కాండీడ్

 

9వ అధ్యాయం

 

ఇసాకర్ హిబ్రూ తెగవాడు. కోపం ముక్కుమీదే ఉంటుంది. ఇజ్రాయెల్ ను బాబిలోనియా చెరపట్టినప్పట్నుంచి ఇజ్రాయెల్ లో అంతటి ముక్కోపి మరొకడు లేడని ప్రతీతి. క్యూనెగొండ్ పై తన శనివారపు హక్కును చలాయించుకోవడానికి లోనికి అడుగుపెట్టగానే పక్కపైన యువజంట సరసమాడుతూ కనిపించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.

‘ఓసి.. రంకుముండా! ఆ మతపెద్దగాడితో నీ కామదాహం తీరలేదన్నమాట. ఇక నేను నిన్ను వీడితోనూ కలసి  పంచుకోవాలన్నమాట? ఈ గుంటవెధవకు తగిన బుద్ధి చెబుతాలే..’ అని రంకె వేశాడు.

అస్తమానం తెగ వేలాడేసుకుని తిరిగే బారెడు ఖడ్గాన్ని సర్రున ఒరలోంచి దూసి నిరాయుధుడైన కాండీడ్ పైకి ఉరికాడు. పరిస్థితి గమనించిన ముసలమ్మ చప్పున కాండీడ్ చేతికి అందమైన కరవాలంతోపాటు, ఒళ్లు కప్పుకోవడానికి బట్టలు కూడా అందించింది. సకల సద్గుణసంపన్నుడైన కాండీడ్ ఒక్క వేటుతో శత్రువును నేలకూల్చాడు. ఇసాకర్ అందాల క్యూనెగొండ్ కాళ్ల దగ్గర పడిపోయి ప్రాణాలు విడిచాడు.

‘అయ్యో, మేరీమాతా! ఇప్పుడు మాకేం మూడనుందో..! నా ఇంట్లో ఖూనీ జరిగిపోయింది. రక్షకభటులొస్తే ఇక మనపని ఖతం..’ అందగత్తె భయపడిపోయింది.

‘మన మహాతత్వవేత్త పాంగ్లాస్ ను ఉరితీయకుండా ఉండుంటే ఈ గడ్డు సమయంలో మనకు చక్కని సలహాలు ఇచ్చుండేవాడు కదా. ఆయన లేడు కనక ఈ ముసలమ్మను సలహా అడుగుదాం’ అన్నాడు కాండీడ్.

ములసమ్మ కూడా తెలివితేటలు గలదే. ముందుచూపున్నదే. పడచుజంటకు ఏం చెయ్యాలో చెప్పడం మొదలుపెట్టగానే రహస్య ద్వారం తెరచుకుంది. అప్పటికి అర్ధరాత్రి ఒంటిగంట దాటిపోయి అదివారం వచ్చేసింది కనక మతవిచారణాధికారి క్యూనెగొండ్ పై, ఆ ఇంటిపై తన హక్కును అనుభవించడానికి వచ్చాడు. తాను కొరడా దెబ్బలు కొట్టించిన యువకుడు చేతితో కత్తితో నిల్చుని ఉండడం, కింద చచ్చిపడున్న యూదు, కలవరపడుతున్న క్యూనెగొండ్, సలహాలిస్తున్న ముసలమ్మ కనిపించడంతో ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు.

ఆ విపత్కర పరిస్థితిలో కాండీడ్ బుర్ర పాదరసంలా పనిచేసింది. ‘ఇప్పుడు వీడు ఇదంతా చూసి సాయం కోసం కేకలు వేస్తే.. తర్వాత నన్ను సజీవదహనం చేయించడం ఖాయం. క్యూనెగొండ్ కూ అదే గతి పడుతుంది. ఈ దుర్మార్గుడు నన్ను క్రూరంగా చావగొట్టించాడు కనక వీడు నాకు బద్ధశత్రువు. పైనా నేనిప్పుడు ఎలాగూ చంపడం మొదలుపెట్టాను కనక, ఆలోచించే వ్యవధి కూడా లేదు కనక.. ఏ రకంగా చూసినా వీణ్ని చంపిపారేయడమే ఉత్తమమని తోస్తోంది’ అనుకుంటూ స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశాడు.

మతాధికారి ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే కాండీడ్ మెరుపు వేగంతో కదిలి అతణ్ని హతమార్చాడు. యూదు పీనుగ పక్కన మరో పీనుగ పడిపోయింది.

‘ఇంకో హత్యా? ఇక మనకు పూర్తిగా మూడినట్టే. ఇక మనల్ని ఎవరూ దయదల్చరు. చావు ముంచుకొచ్చినట్టే. కాండీడ్! నీ వంటి మంచిమనిషి రెండే రెండు నిమిషాల్లో రెండు ఖూనీలు చేయడమా?’ ప్రేయసి కలవరపడింది.

‘ఓసి నా ముద్దుగుమ్మా! ప్రేమోన్మాదం తలకెక్కినవాడు అసూయ, ఉద్వేగంతో ఏం చేస్తాడో అతనికే తెలియదు. మతవిచారణలో కొరడా దెబ్బలు కూడా తిని ఉంటే ఇక చెప్పక్కర్లేదు’ తన పనిని సమర్థించుకున్నాడు ప్రియుడు.

ముసలమ్మ తక్షణ కర్తవ్యం గుర్తుచేసింది.

‘కొట్టంలో మూడు జాతిగుర్రాలు జీన్లు, కళ్లేలు తగిలించి సిద్ధంగా ఉన్నాయి. వీరాధివీరుడైన మన కాండీడ్ వాటిని తీసుకురావాలి. అమ్మగారు నగలూ నాణేలూ మూటగట్టుకు రావాలి. తర్వాత మనం ముగ్గురం గుర్రాలెక్కి కేడిజ్ కు పోదాం. నేను ఈ నా ఒంటిపిర్రెపైనే తిప్పలుపడుతూ ఎలాగోలా దౌడు తీస్తాలే. పదండి త్వరగా వెళ్దాం. వాతావరణం హాయిగా ఉంది. ఈ చల్లని రాత్రివేళ ప్రయాణం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.’

కాండీడ్ వెంటనే గుర్రాలను సిద్ధం చేశాడు. ముగ్గురూ ఏకధాటిగా ముప్పై మైళ్లు ప్రయాణించారు. వాళ్లు శషభిషలు పడకుండా వెంటనే పారిపోవడం మంచిదే అయ్యింది. వాళ్లు అటు వెళ్లీ వెళ్లగానే మతపెద్ద సహచరులు, రక్షకభటులు ఇంట్లోకొచ్చారు. తమ ఉన్నతాధికారిని సుందరతరమైన చర్చిలో గౌరవప్రదంగా ఖననం చేసి, యూదును మాత్రం పెంటకుప్పపైన పడేశారు.

కాండీడ్, క్యూనెగొండ్, ముసలమ్మ.. సియెరా మోరేనా కొండల మధ్య ఉన్న అవసెనా అనే చిన్నపట్టణానికి చేరుకున్నారు. ఓ సత్రంలో గది తీసుకుని కబుర్లలో మునిగిపోయారు.

pic

 

10వ అధ్యాయం

 

‘నా నగలు, డబ్బులు ఏ దొంగముండాకొడుకు ఎత్తుకుపోయాడు? అయ్యో దేవుడా, ఇక మేమేం చేసేది? ఎట్టా బతికేది? అసలు బతకడం దేనికీ అంట? అలాంటి ఖరీదైన నగానట్రా ఇచ్చే మతపెద్దలు, యూదులు మళ్లీ నాకెక్కడ దొరుకుతారు?’ క్యూనెగొండ్ దీర్ఘాలు తీస్తూ, కన్నీళ్లు ధారలు కడుతూ ఏడుస్తోంది.

‘నిన్న రాత్రి మనం బడజాజ్ లో దిగిన సత్రంలో మనతోపాటే బస చేసిన సన్యాసే కాజేసి ఉంటాడనుకుంటాను. అయితే ఇలా తొందరపాటు నిర్ణయానికి రావద్దనుకోండి. కానీ, అతగాడు మన గదిలోకి రెండుసార్లు వచ్చి తచ్చాడి వెళ్లాడు. పైగా మనకంటే ముందుగానే వెళ్లిపోయాడు కూడా’ ముసలమ్మ అనుమానం వెళ్లగక్కింది.

‘అలాగా!  ఈ ప్రపంచంలోని వస్తువులు అందరూ పంచుకోవడానికే ఉన్నాయని, వాటిపై అందరికీ సమాన హక్కు ఉంటుందని మన పాంగ్లాస్ ఎన్నోసార్లు రుజువు చేశాడు. ఆ వాదన ప్రకారం ఆ దొంగసాధువు కూడా తనకు కావాల్సింది తీసుకుపోయి, మన ప్రయాణానికి అవసరమైంత డబ్బును మిగిల్చిపోయే ఉంటాడు. నీ దగ్గరి కొంచెం డబ్బు కూడా లేదా క్యూనెగొండ్?’ కాండీడ్ కారణలీలా విలాసాన్ని విశ్లేషించి అడిగాడు.

‘నాయాపైసా కూడా లేదు! ’ ప్రేయసి కస్సుమంది.

‘అయితే మనమిప్పుడు ఏం చెయ్యాలి?’ అడిగాడు.

‘ఇక చేసేదేముంది? ఒక గుర్రాన్ని అమ్మిపారెయ్యడమే! నేను అమ్మగారి గుర్రంపైన వెనక కూర్చుంటా. ఒంటి పిర్రెతోనే ఎలాగోలా తూలిపోకుండా సర్దుకుంటాను. ఎలాగైనా సరే ముందు మనం త్వరగా కేడిజ్ కు చేరాలి’ ముసలమ్మ సలహా ఇచ్చింది.

ఆ సత్రంలోనే బసచేసిన బెనెడిక్ట్ మతాధికారికి ఓ గుర్రాన్ని కారుచవగ్గా అమ్మేశారు. తర్వాత ఎలాగోలా లూసెనా, చిలాస్, లెబ్రిస్కాల మీదుగా కేడిజ్ చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఓ సత్రంలో చిన్నపాటి స్పానిష్ సైనిక పటాలం తిష్టవేసింది. అది పరాగ్వేకు పోతోంది. పరాగ్వేలో శాన్ శాక్రమెంటో దగ్గర్లోని స్థానిక తెగను స్పెయిన్, పోర్చుగల్లు రాజులపై తిరుగుబాటు చేసేలా రెచ్చగొట్టిన జెస్యూట్లకు బుద్ధిచెప్పడానికి వెళ్తోంది. కాండీడ్ క్షణమాలస్యం చెయ్యకుండా దళాధిపతి వద్దకు వెళ్లి బల్గర్ల సైన్యంలో తాను నేర్చుకున్న కవాతూ గట్రా సైనిక విన్యాసాలను పొల్లుపోకుండా ప్రదర్శించాడు. అతని వేగం, చురుకుదనం, క్రమశిక్షణ, తెలివితేటలు, వినయవిధేయతలు చూసి దళాధిపతి అతణ్ని పదాతిదళ నాయకుడిగా నియమించాడు. కాండీడ్ కెప్టెన్ అయిపోయాడు! క్యూనెగొండ్ ను, ముసలమ్మను, ఇద్దరు సేవకులను, తన చేతిలో హతమైపోయిన లిస్బన్ మతపెద్దకు చెందిన రెండు జాతిగుర్రాలను వెంటబెట్టుకుని ఓడలో పయనమయ్యాడు.

ప్రయాణం సాంతం పాంగ్లాస్ సిద్ధాంతంపై చర్చోపచర్చలు సాగించారు.

‘మనం కొత్త ప్రపంచానికి వెళ్తున్నాం. అక్కడ ప్రతీదీ ముమ్మాటికీ సవ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మన ప్రపంచంలో కొనసాగుతున్న ప్రాపంచిక, నైతిక వ్యవహారాలు ఎవరికీ ఆమోదయోగ్యంగా లేవు కనక’ అన్నాడు కాండీడ్.

‘కాండీడ్.. ప్రియతమా! నిన్ను మనసారా ప్రేమిస్తున్నా.. అయితే నేను చూసిన, అనుభవించిన దారుణాలు గుర్తుకొస్తే చాలు ఒళ్లు జలదరించిపోతోంది సుమా..’ క్యూనెగొండ్ వణికింది.

‘భయపడకు. అంతా చక్కబడుతుందిలే! ఈ కొత్త ప్రపంచం చుట్టూ ఉన్నఈ సముద్రాన్ని చూడు. మన యూరప్ సముద్రంకంటే ఎంతో బావుంది కదూ! అలలూ, గాలులూ తేడా లేకుండా మౌనంగా ప్రశాంతంగా. సందేహం లేదు. ఇది నిజంగా నవలోకమే! సృష్టిలోని ప్రపంచాల్లో ఇదే సర్వోత్తమ ప్రపంచం!’ సముదాయించాడు ఆశాజీవి.

‘భగవంతుడి దయవల్ల అలాగే సాగని. కానీ నేనెంత దుదరదృష్టవంతురాలిని, ఒక్కటీ సవ్యంగా జరగలేదు కదా! నా ఆశలన్నీ అడుగంటి పోయాయి’ నిట్టూర్చింది జవరాలు.

అంతా విని ముసలమ్మ అందుకుంది.

‘మీ కష్టనష్టాలు విన్నాక, అవి నేను అనుభవించిన వాటికంటే పెద్దవేం కాదనిపిస్తోంది’ అంది.

ఆమె తనకంటే దౌర్భాగ్యురాలినన్నట్టు చెప్పడం క్యూనెగొండ్ కు తమామాషా అనిపించి, నవ్వు తెప్పించింది.

‘చాల్చేలేవమ్మా, పెద్ద చెప్పొచ్చావుగాని! నిన్ను ఇద్దరు బల్గర్ సైనికులు చెరిచేసి, నీ కడుపులో కత్తితో రెండు తీవ్రగాయాలు చేసి, పల్లెలోని నీ రెండు భవంతులను కూల్చేసి, నీ తల్లిదండ్రులను నీ కళ్లముందే ఖండఖండాలుగా నరికేసి, నువ్వు ప్రేమించిన ఇద్దరిని బలిజాతరలో కొరడాలతో నెత్తురుకారేలా చావగొట్టి ఉంటేనే తప్ప, నువ్వు నాకంటే దుదృష్టవంతురాలివి కాబోవు! పైగా నేను తొంభై తొమ్మిది అవిచ్ఛిన్న తరాల వంశంలో, జమీందారు ఇంట్లో పుట్టి వంటలక్కగా బానిస బతుకూ బతికానాయె.. ’ క్యూనెగొండ్ ఏకధాటిగా మాట్లాడి, ముసలమ్మను ఎగతాళి చేసింది.

 ‘అమ్మా! మీకు నా పుట్టుపూర్వోత్తరాలు బొత్తిగా తెలియవు. నా వీపుకింది భాగాన్ని మీకు చూపిస్తే, మీరిలా ఎగతాళి చెయ్యరు. పైగా ఇలా మాట్లాడినందుకు ఎంతో నొచ్చుకుంటారు కూడా’ అంది ముసలమ్మ.

పడచుజంటకు ఆమె మాటలు ఆసక్తి రేకెత్తించాయి. ముసలమ్మ తన గాథ మొదలుపెట్టింది.

 

(సశేషం)

( ఈ నవలను ఈ వారంతో ఆపేస్తున్నాం. ఇది ఇకపై http://kalasahiti.blogspot.in/ లో కొనసాగుతుంది.)

కాండీడ్-5

 

 

6వ అధ్యాయం

 

భూకంపంలో పట్టణం ముప్పావు భాగం నాశనమైంది. మిగతా పట్టణాన్ని కాపాడుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. భూకంపాలను నివారించడానికి కొంతమందిని కనులపండువలా సెగమంటల్లో సజీవదహనం చేయడమే అమోఘమైన ఉపాయమని కొయింబ్రా విశ్వవిద్యాలయం అదివరకే ప్రకటించేయడంతో, ఆ దారి మినహా మరో పరిష్కారం తోచలేదు అధికారులకు.

వావీవరసా లేని పెళ్లి చేసుకున్న ఓ బాస్క్ జాతీయుణ్ని, భోంచేస్తుండగా కోడిమాంసంలో వచ్చిన పందిమాంసం ముక్కల్ని పక్కన పడేసిన ఇద్దరు యూదులను పట్టుకున్నారు. విందు పూర్తయ్యాక పాంగ్లాస్, కాండీడ్ లను బంధించారు. నానాచెత్తా వాగినందుకు గురువును, గంగిరెద్దులా విన్నందుకు శిష్యుణ్ని దోషులుగా తేల్చేశారు. ఇద్దరినీ విడివిడిగా.. సూర్యకాంతి సోకి ఇబ్బంది పెడుతుందన్న భయం లేశమాత్రం లేని నేలమాళిగల్లో పడేశారు. వారం తర్వాత బయటకు తీసుకొచ్చి బలి దుస్తులు తొడిగి, తలలపై పొడవాటి కాగితపు టోపీలు పెట్టారు. కాండీడ్ బట్టలు, టోపీపై.. కిందికి తిరగబడిన మంటలు, పంజాలు, తోకల్లేని దెయ్యాల బొమ్మలు ఉన్నాయి. పాంగ్లాస్ బట్టలు, టోపీపై ఉన్న దెయ్యాలకు మాత్రం పంజాలు, తోకలు ఉన్నాయి. మంటలు కూడా పైకి లేచాయి. తర్వాత వాళ్ల వెనక మేళతాళాలతో అట్టహాసంగా బలి జాతర ప్రారంభించారు. వీనుల విందైన చర్చి పాటలను కూడా పాండించారు. కాండీడ్ ఆ గానమాధుర్యంలో ఓలలాడుతుండగా శిక్ష కింద చెళ్లుమని కొరడా దెబ్బ పడింది. బాస్క్ జాతీయుణ్ని, ఇద్దరు పోర్చుగీసు యూదులను సజీవ దహనం చేశారు. పాంగ్లాస్ ను ఉరి తీశారు. బలి వేడుకలో ఉరితీత ఆచారం కాకపోయినా అలా చేశారు. సరిగ్గా అదే రోజు మళ్లీ భారీ భూకంపం వచ్చింది.

candid

 

ఒళ్లంతా నెత్తురోడుతున్న కాండీడ్ భయంతో గడగడ వణికిపోయాడు. ఆ వణుకులోనే గురువులా మీమాంసలో పడిపోయాడు. ‘లోకాలన్నింటిలో ఇదే సర్వోత్తమ లోకమైతే, ఇక ఆ మిగతా లోకాలెలా తగలడి ఉంటాయో? బల్గర్ల చేతిలో ఇదివరకే కొరడా దెబ్బలు తిన్నాను కనక ఇప్పుడీ దెబ్బలు పెద్ద విశేషమేమీ కాదు. కానీ పాంగ్లాస్ సంగతేంటి? తత్వవేత్తల్లో దిగ్గజం లాంటి ఆ పెద్దాయనను ఉరితీశారు. దీనికి కారణమేంటి? పరమోత్తముడైన జేమ్స్ రేవులో జలసమాధి కావడం ఈ ఘటనల పరంపరలో భాగమా? దారుణంగా హతమైపోయిన తరుణీమణి క్యూనెగొండ్ కు ఆ ఘోరం తగిందేనా?’

అలా ఉపదేశాలు, కొరడా దెబ్బలు, ఉపశమనాలు, దీవెనలు, ఆలోచనలు అన్నీ ముగించుకున్న కాండీడ్ గాయాల నొప్పితో నిల్చోలేక అవస్థ పడుతుండగా ఓ వృద్ధురాలు దగ్గరికొచ్చింది. ‘ధైర్యం చిక్కబట్టుకో అబ్బాయ్! మెల్లగా నా వెంట కదులు’ అంది.

 

7వ అధ్యాయం

 7chap

ధైర్యంగా ఉండాలని చెప్పడం మటుకైతే చాలా తేలిక. పాటించడమే కష్టం. కాండీడ్ ఎలాగోలా కూడదీసుకుని కాళ్లీడ్చుకుంటూ ముసలమ్మ వెంట నడిచాడు. ఆమె అతణ్ని చివికిపోయిన గుడిసెలోకి తీసుకెళ్లింది. తిండి, మంచినీళ్లు ముందు పెట్టింది. గాయాలకు కుండెడు లేపనం, తొడుక్కోవడానికి రెండు జతల బట్టలు ఇచ్చి, మెత్తని పక్క అమర్చింది.

‘భోంచేసి, ఈ రాత్రికి సుఖంగా నిద్రపో! అటోచా మేరీమతా, పడువా ఆంథోని, కాంపోస్టెలా జేమ్స్ అవధూతలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుగాక! నేను రప్పొద్దున మళ్లీ వస్తా’ అంటూ వెళ్లబోయింది.

ఇంతవరకు పడ్డ కష్టనష్టాలకే తేరుకోలేకపోతున్న కాండీడ్ ఆ ముసలావిడ ఆదరణ చూసి మరింత చకితుడయ్యాడు. కృతజ్ఞతతో ఆమె చేతిని ముద్దాడబోయాడు.

‘ముద్దాడాల్సింది నా చేతిని కాదులే. తిరిగి రేపొస్తా. మందు పూసుకుని, శుభ్రంగా భోంచేసి, హాయిగా నిద్రపో’ అందామె.

కాండీడ్ తన ఇక్కట్లను క్షణంలోనే మరచిపోయి కడుపునిండా బుక్కి, కంటినిండా నిద్రపోయాడు. ముసలామె పొద్దున్నే అల్పాహారం తెచ్చింది. వీపు చూసి మందు రాసింది. మధ్యాహ్నం భోజనం తెచ్చింది. రాత్రీ  తెచ్చింది. ఆ మర్నాడూ ఈ సేవలను తేడా లేకుండా చేసింది.

‘ఎవరివమ్మా నువ్వు? నాపై నీకెందుకింత ఆపేక్షా, ఆదరణా? నీ ఉపకారానికి బదులుగా నేనేమివ్వగలను?’ అడిగాడు క్షతగాత్రుడు.

ఆమె బదులివ్వకుండా వెళ్లిపోయింది. మళ్లీ పొద్దుగూకగానే వచ్చిందిగాని, భోజనం మటుకు తేలేదు.

‘అబ్బాయ్! ఒక్క మాట కూడా మాట్లాడకుండా నాతో రా..’ అంటూ అతని చేయి పుచ్చుకుని దారి తీసింది.

పావు మైలు నడిచి ఊరిబయటి తోటల, కాలవల మధ్య ఏకాంతంగా ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లింది. తలుపు తట్టగానే తెరచుకుంది. ముసలమ్మ అతణ్ని ఓ మూలలోని మెట్లెక్కించి అందంగా అలంకరించిన గదిలోకి తీసుకెళ్లింది. పెద్ద ఆసనంపై కూర్చోబెట్టి, మళ్లీ వస్తానని చెప్పి తలుపు మూసి వెళ్లిపోయింది. కాండీడ్ కు అంతా కలలా అనిపిస్తోంది. గతం పీడకలలా, వర్తమానం తీపికలలా తోస్తోంది.

ముసలావిడ త్వరగానే వచ్చింది. రత్నాభరణాలు ధరించి, మేలిముసుగు వేసుకున్న గొప్పింటి యువతిని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకొచ్చింది. ఆ యువతి కాండీడ్ ముందుకు రావడానికి కాస్త తడబడింది.
‘ఆ మేలిముసుగు తీసెయ్యి’ ముసలమ్మ కాండీడ్ తో అంది.

కాండీడ్ నెమ్మదిగా కదిలి వణుకుతున్న చేత్తో ముసుగు తీశాడు. సంభ్రమాశ్చర్యాలతో నోరెళ్లబెట్టాడు. తన కట్టెదుట ఉన్నది క్యూనెగొండేనా? ఇది కలా, నిజమా? తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. విస్మయంతో శక్తి సన్నగిల్లి, నోటమాట రాక దభిళ్లున ఆమె కాళ్లపై పడిపోయాడు. క్యూనెగొండ్ కూడా తన వంతుగా దభీమని దివానంపైన కూలబడిపోయింది. ముసలమ్మ వాళ్లద్దరిపైనా పన్నీరు చిలకరించింది. ఇద్దరూ తెప్పరిల్లుకుని కబుర్లు మొదలుపెట్టారు. మొదట సగం సగం మాటలు, తర్వాత సగం సగం ప్రశ్నలు, సమాధానాలు, ఊర్పులు, నిట్టూర్పులు, వగర్పులు, కన్నీళ్లు, వలపోతలు కొనసాగాయి. ఇద్దరూ మామూలు స్థితికి రావడంతో ముసలమ్మ కల్పించుకుని.. గొంతును వీలైనంత తగ్గించి కబుర్లాడుకోవాలని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయింది.

‘నువ్వు నిజంగా క్యూనెగొండ్ వేనా? అయితే నువ్వింకా బతికే ఉన్నావన్నమాట! నిన్నిలా పోర్చుగల్లులో కలుసుకోవడం చిత్రంగా ఉందే! మరైతే, ఆ దుర్మార్గులు నిన్ను బలాత్కరించి, ఒళ్లు చీరేశారని పాంగ్లాస్ చెప్పింది నిజం కాదన్నమాట..’

‘ఆయన చెప్పింది నిజమే. కాని, ఆ రెండు ఘోరాలకే మనుషులు చావరు.’

‘మీ అమ్మానాన్నలు? వాళ్లనూ చంపేశారా?’

‘ఔను..’ గుడ్ల నీళ్లు కక్కుకుంది క్యూనెగొండ్.

‘మీరి నీ అన్న?’

‘అతణ్నీ చంపేశారు.’

‘మరి నువ్వు పోర్చుగల్లుకు ఎలా వచ్చావు? నేనిక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? ఈ ఇంటికి నన్నెలా రప్పించుకోగలిగావు?’

‘అంతా వివరంగా చెబుతాగాని, ముందు నీ సంగతి చెప్పు. నువ్వు నాకు అమాయకంగా ముద్దిచ్చి, దారుణంగా తన్నులు తిన్నాక ఏం జరిగిందో అంతా వివరంగా చెప్పు.’

ఆమె మాటంటే అతనికి శిలాశాసనమే. చెప్పడానికి బోల్డంత సిగ్గేసినా, గొంతు వణికి మాటలు తడబడినా, వెన్నుగాయం సలుపుతూనే ఉన్నా.. ఆమె నుంచి విడిపోయిన క్షణం నుంచి ఈ క్షణం దాకా ఏం జరిగిందో ఎంతో అమాయకంగా, ఉన్నదున్నట్టు పూసగుచ్చినట్టు చెప్పాడు. క్యూనెగొండ్ చలించిపోయింది. పాంగ్లాస్, జేమ్స్ ల మరణానికి దుఃఖిస్తూ పైలోకానికేసి చూసి కన్నీటిబొట్లను టపటపా రాల్చింది. కాండీడ్ కథనం పూర్తి చేయగానే తన కథ వినిపించడం మొదలుపెట్టింది. కాండీడ్ ఆమె చెబుతున్నంతసేపూ రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తూ, ఎంతో శ్రద్ధగా, ఒక్కమాట కూడా చెవిజారిపోకుండా విని ఉంటాడని మీరే ఊహించుకోగలరు.

 

8వ అధ్యాయం

8chap (1)

‘ఒక రోజు రాత్రి నేను గాఢనిద్రలో ఉండగా దేవుడి దయవల్ల బల్గర్లు అందాలు చిందే మా థండర్ టెన్ ట్రాంక్ కోటలోకి చొరబడి నా తల్లిదండ్రులను ఖూనీ చేశారు. మా నాన్న, అన్నల గొంతులను పరపరా కోశారు. మా అమ్మను ముక్కలుముక్కలుగా నరికారు. ఆ రక్తపాతం చూసి మూర్ఛపొయ్యాను. ఆరడుగుల ఎత్తున్న ఓ భారీకాయుడు నన్ను చెరచడానికి మీదపడ్డాడు. దాంతో స్పృహలోకొచ్చి గట్టిగా కేకలేశాను. పెనుగులాడాను, కరిచాను, రక్కాను. వాడి కనుగుడ్లను పీకిపారేద్దామనుకున్నాను. మా ఇంట్లో జరిగింది యుద్ధంలో జరిగే మూమూలు తంతేనన్న సంగతి అప్పుడు నాకు తెలియదు. ఆ పశువు నా ఎడమ తొడపై తీవ్రగాయం చేశాడు. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది.’

‘అయ్యయ్యో! ఏదీ చూపించవూ..’

‘తర్వాత చూద్దువుగానీలే. ముందు నా కథ సాంతం చెప్పనివ్వు.’

‘సరే, అలాగే’ అని కాండీడ్ ఊ కొట్టగానే క్యూనెగొండ్ మళ్లీ కొనసాగించింది.

‘ఇంతలో ఓ బల్గర్ దళనాయకుడు లోనికొచ్చాడు. నెత్తురోడుతున్న నా దురవస్థను కళ్లారా చూశాడు. నాపై పడ్డ ఆ సైనికుడు కాస్త కూడా పక్కకు కదల్లేదు. సైనికుడు వందనం చెయ్యకపోవడంతో తనకు పెద్ద అగౌరవం జరిగిపోయిందని ఆ దళనాయుడు ఉద్రేకంతో రెచ్చిపోయి ఆ నరపశువును గుంజి, పక్కకు ఈడ్చిపారేశాడు.

తర్వాత నా గాయాలకు కట్టుకట్టించి, యుద్ధఖైదీగా తన మాకాంకు తీసుకెళ్లాడు. నేను అతని బట్టలు ఉతికేదాన్ని. అతనికి ఉన్నవి కొన్నే అనుకో. వంట కూడా చేసేదాన్ని. నేను చాలా అందగత్తెనని, పనికొస్తానని అతడనుకున్నాడు. ఆ మాట పైకే అనేవాడు కూడా. అతడూ అందగాడేననుకో. ఒళ్లు పుష్టిగా మంచి ఆకారంలో, తెల్లగా, కోమలంగా ఉండేది. అంతే, అంతకుమించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. తెలివితేటలు గుండుసున్న. తత్వశాస్త్రం ఒక్కరవ్వ కూడా అర్థం కాదు. పాంగ్లాస్ పండితుడి వద్ద శిష్యరికం చేయలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. మూడు నెలల తర్వాత అతని దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయింది. నాపైన మోజూ తీరిపోయింది. దీంతో నన్ను డాన్ ఇసాకర్ అనే యూదుకు తెగనమ్మేశాడు. ఇసాకర్ కు పోర్చుగల్లు, హాలండ్ లలో వ్యాపారాలున్నాయి. కామపిశాచి. నేనంటే పడిచస్తాడు. కానీ అంతకుమించి ఏమీ చేయలేడులే. నేను ఆ బల్గర్ సైనిక పశువుకంటే ఇతగాడినే తేలిగ్గా అడ్డుకోగలుగుతున్నాను. మర్యాదగల మగువ ఒకసారి బలాత్కారానికి గురైతే గురికావచ్చు కాని, ఆ అనుభవంతో ఆమె గుణగణాలు మరింత ఇనుమడిస్తాయి. నన్ను ఎలాగైనా మంచి చేసుకుని లోబరచుకోవాలని ఇసాకర్ ఈ ఇంటికి తీసుకొచ్చాడు. థండర్ టెన్ ట్రాంక్ కోటకు సాటివచ్చే కోట ఈ ఇలలో లేదని ఇంతవరకూ అనుకునేదాన్ని. కానీ అది శుద్ధ పొరపాటని ఇప్పుడర్థమైంది.. ’ గదిని చుట్టూ కలియజూస్తూ చెప్పసాగింది క్యూనెగొండ్.

‘ఈ పట్టణంలోని ఉన్నత మతవిచారణాధికారి ఓ రోజు నన్ను ప్రార్థన వేడుకల్లో చూశాడు. అలాగా ఇలాగా కాదు, కళ్లు తిప్పుకోకుండా చూశాడు. తర్వాత నాతో వ్యక్తిగత విషయాలను ఏకాంతంగా మాట్లాడాల్సి ఉందని కబురు పెట్టాడు. నన్ను అతని భవంతికి తీసుకెళ్లారు. అతనికి నా పుట్టుపూర్వోత్తరాలను వివరించాను. నేను ఓ ఇజ్రాయెల్ జతీయుడి వద్ద ఉంటూ నన్నూ, నా వంశాన్నీ, అంతస్తును ఘోరాతిఘోరంగా కించపరచుకుంటున్నానని ఆక్షేపించాడు. తర్వాత.. నన్ను మర్యాదగా తనకు అప్పగించాలని ఇసాకర్ కు ప్రతిపాదన పంపాడు. ఇసాకర్ రాజులతో డబ్బులావాదేవీలు నడిపేవాడు కావడం వల్ల, బోల్డంత పలుకుబడి ఉండడం వల్ల ఆ మతపెద్దను లెక్కచేయలేదు. దీంతో మతపెద్ద ఇసాకర్ ను సజీవదహనం చేయిస్తానని బెదిరించాడు. ఈ యూదు వెధవ భయపడిపోయి రాజీకొచ్చాడు. ఈ ఇల్లూ, నేనూ ఇద్దరికీ చెందేటట్టు ఒప్పందం రాసుకున్నారు. సోమ, బుధ, శనివారాల్లో ఇసాకర్, మిగతా వారాల్లో మతపెద్ద అని వాటాలు పంచుకున్నారు. ఒప్పందం కుదిరి ఇప్పటికి ఆరు నెలలయినా గొడవలు మాత్రం పోలేదు. శనివారం రాత్రుళ్లు పాత కాలమానానికి చెందుతాయా, కొత్త కాలమానానికి చెందుతాయా అని తేల్చుకోలేక గింజుకుంటున్నారు. ఇక నా సంగతి అంటావా? ఇద్దరినీ దగ్గరికి రాకుండా అడ్డుకుంటూ వస్తున్నాననింతవరకు. అందుకే నేనంటే ఇంకా పడి మోహంతో పడి చస్తున్నారు..

మళ్లీ భూకంపాలు రాకుండా ఉండడానికి, పనిలో పనిగా ఈ యూదును జడిపించడానికి  విచారణాధికారి సజీవదహన వేడుక జరిపించాలనున్నాడు. నన్నూ ఆహ్వానించాడు. బాగా అనుకూలంగా ఉండే చోట కుర్చీ దొరికింది. ఊరేగింపుకు, బలితంతుకు మధ్య పరిచారికలు చిరుతిళ్లు, రుచికర  పానీయాలు అందిస్తూ సేదదీర్చారు. పందిమాంసం తినడానికి నిరాకరించిన ఇద్దరు యూదులను, వావీవరసా లేని పెళ్లి చేసుకున్న ఆ బాస్క్ మనిషిని నిలువునా తగలబెడుతుంటే భయంతో కొయ్యబారిపోయాను. ఇక.. బలిదుస్తుల్లో ఉన్న పాంగ్లాస్ పండితుణ్ని చూసే సరికి నాలో రేగిన ఆశ్చర్యం, ఆందోళన, భయం, నిరాశా, నిస్పృహలను నువ్వే ఊహించుకో. కళ్లు నులుముకుని పాంగ్లాస్ ను ఉరితీసే వరకు చూసి, శోషతో పడిపోయాడు. స్పృహ వచ్చీ రాగానే నగ్నంగా ఉన్న నువ్వు కనిపించావు. గుండె గుభిల్లుమంది. ఆ క్షణంలో నాకు కలిగిన భీతి, ఆందోళన, క్షోభ, దుఃఖపరితాపాలను సులువగానే ఊహించుకోగలవనుకుంటాను. ఆ బల్గర్ దళనాయకుడి ఒళ్లు కంటే నీ ఒళ్లే తెల్లగా, మృదువుగా మెరుస్తూ ఉందని గట్టిగా చెప్పొచ్చు. నిన్ను ఆ దీనస్థితిలో చూడగానే నాకు పిచ్చి ఆవేశం తన్నుకొచ్చింది. ‘పశువుల్లారా.. ఆపండి!  అని గొంతుచించుకుని అరుద్దామనుకున్నాను. కానీ మాట పెగల్లేదు. అయినా నిన్నలా కొరడాలతో పూర్తిగా చిత్రవధ చేసేశాక వలపోసుకుని ఏం లాభంలే! ‘నా ప్రాణసుఖుడు కాండీడ్, మా విజ్ఞానఖని పాంగ్లాస్ లు లిస్బన్ కు ఎలా చేరుకోగలిగారు? ఒకరు వంద కమ్చీ దెబ్బలు తినడానికి, మరొకరు ఉరికొయ్యకు వేలాడ్డానికా వచ్చారు! అదే నేనంటే పడిచచ్చే మతపెద్ద ఆదేశాపైనేనా.. అయ్యో! ఎంత ఘోరం..! ప్రతీదీ మన మంచికేనన్న మెట్టవేదాంతాన్ని పాంగ్లాస్ నా బుర్రకెక్కించి ఎంత దారుణంగా మోసగించాడు! అని నాలో నేను అనుకున్నాను.

ఆ క్షణంలో ఎంత మనోవేదనతో కుంగిపోయానో ఊహించుకో. ఒక క్షణం దుర్భర ఉద్విగ్నతతో ఒళ్లు తెలియకుండా పోయింది. మరుక్షణం నిస్సత్తువ ఆవరించి మృత్యువాకిట ఉన్నట్టనిపించిది. నా తల్లిదండ్రుల నరికివేత, నా సోదరుడి ఖూనీ, ఆ బల్గర్ సైనికుడి అకృత్యం, చేసిన గాయం, బల్గర్ దళనాయకుడి ఇంట్లో వంటగత్తెగా బానిస బతుకు, ఇప్పుడీ భరించలేని యాదు వద్ద, నీచుడైన మతపెద్ద వద్దా అదే బతుకు, పాంగ్లాస్ ఉరితీత,  నిన్ను చావగొడుతూ భేరీలు, బాకాలతో.. దేవా కరుణామయా! కరుణించవా.. అంటూ హోరుమని వినిపించిన భక్తిపాట.. అవన్నీ నాకు బుర్రలో గిర్రున తిరిగి మాచెడ్డ కంపరం పుట్టించాయి. అయితే  ఆ రోజు నిన్ను మా ఇంట్లో కడసారి కలుసుకున్నప్పుడు ఆ తెరవెనక నువ్విచ్చిన తియ్యని తొలిముద్దును మాత్రం మరచిపోలేకపోయాను. ఇన్ని అగ్నిపరీక్షల తర్వాత నిన్ను మళ్లీ నా చెంతకు చేర్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాను. నిన్ను కంటికి రెప్పలా కాపాడి, వీలైనంత త్వరగా నా దగ్గరికి తీసుకురావాలని ఈ ముసలమ్మను పురమాయించాను. ఆమె నమ్మినబంటులా నా కోరిక నెరవేర్చింది. నిన్ను మళ్లీ చూడ్డం, నీతో మాట్లాడ్డం, నీ మాటలు వినడం.. అబ్బ! చెప్పలేనంత సంతోషంగా ఉంది. సరే, ముచ్చట్లకేం, మళ్లీ చెప్పుకుందాం. నీ కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి. నాక్కూడా అలాగే ఉంది. పద భోంచేద్దాం.’ తన కథ ముగించింది ప్రియురాలు.

ఇద్దరూ భోంచేశారు. తర్వాత అందమైన పాన్పుపై పవళించారు. ఇంతలో ఆ ఇంటి యజమానుల్లో ఒకడైన డాన్ లోపలికొచ్చేశాడు. ఆ రోజు శనివారం కావడంతో తన హక్కును దర్జాగా చలాయించుకోవడానికి, తన సుకుమార ప్రేమను చాటిచెప్పుకోవడానికి అడుగుపెట్టాడు.

(సశేషం)

కాండీడ్

candid

వీధిలో కనిపించిన ఆ భీకరాకారాన్ని చూడగానే కాండీడ్ కు భయానికి బదులు జాలి తన్నుకొచ్చింది. జేమ్స్ ఇచ్చిన రెండు నాణేలను అతనికిచ్చేశాడు. బిచ్చగాడు తేరిపార చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. చేతుల్ని కాండీడ్ భుజంపై వేసి వాలిపోయాడు. కాండీడ్ భయంతో వెనకడుగు వేశాడు.

‘అంటే, నువ్వు నీ గురువైన పాంగ్లాస్ నే గుర్తుపట్టలేదన్నమాట!’ గొల్లుమన్నాడు కురూపి.

‘అంటే, మీరు పాంగ్లాసా? మా గురువుగారా? ఇంత దారుణ స్థితిలోనా! ఈ దురవస్థ మీకెలా ఘటిల్లింది? ఎంతో సుందరమైన భవంతుల్లోంచి, ఏ శక్తి మిమ్మల్ని బయటకు నెట్టింది? ప్రకృతి చెక్కిన సుందరకళాఖండం, కన్యారత్నం క్యూనెగొండ్ కు ఏమైంది?’ ప్రశ్నలతో ముంచెత్తాడు శిష్యుడు.

‘మాట పెగలడం లేదు.. నిల్చోలేకపోతున్నా..’ ఆయాసంతో గొణిగాడు తత్వవేత్త.

కాండీడ్ వెంటనే గురువును జేమ్స్ ఇంటికి తీసుకెళ్లి పశువుల పాకలో కూర్చోబెట్టి కాసింత రొట్టెముక్క ఇచ్చాడు.  కాస్త తేరుకోగానే మళ్లీ ప్రియురాలి భోగట్టా విచారించాడు.

‘ఆమె చనిపోయింది..’ చెప్పాడు పాంగ్లాస్.

ఆ మాట వినీ వినగానే కాండీడ్ మూర్ఛపోయాడు. పాంగ్లాస్ పాక అంతా వెతికి కంపుకొట్టే వెనిగర్ పట్టుకొచ్చి శిష్యుడికి స్పృహ తెప్పించాడు.

కాండీడ్ కళ్లు తెరిచి వలపోత మొదలుపెట్టాడు. ‘చచ్చిపోయిందా? నా క్యూనెగొండ్ చచ్చిపోయిందా? అయ్యో! అయ్యయ్యో..! ఆ అతిలోకసుందరి ఇక లేదా? ఏ జబ్బుతో పోయింది? కాదు కాదు, జబ్బుతో కాదు. ఆ సుందర ప్రాసాదం నుంచి నన్ను తన తండ్రి బూటుకాలితో తన్నితగలేయడాన్ని తట్టుకోలేకే గుండెపగిలి చచ్చిపోయింది కదూ?’

‘అందుక్కాదులేవోయ్! బల్గర్ సైనికులు ఆ అబలను ఘోరాతిఘోరంగా చెరిచి, చీరేసి చంపేశారు. జమీందారు ఆమెను కాపాడబోగా ఆయన తలను బద్దలుకొట్టేశారు. జమీందారిణిని ముక్కలుముక్కలుగా నరికేశారు. జమీందారు కొడుకునూ హతమార్చారు. ఇక కోటను మాత్రం వదిలేస్తారా? రాయిపైన రాయి ఎక్కడా మిగల్లేదు. ఒక బాతు లేదు, ఒక గొర్రె లేదు.. ఒక చెట్టు లేదు, ఒక చేమ లేదు. అంతా సర్వనాశం చేశారు. ఇది తగిన ప్రతీకారమేలే. పక్కనున్న బల్గర్ల జమీలో అబర్లు కూడా ఇలాంటి ఘాతుకాలే చేశార్లే..’

అంతా విని కాండీడ్ మళ్లీ మూర్ఛపోయాడు. కాసేపయ్యాక ఈసారి గురువు సాయం లేకుండానే తనంతట తానే తెప్పరిల్లుకున్నాడు. తనను జమీందారు కోటలోంచి తరిమేశాక పడ్డ కష్టాలను ఏకరవు పెట్టాడు. కార్యకారణ సంబంధం లోతుపాతుల్లోకి వెళ్లాడు. పాంగ్లాస్ దుస్థితికి దారితీసిన కారణమేమై ఉంటుందా అని విచారించాడు.

‘ఇదంతా ప్రేమ వల్ల జరిగిందనుకుంటాను. ప్రేమ.. మానవజాతికి ఊరటనిచ్చే ప్రేమ..! అనంతవిశ్వాన్ని పొత్తిళ్లపాపను కాపాడినట్టు కాపాడే ప్రేమ.. సమస్త ప్రాణికోటి ఆత్మ.. దయాపరిపూర్ణ ప్రేమ..!’

‘ఆ..ఆ..! ఆ ప్రేమ రుచేమిటో నాకు తెలుసులెండి.. హృదయ సామ్రాజ్యాలను ఏలే పరమాత్మలాంటి ఆ ప్రేమ గురించి. అది నాకు ప్రసాదించినదల్లా ఒకే ఒక ముద్దు, ముడ్డిమీద ఇరవై తన్నులు. అయితే మరి.., అంత సౌందర్యభరితమైన కారణం మీ విషయంలో మాత్రం ఇంత అసహ్యకరమైన కార్యాన్నెలా ఉత్పత్తి చేసిందో నాకర్థం కావడం లేదు!’ తల పంకించాడు కాండీడ్.

పాంగ్లాస్ సమాధానం మొదలుపెట్టాడు.

4chap

‘బాబూ, కాండీడ్! మన జమీందారిణి పరిచారికల్లోని పకెట్ అనే ముద్దుగుమ్మ నీకు గుర్తుది కదూ..! ఆమె బాహుబంధాల్లో స్వర్గసుఖాలు అనుభవించే నాయనా, నరకానికంటే దారుణమైన ఈ హీనస్థితిలో పడ్డాను. ఆమెకు సుఖవ్యాధి ఉండేది. ఆమె దానివల్లే చనిపోయి ఉండొచ్చు. ఆమెకు ఆ జబ్బును ఫ్రాన్సిస్కన్ సన్యాసి కానుకగా ఇచ్చాడు. అతనికది ఓ ముసలి జమీందారిణి పుణ్యం వల్ల సంక్రమించింది. ఆమెకది ఓ అశ్వదళ నాయకుడి నుంచి సోకింది. అతనికి దాన్ని ఓ సంస్థానాధీశుడి పెళ్లాం అంటించింది. ఆమెకది ఓ కుర్ర నౌకరు నుంచి అంటుకుంది. ఆ నౌకరుకు దాన్ని ఓ జెస్యూట్ అంటించాడు. ఆ జెస్యూట్ కు అది చిన్నతనంలో క్రిస్టఫర్ కొలంబస్ సహచరుల్లో ఒకరి నుంచి సోకింది. ఇక నావరకు వస్తే, నా వల్ల అది ఎవరికీ అంటుకునే ప్రసక్తే లేదు, నేనెలాగూ చచ్చిపోతున్నానుగా..’

‘అబ్బో.. ఎంత గొప్ప వంశవృక్షం! మూలంలో ఉన్నది దుష్టగ్రహం కాదూ?’

‘కాదు, కాదు! అక్కడున్నది ఈ లోకం తప్పించుకోజాలనిది. ఈ మన మంచిలోకంలో తప్పనిసరిగా ఉండవలసినదీనూ. జననమార్గాలను విషపూరితం చేసి వంశాలను నిర్వంశాలను చేసే, సృష్టిధర్మానికే  విరుద్ధమైన ఈ భయంకర రోగాన్ని కొలంబస్ పశ్చిమ ఇండియా దీవులకు వెళ్లి తగిలించుకునిరాకపోయి ఉన్నట్టయితే మనకు చాక్లెట్ రుచి తెలిసేదా? మన మిఠాయిలకు రంగుల సొబగు(కోషినీల్) అబ్బేదా? ఈ జాడ్యం మన మత వివాదాల్లా ఇప్పటివరకైతే మన ఖండంలోని దేశాలకే పరిమితమవడం గమనించాలి. తురుష్కులు, భారతీయులు, పర్షియన్లు, చైనీయులు, సియామీలు, జపనీయులు దీన్నింకా చవిచూసి ఎరగరు. అయితే కారణబలం వల్ల కొన్ని శతాబ్దాల్లో వాళ్లకూ దీని రుచేమిటో తెలుస్తుందిలే. ఈలోగా ఇది ఇప్పటికే మనలో, మరీ ముఖ్యంగా మన రాజ్యాల భవితవ్యం తేల్చే సేవాతత్పరులైన సుశిక్షిత దినభత్యం సైనికుల్లో అద్భుతమైన పురోగతి సాధించింది. చెరో ముప్పైవేల బలగముండే పటాలాలు యుద్ధానికి దిగితే, చెరో పక్షంలో ఇరవై వేల మందికి సవాయి రోగం ఉండితీరుతుందని ఢంకా బజాయించి చెప్పొచ్చు..’ గురువు అనర్గళంగా చెప్పుకుపోతున్నాడు.

 

‘చాలా చిత్రంగా ఉందే! సరిసరి. మీ మాటలు ఇకముందూ తీరిగ్గా వింటానుగాని, ముందు మీ జబ్బు నయం కావాలి’ శిష్యుడు కర్తవ్యం గుర్తు చేశాడు.

 

‘ఎలాగబ్బా? నా దగ్గర చిల్లిగవ్వ లేదే. ఎలా బాగవుతుంది? డబ్బు పుచ్చుకోకుండా జబ్బు నయం చేసే వైద్యుడెవడూ ఈ సువిశాల ప్రపంచంలో లేడు కదా!’

 

కాండీడ్ కు దారి కనిపించింది. నేరుగా జేమ్స్ వద్దకు పరిగెత్తిపోయి కాళ్లు పట్టుకున్నాడు. తన గురువుకు వాటిల్లిన దురవస్థను కళ్లకు కట్టినట్టు వివరించి, ఆదుకోమని అర్థించాడు. ఆ జాలిగుండె పెద్దమనిషి తటపటాయింపు లేకుండా.. పాంగ్లాస్ ను పశువుల పాకలోంచి ఇంట్లోకి తీసుకొచ్చి, సొంతఖర్చుతో వైద్యం చేయించాడు. చికిత్స ముగిసేసరికి ఒక కన్ను, ఒక చెవి ఆనవాళ్లే లేకుండా పోతేపోయాయిగాని, రోగమంతా బాగైంది. పాంగ్లాస్ ఇదివరకట్లాగే బాగా రాయగలుగుతున్నాడు. గణితంలో పాండిత్యమూ ఇసుమంత తగ్గలేదు. వ్యాపార ఖాతాలను చక్కగా  అర్థం చేసుకుంటున్నాడు. జేమ్స్ అతణ్ని తన గణకుడిగా నియమించుకున్నాడు. రెండు నెలల తర్వాత జేమ్స్ వ్యాపారంపై లిస్బన్ కు సొంత ఓడలో బయల్దేరాడు. ఆ ఇద్దరు తత్వవేత్తలనూ వెంటబెట్టుకెళ్లాడు. పాంగ్లాస్ ప్రయాణం పొడవునా.. అంతా మన మంచికే, ఇప్పుడున్న పరిస్థితి ఉన్నదానికంటే మెరుగ్గా ఉండజాలదన్న తన సిద్ధాంతాన్ని కొత్త యజమానికి కూలంకషంగా వివరించాడు. అయితే జేమ్స్ అతని వాదనతో ఏమాత్రం ఏకీభవించలేకపోయాడు.

‘మనుషులు తోడేళ్లలా పుట్టకపోయినా, తోడేళ్లలా మారారు కనక, వాళ్ల స్వభావం కలుషితమైపోయింది. దేవుడు వాళ్లకు ఏనుగుల్లాంటి ఫిరంగులను, తుపాకులను ఇవ్వలేదు. అయినా వాళ్లు వాటిని తయారు చేసుకుని ఒకళ్లనొకళ్లు దుంపనాశనం చేసుకుంటున్నారు. దివాలాలను, రుణదాతల నోళ్లలో మన్నుకొట్టి దివాలాకోరుల కొమ్ముకాసే చట్టాలను ఈ కోవలోకే చేరుస్తా..’ అన్నాడు జేమ్స్.

‘ఉదాహరణలకేంలే, చాలానే ఉంటాయి. అయితే వ్యక్తిగత కష్టనష్టాలు లోకకల్యాణానికి ఉపయోగపడతాయి కనక, అలాంటివి తప్పనిసరి. అలాంటి దురదృష్టాలు ఎంత ఎక్కువైతే లోకానికి అంత మేలు జరుగుతుంది’ వెనక్కి తగ్గకుండా గట్టిగా వాదించాడు ఒంటికంటి పండితుడు.

అతడలా కార్యకారణ సిద్ధాంతాన్ని సాకల్యంగా సాగదీస్తుండగా ఆకాశం నిండా కారుమబ్బులు కమ్ముకున్నాయి. నాలుగు దిక్కుల నుంచీ హోరుమంటూ పెనుగాలులు మొదలయ్యాయి. లిస్బన్ రేవు కనుచూపుమేరలో ఉండగా ఓడ భయంకరమైన తుపానులో చిక్కుకుంది.

 

5వ అధ్యాయం

5chap

తుపాను ధాటికి ఓడ అల్లల్లాడిపోయింది. ఆ ఊపులకు సగం మంది ప్రయాణికులు భయంతో వణుకుతూ  సగం చచ్చిపోయారు. అసలు ఏం జరుగుతోందో కూడా వాళ్లకు తెలియడం లేదు. మిగతా సగం మంది పెడబొబ్బలు పెడుతూ ప్రార్థనలు మొదలుపెట్టారు. తెరచాపలు చిరిగిపోయాయి. కొయ్యలు విరిగిపడ్డాయి. ఓడలో నీరు చేరుతోంది. అందరూ ఏదో ఒకటి చేయగలిగే వాళ్లే అయినా ఆ భయోత్పాతంలో ఏం చెయ్యాలో చెప్పేవాడెవడూ లేడు, వినేవాడు అంతకన్నా లేడు. జేమ్స్ ఓడ పైభాగంలో నిల్చుని ఓడను కాపాడ్డానికి శాయశక్తులా సాయం చేస్తున్నాడు. ఈ విపత్తులో దిక్కుతెలియని ఓ సరంగు పిచ్చి ఆవేశంతో ఊగిపోతూ అతణ్ని చావమోదాడు. జేమ్స్ కిందపడిపోయాడు. దెబ్బకొట్టే ఊపులో సరంగు పట్టుతప్పి నీళ్లలో పడిపోయాడు. ఆ పడ్డంలోనూ విరిగిన తెరచాప దూలంపై పడిపోయి మునుగుతూ, తేలుతూ ఉండిపోయాడు. జాలిగుండె జేమ్స్ ఆ సరంగు కొట్టిన దెబ్బను మరచిపోయి అతణ్ని అతికష్టంతో ఓడపైకి లాగాడు. అయితే సరిగ్గా అప్పుడే ఓడ ఒరగడంతో తానూ నీళ్లలో పడిపోయాడు. సరంగు తన ప్రాణదాతవైపు కన్నెత్తికూడా చూడకుండా తన సంగతి తాను చూసుకోసాగాడు. మునిగిపోతున్న తన శ్రేయోభిలాషిని కాపాడ్డానికి కాండీడ్ నీటిలోకి దూకబోయాడు. అయితే గొప్ప తత్వవేత్తయిన పాంగ్లాస్ వద్దని గట్టిగా వారించాడు. లిస్బన్ ఓడరేవు ఆ అనబాప్తీస్ముడు జలసమాధి కావడానికే సృష్టించబడిందని వాదించాడు. దీన్ని మౌలిక సూత్రాల సాయంతో మరింతగా వివరిస్తుండగా, ఓడ రెండు ముక్కలైంది. పాంగ్లాస్, కాండీడ్, ఆ దుర్మార్గపు సరంగు తప్ప మిగిలినవాళ్లందరూ మునిగిపోయారు. సరంగు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. గురుశిష్యులు ఓ చెక్కబల్లను దొరకబుచ్చుకుని దానిపై తీరం చేరుకున్నారు.

కాస్త సత్తువ చిక్కాక లిస్బన్ వైపు నడిచారు. ఆ తుపాను బీభత్సం తర్వాత ఆకలితో మాడి చావకుండా వాళ్ల దగ్గర కాసిని డబ్బులున్నాయి. ఆ ధీమాతో ముందుకుసాగారు. తమ శ్రేయోభిలాషి మరణానికి భోరున విలపిస్తూ నగరంలోకి అడుగుపెట్టీపెట్టగానే కాళ్ల కింద భూమి కంపించిపోయింది. కడలి ఉప్పొంగి రేవును ముంచెత్తింది. లంగరు వేసిన ఓడలు ముక్కచెక్కలయ్యాయి. మంటలు, బూడిదతో సుడిగాలులు చెలరేగి వీధులను, కూడళ్లను కబళించాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. పునాదులు కదలిపోయాయి. ఆడామగా, పిల్లాజెల్లా కలిపి ముప్పైవేల మంది శిథిలాల కింద చితికి అసువులు బాశారు.

ఆ ఉత్పాతంలో సరంగు సంబరంతో గట్టిగా ఈల వేశాడు.. ‘ఇంకేం, ఇక్కడ బోలెడు విలువైన వస్తువులు దొరుకుతాయి..’ అంటూ.

‘ఈ మొత్తం ఘటనకు కారణమేమై ఉంటుందబ్బా?’ పాంగ్లాస్ తర్కంలో పడిపోయాడు.

‘యుగాంతం కాబోలు..’ శిష్యుడు అందుకున్నాడు.

సరంగు క్షణమాలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి శిథిలాల్లోకి చొరబడి డబ్బుకోసం వెతికాడు. కాసిని డబ్బులు దొరగ్గానే మద్యం కొట్టుకు పరిగెత్తిపోయి పీకల్దాకా తాగొచ్చి గుర్రుకొట్టి నిద్రపోయాడు. లేవగానే అక్కడ కనిపించిన ఓ ఆడమనిషిని డబ్బుతో లోబరుచుకుని ఆ శిథిలాల, పీనుగుల మధ్యే కామకేళికి ఉపక్రమించాడు.

పాంగ్లాస్ అతణ్ని అంగీ పట్టుకుని పైకి లాగాడు.

‘మిత్రమా.. ఇది మంచి పని కాదు సుమా!  విశ్వజనీన కార్యకారణ సిద్ధాంతాన్ని నువ్వు దారుణంగా  ఉల్లంఘిస్తున్నావు. పాపానికి ఒడిగడుతున్నావు. సమయ సందర్భాల విషయంలో విచక్షణ కోల్పోతున్నావు..’ అని హెచ్చరించాడు.

‘ఛత్.. ఏమిటీ పిచ్చి వాగుడు! నేను సరంగును. బటేవియాలో పుట్టాను. జపాన్ వెళ్లిన నాలుగుసార్లూ శిలువపై కాళ్లు మోపాను. నీ మెట్టవేదాంతాన్ని చెప్పుకోవడానికి మరెవర్నయినా వెతుక్కోపో..’ కసిరాడు కామాతురుడు.

మరోపక్క.. విరిగిపడుతున్న ఇళ్ల రాళ్లు తగిలి కాండీడ్ గాయపడ్డాడు. నడివీధిలో శిథిలాల నడుమ కూరుకుపోయాడు.

‘భగవంతుడా… నొప్పి! కాస్త ద్రాక్షసారా, తైలమూ తెచ్చిచ్చి పుణ్యం కట్టుకోండి, చచ్చిపోతున్నా..’ గురువును వేడుకున్నాడు.

‘బాబూ.. కాండీడ్! ఇదేం కొత్త భూకంపం కాదు నాయనా. నిరుడు అమెరికాలోని లిమా పట్టణం కూడా దీన్ని చవిచూసింది. కార్యకారణాలు అక్కడా ఇక్కడా ఒకటే. లిమా నుంచి లిస్బన్ వరకు భూగర్భంలో గంధకపు గొట్టం ఉండి తీరాలి.. ’

‘గొట్టం లేదు, నా బొంద లేదు! అబ్బబ్బ.. నొప్పి భరించలేక నేను చస్తుంటే, మీ వెధవ గోలేమిటి? దయచేసి, ముందు కాస్త సారా, తైలమూ తీసుకొద్దురూ..’

‘అలా అనకు! గంధకపు గొట్టం ఉందని పక్కాగా రుజువైపోయింది.. ’ గురువు మీమాంసను సాగదీయబోయాడు.

క్షతగాత్రుడు స్పృహతప్పాడు. పాంగ్లాస్ దగ్గర్లోని కుళాయి నుంచి దోసిళ్లతో నీళ్లు పట్టుకొచ్చి శిష్యుడికి తాగించాడు. కాండీడ్ కాస్త తేరుకున్నాడు.

మర్నాడు ఇద్దరూ శిథిలాల్లో చక్కర్లు కొడుతుండగా కాస్త తిండి దొరికింది. తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. తర్వాత భూకంపంలో చావుతప్పి కన్నులొట్టబోయిన క్షతగాత్రులకు మిగతా వాళ్లతో కలసి సాయం చేశారు. గురుశిష్యుల సాయం పొందిన కొందరు వాళ్లిద్దరికి అలాంటి విపత్తులో వీలైనంత మంచి విందు ఇచ్చారు. విందు విషాదంగా సాగింది. అందరూ రొట్టెముక్కల్ని కన్నీళ్లలో తడిపేసుకుంటూ తిన్నారు. ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉందో అలాగే జరుగుతుందని, భిన్నంగా జరగడానికి వీల్లేదని పాంగ్లాస్ అందర్నీ ఓదార్చాడు.

‘అంతా మనమంచికే. లిస్బన్లో అగ్నిపర్వతం ఉంటే  ఇంకోచోట ఉండడానికి అస్సలు వీల్లేదు. అంతా మనమంచికే కనక ప్రతీదీ ఉన్న దానికి భిన్నంగా ఉండడం అసాధ్యం.’

పాంగ్లాస్ కు దగ్గర్లో నల్లబట్టలేసుకుని కూర్చున్న పొట్టి మనిషి ఈ వాదనను శ్రద్ధగా ఆలకించాడు. అతడు నాస్తికుల గురించి, దైవదూషణకు పాల్పడేవాళ్ల గురించి మతవిచారణ విభాగానికి ఉప్పందించే గూఢచారి.

‘అయితే, మొత్తానికి మీకు పాపంలో బొత్తిగా నమ్మకం లేనట్టుంది. అంతా మన మంచికే అయితే మరి మనిషి పాపాలతో పతనం కావడం, శిక్షింపబడడం.. ఇవన్నీ ఎందుకంటారు?’ వినయంగా అడిగాడు అతడు.

‘అయ్యా..! మనిషి ఉత్తమలోకాలకు వెళ్లడానికి పాపం, పతనం, శిక్ష తప్పనిసరి’ అంతే వినయంగా బదులిచ్చాడు తత్వవేత్త.

‘అయితే మీకు మనిషి స్వతంత్రేచ్ఛపై నమ్మకం లేదా?’

‘ప్రభువులు మన్నించాలి! మనం స్వతంత్రంగా ఉండాలంటే స్వేచ్ఛ ఎంతైనా అవసరం. నిర్ణాయక స్వేచ్ఛ అనేది.. ’

పాంగ్లాస్ మాట పూర్తిచేయకముందే ఆ పొట్టి మనిషి తనకు సారా పోస్తున్న సేవకుడికి సైగ చేశాడు.

(సశేషం)

కాండీడ్-2

 

2

ఆ విధంగా భూతలస్వర్గం నుంచి తన్నితరిమేశాక కాండీడ్ తనెక్కడికి పోతున్నదీ తనకే తెలియకుండా తిరిగాడు. కడవలకొద్దీ కన్నీళ్లు కారుస్తూ స్వర్గంవైపు చూసేవాడు. అయితే ఆ చూపు మాటిమాటికి దారితప్పి జమీందార్ల కూతుళ్లుండే చక్కని భవనాల్లోకి చొచ్చుకెళ్లేది. ఓ రాత్రి అతడు పొలంలో నాగేటి చాల్లో పడకేశాడు. మంచు తుంపర్లతుంపర్లుగా కాకుండా ముద్దలుముద్దలుగా కురిసింది. చలికోతకు తోడు కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. పొద్దున మెలకువ వచ్చేసరికి ఒళ్లంతా బిరుసెక్కి చల్లగా, శవంలా అనిపించింది. కొనప్రాణాలతో కాళ్లీడ్చుకుంటూ దగ్గర్లోని వాల్డ్ బెర్గాఫ్ డిక్ డార్ఫ్ పట్టణానికి చేరుకున్నాడు. ఓ సత్రం ముందు దీనాతిదీనంగా ముఖం పెట్టుకుని నిల్చున్నాడు.

సత్రం దగ్గర ఏదో పనిపై తిరుగుతున్న ఇద్దరు నీలిబట్టల వాళ్లు అతణ్ని చూశారు.

‘కుర్రాడు కత్తిలా ఉన్నాడు. ఎత్తుకూడా సరిగ్గా సరిపోతుంది’ అన్నాడు వాళ్లలో ఒకడు పక్కవాడితో.

ఇద్దరూ కాండీడ్ వద్దకెళ్లి తమతోపాటు భోజనం చేయాలని వినయంగా ఆహ్వానించారు.

‘అయ్యలారా! మీ మర్యాద బావుంది. సంతోషం. కానీ భోజనానికి నా వాటా కింద ఇచ్చేందుకు నా వద్ద చిల్లిగవ్వ కూడా లేదే.’

‘డబ్బా? ఆ సంగతి మరచిపొండి బాబూ. అసలు మీ వంటి రూపసులు, గొప్పవాళ్లు ఎప్పుడూ దేనికీ డబ్బులు చెల్లించకూడదు. సరేగాని, మీ ఎత్తు ఐదడుగులా ఐదంగుళాలు ఉంటుందా?’ ఒకడు అడిగాడు.

‘అవును. నా ఎత్తు కచ్చితంగా అంతేనండి’ వినయంగా తలవంచి చెప్పాడు కాండీడ్.

‘బావుంది, బావుంది. అయితే ఇక మాతో రండి. మీ వాటా కూడా మేమే చెల్లిస్తాం. మీలాంటి బుద్ధిమంతులకు డబ్బు కొరత రానిస్తామా? అసలు మనుషులు పుట్టిందే ఒకరికొకరు సాయం చేసుకోవడానికి.’

‘మీరన్నది అక్షరాలా నిజం. మా గురువుగారు పాంగ్లాస్ కూడా నాకెప్పుడూ ఈ మాటే చెబుతుంటారు. మీ మర్యాదామన్ననా చూశాక, అంతా మన మంచికేనన్న వాదాన్ని మరింత గట్టిగా ఒప్పేసుకుంటున్నాను సుమీ.’

తర్వాత ఆ కొత్త నేస్తాలు కాండీడ్ కు కొన్ని షిల్లింగులు ఇస్తామని, తీసుకోవాలని బతిమాలారు. కాండీడ్ సంతోషంగా వాటిని పుచ్చుకుని, ముట్టినట్టు రసీదు రాసివ్వబోయాడు. అయితే వాళ్లు వద్దన్నారు. తర్వాత ముగ్గురూ తిండి బల్లముందు కూర్చున్నారు.

2chap

 

‘మీరు గాఢంగా ప్రేమిస్తున్నారనుకుంటా..’ కొత్త మిత్రుల్లో ఒకడు ముచ్చట పెట్టాడు.

‘ఔనౌను. నాకు క్యూనెగొండ్ అంటే చచ్చేంత ప్రేమ.’

‘ఆ సంగతి కాదు, మీరు మా బల్గర్ల రాజును గాఢంగా ప్రేమిస్తున్నారా అని?’

‘ప్రేమా? బల్గర్ల రాజుపైనా! ఆరి దేవుడోయ్.. అసలు నేనాయన్ను చూసే ఎరగనే?’

‘ఆయన రాజుల్లో మణిపూస. ఆయన ఆయురారోగ్యాల కోసం కాస్త మద్యం పుచ్చుకుందాం.’

‘సంతోషంగా..’ అంటూ అతిథి పానపాత్రను ఖాళీ చేశాడు.

‘ఇక చాలు! నువ్విప్పుడు మా రాజువైపు చేరినట్టే. ఆయన రక్షకుల్లో భాగమైనట్టే. బల్గర్లలో మరో వీరుడు అవతరించాడోచ్! కీర్తికాంత నీ కోసం ఎదురుచూస్తోంది ధీరుడా, ముందుకు సాగిపో..’ అన్నారు నీలిబట్టల వాళ్లు.

అలా స్తోత్రపాఠాలు వల్లిస్తూనే ఇద్దరూ కాండీడ్ చేతులకు, కాళ్లకు సంకెళ్లు తగిలించి, దగ్గర్లోని సైనిక స్థావరానికి లాక్కెళ్లారు. అక్కడ ‘కుడి’, ‘ఎడమ’ తిప్పుళ్లు, కవాతు, ఆయుధాలు అందుకోవడం, గురిచూసి తుపాకీ కాల్చడం వగైరా సైనిక విద్యల్లో తర్ఫీదు ఇచ్చారు. తర్వాత దుడ్డుకర్రతో ముప్పైసార్లు బాదారు. మర్నాడు కవాతులో కాస్త మెరుగనిపించడంతో ఇరవై దెబ్బలే కొట్టారు. ఆ మర్నాడు ఇంకాస్త మెరుగనిపించడంతో పది దెబ్బలతో సరిపెట్టారు. తోటి జవాన్లు అతణ్ని ఏకసంతాగ్రాహి అనీ, గండరగండడనీ, అదనీ, ఇదనీ పొగడ్తలతో ముంచెత్తారు.

ఆ పొగడ్తలకు కాండీడ్ విస్తుపోయాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోయాడు. తను వీరాధివీరుడనని చెబుతుంటే నమ్మలేకపోతున్నాడు. అయితే నమ్మకం కుదిరే క్రమంలో వసంత రుతువులో హాయిగొలిపే ఓ ఉషోదయాన అతనికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. మనిషికైనా, జంతువుకైనా తలచుకున్నప్పుడు కాలికి పని చెప్పే హక్కుంది కనక, తాను కూడా పటాలం నుంచి వెళ్లిపోవచ్చని భావించి కాలికి బుద్ధి చెప్పాడు. మహా అయితే ఆరు మైళ్లు పోయాడో లేదో ఆరడుగుల ఎత్తున్న నలుగురు సైనికులు అతణ్ని పట్టుకుని బంధించి, చీకటి కొట్లో పడేశారు. సైన్యాధికారులు నేరాన్ని విచారించారు. పటాలంలోని అందరితోనూ ముప్పయ్యారుసార్లు కొరడా దెబ్బలు తినడమో, లేకపోతే బుర్రలోకి ఒకేసారి పన్నెండు తూటాలు కాల్పించుకోవడమో ఏదో ఒకటి ఎంచుకోవడానికి మహాదయతో అనుమతించారు. మనిషి స్వేచ్ఛాజీవి అని, ఈ రెండింటిలో ఏదీ తనకు వద్దని అతడు గొంతుచించుకు వాదించినా ఫలితముండదు కనక ఏదో ఒకటి ఎంచుకోక తప్పలేదు. అతడు అలా భగవద్దత్తమైన స్వేచ్ఛ అనే వరాన్ని వాడుకుని కొరడా దెబ్బలనే కోరుకున్నాడు. శిక్ష మొదలైంది. రెండు వరసలకు మాత్రమే తట్టుకోగలిగాడు. పటాలంలోని ఒక్కొక్కరు రెండు దెబ్బలు కొట్టారు. పటాలంలో రెండువేల మంది ఉండడంతో సరిగ్గా నాలుగువేల దెబ్బలు పడ్డాయి. కాండీడ్ ఒళ్లు గుళ్లయింది. ఆపాదమస్తకం కండరాలన్నీ, నరాలన్నీ వాతలు తేలి ఉబ్బిపోయాయి.  మూడో వరస మొదలు కాబోతుండగా కాండీడ్ భీతిల్లిపోయి, దయచేసి తనకు శిరచ్ఛేదం చేయమని వేడుకున్నాడు. అతని కోరికను మన్నించారు. కళ్లకు గంతలు కట్టి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఇంతలో బల్గర్ల రాజు అటుగా వచ్చాడు. ఖైదీ నేరమేంటో కనుక్కున్నాడు. రాజు వివేకవంతుడవడం వల్ల, లోకం పోకడ ఏమాత్రం తెలియని కాండీడ్ అనే యువ తత్వవేత్త తన సైన్యంలో ఉన్నాడని అదివరకే విని ఉండడం వల్ల… అన్ని కాలాల్లో, అన్ని పత్రికల్లో వేనోళ్ల కొనియాడదగిన కరుణాకటాక్షవీక్షణాన్ని అతనిపై ప్రసరింపజేసి క్షమాభిక్ష పెట్టాడు. తర్వాత చేయి తిరిగిన వైద్యుడొకడు.. డియోస్కోరిడిస్ సూచించిన లేపనాలతో, కాపడాలతో కాండీడ్ కు మూడు వారాలు చికిత్స చేశాడు. కాస్త నడవడానికి వీలుగా కాళ్లపై కొత్త చర్మం వచ్చింది. ఇంతలో బల్గర్ల రాజు అబర్ల రాజుతో కయ్యానికి కాలు దువ్వాడు.

 

3.

సుశిక్షితమైన రెండు సైనిక బలగాలు యుద్ధానికి దిగినప్పుడు రేగే ఆ కోలాహలం, అందచందాల సంగతే వేరు. కళ్లారా చూస్తేగానీ అనుభంలోకి కాదు. భేరీల, బాకాల, ఫిరంగి పేలుళ్ల, ఈలల, కేకల రణగొణ ధ్వనులు సృష్టించే ఆ ఒద్దికా, ఆకర్షణతో నరకం కూడా పోటీ పడలేదు. తొలి దాడిలో ఫిరంగులు పేల్చగా రెండువైపులా చెరో ఆరువేల మంది పరమపదించారు. తర్వాత తుపాకీ కాల్పుల్లో తొమ్మిది, పదివేల మంది దాకా ఎంతో అద్వితీయమైన ఈ లోకం నుంచి నిష్ర్కమించారు. తుపాకీ కొనకత్తుల కారణబలం వల్ల ఇంకొన్ని వేల మంది నేలకొరిగారు. మొత్తం ముప్పైవేల మంది మృత్యువాతపడ్డారు. కాండీడ్ తత్వవేత్తలా వణికిపోతూ ఆ వీరోచిత ఊచకోత సాగుతున్నంతసేపూ బహు జాగ్రత్తగా దాక్కున్నాడు.

యుద్ధం ముగిశాక ఇద్దరు రాజులూ తమ తమ గుడారాల్లో విజయోత్సవాల్లో లీనమై ఉండగా కాండీడ్ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. తన కార్యకారణ సిద్ధాంతానికి అనువైన చోటుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. శవాల గుట్టలపై నుంచి, చస్తున్నవాళ్లపై నుంచి దారి చేసుకుంటూ దగ్గర్లోని పల్లెకు వెళ్లాడు. అది అబర్ల రాజ్యం లోనిది. కాలిపోతున్న కొంపాగోడూ నుంచి వస్తున్న పొగ తప్ప మరేమీ లేదక్కడ. బల్గర్లు అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం దాన్ని భస్మీపటలం చేశారు. గాయాలతో అవిటివాళ్లయిన ముసలివాళ్లు.. గొంతులు తెగి, నెత్తురోడుతున్న రొమ్ములకు బిడ్డలను హత్తుకుని కన్నుమూసిన తమ ఆడవాళ్ల వంక నిస్సహాయంగా చూస్తూ కనిపించారు. బల్గర్ మహావీరుల కామవాంఛలు తీర్చిన కన్యలు అంగాలు చీరేయబడి, అంతిమ క్షణాల్లో ఎగశ్వాస తీస్తున్నారు. మంటల్లో ఘోరంగా కాలిపోయిన వాళ్లు తమకు త్వరగా చావు రావాలని వేడుకుంటున్నారు. నేలపై ఎటుచూసినా తెగిపోయిన కాళ్లు, చేతులు, మెదళ్లు పడున్నాయి.

కాండీడ్ ఆ భీతావహాన్ని చూడలేక గబగబా మరో పల్లెకు చేరుకున్నాడు. అది బల్గర్ల రాజ్యంలోనిది. అబర్ సైనికులు కూడా అంతర్జాతీయ న్యాయసూత్రాలను తూచ తప్పకుండా పాటించి పై పల్లెకు పట్టిన గతినే దీనికీ పట్టించారు. కాండీడ్ శవాల గుట్టలు, కూలిన కొంపలపై నుంచి వేగంగా సాగి రణభూమిని దాటేశాడు. అతని మూటలో కొద్దిగా తిండి ఉంది. మదిలో క్యూనెగొండ్ పదిలంగా ఉంది. హాలండ్ చేరుకునేసరికి ఉన్న తిండి కాస్తా అయిపోయింది. హాలండ్ వాసులందరూ సంపన్నులని, క్రైస్తవులని అదివరకెవరో అతనికి చెప్పారు. అందుకే వాళ్లు తనను బాగా ఆదరిస్తారని, క్యూనెగొండ్ వలపుచూపుల వలలో చిక్కి, తన్నులు తిని, గెంటేయకముందు థండర్ టెన్ ట్రాంక్ కోటలో తనకు దక్కిన సకల గౌరమర్యాదలన్నీ ఇక్కడా దక్కుతాయని గట్టిగా అనుకున్నాడు.

3chap

ఆ నమ్మకంతో కనిపించిన ప్రతి పెద్దమనిషినీ బిచ్చమడిగాడు. వాళ్లు దమ్మిడీ ఇవ్వలేదు. పైగా, ఇలా అడుక్కుంటూ తిరిగితే, బతుకు తెరువు నేర్పే కారాగారానికి పంపిస్తామని మందలించారు.

కాండీడ్ తర్వాత జనం గుమికూడిన చోటుకు వెళ్లాడు. ఓ వక్త దానధర్మాల గొప్పతనంపై గంటసేపట్నుంచి ఉపన్యాసం దంచుతున్నాడు. అతడు తన పెద్ద టోపీ చాటునుంచి కాండీడ్ ను కళ్లు చిట్లిస్తూ చూసి, ‘ఇక్కడ నీకేం పని? నేను చెబుతున్న ఈ మంచి విషయాన్ని నువ్వు సమర్థిస్తావా లేదా?’ అని గద్దిస్తూ అడిగాడు.

‘కారణం లేకుండా కార్యం ఉండదండి. ప్రతి ఒక్కటీ మన మంచి కోసమే, ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. నన్ను క్యూనెగొండ్ సమక్షం నుంచి తరిమేయడం, తర్వాత నేను పటాలంలో కొరడాల బారిన పడడం, ఇప్పుడిలా కాసింత రొట్టెముక్క కోసం చేతులు చాచి దేబిరించడం.. ఇదంతా నా ఖర్మ, దురదృష్టం. ఇదిలా కాకుండా మరోలా ఉండడానికి వీల్లేదు’ కాండీడ్ వినయంగా విడమరచి బదులిచ్చాడు.

‘బావుంది మిత్రమా! మరి, ఈ సంగతి చెప్పు. .. పోప్ క్రీస్తువ్యతిరేకి అంటే నీకేమన్నా అనుమానమా?’

‘అసలు అలాంటి వాదనొకటి ఉందని నేనింతవరకూ విననే లేదు. అయినా ఆయన క్రీస్తు వ్యతిరేకి అయితేనేం, కాకపోతేనేం, ఆ సంగతి నాకు శుద్ధ అనవసరం! నాకు ప్రస్తుతానికి కడుపు నింపుకోవడానికి కాసింత రొట్టెముక్క కావాలి, అంతే’ అన్నాడు ఆకలి బాధితుడు.

‘ఓరి మూర్ఖుడా! దుష్టుడా.. దుర్మార్గుడా! నీచుడా.. నికృష్టుడా! అయితే నీకు తిండి తినే అర్హత కూడా లేదుపో. వెంటనే ఇక్కణ్నుంచి వెళ్లిపో. ఇంకోసారి నా ఛాయలకే రావద్దు. వచ్చావా, చచ్చావే అనుకో..’ కేకలేశాడు వక్త.

