోడి ఇంద్రుడు లేవోయ్. మా పక్క ఆయన్ని తార్పుడుగాడు అని గౌరవిస్తాం లెద్దూ.. అయినా మీ దేవతలకు ఆకలిదాహాలు ఉండవు కదా. మరి అల్పమానవుల మాదిరి ఈ సారాయిపై అంత కక్కుర్తి ఏమిటోయ్? అచ్చోసిన ఆంబోతుల మాదిరి రంభామేనకలపై ఆ పశువాంఛలేమిటోయ్?’

దేవదూతకు మాట పెగల్లేదు. కల్బుర్గి దేవదూత తలపై ఉన్న భాండాన్ని కాస్త వంచి కడుపారా మద్యం తాగాడు. మనసు కుదుట పడింది.

దేవదూత ఆశ్చర్యం నుంచి తేరుకున్నాడు.

కల్బుర్గి అతన్ని గట్టిగా గిచ్చాడు. దేవదూత కెవ్వుమన్నాడు. అల్పమానవుడు ఊరుకోలేదు. దేవదూతను కితకితలు పెట్టాడు. భాండం జారిపడి రోదసిలోకి వెళ్లిపోయింది.

దేవదూత కల్బుర్గికి దండం పెట్టి తనను వదిలేయమన్నాడు. ఏదో మంత్రం వేసి భాండాన్ని మళ్లీ పైకి రప్పించి తలపై పెట్టుకున్నాడు. కల్బుర్గి మళ్లీ  భాండాన్ని వంచబోయాడు.

‘బాబ్బాబూ, మీ పుణ్యముంటుంది! దాన్ని ముట్టుకోకండి. కావాలంటే వేరొక మద్యం తెస్తా. ఇంద్రుల వారి మద్యాన్ని ఎంగిలి చేశారంటే నా మెడకాయపై తలకాయ ఉండదు’

‘అంతగా వణికిపోతున్నావ్, నువ్వేం దేవుడివోయ్? మెడపైన తలకాయ పోతే మళ్లీ అతుక్కుంటుంది కదా, వినాయకుడి తలకాయలాగా. ఆ మందు తాగకపోతే మాత్రం నేను మళ్లీ చావడం ఖాయం..’ అంటూ కల్బుర్గి భాండాన్ని వంచి గుటకలేశాడు.

‘చచ్చిన పుణ్యాత్ములందరూ ఇక్కడికొస్తారంటారు కదా. మరి, మా వీరశైవ బసవన్న ఎక్కడున్నాడోయ్? ’ అని మత్తుగా అడిగాడు.

దేవదూత దివ్యదృష్టితో పరికించి చూశాడు.

‘ఇక్కడికి దగ్గర్లోనే ఉన్నాడు. అదుగో ఆ మలుపు దాటితే శివాలయం వస్తుంది. అక్కడ అరుగుమీద కూర్చుని వచనాలు వల్లెవేస్తున్నాడు’ అని చెప్పి గబగబా వెళ్లిపోయాడు దేవకింకరుడు.

కల్బుర్గి కాస్త తూలుతూ బసవడి దగ్గరకు వెళ్లాడు.

బసవడు అరుగుపైన శివలింగం పెట్టుకుని అరమోడ్పులతో శివశివా అంటూ ఊగిపోతున్నాడు.

‘అయ్యా..’ పిలిచాడు కల్బుర్గి.

బసవడు పలకలేదు. కల్బుర్గి మళ్లీ పిలిచాడు. వీరశైవుడు పలకలేదు. కల్బుర్గికి మండుకొచ్చి భక్తునికి తొడపాశం పెట్టాడు. బసవడు కెవ్వుమన్నాడు.

‘అయ్యా, నా పేరు మల్లేశప్ప మడివాళప్ప కల్బుర్గి. మీ కన్నడం వాడినే.  కొంతమంది వీరభక్తాగ్రేసులు ఇంటికొచ్చి మరీ కాల్చేసిన పుణ్యం ఫలితంగా ఇక్కడికొచ్చాను.. ఆ పుణ్యంలో మీకూ వాటా ఉందిలెండి..’ అన్నాడు వెటకారంగా.

బసవడు తికమకపడ్డాడు.

‘నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు.. వివరించి చెప్పు’

‘చెబుతా, చెబుతా. ముందు ఆ బారెడు కత్తిని ఒడిలోంచి తీసి పక్కన పెట్టండి. సంఘసంస్కారం కోసం అంతగా తపనపడ్డ మీకు చచ్చాకా ఈ కత్తీగట్రా ఎందుకండీ? కొంపదీసి ఇక్కడా వీరశైవం ప్రచారం చేస్తున్నారా, ఏమిటీ?’

బసవడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.

‘నా ముచ్చట తర్వాత. ముందు నీ సంగతీ, నీ హత్య వల్ల నాకు దక్కిన పుణ్యం సంగతీ చెప్పు’

‘అయ్యా, నేను మీ భక్తివచనాలపై లోతైన పరిశోధన చేశాను. మీలాగే మూఢనమ్మకాలపై అలుపెరగకుండా పోరాడాను. ఓ విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేశాను. ఇరవైకి పైగా పుస్తకాలు, నాలుగొందలకుపైగా వ్యాసాలు రాశాను.. మీ కుటుంబం గురించి, విగ్రహాల పూజ గురించి కొన్ని ప్రశ్నలు లేవదీసినందుకు నన్ను చంపేశారు..’

‘చిత్రంగా ఉందే! నేను కలగన్న మూఢవిశ్వాసాల్లేని కన్నడసీమ ఇంకా సాకారం కాలేదా? ఇంతకూ నాపైన నీ విమర్శలేంటో?’

‘ఏవో కొన్ని ప్రతిపాదనల్లెండి. మీ రెండో భార్య నీలాంబికతో మీ కాపురం వొట్టి అమలిన శృంగారం అని అన్నాను. దానికి వచనాల్లోంచి రుజువులు చూపాను. మీ మేనల్లుడు చెన్నబసవడు మీ చెల్లెలు నాగలాంబికకు, మాదిగవాడైన దోహర కక్కయ్యకు పుట్టి ఉండొచ్చని, పండితులు ఆ సంగతి దాచారని అన్నాను.. దానికీ కొన్ని ఆధారాలు చూపాను..’

బసవడి ముఖం కందిపోయింది. కోపాన్ని బలవంతంగా అణచుకున్నాడు.

‘ఇంకా..’

‘ఇంకా అలాంటివేవో కొన్ని. మీరు జంధ్యం వద్దన్నారు కానీ, మెడలో మాత్రం ఇష్టలింగాన్ని ఎందుకేసుకోమన్నారు అని ప్రశ్నించా. విగ్రహారాధన కూడదని వాదించాను. జనం పాలూపెరుగూ లేక మాడిపోతోంటే రాతిబొమ్మలకు పంచామృతాభిషేకాలు ఎందుకన్నా.. జనం కట్టుగుడ్డలు లేకుండా వణికిపోతోంటే స్పర్శలేని దండగమారి బొమ్మలకు పట్టుగుడ్డలెందుకని ప్రశ్నించా. ఇవన్నీ నా చావుకు తెచ్చాయి..’

బసవడికి కోపంతో పాటు ఆసక్తీ తన్నుకొస్తున్నాయి.

