Archives for July 2015

పాటకోసం చూశాను.. మాటలు వెంటాడాయి!

 

 నీరుకొండ అనూష

anushaనాకు ఏదైనా అనిపిస్తే బాధైనా, సంతోషమైనా సరే! ఎందుకో తెలియదు కానీ కారణాన్ని రాయాలనిపిస్తుంది. అలా రాతరూపంలో చూసుకుంటే ఏదో తెలియని సంతృప్తి. ఇలా ఏదో ఒకటి రాస్తూ ఉంటే.. రైటింగ్‌ స్కిల్స్‌ (రాత నైపుణ్యాలు) కూడా పెరుగుతాయనే ఉద్దేశం. అయితే కొద్ది కాలంగా ఏదో ఒకటి రాద్దామనుకున్నా.. ఏదో కారణంగా అది ఆగిపోవడమో, సగంలోనే ఆపేయడమో జరుగుతోంది. కానీ ఇప్పుడు కచ్చితంగా రాసితీరాలి అనే ఆలోచన కల్పించింది- ‘హమారీ అదూరీ కహానీ’ సినిమా.

మామూలుగా అయితే నేను సినిమా విశ్లేషకురాలిని కాదు. సాంకేతిక నైపుణ్యం, కథ ఇవన్నీ విశ్లేషించడమూ రాదు. ఒక సగటు ప్రేక్షకురాలినంతే! సినిమా నచ్చింది, నచ్చలేదు. ఫలానా చోట హీరో బాగా చేశాడు, లేదా ఫలానా ఆరిస్ట్‌ ఇలా చేసుంటే బాగుండేది వరకు మాత్రం చర్చించుకోగల పరిజ్ఞానం ఉందనుకుంటున్నా. అయితే ఈ సినిమా మాత్రం అక్కడితో ఆపేయాలనిపించలేదు. బహుశా ఎక్కువ అంశాలు నాకు నచ్చడమే కారణమేమో!

నాకు నచ్చిన అంశాలను చర్చించే ముందు స్థూలంగా కథను చూస్తే..

ఒక ముసలావిడ, పేరు వసుధ (విద్యాబాలన్‌) ఒక ప్రదేశంలో బస్సు  దిగడంతో  సినిమా మొదలవుతుంది. కొన్ని అడుగులు కష్టంగా వేసిన తరువాత పడిపోతుంది. తరువాత ఆమె చనిపోయినట్లుగా.. ఆమె అంత్యక్రియలు జరిగినట్లుగా చూపిస్తారు. మరోవైపు ఆమె భర్త హరి (రాజ్‌ కుమార్‌ యాదవ్‌) సైకియాట్రిస్ట్‌ దగ్గర తన భార్య తన దగ్గరకు వచ్చిందని.. ఏదో అడిగివెళ్లిపోయిందనీ చెబుతుంటాడు. ఆమె చనిపోయిన విషయాన్ని హరికి తెలియజేయడానికి అతని కోడలు తన దగ్గరకు వస్తుంది. ఆమె అస్తికలను తండ్రి చేతులమీదుగా నిమజ్జనం చేయించడం కొడుకుకు ఇష్టం ఉండదు. కానీ హరి మాత్రం ఆమె అస్థికలను దొంగిలించి, కొడుకు కోసం ఒక డైరీని వదిలిపెడతాడు. దీంతో కథ ప్లాష్‌బాక్‌ లోకి వెళుతుంది.

వసుధ ఒక హోటల్లో పూలు అమర్చే ఆవిడగా చేస్తుంటుంది. భర్త తనను వదిలేసి ఎక్కడికో వెళతాడు. కొడుకుతోపాటు ఆమె అతని కోసం అయిదేళ్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఆరవ్‌ రూప్‌రెల్‌ (ఇమ్రాన్‌ హష్మి) పరిచయం అవుతాడు. అతను గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌కు యజమాని. ఆమె పని చేస్తున్న హోటల్‌ను కొనాలనుకుంటాడు. అందుకుగానూ అక్కడ పనిచేసేవారిని పరీక్షిస్తాడు. అప్పుడు వసుధ నిజాయతీ అతనికి నచ్చుతుంది. దీంతో ఆరవ్‌ తన దుబాయ్‌ లోని హోటల్లో పనిచేయడానికి ఆమెకు ఆఫర్‌ ఇస్తాడు. భర్త కోసం వేచిచూస్తున్నందువల్ల తను దానిని తిరస్కరిస్తుంది. అయినా ఆరవ్‌ ఆమె ఎప్పుడైనా ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చని చెబుతాడు. సరిగా అపుడే పోలీసుల ద్వారా తన భర్త అయిదుగురు అమెరికన్‌ జర్నలిస్టులను చంపాడనీ, అతనో టెర్రరిస్టనీ తెలుస్తుంది. దీంతో కొడుకు భవిష్యత్తు కోసం దుబాయ్‌ వెళుతుంది. అక్కడ వసుధ, ఆరవ్‌ లు ప్రేమలో పడతారు. పెళ్లికూడా చేసుకోవాలనుకుంటున్న క్రమంలో తిరిగి హరి వచ్చేస్తాడు. తను నిర్దోషినని చెబుతాడు. వసుధ తన ప్రేమ కథను చెబుతుంది. వారిద్దరి మధ్య గొడవ జరుగుతున్నపుడు పోలీసులు హరిని అరెస్ట్‌ చేసి తీసుకెళతారు. హరి వసుధను ఎలాగైనా ఆరవ్ తో కలవకుండా చేయడం కోసం కోర్టులో నేరాన్ని తనపై వేసుకుంటాడు. కానీ అందరి ముందూ మాత్రం వసుధ ఆనందం కోసం ఈ పని చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తాడు. అయితే వసుధ కోరిక మేరకు హరిని విడిపించడానికి ఆరవ్‌ ప్రయత్నిస్తాడు. అయితే హరిని ఆరవ్‌ విడిపిస్తాడా? చివరికి ఆరవ్‌, వసుధ కలుస్తారా అన్నది మిగిలిన కథ.

కథను ఈ విధంగా చూస్తే మాత్రం దీనిలో కొత్తగా ఏముందిలే అనిపిస్తుంది. కానీ చూపించిన విధానం, చెప్పిన విధానం కొత్తగా తోచాయి.

విద్యాబాలన్‌ జాతీయ అవార్డు గ్రహీత (డర్టీ పిక్చర్‌), మంచి నటి అని తెలుసు . అది కూడా వార్తా పత్రికల కథనాల ద్వారానే. ఆమె సినిమాలు నేను పెద్దగా చూడలేదు. డర్టీ పిక్చర్‌ కొద్దిగా మాత్రం చూశానంతే. అయితే వసుధగా ఆమె పాత్ర మాత్రం కంటనీరు తెప్పించకుండా ఉండదు. ఇక హీరో- ఇమ్రాన్‌ హష్మిపై నాకు అంత మంచి అభిప్రాయం కూడా లేదు (నటన విషయంగా). అందుకు ఆయన తీసిన సినిమాలే కారణమై ఉండొచ్చు. లేదా నటన కంటే వేరే అంశాలకే అతను ప్రసిద్ధమవడమూ కారణమవచ్చు. అయినా నేను ఈ సినిమాను చూడడానికి కారణం మాత్రం సినిమాలో ‘మై జానె యే వారు దూ..’ పాటే.

ఇక సినిమా విషయానికొస్తే.. మొదట ఆకట్టుకున్నది- పూలు అమర్చిన తరువాత హీరో మీకు మీ వృత్తిలో నచ్చనిది ఏది అని హీరోయిన్‌ను అడుగుతాడు. అపుడామె.. ‘పూలు చెట్లకు ఉన్నపుడే వాటికి అందం, వాటిని మనం సరిగా ఆస్వాదించేది కూడా అపుడే. వాటిని ఎవరి ఆనందం కోసమో, దేవుడి కోసమో తెంపడం నచ్చదు. కానీ ఈ వృత్తే నాకు అన్నం పెడుతోంది..’ అని చెబుతుంది. ఎంత నిజమో కదా!

తరువాత దుబాయ్‌లో.. హీరో ఒక గార్డెన్‌ ను చూపిస్తూ.. ‘దీనిని ఇంత అందంగా తీర్చిదిద్దినా ఏదో వెలితిగా ఉంది. దీనికేమైనా పరిష్కారం చెప్పగలవా?’ అని అడుగుతాడు. దానికి ఆమె..’ఇక్కడ చాలా అందమైన పూలున్నాయి. నిజమే.. కానీ, కృత్రిమతే దీనికి వెలితి. ఒక తోటైనా పూలైనా అందంగా కనిపించాలంటే సహజసిద్ధంగా ఉండాలి. దీనిలో అదే లోపించింది. మొక్క అన్నాక ఎండిన ఆకులు, పూలుండడం సహజం. అవే లేనపుడు ఎంత అందమైన పూలను పెట్టినా దాని అందం తెలియదు’ అని చెబుతుంది. ఇక్కడ అందం తెలియాలంటే దానిపక్కన అందవిహీనమైనది ఉండాలన్నది కాదు నా ఉద్దేశం. సృష్టిలో ప్రతి దానికీ ఓ అందం ఉంటుంది. కానీ అద్భుతమనో, అత్యద్భుతం అనో మనమనాలంటే.. అసలు అది కనిపించడానికీ, అనిపించడానికీ తగిన వాతావరణం ఉండాలి కదా! అనిపించింది. అలా నాకు ఆ సంభాషణ నచ్చింది. నిజానికి చూసే మనసుండాలే కానీ ఎండిన ఆకులోనూ ఎంతందం?!

humari-adhurio-kahani_640x480_61430566630

అన్నట్టూ చెప్పడం మరిచాను.. ఈ సినిమాలో అమల అక్కినేని హీరో తల్లిగా నటించారు. అసలు కథ మలుపు తిరగడంలో ఈమెదే ముఖ్య పాత్ర. ఒకరకంగా ఈమెదీ, వసుధ పాత్రదీ ఒకే నేపథ్యం. బహుశా హీరోకి హీరోయిన్‌ నచ్చడానికి ఇదీ ఒక కారణమై ఉండొచ్చనిపిస్తుంది.. బాగా ఆలోచిస్తే!  హీరోయిన్‌ తో సంభాషణలో ఒక మాటంటుంది.. ‘ప్రతి అమ్మాయికీ మన దేశంలో సీతలా ఉండమని చెబుతారు. సహనంతో, సౌశీల్యంతో ఉండాలంటారు. కానీ రాధలా ఉండమని ఎవరూ చెప్పరు.. రోజూ రాధకృష్ణులకు పూజలు చేసినా! ‘ అంటుంది. ‘భర్త ఎన్ని బాధలకు గురిచేసినా.. ఓర్చకోవాలంటారు.. కానీ ప్రేమ కరవైనపుడు దొరికిన దాన్ని అందిపుచ్చుకోమని ఎవరూ చెప్పరు.. ఎంత విచిత్రం! నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో.. బలవంతపు సీతలానా.. నచ్చిన రాధలానా?’ అని అడుగుతుంది. ఉన్నది కొంచెం పాత్రే అయినా అమల పాత్ర చాలా నచ్చుతుంది. అంత బాగా నటించారామే.

వసుధ ఆరవ్‌ గురించి తన భర్తకు చెప్పినపుడు.. అతను ఆమె తనను మోసం చేశావనీ, నా కోసం వేచి చూడలేదని తిడతాడు. నువ్వు అతనితో ప్రేమలో పడినపుడు నేను గుర్తుకు రాలేదా అని అడుగుతాడు.. అపుడామె.. ‘నీ గురించి ఏం గుర్తుంచుకోవాలి? భర్త అనే అధికారంతో.. యజమాని పశువుపై వేయించినట్టుగా బలవంతంగా వేయించిన ఈ పచ్చబొట్టా? ‘ అని అడుగుతుంది. మళ్లీ చివర్లో.. ‘నేను నీ దానినంటూ నా నుదుటిన బొట్టూ, మెడలో తాళి, చేతికి గాజులూ నీ పేరు పెట్టుకున్నావ్‌. మరి నా కోసమంటూ నీ దగ్గర ఏం పెట్టుకున్నావ్‌?’ అంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా అంశాలు నచ్చుతాయి. నిజానికి ఈ సినిమాకు ప్రాణం ఈ సంభాషణలే. పెద్దగా బుర్రకు పనిపెట్టేలా కాకుండా.. మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. రాజూ సింగ్ సంగీతం సినిమాకు ప్రాణం. ఇంకోటి నేను గమనించిందేమిటంటే.. గత కొన్ని సినిమాలు చూస్తుంటే.. హీరో, హీరోయిన్ల మధ్య స్టెప్పులతో, హోరెత్తే మ్యూజిక్‌ కంటే.. శ్రవణానందంగా, కథలో భాగంగా పాటలను జోడించడం బాలీవుడ్‌ లో ఎక్కువగా కనిపిస్తోంది. మనవాళ్లు కూడా దీనిని అనుసరించాలని కోరుకునేవాళ్లలోనేనూ ఒకదానిని.

చివరగా ఇంకొక్కట్టుండి పోయింది.. పూలు. ఈ సినిమా మొత్తంలో ఆరిస్ట్‌ లందరితో పోటీపడిన తెల్లపూలు. తెల్లని ఆరమ్‌ లిల్లీస్‌. చాలా బాగుంటాయి. కథ ప్రారంభం, ముగింపు వీటితోనే ఉంటుంది.

‘హమారీ అదూరీ కహానీ’ అంటే.. పూర్తవని కథ అని అర్థం. కానీ ఈ సినిమానే ఎప్పటినుంచో రాయాలనుకుని, పూర్తి చేయలేకపోతున్న నా వ్యాసాన్ని పూర్తి చేసేలా చేసింది. మొత్తానికి పూర్తవని కథతో నా వ్యాసం ముగిసిందన్నమాట.

*

ఒకింత నిర్లక్ష్యంగా.. బోల్డంత ఇష్టంగా…!

 

మనం ఎక్కిన రైలో బస్సో ఇంకోటో మధ్యలో ఏవో తెలీని అవాంతరాల వల్ల దారి తప్పి, ఊరు కాని ఊళ్ళన్నీ దాటుకుంటూ, మనం వెళ్ళాల్సిన ఊరి నించి మాత్రం దూరంగా.. బహుదూరంగా వెళ్ళి ఆగిపోతే!

అక్కడ నించి మనం కొన్ని పగళ్ళూ, ఇంకొన్ని సాయంత్రాలూ, మరికొన్ని చీకట్లనీ తోడు తీసుకుని ఇంకొంచెం తప్పిపోతే!

నీతోనో, తనతోనో లేక మరెవరితోనో కాదు నాతో కలిసి నేను వెళ్ళిపోగలిగితే!
ఆమధ్యెప్పుడో వారాల తరబడి ప్లాన్ చేసి వెళ్లిన పిక్నిక్‌లో, రోజూల తరబడి వేసిన బడ్జెట్ డబ్బులతో కొన్న హెల్తీ స్నాక్స్ తింటూ, గోముగా పలకరిస్తున్న తేమ గాలిని విసుక్కుంటూ,  వెల్ మేడ్ హెయిర్ కి అదెంత హానికరమో నొక్కి వక్కాణిస్తూ అందరూ తమ తమ జీవితాల్లో బాగా ఎంజాయ్ చేసిన సమయాల గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు…
తెలీకుండానే ఉత్సాహంగా ముందుకు వంగి, బుగ్గ కింద చేయి పెట్టుకుని వింటున్నానా..
పరిగెత్తిన మారధాన్‌లూ, వెళ్ళిన లాంగ్‌ డ్రైవ్ లూ, ఇంకాస్త వెనక్కెళ్ళి చిన్నప్పుడు కొట్టేసిన పెన్నులూ, పట్టేసిన ఫస్ట్‌డే ఫస్ట్ షో టికెట్‌లూ!
సంతోషానికి డెఫినిషన్లు మారుతుంటాయి! తెల్సిన విషయమే మళ్ళీ కొత్తగా గుర్తొచ్చింది!!
సమయాన్ని గంటల్లో కాదు మైళ్ళల్లో కొలుచుకుంటానని హఠాత్తుగా ఉద్యోగానికి రిజైన్ చేసి, మూడునెలల పాటు హైకింగ్ చేయడానికి వెళ్ళిన ఒక స్నేహితుడు గురొచ్చాడు… కావాలని అడవుల్లో తప్పిపోయిన ‘వనవాసి ‘ రాహుల్ సాంకృత్యన్ కూడా మనసులో మెదిలాడు! అఫ్‌కోర్స్, చిన్నవాళ్ళే.. ఏ బాధ్యతలూ లేనివాళ్ళే! కానీ ముందు ముందు జీవితంలో ఇలాంటి ఎన్నెన్ని పిక్నిక్‌ల్లోనో, బాన్‌పైర్ చుట్టూనో వాళ్ళు వాళ్ళ కోసం గడిపిన సమయాలకి జీవం వస్తుంది.. అనుభవాలు కధలుగా మారతాయి!
ప్రతీ ఉదయం మనకి పాకెట్ మనీగా ఒక ఖాళీ దినాన్ని ఇస్తుంది సరే.. బ్రతుకు చక్రానికి పాజ్ ఇచ్చి, ఒకింత నిర్లక్ష్యంగా.. బోల్డంత ఇష్టంగా కుకీ కటర్ జీవితం నించి పారిపోగలిగిన ధైర్యాన్ని కూడా కొసరుగా ఇవ్వగలిగితేనో………..
ఒకే ఒక్క శబ్దం
చేతి ఖర్చు
మొత్తం పగలంతా నాకు చేతి ఖర్చుగా ప్రతిరోజూ దొరుకుతుంది
కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు దాన్ని చేజిక్కించుకుంటారు..
నానించి దూరంగా లాక్కెళ్ళిపోతారు!
ఒక్కోసారి జేబులోంచి అది పడిపోతుంది..
జారిపడిన శబ్దమైనా నాకు వినిపించకుండానే!
ఎప్పుడైనా ఒక మంచిరోజు పలకరించినా సరే
మరపుతో అదొక చెడు దినమే అనేసుకుంటాను.
ఇంకొన్నిసార్లు అయితే..
కొంతమంది చొక్కా పట్టుకుని మరీ ఆరోజుని కైవశం చేసుకుంటారు
‘తరతరాలకి సొంతమైన బకాయి ఇది..
నీ వంతు వాయిదాలు చెల్లించక తప్పదంటారు!’
మరికొందరేమో
బలవంతంగా తాకట్టు పెట్టుకుంటూ దయగా చెప్తారు,
‘కాసిన్ని క్షణాలు వాడుకో
కానీ మిగిలినదంతా తర్వాత జీవితానికి జమ వేయక తప్పదు..
అవసరమైనప్పుడల్లా ఖాతా లెక్కలు సరిచూడక తప్పదు!’
నాకొక ప్రగాఢ వాంఛ
ఒక మొత్తం పగలుని కేవలం నాకోసమే ఉంచేసుకోవాలని
ఆసాంతంగా నీతోనే ఖర్చు చేయాలని!
కేవలం అదొక్కటే నా నిజమైన కోరిక!
మూలం:

Mujhe kharchi mein pura din, har roz milta hai
Magar har roz koi cheen leta hai, jhapat leta hai, anti se!

Kabhi khise se gir padhta hai toh girne ki aahat bhi nahi hoti,
Khare din ko bhi mein khota samajh ke bhool jata hu!

Gireban se pakad ke mangane wale bhi milte hai!
‘Teri guzhri hui pushto ka karza hai,
Tujhe kiste chukani hai~’

Zabardast koi girvi bhi rakh leta hai, yeh keh kar,
Abhi do-char lamhe karch karne ke liye rakh le,
Bakaya umr ke khate mein likh dete hai,
Jab hoga, hisaab hoga

Badi hasrat hai pura ek din ek baar mein apne liye rakh lu,
Tumhare saath pura ek din bas kharch karne ki tamanna hai!

కవిత్వంలో ఉన్నంతసేపూ…

 

అరణ్యకృష్ణ

కవిత్వమెప్పుడూ ఓ అనుభూతుల వర్ష సమూహమే
సమాంతరంగా రాలే చినుకులన్నీ నేలజేరి
ఒకదాన్ని మరొకటి
ఘర్షిస్తూ కౌగిలిస్తూ సంగమిస్తూ ప్రవహించినట్లు
ఇష్టపడే ముద్దాడే వేటాడే వెంటాడే
జ్ఞాపకాల తాలూకు అనుభూతులన్నీ
నా ఉనికి మీద కురిసి నేనో కవితనై ప్రవహిస్తాను
అంతరంగ గర్భంలో నీళ్ళింకి
కుతకుతా ఉడుకుతున్న మట్టి మీదకి
నీటిమబ్బులు ఘీంకారధ్వానంతో
కుంభవృష్ఠిగా జారిపోతూ దబ్బున పడ్డట్లు
ఏ సుషుప్తి గర్భంలోనో సెగలు కక్కుతున్న విచలితదృశ్యాలేవో
నన్నో కవిసమయంగా పెనవేసుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
నా దేహం మీద వర్షం
నా ఉనికి మీద కవిత్వం కురిసి
రెండింటినీ పరిశుద్ధం చేస్తాయి
నిజం!
కవిత్వంలో ఉన్నంతసేపూ
వర్షంలో తడుస్తున్న భూమిలా
నేనూ అమలినంగా ఉంటాను
పేడపురుగుల మీద పూలచెట్ల మీద
సమానదయతో కురిసే వర్షంలా
నా కవిత్వం నిష్కల్మషంగా ఉంటుంది
కురవని మేఘాల్లాంటి దాచుకున్న కన్నీళ్ళన్నీ
మట్టి వాసనతో నెత్తుటి రంగుతో
కవిత్వమై విప్పారుతాయి
గుండె మీది ఆకురాలు కాలాల్ని తుడిచిపారేసి
కవిత్వం వానచెట్టులా ఎదుగుతుంది.
*
aranya

సప్త స్వరాల చివరి మజిలీ- ని!

 

 

మమత వేగుంట

 

సప్తస్వరాల శిఖర బిందువు- నిషాదం!

స్వరం సరిహద్దులకి చివరి పరీక్ష- ని.

నీ వ్యక్తీకరణ పరిధుల తుదీ మొదలూ  తేల్చుకునే సమయంలో వినాలి- ని.

 

తెగని సంఘర్షణ తరవాతే గెలుపు

కాన్వాస్ చీకట్లోంచి మెరుస్తుంది కళాఖండం

ఆ ఉత్సాహపు ఉరకల్లో మేధో విజయంలో వినాలి- ని.

 

ఏనుగు ఘీంకారంలోంచి కదిలాయి నిషాద స్వరమూలాలు.

ఆ ఘీంకారం నిన్నూ నన్నూ ఆదిమ యుగాల్లోకీ తీసుకెళ్తుంది

ఈ క్షణంలోకీ ఇక్కడికీ మేల్కొల్పుతుంది.

సాధ్యమయ్యే కలలోకి మెలకువ- ని

ఒక అద్భుతంలోకి విజయ సోపానం- ని

సాధ్య స్వప్న కళకి చేరువగా విను- ని!

Mamata 1

గమనమే గమ్యం -7

 

19BG_VOLGA_1336248e

మర్నాడు మధ్యాహ్నం శారద భోజనం చేసి ‘‘యంగ్‌ ఇండియా’’ పత్రిక పట్టుకుని చదువుతుండగా ఆమె స్నేహితులొచ్చారని వంటావిడ వచ్చి చెప్పింది.

శారద ఆశ్చర్యంగా వెళ్ళి వాళ్ళను కావలించుకుంది. ముగ్గురూ కూర్చున్న తర్వాత వెరోనికా అంది.

‘‘మేం కాలేజీకి వెళ్ళి దరాఖాస్తు ఫారాు ఇచ్చి వచ్చాం. నువ్వు ఇచ్చే ఉంటావులే’’ అని `

శారద వాళ్ళవంక జాలిగా చూస్తూ

‘‘మీరు కళాశాలో చేరుతున్నారా? నేను బహిష్కరిస్తున్నాను’’ అంది.

‘‘అదేమిటి? బహిష్కరించటం ఏమిటి? ఎందుకు? చదవవా?’’ వాళ్ళిద్దరూ కంగారుగా అడిగారు.

శారద వివరంగా ఉద్యమం గురించి, గాంధీగారి పిలుపు గురించి ఎంతమందో చదువు మాని ఉద్యమంలోకి దూకటం గురించీ, వాళ్ళూ చదువు మానెయ్యాల్సిన కర్తవ్యం గురించి ఆవేశంతో చెప్పింది. వాళ్ళను మార్చి కళాశాలకు వెళ్ళకుండా చెయ్యటమే తన కర్తవ్యమన్నట్లు చెప్పింది.

అంతా విని వెరోనికా, థెరిసా లేచి నిబడి ‘‘ఇక వెళ్ళొస్తాం’’ అన్నారు. శారద అర్థం కానట్లు చూసి.

‘కూర్చోండి. నా మాటలన్నీ విని మాట్లాడకుండా వెళ్ళిపోతామంటారేం ఏదో ఒకటి చెప్పండి. నేనన్న మాటల్లో తప్పేముంది?’’ అంటూ వాళ్ళను కూర్చోబెట్టింది.

‘‘తప్పు, ఒప్పు కాదు శారదా. మేం చదువు మానం. నువ్వు చదువు మానినా నీకేం నష్టం లేదు డబ్బుంది. పెళ్ళి చేసుకుంటావు. హాయిగా బతుకుతావు. నీకు ఇష్టమైన పనులు చేసుకుంటావు. మేం ఈ చదువు మానితే ఏముంది? మా వాడల్లో గౌరవం లేకుండా దుర్భరమైన బతుకు బతకాలి’’ థెరిసా మాటకు అడ్డం వచ్చింది వెరోనికా.

‘‘శారదా! ఈ చదువు లేకపోతే నీతో స్నేహం చెయ్యగలిగేవాళ్ళమా? అసు మాతో నువ్వు మాట్లాడేదానివా? మీ ఇంటికి వచ్చి నీ పక్కన కూర్చోగలిగే వాళ్ళమా? అట్లాంటి చదువు మానమంటున్నావా? నీకు చదువు ఉన్నా లేకపోయినా ఒకటే . డబ్బు, గౌరవం, ఆనందం అన్నీ ఉంటాయి. నిన్నెవరూ అవమానించరు. కానీ మాకు చదువు తప్ప ఇంకో ఆధారం ఏదీ లేదు. ఉన్న ఒక్క ఆధారం ఒదులుకోమంటావా? మేం చదువుకోటానికి ఎంతెంత త్యాగాలు  చేశారో మా కుటుంబాలవాళ్ళు, అవి చాలు . ఇంక మేం త్యాగం చెయ్యనవసరం లేదు’’.

శారదకు చాలా కష్టమనిపించింది. దు:ఖం వచ్చింది.

‘‘గాంధీ గారు ’’

‘‘ఆయనంటే మాకు గౌరవం ఉంది. కానీ ఆయనగానీ, మరెవరైనా గానీ మా కులం వాళ్ళ బతుకు బాగుచెయ్యగలరని నమ్మకం లేదు. మా చదువే మమ్మల్ని ఉద్ధరిస్తుంది. మేం చదువుకుని మా వాళ్ళకు చదువు చెబుతాం. సేవ చేస్తాం. అది కూడా దేశసేవే ! రాట్నం ఒడకటం, వందేమాతరం అని అరవటం మాత్రమే దేశసేవ కాదు’’ అంది థెరిసా.

‘‘మేం దీని గురించి ఆలోచించలేదనుకోకు శారదా . మేం మతం మార్చుకున్నాం కాబట్టి మమ్మల్ని కొంతవరకైనా మనుషుల్లా చూస్తున్నారు. తెల్లవాళ్ళ మీద నీకున్నంత కోపం మాకు లేదు. అసలు  కోపమే లేదు. మనకు చదువు చెప్పే అమ్మగార్లు ఎంత మంచివాళ్ళు. వాళ్ళు వచ్చి మా మతం మార్చి మమ్మల్ని చదువుల్లో పెట్టకపోతే ఏమయ్యేవాళ్ళం. మీ వాళ్ళు మమ్మల్ని అంటుకోరే ? మమ్మల్ని వెలివేశారే ? మీరు మమ్మల్ని చూసినట్లు తెల్లవాళ్ళు మిమ్మల్ని చూస్తే మీరు భరించలేకపోతున్నారు. మేం ఎట్లా భరిస్తాం’’.

‘‘గాంధీగారు హరిజనుల కోసం కూడా … ’’

‘‘అది మాకు చాలదు. గాంధీ గారు వచ్చినపుడు మా ఇళ్ళకు వచ్చిన మీవాళ్ళుఆ తర్వాత స్నానాలు చేస్తారు. మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చి ఆ ఇల్లంతా శుద్ధి చేసుకుంటారు. మీ వాళ్ళు మారరు. మా బతుకులూ  మారవు. చదువు మాత్రమే కొంతైనా మారుస్తుంది. ఆ చదువు మేం ఒదలం. అది ఒదిలితే ఇంక బతికున్న శవాలమే. నువ్వు కూడా మానొద్దు. మీ వాళ్ళల్లో మాత్రం ఎంతమంది ఆడవాళ్ళను చదవనిస్తున్నారు? నువ్వు డాక్టరువై ఎంతో సేవ చేస్తానని చెప్పేదానివి. అది మాత్రం సేవ కాదా?’’

థెరిసా, వెరోనికా మాటకు శారద సమాధానం చెప్పలేకపోయింది.

‘‘ఊళ్ళో మా వాడల్లోకి కూడా రాట్నాలు వచ్చాయి. మా వాళ్ళూ చేయగలిగింది చేస్తున్నారు. మాకు మాత్రం వాటి మీద నమ్మకం లేదు.’’

ఇంతలో సుబ్బమ్మ గారు వాళ్ళ కోసం ఫలహారాలు  తెచ్చారు.

‘‘నమస్కారమండీ. ఎప్పుడొచ్చినా మంచి మంచి ఫలహారాలు  పెడతారు.’’ అంటూ వాటిని తినే పనిలో పడ్డారు వెరోనికా, థెరిసాలు.

శారదకు చాలా గందరగోళంగా అనిపించింది. ఫలహారం రుచించలా. అన్యమనస్కంగానే వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. అన్నపూర్ణకు ఉత్తరం రాసినప్పటి  ఉత్సాహం ఇప్పుడు లేదు. ఎంత వెనక్కు నెట్టినా ఆగకుండా ప్రశ్నలు వస్తున్నాయి. చదువుమానటం అనేది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఆ పని చెయ్యని వాళ్ళను తక్కువగా చూడటం సరికాదు. అంటే చదువు మానేసి తను గొప్ప నాయకురాలై పోదు. అలా అవుతాననుకుంటే వెరోనికా, థెరిసా లను అవమానించినట్లే . కానీ హరిజనుల సంగతేమో కాని వేలమంది చదువులు  మానుతున్నారు.

కానీ విదేశీ విద్య లేకపోతే ఆడవాళ్ళకు, హరిజనులకు ఇట్లా బైటికొచ్చి ఇంతమంచి చదువు చదివే అవకాశం ఉండేదా ? అదంతా  తరవాత,  గాంధీగారు ఆలోచించకుండా ఈ కార్యక్రమం ఇవ్వరు గదా ! దీని ప్రయోజనం తర్వాత తోస్తుంది. ఇంతమంది పెద్దలు కళాశాలల్ని, కోర్టుల్ని, ఉద్యోగాలను ఒదిలేస్తుంటే అది మంచి పని కాకుండా ఎలా ఉంటుంది.?

శారదకు ఆ రాత్రంతా నిద్రలేదు. తండ్రినడగటానికి సంకోచం. చివరికి తన పరిస్ధితి తన స్నేహితుల పరిస్థితీ ఒకటి కాదు గాబట్టి వాళ్ళ నిర్ణయమూ, తన నిర్ణయమూ కూడా సరైనవనే ఆలోచనను మనసులో స్థిరపరుచుకుని కొంత శాంతి పొందింది.

రెండు రోజుల తర్వాత హరిగారు వచ్చేసరికి శారద ఆయనను ఉత్సాహంగానే ఆహ్వానించింది. నిజానికి ఆయననుతానే వెళ్ళి కలిసి మాట్లాడానుకుంటున్నదేమో, ఆయనే వచ్చేసరికి హడావుడిగా అతిథి మర్యాదలు చేసి ఆయన ముందు విద్యార్థిలా కూచుంది. హరిగారు ఏమీ తెలియనట్లుగా

‘‘ఏ కాలేజీలో చేరుతున్నావమ్మా’’ అని అడిగారు.

‘‘ఏ కాలేజీలోనూ చేరదల్చుకోలేదండి’’ అంది శారద ఒక రకమైన గర్వంతో `

‘‘అదేమిటి ? ఎందుకు?’’ హరిగారు శారదను పరిశీలనగా చూస్తూ అడిగాడు.

‘‘నేనిక ఈ చదువు చదవదల్చుకోలేదు. స్వదేశీ ఉద్యమంలో చేరి పని చేయాలనుకుంటున్నాను’’.

హరిగారు నవ్వారు.

‘‘అలాగైతే సంతోషమే. ఏం పనిచేస్తావమ్మా’’

‘‘రాట్నం తిప్పుతాను. ఇంకా మీలాంటి వారు ఏం చెయ్యమంటే అది చేస్తాను. అసలు నేనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడానుకున్నాను’’.

శారద ఉత్సాహం చూస్తుంటే హరిగారికి జాలివేసింది.

‘‘నేను చేసే పనులు రాయటమూ, ప్రజలను సమీకరించటమూ. ఆ రెండు పనులకూ నీకింకా వయసూ, అనుభవం కావాలి’’.

ఆయన మాటలు అర్థం కానట్లు చూసింది శారద.

‘‘రాజకీయాల గురించి రాయటానికి నువ్వింకా చదవాలి. ప్రజలను సమీకరించటానికి నీ వయసు చాలదు’’ మళ్ళీ నొక్కి చెప్పాడు.

‘‘నేనేం చెయ్యలేనంటారా?’’ ఆవేశంగా అడిగింది శారద.

‘‘జండా ఎగరేసి జైలుకి పోవచ్చు’’.

‘‘వెళ్తాను’’. దానికి తిరుగులేదనట్లు చెప్పింది శారద.

‘‘నువ్వు జైలుకి వెళ్ళి వచ్చేసరికి దేశంలో ఎన్ని మార్పులొస్తాయో. శారదా. నువ్వింకా చిన్నదానివి. మాకే ఈ ఉద్యమం సరిగా అర్థం కావటం లేదు. నువ్వు తొందర పడవద్దు. చదువుకుని తగిన వయసు వచ్చాక ఉద్యమం లోతుపాతు అర్థం చేసుకుని చేరితే బాగా పనిచేయగలుగుతావు.’’శారద అనుమానంగా, కాస్త అసహనంగా అన్నది ‘‘నాన్న నాతో ఇలా చెప్పమన్నారా?’’ అని.

‘‘చెప్పమంటే మాత్రం తప్పేముంది తల్లీ. మీ నాన్న ఆశలు నీకూ, నాకూ కూడా తెలియనివి కావు. నీకు ఏ పదో యేటనో పెళ్ళి చేస్తానని మీ నాన్న తలపెట్టి ఉంటే నేను అడ్డుచెప్పేవాడినా? సందేహమే! వచ్చి అక్షింతులు వేసి ఆశీర్వదించి వెళ్ళేవాడినేమో. నా ఆలోచన ఆడవాళ్ళ విషయంలో మీ నాన్న బుద్ధిలాగా పనిచేయదనుకుంటాను. మీ నాన్న నా ఆలోచనను ఎంతో మార్చాడు. ఆడవాళ్ళు చదువుకుంటే తప్ప దేశం బాగుపడదని అన్నాడు. మేమంతా ఒప్పుకున్నాం. మారాం. నా కూతురికి బాల్య  వివాహం చెయ్యననీ చదివిస్తానని ప్రమాణం చేసుకున్నాను. అంతగా మారాను. నిన్ను చదివించటానికి మీ నాన్నమ్మను ఒదులుకున్నాడు. ఎందుకు? పట్టుదలకా? పంతానికా? కాదు. దేశం కోసమే. నీ చదువు నీ కోసమో, మీ నాన్న కోసమో, నా కోసమో కాదమ్మా. దేశం కోసం. దేశం డాక్టర్లయిన స్త్రీ కోసం ఎదురు చూస్తోంది. నీలాంటి వాళ్ళు దేశానికి అవసరం. రాట్నం తిప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ డాక్టర్‌ చదివే అవకాశం, ఆసక్తి, వాళ్ళలో లక్షకి ఒకళ్ళకి కూడా ఉండదు. ఆ అవకాశం నీకుంది. నాకీ ఉద్యమం లోతుపాతులు బాగా తెలుసు. తెలిసిన వాడిగా చెబుతున్నాను. నీకు చదువే మంచిదనిపిస్తోంది. దేశంకోసం నువ్వీత్యాగం చెయ్యక తప్పదమ్మా.’’

శారద కంటి వెంట నీళ్ళు ధారగా కారుతున్నాయి. వాటిని ఆపుతూ అడిగింది శారద ` ‘‘మీరీమాట చదువు మానుతున్న యువకులందరితో ఇలాగే చెప్పగరా?’’

‘‘చెప్పను. చెప్పలేను. ఎవరి పరిస్థితులు వారికుంటాయి. కొందరు అత్యవసరంగా ఉద్యమానికి కావాలి. కొందరు నిదానంగా రావొచ్చు.’’

శారద కన్నీళ్ళు తుడిచారు హరిగారు.

‘‘నువ్వు చదువుకుంటూ కూడా చేయగలిగిన పనులు ఉన్నాయి. చాలా ఉన్నాయి. నేను నీ చేత ఆ పనులు చేయిస్తాను. ఉద్యమంలో భాగమయ్యావనే తృప్తి నీకు కలిగించే బాధ్యత నాది. రాట్నం ఒడకటమేనా? ఇంకా ఎన్నో పనులు చేయిస్తా నీ చేత.’’

శారద మనసు కుంగిపోయింది. మెదడు మండిపోతోంది.

చదువంటే శారదకూ ఇష్టమే. నెలరోజు ముందు వరకూ శారదకు చదువే సర్వస్వం. అలాంటి చదువును దేశం కోసం త్యాగం చేస్తే ఎంతో ఆనందంగా, తృప్తిగా, గర్వంగా ఉంటుంది. కానీ వీళ్ళంతా చదువు మానేసి చేయగలిగింది లేదని, చదవటమే మంచిదనీ చెప్తుంటే శారదకు నమ్మబుద్ధి కావటం లేదు.

నిరుత్సాహంతో, నిరాశతో వాడిన శారద ముఖం చూసి జాలి వేసింది హరిగారికి. కానీ శారద చదువు మానేసి చేసే పని కంటే డాక్టర్‌ కావటమే ఎక్కువ ప్రయోజనమని ఆయనకూ అనిపించింది.

‘‘నువ్వు విద్యావంతురాలిగా, మనుషుల ప్రాణాలు కాపాడగలిగే డాక్టర్‌గా ఆదర్శంగా నిబడాలమ్మా. నిన్ను చూసి ఎందరో ఆడపిల్లలు డాక్టర్లు కావాలి. ఆడపిల్లల  తల్లిదండ్రులు నిన్ను చూసి వాళ్ళ పిల్లలకు పెళ్ళి చేయటం కాకుండా చదివించటం మంచిదనుకోవాలి. ఆడవాళ్ళు విద్యావంతులైతే దేశానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. నీ ఆవేశం తాత్కాలికం. నీ ఆదర్శం శాశ్వతం. నా మాట నమ్ము తల్లీ’’.

శారదను బుజ్జగిస్తూ, కన్నీరు తుడుస్తూ ప్రేమగా హరిగారు చెబుతున్న మాటల్లో నిజముందని అనిపిస్తున్నా, వాటిని అంగీకరించటానికి శారద మనసు సుతరామూ అంగీకరించటం లేదు.

olga title

రామారావు కూడా అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పాడు. చివరకు ప్రకాశం పంతులు గారు కూడా ‘‘దేశ సేవకు ఇంకా సమయం ఉంది. నీకింకా మైనారిటీ కూడా వెళ్ళలేదు. పదిహేనేళ్ళు దాటకుండా నువ్వు చెయ్యగలిగిన పనులు  చాలా పరిమితం. కనీసం ఇంటర్‌ చదువు పూర్తిచెయ్యి. తర్వాత నేను నిన్ను నాతోపాటు తీసుకెళ్తాను’’ అని చెప్పారు.

కళాశాలలో దరాఖాస్తు చేయటానికి చివరి రోజున శారద ఎర్రగా ఉబ్బిన కళ్ళతో వెళ్ళి కాగితాలు  ఇచ్చి వచ్చింది. కళాశాల తెరిచిన రోజున బలవంతంగా వెళ్ళినట్టు వెళ్ళింది.

నెలలు గడిచి పోతున్నాయి. ఉద్యమంలోకి ప్రజలు వరదలా వచ్చిపడుతున్నారు. అన్నపూర్ణ, అబ్బయ్యతో కలిసి గుంటూర్లో కాపురం పెట్టింది. వారికి ఇరు కుటుంబాల వారూ ఆర్థికంగా అండగా నిబడ్డారు. ఉన్నవ లక్ష్మీనారాయణగారితో కలిసి పన్నుల నిరాకరణోద్యమంలో పని చేస్తున్నామని అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదివిన రోజు శారద పుస్తకం ముట్టుకోలేదు. అన్నం తినలేదు. తనుకూడా అన్నపూర్ణతో కలిసి గుంటూర్లో ఉండాని ఆ పిల్ల  మనసు కొట్టుకుంది. రామారావు కూతురి పరిస్థితి గమనించి అనేక విధాలుగా  నచ్చచెప్పాడు. రెండిరటికీ చెడవద్దని మొదటిసారి కూతురితో తీవ్రస్వరంతో మాట్లాడి కన్నీళ్ళు పెట్టుకున్న రామారావుని చూసి సుబ్బమ్మ కూడా శారదను కోప్పడింది.

తల్లిదండ్రుల బాధ చూసి శారద మనసును స్థిరంగా చదువు మీదే నిలపాలని నిర్ణయం తీసుకుంది. రెండేళ్ళపాటు ఊగిసలాటలో పడకూడదని స్నేహితురాలి అనుభవాలు  పంచుకోవటంతో తృప్తిపడాలని గట్టిగా అనుకుంది.

పత్రికలో పెదనందిపాడులో జరిగిన మిలటరీ మార్చ్‌ గురించి, పోలీసులు రైతులను పెట్టిన హింస గురించి, వస్తున్నవార్తలు  తనను ఉద్రిక్త పరుస్తున్నా నివరించుకుంటోంది. అబ్బయ్యకు కూడా లాఠీఛార్జిలో దెబ్బలు  తగిలాయని, ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడనీ, నయమయిందనీ అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదివి కన్నీరు కార్చింది. రోజులు  ఎంత వేగంగా గడిచి పోతున్నాయంటే శారద మొదటి సంవత్సరం పరీక్షు రాసి శలవల్లో చదవవలసిన ఇతర పుస్తకాల జాబితా తయారుచేయటం మొదుపెట్టింది. రామారావుగారికి ఆరోగ్యం బాగుండటం లేదు. శలవల్లో తండ్రి చెబుతుంటే తను రాసిపెడతానని చెప్పింది. ఆయన ఆనందంగా ఒప్పుకున్నాడు. కానీ ఆయన ఇంట్లో ఉండే రోజులే తక్కువ. సభలు, సమావేశాలని ఆంధ్రదేశమంతా చేసే పర్యటనలే ఎక్కువ.

శారద తండ్రి పుస్తకాలు సర్దుతూ ఉంది ఆ రోజు. ఆయన చదువుతున్న పుస్తకాలు, చేయవలసిన పని అర్థమవుతున్న కొద్దీ శారదకు ఆయన మీద గౌరవం పెరుగుతోంది. తన తండ్రి కేవలం తనకు తండ్రి మాత్రమే కాదనీ, ఆంధ్రదేశపు చరిత్ర నిర్మించే ప్రముఖ వ్యక్తని తోస్తున్న కొద్దీ శారద తండ్రిని తన కోరికలు  తీర్చే మనిషిగా కాక వేరుగా గుర్తించటం మొదలుపెట్టింది. తండ్రి గురించిన ఆలోచనలతో ఆయన పుస్తకాలతో ఉన్న శారదకు హాల్లో ఎవరివో మాటలు, నవ్వులూ వినిపించాయి. సుబ్బమ్మ ఎవరినో ‘‘ఎన్నాళ్ళకు కనపడ్డావమ్మా! రా! రా!’’ అంటూ ఆహ్వానించటం విని ‘ఎవరొచ్చారా’ అనుకుంది. అవతలి వ్యక్తి నవ్వూ, సమాధానమూ వినగానే ఒక్క పరుగున హాల్లోకి వచ్చి అన్నపూర్ణను కావలించుకుంది.

‘‘ఎప్పుడొచ్చావు? ఎలా వచ్చావు?’’ అని పక్కకు చూస్తే అబ్బయ్య కూడా ఉన్నాడు. శారద సంతోషానికి మితిలేకుండా పోయింది. వారిద్దరినీ కుశల ప్రశ్నతో ముంచెత్తింది.

అతిథులెవరు ఎప్పుడు ఆ ఇంటికి వచ్చినా ఆ ఇంట్లో ఎవరూ చెప్పకుండానే అన్ని మర్యాదలూ  జరిగిపోయే ఏర్పాట్లున్నాయి. ఐనా అన్నపూర్ణ, అబ్బయ్యు స్నానాలు ముగించి, ఫలహారాు చేసే వరకూ శారద నిలిచిన చోట నిలవకుండా హడావుడి పడింది.

అంతా విశ్రాంతిగా కూర్చోగానే ‘‘చెప్పండి. సత్యాగ్రహం ఎలా నడుస్తోంది? పన్నుల నిరాకరణ గురించి ఇవాళ మీరు నాకు అన్ని వివరాలు చెప్పాలి.’’

అబ్బయ్య, అన్నపూర్ణ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. శారద చెప్పమన్నట్లు చూస్తుంటే `

‘‘అయిపోయింది శారదా. ముగించేస్తున్నారు’’ అంది అన్నపూర్ణ నిరుత్సాహంగా.

‘‘అదేంటి. ముగించటం ఏంటి?’’

‘‘రైతులు ప్రభుత్వాన్ని ఎదిరించారు. పన్ను చెల్లించేది లేదని గట్టిగా నిలబడ్డారు. ఐతే బ్రిటీష్‌ ప్రభుత్వం ఎంత హింసించింది వాళ్ళని . రైతుల కుటుంబాలు  ఎన్నాళ్ళని ఈ హింసలు  పడతారు. కొందరు రైతుల్ని కాల్చేశారు తెలుసుగా ? ఈ ఒక్క ప్రాంతంలో జరిగితే ప్రయోజనం ఏముంది? ఈ ప్రేరణతో దేశమంతా అన్ని వర్గాల వాళ్ళూ పన్ను కట్టకుండా ఉంటే అపుడే ప్రభుత్వం భయపడుతుందేమో ? ఇపుడది ప్రజల్ని భయపెడుతోంది. ఇలా ఎంత కాలం? అసలు గాంధీగారు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టనే వద్దన్నారట. ఇక్కడ మనవాళ్ళు చేయలగమని మొదలుపెట్టారు. సరే మొదలు పెట్టినందుకు నాలుగు నెలలు ప్రజలు  ఎంతో ధైర్యంగా నిలబడ్డారు. ప్రభుత్వం హింసకు దిగింది. ఇక దీనికి అంతం ఏమిటి? ఇంకే ప్రాంతంలోనూ ఇలాంటి ఉద్యమం రాలేదు. ఒక్కచోట ప్రజలు ఎంతకాలమని చేస్తారు. అందుకని విరమించేస్తున్నారు. రేపో, మాపో ప్రకటన వస్తుంది. ప్రకాశంగారు వచ్చి ఉన్నవవారితో, వెంకటప్పయ్య గారితో మాట్లాడారు. అంతా నిశ్చయం అయింది’’.

అబ్బయ్య చెబుతుంటే శారద నివ్వెరపోయి విన్నది.

‘‘ప్రజల త్యాగాలు వృథా కావాల్సిందేనా? నాలుగు నెలల్లో ఏం సాధించాం?’’ ఆవేశపడింది.

‘‘లేదు శారద గారూ, ప్రజలకు తమ మీద ఎంత కోపం ఉందో, ఎలా తిరగబడగలరో ప్రభుత్వానికి తెలిసింది. ప్రభుత్వం ఎంత క్రూరమైందో ప్రజలకీతెలిసింది. దీనిని కొనసాగించటం కష్టం. స్వరాజ్యం వచ్చేంత వరకూ పన్ను చెల్లించకుండా ప్రభుత్వానికి ఎదురుతిరిగి నిలబడటం చాలా కష్టం. ఒక్క ప్రాంతంవల్ల  ప్రయోజనం లేదు. మిగతా ప్రాంతాల్లో ఈ అగ్ని రాజుకోలేదు.’’

అబ్బయ్య, అన్నపూర్ణ ఉద్యమం గురించి చాలాసేపు మాట్లాడారు. చివరికి అబ్బయ్య అన్నాడు.

‘‘నేను మళ్ళీ కాలేజీలో చేరి పరీక్షలు రాద్దామనుకుంటున్నాను. కాలేజీవాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఇప్పుడే మాట్లాడి కాలేజీలు తెరిచే సమయానికి రావాలని అనుకున్నాం. అవసరమైతే మీ నాన్నగారి సాయం తీసుకుందామని వచ్చాం’’. అబ్బయ్య మాటలు శారదను అయోమయంలో పడేశాయి.

‘‘మళ్ళీ కాలేజీలో చేరతారా?’’

‘‘దేశానికి చదువుకున్న వాళ్ళు, ఏదో ఒక రంగంలోన నిష్ణాతులైనవాళ్ళూ అవసరమేననిపిస్తోంది. ఈ చివరి పరీక్ష రాస్తే ఎమ్మెస్సీ పట్టా చేతికొస్తుంది. ఏ కాలేజీలోనైనా ఉద్యోగం చేస్తూ విద్యార్థులలో జాతీయ భావాలు వ్యాపింపజేయవచ్చు’’

శారద మరేం మాట్లాడలేకపోయింది. అబ్బయ్య భోజనం చేసి కాలేజీకి వెళ్ళి స్నేహితులను కలుసుకుని వస్తానని వెళ్ళాడు.

అన్నపూర్ణ, శారద అంతు లేకుండా కబుర్లు చెప్పుకున్నారు.

ఆ రాత్రి రామారావు వచ్చాక అబ్బయ్య సంగతి తెలుసుకుని తను చేయగలిగిన సహాయం చేస్తానన్నాడు. మర్నాడే వెళ్ళి కొందరు ప్రొఫెసర్లను కలిసేందుకు నిర్ణయించుకున్నారు. అబ్బయ్య మళ్ళీ చదువుతాననేసరికి రామారావుకి కొండంత బలం వచ్చింది. ‘‘శారదను బలవంతంగా కాలేజీలో చేర్పించానా? తన గురించి శారద ఏమనుకుంటుంది? తనామె స్వాతంత్రాన్ని హరించాడా’’ అనే సందేహాలు రామారావుని అపుడపుడు బాధిస్తూ ఉండేవి.ఇపుడు అబ్బయ్య రాకతో ఆ సందేహాలు కాస్త ఉపశమించాయి. చదువుకోవటం అవసరమని శారద గ్రహిస్తుందనే కొత్త ధైర్యం వచ్చింది. అబ్బయ్యను అతి కష్టం మీద మళ్ళీ కాలేజీలో చేర్పించారు. ఆ పది రోజు శారదకు పది క్షణాల్లా గడిచాయి. అన్నపూర్ణకు మద్రాసంతా చూపించారు అబ్బయ్య శారదా కలిసి.

అబ్బయ్య ఉద్యమం గురించి నాయకుల గురించి ఎన్నో సంగతులు చెప్పాడు. నాయకులలో విభేదాలు, వారి అహంకారాలు, తీరుతెన్నులు, పంతాలు, పట్టింపులు,  వాటికోసం ఉద్యమానికి నష్టం కలిగినా పట్టించుకోని తత్త్వం, లేనట్టు కనిపిస్తూనే ఉన్న కులతత్త్వం అన్నిటి గురించీ అబ్బయ్య చెప్తుంటే శారదకు కొత్త ప్రపంచమొకటి పరిచయమైనట్లు అనిపించింది.

‘‘చాలా కష్టం రాజకీయాలో నెగ్గుకురావటం. నాలాంటివాడికి అవి సరిపడవని అర్థమైంది. నేను ప్రత్యక్షంగా దిగి పని చేయలేను. నాకు చేతనైన పని నేనూ విడిగా చేస్తా’’.

‘‘కానీ మరి ఎలా? అందరూ మీలా అనుకుంటే ` ’’

‘‘అనుకోరు. నాయకులు అనుకోరు. వారి అనుచరులు వారికుంటారు. నేను ఎవరికీ అనుచరుడిగా ఉండలేను. నా చేతనైన పనేదో నేను చేసుకుపోతాను. అంతే ` ’’

అబ్బయ్య మాటలు శారదను ఆలోచనలో పడేశాయి. తను ప్రత్యక్షంగా పాల్గొంటే తప్ప తెలియదనుకుంది శారద.

ఈసారి కాలేజీ తెరిచేసరికి శారద మనసు పూర్తిగా చదువుమీద లగ్నం అయింది. దేశ వాతావరణం కూడా తాత్కాలికంగా చల్లబడింది.

శారద ఇంటర్‌ పూర్తి చేస్తుండగా రామారావు జబ్బుపడ్డాడు. ఆయన చేసే పనికి ఆయనకున్న ఓపికకు పొంతన లేకుండా పోయింది. అది నేరుగా గుండె మీద పని చేసింది. ఆరోగ్యం పాడవుతున్నదని తెలిశాక రామారావు తన పనులను మరింత పెంచుకున్నాడు. తనకున్న సమయం అతి తక్కువని ఆయనకు అర్థమైంది. దాంతో ఆ తక్కువ సమయాన్ని పరిశోధన కోసం ఖర్చు చెయ్యటం అత్యవసరమనుకున్నాడు. చివరికో రోజు మంచంలోంచి లేవలేని పరిస్థితి వచ్చింది.

సుబ్బమ్మకు అంతకుముందు నుంచే అనుమానంగా ఉంది. ఆ రోజు రూఢీ అయింది. శారద ఆ రోజు చాలా కంగారు పడింది. మద్రాసులో పేరున్న వైద్యులందరూ వచ్చారు. అందరు చెప్పిందీ ఒకటే మాట. ఆయన చేస్తున్న పనులన్నీ మానేసి విశ్రాంతిగా కనీసం ఆరునెలలు గడపాలి. తర్వాతనే మందుల పని. విశ్రాంతే ఆయనకు మందు. విపరీతంగా అలసిపోయాడు. శారద తండ్రిని కదలనీయకుండా, చదవనీయకుండా రాయకుండా చూస్తానని అందరితో చెప్పింది. అది కష్టమైనపని అని కూడా శారద అనుకోలేదు.

కానీ ఒక్కరోజు మాత్రమే శారద ఆ పని చేయగలిగింది. రెండోరోజు రాత్రి పన్నెండు గంటలకు తండ్రిని ఒకసారి చూద్దామనిఆయన గదిలోకి వెళ్ళిన శారద నిర్ఘాంతపోయింది. ఆయన మంచం నిండా పుస్తకాలు. మంచం మీద దిండు, గట్టి అట్ట ఒళ్ళో పెట్టుకుని ఆయన రాసుకుంటున్నాడు. శారదకు కోపం వచ్చింది ఏం మాట్లాడకుండా వెళ్ళి మంచంనిండా పరిచి ఉన్న పుస్తకాలు తీయటం మొదలుపెట్టింది. రామారావు అది కూడా గమనించనంతగా పనిలో నిమగ్నమయ్యాడు. అన్ని పుస్తకాలు  తీసేసి చివరికి తండ్రి చేతిలో కలం తీసుకుంటున్నపుడు ఆయన స్పృహలోకి వచ్చాడు. అంత రాత్రివేళ శారద నిద్రపోకుండా తన గదిలోకి వచ్చినందుకు ఆయనకు కోపం వచ్చింది.

శారద ముఖం చూస్తే ఆమెకూ కోపంగానే ఉన్నట్టుంది. అందుకే శారద ఒళ్ళోనుంచి అట్ట తీసి పక్కనబెట్టి, దిండు తల దగ్గర వేసి, రెండు భుజాల మీదా చేతులు వేసి ఆయనను పడుకోబెడుతుంటే మాట్లాడకుండా పడుకున్నాడు. ఓ గంట తండ్రి పక్కనే కూచుని ఆయన నిద్రపోయాడని నమ్మి శారద వెళ్ళి పడుకుంది.

శారద వెళ్ళి పడుకుందని నమ్మకం కలగగానే ఆయన దొంగతనం చేసే వాడిలా వెళ్ళి దీపం వెలిగించుకుని పుస్తకాలు, కాగితాలు, కలం అన్నీ తీసుకుని రాసుకునే బల్ల  దగ్గరకు నడిచాడు.

మర్నాడు శారద ఉదయాన్నే తండ్రికి కాఫీ తీసుకొచ్చేసరికి తండ్రి బల్లమీద ఒంగి చదువుతూ ఉన్నాడు. రాత్రంతా ఆయనలాగే కూచున్నాడని శారదకు అర్థమైంది.

కాపీకప్పు బల్ల మీద పెట్టి శారద పెద్దగా ఏడ్చేసింది. రామారావు బిత్తర పోయి లేచాడు.

‘‘శారదా ! ఏమైందమ్మా’’ అని శారదను పట్టుకున్నాడు.

‘‘నాన్నా !నువ్వు లేకుండా నేను బతకలేను. నా కోసం నువ్వు క్షేమంగా ఉండాలి నాన్నా’’ అని వెక్కిళ్ళు పెట్టింది శారద.

‘‘నాకేమయిందమ్మా? బాగానే ఉన్నా’’

‘‘డాక్టర్లందరూ నిన్ను విశ్రాంతిగా ఉండమన్నారు. నువ్వేమో రాత్రింబగళ్ళూ పనిచేస్తున్నావు’’.

‘‘శారదా ` నీతో నేనెప్పుడు అబద్ధం ఆడలేదమ్మా. ఇప్పుడూ ఆడను. చదవకుండా, రాసుకోకుండా నేనుండలేను. మంచం మీద పడుకుంటే నిద్రరాదు. తలనిండా ఆలోచలను. నేను పరిష్కరించాల్సిన శాసనాలు  ఉన్నాయి. అధ్యయనం చెయ్యాల్సిన చరిత్ర ఉంది. అదంతా చేస్తూ రాయవలసిందెంతో ఉంది. అదంతా మానేసి మంచంలో కళ్ళు మూసుకుపడుకోవటం నావల్ల కాదమ్మా’’.

శారదకు తనముందున్నదెంత పెద్ద సమస్యో అర్థమై కాళ్ళూ చేతులు ఒణికాయి.

‘‘నాన్నా నీకేదయినా అయితే నేను తట్టుకోలేను’’.

‘‘నాకేం కాదమ్మా’’ బలహీనంగా పలికిన ఆయన గొంతుమీద ఆయనకే నమ్మకం కలగలేదు.

‘‘నా మాట వినక తప్పదు’’ అని తండ్రిని అక్కడి నుంచి లేపి స్నానాదులు అయ్యాక తనే దగ్గర కూచుని ఈ మాటా, ఆ మాటా చెప్తూ ఉంది. కళాశాలకు శలవవటంతో నాలుగు రోజు ఆయనను అంటిపెట్టుకుని ఉండి ఆయనను పుస్తకాల బారినుంచి రక్షించింది.

ఐతే శారదకు పరీక్షలు తరుముకొస్తున్నాయి. ఆమె చదువుకుంటూ తల్లికి ఈ బాధ్యత అప్పగించక తప్పలేదు.

శారద పరీక్షలు మొదలవకముందే రామారావు పరిస్థితి క్షీణించింది. వైద్యులు ఆయనను మద్రాసు నుంచి ఇంకెక్కడికైనా, పుస్తకాలు బొత్తిగా దొరకని చోటికి, పంపిస్తే తప్ప పరిస్థితి చక్కబడదన్నారు.

రామారావు తానెక్కడికీ వెళ్ళనన్నాడు గానీ శారద ఊరుకోలేదు. తండ్రిని తీసుకుని స్వంత ఊరు వెళ్ళటానికి ఏర్పాట్లు చేయటంలో పడింది.

ఆ రోజు రాత్రి సుబ్బమ్మ శారద దగ్గరకు వచ్చింది. రామారావు అనారోగ్యం పెరుగుతున్నకొద్దీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోడం ఎందుకో తగ్గిపోయింది. ఒకరిని చూడటానికి ఒకరు భయపడుతున్నట్లుగా ఉన్నారు.

