గమనమే గమ్యం

 

volgaదుర్గాబాయి ఎన్నికల్లో ఓడిపోయింది. రెండువందల కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి గెలిచాడు. శారద దుర్గాబాయికి ఉత్తరం రాసింది. కమ్యూనిస్టు అభ్యర్థులు ఎక్కువమంది గెలిచినందుకు ఆనందపడింది. రోజులు వేగంగా గడుస్తున్నాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా ఊపిరాడని పనులతో శారద పరుగిడుతోంది. దుర్గాబాయి ఓటమి కలిగించిన నిరాశ మనసులోంచి పూర్తిగా పోకముందే దుర్గాబాయి చింతామణి దేశ్ ముఖ్ ల వివాహ వార్త వచ్చింది, అన్నపూర్ణ, స్వరాజ్యం ఆ ఆనందాన్ని మోసుకుంటూ బెజవాడ వచ్చారు. స్వరాజ్యం ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్.ఎస్.సి లో చేరటానికి  వెళ్తోంది. వెళ్ళేముందు శారద పెద్దమ్మతో నాలుగు రోజులు గడపాలని ప్రయాణమైతే ఒక్కరోజుకి నేనూ మీ పెద్దమ్మతో మాట్లాడుకోటానికి వస్తానంది అన్నపూర్ణ. “నువ్వొస్తే మీరిద్దరే మాట్లాడుకుంటారు. నేనొకదాన్నే వెళ్తానంది స్వరాజ్యం. ఆ విషయం మీద కాసేపు తగవు పడిన తల్లీ కూతుళ్లను అబ్బయ్య సమాధాన పరిచాడు. “అన్నపూర్ణ ఒక్క పూట మాత్రమే ఉండి వచ్చేస్తుంది, స్వరాజ్యం నాలుగు రోజులుంటుంది” అన్న తండ్రి మాటను గొణుక్కుంటూనైనా ఒప్పకోక తప్పలేదు స్వరాజ్యానికి,

“నాకంటే నీకు శారద పెద్దమ్మ ఎక్కువైంది” నిష్టూరమాడింది తల్లి, “కాదమ్మా నువ్వూ పెద్దమ్మా చిన్నప్పటి నుంచీ స్నేహితులు. నాకు మొన్న మొన్ననే గదా పెద్దమ్మ దగ్గర చనువు. ఆమె పూర్తిగా నాకే కావాలనిపిస్తుంది, అందరికంటే నన్నే ప్రేమించాలనిపిస్తుంది. నాకు పెద్దమ్మంటే ఉన్న ప్రేమ ఎవరికీ ఉండదు – ”

తన ఉద్వేగాన్ని అణుచుకోలేక అక్కడి నుంచీ వెళ్ళిపోయింది. అన్నపూర్ణ, అబ్బయ్య ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.

“ఏంటంత ఆవేశపడుతుంది” అన్నపూర్ణ ఆశ్చర్యపడింది.

“ఈ వయసులో పిల్లలకు కొందరిపట్ల విపరీతమైన ఆరాధన ఏర్పడుతుంది – అది మామూలే – మనకా వయసులో గాంధీ గారు ఆరాధ్యుడు కదూ – అలాగే -”

“ఇది కమ్యూనిస్టు అవదు గదా”

“ఆ భయం నాకూ ఉంది – ” నవ్వాడు అబ్బయ్య,

సాయంత్రానికి బెజవాడ చేరారు. ఆ రాత్రి మాత్రమే అన్నపూర్ణ ఉండి మర్నాడు ఉదయం వెళ్ళిపోతుంది.

రాత్రి భోజనాలయ్యాక అందరూ కూచుని కబుర్లాడుకునేటపుడు “దుర్గాబాయి గారు పెళ్ళీ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’

అంది అన్నపూర్ణ

“ఎందుకంత ఆనందం, పెళ్ళే జీవిత పరమార్థమా?” నవ్వింది శారద,

“పరమార్థమని కాదు. ఒక మంచి తోడు దొరికింది. చేసే పని మరింత బాగా చెయ్యటానికి మరింత బలం”,

“దుర్గకి ఎవరి బలమూ అరువుగా అకర్లేదు. తన బలం తనకు చాలు”.

“దుర్గ సంగతి పక్కన బెడదాం. ఆమె అసామాన్యురాలు. మిగిలిన వాళ్ళకు ఒకరికొక తోడు అక్కర్లేదా?

‘అది మనకు అలవాటైపోయింది అన్నపూర్ణా, ఒక పెళ్ళి – భార్యా భర్త. భర్త మంచివాడైతే ఫరవాలేదు. ఎందరు ఆడవాళ్ళకు వాళ్ళ భర్తలు బలమిస్తున్నారు చెప్పవోయ్, భార్యలలోని సర్వశక్తులూ లాగేసే వాళ్ళే ఎక్కువ. మనం కూడా పెళ్ళిళ్ళకు ఆనందపడటం, పిల్లలకు పెళ్ళీ తప్పనిసరిగా చెయ్యాలనుకోవటంతో ఆ ఆచారమునూ, మరొకటనూ బలపడుతుంది. దాన్ని బలపడనివ్వకూడదు. అది ఎంత బలహీనపడితే ఆడవాళ్ళకంత మంచిదోయ్”,

“చలం గారిలా మాట్లాడుతున్నావు”,

“ఆయన మూటలు నిజమని నాకనిపించినపుడు నా మాటలకు ఆయన మూటలకూ తేడా ఉండదుకదోయ్’,

స్వరాజ్యం ఎదుట ఆ మాటలు పొడిగించాలనిపించలేదు అన్నపూర్ణకు, కానీ శారద ఆపలేదు.

“స్త్రి పురుషుల మధ్య స్నేహం, ప్రేమ, సాంగత్యం, సెక్సు ఇవి ఆనందాన్నివ్వవని నేననటం లేదు. మనుషులకు సెక్సు అవసరమని తెలియని దాన్ని కాదు – కానీ పెళ్ళి తప్ప సెక్సుకి ఇంకోదారి లేకపోవటం, స్త్రీ పురుషుల స్నేహానికి వీలు లేకపోవటం ఎంత దుర్మార్గమోయ్, దానివల్ల చచ్చినట్లు పెళ్ళి చేసుకోవాలి. ఇక ఆ పెళ్ళీ ఇద్దర్నీ కుంగదీస్తుంది. ఇక ఆ పెళ్ళి నుంచి బైటపడే దారీ ఉండదు”.

‘హిందూకోడ్ బిల్లు ఒస్తోందిగా”

“బిల్లులతో చట్టాలతో పోయేంత బలహీనమైంది కాదోయ్ పెళ్ళి, కొండచిలవలా చుట్టుకుని బిగుసుకొని ఉంది.

“శుభమా అని దుర్గ పెళ్ళి గురించి మాట్లాడుతుంటే –”

“పెళ్ళి శుభం అనుకోవటంతోనే నా పేచీ – దుర్గ పెళ్ళితో కాదు. వాళ్ళిద్దరి

సంగతి గురించి కాదు – మొత్తం పెళ్ళీ అనే తప్పనిసరి చెరసాల గురించి చెబుతున్నాను”.

“ఆడవాళ్ళందరం అందులో బందీలంటావు”

olga title

“ఆడవాళ్ళనే కాదు – మగవాళ్ళు కూడా – మానవుల్ని అమానుషంగా చేస్తుందోయ్ పెళ్ళి

“మరీ దారుణంగా మాట్లాడకు శారదా”

“దారుణం నా మాటలు కాదు. పెళ్ళీ – అందులో పెత్తనం, అధికారం ఉందోయ్ – అది చాలా దారుణం”,

“దాన్నించి బైటపడేదెట్లా పెద్దమ్మా – బైటపడి ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రేమగా కలవటం ఎట్లా”

“ఎట్లా అంటే ఇట్లా అని చెప్పటానికి నా దగ్గర రెడీమేడ్ సమాధానం లేదమ్మా – ఇది దారుణం అని గుర్తించటం ఒక ముందడుగని నాకనిపిస్తుంది. తర్వాతి అడుగులు చాలా ఉన్నాయి – కులం, మతం, డబ్బు – వీటి ప్రభావాల నుంచి తప్పించుకుని ప్రేమించగలిగేందుకు చేసే పోరాటాలూ – ఇలా అడుగులు వేసుకుంటూ ఆ దారిలో నడుస్తూ వెళ్ళటమే – పెళ్ళి దారుణమని సన్యాసులవటం కాదు పరిష్కారం. ప్రేమ కోసం, ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం అన్వేషించటంలోనే ఆనందాన్ని పొందటం నేర్చుకోవాలి”

శారద వంక ఆరాధనగా చూస్తున్న స్వరాజ్యాన్ని చూస్తుంటే అన్నపూర్ణకేదో ఆందోళన.

“నాకు నిద్రోస్తోంది పడుకుందాంరా ”అని లేచింది.

“నువ్వు పడుకోమ్మా నాకు నిద్రరాటంలా” స్వరాజ్యం లేవలేదు. చేసేది లేక అన్నపూర్ణ వెళ్ళింది. స్వరాజ్యం శారదకు మరింత దగ్గర చేరి తన సందేహాలన్నీ అడగటం మొదలుపెట్టింది. శారద చెబుతుంటే శ్రద్ధగా వింటూ –

ఆ రాత్రే కాదు మిగిలిన నాలుగు రోజులూ శారదను ఒక్క క్షణం ఒదలలేదు స్వరాజ్యం. ఆమెతో పాటు ఆస్పత్రికి వెళ్ళింది. రోగుల ఇళ్ళకు వెళ్ళింది. సరస్వతీ గోరాల దగ్గరకూ, మెల్లీ లక్ష్మణరావుల దగ్గరకూ వెళ్ళింది. అదంతా కొత్త ప్రపంచంలా ఉందా అమ్మాయికి.

