కొత్తలోకం చూపిన బ్లాక్ మార్కెట్స్ 

santhi1

డిసెంబర్ 4వ తేదీ .

నేను బ్లాక్ మార్కెట్స్ కు  వెళ్లినరోజు .

బ్లాక్ మార్కెట్ అంటే నల్ల ధనపు లేదా దొంగడబ్బు మార్కెట్లు అనుకునేరు  .

నల్లవారి మార్కెట్లు .  అయితే  అక్కడ అంతా నల్లవారే కనబడరు .  నల్లవారు అంటారు కానీ వారంతా నలుపు రంగులో ఉండరు . వారి పూర్వికులది నలుపు రంగే కావచ్చు . కానీ ఇప్పుడన్ని రంగుల్లోనూ కనిపిస్తారు . ఎప్పుడైతే వారి  అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడడం మొదలయిందో అప్పటి నుండి వారి రంగూ రూపు  మారడం మొదలయింది .  బ్లాక్ మార్కెట్స్ లోకి వెళ్లేముందు వాళ్ళ చరిత్ర ఏంటో విహంగ వీక్షణం చేద్దాం .

ఒకప్పుడు ఆ భూభాగమంతా వారిదే.  ఏ సమూహానికి ఆ సమూహం వారి పరిసరాలు , భౌగోళికంగా ఉన్న పరిస్థితులు  అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా వారి సంస్కృతి ఆచార వ్యవహారాలు రూపొందించుకున్నారు .  ఆదిమ మానవుడు పుట్టిన దక్షిణాఫ్రికా నుండి  అన్వేషణలో ఆసియా దేశాల మీదుగా 60 మైళ్ళు ప్రయాణించి ఇప్పటి వెస్ట్రన్ ఆస్ట్రేలియా భుభాగం చేరారట . అలా వచ్చిన వీరు  ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతితో మమేకమై సహజీవనం చేశారు.

కానీ ఇప్పుడు ఆ భూభాగమంతా వారిది కాదు . వారి జనాభా 3% పడిపోయింది . 50 నుండి  65 వేల (ఆంత్రోపాలజిస్టులు కొందరు 50 వేలని , కొందరు 65 వేల ఏళ్ళని రకరకాలుగా చెప్తున్నారు . ఏదేమైనా 50 వేల ఏళ్ళక్రితమే మానవుడు నిరంతర అన్వేషి అని తెలుపుతూ  మానవుల పుట్టినిల్లయిన ఆఫ్రికా ఖండం నుండి ఖండాంతరాలలోకి మొదట వలసలు ప్రారంభం చేసి  ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి బాటలువేసింది వీరే.

న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని పెన్ రిత్ సమీపంలో 1971 ముందు మట్టిదిబ్బలలో లభ్యమైన   రాతి పనిముట్లు  50 వేల ఏళ్ల  క్రితం ఉన్న మూలవాసులవిగా గుర్తించారు .

 ఆస్ట్రేలియాలోని మూలవాసుల బంధువులే మొట్టమొదటి వాస్తవమైన మానవ అన్వేషులు . మన పూర్వీకులు ప్రపంచమంటే భయపడుతూ ఉన్న సమయంలోనే వీరు అసాధారణంగా సముద్రమార్గంలో ఆసియా వరకు ప్రయాణించారు విల్లెర్స్ లేవ్ , కోపెన్ హెగెన్ యూనివర్సిటీ , డెన్మార్క్ కు చెందిన పరిశోధకుని అభిప్రాయం

ఆస్ట్రేలియా , పపువా న్యూ గినియా దీవుల్లో  ల్లో నివసిస్తున్న జనాభా డిఎన్ఏ పరీక్షచేసిన తర్వాత ప్రాచీన మానవుని జీవన యానాన్ని పసిగట్టారు . వారే సముద్రాన్ని దాటిన మొదటి మానవులని విశ్లేషించారు .

వారెవరో కాదు అబోరిజినల్స్ .. అంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ . ఒకప్పుడు 270 నేటివ్ ఆస్ట్రేలియన్ భాషలతో విలసిల్లిన నేలపై ఇప్పుడు 145 మాత్రమే ఉంటే, అందులో 18 భాషలు మాత్రమే వాడకంలో ఉన్నాయి . అంటే కుటుంబంలో అందరూ మాట్లాడేవి . మిగతా భాషలు కొద్దిమంది  ముసలీ ముతకా తప్ప మిగతా కుటుంబ సభ్యులు మాట్లాడరు.  50 వేల ఏళ్ళకి తక్కువ కాని ఘనచరిత్ర కలిగిన మూలవాసుల సంస్కృతి ఆచారవ్యవహారాలు, భాషలు , జ్ఞానసంపద , వనరులు ,వారి జీవనం అన్నీ ఆపదలో ఉన్నాయి . ఆ విషయాన్ని గమనించి తమ తాతముత్తాతలు తిరుగాడిన తావుల్ని , నింగిని , నేలని మాత్రమే కాదు వారి అందించిన అపారజ్ఞానాన్ని, కళలని , నైపుణ్యాలని పదిలపరుచుకోవాలని నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు భావిస్తున్నారు.  అందుకు తగిన కృషి చేస్తున్నారు .

santhi2

నేను అబోరిజన్స్ ని కలవాలనుకోవడానికి కారణం ఏమిటంటే .. 

అబోరిజినల్స్ ని కలవాలని నేను సిడ్నీ వచ్చిన దగ్గర నుండి అనుకుంటూనే ఉన్నాను .  కారణం , బ్లాక్ టౌన్ హాస్పిటల్ ఉద్యోగాల్లో మిగతా ఆస్ట్రేలియన్స్  లాగే అబోరిజినల్స్ ని కూడా సమానంగా చూస్తామని ప్రత్యేకంగా తెలుపుతూ రాసిన దాన్ని చదివాను .   అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.   అదే  అడిగాను.  మా వాళ్లేమో ,  ఆమ్మో అబోరిజినల్స్ చాలా అగ్రెసివ్ అట అన్నారు.  కొందరు ఆస్ట్రేలియన్లని అడిగితే వాళ్ళు మూలవాసుల గురించి మాట్లాడ్డానికే ఇష్టపడలేదు .   వాళ్ళని హాస్పిటల్ లో , షాపింగ్ మాల్స్ లో, మార్కెట్ ప్రదేశాల్లో , స్టేషన్స్ ఎక్కడబడితే అక్కడ  చాలా చోట్ల చూశాను . వాళ్ళు ఖచ్చితంగా అబోరిజినల్స్ అని చెప్పలేను . మాట్లాడి తెలుసుకునే  అవకాశం లేదు .  మాట్లాడినా మాములు విషయాలు మాట్లాడగలం కానీ వారి పూర్వీకుల గురించి గానీ , మీరు అబోరిజనల్సా అని గానీ సూటిగా  అడగలేం కదా .. అసలు అలా అడగకూడదు కూడాను.  అడిగితే ఇక్కడ చాలా పెద్దతప్పు .  వివక్ష చూపిస్తున్నారని , లేదా వాళ్ళని వేలెత్తి చూపుతున్నారనో మీద కేసు పెట్టినా పెడతారు అన్నారు మావాళ్ళు.    మనదేశంలో లాగా ఇక్కడ అట్రాసిటీస్ ఆక్ట్ ఉందేమో అనుకున్నా .  మనం అడిగేది అర్ధం చేసుకోలేక పోయినా, మనం సరిగ్గా అడగలేక పోయినా ఇబ్బందే అని గమ్మున ఉన్నా.   వారిని మాత్రం పలకరించలేదు కానీ రోజు రోజుకీ వారిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి , తపన పెరిగిపోయింది .

చివరికి  కలవడం కోసం బ్లూ మౌంటెన్స్ దగ్గర ఉన్న అబోరిజినల్ హెరిటేజ్ టూర్ కి వెళ్లిరావాలని అనుకున్నాం .  కానీ అంతలో బ్లాక్ మార్కెట్ గురించి తెలిసింది .  డిసెంబర్ 4 బ్లాక్ మార్కెట్ డే (నల్ల వాళ్ళ లేదా అబోరిజినల్ ).  ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మార్కెట్ అంటే మన అంగడి లేదా సంత లాంటిది నిర్వహిస్తారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో జరుగుతుంది .  ఆయా తెగల ప్రజలు అంతా కలసి ఓ చోట చేరి తమ నైపుణ్యాలని , కళల్ని , జ్ఞానాన్ని , సంస్కృతిని, ఆహారాన్ని , వైవిధ్యభరితమైన జీవితాన్ని  మనకు పరిచయం చేస్తారు . ( మనకు నచ్చిన వాటిని మనం కొనుక్కోవచ్చు ).  విషయం తెలవగానే వాళ్ళని కలవడానికి ఇంతకంటే మంచి అవకాశం నా ఈ పర్యటనలో రాదనుకున్నా .  ఆ రోజు ఎన్నిపనులున్నా వెళ్లాలని నిశ్చయం జరిగిపోయింది .

2013 నుండి బ్లాక్ మార్కెట్స్ ని నిర్వహిస్తోంది ఫస్ట్ హ్యాండ్ సొల్యూషన్స్ అబోరిజల్స్ కార్పొరేషన్ .  ఆపదలో లేదా రిస్క్ లో ఉన్న యువతని ఆదుకోవడం కోసం ఈ ఫండ్ ఉపయోగిస్తారట .  బోటనీ బే తీరంలోని లే పెరౌస్ లో ఈ సంస్థ కార్యాలయం , మ్యూజియం ఉన్నాయి . దీన్ని అబోరిజినల్స్ బిజినెస్ సెంటర్ అనొచ్చు .  ఇక్కడనుండి బేర్ ఐలాండ్ కి టూర్లు నిర్వహిస్తుంటారు .  అబోరిజినల్ రోల్ మోడల్స్ ని యువతకి పరిచయం చేస్తారు . యువతలో లీడర్ షిప్ పెంచడం , పబ్లిక్ తో మాట్లాడడం వంటి జీవన నైపుణ్యాలు అందిస్తున్నారు.   వాటితోపాటే బ్లాక్ మార్కెట్స్ నిర్వహణ .  మొదట్లో ప్రతినెలా నిర్వహించినప్పటికీ 2015 నుండి ప్రతి మూడునెలలకొకసారి నిర్వహిస్తున్నారు .   ఆయా స్టాల్స్ లో తాయారు చేసిన వస్తువులుకొని అబోరిజినల్ యువతను ప్రోత్సహించమని చెప్తుంది ఆ సంస్థ .

మా పూర్వీకుల వారసత్వ జ్ఞానం విపత్కర పరిస్థితుల్లో కొట్టుకిట్టాడుతోంది . వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే  అంటాడు ఫస్ట్ హ్యాండ్ సోలుషన్స్ డైరెక్టర్ పీటర్ కూలీ .

ఆధునిక ఆస్ట్రేలియా పుట్టింది లే పెరౌస్ లోనే .  అంటే ఆస్ట్రేలియాని కనుగొన్న  కెప్టెన్ కుక్ 1770లో మొదట అడుగుపెట్టింది ఈనేలపైనే.  ఆ తర్వాతే బ్రిటిష్ వారి కాలనీలు 1788లో వెలిశాయి =. స్థానికులైన ఆస్ట్రేలియన్ల భూముల్ని , వనరుల్ని దురాక్రమించడంతో పాటు వేల ఏళ్ల సంవత్సరాలుగా నివసిస్తున్న వారి జీవనాన్ని , తరతరాలుగా పొందిన జ్ఞానాన్ని, రూపొందిచుకున్న సంస్కృతిని , భాషల్ని, చరిత్రని సర్వనాశనంచేశారు  జాత్యాహంకారులు . తమ నేలపై తాము పరాయివారుగా తిరుగాడుతూ వివక్షతో బతుకీడ్చడం కాదు.  కోల్పోతున్న తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం తమ పూర్వీకులు కొందరు జాత్యహంకారులపై పోరాడారు .  వారి స్పూర్తితో హక్కుల్ని,  సంస్కృతిని పునరుజ్జివింపచేసుకుంటూ తమ వారసత్వసంపదని కాపాడుకుంటూ ఏకీకృతం అవుతున్నారు నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు . అందులో భాగంగా ఏర్పడిందే బ్లాక్ మార్కెట్ ..

పదండి అలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్లి చూసోద్దాం 

మేముండే బ్లాక్ టౌన్ నుండి బారంగారో రిజర్వ్ లో ఉన్న బ్లాక్ మార్కెట్స్కి కారులో వెళ్లడం కంటే ట్రైన్ లో వెళ్లడం మంచిది అనుకున్నాం .( కారులో వెళ్తే పార్కింగ్ వెతుక్కోవాలని ) .  బస్సు , ఫెర్రీ సౌకర్యం కూడా ఉంది .  ఏది ఎక్కినా opeal కార్డు స్వైప్ చేయడమే .  ప్రయాణ సదుపాయం చాలా బాగుంది .   బారంగారో రిజర్వ్ టౌన్ హాల్ కి , సిడ్నీ హార్బరుకి దగ్గరలో ఉంది . వెతుక్కునే పనిలేకుండా సులభంగానే వెళ్లిపోయాం.

ఉదయం 9. 30 కే బ్లాక్ మార్కెట్స్ లో దుకాణాలు తెరిచారు .  హిక్సన్ రోడ్డులోని  బారంగారో రిజర్వు లోని బ్లాక్  మార్కెట్స్  చాలా సందడిగా కనిపిస్తున్నాయి .  చుట్టూ స్టాల్స్ 30 పైగా ఉన్నాయి  మధ్యలో ఉన్న ఖాళీలో  ఇసుకపోసి ఉంది .  అందులో సాంప్రదాయ నృత్యాలు సాగుతున్నాయి . చుట్టూ జనం గుమి గూడి చూస్తున్నారు .  Ngaran Ngaran డాన్స్ ట్రూప్ వారి ఆధ్వర్యంలో ఆ నృత్య ప్రదర్శన జరిగుతోంది.  మైకులోంచి ఆ నృత్య రీతిని వివరిస్తున్నారు .  వారి డాన్సు చూస్తుంటే నాకు ఆదిలాబాద్ గిరిజనులు చేసిన గుస్సాడీ , చత్తిస్గఢ్ గిరిజనుల మోరియా నృత్యాలు గుర్తొచ్చాయి .  ఆహార్యం ఒకేలా లేకపోవచ్చు గానీ కాళ్ళు చేతుల కదలికలు ఒకేలా అనిపించాయి .  వీవర్స్ చేసే నృత్యం , ఫిషింగ్ కమ్యూనిటీ చేసే నృత్యం , వేటాడేవారి నృత్యం ఇలా వారు చేసే పనులను బట్టి వారి నృత్యాలు ఉన్నాయి . ఆ ట్రూపులో ఉన్న చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు . ఆ విషయమే అడిగినప్పుడు-  ఆదిమ కాలంనాటి వారి నృత్యం కనుమరుగై పోతున్న నేపథ్యంలో అది కాపాడుకోవడానికి వారసత్వ సంపదగా ముందు తరాలకు అందించడం కోసం ఇప్పటి తరానికి తమ పూర్వీకుల సనాతన నృత్యాన్ని నేర్పుతున్నామని చెప్పాడు ఆ ట్రూప్ లీడర్ మాక్స్ హారిసన్ .  నాకు వాళ్ళ నృత్య రీతులు చూశాక కలిగిన భావాన్ని వారితో పంచుకున్నప్పుడు ‘ఇండియాకు మాకు కొన్ని పోలికలు ఉంటాయట’ అన్నాడు ట్రే పార్సన్ అనే మరో కళాకారుడు .

santhi4

ఏ స్టాల్ నుండి చూడ్డం మొదలు పెడదామా అనుకుంటూ  మొదటి స్టాల్ దగ్గరకి వెళ్ళాం .  అక్కడ ఆదిమ జాతుల గురించి సమాచారం చాలా ఉంది . దాంతో ఆసక్తి ఉన్నవారు అబోరిజినల్ కల్చరల్ టూర్ చూసే ఏర్పాటు ఉందని చెప్పారు .  వెంటనే మేమూ మా పేర్లు రిజిస్టర్ చేసుకున్నాం . 11 గంటలకు ఆ టూర్ మొదలయింది .  బారంగారో రిజర్వ్ లో దాదాపు గంటసేపు సాగింది మా టూర్ . ఆదిమకాలంనాటి వీవర్స్ కమ్యూనిటీ కి చెందిన జెస్సికా మాకు గైడ్ గా వచ్చింది . ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లో పనిచేస్తోంది (సెలవుల్లో తమ జాతి ఉన్నతి కోసం సేవలు అందిస్తూ ఉంటుందట. మరో సందర్భంలో అడిగిన ఓప్రశ్నకు జవాబుగా చెప్పింది ).  ఆవిడతో కలసి మాతో పాటు జపాన్ , చైనా , ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశస్తులతో పాటు కొంతమంది యూరోపియన్ దేశాల వారు కూడా వచ్చారు .

బారంగారో కొండ అంచున నడుస్తూ , ఆగుతూ ఆమె చెప్పిన విషయాలు ఇవే . 1788లో 1100 మంది నేరస్థులు , మరో రొండొందలమంది సిబ్బందితో మొదటి యూరోపియన్ కాలనీ వెలిసిన సమయంలో క్యాంమెరగల్ , కడిగళ్  జాతి బారంగారో లో ఉండేది . ఆ సమయంలో దాదాపు 1500 జనాభా  బోటనీ బే నుండి బ్రోకెన్ బే వరకూ ఉన్న సిడ్నీ తీరప్రాంతంలో చిన్న చిన్న సమూహాలుగా  నివసించేవారని గవర్నర్ ఆర్థర్ ఫిలిప్ అంచనా . పారామట్టా నదిలోనో , సముద్రంలో చెట్టు బెరడుతో చేసిన తెప్పలపై తిరిగి చేపలు పట్టడం , వేటాడడం , వండుకోవడం , తినడం ఇదీ వారి దినచర్య.

యూరోపియన్ సెటిల్మెంట్ తర్వాత కూడా కొంతకాలం అబోరిజినల్స్ కి , వలసవచ్చిన తెల్లవాళ్లకి డార్లింగ్ హార్బర్ సమీపంలో సముద్రపు కాకల్స్ అనే గవ్వలు  , ఆయిస్టర్ లు ప్రధాన వనరుగా ఉండేవి . బ్రిటిష్ కాలనీలతో పాటే వచ్చిన మశూచి చాలామంది మూలవాసుల్ని మింగేసింది . దాంతో వారు తమ నివాసాల్ని శ్వేతజాతీయులకి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు .  కాలనీలు పెరిగాయి . 1900 నాటికి సిడ్నీ హార్బర్ నుండి ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది . న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇరవయ్యో శతాబ్దం నుండి ఇరవయ్యో శతాబ్దంలోకి మాత్రమే కాదు ప్రపంచంలోని  అత్యాధునిక నగరాల్లో ఒకటిగా  ఈ ప్రాంతపు రూపురేఖలు మారిపోయాయి .  అభివృద్ధిని మేం కాదనడంలేదు . కానీ మా అస్తిత్వాల్ని, మా వారసత్వ సాంస్కృతిక సంపదను మేం కోల్పోవడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే మాకు తీరని నష్టం జరిగింది అని స్పష్టం చేసింది జెస్సికా  ఓ ప్రశ్నకు సమాధానంగా .

బ్రిటిష్ కాలనీలు వెలసిన కొత్తలో “బారంగారో” అనే  చేపలు పట్టే ఓ శక్తివంతమైన మూలవాసీ మహిళ ఉండేది.  ఆమె  తెల్ల జాతీయుడైన అధికారికి ఒకే రోజు  200 వందల చేపలు ఇచ్చిందట. అందుకే అతను ఆ ప్రాంతానికి ఆమె పేరుపెట్టాడట.  మూలజాతుల వారు పెట్టుకున్న పేర్ల స్థానంలో ఇంగ్లీషు వారి ఊరి పేర్లు , పట్టణాల పేర్లు కనిపిస్తాయి .  సిడ్నీ మహానగరం ఉన్న న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం పేరు కూడా యూరోపియన్లు మొదట వచ్చి రాగానే తామున్న ప్రాంతానికి న్యూ సౌత్ వేల్స్ అని పేరు పెట్టారట . అదే విధంగా ఆస్ట్రేలియాలో పేర్లన్నీ మార్చేశారు. కొద్ది తప్ప. బ్రిటిష్ వారితో స్థానిక ఆస్త్రేలియాన్స్ కి ఉన్న సంబంధాలను బట్టి అక్కడక్కడా ఇప్పటికీ అబోరిజినల్స్ పేర్లు కనిపిస్తాయి.   బారంగారో కొండకి ఒక వైపు అంతా నీరు మరో వైపు భూభాగం .  ఆ కొండపై 75,858 రకాల మొక్కలు పెరుగుతున్నాయి . అవన్నీ కూడా సిడ్నీ ప్రాంతంలో పెరిగే మొక్కలూ , చెట్లూ .  అవి బ్రిటిష్ కాలనీలు రాకముందూ – వచ్చిన తర్వాత మా  జాతీయుల చరిత్రలు చెబుతాయి అంటుంది జెస్సికా . అక్కడ  కనిపించే గడ్డిని చూపి దీనితో మా పూర్వీకులు తమ అవసరాలకు కావాల్సిన పాత్రలు , సంచులు , బుట్టలు తాయారు చేసుకునేవారు . ఆ గడ్డి గెలలు వచ్చాక ఆ గెలనుండి వచ్చే నారతో నులక నేసి మంచాలకు చుట్టేవారు.  చెట్టు బెరడు ఎన్నో విధాలుగా వాడేవారు . నార, పీచు , పళ్ళు , ఫలాలు , వాటి గింజలు , దుంపలు ప్రతిదీ తమచుట్టూ ఉన్న అడవినుండి తమ అవసరాలకు మాత్రమే తెచ్చుకునేవారు . చెట్లను నరకడం మా పూర్వీకులకు తెలియదు . వాళ్ళు చెట్టు మొదలు నుండి పైకి  నిలువుగా ఒక గాటు పెట్టి  బెరడు తొలిచేవారు .  ఆ బెరడును చాలా రకాలుగా అవసరాలకు మలుచుకునేవారు . ఎన్నెనో ఔషధమొక్కలున్నాయి  ఈ కొండపై అంటూ మాకు వివరించింది .  తను మాకు చూపిన గడ్డితో చేసిన బాగ్ లోంచి తీసి తమ పూర్వీకులు వాడిన పరికరాలు , వస్తువులు చూపింది .

అదే విధంగా కనిపించే ఆ నీటిలో ఎంతో చరిత్ర సమాధి అయింది .   అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో సముద్రపు నీటిమట్టం పెరిగి అప్పుడున్న జనాభాతో పాటు రాతిని తొలిచి చేసుకున్న వారి నివాసాలు , సొరంగ మార్గాలు జల సమాధి అయ్యాయి . ఇక్కడ దొరికే ఈ ఇసుక రాళ్ళూ , నత్తలు , గవ్వలు , చేప పొలుసులు అన్నీ మూలవాసుల ఆనవాళ్ళని , ఆనాటి చరిత్రని పట్టిస్తాయి అని ఎంతో ఉద్వేగంగా చెప్పిందామె .

santhi3

కొద్దీ దూరంలో అంటే 500 మీటర్ల దూరంలో కనిపిస్తున్న ఆకాశహార్మ్యాలను చూపుతూ అభివృద్ధి దృష్టి ఎప్పుడూ మా స్థలాలపైనే .. అటుచూడండి ఆ కట్టడాలన్నీ అబోరిజినల్స్ స్థలాల్లోనే జరిగేది . మేం గట్టిగా అడ్డుకుంటున్నాం . అయితే మా జనాభా తక్కువ . ఉన్నవాళ్లు కూడా ఎక్కడెక్కడో ఎవరికి వారుగా ఉన్నారు . అందరం సంఘటితమయ్యి మా సమస్యలని ఎదుర్కొంటూ పోరాడడమే కాదు మా హక్కుల్నీ కాపాడుకోవడం కోసం మిగతా వాళ్ళకంటే మేం మరింత కష్టపడాల్సి వస్తోంది  అంటుందా మూలవాసీ మహిళ .

ఒక్క బారంగారో లోనో , సిడ్నీ లోనో , న్యూసౌత్ వేల్స్ లోనో మాత్రమే కాదు దేశమంతా అబోరిజినల్స్ టోర్రెస్ స్ట్రైట్ ఐలాండర్స్ పరిస్థితి ఇదే  అంటూ వివరించింది జెస్సికా . మధ్య మధ్యలో మేం అడిగే ప్రశ్నలకు , సందేహాలకు ఓపిగ్గా జవాబు చెప్పింది . ఇప్పటికీ ఈ దేశంలో మా పట్ల వివక్ష ఉంది . విద్య , ఆరోగ్యం , ఉద్యోగం,  అన్ని చోట్లా వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పింది . అందుకు సంబంధించిన వివరాలు మరోచోట ప్రస్తావిస్తాను .  అదే విధంగా  స్టోలెన్  జనరేషన్స్ గురించి విన్నానన్నపుడు జెస్సికా చాలా ఉద్వేగానికి గురయింది . అవును , ఇప్పటికీ తమ కుటుంబాన్ని కలుసుకోలేని పిల్లలూ , పిల్లల్ని కలవలేని తల్లిదండ్రులు కొల్లలు .  ఇలాంటి మార్కెట్స్లోనో , మీట్స్ లోనో , ఉత్సవాల్లోనో కలిసినప్పుడు తమవారెవరైనా కనిపిస్తారేమోనని వారి  పేర్లను బట్టి బంధుత్వాలు వెతుక్కుంటూ ఉంటారు . (స్టోలెన్ జనరేషన్స్ గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాం . ) అని చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది .

అలా ఓ గంట నడకతో సాగిన ఆ టూర్ అయ్యేసరికి కడుపులో కొద్దిగా ఆకలి మొదలయింది .  మేం ఇంటినుండి తెచ్చుకున్న పదార్ధాలున్నప్పటికీ అక్కడున్న ఫుడ్ స్టాల్స్ వైపు చూశాము .  మూలవాసులు ఏమి తినేవారో ఆ ఆహార పదార్ధాలు అక్కడ కనిపించాయి .  ఈము పక్షి మాంసం , కంగారూ ల మాంసం పుల్లలకు గుచ్చి నిప్పులపై కాల్చి (ఇప్పుడు మనం అనే BBQ ) చేపలు , పీతలు,  వోయిస్టర్ చెరుకు ఆకులాంటి ఓ ఆకులో చుట్టి కాలుస్తున్నారు .  నత్తలు , ఆల్చిప్పలు ఒలిచి అరటి మొక్క పొరల్లాంటి పొరల్లో చుట్టి కొద్దిగా కాల్చి ఇస్తున్నారు .  ఒకరకం నీచు వాసన .  ఉప్పు కారం మసాలా  లాంటివేమీ లేకుండా  ఎలా తినేవారో అలా ..

మేం ఈము మాంసం తో చేసిన స్కీవర్స్ తీసుకున్నాం .

నేటివ్ అబోరిజినల్స్ జీవిత వీర గాథలు చెప్పింది టకీ కూలీ అనే మహిళ.   ఆ తర్వాత ఆ మహిళ పామిస్ట్రీ చెప్తోంది.  ఒక్కక్కరి నుండి $10, 20, 30 తీసుకొంది. తమ హస్త రేఖలను బట్టి , ముఖ కవళికలను బట్టి ఆమె జాతకం చెప్తోంది . చాలా మంది క్యూ లో కనిపించారు.

అద్భుతమైన కళా నైపుణ్యాలు వారివి . రేగు పండ్ల గింజల్లాంటి గింజలతో వారు చేసిన ఓ  ఆభరణం నా మనసుని బాగా ఆకట్టుకుంది. కొందామనుకున్నాను కానీ అది అప్పటికే అమ్మేశానని చెప్పింది నిర్వాహకురాలు .   మా పూర్వీకులు రంగులు వాడేవారు కాదు . మేం వాడుతున్నాం అని చెప్పింది మేరీ . ఆవిడ ఆర్ట్స్ స్టూడెంట్ ననీ బహుశా వచ్చే ఏడాది ఇండియా వస్తానని చెప్పింది . అయితే ఇండియాలో ఏ యూనివర్సిటీ కి వచ్చేది తెలియదట . కల్చరల్ ఎక్స్చేంజి ప్రోగ్రాంలో భాగంగా వస్తానని చెప్పింది . దాదాపు 50 ఏళ్ల వయసులో ఉన్నావిడ ఇప్పుడు ఈ వయస్సులో యూనివర్సిటీ కి వెళ్లి చదువుతున్నందుకు అభినందించాను . ఆవిడ నవ్వుతూ   మేం చదువుల్లోకి వెళ్ళేది చాలా ఆలస్యంగా .  నాన్ అబోరిజినల్స్ కి ఉన్న అవకాశాలు మాకు లేవు . మేం అవతలి వారి నుండి ఎగతాళి ఎదుర్కొంటూ పై చదువులకు రావడం సాహసమే అని చెప్పింది .  అందుకే కాలేజీల్లో ,యూనివర్సిటీ లో మిగతా వాళ్ళకంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ వయసులో పెద్దవాళ్ళయి ఉంటారు అంటూ కొబ్బరి పూసలతో  బ్రేస్ లెట్ తాయారు చేస్తూ  వివరించింది .  ఇంకా ఎదో మాట్లాడ బోతుండగా కస్టమర్స్ రావడంతో బిజీ అయిపొయింది .  వాళ్ళతో చాలా చాలా మాట్లాడాలి . ఎంతో తెలుసుకోవాలన్న ఉత్సాహం నాది . కానీ వాళ్ళకి ఉన్న సమయం ఉదయం 9. 30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే . అంతలోనే తమ వస్తువులు వీలయినంత ఎక్కువ అమ్మి సొమ్ము చేసుకోవాలన్న తాపత్రయం .  అలా వాళ్ళు తాయారు చేసిన హస్త కళలు , ప్రకృతి సహజమైన వస్తువులతో తాయారు చేసిన సబ్బులు , షాంపూలు , పురుగుమందులు , కొన్ని రకాల మందులు  ఒక స్టాల్లోఉంటే మరో స్టాల్ లో కిందరగార్డెన్ స్కూల్ పిల్లలకోసం స్టడీలెర్నింగ్ మెటీరియల్ అతి తక్కువ ధరల్లో .  ఒక స్టాల్ లో పురాతన ఆస్ట్రేలియన్ వాడిన సామగ్రి ,పనిముట్లు ,వాళ్లకు సంబంధించిన ఫోటోలు, ఆర్ట్ , వగైరాలతో పాటు ఆస్ట్రేలియా దేశంలో ఆదిమ మానవుడు నివసించిన రాతి గుహలు , సొరంగాలు , వారి పవిత్ర స్థలాలు, ఆదిమ కాలంనాటి మానవుల శిలాజాలు , జంతువుల శిలాజాలు వంటివన్నీ చూపడానికి ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీల వివరాలు ..  మందమైన నారవంటి బట్టపై ప్రాధమిక రంగులతో వేసిన కళాకృతులు , పెయింటింగ్స్, మనం ఎందుకూ పనికిరావని పడేసే షెల్స్ , సీడ్స్  తో ఎన్నో ఎన్నెన్నో .. కళాకృతులు , ఆభరణాలు . అద్భుతంగా ..

ఒక స్టాల్ లో పురాతన నేటివ్ ఆస్ట్రేలియన్ వాడిన పనిముట్లు, సామాగ్రి, ఇతర వస్తువులతో పాటు వాళ్ళు కప్పుకున్న గొంగళి కనిపించింది . ఆ స్టాల్ నిర్వాహకుడు జోసెఫ్  ఆ గొంగళి గురించి చెప్పాడు . ఆదిమ మానవులు బిడ్డ పుట్టిన తర్వాత కూలమన్  (అంటే దోనె ఆకారంలో ఉన్న చెట్టు బెరడు )లో గొర్రె ఉన్నితోలు వేసి ఆ బిడ్డను పడుకోబెట్టి అదే కప్పేవారట . ఎటన్నా పోయినా అట్లాగే  తీసుకెళ్లేవారట .  అలా బిడ్డ పెరిగిన కొద్దీ ఆ ఉన్ని ముక్కకి మరో ముక్క అతికేవారట . అలా ఆ బిడ్డ పెద్దయ్యేసరికి పెద్ద గొంగళి అయ్యేదట . అలా అతుకులు అతుకులుగా ఉన్న గొంగళి భలే ఉంది . కూలమన్ ను వంట పాత్రగాను , వస్తువులు వేసుకునే పాత్రగాను  ఎన్నోరకాలుగా వాడేవారట .  మహిళలయినా , పురుషులయినా వాళ్ళ చేతిలో చేతికర్ర కన్నా చిన్నదిగా సూదంటు మొనతో ఉన్న కర్ర ఉండేదట . అది వారిని వారు కాపాడుకోవడం కోసం , కందమూలాలు తవ్వుకోవడం కోసం వంటి వివిధ పనులకోసం వాడేవారు . అలా వారి వస్తువులు , పనిముట్లు ఒకటి కంటే ఎక్కువ పనులకోసం ఉపయోగించేవారు .

ఉదయం 9. నుండీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నారతో వివిధ రకాల వస్తువులు , సముద్రంలో దొరికే వివిధ రకాల గవ్వలతో వస్తువులు , అలంకరణ సామాగ్రి తాయారు చేయడం , అదే విధంగా ఆభరణాలు తాయారు చేయడం , పెయింటింగ్స్ , వంటి వర్క్ షాప్స్ కొనసాగాయి .  95 సంవత్సరాల మహిళ ఎంతో ఉత్సాహంతో ఓ స్టాల్ లో కనిపించింది తన కూతురితో పాటు . ఆమె తాను నేర్చుకున్న పూర్వీకుల జ్ఞానాన్ని వారసత్వంగా తరువాతి తరాలకు అందించే ప్రతినిధిగా అక్కడ కనిపించడం అపురూపంగా తోచింది .

ఓ పక్క ఎండ మండుతున్నా వచ్చే జనం పోయే జనంతో కిటకిటలాడాయి బ్లాక్ మార్కెట్స్ .  అక్కడ వారు చాలా షాపింగ్ చేశారు . మేం మాత్రం ఓ కొత్త లోకంలోకి వెళ్ళివచ్చినట్లుగా భావించాం .  మనకు తెలియని మూలవాసుల జీవితాల గురించి ఆలోచిస్తూ తిరుగు ముఖంపట్టాం.

ఆస్ట్రేలియా పర్యటించేవారు ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి, స్కైటవర్  వంటివి చూడ్డమే కాదు అబోరిజినల్స్ జీవనానికి సంబంధించిన టూర్లు చేయొచ్చు . మూలవాసుల జీవనం గురించి ఎంతో తెలుసుకోవచ్చు .  అదే విధంగా అలలపై తేలియాడే చేపల్ని, నీటిఅడుగున ఉన్న సముద్రపు జీవాల్ని  గురించి తెలుసుకోవచ్చు.  చేపల్ని  వేటాడడం , వివిధ రకాల సముద్ర జీవుల్ని అక్కడే కాల్చుకు తినడం , బూమెరాంగ్ ఎలా విసరాలో నేర్చుకోవడం ,   మంచుయుగం , రాతియుగాల్లోను  జాత్యహంకారులు అడుగుపెట్టక ముందున్న నేటివ్ ఆస్ట్రేలియన్ల జీవనం , టెక్నాలజీ ని , వారి ఆర్ధిక వ్యవస్థని , మార్కెట్ పద్దతులను  తెలుసుకోవడం వంటివన్నీ మనకు కొత్త ఉత్సాహాన్నివ్వడమే కాదు జీవితంపై కొత్త అన్వేషణలకు పునాదులేస్తాయి .

ఆస్ట్రేలియాలో ఏ  మూలకు పోయినా ప్రాచీనచరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను తుడిచేసే ప్రయత్నమే ..  ఎతైన ఆకాశహర్మ్యాలు , స్కై టవర్స్, స్కైవేలు , ఫోర్ వేలు, మైనింగ్ ప్రాజెక్ట్స్ వంటి  మరెన్నో అభివృద్ధి పథకాల  కింద నలిగిపోయిన మూలవాసుల గుండె ఘోష వినిపిస్తూనే ఉంటుంది .  అతి పురాతనమైన చరిత్ర కలిగి కేవలం మూడుశాతం జనాభాగా మిగిలిన మూలవాసులు కోరుకునేదొకటే . అభివృద్ధి భూతం తమని మింగకూడదనే . ఇప్పటివరకూ జరగకూడని విధ్వంసం జరిగిపోయింది . ఇక  జరుగకూడదనే  వారి తపనంతా .   వారే కాదు ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ప్రజలు కోరుకునేది అదే కదా ..

*

 

 

ఎల్లలు దాటిన అద్భుతం – ఎల్లోరా!

ellora1

~

మా ఎలోరా యాత్ర చాలా అకస్మాత్తుగానే జరిగింది. ‘ఈ సారైనా దసరా సెలవులకు ఎటైనా వెళ్దామా?’ అంటూ మా అమ్మాయి కావ్య అడిగిన ప్రశ్న కొంచెంగా కుదిపిందనే చెప్పాలి. చాలా స్తబ్ధంగా విరామం లేకుండా పరిగెట్టి ఒక్క తెరిపి చిక్కే సరికి ‘అవును ఎందుకెళ్ళగూడదు?’ అనే ప్రశ్నే సమాధానమనిపించింది. కొల్హాపూర్ లో వున్న తమ్ముడి కుటుంబాన్ని పలకరించి అలా షిర్డీ, పండరి, అజంతా – ఎలోరా లలో ఒకటైనా సరే చూసి వద్దామని బయలుదేరాం.

