మనిద్దరి దేహాల మీదుగా…

ప్రసూన రవీంద్రన్

 

PrasunaRavindranరాధ ఉలిక్కిపడింది. తననెవరో గుసగుసగా పిలిచిన భావన. చాలా దగ్గరగా వచ్చిపిలిచినట్టు. చెవి పక్కన చెంపల మీదుగా జారి ఒంపు తిరిగిన కురులు కూడా చిన్నగా వణికాయ్.
అప్పటివరకూ నల్లనయ్యను తలుచుకుంటూ , కూనిరాగాలు తీస్తూ చిలికిన వెన్న జాగ్రత్తగా మట్టి కుండలోకి తీసిపెడుతున్నదల్లా రెపరెపలాడుతున్న హృదయంతో తలెత్తి చుట్టూ చూసింది. ఎవరూ లేరు… ఎప్పటిలాగే ఉన్నాయ్ పరిసరాలు.
తిరిగి తన పనివైపు దృష్టి సారించింది కానీ ఏదో అలజడి మనసంతా. ఆమెకు తెలీకుండానే అంతకంతకూ వేగవంతమవుతూ ఎదని ఊయలూపుతోంది ఊపిరి. బుగ్గలు బరువెక్కి , ఎరుపెక్కి ఏదో పరవశం పెదవుల్లోకి కూడా పాకి వణికిస్తోంది.

త్వరగా పని ముగించుకుని ముందు గదిలోకి వెళ్ళి గుమ్మానికానుకుని నిలబడి ఆకాశం వైపు చూసింది. నిండు చంద్రుడు కొంటెగా నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఏవిటో అర్ధంకాలేదు. ఇప్పుడే.. ఈ క్షణంలోనే నల్లనయ్యని చూడాలని ఆమె మనసు ఉవ్విళ్ళూరింది. కానీ ఎలా? ఈ సమయంలో వెళితే అమ్మ ఏమంటుందో. తల తిప్పకుండానే ఓరగా తల్లి వైపు చూసింది. చుట్టుపక్కల వారితో కలిసి ముచ్చట్లలో ఉందావిడ.

తిరిగి ఆకాశం వైపు చూసింది. అంతవరకూ లేనిది ఎక్కడి నుండి వచ్చాయో నల్లమబ్బులు. వేగంగా కదిలిపోతున్నాయ్. అప్పటిదాకా వెన్నెల్లో వెలిగిపోయిన పరిసరాలన్నీ కృష్ణవర్ణాన్ని పులుముకుని ఆమెకేదో చెప్పాలని చూస్తున్నట్టుగా అనిపించాయ్. చల్లటి గాలి తనువుని తాకి ఆమె పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది. ఎక్కడెక్కడి పూల పరిమళాలనో పట్టుకొచ్చి గాలి ఆమెని సాంత్వన పరచాలని చూసింది కానీ, ఆమె పరిస్థితి మెరుగవలేదు.

ఎక్కడినుంచో సమ్మోహన వేణు గానం తనని పిలుస్తున్నట్టుగా వినపడింది. అంతే, ఇక ఆమె తన ఎరుకని మరిచిపోయింది. మెరుపు వేగంతో కదిలింది.
“ఈ సమయంలో, ఈ వాతావరణంలో ఎక్కడికమ్మా …” అంటున్న తల్లి మాటలు రాధ చెవులకి వినపడలేదు.
రాధ తల్లి సరిగ్గా గమనించి ఉంటే రాధ అలా వెళ్ళడం వల్ల కదిలిన ఆమె జడ కుచ్చుల సవ్వడిలోనో, పద మంజీరాల కులుకుల్లోనో , పొడవాటి చెవి జూకాల ఊపులోనో ఆమెకి సమాధానం దొరికేసి ఉండేది.

ఏదో మాయ కమ్మినట్టుగా యమునా తీరంలోని ఆ పచ్చిక బయలుకేసి నదిలా కదిలింది రాధ.
ఆమె పరిమళాన్ని అల్లంత దూరంనుంచే ఆఘ్రాణించి లిప్త కాలంపాటు మురళీ గానాన్ని ఆపాడు కృష్ణుడు. అతని కళ్ళలో యమున వలపుగా మెరిసింది. చెంపల్లో తామరలు విచ్చుకుని రాలి ఒక విధమైన కెంపు మెరుపులతో ఆ ప్రదేశాన్ని వెలిగించాయ్.

పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్న రాధ అలా కృష్ణుడిని చూస్తూనే శిలలా నిలబడిపోయింది. రెప్ప మరచిన ఆమె కన్నుల నీలిమల్లో చంద్రోదయాలయ్యాయి. అమె కళ్ళలోంచి దూకుతున్న వెన్నెల వెలుగు, విశ్వ మోహనుడి తనూ వర్ణంతో కలిసి ఆ ప్రదేశమంతా అలౌకికమైన, అవ్యక్తమైన వర్ణంతో శోభిల్లింది. అక్కడి నీరూ, చెట్టూ, చేమా, పూలూ , తుమ్మెదలూ అన్నీ పరవశంతో ఉలిక్కిపడ్డాయ్.

తన్మయంగా కృష్ణుడిని చూస్తూ నెమ్మదిగా నడిచి వెళ్ళి ఆతని ఒడిలో వాలిపోయింది రాధ. ఆ మానస మనోహరుడి కన్నుల్లోకి ప్రేమగా చూస్తూ అంది-

“నిన్ను చూడగానే నాలో కలిగే ఈ ప్రేమ
ప్రపంచాన్ని ముంచేసేలా విస్తరిస్తుంటే
కృష్ణా…
కాలం కవిత్వమైపోయి
మనిద్దరి దేహాల మీదుగా ప్రవహిస్తున్నట్టు లేదూ… “

*

    ప్రేమోత్సవం

                               1797324_1554574958090172_7329323992269709774_n

సాంధ్య రాగం పిలిచే వరకూ

సూర్యుడి ప్రేమని నిండా కప్పుకుని నిదురిస్తుంది చీకటి

 

ఆకాశాన్ని ప్రేమిస్తూ

తన ఆరాధనంతా పూవుల్లోనో, పళ్ళలోనో

ఏదీ లేకుంటే తన దేహంలోనో నింపుకుని

ప్రేమకి నిర్వచనమవుతుంది చెట్టు

 

రాళ్ళని అలంకరించే సెలయేట్లోనూ

విశ్వమోహన రహస్యాల్ని గుండెల్లో దాచుకున్న లోయల్లోనూ

మట్టి పొత్తిళ్ళలో గుర్తింపుకి నోచుకోని చిట్టి రాళ్ళలోనూ

అన్నిట్లోనూ ప్రేముంది.

కారణాల్లేకుండానే ప్రేమ పంచగల దమ్ముంది.

 

మనిషికి మాత్రం

కాలమంతా ప్రేమమయం కావాలనేమీ లేదుగానీ

నియంత్రిత నైసర్గిక ప్రపంచాన్ని దాటి

శిఖరాగ్రం మీద కాసేపు

తన గుండె చప్పుడు తాను వినడానికీ

నక్షత్రాల వెలుగు లిపిలో మనసు వ్రాసుకోవడానికీ

అరణ్య పుష్ప సుగంధాల్లో స్నానించి

స్వప్న గ్రంధాల్ని ఆవిష్కరించుకోడానికీ

ఓ కారణం తప్పకుండా కావాలి.  