“ఇన్నాళ్ళూ నేనిదంతా మిస్సయ్యాను పెద్దమ్మా. అమ్మా నాన్నా ఎంత చెప్పినా

బెజవాడ వచ్చేదాన్ని కాదు. ముందే వచ్చుంటే ఎంత బాగుండేది” అంటే శారద నవ్వింది,

“ముందే వస్తే ఇంత నచ్చేది కాదేమో. ప్రతి దానికీ ఒక టైముంటుంది. కోడిగుడ్డు పిల్లవటానికున్నట్టు”

“పెద్దమ్మా – నేను ఉత్తరాలు రాస్తే సమాధానం ఇస్తావా?” “ఎందుకివ్వను పిచ్చిపిల్లా – నేను మీ పెద్దమ్మను” అని స్వరాజ్యాన్ని దగ్గరకు తీసుకుంది.

స్వరాజ్యం విశాఖపట్నంలో హాస్టల్లో ఉన్నా శలవు రోజుల్లో తమ బంధువుల ఇళ్ళకు వెళ్ళి ఇష్టమైనవన్నీ వండించుకుని తినమని శారద వాళ్ళ అడ్రసులన్నీ ఇచ్చి వాళ్ళకు ఉత్తరాలు రాసింది.

: ; ; :

“మీ వాళ్ళు చూడు ఏం చేశారో. మూడేళ్ళు తిరగకుండా ఎన్నికలు తెచ్చిపెట్టారు. మొన్నటివరకూ సాయుధ విప్లవం ద్వారా నెహ్రూ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు ఇప్పుడు — ”

“ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పడగొట్టారు. మంచిదే గదా – అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటంలో తప్పేమీ లేదోయ్”,

“నిన్ను వాళ్ళు శత్రువులా చూస్తున్నారు. నువ్వు మాత్రం వాళ్ళను సమర్ధించటం మానవు”,

“వాళ్ళు చేసింది సరైనది కాదని వ్యతిరేకిస్తేనే కదా వాళ్ళు నేనూ అని మాట్లాడే అవకాశం వచ్చింది. ఎన్నికల రాజకీయాలలో వాళ్ళు చేసింది కరక్టేనోయ్”

అన్నపూర్ణకు మరి మాట్లాడేందుకేమీ లేకపోయింది, ఒంట్లో బాగోలేదని శారద దగ్గర పరీక్ష చేయించుకోటానికి వచ్చింది అన్నపూర్ణ పరీక్ష చేసి మందులిచ్చాక రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు మధ్య మధ్యలో గర్భిణీ స్త్రీలు పరీక్షల కోసం వస్తున్నారు.

శారద వాళ్ళను పరీక్షిస్తూ, జాగ్రత్తలు చెప్తూ అన్నపూర్ణతో మాట్లాడుతూ ఉంది.

ఆ సమయంలో తెల్లగా సన్నగా పొడవుగా ఉన్న ఓ యువతి వచ్చింది. పక్కనే కాస్త పొట్టిగా తెల్లగా ఉన్న కుర్రవాడు. వాళ్ళిద్దరినీ చూస్తూనే శారద ముఖం విప్పారింది.

“రావోయ్ – రా – విశేషమా – అన్నపూర్ణా, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? చలసాని శ్రీనివాసరావు చెల్లెలు. వీడు తమ్ముడు ప్రసాదు. హేమలత కదూ నీ పేరు”.

డాక్టర్ గారికి తామంతా గుర్తున్నందుకు ఆ అక్కాతమ్ముళ్ళు సంతోషపడ్డారు. ఔనండి. నాకిప్పుడు మూడోనెల, పరీక్ష చేయించుకుందామని వచ్చాను”.

“మీ పెళ్ళి గోరాగారు చేశారు కదూ – నే రాలేదులే – సరస్వతి చెప్పింది. మీ అన్నయ్య శ్రీనివాసరావంటే నాకెంతో అభిమానం. ఇప్పటికీ కళ్ళల్లో మెదుల్లున్నట్టే ఉంటాడు. అన్నపూర్ణా – మీ పార్టీనే పొట్టన బెట్టుకుంది. పదమ్మా పరీక్ష చేస్తాను” అంటూ పక్కకు తీసికెళ్ళి కర్టెను వేసి కబుర్లు చెబుతూ పరీక్ష చేసింది.

“శ్రీనివాసరావు ఒకరోజు మీ అందరి గురించీ చెప్పాడు. మీ నాన్నగారు బసవయ్యగారు బాగున్నారా? ఈ ప్రసాదుని చూస్తుంటే ముచ్చటేస్తోందోయ్. బాగా చదివించండి. శ్రీనివాసరావు గుర్తోస్తే మాత్రం బాధగా ఉంటుంది. గర్వంగా ఉంటుంది”,

పరీక్ష పూర్తి చేసి జాగ్రత్తలు చెప్పి మందులు తనే ఇచ్చి “క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకో. నీ పురుడు చులాగ్గా అవుతుంది” అని వాళ్ళను పంపింది గానీ శ్రీనివాసరావుని తల్చుకుంటూ కంటనీరు పెట్టింది.

అన్నపూర్ణ ఏదో చెప్పబోయేంతలో మరో గర్భిణీ స్త్రీ రావటం శారద ఆమెను పరీక్ష చేయటం – ఇలా మధ్యాహ్నం వరకూ గడిపి ఇద్దరూ భోజనానికి ఇంటికి వెళ్ళారు. ఇంటి దగ్గర మళ్ళీ రాజకీయ చర్చలు వేడి వేడిగా సాగాయి. చూస్తుండగానే ఎన్నికలు దగ్గరకొచ్చాయి, కమ్యూనిస్టుల విజయం మీద ఎవరికీ సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందని అందరూ నమ్మారు,

అందరి నమ్మకాలనూ ఎన్నికలు దెబ్బతీశాయి. కమ్యూనిస్టులకు అదివరకున్న బలం కూడా లేకుండాపోయింది.ఘోరంగా ఓడిపోయారు. కారణాలనేకం. అవి ఫలితాన్ని మార్చలేవు. శారద, మూర్తీ ఆశ్చర్యపడి ఏవేవో విశ్లేషణలు చేశారు. శారదకు ఇప్పడు పార్టీతో ఏ సంబంధమూ లేదు. నాయకులెవరూ ఆమెతో మాట్లాడరు. కోటేశ్వరమ్మ, రాజమ్మ వంటివాళ్ళు ఎప్పడైనా ఎకడైనా కనపడితే ప్రాణం లేచొచ్చినట్లు పలకరిస్తారు. అంతే – ఐనా కమ్యూనిస్టు పార్టీ ఓడిందంటే శారదకు గుండె కలుక్కుమంది. బాధపడుతూ కూర్చునే తీరిక లేకపోవటమే శారదను రక్షించింది. శారద ప్రాక్టీసు విపరీతంగా పెరిగింది. హాస్పిటల్కి వచ్చేవారిని చూసి ఊరుకోదు శారద. సాయంత్రం నాలుగు నుంచీ జట్కాబండిలో బీదవాళ్ళుండే పేటలకు

వెళ్తుంది. ఇంటింటికీ వెళ్ళి యోగక్షేమాలడిగి, ఆరోగ్య సూత్రాలు చెప్పి, అవసరమైన వాళ్ళకు తనవెంట తెచ్చిన మందులిచ్చి వస్తుంది. ఏడింటి నుంచీ మళ్ళీ హాస్పిటల్, పురుళ్ళకు ఒక సమయమంటూ ఉండదు – తిండికి, నిద్రకూ కూడా సమయం లేకుండా పనిచేసే రోజులు చాలానే ఉంటాయి. బెజవాడ ప్రజలకు శారద ప్రత్యక్ష దేవత అనే భావం కలిగిందంటే అందులో ఆశ్చర్యపడటానికేమీ లేదు. ఒకరోజు మధ్యాహ్నం పనంతా పూర్తి చేసుకుని ఇక భోజనానికి ఇంటికి వెళ్దామనుకుంటూ లేస్తుంటే గదిలోకి వచ్చిన ఉమాదేవిని చూసి ఆశ్చర్యపోయింది. ఆరేళ్ళక్రితం తనను ద్రోహిగా చూసిన ఉమాదేవి – ఎవరినీ తనతో మాట్లాడనివ్వకుండా చూసిన ఉమాదేవి,

“రావోయ్ రా – ఒంట్లో ఎలా ఉంది?” నిష్కల్మషంగా నవ్వింది శారద,

“బాగానే ఉంది డాక్టర్ గారు. మీతో పనుండి వచ్చాను” ఉమాదేవి కూడా ఏమీ జరగనట్లే మాట్లాడింది,

“చెప్పు ఏమిటి పని? ఏం కావాలి?

“ఉద్యోగం డాక్టర్ గారు”

“ఉద్యోగమా?

“ఔను డాక్టర్ గారు. ఉద్యోగం చేస్తే కాస్త మా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

మీకు చాలా పలుకుబడి ఉంది. ఎవరితోనైనా చెప్పి ఏదైనా ఉద్యోగంలో వేయిస్తే – ఉమాదేవి బిడియంగా తలదించుకుంది.