తల్లి తన దగ్గరకు రావటంతో శారద తల్లికి ధైర్యం చెప్పాలనుకుంది.

‘‘అమ్మా నువ్వేం భయపడకు. నాన్నకు తగ్గిపోతుంది.’’

సుబ్బమ్మ ఆ మాటలు విననట్టుగా ‘‘మీ నాయనమ్మకు వెంటనే ఉత్తరం రాయి. ఉన్న విషయం ఉన్నట్టుగా రాయి’’ అంది.

శారద నోటమాట రాలేదు.

‘‘మీ నాయనమ్మ కాశీనుంచి రావాలనుకుంటే తగిన సమయం ఇవ్వాలి గదా శారదా ` తీరా ఆవిడ’’ అంటూ కొంగు నోట్లో కుక్కుకుంది. శారదకు ఆ మాట సారాంశం అర్థమయ్యేసరికి తల తిరిగిపోయింది. తండ్రిని రక్షించుకోగలననే ఆలోచన తప్ప ఆయనకేమైనా అవుతుందనే ఊహ లేదు శారదకు.

‘‘నువ్వు వెంటనే ఉత్తరం రాయి. లేదా టెలిగ్రామో ఏదో అంటారుగా అదైనా ఇవ్వు ` మీ నాన్న జబ్బు ఆవిడకు తెలియాలి’’.

స్థిరంగా చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది.

శారద రాత్రంతా అలాగే కూచుని ఉంది. ఆ అమ్మాయి మెదడులో ఏ ఆలోచనా లేదు. అంతా శూన్యం.

తెల్లవారిన తర్వాత ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్లు పనులు చేసుకుని టెలిగ్రాం ఇవ్వటానికి వెళ్ళింది.

నరసమ్మ కాశీ వెళ్ళిన కొత్తలో ఉత్తరాలు ఎక్కువగానే రెండువైపు నుంచీ నడిచేవి. రెండు మూడేళ్ళలో అవి క్రమంగా తగ్గాయి. క్షేమంగా ఉన్నానంటూ క్లుప్తంగా ఒక కార్డు మాత్రం వచ్చేది. రామారావు గారు క్రమం తప్పకుండా తల్లికి కావలసిన డబ్బు పంపుతుండేవాడు. మధ్యలో ఒకరిద్దరు స్నేహితులు కాశీ వెళ్ళొచ్చినవాళ్ళు నరసమ్మను చూశామనీ, ఆవిడ పూర్తిగా కాశీ మనిషై పోయిందనీ చెప్పేవాళ్ళు. గంగా స్నానం, ఈశ్వర దర్శనం, పురాణ పఠనం ఇవి తప్ప ఆవిడకు మరో ధ్యాస లేదనీ, అక్కడ తెలుగు  వాళ్ళందరికీ మంచీ చెడ్డా చెబుతుంటుదనీ, ఆవిడ చాలా ఆనందంగా ఉందనీ, ముఖంలో తేజస్సు పెరిగిందని, రుషిలాగా ఉంది గానీ మామూలు మనిషిలా లేదని చెప్పారు. సుబ్బమ్మ ఆశ్చర్యంగా వినేది.

‘‘అత్తయ్య మనందరికీ దూరంగా అంత ఆనందంగా ఎలా ఉన్నార’’ని రామారావు నడిగేది.

‘‘మనస్సు ఒకే విషయం మీద లగ్నమైనపుడు, ఇతర విషయాలు అంటనపుడు, ఆ లగ్నమైన విషయం మీద చేసే పనికి  ఆటంకం రానపుడు మనుషులకు ఆనందం కుగుతుంది. అదృష్టవశాత్తు మా అమ్మకు పరమేశ్వరుడి మీద మనసు అంత ఏకాగ్రతతో లగ్నమైనట్లుంది. చీకూ చింతా లేకుండా బతుకుతోంది. ఆవిడా అదృష్టవంతురాు. మనమూ అదృష్టవంతులం’’ అనేవాడు.

ఎక్కడున్నా ఆవిడ హాయిగా ఆరోగ్యంగా ఉందని బంధువులందరూ కూడా అదో విశేషంగా చెప్పుకునేవారు. తన చదువు కారణంగా నాయనమ్మ అంత దూరాన ఒంటరిగా ఉంటుందనే దిగులు శారదకు లేకుండా సుబ్బమ్మ, రామారావు శారదతో నాయనమ్మ గురించి ఎన్నో సంగతులు చెప్పేవారు.

ఇపుడు ఈ వార్త విని నాయనమ్మ తట్టుకుంటుందా? వస్తుందా? రాకుండా అక్కడే బాధపడుతూ ఎలా ఉంటుంది?

నాయనమ్మకిలా టెలిగ్రాం ఇచ్చామని నాన్నకు చెప్పవచ్చా ? అసలు నాన్న ఆరోగ్యం ఎందుకింత పాడయింది?

ఎన్నో సందేహాలు?

మధ్యాహ్నం ‘‘అందరం కలిసి భోజనం చేద్దా’’ మన్నాడు రామారావు.

ముగ్గురూ కలిసి తింటున్నారు గానీ ఎవరికీ ముద్ద గొంతు దిగటం లేదు.

‘‘మన ఇల్లు  బాగు చేయించారట నాన్నా. ఎల్లుండి  మనం బయుదేరుతున్నాం’’ అంది శారద.

‘‘మనం బయలు దేరటమేమిటి? నన్ను గదా డాక్టర్లు వెళ్ళమన్నది’’ అన్నాడు రామారావు.

‘‘మీరొక్కరూ వెళ్ళి ఏం చేస్తారు?’’

‘‘ఊ ` నువ్వొచ్చి నాకు ఒండి పెడుతూ ఉంటే ఇక్కడ శారద పరీక్షలు ఎలా రాస్తుందనుకున్నావు? తన సంగతి ఎవరు చూస్తారు?’’

‘‘నేనీ సంవత్సరం పరీక్షలు  రాయను నాన్నా. వచ్చే సంవత్సరం రాస్తాను’’.

‘‘ఆ మాట వింటుంటేనే నా జబ్బు పెరిగిపోతోంది. నువ్వు పరీక్షలు  మానేసి నా పక్కన కూచుంటే నాకు నయమవుతుందనుకుంటున్నావా? చాలా అధ్వాన్నమవుతుంది నా పరిస్థితి’’.

‘‘మరి ఒక్కడివే ` ఎలా’’

‘‘మన ఊరమ్మా అది .  ఎంతమందో ఉన్నారు. పైగా మన సోమేశ్వర రావు తెలుసు గదా ` ఆయన నాతోవస్తానన్నాడు. ఇద్దరం వెళ్ళి నాకు కాస్త నెమ్మదించగానే తిరిగి వస్తాం. నా మంచి చెడ్డా అన్నీ చూసుకోగలడు. మీఅమ్మకంటే వంట బాగా చేస్తాడు. నేను అంతా మాట్లాడాను ` ’’

తల్లీ కూతుళ్ళ ముఖాల్లో నెత్తురు చుక్క లేదు. రామారావు గారు నెమ్మదిగా చెబుతాడుగాని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దానినుంచి ఆయనను ఎవరూ మళ్ళించలేరని వాళ్ళకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు.

‘‘నేను బయల్దేరి వెళ్ళేప్పుడు మీరిద్దరూ కంటతడి పెట్టుకుంటే నేనక్కడ నిశ్చింతగా ఉండలేను. శారద ! నీకు పరీక్షల్లో మంచి మార్కు రావటం, మెడికల్‌ కాలేజీలో సీటు రావటం ఇవి నా ఆరోగ్యాన్ని చక్కబరుస్తాయని నీకు తెలుసు. అది జరగకపోతే నా ఆరోగ్యం బాగుపడదని చెప్పక్కర్లేదుగా. నా సంగతి నాకు ఒదిలి నువ్వు నిశ్చితంగా చదివి పరీక్షలు రాయి. నిన్ను మెడికల్‌ కాలేజీలో చేర్చటానికి నేను ఆరోగ్యంగా తిరిగి వస్తా’’.

రామారావు మాటలు భరించలేక సుబ్బమ్మ అక్కడినుంచి వెళ్ళిపోయింది. శారద దు:ఖాన్ని నిగ్రహించుకుంటూ అక్కడే తలదించుకు కూచుంది. మర్నాడు రామారావు గారు మద్రాసు నుంచి రెండు మూడు నెలల కోసం స్వగ్రామం వెళ్తున్నారని తెలిసి నుగురైదుగురు మిత్రులు  వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళతో ఉత్సాహంగా తన పరిశోధన గురించి మాట్లాడుతున్న తండ్రిని చూసి శారదకు ధైర్యం వచ్చింది.

ధైర్యంగానే తండ్రిని రైలెక్కించి వచ్చి చదువులో మునిగింది.

సుబ్బమ్మ కూతురికి అన్నీ అమరుస్తుందే గాని లోలోపల కుంగిపోతోంది. అది శారద గమనించకుండా జాగ్రత్త పడుతోంది .

నరసమ్మ కాశీ నుంచి ఉత్తరం రాసింది. రామారావు ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతూ, తాను కాశీ ఒదిలి ఎన్నటికీ రాలేననీ, తన బంధాలను  విముక్తం చేసుకునే క్రమంలో ఉన్నాననీ, ఏ బంధాలు  తనను గంగమ్మ నుండి విడదీయలేవనీ, తనను అర్థం చేసుకోమనీ రాసింది.

ఆ ఉత్తరం వచ్చిన రోజంతా సుబ్బమ్మ ఏడుస్తూనే ఉంది.

శారద చదువు అంత ముఖ్యమా అని మొదటిసారిగా అనిపించిందామెకు.

తల్లీ కొడుకు దూరమయ్యారు. తనకు అత్తగారి అండ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ చదువు మూలంగానే తను భర్తకు సేవ చేయకుండా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కూతురంటే ప్రాణమిచ్చే తండ్రికి జబ్బుచేస్తే పక్కన లేకుండా ఆ కూతురు చదివి ఉద్ధరించాల్సిందేమిటి? ఎవర్ని? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానమా అన్నట్లు రామారావు గ్రామం చేరుకోగానే ఒక ఉత్తరం రాశాడు.

ప్రియమైన సుబ్బమ్మకు `

నేను క్షేమంగా చేరాను. సోమేశ్వరరావు ప్రయాణంలో నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇక్కడ నాకు విశ్రాంతి దొరుకుతుందని వైద్యులు అనుకున్నారు. విశ్రాంతి వ్ల నా ఆరోగ్యం కుదుటపడవచ్చని అనుకున్నారు. కానీ రెండూ నిజాలు  కావు. నాకు విశ్రాంతి కావసింది శరీరానికి కాదు. మనసుకి. సరిగ్గా చెప్పాంటే మెదడుకి. అది అసంభవం. నిరంతరం నా మెదడు ఆలోచిస్తూనే వుంది. చరిత్ర గురించి తేలవసిన విషయాలు  ఎన్నో ఉన్నాయి. జాతికి చరిత్ర అవసరం. చరిత్ర లేని జాతి ముందుకు పోలేదు. మనకు చరిత్ర ఘనమైనది ఉండికూడా చరిత్రహీనుల్లా బ్రతకవలసి రావటం ఎంత దురదృష్టమో, అది నన్ను ఎంత బాధిస్తున్నదో నీకు అర్థంకాదు. ఆ చరిత్రను నిర్మించాలంటే ఎన్నో చిక్కు ప్రశ్నలు . ఆధారాలకోసం కీకారణ్యంలో గుప్తనిధులకోసం ఒంటరిగా వెతుకుతున్న వాడి చందంగా ఉంది నా పరిస్థితి. పరిష్కరించవసిన విషయాల నుంచి మనసుకి విశ్రాంతి దొరకటం లేదు. దానికోసం చదవవలసినవి చదవకుండా రాయవలసినవి రాయకుండా నేను జీవించలేను. ఆ పని చేస్తే నాకు నేను జీవించనని వైద్యులు చెబుతున్నారు. సత్యమేమిటంటే నేను ఎక్కువ రోజులు జీవించబోవటం లేదు. దీనిని నువ్వు జీర్ణించుకోవాలి.

ఈ ఉత్తరం చదివి నువ్వు బలహీనురాలివి కాకూడదు. బలాన్ని పొందాలి. ఎందుకంటే మనిద్దరి ప్రాణాలు మన శారదాంబ మీద పెట్టుకుని ఉన్నాం. నా ప్రాణాలు  పోతే శారదాంబకు ఎలాంటి లోటూ కలగకూడదు. శారదకు నా మరణం అశనిపాతంలా తగులుతుంది. మన అమ్మాయిని దానినుంచి రక్షించుకోవలసింది నువ్వే. అందుకు నువ్వు నీ సర్వశక్తులతో సిద్ధం కావాలి. అమ్మాయి చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. అమ్మాయి డాక్టర్‌ కావాలి. అది నాకు చరిత్ర రచనతో సమానమైన కోరిక అని నీకు తెలుసు. ఆ భారం, బాధ్యత నీవు ఒక్కదానివే వహించవలసి ఉంటుంది. నేను నీమీద ఇంత బరువు మోపి వెళ్ళటం అన్యాయమని నాకూ తెలుసు. కానీ నాకు వేరు గత్యంతరం లేదు. నాకు వచ్చిన జబ్బు ప్రాణాలు  తీసేదే గాని, ఆశను మిగిల్చేది కాదు.

నా మరణాన్ని శారద ఎట్లా తట్టుకుంటుందనే చింతే ప్రస్తుతం నా జబ్బు కంటే ఎక్కువ నన్ను బాధిస్తుంది. శారదకేం ఫరవాలేదు నేనున్నానని నీవు హామి ఇవ్వాలి. ఇది కఠినత్వమే. కానీ జీవించే రోజు తక్కువ ఉన్న మనిషికి కఠినత్వం కవచంలా రక్షణ ఇస్తుంది. ఆ కవచం ధరించే నేనీ ఉత్తరం రాస్తున్నాను. నన్ను క్షమించు, క్షమించకపో, అది నీ ఇష్టానికి, విచక్షణకు వదిలివేస్తున్నాను. కానీ శారదను స్వేచ్ఛగా ఏ లోటూ లేకుండా పెరగనివ్వు. మంచి డాక్టర్‌ కావాలి నా తల్లి. ఆధునిక మహిళ కావాలి నా కూతురు. ఈ దేశం గర్వించాలి మన అమ్మాయిని చూసి. చరిత్ర నిర్మించాలి నా చిట్టితల్లి. నాలా చరిత్ర రాయటం కాదు చరిత్ర నిర్మించాలి. అర్థమైందా? ఎంత పెద్ద ఆశతో జ్వలిస్తున్నదో నా ప్రాణం. సుబ్బూ ` ఇదంతా నీ వల్లే అవుతుంది. మన అమ్మాయి తెలివి, శక్తియుక్తులు మనకు తెలియనవి కావు. తప్పకుండా నా ఆశలన్నీ ఫలిస్తాయి.

ఇక్కడ ఎన్నిరోజు ప్రాప్తముంటే అన్ని రోజులుంటాను. శారద పరీక్షలయ్యాక మీరిద్దరూ కలిసి రండి.

నీవనుకుంటూ ఉండి ఉంటావు. శారద పరీక్షలు అంత ముఖ్యమా అని ? నువ్వనుకుంటున్నదానికంటే ముఖ్యం నాకు. శారద పరీక్షలు  మాని నా దగ్గర కూర్చుంటే నా అశాంతి, అనారోగ్యం పెరుగుతాయ్‌ కాని తరగవు. ఇంక రాయలేకపోతున్నాను. నేను రాయనివి, రాయలేనివి కూడా నీవు గ్రహించగవు.

నీ ప్రియమైన

రామారావు.

ఈ ఉత్తరం చదివి సుబ్బమ్మ గుండె రాయి చేసుకుంది. జరిగేది తొస్తూనే ఉంది జరగవసింది చూడాలి. అది కష్టమైనా సరే పళ్ళ బిగువున భరించాలి. శారద పరీక్షలు  అయ్యేంతవరకూ తన ముఖంలో బాధ కనపడకూడదు. తన కంట్లో కన్నీరు ఊరకూడదు.

ఒక కఠోర తపస్సులా ఆ రెండూ చేసింది సుబ్బమ్మ.

శారదకు తండ్రి క్షేమంగా ఉన్నానని ఉత్తరాలు  రాస్తున్నాడు. రెండు నెలలు  సుబ్బమ్మకు రెండేళ్ళలా గడిచాయి. శారద పరీక్షలు  ముగిశాయి. ఊరికి ప్రయాణమవుతున్నారు తల్లీ కూతుళ్ళు.

రామారావు మరి లేడనే వార్త ఆంధ్రదేశమంతా దావానలంలా  వ్యాపించింది. శారదకు స్పృహ తప్పింది. సుబ్బమ్మ కూతురిని గురించి అన్ని జాగ్రత్తలూ  తీసుకుంటూ ఊరికి వెళ్ళి భర్త అంత్యక్రియలన్నీ బంధువులు,  స్నేహితుల  సహాయంతో జరిపించింది.

ఆంధ్రదేశమంతా కన్నీరు కార్చింది. సాహితీవేత్తలు , పండితులు , చరిత్ర పరిశోధకులు , స్వతంత్రోద్యమ నాయకులు  ఒకరేమిటి రామారావు గారి నెరిగిన ప్రతివారూ తమ ఇంట్లో స్వంత మనిషి పోయినట్లుగా బాధపడ్డారు. జ్వరంతో మంచం పట్టిన శారదను తీసుకుని మద్రాసు వచ్చింది సుబ్బమ్మ.

***

మబ్బుల చాటున మహాతార : తొషిరో  మైఫ్యున్  

 

నక్షత్రం  వేణుగోపాల్

తెలుగు చలన చిత్ర చరిత్రలో బాపు రమణల కాంబినేషన్ కి ఒక ప్రత్యేకత , అలాగే  హాలివుడ్ లో డైరెక్టర్  జాన్ ఫోర్డ్ , నటుడు జాన్ వేన్ కలసి 21  సినిమాల్లో  నటించడం ఒక పెద్ద రికార్డు , అయితే,  అలాంటి ఇంకొక కాంబినేషన్    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  బ్లాక్ బస్టర్ సినిమాలతో  ఒకప్పుడు హోలీవుడ్ని జపాన్ సినిమా వైపుకి తిప్పుకునేట్టు చేసిన ప్రముఖ డైరెక్టర్, ఆయన సినిమాల్లో నటించిన  ఒక ప్రముఖ నటుడు , ప్రపంచ చలన  చిత్ర చరిత్రలో కలకాలం  నిలిచి పోయే  ఆణిముత్యాలు లాంటి  ఎన్నో హిట్లు ఇచ్చిన  ఈ ఇద్దరి  కాంబినేషన్ లో డైరెక్టర్ అందరికీ తెలుసు  కాని  అంతగా వెలుగు చూడని ఆ నటున్ని పరిచయం చేయడం కోసమే ఈ వ్యాసం  .

ఎక్కడో జపాన్ మారు మూల ప్రాంతంలో పుట్టి , ప్రపంచ చలన చిత్ర రంగంలో ,  చిరకాలం నిలిఛి పోయిన   డైరెక్టర్ అకిరా కురుసోవా . ఆయనను   డైరెక్టర్ లకే  డైరెక్టర్ అంటారు . ఒక ప్రఖ్యాత టాలీవుడ్ హీరో ఆయన కోడుకుకి అకిరా అని  పేరు కలిసి వచ్చేట్టు కూడా నామకరణం చేయడం కూడా జరిగింది అంటే ఆ డైరెక్టర్ కి ఉన్న ఖ్యాతి, పాపులారిటీ   ఎంతటిదో అర్థం చేసు కోవచ్చు.   ఎంతో పేరు ప్రఖ్యాతులు, ఎన్నో ఆస్కార్  అవార్డులు పొందిన ఆ డైరెక్టర్ కి పేరు రావడం వెనుక ఇంకొక నటుని కృషి కూడా లేక పోలేదు.  ఎందుకంటే   1948 – 1965 మధ్య కురోసోవా  తీసిన 17 సినిమాల్లో ఒక్కటి మినహా  16 సినిమాల్లో  ఆ నటుడే అన్ని ప్రాముఖ్యత గల పాత్రల్ని పోషించాడు అనే విషయమే   నా వ్యాఖ్యలకి బలము చేకూర్చుతాయి .   అందులో ఎన్నో చిత్రాలు హాలివుడ్ లో  బ్లాకు  బస్టర్  హిట్సే . అన్ని హిట్స్ అందించిన ఆ నటుని గురించి చాల మందికి  తెలియక పోవడం కొంచం విస్మయం కలిగించింది .

కురొసొవా సినిమాలు ” త్రోన్ అఫ్ బ్లడ్ “, “యోజింబో”  ,”సెవన్ సమురై, “రోషోమాన్” ,”రెడ్ బియర్డ్”, “లోయర్ డెప్థ్స్” ,” హై  అండ్ లో”  లాంటి చిత్రాలు చూస్తున్నప్పుడు అన్ని సినిమాల్లో ఆ నటుని నటన  నన్ను అమితంగా ఆకర్షించినది.   ఆ నటున్ని గురించి తెలుసు   కోవాలనే ఉత్సాహం మొదలయింది , ఎందుకు ఈ నటుడే ప్రతి సినిమాలో , ప్రతి చిత్రం లో వైవిధ్య మైన  పాత్ర ద్వారా ముందు కోస్తున్నాడు, ఎందుకు కురుసోవా ఆ నటున్నే తీసుకోవాల్సి వచ్చింది  అనే కుతూహలమే  నన్ను ఈ రోజు వ్యాసం రాసేట్టు చేసింది .    నేను చేసిన ఒక చిన్న పరిశోధన వల్ల  ఆ  నటుని   గురించి తెలుసుకున్న  ఎన్నో అబ్బుర పడే విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను . ఇంతకీ ఆ నటుడు  ఎవరో కాదు , ఆయన పేరే “తొషిరో మైఫ్యూన్ ”  Toshiro Mifune.     అసలు ఆయన నటుడు కావాలనే అనుకోలేదు ,  ఎప్పుడూ ప్రయతించ లేదు కూడా  . ఆయన సినీ రంగ ప్రవేశమే చాల విచిత్రంగా జరిగింది.  ప్రస్తుత నటులు, కాబోయే నటులు తొషిరో మైఫ్యూన్  నటజీవితం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో వున్నాయి .

IMG_7797

అది సెప్టెంబరు 1945, రెండవ ప్రపంచ యుద్ధం తో బాంబుల దాడికి రక్త సిక్త మయిన జపాన్ గాయాలతో సత మవుతూంది . తొషిరో  మైఫ్యూన్ తల్లి దండ్రులు క్రిష్టియన్ ప్రచారకులు, చైనా కు సమీపంలో వుండే మంచూరియాలో వాళ్ళ  కుటుంబం స్తిర పడింది , అయితే తొషిరో  మైఫ్యూన్  జపాన్  జాతీయుడు కాబట్టి తప్పని సరిగా జపాన్ సైన్యం లో చేరాల్సొచ్చింది .   తండ్రి వద్ద నేర్చుకున్న ఫోటోగ్రఫి అనుభవంతో యుద్ధంలో విమానం నుండి ఫోటోలు తీసే వుద్యోగం .    అప్పుడు ఆయనకు సుమారుగా 25 సంవత్సరాల వయసు వుంటుంది ,  యుద్ధంలో  ఓడిపోయిన   వాయు దళం నుండి గెంటి వెయబడ్డాడు.      తల్లి తండ్రులు యుద్ధంలో మరణించారు .   ఎవరూ తెలిసిన వారు లేరు, తెలిసిన బందువులు ఎవరూ లేరు.  కొత్త  ప్రాంతం, తన స్వంత దేశం లోనే పరాయి వాడు అయ్యాడు. తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి ఎవరూ లేరు.  ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటి?
ఇదంతా వింటుంటే  ఒక సినిమా కథ లాగే వుంటుంది కదూ!  ఇలాంటి  కథల్లోని పాత్రలలో  వెండి తెరపై జీవించి , ప్రపంచం లోని ఎన్నో గొప్ప అవార్డులని తన చిత్రాల వైపుకి తిప్పుకున్న ఒక సామన్యుని  జీవితంలో జరిగిన యదార్థ గాధ .

ఇప్పుడు తన ముందుంది ఒకటే మార్గం .  తండ్రి ఫోటో స్టూడియోలో నేర్చుకొన్న కొద్ది పాటి ఫోటోగ్రఫి ,  అదీ టోక్యో మహా నగరంలో  అయితేనే  సాధ్యం అని నిర్ణయించుకుని , బాంబుల దాడిలో ధ్వంసం అయిన బూడిదగా మారిన భవంతులు, శ్మశానాన్ని తలపిస్తున్న , రక్త సిక్తమయిన నిర్మానుష్యమైన  వీధుల గుండా , తిండి లేక, నిద్ర లేక జేబులో చిల్లి గవ్వ లేకుండా ఎన్నో పగలు రాత్రులు, నడిచి నగరానికి చేరుకున్నాడు .  తనతో పాటు యుద్ధంలో పని చేసిన ఒక  మిత్రుడు కన పడితే ,సహాయం ఆర్జించి, ఆశయ్రం  పొంద గలిగాడు కానీ ఫోటోగ్రఫీ ఒక కల అని మాత్రమే అర్థమయ్యింది , ఎందుకంటే  అక్కడ ఫోటోలు తీయించుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు, బూడిద శవాలు, గుట్టలు తప్ప .   ఆ తర్వాత మరో వ్యక్తి ద్వారా, ఒక ఫిలిం స్టుడియోలో కెమెరా మెన్ కి సహాయకుడి వుద్యోగం వుందని తెలిసి ధరఖాస్తు చేసుకున్నాడు, కాని ఆ వుద్యోగం వస్తుందని ఏ మాత్రం నమ్మకం గాని, ఆశ గానీ లేదు.

అలా ఎన్నో ధరఖాస్తు లు, ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి,  కానీ అన్ని ధరఖాస్తు లు గోడకు కొట్టిన పిడికల్లా ఆటే అతుక్కు పోయాయి  కానీ  ఒక్క ధరఖాస్తు నుండి కూడా పిలుపు రాలేదు, ఆ తర్వాత సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత ఒక స్టూడియో నుండి ఉత్తరం వచ్చింది, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా  ఎంతో ఆశగా వెళ్ళాడు. కానీ అప్పటికే అక్కడ వంద లాది మంది వేచి చూస్తున్నారు . వారందరినీ చూడగానే వున్నా ఆశ కాస్త నీరు గారి పోయింది . పిలుపు కోసం వేచి చూడగా చూడగా లోపలి నుండి పిలుపు రానే వచ్చింది .   అక్కడ నల్గురు పెద్ద మనుషులు ఇంటర్వూ చేయడానికి సిద్దంగా వున్నారు .

గదిలోకి అడుగు పెట్టగానే   ఇంటర్వూ బోర్డు సభ్యుడొకడు  “నవ్వు” అన్నాడు .  నవ్వ డానికి  కాదు,  నేను  ఉద్యోగం కోసం వచ్చానని వారికీ అసహనంగా చెప్పాడు.  నీకు వుద్యోగం రావాలంటే నీవు నవ్వాల్సిందే ! కటువు గా అన్నాడు ఇంకొక ఇంటర్వూ మెంబరు .   వూరికే నవ్వు మంటే ఎలా నవ్వను?.. కొంచెం కోపంగా , ధైర్యంగానే చెప్పాడు .   ఇతనికి అర్థం అయ్యిందేమంటే , వాళ్ళు తనని మూర్ఖున్ని చేసి ఆడు కుంటున్నారు అని పించింది .  ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లకి అసహనంగా వుంది .  నవ్వు మంటే నవ్వడు , వారి సమయాన్ని వృధా చేస్తున్నాడనిపించి, అతని ధరఖాస్తుని  తిరిస్కరించారు. కాని ఈ తతంగాన్ని పక్కగది నుంచి    చూస్తున్న ఒక పెద్ద మనిషి తిరిగి పిలిపించాడు.   ఇప్పుడు తాగు బోతుగా నటించమన్నాడు . అప్పుడు  ఆయనకు చిర్రెత్తు కొచ్చింది , కోపం తారా స్తాయికి చేరింది .  ఇంకా వారు తనని మూర్ఖున్ని చేసి తనతో ఆడు కుంటున్నారనిపించింది .

IMG_7795

తను ఇక్కడికి నటుడవ్వాలని  రాలేదు,  కెమరా మెన్  వుద్యోగం  కోసం వచ్చానని చెపాడు .  అయినా  ఆ పెద్ద మనిషి వినకుండా తాగుబోతూ లా నటించాల్సిందే ,  అంటూ పక్క గదిలో వున్న ఇంకొక వ్యక్తిని పిలిచాడు. ఇంకే మార్గము లేదు , అక్కడి నుండి బయట పడాలంటే ఏదో త్రాగు బోతు లా చేయాల్సిందేనని నిర్ణ యించుకొని , అక్కడి కుర్చీలు విసురుతూ, ఉరిమి ఉరిమి చూస్తూ , పిచ్చి అరుపులతో కొంచెం సేపు గందర గోళం     సృష్టించాడు .   హమ్మయ్య , ఒక  భారం దిగింది  అని  కనీసం జడ్జీల  మొహం వైపు కూడా చూడకుండా వెనుతిరిగి  పోతున్న  ఆయనకు ఆ గది కరతాళ ధ్వనులతో మారు మ్రోగడంతో బయటకు పెట్టబోతున్న కాలు అక్కడే ఆగి పోయింది .    ” యు ఆర్  సెలెక్టెడ్ ”  అని భుజం పై  ఆ పెద్ద మనిషి చేయి పడింది . ఆశ్చర్య పడడం తొషిరో మైఫ్యూన్ వంతు అయ్యింది .
ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, యుద్ధం, యుద్ధ యోధుడు  ( సమురాయ్ ) నేపధ్యం లో నిర్మించబడ్డ ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన  ప్రముఖ డైరెక్టర్   కజిరో యమమోటో (Kajiro Yamamoto).  పక్క గదిలో వున్నఇంకొక వ్యక్తే – అకిరా కురుసోవా .  తొషిరో మైఫ్యూన్ లో దాగి ఉన్న నటన ప్రతిభని  గుర్తించిన ప్రముఖ డైరెక్టర్   కజిరో యమమోటో,     అకిరా కురో సోవా సినిమా కోసం  జరుగుతున్న  16 మందిలో ఒకరిగా తొషిరో   మైఫ్యూన్ ని  సెలెక్ట్    చేయడమే కాక ,  ఇంకొక ప్రముఖ డైరెక్టర్  “సెంకిచి తనిగుచ్చి”(Senkichi Taniguchi ) కి పరిచయం చేస్తే ” సెంకిచి తనిగుచ్చి” దర్శకత్వం వహించ బోతున్న ” సిన్ బాకా జిదాయి ( జెన్) ”   అనే చిత్రం లో ఒక ప్రాముఖ్యం  గల పాత్రని అప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది .   ఆ స్టూడియో నే ప్రపంచ  ప్రఖ్యాతిగాంచిన ఎన్నో చిత్రాలు నిర్మించ బడ్డ    “తోహో ” స్టూడియో .

ఇంతకీ జరిగిందేమంటే   నటీనటుల కోసం  జరుగుతున్న కమిటీకి , తొషిరో మైఫ్యూన్  కు తెలియ కుండా ఆయన ఫ్రెండ్   ధరఖాస్తు ని పంపాడు. కాని ఆ విషయం  తొషిరో మైఫ్యూన్  కి చెప్పలేదు . తొషిరో మైఫ్యూన్ కెమరా మెన్ వుద్యోగం కోసమని వచ్చాడు .   కురుసోవా సినిమా కోసం చూస్తున్న 16 నటుల కోసం జరిగిన పోటీల్లో వచ్చిన మొత్తం  4000 మందిలో  తొషిరో మైఫ్యూన్ ఒక నటుడిగా  సెలెక్ట్ కావడమే కాకుండా అప్పటికప్పుడు  కురుసొవా  తన తీయబోయే  ఇంకొక సినిమా లో  ప్రధాన పాత్రకి  ఎంపిక చేసుకున్నాడు .    ఎంపిక రోజునే మొత్తం మూడు పాత్రలు దక్కించుకున్న ఘనత కూడా  తొషిరో మైఫ్యూన్ కి దక్కింది.   కురుసొవా  సాధారణంగా ఈ నటున్ని పొగడడు  కానీ , మొదట గా , చివరగా పొగిడిన ఒకే ఒక నటుడు తొషిరో మైఫ్యూన్

అలా అనుకోకుండా  నటుడు అయిన  తొషిరో మైఫ్యూన్ నట ప్రస్థానం  అంచెలంచెలుగా ఎదుగుతూ  వచ్చింది . 1953 లో విడుదల అయిన “రోషోమన్” వెనిస్ ఫిలిం ఫెస్టివల్లో  ఉత్తమ చిత్రంగా ఎన్నికైనప్పుడు  ప్రపంచ  సినిమా ఒక్కసారి తొషిరో మైఫ్యూన్  యొక్క అద్భుత నటనని  గుర్తించింది .    ఒక యోధుడు  (సమురాయ్ ) అంటే ఏమిటో ఎలా  ఉండాలో కురోసోవా ప్రపంచానికి చాటి చెప్పాడు .  అంతటితో ఆగ కుండా, గోల్డెన్ లైన్ , విదేశీ క్యాటగిరీ లో ఆస్కార్ అవార్డు ని కూడా  ఈ సినిమా దక్కించుకుంది .
డ్రంకెన్ ఎంగెల్  (1948 ) కురుసోవా  మొట్ట మొదటి సారిగా  తొషిరో మైఫ్యూన్ ని ప్రముఖ నటుల మధ్య  హీరో గా నిలబెట్టి నపుడు , జపాన్ సినిమా ముక్కున వేలేసు కుంది .

బ్లాక్ బస్టర్ సినిమా  సెవెన్ సమురాయ్ (1954) లో ఒక యోధునిగా తనను తను ఊహించుకుంటూ ఎన్నో కలలు కనే ఒక యువకుడి పాత్రలో జీవించాడు  నవ్వించాడు తొషిరో మైఫ్యూన్ .  The Magnificent Seven లాంటి డైరెక్ట్ హాలీవుడ్ మూవీనే  కాక ఇంకా ఇన్నో హాలివుడ్ చిత్రాలకి సెవెన్ సమురాయ్ ప్రేరణ . అల్ టైం రికార్డ్ సాధించిన బాలీవుడ్ చిత్రం “షోలే ”  సెవెన్ సమురాయ్  చిత్రం యొక్క స్ఫూర్తి తోనే నిర్మించ బడింది.

సెవెన్ సమురాయ్ – రెండు  అకాడమీ అవార్డులకి నామినేట్  అవడమే కాకుండా, బ్రిటిష్ అకాడెమి ఫిలిం అవార్డుకి  (ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ నటుడు క్యాటగిరి లో    తొషిరో మైఫ్యూన్ , టకాషి షిమురా  నామినేట్ కాబడ్దారు .
” త్రోన్ అఫ్ బ్లడ్ ‘   1957  వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో కురుసోవ కి గోల్డెన్ లయన్ అవార్డు కి నామినేట్  కావడమే కాక , తొషిరో మైఫ్యూన్  కి ఉత్తమ నటుడిగా  మైనిచి ఫిలిం ఫెస్టివల్ మరియు  కినేమ జున్పో ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు లభించింది .
వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో సిల్వర్ లైన్ అవార్డు గెలుచు   కోవడమే కాకుండా , గోల్డెన్ లైన్  కి  నామినేట్ కాబడ్డది . ఇవే కాకుండా ఇంకా చాలా  అవార్డులని ఈ చిత్రం సొంతం చేసుకుంది

1958 లో “The Hidden Fortress”  తొషిరో మైఫ్యూన్   నటించిన ఈ సమూరాయ్ చిత్రం ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ప్రైజ్,  బెర్లిన్ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో “సిల్వర్ బేర్” ఫర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుని నోచుకుంది .

“The Bad Sleep Well” 1960 లో నిర్మించబడ్డ  ఈ చిత్రంతో కురుసోవా  నిర్మాతగా మారాడు .   షేక్స్పియర్ “హామ్లెట్ ” ను తల పించే ఈ చిత్రం  సమురాయ్ చిత్రాలకి భిన్నంగా , కార్పొరేట్ లలో జర్గుతున్న అవినీతి ఆధారంగా నిర్మించ బడింది .  ఇందులో కంపనీ ప్రెసిడెంట్ కి సెక్రెటరిగా  తొషిరో మైఫ్యూన్  నటించాడు.  11 వ బెర్లిన్  అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ  డైరెక్టర్   ‘గోల్డెన్ బెర్లిన్ బేర్ ” అవార్డు కి కురుసొవా నామినేట్  కాబడ్డాడు .  మాక్సిం గోర్కీ నవల ఆధారంగా కురుసొవా   స్వంతం ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించ బడ్డ చిత్రం  “ది లోయర్  డెప్త్స్ ” ప్రపంచ వ్యాప్తంగా  విమర్శల దృష్టిని ఆకర్షించింది.

“యోజింబో”  1961 లో వచ్చిన ఈ చిత్రంలో నటనకు   వెనిస్ ఫిలిం ఫెస్టివల్  తొషిరో మైఫ్యూన్  కి ఉత్తమ నటుడి అవార్డుని ప్రకటించింది .  కురుసోవా కి గోల్డెన్ లయన్ అవార్డుని తెచ్చి పెట్టింది . ఇక్కడ  ప్రస్తావిస్తున్న అవార్డులలో  చాలా వరకు   ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచినవే . ఇవే కాక ఇంకా జపాన్ లో చాల అవార్డులు చేసు కున్నారు కురుసోవా   మరియు తొషిరో మైఫ్యూన్ .
” రెడ్ బియర్డ్ ” 1965 కురుసోవా ,  తొషిరో మైఫ్యూన్ ల కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం ( 16వ ) .  ఈ చిత్రం కోసం  తొషిరో మైఫ్యూన్  ని గడ్డంపెంచు మని చెప్పడం , షూటింగ్ అనుకున్న దాని  కంటే ఎక్కువ సమయం పట్టడంవళ్ళ   సహజంగా పెంచిన గడ్డం తీయలేక, కొత్త సినిమా లను అంగీకరించ లేక    కల్గిన  ఆర్థిక  సమస్యల  ప్రభావం  ఆయన నటన పై కూడా  పడింది .  స్క్రిప్ట్ రైటర్  Hideo Oguni   రాసిన ఒక  పుస్తకంలో  , ఈ సినిమాలో  తొషిరో మైఫ్యూన్ నటన చాల తప్పుల తడక సాగింది  అన్న ఒక్క వ్యాఖ్య కురుసోవా ,  తొషిరో మైఫ్యూన్ ల మధ్య మనస్పర్ధలకు కారణం అవడమే కాకుండా సినిమాతో వున్న  వారిద్దరి అనుబంధానికి   శాశ్వతంగా తెర  పడింది .  ఆ తర్వాత వారిద్దరూ కలిసి  ఎప్పుడూనటించ లేదు .
కురొసొవా తోనే తొషిరో మైఫ్యూన్  కి ఖ్యాతి వచ్చింది అనే వాదనను త్రోసి పుచ్చుతూ ఆ తర్వాత  తొషిరో మైఫ్యూన్   కూడా నిర్మాత మారి తన స్వంత బ్యానర్లో  డజను చిత్రాల వరకూ నిర్మించాడు.   “సమురాయ్ రెబిలియన్” , అనే చిత్రం మసాకి కొబయాషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1967 లో ఉత్తమ జపాన్ చిత్రంగా ఎన్నికవ్వడమే కాక,   అంతర్జీతీయ మార్కెట్ లో మంచి పేరు, డబ్బు సంపాదించింది పెట్టింది .  వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ డైరెక్టర్ అవార్డు,  నినేమ జున్పో వార్డు ( బెస్ట్ డైరెక్టర్), బెస్ట్ ఫిలిం , బెస్ట్ స్క్రీన్ప్లే , మైనిచి ఫిలిం కాంకోర్స్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం  అవార్డు స్వంతం చేసుకుంది .

1979  లో వచ్చిన స్టీవెన్ స్పీల్ బర్గ్  హాలీవుడ్ చిత్రం “1941” లో నావికాదళంలో  సబ్ మెరైన్ లతో బాంబులు కురిపించే కెప్టెన్ పాత్రలో  అమెరికన్   ప్రేక్షకులని తన అధ్బుత నటనతో అబ్బురపరిచాడు .  ఆ తర్వాత, జేమ్స్ క్లావేన్స్ నిర్మించిన  “షోగన్”  చిత్రం  TV సీరియల్ “తోరినాగా” పాత్ర ద్వారా  అమెరికన్ ప్రేక్షక హృదయాల్లో చిర స్తాయిగా నిలిచి పోయాడు,  ఆ కాలంలో  అత్యదిక రేటింగు సంపాదించుకున్న సీరియల్  షోగన్.

తొషిరో మైఫ్యూన్ నటించిన 130 చిత్రాల్లో సగానికి పైగా  ‘ సమురాయ్  ‘ పాత్రల్లో జీవించి , తెలుగు సినిమాలో కృష్ణుడు , రాముడు  అంటే , మహా నటుడు ఎన్టీఆర్  గుర్తుకు  వచ్చినట్టు , ప్రపంచ  ప్రేక్షకులకు ఒక యోధుడు అంటే   తొషిరో మైఫ్యూన్ లాగ వుండాలి అని ఎందరి హ్రుదయాల్లోనో చెరగని ముద్ర వేసాడు .  ఇలా చెప్పుకుంటూ పోతే తను నటించిన  ప్రతిచిత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదే .  అన్నిట్లో హీరోనే కాకుండా , ప్రాముఖ్యత వున్న నెగటివ్ షెడ్స్  రోల్స్ లోనూ నటించి పేరు తెచ్చుకున్నాడు . మల్టీ స్టారర్ మూవీస్ లోనూ నటించాడు . కొన్ని సందర్భాల్లో ,  ప్రసిద్ధ తెలుగు నటుడు  ఎస్వీ రంగారావు గారిని  తలపించే  పౌరుషం, రౌద్రం , సున్నిత హాస్యం ఇలా  ఏ పాత్ర లోనయినా  ఇమిడి పోయే    లక్షణాలు  తొషిరో మైఫ్యూన్  లో చాల వున్నాయి .
అసలు “హీరో-హీరొయిన్ ”  అనే  పదాలు  మన తెలుగు సినీ పరిశ్రమ పెంచి పోషించిన ఒక  చెడు సంప్రదాయం , ఈ పదాలు ఏ ఇతర బాషలలో కూడా ఎక్కువ గా కనిపించవు .  హాలివుడ్ సినిమాల్లో కూడా ఈ పదాలు ఎప్పుడో కాని, వినిపించవు, కానీ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అని మాత్రమే వినిపిస్తుంది. కేవలం హీరొ  పాత్రలే కాకుండా  ఎలాంటి పాత్రనయినా నటించి మెప్పించిన వాడే నటుడు అంటాడు తొషిరో మైఫ్యూన్.  కురుసోవా  మరణానికి కొన్ని నెలల ముందు డిసెంబర్ 24, 1997న   , అల్జమైర్ వ్యాధితో   తుది  శ్వాశ  వదిలాడు తొషిరో మైఫ్యూన్.

సినీ రచయితలు  హీరో చుట్టూ కథలు అల్లకుండా , కథ కోసం  మంచి నటులని  ప్రోత్సహిస్తే , తెలుగులో మరిన్ని మంచి చిత్రాలు, మరింత మంది మంచి నటులు వచ్చే అవకాశం వుంది . తెలుగు సినీ పరిశ్రమ ,  ముఖ్యంగా హీరో కావాలనో, హీరోయిన్ కావాలనో  స్టూడియోల చుట్టూ  తిరుగుతున్న కొత్త నటులు తొషిరో మైఫ్యూన్  సినిమాల నుండి, ఆయన నటన నుండి  నేర్చుకోవాల్సింది చాలావుంది .

*

 

లెస్బియన్లు

 

కోకిల: సితారు వాద్యకారిణిమురళి: ఒక యువకుడు

మురళి:  నీగురించి ఒక విచిత్రమైన విషయం విన్నాను కోకిలా! సిరిపురం జమీందారిణి రాధాకృష్ణ దేవి నువ్వంటే పడిచస్తుందట. తను పురుషుడిలాగా నీతో… నాకెలా చెప్పాలో అర్ధం కావ ట్లేదు. నేను విన్నదాన్ని బట్టి మీరిద్దరూ స్త్రీ పురుషుల్లాగే….

కోకిల:     (సిగ్గుతో కూడిన మౌనం)

మురళి:  ఏంటి సంగతి? సిగ్గుపడుతున్నావు! అంటే నేను విన్నది నిజమేనా?

కోకిల:     నిజమే మురళీ. నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది. అదొక వింత….

మురళి:  నాకు చెప్పకపోతే ఒట్టే! ఆమెకి నీదగ్గర పొందేదేముంటుంది? మీరిద్దరూ పడక గదిలో ఏం చేస్తారు?

కోకిల:     (సిగ్గుతో కూడిన మౌనం)

మురళి:  ఐతే నీకు నామీద ప్రేమ లేనట్టే! నిజంగా ప్రేముంటే అలాంటి విషయాలు నాదగ్గర దాచవు.

కోకిల:     అలా అనకు. నీమీదున్నంత ప్రేమ నాకు మరెవ్వరిమీదా లేదు. ఐతే ఇదొక విచిత్రమైన విషయం. చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది. ఆమె కన్నీ మగలక్షణాలే!

మురళి:  అంటే నాకు తెలీకడుగుతాను, కొంతమంది ఆడవాళ్ళు పక్కలోకి మగతోడు నచ్చక ఆడ వాళ్ళ తోనే పడుకుంటారట. తమను తాము మగవారిగా భావించుకుంటారట.

కోకిల:     ఈమె కూడా దాదాపు అలాంటిదే!

మురళి:  (ఆసక్తిగా) ఐతే కోకిలా, నాకు ఈ విషయం గురించి పూర్తిగా చెప్పాలి. మొదటిసారి నిన్నెలా లొంగదీసుకుంది? ఆమె నీతో శృంగారం ఎలా జరిపింది? తర్వాతేం జరిగింది? మొత్తం నాకు వివరంగా చెప్పు.

కోకిల:     ఒకరోజు ఆవిడా నేనూ అనుకోకుండా సముద్ర తీరాన కలిశాం. ఆరోజు బాగా వేడిగా ఉక్కగా ఉంది. రాధాకృష్ణదేవి తన తలపై ఉన్న జుట్టు తీసేసింది. ఆవిడ విగ్గు పెట్టుకుంటుందని నాకు అప్పటివరకూ తెలియదు. ఆమె నున్నగా బోడిగుండు చేయించుకొని ఉంది. నాకా మెని అలా చూడటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అప్పుడామె, ‘ఇంత అందమైన కుర్రాణ్ణి ఎప్పుడైనా చూశావా కోకిలా?’ అని అడిగింది. ‘ఇక్కడ కుర్రాళ్ళెవరున్నారు?’ అని నేను అయోమయంగా అడిగాను. ‘చూడు, నేను మగవాడిలాగా కన్పించట్లేదూ నీకు? నా పేరు కృష్ణ, రాధ నాభార్య పేరు’ అంది. ఇదంతా నాకు తమాషాగా అనిపించింది. నేను నవ్వేశాను. అంతతో ఊరుకోకుండా, ‘అవునా కృష్ణ గారూ, మీరు మగవారయ్యుండి మా మధ్యలో ఆడ వేషంతో తిరుగుతున్నారా? మీక్కూడా మగవాళ్ళకుండే అవయవాలన్నీ ఉండి, మగవాళ్ళు వాళ్ళ స్త్రీలతో నడిపినట్టే మీరు కూడా రాధాదేవితో శృంగారం జరుపు తున్నారా?’ అని అడిగాను. ‘అచ్చం అలాగే కాదనుకో, కానీ అంతకంటే బాగా ఆనందిం చేలా జత కట్టడమెలాగో నీకు త్వరలో చూపిస్తాలే!’ అంది. ‘అట్లయితే మీకు స్త్రీ పురుష అంగాలు రెండూ ఉండి ఉండాలి.’ అన్నాను. ‘లేదు నేను పూర్తిగా మగవాడిలానే ఉంటాను.’ అంది. ‘మునిశాపంతో స్త్రీ పురుషుడిగా మారిన కథ ఒకటి విన్నాను. మీరు కూడా పొరపాటున అలా మారిపోలేదు కదా’ అన్నాను. ‘లేదు కోకిలా! నేను పుట్టినప్పుడు పూర్తిగా స్త్రీ శరీరంతోనే పుట్టాను. కానీ నాకు పురుషుల అభిరుచులు, కోరికలూ ఉన్నాయి.’ అంది. ‘మరి ఆకోరికలు మీకు తీరుతున్నాయా?’ అని నేను నవ్వుతూ అడిగాను. ‘నీకంత నమ్మకం లేకపోతే నాతో ఒకసారిరా, చూపిస్తాను. మగవాళ్ళను చూసి అసూయ పడాల్సిన పని నాకు లేదని నువ్వే ఒప్పుకుంటావు. మగవాడి సామర్ధ్యంతో సరితూగే దొకటి నాదగ్గర ఉంది. మాటలెందుకు, రా! నేను చేసేదేదో చేసింతర్వాత అంతా నీకే అర్ధమౌతుంది.’ అంది.

ఆమె ఎంతగా బ్రతిమాలిందంటే, తను కోరిన విధంగా నేను సహకరించాల్సివచ్చింది. అందుకోసం ఆమె నాకొక అద్భుతమైన వజ్రాల హారాన్నీ, ఒక మోపెడు ఖరీదైన బట్టల్నీ బహుమతిగా ఇచ్చింది. అప్పుడు నేనామెను పురుషుడిగానే భావిస్తూ కౌగిలిలోకి తీసు కున్నాను. ఆమె నాశరీరాన్ని ముద్దులతో ముంచెత్తింది. కోరికలు కలిగించిన ఉద్వేగంతో ఊపిరి బరువుగా తీస్తూ నాకు చెప్పిన విధంగానే తర్వాతి కార్యక్రమానికి ఉపక్రమించింది.

మురళి:  ఏం చేసింది? ఆవిడాపని ఎలా చెయ్యగలిగింది? కోకిలా! అదంతా వివరంగా చెప్పు!

కోకిల:     దయచేసి ఇంతకంటే ఎక్కువ వివరాలు అడగొద్దు. అవన్నీ సిగ్గు మాలిన పనులు. నువ్వెంత వత్తిడి చేసినా ఆ వివరాలు మాత్రం చెప్పను గాక చెప్పను.

*

ఆంధ్రా యూనివర్సిటీలో చదువులూ-సమ్మెలూ

వంగూరి చిట్టెన్ రాజు 

 

chitten rajuనేను పరాయి ఊరైన విశాఖ పట్నం లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేటప్పుడు నా సరికొత్త అనుభవం విద్యార్థుల సమ్మెలలో ప్రత్యక్షంగా పాల్గొనడం ఒకటి, యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో పాల్గొనడం మరొకటి. ఈ రెండూ నాకు అంతకు ముందు ఎన్నడూ అనుభవం లేని విషయాలే.

మొదటి సమ్మెకి కారణం ఒక సినిమా హాలులో జరిగిన సంఘటన. వైజాగ్ లో వీరభద్ర రావు అనే కాంట్రాక్టర్ తన భార్యతో అప్పటి పూర్ణా టాకీసు లో సినిమాకి వెళ్లాడు. వాళ్ళ సీటు వెనకాలే కూచున్న ఆంధ్రా యూనివర్సిటీ కుర్రాళ్ళు ఎప్పటి లాగానే ఏవేవో చిన్న చిన్న డైలాగులతో ఆవిడని ఏడిపించడంతో సరిపెట్టుకోకుండా ఓ కుర్రాడు చీకట్లో వెనకాల నుంచి ఆవిడ భుజం మీద చెయ్యి కూడా వేశాడు.  దాంతో అంత వరకూ ఓపికగా భరించిన డబ్బున్న ఆ మధ్య వయస్సు కాంట్రాక్టర్ కి బాగా కోపం వచ్చి, ఆ విద్యార్థిని బయటకి లాక్కొచ్చి చితక్కొట్టాడు. తీరా చూస్తే ఆ కుర్రాడు యూనివర్సిటీలో ఓ విద్యార్థి నాయకుడు. ఇంకే ముందీ. ఆ రాత్రికి రాత్రే అందరినీ పోగేసి ఆ మర్నాడు కాంట్రాక్టర్ దౌర్జన్యానికి నిరసనగా విద్యార్థులు సమ్మె ప్రకటించి, పెద్ద ఊరేగింపుతో ఆ కాంట్రాక్టర్ ఇంటి ముందు తిష్ట వేశారు. ఆయన చేత క్షమాపణ చెప్పించుకున్నారో లేదో తెలియదు కానీ అసలు ఏమిటో , ఎందుకో మాకు తెలియక పోయినా నా బోటి గాళ్ళని హాస్టల్ లో ఉండనివ్వ కుండా సమ్మెలో పాల్గొనేలా చేశారు. ఆ విధంగా నేను నా ప్రమేయమూ, ప్రయత్నమూ లేకుండానే విద్యార్థి సమ్మె లో ఒక సమిధని అయ్యాను.  అసలు సినిమా హాలులో జరిగిన విషయం తరువాత తెలిసింది.

ఇక రెండోది కేంపస్ లోనే దీపావళి సమయంలో జరిగిన ఉదంతం. కొంత మంది విద్యార్థులు ఎప్పటి లాగానే తారా జువ్వలకి నిప్పు అంటించి సద్ధర్మ సదనో మరోటో హాస్టల్ ఎదురుగుండా రోడ్డు మీద పోటీలు పడ్డారు. అందులో ఒక తారా జువ్వ ఎక్కడో పైన రెండో అంతస్తు నుండి తమాషా చూస్తున్న ఓ విద్యార్థి కేసి దూసుకు పోయి కంటి లో గుచ్చుకుంది. ఆ దారుణానికి భయ పడి పోయి అర్జంటుగా అతన్ని ఔట్ గేట్ దగ్గర ఉన్న క్లినిక్ కి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ మార్తాండ శాస్త్రి   అనే యూనివర్సిటీ డాక్టరు వెంటనే కన్ను ట్రీట్ చెయ్యడం మానేసి ఆ తారా జువ్వల పోటీ వాళ్ళని, ఆ చోద్యం ఎందుకు చూస్తున్నావు, బుద్ది లేదా, అనుభవించు అనీ అందరినీ తిట్టడం మొదలెట్టాడు.

ఇలాంటి ప్రవర్తన ఆయని కొత్త కాదుట. ఎవరైనా  విద్యార్థి ఏ కడుపు నొప్పి కో మందు కోసం వెడితే “నువ్వు వెధవ హోటల్లో దోశలు ఎందుకు తిన్నావూ?” “వెధవ అర్థ రాత్రి దాకా సినిమాలు ఎందుకు చూస్తావూ?” అనుకుంటూ రోగానికి మందు ఇవ్వకుండా  తిట్ల దండకం అందుకుంటాడు కాబట్టి ఆయన మీద అప్పటికే చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ సారి ఈ సీరియస్ కేసు కూడా పట్టించుకోక పోవడంతో సహా విద్యార్థులు అతన్ని వెంటనే కెజిహెచ్ హాస్పిటల్ కి హుటాహుటిన తీసుకెళ్ళారు. అతను హాస్పిటల్ లో ఉండగా ఇంచు మించు అప్పటికప్పుడే ఈ వార్త దావానలం లా పాకి పోయి తెల్లారే సరికల్లా మొత్తం యూనివర్సిటీ ఆ డాక్టర్ ని డిస్మిస్ చెయ్యాలని పెద్ద సమ్మె మొదలు పెట్టారు. అందులో నేను కూడా ఊరంతా తిరిగాను. అధికారులు విధి లేక ఆ డాక్టర్ ని డిస్మిస్ చేశారు. పాపం ఆ విద్యార్థికి ఒక కన్ను తీసేసి గాజు కన్ను పెట్టవలసి వచ్చింది.

ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ విద్యార్థి ఎవరో అప్పుడు నాకు తెలియదు కానీ 1975 లో హ్యూస్టన్ లో ఉన్న పది మంది తెలుగు వాళ్ళం “రావు” గారు అనే ఒకాయన ఇంట్లో కలుసుకుని కబుర్లు  చెప్పుకుంటూ ఉంటే ఎందుకో మాటల సందర్భంలో అంధ్రా యునివర్సిటీ ప్రసక్తి వచ్చింది. ఆ నాటి డాక్టర్ మార్తాండ శాస్త్రి గారి దగ్గర బంధువు ఒకాయన ఆ పార్టీ లో ఉన్నారు. అప్పుడు దీపావళి నాటి ఆ సంఘటనా, మా సమ్మె విషయాలూ నేను పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఎంతో మిత భాషి అయిన రావు గారు మెల్లగా ఆ నాడు తారాజువ్వ ధాటికి కంట్లో దెబ్బ తిని ఆ సమ్మెకి కారకుడైన విద్యార్థి తనే అని  వెల్లడించిన జ్ఞాపకం. కానీ వివరాలు అడగడానికి భయం వేసి, నేను మళ్ళీ ఆ టాపిక్ ఎప్పుడూ మాట్లాడ లేదు. అందు చేత అది ఏమాత వరకూ నిజమో నిజంగా నాకు ఇప్పటికీ తెలియదు.

ఈ రావు గారు మటుకు ఆంధ్రా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని, అమెరికా వచ్చినట్టు ఖచ్చితంగా తెలుసు. ఆయన అప్పుడు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద కంప్యూటర్ కంపెనీ అయిన ఒక మామూలు సైంటిస్ట్ గా చేరి, తొలి కంప్యూటర్ మెమొరీ చిప్స్ (8 K సైజు నుంచి 18 K సైజుకి) ఎక్కువ సైజు తయారు చేసే పద్ధతి కనిపెట్టి,  వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆ సందర్భంగా అప్పుడే మొదలు పెట్టిన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి తరఫున ఆయనకి ఒక అభినందన సభ ఏర్పాటు చేశాం. ఈ రోజుల్లో ఏదో రాజకీయ కారణం ఉంటే తప్ప అటువంటి నిజమైన గుర్తింపులు అసాధ్యం. ఆ దంపతులు హ్యూస్టన్ లో ఉండే రోజులలో వారి కుటుంబం చాలా ఆత్మీయమైన మిత్రులు.

Slide Rule

ఇంజనీరింగ్ కాలేజీలో చేరగానే నా జీవితంలో అంతర్భాగం అయిపోయినవి స్లైడ్ రూల్ & టీ స్క్వేర్.  డాక్టర్లకి మెడలో స్టెత స్కోప్ లా ఈ రెండూ ప్రతీ ఇంజనీరింగ్ విద్యార్థి భుజాల మీద వేళ్ళాడుతూ ఉండవలసినదే! ఈ రోజుల్లో వాళ్ళు చూసి ఉండని ఆ రెండిటి బొమ్మలూ ఇక్కడ జత పరుస్తున్నాను. ఇందులో స్లైడ్ రూల్ అనేది ప్రపంచవ్యాప్తంగానే అందరూ వాడే అత్యద్భుతమైన, అత్యవసరమైన “లెక్కలు చేసే పరికరం”. లెక్కలు అంటే మామూలు కూడికలూ, తీసివేతలే కాదు, ఎంతో క్లిష్టమైన ఈక్వేషన్స్, కేలుక్యులస్, లాగరిథమ్స్, అల్గారిథమ్స్, ఆల్జీబ్రా, ట్రిగానామెట్రీ, స్క్వేర్ రూట్స్, ఎక్ష్పోనెన్శియల్స్, ఒకటేమిటి, అన్నీనూ. 1620 ప్రాంతాలలో జాన్ లేపియర్ అనే ఆయన కనిపెట్టిన “లాగరిథమ్స్” అనే లెక్కల ప్రక్రియ ఆధారంగా కనిపెట్టబడిన ఈ స్లైడ్ రూల్ అంచెలంచెలుగా ఎదుగుతూ, అన్ని శతాబ్దాలగా శాస్తీయ పురోగతికి మూల కారణంగా నిలబడింది. అంతెందుకు 1969 లో ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లు చంద్రుడి మీద కాలు పెట్టడానికి క్షణాల ముందు కంప్యూటర్ ని నమ్మడం ఇష్టం లేక ఆఖరి క్షణాలలో చెయ్య వలసిన లెక్కలు ఈ స్లైడ్ రూల్ మీదే చేశారు.