కిటికీలోంచి తలను కొంగలా చాచి చూస్తున్న సదరు వక్త భార్యకు కూడా చిర్రెత్తుకొచ్చింది. పోస్ క్రీస్తు వ్యతిరేకా, కాదా అని తర్కించిన ఆ సంశయాత్ముడి నెత్తిపై ఆ మహా ఇల్లాలు కుండెడు కడుగునీళ్లు కుమ్మరించింది. అకటకటా! మతావేశం అతివలతో ఎన్ని ఘోరాలు చేయిస్తుందో కదా!

జేమ్స్ అనే అనబాప్తీస్ముడైన జాలిగుండె మనిషి ఈ క్రూరపరాభవాన్ని చూసి చలించిపోయాడు. సాటి మనిషికి, సోదరుడిలాంటి వాడికి, ఈకల్లేని రెండు కాళ్ల ఆత్మగత ప్రాణికి, బుద్ధిమంతుడికి జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. కాండీడ్ పై కరుణ పెల్లుబికింది. అతణ్ని ఓదార్చి ఇంటికి తీసుకెళ్లాడు. శుభ్రంగా స్నానం చేయించి, తిండి పెట్టాడు. కాస్త బీరు కూడా పోశాడు. దగ్గరుంచుకొమ్మని కొంత చిల్లర ఇచ్చాడు. తాను పర్షియన్ పట్టబట్టలు నేయిస్తుంటానని, ఆ పని కూడా నేర్పుతానని చెప్పాడు. ఆ అమిత దయాదాక్షిణ్యాలకు కాండీడ్  నిలువెల్లా కదలిపోయి కృతజ్ఞతా భారంతో జేమ్స్ కాళ్లపై పడిపోయాడు.

‘ఈ లోకంలోని ప్రతీదీ మన మంచికోసమే ఉందన్న మా గురువు పాంగ్లాస్ వాక్కు ముమ్మాటికీ నిజమని నమ్ముతున్నాను. నల్లకోటు తొడుక్కుని ఉపన్యాసం దంచిన ఆ పెద్దమనిషి, ఆయన ఇల్లాలి దుష్టత్వం, వాళ్లు చేసిన అవమానాలను మీ అపురూపమైన ఆదరణతో మరచిపోతున్నాను’ అన్నాడు.

మర్నాడు కాండీడ్ వీధిలోకి వెళ్లినప్పుడు ఒళ్లంతా గాయాల పక్కులున్న బిచ్చగాడు తారసపడ్డాడు. అతని కళ్లలో జీవం లేదు. ముక్కు కొన పుండుపడి ఊడిపోయింది. మూతి వంకర పోయింది. పళ్లు గారపట్టాయి. గొంతు పెగలడం లేదు. భయంకరంగా దగ్గుతున్నాడు. దగ్గుదగ్గుకు ఒక్కో పన్ను నేలపైన రాలి పడుతోంది.

 

(సశేషం)

వోల్టేర్ నవల: కాండీడ్-1

KONICA MINOLTA DIGITAL CAMERA

1

వెస్ట్ ఫేలియా రాజ్యంలోని థండర్ టెన్ ట్రాంక్ జమీందారు కోటలో సద్గుణ సంపన్నుడైన యువకుడొకడు నివసిస్తుండేవాడు. మనిషి ఎలాంటి వాడో ముఖం చూస్తూనే తెలిసిపోతుంది. ఒట్టి వెర్రిబాగులవాడే కాని, తిరుగులేని నిర్ణయాలు తీసుకోవడంతో మటుకు దిట్ట. అందుకే అతనికి కాండీడ్(నిష్కపటి) అని పేరు పెట్టి ఉంటారనుకుంటాను. అతని పుట్టుపూర్వోత్తరాల గురించి పెద్దగా తెలియదు కాని, ఆ కోటలోని ముసలి నౌకర్లు మాత్రం అతడు జమీందారు సోదరికి, పొరుగూరి పెద్దమనిషి వల్ల పుట్టాడని చెప్పేవాళ్లు. సదరు పెద్దమనిషి ఒట్టి పెద్దమనిషే కాని, అతని వంశవృక్షంలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న తరాలు తొంభై తొమ్మిదికి మించి లేకపోవడం వల్ల,  మిగతా వంశవృక్షం కాలమహిమకు సర్వనాశనం అయిపోవడం వల్ల జమీందారు సోదరి అతణ్ని పెళ్లాడ్డానికి నిరాకరించిదట.

జమీందారు ఆ రాజ్యంలోని శక్తిమంతులైన ప్రభువుల్లో ఒకడు. ఎందుకంటే అతని భవనానికి తలుపు మాత్రమే కాకుండా బోలెడన్ని కిటికీలతోపాటు హాల్లో గోడకు ఖరీదైన అల్లికలగుడ్డా వేలాడుతూ ఉంటుంది కనక. ఆయన దొడ్లోని కుక్కలు కూడా తక్కువేమీ కాదు. ఏదన్నా పని తగిలితే వేటకుక్కల్లా ఎగబడేవి. పాలేర్లే వేటగాళ్లు. ఊరి చర్చి అధికారి జమీందారుకు ఆస్థాన పురోహితుడు. ప్రజలు జమీందారును, ‘మా రాజు’ అని గౌరవంగా, ఇష్టంగా పిలుచుకునేవాళ్లు. అతని సొంత కథలకు, ఛలోక్తులకు పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వేవాళ్లు.

ఇక జమీందారిణి సంగతి. మూడువందలా యాభై పౌండ్ల బరువు కారణంగా ఆమె కూడా ఏ మాత్రం విస్మరించరాని ప్రముఖురాలైపోయింది. ఇంటి సంప్రదాయాలను తూచ తప్పకుండా అమలు చేయిస్తూ బోలెడంత పరువుప్రతిష్ట మూటగట్టేసుకుంది. ఆమె కూతురు క్యూనెగొండ్. పదిహేడేళ్ల పడచుపిల్ల. లేత గులాబీ ఛాయ, కాస్త బొద్దుగా ఉండే ఒంపుసొంపుల ఒళ్లు, అందమైన ముఖంతో చూడముచ్చటగా, మతిపోగొట్టేలా ఉంటుంది. జమీందారు కొడుకు తండ్రికి తగ్గ తనయుడు. అతని గురువు పాంగ్లాస్. పాంగ్లాస్ మహామేధావి, పండితుడు, ఆ ఇంటికి జోస్యుడు. అతని మాటంటే ఇంట్లో అందరికీ గురి. పాంగ్లాస్ వయసు, వ్యక్తిత్వం, సర్వజ్ఞత్వాలపై గౌరవంతో కాండీడ్ అతని బోధనలను అచంచల విశ్వాసంతో వింటుంటేవాడు.

1chap1

పాంగ్లాస్ అధిభౌతిక-మతతాత్విక-విశ్వోద్భవ శాస్త్రాల విషయాలనేకం బోధిస్తుండేవాడు. ముఖ్యంగా కార్యకారణ సిద్ధాంతాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టు వివరించేవాడు. కారణం లేకుండా కార్యం ఉండదని, అన్ని స్థలకాలాల్లో తన యజమాని భవనం వంటి అందమైన, ఘనమైన భవనం లేనేలేదని, లోకంలోని యజమానురాళ్లందరిలో తన యజమానురాలే సర్వోత్తమురాలని రెండోమాటకు తావులేకుండా నిరూపించాడు.

‘వస్తువులు అవి ఉండాల్సిన తీరుగా భిన్నంగా ఉండవని ఏనాడో రుజువైంది. ఎందుకంటే ప్రతి ఒక్కటీ ఏదో ఒక అవసరం కోసం రూపొందుతోంది కనక, ప్రతి ఒక్కటీ ఏదో ఒక మంచిపని కోసమే సృష్టి అవుతోంది కనక. ఉదాహరణకు తీసుకోండి.. మన ముక్కులు కళ్లజోళ్లను మొయ్యడానికే రూపుదిద్దుకున్నాయి. అందుకే కళ్లజోళ్లు పెట్టుకుంటున్నాం. కాళ్లున్నది కచ్చితంగా లాగులు తొడుక్కోవడానికే. అందుకే లాగులు వేసుకుంటున్నాం. రాళ్లు అందంగా మలచడానికి, భవంతులు కట్టడానికి అవతరించాయి. అందుకే మన జమీందారుకు ఎంతో అందమైన భవంతి అమరింది. వెస్ట్ ఫేలియా ప్రభువుల్లోకెల్లా గొప్పవారైన ఆయనకు తన హోదాకు తగ్గట్టు గొప్ప భవనం ఉండాలిగా మరి. ఇక పందుల సంగతి.. అవి మనం తినడానికే అవతరించాయి. అందుకే మనం యాడాది పొడవునా ఎంచక్కా పందిమాంసం ఆరగిస్తున్నాం. అంతా మన మంచికే, ప్రతీదీ మనమంచికేనన్న వాదాన్ని అర్థరహితంగా కొట్టిపడేసేవాళ్లు ఇకనైనా దాన్ని ఒప్పుకుని తీరాలి..’ అని విడమరచి బోధిస్తుండేవాడు పాంగ్లాస్.

కాండీడ్ క్యూనెగొండ్ ను అతిలోకసుందరిగా తలపోయడం వల్ల, ఆ తలపోతకు బలమైన కారణమే ఉంటుందనుకుని పాంగ్లాస్ మాటలను వెర్రిమొగమేసుకుని చెవులు రిక్కించి వినేవాడు. అయితే ఆమె అందాల కుప్ప అన్న సంగతిని నేరుగా ఆమెతోనే చెప్పే ధైర్యం లేకపోయింది. థండర్ టెన్ ట్రాంక్ ప్రాంత జమీందారుగా పుట్టడం పెద్ద అదృష్టమని, ఆయన కూతురవడం రెండో పెద్ద  అదృష్టమని అతని భావన. ఆమెను రోజూ కళ్లారా చూడ్డం మూడో భాగ్యమని, తమ రాజ్యంలోనే కాకుండా యావత్ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్త అయిన పాంగ్లాస్ ప్రబోధాలు వినడం నాలుగో భాగ్యమని అనుకునేవాడు.

1chap3

ఓ రోజు క్యూనెగొండ్ ఇంటి దగ్గర్లోని చిన్న ఉద్యానవనంలో విహరిస్తుండగా ఆసక్తికరమైన దృశ్యం కంటబడింది. పూపొదల మాటున పాంగ్లాస్ పండితుడు తన తల్లిచెంత పనిచేసే అందమైన పడుచుపిల్లకు ప్రయోగపూర్వక తత్వశాస్త్రపాఠాన్ని నేర్పుతూ కనిపించాడు. క్యూనెగొండ్ కు శాస్త్రాలపై చెప్పలేనంత ఆసక్తి కనక, ఊపిరి సలపనంత మోహావేశంతో పునశ్చరణ చేస్తున్న ఆ ప్రయోగాలను కుతూహలంతో కన్నార్పకుండా చూసింది. పండితవర్యుల ‘సహేతుక కారణ’ బలాన్ని చక్కగా అర్థం చేసుకుని, కార్యకారణాలను బుర్రలోకి ఎక్కించుకుంది. వ్యాకుల చిత్తంతో తొట్రుపడుతూ ఇంటికి తిరుగుముఖం పట్టింది. పొదలచాటు వ్యవహారం ఆమెలో ఆలోచనల తుట్టెను కదిల్చి, అభ్యసన కాంక్షను రగిల్చింది. ఆ ప్రయోగాన్ని తాను కూడా కాండీడ్ తో కలసి చేస్తే బాగుంటుందనిపించింది. తాను అతనికి, అతడు తనకు తగిన కారణమని అనుకుంది.

ఇంటికి చేరువవుతుండగా కాండీడ్ కలిశాడు. ఆమె సిగ్గుపడింది. అతడూ సిగ్గుపడ్డాడు. తడబాటు గొంతుకతో ఆమె అతనికి శుభోదయం చెప్పి అభివాదం చేసింది. అతడూ తను చెబుతున్నదేంటో తనకే తెలియకుండా శుభోదయం చెప్పి ప్రత్యభివాదం చేశాడు. మర్నాడు మధ్యాహ్న భోజనాలు ముగించుకుని వెళ్తుండగా ఇద్దరూ ఓ తెరవెనక కలుసుకున్నారు. క్యూనెగొండ్ తన చేతి రుమాలును జారవిడిచింది. కాండీడ్ దాన్ని తీసి ఆమె చేతికందించాడు. ఆమె అమాయకంగా అతని చేయి పట్టుకుంది. అతడూ ఏమీ ఎరగనట్టే తన్మయంగా ఆమె చేతిని ముద్దాడాడు. పెద్దవులూ పెదవులూ పెనేవేసుకున్నాయి. కళ్లు తళుక్కుమని మెరిశాయి. కాళ్లు ఉద్వేగంతో కంపించాయి. చేతులు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఇంతలో జమీందారు ఆ తెరవెనకగా వచ్చాడు. కార్యకారణ సంబంధాలను పరిపూర్ణంగా గ్రహించి, కాండీడ్ ను చావుదెబ్బలతో సత్కరించి ఇంటి నుంచి గెంటేశాడు. క్యూనెగొండ్ మూర్ఛపోయింది. స్పృహలోకి రాగానే జమీందారిణి ఆమె చెవుల్ని సత్తువకొద్దీ మెలేసింది. ఆ విధంగా లోకంలోకెల్లా అందమైన, ఘనమైన ఆ భవనం నలుమూలలా భయాందోళనలు రాజ్యమేలాయి.

 

(వచ్చే గురువారం)

వోల్టేర్ హృదయ ప్రతిబింబం.. కాండీడ్

KONICA MINOLTA DIGITAL CAMERA

 

‘ఒక మనిషిని అతడు చెప్పే సమాధానాలను బట్టి కాకుండా అతడు వేసే ప్రశ్నలను బట్టి అంచనా కట్టు’ అని అంటాడు ఫ్రెంచి తత్వవేత్త వోల్టేర్(1694-1778). ప్రశ్న లేనిదే ప్రగతి లేదని అతని ప్రగాఢ విశ్వాసం. అందుకే అతడు ప్రతిదాన్నీ ప్రశ్నించాడు. మనిషిని, మతాన్ని, దేవుణ్ని, దెయ్యాన్ని, రాజును, రాజ్యాన్ని, యుద్ధాన్ని, న్యాయస్థానాన్ని.. దేన్నీ వదల్లేదు. ప్రతిదాన్నీ హేతువనే గీటురాయిపై రుద్ది మంచిచెడ్డలను విచారించాడు. మంచిని తలకెత్తుకున్నాడు. చెడ్డను నరికి పోగులు పెట్టాడు.

ప్రశ్నే ప్రాణంగా బతికిన వోల్టేర్ తన విశ్వాసాలపై ఎక్కడా రాజీపడలేదు. జైలుకు వెళ్లాడు, ప్రవాసానికి వెళ్లాడు. కానీ ప్రశ్నదీపాన్ని ఎన్నడూ కొడిగట్టించలేదు.  ‘నీ మాటతో నేను ఏకీభవించను. కానీ ఆ మాట చెప్పేందుకు నీకున్న హక్కు కోసం కడవరకు పోరాడతా ’నంటూ భావప్రకటన స్వేచ్ఛ కోసం వోల్టేర్ తాత్విక యుద్ధయంత్రంలా పనిచేశాడు. నిజానికి ఈ మాటలు అతడు ముక్కస్య ముక్కస్య అనకపోయినా.. అభిప్రాయాల కారణంగా నీ పొరుగువాడిని తగలబెట్టొద్దు అని అన్నాడన్నది మాత్రం నిజం.

 

తన భావవిప్లవంతో యూరప్ సమాజాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్నీ ఉర్రూతలూగించిన వోల్టేర్ మనసుకు అతని సుప్రసిద్ధ వ్యంగ్య నవలిక ‘కాండీడ్’(1759) అద్దం పడుతుంది. మనిషి మేధను, శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేసే కర్మసిద్ధాంతం లాంటి నిరర్థక ఆశావాదాన్ని(Leibniz’s Optimism) వోల్టేర్ ఈ రచనతో చావుదెబ్బ తీశాడు. స్వేచ్ఛ కోసం అతడు పడ్డ తపనతోపాటు మతాల అసహనం, ఆధిపత్యం, హింస, ఆత్మలోకంలో దివాలా, కపటత్వం, దోపిడీ, పీడనలపై అతడు లేవదీసిన తిరుగుబాటు అన్నీ ఇందులో హాస్యబీభత్సంగా దర్శనమిస్తాయి. కత్తికంటే పదునైన వెటకారం నవలిక సాంతం అంతస్సూత్రంలా సాగుతూ మానవజాతి నానా అవలక్షణాలపై అడుగడుగునా ఉమ్మేస్తూ పోతుంది. అందుకే అచ్చయిన ఏడాదే ఫ్రెంచి పాలకులు నిషేధం వేటు వేశారు. 20వ శతాబ్ది తొలి దశకాల్లోనూ అమెరికా వంటి ఘన ప్రజాస్వామిక దేశాల్లో సైతం దీనిపై నిషేధం అమలైందంటే ఇది ఎంత ‘ప్రమాదకర’మో అర్థం చేసుకోవచ్చు. కాండీడ్ ను 20వ శతాబ్ది ఘోరాలకు, అసంబద్ధతకు అతికినట్టు అన్వయిస్తూ 1960లో వచ్చిన ఫ్రెంచి సినిమా ‘Candide ou l’optimisme au XXe siècle’ ఆ నవలికకు ఇప్పటికీ ఉన్న ప్రాంగికతకు నిదర్శనం. ‘వోల్టేర్ కాండీడ్ తో తన అన్ని రచనల సారాంశాన్ని మనముందుంచాడు.. అతడు నిజంగానే హాస్యమాడుతున్నాడా? లేదు.. ఆక్రోశిస్తున్నాడు.. ’ అని అంటాడు ఫ్రెంచి రచయిత ఫ్లాబర్.

వోల్టేర్ కాండీడ్ లో దునుమాడిన వికృతం, అన్యాయం, అసత్యం, అసంబద్ధత, కక్ష, కార్పణ్యం ఇప్పటికీ యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అంతా మన మంచికేనన్న భ్రమలను పాలకులతోపాటు ‘మేధావులూ’ మరింత పెంచుతున్నారు. హేతువును, ప్రశ్నించే గొంతుకలను ఉత్తరిస్తున్నారు. ఇప్పకికే భ్రష్టుపట్టిపోయిన మతం, చరిత్ర, రాజకీయాలు, కళలు, సాహిత్యం.. వంటి అనేకానేక ఆవరణలను ’కన్నుగానని వస్తుతత్వం’తో మరింత కలుషితం చేస్తున్నారు.

తలకిందులుగా వేలాడుతున్న సమాజాన్ని సవ్యంగా నిలబెట్టేందుకు వర్తమానానికి ఒక వోల్టేర్ కాదు లక్ష మంది వోల్టేర్లు కావాలి. ఒక కాండీడ్ కాదు లక్ష కాండీడ్ లు కావాలి. ఇది అత్యాశే కావచ్చు కానీ అవసరమైన అత్యాశ. దానికి ఊపిరులూదడానికి కాండీడ్ ను ఒకసారి తిరగేద్దాం వచ్చేవారం నుంచి సారంగలో..

*

పెద్రో పారమొ చివరి భాగం

pedro1-1

పేద్రో పారమొ మెదియా లూనా పెద్ద తలుపు దగ్గర పాత కుర్చీలో కూచున్నాడు. రాత్రి ఆఖరి నీడలు తప్పుకుంటున్నాయి. అతనట్లాగే ఒంటరిగా మూడు గంటలనుండీ ఉన్నాడు. అతను నిద్ర పోవడం లేదు. నిద్ర అంటే ఏమిటో, సమయమంటే ఏమిటో అతను మరిచిపోయాడు. “మేం ముసలివాళ్లం అంతగా నిద్ర పోం. దాదాపుగా ఎప్పుడూ. కునికిపాట్లు పడ్డా మెదడు పని చేస్తూనే ఉంటుంది. నాకు చేయడానికి అదే మిగిలింది.” ఆగి పెద్దగా అన్నాడు. “ఎంతో కాలం పట్టదు. ఇంక ఎంతో కాలం పట్టదు.”
ఇంకా కొనసాగించాడు. “నువ్వెళ్ళి చాలా కాలమయింది సుజానా. ఇప్పటి వెలుతురు అప్పటిలాగానే ఉంది, అంత ఎర్రగా కాదు కానీ అంతే పేలవంగా. మంచు ముసుగు వెనక ఉన్నట్టు. ఇప్పటిలాగే. ఇదే సమయం. నేనిక్కడే వాకిలి పక్కనే కూచుని సంజెని చూస్తూ ఉన్నాను. ఈ దారి వెంటే స్వర్గానికి, ఆకాశం వెలిగే చోటికి నన్నొదిలి వెళ్లడం చూస్తూ ఉన్నాను. ఈ నేల చీకట్లలో మరింత అస్పష్టంగా మారిపోతూంది.
“నిన్ను చూడడం అదే ఆఖరి సారి. నువు వెళుతూ దారి పక్క పారడైజ్ చెట్టు కొమ్మల్ని రాసుకుంటూ పోయావు వాటి చివరి ఆకుల్నీ రాల్చేస్తూ. ఆపై మాయమయిపోయావు. నేను నీవెనకే నిన్ను పిలిచాను. ‘తిరిగి రా సుజానా!’
పేద్రో పారమొ పెదాలు కదులుతూ ఉన్నాయి, అవే మాటల్ని గుసగుసలాడుతున్నట్టు. పెదాలు బిగబట్టి కళ్ళు తెరిచి చూశాడు. పాలిపోయిన సంజె ఆ కళ్ళలో ప్రతిఫలిస్తూ ఉంది.
రోజు మొదలయింది.

దోన ఇనెస్ అదే సమయంలో తన కొడుకు గలాంలియెల్ వియాపండో షాపు ముందు ఊడుస్తూంది. అబుందియో మార్టినెజ్ సగం తెరిచిన తలుపు తీసుకుని లోపలికి వెళ్లడం చూసింది. ఈగలు వాలకుండా మొహమ్మీద సొంబ్రేరో (మెక్సికన్ టొపీ) పెట్టుకుని కౌంటర్ మీద నిద్రపోతూ కనిపించాడు గలాంలియెల్ అతనికి. అబుండదియో అతను లేస్తాడని కాసేపు చూశాడు. దోనా ఇనెస్ బయట ఊడ్చే పని అయ్యాక లోపలికి వచ్చి తన కొడుకు డొక్కల్లో చీపురుతో పొడిచిందాకా ఆగాడు.
“నీ కోసం కస్టమర్ వచ్చారు లే!”
గలాంలియెల్ చిరచిరలాడుతూ, గుర్రు మంటూ లేచి కూచున్నాడు. రాత్రి తాగుబోతులకు సర్వ్ చేస్తూ, నిజానికి వాళ్లతో తాగుతూ బాగా పొద్దుపోయి పడుకోవడం వలన కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. ఇప్పుడు కౌంటర్ మీద కూచుని తన తల్లిని తిట్టాడు, తననూ తిట్టుకున్నాడు, అంతటితో ఆగకుండా బతుకునూ తిట్టాడు పెంటకి కూడా కొరగానిదని. చేతులు కాళ్ళ మధ్య పెట్టుకుని అట్లాగే వెనక్కి వొరిగి పడుకుని పోయాడు. తిట్లు గొణుక్కుంటూనే నిద్రలోకి జారిపోయాడు.
“ఈ వేళప్పుడూ ఈ తాగుబోతులు వస్తే నా తప్పు కాదు.”
“పాపం వాణ్ణి క్షమించు అబుందియో. పిల్లాడు రాత్రంతా నిద్ర లేకుండా ఎవరో ప్రయాణికులు వస్తే వాళ్లకు సర్వ్ చేస్తూ ఉన్నాడు. తాగిన కొద్దీ గొడవ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంత పొద్దున్నే వచ్చావేమిటి?”
అబుందియోకి సరిగా వినపడదు కనుక ఆమె పెద్దగా అరుస్తూ చెపుతూంది.
‘ఏం లేదు, ఒక లిక్కర్ సీసా కావాలి.”
“రెఫ్యూజియో మళ్ళీ మూర్ఛ పోయిందా?”
“లేదు, చచ్చిపోయింది విల్యా అమ్మా! రాత్రే, పదకొండయిందో యేమో. నేను పోయి నా కంచర గాడిదల్ని అమ్మాక. దానికి వైద్యం కోసమని ఖర్చులకోసం వాటిని కూడా అమ్మాను.”
“నువు చెప్పేదేమిటో నాకు వినపడటం లేదు. ఏమంటున్నావు? ఏం చెప్తున్నావు నాకు?”
“రాత్రంతా నా భార్య రెఫ్యూజియో శవ జాగరణ చేశాను. ఆమె ప్రాణం రాత్రే పోయింది.”
“చావు వాసన వస్తూందని నాకు తెలిసింది. గలాంలియెల్ కి అదే చెప్పాను ‘ఎవరో చనిపోయారని నాకనిపిస్తుంది. నాకు ఆ వాసన వస్తుంది,’ వాడు నా మాట పట్టించుకోలేదు. ఆ కస్టమర్లతో స్నేహంగా కలిసిపోవాలని తనూ తాగాడు పిచ్చి వెధవ. నీకు తెలుసుగా అటువంటప్పుడు వాడు ఎట్లా మారిపోతాడో! అన్నీ తమాషాగా ఉంటాయి వాడికి. దేన్నీ పట్టించుకోడు. సర్లే, దినానికి ఎవరినయినా పిలిచావా?”
“లేదు విల్యా అమ్మా. అందుకే నాకు లిక్కర్ కావాలి, నా బాధ మర్చిపోవడానికి.”
“స్ట్రెయిటా?”
“అవును విల్యా అమ్మా. తొందరగా నిషా ఎక్కాలి. ఇప్పుడే ఇవ్వు. నాకిప్పుడే కావాలి.”
“నువ్వు కాబట్టి ఒక పైంట్ ధరకే రెండు పైంట్లు ఇస్తున్నా. తన గురించి ఎప్పుడూ మంచిగా తల్చుకునేదాన్నని చనిపోయిన మీ ఆవిడకి చెప్పు. పైకి వెళ్ళాక నన్ను గుర్తుంచుకోమని చెప్పు.”
“చెప్తా విల్యా అమ్మా!”
“ఆమె చల్లబడేలోగా చెప్పు.”
“చెప్తాను. తనకోసం నువు ప్రార్థిస్తావని ఆమెకి నమ్మకం. చివరి కర్మలు చేసేవారెవరూ లేరని ఏడుస్తూనే పోయింది. ”
“అదేమిటి? ఫాదర్ రెంటెరియా దగ్గరికి పోలేదా?”
“వెళ్లా. కొండల్లోకి పోయాడని చెప్పారు.”
“ఏం కొండలు?”
“ఏమో అక్కడ ఎక్కడివో. తిరుగుబాటు జరుగుతూందని నీకు తెలుసుగా!”
“అయితే ఆయన కూడా చేరాడా? దేవుడే మనమీద దయ చూపాలి అబుందియో!”
“దాంతో మనకేం పని విల్యా అమ్మా? అది మనల్ని తాకదు. ఇంకోటి పోయి. ఊరికే అట్లా. గలాంలియెల్ ఎటూ నిద్ర పోతున్నాడుగా!”
“అయితే నువ్వు మర్చిపోకుండా రెఫ్యూజియోకి చెప్పు నాకోసం దేవుడిని ప్రార్థించమని. ఎంత సాయం దొరికితే అంతా కావాలి నాకు.”
“నువ్వేం ఆదుర్దా పడకు. ఇంటికి వెళ్ళిన క్షణమే చెప్తాను. ప్రమాణం చేయించుకుంటాను. ఆమె చేయక తప్పదనీ లేకపోతే నువు దాని గురించి బుర్ర చెడగొట్టుకుంటావనీ చెప్తాను.”
“నువ్వు ఆ పని చేయి. నీకు తెలుసుగా ఆడవాళ్ల సంగతి! ప్రమాణం చేసి చెప్పింది చేసేట్లుగా చూడాలి.”
అబుందియో ఇంకో ఇరవయి సెంటావోలు కౌంటర్ మీద పెట్టాడు.
“ఇప్పుడు ఇంకోటి పోయి సెన్యోరా. ఆపైన నీ చేయి ఇంకొంచెం జారిస్తే అది నీ దయ. వొట్టేసి చెబుతున్నా, ఇది నేను ఇంటికెళ్ళి నా కూక పక్కనే కూచుని తాగుతా.”
“సరే పో, మా అబ్బాయి లేస్తాడు మళ్ళీ. తాగి పడుకున్నాక లేస్తే వాడికి తెగ చిరాగ్గా ఉంటుంది. ఇంటికి పో. మీ ఆవిడకి చెప్పమన్నది మర్చిపోకు.”
అబుందియో తుమ్ముకుంటూ షాప్ బయటికొచ్చాడు. లిక్కర్ మండుతూంది కానీ ఎంత తొందరగా తాగితే అంత తొందరగా తలకెక్కుతుందని ఎవరో చెప్పారని మండుతున్న నోటిని చొక్కా కొసళ్లతో విసురుకుంటూ గుక్క మీద గుక్క తాగాడు. సరాసరి ఇంటికే వెళదామనుకున్నాడు. అక్కడ రెఫ్యూజియో తన కోసం ఎదురుచూస్తూంది కూడా. కానీ తప్పు మలుపు తిరిగి వీధికి అటు వేపు, ఊరి బయటికి వెళ్ళే దారంట పడి పోయాడు.
“డమియానా!” పేద్రో పారమొ పిలిచాడు. ” వెళ్ళి చూడు ఆ రోడ్డమ్మట పడి వస్తున్నదెవరో?”
అబుందియో తల వేలాడేసుకుని తూలుకుంటూ, ఒక్కోసారి చేతులు కూడా నేలకానించి దోగాడుతూ వస్తున్నాడు. అతనికి ఈ భూమి ఒరిగిపోతున్నట్టూ, గుండ్రంగా తిరుగుతున్నట్టూ, తనని ఎక్కడికో విసిరేస్తున్నట్టూ ఉంది. పట్టు దొరకబుచ్చుకోబోతాడు, దొరికిందనుకునేలోగా మళ్ళీ తిరగడం మొదలుబెడుతుంది…. తన వాకిట్లో కుర్చీలో కూచున్న మనిషికి ఎదురు పడిందాకా.
“నా భార్యని పూడ్చిపెట్టడానికి డబ్బు కావాలి. నువు సాయం చేయగలవా?”
డమియానా సిస్నెరోస్ ప్రార్థించింది. “సైతాను బంధనాలనుండి మమ్మల్ని కాపాడు దేవుడా!” చేతుల్ని శిలువ ఆకారంలో పెట్టి అబుందియో వైపు సాచింది.
అబుందియో మార్టినెజ్ కి ఎదురుగా భయపడ్డ ఒక స్త్రీ శిలువ ఆకారంలో చేతుల్ని ఊపడం కనిపించి వణికిపోయాడు. సైతాన్ తనను ఇక్కడిదాకా వెంబడించిందేమోనన్న భయం కలిగింది. భయంకరమైన వేషంలో సైతాన్ కనిపిస్తుందేమోనని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ కనపడకపోయేసరికి మళ్ళీ అన్నాడు.
“నా భార్యను పూడ్చి పెట్టడానికి ఏమన్నా ధర్మం దొరుకుతుందేమోనని వచ్చాను.”
సూర్యుడు అతని భుజాల దాకా వచ్చాడు. చల్లటి తొలి పొద్దు సూర్యుడు పైకి లేస్తున్న దుమ్ములో మసగ్గా.
సూర్యకాంతినుంచి దాక్కుంటున్నట్టు తన భుజాల్ని కప్పుతున్న శాలువాలోకి పేద్రో పారమొ మొహం అదృశ్యమయింది. డమియానా కేకలు మరింత పెద్దవవుతున్నాయి పొలాల మీదుగా “డాన్ పేద్రోని చంపేస్తున్నాడు!”
అబుందియో మార్టినెజ్ కి ఎవరో స్త్రీ అరవడం వినిపిస్తూంది. అయితే ఆమెనెట్లా ఆపాలో తెలియలేదు. తన ఆలోచనల సూత్రమూ అతనికందలేదు. ఆ ముసలామె కేకలు కచ్చితంగా చాలా దూరం వినపడతాయని తెలుసు. తన భార్యకే వినవస్తాయేమో కూడా. ఆ మాటలు అర్థం కావడం లేదు కానీ అతని కర్ణభేరులు పగిలిపోతున్నాయి. తన మంచం మీద ఒంటరిగా బయటి వరండాలో పడి ఉన్న భార్య తలపుకొచ్చింది. శవం తొందరగా పాడుకాకూడదని అతనే బయటికి చలిగాలిలోకి మోసుకొచ్చి పడుకోబెట్టి వచ్చాడు. నిన్ననే తనతో పడుకుని, జీవితం కంటే సజీవంగా, చిట్టి గుర్రంలా గెంతుతూ, మునిపళ్లతో కరుస్తూ, వొదిగిపోతూ ఉన్న తన కూకా. తనకు కొడుకునిచ్చిన ఆడది. పుట్టగానే వాడు చనిపోయాడు. ఆమెకి ఆరోగ్యం బాలేనందువల్లనని అన్నారు. కంటి కురుపూ, చలిజ్వరమూ, పాడయిన కడుపూ ఇంకా ఏమున్నాయో ఎవరికి తెలుసు అన్నాడు కంచర గాడిదల్ని అమ్మి డబ్బు కట్టాక చివరి నిముషంలో చూడ్డాని కొచ్చిన డాక్టర్. ఇప్పుడదంతా చేసిన ఉపకారమేమీ లేదు. తన కూకా కళ్ళు మూతపడి రాత్రి మంచులో పడి ఉంది. ఈ ఉదయాన్ని చూడ లేదు, ఈ సూర్యుణ్ణీ.. ఇంక ఏ సూర్యుణ్ణీ.
“సాయం చేయండి.” అన్నాతను “నాక్కొంచెం డబ్బు కావాలి.”
కానీ అతని మాటలు అతనికే వినిపించలేదు. ఆ ముసలామె కేకలు అతన్ని చెవిటిని చేశాయి.
కోమలా నుంచి వచ్చే దారిలో చిన్న చిన్న నల్ల చుక్కలు కదులుతున్నాయి. క్రమంగా ఆ చుక్కలు కొందరు మగవాళ్ళుగా మారాయి. ఆ తర్వాత వాళ్లు అతని పక్కనే నిలుచున్నారు. డమియానా సిస్నెరోస్ ఇప్పుడు అరవడం మానేసింది. శిలువ ఆకారంలో పెట్టిన చేతుల్ని జారవిడిచింది. నేలమీదికి పడిపోయింది. ఆమె నోరు ఆవులిస్తున్నట్టు తెరుచుకుని ఉండిపోయింది.
ఆ మనుషులు ఆమెని నేలమీంచి లేపి ఇంటి లోపలికి తీసుకుపోయారు.
“మీరు బాగానే ఉన్నారా అయ్యా?” వాళ్ళు అడిగారు.
పేద్రో పారమొ తల ప్రత్యక్షమయింది. అతను తలూపాడు.
చేతిలో ఇంకా నెత్తుటి కత్తిని పట్టుకున్న అబుందియో ని నిరాయుధుణ్ణి చేశారు.
“మాతో రా!” వాళ్ళు అన్నారు. “ఎంత పని చేశావు!”
అతను వాళ్ళననుసరించాడు.
వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళేలోపల తనను క్షమించమని వాళ్ళను ప్రాధేయపడ్డాడు. రోడ్డు పక్కకు వెళ్ళి పసుప్పచ్చగా కక్కుకున్నాడు. కాలువలు కాలువలుగా పది లీటర్ల నీళ్ళు తాగినట్టు. అతని తల మండిపోతుంది. నాలుక మందమయినట్టుంది.
“నాకు బాగా మత్తెక్కింది.” అన్నాడు.
తన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. తన చేతులు వాళ్ళ భుజాల మీద వేశాడు, వాళ్ళు అతన్ని ఈడ్చుకు పోతుంటే దుమ్ములో అతని పాదాలు చాళ్లు గీస్తూ ఉన్నాయి.

పేద్రో పారమొ వాళ్ళ వెనక ఇంకా కుర్చీలోకూచుని ఊళ్ళోకి వెళుతున్న ఆ ఊరేగింపుని చూస్తున్నాడు. ఎడమ చేతిని ఎత్తబోతే అది సీసంలా అతని మోకాళ్ళ మీదికి జారిపోయింది. అతను దాన్ని పట్టించుకోలేదు. తన దేహంలో ఏదో భాగం రోజూ మరణించడం అతనికి అలవాటయిపోయింది. పారడైజ్ చెట్టు నుంఛి ఆకులు రాలడం చూశాడు. “వాళ్ళంతా అదే దారి పడతారు. అందరూ వెళ్ళిపోతారు.” మళ్ళీ తన ఆలోచనలు ఎక్కడ ఆగాయో అక్కడికే వచ్చాడు.
“సుజానా,” అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు.. “నిన్ను తిరిగిరమ్మని బ్రతిమలాడాను..
“బ్రహ్మాండమయిన చంద్రుడు లోకం మీద మెరిసిపోతున్నాడు. గుడ్డివాడినయ్యిందాకా నిన్నే తదేకంగా చూశాను. నీ మొహం మీదికి జాలువారుతున్న వెన్నెలనీ. నిన్ను చూడడం ఎన్నటికీ విసుగనిపించదు. మెత్తగా, వెన్నెల నిమురుతూన్న నీ లావైన తడి పెదవులు నక్షత్రాల కాంతితో వెలుగుతూ. రాత్రి మంచుతో పారదర్శకమవుతూన్న నీ దేహమూ. సుజానా. సుజానా శాన్ హువాన్.”
బొమ్మ స్పష్టంగా కనపడేందుకు తుడవడానికి చేయెత్తడానికి ప్రయత్నించాడు. అది అయస్కాంతంలా కాళ్లను వదిలి రాలేదు. ఇంకో చేయి లేపడానికి ప్రయత్నించాడు కానీ అది నెమ్మదిగా అతని పక్కకి నేలను తాకేలా జారిపోయింది ఎముకల్లేని భుజానికి ఆధారంలా.
“ఇది చావు,” అనుకున్నాడు.
సూర్యుడు అన్నిటి మీదా దొర్లుతూ ఉన్నాడు వాటికి మళ్ళీ ఆకారాలు కల్పిస్తూ. ధ్వంసమయిన బంజరు భూమి అతని ఎదురుగా పరుచుకుని ఉంది. ఎండ అతని శరీరాన్ని కాలుస్తూంది. అతని కళ్ళు కదలడం లేదు. అవి జ్ఞాపకం నుండి జ్ఞాపకానికి దూకుతూ ఉన్నాయి ప్రస్తుతాన్ని చెరిపేస్తూ. అకస్మాత్తుగా అతని గుండె ఆగిపోయింది. కాలమూ, జీవన శ్వాసా దానితోటే ఆగిపోయినట్లనిపించింది.
“అయితే ఇంకో రాత్రి ఉండదన్నమాట!” అనుకున్నాడు.
ఎందుకంటే అతనికి చీకటితో, భ్రాంతులతో నిండిన రాత్రులంటే భయం. అతని దయ్యాలతో పాటు అతన్ని బంధిస్తాయవి. అదీ అతని భయం.
“నాకు తెలుసు, కొన్ని గంటల్లో నేను నిరాకరించిన సాయం అడగడానికి అబుందియో నెత్తుటి చేతులతో వస్తాడు. కానీ నా కళ్ళు మూసుకోవడానికీ, అతన్ని చూడకుండా ఉంచడానికీ నా చేతులు లేవు. అతని మాటలు వినక తప్పదు. రోజుతో పాటు అతని గొంతు సన్నగిల్లిందాకా, గొంతు పూర్తిగా రూపు మాసిందాకా.”
తన భుజం మీద ఒక చేయి తాకినట్లనిపించింది. నిటారుగా కూర్చున్నాడు తనను తను దృఢంగా చేసుకుంటూ.
“నేనే డాన్ పేద్రో!” డమియానా చెప్పింది. “నీకు డిన్నర్ తీసుకు రమ్మంటావా?”
పేద్రో పారమొ బదులిచ్చాడు:
“నేను వస్తున్నా. వస్తున్నా.”
డమియానా అందించిన చేయి సాయంతో లేచి నిలబడి నడవడానికి ప్రయత్నించాడు. కొన్ని అడుగులు వేశాక అతను పడి పోయాడు. లోలోపల సాయం కోసం అభ్యర్థిస్తున్నాడు కానీ మాటలేవీ బయటకు రావడం లేదు. ఒక రాళ్ల కుప్ప కూలబడినట్టు ధడేల్మని నేలమీద పడి అలాగే ఉండిపోయాడు.
=======================

పెద్రో పారమొ-13

pedro1-1పొద్దు పొడుపుతో రోజు మొదయింది, తక్కుతూ తారుతూ. భూమి తుప్పు పట్టిన గేర్లు దాదాపుగా వినపడుతున్నాయి. చీకటిని తోసేస్తూ ఈ పురాతన భూప్రకంపనలు.
“రాత్రి పాపాలతో నిండిపోయిందా జస్టినా?”
“అవును సుజానా!”
“నిజంగా నిజమేనా?”
“అయి ఉండాలి సుజానా!”
“జీవితం పాపం కాక మరేమిటి జస్టినా? నీకు వినపడుతుందా? వినపడుతుందా భూమి కిరకిరలాడటం?”
“లేదు సుజానా! నాకేమీ వినపడటం లేదు. నా రాత నీరాతంత గొప్పది కాదు.”
“నీకు భయమేస్తుంది. నేను చెపుతున్నాగా, నాకు వినపడేది నీకు వినపడితే భయంతో నీలుక్కుపోతావు.”
జస్టినా గది శుభ్రం చేయడంలో మునిగిపోయింది. మళ్ళీ మళ్ళీ తడి చెక్కనేలని గుడ్డతో తుడిచింది. పగిలిన వేజ్ నుండి కిందపడిన నీటిని శుభ్రం చేసింది. పూలు ఎత్తింది. పగిలిన ముక్కల్ని తొట్టిలో పడేసింది.
“నీ జీవితంలో ఎన్ని పిట్టల్ని చంపి ఉంటావు జస్టినా?”
“చాలా, సుజానా!”
“ఎప్పుడూ బాధ వేయలేదా?”
“వేసింది సుజానా!”
“ఇంకా చనిపోక దేనికోసం ఎదురుచూస్తున్నావు?”
“చావు కోసం సుజానా!”
“అంతే అయితే, అదే వస్తుంది. ఆదుర్దా పడకు.”
సుజానా శాన్ హువాన్ దిండుకి చేరగిలపడి కూచుంది. అస్థిరమైన ఆమె కళ్ళు ప్రతి మూలా వెతుకుతున్నాయి. ఆమె చేతులు పొట్టమీద రక్షించే కొక్కెంలా ముడిపడి ఉన్నాయి. ఆమె తలపై రెక్కలాడినట్టు ఝుం అంటూ వినిపిస్తూంది. కిర్రుమంటూ బావిలో గిలక. జనాలు లేస్తున్న సందడి.
“నరకంలో నీకు నమ్మకముందా జస్టినా?”
“ఉంది సుజానా, స్వర్గంలో కూడా!”
“నాకు నరకంలోనే నమ్మకముంది,” అంది సుజానా. అని కళ్ళు మూసుకుంది.
జస్టినా వెళ్ళిపోయాక సుజానా మళ్ళీ నిద్రలో మునిగిపోయింది. బయట సూర్యుడు తళతళ మెరుస్తున్నాడు. హాల్లో పేద్రో పారమొ కనిపించాడు జస్టినాకు.
“సెన్యోరా ఎట్లా ఉంది?”
“బాలేదు,” తల దించుకుని బదులిచ్చింది.
“ఏమన్నా కంప్లెయిన్ చేస్తుందా?”
“లేదు సెన్యోర్! ఆమె దేని గురించీ కంప్లెయిన్ చేయదు. కానీ చనిపోయినవాళ్ళు ఎప్పుడూ కంప్లెయిన్ చేయరని చెప్తారు. మనకు సెన్యోరా దక్కలేదంతే.”
“ఫాదర్ రెంటెరియా ఆమెను చూడటానికి వచ్చాడా?”
“ఆమె కన్ ఫెషన్ వినడానికి రాత్రి వచ్చాడు. ఇవాళ ఆమె కమ్యూనియన్ తీసుకుని ఉండవలసింది కానీ ఆమె మీద దయ ఉన్నట్టు లేదు. ఫాదర్ పొద్దున్నే వస్తానన్నాడు కానీ చూడు ఎంత పొద్దెక్కిందో ఇంకా రాలేదు. ఆమె మీద దయ ఉన్నట్టు లేదు.”
“ఎవరి దయ?”
“దేవుడి దయ, సెన్యోర్!”
“తెలివి తక్కువగా మాట్లాడకు జస్టినా!”
“సరే, సెన్యోర్!”
పేద్రో పారమొ తలుపు తెరిచి దాని పక్కనే నిలుచున్నాడు, ఒక కాంతి కిరణాన్ని సుజాన శాన్ హువాన మీద పడనిస్తూ. అతనికి కనిపించింది బాధతో గట్టిగా మూసుకున్నట్టున్న కళ్ళూ, సగం తెరిచిన తడి నోరూ, దుప్పట్లను వెనక్కి నెట్టేస్తూన్న చేతులూ, బయటపడుతున్న ఆమె నగ్నత్వమూ, మెలికలు తిరుగుతూ వంకరలు పోతున్న ఆమె దేహమూ.
తనకూ, మంచానికీ మధ్య ఉన్న కొద్ది దూరాన్నీ ఒక్క ఉదుటున దాటి ఏలికపాములా గిజగిజలాడుతూ మరింత విపరీతంగా కొట్టుకుంటూన్న నగ్నదేహాన్ని కప్పాడు. ఆమె చెవిలో పిలిచాడు “సుజానా!”. మళ్ళీ పిలిచాడు “సుజానా!”
తలుపు తెరుచుకుని ఫాదర్ రెంటెరియా చప్పుడు కాకుండా గదిలోకొచ్చాడు. “నీకు కమ్యూనియన్ ఇవ్వడానికి వచ్చాను తల్లీ!” అన్నాడు.
పేద్రో పారమొ ఆమెను లేపి తలగడలు సర్ది వాటికి చేరగిలపడేట్టు కూచోబెట్టిందాకా ఆగాడు. సుజానా సాన్ హువాన్ సగం నిద్రలోనే నాలుక చాపి ప్రసాదాన్ని మింగింది. తర్వాత “దివ్యమైన రోజు గడిపాం ఫ్లోరెన్సియొ!” అంది. మళ్ళీ ఆ దుప్పట్ల సమాధిలోకి జారిపోయింది.

“ఆ కిటికీ చూడు దోన ఫౌస్టా, ఆ మెదియా లూనాలో ఎప్పుడూ లైట్ వెలుగుతూ ఉండేది!”
“లేదు ఏంజెలెస్! నాకేదీ కనపడలేదు”
“ఎందుకంటే ఇప్పుడది చీకటిగా ఉంది. అంటే ఏదయినా చెడు జరిగిఉంటుందంటావా? మూడేళ్ళ పైగా ఆ కిటికీలో లైట్ రాత్రి తర్వాత రాత్రి వెలుగుతూనే ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ గది పేద్రో పారమొ గది అని చెప్తారు. పాపమా పిచ్చావిడకి చీకటంటే భయమట. చూడు ఇప్పుడు లైట్ ఆరిపోయి ఉంది. దుశ్శకునం కాదా?”
“చచ్చిపోయిందేమో! బాగా జబ్బు పడి ఉంది. ఎవరినీ గుర్తు పట్టడంలేదంటున్నారు. తనలో తాను మాట్లాడుకుంటుందట. ఆమెని పెళ్ళి చేసుకోవడం మూలాన పేద్రో పారమొకి తగిన శాస్తే జరిగింది.”
“పాపం పేద్రో పారమొ!”
“లేదు ఫౌస్టా. అతనికి అంతే కావాలి. ఇంకా ఎక్కువే కావాలి”
“చూడు గది ఇంకా చీకటిగా ఉంది.”
“ఆ కిటికీని అట్లా వదిలేసి ఇంటికి పోయి పడుకుందాం పద! మనలాంటి ఇద్దరు ముసలాళ్ళకి ఇట్లా రోడ్ల మీద పడి తిరగడానికి వేళ మీరి పోయింది. ”
చర్చి నుంచి పదకొండింటికి బయటపడ్డ ఆ ముసలి ఆడవాళ్ళు అర్కేడ్ ఆర్చీల కింద మాయమయారు. ప్లాజాని దాటుతూ మెదియాలూనా వైపు వెళుతున్న మనిషి జాడ కనపడింది.
“చూడు దోనా ఫౌస్టా! ఆ వెళుతున్న మనిషి డాక్టర్ వలెన్సియా అంటావా?”
“అతను నాఎదురుగా ఉన్నా గుర్తుపట్టలేనంత చత్వారం వచ్చింది నాకు. కానీ అట్లాగే ఉన్నాడు.”
“నీకు గుర్తు లేదా, ఆయన ఎప్పుడూ తెల్ల పాంటూ, నల్లకోటూ వేసుకుంటాడు కదా! మెదియాలూనాలో ఏదో చెడు జరుగుతుందని పందెం. చూడు ఏదో అవసరం పడ్డట్టు ఎట్లా వేగంగా నడుస్తున్నాడో!”
“చూస్తుంటే ఏదో ఘోరం జరిగే ఉంటుందనిపిస్తుంది. తొందరగా వెళ్ళి ఫాదర్ రెంటెరియాకి చెప్పాలనిపిస్తుంది. పాపం ఆమె కన్ ఫెషన్ చేయకుండా చచ్చిపోతుందేమో!”
“దేవుడే కాపాడాలి ఏంజెలెస్! ఎంత దుర్భరమైన ఆలోచన! ఈలోకంలో పడ్డ కష్టాలు ఎటూ పడింది. ఇప్పుడు చివరి కర్మలు జరక్కుండా పోయి మళ్ళీ వచ్చే జన్మలోకూడా ఇంకా కష్టాలు పడాలని ఎవరూ కోరుకోరు. పిచ్చివాళ్ళు కన్ ఫెస్ చేయనవసరం లేదనీ, వాళ్ల ఆత్మల్ని పాపం చుట్టుకున్నా వాళ్ళు అమాయకులేననీ చెప్తారనుకో. దేవుడికే తెలియాలి… చూడు కిటికీలో లైట్ వెలుగుతుందిప్పుడు. అంతా బాగానే అయిపోయి ఉంటుందని ఆశిస్తున్నాను. ఆ ఇంట్లో ఎవరన్నా చనిపోయి ఉంటే మనం క్రిస్మస్ కోసం చర్చిని అలంకరించడానికి పడ్డ శ్రమంతా ఏమయ్యేదో ఊహించుకో. డాన్ పేద్రో అంత పెద్దమనిషి కాబట్టి మన వేడుకలన్నీ సర్వనాశనమయ్యేవి.”
“నువ్వెప్పుడూ అతిగా ఆలోచిస్తావు ఫౌస్టా. నువు నేను చేసినట్టు చేయి- అంతా ఆ దేవుడికే వదిలేయి. కన్య మేరీకి అవ మారియా చెప్పు. ఇప్పట్నుంచి తెల్లారిందాకా ఏమీ జరగదనే నా నమ్మకం. అప్పుడు దేవుడి ఆనే జరగనివ్వు. ఎటు తిరిగీ ఆమె ఈ జీవితంలో ఆనందంగా ఉండలేదు.”
“నిజం చెబుతున్నా ఏంజెలెస్! నీ మాటలు నాకుఎప్పుడూ సాంత్వన కలిగిస్తాయి. ఆ మంచి మాటలే మనసులో పెట్టుకుని నిద్రపోగలను. మన నిద్రలో ఆలోచనలు సరాసరి స్వర్గానికే చేరతాయంటారు. నాది కూడా అంత దూరం పోతుందనే నా ఆశ. రేప్పొద్దున కలుద్దాం.”
“సరే రేపు కలుద్దాం ఫౌస్టా.”
ఆ ముసలి ఆడవాళ్ళిద్దరూ వాళ్ళ సగం తెరిసిన తలుపుల్లోంచి ఇళ్ళల్లోకి వెళ్ళారు. రాత్రి నిశ్శబ్దం పల్లె మీద మళ్ళీ పరుచుకుంది.

“నా నోరు మట్టితో నిండి ఉన్నది!”
“అవును ఫాదర్!”
“‘అవును ఫాదర్ ‘ అనకు. నేను చెప్పేదంతా మళ్ళీ చెప్పు.”
“మీరేం చెప్తారు? నన్ను మళ్ళీ కన్ ఫెస్ చేయమంటారా? మళ్ళీ ఎందుకు?”
“ఇది కన్ ఫెషన్ కాదు సుజానా. నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. నిన్ను మృత్యువుకు సిద్ధపర్చడానికి.”
“నేను చనిపోబోతున్నానా?”
“అవును తల్లీ!”
“మరి నా మానానికి నన్ను ప్రశాంతంగా వదిలేయవచ్చుకదా? నాకు విశ్రాంతి కావాలి. నన్ను మెలకువగా ఉంచమని మిమ్మల్నెవరో పంపి ఉండాలి. నిద్ర పూర్తిగా పారిపోయిందాకా నాతో ఉండడానికి. అతన్ని కనుక్కోవడానికి నేనేం చేయగలను? ఏమీ లేదు ఫాదర్! నన్నొంటరిగా వదిలేసి వెళ్ళిపోరాదా?”
“నిన్నొదిలేస్తాను సుజానా. నేను చెప్తున్న మాటలు తిరిగి చెప్తుంటే నెమ్మదిగా నీకు నువ్వే జోలపాడుకున్నట్టు నిద్రలోకి జారిపోతావు. ఒకసారి నిద్రపోయాక నిన్నెవరూ లేపరు. ..నువ్వెప్పటికీ లేవవు.”
“సరే ఫాదర్. మీరు చెప్పినట్లే చేస్తాను.”
తన చేతులు ఆమె భుజాల మీద ఉంచి మంచం అంచున కూచున్న ఫాదర్ రెంటీరియా ఎవరికీ వినపడకుండా ఉండేందుకు ఆమె చెవి దాదాపు తన నోరు తాకుతుండగా ఒక్కోమాటా రహస్యంగా గుసగుసలాడుతూ చెప్పాడు. “నా నోరు మట్టితో నిండి ఉన్నది.” అని ఆగాడు. ఆమె పెదవులు కదులుతున్నాయో లేదోనని చూశాడు. మాట్లాడుతున్నట్టు పెదాలు కదులుతున్నాయి కానీ శబ్దం బయటికి రావడం లేదు:
“నా నోరు నీతో, నీ పెదవులతో నిండి ఉన్నది. గట్టిగా మూసుకుని ఉన్న నీ పెదవులు, నా పెదవులను గట్టిగా అదుముతూ, కొరుకుతూ..”
ఆమె కూడా ఆగింది. తన కంటి చివరి నుంచి ఫాదర్ రెంటెరియా వంక చూసింది. అతనెక్కడో దూరంగా ఉన్నట్టూ, మంచు పేరుకున్న గాజుపలక వెనక ఉన్నట్టూ కనిపించాడు.
మళ్ళీ అతని గొంతు ఆమె చెవిలో వెచ్చగా వినపడింది.
“నురగల ఉమ్మిని మింగితిని. నా గొంతుకడ్డంగా ముడి పడి, నా అంగిటిలో వొరుసుకునునట్లు పురుగులతో లుకలుకలాడుతున్న మట్టి పెళ్ళలని నమిలితిని. నములుతూ కబళించుచున్న నా పళ్ళ వలన చీల్చబడి వంకరలు పోయి నా నోరు విరిగిపడినది. నా ముక్కు మెత్తబడినది. నా కనుగుడ్లు నీరై పోయినవి. నా శిరోజములు ఒక అగ్ని కీలయై మండినవి..”
సుజానా శాన్ హువాన్ అంత నిమ్మళంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి ఆమె ఆలోచనలనూ, తను ఆమెలో ప్రతిక్షేపిస్తున్న దృశ్యాలను నిరాకరించడానికి పెనుగులాడుతున్న ఆమె హృదయాన్నీ తెలుసుకోవాలనిపిస్తూంది. అతను ఆమె కళ్లలోకి చూశాడు. ఆమె కూడా అట్లాగే చూసింది. ఆమె మెలి తిరుగుతున్న పెదవుల చివర ఒక చిన్న నవ్వు మొలకెత్తుతున్నట్టు ఉంది.
“ఇంకా ఉంది. దేవుడు సాక్షాత్కరించిన దృశ్యం. ఆయన అనంత స్వర్గధామపు మెత్తటి కాంతి. సెరాఫిం పాటా, చెరూబిం ఉల్లాసం. శాశ్వత బాధలకు శపించబడ్డ వారికి చివరిసారిగా కనపడి మాయమయ్యే దేవుని నయనాలలో ఆనందం. శాశ్వత బాధకు తోడయ్యే ఈ లోకపు వేదన. ఎముకలోని మజ్జ మండుతున్న బొగ్గయి, మన నరములలో ప్రవహించు రక్తము అగ్ని కీలలై నమ్మజాలని యాతన కలుగజేయును. దేవుని ఆగ్రహము దానిని ఆరనివ్వక విసురుచుండుటవలన ఆ అగ్ని ఎన్నటికీ చల్లారదు.”
“అతడు నాకు తన చేతులలో రక్షణనొసగెను. నాకు ప్రేమనొసంగెను.”
ఆమె చివరి క్షణం కోసం ఎదురు చూస్తూ తన చుట్టూ మూగిన ఆకారాల వంక చూశాడు ఫాదర్ రెంటీరియా. పేద్రో పారమొ చేతులు కట్టుకుని వాకిలి వద్ద ఎదురు చూస్తున్నాడు. అతని పక్కనే డాక్టర్ వాలెన్సియా, ఇంకా కొంతమంది నిలుచుని ఉన్నారు. ఇంకా దూరంగా నీడల్లో ఆడవాళ్ళ చిన్న గుంపు మరణించిన వాళ్ళ కోసం ప్రార్థనలు చేయడానికి ఆత్రంగా నిలబడి ఉంది.
అతను లేద్దామనుకున్నాడు. మరణిస్తున్న స్త్రీకి పవిత్ర తైలం అంటి “నా పని ముగిసింది,” అని చెప్పటానికి. కానీ లేదు, అతని పని ఇంకా ముగియలేదు. ఆమె ఎంతవరకూ పశ్చాత్తాపపడుతూ ఉందో తెలియకుండా ఆ మరణ సంస్కారాన్ని కొనసాగించలేడు.
అతను ఒక క్షణం సందేహించాడు. బహుశా ఆమెకు పశ్చాత్తాపపడవలసిందేమీ ఉండి ఉండక పోవచ్చు. బహుశా తను క్షమించవలసిందీ ఏమీ లేకపోవచ్చు. మళ్లీ ఆమె మీదికి వంగి, ఆమె భుజాలు కుదుపుతూ లోగొంతుకతో చెప్పాడు.
“నువ్వు దేవుని సన్నిధానానికి వెళుతున్నావు. ఆయన పాపులపై తీర్పు చెప్పడంలో క్రూరుడు.”
ఆమె చెవిలో ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ ఆమె తల అడ్డంగా ఊపింది. “వెళ్ళి పో ఫాదర్. నాగురించి హైరానా పడకండి. నాకు ప్రశాంతంగా ఉంది. బాగా నిద్రవస్తున్నట్టుంది.”
నీడలో దాగున్న స్త్రీలలో ఒకరి వెక్కు బయటికి వినవచ్చింది.
సుజానా శాన్ హువాన్ కి ఒక్క క్షణం ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంది. మంచం మీద నిటారుగా కూర్చుని అంది:
“జస్టినా, నీకు ఏడవాలనుంటే ఎక్కడికయినా పో!”
అప్పుడు ఆమెకు తల పొట్టమీదికి వాలినట్లనిపించింది. తల పైకెత్తడానికీ, ఊపిరాడకుండా చేస్తున్న పొట్టను పక్కకు నెట్టడానికీ ప్రయత్నించింది కానీ ప్రతి ప్రయత్నంతో ఆమె ఆ రాత్రి లోకి ఇంకా లోతుగా కూరుకుపోసాగింది.

“నేను.. నేను దోనా సుజానితా చనిపోవడం చూశాను.”
“ఏమంటున్నావు డొరోతియా?”
“నీకిప్పుడు చెప్పిందే!”

తొలి సంజ. గణ గణా మోగుతున్న గంటలు జనాల్ని మేలుకొలుపుతున్నాయి. అది డిసెంబర్ ఎనిమిది ఉదయం. మబ్బుగా ఉన్న ఉదయం. చల్లగా లేదు కానీ మబ్బుగా. ఆ మోగడం పెద్ద గంటతో మొదలయ్యింది. మిగతావీ దానికి జత కలిసాయి. ఫెద్ద ప్రార్థన కోసం గంటలు మోగుతున్నాయనుకున్నారంతా. తలుపులు బార్లా తెరుచుకుంటున్నాయి. అన్నీ కాదు; కొన్ని ఇంకా మూసుకునే ఉన్నాయి. బద్ధకస్తులు ఇంకా మంచాల మీదే పడుకుని తెల్లారిందని గంటలు చెప్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ మోగడం మామూలు కన్నా ఎక్కువసేపు సాగింది. పెద్ద చర్చిలో గంటలే కాదు, సాంగ్రె డీ క్రిస్టో, క్రజ్ వర్డె, శాంచువారియో గంటలు కూడా. మధ్యాహ్నమయింది కానీ ఇంకా గంటలు మోగుతూనే ఉన్నాయి. రాత్రి అయింది. పగలూ, రాత్రీ గంటలు మోగుతూనే ఉన్నాయి. అన్నీ, బలంగా, పెద్దగా ఆ మోతలన్నీ గాఢశోకంలో కలిసిపోయేలా. చెప్పేది వినపడక జనాలు పెద్దగా అరవవలసి వస్తూంది. “ఏమయుంటుంది?” వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అడుగుకుంటున్నారు.
మూడు రోజులయ్యేసరికి అందరికీ చెవుడు వచ్చింది. అంతటా నిండిన ఆ ధ్వనులకి మాట్లాడడం అసాధ్యమవుతూంది. కానీ గంటలు మోగుతూనే ఉన్నాయి. కొన్ని పగిలిపోయి ఓటి కుండల్లా డొల్ల మోతలు మోగుతున్నాయి.
“దోనా సుజానా చనిపోయింది.”
“చనిపోయిందా? ఎవరు?”
“సెన్యోర.”
“ఎవరు మీ సెన్యోరానా?”
“పేద్రో పారమొ సెన్యోర.”
ఆ నిరంతర ధ్వనులు విని జనాలు వేరే ఊళ్ల నుంచి రాసాగారు. కోంట్లా నుంచి తీర్థానికొచ్చినట్టు వచ్చారు. ఇంకా దూరాన్నుంచి కూడా. ఎక్కడ్నుంచో ఎవరికి తెలుసు, ఒక సర్కస్ కూడా వచ్చింది ఎగిరే కుర్చీలూ అవీ వేసుకుని. వాయిద్యాల వాళ్ళూ. ముందు ఊరికే అందరిలా చూడ్డానికే వచ్చారు కానీ నెమ్మదిగా అక్కడే స్థిరపడిపోయారు. ప్రదర్శనలూ ఇవ్వడం మొదలుపెట్టారు. నెమ్మది నెమ్మదిగా అంతా ఒక జాతరలాగా అయిపోయింది. కోమలా నిండా జనాలే, సందడి సందడిగా గొడవ చేస్తూ. పండగలప్పట్లా ఇసకస్తే రాలనట్టున్నారు జనం.
గంటలు మోగడం ఆగింది కానీ జాతర అట్లాగే కొనసాగింది. ఇది విచారించదగ్గ సందర్భం అని ఎవ్వరినీ వొప్పించ వీలుగాకుంది. వాళ్లని పొమ్మనే దారీ లేదు. ఒక వైపు జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు.
మెదియా లూనా ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంది. పనివాళ్లు చెప్పులు లేకుండా నడుస్తూ, లోగొంతులతో మాట్లాడుతూ ఉన్నారు. సుజానా సాన్ హువాన్ ని పూడ్చిపెట్టడం అయింది కానీ కోమలాలో ఎక్కువమందికి ఆసంగతే తేలీదు. వాళ్లంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. కోడిపందేలూ, లాటరీలూ, సంగీతమూ, తాగుబోతుల కేకలూ. ఊళ్ళోని దీపాల కాంతి మెదియాలూనా దాకా కనిపిస్తూంది బూడిదరంగు ఆకాశంలో తేజోవలయంలా. అవి మెదియాలూనాలో విషాదభరితమయిన రోజులు. డాన్ పేద్రో ఎవరోతోనూ మాట్లాడడం లేదు. తన గదే విడిచి రాలేదు. కోమల మీద పగ తీర్చుకుంటానని వొట్టు పెట్టుకున్నాడు.
“నా చేతిలోంచి గింజ జార్చను. కోమలా ఆకలితో మాడి చస్తుంది.”
అదే జరిగింది.
టిల్కేట్ వార్తలు అందిస్తూనే ఉన్నాడు.
“మేమిప్పుడూ కర్రాంజా తో ఉన్నాం.”
“మంచిది.”
“ఇప్పుడు జనరల్ ఓబ్రెగాన్ తో కలిశాం.”
“మంచిది.”
“శాంతి ప్రకటించారు. మమ్మల్ని పంపించేశారు.”
“ఆగు. నీ మనుషుల్ని పంపేయకు. ఇదెన్నాళ్ళో ఉండదు.”
“ఫాదర్ రెంటీరియా కూడా పోరాటంలోకి దిగాడు. మనం అతనికి వ్యతిరేకమా కాదా?”
“ప్రశ్నే లేదు. నువు ప్రభుత్వం తరఫునే!”
“కానీ మేం మామూలు వాళ్లం కాదుగా. వాళ్ళు మమ్మల్ని తిరుగుబాటుదారులుగా లెక్క వేస్తారు.”
“అయితే విశ్రాంతి తీసుకో!”
“మేం ఇప్పుడు ఇంత ఊపు మీద ఉన్నాము కదా!”
“సరే నీ ఇష్టం వచ్చినట్టు చేయి.”
“నేను వెనక్కి ఆ ముసలి ప్రీస్ట్ దగ్గరికే పోతున్నా. వాళ్ల కేకలు నచ్చాయి. అదీ కాక ఆయనతో వెళితే ముక్తికి ఢోకా లేదు.”
“నువ్వేం చేస్తావో నాకనవసరం.”

పెద్రో పారమొ-12

pedro1-1చీకటి పడగానే వాళ్ళు వచ్చారు. వాళ్ల వద్ద చిన్న తుపాకులు ఉన్నాయి. ఛాతీల మీద అటూ ఇటూ ఏటవాలుగా గుళ్ళ పట్టీలు ఉన్నాయి. ఇరవై మంది దాకా ఉన్నారు. పేద్రో పారమొ వాళ్లను భోజననానికి ఆహ్వానించాడు. వాళ్ళు నెత్తిమీద టోపీలు తీయకుండానే భోజనాల బల్ల మీద ఏమీ మాట్లాడకుండా కూచున్నారు. చాకొలేట్ తాగుతున్న చప్పుళ్ళూ, మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని టోర్టియాలూ (రొట్టెల్లాంటివి), ఉడకబెట్టిన బీన్సూ తింటున్న చప్పుళ్ళూ మాత్రమే వినవస్తున్నాయి.
పేద్రో పారమొ వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. ఇవి తనకు తెలిసిన మొహాలు కావు. టిల్కేట్ అక్కడే అతని వెనక నీడలో నిలుచుని ఉన్నాడు.
“అయ్యలారా!” పేద్రో పారమొ అన్నాడు వాళ్ళు తినడం పూర్తయినట్టు గమనించగానే. “ఇంకా ఏం చేయమంటారు మీకోసం?”
“ఇదంతా నీదేనా?” చేయి సాచి తిప్పుతూ చూపిస్తూ అడిగాడు వాళ్ళలో ఒకడు.
కానీ ఇంకొకతను అడ్డుపడ్డాడు.
“ఇక్కడ మాట్లాడేది నేను.”
“సరే, మీకేం కావాలో చెప్పండి.” పేద్రో పారమొ మళ్లీ అన్నాడు.
“చూస్తున్నావుగా, మేం ఆయుధాలు చేపట్టాం.”
“అయితే?”
“అయితే ఏముంది? అంతే. అది చాలదా?”
“ఎందుకు చేస్తున్నారు ఇదంతా?”
“ఎందుకంటే అందరూ అదే పని చేస్తున్నారు కాబట్టి. నీకు తెలియదా? కాసేపు ఆగు, మాకింకా పైనుంచి ఆదేశాలు రావాలి. అప్పుడు చెప్తాము ఎందుకో. ఇప్పటికయితే, మేం ఇక్కడున్నాం. అంతే.”
“ఎందుకో నాకు తెలుసు,” ఇంకొకతను అన్నాడు. “నీకు కావాలంటే చెప్తాను. మేం ప్రభుత్వం మీదా, నీలాంటి వాళ్ల మీదా తిరుగుబాటు చేస్తున్నాం. మిమ్మల్ని భరించడం ఇక మా వల్ల కాదు. ప్రభుత్వంలో ప్రతి ఒకడూ ఒక దొంగవెధవ. నువ్వూ, నీలాంటి వారూ బందిపోటు దొంగలు. ఇక గవర్నర్ గురించి ఏమీ చెప్పను. ఆ చెప్పేదేదో బుల్లెట్ల తోటే చెప్తాం.”
“మీ తిరుగుబాటుకి ఎంత కావాలి?” పేద్రో పారమొ అడిగాడు. “నేను మీకు సాయం చేయగలనేమో!”
“అయ్య చెప్పేది బాగానే ఉంది పెర్సెవెరాన్సియో. నువు ఊరికే నోరు పారేసుకోకు. మనకు కావలసిన సరంజామా సమకూర్చడానికి డబ్బున్న వాడొకడు ఎటూ కావాలి. ఈ అయ్యని మించిన వాళ్ళెవరు దొరుకుతారు? కాసిల్డో, మనకి ఎంత కావాలి?”
“ఇంతని ఏముంది? అయ్య ఎంత ఇవ్వగలిగితే అంత.”
“ఏమిటీ? ఈ మనిషి పస్తులున్నవాడికి కూడా మెతుకు విదల్చడు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కనక అవకాశం వదులుకోకూడదు. వాడి రోత నోట్లో ఉన్న ఆఖరి మెతుకుతో పాటు ఉన్నదంతా ఊడబీక్కోవాలి.”
“నువ్వాగు పెర్సెవెరాన్సియో! అల్లంతో కంటే బెల్లంతోటే ఎక్కువ ఈగలు పట్టుకోవచ్చు. మనం బేరం కుదుర్చుకోవచ్చు. ఎంతో చెప్పు కాసిల్డో!”
“ఉరామరిగా చూస్తే ఇప్పుడు ముందో ఇరవై వేల పేసోలయితే బాగానే ఉంటుంది. మిగతా వాళ్లంతా ఏమంటారు? మనకెటూ సాయం చేయాలనుకుంటున్నాడు కనక మన అయ్య ఇంకాస్త ఎక్కువే ఇస్తాడేమో, మనకేం తెలుసు? కాబట్టి ఒక యాభై వేలు అనుకుందాం. మీకేమనిపిస్తుంది?”
“నేను లక్ష ఇస్తాను మీకు.” పేద్రో పారమొ అన్నాడు. “ఎంతమంది మీరు?”
“మూడొందల మంది దాకా ఉంటాం.”
“సరే. నేను ఇంకో మూడొందలమందిని మీతో పంపుతాను మీ దళం బలపడేందుకు. ఒక వారంలో మీకోసం డబ్బూ, మనుషులూ ఏర్పాటు చేస్తాను. డబ్బులు ఇస్తాను కానీ, మనుషులు మాత్రం అరువుకే. వాళ్ళతో పని అయిపోగానే తిరిగి ఇక్కడికి పంపేయండి. ఒప్పందానికి సమ్మతమేనా?”
“ఇంకా సందేహమా?”
“సరే, ఇంకో వారంలో మళ్ళీ కలుద్దాం అయ్యలారా! మిమ్మల్ని ఇట్లా కలవడం ఆనందంగా ఉంది.”
“సరే,” చివరిగా వెళుతున్నతను అన్నాడు “కానీ గుర్తు పెట్టుకో. మాటతప్పావా, నీ సంగతి తేలుస్తాడు పెర్సెవెరాన్సియో. అంటే, నేనే!”
పేద్రో పారమొ అతనితో కరచాలనం చేసాడు అతను వెళ్లబోతుండగా.

“వాళ్ల నాయకుడెవరనుకుంటున్నావు?” వాళ్ళు వెళ్ళిపోయాక టిల్కేట్ ని అడిగాడు.
“ఆ మధ్యలో ఉన్నతను అనుకుంటాను. అదే, ఆ పెద్ద పొట్టేసుకుని తల కూడా పైకెత్తకుండా ఉన్నాడే, అతనే అనుకుంటున్నాను. నేనంత తొందరగా పొరబడను, డాన్ పేద్రో.”
“ఈసారి పొరబడ్డావు డమసియో. నాయకుడివి నువ్వు. కొంపదీసి ఈ తిరుగుబాటులో భాగం పంచుకోవాలనిలేదా?”
“ఆ విషయం నాకు వెంటనే తట్టలేదు. అందులోనూ కాస్త చిల్లర దొరుకుతుందంటే నాకెంతో ఇష్టం కూడాను.”
“ఈపాటికే నీకు అర్థమయి ఉండాలి కనక నీకు నా సలహా పెద్దగా అవసరం లేదు. నీకు నమ్మకమయిన వాళ్లను మూడొందలమందిని సిద్ధం చేసి వీళ్లతో జతకలువు. వాళ్ళకోసం నేను పంపిస్తానన్న మనుషుల్ని తీసుకొచ్చినట్టు చెప్పు. మిగతాది ఎట్లా చేయాలో నీకు తెలుసు.”
“మరి డబ్బు గురించి ఏం చెప్పను? అది కూడా వాళ్లకు ఇవ్వనా?”
“నీకు మనిషికి పది పేసోల లెక్కన ఇస్తాను. వాళ్ల తక్షణ అవసరాలు తీరడానికి సరిపోయేంత. మిగతాది వాళ్ళకోసం ఇక్కడ దాచానని చెప్పు. ఈ రోజుల్లో అంత సొమ్ము వెంట వేసుకుని తిరగడం మంచిది కాదు. అన్నట్టు ఆ రాతిగేటు దగ్గర కొట్టం ఎట్లా ఉంటుంది నీకు? సరే. అది నీదే, ఈ నిమిషం నుంచీ. కోమలలో మన లాయరు ఉంటాడు, అదే ఆ ముసలి గెరార్డొ ట్రూహీయో. ఈ కాగితం అతని దగ్గరికి తీసుకు వెళ్ళు. అక్కడికక్కడే ఆ స్థలం నీ పేరు మీదకి మార్పిస్తాడు. ఏమంటావు డమసియో?”
“అనేదేముంది డాన్! కొట్టం సంగతి వదిలేసినా ఈ పని ఆనందంగానే చేస్తాను. దీని సంగతి చూట్టానికయినా. నేను నీకు తెలుసు. ఏమయినా నీకు కృతజ్ఞుడిని. నేనిట్లా తిరుగుతూ ఉంటే మా ముసలిదానికి కాస్త పని కలిపించినట్టుంటుంది.”
“కాసిని పశువుల్ని కూడా తీసుకుపో. ఆ కొట్టానికి కాస్త ఆ సందడి కూడా ఉండాలిగా!”
“ఆ పుంజుల్ని కూడా తీసుకుంటే ఫర్వాలేదా?”
“నీకేం కావాలంటే అవి తీసుకుపో. మీ ఆవిడ వాటిని చూసుకుంటుంది. ఇక మన విషయానికి వద్దాం. నా పొలానికి మరీ దూరం ఆ వెళ్లనివ్వకు. ఇంకెవరన్నా వస్తే ఇక్కడ ఇప్పటికే వీళ్ళున్నారని తెలిసేట్టుండాలి. నీకు వీలయినప్పుడో, ఏదన్నా వార్త ఉన్నప్పుడో రా.”
“వస్తాను అయ్యా!”

“ఆమె ఏమంటూ ఉంది హువాన్ ప్రెసియాడో?”
“తన పాదాలను అతని కాళ్ళ మధ్య పెట్టుకునేదాన్నని చెపుతూంది. చల్లటి రాళ్ళలాగా ఉన్న పాదాల్ని బట్టీలో రొట్టె కాల్చినట్టు వెచ్చగా చేసేవాడు. అవి బంగారు రొట్టెలంటూ వాటిని మునిపళ్లతో కొరికేవాడనీ చెప్పింది. ఆమె అతని దగ్గరగా ముడుచుకుని పడుకునేది అతని చర్మం కింద, శూన్యంలో తప్పిపోతూ. తన కండరాలు నాగటి చాళ్లలా విడివడుతూ, మంటతో మొదలై వెచ్చగా, మెల్లగా ఆమె మెత్తటి కండరాలను తోసుకుంటూ లోపలికి, లోలోపలికి ఆమె కేక పెట్టిందాకా. కానీ అతని చావు ఆమెని చాలా చాలా బాధించింది. అదీ ఆమె చెప్పింది.”
“ఎవరి చావని ఆమె ఉద్దేశం?”
“ఆమెకంటే ముందుచనిపోయినవాళ్ళెవరో!”
“కానీ ఎవరయి ఉంటారు?”
“నాకు తెలియదు. ఆమె అనడం అతను ఆలస్యంగా వచ్చిన రాత్రి ఆమెకి గట్టిగా అనిపించిందట అతడు ఆలస్యంగా వేకువజాముకయినా వస్తాడని. ఎందుకంటే ఆమె చల్లటి పాదాలు దేంతోటో చుట్టేసినట్టూ, ఎవరో కప్పి వేడి చేస్తున్నట్టూ అనిపించిందట. ఆమె లేచేసరికి తాను అతనికోసం ఎదురు చూస్తూ చదువుతున్న న్యూస్ పేపర్ ఆమె పాదాలకు చుట్టి ఉందట. అతను చనిపోయిన వార్త వాళ్ళు ఆమెకు చెప్పడానికి వచ్చినప్పుడు ఆమె ఆరాత్రి నిద్రకు తాళలేనప్పుడే నేలకు జారిపోయిన పత్రిక ఆమె పాదాల చుట్టూ కప్పబడి ఉంది.
“ఆమెను పూడ్చిపెట్టిన పెట్టె బద్దలయి తెరుచుకున్నట్టుంది. చెక్క కిర్రు మనే చప్పుడు వస్తూంది.”
“అవును నాకూ వినపడుతుంది.”