‘కల్బుర్గీ! ఇష్టలింగధారణలో తప్పేముందోయ్.. ఆలయాల్లో డంబాచారాలకు విరుగుడుగా ఆ పద్ధతి తెచ్చాను.. పొదుపుకు పొదుపూ, భక్తికి భక్తీ. శివుడెప్పుడూ మెడలోనే ఉంటాడు..’

‘మీకు తప్పుగా అనిపించలేదు. నాకనిపించింది. విగ్రహారాధన కూడదని నా వాదన. అది గుళ్లో ఉన్నా, మెడలో ఉన్నా శుద్ధ దండగ. మీరు జంధ్యం దండగన్నారు. నేను లింగం దండగన్నాను..’

‘అది కాదోయ్.. ఏకాగ్రత కోసం లింగాన్ని వేసుకోమన్నా.. ’

‘నాకు కాఫీ, సిగరెట్టు తాగితే ఏకాగ్రత. కానీ నేను వాటిని మెడకు కట్టుకుని ఊరేగను..’

‘సరే ఇంకా ఏమని వాదించావు..’

‘ఇలాంటివేనని చెబుతున్నాగా..’

‘ఓసోస్.. ఈ మాటలకే చంపేశారా? ఇలాంటి వాదవివాదాల కోసమే కదా అనుభవ మంటపం పేరుతో జాతిమతవర్ణలింగ వివక్షల్లేకుండాల అందరూ వచ్చి చర్చించుకోవడానికి భవనం కట్టించాను..’

’ఆ భవనం ఎప్పుడో కాలగర్భంలో కలసిపోయింది. తమకు నచ్చని వాదాన్ని వినిపించేవాళ్లను కాలగర్భంలో కలిపేయడమే నేటి వాదం. దానికోసం సరికొత్త అనుభవ మంటపాలు తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి..’

‘ప్చ్. ఇదేం బాగాలేదోయ్ కల్బుర్గి..’

కల్బుర్గి బసవడు ఆరాధిస్తున్న శివలింగం కేసి చూశాడు. పీకలదాక మధువు తాగడంతో కడుపుకింద ఒత్తిడి పెరిగింది.

‘మరో సంగతి చెప్పడం మర్చిపోయానండి. నన్ను ఖూనీ చేయడానికి మరో కారణం కూడా ఉందండోయ్..’

బసవడు చెవులు రిక్కించాడు.

‘అనంతమూర్తి అని నా స్నేహితుడొకడుండేవాడు. గత ఏడాదే పోయాడు. నా మాదిరే వాదించేవాడు. నా మాదిరే విగ్రహాలంటే పడదు. అతడు బాల్యంలో ఓ మంచి పని చేశాడు. విగ్రహాలకు మహిమ ఉందో లేదో తేల్చడానికి విగ్రహాలపై ఉచ్చ పోశాడు. అవి శపిస్తాయేమోనని చూశాడు. అవి ఏమీ చేయకపోవడంతో మనోడికి మరింత ధైర్యం వచ్చేసింది. ఆ సంగతి ధైర్యంగా ఓ పుస్తకంలో రాశాడు. నేను ఓ చర్చలో ఆ విషయం చెప్పాను. కాషాయమూకలకు అది నచ్చలేదు. అప్పటికే నాపైన కత్తులు నూరుతున్నారు కదా. సఫా చేసేశారు..’

బసవడు ‘శివశివా’ అని చెవులు మూసుకున్నాడు.

కల్బుర్గికి కడుపుకింద ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. బుర్రలో బలమైన సరదా కూడా మెలిపెడుతోంది.

‘వీరశైవరత్నమా.. మీరు మరోలా అనుకోకపోతే ఒక మాట..’

‘చెప్పు..’

‘ఇది స్వర్గం కదా. ఇక్కడికొచ్చినవారికి చావు ఉండదు కదా.. అనంతమూర్తి చేసిన పరీక్షను నేను బతికున్నప్పుడు ఎన్నడూ చేయలేకపోయానండి. ఇప్పడు జరూరుగా చేయాలనిపిస్తోందండి. మీరు  కాస్త అరుగు దిగితే ఈ శివలింగంపై ఆ పని కానిచ్చేస్తాను..’

కల్బుర్గి మాట పూర్తికాకుండానే బసవడు ఖడ్గంతో ఒక్కవేటున అతని తల నరికేశాడు.

శివలింగం పట్టపానంపై పడిన కల్బుర్గి తల విరగబడి నవ్వుతోంది.

కల్బుర్గి పొట్టకింద నుంచి సన్నని ధార రాతి విగ్రహాన్ని తడుపుతోంది.

 

 

(మతోన్మాదులు చంపేసిన కల్బుర్గికి క్షమాపణతో నివాళిగా..)

కోతిస్వామ్యంలో విపక్షం

 

 

సత్యమూర్తి

కోతుల రాజ్యం చట్టసభ అరుపులతో, కేకలతో దద్దరిల్లుతోంది. అధికార, విపక్ష కోతులు సభాధ్యక్ష స్థానం ముందుకు దూసుకొచ్చి గొడవ చేస్తున్నాయి.

‘‘మన రాజ్యం సొమ్మును దోచుకెళ్లిన ఆ నల్లకొండముచ్చును గంపెడు బాదం పప్పులు తీసుకుని కట్లువిప్పి వదిలేసిన మంత్రి బొట్టమ్మ రాజీనామా చెయ్యాలి.. రాజీనామా చెయ్యాలి..’’ విపక్ష కోతులు గట్టిగా అరిచాయి.

బొట్టమ్మకు కోపం మండుకొచ్చింది. తోకను నిలువునా నిక్కబొడుచుకుని, కోరలు బయటపెట్టి గుర్రుమంది.

‘‘మీ పీకల్ని కసుక్కున కొరికేస్తా. ఆ కొండముచ్చు పెళ్లాం చావుబతుకుల్లో ఉందంటే సాటి కోతిజాతిదే కదా అని జాలిపడి దాన్ని వదిలేశా. అది పెళ్లాం దగ్గరికిపోకుండా ముండదగ్గరికి పోతుందని నాకేం తెలుసు? నేను బాదం పప్పులూ తీసుకోలేదు, గీదం పప్పులూ తీసుకోలేదు. మేం తిన్న గంపెడు పప్పులూ నేనూ, నా మొగుడూ, కూతురూ సొయంగా చెట్టెక్కి తెంపుకుని పగలగొట్టుకుని తిన్నవి. ఆ పిప్పి చూసి తెగ కుళ్లుకుంటున్నారు. నేను రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి.. బస్తీమే సవాల్..’’ అని కసిరింది.

‘‘నువ్వు గంపెడు బాదం పప్పులు తీసుకునే వదిలేశావు. ఈ దేశంలోని కోతులకు రెండు బాదం గింజలు దొరకడమే గగనంగా ఉంటే నీకు గంపెడు ఎలా వచ్చాయ్? గడ్డి కరిచానని, తప్పు ఒప్పేసుకుని, రాజీనామా చెయ్!’’ విపక్ష కోతులకు పెద్ద అయిన బోడెమ్మ అరిచింది. అసలే ఎర్రగా ఉన్న దాని ముఖం కోపంతో మరింత ఎరుపెక్కింది. బోడెమ్మకు దాని బిడ్డ గట్టిగా వంత పలికింది. ‘‘బాదం పప్పులు మింగిన బొట్టమ్మ గద్దె దిగాలి. పెద్దమంత్రి బవిరిగడ్డం వెంటనే ఇక్కడికొచ్చి జవాబు చెప్పాలి!’’ అని గొంతు పగిలేలా అరిచింది.

