చావు తప్పి జీవనతీరానికి…

 

స్లీమన్ కథ-3

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

డొరోతియా 1841 నవంబర్ 28న హాంబర్గ్ లో బయలుదేరింది. అప్పటికి వాతావరణం బాగుంది. గాలి అనుకూలంగా వీస్తోంది.

హైన్ రిచ్ అంతవరకూ ఓడ ప్రయాణం చేసి ఎరగడు. ఓడ గురించి ఏమీ తెలియదు. ఓడలో పద్దెనిమిదిమంది సిబ్బంది; ముగ్గురే ప్రయాణికులు- హైన్ రిచ్, ఓ వడ్రంగి, అతని కొడుకు. అంత అనుకూల వాతావరణంలో కూడా సముద్రప్రయాణం అతనికి పడలేదు. మూడు రోజుల తర్వాత కక్సావెన్ అనే చోట స్వల్పకాలం ఓడకు లంగరేసారు. అప్పటికే అతను అస్వస్థతతో ఉన్నాడు. అక్కడినుంచి ఓడ బయలుదేరి ఉత్తర సముద్రంలోకి అడుగుపెట్టింది. రెండురోజులకే గాలివాన మొదలైంది. ఓడలోకి నీరు ఎక్కసాగింది. సిబ్బంది అదేపనిగా తోడిపొయ్యడం ప్రారంభించారు.

హైన్ రిచ్ ఆకలితో నకనకలాడిపోతున్నాడు. ఓడలో ఇచ్చిన బిస్కట్లతో అతికష్టం మీద ఆకలి చల్లార్చుకుంటున్నాడు. ఓ బెంచీకి తనను కట్టేసుకుని స్పానిష్ గ్రామర్ సాయంతో ఆ భాష నేర్చుకుంటూ ఉండిపోయాడు. ఒక్కోసారి ఓడ కుదుపుకి వచ్చి డెక్ మీద పడిపోతున్నాడు.

తుపాను ప్రచండంగా ఉంది. అలలు ఓడ అంచుల్ని విరగ్గొడుతున్నాయి. ఓడ మునిగిపోయే ప్రమాదం భయపెడుతోంది. పెద్ద తెరచాప సాయంతో ఓడ దారితప్పకుండా మాత్రం కొంతసేపు కెప్టెన్ చూడగలిగాడు. కానీ డిసెంబర్ 10 సాయంత్రానికి ఓడ దారితప్పి దక్షిణం వైపుకి కొట్టుకుపోవడం ప్రారంభించింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల తాకిడినుంచి ఓడను కాపాడడం కష్టమని అందరికీ అర్థమైపోయింది. ఇంకోవైపు మంచు భయంకరంగా కురుస్తోంది. సముద్రపు కొంగలు మందల కొద్దీ వచ్చి ఓడ చుట్టూ తిరగసాగాయి. అలా తిరగడం అపశకునం.

మరునాటి మధ్యాహ్నానికి తుపాను మరింత తీవ్రం అయింది. అలలు పర్వతప్రమాణంలో లేచి ఓడ మీద పడుతున్నాయి. అలలు అటూ ఇటూ ఎగరగొడుతుంటే ఓడ అక్షరాలా షటిల్ కాక్ లా మారిపోయింది. సాయంత్రానికల్లా పెద్ద తెరచాప విరిగిపోయింది. వెంటనే తుపాను తెరచాపను ఎగరేశారు. అదీ విరిగిపోయింది. అంతలో ఒక విచిత్రం జరిగింది. లిప్తకాలంపాటు మబ్బులు విడిపోయి అస్తమిస్తున్న సూర్యుడు కనిపించాడు. మళ్ళీ వెంటనే మబ్బులు మూసేశాయి. సూర్యుణ్ణి చూడడం అదే కడసారి అవుతుందని అందరూ అనుకున్నారు.

ఆ సమయానికి హైన్ రిచ్ మృత్యువు గురించి కూడా ఆలోచించలేనంత అస్వస్థతతో ఉన్నాడు. వడ్రంగి భయంతో వణికిపోతూ ఏవేవో మాట్లాడుతుంటే అతనివైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ వడ్రంగికి కలల మీద నమ్మకం ఎక్కువ. ముందురోజు రాత్రంతా దారుణమైన పీడకలలు. దానికితోడు రోజంతా పిల్లి శోకాలు పెడుతూనే ఉంది. కెప్టెన్ కుక్క మొరుగుతూనే ఉంది.