 -ప్రసూన రవీంద్రన్ 

(painting: Mamata Vegunta)

కళ్ళ మీది కటకటాల్ని చెరిపేసే కవిత!

ismayil painting rainbow

” పెయింటింగ్ ఈజ్ ఎ సైలెంట్ పొయెట్రీ, అండ్ పొయెట్రీ ఈజ్ ఎ పెయింటింగ్ దట్ స్పీక్స్ ” అన్నారు. వర్ణ చిత్రం రేఖలు, రంగుల కలబోతతో నిశ్శబ్దంగా పాడే కవిత్వమైతే , కవిత్వమేమో పదాలు , వాటి మధ్య అందంగా పేర్చిన నిశ్శబ్దంతో గుస గుస లాడే వర్ణచిత్రం.

అసలు కవి అనేవాడు ఏం చేస్తాడు? అందులోనూ ఇస్మాయిల్ గారి లాంటి ప్రకృతి సౌందర్యోపాసకుడైన కవి…

ప్రకృతిలోకి తను వేసే ప్రతి అడుగునీ జాగ్రత్తగా అచ్చు వేసి ఎదుటి తరాల వారికి అందిస్తాడు. తను పీల్చే ప్రతి పరిమళాన్నీ పదాల్లోకి తర్జమా చేసి ఎప్పటికీ వాడిపోనీయక దాచి పెడతాడు. అటువంటి కవి , ఏ స్వప్నాల్లోంచి రాలిపడే వర్ణాలతోనో తన ఊహా జగత్తుని అలంకరించుకుని యధాతదంగా ఆ చిత్రాన్ని మన కళ్ళముందు ఆవిష్కరించే చిత్రకారుడి మీద కవిత రాస్తే అదెలా ఉంటుంది? ఇదిగో ఈ క్రింది విధంగా ఉంటుంది.

488096_10151271931041466_1029829309_n

పికాసో ( చెట్టు నా ఆదర్శం సంకలనం నుంచి )

———

పికాసో చిత్రమైన

అచిత్ర కారుడు

 

అతడు గీసింది కన్నా

చెరిపింది ఎక్కువ

 

మన కళ్ళ మీది కటకటాల్ని

కుంచెతో చెరిపేశాడు

 

అప్పట్నించీ మన కళ్ళు

ఎగరడం నేర్చుకున్నాయి.

 

 

ఒక గొప్ప సత్యాన్ని ఎంత సహజమైన వాడుక భాషలో ఎంత సున్నితమైన , తేలికైన పదాలతో ఎంత గాఢమైన చిత్రాన్ని మన మనసుల్లో చిత్రించిందీ కవిత! ఒక్కసారి ఆ చిత్రం చెప్పే గుస గుసలు వింటే ఎన్ని అర్థాలు అందులోంచి సీతాకోకచిలుకలై ప్రాణం పొంది పైకెగురుతాయ్ !

మనల్ని మనమే కాదు, మన కళ్ళని కూడా ఎప్పుడూ కటకటాల్లోనే ఉంచుతున్నాం అన్నది కాదనలేని సత్యం. ఒక పరిధిని దాటి చూడలేకపోతున్నాం. చూపుల్ని ఎక్కడా లోతుగా నాటలేకపోతున్నాం. అంటే మనవన్నీ పై పై చూపులే. అంతర్నేత్రాన్ని కూడా తెరిస్తేనే మనం చూసే వస్తువు నిజంగా మనకు కనపడేది. ఆ సత్యాన్నే ఈ కవిత చెబుతోంది.

కళ్ళ మీది కటకటాల్ని ఆయన కుంచె చెరిపెయ్యగానే కళ్ళు ఎగరడం నేర్చుకోవడం అన్న భావన ఎంత అద్భుతమైన నిజాన్ని మనకి ఆవిష్కరించి పెడుతోందో చూడండి.

సుమారు ఎనిమిదేళ్ళ క్రితం మొదటిసారి నేనీ కవిత చదివినప్పుడు ఒకానొక గాఢమైన నిశ్శబ్దంలోకి నెట్టబడ్డాను. అతి తేలికగా చెప్పబడ్డ ఒక లోతైన భావనని వెతికి పట్టుకునే ప్రయత్నంలో మళ్ళీ మళ్ళీ ఈ కవితని చదివాను. జీవితపు నడకకి అన్వయించుకోవాలని ప్రయత్నించాను. కళ్ళతో చూసే ప్రతి దాన్నీ వెంటనే అలాగే మనసులో ముద్రించుకోకుండా అంతర్నేత్రాన్ని కూడా తెరుచుకుని చూడటం మెల్ల మెల్లగా అలవాటు చేసుకున్నాను.

చిత్రకళాభిమానిగా ఆ తరువాత నేను వర్ణ చిత్రాల్ని ఆశ్వాదించే తీరు కూడా పూర్తిగా మారిపోయింది. వడ్డాది పాపయ్య చిత్రాల్ని చూసినా, రాజా రవి వర్మ తైల వర్ణ చిత్రాల్ని చూసినా, ఇప్పుడు కొత్తగా ఆర్ట్ గేలరీల్లో ప్రముఖ చిత్రకారులు జీవన్ గోశిక, ప్రభాకర్ అహోబిలం మొదలైన వారి వర్ణ చిత్రాల్ని చూసినా మనసు ఇస్మాయిల్ గారి కవితని గుర్తు చేసుకుంటుంది. ఎవరో రహస్యంగా ఆ చిత్రాల్లోని అంతరార్ధాన్ని బోధిస్తున్నట్టుగా కళ్ళు పూర్తిగా ఆ చిత్రాల్ని రెప్పల్లో దాచుకుంటున్నాయ్.

ఒక కవిత కేవలం కొన్ని పదాల అల్లికలా మిగిలిపోకుండా, పాఠకుడి ఆలోచనా పరిధిని పెంచి, ఒక వస్తువుని గమనించే తీరుని మార్చి జీవితాంతం గుర్తుండిపోవడం, నిశ్శబ్ద నదిలా మనసులో పారుతూ అతన్ని/ఆమెని ప్రభావితం చేయడం ఎంత గొప్ప విషయం!

 -ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

 

 

 

మేమెగరడం నేర్చుకునే సమయాల్లో …

Amma Paapa

నీతో ఆడుకునే ఆ నీరెండ మలుపుల్లోనే, పంజరాలు వీడి బయటికొస్తాం. ఆ సాయంకాలపు గాలుల్లో మాత్రమే మాకూ రెక్కలొస్తాయ్. వెనుక కరి మబ్బు తెర, ముందర ఎగిరెళ్ళే తెల్లటి కొంగల్ని రోజూ చూస్తున్నా, ఏదో భావాన్ని భాషతో చిత్రించలేకపోయినట్టు, నీ వెనుక గిరికీలు కొడుతూ మేము చల్లే వెలుగుల్ని తూచలేరెవ్వరూ.

ఎక్కడిదో మంచు మల్లెపూలుగా మారి చారెడేసి కళ్ళలో చలువ పందిళ్ళు వెయ్యడం, ఒక్క వాన చుక్క వెయ్యి వాక్యాలుగా విడిపోయి, మనసు పల్లాలోంచి జారి గుండెలో ఊట బావిగా స్థిరపడటం, ఎక్కడ విరిసిన పూలో గుండె గోడల మీద ఆడుకోవడం, ఇప్పుడిక్కడున్నవాళ్ళందరూ అనుభూతిస్తారు.