“దాన్టేముందోయ్ – అలాగే చేద్దాం. నేను ప్రయత్నిస్తాను. ఏదో ఒకటి దొరకపోదు. నువ్వు బెంగపెట్టుకోకు. ఏదీ నాలుక చూపించు. ఎనీమిక్గా ఉన్నావు, రక్తం తక్కువగా ఉంది. మందులిస్తాను. వాటిని వాడుతూ ఆకు కూరలు బాగా తిను.”

జాగ్రత్తలు చెబుతూ మందులిచ్చింది. కుటుంబ యోగక్షేమాలడిగింది.

ఉమాదేవి శారదకు మంచి స్నేహితురాలనుకునేవారు తెలియని వారెవరన్నా అక్కడుంటే,

మరొక వారం రోజుల్లో ఉమాదేవి ఉద్యోగంలో చేరింది. శారద ఆ క్షణంలో సంతోషపడి ఆ సంగతి మర్చిపోయింది,

ఐతే హేమలత నిండు గర్భిణిగా ప్రసవానికి వచ్చినపుడు చెప్పిన మాటలు ఆమెను కాస్త బాధపెట్టకపోలేదు.

فـ

హేమలతని పార్టీ వాళ్ళంతా శారద దగ్గర పురుడు పోసుకోవద్దని బలవంతం చేశారట. ఆపాలని ప్రయత్నించారట.

“నేను మొదట్నించీ ఆమె దగ్గర చూపించుకున్నాను. ఆమె మంచి డాక్టరు. మీ రాజకీయాలతో నన్నిప్పడు వెళ్ళొద్దంటే నేనెలా మానేస్తాను. నేనావిడ దగ్గరకే వెళ్తాను” అని ఎదిరించి వచ్చానని చెబితే శారదకు చాలా చిరాకనిపించింది.

“ఇంత ఎదగని మనుషులు ఏం సాధిస్తారు?” అనిపించింది. హేమలతకు ఆడపిల్ల పుట్టింది.

‘&)

“బంగారు బొమ్మలా ఉందోయ్ నీ కూతురు’ అంటూ నవ్వుతూ, పాపను నవ్వించింది.

“నీకు కొడుకు పుడితే శ్రీనివాసరావని పేరు పెట్టుకున్నావు. పాపకేం పేరు పెడతావు. మంచి పేరు పెట్టు.”

తన దగ్గరకు వచ్చిన ప్రతివారితో స్నేహంగా మాట్లాడి తమ కష్టసుఖాలు పంచుకోటానికి, ఏ అవసరమైనా వస్తే ఆదుకోటానికీ డాక్టర్ శారదాంబ ఉందనే నమ్మకం వాళ్ళలో కలిగిస్తుంది శారద, చాలాసార్లు ఆ నమ్మకాలు నిజమవుతాయి, నా సమస్య ఇదమ్మా అంటూ వచ్చిన వాళ్ళు శారద దగ్గర నుంచి సహాయం పొందకుండా వెళ్ళరు.

వీటన్నిటితో ఇరవై నాలుగు గంటలూ చాలవన్నట్టు పనిచేస్తున్నా శారదకు మనసులో ఏదో వెలితి.

తను విడివిడి వ్యక్తులకు తన చేతిలో ఉన్న సహాయమేదో చేయగలుగుతోంది. కానీ ఎంతమందికి చేయగలుగుతుంది? ఎన్నాళ్ళు చేయగలుగుతుంది? వ్యవస్థలలో, సాగుతున్న ఆచారాలు, విధానాలలో మార్పులు రాకుండా వ్యక్తులుగా చేసే పనులకు వాటికున్న పరిమితులకూ తేడా తెలియనిది కాకామె. ఆ తేడా బాగా తెలిసే రాజకీయాలకు, జన్మనిచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి ఆమె. అందువల్ల రాజకీయ జీవితం లేని లోటు ఆమెను వేధిస్తూనే ఉంది. ఆంధ్ర రాష్ట్రం వచ్చి గుంటూరులో హైకోర్డు ఏర్పడిన తర్వాత మూర్తి కొంత నిలకడగా ప్రాక్టీసు గురించి ఆలోచించటంతో అతని అశాంతి కొంత పోయింది. ఇద్దరూ తమ తమ పనులలో మునిగిపోయారు. నటాషా చదువు, తన స్నేహితులు, బంధువులతో సంతోషంగానే ఉంది. స్వరాజ్యం శలవలకు విశాఖపట్నం నుంచి వచ్చినపుడు మాత్రం ముగ్గురినీ ఒకచోట కలుపుతుంది. పాటలు

పాడుకుంటారు విడివిడిగా – కలిసి, మూర్తీ, శారద షేక్స్పియర్, షా, ఇబ్సన్ నాటకాల నుంచి కొంత భాగమైనా చదివేదాకా ఊరుకోదు స్వరాజ్యం. ఇబ్సన్ “డాత్స్ హౌస్” లో చివరి ఘట్టం భావయుక్తంగా మూర్తి, శారదలు చదువుతుంటే స్వరాజ్యం ఉత్తేజితు రాలయ్యేది. నటాషా స్వరాజ్యం ఎప్పడొస్తుందా అని ఎదురు చూస్తుండేది. స్వరాజ్యం శలవులన్నీ బెజవాడలోనే గడుపుతోందని అన్నపూర్ణ విసుకున్నా లెక్కజేసేది కాదు. తమ్ముడున్నాడు గదమ్మా – వాడు చాలు మిమ్మల్ని సతాయించటానికి, నేను కూడా ఎందుకు” అని హాస్యంలోకి దించేది.

“వాడు మా దగ్గరే ఉండీ, నువ్వు లేకుండానూ మమ్మల్ని సతాయిస్తున్నారే తల్లీ ఏం పిల్లలో మీరు” అని అన్నపూర్ణ కోపం తెచ్చుకుంటుంటే అబ్బయ్య ఆమెను ఓదార్చి శాంతింపజేసేవాడు.

ఎన్నికల రాజకీయాలలో అన్నపూర్ణ వంటి స్త్రీలను ప్రవేశించనిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ నాయకులకు లేదు. ఎన్నికల రాజకీయాలు కాక మరో రాజకీయ కార్యక్రమమూ లేదు. ఆంధ్రరాష్ట్రం వచ్చేవరకూ ఏదో ఒక పని కల్పించుకునేది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శారదా నికేతన్కి వెళ్ళటం, లక్ష్మీబాయమ్మ గారి ఆరోగ్యం చూసుకోవడం, ఖద్దరు అమ్మటం, వినోబా మొదలెడుతున్న సర్వోదయా ఉద్యమం గురించి తెలుసుకోవటం తప్ప పెద్ద పనులేవీ లేవు. అందువల్ల అన్నపూర్ణకు ఇంటి ధ్యాస, కుటుంబం గురించిన ఆలోచన ఎక్కువయ్యాయి. కానీ స్వరాజ్యం ఆమె చేతికి అందటం లేదు.

“స్వరాజ్యానికి పెళ్ళీ చెయ్యొద్దా అని అబ్బయ్య నడిగితే –

“డాక్టర్ గారి నడిగిరా మంచి సంబంధాలున్నాయేమో” అని నవ్వేవాడు.

“ఈ శారద ఇన్నాళ్ళకు నన్ను అశాంతిపాలు చేస్తోంది చూడండి చిత్రం” అనేది అన్నపూర్ణ

నువ్వూ నీ కూతురూ చెరో విధంగా మారారు. దానికి డాక్టర్ గారిని ఆడిపోసుకోకు’ అని మందలించేవాడు అబ్బయ్య. మళ్ళీ శారదను కలిసినపుడు

ఇద్దరూ అతుకుపోయేవారు. రాజకీయ జీవితం లేకుండా బతకటం బాగోలేదని, దాన్నించి బైటపడటం ఎట్లాగనీ చర్చించుకునేవారు, *

బెజవాడ, కృష్ణాజిల్లా నుంచి కవులు, కళాకారులు 1950 నుంచే మద్రాసు వెళ్ళటం మొదలైనా 55 నాటికి బాగా పెరిగింది. జనరల్గా జరిగే సాహిత్య

కార్యక్రమాలు బాగా తగ్గాయి. మొత్తం మీద ఒక ఉత్తేజ రహిత వాతావరణం కమ్ముకుంది. లక్ష్మణరావు మెల్లీ కూడా బెజవాడ నుండి వెళ్ళిపోతున్నారనే వార్త శారదను కలవరపరిచింది. వాళ్ళు మాస్కో వెళ్తున్నారు. సరస్వతి ఒకతే బెజవాడలో శారదలా స్థిర నివాసం – గోరాగారి నాస్తికోద్యమం, ఇతర రాజకీయ కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి. కమ్యూనిస్టులు కొందరు పార్టీ ఒదిలి కాంగ్రెస్లో చేరారు. వారిలో నారాయణరాజు ఒకడు. అతను శారదను కూడా చేరమని చెప్తూ వస్తున్నాడు.

“ఇదేం కొత్త గాదు గదా డాక్టర్ గారు. ఎన్నిసార్లు గతంలో మనం ప్రచ్ఛన్నంగా కాంగ్రెస్లో పనిచేసి మన తీర్మానాలు అక్కడ నెగ్గించుకోలేదు. మన కార్యక్రమాలకు దేశవ్యాప్త ఆమోదం సంపాదించలేదు. ఆలోచించండి” అంటూ చెప్తుండేవాడు.