ఏడింటికి క్యాబిన్ బాయ్ టీ, బిస్కట్లు తీసుకొచ్చాడు. “ఇదే చివరిసారి, ఇంకెప్పుడూ ఏమీ తేలేను” అంటూ ఏడ్చేశాడు. మరి కాసేపటికి కెప్టెన్, అతని రెండో సహాయకుడు క్యాబిన్ లోకి వచ్చారు. దేనికైనా సిద్ధమవమని ఆ ముగ్గురికీ చెప్పారు. వారి మాటల్లో విషాద, గాంభీర్యాలు గూడుకట్టుకున్నాయి. అంతలో మొదటి సహాయకుడు వచ్చి దూరంగా రెండు దీపాలు కనిపించాయని కెప్టెన్ కు చెప్పాడు.  వెంటనే లంగర్లు దించమని కెప్టెన్ ఉత్తర్వు చేశాడు. దించిన క్షణాలలోనే అవి దారపు ముక్కలా తెగిపోయాయి. అప్పటికే సొమ్మసిల్లిపోయిన హైన్ రిచ్ దుస్తులు విప్పేసి పడుకుండిపోయాడు.

అర్థరాత్రివేళ క్యాబిన్ తలుపులు దడాలున తెరచుకున్నాయి. “అందరూ డెక్ మీదికి రండి. ఓడ మునిగిపోతోంది” అంటూ కెప్టెన్ పెద్ద పెట్టున అరిచాడు. మరుక్షణంలోనే ఓ బ్రహ్మాండమైన అల కిటికీలను ధ్వంసం చేసేసింది. క్యాబిన్ లోకి నీరు వరదెత్తింది.  ఓడ ఊగిపోతూ రేవు వైపు కొట్టుకుపోతోంది. హైన్ రిచ్ తన పడక మీంచి ఎగిరి పడ్డాడు. దుస్తులకోసం తడుముకున్నాడు. కనిపించలేదు. అలా నగ్నంగానే డెక్ మీదికి పరుగెత్తాడు. ఒంటి మీద గాయాలు. ఓడ అంచుల్ని ఎలాగో దొరకపుచ్చుకుని పై భాగం దాకా పాక్కుంటూ వెళ్ళి తాటి కొసల్ని పట్టుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబసభ్యుల్ని తలచుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.  మేరీ మాతను ఉద్దేశించి వడ్రంగి చేస్తున్న ఆర్తనాదాలు అతని చెవిన పడుతున్నాయి. సొరచేపల్ని చూసి అతనెక్కువ భయపడ్డాడు. తుపాను విరుచుకుపడగానే అవి పైకి వచ్చాయి. ఓడ గంట నిరంతరాయంగా మోగుతూనే ఉంది. అది మృత్యుఘంటలా వినిపిస్తోంది.

ఏమ్ స్టడామ్ లో ఇంగ్లీష్ చర్చి

ఆ ఏడాది మొత్తంలోనే అతి శీతలరాత్రి అది. అతను నగ్నంగా ఉన్నాడు. చుట్టూ మంచు ముంచెత్తుతోంది. ఆకాశం ఓ పెద్ద కాలమేఘంలా ఉంది. అతను మీద పడబోయే మృత్యువును నిరీక్షిస్తూ ఉండిపోయాడు. ఓడ మునిగిపోతోంది. లైఫ్ బోట్లలోకి జనాన్ని ఎక్కించమని కెప్టెన్ ఆదేశించాడు. ఒక లైఫ్ బోట్ నీళ్ళలో నిట్టనిలువుగా పడి కొట్టుకుపోయింది. రెండోది ఓడ పక్కభాగాన్ని ఢీకొని నుగ్గునుగ్గు అయిపోయింది, ఓ చిన్న బోటు మాత్రం మిగిలింది. సిబ్బంది దానిని నీళ్ళలోకి దింపే సాహసం చేయలేకపోయారు.