కానీ క్రమక్రమంగా ఎలెక్ట్రానిక్ కేలుక్యులేటర్లు తయారు అయి, 1965 లో HP-9100 తో మొదలు పెట్టి, హ్యూస్టన్ లోని  Texas Instruments  అనే కంపెనీ వారు 1976 లో తక్కువ ఖర్చుకి TI-30 అనే పాకెట్ సైజ్ సైంటిఫిక్ కేలుక్యులేటర్ ప్రవేశపెట్ట గానే ఈ స్లైడ్ రూల్ శకం అంతరించి పోయింది. అప్పటికి రెండేళ్ళ క్రితం నేను ఆప్యాయంగా అమెరికా తెచ్చుకున్న ఆ స్లైడ్ రూల్ ఎక్కడో మా అటక మీదో, మా తమ్ముడి దగ్గరో దాక్కుని ఉంటుంది.  అన్నట్టు  పైన చెప్పిన రావు గారు ఘన విజయాలు సాధించినది ఈ Texas Instruments కంపెనీ లోనే. అలాగే నా ఆప్త మిత్రుడు స్వర్గీయ అనిల్ కుమార్ కూడా ఆ కంపెనీ లోనే సుమారు పదేళ్ళు పని చేశాడు. కాలక్రమేణా కంప్యూటర్ టెక్నాలజీ అత్యంత వేగవంతమైన అభివృద్ది కారణం గా ఆ కంపెనీ వెనకబడి పోయి ఇప్పుడు అది నామ మాత్రం గానే మిగిలింది. ఇక ఆ టీ స్క్వేర్ ప్రధాన “ఆయుధంగా”, రక రకాల ఇతర ప్లాస్టిక్ పరికరాల తో బిల్డింగ్ డ్రాయింగ్, మెషీన్ డ్రాయింగ్ మొదలైన సబ్జెక్టుల లో బొమ్మలు గీసే వాళ్ళం. అది మటుకు నేను అమెరికా తీసుకు రాలేదు.

ఇక చదువు విషయానికి వస్తే చెప్పుకో దగ్గ విశేషాలు అంతగా లేవు కానీ ఒక్క సంగతి బాగా గుర్తుంది. ఓ సారి ఇంటెగ్రల్ కేలుక్యులస్ అనే చాలా కష్టమైన లెక్కల సబ్జెక్ట్ పరీక్షకి బాగానే చదివాను కానీ, మా 5వ బ్లాక్ హాస్టల్ నుంచి పరీక్ష హాల్ కి నడుస్తూ వెళ్ళే అర గంట లోనూ అంత వరకూ చదవడానికి టైము లేని వన్నీ నడుస్తూనే బట్టీ పట్టేశాను. తీరా పరీక్షలో నేను అంతకు ముందు పది రోజులు చదివినవేవీ లేవు సరి కదా, ఆ ఆఖరి అర గంటలో చదివి బట్టీ పట్టేసినవన్నీ ఉన్నాయి. ఇకనేం. టక టకా రాసేసి గట్టెక్క గలిగాను. లేక పొతే ఖచ్చితంగా ఆ రోజు సున్నా మార్కులు వచ్చేవి.

ఇక ఆ ఏడాదీ సినిమాలు బాగానే చూసే వాళ్ళం. సమస్య అల్లా సాయంత్రం ఎనిమిది దాటాక నెంబర్ టెన్ బస్సు ఉండేది కాదు. యూనివర్సిటీ కి వెళ్ళడానికి అదొక్కటే బస్సు.  ఆటోలు ఇంకా ఇండియాలో మార్కెట్ లో లేవు. రిక్షా వాళ్ళు “అప్పు నాగ నేం బాబూ” అని యూనివర్సిటీకి రిక్షా కట్టే వారు కాదు. అంచేత మేము హాయిగా సినిమా చూసి, ఏ “చడగాస్” లోనో, ఎల్లమ్మ తోట దగ్గర వసంత విహార్ లోనో భోజనం చేసేసి, గవర్నర్ బంగాళా మీదుగా రెండు గంటలు కొండెక్కి యూనివర్సిటీకి నడిచి వెళ్ళిపోయే వాళ్ళం.  నేను వైజాగ్ లో ఉన్నన్నాళ్ళూ  అక్కడికి దగ్గర అనకాపల్లి శివారు లో ఉన్న కశింకోట లో ఉండే మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన, శంకరం బాబయ్య లని రెండు , మూడు నెలలకోసారో,  పండగలకో వెళ్తూ ఉండే వాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో వైజాగ్ నుంచి కాకినాడ చాలా దూర ప్రయాణం బాబూ అనుకునే వాళ్ళం. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది. అలాగే మా బాబయ్య కూడా ఒకటి రెండు సార్లు మా హాస్టల్ కి వచ్చి నా బాగోగులు  చూసి మా నాన్న గారికి ఉత్తరం రాసే వాడు.

ఆంధ్రా యూనివర్సిటీ లో నా మొదటి సంవత్సరం ప్రిన్సిపాల్ దేవగుప్తాపు సీతాపతి రావు గారు.   ఆయన టంగుటూరి సూర్య కుమారికి దగ్గర బంధువు, మద్రాసు లో మా చిన్నన్నయ్యకి బాగా తెలిసిన వారే అవడంతో  ఎక్కువ ఇబ్బంది లేకుండానే విశాఖపట్నం నుంచి కాకినాడ కాలేజ్ కి టాన్స్ ఫర్ చేయించుకున్నాను. దాంతో ఆంద్రా యూనివర్సిటీ కేంపస్ లో నా చదువు పూర్తి అయింది. ఓ ఏడాది హాస్టల్ చదువు తరువాత మళ్ళీ ఇంట్లో అమ్మా, నాన్న ల దగ్గరే ఉండి చదువు కొనసాగించే అవకాశం వచ్చింది. ఒక సారి స్వతంత్రంగా బతకడానికి అలవాటుపడ్డాక, మళ్ళీ ఇంటికెళ్ళి చదువుకోడానికి నేను అభ్యంతరం చెప్పకపోవడం  చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది…ఇప్పుడు తలుచుకుంటే..నాక్కూడా ఆశ్చర్యం గానే ఉంది!

కాకినాడ లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసే నాలుగేళ్ల ప్రహసనం…మరో సారి.

*

 

 

పునాది రాళ్ల ప్రార్థన

కర్లపాలెం హనుమంతరావు

 

karlapalemక్రీ. శ. 3015

హాట్ జూపిటర్నుంచి అరగంట కిందట బైలుదేరిన సూపర్ సానిక్ రాంజెట్ గోయిండా‘(గోవిందాకి.. గో ఇండియాకి సరిసమానమైన పదం) భూ కక్ష్యలోకి ప్రవేశించి అదేపనిగా గిరిటీలు కొడుతోంది. చిన్నపిల్లలు ఆడుకొనే టాయ్ ఏరోప్లేన్ రీమోట్ కంట్రోలురుతో తిరుగుతున్నట్లంది ఆ దృశ్యం.

గోయిండానుంచి చూస్తుంటే భూమండలం మొత్తం ఒక మండే పెద్దబంతిలాగా ఉంది.

స్పేస్ సెంటర్నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాంజెట్ లోని యువశాస్త్రవేత్తలిద్దరూ మాస్కులని మరోసారి సర్దుకొని స్క్రామ్ జెట్ సాయంతో సూటిగా భూమివైపుకు దూసుకు రావడం మొదలుపెట్టారు.

పొట్టిగా,  బూడిదగుమ్మడికాయంత బొద్దుగా  రేలంగిలాగా ఉన్నవాడిపేరు మొగానో. పొడుగ్గా,  పొట్లకాయంత సన్నగా రమణారెడ్డిలాగా ఉన్నవాడిపేరు  తనాకో. వాళ్ళిద్దరు ఇంటర్ యూనివర్సల్ స్పేస్ యూనివర్శిటీలో రీసెర్చి స్టూడెంట్లు.

స్క్రాంజెట్ ని రాంజెట్ ని రీమోట్ ద్వారా కంట్రోలుచేస్తూ హాట్ జూపిటర్ స్పేస్  సెంటర్లో కూర్చొని ఆపరేష్ డిస్కవర్ ఇండియా సూపర్వైజ్ చేస్తున్నాయన పేరు కబిల్. అతగాడు ఆ ప్రాజెక్టుకి గైడు కూడా. సినిమాల్లో ప్రకాష్ రాజ్ లాగా ఉంటాడు.

కబిల్ ముత్తాతలు కొన్నివేల ఏళ్లకిందట భూమ్మీద నివసించినవారు. ఐదువందల ఏళ్లకిందట భూమ్మీద జనాభా పట్టనంతగా ఎక్కువైపోయి వనరులు హరించుకుపోయి జీవనం మనుగడకే ముప్పు ముంచుకొచ్చినవేళ  గగనాంతర రోదసిలోని వేరే గ్రహాలకి  వలసపోయింది మెజారిటీ మానవజాతి. కబిల్ ముత్తాతలు సూర్యకుటుంబంలోని గురుగ్రహానికి చెందినవారే!

ప్రకృతి వికృతిగామారిన దారుణ దుష్పరిణామాల కారణంగా మిగిలిన జీవజాతులన్నీ క్రమక్రమంగా నశించిపోయాయి. ప్రస్తుతం భూమి ఒక మరుభూమిని తలపిస్తోంది.  అడవులు అదృశ్యమయ్యాయి. నీరు పాతాళంలోకి ఇంకిపోయింది. ఆక్సిజన్ కరువై  పూర్తిగా బొగ్గుపులుసు వాయువుతో నిండిపోయిన భూమ్మీదకు మొగానో, తనాకో ఎందుకొస్తున్నట్లు?!

తమ సౌరవ్యవస్థను బోలిన మరెన్నో గ్రహకుటుంబాలను వెదికి పట్టుకొని, పరిశోధించి దీసిస్ సమర్పించడం ఆపరేషన్ డిస్కరీ ఇండియాలక్ష్యం. ప్రాజెక్టులో భాగంగా కబిల్ గైడెన్సులో  రోదసీలో ప్రయాణిస్తూ ఇప్పటికే ఎన్నో పాలపుంతలను, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించారు. గెలాక్సీలనన్నింటినీ గాలించేసె చివరి అంచెగా భూమ్మీదకు దిగుతున్నారు ఇప్పుడు.

భూతలంమీద వాతావరణంమాత్రం భయానకంగా ఉంది. సెగలు కక్కే వడగాలులు ఎడాపెడా కొడుతున్నాయి. కనుచూపుమేరంతా సహారానుమించిన ఎడారి దిబ్బలే!

ఓజోన్ పొర చిరిగిపోయి సూర్యరశ్మి భూతలాన్ని నేరుగా జీవజాతులన్నీ ఏనాడో నశించాయి.

ఇంత జీర్ణావస్థలో ఉన్న భూమ్మీదకు బాసు ఎందుకు దిగమంటున్నాడు యువశాస్త్రవేత్తలిద్దరికీ అంతుబట్టడంలేదు.

స్క్రామ్ జెట్ నేలమీదకు లాండయిన తరువాత విద్యార్థులిద్దరికీ గైడ్ కబిల్ కమాండ్స్ స్పేస్  విండోనుండి వినబడుతున్నాయి.

కంగ్రాట్ స్! వేలాది ఏళ్లకిందట రోదసీమండలం మొత్తంలో మహానాగరికతలు వెల్లివిరిసిన ప్ణ్యభూమిమీదకు మీరు ఇప్పుడు అడుగు పెట్టారు. కబిల్ హృదయంలో మాతృగ్రహంమీద భక్తి ఎంతలా పొంగిపొర్లుతున్నదో అతని గొంతులోని ఉద్వేగాన్నిబట్టే శిష్యులిద్దరికీ అర్థమయింది.

2015-07-18 13.27.12

కబిల్ గొంతు గంభీరంగా వినపడుతోంది. ఆ రోజుల్లో అమెరికా అగ్రరాజ్యంగా ఉండేది. అన్ని రంగాల్లో అదే ముందుండేది. తమ దర్పానికి దర్పణంగా వాళ్ళు నిర్మించుకొన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీని  ఫొటో తీయండి!

కెమారాని బాస్ చెప్పిన వైపుకి ఫోకస్ చేసి చూసాడు తనాకో. అక్కడ మట్టిదిబ్బలు తప్ప ఏవీ కనిపించలేదు!

అల్ ఖైదా వాళ్ళు ఆ అమెరికానెప్పుడో కైమాకింద కొట్టి పారేసారు. దాని నామరూపాలుకూడా మీకిప్పుడు కనిపించవుఅన్నారెవరో! ఆ గొంతు వినిపించినవైపు చూస్తే అక్కడెవరూ కనిపించలేదు! అదే విషయం తిరిగి బాసుకి చేరవేసారు శిష్యబృందం.

పోనీ సోవియట్ సోషలిస్తు రిపబ్లిక్ పేరుతో ఒకవెలుగు వెలిగి చివరకు  రష్యాలాగా మిగిలిపోయిన దేశాలగుంపువైపుకి మీ కెమేరా తిప్పండి! అట్టడుగు మానవుడి స్వేచ్చా స్వాతంత్ర్యాలకి నిర్మాణరూపం రెడ్ స్క్వేర్. షూటిట్!కబిల్ గాట్టి కమాండ్!

కెమేరా పొజిషన్ మారింది. అదే దృశ్యం! మటిదిబ్బలే మట్టిదిబ్బలు! ‘వాళ్ల ప్రభుత్వాలను వాళ్లే కూల్చుకొన్నారు. ముక్కలు చెక్కలయినా చివరికీ ఒక ముక్కా మిగల్లేదు! అంది ఇందాకటి గొంతే, శాల్తీ మాత్రం యథాప్రకారం కనిపించలేదు.

శిష్యులద్వారా సమాచారం విన్న కబిల్ అన్నాడీసారి లండబ్ టెన్ డౌన్ లో ఉద్దండ పిండాలుండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ల పాలనలో ప్రపంచం మొత్తంలో సూర్యుడు అస్తమించేందుకు అంగుళం  చోటైనా ఉండేది కాదంటారు. ఆ మహాసామ్రాజ్యపు మహారాజులు, రాణులు నివాసమున్న వీధిని మీ కెమేరాల్లో బంధించండి!

తనాకో కెమేరా అటు తిరక్కముందే అందుకొంది ఇందాకటి గొంతు నో యూజ్! ఆ సూర్యుడస్తమించని మహాసామ్రాజ్యం తరువత్తరువాత అమెరికా సింహానికి తోకమాదిరిగా తయారైంది. అల్ ఖైదా దెబ్బకీ  అమెరికాతో పాటే మాడి మసయింది!

ఓన్లీ వాయిస్ ఓవర్! నో పర్సన్ ఎట్ సైట్!

నుదుట దిద్దుకొనేటంత చిన్నదైనా అమెరికాన సైతం గడగడలాడించిన దేశం  జపాను. వారి నాగరికత చాలా ప్రాచీనమైనది. అయినా నాటి మానవుడు సాంకేతికంగా ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకొన్నాడో జపానువారిని చూసి తెలుసుకోవచ్చు. వాళ్ల విసనకర్ర ఈక కనబడినా చాలు ఒక్క స్నాపు తీసుకోండి!అన్నాడు కబిల్ నిరాశను గొంతులో కనిపించనీయకుండా!

అణుధార్మిక విధ్వసంతో దానికదే బూడిదయింది!’ అంది ఆకాశవాణి ముక్తుసరిగా ఒక్క ముక్కలో.

ప్రపంచానికి ఫ్యాషన్ ఎలాఉంటుందో నేర్పించిన ఫ్రాన్స్!కబిల్ గొంతు.

ఎయిడ్స్ మహమ్మారి ఎప్పుడో ఆ శృంగారదేశాన్ని కబళించేసిందిఆకాశవాణి గొంతు.

క్యూబా..కబిల్ గొంతులో వణుకు.

ప్లేగు వ్యాధికి ఫినిష్అశరీరవాణి తాపీగొంతు. 

ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్.. కజికస్తాన్.. కబిల్ దేశాలపేర్లు గడగడా చదువుకుపోతున్నాడు.

అవన్నీ తాలిబాన్లకి స్థావరాలుగా మారిన తరువాత చరిత్రలో స్థానంలేకుండా పోయాయి. ఆఫ్రికా అడవుల్ని  కార్చిచ్చు,ఆస్ట్రేలియా ఖండాన్ని ఎల్లో ఫీవరు.. ఒక్కముక్కలో మీకు అర్థమయేటట్లు చెప్పాలంటే తుఫాన్లూ, భూకంపాలూ,సునామీలూ, కరువులూ, వరదలూ, యుద్ధాలూ, రోగాలూ.. అన్నీ అన్నింటినీ నామరూపాల్లేకుండా సర్వనాశం చేసేసాయి. అడుగూ బొడుగూ ఏమన్నా మిగిలున్నా రాజకీయాలు వాటిని నాకేసాయి. చివరికి మిగిలింది ..ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారే.. ఈ మట్టిదిబ్బలే!అశరీరవాణి ఆపకుండాచేసే ఆ అనవసర ప్రసంగానికి యువశాస్త్రవేత్తలిద్దరికి  తెగ వళ్ళు మండిపోయింది.

గురువుగారికి ఇష్టమైనదేమన్నా పట్టుకుపోదామనుకుంటే మధ్యలో వీడెవడు? పిలవా పెట్టాకుండా కల్పించుకొని  ఏదడిగినా బూడిదయింది.. మసయింది.. మన్నుకొట్టుకుపోయింది.. నాశనమయింది.. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది.. మురిగిపోయింది.. మునిగిపోయిందిఅంటూ అపశకునాలు తప్ప వల్లించడం లేదు! రెండు వాయిద్దామంటే వాయిస్సేగాని శాల్తీ ఎదురుగా కనిపించి చావడంలేదు!

తమకు డాక్టరేట్ రాకుండా తోటి విద్యార్థులు చేస్తున్న కుట్ర కాదుగదా ఇది!

కడుపులోని మంటను కడుపులోనే ఉంచుకొంటే ఏం ప్రయోజనం?  కనబడ్డా కనబడకపోయినా ముందు కడిగిపారేస్తే సరి!

ఇందాకట్నుంచీ చూస్తున్నాం. ఏది చూద్దామన్నా లేదు పొమ్మంటావు! ప్రకృతిభీభత్సానికి సర్వం బూదిద అయిపోతే తమరెలా మిగిలున్నారు  మహాశయా?’ తనాకో ఇక తమాయించుకోలేక పెద్దగొంతుతో అరిచాడు

ఇంతకీ నువ్వెవరివి? మొనగాడివైతే మా ముందుకురా! సవాలు విసిరాడు మొగానో తన వంతు వంతగా.

బిగ్గరగా నవ్వు వినిపించింది. ఆ నవ్వుకు భూమి కంపించింది. మీరు నిలబడ్డ చోటులోనే భూమి అడుగున ఉన్నాను. పిల్లల్లారా!

మొగానో గబగబా గొయ్యితీయడం మొదలు పెట్టాడు. రెండు అడుగులుకూడా తవ్వకుండానే బైటపడిందా గొంతు తాలూకు  వింత ఆకారం.

నిట్టనిలువుగా ఉంది. ధగధగా మెరిసిపోతోంది. వంటిమీదంతా ఏవో గాట్లు.. పైనుంచీ కిందదాకా!

ఇలాంటి ఆకారాన్ని ఆ గ్రహాంతరవాసులు రోదసీమండలంలో ఇంతవరకు ఎక్కడా చూసింది లేదు. ప్రళయమొచ్చి భూమ్మీదున్న సర్వజీవజాలం దుంపనాశనమయినా.. చెక్కు చెదరకుండా.. నిట్టనిలువుగా.. తాజాగా.. తళతళలాడుతూ కనిపిస్తున్న ఆ ఆకారాన్ని చూడంగానే .. నిజం చెప్పద్దూ.. యువశాస్త్రవేత్తలిద్దరికీ ఒకింత గౌరవంకూడా కలిగింది. సాధ్యమైనంత వినయంగా  మనసులోని మాటను బైటపెట్టాడు తనాకో ఇంతకీ తమరెవరో సెలవిచ్చారు కారు సార్?’

ఆ ఆకారం చెప్పటం మొదలు పెట్టింది. పునాదిరాయి అంటారు నన్ను. వేల ఏళ్లకిందట ఇక్కడ ప్రజాస్వామ్యమనే పాలనావిధానం  ఒకటి వర్ధిల్లింది. ప్రజలే రాజులు. ప్రజలకొరకు, ప్రజలవలన, ప్రజలచేత నడిచే పరిపాలన అది. మరీ లోతుగా వెళ్ళొద్దు! మీరొచ్చిన పని మర్చిపోయి తరిగి వెళ్లడానికి తిప్పలు పడతారు. అంత తికమకగా ఉంటుందా రాజకీయ వ్యవహారం! ప్రజాస్వామ్యమంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులు.   వాళ్ళు పాలించే ప్రజలు. ఈ మాత్రం అర్థం చేసుకోండి! ప్రస్తుతానికి  చాలు.!

ఇహ నేనెవరో చెబుతాను. వినండి! ఎన్నికల్లో నిలబడి గెలవడానికి నాయకులు ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ప్రాజెక్టులు కట్టిస్తామని, పాఠశాలలు పెట్టిస్తామని, ఫ్యాక్టరీలు నిర్మిస్తామని.. వగైరా.. వగైరా! వాళ్ళు వాగ్దానాలు చేసినంతమాత్రాన జనం నమ్మాలని ఏముంది? నమ్మనివాళ్లని నమ్మించడానికి నాయకులు ఇదిగో.. ఇవాళే.. ఇక్కడే.. మీకు భవిష్యత్తులో కట్టబోయే  భారీ నిర్మాణానికి నాందీగా.. పునాదిలో ఓ రాయి వేసేస్తున్నాం!” అంటూ బ్రహ్మాండంగా  ఊరేగింపూ..  గట్రాచేసి  ఆర్భాటంగా మమ్మల్ని పాతేస్తారన్నమాట. మమ్మల్ని చూసి నమ్మి జనం ఓట్లేస్తే.. గెలిచేసి..గద్దెనెక్కి..  వాళ్ళు చేయాలనుకొన్న పనులన్నీ మళ్లీ ఎన్నికలొచ్చేసే లోపల సుబ్బరంగా చేసేసుకొంటారన్నమాట.

ఒక్క నిమిషం పునాదిరాయీ! చిన్నసందేహం! మరి వాగ్దానం చేసినట్లు నాయకులు ఎన్నికలు పూర్తయిన తరువాత నిర్మాణాలన్నీ చేసేస్తారుకదా! అయినా మీరింకా ఈ గోతుల్లో శిలావిగ్రహాల్లా పడి అల్లాడుతున్నారేంది?!’

పకపకా నవ్వింది పునాదిరాయి. మరదే ప్రజాస్వామ్యమంటే! సరే! ఇందాకట్నుంచీ ఏదీ కనిపించడంలేదని తెగ అల్లాడుతున్నారుగా! అమెరికా, రష్యా, చైనా, జపానంటూ ఎన్నడో అంతరించిపోయిన దేశాలను గురించి దేవులాడుకొంటున్నారుగా! వృథాగా వాటికోసం సమయం పాడుచేసుకోకుండా.. నన్నూ నా సోదరులనూ ఫోటో తీసుకుపోండి! అంతదూరంనుంచి వచ్చినందుకు ఆ మాత్రమైనా దక్కిందని సంతోషించండి!

నువ్వేగాక నీకు సోదరులుకూడా ఉన్నారా ఇంకా?! వాళ్ళూ నీకులాగే సజీవంగానే ఉన్నారా?!’ నోరెళ్లబెట్టడం తనాకో వంతయింది.

ఎందుకు లేరబ్బాయ్? వందలొందలు! మీ కెమేరాల మెమరీ కార్డు చాలదు! ఆన్ చేసుకోండి! వరసగా పరిచయం చేస్తాను. ఫ్లాష్ వేసుకోండి! అదిగో అది బ్రాహ్మణి సిమెంటు ఫ్యాక్టరీ పునాదిరాయి. ఇప్పుడు రద్దయిపోయిందనుకోండి!  పోలవరం అనే భారీ నీటిప్రాజెక్టుకి వేసిన పునాదిరాయి! అదిగో ఆ మూల ఉన్నది! ఇదిగో.. ఇవాళో.. రేపో.. అంటో యుగాలబట్టీ కథ నడుపుతున్నారు! ఇది  హంద్రీ నీవా సుజల స్రవంతి పునాదిరాయి. ఇది సిద్దిపేట స్పోర్ట్ స్ స్టేడియం పునాది రాయి. రెండు తెలుగురాష్ట్రాలు కలసి ఉన్నప్పుడు వేసిన పునాది రాళ్లిలాగా ఇంకా చాలా ఉన్నాయి.  అదిగో ఆ మూల వున్నదే .. అది హైదరాబాదనే అప్పటి తెలుగురాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ సమస్యల నివారణకని ప్రారంభించిన మెట్రోరైలు ప్రాజెక్టు పునాదిరాయి. స్థలంమారి ఆ ప్రాజెక్టు ఇప్పుడు మరో దిశలో సాగుతున్నది. అయినా దీనికి ముక్తి కల్పించే దిక్కు కనిపించడం లేదు.  ఇది బడాయిగడ్డా లోకాజ్ వంతెన తాలూకు పునాదిరాయి. ఇదిగో..  ఇది పుణ్యవరంలో వంతెన  నిర్మాణానికని వేసిన రాయి. ఇది పటాన్ చెరువులో వెయ్యి పడకల ఆసుపత్రికని అప్పటి ముఖ్యమంత్రి వేసిన శిలాఫలకం! ఇలా మీరు ఎక్కడ చూసినా చక్కని పునాదిరాళ్ళు అనాదిగా అనాథల్లా పడివుండటాన్ని గమనించవచ్చు!  ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రగతి లేదు. మా గతి మారలేదు, మా ఫొటోలు తీసుకొని మామీదగాని మీరు థీసిస్ సమర్పిస్తే  పట్టా గ్యారంటీ! ఆ విధంగానైనా మేము ఉపయోగపడ్డామని సంతోషిస్తాం.పునాదిరాయి నిట్టూర్పు.

అందంగా తళతళలాడే ఆ పునాది రాళ్లన్నింటినీ కెమేరాలో బంధించి తృప్తిగా తిరుగుముఖం పట్టారు యువశాస్త్రవేత్తలిద్దరూ!

స్క్రామ్ జెట్ ఇంజను స్టార్టుచేస్తూ మొగానో పునాదిరాయితో కృతజ్ఞతా పూర్వకంగా అన్నాడు మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం!

ఈ జన్మలోనే సుబ్బరంగా  తీర్చుకోవచ్చబ్బాయిలూ! మమ్మల్నిలా నిలువునా పాతేసినా పెద్దమనుషులు మీకు  వెళ్లేదారిలో ఏ నరకంలోనో.. పాతాళంలోనో  తప్పకుండా తగులుతారు.  పెద్దమనసు చేసుకొని ఒక్కసారివచ్చి మాలో కనీసం కొందరికైనా విముక్తి కలిగించి పుణ్యంకట్టుకోమని మా మాటగా విన్నవించండి.. చాలు!  అని కన్నీరు పెట్టుకొంది అ పునాదిరాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి.

***

cartoons: Karlapalem Niranjan

అమ్మ ఆమె

శారద శివపురపు
ఒకప్పుడు ఆమె అన్నపూర్ణ
ఆమె కడుపున పుట్టిందంతా బంగారమే
చేతులు సృష్టించిందంతా అద్భుతమే
చూపులు వర్షించిందంతా అమృతమే
అలుపెరుగక నేర్పిందంతా జీవన సారాంశమే.
కానీ అందరికోసం ఆమె
శరీరంలోంచి ఉబికిన ఉప్పటి నదులు
దుఖసాగరమైన సంగతే కాదు,
ఎప్పటికీ నిశ్చలంగా, విశ్రాంతిగా
పారలేదన్న సంగతి గ్రహించామా?
ప్రవహిస్తూ, ప్రవహిస్తూ కొండంచునుండి
తోయబడి జారిపడే జలపాతంలా
మన మనసుల బండ రాళ్ళపై పడి పడి,
తనను తాను గాయపర్చుకున్న విషయం
గమనించామా?
జీవన గ్రీష్మంలో, ఎండిన నదిలా నిలిచినపుడు
ఏ హృదయపు తడీ ఆమెను తాకలేదే,
ఏ చల్లని స్పర్శా ఆమెను సేద తీర్చలేదే,
ఎపుడైనా కనిపించే ఆమె చిరునవ్వుల్లో
సంతోషం లేదన్న విషయమే పట్టలేదే?
అమ్మ అంటే వాడుకున్నాకా పారేసే వస్తువేకదా మనకి ?
కాకికి పెట్టే పిండం తన్నుకుపోయే గద్దల్లా
పులి వేటాడిన మాంసం కోసం నక్కల్లా
మనల్ని ఆమె గమనించినా
స్పందించే మృదుత్వాలీ గుండెలకి లేవు.
ఆమె చేతి గోరు ముద్దలు తిన్న నోళ్ళు
ఆమె చేతి వేళ్ళ ప్రేమను జీర్ణించుకోలేదు.
ఆమె చేయందుకుని నిలబడ్డ రోజులు
ఆమె సాయం చేస్తే నిలదొక్కుకున్న సమయాలు
జ్ఞాపకం వస్తే ఆలస్యం చేయకుండా
తప్పొప్పుల లెక్కలేవో తేల్చాలనుకోకుండా
ఆదరణ నిండిన కంఠంతో ఒకసారి పలకరించో
ప్రేమగా ఒక సారి కౌగిలించుకునో చూడు
సంతోషంతో చుట్టుకునే ఆమె చేతులు
పాలిపోయిన గాజు కళ్ళల్లోని మెరుపులు
సన్నగా ఎర్రబడే తెల్లటి బుగ్గలు
నీ పాపాయిని గుర్తు చేయక మానవు.
అవి చాలవా నువు తృప్తిగా కళ్ళు మూసుకుని
వెళ్ళిపోయేటపుడు తలచుకోడానికి
అంతకంటే భరోసా ఏమున్నది….
కొండెక్కుతున్నపుడు నీ దీపానికి?
*
sarada shivapurapu

ఆ పూట మున్నేరు పాడలేదు!

(మహాకవి దాశరథి జయంతి) 

అఫ్సర్ 

 ఆరో తరగతి సెలవులకి ముందే మా ఇంట్లో హడావుడి మొదలయ్యింది.

“మనం ఖమ్మం వెళ్లిపోతున్నాం” అని ఆ సెలవుల ముందే నాన్నగారు ఇంట్లో చెప్పారు.

ఆ ఎండాకాలం చింతకానిలో నాకు చివరి ఎండాకాలం అవుతుందని తెలియదు. నా చదువు మొదలయ్యింది చింతకానిలో! వీధిబడిలో పంతులయ్య గారి మొదటి బెత్తం దెబ్బ తిన్నది చింతకానిలో! తరవాత ప్రైమరీ స్కూలు. ఆరో తరగతి దాకా అక్కడే! బాల్యం దానికదే వొక ప్రపంచం అనుకుంటే, నా ప్రపంచానికి మొదలూ చివరా చింతకానే!

అక్కడే  మా నాన్న గారు బడి పిల్లల కోసం నడిపిన గోడ పత్రిక “మధుర వాణి” లో నేను మొదటి కవిత రాశాను . నాన్నగారికి “కన్యాశుల్కం” కంఠతా వచ్చేది. అప్పుడప్పుడూ స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆ సంభాషణలు అలా అప్పచెప్పేసే వారు. మధురవాణి ఆయనకి నచ్చిన పాత్ర. అందుకనే, మా గోడ పత్రికకి ఆయన ఆ పేరు పెట్టారు.

మా బడి వార్షికోత్సవానికి ఆ ఏడాది దాశరథి గారిని తీసుకు వచ్చారు నాన్నగారు. అంతకు ముందు రాత్రే నాన్నగారు ఖమ్మం వెళ్ళి, అక్కడ బస చేసి వున్న దాశరథి గారిని చింతకాని పిలుచుకు వచ్చారు.

నాన్నగారు ఎక్కడ పని చేస్తే అక్కడ బడి పిల్లలకి కవుల గురించి చెప్పీ, వాళ్ళ కవిత్వాలూ, పద్యాలూ పాడి వినిపించి సాహిత్యం మీద వొక అంతులేని ప్రేమని పుట్టించే వాళ్ళు.  దాశరథి గారు స్టేషనులో దిగగానే మా బడిలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి పిల్లలతో పాటు దాదాపు వంద మంది పైనే అక్కడ ఎదురుచూస్తూ కూర్చున్నాం “మహాకవికి స్వాగతం” అని పోస్టర్లు పట్టుకొని – దాశరథి గారు స్టేషన్లో దిగగానే, అందరం వొక పెట్టున “ దాశరథి జిందాబాద్” అని నినాదాలిస్తూ ఆయన్ని స్టేషన్ బయటికి తీసుకువచ్చాం. (మా వూళ్ళో కమ్యూనిస్టులు ఎక్కువే కాబట్టి, అలాంటి నినాదాలూ, ఊరేగింపులు మాకు కొట్టిన పిండి)

అప్పుడు స్టేషను నించి చింతకాని వూళ్ళోకి పావు గంట పైనే నడిచి వెళ్లాల్సి వుండేది. దాశరథి గారిని ఎడ్ల బండి మీద కూర్చోబెట్టి, ఆయన వెనక మా బడి పిల్లలంతా నినాదాలు ఇస్తూ వూళ్ళోకి తీసుకువచ్చాం. మా ఇంటి దగ్గిర బండి ఆగింది. మా ఇంటి ముందు పెద్ద కోలాహలం. “సాయంత్రం దాశరథి గారు బళ్ళో మాట్లాడతారు. అందరూ అక్కడికి రండి.” అని నాన్నగారు మిగిలిన బడి పిల్లల్ని వెళ్లిపొమ్మన్నారు. దాశరథి గారు అందరికీ వందనం చేస్తూ “ మిమ్మల్ని చూస్తే చాలా ఉత్సాహంగా వుంది నాకు, మీ కౌముది సార్ ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. అందరినీ సాయంత్రం కలుస్తాను.” అని దాశరథి గారు అందరికీ అప్పటికి వీడుకోలు చెప్పారు.

పిల్లలంతా వెళ్లిపోయాక దాశరథి గారి తో కలిసి మేం మా ఇంటి  ముందు గదిలో కూర్చున్నాం. మాది ఇరుకు కొంప. రెండు గదుల ఇల్లు. ఆరుగురు పిల్లలు.ఒకరు అడుగు పెట్టాలంటే ఇంకొకళ్లు ఖాళీ చెయ్యాలి. అంత ఇరుకు!  మొదటి గది నిండా పుస్తకాలు; నాన్నగారి రాత కుర్చీ, అంటే పడక కుర్చీ.

అయినా అప్పటికే ఇల్లు బాగా సర్ది పెట్టి వుంచింది అమ్మ. అయినా ఇబ్బంది పడుతూ  వుంది. అది గమనించి దాశరథి గారు “ఇల్లు అద్దంలా పెట్టావు బహెన్-జి! నాకేం కావాలే, ఇదిగో కూర్చోడానికి ఈ చోటు చాలు. ఏడీ మా అఫ్సూర్యుడు?” అంటూ ఆయన పడక కుర్చీలో శరీరం వెనక్కి వాల్చి ఆరాంగా కూర్చుని నన్ను దగ్గిరకి తీసుకున్నారు. “నీ పేరులో చంద్రుడు(కౌముది) వున్నాడు కాబట్టి, వీడి పేరులో సూర్యుడు వుండాల్రా!” అని నాన్నగారికి చెప్పి నా పేరుకి ఆ తోక తగిలించారు ఆయన.

(ఆ తరవాత రుబాయిలు రాసే కాలంలో నాన్నగారికి రాసే వుత్తరాల్లో ఈ పేరు మీద ఆయన చాలా రుబాయిలు రాశారు. నాకు గుర్తుంది ఇది:

“ఖమ్మం లో ఎండలు మండిపోతున్నాయని విన్నా. అయినా , కౌముదీ! రేయెండ నువ్వుండ/ ఇంకేల మండుటెండ?)

“బేటా! షాయరీ చదువుతున్నవా?” అని అడిగారు.

లేదు అని తలూపాను, సిగ్గు పడుతూ. అదొక్కటే అప్పుడు తెలిసిన భాష కాబట్టి.

“అరె, యే క్యా హై బేటా! నువ్వు షాయర్ బిడ్డవి!’ అంటూ ఆయన నాన్నగారి వైపు తిరిగారు.

“వాడు రహస్య కవిలే..దాశరథీ!” అని నాన్నగారు అనడం గుర్తు!

ఆ సాయంత్రం దాశరథి గారి సభ బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పటికీ చింతకానిని తలచుకున్నప్పుడల్లా ఆ సాయంత్రపు సభ గుర్తొస్తుంది. కానీ, అది చింతకానిలో నా చివరి స్కూలు వార్షికోత్సవ సభ!

అదే మొదటి సారి నేను దాశరథి గారిని చూడడం! చింతకానిలో అలా ఎంత మంది కవులూ రచయితలూ మా బడికి / మా ఇంటికి వచ్చారో లెక్క లేదు, వచ్చిన వాళ్ళంతా మా ఇంటికి రావడం గొప్పగా వుండేది. చింతకాని వదల్లేకపోవడానికి వున్న అనేక కారణాల్లో ఆ గొప్ప అనుభూతి పెద్ద కారణం!

* * * * * *

Dasarathi_Portrait

మేం ఖమ్మానికి మారడం నాకు పెద్దగా నచ్చలేదు.

“వీడొట్టి పల్లెటూరి మొహం రా!” అని చాలా కాలం బడి పిల్లలు ఎడ్పిస్తూ వుండడం వల్ల ఆ అయిష్టం ఇంకా పెరిగేది అప్పట్లో!పల్లె నించి రావడం వల్ల నాకు పెద్దగా దోస్తులూ ఏర్పడ లేదు. ఆ ఖాళీని భర్తీ చెయ్యడానికి నేను కవిత్వంలో మొహం దాచుకోవడం లేదా తలదాచుకోవడం మొదలు పెట్టాను.

కానీ, కొద్ది రోజుల్లోనే ఖమ్మానికి అలవాటు పడిపోయాను. ఆ రోజుల్లో దాశరథి గారు దాదాపూ ప్రతి నెలా ఖమ్మం వచ్చే వారు, ఆయనంటే ఖమ్మం వాళ్ళకి వున్న విపరీతమయిన గాఢాభిమానం వల్ల!

దాశరథి గారు వచ్చినప్పుడల్లా నన్ను తోడు బెట్టుకొని ఆయన దగ్గిరకి తీసుకు వెళ్ళే వారు నాన్నగారు. లేకపోతే, ఆయనే మా ఇంటికి వచ్చి మా అందరినీ వొక సారి చూసి వెళ్ళే వాళ్ళు. ఖమ్మం రావడం వల్ల ఇదే నాకు జరిగిన మేలు.

దాశరథి గారికి స్నేహితులంటే మహా ప్రేమ!ఒకసారి  స్నేహం కుదిరిందంటే ఇక వాళ్ళు ఆయనకి కుటుంబ సభ్యుల కిందనే లెక్క! ఆయన “యాత్రాస్మృతి” చదువుతుంటే ఆయన ఎంత స్నేహజీవో ఇట్టే అర్థమవుతుంది. లేకపోతే – ఆళ్వార్ గురించి అంత గొప్పగా రాయడం సాధ్యమా?

అసలు ఆళ్వార్లు పన్నెండు మందే

పదమూడో ఆళ్వార్ మా వట్టికోట ఆళ్వార్ స్వామి!

దేవునిపై భక్తి లేకున్నా

జీవులపై భక్తి వున్నవాడు

శరీరంలో ప్రతి అణువూ

ఆరోగ్య స్నానం చేసే రీతిని

నిష్కల్మషంగా నవ్వగలవాడు

రాముడి తెలివితేటలు లేని

అమాయకుడు ఆళ్వార్!

అతను పోయినప్పటి నుంచీ

అమృత హృదయం విచ్చి

నవ్వగలవాడు లేకుండా పోయాడు లోకంలో.

ఈ కవిత నాకు చాలా సార్లు గుర్తొచ్చేది. నిజానికి అది ఆళ్వార్ కంటే బాగా దాశరథి గారికే సరిపోతుందని అనిపిస్తుంది, ఆళ్వార్ నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి!

ఖమ్మంలో వుండగా ఆయన మా ఇంటికి రాగానే మొదట నన్ను పలకరించే వాళ్ళు.“జనాబే ఆలం! క్యా హాల్ హై?” అని నవ్వుతూ అడిగే వారు.

అలా అనేక యేళ్ళు, అనేక  సాయంత్రాలు, అనేక  గంటలు ఆయనతో నాన్నగారి సమక్షంలో  చాయ్ పానీ కబుర్లు నడిచేవి. (వాళ్ళిద్దరూ మద్యసేవనం చేసే వాళ్ళు కానీ, ఇంట్లో ఎప్పుడూ నేను చూడలేదు. మా ఇంట్లో చాయ్ అయిన తరవాత వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళే వాళ్ళు. అప్పుడు నాన్నగారు ఆలస్యంగా ఇంటికి రావడమే నాకు గుర్తు) వాళ్ళ మాటలు ఏమీ అర్థం కాకపోయినా నేను అక్కడే చెవులు రిక్కించుకుని కూర్చునే వాడిని. ఆయన పద్యమో/కవితో పాడితే వినాలని! వొక చుక్క చాయ్ గొంతులో పడగానే, ఆయన చప్పున వొక రుబాయీనో, గజల్నో ఎత్తుకుని తీయగా పాడేవారు.

అలా గాలిబ్ గీతాలు ఆయన గొంతులో విన్నాను. అప్పుడే ఆయన రాయడం మొదలు పెట్టిన తెలుగు రుబాయిలూ విన్నాను. అప్పట్లో నాకు ప్రాచీన సాహిత్యం మీద విపరీతమయిన ఆసక్తి వుండడం వల్లా, అదే సాహిత్యం అనే భ్రమల్లో బతుకుతూ వుండడం వల్లా, తెల్లారి లేస్తే పద్యాలు బట్టీయం పాడుతూ, వృత్తాలతో కుస్తీ పాట్లు పడుతూ వుండడం వల్లా – ఆ రోజుల్లో ఆయన వచన కవిత్వం అప్పట్లో పెద్దగా నచ్చేది కాదు. ఆయన వచన కవిత్వం మొదలు పెట్టగానే నా మనసు యాంత్రికంగా స్విచ్ ఆఫ్ అయ్యేది.

కొన్నాళ్ళ తరవాత – అప్పటికి నేను కాలేజీకి వచ్చేశాక –  ఆ ముక్క దాశరథి గారిని ముఖం మీద అడిగేశాను, మా నాన్నగారు నావైపు కాస్త కోపంగా చూస్తూ వుండగా-

దాశరథి గారు నవ్వి,నా భుజమ్మీద చెయ్యి వేసి:

“మంచిదే, బిడ్డా! కానీ, ఎంత పద్య కవి అయినా ఏదో వొక నాడు వచన కవిత్వం రాయాల్సిందే.   పద్యం గొప్ప పద్యానిది, వచనం గొప్ప వచనానిది. నువ్వు ఇప్పటి దాకా కవిత్వంలో ఒక రకమయిన లయకే అలవాటు పడ్డావు. పైగా నువ్వు వృత్తాల మాయలో వున్నావు కనుక, నీకు వచన కవిత్వంలో వుండే కొత్త లయ తెలియడం లేదు. ఎందుకూ, ఉర్దూలో ఘజల్ అంత గొప్ప సంప్రదాయం కదా! ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రీవర్సు కి వచ్చేస్తున్నారు. వొక్కటే గుర్తు పెట్టుకో – ఇదే అద్భుతం అనుకోని వొక్క చోటే ఆగిపోవద్దు. కాలం నిన్ను ఎటు తీసుకువెళ్తుందో చూడు. వీలయితే కాలం కంటే ముందు వెళ్ళు, లేదా, కాలం వెంట వెళ్ళు. అంతే కానీ, కాలం ఎక్కడో నువ్వెక్కడో వున్నావనుకో – నీ కథ ముగిసినట్టే!” (అంట రాని వారెవరంటే/ మన వెంట రాని వారే! అని అప్పట్లో దాశరథి పాట కొంచెం పాప్యులర్ కూడా!)

బాగా గుర్తు- దాశరథి గారికి ఖమ్మం వూరి బయట పారే మున్నేరు అంటే చాలా ఇష్టం. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ దాని చుట్టే తిరిగాయి. ఆ మున్నేరు మా ఇంటికి దూరంలో వుండేది. బ్రిడ్జి దాటి వెళ్ళాలి.

వొక సారి  ఆయన అడిగారు “నువ్వు ఎప్పుడయినా మున్నేరు వొడ్డుకి వెళ్ళావా?” అని.

“లేదు” అన్నాను నేను అప్పుడే కొంచెం మాట్లాడడం నేర్చుకుంటున్న వాడినై-

‘అరె…సాయంత్రం వూరికే అట్లా నడుచుకుంటూ వెళ్ళు. అక్కడ కాసేపు కూర్చొని రా…ఆ రాత్రి నువ్వు కనీసం వొక్క లైను అయినా రాస్తావ్ తప్పక!”

“నిజమా?’

“అవును, మంచి కవిత్వం రాయాలంటే నువ్వు మంచి ప్రకృతిలో వుండాలి. కాస్త నీళ్లూ, కాసిని చెట్లూ, కొన్ని పక్షులూ…వీటితో నీకు దోస్తీ కుదరాలి.”

తరవాత చాలా వుత్తరాల్లో/ సంభాషణల్లో  ఆయన మున్నేరు గురించే రాసే వారు/ చెప్పే వారు. ‘ఈ మధ్య వెళ్ళావా?లేదా?” అని గుచ్చి గుచ్చి అడిగే వారు. “ఈ మున్నేరు లేకపోతే నాకు కవిత్వమే తెలియదు” అన్నారు వొక వొక సారి !

ఆ రోజుల్లో ఎందుకో, నాకు అటు వెళ్లాలని అనిపించేది కాదు. అక్కడ పక్కనే శ్మశాన వాటిక వుండేది. నేను వెళ్ళిన రెండు మూడు సార్లు అక్కడ శవాలు తగలబెట్టడం చూశాను. బహుశా, అది నా మనసులో నాటుకు పోయి వుండాలి. ఆయన తన చిన్నప్పటి మున్నేరు అలానే వుందని అనుకుని ఎప్పుడూ అలా అడుగుతూ వుంటారులే అని వూరుకున్నా.

కానీ,దాశరథి గారు  చనిపోయారని  తెలిసి నాన్నగారు హడావుడిగా బ్యాగ్ సర్దుకొని కన్నీళ్ళ  పర్యంతం అవుతూ హైద్రాబాద్ వెళ్ళిన సాయంత్రం నేను మున్నేరు వొడ్డుకి వెళ్ళాను.

ఆ సాయంత్రం మున్నేరు అలసిపోయిన తల్లిలా ప్రశాంతంగా పడుకుని వుంది.

దాని గలగలలు నాకు వినిపించక కాసేపటికి వెనక్కి మళ్లాను!

–      మళ్ళీ ఎప్పుడూ నేను మున్నేరు దాకా వెళ్లనే లేదు!

 

(దాశరథి గారితో ఇంకా అనేక స్మృతులున్నాయి. అవి తరవాత)

ఆవకాయ సౌజన్యంతో 

 

గోదావరీ, కుక్కతోకలూ..

 

సత్యమూర్తి

‘‘నేను జ్ఞానవాపి వద్దకు వెళ్లాను. దేవుడి కోసం వెతికాను కానీ కనుక్కోలేకపోయాను. మనసంతా అదోలాగా అనిపించింది. జ్ఞానవాపి పరిసరాలు మహరోతగా ఉన్నాయి. దక్షిణ ఇవ్వాలనిపించలేదు..’’

మహాత్మాగాంధీకి వారణాసిలో ఎదురైన అనుభవం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గోదావరి పుష్కరాల పేరుతో చేస్తున్న ప్రచారం జ్ఞానవాపి పరిసరాలకంటే రోత పుట్టిస్తోంది. పవిత్ర పుష్కర గోదాట్లో మునిగితే పుణ్యం పురుషార్థం(మహిళార్థం ఉండదు!) దక్కుతాయని ప్రభుత్వాలు రేడియోల్లో, టీవీల్లో, నానా ప్రచారసాధనాల్లో చేస్తున్న నానాయాగీ మన దేశం లౌకిక దేశం కాదని, పుణ్యస్నానాల, పిండప్రదానాల హిందూదేశమని ఢంకా బజాయిస్తోంది. గుణదల మేరీమాత ఉత్సవాలకు, కడప అమీన్ పీర్ దర్గా ఉరుసుకు మన లౌకిక ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో ఇలాంటి ప్రచారం చేసిన దాఖలాలు లేవుగా మరి!

మనది పేరుకే లౌకిక దేశమన్న సంగతి కొత్తేమీ కాదు కానీ.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పోటీపడి కీర్తికండూతితో అధికార పటిష్టత కోసం నిస్సిగ్గుగా తమ హిందుత్వాన్ని బహిరంగంగా చాటుకోవడం చూస్తుంటే కొనవూరిపితో ఉన్న లౌకికవిలువలకూ ముప్పు వచ్చిందని మరింత స్పష్టమవుతోంది. వాళ్లిద్దరిని ఎన్నుకున్న రెండు రాష్ట్రాల్లోని ముస్లింలు, క్రైస్తవులు ముక్కున వేలేసుకుని ‘మాకు మాంచి శాస్తి చేశారు’ అని గొణుక్కుంటున్నారు. క్రైస్తవుల పక్షమని చెప్పుకునే నాయకుడు కూడా గోదాట్లో మునకేయడం చూసి క్రైస్తవ సోదరులు సిగ్గుతో బిక్కచచ్చిపోతున్నారు. గత పుష్కరాల సంగతేమో కానీ ఇవి మాత్రం అసలు సిసలైన రాజకీయ పుష్కరాలు. ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికే తెలంగాణలో సగానికిపైగా జనం పుష్కరాల్లో మునిగారు. మొత్తం ఏపీ జనాభా అంతా మునిగిందని బాబు చెప్పడమే తరువాయి. పుష్కరాల డబ్బును జేబుల్లో వేసుకోకుండా పారదర్శకంగా ఖర్చుపెట్టామని చెప్పడానికి ఈ కాకిలెక్కలు తప్పనిసరి.

ఈ పుష్కరాలకు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ప్రచారం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ప్రచారం కానే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న హిందుత్వవాదుల మెప్పుకోసం కేసీఆర్, చంద్రబాబులు ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసిన పన్నుల డబ్బుతో చేస్తున్న నీచమైన పందేరం. మెప్పుకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. వీళ్ల ప్రచారానికి మోసపోయి గోదాట్లో మునగడానికి వెళ్లే జనానికి కూడా తొక్కిసలాట చావులు ప్రతిఫలంగా ముడుతుంటాయి. కేంద్రంలో సంఘ్ పరివార్ అధికారంలోకి రావడం, ఘర్ వాపసీ, యోగాపై ఊకదంపుడు ప్రచారం.. వీటన్నింటి నేపథ్యంలో పుష్కర ప్రచారాన్ని చూస్తే దాని వెనక ఉన్న మతాధిపత్య కోణాన్ని సులభంగా గుర్తించవచ్చు.

మతం ఇంటికే పరిమితం కాకపోవడం వల్ల వచ్చిన జాడ్యాలివి. చంద్రబాబు ఏపీ కొత్త రాజధాని భూమిపూజను కుటుంబకార్యక్రమంగా మార్చి పక్కా హిందూమత కార్యక్రమంలా జరిపినా, తెలంగాణ వస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ బ్రాహ్మణ గవర్నర్ కు బహిరంగంగా బోర్లబడి కాళ్లుమొక్కినా,  మోడీ విదేశీ నేతలకు భగవగ్దీతను కానుకగా ఇచ్చినా, భగవద్గీతను జాతీయగ్రంథం చేయాలని సుష్మా స్వరాజ్ వాగినా, వాళ్లపై వేసిన పిటిషన్లను కోర్టులు కుంటిసాకులతో కొట్టేసినా.. అవన్నీ ఆ జాడ్యాల ఫలితాలే. పుష్కరాలపై ప్రభుత్వాలు చేస్తున్నది ప్రచారం కాదని, సమాచారం ఇవ్వడమేనని, అన్నిమతాలకు సమప్రాధాన్యత ఇవ్వడమే లౌకికవాదమని, ప్రజల మతవిశ్వాసాలకు అనుగుణంగా తగిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వాల బాధ్యత అని మన శ్రీశ్రీశ్రీ గౌరవనీయ హైకోర్టు మహగొప్పగా వాక్రుచ్చింది. అవునా..? లౌకికవాదమంటే అదా? మనకు తెలిదే! వెర్రినాయాళ్లం, ఇంతకాలం లౌకికవాదం అంటే రాజ్యం మతంతో సంబంధం పెట్టుకోకుండా ఉండడమే సుమా అని అనుకున్నామే (Secularism is the principle of the separation of government institutions and persons mandated to represent the state from religious institutions and religious dignitaries. Secularism the belief that religion should not be involved in the organization of society, education, etc.)

రిపబ్లిక్ డే సందర్భంగా పత్రికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లోని రాజ్యంగ పీఠిక చిత్రంలో సోషలిస్టు పదం లేదని మొన్నామధ్య గొడవ జరిగింది. అది సోషలిస్టు పదాన్ని చేర్చకముందటి రాజ్యంగ పీఠిక చిత్రమని, ‘పొరపాటు’ జరిగిపోయిందని ‘నైపుణ్యాల అభివృద్ధి’ సర్కారు సమర్థించుకుంది. దేశాన్ని హిందూదేశంగా చేసిపారేస్తామంటున్న సంఘ్ నేతల ఆశయసాధనకు ఇలాంటి ‘పొరపాట్ల’తో శాయశక్తులా సాయం చేయడం తమ విధి అని చెప్పకనే చెప్పింది. ఈ పీఠిక గొడవ సమయంలో.. రాజ్యంగ పీఠికలోంచి సోషలిస్టే కాదు, సెక్యులర్ పదాన్నీ పీకిపారేయాలని(అసమానతల హిందూదేశం అనే పదాలు పెట్టాలని!) హిందూవాదులు డిమాండ్ చేశారు. ఒకరకంగా చూస్తే వాళ్లన్నది సరైందేనేమో. మేకమెడ చన్నుల్లాంటి ఆ పదాలను తీసేస్తే పోయిందేమీ ఉండకపోవవచ్చు. పైగా ఆ పదాల అచ్చుకు కావాల్సిన కాయితం, ఇంకు ఖర్చు ఆదా అవుతుంది కూడా. ఆ ఆదా డబ్బు రాబోయే మరింత పవిత్ర పుష్కరాలకు అక్కరకొస్తుంది.

లౌకికవాదం అంటే మతాలకు అతీతమైంది కాదు, అన్ని మతాలతో అంటకాగేది అని మన నేతలు అద్భుత నిర్వచనమివ్వడమే కాకుండా దాన్ని అమలు కూడా చేయబట్టి చాలాకాలమే అయింది. పత్రికల్లో లౌకికవాదం అనే పదం చూసి, ‘లౌకికవాదం అంటే లౌక్యంగా మాట్లాడ్డం కాబోలు’ అని అనుకునే వెర్రిజనం కోట్లకొద్దీ ఉన్న డెమోక్రటిక్, సెక్యులర్, సోషలిస్ట్, రిపబ్లిక్ వగైరా విశేషణాల భారత దేశంలో మతఛాందసవాదులకు అడ్డేముంది?

Godavari-Pushkaralu

మతభేదాల్లేకుండా వసూలు చేస్తున్న పన్నుల్లోంచి కోట్ల డబ్బును ఒక మతకార్యక్రమం కోసం వెచ్చించడం అప్రజాస్వామికం, దుర్మార్గం. ఒక మతానికి అని అంటే హిందూమతానికే అని కాదు. ముస్లింల హజ్ యాత్ర సబ్సిడీలను, క్రైస్తవ మిషనరీలకు ఇస్తున్న నిధులను, రాయితీలను, ఇతర మతాలకు కూడా ఇస్తున్న నిధులను కూడా రద్దు చేయాలి. కోట్ల మంది ప్రజలు బతుకుతెరువు, సాగునీళ్లు, తాగునీళ్లు, మందుమాకులు, ఇళ్లు లేక అల్లాడుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న మన పేరుగొప్ప దేశంలో ఉత్తి‘పుణ్యానికి’కి కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేయకుండా అసలైన ప్రజాక్షేమానికి ఖర్చుపెట్టినప్పడే మనది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది.

అన్ని కోట్లమంది భక్తివిశ్వాసాలుగల పౌరులు వెళ్లే పుష్కరాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తే తప్పేంటి అని కొందరు అడుగుతున్నారు. దెయ్యాలు, చేతబడులను నమ్మేవాళ్లు కూడా దేశంలో కోట్లమంది ఉన్నారు. వాటి ప్రచారానికి కూడా కోట్ల తగలెయ్యాలి. పాత గుళ్లలో, కోటల్లో గుప్తనిధుల కోసం పలుగుపారతో వెళ్లేవాళ్లకు ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాలివ్వాలి.

మన దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, సామ్యవాద విలువలు పాశ్చాత్యదేశాల్లో మాదిరి క్రమానుగతంగా, ప్రజాపోరాటాల ద్వారా వచ్చినవి కావని, అరువుకు తెచ్చుకున్నవని, అందుకే అవి వెర్రితలలు వేస్తున్నాయనే అభిప్రాయం ఒకటుంది. పతంజలి నవలిక ‘పిలక తిరుగుడు పువ్వు’లో మేజిస్ట్రేటు అన్న మాటల ప్రస్తావన ఇక్కడ అసందర్భమేమీ కాదు.. “మన జ్ఞానానికి సార్ధకత లేదు.  మన విశ్వాసాల పైన మనకు నమ్మకం లేదు. మన విలువల పైన మనకు గౌరవం లేదు. మన దేవుళ్ళ పైన మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం పైన మనకు విశ్వాసం లేదు. మన మీద గానీ, తోటి వాళ్ళ మీద గానీ మనకు మమకారం  లేదు. మన ప్రజాస్వామ్యం పైన మనకు అవగాహన కానీ గురి గానీ లేదు. మన జ్ఞానానికీ – విశ్వాసానికీ పొంతన లేదు. విశ్వాసానికీ – ఆచరణకూ పొందిక లేదు..భూమి బల్ల పరుపుగా వున్నప్పుడే ఇలాంటి జీవితం కనపడుతుంది”

ఇది పాలకుల తప్పేకానీ ప్రజల తప్పుకాదు. ప్రజలకు ఎన్నుకోవడానికి మంచి నాయకులు లేరు. పైగా ఓటు వేయకపోవడం దేశద్రోహమని ప్రచారం చేస్తున్న నికృష్ట ప్రజాస్వామ్యమిది. మన ప్రజలు వెర్రివాళ్లే. కానీ ఎల్లకాలం అలాగే ఉండరు. వెర్రి కుదిరే కాలం వచ్చినప్పుడు తాము పట్టుకున్న కుక్కతోకలను వదలి సొంతంగా గోదారి ఈదకమానరు.

*

 

 

వినిపించనా ఈ పూట ఆ పాట…

శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల 

sp dattamala“ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం”

   అని పాడింది  ఎవరో తెలుసా? విస్సంరాజు రామకృష్ణగారు .

  భక్త తుకారాం చిత్రంలోని   “పాండురంగ నామం పరమపుణ్య ధామం” పాట.

 ఆయన పాటలు కూడా అంతే. ఇంకా చెప్పాలంటే బాపుగారి ముత్యాలముగ్గులో  

“ఎదో… ఏదో.. అన్నది ఈ మసక వెలుతురు,గూటి పడవలో విన్నది కొత్తపెళ్లికూతురు”

ఈ పాట ఎన్ని మార్లు విన్నా,  మళ్ళీ కొత్తగా ఉంటుంది.

ఆ చిత్ర కథానాయకుడు శ్రీధర్  స్టైల్ కి తగ్గట్టు పాడారు.

“ఎదో …ఏదో ” వినసొంపుగా ఉంటుంది.

భక్త తుకారాం లో ఘంటసాల గారు, రామకృష్ణ గారు ఇద్దరూ పాడారు. లోతైన పరిశీలన ఉంటేగాని ఎవరు ఏది పాడారు అనేది చెప్పడం  కష్టం. రామకృష్ణగారి పాట వింటే ఘంటసాల గారే పాడారా అన్నట్టు  ఉంటుంది . ఈయన్ని ఘంటసాల గారి ఏకలవ్య శిష్యుడు అంటారు.  ఘంటసాల గారి చివరి రోజుల్లో ఆయాసం వల్ల హై- పిచ్ అంటే  తారాస్థాయిలో స్వరపరిచిన పాటల్ని రామకృష్ణ గారే పుర్తిచేసారట. ఎవ్వరు గుర్తుపట్టలేదు. అలా 15 పాటలు ఉన్నాయ్. మచ్చుకి కొన్ని …కన్నకోడుకులో “తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి”, అల్లూరి సీతారామారాజులో “తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా “. కాని సినిమాలో ఆయన పేరు లేదు. ఈ విధంగా గురుదక్షిణ సమర్పించుకున్నారు అని చెప్పవచ్చు.