1956లో ఆంధ్రరాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్ అవటంతో హైకోర్టు హైదరాబాద్ కు మారుతుందని అందరికీ అర్థమైంది. మూర్తికి ఇంకా త్వరగా అర్థమైంది. హైదరాబాదుకు మారితే మంచిదని అతనికి అనిపించింది. బెజవాడనుంచి తను కదిలేది లేదని శారద తెగేసి చెప్పాక మూర్తి తను హైదరాబాదులో తన న్యాయవాద వృత్తి కొత్తగా మొదలు పెడతానన్నాడు. మద్రాసు నుంచి కుటుంబాన్ని కూడా హైదరాబాదు మార్చాలనుకుంటున్నానంటే శారద అలాగే చెయ్యమంది. దానికి కావలసిన ఏర్పాట్లు చేసింది. మూర్తి కూతురు కల్యాణి అప్పుడప్పుడు మద్రాసునుంచి బెజవాడ వచ్చి శారద ప్రేమను పొంది వెళ్తుండేది. శారద ఆ అమ్మాయినంత ఆదరించటం, స్వంత కూతురిలా ప్రేమించటం చుట్టుపక్కల వాళ్ళకు అర్థమయ్యేది కాదు. ఒకరిద్దరు లోపలి ఆరాటం ఆపుకోలేక ఏదో ఒకటి అనేవారు –

శారద నవ్వి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు మనుషులెలా ఉండాలి కుటుంబ సంబంధాలు ఎంత సంకుచితంగా ఉన్నాయి, అవి ఎలా మారాలి అని ఓపికగా చెప్పేది.

వాళ్ళలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళో సానుభూతి పరులో ఉన్నారా వాళ్ళకు మరింత లోతుగా మానవ సంబంధాల గురించి వివరించేది,

కాలం నెమ్మదిగా గడుస్తోంది. సుబ్బమ్మ ఆరోగ్యం మందగించి నీరసంగా ఉంటోంది. ఈ ఒకటి రెండేళ్ళలో జరిగిన సంఘటనలు ఆమెను ఎక్కువగానే కుంగదీశాయి. శారద కూడా నటాషా గురించి, సుబ్బమ్మ గురించి శ్రద్ధ తీసుకుంటోంది. అలాంటి రోజుల్లో శారద మద్రాసు ప్రయాణం తలపెట్టాల్సి వచ్చింది. కోటేశ్వరికి ఆరోగ్యం బొత్తిగా బాగోలేదనీ, శారదను తప్పకుండా రమ్మని పదేపదే

అడుగుతోందని ఫోన్ వచ్చింది. ప్రాక్టీసు బాగా పుంజుకుంటున్న రోజులు. నాలుగు రోజులు ఊళ్ళో లేకపోవటం అంటే అంత తేలిక కాదు. కాన్పు కేసులు ఒదిలి వెళ్ళలేదు. మొదటినుంచీ శారద దగ్గర చూపించుకున్నవాళ్ళు సమయానికి శారద లేకపోతే భరించలేరు. ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటే గాని శారదకు మద్రాసు ప్రయాణం కుదరలేదు. అప్పటికి ఫోను వచ్చి నెల దాటింది. కోటేశ్వరి జీవించే ఉందనే నమ్మకంతోనే వెళ్ళింది శారద, శారద నమ్మకం నిజమే గానీ కోటేశ్వరిని చూడగానే రోజులలో ఉంది అని అర్థమైంది శారదకు, తను ఇప్పటికైనా వచ్చి మంచిపని చేశాననుకుంది. కోటేశ్వరి జబ్బు, జరుగుతున్న వైద్యం అన్నీ వివరంగా తెలుసుకుంది. అంతా బాగానే ఉంది గానీ జబ్బు తగ్గేది కాదు.

కోటేశ్వరి పక్కనే కూచుని “విశాలాక్షికి కబురు పంపారా?” అని అడిగింది.

ఎవరూ సమాధానం చెప్పలేదు. “ఏం అమ్మా – విశాలాక్షికి కబురు పంపనా?” అనడిగింది. కోటేశ్వరి ఒద్దన్నట్లు తల అడ్డంగా ఊపింది.

“నన్నూ నా వృత్తినీ, తన పుటకనూ చీదరించుకు పోయింది. ఏంటమ్మా దాంతో నాకు సంబంధం – ఇన్నాళ్ళు లేనిది చచ్చేముందు కావలించుకుంటే ఒస్తుందా? మా బతుకులిట్టా ఎళ్ళమారిపోవాల్సిందే – ఒదు గానీ – నేనప్పడు చెప్పానే నా డబ్బు మంచి పనులకు పంచిపెట్టాలని – ఆ టైమొచ్చింది. డబ్బు నీ చేతికిస్తాను. నువ్వు నాగరత్నమ్మకీ, దుర్గమ్మకూ ఇచ్చిరా. తల్లీ – ఈ పుణ్యం కట్టుకో – నీ చేతులు మీదుగా ఇప్పించాలనే నిన్ను పిలిపించమని వీళ్ళ ప్రాణాలు తీశాను. బంగారు తల్లివి – ఒచ్చావు. ఈ పని ఒక్కటీ చెయ్యమ్మా” అని శారద చేతులు పట్టుకుంది.

“మంచిపని చెయ్యమంటూ ఇంత బతిమాలతావేంటమ్మా ఈ పని నా చేతుల మీదుగా జరగటం నా అదృష్టం. వెంటనే ఆ పని చేస్తాను. దుర్గాబాయి దేముంది. ఆంధ్ర మహిళా సభకు వెళ్ళి ఇచ్చి రావటమే.

నాగరత్నమ్మ గారి దగ్గరకు వెళ్ళటమే కష్టం. దూరం కదా – రైలు టిక్కెట్టు దొరకాలి – •

“ఎందుకు రెండు కార్లున్నాయి. దర్జాగా కార్లో వెళ్ళమ్మా” అని ఎవరినో పిల్చి “కారూ డ్రైవరూ సిద్ధంగా ఉన్నారా” అని అడిగింది.

మరో గంటలో కారులో దుర్గాబాయి దగ్గరకు వెళ్ళి కోటేశ్వరి ఇచ్చిన డబ్బు ఇచ్చి రసీదు తీసుకుంది.

ఆంధ్ర మహిళా సభ అంతా ఒకసారి కలయదిప్పింది దుర్గాబాయి, దుర్గాబాయికున్న

ముందు చూపును ఆ సంస్థ మీద ఆమెకున్న ప్రేమనూ ఆ సంస్థ నడుస్తున్న తీరునూ శారద మనస్ఫూర్తిగా ఆనందించింది.

“ఇదుగో – మీ ఏలూరు నుంచే వచ్చిందీ అమ్మాయి. మహా తెలివైనది. చురుకైనది”, చురుకుదనంతో మెరిసిపోతున్న ఒక యువతిని చూపింది దుర్గ, “మా ఏలూరేంటి?” “నువ్వు పోటీ చేశావుగా – ఓడిపోయావనుకో – మాలతీ శారదాంబ గారు తెలుసా? అప్పటికి నీకు ఓటు లేదేమో ”- అంది దుర్గ.

“శారదాంబ గారిని చూశానండి. ఎన్నికలప్పుడే. నేనప్పడు స్కూల్ ఫైనల్లో ఉ న్నాను. నమస్కారమండి” అంది ఆ యువతి,

“చాలా మంచి అమ్మాయి – వీళ్ళాయన నాగేశ్వరరావు అని రచయిత, జర్నలిస్టు, వీళ్ళిద్దరూ భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తారు” అంది దుర్గ మాలతి భుజం తడుతూ,

“అదంతా దుర్గాబాయమ్మ గారి అభిమానం. కొన్ని విలువలతో బతకగలిగితే చాలనుకుంటున్నాం” అంది మాలతి వినయంగా నవ్వుతూ. ఆ అమ్మాయి భుజం తట్టి ముందుకు నడిచింది శారద.

మర్నాడు తెల్లవారుఝామునే శారద తంజావూరు దగ్గర తిరువాయూరుకి ప్రయాణమైంది. సాయంత్రమవుతుండగా ఆ ఊరు చేరింది. కావేరీ నది ఒడ్డున ఉన్న త్యాగరాజస్వామి ఆలయంలోనే ఆ సమయంలో ఆవిడ ఉంటుందని తెలుసుకుని సరాసరి అక్కడికే వెళ్ళింది. ఆ ఊరు చిన్నదే గాని ముచ్చటగా ఉంది, నదికి దగ్గరగా అంత విశాలమైన స్థలంలో చిన్న ఆలయం నిర్మించటానికి ఒంటిచేత్తో పని చేసిన నాగరత్నమ్మ గారి పట్టుదలకూ, త్యాగరాజస్వామి మీద ఆమెకున్న ప్రేమకూ శారద నిండు మనసుతో చేతులెత్తి నమస్కరించింది.

తనను తాను పరిచయం చేసుకుని వచ్చిన పని చెప్పింది. నాగరత్నమ్మ సంతోషంతో శారదను దీవించింది.

త్యాగరాజస్వామి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసింది. అక్కడే కూచున్నారు

కాసేపు ఇద్దరూ,

నాగరత్నమ్మ గారు అప్రయత్నంగా గొంతెత్తి రాగాలాపన అందుకున్నారు.

“ఏ పనికో జన్మించి తినని నన్నెంచవలదు, శ్రీరామ! నే నే పనికో జన్మించితినని.