అలాగే రెండు గంటలు గడిచాయి. నీళ్ళతో నిండిపోయి మునుగుతూ మునుగుతూ ఉన్న ఓడ ఎట్టకేలకు ఓ పెద్ద కుదుపుతో రేవువైపు దొర్లుకుంటూ వెళ్ళి కూరుకుపోయింది.  అప్పటికే హైన్ రిచ్ నీళ్ళలోకి జారిపోయాడు, కానీ వెంటనే పైకి తేలాడు. అంతలో ఓ ఖాళీ పెట్టె అతనివైపు తేలుకుంటూ వచ్చింది. అతను దాని అంచుల్ని పట్టుకుని ఉండిపోయాడు.

అలా సగం రాత్రి వరకూ ఆకాశానికి, సముద్రానికీ మధ్య వేల్లాడాడు. ఆ తర్వాత మొదటి సహాయకుడు వచ్చి అతణ్ణి నీళ్ళలోంచి లాగి లైఫ్ బోటులోకి ఎక్కించాడు. తెడ్లు కూడా లేని ఆ బోటు పద్నాలుగుమందితో పొద్దుటివరకూ దారీ తెన్నూ లేకుండా కొట్టుకెళ్లి చివరికి డచ్చి తీరానికి దూరంగా టెక్సెల్ అనే దీవిలోని ఇసుకతిప్పల మీదికి వచ్చి ఆగింది.

అప్పటికి తుపాను నెమ్మదించింది. ఒడ్డువైపు తేలుకుంటూ వస్తున్న సరకుకోసం ఆ దీవిజనం బిలాబిల్లాడుతూ వచ్చి వాలిపోయారు. హైన్ రిచ్ గాయాల నొప్పులతో గిలగిల్లాడుతున్నాడు. అతని ముందు పళ్ళు మూడు ఊడిపోయాయి. ముఖం మీదా ఇతర శరీరభాగాలమీద లోతైన గాట్లు పడ్డాయి. పాదాలు వాచిపోయాయి. బతికున్న వాళ్ళు అందరూ రొప్పుతూ ఇసుకతిప్ప మీద వాలిపోయారు. అంతలో ఓ దయగల రైతు ఓ బండి తీసుకుని అక్కడికి వచ్చాడు. వాళ్లందరినీ తన పొలం ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు చలి కాచుకోడానికి పెద్ద మంట రాజేశాడు. వారికి వేడి వేడి కాఫీ, నల్ల రొట్టె అందించాడు. ఒంట్లో సత్తువను కూడదీసుకునేవరకూ మూడు రోజులు వాళ్ళు అక్కడే ఉండిపోయారు.

హైన్ రిచ్ కు కొయ్య బూట్లు, ఓ జత చినిగిపోయిన పంట్లాములూ, ఓ దుప్పటి, ఓ ఊలు టోపీ ఇచ్చారు. అతనికి ఆ రైతు మీద ఎంతో ఇష్టం కలిగింది. తన సముద్రపు పెట్టె ఒడ్డుకు కొట్టుకు రావడం అంతకంటే ఎక్కువ సంతోషం కలిగించింది. అందులో తన చొక్కాలు, స్టాకింగులు, పాకెట్ బుక్కు, లా గ్వైరా లో తన పరిచయస్తులకు హెర్ వెంట్ రాసిన సిఫారసు ఉత్తరం ఉన్నాయి. మిగతా అందరి పెట్టెలూ కొట్టుకుపోయి, హైన్ రిచ్ పెట్టె ఒక్కటే ఒడ్డుకు రావడంతో అతన్ని ‘జోనా’ అని పిలవడం ప్రారంభించారు(ఓల్డ్ టెస్టెమెంట్ ప్రకారం జోనా ఒక దేవదూత. అతను ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోతుంది. అతన్ని ఓ తిమింగలం మింగేస్తుంది. మూడురోజుల తర్వాత అతను ప్రాణాలతో బయటపడతాడు). సరకుతో ఉన్న ఓ పెట్టె తనను చంపినంత పనిచేసి జీవితాన్ని మలుపు తిప్పింది, ఓ ఖాళీ పెట్టె తన ప్రాణాలు కాపాడింది, ఏదో అదృష్టం తన వెనక పనిచేస్తోందని అతను అనుకున్నాడు.