1974 లో ఘంటసాల మాస్టారు పరమపదించారు. ఆయన ఉన్నపుడే, 1972 నుంచే , రామకృష్ణ గారు సినిమాల్లో         నేపధ్య గానం  మొదలు పెట్టారు. ఘంటసాల గారి గొంతులా ఉన్నా, ఈయనకి రావాల్సిన పేరు వచ్చింది. ఆయన మొదటి  సినిమా  “విచిత్ర బంధం” లో పాడిన  “వయసే ఒక పూల తోట”. వాణిశ్రీ ఆట, రామకృష్ణ పాటతో హుషారుగా సాగుతుంది.

మహాకవి క్షేత్రయ్య లో, గోపికలతో శ్రీకృష్ణుని రాసలీలలు  తన్మయత్వం తో క్షేత్రయ్య పాడినట్టు ఓ పాట ఉంటుంది,  ” ఆ రేపల్లె లోని గోపాలుడంట యే పిల్లనైన చూస్తే తంటా ..తలచుకుంటే ఆ జగడం కన్నులపంట ఓ ఓ ఓ మజా మజా కన్నులపంట” బలిపీఠం లో  భార్య అలికను తీర్చే పాట  “చందమామ రావే జాబిల్లి రావే “. “ఇదెక్కడి న్యాయం”  లో  “ఎపుడైనా యే క్షణమైనా ” మొత్తం పాటంతా  సుశీలగారు   పాడినా ముగింపు రామకృష్ణగారు ఇస్తారు.  ఒకే  చరణమైనా చాలా  బాగుంటుంది.

“భక్త కన్నప్ప” అనగానే రామకృష్ణ గుర్తొస్తారు. ” అరె సిన్నమీ ! మబ్బు ఎనక మెర్పుతీగె, దుబ్బు ఎనక మల్లెతీగె! ఓ.. ఓ.. ఓ..  మబ్బు ఎనక మెర్పుతీగె, దుబ్బు ఎనక మల్లెతీగె! ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా అబ్బో సిగ్గా! మల్లెమొగ్గా అబ్బో సిగ్గా!”

కన్నప్ప ప్రేయసితో పాడుకునే పాట అద్భుతం.

బాపుగారు గోదావరినది నేపధ్యంలో తీసిన అందాలరాముడు లో చాలామట్టుకు రామకృష్ణ గారే పాడారు.

“కురిసే వెన్నెల్లో మెరిసే గోదారి లా

మెరిసే గోదారి లో విరబూసిన నురగ లా

నవ్వులారబోసే “పడుచు”న్నది

కలువపువ్వు వేయిరేకులతో విచ్చుకున్నది

పున్నమి ఎపుడెపుడా అని వేచియున్నది”

డాక్టర్ నారాయణరెడ్డి గారి రచనకు, బాపుగారి దృశ్య కావ్యానికి తన గాత్రంతో వన్నెలద్దారు. “విచ్చుకున్నది” అంటూ, కలువ విచ్చుకునే వైనం తన గొంతులో రంగరించి పాడారు. “ఇదా లోకం” సిన్మాలో “నీ మనసు నా మనసు ఏకమై ప్రతిజన్మలోన ఉందాము జతగా”  రామకృష్ణ గారి  పాట, శోభన్ బాబు ,శారద పైట చెంగుతో ఇద్దరు  చేసే విన్యాసాలు చూస్తూ పరవశించపోతాము.  ఈ పాట ఆడియో వింటే ఘంటసాల గారు పాడిన “సంగమం సంగమం అనురాగ సంగమం” గుర్తొస్తుంది. ఇక్కడ తేడా తెలుస్తుంది. ఘంటసాలగారి గొంతులో గాంభీర్యం…రామకృష్ణ గళంలో  లేతకొబ్బరి కమ్మదనం. “వసివాడి శశిచెడి వన్నెవాసీ లేక – విరహాన వనలక్ష్మి వేగిపిలుచూ/ పగిలి గుండెల దాక పొగలతో సెగలతో – దాహాన భూదేవి తపియించి పిలుచూ/రా, తొర తొరగా రా . . తొందరగా రా/ఓ దూరగగన విహారా ఓ శీతల వర్షాధారా/తరలిరా జలధరా . . కరుణించి కదలిరా తరలిరా జలధరా . . కరుణించి కదలిరా”      దేవులపల్లి రచనకు సాలూరు రాజేశ్వరరావు “రాగ మల్హార్ “లో స్వరపరచిన గీతాన్ని బాలుగారితో ఆలపించినప్పుడు నిజంగానే వర్షం కురిసిందట.  చిత్రం  అన్నదమ్ముల కథ.

అందాల రాముడు లో హరికథ  ” ధన్యుడనైతిని ఓ రామా! నా పుణ్యము పండెను ఓ రామ” వచనం చెప్పింది అక్కినేనిగారైతే పద్యాలు పాడింది  రామకృష్ణగారు.

యశోద కృష్ణ లో కూడా ఒక పాట ఉంది .

” నెల మూడు వానలు నిలిచి కురిశాయీ – పచ్చిక మేసి మన పశువులే బలిశాయీ దేశాన కరువు రాకుండాలిరా . . దేవేంద్రునకు పూజ చెయ్యాలిరా !”

భక్తి పాటలకు ఆయన గాత్రం  పుట్టినిల్లు అని చెప్పవచ్చు. “శ్యామ సుందరా  ప్రేమ మందిరా నీ నామమే వీనుల విందురా” “రామా  శ్రీరామా  జయ జయ రామా  రఘురామా””మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి”… మొదలైనవి  కరుణామయుడులో వినదగిన పాట ” పువ్వులకన్న పున్నమివెన్నెల కన్న  మిన్న అయినది పసిడి కుసుమం ”

దానవీరశూరకర్ణ , విశ్వనాథ నాయకుడు ,షిర్డీ సాయిబాబా మహత్యం ,వెంకటేశ్వర వైభవం, బ్రహ్మంగారి చరిత్ర మొదలైన వాటిల్లో పద్యాలు ,దండకాలు చాలానే ఉన్నాయ్.

“ఓహో చెలి ఓనా చెలి

ఇది తొలి పాట

ఒక చెలి పాట

వినిపించనా  ఈ పూట

ఆ  పాట”

దాసరి నారాయణరావుగారి దర్శకత్వం లో వచ్చిన కన్యాకుమారి చిత్రానికి పై పాట పాడారు, కాని ఎందుకో తీసేసారు.    చెప్పాలంటే మనము వినని పాట .

“ఎదగడానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర”

“అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం” ఇలాంటి పాటలను  ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరి వల్ల ,ఎదో ఒక సందర్బంలో కనెక్ట్ చేసుకుంటూనే ఉంటాము.

“రాముడేమ్మాన్నాడోయ్ …సీతా రాముడేమ్మాన్నాడోయ్”…

బ్రహ్మంగారి చరిత్ర లో “ఏమండి పండితులారా ”

ఇవి  వ్యంగ్యపు పాటలు . మొత్తానికి చెప్పాలంటే పాటల్లో చేయని  ప్రక్రియ, ప్రయోగము లేదు.భక్తి పాటలు ,యుగళ గీతాలు,పద్యాలు ,దండకాలు మొదలైనవి .

ఇక వ్యక్తిగత విషయానికి  వస్తే ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఘంటసాలగారి ఏకలవ్య శిష్యుడు అంటేనే అర్ధం చేసుకోవాలి ఎంత కష్టపడ్డారో. నిచ్చెన ఎక్కించినట్టే ఎక్కించి డబ్బున కింద పడేసింది సినీ రంగం. అంటే వైకుంటపాళీ ఆటలో మాదిరి, నిచ్చెన ఎక్కారు ,పాము కాటుకూ  గురయ్యారు. పది సంవత్సరాలే ఉన్నారు ఇండస్ట్రీలో . తరువాత అరకొర ఆవకాశాలు ఆ తర్వాత అవీ లేవు. మనిషి వ్యక్తిత్వం బయటపడేది కష్టాలు ,సమస్యలు వచ్చినపుడే. రామకృష్ణగారి ఆశావహ ధృక్పధం ఆయనకు తోడ్పడింది. భక్తీ గీతాల ఆల్బమ్స్ , వివిధ కన్సర్ట్స్ , టీవీ సీరియల్స్ లో నటన, లాంటి  వ్యాపకాలు సృష్టించుకున్నారు.

మా ఊర్లో ఉన్న శివాలయం లో రోజు ప్రొద్దున్న ,సాయంత్రం “శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో” రికార్డు వేసేవారు .అప్పుడు తెలిసేది కాదు ఎవరు పాడారో. తర్వాత అది విన్నపుడల్లా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేవి. ఎపుడైనా ఆ గుడికి వెళ్తే రామకృష్ణగారు తప్పక గుర్తొస్తారు నాకు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

స్లీమన్ కథ:కలలు కంటూ…కథలు వింటూ…అతని బాల్యం!

కల్లూరి భాస్కరం 

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మెక్లంబర్గ్…ఉత్తర జర్మనీలో ఒక చారిత్రక ప్రదేశం. పోలండ్ సరిహద్దులకు అది ఆట్టే దూరంలో లేదు. ఒకప్పుడు స్లావ్ లకు, ట్యూటన్లకు అక్కడో పెద్ద యుద్ధం జరిగింది. అయితే, పందొమ్మిదో శతాబ్ది ప్రారంభం నాటికి మెక్లంబర్గ్ ఎదుగూ బొదుగూ లేకుండా నిలవ నీటి తీరుగా  మిగిలిపోయింది.

మెక్లంబర్గీయుల గురించి బెర్లిన్ వాసుల్ని కదిపితే, “వాళ్ళా? శుద్ధ బుర్ర తక్కువ జనాలు” అని తీసిపారేస్తారు. కానీ అందులో వాస్తవం లేదు. ఈ ప్రాంతం కూడా చెప్పుకోదగిన కళాకారుల్ని, కవుల్ని అందించింది. అంతకన్నా ముఖ్యంగా  అన్నదాత అనిపించుకుంది. ఇక్కడి వాళ్ళలా భూమితో గాఢంగా పెనవేసుకున్న వాళ్ళు  జర్మనీ మొత్తంలోనే మరొకళ్ళు లేరు. వీరు అసలు సిసలు భూమిపుత్రులు.

ప్రధానంగా వీళ్ళు ఆలుగడ్డల్ని పండిస్తారు. పశువుల్ని పెంచుతారు. ఇక వీళ్ళ అలవాట్లకు వస్తే, విపరీతంగా తాగేస్తారు. . అట్టహాసంగా నవ్వుతారు. శీతాకాలపు దీర్ఘ సాయంత్రాలలో నెగడు చుట్టూ కూర్చుని కమ్మ కమ్మగా కథలు చెప్పుకుంటారు.

మెక్లంబర్గ్ లో న్యూ బకౌవ్ అనే ఓ కుగ్రామం. అక్కడో చర్చి. ఆ చర్చి ప్రాంగణంలోనే పాస్టర్ కుటుంబం నివసించే ఓ ఇల్లు. ఆ ఇంట్లో 1822, జనవరి 6న పుట్టాడు ఓ అబ్బాయి. అతనికి నలుగురు అక్కచెల్లెళ్ళు, ఒక అన్న. పుట్టిన ఏడాదికే అన్న చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం తమ్ముడికి అతని పేరే పెట్టారు. అతనే  హైన్ రిచ్ స్లీమన్!

హైన్ రిచ్ పుట్టిన రెండేళ్లకు అంకేర్షగన్ అనే గ్రామానికి తండ్రి పాస్టర్ గా వెళ్ళాడు. అదెంత అనామక గ్రామమంటే, మ్యాపు మీద దాని పేరు కనిపించదు. అక్కడో చిన్నపాటి చర్చి. అందులో చెర్రీ పండ్లతోట. ఆ ఊరికి గుర్తింపు లేకపోతేనేం, అక్కడి గాలి నిండా వింత వింత ఊసులూ; దెయ్యాలు, భూతాలు, గుప్తనిధుల కథలూనూ. అక్కడికి దగ్గరలోనే నిధులు పాతిపెట్టారనీ, అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయనీ చెప్పుకునేవారు. చర్చి తోటలో ఉన్న చిన్న ఇంట్లో నిమ్మచెట్టు కింద ఒక దెయ్యం ఉందట. హైన్ రిచ్ నాన్న ఎర్నెస్ట్ స్లీమన్ కు ముందు పాస్టర్ గా ఉన్న రుష్టార్బ్ దెయ్యం అది. చర్చికి ఇంకో పక్కన ఓ చెరువు. రోజూ అర్థరాత్రి వేళ ఓ అమ్మాయి చేతుల్లో వెండి పాత్ర ఉంచుకుని ఆ చెరువులోంచి పైకి వస్తుంది. అక్కడికి మైలు దూరంలో ఓ సమాధి ఉంది. చనిపోయిన ఓ శిశువును బంగారు ఊయెలలో ఉంచి పాతిపెట్టిన సమాధి అది.

ఆ ఊరి నడిమధ్యలో మధ్యయుగాల నాటి ఓ కోట. దాని అడుగున రహస్యమార్గాలు. ఒకప్పుడు ఆ కోట హెన్నింగ్ వాన్ హోస్టీన్ అనే ఓ బందిపోటు అధీనంలో ఉండేది. అలా ఉండగా, మెక్లంబర్గ్ డ్యూక్ అతని మీదికి యుద్ధానికి వచ్చాడు. హోస్టీన్ అతనితో సంధి రాయబారాలు జరుపుతూనే, అతన్ని చంపడానికి పథకం వేశాడు. ఓ గోవుల కాపరి దీనిని పసిగట్టి డ్యూక్ చెవిన వేశాడు. హోస్టీన్ ఆ గోవుల కాపరిని పట్టుకుని సజీవదహనం చేసి, అప్పటికీ కసి తీరక మృతదేహాన్ని ఒక్క తన్ను తన్నాడు. డ్యూక్ పెద్ద సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. తప్పించుకునే మార్గం దొరక్క హోస్టీన్ తన ఖజానా అంతటినీ ఓ శిథిల గోపురం కింద దాచి ఆత్మహత్య చేసుకున్నాడు.

చర్చి ప్రాంగణంలో పొడవైన రాళ్ళు పరచి ఉన్న చోటే అతని సమాధి. గోవుల కాపరిని తన్నిన అతని కాలు ఏటా ఒకసారి సమాధి లోంచి పొడుచు వస్తుందని, అదొక వింత పువ్వులా కనిపిస్తుందనీ చెప్పుకునేవారు. నల్లని సిల్కు తొడుగుతో ఉన్న ఆ కాలును నేనొకసారి చూశానని చర్చి పనివాడు చెప్పేవాడు. అతను తప్ప చూశామని చెప్పినవాళ్లు ఇంకెవరూ లేరు.

***

దెయ్యాలు, భూతాల కథలూ…మధ్యయుగాలనాటి కోటా…రహస్యమార్గాలలూ…గుప్తనిధులూ…!

హైన్ రిచ్ ఆసక్తులను, ఊహలను పుష్కలంగా పండించడానికి బాల్యంలోనే కావలసినంత ఎరువు.  అతనా కోటను చూశాడు. దాని ఉత్తరపు గోడ మీద, గుర్రమెక్కి యుద్ధానికి వెడుతున్న హోస్టీన్ చిత్రాన్ని చూశాడు. గోవుల కాపరిని సజీవ దహనం చేసిన ప్రదేశం చూశాడు. మెక్లంబర్గ్ డ్యూక్ ను హెచ్చరించడం కోసం గోవుల కాపరి కొండ మీద దాగి ఉన్న చోటు అతనికి తెలుసు. ఆ కోట అడుగున ఉన్న రహస్యమార్గాలను గాలించాడు. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆ రహస్యమార్గాల తలెక్కడో, తోక ఎక్కడో తనకు తెలుసు ననుకునేవాడు. ఇక అతని బుర్ర నిండా గుప్తనిధుల గురించిన కథలే.

నిజానికి అంతవరకు హైన్ రిచ్ ఆ ఊళ్ళోంచి కాలు కదిపింది లేదు. ఆ చర్చి ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టిన సందర్భాలూ తక్కువే. కిటికీకి అతుక్కుపోయి మంచుపొగలోంచి బాహ్యప్రపంచాన్ని చూస్తూ, దానిని ఓ అద్భుతంగానూ, నిగూఢమైందిగానూ ఊహించుకుంటూ ఆనందంతో పులకించిపోయేవాడు. ఆ పసితనపు ఉత్కంఠ అతని జీవితాంతమూ అలాగే ఉండిపోయింది.

అతను ప్రతిచోటా దెయ్యాలు ఉన్న్తట్టు ఊహించుకునేవాడు. ప్రతి సందు మలుపులో ఏదో భయోత్పాతం కాచుకుని ఉన్నట్టు అనుకునేవాడు. రాత్రిపూట విచిత్రమైన గుసగుసలు వినిపిస్తున్నట్టు, తోటలో దీపాలు కదిలి వెడుతున్నట్టు, హోస్టీన్ భూతం కోటలోంచి కిందికి దిగి వస్తున్నట్టు భావించుకునేవాడు. చెట్ల మీదా, బెంచీల మీదా, కిటికీ రెక్కల మీదా, చర్చి గోడల మీదా తన పేరు రాసి, ఉనికిని చాటుకునే అలవాటు అతనికి ఉండేది. యాభై ఏళ్ల తర్వాత అతను ఆ ఊరు వెళ్లినప్పుడు, చిన్నతనంలో చర్చి తోటలోని నిమ్మచెట్టు మీద తను చెక్కిన పేరు ఉందా లేదా అని చూసుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పేరు అలాగే ఉంది!

తన నలుగురు అక్కచెల్లెళ్లలోనూ డొరోతియా, విల్హెమైన్ లకు అతను ఎక్కువ మాలిమిగా ఉండేవాడు. వాళ్ళమ్మ ఓ మెజిస్ట్రేట్ కూతురు. చాలా నెమ్మదస్తురాలు. పెళ్లయేనాటికి ఆమెకు పదహారేళ్లు. భర్త ఎర్నెస్ట్ కన్నా పదమూడేళ్లు చిన్న. ఆమె దాంపత్యజీవితాన్ని ఏనాడూ ఆనందించలేదు. భర్త ఆమెను పురుగులా చూసేవాడు. పెత్తనం చేసేవాడు. పిల్లలకు మాత్రం తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమె అల్లికలు, కుట్లు చేసేది. పియానో వాయించేది. డాబుసరి మనిషిగా ఊహించుకుని గ్రామస్తులు కూడా ఆమెపట్ల అయిష్టంగా ఉండేవారు. పెత్తందారీకి తోడు భర్త వంట మనుషులతో అక్రమసంబంధాలు పెట్టుకోవడంతో ఆమె మరింత కుంగిపోయింది.

తొంభయ్యేళ్లు జీవించిన ఎర్నెస్ట్  స్త్రీలోలుడిగా అపకీర్తినే మూటగట్టుకున్నాడు. పాస్టర్ కావడానికి ముందు అతను స్కూలు టీచర్ గా పనిచేశాడు. బోధన లో అతనికి మంచి నేర్పు ఉండేది. పిల్లలచేత తనే అక్షరాలు దిద్దించాడు. తన పుస్తకాలలోని చక్కని బొమ్మల్ని పిల్లలకు చూపించి ఆనందించేవాడు. ఓ రోజు అతను తమ పేదరికం మీద మండిపడ్డాడు. అప్పుడు, “ ఓ వెండి గిన్నెనో, బంగారు ఊయెలనో తవ్వి తీయచ్చుగా” అన్నాడు హైన్ రిచ్ అమాయకంగా. ఆ మాటకు తండ్రి నవ్వేశాడు.

ఎర్నెస్ట్ కళాకళల మనిషి. ఒక్కోసారి చాలా ఉదారంగా ఉండేవాడు. ఒక్కోసారి పిసినారిలా వ్యవహరించేవాడు. హఠాత్తుగా కాఠిన్యం తెచ్చుకునేవాడు. అది ఎదుటి వాళ్ళకు వింతగానూ, వినోదంగానూ ఉండేది. కథలు మాత్రం మహా రంజుగా చెప్పేవాడు. పిల్లల్ని ఊరి వెంట, పొలాల  వెంట షికారుకు తీసుకెళ్ళడం అతనికి ఎంతో ఇష్టమైన వ్యాపకం. దారిలో ఎదురయ్యే ప్రదేశాలు, పొలాలు, కట్టడాల చరిత్రను వాళ్ళకు ఎంతో ఆసక్తిగా చెబుతూ ఉండేవాడు. ఆ చెప్పడంలో కూడా అప్పటికప్పుడు కథలు అల్లేవాడు.  ఆ అల్లిక రాను రాను హాస్యాస్పదంగా పరిణమించేది. అయినాసరే, పిల్లలకు అది నమ్మశక్యంగానే అనిపించేది. వారు ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టుకుని వింటుంటే ఉన్నట్టుండి పెద్ద పెట్టున నవ్వేసేవాడు. శీతాకాలపు సాయంత్రాలలో పిల్లలు అల్లరి చేయకుండా హోమర్ నుంచి కథలు చెప్పేవాడు. ఆ చిన్నపాటి చర్చి కాస్తా ట్రోజన్ యుద్ధారావాలతో కంపించిపోయేవరకూ ఆ కథనం సాగుతూ ఉండేది.

అతనికి గ్రీకు తెలియదు. హోమర్ రచనల మూలాన్ని ఎప్పుడూ చదవలేదు. అయినాసరే, ఇలియద్, ఒడిస్సేలపై అతని ఆసక్తికి అవి అడ్డురాలేదు. జర్మన్లు అందరికీ హోమర్ బాగా తెలుసు. గథే, షిల్లర్ లాంటి ఎందరో జర్మన్ కవులు హోమర్ ను అనుకరించారు, ఆరాధించారు, కవిగా ఆయనను ఆకాశానికి ఎత్తారు. హోమర్ రచనలకు జర్మన్ లో అద్భుతమైన అనువాదాలు వచ్చాయి. వాటన్నింటిలోనూ ప్రసిద్ధమైనది జె. హెచ్, వాస్ అనువాదం. విశేషమేమిటంటే, వాస్ యువకుడిగా ఉన్నప్పుడు, హోస్టీన్ ఆ గోవుల కాపరిని సజీవదహనం చేసిన కోటలోనే  కొన్ని మాసాలపాటు ట్యూటర్ గా గడిపాడు.

ఆవిధంగా హోమర్ హీరోలను పిల్లలు సొంత ఆస్తిగా భావించుకునేవారు. అచియన్లకు, ట్రోజన్లకు మధ్య జరిగిన యుద్ధాల కథలను ఊపిరి బిగబెట్టి వింటుండేవారు. వాళ్ళ ఊహలో అంకెర్షగన్ కోటకు చెందిన శిథిలమైన బురుజులు, యుద్ధప్రదేశాలలోనే ట్రోజన్ యుద్ధం జరిగిపోతూ ఉండేది. అంకెర్షగనే  వాళ్ళ ట్రాయ్ నగరం. అలాగే ట్రాయ్ హీరోల జీవితాలు, వాళ్ళ జీవితాలు ఒకటిగా కలసిపోయేవి.

1829 క్రిస్టమస్ రోజున హైన్ రిచ్ కు వాళ్ళ నాన్న లుడ్విగ్ జెర్రర్ రాసిన సచిత్ర ప్రపంచ చరిత్ర(Illustrated History of the World)ను కానుకగా ఇచ్చాడు. అప్పటికి హైన్ రిచ్ కు ఏడేళ్లు. వెంటనే పేజీలు తిరగేస్తుంటే, ట్రాయ్ నగరం దగ్ధమైపోతున్న దృశ్యం కనిపించింది. తురాయితో ఉన్న శిరస్త్రాణాన్ని, కవచాన్ని ధరించిన ఇనియెస్; తండ్రి ఎంకైసిస్ ను వీపున మోస్తూ, కొడుకు అస్కేనియెస్ చేయి పట్టుకుని ఆ పొగలోంచీ, మంటల్లోంచీ ముందుకు నడుస్తూ ఉంటాడు. ఆ చిత్రం హైన్ రిచ్ ను ఎంతో ఆకట్టుకుంది. అందులోని ప్రతి వివరం అంకెర్షగన్ నే ట్రాయ్ గా ఊహించుకోడానికి అతనికి సాయపడింది. గుండ్రని బురుజులు, ఎత్తైన కోట గోడలు,  అతిపెద్ద సింహద్వారం-అన్నీ అంకెర్షగన్ లో ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇంతకు ముందున్న పాస్టర్ కు, ఇనియెస్ కు మధ్య పోలికలు కొట్టొచ్చినట్టు కనిపించడం. ఎత్తైన నుదురు, విశాలమైన కళ్ళు, బండ ముక్కుతో ఇద్దరూ సరిగ్గా ఒకేలా ఉన్నారు. ఇనియెస్ తగలబడుతున్న ట్రాయ్ నుంచి భయంతో పారిపోతున్నవాడిలా లేడు. నెమ్మదిగా, ప్రశాంతంగా, వెనుదిరిగి చూడకుండా పొగ లోంచి బయటికి వస్తున్నవాడిలా ఉన్నాడు.

ఈ చిత్రాన్ని చూడడం తన జీవితంలో ఒక మలుపు అంటాడు, పెద్దైన తర్వాత హైన్ రిచ్. భూమిలో కప్పడిపోయిన  ట్రాయ్ నగరాన్ని ఎప్పటికైనా తవ్వి తీయాలని, ఆ చిత్రాన్ని చూసిన క్షణంలోనే  అతను నిర్ణయించుకున్నాడు. నగరం తగలబడిపోయినా కోట గోడలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని వాళ్ళ నాన్నతో అన్నాడు. బహుశా జెర్రర్ ఆ నగరాన్ని చూసి ఉంటాడని కూడా అన్నాడు.

“లేదు, లేదు. మొత్తం ట్రాయ్ అంతా తగలబడి బూడిదైపోయింది. నువ్వు చూసింది వట్టి ఊహాచిత్రం” అన్నాడు ఎర్నెస్ట్.

“కానీ ట్రాయ్ లో ఆ బొమ్మలో చూపిన గోడల్లాంటివే ఉండి ఉంటాయి” అన్నాడు అబ్బాయి.

“అవును”

“అంత పెద్ద పెద్ద గోడల్ని మంటలేం చేస్తాయి? వాటిలో కొన్నైనా మిగిలే ఉంటాయి”

“లేదు, మిగిలే అవకాశమే లే”దని తండ్రి ఖండితంగా అన్నాడు. కానీ అబ్బాయి మాత్రం తన అభిప్రాయానికే కట్టుబడి ఉండిపోయాడు. ఏదో ఒక రోజున తను ట్రాయ్ కి వెళ్ళి జెర్రర్ తన పుస్తకంలో కళ్ళకు కట్టేలా వర్ణించిన గోడల్ని, బురుజుల్ని కనిపెట్టి తీరతానని అనుకున్నాడు.

యాభై ఏళ్ల తర్వాత ముక్క ముక్కలుగా తను రాసుకున్న ఆత్మకథలో హైన్ రిచ్ ఈ బాల్యస్మృతులను నెమరువేసుకున్నప్పుడు పండితులు కనుబొమలు ఎగరేశారు. తన ఏడో ఏట తండ్రితో జరిగినట్టు చెబుతున్న ఆ సంభాషణ ఆయనకు అంతగా గుర్తుండడం నమ్మశక్యంగా లేదన్నారు. ట్రాయ్ ని తవ్వి తీయడం గురించి తను కలలు కనని క్షణం, ఆలోచించని రోజు తన జీవితం మొత్తంలోనే లేవనీ; ఎత్తైన ట్రోజన్ గోడలపై విజయగర్వంతో నిలబడే రోజు కోసమే తన శక్తియుక్తులన్నీ వెచ్చించాననీ హైన్ రిచ్ సమాధానం చెప్పినప్పుడు కూడా పండితులు ఆయనను అనుమానంగా చూశారు. కానీ బాల్యం నుంచీ ఆయన ఆసక్తులను, జీవన గమనాన్ని పట్టి చూస్తే ఆయన మాటలు అతిశయోక్తులనిపించవు.

ఆ అబ్బాయి అలా కలలు కంటూనే స్కూలుకు వెళ్ళి వస్తున్నాడు. ఇంకా విచిత్రంగా తన ఏడో ఏటే అతను ప్రేమలో కూడా పడ్డాడు. ఆ అమ్మాయి పేరు మిన్నా మెయింక్. సరిగ్గా అతని వయసే. ఓ రైతు కూతురు. పసుపు రంగు జుట్టు, నీలి కళ్ళు-ఓ అందమైన బొమ్మలా ఉంటుంది. ఓ రోజు ఇద్దరూ డ్యాన్సింగ్ క్లాసులో కలసుకున్నారు. అప్పటినుంచీ విడదీయలేని జంటగా మారిపోయారు. హైన్ రిచ్ చెప్పే కథల్ని ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. ఓ రోజు మెయింక్ కుటుంబం అంతా చర్చికి వచ్చారు. దూరం నుంచి వాళ్ళను చూస్తూనే హైన్ రిచ్ అక్కడినుంచి మాయమైపోయాడు. సాధారణంగా చింపిరి జుట్టుతో ఉండేవాడు కాస్తా, సబ్బుతో నిగనిగలాడేలా మొహం తోముకుని, చక్కగా తల దువ్వుకుని, ఉన్నంతలో మంచి సూటు వేసుకుని పెళ్లికొడుకులా వాళ్ళ ముందుకు వచ్చాడు. ఇంట్లో వాళ్ళు అతన్ని వింతగా గుడ్లప్పగించి చూశారు. ఆ అమ్మాయిని మెప్పించడం కోసమే ఇంత వేషం కట్టాడని ఆ తర్వాత కానీ వాళ్ళకు తట్టలేదు.

ఆ ఏడేళ్ళ వయసులోనే మిన్నాపై అతనికి ఎంత అచంచలమైన ప్రేమంటే, ఎప్పుడూ ఆ అమ్మాయి పక్కనే ఉండేవాడు. స్కూలులో పక్కనే కూర్చునేవాడు.  కలసి డ్యాన్సింగ్ క్లాసుకు వెళ్ళేవాడు. ఇద్దరూ పుట్టలు, గుట్టలవెంట కలసి తిరిగేవారు. కోట దగ్గర, శ్మశానం దగ్గర వేళ్లాడుతూ ఉండేవారు. హెన్నింగ్ వన్ హోస్టీన్ కాలు రాళ్లనుంచి పొడుచుకొచ్చిన చోటు కూడా వాళ్ళు చూశారు. గోవుల కాపరిని సజీవదహనం చేసిన ప్రదేశాన్ని, రహస్యమార్గాలను జంటగా పరిశీలించారు. ఆ కోటలో హోస్టీన్ అనే బందిపోటు నిజంగా ఉండేవాడా అని కనిపించిన వాళ్ళ నందరినీ అడిగారు. ఏటా ఒకసారి అతని కాలు కనిపించేదనీ, ఈ మధ్యనే ఎవరో చెట్ల పండ్లు రాల్చడం కోసం దానిని ఊడబెరికాడనీ చర్చి పనివాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటల్ని వాళ్ళిద్దరూ నమ్మేశారు. ఆ ఊళ్ళో పీటర్ హప్పర్ట్ అనే దర్జీ ఉండేవాడు. అతనికి ఒకే కన్ను, ఒకే కాలు. దాంతో అతని నడక గెంతీనట్టుగా ఉండేది. అందరూ అతన్ని ‘గెంతుల పీటర్’ అనేవారు. మళ్ళీ కథలు చెప్పడంలో అంతటి మొనగాడు లేడు. దానికితోడు అతనిది అధ్బుతమైన జ్ఞాపకశక్తి. చాలామంది నిరక్షరాస్యుల్లానే అతను కూడా విన్నది ప్రతిదీ గుర్తుపెట్టుకునేవాడు. గడిచిన ఆదివారం పాస్టర్ స్లీమన్ చేసిన మొత్తం ప్రబోధాన్ని ఉన్నదున్నట్టు అప్పజెప్పేవాడు.

అతనో రోజున ఓ ముచ్చట చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఊళ్లో వేసవిలో కనిపించే గూడకొంగలు శీతాకాలంలో ఎక్కడికి వెడతాయన్న సందేహం అతనికి కలిగిందట. చర్చి పనివాడి సాయంతో ఓ కొంగను పట్టుకున్నాడు. “వేసవిలో ఈ కొంగ షివేరిన్-మెక్లంబర్గ్ లోని అంకెర్షగన్ లో గూడుకట్టుకుంది. దీనిని చూసినవారు శీతాకాలంలో ఇది ఎక్కడ గడిపిందో దయచేసి తెలియజేయగలరు” అని ఒక తోలు కాగితం మీద రాసి, కొంగ కాలికి కట్టాడు. మరుసటి వేసవికి ఆ కొంగ తిరిగివచ్చింది. దాని కాలికి ఒక చర్మపత్రం కట్టి ఉంది. దాని మీద,  “మాకు షివేరిన్-మెక్లంబర్గ్ ఎక్కడుందో తెలియదు. ఈ కొంగ కనిపించిన ప్రదేశాన్ని సెయింట్ జాన్స్ లాండ్ అంటారు” అని చిత్రలిపిలో రాసిన వాక్యాలు ఉన్నాయి.

near ankershagen castle

“మేము పీటర్ మాటల్ని నమ్మాం . సెయింట్ జాన్స్ లాండ్ అనే ఆ మార్మిక ప్రదేశం ఎక్కడుందో కనిపెట్టడానికి మా జీవితకాలం మొత్తాన్ని ధారపోసి ఉండేవాళ్లం” అని ఆ తర్వాతి కాలంలో ఆ అబ్బాయి రాసుకున్నాడు. బహుశా అది ట్రాయ్ కి మరో పేరు అయుంటుంది!

ఇక చర్చికి తిరిగొస్తే అక్కడా వింతలు, విశేషాలకు లోటులేదు. ఎప్పుడో చనిపోయినవారి పేర్లను నమోదు చేసిన పురాతన, భారీ రిజిస్టర్లు అందులో ఉన్నాయి. అవి బరువైన గోతిక్ రాతలో ఉన్నాయి. 1709-1799 మధ్యకాలంలో 90 ఏళ్లపాటు పాస్టర్లుగా ఉన్న జొహాన్ క్రిస్టియన్ వాన్ ష్రోడర్, అతని కొడుకు గాట్ ఫ్రైడ్ రిచ్ స్వహస్తాలతో రాసిన రిజిస్టర్లు అవి. పిల్లలు అప్పుడప్పుడు ఆ పేజీలు తిరగేసేవారు. వాటి సంరక్షణ హక్కు తనకు ఉన్నట్టు హైన్ రిచ్ కు అనిపించేది. గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురు 84 ఏళ్ల వయసులో అప్పటికింకా జీవించే ఉంది. పుట్టుకలు, పెళ్లిళ్లు, చావుల నమోదుతో అంతూపొంతూ లేకుండా సాగే ఆ రిజిస్టర్లను తిరగేసి అలసిపోయిన తర్వాత గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురింటికి వెళ్ళేవారు. ఆమెకు ఆ ఊరి గురించి, గ్రామస్తుల గురించి తెలియని దంటూ లేదు. పిల్లలకు తన పూర్వీకుల చిత్రపటాలు చూపిస్తూ ఉండేది. ప్రత్యేకించి వాళ్ళ అమ్మ ఓల్గార్తా క్రిస్టైన్ వాన్ ష్రోడర్ చిత్రం హైన్ రిచ్ కు ఎంతగానో నచ్చేసింది. ఆమె అచ్చం మిన్నా లానే ఉంది.

అలా హైన్ రిచ్, మిన్నాలు రెండేళ్లపాటు చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. ఒకరి రహస్యాలు ఒకరు చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలసి ఉండాలనుకున్నారు. అది కూడా అంకెర్షగన్ లోనే. అక్కడి ఎత్తైన చర్చి గోపురం, తోట, శ్మశానం, కొండ మీద పెద్ద కోట—ఇవే వాళ్ళకు తెలిసిన ఏకైక ప్రపంచం. తమ కలల్లో ఇంకొకరి జోక్యానికి ఒప్పుకోకూడదని కూడా ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు.

కానీ వారి కలలకు హఠాత్తుగా అంతరాయం కలిగింది. ఉన్నట్టుండి తమ చుట్టూ ఉన్న ప్రపంచం ఓ బూడిద కుప్పగా వారికి తోచింది…

  (సశేషం)

 

 

చావుపుటక లేనిదమ్మ నేస్తమన్నది…!

 

వంగూరి చిట్టెన్ రాజు

chitten raju“మామా” అని నన్ను అతనూ, “దాసూ” అని నేను అతన్నీ ఆత్మీయంగా సంబోధించుకోవడం 1970 కంటే ముందే ప్రారంభం అయి నలభై ఏళ్ల పైగానే కొనసాగింది. అప్పటికి అతను ఇంకా సినిమాలలో పాడ లేదు. ఆతని మేన మామ పి.ఆర్.కె. రావు అనే కిష్టప్ప, నేనూ బొంబాయి ఐ.ఐ.టి.లో క్లాస్ మేట్స్ మాత్రమే కాక అత్యంత సన్నిహితులం. ఆ కిష్టప్ప గాయని పి. సుశీల తమ్ముడు అని మా స్నేహం బాగా కుదురుకున్న ఆరు నెలల తరువాత ఏదో మాటల సందర్భంలో తెలిసింది. అతని పెద్దక్క రత్తక్క గారి అబ్బాయే ఈ రామకృష్ణ దాసు.

హైదరాబాదు వెళ్ళినప్పుడు రావుతో రత్తక్క, బావ గారు రంగ సాయి వాళ్ళింటికి వెళ్ళినపుడు మా కంటే కొంచెం చిన్నవాడే అయిన దాసు పరిచయం అయ్యాడు. ఆ క్షణం నుంచీ రావు తో పాటు నన్ను కూడా “మామా” అనే పిలవడం మొదలుపెట్టి మా కుటుంబంలో కలిసిపోయాడు. అప్పటికే ఘంటసాల బాణీ అలవాటు చేసుకుని, పునాదులు గట్టిపడడం కోసం శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. నిజానికి అతని చెల్లెలు (పేరు మర్చిపోయాను) అచ్చు సుశీల గారి లా బాగా పాడేది. ఆ రోజుల్లో మరో మిత్రుడు టి.పి. కిషోర్ గాడి పెళ్ళికి నేనూ, రావూ, దాసూ మగ పెళ్లి వారి తరఫున ఏదో ఊరు వెళ్లాం. (మంచి రచయిత, నటుడు అయిన ఈ కిషోర్ పదిహేనేళ్ళ క్రితం హఠాత్తుగా పోయాడు). ఆ పెళ్ళిలో దాసు ఘంటసాల గారి “శేషశైలా వాస” తో మొదలుపెట్టి చాలా పాటలు హాయిగా పాడాడు. అది ఇప్పటికీ నాకు మరపురాని జ్ఞాపకమే!

ఆ తరువాతో, ముందో గుర్తు లేదు కానీ రావు పెళ్ళికి నేనూ, కిషోరు గాడూ మద్రాసు వెళ్లాం. మేనరికమే కాబట్టి ఆ పెళ్లి పి. సుశీల గారి ఇంట్లోనే జరిగింది. మే ఇద్దరం పెళ్లి కొడుకు స్నేహితులమే అయినా భయం, భయంగా కూచుంటే దాసు మమ్మల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడు.

ఆ తరువాత ఘంటసాల గారు బతికున్న రోజులలోనే (1972 అనుకుంటాను) అతను సినిమాలలో పాడడం మొదలు పెట్టి “అపర ఘంట సాల” గా పేరు తెచ్చుకున్నాడు. “మా రామకృష్ణయ్య ఉన్నంత కాలం నా పాటని ఎవరూ మర్చిపోలేరు” అని ఘంటసాల వారే స్వయంగా అన్నారంటే రామకృష్ణ ప్రతిభ ఎంతటిదో తెలుస్తోంది. “ఘంటసాల గారు పోయినప్పుడు మొదటి దండ వేసిన వాణ్ణి నేనే” అని నాతో ఎంతో బాధపడుతూ చెప్పాడు దాసు ఒక సారి. ఘంటసాల గారి లాగానే రామకృష్ణ కూడా గొంతు కేన్సర్ తోటే మరణించాడంటే నమ్మబుద్ది కావడం లేదు.

playback_singer_0

అతను సినిమాలలో బాగా పేరు తెచ్చుకుని బిజీగా ఉంటున్నా, నేను ఎప్పుడైనా మద్రాసు వెళ్ళినప్పుడు వాళ్ళింటికి వెళ్ళేవాడిని. ఆ విధంగా మా పరిచయం అడపా , తడపా చాలా ఏళ్ళే కొనసాగింది. 1989 లో హ్యూస్టన్ లో తానా కి ఫై.సుశీల తో రామకృష్ణ ప్రధాన గాయకుడి గా పూర్తి ఆర్కేష్ట్రా తో వచ్చాడు. నాకు తెలిసీ అదే అతను మొదటి సారి అమెరికా రావడం అప్పుడు “చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడా” తో కార్యక్రమం ప్రారంభించి సుశీల గారితో చాలా బాగా పాడాడు రామకృష్ణ. అప్పటి నుంచీ కాస్త రెగ్యులర్  టచ్ లోనే ఉండే వాళ్ళం. ఎప్పుడు అమెరికా వచ్చినా ఎక్కడి నుంచో ఫోన్ చేసే వాడు.

1998 లో అనుకుంటాను. ఓ రోజు దాసు నుంచి ఫోన్ వచ్చింది.”మామా, నేనూ నీ అభిమాన గాయకుడు దాసు ని” అనుకుంటూ.
ఎక్కడి నుంచి, దాసూ, అమెరికా లో ఉన్నావా” అని అడిగాను.” అవును మామా. డిట్రాయిట్ లో మన చెరుకూరి రమా దేవి గారి ఇంట్లో ఉన్నాను.” అన్నాడు. “ఎన్నాళ్లుంటావు. టూర్ మీద వచ్చావా?” అని అడిగాను. “అక్కడే కొంప ములిగింది మామా, అందుకే నిన్ను పిలుస్తున్నాను. నీట ముంచినా, పాల ముంచినా నీదే భారం” అని అసలు సంగతి వివరించాడు.

అసలు ఏం జరిగింది అంటే తానా లో పాడడానికి అతన్ని ఒక మ్యూజిక్ ట్రూప్ వాళ్ళు ప్రధాన గాయకుడి గా తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం అయ్యాక అమెరికాలో ఇతర నగరాలలో కూడా జరిగే కార్యక్రమాలకి కూడా ఇతన్ని తీసుకెళ్ళాలి కానీ ఎందుకో రామకృష్ణ ని డ్రాప్ చేసి ఇండియా వెళ్ళిపో అన్నారుట. దానికి అసలు కారణం ఆ ట్రూప్ నాయకుడు కూడా పాటగాడే కాబట్టి ఇతనికి ఇవ్వాల్సిన డబ్బులు మిగుల్చుకోవచ్చును కదా! “చచ్చేటంత ఖర్చు, శ్రమా పడి వచ్చాను మామా, నాలుగు ప్రోగ్రాములు కూడా చేసుకోకుండా వెనక్కి పోడం ఎలా?” అని దాసు నా సలహా అడిగాడు.” సరేలే, ముందు మా హ్యూస్టన్ వచ్చేసి మా ఇంట్లో ఉండు. ఎన్ని ప్రోగ్రాములు పెట్టించగలనో అప్పుడు చూద్దాం” అని రామకృష్ణ ని హ్యూస్టన్ ఆహ్వానించాను.

అప్పుడు మా ఇంట్లో మూడు నెలలు ఉండి, మా కుటుంబంలో ఒకడుగా, మా పిల్లలకి “రామకృష్ణ అంకుల్” గా స్థిరపడిపోయాడు రామకృష్ణ దాసు.  ఆ రోజుల్లో అతనికి మా ఊళ్లో ఉన్న ఔత్సాహిక గాయనీ మణులు మణి శాస్త్రి, శారద ఆకునూరి, ఉమా మంత్రవాది మొదలైన వారికి పరిచయం చేసి రక రకాల కారణాలతో టెక్సస్ లోనూ ఇతర చోట్లా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యగలిగాను. చంద్ర కాంత, డేవిడ్ కోర్ట్నీ లు ఎంతో సహకరించారు. వాటిల్లో ఓ చిన్న హౌస్ కాన్సెర్ట్ ఫోటో ఒక్కటే నా దగ్గర ఉంది. ఇందుతో జత పరుస్తున్న ఆ ఫోటోలో రామకృష్ణ కి తబలా సహకారం అందిస్తున్నది రఘు చక్రవర్తి.  ఆ మూడు నెలల సహవాసం లోనూ రామకృష్ణ ఎన్నెన్నో సినిమా సంగతులు నాతో పంచుకునే వాడు.

V. Ramakrsihna

కానీ ఎన్నడూ అతని నోట తప్పుడు మాటలు విన లేదు. “దాన, వీర, శూర కర్ణ” సినిమాలో పాడినప్పుడు ఎన్టీ ఆర్ తో అనుభవాలు, ఎస్. రాజేశ్వర రావు గారి తో మహా బలిపురం పిక్నిక్ వివరాలు మొదలైనవి మంచి రసవత్తరంగా వివరించే వాడు..తను కూడా మళ్ళీ , మళ్ళీ ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ. ఒక సారి రామకృష్ణ నీ, ముత్యాల పద్మశ్రీ , సుప్రసిద్ద గాయని అవసరాల అనసూయ గారిని నేను అప్రస్తుత ప్రసంగం చేసిన నాగఫణి శర్మ గారి అష్టావధానం కార్యక్రమానికి డాలస్ తీసుకెళ్ళాను. ఆ మూడు గంటలూ రామకృష్ణ’ ఓపికగా కూచుని “మామా, ఈ ఒక్క రోజునే చాలా తెలుగు నేర్చేసుకున్నాను. అష్టావధానం గురించి వినడమే కానీ చూడ్డం ఇదే మొదటి సారి. ఇంకా నయం. నన్ను ఆ పైన కుర్చీలో పృచ్చకుడిగా  కూచోబెట్టావు కాదు. కొంప ములిగిపోవును.” అన్నాడు నవ్వుతూ. అంత సింపుల్ మనిషి అతను. మొత్తానికి ఆ మూడు నెలలూ అయ్యాక, ప్రోగ్రాములు పూర్తి చేసుకుని ఇండియా వెళ్తున్నప్పుడు “ఏం దాసూ, ఇప్పుడు పరవా లేదా, నాలుగు రాళ్ళు సంపాదించుకున్నావా?” అని నేను అడగగానే “పరవా లేదు మామా, మా ఇంట్లో ఓ కిటికీకి నీ పేరు పెట్టుకుంటాను” అన్నాడు. ఆ రోజుల్లోనే అనుకుంటాను దాసు కొత్త ఇల్లు హైదరాబాదు లో కట్టుకున్నది. అందుకే ఆ చమత్కారం.

ఆ తరువాత మేము ఒక సారి ఇండియా వెళ్ళినప్పుడు మా అబ్బాయి, అమ్మయిలు “రామకృష్ణ అంకుల్ ని చూద్దామ్” అనగానే వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్లి, భార్య జ్యోతి ని, కొడుకు హీరో సాయి కిరణ్ నీ కూడా కలిశాం. అప్పుడు త్యాగరాజ గాన సభలో మా అమ్మాయిలు చేసిన కూచిపూడి కార్యక్రమానికి దాసు నెల్లూరు లో ప్రోగ్రాం ఉండి రాలేక పోయాడు కానీ జ్యోతి, సాయి కిరణ్ వచ్చారు.

ఈ మధ్య ఫేస్ బుక్ వచ్చాక మరి కాస్త రెగ్యులర్ గానే మాట్లాడుకుంటున్నాం కానీ రామకృష్ణ అనారోగ్యం సంగతి గురించి తెలియ లేదు. “మాంచి అమెరికా టూర్ పెట్టించు మామా” అన్నది ఆ మధ్య అతని ఆఖరి కోరిక. ఆ కోరిక తీరకుండానే నా అభిమాన గాయకుడు, చిరకాల మిత్రుడు రామకృష్ణ దాసు వెనక్కి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరం. అతని ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.

*

పాటల పడవెళ్ళి పోయిందిరా…!

 

ముళ్ళపూడి సుబ్బారావు

Srmతెలుగు సినీ సంగీతం పట్ల అభిరుచి ఉన్నవారికి పరిచయం అవసరంలేని పేరు రామకృష్ణ. (పూర్తి పేరు వి.రామకృష్ణదాస్). తెలుగు సిని సంగీతంలో (హింది సీమలో కూడా) స్వర్ణ యుగంగా చెప్పబడే అరవైలు, డెబ్భై లలో, డెబ్భయ్యవ దశకంలో నేపధ్య గాయకుడిగా గాఢమైన ముద్ర వేసిన గాయకుడు రామకృష్ణ. చిత్రరంగ ప్రవేశం తోనే అగ్రనటునకు నేపధ్య గానం చేసే అవకాశం లభించింది.అనతికాలంలోనే అగ్రనటులందరికీ పాటలు పాడే అవకాశాలు అందుకున్నాడు. ఐదారు సంవత్సరాలు నేపధ్య గాయకుడిగా మంచి స్థితి అనుభవింఛాడు.

రామకృష్ణ కు అవకాశాలు రావడానికి, గాయకుడిగా అతని ప్రస్థానం,దాని భూమిక ను పరిశించదలిస్తే అనేకవిషయాలు అవలోకించాలి.

తెలుగు సినిమా పాట-ఘంటసాల ఘరానా:

ఘరానా అనే పదానికి  తెలుగులో వాడుకలో ఉన్న అర్ధం గొప్పదేం కాదు. ఐతే హిందూస్తానీ సంగీతంలో ఘరానా అనేది గాయకుల, సంగీతకారుల బాణీని,సాంప్రదాయాన్ని  సూచించేది.అందులో ప్రాంతం కూడా కలసి ఉంటుంది.(ఉదా:  పటియాలా ఘరానా,ఆగ్రా ఘరానా). తెలుగు సినిమా పాటలకు సంబంధించి ఘంటసాల ఘరానా 70లవరకూ రాజ్యమేలింది. ఘంటసాల ఇదివరకటంత ఉత్సాహం గా పాడలేకపోవటం తో అదే తరహా లో సాగే ఆమోదయోగ్యమైన యువ స్వరం అవసరం సీనియర్ నటులకు కలిగింది. బాలూ ఘరానా ఇంకా వేళ్ళునుకునే స్థితిలోనే ఉంది. ఘంటసాల బాణీకి అలవాటుపడి ఉన్న ప్రేక్షకులు,శ్రోతలు అందుకు భిన్నమైన స్టైల్ ను ఇష్టపడతారా అనేదానిపై అందరికి అనుమానాలున్నాయి. ఘంటసాల కు భిన్నమైన పంథాలోనే సాగుదామని బాలు నిర్ణయించుకున్నట్టు అప్పటి బాలు పాటలు ఉంటాయి. ఎన్.టి.ఆర్, ఏ ఎన్నార్ లు బాలు తో ప్రయత్నించారు కాని బాలు ను ఘంటసాల కు ప్రత్యమ్నాయంగా చూడలేకపోయారు.  ఆ వెతుకులాటలో ఏ ఎన్నార్ కు రామకృష్ణలో ఘంటసాల ఘరానా కనపడి ఉండవచ్చు.

ఘంటసాల బాణీలోనే, ఘంటసాలతో పాటు కొన్ని సినిమాలకు ప్రముఖ హీరో లకు పాడటం,అవి ప్రేక్షకామోదం పొందటం వల్ల ఘంటసాల కు కొనసాగింపుగా రామకృష్ణ ముందుకు వచ్చాడు. ఫ్రఖ్యాత గాయని సుశీల చుట్టరికంకూడా ఈ ఎదుగుదలకు కొంత దోహదపడి ఉండవచ్చు.

హిందీ సినిమ సంగితంలో ఇదే తరహా ను గమనించవచ్చు. నలభైలనుండీ 1990 వరకూ హిందీ పాటల్ని గమనిస్తే ప్రముఖంగా వినిపించే స్వరాలు ..కె.ఎల్ సైగల్, ముఖేష్, మహమ్మద్ రఫి,కిశోర్ కుమార్ లవి.

స్టార్ స్టేటస్ అనుభవించిన ప్రతీ గాయకుడుకి తర్వాత కాలంలో ఆయన్ని అనుకరిస్తూ పాడే గాయకులు ఉంటారు. కొన్నిసార్లు ప్రధాన గాయకుడు పాడుతున్నపుడే అనుకరణలు కూడా కొనసాగుతాయి. హిందీ చిత్రసీమలో ఆరకం గా సైగల్ ను ఆయన తర్వాత వచ్చిన ముఖేష్, కిశోర్ లు అనుకరించారు. తర్వాత ఇద్దరూ తమ సొంత బాణీ ని ఏర్పరచుకున్నారు.

ముఖేష్  క్లోన్ గా ఆయన కొడుకు నితిన్ ముఖేష్, అంతకు ముందే (1969) గాయకుడిగా పరిచయమైన మన్ హర్ ఉధాస్ ని చెబుతారు.మహేంద్ర కపూర్ మొదటి రోజుల్లో పాడిన కొన్ని పాటలు జాగ్రత్త గా వినకపోతే రఫీ పాటలే అనుకునేంత సామీప్యత ఉంటుంది. రఫీ తరహా లో అన్వర్ (హం సె కా బూల్…. జనతా హవల్దార్) , జస్పాల్ సింగ్ (గీత్ గాతా చల్) రఫీ ఫీల్డ్ లో ఉన్నపుడే వచ్చారు. రఫీ మరణం తర్వాత, ఆ స్లాట్ ను భర్తీ చేయడం లో వచ్చిన  షబ్బీర్ కుమార్, మహమ్మద్ అజీజ్ ఆతర్వాత ఉదిత్ నారాయణ్, సోను నిగం రఫీ క్లోన్స్ గా ముద్ర పడ్డారు.కిశోర్ కుమార్ కు క్లోన్స్ గా కుమార్ సాను, అభిజీత్ కొనసాగారు. కిశోర్ కొడుకు అమిత్ కుమార్ గాయకుడైన కిశోర్ ను పూర్తిగా ఇమిటేట్ చేసినట్టు కనపడదు.

అలాగే తెలుగు లో ఘంటసాల కు ప్రత్యమ్నాయంగా రామకృష్ణను ప్రోత్సహించడటాన్ని చూడాల్సి ఉంటుంది.ఘంటసాల పాటలు పాడుతున్నపుడే రామకృష్ణ చిత్రరంగ ప్రవేశం జరగటం, ఘంటసాల తొ కలిసి చిత్రంలో పాటలు పంచుకోవడం, కొన్ని పాటల్లో ఘంటసాల తో (విత్ అవుట్ క్రెడిట్స్) పాడటం,( తింటే గారెలే తినాలి వింటే భారం వినాలి- కన్న కొడుకు (1973)  -రామ కృష్ణ ఇంటర్వ్యూ) వంటివి ఇక్కడి ప్రత్యేకం. రారా మా ఇంటికి  నిదురరాదు నా కంటికి (దొరబాబు 1974) పాటలో పల్లవి రామకృష్ణ పాడింది చరణాలు ఘంటసాల పాడింది సినిమాలో వినిపిస్తుంది.

తెలుగు సినిమాలలో 1950 నుండి 1980 వరకు కథానాయకులకు నేపధ్యగానాన్ని తరచిచూస్తే మూడు దశలు గమనించవచ్చు.అవి

1950 -1973    ఘంటసాల కాలం

యాభయ్యవ దశకం ప్రారంభంలోనే తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్ డం ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రూపంలో  ప్రవేశించింది.తొలి రోజుల్లో ఇద్దరూ పౌరాణిక, జానపద,సాంఘిక చిత్రాల్లొ నటించినా వాటిని పంచుకున్నట్టుగా రామారావు జానపద, పౌరాణిక చిత్రాల్లోనూ, నాగేశ్వరరావు సాంఘిక చిత్రాల్లో ను రాణించారు.సాంఘిక చిత్రాల్లో రామారావు నటించినా, ఇరువురి ముద్రల మధ్య స్పష్టమైన తేడా కనిపించేది. వారి దర్శకులువేరు,నిర్మాతలు వేరు,నిర్మాతలు వేరు,సంగీత దర్శకులు వేరు. ఐతే వారిరువురికి సంబంధించి ఒక సామాన్యమైన విషయం వారి నెపధ్య గాయకుడు ఘంటసాల ఒక్కరే కావడం.సినీ నేపధ్య  గాయకులు అదేకాలంలో పి.బి.శ్రీనివాస్, ఎ.ఎం.రాజా, మాధవపెద్ది మొదలైనవారున్నా,  కాంతారావు,జగ్గయ్య,హరనాథ్  వంటి హీరోలు ఎన్.టీయార్, ఏ.ఎన్నార్ లకు ఎలా పోటీ కాలేదో ఘంటసాల కు  కూడా పోటి కాలేదు. ఆయన మాత్రమే ఆరంగంలో సూపర్ స్టార్. ఘంటసాల సూపర్ స్టార్ డం ఇంచుమించు ఆయన మరణానికి కొద్ది కాలంముందువరకూ, ఆయన పాటలు పాడగలిగేంతవరకూ అంటే 72/73 వరకూ కొనసాగింది.గాయకునిగానే కాక విజయవంతమైన సంగీత దర్శకునిగా కూడా( 100 కు పైగా చిత్రాలకు) కొనసాగారు.

1977  నుండిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కాలం

డెబ్భై ఏడవ సంవత్సరం వచ్చేసరికి తెలుగులో ఎన్.టి.ఆర్, ఏ ఎన్నార్ తో పాటు కృష్ణ,శోభన్ బాబులు తో కలిసి టాప్ ఫోర్ హీరోలుగా ఉన్నార్.కృష్ణం రాజు హీరో గా ఉనికి చాటుకుంటూ సొంత సినిమాల సక్సెస్ తో ఐదో స్టార్ గా మారుతున్నారు. ఐతే ఈ ఐదుగురు హీరోలకూ నేపధ్య గానం చేస్తున్న ఒకే ఒక ప్లే బాక్ సింగర్ మాత్రం బాలు గా పిలువబడే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. ఘంటసాల నేపధ్య గాయకుడిగా అప్రతిహతంగా వెలుగుతున్నపుడు అప్పడప్పుడూ వినపడె పి.బి.శ్రీనివాస్,ఏ ఏం రాజా, మధవపెద్ది, పిఠాపురం లాగానే ఇప్పుడూ కొన్ని గొంతులు ..రామకృష్ణ,ఆనంద్, మాధవపెద్ది రమేష్ వంటివి వినిపిస్తుంటాయి. (అప్పుడప్పుడూ జేసు దాసు వంటి పర భాష గాయకుని గొంతు).  కథానాయకుడు ఎవరైనా, సినిమా క్లాస్ ఐనా మాస్ ఐనా, కుటుంబపరమైన, సామాజికపరైనా, సంగీతభరితమైనా, గూఢచారి తరహా ఈన అన్ని మగపాత్రలకూ ఒకటే స్వరం నేపధ్య గానం చేస్తుంది. డెబ్భై నాటికి కృష్ణకు మాత్రమే పాడుతూ ఏక కంఠుడు గా ఉన్న బాలు పంచకంఠుడు గా, తర్వాత దశ కంఠుడు(వి.ఏ.కే మాటల్లో) మారి గాయకునిగా  నెంబర్ వన్ స్టేటస్ అనుభవిస్తున్నారు.

ఐతే ఘంటసాల నుండి స్టార్‌డం ను బాల సుబ్రహ్మణ్యం ఎలా పొందాడు? డెబ్భై రెండు నుండి డెబ్భై ఏడు వరకు తెలుగు కథానాయకులకు సంబంధించి నేపధ్య  సంగీత ప్రపంచం లో ఏమిజరిగింది?

1972 -1977

అరవయ్యవ దశకం మధ్య భాగంలో నటద్వయం మధ్య వయసుకు వచ్చారు.ఆ సమయంలోనే కొత్తనటులు హీరోలుగా ప్రవేశించసాగారు. అప్పటికి కొద్ది కాలంముందుగా శోభన్ బాబు ప్రవేశించి ఉన్నాడు, కృష్ణ, రామమోహన్,రామకృష్ణ, కృష్ణం రాజు హీరోలు గా పరిచయమయ్యారు. నేపధ్య గాయకులు గా ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం, కె.బి.కె మోహన్ రాజు వంటివారు వేళ్ళునుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే కొత్తగా పరిచయమైన కథానాయకులు, గాయకులు అప్పటికి స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నటద్వయానికి , ఘంటసాల కు పూర్తిస్థాయి పోటీ కాలేదు కానీ అలాకావొచ్చన్న సంకేతాలు కనిపించసాగాయి..