నేరుగా కొల్హాపూర్ కు రైలు లేకపోవడంతో  డబుల్ డెకర్ ట్రైన్ లో హైదరాబాదు సాయంత్రానికి చేరి నకోడా స్లీపర్ సర్వీస్ లో మర్నాడు వుదయానికి  దట్టంగా పొగమంచులో కిటికీ నుంచీ వరుసగా దాటిపోతున్న  గ్రామాలు, మనుషులను చూస్తూ సాంగ్లీ చేరేసరికి వుదయం 6.45 అయింది.  పొద్దున 7 .30 కల్లా కొల్హాపూర్ లోకి ప్రవేశించాం. నేనూహించిన సాంప్రదాయకమైన మహరాష్ట్ర దుస్తులలో మనుషులు ఎక్కడో ఒకటి, రెండు చోట్లలోనే కనిపించారు. బహుశా ఇంకా లోపలి వూళ్ళ కెళితే కనిపిస్తారు కాబోలు అనుకున్నాం. గ్లోబలైజేషన్ పుణ్యమా అని వేషం, భాష కట్టుబాట్లు మారుతున్నాయి గదా. భాషలు పేరులే మార్పు కానీ ప్రదేశాలన్నీ ఒకటే.

ellora4

తమ్ముని కుటుంబంతో ఓ రోజు గడిపి ఆ సాయంత్రం కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించాం. గోకుల్ పాలెస్ లో భోజనాల సమయంలో ‘కేవలం ఈ దేవాలయమే  కాక కొల్హాపూర్ లో పంచగంగా ఘాట్, శ్రీ ఛత్రపతి సాహు మ్యుజియం గా మలచబడిన రాజ సౌధం, టౌన్ హాల్ మ్యుజియం కూడా సందర్సించ దగినవి. కొల్హాపూర్ చెప్పులకు, బెల్లానికి కూడా ప్రసిద్ధి’ అని కూడా తెలిసింది. ఆ రాత్రే షిర్డీ కి బయలుదేరి తెల్లారేసరికి చేరాము.

మొదటి సారి షిర్డీ లో అడుగుపెట్టగానే అంతా గందరగోళంగా అనిపించింది. భక్తీ అంటే వాణిజ్యమనే నానుడి (నా గొణుగుడు) నిజమనిపించింది. ఇలా వాణిజ్యం లేకుండా మనుషులు జీర్ణించు కోలేరేమో. చుట్టుముట్టిన ఆటో వాలాలు, గదులు కావాలా, హోటల్స్ కావాలా, చాలా చవక అంటూ దళారీలు- ఓ నిముషం ఉక్కిరి బిక్కిరి అయ్యాము. అందర్నీ తప్పించుకు కొంత దూరం నడిచి ఊపిరి పీల్చుకు ఓ మాదిరిగా  మంచి హోటల్ లో రూమ్ తీసుకున్నాము. స్నానం , బ్రేక్ ఫాస్ట్ తర్వాత దర్శనానికి వెళ్ళడం మరో అధ్యాయం.

భక్తి అంటే  పెరిగిన ప్రేమ, అభిమానమే. దైవం మానుష రూపం లో అన్నట్లు గా తన సమాజంకోసం, తనను నమ్మిన వారికోసం కులమతాల కతీతంగా జీవించిన షిరిడీ బాబా పై ప్రత్యేక మైన ప్రేమ. అయితే ఈ ప్రేమను కూడా ఇలాటి చోట్ల, డబ్బు చేసుకునే వ్యాపారుల వల్లే కొంచెం పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలంటే జంకు. అనవసరమైన వన్నీ భక్తులకు అంటగట్టాలని దారి మళ్ళించే వ్యాపార దళారీలను తప్పించుకొని మొబైల్ వగైరాలు బయటే జమచేసి దర్సనానికి వెళ్ళి వచ్చాం .  షిరిడీ ఆలయం చుట్టూరా ఉన్న గ్రామమంతా హోటళ్ళు, లాడ్జి లతో నిండిపోయింది. మా కారు డ్రైవర్ చెబితే విని ఆశ్చర్య పోయాము, ‘వీటిలో ఎక్కువ భాగం తెలుగు వారివే నట’. నిజమైన మహారాష్ట్ర గ్రామీణ వాతావరణం చూడాలంటే గుర్రపు జట్కా లో పక్కనున్న పల్లెలను చూడాల్సిందే. షిర్డీ వెళితే బళ్లపై అమ్మే ఎర్రటి జామపళ్ళు తినాల్సిందే.

మర్నాడు ఉదయమే బయలుదేరి ఎలోరా వెళ్ళాము. చాలా ఆహ్లాదకరంగా కొండలు, కోనలు, చెరువులు గల దారిమధ్యలో ఘ్రుష్ణేశ్వర ఆలయాన్ని దర్శించాము. పెద్ద స్తంభాలు, చుట్టురా ఎత్తైన అరుగులు కలిగి విశాలమైన ప్రాంగణం కల చాలా పురాతన ఆలయం. ఈ రహదారి నేరుగా వెళితే ఔరంగాబాద్ కు, ఎడమకు వెళితే అజంతా కు తీసుకెళ్తుంది.

ఈసారి  ఎల్లోరా నే చూద్దామనుకున్నాం.  ఎప్పటినుంచో  వేరుల్, లేక ఏలపుర, లేక ఏలుర – అదే మన ఎలోరా గురించి విని, చదివి ఉండడంతో చాల్ల ఉత్సుకత నిండిన మనస్సులతో చేరుకున్నాం. కొండలను గుహలలా, ఆలయాల్లా మలిచి సృష్టించిన మహాద్భుతం ఈ ఎల్లోరా గుహల సముదాయం. బౌద్ధ, హిందూ జైన సంప్రదాయాలకు సంబంధించినవీ గుహలు. ఈ గుహలనన్నీ  చరణాద్రి పర్వత సానువుల్లో (600 – 1000 C.E)  తొలిచి నిర్మించినవి.

ellora2

మనం అక్కడికి చేరుకోగానే గైడ్ లు మనల్ని అనుసరిస్తారు. ముందుగానే వివరాలన్నీ దగ్గరుంచుకుని లేదా మంచి అనుభవజ్ఞు దిన గైడ్ ను ఎంచుకుని దర్శించవచ్చు. బయట ఎలోర కు సంబంధించిన పుస్తకాలు అమ్ముతూ కొందరు అనిపిస్తారు. వీరి వద్ద కంటే లోపల ప్రభుత్వం వారి టూరిజం కౌంటర్ లో ధర తక్కువగా లభిస్తాయి.

ఇక్కడ దాదాపు వంద గుహలున్నాయి. అయితే 34 గుహలు మాత్రమే దర్శించడానికి అనుమతిస్తారు. వీటిలో 12 (1-12) బౌద్ధ గుహలు, 17 (13-29) హైందవ గుహలు, 5 (30-34 ) జైన గుహలు. ప్రతి గుహా వారి వారి పురాణాలకు సంబంధించిన గాధలను తెలిపే శిల్పాలను ఆవిష్కరిస్తుంది. ఇవన్నీ  కూడా రాష్ట్రకూటులు, యాదవ వంశస్తులు నిర్మించినట్లు చరిత్ర, శాసనాలు తెల్పుతున్నై. ఒకప్పుడివి ప్ర్రార్ధనాలయాలుగా భాసించ బడ్డా, కాలక్రమంలో శత్రువుల దండయాత్రలలో దెబ్బతిని, ప్రాభవాన్ని కోల్పోయి ప్రస్తుతం పురాతన సందర్శనా స్థలాలుగా నిలిచిపోయాయి.

16 వ నంబరు గుహ అత్యద్భుత సాక్షాత్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద, మొదటి ఏకశిలా కైలాస దేవాలయం. కైలాసాన్ని తలపించే ఒక పెద్ద దేవాలయాన్ని , చుట్టురా ఉండే ప్రాకారం, రెండు ధ్వజ స్తంభాలు, ఎదురుగా రెండు పెద్ద ఏనుగులు , ఆలయ పాలకుడి మందిరం, ప్ర్రార్ధనాస్థలం, గర్భాలయం, దాని చుట్టూ బయటగా ఐదు చిన్న ఆలయాలు – ఇవన్నీ ఒకే పర్వతం లో ఒక మహా దేవాలయంలా నిలువెత్తు , అంటే దాదాపు పది పదిహేను అడుగుల ఎత్తుగల శైవ వైష్ణవ గాధలను ప్రతిబింబించే శిల్పాలు కనులముందు నిలిచి మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఒడలు గగుర్పొడిచి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రవేశద్వారానికి అటూ ఇటూ పురాణేతిహాసాలకు సంబంధించిన శిల్పాలు దర్సనమిస్తాయి. లోనికి ప్రవేశించగానే గణపతి, మహా శివుడు, మహావిష్ణువు, గజలక్ష్మి , శిల్పాలు కనుల విందు చేస్తాయి.

ఈ ఆలయాన్ని దాదాపు 200,000 టన్నుల  రాతిని తొలిచి శిల్పులు నిర్మించారు. అంత కొండ ని తొలచి ఆ శిలా వ్యర్ధాన్ని తరలించి అంత పెద్ద ఆలయాన్ని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టించారో నన్న ఊహే మనలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

గర్భ గుడి ముందరి ప్రార్ధనా మందిరం విశాలంగా పెద్ద పెద్ద స్తంభాలతో తీర్చిదిద్దబడి  ఉంటుంది. మామూలుగా నేలపై నిర్మించిన దేవాలయంలో ఉన్న అనుభూతి కలిగిస్తుంది. ఆలయం చుట్టూ మరియు ఇతర గుహలలో దశావతారాలు, శివ పార్వతుల కళ్యాణ అంశాలు, నరసింహ, రామ, కృష్ణ అవతార విశేషాలు ప్రముఖంగా కనిపిస్తాయి.

ellora3

అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రదేశాన్ని తిలకించడానికిమంచి కాలం. అంత ఎండా అంత చలీ కాకుండా కుటుంబ సభ్యులతో కులాసాగా వెళ్ళి రావచ్చు. ఎలోరా పూర్తిగా చూడడానికి మూడు రోజుల సమయం కేటాయిస్తే బాగుంటుంది. ఒక రోజులో ఐదారు గంటలలో రెండు గుహలను మాత్రమే చూడగలం.  విహార యాత్రలు చేస్తూ, భారత దేశంలో పుట్టి అజంతా ఎల్లోరా లను చూడకపోవడం మహా ద్రోహమే ననిపిస్తుంది. మానవుని సృజనాత్మక శక్తికి, విధ్వంసపుటాలోచనా విధానానికీ ఎల్లోరా ఒక సజీవ చిహ్నం.

తిరిగి వస్తుంటే కావ్య ఒక ప్రశ్న అడిగింది. ‘ నైట్ ఎట్ ది మ్యుజియం’ సినిమా లో లాగా ఈ శిల్పాలకు రాత్రి సమయాలలో ప్రాణం వస్తే ఎలా ఉంటుందీ?’ అని. అవును, ఆ ఊహే చాలా విచిత్రం. అంతటి మహారూపాలు సజీవంగా సంచరిస్తే ? ఆ సంగీత ధ్వనులు, ఆభరణాల సవ్వడులు, నృత్యాలు, ఏనుగులు, గుర్రాలు, శరభాలు, సింహికలు, యక్షులు, యుద్ధశబ్దాలు ,.. ఓహ్, ఓ అద్భుత దృశ్య కావ్యం! అయితే నాకు ఇంకో కోరికా కలిగింది. వెన్నెల్లో స్నానించే ఎల్లోరా ను చూడాలని!

ఫోటోలు: శ్రీ కావ్య,కోగంటి

శాంతికీ కాంతికీ లోగిళ్ళు!

 

chettinadu-mansion

తుప్పరలతోబాటు వీచిన గాలి కి గోధూళి అలుముకుంటుంది. ఉరుములు మెరుపులతోబాటు చిలికిన జల్లులకి కోనేరు నిండిపోతుంది. అప్పటిదాకా ఆడుకుంటున్న పిల్లల ఆటవిడుపుకి మరో నిర్వచనం వచ్చి చేరుతుంది. వడివడిగా ఎవరిళ్లకు వారు పరిగెడతారు.   అల్లిబిల్లి ఆడుతూ మండువా లోగిళ్లలోనూ, పూరిళ్ల చూరు కిందనూ వాననీటిని ఒడిసిపట్టుకున్న చిట్టి ఆటల చేతులు! వాననీటికి మట్టిమిద్దె గంధపు పవనాలు! వాన వస్తే ఇంటికి రావాల్సిందే!

కార్తీక దీపంతో చలికాచుకుంటుంది తులసికోట. చేమంతులు పూసే హేమంతవేళ…. వెన్నెల్లో .. గోరుముద్దలు తినిపిస్తుంటే పెరడంతా తిప్పే పిల్లలు ఆ చిట్టి చేమంతుల్లా విరగబూస్తారు! అయినా చలిగాలులు ఊపేస్తుంటే ఆ సుకుమారమైన  పూలకు, మొక్కలకు ఉన్న శక్తి బలవంతులైన మనుషులకెక్కడ ఉంటుంది? వణికే చల్లటిగాలులకు వెచ్చదనాన్ని అందించే కంబళి ఇల్లు!

పేరుకు మధుమాసం.  వసంతమే కానీ, మండిపడే సూర్యుడికీ, వడగాడ్పులకీ మామిడిపండ్లు, తాటిమున్జెలు తట్టుకునే ఉపాయాన్ని చెప్తాయి. అ ఊరటతో ఇంట్లోనే సాయంకాలందాకా ఇంటి ఆటలు,  గిల్లికజ్జాలతో సరిపోతుంది పిల్లలకి. పగలంతా ఇల్లే బుజ్జగించి కూర్చోబెడుతుంది.

ఇల్లు….. ఋతువులకనుగుణంగా, ఆదరాభిమానాలు అను-గుణాలకు మరోరూపంగా ఉండేది!  బంధుమిత్రుల్ని ఆదరించేది! ఎంత చిన్న ఇల్లైనా ఎంతమందివచ్చినా పుష్పకవిమానంలా మరొకరికి చోటునిచ్చేది! పదిమందికిపైగా కూర్చోబెట్టుకొని కబుర్లాడిన అరుగులు! పెళ్ళిల్లు జరిగినా, పేరంటాలు జరిగినా  గొప్ప వేదిక అరుగు!ఆటలు ఆడినా, పాటలు నేర్చినా ఈ అరుగు ఆసరా.

ఈ ప్రహరీ గోడల్లోనే జాజులు పూయించినా, సంపెంగలు పూయించినా  అరటిపాదులు వేసినా, కూరమళ్లు నాటినా అదో గొప్ప విజయం!

ఈ అంగణంలో కల్లాపి జల్లి ముగ్గులు దిద్దినా, చిన్నిపాపలు దోగాడినా అదో మురిపెం!

శుచిగా, రుచిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకునేందుకు అనువైన మట్టి కుండలు; కంచు,  ఇత్తడి, రాగి, ఇనుప వస్తు సామాగ్రి; రాతి తో చేసిన చిప్పలు, తిరగళ్లు, రోళ్లు;  వెదురు పుల్లలతొ అల్లిన బుట్టలు..ఇవన్నీ వంటింటి ఆరోగ్య సంపత్తులు!

పాడిపంటలకు, వృత్తి ప్రవృత్తిలకు అనుగుణమైన వెసులుబాటు ఉన్న ఇల్లు! .ఒకవైపు ఆవులు దూడల చావిడి మరోవైపు నట్టింట ధాన్యపు గాదెలు లేదా గరిసెలు!

ఇల్లు పుస్తకాల నిలయం! మంచి ఙ్ఞాపకాల చాయాచిత్రాల సమాహారం! లోపల దూలాలు, వాసాలతో ఉన్న ఇంటిపైకప్పు లోపలిభాగం , దూలానికున్న ఇనుప కొక్కేలకు తగిలించిన ఉయ్యాలబల్ల గొలుసులు, అమరిన ఉయ్యాలబల్ల, లాంతర్లు వేలాడదీసే ఇనుపరింగులు, పిచ్చుకలు ఉయ్యాలలూగే ఇనుపరింగులు,   ఆ  రింగు కు వేలాడుతున్న ఒక తీగకు గుచ్చిన ఉత్తరాల కట్ట తో ఎంత కళాత్మకం!

ఒక్కసారి ఇటువంటి ఇంటి ముంగిట్లోకి అడుగుపెట్టినట్లు ఊహించుకుంటే..సెపియా వర్ణ  యుగంలోకి అడుగుపెట్టినట్లుంటుంది.

ఇవన్నీ ప్రతి ఒక్కరికీ తమ చిన్నప్పటి అనుభవాలే!

కానీ ఇంతటి ఆనందమైన , కాంతిమయమైన అనుభవాలన్నీ ఎకోఫ్రెండ్లీ నిర్మాణాలతో కూడినవే!

అవును..గచ్చుఇళ్లు, బంకమట్టి ఇళ్లు ప్రకృతితో మేళవింపు కలిగి, నివసించేవారిక్కూడా మేలుచేసేవి.

కొన్ని దశాబ్దాల కిందటిదాకా కూడా సంప్రదాయాలకు లోబడే ఇల్లు రూపుదిద్దుకునేది.  అక్కడక్కడే లభ్యమయ్యే పదార్ధాలతోనే అక్కడక్కడి వాతావరణానికి అనుకూలంగానే కట్టబడేది. మార్పు చాలా సహజం.కొండగుహల్లో తలదాచుకున్న మనిషి అద్భుతమైన సౌధాలని నిర్మించలేదూ!?

కౌరవుల రాజధాని నగరంలో ఇళ్లు రెల్లుగడ్డిపై తాపడం చేసిన బంకమన్ను భవంతులు. అని మా పితామహులు చెప్పారు.

512px-dakshina-chitra-kerala-house

హంపి కట్టడాలు – లోటస్ మహల్, ఉదయపూర్ రాజస్థాన్ నీర్ మహల్, త్రిపుర  నీర్ మహల్….రాజులు, జమీందారుల వాతావరణ అనుకూల కట్టడాలు, ఆ కాలపు సాంకేతికత మనల్ని అబ్బురపరుస్తాయి.  ఏన్నో పురాతన హవేలీలు ఉత్తరభారతమంతటా నిలువెత్తు నిదర్శనాలుగా అనిపిస్తాయి. కొండరాళ్లని తొలిచి నిర్మించిన కోవెళ్లలో , చారిత్రిక  కట్టడాలలో, పురాతనంగా నిర్మించబడిన  గుడి, మసీదు, దర్గా, చర్చి లాంటి దేవాలయాల్లో కూడా చల్లటిగాలులు ఒదిగి ఒదిగి వీస్తాయి.  చిన్ని పూరిళ్లలోనూ, మట్టిమిద్దెల్లోనూ, పెంకుటిళ్లలోనూ అవే చల్లటిగాలులు ఆప్యాయంగా  వీస్తాయి. కలిమి లేముల ప్రసక్తి ప్రకృతికి లేదు కదా! ఆంతా సమానమే దాని దృష్టిలో!

సామాన్యమానవుడైనా, ఎంత గొప్ప మహారాజైనా వాతావరణనికి అనుకూలంగానే నిర్మించాడు కదా!

సామాన్యుడి ఇంటి గోడలు బంకమట్టిలో, వడ్లపొట్టు ని కలిపినవి అయితే, కలవారి ఇంటి గోడలు  ఎండిన లేదా కాల్చిన మట్టి ఇటుకలతో ఉండేవి!  అయితే ఇద్దరి ఇళ్ల గోడలకి మాత్రం  సారూప్యంగా సున్నపురాయి పూత ఉండేది.  సున్నపురాయి క్రిమి కీటకాలను రానీయకుండా చేయటమేగాకుండా ,  సూర్యకాంతిని పరావర్తనం చేసే శక్తి కలిగుండి,  వేసవిలో ఇంట్లో ఉండే  వేడి తీవ్రతని తగ్గిస్తుంది.  బాగా నూరిన సముద్రపు చిప్పల పొడి, సున్నపురాయి, బెల్లం కరక్కాయ ల మిశ్రమాన్ని కూడా గోడలకు పైపూతగా పూస్తారు. ఈ విధానం  వర్షాకాలం, చలికాలం లో ఇంటి ని తేమ  బారి నుండి కాపాడుతుంది. గోడలు చిరకాలం పాటు మన్నుతాయి. పైగా గోడలు చాలా నున్నగాకూడా ఉంటాయి.  సున్నపురాయి పూత పూసిన గోడలు వాన చినుకులు పడినా, నీటి జల్లు పడినా  పరిమళాలు వెదజల్లేవి.

నా చిన్నప్పుడు ఉలగరం గా ఉన్నట్లుంది అంటే, మా బామ్మ “నోట్లో మంచినీళ్లు పోసుకొని పుక్కిలించి గోడమీద ఉమ్మేసి వాసన చూడు” అనేది.  నీళ్లు పడగానే,  గోడనుంచి కమ్మని సున్నపు గచ్చు వాసన. గుండెలదాకా దాన్ని పీల్చటం అదో సరదా! అదో రసాస్వాదన! అదో ఆరోమా థెరపి.

ఇప్పుడేవి శోభాయమానంగా ఉండే ఈ స్వర్ణకాంతులు?

ఇప్పుడేవీ ఈ ఎకోఫ్రెండ్లీ నిర్మాణాలు అని ప్రశ్నించుకుంటే దక్షిణచిత్ర అని చెప్తుంది మనసు రూఢీగా!

దక్షిణచిత్ర  Deborah Thiagarajan స్థాపించిన , చారిత్రిక జీవనశైలిని ప్రతిబింబించే పద్ధెనిమిది ఇళ్ల సముదాయపు హెరిటేజ్ మ్యూజియం. architects : Laurie Baker,  Benny Kuriakose .

ఇది ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణమైన  గృహాలను తరలించి , పునర్నిర్మించిన సారస్వత వైభవ చిహ్నం!  ఇది  దక్షిణభారతం లోని నాలుగు రాష్ట్రాల లోని ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, వృత్తిప్రవృత్తులకు సంబంధించిన జానపద జీవనశైలిని మన కళ్లముందు ఉంచుతుంది కాలుష్య రహితమైన వాతావరణాన్ని  గుర్తుచేయిస్తుంది. ప్రకృతి సామరస్య కట్టడాల ప్రాశస్త్యాన్ని నొక్కిచెప్తుంది.

చెన్నాపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లేదారిలో  సంప్రదాయ పురాతన భవనాలతో అలరారే దక్షిణచిత్ర ని మనం చూసితీరాల్సిందే! ఇక్కడ ప్రతిఒక్క ఇంటిలోనూ ఆయా వృత్తిపనులు కొనసగుతూనేఉన్నాయి. దీన్ని ఒక జీవనచిత్రమనొచ్చు. చెప్పానుగా సెపియా టిన్ టెడ్ కాలంలోకి వెళ్లిపోయిన అనుభూతి అని!

మొదట తమిళనాడు విభాగం  తో  హెరిటేజ్ టూర్ మొదలుపెడదాం. ఈ తమిళ ఇళ్ల నమూనాలలో  అన్నింటికంటే ఆకర్షణీయమైనది చెట్టినాడు ఇల్లు. ఇది చెట్టియార్ల మండువాలోగిలి.  స్తంభాల తో ఉండే వరండా, అరుగులు , మండువా చుట్టూ గచ్చుడాబా గదులతో,మండువా అంతా ఎర్రటి మంగుళూరు పెంకులతో ఇల్లు విశాలంగా ఉంటుంది.

చెట్టియార్ల ని నట్టుకొట్టై  చెట్టియార్లు అంటారు. వీళ్లు  వర్తకులు. బాగా శ్రీమంతులు. వాళ్ల ఇళ్లంతా బర్మా టేకు తో చేసిన సీలింగులతో ఇంటి దూలాలు, స్థంభాలేకాకుండా ఇంటిలోపలి భాగమంతా టేకుతో చేసిన నగిషీలు చెక్కిన ద్వారబంధాలు,    మార్బులు ఫ్లోరింగులతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. నగిషీలు చెక్కి, ఇత్తడి గుబ్బలు పొదిగిన ప్రధాన ద్వారము, ద్వారబంధరము పై చిక్కని నగిషీలుచెక్కిన దేవుడి బొమ్మలు ఈ దేశవాళి ఇళ్ల  ప్రత్యేకత.

చెట్టియార్ల ఇళ్లని మనం అధ్యయనం చేస్తే వీళ్లు ప్రకృతి సామరస్యంగా ఎలా ఇళ్లని నిర్మించుకున్నారో మరింతగా తెలుసుకోవచ్చు.  ఎత్తైన సీలింగులు, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే అనువైన కిటికీలు, తలుపులు అన్నీ టేకు కలపతో చేసినవే. అన్నీ . ఈ ఇంటి గదులు ప్రత్యేకమైన పూత వేయబడినవి.

కరైకుడి  అనే ప్రాంతం చెట్టినాడు. హెరిటేజ్ బంగ్లాలకు పెట్టింది పేరు

ఇవి పురాతన వైభవం, సాంస్కృతిక సంపత్తుకి ఆలవాలంగా ఉంటాయి.

agraharam

తరువాత సంప్రదాయ బ్రాహ్మణ ఆగ్రహరము. దీన్ని దక్షిణచిత్ర లో విష్ణు అగ్రహారము అని అంటారు. ఇది తిరునెల్వేలిలోని అంబూరు గ్రామపు  సంప్రదాయ బ్రాహ్మణ అగ్రహారాన్ని పోలిఉంటుంది/తలపిస్తుంది.  మద్రాస్ టెర్రస్ లు, బర్మా టేకుతో చేసిన దూలాలు, స్తంభాలు, సున్నపురాయి పూతలున్న గోడలు, సరైన గాలి, వెలుతురుల సదుపాయాలతో ఉన్న ఇళ్ల సముదాయము. అగ్రహారపు వీధి అంతా వరుస ఇళ్లతో ఒకదానినొకటి ఆనుకొని ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. ఈ వీధి చివర ఒక విష్ణు అలయం కూడా ఉంటుంది. ఈ ఇళ్లు రెండంతస్తులచిన్న భవనాలు.  కలప స్తంభాలతో అరుగు, లోపల హాలు, చిన్న గదులు, పూజగది, వంటిల్లు , పెరడు, పై అంతస్తులో గదులుంటాయి.  గాలి వెలుతురు ప్రసరించటానికి పై అంతస్తులో చిన్న కిటికీలు ఉంటాయి.   ఈ వీధికి ఒక చివర పెద్ద వేపచెట్టు నీడనిస్తూ ఉంటుంది.  ఈ వీధి ఓ  సామాజిక  జీవనచిత్రాన్ని మన కళ్లముందు ఉంచుతుంది.

ప్రతింటికీ ఉన్న అరుగు …పెద్దవాళ్లు, బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగు వాళ్లు   చర్చించిన సామాజిక, రాజకీయ విశేషాలకు వేదిక ఇదే! చిన్నపిల్లలు ఆడుకున్న  గొప్ప ఆటస్థలమిదే! చుట్టువైశాల్యం ఎక్కువగా ఉన్న అరుగుమీది స్తంభాలు దాక్కునేందుకు మంచి జాగాలు. అంతేనా

ఉదయం మొదలుకొని సాయంత్రందాకా భయమన్నదే తెలియక ఎప్పుడూ తలుపులు తెరిచుంచిన ఇళ్లలో అసంఖ్యాకమైన  పిల్లల దాగుడుమూతల ఆటకు ఎన్ని జాగాలు!  ..నట్టింటిలో ధాన్యం గాదెలు, బస్తాలు, గరిసెలు, అటకలు..ఇలాంటివెన్నో!  ఇటువంటి నేపథ్యం నుంచి ఉన్నతంగా ఎదిగిన పిల్లల సమాజం ..తలచుకుంటే చాలు ఒక రీలులా తిరుగుతుంది.   ఏవరికివారే తమ చిన్ననాటి అనుభూతుల్ని నెమరివేసుకునేలా చేస్తుంది.

మాతామహుల ఇంటికి వేసవిసెలవులకు వెళ్లినప్పుడు, మధ్యాహ్నపు వడగాడ్పులకు మమ్మల్ని ఇంట్లోనే కట్టిపడేసేంతపనిచేసేవారు. ఆంత పెద్ద మధ్యహాలు బేతంచర్ల బండలు నల్లగా నిగనిగలాడుతూ ఉండేవి. పిల్లలందరం హాల్లోనే పడిదొర్లుతుండేవాళ్లం. విసనకర్రలు తప్పించి విదుత్ పంఖాలు ఇంకా ప్రవేశిన్చని కుగ్రామమది. మరి అంతమంది  ఉన్నా ఉక్కబోత ఉండేదికాదు. ఉన్డుండి వీచే సెగ గాలులు ఇంట్లో ప్రవేశించేసరికి చల్లని సమీరాల్లా మారిపోయేవి. ఆ ఇల్లు చేసిన మాయాజాలమిది!  ఈ కబుర్లు కొరతలేనివి. వీటిని కొద్దిసేపు పక్కనపెట్టి  హోం టూర్ కి మళ్లీ వచ్చేద్దాం.

dakshinachitra-traditional-chikkamagaluru-house1

మరో ఇల్లు తమిళనాడు పట్టునేత వాళ్లది. పట్టునేత అనగానే గుర్తొచ్చేది కాంచీపురం.  కంచిపురం నుండి తరలించిన ఇంటి నమూనానే ఇది. రంగురంగు పట్టుదారాలతో మగ్గము ఉన్న లోపలి వరండా కనిపిస్తుంది.  కళకళలాడే పట్టుచీరలు, వాటిని కట్టుకునే  పుత్తడిబొమ్మలు. ఆ శోభని ఏమని వర్ణించగలం!? కళామయమైన ఈ మగ్గపు ఇళ్లు , ఆ నేతకారుల రంగులమయ స్వప్నాలకు ప్రతీకగా కనిపిస్తుంది.

ఇక మరో ఇల్లు వ్యవసాయదారుని ది. ఇది కొంచెం చెట్టినాడు ఇంటిని పోలి ఉంటుంది. ఇవే కాకుండా కుమ్మరి, మేదరవాళ్ల(బుట్టలల్లేవారి) ఇళ్లుకూదా ఉన్నాయి.  అవి బంకమట్టితో నిర్మించిన ఇళ్లు. ఇళ్ల పైకప్పుగా తాటాకులుంటాయి. ఈ ఇళ్లక్కూడా ఇంటిముందు అరుగు ఉంటుంది.

మరిక ఆంధ్రప్రదేశ్ విభాగానికి వస్తే ప్రస్తుతానికి రెండిళ్లు మాత్రమే ఉన్నాయి. వరంగల్ జిల్లా గ్రామపు ఇల్లొకటి , దాన్ని ప్రాంతీయంగా “భవంతి” అని అంటారు. ఇది చేనేతకారుల గృహం. ఇంటిముందు రెండువైపులా పొడవాటి అరుగులు ఉంటాయి. ఇంకొకటి విశాఖపట్టణ ప్రాంతపు చుట్టిల్లు అని పిలవబడే ఇల్లు. చుట్టిల్లు అంటే గుండ్రంగా ఉన్న ఇల్లు అని అర్ధం. సముద్రతీర ప్రాంతం లోని ఇళ్లు ఇలా గుండ్రంగా ఉండటం వల్ల తరచూ వచ్చే తుఫాన్ తాకిడికి తట్టుకుంటాయి. గోడలుకూడా గుండ్రంగానే ఉండి,

పూర్తిగా బంకమట్టి తో కట్టినవి.

ఇంకా మరికొన్ని ఆంధ్రప్రదేశ్ ఇళ్లను రీలొకేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రెండే ఉన్నప్పటికీ, తమిళనాడులోని అగ్రహారం, వ్యవసాయదారుడి, కుమ్మరి, మేదర, పద్మశాలీల ఇళ్ల వాతావరణమే  తెలుగునాట కూడా కనిపిస్తుంది.

ఇక కర్ణాటక గృహాల విషయానికొస్తే బాగల్ కోట్ లోని ఇల్కాల్ చేనేతకారుని ఇల్లు. పూర్తిగా బండరాళ్లతో కట్టబడింది.

ఈ ఇంటిని చూడగానే సత్రాలు గుర్తుకువస్తాయి. బన్డలు పరిచిన బండ్ల మిద్దె.  చుట్టు రాతి గోడ కలిగి మధ్యలో రాతి కూసాలు ఏర్పాటు చేసి ఆ రాతి స్థంబాల మధ్యన రాతి దూలాలను అమర్చి వాటిపై పై రెండడుగుల వెడల్పు కలిగి నాలుగంగుళాల మందం కల రాతి బండలను వరుసగా పేర్చి వాటి సందులలో సిమెంటు చేసి బండల పైన  అంతా సున్నము వేస్తారు.  కాని వీటిలో విశాలమైన గదుల ఏర్పాటు చేయలేరు. పుణ్య క్షేత్రాల సమీపాన నిర్మించిన సత్రాలు అన్నీ ఇటివంటివే. ఇవి చిరకాలము నిలుస్తాయి. త్రిపురాంతకేశ్వరుడు, , బాలా త్రిపుర సుందరి ఆలయాల ధర్మకర్త మా మాతామహులు. ఆ ఆలయకొండ దగ్గరే మా సత్రం కూడా ఉండేది.  మరి ఇటువంటి సత్రం, చుట్టూ చింతచెట్లగాలి..ఉగాది సమయంలో, ఎండ తీవ్రతని కలిగించనీయని ఈ సత్రంలో దేవుడి ఉభయం అత్యంత సందడిగా జరిపించేవారు మా తాతయ్య.

ఇల్కాల్ చేనేతకారుని ఇంటికి బండరాళ్లతో,  చెక్కతో ఉన్న ఒక పెద్ద ప్రవేశద్వారాన్ని నిర్మించారు. ఈ ఇంటిపైకప్పు  చదరమైన బండలు, మట్టి సాయంతో పేర్చబడింది.

ఈ ఇంటిలో ఏకొద్దిపాటి చెక్కను వాడినా, అదిమాత్రం వేపచెక్కనే వాడారు. ఉత్తరకర్ణాటకలో ఎక్కువగా దొరికేది వేప కలపనే. దాన్నే వాడుకున్నారు.

వేప త్వరగా పుచ్చిపోదు. ఇళ్ల కిటికీలకు, తలుపులకు, గుమ్మాలకు వాడొచ్చు. టేకుని వాడేంత ఆర్ధికస్థితి లేనప్పుడు వేపచెక్కని వాడటమే శ్రేష్ఠం.

మరొక ఇల్లు చిక్ మంగుళూరులోని సంప్రాదాయ రెండంతస్తుల భవనం. ఇది ముసల్మానుల గృహం.  చిక్ మంగుళూరు లోని కొండప్రాంతంలో సమృద్ధిగా దొరికే కలపతో నిర్మించారు. ముస్లిముల వైభవాన్ని, కొంత అరబ్, టర్కీ దేశాల వాస్తు ప్రభావాన్ని కలిగున్న 1914 నాటి కట్టడమిది.  దక్షిణచిత్రకి తరలించి తిరిగి అలాగే నిర్మించారు. దీని వరండా విల్వంపు కమానులతో, నిలువెత్తు స్తంభాలతో , అందంగా చెక్కిన ముఖద్వారంతో  ఉంటుంది.  కిటికీలు కలప, సున్నపుపూతతో అద్దిన డిజైన్స్ తో అందంగా అమరించిఉన్నాయి.  ఇంటిలోపల పింగాణీ కళాకృతులు, మేజాలు, సోఫాలతోనూ ఐశ్వర్యమయంగా ఉంటుంది.

ఇక కేరళ ఇళ్లు..వీటిగురించి తెలియనిదేముంది?  ఎర్రటి దేశవాళీ పెంకుల వాలు వసారాలతో, పైకప్పులతో ప్రతిఒక్క వాననీటిబొట్టు తిరిగి ధరిత్రిని చేర్చే సహృదయంతో ఉంటాయి ఈ ఇళ్లు.

dakshinachitra_traditional_kerala_syrian_christian_house1

ఇక్కడ దక్షిణచిత్రలో నాలుగు రకాల కేరళ ఇళ్లు ఉన్నాయి. మొదటిది సిరియన్ క్రిష్టియన్ ఇల్లు . ఇది ట్రావెంకూర్ ఇళ్ల నమూనాలా ఉంటుంది. ఇది 1850 లో కట్టబడినది. దక్షిణచిత్రలో  తిరిగి దీన్ని నిర్మించారు. ఇల్లంతా పూర్తిగా కలపతోనే నిర్మితమై ఉంటుంది.  కలప మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారిదీ గృహం. ఇ ఇంటి వరండాకి ఒక పడవ వేలాడదీసి ఉంటుంది.

ఇక పుట్టుపల్లి ఇల్లు. ఈ ఇంటిలో కలపతోచేసిన ధాన్యాగారము, ఆవుల చావిడి కూడా ఉంది. ఈ ఇల్లు కొంచెం బ్రిటీష్ వాస్తుని పోలి ఉంటుంది. తిరువనంతపురం లోని నాయర్ ఇల్లు ఇక మూడవది. ఇది కూడా పుట్టుపల్లి ఇంటిలానే ఉన్న పెద్ద భవనం. పూర్తిగా టేకుతోనే కట్టారు. ఇది దక్షిణ కేరళ ఇళ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఉత్తర కేరళలోని కాలికట్ ఇల్లు మరొకటి,  దీన్ని కంకరతో కట్టారు. ఇది ఒక మేనన్ కుటుంబానికి చెందినది.  దీని ఇంటిమండువాని  నడుముట్టం అని పిలుస్తారు. ఎత్తైన టేకు స్తంభాలతో ఇంటి మధ్య లోగిలి తో ఉంటాయి. పైనుంచి తొంగిచూసే కాంతి, ఉండుండి వీచే చల్లటిగాలి , అప్పుడప్పుడు చప్పుడు చేసే వాన చినుకులతో మంచి ఙ్ఞాపకాల్ని అందిస్తుందీ నడుముట్టం.  ఈ ఇంటినిండా చిన్న చిన్న  గదులు చాలా ఉన్నాయి. కాంతి చాయలు పరుచుకున్న ఈ నడుముట్టం వరండాలలో కేరళలో ప్రాశస్తమైన మ్యూరల్ పెయింటింగ్స్ ఉన్నాయి.