అదిగో, విశ్వసంబరాల్ని సంధ్య ప్రమిదలోకి జార్చి, ఆకు కొసల్ని వెలిగిస్తోంది చూడు వెన్నెల. రెక్కలింక ముడుచుకుని, గూటికి తిరిగి చేరేముందు వెన్నెల్ని చుట్టేసి పట్టుకెల్దాం మర్చిపోకేం.

– ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

గ్రీష్మంలో కురిసే వాన

Kadha-Saranga-2-300x268

వాచ్ చూసుకుంది లిఖిత.

రైలు సరయిన సమయానికే బయలుదేరింది.

ఎదురు బెర్త్ లోనూ, పక్క బెర్త్ లోనూ ఇంకా ఎవరూ రాలేదు. ఈ మాత్రం ఏకాంతం దొరికి కూడా చాలా రోజులయింది మరి.

వేగం పెరిగేకొద్దీ చల్లటి గాలి మొహానికి కొడుతుంటే వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకుంది. మనసు , శరీరం రెండూ కొద్ది కొద్దిగా సేద తీరుతున్నట్టు అనిపించింది. నాలుగు నెలలు ఇంజినీరింగ్ ట్రైనీ గా శిక్షణ పేరు చెప్పి, ఎంసెట్ విద్యార్ధుల కంటే దారుణంగా పరీక్షలు పెట్టాడు. ఎంసెట్ కి కూడా ఇంత కష్టపడలేదేమో.

రైలు ఏదో పెద్ద చెరువు పైన బ్రిడ్జ్ మీదుగా పోతుంటే గాలి మరింత చల్లబడింది. అలాంటి వాతావరణంలో తీసుకునే ప్రతి శ్వాసతోనూ మనసుపై పేరుకున్న దుమ్ము తొలగి అతని రూపం మెల్ల మెల్లగా సుస్పష్టమవుతోంది. లిఖిత పెదవులపై అప్రయత్నంగానే అందమైన చిరునవ్వు.

ఎప్పటిలాగే మళ్ళా అదే ఆశ. కనీసం రైల్లో అయినా ఒక్కసారి తనతో ప్రయాణించే అవకాశం రాకూడదూ? మనసులో జాగ్రత్తగా దాచుకున్న పెట్టె తీసింది. ఆరేళ్ళ క్రిందటివైనా, పరిమళించే ఆ క్షణాలని ఆప్యాయంగా తడుముకుంది.

తామిద్దరి మధ్యా ఒక్క మాట లేదు. ఇంటర్ మొదలైన తొలి రోజుల్లో మాత్రం నోట్సు విషయంలో రెండు మూడు సార్లు మాట్లాడుకున్నారు. ఆ మాత్రానికే క్లాసులో అందరూ తామిద్దరి మధ్యా ఏదో ఉన్నట్టు కామెంట్లు చెయ్యడం గమనించింది. వాళ్ళ బుధ్ధికి చికాకుపడి ఇక ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం మానేసింది. ఆ సమయంలో తనది ఒకే లక్ష్యం ఉండేది. ఎంసెట్ లో మంచి రాంకు తెచ్చుకుని ఇంజినీరింగ్ చదవాలి. సాఫ్టు వేర్ లో ఉద్యోగం తెచ్చుకోవాలి. పగలూ, రాత్రీ ఆ లక్ష్యంతోనే చదివేది.

సరిగ్గా ఆ సమయం లోనే ఏది జరక్కూడదో అదే జరిగింది. కాలేజీ కి చేరుకుంటూనే అతను కనపడేవాడు. ఫ్రెండ్స్ తో కబుర్లాడుతూనో, ఒక్కడూ సైకిల్ మీద కూచుని ఎవరికోసమో ఎదురుచూస్తూనో. అతనూ తన వంకే చూసేవాడు. ఇద్దరి చూపులూ కలుసుకోగానే వెయ్యి తుమ్మెదలు ఒకేసారి పాట పాడినట్టు తన చెవులకి ఇంకేమీ వినిపించేవి కాదు. ఒంట్లో ఉన్న రక్తమంతా ముఖంలోకి చేరిపోయినట్టు కందిపోయేది. కనురెప్పలు బరువెక్కిపోయేవి. శరీరమంతా వీణగా మారి అన్ని తీగలూ ఒకేసారి మోగుతున్నట్టు మధురమైన ప్రకంపనలు కలిగేవి. అతని ఎదురుగా అడుగులు తడబడేవి. మాట పెగిలేది కాదు. అతన్ని దాటి క్లాసురూములోకి వెళ్ళి తన స్థలంలో తాను కూచునేవరకూ గుండె అతి వేగంగా కొట్టుకునేది.

అతను తనని ప్రత్యేకంగా చూస్తున్నాడని తెలీడానికి ఎంతో కాలం పట్టలేదు. అతని కళ్ళలోనే విద్యుత్తున్నట్టు అనిపించేది. కాలేజీ అయిపోయాక సాయంత్రం వేళ అతను ఎక్కడైనా ఎదురుపడితే, గుండె మరలా గెంతులేసేది. ఆ అవస్థ అందరూ చెప్పినట్టే అపురూపంగా ఉండేది. లోకమంతా అకస్మాత్తుగా నందనవనంలా మారిపోయినట్టు తోచేది.

అది ప్రేమో, ఆకర్షణో నిర్ధారించుకునే లోపే అందులో అపశృతి. క్లాసులో తామిద్దరి గురించీ కామెంట్లు ఎక్కువయ్యాయి. తనకది చాలా అవమానంగా అనిపించేది. తామేదో దీర్ఘకాల ప్రేమికులైనట్లు మాట్లాడుకునే వారు అందరూ. దాన్ని అతను ఏ రకంగానూ ఖండించకపోవడం, వాళ్ళు కామెంటు చేస్తుంటే అతను ఆనందించడం తన మనసుని ఎంత ముక్కలు చేసిందో. అతనిది ప్రేమా కాదు, ఆకర్షణా కాదు. ఎందుకో తనను ఏడిపించాలని చూస్తున్నాడు. ఏ శతృత్వమూ లేకుండానే తనను మాత్రమే బాధపెట్టి ఆనందిస్తున్నాడు అనిపించేది. ఇలాంటి ఆకర్షణలకి లోనయి తన భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. అంతే ఆ తరువాత కూడా అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ అతని పేరు తల్చుకుంటేనే తనలో కలిగే ఆ మధురమైన ప్రకంపనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

నాలుగు నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది లిఖితకి. ఒక ఆదివారం సాయంత్రం తను సూపర్ మార్కెట్ నుంచి బయటికి వచ్చేసరికి వర్షం మొదలయింది. వర్షాన్ని చూస్తోంది గానీ తనలో ఏదో తెలీని ఉద్వేగం. ఎప్పుడూ లేని మధురమైన భావన. ఎందుకో అతనే గుర్తొచ్చాడు. అతన్ని చుసి అయిదు సంవత్సరాలయింది. తరచూ గుర్తొచ్చి కలవరపెడతాడు కానీ ఇప్పుడిలాంటి సందర్భంలో గుర్తురావడం, గుండె కొట్టుకోవడం ఎందుకో చుట్టూ చూస్తే ఆశ్చర్యంగా అతను. కారుకి ఆనుకుని నిలబడి తననే చూస్తున్నాడు. కాసేపు తనని తాను నమ్మలేకపోయింది. సినిమాలో చెప్పినట్టు చూపులు గుచ్చుకోవడం అంటే ఏమిటో స్వయంగా తనకారోజు అనుభవమైంది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తొలిసారి గాఢంగా అనిపించింది తను అతన్ని ప్రేమిస్తోందని. ఆ తరువాత నుంచీ వర్షమొచ్చిన ప్రతిసారీ అతను మనసు ముంగిట్లోకొచ్చేస్తాడు.