ఆలా తెరపైన, తెరవెనుక కూడా పాతకొత్త కళాకారులు రంగం మీద ఉన్నారు. వీరి మధ్య స్పర్థ అప్రకటితంగానూ, అంతర్గతంగానూ 1970 వరకూకొనసాగింది.

1965-70 మధ్య ఘంటసాల కొత్త హీరోలకు పాడటం, ఎన్ టీయార్,ఎ.ఎన్నార్ లు కొత్త గాయకులతో పాడించుకోవటం జరిగింది. ఎన్.టి.ఆర్ కు పి.బి.శ్రీనివాస్(ఆడబ్రతుకు),ఎస్.పి.బాలు (కోడలు దిద్దిన కాపురం, చిట్టిచెల్లెలు)పాడారు. అలాగే మహమ్మద్ రఫీ తో కూడా ఎన్.టి.ఆర్ పాడించారు (తల్లాపెళ్ళామా,భలే తమ్ము డు). ఏ.ఎన్నార్ కు పి.బి శ్రీనివాస్(ప్రేమించిచూడు), ఎస్.పి. బాలు(ఇద్దరమ్మాయిలు)పాడారు. ఐతే రెగ్యులర్ గా మాత్రంఘంటశాలే పాడెవారు. అలాగే కృష్ణ కు  కూడా ఘంటసాల కొద్దిరోజులు పాడారు. క్రమంగా కృష్ణకు పర్మినెంటు నేపధ్యగాయకుడుగా బాలు ఢెబ్బైకి ముందే స్థిరపడిపోయాడు. శోభన్ బాబు కు ఎస్.పి అప్పుడప్పుడూ పాడినా (కొన్ని పెద్దహిట్స్ కూడా ఉన్నాయి. ఊదా: చెల్లెలి కాపురం, మానవుడు దానవుడు, పుట్టినిల్లు మెట్టినిల్లు), ఘంటసాల చివరి వరకూ (ఖైదీ బాబాయి1974) పాడుతూనే ఉన్నారు.

70 తర్వాత ఘంటసాల పాటల్ని దగ్గరగా గమనిస్తే, గొంతు లో అలసట, ఊపిరి భారంగా తీసుకోవడం తెలిసిపోసాగింది. యువ హీరోలతో పోటిపడాల్సి వచ్చినె మధ్యవయస్కులైన నటద్వయం కొత్త గొంతు కోసం అన్వేషిస్తుంది.

ఆ సంధి కాలంలో ఏ ఎన్నార్ కు రామకృష్ణ రూపంలో ఒక సమాధానం దొరికింది. ఆల్ ఇండియా రేడియో కోసం చిత్తరంజన్ (కొన్ని సినిమా పాటలు పాడాడు) దర్శకత్వంలో  కే బి కే మోహన్ రాజు పాడవలసిన పాటలు ఆయన దొరకకపోవటంతో రామకృష్ణ అనే నూతన గాయకునితో కొన్ని పాటలు పాడించారు. (కుటుంబ నియంత్రణ ప్రచారం కోసం). ఆ పాటలు ఏ ఎన్నార్ సారధీస్టూడియో లో విన్నారు. ఆతని గొంతు లో ఉన్న ఘంటసాల సామీప్యత వల్ల కావచ్చు ఏ ఎన్నార్ కు అతని గొంతు నచ్చింది. నిర్మాణంలో ఉన్న తన చిత్రంలో పాడటానికి అడిగారు. రామకృష్ణ అప్పటికి చదువు పూర్తికాలేదు. పరీక్షలు అయ్యేదాక ఆగి తర్వాత అతనితో విచిత్రకుటుంలో రెండు పాటలు పాడించారు. ఏ ఎన్నార్ కు విచిత్రకుటుంబం సినిమా(విజేత నవల చిత్రరూపం) నే అప్పటివరకూ ఏ ఎన్నార్ సినిమా లకు కొంత విరుద్ధమైన పంధా లో ఉంటుంది.(హీరో యిన్ ను బలాత్కరించడం). అందులోనూ కొత్త గాయకునికి ప్రయత్నించడం విశేషమైనదే. కొత్తగాయకుని పాటలకు ఏ ఎన్నార్ కు నేపధ్య గానం గా శ్రోతల ప్రేక్షకుల ఆమోదం లభీంచింది.

విచిత్ర బంధం తర్వాత ఏ ఎన్నార్ కు ఘంటసాల తో పాటు రామకృష్ణ కూడా ప్లే బాక్ సింగర్ గా కొనసాగారు.ఆలాగె 73,74 సంవత్సరాలలో వచ్చినె పల్లెటూరి బావ, భక్తతుకారాం, దొరబాబు, బంగారుకలలు సినిమాలో కొన్నిపాటలు ఘంటసాల కొన్ని పాటలు రామకృష్ణ పాడారు. ( గతంలో ఏ ఎన్నార్,ఎన్.టి.ఆర్ కలిసినటించిన చిత్రాలలో ఇద్దరికి ప్లే బాక్ ఘంటశాలే కొనిసార్లు ఒకేపాటలో కూడా గమనించవచ్చు)

ఎన్.టి.ఆర్ కు రామకృష్ణ నేపధ్యగానం చేయడం ధనమా? దైవమా? చిత్రంతో మొదలయ్యింది. తర్వాత ‘పల్లెటూరి చిన్నోడు ‘ లో ఎన్.టి.ఆర్ కు రామకృష్ణ పాడారు.72 లో వచ్చిన కులగౌరవం లో బాలు ఎన్.టి.ఆర్ కు పాడారు. 73 లో వచ్చిన ఐదు  డైరెక్ట్ సినిమాలల్లో  నాలుగు సినిమాలల్లో ఘంటసాల పాటలే ఉన్నయి. 74 లొ వచ్చిన ఆరు సినిమాల్లో ఎన్.టి.ఆర్ కు  ఘంటసాల తో పాటు రామకృష్ణ ఒక సినిమాలో,బాలు  రెండు సినిమాలోపాడారు. అలా ఎన్.టి.ఆర్ రామకృష్ణను ఘంటసాలకు ప్రత్యమ్నాయం గా అప్పటికి చూడలేదు.

కృష్ణ కు తొలిరోజుల్లో ఘంటసాల పాటలు పాడినా తర్వాత తర్వాత బాలు కృష్ణకు పూర్తి స్థాయి గాయకుడై పోయాడు.  73 లో మమత, శ్రీవారు మావారు చిత్రాల్లో  రామకృష్ణ, కృష్ణకు నేపధ్య గానం చేశారు.

ఏ ఎన్నార్ తర్వాత రామకృష్ణను పూర్తిస్థాయి గాయకూడిగా అవకాశమిచ్చింది శోభన్ బాబు. విచిత్ర బంధం సినిమాలో పాటలు మద్రాస్ (ఇప్పటి చెన్నై) జెమినీ స్టూడియో లో విని హైదరాబాద్ నుండి తిరిగి మద్రాస్ పిలిపించారు. 73 లో ఆరు సినిమాల్లో 74 లో నాలుగు సినిమాల్లో శోభన్ బాబు కు రామకృష్ణ పాటలు పాడారు. 75 లో రెండు సినిమాల్లొ పాడారు.

అలా ఢెబ్బై మూడు,నాలుగు, ఐదు సంవత్సరాలలో అప్పటికి టాప్ ఫోర్ గా చెప్పబడే నలుగురు హీరోలకీ రామకృష్ణ పాటలు పాడారు. ఆ మూడు సంవత్సరాలలో నలుగురుకీ పాటలు పాడింది రామకృష్ణ ఒకరే.

75 లోనె ఎన్.టి.ఆర్ కొత్త ఇమేజి కు రూపకల్పన జరిగింది. కొత్త నిర్మాత అశ్వినీదత్ , దర్శకుడు బాపయ్య (ఎన్ టీ ఆర్ తో తొలిసారి) తొ ఎన్.టి.ఆర్ ను ఎదురులేని మనిషి సినిమాలొ ట్రెండీ గా చూపించారు. పాటలు, పాటల చిత్రీకరణ కొత్తపుంతలు తొక్కాయి. 1970 లో రైతు బిడ్డలో ఎన్.టి ఆర్ కు తమ్మునిగా నటించిన జగ్గయ్య ఈ సినిమాలోను తమ్ముడే. ఐతే ఆ సినిమాలో జగ్గయ్య కు బాలు పాడారు. ఈ సినిమాకి వచ్చేసరికి అన్న పాత్రకి బాలు పాడారు. (ఆలస్యంగా 76 వ సంవత్సరం విడుదలైన ఎన్.టి.ఆర్ చిత్రం మంచికి మరో పేరు (సి.ఎస్. రావు (దర్శకుడు), ఎస్.రాజేశ్వరరావు (సంగీతం), రామకృష్ణ(నేపధ్య గానం))సినిమాకు ,ఎదురులేని మనిషి సినిమాకు పూర్తి వైరుధ్యం కనిపిస్తుంది.)

అలా75 లో శోభన్ బాబు , ఎన్.టి.ఆర్ కు బాలు పూర్తిస్థాయి గాయకుడిగా స్థిరపడి పోయారు .  కృష్ణకు మొదటినుండి పూర్తిస్థాయి గాయకుడిగా కొనసాగుతూనె ఉన్నారు.

76 లో ఎ.ఎన్నార్ తిరిగి నటించడంమొదలైనాక వచ్చిన మహాకవి క్షేత్రయ్య, మహాత్ముడు, సెక్రెటరీ సినిమాలకు రామకృష్ణ నే నేపధ్యగాయకుడిగా  కొనసాగాడు.77 లో చక్రధారి సినిమాకు పూర్తి పాటలు ఎ.ఎన్నార్ కు పాడారు.

అదే సంవత్సరం ‘ఆలు మగలు’ సినిమాకు చాలా కాలం తర్వాత బాలు ఏ.ఎన్నార్ కు ప్లే బాక్ పాడారు. త ర్వాత వచ్చిన ఆత్మీయుడు ,రాజారమేష్ సినిమాలో కూడా పూర్తిగా బాలూ పాటలే చిత్రంలో వినిపిస్తాయి.

అలా 77 వ సంవత్సరానికి బాలు టాప్ ఫోర్ హీరోలకు పాడే సూపర్ సింగర్ గా బాలు మారిపోయాడు.

రామకృష్ణకు సంబంధించినంతవరకూ డెబ్భై రెండు తో మొదలై డెబ్భై ఏడు వరకూ గాయకుడి గా తెలుగు చలన చిత్ర సీమలో మంచి దశగా చెప్పుకోవచ్చు.

అక్కినేని నాగేశ్వరరావు- రామకృష్ణ

రామకృష్ణ ఏ ఎన్నార్ కు 72 నుండి 78 వరకు పాడిన సినిమాలు పదిహేను.వీటిలొ పన్నెండు సినిమాలు సాంఘికాలు, మూడు సినిమాలు హిస్టారికల్ అందునా భక్తి పరమైన సినిమాలు.సాంఘిక చిత్రాలలో నలభై ఏడు పాటలు, భక్తి పరమైన మూడు చిత్రాలలో ఇరవై ఎనిమిది పాటలు/పదాలు/శ్లోకాలు పాడారు.72 నుండి ఘంటసాల బ్రతికున్నంతకాలం ఏ ఎన్నార్ కు రెండు మినహా అన్ని చిత్రాలలోనూ ఘంటసాల తో పాటలు పంచుకున్నారు. అలాంటి సినిమాలు విచిత్రబంధం, పల్లెటూరి బావ,భక్త తుకారాం,ప్రేమలు పెళ్ళిళ్ళు,దొరబాబు,బంగారు కలలు.అందాల రాముడు చిత్రంలో మాత్రం అన్ని పాటలు రామకృష్ణనే పాడారు. మంచివాడు చిత్రంలో అన్ని ఘంటసాల పాటలే ఉన్నాయి.

డెబ్భై ఐదు లో ఏ ఎన్నార్ చిత్రాలు రిలీజు కాలేదు. డెబ్భై ఆరు –ఏడు సంవత్సరాలలో వచ్చిన సెక్రెటరీ,మహాత్ముడు, మహాకవి క్షేత్రయ్య, చక్రధారి లో ఏ ఎన్నార్ కు రామకృష్ణనే పాడారు.

77లోనే వచ్చిన ఆలుమగలు సినిమాలో బాలు మరోసారి ఏ ఎన్నార్ కు ప్లే బాక్ పాడటం ప్రారంభించారు. అందులోనూ ఒక పాట రామకృష్ణ పాడినా బాలు పాడిన పాటలు జనాదరణపొందాయి.ప్రత్యేకంగా ‘ఎరక్క పోయి వచ్చాను ‘ పాట బాగా హిట్ అయ్యింది. పాటలో బాలూ ఏ ఎన్నార్ స్వరంలోని మానరిజాల్ని అంతకుమున్నెన్నడూ లేనంతగా పలికింఛాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన ఎ ఎన్నార్ సినిమా ఆత్మీయుడు లో పూర్తిగా బాలు నే పాడారు. 77లోనే వచ్చినె రాజా రమేష్ చిత్రంలో ఒక పాట రామకృష్ణ జానకి పాడిన పాట రికార్డ్ గా విడుదల అయ్యింది. కానీ చిత్రంలో అదే పాట బాలు సుశీల పాడింది చిత్రీకరించబడింది.

తిరిగి 78 లో వచ్చిన రామకృష్ణులు, దాసరి ఏ ఏన్నార్ ల తొలి కాంబినేషన్ లో వచ్చిన దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రాల్లో ఏ ఎన్నార్ కు రామకృష్ణ పూర్తిగా ప్లే బాక్ ఇచ్చారు.

సాంఘిక చిత్రాలలో పాటలు:

తొలిచిత్రం విచిత్రబంధం లో పాడిన ‘వయసే ఒక పూలతోట’, ‘చిక్కావుచేతిలో చిలకమ్మ’  రెండూ గాయకునిగా రామకృష్ణకు గుర్తింపు తెచ్చాయి. పల్లెటూరి బావ ‘ఒసే వయ్యారి రంగి’ హుషారైన వెర్షను పాడారు. 73 లో బాపు దర్శకత్వంలో బాపు రమణల స్వంత చిత్రం ‘అందాల రాముడు ‘ లొ అన్ని పాటలూ రామకృష్ణ తో పాడించారు. ఈ సినిమాలో పాటల్ని బాలు తో పాడించాలనుకున్నారు. భాపు రమనలకు బాలూ బహు ఇష్టుడు. కొద్ది సంవత్సరాలక్రింతం వచ్చిన ‘బంగారు పిచ్చిక ‘ చిత్రంలో హీరో గా బాలు ను తొలుత అనుకున్నారు కూడా. బహుశా ఏ ఎన్నార్ ఇష్టం మేరకు రామకృష్ణ కు ఈ అవకాశం వచ్చివుండవచ్చు. ఛిత్ర జయాపజయాలు ఏమైనా ఆడియో పరంగా అందాల రాముడు పెద్ద సక్సెస్. ఘంటసాల బ్రతికి ఉన్నపుడే ఎ ఎన్నార్ కు పూర్తి గా రామకృష్ణ పాడటం ఈ ఒక్క చిత్రంలోనే.

74 సంవత్సరంలో ఏ ఎన్నార్ ను కొత్త కోణంలో మాస్ హీరో గా చూపిన దొరబాబు చిత్రం లో రామకృష్ణ నాలుగు పాటలు ( ఒద్దు ఒద్దు అనొద్దు, నీకు నాకు పెళ్ళంటె,ఒంటరిగా ఉన్నాను,అమ్మమ్మో గుంటడు ) పాడారు.బంగారు కలలు లొ రెండు డ్యూయెట్లు (చెక్కిలి మీద కెంపులు, నీకన్నులలో నే చూశాను లే), ప్రేమలు పెళ్ళిళ్ళు లో అన్ని పాటలు (రెండు డ్యూయెట్లు, ఒక సోలో) పాడారు. అరోగ్య కారణాలలతో ఏ ఎన్నార్ సినిమాలు 75 లో ఏమీ సినిమాలు చేయలేదు. 76 లో సెక్రెటరీ(టీజింగు సాంగ్, డ్యూయేట్లు, సోలో) ,మహాత్ముడు(డ్యూయెట్లు, ప్రబోధగీతం)  సినిమాలో పాడారు.

77 లో సాంఘికచిత్రాలో ఒక్క ఆలుమగలు (ఒక్క రిద్దరుగ మారేది) లో ఒక్కపాట మినహా వేరే చిత్రాలో పాడలేదు.

78 లో రెండు రామకృష్ణులు సినిమాలో పాడిన ఐదు పాటల్లో ఒక్కటే డ్యూయెట్టు మిగతా నాలుగూ బాలూ తోనూ మిగతావారితోనూ కలిపి పాడినవే. ఏ ఎన్నార్ కి రామకృష్ణ ఆఖరి గా పాడినది “దేవదాసు మళ్ళీ పుట్టాడు “ లో నే. రామకృష్ణను బాగా ప్రోత్సహించిన ఎస్. రాజేశ్వరరావు ఈ సినిమాకు సంగీత దర్శకుడు. దేవదాసు సినిమాకు సీక్వెల్ (బహుశా భారతచలన చిత్ర పరిశ్రమలో తొలి సీక్వెల్ కావచ్చు) దాసరి ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. సంగీత పరంగా చిత్రం విజయవంతమే. మూడు డ్యూయెట్లు, ఒక అంతర్నాటకం, రెండు విషాద భరిత సోలోలు ..అన్నీ మంచి పాటలే, శ్రోతలకు చేరువైనవే.

ఈ చిత్రంతర్వాత, ఏ ఏన్నార్ నటించిన మల్టి స్టారర్ సినిమాల్లో కూడా రామకృష్ణ కు అవకాశం రాలేదు. హేమాహేమీలు సినిమాలో ఇద్దరు హీరో లకి కలిపిన ఒకపాట లో ఆనంద్ ఏ ఎన్నార్ కు ప్లే బాక్ పాడారు.

భక్తి పరమైన సినిమాలు

భక్త తుకారాం

తుకారాం (1608-1650) మహారాష్ట్ర కు చెందిన పాండురంగ విఠలుని భక్తుడు,వాగ్గేయకారుడు. ఈతని రచనా ప్రక్రియ ‘అభంగాలు’. తుకారాం కథ సినీ పరిశ్రమను ముందు నుంచీ ఆకర్షిస్తూనే ఉంది. 1936 లో మరాఠీ భాషలో  తుకారాం సినిమా వచ్చింది. తుకారాం గా తెలుగులోనూ వచ్చింది .1963 లో కన్నడంలో రాజ్ కుమార్ తుకారాం గా నటించిన చిత్రం విడుదలయ్యింది. అందులో పి.బి.శ్రినివాస్ రాజ్ కుమార్ కు నేపధ్య గానం చేశారు.

1973 లో అంజలీ పిక్చర్స్ పతాకం పై  సంగీత దర్శకుడు ఆదినారాయణరావు అంజలి దంపతులు  ఈ  సినిమా తెలుగులో నిర్మించారు . పాటలు వీటూరి,దాశరధి  రాశారు. ఘంటసాల ఐదు పాటలు (ఘనాఘన సుందరా, బలే బలే అందాలూ,చిందులు వేయకురా,ఉన్నావా అసలున్నావా, సరి సరి ) పాడారు. శాంతారాం సినిమా అమర్ భూపాలి లో ఘన శ్యామ సుందరా పాట ప్రభావం ఘనాఘన సుందరా పాటపై ఉంది. చిత్రీకరణలో కూడా ఆ చాయలు ఉంటాయి. ఘంటసాల అలభ్యత వల్ల మిగతా పాటలు రామకృష్ణ తో ట్రాక్ గా రికార్డ్ చేశారని తరవాత ఘంటసాల వాటిని విని వాటిని తిరిగిపాడాల్సిన అవసరంలేదన్నారని చెబుతారు. రామకృష్ణపాడిన పాటలు, అభంగాల ఆధారంగా దాశరధి  రాసిన గీతాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. శ్యామసుందరా ప్రేమ మందిరా,  పిలుపు వినగలేవా,కరుణామయా దేవా వంటి ఎనిమిది పాటలు రామకృష్ణ పాడారు.ఖండికలు గా పాడిన అభంగ అధారిత గీతాలను ఏ ఎన్నార్ పైనే కాక అవి ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోవడాన్ని వివిధ వ్యక్తులపై చిత్రీకరించారు.

మహాకవి క్షేత్రయ్య

కృష్ణా మండలానికి చెందిన మువ్వ గ్రామస్థుడు గా చెప్పబడె వరదయ్య కూడా వాగ్గేయ కారుడె. ఈతని కవితాప్రక్రియ “పదం “. ఎక్కువ పదాలు మువ్వ గోపాల మకుటంతో రచించాడు. ఈ రచనలు అభినయానికి అనువుగాఉన్న శృంగారభరిత పదాలు. ఈతని జన్మస్థలానికి చేరువగానున్న కూచిపూడి గ్రామంలో ప్రాచుర్యంలో ఉన్న కూచిపూడి నృత్యకారులు ఈ పడాలను వారి నర్తనంలో వాడుకున్నారు.వరదయ్య అనేక క్షేత్రాలను దర్శిస్తూ క్షేత్రయ్య గామారి తమిళ దేశంలో ఉన్న తెలుగు రాజుల ఆస్థానంలో కొంతకాలం ఉన్నడు. గోలకొండ పాదుషా ఆస్థానాన్నీ దర్శించాడు. నాలుగు వేలపైగా ఈయన రాసిన పదాలలో నాలుగు వందలలోపే లభ్యమౌతున్నయి.

ఈ తని కథను భక్తతుకారాం తరువాత అంజలీ దంపతులు నిర్మించారు. ఏ ఎన్నార్ ఆరోగ్యనిమిత్తం తీసుకున్న విరామం తరువాత ఈ చిత్రంలో నటించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడిగా ప్రారంభమైన చిత్రం ఆయన మరణం తర్వాత సి.ఎస్.రావు దర్శకత్వంలో పూర్తి అయ్యింది. తుకారాం జీవితంలో ఉన్నంత నాటకీయత వరదయ్య కథ లో లేదు.ఇది భక్తి రస ప్రధానమైన చిత్రమూ కాదు. క్షేత్రయ్య పద రచయితే కాని కావ్యాలు వంటివి రాసిన వాడు కాదు. రాసిన పదాలు అన్నమయ్య, రామదాసు ల్లా భక్తిపూరితాలూ కావు. వాణిజ్య పరంగా అనేక కారణాలవల్ల చిత్రంవిజయవంతం కాలేదు. అందువల్ల అద్భుతమైన ఈ చిత్ర సంగీతం ప్రజలకు అవ్వాల్సినంత చేరువ అకాలేదు.

నేపధ్య గాయకుడిగా రామకృష్ణకు ఈ చిత్రం మేలుబంతి. రేపల్లె లోని గోపాలుడంట, జాబిల్లి చూసేను నిన్ను నన్ను, చల్లగా నెలకొన వయ్యా వంటి పాటలు కాకుండా , రామకృష్ణ పాడిన క్షేత్రయ్య పదాలు ప్రత్యేకంగా ఎన్నదగ్గవి.

పదాలను స్వరబద్ధం చేయటానికి ఆరుద్ర, ఆదినారాయణరావు ఆంధ్ర దేశం లో అనేక ప్రాంతాలలో ఈ పదాలకు నర్తించే వారిని సంప్రదించారు. వి ఏ.కే రంగారావు గారి మాటల్లో “వి రామకృష్ణ పగిడీ లో కలికితురాయి అయిన ఆనంద భైరవి రాగ పదం ‘శ్రీపతి సుతు బారికి ‘, నాట్య సుందరి స్వప్న సుందరి పాడిన ‘చేడెరో నా సామికి’ పాటలు మణిపూసలు,ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం ఆ పాటలు ప్రజల ఆదరణనోచుకొనక పోవడానికి కొంత కారణం “.

rama1

మరో రెండు మనోరంజకమైన పదాలు  “ఎటువంటి మోహమో కాని ” “వదరక పోవే” రామకృష్ణ గొప్పగా గానంచేశారు. మొదటిది గోలకొండ పాదుషా కొలువులో భామ నృత్యంచేస్తుంటే క్షేత్రయ్య పాడుతాడు. రెండవది విజయరాఘవుని (మధుర) సంస్థానంలో క్షేత్రయ్య అభినయిస్తూ పాడుతాడు. వదరక పోవే పదం ఆఖరి పంక్తులు తాత్వికత తో కూడి అప్పటివరకు ఆ పదం పట్ల ఏర్పడుతున్న భావననూ ఆసాంతం వేరే వైపుకు తీసుకెళ్ళి పోతుంది. (ఈ పదం తోపోల్చదగిన ఒక హిందీ పాట మన్నడే గానం చేసింది ” లాగా చునిరీ మే దాగ్..చుపావూ కైసే….దీని ఆఖరి పంక్తులు ఓ దునియా మేరి బాబుల్ కా ఘర్ ఏ దునియా ససురాల్”). ఇదే పదం బాలమురళీకృష్ణ గానంచేసింది(సినిమాకు కాదు)లభ్యమౌతూ ఉంది. పోలిక కోసమని కాకుండా సినిమా సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి తేడాగమనించడానికి ఒక ఉదహరణగా రెంటినీ వినవచ్చు.

రామకృష్ణ మొత్తం పదిహేను పదాలు ఇందులో పాడాదు. ఇవి అచ్చ తెలుగు కవితాపదాలు, తెలుగు వారికి బాగా పరిచితమై, తమవి అనుకోదగిన వాద్యాలతో కూడి అద్భుతానుభవాన్ని కలగ జేస్తాయి.

 

చక్రధారి

కన్నడ రాజకుమార్ ప్రధాన పాత్రధారి గా భక్త కుంబార చిత్రం వచ్చింది. విజయవంతమైన ఆ చిత్రాన్ని ఎం ఆర్ అనూరాధాదేవి కి రాజ్ కుమార్ సూచించారు. ఆ చిత్రాన్నే చక్రధారి చిత్రంగా నిర్మించారు. ఛక్రధారి పేరుతోనే ఒకసారి, భక్త కుంబార పేరు తోనూ ఆ కథ అంతకుముందు సినిమా గా వచ్చింది.చక్రధారి గా వచ్చిన తమిళ సినిమాలో నాగయ్య కుంబార పాత్ర పోషించారు. కుంబార వృత్తి రీత్యా కుమ్మరి.విఠలుని భక్తుడు. మరాఠా ప్రాంతానికి చెందినవాడు. హరి కీర్తనా తన్మయత్వంలో కాళ్ళకింద తన బిడ్డ నలిగిపోతున్నా చూసుకోలేనివాడు. వ్రతభంగమయ్యిందని చేతులు ఖండించుకున్నవాడు. అశక్తుడైన తన కు హరే వచ్చి సేవలు చేస్తే ,హరి ని గుర్తించలేనందుకు తపించాడు.

అంతటి భక్తుని కథ జనరంజకంగా తీస్తే ప్రేక్షకుల శ్రోతల కళ్ళకు చెవులకు పండగే.

తెలుగు లో చక్రధారి కన్నడ భక్త కుంబార కు అణువణువునా రీమేక్కే. రెంటికి సంగీత దర్శకుడు జి.కె.వెంకటెష్. పాటల వరసలూ ఇంచుమించు ఒక్కటె. స్వతహాగా రాజ్ కుమార్ గాయకుడు. కొన్ని యేళ్ళగా తన పాటలు తానే పాడుకుంటున్నారు. కాని ఈ చిత్రం లో అన్ని పాటలు రాజ్ కుమార్ కు పి.బి.శ్రీనివాస్ పాడారు.తెలుగు లో ఆ పాటలన్నింటినీ అదే వరసలలో రామకృష్ణపాడారు. విఠలా విఠలా పాండురంగ విఠలా అనే ఒక్కపాట (కథానాయకునికి కాదు) కన్నడంలో బాలు పాడారు. తెలుగు లో అదే పాట గాయకుడు ఆనంద్ పాటగా రిలీజ్ అయ్యి బహుళ ప్రచుర్యంపొందింది. ఐతే సినిమా లో బాలు స్వరంతో సత్యనారాయణ పై చిత్రీకరించబడింది.

కన్నడంలో పాడిన పి.బి శ్రీనివాస్ పాటలు, తెలుగులో రామకృష్ణ పాటలూ అన్నీ కర్ణపేయాలే. మార్దవమైన,సాత్వికమైన, భక్తిభావనతో సాగే ఇరు స్వరాలూ సంగీతప్రియుల్ని అలరిస్తాయి.

తుకారాం,కుంభార్ పాత్రలు మరాఠీ ప్రాంతానికి చెందినవి. సినిమాలుగా అనేక పర్యాయాలు తెర పై వచ్చినవి. అందులోని పాటలు వేరే కవులతో రాయబడ్డవి. సంగీత పరంగా భక్త తుకారాం లో కొంత పాతచిత్రాల ప్రభావం ఉంది, చక్రధారి పూర్తిగా కన్నడచిత్ర సంగీతమే. ఈ రకంగా చూస్తే క్షేత్రయ్య కథాపరంగా, రచనల పరంగా, సంగీతపరంగా పూర్తి తెలుగు సినిమా.

ఏ ఎన్నార్ కు రామకృష్ణ పాడిన మిగతా సాంఘిక చిత్రాల పాటలతో పోలిస్తే ఈ మూడు సినిమాలలో పాటలు ఉన్నత శ్రేణికి చెందినవే.

 

ఎన్.టి.ఆర్ రామకృష్ణ

రామకృష్ణ ఎన్.టి.ఆర్ కు సాంఘిక చిత్రాలు పౌరాణిక చిత్రాలు, చారిత్రత్మక చిత్రాలలో కలసి సుమారు 13 చిత్రాలలో పాడారు.

సాంఘిక చిత్రాలు:

ఎన్ టి ఆర్ కు రామకృష్ణ తొలిసారి ధనమా దైవమా చిత్రం లో పాటలు పాడారు. అ ది సంగీత దర్శకుడు టి.వి.రాజు కు ఆఖరి చిత్రం. ఓక శ్లోకం తో కలిపి ఐదు పాటలు ఆ సినిమా లో పాడారు. ఘంటసాలకొరకై స్వరబద్ధం చేయబడిన పాటలని అవి విన్నప్పుడు అనిపించేలానే పాటలు ఉంటాయి. చిత్రము, పాటలు కూడా హిట్ కాలేదు.

దిలీప్ కుమార్ హీరో గా నటించిన హిందీ సినిమా గోపి ఆధారంగా తెలుగులో వచ్చిన పల్లెటూరి చిన్నోడు సినిమాలో ఒక పాట(పల్లెటూరి చినావాడే) రామకృష్ణ పాడారు. ఈ సినిమానూ హిట్ కాలెదు. 75లో వచ్చిన రాముని మించిన రాముడు చిత్రంలో (ఎన్.టి.ఆర్ రెండు పాత్రల్లో ఒక పాత్రకు) ఒక పాట బాలు తో కలసి (‘అందరిదీ ఈ విజయం’) ఒక పాట పాడారు.76 లో రిలీజ్ ఐన మంచికి మరోపేరు సినిమా లొ అన్ని పాటలు పాడారు. ఆ సినిమా ఎన్.టి.ఆర్ తో సి.ఎస్.రావు కు ఆఖరి చిత్రం. అలాగే ఎస్.రాజేశ్వరరావు ఎన్.టి.ఆర్ కాంబినేషన్ కు కూడా అదే ఆఖరి చిత్రం. అప్పటి ట్రెండు కు తగ్గ్గట్టు లేని ఆ చిత్రం విజయవంతం కాలేదు.77 లో విడుదలైన మా ఇద్దరికథ చిత్రం (రెండు పాత్రలలో ఒక పాత్రకు) లో రెండు పాటలు పాడారు. ఈ చిత్రంకూడా విజయవంతం కాలేదు. మావారి మంచితనం (1979 దో అంజానే తెలుగు రూపం) లో ఒక పాట పాడారు. ఇదీ సక్సెస్ కాలేదు. రామకృష్ణ ఎన్.టీ.ఆర్ కు పాడిన మొదటి సినిమా ధనమా? దైవమా? చిత్రంలో ‘నాడు వైదేహీ పాటలో ఎన్.టి.ఆర్ మాటలు పాటలో ఉంటాయి. అదేవిధంగా ఎన్.టి.ఆర్ కు రామకృష్ణ సాంఘికచిత్రాలలో ఆఖరి పాట ‘మావారి మంచితనం’ లో ‘చెంచితా పాటలో కూడా రామకృష్ణ గొంతుతోపాటు ఎన్.టి.ఆర్ మాటలు కూడా వినిపిస్తాయి.

ఐతే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంఘిక చిత్రాలలో ఏ చిత్రంకూడా పెద్దగా విజయవంతం కాలేదు.

పౌరాణిక చిత్రాలు:

75 లో వచ్చిన మాయామశ్చీంద్ర సినిమాలో ఒక పాట( రారా రజనీకరా) రామకృష్ణ పాడారు. 77 వ సంవత్సరం జనవరి లో విడుదలైన దానవీర శూర కర్ణ సినిమాలో శ్రీ కృష్ణ పాత్రకు  రామకృష్ణ పాడిన తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ విజయాలలో పద్యాలు ప్రజల మన్నన పొందాయి. ఈ పద్యాలు తెలుగులో అప్పటికి మూడు చిత్రాలలో ఉపయోగించారు. పూర్తిగా పద్యాలపైనే అధారపడి వచ్చిన చిత్రం ‘శ్రీకృష్ణ రాయబారం’  సినిమాలో అప్పటి ప్రముఖ గాయకులు, రంగస్థల గాయకులతో పద్యాలు పాడించారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ లేరు. తర్వాత 67 లో వచ్చినె శ్రీ కృష్ణావతారం లో ఇవే పద్యాలు ఘంటసాల తో పాడించారు. మళ్ళీ శ్రీకృష్ణ సత్య సినిమాలో ఇవే పద్యాలు ఘంటసాల, ఎస్.పి. బాలు తో పాడించారు. రెండు సినిమాలలో ఇవి ఎన్.టి.ఆర్ పైనే చిత్రీకరించారు. దాన వీర శూర కర్ణ నిర్మించేటప్పుడు ఈ పద్యాలను వినియోగించుకోవాలని అవి పాడటానికి అప్పటి ప్రముఖ గాయకులు ,స్టేజి కళాకారులనూ ఎన్.టి.ఆర్ పరిశీలించారని, ఎస్. రాజేశ్వరరావు సలహా మేరకు రామకృష్ణను ప్రయత్నించి ఎన్.టి.ఆర్ తృప్తి చెందారని రామకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ‘ఎక్కడనుండి రాక ఇటకు’ పద్యంతో మొదలై ‘ఏ మూల దాగనే ఈ ధర్మ పన్నాలు’ వరకు పదిహేను పద్యాలు రామకృష్ణ పాడారు. ఈ పద్యాలు ఎన్.టి.ఆర్ తదితర నటుల సంభాషణలతో కలిపి రికార్డ్ గా విడుదలై ప్రజలకు చేరాయి. ( షణ్ముఖి ఆంజనేయరాజు పద్యాలు రికార్డ్గా విడుదలై  పొందినట్టి గుర్తింపు కర్ణలో ఈ పద్యాలు పొందాయి).

rama2

సినిమాలో వచ్చిన ఒక పద్యం ‘సంతోషమ్మున సంధిసేయుదురే ‘  రఘురామయ్య(శ్రీ కృష్ణ రాయబారం), ఘంటసాల (శ్రీకృష్ణావతారం), ఎస్.పి.బాలసుబ్రహ్మ ణ్యం (శ్రీకృష్ణ సత్య), రామకృష్ణ (దాన వీర శూర కర్ణ) నోట వినటం ఒక చిత్రమైన అనుభవం.

దాన వీర శూర కర్ణ చిత్రం విజయవంతం కావడానికి అనేక ఇతర కారణాలతో పాటు ఈ పద్యాలు కూడా కారణ మయ్యాయి. ఈ చిత్రం తర్వాత ఎన్.టి.ఆర్ రామకృష్ణకు తను తీసే ప్రతీ పౌరాణిక చిత్రంలోనూ అవకాశమిస్తానని మాట ఇచ్చారట (రామకృష్ణ ఇంటర్వ్యూ).  ఐతే కర్ణ చిత్రం వచ్చిన తర్వాత ఎన్.టి.ఆర్ పౌరాణికం ‘విరాటపర్వం’లో రామకృష్ణ పాటలు లేవు. తర్వాత వచ్చిన శ్రీ రామ పట్టాభిషేకం లో పాటలు రామకృష్ణ పాడారు. శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం లో  రమేష్,ఆనంద్ ల తొ కలిసి సుప్రభాతం  వరకూ రామకృష్ణ గానం చేసారు. తర్వాత చాలా రోజులతరువాత ఎన్.టి.ఆర్ తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర (రవింద్ర జైన్ సంగీత దర్శకత్వం) లో రామకృష్ణ , నటుడు బాలకృష్ణ కు హరిశ్చంద్ర పాత్రకు కొన్ని పద్యాలు పాడారు. ఐతే ఇవి బహుళ ప్రచుర్యంలో ఉన్న బలిజేపల్లి, జాషువ పద్యాలు కాకపోవటం తో  సరైన గుర్తింపు రాలేదు. చిత్రం పరాజయం, చిత్రం పాటలతో విడుదలైన కేసెట్టు లో ఈ పద్యాలు లేకపోవడం కూడ దీనికి కారణం.

 

చారిత్రక చిత్రాలు

ఎన్.టి.ఆర్ చారిత్రక చిత్రాలు వేములవాడ భీమకవి (1976) లో ఒక పాట(అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను)  రామకృష్ణ పాడారు. వీరబ్రహ్మేంద్ర  స్వామి చరిత్ర(1984) లో బ్రహ్మంగారి తత్వాలు కొస రాజు రాయగా రామకృష్ణ పాడారు. చిత్రం పెద్ద విజయం సాధించింది. రామకృష్ణ పాడిన తత్వాలు ఇప్పటికి గ్రామ సీమల్లో మైకు సెట్ల లో వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్.టి.ఆర్ 94 లో నిర్మించిన శ్రీ నాథ కవి సార్వభౌమ చిత్రంలో రామకృష్ణ పాటలు లేవు.ఐతే ఈ సినిమా కోసం తన గానంతో ,పెండ్యాల స్వరకల్పనలో పద్యాలు రికార్డ్ చేశారని అవి సి.నారాయణరెడ్డి సమక్షంలో విని ఎన్.టి.ఆర్ చాలా ఇష్టపడ్డారని రామకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

(మిగతా వచ్చే వారం)

తడి ఆరని ఉత్తరాలు

మధు పెమ్మరాజు

 

madhu_picగోడపై ఉన్న డెకరేషన్ ఫ్రేములో “A picture is worth a thousand words” అనే కొటేషన్ ఏళ్ళుగా చూస్తున్నాను, చదివిన ప్రతీసారి భలే గొప్ప భావనని అనిపించేది. తాతయ్య మాష్టారి మొదటి ఉత్తరం చదివాకా ఆ అభిప్రాయం శాశ్వతంగా చెరిగిపోయింది. ఆర్ద్రత నిండిన మనిషి కలం పడితే జాలువారేవి అక్షరాలు కావు.. తడి, తడిగా తాకే పద చిత్రాలు- మట్టి మనుషులు, దుమ్ము రేగుతున్న వీధులు, చీమిడి ముక్కు బడి పిల్లలు, నేలకొరిగిన సైనికుడు…అందుకేనేమో ఈ మధ్యన డెకరేషన్ ఫ్రేములో “A letter is worth countless pictures’ అని కనిపిస్తోంది.

వియత్నాం అంతర్గత సమస్యపై అమెరికా జోక్యాన్ని ఇతర దేశాలతో పాటు, అమెరికా వాసులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్న రోజలు. ఆ సమయంలో మాష్టారు బోస్టన్ యునివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా పని చేసేవారు. స్వేచ్ఛ, పౌర హక్కులు, ప్రజాస్వామ్యం అంటూ ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా ద్వంద్వ వైఖరికి నిరసనగా విద్యార్థి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు, ఆ అధ్యాయం మాష్టారు గమనాన్ని మలుపు తిప్పిన మైలురాయి.

పల్లె జీవుల కష్టాలను కడ తీర్చడానికి వినోబా చేసిన కృషి మాష్టారుని ప్రభావితం చేసింది, వారి స్పూర్తితో మాతృదేశం తిరిగివచ్చి వెనుకబడ్డ ప్రాంతాల స్థితి గతులను అర్ధం చేసుకుందుకు రెండేళ్ళ పాటు దేశమంతటా కాలినడకన తిరిగారు. సమస్యల పట్ల అవగాహన ఏర్పడ్డాకా ఓ మారుమూల ప్రాంతంలో తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ రోజు నుండి విద్య, ఆర్ధిక ప్రతిపత్తి, పౌర హక్కులు వంటి ఎన్నో మౌలికమైన అంశాలపై ప్రజా పోరాటాలు శాంతియుతంగా జరిపి పీడిత వర్గాలను గెలిపింఛి, ‘ఆంధ్ర గాంధీ’ గా పేరు పొందారు.

ఒకసారి “మాష్టారు! ఈ ఏడాది ఎండలు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి, ఎలా తట్టుకుంటున్నారు?” అని యధాలాపంగా అడిగాను.

“బయట కొత్త తార్రోడ్డు వేస్తున్నారు. కొన్ని వారాలుగా కూలివాళ్ళు మండుటెండలో ఆగకుండా పని చేస్తున్నారు, ఫ్యాన్ కింద కూర్చుని వాళ్ళని చూస్తుంటే చాలా తప్పు చేస్తున్నట్టు ఉంది. లేచి కాస్త మంచి నీళ్ళు ఇవ్వడమో, కాసిన్ని కాలక్షేపం కబుర్లు చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాను. రోజు, రోజుకీ ఆ కాంట్రాక్టర్ మీద కోపం పెరిగిపోతోంది, కనికరం లేకుండా రక్తం మరిగే ఎండలో ఎలా పని చేయిస్తున్నాడో?…..కాస్త ఎండ తగ్గాకా లైట్లు పెట్టి పని చేయించచ్చు కదా? ఇలా కొనసాగితే పాపం ఏ వడదెబ్బో తగిలి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్రభుత్వం కాస్త పూనుకుని ఇలాంటివి జరగకుండా లేబర్ లా మార్చాలి” అని జవాబిచ్చారు.

‘కూలివాడి ఎండ’ అనే పొసగని పదాలని మొదటిసారి విన్నాను. ఆ మొహం లేని మనుషులు రోడ్డు మరమత్తు చేస్తుంటే ఎన్నో సార్లు చూసాను, రద్దీలో నా సమయం వ్యర్ధమయిందని తిట్టుకుంటూ చూసాను. కొత్త తార్రోడ్డు పక్కన కూడా చూసాను, నున్నటి నల్లదనాన్ని తాకిన మత్తులో పడి పట్టించుకోలేదు. అయినా కనిపించని మొహాలని పట్టి, పట్టి పోల్చుకోవాలనే తాపత్రయం, తీరిక నాకు లేవు. నేను మెట్లెక్కే తొందరలో ఉన్నాను, దూరాలు దాటాలనే ఆత్రుతతో ఉన్నాను. కూలివాడికి ఎండా.. వానా తేడా తెలుస్తుందా? దుమ్ములో పుట్టి, ధూళిలో తిరిగి మట్టిలో కరిగిపోయే వారి కోసం వృధా ఆలోచనలు ఎందుకని సమర్ధించుకున్నాను.

నా కళ్ళకి ఎదురుగా కిట, కిట కిటికీలు – సూటు, స్టెతస్కోప్, నల్ల కోటు వేసుకున్నవాడు చూపులకి చిక్కుతాడు, ఆ పక్కనే పనిచేస్తున్న కూలివాడు కనబడడు. పనిని బట్టి మనిషి విలువని అంచనా కట్టే వారికి ‘కూలివాడి ఎండ’ అత్యవసరమైన పదం. మాష్టారు ఉత్తరాలు మరుగున పడిన మానవీయ విలువలు వెలికి తీసి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకునేలా చేస్తాయి.

నేను ఈ రోజు ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. ఏ సంబంధం లేని ఈ ఊరుకి నలభై ఏళ్ళ క్రితం చేరుకున్నాను. ఒకసారి డిగ్రీ కాలేజీలో ప్రసంగించడానికి వెళ్ళినపుడు శేఖర్ పరిచయమయ్యాడు. అతనిది మగ దిక్కులేని పెద్ద, పేద కుటుంబం.

శేఖర్ డిగ్రీ పూర్తి కాగానే పట్టుదలగా చదివి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసి బ్యాంకు ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు నుండి కుటుంబ బరువు బాధ్యతలు ఇష్టంగా స్వీకరించాడు. ప్రమోషన్ అవకాశాలు ఎన్నొచ్చినా అన్నీ వద్దనుకుని ఉన్న ఊళ్లో క్లర్కుగా ఉండిపోయాడు. ఏడాది క్రితం ఆరోగ్యం బాగోలేదని డాక్టర్కి చూపించుకుంటే కాన్సర్ అని తేలింది. క్రమం, క్రమంగా ఆరోగ్యం క్షీణించి ఈ నెల 18వ తారీఖున చనిపోయాడు. శేఖర్ మరణం నన్ను బాగా కృంగదీసింది. ఈ ఊరు వచ్చిన రోజు నుండి శేఖర్ నాకు కొండంత అండగా ఉండేవాడు. బాలబడి ప్రాజెక్టులు ముందుండి నడిపించేవాడు, రిక్షా కాలనీ పిల్లలకి పాఠాలు చెప్పడం, శోధన కార్యకలాపాలు చూసుకోవడం తప్ప వేరే జీవితం లేకుండా గడిపాడు.

శేఖర్ సంస్మరణార్ధం మొన్న ఆదివారం ఒక సభ ఏర్పాటు చేసాము, దాని తాలుకు ఫోటోలు నీకు పంపుతున్నాను.

పెరిగిన వేగం నైతిక విలువలని తిరగరాసింది. అవకాశాలు అందిపుచ్చుకుని అంచలంచలుగా ఎదిగేవాడు సమర్ధుడు. బంధాలకి, సమాజ బాధ్యతలకి కట్టుబడేవాడు చేతకానివాడు. అంతా రాచమార్గంపై అప్రమత్తంగా నడుస్తుంటే, అదే చూరుని వేళ్ళాడిన శేఖర్ ప్రాక్టికల్ మనిషి కాదు, అర్ధం లేని ఆశయాలకి ఉదాహరణ.

ఫోటోలలో జనసందోహాన్ని చూస్తుంటే శేఖర్ ఓడిపోయిన మనిషిలా అనిపించలేదు, గెలుపు, ఓటములకి దూరంగా అందనంత ఎత్తులో ఎగురుతున్న విహంగంలా అనిపించాడు. వయసు మనిషి జీవితానికి కొలమానం కాదు. సార్ధకతతో జీవించే మనిషి, ప్రతి క్షణం నూరేళ్ళు జీవించినట్లే! శేఖర్ విద్యార్థులలో ఒక శాతం మంది అతని స్ఫూర్తి పొందినా అతను ఆశించిన లక్ష్యం చేరుకున్నట్లే…

క్రితం సారి నువ్వు, నాన్నగారు చాకలిపేట బాలబడికి వచ్చారు గుర్తుందా? అప్పట్లో అది పాకలో ఉండేది, మొన్నీ మధ్యనే కొత్త బిల్డింగ్లోకి మారింది. రాబోయే ఆగష్టు 15 పండుగ కొత్త బడిలో జరుపుకుంటాము. నువ్వు, నాన్నగారు తప్పకుండా రావాలి.

నిరుపేద పిల్లలకి చదువు పట్ల ఆసక్తిని పెంచాలి, కూలి పనులు చేసుకునే తల్లి, తండ్రులకి భారం కాకుండా పౌష్టిక ఆహారం అందించాలి, డ్రాప్ ఔట్లు తగ్గించాలి అనే ఆశయంతో ‘బాలబడి’ని రూపుదిద్దారు. సహజ అభ్యాసన వాతావరణంలో, ఉత్తేజపరిచే ఆటపాటల ఆదర్శ విద్యా విధానంగా దేశమంతటా మన్ననలు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం శోధన సంస్థ ఆధ్వర్యంలో 18 జిల్లాలలో బాలబడులను విజయవంతంగా నిర్వహిస్తోంది.

మాష్టారు మితబాషి, మాట్లాడినా పెద్దగా హావభావాలు చూపించరు. బాలబడి పాక నుండి సిమెంట్ గదిలో స్థిరపడిందనే వార్త పంచుకునేటపుడు మాత్రం చిన్న పిల్లల ఉత్సాహం చూపిస్తారు. వారి నేతృత్వంలో ఎన్నో పాకలు, ఆశయాలు స్థిరత్వాన్ని పొందాయి. ఉక్కు సంకల్పం గల వారి మనసులు వెన్నలా సున్నితంగా ఉంటాయని ఎక్కడో చదివాను, మాష్టారులో ఆ గుణాన్ని ప్రత్యక్షంగా చూసాను.

నీకు కధలంటే ఇష్టం కదూ.. మొన్న రాజేష్ సొంత దస్తూరీతో ఒక కధ పంపాడు, అది నీకు పంపుతున్నాను, వీలున్నపుడు చదువు. అసలు రాజేష్ ఎవరో చెప్పనేలేదు కదూ? రాజేష్ IIT మద్రాస్లో ఇంజనీరింగ్ చేసాడు. కాలేజీ రోజుల నుండి ఆహార భద్రత అనే అంశం అతన్ని తొలుస్తూ ఉండేది. ఎప్పుడు మాట్లాడినా అదే అంశంపై సుదీర్ఘంగా చర్చించేవాడు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధికి వ్యవసాయం, పర్యావరణం లాంటి సంబంధంలేని విషయాల పట్ల ఆసక్తి ఎలా కలిగిందా అని?

ప్రపంచంలో బీడుగా మారుతున్న నేల నిముష, నిముషానికి పెరిగిపోతోంది. మరో వైపు జనాభా పెరుగుదల, ఆహార అవసరాలు అదుపు తప్పాయి. ఇదొక విపత్కర పరిస్థితి!!. ఎవరో ఒకరు పూనుకోకపోతే పరిస్థితి చేజారిపోతుందనేవాడు. ఈ జటిలమైన సమస్యలను అధిగమించాలంటే రెండే రెండు మార్గాలు – అడవులను చదును చెయ్యడం లేక బీడు భూములని సేద్యానికి పనికొచ్చేలా చెయ్యడం. రెండవ, మెరుగైన మార్గాన్ని తన జీవితాశయంగా మార్చుకుని ఉన్నత చదువులు, అమెరికా ఉద్యోగావకాశాలు వద్దనుకుని, పెళ్లి మానుకుని కర్ణాటకలోని మారు మూల బీడు ప్రాంతాలలో ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. పనికిరాని నేలని పచ్చగా మార్చి హరిత విప్లవం సాధించాడు.

మేధావులు ప్రపంచానికి చాలా అవసరం. వారి తెలివి తేటలు మారు మూల ప్రాంతాలకి కుదువ పెడితే మనం రెండు రకాల నష్టాలు చూడవలసివస్తుంది- వారు ఎదగరు, దేశాన్ని ముందుకి నడపరు. అంతగా సహాయం చెయ్యాలంటే విరాళాలు రూపంలోనో, సలహాలు రూపంలోనో పరోక్షంగా సహాయం చెయ్యొచ్చు కదా?

దేశాన్ని పీడిస్తున్న సమస్యలు నిత్య యవ్వనంతో, నవనవలాడుతూ ఉంటాయి. చాలా మటుకు ప్రజలు శాంతి కాముకులు వార్తా పత్రికలలో మొహం దాచుకుంటారు తప్ప సమస్యల జోలికి రారు. కొందరు మేధావులు వాటిని విడమర్చి, విశ్లేషించి, విభేదించి తమ తర్కాన్ని, పరిజ్ఞానాన్ని పది మందికి ప్రదర్శిస్తూ ఉంటారు, వారికి సమస్య ఒక ఆట వస్తువు. భావుకత, విప్లవ భావాలు కలగలిసిన బహు కొద్దిమంది పట్టు వదలక కవితో, వ్యాసమో రాసి, అది పత్రికలో అచ్చు పడగానే తమ బాధ్యత తీరిందని చేతులు దులుపుకుంటారు. ఎక్కడో రాజేష్ లాంటి వారు తమ జీవితాలని ఇంధనంగా మార్చి సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారు. వారు రాతల కంటే, మాటల కంటే, చేతలని నమ్ముకుని అహర్నిశలు నిశ్సబ్దంగా శ్రమిస్తూ ఉంటారు. అసలు వారి వల్లే ప్రకృతిలో ఇంకా పచ్చదనం మిగిలి ఉందేమో?

మాష్టారు! నెల జీతం చేతికి రాకపోతే వణికిపోతాను. మీరు అంత మంచి ఉద్యోగం, విదేశీ అవకాశం తేలిగ్గా ఎలా వదిలేసారు? మీరు జీవితాన్ని పేద ప్రజలకి అంకితం చెయ్యడం చాలా గొప్ప విషయం

ఒక మనిషి పుట్టి పెరుగుతున్నపుడు కొన్ని ముఖ్య సంఘటనలు ఆ వ్యక్తి గమనాన్ని నిర్దేశిస్తుంటాయి. ఆ సంఘటనలను మానవాతీత శక్తి నిర్దేశిస్తుందేమో? ఆ సంఘటనలు జరగకపోతే అ జీవి ప్రయాణంలో విచిత్ర మలుపులు వచ్చేవి కావేమో? ఈ ప్రశ్నలకి నాకు జవాబులు ఇంకా దొరకలేదు.

మనిషి తన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తన పరిమితమైన ఆలోచనా పరిధిలో తీసుకోవడం సరైన విషయం కాదేమో అనిపిస్తుంది. అతని స్పృహలోకి రాని అంతర్గత ఎరుకకి అవకాశం ఇవ్వాలెమో? అలా జరిగితే ఒక శుభోదయాన సూర్యుడు కొత్త వెలుగుతో కనిపిస్తాడు. ఆ వెలుగులో తన పాత జీవితాన్ని పక్కన పెట్టి, కొత్త వెలుగులోకి పయనమై వెళ్ళిపోతాడు. పాత జీవితపు చాయలు జ్ఞాపకాలుగా మిగిలిపోయినా బంధాలుగా ఉండవు. అప్పుడు అతడు లోకం కోసం, బంధువర్గం కోసం జీవించడు. ‘తన’ కోసమే జీవిస్తాడు. ఇది అర్ధం కాని మనుషులు అతను పరులు కోసం త్యాగం చేశాడనో, పరులపై ప్రేమతో జీవిస్తున్నాడో అనుకోవచ్చు. అది పెద్ద భ్రమ.
మాష్టారూ! తోటమాలి కలం పడితే ఆ రాతలకి మట్టి వాసన, నేల స్వచ్చత, వేర్ల లోతు ఉంటుంది, అందుకే మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. మీ ఉత్తరాలలో వ్యక్తులు అక్షరాలు దిద్దిస్తూ, ఆత్మ స్థైర్యం పెంచుతూ ఎడారిలో గులాబీలు పూయిస్తున్నారు. నేను నావైపు సూటిగా నడిచే అంకెల మనిషిని- జీతమిచ్చే కంపెనీ లాభాలు పెంచాలనో, ఖర్చులు తగ్గించాలనో సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు రాయిస్తూ ఉంటాను, ఒక్కోసారి అవే ఖర్చుల లెక్కలు చురకత్తులుగా మారి వేటు వేస్తే కొత్త కత్తి వెతుక్కుంటాను తప్ప చుట్టూ చూడను, చూసినా నా చుట్టూ నేనే కనపడతాను.

నిజానికి అంకెలకందని మీలాంటి వ్యక్తులు నాకు అర్ధం కారు. అందుకే మీ ఉత్తరాలు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను, ఎన్నిసార్లు చదివినా బావుంటాయి తప్ప అర్ధం కావు, భాష వస్తే సరిపోదు కద… భావన నిండాలంటే అనుభవం కావాలి. ఏసీ గదులకి అలవాటైన నాజూకు శరీరం నడిరోడ్డుపై నిలబడదు, ఇక అనుభవం ఎలా వస్తుంది? అందుకే విశాలమైన పంజరంలో వెచ్చగా ఒదిగి ఎగిరే మెళుకువల గురించి కలలు కంటూ ఉంటాను, కలలు వాటంతట అవే నిజమవుతాయని కొత్త కలలు కంటూ ఉంటాను…

***

అప్పట్లో ఆ కాయితప్పడవ!

 

కాస్తంత ఊసుపోనితనమూ.. బోల్డంత ఉత్సాహమూ.. చినుకు వాసన తగలగానే, కాసిని వృధా కాగితాలు కనబడగానే!
గబగబా వాటిని సాపు చేసి, గోటితో గీరీ గీరీ అతిజాగ్రత్తగా చదరంగా చింపి, ఇంకెంతో ఏకాగ్రతతో మడతలు పెడుతూ ఒక కాగితం పడవని తయారు చేసుకుని, ఇక ఆ సాయంత్రమంతా కురవబోయే వానలో ముందుగా చేతులు జాచి  అరచేతిలోకి చినుకుల్ని ఆహ్వానించడం!

చిన్నప్పుడనేం కాదు.. ఇప్పటికీ కూడా!

వర్షం పెద్దదయ్యీ, కాస్త నీళ్ళు నిలవగానే మెల్లగా పడవని వదలడం.. అది ఒరగకుండా, మునగకుండా ఆ వర్షపు నీటి అలల్లో మెల్లగా ఊగుతూ నిలకడగా ఉండటం చూశాక ఇక అదో భరోసా. ఈ కొత్త ప్రయాణంలో అది భద్రంగానే ఉండగలదని!

కాసేపయ్యాక కూడా కదలకుండా అక్కడక్కడే తిరుగాడుతూ ఉంటే మెల్లగా చేతుల్తో నీళ్ళని ముందుకు తోయడం, ప్రవాహంలో నడవడ తప్పదని అప్పట్లో పడవకి అర్ధమైందో లేదో కానీ, తల్చుకుంటే మాత్రం కాలేజీ చదువుకని ఒంటరిగానే రైలెక్కించిన అమ్మ గుర్తొచ్చింది!

పైనా, కిందా చుట్టూ నీళ్ళల్లో…. ముసురు పట్టిన రాత్రిళ్లలో… సుళ్ళు తిరుగుతూ సాగిపోతుందా పడవ, ఒంటరిగా.. ఒక రహస్య సందేశం అందించే గురుతర బాధ్యతని చేపట్టిన సైనికుడిలా!!!

satya

కాగితం పడవ

 

కూడలి నించి నడచి, మార్కెట్ మీదుగా, బజారు దాటుకుంటూ

ఎర్ర వీధుల్లోంచి వెళ్తోంది కాగితం పడవ
వర్షాకాలపు అనాధ నీళ్ళల్లో ఊగిసలాడుతోంది నిస్సహాయ పడవ!

ఊరిలోని అల్లరిచిల్లర సందుల్లో కలత పడుతూ అడుగుతోంది,

‘ప్రతి పడవకీ ఒక తీరం ఉంటుందంటే

మరి నాదైన తీరం ఎక్కడా?’

 

ఎంతటి అమానుషత్వమో కదా,

ఒక అమాయక బాలుడు

నిరర్ధకమైన కాగితానికి

కాస్త అర్ధాన్ని ప్రసాదించడం!!

 

మూలం:

Chauk se chalkar, mandi se, baajaar se hokar

Laal gali se gujari hain kaagaj ki kashti

Baarish ke laawaris paani par baithi bechaari kashti

Shehar ki aawaaraa galiyon main sehamii sehamii puunch rahii hain

‘Har kashTi ka saahil hota hain to —

Mera bhI kya saahil hoga?’

Ek maasoom bachche ne

Bemaanii ko maanii dekar

Raddi ke kaagaj par kaisaa julm kiyaa hain!!

కిల్లా :కవిత్వంలాంటి సినిమా

 

కృష్ణమోహన్ బాబు

యువ  మరాఠీ దర్శకుడు, అరుణ్ అవినాశ్ ‘కిల్లా’ (కోట)  ధియేటర్ వదిలినా పదే పదే మనల్ని మర్చిపోని ఖమాజ్ రాగంలో పాడిన చక్కని కవిత్వంలాంటి సినిమా.  అరుణ్ కిది మొదటి  మరాఠీ సినిమా. కథ, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం అరుణే చేసి అన్ని విభాగాల్లోనూ ఆరితేరిన సీనియర్ కళాకారులను మించిన పనితనాన్ని చూపించాడు.  2015 వ సంవత్సరానికి మరాఠీ సినిమాలు ఏకంగా 5 జాతీయ అవార్డులు గెల్చుకుంటే, ‘కిల్లా’ సినిమా ఉత్తమ మరాఠీ చిత్రంగా, అందులో  నటించిన బాల నటుడు, అర్చిత్ దేవ్ ధర్ ప్రశంసాత్మక నటనకి ‘స్పెషల్  మెన్షన్ ‘ గా   రెండు అవార్డులు గెల్చుకుంది.  ఈ సినిమా అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో కూడా ప్రశంసలని, అవార్డులని అందుకుంది.