ఈ దక్షిణచిత్రని చూస్తే మళ్లీ మనకు అవసరమైన సాంఘిక, ప్రకృతిమయ జీవితం తిరిగి పొందినట్లు ఉంటుంది. పిల్లల ఆటపాటలతో , పెద్దల సామరస్య జీవన కట్టుబాట్లతో ఒకప్పుడు సామాన్య ప్రజలు  ఎలా జీవించారో తెలియచేస్తుంది.

కేరళ వాళ్లు ఇటువంటి ఇళ్లని, భవనాల్ని ఇంకా కాపాడుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఇళ్లు అడపాదడపా ఎక్కడో అక్కడ మనము పుట్టిన తెలుగునాట మొదలుకొని దేశమంతటా కనిపిస్తూనే ఉంటాయి.  స్పెయిన్, ఫ్రెంచ్ . ఫొర్చుగీసు , బ్రిటీష్ వారి వాస్తుశైలికి ప్రభావమై నిర్మించిన  హెరిటేజ్ కట్టడాలను కలకత్త, తమిళనాడు, పాండిచ్చేరి, గోవా, కూర్గ్, కేరళలలో హోంస్టే లుగా టూరిస్ట్ లకి వసతిని కల్పిస్తున్నారు. కొన్ని  హెరిటేజ్ బంగ్లాలు అధునాతన హోటళ్లుగా రుపుదిద్దుకున్నాయి. యాంటిక్ శైలికి ప్రభావితులైనవారకి  సెలవుల్లో విడిదిగృహాలవుతున్నాయి. .

ఈ దక్షిణచిత్రని సందర్శించినప్పుడు ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి అనుభవాలను నెమరువేసుకుంటే, చిన్నపిల్లలు సరికొత్త అనుభూతులకు లోనౌతారు.  ఉదయం నుంచి సాయంత్రందాకా తిరుగుతూ ఆ ఇళ్లమధ్య తమని తాము తిరిగి పొందవచ్చు!

గుండెలోతుల్లో నిక్షిప్తమైన ఆ రోజుల్ని కళ్లముందు తిరిగి ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది ఈ దక్షిణచిత్ర!

మున్ముందు అవసరమయ్యే ప్రకృతి సామరస్య జీవన విధానానికై కనువిప్పు కలిగించి, స్ఫూర్తిని అందిస్తుంది ఈ దక్షిణచిత్ర!

*

ఆ నాలుగు రోజులూ చిత్ర యాత్రా లోకంలో…

chitra1

పచ్చపచ్చని కొండలు  పరవశాన్నంతా  పరుచుకుని  ఆనంద సాగరంలో మునిగి పోవడం   అనకాపల్లి  రైలు   ప్రయాణంతోనే మొదలయ్యింది .ఒకే అభిరుచి గల మిత్రులతో నాలుగు  రోజులు ప్రయాణించడం ఎంత గొప్ప  అనుభూతో .అదీ ప్రకృతిలోకి  ప్రయాణించడం .అదీ సాహిత్యంతో పాటుగా ప్రయాణించడం ఇంకెంత సాహిత్యానుభూతో కదా! నింగి  చందమామలు  నేలకు దిగి వచ్చి  దేవదూతలతో  ప్రయాణం చెయ్యడం  మరీ చెప్పరాని పరవశం.

ప్రకృతీ ప్రేమా ఆప్యాయతలు ఆనందాల కలబోతలు,రచనలు,రచయితలు.ఓహ్ ఎంత చక్కటి కమ్మని కాఫీ లాంటి జ్ఞాపకమో! ఆకాశం  గొడుగు కింద  చేతులు రెండూ రుద్దుకుంటూ  పొగలు కక్కే కాఫీని చప్పరిస్తూ వాన చినుకులు భూమిని ముదాడి ,ఆ నీటి బుడగలపై ఇంద్రధనుస్సులు మెరిసి ,పగిలిపోయిన బుడగలతో పాటుగా  సప్తవర్ణంలో మెరిసి పోతుంటే ఓహ్!  జీవితానికెంతటి గొప్ప భరోసా!

జ్ఞానాన్వేషి  అయిన మనిషి ఆత్మావలొకనంలోకి వలస వెళ్ళి రావడం మనసుకెంత ఆరాటమో! స్త్రీలందరూ దేవతల రూపం ధరించి  ముందుకు వచ్చి అమృత భాండాలను  మా చేతుల్లోకి వొంపి ,గాల్లోకి ఎగిరే ముంగురులను సవరించుకుంటూ నవ్వుల మోముల నిండా మరింత పరిమళమద్దుకుని ,ముందుకు వచ్చి  వరాలిస్తున్నట్టుగా సంచరిస్తుంటే మనిషికి నిజంగా ఏమదృష్టం. మా ఆనంద సాగర తీరాల వెంట  నడవడానికి బాటల వెంట వంతెనలు వేసిన వీళ్ళకు నమోవాకములు. ప్రకృతి స్వేచ్చగా నర్తిస్తూ మైమరిపిస్తూ ఎంతో మంది గడ్డకట్టిన హృదయాలను  సమ్మోహపరిచేందుకు ,మనిషి కరిగి నీరయ్యేందుకు   ఎన్ని నదులుగా విచ్చుకుని  వగలు పోతుందో!    అలాంటి ప్రకృతిలోకి ప్రయాణం కట్టించిన సారధులకు ప్రణామములు

ఆ ప్రకృతిలో మరో ప్రకృతి  వింతైన అనుభూతి కలిగించే అజంతా సుందరి.అల్లరిలో కూడా ఎంత అద్భుతమైన లయ వుందొ!ఆమె కొద్దిసేపు బాల్యంలోకి వెళుతుంది.కాసేపటికి ఆరిందాలా మారిపోయి జీవన గీతాలను బోధిస్తుంది.మరి కొద్ది సేపటికి పురి విప్పిన మయూరమే అవుతుంది.మరి కొంచెంగా మాట్లాడితే బుంగ మూతి పెడుతుంది.కాసేపటికే వెన్నెల జలపాతమౌతుంది.వర్షించే మేఘమవుతుంది.పచ్చపచ్చని  చీర కట్టే పచ్చని  ప్రకృతవుతుంది. జీవించడమంటే  ఏమిటో జీవనమెలా వుంటుందో, ఆనందసాగరంలో మునిగి తేలడమంటే ఏమిటో చేతివేళ్ళ కదలికలతోనే తెలియ  జేస్తుంది.

నాగరికత  నిండిన మనుషులు ప్రకృతిలోకి  వలసపోయినప్పుడు ప్రకృతెంత  ఆనందపడి పోతుందో!  దారంతా ఇలా పచ్చ పచ్చని   జ్ఞాపకాలుగా మారిపోయి  మేఘాలూ,వర్షమూ,లోయలూ,కొండలూ కలగలిసి పోయి ఒక గొప్పసుందర  దృశ్యాన్ని ముందుకు తెచ్చిపంచిపెట్టి  విందారగించమంటే మేము మా స్వప్నాల్లోకి జారిపోయి మాయా ప్రపంచంలోకి వలస పోయాము.

శివుని ఝటా ఝూటం నుండి  నేరుగా  నేలకు జారే గంగమ్మ తల్లిలా జలపాతాలు ఆకాశం  నుండి  లోయలోకి జారి పొగ మంచులా విడిపోయే  నీటి ఆవిరుల మధ్య మేమూ తెల్లటి నీటి వస్త్రాలు కప్పుకుని దేవతా లోకంలో విహరించి వొచ్చాము. ఆ జల ధారల ముందు మేము ఎన్నెన్నో సరిగమలు విన్నాము .ఘడియఘడియకూ రూపం మార్చుకుని   గీతమై  గుండెలపై వాలిపోయే ఆ వొంపుసొంపుల వయ్యారి  మమ్మల్ని మరో లోకంలోకి ప్రయాణం కట్టించింది.ఆమె ముందు ఎన్నోపురా జీవ దృశ్యాలు అవగతమయ్యాయి.ఆదిమ వసంతం కళ్ళ ముందుకు వొచ్చి నిలిచింది.అదొక స్వప్నం. అదో నమ్మలేని నిజం. అదొక వింత అనుభూతి.అదొక  ఆనంద పరవశాల  పర్ణశాల  .గుండె తలుపులు తెరిచి మాలిన్యాన్ని శుభ్రం  చేసుకోవడం.,గుమిగూడిన మనుషుల్తో ప్రేమ బంధం పెన వేసుకోవడం.సహజ సిద్ధ మానవ ఈతి బాధల్ని దూరం చేసుకోవడం. మకిల పట్టిన  మనసుకు సాంత్వన చేకూర్చడం.బరువెక్కిన మనసుల్ని తేలిక పర్చుకోవడం.జీవితాల్ని  నిండుగా పలవరించాలనుకునే వారంతా కలిసి సంబరం చేసుకోవడం.ఇది నీటి కోలాహలం.జలపాతాల జాతర. నీటి తరగల విశ్వరూపం  .

ఆ విశ్వరూపాన్ని దర్శించుకుని నీటి జాడల నుండి మనసుల్ని  బలవంతంగా తెంచేసుకుని నీటి వాలుల గుండా ఎత్తైన కొండ సానువుల గుండా గడ్డి బయళ్ళ నుండి  భారంగా అడుగు తీసి అడుగేసుకుంటూ బయట పడ్డాము.అక్కడ మళ్ళీ మరో ప్రపంచం.ఆదివాసీ దేవదూతలు మాముందు ప్రత్యక్షమయ్యారు.మొలలకు అడవి అందాలను ధరించి ,తలలకు చంద్రవంకలను అలంకరించి ఢమరుకాలను చేతపట్టుకుని కాలి గజ్జలు ఘల్లుఘల్లు మంటూ అడవుల నుండి, మానవ మూలాల నుండి పూర్వీకుల నుండి బాంధవ్యాలను మూట గట్టుకుని  ఆప్యాయంగా మాముందు  నిలబడ్డారు

chitra2

వాళ్ళను చూస్తుంటే పేగు బంధమెక్కడో  మెదిలినట్టయింది.బంధుత్వమేదో    కలిసినట్టనిపించింది.బాంధవ్యమెక్కడో మెలకువలో కొచ్చింది.సంగీత వాయిద్యాల నిండా అమృతం నింపుకుని వచ్చి  మా ముందు ఒలకబోశారు. గొంతుల నిండా అమృత  జీరతో మా ముందు ధారగా ప్రవహించారు. అడుగు అడుగులో అడుగేస్తూ తల ఎగరేస్తూ ,ఝనక్ ఝనక్ మని చిందేస్తూ కలిసి నడుస్తూ కదం తొక్కారు.కలిసి మెలిసి ఆడారు.పాడారు.కాలాన్ని ఘనీభవింపజేశారు.మరో లోకానికి మమ్మల్ని లాక్కెళ్ళి పోయారు.సంగీత కెరటమై లేచారు.నిజంగా మనుషుల ఆత్మీయ కరస్పర్శ ఎంత అనుభూతి మయమో కదా !

ఆధునిక విధ్వంసానికి గురయ్యేవారు, బయటి ప్రపంచపు వెలుతురు చూడనివారు,సూర్యుని వేడికే వొగుడాకులా  రెపరెపలాడేవారు ,పుట్టుకంతా  కష్టాల  కడలే అని భావించేవారు వీళ్ళ  చాయల్లో,వీళ్ళ   కర స్పర్శతో  విప్పారిన హృదయంతో  వాళ్ళ రహస్యాలు వింటే చాలు మానవతలోకి రూపాంతరీకరణం  చెంది  సంబంధ బాంధవ్యాల చెంతకు పరుగెత్తుకు వెళ్ళాల్సిందే

అలా ఆ రాత్రి మత్తు మత్తుగా నిద్దరోయింది.మళ్ళీ ఉదయాన్నే బద్దకంగా వొళ్ళు విరుచుకుంది.. మళ్ళీ పరుగుల పోటీ .ఎక్కిన కొండలు చూసిన గుట్టలు దిగుతూ వానలో తడుస్తూ ,వానలోనే రోడ్డు వారగా విందారగిస్తూ మిత్రుల్తో కరచాలనం చేస్తూ,వీడ్కోలు కబుర్లు చెప్పుకుంటూ తిరుగు ప్రయాణం.కాలు  కదిపితే చాలు ఎవరో పిలిచినట్టు పరుగెత్తుకొచ్చే  వాన జల్లుల్లో మురిసిపోతూ ముద్దవుతూ ,అడుగడుగునా ఆప్యాయతారాగాలు కురిపించే  దేవతల చెంత మేమంతా ఆ నాలుగు రోజులూ… ఎంత కమ్మని  స్వప్నమిది.కరిగిపోకుండా,కదిలిపోకుండా వుంటే ఈ కాలం ఎంత బాగుండు అనిపించేలా! ఈ చిత్ర కూటమి ఆద్యంతం అద్భుత లోకంలో విహరించి వొచ్చినట్టు.

ఆ కలల్లో మేమంతా

ఆకుపచ్చని హరిత వనాలయ్యాము

వెన్నెల జలపాతాలయ్యాము

సువాసనల పూలజల్లులమైనాము

అడవి వూహల వెచ్చదనమయ్యాము

ఆనందసాగర చర్చలమయ్యాము

వయ్యారి జలపాతాలమయ్యాము

అడవిపూసే తంగేడుపూవులయ్యాము

అమరులైన  అడవిబిడ్డల పాటలయ్యాము

గజ్జకట్టీ అటలాడే ఆటల్లో మేం ఆటలయ్యాము

దారిపొడుగునా అడవికి ఆత్మలమయ్యాము

పిల్లల్లో పిల్లల మయ్యాము

పెద్దల్లో పెద్దల మయ్యాము

ఆత్మీయుల ఆలంబనలమయ్యాము

మానవత్వపు ప్రభోదమయ్యాము

సాహిత్యపు సువాసనలయ్యాము

మర్చిపోలేని స్వప్నలోకమయ్యాము

*

 

 

 

చిత్రకూటమి సహప్రయాణం

gop3

కలల్లో …కలవరింతల్లో… మెక్సికో!

highres_443910893

ప్రయాణానికి ఏర్పాట్లు – 2016

పెళ్ళికి ముందు పెళ్ళికూతురు ముస్తాబవుతున్నట్టు మన బైకుని కూడా దూరప్రయాణానికి సిద్ధం చెయ్యాలి. కార్లకి లాగా బైకు టైర్లు ఎక్కువ రోజులు రావు. మహా అంటే అయిదువేల మైళ్ళు. సాంబారులో తగినంత ఉప్పు వేసినట్లు బైకు టైరులో గాలిని తగినంత ఉండేలా చూసుకోవాలి.లేకపోతే టైరు మరికొంచెం తొందరగా అరిగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్యనే ఓజార్క్సు వెళ్ళినపుడు టాళ్ళమేనాలో బైకు వెనక టైరు పంచర్ అయింది.

“టైరులో సరిగ్గా గాలి లేకపోవడమే ఇందుకు కారణం!” అని ఫరూఖ్ చెప్పాడు.

అపుడు మార్చిన వెనక టైరుతో ఇంకో మూడు,నాలుగువేలు తిరగవచ్చు. ముందు టైరు మాత్రం మార్చుకోవాలి, అలాగే ప్రతి సంవత్సరం ఆయిల్ కూడా మారుస్తూ ఉండాలి. చలికాలం పోగానే పని చేసుకోవాలి. బైకు ఆయిల్ మనమే మార్చేసుకోవచ్చు. కారులాగా పెద్ద ఇబ్బందిఉండదు. నేను ఎలాగూ టైరు మార్చుకోవాలి కాబట్టి మెకానిక్ దగ్గర చేపిస్తే మంచిది అనుకున్నాను.

మాకు మీటప్ గ్రూపు కాకుండా వాట్సప్ గ్రూపు కూడా ఉంది. బైకు రిపేర్ల గురించి చర్చలు, సలహాలు, ముచ్చట్లు ఇక్కడ జరుగుతుంటాయి. సాయీ తనకు తెలిసిన ఒక మెకానిక్ ఉన్నాడని, డీలరు కంటే చాలా తక్కువగా చేస్తాడని చెప్పాడు. ఈసారి అతని దగ్గర ఆయిల్

మారుద్దా మని అనుకున్నా. కాకపోతే అతను మా ఇంటికి చాలా దూరం. పోను గంట, రాను గంట పడుతుంది. పైగా అతను సాయంత్రం ఆరువరకు మాత్రమే ఉంటాడు. నేను అతని షాపుకి చేరాలాంటే అయిదుకి మా ఇంటిలో బయలుదేరాలి. రష్ అవరులో ట్రాఫిక్ నరకం!అవసరమయితే శనివారం అతను మనకోసం షాపు తీస్తాడు. వారాంతం అంటే మన ఊళ్ళో చాలా హడావిడి. మనకి కుదరదు.

ఇతను మనకు కుదరడు అనుకునే సమయంలో అవతార్ సింగుమన ఇంటికి దగ్గరలోనే ఒక కొత్త మెకానిక్ షాపు తెరిచారు. ఇక్కడ చాలా సరసమైన ధరకే మరమ్మత్తులు చేస్తున్నారుఅని సెలవిచ్చాడు.

కావలసింది మన ఇంటిలోనే పెట్టుకుని ఊరంతా వెతికినట్లుంది అనుకుని కొత్త షాపులో కొత్త టైరుకొని ఆయిల్ కూడా మార్చేసాను.

మెకానిక్ బ్రేకులు, క్లచ్చు గట్రాలు చెక్ చేసిబండి కండిషన్ బాగుంది, ఇక కుమ్మేసుకోఅని నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

బండి అయితే సిద్ధంగా ఉంది, ఇక మిగిలింది ఒక్కటే! వానలకు సామాను తడవకుండా ఉండేలాంటి బాగు కొనుక్కోవాలి. కొలరాడో వెళ్ళినపుడు నా లగేజ్ అంతా గందరగోళం అయింది. నా బైకు షాపింగ్ అంతా మా ఊరిలోని సైకిల్ గేరులోనే!  ఖాళీ సమయంలో అక్కడే పచార్లు కొడుతూపనికిరానివీ, పనికివచ్చేవీ కొంటూ ఉంటాను. ఆన్ లైనులో వాటర్ ప్రూఫ్ బాగులకి యాభై శాతం పైగా తగ్గింపు ఉంది. ఎప్పటినుండో వీటిపైన ఒక కన్ను వేసి ఉంచాను. షాపులో వీటిని చూసి కొనుక్కుందామంటే వాటిని పెట్టిచావడు. చూసి కొందాములే అని నేను చాలా రోజులుకొనలేదు. తీరా మెమొరియల్ వారాంతానికి రెండు వారాల ముందు వాటిని షాపులో పెట్టి తగ్గింపు ధరని అటకెక్కించేసాడు.

“ఓరి వీడి దుంపతెగా! ఆశకు పోతే దోశ వచ్చిందిఅని వాడిని, నన్ను తిట్టుకున్నాను.

చూస్తూ, చూస్తూ బాగుని అంత ధరలో కొనలేను. ఇక ప్రత్యామ్నాయ మార్గాలని వెతకసాగాను. యూట్యూబులో మోటారుసైకిలు లగేజీల గురించి వెతుకుతూ, చూస్తూ గడిపాను. చివరికి REI లో నాకు కావలసింది దొరికింది. కొలరాడో వెళ్ళేటపుడు ఇక్కడే మడతకుర్చీకొనుక్కున్నాను. కుర్చీని మడతవేసి చిన్నగొడుగు పరిమాణంలోకి మార్చెయ్యచ్చు. కాంపింగ్, ట్రెక్కింగ్, ఆటలకి కావలసిన సామానంతా ఇక్కడ దొరుకుతుంది.  మనకి కొనే వస్తువు మీద అవగాహన లేకపోతే మనకి కొన్ని గంటలు క్లాసు పీకి చావగొట్టి చెవులు మూసేస్తారు. జన్మకి ఇంకొక అనుమానం వస్తే ఒట్టు! నాకు కావలసినది ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఎవరినీ కదిలించకుండా తెచ్చేసుకుందామని వెళ్ళాను. అయినా పసిగట్టి, పాఠం చెప్పేసి వెళ్ళిపోయాడు. నలభై లీటర్ల బాగు కొనుక్కున్నాను. ఇందులో బట్టలు కుక్కేసుకునిబంజీతాడులతో వెనకసీటుకి కట్టేసుకోవచ్చు. బంజీతాడులు మొలతాడుకంటే ఎంతో మేలు చేస్తాయి. ఇలా సామాను కట్టేసుకోవడమే కాకుండా జాకెట్టు, హెల్మెట్టు లాంటివి కూడా వీటితో బైకుకి కట్టేయచ్చు. ప్రతి బైకరు దగ్గర ఇలాంటి తాళ్ళు కొన్ని మనకి కనపడుతాయి.

మాకు మెక్సికో వెళ్ళడానికి వీసా అఖ్ఖరలేదు కానీ మేము తీసుకుని వెళ్ళే బైకుకి పర్మిట్ కావాలి. డాలసులోనే ఉన్న మెక్సికన్ ఎంబసీలో ఈ పని పూర్తి చెయ్యచ్చు. ఫరూఖ్ ముందుగా పర్మిట్ తీసుకుని మాకు ఎలా చెయ్యాలో తెలిపాడు. మొదటిసారి అపాయింటుమెంటుతీసుకోకుండా వెళ్ళి తిరిగి వచ్చాను. మెక్సికోకి ఫోన్ చేసి తీసుకోవాలి. ఫోన్ చేస్తే స్పానిష్ లో మాట్లాడుతారు. ఇంగ్లీషులో మాట్లాడితే ఫోన్ పక్కకు పెట్టేస్తారు. మన అవసరం కదా! పట్టుబట్టిన విక్రమార్కుడిలాగా ఫోను కింద పెట్టకుండా ఉంటే ఎవరో ఒక మహాతల్లి వెహికల్ పర్మిట్ కోసంఅపాయింటుమెంటు ఇచ్చింది. ఈసారి పని తొందరగానే అయిపోయింది. రెండువందలు మెక్సికన్ డాలర్లు డిపాజిట్ ఉంచుకుని పర్మిటుకి డబ్బులు కట్టించుకున్నారు. తిరిగి వచ్చేటపుడు సరిహద్దులో డిపాజిట్ వెనక్కి ఇస్తారట! నేను చాలావరకు ఇంటి నుండి పనిచేస్తాను కాబట్టి,ఆరోజు గడ్డం గీసుకోలేదు. నన్ను మెక్సికన్ అనుకున్నారు. పాసుపోర్టు చూసి కానీ నమ్మలేదు.

ఇదే విషయం మా దోస్తులకి చెపితేఅదే గడ్డం కంటిన్యూ చేసెయ్” అని ఒక ఉచిత సలహా పడేసారు. నేను నిజంగానే అన్నారేమో అనుకుని అలాగే గడ్డం ఉంచుకున్నాను.

పర్మిటుతో పాటూ మెక్సికోలో మన వెహికలుకి ఇన్స్యూరన్సు కావాలి. అమెరికా ఇన్స్యూరన్సు అక్కడ పని చెయ్యదు. మెక్సికన్ కన్సొలేట్ చెప్పిన కంపెనీ నుండి బాగా దమ్మున్న ప్లాటినం పాలసీ ఒకటి తీసుకున్నాము. ఇది నాకైతే చాలా బాగా పనికి వచ్చింది.

నెలకో, రెండు నెలలకో ఒకసారి కలుసుకుంటూ అందరి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. అమిత్ కూడా మాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వినయ్ ఇంకొన్ని రోజుల్లో వెహికల్ పర్మిట్ కోసం వెళ్తానన్నాడు. న్యూయార్కు నుండి రాము తన బైకుని ఒక నెల ముందే డాలసుకీ షిప్ చేపించాడు. రాముకి న్యూయార్కులో వ్యాపారం ఉంది. ఏ పని చేసినా మంచి డీల్ కోసం చూస్తూ ఊంటాడు. ఏదో చీప్ డీల్ అని బైకుని షిప్ చేసాడు. బైకుని తీసుకెళ్ళిన వాళ్ళు పక్క రోజు నుండి ఫోన్ ఎత్తడంలేదు. మనవాడికి ఫుల్లు చమటలు! అదృష్టవశాత్తూ రెండు రోజుల్లోనే లైనులోకి వచ్చి, క్షేమంగా డాలసులో బైకుని చేర్చారు.

మాలో ఎవరికీ స్పానిష్ పెద్దగా రాదు. స్పానిష్, రష్యన్ వచ్చిన బాబీ ట్రిప్పుకి రావడం లేదు. కనీసం కొంత ప్రాధమిక మాటలు నేర్చుకోవాలని యూట్యూబు, అండ్రాయిడ్ ఆపులు చూసుకుంటూ కూర్చున్నాము. గూగుల్ ట్రాన్స్లేట్ ఆప్ బాగా పనిచేస్తుందని దాన్ని డౌన్లోడ్చేసుకున్నాము.             

నాకు మెక్సికో వెళ్ళాలని ఎప్పటి నుండో కోరిక. నేను శాన్ ఆంటోనియోలో ఉండే రోజుల్లో వెళ్దామనుకున్నాను. ఒక్కడే అక్కడకి వెళ్ళడమంటే కొరివితో తల గోక్కున్నట్లే! ఒకసారి మా డ్రయ్యర్ పాడయితే రిపేరు చెయ్యడానికి ఒక పనివాడు వచ్చాడు. అతడు చిన్న వయసులోఉన్నపుడు మెక్సికో నుండి ఇటు వైపు వచ్చేసాడు.

అతన్ని కదిపితేనేను ఇంతవరకూ మళ్ళీ మెక్సికో వైపు వెళ్ళలేదు. మా ఆవిడ వెళ్ళనివ్వదుఅన్నాడు.

అంతే కాకుండాపోలీసులు బాగా అవినీతిపరులు. మనం సరిహద్దు దాటగానే మన వివరాలు చెడ్డవాళ్ళకి చేరవేస్తారుఅన్నాడు.

sree mexico

నేను చూసిన చాలా సినిమాలు ఈ విషయాన్ని మరింత నొక్కి చెప్పాయి. మా ధైర్యం ఏమిటంటే మాకు తెలిసిన బైకర్లు గత సంవత్సరం వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన రూటులోనే మేము వెళ్తున్నాము. వాళ్ళు ఉన్న హోటలులో బస చేస్తున్నాము. హోటలు బుకింగులు అన్నీఅయిపోయాయి. మేము వెళ్తున్న ఊర్ల గురించి వీకీలో చదువుతూ, యూట్యూబులో చూస్తూ వాటి గురించి తెలుసుకుంటూ ఉన్నాము.

వారం రోజుల్లో మెక్సికో వెళ్దామనంగా మా టీము ఒక కొలిక్కి వచ్చింది. ఫరూఖ్, నేను, అమిత్, రాము ప్రయాణం ఖాయం చేసుకున్నాము. వినయ్ కి సెలవలు దొరక్క మాతో రాలేకపోయాడు. బాబీకి మెక్సికో రావాలని ఎంతో కోరికగా ఉంది, అతనికి కూడా సెలవలు లేక ఆగిపోయాడు.అవతార్  సింగ్ కూడా చివరి నిముషంలో రాలేకపోయాడు. మెక్సికో నుండి రాము ప్రయాణానికి మూడు రోజుల ముందు డాలసు వచ్చాడు.

మేము బయలుదేరేముందు రాత్రి అవతార్ సింగ్ ఇంటిలో చిన విందు జరిగింది. డాలసులో ఉన్న బైకు మిత్రులు కొందరు రాముని కలవాలని, దానితోపాటూ మాకు వీడ్కోలు పలకాలని వచ్చారు. అందరం విందులో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడుపుతూ ఉన్నాము. కొంచెంలేటుగా వచ్చిన అమిత్ మమ్మలందరినీ కలవరపెట్టే మాట చెప్పాడు. అమిత్ సోమవారం నుండీ గురువారం వరకూ క్లైంట్ దగ్గర పని చేస్తాడు. గురువారం సాయంత్రం డాలస్ చేరుకుంటాడు. సాఫ్టువేరులో చాలా మంది ఇలాగే వారమంతా తిరుగుతూ ఉంటారు. అమిత్ వాళ్ళకి బాగాదగ్గర అయిన స్నేహితుడి తండ్రి హఠాత్తుగా చనిపోయారు. ఆరోజే డాలాసు చేరుకున్న అమిత్ రేపు ప్రయాణించడం కుదరదు అని చెప్పాడు. స్నేహితుని కుటుంబంతో మరి కొన్ని రోజులు తోడుగా ఉండాలని అన్నాడు.

మనం వేసుకున్న ప్రతి ప్లానూ పారుతుందని ఎపుడూ అనుకోలేము. అందుకే ప్లాను నుండి మొదలయి జెడ్ వరకు అందుబాటులో ఉంటుంది. ఇది కాకపోతే మరొకటి! దారులన్నీ మూసుకుపోయినా రెక్కలు కట్టుకుని ఎగరవచ్చు, లేకపోతే ఈతకొట్టి అవతలి గట్టు చేరవచ్చు. అందరం అలోచించడం మొదలుపెట్టాము. అందరూ సలహాలు విసిరిపారేస్తున్నారు. వాటిలో అందరికీ నచ్చిన సలహాని పట్టేసుకుని  దాన్ని ఖాయం చేసేసుకున్నాము. అదేమిటంటే నేను, ఫరూక్, రాము కలిసి అనుకున్న ప్రకారం రేపు ఉదయం డాలసు నుండి బయలుదేరుతాము.కాకపోతే లొరేడో వెళ్ళకుండా హిల్ కంట్రీ వెళ్తాము. పక్కరోజు లొరేడో వెళ్తాము. అమిత్ కూడా అదే రోజు మమ్మల్ని దారిలో కలుసుకుంటాడు. కొత్త ప్లాను విని వినయ్, నిలేష్ మాతో పాటూ హిల్ కంట్రీ వరకు వచ్చి పక్కరోజు తిరిగి డాలస్ వచ్చేస్తామని చెప్పారు. వస్తానన్నాడుకానీ మళ్ళీ ఎందుకో ఆగిపోయాడు. ట్రంప్, హిల్లరీ గురించి కాసేపు వాదులాడుకుని అలసిపోయి ఇంటికి వెళ్ళిపోయాము.

ఉదయాన్నే బట్టలు ఉతికేసుకుని వాటిని REI లో కొన్న బాగులో సర్దేసాను. బాగుని వెంకసీటు మీద అడ్డంగా ఉంచి, బంజీ తాడులతో కట్టాను. బండి తలకిందులు అయినా కూడా, అంటే మన తాడు తెగినా కూడా బంజీ తాడు తెగదు! క్రితంసారి బట్టలన్నీ బైకుకి తగిలించి ఉన్నసాడల్ బాగ్సులో ఉంచాను. ఈసారి బాగులో ఉంచేసరికి సాడల్ బాగులు ఖాళీ అయ్యాయి. అందులో టూల్ కిట్టు, కెమెరాలు కేబిల్సు సర్దాను. వీటిని ఎలా సర్దుకోవాలో రాముని చూసాక తెలిసింది. ఆవిషయం సమయం వచ్చినపుడు మీకు తెలియజేస్తాను. వర్షం వస్తే తడవకుండా రైన్గేరు సాడల్ బాగులో సర్దాను. రెండు టైర్లలో గాలి కూడా నిండుగా ఉంది. ఉదయం బయలుదేరేముందు పెట్రోలు కూడా కొట్టిచ్చేస్తే ఇక దిగులు ఉండదు.

మా ఆవిడ ఫోనులో గ్లింప్సు ఆప్ లోడ్ చేపించా. ఆపు వలన చాలా లాభాలున్నాయి. మా గ్రూపులో ఎవరన్నా వెనకబడితే, లేకపోతే ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటే వారి లొకేషన్ మిగతావారితో పంచుకోవచ్చు. మాపులో బైకరు ప్రయాణం మనం గమనిస్తూ ఉండచ్చు. మనం ఏ సమయంలో ఎక్కడ ఉన్నాము అన్న విషయం ఇందులో తెలిసిపోతుంది. పటంలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు చూసుకుని అందరం భోజనానికి ఎక్కడ ఆగాలో తెలుసుకోవచ్చు.

పక్కరోజు ఉదయం ఏడుకంతా కొపెలులో కలవాలనుకున్నాము. రాత్రి తొందరగానే నిద్ర పోవాలనుకున్నాము. 

మరికొన్ని గంటల్లో ప్రయాణం చెయ్యాలన్న ఆలోచన నిద్ర పోనివ్వలేదు. ఎపుడూ వెళ్ళని చోటుకి వెళ్తున్నాము. ప్రయాణం అంతా బాగా జరుగుతుందో, లేదో? మెక్సికోలోఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో? లాంటి ఆలోచనలు బాగా కలవరపెట్టాయి. అంతకుమందే అవతార్ సింగుగారి ఇంట్లో తీసుకున్న సురాపానం ఎక్కువసేపు ఆలస్యం చెయ్యకుండా నిద్రాదేవిని ముగ్గులోకి దింపింది.

*

 

బైకు మీద మెక్సికో…

 sree1
డాలస్,  నవంబరు, 2015

ప్రతి సంవత్సరం మా ఇండియన్ మోటార్ సైకిలు గ్రూపులో రెండు దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రతి వారం, రెండు వారాలకి డాలసు చుట్టుపక్కలాచక్కర్లు సరేసరి! మొన్న జూలై నెలలో తొమ్మిదిమంది కలిసి కొలరాడో వెళ్ళాము. వచ్చే జూలైలో లే లడాక్ వెళ్దామని మాకు అప్పటికే ఒక ప్రణాళికఉంది. ప్రపంచంలో మోటారుసైకిలు నడిపే ప్రతివారికీ లే లడాక్ యాత్ర అంటే ఒక కల! కఠినమైన దారులు, అంతే కఠినమైన వాతావరణం! ఇవికాకుండా 18000 అడుగులపైగా ఉన్న ఖాడుంగులా అన్న ప్రదేశంలో సవారీ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా ఇంత ఎత్తులోసవారి చేసే రహదారి లేదు. అందుకే ఇక్కడకి ప్రపంచం నలుమూలల నుండీ బైకర్లు వస్తూ ఉంటారు. 

ఈమధ్యలో మెమొరీల్ డే వారాంతం మెక్సికో వెళ్దామని తీర్మానించుకుని ఎప్పటిలాగే ఇర్వింగులోని మెకార్థర్ రోడ్ మీద ఉన్న స్టార్ బక్సులో ఒక సాయంకాలం కలిసాము. మా ప్రతి దూరప్రయాణం మొదలయ్యేది ఇక్కడ నుండే! ప్రయాణం గురించి మీటపులో ప్రకటించగానే ఇష్టమున్నవారుకలిసి కాఫీ తాగుతూ చర్చించుకోవడం, కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడే జరుగుతుంది. మొదటి మీటింగులో ఏదీ తేలదు,పోను పోనూవిషయాలు ఒక కొలిక్కి వస్తాయి.

మెక్సికో అనగానే చాలా మంది భయపడ్డారు, ఇష్టమున్న వాళ్ళు చేతులు కలిపారు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకోలేని వారు, వీలయితే చూద్దాముఅనుకున్నవారు కూడా వచ్చారు. మోటారుసైకిలు మీద దూరప్రయాణం చెయ్యాలంటే   కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. బైకుకికనీసం అయిదు గాలన్ల పెట్రోల్ టాంకు ఉండాలి. లేకపోతే ఒకేసారి ఎక్కువ దూరం ప్రయాణించలేము. టూరింగ్ బైకులు ఇటువంటి ప్రయాణాలకుఅనువుగా ఉంటాయి. కనీసం అయిదు గాలన్లు పెట్రోలు పట్టే వీలు,  ఎక్కువసేపు బైకు మీద కూర్చునే సౌకర్యం, తగినంత సామాను తగిలించుకునేవీలు ఉంటే మన ప్రయాణం సుఖంగా సాగుతుంది.

ఫరూఖ్, నేను మెక్సికో ప్రయాణానికి తయారుగా ఉన్నాము. న్యూయార్కు నుండి రాం కూడా మాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అవతర్ సింగ్కూడా అలోచించుకుని చెప్తాను అన్నాడు. వినయ్ కి ఆఫీసులో సెలవు ఉంటుందో, లేదో తెలియదు. నిదానంగ చెప్తాను అన్నాడు. నేను ఫిట్టింగ్సెక్షనులో సూపర్వైజరు కాదు, డైలీ లేబరు! నేను పని చేస్తే జీతం, లేకపోతే లేదు, అందుకే నాకు సెలవలు బాగా వీజీగా దొరికేస్తాయి!

అందరి మెదడులో ఒకే ప్రశ్న! “మెక్సికోలో ఎక్కడకి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? వెళ్తే తిరిగి వస్తామా?”

“ఈ విషయాన్ని నాకు వదిలేయండి, నేను తొందరలోనే చెప్తాను” అని ఫరూఖ్ చెప్పాడు.