అతనక్కడ బోటు ఎక్కాడు. ముఖంలో అలసట, అస్వస్థత ఇంకా తాండవిస్తూనే ఉన్నాయి. బరువైన కొయ్య బూట్లతో, చంకలో పెట్టెతో అతను హాలెండ్ గడ్డ మీద అడుగుపెట్టాడు. బూటు పాలిష్ కుర్రాళ్ళు అతని వేషం చూసి తమ లాంటివాడే అనుకుని కేరింతలు కొడుతూ ఆహ్వానించారు.

మృత్యుముఖం నుంచి బయటపడడం, అస్వస్థత, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా దేశం కాని దేశంలో అడుగుపెట్టడం… ఆలోచించకొద్దీ తను బతికి ఉండడమే ఓ అద్భుతంగా అతనికి అనిపిస్తోంది.  హాంబర్గ్ లో చన్నీళ్ళ స్నానాలతో శరీరాన్ని గట్టి పరచుకోవడం వల్లనే ఓడ మునక వల్ల కలిగిన విపత్తునుంచి బయటపడ్డానని అనుకున్నాడు. మిగతావాళ్ళు తిరిగి హాంబర్గ్ కు బయలుదేరుతుంటే, తనను అంతులేని కష్టాల్లోకి నెట్టిన ఆ నగరానికి రానని చెప్పేశాడు. తన అదృష్టాన్ని హాలెండ్ లోనే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు.

ఎముకలు కొరికేసే ఆ చలిలో  చింకిపాతతో నేరుగా ఏమ్ స్టడామ్ లోని మెక్లంబర్గ్ కాన్సూల్ కు వెళ్ళాడు. హెర్ క్వాక్ అనే అతను కాన్సూల్ గా ఉన్నాడు. తలుపు తీసిన నౌకరు, బిచ్చగాడనుకుని అతని మొహం మీదే తలుపు మూసేశాడు. తను మెక్లంబర్గ్ పౌరుణ్ణనీ, సాయం కోసం వచ్చాననీ ఓ కాగితం మీద రాసి మళ్ళీ బెల్లుకొట్టాడు. ఈసారి  నౌకరు అతను రాసిన నోటు తీసుకెళ్లి హెర్ క్వాక్ కు ఇచ్చాడు. అది చూసి రెండు గోడెన్లను, అంటే యాభై సెంట్లను నౌకరు చేతికిచ్చి పంపించాడు. దాంతో అతను మళ్ళీ తన దగ్గరికి రాడనుకున్నాడు. ఆ మొత్తాన్ని చూసి విస్తుపోయిన హైన్ రిచ్ తో, “ఈ మాత్రమైనా ఇచ్చినందుకు సంతోషించు” అని ఎకసెక్కంగా అని నౌకరు తలుపు మూసేశాడు.

ఏమ్ స్టడామ్-1840లలో

హైన్ రిచ్ కోపంతో కుతకుత లాడిపోయాడు. అది పేదవాడి కోపమని అతనికి తెలుసు. ఏమ్ స్టడామ్ లో రామ్స్కో అనే చోట ఉన్న నావికుల లాడ్జీకి వెళ్ళాడు. గ్లామెన్ అనే ఓ వితంతువు దానిని నడుపుతోంది. అద్దె రోజుకు ఒక గోడెన్. తన దగ్గరున్న మొత్తంతో మహా అయితే ఒకరోజు గడుపుకోవచ్చు. కానీ రేపేలా? అంతలో అతనికో ఉపాయం తట్టింది. తను తీవ్ర అస్వస్థతో ఉన్నానని, ఆసుపత్రిలో చేర్చవలసిందని హెర్ క్వాక్ కు ఉత్తరం రాసి పంపాడు. ఆ దరిద్రుడు తనకు చేయగలిగిన సాయం ఇదే ననుకున్నాడు. అతని భారం తన మీద ఎక్కడ పడుతుందోనని భయపడ్డ గ్లామెన్ ఆ ఉత్తరాన్ని హెర్ క్వాక్ కు అందించే ఏర్పాటు చేసింది. ఆ ఉపాయం ఫలించింది. ఎనిమిదిరోజులు ఆసుపత్రిలో గడిపాడు.