ఆరాత్రి ఆమెకు మళ్లీ కలలు వచ్చాయి. ఎందుకంత గాఢంగా అన్ని విషయాలనూ గుర్తుంచుకోవడం? అతని చావు మాత్రమే కాక ఎప్పటిదో మృదువయిన సంగీతం?
“ఫ్లోరెన్సియో చనిపోయాడు సెన్యోరా!”
ఎంత భారీ మనిషి! ఎంత పొడవు! అతని గొంతెంత దృఢంగా ఉండేది!. ఎంతో పొడి అయిన నేలంత పొడిగా. అతని దేహాన్ని సరిగ్గా చూడలేకపోయింది. లేక జ్ఞాపకాల్లోంచి చెరిగిపోయిందా? వాళ్ల మధ్య వానేదో పడుతున్నట్టు. అతనేమన్నాడు? ఫ్లోరెన్సియో? ఏ ఫ్లోరెన్సియో? నావాడా? మరయితే అప్పుడు నేనెందుకు ఏడవలేదు నాకన్నీళ్లలో నన్ను ముంచేసుకుని నా వేదననంతా కడిగేసుకునేట్టు? ఓ దేవుడా! నువు నీ స్వర్గలోకంలో లేవు. అతన్ని కాపాడమని నిన్ను కోరాను. అతన్ని జాగ్రత్తగా చూసుకోమని. నిన్నడిగింది అదే. కానీ నీకు పట్టిందల్లా ఆత్మలు. మరి నాకు కావలసింది అతని శరీరం. నగ్నంగా, ప్రేమతో వేడిగా, కోరికతో కాలిపోతూ, నా వణికే రొమ్ముల్నీ, చేతుల్నీ రాస్తూ. అతని దేహాన్నుంచి నా పారదర్శక దేహం వేలాడుతూ. అతని బలం పట్టి విడుస్తున్న కామాతురమైన నా దేహం. అతని పెదవులు కప్పని నాపెదవులతో ఏం చేయను? నా పేద పెదవులేమవుతాయి?
సుజానా శాన్ హువాన్ తన పక్కలో అటూ ఇటూ దొర్లుతూ ఉంటే పేద్రో పారమొ తలుపు దగ్గరే నుంచుని ఆమెనే చూస్తూ ఈ కొత్త కలని సెకన్లలో కొలుస్తున్నాడు. లాంతరులో నూనె తగ్గి మంట రెపరెపలాడి బలహీన పడుతూ ఉంది. తొందర్లోనే అది ఆరిపోతుంది.
ఈ అంతులేని శిక్షింపజేసే కలలు కాకుండా ఏదన్నా నొప్పితో బాధపడుతూ ఉంటే అతను ఉపశమనానికేమయినా చేసుండేవాడు. సుజానా శాన్ హువాన్ నే చూస్తూ ఆమె ప్రతి కదలికనూ గమనిస్తుంటే పేద్రో పారమొకి కలిగిన ఆలోచనలు అవి. ఆమెను చూడడానికి సాయపడుతున్న ఆ పాలిపోయిన వెలుగు లాగా ఆమె బ్రతుకు కూడా హరించుకుపోతే తనేం చేయాలి?
అతను చప్పుడు కాకుండా తలుపు మూసి బయటికి నడిచాడు. బయట చల్లని గాలి. సుజానా శాన్ హువాన్ రూపాన్ని చల్లటి రాత్రి తుడిచేసింది.
వేకువజామున సుజానాకు మెలకువ వచ్చింది. ఆమెకు చెమట్లు పోస్తున్నాయి. పైనున్న బరువయిన దుప్పట్లను నేల మీదికి విసిరేసి దాని వేడి నుంచి తప్పించుకుంది. ఉదయపు చల్లటి గాలి ఆమె నగ్నదేహాన్ని చల్లపరుస్తూ ఉంది. ఆమె నిట్టూర్చి తిరిగి నిద్రలోకి జారుకుంది.
కొన్నిగంటల తర్వాత ఆమె ఫాదర్ రెంటెరియాకు అట్లాగే కనిపించింది. నగ్నంగా నిద్రపోతూ.

“ఇది విన్నారా డాన్ పేద్రో? టిల్కేట్ ని లేపేశారు”
“రాత్రి గొడవేదో వినపడుతూ ఉంది కనక కాల్పులు జరిగినట్టు తెలుసు. కానీ నాకంతవరకే తెలుసు. ఇది నీకెవరు చెప్పారు గెరార్డో?”
“గాయపడ్డవాళ్ళలో కొంతమంది కోమలా చేరుకున్నారు. నా భార్య వాళ్ళకి కట్లు కట్టడానికి సాయపడింది. వాళ్ళు డమసియోతో ఉన్నట్టూ, చాలా మంది చనిపోయారనీ చెప్పారు. విజీస్తాలమని చెప్పుకునే వాళ్ళెవరితోనో గొడవ జరిగినట్టుంది.”
“ఓరి దేవుడా! ముందుముందు అన్నీ పాడురోజులే రాబోతున్నట్టున్నాయి గెరార్డో! నువ్వేం చేయాలనుకుంటున్నావు?”
“నేను వెళ్ళిపోతున్నా డాన్ పేద్రో! సయులాకి. అక్కడ మళ్ళీ మొదలుపెట్టుకోవడమే.”
“మీ లాయర్లకా అవకాశముంది. మిమ్మల్ని చంపనంతవరకూ మీ సొత్తంతా తీసుకుని ఎక్కడికయినా పోవచ్చు.”
“అట్లా అనుకోకండి డాన్ పేద్రో! మా సమస్యలు మాకున్నాయి. అంతేకాక మీలాంటి వాళ్ళను వదిలిపోవడం కష్టంగానే ఉంటుంది. మీ మర్యాదలు మళ్లీ ఎక్కడ దొరుకుతాయి? మన ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుందనుకుంటే కాస్త మనశ్శాంతి. మీ పేపర్లన్నీ ఎక్కడ వదిలేయమంటారు?”
“వదిలేయద్దు. నీతో పాటు తీసుకు వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడనుంచే నా వ్యవహారాలు చూడడం కుదరదా?”
“నామీద మీరుంచిన నమ్మకానికి చాలా సంతోషంగా ఉంది. నిజంగా. కానీ మీ పనులు చూడడం కుదరదని చెప్పే సాహసం చేస్తున్నాను. కొన్ని అవకతవకలు.. మీకు తప్ప మరొకరికి తెలియకూడని విషయాలున్నాయి. మీ పేపర్లు తప్పుడువాళ్ల చేతుల్లో పడితే వాళ్ళు ఏమయినా చేయొచ్చు. వాటిని మీతో ఉంచుకోవడమే మంచిది.”
“నువు చెప్పింది నిజమే గెరార్డో! వాటిని ఇక్కడే వదిలేయి. వాటిని తగలబెట్టేస్తాను. పేపర్లున్నా లేకపోయినా నా ఆస్తి గురించి నాతో పెట్టుకునేదెవడు?”
“ఎవరూ లేరు డాన్ పేద్రో! నాకా నమ్మకముంది. ఇక నేను వెళతాను.”
“దేవుడు తోడుగా పో గెరార్డో!”
“ఏమన్నారు?”
“దేవుడు నీకు తోడుగా ఉంటాడంటున్నాను.”
గెరార్డో ట్రూహీయో చాలా నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అతను ముసలివాడే కానీ అంత నెమ్మదిగా, ఆగుతూ ఆగుతూ నడవవలసిన అవసరం లేదు. నిజానికి అతనేదన్నా బహుమానం దొరుకుతుందని ఆశించాడు. పైన ఎక్కడున్నాడో డాన్ లూకాస్, అప్పుడతని పనీ, ఇప్పటిదాకా డాన్ పేద్రో పనీ అతనే చూశాడు. డాన్ పేద్రో కొడుకు మిగెల్ పని కూడా. ఏదన్నా గుర్తింపు కోసం ఆశపడ్డాడు. అతను చేసిన సేవలకు బదులుగా కాస్త పెద్ద ఎత్తున. అతని భార్యకు చెప్పాడు వచ్చేముందు “నేను వదిలిపెట్టి పోతున్నానని డాన్ పేద్రోకి చెప్తాను. నాకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటాడని నాకు తెలుసు. ఆయనిచ్చే డబ్బుతో సయులాలో స్థిరపడొచ్చు. ఇక మిగతా జీవితం హాయిగా గడిపేయొచ్చు.”
కానీ ఆడవాళ్ళకి ఎప్పుడూ సందేహాలు ఎందుకు వస్తాయి? అసలేమిటి? వాళ్ళకు పైనుంచి ఏదన్నా సమాచారం అందుతుందా? అతని భార్యకు నమ్మకం లేదు అతనికేదన్నా బహుమానం దక్కుతుందని.
“నీ తల నీళ్ళలో మునగకుండా చూసుకోవడానికి నువు కుక్కలా పనిచేయాలి. అతడి నుంచి నీకేమీ రాదు.”
“ఎందుకట్లా అంటున్నావు?”
“నాకు తెలుసు, అంతే!”
వెనకనుంచి పిలుపు వస్తుందేమోనని ఇంకా వాకిలి వైపు నెమ్మదిగా నడుస్తున్నాడు.
“ఓ గెరార్డో! పరధ్యానంలో బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. నువు చేసినదానికి డబ్బుతో బదులు తీర్చుకోలేను. సరే, ఇది తీసుకో. ఏదో కాస్త కృతజ్ఞతగా.”
కానీ ఆ పిలుపు రాలేదు. ముఖద్వారం నుండి బయటకు వచ్చి రాటకు కట్టిన గుర్రాన్ని విప్పాడు. దానిపై ఎక్కి నెమ్మదిగా కోమలా వైపు బయలు దేరాడు కూతవేటు దూరం దాటిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ. మెదియా లూనా కనుచూపు మేరలనుంచి దాటిపోయాక అనుకున్నాడు “అప్పు అడగడం ఎంత నీచమైన పని?”

“డాన్ పేద్రో. నాకే ఎందుకో బాగాలేక తిరిగి వచ్చేశాను. నీ పనులు చూడ్డం నాకు సంతోషమే.”
అరగంట క్రితమే వదిలిన డాన్ పేద్రో ఆఫీసులో కూచుని ఉన్నాడు అతను మళ్ళీ.
“నాకేమీ అభ్యంతరం లేదు గెరార్డో. అవిగో పేపర్లు. ఇంకా నువు వదిలిపెట్టిన చోటనే ఉన్నాయి.”
“మరి నా ఖర్చులకి.. నా ఫీజ్లో కొంత అడ్వాన్స్ గా.. కొద్దిగా ఎక్కువ ఏమన్నా ఇస్తే.. మీకు పర్వాలేదనిపిస్తే..”
“అయిదొందలు?”
“ఇంకొంచెం.. చాల కొంచెం ఎక్కువ కుదరదా?”
“వెయ్యి సరిపోతుందా?”
“అయిదు వేలు..”
“అయిదు.. ఏమిటీ? అయిదు వేల పేసోలా? నాదగ్గర అంత లేదు. అందరికంటే నీకే ఎక్కువ తెలిసి ఉండాలి నాకున్నదంతా ఇరుక్కుపోయి ఉన్నదని. నేలా, పశువులూ.. నీకు తెలుసా సంగతి. వేయి తీసుకో. అది సరిపోతుందిలే నీకు.”
ట్రూహీయో కూచుని ఆలోచిస్తున్నాడు. ఛాతీమీదికి తల వాల్చి. పేద్రో డబ్బు లెక్కపెడుతున్న వైపు నుంచి పేసోలు బల్లపై ఠంగుమని పడుతున్న చప్పుడు వినపడుతూంది. తన ఫీజు చెల్లించకుండా ఎప్పుడూ దాటవేసే డాన్ లూకాస్ ను గుర్తు తెచ్చుకున్నాడు. మొదట్లో ఏ మచ్చా లేని డాన్ పేద్రోని. అతని కొడుకు మిగెల్ని కూడా. ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు ఆ పిల్లాడు?
కనీసం పదిహేను సార్లు జైలునుంచి బయటకు రప్పించాడు. ఆ మనిషిని చంపిన కేసొకటి. ఏం పేరు అతనిది? రెంటెరియా. అవును, అదే. శవం చేతిలో తుపాకీ ఉంచారు. తర్వాత దాని గురించి నవ్వేసేవాడు కానీ మిగెలో జడుసుకు చచ్చాడు. ఆ వొక్కసారికే డాన్ పేద్రోకి ఎంత ఖర్చయి ఉండేది చట్టప్రకారం వెళ్ళుంటే. ఇంక ఆ బలాత్కారాల సంగతేమిటి? ఎన్ని సార్లు తన జేబులోంచి డబ్బు తీసి ఆ అమ్మాయిల నోరు మూయించలేదు? “మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీకు తెల్లటి బిడ్డ పుట్టబోతున్నాడు కాబట్టి,” వాళ్ళకు నచ్చచెప్పేవాడు.
“ఇదుగో గెరార్డో, జాగ్రత్తగా చూసుకో. డబ్బు చెట్లకేం కాయదు.”
తన ఆలోచనల్లో ఇంకా మునిగి ఉన్న ట్రూహీయో బదులిచ్చాడు “చనిపోయినవాళ్ళు సమాధుల్లోంచి పైకి లేచి రానట్టే.”

తెల్లారడానికి ఇంకా చాలా సమయముంది. దీర్ఘరాత్రి వలన ఉబ్బిన లావాటి నక్షత్రాలతో ఆకాశం నిండి ఉంది. జాబిలి కొంచెం పైకి లేచి కనపడకుండా పోయింది. అది ఎవరూ చూడని, పట్టించుకోని దిక్కుమాలిన జాబిళ్లలో ఒకటి. అక్కడే కొద్దిసేపు వేలాడింది వక్రంగా, వెన్నెలేమీ కురవకుండా. తర్వాత కొండల వెనక దాక్కోవడానికి పోయింది.
దూరాన్నుంచి చీకటి ముసుగులో ఎడ్ల రంకెలు వినిపిస్తున్నాయి.
“ఆ పశువులు ఎప్పుడూ నిద్రపోవు.” డమియాన సిస్నెరోస్ అంది. “అవి ఎప్పుడూ నిద్రపోవు. అవి సైతాను లాగా ఎప్పుడూ ఏ ఆత్మను తన్నుకు పోదామా అని చూస్తూ ఉంటాయి.”
ఆమె అటు గోడవేపుకు తిరిగి పడుకుంది. అప్పుడే ఆమెకి ఎక్కడో తట్టిన చప్పుడు వినపడింది.
ఆమె ఊపిరి బిగబట్టి కళ్ళు తెరిచింది. మళ్ళీ మూడు సార్లు చిన్నగా తట్టిన శబ్దం వినపడింది ఎవరో గోడమీద కొడుతున్నట్టు. ఆమె పక్కనే కాదు, ఎక్కడో దూరంగా, కానీ అదే గోడ మీద.
“దేవుడే కాపాడాలి. అది శాన్ పస్కూల్ అయి ఉండాలి. మూడు సార్లు తట్టి, తనను నమ్మినవాళ్ళల్లో ఎవరికో సమయమాసన్నమయిందని హెచ్చరిస్తున్నాడు.”
కీళ్లనొప్పులవల్ల చాలా రోజులనుంచీ నొవేనా చేయలేదు కనక ఆమె ఆందోళన చెందలేదు. కానీ భయపడింది. భయాన్ని మించి కుతూహలం.
ఆమె మంచం మీనుండి సద్దు చేయకుండా లేచి కిటికీ నుంచి బయటికి తొంగి చూసింది.
పొలాలు నల్లగా ఉన్నాయి. ఆమెకి ఆ చుట్టుపక్కల అంతా క్షుణ్ణంగా తెలుసు కనక చీకట్లో కూడా పేద్రో పారమొ భారీ శరీరం మార్గరిటా కిటికీలోకి దూకడం కనపడింది.
“ఆ డాన్ పేద్రో..” డమియానా అనుకుంది “అమ్మాయిల వెంట పడడం మానడు గదా! నాకర్థం కానిదేమిటంటే అప్పటికేది తోస్తే అది చేయాలని ఎందుకనుకుంటాడన్నది. నాకు ముందే చెప్పి ఉంటే అయ్యగారికి ఆరాత్రికి తను కావాలని మార్గరిటాకి చెప్పేదాన్ని. అతనికి మంచం వదిలి వెళ్ళాల్సిన శ్రమ తప్పేది.”
ఎడ్లు ఇంకా రంకెలు వేస్తుండగానే ఆమె కిటికీ మూసింది. తన మంచంలో పడుకుని దుప్పటి చెవులదాకా కప్పుకుంది. కుర్ర మార్గరిటానిప్పుడు అతను ఏం చేస్తూ ఉంటాడో ఆలోచిస్తూ పడుకుని ఉండి పోయింది.
కాసేపటికి రాత్రి వేడెక్కినట్టనిపించడంతో లేచి నైట్ గౌనును విప్పేయక తప్పింది కాదు.
“డమియానా!” ఆమెకు వినిపించింది.
ఆమె చిన్నపిల్ల అయిపోయింది.
“తలుపు తెరువు డమియానా!”
ఆమె గుండె ఉరఃపంజరంలో చిన్న కప్పపిల్ల లాగా ఎగిరెగిరి పడుతూంది.
“ఎందుకు అయ్యా?”
“తెరువు డమియానా!”
“బాగా నిద్రలో ఉన్నానయ్యా!”
తర్వాత ఆమెకు డాన్ పేద్రో బయట కారిడార్లో అటూ ఇటూ నడుస్తున్న చప్పుడు వినపడింది. బూట్ల మడాలు టక్కు టక్కుమని గట్టిగా శబ్దం చేస్తున్నాయి, అతని కోపాన్ని తెలియజేస్తూ.
మరుసటి రాత్రి అతనికి మళ్ళీ కోపం రాకుండా ఉండేందుకు ఆమె తలుపు వారగా తెరిచి ఉంచింది. అతని పని సులభమయ్యేందుకు నగ్నంగానే పడుకుంది. కానీ పేద్రో పారమొ మళ్ళీ రాలేదు.
ఇప్పుడు ఆమె మెదియా లూనాలో పనివాళ్లందరికీ మేస్త్రీ. ముసలిదయి నలుగురి గౌరవాన్నీ సంపాదించుకుంది. ఈ రాత్రి ఆమె ఇంకా ఆ రాత్రి గురించే ఆలోచిస్తూ ఉంది – పేద్రో పారమొ “తలుపు తెరువు డమియానా!” అంటూ పిలిచిన రాత్రి.
ఈ గడియలో కుర్ర మార్గరిటా ఎంత సంతోషంగా ఉండి ఉంటుందో అనుకుంటూ నిద్రపోయింది.
తర్వాత ఆమెకు ఎవరో తలుపు తట్టడం వినిపించింది. కానీ ఈసారి పెద్ద తలుపు. ఎవరో తుపాకీ మడమతో దాన్ని పగలకొట్టాలని చూస్తున్నట్టు.
రెండో సారి ఆమె కిటికీ తలుపు తెరిచి బయటికి రాత్రిలోకి చూసింది. పురుగులు దొర్లే నేలపై వాన పడ్డాక ఆవిర్లొస్తున్నట్టనిపిస్తున్నా ఆమెకు ఏమీ కనపడలేదు. ఆమెకు ఏదో పైకి తేలి వస్తున్నట్టనిపించింది – చాలామంది మగవాళ్ళ వేడి. ఆమెకు కప్పల బెకబెకలూ, కీచురాళ్ళ చప్పుడూ వినిపించాయి. వానాకాలంలో ఒక సందడి లేని రాత్రి. మళ్ళీ తలుపు బాదుతున్న చప్పుడు వినిపించింది.
ఒక దీపం వెలుతురు గుంపులోని మనుషుల మొహాల మీద పడింది. అంతలోనే అది ఆరిపోయింది.
“ఇవన్నీ నాకవసరం లేని విషయాలు,” అని డమియానా సిస్నెరోస్ కిటికీ మూసుకుంది.

“నిన్ను చితకతన్నారని విన్నాను డమసియో! అట్లా ఎట్లా జరగనిచ్చావు?”
“నీకు తప్పుడు వార్త అందినట్టుంది అయ్యా! నాకేమీ కాలేదు. నామనుషులెవరూ చచ్చిపోలేదు. నాకింద నా వాళ్ళే ఏడువందలమంది ఉన్నారు. ఆపైన వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళు ఇంకొంత మంది. ఏమయిందంటే ఆపాతవాళ్లకు పనేమీ లేక విసుగుపుట్టి బోడిగుళ్ళ వాళ్ళ మీద కాల్పులు మొదలుపెట్టారు. చూడబోతే వాళ్లది పెద్ద సైన్యం. తెలుసుగా, ఆ విజీస్తాలు!”
“ఎక్కడినుంచి వచ్చారు వాళ్ళు?”
“ఉత్తరాన్నుంచి. వచ్చేదారంతా వాళ్ళకు కనపడినదంతా చదును చేసుకుంటూ వస్తున్నారు. మనకి తెలిసినంతవరకూ ఇక్కడిదాకా పంటలన్నీ దోచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు బాగా శక్తివంతులు. అది మాత్రం కాదనలేం.”
“మరి వాళ్లతోటే కలవకపోయావా? మనం గెలిచే పక్షం వైపే ఉండాలని నీకు ముందే చెప్పా గదా!”
“ఆపని ముందే చేశాను.”
“మరి ఇక్కడికెందుకు వచ్చావు?”
“మాకు డబ్బు కావాలయ్యా! మాంసం తప్ప మరేమీ తినక విసుగు పుట్టింది. ఇక అది రుచించడం లేదు. మాకు అరువు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నువు మాకు కిరాణా సరుకులు కొనిపెడతావన్న ఆశతో వచ్చాం. మేం ఎవరినుంచో దొంగిలించదల్చుకోలేదు. ఇంకాస్త దూరం వెళ్ళినట్టయితే అక్కడివాళ్ళనుంచి కాస్త ‘అప్పు‘ తీసుకునే వాళ్ళమేకానీ ఈ చుట్టుపక్కల అంతా చుట్టాలేనయిపోతిరి. వాళ్ళను దోచుకోవడం బాగోదు. మాకు కావలసింది తిండి కొనడానికి డబ్బు, కాసినయినా మిరపకాయలూ, టోర్టియాలూ కొనుక్కోవడానికి.”
“అయితే నాదగ్గరే నీ డిమాండ్లు మొదలుపెట్టావన్న మాట!”
“ఛ! లేదయ్యా. నేను ఈ కుర్రాళ్ల కోసం అడుగుతున్నా. నాకు మాత్రం ఏమీ అక్కర్లేదు.”
“నీ మనుషులకేం కావాలో నువు చూసుకుంటున్నావంటే అది నీ మంచితనమే కానీ నీకేం కావాలో అది ఇంకెవరినన్నా అడుక్కో. నేను నీకు ముందే డబ్బు ఇచ్చాను. నీకిచ్చిన దాంతో సంతోషపడు. నీకేం సలహా ఇవ్వాలని కాదు కానీ, కోంట్లాకి వెళ్ళాలన్న ఆలోచన రాలేదా? మీరు తిరుగుబాటు యుద్ధం ఎందుకు చేస్తున్నారు? మూర్ఖులే అడుక్కు తినేది. ఇంటికిపోయి కోళ్లకి మేత వేసుకోకపోయావా మీ ఆవిడతో కలిసి? వెళ్ళి ఏదో పట్టణం దోచుకోండి. నువు నీ తలమీదికి తెచ్చుకుంటున్నావు, మిగతావాళ్ళు వాళ్ళ పని చేయలేరా? కోంట్లా అంతా ధనవంతులే. వాళ్ళు దాచుకున్నదాంట్లో కొంత తీసుకో. లేకపొతే నువ్వేమన్నా వాళ్ళకి పాలిచ్చే దాదివనుకుంటున్నావా వాళ్ల అవసరాలు కనిపెట్టుకోటానికి? లేదు డమసియో. నువ్వేం సరదాకి తిరగడం లేదని తెలిసేట్టు చేయి. కాస్త బెదిరించు, సెంటావోలు అవే వస్తాయి.”
“నువు చెప్పినట్టే చేస్తానయ్యా. నువు మంచి సలహాలిస్తావనే నా నమ్మకం.”
“సరే, అది చేసి చూపించు.”
ఆ మనుషులు స్వారీ చేస్తూ వెళ్ళిపోతుంటే పేద్రో పారమొ చూస్తూ ఉండిపోయాడు. చీకట్లో కనపడకుండా గుర్రాలు దౌడు తీయడం వినిపిస్తూంది. చెమటా, దుమ్మూ; వణుకుతున్న నేలా. మిణుగురుల కాంతి మళ్ళీ మెరుస్తుంటే అందరూ వెళ్ళిపోయినట్టు అర్థమయింది. అతడొక్కడే మిగిలిపోయాడు, లోపల పుచ్చుతూన్న దృఢమైన వృక్షంలా.
అతనికి సుజానా శాన్ హువాన్ తలపుకొచ్చింది. తనతో అంతకు ముందే పడుకున్న యువతి కూడా. చిన్నగా, భయంగా వణుకుతూన్న దేహమూ, ఛాతీలోంచి ఎగిరి బయటపడుతుందేమో అన్నట్టు దడదడమని కొట్టుకుంటున్న గుండే. “చిన్నారి చిలకా,” అన్నాడు ఆమెతో. ఆమెను వాటేసుకున్నాడు ఆమెను సుజానా సాన్ హువాన్ గా మార్చడానికి ప్రయత్నిస్తూ. “ఈ లోకానికి చెందని స్త్రీ!”

పెద్రో పారమొ-11

pedro1-1
కోమల లోయలోని పొలాల మీద వాన పడుతూంది. కుంభవృష్టి కురిసే ఈ ప్రాంతాల్లో అరుదుగా పడే పలచటి వాన. అది ఆదవారం. ఆపంగో నుండి ఇండియన్స్ వాళ్ళ సీమ చేమంతి జపమాలలతోటీ, మరువం, దవనం కట్టలతోటీ దిగబడ్డారు. కలప అంతా తడిగా ఉండడం చేత పైన్, వోక్ కట్టెలు లేకుండానే వచ్చారు.
వాన నిలకడగా పడుతూంది. చిన్న గుంటల్లో నిల్చిన నీటి మీద సొట్టలు పడుతున్నాయి.
నాగటి చాళ్ళనుండి నీరు కాలవలుగా మారి మొలకలెత్తుతున్న లేత మొక్కజొన్న వైపు పారుతున్నాయి. మగాళ్ళెవరూ సంతకి రాలేదు. వాళ్లంతా పొలాల్లో పారే నీటికి గండ్లు కొడుతూ దారి మళ్ళించి లేతపంటను ముంచెత్తకుండా చూస్తున్నారు. వాళ్ళు గుంపులుగా కదులుతూ ఆ వానలో వరదలెత్తిన పొలాల్లో దారి చేసుకుంటూ మెత్తబడ్డ మట్టిని పారలతో తెగకొడుతూ, మొలకలను చేతితో కదతొక్కుతూ అవి బలంగా పెరిగేందుకు దోహదం చేస్తున్నారు.
ఇండియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇది తమకు మంచిరోజు కాదు అనుకున్నారు. అందుకే వాళ్ళు తడిసిన గబానేల, చెత్త టోపీల కింద వణుకుతున్నారు. చలితో కాదు, భయంతో. వాళ్ళు సన్నగా పడుతున్న వాన వంకా, పైన ఇంకా నిండుగా కనిపిస్తున్న మబ్బులవంకా తేరిపార చూస్తున్నారు.
ఎవరూ రావడం లేదు. ఊరంతా నిర్మానుష్యంగా అగపడుతూంది. ఒకావిడ ఒక గుడ్డ పీలికా, పంచదార పొట్లం, ఉంటే జొన్నగంజి వార్చడానికి చిల్లుల గిన్నే కావాలని అడుగుతూంది. సమయం గడుస్తున్న కొద్దీ గబానేలు బరువెక్కుతున్నాయి తడికి. ఇండియన్స్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, చతుర్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. సీమ చేమంతి ఆకులు వాన తడికి మెరుస్తున్నాయి. “కాస్త కిత్తనార సారా తెచ్చి ఉంటే బాగుండేది కానీ కిత్తనార చెట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి,” అనుకుంటూ ఉన్నారు.జస్టినా డయజ్ గొడుగు వేసుకుని మెదియా లూనా నుండి తిన్నగా ఉన్న దారిలో వేగంగా పారుతున్న నీటి కాలవలను తప్పించుకుంటూ వస్తూంది. చర్చి ప్రధాన ద్వారం దాటుతూ గుండెల మీదుగా చేత్తో శిలువ గుర్తు వేసుకుంది. ఆర్చీల కింది నుంఛి ప్లాజా లోకి వచ్చింది. ఇండియన్స్ అంతా ఆమెను చూడ్డానికి అటువైపు తిరిగారు. అందరి కళ్ళూ తనమీదే ఉన్నట్టూ, అందరూ తనను గుచ్చి గుచ్చి చూస్తున్నట్టూ అనిపించిందామెకి. ఆకులూ అలములూ పరిచిపెట్టుకున్న చోట్లలో మొదటిదాని దగ్గర ఆమె ఆగింది. పది సెంటవోల దవనం కొనుక్కుని వెనుతిరిగింది. ఇండియన్స్ కళ్ళన్నీ ఇంకా ఆమె వెన్నంటే ఉన్నాయి.
“ఈ కాలంలో అన్నీ ప్రియంగానే ఉంటాయి,” అనుకుంది మెదియాలూనా వెళుతూ దారిలో. “ఈ కాస్త దవనం పది సెంటవోలు! వాసన చూడ్డానికి కూడా చాలదు.”
పొద్దుపోతుండగా ఇండియన్స్ వాళ్లు తెచ్చుకున్న దినుసులన్నీ ఎత్తేసుకున్నారు. బరువుగా ఉన్న మూటల్ని భుజాన వేసుకుని వానలో నడిచారు. చర్చి దగ్గర ఆగి కన్య మేరీని ప్రార్థించి, ఒక మరువం కట్ట నైవేద్యంగా పెట్టారు. అపాంగో వైపు తమ ఇంటి దారి పట్టారు. “ఇంకో రోజు,” అనుకున్నారు. చతుర్లాడుకుంటూ నవ్వుతూ దారి వెంట నడిచారు.
జస్టినా డయజ్ సుజానా శాన్ హువాన్ గదిలోకి వెళ్ళి దవనాన్ని చిన్న అలమరలో పెట్టింది. పరదాలు కిటికీని పూర్తిగా మూసేయడంతో చీకట్లో ఆమెకు నీడలు మాత్రమే కనిపించాయి. కనపడని వాటిని ఉరామరిగా ఊహిస్తూంది. సుజానా శాన్ హువాన్ నిద్రపోతున్నట్లుంది అనుకుంది. ఆమె ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటే బాగుండుననుకునేది. ఇప్పుడు నిద్ర పోతుంది కనక జస్టినాకి తృప్తిగా ఉంది. కానీ ఆమెకి ఆ చీకటి గదిలో ఒక దూరపు మూలనుంచి నిట్టూర్పు వినవచ్చింది.
“జస్టినా!” ఎవరో పిలిచారు.
ఆమె చుట్టూ తిరిగి చూసింది. ఎవరూ కనపడలేదు కానీ భుజమ్మీద చేయీ, చెవి దగ్గర ఊపిరీ తగిలాయి. ఒక గొంతు రహస్యం చెపుతున్నట్టు అంది “వెళ్ళి పో జస్టినా, నీ సామానంతా సర్దుకుని పో. ఇక నువ్వు మాకక్కర లేదు.”
“ఆమెకి నా అవసరం ఉంది,” నిటారుగా నిలబడుతూ అంది. “ఆమెకి జబ్బు చేసింది. ఆమెకి నా అవసరం ఉంది.”
“ఇకపై అవసరం లేదు జస్టినా! నేనిక్కడే ఉండి ఆమెను చూసుకుంటాను.”
“నువ్వేనా బార్ట్లోం?” అడిగింది కానీ జవాబుకోసం ఆగలేదు. పొలాలనుంచి తిరిగి వచ్చే ఆడా మగా చెవుల పడేట్టు ఒక్క అరుపు అరిచింది. అది విన్న వాళ్ళు “ఇదేదో అరుపులా ఉంది కానీ మనిషి అరుపులా మాత్రం లేదు,” అనుకున్నారు.
వానకి చప్పుళ్ళనీ సన్నగిల్లుతున్నాయి. మిగతా సందడంతా సన్నగిల్లినప్పడు అది చల్లటి చినుకుల్ని విసిరికొడుతూ, జీవన సూత్రాన్ని నేయడం వినిపిస్తూంది.
“ఏమయింది జస్టినా? ఎందుకంతగా అరిచావు?” సుజాన శాన్ హువాన్ అడిగింది.
“నేనేం అరవలేదు సుజానా! నువు కలగన్నట్టున్నావు.”
“నాకు కలలు రావని చెప్పానుగా! నీకేం పట్టదు. ఒక రవ్వ కన్ను మూతపడింది. పిల్లిని రాత్రి బయట వదిలివేయలేదు. అది నన్ను రాత్రంతా నిద్ర పోనివ్వలేదు.”
“అది నాతో పడుకుంది, నా కాళ్ల మధ్య. అది తడిస్తే చూడలేక నా మంచం మీదే ఉండనిచ్చాను. కానీ అది గొడవేం చేయలేదు.”
“లేదు, గొడవేం చేయలేదు! రాత్రంతా సర్కస్ పిల్లి లాగా నా కాళ్ల నుంచి తలమీదికి దూకుతూ ఉంది ఆకలేసినట్టు మెల్లగా మ్యావ్ మ్యావ్ అంటూ.”
“దానికి తిండి బాగానే పెట్టాను. అది రాత్రంతా నా పక్క వదల్లేదు. మళ్ళీ ఏవో అబద్ధాల కలలు కంటున్నావు సుజానా!”
“అది రాత్రంతా దూకుతూ నన్ను జడిపిస్తూనే ఉందని చెపుతుంటే వినవేం? నీ పిల్లంటే నీకు ముద్దేమో కానీ నేను పడుకున్నప్పుడు నా దగ్గరికి రానీయకు.”
“ఊరికే ఊహించుకుంటున్నావు సుజానా. అంతే. పేద్రో పారమొ వచ్చాక ఇక నీతో నా వల్ల కాదని చెప్పేస్తా. వెళ్ళిపోతానని చెప్తా. పనికి పెట్టుకునే మంచి వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. అందరూ నీలా తిక్కగా ఉండరు, ఇట్లా ఏడిపించి నవ్వుకోరు. రేపు నేను వెళ్ళిపోతాను. నా పిల్లిని తీసుకుని పోతా, నువ్వు సుఖంగా ఉండు.”
“నువ్వు పోవు పాపిష్ఠి జస్టినా! నువ్వెక్కడికీ పోలేవు. నీకు నాలా ప్రేమించేవారు ఎక్కడా దొరకరు.”
“అవును, నేను పోను సుజానా. నేను పోను. నిన్ను చూసుకుంటానని నీకు తెలుసు. నేను ఏం చేయనని నువు తిట్టినా నేనెప్పుడూ నిన్ను చూసుకుంటాను.”
సుజానా పుట్టిన రోజునుంచీ ఆమే సాకింది. ఆమెను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమెకు నడవడం నేర్పింది. ఎప్పటికీ గుర్తుండి పోయే ఆ మొదటి అడుగు వేయడం. ఆమె పెదవులూ, కళ్ళూ పంచదార చిలకల్లా తీపెక్కడం చూసింది. “పీచు మిటాయి బులుగు, పసుపూ బులుగూ, పచ్చా బులుగూ, అదీ ఇదీ కలుపు,” బొద్దుగా ఉన్న ఆమె కాళ్ళను మునిపళ్లతో కొరికేది. పాలు రాని రొమ్ముని బొమ్మలా ఆమెకందించి ఆనందపరిచేది. “ఆడుకో దీనితో,” సుజానాతో చెప్పేది. “నీ చిన్న బొమ్మతో నువ్వాడుకో,” ఆమె ముక్కలవుతుందా అనేట్టు వాటేసుకునేది.
బయట అరటి ఆకులమీద వాన పడుతూంది. నీరు కింద మడుగుల్లో పడి మరుగుతున్న చప్పుడు వస్తూంది.
పక్క దుప్పట్లు చల్లగా, చెమ్మగా ఉన్నాయి. పగలూ రేయీ, పగలూ రేయీ పనిచేసి అలసిపోయినట్టు తూముల్లో జల జలమంటూ నురగలు తేలుతున్నాయి. ప్రళయ కాల ధ్వనులతో వాన కుంభవృష్టిగా పడుతూనే ఉంది కాలవలు కడుతూ.

అర్ధరాత్రయింది. బయట వాన చప్పుడు అన్ని శబ్దాలనూ మింగేస్తూంది.
సుజానా శాన్ హువాన్ పెందలకడనే నిద్ర లేచింది. నెమ్మదిగా లేచి కూచుని మంచం దిగింది. మళ్ళీ ఆమెకు కాళ్ళు బరువెక్కినట్టనిపించింది. ఒళ్ళంతా కూడా బరువుగా ఉన్నట్టూ, అది తలకెక్కుతున్నట్టూ అనిపించింది.
“ఎవరది? నువ్వేనా బార్ట్లోం?”
ఎవరో వస్తున్నట్టో, పోతున్నట్టో తలుపు కిర్రుమనడం విన్నాననుకుంది. మళ్ళీ చల్లటి వాన, ఆగాగి ఆరటి మొక్క్ల మీదినుంచి జారిపడుతూ, దాని పొంగులోనే మరుగుతూ.
ఆమె మళ్ళీ పడుకుని పొద్దున ఎండ చెమ్మనీటితో పూసలు కట్టిన ఎర్రటి ఇటుకల మీదపడిందాకా లేవలేదు.
“జస్టినా!” ఆమె పిలిచింది.
భుజాల మీద శాలువా కప్పుకుంటూ ఆమె ప్రత్యక్షమయింది తలుపు పక్కనే ఉన్నట్టు.
“ఏం కావాలి సుజానా!”
“పిల్లి. పిల్లి మళ్ళీ ఇక్కడికి వచ్చింది.”
“అయ్యో నా సుజానా!”
సుజానా రొమ్ముల మీద తల ఆనించి కౌగిలించుకుంది. సుజానా తలపైకెత్తి అడిగింది “ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నువ్వు నన్నెంత బాగా చూసుకుంటున్నావో పేద్రో పారమొకి చెప్తాను. నీ పిల్లి నన్నెట్లా జడిపిస్తుందో అతనికి చెప్పనులే! ఏడవకు జస్టినా!”
“మీ నాన్న చనిపోయాడమ్మా! మొన్న రాత్రే చనిపోయాడు. మనం చేయవలసింది ఏమీ లేదని ఇవాళే వచ్చి చెప్పారు. అక్కడే పూడ్చేశారట. ఇక్కడి దాకా తీసుకురావడం దూరాభారమని. నువ్వొంటరిదానవయ్యావమ్మా, సుజానా!”
“అయితే అది నాన్న అన్నమాట.” సుజానా నవ్వింది. “నాకు సెలవని చెప్పటానికి వచ్చాడు,” ఆమె మళ్ళీ నవ్వింది.
చాలా ఏళ్ళ క్రితం ఆమె చిన్న పాపగా ఉన్నప్పుడు అతను ఒకరోజు ఆమెతో అన్నాడు “కిందికి దిగు సుజానా! వచ్చి నీకేం కనిపించిందో చెప్పు!”
ఆమె నడుముకు కట్టుకున్న తాడు నొక్కుకుపోతున్నా వేలాడుతూంది. చేతులు దూసుకుపోతున్నా వదిలి పెట్టడం లేదు. బయటి ప్రపంచాన్నీ ఆమెనీ కలిపి ఉంచే బంధం ఒక్క ఆ తాడే.
“నాకేం కనపడడం లేదు నాన్నా!”
“సరిగా చూడు సుజానా! ఏమన్నా కనిపిస్తుందేమో చూడు,” లాంతరు వెలుగు ఆమె మీద పడేట్టు చేశాడు.
“నాకేం కనపడడం లేదు నాన్నా!”
“ఇంకొంచెం కిందికి దింపుతాను. నేల తగలగానే చెప్పు.”
ఏవో చెక్కల మధ్య సన్నటి సందు నుండి లోపలికి పోయింది. బంకమట్టితో కప్పబడి, పుచ్చి పాడయిన చెక్కల మీద నడిచింది.
“నెమ్మదిగా పో సుజానా. నీకు నేను చెప్పింది కనిపిస్తుంది.”
ఆమె చీకట్లో అటూ ఇటూ ఊగుతూ, దేనికో కొట్టుకుంటూ కిందికి, ఇంకా కిందకి వెళ్ళింది కాళ్ళు గాల్లో తేలుతుంటే.
“కిందికి సుజానా. ఇంకొంచెం కిందికి. ఏమన్నా కనిపిస్తుందేమో చూసి చెప్పు.”
కాళ్ల కింద నేల తగిలినప్పుడు ఆమె భయంతో అక్కడే నిలబడిపోయింది. దీపపు కాంతి ఆమె మీదే తిరిగి ఆమె పక్కనే కేంద్రీకృతం అయింది. పైనుంచి అరుపు విని వణికింది.
“అది నాకివ్వు సుజానా!”
ఆ పుర్రెను చేతుల్లోకి తీసుకుంది కానీ వెలుతురు పూర్తిగా దాని మీద పడేసరికి వదిలేసింది.
“ఇది చచ్చిపోయన వాడి పుర్రె,” అంది.
“దాని పక్కనే ఇంకేదో ఉంటుంది చూడు. ఏం కనిపించినా నాకివ్వు.”
అస్తిపంజరం ఎముకలుగా విడివడి ఉంది. దవడ ఎముక పంచదారలాగా పక్కకి పడిపోయింది. బొటనవేలు దాకా ఒక్కో ముక్కా కీలు తర్వాత కీలుగా అతనికి అందించింది. అన్నిటి కంటే ముందు ఆమె చేతుల్లోనే పొడయిన గుండ్రటి పుర్రె.
“బాగా చూడు సుజానా! డబ్బు కోసం. గుండ్రటి బంగారు నాణేలు. అంతా చూడు సుజానా!”
తరవాత ఆమెకి ఏమీ గుర్తు లేదు కొన్ని రోజుల తర్వాత మంచుగడ్డలోకి అడుగుపెట్టిందాకా. ఆమె తండ్రి చూపుల్లోని మంచుగడ్డ.
అందుకే ఆమె నవ్వుతూందిప్పుడు.
“అది నువ్వేనని నాకు తెలుసు బార్ట్లోం!”
ఆమె రొమ్ముల మీద తలపెట్టి ఏడుస్తున్న జస్టినా పైకి లేచి చూసింది ఆమె ఎందుకు నవ్వుతుందా అనీ, ఆ నవ్వు అట్టహాసంగా ఎందుకు మారిందా అనీ.
బయట ఇంకా వాన పడుతూంది. ఇండియన్స్ వెళ్ళిపోయారు. అది సోమవారం. కోమల లోయ వానలో మునుగుతూ ఉంది.

రోజు తర్వాత రోజు గాలులు విసిరి కొడుతున్నాయి. వానలు తీసుకు వచ్చిన గాలులు. వాన పోయినా గాలి ఉండిపోయింది. పొలాల్లో లేత ఆకులు ఇప్పుడు ఎండిపోయి చాళ్ళలో పరిచినట్టు పడి ఉన్నాయి గాలికి ఎగిరిపోకుండా. పగటిపూట గాలులు ఐవీ తీగలను కదిలిస్తూ, కప్పుపై పెంకుల్ని దడదడమనిపిస్తూ కొంత భరించగలిగేలా ఉన్నా రాత్రయ్యేప్పటికి ఆగకుండా ఒకటే రొద పెడుతూన్నాయి. ఆకాశంలో పందిరిలా కమ్ముకున్న మబ్బులు నిశ్శబ్దంగా కదిలిపోతున్నాయి నేలను రాసుకుపోయేంత కిందగా.
సుజానా శాన్ హువాన్ మూసి ఉన్న కిటికీని గాలి విసిరి కొట్టడం వింటూంది. చేతులు తలకింద పట్టుకుని ఆలోచిస్తూ పడుకుని రాత్రి చప్పుళ్ళు వింది. గాలి అసహనంగా ఉండుండి రాత్రిని వేధిస్తూంది. అకస్మాత్తుగా ఆగిపోతుంది.
ఎవరో తలుపు తెరిచారు. గాలి విసురుకి దీపం ఆరిపోయింది. ఆమె చీకటినే చూస్తూంది ఆలోచించడం ఆపేసి. మరుక్షణం అడ్డదిడ్డంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు వినపడింది. మూసిన కనురెప్పలమీద దీపపు కాంతి పడడం తెలుస్తూంది.
ఆమె కళ్ళు తెరవలేదు. వెంట్రుకలు మొహం మీద చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఆమె పై పెదవి మీద చెమట చుక్కల్ని దీపం వేడెక్కిస్తూంది.
ఆమె అడిగింది “నువ్వేనా ఫాదర్!”
“అవునమ్మా, నేను నీ తండ్రిని.”
సగం తెరిచిన కళ్ళతో చూసింది. పైకప్పు మీద నీడలాంటి ఆకారం ఆమె మొహం మీద పడుతున్నట్టూ, దాన్ని ఆమె జుట్టు మూసేస్తున్నట్టూ ఉంది. దాని తల ఆమె మొహం మీదికి వచ్చినట్టుంది. కనురెప్పల వెంట్రుకల్లోంచి బూజరగా ఉన్న ఒక ఆకారం రూపుదాల్చింది. దాని గుండె స్థానంలో ఒక దీపం వెలుగుతూంది. చిన్న గుండె దీపంలా రెపరెపమంటూ కొట్టుకుంటూంది. “నీగుండె నొప్పితో చనిపోతూ ఉంది,” ఆమె అనుకుంది. “నాకు తెలుసు నువ్వు ఫ్లోరెన్సియో చనిపోయాడని చెప్పడానికి వచ్చావని. కానీ నాకు ఆ విషయం ముందే తెలుసు. ఇక దేని గురించీ విచారించకు. నాగురించి ఆందోళన పడకు. నా దిగులు భద్రంగా దాచి ఉంచాను. నీ గుండె జారిపోనీకు.”
మంచం దిగి ఫాదర్ రెంటెరియా వైపుకు ఈడ్చుకుంటూ వచ్చింది.
“నన్ను ఓదార్చనీ.” అన్నాడు కొవ్వొత్తి వెలుగుని తన చేతితో కాపాడుతూ. “నా తీరని దుఖం తో నిన్ను ఓదార్చనీ!”
ఆమె అతని వద్దకు వచ్చి కొవ్వొత్తి జ్వాల చుట్టూ తన చేతుల్ని అడ్డుపెట్టి, దానివైపు తన ముఖం వంచడం ఫాదర్ రెంటెరియా చూస్తూ ఉండిపోయాడు. కాలుతున్న మాంసం వాసన రావడం తో కొవ్వొత్తిని ఒక్క ఊపున పక్కకి లాగి ఆర్పేశాడు.
చీకట్లో సుజానా మళ్ళీ పరుగెత్తింది తన దుప్పటి కింద దాక్కోవడానికి.
“నిన్ను ఓదార్చడానికి వచ్చానమ్మా!”
“అయితే నువ్వెళ్ళవచ్చు ఫాదర్!” ఆమె చెప్పింది. “మళ్ళీ రావద్దు. నాకు నీ అవసరం లేదు.”
వెనుతిరిగిపోతున్న అడుగుల చప్పుడు వినిపించింది. ఎప్పటిలా చలినీ, భయాన్నీ కలగజేస్తూ.
“చచ్చిపోయినవాడివి, నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు?’
ఫాథర్ రెంటెరియా తలుపు మూసి రాత్రి గాలిలోకి అడుగు పెట్టాడు.
గాలి వీస్తూనే ఉంది.

టర్తముడో అని అందరూ పిలిచే అతను మెదియా లూనా వచ్చి పేద్రో పారమొ గురించి అడిగాడు.
“అతన్నెందుకు కలవాలనుకుంటున్నావు?”
“మ..మాట్లాడదామని..”
“ఇక్కడ లేడు.”
“వ..వచ్చాక చెప్పు ఆయనకి. డ..డాన్ ఫుల్గోర్ గురించి.”
“నేను వెళ్ళి చూస్తాను. కాసేపు ఆగాల్సి ఉంటుంది.”
“అ..అర్జెంటని చెప్పు.”
“చెప్తాలే!”
టర్తముడో గుర్రం దిగకుండానే ఎదురుచూశాడు. కొద్దిసేపయ్యాక అతనెప్పుడూ చూడని పేద్రో పారమొ వచ్చి అడిగాడు “ఏం పని నీకు?”
“నే.నేను అయ్యతోటే మాట్లాడాలి.”
“నేనే అయ్యను. నీకేం కావాలి?”
“ఏ..ఏమిటంటే డాన్ ఫుల్గోర్ సెడానో ని చ..చంపేశారు. నె..నేను అతనితోనే ఉన్నాను. ని..నీళ్ళు రావడం లేదేమిటా అని చు..చూడ్డానికి కాలవ పైకి వెళ్ళాము. వె..వెళుతుంటే కొంతమంది గుర్రాల మీద మాకెదురుగా వచ్చారు. వ..వాళ్లల్లో ఒకడు ‘వాడు నాకు తెలుసు, మె..మెదియా లూనాలో మేస్త్రీ’ అని అరిచాడు. వ..వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. డ..డాన్ ఫుల్గోర్ ని గుర్రం ది..దిగమని చెప్పారు. వ..వాళ్ళు తిరుగుబాటుదారులమని చెప్పుకున్నారు. వ..వాళ్లకి మీ భూములు కావాలంట. ‘పొ..పో!’ అని డాన్ ఫుల్గోర్ని అన్నారు ‘పో, పోయి మీ అయ్యగారితో చెప్పు మె..మేం వస్తున్నామని.’ బ్..భయపడిపోయి బయలుదేరాడు. ల..లావు కదా, మరీ వేగంగా కాదు కానీ పరుగెత్తాడు. అ..అతను పరుగెడుతుంటే వాళ్ళు కాల్చారు. ఒ..ఒక కాలు గాల్లో, ఒక కాలు నేలమీద ఉండగానే చ..చచ్చిపోయాడు.
“నె..నేను ఒక్క అడుగు కూడా క..కదల్లేదు. ర..రాత్రంతా అక్కడే ఉండి ఏం జరిగిందో చె..చెప్పడానికి వచ్చాను.”
“మరి ఇంకా దేనికోసం ఆగావు? నీ దారిన పో. వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వచ్చి కలవాలన్నా ఇక్కడే ఉంటానని వాళ్ళకు చెప్పు. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను. ముందు కొసగ్రేషన్ రాంచ్ మీదుగా వెళ్ళు. నీకు టిల్కేట్ తెలుసా? అక్కడ అతనుంటాడు. అతన్నొచ్చి నన్ను కలవమని చెప్పు. తర్వాత వాళ్ళకు చెప్పు ఎంత తొందరగా వస్తారా అని ఎదురు చూస్తున్నానని. ఏ రకం తిరుగిబాటుదారులు వాళ్ళు?”
“న..నాకు తెలియదు. ఆ పేరే చెప్పుకున్నారు.”
“ఆ టిల్కేట్ ని ఇక్కడ ఉన్నట్టు రమ్మను.”
“ఆ..అట్లాగే అయ్యా!”
పేద్రో పారమొ తన ఆఫీసు గది తలుపులు మూశాడు. తను ముసలివాడయినట్టూ, అలసిపోయినట్టూ అనిపించిందతనికి. ఫుల్గోర్ గురించి ఎక్కువ దిగులుపడలేదు. “అతనీ లోకం కంటే పై లోకానికే చెందినవాడు.” ఫుల్గోర్ చేయగలిగిందల్లా చేశాడు. ఇంకెవరికంటేనూ ఎక్కువగా కాకపోయినా ఉపయోగపడ్డాడు. “కానీ ఆ దొంగలంజకొడుకులకి కొండచిలువలాంటి టిల్కేట్ వంటి వాళ్ళు ఎదురుపడి ఉండరు,” అనుకున్నాడు.
అతని ఆలోచనలు ఎప్పుడూ తన గదిలో నిద్రపోతూనో, నిద్ర నటిస్తూనో ఉండే సుజానా శాన్ హువాన్ వైపు మళ్ళాయి. అతను ముందు రాత్రంతా అమె గదిలో గోడ కానుకుని నిలుచుని పల్చటి కొవ్వొత్తి కాంతిలో ఆమెనే గమనిస్తూ గడిపాడు. చెమటతో తడిసిన మొహం, దుప్పటిని అటూ ఇటూ కదిలిస్తూ, దిండు పీలికలయ్యేట్టు పీకుతూన్న చేతులూ.
ఆమెను తనతో కాపురానికి తీసుకువచ్చినప్పటినుంచీ ప్రతి రాత్రీ అంతే. రాత్రంతా ఆమె అంతు లేని కలతతో బాధపడుతూ ఉండడం చూస్తూ గడపడమే. ఇట్లా ఎన్నాళ్ళు సాగుతుందని తనను తనే ప్రశ్నించుకున్నాడు.
చాలా రోజులు ఇట్లా ఉండదని ఆశించాడు. ఏదీ ఎల్లకాలమూ ఉండబోదు. ఏ జ్ఞాపకమూ ఎంత గాఢమైనదయినా మాసిపోకుండా ఉండదు.
ఆమెను అంతగా లోలోపల చీలుస్తూ వేధించేదేమిటో, నిద్రపట్టక అటూ ఇటూ దొర్లేట్టు చేస్తున్నదేమిటో తనకు తెలిస్తే బాగుండును.
ఆమె తనకు తెలుసుననుకున్నాడు. తెలియదని తెలిసినప్పటికీ, తను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తి అని తెలియడం చాలదా? ఇంకా – ఇది అన్నిటికంటే ముఖ్యమైనది – ఆమె వలన మిగతా జ్ఞాపకాలన్నీ చెరిపేసుకుని వెలిగే రూపుతో ఈ భూమిని వదిలిపోతాడు.
కానీ సుజానా శాన్ హువాన్ ఏ లోకంలో బతుకుతూంది? పేద్రో పారమొకి ఎప్పటికీ తెలియని విషయాల్లో అది ఒకటి.

“వెచ్చటి ఇసుక వొంటికి తగులుతూ హాయిగా ఉంది. నా కళ్ళు మూతపడీ, చేతులు బార్లా సాచీ, కాళ్ళు ఎడంగా సముద్రపుగాలికి తెరుచుకునీ ఉన్నాయి. నా ముందు దిగంతాలదాకా వ్యాపించిన సముద్రముంది కెరటాలతో నా పాదాలని కడిగి వాటిపై నురగలు వదులుతూ..”
“ఇప్పుడు మాట్లాడుతూంది ఆమే, హువాన్ ప్రెసియాడో. ఆమె ఏమంటూ ఉందో నాకు చెప్పడం మర్చిపోకు.”
“.. అది పొద్దున్నే. సముద్రం లేస్తూ పడుతూ ఉంది. దాని నురగ నుండి జారుకుని పచ్చటి నిశ్శబ్ద కెరటాలుగా పరుగెడుతూంది.
“’నేనెప్పుడూ నగ్నంగానే సముద్రంలో ఈదుతాను,’ అని అతనితో చెప్పాను. అతను కూడా ఆ మొదటి రోజు నాతో పాటు నగ్నంగానే దిగాడు. వెనక్కి తిరిగి నడిచి వస్తూ మెరుస్తూన్నాడు. సముద్రపు కాకులెక్కడా కనపడలేదు. ‘కత్తి ముక్కు ‘ పిట్టలని అందరూ పిలిచే పిట్టలు మాత్రం గురక పెడుతున్నట్టు గుర్రుగుర్రు మంటున్నాయి. అవి కూడా పొద్దెక్కేపాటికి మాయమయ్యాయి. నేను తోడు ఉన్నప్పటికీ అతనికి వొంటరిగా ఉన్నట్టనిపించింది.
“’నువు ఆ పిట్టల్లో ఒకదానివయితే ఎంతో అంతే,’ రాత్రి అతను అన్నాడు. ‘రాత్రి పూట మనమిద్దరమూ ఒక దుప్పటికింద ఒకే దిండు వేసుకుని పడుకున్నప్పుడే నిన్ను బాగా ఇష్టపడతాను.’
“అతను వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడూ తిరిగి వెళుతుండేదాన్ని. సముద్రం నా చీలమండల్ని కడిగి వెనక్కి పోతుంది, నా మోకాళ్ళను కడుగుతుంది, నా తొడలను కూడా. తన మెత్తటి చేయిని నా నడుం చుట్టూ వేసి, నా రొమ్ముల చుట్టూ తిరిగి, నా గొంతును పెనవేసుకుని, భుజాల్ని అదుముతుంది. నేను అప్పుడు దాంట్లోకి మునిగి పోయాను, నా పూర్తి శరీరంతో. దాని తాడన బలానికి నన్ను నేను అర్పించుకుని, ఏమీ దాచుకోకుండా దాని హస్తగతమౌతాను.”
“’నాకు సముద్రంలో ఈదడం ఇష్టం,’ అతనికి చెప్పాను.
“కానీ అతనికి అర్థం కాలేదు.
“ఆ మరుసటి రోజు నేను మళ్ళీ సముద్రంలో ఉన్నాను నన్ను నేను శుద్ధి చేసుకుంటూ. నన్ను ఆ కెరటాలకు అర్పించుకుంటూ.”

పెద్రో పారమొ-10

pedro1-1

చాలాకాలం క్రిందట మా అమ్మ చనిపోయిన మంచం మీదే పడుకున్నాను. అదే పరుపు పైన, మమ్మల్ని నిద్రపుచ్చేముందు మాపై కప్పే ఉన్ని దుప్పటి కింద. ఆమె పక్కనే పడుకుని ఉన్నాను, ఆమె బుజ్జాయిని. తన చేతుల మధ్య నాకోసం ఏర్పరచిన ప్రత్యేకమైన చోటులో.

ఆమె నెమ్మదిగా ఊపిరి తీసే లయ నాకు తెలుస్తూందనుకుంటాను. ఆ అదురుపాటూ, నిట్టూర్పులూ నన్ను నిద్రపుచ్చుతూ.. ఆమె చావు బాధ నాకు తెలుస్తుందనుకుంటాను… కానీ అది నిజం కాదు.

ఆ రోజుల్ని తల్చుకుని నా వొంటరితనాన్ని మర్చిపోవాలనుకుంటూ నేనిక్కడ వెల్లికిలా పడుకుని ఉన్నాను. నేనిక్కడ కొద్ది కాలమే కాదు కదా ఉండేది! నేను మా అమ్మ పక్కలో కూడా కాదు ఉంది, చనిపోయినవాళ్లను ఖననం చేసే నల్లపెట్టె లాంటి పెట్టెలో. నేను చనిపోయాను కనుక.

నేనెక్కడున్నదీ తెలుస్తూంది. కానీ నేనింకా ఆలోచించగలను.

పండుతున్న నిమ్మకాయలని తలుచుకున్నాను. నిర్లక్ష్యానికి గురయి ఎండిపోకముందే ఫెర్న్ మొక్కల కాడల్ని విరగ్గొట్టే ఫిబ్రవరి గాలి తలపుకు వచ్చింది. వరండాని తమ పరిమళంతో నింపిన పండు నిమ్మకాయలు.

ఫిబ్రవరి ఉదయాల్లో కొండల మీద నుంఛి గాలి కిందికి వీస్తుంది. లోయలోకి తోసే వేడి గాలి కోసం ఎదురుచూస్తూ మబ్బులు అక్కడ గుమికూడాయి. ఆకాశం నీలంగా ఉంది. నేల మీదుగా ఊడ్చుకుంటూ దుమ్ము రేపుతూ నారింజ కొమ్మల్ని విసిరి కొడుతూన్న సుడిగాలులపై కాంతి ఆటలాడుతూంది.

పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి. గాలికి కొట్టుకు వచ్చిన ఆకులను పొడిచి మళ్లీ కిచకిచమంటున్నాయి. ముళ్ళకంపల్లో ఈకలను జార విడుచుకుని సీతాకోకచిలకల్ని తరిమి మళ్ళీ కిచకిచమంటూన్నాయి. అది ఆ రుతువు.

గాలితో, పిచ్చుకలతో, నీలి కాంతితో నిండిన ఫిబ్రవరి. నాకు గుర్తుంది. అప్పుడే మా అమ్మ చనిపోయింది.

నేను ఏడ్చి ఉండాలి. నేను నెత్తురోడేట్టు నాచేతులు పిండుకుని ఉండాలి. అట్లాగే చేయాలని నువ్వనుకుని ఉంటావు. కానీ నిజానికి అది ఆహ్లాదకరమైన ఉదయం కాదా? తెరిచిన తలుపులోంచి పిల్లగాలి వీస్తుంది ఐవీ నులి తీగలను విదిలిస్తూ. నా కాళ్ల మధ్య వెంట్రుకలు పెరగడం మొదలెట్టాయి, నా రొమ్ముల్ని తాకిన నా చేతులు వేడిగా వణికాయి. పిచ్చుకలు అడుకుంటున్నాయి. కొండవాలున గోధుమ పంట గాలికి ఊగుతూంది. మల్లెల మధ్య ఆడుకునే గాలిని ఆమె ఎప్పటికీ చూడలేదనీ, ఉజ్వలమైన సూర్యకాంతిని చూడకుండా ఆమె కళ్ళు మూసుకున్నాయనీ నాకు దిగులు. కానీ నేనెందుకు ఏడవడం?

నీకు గుర్తుందా జస్టినా? చూడటానికి వచ్చిన వాళ్ళు వాళ్ల వంతు వచ్చేవరకూ కూచోవడానికి నడవాలో వరసగా కుర్చీలు వేశావు. అవన్నీ ఖాళీగా ఉన్నాయి. కొవ్వొత్తుల మధ్య మా అమ్మ వొంటరిగా పడుకుని ఉంది. పాలిపోయిన మొహం, మృత్యు శీతలానికి గడ్డకట్టిన ఊదా పెదవుల మధ్యనుంచి కనీకనపడకుండా తెల్లని దంతాలు. కనురెప్పల వెంట్రుకలు నిశ్చలంగా ఉన్నాయి. ఆమె గుండె నిశ్చలంగా ఉంది. నువ్వూ నేనూ ఆమె వినని ప్రార్థనలు ఎడతెగకుండా చేస్తున్నాము. ఆ రాత్రి గాలి రొదలో అవి నీకూ నాకూ కూడా వినపడలేదు. అమ్మ నల్లటి డ్రస్ ను నువు ఇస్త్రీ చేశావు. రొమ్ముల మీద అడ్డంగా ఉంచినప్పుడు తన చేతులు వయసులో ఉన్నట్టుగా కనిపించాలని కాలర్ కీ, చేతుల పట్టెలకీ బాగా గంజి పెట్టావు. అవే రొమ్ములు, నాకు పాలిచ్చినవీ, నా ఊయలయినవీ, నన్ను లాలిస్తూ నిద్ర పుచ్చినప్పడు కొట్టుకులాడినవీ.

ఆమెను చూడటానికి ఎవరూ రాలేదు. నువు వాకిలి దాకా వెళ్ళావు.

“నువు వెళ్లు,” నేను చెప్పాను. “నాకు మనుషులు పొగమంచులోంచి కనిపిస్తున్నారు. వాళ్ళను పొమ్మని చెప్పు. వాళ్ళు గ్రెగోరియన్ ప్రార్థనల కోసం డబ్బుల కోసం వచ్చారా? ఆమె డబ్బులేమీ వదిలిపెట్టి పోలేదు. ఆ సంగతి వాళ్ళకు చెప్పు జస్టినా? వాళ్ళు ఆ ప్రార్థనలు చేయకపోతే అమ్మ పాప విమోచన లోకం లోనే ఉండి పోతుందా? తీర్పు చెప్పటానికి వాళ్ళెవరు జస్టినా? నాకు పిచ్చనుకుంటున్నావా? అనుకో..”

మనం అమ్మను ఖననం చేయడానికి వెళ్ళినదాకా నువు వేసిన కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. తమకు తెలియని శవాన్ని మోస్తూ చెమటలు కక్కుతూ మన బాధ తెలియని కూలి వాళ్ళు వెంట వచ్చారు. తడి ఇసుకను సమాధిలోకి ఎత్తివేసి , తమ పనికి తగిన వోపికతో శవపేటికను నెమ్మదిగా లోపలికి దించారు. అంత శ్రమ తరవాత పిల్లగాలి సేదతీరుస్తూంది. వాళ్ల కళ్ళు ఉదాసీనంగా, ఏమీ పట్టనట్టు ఉన్నాయి. “ఇంత అవుతుంది,” అని చెప్పారు. బజార్లో ఏదో కొంటున్నట్టు నువు వాళ్ళకు డబ్బు ఇచ్చావు. కన్నీటితో తడిసి మెలికలు తిప్పీ తిప్పీ ఉన్న జేబురుమాలు ఒక కొస ఊడదీసి అందులోచి తీసి.

వాళ్ళు వెళ్ళిపోయాక, అమ్మ తలవైపు మోకాళ్ళ మీద కూచుని నేలను ముద్దాడావు. “పద జస్టినా. ఆమె ఇక్కడ లేదు. ఇక్కడ శవం తప్ప మరేదీ లేదు,” అని ఉండక పోతే నువు ఆమె వైపుకు తవ్వుతూ పోయేదానివే.

 

నువ్వేనా మాట్లాడుతూంది డొరోతియా?”

“నేనా? కాసేపు నిద్రపోయాను. ఇంకా భయపడుతున్నావా?”

“ఎవరో మాట్లాడడం వినిపించింది. ఆడ గొంతు. నువ్వేననుకున్నాను.”

“ఆడ గొంతా? నేననుకున్నావా? తనలోతాను మాట్లాడుకునే ఆమె అయి ఉంటుంది. ఆ పెద్ద సమాధిలో ఉండే ఆమె. డోన సుసానీత. మనకు దగ్గరలోనే పూడ్చారు. చెమ్మ తగిలినట్టుంది, నిద్రలో కదులుతూంది.”

“ఎవరామె?”

“పేద్రో పారమొ చివరి భార్య. ఆమె పిచ్చిదని కొందరంటారు. కాదని కొందరంటారు. నిజమేమిటంటే ఆమె బతికి ఉన్నప్పుడు కూడా తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేది.”

“చనిపోయి చాలారోజులయి ఉండాలి.”

“అవును. చాలా రోజులయింది. ఏమిటి, ఆమె అంటూన్నదేమిటి?”

“ఏదో వాళ్ళ అమ్మ గురించి.”

“వాళ్ల అమ్మ లేదే!”

“ఏమో, వాళ్ల అమ్మ గురించే మాట్లాడుతూంది.”

“హుఁ. .. ఆమె వచ్చినప్పుడు మాత్రం తనతో వాళ్ల అమ్మ లేదు. ఆగాగు. గుర్తొచ్చింది. వాళ్ల అమ్మ ఇక్కడే పుట్టింది, పెరిగేప్పుడు మాయమయిపోయారు. అవును. అంతే. వాళ్ల అమ్మ క్షయ వ్యాధితో చనిపోయింది. ఆమె వో వింత మనిషి. ఎప్పుడూ జబ్బుతో ఉండేది. ఎవరింటికీ వెళ్ళేది కాదు.”

“అదే ఆమె చెపుతుంది. వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు చూడటానికి ఎవరూ రాలేదని.”

“ఏమిటి ఆమె ఉద్దేశం? ఆమె గడపలోకి ఎవరూఅడుగు పెట్టలేదంటే ఆశ్చర్యం లేదు. ఆమె జబ్బు తమకెక్కడ అంటుకుంటుందో అని భయం. ఆ ఇండియన్ ఆమెకేమన్నా తెలుసేమో!”

“దాని గురించీ మాట్లాడుతుందామె.”

“ఈసారి మాటలు వినిపించినప్పుడు నాకు చెప్పు. ఆమె ఏమి చెపుతుందో నాకూ వినాలని ఉంది.”

“వింటున్నావా? ఏదో చెప్పబోతున్నట్టుంది. గుసగుసలు వినిపిస్తున్నాయి.”

“ఉహు, అది ఆమె కాదు. అది ఇంకా దూరంగా, వేరే దిక్కులో. ఆ గొంతు మగది కూడా. చాలా రోజులుగా శవాలుగా ఉన్న వాళ్ళేం చేస్తారంటే కాస్త చెమ్మ చేరేసరికి కదలడం మొదలెడతారు. లేస్తారు.”

“స్వర్గం ఉదారమైనది. దేవుడు నాతో ఉన్నాడా రాత్రి. లేకపోతే ఏమయి ఉండేదో ఎవరికి తెలుసు? ఎందుకంటే నేనొచ్చేసరికే రాత్రయి పోయింది..”

“నీకిప్పుడు బాగా వినిపిస్తుందా?”

“ఊఁ”

“..నా వొంటి నిండా నెత్తురు. లేవడానికి ప్రయత్నించినపుడు నా చేతులు రాళ్ల మధ్య నెత్తుటి చిదపల్లో జారిపోతున్నాయి. అది నా నెత్తురే. బకెట్ల కొద్దీ నెత్తురు. కానీ నేను చనిపోలేదు. ఆ సంగతి నాకు తెలుసు. పేద్రో నన్ను చంపాలనుకోలేదన్నది నాకు తెలుసు. కాస్త భయపెట్టాలనుకున్నాడు. రెండేళ్ల క్రితం ఆ రోజు నేను విల్మాయో లో ఉన్నానేమో కనుక్కుందామనుకున్నాడు. శాన్ క్రిస్తోబాల్ రోజు. పెళ్ళి దగ్గర. ఏ పెళ్ళి? ఏ శాన్ క్రిస్తోబాల్? నా నెత్తుటిలో నేను జారిపడుతూ అతన్ని అదే అడిగాను: ‘ఏ పెళ్ళి డాన్ పేద్రో? లేదు, లేదు డాన్ పేద్రో! నేనక్కడ లేను. ఆ చుట్టుపక్కల ఉన్నానేమో, అదీ కాకతాళీయంగా…’ అతను నిజంగా నన్ను చంపాలనుకోలేదు. నన్ను కుంటివాడిగా వదిలేశాడు – నీకు కనిపిస్తూనే ఉందిగా – బాధపడవలసినదేమిటంటే నా చేయి కూడా పనికిరాకుండా పోయింది. కానీ అతను నన్ను చంపలేదు. అప్పటి నుంచి అంతా నాకు వెర్రి చూపు పడిందంటున్నారు. ఆ భయానికి. కానీ అది నన్ను మగాణ్ణి చేసింది. స్వర్గం ఉదారమయింది. ఆ విషయంలో అనుమానపడకు.”

“ఎవరతను?”

“నాకేం తెలుసు? డజన్ల మందిలో ఒకడు. తన తండ్రిని ఎవరో చంపాక పేద్రో పారమొ ఎంతో మందిని ఊచకోత కోశాడు. దాదాపుగా ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్లనందరినీ చంపేశాడు. డాన్ లూకాస్ కన్యాదానం చేయవలసి ఉంది. నిజానికి అతను ప్రమాదవశాత్తూ చనిపోయాడు. అసలు ఆ పెళ్ళికొడుకు మీద ఎవరికో పగ ఉంది. డాన్ లూకాస్ కి తగిలిన బులెట్ ఎవరు కాల్చిందో తెలియలేదు కనక పేద్రో పారమొ అందరినీ తుడిచిపెట్టేశాడు. అది విల్మయో కొండమీద జరిగింది. అప్పుడేవో ఇళ్ళుండేవి గానీ ఇప్పుడు వాటి ఆనవాలు కూడా దొరకదు… విను, ఇప్పుడు ఆమెలా ఉంది మాట్లాడేది. నీవి పడుచు చెవులు. నువు విను. విని నాకు చెప్పు ఏమంటుందో.”

“నాకేం అర్థం కావడం లేదు. ఆమె మాట్లాడుతున్నట్టు లేదు, మూలుగుతూంది.”

“ఏమని మూలుగుతుంది?”

“నాకేం తెలుసు?”

” దేనిగురించో అయి ఉంటుంది. సరిగా విను. ఊరికే మూలగడానికే ఎవరూ మూలగరు.”

“ఆమె మూలుగుతూ ఉంది. ఊరికే మూలుగుతుంది. పేద్రో పారమొ ఏమన్నా కష్టపెట్టాడేమో ఆమెని!”

“ఆ మాట నమ్మకు. అతడామెని ప్రేమించాడు. ఆమెని ప్రేమించినట్టు అతనింకెవరినీ ప్రేమించలేదని నేను చెప్పగలను. ఆమెను అతని దగ్గరికి తీసుకు వచ్చేసరికే ఆమె బాధలో ఉంది – పిచ్చేనేమో! ఆమెను ఎంతగా ప్రేమించాడంటే ఆమె పోయాక రోజుల తరబడి కుర్చీలో కూలబడి ఆమెను స్మశానానికి తీసుకువెళ్ళిన దారి వైపే చూస్తూ ఉండే వాడు. దేనిపట్లా ఆసక్తి చూపేవాడు కాదు. పొలాలు బీడుపెట్టాడు. పొలం పనిముట్లన్నీ నాశనం చేయించాడు. అతను ఇట్లా చేస్తున్నది డస్సిపోవడం వల్ల అని కొంతమందీ, నిస్పృహ వల్ల అని కొంతమందీ అన్నారు. పనివాళ్లనంతా తరిమేసి ఆ దారి వంకే చూస్తూ కూచునేవాడన్నది మాత్రం నిజం.

“ఆ రోజునుంచీ పొలాలను పట్టించుకున్న నాధుడు లేడు. వదిలేశాడు. ఆ నేలని అట్లా చూస్తుంటే బాధగా ఉండేది. అట్లా వదిలేయగానే మహమ్మారి చుట్టుముట్టింది. చుట్టుపక్కల మైళ్ళకొద్దీ జనాలకి కష్టకాలం దాపురించింది. మగవాళ్ళు అన్నీ సర్దుకుని పనుల కోసం బతుకుతెరువు వెతుక్కుంటూ పోయారు. ఆరోజుల్లో కోమలాలో సెలవు తీసుకుంటూ చెప్పే మాటలు తప్ప మరేవీ వినిపించేవి కావన్న సంగతి నాకు గుర్తుంది. ఒక్కొక్కరినీ వాళ్ల దారివెంట పంపుతున్నప్పుడల్లా ఒక పండగలాగా ఉండేది. వాళ్లంతా మళ్ళీ తిరిగి వద్దామనే ఉద్దేశంతోటే పోయారు. వాళ్ళ సామాన్లమీదా, కుటుంబాలమీదా ఒక కన్నేసి ఉంచమని చెప్పేవారు. తర్వాత కొంతమంది సామాన్లు వదిలేసి కుటుంబాలను మాత్రం పిలిపించుకున్నారు. ఆపైన మా గురించీ, ఊరి గురించీ, వాళ్ల సామాన్ల గురించి కూడా మర్చిపోయారు. వెళ్లడానికి ఏ చోటూ లేక నేను ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది పేద్రో పారమొ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉండిపోయారు. తను పోయాక తన పొలమూ, ఆస్తులూ వాళ్లకు వదిలేస్తానని మాట ఇచ్చాడు. ఆ ఆశతోటి వాళ్ళు బతుకుతున్నారు. ఏళ్ళు గడిచాయి కానీ అతను బతికే ఉన్నాడు, మెదియా లూనా పొలాల మీదకి చూస్తూ ఉన్న దిష్టిబొమ్మ లాగా.

“అతను చనిపోబోయే కొదిరోజుల ముందే క్రిస్టెరోస్ యుద్ధం వచ్చింది. అతని దగ్గర ఉన్న కొద్ది మంది పనివాళ్లూ సైన్యంలో చేరారు. అప్పుడే నేనూ నిజంగా ఆకలితో నకనకలాడటం మొదలయింది. ఏదీ మునుపటిలా ఇక ఉండలేదు.

“అంతా డాన్ పేద్రో చేసుకున్నదే, తన ఆత్మక్షోభ వలన. కేవలం తన భార్య సుసానీత చనిపోవడం వల్ల. ఇప్పుడు చెప్పు అతను ఆమేని ప్రేమించాడో లేదో?”

 

ఫుల్గోర్ సెడనో చెప్పాడతనికి.

“దొరా! ఊళ్ళోకి తిరిగి ఎవరొచ్చారో తెలుసా?”

“ఎవరు?”

“బార్ట్లోం శాన్ హువాన్!”

“ఎందుకు?”

“నాకూ అదే అనిపించింది. తిరిగి ఎందుకొచ్చాడో?”

“కనుక్కోలేదా?”

“లేదు, ముందు మీకు చెప్పాలనుకున్నాను. ఇంటి గురించేమీ వాకబు చేయలేదు. శరాసరి మీ పాత ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లేదో మీరతనికి అద్దెకిచ్చినట్టు గుర్రం దిగి సూట్ కేసులు లోపలికి మోసుకుపోయాడు. ముందువెనకలాడుతున్నట్టు కనబడ లేదు. ”

“దాని గురించి నువ్వేం చేస్తునావు ఫుల్గోర్? ఏమవుతుందో ఎందుకు కనుక్కోలేదు? అందుకు కాదా నీకు జీతమిస్తుంది?”

“ఈ విషయం తెలిసేసరికి నాకు బుర్ర తిరిగిపోయింది. కనుక్కోవాలంటే రేపు ఎలాగోలా కనుక్కుంటాను.”

“రేపటి సంగతి మర్చిపో! ఆ శాన్ హువాన్ సంగతి నేను చూస్తాను. ఇద్దరూ వచ్చారా?”

“అవును, అతనూ, అతని భార్యా. నీకెట్లా తెలుసు?”

“అతని కూతురు కాదా?”

“ఆమెతో ఉన్న తీరును చూస్తే భార్యలాగే ఉంది.”

“ఇంటికి పోయి పడుకో ఫుల్గోర్!”

“తమ దయ!”

 

నువు తిరిగివస్తావని ముప్పయ్యేళ్ళు ఎదురుచూశాను సుజానా. నాకన్నీ కావాలనుకున్నాను. ఏ ఒక్క భాగమో కాదు, పొందడానికి ఏదయితే ఉందో అదంతా. ఇక కోరుకోవడానికి ఏమీ మిగలనట్టుగా. నాకు తన అవసరం ఉందనీ, వచ్చి మనతో ఉండమనీ మీ నాన్నతో ఎన్నోసార్లు చెప్పాను. మాయ కూడా చేశాను.

నా పనులు చూస్తూ ఉండమన్నాను. అదికాకపోతే ఇంకా ఏదయినా, నిన్ను మళ్ళీ చూసేందుకు వీలుగా. అంతా విని ఏమన్నాడు? “బదుల్లేదు.” నేను పంపిన రాయబారి ఎప్పుడూ చెప్పే మాటే అది. “డాన్ బార్ట్లోం మీ ఉత్తరాలన్నీ చేతికి ఇవ్వగానే చింపేస్తాడు.” కానీ ఆ కుర్రాడి ద్వారా నీకు పెళ్ళయిన సంగతి తెలుసుకున్నాను. కొద్దికాలంలోనే నువు విధవవయ్యావనీ, తిరిగి మీ నాన్నతో ఉండటానికి వెళ్ళిపోయావనీ తెలిసింది.

తర్వాత నిశ్శబ్దం.

ఆ రాయబారి వెళ్ళేవాడు, వచ్చేవాడు. ప్రతిసారీ అదే చెప్పేవాడు ” నాకు వాళ్ళెక్కడా కనపడలేదు డాన్ పేద్రో! మస్కోట వదిలిపెట్టి పోయారనుకుంటున్నారంతా. కొంతమంది ఒకవేపు వెళ్ళారంటే, ఇంకొంతమంది వేరేవైపు వెళ్లారంటున్నారు.”