ఫరూఖ్ మనసులో ముందే ఒక ప్లాన్ వేసుకొని ఉంటాడు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిగానీ బయటకు వదలని చాణక్యుడు. మా ప్రతి ప్రయాణంఇతని చేతులమీదుగా నామకరణం చేసుకుంటుంది. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుని మాకు కూడా వాటి గురించి చెప్తాడు.మధ్యలో బైకు కష్టాలు ఆర్చి, తీర్చే శ్రీకృష్ణుడు. ఫరూఖ్ దగ్గర మూడు, నాలుగు బైకులు ఉన్నాయి. బైకు మొత్తం విప్పేసి మళ్ళీ బిగించగలఘటికుడు. నాకు చిన్నప్పటి నుండీ విప్పడం మాత్రమే వచ్చు! 

sree2

కొలరాడో నాకు మొదటి దూర ప్రయాణం. వారం రోజుల పైగా ప్రయాణం, ఇంచుమించు రెండువేలకు పైగా మైళ్ళు. అక్కడక్కడా కాంపింగ్ చేస్తూ,కొన్ని చోట్ల హోటళ్ళలో ఉన్నాము. ఈసారి మాత్రం పూర్తిగా హోటలులోనే ఉందామని అనుకున్నాము. కాంపింగ్ అంటే టెంటు, దాంట్లో పరుచుకునేపరుపు లేక దుప్పటి,  దిండు, స్లీపింగ్ బాగ్, కూర్చోవడానికి ఒక ఫోల్డింగ్ కుర్చీలాంటివన్నీ బైకు మీద వేసుకోవాలి. కేంపింగ్ లేకపోతే  బండి చాలాతేలిక అయిపోతుంది.

ఎంత మండే వేసవి అయినా కొలరాడోలో ఉదయం పూట చలిగా ఉంటుంది. మధ్యాహ్నం కొద్దిగా వేడి పెరిగి పెద్ద వాన పడుతుంది. ప్రతిరోజూ ఇదేవాతావరణం అక్కడ. వాతావరణానికి తగ్గట్టు రైన్ గేర్ కొనుక్కున్నాము. మెక్సికోకి కూడా రైన్ గేర్ పెట్టుకుండామని నిశ్చయించుకున్నాము.వాన పడుతుందో,లేదో తెలియదు కానీ పడినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి కదా! మెక్సికోలో కూడా కొండ ప్రాంతాలలో ఉన్నపుడు చలి పుట్టచ్చు,అందుకని మెష్ జాకెట్ కింద వేసుకోగలిగిన బేస్ లేయర్లు కొన్ని పెట్టుకోవాలి. ఎక్కువగా ఎండ ప్రాంతం, ఎండాకాలం కాబట్టి మెష్ జాకెట్వేసుకోవాలి. జాకెట్లో గాలి దూరే సందులు చాలా ఉంటాయి. బైకులో వెళ్ళేటపుడు గాలి ఇందులొకి దూరి చక్కిలిగిలి పెడుతుంది, అదో కమ్మనిహాయి! 

కొలరాడో ప్రయాణంలో కొంతమంది నీళ్ళు తీసుకుపోయే బాగ్ వాడారు. ప్రతిసారీ నీళ్ళు కొనుక్కోకుండా ఉదయం పూట ఇంచుమించు రెండు, మూడు గాలన్లు ఇందులో నింపుకోవచ్చు. నీళ్ళు చల్లగా ఉండడానికి ఐసు ముక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు. కొలరాడో నుండి రాగానే వినయ్ కాస్టుకోలో కొంటూ నాకు కూడా ఒకటి తీసుకున్నాడు. అది ఈసారి మెక్సికోకి బాగా పనికి వస్తుందనుకున్నాను.

ప్రతి ప్రయాణంలో ఎవరో ఒకరు కొత్త పరికరం వాడడం, తరువాత ప్రయాణంలో మిగతావారు దాన్ని కొనుక్కోవడం మాకు ఆనవాయితీగా వస్తూ ఉంది. గత సంవత్సరం బిగ్ బెండు పార్కుకి వెళ్ళినపుదు కొందరు సేనా బ్లూటూత్ వాడడం, కొలరాడో ప్రయాణానికి అందరూ అది వాడడం జరిగింది. ఈ బ్లూటూతులో ఒకరు, ముగ్గురుతో కలవచ్చు. అలా గుంపులోని బైకర్లందరూ కలిసి కబుర్లాడుతూ సవారీ చేస్తుంటే ఆ ఆనందం వేరు. కొంత మంది మాట్లాడకపోయినా వింటూ ఉంటారు. లేకపోతే సంగీతం కూడా వినచ్చు ఇందులో.

మేము వెళ్ళే ప్రదేశం మాకంతా కొత్తది, అంతే కాకుండా కొంత ప్రమాదకరం కూడా. మరి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా? కొలరాడో వెళ్ళేటపుడు మా గ్రూపులో ఒకరైన అంజాన్ మాకు స్పాట్ అనే పరికరం ఇచ్చాడు. ఇది ఉపగ్రహం ఆధారంగా పని చేసే పరికరం. ఇందులో మన ప్రయాణంలోని గమ్యాలని నింపుకోవచ్చు. మనం ఆ గమ్యం చేరగానే మన ఇంట్లోవారికి టెక్స్టు లేక ఈ-మెయిలు పంపుతుంది. మనం ఏ సమయంలో ఎక్కడ ఉన్నామో కూడా తెలిపే మాప్ కూడా మన ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మనకి ఆక్సిడెంట్ అయితే ఈ పరికరం ద్వారా అంబులెన్సుకి మన లొకేషన్ చెప్పచ్చు. పరిస్థితి మరీ ప్రమాదకరం అయితే మనల్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి విమానంలో తీసుకువెళ్ళే సౌకర్యం కూడా ఉంది. ఒంటరిగా సాహసయాత్రలు చేసేవారికి ఇది ఎంతో పనికివస్తుంది. నెల్లూరికి చెందిన పర్వతారోహకుడు మస్తాన్ బాబు మంచుకొండల్లో చనిపోయాక అతని మృతదేహం దొరకడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈసారి అందరూ స్పాట్ కొనుక్కుందామని నిర్ణయించుకున్నాము. మెక్సికో ప్రయాణానికి ఒక వాట్సాప్ చేసి అందులో మాట్లాడుకునే వాళ్ళం.

sree3

****************

  

బైకులో మెక్సికో వెళ్ళడమంటే పెద్ద సాహసం! వెళ్ళడానికి ముందడుగు వేసినా మా ఆవిడకి అపుడే చెప్పలేదు. దానికి తగిన సమయం, సందర్భంరావాలి, కావాలి కూడా!

మా స్నేహితులందరూ మా ఆవిడని పొగుడుతూమీరు భలే వాళ్ళండీ! మీ ఆయనను ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటారుఅని అంటూ ఉంటారు.మా ఆవిడ ఉబ్బితబ్బిబ్బవుతుంది కానీ అసలు విషయం చెప్పదు. కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే సాహసోపేతమైన కార్యాలు చేస్తారని నేనుచిన్నపుడు ఎక్కడో చదివినట్టు గుర్తు. అందుకే కాలేజీలో ఉన్నపుడు బ్రేకులు లేని సైకిలు మీద నెల్లూరులో ఉన్నమూలాపేట,చిన్నబజారు,పెద్దబజారు, ట్రంకురోడ్డులో విపరీతంగా తిరిగేవాడిని. దేవుడు నాకు కుడిభుజం మీద పుట్టుమచ్చ అయితే పెట్టాడుకానీ మా ఆవిడని ఒప్పించడానికి ఒక మంచి మచ్చ ఇవ్వలేకపోయాడు. భారతదేశం మీద దండెత్తడానికి తగిన సమయం కోసం అలెగ్జాండర్ ఎలాఎదురుచూసాడో నేను కూడా మా ఆవిడని ఒప్పించడానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఒక మంచి సినిమా, సూపరుగా ఉండేబిరియానీ, తృప్తి పడే విధంగా షాపింగ్ చేపించిన తర్వాత మా ఆవిడ నా ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

దేవుడు వరమిచ్చినా పూజారి ప్రసాదం పెట్టడు అన్నట్టు మా ఆవిడ ఒప్పుకున్నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళుఅలా ఎలాగ ఒప్పుకున్నావు?” అనిమా ఆవిడ మీద బాగా వత్తిడి తీసుకువచ్చేవారు.

ఒక్కసారి కమిటయ్యాక మా ఆవిడ మాటే కాదు, పక్కింటావిడ మాట కూడా వినను కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఎదురవలేదు.

*

అందమైన కలలాంటి ఆ నేలా..గాలీ!

 

  -శివలక్ష్మి

~       

మా కోడలి  అక్కలిద్దరు సంధ్య,రూపల్ ఇండొనేషియాలో టీచర్స్ గా పని చేస్తున్నారు. పదే పదే రమ్మంటున్న వాళ్ళ  ఆహ్వానం మీద  ఇండొనేషియా వెళ్ళాలని అనుకున్నాం. అది ఒక ద్వీప దేశం. చిన్నప్పుడు రామాయణ పాఠాల్లో చదువుకున్న జావా,సుమత్రా దీవులు ఇండోనేషియా లోనివే కనుక చూస్తే బాగుంటుందనుకున్నాం. ఇటీవల మాకుటుంబం లోని – మేమిద్దరం హైదరాబాద్ నుంచి, హిమాన్షి (కోడలు) , శయన్ (మనవడు) డిల్లీ నుంచి , మా బాబు స్వరూప్  లే(లఢక్) నుంచి, రాజ్(రూపల్ భర్త) గౌహతి నుంచి బయల్దేరి, అందరం హైదరాబాద్ లో కలిసి డిసెంబర్ 23 న ఇండొనేషియా రాజధాని జకర్తా చేరుకున్నాం. అక్కడికెళ్ళాక న్యూజీలాండ్ లో చదివే సంధ్య కొడుకు సహర్ష్ జాయినయ్యాడు.అక్కడే ఉంటున్న సంధ్య,రూపల్ ఆమె  కూతురు రసజ్ఞ -ఇదీ మొత్తం 10మంది మాగ్రూప్.

అప్పటికే జకర్తాకి చేరిన సహర్ష్, రూపల్  తో కలిసి మమ్మల్ని జకర్తా ఎయిర్ పోర్ట్ కొచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఇతర దేశాలనుంచి అక్కడి పని చెయ్యడానికొచ్చే ఉపాధ్యాయులకి ఇండొనేషియా ప్రభుత్వం ఉచితంగా ఇల్లు,అవసరమైన గృహోపకరణాలన్నీ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకి ప్రభుత్వం సమకూర్చిన ఇళ్ళు కూడా స్కూళ్ళకి నడిచి వెళ్ళేంత దూరంలో, మంచి పరిసరాల్లో, అందమైన ఫర్నిచర్ తో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. ఉపాధ్యాయుల  పిల్లలకి ప్రభుత్వమే ఉచిత విద్య నందిస్తుంది. అలా సంధ్య పిల్లలిద్దరూ జునియాలీ, సహర్ష్ 12th క్లాస్ వరకూ ఉచిత విద్య నభ్యసించి ఇప్పుడు పైచదువుల కెళ్ళారు.ఇప్పుడు రూపల్ కూతురు రసజ్ఞ 12th క్లాస్ ఇండొనేషియాలోనే చదువుతుంది. తన క్లాస్ టీచర్సందరూ భారతీయులేనని చెప్పింది. ఈ టీచర్ల పిల్లలందరూ 12th క్లాస్ వరకూ ఇక్కడ చదివి,తర్వాత వాళ్ళ వాళ్ళ అభిరుచుల కనుగుణంగా పై చదువులకు విదేశాలకెళ్తున్నారు.

జకర్తాలో ఉన్న నాలుగు రోజులూ సంధ్య, రూపల్ అత్యంత ఆత్మీయమైన ఆతిధ్యమిచ్చారు. అలాగని వాళ్ళేమీ పదిమంది మున్నామని  హైరానా పడలేదు. వాళ్ళు వంట చెయ్యనే లేదు. అసలా సమాజంలో వంట చేసుకునే కాన్సెప్టే లేదు. ఈ విషయం నాకు భలే నచ్చింది!అమెరికాలో ఇండియాని నెత్తిన మోసుకెళ్ళి ఇక్కడి వంటలతో ఆడపిల్లలందరూ తెగ యాతన పడుతున్నారు! కానీ “రోమ్ లో రోమన్ లా జీవించు” అన్నట్లు మా సంధ్య,రూపల్ ఎంచక్కా వంటలకు గుడ్ బై కొట్టేశారు!!

bali1

“The first condition of understanding a foreign country is to smell it”- అని Rudyard Kipling  అన్నట్లు Food is the best way to represent a country because of its distinctive aromas and flavours. రోడ్ల మీద ఎంతో రుచికరమైన,అత్యంత శుభ్రమైన ఆహారం దొరుకుతుంది.ఏదో అయిందనిపించే టట్లుండదు.నోరూరించే జిహ్వ రుచులతో, స్పైసీగా తిన్నాం.కొంచెం అన్నం, ఒక కప్పు ఆకు కూరా, చికెన్ మూడూ కలిపిన “పడాంగ్” అనబడే భోజనం వేడి వేడిగా దొరుకుతుంది ఆహా!ఎంతో రుచిగా ఉంది! ఎంతో రుచి, ఎంతో రుచి అని పాడుకున్నాం!ఖచ్చితంగా సగం సగం చేసి ఎనిమిది ముక్కలుగా చేసిన, మషాలా దట్టించిన, అద్భుతంగా ఘుమ ఘుమలు వెదజల్లే   నాలుగు పెద్ద పెద్ద చేపల్ని కొనుక్కుని అన్నంతో తిన్నాం.మా షయన్ కి హిమాన్షికి చేపలంటే చాలా చాలా ఇష్టం.అవి తిన్న తర్వాత తీసిన ఫొటోలో వాళ్ళ మొఖాల్లో ఆనందం చూడండి!!

పిల్లల చదువుల కోసం మా సంధ్య, రూపల్  డెహ్రాడూన్ నుంచి వెళ్ళి కుటుంబాలకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. అక్కడ ఈవ్ టీజింగ్లుండవు.అత్యాచారాల చాయలేలేవు.ఆ రకంగా ఇండొనేషియా చాలా సురక్షితమైన దేశమని వాళ్ళిద్దరూ చెప్పారు. అత్యాచారాలతో అట్టుడిగిపోతున్న భారత్ గుర్తొచ్చి వేదన కలిగింది. వాయు కాలుష్యముండదు.పెట్రోల్ చాలా చౌకగా దొరుకుతుంది.అదెలా సాధ్యమని అడిగితే మన దేశంలో సెంట్రల్ ఎక్సైజ్,సర్వీస్ టాక్సులు చాలా ఎక్కువుంటాయని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో పనిచేసిన మా ఆయన చెప్పారు. ఇండొనేషియాలో లీటర్ పెట్రోల్ మన 30రూపాయల కంటే తక్కువే.మనకి 70 రూపాయలు.రిఫైనరీ లీటర్ ధర రూ 16.50, టాక్స్ 11.80%, ఎక్సైజ్ డ్యూటీ 9.75%, వ్యాట్ సెస్ 4%, స్టేట్ టాక్స్ 8%-ఈ మొత్తం కలిసి 50.05. కానీ భారత ప్రభుత్వం ఇంకో 20రూ అదనంగా మన చెవులు పిండి వసూలు చేస్తుంద ! 20రూ దేనికోసం వసూలు చేస్తుందో మాత్రం ప్రజలకు చెప్పదు !!

మన లాగే ఇక్కడి వారివి మామూలు మధ్య తరగతి జీవితాలే! సాదా సీదా జీతాలే!! కానీ మన ఉపాధ్యాయులే కాదు,ఉన్నతోధ్యోగుల జీవితాలతో పోల్చి చూసినా ఈ దేశంలో చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నారనిపించింది.ఏ రకమైన ఒత్తిడీలేదు.ఇందు గల డందు లేదన్నట్లు మనకి యెల్లడలా ప్రత్యక్షమై, పీల్చి పిప్పి చేసి, అనారోగ్యాల పాల బడేస్తున్న దుమ్ము  అస్సల్లేదు.అమెరికాలో దుమ్ముండదనుకుంటారు గానీ అక్కడి  మూల మూలల్లో కనిపించే దుమ్ము లాంటిది కూడా యిక్కడ కనిపించదు.ఎటు చూస్తే అటు పచ్చని చెట్లతో పరిశుభ్రంగా ఉంటుంది. బట్టలు మాయవు. అంత పచ్చదనం నేనెక్కడా చూడలేదు.తాజాగా,నేవళంగా,కళ కళ లాడుతూ చెట్లూ,ఆకులూ,పువ్వులూ ఆహ్లాదం కలిగిస్తాయి. జకర్తా నగర శివార్లలోనూ,బాలీ లోనూ తిరుగుతుంటే రోడ్డు కిరువైపులా వరి పంట పొలాలు కనిపిస్తూ కన్నుల పండుగ చేస్తాయి.కొన్నిచోట్ల లోయల్లాగా ఉండి, లోయ నిండా పరుచుకున్న పచ్చదనంతో కళ కళలాడుతుంటాయి. ఆ వరి పంట నీళ్ళ మధ్య మధ్య లో చిన్న చిన్న చేపల్ని వదుల్తారనీ, ఆ చేపలు తిరుగుతూ,పెరుగుతున్న క్రమంలో వాటి మల మూత్రాలతో పంట బాగా పండుతుందని,ఆ ప్రజల ప్రధాన మైన పంట వరేనని తన పాఠాల్లో ఉందని రసజ్ఞ  మాకు చెప్పింది!

వాళ్ళ ప్రధానమైన ఆహారం మనలాగే అన్నం.రోజులో నాలుగైదుసార్లు అన్నం తింటారు.కానీ మనుషులు ముఖ్యంగా స్త్రీలు సన్నగా, నాజూగ్గా, చలాకీగా, బలంగా ఉంటారు. మీరు చెప్తే నమ్ముతారో లేదో గానీ నిజంగా నా సైజ్ ప్యాంట్ అక్కడి షాపుల్లో దొరకలేదు.మనదేశంలో నైతే నేనసలు లావే కాదు. నాక్కోపమొచ్చి ఇక్కడ కూడా అక్కడక్కదా లావాటి వాళ్ళున్నారు కదా వాళ్ళకెలా?అని అడిగాను.వాళ్ళకి బిగ్ సైజ్ షాపులుంటాయని చెప్పారు.సిగ్గేసింది కానీ ఒక విషయం తెలిసొచ్చింది. అదేమిటంటే  వాళ్ళు నాలాగా ఆవకాయ-ముద్దపప్పు లేకపోతే రోటి పచ్చడితో ఒక వాయి,కూరతో ఒక వాయి, సాంబారు,రసాలు వగైరాలతో ఒక వాయి,పెరుగుతో చివరి వాయి లాగించరు.ప్రతి సారీ రెండే రెండు స్పూన్ల (మళ్ళీ స్పూన్ అంటే  మన హస్తం కాదు,నిజంగా టేబిల్ స్పూన్ కన్న కొంచెం పెద్ద స్పూన్) అన్నం తింటారు అని. ఈ రహస్యాన్ని మా సంధ్య,రూపల్ దగ్గర ఉన్న మెయిడ్స్ నుంచి రాబట్టాను. మెయిడ్స్ అంటే గుర్తొచ్చింది (పని మనిషి పదం కంటే మెయిడ్ పదం కొంచెం బాగుంది) సంధ్య ఇంట్లో అమ్మాయి పేరుపార్వతి,రూపల్ ఇంట్లో అమ్మాయి పేరు మీనా.ఇంతకీ వాళ్ళు ముస్లిం స్త్రీలు.అచ్చం మన తెలుగు పేర్లు! వాళ్ళు చాలా హుందాగా,సమర్ధంగా ఉన్నారు. చక్కగా టూ వీలర్ల మీద వస్తారు. ఒకరి మీద ఒకరికి ఎంతో నమ్మకం, గౌరవం. వీళ్ళు తాళాలిచ్చి ఉదయాన్నే స్కూళ్ళకెళ్ళిపోతారు! వాళ్ళు ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతికి మడతలు పెట్టడం మొదలైన పన్లు చక్క బెట్టి వెళతారు!

ముస్లిం అమ్మాయిలకు తెలుగు పేర్లు ఎందుకున్నాయో తెలుసుకోవాలనే  ప్రయత్నంలో   జకార్తా చరిత్ర గురించి చదివితే 14 వ శతాబ్దంలో “జకార్తా” జావా అనే హిందూ రాజ్యంలో ఒక చిన్న నౌకాశ్రయం పట్టణంగా ఉండేది. 1527లో “ఫతాహిల్లా” అనే ముస్లిం మత పాలకుడు స్వాధీనం  చేసుకుని “జయకార్తా” (Victory City) అని పేరు మార్చాడు.1619 లో డచ్ వాళ్ళు స్వాధీనం చేసుకుని, ఒక కొత్తనగరంగా నిర్మించి, ‘బటావియా’ అని పేరు మార్చి, ఆగ్నేయాసియాకి అధికార కేంద్రంగా  చేసి 300 ఏళ్ళు పరిపాలించారు. 1941 లో జపాన్ సామ్రాజ్య వాదులు ముట్టడించి పాత పేరు జయకార్తాని జకార్తాగా మార్చేశారు. డచ్ పాలకులు మళ్ళీ ఇంకోసారి జకార్తాని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఇద్దరి మధ్య పోరాటాలు మొదలయ్యాయి. ఈ లోపల ఇండోనేషియన్ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష ఉధృత మైంది . ప్రజల విముక్తి పోరాటాల ఫలితంగా 1945, ఆగష్టు 17 న ఇండోనేషియన్ నాయకులు జకార్తాలో విదేశీ పాలన నుంచి స్వాతంత్ర్యం ప్రకటించారు.

ఇక్కడ శతాబ్దాలుగా హిందూ,ముస్లిం,యూరోపియన్,డచ్,జపనీస్ ప్రజలు సహజీవనం చెయ్యడం వల్ల అన్ని జాతుల మిశ్రమ సంస్కృతి కలగాపులగమైందని అర్ధమైంది. హిందూ, బౌద్ధం,  కన్ఫ్యూషియనిజం, ఇస్లాం, క్రైస్తవ  మతాల సమూహాలతో కలిసిన ఒక సంక్లిష్టమైన సాంస్కృతిక జీవనం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన “భాష” లాగే వాళ్ళు మాట్లాడే భాష పేరు “భాస”. స్త్రీలను వనిత (wanita) లంటారు. సరస్వతి, రాముడు,సీత,శివ-పార్వతులు,అర్జునుడు లాంటి అనేకమైన మన పదాలుండడం వల్ల వాళ్ళ భాష (భాస) కొంచెం అర్ధమవుతుంది.అర్ధం కాకపోయినా సైగలతో,హావభావాలతో వాళ్ళతో చక్కగా మాట్లాడొచ్చు. పోయిన సంవత్సరం హాంకాంగ్, మకావ్ లకు వెళ్ళాం. అక్కడి వాళ్ళకు ఇంగ్లీష్ రాదు. ఏ షాపుకెళ్ళినా,బజార్ల లో ఏమైనా తినాలని అడగబోయినా, సైగలు చేద్దామన్నా మొఖాలు చిట్లించుకుని విదిలించి పారేసేవారు. చాలా ఇబ్బంది పడ్డాం! ఇండోనేషియా మనుషులు ఎక్కడున్నా మనందరం మనుషులమే అన్నట్లు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. ప్రేమాభిమానాలు చూపించారు. ఆ నేలలో మనుషులందర్నీ కలగలిపే గొప్పతనమేదో ఉందనిపించింది!

ఇక కరెన్సీ విషయానికొస్తే మన రూపాయికి 210 ఇండొనేషియన్ రూపయ్యాలు. ఒక డాలర్ కైతే 13,600 రూపయ్యాలు. అందుకే డాలర్లున్న విదేశీయుల ఎద్దడి సర్వకాలాల్లోనూ ఉంటుందట! పది వేల రూపాయిల్ని మార్చుకుంటే నాకు 20 లక్షల రూపయ్యాలొచ్చాయి. ఆర్టిస్ట్ మోహన్ అప్పుడప్పుడూ  ఆయన జేబులో కాసిని డబ్బులుంటే చాలు “I am Stinkingly Rich” అని అంటుంటారు, అలా ఫీలైపోయాను. తీరా ఒక కాఫీ మేకర్ కొనుక్కుంటే 2 లక్షలైపోయాయి. పిల్లలకిష్టమైన  బ్రాండ్స్ అన్నీ చీప్ గా దొరుకుతాయి.కానీ అవి ఇండొనేషియన్ బ్రాండ్స్.ఏమైనా రెండు మూడు వస్తువులు కొందామనుకున్నప్పుడు మిలియన్లలో లెక్క తేలేది.ఇక నా లెక్కలు రాని బుర్రకి తాళం పడిపోయేది.కౌంటర్ లో అమ్మాయి ఎంత చెప్తే అంతా ఇవ్వడం, అదీ రాకపోతే రూపల్ హెల్ప్ చేసేది.

bali2

జాతీయవాదం తీవ్రంగా ప్రబలిన  సుకర్ణో కాలంలో నిర్మించిన స్మారక చిహ్నం “మోనాస్”. ఇది 35 కిలోల బంగారపు పూతతో,137 మీటర్ల పొడవైన పాలరాయి కీర్తి స్తంభం. ఆగ్నేయాసియాలో అతి పెద్దదైన ఈ మసీదుని నిర్మించడానికి 17 సంవత్సరాలు పట్టింది.ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదైన ఒక చారిత్రాత్మక మ్యూజియం.”ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం”,అన్న మాహాకవి మాటలు గుర్తొచ్చాయి. కానీ పరపీడన పరాయణత్వం నుంచి ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులకూ, స్వేచ్ఛకూ, వారి స్వావలంబనకూ ప్రతీకగా నిలుస్తున్న మ్యూజియం గోడలు, గోపురం మసీదు వైభవాన్ని, ఐశ్వర్యాన్నే గాక ప్రజల గొప్పతనాన్నీ,హుందాతనాన్నీ,స్వావలంబననీ చాటి చెప్తున్నాయి. పాలకుల దగ్గర యుద్ధ టాంకులుంటే ప్రజల దగ్గర చిట్టి చిట్టి  ఆయుధాలుంటాయి.  ఒకసారి ప్రజలకు రాజకీయ స్పష్టత వచ్చిందంటే ఎంత కౄరమైన సామ్రాజ్య వాదాలైనా కాగితప్పూలలాగా ఎగిరిపోయి, ప్రజలే అంతిమ విజయం సాధిస్తారని చరిత్రలో రుజువైన సత్యాన్ని ఇండోనేషియన్ ప్రజలు  మరోసారి నిరూపించారు.

భాలికల విద్య,ఆధునికత  విషయంలో ” బి యూ కార్టిని (IBU Kartini)” అనే ఒక పేరు ప్రముఖంగా వినబడింది. కార్టిని పేరుతో ఇండోనేషియాలో చాలా స్కూళ్ళు, స్థలాలు ఉన్నాయి.ఏమిటని సంధ్య నడిగితే ఆడపిల్లల చదువుల కోసం కృషి చేసిన కార్టిని అనే ఒక అద్భుతమైన మహిళ గురించి చెప్పింది. కార్టిని 1789 లో ప్రస్తుత ఇండోనేషియాలో ఒక కులీన జావనీస్ కుటుంబంలో జన్మించింది. 1904 వరకూ జీవించింది. ఆమెకు చదువు పట్ల విపరీతమైన  ఆసక్తి ఉండేది. 12 సం.ల లోపే ఆమె డచ్ భాష నేర్చేసుకుంది. జావనీస్ సమాజంలో అమ్మాయిలను ప్రాధమిక పాఠశాల, అంటే 12 సం.ల వరకే పాఠశాలకు వెళ్ళనిచ్చేవారు. ఆ కాలంలో బహుభార్యాత్వ ముండేది. బాలికల వేషధారణ మీద అనేకరకాలైన కౄరమైన ఆంక్షలుండేవి.ముక్కుపచ్చలారని పసిపిల్లలను గృహనిర్భంధంలో ఉంచి, మొఖం తెలియని ముసలివాళ్లతో రెండో,మూడో పెళ్ళికి సిద్ధం చేసేవారు.ఈ బాలికల దుర్భర పరిస్థితులకు కలత చెందిన కార్టిని వారి ఏకాంత బాధలను అధ్యయనం చేసి “Out of Darkness to Light” అనే పుస్తకం డచ్ భాషలో రాసింది. “Letters of a Javanese Princess” అని ఆమె భావాలను వ్యక్తపరిచే కొన్ని ఉత్తరాలు కూడా డచ్ భాషలోనే  రాసింది. అందులో ఆమె బహు భార్యాత్వాన్ని వ్యతిరేకించింది. ఇండోనేషియా యువత యూరోపియన్ యువతలా ఉండాలనే ఆశాభావం వ్యక్తం చేసింది. స్త్రీల చదువుల కోసం, హక్కుల కోసం ,రకరకాల పీడనలనుండి విముక్తి కోసం న్యాయపోరాటాలను సూచించింది. డచ్, నెదర్లాండ్స్, యూరోపియన్  దేశాల పౌరులను ఆకర్షించి, గొప్ప ఆసక్తిని  రేకిత్తించడం ద్వారా  విదేశీ  ప్రముఖుల  మద్దతును కూడగట్టగలిగింది. విద్యా రంగంలో మార్గదర్శకురాలైంది. ఇండొనేషియా స్వాతంత్ర పోరాటంలో కూడా దేశ నాయకులకు ఆమె ఆలోచనలు   ప్రేరణ నిచ్చాయి. కార్టిని జన్మదినం ఏప్రిల్ 21 ని జాతీయ సెలవు దినంగా, ఆమెను జాతీయ నాయకురాలిగా ప్రకటించింది ప్రభుత్వం. ఇండొనేషియా స్మారక చిహ్నం “మోనాస్”. తో పాటు, కార్టిని విగ్రహాన్ని కూడా చూశాం.

bali5

ఇండోనేషియా ఒక ముస్లిం మతం దేశం అయినప్పటికీ బయట పరిశీలకులు సమాజం లో ముస్లిం మహిళల హోదా, హక్కులు, వారి స్థా నాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు. సమాజంలో మహిళలు పాటిస్తున్న మంచి విలువలే సమాజానికి వెన్నెముకలా పనిచేస్తున్నాయని పరిగణిస్తారు. సుకర్ణో కూతురు మేగావతి అధ్యక్ష అభ్యర్థిగా  నిలబడితే ముస్లిం మత నాయకులు ఒక మహిళ అధ్యక్ష పదవిలో ఉండడమేమిటని వ్యతిరేకించారు. కాని ఆమె 1999 జాతీయ ఎన్నికల్లో అతిపెద్ద మెజారిటీతో గెలుపొంది, ప్రముఖంగా నిలిచింది. అక్కడి ముస్లిం మహిళలు బురఖాలు వదిలేశారు. చిన్న చిన్న అతి సుందరమైన స్కార్ఫ్ లను తల చుట్టూ మాత్రం ధరిస్తున్నారు.అవి కూడా మహిళల అందాన్ని పెంచుతున్నాయి. కొందరు అవి కూడా వదిలేశారు.అమ్మాయిలు రాత్రుళ్ళు స్వేచ్చగా తమ తమ పనుల మీదే కాకుండా రాత్రంతా తెరిచి ఉండే నైట్ మార్కెట్లలో నిర్భయంగా తిరుగుతున్నారు.వారికి సౌకర్యవంతంగా ఉండే అన్ని రకాల ఆధునికమైన దుస్తులను ధరిస్తూ అత్యాధునికంగా కనిపించారు. ఇండియాలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో మేము “బిలియన్ రైజింగ్” ల పేరుతో ‘పగలే కాదు,రాత్రుళ్ళు కూడా మావి కా వాలనే డిమాండ్ తో ఇంకా ఉద్యమాలు చేసే స్థితిలోనే ఉన్నాం! ఈ ఆధునికత వెనక కార్టినికి స్త్రీజాతి పట్ల ఉన్న ఆర్ధ్రత ఎంతైనా అభినందనీయం!!

ఇండోనేషియా నిత్య జీవితంలో ఆహారంలో, సంస్కృతిలో కూడా  దేశీయ ఆచారాలూ, విదేశీ ప్రభావాల కలయికలూ కనిపిస్తాయి. బాలినీస్ నృత్యాల్లో  పురాతన బౌద్ధ, హిందూ మత రాజ్యాల గురించి కథలున్నాయి. బాలిలో అచ్చు తెలంగాణ బోనాల పండుగలో మహిళలు తీసికెళ్ళే బోనాల్లాంటివే బాలి మహిళలు పెద్ద పెద్ద బుట్టలలో రకరకాల పళ్ళు అందంగా పేర్చుకుని తీసికెళ్ళడం చూశాం.

బాలి లో హోటెల్ Kuta Central Park లో దిగాం .అక్కడినుంచి ఒక టాక్సీ తీసుకుని ఊరంతా తిరిగాం. ఒక టాక్సీ డ్రైవర్ ని నీ పేరేమిటని అడిగితే “ఒయాన్” అని చెప్పాడు.మీరు ముస్లింలా?అనడిగితే “No,I am a real Hindu” అని చెప్పాడు.నిజమైన హిందువంటే ఏమిటంటే రోజుకి ఐదు సార్లు పూజ చేస్తారట!ఆ పూజలు ఇంటి బయటి ప్రవేశ ద్వారం దగ్గరే చేస్తారు. ఇంటి ఆవరణమంతా చాలా శుభ్రంగా ఉంచుకుంటారు.మనవాళ్ళలాగా పక్కింటివాళ్ళ గుమ్మాల్లో చెత్త పారబొయ్యరు! ప్రవేశ ద్వారం దగ్గరే  ఎందుకు పూజలు చేస్తారంటే సకల దేవుళ్ళూ,పంచ భూతాలూ ఇంటికి కాపలా ఉండి ఎటువంటి చెడునీ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డు పడతాయని, తమను కాపాడతాయని వాళ్ళ నమ్మకం! నాకిది కూడా భలే నచ్చింది.పూజల పేరిట ఇక్కడి ఆడవాళ్ళకు ఇరుకు ఇళ్ళలో చచ్చేంత చాకిరీ ఉంటుంది.ప్రతిసారీ దేవుడి విగ్రహాలు తోమి,వాడిపోయిన పువ్వులూ,పాచిపోయిన నైవేద్యాలూ అన్నీ శుభ్రం చెయ్యాలి.బయటంటే స్త్రీలూ-పురుషులూ కలిసి చెయ్యడం చూశాం ! నడి రోడ్ల కూడళ్ళలో పెద్ద పెద్ద కృష్ణార్జునులూ,శివ-పార్వతులూ మొదలైన హిందూ దేవుళ్ళ విగ్రహాలు చూశాం!

ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం  వరకూ రంజాన్ సందర్భంగా నిష్టగా నెలంతా ఉపవాసం చేస్తారు. ప్రతి రాత్రి కుటుంబ సభ్యులంతా ప్రత్యేక వంటకాలతో వేడుకగా భోజనం చేస్తారు. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, సహచరులకు  ఆహార పదార్థాలను పంచిపెడతారు. వారికి ఆతిథ్య సామర్ధ్యం చాలా ఎక్కువని, రంజాన్ సమయంలో మాకు విందులే విందులని మా సంధ్య,రూపల్ చెప్పారు.

రాజకీయ వ్యవస్థ, శాస్త్ర,సాంకేతిక సమస్యలు, వినోదం, సినిమా, టెలివిజన్ కార్యక్రమాలు మొదలైన విషయాల్లో పాశ్చాత్య సంస్కృతి ఇండోనేషియాను గొప్పగా ప్రభావితం చేసింది. అరబ్, మలయ్, భారత్ ల జానపద సంగీతాల మేళవింపుతో తయారైన సంగీతం ఇండోనేషియాలో బహుళ ప్రజాదరణ పొందింది.

డచ్, చైనా, యూరోపియన్లు ఆధిపత్యం చెలాయించడం వల్ల ఇండోనేషియాలో ఇప్పటికీ “ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ.”  ఉంది. దేశీయ వినియోగం కోసం జనాభాలో 60 శాతం వ్యవసాయం చేసి, వరి పండిస్తారు. మధ్య భూభాగంలో ఉండడం వల్ల ఇండోనేషియా వేడి ప్రదేశమే. వాతావరణ పరిస్థితుల్ని బట్టి జీవనోపాధికి కూరగాయలు, పండ్లు, టీ, కాఫీ, పంచదార,  సుగంధ ద్రవ్యాలు మొదలైన మార్కెట్ ఆధారిత పంటలు పండించే రైతులున్నారు. అందమైన చెక్క బొమ్మలు చేసే కళలో ఇక్కడి ప్రజలు మంచి నైపుణ్యం సంపాదించారు. బంగారం, చమురు, సహజ వాయువు, తగరం, రాగి, అల్యూమినియం, ఆయిల్ పామ్, రబ్బరు, చక్కెర, ఇండోనేషియా ఎగుమతుల్లో ముఖ్యమైనవి. ఇండోనేషియాలో దొరికే కలప నుపయోగించి ప్రాసెస్ చేసిన చెక్క కూడా ఎగుమతుల్లో ప్రధానమైనది.