శ్రీపతి! శ్రీరామచంద్ర! చిత్తమునకు తెలియదా? ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు”

ఆవిడ పాడుతుంటే శారద తన అదృష్ణాన్ని నమ్మలేకపోయింది. తన ఒక్కదాని ఎదుట, త్యాగరాజాలయంలో, కావేరీ ఒడ్డున ఆ సంగీత నిధి పాడుతుంటే శారద మనసు పులకించిపోయింది. కళ్ళవెంట నీళ్ళు కారాయి. మనసులో ఆ కీర్తననూ, ఆ వాతావరణాన్ని ఆ కావేరిని గాఢంగా ముద్రించుకుంది.

శారదాంబ వివరాలన్నీ ఒక్కొక్కటే ఓపికగా అడిగి తెలుసుకుంది నాగరత్నమ్మ శారదకు కూడా ఎంతో సంతోషంగా తన గురించి ఆమెకు చెబుతుంటే తనేమేమిటి, ఎవరు ఏం చేస్తోంది? అనే విషయాలు కొత్తగా తను కూడా తెలుసుకుంటు న్నట్లనిపించింది, అదొక వింత అనుభూతి అయింది.

“ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు వెళ్దువు గాని రా” అని అక్కడి నుంచి శారదను ఇంటికి తీసుకెళ్ళింది.

ఇంటికి వెళ్ళాక శారద స్నానం, భోజనం చేసి కూర్చున్న తర్వాత “ఈ పుస్తకం చూశావా” అంటూ “రాధికా స్వాంతనము” అనే కావ్యాన్ని శారద చేతిలో పెట్టింది. ముద్దు పళని రాసిన కావ్యం అది. పుస్తకం తెరిచి ముందుమాట చదివింది.

చాలా అలజడి, ఆనందం, కలవరం –

ముడు పళని వేశ్య కాబట్టి వీరేశలింగం గారు ఆమె రాసిన కావ్యం నిండా పచ్చి శృంగారముందని విమర్శిస్తే – దానికి నాగరత్నమ్మ గారిచ్చిన సమాధానం ఆ ముందుమాటలో ఉంది.

ఆ మాటలలో ఎంతో అర్థముంది. ఆలోచించటానికెంతో ఉంది. అది పక్కన బెడితే నాగరత్నమ్మ ధీరత్వానికి ఆశ్చర్యపోయింది శారద – సాహసవంతురాలని అందరూ చెప్పకునే శారద.

వీరేశలింగం గారి వంటి పండితుడిని, సంస్కర్తను, ప్రజాభిమానం ఎంతగానో పొందినవాడిని అట్లా పది వాక్యాలలో కడిగివేయటానికి ఎంత సాహసం, ఎంత పాండిత్యం కావాలి? నాగరత్నమ్మ గాయకురాలనే ఇన్నాళ్ళూ అనుకుంది శారద, ఆమె మేధస్సు, విద్య, విమర్శనా శక్తి, సాహసం తెలియదు. స్త్రీలను మేధావులుగా గుర్తించరని బాధపడే తనెంత గుర్తిస్తోంది?

కోటేశ్వరి, విశాలాక్షి గుర్తొచ్చారు. కులం, కుల వృత్తులు, వీటి ఆవిర్భావం వీటి

గురించి ఆలోచించటానికి ఎంతో ఉందనిపించింది శారదకు, కులాలు పోవాలనటం తప్ప కుల అస్తిత్వం గురించి ఆలోచించటం లేదు. ఆ దిశగా ఆలోచించటానికెంతో ఉంది. కోటేశ్వరి, విశాలాక్షి నిశ్శబ్ద యుద్ధం చేశారు. నాగరత్నమ్మ, ముత్తు లక్ష్మీరెడ్డి బహిరంగంగానే పని చేశారు. ఐనా ఇంకా తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. జాతి, కులం మామూలు విషయాలు కాదు. కుల నిర్మూలన అంటున్న అంబేద్కర్ రాసిన విషయాల గురించి జరగాల్సిన చర్చ జరగటం లేదు. కమ్యూనిస్టులూ పట్టించుకోవటం లేదు. ఎలా ఎక్కడ నుంచి – ఆర్థికమా, సాంఘికమూ, సంస్కృతా, వృత్తులా – శారద మనసు ఆ రాత్రి అనేక విషయాలతో అల్లకల్లోలమయింది. నిద్ర పట్టలేదు. తెల్లవారి ఎర్రని కళ్ళతో నిద్రలేచి స్నానం చేసి తల దువ్వకుంటుంటే నాగరత్నమ్మ గారి కీర్తన మధురంగా శాంతంగా వినిపించింది.

శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన

దాంతునికైన వే – దాంతునికైన

శాంతము లేక సౌఖ్యము లేదు

దార సుతులు ధన ధాన్యములుండిన

సారెకు జప తప సంపద గల్గిన

శాంతము లేక సౌఖ్యము లేదు

ఆగమ శాస్త్రములన్నియు జదివిన

బాగుగ సకల హృద్భావము దెలిసిన

శాంతము లేక సౌఖ్యము లేదు

శారద నాగరత్నమ్మ గారి పక్కన జేరి తాళం వేస్తూ తనూ మెల్లిగా గొంతు కలిపింది.

యాగాధికర్మము లన్నియు జేసిన

భాగవతులనుచు బాగుగ బేరైన

శాంతము లేక సౌఖ్యము లేదు

రాజాధిరాజ ! శ్రీ రాఘవ త్యాగ

రాజ వినుత సాధురక్షక తనకుప

శాంతము లేక సౌఖ్యము లేదు –

కీర్తన పూర్తయ్యేసరికి శారద మనసు ప్రశాంత మయింది. ఆమెకు నమస్కారం చేసి బయల్దేరింది.

దారంతా కోటేశ్వరికి నమస్కారాలు చెప్పకుంటూనే ఉంది ఈ అనుభవాన్ని తనకిచ్చినందుకు,

కోటేశ్వరికి రెండు రసీదులూ ఇచ్చి ఆ సాయంత్రమే బెజవాడ రైలెక్కింది.

బెజవాడ చేరిన రెండు రోజులకే కోటేశ్వరి చనిపోయిందని ఫోను వచ్చింది.

తను సరైన సమయానికి వెళ్ళగలిగినందుకు సంతృప్తిగా అనిపించింది. విశాలక్షికి ఫోను చేద్దామా ఒద్దా అని ఆలోచించి చివరికి రాత్రికి ఫోను చేసి చెప్పింది.

“అలాగా – జబ్బేమిటి” పొడిపొడిగా వివరాలడిగి తెలుసుకుంది విశాలాక్షి ఆ ఫోన్ పెట్టేశాక విశాలాక్షి యేడ్చిన యేడుపు శారద ఊహించనిది.

***************************

ఎమ్మెస్సీ పూర్తవుతూనే స్వరాజ్యం విశాఖపట్నం ఎ.వి.యన్ కాలేజీలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగంలో చేరటానికి ముందు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమని అన్నపూర్ణ ఉత్తరాలు తీవ్రంగా రాసీ రాసీ విసుగెత్తిన తర్వాత ముందు బెజవాడ వచ్చి పెద్దమ్మను, పెదనాన్ననూ, నటాషానూ చూసి ఆ తర్వాత గుంటూరు వస్తానని స్వరాజ్యం నుండీ సమాధానం వచ్చింది. అన్నపూర్ణకు ఏదో అనుమానం తోచింది గానీ అది అబ్బయ్యతో కూడా పంచుకోలేదు. “స్వరాజ్యాన్ని నాలుగు రోజుల్లో పంపు తల్లీ అని నిష్టూరంగా శారదకో ఉత్తరం రాసి ఊరుకుంది.

స్వరాజ్యం వస్తుందంటే ఇంట్లో అందరికీ ఆనందమే. స్వరాజ్యానికి ఎవరితో ఉండే పనులు వారితో ఉంటాయి, వచ్చి ఒకరోజు అలసట తీర్చుకున్న తర్వాత శారద ఒంటరిగా ఉన్నపుడు తన మనసులో మాట బైట పెట్టింది.

పెద్దమ్మా నేను పెళ్ళీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను”

“ఔనా – మరి రాగానే చెప్పలేదేం. మీ అమ్మానాన్నకు చెప్పావా? ఎవరతను? ఏం చేస్తాడు? స్వరాజ్యం అనుకున్నంత ఆనందమూ ప్రకటించలేదు. హడావుడీ చెయ్యలేదు శారద,

“నాకు సీనియర్ యూనివర్సిటీలో, విశాఖ పోర్టు కార్మికుల సంఘంలో పని చేస్తున్నాడు. కమ్యూనిస్టు, మా కులం కాదు. మా పెళ్ళి నువ్వే చెయ్యాలి”.

శారద ముఖంలో ఇప్పడు ఆనందం నిండిపోయింది. స్వరాజ్యాన్ని దగ్గరకు లాక్కుని,

నీ పెళ్ళి నేనెందుకు చేస్తాను. మీ అమ్మ నన్ను బతకనిస్తుందా? మీ అమ్మా నాన్నలను అంత తక్కువగా అంచనా వెయ్యకు, కమ్యూనిస్టనీ, కులాంతరమనీ వాళ్ళేమీ అభ్యంతరం పెట్టరు. ఇవాళ సాయంత్రం మనిద్దరం గుంటూరు వెళ్దాం పద. అసలు నువ్వొకదానివే వెళ్లి చెస్తే మంచిది. నా మీద నా కూతురు నమ్మకం ఉంచిందని మీ అమ్మ సంతోషపడుతుంది, వెళ్ళరాదు?”