విపక్ష కోతులు చప్పట్లు చరిచాయి.

బొట్టమ్మ తోక మరింత ఉబ్బింది.

‘‘ఒసే బోడీ.. నోరు మూసుకోవే! నువ్వూ, నీ మొగుడూ ఆనాడు చిప్పెడు దోసగింజలు పుచ్చుకుని ఒకటి కాదు, రెండు దొంగముండా తెల్లకొండముచ్చులను వదిలేయలేదా? ఒరే బోడెమ్మ కొడుకా! నోటికొచ్చినట్టు వాగమాక. ఇంటికెళ్లి నీ వంశ చరిత్ర చదువుకో!’’

మూడువందల అధికార కోతులు కిచకిచ నవ్వుతూ గట్టిగా చప్పట్లు కొట్టాయి. సభ భూకంపం వచ్చినట్టు కంపించిపోయింది.

విపక్ష కోతులు కూడా వెనక్కి తగ్గలేదు. అన్నీ కలిపి నలబయ్యే ఉన్నా కోరలు బయటపెట్టి సత్తువకొద్దీ భీకరంగా గుర్రుమన్నాయి.

అధికార కోతులు కాస్త భయపడ్డాయి. వెంటనే తేరుకుని, ‘‘విపక్షం కోతిస్వామ్యాన్ని హత్య చేస్తోంది’’ అని నినదించాయి.

సభాధ్యక్ష కోతి చిద్విలాసంగా నవ్వింది. అధికార అరుపులు దానికి కర్ణపేయంగా అనిపించాయి.

‘‘అవును, విపక్షం కోతిస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది, పూడ్చేస్తోంది, కాల్చేస్తోంది. విపక్ష కోతులకు రేపట్నుంచి ఇక మాట్లాడే అవకాశమే ఇవ్వను’’ అంటూ సభను వాయిదా వేసింది.

***

Painting: Slade Smiley

Painting: Slade Smiley

అధికారపక్ష కోతులన్నీ పసనచెట్టు కొమ్మలమీద సమావేశమయ్యాయి.

‘‘సభ ఇట్లా సాగితే కష్టం. విపక్ష కోతులు చెప్పేదే నిజమని దేశం నమ్మే ప్రమాదముంది. అందుకే ఎదురుదాడి చేయండి. బోడెమ్మపై, బోడెమ్మ కొడుకుపై నానా నిందలూ వెయ్యండి. కోతిస్వామ్యాన్ని మనం కాదు, అవే హత్య చేస్తున్నాయని చాటింపు వెయ్యించండి..’’ పెద్ద మంత్రి బవిరిగడ్డం ఆదేశించింది.

భేటీ ముగిసింది. బవిరిగడ్డం చెట్లకొమ్మలు పట్టుకుని నాలుగు యోగాసనాలు వేసింది. ఆయాసం తీర్చుకుని దోనెడు తేనెతాగి బ్రేవ్ మని త్రేన్చింది. చచ్చిన మిణుగురుపురుగులను తన పేరులా అతికించిన పట్టు చొక్కా వేసుకుని, నీటిగుంటలో తనను తాను చూసుకుంటూ తెగమురిసిపోయింది. ఇంతలో రాజ్యపెద్ద తెల్లగడ్డం నుంచి పిలుపు వచ్చింది.

***

‘‘నాయనా, బవిరిగడ్డమూ! పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సుమీ. అసలు నువ్వు రావేమోనని కాస్త భయపడ్డాను. సభలో అధికార కోతులు తమ గొంతు నొక్కేస్తున్నాయని విపక్ష కోతులు నాకు తాటాకు ఫిర్యాదు చేశాయి. సభాధ్యక్ష కోతి తీరు నాకేం నచ్చలేదు. అది మీ పక్షమే కావొచ్చు, కానీ మనకొక సభానీతి, న్యాయమూ ఉంది. ఎంతైనా మనది కోతిస్వామ్యం. కొన్ని కనీస విలువలూ, సంప్రదాయాలూ పాటించాలి. కనీసం పాటిస్తున్నట్టు నటించనైనా నటించాలి. విపక్షాన్ని మాట్లాడనివ్వాలి.. ఒక్క విపక్షాన్నే కాదు గొంతుక ఉన్నవాళ్లందరినీ మాట్లాడనివ్వాలి.. గొంతుకలేనివాళ్ల మూగగొంతుకలనూ వినాలి..’’ తెల్లగడ్డం పండిన జామపండును కొరుకుతూ అంది.

బవిరి గడ్డం చిరాగ్గా చూసింది.

‘‘నువ్వెప్పుడూ ఇంతే. ఎప్పుడూ ఆ పాతకాలం సొల్లు కబుర్లే చెబుతావు. ఈ దేశంలోని అశేషవానరానీకం మమ్మల్ని ఎన్నుకున్నది మా మాటలు వినడానికే కానీ విపక్షం మాటలు వినడానికి కాదు. నీకు తల పండిపోయింది కానీ, బుర్ర పండలేదు..’’

తెల్లగడ్డం నొచ్చుకుంది. అయినా పట్టించుకోకుండా తన ధర్మాన్ని పాటించింది.

‘‘బవిరిగడ్డమూ! నా మాటలు నీకు కోపం తెప్పిస్తాయి. అయినాసరే, నిష్కర్షగానే మాట్లాడదలచుకున్నా. నీకు దేశస్థాయి రాజకీయాల్లో అనుభవం తక్కువ కనుక ఇలా అవివేకంగా మాట్లాడుతున్నావు. ఈ సువిశాల వానరరాజ్యంలో నువ్వు ఇదివరకు ఓ  మండలానికే పెద్దమంత్రిగా పనిచేశావు. దేశానికి ఎట్లా పెద్దమంత్రివయ్యావో నీ అంతరాత్మకు తెలుసు, నువ్వాడిన అబద్ధాలకు తెలుసు, నీ మండలంలో పారిన చిన్నకోతుల నెత్తురుకు తెలుసు. నీ చేతులకింకా ఆ నెత్తుటి మరకలు పోలేదు. పోనీ, ఇప్పుడైనా మారావా, అంటే అదీ లేదు. ఇప్పుడూ అవే మాటలూ, అవే చేతలూ! కోతిస్వామ్యం అంటే ఆటవికస్వామ్యం కాదు నాయనా. ఎదుటి కోతి చెప్పింది వినడం, జవాబివ్వగలితే ఇవ్వడమే కోతిస్వామ్యం. ఆ కోతి మాటను ఖండించు. కానీ ముందు దాని మాటను సాంతం విను. నువ్వు అధికారంలో ఉన్నావు కనుక నీకు మాట్లాడే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకేగా మరుగుదొడ్డి కాన్నుంచి అంతర్జాతీయ మహాసభ వరకు ఎక్కడ అవకాశం దొరికినా నోట్లో బారెడు బాకా పెట్టుకుని కోతుల కర్ణభేరీలను బద్దలుగొడుతున్నావు. మరుగుదొడ్డి నుంచి మంత్రతంత్రాల వరకు దేనిపైనైనా ఏకధాటిగా వదురుతున్నావు. సభలే కాకుండా నెలకోసారి గొట్టం పట్టుకుని మనసులో మాటంటూ ఉన్నదీ లేనిదీ చెప్పి మాయ చేస్తున్నావు.