గ్రామాల్లో వ్యవసాయపు పనుల్లో స్త్రీ-పురుషుల భాగస్వామ్యం ఉంటుంది. సాధారణంగా పురుషులు పొలం దున్నితే, మహిళలు సేద్యం చెయ్యడం, కోతలు కొయ్యడం,పంటల్ని భద్రపరచడం వంటి అనేక పన్లు చేస్తారు. ఆ స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా దర్శనమిస్తారు. విదేశీ సంస్కృతి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, కొన్ని మారుమూల ఇండోనేషియన్ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రత్యేక మూలవాసీ సంస్కృతి భద్రపరచబడింది. ఆ  మహిళల సాంప్రదాయ దుస్తుల్ని మేము చాలా ఇష్టంగా  కొనుక్కున్నాం !

bali4నిర్ణయాత్మక స్థానాల్లో,అధికారా హోదాల్లో ఎక్కువగా పురుషులే ఉంటారు. మహిళలు పురుషుల కంటే తక్కువ సంఖ్యలో చిన్న చిన్న ఉద్యోగాల్లో దుకాణాలు, పరిశ్రమలు, మార్కెట్లలో  సేల్స్ గళ్స్ గా కనిపిస్తారు. మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, కాలేజ్ లెక్చరర్లుగా,విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పురుషులే ఉంటారు గానీ మహిళలు మాత్రం ప్రాధమిక స్కూలు ఉపాధ్యాయుల వరకే పరిమితమవుతారని సంధ్య,రూపల్ చెప్పారు.కానీ ప్రాధమిక పాఠశాలల్లో బాల-బాలికల సంఖ్య సమానంగా ఉంటుందని చెప్పారు! రాచరిక పాలనే అయినప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ఒకటి,రెండు దశాబ్దాలకే చదువు మీద అమితాసక్తి కలిగి,ఉచిత విద్యను అమలు చేసింది ఇండోనేషియన్ ప్రభుత్వం. అదీ గాక, ఈ దేశంలో కార్టిని పాఠశాలల ప్రభావం ఎక్కువగానే ఉంది కాబట్టి కొద్ది కాలంలో చదువుల్లో ఉద్యోగాల్లో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఎదుతారని ఆశించవచ్చు!!

bali6

Taman Safari, Kidzania, Kuta Beach, Kuta Square,Tanah lot Temple,Tanjung Benua in Nusa Dua Beach for water sports,Sukhawati Art Market,Drive in Ubud,Ubud Art Market,Ubud Rice Fields, Zimbaran Beach and Sea Food Dinner, Legian Street,Seminyak area,Sanur Beach,Uluwatu Temple మొ.వాటిని జకర్తా,బాలి లలో మేము చూశాం. రెండు దేవాలయాల బయట సముద్ర తీరాలు,తనివి తీరని దృశ్యాల సౌందర్యాన్నే చూడగలిగాం.సాంప్రదాయ దుస్తులు లేనందుకు మమ్మల్ని లోపలికి అనుమతించలేదు.

ఎటు చూస్తే అటు కనుచూపు మేరా కనిపించే ఇండియన్ ఓషన్ పులకింపజేసేది! మన దేశం పేరుతో ఒక మహా సముద్రముండడ మనే భావన మరీ మరీ పరవశింపజేసింది !! దానికి తోడు ఉడుకు రక్తంతో అత్యుత్సాహంగా ఉరకలు వేసే పిల్లలు.ఒకటే కేరింతలు!వాళ్ళ సాంగత్యంతో మాకూ యవ్వనం వచ్చేసింది!

ఆధునిక జీవితం అర్ధం కావాలన్నారు శ్రీ శ్రీ. వేష భాషల్లోనే కాదు,ఆలోచనల్లోనూ శ్రీ శ్రీ చెప్పిన ఆధునికతను వంట బట్టించుకున్న మా అమ్మాయిలు, ఒకరు కాదు,ఇద్దరు కాదు, ముగ్గురు సమర్ధులైన, అతి చలాకైన,ఆధునిక యువతులు నిర్వహించిన ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప సంబరంగా సాగింది!

         *

 

 

 

 

 

 

 

 

ప్రభాతమైనా…. ప్రదోషమైనా…. ప్రశాంతమే!

నేటి ఆధునిక జీవితం మనుషుల్ని ఎన్ని ఒత్తిడులకు గురి చేస్తోందో అందరికి తెలిసిందే. పగలూ, రాత్రి, ఆఫీసూ.. ఇల్లూ… తేడా లేకుండా యంత్రాల వలె పనిచేస్తూ ఉరుకులు పరుగుల మీద ఉంటున్నారు జనం. డైలీ టార్గెట్లు… వీక్లీ టార్గెట్లు… మంత్లీ టార్గెట్లు… ఇలా పనిచేసే సమయమంతా టార్గెట్లని వెంటాడుతూ ప్రశాంతత కోల్పోతున్నారు. విశ్రాంతి కరువై శారీరకంగానూ, మానసికంగాను అలసిపోతున్నారు. మరి ఈ వలయం నుంచి బయటపడడం ఎలా? పూర్తిగా బయటపడలేకపోయినా, కాస్త విరామం తీసుకుని, కొత్త ఉత్తేజం పుంజుకుని మళ్ళీ పరుగుపందెంలో పాల్గొంటే ఉత్సాహంగా ఉంటుంది.

మరి కొత్త ఉత్తేజం పొందడం ఎలా? కొందరికి పుస్తకాలు, కొందరికి సినిమాలు, కొందరికి ఆటలు, కొందరికి యాత్రలు… ఉత్సాహాన్నిస్తాయి.

యాత్రలలో మళ్ళీ పలురకాలు.. వినోద యాత్రలు.. విజ్ఞాన యాత్రలు.. ఆధ్యాత్మిక యాత్రలు….

ఆధ్యాత్మిక యాత్రలంటే ఎక్కడో దూరంగా ఉన్న కేదారనాథ్, బదరీనాథ్ యాత్రలే కానవసరం లేదు. మనకి దగ్గరలో ఉన్న ఆలయాలని దర్శించడం కూడా ఆధ్యాత్మిక యాత్రే అవుతుంది. “ఈ వయసులో గుళ్ళూ, గోపురాలు ఏంటి బాస్” అని కొందరు, “ఆఁ, గుళ్ళలో మాత్రం ప్రశాంతత ఎక్కడుంది? భక్తులను తరిమే సిబ్బంది, బిచ్చగాళ్ళు… వ్యాపారులూ… అంతా కమర్షియల్ కదా…” అని మరి కొందరు అంటారు. నిజమే. అన్ని ఆలయాలలోను ప్రశాంతత దొరుకుతుందని కచ్చితంగా చెప్పలేం కాని.. సంవత్సర కాలంలో కొద్ది రోజులు తప్ప మిగతా కాలమంతా అత్యంత ప్రశాంతంగా ఉండే గుడి ఒకటుంది. అదే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం.

ఈ ఆలయం గురించి వెళ్ళేవరకూ కూడా నాకు పెద్దగా ఏమీ తెలియదు. కాని అక్కడికి వెళ్ళి ఆ ప్రశాంతతని అనుభూతి చెందాకా, ఆ అనుభవాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. అందుకే ఈ వ్యాసం.

∗ ∗ ∗

KSSinDoubleDeccarTrainది 15 ఆగస్టు 2014 నాడు నేనూ, మా బాబాయి కొల్లూరి గణేశ్ కలిసి ఉదయం 5 గంటల 45 నిముషాలకి మల్కాజ్‌గిరి స్టేషన్‍లో కాచీగుడా – గుంటూరు డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కాం. రైలు ఓ పది నిముషాలు ఆలస్యంగా వచ్చింది. 5.45 కే బండి అని తెల్లారకట్టే లేచాను. 4.45కి తాగిన టీ తప్ప కడుపులో ఏం లేదు. రైల్లో ఇంకో కప్పు టీ తాగచ్చులే అనుకున్నాం కానీ, కాటరింగ్ వాళ్ళెవరు రాలేదు. నల్గొండ స్టేషన్‌లో కేటరింగ్ వాళ్ళొచ్చినా, టిఫిన్లే తెచ్చారు… టీ లేదు. చేసేదేముందని కాసేపు కునుకు తీసాం. మిర్యాలగుడా, నడికుడి స్టేషన్లు ఎప్పుడు దాటిపోయాయో గమనించలేదు. ఇంకో పది నిముషాల్లో పిడుగురాళ్ళ వస్తుందనగా మెలకువ వచ్చింది. పిడుగురాళ్ళలో 9.10కి దిగాం. సూపర్‌ఫాస్ట్ ట్రైన్ అన్నారు కానీ 205 km దూరానికి సుమారు మూడు గంటల సమయం తీసుకుంది.

పిడుగురాళ్ళ స్టేషన్ నుంచి బయటకొచ్చి నర్సరావుపేట వెళ్ళేందుకు బస్ స్టాండ్‌కి షేర్ ఆటోలో వెళ్ళాం. పిడుగురాళ్ళ నుంచి నర్సరావుపేటకి గంటంపావు పట్టింది ఆర్డినరీ బస్‌లో. మా బాబాయి కోటప్పకొండ గుడికి తరచూ వెడతాడు కాబట్టి, నర్సరావుపేటలో కొంతమంది మిత్రులయ్యారు. ఒక ఆటో డ్రైవర్‍తో కూడా టచ్‌లో ఉంటాడు. నర్సరావుపేటలో దిగగానే ఓ మిత్రుడిని కలిసాం. పలకరింపులయ్యాక, టీ తాగి, ఆటోలో కోటప్పకొండకి బయల్దేరాం. నర్సరావుపేట బస్‌స్టాండు నుంచి కోటప్పకొండ ఆలయానికి సుమారు 16కిమీ దూరం ఉంటుంది. ఘాట్ రోడ్ మీదుగా ఆలయానికి చేరాము. ఆఖరి అభిషేకానికి సమయం అవుతుండడంతో, కాళ్ళూ చేతులు కడుక్కుని, మా లగేజ్ అంతా ఆలయ సిబ్బంది వద్ద ఉంచి దర్శనానికి వెళ్ళాం. శ్రావణ శుక్రవారం, సెలవు రోజు కావడంతో కాస్త రద్దీగానే ఉంది గుడి. అభిషేకమూ, అర్చన చూసుకుని బయటకు వచ్చాం. ఆలయ సిబ్బందిలో మా బాబయికి తెల్సినవాళ్ళు ఉండడంతో, మాకు భోజనం ఏర్పాటు చేసారు. వారితో పాటే వారి గదిలోనే అన్నం తిని, ఆలయంకి దిగువన ఉన్న దేవాలయం వారి గది ఒకటి అద్దెకు తీసుకుని, కాసేపు విశ్రాంతి తీసుకున్నాం.

 

∗ ∗ ∗

TempleView

ఆలయ సిబ్బంది నుంచి ఓ బ్రోచర్ సంపాదించి, అక్కడున్న ఓ స్టాల్‌లో డా. పోలేపెద్ది వేంకట హనుమచ్ఛాస్తి రచించిన “కోటప్పకొండ చరిత్ర – క్షేత్ర వైభవం” పుస్తకం కొనుక్కుని అలయ చరిత్ర, స్థల పురాణం తెలుసుకున్నాను. కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయం ప్రాచీనమైనది. చారిత్రాక శాసనాల ప్రకారం క్రీ.శ. ఒకటవ శతాబ్దం నాటికే ఈ దేవాలయం ఉన్నట్లు చెబుతారు. వివిధ మహారాజుల ఏలుబడిలో గత పదిహేడు వందల సంవత్సరాలుగా పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతోంది. నరసరావుపేట మండలంలోని ఎల్లమంద, కొండకావూరు అనే గ్రామాల మధ్య ఉన్న పర్వతరాజం త్రికూటాచలం. దీన్నే కోటప్పకొండ అని కూడా పిలుస్తారు. సుమారు 1600 అడుగుల ఎత్తు, ఎనిమిది మైళ్ళ చుట్టుకొలత ఈ పర్వతాన్ని ఏవైపు నుంచి చూసినా మూడు కూటాలుగా (శిఖరాలు) కనిపిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు రూపాలుగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల పేరిట మూడు శిఖరాలున్నాయి.

దక్ష యజ్ఞ విధ్వంసం చేసిన తరువాత లయకారుడైన మహాశివుడు శాంతివహించి బాల వటువులా శ్రీ దక్షిణామూర్తి స్వరూపంలో మధ్య శిఖరమైన రుద్రశిఖరంపై ఉన్న మారేడువనంలో ధ్యానమగ్నుడయ్యాడట. ఈ శిఖరం మీదే బ్రహ్మకు, విష్ణువుకు, సకలదేవతలకు, సనకసనందనాది మునులకు, నారదుడికి, ఎందరెందరో సిద్ధులకు, వశిష్టాది ఋషులకు జ్ఞానబోధ చేసాడట. సమస్తదేవతలు సేవించి తరింప, శివుడు దక్షిణామూర్తి రూపంలో చిన్ముద్రధారుడై దర్శనమిచ్చాడని భక్తుల విశ్వాసం. ఇదే పాత కోటప్ప గుడి. ఇక్కడే ప్రాచీన కోటేశ్వర లింగం ఉంది. శ్రీ దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వులు. “ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే | నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||” అని ఆది శంకరులు ప్రార్థించి తరించారు.

రుద్ర శిఖరానికి ఈశాన్య భాగాన మరో శిఖరం ఉంది. అదే విష్ణు శిఖరం. దక్షయజ్ఞం సందర్భంగా శివుడు లేకుండానే హవిర్భాగం స్వీకరించినందుకు దోష నివారణ కోసం, విష్ణువు ఇంద్రుడు ఇతర దేవతలతోకలసి ఇక్కడ తపస్సు చేసాడట. ఈశ్వరుడు కరుణించి ప్రత్యక్షం కాగా, తాము ఎల్లవేళలా అర్చించుకోడానికి లింగరూపంలో ఆ శిఖరంపై నిలచి దర్శనమీయమని దేవతలు కోరగా, తన త్రిశూలంతో రాతిపై పొడిచి జలం ఉద్భవించజేసి, ‘ఈ జలమందు స్నానమాచరించి నన్ను పూజించిన మీ పాపములు నశించునని’ చెప్పి అక్కడ లింగరూపంలో వెలిసాడట. దేవతలు అక్కడ స్నానమాచరించి, తమ పాపాలను పోగొట్టుకున్నారట. పాప వినాశన క్షేత్రమిది.

రుద్రశిఖరానికి నైరుతి దిశలో బ్రహ్మ శిఖరం ఉంది. రుద్ర, విష్ణు శిఖరాలలో పూజనీయ లింగాలు ఉండి తన శిఖరంలో లింగం లేకపోవడంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా, శివుడు అక్కడ కూడా లింగ రూపంలో వెలిసాడు. నేడు అర్చనలు అందుకుంటున్న మహిమాన్విత దివ్యరూప శిఖరం బ్రహ్మశిఖరం. లింగరూపధారుడైన నూతన కోటేశ్వరుడు నేటికినీ ఈ శిఖరం మీదే అశేషభక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ మూడు శిఖరాలలోనూ జ్యోతిర్మయ లింగాలు ఉన్నాయనీ, మానవులకు అగోచరమగుటచే శిలాలింగములు నేడు విశిష్ట పూజలందుకుంటున్నాయని పండితులు చెబుతారు.

∗ ∗ ∗

 

TrekkingPathవిశ్రాంతి అనంతరం, సాయంత్రం నాలుగున్నరకి స్నానం చేసి, రుద్రశిఖరంపై ఉన్న పాత కోటప్ప లింగాన్ని దర్శించాలని బయల్దేరాం. ప్రస్తుతం ఉన్న గుడి నుంచి పైకి సుమారు ఒకటిన్నర – రెండు కిలోమీటర్ల దూరంలో పాత కోటప్పగుడి ఉంది. ప్రస్తుతం ఇక్కడ పూజలేం జరగడం లేదు. రోజూ పొద్దున్న సాయంత్రం ఓ సాధువు కొండెక్కి, అర్చన, దీపారాధన చేసి వస్తాడట. ఓపిక ఉత్సాహం ఉన్నవాళ్ళు ఆ కొండెక్కి అక్కడి లింగానికి స్వయంగా పూజలు చేసుకోవచ్చు. పూజాసామాగ్రి తీసుకుని కొండెక్కుదామని బయల్దేరి, కొంత దూరం ఎక్కామో లేదో పెద్దగా వాన! ముందుకు వెళ్ళాలో వద్దో తేల్చుకోలేకపోయాం. చీకటి పడేలోగా కొండ దిగి వచ్చేయాలని మా ఉద్దేశం. ఈ వానకి జడిసి, వెనక్కి వచ్చేద్దామా అని అనుకున్నాం. కాని ఉదృతి ఆగి, తుంపరగా మారడంతో ముందుకే సాగాం. “పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు” అనే వేమన పద్యాన్ని గుర్తు చేసుకుని ఎక్కడం కొనసాగించాం. కొండపైకి ఎక్కుతున్న కొద్దీ నాకు అలసట, ఆయాసం వచ్చాయి. గత మూడేళ్ళుగా శబరిమలకి కూడా వెళ్ళకపోవడంతో, నాకు ఈ కొండ ఎక్కడం కష్టమనిపించింది. మా బాబయి సులువుగానే ఎక్కేస్తున్నాడు, నేనేమో పది అడుగులు వేయడం ఆగిపోవడం! పనివేళలు పట్టించుకోకుండా, ఏం తింటున్నామో చూసుకోకుండా, సరైన నిద్ర లేకుండా ఉంటుండడంతో బరువు పెరిగిపోయి శరీరం స్థూలకాయమవుతూ ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. అప్పుడే స్ఫురించింది శరీరానికి కనీస వ్యాయామం ఎంత అవసరమో. ఆ క్షణంలో ఆ కొండ (ప్రకృతి) మౌనంగా బోధించేది అదేనని అర్థమైంది.

కొండలెక్కడం గురించి ఎప్పుడో చదివిన కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయి. “At bottom, mountains, like all wildernesses, challenge our complacent conviction – so easy to lapse into – that the world has been made for humans by humans. Most of us exist for most of the time in worlds which are humanly arranged, themed and controlled. One forgets that there are environments which do not respond to the flick of a switch or the twist of a dial, and which have their own rhythms and orders of existence. Mountains correct this amnesia. By speaking of greater forces than we can possibly invoke, and by confronting us with greater spans of time than we can possibly envisage, mountains refute our excessive trust in the man-made. They pose profound questions about our durability and the importance of our schemes. They induce, I suppose, a modesty in us.” – అని “Mountains of the Mind: Adventures in Reaching the Summit” అనే పుస్తకంలో అంటాడు రచయిత Robert Macfarlane.

PataKotappaGudi

DarkCloudమొత్తానికి తడుస్తూనే, రాళ్లూ రప్పలను దాటుకుంటూ శిఖరాగ్రానికి చేరాము. అనుకున్నట్లే అక్కడ ఎవరూ లేరు. నేను, మా బాబాయి తప్ప మరో మనిషి లేడు. వర్షంతో తడిసిన బట్టలను అక్కడ చెట్ల మీద ఆరేసుకుని, నా బ్యాగ్ లో పట్టుకెళ్ళిన పంచలు ధరించి అక్కడి లింగానికి పూజ చేసుకున్నాం. ఆ శిఖరం నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. అత్యంత ప్రశాంతంగా ఉన్న ఆ చోటు వదిలి రా బుద్ధి కాలేదు. కానీ చీకటి పడేలోగా క్రిందకి దిగాలి కాబట్టి, దిగసాగం. దిగేడప్పుడు అంత కష్టమనిపించలేదు. మళ్ళీ జోరున వాన. ఓ చెట్టు చాటున ఆగాం. జీవితంలో ఏదైనా సాధించడమనేది శిఖరాగ్రాన్ని చేరడం లాంటిదని, అక్కడికి చేరాక, ఇంక సాధించడానికి ఏమీ ఉండదని, మళ్ళీ క్రిందకి దిగి రావల్సిందేనని అనిపించింది. ఎక్కేడప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కామో, దిగేడప్పుడు అంతే జాగ్రత్తగా దిగాము. ఏమరుపాటుగా ఉంటే కాలు జారి పడడం ఖాయం. విజయం తరువాత గర్వం తలకెక్కితే పతనం తప్పదని ప్రకృతి ఈ రకంగా చెబుతోందని అనిపించింది. గదికొచ్చి, తడిసిన బట్టలు ఆరేసుకుని, పొడి బట్టలు ధరించి భోజనం చేసి విశ్రమించాం.

∗ ∗ ∗

కొండ ఎక్కడానికి నానా అవస్థలు పడ్డ నన్ను చూసి మా బాబాయి ఓ కథ చెప్పాడు. ఓ మహిళ కొన్ని సంవత్సరాల పాటు రోజూ ఈ కొండెక్కి ఆ లింగాన్ని పూజించేదని చెప్పాడు. ఆ కథేంటంటే… కొండకావురు గ్రామంలో సునందుడు, కుందరి అనే యాదవ దంపతులకు ఆనందవల్లి అనే కూతురు ఉందేది. పుట్టుకతోనే శివభక్తిని అలవడిన ఆమెకి వయసుతో పాటు ఆ భక్తి పెరిగింది. రోజూ రుద్రశిఖరమెక్కి అక్కడ జంగమరూపంలో ఉన్న శివునికి త్రికరణ శుద్ధిగా పూజచేసి, పాప వినాశన క్షేత్రం నుంచి తీసుకువెళ్ళిన జలంతో అక్కడి లింగానికి అభిషేకం చేసి, తాను తీసుకువెళ్ళిన ఆవుపాలను నైవేద్యంగా పెట్టేది. ఎండనకా, వాననకా ఎంతో శ్రమల కోర్చి కొండ ఎక్కి స్వామిని అర్చించి దిగి వచ్చేది. ఆమె వివాహం ప్రస్తావన లేకుండా నిరంతరం శివుని ధ్యానంలోనే ఉండిపోయేది. ఏళ్ళు గడుస్తున్నా ఆమె భక్తి పెరుగుతోందే తప్ప, తరగడం లేదు. భౌతిక ప్రపంచ విషయాలను పట్టించుకోకుండా, స్వామి తలంపులలోనే గడుపుతూ, ఆధ్యాత్మికానందం పొందుతూండేదట. ఆమెని పరీక్షించాలని స్వామి ఆమెకు మాయాగర్భాన్ని కల్పిస్తాడట. నెలలు నిండినా కూడా కొండ ఎక్కడం ఆపక, నిత్యం కొండెక్కి పూజలు కావించి మళ్ళీ దిగేదట. ఆమె బాధ చూడలేని స్వామి వారు, ఓ రోజు “అమ్మా, నువ్వు ఇలా రోజూ రావద్దు. నేనే నీతో పాటు వస్తాను… నువ్వు కిందకి దిగుతూ ఉండు. నీ వెనుకే నేను వస్తాను. ఎలాంటి చప్పుడైనా వెనుదిరిగి చూడకు. ముందుకు సాగుతునే ఉండు…” అని అన్నారట. ఆమె తలూపి దిగడం ప్రారంభించిదట. ప్రస్తుత ఆలయం ఉన్న చోటుకి రాగానే భయంకరమైన శబ్దమై, భయపడి ఆమె తల తిప్పి వెనక్కి చూసిందట. అంతే స్వామి అదృశ్యుడై అక్కడే లింగంగా వెలిసాడట. ఆ క్షణంలోనే ఆమె ప్రసవం అవడం, మగబిడ్డ పుట్టడం జరుగుతుంది. స్వామి వారు అదృశ్యమైనందుకు చింతించిన ఆమె అక్కడే ప్రాయోపవేశం చేయాలని తలచగా, ఆ నవజాత శిశువు మాయమై శివుడు దర్శనమిస్తాడు. ఆమెకి ముక్తిని ప్రసాదించాడు. నూతన కోటేశ్వరస్వామి వారి ఆలయానికి దిగువనే ఆనందవల్లికి గుడి ఉంది. దీనిని గొల్లభామ గుడి అంటారు. ఈమె గురించి మరో విశేషం ఉంది. శివుడికి అభిషేకం నిమిత్తం సేకరించిన జలాన్ని ఓ బిందెలో ఉంచి, పూల కోసం వెళ్ళినప్పుడు ఓ కాకి వచ్చి ఆ బిందెలోని నీటిని నేలపాలు చేసిందట. కోపించిన గొల్లభామ “ఇక్కడ కాకులుండ కూడదు గాక!” అని శాపమిచ్చిందట. అందుకే కోటప్పకొండ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనబడవు.

రాత్రి 8 గంటల తర్వాత గుడి ఖాళీ. ఒకరిద్దరు సిబ్బంది తప్ప జనాలే లేరు. గుడి ప్రాంగణంలో ఉన్న ఓ సిమెంట్ దిమ్మ మీద కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తుంటే ఏదో ఆనందం. తృప్తి. నిత్యం రణగొణధ్వనులతో నిండిన నగర జీవితం నుంచి ఒక్కరోజయినా దూరంగా ఉండి ప్రశాంతమైన స్థలంలో ఉండడం వల్ల కలిగిన మానసికానందం అదని గ్రహించడానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఈ గుడి కొండ మీద ఊరికి దూరంగా ఉండడం; ఏం కావాలన్నా, కొండ దిగి కనీసం పది కిలోమీటర్లైనా వెళ్ళాల్సిరావడం వల్ల సాయంత్రమయ్యే సరికి ఇక్కడ జనాలు ఉండరు. ప్రధాన రహదారికి, రైలు మార్గానికి దూరంగా ఉండడం వల్ల వాహనాల రాకపోకల శబ్దాలు, రైలు కూతలు వంటివి లేవు. మైకులూ, లౌడ్ స్పీకర్లు లేవు. పొద్దుగుంకాక, పక్షుల కువకువలు, కోతుల కిచకిచలు తప్ప మరేమీ వినపడదు. చాలా సేపు గుడి ప్రాంగణంలోనే కూర్చుని, నిద్రపోకతప్పదు కాబట్టి గదికి వచ్చి – ఆ పూట పొందిన అనుభవాలను నెమరు వేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. – It was a real bliss!

∗ ∗ ∗

 

DakshinamurthyTemple16 ఆగస్టు 2014 శనివారం పొద్దున్నే లేచి స్నానాదులు గావించి, త్రికోటేశ్వర స్వామి వారి ఆలయానికి దిగువన ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళాం. మళ్ళీ మేమిద్దరమే. పూజారి తప్ప మరెవరూ లేరు. మన గుళ్ళలో చాలా అరుదుగా దొరికే భాగ్యం ఇది. ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోగలగడం! ఆ మూర్తిని చూస్తుంటేనే ఏదో పరవశం. ఇక్కడ పూజాదులు కానించి, త్రికోటేశ్వర స్వామి వారి అభిషేకానికి వెళ్ళాము. దర్శనమయ్యాక, తీర్థ ప్రసాదాలు స్వీకరించి బసకి వచ్చాం. చిత్తచాంచల్యాన్ని దూరం చేసి మానసిక స్వస్థత కలిగించే ఆలయమిదని ప్రధానార్చకులు చెప్పారు. మేం దిగిన గది ఖాళీ చేసి, అక్కడున్న కాంటిన్‍లో టిఫిన్ తిని బయటకు వచ్చేసరికి మా ఆటో అతను వచ్చేసాడు.

DakshinaMurthyIdolఇక్కడ ప్రధానంగా ఉన్న రెండు ఇబ్బందుల గురించి ప్రస్తావించక తప్పదు. కొండ మీద ఉన్నది ఒకే ఒక కాంటిన్. ఏ వస్తువైనా మాములు ధరకన్నా కనీసం రెండు రెట్లు ఎక్కువకి అమ్ముతున్నారు. గ్లాస్ మినరల్ వాటర్ రెండు రూపాయాలు. టీ కాఫీలు పది రూపాయలు. ప్లేట్ ఇడ్లీ (చిన్న సైజువి మూడు) రేటు వింటే ఠారెత్తిపోయింది… గత్యంతరం లేదు కాబట్టి తినక తప్పలేదు. ఇక రెండో ఇబ్బంది కోతులు. గుంపులు గుంపులుగా ఉంటాయి. భక్తుల సంఖ్య కన్నా వీటి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. చేతిలోని వస్తువులను బలవంతంగా గుంజుకుపోతాయి. త్రికోటేశ్వరస్వామి వారిది బ్రహ్మచారి రూపం కాబట్టి ఇక్కడ పార్వతి దేవి ఉండదు. కాబట్టి కళ్యాణోత్సవాలు ఉండవు. సాధారణంగా ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుందీ ఆలయం. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలోనూ, ధనుర్మాసంలో వచ్చే ఆర్ద్రోత్సవానికి మాత్రం భక్తులతో కిటకిటలాడిపోతుంది. పునర్దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థిస్తూ, కొండ దిగడం ప్రారంభించాము.

మెట్ల మార్గంలోనూ, కొండకి దిగువన మరిన్ని ఆలయాలు ఉన్నాయి. భక్తులు ఆరాధించిన విగ్రహాలు ఉన్నాయి. ఘాట్ రోడ్ మీద నుంచి దిగుతూ, రోడ్‌కి అటూ ఇటూ ఉన్న పెద్ద పెద్ద బొమ్మలను ఫోటోలు తీసుకున్నాను. దారిలో పిల్లల కోసం అటవీశాఖ నిర్వహిస్తున్న పార్కు ఉంది.

Ganesha GollabhamaTemple PanchamukhaSivalingam KalindiMadugu Shiva Vishnu Brahmaనరసరావుపేట బస్టాండ్‍కి వచ్చి టీ తాగి గుంటూరు వెళ్ళే నాన్-స్టాప్ బస్ ఎక్కాం. మధ్యాహ్నం ఒకటి నలభై కల్లా గుంటూరు చేరి, రైల్వే స్టేషన్ సమీపంలో ఓ హోటల్‍లో భోజనం చేసి, గుంటూరు – సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురు చూడసాగం. గంట ఆలస్యంగా వచ్చిన రైలు గుంటూరు నుంచి బయల్దేరేసరికి మరో అరగంట పట్టింది. మొత్తానికి రాత్రి పదకొండు గంటలకి సికింద్రాబాద్ చేరాము. ఇంటికి చేరే సరికి పదకొండున్నర. ఏదో రెండు ముద్దలు తిని, పక్కమీదకి చేరి.. “కోటి వేల్పుల అండ కోటప్ప కొండ” యాత్రానుభవాలను స్మరించుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

∗ ∗ ∗

హైదరాబాదు నుంచి పిడుగురాళ్ళకి ఇప్పుడు చక్కని రోడ్ మార్గం కూడా ఉంది. సొంత వాహనం ఉంటే పొద్దున్నే బయల్దేరితే, దర్శానాదులు కావించుకుని రాత్రికి తిరిగి హైదరాబాదు చేరుకోవచ్చు. లేదూ వారాంతాలు ప్రశాంతంగా గడపదలచుకుంటే శనివారం పొద్దున్నే ప్రయాణమైనా, మధ్యాహ్నానికి గుడికి చేరుతాం. అక్కడ గది తీసుకుని శనివారం సాయంత్రం, రాత్రి ప్రశాంతతని అనుభవించి, ఆదివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమైనా శరీరం, మనసు రీచార్జి అవుతాయి. మరి ఆలస్యమెందుకు, వెడతారుగా…?

కొల్లూరి సోమ శంకర్

శివం-సుందరం : గోకర్ణం

Murudeswar

శ్రావణమాసం!

        గోకర్ణం అని బస్ వాడు పిలిచిన పిలుపుకు ఉలిక్కిపడి లేచి క్రిందకు దిగగానే పన్నీటి చిలకరింపుల ఆహ్వానంలా కురిశాయి తొలకరి జల్లులు. ‘చంద్రుణ్ణి చూపించే వేలు’లా, మట్టి రోడ్డు ఊరిలోకి దారిని చూపిస్తోంది. మనసును పట్టిలాగే మట్టి పరిమళం వెంటే వస్తోంది. పచ్చటి పల్లెటూరు గోకర్ణం. భుజాల మీదకు బ్యాగులు లాక్కుంటూ మేం వెళ్ళవలసిన హోటల్కు నడక మొదలెట్టాము. ఆదిలోనే హంసపాదు. ముందురోజు గోకర్ణం వచ్చాకే రూం తీసుకోవచ్చునన్న హోటల్ వాళ్ళు, తీరా వెళ్ళాక, రూములేవీ ఖాళీల్లేవన్నారు. చేసేదేమీ లేక, ఒక హోం స్టేలో అద్దెకు దిగాం.

ఇక్కడ ఇళ్ళన్నింటికీ చిత్రంగా రెండేసి తలుపులు. ఒకటి గుమ్మం బయట మోకాళ్ళ వరకూ. రెండవది మామూలుగా- గుమ్మానికి లోపలివైపు. దాదాపు పగలంతా, ఎవరూ లోపలి తలుపు వేసుకున్నట్టే కనపడలేదు. బహుశా, దొంగల భయం ఉండి ఉండదు. రూం ఏమంత సంతృప్తికరంగా లేకపోయినా త్వరత్వరగా స్నానాలవీ ముగించి మహాబలేశ్వరుడి గుడికి బయలుదేరాం. చిన్న ఊరే కావడంతో అన్నీ నడచి వెళ్ళగల్గిన దూరాలే. గుడికి నాలుగడుగుల ముందు, రవికల్లేకుండా, కుడిపవిటతో, నడినెత్తిన కొప్పులతో ఉన్న కొందరు యువతులు మమ్మల్ని అటకాయించి, అధికారంగా చేతుల్లో తామరాకు పొట్లమొకటి ఉంచి, “ముందు ఇటు” అంటూ దారి మళ్ళించారు.

గుప్పెడు గరిక, దోసెడు పూలు. తామరాకు పొట్లాన్ని భద్రంగా పట్టుకుని, వాళ్ళు చెప్పినట్టే గణపతి దర్శనానికి వెళ్ళాము. గోకర్ణ ప్రాముఖ్యత అంతా అక్కడి ప్రాణలింగంలోనే ఉందని అంటూంటారు. ఈ ప్రాణలింగం సామాన్యమైనది కాదు. సృష్టిలోని చరాచర జీవుల సత్వశక్తితో మహాశివుడు మూడు కళ్ళు, మూడు కొమ్ములు ఉన్న ఒక విశిష్ట మృగాన్ని తయారుచేస్తాడొకానొకప్పుడు. రెండు కొమ్ములు బ్రహ్మ, విష్ణు శక్తులుగా మారగా, మూడవది ఈ ప్రాణలింగం. సాక్షాత్తూ రుద్రాంశ. దీని శక్తిని గుర్తెరిగిన రావణాసురుడు ఘోరమైన తపస్సు చేసి, శివానుగ్రహంతో దీనిని సాధించి తీసుకు వెళ్ళిపోజూస్తాడట. భక్తుల యోగ్యత చూసి, భోళాశంకరుడి వరాలను అవసరమైతే పట్టి వెనక్కు లాగే శ్రీహరి, ఈసారీ రంగంలోకి దిగి, రావణాసురుడి నుండి ప్రాణలింగాన్ని దూరం చేయదలచి, తన చక్రాన్ని అడ్డు పెట్టి, సూర్యాస్తమయమైన భ్రమ కలిగిస్తాడట లోకాలకు.

విజయగర్వంతో ప్రాణలింగాన్ని తీసుకుని ప్రయాణిస్తోన్న రావణాసురుడు, కమ్ముకుంటోన్న అరుణవర్ణాన్ని చూసి, సాయంసంధ్య వేళయిందని నమ్మి, సంధ్యావందనం చేయగోరి, భూస్పర్శ సోకితే లింగం అక్కడే ప్రతిష్టితమైపోతుందన్న శివుని వాక్కు గుర్తొచ్చి, ఇహ ఎక్కడ పెట్టాలో తెలీక, చుట్టూ చూస్తాడట. ఈ లోపు, బొజ్జ గణపయ్య అక్కడికి గోవులకాపరి వేషంలో వచ్చి, గోవులను చూస్తునట్టు నటనమాడుతాడట. రావణాసురుడు ఉన్న కథంతా చెప్పి, తానొచ్చేవరకూ లింగాన్ని భూస్పర్శ సోకకుండా కాపాడమని అర్థిస్తే, లంబోదరుడు తాను చిన్నవాణ్ణి కనుకా, లింగం బాగా బరువుగా ఉంది కనుకా, మోయలేననిపిస్తే ముమ్మార్లు పిలిచి క్రింద పెట్టేస్తానని హెచ్చరించి, ఆ భారాన్ని అందుకుంటాడట. రావణుడు సంధ్య వార్చడమిలా మొదలెట్టీ మొదలెట్టగానే చకచకా మూడుసార్లూ పిలిచేసి, లింగాన్ని నేల మీదకు దించేస్తాడట గౌరీసుతుడు. ఆ ప్రాంతమే ఈ గోకర్ణం.

రావణాసురుడు రాక్షసుడు, గర్వి, కోపిష్టి. ఊరుకుంటాడా మరి? పట్టరాని ఆవేశంతో గణపతి శిరసుపై పిడికిలితో మోదుతాడట. మహాబలేశ్వరుడి దర్శనానికి ముందు, ఆ కొండయువతులు మమ్మల్ని చూడమన్నది, ఈ గణపతినే. శిరసు మీద పిడికిలి గుర్తులు సుస్పష్టంగా కనపడుతోన్న ఇక్కడి “చింతామణి గణపతి”కి మనసారా మొక్కి, మహాబలేశ్వరుడి గుడివైపు నడక సాగించాం.