వాడికి చెప్పాను “ఖర్చులకు వెనుకాడకు. వాళ్ళెక్కడున్నారో కనుక్కో. నేల ఏమీ మింగేయలేదుగా వాళ్ళను!”

ఒక రోజు వచ్చి చెప్పాడు.

“డాన్ బార్ట్లోం శాన్ హువాన్ ఎక్కడ దాక్కునే చోట్లున్నాయో ఆ కొండలన్నీ వెదికాను. చివరికి ఎక్కడో చాలా దూరంగా ఆ ఆండ్రోమెదా గనుల దగ్గర ఒక చెక్క ఇంట్లో దాక్కుని ఉన్నట్టు కనిపెట్టాను.”

వింతగాలులు వీస్తున్నాయప్పుడు. సాయుధ తిరుగుబాటు వార్తలు వినవస్తున్నాయి. పుకార్లు వింటున్నాము. నీ తండ్రినే వెనక్కి ఇక్కడికి తరిమి కొట్టే గాలులవి. తనకోసం కాదనీ, నీ క్షేమంకోసమేననీ ఉత్తరం రాశాడు. నిన్ను తిరిగి నాగరికతలోకి తీసుకు రావాలనుకున్నాడు.

స్వర్గం విడివడి దారి ఇస్తుందనిపించింది. పరుగెత్తుకువచ్చి నిన్ను కలవాలనుకున్నాను. నిన్ను సంతోషంలో ముంచెత్తాలని. ఆ ఆనందం పట్టలేక ఏడ్చేయాలని. ఏడ్చాను సుజానా, ఎట్టకేలకి నువు తిరిగి వచ్చావని తెలిసి.

 

కొన్ని ఊళ్ళకు దురదృష్టపు వాసన ఉంటుంది. అన్నిటిలా పాతగా ఉండే ఆ నిలవ ఉండి మగ్గిపోయిన పలచటి గాలిని ఒక్కసారి పీల్చినా నీకు తెలిసిపోతుంది. అలాంటి ఊళ్ళలో ఇది ఒకటి సుజానా!

“మేము ఇంతకుముందు ఉన్నచోట కనీసం పుట్టడం చూసి ఆనందించేవాళ్లం – ఆ మబ్బులూ, పిట్టలూ, నాచూ. నీకు గుర్తుందా? ఇక్కడ నేలనుంచి పైకి ఉబుకుతున్నట్టుండే ఆ పులిసిపోయిన పసుప్పచ్చ వాసన తప్ప ఇంకేమీ లేదు. ఈ ఊరు శాపగ్రస్త. దురదృష్టంలో మునిగి ఊపిరాడనిదీ ఊరు.

“మనం తిరిగి రావాలన్నది అతని కోరిక. మనకీ ఇల్లు ఇచ్చాడు. మనకు కావలసిందంతా సమకూర్చాడు. కానీ అతనికి మనమేం కృతజ్ఞులంగా ఉండక్కర్లేదు. ఇది మనకు వరమేమీ కాదు. మనకు ఇక్కడ మోక్షమేమీ దొరకదు. నాకు తెలుస్తూంది.

“పేద్రో పారమొకేం కావాలో నీకు తెలుసా? ఇదంతా మనకు ఊరికే ఇస్తున్నాడని నేనేం అనుకోవడం లేదు. ఈ బాకీ తీర్చాలి కనక అతనికోసం చెమటోడ్చి పని చేయడానికి సిద్ధమే. ఆండ్రోమెడాఅ గనుల గురించి వివరాలన్నీ ఇచ్చి దానిమీద సరిగా పనిచేస్తే లాభం కళ్ల చూడవచ్చని వొప్పించాను. అతనేమన్నాడో తెలుసా? ‘నీ గని మీద నాకేం ఆసక్తి లేదు బార్ట్లోం శాన్ హువాన్! నీనుంచి నాకు కావలసింది ఒక్క నీ కూతురే! నువు సాధించినవాటిలో అత్యున్నతమైనది ఆమే!’

“అతనికి నువ్వంటే ప్రేమ సుజానా! మీరిద్దరూ చిన్నప్పుడు ఆడుకునేవారని చెప్పాడు. అతనికి నువ్వు తెలుసట. వయసులో ఉన్నప్పుడు మీరు నదిలో కలిసి ఈతలు కొట్టేవారట. నాకు తెలియదా సంగతి. నాకు తెలిస్తే అప్పుడే నిన్ను చితకబాదే వాడిని.”

“తప్పకుండా తన్ని ఉండే వాడివే!”

“సరిగానే విన్నానా? ‘తప్పకుండా తన్ని ఉండే వాడివే,’ అనా?”

“సరిగ్గానే విన్నావు.”

“అయితే వాడి పక్కలో పడుకోటానికి సిద్ధమేననా!”

“అవును బార్ట్లోం.”

“వాడికి పెళ్ళయిందనీ, లెక్కలేనంత మంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయనీ తెలియదా?”

“తెలుసు బార్ట్లోం.”

“ముందు ఆ బార్ట్లోం అనడం ఆపు. నేను నీ కన్న తండ్రిని.”

బార్ట్లోం శాన్ హువాన్ ఒక చనిపోయిన గని పనివాడు. సుజానా శన్ హువాన్ ఆండ్రొమెదా గనుల్లో చనిపోయిన ఒక గని పనివాడి కూతురు. అతనికి స్పష్టంగా కనిపించింది. “చావడానికి అక్కడికి వెళ్ళాలి,” అనుకున్నాడు. తర్వాత చెప్పాడు-

“నువ్వు విధవవే అయినా ఇంకా నీ భర్తతోటే బతుకుతున్నావని చెప్పానతనికి. కనీసం అట్లా ప్రవర్తిస్తున్నావని. అతన్ని ఎట్లా అన్నా నిరుత్సాహపర్చాలని చూశాను కానీ నేను అట్లా మాట్లాడినప్పుడల్లా అతని చూపు పదునెక్కేది. నీ పేరు చెప్పగానే కళ్ళు మూసుకునేవాడు. అతను ఒక నిఖార్సయిన నికృష్టుడన్న విషయంలో నాకే సందేహమూ లేదు. పేద్రో పారమొ అంటే అంతే.”

“మరి నేనెవరిని?”

“నా కూతురువి. నాదానివి. బార్ట్లోం శాన్ హువాన్ కూతురివి. ”

సుజానా శాన్ హువాన్ మనసులో ఏవో ఊహలు రూపు కట్టుకోసాగాయి. ముందు నెమ్మదిగా, మళ్ళీ వెనక్కి తగ్గి, తర్వాత ఒక్కసారిగా దూకేసరికి ఆమె “అది నిజం కాదు. అది నిజం కాదు,” అని మాత్రమే అనగలిగింది.

“ఈ లోకం మనల్ని అన్నివైపులనుంచీ వొత్తిడి పెడుతుంది. మన బూడిదని నేలంతా చిమ్ముతుంది. మన నెత్తుటితో నేలను తడపాలని చూస్తుంది. మనమేం చేశాము! మన ఆత్మలెందుకిలా కుళ్ళిపోయాయి? మనకు కనీసం దైవకటాక్షమయినా దక్కుతుందని మీ అమ్మ ఎప్పుడూ అనేది. కానీ నువు కాదంటున్నావు సుజానా. నేను తండ్రిని కాదని ఎందుకంటున్నావు? నీకేమయినా పిచ్చా?”

“నీకు తెలియదా?”

“నీకు పిచ్చా?”

“నాకు పిచ్చే బార్ట్లోం! నీకు తెలియదా?”

 

నీకు తెలుసుగా ఫుల్గోర్! ఈ భూమి మీద అందరికంటే అందగత్తె ఆమే. ఆమెను ఎప్పటికీ పోగొట్టుకున్నాననే నమ్మాను. మళ్ళీ ఆమెను పోగొట్టుకోలేను. అర్థమవుతుందా ఫుల్గోర్? వాళ్ళ నాన్నను పోయి ఆ గనుల్లోనే వెతుక్కోమని చెప్పు. అక్కడ… ఎవరూ అడుగుపెట్టని ఆ ప్రాంతంలో ఒక ముసలాడు మాయం కావడం పెద్ద కష్టం కాదనే అనుకుంటున్నాను. నువ్వేమంటావు ఫుల్గోర్?”

“కావచ్చు.”

“అట్లా కావడం మనకవసరం. ఆమెకు కుటుంబమేమీ మిగలకూడదు. అవసరంలో ఉన్న వాళ్ళ బాగోగులను చూడడం మన పని. నువ్వు దానికి వొప్పుకోవా ఫుల్గోర్?”

“అదంత కష్టంగా ఏమీ కనిపించడం లేదు.”

“మరి ఆలస్యమెందుకు ఫుల్గోర్? ఆ పని మీద ఉండు.”

“ఆమెకి తెలిస్తే?”

“ఎవరు చెపుతారు? చెప్పు. ఇది తెలిసింది నీకూ నాకూ. మనిద్దరిలో ఆమెకి ఎవరు చెప్తారు?”

“ఎవరూ చెప్పరనుకుంటున్నా.”

“ఈ అనుకోవడాలు వదిలేయి. అది మర్చిపో, అంతా సరిగ్గా జరుగుతుంది. ఆండ్రొమెదా దగ్గర ఎంత పని చేయాలో గుర్తు చేసుకో. ఆ ముసలాడిని ఆపని మీద పంపు. తన ఇష్టం వచ్చినట్టు పోయి రమ్మను. కానీ తన కూతుర్ని అక్కడికి తీసుకు వెళ్ళే ఆలోచన రానీయకు. ఆమె సంగతి మనం చూసుకుందాం. అతని పని గనిలో. కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇల్లు ఉంది. ఆ సంగతి చెప్పు అతనికి.”

“మీరు పనులు చేసే పద్ధతి చూసే ముచ్చటేస్తుందని మళ్ళీ చెప్పాలనిపిస్తూంది దొరా! మీలో వెనకటి హుషారు తిరిగి వచ్చినట్టుంది.”

పెద్రో పారమొ-9

pedro1-1

వాళ్ళు అతని ఇంటి తలుపుల మీద బాదారు కానీ బదులు లేదు. ఒక తలుపు తర్వాత ఇంకో తలుపు తడుతూ అందరినీ లేపుతూండడం అతను విన్నాడు. ఫుల్గోర్ – అడుగుల చప్పుడు విని గుర్తుపట్టగలడు – పెద్ద తలుపు వైపు తిరిగి వడిగా నడవబోతూ మళ్ళీ తలుపు తట్టడానికా అన్నట్టు ఆగాడు. కానీ తిరిగి పరుగు తీశాడు.

గొంతులు. నెమ్మదిగా ఈడుస్తున్నట్టు అడుగుల చప్పుడు, బరువైనదేదో మోస్తున్నట్టు.

పోలిక పట్టలేని శబ్దాలు.

తన తండ్రి చావు గుర్తొచ్చిందతనికి. ఇట్లాగే ఒక వేకువజామున. కానీ తలుపు తెరిచి ఉంది. బూడిద రంగు ఆకాశం లోపలికి జొరబడటం కనిపించింది. దుఖాన్ని దిగమింగుకుంటూ ఒక స్త్రీ వాకిలిని ఆనుకుని ఉంది. అతను మర్చిపోయిన, ఎన్నెన్నో సార్లు మర్చిపోయిన తల్లి అతనికి చెపుతూంది ‘నీ తండ్రిని చంపేశారు,’ వెక్కిళ్ళు మాత్రమే ఒకటిగా పట్టుకుని ఉన్న చిట్లిన గొంతు వణుకుతూండగా.

ఆ జ్ఞాపకం తిరిగి గుర్తుచేసుకోవడం అతనికి ఇష్టం ఉండదు. అది ఇంకా చాలా వాటిని వెంట పెట్టుకుని వస్తుంది. నిండా నింపిన బస్తా పిగిలితే గింజలు కారిపోకుండా చూడాలని ప్రయత్నిస్తున్నట్టు. అతన తండ్రి చావుతో పాటు చాలా చావులు తోడయ్యాయి. ప్రతి చావులో ఒక పగిలిన మొహపు బొమ్మ – ఒక కన్ను చితికీ, ఇంకో కన్ను ప్రతీకారేచ్ఛతో చూస్తూ. తర్వాత ఇంకో జ్ఞాపకం, ఆ తర్వాత ఇంకోటీ, జ్ఞాపకాల్లోంచి ఆ చావుని చెరిపేస్తూ. ఇక దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎవరూ లేరు.

“ఇక్కడ పడుకోబెట్టండి. అహఁ అట్లా కాదు. తల అటు తిప్పి పెట్టు. నిన్నే! దేనికోసం చూస్తున్నావు?”

అంతా లోగొంతుకల్లోనే.

“డాన్ పేద్రో ఎక్కడ?”

“నిద్ర పోతున్నాడు. ఆయన్ని లేపకు. సద్దు చేయకండి”

కానీ అతను నిలువెత్తున అక్కడ నిలుచుని ఉన్నాడు. ఒక పెద్ద మూటని గోనెపట్టాల్లో చుట్టి ప్రేతవస్త్రంలా చుట్టూ గడ్డితో కప్పడానికి వాళ్ళు శ్రమపడటాన్ని చూస్తూ.

“ఎవరది?” అడిగాడతను.

ఫుల్గోర్ సెడానో ముందుకొచ్చి చెప్పాడు “అది మిగెల్ డాన్ పేద్రో!”

“వాడిని ఏం చేశారు వాళ్ళు?” అరిచాడు.

‘వాళ్లు అతన్ని చంపారు,’ అని అంటారని ఎదురు చూశాడు. లోపల ఆగ్రహం సుళ్ళు తిరుగుతూ పగగా గడ్డకట్టడం అతనికి తెలుస్తూంది. కానీ ఫుల్గోర్ మెత్తటి గొంతుతో చెప్పాడు. “ఎవరూ అతన్ని ఏమీ చేయలేదు. తనంత తనే చనిపోయాడు.”

నూనె దీపాలు రాత్రిని వెలిగిస్తున్నాయి.

“అతని గుర్రం చంపిందతన్ని!” ఎవరో అడక్కుండానే చెప్పారు.

అతన్ని అతని మంచం మీద పడుకోబెట్టారు పరుపు తిరగేసి. ఇంటికి మోసుకురావడానికి కట్టిన కట్లన్నీ ఊడదీసారు. చేతులు ఛాతీ మీదుగా కట్టి, మొహాన నల్ల గుడ్డ కప్పారు. “ఉన్నదాని కంటే పెద్దగా కనిపిస్తున్నాడు,” తనలో తాను అనుకున్నాడు ఫుల్గోర్.

పేద్రో పారమొ అలాగే నిలబడిపోయాడు. ఎక్కడో ఉండి పోయినట్టు అతని మొహాన ఏ భావమూ లేదు. అతని స్పృహకు అందని దూరంలో ఆలోచనలు వేగంగా పరుగెత్తాయి రూపు దాల్చకుండానే తెగిపడి పోతూ. చివరికి అన్నాడు “బదులు చెల్లించడం మొదలుపెట్టాను. ఎంత తొందరగా మొదలు పెడితే అంత తొందరగా అయిపోతుంది.”

అతనికి విచారమేదీ కలగలేదు.

అందరికీ వినపడేలా ఆడవాళ్ల ఏడుపులకు మించి గొంతెత్తి వరండాలో చేరిన వాళ్లకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడినప్పుడు అతనికి ఊపిరీ మాటలూ కరువు కాలేదు. తర్వాత వినిపించిన ఒకే శబ్దం మిగెల్ కపిల రంగు గుర్రపు పాదాలదే.

ఫుల్గోర్ సెడానోని ఆజ్ఞాపిస్తూ అన్నాడు ” రేపు ఎవరినన్నా పిలిపించి ఆ పశువు పని పూర్తి చేయి. ఆ బాధనుంచి దానికి విముక్తి కలిగించు.”

“అలాగే డాన్ పేద్రో! నేను అర్థం చేసుకోగలను, పాపం అది చాలా బాధపడుతున్నట్టుంది.”

“నేనూ అదే అనుకుంటున్నాను ఫుల్గోర్. నువు వెళ్ళేఫ్ఫుడు ఆ ఆడవాళ్లను ఆ ఏడుపులాపమని చెప్పు. పోగొట్టుకుంది నేనయితే వాళ్లు ఎక్కువ గొడవ చేస్తున్నారు. ఇదే వాళ్ళకు జరిగితే అంత చేటు ఏడవడానికి ముందుకు రారు.”

సంవత్సరాల తర్వాత ఫాదర్ రెంటెరియా తన గట్టి పక్క తనని నిద్రపోనివ్వక బయటికి తరిమిన రాత్రి గుర్తు చేసుకుంటాడు. అది మిగెల్ పారమొ చనిపోయిన రాత్రి.

అతనా రాత్రి కోమలా వొంటరి వీధుల్లో నడిచాడు. అతని అడుగుల చప్పుడుకు చెత్త కుప్పల్లో మూతి పెట్టి వెతుక్కుంటున్న కుక్కలు ఉలిక్కిపడి చూశాయి. నది దాకా నడిచాడు. అక్కడే నిలబడి స్వర్గాలనుంచి తెగిపడి రాలిన నక్షత్రాలు నీళ్ళ నిశ్శబ్దపు సుడుల్లో పరావర్తనం చెందడం చూశాడు. కొన్ని గంటలపాటు నది నల్లటి నీళ్ళలో కలిసిపోతున్న తన ఆలోచనలతో సతమతమయ్యాడు.

ఇదంతా ఆ పేద్రో పారమొ అనే నీచుడు తనంత తాను పైకి రావడంతోటే మొదలయ్యిందనుకున్నాడు. పిచ్చిగడ్డి లాగా పాకి పెరిగిపోయాడు. అన్నిట్లోకీ విషాదమేమిటంటే తను అందుకు తోడ్పడటం. “నేను పాపం చేశాను ఫాదర్! నిన్న పేద్రో పారమొతో పడుకున్నాను.” “పాపం చేశాను ఫాదర్! పేద్రో పారమొ బిడ్డను మోస్తున్నాను.” “నా కూతుర్ని పేద్రో పారమొకి అప్పచెప్పాను ఫాదర్!” ఎప్పుడన్నా వొచ్చి కొన్ని పాపాలనయినా కన్ ఫెస్ చేస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉండిపోయాడు కానీ అతనెప్పుడూ రాలేదు. తన దౌష్ట్యాన్ని కొడుకు ద్వారా ఇంకా విస్తరింపజేశాడు. తను గుర్తించింది.. ఎందుకో ఆ దేవుడికే తెలియాలి. తనకు తెల్సిందల్లా ఆ సాధనాన్ని అతని చేతుల్లోనే పెట్టడం.

అతనికి స్పష్టంగా గుర్తుంది కొన్ని గంటల బిడ్డని తనే పేద్రో పారమొ దగ్గరికి తీసుకు వెళ్ళడం.

“డాన్ పేద్రో! ఈ బిడ్డకి జన్మనిచ్చి తల్లి చనిపోయింది. ఈ బిడ్డ నీకొడుకే అని చెప్పింది. ఇడుగో!”

పేద్రో పారమొ కన్నార్పలేదు. మామూలుగా చెప్పాడు ” మీరే ఉంచుకోకపోయారా? ప్రీస్ట్ ని చేయండి.”

“ఈ బిడ్డ వొంట్లో పారే నెత్తురెవరిదో తెలిసీ ఆ బాధ్యత నేను స్వీకరించలేను.”

“వాడిది చెడ్డ నెత్తురేనని నిజంగా అనుకుంటున్నారా? ”

“నిజంగానే అనుకుంటున్నాను డాన్ పేద్రో!”

“నువు తప్పని నిరూపిస్తాను. వాణ్ణి నా దగ్గరే వదిలేయి. వాడిని చూసుకోవడానికి ఎవరో ఒకరిని చూస్తాను.”

“నా మనసులో ఉన్నదీ అదే. ఇక్కడుంటే కనీసం వీడికి తినడానికయినా ఉంటుంది.”

చిన్నగా ఉన్నా ఆ పసివాడు రక్తపింజేరిలా కదులుతూ ఉన్నాడు.

“డమియానా! నువ్వు చూసుకోవలసినదొకటుంది చూడు ఇక్కడ. వీడు నాకొడుకు.”

తర్వాత ఒక సీసా బిరడా తీశాడు.

“ఇది చనిపోయిన తల్లికీ, నీకూ!”

“బిడ్డకి కూడానా?”

“వాడికి కూడా, ఏం?”

అతను ఇంకో గ్లాసు నింపాడు. ఇద్దరూ బిడ్డ భవిష్యత్తుకోసం తాగారు.

అది అట్లా అయింది.

బళ్ళు మెదియా లూనా వైపు శబ్దాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఫాదర్ రెంటెరియా వంగి నది వొడ్డున ఉన్నరెల్లు పొదల వెనక నక్కాడు.

“దేన్నుంచి దాక్కుంటున్నావు?” తనను తనే అడుక్కున్నాడు.

“సెలవు ఫాదర్!” అతనికి వినిపించింది.

పైకి లేచి బదులిచ్చాడు. “సెలవు. దేవుడు నిన్ను దయచూచుగాక!”

ఊళ్ళోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా ఆరిపోయాయి. నది కాంతివంతమైన రంగులతో వెలుగుతూంది.

“ఏంజెలస్ గంట (ఒక ప్రార్థనా సమయాన్ని సూచించేది) మోగిందా ఫాదర్?” బళ్ళు నడిపేవాళ్ళలో ఒకరడిగారు.

“ఆ సమయం దాటి చాలా సేపయింది,” అని బదులిచ్చాడు. తిరిగి వాళ్లకు ఎదురు దిక్కులో నడవసాగాడు ఆపినా ఆగకూడదని నిర్ణయించుకుని.

“ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు ఫాదర్?”

“ఎవరింట్లో చనిపోయారు ఫాదర్?”

“కోంట్లాలో ఎవరన్నా చనిపోయారా ఫాదర్?”

“నేనే. ఆ చనిపోయింది ఎవరో కాదు నేనే,” అని బదులిద్దామనుకున్నాడు. కానీ నవ్వి ఊరుకున్నాడు.

చివరి ఇళ్ళూ వెనకపడగానే వేగంగా నడిచాడు.

అతను తిరిగొచ్చేసరికి బాగా పొద్దెక్కింది.

“ఎక్కడికెళ్ళావు బాబాయ్?” ఆనా అడిగింది. చాలామంది ఆడవాళ్ళు నీకోసం చూస్తూ ఉన్నారు. వాళ్లు కన్ ఫెస్ చేయాలనుకుంటున్నారు. రేపు మొదటి శుక్రవారం కదా!”

“వాళ్ళను తిరిగి సాయంత్రం రమ్మని చెప్పు.”

హాల్ లో బల్ల మీద ఒక క్షణం నిశ్శబ్దంగా కూచున్నాడు అలసట బరువుకు.

“ఈ గాలి ఎంత చల్లగా ఉంది ఆనా!”

“చాలా వేడిగా ఉంది బాబాయ్!”

“నాకనిపించడం లేదు.”

అతను అసలు ఆలోచించకూడదనుకున్నది తను కోంట్లాకు వెళ్ళి అక్కడ తోటి ప్రీస్ట్ తో కన్ ఫెస్ చేసిన సంగతి. ఎంత బతిమలాడినా ప్రక్షాళన మాత్రం తిరస్కరించాడు అతడు.

“నువు పేరెత్తడానికి కూడా ఇష్టపడని మనిషి నీ చర్చిని నాశనం చేశాడు. నువు చూస్తూ కూచున్నావు. ఇప్పుడు నీనుంచి ఏం ఆశించగలను ఫాదర్? దేవుడి శక్తిని ఎలా వాడుకున్నావు? నువు మంచి మనిషివనే అనుకుంటాను, అందుకు నిన్ను గౌరవిస్తాను కూడా. కానీ మంచితనమే సరిపోదు. పాపం మంచిది కాదు. పాపనాశనం కోసం గట్టిగా నిర్దాక్షిణ్యంగా నిలబడగలగాలి. మీ చర్చికి వచ్చేవాళ్ళంతా విశ్వాసులే అనుకుంటాను. కానీ వాళ్ల నమ్మకాన్ని నువే నిలబెట్టుకోలేకపోయావు. వాళ్లు భయంతోటో, మౌఢ్యంతోటో నమ్ముతారు. నీ కటిక దరిద్రం సంగతి నాకు తెలుసు. గంటలకొద్దీ నీ విధుల్ని నువు నిర్వర్తించడమూ నాకు బాగా తెలుసు. బహిష్కార శిక్ష విధించినట్టు మనల్ని ఈ పాడుబడ్డ ఊళ్ళకి పంపారు. ఇక్కడ మన పని ఎంత కష్టమో నాకూ వ్యక్తిగతంగా తెలుసు. కానీ అదే నీకు ఈ విషయం చెప్పే హక్కునూ ఇస్తూంది. మన ఆత్మలకి బదులుగా బెత్తెమిచ్చే ఏ కొద్దిమందికోసమో కాదు మనం సేవ చేయవలసింది. నీ ఆత్మ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు నీకంటే మెరుగ్గా ఉన్నవాళ్లకంటే మెరుగ్గా అయే అవకాశమెక్కడుంది? లేదు ఫాదర్! నిన్ను ప్రక్షాళన చేయడానికి నా చేతులంత పరిశుభ్రంగా లేవు. నువు ఇంకెక్కడికన్నా వెళ్లాలి దాని కోసం.”

“నువ్వనేదేమిటి? కన్ ఫెస్ చేయడానికి ఇంకెక్కడికన్నా వెళ్లమంటావా?”

“అవును. వెళ్లాలి. నువ్వే పాపంలో కూరుకు పోయినప్పుడు ఇతరులను శుద్ధి చేయడమెలా కొనసాగిస్తావు?”

“వాళ్ళు నన్ను మినిస్ట్రీ నుంచి తొలగిస్తేనో?”

“అదే నీకు తగినదేమో! ఆ తీర్పు వాళ్ళే చేస్తారు.”

“కొంచెం.. తాత్కాలికంగానయినా.. అంటే.. నేను అంత్యక్రియలు చేయవలసి ఉంది, ప్రార్థన సమ్మవేశాలు నిర్వహించాలి. మా వూళ్ళో ఎంత మంది చనిపోతున్నారో ఫాదర్!”

“నేస్తం, ఆ దేవుణ్ణే చనిపోయినవాళ్లపై తీర్పులు చెప్పనీ!”

“అయితే ప్రక్షాళితం చేయవన్నమాట!”

కోంట్లా ఫాదర్ లేదని చెప్పాడు.

తర్వాత వాళ్ళిద్దరూ చర్చి వరండాలో అజాలియా నీడల్లోని జపమందిరం గుండా నడిచారు. ద్రాక్షపళ్ళు పండుతూ ఉన్న ఆర్బర్ కింద కూచున్నారు.

“అన్నీ చేదే ఫాదర్!” ఫాదర్ రెంటెరియా ఏం అడగబోతున్నాడో ఊహించాడు. “దేవుడి దయ వల్ల అన్నీ పండే నేల మీదే బతుకుతున్నాము. కానీ పెరిగే ప్రతిదీ చేదే. అదే మన శాపం.”

“నువ్వు చెప్పేది నిజమే ఫాదర్! కోమలాలో ద్రాక్ష పెంచుదామని చూశాను. పిందె నిలవలేదు. జామ పళ్ళూ, నారింజలే. అవీ చేదు జామలూ, చేదు నారింజలూ. తియ్యటి పండు రుచే మర్చిపోయాను. సెమినరీలో మనం తిన్న చైనా జామ పళ్ళు గుర్తున్నాయా? ఆ పీచ్ పళ్ళు? తాకగానే తోలు ఊడొచ్చే ఆ కమలా పళ్ళు? విత్తనాలు ఇక్కడికి తీసుకు వచ్చాను. కాసినే, చిన్న సంచిలో. తర్వాత అక్కడే వదిలేసి ఉంటే బాగుండేదోమోననిపించింది. ఇక్కడికి తీసుకువచ్చింది చంపడానికేగా!’

“నిజమే ఫాదర్! ఈ కోమలా నేల మంచిదనే అంటారు వాళ్ళూ. కానీ ఆ నేలంతా ఒక్కడి చేతిలోనే ఉండటం అన్యాయం. ఇంకా పేద్రో పారమోయే కద వాటి యజమాని?”

“అది దైవేఛ్ఛ.”

“దానికీ దైవేఛ్ఛకీ ఏమన్నా సంబంధం ఉందంటే నమ్మలేను. నువ్వూ నమ్మవు కదా ఫాదర్? నమ్ముతావా?”

“కొన్ని సార్లు అనుమానం వచ్చింది, కానీ కోమలాలో అందరూ అదే నమ్ముతారు.”

“వాళ్లలో నువ్వూ ఒకడివా?”

“నేను వినమ్రంగా తలదించుకోవడానికి సిద్ధపడిన మనిషిని. ఇంకా అలాగే ఉండాలని అనిపిస్తుంది.”

తర్వాత వాళ్లిద్దరూ సెలవు తీసుకుంటున్నప్పుడు ఫాదర్ రెంటెరియా ప్రీస్ట్ చేతుల్ని పట్టుకుని ముద్దాడాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాక, వాస్తవంలోకి తిరిగి వచ్చాక కోంట్లాలో ఆ ఉదయం గురింఛి అతనికి తలుచుకోబుద్ధి కావడం లేదు.

అతను బల్ల మీది నుంచి లేచి వాకిలి వేపు నడిచాడు.

“ఎక్కడికి వెళుతున్నావు బాబాయ్?”

అతని కూతురు ఆనా, బతుకునుంచిరక్షణ కోసం అతని నీడ కావాలన్నట్టు ఎప్పుడూ అతని పక్కనే.

“కాసేపు నడిచొద్దామని బయటికి వెళుతున్నా. కాస్త తిక్కగా ఉన్నట్టుంది”

“వొంట్లో బాలేదా?”

“బాలేకపోవడం కాదమ్మా! చెడ్డగా. అవును, నేను చెడ్డ వాణ్ణి.”

అతను మెదియా లూనా దాకా నడిచివెళ్ళి డాన్ పేద్రోకి ఓదార్పు మాటలు చెప్పాడు. మళ్ళీ తన కొడుకు మీద వచ్చిన ఆరోపణలను తిప్పి కొడుతూ చెప్పిన సాకులను విన్నాడు. బదులుగా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఏమనుకున్నా ఏం లాభం? భోజనానికి లేవమన్నప్పుడు మాత్రం కుదరదన్నాడు.

“నాకు వీలు కాదు డాన్ పేద్రో. తొందరగా చర్చికి వెళ్ళాలి. కన్ ఫెషన్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.”

అతను ఇంటికి నడిచి వచ్చి తర్వాత సాయంత్రమయేటప్పటికి సరాసరి చర్చికి వెళ్ళాడు. అట్లాగే ఆ మురికీ, దైన్యమూ కమ్ముకున్న దేహంతోటే. కన్ ఫెషన్స్ వినడానికి కూర్చున్నాడు.

లైనులో మొదట ఉన్నది చర్చి తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూసే పాత డొరోతియా.

ఆల్కహాల్ వాసన వేసిందతనికి.

“ఏమిటిది? ఇప్పుడు తాగడం కూడా మొదలుపెట్టావా? ఎన్నాళ్ళనుంచి?”

“మిగెల్ దినానికి కి వెళ్ళాను ఫాదర్. కొంచెం ఎక్కువయినట్టుంది. తాగడానికి బోలెడంత ఇచ్చేసరికి చివరికి నేను బఫూన్ నయ్యాను.”

“నువు ఎప్పుడూ చేసేదదేగా డొరోతియా!”

“కానీ ఇప్పుడు నేను నా మోయలేని పాపాలతో వచ్చాను.”

చాలా సందర్భాలలో ఆమెకి చెప్పాడు. ” కన్ ఫెస్ చేయాలనుకోకు డొరోతియా. నా సమయం వ్యర్థం చేస్తావు. నువు కావాలనుకున్నా పాపం చేయలేవు. అది మిగతా వాళ్లకు వదిలేయి.”

“ఇప్పుడు పాపం చేశాను ఫాదర్! నిజంగా!”

“చెప్పు.”

“ఇప్పుడిక అతనికి కలిగే కీడు ఏమీ లేదు కనుక చెపుతున్నాను. ఆ చనిపోయినవాడికి అమ్మాయిలని తార్చింది నేనే. మిగెల్ పారమోకి.”

ఆలొచించడానికి వ్యవధి కావాలన్నట్టు స్తబ్ధుడయాడు. పొగమంచులోంచి బయట పడుతున్నట్టు అలవాటు చొప్పున అడిగాడు “ఎన్నాళ్ల నుంచి?”.

“చిన్నప్పట్నుంచీ. అతనికి మీజిల్స్ వచ్చినప్పటి నుంచీ.”

“ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు డొరోతియా.”

“మిగెల్ కి అమ్మాయిలని ఏర్పాటు చేసింది నేనే.”

“నువు తీసుకు వెళ్ళేదానివా అతని దగ్గరకు?”

“కొన్నిసార్లు నేను తీసు వెళ్ళేదాన్ని. కొన్ని సార్లు ఏర్పాట్లు మాత్రం చేసేదాన్ని. కొంతమందితో మాత్రం అతనికి సరైన దారి చూపించి ఊరుకునేదాన్ని. అదే, వాళ్ళెప్పుడు వొంటరిగా ఉండేదీ, అదాటున వాళ్ళనెప్పుడు పట్టుకోవచ్చో..”

“చాల మందినా?”

అడగాలనుకోలేదు కానీ అలవాటు చొప్పున వచ్చేసిందా ప్రశ్న.

“లెక్కలేనంత మంది. చాలా చాలా మంది.”

“నిన్నేం చేయమంటావో చెప్పు డొరోతియా! నువ్వే తీర్పు చెప్పు. నిన్ను నువు క్షమించుకోగలవా?”

“క్షమించుకోలేను ఫాదర్! అందుకే ఇక్కడికి వచ్చింది.”

“చనిపోయాక స్వర్గానికి పంపమని నన్నెన్ని సార్లు అడిగావు? నీకు నీకొడుకు అక్కడ కనపడతాడని ఆశ ఉండేది, కదా డొరోతియా? ఇప్పుడు నువు స్వర్గానికి వెళ్ళలేవు. ఆ దేవుడు నిన్ను క్షమించు గాక!”

“ధన్యవాదాలు ఫాదర్!”

“సరే, ఆ దైవం పేరిట నిన్ను క్షమిస్తున్నాను. ఇక వెళ్ళు.”

“నాకు ప్రాయశ్చిత్తం ఏదీ ఇవ్వవా?”

“నీకు ఆ అవసరం లేదు డొరోతియా!”

“ధన్యవాదాలు ఫాదర్!”

“దేవుడు తోడుగా వెళ్ళు!”

ఆ గది కిటికీ మీద చప్పుడు చేశాడు తర్వాత ఆమెని రమ్మన్న సూచనగా. “నేను పాపం చేశాను,” మాటలు వింటుండగా అతని తల ఇక నిలబడలేనట్టు ముందుకు వాలింది. తర్వాత తలతిప్పుడు, గందరగోళం, జిడ్డు నీళ్ళలో ఉన్నట్టు జారిపోవడం, తిరుగుతూ ఉన్న దీపాలూ. బద్దలయి ముక్కలుగా చెదిరిపోయి ముగుస్తున్న దినకాంతీ. నాలుకపైన నెత్తుటి రుచీ. “నేను పాపం చేశాను,” బిగ్గరగా, మళ్ళీ మళ్ళీ వినవస్తూంది. “ఇప్పటికీ, ఎప్పటికీ”,”ఇప్పటికీ, ఎప్పటికీ” “ఇప్పటికీ..”

“ఊరుకో అమ్మా,” అన్నాడు. “చివరిసారిగా ఎప్పుడు కన్ ఫెస్ చేశావు?”

“రెండురోజుల క్రితం ఫాదర్!”

ఇంతలోనే మళ్ళీ వచ్చింది. దురదృష్టం అతన్ని చుట్టుముట్టినట్టనిపించింది. ఏం చేస్తున్నావిక్కడ, తనని తనే అడుక్కున్నాడు. విశ్రాంతి తీసుకో. పో. నువు బాగా అలసిపోయావు.

కన్ ఫెషన్ గది నుంచి బయటికి వచ్చి సరాసరి పాత సామాన్ల గదివైపు వెళ్ళాడు. ఎదురుచూస్తున్నవాళ్ల వంక కూడా చూడకుండా చెప్పాడు “మీలో పాపం చేయలేదనుకున్న వాళ్ళంతా రేపు పవిత్ర ప్రార్థన సమావేశానికి రండి.”

అతను వెళుతుంటే వెనక నుంచి గుసగుసలు వినిపించాయి.

పెద్రో పారమొ-8

( గత వారం తరువాయి )

వేడికి కాబోలు అర్థరాత్రికి కొంచెం ముందుగా మెలకువ వచ్చింది. ఆపైన చెమట ఒకటి. ఆమె శరీరమంతా మట్టితో చేసినట్టు, పొరలు పొరలుగా పొడవుతూ, బురదగా కరిగిపోతూ. ఆమె దేహాన్నుండి కాలవలు కడుతున్న చెమటలో ఈదుతున్నట్లు అనిపించింది. చాలినంత ఊపిరి అందడం లేదు. మంచం మీదినుంచి దిగాను. ఆమె నిద్రిస్తూంది. ఆమె నోటినుంచి చావు గిలక చపుడు బుడబుడమంటూ వస్తూంది.

గాలికోసం బయటికి వెళ్ళినప్పటికీ ఎటు వెళ్ళినా వెంటాడుతున్నట్టున్న వేడినుంచి తప్పించుకోలేకపోయాను.

గాలి ఆడటం లేదు. గడ్డకట్టిన రాత్రి చిత్తకార్తె రోజుల్లో మండిపోతూ.

ఒక్క శ్వాస లేదు.వదిలిన గాలినే పీల్చాలి అది తప్పించుకునేలోగా చేతులు కప్పులాగా చేసి అడ్డం పెట్టుకుని. లోపలికీ, బయటికీ. గాలి క్రమంగా తగ్గుతూండడం తెలుస్తూంది…పల్చబడి చివరికి నావేళ్ళమధ్యనుండి పూర్తిగా తప్పించుకుని పోయింది.

ఎప్పటికీ.

నాతలపై నురగల మబ్బుల్లాంటివి సుళ్ళు తిరుగుతూన్నట్టూ, నురుగులు నన్ను కడిగాక చిక్కటి మబ్బుల్లోకి కూరుకుపోతున్నట్టూ గుర్తుంది. అదీ చివరికి కనిపించింది.

నువ్వు నీళ్లల్లో మునిగిపోయినట్టు నన్ను నమ్మించాలని చూస్తున్నావా హువాన్ ప్రెసియాడో? పెద్ద బజారులో డోనిస్ ఇంటికి దూరంగా చూశాను నిన్ను. అతను కూడా నాతో ఉన్నాడు నువ్వు చనిపోయినట్టు నటిస్తున్నావని చెపుతూ. మేమిద్దరమూ నిన్ను ఆర్చీల నీడలోకి లాక్కెళ్ళాము. నువ్వప్పటికే భయంతో బిక్కచచ్చిన వాడిలా కట్టెలా బిర్రబిగిసి ఉన్నావు. నువ్వు చెప్తున్నట్టు ఆరాత్రి ఊపిరి పీల్చడానికి గాలి కూడా లేనట్లయితే నిన్ను పూడ్చిపెట్టడానికి కాదు, మోసుకుపోవడానికే శక్తి చాలేది కాదు మాకు. మరి చూశావుగా, పూడ్చిపెట్టామా లేదా?”

“నువ్వనేది నిజమే డొరోతియో! నీపేరు డొరోతియో అనేనా చెప్పావు?”

“తేడా ఏం పడదులే! నాపేరు డొరోతియా కానీ, తేడా ఏమీ పడదు.”

“నిజమే డొరోతియా! ఆ గొణుగుడికి చచ్చిపోయాననుకో!”

అక్కడ లోకంలో నేనన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన చోటు కనిపిస్తుంది. కలలు కనీ కనీ నేను చిక్కిపోయిన చోటు. మైదానాన్నుండి పైకి లేస్తూ నా ఊరు. జ్ఞాపకాల్తో నిండిన పిగ్గీ బేంక్ లాగా చెట్ల, ఆకుల నీడలు. అక్కడ ఒక మనిషి ఎందుకు కలకాలమూ జీవించాలనుకుంటాడో నీకే తెలుస్తుంది. ప్రత్యూషమూ, ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రీ: గాలిలో మార్పులు తప్పించి అలాగే ఉంటాయి ఎప్పుడూ. అక్కడ గాలిలో తేడా అన్నిటి రంగులూ మారుస్తుంది. జీవితం ఒక కాకలీధ్వనిలా మెత్తగా జారిపోతుందిజీవితపు స్వఛ్ఛమైన కాకలీధ్వని.

“అవును డొరోతియా, ఆ గొణుగుడుకి చచ్చిపోయాననుకో! నాభయాన్ని అదుపులో పెట్టుకోవాలనే చూశాను. కానీ లోపల్లోపల అది పెరిగిపోతూనే ఉంది. ఇక బిగపట్టుకోలేకపోయాను. ఆ గొణుగుడికి ఎదురు నిలిచేసరికి ఇక ఆనకట్ట బద్దలయింది.”

“నేను పెద్ద బజారుకు పోయాను. నువ్వు చెప్పింది నిజమే. జనాల సద్దు విని పోయాను. అక్కడ నిజంగానే జనాలు ఉన్నారనుకున్నాను. అప్పటికి నా బుద్ధి సరిగా పని చేయనట్లుంది. గోడల్ని తడుముకుంటూ చేతులతో నడుస్తున్నట్టు అక్కడికి చేరుకోవడం గుర్తుంది. ఆ గోడలు పగుళ్ళలోంచీ,చితికిపోతున్న సిమెంట్ లోంచీ గొంతుల్ని పీల్చుకున్నట్టు ఉన్నాయి. నేను విన్నాను. మనుషుల గొంతులు. చెవుల్లో రొద పెడుతున్నట్టు రహస్యపు గొంతులు ఏవో గుసగుసలాడుతున్నట్టు. గోడలనించి దూరంగా జరిగి వీధి మధ్యలో నడవసాగాను. అయినా ఇంకా వినిపించాయి. అవి నాతోటే వస్తున్నట్టు, నాముందో, కొద్దిగా వెనకో. నీకు చెప్పినట్టు అప్పుడింక వేడిగా లేదు. చల్లగా ఉంది. తన మంచం వాడుకోనిచ్చిన ఆమె ఇంటి దగ్గరనుంచి – నీకు చెప్పానే, ఆమె చెమటలో కరిగిపోయినట్టు – అప్పటినుంచీ నేను చల్లగా అయిపోయాను. దూరం వెళుతున్న కొద్దీ చలి పెరిగసాగింది. వొళ్ళంతా పులకలు. నాకు తిరిగి వెళ్ళాలనిపించింది. వెళితే నేను వదిలేసిన వేడి దొరుకుతుందనిపించింది. కానీ కొద్దిదూరం వెళ్ళాక అర్థమయిందేమిటంటే ఆ చలి నా వొంట్లోంచి, నా రక్తంలోంచే వస్తుందని. అప్పుడు తెలిసింది నేను భయపడుతున్నానని. పెద్దబజార్లో జనాల సవ్వడి విని అక్కడ జనమున్నారనీ భయాన్నుంచి తప్పించుకోవచ్చనీ అనుకున్నాను. అట్లా నీకు నేను పెద్దబజారులో కనిపించాను, అయితే డోనిస్ తిరిగి వచ్చాడా? అతను తిరిగి రాడని ఆమెకి గట్టి నమ్మకం.”

“నువ్వు కనపడేసరికి తెల్లవారింది. అతను ఎక్కడినుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను అడగలేదు.”

“సరే, పెద్దబజారు చేరుకున్నాను. ఆర్కేడ్ స్తంభానికి ఆనుకుని నిలుచున్నాను. అక్కడ ఎవరూ కనపడలేదు కానీ సంతనాడు జనాలు చేరితే వినిపించే రణగొణధ్వని వినిపిస్తూంది. ఆగకుండా మాటల్లేని చప్పుళ్ళు, చెట్టు కొమ్మల్లోంచి రాత్రిపూట గాలి వీచినట్టు. చెట్టూ కనపడదు, కొమ్మలూ కనపడవు కానీ గుసగుసలు వినిపిస్తాయే అట్లా. ఇంకో అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను. ఆ గుసగుసలు దగ్గరికి వచ్చినట్టూ, తేనెటీగల రొద మల్లే నా చుట్టూ తిరుగుతున్నట్టూ అనిపించింది. చివరికి నాకు చప్పుడు లేని మాటలు వినిపించాయి “మా కోసం ప్రార్థించు!” అవే మాటలు నాకు వాళ్ళు చెపుతున్నవీ, నేను విన్నవీ. ఆక్షణంలో నా ఆత్మ గడ్డకట్టుకుపోయింది.అందుకే నీకు కనిపించినపుడు నేను చనిపోయి ఉన్నది.”

“ఇంటి దగ్గరే ఉంటే బాగుండేది కదా! ఇక్కడికెందుకు వచ్చావు?”

“నేను మొట్టమొదటే చెప్పాను. అందరూ మా నాన్న అని చెప్పే పేద్రో పారమొ ని వెతకడానికి వచ్చాను.ఆశే నన్ను లాక్కొచ్చింది ఇక్కడికి.”

“ఆశా? దానికి చాలా మూల్యం చెల్లించాలి నువ్వు. నా భ్రమలు నేను బతకవలసిన దానికంటే ఎక్కువకాలం బతికించాయి. నా కొడుకు కోసం నేను చెల్లించిన మూల్యం అదీ.అసలు ఒకరకంగా వాడు కూడా ఇంకో భ్రమ. ఎందుకంటే నాకు కొడుకనేవాడే లేడు. ఇప్పుడు చనిపోయాను కనక ఆలోచించడానికీ, అర్థం చేసుకోవడానికీ సమయం చిక్కింది. ఆ దేవుడు నాకు చిన్నగూడు కూడా ఇవ్వలేదు నా బిడ్డకి నీడనివ్వడానికి. కాళ్ళు ఈడ్చుకుంటూ దిక్కు తోచకుండా గడప గడపకీ తిరిగే అంతులేని జీవితమిచ్చాడు. వాళ్ళు దాచారా, వీళ్ళో.. వీళ్లు దాచారా నాబిడ్డను నాకు కాకుండా అని అనుమానంగా, ఏడుపు కళ్ళతో పక్క చూపులతో, ఎప్పుడూ మనుషుల్ని దాటి చూసుకుంటూ బతికాను. అసలిదంతా ఒక పాడు కల. తప్పు. రెండున్నాయి నాకు: అందులో ఒకదాన్ని మంచి కల అనీ రెండోది పాడు కల అనీ చెప్పుకుంటాను. మొదటిది నాకసలు కొడుకు ఉన్నట్టు కల కనేట్టు చేసింది. ఇక బతికి ఉన్నన్నాళ్ళూ అదే నిజమని నమ్ముతూ గడిపాను. నా వరాల తండ్రి బుల్లి నోటితో, కళ్లతో,చిట్టి చిట్టి చేతులతో నా చేతుల్లో ఉన్నట్టే అనిపించేది. చాలా చాలా కాలం దాకా వాడి కనురెప్పలూ, కొట్టుకునే గుండెకాయా నా చేతి వేళ్ళ చివరే ఉన్నట్టు అనిపించేది. అది నిజమని నేనెందుకనుకోను? నా పైశాలువాలోనే చుట్టుకుని నేనెక్కడికి వెళ్ళినా తీసుకు వెళ్ళేదాన్ని. ఒకరోజు వాణ్ణి పోగొట్టుకున్నాను. స్వర్గంలో వాళ్ళు పొరపాటు వాళ్ల వల్లే జరిగిందని చెప్పారు. నాకు గుండె తల్లిది ఇచ్చి కడుపు లంజది ఇచ్చారట. అది నా ఇంకో కల. నేను స్వర్గానికి వెళ్ళి అక్కడ దేవదూతల్లో నాకొడుకెవడో గుర్తుపట్టగలనేమోనని తొంగి చూశాను. లేదు. ఆ మొహాలన్నీ ఒకే మచ్చు లోంచి తీసినట్టు ఒకలాగే ఉన్నాయి. అప్పుడు నేను అడిగాను. ఆ సాధువుల్లో ఒకరు నావద్దకు వచ్చి మైనపు ముద్దలో దూర్చినట్టు నా కడుపులోకి చేయి పెట్టాడు. చేయి బయటికి తీసినప్పుడు కాయపై పెంకు లాంటిదేదో నాకు చూపించాడు. ‘నేను నీకు ప్రదర్శిస్తున్నదానికి ఇదే ఋజువు.’

“అక్కడ వాళ్ళెంత వింతగా మాట్లాడతారో తెలుసా? కానీ వాళ్ళు చెప్పేది నీకు అర్థమవుతుంది. అది నా కడుపేననీ, తినడానికి ఏమీ లేక ఆకలికి ఎండిపోయిందనీ వాళ్ళకు చెప్దామనుకున్నాను కానీ ఇంకో సాధువు వచ్చి నా భుజాలు పట్టుకుని వాకిలి వైపు నెట్టాడు. ‘వెళ్ళి భూమ్మీద కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో బిడ్డా! సన్మార్గంలో బతికితే ప్రాయశ్చిత్త స్థలంలో గడిపే సమయం తగ్గుతుంది.’

“అది నా ‘పీడ కల ’. నాకసలు కొడుకే లేడని తెలిసిన కల. అది నాకు బాగా ఆలస్యంగా తెలిసింది, నా వొళ్ళంతా ముడుచుకు పోయి నా వెన్నెముక పైకి పొడుచుకు వచ్చి నేనిక నడవలేనప్పుడు. ఆపైన అందరూ ఊరు వదిలి వేరే ఎక్కడికో వెళుతున్నారు. చావు కోసం ఎదురు చూస్తూ నేను కూచున్నాను. నువు కనిపించాక ఇక నా అస్థులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాయి. ‘నన్నెవరూ పట్టించుకోరు,’ అనుకున్నాను. ‘నేనెవర్నీ ఇబ్బంది పెట్టను.’ చూడూ, నేను ఈ నేల మీద ఇంత చోటు కూడా దొంగిలించలేదు. నన్ను నీతో పాటు సమాధి చేశారు, నేను నీ చేతుల మధ్య ఖాళీలో ఇమిడిపోయాను. ఇప్పుడు నేను ఈ కొద్ది చోటులో ఉన్నాను. ఒకటే విషయం ఏమిటంటే నా చేతులు నీ చుట్టూ వేసి ఉండవలసింది. వింటున్నావా? పైన వాన పడుతూంది. వాన దరువు వినపడటం లేదా?”

“ఎవరో నడుస్తున్నట్టుగావినిపిస్తుంది నాకు.”

“నువు బెదిరిపోవలసిన పని లేదు. ఇప్పుడు నిన్నెవరూ భయపెట్టలేరు. మంచి ఆలోచనలు రానివ్వు, మనం ఈ నేలలో చాలా కాలం ఉండబోతున్నాం.”

pedro_paramo1

తెల్లవారేసరికి భారీ వర్షం పడుతోంది నేల మీద. చాలులో మెత్తటి మట్టి పైన పడి మందంగా చప్పుడవుతూంది. వనభూషణ పక్షి పొలం మీద కొద్ది ఎత్తులోనే ఎగురుతూ పిల్లవాడి మొరననుకరిస్తూ ఏడ్చింది, కొంత దూరం పోయాక అలుపుతో వెక్కి వెక్కి ఏడ్చినట్టు పాడింది, ఇంకా దూరంగా తెరిపి పడుతున్న దిగంతాలలో వెక్కిళ్ళు పెట్టి, మళ్ళీ నవ్వి, ఇంకోసారి ఏడ్చింది.

తాజా నేల పరిమళాన్ని పీల్చుకుని ఫుల్గర్ సెడనొ బయటికి చూశాడు వాన చాళ్ళను ఎంతవరకు తడుపుతుందోనని. అతని కళ్ళు సంతోషంగా మెరిశాయి. అతను మూడు గుక్కలు లోతుగా పీల్చాడు ఆ వాసనను ఆస్వాదిస్తూ. పళ్ళు బయటికి కనపడేట్టు నవ్వాడు.

“ఓహో! ఈ ఏడూ బాగా పండేట్టు ఉంది.” ఆగి మళ్ళీ అన్నాడు “పడవే వానా బాగా పడు. ఇంక కురవలేనంతగా కురువు. అప్పుడు వెళ్ళిపో. గుర్తు పెట్టుకో, ఈ నేలంతా నీ ఆనందం కోసమే దున్ని ఉంచాం.”

 

పైకే పెద్దగా నవ్వాడు.

పొలాలన్నీ సర్వే చేసి వచ్చిన వనభూషణ పక్షి అతని మీదుగా ఎగిరిపోయింది గుండెలవిసిపోయేలా రోదిస్తూ.

వాన ఎక్కువయింది. దూరంగా వెలుతురు వచ్చిన చోట తిరిగి మబ్బులు కమ్ముకున్నాయి. పోతున్నదనుకున్న చీకటి తిరిగి వస్తున్నట్టుంది.

మెదియా లూనా పెద్ద తలుపు కీచుమంటూ తెరుచుకుంది తేమ గాలికి తడిసి. ముందు ఇద్దరు, తర్వాత ఇద్దరు, ఆ వెనక మరో ఇద్దరు, అట్లా రెండువందలమంది గుర్రాల మీద స్వారీ చేస్తూ వానకి తడిసిన పొలాల మీద చెల్లాచెదరయ్యారు.

“మనం ఎన్మెడియో మందని ఎస్తగువా ఉండే చోటు దాటి తోలాలి. ఎస్తగువా పశువుల్నేమో విల్మయో కొండల్లోకి తరమాలి.” ఫుల్గోర్ సెడానో ఆజ్ఞాపించాడు ఒక్కొక్కళ్ళూ దాటి పోతూ ఉంటే. “కదలండి, వాన దంచి కొట్టేటట్టుంది.”

అతను ఎన్నిసార్లు చెప్పాడంటే చివర వెళ్ళే వాళ్ళకు “ఇక్కడినుండి అక్కడికి, అక్కడి నుండి ఇంకా పైకి,” అని మాత్రమే వినిపించింది.

వాళ్లలో ప్రతి ఒకడూ తనటోపీ అంచు తాకాడు అర్థమయిందని సూచిస్తూ.

చివరివాడు వెళ్ళాడో లేదో మిగెల్ పారమొ గుర్రం మీద వేగంగా వచ్చి కళ్ళెం బిగించి నిలపకుండానే దాదాపు ఫుల్గోర్ మొహమ్మీదికి దూకేశాడు. గుర్రం జీనుతో సహా కొట్టానికి పోయింది.

“ఈ వేళప్పుడు ఎక్కడికి పోయావబ్బాయ్!”

“కొంచెం పాలు పితుకుతున్నా.”

“ఎవరివి?”

“నీకు తెలియదా?”

“ఆ డొరోతియా క్వర్రకా అయి ఉండాలి. పిల్లలంటే ఆమెకే అంత ఇష్టం ఈ చుట్టుపక్కల.”

“నువ్వు వెధవ్వి ఫుల్గోర్. అయినా అది నీ తప్పు కాదులే!”

గుర్రపుసవారీ చేస్తున్నప్పుడు కాళ్లకు కట్టుకునే ముళ్ళచక్రాల్ని తీయకుండానే మిగెల్ తనకు నాస్తా పెట్టడానికి ఎవరయినా కనపడతారేమోనని చూస్తూ పోయాడు.

వంటగదిలో డామియానా సిస్నెరోస్ అదే ప్రశ్న అడిగింది అతనిని.

“ఎక్కడికెళ్ళావు మిగెల్?”

“ఆఁ ఇక్కడనే. చుట్టుపక్కల తల్లుల్ని పలకరించి..”

“నీకు చిరాకు పుట్టించాలని కాదు మిగెల్! గుడ్లు ఎట్లా కావాలి?”

“పక్కన ఏదన్నా స్పెషల్ తో వడ్డిస్తావా?”

“నేను సీరియస్ గా చెపుతున్నాను మిగెల్!”

” నాకు తెలుసు డామియనా. కంగారు పడకు. అది సరే కానీ నీకు డొరోతియా అనే ఆమె తెలుసా? అందరూ క్వర్రకా అని పిలుస్తారు.”

“తెలుసు. నీకు ఆమెని చూడాలనిపిస్తే ఇక్కడే ఆ బయటే కనపడుతుంది. రోజూ పొద్దున్నే లేచి నాస్తా కోసం ఇక్కడికే వస్తుంది. ఒక మూటని శాలువాలో కప్పుకుని పిల్లాడని చెప్పుకుంటూ పాటలు పాడేది ఆమే. ఏదో ఘోరం జరిగి ఉండాలి ఎప్పుడో. ఆమె ఎప్పుడూ మాట్లాడదు కనక ఎవరికీ తెలియదు అదేమిటో. ఎవరన్నా దయదల్చి ఇచ్చిన వాటి మీద బతుకుతుంది.”

“ఆ ఫుల్గోర్ గాడు.. దిమ్మతిరిగేట్టు బాదుతా!”

అతను కూర్చుని కాసేపు ఆలోచించాడు ఆమె తనకెలా ఉపయోగపడుతుందో. తర్వాత అణుమాత్రమైనా సంశయించకుండా వంటగది వెనక తలుపు దగ్గరకు వెళ్ళి డొరోతియాని పిలిచాడు.

“ఒకసారి ఇటురా. నీతో ఒక మాట చెప్పాలి.”

ఆమెకేం చెప్పి ఏం బేరం కుదుర్చుకున్నాడో ఎవరికీ తెలియదు. అతను లోపలికి వచ్చినప్పుడు మాత్రం చేతులు రుద్దుకుంటూ ఉన్నాడు.

“ఆ గుడ్లు తీసుకురా!” డామియానాకి కేకేసి చెప్పాడు. “ఇకనుంచీ ఆమెకి నాకు పెట్టే తిండే పెట్టు. నీకు పని ఎక్కువయితే అయింది. అది నాకనవసరం.”

ఈలోగా ఫుల్గోర్ సెడానో గాదెల్లో ఇంకా ఎంత ధాన్యం మిగిలిందో చూడటానికి పోయాడు. కోతలకింకా చాలా కాలం ఉంది కాబట్టి తగ్గిపోతున్న నిలవల గురించి ఆందోళన చెందాడు. అసలు పంటలు పూర్తిగా వేయనే లేదింకా. “ఎట్లా సర్దుకు పోవాలో చూడాలి.” మళ్ళీ పైకే అన్నాడు. “ఏం పిల్లాడు? అచ్చం వాళ్ళ నాన్నే. కానీ అప్పుడే మొదలుపెడుతున్నాడు. ఈ లెక్కన చూస్తే ఎన్నాళ్ళో నిలిచేట్టు లేడు. ఈయనికి చెప్పడం మరిచేపోయాను నిన్నొకడు వచ్చి ఇతనెవరినో చంపాడన్న విషయం చెప్పినట్టు. ఈ లెక్కన ..”

నిట్టూర్చి, ఈ పాటికి జీతగాళ్ళు ఎక్కడి దాకా పోయుంటారో ఊహించడానికి ప్రయత్నించాడు. కానీ చిక్కంతో దడిని రాస్తూ ఉన్న మిగెల్ గుర్రం అతని ఆలోచనల్ని భగ్నం చేసింది. “దాని జీనుని కూడా తీయలేదు.” అనుకున్నాడు. “తీయాలన్న ధ్యాసే లేదు. డాన్ పేద్రో ఇంకా నయం. ఆయన కాస్త స్థిమితంగా ఉండే సమయాలన్నా ఉంటాయి. కానీ మిగెల్ ఆటలన్నీ సాగనిస్తాడు. కొడుకేం చేశాడో నిన్న చెప్పినప్పుడు అతను ” అది నేను చేసినట్టే అనుకో ఫుల్గోర్! వాడు అట్లాంటి పని చేసి ఉండడు. ఒక మనిషిని చంపేంత దమ్ము లేదు వాడికి. దానికి ఇంత గుండె కావాలి.” అని ఒక పెద్ద గుమ్మడికాయను చూపిస్తున్నట్టు చేతులు ఎడంగా సాచాడు. “వాడేం చేసినా నాదీ పూచీ.”

“మిగెల్ నీకు తలనెప్పులు తెచ్చిపెడతాడు డాన్ పేద్రో. గొడవలకు ఎప్పుడూ ముందుంటాడు”

“కాస్త వదిలెయ్! ఇంకా పిల్లాడు. ఎన్నేళ్ళున్నాయి వాడికి. పదిహేడేగా వచ్చింది ఫుల్గోర్?”

“అంతే! నిన్న కాక మొన్నే తనని తీసుకు వచ్చినట్టుంది. నాకు గుర్తే. కానీ పట్టపగ్గాలు లేకుండా తిరుగుతున్నాడు. కాలంతో పందెం పెట్టుకున్నంత దూకుడుగా బతుకుతున్నాడు. ఎప్పుడో ఓడిపోక తప్పదు. చూస్తావుగా!”

“ఇంకా పసివాడే ఫుల్గోర్!”

“నువ్వు చెప్తే సరే డాన్ పేద్రో! కానీ తన భర్తని నీ కొడుకే చంపాడని నిన్న ఏడుస్తూ వచ్చిన ఆమెని ఆపలేకపోయాము. బాధను అంచనా వేయడం నాకు తెలుసు డాన్ పేద్రో, ఆమెది మామూలు దుఃఖం కాదు. ఈ విషయాన్ని వదిలెయ్యమని నూటా యాభై బస్తాల మొక్కజొన్నలు ఇస్తానని చెప్పినా ఒప్పుకోలేదు. ఎలాగో ఒకలా విషయాన్ని సరి చేస్తానని మాట ఇచ్చాను. అయినా తృప్తి చెందలేదు.”

“ఏమిటంట సంగతి?”

“ఏమో, అందులో ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు.”

“అంత ఆందోళన చెందవలసిందేమీ లేదు ఫుల్గోర్! వీళ్లని లెక్క చేయాల్సిన పని లేదు.”

ఫుల్గోర్ గాదెల దగ్గరకు వెళ్ళాడు. మొక్కజొన్నల వేడి తెలుస్తూంది. గుప్పిట నిండా తీసుకుని పురుగేమన్నా పట్టిందేమోనని పరీక్షగా చూశాడు. ఎంత ఎత్తువరకు గింజలున్నాయో కొలిచాడు. “సరిపోతాయిలే. కొంచెం గడ్డి మొలకలేస్తే పశువులకి గింజలు తినిపించక్కర్లేదు. కాస్త ఎక్కువగానే ఉన్నట్టు లెక్క.”

వెనక్కి వెళుతున్నప్పుడు పైన మబ్బులు పట్టిన ఆకాశం వంక చూశాడు. “వాన చాలాసేపే పడేట్టుంది.” ఇక మిగతావన్నీ మరిచి పోయాడు.

పైన వాతావరణం మారుతున్నట్టుంది. వాన పడగానే కాంతీ, మొలకెత్తుతున్నవాటినుంచి పచ్చటి వాసనా అంతటా నిండుతాయని మా అమ్మ చెపుతుండేది. మబ్బులు అలలుగా ఎట్లా తేలుతూ వస్తాయో, ఎట్లా తమను తాము నేలమీదికి ఖాళీ చేసుకుని, దానికి రంగులన్నీ అద్ది మార్చేశాయో చెప్పేది. మా అమ్మ తన బాల్యమూ, యౌవన ప్రారంభకాలమూ ఈ ఊర్లోనే గడిపింది. కానీ తిరిగి చనిపోవడానికి కూడా రాలేకపోయింది. అందుకే తన స్థానంలో నన్ను పంపింది. వింతగా ఉంది డొరోతియా, నేను ఆకాశాన్నే చూడలేదు. కనీసం అది ఆమె ఎరిగిన ఆకాశం అయ్యుండేది”

“నాకు తెలియదు హువాన్ ప్రెసియాడో! తల ఎత్తకుండా ఇన్నేళ్ళు గడిపాక నేను ఆకాశం గురించే మరిచిపోయాను. పైకి చూసినా వొరిగేదేముంది? ఆకాశమేమో అంత ఎత్తున ఉంది. నాకళ్ళు మసకలు కమ్మాయి. నేల ఎక్కడుందో తెలిస్తే అదే సంతోషం. అదీ కాక ఫాదర్ రెంటెరియా నాకు దైవకృప అందదని చెప్పినప్పుడే ఆసక్తి చచ్చిపోయింది. కనీసం దూరాన్నుంచి చూడటానికయినా.. అంతా నా పాపాల వల్లనే. కానీ అది నాకు ఆయన చెప్పాలా? బతుకులో ఉన్న కష్టాలు చాలకనా? చచ్చాక ఈ కట్టె నుంచి పైకి తీసుకువెళతారన్న ఆశే ముందుకు నడవడానికి ఆధారం. కానీ వాళ్ళు నీకు ఒక తలుపు మూశాక తెరిచి ఉన్న ఒకే ఒక్క తలుపూ నరకానికే అని తెలిస్తే అసలు జన్మ ఎత్తకపోవడమే మంచిదనిపించదా? మా మటుకు మాకు ఇదే, ఇక్కడే స్వర్గం హువాన్ ప్రెసియాడో!”

“మరి నీ ఆత్మ? అదెక్కడికి పోయి ఉంటుందంటావు?”

“మిగతా వాటిలాగే తిరుగుతూ ఉందేమో తన కోసం ప్రార్థిస్తారని బతికినవాళ్ల కోసం వెతుక్కుంటూ. సరిగ్గా చూసుకోనందుకు నా మీద అసహ్యమేమో! కానీ దాని గురించి నేనిప్పిప్పుడు పట్టించుకోను. పశ్చాత్తాపం గురించి దాని రోదన నేను విననక్కరలేదు. దాని వల్ల తిన్నది కాస్తా నోట్లోనే చేదయ్యేది. పాపిష్టి వాళ్ళ పీడ తలపులతో రాత్రిళ్ళు వెంటాడేది. చద్దామని కూచుంటే లేచి ఎట్లాగో బతుకునీడ్చమని మొరపెట్టేది.అక్కడికి ఏదో మహత్యం జరిగి నా పాపాలన్నీ పరిశుభ్రమవుతాయేమోనని ఆశేమో దానికి. నేనసలు ప్రయత్నించను కూడా లేదు. ‘ఇక ముందుకు దారి లేదు,’ నేను దానికి చెప్పాను. ‘ఇంకా ముందుకు వెళ్ళేందుకు చాలినంత శక్తి నా వద్ద లేదు.’ అది పారిపోవడానికి నా నోరు తెరిచాను. అది వెళ్ళిపోయింది. దాన్ని నాగుండెకు బంధించిన నెత్తుటి పోగు నాచేతుల్లో పడ్డప్పుడే నాకు తెలిసిపోయింది.”

(సశేషం)

పెద్రో పారమొ-7

pedro1-1

పొద్దుటి ఎండకి నా జ్ఞాపకాలు వెలిసిపోతూ ఉన్నాయి.
అప్పుడప్పుడూ మాటల శబ్దాలు విన్నాను. తేడా గమనించాను. ఎందుకంటే అప్పటిదాకా నేను విన్న మాటలన్నీ నిశ్శబ్దమైనవి. శబ్దమేదీ లేదుగానీ అర్థం తట్టేది. కలలో మాటలు విన్నట్లు నిశ్శబ్దంగా.
“ఎవరయి ఉంటాడు ఇతను?” ఆమె అడుగుతూంది.
“ఎవరికి తెలుసు!” అతను బదులిచ్చాడు.
“ఎందుకొచ్చాడో ఇక్కడికి?”
“ఎవరికి తెలుసు!”
“వాళ్ల నాన్న గురించి ఏదో అన్నట్లు గుర్తు.”
“నేనూ విన్నాను.”
“దారి తప్పాడంటావా? ఒకసారి దారి తప్పామని కొందరు వచ్చారు గుర్తు ఉందా? లాస్ కంఫైనెస్ అనే ఊరి కోసం చూస్తున్నామంటే నీకు తెలియదని చెప్పావు”
“అవును, గుర్తుందిలే. నన్ను పడుకోనియ్! ఇంకా తెల్లవారలేదు.”
“తెల్లారుతూనే ఉంది. నిన్ను లేపాలనే నీతో మాట్లాడుతూంది. తెల్లారకముందే గుర్తు చేయమని అన్నావు, నేను గుర్తు చేస్తున్నాను. లే!”
“నన్నెందుకు లేపుతున్నావు?”
“నాకు తెలియదు. లేపమని నాకు రాత్రి చెప్పావు. ఎందుకో చెప్పలేదు.”
“అదే కారణమయితే నన్ను పడుకోనియ్. రాత్రి అతను వచ్చినప్పుడు ఏమన్నాడో గుర్తుందిగా? తనను నిద్రపోనివ్వమని. అతని నోట్లోంచి వచ్చిందంతా ఆ ముక్కే.”

 

గొంతులు దూరంగా పోతున్నట్టున్నాయి. మాసిపోతూ. ఊపిరి తిరగనివ్వకుండా చేసినట్టు. ఎవరూ ఏమీ అనడం లేదు. అది కల.
కానీ కాసేపయ్యాక అది మళ్ళీ మొదలయింది.
“అతను కదులుతున్నాడు. లేవబోతున్నాడనుకుంటాను. మనల్ని ఇక్కడ చూస్తే ఏవో ప్రశ్నలన్నీ అడుగుతాడు.”
“అతనేం అడుగుతాడు?”
“అతనేదో మాట్లాడాలి గదా! కాదా?”
“అతన్ని వదిలెయ్! బాగా అలసిపోయి ఉండాలి.”
“నువ్వలా అనుకుంటున్నావా?”
“ఇక చాలించు తల్లీ!”
“చూడు, కదులుతున్నాడు. ఎట్లా ఎగిరెగిరి పడుతున్నాడో చూడు. లోపలేదో అతన్ని కుదిపేస్తున్నట్టు. నాకు కూడా అలా అయింది కనక నాకు తెలుసు.”
“నీకేం అయింది?”
“అది.”
“నువ్వేమంటున్నావో నాకు తెలియడం లేదు.”
“అతన్ని అట్లా చూసినప్పుడు నువ్వు మొదటిసారి నాకు అది చేసినప్పుడు నాకేమయిందో గుర్తుకు వచ్చింది. అంతకంటే ఏమీ చెప్పలేను . అది నన్నెంత బాధించిందీ, అది చేసినందుకు ఎంత చెడ్డగా అనిపించిందీ..”
“అది అంటే?”
“నువ్వు అట్లా చేయగానే నాకనిపించిందీ, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎట్లా సరిగ్గా చేయనిదీ..”
“మళ్ళీ మొదలుపెట్టావా? నువ్వు పడుకుని నన్ను పడుకోనివ్వు!”
“నువ్వే అడిగావు గుర్తు చేయమని. నేను అదే చేస్తున్నాను. ఓరి దేవుడా, నువ్వు నాకేం చెప్పావో అదే చేస్తున్నాను. లే! నువ్వు లేచే సమయమయింది.”
“నన్నొదిలేయి తల్లీ!”
అతను నిద్రపోయినట్టున్నాడు. ఆమె మెత్తటి గొంతుతో తిడుతూనే ఉంది.
“అదుగో తెల్లగా తెల్లారిపోయింది. ఎంత వెలుతురుగా ఉందో చూడు. ఇక్కడినుంచి అతను కనిపిస్తున్నాడంటే అంత వెలుతురు ఉండబట్టే కదా! కాసేపట్లో ఎర్రగా పొద్దు పైకొస్తుంది. అది నీకు నేను చెప్పనవసరం లేదు. అతనేదో తప్పు చేసి ఉండాలి. మనం లోపలికి రానిచ్చాం. ఈ ఒక్క రాత్రికే అయినా సరే, అతనికి ఆశ్రయమిచ్చాం. ముందుముందు లేనిపోనివి మన తలకు చుట్టుకుంటాయి. చూడు అతనెంత దొర్లుతున్నాడో కుదురుగా పడుకోకుండా. గుండెలమీద పెద్ద బరువు పెట్టుకుని ఉండాలి.”
వెలుతురు ఎక్కువవుతూంది. దినం నీడల్ని పారదోలుతూంది. వాటిని చెరిపేస్తూంది. నిద్రపోతున్న దేహాల వేడితో నేను పడుకున్న గది వెచ్చగా ఉంది. పొద్దుటి ఎండ నా కనురెప్పలపై వాలడం తెలుస్తూంది. నాకు వినిపించింది:
“అతను శపించబడ్డట్టు కొట్టుకుంటున్నాడు. దురాత్ముడి ఆనవాళ్ళన్నీ కనపడుతున్నాయి. లే డోనిస్, అతన్ని చూడు. చూడు అతను ఎట్లా తన్నుకులాడుతూ అటూ ఇటూ దొర్లుతున్నాడో! చొంగ కారుస్తున్నాడు. చాలా మందినే చంపి ఉండాలి. నువ్వు చూడను కూడా చూడడంలేదు.”
“పాపం! పడుకో.. మమ్మల్ని పడుకోనివ్వు.”
“నాకు నిద్ర పట్టకపోతే ఎట్లా పడుకోను?”
‘లేచి పో అయితే. నన్ను సతాయించకుండా ఎక్కడికన్నా పో!”
“పోతా. పోయి నిప్పు రాజేస్తా. పోతూ ఏం పేరో అతన్ని వచ్చి నీ పక్కనే నా చోట్లో పడుకోమంటా.”
‘అదే చెప్పు అతనికి.”
“కాదులే. నాకు భయం.”
“అయితే మమ్మల్ని వదిలేసి నీ పని చూసుకో!”
“పోతున్నా!”
“ఇంకా దేనికి ఆగావు?”
“పోతున్నా.”
ఆమె మంచం మీదినుంచి లేవడం వినిపించింది. ఆమె నగ్న పాదాలు నేలను తాకిన చప్పుడు. నా తల మీదుగా దాటుకుంటూ పోయింది. నేను కళ్ళు తెరిచి మూసుకున్నాను.
మళ్ళీ కళ్ళు తెరిచేసరికి పొద్దు బాగా పైకెక్కింది. నా పక్కనే మట్టి కప్పులో కాఫీ ఉంది. తాగడానికి ప్రయత్నించాను. కాసిని గుక్కలు మింగాను.
“మా దగ్గర అదే ఉంది. ఏం చేయను? ప్చ్! కొద్దిగానే ఉంది. అన్నిటికీ కొరతగానే ఉంది. ఎంతో కొరతగా.”
అది ఒక స్త్రీ గొంతు.
“నాగురించి చింతించకండి.” ఆమెకి చెప్పాను. “నాగురించి చింత ఏమీ వద్దు. నాకలవాటే. ఇక్కడి నుంచి బయటికి ఎట్లా వెళ్ళాలి?”
“ఎక్కడికి పోతున్నావు?”
“ఎక్కడికయినా.”
“బోలెడు దారులున్నాయి. ఒకటి కోంట్లాకి వెళుతుంది. ఒకటి అక్కడ్నుంచి వస్తుంది. ఒకటి తిన్నగా కొండల్లోకి పోతుంది. ఆ కనపడేది ఎక్కడికి పోతుందో నాకు తెలియదు.” పడిపోయిన కప్పు స్థానంలో రంధ్రం గుండా పైకి చూపిస్తూ అంది. “ ఇంకొకటి మెదియాలూనా మీదుగా పోతుంది. మరొకటి ఊరంత పొడుగూ పోయేదుంది. అది అన్నిటికంటే పొడవయింది.”
“అయితే నేను అటునుంచే వచ్చి ఉండాలి.”
“ఎటు పోతున్నావు?”
“సయులా వైపు.”
“నా మతి మండ. ఇంకా సయులా అటు వైపనుకున్నాను. అక్కడికి వెళ్ళాలని ఎన్నాళ్లనుంచి అనుకుంటున్నానో. అక్కడ చాలా మంది జనం ఉంటారని చెప్తారు.”
“మిగతా చోట్ల లాగే.”
“మరే! ఇక్కడేమో మేం ఒంటరిగా ఉన్నాము. ఒక్క పురుక్కి కూడా మొహం వాచి ఉన్నాం.”
“మీ ఆయన ఎక్కడికి పోయాడు?”
“మా ఆయన కాదు, అన్న. ఆ సంగతి ఎవరికీ తెలియడం ఇష్టం లేదు తనకి. ఎక్కడికి పోయాడో! దూడేదో ఈ చుట్టుపక్కల తప్పించుకు తిరుగుతుంటే దాని కోసం పోయినట్టున్నాడు. నాకు చెప్పడమయితే ఆ మాటే చెప్పాడు.”
“ఇక్కడ ఎన్నాళ్ళ నుంచీ ఉంటున్నారు?”
“ఎప్పటినుంచో! మేం ఇక్కడే పుట్టాం.”
“అయితే నీకు డలోరిస్ ప్రెసియాడొ తెలిసే ఉండాలే!”
“డోనిస్ కి తెలుసేమో! జనాల గురించి నాకంతగా తెలియదు. బయటికి ఎప్పుడూ వెళ్ళను. శాశ్వతంగా ఇక్కడే ఉన్నట్లు ఉంటుంది. అన్నాళ్ళు కాదులే కానీ, నన్ను తనదాన్ని చేసుకున్నప్పటి నుంచీ. అప్పటినుంచీ ఇక్కడే ఉండిపోయాం. ఎవరయినా చూస్తారని భయం. తను నమ్మడు కానీ నామొహం చూసి ఎవరయినా దడుచుకోరా?” నడిచి వచ్చి ఎండలో నిలుచుంది. “ నా మొహం చూడు.”
అది మామూలు మొహం.