స్వరాజ్యం ఆలోచనలో పడింది.

వెళ్తాను. కానీ రేపు సాయంత్రానికి మీరు రావాలి అంది స్వరాజ్యం,

“అలాగేవస్తా ముందు నువ్వు వెళ్ళి మూట విప్పెయ్” అని ప్రేమగా నవ్వింది. స్వరాజ్యాన్ని గుంటూరు పంపి తల్లితో ఈ కబురు చెప్పి ఆ తర్వాత సరస్వతికి, … కబురు పంపి, మర్నాడు అందరూ కలిసి గుంటూరు వెళ్ళాలని మనసులో అనుకుంది. ఇంతలో ఆస్పత్రి నుంచి కబురొచ్చింది అర్జెంటు కేసని. ఇలా వెళ్తున్నానని ఒక కేకైనా వేయకుండా చెప్పలు వేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చే సరికి రాత్రి పదయింది. స్వరాజ్యం వెళ్ళిపోయినట్లుంది. లేకపోతే శారద కోసం ఎదురు చూస్తూ వరండాలో కూచుని ఉండేది. శారద తల్లి నిద్రపోతూ ఉంటుందనుకుంటూనే సుబ్బమ్మ గదిలోకి వెళ్ళింది. ఆమె నిద్రపోతోంది. నిద్రలో అమాయకంగా, నవ్వు ముఖంతో ప్రశాంతంగా ఉన్న తల్లిని చూస్తే శారదకు ప్రేమ గుండెల్లో నుంచి పొంగుకువచ్చింది. నెమ్మదిగా ఆమె మీదికి వంగి నుదుటి మీద మెల్లిగా పెదవుల్లాన్చింది. శారద పెదవులు ఒక్క క్షణం ఆ నుదుటి మీదే గట్టిగా అడ్డుకున్నాయి. శారద చటుక్కున లేచింది. ఒకక్షణం భయ సందేహాలతో అలాగే చూసింది. చేయి పట్టుకునే సరికి అర్ధమైపోయింది. తల్లి పక్కనే కూలబడి పోయింది శారద. మనసంతా నిరామయమయింది.

“నాకు చెప్పకుండా ఏ చిన్న పనీ చేసేదానివి కాదు. ఇంత పెద్ద పని చేశావేమి టమ్మా అనుకుంది మనసులో –

కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శారదకు ఎవరినీ పిలవాలనిపించలేదు. తల్లి ముఖం చూస్తూ, ఆమె చేతిని తన చేతితో నిమురుతూ అలాగే కూచుండిపోయింది.

తల్లి బోళా మనిషనీ, అంత సమర్థురాలు కాదనీ అందరూ అనుకుంటారు. కానీ చాలా తెలివైనదని తనకొక్కదానికే తెలుసు. సమాజంలో, ఇంట్లో వచ్చే మార్పులను

366 • ఓల్లా

చివరివరకూ అర్థం చేసుకుని ఆనందంగా వాటితో సహజీవనం చేసింది. తన చిన్న చిన్న ఆచార వ్యవహారాలకు కాస్త చోటుంచుకుంది. దేనికీ రొష్టు పడలేదు. కష్టాలు వస్తాయి పోతాయి అనుకుంది. జీవించటంలో అంతకంటే తెలివైన మార్గం ఏముంటుంది? ఎన్నెన్నో జ్ఞాపకాలు శారదకు,

తనమీద తల్లికున్న నమ్మకం ప్రేమ ఎన్ని సందర్భాల్లో అర్థమై గుండె తడయిందో అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి.

రేపటి నుంచీ అమ్మ కనిపించదు. తనివిదీరా తల్లి ముఖం చూస్తూ, అడ్డం పడుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అక్కడే కూచుంది.

రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో రోజూ సుబ్బమ్మను దొడ్లోకి తీసుకుపోయే ఆయా వచ్చి శారద నక్కడ చూసి

“అమ్మా – ఏమైంది అంది కంగారుగా.

“అమ్మ వెళ్ళిపోయింది దుర్గా అంటూ లేచి ఆ కబురు చెప్పవలసిన వాళ్ళకు చెప్పే పనిలో పడింది.

మర్నాడు ఉదయం నుంచీ ఎందరో వచ్చి సుబ్బమ్మను చూసి, నమస్కరించి శారదను పలకరించి వెళ్తున్నారు. సాయంత్రం వరకూ బంధువులు, స్నేహితులు వస్తూనే ఉన్నారు. కానీ ఆపదలో, అవసరంలో వేళ కాని వేళల్లో వచ్చి సుబ్బమ్మ చేతి కింద నడిచే వంటగదిలో నిప్ప ఆరకుండా చేసిన ఎందరో రాలేదు. శారద కొందరు వస్తారని ఎదురు చూసింది, యువకులుగా ఉన్నప్పటి నుంచీ అమ్మా అంటూ పిల్చి ఆమె ఆప్యాయతను పంచుకున్న కొందరు చివరిసారిగా ఆమెను చూడటానికి వస్తారని చూసింది. రాలేదు. అన్నపూర్ణ, సరస్వతి శారదను ఒదలకుండా కూర్చున్నారు, ఆ తల్లీ కూతుళ్ళ అనుబంధం వీరిద్దరికి బాగా తెలుసు. ఒక వైద్యురాలిగా మృత్యువుని అర్థం చేసుకోగలిగినా కూతురిగా ఆ వాస్తవాన్ని మింగటం శారదకైనా కష్టమేనని చాలామంది అనుకున్నారు.

ఆనాటి సూర్యాస్తమయంలో కలిసిపోయింది సుబ్బమ్మ,

శారద మనసింకా పచ్చిగా ఉన్నా స్వరాజ్యం పెళ్ళీ గురించి అన్నపూర్ణతో మాట్లాడాలని తల్లిపోయిన వారం రోజుల్లోనే గుంటూరు వెళ్ళింది.

అన్నపూర్ణకు శారద వచ్చిన పని తెలుసు. కానీ తెలియనట్లే వేరే సంగతులు చెప్తూ పోయింది,

“అవన్నీ ఆపవోయ్ – స్వరాజ్యం పెళ్ళి సంగతేమిటి? మీరేమనుకుంటున్నారు? అన్నపూర్ణ ముఖం వివర్ణమైంది,

“నాకిష్టం లేదు శారదా, అబ్బయ్య అమ్మాయి ఇష్టం. నాదేం లేదంటున్నాడు. నాకు కులం గురించి పట్టింపు లేదు. కానీ అలవాట్లలో, ఆచారాల్లో తేడాల వల్ల తర్వాత్తర్వాత సమస్యలొస్తాయి అని భయంగా ఉంది”

ఏ పెళ్ళీలోనైనా సమస్యలొస్తాయి. ఒస్తే ఎదిరిస్తాం గానీ సమస్యలొస్తాయని చేతులు ముడుచుకు కూచుంటామా?”

‘నాకెలా చెప్పాలో అర్థం కావటం లేదు – హరిజనుల బాగు కోసం నేనూ పని చేశా. కానీ ఒక హరిజనుడు అల్లడవుతాడంటే ఒప్పకోలేకపోతున్నా

“వాళ్ళూ నువ్వూ వేరు వేరనుకుని – వాళ్ళు నీకంటే తక్కువని, వాళ్ళను ఉద్ధరించటం మంచిపని, వాళ్ళకు మేలు చేస్తున్నాననీ నువ్వు హరిజనోద్యమంలో పని చేశావు, వాళ్ళను నీతో సమానమని అనుకోలేదన్న మాట – అదేంటోయ్ – నువ్విలా ఉండటం ఏమీ బాగోలేదోయ్ – అంది శారద.

అన్నపూర్ణ తలదించుకు కూచుంది.

స్వరాజ్యం తల్లి గురించి అవమానపడుతూ ముఖం ఎర్రగా చేసుకుంది. అబ్బయ్య సమస్య తనది కానట్లు ఏదో పుస్తకం తిరగేస్తూ కూచున్నాడు, “సరస్వతి కూతురు మనోరమ పెళ్ళీ గుర్తులేదా? గాంధీ గారే చేయాలనుకున్నారు. ఆయన మరణించాక గాని అది కుదరలేదు. గాంధీ ఆశ్రమంలో నెహ్రూ చేతుల మీద జరిగింది. వాళ్ళిద్దరూ ఎంత బాగుంటారు. నాకు తెలిసి వాళ్ళకే సమస్యలూ లేవు. ఇప్పడు లవణానికి జాషువా గారమ్మాయితో పెళ్ళీ ఎంత ప్రేమగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు, అసలు – ఎప్పట్నించి నువ్వు గాంధీగారి శిష్యురాలివి – నువ్వనాల్సిన మాట లేనా ఇవి?