మహాబలేశ్వరుడి గుడిలో ఉదయం 6-12 వరకూ, సాయంకాలం 6-8 వరకూ భక్తులందరికీ గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది. ఆత్మలింగాన్ని స్వహస్తాలతో స్పృశించి అభిషేకం చేయగల మహదవకాశమూ లభిస్తుంది. సువర్ణనాగాభరణవిశేష పూజ చేయించదలచిన మా జంటని, పూజారులొకరు వచ్చి వారి తరఫున అంతరాలయంలోకి తీసుకువెళ్ళారు. పంచామృతాలతో పరమశివుడికి అభిషేకం చేయడం కాసేపటికి పూర్తయింది. “త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్” అనుకుంటూ మారేడు దళాలను సమర్పించుకోవడమూ అయింది. అప్పుడు,
“లింగరూప తుంగ, జగమాఘనాశన
భంజితాసురేంద్ర రావణలేపన
వరగోకర్ణఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ
శ్రీమహాబలేశదేవ సార్వభౌమతే”
అని మహాబలేశ్వరుణ్ణి అందరూ కీర్తిస్తూండగా, దాదాపు మూణ్ణాలుగు బిందెల నీళ్ళను, మన ముంజేయి లోతులో ఉన్న బిలంలో ధారగా వదిలారు అర్చకులు. వచ్చినంత నీరు బయటకు రాగా, లోపల మిగిలిన నీరు నిశ్చలమైపోగా, మమ్మల్ని అందులోకి తొంగి చూడమన్నారు. తాకి మొక్కుకోమన్నారు. ఆత్మలింగం!! రుద్రాంశ! దేవతలందరూ కొలిచిన కొమ్ము. సమస్త లోకాలకూ రక్షణైన కొమ్ము. రాముడు నమ్మిన క్షేత్రం. రావణుడోడిన క్షేత్రం. అక్కడ..ఆ క్షణంలో, దానిని తాకి పరవశించగల సౌభాగ్యంతో మేము. ‘ఆత్మనొక దివ్వెగా’ ఈ పరమేశ్వరుని పాదాల చెంత వెలిగించాలనుందన్న ఓ కవిమిత్రుని మాటలు అప్రయత్నంగా గుర్తొచ్చాయి. ఆ శ్రావణమేఘాల తడిజాడలేవో నా కన్నుల్లోనూ మెరిశాయి.

అటుపైన ‘కడల్ బీచ్’కు వెళ్ళి, కడలి ఒడిలో కాసేపు ఆటలాడి, అక్కడి భోజనం వెగటు పుట్టిస్తోన్నా శక్తినంతా సముద్రానికి ధారపోసిన పాపానికి తినకుండా ఉండలేక, ఎలాగో అయిందనిపించి, మురుడేశ్వర్ వెళ్దామని బయలుదేరాం. 2000/-కు మారుమాట లేని బేరమైతే తీసుకువెళ్తామని టాక్సీల వాళ్ళు ముందుకొచ్చారు. బస్స్టాండ్ అట్టే దూరం కాకపోవడంతో, బస్సులేమైనా ఉన్నాయేమోనని కనుక్కోవడానికి వెళితే, నేరుగా ఏం లేవనీ, కుంటాలో దిగి మారవలసి ఉంటుందనీ చెప్పారు.

ఇక టాక్సీ తప్పదనుకుంటూండగా మా వద్దకొక ఆటోవాలా వచ్చి వివరమడిగాడు. ఇవన్నీ వద్దనీ, మూడున్నరకు మురుడేశ్వర్లో దింపే రైలొకటుందనీ, అది ఎక్కితే గంటలో వెళ్ళిపోతామనీ చెప్పాడు. మాకొక్క గంటే సమయముంది. అతని ఆటోలోనే ఎక్కి స్టేషన్ కు బయలుదేరాం. దారంతా అతను అక్కడి గుడుల గురించీ, అక్కడి మనుష్యుల మంచితనాన్ని గురించీ కథలుకథలుగా చెబుతూనే ఉన్నాడు. పచ్చిక బయళ్ళ దగ్గరా, ఉప్పు నీటి మడుల దగ్గరా మెల్లిగా పోనిస్తూ వాటి విశేషాలన్నీ విప్పి చెప్పాడు.

అనుకున్న వేళకి పది నిముషాల ముందే మమ్మల్ని స్టేషన్లో దించేశాడు. రైలు నిజంగా ఉందో లేదో నన్న అనుమానం నన్ను వదల్లేదు. ఐదువందల రూపాయల నోటు చేతిలో రెపరెపలాడుతోంటే, అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగానతన్ని. అతడేమనుకున్నాడో, ఏమనిపించిందో నాకు తెలీదు కానీ, “నమ్మకం ఉండాలి మేడం! అది లేకుండా ఏ ప్రయాణమూ పూర్తి కాదు” అన్నాడు, చిల్లర లెక్కపెడుతూ. అతడు మామూలుగానే అన్నా, “ప్రయాణం” అన్న పదం, అతను పలికినంత తేలిక అర్థంలో అయితే నాకు స్ఫురించలేదు. చాలా సేపు ఆమాట నా ఆలోచనలను అంటిపెట్టుకునే ఉంది. ఆ ఒక్కమాటా కలిగించిన వేల ఆలోచనలు, గుర్తు చేసిన వేనవేల సందర్భాలూ, మనుష్యులూ, అన్నీ, మురుడేశ్వర్ ఆలయాన్ని చూసీ చూడటంతోనే, అక్కడి గోపురాల్లో నుండి చివాలున రెక్కలు విదుల్చుకుంటూ ఎగిరిపోయి శాంతిని వదిలే పావురాలల్లే చెల్లాచెదురైపోయి, నన్నొక నిశ్శబ్దంలోకి నెట్టేశాయి.

gokarna2

దాదాపు ఇరవై అంతస్తుల మహాఆలయం. నిగర్వులమై తలపూర్తిగా వెనక్కు వాల్చితే తప్ప కనపడని గోపురం. అది దాటి వెనక్కు వెళితే, సముద్ర తీరాన అంతెత్తులో, ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద శివుడి విగ్రహం. ఆ శివుడి విగ్రహం దగ్గర నిలబడి చూస్తే అనంత జలరాశితో ఎగసెగసిపడుతూ అరేబియన్ సముద్రం. అస్తంగత సూర్యుడు తన బంగారు కాంతులన్నింటినీ ఆప్తుడని కాబోలు, సముద్రుడికే ధారపోశాడు. వాతావరణం ఉన్నట్టుండి చల్లబడిపోయింది. తలెత్తి చూస్తే పరమేశ్వరుడి శిరసుపై ఠీవిగా కనపడుతోన్న చంద్రవంక. ” చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమాం!”

గుంపులు గుంపులుగా మనుష్యులు. చిన్నా-పెద్దా, పొట్టీ-పొడుగూ, నలుపూ-తెలుపూ..ఏవో భేదాలు. ఏవేవో పోలికలు. ఆ గుడిమెట్ల దగ్గరే కొన్ని జంతువులు మూగగా నిలబడి చూస్తున్నాయి. అశుచిగా ఉన్న చోట్ల ఈగలూ దోమలు ముసురుకుని చెదరిపోతున్నాయి. పక్షులు కొన్ని అక్కడే ఉన్న పొడుగాటి చెట్ల గుబుర్లలో చేరి కిచకిచమంటున్నాయి. కలకలం రేపుతున్నాయి. గట్టిగా ఆరేడు నెలలైనా నిండి వుండని పసివాడొకడు అమ్మ చేతుల్లో నుండే చిన్ముద్రలో ఉన్న మహాదేవుడి విగ్రహాన్ని తదేకంగా చూస్తున్నాడు.

ఏం కోరుకోవాలీ పరమేశ్వరుణ్ణి?
ఏమని మొక్కాలి?

“నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ |
సదా త్వత్పాదాబ్జస్మరణపరమానందలహరీ-
విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ||”

***

ఆరున్నరకు తిరిగి గోకర్ణం చేర్చే రైలు పట్టుకుని వెనక్కు వచ్చేశాం. వచ్చీ రావడంతోనే మర్నాడు ఉదయమే ఐదు గంటలకు దూద్సాగర్ జలపాతాలకు వెళ్ళేలా కార్ మాట్లాడుకున్నాం. అటుపైన ఆ రాత్రి మేం పట్టుమని నాలుగు వీథులైనా కనపడని గోకర్ణమంతా చెట్టాపట్టాలేసుకుని తీరిగ్గా తిరిగాము. కోటి తీర్థం, భద్రకాళి గుడి, శ్రీకృష్ణ మందిరం – – అడుగుకో గుడి, అరుగుకో బ్రాహ్మడు అన్నట్టుందా ఊరు. ఎవరి ముఖంలోనూ ఖంగారు లేదు. ఎత్తరుగుల ఇళ్ళ వాకిళ్ళలో పిల్లలు గుంపులు గుంపులుగా చేరి ఆడుకుంటున్నారు. ఊరు ఊరంతా తొమ్మిది గంటల వేళకే నిద్రించండానికి సమాయత్తమైపోయింది. ఒకానొక కూడలిలో మాకు వేంకటరమణుడి ఆలయమొకటి కనపడింది.

మేం ఎక్కడ నడుస్తూన్నా, ఆ శ్రావణ మాసపు రాత్రి, నిర్జన వీధుల్లో నుండి శ్రీకృష్ణ సంకీర్తనలు తేలివచ్చి మమ్మల్ని తాకిపోతున్నాయి. వాటిని పరిపూర్ణంగా లోలోపలికి ఒంపుకుంటూనే, కనపడ్డ ప్రతి షాపులోకీ తొంగి చూస్తూన్నాన్నేను. స్త్రీసహజమైన బేరాలాడే బుద్ధి ఏనాడూ కలిసొచ్చిన జ్ఞాపకం లేకపోయినా, ఆకుపచ్చని ఆశని గుండెలో దాచుకుని, అప్పుడెప్పుడో చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న సూత్రం – సగానికి సగం ధర తగ్గించి అడగడమే బేరం – అని గుర్తు చేసుకుని, నచ్చిన ప్రతి కుర్తాకోసమూ ఓ మాట వదిలి చూశాను. కొట్టు కట్టేసే హడావిడిలో ఉన్న ఓ ఆసామీ నా మాట మన్నించాడు. ఆ విజయగర్వంతో , ఆ మిగిలిన డబ్బులతో – స్వీట్ కోసం ఓ చిన్న షాపు ముందు ఆగాం. అది నిజానికి హోటల్.

gokarna1

అక్కడున్న రెండు నిముషాల్లోనూ నన్ను ఆకర్షించింది – అక్కడ పనిచేస్తోన్న అమ్మాయిలు. లంగాఓణీల్లో పద్ధతిగా, ధైర్యంగా, చిత్రంగా మెరుస్తోన్న కన్నులతో హోటల్ తమదే అన్నట్టు కలియదిరుగుతున్నారు వాళ్ళందరూ. మామూలుగా అమ్మాయిలు ఎక్కడో లోపల నక్కి గిన్నెలు తోమడమో, వంటింట్లో కూరలు తరగడమో చూశాను కానీ, ఇలా ఇదీ-అదీ అన్న భేదం లేకుండా వంట నుండీ-కేష్ కౌంటర్ దాకా, తయారుగా ఉన్న పదార్థాల గురించి ఉత్సాహంగా చెప్పడం మొదలు- వాటిని శ్రద్దగా మననం చేసుకుని అంతే శ్రద్ధగా అందించేదాకా, అన్ని పనులూ గట్టిగా ఇరవయ్యేళ్ళు కూడా నిండి ఉండని అరడజను మంది అమ్మాయిలు నేర్పుగా చేసుకుపోవడం ఇక్కడే చూశాను.

మాటల్లో మన్నన, చేతల్లో చురుకుదనం – అక్కడున్న కాసేపూ నా కళ్ళు వాళ్ళ చేష్టలని వెంటాడుతూనే ఉన్నాయి. నాతో పాటుగా అక్కడి అరడజను బల్లల మీది అంతమందినీ, అన్నిరకాల చూపుల్నీ గడుసుగా తప్పించుకుంటూ తమ పని తాము చేసుకుపోతున్నారు వాళ్ళు. టేబుల్ క్లీన్ చేస్తున్న అమ్మాయిలో కూడా ప్రస్ఫుటంగా కనపడ్డ సంతోషాన్నీ, శ్రద్ధనీ చూస్తే, మార్టిన్ లూథర్కింగ్ను మాటలను కానీ వీళ్ళు చదివారా అనిపించింది. మనుష్యుల్లోని ఏ లక్షణాలు వాళ్ళని ప్రత్యేకంగా నిలబెడతాయో, అభిమానాన్ని, గౌరవాన్ని కలిగించి గుర్తుండిపోయేలా చేస్తాయో, మరొక్కసారి నేర్చుకున్నట్టైంది. మేమడిగిన స్వీట్తో పాటు చిల్లరనూ, చలాకీ నవ్వులతో చుట్టబెట్టి ఇస్తూన్నప్పుడు, తళుక్కుమన్న ఆ అమ్మాయి ముక్కెర మెరుపును ఆ రాత్రి ఆఖరి జ్ఞాపకంగా మార్చుకుని, రూంకొచ్చేశాం.

మా అనుమానం నిజం చేస్తూ, 11 దాటాక, ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేశారు. వాన చాలా ఎక్కువగా పడుతోందనీ, ఈ వాతావరణంలో ప్రయాణం మంచింది కాదనీ, దూద్సాగర్లో కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటే జలపాతాల దగ్గరికి ఎవ్వరికీ అనుమతి ఉండదనీన్నూ. ప్రయాణం రద్దయింది. నిరాశతోనే తెల్లవారింది.

 

***
శ్రావణ బహుళ అష్టమి.

చీకటి ముసుగులా పల్లెనింకా వీడనే లేదు. సన్నగా జల్లు కురుస్తూనే ఉంది. జంధ్యప్పోగులు సరిచేసుకుంటూ బ్రాహ్మలు వడివడిగా మమ్మల్ని దాటుకుపోతున్నారు. మహాబలేశ్వరుడి గుడి ఎదుటి దుకాణాల్లో నుండీ లింగాష్టకం లీలగా వినపడుతోంది. మట్టి రోడ్లే అన్నీనూ. అయినా రాత్రంతా కురిసిన వర్షానికి ఏ వీథిలోనూ నీరు నిల్చిపోయిన దాఖలాల్లేవు. అక్కడి మనుష్యుల శుభ్రతనూ, ఉన్నంతలోనే జాగ్రత్తగా మసలుకోవాలన్న మెలకువనూ అభినందించుకుంటూ నడుస్తూండగానే..అల్లంత దూరాన తరగల నురగలతో నవ్వుతూ పిలుస్తూ సముద్రం. ఆ సాగరఘోషలో అంతులేని ఆకర్షణ ఉంది. అర్థమయీ అవని విషాదమూ దాగుంది.

“సముద్రం సంగతి” అంటూ, దేవిప్రియ ఓ కవితలో ఇలా అంటారు –

“వేయి తలల నాగులా
అలల నాలుకలు చాచుకుని
పైపైకి వస్తోంది సముద్రం
నా పాదాల మంత్రదండాలు తగిలితే
పడగల్ని రాతి గట్టుకేసి కొట్టుకుని
మళ్ళీ నీటిపుట్టలోకి నిష్క్రమించడానికి”

దేవిప్రియ ఏ సముద్రం ముందు నిల్చుకుని ఇంత చమత్కారంగా ఆలోచించారో అనుకుంటూ, చర్చించుకుంటూ, ఆ సాగరతీరంలో మేమిద్దరం నడక మొదలెట్టాం. నిర్మానుష్యంగా, నిర్మలంగా, తడిగా, ఒకింత గట్టిగా ఉన్న ఆ ఒడ్డు వెంట..ఎన్ని మైళ్ళు నడిచినా అలసట రానివ్వని మహత్తేదో ఉంది. ఏ అలల చప్పుళ్ళు విన్నా, ఏవో కథలు వినపడుతూనే ఉంటాయి. వాన పెరుగుతూ తగ్గుతూ ఉంది. అలలు మెదిపిన తీరాల మీద చినుకులేవో అర్థమవని చిత్రాలు గీయడం మొదలెట్టాయి. సుడులుసుడులుగా లోతుగా, స్పష్టంగా – క్షణికాలే కానీ, చూసి తీరాల్సిన బొమ్మలవి. సముద్రంలో వాన చినుకుల చప్పుళ్ళు సంగీతమైతే, తడితడి తీరాల పెదవుల మీద చినుకుల ముద్దు ముద్దరలన్నీ చిత్రలేఖలే.

Crow_onthe_beach

మరికాసేపటికి ఎటు నుండి వచ్చిందో – ఓ కాకి ఆ తీరానికి వచ్చింది. కాకిని, అందులోనూ ఒంటరి కాకిని చూస్తే, నాకు బషో గుర్తొస్తాడు. లోకం చలికాలపు దిగులు సాయంకాలమవుతుంది. కానీ, ఆనాటి కాకి కథ వేరు. అల వచ్చేవరకు నిశ్చలంగా నిలబడి సముద్రం వైపే చూడటం; అల మీదకు రాగానే గంతులతో అడుగులు వెనక్కు వేయడం. ఇసుక మీద పడటం వల్లో, అలల తుంపరల వల్లో – ఆగీ ఆగీ రెక్కలు విదుల్చుకోవడం. మళ్ళీ సముద్రం వైపు నాలుగడుగులు..మళ్ళీ వెనక్కు, మళ్ళీ తపతపా రెక్కల చప్పుడు..మళ్ళీ ముందుకు..!

దాని ఈ చేష్టితాలన్నీ చూస్తూ చూస్తూ ఫొటోలు తీస్తూ ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఈ మధ్యే చదివిన రోబర్ట్ ఫ్రోస్ట్ కవిత “డస్ట్ ఆఫ్ స్నో” కూడా గుర్తొచ్చింది. అందులోనూ ఇంతే, గన్నేరు చెట్టు మీద తీరి కూర్చున్న కాకి, తుషార ధూళిని విదుల్చుకున్న తీరే కవి హృదయానికి కొత్త గతినిచ్చిందట. విషాదంలో మగ్గాల్సిన ఓ రోజు నుండి అతనిక్కొంత ఉపశాంతినిచ్చిందట. ఇది అతిశయోక్తి అని ఏ పాఠకులకైనా అనిపించిందీ అంటే, అట్లాంటి ఓ అనుభవం వారికి జీవితంలో ఎదురుపడలేదని అర్థమన్నమాట. చాలా తేలిగ్గా కనిపించే ఇలాంటి కవితల వెనుక ఎంత సున్నితమైన రసస్పందనలు ఉంటాయో, ఎలాంటి అనిర్వచనీయమైన భావోద్వేగాలు ఉంటాయో తెలుసుకోగల్గడమే, ఆనాడు గోకర్ణం సముద్రతీరంలో నే నేర్చుకున్న పాఠం. నా ఉనికిని నిర్లక్ష్యం చేస్తూ తీరమంతా కలియదిరిగిన ఆ కాకి, బహుశా నాకు చెప్పాలనుకున్నదీ అదే కావచ్చును.

gokarna4

ఇంకా ఎన్ని గంటలలా గడిచిపోయేవోకానీ, అందాకా ఆహ్లాదంగా కురిసిన వర్షం జడివానగా మారి చలి మొదలవ్వడంతో, వెంట తెచ్చుకున్న గొడుగులో ఒదిగి వెనక్కు మళ్ళాం. ముందు రాత్రీ, ఆ వేళా, వేంకటరమణుడి గుడి నుండి ఆగకుండా భజనలెందుకు వినపడ్డాయో, చిన్నపెద్దా గొంతులు అన్నేసి భాషల్లో కృష్ణగీతాలెందుకు ఆలపించారో, “కృష్ణా నీ బేగనే బారో” అంటూ ఎందుకంతలా తపించారో గుడిలోకి అడుగుపెట్టేదాకా తట్టనేలేదు మాకు. ఆ వేళ కృష్ణాష్టమి. మేం వెళ్ళిన కాసేపటికే అక్కడికొక విశాలమైన వెండి ఉయ్యాలనూ, దాని తోడిదే సందళ్ళనూ మోసుకుంటూ యువకులు కొందరు దూసుకొచ్చారు. మండపం మధ్యలో అందరూ నిలబడి చూసేందుకనువుగా క్షణాల్లో ఊయలను వేలాడదీశారు. చామంతి, మల్లె, మరువం, కనకాంబరాలతో ఒద్దికగా అల్లిన మాలలను ఉయ్యాలకు బయటివైపు అన్ని దిక్కుల్లోనూ వేలాడదీసి దానిని వర్ణరంజితం చేశారు. పట్టుపరుపులు, తలగడలు తరలి వచ్చాయి. మరి చిన్ని కృష్ణుడెక్కడున్నట్టూ? నాలో అంతకంతకూ పెరుగుతోన్న ఉత్సుకతకు తగ్గట్టే, భజన వేగమూ పెరిగింది.

తాళం అంతకంతకూ మారిపోతోంది. శ్రీకృష్ణ స్మరణతో సభామండపం మారుమ్రోగిపోతోంది. నేనిక కుతూహలాన్ని అణచుకోలేక, పాడుతున్న పాటనలా గాలికి వదిలి, ఊయల వద్దకెళ్ళి తొంగి చూశాను. ఆశ్చర్యం! బాలకృష్ణుడక్కడే పడుకుని హాయిగా నిద్దరోతున్నాడు. వేనవేల గోపికలను “బిగియార కౌగిట మనంబలరారగ జేర్చి”న కొంటెకృష్ణుడేమీ కాదు సుమా, యదుకుల క్షీరవారాశి పూర్ణచంద్రుడితడు. యదుసింహ కిశోరుడు. అంగుష్ఠమాత్రమైనా లేని పసిడి విగ్రహమై, పసివాడై వామహస్తాన్ని నెన్నుదిటిపై వాల్చుకుని పట్టుపరుపుల మధ్య పవ్వళిస్తున్నాడు. “లోకములు నిదురవోవగ జోకొట్టూచు నిదురవోని సుభగుడు” మళ్ళీ ఇలా మనబోటి మామూలు మనుష్యుల ఉత్సవసంబరాన్ని చిన్నబుచ్చకుండా ఉండేందుకు నవ్వుతూ నిదుర నటిస్తున్నాడు. “జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజోకృష్ణా!! జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందువదన! జోజో” అంటూ, అలనాడు యశోద, గోపికలు ఏ విశ్వాసంతో, ఏ అనురాగంతో ఆ బాలకృష్ణుని నిదురపుచ్చారో, అదే భావనతో, అదే నమ్మికతో మేమూ వెండి ఉయ్యాల నూపుతూ జోలపాడాము. భజన అలా నిర్విరామంగా సాగుతూనే ఉంది. మేమా గుడి నుండీ, గోకర్ణం నుండీ వెనక్కు రావలసిన వేళ దగ్గరపడుతోంది. తులసిమాలల మధ్య ఒత్తిగిలిన నందనందనుణ్ణి వీడుకోలువేళ మెల్లగా తాకి చూశాను. గోకర్ణం రేపల్లెగా మారింది. హృదయం బృందావనియై నవ్వింది. తృప్తి.

gokarna3

గోకర్ణం నుండీ ఇటు మోకాంబిక, ఉడిపి, అటు వెళ్తే గోవా ఇవన్నీ దగ్గర దగ్గరే. ఏవి చూడాలీ, ఏవి వదలాలన్నది పూర్తిగా మన ఆసక్తులకు సంబంధించిన విషయం. గోకర్ణం నావరకూ ఓ ఆధ్యాత్మిక ప్రదేశం, నాగరిక ఛాయలు పడని స్వచ్ఛ సౌందర్యం. ఓం బీచ్లోనూ, కడల్ బీచ్లోనూ కూడా విచ్చలవిడితనం లేదు. గుడినీ, సముద్రాన్నీ మినహాయిస్తే, ఇక్కడ చూడటానికీ, చేయడానికీ ఏమీ లేదు. అది కొందరికి నిస్తేజాన్ని, కొందరికి ఉత్తేజాన్ని కలిగించవచ్చు. బెంగళూరుకు తిరిగి ఒకే ఒక్క రైలు ఉంది. అదీ నాలుగ్గంటలకే. తిరుగు ప్రయాణంలో “Value Vision consultancy ” స్థాపించిన పూర్ణిమ నా ముందు కూర్చున్నారు.

ఇరవైరెండేళ్ళ తన సుదీర్ఘమైన కెరీర్లో ఆటుపోట్లనీ, ఆవిడ వాటిని దాటుకొచ్చిన తీరునీ ఆసక్తిగా చెబుతోంటే, నాకసలు సమయం తెలీలేదు. బహుశా, చాలా చోట్ల నన్ను నేను చూసుకోవడం వల్ల అయి ఉండవచ్చు. మర్నాడు తెల్లవారు ఐదుగంటలకే లేచి, అందరం ఫ్రెష్ అయిపోయి, రగ్గుల్లో ముడుచుక్కూర్చుని కాఫీలు తాగుతూ “ఆల్టర్నేటివ్ కెరీర్ ప్లాన్స్ ఫర్ విమెన్” చర్చించుకున్నాం. మద్దూర్ రాగానే రైల్లోకి వడలమ్ముకునేందుకు వచ్చిన వాళ్ళని ఆపి, మమ్మల్నీ కొనుక్కోమని సూచించారావిడ. మద్దూర్ వడకంత పేరు ఊరికే రాలేదని మొదటి ముక్కకే అర్థమయిపోయింది.

బెంగళూరు చేరిపోయాం. కొత్త అనుభవాలూ, పాతబడని జ్ఞాపకాలూ, కొందరు మంచి మనుష్యులు, మనసులో ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్వేగపు కెరటాలు – అన్నింటి తాకిడినీ పరిపూర్ణంగా అనుభవిస్తూ, “మండే మార్నింగ్”ని కూడా ప్రేమిస్తూ…’నమ్మ బెంగళూరు’లో – ‘మస్త్ మజా మాడి’ అనుకుంటూ.

“ఏకాంత జీవితంలో లోతు ఎక్కువవుతుంది, సమాజజీవితంలో వెడల్పు ఎక్కువవుతుంది” అన్న సంజీవదేవ్ మాటలెంత సత్యం!

– మానస చామర్తి

ఆ రోజు “గోముఖ్” ఒక మార్మిక చిత్రం…

1

బదరీనాథ్ వెళ్ళే దారిలో చమోలీ జిల్లాలో పిపల్ కోటి అనే ఓ మాదిరి ఊరుంది. అక్కడో చిన్న అందమైన హోటల్ లో మేం ఒక రాత్రి గడిపాం. విశ్రాంతిగా అందరం ముచ్చట్లు చెప్పుకుంటున్న ఆ రాత్రి వేళ దూరాన ఉన్న ఓ కొండ మీద మోదుగ పూల మాలలా మంటల చార వెలుగుతూ కనిపించింది. అంటుకున్న అడవి ఎప్పటికి చల్లారుతుందోననుకుంటూ నిద్రలోకి జారుకున్నాం.

మర్నాడు పొద్దునే మా స్నానాలకు బకెట్లతో వేడినీళ్ళు కాచి ఇచ్చేందుకు ఇద్దరు పిల్లలు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. ఆ నీళ్ళు తెచ్చుకుందుకు మేడ మెట్లెక్కి నేనూ వెళ్లాను. హోటల్ గదులు కింద ఉన్నాయి. పైనున్న అంతస్తుతో సమానంగా ఉన్న విశాలమైన కొండ భాగం. చూస్తే అక్కడో అందమైన దృశ్యం కళ్ళ ముందు పటం కట్టింది… ఒక వెయ్యి గజాల స్థలంలో వేసుకున్న రక రకాల పంటలు… వాటిలో పసుపు, వెల్లుల్లి దగ్గర్నుంచి గోధుమ వరకూ ఉన్నాయి. చిన్న గుడిసె పక్కనే విశ్రాంతిగా నెమరేసుకుంటున్న ఆవూ, పక్కనే దూడ… ఆ పక్కనే పొయ్యిమీద వేడినీళ్ళు కాగుతున్నాయి. ఈ చక్కని చిన్న ప్రపంచాన్ని పోషిస్తున్న వ్యక్తి ఎవరా అని చూస్తే, ఓ ముప్పయ్యేళ్ళ స్త్రీ నీళ్ళు మోసుకొస్తూ ప్రత్యక్షమైంది. రాత్రి అంటుకున్న అడవి గురించి అడిగితే, ‘నిర్లక్ష్యంగా విసిరేసిన చిన్న బీడీ నిప్పు చాలు అడవిని తగలబెట్టడానికి’ అంది. ఇలా అడవి అంటుకోవటం వల్ల వాగుల్లో నీళ్ళు తగ్గిపోతాయంటుంది. నీళ్ళు లేక తన ఆ చిన్న వ్యవసాయం ఎంత కష్టంగా ఉందో వివరించింది.

2

బదరీనాథ్ ఒక పది కిలోమీటర్ల దూరం ఉందనగా దారి చాలా ఇరుగ్గా మారింది. సూదిగా ఉన్న రాతి పలకలు ఒకదానిమీద ఒకటి పేర్చినట్టుగాఉన్న కొండచరియలు ఒకవైపు, లోయల అగాధాలు మరోవైపు… ఆ మధ్య దారిలో జాగ్రత్తగా బస్సును పోనిచ్చాడు మా డ్రైవర్. చినుకులతో పాటు సన్నని చలిని అనుభవిస్తూ మాకు ఏర్పాటు అయిన బసలో చక్కని భోజనం చేస్తుంటే, మా వెనుక బస్సులో వచ్చినవాళ్ళు తమ కళ్ళ ముందే ఒక ఇన్నోవా లోయలో పడిపోయిందని చెప్పారు. నోరంతా చేదెక్కింది. ఇలా వాహనాలు లోయల్లో పడి మనుషులు ప్రాణాలు పోగొట్టుకోవటం తరచుగానే జరుగుతుందట. మా డ్రైవర్ ఈ విపరీతాలకు కారణం వివరించాడు. వీలైనంత తక్కువ సమయంలో ఈ యాత్రలు పూర్తి చేసేద్దామని అనుకుంటూ డ్రైవర్ లకు రాత్రి సరిగ్గా నిద్రపోయే అవకాశం కూడా ఇవ్వకుండా, వెళ్ళకూడని వేగంతో కొండదారుల్లో పరుగులు తీయించే వాళ్ళ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని అతను చెప్పాడు. పరుగుల జీవిత వేగాన్ని కొండల్లోని నిదానపు నడక దారుల మీద overlap చెయ్యబోతే గమ్యం ప్రతీసారీ అనుకున్నట్టుగా అందదు.

బదరీనాథ్ దగ్గర అలకనంద పరవళ్ళు తొక్కుతోంది. గుడికి వెళ్లేందుకు నది మీద కట్టిన వంతెన పైన నించుని తదేకంగా నీటి ఉరవడి చూస్తుంటే ఒక్కసారిగా అందులోకి దూకేసి సుడి తిరిగి ముక్కలైపోదామనే వింతైన భయపు కోరిక… నది ఒడ్డున పితృదేవతలకు పిండాలు పెడుతున్న తంతు నిర్విరామంగా నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని బ్రహ్మ కపాలం అని కూడా అంటారు. ఇక్కడ సహజంగా ఏర్పడ్డ వేడినీటి గుండంలో మెడలోతు మునిగి చాలాసేపు చేసిన స్నానం ఒంటిని తేలికపరిచింది. ఆలయంలో బదరీనాధుడు సుందర మూర్తి .

మా తరువాతి గమ్యం గంగోత్రి వెళ్ళే దారిలో విశాలం గా పరుచుకున్న లేత గడ్డి మైదానాలూ, ఎండలో మెరిసే మేరు పర్వతం కనువిందు చేశాయి. గంగోత్రి దగ్గర గంగమ్మ పేరు భాగీరథి. భగీరథుడు ఈ ప్రాంతంలోనే గంగను భూమికి తీసుకొచ్చాడని పురాణ గాథ. సాయంత్రం వేళ నది వొడ్డున గుడిలో గంగాదేవికి ఆరతులూ పూజలూ జరిగాయి. గంగ భువికి దిగిన ఈ ప్రదేశం నుంచీ కాశీ వరకూ ‘గంగా మయ్యా’ అని గౌరవంగా పిలిపించుకుంటూ అన్నిచోట్లా సాయంత్రంవేళ ఆరతులు అందుకుంటూనే ఉంటుంది. హరిద్వార్ లో మే నెలలో గంగ దసరా అనే పెద్ద ఉత్సవం కూడా జరుగుతుంది.

3

కేదార్, బదరీ, గంగోత్రి యాత్ర అనుకున్నప్పుడే మా అన్నయ్యతో ‘గంగోత్రి వరకూ వెళ్లి గంగా నది జన్మస్థానం ‘గోముఖ్’ వెళ్ళకుండా ఎలా?’ అన్నాన్నేను. బయలుదేరిన 15 మందిలో గోముఖ్ వెళ్ళేవాళ్ళు అయిదుగురం లెక్క తేలాం. ‘సరే మీరు ఒక రోజులో గోముఖ్ వెళ్లి రండి. మిగతా వాళ్ళు గంగోత్రిలో మీ కోసం ఒక రోజు ఆగుతారు. తరువాత అందరం తిరిగి వద్దామ’ని తను ప్లాన్ చేశాడు. గంగోత్రి నుండి గోముఖ్ వెళ్లి రావటం మొత్తం 38 కిలోమీటర్ల ప్రయాణం. కొండల్లో ఎక్కేటప్పుడు గంటకు రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేము. ఒక రోజులో నడిచి వెళ్లి రాగలిగే పని కాదని అర్ధం అయింది. కానీ గంగోత్రి నుండి గోముఖ్ కు గుర్రాల మీద కూడా వెళ్ళొచ్చు. గుర్రాల మీద అయితే తెల్లారుజామునే బయలుదేరి చీకటి పడేలోగా వచ్చెయ్యగలమనే ఊహతో ముందు రోజే పర్మిట్లు తీసుకున్నాం. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, రోజుకు 15 గుర్రాలకూ 150 మంది వరకూ మనుషులకూ మాత్రమే గోముఖ్ వెళ్ళటానికి పర్మిట్లు ఇస్తారు. దీనికి కారణం, గోముఖ్ గ్లేసియర్ గడిచిన 70, 80 ఏళ్ళలోనే ఒక కిలోమీటరు దూరం వెనక్కు వెళ్ళిపోయిందని తెలుసుకోవటం… ఇంతకు ముందు గోముఖ్ కూడా మంచి ఆధ్యాత్మిక టూరిస్టు ప్రాంతం. జనం రాక పోకలూ, వ్యాపారాలూ, చెత్త కుప్పలతో కేదారనాథ్ లాగే ఉన్నట్టు అప్పట్లో వెళ్ళినవాళ్ళ అనుభవాల వల్ల తెలిసింది. మనుషుల దాడి తట్టుకోలేకేమో, గ్లేసియర్ బెదిరిన ఆవులా వెనక్కి అడుగులు వేస్తోందని గుర్తించాక, ప్రభుత్వం కళ్ళూ, చెవులూ తెరిచి, గోముఖ్ ప్రయాణాల మీద ఈ ఆంక్షలు పెట్టింది.

వెళ్ళే దారంతా తినటానికి ఏమీ దొరకదని తెలిశాక మరీ హాయి అనిపించింది. ముందురోజే గంగోత్రిలో రెస్టారెంట్ వాళ్ళను పొద్దున్నే మాకోసం పరాఠాలు తయారు చేసిపెట్టమని అడిగి, అవి తీసుకుని బయలుదేరాం. కొండల్లో వాతావరణాన్ని ఏమాత్రం నమ్మటానికి లేదు. ముందురోజు రాత్రే సన్నగా చినుకు మొదలై, వదలటం లేదు. అది ముసురు వాన లాగే అనిపించింది. ఎత్తుగా బలంగా ఉన్న అయిదు గుర్రాల మీద నేనూ, జయసూర్యా, శంకర్, జానకి, కాశ్యప్, మాతోపాటు గుర్రాలను నడిపించేవాళ్ళూ … అందరం తెల్లవారుజామునే బయలుదేరాం. నన్ను ఓ ఆడగుర్రం మీద ఎక్కమన్నారు. దాని పేరు భూరీ. కేదారనాథ్ దారిలో నేనెక్కిన పెంకి గుర్రాన్ని తలుచుకుంటూ, భయంగానే గుర్రం ఎక్కి కూర్చున్నాను. కాసేపటికి దాని వీపు మీద స్థిరంగా కూర్చున్నట్టు అనిపించిందో లేదో, ఒక్కసారిగా ఎత్తు రాళ్ళ మీదకు ఎగిరి, గట్టి చప్పుళ్ళతో డెక్కలు ఊని, నన్ను గాభరా పెట్టింది. భూరీని అదిలిస్తూ, అది నెమ్మదైన, తెలివైన గుర్రమేనంటూ నాకు ధైర్యం చెపుతున్నాడు భోలా.

4

వాన కాసేపు ప్రేమికుడి ప్రియవచనాల్లా మెత్తగా తాకుతోంది. కాసేపు పెద్దవాళ్ళ అదిలింపులా గుచ్చుకుంటోంది. లోపలి బట్టల్లోకి ఇంకటానికి అడ్డు పడుతున్న రెక్సిన్ జాకెట్ల మీదినుంచి అలుగుతూ బొట్లుగా జారిపోతోంది. పల్చని రెయిన్ కోట్లు ఒంటి నిండా వేసుకోవటానికి ప్రయత్నించినా ఆవంత సౌకర్యంగా అనిపించలేదు.