Pedro_Páramo
“ఏం చూడమంటావు?”
“ నా పాపం కనపడటం లేదా? ఊదారంగు మచ్చలు కనపడటం లేదా? అదింకా బయటే. లోపల నేనొక బురద సముద్రాన్ని.”
“ఇక్కడ ఎవరూ లేనప్పుడు ఇక నిన్నెవరు చూస్తారు? ఊరంతా తిరిగాను కానీ ఒక్కరూ కనపడలేదు.”
“కనపడలేదని నువ్వనుకుంటున్నావు కానీ ఇంకా ఇక్కడ కొందరున్నారు. నీకు ఫిలోమెన కనపడలేదా? డరోటియా, మెల్క్విలాడెస్, లేకపోతే ముసలి ప్రెడెన్సియో? ఇంకా సొస్టేనెస్ వాళ్ళంతా బతికే ఉన్నారు కదా! విషయమేమిటంటే వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉంటారు. పగలంతా ఏం చేస్తారో తెలియదు కానీ, రాత్రుళ్ళు తలుపులు వేసుకుని లోపలే ఉంటారు. ఇక్కడ రాత్రులన్నీ దయ్యాలతోటే నిండి ఉంటాయి. ఆ ఆత్మలన్నీ వీధుల్లో నడిచివెళ్ళడం నువు చూడాలి. చీకటి పడగానే అవన్నీ బయటకు వస్తాయి. ఎవరికీ వాటిని చూడాలని ఉండదు. అవి చాలా ఉంటాయి, మేమా కొద్దిమందిమి. వాళ్ళు పాప ప్రాయశ్చిత్త లోకం నుంచి బయటపడేందుకు ప్రార్థన చేయడానికి కూడా ప్రయత్నించం. అన్ని ప్రార్థనలు మావద్ద లేవు. ఏదో దైవప్రార్థన, తలా నాలుగు మాటలు.అది వాళ్ళకు ఏమూలకి? వాళ్ళ పాపాలపైన మా పాపాలు. బతికి ఉన్నవాళ్ళవెవరమూ దైవకృప కలిగి లేము. సిగ్గుతో నిండిన కళ్ళను ఎత్తి చూడలేము. సిగ్గు సాయపడదు. కనీసం బిషప్ చెప్పిన మాట అదీ. ఆ మధ్య దీవెనలివ్వడానికి వచ్చాడు. నేను వెళ్ళి అన్నీ కన్ ఫెస్ చేశాను.
“’నేను నిన్ను క్షమించలేను,’ అన్నాడు.
“’సిగ్గుతో నా వొళ్ళంతా చితికిపోతూంది.’
“’అది సమాధానం కాదు.’
“’మా ఇద్దరికీ పెళ్ళి చేయండి!’
“’విడివిడిగా బతకండి!’
“నేనతనికి చెప్పడానికి ప్రయత్నించాను. బతుకు మమ్మల్ని కలిపింది. పశువుల్లా తరిమింది. ఒకళ్ళమీదికొకళ్ళని బలవంతాన తోలింది. మేమెంతో వొంటరిగా ఉన్నాము, ఇద్దరమే మిగిలాం. మళ్ళీ ఎట్లాగో ఊళ్ళోకి కొంతమంది వచ్చారు. అతను ఈసారి వచ్చేసరికి దీవెనలివ్వడానికి ఎవరో ఒకరు ఉంటారని చెప్పాను.”
“’ఎవరి దారిన వాళ్ళు పోండి. మార్గాంతరం లేదు.”
“’మరి మేమెలా బతకం?’
“’అందరూ బతికినట్టే.’
“మొహం గంటు పెట్టుకుని కంచరగాడిదనెక్కి వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి చూడకుండా. ఇక్కడేదో శాపగ్రస్త దృశ్యాన్ని వదిలి పోతున్నట్టు. అతను మళ్ళీ తిరిగి రాలేదు. అందుకే ఈ చోటంతా ఆత్మలు ముసురుకొని ఉన్నాయి. క్షమాపణ దొరకకనే చనిపోయిన నిమ్మళం లేని ఆత్మలగుంపులు. జనాలకి క్షమాపణ ఎటూ దొరకదు, అందులోనూ మా మీద ఆధారపడి ఉన్నప్పుడు. అతను వస్తున్నాడు. వినిపిస్తుందా?”
“అవును. వినపడుతుంది.”
“అది అతనే!”
తలుపు తెరుచుకుంది.
“దూడ దొరికిందా?” అడిగింది.
“తిరిగి రాకూడదని దాని బుర్రకెక్కినట్లుంది. దాని అడుగుజాడలు దొరికాయి. తొందరలోనే ఎక్కడుందీ కనుక్కుంటాను. రాత్రికి పట్టుకుంటాను.”
“మళ్ళీ రాత్రికి ఒంటరిగా వదిలి పోతావా?”
“పోవలసివస్తుందేమో!”
“నావల్ల కాదు. నువు నాతో ఉండాలి. అప్పుడే నాకుహాయిగా ఉంటుంది. రాత్రిపూట.”
“కానీ ఈరాత్రికి దూడ కోసం వెళ్ళాలి.”
“నాకిప్పుడే తెలిసింది.” అడ్డు తగిలాను. “మీరిద్దరూ అన్నా చెల్లెళ్లని.”
“నీకిప్పుడే తెలిసిందా? నాకు చాలాకాలం నుంచీ తెలుసు. అందులో నువు వేలు పెట్టకు. జనాలు మాగురించి మాట్లాడుకోవటం నాకిష్టం లేదు.”
“నేను అర్థం చేసుకోగలనని చెప్పటానికే ప్రస్తావించాను. అంతే.”
“అర్థం చేసుకునేదేమిటి?”
“ఏం లేదు.” చెప్పాను. “క్షణక్షణానికీ నాకు అర్థమవడం తగ్గుతూ ఉంది.” ఇంకా జతకలిపాను. “ నాకు కావలసిందల్లా నేను బయలుదేరిన చోటుకి తిరిగి వెళ్లటమే. మిగిలిన కాస్త వెలుతురూ పోకముందే బయలుదేరాలి.”
“నువ్వాగటం మంచిది.” అతనన్నాడు. “పొద్దుటి దాకా ఆగు. తొందరగా చీకటి పడుతుంది. ఈ దారుల్లో తప్పిపోతావు. రేపు పొద్దున నీకు సరైన దారి చూపిస్తాను.”
“సరే.”

 

కప్పుకున్న రంధ్రంలోంచి పిట్టల్ని చూస్తున్నాను. సందెవేళ చీకటి దారులు మూసేలోపు గుంపు కట్టి పోతున్నాయి. దినాన్ని తీసుకువెళ్లడానికి వస్తున్న గాలి కొన్ని మబ్బుల్ని అప్పటికే చెదరగొట్టింది.
తర్వాత శుక్రనక్షత్రం బయటికి వచ్చింది. మరి కాసేపటికి చంద్రుడూ.
అతనూ, ఆమే దగ్గరలో లేరు. వరండాలోంచి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేప్పటికి చీకటి పడిపోయింది. కాబట్టి వాళ్లు వెళ్ళిపోయాక ఏం జరిగిందో వాళ్ళకు తెలిసే అవకాశం లేదు.
ఇదీ జరిగింది:
వీధిలోంచి ఒక స్త్రీ వచ్చింది. పురాతనమైన ఆమె ఎంత సన్నగా ఉన్నదంటే చర్మం బొమికెలకు అతుక్కునిపోయింది. తన పెద్ద కళ్ళతో గది చుట్టూరా కలయజూసింది. ఆమె నన్ను కూడా చూసే ఉండొచ్చు. బహుశా నేను నిదరపోతున్నాననుకుందేమో! సరాసరి మంచం దగ్గరికి వెళ్ళి దాని కిందనుంచి ట్రంకు పెట్టె బయటికి లాగింది. డాని లోపలంతా వెతికింది. కాసిని దుప్పట్లు చంక కింద పెట్టుకుని నేనెక్కడ నిద్ర లేస్తానో అన్నట్టు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పోయింది.
ఊపిరి బిగబట్టి, ఆమెవేపుకు కాకుండా ఎటో చూడడానికి ప్రయత్నిస్తూ బిర్రబిగుసుకుని ఉండిపోయాను. చివరికి తల తిప్పడానికి కాస్త ధైర్యం కూడదీసుకుని ఆమె వంక చూశాను.శుక్రతార చంద్రుడితో కలుస్తున్న దిశలో.
“ఇది తాగు” నాకు వినిపించింది.
తల తిప్ప సాహసించలేకపోయాను.
“ఇది తాగు. నీకు మంచే చేస్తుంది. ఇది నారింజ పూల తేనీరు. నువు వణుకుతున్నావు కనుక భయపడుతున్నావని నాకు తెలుసు. ఇది నీ భయాన్ని తగ్గిస్తుంది.”
చేతులు గుర్తు పట్టాను. కళ్ళెత్తి చూశాక మొహాన్నీ గుర్తు పట్టాను.ఆమె వెనక ఉన్న అతను అడిగాడు: ”ఒంట్లో బాగా లేదా?”
“నాకు తెలియదు. మీకెవరూ కనపడని చోట నాకు మనుషులూ, వస్తువులూ కనపడుతున్నాయి. ఇప్పుడే ఇక్కడికి ఒకామె వచ్చింది. ఆమె వెళుతుండగా మీ కళ్ళపడే ఉండాలి.”
“దా!” తన భార్యతో అన్నాడతను “ అతన్ని ఒంటరిగా వదిలేయి. మర్మయోగిలా మాట్లాడుతున్నాడు.”
“అతనికి మంచం ఇద్దాం. చూడు ఎట్లా వణికిపోతున్నాడో. జ్వరం తగిలిందేమో!”
“అతన్ని పట్టించుకోకు. ఇట్లాంటి వాళ్ళు మనల్ని ఆకట్టుకోవడానికి కావాలనే ఈ పరిస్థితి కొని తెచ్చుకుంటారు. మెదియాలూనా దగ్గర ఒకతను నాకు తెలుసు. దైవాంశ ఉందని చెప్పుకునే వాడు. అతనికి ఆ దైవాంశ చెప్పనిదేమిటంటే అతనెంత అబందరగాడో వాళ్ళ అయ్యగారికి తెలియగానే వాడికి చావు మూడిందని. వాళ్ళు ఒక ఊరినుంచి ఇంకో ఊరికి పోతూ బతుకు గడిపేస్తారు ‘దేవుడు ఏం ఇవ్వదలచాడో కనుక్కోవడానికి’. కానీ అతనికి ఇక్కడ తినడానికి ఒక్క మెతుకు కూడా దొరకదు. చూడు వణకడమెట్లా ఆపాడో! మన మాటలు వింటున్నాడు.”

కాలం వెనక్కి తిరుగుతున్నట్లుంది. తార మళ్ళీ చంద్రుడి వద్దకు చేరుతూంది. చెదిరిన మేఘాలు. పిట్టల గుంపులు. అప్పుడు అకస్మాత్తుగా మిట్టమధ్యాహ్నపు వెలుతురు.
గోడలపై మధ్యాహ్నపు ఎండ పరావర్తనమవుతూంది. బండరాళ్ల మీద నా అడుగులు చప్పుడు చేస్తున్నాయి. గాడిదలు తోలేవాడు అంటున్నాడు “పైకి చూడు దోనా ఎదువిజస్! నువ్వింకా బతికుంటే.”
అప్పుడొక చీకటి గది. నా పక్కనే గురక పెడుతున్న ఒక స్త్రీ. ఆమె కల కంటున్నట్టో, లేక మెలకువగా ఉండే నిద్రపోతున్నట్లు చప్పుడు చేస్తూనో ఉన్నట్లు ఊపిరి హెచ్చుతగ్గులుగా పీలుస్తూంది. ఎప్పుడూ ఎండలో వేయక ఉచ్చ కంపు కొడుతున్న గోతం సంచులు పరిచిన రెల్లుమీద కప్పి ఏర్పాటు చేసిన పక్క. ఒక మొద్దు మీదో ఊలు చుట్ట మీదో జీను మెత్తని చుట్టి చేసిన దిండు. అది చెమటకంపు కొడుతూ రాయిలా గట్టిగా ఉంది.
నగ్నంగా ఉన్న స్త్రీ కాళ్ళు నా మోకాళ్ళకు తగులుతున్నట్లు తెలుస్తూంది. నామొహం మీద ఆమె ఊపిరి. ఆ రాయి లాంటి దిండును ఊతం చేసుకుని లేచి కూచున్నాను.
“నువు నిద్రపోలేదా?” ఆమె అడిగింది.
“నిద్ర పట్టడం లేదు. పగలంతా పడుకున్నాను. మీ అన్న ఎక్కడ?”
“ఎక్కడికో పోయాడు. ఎక్కడికి వెళతానన్నాడో నువుకూడా విన్నావు కదా? ఈరాత్రికి ఇక రాకపోవచ్చు.”
“అయితే వెళ్ళాడా? నువు వద్దని చెబుతున్నా?”
“అవును. తను ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చు. వాళ్లంతా అలాగే చేస్తారు. ‘నేనక్కడికి పోవాలి; ఇటు వెళ్లాలి.’ ఎపుడో చాలా దూరం , తిరిగి రావడం అంత తేలిక కానంత దూరం పోతారు. తను పైకి చెప్పకపోయినా నన్ను నువ్వు చూసుకుంటావని వదిలేసి పోయుంటాడు. తన వీలు తను చూసుకున్నాడు. తప్పిపోయిన దూడ ఒక సాకు. చూస్తూండు. ఇక తిరిగి రాడు.”
“నాకు కళ్ళు తిరుగుతున్నాయి. గాలి కోసం బయటకు వెళుతున్నాను.” అందామనుకున్నాను. బదులుగా అన్నాను. “కంగారు పడకు. అతను తిరిగి వస్తాడు.”
నేను మంచం దిగేసరికి ఆమె అంది.
“కుంపట్లో బొగ్గుల మీద నీకు కాస్త ఉంచాను. అంత ఎక్కువ లేదు కానీ నువు మరీ పస్తు ఉండకుండా ఉంచుతుంది.”
ఎండు ఆవు మాంసపు ముక్కా, కొన్ని వేడి రొట్టెలూ కనిపించాయి.
“అంతే నాకు దొరికింది,” వేరే గదిలోంచి ఆమె మాటలు నా చెవిన పడ్డాయి. మా అమ్మ చస్తూ వదిలివెళ్ళిన రెండు మంచి దుప్పట్లు మా చెల్లికి ఇచ్చి ఇవి తెచ్చాను. అవి మా మంచం కింద దాచాను. అవి తీసుకు వెళ్ళడానికే వచ్చి ఉంటుంది. డోనిస్ ఎదురుగా నీకు చెప్పదల్చుకోలేదు కానీ నువ్వు చూసింది ఆమెనే. బాగా భయపెట్టినట్టుందిగా!”
ఒక నల్లటి ఆకాశం, నిండా నక్షత్రాలు. చంద్రుడి పక్కనే అన్నిటికంటే పెద్ద నక్షత్రం.

“నామాట వినపడటం లేదా?” లోగొంతుకతో అడిగాను.
ఆమె గొంతు బదులిచ్చింది: ”నువ్వెక్కడ?”
“నేను ఇక్కడ, నీ ఊరిలో, నీ మనుషులతో. నేను కనపడటం లేదా?”
“లేదు కొడుకా, నువు నాకు కనపడటం లేదు.”
అన్నిటినీ ఆవరిస్తూ ఉంది ఆమె గొంతు. ఎక్కడో దూరంలో మాయమవుతూంది.
“నాకు నువు కనపడటం లేదు.”

 

నేను ఆమె నిద్రపోతున్న గదికి తిరిగి వెళ్ళి చెప్పాను.
“నేను ఈ మూలన పడుకుంటాను. ఆ మంచమెటూ రాయంత గట్టిగా ఉంది. ఏమన్నా అయితే నన్ను లేపు.”
“డోనిస్ తిరిగి రాడు.” ఆమె అంది. “తన కళ్ళు చూస్తే తెలిసిపోయింది. ఎవరన్నా వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాడు తప్పించుకుపోవచ్చని. ఇప్పుడు నా బాగోగులు నువ్వే చూడాలి. చూడవా? నన్ను చూసుకోవా? నా పక్కనే పడుకుని నిద్రపో!”
“ నాకిక్కడ బాగానే ఉంది.”
“ ఇక్కడ ఈ మంచంలో ఇంకా బాగుంటుంది. అక్కడ నల్లులు నిన్ను బతికుండగానే పీక్కు తింటాయి.”
నేను లేచి ఆమె పక్కలోకి దూరాను.

(సశేషం)

పెద్రో పారమొ-6

pedro1-1

“ఆమెని అడిగాను, ఒప్పుకుంది. ప్రీస్ట్ అరవై పీసోలు అడిగాడు ముందస్తు పెళ్ళి ప్రకటనలగురించి పట్టించుకోకుండా ఉండేందుకు. వీలయినంత తొందర్లోనే ఇస్తానని చెప్పాను. దైవ పీఠాన్ని బాగు చేయడానికి కావాలన్నాడు. అతని భోజనాల బల్ల కూడా చివరిదశలో ఉందట. కొత్త బల్ల పంపిస్తానని చెప్పాను. నువెప్పుడూ ప్రార్థనకు రావన్నాడు. నువ్వొస్తావని చెప్పాను. మీనాయనమ్మ పోయనప్పట్నుంచీ దశకం చేయలేదన్నాడు. దానిసంగతి వదిలేయమన్నాను. చివరికి ఒప్పుకున్నాడు”
“డలోరిస్ నుంచి అడ్వాన్స్ ఏమన్నా అడగలేదా?”
“లేదయ్య అంత ధైర్యం చేయలేకపోయాను. నిజంగా. ఆమె సంతోషాన్ని చూసి అట్లాంటి పని ఏదీ చేయాలనిపించలేదు.”
“మరీ పసిపిల్లాడిలా ఉన్నావు!”
పసిపిల్లాడని అన్నాడా? నన్ను, యాభై ఏళ్ళ నన్ను పట్టుకుని? అతన్ని చూస్తే ముక్కుపచ్చలారలేదు, నేను కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నాను. “ఆమె సంతోషాన్ని చెడగొట్టదలచలేదు.”
“ఎంతయినా నువ్వింకా పిల్లాడివే!”
“నువ్వేమంటే అదేనయ్యా!”
“వచ్చే వారం ఆ ఆల్డ్రెట్ దగ్గరికి వెళ్ళు. అతని కంచెలు సరి చూసుకోమను. మన మెదియా లూనా లోపలికి జరిపాడని చెప్పు.”
“కొలతలన్నీ పొరపాటు లేకుండా బాగానే కొలిచాడు. ఆ సంగతి నేను కచ్చితంగా చెప్పగలను”
“సరే, పొరపాటు చేశాడని చెప్పు. లెక్కల్లో తేడా వచ్చిందను. అవసరమయితే ఆ కంచెలు పీకేయించు.”
“మరి చట్టం?”
“ఏం చట్టం ఫుల్గోర్? ఇకనుంచీ మనమే చట్టం. మెదియా లూనాలో పనిచేసే వాళ్లలో ఎవరన్నా గట్టివాళ్ళున్నారా?”
“ఒకరిద్దరున్నారు.”
“ఆల్డ్రెట్ సంగతి చూడ్డానికి వాళ్లను పంపు. నువ్వొక ఫిర్యాదు రాయి అతను మన నేలను ఆక్రమించుకున్నాడనో లేకపోతే నీ ఇష్టమొచ్చిందేదో. లూకాస్ పారమొ చనిపోయాడని అతనికి గుర్తు చేయి. ఇకనుంచీ వ్యవహారమేదో నాతోనే తేల్చుకోవాలని చెప్పు.”
ఇంకా నీలంగా ఉన్న ఆకాశంలో కొద్ది మబ్బులే ఉన్నాయి. పైనెక్కడో గాలి రేగుతున్నట్లుంది కానీ కింద నిశ్చలంగానూ, వేడిగానూ ఉంది.

అతను మళ్లీ కొరడా పిడితో తట్టాడు. తీయాలని పేద్రో పారమొకి అనిపించిందాకా వేరెవరూ తలుపు తీయరని తెలిసినా తనొచ్చినట్లు తెలియజేయడానికి. తలుపు పైన ఉన్న రెండు ముడులుగా చుట్టిన అలంకారాల్ని చూసి ఆ నల్ల రిబ్బన్లు బావున్నాయనుకున్నాడు, ఒకదానికొకటి.
అప్పుడే తలుపు తెరుచుకుంది. అడుగు లోపలికి పెట్టాడు.
“రా ఫుల్గోర్! ఆ టోర్బియో ఆల్డ్రెట్ సంగతి ముగిసినట్లేనా?”
“ఆ పని అయిపోయిందయ్యా!”
“ఇంక ఫ్రెగోసస్ విషయమొకటి ఉంది. ప్రస్తుతానికి అది వదిలేద్దాం. నా హనీమూన్ తో తీరికే దొరకడం లేదు.”

“ఈ పట్టణమంతా ప్రతిధ్వనులతో నిండిపోయింది. అవి ఈ గోడల వెనకో, కిందపరిచిన బండరాళ్ల కిందో ఇరుక్కుపోయినట్టు ఉన్నాయి. నువ్వు నడుస్తున్నప్పుడు ఎవరో నీవెనకే ఉన్నట్టూ, నీ అడుగులో అడుగు వేస్తున్నట్టూ ఉంటుంది. మర్మర ధ్వనులు వినిపిస్తాయి. ఇంకా జనాలు నవ్వుతున్నట్టు. అలసిపోయినట్టుగా వినిపించే నవ్వులు. యేళ్ళు అరగదీసిన గొంతులు. అలాంటి శబ్దాలు. కానీ ఆ శబ్దాలన్నీ మాయమయే రోజు వస్తుందనుకుంటాను”
పట్టణం గుండా మేం నడుస్తున్నప్పుడు నాతో డమియాన సిస్నెరోస్ చెప్తూ వస్తున్నదదీ.

“ఒకప్పుడు రాత్రి తరవాత రాత్రి జాతర జరుగుతున్న శబ్దాలు వినిపించేవి. మెదియాలూనా దాకా స్పష్టంగా వినగలిగేదాన్ని. ఆ గోలంతా ఏమిటో చూద్దామని ఇక్కడిదాకా వస్తే నాకు కనిపించేదేమిటంటే ఇప్పుడు మనం చూస్తున్నదే. ఏమీ లేదు. ఎవరూ లేరు. ఇప్పటిలాగే ఖాళీగా ఉన్న వీధులు.
“తర్వాత ఏమీ వినిపించేది కాదు. నీకు తెలుసుగా సంబరాలు చేసుకునీ చేసుకునీ అలసిపోతాం. అందుకే అది ముగిసినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు.
“అవును,” డమియానా సిస్నెరోస్ మళ్లీ అంది “ఈ పట్టణమంతా ప్రతిధ్వనులతో నిండిపోయింది. నాకిప్పుడు భయం వేయదు. కుక్కల అరుపులు వినిపిస్తాయి, వాటినలా అరవనిస్తాను. బాగా గాలిగా ఉన్న రోజుల్లో చెట్లనుంచి రాలిన ఆకులు కొట్టుకుని వస్తాయి. ఇక్కడ చెట్లు లేవన్న విషయం ఎవరికయినా కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఉండి ఉండాలి. లేకపోతే ఆకులెక్కడ్నుంచి వస్తాయి?
“అన్నిటికంటే పాడుసంగతి ఏమిటంటే ఎవరో మాట్లాడుతున్నట్టు వినపడతాయి. ఆ గొంతులు ఏ సందుల్లోంచో వస్తున్నట్లు వినపడుతుంది. కానీ ఆ గొంతులు ఎవరివో చెప్పగలిగేంత స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడు దారిలో దినం చేయడం కనిపించింది. దైవ ప్రార్థన చేద్దామని ఆగాను. నేను ప్రార్థిస్తుండగా ఒకామె మిగతా జనాన్నుండి విడివడి నావైపు వచ్చి ‘డమియానా నాకోసం ప్రార్థించు డమియానా!’ అంది.
“ఆమె మొహాన ముసుగు జారి ఆమె మొహం కనపడగానే గుర్తు పట్టాను. ఆమె నా అక్క సిక్స్టినా.
“’నువ్వేం చేస్తున్నావిక్కడ?’ ఆమెనడిగాను.
“అప్పుడామె పరుగెత్తుకుని వెళ్ళి మిగతావాళ్ల వెనక దాక్కుంది.
“నీకు తెలియదేమో, మా అక్క సిక్స్టినా నాకు పన్నెండేళ్ళప్పుడే చనిపోయింది. అందరికంటే పెద్దది. మేము పదహారుమందిమి. నువ్వే లెక్క చూసుకో ఇప్పటికి ఆమె చనిపోయి ఎన్నాళ్లయిందో!. ఇంకా ఈలోకంలోనే తిరుగుతూంది. కాబట్టి నీకు కొత్త ప్రతిధ్వనులు వినపడితే ఏం భయపడకు హువాన్ ప్రెసియాడో!”
“నేను వస్తున్నట్టు నీకు మా అమ్మేనా చెప్పింది?” నేను అడిగాను.
“కాదు. ఇంతకీ మీ అమ్మకి ఏమయింది?”
“ఆమె చనిపోయింది” బదులిచ్చాను.
“చనిపోయిందా? ఎలా?”
“ఏమో నాకు తెలియదు. బహుశా దిగులేమో! ఎప్పుడూ నిట్టూర్పులు విడుస్తూ ఉండేది.”
“అయ్యో! ప్రతి నిట్టూర్పుతోటీ నీ జీవితంలో ఒక్కో బొట్టూ జారిపోతూ ఉంటుంది. అయితే చనిపోయిందన్నమాట!”
“అవును. నీకు తెలుసనుకున్నాను.”
“నాకెట్లా తెలుస్తుంది? ఆమె కబురందక కొన్నేళ్ళయింది.”
“మరి నీకు నా సంగతెలా తెలుసు?”
డమియానా బదులీయలేదు.
“నువు బతికే ఉన్నావా డమియానా? చెప్పు డమియానా?”
అకస్మాత్తుగా ఆ ఖాళీ వీధుల్లో నేను ఒంటరిగా నిలబడి ఉన్నాను. కప్పులు లేని ఇళ్ల కిటికీల్లోంచి ఎత్తుగా పెరిగిన కలుపు మొక్కలు కనిపిస్తున్నాయి. దాచలేని కప్పు కింద పొడవుతున్న ఇటుక గోడలు.
“డమియానా!” పిలిచాను. ‘డమియానా సిస్నెరోస్!”
ప్రతిధ్వని బదులిచ్చింది “…ఆనా….నెరోస్…ఆన..నెరోస్”

కుక్కలు అరవడం వినిపించింది. నేనే వాటిని లేపినట్టు. ఒకతను వీధి దాటటం చూశాను.
“ఓయ్, నిన్నే” పిలిచాను.
“ఓయ్, నిన్నే” నా గొంతే వెనక్కి వచ్చింది.
పక్క మలుపులోనే మాట్లాడుకుంటున్నట్టు ఇద్దరు ఆడవాళ్ళ మాటలు వినవచ్చాయి.
“చూడు ఇటు ఎవరొస్తున్నారో! అది ఫిలోటియొ అరేచిగా కాదూ?”
“అవును అతనే. అతన్ని గమనించనట్టు నటించు.”
“అంతకంటే మేలు, ఇక్కడినుంచి పోదాం పద! అతను మనవెంట పడితే మనలో ఒకరినుంచి ఏదో ఆశిస్తున్నట్టు. మనలో ఎవరి వెనక పడుతున్నానుకుంటున్నావు?”
“నీ వెనకే అయ్యుండాలి.”
“కాదు, నా లెక్కప్రకారం నీ వెనకే.”
“మనం పారిపోవలసిన పని లేదు. అతనా మలుపు దగ్గరే ఆగిపోయాడు.”
“అయితే మన ఇద్దరిలో ఎవరమూ కాదన్నమాట. చూశావా!”
“కానీ అయి ఉంటే? అప్పుడేమిటి?”
“లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు.”
“కాకపోవడమే మంచిదయింది. డాన్ పేద్రోకి అమ్మాయిలని ఏర్పాటు చేసేది అతనే అంటారంతా. మనం తప్పించుకున్నాము.”
“అవునా? ఆ ముసలాడితో శొంటి నాకు లేకపోవడమే మేలు.”
“మనం ఇక వెళ్ళడం మంచిది.”
“అవును. ఇంటికి పోదాం.”

రాత్రి. అర్థరాత్రి దాటి చాలాసేపయింది. ఇక ఆ గొంతులు:
“ఈ ఏడు మొక్కజొన్న పంట బాగా పండితే నీ అప్పు తీరుస్తాననే చెప్తున్నాను.అది చేతికి అందిరాకపోతే నువు కొనాళ్ళు ఆగవలసిందే!”
“నేనేమీ బలవంతపెట్టడం లేదు. ఎంత ఓపిక పట్టానో నీకు తెలుసు. కానీ అది నీ పొలం కాదు. నీది కాని పొలంలో పని చేస్తున్నావు. మరి నా అప్పు తీర్చడానికి డబ్బెక్కడి నుంచొస్తుంది?”
“అది నా పొలం కాదన్నదెవరు?”
“పేద్రో పారమోకి అమ్మావని విన్నాను.”
“నేను అతని దరిదాపులకి కూడా పోలేదు. అదింకా నా పొలమే.”
“అని నువ్వంటున్నావు. జనాలంతా అది అతనిదంటున్నారు.”
“ఏదీ ఆ మాట నాతో అనమను.”
“చూడు గెలీలియో! మనలో మాట, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత కాదన్నా నా చెల్లి భర్తవి. ఆమెను నువ్వు బాగా చూసుకోవడంలేదని ఎవరూ అనగా నేను వినలేదు. కానీ ఆ పొలం నువ్వు అమ్మలేదని మాత్రం నాకు చెప్పబోకు.”
“ఎందుకు చెప్పను? అది నేను ఎవరికీ అమ్మలేదు.”
“అది పేద్రో పారమోకి చెందుతుంది. ఆ అర్థం వచ్చేటట్లే నాతో అన్నాడు. డాన్ ఫుల్గోర్ వచ్చి నిన్ను కలవలేదా?”
“లేదు.”
“అయితే రేపు తప్పకుండా ఇక్కడికి వస్తాడు. రేపు కాకపోతే త్వరలోనే ఒక రోజెప్పుడో!”
“అయితే మా ఇద్దరిలో ఒకడికి చావు రాసి పెట్టి ఉంది. అతని ఆటలు నా దగ్గర సాగవు.”
“వదిలేసి ప్రశాంతంగా ఉండు బావా! ఎందుకయినా మంచిది.”
“నేనెక్కడికీ పోను, చూస్తూండు. నాగురించి కంగారు పడకు. మా అమ్మ డక్కామొక్కీలు తినిపించే పెంచింది గట్టివాడిగా.”
“సర్లే, రేపు చూద్దాం. ఫెలిసిటాస్ కి రాత్రి భోజనానికి రానని చెప్పు.తర్వాత ‘అతను చనిపోయే ముందు రాత్రి నేను అతనితోనే ఉన్నాను’ అని చెప్పుకునే బాధ తప్పుతుంది.”
“చివరి క్షణంలో మనసు మార్చుకుంటే రా, నీకోసం అట్టేపెడతాం.”
దూరమవుతున్న అడుగుల చప్పుడు కాలి బూట్ల ముళ్లచక్రాల గలగలల్లో కలిసిపోతూ ఉంది.

“రేపు పొద్దున్నే వేకువజామున నాతో వస్తున్నావు చోనా. జట్టునంతా సిద్ధం చేశాను.”
“మరి మానాన్న తట్టుకోలేక చచ్చిపోతే ఏం చెయ్యాలి? ఈ వయసులో.. నామూలాన ఆయనకి ఏమయినా అయితే నేను భరించలేను. ఆయన బాగోగులు చూడవలసినదానిని నేనొక్కదాన్నే కదా? ఇంకెవరున్నారు? ఆయన్నించి లాక్కెళ్ళడానికి ఎందుకంత తొందర నీకు? కొన్నాళ్ళు ఆగు. ఎన్నాళ్ళో బతకడు.”
“పోయిన ఏడూ అదే చెప్పావు. అవకాశం తీసుకోవడం లేదని ఎత్తిపొడిచావు. అప్పుడేమో ఈ పనులన్నిటితో విసిగిపోయి ఉన్నానన్నావు. కంచరగాడిదల్ని కట్టి సిద్ధం చేశాను. నువ్వు నాతో వస్తున్నావా లేదా?”
“నన్ను ఆలోచించుకోనివ్వు.”
“చోనా! నేను నిన్నెంత కోరుకుంటున్నానో నీకు తెలుసు. ఇంక ఆగలేను చోనా! ఏది ఏమయినా నువ్వు నాతో రావలసిందే!”
“నేను ఆలోచించుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆయన చనిపోయేదాకా మనం ఆగాలి. ఎన్నాళ్ళో పట్టదు. అప్పుడు నేను నీతో వస్తాను. మనం లేచిపోవలసిన అవసరం ఉండదు.”
“అది కూడా చెప్పావు సంవత్సరం క్రితం.”
“అయితే?”
“చోనా, నేను కంచరగాడిదలు బాడిగకి తీసుకోవలసి వచ్చింది. అవి తయారుగా ఉన్నాయి. నీకోసమే ఎదురుచూస్తున్నాయి. ఆయన బతుకు ఆయన్ని బతకనివ్వు. నువు అందగత్తెవి. వయసులో ఉన్నావు. ఏ ముసలమ్మో వచ్చి ఆయన్ని చూసుకుంటుంది. దయగల తల్లులు లోకంలో చాలామందే ఉన్నారు”
“నావల్ల కాదు.”
“అవుతుంది.”
“కాదు. అది నన్నెంత బాధిస్తుందో నీకు తెలుసు. ఆయన నా కన్నతండ్రి.”
“ఇక నేను చెప్పేదేం లేదు. నేను హూలియానా దగ్గరికి పోతున్నాను. తనకి నేనంటే తగని పిచ్చి.”
“సరే. నువు పోవద్దని నేను చెప్పను.”
“అయితే రేపు నా మొహం చూడవా?”
“లేదు. నిన్నెప్పటికీ చూడాలనుకోవడం లేదు.”

శబ్దాలు. గొంతులు. గొణుగుళ్ళు. దూరపు పాట:
లేసు అంచుల రుమాలిచ్చిపోయావా ప్రియతమా
నాకన్నీళ్ళు తుడుకునేందుకు
ఉచ్ఛస్వరాలు. ఆడవాళ్లెవరో పాడుతున్నట్టు.

బళ్ళు కిరకిరలాడుతూ పోవడం చూశాను. నెమ్మదిగా కదులుతున్న ఎడ్లు. చక్రాల కింద నలుగుతున్న రాళ్ళు. నిద్రకి తూగున్నట్టున్న మగాళ్ళు.
… ప్రతి ఉదయమూ ఆ పట్టణం దాటిపోయే బళ్ళ మూలాన వణుకుతుంది. అవి ఉప్పూ, మొక్కజొన్న కండెలూ,పశువుల దాణా వేసుకుని ఎక్కడెక్కడినుంచో వస్తాయి. కిటికీలు దడదడలాడి లోపలి జనాలు లేచేదాకా చక్రాలు కిర్రుమని మూలుగుతుంటాయి. ఆవం తెరిచే సమయం కనక అప్పుడే కాల్చిన రొట్టె వాసన చూడగలవు. హటాత్తుగా ఉరుముతుంది. వాన, వసంతకాలం వచ్చిందేమో! ఆ ఆకస్మికాలకి నువ్వు తొందరలోనే అలవాటు పడతావు కొడుకా!”
వీధుల్లోని నిశ్శబ్డాన్ని చిలుకుతూ ఖాళీ బళ్ళు. రాత్రి చీకటి దారుల్లో కలిసిపోతూ. ఇంకా నీడలు. నీడల ప్రతిధ్వని.
వెళ్ళిపోదామనుకున్నాను. నేను వచ్చినదారి కొండల పైదాకా పోల్చుకోగలుగుతున్నాను. అది కొండల నల్లదనంలో తెరుచుకున్న గాయంలా కనిపిస్తుంది.
అప్పుడెవరో నాభుజాన్ని తాకారు.
“నువ్విక్కడ ఏం చేస్తున్నావు?”
“నేను ..” ఎవరిని చూడడానికొచ్చానో ఆ పేరు చెప్పబోయి ఆగిపోయాను. “ నేను మా నాన్నను చూడటానికి వచ్చాను.”
“లోపలికి రారాదూ?”
“లోపలికి వెళ్ళాను. సగం కప్పు ఇంట్లోకే కూలిపోయి ఉంది. నేలమీదే కప్పు. మిగతా సగంలో అతనూ, ఆమే.
“మీరు చనిపోయారా?”
ఆమె నవ్వింది. అతను తీక్షణంగా చూస్తున్నాడు.
“బాగా తాగినట్టుంది.” అతనన్నాడు.
“భయపడ్డాడులే!” ఆమె అంది.
ఒక నూనె పొయ్యి ఉంది. ఎర్ర మంచం, ఈమె దుస్తులు పడేసిన మోటు కుర్చీ. పుట్టినప్పుడున్నంత నగ్నంగా ఉంది ఆమె. అతను కూడా.
“ఎవరో మా తలుపుకి తలకొట్టుకుంటూ మూలుగుతున్న చప్పుడు వినవచ్చింది. తీసి చూస్తే నువ్వు. ఏమయింది నీకు?”
“చాలా జరిగాయి. నాకయితే నిద్రపోవాలనే కోరిక తప్ప మరేం లేదు.”
“ఆ నిద్రే పోతూ ఉన్నాం.”
“అయితే పడుకుందాం పదండి!”

పెద్రో పారమొ-5

pedro1-1

నువు అదృష్టవంతుడివి నాయనా, చాలా అదృష్టంతుడివి.” ఎదువిజస్ ద్యాడా నాతో చెప్పింది.

అప్పటికే చాలా ఆలస్యమయింది. మూలనున్న దీపం సన్నగిల్లుతూ ఉంది. చివరిగా వణికి ఆరిపోయింది.

ఆమె పైకి లేచినట్టు అనిపించింది. ఇంకో దీపం కోసం వెళుతుందనుకున్నాను. దూరమవుతున్న ఆమె అడుగుల చప్పుడు విన్నాను. ఎదురు చూస్తూ అక్కడే కూచున్నాను.

కొద్ది సేపయ్యాక, ఆమె ఇక తిరిగి రాదని నిర్ధారించుకున్నాక, నేనూ లేచాను. చీకట్లో తడుముకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ నాగదికి చేరాను. నేలమీద పడుకుని నిద్ర కోసం ఎదురుచూశాను.

నిద్ర పడుతూ పోతూ ఉంది.

ఆ మధ్యలోనే ఎప్పుడో ఒక ఏడుపు విన్నాను. సాగదీసి ఏడ్చినట్టుగా ఉంది తాగినవాడి కూతలా. “అయ్యో బతుకా! నాకర్మ ఇట్లా కాలిందే!’

మరీ నా చెవిలోనే వినిపించినట్టుండేసరికి దిగ్గున లేచి కూచున్నాను. అది వీధిలోంచీ కావచ్చు గానీ, నేనిక్కడే విన్నాను ఈ గదిగోడలకు అంటుకుని ఉన్నట్టు. నేను లేచేసరికి చిమటల చప్పుడూ, నిశ్శబ్దపు సణుగుడూ తప్పించి అంతా నిశ్శబ్దంగా ఉంది.

లేదు, ఆ కేక తర్వాత నిశ్శబ్దపు లోతు కొలిచే మార్గమేదీ లేదు. భూమి శూన్యంలో నిలబడిపోయినట్టుంది. ఏ శబ్దమూ లేదు – ఆఖరికి నా ఊపిరీ, నా గుండె కొట్టుకునే చప్పుడు కూడా. అస్తిత్వపు శబ్దమే ఘనీభవించినట్టుగా. దాన్నుంచి బయటపడి కుదుటపడుతుండగానే మళ్ళీ అదే కేక. అది చాలాసేపు వినిపించింది. “నువు నాకు బాకీ ఉన్నావు, ఉరితీయబడ్దవాడికి చివరిమాట వినిపించే హక్కు కంటే అది ఎక్కువ కాకపోయినా!”

అప్పుడు తలుపు భళ్ళున తెరుచుకుంది.

“నువ్వేనా దోన ఎదువుజస్?” పిలిచాను. “ఏమవుతూంది? భయపడ్డావా?”

“నా పేరు ఎడువుజస్ కాదు. నేను డమియానాని. నువ్విక్కడ ఉన్నావని విని చూడటానికి వచ్చాను. మా ఇంటికి వచ్చి పడుకో. అక్కడయితే హాయిగా సేద తీరవచ్చు.”

“డమియానా సిస్నెరోస్? మెదియాలూనాలో ఉండే ఆడవాళ్ళలో ఒకరివికాదూ నువ్వు?”

“అక్కడే ఉంటాను. అందుకే ఇక్కడికి రావడానికి ఇంతసేపు పట్టింది.”

“నేను పుట్టినప్పుడు డమియానా అనే ఆవిడ నా ఆలనా పాలనా చూసిందని మా అమ్మ చెప్పింది. అది నువ్వేనా?”

“అవును. అది నేనే. నువు మొట్టమొదటిసారి కళ్ళు తెరిచినప్పట్నుంచీ నాకు తెలుసు.”

“సంతోషంగా వస్తాను. ఈ గోలలో నాకు నిద్రే పట్టడం లేదు. నువ్వు వినలేదా? ఎవరినో చంపుతున్నట్టు. నీకు వినపడలేదా ఇప్పుడు?”

“ఆ ప్రతిధ్వని ఏదో ఇక్కడే ఇరుక్కుపోయినట్లుంది. చాలా కాలం క్రితం టోర్బిడొ అల్బ్రెట్‌ని ఈ గదిలోనే ఉరి తీశారు. తర్వాత ఈ గదిలోనే వదిలేసి తాళం పెట్టారు. అందుకే అతనికెప్పుడూ శాంతి కలగదు. ఈ గది తాళం చెవి లేకుండానే నువ్వెట్లా లోపలికి వచ్చావో నాకు తెలియదు.”

“దోనా ఎదువిజస్ తెరిచింది. ఈ గదొక్కటే ఖాళీగా ఉందని చెప్పిందామె.”

“ఎదువిజస్ ద్యాడానా?”

‘అవును. ఆమే!”

“పాపం ఎదువిజస్! అంటే ఆమె ఆత్మ దారి తప్పి ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉందన్న మాట!”

 

 

ఫుల్గోర్ సెడనో నామధేయుడనూ, యాభయి ఏళ్ళ అవివాహితుడనూ, వృత్తిరీత్యా వ్యవహర్తనూ, దావా వేయుటలోనూ, కేసులను వాదించుటలోనూ అనుభవజ్ఞుడనూ అయిన నేను నాకివ్వబడిన సర్వహక్కులనూ నియోగించుకునియున్నూ, నా అధికారమును వాడుకొంటున్నూ ఈ క్రింది ఆరోపణలు చేయుచున్నాను….”

టోర్బిడో అల్డ్రెట్ చేసిన అకృత్యాలపై ఫిర్యాదు చేసినప్పుడు అదీ అతను రాసింది. “ అపరాధం సరిహద్దులను తారుమారు చేయడం.”

Pedro-Páramo-de-Juan-Rulfo

 

“నిన్నెవడూ ఏమీ అనలేడు డాన్ ఫుల్గోర్. నీ అంతట నువు నిలబడగలవు. నీవెనక ఉన్న అధికారంతో కాదు, నీ అంతట నువ్వే.”

అతనికి గుర్తుంది. ఫిర్యాదు చేసిన సందర్భంగా తాగుతూ సంబరం చేసుకుంటున్నప్పుడు ఆల్డ్రెట్ అన్న మొదటి మాట అది.

“ ఈ కాగితం నువ్వూ నేనూ నాలుక గీసుకోడానికి కూడా పనికి రాదు డాన్ ఫుల్గోర్. అంతకు మించి ఏం కాదు. అది నీకూ తెలుసు. ఇంకోరకంగా చెప్పాలంటే, నీకు సంబంధించినవరకూ నీ పని నువ్వు చేశావు. నేను మొదట్లో కంగారుపడ్డాను కానీ ఇదంతా చూశాక నవ్వొస్తూంది. సరిహద్దులను తారుమారు చేయడమా? నేనా? అంత బుర్రతక్కువ వెధవ అయితే అతను సిగ్గుతో తలవంచుకోవాలి”

అతనికి గుర్తుంది. వాళ్ళు ఎదువిజస్ ఇంటి దగ్గర ఉన్నారు. అతను ఆమెను అడిగాడు కూడా.

“విజస్! ఆ మూల గది వాడుకోవచ్చా?”

“ఏ గది కావాలంటే అది తీసుకోండి డాన్ ఫుల్గోర్! అవసరమయితే అన్నీ తీసుకోండి. రాత్రంతా ఉంటారా?”

“లేదు, ఒకటి చాలు. మాగురించి ఎదురు చూడక పడుకో. తాళం చెవి మాత్రం ఇవ్వు!”

టోర్బియో ఆల్డ్రెట్ అందుకున్నాడు “సరే, డాన్ ఫుల్గోర్! నేను చెపుతున్నట్టు నీ మగతనాన్ని ఎవడూ శంకించడు. కానీ మీ పెంటముండకొడుకుతోటే నేను విసిగిపోయాను.”

అతనికి గుర్తుంది. తెలివి సక్రమంగా పని చేసినంతవరకూ విన్నమాటల్లో చివరిది అది. తర్వాత పిరికివాడిలా కేకలు వేశాడు “నా వెనక అధికారముందనా అన్నావు? నిజమా?”

 

కొరడా పిడితో పేద్రో పారమొ ఇంటి తలుపు తట్టాడు. రెండువారాలక్రితం మొదటిసారి వచ్చినప్పుడు అట్లాగే చేసినట్టు గుర్తొచ్చింది. ఎదురుచూశాడు, మొదటిసారి చూసినట్లే. మళ్ళీ అప్పుడు చేసినట్టే, తలుపుపైన వేలాడదీసిన నల్లటి ముడులలాంటి అలంకారాలను పరీక్షించి చూశాడు. అయితే మళ్ళీ అప్పటిలా వ్యాఖ్యానించలేదు: “అబ్బో, ఒకదాని మీద ఇంకొకటి వేలాడదీశారే! మొదటిది మాసిపోయింది, రంగు వేసినట్టు కనపడుతున్నా కొత్తది పట్టులా తళతళలాడిపోతుంది.”

 

మొదటిసారి చాలాసేపు ఎదురుచూస్తూ ఇంట్లో ఎవరూ లేరేమో అనుకున్నాడు. చివరికి వెళ్ళిపోదామనుకుంటుండగా పేద్రో పారమొ కనిపించాడు.

“లోపలికి రా నేస్తం!”

అప్పటికి అది రెండోసారి వాళ్ళు కలవడం. మొదటిసారి కలిసిన విషయం అతనికి మాత్రమే తెలుసు, పేద్రో అప్పుడే పుట్టిన పిల్లాడు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు. ఇదే మొదటిసారి అనుకోవచ్చు కూడా. కానీ తనతో సమానంగా చూస్తున్నాడు. ఏం చెప్పాలి? కాలిని కొరడాతో చిన్నగా కొట్టుకుంటూ, పెద్ద అంగలు వేస్తూ ఫుల్గోర్ అతన్ని అనుసరించాడు. ఏది ఏదో తెలిసిన వాడినని అతను త్వరలోనే గ్రహిస్తాడు. అతను తెలుసుకుంటాడు. నేనెందుకు వచ్చానో కూడా.

“కూర్చో ఫుల్గోర్! ఇక్కడ తాపీగా మాట్లాడుకోవచ్చు!”

వాళ్లు గుర్రాల శాలలో ఉన్నారు. పేద్రో పారమొ దాణా వేసే గొట్టం మీద కూచుని ఎదురు చూస్తున్నాడు.

“కూర్చోదలుచుకోలేదా?”

“నిలబడే ఉంటాలే పేద్రో!”

“నీ ఇష్టం. కానీ ‘డాన్’ అనడం మర్చిపోకు!”

ఎవడనుకుంటున్నాడు ఈ కుర్రాడు తన గురించి అలా మాట్లాడడానికి? వాళ్ళ నాన్న డాన్ లూకాస్ పారమొ కూడా అంత ధైర్యం చేయలేదు. మెదియా లూనాలో అడుగు కూడా పెట్టని, వీసమెత్తు పని కూడా చేయని ఈ కుర్రాడు మొట్టమొదటిగా చేస్తున్నది తనో జీతగాడన్నట్లు మాట్లాడడం! ఇంకేం చెప్తాం!

“వ్యవహారం ఎందాక వచ్చింది?”

సెడానోకి ఇదే సందు అనిపించింది. “ఇప్పుడు నావంతు!” అనుకున్నాడు.

“అంత బాలేదు. ఏమీ మిగల్లేదు. మిగిలిన పశువుల్నీ ఒక్కటి కూడా మిగలకుండా అమ్మేశాం.”

పత్రాలన్నీ చూపించడానికి బయటికి తీయసాగాడు. “మనం ఇంతా బాకీ” అని చెప్పబోయేంతలో ఆ కుర్రాడే అడిగాడు.

“మనం ఎవరికి బాకీ ఉన్నాం? ఎంత అనేది నాకు అనవసరం, ఎవరికి అన్నదే ముఖ్యం.”

 

ఫుల్గోర్ పేర్ల జాబితా చివరిదాకా చూసి అన్నాడు. “కట్టడానికి డబ్బు ఎక్కడినుంచీ వచ్చే అవకాశం లేదు. అసలు సమస్య అదీ!”

“ఎందుకని?”

“ఎందుకంటే మీ కుటుంబం అంతా తినేసింది. చిల్లిగవ్వ చెల్లు వేయకుండా అప్పుల మీద అప్పులు చేస్తూ పోయింది. ఏనాటికయినా కట్టాలి కదా? నేనెప్పుడూ చెప్తూ ఉండేవాడిని ‘ఏదో రోజు ఉన్నదంతా ఊడ్చేస్తారు’ అని. సరిగా అట్లాగే అయింది. సరే, పొలం కొనడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళొకరు నాకు తెలుసు. మంచి ధరే ఇస్తారు. అప్పులన్నీ తీరిపోగా కొంచెం మిగలొచ్చు కూడా. మరీ ఎక్కువ కాదనుకో!”

“ఆ ఒకరూ నువ్వు కాదూ?”

“అట్లా ఎందుకనుకుంటున్నావు?”

“నా నీడనే నేను నమ్మను. రేపు పొద్దున మన వ్యవహారాలన్నీ చక్కపెడదాం. ముందు ఆ ప్రెసియడొస్ ఆడవాళ్ల సంగతి చూద్దాం. అందరికంటే ఎక్కువ వాళ్లకే ఇవ్వాలి అని కదా అన్నావు?”

“అవును. వాళ్ళకే అందరికంటే తక్కువ చెల్లవేసింది. మీ నాన్న జాబితాలో వాళ్ళను చివరన ఉంచాడు. వాళ్లలో ఒక అమ్మాయి మటిడా ఏదో పట్టణానికి వెళ్లిపోయింది. గ్వాడలజరానో, కోలిమానో గుర్తు లేదు. ఆ లోలా, అదే దోనా డలొరిస్ అన్నీ చూసుకుంటుంది, డాన్ ఎన్మెడియో పొలం అదీ. మనం అప్పు తీర్చవలసింది ఆమెకే.”

“అయితే రేపు పొద్దున నువ్వెళ్ళి లోలాని పెళ్లి చేసుకుంటానని చెప్పు.”

“ఆమె నన్నెందుకు చేసుకుంటుంది? ఇంత ముసలాడిని..”

“నీకోసం కాదు, నా కోసం అడుగు. కంటికి కాస్త నదురుగానే ఉంటుంది కదా! నేను ఆమెతో ప్రేమలో పడిపోయానని చెప్పు. ఆమెకి ఇష్టమో కాదో అడుగు. వచ్చే దారిలో ఆగి ఫాదర్ రెంటెరియాని ఏర్పాట్లు చేయమని చెప్పు. ఇప్పటికిప్పుడు ఎంత డబ్బు జమజేయగలం?”

“ఒక్క ఏగానీ కూడా లేదు డాన్ పేద్రో!”

“సరే, అతనికి ఏదో మాట ఇద్దాం. నా చేతిలో రొక్కం పడగానే అతనికి ఇచ్చేస్తానని చెప్పు. అతను అడ్డు వస్తాడని నేననుకోను. రేపే చేయి ఆ పని. పొద్దున్నే.”

“మరి ఆల్డ్రెట్ సంగతి ఏం చేద్దాం?”

“ఆల్డ్రెట్‌తో మనకి సంబంధమేముంది? నువు ప్రెసిడియో ఆడవాళ్ళు, ఫ్రెగోసోస్, ఇంకా గుజ్మాన్ల గురించే కదా చెప్పావు? ఇప్పుడు ఈ ఆల్డ్రెట్ సంగతేమిటి?”

“సరిహద్దుల గొడవ. అతను చుట్టూ కంచెలు వేస్తూ ఉన్నాడు. చివరి భాగం మనం వేస్తే సరిహద్దుల పని పూర్తి అయిపోతుందంటున్నాడు”

“అదంతా తర్వాత. ఆ కంచెలగురించి ఇప్పుడు ఆలోచించకు. కంచెలూ అవీ ఏవీ ఉండవు. పొలాన్నేమీ భాగాలు వేయడం లేదు. ఆలోచించు ఫుల్గోర్, ఇప్పుడే ఎవరికీ చెప్పకు. ఇప్పుడు మాత్రం  ముందు ఆ లోలాతో కుదుర్చు. కూర్చో రాదా?”

“కూర్చుంటాను డాన్ పేద్రో. దేవుడి మీదొట్టు, నీతో పనిచేయడమంటే పసందుగా ఉండేటట్లుంది.”

“లోలాను దారిలో పెట్టు, నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పు. అది ముఖ్యం. అది నిజమే సెడానో, ఆమెని నిజంగానే ప్రేమిస్తున్నాను. తెలుసా, ఆమె కళ్లు చూసే! నువ్వు పొద్దున్నే తొట్టతొలిగా ఆ పని చేయి. కొన్ని బరువుబాధ్యతలనించి నిన్ను తప్పిస్తాను. ఆ మెదియా లూనాను నాకొదిలేయి.”

 

జిత్తులన్నీ ఈ కుర్రాడు ఎక్కడ నేర్చాడో అనుకున్నాడు ఫుల్గోర్ సెడనో రెండోసారి మెదియాలూనాకి వెళ్ళినప్పుడు. అతను ఏదయినా చేయగలడని అనుకోలేదు నేను. “వాడొట్టి పనికిమాలినవాడు” మా పెద్దాయన డాన్ లూకాస్ అనేవాడు. “పుటకతోటే చవట”. నేనేం వాదించలేకపోయాను. “ఫుల్గోర్, నేను పోయాక వేరే ఉద్యోగం చూసుకో!” “అట్లాగే డాన్ లూకాస్!” “ఫుల్గోర్, ఏదో తిండికయినా సంపాదించుకుని నేను పోయాక తల్లిని చూసుకుంటాడని బడికి పంపుదామని చూశా. అదీ మధ్యలో వదిలేశాడు.” “మీకు రావలసిన కష్టం కాదు డాన్ లూకాస్” “వాడిమీద ఏ ఆశలూ పెట్టుకోకు. ఆఖరికి నా వయసు ఉడిగాక నన్ను చూసుకోబోడు. దేనికీ కొరగాకుండాపోయాడు. అంతే!” “సిగ్గుచేటు డాన్ లూకాస్!”

 

ఇప్పుడు ఇట్లా. మెదియాలూనా మీద అంత ఇష్టమే లేకపోయినట్లయితే మిగెల్ని కలిసేవాడే కాదు. అతన్ని కలవకుండానే వెళ్ళిపోయేవాడు. ఆ నేలంటే తనకి చాలా ప్రేమ: దున్నగా దున్నగా ఏ యేటికాయేడు కొద్దికొద్దిగా పట్టు సడలించుకుంటున్న బంజరు కొండలు.. ప్రేమాస్పదమైన మెదియాలూనా.. ఎమ్మెడియో పొలంలాగా కొత్తగా కలుస్తున్నవీ..”దగ్గరకురా ప్రియతమా”. అతను చూడగలుగుతున్నాడు అప్పటికే జరిగిపోయినట్లు. మరి ఒక స్త్రీ ఏ మాత్రం? “అంతే” అంటూ కొరడాతో కాలిమీద కొట్టుకుంటూ ఆ కొట్టం ప్రధాన ద్వారం దాటాడు.

 

లోరిస్‌ను బుట్టలో వేసుకోవడం తేలికగానే అయిపోయింది. ఆమె కళ్ళు వెలిగి మొహంలో కంగారు కనిపించింది.

“అబ్బ, సిగ్గుగా ఉంది క్షమించండి డాన్ ఫుల్గోర్! డాన్ పేద్రో అసలు నన్ను గమనించాడంటేనే నమ్మలేకపోతున్నాను.”

“నీగురించి ఆలోచిస్తూ నిదరకూడా పోవడం లేదు.”

“ఆయన కావాలంటే ఎవర్నయినా ఎంచుకోవచ్చు. కోమలాలో ఎంతమంది అందగత్తెలు లేరు? ఈ సంగతి తెలిస్తే వాళ్ళేమంటారో!”

“అతను నిన్ను తప్ప వేరెవరి గురించీ తలవడం లేదు. ఒక్క నిన్నే!”

“నాకు దడ పుట్టిస్తున్నావు డాన్ ఫుల్గోర్! కలలోకూడా అనుకోలేదు..”

“అతను ఎక్కువ మాట్లాడే రకం కాదు. చచ్చి ఎక్కడున్నాడో ఆ డాన్ లూకాస్ పారమొ నిజానికి నువ్వు అతనికి తగవనే చెప్పాడు. తండ్రి మీద గౌరవంతో నోరు మెదపలేదు. ఇప్పుడు ఆయన పోయాక అడ్డేముంది? ఇది అతని మొదటి నిర్ణయం – నేనే ఆలస్యం చేశాను పనుల్లో పడి. పెళ్ళి ఎల్లుండి అయితే నీకు ఫర్వాలేదా?”

“అంత తొందరగానా? ఏవీ సిద్ధంగా లేవు. పెళ్ళిబట్టలూ వాటికి సమయం కావాలి. అక్కకి ఉత్తరం రాయాలి. లేదులే ఎవరి చేతనన్నా కబురు పంపిస్తా. కానీ ఏం చేసినా ఏప్రిల్ 8 లోగా తయారు కాలేము. ఇవాళ ఒకటి కదా! అవును, ఎనిమిదికంటే ముందు కుదరదు. ఈ కొద్దిరోజులూ ఆగమని చెప్పు.”

“కుదిరితే ఈ క్షణంలోనే చేసుకుందామని ఉందతనికి. పెళ్ళి డ్రస్సే సమస్య అయితే, అది మేం తీసుకు వస్తాం. చనిపోయిన వాళ్లమ్మ కోరిక ప్రకారం ఆమె పెళ్ళి డ్రస్ నీకే చెందుతుంది. అది వాళ్ల వంశాచారం.”

“అంత సమయం కావాలనడానికి వేరే కారణం కూడా ఉంది. అది ఆడవాళ్ల సమస్య, తెలుసు కదా! అయ్యో, చెప్పడానికి ఇబ్బందిగా ఉంది డాన్ ఫుల్గోర్.నా మొహం రంగులు మారుతూ ఉండి ఉండాలి. ఛీ, ఎట్లా చెప్పాలి? సిగ్గుగా ఉంది.ఇది నా నెలసరి..”

“అయితే ఏమయిందమ్మా! పెళ్ళంటే నీ నెలసరా కాదా అన్న ప్రశ్నే కాదు. అది ఒకళ్లనొకళ్లు ప్రేమించుకోవడం. అదుంటే ఇక ఏదెట్లా అయినా ఫర్వాలేదు.”

“నేనేం చెపుతున్నానో మీకు అర్థమవుతున్నట్లు లేదు డాన్ ఫుల్గోర్!”

“నాకు అర్థమయింది. పెళ్ళి ఎల్లుండే.”

వారం కోసం, ఒక్క వారం కోసం ఆమె చేతులు సాచి బ్రతిమలాడుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.

డాన్ పేద్రోకి చెప్పడం మర్చిపోకూడదు – దేవుడా ఆ పేద్రో ఎంత చురుకైన వాడు – ఆస్తిని ఉమ్మడి యాజమాన్యం కిందకి మార్చమని జడ్జికి గుర్తు చేయమని అతనికి చెప్పడం మర్చిపోకూడదు. రేపుపొద్దున్నే ఆ సంగతి అతనికి చెప్పడం మర్చిపోకు ఫుల్గోర్!

ఈలోపు డలోరిస్‌ వేడి చేయడానికి నీళ్లు వంటగదికి తీసుకునిపోతూంది. “తొందరగా వచ్చేందుకు నేనేమయినా చేయాలి. ఏం చేసినా మూడు రోజులు ఉంటుంది. ఇంకో మార్గం లేదు. కానీ, ఎంత ఆనందంగా ఉందో! చాలా ఆనందంగా ఉంది. దేవుడా , నీకు కృతజ్ఞతలు ఎలాతెలుపుకోను డాన్ పేద్రోని నాకిచ్చినందుకు!” మళ్ళీ అనుకుంది “ఆ తర్వాత అతనికి నేనంటే మొహం మొత్తినా ఫర్వాలేదు!”

పెద్రో పారమొ-4

pedro1-1
నీటి చుక్కలు నిలకడగా రాతి దోనె మీద పడుతున్నాయి. తేట నీరు రాతిమీదినుంచి తప్పించుకుని కలశంలోకి పడుతున్న చప్పుడును గాలి మోసుకొస్తూంది. అతనికి చప్పుళ్లన్నీ వినిపిస్తున్నాయి. నేలను రాపాడుతున్న పాదాలు, ముందుకూ వెనక్కూ, ముందుకూ వెనక్కూ. విడుపులేకుండా బొట్లు బొట్లుగా జారడం. కలశం నిండి నీరు తడినేలమీదికి పొంగడం.
“లే!” ఎవరో లేపుతున్నారు.
అతనికి ఆ గొంతు వినిపిస్తూంది. గుర్తు పట్టడానికి ప్రయత్నిస్తూనే నిద్రమత్తు బరువుకు మునిగిపోతూ ఉన్నాడు.దుప్పటి వేడిలో కుదురుగా ముణగదీసుకున్నాడు.
“లే!” మళ్ళీ ఎవరో పిలుస్తున్నారు.
ఆ ఎవరో భుజాలు పట్టుకు కుదుపుతున్నారు. అతన్ని లేపి కూచోబెడుతున్నారు. అతను కళ్ళు సగం తెరిచాడు. రాతి మీద నుంచి పొంగుతూ కలశంలోకి పడుతున్న నీటి చప్పుడు అతను మళ్లీ విన్నాడు. అటూ ఇటూ పడుతున్న అడుగుల చప్పుడు. ఇంకా ఏడుపు.
అప్పుడు అతను ఎవరో ఏడవడం విన్నాడు. అతన్ని లేపింది అదే – మెత్తగా ఉన్నా చొచ్చుకునిపొయే ఏడుపు- అంత పదునుగా ఉండబట్టే అతని నిద్ర కంచె దాటుకుని అతని లోలోపలి భయాన్ని తట్టి లేపగలిగింది.
నెమ్మదిగా పక్కమీదినుంచి లేచాడు. ద్వారానికి ఆనించి ఉన్న ఒక స్త్రీ ముఖం కనిపించింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూంది.
“ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అతను అడిగాడు. నేలమీద అడుగు పెట్టగానే తల్లి మొహం గుర్తు పట్టాడు.
“మీ నాన్న చనిపోయాడు.” ఆమె అంది.
అప్పుడు చుట్టలు చుట్టుకున్న ఆమె దుఃఖం ఒక్కసారిగా విప్పుకుంది .తట్టుకోలేక ఆమె గుండ్రం గుండ్రంగా అక్కడక్కడే తిరిగింది. చేతులతో భుజాలు పట్టుకుని ఆ వ్యధిత దేహం తిరగడం ఆపేదాకా.
వాకిలిగుండా ఉదయ సంధ్య కనిపిస్తూంది. పైన చుక్కలేమీ లేవు. ఇంకా రవికిరణాలు సోకని బూడిద రంగు ఆకాశం ఒక్కటే. పొద్దుపొడుపు కంటే పొద్దుగూకడాన్నే సూచిస్తున్నట్టు మసక చీకటి.
బయట వరండాలో అడుగుల చప్పుడు మనుషులు అక్కడికక్కడే గుండ్రంగాతిరుగుతున్నట్టు. మెత్తటి చప్పుడు. లోపల వాకిలికడ్డంగా ఆమె రాబోయే రోజును ఆపేస్తున్నట్టు. ఆమె చేతుల సందుల్లోంచి ఆకాశం ముక్కలూ, పాదాల కిందనుంచి స్రవిస్తున్న వెలుతురు. తడి వెలుతురు, కింద నేలంతా ఆమె కన్నీటి వరద ముంచేసినట్టు. ఆపైన వెక్కిళ్ళ ఏడుపు. మళ్ళీ అదే మెత్తటి కోసుకుపోయే ఏడుపు. ఆమె శరీరాన్ని మెలికలు తిప్పుతున్న బాధ.
“వాళ్ళు మీ నాన్నను చంపేశారు.”
మరి నిన్నో అమ్మా? నిన్నెవరు చంపేశారు?
గాలీ, పొద్దూ ఉన్నాయి, మబ్బులూ ఉన్నాయి. పైపైన నీలాకాశం, ఆపైన పాటలున్నాయేమో, తీయటి గొంతుకలు. ఒక్కమాటలో, ఆశ. మనందరికీ ఆశ,ఉంది, మన బాధలు తీర్చే ఆశ.
“కానీ నీకు కాదు మిగెల్ పారమొ! నీకు క్షమాపణ దొరక్కుండానే చనిపోయావు. దైవకృప నీకెన్నటికీ తెలియదు.”
ఫాదర్ రెంటెరియ మృతజీవుల ప్రార్థన చేస్తూ శవం చుట్టూ తిరిగాడు.తొందరగా ముగించేసి, చర్చి నిండా చేరిన వాళ్లకి చివరి దీవెన అందించకుండానే వెళ్ళిపోయాడు.
“ఫాదర్, మీరు అతన్ని దీవించాలని మా కోరిక.”
“లేదు!” గట్టిగాతలూపుతూ చెప్పాడు. “నేను దీవెన ఇవ్వను. అతను దురాత్ముడు. ప్రభువు రాజ్యం చేరడానికి వీల్లేదు. అందుకు నేను పాల్పడితే ప్రభువు నాపట్ల దయచూపడు.”
మాట్లాడుతూ, చేతులు గట్టిగా కట్టుకున్నాడు వణుకుతున్నట్టు తెలియకుండా ఉండాలని. కుదరలేదు.
ఆ శవం అక్కడున్న వారందరి ఆత్మల మీదా పెద్ద బరువై నిలిచింది. చర్చి మధ్యలో వేదికపైన ఉందది చుట్టూ కొవ్వొత్తులూ, పూలతో. తండ్రి అక్కడే నిల్చున్నాడు, వొంటరిగా, ప్రార్ధన అయ్యేదాకా.
ఫాదర్ రెంటెరియ పేద్రో పారమొ ని దాటుకుని వెళ్ళాడు, అతన్ని తాకకుండా జాగ్రత్తపడుతూ. పరిశుద్ధజలాన్నుంచిన పాత్రను నెమ్మదిగా పైకెత్తి శవపేటిక పైనుంచి కింద దాకా చిలకరించాడు పెదాలనుంచి ప్రార్థనలాంటిదేదో గొణుగుతూ. అతను మోకరిల్లగానే అందరూ మోకరిల్లారు.
“భగవంతుడా, ఈ నీ సేవకుడి మీద దయ చూపు!”
“అతని ఆత్మకు శాంతి కలుగు గాక! తధాస్తు!” అందరి గొంతులూ ఒక్కటై పలికాయి.
మళ్ళీ అతని లోపలి క్రోధం రేగుతూంది. మిగెల్ పారమొ శవాన్ని మోసుకుంటూ అందరూ చర్చి బయటికి వెళుతున్నారు.

pedro_paramo1
పేద్రో పారమొ అతని వద్దకు వచ్చి పక్కనే మోకరిల్లాడు.
“మీరు వాడిని అసహ్యించుకుంటున్నారని తెలుసు ఫాదర్! దానికి కారణమూ ఉందనుకోండి. మీ అన్నని మావాడు చంపాడన్న వదంతి ఉంది. మీ అన్న కూతురిని వాడు చెరిచాడనీ మీరు నమ్ముతున్నారు. ఆపైన వాడు చేసిన అవమానాలూ, ఎవరినీ లెక్కచేయకపోవడమూ. ఆ కారణాలు ఎవరయినా అర్థం చేసుకుంటారు. కానీ అవన్నీ మరచిపొండి ఫాదర్! అతన్ని క్షమించండి, బహుశా దేవుడు క్షమించినట్టుగానే!”
గుప్పెడు బంగారు నాణేలు అక్కడ ఉంచి పైకి లేచాడు. “మీ చర్చికి వీటిని బహుమతిగా తీసుకోండి.”
చర్చి ఖాళీ అయింది అప్పటికి. వాకిలి దగ్గర ఇద్దరు పేద్రో పారమొ కోసం ఎదురు చూస్తున్నారు. అతను వాళ్ళతో కలవగానే అంతా కలిసి అప్పటిదాకా వాళ్ళ కోసం ఆగి ఉన్న శవపేటిక వెంట నడిచారు. మెదియా లూనాకి చెందిన నలుగురు పనివాళ్లు మోస్తున్నారు దాన్ని. ఫాదర్ రెంటెరియ ఆ నాణేలు ఒక్కొక్కటే ఏరుకుని దైవపీఠం వైపు నడిచాడు.
“ఇవి నీవి.” అతను చెప్పాడు. “అతను విముక్తిని కొనుక్కోగలడు. ఇది సరయిన ధర అవునో కాదో నీకే తెలియాలి. నావరకూ, దేవా, నీపాదాల మీద పడి న్యాయమో అన్యాయమో వేడుకుంటాను అందరిలాగే… వాణ్ణి నరకంలో తోసేయి!”
ప్రార్థనామందిరాన్ని మూశాడు.
పాతసామాన్ల గదిలోకి వెళ్ళి ఒక మూలన కూలబడ్డాడు. బాధతో, వ్యధతో కన్నీరు ఇంకిందాకా అక్కడే కూచుని ఏడ్చాడు.
“సరే ప్రభూ, నువ్వే గెలిచావు!”

భోజనాల సమయానికి, ప్రతి రాత్రీ తాగినట్టుగానే వేడి చాకొలేట్ తాగాడు. మనసు నెమ్మదించింది.
“అనీతా, ఇవాళ ఎవరిని పూడ్చారో తెలుసా నీకు?”
“తెలియదు బాబాయ్!”
“మిగెల్ పారమొ గుర్తున్నాడా?”
“ఆఁ”
“వాణ్ణే!”
అనీత తల వేలాడేసింది.
“కచ్చితంగా వాడేననని నీకు నమ్మకమేగా?”
“ఏమో బాబాయ్! అతని మొహం నేను చూడలేదు. ఒక్కసారిగా మీద పడ్డాడు. చీకటి.”
“మరి అది మిగెల్ పారమొ అని నీకెలా తెలుసు?”
“ఎట్లా అంటే అతను చెప్పాడు: ‘అనా నేను మిగెల్ పారమొని. భయపడకు.’ అదీ అతను చెప్పింది.”
“ కానీ వాడే మీ నాన్న చావుకు కారణమని తెలుసు కదూ?”
“తెలుసు బాబాయ్!”
“మరి నువ్వేం చేశావు వాణ్ణి వెళ్లగొట్టడానికి?”
“నేనేమీ చేయలేదు.”
ఇద్దరూ మాట్లాడకుండా ఉండిపోయారు. మర్టిల్ ఆకుల్ని కదుపుతున్న వేడి గాలి చప్పుడు ఇద్దరి చెవులా పడుతూంది.
“అతనందుకే వచ్చానని చెప్పాడు – అందుకు సారీ చెప్పి నన్ను క్షమించమని అడగడానికి. నేను మంచం మీద కదలకుండా పడుకునే కిటికీ తెరిచే ఉందని చెప్పాను. అతను లోపలికి వచ్చాడు. ముందుగా నా చుట్టూ చేతులు వేశాడు, అతను చేసిన తప్పుకు క్షమాపణ అడగడానికి అదే అతని పద్ధతి అన్నట్టు. నేను అతని వంక చూసి చిరునవ్వు నవ్వాను. మనం ఎవరినీ అసహ్యించుకోకూడదని నువు చెప్పింది నాకు బాగా గుర్తుంది. అందుకే, ఆ విషయం అతనికి తెలియడానికే నవ్వాను కానీ ఆ చీకటిలో అది అతనికి కనపడదని వెంటనే తెలియలేదు. అతని శరీరం నామీద పడటం, చీదర పనులు చేయడం మాత్రమే తెలుస్తూంది.”
“నన్ను చంపబోతున్నాడని అనుకున్నాను. అదే గట్టిగా అనుకున్నాను బాబాయ్! ఆ తర్వాత ఆలోచించడం మానేశాను అతను చంపేలోగానే చనిపోదామని. అంత ధైర్యం చేయలేకపోయాడనుకుంటాను.”
“అతను చంపలేదని నేను కళ్ళు తెరిచి పొద్దుటెండ కిటికీలోంచి పడటం చూసినప్పుడు తెలిసింది. అప్పటిదాకా నేను నిజంగానే చనిపోయాననుకున్నాను.”
“ఏదో రకంగా నీకు కచ్చితంగా తెలిసే ఉండాలి. అతని గొంతు. అతని గొంతు బట్టి గుర్తు పట్టలేదా?’”
“నేనతన్ని అసలు గుర్తు పట్టలేదు. అతని గురించి నాకు తెలిసిందల్లా నాన్నను చంపాడనే. అతన్ని అదివరకెన్నడూ చూడలేదు, ఆ తర్వాతా చూడలేదు. అతని ఎదురుపడగలిగేదాన్నా బాబాయ్?”
“కానీ అతనెవరో నీకు తెలుసు.”
“అవును. అతనేమిటో కూడా. ఇప్పుడు నరకబాధలు అనుభవిస్తుంటాడని కూడా తెలుసు. సెయింట్స్ అందరినీ నా మనసుతో, ఆత్మతో ప్రార్థించాను.”
“అంత నమ్మకం పెట్టుకోకు అమ్మాయ్! అతనికోసం ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారో ఎవరికి తెలుసు? నువ్వొక్క దానివే. వేల ప్రార్థనలకు ఎదురుగా ఒక్క ప్రార్థన. అందులోనూ కొన్ని నీ ప్రార్థన కంటే తీవ్రమైనవి, అతని తండ్రి ప్రార్థనలాంటివి.
“ఏమయినా నేను అతన్ని క్షమించేశాను.” అనబోయాడు. కేవలం అనుకున్నాడు. ఛిద్రమయిన ఆ అమ్మాయి ఆత్మను మరింత బాధకు గురి చేయడం ఇష్టం లేకపోయింది. అందుకు బదులు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు “ప్రభువైన మన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం ఇంత కీడు చేసిన వాణ్ణి ఈ భూమ్మీదనుంచి తీసుకు పోయినందుకు. తన స్వర్గానికి తీసుకుపోయాడో లేదో మనకెందుకు?”
కోంట్లా రోడ్డును పెద్ద బజారు కలిసేదగ్గర ఒక గుర్రం పరుగులు తీస్తూ ఉంది. దాన్నెవరూ చూడలేదు. అయితే ఊరి బయట దేనికోసమో ఎదురుచూస్తూన్న ఒక స్త్రీ ఆ గుర్రాని చూచాననీ, అది బొక్కబోర్లా దొర్లబోయినట్టు దాని ముంగాళ్లు వంగబడిపోయాయనీ చెప్పింది. అది మిగెల్ పారమొ టేకుమాను రంగు గుర్రం అని గుర్తుపట్టిందామె. అది తన మెడ విరగ్గొట్టుకుంటుందేమోనన్న ఆలోచన ఆమె మనసులో మెదిలింది. తరవాత అది దాని కాళ్లమీద నిలబడి కింద వదిలేసినదాన్నేదో చూసి భయపడుతూ ఉన్నట్టు మెడ మాత్రం వంచి మామూలుగానే పరుగులు తీయడం మొదలుపెట్టింది.
ఖననం జరిగిన రాత్రి శ్మశానాన్నించి అంత దూరమూ నడిచివచ్చి మగవారంతా విశ్రాంతి తీసుంటూ ఉండగా ఈ కథ మెదియాలూనా చేరింది. జనాలు పడుకునేముందు కబుర్లు చెప్పుకునేట్టు వాళ్ళూ మాట్లాడుకుంటూ ఉన్నారు. “ఈ చావు నన్ను నాలుగు రకాలుగా బాధిస్తూంది.” టెరెన్సియో లుబియానెస్ అన్నాడు “ నా భుజాలింకా తీపులు పుడుతూనే ఉన్నాయి.”
“నావి కూడా!” అన్నాడు అతని అన్న ఉబియాడో. “నా మడమలు అంగుళమన్నా వాచి ఉంటాయి.ఇదేదో పవిత్ర దినంఅయినట్టు ఆ పెద్దాయన మనల్ని బూట్లు వేసుకోమనబట్టే, కదా టోరిబియో?”
“నన్నేం చెప్పమంటావు? ఇంత తొందరగా పైకి పోవడమే నయం!”
ఇంకొన్ని రోజులకు కోంట్లా నుంచి ఇంకో వార్త వచ్చింది. అది ఒక ఎడ్ల బండితో.
“అతని ఆత్మ అక్కడే తిరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఒక స్నేహితురాలి కిటికీ తట్టడం చూశారు. అంతా అతని లాగే ఉంది.”
“కొడుకు అట్లా ఆడోళ్ళ కిటికీలు తడుతూంటే డాన్ పేద్రో వదిలేస్తాడనుకున్నావా? అతనికి తెలిస్తే – ‘సరే నువ్వు చనిపోయావు, నీ సమాధిలో నువ్వుండు. ఇవన్నీ మాకు వదిలేయి.’ అనడూ! అట్లా తిరిగేప్పుడు పట్టుకుంటే సమాధిలోంచి మళ్ళీ లేవకుండా పూడ్చిపెట్టడూ?”
“నువు చెప్పేది నిజమే ఇసయ్యస్. ఆ ముసలాయన దేన్నీ భరించలేడు”
బండి తోలే అతను తన దారిన తను వెళ్ళిపోయాడు “నేను విన్నదే మీకు చెపుతున్నాను” అంటూ.
తారాజువ్వలు. ఆకాశాన్నుండి నిప్పుల వాన కురుస్తున్నట్టు.
“అటు చూడండి.” టెరెన్సియో అరిచాడు “ మనకోసం ఆట మొదలుపెట్టారు చూడండి!”
“మిగెలిటో తిరిగొచ్చాడని సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు.” జీసస్ అన్నాడు. “అపశకునం కాదా అది?”
“ఎవరికి?”
“మీ చెల్లి ఒంటరిగా ఉందేమో, అతను తిరిగి రావాలని కోరుకుంటుందేమో!”
“ఎవరితో మాట్లాడుతున్నావు?”
“నీ తోటే!”
“ఇక పదండి, పొద్దుపోయింది. ఇవాళ్టి తిరుగుడుకి సాలిపోయింది. మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి.”
చీకట్లో నీడల్లా కలిసిపోయారు వాళ్ళు.
తారా జువ్వలు. ఒక్కటొక్కటిగా కోమలాలో దీపాలు ఆరిపోయాయి.
ఇక రాత్రిని అకాశం ఆక్రమించుకుంది.
ఫాదర్ రెంటెరియా నిద్రపట్టక పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు.
అది నా తప్పే అనుకున్నాడు. జరిగేదంతా. నా బాగోగులు చూసే వాళ్ళను బాధించాలంటే కలిగే భయం వల్ల. అది నిజమే, నా జీవనాధారానికి వాళ్ళకి రుణపడి ఉన్నాను. పేదవాళ్ళనుంచి చిల్లిగవ్వ రాదు, ప్రార్థనలు పొట్ట నింపవని ఆ పైవాడికీ తెలుసు. ఇప్పటిదా అట్లాగే గడిచింది. దాని పర్యవసానం ఇప్పుడు తెలుస్తూంది. అంతా నా తప్పే. నన్ను ప్రేమించినవారికీ, నాపై నమ్మకముంచి తమ తరఫున దేవుడిని ప్రార్థించమని అడగవచ్చిన వారికీ ద్రోహం చేశాను. నమ్మకం ఏం సాధించింది వాళ్ళకి? స్వర్గమా? వాళ్ల ఆత్మల పారిశుధ్ధ్యమా? వాళ్ళ ఆత్మలను పరిశుద్ధం మాత్రం చేయడమెందుకు చివరి క్షణాల్లో.. వాళ్ల చెల్లి ఎదువిజస్ ను కాపాడమని వచ్చిన మరియా ద్యాడ మొహాన్ని ఎప్పటికీ మరవలేను.
“ఆమె ఎప్పుడూ తోటివాళ్ళకి సాయం చేస్తూ ఉండేది. వాళ్ళకి తనకున్నదంతా ఇచ్చింది. వాళ్ళకు కొడుకుల్నీ ఇచ్చింది. అందరికీ. పసిపాపలని వాళ్ళ తండ్రుల దగ్గరకు గుర్తుపట్టడానికి తీసుకు వెళ్ళింది. ఎవరూ పట్టించుకోలేదు. ‘అయితే వాళ్ళకి తండ్రినీ నేనే అవుతాను, తల్లివి కమ్మని విధి రాసినా.’ అని చెప్పిందామె వాళ్ళకి. ఆమె మంచితనాన్నీ, ఆదర స్వభావాన్నీ ప్రతివాళ్ళూ వాడుకున్నవారే. ఆమె ఎవరినీ బాధించాలనుకోలేదు, ఎవరితో గొడవా పెట్టుకోదలచలేదు.”