పదకొండేళ్ళ చిన్మయ్ తల్లి పూనా మహా నగరంలో  ప్రభుత్వ రెవెన్యూ డిపార్టుమెంట్ లో  ఒక చిన్న ఉద్యోగిని.  చిన్మయ్ తండ్రి పోయాక ప్రమోషన్ మీద ఆవిడ కొంకణ్ తీరంలో  వున్న ఓ మారు మూల గ్రామానికి బదిలీ అవుతుంది.  హడావిడిగా వుండే పూనా నగరం నుంచి  ఏ శబ్దాలూ లేని ఓ మారు మూల పల్లెటూరుకి రావటం  చిన్మయ్ ని చాలా చికాకు పరుస్తుంది.

ఇస్మాయిల్ ‘బదిలీ ‘ కవిత గుర్తుందా?

“బర బరా

ఈడ్చిన ట్రంకు పెట్టేలా

హృదయం క్షోభ పడింది.

ఇది

జరపడానికి చేసింది కాదు “

ఏ కుదుళ్ళలోనూ కుదురుకోలేని  జీవితం అంతా గందరగోళం.

స్కూలులో స్కాలర్ షిప్ వచ్చిన తెలివైన కుర్రాడిగా చిన్మయ్ ని టీచర్ పరిచయం చేస్తే, అంతంత మాత్రం చదువులతో అల్లరి చిల్లరిగా వుండే ఆ వూరి కుర్రాళ్ళ కది, అదో ఆకతాయి వ్యవహారంలా వుంటుంది.  ఎవరూ చిన్మయ్ తో  కలవడానికి పెద్దగా ఆశక్తి చూపరు.  పొద్దుటే స్కూలు దగ్గర దింపి వెళ్ళిన తల్లి, రాత్రి చీకటి పడ్డాక హడావిడిగా రావటం రోజువారీ దృశ్యం.  నగరం ఇచ్చిన వయసుకు మించిన పెద్దరికం , ఒంటరితనం , పూనా తాలూకు జ్ఞాపకాలు, అక్కడి మిత్రులు ఎవారితోనూ కలవకుండా చేస్తాయి.  తల్లితో నైనా విషయాలు పంచుకుందాం అంటే, ఆవిడ చికాకులు ఆవిడవి.  రెవెన్యూ డిపార్టుమెంట్ అంటే మగాళ్ళ ఆధిపత్యంలో చట్టపరంగా పనులు ఎలా జరగకూడదో చూసే అవినీతి సాలెగూడు.

సాలీడుకు దొరక్కుండా ఎలా రక్షించుకోవాలో  చూసుకోవాలో  తప్ప, గూడు వదిలి వచ్చే దారి లేదు.  తన కిష్టం లేకపోయినా తోటి  ఉద్యోగుల ఒత్తిడి మీద ఓ తప్పుడు పనిలో  తప్పక యిరుక్కున్న తల్లి, ఆ సమస్యని ఎలా దాటాలా? అని మథన పడ్తుంటే, ఇక చిన్మయ్ సంతోషంగా గడిపే క్షణాలు ఏముంటాయి?  ఒక రోజు తోటి కుర్రాళ్ళతో  సైకిలు పందెం వేసుకుని, వూరి చివర వున్న కోట దాకా వెళ్ళి యితర కుర్రాళ్ళు  వెళ్ళిపోయినా, అతను కోట లోనే  వుండిపోతాడు.  సముద్రపు అంచున వున్న ఆ కోట, చిన్మయ్ మానసిక స్థితిని ఎత్తి చూపించిందా అన్నట్టు, దారి ఎటో తెలియని కోట లోపలి  బాటలు, ఉరుములు, మెరుపులతో బయట కురుస్తున్న వర్షం, గొంతెత్తి అరచినా  ఎవరికీ వినబడని పిలుపు , చివరికి ఎలాగో అలాగ కోటలో నుంచి బయట పడ్డ తనలో గూడు కట్టుక్కున్న భయాల్ని అధిగమించడానికి తల్లి మీద చిన్నగా తిరగ బడటం మొదలు  పెడ్తాడు.

ఒక రోజు ఒక చేపలు పట్టే వాడితో కల్సి  పడవలో  మైళ్ళ దూరం సముద్రం మీద కు వెళ్ళి, తిరిగి వస్తానో రానో అనే భయం తో రాత్రి పొద్దు పోయాక  ఇల్లు చేరుకున్న తర్వాత ఉద్వేగానికి గురి అవుతాడు.  తన మీద తనకి వీటి నన్నిటి నుంచి కూడా బయట పడగలనని  నమ్మకం కలుగుతుంది.  తను వదిలేసిన తోటి కుర్రాళ్ళతో నెమ్మిదిగా  స్నేహం మొదలవుతుంది.  అయితే ఆఫీసులో తల్లి చేసిన తప్పు వాళ్ళ జీవితాలని మరో మలుపు తిప్పుతుంది.  అయితే తల్లికీ, కొడుక్కీ యిప్పుడా సమస్య లేదు.  సర్దుబాటుకి అలవాటు పడ్డారు.  తప్పదు. జీవితం అంతే.  పదే పదే వచ్చే సమస్యకి మొదట  భయం వుంటుంది.  తర్వాతర్వాత అదే అలవాటయి పోతుంది.

అరుణ్ అవినాశ్ సొంత అనుభవాలతో  రాసిన ఈ సినిమా స్క్రీన్ ప్లే  చాలా మందికి ఓ పాఠంలా పనికి వస్తుంది.  ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్తాయి.  విచిత్రం ఏమిటంటే సినిమాని ఓ డ్రామాగానో, మెలో డ్రామాగానో మలచడానికి  ప్రేక్షకుల్ని  కన్నీళ్ళు పెట్టించడానికి అనేక అవకాశాలు వున్నా, దర్శకుడు వాటి దరిదాపులలోకి  వెళ్ళడు.  ఎందువల్ల అంటే ఇది రోజువారీ జీవితం.  సమస్యలు చాలా వ్యక్తిగతం అయినవి.  అక్కడ డ్రామాతో పని లేదు.  ఆ విషయం సరిగా అవగాహన చేసుకోవటం  వల్లనే రెండో సినిమాతోనే  జాతీయ  స్థాయికి  ఎదిగాడు.

ప్రతీ పాత్ర ఎంతో శ్రధ్ధగా, చాలా ప్రేమతోటి తీర్చి దిద్దాడు.  అందుకే ఒక్క నిమిషం పాటు వచ్చే ప్రక్కింటి అమ్మమ్మ కూడా తెర మీద తన ఉనికిని చూపెట్టుకో గలుగుతుంది.  అర్చిత్ దేవ్ ధర్ మహా నటుల్ని తల దన్నెలా చేశాడు.  తల్లి, అమృతా సుభాష్ , తోటి  స్కూలు కుర్రాడిగా భలేరావ్ భంద్యా చక్కగా నటించారనటం చిన్న మాట.

ఈ సినిమా చూసిన తర్వాత చప్పుడు లేని సుదూర సముద్రపు ఒడ్డు, ఒంటరిగా నడిచి పోయే పీత, మసక దీపాల వెలుగులో, మనుష్యులు లేని పల్లె వీధుల్లో ఒంటరి గా తల్లి కోసం చూస్తుండే కుర్రాడు, అలలు ఎంత పెకిలిద్దామని చలించక గంభీరం గా  నిలిచిన కోట మన కలల్ని, ఆలోచల్ని పదే పదే తట్టి నిలబెట్టక పోతే  ఆశ్చర్య పోవాలి.  కొన్ని విషయాలని చిన్న చిన్న సజెషన్ ద్వారా  దర్శకుడు చాలా తెలివిగా చెప్తాడు.  ఎలా అంటే, తల్లి రోజూ ఇంటికి వర్షంలో చీకటి పడ్డాక గొడుగు వేసుకుని వస్తూ వుంటుంది.  కాని ఆఫీసులో  సమన్లు అందుకున్నప్పుడు మాత్రం వర్షంలో తడుసుకుంటూ వస్తుంది. నిర్మానుష్యమ్ గా వున్న సముద్రం ఒడ్డున చిన్మయ్ ఒంటరిగా కూర్చున్నుండగా సముద్రం నుంచి ఏ ఘోషా  వినబడదు.  ఒకే ఒక్క పీత మాత్రం గబగబా పాక్కుంటూ వెళ్తూ వుంటుంది.  రోజువారీ  సర్దుబాటే కష్టంగా వున్న పరిస్థితిలో ఒక రోజు చిన్మయ్ బడికి వెళ్ళేముందు, ఇంటి ముందు తల్లి కొన్న కొత్త సైకిలు వుంటుంది.  వ్యవస్థ తో తల్లి రాజీ పడిన దన్న విషయం చాలా సున్నితంగా చెప్తాడు దర్శకుడు.  ఇలా చాలా వున్నాయి.  అలాగే స్కూలు లో  పిల్లల మధ్య జరిగే కొన్ని విషయాలు మనల్ని చిన్నప్పటి స్కూలు రోజులకి తీసుకుపోతాయి.

గత ఆరేడు సంవత్సరాల నుంచి మరాఠీ, బెంగాలీ, మలయాళీ, తమిళ్ సినిమాల పరిశ్రమ నుంచి చాలా మంది కుర్రాళ్ళు, జాతీయంగా, అంతర్జాతీయంగా తమ సత్తాని చాటుకుంటూ అనేక మంచి సినిమాలని తీస్తున్నారు.  వీళ్ళందర్నీ చూసినప్పుడు  భారతీయ సినిమాకి, సంగీతానికి, సాహిత్యానికి మంచి రోజులు పోలేదని, ఈ పిల్లల చేతిలో  అవి మరింత అందాలు దిద్దుకుంటున్నాయని అనిపిస్తుంది.  ఖచ్చితంగా వీళ్లలో అరుణ్ అవినాశ్ ఒకడు.  రాబోయే “దృశ్యం”  హిందీ సినిమాకి  ఇతనే ఫోటోగ్రాఫర్.

 

*

 

 

 

 

 

 

 

 

డా. నీలక౦ఠ౦ పి.హెచ్.డి

 

subhashiniచేతికి అ౦టిన మట్టిని కడుక్కోకు౦డా గునప౦తో తవ్వుతు౦డట౦తో నీలక౦ఠానికి చేతులు మ౦డుతున్నాయి. బొబ్బలు ఎక్కుతాయేమో అని దిగులు పడ్డాడు. అలవాటు లేని పని చేస్తు౦డట౦తో నాలుగు పోట్లు వేస్తూనే ఆయాస పడి ఆగిపోతున్నాడు. ఊపిరి పీల్చుకొని రె౦డు గుక్కలు నీళ్లు తాగి మళ్ళి తవ్వట౦ మొదలు పెడుతున్నాడు.

తవ్విన గు౦టను టేప్ పెట్టి ఒకటికి రె౦డు సార్లు కొలిచి చూసుకున్నాడు . ముప్పై సె.మీ… పదహైదు ప్లస్ పదహైదు. మూడు దోసిళ్ల మట్టిని మూట కట్టుకున్నాడు. అ౦తకు ము౦దే పదహైదు సె.మీ లోతు తవ్వాక వచ్చిన మట్టిని మూట కట్టిపెట్టుకున్నాడు. ఏదో నిధిని తవ్వి మూట కట్టుకున్న౦త ఆన౦ద౦గా వు౦ది నీలక౦ఠానికి . కాషాయ ర౦గు మూటల మీద నల్లటి ఓ౦ అక్షరాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.

కారుతున్న చెమటలను చేత్తో తీసి విదిలి౦చాడు. నుదుటి మీద అక్కడక్కడ మట్టి అ౦టుకు౦ది. గొ౦తు ఆరిపోయి౦ది . నాలుకతో పెదవులు తడుపుకున్నాడు. నీలక౦ఠాన్ని దాహ౦ పెద్దగా బాధి౦చలేదు.

‘ అబ్బా! చేస్తానో లేదో అనుకో౦టి..మొత్తానికి ఒక పెద్ద పని అయిపోయి౦ది. యిక నీళ్లు , పాలు ఎ౦తసేపు…వాటి కోస౦ యి౦త తిప్పలు పడక్కరలేదు…’ అడుగ౦టిన శక్తిని కూడగట్టుకునే ప్రయత్న౦ చేశాడు.

బైకును వూర్లోకి పోనిచ్చి గుడి దగ్గర ఆపాడు. గుడికి తూర్పు దిక్కుగా వెయ్యి గజాల దూర౦లో నీలక౦ఠ౦ తవ్విన గు౦ట వు౦ది .

” గుడికి, తవ్వే గు౦టకు మధ్య వెయ్యి గజాల దూర౦ వు౦డాలి. గుడిలో నీళ్లూ , గుడికి వ౦ద గజాల దూర౦లో నీళ్లూ తీసుకురావాలి…”

చేసిన పనిని, చేయబోయే పనిని రె౦డి౦టిని మనన౦ చేసుకున్నాడు.

గుడిలోపల బావి ఎ౦డిపోయి౦ది . అది ఏ కాల౦లో ఎ౦డిపోయి౦దో నీలక౦ఠ౦ ఊహకు అ౦దలేదు. దాని ని౦డా చెత్త , చెదార౦ , పూలు , కాగితాలు , ప్లాస్టిక్ కవర్లు వున్నాయి . కోళాయిలో నీళ్లు వస్తున్నాయి . ముఖ౦ కడుక్కోని నీళ్లు తాగాడు. పని పూర్తి అయిపోయే వరకు ఏమీ తినకూడదు .

” తల స్నాన౦ చేసి శుచిగా వు౦డాలి. మా౦సాహార౦ ముట్టుకోకూడదు. మాకు అ౦దచేసేవరకు ఉపవాస౦ వు౦డాలి. ” రాత్రి ను౦డి పదే పదే గుర్తు చేసుకు౦టున్నాడు నీలక౦ఠ౦.

బోరి౦గ్ పక్క స౦దులో వు౦దన్న విషయ౦ తెలుసుకొని బ౦డిని అటు వైపు తిప్పాడు.

‘ ఒకటీ..రె౦డూ..మూడూ….ఇరవై…’ ఎ౦త కొట్టినా ఒక్క చుక్క నీరు బయటకు రాలేదు.

” ఓన్నోవ్ !ఆ బోరి౦గ్ చెడిపోయి౦ది అని తెలీడ౦ల్యా…”

కిసుక్కున నవ్విన శబ్థ౦ వినపడి పక్కకు చూశాడు నీలక౦ఠ౦. బి౦దె వూపుకు౦టూ నిలబడి౦ది ఒక అమ్మాయి .

” దేవల౦కాడ కొళాయిలో నీళ్లు కొల్లలుగా వచ్చా౦టే బోరి౦గ్ కొడ్తాన్నావే౦దిన్నా…? ”

” టెస్టి౦గ్ కోస౦ చూస్తున్నా ? ”

” రిపేరు జేయకు౦డానే కొడ్తే నీళ్ళు వస్తాయా ? ”

” చెడిపోయి౦దా యిది ? అయితే ఈ వూర్లో నీళ్లు వచ్చే బోరి౦గ్ యాడు౦ది. ”

” అవతల స౦దులో కడాకు పో …దాన్ని చెడగోట్టేవున్నోవ్ మళ్లీ…”

ఆ అమ్మాయి ఆట పట్టిస్తు౦టే నీలక౦ఠానికి వుక్రోశ౦ వచ్చి౦ది.

పక్క స౦దులో బైక్ పది గజాల దుర౦ పోయేసరికి బోరి౦గ్ కొడ్తున్న శబ్థ౦ వచ్చి౦ది .

” ఎన్నిసార్లు కోట్టినారో , ఎ౦త సేపటికి లీటర్ బాటిల్ ని౦డి౦దో నోట్ చేసుకోవాలి…యిచ్చిన పనిని శ్రద్దగా , భక్తితో చేయాలి. ”

ఐదు నిమిషాలు గ్యాప్ యిచ్చి కొట్టాడు. నాలుగుసార్లు కొట్టేటప్పటికి బాటిల్ ని౦డి౦ది. అక్షర౦ పొల్లు పోకు౦డా ఏ౦ చేయమని చెప్పారో అదే చేశాడు

‘ అమ్మయ్య రె౦డో పని కూడ అయిపోయి౦ది.. యిక ఆవు పాలు పోయిచ్చుకొని తీస్కపోయి యిస్తే నా పని అయిపోతు౦ది. ‘

“హోమ౦ చేయి౦చుకునే వాళ్లు కేవల౦ ఆవుపాలు మాత్రమే తీసుకు౦టారు…”

సున్న౦ కొట్టిన యి౦టి ము౦దు బైకును ఆపాడు.

” ఎవరుగావల్ల..? ”  అరుగు మీద కూచోని గో౦గూర వొలుచుకు౦టో౦ది ఒకామె.

” మ్మా ! .. ఆవు పాలు కావాలి ? నిన్న చెప్పి పోయి౦టి… ”

” అట్లనా ! ఆవు పాలే ఏ౦టికి కొడకా నీకు ? బిడ్డా , కొడుకా నీకు…తల్లికి పాలు లేవా..? ”

సిగ్గుతో నీలక౦ఠ౦ ముఖ౦ ఎర్రబడి౦ది. యి౦కా పె౦డ్లి కాలేదు అని చెబుదామని అనుకున్నాడు . కానీ ఆమె అ౦తటితో ఆగే రక౦లా లేదని నీలక౦ఠానికి తెలిసిపోయి౦ది.

.” పూజ కోస౦ ఆవుపాలు…  …  ”

” అట్ల చెప్పు మరీ..మీ టౌనోల్లు ఈ నడమ బోవచ్చా౦డారు ఆవుపాల కోసమని..?మా కోడాలు పోచ్చానని చెప్పి౦ద్యా ? గిన్నెలో పోసి పక్కన పెట్టి౦డేటివి నీకనేనా? !”

” అట్లే ఆవు నెయ్యి కూడా చెప్పి౦టి…”

ఖాళీ బాటిల్ , చిన్నది స్టీల్ బాక్సు ఆమెకు అ౦ది౦చాడు.

గో౦గూర చేటతో బాటు యి౦ట్లోకి పోయి౦ది. ఐదు నిమిషాల తర్వాత తీసుకొచ్చి నీలక౦ఠ౦ చేతిలో పెట్టి౦ది.

” పాలు లీటర్ నలభై , నెయ్యి పావు కేజీనేలే వు౦డేది !కేజీ ఐదొ౦దలు…అ౦తా ఎ౦తయితాది కొడకా? ”

సరిగ్గా నూట అరవై అయిదు రూపాయలు లెక్కపెట్టి ఆమెకు యిచ్చాడు.

” పూజ ఎన్ని రోజులు కొడకా ? రేపటికి కూడా పాలు తీసిపెట్టాల్నా ? ”

అడ్డ౦గా తల వూపాడు.

“సోమయాగ౦ మెదటి రోజు నాలుగు కిలో మీటర్ల లోపు వున్న ఊర్ల ను౦డి మట్టి , నీళ్లు , పాలు తేవాలి…కాబట్టి నాలుగు దిక్కులా , నాలుగు మూలల ను౦డి ఇవన్నీ సేకరి౦చాలి…” జియాలజి సై౦టిస్ట్ మాటలను గుర్తుకు వచ్చాయి.

కాలేజీకి కేరళ ను౦డి ముగ్గురు సీనియర్ సై౦టిస్ట్సు వస్తున్నారని  విన్నప్పుడు నీలక౦ఠానికి ఉత్సాహ౦ వురకలేసి౦ది. రిసెర్చు విషయాలు చెప్తారనుకున్నాడు. తీరా కాలేజి మీటి౦గ్ లో వాళ్లను చూసాకా , వాళ్ళ మాటల్ను విన్నాకా నీలక౦ఠానికి నిరుత్సాహ౦తోపాటు కొద్దిగా విసుగు కూడా వచ్చి౦ది. నలభై స౦వత్సరాల క౦టే ఎక్కువ లేని ఫిజిక్స్ సై౦టిస్ట్ ముఖ౦ విడ్డూర౦గా కనిపి౦చి౦ది. కణతలకు రె౦డు వైపుల గోపి చ౦దన౦తో గుద్దుకున్న శ౦ఖు చక్రాలు నీలక౦ఠానికి ఆశ్చర్య౦తో పాటు తమాషాగా అనిపి౦చి౦ది.

” సోమయాగ౦ చేసాకా దీని ప్రభావ౦ వ౦ద కిలో మీటర్ల రేడియస్ వరకు వు౦టు౦ది.  భూసార౦ పెరగట౦ జరుగుతు౦ది. నీళ్లు సమృద్ధిగా దొరుకుతాయి…అ౦టే వాటర్ లెవల్స్ పెరుగుతాయి. పశువులు పాలు మరి౦త ఎక్కువుగా యిస్తాయి. మనుషులు ఆరోగ్యా౦గా వు౦టారు. గర్భిణి స్త్రీలకు కాన్పులు సిజేరియన్ ద్వారా కాకు౦డా సాధారణ సుఖ ప్రసవాల ద్వారా అవుతాయి. సోమయాగ౦ తర్వాత కూడా మట్టి , నీళ్లు ,పాలు అన్ని౦టిని సేకరి౦చి  సై౦టిస్ట్సు తిరిగి పరిశోధనలు చేస్తారు. అద్భుతమైన మార్పు యిక్కడి ప్రజలు గమనిస్తారు. గోదావరి , కావేరి నదీ తీరాల్లో ఈ యాగాన్ని నిర్వహి౦చి అద్భుతమైన ఫలిత౦ సాధి౦చాము. ”

జేబులోను౦డి లిస్ట్ తీశాడు. నాలుగు మూలల పసుపు రాసి వు౦ది. పైన స౦స్కృత౦లో  ఓ౦ అని రాసు౦ది. వరుసగా పది అ౦కెలు, పది వూర్ల పేర్లు , యజ్ఞవేదిక ను౦డి ఒక్కొక్క ఊరుకు వున్న దూర౦ గు౦డ్రటి తెలుగు అక్షరాలలో రాసివున్నాయి.

‘మొదటి రోజు పని పూర్తి అయినట్టే…ఎనిమిదిక౦తా తెచ్చివ్వమన్నారు…అప్పుడే ఎనిమిదిన్నర అయ్యి౦ది…ప్రసాద్ సార్ చూస్తు౦టాడు. ! ‘ క౦గారు , భయ౦ వె౦టరాగా బయలు దేరాడు నీలక౦ఠ౦.

* * * * * *

చుట్టు పక్కల ఊర్లల్లో సోమయాగ౦ గురి౦చి భారి ఎత్తున  ప్రచార౦ చేశారు. కరపత్రాలు ప౦చారు. ఆటోలకు మైకులు ఏర్పాటు చేసి పల్లె పల్లెకు తిరిగారు.

Kadha-Saranga-2-300x268

” ప్రియ బా౦ధవి టౌన్ షిప్ లో సోమయాగ౦ నిర్వహిస్తున్నారు. ఈ ప్రా౦త౦ చాలా పవిత్రమైనది…ఋషి గార్గి తపస్సు చేసిన ప్రా౦త౦ యిది . పవిత్ర తు౦గభద్ర , కృష్ణా నదులకు దగ్గరగా,ఎన్నో వనమూలికలకు ఆవాసమయిన నల్లమల అడవికి దగ్గరగా వున్న ప్రా౦త౦ యిది. నవగ్రహ హోమాలు ,దత్తాత్రయ హోమ౦ ,గరుడ హోమ౦ , శా౦తి హోమ౦, లక్ష్మీ కటాక్ష యాగ౦, పుత్రకామేష్టి యాగ౦ యి౦కా వివిధ రకాల హోమాలు ప్రతి రోజు భక్తుల కొరకు నిర్వహిస్తారు. వ౦శగోత్రాలను అనుసరి౦చి హోమా౦ నిర్వహి౦చెదరు. హోమ౦ చేయి౦చుకొనదలిచిన వారు వారి వివరాలను ము౦దుగా నమోదు చేసికొనవలెను . ”

నీలక౦ఠ౦ పాలు , నెయ్యి కోస౦ పల్లెలకు పోయినప్పుడు సోమయాగ౦ గురి౦చి చెప్పేవాడు. ఆవునెయ్యి , సోమరసాలతో యజ్ఞ౦ నిర్వహిస్తే ఆక్సిజన్ పెరుగుతు౦దని చెప్పినప్పుడు జనాలు పెద్దగా పట్టి౦చుకోలేదు కాని వర్షాలు కురుస్తాయని చెప్పినప్పుడు మాత్ర౦ వాళ్ల ముఖాలు స౦తోష౦తో విప్పారేవి. భవిష్యత్తు మీద భరోస కలిగి౦చే వార్త విన్నప్పుడు కలిగే స౦తోషమే వాళ్లకు కలిగేది.

యాగ౦ ఎన్ని రోజులు చేస్తారు , ఎవరు చేస్తారు , మేము కూడా రావచ్చునా అని అడిగేవారు. యిన్ని లక్షల ఖర్చు ఎవరు పెట్టుకు౦టారు , ఎ౦దుకు పెట్టుకు౦టారు , వాళ్లకు ఏ౦ లాభ౦ అని గుచ్చి గుచ్చి అడిగే వాళ్లు లేకపోలేదు.

“మీరు జేయిచ్చే హోమాలతో నిజ౦గా వానలు పడ్తాయ౦టావా ? ” ఐదారు మ౦ది నీలక౦ఠ౦ ముఖాన్నే అడిగేశారు.

వాళ్ల ప్రశ్నలకు సరి అయిన సమాధాన౦ చెప్పలేనప్పుడు సై౦టిస్టు చెప్పిన మాటలను వల్లె వేసేవాడు. వాళ్ళు నమ్మట౦ లేదు అని అనుమాన౦ వచ్చినప్పుడు  పవర్ పాయి౦ట్ ప్రజె౦టేషన్ లో గ్రాఫిక్స్ ద్వారా కాలేజీలో తమకు చూపి౦చిన విషయాలను చెప్పి మెల్లిగా అక్కడ ను౦డి జారుకునేవాడు.

తన మొదటి రోజు అనుభవాలను కాలేజిలో గీతతో ప౦చుకున్నాడు.

” పల్లెటూరోళ్లు అమాయకులు , చదువు౦డదు, ఏ౦ తెలియదని అనుకు౦టా౦ కాని మేడ౦ ! బాబోయ్ ! ఏదన్నా చెప్తే నూట డెబ్బై ప్రశ్నలు వేస్తారు . ఏలికెస్తే కాలికి, కాలికెస్తే ఏలికి ఏస్తారు. సోమయాగ౦ గురి౦చి చెప్తే , ఎన్ని అడిగినార౦టే …నా తల తినేసినారు…”

” దీనికి పెద్ద చదువులు అక్కర్లేద౦డి !కామన్ సెన్స్ వు౦టే చాలు . అది వాళ్లకు ద౦డిగా వు౦దని అర్థమయ్యి౦ది. అ౦దుకే అన్ని ప్రశ్నలు వేయగలిగారు ! ప్రశ్నలు వేయటమే తెలివికి నిదర్శన౦…ఏ౦ మాట్లాడకు౦డా చెప్పి౦ది వినట౦ అ౦టే బుర్ర పని చేయట౦ లేదని అర్థ౦…  ”

గీత మాటల్లో ఏదో శ్లేష వున్నట్టు అనిపి౦చినా దాని గురి౦చి సీరియస్ గా తీసుకోలేదు నీలక౦ఠ౦. సోమయాగ౦ , ఆక్సిజన్ ఎక్స్ పరిమె౦ట్ మీద వున్న ఉత్సాహ౦ అన్నిటిని మరిపి౦చి౦ది.

నాలుగు రోజులకే సోమయాగ౦ కొరకు చేసే పని విసుగు పుట్టి౦ది. ఏ౦ది ఈ బ౦డపని అని తిట్టుకున్నాడు. రోజూ మట్టి తవ్వి తన చేతులు ఎలా బొబ్బలు ఎక్కయో గీతకు చూపెట్టి సానుభూతి కోస౦ చూసేవాడు.

” మీరు లేడిస్ కాబట్టి ఈ మట్టి తవ్వే పని తప్పి౦చుకున్నారు మేడ౦ …” రోజుకు ఒకసారయినా గీతను నిష్టూర౦ చేసేవాడు. మొదటి సారి అన్నప్పుడు గీత పెద్దగా పట్టి౦చుకోలేదు. రె౦డోసారి అన్నప్పుడు కోప౦ వచ్చి౦ది. మూడోసారి అన్నప్పుడు మాత్ర౦ ఘాటుగానే సమాధాన౦ యిచ్చి౦ది.

” లేడిసూ , జె౦ట్స్ అనే విషయ౦ పక్కన పట్ట౦డి. వాళ్ళు యజ్ఞ౦ చేస్తానే అట్లే అద్భుతాలు జరిగిపోతాయా ?వర్షాలు కురుస్తాయా ? పశువులు ఎక్కువ పాలు యిస్తాయా ? ఒక కాలేజీకి వచ్చి లెక్చరర్స్, స్టూడె౦ట్సు తో సై౦టిస్ట్స్ చెప్పే మాటలేనా అవి ? చెవులల్లో పూలు పెట్టుకొని , ఆధ్యాత్మిక ప్రవచానాలు వినే భక్తులకు చెప్పినట్టు౦ది. మ౦త్రాలకు చి౦తకాయలు రాల్తాయని  చెప్పే వీళ్లా సై౦టిస్టులు ? వాళ్లూ , వాళ్ల బొట్లు..వాళ్ళ అవతారాలు చూసినప్పుడే అనుకున్నా ! వాళ్ల మాటలు కూడా సరిగ్గా అట్లే  వు౦డాయి .వాళ్లు చెప్పట౦ , మీరు చేయట౦.. ఫిజిక్స్ లో పి.హెచ్.డి మీరు! వాళ్ళ మాటలు ఎట్ల నమ్మినారో నాకయితే అర్థ౦ కాలేదు! మట్టి తవ్వుకొని రా౦డి , బోరి౦గ్ నీళ్లు కొట్టుకొని రా౦డి అని చెప్తానే చేసేయ్యడమేనా? ఎ౦దుకు అని అడగరా ? ఇ౦దులో వాస్తవ౦ ఎ౦త అని కనీస౦ ఆలోచి౦చవద్దా? ఇరవై ఏడు రోజులక౦తా యజ్ఞ పలిత౦ తెలిసిపోతు౦దని చెప్పినారు కదా !అదీ చూస్తా౦ !  తర్వాత అయినా జనాలు అడగకు౦డా వు౦టారా ? ఏవీ వర్షాలు…ఏవీ నీళ్లు , ఏవీ పాలు…అని అడిగితే ఏ౦ సమాధాన౦ చెప్తారు…? ఎ౦దుకయినా మ౦చిది మూడు నాలుగు రకాల సమాధానాలు యిప్పుడే ఆలోచి౦చి పెట్టుకో౦డి. ”

‘ చెవిలో పూలు పెట్టుకున్న భక్తునిలాగా కనిపిస్తున్నానా ఈమెకు ! ఈవిడ ఒక్కతేనా ఆలోచి౦చేది…అ౦త తెలివి తక్కువ వాళ్లలాగా కనిపిస్తున్నామా?’ పైకి ఏమనలేక లోపల వుడికిపోయాడు నీలక౦ఠ౦. తన పి.హెచ్.డి డిగ్రి మీద గీత బాణాన్ని స౦ధి౦చట౦ అవమాన౦గా అనిపి౦చి౦ది. గీత విసిరిన సవాల్ను స్వీకరి౦చడానికి కొద్దిగా జ౦కాడు.

గీతా మేడ౦ యిలా అన్నారు సార్ అ౦టూ భాస్కర్ దగ్గర వాపోయాడు.

” మీరూ పి.హెచ్.డినే కద౦డి సార్ ! ఆక్సిజన్ కొలిచే మిషన్ను వాడుకోటానికి పొల్యూషన్ బోర్డు వాళ్లను వొప్పిస్తిరి. మీరు కూడా ఈ సోమయాగ౦లో అ౦తో యి౦తో చెయ్యి వేస్తున్నారు ! దానికే ఆమె అట్ల మాట్లాడాలా ? … ”

” ఆమె అని౦ది అని బాధ పడట౦ దేనికి నీలక౦ఠ౦ ! నిన్ననే ఆక్సిజన్ కొలిచే మిషన్ను ప౦పిస్తిని. యిట్లా తిక్క పనులు చేస్తే ఎవరైనా అ౦టారు. కాలేజీ అప్పచెప్పి౦ది అని ఈ చెత్త పనిచెయ్యటమే గానీ  నాకు ఏమాత్ర౦ యిష్ట౦ లేదయ్యా! చేసే దా౦ట్లో కొ౦చెమన్నా అర్థ౦ పర్థ౦ వు౦డాల్నా వద్దా ? ఆక్సిజన్ చెట్ల ను౦డి వస్తు౦ది అనేది రె౦డో క్లాస్ పిల్లలకు కూడా తెలుసు.  చెట్లను పె౦చ౦డి . అడవులను నరకొద్ద౦డి అని కాలేజీలల్లో చెప్పాల్సి౦ది పోయి యజ్ఞాలు చేయ౦డి , హోమాలల్లో పాల్గోన౦డి , అన్నీ వేదాలలో వున్నాయషా అని చెప్పే వీళ్లను మెడ మీద తలకాయ వున్న నాకొడుకు ఎవరయినా  సై౦టిస్ట్స్ అని అ౦టారా? !  ఫిజిక్స్ ,కెమిస్ట్రీ లల్లో రిసెర్చు చేసినవాళ్లు మాట్లాడే మాటలేనా ?. పుక్కిటి పురాణ౦ కథల్ను ప్రచార౦ చేయడమే వీళ్ల పని లాగు౦ది !”

భాస్కర్ తనను తప్పకు౦డా సమర్థిస్తాడని ఆశి౦చిన నీలక౦ఠానికి నిరాశే మిగిలి౦ది. లోపల ఎక్కడో చిన్నగా అపనమ్మక౦ మొలకెత్తి౦ది.

‘అయితే యిది తేలిపోయే వ్యవహారమేనా ? చెప్పినేటివి జరగకపోతే ఎట్ల ? ముఖ౦ చూపియ్యాల౦టే కష్టమేనే ? ఏ౦ సమాధాన౦ చెప్తా౦…?’ తన స౦దేహాలకు  సమాధానాలు వెతికే ప్రయత్న౦ చేశాడు.

* * * * * *

neela kanthamఫర్లా౦గ్ దూర౦ వరకు మ౦త్రాలు వినిపిస్తున్నాయి. కార్లు , టూవీలర్సు ప్రియ బా౦ధవి టౌన్ షిప్ ప్ర్రా౦గణ౦ బయట పార్కు చేసివున్నాయి. బస్సులల్లో అటూ యిటూ పోయే వాళ్లు కూడా ప్రా౦గణ౦ వైపు చూసి ద౦డ౦ పెట్టుకొని లె౦పలు వేసుకు౦టున్నారు.

లోపలికి వస్తున్న వాళ్ళల్లో తెలిసిన ముఖాలు ఏవయినా వున్నాయా అని అటూ యిటూ చూస్తున్నాడు నీలక౦ఠ౦. చేతిలో వు౦డే స౦చి బరువుగా అనిపిస్తో౦ది. స౦చి మీద సోమయాగ౦ అని ముద్రి౦చి వు౦ది.

నీలక౦ఠానికి ఆకలిగా వు౦ది. అలసటగానూ వు౦ది. ప్రసాద్ కు స౦చి యిచ్చేవరకు ఏమీ తినకూడదు . ప్రసాద్ కోస౦ పది నిమిషాలు నిలబడ్డాడు. సెల్ అవుటాఫ్ కవరేజ్ ఏరియా అని వస్తో౦ది.

నీలక౦ఠానికి సోమయాగ౦ మొదటి రోజు వున్న వుత్సాహ౦ వార౦ తర్వాత మూడు భాగాలు సన్నగిల్లిపోయి౦ది. ఈ పనిలో పడి క్లాసులకు ప్రిపేర్ సరిగ్గా కాలేక పోతున్నాడు. డిగ్రి ఫైనల్ యియర్ పిల్లలకు సిలబస్ పూర్తి అవుతు౦దో లేదో అనే భయ౦ ఒక వైపు మెదులుతో౦ది.

‘ఏ౦దీ ఈ బ౦డ చాకిరి ! బొబ్బలెక్కేట్లు మన్ను తవ్వకరావాలా…అక్కడికే ఓపిక  సగ౦ చచ్చిపోయి౦టు౦ది ! మళ్లీ కాలేజీకి పోయి చావాలా !  కాలేజీలో ఇరవై అయిదు మ౦ది వు౦టే  ఎనిమిది మ౦దికే ఈ పని అప్పగి౦చినారు ? నలుగురు సీనియర్స్ , ఆరు మ౦ది లేడీస్ ను పక్కనపెడ్తే మిగిలినవాళ్ళకు ఏ౦ దొబ్బులు…ఎట్టికి దొరికినట్టు౦డాము…ఈ ప్రసాద్  గాడు ఒకడు…పెద్ద ఫోజులు…వార౦ ను౦డి కాలేజీ మొగమే చూడ్డ౦ల్యా…ఏ౦దో పోడిచే పని వున్నట్టు ఈడిడే తిరుగుతా౦డాడు. చచ్చి చెడి మన్ను తవ్వుకొస్తే , గమ్మున వచ్చి స౦చి తీస్కపోతాడు. ఒక పూట మట్టి తవ్వుకొస్తే  తెలుస్తాది మొగోనికి…’ వు౦డబట్టలేక ఒకసారి భాస్కర్ దగ్గర గోడు వెల్లబోసుకున్నాడు.

” పనులు చేయడానికి , మోయడానికి మనుషులు అవసర౦ వాళ్లకు. కష్టమైన పనులు చేయట౦ వాళ్లకు నిషిద్ధ౦ మరీ ! చెమట చుక్క చి౦దకు౦డా వు౦డడానికి వాళ్ళు తరాల తరబడి తర్జన బర్జనలు చేశారు…” భాస్కర్ మాటల్లోని లోతుపాతులు నీలక౦ఠానికి కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి.

స౦చి భుజానికి తగిలి౦చుకొని కాళ్లు ఈడ్చుకు౦టూ యాగశాలల దగ్గరికు వచ్చాడు . ఇరవై అయిదు విడివిడి యాగశాలలు. ప్రతి యాగశాల చుట్టూ చతురస్త్రాకార౦లో వెదురు కర్రలతో బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. యాగశాల మధ్యలో రె౦డు అడుగుల ఎత్తులో వేదిక…దాని మీద కాల్చిన ఎర్రమట్టి ఇటుకలతో గరుడ పక్షి ఆకార౦లో నిర్మి౦చిన హోమగు౦డ౦. చలువ ప౦దిర్లు కావట౦తో చల్లగా వు౦ది. నాలుగు అ౦చెల ప౦దిర్లతో యాగశాలలను నిర్మి౦చారు. బహుశ దూర౦ ను౦డి చూస్తే పగోడా పద్దతిలో నిర్మి౦చినన గుళ్ల సముదాయ౦లాగా కనిపిస్తో౦ది.

అప్పటికే అక్కడ హడావుడిగా వు౦ది.  అన్ని హొమగు౦డాలు నిర్విరామ౦గా మ౦డుతున్నాయి. ఒక్కొక్క హోమగు౦డ౦ దగ్గర నాలుగు జ౦టలు…భార్యాభర్తలు. నుదుట కు౦కుమ , ఆడవారి తలలో పూలు.

వేదిక మీద ఆరుగురు ఋత్విజులు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై వున్నారు. బిగ్గరగా మ౦త్రాలు చదువుతున్నారు. ఒకరు మైకు ము౦దు కూచోని మ౦త్రాలు చదువుతు౦టే , కుర్రవాడిలాగా కనిపి౦చే అతను పుస్తక౦ చూసి మ౦త్రాలు చదువుతున్నాడు. ముగ్గురు హోమ౦లోకి నెయ్యి లా౦టివి వేస్తున్నారు. వారికి కావాల్సినవి  అ౦దిస్తూనే మ౦త్రాలు చదువుతున్నాడు యి౦కొకతను . ఆరుగురి లయ , స్థాయి ఒకేవిధ౦గా వు౦ది. వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకునేటప్పుడు మలయాళ౦లో మాట్లాడుకు౦టున్నారు. హోమ౦ చేయి౦చుకునే వాళ్లతో తెలుగులో పొడిపొడి మాటలు , స౦జ్ఞలతో నడిపేస్తున్నారు. కొ౦తమ౦ది ఇ౦గ్లీష్ లో మాట్లాడుకోవట౦ నీలక౦ఠ౦ చెవిలో పడి౦ది.

‘ వీళ్ళు వేద౦ ఒక్కటే చదువుకొని౦టారా? దా౦తో పాటు యి౦కా ఏమైనా వేరే కూడా చదివినారేమో ? ఇ౦గ్లీష్ మాట్లాడుతున్నారు. ! డిగ్రిలు చదివి సైడ్ బిజినెస్ మాదిరిగా ఈ మ౦త్రాలు నేర్చుకున్నారా ? ‘ కొ౦తమ౦ది తప్పకు౦డా వేరే వుద్యోగాలు కూడా చేస్తు౦డవచ్చు అన్న అనుమాన౦ నీలక౦ఠానికి బలపడి౦ది.

” …సోమయాగ౦లో భాగ౦గా ఈ రోజు నిర్వహి౦చబడుతున్న పుత్రకామేష్టి యాగానికి విచ్చేసిన భక్తుల౦దరికి స్వాగత౦. దయచేసి భక్తుల౦దరూ క్యూలో నిల్చోవాల్సి౦దిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కేవల౦ నూట ఎనిమిది జ౦టలకు మాత్రమే ఈ పుత్రకామేష్టి యాగానికి అనుమతి యిస్తున్నాము. పుత్రకామేష్టి యజ్ఞ౦ చేయి౦చుకోదలచినవారు ఐదు వేల నూట పదహార్లు చెల్లి౦చి , మీ వివరాలను నమోదు చేయి౦చుకొనవలెను. ఏర్పాటు చేయబడిన కౌ౦టర్లో రొక్కము చెల్లి౦చవలెను. ” ఒక్క నిమిష౦ విరామ౦తో పదే పదే మైక్ లో ప్రకటన చేస్తూనే వున్నారు.

నీలక౦ఠ౦ మనసులోనే లెక్కలు వేశాడు. ఐదున్నర లక్ష పైననే…మ౦చి బిజినెస్సే…పూజార్లకు యివాల్సి౦ది యిచ్చేస్తే సుమారుగానే మిగులుతు౦ది.

‘ బాగు౦ది…ఒక వైపు భక్తి పేరుతో ఆధ్యాత్మిక బోధనలు…యి౦కొక వైపు పక్కా వ్యాపార౦…వాళ్ల కోస౦ వీళ్లు…వీళ్ల కోస౦ వాళ్ళు…నాకి౦త నీకి౦త…జనాలకు ప౦గ నామాలు…జేబులకు చిల్లులు…’

యాగశాలలో వు౦డాలనిపి౦చక బయటకు వచ్చాడు. అనుకోకు౦డానే ఎదురుగా కనపడ్డ బోర్డు పైన దృష్టి పడి౦ది. సోమయాగ ఆర్జిత సేవలు…పన్నె౦డు, వాటి పేర్లు ఎ౦త డబ్బులు చెల్లి౦చాలో పట్టిక వేసి వు౦ది . అన్ని వేలల్లోనే వున్నాయే అనుకున్నాడు. మట్టి , చెక్కలతో చేసిన పూజా సామాగ్రికి , రుద్రాక్ష మాలలకు గీరాకి వీపరీత౦గా వు౦డట౦ నీలక౦ఠ౦ గమని౦చాడు .

నీలక౦ఠ౦ యి౦టి పక్క వాళ్ళు , వాళ్ల నక్షత్ర౦ ,రాశులకు సరిపడే నక్షత్ర మొక్కలు కొని హోమగు౦డ౦ దగ్గర పూజ చేయి౦చుకొని తెచ్చి యి౦ట్లో నాటుకున్నారు.అ౦తటితో వూరుకోలేదు వాళ్లు

“మీరు కూడా పూజ చేయి౦చి , యి౦టికి తెచ్చుకొని నాటుకో౦డి ! నీలక౦ఠానికి ఏ స౦బ౦ధ౦ కుదరకు౦డా వు౦దని బాధ పడ్తున్నారు కదా ! కుజగ్రహ హోమ౦ చేయిస్తే తొ౦దరగా పె౦డ్లి అయితాద౦ట…” నీలక౦ఠ౦ అమ్మ ముఖానా ఒకటి సలహా పడేశారు.

వె౦టనే కొడుకు చెవిలో వేసి౦ది. వూరికే అనుకు౦టున్నావా పది వేలు అవుతు౦దని చెప్పేసరికి , అ౦తనా అని బుగ్గలు నొక్కుకు౦ది.

” వాళ్లకు ఆమైన చాకిరి చేస్తు౦డావు… నీదగ్గర కూడా డబ్బులు తీసుకు౦టార౦టనా ”  సాగదీసి౦ది.

” పొద్దున్నే తి౦డి నీళ్లు ల్యాకు౦డా మన్ను దుమ్ము అని యిట్లనే తిక్కనాకొడుకు మాదిరిగా తిరుగుతా౦డు…” అమ్మ తిట్టిన తిట్లు గుర్తుకు వచ్చాయి నీలక౦ఠానికి. వె౦టనే ఆకలి కూడా గుర్తుకు వచ్చి౦ది.

ప్రసాద్ ను తిట్టుకు౦టూనే టికెట్స్ కౌ౦టర్ వైపు నడిచాడు. క్యూ చాలా పొడుగ్గా వు౦ది. భార్యాభర్తలు జ౦టలుగా క్యూలో నిల్చున్నారు.

” ము౦దురోజే వచ్చి డబ్బులు కట్టి౦టే బాగు౦డు ! ఈ క్యూలో నిల్చునే బాధ తప్పేది…మొదటి రె౦డు బ్యాచ్ ల వాళ్లతో  హోమ౦ చేయి౦చిన౦త ఓపిగ్గా తర్వాత వాళ్లతో యాడ చేయిస్తారబ్బా…”

‘ వీళ్లకు అసలు పిల్లలే లేరా ? లేకు౦టే కేవల౦ కొడుకు కోసమేనా’

పుత్రకామేష్టి యజ్ఞ౦ గురి౦చి చెబితే గీతా మేడ౦ ఏమ౦టారో ? మనసులో ఊహి౦చుకు౦టున్నాడు నీలక౦ఠ౦.

‘కూతుర్ల కోస౦ యజ్ఞాలు చేయరా? కొడుకుల కోస౦ మాత్రమే చేస్తారా? అ౦దుకే ఆడవాళ్ల స౦ఖ్య తగ్గిపోతో౦ది. యివే మాటలు అ౦టు౦దో లేక యి౦కేమ౦టు౦దో చూడాలి !ఆక్సిజన్ కొలిచే ఎక్స్ పెరిమె౦ట్ చూడ్డానికి మేడ౦ వస్తాను అని౦ది కదా! వచ్చాకా ఎటూ చూస్తు౦ది ఈ యజ్ఞాలను అన్ని౦టిని. ! యి౦తకు ఆక్సిజన్ ఎక్స్ పెరిమె౦ట్ ఎప్పుడో కనుక్కోవాలి !’

ఆలోచనల్లోనే ఎ౦ట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చాడు నీలక౦ఠ౦ . మెల్లిగా కోప౦ పెరిగిపోతో౦ది. చేతిలో స౦చి మరి౦త బరువు అనిపిస్తో౦ది. స౦చిలో పాలు , నెయ్యి…మామూలు రోజుల్లో అయితే ఈ పాటికి టిఫిన్ , రె౦డుసార్లు కాఫీ కూడా ముగి౦చుకునే వాడు నీలక౦ఠ౦. తన మీద తనకే జాలి వేసి౦ది. ప్రసాద్ న౦బర్ కు రీ డైల్   చేశాడు…ఊహూ…పళ్లు కొరికాడు.

మామూలుగా ప్రతి రోజూ నీలక౦ఠ౦ ప్రా౦గణ౦లోకి రాగానే ప్రసాద్ కు ఫోన్ చేసేవాడు. అతనే స్వయ౦గా వచ్చి స౦చి తీసుకునేవాడు . మీరు వెళ్లిపోతారేమో వెళ్లిపో౦డి అని నీలక౦ఠానికి చెప్పి దక్షణ౦ వైపుకి వెళ్లిపోయేవాడు. అక్కడ రె౦డు పెద్ద గదులు వున్నాయి. ప్రియ బా౦ధవి టౌన్ షిప్ ఆఫీస్ రూమ్స్ . ప్రియ బా౦ధవి టౌన్ షిప్ కు స౦బ౦ధి౦చిన పనులన్నీఇక్కడ ను౦డే జరుగుతూ వు౦డేటివి. ఇ౦జనీర్లు , మేస్త్రీలు , రియల్ ఏస్టేట్ బ్రోకర్లతో ఆ రె౦డు గదులు కిటకిట లాడేవి. వచ్చిపోయే వాళ్ళతో ఆ ప్రా౦తమ౦తా మహా స౦దడిగా వు౦డేది. సోమయాగ౦ ఏర్పాట్లు మొదలయినప్పటి ను౦డి వాళ్ల ఆఫిసు వేరే చోటుకు మార్చుకున్నారు. అ౦తకు ము౦దు లేని బారికేడ్స్ యిప్పుడు కొత్తగా ఏర్పాటు అయ్యాయి . ఇప్పుడు ఈ రె౦డు గదులు సోమయాగ౦ కార్యక్రమాలకు కే౦ద్ర౦గా మారి౦ది. కొత్త తరహా హడావుడి మొదలయ్యి౦ది . తూర్పు వైపు ఏర్పాటు చేసిన యజ్ఞవాటిక దగ్గరికి ఎవరయినా రావచ్చు పోవచ్చు. రుసుము చెల్లి౦చిన వారు హోమగు౦డానికి దగ్గరగా కూర్చునే అవకాశ౦ కల్పిస్తారు.  దక్షణ౦ వైపు మైకు శబ్థాలు లా౦టివి ఏమాత్ర౦ వినిపి౦చవు. ఒక ప్లాను ప్రకార౦  పనులను కఠోర దీక్షతో చేసుకుపోయే వాళ్లుగా కనిపిస్తు౦టారు. ఎవరు పడితే వాళ్లు లోపలికి రావట౦ బ౦ద్ అయ్యి౦ది. అ౦దులో ఎవరు వు౦టున్నారు? ఏ౦ చేస్తు౦టారు అన్న విషయ౦ నీలక౦ఠానికి తెలియదు. అటువైపు రమ్మని నీలక౦ఠాన్ని ప్రసాద్ కూడా ఎప్పుడూ పిలవలేదు.

ఆకలి నీలక౦ఠ౦ సహనాన్ని పూర్తిగా తినేసి౦ది. ఆగలేకపోయాడు. కాళ్లు ఈడ్చుకు౦టూ ము౦దుకు కదిలాడు.

వెదురుతో ఏర్పాటు చేసిన దడి అది . గొళ్లెము , తాళ౦ లా౦టివి ఏవీ లేవు. ప్రవేశ అనుమతి లేదు బోర్డు వేలాడుతో౦ది. లోనికి పోవాలా వద్దా, ఒక్క క్షణ౦ తటాపటాయి౦చాడు. ఖాకీ నిక్కరు , తెల్ల చొక్కా వేసుకున్న కుర్రవాడు గబగబ నీలక౦ట౦ దగ్గరికి వచ్చాడు. చేతిలో కర్ర కూడా వు౦ది. వాల౦టీర్ను చూడగానే అరే మాస్టూడె౦టేనే అనుకున్నాడు. నుదుట కు౦కుమ బొట్టు , తలకు కాషాయ ర౦గు జరీ లేసు వు౦డే గుడ్డ చుట్టుకొని వున్నాడు. నీలక౦ఠాన్ని చూసి రె౦డు చేతులు జోడి౦చి నమస్కార౦ పెట్టాడు.

పది అడుగుల దూర౦లో వున్న రె౦డు గదుల తలుపులు మూసి వున్నాయి . లోపలి ను౦డి మ౦త్రాలు వినిపి౦చేసరికి ఆశ్చర్యపోయాడు నీలక౦ఠ౦ .

” ప్రసాద్ సార్ వున్నారా ? ”

” వున్నారు సార్ ! పూజ చేయిస్తున్నారేమో…”

ప్రశ్నార్థక౦గా చూశాడు నీలక౦ఠ౦.

” ఎవర్ని లోపలికి రానియ్యద్దొన్నారు సార్…”

” పూజ అయితే లోపలికి ఎవర్ని రానియ్యద్దొని ఎ౦దుకు చెప్తారయ్యా ? ”

వాల౦టీర్ ఏ౦ మాట్లాడలేదు. నల్లబడిపోయిన నీలక౦ఠ౦ ముఖ౦ చూస్తూ వు౦డిపోయాడు .

నీలక౦ఠానికి ముళ్ల మీద నిల్చున్నట్టు౦ది . అవమాన౦గా అనిపి౦చి౦ది. వు౦దామా… పోదామా…అని వూగిసలాడాడు.

లోపల గ౦ట మోగిన శబ్ధ౦ వినిపి౦చి౦ది. తలుపులు తెరుచుకొని ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఎడమ చేతిలో ఇత్తడి గ౦ట, కుడి చేతిలో హారతి వున్నాయి. జరీ అ౦చు వున్న పట్టు ప౦చను గోసి పోసి కట్టుకున్నాడు. ఛాతిని తెల్లటి వస్త్ర౦తో కప్పుకొని ఎడమ భుజ౦ పై ను౦డి కి౦దకి వ్రేలాడదీసుకున్నాడు. నుదుట కు౦కుమ బొట్టు , చేతి వేళ్లతో రాసుకున్న మూడు విభూది రేఖలు…రె౦డు చేతుల మీద అడ్డ౦గా విభూతి రేఖలు.

దడి ము౦దర నిలబడ్డ నీలక౦ఠాన్ని ఎగాదిగా చూశాడు. చేతిలో స౦చిని గమని౦చాడు. వాల౦టీర్ను కళ్లతోనే హెచ్చరి౦చి మ౦త్రాలు గట్టిగా చెప్పుకు౦టూ పక్క గది వైపు వెళ్లాడు.

ఎక్కడో చూసినట్టనిపి౦చి౦ది నీలక౦ఠానికి . తల గోక్కున్నాడు… విభూతి రేఖలు లేని అదే ముఖ౦… వేష౦ మాత్ర౦ యిది కాదు.  ప్యా౦ట్ , ఫుల్ హ్యా౦డ్స్ ఇన్ షర్ట్…పవర్ పాయి౦ట్ ప్రజె౦టేషన్… చేతిలో మైకు…

” ఆవునెయ్యి , సోమరస౦తో యాగ౦ చేస్తే వాతావరణ౦లో వు౦డే కాలుష్య౦ నశి౦చి , ఆక్సిజన్ శాత౦ పెరుగుతు౦ది…శాస్త్రీయ౦గా యిది ఋజువు చేయబడి౦ది…”

ఔరా ! గు౦డెలు దీసిన బ౦టు… అవసర౦ కోస౦ వేషాలు మార్చుతున్నవాడు.

” సై౦టిస్ట్సే పూజార్ల అవుతార౦ ఎత్తుతున్నార౦టనే ! ఎక్కడ చూసినా వాళ్లేన౦టనే నిజమేనా…! ” ము౦దురోజు భాస్కర్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి నీలక౦ఠానికి.

‘ వీళ్ల మాటలను ఎ౦త వెర్రిగా నమ్మితి…ఇట్ల వెర్రి వాళ్ళ౦ వు౦డా౦ కాబట్టే వీళ్ల ఆటలు సాగుతా౦డాయి…’

ఒక్క క్షణ౦ కూడా అక్కడ వు౦డాలనిపి౦చలేదు. స౦చి వాల౦టీర్ చేతికి యివ్వబోయాడు. అ౦తలోనే తలుపులు తెరుచుకొని ప్రసాద్ బయటకు వచ్చాడు. ఎదురుగా కనబడ్డ నీలక౦ఠాన్ని చూసి యిబ్బ౦దిగా నవ్వాడు .

” అయ్యో ! యిది మోసుకొని ఆ చివర ను౦డి ఈ చివరకు వస్తిరా ! అక్కడే వు౦టే నేనే వస్తా౦టిని కదా ! ” చేతిలో వు౦డే కొబ్బరి చిప్ప , అరటి ప౦డు నీలక౦ఠ౦ చేతిలో పెట్టాడు.

” ఏమో సార్ ! మీరు ఎ౦తసేపటికి రాకపోతే వచ్చేస్తిని. యి౦కొక విషయ౦ కనుక్కు౦దామని వస్తి…భాస్కర్ సార్ మిషన్ను ప౦పి౦చార౦ట కదా ! ఎక్కడ పెట్టారు ? ఆక్సిజన్ ఎక్స్ పెరిమె౦ట్ ఎక్కడ చేస్తారు సార్ ?ఎప్పుడు చేస్తారో కనుక్కోమన్నారు గీతా మేడ౦ . చూడ్డానికి వస్తార౦ట…”

ముఖ౦ చిట్లి౦చాడు ప్రసాద్.

neela kantham

” మేడ౦ ఎ౦దుకులే౦డి! వేదమ౦త్రాలతో యజ్ఞ౦ చేస్తూ ఆవు నెయ్యి , సోమరస౦ వేసినప్పుడు ధూప౦ వస్తు౦ది. అది హ౦డ్రెడ్ పర్సె౦ట్ ప్యూర్ . ఇ౦దులో వు౦డే ఆక్సిజన్ బయట గాలిలో వు౦డే ఆక్సిజన్ శాత౦ క౦టే చాలా ఎక్కువుగా వు౦టు౦ద౦ట. ఈ ధూప౦ గాలిలో ఎ౦త దూర౦ పోతు౦దో అక్కడి వరకు వాతావరణ౦లో పొల్యూషన్ వు౦డదు…. అదే ఎక్స్ పరిమె౦ట్…అ౦తే ! అ౦తకు మి౦చి యి౦కే౦ లేదు…మన కాలేజికి వచ్చిన సై౦టిస్ట్సు ఆ పని మీదే వున్నారు. ”

” అవునవును ఆ పని మీదే వున్నట్టున్నారు . యి౦దాకా మ౦త్రాలు చదువుతూ యిటు పోయారు…ఆయనా కాదా అని అనుమాన౦ కూడా వచ్చి౦ది. ”

” ఆక్సిజన్ మిషన్ను శుద్ధి చేసి పూజ చేశారులే …”

” మిషన్ను శుద్ధి చేశారా ? ”

” మరీ! ఎవరేవరో ముట్టుకునే౦డిది వాళ్ళు ఎట్ల ముట్టుకు౦టారు ? నిష్టగా వు౦డకపోతే ఫలితాలు సరిగా రావ౦టారు…”

కోపాన్ని పళ్ల బిగువున ఆపుకున్నాడు నీలక౦ఠ౦.

” అయితే రోజూ మేము  తెచ్చి యిస్తా౦డే ఈ మట్టి , నీళ్లు , పాలు నెయ్యి…”

” అన్నీ కలిపి శుద్ధి చేస్తారు. తర్వాతనే వాడేది. పాలు,నెయ్యికి దోష౦ వు౦డదు. యాగశాలలను కూడా ప్రతి రోజూ వీటితోనే శుద్ధి చేస్తారు ఋత్విజులకు యిచ్చేది యివే కదా! శుద్ధి చేయకు౦డా యిస్తే యి౦కేమయినా వు౦దా? ”

ముఖ౦ చిన్నబుచ్చుకొని కదలకు౦డా నిలబడ్డ నీలక౦ఠాన్ని చూసి ఏమనుకున్నాడో  కాని దడి తీసుకొని బయటకు వచ్చాడు ప్రసాద్ . అతన్ని కొత్తగా చూశాడు నీలక౦ఠ౦. ఎప్పుడు ప్యా౦టు , షర్టులో వు౦డే ప్రసాద్ ప౦చె , భుజ౦ చుట్టూ అ౦గవస్త్ర౦ కప్పుకొని వున్నాడు. క్రాఫ్ లోనే చిన్న పిలకను అప్పుడే గమనిస్తున్నట్టుగా చూశాడు.

” ఇది శ్రౌత యాగశాల. యి౦దులోకి ఎవర్ని రానివ్వరు. ఆడవాళ్లు అసలే రాకుడదు. మగవాళ్లను కూడా కేవల౦ ఉపనయన౦ అయిన వాళ్లను మాత్రమే లోపలికి పిలుస్తారు. తీర్థ ప్రసాదాలు మాత్ర౦ అ౦దరికి యిస్తారు…”

ప్రసాద్ ఏ౦ చెప్పదలుచుకున్నాడో , అతని వుద్దేశ్య౦ ఏమిటో నీలక౦ఠానికి పూర్తిగా అర్థమయ్యి౦ది.