ఎక్కడా ఎండ పొడ వచ్చే ఆస్కారం కనిపించలేదు. ప్రకృతి నిశ్శబ్దంగా, సన్నని మబ్బుపొరలని ఆచ్చాదనగా చుట్టుకుని స్నానిస్తోంది. మేము తప్ప ఇంకెవరి అలికిడీ లేదు. చిన్నగా పడుతున్న చినుకులు గడ్డి పూలను వణికిస్తున్నాయి. సన్నని దారి దాటి పెద్ద వాగు దగ్గరికి వచ్చాం. నాకేమో గుర్రం దిగి నీటి పరవళ్ళ మీదినుంచి రాళ్ళ మీద అడుగులు వేసుకుంటూ వాగు దాటదామని అనిపిస్తోంది. నడిచి వెళ్ళే వారికోసం ఒక దుంగ కూడా నీళ్ళ మీద వేసి ఉంది. కానీ భోలా గుర్రం దిగవద్దని ఆజ్ఞాపించాడు. భూరీ ఆగిపోయి నీళ్ళ వైపు చూస్తోంది. మనం రాళ్ళమీద ఎక్కడ అడుగు వేద్దామా అని ఎలా చూసుకుంటామో సరిగ్గా అలాగే తల తిప్పుతూ అటూ ఇటూ చూసి, టక్ మని నీళ్ళలో అనువైన చోట అడుగు వేసింది. అలాగే నీటి ఉధృతిలో జాగ్రత్తగా నడుస్తూ నది దాటేసింది. భూరీని నమ్మొచ్చనుకుంటూ ఇక నిశ్చింతగా కూర్చున్నాను నేను.

‘చీడ్ వాసా’ చేరుకున్నాం. ఆ పేరుకు అర్ధం పైన్ చెట్ల అడవి అని. నిలబెట్టిన బల్లేల లాగా ఆకాశం వైపు చూస్తున్నాయి పైన్ వృక్షాలు. చుట్టూ కొండల వాలులంతా ఆవరించి ఉన్నాయి. వాటి ముదురాకుపచ్చని సూదుల్లాంటి ఆకుల్ని కూడా కమ్ముతూ మేఘాలు… ఈ రోజుకి ప్రకృతి ప్రసాదించినది ఈ monochrome చిత్రాన్నే. నలుపూ, తెలుపు వర్ణాల లోని అన్ని ఛాయలూ నింగీ నేలా మార్మికంగా పరుచుకున్నాయి. ఆ వెలుగులో, వర్షంలో అడవి నిగూఢంగా ఉంది. నిలువెత్తు ఆరోగ్యంలా కనబడుతున్న ఒక వ్యక్తి ఒక కర్ర పట్టుకుని గబా గబా నడుస్తూ పోతున్నాడు. సాయంత్రంలోగా తిరిగి వచ్చెయ్యాలంటూ మా గుర్రాలు దాటి వెళ్ళిపోయాడు.

పైపైకి పోతున్నకొద్దీ తడిసిన శరీరాలను చలి పొరలు చుట్టుకుంటున్నాయి. చినుకుల దాడి పదునెక్కింది. ‘భుజ్ వాసా’ – అంటే భూర్జ వృక్షాల (birch) అడవి మొదలైంది. భూర్జ పత్రాల మీద ప్రాచీన కవులు కావ్యాలు రాశారని మనం విన్నాం. తెల్లగా ఉండే ఈ చెట్టు కాండం నుండి సులువుగా ఊడే పొరలను కాగితంలాగా ఉపయోగించి చుట్టలుగా భద్రం చెయ్యొచ్చు. మరీ ఎత్తులేకుండా గుబురు అరణ్యంలా ఉన్న లేత చెట్లు ఎక్కువగా కనిపించాయి.

5

6

ఒకచోట ఎవరో చేసిపెట్టిన ఒంటి స్థంభపు మట్టిమేడల్లాగా పెద్ద పెద్ద స్వరూపాలు చాలా కనిపించాయి. కొన్ని ఎప్పుడైనా కూలిపోయేలా ఉన్నాయి. వానలకు కరిగి నీరుగారిన కొండల్లా ఉన్నాయి అవి. వాటి పక్కనుంచి ఇరుకైన దారి, ఒక మనిషి, లేదా ఒక గుర్రం మాత్రమే వెళ్ళేలా ఉంది. అక్కడ చరియలు విరిగి పడటం ఎక్కువేనట. Lord of the rings సినిమా లోని mood photography ని గుర్తు చేస్తోందా ప్రాంతంలోని ఆ వింత వాతావరణం.

‘భుజ్ వాసా’ చేరాక కాస్త కిందుగా ఉన్న లోయలో నది ఒడ్డున కొన్ని కట్టడాలు కనిపించాయి. లాల్ బాబా, రామ్ బాబా ఆశ్రమాలు, GMVN గెస్ట్ హౌస్ అక్కడ ఉన్నాయి. నిజానికి గోముఖ్ చూశాక అక్కడ నది ఒడ్డున ఆ రాత్రికి ఉండిపోయి మరునాడు బయలుదేరితే బాగుండేది.

అందరం గుర్రాలు దిగాం. అక్కడి నుండీ గోముఖ్ నాలుగు కిలోమీటర్లు. ఆ నాలుగు కిలోమీటర్లూ గుర్రాలు వెళ్ళటానికి అనుమతి లేదు. ఈ నియమాలు ఖచ్చితంగా ఎంత బాగా అమలు చేస్తున్నారో! ఈ ఆలోచన మిగతా కొండ ప్రాంతాల విషయంలో కూడా చేస్తే… తప్పని వాతావరణ మార్పులు ఎలాగూ తప్పవు, మన పొరపాట్ల వల్ల వచ్చే వినాశనమైనా తగ్గుతుంది కదా! గ్లేసియర్లు మననుంచి దూరం జరిగితే గానీ మనకు అర్ధం కావటం లేదు.

కాస్త తిని నడుద్దామని, తెచ్చుకున్న పరాఠాల పొట్లాలు విప్పి చూస్తే అవీ మా లాగే చలికి బిగుసుకుపోయి ఉన్నాయి. జయసూర్య అంత చలిలోనూ ఫోటోలు తియ్యటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను ఓ సగం పరాఠా తిన్నాననిపించి నడక మొదలు పెట్టాను, అడుగు ముందుకు సాగటం లేదు. చలి వెన్నులోంచి వణికిస్తోంది. ఇలా లాభం లేదని గబగబా నడవబోతే, ఊపిరి అందలేదు. మిగిలిన వాళ్ళంతా ముందు వెళ్ళిపోతున్నారు. కొంతదూరం వెళ్ళాక వెనక్కి చూసి, నాకేమైందో అర్ధం కాక ఆగిపోయారు. వాళ్ళను నడవమని చెప్పి, నేను నెమ్మదిగా నడక సాగించాను. పన్నెండు వేల అడుగుల ఎత్తులో పరుగెత్తడానికి నా ఊపిరి సత్తువ సరిపోవట్లేదని అర్ధం అయింది. దారి చూపించటానికి మాతోపాటు ఒక గుర్రం యజమాని వచ్చాడు. అతను నా అవస్థ గమనించి చిన్న గుబురు పొద నుంచి ‘గంగ తులసి’ ఆకులు కోసిచ్చి, అవి నలిపి వాసన చూడమన్నాడు. ఆ ఆకుల ఘాటైన వాసన గుండెలనిండా చేరి, ఆయాసాన్ని తగ్గించింది. గుర్రాలు కూడా దారిలో ఆ ఆకులు తినటం చూశాను.

ఆవరించిన మబ్బు పొగల మధ్య ఎటు చూసినా రాళ్ళ గుట్టలే. రాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న మొక్కలూ, చెట్ల ఆకులను తింటున్న భరల్ (కొండ మేకలు) సమూహాలు కనిపించాయి. గండశిలలు నిండిన ఆ ప్రాంతంలో నడక కష్టంగానే ఉంది. రకరకాల ఆకారాల్లో ఉన్న ఆ రాళ్ళు వింతైన రంగుల్ని చిమ్ముతున్నాయి..   కనిపిస్తూనే రాళ్ళ మలుపుల్లో మాయమౌతున్న గ్లేసియర్ మొత్తానికి దగ్గరయింది. ఆవు ముఖం లా ఒకప్పుడు కనిపించేదని అనుకునే  భాగీరథి జన్మస్థానం ఇప్పుడలా లేదు. నల్ల మట్టి చారలతో నిండిన గ్లేసియర్ నుంచి వస్తున్న నీరు ఆ మట్టిలోని ఖనిజాలనూ ఔషధ లక్షణాలనూ కూడా అందుకుంటూ ఉండవచ్చు. పసుపు పచ్చని ముక్కులున్న బలిష్టమైన కాకులు అదోరకంగా అరుస్తూ తిండి వెదుక్కుంటున్నాయి. గ్లేసియర్ వెనకనున్న శివలింగ్ మంచు పర్వతం మబ్బుల్లో పూర్తిగా దాక్కుంది. మేము కాక ఒకరిద్దరు విదేశీయులూ, సాధువులతో కలిసి మరో పదిమంది దాకా ఉన్నారక్కడ. వాళ్ళు కలలో కదిలే నీడలకు మల్లే అనిపించారు. ఓ పెద్ద కాన్వాస్ మీద ప్రకృతి గీసిన అతి పెద్ద impressionistic painting లో మేం కూడా ఒక చిన్న భాగమైనట్టుంది.

7

8

9

భాగీరథి ప్రవాహం నుంచి కాస్త నీటిని ఒక సీసాలో నింపుకుని వెనక్కు తిరిగాం. వాన మాత్రం వెనక్కు తగ్గటం లేదు. దిగుతున్నప్పుడు రాళ్ళ మీద నడక నాకు సునాయాసంగా అనిపించింది. గంగ తులసి ఆకులు గుండెకు కొత్త శక్తినిచ్చాయి. ‘భుజ్ వాసా ’ దగ్గర మా గుర్రాలున్న చోటికి చేరేసరికి, వాళ్ళంతా చిన్న చలిమంట వేసుకుని చుట్టూ కూర్చుని ఉన్నారు. అక్కడే కాళ్ళూ చేతులూ కాస్త వెచ్చ చేసుకుని మళ్ళీ గుర్రాలెక్కాం.

నా కాళ్ళ మీద నేను నిలబడటం, నడవటం అప్పుడు నాకెంత ముఖ్యమనిపించిందో ! నేర్చుకున్న వాళ్లకు గుర్రపు స్వారీ లో మజా ఉండొచ్చునేమో కానీ, గుర్రం మీద కూర్చుని కొండలెక్కటం మాత్రం కష్టమే. పోనీ ధీమాగా సోమరిగా కూడా కూర్చోలేం. పెద్ద పెద్ద రాళ్లున్నచోట గుర్రం మీద వెళ్తే, బాలన్స్ తప్పకుండా ఉండటం కోసం అది కిందకు దూకుతున్నప్పుడు మనం వెనక్కు వంగాలి. అది పైకెక్కేటప్పుడు మనం ముందుకు వంగాలి. గుర్రం కిందకు దూకేటప్పటి అదురుకు వెన్నూ, నడుమూ గట్టిగా లేనివాళ్ళకు ప్రమాదమే.

10

నిదానంగా ప్రకృతి నలుపూ తెలుపుల్లోంచి కుంచెను బయటకు తీసి, రంగుల్లో ముంచి విదిలిస్తోంది. సూర్యుడు ముదురు కాషాయ రంగులో బయట పడ్డాడు. ఒక్కసారిగా మార్మికతను వదిలించుకున్న కొండలు పచ్చటి రంగును వెదజల్లాయి. పక్షుల కూజితాలు మొదలయ్యాయి. గడ్డి పువ్వు నీటి రంగుల్లో మెరిసి ఠీవిగా తలెత్తింది. వాన పూర్తిగా వెలిసింది. భాగీరథి పర్వతం బంగారు రంగులో మెరిసింది. గుర్రాలు చిన్నగా పరుగు తీశాయి. అలసట అంతా మరిచిపోయి, ఇన్ని వన్నెచిన్నెలు చూపిస్తూ ఎన్నో రకాల మనస్థితుల్లోకి నెట్టిన ఆ ప్రకృతి దృశ్యాలను మెదడులో భద్రపరచుకుంటూ గంగోత్రికి ఉత్సాహంగా చేరుకున్నాం.

                                                                                             lalitha parnandi   ల.లి.త.

 

బౌద్ధం… యుద్ధం… తవాంగ్ దృశ్యం

1

టూరిజం ఓ పెద్ద పరిశ్రమ అయిపోయాక మన మైదానాల సౌకర్యాలన్నీ మనతోపాటే  కొండలెక్కేశాయి. మంచి హోటళ్ళూ, బీరు బాటిళ్ళూ, ఫాస్ట్ ఫూడ్స్, మన ట్రాఫిక్ జాంలూ… చక్కగా వేటినీ వదలకుండా ప్రకృతి వొడిలోకి తెచ్చేసుకుని సెలవుల్ని ఆనందిస్తున్నాం. డార్జిలింగ్, నైనిటాల్, సిమ్లా, మసూరీ, ఊటీ, కొడైకెనాల్ లాంటి కొండ ప్రదేశాలకు పెద్ద పట్నాల వైభవం వచ్చేసి చాలా కాలమైంది.  కష్టపడి ఈ ఊళ్లకు వెళ్తే, ప్రకృతి పారవశ్యాల మాట అటుంచి, మన హైదరాబాద్ కో  ఢిల్లీకో కాస్త చల్లదనాన్ని పూసి, పాత సినిమాల్లో లాగా ఓ రెండు మంచు కొండలూ, ఓ సరస్సూ బ్యాక్ ప్రొజెక్షన్ పెట్టినట్టు ఉంటోంది. వీపున ఓ మూట వేసుకుని ఎవరూ పోని ప్రాంతాలకు ట్రెక్కింగ్ కి పోవటం ఉత్తమమే కానీ అది అన్నిసార్లూ కుదరదు.

మే లో మా కుటుంబం గువాహతి (అస్సాం) వెళ్లాం. అస్సాం వాతావరణం మేలో మన కోస్తా ప్రాంతాల మల్లే ఉంది.  షిల్లాంగ్ చల్లగా ఉన్నా అదీ ఓ పట్నమే కాబట్టి వద్దనుకున్నాం. అంతగా టూరిజం కోరల బారిన పడని అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే బాగుంటుందేమో అని తవాంగ్ కు బయలుదేరాం. ఈ ప్రయాణంలో మార్గం కూడా గమ్యం అంత అందంగా ఉంటుందని విని  దీనిని ఎంచుకున్నాం.

బయలుదేరిన రోజున పొద్దున్నే ఏడు గంటలకల్లా ‘బొలెరో’ తో మా వాహనచోదకుడు సిద్ధం. ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం వేసవిలో తెల్లారుజామున మూడున్నరకే అయిపోతుంది. అయినా మా వాళ్ళందరికీ ఒంట్లోని గడియారాలు ఆరుదాకా గంటలు కొట్టలేదు. బైటకొచ్చి చూస్తే,  పూబాలల్ని సున్నితంగా తడుతూ చిరుజల్లులు… మొత్తానికి ఎనిమిదికల్లా బయలుదేరాము.  ఎర్రటి నేలా,  లేత, ముదురాకుపచ్చ ఆకుల పరదాల మధ్యగా  సారవంతమైన పల్చని బూడిదరంగు నీటితో బ్రహ్మపుత్ర పరవళ్ళు… వీటిమధ్యలోంచి బద్ధకంగా ఆవులిస్తూ నిద్రలేస్తున్న గువాహతి ఊరిలోంచి మా ఎర్ర బొలెరో ప్రయాణం మొదలు పెట్టింది.

 

2

3

ఒక చిన్న ఫలహారశాల, బ్రహ్మపుత్ర

 

ఊరు దాటాక ఒక చిన్నపాటి భోజనశాలలో అల్పాహారం.  నన్ను చిన్నతనంలోకి ఒక్కసారిగా గిరాటు వేశాయి  బల్లమీద పెట్టిన ఇత్తడిపళ్ళెం, దానిలో అరిటాకులో పూరీలూ, ఒక చిన్న ఇత్తడి గిన్నెలో పల్చని శెనగపప్పు, ఆలుగడ్డ కూరా..  మా ఊళ్ళో నా చిన్నప్పుడు వాడకంలో ఉండిన కంచు, ఇత్తడి పాత్రలగురించి పిల్లలకు ఆనందంగా వర్ణిస్తూంటే, కాసేపు ఆ వస్తువులేంటో ఊహకందక,  వింత చూపులు ప్రసరించారు వాళ్ళిద్దరూ.

దారంతా అలాగే ఓ ముప్ఫై ఏళ్ల క్రితం మన పల్లెటూళ్ళు ఎలా ఉండేవో అలా కనపడింది.  అస్సాం అభివృద్ధి చెందలేదని అక్కడి ప్రజల బాధ. టాటాలూ అంబానీలూ అక్కడికి వెళ్ళరు. ఫలితం స్వచ్చమైన నీరూ, గాలీ, పంటా, పైరూ..   చమురు రిఫైనరీలు ఉన్నచోట అస్సాం అభివృద్ధి ఎలా ఉందో నేను చూడలేదు.  ఈ దారిలో కేవలమైన పచ్చదనంతో కూడిన పైర్లూ, గుబురు చెట్లూ,  వెదురుతోనూ, మట్టితోనూ కట్టిన ఇళ్ళూ.. అక్కడక్కడా సిమెంట్ ఇళ్ళు కూడా దిష్టిబొమ్మల్లా ఉన్నాయనుకోండి. మరీ ముఖ్యంగా ఎక్కడా వెదికినా కనబడని ప్లాస్టిక్ లూ, పాలితిన్లూ..  సైకిళ్ళమీద పాఠశాలకు వెళ్ళే పిల్లలు.. తేయాకు తోటలూ..  చక్కని రహదారికిరుపక్కలా ఈ అపురూప దృశ్యాలు తీరిగ్గా రాగాలాపన చేస్తుంటే మా వాహనం ఆ రాగాన్ని మింగేసే మెటల్ బ్యాండ్ హోరులా ఎనభై కిలోమీటర్ల వేగంతో పరుగెత్తడం మహా అసంబద్ధ దృశ్యం. ఇవాళ దేశమంతటా కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్  అంటేనే అదో గగన కుసుమం.  మన సమయాన్ని ఆదా చేస్తూ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రతీచోటా.

అస్సాం బాటకిరువైపులా...

అస్సాం బాటకిరువైపులా…

దారిలో దిరాంగ్ జిల్లా ఖరుపేటియాలో జనపనార బాగా కనిపించింది. ఈ జిల్లాలో ముస్లిం జనాభా కూడా ఎక్కువగా ఉంది. రౌతల్ గురి  చేరాక, ఇక్కడ బోడోలాండ్ ప్రభావం ఎక్కువని చెప్పాడు మా డ్రైవర్ రాజేష్. ‘బంగ్లాదేశ్ నుంచి  చొరబాట్లు ఈ ప్రాంతంలో సాధారణం’ అన్నాడు.  చొరబాట్ల మీద అదుపు, కాందిశీకులకు సరైన గుర్తింపు, స్థానికులకు సరైన భరోసా ఇవ్వని ప్రభుత్వాల వల్లనే కదా వేర్పాటువాదాలు!

మధ్యాన్నానికి తేజ్ పూర్ దాటి భాలుక్ పాంగ్ చేరుకున్నాం. ఇక్కడినుండి  అరుణాచల్ ప్రదేశ్ మొదలవుతుంది. అరుణాచల్ లో తిరగటానికి అక్కడి ప్రభుత్వపు అనుమతి పత్రం (inner line pass) ఈ వూరిలో తీసుకోవాలి.  భాలుక్ పాంగ్ నుంచి కొండ ఎక్కటం మొదలయింది. కొండ పక్కనే కామెంగ్ నది పరవళ్ళు తొక్కుతూ మా వాహనధ్వని తో జుగల్ బందీ సాగిస్తోంది.  ‘ఇది సతత హరితారణ్యం సుమా’ అంటూ పరచుకున్న పోక, అరటిచెట్లు, వెదురు పొదలు. కామెంగ్ నది చేస్తున్న గాన కచేరీకి పక్క వాద్యాల్ని అందిస్తున్నట్టు చిన్నా పెద్దా జలపాతాల ఝరీ నాదాలు.  ఈ పచ్చసముద్రాన్ని ఈదుకుంటూ టెన్గా లోయ చేరుకున్నాం. అదంతా మన సైన్యం నివసించే ప్రాంతం. చాలా పెద్ద సెటిల్మెంటు. టెన్గా దాటాక ఇంకో గంటలో బొమ్ దిలా చేరుకున్నాం. అప్పటికి చీకటి పడింది. మేము చేరేసరికి ఈ వూరిలో బజారంతా వస్తువులతో, విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. బస వెదుక్కుని, కిందకు భోజనం చేద్దామని వచ్చేసరికి అంతలోనే కర్ఫ్యూ పెట్టినట్టు అంతా నిర్మానుష్యం. అప్పటికి సమయం రాత్రి ఎనిమిదే అయింది. కష్టంమీద రొట్టెలూ, రాజ్ మా  సంపాదించి తినటం అయిందనిపించాం.

అరుణాచల్ అందాలు

అరుణాచల్ అందాలు

 

రెండో రోజు ఉదయాన్నే బయలుదేరాం. దారంతా ఒకటే వాన. మెత్తటి మట్టిలో ఇరుక్కుపోతున్న వాహనాలు. సరిహద్దు రహదారుల సంస్థ (బీ ఆర్ ఓ) ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తున్నట్టు కనిపించింది. చాలా చోట్ల ప్రోక్లైనర్ లతో పని చేస్తున్నారు.  చంటి పిల్లల్ని వీపున కట్టుకుని పని చేస్తున్న ఆడవాళ్ళు కొంతమంది.  దారి విశాలంగానే ఉందిగానీ రాళ్ళు, బురదతో నిండి మా వాహన వేగానికి బాగానే కళ్ళెం వేసింది. అలా నెమ్మదిగా 13,700 అడుగుల ఎత్తులో ఉన్న సెలా పాస్ చేరుకున్నాం. అక్కడో పెద్ద సరస్సు. ఓ పక్క ప్రశాంతంగా గడ్డి మేస్తున్న జడల బర్రెలూ… కఠిన శిలా సదృశమైన కొండ కొమ్ము పక్కనే పసుపుపచ్చని పూలతో నిండిన లోయ.  హిమాలయాల్లో ఈ ఎత్తులో rhododendron పూలకోసం అప్రయత్నంగా వెదుకుతాయి నా కళ్ళు.   ‘నీకెప్పుడూ నిరాశ కలిగించలేదు కదూ’ అంటూ నవ్వుతున్న నేస్తాల్లా ఎర్రని, తెల్లని, రోజా రంగుల్లోని rhododendrons సమృద్ధిగా…

6

సెలా పాస్ దివ్యత్వం

సెలా పాస్ దివ్యత్వం

సాయంత్రానికల్లా కొండ దిగి జాంగ్ జలపాతం దగ్గరకు వచ్చాం. చాలా పెద్దదైన ఈ జలపాతం దగ్గర 3X2 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం ఉంది. ఉత్తరాఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో బోలెడంత సిమెంటూ, ఇనుమూతో చాలా పెద్ద పెద్ద జలవిద్యుత్ కేంద్రాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకా ఆ జాడ్యం అంటుకోకముందే ప్రభుత్వాలు సౌరశక్తి మీద పడితే బాగుంటుందని అనిపించింది.

జాంగ్ జలపాతం,                             కొండ దారుల వలయాలు

జాంగ్ జలపాతం, కొండ దారుల వలయాలు

చీకటి వేళకు తవాంగ్ చేరుకున్నాం.  ప్రయాణం మొదలైన దగ్గరనుంచీ ఒక ‘దీదీ’  రాజేష్ తో మొబైల్ ఫోనులో తెగ మాట్లాడుతూనే ఉంది. మమ్మల్ని తన హోటల్ లోనే దింపాలని ఆవిడ బాధ. ఇతనేమో ‘ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం’ అంటూ హామీలు ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి అతని సలహా ప్రకారమే ఆ హోటల్ లోనే దిగాము.  ఈ రకం ప్రయాణాలలో చాలా వరకూ  క్యాబ్ డ్రైవర్ ల ఇష్టానుసారమే మనం నడిచేస్తూ ఉంటాం. మరో మార్గం ఉండదు. క్యాబ్ లో ద్రైవరయ్యకు నచ్చిన టపోరీ పాటల్ని భరించక తప్పదు. మధ్యలో వినయంగా విన్నవించి కాసేపు మనకి నచ్చిన  సంగీతాన్ని పెట్టబోయినా మొహం ముడిచేస్తాడు.  ‘ఏ పాటలూ వద్దు  ప్రకృతి సంగీతాన్ని విని లయించిపోదామ’ని  ప్రయత్నిస్తూ నేను  మా అమ్మాయితోనూ  క్యాబ్ డ్రైవర్ లతోనూ  ప్రత్యక్ష, ప్రచ్చన్న యుద్ధాలు చేస్తోంటాను.  అదో ఆట.

మొత్తానికి హోటల్ గది శుభ్రంగా కళాత్మకంగా ఉంది. తవాంగ్ హోటల్ లో వంట, వడ్డన, పాత్రలు శుభ్రం చేయటం, అతిథుల సామాను మోయటం కూడా ఆడపిల్లలే చేస్తున్నారు.  ‘ఇదేం బాధ?’ అనుకుని మా సామాన్లు మేమే పట్టుకున్నాం.  ఇక్కడ మగవాళ్ళకంటే ఆదివాసీ ఆడవాళ్లే ఎక్కువ కష్టపడతారని ఒకరిద్దరు చెప్పారు. బైటి పనుల్లో ఆడవాళ్ళు మునిగిఉంటే కొంతమంది మగవాళ్ళు ఇంటినీ, పిల్లలనూ చూసుకుంటారట.

పని పాటలు మన వంతేనప్పా!

పని పాటలు మన వంతేనప్పా!

 

10

తవాంగ్ టూరిస్టు ప్రాంతం అన్నదానికి గుర్తుగా ఊరంతా అక్కడక్కడ చిన్న ఝరుల మధ్య ఖాళీ  ప్లాస్టిక్ సీసాలూ, పాలితిన్ సంచులూ కనిపించాయి. ఘనీభవించిన  పచ్చదనాన్ని చేదిస్తూ రంగుల దుస్తుల్లో మనుషులు కనిపించాలి కానీ రంగుల చిరుతిళ్ళ రేపర్లు కాదుగదా!   ప్రకృతి పట్ల ఈ నిర్లక్ష్యాన్ని మనం ఎప్పటికైనా వదుల్చుకోగలమా?

మరునాడు ఎడతెగని వాన వల్ల అక్కడున్న ఒకటి రెండు సరస్సులు చూడాలన్న మా ప్రయత్నం నెరవేరలేదు. అరుణాచల్ ప్రదేశ్ లో  ఎత్తైన కొండలమీద వెయ్యి దాకా చిన్నా పెద్దా సరస్సులు ఉన్నాయట. తవాంగ్ మొనాస్టరీ అంతా తిరిగి చూసాం. మేము వెళ్లేసరికి బుజ్జి బుజ్జి అయిదేళ్ళ పిల్లల నుండి పదిహేనేళ్ళ పిల్లల వరకూ ఉదయపు అసెంబ్లీ లో ఉన్నారు. గురువుగారితో పాటు ప్రార్ధన అయాక అందరూ వరుసగా తరగతి గదులకు వెళ్ళిపోయారు.  మహాయాన బౌద్ధంతో పాటు, కాసిన్ని లెక్కలూ, హిందీ, సమాజ శాస్త్రం కూడా పిల్లలకు నేర్పిస్తామని ఒక గురువు చెప్పారు. తవాంగ్  మొనాస్టరీ  మన దేశంలోనే పెద్దది. చాలా పెద్ద గ్రంథాలయం ఉంది ఇక్కడ.  అయిదు వందల మంది దాకా బౌద్ధ సన్యాసులు ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు. ప్రార్ధనాలయం గోడల మీద ఉన్న చిత్రాలు (murals) పాడవుతూ తమను కాస్త పట్టించుకోమంటున్నాయి. అయిదవ దలైలామా ఆధ్వర్యంలో ఈ మొనాస్టరీని పదహారవ శతాబ్దంలో నిర్మించారట. తవాంగ్ ఆరవ దలైలామా జన్మస్థలం కూడా.

11

తవాంగ్ మొనాస్టరీ

తవాంగ్ మొనాస్టరీ

ప్రార్ధనాలయం

ప్రార్ధనాలయం

ప్రార్ధనాలయంలో...

ప్రార్ధనాలయంలో…

తవాంగ్ లో మోంపా తెగకు చెందిన ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ బౌద్ధం ఎక్కువ. బౌద్ధులు కాని మిగతా వారంతా ప్రకృతి ఆరాధకులే.  ఒకప్పుడు టిబెట్ లో భాగమైన తవాంగ్, బ్రిటిష్ వారు మెక్ మోహన్ లైన్ ను సరిహద్దుగా నిర్ణయించాక భారతదేశానిదయింది. 1962 చైనా-భారత్ యుద్ధం తరువాత ఒక ఆరునెలల పాటు చైనా ఆధీనంలోనికి వెళ్ళింది తవాంగ్ .  1962 లో తవాంగ్ దాటి, అస్సాంలోని తేజపూర్ దాకా చైనా సైన్యం వచ్చేసిందట. మొత్తానికి  ఆరు నెలల తరువాత చైనా దీనిని విడిచిపెట్టింది.  ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ లో భాగమేననీ, తద్వారా అది తమకు చెందినదే అన్న భావం చైనా వారికి ఉంది. ఇక్కడుండే బౌద్దులకూ, ఆదివాసీలకూ చైనామీద ప్రత్యేక ఆసక్తి సహజంగానే లేదు. పైగా టిబెటన్లను అణిచివేసే చైనా విధానాలవల్లా, దలైలామా మన దేశంలోనే ఆశ్రయం తీసుకోవటంవల్లా, బౌద్ధులకు చైనావాళ్ళంటే గిట్టకపోవటమూ, మన దేశం అంటే కాస్త ఇష్టం ఉండటమూ కూడా సహజమే. తవాంగ్ భారతదేశంలో భాగంగా ప్రశాంతంగానే కనిపిస్తుంది. అయినా ఎటువంటి పొరపాట్లకూ, చొరబాట్లకూ ఆస్కారం ఇవ్వకుండా భారీగా మన సైన్యం అడుగడుగునా పహారా  తిరుగుతూ ఉంటుంది.

1962 లో చైనా మెరుపుదాడిని ఎంత మాత్రం ఎదుర్కోవటానికి సిద్ధంగా లేని భారత్  ఆదరా బాదరాగా దేశం  అన్ని మూలలనుంచీ సైన్యాన్ని తవాంగ్ కు పంపిందట. ఆ యుద్ధంలో సుమారు రెండు వేల మంది దాకా మన సైనికులు మరణించారు. వారందరి స్మృతి చిహ్నాన్ని తవాంగ్ లో కట్టిన  వార్ మెమోరియల్ లో చూసాం. జస్వంత్ సింగ్ రావత్ అనే సైనికుడు మరో ఇద్దరి సాయంతో  చైనా సైన్యాన్ని నిలువరించి, వారి మెషిన్ గన్ ను ఎత్తుకురావటం, చివరకు వారి చేతిలో మరణించటం వంటి సంఘటనలను వివరించే ఆయన స్మృతిచిహ్నం (జస్వంత్ గడ్)  కూడా తవాంగ్ వెళ్ళే దారిలో ఉంది.  ఇక్కడ యుద్ధంలో చనిపోయిన చైనాసైనికుల సమాధులు కూడా ఉన్నాయి.  ‘They also died for their country’ అని అక్కడ బోర్డు పెట్టారు.  మనసు బరువెక్కించే ఆ యుద్ధం ఆనవాళ్ళు నిండా నింపుకుంది తవాంగ్.

జస్వంత్ గడ్ స్మృతి చిహ్నం,                              చైనా సైనికుల సమాధులు

జస్వంత్ గడ్ స్మృతి చిహ్నం, చైనా సైనికుల సమాధులు

 

 

జస్వంత్ సింగ్ రావత్ సమాధి,     ఆవరణ

జస్వంత్ సింగ్ రావత్ సమాధి, ఆవరణ

 

 

తవాంగ్ వార్ మెమోరియల్,                                  ప్రార్ధనాలయంలో సైనికుల సేవ

తవాంగ్ వార్ మెమోరియల్, ప్రార్ధనాలయంలో సైనికుల సేవ

మరునాడు తిరుగు ప్రయాణం.  వరుణుడు తన ఆశీస్సులతో దారంతా ముంచెత్తాడు. సెలా పాస్ దగ్గరకొచ్చేసరికి ఎదురుగా అయిదడుగుల దూరంలో ఏముందో కనిపించటం లేదు. అక్కడ దిగి కాసేపు అటూ ఇటూ పరుగులు తీసి, అక్కడున్న ఒకే ఒక చిన్న ఫలహారశాలలో దూరాం. బయటి వర్షపు పొగలూ, లోపల వేడిగా మోమోలూ, నూడుల్స్ నుండి వస్తున్న పొగలూ… వణికించే చలిలో వేడి పొయ్యి సెగలలో సేదదీరి మోమోలూ, చాయ్ ఆస్వాదించాం.  ఈ షాప్ నడుపుతున్నదీ ఇద్దరు స్త్రీలే. అక్కచెల్లెళ్ళు.  పొయ్యి చుట్టూ అక్కడికి వచ్చిన వారంతా  చేరి  వాతావరణంగురించీ, బురదలో ఇరుక్కున్న వాహనాల గురించీ, ఒకనాటి  యుద్ధం గురించీ కబుర్లు చెప్పారు.  ఆ వర్షంలో రాజేష్  నిదానంగా బండి పోనిస్తుంటే, రోడ్డు విశాలంగానే ఉంది  గనుక ఎదురుగా ఏమీ కనిపించకపోయినా నిశ్చింతగానే కూర్చున్నాం.

సెలా పాస్ దగ్గరున్న చిన్ని ఫూడ్ జాయింట్ లో  సేద తీరుతూ మేము.

సెలా పాస్ దగ్గరున్న చిన్ని ఫూడ్ జాయింట్ లో సేద తీరుతూ మేము.

సెలా పాస్ ఎత్తుల్లో ఇవీ ఇళ్ళు

సాయంత్రానికి వర్షం నెమ్మదించి, కొండా లోయల అందాలు బయటపడ్డాయి.  దారిలో  ‘కివి’ పండ్ల చెట్లు చూపించి ఇది మంచి వాణిజ్య పంట అని చెప్పాడు రాజేష్.  ఏమయినా డబ్బు, వ్యాపారం పెద్దగా తెలియని మనుషులు వీళ్ళు.  టెన్గా లోయలో వచ్చేటప్పుడు బస. ఆ హోటల్ లో పని చేసే నేపాలీ అతను అక్కడ హోటల్ వ్యాపారం ఎంత కష్టమో వివరించాడు. ఇక్కడ బయటినుంచి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళే ఎక్కువ. స్థానికులు చాల మంది హోటల్ కు వచ్చి డబ్బులివ్వకుండా ఊరికే తిని వెళ్ళిపోతారట. వ్యాపారపు విలువలు వీరికి చాలా తక్కువగా అర్థమవుతాయేమో!  ఆ విలువలే తెలిసిన మనకు,  కొంత కాలం అక్కడ గడిపితే కానీ వీళ్ళ జీవితం అర్ధం కాదు.

మొత్తం అరుణాచల్ ప్రదేశ్ లో అయిదారు కళాశాలల కంటే ఎక్కువ లేవుట.  భారీ ఎత్తున టూరిజం పరిశ్రమా, పెద్ద తరహా వ్యాపారమూ అడుగు పెట్టని చోట ఆదివాసీ తెగలు ఎంత ప్రశాంతంగా బ్రతుకుతాయో కదా అనిపించింది తవాంగ్ ను ఇలా బయటినుంచి చూస్తే!  కానీ ఆ సమాజాలలో ఉండే అంతర్గత సమస్యలు వారితో కలిసి గడిపితే కానీ అర్ధంకావు కదా!

టూరిస్టుల కోసం దారంతా  స్త్రీల ఆధ్వర్యంలో చిన్న చిన్న భోజనశాలలున్నాయి. శుభ్రమైన సాదా సీదా భోజనం దొరికింది. మోమోలు, తూక్పా(మోంపాల సంప్రదాయ వంటకం), నూడుల్స్, గోధుమ రొట్టెలు, అన్నం, కూరలు వేడిగా దొరుకుతున్నాయి. పదహారు జిల్లాలతో విశాలంగా పరుచుకున్న అరుణాచల్ ప్రదేశ్ లో వ్యవసాయమే ముఖ్యమైన పని.  వాళ్ళ ఇళ్ళు నన్ను చాలా ఆకర్షించాయి.  గట్టి కలపతో చట్రాలు కట్టి, మధ్యలో వెదురు తడకలు బిగించి వాటిపై మట్టి పూసిన ఇళ్ళు కట్టటం వీరి సాంప్రదాయం.  ఉన్న చోటే దొరికే కలపతో కట్టిన ఇళ్ళూ, ఉన్నచోటే పండించుకునే తిండీ, అచ్చమైన గాలీ, స్వచ్చమైన నీటి గలగలలూ…

ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి? అని కాసేపైనా అనిపిస్తుంది, మళ్ళీ మన నగరాలకు వచ్చేసేముందు.

కొంత సమాచారం :  గువాహతి నుంచి తవాంగ్ కు బొలెరోలలో వెళ్ళటం ఎక్కువ. కఠినమైన ఆ రోడ్లకు ఈ వాహనం బాగా సరిపోతుంది.  తేజ్ పూర్ నుంచి బస్సులు ఉన్నాయంటారు కానీ మేము వెళ్ళిన వర్షా కాలంలో ఏ బస్సులూ కనిపించలేదు. ఆరు రోజుల ఈ ప్రయాణానికి బొలెరో కి  Rs.25,000/- వరకూ తీసుకుంటారు. సైన్యం సులువుగా మసలటం కోసం వేసిన విశాలమైన రోడ్లు. దారంతా కన్నుల పండుగే.  సెప్టెంబరు నుంచి నవంబరు అనువైన సమయం. ఫిబ్రవరి, మార్చిలో కూడా సెలా పాస్ దగ్గర మంచూ, గడ్డ కట్టిన సరస్సులూ చూడవచ్చు. ఏప్రిల్ నుంచి ఇక వర్షాలే. తవాంగ్ నుంచి చైనా సరిహద్దు బూమ్ లా పాస్ కూడా  చూడాలంటే మొత్తం ప్రయాణానికి కనీసం ఆరు రోజులు పడుతుంది.     