ఇన్ని అవకాశాలూ నీకు కోతిస్వామ్యమే కదా ఇచ్చింది. విపక్షమూ, విపక్ష గొంతుకా లేని కోతిస్వామ్యం ఉండదు నాయనా. ఉన్నా నేతిబీరకాయే. అందుకే నువ్వు మన కోతిస్వామ్యపు మౌలిక విలువల గురించి బాగా తెలుసుకోవాలి. చూస్తూంటే నీకు అందులో ఓనమాలు కూడా తెలియనట్టుందే..’’

తెల్లగడ్డం ఆయాసంతో విరామం తీసుకుంది.

బవిరిగడ్డం ముఖం కందగడ్డగా మారిపోయింది.

‘‘విపక్షం, విపక్షం..! అసలు అధికార పక్షం లేకపోతే విపక్షమెక్కడ?’’  అని అరిచింది.

‘‘నేనూ ఆ మాటే ఇంకోలా అడుగుతున్నా. విపక్షం లేకపోతే అధికార పక్షమెక్కడ?’’

‘‘నువ్వెన్నయినా చెప్పు. అధికారంలో ఉన్నవాళ్ల మాటే చెల్లుబాటు కావాలి. అంతే..’’

‘‘మూర్ఖంగా మాట్లాడక. అధికారం శాశ్వతం కాదు. మీ పక్షం ఇదివరకు విపక్షమన్న సంగతి మర్చిపోకు. నీ పదవీ కాలం పూర్తయ్యాక, ఎన్నికల్లో ఓడితే నువ్వూ విపక్షంలోనే కూర్చుంటావు. అప్పుడూ ఇలాగే మాట్లాడతావా? విపక్షం ఉన్నది అధికార పక్షాన్ని విమర్శించడానికి కాక వత్తాసు పలకడానికా? పూర్వం నీలాగే.. అధికారంలో ఉన్నవాడి మాటకు ఎదురులేదని విర్రవీగి పతనమైన రాజుకోతి కథ చెబుతాను విను.. ’’

బవిరిగడ్డానికి ఈ మాటలు విసుగనిపించినా, రాజులన్నా, రాజుల కథలన్నా ఇష్టం కనుక చెవులు రిక్కించింది.

‘‘పూర్వం ఒక రాజుకోతి ఉండేది. అది నపుంసక కోతి కావడం వల్ల తనకు దక్కని రతిసౌఖ్యం మిగతా కోతులకు దక్కొద్దని రాజ్యంలో రతి కార్యాన్ని నిషేధించింది. దానికి నిర్బంధ బ్రహ్మచర్య చట్టం అని దొంగపేరు పెట్టింది. అది రాజరిక వ్యవస్థే అయినా భిన్నాభిప్రాయాలు వినడంలో తప్పేమీలేదని రాజుకోతి ఆస్థానంలో తీర్మానం తెచ్చి చర్చ పెట్టింది. ఆస్థాన కవి క్రియాశక్తీ, పెద్దమంత్రీ ఆ చట్టాన్ని వ్యతిరేకించాయి. శృంగారాన్ని నిషేధిస్తే జీవితంలో రుచిపోతుందని వాదించింది కవికోతి. రతికార్యంలో రుచేమీ లేదని స్వానుభవంతో తెలుసుకున్న రాజుకోతి కవి మాటను తోసిపుచ్చింది. మన్మథకార్యంపై నిషేధం ప్రకృతి విరుద్ధమని వాదించింది పెద్దమంత్రి. ప్రకృతి శక్తులను జయించడమే కోతి లక్షణమంటూ ఆ అభ్యంతరాన్నీ తోసిపుచ్చింది రాజుకోతి. తీర్మానం నెగ్గింది. రతి నిషేధం అమల్లోకి వచ్చింది. పెళ్లి వ్యవస్థ రద్దయింది. పెళ్లయిన కోతులు విడాకులు తీసుకోవాలని తాఖీదులు జారీ అయ్యాయి. శాసనాన్ని అమలు చెయ్యడానికి బోలెడు కోతులు కావాల్సి వచ్చింది. నిరుద్యోగం తగ్గింది. రాజుకోతికి మరో చక్కని ఆలోచనా వచ్చింది. ఆడామగా కోతులను విడదీయడానికి దేశం మధ్యన ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఇరవై అడుగుల గోడకట్టించి తూర్పువైపున ఆడకోతులను, పడమటివైపున మగ కోతులను ఉంచింది. అయితే ఈ చట్టం వల్ల వచ్చే తరానికి కోతులే ఉండవని పెద్దమంత్రి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చిక్కు సమస్యేనని తోచింది రాజుకోతికి. రతిపై నిషేధం, ప్రజావృద్ధి అనే భిన్న కోణాలను సమన్వయం చేయడంపై బుర్ర చించుకుంది. రాజ్యంలో మంచిప్రవర్తన గల మగకోతులను ఎంపిక చేసి, అవి నెలకు రెండు మూడుసార్లు తూర్పు వైపుకు వెళ్లడానికి ఏర్పాటు చేసింది. నిర్బంధ బ్రహ్మచర్యానికి అపరాధంగా స్వచ్ఛంద వ్యభిచారం. అయితే మళ్లీ ఒక సమస్య వచ్చిపడింది. తన తదనంతరం రాజ్యాన్ని ఎవరు పాలించాలీ అని. తనకు వారసులు లేరు, ఉండరు కనుక పక్కరాజ్యం దండెత్తి రాజ్యాన్ని ఆక్రమించుకుంటుంది. ఈ సమస్యకూ పరిష్కారం దొరికింది. పడమటి కొండల్లోని ఓ యోగికోతికి మహత్యాలున్నాయని తెలుసుకుని అంతఃపురానికి తీసుకొచ్చింది రాజుకోతి. యోగికి అక్కడ పరిచర్యలు జరిగాయి. యోగి మహిమతో రాజుకోతి తండ్రి వితంతువుల్లోని అందమైన కోతి గర్భం దాల్చింది. పదినెలలు తిరిగే సరికి రాజుకు పండంటి తమ్ముడు కోతి పుట్టింది. సమస్య తీరింది. అయితే తూర్పువైపున్న ఆడకోతులూ పిల్లల్ని కనేయసాగాయి. రాజుకోతి ఆశ్చర్యపోయింది. మగకోతి సంపర్కం లేకపోయినా తన పిన్నమ్మకు పిల్ల పుట్టింది కనుక తతిమ్మా ఆడకోతులు పిల్లలను కనడానికీ ఆ యోగి మహిమే కారణమని నమ్మింది. రాజ్యపాలన సుఖంగా సాగుతుండగా రెండేళ్ల తర్వాత పక్క రాజ్య సైన్యం దండెత్తి వచ్చింది. దాన్ని ఆస్థాన కవి క్రియాశక్తే తీసుకొచ్చింది. పక్క రాజ్య సైన్యాధిపతికోతి రాజుకోతిని గద్దె దింపి తమ్ముడు కోతిని ఎక్కించి తానే పాలించసాగింది. సదరు సైన్యాధిపతికీ ఈ సంతాన వ్యవహారంపై అనుమానమొచ్చింది. యోగికోతి చలవే కాబోలనుకుంది. అయితే అడ్డుగోడ కింద అటునుంచి ఆడకోతులూ, ఇటు నుంచి మగకోతులూ తవ్విన సొరంగాలు ఉన్నాయన్న సంగతి తర్వాత బయటపడింది. అయినా ఆడామగా కోతులు అవి తాము తవ్వలేదని, పందికొక్కుల పని అయ్యుంటుందని అన్నాయి…’’

తెల్లగడ్డం కోతి కథ పూర్తిచేసింది.