“కానీ ఆమె తన ప్రాణం తనే తీసుకుంది. దైవాజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించింది.”
“అంతకంటే ఏం చేయగలదు? అది కూడా ఆమె మంచితనం వల్లే చేసింది.”
“చివరి గడియలో ఆమె పుణ్యం చాలకపోయింది.” మరియా ద్యాడతో చెప్పాను.
“చివరి క్షణంలో. ముక్తి కోసం అన్ని మంచిపనులూ చేసి అంత పుణ్యమూ మూటగట్టుకుని అంతా ఒక్కసారిగా ఎట్లా పోగొట్టుకుంటుంది?”
“అదంతా ఎక్కడికీ పోదు. ఆమె దుఃఖం వల్ల మరణించింది. ఆ దుఃఖం… దుఃఖం గురించి నువ్వెప్పుడో నాకు చెప్పావు గానీ నాకు గుర్తు రావడం లేదు. ఆమె దుఃఖం వల్ల ఆమె పోయింది. ఆమె రక్తమే గొంతుకడ్డం పడి ఊపిరాడక చనిపోయింది. ఆమె ఎట్లా అగపడేదో ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉంది.అంత విషాదగ్రస్తమయిన మొహం నేనెప్పుడూ చూడలేదు.”
“కాస్త ఎక్కువ ప్రార్థనలు చేస్తే ఏమన్నా..”
“మేము చాలా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాము ఫాదర్!”
“పోనీ, బహుశా, గ్రెగోరియన్ ప్రార్థనలు. కానీ అవి చేయాలంటే మన వల్ల కాదు. ఇంకా మతాచార్యులని పిలిపించాలి. దానికి ఖర్చవుతుంది.”
నా కళ్ళ ఎదుట, పిల్లలతో పండి పేదదయిన మరియా ద్యాడ మొహం.
“నాదగ్గర చిల్లి గవ్వ లేదు. ఆ సంగతి నీకు తెలియదా ఫాదర్!”
“సరే ఇట్లాగే వదిలేద్దాం. భగవంతుని యందు విశ్వాసాన్ని ఉంచుదాం.”
“సరే ఫాదర్!”
అలా వదులుకోవడంలోనూ ఆమె ఎందుకంత ధైర్యంగా కనిపించింది? సునాయాసంగా ఒకటో అరో మాట – ఒక ఆత్మను కాపాడడానికి వంద అవసరమయితే వంద – చెప్పడంలో, క్షమాభిక్ష ప్రసాదించడంలో తనకి పోయిందేముంది? స్వర్గనరకాల గురించి తనకేం తెలుసు? ఒక పేరులేని ఊళ్ళో ఒక ముసలి మతగురువుకు కూడా స్వర్గానికెవరు అర్హులో తెలుసు. ఆ వరస అంతా తనకి తెలుసు. క్రిస్టియన్ సెయింట్స్ పట్టికలో కేలెండర్లో ప్రతిరోజుకూ ఉండే సెయింట్స్ తో మొదలు పెట్టాడు – సెయింట్ నునిలోన, కన్య,వీర మరణం పొందినది, అనెర్సియో పెద్ద మతాధికారి, సలోమి, విధవ, అలోదీ, నులీన కన్యలు, కోర్డుల, దోనాటొ” అదే వరసలో ఇంకా కిందికి. అతను నిద్రలోకి జారుకోబోతూ లేచి తిన్నగా పక్క మీద కూచున్నాడు. “నిద్ర పట్టడానికి గొర్రెల్ని లెక్క పెడుతున్నట్టు నేను సెయింట్స్ పేర్లు అప్పచెబుతున్నాను.”
అతను బయటికి వెళ్ళి ఆకాశం వంక చూశాడు. చుక్కలు కురుస్తున్నాయి. ఆకాశం ప్రశాంతంగా కనపడక అతను విచారించాడు. రాత్రి దుప్పటి భూమిని కప్పుతున్నట్టు అనిపించింది. “నరక కూపం” ఈ భూమి.

పెద్రో పారమొ-౩

pedro1-1

“.. నేను

చెపుతున్నాయన మెదియా లూనా కొట్టం దగ్గర గుర్రాలను మాలిమి చేసి దారికి తెస్తుండేవాడు. తన పేరు ఇనొసెంసియో ఒజారియో అని చెప్పేవాడు. గుర్రమెక్కితే దానికి అతుక్కుపోతాడంతే. అందరూ చికిలింతగాడనే పిలిచేవాళ్ళు. అతను గుర్రాల్ని లొంగదీసేందుకే పుట్టాడనేవాడు మా పేద్రో. అసలు సంగతేమిటంటే అతని దగ్గర ఇంకో విద్య ఉంది: మంత్రాలేయడం. కలల్ని మంత్రించేవాడు. నిజానికి అతని అసలు పని అదే. మీ అమ్మకూ వేశాడు చాలా మందికి వేసినట్టే. నాక్కూడా. నాకు వొంట్లో బాలేనప్పుడు ఒకసారి వచ్చి ‘నీకు నయం చేయడానికి వచ్చాను ‘ అని చెప్పాడు. దానికర్థం ఏమిటంటే మొదట రుద్దడమూ, మర్దనా చేయడమూ: ముందు నీ వేళ్లకొసలూ, తర్వాత నీ అరిచేతులూ, ఆపైన చేతులూ. నీకు తెలిసేలోగా నీ కాళ్ళ మీద మొదలెడతాడు గట్టిగా రుద్దుతూ. కాసేపట్లో వొళ్ళంతా వేడి పుడుతుంది. అలా రుద్దుతూ తోముతూ దువ్వుతున్నంతసేపూ నీకు నీ జాతకం చెపుతూ ఉంటాడు. మైకంలో పడిపోయి గుడ్లు తిప్పుతూ ఉమ్మి తుంపర్లు చుట్టూ చిందేట్టు ఆవాహన చేస్తూ, శాపనార్థాలు పెడుతూ – చూస్తే ఏ సంచారజాతి మంత్రగాడో అనుకుంటావు. కొన్నిసార్లు చివరికి దిసమొలతో మిగిలిపోతాడు; అట్లా కావాలనే చేశాననేవాడు. కొన్నిసార్లు అతను చెప్పేవి నిజమయ్యేవి. గుప్పెడు రాళ్లు విసిరితే ఒకప్పటికయినా ఏదో ఒకటి తగలకపోదు.
“ఇంతకీ ఏమయిందంటే మీ అమ్మ ఆ రోజు ఈ ఒజారియోని చూడబోయింది. చంద్రుడు సరియైన స్థానంలో లేడు కాబట్టి ఆ రాత్రి ఆమె మగాడితో కలవడం కూడదని అతను చెప్పాడు.
“ఏం చేయాలో తెలియక డలోరిస్ వచ్చి నాకు అంతా చెప్పింది. పేద్రోతో పడుకునే ప్రశ్నే లేదని చెప్పింది. అది అమె శోభనం రాత్రి. నేనేమో ఆ మోసకారి, అబద్ధాలకోరు ఒజారియో మాటలు పట్టించుకోవద్దని నచ్చచెప్పచూశాను.
“ ‘నా వల్లకాదు.’ చెప్పిందామె. ‘నా బదులు నువ్వెళ్లు. అతనికి తెలియదులే!’
“ఆమె కంటే నేను చాలా చిన్నదాన్నే అనుకో! ఆమె అంత రంగు తక్కువా కాదు. అయినా చీకటిలో నీకు ఏం కనిపిస్తుంది?
“‘అది కుదిరేపని కాదు డలోరిస్, నువు వెళ్లక తప్పదు.’
“‘నాకీ ఒక్క సాయం చేయి. నీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను.’
“ఆ రోజుల్లో మీ అమ్మకు సిగ్గులొలికే చక్కటి కళ్లుండేవి. ఆమెను చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించేది ఆమె కళ్లే. అవి నిన్ను పూర్తిగా జయించేయగలవు.
“‘నా బదులు నువ్వెళ్ళు ‘ అని అడుగుతూనే ఉంది.
“అందుకని నేను వెళ్లాను.
“చీకటి కొంత ఊతమిచ్చింది, ఇంకొంత మరొకటి – మీ అమ్మకి తెలియనిది ఏమిటంటే పేద్రో పారమొ అంటే మీ అమ్మకొక్కదానికే కాదు ఇష్టం.
“అతని పక్కలో దూరాను. సంతోషంగా, ఇష్టంగానే. అతన్ని వాటేసుకుని పడుకున్నా. కానీ ఆ సంబరాల బడలికతో ఆ రాత్రంతా గుర్రుపెట్టి పడుకున్నాడు. నా కాళ్ల మధ్య తన కాళ్లు జొనపడం తప్ప ఏం చేయలేదతను.
“పొద్దు పొడిచేలోగానే లేచి డలోరిస్ దగ్గరకు వెళ్ళాను. ఆమెకి చెప్పాను ‘ఇప్పుడు నువ్వెళ్ళు. ఇది మలిరోజు కదా!’
” ‘ఏం చేశాడు నిన్ను?’ ఆమె నన్నడిగింది.
“’నాకింకా తెలియడం లేదు.’ చెప్పాను.
“మరుసటి ఏడు నువ్వు పుట్టావు కానీ మీ అమ్మను నేను కాదు, వెంట్రుక వాసిలో తప్పిపోయావు.
“మీ అమ్మ సిగ్గుపడిందేమో ఈ సంగతి నీకు చెప్పడానికి”
పచ్చటి మైదానాలు. వంపు తిరిగే రేఖల్లా కురుస్తున్న వానతో అలలవుతున్న మధ్యాహ్నం గోధుమ పొలాల్లో గాలి సుడి తిరుగుతుండగా దిగంతం లేస్తూ పడుతూ ఉంటే చూస్తూ. నేల రంగూ, అల్ఫాల్ఫా, రొట్టె వాసనా. తొణికిన తేనెల వాసనొచ్చే ఊరు…
“ఆమెకి పేద్రో పారమొ అంటే ఎప్పుడూ గిట్టేది కాదు. ‘డలోరిటస్! నాకు నాస్తా పెట్టమని వాళ్ళకి చెప్పావా?’ ప్రతి రోజూ తెల్లారకముందే లేచేది మీ అమ్మ. బొగ్గులు రాజేసేది, ఆ వాసనకి పిల్లులు లేచేవి. వెనకే పిల్లుల్నేసుకుని ఇల్లంతా అటూ ఇటూ తిరుగుతూ. ‘దోన డలోరిటస్!’
“ఆ పిలుపు ఎన్ని సార్లు విందో లెక్కలేదు. ‘దోన డలోరిటస్, ఇది ఆరిపోయింది. తీసెయ్!’ ఎన్ని సార్లు! గడ్డుకాలానికి అలవాటు పడి, ఆమె సిగ్గు పడే కళ్లు కుదురుకున్నాయి.
వేసవి వేడిమిలో నారింజ పూత వాసనలు కాక మరేదీ చవి చూడకపోవడం.
“అప్పుడు నిట్టూర్పులు విడవడం మొదలు పెట్టింది.
“’ఆ నిట్టూర్పులెందుకు డలోరిటస్?’
“ఒక మధ్యాహ్నం వాళ్ళతో వెళ్ళాను. పొలం మధ్యలో ఉన్నాం పిట్టలబారును చూస్తూ. రాబందు ఒకటి బద్ధకంగా ఆకాశంలో ముందుకీ వెనక్కీ ఎగురుతుంది.
“’ఎందుకు నిట్టూరుస్తున్నావు డలోరిటస్?’
“’నేనూ రాబందునయితే ఎగిరి మా అక్క దగ్గరికి వెళ్ళేదాన్ని.’
“’ఇక చాలించు దోన డలోరిటస్! సరే, మీ అక్కని చూస్తావు, ఇప్పుడే. మనమిప్పుడు ఇంటికి వెళదాం, నువు నీ పెట్టెలు సర్దుకో. ఇంక నావల్ల కాదు.’
“మీ అమ్మ వెళ్లిపోయింది. ‘నిన్ను త్వరలో చూస్తాను డాన్ పేద్రో!’
“’గుడ్ బై, డలోరిటస్!’
“ఆమె మళ్ళీ మెదియా లూనాకి తిరిగి రాలేదు. కొన్ని మాసాలయ్యాక పేద్రో పారమొని ఆమె గురించి అడిగాను.
“’ ఆమెకి నాకంటే వాళ్ళక్క అంటేనే ఇష్టం. అక్కడే హాయిగా ఉన్నట్టుంది. అదీ కాక ఆమె అంటేనే విసుగు పుడుతూ ఉండింది. ఆమెని తిరిగి రమ్మనే ఉద్దేశమేదీ లేదు నాకు – నువ్వడగాలనుకున్నది అదేగా?’
“’ఎట్లా గడుస్తుంది వాళ్లకి?’
“’ఆ దేవుణ్ణే చూసుకోనీ!’
..బదులు చెల్లించనీ, కొడుకా, ఇన్నేళ్ళూ మన పేరుగూడా తలవనందుకు.
“నువ్వు నన్ను చూడడానికి వస్తున్నావని ఆమె నాకు చెప్పిందాకా అంతే. ఆమె సంగతేమీ తెలియలేదు ఆ తర్వాత.
“చాలా జరిగింది ఆ తర్వాత.” ఎదువిజస్ కి చెప్పాను. “కొలీమ లో ఉండేవాళ్లం. మా పెద్దమ్మ హెర్త్రూడిస్ వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చింది కానీ మేము తనకెంత భారమో చెపుతూనే ఉండేది. మా అమ్మనెప్పుడూ అడిగేది ‘మీ ఆయన దగ్గరకెందుకు వెళ్లవు?’
” ‘తీసుకురమ్మని ఎవర్నయినా పంపాడా? నన్ను అడిగిందాకా వెళ్లను. నిన్ను చూడాలని వచ్చాను. నువ్వంటే ప్రేమ కనుక. అందుకు వచ్చాను.’
” ‘అది నాకు తెలుసు. కానీ నువ్వు వెళ్ళే సమయమొచ్చింది. ‘
“’అది నా చేతుల్లోనే ఉంటే….’”
ఎదువిజస్ నా మాటలు వింటుందనుకున్నాను. కానీ ఆమె ఎక్కడి మాటలో ఆలకిస్తున్నట్టు తల వంచి ఉండడం గమనించాను. అప్పుడామె అంది:
“ఇంకెప్పుడు శాంతి కలిగేను నీకు?”

నువు వెళ్లిపోయిన రోజే నాకు తెలుసు మళ్ళీ నువ్వెప్పటికీ కనపడవని. సంధ్య ఆకసాన్ని నెత్తుటితో నింపుతుంటే నీపై ఎరుపు మరకలు పడుతున్నాయి. నువు నవ్వుతున్నావు. నువు వదిలిపోతున్న ఆ ఊరి గురించి నువు తరచుగా అనేదానివి “నీ వల్లే ఇష్టపడ్డాను దీన్ని. మిగతాదంతా చీదర ఇక్కడ-ఇక్కడ పుట్టడం కూడా.” నాకనిపించింది – ఈమె తిరిగి రాదు; ఈమెని ఇక ఎప్పటికీ చూడబోను.
“ఈ వేళలో ఏం చేస్తున్నావిక్కడ? పని చేయడం లేదా?”
” లేదు నానమ్మా! రొహెలియో వాళ్ల చిన్నబ్బాయిని చూడమని చెప్పాడు. వీణ్ణి అటూ ఇటూ నడిపిస్తున్నాను. ఈ పిల్లాడూ, టెలిగ్రాఫూ – రెండు పనులూ చేయలేను. ఆయనేమో ఆ పూల్ రూంలో బీరు తాగుతూ కూచుంటాడు. ఇంతా చేసి మళ్ళీ నాకేమీ ఇవ్వడు.”
“సంపాదించడానిక్కాదు నువ్విక్కడుంది, నేర్చుకోవడానికి. ఒకసారి ఏదయినా నేర్చుకుంటే అప్పుడు ఏమనా డిమాండ్ చేయడానికన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వొక పని నేర్చుకునేవాడివి. ఒక రోజు నువ్వే యజమాని కావచ్చు. కానీ దానికి ఎంతో ఓపిక కావాలి, వినమ్రంగా ఉండాలి. వాళ్లు పిల్లాడిని నడిపించమంటే ఆ పని చేయి. వోపిగా ఉండడం నేర్చుకో!”
“ఇంకెవర్నయినా నేర్చుకోమను నాయనమ్మా వోపిగ్గా ఉండడం! నా వల్ల కాదు.”
“నువ్వూ నీ తలతిక్క ఆలోచనలూ! నీకు ముందు ముందు కష్టాలు తప్పవురా పేద్రో పారమొ!”

“ఇప్పుడు నేను విన్నదేమిటి దోన ఎదువిజస్?”
కలలోంచి మేలుకుంటున్నట్టు తల విదిలించిందామె.
“అది మిగెల్ పారమొ గుర్రం, మెదియా లూనాకి వెళ్ళే దారిలో దవుడు తీస్తూంది.”
“అయితే అక్కడ ఎవరయినా ఉంటున్నారా?”
“లేదు, ఎవరూ ఉండడం లేదు అక్కడ.”
“మరి?”
“అది అతని గుర్రమొక్కటే. వస్తూ పోతూంటుంది. అదీ, మిగెల్ ఎప్పుడూ విడిగా కనపడేవారు కాదు. ఊళ్ళ వెంటబడి తిరుగుతూ ఉంటుంది అతని కోసం చూస్తూ. ఈ వేళకి తిరిగి వస్తుంది. ఆ వెర్రి జీవి పశ్చాత్తాపంతో బతకలేకపోతుందేమో! జంతువులకీ తెలుస్తుంది కాదూ తాము ఏదయినా తప్పు చేస్తే?”
“నాకర్థం కావడం లేదు. గుర్రం చేసే చప్పుళ్ళేవీ వినపడలేదు నాకు.”
“లేదా?”
“లేదు.”
“అయితే నాకు అతీంద్రియ శక్తి ఉండి ఉండాలి. దేవుడిచ్చిన వరం – లేక శాపమో! నాకు తెలిసిందల్లా దాని మూలాన బాధలు పడటమే.”

Pedro_Páramo
కాసేపటి దాకా ఏమీ అనలేదు. మళ్ళీ చెప్పింది:
“అదంతా మిగెల్ పారమొతో మొదలయింది. అతను చనిపోయిన రాత్రి జరిగిందంతా నాకొక్కదానికే తెలుసు. అతని గుర్రం మెదియా లూనా వైపు దవుడు తీస్తున్న చప్పుడు వినపడేసరికి నేను పక్క ఎక్కాను. నాకు ఆశ్చర్యమేసింది, ఎందుకంటే మిగెల్ ఆ వేళకి ఎప్పుడూ వచ్చేవాడు కాదు. అతనొచ్చేసరికి ఎప్పుడూ వేకువజాము అయ్యేది. ప్రతి రాత్రీ అతను కాస్త దూరంలోనే ఉన్న కోంట్ల వెళ్ళేవాడు తన ప్రేయసి కోసం. తొందరగా వెళ్లి ఆలస్యంగా వచ్చేవాడు. కానీ ఆ రాత్రి అతను తిరిగి రాలేదు..నీకు వినిపిస్తుందా ఇప్పుడు? నీకు వినిపిస్తుందిలే! అది అతని గుర్రం; తిరిగి వస్తుంది.”
“నాకు ఏమీ వినపడటం లేదు.”
“అయితే అది నాకే వినిపిస్తుందేమో! సరే, నేను చెపుతున్నట్టు అతను రాకపోవడం కాదు అసలు కథ. అతని గుర్రం అటు వెళ్ళిందో లేదో ఎవరో నా కిటికీ తట్టడం వినిపించింది. నువ్వే చెప్పు అది నా భ్రమో కాదో! నాకు తెలిసిందల్లా ఎవరా అని చూడడానికి లేచి వెళ్లడమే. అది అతనే. మిగెల్ పారమొ. అతన్ని చూసినందుకు ఆశ్చర్యమేదీ కలగలేదు నాకు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి రాత్రీ నా ఇంట్లోనే గడిపేవాడు నాతో పడుకుని – అతని నెత్తురు తాగిన ఆ పిల్లని అతను కలిసిందాకా.
” ‘ఏమయింది?’ మిగెల్ పారమొని అడిగాను. ‘ఆ పిల్ల తన్ని తరిమేసిందా నిన్ను?’
“’లేదు, నన్నింకా ప్రేమిస్తూనే ఉంది.’ అతను చెప్పాడు. ‘సమస్య ఏమిటంటే ఆమె ఎక్కడుందో తెలియడం లేదు. ఆ ఊరికి వెళ్లడానికి దారి దొరకడం లేదు. అంతా పొగో, మంచో ఇంకేదో ఉంది. కోంట్ల ఇక అక్కడ లేదన్నది మాత్రం తెలుస్తుంది నాకు. అదెక్కడ ఉండాలో దాని మీదుగా వెళ్లాను కానీ అది కనపడలేదు. నువు అర్థం చేసుకుంటావని తెలుసు కనక నీకు చెప్పటానికి వచ్చాను. కోమలలో ఇంకెవరికయినా చెప్తే నన్ను పిచ్చాడని అంటారు – ఎప్పటిలానే.’
“’లేదు, పిచ్చి కాదు మిగెల్. నువు చచ్చిపోయి ఉండాలి. గుర్తుందా, ఆ గుర్రం వల్లే నీకు మూడుతుందని అనేవాళ్లంతా. గుర్తు చేసుకో మిగెల్. నువ్వేమన్నా పిచ్చి పని చేశావేమో కానీ, అది కాదు విషయమిప్పుడు..’
“’నేను చేసిందల్లా మా నాన్న కొత్తగా కట్టిన రాతి చుట్టుగోడ దూకించడమే. రోడ్డుమీదికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తుందని ఎల్ కొలొరాడోని దూకమన్నాను. దూకిన గుర్తుంది, తర్వాత స్వారి చేయడం కూడా. కానీ నీకు చెప్పినట్టు అంతా పొగ, పొగ, పొగ.’
“’రేపు పొద్దున మీ నాన్న దిగులుతో ఏమవుతాడో!.’ నేను అతనితో చెప్పాను. ’పాపం! ఇక వెళ్ళు ప్రశాంతంగా సేదదీరు మిగెల్. నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.’
“కిటికీ మూశాను. తెల్లారకముందే మెదియా లూనా నుంచి జీతగాడొకడు వచ్చి చెప్పాడు ‘పెద్దాయన నీకోసం అడుగుతున్నాడు. మిగెల్ చచ్చిపోయాడు. డాన్ పేద్రోకి తోడు కావాలి.’
“’నాకు ముందే తెలుసు.’ అతనికి చెప్పాను. ‘నీకు ఏడవమని చెప్పారా?’
“’అవును, నీకు చెప్పేప్పుడు ఏడవమని డాన్ ఫుల్గోర్ చెప్పాడు.’
“’సరే, నువు డాన్ పేద్రోకి చెప్పు నేనొస్తున్నానని. అతన్ని తీసుకొచ్చి ఎంతసేపయింది?’
“’అరగంట కూడా కావడం లేదు. అతన్ని చూసిన డాక్టర్ చనిపోయి చాలాసేపయిందని చెప్పాడు కానీ కొంచెం ముందయితే బతికి ఉండేవాడేమో! ఎల్ కొలొరాడో ఖాలీ జీనుతో వచ్చి ఎవర్నీ నిద్రపోనీయకుండా ఒకటే కదం తొక్కుతూంటే తెలిసింది మాకు. డాన్ పేద్రో కంటే గుర్రమే ఎక్కువ బాధపడుతుందనిపిస్తుంది, నీకు తెలుసుగా అదీ అతనూ ఒకర్నొకరు ఎంత ప్రేమగా చూసుకునేవారో! అది తినదు, నిద్రపోదు. కల్లం తిరుగుతూ ఉంది. లోలోపల అంతా విరగ్గొట్టి, నమిలేసినట్టు దానికి అనిపిస్తుందేమో!’
“’వెళ్ళేప్పుడు మర్చిపోకుండా తలుపు వేయి.’
“మెదియా లూనా జీతగాడు వెళ్ళిపోయాడు.”
“చచ్చిపోయినవాడి మూలుగు ఎప్పుడయినా విన్నావా?” ఆమె నన్నడిగింది.
“లేదు, ఎదువిజస్.”
“అదృష్టవంతుడివి.”

పేద్రో పారమొ-2

pedro1-1

“నేను ఎదువిజస్ ద్యాడని. రా లోపలికి.”

ఆమె నాకోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అంతా సిద్ధంగా ఉంది అని చెప్పి, నన్ను వెంట రమ్మని సైగ చేస్తూ వరసగా ఖాళీగా కనిపిస్తున్న చీకటి గదులగుండా తీసుకు వెళ్ళింది. కానీ అవి ఖాళీవి కాదు. ఆ చీకటికీ, వెన్నంటే వస్తున్న సన్నపాటి వెలుగుకీ అలవాటు పడ్డాక రెండు వైపులా కనిపించిన నీడలు చూశాక భారీ ఆకారాల మధ్య సన్నటి దారిగుండా వెళుతున్నట్లు తెలిసింది.
“ఏమిటివన్నీ?” అడిగాను.
“చిల్లరమల్లర సామాన్లు” ఆమె చెప్పింది. మా ఇంటి నిండా వాళ్ళూ వీళ్ళూ వదిలేసి వెళ్ళినవే. జనాలు వెళ్ళిపోతూ వాళ్ల వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకున్నారు కానీ తిరిగి తీసుకువెళ్ళడానికి ఒక్కరూ రాలేదు. నీకోసం అట్టిపెట్టిన గది ఈ వెనకాల ఉంది. ఎవరయినా వస్తారేమోనని శుభ్రం చేసి ఉంచుతాను. అయితే నువ్వు ఆమె కొడుకువా?”
“ఎవరి కొడుకుని?” నేను అడిగాను.
“డలొరీటాస్ వాళ్ళ అబ్బాయివి కాదూ?”
“అవును. కానీ నీకెలా తెలుసు?”
“నువ్వొస్తావని చెప్పిందామె. నిజానికి ఇవాళే చెప్పింది. ఈ రోజే నువ్వొస్తావని.”
“ఎవరు చెప్పారు నీకు? మా అమ్మా?”
“అవును. మీ అమ్మే.”
ఏమనుకోవాలో నాకు తెలియలేదు. ఏమనుకోవడానికీ నాకు సమయమీయలేదు ఎదువిజస్.
“ఇదే నీ గది,” చెప్పిందామె.
ఆ గదికి వేరే వాకిళ్ళేమీ లేవు మేమొచ్చింది తప్పించి. ఆమె కొవ్వొత్తి వెలిగించింది. గదంతా ఖాళీగా ఉన్నట్టు తెలిసింది.
“పడుకోవడానికి ఏమీ లేదు,” చెప్పాను.
“దాని సంగతి వదిలెయ్. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావు, అలసటకంటే మంచి పక్క ఉండదు. పొద్దున్నే నీకు మంచం ఏర్పాటు చేస్తాను. అన్నీ క్షణంలో ఏర్పాటు చేయగలనని అనుకుంటే ఎలా? కొంచెం ముందుగా చెప్పాలా? ఇంతకుముదు మీ అమ్మ చెప్పిందాకా నాకు కబురే లేకపోయె!”
“మా అమ్మా? మా అమ్మ చనిపోయింది.” చెప్పాను.
“ఓహో అందుకా ఆమె గొంతు అంత పీలగా వినిపిస్తూంది ఎంతో దూరం నుంచి వచ్చినట్టు! ఇప్పుడర్థమవుతూంది. ఇంతకీ ఎప్పుడు చనిపోయింది?”
“వారం క్రితం.”
“పాపం పిచ్చిది. నేనామెను వదిలేశాననుకుని ఉంటుంది. కలిసి చనిపోదామని ప్రమాణం చేసుకున్నాము. చేతిలో చేయి వేసుకుని చివరి ప్రయాణంలో ఏదయినా అవసరం పడినా లేక ఏదన్నా చిక్కు వచ్చిపడినా ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ. మేం ప్రాణస్నేహితులం. నాగురించి ఆమె చెప్పలేదా ఎప్పుడూ?”
“లేదు. అసల్లేదు.”

rulfo

హువాన్ రుల్ఫో

“వింతగా ఉంది. మేమప్పుడు చిన్నపిల్లలమనుకో. ఆమెకి అప్పుడే పెళ్ళయింది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమూ, ప్రేమా. ఆమె ఎంతో చక్కగా ఉండేది, ఆఁ.. ఎంత చూడ ముచ్చటగా ఉండేదంటే ఆమెను ప్రేమించే వారు చాలా సంతోషపడేంత. ఎవరయినా ఆమెను ప్రేమించాలని కోరుకుంటారు. అయితే నాకంటే ముందే పోయిందన్నమాట. సరే, తొందరలోనే ఆమెను అందుకుంటాలే. స్వర్గమెంత దూరమో నాకంటే ఎవరికీ తెలియదు. అడ్డదారులూ తెలుసు నాకు. కిటుకేమిటంటే దేవుడి దయవల్ల వాడు తలిచినప్పుడు కాకుండా నువు కావాలనుకున్నప్పుడు పోవడం. లేకపోతే నీకు రోజులు మూడకముందే తీసుకెళ్ళమని వాడిని బలవంతపెట్టడం. మనమేదో పాత నేస్తాలమయినట్టు ఇట్లా మాట్లాడుతున్నానేమిటాని అనుకోకు, నువు నా సొంతబిడ్డ లాంటి వాడివే. అవును, వేయి సార్లు చెప్పాను: ‘డలోరిస్ వాళ్ల అబ్బాయి నా కొడుకయి ఉండాల్సింది!’ అని. ఎందుకో ఇంకెప్పుడన్నా చెబుతా. నేనిప్పుడు చెప్పదలుచుకున్నదల్లా మీ అమ్మను పైకెళ్ళే దారిలో ఎక్కడో అందుకుంటాను.”
ఆమెకి తిక్కేమోనని అనుమానమేసింది. కానీ అప్పటికే నేనేమీ ఆలోచించడం లేదు. నేనేదో సుదూర లోకంలో ఉన్నట్టు అనిపించింది. ఆ ప్రవాహంలో నన్ను నేను కొట్టుకుపోనిచ్చాను. మరింత బలహీనమవుతున్న నా శరీరం పూర్తిగా లొంగిపోయింది; ముళ్ళన్నీ జారిపోయి ఎవరయినా బొమ్మలాగా పిండేయగలిగేట్టు.
“నేనలసిపోయాను” చెప్పాను.
“రా వచ్చి కాస్త తిని పడుకో. ఒక ముద్ద. ఉన్నదేదో అదే.”
“వస్తా. తర్వాత వస్తా.”

కప్పు మీద పెంకుల్నుంచి జారుతున్న వాన నీళ్ళు పంచలోని ఇసుకలో గుంటలు చేస్తున్నాయి.

చుక్! చుక్! మళ్ళీ ఇంకో చుక్!

ఇటుకల మధ్య చిక్కుకుని గాలికి ఊగుతూ నృత్యం చేస్తున్న లారెల్ ఆకు మీద నీటి చుక్కలు పడుతుంటే. తుఫాను వెలిసింది. ఉండుండి వీస్తున్న పిల్లగాలి దానిమ్మ చెట్టు కొమ్మల్ని ఊపి మెరిసే చుక్కలని కింద చిమ్ముతూంది. అవి నేలలోకి ఇంకుతూ కాంతిని కోల్పోతున్నాయి. ఇంకా గూళ్ళలో ముడుచుకుని ఉన్న కోళ్ళు ఒక్కసారిగా రెక్కలు విసురుకుంటూ పంచలోకి వచ్చాయి తలలూపుకుంటూ వానకి బయటపడ్డ పురుగుల్ని ఏరుకుతింటూ. మబ్బులు చెదురుతుంటే సూర్యుడూ బయటికిచ్చాడు రాళ్ళ మీద మెరుస్తూ, కాంతి వలయాల్ని పరుస్తూ, నేలనుంచి నీటిని పీలుస్తూ, పిల్లగాలికి ఊగే ఆకులపై మెరుస్తూ.
“అంతసేపు ఏం చేస్తున్నావురా దొడ్లో?”
“ఏం లేదమ్మా!”
“అట్లాగే కూచో! పామొచ్చి పీకుతుంది!”
“సరేనమ్మా!”
నీ గురించే ఆలోచిస్తున్నా సుజానా. పచ్చటి కొండల గురించీ. గాలులు వీచే కాలంలో మనం ఎగరేసిన గాలిపటాల గురించీ. కింద ఊరినుంచి జనసందోహపు చప్పుళ్ళు వినిపించేవి; మనం ఎక్కడో కొండ మీద గాలికి అనువుగా దారం వదులుతూ. “సాయం చేయి సుజానా!” మెత్తటి చేతులు నా చేతులపై బిగుసుకుంటూ. “ఇంకొంచెం దారం వదులు.”
గాలి మనల్ని నవ్వించింది; గాలికి మన చేతివేళ్ళ మధ్యనుండి జారిపోతున్న దారం వెంబడి మన కళ్ళు పరుగెత్తి చివరికి చిటుక్కున తెగి ఏ పిట్ట రెక్కలకో తగులుకున్నట్టు. ఆ కాగితపు పిట్ట దాని తోక వెంబడే అంతెత్తునుండి గిరికీలు కొట్టుకుంటూ, మొగ్గలు వేస్తూ పచ్చటి నేలలోకి మాయమవుతుంది.
నీ పెదాలు తడిగా ఉన్నాయి మంచు ముద్దు పెట్టుకున్నట్టు.
“ఒరేయ్, నీకు చెప్పానా ఆ దొడ్లోంచి బయటికి రమ్మని!”
“సరేనమ్మా! వస్తున్నాను.”
నీగురించి ఆలోచిస్తున్నాను. నీ నీలాల కళ్ళతో నువు నన్నే చూస్తున్న సమయాల గురించి.
అతను తల పైకెత్తి వాకిట్లో వాళ్ళమ్మను చూశాడు.
“ఇంతసేపు ఏమిటి లోపల? ఏం చేస్తున్నావక్కడ?”
“ఆలోచిస్తున్నాను.”
“ఇక్కడే కుదిరిందా? దొడ్లో ఇంతసేపు ఉండటం మంచిది కాదు. ఇంకా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయాయె. పోయి మొక్కజొన్నలు వొలవడానికి మీ నాయనమ్మకు సాయం చేయొచ్చుగా?”
“వెళ్తున్నానమ్మా. వెళుతున్నా.”

 

“నాయనమ్మా! జొన్నలు వొలవడానికి నీకు తోడొచ్చా.”

“ఆ పని అయిందిలే గానీ ఇంకా చాకొలేట్ నూరాలి.ఎక్కడికి పోయావు నువ్వు? గాలివాన వచ్చినప్పుడు నీకోసం వెతికాము.”
“నేను వెనక పంచలో ఉన్నా.”
“అక్కడేం చేస్తున్నావు? జపం చేస్తున్నావా?”
“లేదు నాయనమ్మా. ఊరికే వానని చూస్తున్నా.”
అతని నాయనమ్మ సగం పసుపూ, సగం బూడిద రంగులో ఉన్న కళ్ళతో అతని వంక చూసింది చదివేయగలిగినట్టు.
“సరే, పోయి మిల్లు శుభ్రం చేయి.”
మబ్బులపై వందల అడుగుల ఎత్తున, అన్నిటికీ ఎంతెంతో ఎత్తున నువు దాగున్నావు సుజానా. బ్రహ్మాండం ఆవల, ఏ దైవ కటాక్షం వెనకో దాగున్నావు. నేను తాకలేని, చూడలేని చోట, నా మాటైనా నీదరికి చేరని చోట.
“మిల్లు పనికిరాదు నాయనమ్మా. గ్రైండరు పగిలిపోయింది”
” ఆ మికయేలా మళ్ళీ అందులో జొన్నలేసినట్టుంది. ఎన్ని సార్లు చెప్పినా దాని అలవాటు మానిపించలేము. ఇప్పుడింకేం చేస్తాం!.”
“కొత్తది కొనొచ్చుగా? ఇది ఎటూ పాతబడి అరిగిపోయిందిగదా!”
“నిజమే. మీతాత ఖననానికయిన ఖర్చుతోటీ, చర్చికి డబ్బులు కట్టాల్సివచ్చీ చేతిలో పైసా లేదు. సరేలే, ఏదో ఒకటి మానుకుని అన్నా కొత్తది కొందాంలే. నువు ఆ దోన ఈనెస్ వీయల్పాండో దగ్గరికి పోయి అక్టోబర్ దాకా ఖాతా పెట్టుకోమని చెప్పు. కోతలయ్యాక చెల్లు వేద్దాం.”
“సరే నాయనమ్మా.”
“ఎటూ పోతున్నావుగా, పనిలో పని జల్లెడా, కత్తెరా అరువు తీసుకురా. గడ్డి ఆవజాన పెరిగిపోతూ ఉంది. వదిలేస్తే మన వొంటిమీదికి కూడా పాకుతుంది. ఆ పాత పెద్ద ఇల్లయితే ఏమీ అనకపోదును. ఈ ఇంటికి మారినప్పుడు మీతాత చూసుకున్నాడదంతా. అంతా ఆ దేవుడి లీల. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? దోన ఈనెస్ కి చెప్పు కోతలు కాగానే బాకీ అంతా తీరుస్తామని.”
“సరే నాయనమ్మా.”
హమ్మింగ్ పిట్టలు. వాటి కాలమిది. విరగబూసిన మల్లె పొదలో వాటి రెక్కల చప్పుడు విన్నాడతను.
పవిత్ర హృదయం బొమ్మ పెట్టిన అలమరదగ్గర ఆగి చూస్తే ఇరవై నాలుగు సెంటావోలు కనిపించాయి. నాలుగు సెంటావోలు వదిలేసి ఒక వెయింటె తీసుకున్నాడు.
అతను వెళ్ళబోతుంటే అతని తల్లి ఆపింది.
“ఎక్కడికి వెళుతున్నావు?”
“దోన ఈనెస్ వీయల్పాండో వాళ్ల ఇంటికి, కొత్త మిల్లు కొనడానికి. మనది పాడయిపోయింది.”
“ఒక మీటర్ సిల్క్ గుడ్డ పట్టుకురా, ఇట్లాంటిది,” అని ఒక ముక్క ఇచ్చింది. “మన ఖాతాలో రాసుకోమను.”
“సరేనమ్మా.”
“వచ్చేప్పుడు నాకు యాస్పిరిన్ తీసుకురా. హాల్లో పూలకుండీలో డబ్బులుంటాయి చూడు.”
అతనికి ఒక పేసో కనిపించింది. వెయింటె వదిలేసి పెద్ద నాణెం తీసుకున్నాడు. “ఇప్పుడు ఏదయినా కనిపిస్తే సరిపోయేంత డబ్బుంది” అనుకున్నాడు.
“పేద్రో,” జనాలు పిలిచారతన్ని. “వోయ్ పేద్రో!”
అతను వినిపించుకోలేదు. అతను చాలా చాలా దూరం వెళ్ళిపోయాడు.

 

రాత్రి మళ్ళీ వాన మొదలయింది.

చాలాసేపు అతను జలజల పారే వాన నీటి శబ్దం వింటూ పడుకున్నాడు. ఎప్పుడో నిద్రపట్టి ఉండాలి. లేచేప్పటికి అతనికి చప్పుడులేని జల్లు పడటమే వినిపించింది.
కిటికీ అద్దాలపైన పొగమంచు అలుముకుని వానచినుకులు కన్నీటి దారం కడుతూ జారుతున్నాయి….మెరుపు కాంతిలో వెలుగుతున్న ఆ ధారల్ని చూచాను. ప్రతి నిశ్వాసమూ నిట్టూర్పు అవుతూంది. ప్రతి ఆలోచనా నీగురించే కలుగుతుంది, సుజానా.
వాన గాలిగా మారింది. అతనికి వినిపిస్తూంది “..పాపాలకు క్షమాపణా, దేహానికి పునరుథ్థానం. తథాస్తు.” అది ఇంటి లోలోపల ఆడవాళ్ళు జపమాల చివరి పూసను లెక్కిస్తున్న చోట. వాళ్ళు పూజలనించి లేచారు, కోళ్ళను గూళ్ళలో పెట్టారు, తలుపులకు గొళ్ళెలు పెట్టారు, దీపాలార్పారు.
ఇప్పుడు రాత్రి వెలుగు మాత్రమే ఉంది. వాన కీచురాళ్ళ సొదలా బుస పెడుతూ ఉంది.
“నువ్వొచ్చి జపమాల పట్టుకుని కూచోలేదు ఎందుకని? మీ తాత కోసం నొవేనా (ప్రత్యేక ప్రార్థన) చేస్తున్నాము.”
చేతిలో కొవ్వొత్తి పట్టుకుని వాకిట్లో వాళ్ళమ్మ నిలుచుని ఉంది. ఆమె పొడవాటి వంకరటింకర నీడ కప్పుమీదికి పాకుతూంది. పైన వాసాలు దాన్ని తెగగొడుతూ ఉన్నాయి.
“నాకు దిగులుగా ఉంది.” చెప్పాడు.
ఆమె అటు తిరిగింది. కొవ్వొత్తిని మలిపింది. తలుపు మూస్తూనే ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలయింది. వాన చప్పుడుతో కలిసిన దాన్ని అతను చాలాసేపు వింటూ ఉండిపోయాడు.
చర్చి గంట గంటలు కొట్టింది, గంట తర్వాత గంట, గంట తర్వాత గంటా, కాలం కుంచించుకుపోతున్నట్టుగా.

 

“అవునవును. నేను నీ తల్లిని కావడం కొద్దిలో తప్పిపోయింది. ఆమె దాని గురించి నీకు ఏమీ చెప్పలేదా?”

“లేదు, ఆమె నాకన్నీ మంచి కబుర్లే చెప్పింది. నీ గురించి నేను కంచర గాడిదలతని ద్వారా వినడమే. నాకిక్కడికి దారి తనే చూపించించాడు. అబుందియో అతని పేరు.”
“మంచివాడే ఆ అబుందియో. అయితే అతనికి నేనింకా గుర్తున్నానన్న మాట. మా ఇంటికి పంపిన ప్రతి గిరాకీకి ఏదో కొంచెం ఇచ్చేదాన్ని. ఇద్దరికీ బేరం బాగా కుదిరింది. ఇప్పుడు తలుచుకుంటే బాధే కానీ, రోజులు మారిపోయాయి. ఊరు పాడయినకాడి నుంచీ కబురు తెచ్చేవారే లేరు. అయితే అతను చెప్పాడా నీకు నా దగ్గరికి పొమ్మని?”
“అవును, నీకోసం చూడమని చెప్పాడు.”
“దానికి అతనికెప్పుడూ ఋణపడి ఉంటాను. అతను మంచివాడు, నమ్మకస్తుడు. అతనే ఊళ్ళోకి తపాలా తెస్తుండేవాడు, చెవిటి వాడయ్యాక కూడా. అది జరిగిన పాడు రోజు నాకింకా గుర్తుంది. అందరికీ అతనంటే ఇష్టం కనక అందరూ బాధపడ్డారు. మాకు ఉత్తరాలు తెచ్చి ఇచ్చి మావి తీసుకుపోయేవాడు. అవతలి ప్రపంచంలో ఏం జరుగుతుందో మాకు ఎప్పుడూ చెపుతూండేవాడు, తప్పకుండా వాళ్ళకి మేమెట్లా ఉన్నామో చెపుతూ ఉండే ఉండాలి. వొట్టి కబుర్ల పోగు. ఆ తర్వాత మాత్రం కాదులే. అప్పుడు మాట్లాడడమే మానేశాడు. అతను వినని మాటలూ, గాలిలో ఆవిరయ్యే మాటలూ, రుచి తగలని మాటలూ చెప్పేం లాభమనేవాడు.నీటి పాముల్ని బెదరగొట్టడానికి మేము వదిలిన రాకెట్ అతని తలకి మరీ దగ్గరగా పోయినప్పుడు జరిగిందదంతా. మాట పడిపోకపోయినా ఆ రోజు నుంచీ అతను నోరు విప్పలేదు. ఒక్కమాట మాత్రం చెప్పుకోవాలి, అందుమూలాన అతను చెడ్డవాడయిందేమీ లేదు.”
“నేను మాట్లాడినతనికి బాగానే వినిపిస్తుంది”
“అయితే అతనయి ఉండడు. అదీకాక, అబుందియో చనిపోయాడు. చచ్చిపోయాడనే నా నమ్మకం. అర్థమయిందా, అందువల్ల అది అతనయి ఉండడు.”
“నువు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు.”
“సరే, ఇక మీ అమ్మ సంగతికొస్తే ఇందాక చెపుతున్నట్టు….”
ఆ నస వింటూ, నా ముందున్న ఆమెని పరిశీలించాను. జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసినట్లుంది. మొహం పారదర్శకంగా నెత్తురంతా తోడేసినట్టూ, చేతులు ముడుచుకుపోయి ముడతలుపడీ ఉన్నాయి. కళ్ళు లోపలికిపోయి కనపడటమే లేదు. ఆమె కుచ్చులు పెట్టిన పాతకాలపు తెల్ల డ్రస్ వేసుకుని మెడలో దారానికి “పాపులకు రక్ష” అని రాసున్న మరియా సంతీసిమా పతకం ధరించి ఉంది.

(సశేషం)

(మళ్ళీ వచ్చే గురువారం)

కొత్త అనువాద నవల ప్రారంభం: పేద్రో పారమొ-1

pedro1-1

పేద్రో పారమొ అనే పేరుగల మా నాన్న ఇక్కడ ఉన్నాడని చెప్పబట్టే ఈ కోమలాకి వచ్చాను. చెప్పింది మా అమ్మే. ఆమె చనిపోయాక వెళ్ళి ఆయన్ని కలుస్తానని మాట ఇచ్చాను. తప్పకుండా వెళతానంటూ అందుకు సూచనగా ఆమె చేతుల్ని గట్టిగా నొక్కాను కూడా. ఆమె చావుకు చేరువలో ఉంది; ఆమెకి ఏ మాట అయినా ఇచ్చి ఉండే వాణ్ణి. “ఆయన్ని కలవకుండా ఉండొద్దు” గట్టిగా చెప్పిందామె “ఆయన్ని కొంతమంది ఒకటంటారు. మరికొంతమంది మరొకటి. ఆయనకీ నిన్ను చూడాలని తప్పకుండా ఉంటుంది.” అప్పుడు నేను చేయగలిగిందల్లా ఆమె చెప్పినట్టు చేస్తానని చెప్పడమే. అదే వాగ్దానాన్ని తరచుగా చేసీ చేసీ, బిగిసిన ఆమె గుప్పిటనుంచి నా చేతుల్ని విడిపించుకున్నాకా అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండిపోయాను.
అంతకుముందు ఆమె చెప్పింది:
“ఆయన్ని ఏమీ అడక్కు. నీకేం రావాలో అంతవరకే. నీకివ్వాల్సి ఉండీ నీకు ఇవ్వనిది.. బదులు చెల్లించనీ నాయనా, ఇన్నేళ్ళూ మన పేరుగూడా తలవనందుకు.”
“అలాగే అమ్మా!”
నా మాట నిలుపుకునే ఉద్దేశం లేదు నాకు. కానీ నేను గమనించేలోపే నా బుర్ర కలల్లో తేలడమూ, ఊహలకు రెక్కలు రావడమూ మొదలయింది. నా తల్లికి భర్త అయిన పేద్రో పారమొ అనే వ్యక్తి కేంద్రంగా పెరిగిన ఆశ చుట్టూ కొద్దికొద్దిగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకోసాగాను. అందుకే కోమలాకి రావలసి వచ్చింది.

గస్టు గాలులు వేడిగా సపొనారియా పూల కుళ్ళు కంపుతో విషపూరితమై వీచే వేసవి కాలపు రోజులు.
దారంతా ఎగుడు దిగుడు. ఎగుడా దిగుడా అన్నది నువ్వు వస్తున్నావా పోతున్నావా అన్న దాని బట్టి ఉంటుంది. వెళ్ళేప్పుడు ఎగుడు, వచ్చేప్పుడు దిగుడు.
“ఆ దిగువన కనిపించే ఊరును ఏమంటారన్నావూ?”
“కోమలా అయ్యా!”
“కచ్చితంగా తెలుసా నీకది కోమలాయేనని?”
“బాగా తెలుసయ్యా!”
“అంత దీనంగా ఉంది, ఏమయింది దానికి?”
“రోజులట్లాగున్నాయయ్యా!”

మా అమ్మ జ్ఞాపకాలకు చెందిన ఊరిని చూడబోతున్నానని తెలుసు నాకు. నిట్టూర్పులతో నిండిన జ్ఞాపకాలు. ఆమె జీవితమంతా కోమలా గురించీ, అక్కడికి తిరిగి వెళ్ళటం గురించీ తలపోస్తూ నిట్టూరుస్తూ గడిపింది. అయితే ఆమె వెళ్లలేకపోయింది. ఇప్పుడు ఆమె స్థానంలో నేను వచ్చాను. నేను ఆమె కళ్లతో, ఆమె చూసినట్లుగా చూస్తున్నాను. చూడడానికి తన కళ్లను ఆమె నాకిచ్చింది. లాస్ కొలిమోట్స్ గేటు దాటగానే మొక్కజొన్న పసుపు అంచుతో అందమైన ఆకుపచ్చని మైదానం కనిపిస్తుంది. అక్కడినుంచి కోమలా కనిపిస్తుంది, నేలను తెల్లబరుస్తూ, రాత్రి దాన్ని వెలిగిస్తూ. ఆమె గొంతు రహస్యం చెపుతున్నట్టుగా, తనలో తను మాట్లాడుకుంటున్నట్టూ…అమ్మ.
“అడుగుతున్నానని అనుకోవద్దు గానీ ఇంతకీ మీరు కోమలా ఎందుకు వెళుతున్నట్టు?” ఆ మనిషి ప్రశ్నించడం వినిపించింది.
“నా తండ్రిని చూడడానికి వచ్చాను” జవాబిచ్చాను.
“ఊఁ” అన్నాడు.
మళ్లీ నిశ్శబ్దం.
కంచరగాడిదల గిట్టల చప్పుడుకు అనుగుణంగా నడుస్తూ గుట్ట దిగుతున్నాము. ఆగస్టు వేడికి వాటి నిద్రకళ్ళు ఉబ్బి ఉన్నాయి.
“మీకు మంచి మర్యాదలు జరుగుతాయిలే” మళ్లీ నా పక్కన నడుస్తున్న మనిషి గొంతు వినిపించింది. “ఇటువైపు ఇన్నేళ్ళుగా ఎవరూ రాలేదు. ఇప్పుడయినా ఒకరిని చూసి సంతోషిస్తారు”
కాసేపయ్యాక పొడిగించాడు: “మీరెవరయితేనేం గానీ, మిమ్మల్ని చూసి సంతోషిస్తారు”
తళతళలాడే సూర్యకాంతిలో మైదానమంతా బూడిదరంగు దిగంతాల్ని కప్పిన పొగమంచును కరిగిస్తున్న పారదర్శక కాసారంలా ఉంది.అంతకంటే దూరంగా పర్వతశ్రేణులు. ఇంకా దూరంగా నిస్త్రాణమైన ఒంటరితనం.
“మీరేమీ అనుకోకపోతే, మీ నాయన ఎలాఉంటారు?”
“నేనెప్పుడూ చూడలేదు” అతనికి చెప్పాను. “ఆయన పేరు పేద్రో పారమొ అన్నదే నాకు తెలిసింది.”
“ఊఁ అట్లాగా?”
“అవును. కనీసం నాకు చెప్పిన పేరు అదీ!”
మళ్లీ ఆ కంచరగాడిదలు తోలేవాడి గొంతునుంచి ఇంకో “ఊఁ”.
లాస్ ఎన్క్వెంట్రోస్ కూడలి దగ్గర కలిశాడితను. అక్కడ ఎదురు చూస్తూ ఉంటే చిట్టచివరికి ఇతను కనిపించాడు.
“ఎక్కడికి వెళుతున్నావు?” నేనడిగాను.
“ఆ దిగువకు పోతున్నానయ్యా!”
“నీకు కోమలా అనే ఊరు తెలుసా?”
“అటువైపే నేను పోతుంది!”
అతని వెంటబడి పోయాను. అతనితో కలిసి నడవాలని ప్రయత్నిస్తూ వెనకపడినప్పుడల్లా నేను వెనకే వస్తున్నట్టు గుర్తొచ్చినట్టు కొంచెం నెమ్మదిగా నడిచాడు. ఆ తర్వాత మేం పక్కపక్కనే మా భుజాలు దాదాపు తాకేంత దగ్గరగా నడిచాము.
“పేద్రో పారమొ నాతండ్రి కూడా” అన్నాడతను.
పైన శూన్యాకాశంలో కాకుల గుంపు ఒకటి కావు కావుమంటూ పోయింది.
ఎగుడు దిగుడుగా ఉన్నా మొత్తానికి దిగుతూనే ఉన్న బాట వెంట నడిచాము. వేడిగాలిని వెనకే వదిలేసి, గాలిలేని అచ్చమైన వేడిలోకి దిగుతున్నాము. ఆ నిశ్చలత్వం దేనికోసమో ఎదురుచూస్తున్నట్లుంది.
“ఇక్కడ వేడిగా ఉంది” నేనన్నాను.
“నీకనిపిస్తుందేమో. ఇది పెద్ద లెక్కలోది కాదు” నా తోటిమనిషి అన్నాడు.”తేలిగ్గా తీసుకో. మనం కోమలా కి వెళ్ళేసరికి నీకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఆ ఊరు బొగ్గుల కుంపటి మీద నరకం వాకిలి దగ్గర ఉన్నట్టు ఉంటుంది. ఊరి జనం చచ్చి నరకానికి వెళ్ళినప్పుడు దుప్పటి కోసం తిరిగి వస్తారని చెప్పుకుంటారు.”
“పేద్రో పారమొ తెలుసా నీకు?” అడిగాను.
అతని కళ్లలో మినుకుమనే స్నేహభావం చూసి అడగొచ్చనిపించింది.
“ఎవరాయన?”
“మనిషి జన్మెత్తిన రాక్షసుడు” చెప్పాడతను.
కారణం లేకుండానే దిగుడుబాట వెంట చాలా ముందుగా వెడుతున్న గాడిదల్ని కర్ర ఊపుతూ అదిలించాడు.
నా జేబులో ఉన్న మా అమ్మ ఫొటో నా గుండెకి వేడిగా తగులుతుంది ఆమెకు చెమట్లు పోస్తునట్టు. అది అంచులు నలిగిన పాత ఫొటో. అదొక్కటే నాకు తెలిసి ఆమె ఫొటో. వంటగదిలో ఎండిన నిమ్మతొక్కా, చాస్టియా మొగ్గలూ, సదాప రెమ్మలూ ఉన్న మట్టి పాత్రలో దొరికింది నాకది. అప్పటి నుంచీ అది నాతోనే ఉంది. నాకున్నదల్లా అదే. మా అమ్మకి ఫొటో తీయించుకోవడం అసలు ఇష్టం లేదు. అది చేతబడి కోసం వాడతారని చెప్పేది. అది నిజమేననిపిస్తుంది ఫొటో అంతా సూదులతో గుచ్చిన గుర్తులూ, గుండె దగ్గర మధ్యవేలు పట్టేంత రంధ్రమూ చూస్తుంటే.
మా నాన్న నన్ను గుర్తు పట్టేందుకు ఆ ఫొటో నాతోపాటు తెచ్చాను.
“అటు చూడు” గాడిదల కాపరి చెప్పాడు ఆగిపోయి. “ఆ గుండ్రంగా పంది పొట్టలా కనిపిస్తున్న గుట్ట చూశావా? మెదియా లూనా దాని వెనకే ఉంటుంది. ఇప్పుడు ఇటు తిరుగు. ఆ కొండ కొమ్ము చూడు. సరిగ్గా చూడు. మళ్ళీ ఈవంక చూడు. ఆ కొస కనిపిస్తుందా? అట్లా అదుగో దూరంగా కనపడీ కనపడకుండా? అదుగో ఆ అల్లదంతా మెదియా లూనా. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. కనుచూపుమేరా అంటారే అంత దాకా. ఆ భూమంతా ఆయనదే. మనం పేద్రో పారమొ కొడుకులమే గానీ మన అమ్మలు మనల్ని చింకి చాపలమీదే కన్నారు. ఇంకా పెద్ద తమాషా ఏమిటంటే ఆయనే మమ్మల్ని బాప్టిజం చేయడానికి తీసుకెళ్ళాడు. నీకు కూడా అంతేనా?”
“నాకు గుర్తు లేదు”
“నీ మొహం లే!”
“ఏమన్నావు?”
“దగ్గరకి వచ్చేశాం అని చెపుతున్నానయ్యా!”
“అవును. నాకు కనిపిస్తుంది.. ఏమయ్యుంటుంది?”
“కరెకామినోస్ అయ్యా! ఆ పిట్టల్ని ఆ పేరుతో పిలుస్తారిక్కడ.”
“అది కాదు. ఊరికి ఈ గతి ఎందుకు పట్టిందా అని ఆలోచిస్తున్నాను. జనసంచారం లేకుండా, అంతా ఎటో వెళ్ళిపోయినట్లు. అసలు ఎవరూ ఉంటున్నట్లే లేదిక్కడ.”
“ఉంటున్నట్లు లేకపోవడం కాదు, ఎవరూ ఉండరిక్కడ”
“మరి పేద్రో పారమొ?”
“పేద్రో పారమొ పోయి ఏళ్ళవుతూంది”

xinmortal-del-bronce.jpg.pagespeed.ic.9TAvf_tMeK

ప్రతి చిన్న ఊళ్ళో పిల్లలు ఆడుకోవడానికివీధుల్లోకి చేరి సాయంత్రాల్ని వాళ్ళ కేకలతో నింపే సమయం. ముదురు గోడలు లేత పసుపు ఎండని ప్రతిఫలించే సమయం.
కనీసం నేను నిన్న సాయంత్రం ఈ సమయానికి సయులాలో చూసింది అదీ. రెక్కలు టపటపలాడించుకుంటూ ఈ దినం నుంచి తప్పించుకుంటున్నట్టు ఎగిరిపోయే పావురాలు భగ్నం చేసిన కదలని గాలిని చూశాను. అవి ఒక్కసారిగా పైకి లేచి ఇళ్ళ కప్పుల మీద వాలిపోయాయి. పిల్లల కేకలు సుడి తిరుగుతూ పైకి లేచి సందె ఆకాశపు నీలంగా మారిపోయాయి.
ఇప్పుడు ఈ సద్దు మణిగిన ఊళ్ళో ఉన్నాను. కింద పరిచిన రాతిపలకల మీద నా అడుగుల చప్పుడు వినిపిస్తూంది. బోలు అడుగులు కుంకే పొద్దులో ఎర్రబారిన గోడల వల్ల ప్రతిధ్వనిస్తూ.

చూస్తే ఆ సమయానికి మెయిన్ రోడ్ మీద నడుస్తున్నాను. వదిలేసిన ఇళ్ళూ, అడ్డు లేకుండా పెరిగిన గడ్డి కప్పిన వాకిళ్ళూ తప్ప ఏమీ లేవు. వాటిని ఏమని పిలుస్తారని చెప్పాడతను? “గోబర్నడోర అయ్యా! క్రియోసోట్ పొదలు. బయటికి వెళితే నిమిషంలో ఇల్లంతా మహమ్మారిలా ఆక్రమిస్తుంది. చూస్తావుగా!”

ఒక వీధి మలుపు తిరుగుతుండగా ఒక స్త్రీ శాలువా కప్పుకుని కనిపించింది; అంతలోనే మాయమయింది. తలుపుల్లేని ఇళ్ళలోకి తొంగి చూస్తూ ముందుకు నడిచాను. మళ్ళీ ఆ శాలువా కప్పుకున్న ఆమె నాకెదురుగా వచ్చింది.
ఆమె పలకరించింది.
ఆమె వంక చూశాను. “దోన (మేడం) ఎదువిజస్ వాళ్ళ ఇల్లెక్కడ?” అరిచాను.
ఆమె చేయెత్తి చూపించింది. “అదుగో ఆ వంతెన పక్క ఇల్లు”
ఆమె గొంతులో మానవ స్వరమే పలుకుతున్నట్టూ, నోటినిండా పళ్ళూ, మాట్లాడుతున్నప్పుడు కదిలే నాలుకా, ఈ భూమి మీద నివసించే మనుషులకున్న కళ్ల లాంటి కళ్ళూ గమనించాను.
అప్పటికి చీకటి పడిపోయింది.
సెలవని చెప్పడానికి వెనక్కి తిరిగింది వెళుతూ. ఆడుకునే పిల్లలూ, పావురాలూ, కప్పుల మీద నీలపు రంగు పెంకులూ లేకపోయినప్పటికీ ఈ ఊరు బతికిఉన్నట్టు అనిపించింది. నిశ్శబ్దమే చెవులపడుతున్నదంటే, అందుకు కారణం ఇంకా నాకు నిశ్శబ్దం అలవాటు కాలేదన్న మాట. బహుశా నా బుర్రంతా శబ్దాలతోనూ, గొంతులతోనూ నిండి ఉండటం వలనేమో.
అవును, గొంతులు. ఇక్కడ, గాలి ఆరుదయిన చోట, అవి నాకు బలంగా వినిపిస్తున్నాయి. అవి నాలో బరువుగా నిండి ఉన్నాయి. మా అమ్మ చెప్పింది గుర్తుంది: “అక్కడ నీకు బాగా వినిపిస్తుంది. నేను నీకు ఇంకా దగ్గరగా ఉంటాను. నా జ్ఞాపకాల గొంతు నా చావు గొంతుకంటే బలంగా వినిపిస్తుంది, చావుకు గొంతు అంటూ ఉంటే” అమ్మ.. బతికి ఉన్నట్టే.
ఆమె ఇక్కడ ఉండి ఉంటే బావుండేది; “ఆ ఇంటి గురించి పొరబాటు పడ్డావు. నువ్వు చెప్పిన చోటు తప్పు. దిక్కూ దివాణం లేని ఊరికి పంపావు. బతికిలేని వాళ్ల కోసం వెతకడానికి” అని ఆమెతో చెప్పడానికి.
నది చేస్తున్న చప్పుడును అనుసరించి వంతెన పక్కనున్న ఇల్లు కనుక్కోగలిగాను. తలుపు కొట్టడానికి చేయెత్తాను కానీ అక్కడేమీ లేదు. గాలి తలుపును బద్దలు కొట్టినట్టు నా చేతికి శూన్యం తగిలింది. ఒకావిడ అక్కడ నిలుచుని ఉంది. ఆమె “లోపలికి రా” అంది. నేను లోపలికి వెళ్ళాను.

ట్లా నేను కోమలాలో ఆగిపోయాను. గాడిదలతో వచ్చినతను తన దారిన వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు చెప్పాడు:

“నేనింకా చాలా దూరం వెళ్ళాలి. అదుగో వరసగా కొండలు కనిపిస్తున్నాయే వాటవతలికి. నా ఇల్లుందక్కడ. నీకు రావాలని ఉంటే సంతోషం. ఇప్పటికి నీకు ఇక్కడ ఉండాలనిపిస్తే ఉండు. ఇక్కడొక చుట్టు తిరిగివస్తే పోయేదేమీ లేదు, ఇంకా బతికి ఉన్న వాళ్ళెవరయినా తగలొచ్చు.”
నేనుండిపోయాను. నేనొచ్చిందే అందుకు.
“ఉండటానికి చోటెక్కడ దొరుకుతుంది?” దాదాపు అరుస్తూ అడిగాను.
“ఎదువిజస్ కోసం చూడు, ఇంకా ఆమె బతికిఉంటే. నేను పంపానని చెప్పు”
“నీ పేరేమిటి?”
“అబుందియో” బదులిచ్చాడు అతను. అతని ఇంటి పేరు వినపడనంత దూరం వెళ్ళిపోయాడు అప్పటికే.

(వచ్చే వారం…)

అనువాదం: చందూ

వచ్చే గురువారం నుంచి: మాంత్రిక వాస్తవికతకి పునాది వేసిన నవల “పేద్రో పారమొ” మీ కోసం…

Pedro-Páramo-de-Juan-Rulfo

పేద్రో పారమొ నవల మొదట మెక్సికో సిటీలో 1955లో ప్రచురింపబడింది.  రచయిత హువాన్ రుల్ఫో వయసు అప్పటికి ముప్పయి ఏడో, ముప్పయి ఎనిమిదో. అంతకు మూడేళ్ళ ముందు ప్రచురించబడిన కథల పుస్తకానికి లభించిన ఆదరణ అంతంత మాత్రమే. విమర్శకులు దీన్నీ పట్టించుకోలేదు. అంతకుముందు ఎన్నడూ చూడని ధోరణిలో సాగిన ఈ రచనను ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళకు తెలిసి ఉండదు.

ఆ తర్వాత  హువాన్ మరో ముప్పయి ఏళ్ళు జీవించినా మరే నవలా, కథా రాయలేదు. అయితే తన జీవితకాలంలోనే ఆ నవల లక్షల ప్రతులు అమ్ముడు పోవడమూ, ముప్పయి పైగా భాషల్లోకి అది అనువదించబడటమూ చూశారు. లాటిన్ అమెరికన్ సాహిత్యంలో మాంత్రికవాస్తవికతకు రూపాన్నిచ్చినవాడిగా కీర్తీ గడించారు.  స్పానిష్ సాహిత్యంపై ఎనలేని ప్రభావం చూపిన ఈ నవల ఇరవయ్యో శతాబ్దపు గొప్ప రచనల్లో ఒకటిగా పరిగణింపబడుతూంది. గాబ్రియెల్ మార్కెజ్ కు ఈ నవల ఎంతగా నచ్చిందంటే ఆయన దీన్ని దాదాపు కంఠతా పట్టారు. ఆ తర్వాత ఆయన రాసిన One hundred years of solitude నవలకు ఇది ప్రేరణ అనీ చెప్పారు.
1910-1920 మధ్య కాలంలో మెక్సికన్ విప్లవం, తర్వాత పరిణామాల నేపథ్యంగా జరిగిన కథ ఇది. కాథలిక్ మత ప్రభావమూ, అణచివేతలూ, సాంఘిక ఆధిపత్యం మారుతూ ఉన్న క్రమమూ కనిపిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత అధునికీకరణ, నగరీకరణల్లో భాగంగా గ్రామాలనుంచి పట్టణాలకు వలసలతో పాడు బడ్డ ఊరు కనిపిస్తుంది. వీటనిటి మధ్యా నిష్కృతిలేని కొన్ని ఆత్మల తాలూకు మూలుగులు వినిపిస్తాయి.
Pedro_Páramo
ఉత్తమ పురుషకథనంలో వర్తమానంలో సాధారణంగా మొదలయ్యే కథ హువాన్ ప్రెసియాడో వల్లకాటి లాంటి ఊరు కోమలా చేరగానే మారిపోతుంది. ప్రథమ పురుష కథనంలోకీ, భూతకాలంలోకీ ఆసులో కండెలా తిరుగుతూ ఉంటుంది. కథ చెప్పే పాత్ర మారుతూ కథనం ముక్కలు ముక్కలుగా సాగుతూ తెగుతూ నడుస్తుంది. తలపోతలూ, వలపోతలూ, గొణుగుళ్ళూ, సంభాషణలూ కలగలిసిపోయి ఎవరి గొంతు ఏదో గుర్తు పట్టడానికి పాఠకుడికి సమయం పడుతుంది.  చదవడం పూర్తయ్యాక ఆ పాడుబడ్డ ఊళ్ళో సంచరించే ప్రేతాత్మల ఘోషలు పాఠకుడినీ వెంటాడుతాయి.
pedro_paramo1
నవలను process of elimination గా వర్ణించే హువాన్ రుల్ఫో ఈ నవల గురించి అన్న మాటలు –  “చిన్న కథలు రాయడం వల్ల క్రమశిక్షణ అబ్బింది. నేను కనపడకుండా పోవలసిన అవసరమూ, నా పాత్రల్ని వాటి ఇష్టానికి మాట్లాడనివ్వవలసిన అవసరమూ తెలిశాయి. దాని వల్ల కట్టుబడి (structure) లేనట్టుంటుంది గానీ ఉంది. అది ఏకకాలంలో జరిగినట్టే ఉండి ఏ కాలానికీ చెందని నిశ్శబ్దాలతోటీ, వేలాడే దారాలతోటీ, తెగిన దృశ్యాలతోటీ ఏర్పడి ఉంది.”
ఈ అనువాదానికి ఆధారం Margaret Sayers Peden ఇంగ్లీషులోకి చేసిన అనువాదం. వదిలిన, కలిపిన వాక్యాలు దాదాపుగా లేవు.

-చందూ

వీలునామా – చివరి భాగం

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఉపసంహారం

(కొన్నేళ్ళ తరవాత – క్రిస్మస్ పర్వదినం)

 

జేన్ హొగార్త్ క్రిస్మస్ భోజనం తయారీలో తల మునకలుగా వుంది. మెల్బోర్న్ కి దగ్గరలో ముచ్చటైన ఒక చిన్న ఇంట్లో వుంటున్నారు వాళ్ళు. ఎర్రటి ఎండాకాలం కావడంతో పళ్ళూ ఫలాలూ ఏవీ ఎక్కువగా దొరకడం లేదు. అందుకే ఆమెకి వంట ఎలా చేయాలో అర్థం కావడంలేదు. అయినా మొత్తానికి జీవితం సంతృప్తిగా హాయిగా వుందామెకి.

ఫ్రాన్సిస్ తన శ్రమా పట్టుదలలతో మెల్బోర్న్ లో చాలా పైకొచ్చాడు. అతనిప్పుడు వ్యాపారంలో భాగస్వామ్యం కూడా తీసుకుని మామూలు ఉద్యోగి స్థానం నుంచి ఎంతో ముందుకొచ్చాడు. బ్రాండన్ కుటుంబమూ హొగార్త్ కుటుంబమూ తరచూ కలుసుకుంటూనే వుంటారు, ముఖ్యంగా క్రిస్మస్ పండగ రోజు. ఈ సంవత్సరం జేన్ ఇంట్లో కలుసుకుంటున్నారు. పల్లె జీవితాన్నించి కాస్త మార్పుగా వుంటుందని ఎల్సీ భర్తా పిల్లలతో వచ్చి ఉంది.

ఈ సంవత్సరం వాళ్ళకి ఇంకా వేరే అతిథులు కూడా వస్తున్నారు. టాం లౌరీ, చదువు పూర్తయి ఇంజినీరు గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనూ, అతని కాబోయే భార్య గ్రేస్ ఫారెస్టర్ తో సహా విందుకొస్తున్నాడు. లౌరీ పిల్లలందరూ చక్కగా స్థిరపడ్డారు. పెద్దమ్మాయి పెళ్ళి చేసుకుంది. చిన్నమ్మాయి పెగ్గీ తో కలిసి దుకాణం నడుపుతూంది. ఇప్పుడందరూ పెగ్గీని “మిస్ వాకర్” అని పిలుస్తారు గౌరవపూర్వకంగా. మరిప్పుడామె ఎడిన్ బరో లో బట్టలు ఇస్త్రీ చేసే మనిషి కాదు, సొంతంగా దుకాణం నడుపుకుంటున్న వ్యాపారస్తురాలు.

అదిగో, ఆ తలుపులోంచి విందుకి వస్తూనే వుంది పెగ్గీ! వయసు మీద పడుతూన్నాపెగ్గీ ఇంకా అందంగానే వుంది.

“పెగ్గీ, నువ్వు రోజురోజు కీ అందంగా తయారవుతున్నావు! అది నీ అందమో లేక నా పెళ్ళాం చేసి ఇస్తున్న టోపీల అందమో అర్థం కావడం లేదు నాకు,” బ్రాండన్ ఎప్పుడూ ఆట పట్టిస్తాడామెని.

ఇవాళ్టి విందుకి ఫ్రాన్సిస్ బలవంతం చేసి డెంస్టర్ గారిని కూడా లాక్కొచ్చాడు.భగవంతుడికి ధన్యవాదాలు అర్పించి అందరూ భోజనాలకి బల్ల చుట్టూ చేరారు.
“జీవితం ఊహించని దారుల్లో, ఊహించనంత వేగంగా ప్రవహిస్తుంది కదా? మనందరమూ ఏదో ఒక కష్టం పళ్ళ బిగువున సహించి ఇంత దూరం వచ్చిన వాళ్ళమే! కష్టాలు దాటడానికి మనకి ధైర్యాన్నీ, దాటినందుకు తీయని ఫలితాలనీ ఇచ్చిన దేవుడికి శతకోటి వందనాలు. ఒకనాడు నేను దిక్కు తోచని పరిస్థితిలో మా చెల్లెలి పిల్లలను ఎలా పోషించాలో అర్థం కాక మిస్ థాంసన్ ను సహాయమడిగాను. ఆనాడావిడ పెద్ద మనసుతో నాకు ఇస్త్రీ కొట్టు పెట్టుకోవడానికి కొంత డబ్బిచ్చింది. ఈ నాడు మా టాం ఆమె మేన కోడలు గ్రేస్ ని పెళ్ళాడడం కంటే నాకు సంతోషమేముంది?” పెగ్గీ అంది.

“అత్తయ్యా! ఇవాళే నాకు మార్గరెట్ అత్త దగ్గర్నించీ ఉత్తరం వచ్చింది. నాకూ టాం కీ ఆశీర్వాదాలనీ, మా పెళ్ళి తనకూ చాలా సంతోషాన్నిస్తుందనీ అన్నది. టాం అత్తయ్యకి రాసిన ఉత్తరం ఎంతో హుందాగా వుందనీ, అంత చక్కటి భర్త దొరకడం నా అదృష్టమనీ రాసింది” గ్రేస్ చెప్పింది.

“అసలు వాడికి అక్షారాలు రాయడం నేర్పిందే మా పెద్దమ్మాయి గారు కాదూ? మీ ఇద్దరూ పెళ్ళాడి సుఖంగా వుండండి. కానీ గ్రేస్, అక్కయ్య మేరీని మాత్రం మర్చి పోకు సుమా! నీకంటే ఆరేళ్ళు పెద్దది. ఫిలిప్స్ పిల్లలకి గవర్నెస్ గా పని చేస్తూ పెళ్ళాడకుండా వుండిపోయింది, పాపం. దాన్నెప్పుడూ చిన్న చూపు చూడకండి!” జేన్ ఫ్రాన్సిస్ ని పెళ్ళాడి మెల్బోర్న్ వచ్చేయడంతో స్టాన్లీ ఫిలిప్స్ మేరీ ఫారెస్టర్ ని తన పిల్లలకి టీచరుగా నియమించుకున్నాడు.

“ఎంత మాటన్నారు అత్తయ్యా! మా మేనత్త మార్గరెట్ థాంసన్ కూడా పెళ్ళాడలేదు. ఆమెని ఎప్పుడైనా అవమానంగా చూసామా? మిమ్మల్ని టాం ఎప్పుడైనా అవమానపర్చారా? మేరీ ఎప్పటికీ మా ఇంట్లోని మనిషే!” నొచ్చుకున్నట్టు అంది గ్రేస్. “అది సరే కానీ, మీకందరికీ ఒక మంచి వార్త. విరివాల్టాలో మళ్ళీ పెళ్ళి సందడి. ఎవరో చెప్పుకోండి చూద్దాం!” బ్రాండన్ అన్నాడు.

“ఎమిలీ యే అయివుంటుంది. నా చేతుల్లో పుట్టినబిడ్డ. అప్పుడే దానికి పెళ్ళీడొచ్చిందా?” పెగ్గీ అంది.

“ఆ మాట మా ఎడ్గర్ తో అని చూడు పెగ్గీ! బావురుమంటాడు. అయినా ఇప్పుడు నిశ్చితార్థమే లే, పెళ్ళికి ఇంకా ఒక యేడు ఆగుతారట!” నవ్వుతూ అన్నాడు బ్రాండన్.

“అన్నట్టు, ఈ పెళ్ళికి స్టాన్లీ, లిల్లీ సంతోషంగా ఒప్పుకున్నారు. ఒప్పుకోనిదెవరో తెలుసా? పెళ్ళి కూతురు మేనత్త హేరియట్ గ్రాంట్. ఆవిడకి మొదట్నించీ రైతులంటే ఇష్టం లేదులే!”
అందరూ నవ్వారు.

“అయినా నేను ఒకసారి ఎమిలీతో నిర్మొహమాటంగా మాట్లాడాను. ఆస్ట్రేలియాలో రైతుల జీవితం అంటే చాలా శ్రమా, కష్ట నష్టాలకోర్చుకోవాలనీ, డబ్బున్న భూస్వామి కూతురి జీవితానికీ, రైతు భార్యగా వుండే జీవితానికీ చాలా వ్యత్యాసం వుంటుందనీ వివరించాను! అంతా విని, నవ్వి నాకొక ముద్దిచ్చింది చెంప మీద. ‘బాబాయ్, నాకు ఎడ్గర్ అంటే చాలా ఇష్టం. పొలాల్లో పనులూ అవీ నేనూ నేర్చుకున్నాను నాన్నతో కలిసి. నేను హాయిగా సర్దుకుంటాను,’ అని చెప్పింది. చిన్నప్పణ్ణించీ దానికి వాళ్ళ నాన్న కంటే నా దగ్గరే చనువు ఎక్కువ!” బ్రాండన్ మళ్ళీ అన్నాడు.

“అసలు నన్నడిగితే అంత లేత వయసులో పుట్టేదే స్వఛ్ఛమైన ప్రేమ! మనిద్దరిలా బోలెడు వయసొచ్చేంతవరకు ఎదురు చూడకుండ హాయిగా తమకు తగ్గ జతని వెతుక్కున్నారు పిల్లలు! ఏమంటావు ఫ్రాన్సిస్?” ఫ్రాన్సిస్ ని అడిగాడు.

“అదీ నిజమే కానీ, ఈ చిన్న పిల్లలు ప్రేమలో పడితే వాళ్ళ ఇక ఇకలూ పక పకలూ పట్టలేం. చుట్టూ ఏం జరుగుతుందో తెలియనంతగా వాళ్ళ నవ్వులూ మాటల్లో కూరుకుపోయి వుంటారు, మా టాం నీ గ్రేస్ నీ చూడరాదూ!” నవ్వుతూ అంటించింది పెగ్గీ.