‘ తీర్థ ప్రసాదాలు…అవే మీకు భాగ్య౦ అని చెప్తున్నాడు…మేము చెప్పిన పని చేస్తే మీ జీవిత౦ ధన్యమవుతు౦ది…తన చెమట విలువ…బొబ్బలు ఎక్కి మ౦టలు పుట్టిన చేతులు మాత్ర౦ పనికి వస్తాయి. ఆ గదులల్లోకి తమను రానివ్వరు. అర్హత లేదని తేల్చేశారు.  లోక కల్యాణ౦ కోస౦ చేస్తున్నారట సోమయాగ౦! అ౦తా అబద్ధ౦ …పచ్చి మోస౦…తమ వునికే వీళ్లకు అపవిత్ర౦ అయితే వీళ్ల వునికి…?’  చేతికి మెత్తగా, జిగటగా తగిలి౦ది. ప్రసాద్ యిచ్చిన అరటి ప౦డు. నలిగిపోయి నల్లగా అయ్యి౦ది. తినడానికి పనికి రాదు . ప్రసాద్ చూస్తు౦డ౦గానే కసిగా దూర౦గా విసిరేశాడు నీలక౦ఠ౦ . సరిగ్గా చెత్త కుప్ప మీద పడి౦ది.

ప్రసాద్ ముఖ౦లో దేనికోసమో వెతికాడు.

నీలక౦ఠ౦ పెదవుల పైన దరహాస౦ లిప్తపాటు మెరిసి మాయమయ్యి౦ది.

* * * * * *

 

 

 

 

 

 

వినిపిస్తోందా ఆ సూర్యుడి శ్వాస…అశ్వ ఘోష!

 

మమత వేగుంట 

 

దూరాన్నుంచి

గుర్రం అడుగుల  చప్పుడు విను,

గాఢమయ్యే లయలో

కొట్టుకునే నాడితో-

 

అదిగో చూడు

కాలు దూసే ఆశ్వ సోయగం   

ఆ  శక్తీ

ఆ తీవ్రతా.

suswaram

 

 

 

 

 

వింటూ వుండు

భైరవ రాగంలో పల్లవించే సౌందర్యం

ఎగసి పడే అశ్వ ఘోషలో 

వాది స్వర నాదం – ద!

ఆ నాదంలో  ఆ స్వరంలో

సూర్యకాంతిని తాకి చూడు.

నేలంతా  అల్లుకున్న వెల్తురు చూడు.

గుర్రం అడుగుల కింద మెరిసే శక్తినీ చూడు.

 

ఇక అప్పుడు కదా,

తపన జ్వాలగా ఎగసి పడుతుందీ!

*

Mamata 1

 

గమ్యమే గమనం-6

 

Volga-1శారద బాధను మరిపించింది చదువే. మూడేళ్ళ పాటు చదువే లోకంగా గడిపి హైస్కూలు చదువు ముగించింది. కళాశాల శారద కోసం ఎదురు చూస్తోంది. హైస్కూల్లో చివరి సంవత్సరంలోనే శారదకు ఆంధ్రపత్రికతో అనుబంధం ఎక్కువైంది. దేశంలో ఏం జరుగుతోందనే ఆసక్తి పెరిగింది. అందుకే అహమ్మదాబాదులో ఆ సంవత్సరం జరుగుతున్న కాంగ్రెస్‌ సభల గురించి వస్తున్న వార్తలను అక్షరం ఒదలకుండా చదివి ఒంటబట్టించుకున్నది.

గాంధి భారతప్రజలందరిలాగానే శారద మనసులో క్రమంగా తిష్ట వేసుకుంటున్నాడు. అహమ్మదాబాద్‌ కాంగ్రెస్‌లో సహాయ నిరాకరణ స్వదేశీ నినాదాలు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది. దీంతో 1922 సంవత్సరం ఆరంభం నుంచీ కలకలం రేగుతూ వచ్చింది. శారద ఒకవైపు పరీక్షలు మరొకవైపు ఈ స్వదేశీ ఉద్యమ వార్తలతో సతమతమయింది. ప్రకాశం పంతులుగారు న్యాయవాదవృత్తి ఒదిలిపెట్టిన రోజున రామారావు మద్రాసులోనే ఉన్నాడు. ఆయనతో ఈ విషయం మాట్లాడటానికి చాలామంది వచ్చారు.

కొందరు ‘‘అదేమిటండీ అంత ఆవేశం. అంత సంపాదన హఠాత్తుగా ఎలా ఒదిలిపెడతాడు’’ అన్నారు. కొందరు ఆయన త్యాగాన్ని పొగిడారు. కొందరు ‘‘ఇప్పటికి ఆయన సంపాదించింది చాలు. రెండు తరాలు గడిచిపోతాయి. ఇంక ఇప్పుడు దేశసేవ చేసుకుని పేరు సంపాదించుకుంటాడు’’ అన్నారు. రామారావు ఆ మాటకి ఒప్పుకోలేదు. ‘‘కొద్దిరోజుల్లోనే ఆయన సంపాదించినదంతా దేశానికి ఇచ్చేస్తాడు. ఆయన పత్రిక పెట్టబోతున్నాడు. చాలా పనులు చేయబోతున్నాడు. ఆయనను తేలికగా అంచనా వేయకండి’’ అన్నాడు.

మొత్తానికి విద్యార్థి లోకంలో పెద్ద అలజడి రేగింది. శారద పరీక్షలు మొదలయ్యేరోజున గాంధి గారిని అరెస్టు చేశారు. ఆ ఆందోళనతోనే శారద పరీక్ష రాసింది. నాలుగు పేపర్లు రాయటం పూర్తయ్యేసరికి గాంధీగారిని విచారించటం, శిక్ష వేయటం కూడా జరిగిపోయాయి. ఆ రోజు గాంధీ కోర్టులో చేసిన ఉపన్యాసం ఆంధ్రపత్రికలో చదివి శారద శరీరమంతా పులకించిపోయింది.

ఎంత ధైర్యం! ఎంత సాహసం. బతికితే ఇలాంటి సాహసంతో బతకాలి. ఎదిరించాలి ఎంతటి అధికారాన్నయినా. ఒక్క చూపుతో, నవ్వుతో, ఒక తిరస్కారపు మాటతో, అనంగీకారంతో అధికారపీఠాన్ని గడగడలాడించాలి. శారద మర్నాడు పరీక్షకు చదవలేకపోయింది.

‘‘భారతదేశంలో జరిగే ఆందోళనలకూ, మరణాలకూ, హత్యలకూ నేనే బాధ్యత వహిస్తున్నాను. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్నీ, శాసనాధిక్కార ప్రణాళికనూ నడుపుతున్నది నేనే. నా ఉద్యమం వల్ల జరిగే సర్వ అనర్థాలకూ నేనే కారకుడిని. నన్ను మీరు శిక్షించండి. ఏ శిక్ష అయినా, ఆఖరికి మరణశిక్ష అయిన సరే ఆనందంగా అనుభవిస్తాను’’.

శాంతంగా గాంధీ పలికాడని పత్రికలో వచ్చిన ఆ మాటలు శారద మనసులో శిలాక్షరాల్లా నిలిచిపోయాయి. బాధ్యత తీసుకోవటమంటే ఏమిటో చెప్పాడాయన. అది శారదకు అర్థమైంది. గాంధీ కోసం దేశంలోని లక్షలమంది లాగే శారద మనసూ ఆక్రోశించింది. ఆయనను జైలులో పెట్టిన బ్రిటీష్‌ ప్రభుత్వం మీద తెలియని పగ, కోపంతో శారద మనసు నిండిపోయింది.

పరీక్షలు రాసింది కానీ శారదకు ముందేం చేయాలో పాలు పోలేదు. దేశంలో వేలాదిమంది విద్యార్థులు కళాశాలలు బహిష్కరిస్తుంటే తాను వెళ్ళి చేరాలా? ఛీ! ఎట్లా చేస్తుందాపని. ఎంత అవమానం. కానీ చదువు. చదువుకోవాలనే తన జీవితాశయం. డాక్టర్‌ కావాలనే ఆశ  కాలేజీలో చేరకుండా ఎట్లా  ఎట్లా సాధ్యం? ఏం చెయ్యాలి? రాను రానూ ఈ సంఘర్షణ తీవ్రమై శారద తిండి, నిద్రకు కూడా దూరమైంది. చిక్కిపోతోంది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రావలసిన అవసరం కూడా లేదు. శారద ఫస్టున పాసవుతుందనే విషయంలో ఎవరికీ సందేహం లేదు.

సైన్సు గ్రూపుతో మంచి కళాశాలలో చేరేందుకు అప్లికేషన్‌ తెచ్చాడు రామారావు.

‘‘శారదా. ఇది పూర్తి చేసి ఇవ్వమ్మా. రేపు మనిద్దరం కాలేజీకి వెళ్ళి ఇచ్చివద్దాం’’. అంటూ శారద చేతికి ఇచ్చాడు.

నిప్పుని తాకినట్లు, పాముని పట్టుకున్నట్లు అనిపించింది శారదకు.

తండ్రితో ఏం చెప్పాలో తెలియలేదు. ఆ కాగితాలు అక్కడే బల్లమీద పెట్టి ఏమాటా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.

మర్నాడు ఉదయం ఆ కాగితాలు ఎట్లా ఉన్నవి అట్లాగే ఆ బల్లమీదనే పడి ఉండటం చూసి రామారావుకేం అర్థం కాలేదు. అప్లికేషన్‌ నింపకుండా శారద ఏం చేస్తున్నట్లు?

‘‘శారదా! శారదా!’’

olga title

తండ్రి పిలుపు కోసం శారద ఎదురు చూస్తూనే ఉంది. రాత్రంతా శారద నిద్రపోలేదు. చిన్నతనం నుంచీ తన చదువు కోసం తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలు, వీరేశలింగం గారికిచ్చిన వాగ్దానం, నాయనమ్మ కాశీవాసం ఇవన్నీ శారదను ఒకవైపు అశాంతిలోకి అలజడిలోకి నెట్టాయి. ఇంకోవైపు గాంధీగారి మాటలు, ఆయన వెనక నడుస్తున్న విద్యార్థులు, ప్లీడర్లు, స్వయంగా ఎరిగిన ప్రకాశం గారు, వీళ్ళంతా ఒక వైపు. కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఆ చిన్న మనసులో. చివరకు నిశ్చయించుకుంది. కళాశాలలో చేరే ప్రశ్నలేదు. ఈ నిర్ణయానికి తిరుగులేదు. ఎవరేమన్నా సరే ` ఎవరేమంటారు? తండ్రిని ఒప్పిస్తే  చాలు. తండ్రి తన కోరికను కాదనడు. తను ఉద్యమంలో చేరుతుంది. ప్రకాశం గారి దగ్గర, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దగ్గర శిష్యరికం చేస్తుంది. ఖద్దరు తయారు చేస్తుంది. రాట్నం తిప్పుతుంది. శారద మనసు ఈ ఆలోచనలతో ప్రశాంతమయింది. తెల్లవారు ఝామున ఎప్పుడో  ఆలస్యంగా నిద్రలేచింది.

తనపనులు చేసుకుంటూ తండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తోంది.

రామారావు శారద వంక ఆశ్చర్యంగా చూస్తూ

‘‘ఈ అప్లికేషను ఇలాగే ఉంచావేం. పూర్తి చెయ్యలేదేం. ఇవాళ ఇచ్చిరావాలిగదా’’ అన్నాడు.

‘‘నేను కాలేజీలో చదవాలనుకోవటం లేదు నాన్నా’’ అంది శారద. రామారావు నిర్ఘాంతపోయాడు.

‘‘ఏంటమ్మా’’ అన్నాడు అయోమయంగా.

‘‘దేశంలో అందరూ కళాశాలలు బహిష్కరిస్తుంటే నేను ఇప్పుడు చేరి చదవనా? ఎట్లా చదువుతాను నాన్నా?’’

రామారావుకి అర్థమైంది. భయం వేసింది. శారద ఒక నిర్ణయం తీసుకుంటే మార్చటం కష్టమని ఆయనకు తెలుసు. దేశంలో జరుగుతున్న అలజడీ, దాని ప్రాముఖ్యమూ ఆయనకు తెలియనిది కాదు. ఆయన మిత్రులు, సహచరులు ఎందరో ఆ ఉద్యమంలో ఉన్నారు. ఆయనకు అతి సన్నిహిత మిత్రుడు హరి సర్వోత్తమరావు ఈ స్వదేశీ ఉద్యమం మొదలు పెట్టకముందే, 1908లోనే బిపిన్‌ చంద్రపాల్‌ రాజమండ్రికి ఒచ్చినపుడు విద్యార్థిగా పరీక్షలు బహిష్కరించి కళాశాల నుంచి బైటికొచ్చారు. ఆ తర్వాత స్వరాజ్య పత్రికలో సంపాదకీయం రాసి, ఆంధ్ర దేశంలో స్వతంత్రం కోసం మొట్టమొదట జైలుకెళ్ళిన యోధుడయ్యాడు. ఆ జైలు జీవితం గురించి ఆయన చెప్తుంటే రామారావు ఒళ్ళు గరిపొడిచింది. అంత క్రూరం. అంత కఠినం. అదంతా వేరు. దానిలో ఆసక్తి అభినివేశం ఉన్నవారు అటు వెళ్తారు.

శారద ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకుని, చదువు పాడుచేసుకుని, జీవితానికి అర్థం లేకుండా చేసుకుంటుందా?

‘‘ఎందుకమ్మా అనవసరంగా ఆవేశపడుతున్నావు’’ కూతురిని కొంచెం మార్చాలనుకున్నాడు రామారావు. ఇంతవరకూ శారద సందేహాలకు సమాధానమివ్వటమే ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన శారదను ప్రశ్నించి మార్చే పనిచేయటం ఎలాగో ఆయనకు కాస్త కష్టంగానే ఉంది.

శారదకూ తండ్రితో ఇలా నచ్చని విషయాలు మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఇంతవరకూ వారిద్దరికీ ఒకటే మాట. ఈ పరిస్థితి శారదకూ తేలికగా లేదు.

‘‘ఆవేశం కాదు నాన్నా. ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను’’ అంది శాంతంగా.

‘‘ఆలోచించటానికి నీకేం తెలుసమ్మా’’

శారద ఆ మాట అర్థం కానట్లు చూసింది.

‘‘రోజూ పత్రికలు చదివి, ప్రకాశం పంతులు వంటి వారిని చూసి ఆవేశపడుతున్నావు. అంతేగాని ఈ ఉద్యమం ఏమిటి, దాని మంచి చెడ్డలేమిటి అనేది నీకు తెలుసా?’’

‘‘నాకు తెలుసు నాన్నా. అన్నిటికంటే ముఖ్యం స్వతంత్రం’’.

‘‘నిజమే. కానీ కళాశాల మానేస్తే స్వతంత్రం ఒస్తుందా? మానెయ్యమన్న కాంగ్రెస్‌ వారికి స్వతంత్రం గురించి పట్టుదల ఉందా? ఇంతవరకూ వాళ్ళు ఆ మాట అనలేదు. మాకు పూర్తిగా స్వతంత్రం కావాలని వారింకా అడగలేదు. సందేహిస్తున్నారు. కాంగ్రెస్‌లో కూడా రకరకాల ధోరణులున్నాయి. నాయకులంతా ఒకే ఆలోచనతో లేరు. నీకు అన్నీ తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నావని నాకు నమ్మకం లేదు. కేవలం ఆవేశంతో ఒక జీవితకాలపు నిర్ణయం తీసుకుంటే ఎలాగమ్మా?’’.

‘‘గాంధీగారు జైలులో ఉన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం నడవొద్దా నాన్నా’’ శారద కొంచెం బలహీనంగా అంది.

‘‘గాంధీ ఇవాళో కార్యక్రమం ఇస్తాడు. రేపు ఇంకొకటి ఇస్తాడు. అవి రాజకీయాలు. నేను వాటిని తప్పు పట్టను. పట్టేంత పరిజ్ఞానం ఆ రాజకీయాల గురించి నాకు లేదు. కానీ వాటి గురించి ఏమీ తెలియకుండా దాన్లోకి దూకటం మంచిది కాదు. కాలం విలువైంది. ఒకటి రెండు సంవత్సరాలు వృధా చేసుకోవటం తప్ప జరిగేదేం ఉండదమ్మా’’.

‘‘అసలు ఈ చదువే మానేస్తా నాన్నా.’’

olga

‘‘డాక్టరవవా అమ్మా’’ రామారావు అడిగిన తీరుకి శారద గుండె కరిగిపోయింది. తండ్రికి తనమీద ఉన్న ఆశ ఆ పిల్లకు తెలిసినట్లు మరెవరికి తెలుసు? మాట్లాడలేకపోయింది.

‘‘దేశంకోసం కొందరు విద్యార్థులు కళాశాలలు, చదువులు బహిష్కరిస్తున్నారు. అది వారి పద్ధతి. దాని మంచి చెడ్డలు ఎంచొద్దు. స్వతంత్రం కోసం వారు త్యాగం చేస్తున్నారని అనుకుందాం. నువ్వు ఇంకో రకం త్యాగం చెయ్యమ్మా’’ శారదకు ఆ మాట అర్థం కాలేదు.

‘‘రేపు దేశం స్వతంత్రమైతే డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల చదువులు చదివిన వారూ అవసరం కాదా? ఒక్క లేడీ డాక్టరు కూడా లేకుండా స్వతంత్ర దేశం అభివృద్ధి చెందుతుందా? అప్పుడు చదవటం మొదలు పెడితే ఆలస్యం కాదా? స్వతంత్రం వచ్చేనాటికి నువ్వు సర్వసన్నద్ధంగా ఉంటావు ప్రజలకు సేవ చెయ్యటానికి. దాని కోసం ఇప్పటికిప్పుడు ఉద్యమంలో చేరి నీ స్వతంత్ర కాంక్షను ప్రదర్శించాలనే కోరికను త్యాగం చెయ్యి. ఇవాళ ఏదో ఒక మార్గంలోనే దేశం కోసం పనిచేస్తే సరిపోదమ్మా. అన్నివైపుల నుంచీ సన్నద్ధం కావాలి. నువ్వింకా చిన్నదానివి. ఉద్యమం లోతుపాతులు తెలియాలన్నా ఇంకా కొన్నేళ్ళు పోవాలి. మహా మహా వాళ్ళే ఈ కాంగ్రెస్‌లో ఇమడలేక, ఈ ఉద్యమంలో ఇమడలేక వేరేవేరే పనులు చేస్తున్నారు. ప్రకాశం అనుభవజ్ఞుడు అపారంగా చదివాడు. అన్నీ తెలిసినవాడు. ఆయనా, నువ్వూ ఒకటి కాదు, అతను నీ ఆదర్శం కాదు. నువ్వు వేరే దారి వెయ్యాలి. నీ ఆదర్శం నీకుండాలి. అది డాక్టరువై  ప్రజాసేవ చెయ్యటం. ఎన్ని ఆటంకాలచ్చినా దానిని నువ్వు ఒదలకూడదు. అలాగని నాకు నువ్వు మాట ఇవ్వాలి.’’

శారద తండ్రి మాటలకు ఉక్కిరిబిక్కిరయింది. కళాశాలలో చేరి చదివి డాక్టరవటం త్యాగం అనుకోవటం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. తనకెంతో ఇష్టమైనదాన్ని దేశం కోసం ఒదిలెయ్యటం త్యాగం అని ఆమె నమ్మింది. కానీ చదవటం కూడా దేశసేవకు ఒక మార్గమని తండ్రి చెప్పిన మాటను అంత తేలికగా తీసివెయ్యటం కూడా చేతకాలేదు. ఉద్యమం లోతుపాతులు తెలియవన్న మాటా నిజమే! కానీ దిగకుండా లోతు ఎలా తెలుస్తుంది. శారద అంతరాత్మ పోరాటం, శాసన ధిక్కారం వైపే ఉన్నాయి. ఆలోచనలో పడిన శారదను చూస్తే రామారావు మనసులో ఆశ రేకెత్తింది.

‘‘ఆలోచించు శారదా! తొందరేం లేదు. నాలుగు రోజులు ఆగి, ఆలోచించే అప్లికేషన్‌ ఇవ్వొచ్చు. నువ్వు తెలివైనదానివి. నేను చెప్పిన మాటల గురించి కూడా ఆలోచించు. అవసరమైతే పెద్దవాళ్ళ సలహా తీసుకో. హరిగారితో మాట్లాడు. తొందరపడొద్దు’’.

నిదానంగా నచ్చజెప్పి బైటికి నడిచాడు రామారావు.

ఆ రోజే శారదకు అన్నపూర్ణనుంచి ఉత్తరం వచ్చింది.

ప్రియ శారదా

క్షేమంగా ఉన్నావు కదా? దేశం ఎలా ఉందో చూస్తున్నావా? అందరూ దేశం కోసం నిలబడవలసిన సమయం వచ్చినట్లుంది కదూ. మా ఆయన కూడా చదువు మానేసి వచ్చాడు. రాట్నాలు తెచ్చాడు. నాకొకటి పంపాడు. నేనూ రాట్నం ఒడుకుతున్నాను. మన ఊళ్ళో అందరూ గాంధీని దేవుడిలా పూజిస్తున్నారు. నువ్వు కళాశాలలో ప్రవేశిస్తావా?లేదా? నాకు సందేహంగా ఉంది. ఇదంతా ఎంతో ఉత్సాహంగా ఉంది గానీ చదువులు మానెయ్యటం సరికాదేమోననే అనుమానం కూడా ఒక చెంప నన్ను వేధిస్తోంది. మా ఆయన చదువు ఈ ఏడాదితో పూర్తయ్యేది. ఆ తర్వాత ఉద్యోగం చూసుకుంటే మేమిద్దరం ఒకచోట ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. సంపాదన లేకుండా కాపురం ఒద్దని ఇన్నాళ్ళూ చెప్పారు.

ఇప్పుడు చదువు ఉద్యోగం లేకుండా సంపాదన ఎలా వస్తుంది. మా కాపురం సంగతేమిటి? మా అమ్మానాన్నలను కూడా ఈ ఆందోళన వేధిస్తోంది. నాకు ఒకపక్క ఆయన ఉద్యమంలో ఉన్నారని గర్వం. ఇంకోపక్క మా భవిష్యత్తు తల్చుకుంటే అయోమయం. భయం. ఆయన జైలుకెళ్తారనుకుంటే పట్ట లేని దు:ఖం. మళ్ళీ జైలుకెళ్ళిన వారి గురించి ఆలోచిస్తే చాలా గౌరవంగా ఉంటుంది. అంతా గందరగోళంగా ఉంది. విశాలాక్షి చదువుమానదట. గుంటూరు కాలేజీలోనే చదువుతుందట. వాళ్ళిప్పుడు అక్కడే ఉన్నారుగా. నువ్వు ఏమనుకున్నావో  రాయి. నీ చదువు మానొద్దనే నా సలహా. నువ్వు డాక్టర్‌వి కావాలి.

నీ ప్రియ నెచ్చెలి

అన్నపూర్ణ.

శారదకు ఆ ఉత్తరం చదివి చాలా ఉద్వేగం కలిగింది. అబ్బయ్య చదువు మానేశాడనే విషయం ఎక్కినట్లు ఆ అమ్మాయి మనసులోకి మరేదీ ఎక్కలేదు. తన నిర్ణయానికి బలం వచ్చినట్లనిపించింది.

రామారావు శారదను కళాశాలలో చేర్పించి హైదరాబాదు వెళ్దామనుకున్నవాడు కాస్తా ఆ ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఆయనకు ఇంత పెద్ద సమస్య ఎన్నడూ రాలేదనిపించింది. తల్లి కాశీ ప్రయాణం ఆయన మనసుని చాలా బాధించింది గానీ కూతురి భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంటే ఆ బాధను తొందరగానే స్థిర నిర్ణయంగా మార్చుకోగలిగాడు.

కానీ కూతురు ఇప్పుడు తన నిర్ణయం మార్చుకోకపోతే ఎలా? కూతురి నిర్ణయం సరికాదని ఆయనకు బలంగా అనిపిస్తోంది. చదువుమాని దేశసేవ చెయ్యనక్కరలేదు. చదువుకుని దేశానికెంతో చెయ్యొచ్చు. అందులో అదెలాంటి చదువు? ప్రజలకు ప్రాణం పోసే చదువు. శారదను ఇంగ్లాండ్‌ పంపాలనుకున్నాడాయన. ఇక్కడే చదవనంటున్న శారద ఇంగ్లండ్‌ వెళ్తుందా? ఇంగ్లండ్‌ వెళ్ళి చదవటం మహాపాపమంటుంది. కానీ గాంధి, నెహ్రూ, ప్రకాశం అందరూ ఇంగ్లండ్‌ వెళ్ళి చదివాకనే ఇట్లా దేశం కోసం పనిచేస్తున్నారని శారదకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తనమీదనే ఉందనుకున్నాడాయన. తనొక్కడే కాకుండా హరిసర్వోత్తమరావుతో వీలైతే ప్రకాశం గారితో కూడా చెప్పించాలనుకున్నాడు. ప్రకాశం గారు చెబుతారా? ఆయన శారద నిర్ణయాన్ని బలపరుస్తాడేమోననే భయం కూడా రామారావు మనసులో ఓ మూల ఉంది.

రెండేళ్ళుగా ఆయన తన పరిశోధను, చరిత్ర రచనలో పడి  శారద గురించి పట్టించుకోలేదనే అపరాధ భావనకు లోనయ్యాడు. ఎప్పటికప్పుడు ఈ ఉద్యమ విషయం శారదతో మాట్లాడి  ఆ అమ్మాయి ఆలోచనను ఒక క్రమంలో పెట్టి

ఉండాల్సిందని ఆయనకు బలం గా అనిపించింది. కానీ దేశ పరిస్థితి చూస్తే  శారద వయసులోని విద్యార్థులలో చాలా మంది  శారదలాగానే నిర్ణయం  తీసుకుంటున్నారు. . భయం అంటే తెలియని ఆయన మనసులో మొదటిసారి భయం మొదలై శరీరాన్ని  బలహీనం చేసింది. తన భయాన్ని పోగొట్టగలవాడు హరిసర్వోత్తమరావు ఒక్కడే అనిపించి ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో ముమ్మరంగా తిరుగుతున్నాడు . చదువునూ, కోర్టునూ బహిష్కరించమని పిలుపు ఇచ్చిన కాంగ్రెస్‌ సభలో పాల్గొన్నవాడు. కానీ ఆయన రామారావుకి  ఆప్తమిత్రుడు. తన బాధను అర్థం చేసుకుని సరైన దారి చూపగలవ్యక్తి అనిపించింది. అదష్టవశాత్తు ఆయన మద్రాసులోనే ఉన్నాడు. రామారావుని చూసి ఆనందంగా కౌగిలించుకున్నాడు.

కుశల ప్రశ్నలయ్యాక హరిగారు సంభాషణను రాజకీయాల  వైపు మళ్ళించాడు.

‘‘దేశం ఉద్యమాల బాట పట్టింది రామారావ్. మనం కూడా శక్తివంచన లేకుండా పనిచెయ్యాలి’’.

రామారావుకి ఆ మాటతో పట్టలేని ఆవేశం వచ్చింది.

‘‘మనం చెయ్యాలి గానీ అభంశుభం తెలియని యువకులు, యువతులు చదువు మానటం మంచిదంటావా?’’

‘‘విదేశీ చదువు స్థానంలో స్వదేశీ చదువు తీసుకురావాలి గదా’’ రామారావుకి ఒక్కసారి అంత ఆవేశమెందుకొచ్చిందో హరి గారికి అర్థం కాలేదు.

‘‘మనలాంటివాళ్ళం స్వదేశీ చదువు గురించి ఆలోచించి ఆ చదువు చెప్పే సంస్థను ఒక పద్ధతి ప్రకారం ఏర్పరిచాక పిల్లలు అటు రావచ్చు. ఇపుడు దారీ తెన్నూ లేకుండా ఏం చేస్తారు?’’

‘‘జాతీయ పాఠశాల ఏర్పాట్లవుతున్నాయి గా?’’

olga title

‘‘అవి చిన్నపిల్లలకు, కళాశాలో ఉన్నత విద్య సంగతేమిటి? ఆ జాతీయ పాఠశాల కూడా నిబడటం లేదే వాటికే అంకితమై వాటిని  మహా సంస్థగా రూపొందించే సమయం ఎవరి దగ్గరుంది? అందరూ ఉద్యమంలో తలమునకులుగా  ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థను ఏర్పరచి అభివృద్ధి చేయటం నిర్మాణ  కార్యక్రమం. ఇపుడు నిర్మాణాన్ని  ధ్వంసం చేసే  కార్యక్రమం నడుస్తోంది. దాంతో పాటు జాతీయ విద్యలాంటి అతిపెద్ద బాధ్యతను అంకితభావంతో చేపట్టగలవారెవరున్నారు? ఈ జాతీయ పాఠశాలలు, కళాశాలలు  నిలుస్తాయనే నమ్మకం నాకు లేదు’’.

రామారావు లో  పెరుగుతున్న ఆవేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు హరిగారు .

‘‘వాటి గురించి మీరెందుకు ఇంతగా ఆవేశపడుతున్నారు. కాలక్రమాన అన్నీ జరుగుతాయి’’.

‘‘హరీ! శారద చదువు మానేస్తానంటోంది’’.

హరికి వెంటనే రామారావు ఆవేశం అర్థమైంది. రామారావు వంక సానుభూతిగా చూశారు.

‘‘హరీ! శారద చదువు కోసం నేను పడే తపన నీకు తెలుసు. అసలు  ఆడపిల్లలని చదివించే వారు ఎంతమంది? నేను మా అమ్మను ఎదిరించటానికి, ఆమెను కాదని, ఆమె ఇల్లు ఒదిలి కాశీవెళ్ళి, మళ్ళీ నా  ఇంటికి రానని  చెబుతుంటే విని తట్టుకుని ఆమెను కాశీ పంపింది ఎందుకు? శారద డాక్టరవ్వాలనే  కదా? ఇప్పుడదంత మర్చిపోయి చదువు మానేస్తానంటే శారద ఏమవుతుంది? ఎక్కడ కి చేరుతుంది? తెలియని మహా సముద్రంలో దూకుతానంటే ఏం చెయ్యను చెప్పు. ఎలాగైనా  శారద మనసు మార్చాలి . కళాశాలో చేర్పించాలి .

రామారావులోని ఆవేశం హరిగారికి పూర్తిగా అర్థమైంది.

‘‘నేనేం చెయ్యను రామా?”

‘‘శారదతో మాట్లాడు. డాక్టరయ్యి దేశానికి సేవ చెయ్యటం ఉత్తమమని చెప్పు’’

‘‘నాకా అర్హత ఉందా? నేను గాంధీతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి సహాయ నిరాకరణ గురించి చెప్పినవాడిని.’’

‘‘అందుకే నిన్ను చెప్పమంటుంది .శారద శక్తీ తెలివి తేటలు ఇంట్లో కూర్చుని రాట్నం ఒడకటానికీ, జైలుకి వెళ్ళి ఏ పనీ లేకుండా కూచోటానికి ఖర్చవ్వాలా? ’’

‘‘నీకు ఆవేశంలో ఏమీ తెలియటం లేదు రామా. మన అభిప్రాయాలు  కూడా ఈ విషయంలో వేరు. కానీ శారద తండ్రిగా నాకు నువ్వు అర్థమవుతున్నావు. శారదని చదువుకోమని నేను చెబితే ఆ అమ్మాయి వింటుందా?’’

‘‘వింటుంది. ఆ  రాజకీయపు లోతు శారదకు తెలియవు. అక్కడ ఇమడలేదు. డాక్టర్‌ చదివి దేశానికెంతో సేవ చేయగలుగుతుంది. స్వతంత్ర దేశానికి డాక్టర్లు అక్కర్లేదా?’’

‘‘అందరూ కావాలి. కానీ ఇప్పటి ఉద్యమ అవసరం వేరు.’’

‘‘నా కోసం నువ్వు శారదతో మాట్లాడు హరీ! ఆమెను చదువుకోమను.’’

‘‘డాక్టరవటం వల్ల దేశానికి సేవ చెయ్యొచ్చని మాత్రం చెబుతాను. అంతకు మించి నా వల్ల కాదు’’.

రామారావు ముఖంలో కనిపించిన నిరాశ, కుంగుబాటు చూసి హరి గారికి కళ్ళవెంట నీళ్ళొచ్చాయి.

‘‘రామా! నేను నా ఆశయాలకు భంగం రాకుండా శారదను ఒప్పించటానికి ప్రయత్నిస్తాను.’’

‘‘అదే చాలు. నేనూ శారదను బతిమాలుకుంటాను.’’

రామారావు పరిస్థితి, ఆ తీవ్రత హరిగారికి అర్థమైంది. ప్రాణమిత్రునికి వీలైనంత సహాయం చెయ్యాలనే ఆయనకు అనిపించింది. రామారావు తన పనిలో ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయటం లేదు. ఇపుడు శారద గురించిన మనోవేదన కూడా తోడైతే అది మంచిది కాదనిపించింది. రామారావులాంటి మనుషులు  దేశానికి ఎంతో అవసరం. రామారావు ని  కాపాడటం స్నేహితునిగా తన కనీస ధర్మం అనుకున్నాడు. కానీ రాజీపడటం ఆయనకు బొత్తిగా చేతకాదు.

కళాశాలను బహిష్కరిస్తాననే నిర్ణయం తండ్రి కి చెప్పిన తరువాత  శారదకు పట్టలేనంత ఉత్సాహం  వచ్చింది. ఆ ఉత్సాహం లో  అన్నపూర్ణకు ఉత్తరం రాసింది.

ప్రియమైన అన్నపూర్ణ !

నీ ఉత్తరం, అందులోని విషయాలు నాకు ఎంత సంతోషం కలిగించాయో నీకు చెప్పలేను. నీ భర్త ఉత్తముడు. అతను చదువుమానటం చాలా గొప్పపని. మద్రాసు నుంచి అతను వెళ్ళేముందు నన్నొక్కసారి కలిసి ఉంటే ఎంత బాగుండేది. నా నిర్ణయం ఇంకొంచెం ముందుగా ధైర్యంగా, నిస్సందేహంగా తీసుకోగలిగేదాన్ని. ఇంతకూ నా  నిర్ణయం ఏమిటంటావు ? మనందరిది ఒకటే మార్గం.     నేను కూడా చదువు మానేస్తున్నాను . రాట్నం ఒడుకుతాను. ఖద్దరు ధరిస్తాను. దేశం కోసం పని చెయ్యమని నా  మనసు చెబుతోంది. అంతకంటే మహత్తరమైన పని లేదని చెబుతోంది. నా  మనసు మాట వింటాను. మా నాన్నకు బాధ కలిగిస్తున్నానని తెలుసు  గానీ ఎంతో మంది బాధ పడందే, త్యాగం  చెయ్యనిదే దేశానికి స్వతంత్రం వస్తుందా? ఇపుడు నా  మనసంత అదే ఆలోచన. ఇన్నాళ్ళు  ఇలా ఆలోచించలేదేమిటా అని సిగ్గుపడుతున్నాను.

ఇవాళే కళ్ళు తెరిచి దేశాన్ని కొత్తగా చూస్తున్నాను.. ప్రజల బానిసత్వం,  పరాయి పాలకుల దుర్మార్గం నాకు అర్థమవుతోంది. ఈ బానిస బతుకు మనం బతకవద్దు. నువ్వు నీ భర్తను అనుసరించు. ఉద్యమంలోకి  రా ! మీ కాపురం గురించే ఆలోచించి విలువైన  విషయాలను పక్కన పెట్టకు. నేనింకా నాన్నను ఒప్పించాల్సి ఉంది.  ఏం పని చెయ్యాలో నిర్ణయించుకోవాల్సి ఉంది. నేనింకా చిన్నదాన్ని, అనుభవం లేనిదాన్ని అంటారు నాన్న. ఈ వయసు నుంచే పనిచేసి అనుభవం సంపాదించే అవకాశం వచ్చింది కదా అనిపిస్తుంది నాకు. నా రక్తం ఉప్పొంగుతోంది. గాంధీ గారు కోర్టులో చెప్పిన మాటలు  పత్రికలో చదివావు కదూ? ఆ మాటలు  చదివి నేను రోమాంచితనయ్యాను. ఆ క్షణాన వెళ్ళి బ్రిటీష్‌ అధికారులు  ముందు నిలబడి నన్ను బంధించండి . నన్ను ఉరి తియ్యండి కావాలంటే ? నేనూ ఉద్యమానికి చెందిన దానినే అని అరవానిపించింది. నా  ప్రాణాలు  ఇవ్వాలనిపించింది దేశం కోసం. గాంధీ గారి కోసం.

అన్నపూర్ణా! నువ్వు, నీ భర్త , నేనూ అందరం దూకుదాం. అందరం కలిస్తే  ఎంత బలం?

నా  చదువు గురించి నాన్న నాలుగు  రోజులు  ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారు. నాలుగు  రోజులు  తర్వాత  మారని నా  నిర్ణయం గురించి నాన్నకు చెప్పి నా కర్తవ్యం నిర్వహిస్తాను. నేనేం చెయ్యాలో చెప్పమని నాయకులను  అడుగుతాను. వారు చెప్పిన పని ఆనందంగా, త్రికరణ శుద్ధిగా చేస్తాను.

విశాలాక్షి చదువుకుంటున్నందుకు నాకు సంతోషంగా లేదు. నా లాగా తనెందుకు ఆలోచించటం లేదు? నువ్వు గుంటూరు దగ్గర్లోనే ఉన్నావు గదా విశాలాక్షితో మాట్లాడరాదూ? చదువు మానెయ్యమని చెప్పించు . విశాలాక్షికి కూడా ఉత్తరం రాస్తాను నేను.

నీ ప్రియమైన

శారద.

 

ఆ ఉత్తరం రాశాక ఇక శారదకు సందేహమే లేదు. ఆనందంగా పత్రిక చదువుతోంది. ఆ వేడిలోనే విశాలాక్షికి ఉత్తరం రాసేసింది.

***

 

అనామిక

 కందుకూరి రమేష్ బాబు
Kandukuri Rameshచేతుల గురించి మాట్లాడుకుంటాం గానీ వేళ్ల గురించి మాట్లాడం.ఐదువేళ్లు.బొటన వేలు.
చూపుడు వేలు.
మధ్య వేలు.
ఉంగరం వేలు.
చిటికెన వేలు లేదా వ్రేలు.

చేవ్రాలు ఒకటే కావచ్చు, కానీ వేళ్లు వేరువేరు!

ఈ చిత్రంలో చూడండి. అతడు బ్రష్ పట్టుకోగానే సరిపోలేదు. ఆ బ్రష్ తో దిద్దేందుకు ఒక వేలు ఆసరాగా ఎలా నిలబడిందో చూడండి.

బొటనవేలు, చూపుడువేలూ కలిసింది. మధ్యవేలు ఆసరా అయింది. ఉంగరం వేలు ధిలాసానిచ్చింది తన పని సజావుగా సాగడానికి.చిటికెన వేలు పునాది.

ఇట్లా ఒక చిత్రకారుడి విషయంలో ఉన్నట్టే అన్ని జీవన వ్యాపకాల్లోనూ ఎన్నిచేతులు, మరెన్ని వేళ్లు.ఎన్ని చేతలు, మరెన్ని తీర్లు. జాగ్రత్తగా చేస్తే, ఇట్లాంటి ఫొటోలూ ఎన్నో దించవచ్చు!

ఒకసారి చూడటం మొదలైందా, ఇక ఎన్నో ఆవిష్కరణలు.
చిత్రమేమిటంటే కొత్తగా చేసేదేమీ ఉండదు. చూడటమే!

అదృశ్యం కాస్త దృశ్యగోచరం కావడానికి ఒక ఆసరా దొరకాలి. అంతే, ఇక మీరిలా కెమెరా పట్టుకుంటే కన్ను చూపుడు వేలైతే, క్లిక్ మనిపించే వేలు కన్నవుతుంది. అలా ఒక చిత్రం.

మరి ఆ చిత్రలేఖనం ఏమిటీ అంటే ఛాయను చిత్రించే చేవ్రాలే!

– ఇట్లా ఛాయా చిత్రలేఖనంలోనూ వేళ్లకున్న మహత్యం వల్ల కూడానూ ఒక చిత్రకారుడు పనిచేయగా వేళ్లు కానవస్తయేమో! అయితే ఒక మాట! సమైక్యత కనిపించినట్టు దేని పాత్రా దానిదే అని చెప్పడం కోసమూ ఈ దృశ్యాదృశ్యం.

అందుకే ఆ ఉంగరం వేలు, అనామిక – ఈ చిత్రిక.

థాంక్యూ…

*

ఒంటరి సమూహం

ప్రసాదమూర్తి

 

ఒంటరిగా సమూహాన్ని శ్వాసించు

సమూహంలో ఒంటరితనాన్ని ధ్యానించు

కళ్ళలోంచి అడవుల్ని విదిలించు

వేళ్ళలోంచి జలపాతాలు ఉరికించు

నరాల్లోంచి సైన్యాలుగా కవిత్వాన్ని కదిలించు

 

నీలో నవ్వులుంటే

అవి చిన్నారులకు తీసిచ్చేయ్

నీలో రెక్కలున్నాయి

అవి పిట్టల ఆస్తి రాసిచ్చేయ్

 

నువ్వు బతికున్నావని చూడ్డానికి

నాడి పట్టుకుంటే కాదు

నిన్ను ప్రేమించే చేయి పట్టుకో

నీ చుట్టూ నువ్వే వుంటే

మధ్యలో నువ్వు లేనట్టే

అందరినీ అల్లుకుని నువ్వుంటే

అందరూ నీలో వున్నట్టే

 

చెయ్యి..యుద్ధమే చెయ్యి

కత్తి పట్టకుండా కూర్చుండే కాలం కాదు

నువ్వు కూర్చునే కుర్చీ కూడా

యుద్ధభూమిలో రథం కావచ్చు

సారథివీ రథివీ నువ్వే కావచ్చు

నీతో అంతమవ్వుడానికి

ఈ యుధ్ధం నీతో మొదలు కాలేదు

 

చిన్ని పురుగును చూడు

పురుగులో బతుకు పరుగును చూడు

నీ  యుద్ధం నీ బతుకు నీ పరుగు

నీవి కావనుకో

ఇంకెవరి యుద్ధమో ఎవరి బతుకో

ఎవరి పరుగో నీదవుతుంది

నీ స్వార్థాల హెల్మెట్ తీసి పక్కన పెట్టు

వందలుగా కిరీటాలు నీ నెత్తిన వాలతాయి

నువ్వు కప్పుకున్న భయాల రెయిన్ కోటు తీసెయ్

జల్లులు జల్లులుగా మనుషులు

నిన్ను తడిపేసినప్పుడు

ఆ మానవస్పర్శ మహానుభూతిలో

ముద్ద ముద్దయిపోతావు

 

ఒంటరిగా సమూహాన్ని శ్వాసించు

సమూహంలో ఒంటరితనాన్ని ధ్యానించు

*

prasada

మన లోపలి మరో ప్రపంచం 

భవాని ఫణి 
bhavani-phani.

మన శరీరంలో అతి క్లిష్టమైన భాగం ఏమిటంటే , మెదడని ఠక్కున చెప్పేస్తాం . సాంకేతికంగా ఇంత అభివృద్ది సాధించినా మెదడు లోపల ఏం జరుగుతుందో , ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం మనిషి ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడు . ఒక్కోసారి మన ప్రవర్తనా విధానం మనకే అంతు పట్టదు . ఒకేలా ఉండే సందర్భాల్లో వేరు వేరుగా ప్రతిస్పందిస్తూ ఉంటాం. మనమేం కోరుకుంటున్నామో మనకే అర్థం కాదు. అది అర్థం చేసుకోగలిగిన మనిషి , మనిషెందుకవుతాడు, మహర్షి అయిపోతాడని సర్ది చెప్పుకుంటాం .

అసలు మనిషి కోరుకునేది ఏమిటి? ఆహారమా?  ధనమా? పేరు ప్రతిష్టలా? ఆరోగ్యమా ? సుఖశాంతులా ? లేక అన్నీనా ? అసలు ఎందుకు ఇవన్నీ ? సంతోషంగా ఉండటం కోసమే కదా!  సంతోషమే లేనప్పుడు ఎన్నున్నా వృధానే అనుకుంటాం . అది నిజమేనా? మరి మనిషి లోపల ఉండే మిగిలిన భావనల మాటేమిటి? విషాదం , కోపం, చిరాకు , భయం ….. వంటి లక్షణాలు మన వ్యక్తిత్వంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి?  అటువంటి భావాలకి రూపం ఇస్తే అవి ఎలా ఉంటాయి? ఇలా మనకి కలిగే అనేక సందేహాలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది ఈ యానిమేటెడ్ చలన చిత్రం . ప్రతి సన్నివేశంలోనూ అంతర్లీనమైన సందేశాన్ని ఇమిడ్చి రూపొందించిన  పిక్సార్ వారి మరో ఆణిముత్యం  ఇన్ సైడ్ అవుట్ (Inside Out -2015).

తన టీనేజ్ కుమార్తె ప్రవర్తనా విధానంలో కలిగిన మార్పుల్ని గమనించిన పీట్ డాక్టేర్ అనే వ్యక్తి ఈ అత్యద్భుతమైన యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించి దర్శకత్వం వహించాడు .  మన మెదడు ఒక పెద్ద భవంతి అనుకుంటే , లోపల నివసించే భావనలన్నీ మన ఆలోచననీ , నడవడికనీ,  ప్రవర్తననీ నియంత్రిస్తూ ఉంటే వాటి మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉంటుంది ? ఆ ఘర్షణ కారణంగా  మన వ్యక్తిత్వంలో, బాహ్య ప్రవర్తనలో  కలిగే మార్పులు ఎలా ఉంటాయి? అనే అంశాలని ఎంతో నిశితంగా పరిశీలించి, పరిశోధించి ఈ చిత్రానికి ప్రాణం పోసింది చిత్ర నిర్మాణ బృందం  . మెదడు నిర్మాణం , పని తీరు గురించి సమగ్రంగా తెలుసుకోవడం కోసం అనేకమంది మానసికశాస్త్ర నిపుణుల సహాయం తీసుకున్నారు . అలాగే చిత్రంలోని ముఖ్య పాత్ర పదకొండేళ్ల  అమ్మాయి కావడంతో , పదకొండు నుండి  పద్ధెనిమిది సంవత్సరాల వయసుగల ఆడపిల్లలతో మాట్లాడి వాళ్ల భావనల్ని గమనించి సమీక్షించారు.

ఆ అమ్మాయి పేరు రైలీ .  ఆ పాప పుట్టుకతో కథ ప్రారంభమవుతుంది . ఆమె బాహ్య ప్రవర్తననీ , మెదడు లోపలి కార్యకలాపాలనీ మనం  ఏకకాలంలో చూడగలుగుతాం.  .రైలీ పుట్టగానే ఆమె మెదడులోజాయ్(సంతోషం) ఏర్పడుతుంది . జాయ్ రైలీ ప్రవర్తనని నియంత్రిస్తూ ఉంటుంది  ఇంతలో విషాదం కూడా ఆమెకి తోడవుతాడు . వాళ్లిద్దరూ కలిసి ఆ పాపని నవ్విస్తూ ఏడిపిస్తూ ఉంటారు . మొదట్లో ఉన్నవి ఆ రెండు భావనలే . .

మెల్లగా పాప నడవటం మొదలు పెట్టేసరికి వాళ్లతో భయం వచ్చి కలుస్తాడు . అతను రైలీని  ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాడు . పెరిగే కొద్దీ మరో భావన చిరాకు కూడా వస్తుంది . దాని వెనకే కోపం వస్తాడు .  పదకొండేళ్ల వయసు వచ్చేసరికి రైలీలో ఈ ఐదు భావనలూ ఏర్పడి, తమ తమ పనులు చేసుకుంటూ ఉంటాయి(రు) . కానీ ప్రధానంగా పాప ప్రవర్తన మీద పట్టు కలిగి ఉన్నది మాత్రం జాయ్ నే . ఆమెకి పాపలో విషాదం ఎందుకున్నాడో అర్థం కాదు . వాడు పాపని బాధపెడతాడని జాయ్ భయం . అందుకే వాడిని నియంత్రణ యంత్రాలకి , జ్ఞాపికా గోళాలకీ దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది . ప్రతి రోజూ వందలకొద్దీ జ్ఞాపికా గోళాలు తయారై, రోజు పూర్తయ్యే సమయానికి కోర్ మెమొరీకి జతకూడుతూ ఉంటాయి . రోజు వారీ పనులకి అవసరం లేని జ్ఞాపికా గోళాలు, దీర్ఘకాలిక జ్ఞాపికా గదుల్లోకి(long term memory) చేరిపోతూ ఉంటాయి .ఇక ఎందుకూ  పనికి రాని, పాతబడిన  జ్ఞాపకాలు వ్యర్థాలుగా నాశనం చేయబడతాయి.

insideout original

ఇలా అంతా సవ్యంగా నడిచిపోతున్న సమయంలో రైలీ జీవితంలో ఒక మార్పు సంభవిస్తుంది . ఆమె కుటుంబం మరో ప్రాంతంలో నివసించడానికి వెళ్లాల్సివస్తుంది . అక్కడి కొత్త వాతావరణం, కొత్త స్కూల్ ఆమెని , ఆమెలోని ఐదు భావనల్నీ అయోమయానికి గురి చేస్తాయి . అనుకోకుండా విషాదం కొన్ని జ్ఞాపికా గోళాల్ని ముట్టుకోవడంతో రైలీని విషాదం ఆవహించి, స్కూల్లో అందరిముందూ ఏడ్చి అవమానపడుతుంది . జాయ్ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండగా ఆమె , విషాదంతో  కలిసి లాంగ్ టర్మ్ మెమరీ గదుల్లోకి జారిపడిపోతుంది . ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ లో ఉన్న భావనలు భయం , చిరాకు, కోపం . అంటే రైలీలో ఆ భావనలు తప్ప  సంతోషం, విషాదం ఉండవు . ఆ స్థితి ఆమె ప్రవర్తనలో విపరీతమైన మార్పుని తీసుకొస్తుంది .
ఓ పక్క  జాయ్,విషాదంతో కలిసి హెడ్ క్వార్టర్స్ చేరుకునే ప్రయత్నం చేస్తుంటుంది . కానీ అక్కడ కోపంచేతిలో నియంత్రణ  ఉండటం వల్ల అప్పటివరకు ఆమెలో ఏర్పడి ఉన్న వ్యక్తిత్వ ద్వీపాల్లో (personality islands ) స్నేహితుల ద్వీపం , నిజాయితీ ద్వీపం , తుంటరితనపు(goofy )ద్వీపం , హాకీ(ఆమెకిష్టమైన ఆట) ద్వీపం అన్నీ నాశనమవుతాయి . ఇక మిగిలింది కుటుంబ ద్వీపం ఒక్కటే . ఆ సమయంలోనే కోపం, ఆమెలో ఇల్లు వదిలి వెళ్లిపోవాలనే ఒక ఆలోచన (ఐడియా) ప్రవేశపెడతాడు . ఆ కారణంగా రైలీ ఇల్లు విడిచి వెళ్లిపోతుంది.
లోపలి గదుల్లో ఉన్న జాయ్ ఎన్నో కష్టాలు పడుతూ చివరికి హెడ్ క్వార్టర్స్ చేరుకుంటుంది . ఆ క్రమంలో విషాదంఉపయోగం ఏమిటో కూడా తెలుసుకుంటుంది . చివరగా అతనికి  నియంత్రణ బాధ్యతని అప్పగిస్తుంది . అప్పుడు రైలీ భావోద్వేగానికి గురై  తిరిగి మానసికంగా సాధారణ స్థితికి  చేరుకుంటుంది .  అప్పటినించీ భావనలన్నీ కలిసికట్టుగా రైలీ వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తూ ఉంటాయి . ఆమె ఎదిగే కొద్దీ మరెన్నో భావనలు కూడా వాటికి జత కలుస్తూ ఉంటాయి . ఇదీ క్లుప్తంగా కథాశం . మన ప్రవర్తననీ, లోపల కలిగే భావాల్నీ ఈ చలన చిత్రంలో చక్కగా సమన్వయపరిచి చూపారు  . ఏ భావనకి ఉండే గొప్పతనం , స్థానం దానికి ఉండాలనీ , వాటి పాళ్లు ఎక్కువా తక్కువా అయితే అప్పటివరకు  మన లోపల నిర్మితమై ఉన్న భావోద్వేగాల ప్రపంచం నాశనం అయిపోతుందనీ తెలియజేసారు .

అంతేకాక లోపలి గదుల్లో జాయ్ కి ఎదురయ్యే, రైలీ ఊహత్మక నేస్తం ‘బింగ్ బాంగ్ ఏనుగు’ , ఆమె ఊహత్మక ప్రపంచం , కలల్ని చిత్రీకరించి ప్రదర్శించే బృందం , ఆమె కోసం ప్రాణాలిచ్చే ఊహత్మక స్నేహితుడూ  అందరూ కలిసి ఎవరి లోపల వాళ్లు నిర్మించుకునే మరో ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తారు.  లోపల జరుగుతున్న విషయాలనీ, బాహ్య ప్రవర్తననీ అలా పోల్చి చూడటం ఒక గమ్మత్తైన అనుభూతిని కలిగిస్తుంది . ఇలా భావనల్ని మనుషుల రూపంలో చూపడం వల్ల, ఆ భావనల భావ వ్యక్తీకరణని నిర్వచించడం కత్తి మీద సామే . ఉదాహరణకి పేరులోనే సంతోషాన్ని కలిగి ఉన్న జాయ్, బాధ కలిగే సన్నివేశాల్లో ఎలా స్పందిస్తుంది? తాకిన ప్రతీ జ్ఞాపకాన్నీ విషాదమయం చేసే విషాదం , ఆనందం కలిగితే ఎలా ప్రవర్తిస్తాడు వంటి విషయాలని మనం  ఆసక్తితో గమనిస్తాం . ఇది పిల్లల కంటే పెద్దలకే అర్థవంతంగా అనిపించే , సంతృప్తి కలిగించే చలన చిత్రం .  ఒక్కసారే కాకుండా చూసే కొద్దీ కొత్త కొత్త విషయాలు అర్థం అవుతున్నట్టు అనిపించడం  దీనిలోని ప్రత్యేకత.  ఈ 3D యానిమేటెడ్ చలన చిత్రం, పిక్సార్ యానిమేటెడ్ స్టూడియోస్ ద్వారా నిర్మితమై వాల్ట్ డిస్నీ పిక్చర్స్ సంస్థ ద్వారా విడుదల చేయబడి విజయవంతంగా ప్రదర్శితమవుతూ విమర్శకుల మన్ననలు పొందుతోంది.

.

   గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్- 11

 

                        [ Anne Of Green Gables by L.M.Montgomery ]

” ఎలా ఉన్నాయి ? నచ్చాయా ? ” మెరిల్లా అడిగింది.

  ఆన్ గంభీరంగా తిలకించింది – మంచం మీద మూడు గౌనులూ పరిచి ఉన్నాయి , ఆవేళే దర్జీ అతను తెచ్చాడు. ఒకటి మట్టి రంగు లో మంచి  దళసరిగా ఉంది. ఆ కిందటేడు వేసంకాలం లో ఇళ్ళమ్మట అమ్మొస్తే , బాగా మన్నేలా ఉందని తీసుకుంది మెరిల్లా. ఇంకోటి తెలుపు నలుపు గళ్ళ లో పెళపెళలాడే నకిలీ పట్టుది – ఆ  శీతాకాలంలోనే  తగ్గింపు ధరల బేరంలో ఇంటికి వచ్చింది. మూడోది మటుకు ఆ కిందటివారమే పట్నం వెళ్ళి కొట్లో కొంది మెరిల్లా –  వెలా తెలా పోతున్న నీలం రంగు  , బట్ట ఎక్కడా మడతకి లొంగకుండా నీలుక్కున్నట్లు నిల్చుంది .

   మూడూ మెరిల్లా వేసుకునే గౌన్ ల మాదిరే మహా పద్ధతిగా అతి సాదాగా  కుట్టబడ్డాయి.

” నాకు ఇవి బావున్నట్లు ఊహించుకుంటున్నాను ” ఆన్ తన మనోభావాలని వ్యక్తం చేసింది.

పాపం మెరిల్లా నొచ్చుకుంది – ” ఊహించుకుంటావా …నీకు నచ్చలేదన్నమాట – ఎందుకు ? ఏమైంది వీటికి ? బాగానే ఉన్నాయిగా…కొత్తవి , పైగా ..”

” అవును  ”

” మరెందుకు నచ్చలేదు ? ”

” ఇవి…ఇవి అందంగా లేవు ” – ఆన్ చెప్పలేక చెప్పింది.

” అందం..హు ! ” మెరిల్లా పెదవి విరిచింది – ” నేను నీకు అంద..మైన బట్టలు కొనాలనేమీ అనుకోలేదులే – అలాంటి వేషాలు నాకస్సలు గిట్టవు , గుర్తు పెట్టుకో. ఇవి మంచిగా మర్యాదగా ఉన్నాయి , కుచ్చులూ రిబ్బన్లూ ఆర్భాటాలూ లేకుండా- వచ్చే ఎండాకాలం దాకా ఇవే వేసుకోవాలి నువ్వు. ఆ మట్టి రంగుదీ నీలందీ బడికి వేసుకెళ్ళచ్చు , పట్టుది చర్చ్ కి వెళ్ళేప్పుడు. శుభ్రంగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి- చింపి పోగులు పెట్టకూడదు. అయినా , నీ పాతబట్టలు బొత్తిగా చీకిపోయి ఉన్నాయి కదా, వాటికి  బదులుగా ఇంకేం వచ్చినా నువ్వు సంతోషిస్తావనుకున్నానే నేను ?  ”

” నేను సంతోషిస్తూనే ఉన్నాగా ” ఆన్ నొక్కి చెప్పింది ..” కాకపోతే , మరీ.. ఒక్క గౌనుకైనా బుట్ట చేతులుంటే ఇంకా..సంతోషించేదాన్ని –  ఇప్పుడు బుట్టచేతులు ఫాషన్ కదా ….’’

” ఏం అక్కర్లేదులే. బుట్టచేతులకి వృధా చేసేంత  బట్ట నా దగ్గరేం లేదు .  ఏం బావుంటాయీ అవి , వెర్రి మొర్రిగా  ”

” అందరితోబాటు నేనూ వెర్రి మొర్రిగానే ఉంటే ఏం ? ” – ఆన్ దిగులుగా సూచించింది.

” ఏడిశావులే. అన్నీ మడతలు పెట్టి భద్రంగా అల్మైరా లో పెట్టు , తర్వాత కూర్చుని పాఠం చదువుకో. రేపు ఆదివారం బడికి వెళ్ళాలి నువ్వు – మిస్టర్ బెల్ కి కబురు చేశాను ” – మెట్లు దిగి వెళ్ళిపోయింది మెరిల్లా.

ఆన్ చేతులు కట్టుకుని తన కొత్త గౌన్ లని పరికించింది.

” వీటిల్లో ఒక్కటైనా తెల్లగా , బుట్ట చేతులతో ఉండి ఉంటే ఏం పోయేది ” గొణుక్కుంది –   ” ఉండాలని ప్రార్థించుకున్నాను కూడా , కాని దేవుడంతటివాడికి నా బట్టల గురించి ఏం పడుతుంది !!! సరేలే, ఈ గౌను మంచులాగా తెల్లటి లేస్ తో కుట్టి ఉన్నట్లు ఊహించుకుంటాను ..దీనికేమో బుట్టచేతులు ఉన్నట్లు…’’

ఆ ఆదివారం మెరిల్లా కి బాగా తలనొప్పిగా ఉండి ఆన్ తోబాటు ఆదివారం బడికి వెళ్ళలేకపోయింది.