అదే…అదే..మణిమహేష్!

( గత వారం తరువాయి)

అలా ఓ మూడుగంటలు కబుర్లతో సాగగా  మొత్తం పది కిలోమీటర్లు గడిచి ‘సుంద్రశ్’ అన్న ప్రడేశం చేరాం, దాని పొలిమేరల్లోనే నాజూకు స్వరూపం, పల్చని శరీరం ఉన్న ఓ నలభై ఏళ్ల మనిషి కనిపించి మాటల్లో పెట్టాడు.  ‘అదిగో ఆ చిట్ట చివర ఉన్న లంగరు మాదే. మీరు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి సేద తీరాలి’ అన్నాడు. వెళ్లాం. మాటల్లో తెలిసింది.  ఈయన బెంగుళూరులో మెడిసిన్ చేసారని.  కాంగ్రా జిల్లాలో గవర్నమెంటు డాక్టరు. “మొన్న ఉత్తరాఖండ్ ఉత్పాతం వల్ల యాత్రికుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. లేకపోతే ఈపాటికి కిటకిటలాడుతూ ఉండవలసింది” అన్నాడాయన.

బడలికలూ, ఆకళ్ళూ తీర్చుకొనేసరికి మూడయిపోయింది.  భోజనంతోపాటు లౌడ్‌స్పీకర్లో శివభక్తి గీతాలు… వాటి పారవశ్యంతో చిందులు వేస్తోన్న ఆబాలగోపాలం. ఈలోగా నేనూ ఉన్నానంటూ భోరున వర్షం. అసలు అప్పటిదాకా కురవకపొవడమే విశేషం. ఏదేమైనా వర్షం పుణ్యమా అని సందిగ్ధంలో పడ్డాం. ఆలోచనలు .. చర్చలు..

“ఇంకా మూడు కిలోమీటర్లూ, రెండు గంటల ప్రయాణం ఉంది. వర్షం వెలిసిన మాట నిజమే గానీ మళ్లీ కురిసే అవకాశం ఉంది.  తెగబడి వెళ్ళడం ఎందుకూ? ఈ ప్రదేశం బావుంది. వసతి పుష్కలంగా ఉంది. రాత్రికుండిపోదాం” నా ప్రపోజలు. అందరూ ఓకే అన్నా నాయకుడు సంజయ్ వీటో చేసాడు. “పోనీ మీరూ, ముక్తా గుర్రాలమీద రండి. మిగిలిన అయిదుగురం రిస్కు తీసుకుని నడచి వస్తాం” అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అదే మంచి నిర్ణయం అని తేలింది. నలభై నిమిషాలు. ఆశ్వారోహణ చేయగా మరో రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ‘గౌరీకుండ్’ చేరాం. ‘పార్వతీదేవి స్నానాలు చేసే కుండమిది’ అని జనుల నమ్మకం.

ఇహ వెళ్లాల్సింది ఒకే ఒక్క కిలోమీటరు. వర్షం పూర్తిగా వెలిసింది. అందరం వచ్చేదాకా ఆగుదాం’ అని నేనూ, ముక్తా అక్కడ దిగాం.  మిగిలిన యాత్రికులు దాదాపుగా లేరు. ‘తన మొక్కు తీర్చుకోవడం కోసం ఆ రాళ్లల్లో, నీళ్లల్లో, మంచులో, చలిలో నగ్న పాదాలతో పైకి వెళుతోన్న ఓ పాతికేళ్ళావిడా, ఆవిడ అడుగులకు మడుగులొత్తుతూ సహకరిస్తోన్న అన్యోన్యపు భర్తా – అక్కడ కనిపించిన అపురూప దృశ్యం’ రెండు మూడు లంగర్లు … ఓ డిస్పెన్సరీ.. అరడజను ధాభాలు.. హెచ్‌పి సర్కారు వారి అత్యాధునిక టెంట్లు వంటి ముచ్చటైన ప్రదేశం ఆ గౌరీకుండ్. అల్లదిగో ఆ చిరుకొండ వెనకనే మణిమహేశ్వర్  అన్నారు.

 SAM_9371

సంజయ్, ముక్తాలతో నాది పదిహేనిరవై ఏళ్ల పరిచయం . అప్పట్లో ఓ ఆఫీసు సాంస్కృతిక కార్యక్రమానికి ముక్తా , నేనూ వ్యాఖ్యాతలుగా వ్యవహరించాం కూడానూ. స్నేహం కాకపోయినా మంచి పరిచయం, చనువూ ఉన్నాయి. మా బృందం రావడానికి మరో గంటైనా పడుతుంది గాబట్టి అక్కడి లంగర్లో చెప్పి మరీ పంచదార లేని టీ చేయించుకుని తాగాం. వంద గజాల దూరాన ఉన్న నదీ వంతెన దగ్గరకు నడక సాగించాం. మాటల మధ్యలో “ఎంతవరకు చదువుకున్నావు” అని అడిగాను. “ఎమ్మెస్సీ మాత్స్” అంది. అంత చదివి కనీసం టీచరుగానైనా ఉద్యోగం చెయ్యాలనిపించలేదా? వాటే వేస్టావ్ రేర్ టాలెంట్” అని నావైన దుడుకు బాణీలో నిష్ఠూరించాను. నవ్వేసి ఊరుకుంది. ఓ పది నిమిషాల తర్వాత వివరించింది. “నాన్న గవర్నమెంటు ఉద్యోగి. నాకు పెళ్ళి అవకముందే హృదయ రోగిష్టి అయ్యారు. అమ్మకు అంతగా వ్యవహారజ్ఞానం లేదు. ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. నా పెళ్ళి దగ్గర్నించి ఇంట్లో అన్ని వ్యవహారాలకూ  నేనే పెద్దను. అదిగాక నా భర్త, పాప, సంసారం. ఆపైన రెండువైపులనుంచి దగ్గర బంధువుల తాకిడి. వీటన్నిటి మధ్య ఉద్యోగం గురించి ఆలోచించే అవకాశం లేకపోయింది. తమ్ముడు ఆలస్యంగా  ఈ మధ్యనే జీవితంలో సెటిల్ అయ్యాడు..” పి.సత్యవతి గారు మెచ్చరేమో అనిపించినా ఇదంతా విన్నాక ఆవిడంటే గౌరవం పదిరెట్లు పెరిగింది.

అందరూ గౌరీకుండ్ చేరేసరికి దాదాపు ఆరు. మరో ముగ్గురు గుర్రాలవైపు మొగ్గు చూపారు. అప్పటికే పరిచయమయిన సురేంద్రపాల్‌గారి లంగర్లో టీలు తాగి మమ్మల్ని ఆ రాత్రికి అక్కడే ఉంచేలా ఆయన చేసిన ప్రయత్నాలను సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగాం. ఓ పంజాబు గ్రామ పంచాయితీ సెక్రటరీ అట ఆయన.

అంతా కలిసి అయిదుగురం గుర్రాలమీద, సంజయ్, ప్రధి కాలినడకన గౌరీకుండ్, మణిమహేశ్వర్‌ల మధ్య ఆ నలభై నిమిషాలలో సూర్యుడు, మబ్బులు, కొండలు, లోయలు, పచ్చని పచ్చిక, గాఢపు నీలాకాశం – అన్నీ కూడబలుక్కొని అద్భుత సౌందర్య ఆవిష్కరణకు పూనుకొన్నాయి. ఎదురుగా సువిశాలమైన లోయలో వేలాడుతూ మేఘాలు, వాటిమీద రంగులు చిమ్ముతూ అస్తమించే సూర్యుడి బంగారు కిరణాలు. ఆ కిరణాల సుతిమెత్తని స్పర్శలో ధగధగ వెలిగిపోతున్న హిమగిరి శిఖరాలు. ఓ పావుగంటా ఇరవై నిమిషాలు గుండె గొంతులోన కొట్టాడింది. గుర్రం మనిషిని అడిగి, ఆపించి రెండు మూడు ఫోటోలు తీసానేగాని అసలు ఆ క్షణాలు గుర్ర్రం మీద ఉండదగినవి కాదు. నడక అయితే బావుండేది.

ముసిరీ ముసరని చీకట్లలో ఏడుగంటలవేళ ఏడుగురమూ మణిమహేష్ సరోవర తీరం చేరాం. చిన్న తటాకమది. చుట్టూ అరకిలోమీటరు పొడవున పరిక్రమ మార్గం, ఎదురుగా నిడుపాటి మణిమహేష్ శిఖరం. శిఖరాగ్రాన మంచు తొడుగు. కొండ చరియల్లో గ్లేషియర్లు. అటు ఇటు గరుకుపాటి పర్వత శ్రేణులు. వెనక్కి తిరిగితే గౌరీకుండ్. ఇంకా ఆపైన కనిపించే  సువిశాలమైన లోయ. ప్లాస్టిక్కు, కల్మషమూ లేని  సరోవర జలాలు. అందులో ప్రతిబింబించే కైలాస పర్వతం .. చక్కని దృశ్యం. దేవుడి సంగతి దేవుడెరుగు.. నాలాటి సామాన్యునికి సరిపడే సౌందర్యం పుష్కలంగా  ఉంది. అక్కడి సంప్రదాయమేమో.. గుడి అంటూ శాశ్వత నిర్మాణం ఏమీ లేదు. సరోవర తీరంలో ఒకచోట చిన్నపాటి అరుగు. శివుని ప్రతిమ. అలంకరణ.. పూజలు.. అరడజనుకు పైగా లంగర్లూ. దాభాలూ.. విశాలమైన గుడారాల నివాసాలు. సూర్యుని అంతిమ వెలుగురేకల్లో కైలాస శిఖరాన్ని చూసి పరవశిస్తోన్న పదీ పదిహేనుమంది భక్తులు.. నిశ్శబ్ద ప్రశాంత వాతావరణం.

అందము, ఆనందమూ ఎలా ఉన్నా అందరమూ విపరీతంగా అలసిపోయి ఉన్నాం. జీరో డిగ్రీల దరిదాపుల్లో చలి. అంచేత స్నానాల ప్రసక్తి లేనేలేదు. ఉన్నంతలోనే కొంచెం ఫ్రెష్ అయ్యి. ఎనిమిదిన్నరకల్లా లంగరు భోజనాలు ముగించుకొని గుడారాలలో నిద్రకు ఉపక్రమించాం. తెచ్చిన స్వెట్టర్లన్నీ వదలకుండా వేసుకొన్నాం. వాళ్ళిచ్చిన రెండు రెండూ రగ్గులకు తోడు రెండు అడిగి పుచ్చుకున్నాం. మొత్తానికి చలిపులి బాధ తెలియకుండా రాత్రి గడిచింది.

అన్నట్టు అవి పున్నమి రాత్రులు. నేనూ సంజయ్ ముందే అనుకొని తెల్లవారుఝామున నాలుగు గంటలకు గుడారం బయటకు వచ్చాం నిండుచంద్రుడు. వందలాది తారలు. వెండి కైలాసశిఖరం. మరువలేని అనుభవం. అన్నట్టు ఆ శీఖరాగ్రాన భక్త శిఖామణులకు ఒకోసారి రాత్రిళ్లు మణీదీపాల వెలుగు కనిపిస్తుందట. శబరిమలై శైలిలో నన్నమాట. మాకా ఛాయలు కనిపించనేలేదు. విశ్వాసం ముఖ్యం గదా!

ఆగస్టు 23 ఉదయం ఆరింటికే రోజు మొదలయింది.

100_8613

సరోవరం చుట్టూ ఒకటికి రెండుసార్లు ప్రదక్షిణ. “అరే.. నీళ్లమీద  మెరుస్తూ ఏవిటదీ?’ అని వెళ్లి చూస్తే పలకలు గట్టిన మంచు. ఆ మంచునీళ్లలోనే స్నానాలు చేస్తోన్న సాహస భక్తులు. మేమంతా భయపడినా ప్రధి సాహసించాడు. అయిదారు మునకలు వేసాడు. రెండోమునక అతికష్టమయినది. ఉండేలు దెబ్బ తెలియని పిల్లకాకుల్లా మొదటి మునక చలాగ్గా వేసేస్తాం. దాంతో రుచి తెలుస్తుంది. రెండోది వెయ్యడానికి పదిరెట్లు ధైర్యసాహసాలు కావాలి’ అన్నది అతని చక్కని విశ్లేషణ.

సంజీవ్‌గారు పూజ అన్నారు. అదో అరగంట. లంగర్లో ఒకటికి రెండుసార్లు వేడివేడి అతి తియ్యని తేనీరు తాగి, అల్పాహారమూ ‘స్వీకరించి’ మరోసారి, మరోసారి  తటాకాన్నీ, అబేధ్యమైన (ఇప్పటిదాకా ఎవరూ ఎక్కలేకపోయిన ) కైలాసశిఖరాన్ని చూసి, చూసి మనసులో నింపుకొని  ఏడున్నరకు తిరుగు ప్రయాణం మొదలెట్టాం. హడ్సర్ చేరేసేరికి సాయంత్రం మూడున్నర . “ఓరిదేవుడో… ఈ దిగడం కన్నా ఆ ఎక్కడమే సుఖంగా ఉంది” అని (అసహజంగా) అనిపించిన మార్గమది!

నా కాలు (ఇదే చివరిసారిలెండి!) చిద్విలాసాలు చిందుతూ కనిపించింది. పట్టరాని ఆశ్చర్యం నాకు. భక్తులూ, ఆస్తికులూ – ఇదంతా ఆ మహాదేవుని లీల. అనే సందర్భమిది. మరి నాలాంటి అవిశ్వాసికి ఆ అవకాశం లేదాయే!!

ఉపశృతి:

1. పైకి వెళ్ళేటపుడూ, కిందకు దిగేటపుడూ ఓ అచ్చమైన పంజాబీ గ్రామీణ కుటుంబం తోడుగా వచ్చింది. భీష్మాచార్యుని వంటి తాతగారు, నాలుగేళ్ళ బుడుగులాంటి మనవడు. వాడి అమ్మా, నాన్నా, బాబాయి, అత్తయ్య, నాయనమ్మా, దారంతా మాటలు – తాతామనవళ్ళతో విడివడేటప్పుడు పచ్చబొట్ల పల్చని ముప్పై ఏళ్ల అత్త్తయ్య వచ్చి పరిచయం చేసుకొంది. ఊళ్లో టీచరట. వాళ్ల జీపు బయల్దేరుతోంటే, తాతామనవళ్ళు వీడ్కోలు చెప్పడం సరేసరి.. ఈవిడ పక్కసీట్లోంచి వంగి తల బయటపెట్టి మరీ ఆత్మీయంగా చెయ్యి ఊపింది. నాకీ పుణ్యయాత్రలో సరైన విశ్వాస స్నేహఫలం దొరికిందని అంబరమంత సంబరం.

2. ఏసీ రైళ్లు, ఇన్నోవాలూ, గుర్రాలూ – ఇన్ని హంగులతో ప్రయాణం చేసినా ‘సత్రం భోజనం – మఠం నిద్ర ‘ పుణ్యమా అని మా ఖర్చు మనిషికి నాలుగువేలే.. ఎంత చవక!!

 – దాసరి అమరేంద్ర

 

 

మణి మహేష్ ఇలా పిలిచింది మమ్మల్ని!

SAM_9392

(యాత్రాకథనాలకు ఆహ్వానం: ఎక్కడికో వెళ్ళాలి. ఏదో వెతుక్కోవాలి. ఏమేమో చూడాలి. ఎవరెవరితోనో మాట్లాడాలి.  రొటీన్ గా అనిపించే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి. ఈ తపన బహుశా వొక ప్రేరణ యాత్రలకూ…దూర ప్రయాణాలకు! అలాంటి యాత్రా సాహిత్యాన్ని అందించే ఉద్దేశంతో ‘యాత్రాస్మృతి’ అనే ఈ కొత్త శీర్షిక. మీ యాత్రా అనుభవాలను రాయండి. ‘సారంగ’కి పంపండి. ఈ వారం ఈ శీర్షిక ప్రముఖ కథా రచయిత, యాత్రా సాహిత్యకారుడు దాసరి అమరేంద్ర గారి రచనతో మొదలు పెడ్తున్నాము. చదివి, ఎలా వుందో చెప్పండి.)

“అమరేంద్రాజీ.. ఆగస్టు చివర్లో మణిమహేష్ యాత్ర ప్లాన్ చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి” జులై మొదటివారంలో ఫోను చేసాడు మా డిల్లీ బీ.ఈ.ఎన్ లో  సహోద్యోగి సంజయ్ అగర్వాల్. ఇరవై ఏళ్ళ పరిచయం… నాలాగే ట్రెక్కింగ్ అంటే ఆసక్తి.

“తప్పకుండా.. నన్ను లెక్క వేసుకో.. కానీ ఓ మాట చెప్పు. అక్కడ గుర్రాల సదుపాయం ఉందా?” ముందు జాగ్రత కోసం అడిగాను. ఉందన్నాడు.    ఇలా గుర్రాల కోసం తాపత్రయపడడం ట్రెక్కింగు స్ఫూర్తికి విరుద్ధం. కానీ ఆ మధ్య షష్టిపూర్తి కానుకగా  ప్రకృతి మోకాలి నెప్పులు ప్రసాదించింది.  మే నెలలో ఓ మూడువారాలు ఫిజియోధెరపీ తర్వాతే కాళ్ళు కొంచం చెప్పిన మాట వింటున్నాయి. ‘ఇహ ట్రెక్కింగులకు చరమగీతం పాడాలేమో’ అనుకుంటున్న సమయంలో ఈ ప్రలోభపు ఆహ్వానం.!

నెట్‌లోకి వెళ్లాను. డిల్లీనుంచి పఠాన్‌కోట్, చంబాల మీదుగా 670 కిలోమీటర్లు వెళీతే హిమాచల్ ప్రదేష్‌లోణి ‘భర్‌మౌర్’ అన్న చిరు పట్టణం వస్తుంది. మరో పదిహేడు కిలోమీటర్లు రోడ్డున వెళితే ‘హడ్‌సర్’ అన్న చిరు గ్రామం…. అక్కడ్నించి మరో పదమూడు కిలోమీటర్లు కాలి నడకన కొండదారుల్లో వెళితే మధ్య హిమాలయాల మధ్యన, సముద్ర తలానికి 4115 మీటర్ల (13,500 అడుగుల) ఎత్తున ఈ మణిమహేష్ చిరు సరోవరం. దాని పక్కనే ధీరగంభీరంగా 5775 మీటర్ల  ఎత్తున్న మణిమహేశ కైలాస శిఖరం. శివుని (రెండోదో, పన్నెండోదో) ఆవాసమట. ప్రతి ఏడాది జన్మాష్టమి నుంచి పదిహేను రోజులపాటు భక్తులు యాత్రగా వెళ్లిరావడం తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ అట.

 

* * *

 2013, ఆగస్టు 20, రాత్రి ఎనిమిదిన్నరకు అంతా న్యూడిలీ స్టేషన్లో కలిసాం. సంజయ్, అతని భార్య ముక్త, పదమూడేళ్ల కూతురు సంజక్త, తోడల్లుడు సంజీవ్, ఆయన పన్నెండేళ్ళ కూతురు రూపాంశి., ఇరవై ఏళ్ల సంజయ్ మేనల్లుడు ప్రధి, నేను . వెరసి ఏడుగురం. “మన ఈ ఉత్తర  సంపర్క క్రాంది రేపు ఉదయం నాలుగున్నరకు పఠాన్‌కోట్ చేరుస్తుంది. ఓ ఇన్నోవా  మాట్లాడి ఉంచాను. పదీ పదకొండుకల్లా భార్‌మౌర్ చేరుకొంటాం. పగలు అక్కడి గుళ్లూ గోపురాలు చూసుకొని సాయంత్రానికి హాడ్‌సర్ చేరుకొంటాం… రోజంతా ట్రెక్కింగు. మణీమహేష్వర్‌లో రాత్రి మజిలీ,  ఒక ఉదయాన పూజలూ పునస్కారాలూ ముగించుకొని క్రిందకి దిగి సాయంత్రానికల్లా హాడ్‌సర్  చేరతాం.  వెంటనే ఇన్నోవా ఎక్కి రాత్రి చంబాలో హాల్టు. 24 రోజంతా చంబాలోనూ, అక్కడికి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న ఖడ్జుయార్ పచ్చిక బయలు లోనూ, మరో ఇరవై కిలోమీటర్ల దూరాన ఉన్న డల్‌హౌస్ పట్టణంలోనూ, రాత్రికి పఠాంక్‌కోట్ చేరి డిల్లీ బండి పట్టుకొని 25 ఉదయానికల్లా గూటికి చేరతాం . టూకీగా కార్యక్రమ రూపురేఖలు వివరించాడు సంజయుడు.

SAM_9361

ఇన్నోవాలో అరగంట ప్రయాణించేసరికి వెలుగురేకలు విచ్చుకోవడం మొదలయింది. గలగలమని పారుతోన్న ‘రావి’నది ఒడ్డునే మా ప్రయాణం. తల ఎత్తి మరీ చూడవలసిన ఉన్నత గిరిశిఖరాలు. వాటి చెరియల్లో నిడుపాటి ‘పైన్’ వృక్షాలు. వర్షాకాలం గాబట్టి అన్నివైపులా పరిపూర్ణమైన పచ్చదనం. ‘ఎటు చూసినా అందమే’ అంటూ మనసు పాడటం మొదలెట్టేసింది.

సంజయ్‌తో పాటూ ముక్తకూ, వాళ్ల పాప సంజక్తకూ ట్రెక్కింగ్ అభిరుచి ఉంది. సంజీవునికి వాళ్ల పాప రూపాంశ్ కి  కూడా ట్రెక్కింగులో చెప్పుకోదగ్గ ప్రవేశముంది. ప్రధి సరేసరి. పిల్లలు ముగ్గురికీ చదివే అలవాటూ ఉంది. సంజక్త, రూపాంశి ఫేమస్ ఫైవ్, సీక్రెట్ సెవెన్లు దాటుకొని ఎనిడ్ బ్లైటమ్ దగ్గరకి చేరారు. రస్కిన్‌బాండ్ దారిలో ఉన్నారు. ప్రధీ అప్పుడే ఖాలిద్ హుస్సేనీ దగ్గర్నించి టాగోర్ దాకానూ, స్టీవెన్ స్పిల్‌బర్గ్ నుంచి సత్యజిత్ రే దాకానూ ఔపాసన పట్టేసి ఉన్నాడు. మరింకేం.. మాటలు సాగాయి. గంట గడిచేసరికల్లా స్నేహం పండింది. ఆటలు.. పాటలు.. కబుర్లూ.. కోలాహలం.

“మోకాలు ఇబ్బంది పెట్టొచ్చు. అయినా ప్రయత్నిస్తాను. అవసరమయితే గుర్రం. అదీ కుదరకపోతే మధ్యలో ఆగిపోయి మీరు తిరిగొచ్చేదాకా ఉంటాను” అని మాటల మధ్య అంటే..” అదెలా అంకుల్! ముందే అలా అనేసుకుంటే ఎలాగా? చివరిదాకా వెళ్లి తీరాలి అని సంకల్పం చెప్పుకోండి. జరిగి తీరుతుంది” అని  హితవు చెప్పింది తొమ్మిదో క్లాసు సంజక్త. భర్తృహరిగారి “ఉత్తమ పుత్రికా?” అని  అబ్బురపడ్డాను.

ఇంజనీరింగ్ చదువుతోన్న ప్రధి అడిగాడు.”ఎన్నెన్నో ట్రెక్కింగులు చేసారు గదా. అందుకు ప్రేరణ ఏమిటి? ఏం ఆశిస్తూ ఉంటారు?”  ఆలోచనలో పడ్డాను. “కారణాలు నాలుగు.. అద్భుతమైన ప్రకృతి. నాలోకి నేను చూసుకొనే అవకాశం. పదిమందినీ కలిసి తెలుసుకొనే అవకాశం. నా మానసిక, భౌతిక శక్తులను పునర్నిర్వచించుకొనే అవకాశం..”

* * *

 SAM_9381

 

ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో చంబా చేరుకొన్నాం.

జిల్లా కేంద్రమది. కొండలమధ్య ఊహాతీతమైన విశాల మైదానంలో ఆ పట్టణం ఊరు మధ్య ఐదారు ఫుట్‌బాల్ కోర్టులు వచ్చే బడా మైదానం. దిగువన పారుతున్న ‘రావి’ నది. ఎదురుగా కలెక్టరాఫీసు. కోర్టులు, సర్క్యూట్ హౌస్.. బ్రిటీషు కాలం నాటి బంగాళాలు.. కాస్తంత ఎగువన వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ మందిరం.  చేరువలోనే ఓ మ్యూజియం. ఊరు నాకు తెగ నచ్చేసింది. మళ్ళీ వెళ్లాలి.

చంబా దాటీ దాటగానే దిగువన పిక్చర్ పోస్ట్ కార్డ్‌లాంటి అందాలున్న చక్కని ప్రదేశమూ, అక్కడే ఓ డిగ్నిఫైడ్ మధ్యవయసు మహిళ నడుపుతోన్న  ఒక దుకాణమూ. అరగంట ఫోటోలు సరేసరి. అలా ఆడుతూ పాడుతూ, అనిపించిన చోటల్లా ఆగుతూ పదిన్నరా పదకొండు ప్రాంతంలో భర్‌మౌర్ చేరాం. వాకబు చెయ్యగా ఒకరికిద్దరు ఓ పంజాబీ ఢాభాకేసి చూపించారు. మరిహనేం. ఆనాటి ముఖ్యభోజనం అక్కడ. అన్ని పదార్థాలూ అతి రుచికరంగా ఉండగా అందరం ఒంటెల్లా భోంచేసాం!

భర్‌మౌర్ ఆలయాల నిలయం. ముఖ్యమైన భరణీ మాత మందిరం ఓ కొండ చిటారుకొమ్మన ఉందట. మణి మహేష్ వెళ్ళెవాళ్లంతా ఈ దేవి అనుగ్రహం పొంది మరీ ముందుకు సాగడం మర్యాదట. మా బృందం కొండెక్కడానికి సిద్ధపడిపోయింది. నా మోకాలును ఆచితూచి వాడుకోవాలి. రేపటికి దాచి ఉంచాలి అనేసి నేను  ఉండిపోయాను.

ఆగస్టు ఆపిళ్ళ సీజను. ఊళ్లో ఎక్కడ చూసినా యాపిలు చెట్లు. కాయలు. పళ్లు. మెల్లగా సాగగా ఊరిచివరి ఓ పేద్ద యాపిల్ తోట. ‘అపురూప ప్రదేశం’ అని అందులో తనివితీరా తిరుగాడాను.  రెండు మూడు గంటలే అనుకొన్నది మా బృందం తిరిగొచ్చేసరికి సాయంత్రం నాలుగయింది. వెంటనే హడ్సర్ ప్రయాణం చేరేసరికి ఆరు దరిదాపు. వర్షాకాలం గాబట్టి దారిలో లాండ్ స్లయిడ్లు ఉండవచ్చౌనని అనుభవజ్ఞులు అన్నారు గానీ మేం ఏ అడ్డంకి లేకుండానే చేఅరాం.

హడ్సర్ మరీ చిన్న పల్లెటూరు. అంతా కలిసి అయిదొందల జనాభా. అసలీ యాత్ర సమయంలోనే ఊరు మేల్కొనేది. అప్పుడే ఓ  లంగరు వెలిసింది. వసతి సౌకర్యం పూజ్యం. కానీ కొంచెం వెదగ్గా ఊరి పొలిమేరన ఎత్తైన కొండ చెరియన ఓ పి.డబ్ల్యూ. డి వారి గెస్ట్‌హౌస్ దొరికింది. సంబరం. రూములు బాగా విశాలంగా ఉందటమే గాకుండా వేడినీళ్ల సౌకర్యమూ ఉంది. మరిహనేం?

ఇలాంటి  యాత్రాసమయాల్లో యత్రికుల సౌకర్యం కోసం ఉచిత భోజన సదుపాయం కలిగించే ‘లంగర్లు” దారి పొడవునా విరివిగా వెలవడం ఉ త్తరభారతదేశంలో కద్దు. అలాంటి ఓ లంగర్లో డిన్నరు చేసాం. దాని నిర్వాహకుడు మాతో కబుర్లలో పడ్డాడూ. అతనికి ఏభై ఏళ్లుంటాయి. పంజాబు ప్రభుత్వ ఉద్యోగి. పఠాన్‌కోట్ నివాసి. గత ఇరవై ఏళ్లుగా ఈ దారిలో నాలుగయిదు లంగర్లు నిర్వహిస్తున్నాడట. యాత్రా సమయంలో మూడు నాలుగు వారాలు ఇక్కడే మజిలీ..

“ఏమిటి మీ ప్రేరణ?” అని అడిగాం. ” 1993లో మొదటిసారి యాత్రకు వచ్చాను. ఆ రాత్రి మణిమహేష్‌లో గడిపాం. తిండి దొరకలేదు. పైగా భయంకరమైన చలి. తలపైన ఏ కప్పూ లేదు. కంబళ్ళూ, రజాయిలూ సరేసరి. ఇదిగాదు పద్ధతి అనిపించింది. నలుగురినీ కూడగట్టుకుని ఈ లంగరు వ్యవస్థను ప్రారంభించాను. భోజనంతోపాటు ప్రాధమిక వసతి సౌకర్యమూ కల్పిస్తున్నాం” వివరించాడాయన.  సమ హృదయ భక్తులూ, స్నెహితుల పుణ్యమా అని డబ్బు సమస్యే లేదంట”

 

* * *

 

పచ్చని ప్రకృతి తోడుంటే...జీవితమే దాసోహం :దాసరి అమరేంద్ర

పచ్చని ప్రకృతి తోడుంటే…జీవితమే దాసోహం :దాసరి అమరేంద్ర

22 ఉదయం ఆరింటికల్లా ట్రెక్కింగు మొదలెట్టాం.

మామూలుగా మనం పార్కుల్లో అయితే గంటకు ఐదారు కిలోమీటర్ల వేగంతో  నడుస్తాం. సాధారణంగా అది ట్రెక్కింగులో రెండు మూడుకు పడిపోతుంది. ఎత్తులు ఎక్కాలి గాబట్టి. కాని మణిమహేశ్వర్ మార్గం మరీ ఎగుడు. హడ్సర్ ఉన్నది 2100 మీటర్లన అయితే మణిమహేశ్వర్ 4115 మీటర్లు.  అంటే మదమూడు కిలోమీటర్ల నడకలో రెండువేల మీటర్లు ఎత్తు ఎక్కాలన్నమాట. దుర్గమం. అంచేత కనీసం పదిగంటలయినా పడుతుందని తెలుసు. సాయంత్రం నాలుగు గంటలకల్లా గమ్యస్థానం చేరాలన్నది ఆనాటి మా లక్ష్యం.

“బాప్‌రే! ఆ కొండల్ని చూసారా? నిట్టనిలువుగోడల్లా ఉన్నాయి. వాటినన్నింటినీ దాటుకుని వెళ్లాలి మనం. గుండె గుభేలుమంటోంది” అన్నాడు సంజయుడు. నిజానికి మాలో అది అతి దిట్టమైన మనిషి అతనే. ముక్త బక్క పలచన. పైగా నిన్నటి భర్‌మౌర్ భ్రమణంలో జారిపడగా మోకాలు పట్టేసింది. ఆడపిల్లలు బాగా చిన్నవాళ్లు. సంజీవుడు ఒకప్పటి జాతీయ స్థాయి ఈతగాడే అయినా ఇపుడూ మాత్రం సేఠ్ జీ స్వరూపం. ప్రధి కూడా స్థూలకాయుడే. నా మోకాలు…. వద్దులెండి. ఎన్నిసార్లని దాన్ని కీర్తించడం? అయినా ఎవ్వరం గుర్రాల సంగతి ఎత్తలేదు. ఓ గంటన్నర నడక మహాచురుగ్గా సాగింది.
SAM_9351

 

దారిపక్కనే  పాలవరదలా పారుతోన్న ‘గౌరీనాలా’ అనే చిరునది. అడపాదడపా  నిడుపాటి కొండల్లోంచి పడుతోన్న  సుందర జలపాత ధారలు. ఇరవై పాటిక్ డిగ్రీల ఉష్ణోగ్రత – ట్రెక్కింగుకు అన్ని విధాల అనుకూలమైన వాతావరణమది. దారిలో కనిపించిన ఓ లంగర్లో అన్నమూ. పప్పులతో బ్రేక్‌ఫాస్ట్ ముగించాం. అందరమూ స్వేచ్చా విహంగాల్లా సాగిపోతూ ఉంటే అపశృతిలా రూపాంశ్‌ని అనవసరపు, అతి జాగ్రతల నియంత్రణలో ఉంచాలని ప్రయత్నించే  వాళ్ల నాన్నగారు.. చెలంగారుంటే సుబ్బరంగా దెబ్బలాడేవారే. నేనూ నర్మగర్భంగా చెప్పి చూసాను.

దారి నిర్ధాక్షిణ్యం రెండు గంటలు గడిచాకే స్పష్టమయింది. దారులూ, రాళ్లూ, రప్పలూ, బండలూ. వర్షాలవల్ల చిత్తడి. అదపాదడపా చీలమండలదాకా నీళ్లు. ఎత్తు ఎక్కవలసి రావడం సరేసరి. అయినా ఆ దారిలో అంతా ఉల్లాసమే. ‘బాధే సౌఖ్యం’ సన్నివేశమన్నమాట. మాతో పాటే వస్తున్న ఓ పాతిక ముప్పై మంది సహయాత్రికులు. యాత్ర ముగించుకొని వస్తోన్న వాళ్ల ప్రోత్సాహపు పలుకులు.. అలా ఆడుతూ, పాడుతూ పదిగంటల ప్రాంతంలో “ధాంభో’ అన్న  ఆరు కిలోమీటర్ల దూరపు ప్రదేశానికి చేరాం. సగం దారి గడిచిందన్నమాట. 2900 మీటర్ల ఎత్తు. చెట్లు కనుమరుగై పర్వత సానువుల్లో తుప్పలూ, పచ్చికా మాత్రమే. మిగులుతోన్న సమయం ఆ ధాంభోలో ఒకళ్ల నొకళ్ళం పరామర్శించుకొంటూ కొత్తవాళ్లను పలకరిస్తూ, సేద తీరుతూ ఓ గంట. “మా లంగరుకు రండి అంటే ఎమా లంగరుకు రండి’ అని నిర్వాహకుల ఆహ్వానాలు.

విరామం కలిగించిన ఉల్లాసంతో మళ్లా మార్గారోహణ మొదలెట్టాం. కాస్త సాగగా – ‘ధాంభో’ జలపాతం. భస్మాసురుడి బారినుంచి తప్పించుకొనే ప్రయత్నంలో పరమశివుడు ఈ జలపాతం వెనకాల దాక్కున్నాడని స్థలపురాణం. ఎక్కడా విడుపులేని ఆరోహణ ఆశ్చర్యమనిపించింది. ఏ మామూలు ట్రెక్కింగు మార్గంలో అయిన ఆరోహణలూ. అవరోహణలూ, సమతల ప్రదేశాలూ, అరుదుగా పీఠభూములూ ఉండడం సామాన్యం. ఇక్కడ మాత్రం ఒక్కటే రాగం. ఆరున్నొక్క ఆరోహణా రాగం..

ఆ కష్టమార్గంలో దొరికిన అలవోక సుఖం పిల్లల సాహచర్యం.

“మీరు వస్తోంది పుణ్యం కోసమా? ట్రెక్కింగు ఆనందం కోసమా? అని అడిగితే ఆనందం కోసమే అనేసారు రూపాంశీ, సంజక్త.

SAM_9352“అంకుల్. జీవితంలో డబ్బు పాత్ర ఏమిటి? అన్న గొప్ప ఫిలసాఫికల్ ప్రశ్న వేసి ఆశ్చర్యపరిచాడు ప్రధి. “అది మనకు బానిస అవ్వాలి. సేవలు చెయ్యాలి. డబ్బు అవసరమే. సందేహం లేదు. కానీ దాన్ని  నీ పదో ప్రయారిటీగా ఉంచు. సుఖపడతావు. మనలాంటి మహానగరపు  మధ్యతరగతి జీవులకు జీవనోపాధి సమస్య కానేకాదు. దురాశకు పోనంతవరకూ మనకు డబ్బును చిన్నచూపు చూసే శక్తి వుంటుంది. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను డబ్బు పరంగా తీసుకోకు, సుఖం కోల్పోతావు” విపులంగా హితవు పలికాను. మరో రెండు అనుబంధ ప్రశ్నలు. నా శక్తిమేర జవాబులు .. తమకు ఆసక్తి ఉన్న సంగీతం, నటన, వక్త్రుత్వం, సాహితీపఠనం గురించి సంజక్త, రూపాంశ్ ప్రశ్నలడిగారు. “మనిషి మానవుడవడానికి ఇవన్నీ సమపాళ్లలో ఉండడం చాలా చాలా అవసరం. కానీ ఎంతైన ఇవి పక్క వాయిద్యాలే. చదువన్నదే అసలు సిసలు రాగం. చదువు విషయంలో రాజీ పడకండి. రాణించడం అవసరం” అన్నాను.

(రెండో భాగం వచ్చే వారం)

– దాసరి అమరేంద్ర