“ఆ ఇక ఇకలూ పక పకలూ నాకు చాలా ముద్దొస్తాయి పెగ్గీ! మేం ఎప్పుడైనా విరివాల్టా వెళ్తే మాతో పాటు ఎడ్గర్ వున్నాడేమోనన్న ఆశతో ఎమిలీ పరిగెత్తుకొస్తుంది. అసలు ఎమిలీని చూడడానికే మా వాడు రెండు రోజులకోసారి ఏదో ఒక వంకన విరివాల్టా వెళ్దామంటాడు. ఇంకో విచిత్రం చెప్పనా? ఇంతవరకూ ఎమిలీ నన్నూ, ఎల్సీనీ పేర్లతో పిలిచేదా? ఇప్పుడు మెల్లిగా “బాబాయ్, పిన్నీ” అని పిలుస్తోంది! ఇంతవరకూ పెగ్గీ అని పిలిచే గ్రేస్ ఉన్నట్టుండి అత్తయ్యా అనడం మొదలుపెట్టలేదూ?” అందరూ మళ్ళీ గొల్లుమన్నారు. గ్రేస్ మొహం సిగ్గుతో ఎర్రబడింది.

“ఇంకా వినండి! ఎమిలీ చెల్లెలు కాన్స్టన్స్ లేదూ? అక్కా- ఎడ్గర్ ల ముద్దూ మురిపాలు చూస్తే దానికి ఎక్కళ్ళేని ఒళ్ళుమంట. ‘కథల్లోలా అలా సిగ్గు లేకుండా చేతులెలా పట్టుకుంటారో,’ అన్నది నాతో మొహం వికారంగా పెట్టి. నేను నవ్వుతూ, ‘కాన్స్టన్స్, ఇంకో మూడేళ్ళు ఆగు. నా ఇంకో మేనల్లుడు కూడా వస్తున్నాడు ఇక్కడికి. అప్పుడు నువ్వూ ఇంతే!’ అన్నాను. ‘నేనా? చస్తే అలా చేయను,’ అంది మొహం ఎర్రగా చేసుకొని. ”

” ఫ్రాన్సిస్! ఆ రోజు మా ఇంట్లో ఆత్మలు చెప్పినట్టు మీకంతా మంచే జరిగింది చూసారా? వీలునామా వల్ల కొంచెం కష్టాలొచ్చినా మీరేం నష్టపోలేదు!” డెంస్టర్ కలగజేసుకున్నాడు సంభాషణలో.

“నష్టపోవాడమా? అ వీలునామా వల్లే కదండీ బంగారం లాటి భార్య దొరికింది!” ఫ్రాన్సిస్ అన్నాడు.

“అవునవును. ఆ వీలునామాయే లేకపోతే, ఎల్సీ ఇరవై వేల పౌండ్లకి వారసురాలయి వుండేదీ, నేనమెను పెళ్ళాడి వుండే వాణ్ణీ కానూ, పాపం ఒంటరి బ్రతుకీడుస్తూ వుండేది! కదూ ఎల్సీ?”

” డెంస్టర్, మీరు ఆత్మలనడిగి మా డాక్టరు గ్రాంట్ గారు ఎన్నికల్లో నెగ్గుతారో లేదో చెప్పగలరా? ఆత్మలు వున్నాయో లేవో చెప్పడానికి అది మంచి పరీక్ష!” ఫ్రాన్సిస్ అన్నాడు.
సంభాషణ రాజకీయాల్లోకి మళ్ళింది.

“గ్రాంట్ ఏమో కానీ, ఫ్రాన్సిస్ నువ్వు మాత్రం తప్పక వచ్చే ఎన్నికల్లో నిలబడాలి. మనలాటి వలస పక్షుల గతి పట్టించుకునే నాథుడే లేడు. ఈ సంగతి ఒక రాత్రంతా గ్రాంట్ కి వివరించాము, నేనూ ఎల్సీ! గ్లాసుల కొద్దీ షెర్రీ తాగాడే కానీ, ఒక్క ముక్క అతనికి అర్థమైతే ఒట్టు!” బ్రాండన్ అన్నాడు.

“ఫ్రాన్సిస్ రాజకీయ ఆశయాలూ, సంఘ సంస్కరణ అభిలాషా అన్నీ చచ్చిపోయాయి! పక్కా గృహస్థు అయిపోయాడు. కదూ ఫ్రాన్సిస్? అయినా పెళ్ళాడిన ఏ మగాడండీ ప్రయోజకుడయింది? పెళ్ళాం గయ్యాళి దైతే తప్ప!” వేళాకోళంగా అన్నాడు డెంస్టర్.

“మీరు భార్యలనీ, ఆడవాళ్ళనీ అవమానిస్తున్నారు. అయినా పండగ పూటని వొదిలేస్తున్నాను.” జేన్ నవ్వుతూ అంది.

“మా ఆవిడ నా ఆశయాలనీ, అభిలాషలనీ ఎప్పుడూ చచ్చి పోనివ్వదు లెండి. అసలవి నాలో పుట్టించిందే ఆమె!”

ఇంతలో పిల్లలంతా వచ్చారు. జేన్, ఎల్సీ ఇద్దరికీ ఇద్దరేసి ఆడపిల్లలు. “పెద్దమ్మాయి గారూ, పిల్లల చదువులూ శిక్షణా ఏర్పాటు చేసారా?” పెగ్గీ అడిగింది జేన్ ని.
“ఏర్పాటేముంది. మా లాగే చదువుకుంటారు. మేమే చెప్పుకుంటాం.” జేన్ జవాబిచ్చింది.

“చదువుకున్న భార్యల వ్యవహారమే వేరు. మీలాగే మీ పిల్లలూ మంచి స్త్రీలవుతారు, మంచి భార్యలూ, తల్లులూ..”

“నీ సంగతి చెప్పుకోవోయ్ ఫ్రాన్సిస్! నా గురించి మాట్లాడకు. మా ఆవిడ అంత నోరు లేని పక్షిని నేనెక్కడా చూడలేదు. అసలు ఆ చదువు వల్ల ఆమెకి వున్న కొంచెం నోరూ పడిపోయిందేమో ననిపిస్తుంది. పని వాళ్ళందరూ ఆమె చెవులకి తాటాకులు కడతారు!” భార్యని వేళాకోళం చేసాడు బ్రాండన్.

“వాల్టర్! పని వాళ్ళెవరూ మనల్నొదిలి వెళ్ళిపోవడం లేదు కదా? మన పనులు బానే చేసి పెడుతున్నారు కదా? ఇక వాళ్ళతో నేనెలా చేయించుకుంటే నీకెందుకు?”

“అవునవును! నువ్వింత సౌమ్యంగా పెంచినా మన పిల్లలింత బుధ్ధిమంతులెలా అయ్యారన్నదే నన్నెప్పుడు వదలని ప్రశ్న! వాళ్ళనొక్క మాటా అనదు, అననివ్వదు. అయినా, ఎల్సీ, మన పిల్లలు నీలా తయారయితే అంతే చాలు నాకు!”

“చదువులూ శిక్షణా అంటే మనం ఇప్పించగలం కానీ, వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద బయట ప్రపంచం కూడా నిలబడనివ్వాలి కదా? గుర్తుందా ఫ్రాన్సిస్, నాకు ఉద్యోగం దొరకక ఎంతెంత తిరిగామో మనిద్దరం. ఎంత చదువుకున్నా బయట సంస్థల్లో ఆడవాళ్ళకి ఉద్యోగాలివ్వకుండా ఎంత సేపూ, చిన్న పిల్లలకు టీచర్లుగానో, బట్టలు కుట్టుకుంటూనో బ్రతకమంటే ఇక ఆడవాళ్ళకు పెద్ద చదువులెందుకు?”

“అయితే మీరింకా స్త్రీల సమాన హక్కుల సంగతి మర్చి పోలేదన్నమాట. నాకైతే ఆడవాళ్ళకి అన్నిటికంటే కావలసింది చక్కటి భర్తా, మంచి సంతానం అనిపిస్తుంది.” డెంస్టర్ అన్నాడు.

“ఆడవాళ్ళకేం కావాలో వాళ్ళే తేల్చుకుంటార్లెండి. ఒక వింత తెలుసా, సంఘంలో ఒక తప్పుడు అభిప్రాయం వుంది. సమాన హక్కులకోసమూ, విద్య కొసమూ పోరాడే స్త్రీల వెనక భయంకరమైన విషాదాలూ, విఫలమైన ప్రేమలూ వున్నాయనుకుంటారు చాలా మంది. జీవితం నిండా ఎంత ప్రేమ నిండి వున్నా, ఆడవాళ్ళకి మేధో వికాసమూ, ఆత్మ ఙ్ఞానమూ, ఆత్మ విశ్వాసమూ కూడా అవసరమే. ఆడవాళ్ళు చదువుకుని ఉద్యోగాలు ఆశించినంతమాత్రానా, తమ కాళ్ళ మీద తాము నిలబడ్డంత మాత్రానా కుటుంబాలు కూలిపోతాయనీ, సమాజం నిండా ప్రేమ రాహిత్యం నెలకొంటుందనీ అనుకోవడం సరి కాదు.” జేన్ దృఢంగా అంది.

(అయిపోయింది)
———————————–

మనవి మాటలు

నలభైయేడువారాలంటేదాదాపుసంవత్సరంకాలం! సుదీర్ఘప్రయాణం! ఈప్రయాణంనేనెంతోఆస్వాదించాను, ఎన్నోనేర్చుకున్నాను.

ఒకపనిచేసామంటేఆపనికిసంబంధించిననైపుణ్యమేకాకఇతరత్రాఎన్నోనేర్చుకుంటామన్నదినాసిధ్ధాంతం. అంటేస్కూలుకెళ్ళిచదువుకోనిపరీక్షలుపాసయితే, తరగతిగదిలోనేర్చుకున్నపాఠ్యాంశాలుమాత్రమేనేర్చుకోము. పట్టుదలతోపరీక్షలకుచదవటం, ఫెయిలయినప్పుడునిరాశచెందకపోవడం, పదిమందితోకలిసివ్యవహరించడం, స్నేహశీలత, ఇలాటివన్నీకూడానేర్చుకుంటాంకదా? అలాగన్నమాట.

ఈనవలఅనువాదంలోకూడానేనుఎన్నోసంగతులునేర్చుకున్నాను. అన్నిటికంటేముఖ్యంగాఒకపనిమొదలుపెట్టినప్పుడుదానినిచివరంటాపూర్తిచేయడంనేర్చుకున్నాను. ఎన్నోసార్లుమధ్యలోవదిలేద్దామనుకున్నానుకూడా. కానీ, “ఆరంభింపరునీచమానవుల్…..” అనితలచుకునికొనసాగించాను. అయితేఏమాటకామాటేచెప్పుకోవాలి. మానేయాలనుకోవడంపనివత్తిడితట్టుకోలేకనేకానీ, చేస్తున్నఅనువాదంనచ్చకమాత్రంకాదు.

కథలఅనువాదానికీనవలఅనువాదానికీచాలాతేడాలుంటాయనిఅనుభవంమీదతెలుసుకున్నాను. అందులోనూదాదాపుఒకశతాబ్దంకిందరాసిననవలఅనువదించేటప్పుడుగ్రంథవిస్తరణభీతికీ, నవలలోనిముఖ్యాంశాలుఇముడ్చుకుంటూవుండాల్సినఅవసరానికీ, రెండిటీమధ్యాసమన్వయంసాధించాల్సివుంటుంది.

వందేళ్ళక్రితంఇంగ్లండులోరాజకీయసాంఘికపరిస్థితులూ, ఆస్ట్రేలియావలసదార్లపరిస్థితులూ, ఆడవాళ్ళసమస్యలూచూడగలిగాను. ఇవన్నీనవలచదవటంవల్లకూడాజరిగేవే. అయితేఅనువాదంచేయడంవల్లపాత్రలతోస్నేహం, సానుభూతిఏర్పడ్డాయి. ఈనవలలోనాకందరికంటేనచ్చినపాత్రజేన్మెల్విల్. అన్నేళ్ళకిందజేన్లాటివ్యక్తిత్వమున్నఆడపిల్లనాయికగాఅందమైనప్రేమకథరాయడంకొంచెంకష్టమైవుండాలి. ఆఖర్నజేన్అన్నమాటలుఇవాళ్టికీసంఘానికిఅవసరమే.

నాకీఅవకాశాన్నిచ్చిప్రోత్సహించినందుకుసారంగపత్రికకూ, సంపాదకులకూధన్యవాదాలు.

శారద

శారద

శారద

వీలునామా – 45, 46 భాగాలు

veelunama11

కిం కర్తవ్యం?

మర్నాడే ఫ్రాన్సిస్ ఎడిన్ బరో బయల్దేరి వెళ్ళి గ్రంథాలయాలల్లో పాత పేపర్లన్నీ తిరగేసాడు. ఎక్కడైనా ఆ తేదీన బయల్దేరిన పడవల వివరాలో, పిల్లాణ్ణి పారేసుకున్న తల్లి వివరాలో దొరుకుతాయేమోనని. పడవల కార్యాలయానికెళ్ళి ప్రయాణీకుల వివరాలు సంపాదించి చూసాడు. కానీ ఆ సంఘటన జరిగి ముఫ్ఫై అయిదేళ్ళు గడిచిన కారణంగా అతనికి వివరాలేవీ దొరకలెదు, దొరికిన కొద్ది సమాచారమూ అతనికి నమ్మదగింది గా అనిపించనూ లేదు.
ఆఖరికి అతను లండన్ నగరానికి వెళ్ళి మిసెస్ పెక్ చెప్పిన హోటలు చిరునామాకి కూడా వెళ్ళాడు. అక్కడ ఆ హోటేల్ కూల్చేసి ఇంకేదో కట్టడాన్ని కట్టారు. లండన్ మున్సిపల్ కార్యాలయానికెళ్ళి అక్కడ పాత చిఠ్ఠాలన్నీ తిరగేస్తే ఆ హోటల్ యజమానురాలి పేరుకీ మిసెస్ పెక్ చెప్పిన పేరుకీ పొంతనే లేదు! చాలా నిరాశ చెందిన ఫ్రాన్సిస్, చీకట్లోబాణం లా ఒక పేపరు ప్రకటన మాత్రం ఇచ్చాడు. ముఫ్ఫై అయిదేళ్ళ క్రితం జరిగిన విచిత్రమైన సంఘటన పేర్కొంటూ, ఈ సంఘటన గురించి ఏ మాత్రం వివరాలు తెలిసినా తనని సంప్రదించవలసిందని ఆ ప్రకటన సారాంశం.
లండన్ నించి ఎడిన్ బరో తిరిగొచ్చిన ఫ్రాన్సిస్ తన స్నేహితుడూ సలహాదారూ అయిన సింక్లెయిర్ ని కలిసాడు. సింక్లెయిర్ కొన్నాళ్ళు అమెరికాలో వుండొచ్చాడు. అతనీ సంగతి ఏ పేపర్లోనైనా చూసి వున్నాడేమో అన్న ఆశతో ఫ్రాన్సిస్ అతనికి సంగతంతా చెప్పాడు. ఇదే ఏ ప్రేక్షకాదరణ పొందిన గొప్ప నవలలో అయితే సరిగ్గా సింక్లెయిర్ కి ఆవిడ తెలియడమో, మరీ మాట్లాడితే సింక్లెయిర్ ఫ్రాన్సిస్ తండ్రి అని తెలిసిపోవడమో జరిగి వుం డేది. అదేమీ కాలేదు సరికదా అసలీ కథంతా నిజమేనా అన్న అనుమానం కూడా వచ్చింది సింక్లెయిర్ కి. ఆఖరికి నిట్టూర్చి,
“ఏం చేస్తాం! నువ్వన్నట్టు ఆ రోజు బయల్దేరిన మూడు పడవల్లో పిల్లాడుమరణించిన తల్లి ఎవరైనా వున్నారా అని ఒక ప్రకటన ఇచ్చి వూరుకోవడమే. నాకైతే ఆ ప్రకటనకి జవాబొస్తుందన్న నమ్మకం లేదనుకో! అయినా మానవ ప్రయత్నం మానలేం కదా! అది సరే కానీ, ఇప్పుడు ఆ మిసెస్ పెక్ నీ తల్లి కాదు అని తేలిపోయినంత మాత్రాన నీకొరిగేదేమిటి?”
“అప్పుడు జేన్ మెల్విల్ కీ నాకూ ఎటువంటి సంబంధమూ లేదని తెలిసిపోతుంది కదా? నేనా అమ్మాయిని హాయిగా పెళ్ళాడి రాజకీయాల్లో వుండొచ్చు. లేదంటే ఎస్టేటూ, పార్లమెంటులో సీటూ అన్నీ వొదులుకోని ఆమెని పెళ్ళాడక తప్పదు.”
“హమ్మ్! అదా సంగతి? అయినా నువు పెళ్ళాడనే దలచుకుంటే మనూళ్ళో అమ్మాయిలకి కొదవా? ఆలోచించుకో!”
“ఇహ ఆలోచించుకోవడానికేం లేదు సింక్లెయిర్. ఈ పని అసలు ఇంతకు ముందే చేసి వుండాల్సింది. నేను ముందుగా వకీలు మెక్ ఫర్లేన్ దగ్గరికెళ్తున్నా. నువ్వూ వొస్తావా నాతో?”
“పద వెళదాం.”
ఇద్దరూ వకీలు దగ్గరికెళ్ళారు. వీరి వృత్తాంతం విని వకీలు చాలా ఆశ్చర్యపోయాడు. ఎల్సీ పంపిన కాగితాలు శ్రధ్ధగా చదివాడు.
“ఇది నిజమే అయుంటుంది ఫ్రాన్సిస్. ఎలిజబెత్ ఆర్మిస్టవున్ నాకు తెలుసు. ఒకసారి ఆమెని వూళ్ళో చూసాను. అయితే ఇప్పుడీ కాగితాలు మాత్రం కోర్టులో చెల్లవు ఫ్రాన్సిస్! నిన్ను పారేసుకున్న మీ అమ్మ వొచ్చి చెపితే తప్ప ఈ కాగితాలకి వేరే ఆధారం లేదు. ఇప్పుడావిడ ఎక్కడుందో, అసలు బ్రతికుందో లేదో! అయినా ఇప్పుడిదంతా ఎందుకు?”
“హొగార్త్ గారి వీలునామాలో నేను బంధువుల్లో అమ్మాయిలను పెళ్ళాడరాదనీ, పెళ్ళాడితే ఎస్టేటు ఆస్తులన్నీ అనాథాశ్రమాలకు చెందాలని రాశారు. కోర్టును కాకపోతే కనీసం ఆ శరణాలయాల మేనేజర్లనైనా ఒప్పించలేమంటారా నేను జేన్ కి రక్త సంబంధీకుండిని కానని?”
“ఒక్కరినైతే ఒప్పించగలిగే వారిమేమో కానీ నలుగురైదుగురిని కష్టమేమో!”
“నేను జేన్ ని పెళ్ళాడితే అడ్డుపడేది వాళ్ళే తప్ప ఇంకెవరూ లేరు. నిజానికి వాళ్ళదీ తప్పనలేం కదా!”
“అసలు ఆస్తి పాస్తులని ఇలా పెళ్ళిళ్ళతో ముడిపెట్టే వీలునామాలతో మహా చిరాకు! అవి వ్యక్తిగత స్వేఛ్ఛని కూడా హరించివేస్తూన్నట్టనిపిస్తుంది నాకయితే!” సింక్లెయిర్ అన్నాడు.
“హెన్రీ చాలా తెలివైన వాడు కానీ అప్పుడప్పుడూ తెలివి తక్కువ పన్లు చేసే వాడు. ఎలిజబెత్ ని పెళ్ళాడుతున్నాను అని నాతో అనగానే నేను అదే అనుకున్నాను. ఆ తరవాత మేన కోడళ్ళని చిల్లి గవ్వ లేకుండా వీధిలో నిలబెట్టాడు. ఇప్పుడీ పెళ్ళి క్లాజు! పిల్లలని వొద్దన్న పనే చేస్తారని హెన్రీకి అర్థమే కాలేదు. అతనీ వీలునామాలో ఈ క్లాజు పెట్టి వుండకపోతే, నువ్వసలు జేన్ గురించి అలా ఆలోచించేవాడివే కాదు! పందెం!” అన్నాడు వకీలు నవ్వుతూ.
“అయితే, మీ వుద్దేశ్యం ప్రకారం నేనూ జేన్ పెళ్ళాడితే అనాథాశ్రమాల మేనేజర్లు తప్పక మమ్మల్ని కోర్టు కీడుస్తారు!”
వకీలు మళ్ళీ తన దగ్గరున్న వీలునామా ప్రతిని తీసి ఆసాంతం చదివాడు.
“హెన్రీ ఈ వీలునామా రాయడం వెనక ముఖ్య ఉద్దేశ్యం తన మేన కోడళ్ళను తమ కాళ్ళపై నిలబడేటట్టు చేయడం కాబోలు. ఆయన అనుకున్నట్టే ఆ అమ్మాయిలిద్దరూ చక్కగా స్థిరపడ్డారు. నాకైతే వా ళ్ళనలా ఒదిలేయడం అన్యాయమే అనిపిస్తూంది, కానీ ఇప్పుడేం చేయగలం?”
“అయితే ఇప్పుడేం చేయాలంటారు?”
“ఏమీ లేదు. ఆ అయిదు శరణాలయాలు నిజంగా పేద పిల్లల కోసం నడుస్తూన్నవి. వారందరికీ సంఘంలో మంచి పేరూ పలుకుబడీ వున్నవి. ఒకవేళ నువ్వు జేన్ ని పెళ్ళాడి కోర్టులో వాళ్ళు నీమీద దావా వేసారే అనుకో, వాళ్ళే నెగ్గే అవకాశం ఎక్కువ. నీ రాజకీయ ప్రతిష్ఠా అనవసరంగా మంట గలిసిపోతుంది.”
“ఎంత విచిత్రమైన పరిస్థితి! మా ఇద్దరికీ పెళ్ళాడడానికి ఏ అడ్డూ లేదని తెలిసినా పెళ్ళాడలేని పరిస్థితి!”
“ఒక పని చేయ్యొచ్చు! నువ్వు పెళ్ళాడెయి. వాళ్ళు కోర్టులో దావా వేసిన అది తెగే సరికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఈ లోగా నువ్వు రాజకీయంగా నిలదొక్కుంటే ఎస్టేటు పోయినా దిగుల్లేదు.”
“లేదు, లేదు వకీలు గారూ! నేను రేపే ఆస్తి పాస్తులన్నీ శరణాలయాల పేర రిజిస్టరు చేస్తాను. ఆ తరవాత జేన్ ని పెళ్ళాడతాను. ఆ డబ్బంతా వకీళ్ళ జేబులు నింపడానికంటే పేద పిల్లలకి పనికి రావడం మంచిది. ఎస్టేటుకోసం నేను పెట్టిన ఖర్చులన్నీ నయా పైసాతోసహా లెక్కలు రాసే వుంచాను.”
అదిరిపడ్డాడు వకీలు.
“తొందరపడకు ఫ్రాన్సిస్. ఎన్నో కష్టాలనుభవించాక నీమీద అదృష్టానికి దయకలిగింది. దాన్నంతా అలా తోసేస్తానంటావే? డబ్బే కాదు, ఎస్టేటు తో పాటు నీ పార్లమెంటు సీటూ పోతుంది. నీ రాజకీయ భవిష్యత్తు మొదలవకముందే ముగిసిపోతుంది. నిదానంగా ఆచి తూచి అడుగేయాలి.”
సింక్లెయిర్ కూడా గొంతు కలిపాడు, “అవును ఫ్రాన్సిస్! అంత దూకుడు వ్యవహారం మంచిది కాదు,” అంటూ.
“అసలు నీ గురించి పార్టీలోనూ పార్లమెంటులోనూ ఎంత మంచిగా చెప్పుకుంటున్నారో తెలుసా? నువ్వు హెన్రీ కొడుకైతె ఎంత కాకపోతే ఎంత? అసలు ఎలిజబెత్ చెప్పిందాంట్లో నిజమెంతో కూడా ఎవరికీ తెలియదు. మంచి భవిష్యత్తూ, డబ్బూ ఒక అమ్మాయి కోసం వదులుకుంటావా? అట్లాంటి అమ్మాయిలు లక్ష మంది కనబడతారు. అసలేముందా జేన్ లో, ఆలోచించు? అందమా చందమా?”
“వాటి సంగతేమో కానీ, ఒక మంచి మనసూ ఒక తెలివైన మెదడూ కూడా వున్నాయి కదా? అవి చాలు నాకు.” నవ్వుతూ అన్నాడు ఫ్రాన్సిస్.
” నువ్వు చేసిన పనికి జేన్ సంతోషిస్తుందనుకుంటున్నావా?”
“చచ్చినా ఒప్పుకోదు. అందుకే నేను ఆమెకి అంతా పూర్తయ్యాకే చెప్తాను. ఇద్దరం కలిసి మళ్ళీ హాయిగా జీవితం మొదలు పెడతాము. ఏదో సంపాదించుకోని బ్రతకలేకపోము”
“జేన్ ఈపాటికే ఎవరినైనా పెళ్ళాడేసి వుంటే? చిన్నదాని పెళ్ళి ఆస్ట్రేలియాలో జరగబోతుందని విన్నాను.”
“అప్పుడే ఆ వార్త మీదాకా వచ్చిందీ? జేన్ ఇంకా పెళ్ళాడలేదు. ఒకవేళ ఆమెకి ఎవరినైనా పెళ్ళాడే వుద్దేశ్యం వుంటే ఈపాటికి నాతో చెప్పేదే.” ఫ్రాన్సిస్ నమ్మకంగా అన్నాడు, ఎల్సీ తనకు రాసిన వుత్తరాన్ని తలచుకుంటూ.
నిట్టూర్చాడు వకీలు మెక్ ఫర్లేన్.
“నీ ఇష్టం ఫ్రాన్సిస్. నాకైతే నువ్వు తొందరపడుతున్నావనిపిస్తుంది.”
“ధన్యవాదాలు వకీలు గారూ. నేను ఇవాళే శరణాలయాల మేనేజర్లని సంప్రదించి వివరాలు వాళ్ళ ముందుంచుతాను. ఈ విషయంలో నాకొక వకీలు కూడా అవసరమవుతాడనుకుంటా. ఎస్టేటు వ్యవహారాలన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి వేరే వకీలుని నా ప్రతినిధిగా వుంచుకోవడం మంచిదేమో. మీరేమంటారు?”
“అవునవును. నాకు తెలిసిన ఇంకొక వకీలున్నాడు. ఆయనకి ఉత్తరం రాసి నిన్ను పరిచయం చేస్తాను. వెళ్ళి ఆయనని కలువు.”
అనుకున్నట్టే ఫ్రాన్సిస్ అయిదు శరణాలయాల యాజమాన్యాలకీ తను ఎస్టేటూ మిగతా ఆస్తి పాస్తులూ వారి పరం చేయదలచుకున్నట్టూ, అందుకు తనకు గల కారణాలనూ తెలుపుతూ ఉత్తరాలు రాసాడు.

ఆ పనైన తరవాత ఫ్రాన్సిస్ పెగ్గీ వాకర్ ను చూడబోయాడు. పెగ్గీ అతన్ని సంతోషంగా పలకరించింది.
“బాగున్నారా బాబూ? ఈ మధ్య పిల్లల దగ్గర్నించి ఉత్తరాలే లేవు. అందరూ బాగున్నారా?”
“పెగ్గీ! ఒక మంచి వార్త మోసుకొచ్చాను!”
“ఆగండాగండి, నేనే ఊహిస్తాను! హ్మ్! చిన్నమ్మాయి గారు బ్రాండన్ ని పెళ్ళాడబోతున్నారు, అవునా?”
“అరే!భలే కనిపెట్టేసావే!”
“ఆయనసలు ఇక్కడుండగానే అడుగుతాడనుకున్నా ఆయన వాలకం చూసి, కాని బాగా ఆలస్యం చేసాడే! పెద్దమ్మాయిగారెలా వున్నారో తెలుసా?”
“ఆమె దగ్గర్నించి నాకూ ఉత్తరాలు రాలేదు ఈ మధ్య. ఎల్సీ వుత్తరం రాసి సంగతంతా చెప్పింది. మిమ్మల్నందరినీ అడిగినట్టు చెప్పిందిద్. అది సరే, మీ పెద్దమ్మాయి గారికి పెళ్ళి జరిగిపోతే ఎలా వుంటుందంటావ్?” ఫ్రాన్సిస్ కుతూహలంగా అడిగాడు.
“పెద్దమ్మాయిగారా? ఆవిడసలు ఎవరినైనా పెళ్ళాడేందుకు ఒప్పుకుంటుందంటారా?”
“ఏమో మరి, అంతా అనుకున్నట్టు జరిగితే ఆవిడ పెళ్ళీ జరగొచ్చు మూడు నాలుగు నెలలో. మనం వెళ్ళే పడవ ఇంకా నెలకి గానీ బయల్దేరదు కదా!”
“ఏమిటి బాబూ మీరంటున్నది. మనం వెళ్ళడేమిటి?”
“పెగ్గీ! నీతో పాటు నేనూ వచ్చేస్తున్నా ఆస్ట్రేలియా! నెల రోజుల్లో ఇక్కడ అన్ని పనులూ చక్కబెట్టుకొని, బాధ్యతలు తీర్చుకొని వెళ్ళిపోదాం. నీకు అసలు సంగతి చెప్పనేలేదు.”
ఫ్రాన్సిస్ పెగ్గీకి ఎల్సీ పంపించిన కాగితాలు అందజేసాడు. పెగ్గీ అన్నిటినీ కూడబలుక్కోని ఓపికగా చదివింది.
“ఎంత పని జరిగింది! అయితే మీరసలు పెద్దయ్యగారి సంతానమే కాదన్నమాట.” ఆశ్చర్యంగా అంది.
“ఇదంతా నిజమేనంటావా పెగ్గీ?”
“భలేవారే, ఎందుకు కాదు. ఎలిజబెత్ ని నేనూ చూసాను. ఆ తల్లీ బిడ్డలు ఎంతకైనా తగుదురు. వాళ్ళు బిడ్డలని మార్చేసారంటే నమ్మలేని విషయమేమీ కాదు.”
“వింతేమిటో తెలుసా? ఈ కాగితాలు చదివినవారందరూ అది నిజమే అయి వుండొచ్చు అంటున్నారు, కానీ దీనిని కోర్టు నమ్మదంటున్నారు. సరే, అదంతా నాకెందుకు? నేను ఈ ఆస్తీ ఎస్టేటూ వొదిలేసిజేన్ ని పెళ్ళాడతాను. ఆయన రక్తసంబంధీకులేమో వీధుల్లో వుంటే ఎవరో పరాయివాణ్ణి నేను ఆస్తి అనుభవించడం ఏమిటి? నాకదేం బాగుండలేదు. ఇక్కడ పొట్ట పోషించుకోగలిగిన వాణ్ణి ఆస్ట్రేలియాలో ఏదో పని చేసుకోలేకపోను.”

***

46 వ భాగం

అంతా మన మంచికే..

 

సాధారణంగా మేనేజర్లూ, అందులోనూ అనాథ శరణాలయాలు నడిపే వారూ ప్రేమ కథలు చదివే అవకాశం తక్కువ. ఏదో దారి తప్పి మంచి ప్రేమ కథ వున్న పుస్తకం వాళ్ళ చేతికందినా అక్కడక్కడా తిరగేసి పుస్తకం పక్కన పారేసే రకాలు వాళ్ళు. అందుకే వారికి ఫ్రాన్సిస్ అయిదుగురినీ ఒకేసారి రమ్మని వర్తమానం పంపితే, దానికి కారణం ఏమై ఉంటుందో కొంచెం కూడా ఊహించలేకపోయారు.
ఫ్రాన్సిస్ చెప్పిన సమయానికి అయిదుగురు మేనేజర్లూ అక్కడికి చేరుకున్నారు. ఉపోద్ఘాతం ఏదీ లేకుండానే ఫ్రాన్సిస్ వారికి మిసెస్ పెక్ సంతకం చేసిన కాగితాలు ఇచ్చాడు. అందరూ గబ గబా వృత్తాంతం చదివారు తప్పితే ఏ వ్యాఖ్యానమూ చేయలేదు.
“అందులో వుండేది నిజమే అయి వుండొచ్చంటారా?” ఫ్రాన్సిస్ అడిగాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఆఖరికి అంథ విద్యార్థుల శరణాలయం అధికారి గొంతు సవరించుకొని,
“ఏమో మరి, మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అయి వుండొచ్చు!” ఎటూ తేలకుండా అన్నాడు.
వకీలు మెక్ ఫర్లేన్ కలగజేసుకున్నాడు. ఫ్రాన్సిస్ తొందరపడి ఎక్కడా దూకుడు నిర్ణయాలు తీసుకుంటాడో అని ఆయన కూడా వచ్చారు, కేసు ఇంకొక వకీలుకి అప్పజెప్పినా కూడా.
“అసలు ఈ వృత్తాంతం వల్ల ఫ్రాన్సిస్ పరిస్థితిలో ఏ మార్పూ వుండదనుకోండి! ఆస్తీ ఎస్టేటూ అతనికి హెన్రీ రాసిన విల్లు ద్వారా సంక్రమించాయే గానీ, పిత్రార్జితమైన ఆస్తిలా కాదుగా? అటువంటప్పుడు ఫ్రాన్సిస్ హెన్రీ కొడుకైనా, కాకపోయినా తేడాలేదు. ”
“అవునవును. ఆ సంగతి మాకూ గుర్తుంది. అది సరే, ఇప్పుడు మమ్మల్ని పిలిచి మరీ ఈ సంగతి చెప్పడం దేనికి?” మూగ-చెవిటి శరణాలయం అధికారి అడిగాడు.
“ఎందుకంటే, వీలునామాలో నేను దగ్గరి బంధువులని పెళ్ళాడనంతకాలం ఆస్తికి హక్కుదారుణ్ణని రాసి వుంది. ఇప్పుడు మరి నాకూ జేన్ కీ ఏమీ సంబంధం లేదు. ఆమెకి నేను మేన మామ కొడుకునేమీ కానూ. ఆమెని పెళ్ళాడాలని నాకెంతకాలం గానో ఆశ. ఇప్పుడు నేను ఆమెని పెళ్ళాడినా వీలునామా నిబంధనలేమీ అతిక్రమించడంలేదుగా?” ఫ్రాన్సిస్ అడిగాడు.
“ఆ!! అదీ సంగతి. మీకు అమ్మాయీ కావాలి, ఆస్తీ కావాలన్నమాట.”
“చట్టరీత్యా సాధ్యమైతే! పెద్దాయన హెన్రీ హొగార్త్ ఇప్పుడు బ్రతికి వున్నట్టైతే, తప్పక ఈ పెళ్ళికి ఒప్పుకునేవాడు.” “చూడండి ఫ్రాన్సిస్! ఇక్కడ మా వ్యక్తిగత అభిప్రాయాలతో పనిలేదు. మేం నడుపుతున్న శరణాలయాల్లో ఎందరో అనాథ బాల బాలికలుంటున్నారు. ఆ నిర్భాగ్యుల కోసమైనా, మీరు వీలునామాలోని నిబంధనలని అతిక్రమించిన మరుక్షణం మీమీద కోర్టులో దావా వేయాల్సిన బాధ్యత మాపైన వుంటుంది. ఇందులో మా స్వార్థం ఏమీ లేదు.” మూగ-చెవిటీ శరణాలయం అధికారి అన్నాడు.
“ఊ…! సరే అయితే, ఇక నాకు వేరే దారి ఏదీ లేదు. నా అంతట నేను ఆస్టి పాస్తులూ, ఎస్టేటూ అన్నీ శరణాలయాలకు దానం ఇవ్వడం మినహా. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ ఆస్తి పాస్తులూ ఎస్టేటూ రాకముందు హాయిగా నా మానన నేను బాంకులో గుమాస్తా ఉద్యోగం చేసుకుంటూండేవాణ్ణి. ఇప్పుడు, రెండేళ్ళ తర్వాత, కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. పైగా, భార్యని పోషించాల్సిన కొత్త బాధ్యత! కాబట్టి మీరు నాకెంతో కొంత సొమ్ము ముట్టచెప్తే నేను మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టడానికి వీలవుతుంది.”
“మీరన్నదీ నిజమే!” మొదలుపెట్టాడు వృధ్ధాశ్రమం మేనేజరు. మిగతా వారు ఇంకా ఫ్రాన్సిస్ ప్రతిపాదన ఇచ్చిన ఆశ్చర్యం నించి తేరుకోనేలేదు. “ఒకవేళ మీరు పెళ్ళాడి, మేమూ కోర్టుకెక్కి ఆస్తంతా స్వాధీనం చేసుకోవడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. మీరు పెద్ద మనసుతో మాకా ఖర్చు తప్పిస్తున్నారన్నమాట! మీ దయార్ధ్రహృదయానికీ, బాధ్యతా పూరితమైన వ్యక్తిత్వానికీ మా జోహార్లు. అయితే ఒట్టి జోహార్లతో ఒరిగేదేమీ ఉండదు కాబట్టి, నేననేదేమిటంటే- మా అయిదు సంస్థలూ నాలుగు వందల పౌండ్ల చొప్పున రెండు వేల పౌండ్లు మీకు బహుమతిగా ఇస్తాం. అంతేకాదు, క్రాస్ హాల్ ఎస్టేటూ, భవంతీ నుంచి మీకిష్టమైన పుస్తకాలూ, సామానూ, బట్టలూ, రెండు వందల పౌండ్ల విలువ మించకుండా మీరు పట్టికెళ్ళొచ్చు! ఏమంటారు?”
“మీరనేది చాలా అన్యాయంగా వుందటాను!” వకీలు మెక్ ఫర్లేన్ రంగంలోకి దుమికాడు. ఫ్రాన్సిస్ అమాయకత్వాన్నీ మంచి తనాన్నీ అందరూ వాడుకుంటున్నారనిపించిందతనికి.
“ఆ ఎస్టేటూ, భవంతీ, అందులో వున్న సామానూ ఎంత విలువైనవో, దాంతో మీ సంస్థలెంతెంత లాభ పడతాయో మీకూ తెలుసు. అయినా చెప్తాను వినండి! దాదాపు యాభైవేల పౌండ్లు. దానికి మీరిచ్చేది ముష్ఠి రెండు వేలా? ఇంకో ఇంకోరయితే గుట్టు చప్పుడు కాకుండా నచ్చిన అమ్మాయితో ప్రేమ వ్యవహారం సాగిస్తూ ఆస్తినీ అనుభవించేవారు. ఫ్రాన్సిస్ మంచివాడూ, నీతికి నిలబడే మనిషి కాబట్టి నిజంతో మీ ముందుకు వచ్చాడు. కోర్టు కెళ్తే మీకయ్యే ఖర్చెంతో తెలుసా? అక్షరాలా పది వేల పౌండ్లకి పైనే! అదయినా మీరు కేసు గెలుస్తారన్న నమ్మకం లేదు నిజానికి. ఇప్పటికే ఇటువంటి నిబంధనలతో కూడిన వీలునామాల పట్ల ప్రజల్లో సంఘంలో నిరసన పెరుగుతోంది. వ్యక్తి స్వేఛ్ఛకి భంగం వాటిల్లకూడదని కోర్టు మీకేసు కొట్టేస్టే ఏమవుతుందో ఆలోచించుకోండి! పైగా ఫ్రాన్సిస్ పార్లమెంటులో, రాజకీయాల్లో మంచి పేరూ ప్రతిష్ఠలూ సంపాదించుకున్నాడు. అతని కోసం పార్టీ జోక్యం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. అందుకని మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి.” వకీలు ధాటీగా అన్నాడు. ఆసుపత్రి మేనేజరు ఆఖరికి రంగంలోకి దిగాడు.
“అవును వకీలు గారూ! నేనూ మీతో ఏకీభవిస్తాను. ఒక్కొక్కరమూ నాలుగు కాదు, అయిదు వందల పౌండ్లిస్తాము, సరేనా? ఎస్టేటు లైబ్రరీలో వున్న పుస్తకాల విలువే వెయ్యి పౌండ్లకి పైగా వుందట. ఫ్రాన్సిస్, జేన్ ఇద్దరూ విద్యాధికులేకాబట్టి రెండు వందల పౌండ్ల విలువ గల పుస్తకాలూ, ఏడు వందల పౌండ్ల విలువ గల సామానూ తీసికెళ్ళొచ్చు. ఇది సరేనా?”
ఈ ప్రతిపాదనకి అందరూ అంగీకరించారు.
“సరే, అయితే ఎస్టేటుని అమ్మకానికి పెట్టి, అమ్మగా వచ్చిన డబ్బుని అయిదు సంస్థలూ సమానంగా పంచుకోవాలి. ఫ్రాన్సిస్ హోగార్త్ కిచ్చే డబ్బు ముందుగానే ఇచ్చేసి, ఎస్టేటు ఆదాయంలో మినహాయించుకోవచ్చు,” అని తీర్మానించారందరూ.
“అవునవును. ఎందుకంటే నేను వీలైనంత తొందరలో ఆస్ట్రేలియా వెళ్తాను,” అన్నాడు ఫ్రాన్సిస్.
ఎస్టేటుని ఎవరు కొంటారో, ఎలా చూసుకుంటారో అని ఒక్క క్షణం బెంగ పడ్డాడు ఫ్రాన్సిస్. పార్లమెంటుకీ, పార్టీకి తన రాజీనామా లేఖలు పంపాడు. స్నేహితులకీ, ఎస్టేటు పనివారికీ భారమైన గుండెతో వీడ్కోలు చెప్పి ఆస్ట్రేలియా బయల్దేరాడు ఫ్రాన్సిస్.
*******************
ఎల్సీ తనకు చెప్పిన ఫ్రాన్సిస్ జన్మ వృత్తాంతం విని జేన్ చాలా ఆశ్చర్యపోయింది. తనతో సంప్రదించకుండా సంగతంతా ఫ్రాన్సిస్ కి చెప్పేసినందుకు చెల్లెల్ని కోప్పడింది కూడా. అయితే అదంతా తెలిసిన తరవాత ఫ్రాన్సిస్ ఏమాలోచిస్తున్నాడో మాత్రం ఆమెకి అంతుబట్టలేదు. అతని వద్దనించి మాటా పలుకు లేదు మరి.
అనుకున్నట్టే చెల్లెలి పెళ్ళి బ్రాండన్ తో జరగడం తో జేన్ సంతోషానికవధుల్లేవు. మెల్బోర్న్ లో ఎల్సీ ఒప్పుకున్న కొద్ది రోజులకే బ్రాండన్ పెళ్ళి ఏర్పాట్లు చేసాడు. ఫిలిప్స్ కూతురు ఎమిలీ తోడు పెళ్ళికూతురూ, బ్రాండన్ మేనల్లుడు ఎడ్గర్ తోడు పెళ్ళికొడుకూ అవతారాలెత్తారు. పెళ్ళి జరిగి ఎల్సీ ఇంటి పగ్గాలందుకోగానే మొదట సంతోషపడ్డది ఎడ్గర్ తల్లి మేరీ! కొడుకుకి బ్రహ్మచారి తిండి తినే గతి తప్పి కాస్త ఆడ దాని పోషణలో బాగుంటాడని ఆశపడిందామే.
ఫిలిప్స్ కుటుంబం వున్న విరివాల్టాకీ, బ్రాండన్ పొలం వున్న బారాగాంగ్ కీ మధ్య ఇరవై మైళ్ళే అవడంతో అక్క చెల్లెళ్ళు తరచుగా కలుసుకోవడం వీలవుతూ వుంది. ఎల్సీ ఇప్పుడు తమ ఇంట్లో పనిమనిషి కాదు, తన లాగే ఇంకొక వ్యవసాయదారుడి భార్య! ఈ ఙ్ఞానంతో లిల్లీ ఫిలిప్స్ ఎల్సీతో మునుపటికన్నా మర్యాదగా మెలగసాగింది. హేరియట్ మనసులో ఏముందో కానీ, పైకి బాగానే వుంది.
అన్నట్టు ఈ హడావిడిలో డాక్టర్ గ్రాంట్ హేరియట్ తో పెళ్ళి కుదుర్చుకోగలిగాడు! అయితే అతను వుంటున్న ఇల్లు హేరియట్ వుండడానికి వసతిగా లేదని ఇంటి మరమ్మత్తు మొదలుపెట్టాడతను. ఆ మరమ్మత్తు అయేవరకూ పాపం, ఆ ప్రేమ పక్షులు విరహ గీతాలు పాడుతూ గడిపారు. ఎట్టకేలకు ఇంటి మరమ్మత్తు ముగిసి పెళ్ళిరోజు దగ్గరపడింది. ఎల్సీ పెళ్ళిలా కాకుండా ఇది చాలా ఘనమైన పెళ్ళి. చుట్టుపక్కల వూళ్ళనుంచీ విచ్చేస్తున్న ఆహూతులు, పెళ్ళి పనులతో విరివాల్టా హోరెత్తిపోసాగింది. చెల్లెలికని స్టాన్లీ ఫిలిప్స్ ఖరీదైన బట్టలు తెప్పించాడు. మొదటిసారి ఆ ఇంట్లో లిల్లీ కంటే ఇంకొకరు అందంగా వుండడం సంభవించింది!
ఆరోజు ఉదయం జేన్ వంటింట్లో పని వాళ్ళని సంబాళిస్తూ తీరుబడిలేకుండా వుంది. మర్నాడే పెళ్ళి. ఇంతలో అమ్మాయిగారు పిలుస్తున్నారంటూ వచ్చి చెప్పారెవరో. లేచి హేరియట్ గదిలో కెళ్ళింది జేన్.
“జేన్, ఈ మేలి ముసుగు ఇలా పెట్టుకుంటే బాగుందా?” జేన్ అభిప్రాయం అడిగింది హేరియట్.
“నన్నడిగి లాభం లేదు హేరియట్. ఇలాటి వాటి గురించి నాకసలేమీ తెలియదు. నాకన్నీ ఒకలానే అనిపిస్తాయి!”
“అబ్బా! ఇప్పుడెలా? ఇన్ని మేలి ముసుగుల్లో ఏది బాగుంటుందో తెలియక చస్తూంటే నువ్వు సహాయమైనా చేయవు!” విసుక్కుంది హేరియట్.
“లేకపోతే రేపంతా హడావిడై పోతుంది. మీ చెల్లెలి పెళ్ళికి అంతా మామూలు బట్టలు కొన్నాడు బ్రాండన్ కాబట్టి తేలిగ్గా అయిపోయింది. ఇది అలా కాదు, అన్నయ్య ఎంతో ఖరీదైన గౌను తెచ్చాడు. మేలి ముసుగు సరిగ్గా లేకపోతే గౌను అందమంతా పాడైపోతుంది కదూ? ఎల్సీలా గబగబా పెళ్ళాడినా ఐపోయేది. వాళ్ళిద్దరూ హాయిగా వున్నారు, ఈ హడావిడీ ఆర్భాటమూ లేకుండా!”
“ఊమ్మ్..”
“బ్రాండన్ మంచి వాడే కాదనను, కానీ, నువ్వే చూస్తున్నావుగా, డాక్టర్ గ్రాంట్ ఎక్కడా, అతనెక్కడా? నాకు చదువూ సంధ్యలు లేని వాళ్ళంటే పెద్ద ఇష్టం వుండదు. అందుకే బ్రాండన్ పట్ల మనసు మార్చుకున్నాను. గ్రాంట్ లాటి మేధావీ, విద్యాధికుడూ నా భర్త అవాలని రాసి పెట్టి వున్నప్పుడు అందులో ఆశ్చర్యమేముంది? బ్రాండన్ మొరటుతనానికీ నాకు పొసిగేదే కాదు. అతనికసలు గొర్రెలు బర్రెల ధ్యాసే తప్ప కాస్త జీవితాన్ని చవి చూద్దామన్న కళాత్మక దృష్టే లేదు. ఎల్సీ అదృష్టవంతురాలే లే మొత్తం మీద. అందులోనూ మీ పరిస్థితిలో, బ్రాండన్ లాటి భర్త దొరకడం..”
ఇంకేమనేదో కానీ, జేన్ తన వైపు చూసిన చురుకైన చూపుతో నోరు ముసుకుంది హేరియట్. అసలు చడా మడా తిడదామనుకుంది జేన్, కానీ పెళ్ళి కూతురి మనసు పాడు చేయడం ఇష్టం లేక అక్కణ్ణించి బయటికి వెళ్ళిపోయింది. బయటికొచ్చేసరికి రెండు పెద్ద జాగిలాలు ఆనందంగా మొరుగుతూ ఆమె మీద పడ్డాయి. సంతోషంతో కెవ్వుమంది జేన్!
“నెప్! ఫ్లోరా! మీరిక్కడా? ఎలా? ఎలా వొచ్చారసలు?” వాటిని ఆనందంతో కౌగలించుకుంది. అవి రెండూ ఆపకుండా మొరుగుతూ ఆమెని చుట్టుకున్నాయి. పకపకా నవ్వుతూ చుట్టూ చూసింది జేన్.
“ఎవరివీ కుక్కలు? ఇక్కడికెలా వచ్చాయి? జేన్, వీటిని బయటికి తీసికెళ్ళు.” అసహనంగా అరిచింది హేరియట్.
“అలాగే, అలాగే!” వాటిని తీసుకుని బయటికి నడిచింది జేన్. వీధి తలుపు దగ్గర నిలబడి ఫ్రాన్సిస్ లోపలికి తొంగి చూస్తున్నాడు.
“ఫ్రాన్సిస్!” పరుగున అతన్ని చేరుకుంది జేన్. దగ్గరకొచ్చిన ఆమెని రెండు చేతుల్లో చుట్టేసాడు ఫ్రాన్సిస్.
“జేన్, నీకోసమే వచ్చేసాను. ఇక నువ్వేం చెప్పినా నేను వినను. ఆస్తీ ఎస్టేటు పార్లమెంటు సీటూ నాకివేవీ వొద్దు. ఇహ పోగొట్టుకోడానికి నా దగ్గరేమీ లేదు. ఇప్పుడు నువ్వు నిరభ్యంతరంగా నన్ను పెళ్ళాడతావుగా జేన్?”
“ఫ్రాన్సిస్! నేను నిన్ను చాలా ప్రేమించాను. ఎంతంటే, నీ మంచి కొసం జన్మంతా నీకు దూరంగా వుండేంత! కానీ, ఇది చెప్పు. ఆ కథంతా నిజమేనా? నిజంగా నువ్వు అన్నీ వొదిలేసి ఆస్ట్రేలియా వచ్చేసావా?”
“అన్నీ చెప్తా, బయట తోటలో కూర్చుందాం పద. ఇక మన జీవితాల్లో సంతోషం తప్ప ఏమీ లేదు జేన్. నాకెంత హాయిగా వుందో చెప్పలేను. అన్ని సంకెళ్ళూ తెగిపోయినట్టూ, స్వేఛ్ఛగా ఎగిరిపోతున్నట్టుంది. నీక్కూడా సంతోషమేగా జేన్?”
మనస్ఫూర్తిగా నవ్వింది జేన్.
“చాలా, చెప్పలేనంత! మనం సంపాదించని ఆ ఆస్తిపాస్తులు మనకెందుకు?”
“అది సరే, ఇప్పుడు నా పేరేమిటంటావ్? ఫ్రాన్సిస్ హొగార్త్ అని చెప్పాలా? అసలు నేను ఫ్రాన్సిస్ నే కాను, నా నిజం పేరేమిటో కూడా నాకు తెలియదు!”
“నేను నిన్ను ప్రేమించింది ఫ్రాన్సిస్ హొగార్త్ అన్న పేరుతోటే, కాబట్టి అదే నీ పేరు. మా మావయ్య వున్నా చాలా గర్వంగా తన పేరు నీకిచ్చేవాడు.అది సరే, ఎస్టేటు, ఆస్తి అంతా ఏం చేసావ్?”
హాయిగా నవ్వాడు ఫ్రాన్సిస్.
“అంతా ఆ శరణాలయాలకి ధారాదత్తం చేసాను. అయినా నువ్వేం బెంగపడకు. యేడాదికి మూడొందలొచ్చే ఉద్యోగం చూసుకున్నా మెల్బోర్న్ లో. వాళ్ళందరూ ఇచ్చిన డబ్బూ వుంది. క్రాస్ హాల్ ఎస్టేటు నించి మన ఇంటికి అవసరమైన సామానూ కొంచెం తీసుకున్నాను. అసలు గుర్రాలూ తెద్దామనుకున్నా కానీ పడవ మీద వీలు పడలేదు. ఈ రెండు కుక్కలు మాత్రం తేగలిగాను. అన్నట్టు సూసన్ గుర్తుందా? ఎస్టేటులో మీ ఇంట్లో పని చేసేది? తనకీ దారి ఖర్చులు చెల్లించి నీకోసం తెచ్చాను. మెల్బోర్న్ లో మనం సుఖంగా బ్రతకొచ్చు జేన్. చెప్పు జేన్ మెల్విల్, నన్ను పెళ్ళాడతావా?”
“తప్పక పెళ్ళాడతా ఫ్రాన్సిస్ హొగార్త్!” నవ్వింది జేన్.

(వచ్చే వారం- ముగింపు)

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం  తరువాయి)

శారద

శారద

వీలునామా – 44వ భాగం

veelunama11

ఎల్సీ ఉత్తరం

తన జీవితం లోంచి జేన్ వెళ్ళిపోయాక ఫ్రాన్సిస్ ప్రజా సేవలో నిమగ్నమైనాడు. పార్లమెంటు సమావేశాలూ, చర్చలూ క్రమం తప్పకుండా హాజరవుతూ తన వాక్పటిమకీ, లోక ఙ్ఞానానికీ మెరుగులు దిద్దుకున్నాడు. ఎలాగైనా ఎన్నికల ప్రక్రియను మెరుగుపరిచి సంఘంలో వీలైనంత ఎక్కువ మందికి ఓటు హక్కు కల్పించాలని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. పార్టీ అధిష్ఠానం అతన్ని ఎన్నో కమిటీల్లో సభ్యునిగా వేసింది.

అబధ్ధాలతో కాలం గడుపుతూ రాజకీయం చేసేవారిని అతను నిర్భయంగా ప్రశ్నలడిగి చికాకు పెట్టసాగాడు. ఇతరత్రా అతని విలువని పార్టీ, ఇతర పార్లమెంట్ సభ్యులూ గుర్తించి గౌరవించినా, అతని ‘అందరికీ ఓటు హక్కు ’ నినాదం చాలా మందికి మింగుడు పడలేదు.
అయితే పార్లమెంటు భవనాని కవతల చాలా మంది ఫ్రాన్సిస్ అనుకుంటున్నట్టు ‘అందరికీ ఓటు హక్కు ‘ మంచిదనే నమ్ముతున్నారు. అమెరికా ఆస్ట్రేలియా రాజకీయాలల్లో కూడా ఓటు హక్కు విస్తరణ ప్రస్ఫుటంగా కనబడుతోంది. ప్రపంచమంతా ప్రజాస్వామ్యం వైపు త్వరత్వరగా అడుగులేస్తూ వుంటే ఇంగ్లండు మాత్రం “ధనిక స్వామ్యం” లో కూరుకుపోవడం భవిష్యత్తులో చాలా సమస్యలు సృష్టిస్తుందని ఫ్రాన్సిస్ గాఢంగా నమ్మాడు. నమ్మిన విషయాన్ని రాజకీయ సహచరులతో పంచుకున్నాడు కూడా.

ఆస్ట్రేలియా రాజకీయాలూ అక్కడ ఓటు హక్కు విస్తరణా గురించి మాట్లాడినప్పుడు కొన్నిసార్లు సహచరులు అతన్ని హేళన చేసారు. అలాటప్పుడు కృంగిపోయినా, మళ్ళీ అంతలోనే తన మీద జేన్ వుంచిన నమ్మకమూ ఆశ గుర్తొచ్చేవి అతనికి.

రాజకీయాల్లో తలమునకలుగా వున్నా అతను మిగతా స్నేహితులగురించి కనుక్కుంటూనే వున్నాడు.

ఆ రోజు రాత్రి ఫ్రాన్సిస్ కొందరు పుర ప్రముఖులతో కలిసి భోజనం చేసి వచ్చాడు. అక్కడ మేధావులూ, బహు భాషా కోవిదులతో ఆ సాయంత్రం అతనికి చాలా చక్కగా గడిచింది. తాను- ఒక మామూలు బాంకు గుమాస్తా- ఇవాళ పెద్దలతో సమాన స్థాయిలో కూర్చుని సంభాషించే స్థాయికొచ్చాడు. విధి ఎంత విచిత్రమైనది. అతనా ఆలోచనల్లోనే ఇల్లు చేరుకొని తనకొచ్చిన ఉత్తరాలు తీసుకొని పక్కకెక్కాడు.

ఆస్ట్రేలియానించి రెండు ఉత్తరాలు, ఒకటి రాసింది జేన్ అయితే రెండోది ఎల్సీనుంచి. ముందుగా జేన్ ఉత్తరం తీసి చదివాడు. అందులో జేన్ విరివాల్టాలో తమ జీవనం గురించి వివరంగా రాసింది. డాక్టర్ గ్రాంట్, ఫిలిప్స్ చెల్లెలు హేరియట్ ని పెళ్ళాడబోతున్నట్టూ రాసింది. “దీంతో బ్రాండన్ విముక్తుడవుతాడు కాబట్టి అతను ఎల్సీని పెళ్ళాడితే బాగుండు,” అనే ఆశ భావాన్ని వ్యక్తం చేసింది.
ఉత్తరం చదివి ఫ్రాన్సిస్ నిట్టూర్చాడు.

“జేన్, నిన్నిలా ఉత్తరాల్లో కాకుండా సంపూర్తిగా నాదాన్ని చేసుకునే అదృష్టం నాకెప్పుడు పడుతుందో! బయటినించి అలిసి ఇంటికొచ్చేసరికి నీ ఉత్తరం కాకుండా నువ్వే ఎదురొస్తే! నేను చెప్పే విశేషాలని నువ్వు మెరిసే కళ్ళతో వింటూంటే! ఇప్పుడు నువ్వూ నాలా ఆలోచిస్తూ పడుకోని వున్నావో! కాదు కాదు, నువ్వేమో ప్రపంచానికా పక్క! మీకక్కడ తెల్లారి పోయి వుంటుంది, పనుల్లో తలమునకలుగా వుంటావు. నాకు మాత్రం నేనేం చేస్తున్నా మనసులో ఓ మూల నువ్వు తొంగి చూస్తున్నట్టే ఉంటుంది!” ఆలోచనల్లోంచి తెప్పరిల్లి ఫ్రాన్సిస్ రెండో ఉత్తరం చూసాడు.

“హ్మ్మ్! ఎల్సీ నాకెప్పుడూ ఉత్తరం రాయలేదు. ఇప్పుడెందుకు రాసిందో..” కవరు చించి తెరవగానే, దాంతో ఉత్తరంతో పాటు, ఏవో నాలుగైదు కాగితాలు జారి పడ్డాయి. నాలిగింటి మీదా ఏవో సంతకాలు కూడా ఉన్నాయి. కుతూహలంగా ఉత్తరం తెరిచాడు ఫ్రాన్సిస్.

ప్రియమైన ఫ్రాన్సిస్,
దీంతో జత చేసిన కాగితాలు ఏమిటో అనుకుని ఆశ్చర్యపడుతున్నావేమో. ఆ కాగితాల్లో ఒక ముఖ్య సమాచారం వుంది.
నీకు మిసెస్ పెక్ గుర్తుందిగా? మీ అమ్మననీ, కొంచెం డబ్బివ్వమనీ ఆవిడ నీకు ఉత్తరం రాసింది. అయితే ఆవిడ నీ తల్లి కాదు. అసలు ఆవిడకీ నీకూ ఎటువంటి సంబంధమూ లేదు. అలాగే, మావయ్యా మీ నాన్న కారు. మిసెస్ పెక్ నోటి వెంట నిజాలు చెప్పించి వాటన్నిటీ రాసి ఆవిడ సంతకాలూ సాక్షి సంతకాలూ తీసుకున్నాము.
నీకూ మాకూ ఎటువంటి చుట్టరికమూ లేదు. ఆ వార్త వినగానే నాలాగే నువ్వూ ఎగిరి గంతేస్తావని తెలుసు. ఎందుకంటే మనకి ఏ చుట్టరికమూ లేకపోతే నువ్వు జేన్ ని పెళ్ళాడడానికి ఎటువంటి అడ్డంకీ వుండదు. వీలునామా ప్రకారం ఆస్తి కూడ నీదగ్గరే వుంటుంది. అందుకని జేన్ కూడ పెళ్ళికి అభ్యంతర పెట్టదు. అయితే ఒక్కటి- ఈ కాగితాలకి కోర్టులో ఏ విలువా ఉండదని బ్రాండన్ అంటున్నారు. అయినా కనీసం నీ మనసు కుదుట పడుతుందని పంపుతున్నా. ఏం చేసినా బాగా ఆలోచించి నీ బాగూ జేన్ బాగూ దృష్టిలో పెట్టుకోని చేయి. మీరిద్దరూ ఒకటయితే నాకంటే సంతోషించే వారింకెవరూ ఉండరు.
ఇంకొక మంచి వార్త- అక్క నీతో చెప్పేవుంటుంది- నేనూ బ్రాండన్ పెళ్ళాడబోతున్నాం. నేను చాలా సంతోషంగా వున్నా ఫ్రాన్సిస్! పెగ్గీ కనిపిస్తే అడిగానని చెప్పు. పెళ్ళికూతురిగా తన ఇంట్లోంచే వెళ్ళాలని వుంది నాకు. బ్రాండన్ కి తగిన భార్యగా బ్రతకమని నన్ను దీవించు.
ప్రేమతో
ఎల్సీ

ఉత్తరం చదివి ఫ్రాన్సిస్ మిసెస్ పెక్ కాగితాలన్నీ ఆత్రంగా చదివి ఆకళింపు చేసుకున్నాడు. తన మీద ఎల్సీకి వున్న ఆప్యాయతకి కదిలిపోయాడు.
“ఆహా! ఈ ప్రపంచం లో నా బాగు కోరే వ్యక్తులూ వున్నారన్నమాట. నేను ఒంటరిని కాను. నాకేం చేయాలో బాగా తెలిసిపోయింది. జేన్ కి కూడా నా మీద ఇష్టం వుండే వుంటుంది. లేకపోతే ఎల్సీ అలా ఎందుకు రాస్తుంది? సరే, ఈ కాగితాలతో నాకూ జేన్ కీ ఎటువంటి చుట్టరికమూ లేదని కోర్టు ఒప్పుకుంటే సరే! లేకపోతే ఈ వెధవ ఆస్తిని ఒక్క తాపు తన్ని ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను. జేన్ మాటలు కూడా ఇక నేను వినను! నా అదృష్టం బాగుంటే పార్లమెంటు సీటూ ప్రజా సేవా, జేన్, మూడింటినీ దక్కించుకుంటాను. లేదా అన్నిటినీ వొదిలేసి జేన్ తోనే స్థిరపడిపోతాను. ముందుగా పొద్దునే ఎడిన్ బరో వెళ్ళి పాత పత్రికలన్నీ తిరగేసి మిసెస్ పెక్ చెప్పినదాంట్లో నిజమెంతో నిర్ధారించుకుంటాను. తరవాత లాయరు మెక్ ఫర్లేన్ తోనూ, సింక్లెయిర్ తోనూ సంప్రదిస్తాను. …” భవిష్యత్తు గురించి కలలు కంటూ నిద్రలోకి జారిపోయాడు.

(సశేషం)

వీలునామా – 43 వ భాగం

veelunama11

ఆశా- నిరాశా

 

మిసెస్పెక్చెప్పినవింతకథనుబ్రాండన్ఆసాంతమూఅడ్డుచెప్పకుండావిన్నాడు. విన్నతర్వాతఏమనాలోఅతనికితోచలేదు. కొంచెంసేపుఆలోచించినతర్వాత, అతను

“అయితేనువ్వుతర్వాతఎప్పుడైనాఆపిల్లాణ్ణిపోగొట్టుకున్నఆవిడనికలిసేప్రయత్నంచేసావా?”

“ఎలాచేస్తాను? ఆరాత్రికేపడవఎక్కిసిడ్నీవెళ్ళిపోతిమి. ఆవిడపేరేమిటోకూడానాకుతెలియదు. ఆవిడఎవరో, ఎక్కడవుందో, అసలిప్పుడుబ్రతికుందోలేదో, తనపిల్లాడుమారిపోయినసంగతిగుర్తుపట్టిందోలేదో, ఏదీతెలియదునాకు.”

“ఇదంతాఎప్పుడుజరిగింది?”

“సరిగ్గాముఫ్ఫైనాలుగేళ్ళక్రితం.”

“అప్పుడులండన్లోమీరుబసచేసినసత్రంపేరుగుర్తుందా?”

“పేరుగుర్తుందికానీచిరునామాగుర్తులేదు.”

“మీరుప్రయాణించినపడవపేరు?”

“పేరుగుర్తులేదుకానీ, మేంబయల్దేరినతేదీసరిగ్గాగుర్తుంది. మే 14! ఆతేదీసాయంతోమనంపడవపేరుకనుక్కోలేమా? అమెరికాబయల్దేరినపడవసరిగ్గామర్నాడుబయల్దేరింది.”

“ఆవిడఅమెరికాప్రయాణంఅవుతున్నట్టునీకుగట్టిగాతెలుసా?”

“ఆసత్రంయజమానిమాఅమ్మతోచెప్తూవుంటేవిన్నా.”

నిట్టూర్చాడుబ్రాండన్.

“నిన్నూమీఅమ్మనీఉరితీసినాపాపంలేదు. డబ్బుకోసంపసిపాపనీతల్లినీవిడదీస్తారా? ఇంతకీమీరుసిడ్నీలోఎలాబ్రతికారు?”

“దర్జాగా! అదీహేరీపంపేడబ్బుఅందుతూవున్నంతకాలం.”

“ఫిలిప్స్మీకెక్కడకలిసాడు? అతనికీమీఅమ్మాయికీపెళ్ళెలాజరిగింది? కనీసంఆవిడైనానీసొంతకూతురేనాలేకమళ్ళీఎవరిదగ్గర్నించైనాఎత్తుకొచ్చావా?”

“ఆకృతఘ్నురాలునాకడుపునేచెడబుట్టిందిలే. దానిఅందచందాలన్నీనాపోలికేకదా? ఆఅందాన్నిఎరగాచూపిఫిలిప్స్లాటీడబ్బున్నమగవాణ్ణివలలోవేసుకోమనినేర్పిందినేనేకదా? అయితేఅదిచేసినపనిచూడు! అతన్నిఏకంగాపెళ్ళిచేసుకునినన్నొదిలివెళ్ళిపోయింది.”

“బ్రతికిపోయింది. సరే, ఇప్పుడీకథంతానేనుకాగితాల్లోరాస్తాను. నువ్వునిజమేననిసంతకంచేయాలి.”

బ్రాండన్ ఆమెచెప్పినకథంతా ఏవివరాలూమరిచిపోకుండా ఓపిగ్గా నాలుగుపేజీల్లోరాసి ఆమె ముందు పెట్టాడు.

“నేనుహేరీనిమభ్యపెట్టిపెళ్ళిచేసుకున్నసంగతికూడారాయాలా? దానికీఫ్రాన్సిస్వారసత్వానికీఏంసంబంధం?”

“అదంతానీకెందుకు? నువ్వడిగినకాగితంమీదనేనుసంతకంపెట్టాకదా? ఇందులోఏమీఅబధ్ధాలులేవుకదా? అన్నీనువ్వుచెప్పినసంగతులేకానీ, నేనేంకల్పించిరాయలేదుకదా? ఇహమాట్లాడకుండసంతకంపెట్టు,” చిరాగ్గాఅన్నాడుబ్రాండన్.

ఆ కాగితం మీద సణుక్కుంటూ సంతకం చేసింది మిసెస్పెక్. ఆ తర్వాత తనకీపెక్కీమధ్యనడిచినప్రేమాయణమూ, పెళ్ళివివరాలూచెప్దామనిఅనుకుందికూడాకానీబ్రాండన్ఎటువంటిఆసక్తీకనబర్చలేదు

“ఇంతకీనీకొకవిషయంచెప్పడమేమర్చిపోయాను. ఫ్రాన్సిస్కిక్రాస్హాల్ఎస్టేటువారసత్వంగారాలేదు. పెద్దాయనహొగార్త్రాసినవీలునామావల్లవచ్చింది. ఇప్పుడు నీ కథ వల్ల ఫ్రాన్సిస్హేరీహొగార్త్కొడుకు కాదన్న విషయం తెలిసినా ఒరిగేదేమీ ఉండదు. ఎస్టేటూ, ఆస్తీ అన్నిటికీ అతనే హక్కుదారు,”చావు కబురు చల్లగా చెప్పాడు బ్రాండన్. నిర్ఘాంతపోయింది మిసెస్పెక్.

“ఏమిటీ? వీలునామావల్లా? మరిఆసంగతిముందేఎందుకుచెప్పలేదు? అయితేఆఅక్కచెల్లెళ్ళకిడబ్బొచ్చేఅవకాశమేలేదన్నమాట. హయ్యో! నేనింకావాళ్ళకిఆస్తికలిసొస్తేనాకూకొంచెంబహుమానంఇస్తారనిఆశపడిఈకథంతానీకిచెప్పానే! పేపర్లోవీలునామాసంగతేమీరాయలేదే! విచిత్రమైన పరిస్థితులలో ఎస్టేటు హేరీహొగార్త్కొడుకనిచెప్పుకుంటూ వున్న ఫ్రాన్సిస్ ఎస్టేటు సొంతదారుడయ్యాడు అనిమాత్రమే వుంది పేపర్లో!”

“అయ్యో! అలాగా? ఆ వీలునామాలో ఫ్రాన్సిస్ ఆర్మిస్టవున్గా చలామణీ అవుతున్న ఫ్రాన్సిస్హొగార్త్కి ఆస్తీ ఎస్టేటూ డబ్బూ చెందవలసింది, అనివుంది.”

“మరింకేం? ఆపిల్లాడుఫ్రాన్సిస్ఆర్మిస్టవునూకాడు, ఫ్రాన్సిస్హొగార్తూకాడు. ఎవరోఅనామకుడు. ఈసంగతితెలిస్తేఅతన్నితన్నితగిలేసిమేనకోడళ్ళకేఆస్తిదక్కుతుందేమో! అప్పుడునావెయ్యిపౌండ్లమాటమరిచిపోరుగా?” ఇంకాఆశగాఅడిగిందిమిసెస్పెక్.

ఆమెవంకజాలిగాచూసాడుబ్రాండన్.

“కానీనీమాటలునమ్మేదెవరు? కోర్టుఎటువంటిఋజువులూలేకుండానువ్వుచెప్పేవిషయాలేవీనమ్మదు. అసలునువ్వుచెప్పేదంతానిజమనినాకేఅనిపించడంలేదు. ఫ్రాన్సిస్నీకుడబ్బుపంపడంలేదన్నకోపంతోఇదంతానువ్వేకల్పించివుండొచ్చుగా? ఎలాఋజువుచేస్తావీవింతకథను?”

“పాతపేపర్లుచూస్తేపిల్లాణ్ణిపోగొట్టుకున్నవివరాలేమైనాదొరకచ్చు. ఆలోచిస్తేఏదోమార్గంకనిపించకపోదు. అయినా, ఆచెల్లెలిమీదమనసుపడ్డట్టున్నావు, ఆపిల్లకీడబ్బొస్తుందంటేనువ్వేఅడ్డుపడుతున్నావే!”

మిసెస్పెక్నిరాశ తట్టుకోలేకుండావుంది. ఫ్రాన్సిస్దగ్గర్నించి డబ్బు వచ్చేటట్టయితే అతని తల్లిగా చలామణీ అవుదామని ఆమె తన పెళ్ళిసర్టిఫికేటూ, ఫ్రాన్సిస్పుట్టుకసర్టిఫికేటూ అన్నీ జాగ్రత్తగా దాచుకుంది. ఎప్పుడైతేఫ్రాన్సిస్తనవిన్నపాలుబేఖాతరుచేసాడో, అప్పుడుమేనకోడళ్ళపక్షానచేరాలనినిశ్చయించుకుంది. ఇప్పుడాదారీలేదనితెలియడంతోఆమెకిదిక్కుతోచడంలేదు.

“కనీసంఆవిడపేరైనాతెలిసుంటేపేపర్లోలోనోఅమెరికాలోనోవెతికేఅవకాశంవుణ్డేదేమో. నీకావిడపేరుకూడాతెలియదుకాబట్టిఇప్పూడుఇంకేమీచేయలేము.”

మిసెస్పెక్కోపంపట్టలేకపోయింది.

“ఎంతమోసం! డబ్బొస్తుందనిఆశపెట్టినాతోకథంతాచెప్పించిఇప్పుడేమీవీలుకాదంటావా? ముందాకాగితంఇటిచ్చేయ్!” అతనిపైకిదూకింది.

“ఆగాగుమిసెస్పెక్! నీకేమీభయంలేదు. ఈ కాగితంతో ఫ్రాన్సిస్ని ఎస్టేటు బయటకి వెళ్ళగొట్టలేని మాట నిజమే,కానీ దీన్లో వున్నది నిజమని నిరూపణ అయితే నీకు కనీసం అయిదు వందల పౌండ్లైనా ఇప్పిస్తా సరేనా? నేనూ ఫ్రాన్సిస్దగ్గరి స్నేహితులం, నా మాట అతనెన్నడూ కాదనడు.”

మళ్ళీ నివ్వెర పోయింది మిసెస్పెక్!

“ఏమిటీ? మీరిద్దరూస్నేహితులా? మరిఎందుకుఅంతలాఈకథంతాచెప్పించుకున్నావు? దీంతోనీకేమిటిప్రయోజనం?” అయోమయంగాఅడిగిందిమిసెస్పెక్.

“అది చెప్పినా నీకర్థం కాదులే,” నవ్వాడు బ్రాండన్, లేచి వెళ్ళబోతూ. “అసలిదంతా నీ వల్లే జరిగింది. తగుదునమ్మా అంటూ నువ్వు ఆరోజు అడ్డుపడకపోతే ఆపిల్లతో రెండు వందలకైనా ప్రోనోటు రాయించుకునేదాన్ని.”

“ఆపిల్లకిచిల్లిగవ్వకూడారాదాఆస్తిలోంచిఅనిఎన్నిసార్లుచెప్పినాఅర్థంకాదానీకు?” చిరాగ్గాఅన్నాడుబ్రాండన్.

“మాబాగాజరిగింది. నువ్వుఆఅమ్మాయినిపెళ్ళాడతావల్లేవుందే? నాకూతురిదగ్గరపనమ్మాయినీపెళ్ళాంఅవుతుందన్నమాట. పదిమందిలోనీకాతలవంపులైతేగానీతెలిసిరాదు.”కసిగాఅందిమిసెస్పెక్.

“ఇంకోముఖ్యమైనవిషయం. ఎట్టిపరిస్థితిలోనూనువ్వునీకూతురిఇంటికివెళ్ళగూడదు. వస్తేఫిలిప్స్చాలాకోపగిస్తాడు. నీకూతురిక్కూడాఆవిషయంఇష్టంలేదు.”

“అబ్బో! ఇన్నాళ్ళకిదానికితనతల్లిపనికిరాకుండాపోయిందన్నమాట. ఎంతడబ్బున్నా, ఎంతఖరీదైనబట్టలేసుకున్నానాకూతురుకాకుండాపోతుందా? ఈపెద్దవయసులోకన్నకూతురేనాకొకముద్దపడేయకపోతేనేనెలాచావను?”

“సరే, నేనుఫిలిప్స్తోమాట్లాడినీకేదైనాఏర్పాటుచేయడానికిప్రయత్నిస్తాలే. మళ్ళీనిన్నొచ్చికలుస్తా.” బ్రాండన్లేచిఎల్సీదగ్గరకువెళ్ళిపోయాడు.

ఆ కాగితం చదివి ఎల్సీ ఎంతో నిరుత్సాహపడింది.ఇలా కాగితమ్ముక్క కాకుండా, ఫ్రాన్సిస్హొగార్త్మామయ్య కొడుకు కాడు అని నిరూపించే ఇంకేదో గొప్ప ఆధారం వుంటుందని ఆశపడిందామే. అప్పటికే ఆమె ఊహా లోకంలో ఫ్రాన్సిస్జేన్పెళ్ళాడి సంతోషంగా కాపురం చేసేసుకుంటున్నారు. ఏం చేయాలో తోచలేదామెకి.

“సరే, ఇప్పుడేంచేద్దాం. ఈకాగితంలోవున్నఏవిషయాన్నీమనంనిర్ద్వంద్వంగానిరూపించలేం. అలాటప్పుడుఈసంగతిఫ్రాన్సిస్చెప్పాలావద్దా? అనవసరంగాఅతన్నిబాధపెట్టడంఅవుతుందేమో! ఈవిషయాన్నిఇంతటితోవదిలేద్దామా? పోనీజేన్నిసలహాఅడిగితేనో?”

“వొద్దొద్దుబ్రాండన్! ఇంతవరకూమనంఅక్కయ్యకిచెప్పకుండానేఅన్నీచేసాం. ఇప్పుడూమనమేనిర్ణయించుకుందాం. నాఅనుమానం, జేన్కూడానీలానేఈవిషయాన్నొదిలేయమంటుంది.”

“అయితేజేన్కిఫ్రాన్సిస్మీదపెద్దఇష్టంలేదేమో!”

“అలాకాదు. జేన్కినిజంగానేఅతనంటేచాలాఇష్టం. అయితేతనకోసంఫ్రాన్సిస్త్యాగంచేయడంఇష్టంలేదు, అంతే.”

“నేనైతేనీకోసందేన్నైనావదిలేస్తా, ఎల్సీ!”

“ఆసంగతినాకూతెలుసు. కానీనిజంగానాకోసంనువ్వేదైనావొదులుకోవల్సినపరిస్థితివొస్తుందనుకో, అదినాకిష్టంవుండదుగా? ఇదీఅలాగేనన్నమాట.”

“సరేఅయితేమరిఒదిలేద్దాం. ఇద్దరూవేరేవేరేపెళ్ళిళ్ళుచేసుకొనిస్థిరపడతారు.”

“నాకదీనచ్చడంలేదుబ్రాండన్. ఒకరినిమనసులోవుంచుకొనిఇంకొకరినిపెళ్ళాడడంఎంతహీనమైనపని!నాఆలోచనప్రకారంజేన్, ఫ్రాన్సిస్ఒకరికోసంఇంకొకరుఒంటరిగాఉండిపోవడంమంచిది. జేన్కిమనఇంట్లోఎప్పుడూచోటువుంటుందిగాబ్రాండన్?”

“తప్పక! నీకాసందేహమేవొద్దు.”

“సరేఅయితేఈకాగితందాచేద్దామా?”

“ఉహూ! ఆకాగితంనేనుఫ్రాన్సిస్కిపంపిస్తాను. తనతల్లెవరోతెలుసుకునేహక్కుఅతనికుంటుందికదా? ఆతరవాతఏంచేయదల్చుకున్నాడన్నదిఅతనినిర్ణయం. కానీనిజాన్నిఅతనిదగ్గర్నుంచిదాచకూడదేమో! ఆకాగితంఇటివ్వుబ్రాండన్. నేనుఫ్రాన్సిస్కొకఉత్తరంరాసిదాంతోఈకాగితమూజతచేస్తాను. మనపెళ్ళివిషయంకూడాచెప్పలేదునేనింకాఅతనికి.”