ఈలోపున హాంబర్గ్ లో తనకు పరిచయమైన ఓడల దళారీ హెర్ వెంట్ కు ఉత్తరం రాశాడు. అందులో ఓడ మునక గురించి, తన ప్రస్తుత దుస్థితి గురించి వివరించాడు. అతని అదృష్టం కొద్దీ ఆ ఉత్తరం అందే సమయానికి హెర్ వెంట్ కొంతమంది అతిథులకు విందు ఇస్తున్నాడు. ఆ ఉత్తరాన్ని బిగ్గరగా చదివాడు. అతనితోపాటు అతిథులందరూ అతని మీద జాలిపడ్డారు. అప్పటికప్పుడు 240 గోడెన్ల మొత్తం సమకూడింది. హెర్ వెంట్ ఆ మొత్తాన్నీ, అతనికి సాయం చేయవలసిందిగా అర్థిస్తూ ప్రష్యా కాన్సూల్-జనరల్ కు రాసిన ఉత్తరాన్నీ హైన్ రిచ్ కు పంపాడు.

కొద్ది రోజులకే అతనికి ఎఫ్.సి. క్వెన్ & కొ లో అకౌంట్స్ విభాగంలో మెసెంజర్ బాయ్ గా ఉద్యోగం దొరికింది. డిమాండ్ డ్రాఫ్టులను స్టాంపింగ్ చేసి నగదుగా మార్చడం అతను చేయవలసిన పని. ఈ ఉద్యోగంతో పచారీ కొట్టు జీవితం నుంచి తను శాశ్వతంగా బయటపడ్డాడనీ, అదృష్టాన్ని వెతుక్కునే మార్గంలో తొలి అడుగు పడిందనీ అనుకున్నాడు.

అంతే…ఆ క్షణం నుంచి అతను మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు.

అపారమైన డబ్బు సంపాదించాలంటే, జీవితం మొత్తాన్ని అందుకు ధారపోయడం మినహా మరో మార్గం లేదని అతనికి అప్పటికే అర్థమైంది. తన తెలివితేటలకు మరింత సాన పట్టాడు. ఇదే తన జీవితం, ఇందుకు భిన్నంగా తను జీవించలేడని అనుకునే టంతగా తన లక్ష్యానికి అంకితమవడం అతనికి అలవడింది. ఖర్చును కనీస స్థాయికి తగ్గించుకున్నాడు. ఇప్పుడతని జీతం నెలకు 36 గోడెన్లు. అందులో ఎనిమిది గోడెన్లు లాడ్జీలో తనుంటున్న చవకబారు గది అద్దెకు పోతాయి. విందు వినోదాల ప్రశ్నే లేదు. సాయంత్రాలు ఊరంతా తిరగడం, గ్యాస్ దీపాల వెలుగులో జిగేలుమనే దుకాణాలను మెరిసే కళ్ళతో చూసి ఆనందించడం; లేదా రైల్వే స్టేషన్ కు వెళ్ళి, వచ్చిపోయే రైళ్లను చూస్తూ గడపడం…ఇవే అతని కాలక్షేపాలు. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే, హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్లలోని రంగు రంగుల మైనపు బొమ్మల్ని తనివితీరా చూసేవాడు. మిన్నాను తలచుకుంటూ ఉండేవాడు.

అతని దినచర్యలో ఉద్యోగం తర్వాత చదువుకే ప్రాధాన్యం. పుస్తకాలపైనా, తన చదువును ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కదానిపైనా ధారాళంగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. జర్మన్ అక్షరాలను దిద్దడంతో సహా మళ్ళీ కొత్తగా చదువు మొదలెట్టాడు. జర్మన్ లో తప్పులు లేకుండా ఒక మాదిరిగా రాయడమెలాగో ఇరవై పాఠాలతో నేర్చుకున్నాడు. ఆ తర్వాత డచ్చి, ఇంగ్లీష్ నేర్చుకోడానికి ఓ ట్యూటర్ ను పెట్టుకున్నాడు. పదాలను, వాక్యాలను బిగ్గరగా ఉచ్చరించేవాడు. వ్యాసాలు రాసి ట్యూటర్ తో దిద్దించుకునేవాడు. ఆపైన ఇంగ్లీష్ పై పట్టు సంపాదించడానికి ప్రతి ఆదివారం రెండుసార్లు ఏమ్ స్టడామ్ లోని ఇంగ్లీష్ చర్చికి వెళ్ళేవాడు. అక్కడి పాస్టర్ పలికే ప్రతి మాటనూ పదే పదే ఉచ్చరించేవాడు. అంకెర్షగన్ చర్చిలో వాళ్ళ నాన్న పలికిన ప్రతి మాటనూ, అర్థం తెలియకపోయినా ఉన్నదున్నట్టు అద్భుతంగా వల్లించగలిగిన హాపింగ్ పీటర్ ఒరవడిలో-తనూ తెలియకుండానే వెళ్ళాడు.