ఉలిక్కిపడి కిటికీలోంచి బయటికి చూసింది లిఖిత. చిరు చీకట్లు పడుతూ ఆకాశం మొహం చాటేస్తున్నట్టుగా ఉంది. తెలీకుండానే కన్నీటి బొట్టొకటి పెదవులపైకి జారి ఉప్పగా తగిలింది.

టి.సి వచ్చాడు. అతను టికెట్ చూసి వెళ్ళాక గమనించింది. సయిడ్ లోయర్ బెర్త్ లో ఎవరో ఒకతను. తననే చూస్తున్నాడు. విసుగ్గా చూపులు తిప్పుకుంది. అతనిలా ఇప్పటివరకూ ఎవరూ తన మనసుకి దగ్గరగా రాలేదు. చదువు చెడకూడదని అతనిమీదున్నదంతా వయసుతో వచ్చిన ఆకర్షణే అని తనిన్నాళ్ళూ నచ్చ చెప్పుకోవడం తనని తాను మోసం చేసుకోవడమే కదూ. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అది ప్రేమని. ఒక మాటా మంతీ లేకుండా కలిగినది ఆకర్షణే అయితే , అది ఇన్నాళ్ళు , ఇన్నేళ్ళు ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్న తరువాత కూడా సజీవంగా ఎలా ఉంటుంది?

ఇంత సేపు తల్చుకున్నవన్నీ ఎప్పటిలా మధురంగా ఉన్నాయి. ఆ పైన తల్చుకోడానికే లిఖితకు బెరుకు. ఏ అలోచనైతే తను తల్చుకోడానికి కూడా భయపడుతుందో మరి తన ప్రేమతో ముడిపడున్న ఆ అంశమే తన జీవితాన్ని ఇప్పుడు శాసిస్తోంది.

ఉన్నట్టుండి కిటికీలోంచి విసురుగా నీళ్ళుపడ్డాయి మొహం మీద. వర్షానికి అందరూ అప్పటికే కిటికీలు దించేస్తున్నారు. లిఖిత లేచి తనూ కిటికీ మూసింది.

“ఇప్పుడే చెబుదామనుకుంటున్నానమ్మా. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావ్. వర్షాన్ని గమనించలేదా?” తనకెదురు బెర్త్ లో కూచున్న ఒక పెద్దావిడ నవ్వుతూ అడిగింది లిఖితని.

లిఖిత చిన్నగా నవ్వి ఏదో చెప్పేలోపే ఆమె సెల్ మోగింది.

లిఖిత తల్లి జయంతి.

“లిఖితా. క్రిందటి నెలలో నీ గురించి అడిగి జతకం తీసుకున్నారని చెప్పాను కదా. వాళ్ళిప్పుడే ఫోన్ చేసారమ్మా. ఆ అబ్బాయి వారాంతమని ఇంటికొస్తున్నాడుట. వాళ్ళందరూ ఆదివారం నిన్ను చూడటానికి మనింటికొస్తున్నారు. ” విషయం చెప్పి ఇంకా ఏవేవో మాట్లాడి ఫోను పెట్టేసింది జయంతి.

లిఖిత అభావంగా నల్లటి ఆకాశాన్ని చూస్తూ కూచుంది. తనకు అతనే తోడుగా కావాలని ఉంది. అతని సమక్షంలో కలిగే ఆ మధురానుభూతులతో మనసు క్షణ క్షణం కొత్తగా వికసిస్తూనే ఉండాలనుంది. అతనికీ తనంటే ఇష్టముందో లేదో తెలుసుకోవాలని ఏ మూలో గట్టిగా ఆశ పడుతోంది. కానీ ఏలా తెలుసుకుంటుంది?

“అంత ఇష్టం నిజంగా ఉంటే ఇన్నాళ్ళూ మళ్ళా తనను కదిలించకుండా ఉంటాడా? ఆ అధ్యాయం ఎప్పుడో ముగిసిపోయింది. ఏదో అతనూ ఆ వయసులో ఉండే ఆకర్షణ వల్ల తననే చూడటం స్నేహితులతో చెప్పుకోవడం చేసుంటాడు. ఏ ఆధారాలతో ఇంత దూరం అలోచిస్తున్నావు? ” వివేకం వేసిన మొట్టికాయ.

ఎందుకో లిఖితకు ఈ విషయం లో వివేకం పనికిరాదనిపిస్తుంది. అతనూ తనని ప్రేమిస్తున్నాడనుకుంటేనే బావుంది.

“ఒకవేళ అతను ప్రేమించినా. ఉమ్మడి కుటుంబం. ఇంతమంది బాబాయిలనీ, తతయ్యనీ కులాంతర వివాహానికి ఒప్పించగలవా? వాళ్ళని బాధపెట్టేంత కఠినమైన మనసు నీకుందా? వేరే కులానికి చెందిన వాడిని ఇంతగా నువ్వు ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పే ధైర్యమైనా నీకుందా? ” మరో మొట్టికాయ.

నీరుకారిపోయినట్టు కిటికీకి తలానించి శూన్యం లోకి చూసింది. “లేదు. తనకు అంత ధైర్యం లేదు. ఉద్యోగం వచ్చి ఆరు నెలలయినా కాకుండానే తన భద్రత గురించి భయపడుతూ పెళ్ళి చేసెయ్యాలని చూస్తున్న తనవాళ్ళని ఎదిరించే ఊహ కూడా తనకు రాదు. ”

రైలు ఏదో స్టేషన్ లో ఆగింది. చాలా మంది ఎక్కారు. లిఖిత కిటికీ దగ్గరగా జరిగింది. కిటికీ అద్దంలో తన ప్రతిబింబం చూసి “నాతో నేను ప్రయాణించక తప్పదని ఇన్నాళ్ళకి తెలుసుకోగలిగాను” అన్న ఇస్మాయిల్ కవితలోని వాక్యాలు గుర్తొచ్చి నవ్వుకుంది.

అంతవరకు కాస్త నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు అందరూ మాట్లాడుకోవడంతో గోల గోల గా మారింది. లిఖిత మనసు పొరలు ఒక్కొక్కటే మూసుకుంటూ వాస్తవంలోకొచ్చింది.

“ఏ అదృష్టమో కలిసొచ్చేసి, అందరూ సానుకూలంగా స్పందించి తను ఇష్టపడిన వాడితోనే పెళ్ళి జరిగినా, ఆ తరువాత సంగతి? పధ్ధతులన్నీ వేరుగా ఉండే ఇంట్లో తను సర్దుకుపోగలదా? చుట్టాలందరూ తనని మెల్ల మెల్లగా పట్టించుకోవడం మానేస్తే బాబాయిలనీ, పిన్నిల్నీ, ఇంత మంది కసిన్స్ నీ కలవకుండా మిగతా జీవితమంతా గడిపేసేంత అలోచన కూడా తను చెయ్యగలదా? చిన్నప్పటినుంచీ ఎంత అనుబంధం తన వాళ్ళందరితో! వాళ్ళకీ తనంటే ఎంత ప్రేమాభిమానాలు? ఈ విషయం తెలిస్తే , ఒక్కసారిగా అందరూ తనతో మాట్లాడటం మానేస్తారు. తను తట్టుకోగలదా? ఈ ఆకర్షణంతా తనకు రాసిపెట్టి ఉన్నవాడు కలవగానే మాయమైపోతుందిలే”

నిస్సహాయత లోంచి పుట్టిన ఓదార్పేమో…

కంటికి కనపడని మనసంటే అందరికీ లోకువే. ఎవరి మనసు వాళ్ళకే ఇంత లోకువ కాబట్టే, లోకంలో ఎవరు ఎవరినైనా తేలిగ్గా బాధించగలుగుతున్నారు. మనసుకి విలువివ్వడం తప్పనిసరని ప్రతి మనిషీ తెలుసుకుంటే, లోకం ఇంకా అందంగా ఉండేదేమో…

**********

pic2

మనోజ్ తో అన్నీ కలిసాయి. సాంప్రదాయ పధ్ధతులు, జాతకాలు, ఈడూ, జోడూ, సంపాదన. మనసుతో శృతీ, గుండెతో లయా తప్ప.