“సరేనీఇష్టం. ఆచేత్తోనేమాఅమ్మకీఒకఉత్తరంరాసిపడెయరాదూ? కాబోయేకోడలిచదువూసంస్కారమూచూసిఅమ్మపొంగిపోతుంది. ఎడ్గర్ ఇహ బ్రహ్మచారి కొంపలో కాకుండా అత్తయ్య సంరక్షణలో వుండబోతాడని ఫానీ కూడా సంబరపడిపోతుంది.”

*********************************

వీలునామా – 42

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.Hogarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

“పారిస్ లో మేమిద్దరం పెళ్ళీ పెటాకులూ లేకుండానే ఒకే ఇంట్లో కలిసి వున్నాం. అక్కడెవ్వరూ ఏదీ పట్టించుకోరు! అక్కడ నాకు బానే వుండేది. అన్నిటికంటే డబ్బుకి కొదవ వుండకపోవడం లోని హాయి తెలిసొచ్చింది. నన్ను హేరీ అప్పుడప్పుడూ, ‘ఆశ పోతూ!’ అని పిలిచేవాడు. కానీ నేనేది అడిగితే అది కొని పెట్టేవాడు.

ఇంతలో అతనికి వాళ్ళ అన్నయ్య ప్రమాదం లో మరణించాడనీ, దాంతో తండ్రి గుండె పగిలి మంచం పట్టాడనీ కబురొచ్చింది. వెంటనే బయల్దేరి ఇంటికెళ్ళిపోయాడు. కొంచెం వెనకగా నేనూ ఇల్లు చేరుకున్నాను. ఒంటరిగా పారిస్ లొ నేను మాత్రం చేసెదేముంది?

అసలు ఇంటికి అమ్మ దగ్గరకెళ్ళాలంటే భయంతో ఒణికిపోయాను. కానీ హేరీ నచ్చచెప్పి పంపాడు. తను తప్పకుండా ఒచ్చి చూస్తుంటాననీ, కావలసినంత డబ్బిస్తాననీ చెప్పాడు. నేననుకున్నట్టుగానే అమ్మ నా మీద విరుచుకుపడింది. పెళ్ళి కాకుండా పరాయి మగాడితో లేచి పోయానని చావ బాదింది.

అయితే హేరీ గురించి నేను చెప్పగానే కొంచెం శాంతించింది. అంత డబ్బున్న అబ్బాయి పెళ్ళాడితే చాలని, ఎలాగైనా అతన్ని పెళ్ళికొప్పించాలనుకుంది. అందుకొక పథకం వేసింది అమ్మ. నన్ను తిండీ తిప్పలు పెట్టక చిక్కి శల్యమై పోయేలా చేసి, అతనికి కబురు పెట్టించింది. ఆ కబురందుకొని ఆఘ మేఘాలమీద వచ్చేసాడు హేరీ. అప్పటికే వాళ్ళ నాన్న గారు కూడా మరణించారట, ఊళ్ళో చెప్పుకున్నారు. వస్తూనే, మంచం మీద పడుకున్న నన్ను చూసి,

“బేస్సీ! ఏమైంది? ఇలా అయిపోయావెందుకు?” అని అడిగాడు. నేను అమ్మ చెప్పినట్టే మూలుగుతూ పడుకున్నా.

“ఏముంది, అంతా అయిపోయింది నాయనా! ఇహ మన బెస్సీ మననొదిలి వెళ్ళిపోతుందన్నాడు వైద్యుడు!” మా అమ్మ యథా శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ అంది.

నా నాడి పట్టుకుని చూసాడు హేరీ. అతను డాక్టరు పరీక్షకి చదివేవాడన్న సంగతి మర్చిపోయినందుకు అమ్మ తనని తనే తిట్టుకుంది. నాడి చూసి, నవ్వేసాడు.

“మరేం భయం లేదు. కొంచెం తిండి తింటే చాలు. బెస్సీ, నీ ఆరోగ్యానికేం ఢోకా లేదు. లే, లేచి కూర్చో!” అన్నాడు.

“వ్యాధి ఒంటిక్కాదు నాయనా, మనసుకి. పెళ్ళి కాకుండా పరాయి మగాడితో వున్న ఆడపిల్ల మనసెలా వుంటుంది బాబూ? నా కుతురి మొహాన అందరూ ఉమ్మేస్తున్నారు.”

“అయ్యో! ఆర్మిస్టవున్ గారూ! నేను మీ అమ్మాయిని లేవదీసుకెళ్ళలేదు. తనే నాతో లేచి వచ్చేసింది, అసలు తీసికెళ్ళేదాకా ప్రాణలు తోడిందంటే నమ్మండి!” నవ్వుతూ అన్నాడు.

“బెస్సీ కేమీ ప్రమాదం లేదు, మంచి తిండి తిని విశ్రాంతి తీసుకుంటే తనే లేచి తిరుగుతుంది!” నవ్వుతూ అని లేచి వెళ్ళిపోయాడు. అమ్మకి ఒళ్ళు మండిపోయింది.

“చావుకి పెడితే కానీ, లంఖణానికి రాదు,” అనుకుని నా ఆరోగ్యం క్షీణించాలనీ ఏవేవో మందులు తినిపించింది. నిజం చెప్పొద్దూ, ఆ మందులూ మాకులూ తిని నేనెంత అనారోగ్యం పాలయ్యానంటే నిజంగా చచ్చిపోతానేమోనని భయ పడ్డాను కూడా.

మళ్ళీ కబురు పెట్టింది అమ్మ హేరీకి. ఈ సారి నిజంగానే మంచం పట్టిన నన్ను చూసి హేరీ ఆశ్చర్యపోయాడు.

“పిల్ల బెంగతో చచ్చిపోయేటట్టుంది బాబూ! మీరు దాన్ని భార్యగా అంగీకరిస్తే మనశ్శాంతితో పోతుంది. లేకపోతే ప్రపంచం దృష్టిలో తాను కులటననే బాధతో పోతుంది.” అమ్మ వీలైనంత ఏడుపు గొంతుతో అంది.

నిజంగా నేను తన ప్రేమా పెళ్ళీ కోసం అంత బెంగటిల్లిపోతానని హేరీ ఊహించలేదు. నన్ను అక్కడికక్కడే పెళ్ళాడడానికి ఒప్పుకున్నాడు. అమ్మ వెంటనే ఇద్దరు బంధువులనీ, ఒక చర్చి ఫాదరునీ పిలిచి అప్పటికప్పుడు చట్టబధ్ధంగా భార్యా భర్తలనిపించింది. ఇదిగో ఆ కాగితం. దీంతో హేరీని దిగ్బంధనం చేసాననుకొంది అమ్మ.

అ తర్వాత హేరీ ఎస్టేటు పన్ల మీద లండన్ వెళ్ళాడు. అతనక్కడుండగానే ఫ్రాంక్ పుట్టాడు. ఆ సంగతి ఉత్తరంలో చెప్పాను. హేరీ పిల్లాణ్ణి చూడటానికి హుటాహుటిని బయల్దేరి మా వూరొచ్చాడు. దురదృష్టవశాత్తూ, సరిగ్గా హేరీ ఇంట్లో అడుగుపెడుతూన్నప్పుడు నేను చిన్ననాటి స్నేహితుడు జేమీతో మాట్లాడుతూ వున్నాను. నాకూ హేరీకీ పెళ్ళయిన సంగతి తెలిసి జేమీ చాలా బాధపడ్డాడు. పాపం నా కొసమే వూరొదిలి వెళ్ళిపోయి ఉద్యోగం సంపాదించుకోని స్థిరపడ్డాననీ, నన్ను పెళ్ళాడడంకోసమే తిరిగి వూరొచ్చాననీ చేప్పాడు జేమీ. నేనూ, తననెప్పుడూ మర్చిపోలేదనీ, హేరీతో పెళ్ళి కేవలం మా అమ్మ చేసుకున్నాననీ చెప్తూ వుండగా వొచ్చాడు హేరీ.

ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నేను తనని ప్రేమ పేరుతో మోసం చేసాననీ, ఇంకెన్నడూ నా మొహం కూడా చూడననీ ఉత్తరం రాసాడు.”

ఊపిరి పీల్చుకోవడానికని ఆగింది మిసెస్ పెక్.

“ఆహ్హా! అయితే ఫ్రాంక్ హేరీ హొగార్త్ గారి కొడుకు కాదన్నమాట. ఆ జేమీ స్టీవెన్సన్ కొడుకు. ఇదేనా నువ్వు నాకు చెప్పదల్చుకొన్న రహస్యం?” ఆత్రంగా అడిగాడు బ్రాండన్.

“నీ తెలివి సంతకెళ్ళా! అలాటిదేమీ లేదు. ఫ్రాంక్ ముమ్మాటికీ హేరీ హొగార్త్ కొడుకే! చెప్పేది పూర్తిగా విను మరి. వెళ్ళిపోయిన హేరీ అప్పుడప్పుడూ పిల్లాడి కోసం డబ్బు పంపుతూ వుండే వాడు, కానీ ఎన్నడూ నన్ను చూడడానికి రాలేదు. ఫ్రాంక్ యేణ్ణర్థం పిల్లవాడుగా వుండగా హేరీ ఇంకొక అన్నయ్య కూడా మరణించాడు. పాపాం, చాలా అల్పాయుష్కులు వాళ్ళందరూ. అప్పుడే హేరీ ఎస్టేటు సొంతదారుడయ్యాడు. అంత డబ్బున్న అల్లుడు చిక్కినట్టే చిక్కి చేజారిపోయినందుకు అమ్మ లబలబ లాడింది. ఏది ఏమైనా చట్ట రీత్యా నేను అతని పెళ్ళాన్ని కాబట్టి కొంతైనా డబ్బివ్వాలని హేరీ మీద ఒత్తిడి తెచ్చింది అమ్మ. దానికి హేరీ సరేనన్నాడు. అయితే నేను స్కాట్ లాండు వదిలి వెళ్ళి ఇంకెక్కడైనా స్థిరపడితేనే డబ్బు ఇస్తానన్నాడు. ముందు మేమిద్దరమూ ఒప్పుకోలేదు. కావాలంటే న్యాయస్థానానికీ వేళ్తామని బెదిరించాము. కానీ హేరీ యే మాత్రమూ లొంగలేదు. పైగా, అనారోగ్యం నటించి అతనిపై వత్తిడి తెచ్చి పెళ్ళి జరిపించామని తానే న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తానని మమ్మల్నే బెదిరించాడు. దాంతో మేము సరేననక తప్పలేదు. ఆ మాటకొస్తే ఆ వూళ్ళో మాకంత ఏముంది గనక?

సిడ్నీకి వెళ్ళే పడవ మీద మా ఇద్దరికీ టిక్కట్లు హేరీ యే కొనిచ్చాడు. మా మీద అతనికేమాత్రం నమ్మకం లేకపోవడంతో, లండన్ వరకూ వచ్చి మమ్మల్ని పడవ యెక్కిస్తానని అన్నాడు. నేనూ అమ్మా చంటి పిల్లాణ్ణేసుకుని లండన్ చేరుకున్నాము. లండన్ లో ఒక చిన్న హోటల్లో బస చేసాము. ఆ రోజు అక్కడ చచ్చేంత జనం వున్నారు.

మళ్ళీ దురదృష్టం నన్ను కాటేసింది. పిల్లాడికి జ్వరం తగిలింది. వాడసలే అర్భకంగా వుండి అప్పుడప్పుడూ అనారోగ్యం పాలవుతూ వుండడంతో మేము పెద్దగా పట్టించుకోలేదు. అమ్మ యేదో మందు వేసి వాణ్ణి పడుకోబెట్టింది. సరిగ్గా హేరీ రావడానికి గంట ముందర పిల్లాడు జ్వర తీవ్రతలో మరణించాడు. అమ్మ లబో దిబో మంది. ఇప్పుడు పిల్లాడు లేడంటే హేరీ పైసా విదల్చడు, అని అమ్మ ఏడుస్తూ వుంటే పిల్లాణ్ణి పోగొట్టుకొని నేనేడుస్తున్నాను.

“హయ్యో! హయ్యో! ఎంత పని జరిగిందే అమ్మా! ఈ ముదనష్టం పిల్లాడు పడవ ఎక్కింతరవాతైనా పోలేదు. ఇప్పుడు హేరీకి ఏం చెప్తాం? ఎవరి దగ్గరైనా పసివాడు దొరికితే ఈ గండం గట్టేక్కొచ్చేమో! అన్నట్టు, ఈ పక్క గదిలో అమ్మాయి పిల్లాడి తల్లి. ఒక్క గంట సేపు పిల్లాణ్ణి ఆడిస్తానని చెప్పి ఏదో మాయ చేసి ఆమె పిల్లాణ్ణి తీసుకొస్తా! హేరీ ఇంతవరకూ ఫ్రాంక్ ని చూడలేదు కాబట్టి గుర్తు కూడా పట్టలేడు,” అంటూ అమ్మ పక్క గదిలోకి పరిగెత్తింది.

ఆ గదిలో ఎవరో ఒక బీదరాలు అమెరికా వేళ్ళే పడవ ఎక్కి వెళ్ళబోతోంది. ఒక్క పౌండు ఇస్తే పిల్లాణ్ణి గంట సేపు తప్పకుండా అరువిస్తుంది, అన్న నమ్మకంతో అమ్మ ఆమె గదికి వెళ్ళింది. విచిత్రంగా, తల్లి పిల్లాణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఎటో వెళ్ళినట్టుంది. అమ్మ చకచకా పిల్లల బట్టలు మార్చి, పిల్లలనీ మార్చేసింది.

కనీసం నాకు ఏడ్చేందుకు కూడా తీరిక నివ్వకుండా అమ్మ, గుర్రబ్బండిలో నన్నూ పిల్లాణ్ణీ ఎక్కించింది. ఆ తర్వతే తెలిసింది నాకు, అమ్మ మా సామాను కూడా బండిలోకెక్కించిందనీ, మేము సత్రం తిరిగి రాగలమన్న నమ్మకమూ, ఉద్దేశ్యమూ ఆమెకెంత మాత్రమూ లేవని!

అలాగే ఏడుస్తూ హేరీని కలుసుకున్నాను. పిల్లాడు పోయిన సంగతి అతనికి చెప్పలేకపోవడం నాకింకా బాధగా వుంది. కానీ హేరీ నా ఏడుపుని నటన అనుకున్నాడు. నాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా ఆ పిల్లాణ్ణి చేతులోకి తిసుకున్నాడు. ఎందుకో అతని కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.

నా కడుపున పుట్టిన ఫ్రాంక్ ని ఒక్కనాడూ చేరదీసిందీ లేదు, ముద్దాడిందీ లేదు, ఇప్పుడీ అనామకుడెవర్నో చేతుల్లోకి తిసుకొని కన్నీళ్ళు కారుస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, ఆ క్షణం నా ఒళ్ళూ మనసూ ఈర్ష్యతో ఎంత భగభగ లాడాయో చెప్పలేను. అమ్మ భయం లేకపోతే అక్కడే నిజం చెప్పేసేదాన్నే. అయితే ఆ పిల్లాడి పట్ల అతని అనురాగం చూసి అమ్మ మొహం ఎందుకో కళకళ లాడింది.

“అయితే, మీరిద్దరూ ఈ పడవ ఎక్కి వెళ్తున్నట్టే గా?” అనుమానంగా అడిగాడు.

“నువ్వు చెప్పాక వెళ్ళక తప్పుతుందా నాయనా? ఇంతకీ మా సంగతేం చేస్తావో చెప్పావు కాదు. కొత్త స్థలం లొ మేం పొట్ట ఎలా పొసుకోవాలి? ఎలా నిలదొక్కుకోవాలి? పైగా నీ పెళ్ళాం బాలింతరాలు, చేతిలో చంటి పిల్లాడూ…”

“పిల్లాడిని నాకొదిలేయండి. మీ ఇద్దరికీ నెలకింతని పంపుతాను,” ఆలోచిస్తూ అన్నాడు హేరీ. నాకు పగలబడి నవ్వాలనిపించింది. నేనేదో అనేలోపలే అమ్మ అందుకుని,

“ఏమిటీ? దానికి వున్న ఒకే ఒక్క ఆసరా ఆ పిల్లాడు. తల్లినీ పిల్లాణ్ణీ వేరు చేస్తావా? ఏమ్మనిషివయ్యా? పెళ్ళానికి దిక్కులేదు గానీ పిల్లాణ్ణి ప్రేమగా పెంచుతాడట! ఎవరైనా వింటే నవ్వి పోతారు! అయితే ఆ పిల్లాణ్ణి నీ కొడుకని ఒప్పుకుంటావా? అది చెప్పు ముందు! “

అయితే అమ్మ మాటల ధాటీకీ హేరీ ఏమీ తడబడలేదు. నెమ్మదిగా, దృఢంగా అన్నాడు,

“పిల్లాణ్ణి ప్రేమగా చూస్తానో లేదో చెప్పలేను. కానీ చక్కటి చదువు సంధ్యలు చెప్పించి మనిషిని చేస్తాను. నీ దగ్గరుంటే వాడు జేబు దొంగ అయేది ఖాయం. ఆలోచించుకోండి!”
“సరే ఏం చేస్తాం! బెస్సీ! గుండె దిటవు చేసుకోమ్మా! తల్లిగా పిల్లాడి మంచి కోసం నువ్వా మాత్రం త్యాగం చేయక తప్పదు. బాబుగారు డబ్బున్న మారాజులు, మనకేమీ లోటు చేయరనుకో! నువ్వు చేసే త్యాగానికి ఎంతో కొంత ప్రతిఫలం ముట్టచెప్పకుండా వుంటారా చెప్పు…”

నాకు నిజానికి వాళ్ళిద్దరి మీదా ఎంత అసహ్యం వేసిందో చెప్పలేను. ఒక్క మాటా మాట్లాడకుండా తల తిప్పేసుకుని నిలబడ్డాను.

హేరీ ఒకసారి అమ్మ వైపు చురుగ్గా చూసి నా వంక చూసాడు. నా కన్నీళ్ళని నమ్మలేదు కానీ, జాలిపడ్డాడు. అమ్మ అనుకున్నట్టే మా ఇద్దరికీ నెల నెలా సరిపడా డబ్బు పంపుతానని మాట ఇచ్చాడు. ఆ డబ్బు మాట వినగానే అతనికి నిజం చెప్పాలన్న కోరిక నాకూ చచ్చిపోయింది. ఆ రాత్రే అతనికీ ఆ పిల్లాడికీ వీడుకోలు చెప్పి అమ్మా నేనూ వెళ్ళిపోయాము.

తన మాట ప్రకారమే హేరీ నెల నెలా డబ్బు పంపుతూ వచ్చాడు.

అయితే ఒకసారి ఆశతో నేను పదిహేను వందల పౌండ్లు అడగడంతో, ఆ తరవాత ఇహ ఎప్పుడూ డబ్బు అడగనని నాతో పత్రం రాయించుకుని పదిహేను వందలూ పంపాడు. నేనెంత తెలివి తక్కువ పని చేసానో ఆ పదిహేను వందలూ ఖర్చయిపోయింతరవాత కానీ అర్థం కాలేదు నాకు. బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకున్నట్టయింది.”
—————————————————————————

వీలునామా-41

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మిసెస్ పెక్ ఆత్మకథ

 

ఆ మర్నాడు తన ఇంట్లోకి వస్తూన్న బ్రాండన్ ని చూసి మిసెస్ పెక్ కొంచెం ఆశ్చర్యం తో పాటు భయానికీ లోనయింది. అయితే బింకంగానే మాట్లాడింది.

“అబ్బో! ఎల్సీ ని మా ఇంటికి రమ్మంటే ఆమె రాదన్నావు. మరి నువ్వెందుకొచ్చినట్టో!” తనకలవాటైన వెటకారపు ధోరణిలో అన్నది.

“నిన్న మధ్యాహ్నం నీ బేరం పాడు చేసా కదా? దాని గురించి మాట్లాడదామనీ..” అంతే వెటకారంగా జవాబిచ్చాడు బ్రాండన్.

“మధ్య వర్తులతో నేను చస్తే మాట్లాడను. ఏదైనా వుంటే ఆ ఎల్సీతోనే మాట్లాడతా!”

“నీలాటి మనిషితో ఏ పరువైన ఆడపిల్లా మాట్లాడదని గుర్తుంచుకో! ఐనా ఇదిగో ఎల్సీ ఉత్తరం. తన తరఫున నాతో నువ్వు మాట్లాడొచ్చని రాసి ఇచ్చింది, ” ఆమె చేతిలో ఒక కాగితం పెడుతూ అన్నాడు బ్రాండన్.

అమాయకురాలితో బేరం ఆడడమంటే బానే వుంటుంది కానీ, ప్రపంచం చూసిన మొరటు మగవాడితో బేరం తెగదని తెలుసు ఆమెకి.అయినా విధిలేక అతనితోనే మాట్లాడింది.

“సరే అయితే చెప్పు, నా దగ్గరున్న రహస్యానికెంత ఇవ్వగలవు నువ్వు?”

“నువ్వు చెప్పే రహస్యం వల్ల ఎల్సీ, జేన్ క్రాస్ హాల్ ఎస్టేటు సొంత్ దార్లయేటట్టయితే వెయ్యి పౌండ్లు!”

“రెండు వేలకంటే ఒక్క చిల్లి కానీ తగ్గను. ఆ ఎస్టేటు ధర ఎంతుంటుందో నీకు తెలియదా?”

“నిజానికి నువ్వు చెప్పే ఏ రహస్యమూ రెండు వేల విలువ చేయదు. ఒక వేళ నీకూ పెద్దాయన హొగార్త్ కీ జరిగిన పెళ్ళి చెల్లదనుకుందాం. అది నిరూపించడం కష్టం. అసలు ఇన్నేళ్ళయింతర్వాత నువ్వెవరో, నీ మాటల్లో నిజమెంతో కూడా నిర్ధారించడం కష్టం. అందుకని నువ్వు నీ రహస్యం గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోకు.” నిర్మొహమాటంగా అన్నాడు బ్రాండన్.

veelunama11

“నేనెవరో నిరూపించడానికి నాదగ్గర హొగార్త్ రాసిన ఉత్తరాలూ, రాసిచ్చిన చెక్కుల కాపీలూ వున్నాయి,” సంచీలోంచి కాగితాలు కొన్ని తీసి చూపించింది మిసెస్ పెక్.

“మరి ఆయన ఇచ్చిన డబ్బంతా ఏమయిపోయింది?”ఆశ్చర్యంగా అడిగాడు బ్రాండన్.

“అంతా పెక్ మొదలు పెట్టిన వ్యాపారాల్లో కొట్టుకుపోయింది,” నిరాశగా అంది మిసెస్ పెక్.

“ఇంతకీ నువ్వీ పెక్ ని ఎప్పుడు పెళ్ళాడావు?”

“పెళ్ళా నా బొందా! హొగార్త్ తో విడిపోయినతరవాత నేను పెళ్ళి చేసుకోనేలేదు. వేరే పెళ్ళి చేసుకుంటే ఆయన డబ్బివ్వడేమోనని భయపడ్డాను. “ఆమె వంక చూసి నిట్టూర్చాడు బ్రాండన్.

“నువ్వు చెప్పేదాంట్లో ఏది నిజమో, ఏదబధ్ధమో నీకైనా తెలుసనుకోను. అయితే నువ్వు నిజంగానే హొగార్త్ పెళ్ళాడిన ఎలిజబెత్ ఆర్మిస్టవున్! అంత వరకూ నిజమే అనిపిస్తుంది! అయితే ఫ్రాన్సిస్ నీ కొడుకే అయినా హొగార్త్ కొడుకు అయి వుండడు. అయితే అదిప్పుడు నిరూపించడం కష్టం కాబట్టి ఆ రహస్యం వల్ల ఎవరికీ పెద్ద ప్రయోజనం వుండదు.”

“ఆ విషయాన్ని నేను నిరూపించగలిగితే? రెండు వేలిస్తావా?”

“నువ్వెంత అరిచి గీపెట్టినా అంతే. నీకు వెయ్యి పౌండ్లు వద్దనుకుంటే నేనిక బయల్దేరతాను,” బ్రాండన్ లేచి నిలబడ్డాడు.

“అయితే ఆ ఫ్రాన్సిస్ ని ఆస్తంతా అనుభవించమని వదిలెస్తావా? నన్ను గడ్డి పోచ కంటే హీనంగా తీసి అవతల పడేసాడు. ఏలాగైనా అతన్ని ఎస్టేటు నుంచి వెళ్ళగొట్టి తీరతాను. అతను ఆ ఆస్తంతా అనుభవించడానికి అనర్హుడు.”

నవ్వాడు బ్రాండన్.

“అయితే నీదంతా ఫ్రాన్సిస్ మీద అక్కసే నన్నమాట! చెప్పు మరీ, వెయ్యి పౌండ్లకి నీకు తెలిసిందంతా చెప్తావా?”

“ముసలి దానితో ఇంత సేపు బేరాలు సాగిస్తావేమిటయ్యా నువ్వూ! సరే,అలాగే కానీ.”

తనతో తెచ్చిన అగ్రిమెంటు మీద తాను సంతకం చేసి, తరవాత మిసెస్ పెక్ తో సంతకం చేయించాడు బ్రాండన్.

“ఇప్పుడు చెప్పు నీకంతగా తెలిసిన ఆ రహస్యమేమిటో! ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. నిజమే చెప్పాలి. ఎక్కడ అబధ్ధాలాడినా నేను కనుక్కోగలను. ఆ తరవాత మళ్ళీ నీకు దిక్కుండదు!” బెదిరించాడామెను.

మిసెస్ పెక్ ఉత్సాహంగా చెప్పడానికి సిధ్ధపడింది. ఈ దెబ్బతో ఫ్రాన్సిస్ వీధిన పడతాడు. ఇప్పుడేదో వెయ్యి పౌండ్లంటున్నారు కానీ, ఎస్టేటంతా చేతిలో పడితే అక్క చెల్లెళ్ళిద్దరూ ఇంకొంచెం చేయి విదిలించకుండా వుంటారా? ఆ ఆశతోఆమె మొదలు పెట్టింది.

*******************

“నువ్వడిగినట్టు నిజమె చెప్తానబ్బాయి. అబధ్ధాలతో ఒరిగేది మాత్రం ఏముందిలే? నిజంగానే నా పేరు ఎలిజబెత్ ఆర్మిస్టవున్. క్రాస్ హాల్ ఎస్టేటు దగ్గర్లో వుండే పల్లెటూళ్ళో వుండేవాళ్ళం మేము. మా నాన్న ఒక దుకాణం నడిపే వాడు, అమ్మ బళ్ళొ పాఠాలు చెప్పేది. అయితే నాన్న తెలివి తక్కువతనంతో డబ్బంతా పోగొట్టుకొని వీధిన పడాల్సి వచ్చింది. ఆ విషయానికి అమ్మ మా నాన్నని చచ్చేదాకా సాధించింది పాపం! అక్కడ నన్ను జేమీ స్టీవెన్ సన్ పెళ్ళాడతానన్నాడు. పెద్ద చదువూ సంధ్యా డబ్బూ ఏమీ లేని వాడు. అయితే నాకంతకంటే మంచి మగవాడు దొరుకుతాడన్న నమ్మకం మాత్రం ఏముంది? అందుకే సరేనన్నాను. అమ్మ మాత్రం మండి పడింది. అప్పట్లో నేను చాలా అందంగా వుండేదాన్నిలే. లిల్లీని చూడలే? అదంతా నా పోలికే మరి!

నా అందచందాలకి ఇంకొంచెం డబ్బున్న మగవాడు దొరకచ్చని ఆశపడింది అమ్మ. వెంటనే నన్ను ఆ పల్లెటూరి నించి పట్నం తన స్నేహితురాలిదగ్గరికి పంపించేసింది. ఆ స్నేహితురాలు చదువుకుంటున్న విదార్థులకోసం ఒక సత్రం నడిపేది. ఆవిడ దగ్గర వుంటూ పని చేసుకుని నాలుగు రాళ్ళు సంపాదించుకోమని అమ్మ సలహా. సరే నని అక్కడికెళ్ళాను.

అక్కడికొచ్చే విద్యార్థులంతా బాగా డబ్బున్నవాళ్ళూ, సరదా మనుషులూను. వాళ్ళతో బాగా పొద్దుపోయేది. అయితే ఎవరూ ప్రమాదకరమైన వాళ్ళు కారు. చిన్న పిల్లల తరహా, అంతే. అక్కడికి రెండో సంవత్సరంలో వచ్చాడు హేరీ హొగార్త్.

అప్పట్లో చాలా తెలివైన వాడని చెప్పుకునేవారందరూ. అయితే కొంచెం సౌమ్యుడు. అంత పెద్ద ఎస్టేటుకి యజమాని నౌతానని తెలిసి వుండదు కాబట్టి పెద్ద గర్వంగా కూడా వుండేవాడు కాదు. పారిస్ లో చదువుకుంటానంటే వాళ్ళ నాయన కోప్పడి స్కాట్ లాండులోనే వుంచేసాడు.అయితే వున్నట్టుండి ఒకరోజు పెద్దాయన ఊడిపడ్డాడు కొడుకుని చూడటానికని. తలుపు తెరిచిన నన్ను చూసి మొహం చిట్లించాడు.

ఏమనుకున్నాడో ఏమో కానీ, వెంటనే హేరీని తన ఇష్ట ప్రకారమే పారిస్ వెళ్ళి చదువుకోమన్నాడు. హేరీ ఎగిరి గంతేసాడు. ఆ రాత్రి సత్రం లో పిల్లలందరూ పెద్ద పార్టీ చేసుకున్నారు.

 

పార్టీనించి హేరీ తిరిగొచ్చేసరికి నేనొక్కదాన్నీ హాల్లో కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఎందుకో ఆ రోజు నాకు చాలా దిగులుగా ఒంటరిగా అనిపించింది. నన్నలా చూసి హేరీ ఆశ్చర్యపోయాడు. అయితే ఆ అమాయకుడు నేనేదో తనని ప్రేమించి తననొదిలి ఉండలేక ఏడుస్తున్నాననుకున్నాడు.

ఆ తర్వాత హేరీ తన ప్రయాణాన్ని వారం రోజులు వాయిదా వేసుకున్నాడు. ఆఖరికి అనుకున్నట్టే పారిస్ వెళుతూ నన్నూ తనతో తీసికెళ్తానన్నాడు. నేను సంతోషంగా ఒప్పుకున్నాను. ఇద్దరమూ పారిస్ వెళ్ళిపోయాము.

***

-అనువాదం: శారద

శారద

శారద

వీలునామా – 40 వ భాగం

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

లిల్లీ మనశ్శాంతి

 

లిల్లీ ఫిలిప్స్ చెప్పా పెట్టకుండా ఇంట్లో కొచ్చిన బ్రాండన్ ని చూసి తత్తరపడింది. ఇంట్లో ఎల్సీ లేదనీ, పైగా మిసెస్ పెక్ తో కలిసి బయటికెళ్ళిందనీ తెలిస్తే ఏమంటాడో నన్న భయం ఆమెది. ఏమీ అనకున్నా తప్పక స్టాన్లీ తో చెప్తాడు. స్టాన్లీ కోపాన్ని తలచుకుని ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పైగా వచ్చీ రావడమే “ఎల్సీ ఏది?” అంటూ అడిగాడు. ఏదైనా అబధ్ధం చెప్పి తప్పించుకోవాలనీ అనుకుంది కూడా.
అయితే, నిజానికి లిల్లీ అమాయకురాలు, కల్లా కపటం తెలీని మనిషి. తన తల్లికి మల్లే అప్పటికప్పుడు నోటి కొచ్చిన కథలల్లే సామర్థ్యం ఆమెకి కొంచెం కూడా అబ్బలేదు. దాంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోయింది కాసేపు. ఎలాగైనా మిసెస్ పెక్ బ్రాండన్ కళ్ళ పడకుండా చేయగలిగితే తర్వాత ఎల్సీని ప్రాథేయపడితే సరిపోతుంది, అనుకుంది లిల్లీ.

“బ్రాండన్! నాకోసం ఒక చిన్న పనిచేసి పెడతారా? కొంచెం రిచ్ మండ్ దాకా వెళ్ళి రావాలి, చిన్న పని,” అని మొహమాటంగా అడిగింది. ఆశ్చర్యపోయాడు బ్రాండన్. ఇలా ఆమె ఎప్పుడూ అడగలేదు. ఇంతా చేస్తే ఆమె తెచ్చి పెట్టమన్నది ఒక పూల దండ. పూల దండ కిప్పుడంత తొందరేమొచ్చింది?

ఏదో అనుమానం మొలకెత్తింది బ్రాండన్ మనసులో. అయితే అతను అనుమానించిన విషయం వేరు. అప్పుడప్పుడూ లిల్లీ ఎల్సీ పట్ల మొరటుగా ప్రవర్తిస్తూందని అతనికొక అనుమానం. ఇవాళ కూడ ఎల్సీని అలాగే ఏదో మొరటుగా బరువులెత్తే పని మీద దుకాణానికి పంపి వుంటుంది. అందుకే ఎల్సీ వచ్చేసరికి నేనింట్లో వుండకుండా బయటికి పంపిస్తూంది, లేకపోతే ఇప్పుడు పూల దండతో పనేమిటి, అనుకున్నాడు బ్రాండన్. ఆమె అందీ పొందని సమాధానాలూ, పాలిపోయినట్టున్న మొహం, ఎంత సేపు కూర్చున్నా బయటకి రాని ఎల్సీ, అన్నీ కలిసి అతని అనుమానాన్ని బలపర్చాయి.

‘సరే పూల దండ తీసుకొస్తా’నని బయటపడ్డాడు బ్రాండన్. అయితే ఆమె అడిగినట్టు రిచ్ మండ్ కాకుండా ఇంకో వైపు వెళ్ళాడు, ఒకవేళ లిల్లీ ఎల్సీ ని ఏదైనా పనికి బయటికి పంపి వుంటే, ఇటు వైపే పంపి వుండాలి అనుకుంటూ. అదృష్టవశాత్తూ అతను సరిగ్గా ఎల్సీ మిసెస్ పెక్ తో కలిసి వస్తున్న దార్లోనే వెళ్ళి వాళ్ళకి ఎదురయ్యాడు. దూరం నించి వాళ్ళిద్దరినీ చూసి,
“ఆ అమ్మాయినెక్కడో చూసినట్టుందే” అనుకుంటూ దగ్గరకొచ్చాడు.

***

veelunama11

ఎల్సీతో కలిసి ఇంటికొస్తూన్న బ్రాండన్ చూసి లిల్లీ ఇంకా బెంబేలెత్తి పోయింది. ఇంట్లోకొస్తూనే ఏమీ మాట్లాడకుండా ఎల్సీ లోపలికెళ్ళిపోయింది. లిల్లీ ఒంటరిగా బ్రాండన్ తో నిలబడిపోయింది. ఆమె అనుకున్నట్టే బ్రాండన్,
“మిసెస్ పెక్ లాటి ఆవిడతో ఎల్సీ లాటి అమాయకురాల్ని పంపుతావా? ఆ అమ్మాయికేదైనా అయితే వాళ్ళ అక్కయ్యకేం జవాబు చెప్తావు?” అని అడిగాడు కోపంగా. బావురుమంది లిల్లీ.

“నాకు తెలుసు బ్రాండన్. కానీ ఆమెకి ఎదురాడలేను నేను. ఆమెని ఇంట్లోకి రానిచ్చానని తెలుస్తే స్టాన్లీ మండిపడతాడు. ఆమెని ఆపడానికి ఎంత ప్రయత్నించానో చెప్పలేను. కానీ ఆమె నా తల్లి! నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపొమ్మని చెప్పలేకపోయాను. నా ఖర్మకి ఆమెకెందుకో ఎల్సీతో ఎడతెగని కబుర్లు. స్టాన్లీకీ సంగతి తెలిస్తే నేను బ్రతకలేను.”
ఆమె దుఃఖం చూసి బ్రాండన్ కరిగిపోయాడు.
“పోన్లే లిల్లీ! బాధ పడకు. కానీ నువ్వామెకి భయపడడం మానేయాలి. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే అలాటి ఆడవాళ్ళు ఇంటికి రావడం ఏ మగవాడికీ ఇష్టం వుండదు. స్టాన్లీ చాలా మంచి వాడు. నువ్వు భయపడకు,” ఆమెకి సర్ది చెప్పాడు.
“నేనెప్పుడూ స్టాన్లీ నించి ఏదీ దాచను. స్టాన్లీ కాకపోతే ఈ ప్రపంచం లో నాకింకెవ్వరున్నారు? అసలు ఎప్పుడు స్టాన్లీ నన్నొదిలి ప్రయాణాలకెళ్ళినా నాకేదో ఆపద చుట్టుకుంటుంది. అందుకే నాకు స్టాన్లీ పక్కన లేకపోతే భయం నాకు. ఆయన మాట విని విరివాల్టా వెళ్ళిపోయినా ఈవిడ పీడ తప్పేది నాకు.”

లిల్లీ ఆవేదన చూసి బ్రాండన్ ఆశ్చర్యపోయాడు. అతనింకా లిల్లీకి భర్త పట్ల అంత ప్రేమా అభిమానాలూ వున్నట్టు ఊహించలేకపోయాడు. నిజానికి బ్రాండన్ కి లిల్లీని చూస్తే అంత ఇష్టం వుండేది కాదు. స్టాన్లీ లాటి మంచి మనిషికీ, కష్టపడే మనస్తత్వానికీ ఆమె సోమరితనమూ, నిర్లక్ష్యమూ ఏవీ సరిపడవని అతననుకుంటూ వచ్చాడు. స్టాన్లీ లాటి భర్త లభించడం తన అదృష్టమన్న గుర్తింపు లిల్లీకి ఏమాత్రమూ లేదని అనుకుంటూ వచ్చాడతను. నిజంగా లిల్లీ మనసులో స్టాన్లీ కున్న విలువ చూసి ఆశ్చర్యపోయాడు.

అసలెప్పుడూ లిల్లీ తన మనసులోని మాటలని పొందికగా చెప్పగలిగేదీ కాదు. అయితే మిసెస్ పెక్ లాటీ అపభ్రంశపు తల్లి చేతుల్లో పెరిగిన ఆడకూతురుకి అంత కంటే ఎక్కువ సంస్కారం ఎలా అలవడుతుంది, అనుకున్నాడు. కొంతవరకూ అ విషయం నిజమే అయినా తన తల్లిని చూసినప్పణ్ణించీ లిల్లీకి కొంచెం అవగాహన పెరిగింది. తనకన్ని సుఖాలూ సౌకర్యాలూ కల్పిస్తూ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన పెంకితనాన్నీ, చిన్న పిల్లల మనస్తత్వాన్నీ ఓపికగా భరిస్తున్న భర్తనీ, ఇంకా తననించి ఏదైనా లాభం వస్తే పొందుదామని ఎదురు చూస్తున్న తల్లినీ అప్రయత్నంగానే బేరీజు వేసిందామె మనసు. భర్త మీదా ప్రేమా గౌరవమూ రెట్టింపయ్యాయి! తన తల్లినించి రక్షించగలిగే ఒకే ఒక నీడ లా అనిపిస్తున్నాడామె భర్తకి. ఇప్పటికిప్పుడు స్టాన్లీ ఇక్కడికొచ్చి నన్ను ఇక్కణ్ణించి తీసికెళ్ళిపోతే బాగుండనుకుంది ఆమె. కన్నీళ్ళు తుడుచుకుంది.
ఆమె మనసు మళ్ళించాలనుకున్నాడు బ్రాండన్.

“అదంతా వొదిలెయ్యి లిల్లీ! అసలు నేను పెళ్ళాడబోయే అమ్మాయిని దుకాణాలవెంట తిప్పడానికి నీకెంత ధైర్యం!” నవ్వుతూ అన్నాడు.
“నువ్వు పెళ్ళాడ బోయే అమ్మాయి?” అయోమయంగా చూసింది లిల్లీ! అంతలోనే అర్థమయి సంతోషంతో కెవ్వుమంది.

“అమ్మ దొంగా! మరి చెప్పవేం ఇంతసేపూ? అబ్బ! ఎంత చక్కటి వార్త చెప్పావు బ్రాండన్! ఎల్సీ చాలా మంచి పిల్ల. నీకు అన్నివిధాలా తగిన భార్యా! హేరియట్ లాటి గర్విష్టి తో ఎలా సర్దుకుంటావో నని అప్పుడప్పుడూ బెంగ పడ్డాననుకో! పన్లో పని, జేన్ టీచర్ క్కూడా పెళ్ళి కుదిరితే బాగుండు. ఆ అమ్మాయిని చూసి మగవాళ్ళందరూ బెదిరి పోతారెందుకో! హేరియట్ ఎటూ డాక్టరు గ్రాంట్ ని పెళ్ళాడే టట్టుంది,” నవ్వింది లిల్లీ.
“అవునట. నేనూ విన్నా. అందుకే ఆ అమ్మాయిని అన్యాయం చేస్తున్నానేమో నన్న భయం కూడా లేకుండ హాయిగా ఎల్సీని అడిగాను.”
” అయితే ఒక్క మాట! డాక్టరుని పెళ్ళాడతానని హేరియట్ నాతో ఒక్క మాట కూడ అనలేదు. ఇద్దరూ కలిసి ఎడ తెగని కబుర్లు చెప్పుకునేవారంతే. కాబట్టి ఏ సంగతీ జాగ్రత్తగా కనుక్కోవడం మంచిది.”

“అదే నేను చూడు! పెళ్ళాడాలన్న నిర్ణయానికొచ్చిన అరగంటలో నికే ముందుగా చెప్పేసాను.”
“మంచి పని చేసావు. ఎల్సీ లేకపోతే నాకు చేయి విరిగినట్టుంటుందనుకో. ఇంతకీ పెళ్ళెప్పుడు?”
“ఎల్సీ ఎప్పుడంటే అప్పుడే!”
“తోడు పెళ్ళి కూతురు మాత్రం మా ఎమిలీ నే! అది ఎప్పణ్ణించో నీ పెళ్ళి కోసం ఎదురు చూస్తోందందుకనే”
నవ్వాడు బ్రాండన్. “ఆహా అలాగే! అది సరే కానీ, లిల్లీ, మిసెస్ పెక్ మీ అమ్మ అన్న సంగతి నేను ఎల్సీతో చెప్పలేదు. నువ్వు చెప్తావా నేను చెప్పనా?”
“నేనే చెప్తాలే. ఇప్పుడే లోపలికెళ్ళి తనతో మాట్లాడి వొస్తా. అప్పడిదాకా ఇక్కడే వుండు,” లేచి నిలబడింది లిల్లీ.
లోపలికెళ్ళి ఎల్సీని గట్టిగా కౌగలించుకుంది సంతోషంగా!
“ఎల్సీ! బ్రాండన్ సంగతంతా చెప్పాడు. భలే సంతోషంగా వుంది నాకు. స్టాన్లీ కూడా సంతోషిస్తాడు. అది సరే కానీ, ఎల్సీ, నీకొక రహస్యం చెప్పాలి.మిసెస్ పెక్ మా అమ్మ! అందుకే ఆవిడకి గట్టిగా ఎదురాడలేకపోయాను. ఆవిడ మనింటికొచ్చిన సంగతి తెలిస్తే స్టాన్లీ మండి పడతాడు. నువ్వీ విషయం దయచేసి నీలోనే దాచుకో. మీ అక్కయ్యకి కూడా చెప్పొద్దు!”
ఆశ్చర్యపోయింది ఎల్సీ.
“అవునా? అదన్నమాట సంగతి. పోన్లెండి, జరిగిందేదో జరిగిపోయింది. నేను ఎవ్వరికీ చెప్పకుండా దాచుకుంటాను,” లిల్లీని సమాధాన పరచింది ఎల్సీ.
“ఇంత మంచి విషయం తెలిసాక నాకిక్కడ కాలు నిలవడం లేదు. హాయిగా మన ఎస్టేటు కెళ్ళిపోదాం. ఎల్సీ, నేను నిన్నెప్పుడైనా నొప్పించి వుంటే అదంతా ఎమీ మనసులో పెట్టుకోవు కదా?” అమాయకంగా అడిగింది లిల్లీ.
“అదేం లేదండీ! అదంతా గతం, మర్చిపొండి,” అనునయంగా అంది ఎల్సీ.
“అబ్బ, పెళ్ళంటే ఎన్ని పనులో! ముందు ఎమిలీకీ పిల్లలకీ మంచి బట్టలు కొని కుట్టించాలి. ఇందాకే బ్రాండన్ తో కూడా చెప్పాను, మా ఎమిలీ యే తోడు పెళ్ళికూతురు! ఇప్పణ్ణించే మొదలుపెడితే కానీ పన్లన్నీ కావు. ఇంతకీ పెళ్ళెప్పుడనుకుంటున్నారు?”
సిగ్గుతో నవ్వేసింది ఎల్సీ.
“ఏదీ, ఇంకా ఏమీ అనుకోందే! అసలు నేను నమ్మలేకుండా వున్నాను, నాకు పెళ్ళి నిశ్చయమైందంటే!”
“అన్నట్టు చెప్పడమే మర్చి పోయాను. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటూ బ్రాండన్ ముందు గదిలోకి రమ్మన్నాను. వెళ్ళు, వెళ్ళు! వెళ్ళి పెళ్ళి ఎప్పుడన్నది నిశ్చయించుకుని నాకొచ్చి చెప్పు!” హడావిడి పడింది లిల్లీ.

అయితే బ్రాండన్ పిలిచింది పెళ్ళి గురించి మాట్లాడడానికి కాదు. మెల్బోర్న్ విడిచి తన ఎస్టేటుకెళ్ళే ముందే పెళ్ళాడేయాలన్నది అతని అభిమతమే అయినా, అంతకంటే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయతనికి.

ముందుగా మావయ్య వీలునామా గురించి. అందులో అక్షరం పొల్లు పోకుండా తనకి గుర్తుందన్నది ఎల్సీ. తర్వాత మిసెస్ పెక్ ని పట్టుకోవడం. ఇంకా తమ భవిష్యత్తు గురించి చర్చలు! అన్ని కబుర్లూ అయి గడియారం చూసుకుని ఉలిక్కిపడ్డాడు బ్రాండన్. తను ఆ ఇంట్లో దాదాపు రెండు గంటలపైగా కూర్చున్నాడు. మళ్ళీ మర్నాడు కలుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు.

***
(సశేషం)

వీలునామా – 39 వ భాగం

veelunama11

స్వామి కార్యమూ-స్వకార్యమూ -II

వాల్టర్ బ్రాండన్! పెద్దపెద్దఅంగలువేసుకుంటూ తమవైపే వొస్తున్నాడు. చటుక్కున మిసెస్పె కాగితాన్ని లాక్కుని తన సంచీలో పెట్టేసుకుంది.

“ఎల్సీ! ఇక్కడేంచేస్తున్నావునువ్వు? ఈవిడతోఏంపనినీకు?” మిసెస్పెక్వంకచిరాగ్గాచూస్తూఅన్నాడుబ్రాండన్. ఎల్సీమొహంపాలిపోయింది. ఏమీమాట్లాడలేకపోయింది.

“పద, నిన్నుఇంటిదగ్గర దిగబెట్టివెళతాను. చీకటవుతోంది. ఇక్కణించినీకుదారికూడా తెలిసుండదు. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడొద్దనితెలియదా నీకు?”

నొరుపెగుల్చుకుంది ఎల్సీ.

“బ్రాండన్! ఈమెనాతోపాటు కుట్టు పని చేస్తుంది. ఇద్దరందారాలుకొనుక్కుందామనిబయటికొచ్చాం, అంతే.”

“డబ్బుసరిగ్గా వేసాడోలేదోఅనిఇద్దరమూ బిల్లు సరిచూస్తున్నాం అంతే,” మిసెస్పెక్అనునయంగా అంది.

ఎల్సీకిఅబధ్ధాలుచెప్పడంఇష్టం వుండదు.

“బిల్లంటావేమిటి? అది బిల్లు కాదు,” ఇంకాచెప్పబోయింది.

ఆమెనిఆపాడుబ్రాండన్.

“అవన్నీ సరే! నిన్నసలు కొత్త ఊళ్ళోఈవిడతోఎలా పంపిందిలిల్లీ? ఎవరెలాటి వాళ్ళో తెలియకుండా స్నేహంచేయడం మంచిదికాదు. ఇంత అమాయకంగా వుంటేఎలా?”

అతని  మాటలకిఎల్సీకళ్ళల్లోనీళ్ళు తిరిగాయి. సంగతి తెలిస్తేతనుఆస్తిమీద ఆశతోముసలామెతోచేరికుట్రలు పన్నుతూందనుకుంటాడేమో బ్రాండన్. ఛ! ఛ! తనబుధ్ధేమయింది!

“మిసెస్ పెక్! మీరిక ఇంటికెళ్ళండి! స్టాన్లీ మిమ్మల్నిచూస్తేచాలా గొడవైపోతుంది. కుట్టుపనికథలునమ్మడానికిస్టాన్లీఎల్సీలాఅమాయకుడుకాదు. వెళ్ళండిక!”

ఆశ్చర్యపోయిందిఎల్సీ! ఆమె పేరుమిసెస్ మహోనీకాదా? ఆమెఎవరో బ్రాండన్కెలాతెలుసు?

“వెళ్తా, వెళ్తా! నాకేమన్నా భయమా? అమ్మాయ్! నాఅడ్రసు గుర్తుంచుకో!”

బ్రాండన్వంక కోపంగా చూస్తూవెళ్ళిపోయిందామె. ఆమెవెళ్ళిందాకాఆగి, ఎల్సీవైపుతిరిగాడు బ్రాండన్.

“క్షమించు ఎల్సీ! కోపంగామాట్లాడాను. ఆమె అసలుమంచిదికాదు. నాకూ స్టాన్లీకిఆమెముందే తెలుసు. ఆమెనీకేం హానితలపెడుతుందో అన్నఖంగారులోకోప్పడ్డానంతే! పదఇంటికి తీసికెళ్తా!”

“అలాగే, ఇంటికెళ్ళిపోదాం! మీరిక్కడికెలావొచ్చారు?”

“విరివాల్టా వెళ్తే నువ్విక్కడ వున్నావని జేన్ చెప్పింది. ఆఘ మేఘాల మీదబయల్దేరి  వచ్చాను. ఇవాళ నీతో మాట్లాడాలని మీ ఇంటికొచ్చాను. ఎందుకో లిల్లీ భయంగా  బెరుకుగాఅనిపించింది. నువ్వెక్కడున్నావంటేతలా తోకా లేకుండా సమాధానంచెప్పింది. నువ్వొచ్చేదాకా కూర్చుంటానన్నాను. కొంచెందుకాణానికెళ్ళిఏదోపట్టుకురమ్మనినన్ను బయటికి పంపేసింది. అదృష్టవాశాత్తూనేనూ దుకాణాల కోసంఈ వైపే వొచ్చాను. బహుశామిసెస్ పెక్నీతోకలిసిఇంటి కొస్తేనేను చూసిస్టాన్లీతోచెప్తాననిభయపడి వుంటుంది!”

“నిజమే, లిల్లీగారికిఈవిడనిచూస్తే చిరాకూ, భయమూ!”

“స్టాన్లీకేమో  కోపమూ! పోన్లే, మనమూఈ సంగతి స్టాన్లీదగ్గర ఎత్తొద్దు. అనవసరంగాఅతనికీ లిల్లీకిమధ్యలో దెబ్బలాటలోస్తాయి!”

“అలాగే! అదిసరే కానీ, బ్రాండన్, నాకుఒక చిన్నవిషయంలో మీసలహాకావాలి!”

“నాసలహానా? చెప్పు, ఏంటది?” ఆశ్చర్యంగాఅడిగాడు బ్రాండన్.

“ఇప్పుడునాతోమాట్లాడిందే, మిసెస్పెక్! ఆవిడేఫ్రాన్సిస్తల్లిఅని నా అనుమానం. అసలుఆమె నాతోపరిచయంపెంచుకొని ఈసంగతి నాతో చెప్పడానికే స్టాన్లీగారిఇంట్లోచేరివుంటూంది. ఆరహస్యమేదో తెలిస్తే ఫ్రాన్సిస్ని వెళ్ళగొట్టొచ్చంటుంది ఆమె.”

“ఇప్పుడామెకి ఏం కావాలటా?”

“నా అనుమానం ఆమెమా మావయ్యని మోసం చేసింది. ఫ్రాన్సిస్తండ్రిమామావయ్య హొగార్త్కాదు. అతనిఅసలు తండ్రెవరో నాతోచెప్తానంటుంది ఆమె. అయితేఆమె మాటలెంతవరకు నమ్మొచ్చో తెలియదనుకోండి…”

“ఆగాగు! ఫ్రాన్సిస్తండ్రిమీమావయ్యకాదు అని చెప్పినంత మాత్రానఒరిగేదేముంది? ఆ ఆస్తంతా ఆయన స్వార్జితం. ఆయన చక్కగా విల్లురాసిమరీఅంతాఫ్రాన్సిస్కిఅప్పగించాడుకదా? కాబట్టి ఈవిడ ఇప్పుడొచ్చి ఫ్రాన్సిస్తండ్రిఎవరోచెప్పినంతమాత్రానఏదీ మారదు!”

“అవును, ఆ సంగతి నాకూతెలుసు. అయితేమావయ్యవిల్లు రాసిన సంగతి ఆమెకితెలియదనుకుంటా.  ఫ్రాన్సిస్ తన కొడుకే అనిమావయ్యప్రకటించడంవల్ల, పిత్రార్జితంగాఆస్తంతా ఫ్రాన్సిస్కి దక్కింది అనుకుంటుంది.”

“ఇంతకీ, నీకేమిటీ విషయంలో ఆసక్తి?” అనుమానంగా అడిగాడు బ్రాండన్

“ అయ్యోబ్రాండన్! నువ్వింకా గుర్తించలేదా? ఫ్రాన్సిస్ మా అక్కని ప్రేమిస్తున్నాడు. ఆపాపిష్టి వీలునామా వల్లపెళ్ళాడడంలేదు. మావయ్య వీలునామావిచిత్రంగావుంటుంది. ‘ఫ్రాన్సిస్ దగ్గరబంధువులనెవరినీపెళ్ళాడరాదు, పెళ్ళాడితేఆస్తివొదులుకోవలసివొస్తుంది,’ అనిమాత్రమేవుంది. ఫ్రాన్సిస్తండ్రిమావయ్యకాదనితెలిస్తే, మేము దగ్గరబంధువులం కాదు కదా? హాయిగా ఆస్తీవొదులుకోకుండా జేన్నిపెళ్ళాడొచ్చు కదా?”

“ఫ్రాన్సిస్ నిజంగా జేన్నిఇష్టపడుతున్నాడంటావా? అయితేఆఆస్తంతాఅవతలపారేసివొచ్చి జేన్ని పెళ్ళాడొచ్చుగా? లేకపోతే, ఆస్తీ, పార్లమెంటు సీటూ అన్నిటి మీదావున్నంత ప్రేమజేన్మీదలేదేమో! నేనైతేప్రేమించిన అమ్మాయికొసం ప్రపంచాన్నైనాసరే వదిలేస్తా!” ఆమెకళ్ళల్లోకి చూస్తూఅన్నాడు బ్రాండన్.

“అదికాదు బ్రాండన్! ఈవిషయం గురించి జేన్ఎప్పుడూ నాతోమాట్లాడదు కానీ, నాఅనుమానం ఫ్రాన్సిస్కూడానీలాగేఅన్నాడు. కానీజేన్ ఒప్పుకోలేదు. తన వల్లఅతనుతనకిలభించిన మంచి జీవితాన్నీ అవకాశాలనూవొదులుకోవడం జేన్కిచచ్చినాఇష్టంవుండదు. కానీ, మేములండన్వదిలివచ్చేటప్పుడూజేన్రోజులతరబడి రాత్రుళ్ళూ ఏడుస్తూగడిపింది. అందుకేఎలాగైనాఈమె దగ్గర ఆ రహస్యంసంపాదించి వాళ్ళిద్దరినీ కలపాలనివుంది నాకు.”

“ హ్మ్మ్!! అయితే నేనుతొందరపడిపనిచెడగొట్టానన్న మాట. కానీ ఆ రాక్షసి పక్కననిన్ను చూడగానే గుండెలవిసి పోయాయంటేనమ్ము! ఆమె గురించీ, ఆమె నక్కజిత్తుల గురించీ మెల్బోర్న్ అంతా తెలుసు. అందుకేఒక్కక్షణం కూడా ఆగలేకవొచ్చేసాను. అదిసరేకానీ, ఎల్సీ, నీకుమనిద్దరం చాలారోజుల క్రితం రైల్లోమాట్లాడుకున్నసంగతి గుర్తుందా?”

ఎల్సీగుండెలుదడ దడలాడాయి.

“ఆ రోజసలుఎలామర్చిపోతాను? నాతెలివి తక్కువ తనానికిపరాకాష్ఠ ఆ రోజు. ఆతర్వాత నన్నునేను ఎంతతిట్టుకున్నానో, ఎంతపశ్చాత్తాపపడ్డానోమీరెరుగరు. మీమనసులో నామీదప్రేమంతాతుడిచి పెట్టుకు పోయిందనీ, ఇహ నా ముఖంమళ్ళీచూడరనీఅనుకున్నాను,” మనసులో మాట నిర్భయంగాచెప్పింది ఎల్సీ.

“ ప్రేమతుడిచి పెట్టుకుపోవడమా? అసంభవం! నిజానికి నేనూ తొందరపడ్డాను. పోయిపోయి ఫిలిప్స్చెల్లెల్ని పెళ్ళాడదామనుకున్నాను. మీఇద్దర్నీకలిసిచూసింతరవాతకానీఅర్థం కాలేదునాకు, నా కోసం నేనే గోతినితవ్వుకుంటున్నానని. నువ్వు నన్నుప్రేమించినా, మానినా, నా స్నేహమూ, సలహా, సహాయాలు మాత్రం నీకెప్పటికీవుంటాయి!”

“ మీరునన్నుమొహమాట పెడుతున్నారు,” సిగ్గుగాఅంది ఎల్సీ.

“ అయ్యొయ్యో! మొహ మాటమేమీ లేదు. ఇదిపార్కు కాబట్టిసరిపోయింది. లేకపోతేఅందరిలామోకాళ్ళమీదకూర్చుని ప్రాధేయపడేవాడిని. చెప్పుఎల్సీ, నీమనసులోనాపట్లస్నేహంతప్ప మరేమీలేదా?” ఆశగాఅడిగాడు బ్రాండన్.

“స్నేహమూ, ప్రేమా, రెండూఇస్తే  తీసుకోవడానికి మీకేమైనాఅభ్యంతరమా!” అదుపుతప్పికొట్టుకుంటూన్నగుండెని చిక్కబట్టుకుని అడిగింది ఎల్సీ. సంతోషంతోకెవ్వుమన్నాడు బ్రాండన్. తబ్బిబ్బైపోయి, మాటకూడా తడబడిందతనికి.

“అభ్యంతరమా, నాకా? భలేదానివే! స్నేహమూ, ప్రేమా! రెండూ! అబ్బో! అసలుఎల్సీ, నువ్వింతచమత్కారంగాఎలా మాట్లాడతావు? నామట్టి బుర్రకిఅర్థంకావడానికేకొంచెంసేపుపట్టిందే! ఈసంతోషంతోనాకు మతిపోయేలా వుంది! చెప్పు, ఇప్పుడేంచేద్దాం? పెళ్ళాడేద్దామా?”

నవ్విందిఎల్సీ!

“ అందరూమన వంకే చూస్తున్నారు. ముందుఇంటికెళ్దాం పదండి. తర్వాత, ఆవిడపేరేమిటో, అదే, మిసెస్ పెక్, ఆమెదగ్గర్నించి సమాచారం ఎలా రాబట్టాలో ఆలోచిద్దాం. ఇంతకీమీరొచ్చేసరికినేనుఒకఅగ్రిమెంటుమీద సంతకం పెట్టబోతూవున్నాను. ఆకాగితం నాలుక గీసుకోవడానిక్కూడా పనికిరాదనుకోండి, ఏదో ఆవిడతృప్తి కోసంపెడదామనుకున్నా!”

“ సరే! అయితే నేను రేపు ఆమె చెప్పిన చిరునామాకి వెళ్ళి, ఆమెనికలిసి విషయంతేల్చుకొస్తా! సరేనా?”

“అలాగే! మీరెళ్ళిచూడండి!”

ఎల్సీకి తనమీదున్న నమ్మకానికి బ్రాండన్ పొంగిపోయాడు.

“ అవునూ! నేనెంతో కష్ట పడి చెమటోడ్చిరాసిన వుత్తరం మీకందనే లేదట గదా! లండన్ నించి బయల్దేరగానే మొదలుపెట్టాను ఉత్తరం రాయడం. నెలలతరబడిరాసాను. ఏం లాభం! అంతా బూడిదలో పోసిన పన్నీరయింది!”

“మీరెళ్ళగానే జేన్ నా మీదవిరుచుకు పడింది. ఎదురుగా వున్న వజ్రాన్ని కాలదన్నుకున్నానంది! అప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి.”

“అసలింతకీ నన్నెందుకు కాదన్నావు ముందు?” సంకోచంగా అడిగాడు బ్రాండన్.

“ మీఉత్సాహానికీ, పరిశ్రమకీ, జీవ శక్తికీనేనుసరిపోననుకున్నాను. అందులోనూ, అప్పట్లో చాలాజబ్బుగా, దిగులుగా వుండేదాన్ని. నాతోపాటు మిమ్మల్నీ నీరసంగాచేస్తానేమోననిభయపడ్డాను. పైగా, మీరు మీ మనసులో నా పట్ల వున్న జాలినిప్రేమగా భ్రమ పడుతున్నారనుకున్నాను. అప్పట్లో, నన్నెవరైనాప్రేమించగలరనీ, నేనుప్రేమించదగిన దాన్ననీ నమ్మకమే వుండేది కాదు నాకు!” వివరించిందిఎల్సీ.

“ అర్థమైంది. నా ఉత్తరంబహుశానాకే తిరిగొస్తుందేమో! నీకూ చూపిస్తా, బాగానవ్వుకోవచ్చు. నువ్వు నన్నుకాదన్నప్పుడు నీకింకెవరైనానచ్చారేమోననుకున్నా. కానీనేనుబయల్దేరే ముందుపిల్లల గదిలో నా వైపు చూసావు చూడు, అప్పుడుమళ్ళీనాలోఆశలు రేకెత్తాయి. నిన్నొదిలి ఇక్కడికి రావడమంటేనరక యాతనలాగనిపించిందంటేనమ్ము! ఇంకో విషయం, నువ్వు హేరియట్ ఫిలిప్స్ గురించిదిగులేమీ పెట్టుకోకు. ఆమెకిఅప్పుడేకోరుకున్న వరుడు దొరికాడు.”

నవ్వేసిందిఎల్సీ.

“అసలుదేవుడికి రోజూదండం పెట్టుకోవాలి ఎల్సీ! లేకపోతే ఈ పాటికినేనుహేరియట్కిమొగుణ్ణయి రోజూఆమెతో చీవాట్లూ, తిరస్కారాలూ తింటూ వుండేవాణ్ణి. ఇప్పుడునీపక్కనే! ఇహనేనుచచ్చినానామనసులోమాట దాచుకోనమ్మాయ్! నువ్వెంతపెద్దకవయిత్రివైనాసరే, నేను సిగ్గూ బిడియంలేకుండావాగుతూనేవుంటా…”

“ నా కవిత్వం గురించి ఇప్పుడెందుకు?”

“విరివాల్టా గురించినువురాసినపాట వినిపిస్తావా? అందులో నేనేనటగానాయకుణ్ణి?”

నవ్వాపుకోలేకపోయిందిఎల్సీ!

 

****

వీలునామా – 38 వ భాగం

veelunama11

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

స్వామికార్యమూ-స్వకార్యమూ-I

ఆ మర్నాడు మిసెస్ పెక్లిల్లీఇంటికితానుచెప్పినట్టే ఒకచిన్నచేతి సంచీలోకత్తెరా, టేపూ, సూదీదారమూ మొదలైనవితెచ్చుకునివచ్చికూర్చుంది. కాసేపులిల్లీతోపోచికోలుమాటలయ్యాకనెమ్మదిగాఎల్సీపక్కన చేరింది, “నాక్కొంచెంకుట్టుపనినేర్పమ్మాయీ,” అంటూ.

ఆమెని చూస్తున్నకొద్దీ ఎల్సీకిఆశ్చర్యం అధికమవుతూంది. కుట్టు పనినేర్చుకుంటానంటుందికానీ, ఆమెకిసూదిలోదారంఎక్కించడం కూడారాదు. పెద్దధాష్టీకంపైగా!

“నేనుఇంతవరకూనర్సు గానేపని చేసానమ్మా, అందుకేనాకీకుట్టు పనీఅలాంటివిరావు. పెద్దదాన్నయ్యాను, నర్సుపనిలో వుండే శ్రమతట్టుకోలేకుండావున్నాను. మరింకేదైనా పని నేర్చుకోకపోతేజరిగేదెట్టా? అందుకే నిన్నడుగుతున్నా. ఏదోకాస్తలిల్లీ అమ్మగారుదయతలచి నన్నురానిస్తున్నారు,” అంటూ కథలల్లేసింది.

ఆ తర్వాత పాపాయినిచూస్తున్ననర్సునిచేత కానిమనిషికిందకట్టేసిఆమెపనుల్లోతప్పులెతకసాగింది. మెల్లమెల్లగాఆ రోజుసాయంత్రానికి కుట్టు పనీవదిలేసి కేవలం కబుర్లతోనేకాలక్షేపంచేయ సాగింది. అయితే ఎల్సీ చూడ్డానికిఅమాయకంగావున్నాఅంతతెలివితక్కువదేమీకాదు. కొద్దిగంటల్లోనే ఈ ముసలామెకి ఒళ్ళొంగదనీ, ఆమె చెప్పేవన్నీఅబధ్ధాలేననీఎల్సీకనిపెట్టేసింది. అన్నిటికంటే”అమ్మగారు” అంటూ వినయంగా మాట్లాడుతూనే, లిల్లీతో అతిచనువుచూపిస్తోందంపించిందిఎల్సీకి. అయితే విచిత్రంగాలిల్లీ మాత్రంపెద్దామెని చూస్తూనే ముఖం ముడుచుకునిచిటపటలాడుతుంది. ఇదంతా వింతగా అనిపించినా, పెద్దగా పట్టించుకోలేదుఎల్సీ.

మూడో రోజు ఎప్పట్లాగే మిసెస్పెక్ ఎల్సీపక్కనచేరి కబుర్లాడసాగింది. వున్నట్టుండి,

“అది సరే కానీ, అమ్మాయీ, మీదేవూరు?” అనిఅడిగింది.

ఎల్సీ తమ వూరిపేరు చెప్పింది.

“ఆవూరా? అక్కడనాకుచాలామంది తెలుసే! అయితే అక్కడక్రాస్హాల్అనే ఎస్టేటుతెలుసా?”

“తెలుసు, నేనుపెరిగిందంతా అక్కడే,” కొంచెం ముభావంగాఅందిఎల్సీ.

“మాదీఅదేవూరు తెలుసా?”

“అవునా? నిన్ను చూస్తేస్కాట్లాండ్ స్త్రీలాఅనిపించడంలేదే!” పరిశీలనగా ఆమెనిచూస్తూ అందిఎల్సీ.

“అక్కణ్ణుంచి వచ్చేసిముఫ్ఫైనాలుగేళ్ళయిందిలే!”

“అబ్బో! అన్నాళ్ళయిందా! అందుకేనీమాటలో ఆస్ట్రేలియన్ యాసవినిపిస్తుంది కానీ, స్కాట్లాండుదికాదు.”

“అది సరేకానీ, ఆఎస్టేటు యజమానిహొగార్త్ నాకు బాగాతెలుసు. అక్కడేపెరిగానంటున్నావు, అయితే నీకూ అతనుబాగతెలిసుండాలే!”

“ఆయనమా మావయ్య!”

“అయితే నువ్వు ఆయనచెల్లెలు మేరీకూతురివన్నమాట. మరి అంత పెద్ద ఎస్టేటుయజమానిమీమావయ్యఅయితే నువ్విలా పనిచేసుకు బ్రతుకుతున్నావే?”

“మామావయ్య మాకు చదువులుచెప్పించి, మమ్మల్ని మాకాళ్ళమీదనిలబడమన్నాడు.”

“మరిఆస్తంతా ఎవరికిచ్చాడు? ఆయన కొడుకని అనుకుంటూ వుంటారు, ఫ్రాన్సిస్ అని! అతనికేనా? మీకు చాలా కష్టంగాలేదూ?”

“మొదట్లో కొంచెం కష్టం అనిపించినా, ఇప్పుడు అలవాటుఅయిపోయింది. ఆమాట కొస్తేనేనూ, మా అక్క జేన్ స్వతంత్రంగామాపొట్టలు మేమే పోషించుకుంటున్నాం, ఈప్రపంచంలో చాలామందికిలాగే!” హుందాగా అంది ఎల్సీ.

“అదిసరే! ఇప్పుడు నేను నీకు మీఆస్తంతా దొరకబుచ్చుకునేఉపాయంచెప్తాననుకో, ఏమిస్తావ్?” గుసగుసగాఅందిమిసెస్పెక్.

“ఏమిటీ? మాఆస్తిమాకు తిరిగి దొరకడమా? ఇప్పుడదిసాధ్యంకూడాకాదు కనక ఆ ప్రసక్తి అనవసరం!” చిరాగ్గా అందిఎల్సీ.

“ఆఅబ్బాయెవరికోకాక డబ్బు మీకొచ్చిందనుకో, మీరతన్ని కట్టుబట్టలతోవెళ్ళగొట్టరుగా? అతన్లాగా!”

నిజానికిఎల్సీకిఫ్రాన్సిస్తమనిఆదుకోవాలనిఎంత ఆశపడ్డాడో బాగా తెలుసు. అయితేఈపెద్దామెఅనవసరమైన విషయాల్లో కల్పించుకుంటుందన్నఅభిప్రాయంతోసంభాషణపొడిగించనీయలేదు.

కానీఆవిషయంగురించిఆలోచన మాత్రం మానలేదు. ఏమిటీ ముసలమ్మ ఉద్దేశ్యం? ఫ్రాన్సిస్ మావయ్య కొడుకు కాదని ఆమెకేమైనాతెలుసా? అయితేఫ్రాన్సిస్తలితండ్రులేవరోకూడాఈమెకితెలిసే వుండాలి. కానీ తను మామూలుగాఅడిగితేచెప్తుందా? మావయ్య ఆస్తివల్ల ఫ్రాన్సిస్ ఎంత లాభ పడ్డాడోఅంతకు రెండింతలునష్టపోయాడన్నదీతనకుతెలుసు. ఎలాగైనా ఈమె దగ్గర్నించి ఫ్రాన్సిస్ గురించిమరిన్నివివరాలురాబట్టాల్సిందే, అనుకుందిఎల్సీ!

“మీరన్నట్టుఫ్రాన్సిస్కిఆస్తిపై హక్కులేనట్టైతే, అదిమాకు చెందాల్సిందే!” అంది

మిసెస్పెక్ని నిశితంగా చూస్తూ!

“ఫ్రాన్సిస్ తలిదండ్రుల పెళ్ళీ స్కాట్ లాండు చట్టబధ్ధమైనది.”

“అవును, అతనుతన సంతానమేనని మావయ్య ప్రకటించాడుకూడా!”

“అవునా? మీ మావయ్య ఫ్రాన్సిస్తల్లిగురించి వివరాలేమైనాచెప్పాడా మరి?”

“లేదు, ఆమె మరణించిందనిమాత్రం చెప్పాడు.”

“అవునవును! మరణించింది! మనకి నచ్చని చుట్టాలనీస్నేహితులనీచచ్చిపోయారనిచెప్తే పీడా పోయె!”

“ఆ విషయంలోనిజానిజాలుఎవరికీ తెలియదు. ఒకవేళఆమె బ్రతికి వుంటే ఈ పాటికిఫ్రాన్సిస్నా కొడుకని చెప్తూముందుకొచ్చివుండేది కదా? అప్పుడుఆమెకీ ఫ్రాన్సిస్డబ్బులోవాటావచ్చేదికదా?”

“ఆహా? ఆమెవొచ్చిచెప్పినంతమాత్రాన ఆస్తిలోవాటావొచ్చేస్తుందా?అలాగైతేఈపాటికివెయ్యిమంది వొచ్చి నిలబడే వారు, వాడు నా కొడుకే అని చెప్తూ!”

“మరైతే ఆమె ఎందుకుముందుకు రానట్టో? ఆమెకేదైనా భయం వుందేమో? ఎవరైనాభయపెడుతున్నారో? ”

“అన్నిఊహాగానాలెందుకు? ఆమెనాకు బాగా తెలుసు!” ఆమాట వినగానేఎల్సీనివ్వెరపోతుందనీ, నోటమాట రాదనీ అనుకుంది మిసెస్ పెక్. అయితే ఆమెదగ్గర్నుంచి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న దానిలాఎల్సీచిరునవ్వు నవ్వింది.

ఇంతలో అక్కడికి లిల్లీవచ్చింది.

“ఎల్సీ! కొంచెం ఈరంగు గుండీలు తెచ్చిపెడతావా?” అనిఅడిగిందిఎల్సీని.

“అవునవును అమ్మాయ్! రోజంతా ఇదేగదిలో కూర్చొని విసుగు పుట్టడంలేదూ? నీకుమెల్బోర్న్కొత్తన్నావుగా? పద, నేను నీకుదుకాణాలూ అవీచూపిస్తాను, ఎలాగూ నువ్వు లేకుంటే నేనేమీ చేయలేను,” ముసలావిడలేచిబయల్దేరదీసింది. ఎల్సీతోఆవిడా బయల్దేరడం లిల్లీకెంతమాత్రమూనచ్చలేదు.

కానీ లిల్లీ పాపంచిన్నప్పణ్ణించీ తల్లి కోపానికీగొంతుకకీ వొణికి పోతూ పెరిగింది. ఇప్పుడామె ఏ మాటకి ఎదురాడాలన్నాభయమే. భార్యకున్నఈబలహీనతగమనించేస్టాన్లీఅత్తగారుతమ చుట్టు పక్కల రాకుండాకట్టుదిట్టంచేసాడు.

ఆమెతో బయటికివెళ్ళడం ఎల్సీ కెంత మాత్రమూ ఇష్టంలేదు. కానీ, ఎలాగైనా ఫ్రాన్సిస్జన్మరహస్యం తెలుసుకోవాలి. అందుకేఆమెతో కలిసిబయట కాలుపెట్టింది. బయటికెళ్ళగానే మాట్లాడే ప్రయత్నం చేసింది మిసెస్పెక్. కానీ, ఎల్సీ ఆమెనితనపనయ్యేంతవరకూ మాట్లాడనివ్వలేదు. గుండీలూ, ఇంకా రంగు రంగు దారాలూ, సూదులూఅన్నీకొనుక్కుంది. అన్ని కొట్లలో దుకాణదారులు మిసెస్పెక్నితెలిసినట్టూ, వేళాకోళంచేస్తూచనువుగామాట్లాడడంగమనించిందిఎల్సీ. అక్కణ్ణించిబయటపడిఒకపార్కులోకూర్చుందామందిమిసెపెక్. సరేనని, బొటానిక్గార్డెన్లోకెళ్ళికూర్చుందిఎల్సీ. చుట్టు పక్కలజనంపలచగాఅనిపించగానే,

“సరే! ఫ్రాన్సిస్ తల్లిగురించి నీకు తెలిసింది చెప్పు!” తొందరపెట్టిందిఎల్సీఆమెని.

“చెప్తా! కానీ, ఆ దెబ్బతో నువ్వూ మీ అక్కా ఆస్తంతాతన్నుకు పోతారు! నాకేంలాభం? నాకేమిస్తావ్?”

“ఏమిస్తావంటేనేనేం చెప్పగలను? నువ్వన్నట్టుముందు ఆస్తి మాచేతికి రానీ! నీకూఏదో బహుమానంఇవ్వకపోను!”

“అదే, ఎంత బహుమానంఇస్తావోచెప్పు?”

ఆమె చెప్పే దాంట్లోనిజంచాలాకొంచెమేఉంటుందన్నవివేకంహెచ్చరించిందిఎల్సీని.

“నువ్వరచిగీ పెట్టినా, ఇప్పుడు నాదగ్గరచిల్లికానీ లేదు! ఆస్తివొచ్చినప్పటిమాటనేనుచెప్పలేను! పైగా నేనుమా అక్కనీ స్టాన్లీగారినీసంప్రదించకుండనీకేవాగ్దానమూచేయలేను,” ఖచ్చితంగాఅంది.

“ఇప్పుడునువ్వు ఊళ్ళోఅందరినీఅడిగి చెప్తానంటేఆగడం నా వల్ల కాదు. నేను ఈవూరొదిలివెళ్ళి పోవాలి. అందుకేఆఖరుమాటచెప్తున్నాను! నేనుచెప్పే రహస్యంమూలంగానీకుఆస్తికలిసి వచ్చినట్టైతే, నువ్వూమీఅక్కా కలిసి రెండూ వేలపౌండ్లివ్వాల్సివుంటుంది!”

“రెండు వేలపౌండ్లా?” ఆవలించిందిఎల్సీ.

“క్రాస్హాల్ఎస్టేటులోజొరబడ్డాకరెండువేలపౌండ్లుపెద్ద మొత్తంకాదని నీకూతెలుసు!”

“అయితేనువ్వుచెప్పే రహస్యంకాగితం మీద చట్టబధ్ధంగారాసి సంతకంచేసిఇవ్వాలి!” షరతు విధించిందిఎల్సీ.

“సరే! కానీ నేను ఈఊరువొదిలివేళ్ళింతరువాతేఆకాగితం లాయరు చేతిలోపెట్టాలి!”

“అంతా బానేవుంది కానీ, నిజంగా నువ్వు చెప్పేరహస్యం రెండు వేలపౌండ్లవిలువచేస్తుందో నాకు తెలియదు. నువ్వునా మీదనమ్మకంవుంచిరహస్యంచెప్పాలి! ఆస్తివొచ్చింతరువాతేడబ్బిస్తాను.”

“మాటలమీదనమ్మకం కాదు. నువ్వూ నాకుకాగితం రాసివ్వాలి, ఆస్తివొస్తేడబ్బిస్తానని.”

అలాఅంటూ మిసెస్పెక్తనసంచీ లోంచి ఒక కాగితాన్ని తీసింది. దాన్లోఎస్టేటుతమకిలభించినట్టయితేతామిద్దరుఅక్కచెల్లెళ్ళూఈ స్త్రీకిరెండువేల పౌండ్లుచెల్లించగలమనిరాసివుంది.

అంతతయారుగా వున్న ఆకాగితం చూసిఎల్సీఆశ్చర్యపోయింది. ఆమెఆకాగితంచదువుతూండగానే, మిసెస్పెక్ఆమె చేతిలో ఒక పెన్ను పెట్టి,

“ఊ..! సంతకంచేయిత్వరగా!” అనితొందరపెట్టసాగింది.

సంతకంపెట్టడానికి భయపడుతూఎల్సీచుట్టూ చూసింది. ఆమెకేంచేయాలోతోచలేదు.

వున్నట్టుండి అక్కడ ఆమెకెవరోతెలిసినమొహం తన వైపే వస్తూ కనబడింది.

-అనువాదం: శారద

శారద

శారద