సూపును సుక్కాని చేశినం బిడ్డా..

 

 మిత్రబిందు

~

 

నిన్ను కండ్లనిండా సూసుకోని

కడుపునిండ బువ్వవెట్టి

ఎన్ని నాల్లైందో

 

నువు కానొత్తవేమో అని

సంద్రాల అవుతలికంతా సూత్తన్నం

రేవుకొచ్చే అలలల్ల

దేవులాడ్తున్నం

 

“అవ్వా,

అడవిపూలు పిలుత్తన్నై ఆడికే వోతనే

ఆల్లకి ఆసరా ఐతనే

నా కలల సాకారానికి  వోతనే”   అన్నవు.

సరే బిడ్డా

నిన్నెట్ల ఆపుతం బిడ్డా అన్న

 

నువు వోయినవు,

నీ కలల తోవల నడిసీ నడిసీ

“మంచిగ జేర్కున్నవా బిడ్డా “

అని అడగలేనంత దూరం వోయినవు.

కానీ అయ్యా,

మా ముసలి కండ్లకు కలవే నువ్వు గదా

ఇప్పుడు మేమేడ  వోవాలి బిడ్డ?

మా కలను దేవులాడుకుంట

నీ ఎనుకనే ,

నువు  వోయిన దార్లనే రమ్మంటవ?

 

మొన్నటికి మొన్న

ఎప్పుడు సూసిన శిన్నబొయి కూకుంటాన్నవు

ఏమైందయ్యా అంటే.

“తెలంగాణ  పిలుత్తాంది,

బందికానాల ఉన్నా బయటకి తీయి అంటాంది ఎల్తనే” అన్నవు.

బుగులైంది కొడుకా, ఐనా పొమ్మన్న

“పొతా పొతా అవ్వా ఏడ్వకు,

మనందరికోసమే పొతాన్న” అన్నావు

పోరాటంల సచ్చివోతే

తెలంగాణా ఆకిట్ల పందిరి గుంజనైతనే అన్నవు

ఐనవు బిడ్డా, బతికుండంగనే పందిరిగుంజవైనవు

పోరాటంల గెల్సి తెలంగాణకి పచ్చని పందిరేసినవు

పందిరికున్న నాల్గు గుంజల్లో ఒక గుంజవై నిల్సినవు

 

“నాతల్లిని బందికాన నుంచి తప్పిచ్చిన “

అని దోస్తుల్తోని కల్సి యెగిరినవు

రతనాలు రాలినట్ల నవ్వినవు

ముత్యాలు మెర్సినట్ల ముర్సినవు

 

ఆయాల పెద్దయ్యలందరూ మెచ్చుకున్నరు గద బిడ్డా

ఇయ్యాలెందుకయ్యా

పందిరెండ్కవోయిందని  గుంజను వీకివడేసిన్రు?

పనైపోయింది పందిరెందుకు అనుకున్నరా

పందిరినే గుంజేసిన్రు?

మొలను మొగ్గానికేసి  కట్టి సంపిండ్రు

 

అడవిబిడ్డలు సల్లంగుండాలని

అన్యాలాన్ని ఆపాలని

అవినీతిని అరికట్టాలని

పల్లె పల్లె కదిలిరావాలని

నువు పాడిన పాట

దేశద్రోహం  అన్నరు

కట్టేసి కొట్టిండ్రు

నిజాలు మాట్లాడుతున్నవని

మర్మాన్ని కోసిండ్రు

 

నడిసే తోవ్వల పోటురాయి తగిల్తేనే

పానం గిలగిల కొట్కుంటుండె

అన్ని దెబ్బలు ఎట్ల ఆపుకున్నవు కొడుకా

 

నువు సచ్చిపోయినవన్నరు

మాంసం ముద్దను చేతికిచ్చిండ్రు

బిడ్డా అది సూడంగనే

పురిట్లబిడ్డోలె అనిపిచ్చినవు

చాతికి అదుముకున్న

నాకొడుకు నాకొచ్చిండు సాలనుకున్న

ఊరికివోయెదాంక ఒద్లలె నిన్ను

ఆడవోయినంక నిన్ను కాల్సిండ్రో పూడ్సిండ్రో?

 

ఇప్పటికీ నువ్వొస్తవనే నమ్మకం తోటి

పొక్కిలైన వాకిట్ల కూకొని

జొన్నన్నం ముద్ద చేతిల వట్టుకుని

సూపు సాగినంతమేరా సూత్తన్నా

 

మూసిన కండ్లెనక  కన్నీల్లను దాస్కుని

మీనాయన నీకోసం

మంచమొంచి, పరుపేసి

మెత్త సదిరి , చెద్దరి వెడ్తున్నడు

ఒక్కసారి రాయ్యా,

బుక్కెడంత తిని నిద్ర పోదువుగని.

*