బవిరిగడ్డం ముఖం మాడిపోయింది.

‘‘అందుకే నాయనా, ఇంతలా నెత్తీనోరూ కొట్టుకుని చెబుతున్నాను. కోతిస్వామ్యానికి విపక్షం రతికార్యమంత అవసరమైనది, సహజమైనది. అది లేకపోతే చర్చ ఉండదు. సంభాషణా ఉండదు. భవిష్యత్తూ ఉండదు. ఆటవికత్వం రాజ్యమేలుతుంది. మనం కోతులం. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. మాట్లాడే శక్తి ఇచ్చాడు. మాట్లాడుకుందాం, తిట్టుకుందాం, అరచుకుందాం, గుర్రుమందాం. ఆ కోతులు నీ తప్పులను ఎండగట్టనీ. నువ్వూ వాటి తప్పులను ఎండగట్టు. అంతే కానీ వాటి గొంతు నొక్కేయకుమీ, కోతిస్వామ్యానికి కళంకం తేకుమీ.. నీ పుణ్యం ఉంటుంది..’’

 

(ఈ కథలోని నపుంసక రాజుకోతి కథ శ్రీశ్రీ రాసిన ‘మొహబ్బత్ ఖాన్’కు కొన్ని మార్పులతో సంక్షిప్తం)

పెద్దకోతుల ధర్మం

సత్యమూర్తి

‘‘ఇది ఒక నిండు ప్రాణంతో ముడిపడిన సమస్య నాయనా! నిదానంగా ఆలోచించు. ఆప్తులను పోగొట్టుకున్న మనకు ప్రాణం విలువేంటో బాగా తెలుసు. అందుకే తొందరపడొద్దని అంటున్నాను. నామటుకు నాకు ఆ చిన్నకోతిని చంపేయకుండా.. జీవితాంతం అలా చెట్టుకు కట్టేస్తేనే మేలనిపిస్తోంది. మన వానరజాతి ధర్మగ్రంథాలు, శిక్షాస్మృతులు అలానే చెబుతున్నాయి. ఆ కోతిని మనం పట్టుకోలేదు. పశ్చాత్తాపంతో అదే లొంగిపోయింది. నేరం ఒప్పుకుంది. చెరలోనే ముసలిదైపోయింది. ఆ జీవచ్ఛవాన్ని అలా వదిలెయ్. అయినా అది మహా బతికితే రెండు, మూడేళ్లకంటే ఎక్కవ బతకదు. అంతేకదా.. ఆ మాత్రం దానికి ధర్మభ్రష్టులం కావడమెందుకు?’’

తెల్లగడ్డమున్న ముసలి కోతి పున్నమి చంద్రున్ని చూస్తూ అంది. అడవి వెన్నెల్లో తమకంతో స్నానమాడుతోంది. ముసలి కోతి కూర్చున్న రావిచెట్టు చిటారుకొమ్మ ఆ వెన్నెల్లో జాబిల్లిని ముద్దాడుతున్న నెమలీకలా ఉంది. ఆ కోతి తలపైనున్న పూలకిరీటం నుంచి పరిమళాలు బలహీనంగా వస్తున్నాయి.

‘‘మీరన్నది నిజమే కావచ్చు. కానీ, ఆనాడు చిన్నకోతులు చేసిన దారుణాన్ని తల్చుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. అవి చంపేసిన పెద్దకోతుల పెళ్లాం పిల్లలు ధర్మగంటను వాయించని రోజంటూ లేకుండా పోతోంది. కంటికి కన్ను, పంటికి పన్ను పీకాల్సిందేనంటున్నాయి అవి. ఇప్పుడీ చిన్నకోతిని వదిలేస్తే.. మిగతా చిన్నకోతులన్నీ రెచ్చిపోతాయి. మన పెద్దకోతులకు రక్షణ ఉండదు.. అరాచకం రేగుతుంది.. ’’

నడీడు బవిరిగడ్డం కోతి ఆవేశంగా చెప్పుకుపోతోంది. దాని కోరలు విషపు పుట్టగొడుగుల్లా తెల్లగా మెరుస్తున్నాయి. అది తల విసురుగా అటూ ఇటూ ఊపుతోంది. తలపై ఉన్న వట్టివాసనవేళ్ల కిరీటం ఆ వెన్నెల్లో తాచుపాము చుట్ట కదులుతున్నట్లు కదులుతోంది. దాని తోక రోమాంచితమైంది.

ముసలి కోతి చిన్నగా నవ్వింది. ఓ ఆకును నోట్లో పెట్టుకుని మునిపంట కొరికింది.

‘‘నాయనా, ఈ రాజ్య లాంఛన పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నీ ఇష్టం! కానీ ఒకటి మాత్రం గుర్తించుకో.. అంతరాత్మకు మించిన ధర్మశాస్త్రం లేదు…!’’

‘అంటే, మేం చేస్తున్నది అధర్మం అంటారా? తలపండిన న్యాయకోతులు ఇచ్చిన తీర్పు తప్పంటారా? నన్ను ఎంతో అభిమానంతో, నమ్మకంతో ధర్మసంస్థాపనార్థం రాజ్యనిర్వాహక కోతిగా ఎన్నుకున్న ఈ అశేష వానరజాతి అభీష్టాన్ని నెరవేర్చడం ధర్మవిరుద్ధం అంటారా?’’

‘‘హ్హు.. అశేష వానరజాతి అభీష్టం! అంటే ఏమిటి నాయనా? మన పెద్దకోతులు కోరుకునేదేనా? చిన్నకోతులకు అభీష్టాలుండవా? ధర్మగంట వాయించడానికి కాదు, అసలు దాని ఛాయలకు రావాలంటేనే వణికిపోతున్న వేలాది చిన్నకోతులకు కోరికలేమీ లేవా? అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చిందో నీకు మాత్రం తెలియదా?’’

బవిరిగడ్డం కోతి విసుగ్గా ముఖం పెట్టింది. ముసలి ఘటం ఇక చరిత్ర మొదలుపెడుతుంది కాబోల్రా బాబూ అంటూ బుర్ర గోక్కోబోయింది. కానీ అది తన అంతస్తుకు భంగమనుకుని ఆ చీకట్లో గంభీరంగా ముఖం పెట్టుకుంది. అంతే గంభీర గొంతుకతో..