“మనోరమ సంజీవరావుల పెళ్ళికి గాంధీగారు ఎంత ఆలోచించారు. వాళ్ళిద్దరూ గాంధీ ఆశ్రమంలో ఏడాదిపైగా కలిసి పనిచేసి ఒకర్నొకరు అర్ధం చేసుకున్నారు, హేమలత జాషువాగారి సంస్కారం పంచుకుని పెరిగిన పిల్ల –

“అమ్మా – నేనూ సుందర్రావూ రెండేళ్ళ నుంచీ ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. సుందర్రావు నీకంటే చాలా సంస్కారవంతుడు.” ఆవేశంగా అంది స్వరాజ్యం,

“ఔను. నేనే సంస్కారం లేనిదాన్ని హీనురాల్ని అంటూ ఏడుపు మొదలెట్టింది అన్నపూర్ణ

“ఈ ఇంట్లో జరగవలసిన మాటలు కావివి. అన్నపూర్ణా – నాకసలు అర్థం కావటం లేదోయ్ – ఆ అబ్బాయి బాగా చదువుకున్నవాడు. ఆ చదువుతో సంపాదించుకుని తానొకడే ఎదిగిపోవాలనుకోకుండా అందరి బాగు కోసం పని చేస్తున్నాడు, కులం కారణంగా నువ్వు – అన్నపూర్ణవి – కూతురి ప్రేమను ఒప్పకోవటోయ్ – ”

“ఆదర్శాల కోసం పెళ్ళీళ్ళు చేసుకోకూడదు” కఠినంగా అంది అన్నపూర్ణ

పెద్దమ్మా – నేను ఆదర్శాల కోసం చేసుకోవటం లేదు. సుందరం మా దరిద్రపు కమ్మ కులంలో పుట్టినా, బ్రాహ్మణ కులంలో పుట్టినా అతని సంస్కారం ఇదే అయితే నేనతన్ని ప్రేమించేదాన్ని – అతను హరిజనుడనీ, మా పెళ్ళి ఆదర్శమనీ నేను అనుకోవటం లేదు. అమ్మని అది నమ్మమనండి. స్వరాజ్యం తీవ్రతకు అందరూ భయపడ్డారు.

పెద్దమ్మా – ఈ కాంగ్రెస్ హరిజనోద్ధరణ ఒట్టి బూటకం, అందులో ఈ కమ్మ, రెడ్డి కాంగ్రెస్ వాళ్ళది మరీ బూటకం. నేను అమ్మమ్మ గారి ఊరెళ్ళినపుడు చూశానుగా – వీళ్ళు కుర్చీలలో మంచాల మీదా దర్జాగా కూర్చుంటారు. హరిజనులొచ్చి కింద కూచోవాలి. ఇళ్ళల్లోకి రానివ్వరు. మళ్ళీ బ్రాహ్మలు తమని వంటిళ్ళలోకి రానివ్వరని ఏడుస్తారు. వీళ్ళేమో అంటరానితనం పాటిస్తారు. మీరు కమ్యూనిస్టులు గాబట్టి మీరట్లా ఉండరేమో – కమ్మ బ్రాహ్మలు పెద్దమ్మా ఈ కాంగ్రెస్ వాళ్ళంతా –

అందరూ కాసేపు నిశ్శబ్దమై పోయారు. స్వరాజ్యం మాటల్లో నిజం అందరికీ తెలుసు,

శారద అంటరానితనం పాటించకూడదనే ప్రత్యేకమైన స్పృహతో ఉంటుంది. మహిళా సంఘంలో పదే పదే చెప్పింది. ఆచరింపచేసింది. ఐనా కొందరు కులాన్ని అధిగమించలేదనీ, స్వరాజ్యం చెప్పినవి కమ్యూనిస్టుల ఇళ్ళల్లో కూడా జరుగుతాయని శారదకు తెలుసు. కానీ అన్నపూర్ణ ఇంత సంకుచితంగా ఆలోచిస్తుందని అసలు అనుకోలేదు.

“అన్నపూర్ణా – అంబేద్కర్ రైటనిపిస్తోంది. కుల నిర్మూలనే జరగవలసిన మొదటి పని – తర్వాతే మిగిలిన విషయాలు, కులాంతర వివాహాల వల్లనే కులం లేకుండా

పోతుందని ఆయన చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో నాకివాళ అర్థమవుతోంది. నీకే ఇంత వ్యతిరేకత ఉంటే ఇక మామూలు వాళ్ళ సంగతేంటి?”

నాకిప్పుడు దేశోద్ధరణ గురించి ఉపన్యాసం ఇవ్వకు శారదా – నా కూతురి భవిష్యత్తు నాకు ముఖ్యం.”

“నీ కూతురి భవిష్యత్తు, దేశ భవిష్యత్తు వేరని ఎందుకనుకుంటావు?” అబ్బయ్య కలగజేసుకున్నాడు.

“ఇది మాటలతో, వాదనలతో పరిష్కారమయ్యే సమస్య కాదు డాక్టర్ గారు. ఇవన్నీ అనవసరం, స్వరాజ్యం మేజరు, స్వతంత్రురాలు, అది వెళ్ళి దానిష్టం వచ్చిన పెళ్ళీ చేసుకోవచ్చు.

“థాంక్స్ నాన్నా తేల్చి చెప్పావు, పెద్దమ్మా – నేను నీతో వస్తాను ఉండు” అని బట్టలు మార్చుకుని వచ్చింది.

అన్నపూర్ణ మాట్లాడకుండా కూర్చుంది, వారించలేదు.

పద పెద్దమ్మా” అని స్వరాజ్యం తొందర చేస్తోంది.

“ఏంటోయ్ ఇది – ఈ పిచ్చి, మూర్ఖత్వం ఏంటి నీకు? స్వరాజ్యాన్ని దగ్గరకు తీసుకో – మీ ఇద్దరూ ఆనందంగా కూతురి పెళ్ళి చెయ్యండి. ఆనందంగా జరగాల్సిన పనిని అశాంతిమయం చేసుకోకండి”,

ఎంత చెప్పినా అన్నపూర్ణ కరగలేదు.

చివరికి కట్టుబట్టలతో స్వరాజ్యం శారద వెంట ఆమె ఇంటికి వచ్చింది. శారద ఎన్నో కులాంతర వివాహాలు, దండల పెళ్ళిళ్ళు తన ఇంట్లో చేయించింది. కానీ అన్నపూర్ణ కూతురి పెళ్ళీ ఇట్లా తన ఇంట్లో జరుగుతుందని అనుకోలేదు. అన్నపూర్ణ, అబ్బయ్య, శారద కుటుంబంలో వారేనని అందరూ అనుకుంటారు. వాళ్ళిద్దరూ రాకుండా వాళ్ళ కూతురి పెళ్ళి శారద ఇంట్లో జరగటం అందరికీ ఆశ్చర్యమే. తల్లి రాని లోటు తెలియకుండా స్వరాజ్యానికి తనే తల్లయింది శారద, సరస్వతి, గోరా, మెల్లీ, లక్ష్మణరావుల సహాయం ఉంది. సుందర్రావు కుటుంబం కూడా శారద ఇంట్లోనే దిగారు, సుందర్రావు తల్లిదండ్రులు సంకోచంతో దూరదూరంగా ఉంటే శారద వాళ్ళకు బెజవాడంతా తిప్పి చూపి, అందరి ఇళ్ళకూ తీసికెళ్ళి, వాళ్ళందరి వద్దా వీళ్ళను గౌరవించి మొత్తానికి వాళ్ళ బెరుకు పోగొట్టింది.

సుందర్రావు బంధువులు పాతికమంది దాకా వచ్చారు. మరో పాతికమంది బెజవాడ మిత్రులు. గోరా గారి అధ్యక్షతన, శారద నిర్వహణలో ఆనందంగా జరిగిపోయింది.

పెళ్ళయిన మర్నాడే స్వరాజ్యం, సుందర్రావులు విశాఖపట్నం వెళ్ళిపోయారు. అన్నపూర్ణ గురించి ఆలోచిస్తూంటే శారదకు కులం ఎంత పెద్ద సమస్యో అర్థమయింది. “ఇన్నాళ్ళూ ఆడవాళ్ళే అన్నిటిలో అధమస్థానంలో ఉన్నారనుకున్నాను. మాల మూదిగలు, వృత్తి కులాల వాళ్ళు, అక్కడ స్త్రీలూ — అసలు జరగవలసిన పనంతా అక్కడే ఉంది. కులాలు లేనట్టు నటించటమే స్వతంత్రోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమాలూ నేర్పాయా? అంబేద్కర్ని మళ్ళీ చదవాలి” అనుకుంది శారద.

************

విశాఖపట్నం వెళ్ళి స్వరాజ్యాన్ని చూడాలి అనుకుంటూనే అయిదు నెలలు గడిచి పోయాయి. వెళ్ళి వాళ్ళకు కావలసిన సామాను కొనిచ్చి రావాలనేది శారద ఆరాటం. శారద రేపా మాపా అని ఆలోచిస్తుండగానే స్వరాజ్యం వచ్చేసింది. ఉత్తరమన్నా రాయకుండా దిగిన ఆ పిల్లను చూస్తే శారదకు విషయం అర్థమయింది. ఐనా పైకేమీ మాట్లాడకుండా

“ఎప్పటికప్పుడు విశాఖపట్నం రావాలనుకుంటూనే ఆలస్యమైంది” అంది.

స్వరాజ్యం నవ్వి పర్లేదులే పెద్దమ్మా మేం బాగానే ఉన్నాం.

ఏ అవసరం వచ్చినా నీకు ఉంతరం రాయనా?” అంది శారద హాస్పిటల్కి బయలు దేరుతుంటే నేనూ వస్తాను పెద్దమ్మా అంది తప్పు

చేసినట్లు,

“ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు. శారద ఇన్ పేషెంట్స్ని చూసి వస్తానని వెళ్ళింది.