ఎవరితోనూ సంబంధం లేని కాలం శరవేగంగా ప్రవహిస్తూనే ఉంది.

ఏ రోజు కా రోజు దాదాపు ఒకేలా దినచర్య రాజీలతో సాగిపోతూనే ఉంది.

పరుగున వచ్చి రైలు ఎక్కింది లిఖిత. మనోజ్ బేగ్ అందించి జాగ్రత్త చెప్పి రైలు స్టేషన్ వదలగానే ఇంటికి బయలుదేరాడు.

లిఖిత తన బెర్త్ కి వచ్చి సీటుకానుకుని కళ్ళు మూసుకుంది. రైలు అందుకోలేననే భయంతో వేగంగా పరుగెట్టుకుంటూ వచ్చిన అలసట చల్లటి గాలికి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తోంది.

పుట్టింటికి వెళ్ళి దాదాపు ఏడెనిమిది నెలలయింది. అమ్మా, నాన్నలతో, పిన్నీ, బబాయిలతో ఫోనులు కూడా బాధ్యతల నడుమ చాలా తగ్గిపోయాయి. ఇన్నాళ్ళకి సెలవులు కలిసొస్తే వెళ్ళడానికి కూడా ఎన్నో వాదోపవాదనలు. కోప తాపాలు. పుట్టింటికి వెళ్ళాలనీ, రెండు మూడు రోజులైనా తనవాళ్ళందరితో గడపాలనుకునే తన ఆశని అర్థం చేసుకునే మనిషే అక్కడ లేడు.

ఎదురుగానూ , పక్క బెర్త్ లోనూ ఇంకా ఎవరూ వచ్చినట్టు లేదు.

ఒంటరి తనం…

“సర్. అర్.ఎ.సి వచ్చింది. ఏదైనా బెర్త్ ఖాళీ ఉంటే కొంచం చూడండి ప్లీజ్ ” రైలు శబ్దాన్ని చీల్చుకుంటూ ‘అతని ‘ గొంతు. ఉలిక్కిపడింది లిఖిత. గుండె వేగం పెరిగింది. ముఖం ఎరుపెక్కింది. ఎప్పుడో మర్చిపోయిన మధుర స్పందన మళ్ళీ పలకరించింది. వెయ్యి తుమ్మెదల ఘీంకారం రైలు శబ్దాన్ని మించి హృదయ వీణ పాటకి పోటిగా వినిపిస్తోంది.

టి.సి తన ఎదురుగా ఉన్న బెర్త్ ఖాళీగా ఉందని అతనికే ఎలాట్ చేసాడు.

సంతోషంగా తన ఎయిర్ బేగ్ భుజాన వేసుకుని బెర్త్ లో కూలబడిన అతను ఎదురుగా లిఖితని చూసి రెండు నిముషాలు సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాడు.

“లిఖితా. నువ్వా. ఎన్నాళ్ళయింది చూసి. బావున్నావా? జాబ్ చేస్తున్నావని విన్నాను. పెళ్ళయిందిట కదా. ”

అతను ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. స్పృహలో లేనట్టుగా తను సమాధానాలు చెబుతున్నట్టనిపించింది లిఖితకి. అంతటి ఉద్వేగంలోనూ అతని మొహం లో దేని కోసమో వెతుకుతోంది తను. అయిదు నిముషాలకే దశాబ్దపు సంశయానికి సమాధానం దొరికిందామెకి. లేచి బాత్ రూం వైపు వెళ్ళింది.

అచ్చం అప్పటి లాగే , కాళ్ళింకా వణుకుతున్నాయి. ఇప్పుడు తనకతను పూర్తిగా పరాయివాడైపోయినా.

“సార్. మోకాళ్ళు నొప్పులు నాకు. అరవై ఏళ్ళ వాణ్ణి. నాకు అప్పర్ బెర్త్ అలాట్ అయింది చూడండి. ఇక్కడెవరూ మార్చుకోవట్లేదు. కొంచం చూడండి సార్. ” ఎవరో పెద్దాయన టి.సీ ని బ్రతిమాలుతున్నాడు.

మరో ఆలోచన లేకుండా లిఖిత ఆ పెద్దాయన దగ్గరకెళ్ళింది. “అంకుల్ . నాది ఆ పక్కన లోయర్ బెర్త్. నాది తీసుకోండి. నేను మీ అప్పర్ బెర్త్ తీసుకుంటాను. ”

కృతఙ్ఞతగా లిఖితవైపు చూశాడాయన.

లిఖిత వెంటనే తన బేగ్ తీసుకుని ఆ పెద్దాయన బెర్త్ కి మారిపోయింది.

ఎప్పటిలాగే ఏ స్పందనా లేకుండా, మాటలు కూడా ఇష్టంలేనట్టు వెళిపోతున్న లిఖిత వైపు నిరాశగా చూశాడతను.

“కొన్ని మథుర స్పందనలు ఙ్ఞాపకాలుగా మిగిలిపోతేనే కలకాలం పదిలంగా ఉంటాయనుకోవడం తప్ప ఇంకేం చెయ్యగలనురా . ” ఎవరితోనో ఫోన్లో అతను చెబుతున్న మాటలు అతను కూచున్న బెర్త్ కి వెనుకవైపున ఉన్న అప్పర్ బెర్త్ ఎక్కుతుండగా లిఖితకి స్పష్టంగా వినపడ్డాయ్.

“ఎంత పాత పరిచయమైనా, ఒక వ్యక్తిని తల్చుకున్నప్పుడల్లా మనసు జోరు వానై కురవగలగడం ఒక వరం. జీవితంలో ఎప్పుడు గ్రీష్మ ఛాయలు కనపడినా , ఇప్పుడు నేను నాలోపలొక వర్షాన్ని తేలిగ్గా ఆహ్వానించగలను. ..” అతనింకా చెప్తూనే ఉన్నాడు.

గుండె దడ కాస్త కాస్తగా తగ్గుతోంది లిఖితకి.

ఎవరి భావోద్వేగాలకూ విలువివ్వని రైలు తన తీరులో తాను పెద్దగా శబ్దం చేసుకుంటూ దూసుకుపోతోంది.

-ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

ప్రతి రోజూ ఇలా …

రాత్రి వెన్నెల్లో ఆరేసుకున్న భావాలతో

ప్రభాత పక్షి కొత్త బాణీలు కడుతుంది.

కడలి దొన్నెలో మిశ్రమించి పెట్టుకున్న రంగులతో

నింగి తూరుపు చిత్రం గీసుకుంటుంది.