‘‘మీతో చరిత్ర చెప్పించుకోవాల్సిన సమయం కాదిది. ఆ చిన్నకోతిని మూడో ఝాము మొదలవగానే ఉరితీయాలని న్యాయకోతులు తీర్పిచ్చాయి. ఆ శుభఘడియ కోసం రాజ్యమంతా ఎదురుచూస్తోంది. ఆ దెయ్యపు కోతి చివరిసారిగా మీకు మొరపెట్టుకుంది కనుక లాంఛనప్రాయమైన మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఇక ఒక ఝాము మాత్రమే గడువుంది. మీరు దాని మొరను తిరగ్గొట్టి, ఉరితీతకు ఒప్పుకుని తీరాలి..‘’

‘‘ఒప్పుకోకపోతే..?’’

‘‘మీ స్థానంలో మా మాట వినే ఆ జులపాల కోతి వస్తుంది..’’

ముసలి కోతి నిట్టూర్చుంది. దానికి మనసంతా కెలికినట్లు అయింది. ఉన్నపాటున మల్లెపూల కిరీటాన్ని తీసి కిందికి విసిరికొడదామనిపించింది. కానీ భయమేసింది. కొమ్మ నుంచి కొమ్మకు ఎగరలేని ముసలితనం గుర్తుకొచ్చింది. రాజ్యపెద్దగా చిటారుకొమ్మన గంధపు పుల్లలపై కూర్చుని అనుభవిస్తున్న లాంఛనాలు, గౌరవాలు, విలాసాలు, జుర్రుకుని, కొరుక్కుని తింటున్న తియ్యతియ్యని పళ్లు, ఒళ్లుపడుతున్న పరువాల ఆడకోతులు గుర్తుకొచ్చాయి. కానీ దాని అంతరాత్మ మాత్రం ఎందుకో ఎదురు తిరుగుతోంది. మళ్లీ అంతలోనే జావగారి పోతోంది..

‘‘నాయనా, నువ్వు రాజ్యనిర్వాహక కోతివి. అధికారమంతా నీదే. కాదనే శక్తి నాకు లేదు. కానీ నా అంతరాత్మ మాత్రం ఆ చిన్నకోతిని వదిలేయాలనే ఘోషిస్తోంది. నీకు విసుగ్గా ఉన్నా వినక తప్పదు. చేసిన పాపం చెబితే పోతుందంటారు.. చిన్నకోతులకు మనం అన్యాయం చేయబట్టే కదా, అవి ఆనాడు ఆ దారుణానికి ఒడిగట్టింది! ఆ ఘోరానికి ముందు.. వారం రోజులపాటు మన అల్లరి పెద్దకోతులు ఏం చేశాయో నీకూ తెలుసు కదా. ఆ చిన్నకోతుల చెట్లపైకి వెళ్లి, వాటిని పీక పిసికి చంపాయి. గోళ్లతో, నోళ్లతో రక్కి చంపాయి. వాటి పళ్లను, కాయలను దోచుకున్నాయి. వాటి ఆడకోతులను చెరిచాయి. వాటి పిల్లలను చితగ్గొట్టి చంపేశాయి. ఇంకా.. నోటితో చెప్పరాని పాడుపనులన్నీ చేశాయి. ఎందుకు చేశాయి? అవి చిన్నకోతులని, తిరగబడే శక్తి లేదని. వాటి వల్ల రాజ్యంలో చెట్లకు, పళ్లకు కొరతవచ్చిందని పెద్దకోతులను రెచ్చగొట్టి, వాటి అభిమానం సంపాయించి గద్దెనెక్కాలని. చిన్నకోతుల్లో అల్లరివి లేవని చెప్పను. కొన్ని ఉన్నాయి. కానీ వాటిని సాకుగా చూపి మొత్తం అవన్నీ చెడ్డవని తీర్పివ్వకూడదు నాయనా. బలహీనులను కాపాడాలని మన ధర్మం ఘోషిస్తోంది. మన పెద్ద కోతుల అకృత్యాలకు ప్రతీకారంగా ఆ చిన్నకోతి కుటుంబం సర్వనాశనమైంది. అలాంటి మరికొన్ని చిన్నకోతులు కలసి ఎక్కడో పాము విషం సంపాయించి, దాన్ని మన చెట్లపైని పళ్లకు పూశాయి. అవి తిని మన పెద్దకోతులే కాక, కొన్ని చిన్నకోతులు కూడా చచ్చాయి. ఉరికంబమెక్కబోతున్న ఈ కోతి కంటే ఘోర నేరాలు చేసిన చిన్నకోతులు పక్కరాజ్యంలో దాక్కున్నాయి. వాటిని తీసుకురావడం మన అరివీరశూర భయంకర పెద్దకోతులకు చాతకాలేదు. ఆ కోతులకంటే పెద్ద ఘోరాలు చేసిన పెద్దకోతులతో సాక్షాత్తు నువ్వే అంటకాగుతున్నావు. నీ అనుంగులూ అంటకాగుతున్నాయి. పట్టుకొచ్చి ఉరితీయాల్సిన మరెన్నో కోతులు మతపీఠాలపై, రాజ్యపీఠాలపై బోరవిడుచుకుని కూచుని నీతిన్యాయాలను శోష వచ్చి పడిపోయేలా వల్లిస్తున్నాయి.

నాయనా, మనం.. అంటే నువ్వనుకుంటున్నట్లు పెద్ద కోతులం మాత్రమే కాదు, చిన్నకోతులం కూడా.. ఆనాడు తెల్ల చింపాంజీల నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకోవడానికి చేతులు కలిపి తిరగబడ్డాం. చింపాంజీల దాడిలో చచ్చిన కోతుల్లో వేలాది చిన్నకోతులు కూడా ఉన్న విషయాన్ని మరవొద్దు. స్వాతంత్ర్యం వచ్చాక లెక్కలేనన్ని ధర్మపన్నాలతో పెద్ద ధర్మగ్రంథం  రాసుకున్నాం. రాజ్యంలోని కోతులన్నింటికి చిన్నకోతి, పెద్దకోతి అనే తేడాల్లేకుండా అన్ని హక్కులూ ఉంటాయని హామీ ఇచ్చాం. కానీ, ఆ హామీలు మనం కొరికి పారేసే నేతిబీరకాయలైపోయాయి, మేడిపళ్లయిపోయాయి, గుడ్డిగవ్వలైపోయాయి, గురివిందగింజలైపోయాయి. అన్నిచోట్లా పెద్దకోతులు చెబుతోందే వేదమైపోతోంది. వాటి రెట్టమతమే రాజ్యమతమైపోతోంది. అవి చేసేది పుణ్యమూ, చిన్నకోతులది పాపమూ ఐపోతోంది. వాటి పిల్లలు దేశభక్తులూ, వీటి పిల్లలు దేశద్రోహులూ అయిపోతున్నాయి. చివరకు ఆ చిన్నకోతులకు రెండు పిల్లలను కనే స్వేచ్ఛకూడా లేకపోతోంది. పక్కరాజ్యానికి పోవాలని బెదిరింపులూ.. ఆ చిన్నకోతులు అక్కసుతో తిరగబడితే అరాచకకోతులని ముద్రవేసి చెట్లకు కట్టేస్తున్నాం, పీక పిసికి చంపేస్తున్నాం…’’

ముసలి కోతి ఆయాసంతో రొప్పుతోంది.

బవిరి కోతి ముఖం క్రోధంతో ఆ వెన్నెల్లో నిద్రలేని పులికన్నులా ఎర్రబారి తళుక్కుమంది.