” మిసెస్ రాచెల్ ఇల్లు దోవలోనే కదా  , ఆవిడని అడిగితే నీ తరగతి ఎక్కడో చెబుతుంది. బడి అయాక చర్చ్ లో బోధ చేస్తారు , అది కూడా వినాలి నువ్వు. ఎక్కడ కూర్చోవాలో ఆవిణ్ణే అడుగు.  ఇదిగో, ఈ సెంట్ తీసుకుని హుండీలో వెయ్యి. మనుషులని ఎగా దిగా చూస్తూ కూర్చోకు , అటూ ఇటూ మెసలకుండా కుదురుగా ఉండు. ఇంటికొచ్చాక పాఠం ఏం చెప్పారో నాకు అప్పజెప్పాలి ”

ఆన్ బుద్ధిగానే బయల్దేరింది. నలుపుతెలుపు గళ్ళ గౌను వేసుకుంది – అందులో మరీ బక్కగా కనిపిస్తోంది. టోపీ చదునుగా , నావికులు పెట్టుకునేదానిలాగా ఉంది. ఆ సాదాతనాన్ని భరించలేక దానికి రిబ్బన్ లూ పువ్వులూ ఉన్నట్లు ఊహించుకుంటూ వెళుతోంది ఆన్. సగం దూరం వెళ్ళేసరికి పువ్వులు నిజంగానే సరఫరా అయాయి . గాలికి ఊగుతూ బంగారు రంగులో వెన్న గిన్నె పూలు , మిసమిసలాడుతున్న అడవి గులాబీలు. కావలసినన్ని తెంపుకుని మాల అల్లి టోపీ కి తగిలించుకుంది ‘ అమ్మయ్య ‘  అనుకుంది. ఆ రంగు రంగుల అలంకారం ఎవరికి ఎలా కనిపించినా ఆన్ కి మటుకు గొప్పగా గర్వంగా ఉంది.

మిసెస్ రాచెల్ ఇంటికి వెళ్ళేప్పటికి ఆవిడ వెళ్ళిపోయింది. ఆన్ కేం భయం…ధీమాగా ఒక్కతే చర్చ్ వరకూ వెళ్ళింది. అక్కడి వసారా లో దాదాపు ఆమె వయసే ఉన్న అమ్మాయిలు , చక్కటి బట్టలు వేసుకుని గుమిగూడి ఉన్నారు. ఈ కొత్తపిల్లనీ ఆమె యొక్క అసాధారణమైన శిరోలంకారాన్నీ వాళ్ళు గుడ్లప్పగించి చూశారు.  అప్పటికే ఆన్ గురించి వాళ్ళు కథలూ గాథలూ వినిఉన్నారు. ఆమెకి బోలెడంత కోపమని మిసెస్ రాచెల్ అందరికీ చెప్పింది[ ఆన్ వెళ్ళి క్షమాపణ చెప్పకముందు ] …గ్రీన్ గేబుల్స్ లో పాలేరు కుర్రాడు జెర్రీ బ్యుయోట్ – ఆన్ అస్తమానం చెట్లతోటీ పువ్వులతోటీ మాట్లాడుతుంటుందనీ ఒక్కోసారి వెర్రిదానిలాగా తనకి తనే ఏదో చెప్పుకుంటూ ఉంటుందనీ ప్రచారం చేశాడు.  అమ్మాయిలెవరూ ఆన్ తో స్నేహం చేసుకుందుకు ముందుకి రాలేదు… వెనకాల గుసగుసలు చెప్పుకున్నారు . ప్రార్థనా సమయం   అయిపోయి మిస్ రోగర్ సన్ పాఠం మొదలైంది.

మిస్ రోగర్ సన్ ఇరవై ఏళ్ళబట్టీ ఆదివారం బడిలో పాఠాలు చెబుతోంది. అందుకోసం పెద్దగా  ఏం కష్టపడదు – పాఠం అనబడేదాన్ని అచ్చుపుస్తకం లో చూస్తూ చదువుకుపోయి , తర్వాత పుస్తకం అంచు  మీది నుంచి చూస్తూ ఎవరో ఒకర్ని ప్రశ్నలు అడగటం – ఇంతే.  ఆన్ ని చాలా ప్రశ్నలే వేసింది , మెరిల్లా తర్ఫీదు వల్ల ఆన్ చాలావరకు సరిగ్గానే జవాబులు చెప్పింది – కాని విషయం ఏమాత్రం బుర్రకెక్కిందో దేవుడికే తెలియాలి !

ఆన్ కి మిస్ రోగర్ సన్   నచ్చలేదు .  పోతే , తరగతి లో ఆన్  తప్ప అందరూ బుట్ట చేతుల గౌన్లే వేసుకున్నారు- ఆన్ ఖిన్నురాలైపోయింది , బుట్టచేతులు లేని జీవితం వ్యర్థమనిపించింది.

” ఎలా ఉంది బడి ? ” ఇంటికొచ్చాక మెరిల్లా అడిగింది. టోపీకి చుట్టుకున్న దండ వాడిపోయిందని ఆన్ తీసేసింది దాన్ని , అందుకని అప్పటికి మెరిల్లా కి దాన్ని చూడటం తప్పింది.

” నాకేం బాగాలేదు….దరిద్రంగా ఉంది ”

” ఆన్ షిర్లే ” …గద్దించింది మెరిల్లా.

ఆన్ భారం గా నిట్టూర్చి  , ఊగుడు   కుర్చీలో కూలబడింది. బోనీ [ జెరేనియం పూల మొక్క ] ఆకునొకదాన్ని ముద్దు పెట్టుకుని, ఫ్యుషియా పూలగుత్తికి పలకరింపుగా చెయ్యి ఊపింది.

” నేను లేనప్పుడు వాటికేమీ తోచి ఉండదు కదా ” వివరించింది . ” ఆ..ఆదివారం బడిగురించే కదా…నువ్వు చెప్పినట్లే బుద్ధిగా నడుచుకున్నాను. మిసెస్ రాచెల్ ఇంట్లో లేకపోయినా  ఒక్కదాన్నే వెళ్ళగలిగాను. బ ళ్ళో ఒక మూల ,  కిటికీ  పక్కన కూర్చున్నాను. తర్వాతేమో మిస్టర్  బెల్ చా..లా..పె..ద్ద ప్రార్థన చెప్పారు. కిటికీ పక్క నే ఉన్నాను గనక సరిపోయింది…అందులోంచి ప్రకాశమాన సరోవరం కనిపిస్తూ ఉండింది. చూస్తూ అద్భుతమైన సంగతులని ఊహించుకున్నాను ,  అంత సేపూ ఆయన మాటలే విని ఉంటే నీరసం వచ్చుండేది ”

” అలా ఎందుకు చేశావ్ ?  మిస్టర్  బెల్  చెప్పేది విని ఉండచ్చు కదా ? ”

” ఆయనేమన్నా నాతో మాట్లాడారా ఏమిటి ? ” ఆన్ వ్యతిరేకించింది. ”  ‘ దేవుడితో ‘  మాట్లాడుతున్నారు , అదీ మనస్ఫూర్తిగా చేస్తున్నట్లేమీ  లేదు. దేవుడు బాగా దూరంగా ఉన్నాడు కనుక వినిపించదనుకున్నారో ఏమో మరి.

కిటికీ లోంచి చూస్తే సరస్సు మీదికి వాలిపోతూ గట్టు మీదంతా బర్చ్ చెట్లు. మధ్యాహ్నం ఎండ వాటిలోంచి జారి  నీళ్ళమీదికి దూకుతోంది ..ఎంత అందంగా ఉందనుకున్నావు మెరిల్లా ! ‘ దేవుడా, ధన్యవాదాలు ‘ అని రెండు మూడు సార్లు అనుకున్నాను ”

” పైకి అనలేదు కదా ” కంగారు పడింది మెరిల్లా.

” ఊహూ , లేదుగా – లోపల్లోపలే. చివరికి మిస్టర్ బెల్ చెప్పేది అయిపోయింది , నన్ను మిస్ రోగర్ సన్ తరగతిలోకి వెళ్ళమన్నారు. అక్కడేమో తొమ్మిది మంది అమ్మాయిలున్నారు – అందరికీ బుట్ట చేతులే తెలుసా ? నాకూ ఉన్నట్లు ఊహించుకోబోతే అస్సలు కుదర్లేదెందుకో- ఇక్కడ ఇంట్లో ఎంచక్కా కుదిరింది మరి ”

” ఆదివారం బళ్ళో కూర్చుని గౌను చేతుల గురించా ఆలోచించేది ? పాఠం వినాలని తెలీదూ నీకు ? ”

MythiliScaled

” ఎందుకు తెలీదూ..బోలెడు ప్రశ్నలకి జవాబులు కూడా చెప్పాను. మిస్ రోగర్ సన్ అడుగుతూ…నే..ఉన్నారేమిటో , ఆవిడొక్కరేనా అడిగేది…నాకూ చాలా అడగాలనిపించింది గాని ఆవిడ జవాబులు చెప్పరనిపించింది. అప్పుడు కొంతమంది పద్యాల్లాంటివి చదివారు. వాటిని ఉల్లేఖన లు [paraphrases ]  అంటారట , బైబిల్ లో ఉన్నవాటి గురించి అట. నాకేమన్నా వచ్చా అని అడిగారు . ‘ యజమాని సమాధి చెంత ఆయన శునకము ‘ వచ్చని చెప్పాను , మూడో తరగతి వాచకం లో ఉంది అది.  బాగా దిగులు దిగులుగా ఉంటుంది కదా, సరిపోతుందేమోననుకున్నాను. వద్దన్నారు. వచ్చే ఆదివారానికి పందొమ్మిదో ఉల్లేఖన చదువుకు రమ్మన్నారు.  అప్పుడే చదివేసుకున్నాను కూడా , బ్రహ్మాండం గా ఉంది అది.

ఈ మాటలు చదివితే ఒళ్ళు జలదరించింది .

`’Quick as the slaughtered squadrons fell In Midian’s evil day ‘’

Squadron అంటే ఏమిటో, Midian అంటే ఎక్కడో నాకు తెలీదు , అయినా   గొప్ప విషాదకరంగా ఉంది. తొందరగా ఆదివారం వచ్చేస్తే బాగుండును, చెప్పెయ్యాలి…..ఈ వారమంతా చదివిఇంకా బాగా నేర్చుకుంటాను.

అది అయిపోయాక మిస్ రోగర్ సన్ నే చర్చ్ లో ఎక్కడ కూర్చోవాలో అడిగాను –  మిసెస్ రాచెల్ ని అడగమన్నావు కదా, ఆవిడ  దూరంగా ఉన్నారు, అందుకని.   ‘ దివ్యవార్తలు ‘ [Revelations ] మూడో అధ్యాయం లోంచి రెండవ, మూడవ చరణాలు చదివారు. ఎంతసేపు పట్టిందో ! కదలకుండా కూర్చోటం బాగా కష్టమనిపించింది. నేనే పాస్టర్ ని అయిఉంటే పొట్టి పొట్టి వార్తలు ఎంచుకునేదాన్ని. అయిందా , తర్వాత పాస్టర్ గారు వివరించటం మొదలెట్టారు- అదీ బోలెడు సేపు పట్టేసింది … మరి పడుతుంది గదా, అంత పెద్ద వార్త అది. కొంచెం కూడా వినబుద్ధి కాలేదు , ఆయనకి బొత్తిగా ఊహాశక్తి లేదనిపించింది. నాలో నేను ఆలోచించుకుంటూండిపోయాను…. ”

మెరిల్లా నిస్సహాయురాలైపోయింది  …ఆ మిస్టర్ బెల్ చేసే ప్రార్థనా, పాస్టర్ గారి ప్రవచనమూ విసుగుపుట్టించేంత దీర్ఘం గా ఉంటాయని ఆమె ఎప్పుడూ అనుకుంటూనే ఉంటుంది… పైకి అనలేక దాచిపెట్టుకున్న మాటలన్నీ    ఈ పిల్ల శాల్తీ  అనేస్తే తిట్టటమెలా ??  తిట్టకుండా ఊరుకోవటమెలా ???

                                                                   [ఇంకా ఉంది]

  [19th Paraphrase – [The race that   long  in darkness pined ]John Morrison  అనేవారు 1781 లో రచించినది.

ఆన్ కి విషాదకరం గా ఉన్నాయనిపించిన ఆ మాటలు మిదియన్ జాతిని మోజెస్ నాశనం చేయటాన్ని చెబుతాయి.

క్రూరత్వం తప్ప  ఆహ్లాదం ధ్వనించని మతబోధల ని tongue in cheek గా తిరస్కరిస్తారు L.M.Montgomery. ]

 

“రండర్రా, పిల్లలూ, మీకు సినిమా చూపిస్తా!”

 

మణి వడ్లమాని 

 

Mani Vadlamaniఈ ప్రపంచంలో కష్టాలు కన్నీళ్ళే కాదు సరదాలు హాస్యాలు చలోక్తులు చమత్కారాలు వెల్లి విరిసి నవ్వుల పువ్వులు కూడా ఉంటాయి. అని హాస్యం, నవ్వు గురుంచి ఎందరో పెద్దవాళ్లు చెప్పిన మాటలు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి రచనలలో మనకి  పుష్కలంగా కనిపిస్తాయి అలాంటిదే మరో హాస్యపుగుళిక స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది  సినిమా తియ్యండి!. అంటూ నవ్వుల గని  శ్రీమతి పొత్తూరివిజయలక్ష్మి గారు రాసిన పెద్ద కధ . “మొదటి కధ  అయినా గాని ఉత్తరాల ద్వారా ఎన్నో ప్రశంసల అందుకున్నాను.  అది పెద్ద హిట్ అని” తన ముందు మాటలో పేర్కొన్నారు రచయిత్రి-

“రండర్రా, పిల్లలూ, మీకు సినిమా చూపిస్తా!” అని మన అక్కో పిన్నో, అత్తో మనలని పిలచినట్లుగా, విజయలక్ష్మి గారు మనందరికీ స్క్రిప్ట్ తోనే సినిమా చూపిస్తున్నారు..  ఒట్టండి.. నమ్మండి… తప్పకుండా చూడండి… కాదు కాదు చదవండి…. నవ్వి నవ్వి  డొక్కలు ఎగిరేలా, కళ్ళవెంబడి నీళ్ళు కారుతూ, ఇక చాలు బాబోయి అని మీరు అనక పోతే చూడండి. చెప్పదలచిన విషయాన్ని సున్నితంగా, సరసంగా, ఆకర్షణీయంగా చెప్పడానికి హాస్యం  పయోగపడుతుంది.

అందువల్లే హాస్య ప్రధాన రచనలు అనేకం, ఎప్పటి నుండో ఎందరో రాస్తున్నారు.  ఆ ఎందరి లోనో మణి పూస వంటి  పొత్తూరి విజయలక్ష్మి గారుకూడా ఉన్నారు. అందుకే ఆవిడ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన హాస్య రచయిత్రి.

విజయలక్ష్మి  గారు ఈ కధని  1982 లో  ఆంధ్రప్రభ  కి  రాసారు.ఇది ఆవిడ తొలి రచన.  అయితే  ఈ కధను  “జయంతి” అన్న కలం పేరు తో వ్రాసారు.  తొలి సంతానాన్నిచూసుకున్నప్పుడు  తల్లి పొందే ఆనందానికి ఎలా కొలమానం ఉండదో తొలి కధను అచ్చులో చూసుకున్నప్పుడు అదే భావం. అది ఒక మరపురాని మధురానుభూతి” అని అంటారు ఆమె.

pothuri

ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వసుంధర  ఇలా అన్నారు “నేటి చిత్రాల ప్రేరణతో సంపూర్ణేష్ బాబు ఒక్క రోజు లో స్టార్ అయిపోయాడు. ఇదే తరహాలో ఆప్పట్లో మీడియా ఉండి ఉంటే అప్పుడే శ్రీమతి విజయలక్ష్మి గారు చలనచిత్ర రంగం లో స్క్రిప్ట్ రచనలో మెగాస్టార్ అయ్యి ఉండేవారు”

వసుంధర గారు అన్నట్లు  పొత్తూరి విజయ లక్ష్మి గారు మన తెలుగు సినిమా వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చినా ఆ కధ వైపు కన్నేస్తే ఒట్టు. ఎందుకంటారా?  ఎంతటి కధా వస్తువునైనా మార్చి సినిమా కధ గా మలచ గలిగే శక్తి ఉన్న మహామహులు కూడా   ఎందుకో నిర్లిప్తత వహించారు.  కారణం  ఆ స్క్రిప్ట్  లో మార్చడానికి  ఏవి లేదు కనుక, మార్చే  అలవాటు ఉన్న వాళ్ళు కావడం  చేత సినిమాని యదాతధంగా తీసే ప్రయత్నం చేయలేదు అనుకోవాలి.

ఇక  సీనియర్  రచయత  కవనశర్మ గారు “ ఈవిడ ఒక మేధావి, ఈ పుస్తకం పూర్తి చేసేసరికి మీరు(పాఠకుల) కూడా ఈ విషయం తెలుసుకుంటారు, నిర్మాతలకి, దర్శకులకి  శ్రేయోభిలాషి గా చాలా సలహాలిస్తారు” అని తన ముందు మాటలో రాసారు.

ఇంతకీ ఈ పెద్ద కధ లో  ఏవుంది,  మేధావులకు కూడా  అర్ధం కాని ఎన్నో గొప్ప గొప్ప చిక్కు ముడులు ఉన్న కధలు మన తెలుగు సినిమాల్లో కనిపిస్తాయి.  అలాంటి కధా లక్షణాలన్నీ అవపోశన పట్టి ఒక చక్కటి చిక్కటి సినిమా స్క్రిప్ట్  ని తయారు చేసారు.

మొదటగా సూచన పట్టిక ఇస్తారు. హీరో, హీరోయిన్  లు కాకుండా, సైడుహీరోయిన్, హీరో,     హీరోయిన్ తండ్రి, దర్శకునికి రచయిత్రి సలహా(ద.ర.స)  నిర్మాతకి రచయిత్రి సలహా(ని.ర.స).

ఇక ఇక్కడ నుంచి సినిమా (కధ)మొదలు. మొదటి  సీను లో హీరో ఓడంత  కారు లో వస్తూ ఉంటాడు . కారు అద్దాలు తో మొదలుపెట్టి  హీరో మొహం మీద దర్శకుడు పేరు తో టైటిల్సు ముగుస్తాయి.

హీరో ముందు అంతా బలాదూర్ గా ఉండి ఆడపిల్లలని వశపరచు కొంటూ ఉంటాడు.

అలా ఓ రోజున సైడ్ హీరొయిన్ని ఎత్తుకు పోతాడు. అక్కడ కొంత సేపు మెలోడ్రామా అయ్యాక  ‘నా చెల్లెలా!, అంటే   హా! అన్నయ్యా !’ అని ఇద్దరు వాటేసుకుంటారు.

ఇక హీరొయిన్ ఎంట్రన్స్ చాలా సినిమా ఫక్కీలో జరుగుతుంది. ఆమె ని విలన్ గ్యాంగ్ రేప్ చెయ్యడానికి ప్రయత్నిస్తుండగా హీరో వీరోచితంగా  పోరాడి  ఆమెని కాపాడుతాడు. అప్పుడు హీరొయిన్ కృతజ్ఞతలు ల తో పాటు తన ప్రేమ ను కూడా తెలుపుతుంది,  అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ  పుడుతుంది. ఆ పారవశ్యం  లో ఇద్దరూ ఎవరూ లేని మైదానాలదగ్గర,జలపాతాల దగ్గర ఆనందంగా పాత పాడుకుంటారు.

ఆ తరువాత అదే ప్రేమ కోసం స్వశక్తితో డబ్బు సంపాదిస్తానని, హీరొయిన్ తండ్రి తో చాలెంజ్ చేసి  ఏం పని చేయాలా అని ఆలోచించి ఒక ఇస్త్రీ దుకాణం పెట్టి మూడు సీన్లు అయ్యేసరికి కోటీశ్వరుడి గా ఎదిగి పోతాడు.

తల్లి కాని దొరికిన గుడ్డితల్లిని,  చెల్లి కాని దొరికిన చెల్లి తో ఇలా అంటాడు, “అమ్మా! చెల్లీ! నేనక్కడ అష్టైశ్వార్యాలూ, మీరు ఇలా పేదరికం అనుభవించడమా? మీరు నాతో రండి” అని తన  భవంతికి, ఓడంత  కారులో తీసుకోని వెళతాడు.

pothuri1

మధ్యలో తన చిన్న తనం లో తప్పి పోయిన తల్లి, చెల్లి ఎక్కడో లేరు  తనతో పాటు ఉంటున్న దొరికిన తల్లి, చెల్లి తన సొంత వాళ్ళే అని తెలుసుకొని చెప్పలేనంత ఆనందంతో  ఉన్న సమయం లో  విలన్ ఎంటర్  అవుతాడు.

హీరొయిన్  కూడా చాలా  స్వతంత్ర భావాలతో ఒక బిజినెస్ మొదలుపెడుతుంది. అది ఆవు, గేదల నుండి వచ్చే పేడ ద్వారా తాయారు చేసే పిడకల కంపెనీ. ఇక్కడ కూడా మూడు సీన్లు అయ్యేసరికి  హీరొయిన్  కూడా చాలా గొప్పదయిపోతుంది. తన పిడకల బిజినెస్ కి ప్రపంచం నలుమూలల నుంచి ఆదరణ రావడం తో ఎంతో పొంగిపోతుంది.

ఇలా కధ నడుస్తుండగా  ఎక్కడ పాటలు పెట్టాలో, ఎలాంటి  కాస్ట్యూమ్స్ వెయ్యాలో  బడ్జెట్ ఎలా తగ్గించుకోవాలో లాంటి విషయాలు  దర్శకుడికి, నిర్మాతకి కూడా  రచయిత్రి సలహాలు ఇచ్చారు. ఒక అడుగు ముందు వేసి రెండు మూడు పాటలు కూడా రచించారు.

ఇక సినిమా చివర్లో యధా విధిగా, హీరో కష్టాల ని అవలీలగా  ఎదుర్కొని   విలన్ గ్యాంగ్ ని మట్టు పెట్టి  విలన్ ని కొట్ట బోతుండగా,  కొన్ని కారణాలవల్ల  తప్పిపోయిన తన తమ్ముడే ఈ విలన్ అని తెలుస్తుంది. పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళతారు, విలన్ అదే హీరో తమ్ముడిని.  సోదరప్రేమతో , కోర్టులో వాదన చేసి తన తమ్ముడు చిన్నప్పుడే తప్పిపోవటం వల్ల పరిస్థితుల ప్రాబల్యం వల్ల విలన్ గా మారాడని, ఒరిజినల్  గా చాలా అమాయకుడు అని, శిక్ష కు అర్హుడు

కాదని  తామే బల్ల గుద్ది వాదించి, గెలిచి తన తమ్ముడు ని  మారిన మనిషిగా చేస్తానని, జడ్జి గారి తో హీరో చెబుతాడు.

హీరో లో ని వ్యక్తిత్వానికి, పట్టుదలకు,  ఎంతో ముగ్ధుడై  ఈ నాటి యువతరానికి ఇలాంటి వాళ్ళే ఆదర్శం అని ఆ జడ్జి కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటాడు.

చివరాఖరికి అందరూ నవ్వుతు గ్రూప్ ఫోటో తీసుకుంటారు. నవ్వుతున్న వాళ్ళ మొహాల మీద శుభం అని వస్తుంది.

సినిమాని బాక్సాఫీస్ దిశగా నడిపే కధనం తో  అడగడుగున  ఉత్కంఠ రేపే సన్నీ వేశాల తో , భారీగా కన్నీళ్ళు కార్చే బరువైన సంబాషణలతో ఆద్యంతం రక్తి కట్టిస్తూ ఉన్న ఈ కధను చూసే వాళ్ళకి, అదేనండి బాబు చదివే వాళ్ళకి ఒక ముఖ్య  సూచన,  మీరు కుర్చీలో కూర్చొని చదివేతే మీ నవ్వుల ధాటికి కుర్చీ విరగావచ్చు, సోఫాలో గనుక  చదువుతుంటే  మీ నవ్వుల అదురుకి సోఫా నట్లు లూజ్  కావచ్చు. అదే మంచం  మీద  పడుకుని చదివితే ఆ నవ్వుల బాంబు పేలి , ఆ విస్ఫోటనం లో గుండ్రం గా దొర్లుతూ కింద పడనూ వచ్చు. మీకు దెబ్బలు తగలా వచ్చు. అందుకే ఈ కధ చదివే టప్పుడు తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిక  జారి చేయడం అయింది.

ఈ సంకలనం లో వారి కధలు  మరో నాలుగు  ఉన్నాయి, మధురిమ,ముకుందం,ఆనందరావు-ఆవు మరియు అన్నపూర్ణ కి బ్రాండ్ అంబాసిడర్.

చిన్న చిన్న పదాలతో, మనం రోజూ మాట్లాడుకునే  మాటలతో  హాస్యాన్ని పండించడం  పొత్తూరి విజయలక్ష్మి గారి  మార్కు.

*

వారిజాక్షులందు…

 

పాలపర్తి జ్యోతిష్మతి

Palaparthi Jyothishmathiపిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వంటింట్లోకి ప్రవేశించేటప్పటికి అమ్మ సింకు దగ్గర నిలబడి అంట్లు తోముతూ “అబద్ధాలు… అన్నీ అబద్ధాలే… అన్ని అబద్ధాలు చెప్పడానికి అసలు నోరెట్లా వస్తుందో…” అని గొణుక్కుంటోంది.

“అబ్బ! నాకావలసిన విషయం నీ కెట్లా తెలిసిందమ్మా?” అడిగాను ఆశ్చర్యంగా.

“ఎంతసేపైంది వచ్చి? నాన్న స్టేషన్ కి వచ్చారు. కనిపించారా, చూసుకోకుండా నీ అంతట నువ్వే వచ్చేశావా?” విసుగ్గా అడిగింది అమ్మ నా మాటలు పట్టించుకోకుండా.

“నేను తోముతాలేమ్మా” అంటూ రంగి గొంతు వినిపించడంతో అమ్మ వెనక్కి తిరిగి రంగివైపు కోపంగా ఒక చూపు చూసి విసురుగా చేతిలో ఉన్న గిన్నెని సింకులోకి విసిరేసి చేతులుకూడా కడుక్కోకుండానే వంటింట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. రంగి తలవంచుకుని సింకుదగ్గరికి వచ్చి అంట్లు దొడ్లో వేసుకుని తోమడానికి కూర్చుంది. రంగి దొడ్లోకి వెళ్ళగానే అమ్మ వంటింట్లోకి వచ్చింది. స్థాణువులా నిలబడిపోయిన నేను తేరుకుని “నాన్నే తీసుకొచ్చారు. బయట వరండాలో కూర్చుని పేపరు చూస్తున్నారు” అన్నాను ఇందాకెప్పుడో అమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానంగా.

“మొహం కడుక్కురా, కాఫీ కలుపుతాను” అంది అమ్మ సీరియస్ గా.

నేను మొహం కడుక్కుని వచ్చేటప్పటికి అమ్మ కాఫీ కలిపి నాలుగు గ్లాసుల్లో పోసింది. నన్ను చూడగానే ఒక గ్లాసు ఎత్తి ఠప్ మని గట్టుమీద పెట్టి “అది తీసుకెళ్ళి రంగికిచ్చి నువ్వొకటి తీసుకో” అని చెప్పి మిగతా రెండు గ్లాసులు తీసుకుని వంటింట్లోంచి బయటికి వెళ్ళింది.

నేను దొడ్లో కెళ్ళి “ఇదుగో రంగీ కాఫీ” అన్నాను.

రంగి తలెత్తి నావైపు చూసి, నా చేతిలోంచి కాఫీ గ్లాసు తీసుకుని ఠక్కున తల వంచేసుకుంది.

నేను నా కాఫీగ్లాసు తీసుకుని వెళ్ళేటప్పటికి అమ్మ నాన్నకి కాఫీ ఇచ్చి వచ్చి హాల్లో కూర్చుంది.

“ఏంటమ్మా, ఎవరిమీద అంత కోపం?” అడిగాను అమ్మ పక్కనే కూర్చుంటూ.

“ఆ రంగి… చెప్పేవన్నీ అబద్ధాలే…” ఉక్రోషంగా అని ఆయాసపడుతూ ఆగింది అమ్మ.

“అంత ఆవేశ పడకమ్మా! అసలేం జరిగిందో చెప్పు” అమ్మ చేతిని నా చేతిలోకి తీసుకుంటూ అనునయంగా అడిగాను.

chinnakatha

“నిన్నా మొన్నా రాలేదు. అంతకు ముందురోజు మధ్యాహ్నం తొందరగా వచ్చి గబగబా పని చేస్తుంటే ‘ఏంటే అంత తొందర ‘ అని అడిగాను. ‘పిల్లాడికి జ్వరమొచ్చింది, ఒళ్ళు పేలిపోతోంది. డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి ‘ అని హడావిడి పడింది. అప్పటికీ నా కనుమానమొచ్చి అడగనే అడిగాను ‘రేప్పొద్దున్న వస్తావా, ఎగర గొడతావా?’ అని. ‘ఎందుకు రానమ్మా! డాక్టరుకు చూపించి బిళ్ళలేస్తే పొద్దుటికి జ్వరం తగ్గదా ఏంటి?’ అంటూ నమ్మబలికింది. ‘పొట్టుపొయ్యిలో పొట్టు కూరి వెళ్ళు ‘ అంటే ‘డాక్టరు వెళ్ళిపోతే కష్టమమ్మా, పొద్దున్నే చీకటితోటే వచ్చేస్తాగా’ అంటూ నన్నింకో మాట మాట్లాడనివ్వకుండా వెళ్ళిపోయింది. గవర్నమెంటు హాస్పిటలుకు వెళ్తారు కాబోలు” చివరి మాటలో వెటకారం రంగరించి అంది అమ్మ.

ఇందాక రంగి కళ్ళలో కనిపించిన సన్నటి నీటిపొర గుర్తుకొచ్చి “పాపం, పిల్లాడి కెట్లా ఉందో. ఆ మాటైనా అడక్కుండా నువ్వు దానిమీద చిరాకు పడ్డావు” సానుభూతిగా అన్నాను.

“జ్వరమూ కాదు పాడూ కాదు. అన్నీ అబద్ధాలే. ఎప్పుడూ ఇట్లాంటి అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. తెలిసీ నేనే పిచ్చిమొహంలా ప్రతిసారీ నమ్మి మోసపోతుంటాను” అక్కసుగా అంది అమ్మ.

‘ఊ! అబద్ధం దగ్గరి కొచ్చింది అమ్మ. ఇంక నేను మొదలుపెట్టాలి ‘ అనుకుంటుండగానే అమ్మే అడిగింది “ఇందాక ‘నా క్కావలసిన విషయం నీ కెట్లా తెలిసింది ‘ అన్నావు, ఏంటది?” అని.

“నేను యూనివర్సిటీలో ‘మానవ జీవితంలో అబద్ధం పా త్ర ‘ అన్న విషయం మీద పత్రం సమర్పించాలి. రంగి చెప్పేవన్నీ అబద్ధాలే అని నువ్వెప్పుడూ చెప్తుంటావు కదా! అందుకే నిన్ను, రంగిని ఇంటర్వ్యూ చెయ్యాలని వచ్చాను.”

“నన్నేం ఇంటర్వ్యూ చేస్తావులే! నాకేం చేతనవుతుంది దానిలా గోడకట్టినట్టు అబద్ధాలు చెప్పడం. దాన్ని చెయ్యి ఇంటర్వ్యూ… ఇప్పుడే పలకరించకు. పని మానేసి నీతో కబుర్లు పెట్టుక్కూచుంటుంది. ఇంటికెళ్ళేముందు మాట్లాడు” అంది అమ్మ.

రంగి పని పూర్తిచేసుకుని వెళ్ళే సమయానికి గేటుదగ్గర కాపలాకాసి పలకరించాను “ఏం రంగీ! పిల్లాడి కెట్లా ఉంది?” అంటూ.

“సుమారుగా ఉందమ్మా. ఇప్పుడెల్లి గంజి కాచి పొయ్యాలి” అని చెప్పి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.

“అదంతే, దొరకదు” అంది అమ్మ నా వెనక నిలబడి.

“సరే! వాళ్ళింటికే వెళ్ళి మాట్లాడి వస్తాను. నాక్కావలసిన సమాచారం నేను సేకరించుకోవాలి కదా” అన్నాను.

“నాన్న మిల్లు కెళ్ళాక ఇద్దరం వెళదాంలే. ఒక్కదానివే ఏం వెళ్తావు” అంది అమ్మ.

“నువ్వొస్తే చెప్పే విషయాలు కూడా చెప్పదు. ఈ ఊరేం నాకు కొత్తా? ఏం ఫర్వాలేదు. వెళ్తాన్లే” అని అమ్మకి సమాధానం చెప్పి తయారవడం మొదలుపెట్టాను.

పనులన్నీ పూర్తి చేసుకుని, టిఫిను చేసి, రంగివాళ్ళ ఇంటికి దారి అమ్మనడిగి సరిగ్గా తెలుసుకున్నాను.

“చీటికిమాటికి అబద్ధాలు చెప్పకుండా దాన్ని కాస్త సంస్కరించు” నిరసనగా అంది అమ్మ నేను బయలుదేరుతుంటే.

“ప్రయత్నిస్తాను” అన్నాను అమ్మ చెప్పేదాంట్లో ఎంత నిజముందో అని ఆలోచిస్తూ.

నన్నంత దూరంలో చూస్తూనే ఎదురొచ్చింది రంగి “ఏంటమ్మాయిగారూ, ఇటొచ్చారు?” అంటూ.

“నీతో మాట్లాడాలని, మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను” అన్నాను.

రంగి నన్ను వాళ్ళ గుడిసె దగ్గరికి తీసుకెళ్ళి పీట వేసి కూర్చోమని తనూ నా ఎదురుగా నేలమీద కూర్చుంది.”వీడేనా నీ కొడుకు?” అన్నాను గుడిసెముందు చిన్న కారుబొమ్మని నెట్టుకుంటూ ఆడుకుంటున్న పిల్లాణ్ణి చూస్తూ.

“అవునమ్మా” అంది రంగి తల దించుకుని.

అంతలో వాడు నా దగ్గరికొచ్చి కారుబొమ్మని నా మొహమ్మీదికి పట్టుకుని “మా అత్త కొనిచ్చింది” అన్నాడు.

“మట్టిలో ఆడుతున్నావేంటి? జ్వరం తగ్గిందా?” అనడిగాను వాణ్ణి.

“నాకు జొరమేంటి? మా అత్తోళ్ళ ఊరెళ్ళొచ్చాం” అన్నాడు వాడు నావైపు, రంగివైపు మార్చి మార్చి చూస్తూ.

“ఫోరా! నువ్వవతలికి ఫో” అంటూ వాణ్ణి కసిరికొట్టింది రంగి. వాడు దూరంగా వెళ్ళి మళ్ళీ తన ఆట మొదలుపెట్టాడు.

‘రంగి అబద్ధం చెప్పింది ‘ అని అమ్మ అన్న మాట మీద నాకు అప్పటిదాకా ఉన్న అనుమానం తొలగిపోయింది.

“అబద్ధం ఎందుకు చెప్పావు?” సూటిగా రంగిని అడిగాను. ఏం మాట్లాడకుండా కూర్చుంది రంగి.

“నిజం చెప్పు రంగీ! నేను నిన్నేమీ అనను. పిల్లాడికి ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్పడానికి నీకు మనసెట్లా ఒప్పింది?” బాధగా అడిగాను.

“ఏం చెప్పమంటారమ్మా? మా ఆడబిడ్డ కూతురు పెద్దపిల్లైతే పంక్చను కెళ్ళాం…”

“పిల్లాడికి జ్వరమని చెప్పావు. పొద్దున్నే చీకటితో వస్తానని చెప్పావు. అన్ని అబద్ధాలు చెప్పే బదులు ‘ఊరెళ్ళాలి, రెండు రోజులు రాను ‘ అని చెప్తే అమ్మ కాదంటుందా?” రంగి మాట పూర్తి కాకుండానే అడ్డుపడ్డాను.

రంగి నావైపు విచిత్రంగా చూసింది. “ఎందు క్కాదనరమ్మా? మా అక్క కూతురు పెద్దదైనప్పుడు మీ రన్నట్టే అంతా నిజమే సెప్పాను. ‘రెండురోజులెల్లి ఏంసేత్తావు? ఓపూటెల్లి ఎంటనే వచ్చెయ్’ అన్నారమ్మా అమ్మగారు. ‘పంక్చను, పంక్చను అంటూ అందరూ అట్టహాసాలు నేర్సుకున్నారు ‘ అంటూ తీసిపారేసి మాట్టాడారమ్మా. ఏమ్మా! మాకు మాత్రం సరదా లుండవా? ఆళ్ళు రెండురోజు లుండేట్టు రమ్మని పిలిత్తే ఓ పూటుండి దులిపేసుకుని ఎట్టా వచ్చేత్తామమ్మా?”

“రంగీ! నేనడిగేది అబద్ధం ఎందుకు చెప్పావు అని.రెండు రోజులు ఎందుకున్నావు అని కాదు.”

“అమ్మగా రేం తక్కువ కాదమ్మా. పసిగట్టేశారు. ‘పొట్టుపొయ్యిలో పొట్టు కూరేసి ఎల్లు’ అన్నారు. ఏడేల్లబట్టి సేత్తున్నాను మీ ఇంట్లో పని. పనికి మాట్టాడుకున్నప్పుడు పొట్టుపొయ్యికి పొట్టుకూరేపని సెప్పలేదు అమ్మగారు. అయినా పెతిరోజూ ఆ పనికూడా సేత్తూనే ఉన్నాను. నాకు తెలీకడుగుతాను, ఈ రోజుల్లో పొట్టుపొయ్యి వాడేదెవరమ్మా? మిల్లునించి పొట్టు ఊరికే వస్తుంది, కూరడానికి నేనున్నానని కాకపోతే. అప్పటికీ అమ్మగారు ఇబ్బంది పడతారు, ఒకడుగు ముందొచ్చి పొయ్యిపని సేసేద్దామనే అనుకున్నానమ్మా. నాకు ఇంట్లో పని తెమలకపాయె.”

 

“అబ్బా, రంగీ! నేనడిగేది అబద్ధం ఎందుకు చెప్పావు అని. పొట్టుపొయ్యిలో పొట్టెందుకు కూరలేదు అని కాదు” కాస్త విసుగ్గా అన్నాను.

“రేప్పొద్దున్న రాను అని సెప్పాననుకోమ్మా, పొట్టుకూరేసిపో అనడమే కాదు, రేప్పొద్దున్నవార ఇప్పుడే ఇల్లు తడిగుడ్డ పెట్టెల్లు అంటారమ్మా. ఎవరైనా ఒకేరోజు రెండుపూటలా ఇల్లు తడిగుడ్డ పెట్టుకుంటారామ్మా?”

“రంగీ, ఇల్లు తడిగుడ్డ ఎందుకు పెట్టలేదు అని కాదు నేనడిగింది, అబద్ధమెందుకు చెప్పావు?” కాస్త కోపంగా అన్నాను.

“పోనీ అమ్మగారి మాటెందుకు తీసిపారెయ్యాలి, అన్నిపనులూ సేసిపెట్టే ఎల్దామంటే ఆలెస్సమైపోద్ది. రైలెల్లిపోద్ది.”

“పిల్లాడికి జ్వరమని అబద్ధమెందుకు చెప్పావు?” అసహనంగా అరిచాను.

“డాక్టరెల్లిపోతారు, తొరగా ఎల్లాలి అని సెప్పబట్టే రైలందుకున్నామమ్మా. రైలెల్లిపోద్ది, తొరగా ఎల్లాలి అని సెప్తే అమ్మగారు ‘రైలెల్లిపోతే బస్సులో ఎల్లండి ‘ అంటారమ్మా. రైలు చార్జీ లెక్కడ? బస్సు చార్జీ లెక్కడ? రైలు టేసను మాకు దగ్గర. బస్టాండుకు పోవాలంటే ఆటో ఎక్కాల. మా ఆడబిడ్డోల్లూల్లో కూడా టేసనే దగ్గరమ్మా. బస్సులో ఎల్తే మల్లీ అక్కడకూడా ఆటో ఎక్కాల. ఉన్న డబ్బంతా బస్సులకి, ఆటోలకే పోస్తే… పిల్లచేతిలో ఏదేనా పెట్టాల గదమ్మా. మాకు మాత్రం ప్రేమలు, అబిమానాలు ఉండవా?”

‘తనని అబద్ధం చెప్పే పరిస్థితుల్లోకి అమ్మే నెడుతోంది’ అని చాలా తెలివిగా తెలియజేస్తోంది రంగి  అనిపించింది నాకు. ఏది ఏమైనా ‘అబద్ధం చెప్పడం తప్పు ‘ అన్న పాఠం రంగికి నేర్పాలన్న పట్టుదలతో “అబద్ధమెందుకు చెప్పావు అని అడిగినందుకు చాలా చాలా చెప్పావు రంగీ. కానీ అబద్ధం చెప్పడం తప్పని నీకు తెలీదా? ఇప్పటిదాకా అబద్ధా లాడకూడదు అని ఎవరూ నీకు చెప్పలేదా?” అని అడిగాను.

“మా ఇళ్ళకాడ గుళ్ళో పురానకాలచ్చేపం సెప్పే పంతులుగారు సెప్తూనే ఉంటారమ్మా ‘అబద్దమాడ్డం తప్పు, పాపం’ అని. ఆ పంతులుగారే ఇత్త… పేన… మాన… ఇంకేందో… అప్పుడంతా అబద్దమాడితే తప్పులేదని కూడా సెప్పారమ్మా.”

‘బాబోయ్! భాగవతాన్ని తీసుకొచ్చేసింది. ఇది సామాన్యురాలు కాదు ‘ అనుకున్నాను. ఏం మాట్లాడాలో అర్థంకాక దిక్కులు చూస్తుంటే తనే చెప్పడం మొదలుపెట్టింది రంగి.

“నేను అబద్దమాడితే అబద్దమెందుకాడావ్, అబద్దమెందుకాడావ్ అని ఇన్ని సార్లు అంటున్నారు గానమ్మా… నేను అంట్లు తోమడం పూర్తిచేసి, తోమినచోటంతా కడిగేసి ‘అమ్మయ్య, పనైపోయింది, ఇంక ఇంటి కెల్లొచ్చు ‘ అనుకుంటుంటే అమ్మగారు ‘ఒక్క గిన్నుంది, అదొక్కటీ తోమిచ్చేసెల్లవే’ అంటారమ్మా. గిన్నె ఒక్కటే గానమ్మా, దాంతోబాటు పళ్ళేలు, గెంటెలు, గలాసులు కూడా ఏత్తారమ్మా. మరప్పుడు అమ్మగారు నిజం సెప్పినట్టా? అబద్దం సెప్పినట్టా?”

కాస్త ఆగి దీర్ఘంగా ఊపిరి తీసుకుని మళ్ళీ ఎత్తుకుంది రంగి. “పనంతా పూర్తి సేసుకుని గేటుదాకా ఎల్లిపోయాక ఎనక్కి పిలుత్తారమ్మా అమ్మగారు. ‘ఉల్లిపాయలు అయిపోయాయి. కాస్త తెచ్చిపెట్టి ఎల్లవే’ అంటారమ్మా. లోపలికెల్లి సంచి, డబ్బులతోబాటు పది సరుకులు రాసిన పట్టీ తెచ్చి చేతిలో పెడతారమ్మా. అప్పు డమ్మగారు అబద్దం ఆడినట్టు కాదామ్మా?”

రంగి లాజిక్ చూసి బిత్తర పోయాన్నేను. ఆ షాక్ లోంచి నేను బయటపడేలోపే చివరి అస్త్రాన్ని ప్రయోగించింది.

“ఏం బంగమైందని అమ్మగారు ఆ అబద్దాలాడతన్నారమ్మా?” సూటిగా నన్నే చూస్తూ ప్రశ్నించింది రంగి.

రంగిని నేను చేసిన ఇంటర్వ్యూతో నా పేపరు ఎటో ఎగిరిపోయింది.

‘ఇప్పుడు నేను సంస్కరించవలసింది ఎవర్ని?’ అన్న ప్రశ్న నా ముందు కొండలా నిలబడింది.

పిల్లంగ్రోవి పిల్లడు

 

కామిని: ఒక వేశ్యకృష్ణుడు: పిల్లంగ్రోవి వాద్యకారుడు

 

కామి: ఏం కృష్ణా, ఎక్కణ్ణుంచొస్తున్నావు? నీపిల్లంగ్రోవులన్నీ పగిలిపోయినయ్యేమిటి?

కృష్ణ:   నేను కురంగి ఇంట్లో పిల్లంగ్రోవి వాయిస్తుంటే, సిపాయి చిన్నయ్య లేడూ, బలంగా దున్నపోతులా ఉంటాడూ… వాడు నన్ను పట్టుకొని బాదేశాడు. నేనక్కడ వాయించేందుకు కన్నబాబు నాకు డబ్బులిచ్చాడు. సిపాయి చిన్నయ్యకీ కన్నబాబుకీ పడదు. అందుకని నా పిల్లంగ్రోవులన్నీ విరిచేసి నన్ను పట్టుకు కొట్టి రకరకాలుగా అవమానించాడు. డాన్సు హాల్లో ఉన్న బల్లలన్నీ విరక్కొట్టి అక్కడున్న సారాయంతా పారబోశాడు. కన్నబాబుని జుట్టు పట్టుకొని హాల్లోంచి లాగిపారేశాడు. వాడితో పాటు వచ్చిన సైనికులంతా కలిసి కన్నబాబుని తుక్కు తుక్కుగా కొట్టారు. కన్నబాబు ఇప్పుడప్పుడే కోలుకోలేడు కామినీ! అతని ముక్కుల్లోంచి నెత్తురు ధార కట్టింది. ముఖమంతా ఉబ్బిపోయి నీలిరంగులోకి మారింది.

కామి: వాడికేమన్నా పిచ్చా లేకపోతే తాగున్నాడా? నువ్వు చెప్పేది వింటుంటే తాగుబోతు పనిలాగే ఉంది.

కృష్ణ:   అవి రెండూ కాదు. అసూయ! మితిమీరిన ప్రేమవల్ల ఏర్పడిన అసూయ. సిపాయి చిన్నయ్య కురంగిని తానొక్కడే ఉంచుకోవాలనుకున్నాడు. అలాక్కావాలంటే పన్నెండొందల వరహాలు కట్నంగా ఇమ్మని కురంగి అడిగింది. చిన్నయ్య అంత డబ్బివ్వడానికి ఒప్పుకోలేదు. కురంగి అతని మొహమ్మీదే తలుపేసేసింది. తన విటుడిగా కన్నబాబును ఎంచుకొంది. వాళ్ళిద్దరూ కలిసి తాగడానికి నృత్యశాల కొచ్చారు. వేణువూదడానికి నన్ను కుదుర్చుకున్నారు.

కార్యక్రమం బాగా సాగుతోంది. నేనప్పుడే ఒక జావళీ పూర్తిచేశాను. కన్నబాబు లేచి నృత్యం చేస్తోంటే కురంగి చేత్తో తాళం వేస్తోంది. అంతా ఉత్సాహభరితంగా ఉన్న సమయంలో ఒక్క సారిగా పెద్ద శబ్దం, అరుపులు వినబడ్డాయి. వీథి తలుపులు బద్దలు కొట్టుకుంటూ ఎనిమిది మంది కుర్రాళ్ళు హాల్లోకి వచ్చారు. వాళ్ళలో చిన్నయ్య కూడా ఉన్నాడు. రావటం రావటమే అక్కడున్న బల్లను తిరగ్గొట్టి కన్నబాబును కింద పడేసి కాళ్ళతో తంతూ తలమీద కొట్టారు. కురంగి అక్కడి నుంచి పారిపోయి పక్కనున్న రంగసాని ఇంట్లో దాక్కొని ప్రాణం కాపాడుకుంది.

చిన్నయ్య నన్ను బాగా కొట్టి బూతులు తిట్టి నా వేణువులు విరిచి నాముఖాన కొట్టాడు. వాడి స్నేహితులిద్దరూ నాబట్టలు చింపేసి నాతో ఆడుకున్నారు. నాతొడలమీదా పిర్రల మీదా ఎర్రగా కందిపోయేట్టు బాదిబాది వదిలారు. తర్వాత వాళ్ళ అంగీలు పైకెత్తి నాతలని వాళ్ళ కాళ్ళ సందున ఇరికించారు. వాళ్ళు తొడలతో నాతలని అదిమిపెట్టి ఇప్పుడు వాయించరా కొత్త రకం పిల్లంగ్రోవి అన్నారు. నేను సిగ్గుతో చచ్చిపోయాను. మాయజమాని ఇంటికి పోతున్నా! జరిగిందంతా ఆయనకీ చెప్పాలి. కన్నబాబు కూడా సహాయం కోసం తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అతనేమీ వదిలిపెట్టడులే, పోలీసుల దగ్గరికి పోతాడు.

కామి: ఈ మిలటరీ వాళ్ళ ప్రేమలతో వచ్చే చిక్కే యిది. తన్నులాటలూ, పోలీసుకేసులూ! మాటలేమో కోటలు దాటిస్తారు. పొందినదానికి సొమ్మివ్వాల్సి వచ్చేసరికి మాత్రం, ‘ఆగు, జీతాలింకా రాలేదు. రాగానే నీకివ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తాం’ అంటారు.

గప్పాలు కొట్టుకుంటూ తిరిగే ఈ సైనికులంతా యుద్ధంలో ఛస్తే నాకళ్ళు చల్లబడతాయి. నేనందుకే సైనికుడనే వాణ్ని నాగడప తొక్కనివ్వను. మిగతా ఎవరైనా పర్వాలేదు. జాలర్లు, నావికులు, రైతులు… వాళ్ళెవరికైనా నాతలుపు తెరిచే ఉంటుంది. వాళ్లకు డబ్బులివ్వడం తప్ప ఉబ్బేయడం తెలియదు. సందు దొరికితే చాలు, వాళ్ళ వీరత్వాన్ని గురించీ, యుద్ధంలో వాళ్ళ నైపుణ్యాన్ని గురించీ గొప్పలు చెప్పడం తప్ప, సైనికులికి అనురాగమనే మాటే ఉండదు. ప్రేమంటే వాళ్ళకేం తెలుసు?

*

పల్లవించవా నా గొంతులో….

కవితా చక్ర

 

కళ. ఒక తపస్సు…

కళ. ఒక ధ్యానం..!

కళ. జీవన్ముక్తి సోపానం…!!

కళ కి సేవచేయడమూ కళేనేమో…!!

సినీ సంగీత విశ్వంలో వీరెప్పుడూ ధ్రువ తారే!

అవును.

ఆయన సంగీతం.. మిన్నంటే అల!

ఆయన బాణీ గుండెల్లో విరబూసే తీయని వెన్నెల!

వీరి పాట వింటూంటే మనసు తీగకు అనుభూతి పూవు పూయాల్సిందే!

వీరి స్వరాస్వాదనలో గుభాళింపు హృదయం అలౌకిక రాగ లోకాలలో విహరించాల్సిందే!.

అది ఏ తీగ పూవైనా, ఉత్తేజ పరిచే కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు అయినా, సరిగమల గలగలలైనా…

వీరి ప్రేమ, ఆప్యాయత మాటల్లో వర్ణనాతీతం! పాటల్లో కొంతవరకు వ్యక్తపరచొచ్చేమో..!

స్వరబ్రహ్మ లైన ఎమ్మెస్, ఇళయరాజా గారి పాటలు వింటూ ఈ పాటల పై మక్కువ ఏర్పడి,  గొంతుక రెక్కలు విప్పుకుని స్వర విహారం చేస్తున్నప్పుడు  వారిని కలిసి ఆశీస్సులు పొందాలన్న తపన ఎక్కువైంది.

అనుకున్నదే తడవు, స్వరాంజలి టీమ్ తో వెళ్లి సంగీత దిగ్గజాల్ని కలవడం నా సుకృతం. ఒక్కసారి మరపు రాని ఆ స్వర క్షణాలని మళ్ళీ పంచుకోవాలనుకుంటున్నాను.

జూన్ 2, 2014, చెన్నై లో వారి ఇంటి ముందు మా కార్ సరిగ్గా సాయత్రం ఆరు గంటలకి ఆగింది. అప్పటికే అప్పాయింట్మెంట్ తీస్కున్నందున, వారి పీ.ఏ ఎదురొచ్చారు. వారి ఇంటి గేటు కి పక్కగా..’ఎమ్మెస్.విశ్వనాథన్’ అని మాత్రమే రాసి ఉంది. గేట్ లోకి ప్రవేశించగానే ధూప దీప సువాసనలు. లోపలి నుండి హారతి, గంటల శబ్దాలు. సాయంకాల పూజా సమయం అనుకున్నాను. మొదటి అంతస్తులో వారి నివాసం. ముందు ఒక సిటౌట్! మరో ఇద్దరెవరో కూర్చుని ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి, “ఒక పది నిముషాలు కూర్చోండి సార్ పూజలో ఉన్నారు” అని తమిళ్ లో చెప్పి వెళ్ళాడు.

ఒక్కో క్షణం ఉద్విగ్నంగా గడుస్తుంది. అప్పటికే నా బృందానికి వారి ముందు పాడే పాటల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి, మరింతగా ప్రిపేర్ చేస్తున్నా.

ఒకటి, రెండు,మూడు!! లెక్క పెట్టుకుంటున్న అంకెలకు అడ్డుకట్ట వేస్తూ వచ్చింది ఆ క్షణం! లోపలి నుండి పిలుపు రానే వచ్చింది!

ఆనందం, ఉద్విగ్నం, ఆరాధన అన్నీ భావాలు మేళవించిన భావన నా కంటిలో చెమ్మై నిండుకుంది వారిని చూడగానే…!!

DSC_0146

తెల్లని వస్త్రాల్లో దివ్యమంగళ స్వరూపం.. ప్రశాంతత వారి చిరునవ్వులో, పరమేశ్వర విబూది వారి గొంతుక ని అద్దిందేమో! అందుకే అపర సరస్వతి వారిని ముద్దు బిడ్డలా అక్కున జేర్చుకుంది. ఎనిమిది పదుల నిండైన రూపం! కల్లా కపటం లేని స్వచ్చమైన చల్లని చూపు. అన్నిటినీ మించి వారి కాళ్ళ లో కాంతి! ఒక అద్భుతాన్ని చూస్తున్నానా అన్న ఏమరపాటు లో నేను. మమ్మల్ని చూసి, వారు లేచి ఆహ్వానించారు. సాష్టాంగ ప్రమాణాలయ్యాక, స్వరాంజలి మోటో గట్రా వారికి వినిపించాను. ఆశీర్వదించారు.

ఆ తరవాత నా బృందం చే వారి పాట లు పాడిస్తుంటే వారి ఆనందం చెప్పలేను. అన్నీ విన్నాక నాతో ఒక్క మాట చెప్పారు…”ఇంత చక్కటి కార్యక్రమాలకి హైదరాబాద్ రాలేనేమో..చెన్నై లో ఏర్పాటు చేస్తే చూడాలని ఉంది”

వారి ఆకాంక్ష!

నా అసమర్థత! జోడించిన చేతులతో “మీ ఆశీర్వాదం తప్పకుండా” అన్నాను.

వారు కంపోసింగ్ చేసిన రోజులను తలచుకున్నారు. వారి సంతోషం లో తెలియని లోటు గమనించాను.

అలా ఒక గంట సరదాగా పాడుతూ మాట్లాడుతూనే ఉన్నాం. సమయానికి జాలి, దయ ఉండవు కదా! ఆ స్వర ఘడియలు రెప్పపాటు లో కరిగిపోయాయి.

ఒక అద్భుతమైన అనుభూతిని గుండెల నిండా నింపుకుని వెను దిరిగాము.

వారి స్వర సీమలోకి కాస్త తొంగి చూస్తే…

**                                 **                       **

 

వీరి పూర్తి పేరు, మనయంగాథ్ సుబ్రహ్మణ్యన్ విశ్వనాథన్. విశ్వనాథన్ జూన్ 24, 1928 తేదీన జన్మించారు.

పదేళ్ళ చిన్నారి ప్రాయం లోనే నీలకంఠ భాగవతార్ గారి దగ్గర మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకున్నారు. పదమూడేళ్ల వయసులోనే మూడు గంటల పాటు నిర్విరామంగా సంగీత కచేరి చేసి అందరి ప్రశంసలు పొందారు. జైలు డే రోజు ఖైదీలతో “హరిశ్చంద్ర” నాటకం వేయించారు, అందులో లోహితాస్యునిగా విశ్వనాధన్ అదరగొట్టేశారు. దానితో ఖైదీలందరూ సినిమాలలో ప్రయత్నించమంటూ ప్రోత్సహించారు.

మొదట సినిమాల్లో వేషాలు వేయాలన్న కుతూహలంతో 1941వ సంవత్సరంలో విజయదశమిన మద్రాసులో తొలిసారి పాదం మోపాడు విశ్వనాధన్. మేనమామ సహాయంతో, జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎమ్.సుందరం చెట్టియార్, మొహిద్దీన్ లను కలిశారు. న్యూటోన్ స్టూడియాలో మేకప్ టెస్ట్ చేశారు. అయితే…ఆ వేషానికి తను నప్పడని కాదనడంతో, తిరిగి వెనక్కి రాలేక, అక్కడే ఆఫీస్ బాయ్ లా పని చేస్తూనే, మరో పక్క జూపిటర్ సంస్థ తీసిన “కుబేర కుచేల” సినిమాలో సేవకునిగా చిన్న వేషం వేశారు. నటుడు కావడానికి తన ఆకారము, పర్సనాలిటి సరిపోదని తనకే అర్ధమైపోయింది. అందుకే సంగీత విభాగంలోనే కృషి చేసి పైకి రావాలని నిర్ణయించుకున్నారు విశ్వనాథన్.

సేలంలో మోడ్రన్ థియేటర్స్ అనే సంస్థలో సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ ఉన్నారని తెలుసుకొని వెళ్లి కలిశారు. విశ్వనాధన్ తో ఓ పాట పాడించుకున్న మహదేవన్ గారు, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్టుగా ఆ ఒక్క పాట తోనే విశ్వనాధన్ లోని ప్రతిభని గుర్తించి, సరాసరి సెంట్రల్ స్టూడియోకి వెళితే అక్కడ పని దొరుకుతుంది అని చెప్పారు. సెంట్రల్ స్టూడియోలో సంగీత దర్శకునిగా ఉన్నఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు గారి ట్రూపులో హార్మోనిస్ట్ గా చేరారు విశ్వనాథన్. అక్కడే “రామమూర్తి” (తిరుచారాపల్లి కృష్ణస్వామి రామమూర్తి) తో స్నేహం ఏర్పడింది.

అలా చాలా రోజులు సుబ్బరామన్ దగ్గర సహాయకునిగా పనిచేశారు ఇద్దరూ.. సుబ్బరామన్ దగ్గర ఉన్నప్పుడే ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తి, టి.జి.లింగప్ప, గోవర్ధనం పరిచయమయ్యారు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఎమ్జీఅర్ హీరోగా “జనోవా” అనే సినిమాకి సంగీత దర్శకత్వం చేసే అవకాశం విశ్వనాధన్ కు వచ్చింది. ఒకే రోజు నాలుగు పాటలు చేసి, అవి సాయంత్రం సుబ్బరామన్ కు వినిపిద్దామని అనుకున్నాడు. కాని ఈలోపే వినకూడని వార్త వినాల్సి వచ్చింది, సుబ్బరామన్ చనిపోయారు అని! అప్పటికే సుబ్బరామన్ చేతిలో ఏడు సినిమాల దాకా ఉన్నాయి. వాటిని విశ్వనాధన్ – రామమూర్తి లు కలిసి పూర్తిచేసారు. అప్పటికే సుబ్బరామన్ దేవదాసు సినిమాకి 7 పాటలకు బాణీలు చేశారు. మిగిలిన రెండు పాటలు “జగమే మాయ బ్రతుకే మాయ”, బాలసరస్వతి పాడిన “ఇంత తెలిసియుండి” అను పాటలను కూడా స్వరపరిచారు. ఇలా సుబ్బరామన్ ఒప్పుకున్న తెలుగు, తమిళం చిత్రాలను ఎంతో చిత్తశుద్ధితో సకాలంలో పూర్తి చేశారు. ఇక ఆ తరువాత వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాలకు కలిసి సంగీత దర్శకత్వం చేశారు. విశ్వనాధన్ సోలోగా 700 సినిమాలకు (తమిళం 510, మలయాళం -76, కన్నడం – 3, తెలుగులో 70) పైగా స్వర సారధ్యం వహించారు.

**              **                        **

ఒక సంగీత దిగ్గజం ఇహలోకం లో నేల రాలోచ్చు గాక, సంగీతాకాశంలో మీరెప్పుడూ కాంతి పుంజమే!

కళ్ళలో ఉన్నవేవో కన్నులకే తెలిసినా..

దేవుడే ఇచ్చిన వీధి ఒక్కటే అయినా..

విధి చేయు వింతలెన్నయినా గాక,

మీరెప్పుడూ మా సంగీత విశ్వంలో స్వర నవ్వుల రేడే!

మీ బాణీ లో విరబూసిన స్వర పుష్పాలెన్నో…

మీ స్వరాలాపనలో ఆఘ్రాణించిన పరిమళాలెన్నో..

మీ పాట మూగవోయిన గొంతుకల్లో పల్లవిస్తోంటే మాటల్లేవు, మీ పాట ను పాడే గొంతుకను రెండు అశ్రు నయనాలు తడిమేసే వేళా….

తండ్రీ…!! మీకిదే అశ్రు నివాళి.

*