సెలయేటి నవ్వులమీది ఎగురుతూ ఆటాడే

వజ్ర దేహపు చంద్ర కిరణంలాగో

లేత చిగురాకు బధ్ధకపు విరుపులో పడి

మెలికపడే తొలి సూర్య కిరణం లాగో

ఒక్కోసారి చల్లగా, మరో సారి వెచ్చగా

చక్కిలిగింతలు పెడుతుంది గాలి.

అలంకారాలన్నీ వదిలేసి

నింగికెదురుగా నిలబడి

ఒక్క ప్రకృతి చిత్రానికైనా

కనుపాప దోసిలి పట్టాలి

digital-art-desktop-wallpaper

సన్న జాజితీగల్ని

మృదువుగా మీటే గాలి కొనగోళ్ళ స్పర్శలాంటి

జగన్మోహనాస్త్రమొకటి

గుండెల్లో గుచ్చుకోవాలి.

నింగి బుగ్గన సొట్టలా మొదలై

అనంతంగా విస్తరించే

వెలుగు దరహాసంలా

ఈ పొద్దు విరబూసి

తనలోని మధువుతోనే

మలి పొద్దుకు మెత్తని ఊయలేసి

తృప్తిగా నిష్క్రమించాలి.

–ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

కాసేపలా …

PrasunaRavindran

 

కొన్ని దారులంతే, వద్దన్నా పూల వాసనలు వెంటపడతాయ్. భావాల్ని పోల్చుకోమని సవాళ్ళు విసురుతూ, పిట్టలు అవే పాటలు తిరిగి తిరిగి పాడుతూంటాయ్. ప్రయత్నించినా నిమ్మదించలేని నడకలో అక్కడక్కడా పరిచయమయ్యే మంచు బిందువులు, లేత ఎండలో కరిగిపోతాయనుకుంటాం. కరిగిన బిందువులన్నీ మట్టిలో నిద్దురోతూనే కొన్ని రహస్యాల్ని పలవరిస్తాయ్.

 

నడుస్తూనే ఈ దారంట, నాలుగు నవ్వుల్ని నాటి పోవాలి. ఆ నవ్వులెదిగి పూలు పూసి, గాలికి ఊగేప్రతిసారీ , తన నీడలో నడిచిపోయే వారి పైన మధువు చిలకాలి. ముల్లు దిగిన నొప్పి కన్నా, పూల స్పర్శని పంచుకోవడమే నాకిష్టం.

images

 

గుండెలో ఏ మూలో ఓ చిన్న గుడిసేసుకుని కూచుంటావని తెలుసు నాకు. సెలయేటి పాటలైతే బావుంటాయి కానీ , సముద్రపు హోరెందుకు నీకు? అందుకే , ఆ సముద్రానికీ, ఆకాశానికీ ఓ పందెం పెట్టి వదిలేశాను. ఇక నీ దాకా రాదు హోరు.

 

అవును మరి. నా మాటల్ని వింటూనే కోసిన మల్లెమొగ్గల్ని హటాత్తుగా నా ముఖం మీదకి విసిరినప్పుడు, అవి విచ్చుకుని కిందకి జారుతుంటే, నీ కళ్ళలో కనపడే విస్మయాన్ని చూసి ఎన్నేళ్ళయిందని? కాసేపిలా నా పక్కన కూచుని చందమామని చూసేంత సమయముందా? నీ కళ్ళలో ప్రతిఫలించే వెలుగులో దీపించే క్షణాల ద్వారానే నా దారి నేను తెలుసుకోవాలి.

– ప్రసూన రవీంద్రన్

నా ఏకాంతక్షణాలు

PrasunaRavindran

బరువైన క్షణాల్ని మోసి అలసిన పగటిని జోల పాడి నిద్రపుచ్చాక, నా కోసం మాత్రమే ఓ రహస్య వసంతం మేల్కొంటుంది.

గుమ్మం దగ్గరే, కలలు కుట్టిన చీర కట్టి, నిద్ర వాకిలి తడుతున్నా, అక్షరాన్ని ఆప్యాయంగా తడుముకుని ఎన్నాళ్ళయిందోనని ఙ్ఞప్తికొచ్చాక, నా గది గవాక్షన్నే ముందుగా తెరుస్తాను.

వెన్నెల తివాచీలు పరుస్తూ చంద్రుడూ, పన్నీరు జల్లుతూ చల్ల గాలీ నా వెనుకే వస్తారు.

 

నా అడుగుల సవ్వడి వినపడగానే ఆ పూదోట మెల్లగా విచ్చుకుంటుంది.

ఎందుకో మరి, అలిగి విరిగి పడ్డ మబ్బు తునకలు, దారంతా కాళ్ళ కింద నలుగుతూ ఎదురుచూడని ఏ రాగాన్నో అస్పష్టంగా గుణుస్తున్నట్టున్నాయ్.

ఎప్పటి ఉద్వేగానికో ఇప్పుడు పదాల్ని సమకూర్చుకుంటూ ఇక్కడొక చలిమంట వెయ్యాలనుంది.  చీకటీ , నిశ్శబ్దం సంగమించే సమయం ఎంత అపురూపం?   కీచురాళ్ళ భాష తెలిస్తే రాయలేనన్ని పదాలు దొరికేవేమో.

182447_10152600304780363_1937093391_n

 

చంద్రుడినుంచి ఒకే ఒక్క కౌగిలి పుచ్చుకున్న స్ఫూర్తితో ఎక్కడున్నా వెలిపోయే మబ్బు తునకలాగో,

అడవి నుంచి ఒకే ఒక్క రంగుని తీసుకుని గాలిలో విలీనమవుతూ సాగిపోయే పాట లాగో

నువ్వన్న ఒకే ఒక్క మాట, కొన్ని వేల ప్రతిధ్వనులుగా విడిపోయి, వెచ్చటి ఊపిరి లోంచి బయటికొస్తూ అదో రకమైన మత్తులో నన్ను ఓలలాడించిన ఙ్ఞాపకమొకటి నా ముంగురులు సవరించి వెళ్ళిపోతుంది.

 

క్షణాలన్నీ నన్నే ఎత్తుకుని లాలించే ఈ అద్వితీయమైన ఏకాంతం కోసమే పగలంతా ఎదురు చూస్తాను.  కొన్ని అరుదైన పూరేకుల్ని దోసిట దొరకపుచ్చుకుని సంతృప్తిగా  నా గది గవాక్షం వైపు సాగిపోతాను.

     – ప్రసూన రవీంద్రన్

painting: Mandira Bhaduri

ఒక్కసారిగా ఎంత వెన్నెల!

 

    PrasunaRavindran

చీకటి…చీకటి…

మండుటెండలో సైతం

మనసు ఖాళీల్లో నిండిపోయిన చీకటి.

పొద్దు వాలినా

ఒక తేడా తెలీని తనంలోంచి

నిర్నిద్రతో

క్షణాలన్నీ నిస్సహాయంగా మండిపోయాక

నిరాశగా పడున్న

చందమామ పుస్తకంలోంచి

ఏ వన దేవతో దయ తలచి వస్తుంది.

నొప్పి కళ్ళలో

ఓ కలను పిండి

తన చేత్తో కళ్ళు మూస్తుంది.

 poem1

చీకట్లను చేదుకుంటూ

పొగ బండి దూసుకుంటూ పోతుంది.

ఎదురుగా …

ఆకాశమంతా పరుచుకున్న చంద్ర బింబం

ప్రతి దిక్కులోనూ ప్రతిఫలిస్తూ

దోచుకోలేనంత వెన్నెల …

సుడిగుండంలా ఉక్కిరి బిక్కిరి చేసాక

సాయం చెయ్యలేనని

భాష చేతులెత్తేసాక

చేసేందుకేముంటుంది !