‘‘చాలుచాలు. ఇక ఆపండి. మీకు ముసలితనంలో మతి చెడింది. దేశద్రోహికంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోండి. అసలు ఉరి తీయాల్సింది ఆ చిన్నకోతిని కాదు, మిమ్మల్ని. మీ ధర్మపన్నాలకు కాలం చెల్లింది. మీ కాలం వేరు, మా కాలం వేరు. దండం దశగుణం భవేత్ అన్నారు. హక్కులు, గిక్కులు అంటూ కూర్చుంటే రాజ్యం అల్లకల్లోలమవుతుంది. మన కర్మభూమి విశ్వప్రేమిగా, శాంతిదూతగా ఎదగదు. శాంతికి, ప్రేమకు, కరుణకు మారుపేరైన పెద్దకోతులకు, వాటి ధర్మానికి ఉనికే లేకుండా పోతుంది. మీ పనికిమాలిన మాటలతో అప్పుడే అరఝాము గడిచిపోయింది. అక్కడ ఉరికి అంతా సిద్ధమైంది. తలారికోతి తాడు లాగడమే మిగిలింది. ఈ భువికి వన్నెతెస్తున్న మన మహోన్నత పరమపావన స్వర్గతుల్య పూజనీయ శాంతికాముక కర్మరాజ్యంలోని కోతులన్నీ ఆ మరణదండన శుభముహూర్తం కోసం వేచిచూస్తున్నాయి. ఈ తాటాకుపై సంతకం పెట్టి, ఆ తెగపండిన రేగుపళ్లను కొరుక్కు తినండి..’’

బవిరి కోతి కోపం, వెటకారం కలగలిపి తిట్టింది. ముసలి కోతి స్థాణువైపోయింది. బవిరి కోతి ఇచ్చిన తాటాకుపై కలలో మాదిరిగా సంతకం చేసింది. బవిరి కోతి ‘‘శభాష్’’ అంటూ ఓ రేగుపండును రాజ్యపెద్ద నోట్లో ముద్దుగా కుక్కి, తాటాకును నోట్లో కరచిపట్టుకుని ఆ చీకట్లో ఎంతో లాఘవంగా చెంగుచెంగుమంటూ చిన్నకోతిని ఉరితీస్తున్న చెట్టుమీదికి దెయ్యపు పిల్లిలాగా దూసుకుపోయింది.

 

 

 

 

 

 

 

 

గోదావరీ, కుక్కతోకలూ..

 

సత్యమూర్తి

‘‘నేను జ్ఞానవాపి వద్దకు వెళ్లాను. దేవుడి కోసం వెతికాను కానీ కనుక్కోలేకపోయాను. మనసంతా అదోలాగా అనిపించింది. జ్ఞానవాపి పరిసరాలు మహరోతగా ఉన్నాయి. దక్షిణ ఇవ్వాలనిపించలేదు..’’

మహాత్మాగాంధీకి వారణాసిలో ఎదురైన అనుభవం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గోదావరి పుష్కరాల పేరుతో చేస్తున్న ప్రచారం జ్ఞానవాపి పరిసరాలకంటే రోత పుట్టిస్తోంది. పవిత్ర పుష్కర గోదాట్లో మునిగితే పుణ్యం పురుషార్థం(మహిళార్థం ఉండదు!) దక్కుతాయని ప్రభుత్వాలు రేడియోల్లో, టీవీల్లో, నానా ప్రచారసాధనాల్లో చేస్తున్న నానాయాగీ మన దేశం లౌకిక దేశం కాదని, పుణ్యస్నానాల, పిండప్రదానాల హిందూదేశమని ఢంకా బజాయిస్తోంది. గుణదల మేరీమాత ఉత్సవాలకు, కడప అమీన్ పీర్ దర్గా ఉరుసుకు మన లౌకిక ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో ఇలాంటి ప్రచారం చేసిన దాఖలాలు లేవుగా మరి!

మనది పేరుకే లౌకిక దేశమన్న సంగతి కొత్తేమీ కాదు కానీ.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పోటీపడి కీర్తికండూతితో అధికార పటిష్టత కోసం నిస్సిగ్గుగా తమ హిందుత్వాన్ని బహిరంగంగా చాటుకోవడం చూస్తుంటే కొనవూరిపితో ఉన్న లౌకికవిలువలకూ ముప్పు వచ్చిందని మరింత స్పష్టమవుతోంది. వాళ్లిద్దరిని ఎన్నుకున్న రెండు రాష్ట్రాల్లోని ముస్లింలు, క్రైస్తవులు ముక్కున వేలేసుకుని ‘మాకు మాంచి శాస్తి చేశారు’ అని గొణుక్కుంటున్నారు. క్రైస్తవుల పక్షమని చెప్పుకునే నాయకుడు కూడా గోదాట్లో మునకేయడం చూసి క్రైస్తవ సోదరులు సిగ్గుతో బిక్కచచ్చిపోతున్నారు. గత పుష్కరాల సంగతేమో కానీ ఇవి మాత్రం అసలు సిసలైన రాజకీయ పుష్కరాలు. ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికే తెలంగాణలో సగానికిపైగా జనం పుష్కరాల్లో మునిగారు. మొత్తం ఏపీ జనాభా అంతా మునిగిందని బాబు చెప్పడమే తరువాయి. పుష్కరాల డబ్బును జేబుల్లో వేసుకోకుండా పారదర్శకంగా ఖర్చుపెట్టామని చెప్పడానికి ఈ కాకిలెక్కలు తప్పనిసరి.

ఈ పుష్కరాలకు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ప్రచారం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ప్రచారం కానే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న హిందుత్వవాదుల మెప్పుకోసం కేసీఆర్, చంద్రబాబులు ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసిన పన్నుల డబ్బుతో చేస్తున్న నీచమైన పందేరం. మెప్పుకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. వీళ్ల ప్రచారానికి మోసపోయి గోదాట్లో మునగడానికి వెళ్లే జనానికి కూడా తొక్కిసలాట చావులు ప్రతిఫలంగా ముడుతుంటాయి. కేంద్రంలో సంఘ్ పరివార్ అధికారంలోకి రావడం, ఘర్ వాపసీ, యోగాపై ఊకదంపుడు ప్రచారం.. వీటన్నింటి నేపథ్యంలో పుష్కర ప్రచారాన్ని చూస్తే దాని వెనక ఉన్న మతాధిపత్య కోణాన్ని సులభంగా గుర్తించవచ్చు.