రాత్రిళ్లు అతని బుర్ర పాదరసంలా పనిచేసేది. నిద్ర కాచుకుంటూ పుస్తకపఠనం సాగించేవాడు. దాంతో నిద్ర తక్కువై పాలిపోయి జబ్బుమనిషిలా కనిపించేవాడు.  ఆ పుస్తకాలు కూడా అంతవరకూ తనకు విపరీతమైన ఆసక్తి కలిగిస్తూ వచ్చిన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలకు సంబంధించినవి కావు. వ్యాపారరంగంలో తను పైకి రావడానికి సాయపడే భాషలకు సంబంధించినది. ఇప్పుడు డబ్బు యావలో పడిపోయి ట్రాయ్ ని, చివరికి మిన్నాతో పెళ్లి తలపులనూ కూడా పక్కన పెట్టేశాడు.

వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్, ఇవాన్ హొలను… అవి దాదాపు కంఠస్థమయ్యేవరకూ చదివిందే చదువుకుంటూ పోయేవాడు. అలా ఆరునెలల్లో ఇంగ్లీష్ అతనికి ఒంటబట్టేసింది. మరోవైపు తను చదివింది, విన్నది గుర్తుండిపోయేలా; బుర్రలో పడిన ఒక్క అంకె కూడా జారిపోని విధంగా తన జ్ఞాపకశక్తికి శిక్షణ ఇచ్చుకుంటూ వచ్చాడు. నామవాచకాలు, క్రియాపదాలతో సహా అన్నీ వల్లె వేసుకుంటూ క్రమంగా ఓ జ్ఞాపక యంత్రంలా మారిపోయాడు.

ఇంగ్లీష్ నేర్చుకున్న పద్ధతిలోనే తర్వాతి ఆరునెలల్లో ఫ్రెంచ్ నేర్చుకున్నాడు. ఏడాది తిరిగేసరికి అతనిలో ఏకాగ్రత ఎంత పదునెక్కిందంటే; డచ్చి, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్ భాషల్ని ఆశ్చర్యం గొలిపేటంత త్వరగా నేర్చేసుకున్నాడు. గట్టిగా దృష్టి పెట్టి ఈ భాషల్లో ధారాళంగా చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకోడానికి నాకు ఆరువారాల్ని మించి పట్టలేదని అతను చెప్పుకున్నాడు. దీనిని సాధించడానికి అతను కఠోరమైన కాలనియమాన్ని పాటించాడు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా పొడవైన పదాల పట్టికను ఎదురుగా ఉంచుకుని అదేపనిగా వల్లించేవాడు. పోస్టాఫీస్ లో స్టాంపుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు పేరాలకు పేరాలను గుర్తుచేసుకుంటూ ఉండేవాడు. ఈ విషయంలో ఒక్క క్షణం కూడా అతను రాజీపడలేదు.  ఈవిధంగా ఏమ్ స్టడామ్ లో తన చుట్టూ ఉన్న సాధారణ ప్రపంచానికి దూరంగా తన ప్రపంచంలో తాను గడిపాడు.

ఏమ్ స్టడామ్ కు రావడానికి ముందు అతనికి జర్మన్…అది కూడా మెక్లంబర్గ్ మాండలికం, తగుమాత్రం లాటిన్ మాత్రమే తెలుసు. ఇప్పుడతను ఏడు భాషల్ని చదవగలడు, మాట్లాడగలడు, రాయగలడు; ఈ భాషల్లో వ్యాపార నివేదికలు తయారుచేయగలడు.

తనపై  తాను కఠిన క్రమశిక్షణను విధించుకుని చేసిన ఇంతటి కసరత్తుకూ త్వరలోనే తగిన ప్రతిఫలం ఉంటుందన్న  ఆత్మవిశ్వాసమూ అతనిలో ఉంది.

అతను ఊహించినట్టే మరోసారి అదృష్టం అతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది…!!!

    (సశేషం)

 

 

 

 

మీ మాటలు

*