కవిత్వీకరించాలనే అలోచనలన్నీ

ఒలిచిపారేసి

ఒక్కసారి

ఆ వెన్నెల సముద్రంలో

నాలోని నన్ను

కడిగేసుకోవడం తప్ప!

      ప్రసూన రవీంద్రన్

కవిత్వ ‘బాధ’లో ఒక సుఖముంది!

మనసుకి బాధ కలిగితే కవిత్వం వస్తుందంటారు. కానీ శరీరానికి బాధ కలిగితే కూడా కవిత్వం వస్తుంది అన్న నానుడి నేను ఎక్కడా వినలేదు. అయితే , శరీరానికి కలిగే బాధలు ఎంత చిన్నవైనా, ఎంతో కొంత మన ఉత్సాహాన్ని , శక్తిని తగ్గిస్తాయి. రోజువారీ దినచర్య కొంత నత్త నడక సాగుతుంది. అదే ఏదైనా భరించలేని నొప్పి వచ్చిందంటే ఇంక చెప్పేదేముంది? తప్పని బాధ్యతలు ముక్కుతూ మూలుగుతూ పూర్తి చెయ్యాల్సి వస్తుంది. చేసే పనిలో ఉత్సాహం , తపన కరువై , తప్పదురా భగవంతుడా అనుకుంటూ చేస్తాం. మొత్తానికి ఏ చిన్న అనారోగ్యమైనా మన కేంద్రీకరణ శక్తిని తగ్గించేసి అలవాటుపడిన దినచర్యకి ఆటంకం కలిగిస్తుంది.

అలా కాకుండా అమితమైన మనోబలం ఉన్న కొద్ది మంది మాత్రం పెద్ద పెద్ద అనారోగ్యాల్ని కూడా త్రుణప్రాయంగా తోసేసి వీలైనంతవరకు అవి తమ కార్యకలాపాలను ప్రభావితం చెయ్యకుండా చూసుకుంటారు. ఇది అరోగ్యకరమైన శక్తి. అలాంటి మనోబలం, మనో నిబ్బరం పొందాలని ఎవరికుండదు? అందుకే చిన్న చిన్న నొప్పులకి సైతం నీరుకారిపోయే కొంతమంది ధ్యానం ద్వారానో, యోగా ద్వారానో అలాంటి మనోబలాన్ని పొందాలని ఆరాటపడుతూంటారు.

64681_101182536614807_2154683_n

అయితే కవిత్వానికున్న శక్తి కూడా అలాంటిదే అని నాకనిపిస్తుంది. మానసికోల్లాసం ద్వారా శారీరక వికాసం కవిత్వం కలిగిస్తుందనేది స్వీయానుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. అచ్చంగా అలాంటి అనుభవమే విన్నకోట రవి శంకర్ గారి “బాధ” కవిత మొదటి సారి చదివినప్పుడు నాకు కలిగింది. ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మన శారీరక, మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా తేలికైన భాషలో కవిత్వీకరించారు. శారీరక బాధ అనేది ఎప్పుడో అప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవించే ఉంటారు కాబట్టి ఈ కవిత చాలా తేలికగా మనసుకి హత్తుకుపోతుంది. అంతే కాదు, ఒక్కసారి గుర్తుచేసుకుంటే అలాంటి బాధలనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిచ్చి మొరాయించే   శరీరానికి నూతనోత్సాహానిస్తుంది.

 

కవి ఈ కవితలో చెప్పినట్టు

 

“మనసు బాధని మరొకరితో పంచుకోవచ్చు

  శరీరం బాధని మాత్రం

  ఎవరికి వారే మోసుకోవాలి

  ఎదురైన ఏ సుఖాన్నైనా

  వద్దని ఒదులుకోవచ్చుగానీ,

  బాధని కాదనటానికి కూడా వీలుండదు. “

కాబట్టే, బాధను ఉపశమింపజేసే సాధనాల్లో ఈ కవిత కూడా ఒకటయిందంటాను. ప్రతి మనిషీ నొప్పి కలిగినప్పుడు ఇదేరకమైన బాధని అనుభవిస్తాడు. అలాంటి బాధని ఇలా కవిత్వరూపంలో చూసుకోవడం ఒక చిత్రమైన అనుభూతి. పెదవులపై చిరునవ్వులు పూయించి బాధని కాసేపు మర్చిపోయేలా చేస్తుందీ కవిత.

 

అంతా సవ్యంగా ఉన్నంతసేపూ

  

   అన్ని వైపులా పాదులా అల్లుకుపోయే శరీరం

   ఏ చిన్న భాగం ఎదురు తిరిగినా

   బాధతో లుంగలు చుట్టుకుపోతుంది.

 

   వేల ఆనందపుష్పాలు

   విరబూసే శరీరవృక్షం

   ఒకే ఒక బాధా విషఫలంతో

   వాటన్నిటినీ రాల్చుకొంటుంది.

 

శరీరం వీణ మీద

   ఒకో చోట సుఖం ఒకోలా పలికినా,

   బాధ మాత్రం అన్ని చోట్లా     

   ఒకలాగే పలుకుతుంది.

   సుఖాన్ని మించిన సుఖం ఉందనిపిస్తుంది గానీ,

   ఏ బాధా మరొక బాధకి తీసిపోదు.

 

   చుట్టూ ఉన్న ప్రపంచం తన అందాన్ని

   అతి తేటగా ప్రకటిస్తున్నప్పుడు

   ఒక్క బాధ చాలు –

   కళ్ళకి కన్నీటి తెరకట్టి

   మొత్తంగా దానిని మసకబరుస్తుంది.

 

   మనసు బాధని మరొకరితో పంచుకోవచ్చు

  శరీరం బాధని మాత్రం

  ఎవరికి వారే మోసుకోవాలి

  ఎదురైన ఏ సుఖాన్నైనా

  వద్దని ఒదులుకోవచ్చుగానీ,

  బాధని కాదనటానికి కూడా వీలుండదు.

 

   మనసు ఒప్పించలేని

   మనిషి చివరి ఒంటరితనాన్ని

   శరీరం ఒక బాధాదీపపు వెలుతురులో

   సరిపడా రుజువుచేస్తుంది.

– ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే!

ప్రయత్న పూర్వకంగానే యంత్రమయం చేసుకున్న బ్రతుకుల్ని కూడా కాలం తరుముతూనే ఉంటుంది. నిర్విరామంగా సాగిపోయే ఆ పరుగులో తుప్పట్టిన యంత్రాల వాసనే ఎటు చూసినా. ఆ పరుగైనా కాస్త జీవంతో నవ్వాలంటే మనల్ని ప్రేమించే ప్రకృతి సహాయం ఎంత అవసరమో, మూర్ఖుల్లా కళ్ళుమూసుకుని పరుగెడితే ఏం కోల్పోతామో సుస్పష్టంగా, సూటిగా, సరళమైన వాడుక భాషలో ‘సుహానా సఫర్ ‘ కవితలో చెబుతారు ఇక్బాల్ చంద్. 

iqbal

ప్రకృతి సౌందర్యానికి ఒక చిరునామా కోనసీమ. అక్కడి అందాల్ని పచ్చగా శ్వాసిస్తూ గోదారి పరవళ్ళలాంటి పదాలతో మనకు వర్ణించి చెప్తాడు కవి. మనసారా, తనువారా అక్కడి ప్రకృతి ప్రేమని అనుభవిస్తూ తన దాహార్తిని తీర్చుకోవాలనుకుంటాడు. ఏడ్చే బిడ్డను అక్కున చేర్చుకుని లాలించే తల్లి లాంటిది కోనసీమ అంటాడు మొదటి వాక్యంలోనే. అలా తల్లితో సమానమంటూ అగ్రతాంబూలమిచ్చేయడంలోనే తెలుస్తుంది అక్కడి ప్రకృతి మనకందించే ప్రేమ ఎలాంటిదో.