మతం ఇంటికే పరిమితం కాకపోవడం వల్ల వచ్చిన జాడ్యాలివి. చంద్రబాబు ఏపీ కొత్త రాజధాని భూమిపూజను కుటుంబకార్యక్రమంగా మార్చి పక్కా హిందూమత కార్యక్రమంలా జరిపినా, తెలంగాణ వస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ బ్రాహ్మణ గవర్నర్ కు బహిరంగంగా బోర్లబడి కాళ్లుమొక్కినా,  మోడీ విదేశీ నేతలకు భగవగ్దీతను కానుకగా ఇచ్చినా, భగవద్గీతను జాతీయగ్రంథం చేయాలని సుష్మా స్వరాజ్ వాగినా, వాళ్లపై వేసిన పిటిషన్లను కోర్టులు కుంటిసాకులతో కొట్టేసినా.. అవన్నీ ఆ జాడ్యాల ఫలితాలే. పుష్కరాలపై ప్రభుత్వాలు చేస్తున్నది ప్రచారం కాదని, సమాచారం ఇవ్వడమేనని, అన్నిమతాలకు సమప్రాధాన్యత ఇవ్వడమే లౌకికవాదమని, ప్రజల మతవిశ్వాసాలకు అనుగుణంగా తగిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వాల బాధ్యత అని మన శ్రీశ్రీశ్రీ గౌరవనీయ హైకోర్టు మహగొప్పగా వాక్రుచ్చింది. అవునా..? లౌకికవాదమంటే అదా? మనకు తెలిదే! వెర్రినాయాళ్లం, ఇంతకాలం లౌకికవాదం అంటే రాజ్యం మతంతో సంబంధం పెట్టుకోకుండా ఉండడమే సుమా అని అనుకున్నామే (Secularism is the principle of the separation of government institutions and persons mandated to represent the state from religious institutions and religious dignitaries. Secularism the belief that religion should not be involved in the organization of society, education, etc.)

రిపబ్లిక్ డే సందర్భంగా పత్రికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లోని రాజ్యంగ పీఠిక చిత్రంలో సోషలిస్టు పదం లేదని మొన్నామధ్య గొడవ జరిగింది. అది సోషలిస్టు పదాన్ని చేర్చకముందటి రాజ్యంగ పీఠిక చిత్రమని, ‘పొరపాటు’ జరిగిపోయిందని ‘నైపుణ్యాల అభివృద్ధి’ సర్కారు సమర్థించుకుంది. దేశాన్ని హిందూదేశంగా చేసిపారేస్తామంటున్న సంఘ్ నేతల ఆశయసాధనకు ఇలాంటి ‘పొరపాట్ల’తో శాయశక్తులా సాయం చేయడం తమ విధి అని చెప్పకనే చెప్పింది. ఈ పీఠిక గొడవ సమయంలో.. రాజ్యంగ పీఠికలోంచి సోషలిస్టే కాదు, సెక్యులర్ పదాన్నీ పీకిపారేయాలని(అసమానతల హిందూదేశం అనే పదాలు పెట్టాలని!) హిందూవాదులు డిమాండ్ చేశారు. ఒకరకంగా చూస్తే వాళ్లన్నది సరైందేనేమో. మేకమెడ చన్నుల్లాంటి ఆ పదాలను తీసేస్తే పోయిందేమీ ఉండకపోవవచ్చు. పైగా ఆ పదాల అచ్చుకు కావాల్సిన కాయితం, ఇంకు ఖర్చు ఆదా అవుతుంది కూడా. ఆ ఆదా డబ్బు రాబోయే మరింత పవిత్ర పుష్కరాలకు అక్కరకొస్తుంది.

లౌకికవాదం అంటే మతాలకు అతీతమైంది కాదు, అన్ని మతాలతో అంటకాగేది అని మన నేతలు అద్భుత నిర్వచనమివ్వడమే కాకుండా దాన్ని అమలు కూడా చేయబట్టి చాలాకాలమే అయింది. పత్రికల్లో లౌకికవాదం అనే పదం చూసి, ‘లౌకికవాదం అంటే లౌక్యంగా మాట్లాడ్డం కాబోలు’ అని అనుకునే వెర్రిజనం కోట్లకొద్దీ ఉన్న డెమోక్రటిక్, సెక్యులర్, సోషలిస్ట్, రిపబ్లిక్ వగైరా విశేషణాల భారత దేశంలో మతఛాందసవాదులకు అడ్డేముంది?

Godavari-Pushkaralu

మతభేదాల్లేకుండా వసూలు చేస్తున్న పన్నుల్లోంచి కోట్ల డబ్బును ఒక మతకార్యక్రమం కోసం వెచ్చించడం అప్రజాస్వామికం, దుర్మార్గం. ఒక మతానికి అని అంటే హిందూమతానికే అని కాదు. ముస్లింల హజ్ యాత్ర సబ్సిడీలను, క్రైస్తవ మిషనరీలకు ఇస్తున్న నిధులను, రాయితీలను, ఇతర మతాలకు కూడా ఇస్తున్న నిధులను కూడా రద్దు చేయాలి. కోట్ల మంది ప్రజలు బతుకుతెరువు, సాగునీళ్లు, తాగునీళ్లు, మందుమాకులు, ఇళ్లు లేక అల్లాడుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న మన పేరుగొప్ప దేశంలో ఉత్తి‘పుణ్యానికి’కి కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేయకుండా అసలైన ప్రజాక్షేమానికి ఖర్చుపెట్టినప్పడే మనది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది.

అన్ని కోట్లమంది భక్తివిశ్వాసాలుగల పౌరులు వెళ్లే పుష్కరాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తే తప్పేంటి అని కొందరు అడుగుతున్నారు. దెయ్యాలు, చేతబడులను నమ్మేవాళ్లు కూడా దేశంలో కోట్లమంది ఉన్నారు. వాటి ప్రచారానికి కూడా కోట్ల తగలెయ్యాలి. పాత గుళ్లలో, కోటల్లో గుప్తనిధుల కోసం పలుగుపారతో వెళ్లేవాళ్లకు ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాలివ్వాలి.

మన దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, సామ్యవాద విలువలు పాశ్చాత్యదేశాల్లో మాదిరి క్రమానుగతంగా, ప్రజాపోరాటాల ద్వారా వచ్చినవి కావని, అరువుకు తెచ్చుకున్నవని, అందుకే అవి వెర్రితలలు వేస్తున్నాయనే అభిప్రాయం ఒకటుంది. పతంజలి నవలిక ‘పిలక తిరుగుడు పువ్వు’లో మేజిస్ట్రేటు అన్న మాటల ప్రస్తావన ఇక్కడ అసందర్భమేమీ కాదు.. “మన జ్ఞానానికి సార్ధకత లేదు.  మన విశ్వాసాల పైన మనకు నమ్మకం లేదు. మన విలువల పైన మనకు గౌరవం లేదు. మన దేవుళ్ళ పైన మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం పైన మనకు విశ్వాసం లేదు. మన మీద గానీ, తోటి వాళ్ళ మీద గానీ మనకు మమకారం  లేదు. మన ప్రజాస్వామ్యం పైన మనకు అవగాహన కానీ గురి గానీ లేదు. మన జ్ఞానానికీ – విశ్వాసానికీ పొంతన లేదు. విశ్వాసానికీ – ఆచరణకూ పొందిక లేదు..భూమి బల్ల పరుపుగా వున్నప్పుడే ఇలాంటి జీవితం కనపడుతుంది”

ఇది పాలకుల తప్పేకానీ ప్రజల తప్పుకాదు. ప్రజలకు ఎన్నుకోవడానికి మంచి నాయకులు లేరు. పైగా ఓటు వేయకపోవడం దేశద్రోహమని ప్రచారం చేస్తున్న నికృష్ట ప్రజాస్వామ్యమిది. మన ప్రజలు వెర్రివాళ్లే. కానీ ఎల్లకాలం అలాగే ఉండరు. వెర్రి కుదిరే కాలం వచ్చినప్పుడు తాము పట్టుకున్న కుక్కతోకలను వదలి సొంతంగా గోదారి ఈదకమానరు.

*