ఏడ్చే బిడ్డను లాలించి

          స్తన్యం పట్టే అమ్మ కోనసీమ

చిన్న పాయల నీళ్ళ జారుడు లోకి

          చందమామ చేపపిల్లనై ఎగురుతూ

          దాహాన్ని కసితీరా తీర్చుకుంటే బావుండుననిపిస్తోంది

అంతటి ప్రకృతి సౌందర్యానికి వర్షం కూడా తోడైతే ఇక భావుకుల పరిస్థితి చెప్పేదేముంది. మానసికానందానికి సమయం కేటాయించుకోలేని దైనందిన జీవితాలు ఎడారిలో పయనిస్తున్నట్టే ఉంటాయి. మనసనేది సంతోషపడకపోతే కళ్ళలోకి వెలుగెలా వస్తుంది మరి? అందుకే

ఎడారిలో తడారి ఆరిన కంటివొత్తులు

           కోనగాలి తాకి మళ్ళీ దీపిస్తాయి

అంటాడు.

 

కోనసీమ అందాలు చూశాక మనసు తడవని మనిషుండడు. మచ్చుకైనా భావుకత్వం లేని మనిషైనా సరే, అక్కడి ప్రకృతిని కళ్ళార్పకుండా చూస్తాడు. అనుభూతులూ , స్పందనలూ అవసరం లేని కఠినమైన మనిషయినా, అక్కడున్నంతసేపూ, గోదారి నీళ్ళలో కాళ్ళు తడుపుకుంటూ నాట్యమాడే పచ్చని చెట్టవుతాడు. అది చెప్పడానికే

 

ఇక్కడ పాషాణ కత్తులైనా

            విత్తులై పాతుకుని మొక్కలై ఎదగాల్సిందే

అంటాడు కవి.

 

నాగరికత అని అబద్ధం చెప్పుకుంటూ తిరిగే ఈ నాటి బ్రతుకుల్ని రక్షించేది, రక్షించాల్సిందీ ప్రకృతి ఒక్కటే. ప్రకృతిని సంరక్షించుకోలేకపోతున్నాం. ప్రేమించలేకపోతున్నాం. కనీసం ఆటవిడుపుగానైనా ప్రకృతిని కాసేపు చూస్తూ మన కళ్ళని వెలిగించుకోగలిగితే, పచ్చని పాటని కాసేపు వినగలిగితే, బ్రతుకు పరుగు అహ్లాదంగా సాగుతుంది.

  అనాగరికపు అబధ్థపు గదుల్లోంచి

            మనిషి వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే

మనిషికి ఏనాటికైనా ప్రకృతే గమ్యమని చెప్పడానికి ఇంతకంటే శక్తివంతమైన వాక్యం వేరే అవసరం లేదనుకుంటాను.

 

పూర్తి కవిత:

 

  సుహానా సఫర్

————

  ఏడ్చే బిడ్డను లాలించి

               స్తన్యం పట్టే అమ్మ కోనసీమ

               వర్షం వచ్చి తడిసినా సరే

               కిటికీ తెరిచి చూపుల్తో అల్లుకోవాల్సిందే

               వెలిసిపోయే ఊపిరి చిత్రాలపై

               కొత్త రంగులు పూస్తాయి

               ఎడారిలో తడారి ఆరిన కంటివొత్తులు

               కోనగాలి తాకి మళ్ళీ దీపిస్తాయి

               చిన్న పాయల నీళ్ళ జారుడు లోకి

               చందమామ చేపపిల్లనై ఎగురుతూ

               దాహాన్ని కసితీరా తీర్చుకుంటే బావుండుననిపిస్తోంది

               ఎక్కడి దుఃఖితుల చెంపల్ని తుడవటానికో

               ఆకుల సందుల్లోంచి జారిపోతూ మబ్బు చాపలు

               కాలం తరిమే బ్రతుకులై తేలిపోతూంటాయి.

               జల్లు పడుతూ … ఊగుతున్న చేట్లూ …

               అంతర్ముఖంగా మాత్రమే పలకరించే

               ఇంకా లిపి లేని ఏ భాషో ఆవిష్కరించుకుంటుంది.

               ఏ గంధర్వుడు వదిలి వెళ్ళిన స్వప్నాంతర్యమో

               పచ్చ శాలువా కప్పుకుని నడుస్తున్న

               నిండు గర్భిణీ గుంభనపునవ్వులా ఉంది

               ఎవరూ అల్లని ఈ పహ్చ తివాచీ మీంచి నడుస్తుంటే

               గోలీలాడుతూ పోగొట్టుకున్న క్షణాలు పలకరిస్తాయి

               గుండె ముడతలిప్పుతుంటే

               ఎన్ని నగ్న ప్రపంచాలు రెప్పలు తెరిచి నవ్వుతాయో

               ఇక్కడ పాషాణ కత్తులైనా

               విత్తులై పాతుకుని మొక్కలై ఎదగాల్సిందే

               ఇక్కడి ప్రతీ ఆకుకూ తెలుసు ప్రకృతి రహస్యం

               దాహార్తుల పెదాల్ని ఎలా స్పృశించాలో

               ఇక్కడ కదిలే ప్రతి గాలి పైటకూ తెలుసు

               ప్రకృతి కొత్త రుతువై మనిషిని కవిత్వం చేస్తుంది

               ఈ అనాథస్వామ్యంలో మనిషిని రక్షించేది ప్రకృతే

               అనాగరికపు అబధ్థపు గదుల్లోంచి

               మనిషి వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే.

– ప్రసూన రవీంద్రన్ PrasunaRavindran

నింగీ, నేలా

 PrasunaRavindran

నా ఎదురుగానే ఉంటావ్
అయినా
నీకూ నాకూ మధ్య
కొన్ని జన్మల దూరం
అడ్డు మేఘాలు కరిగిపోడానికి
నా స్పర్శే కాదు
నీ వేడి నిట్టూర్పులు కూడా
చాలటం లేదు
ప్రవహించే ఏ నదయినా
ఒక్క క్షణం ఆగి
నా పాట కూడా వింటుందని
ఆశగా చూస్తూంటాను
ఇన్నేసి పక్షుల గుంపుల్లో ఒక్కటయినా
తన రెక్కల నీడ పడుతుందని
నిష్ఫల స్వప్నాలు కంటూంటాను.
నీకోసం
రంగుల ముఖాల్ని తొడుక్కుంటూ
నీ మనసుకి అద్దంలా మారిపోతూ
అమృతాన్ని వర్షిస్తూ
నేనూ  …
నాతో మాట్లాడాలని
సుడులు తిరుగుతూ
పచ్చటి సైగలు చేస్తూ
పూలను విసురుతూ
గాలిపైటనాడిస్తూ
అనేక సంకేతాల పక్షులనెగరేస్తూ
నువ్వూ …
పరస్పరం ప్రేమించుకోని క్షణముండదు
అయినా
నీకూ నాకూ మధ్య
కొన్ని జన్మల దూరం ….