ఓ గంటలో కన్సల్టింగ్ రూంకి వచ్చేసరికి స్వరాజ్యం దిగులుగా కూచుని ఉంది.

“ఎన్నో నెల? శారద కుర్చీలో కూచుంటూ అడిగింది.

“మూడో నెల అనుకుంటా”

“అనుకుంటా బుద్ధిలేదూ? ఎమ్.ఎస్.సి. చదివావు. కాస్త జాగ్రత్త పడలేక పోయావా??

“ఎబార్షన్ కుదరదా పెద్దమ్మా

 

గమనమే గమ్యం-33

 

volgaదుర్గ ఆప్యాయంగా శారదను దగ్గరకు తీసుకుంది.

ఆమె ఒకవైపు లాయర్‌గా పనిచేస్తోంది. మరోవైపు రాజ్యాంగ సభ సభ్యురాలిగా నెలకు ఒకటి రెండు సార్లు డిల్లీ ప్రయాణాలు  తప్పటం లేదు. ఆంధ్ర మహిళా సభ నిర్మాణం  జరిగింది. దానిని విస్తరించే ప్రణాళికలు , దానికి కావలసిన విరాళాల  సేకరణ దుర్గాబాయికి ఒక్క నిమిషం తీరిక దొరకదు. ఆమెకు ఆ తీరిక అవసరం లేదు కూడా. పని. పని. పని. ‘‘వందమంది మనుషుల పని చేస్తున్నావోయ్‌’’ అంది శారద.

‘‘నువ్వు? వెయ్యి చేతుల్తో పని చేస్తున్నావు. అసలు  సంగతి చెప్పనా  ? మనం ఇలా పని చెయ్యకుండా బతకలేం’’

‘‘సరిగ్గా చెప్పావు’’ శారద గలగలా నవ్వింది.

‘‘కాకినాడ కాంగ్రెస్‌ సభకొచ్చావు గుర్తుందా? ఇంటర్‌ చదువుతున్నావు. డాక్టర్‌నవుతానన్నావు. అప్పటికి నేనింకా చదువులో ప్రవేశించలేదు. ప్రవేశిస్తానో లేదో తెలియదు. నిన్ను చూసి ఆనందించాను. నువ్వు మెడిసిన్‌  చదివి డాక్టరవటం ఊహించుకుని, నేను గాంధీ గారిలా, నెహ్రూగారిలా, ప్రకాశం గారిలా లాయర్‌ నవ్వాలనుకున్నాను . ప్రాక్టీస్‌ చెయ్యాలనుకున్నాను ’’.

‘‘సాధించావుగా ` మనిద్దరి ప్రాక్టీసూలూ  జనానికి మేలు  చేస్తున్నాయి’’.

‘‘నేను ప్రాక్టీసు ఒదిలెయ్యాల్సి వచ్చేలా ఉంది’’ అంది దుర్గ నిరుత్సాహం గా .

‘‘ఎందుకు?’’

‘‘రాజ్యాంగ  సభ చాలా సమయాన్ని తీసుకుంటోంది. ఢల్లీకి వెళ్ళిపోవాలి. అక్కడ ఫెడరల్‌ కోర్టులో చెయ్యొచ్చనుకో. వచ్చే ఏడాది ఎన్నికలొస్తున్నాయిగా. నేను పార్లమెంటుకి రావాలని  నెహ్రూగారు పట్టుదలగా ఉన్నారు. వీటన్నిటితో ఇంక ప్రాక్టీసెక్కడ కుదురుతుంది?’’

‘‘పార్లమెంటులో నీలాంటి వాళ్ళుండాలోయ్‌ – ముఖ్యంగా హిందూకోడ్‌ బిల్లు  వంటివి చట్టాలై  రావాలంటే  నీలాంటి  వాళ్ళుండాలి. ప్రాక్టీసుతో కొందరికే మేలు  చెయ్యగలం. పాలసీలు  దేశాన్నంత ప్రభావితం చేస్తాయి గదా. నువ్వు పార్లమెంటుకి వెళ్ళి తీరాలి. రాజ్యాంగసభ ఎలా జరుగుతుందోయ్‌’’.

‘‘అబ్బా –  చాలా తీవ్రమైన చర్చు. ఒక్కపదం గురించి గంటలు గంటలు  వాదనలు . అంబేద్కర్‌ ఎంత గొప్పవాడనుకుంటున్నావు ? ఆయనకున్న చట్ట పరిజ్ఞానం ప్రపంచంలోనే ఎవరికైన ఉందా అనిపిస్తోంది. ఆయన ఆధ్వర్యంలో ఆడవాళ్ళకు, హరిజనులకు మేలు  చేసే  అంశాల తోనే తయారవుతోంది’’.

‘‘అది జరిగితే చాలు . హరిజనుల  పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంటరానితనాన్ని నిషెధించాలి’’.

‘‘నిషెధిస్తాం చూడు. అన్నట్టు మా రాజ్యాంగసభలో దాక్షాయణీ వేలాయుధన్‌ అని ఒక హరిజన స్త్రీ కేరళ నుంచి ఉంది. భలే గట్టి మనిషిలే. నువ్వూ నేనూ ఎందుకూ పనికిరాము  ఆమె ముందు’’

‘‘మనం భద్ర జీవితాల   నుంచి వచ్చాం. ఆమె ముళ్ళూ రాళ్ళూ గుచ్చుకున్నా లెక్కచెయ్యకుండా ఎదిగి ఉంటుంది.  రాటుదేలి ఉంటుంది’’.

వాళ్ళ కబుర్లకు అంతులేదు. ఆంధ్ర మహిళా సభ చూసి శారద చాలా సంతోషించింది. ‘‘ఇలాంటివి చాలా కావాలోయ్‌’’ అంది ఆలోచనగా. ‘‘ఇంతకూ వచ్చిన పని చెప్పలేదు’’ ఆ  రాత్రి దుర్గాబాయి అమ్మ శారద కోసం ఇష్టంగా వండినవన్నీ తిని భుక్తాయాసంలో కూర్చున్నపుడు అడిగింది దుర్గ.

‘‘దుర్గా . ఒక్కసారి నెహ్రూగారిని కలవాలోయ్‌. నువ్వెలాగైన  నాకు ఆయనతో ఇంటర్వ్యూ ఇప్పించాలి. నిజాం నుంచి తెలంగాణాని విముక్తం చేశామని ఆయన సంతోషిస్తుండవచ్చు. కానీ తెలంగాణాలో, ఆంధ్రాలో, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో జరుగుతున్న మారణకాండ ఆయనకు తెలుసా? తెలిసిన సరే నేను ఆయనకు చెప్పాలి. ఒక్కసారి ఇంటర్వ్యూ ఇప్పించాలోయ్‌’’.

olga titleదుర్గ నవ్వింది.

‘‘నెహ్రూ ఇప్పుడు హిందూ ముస్లిం కలహాలు , శరణార్థుల  సమస్యతో సతమతమవుతున్నారు. ఒకవైపు రాజ్యాంగ సభ. అందులో అంబేద్కర్‌ని వ్యతిరేకించే కాంగ్రెస్‌ వాదులను సముదాయించలేక తలపట్టుకుంటున్నారు. ఒక్క సమస్య కాదు. అందుకే ఇలాంటి విషయాన్నీ పటేల్‌కి అప్పగించారు’’.

‘‘నెహ్రూ చెబితే పటేల్‌ పంతాలు  కొంత తగ్గుతాయేమోనోయ్‌’’

‘‘సరే – ప్రయత్నిస్తా’’ అంది దుర్గాబాయి.

ఇద్దరూ కలిసి ఢల్లీ ప్రయాణం ఖరారు చేసుకున్నారు.

‘‘అమ్మాయ్‌. శారదా చాలా కాలానికి వచ్చావు. కాకినాడలో పాడినట్లు ఒక పాట పాడమ్మా. దుర్గ వీణ వాయిస్తుంది’’

‘‘త్యాగరాజ కృతులు పాడి చాలా   రోజులయిందమ్మా. గొంతూ పాడయింది ఉపన్యాయసాలిచ్చీ, యిచ్చీ’’.

‘‘ఫరవ లేదులే – ఏదో ఒకటి పాడు’’

దుర్గ లోపలికి వెళ్ళి వీణ తెచ్చింది. తీగలు  సరి చేస్తూ

‘‘ఈ మధ్య బెంగుళూరు నాగరత్నమ్మ కచేరీ చేసింది. ఏమీ తగ్గలేదు ఆమె గొంతులో మాధుర్యం. తిరువాయూర్‌లోనే ఉంటోంది. త్యాగరాజ స్వామికి ఆలయం  కట్టిస్తోంది. సమాధి కూడా. తన మొత్తం ఆస్తి ఇచ్చేస్తోంది. కచేరీలు  చేసి సంపాదిస్తున్నది ఆ పని కోసం’’.

‘‘ఔను. విన్నాను. ఎంత అందమైన పని, ఒక జీవితకాలంలో చేయగల పని, తన హ దయాన్నంత అర్పించి చేయగల పని లక్ష్యంగా పెట్టుకుంటే ఎంత ఆనందం దొరుకుతుందో గదా ` మన జీవితాలు  చూడు ఎక్కడ బయల్దేరాము? ఎక్కడ కి వెళ్తున్నాము? ఎక్కడకి వెళ్ళాలి? ప్రశ్నలే – అంతంత పనులుండగ నేనీమధ్య ఒక చిన్న పని పెట్టుకున్నానోయ్‌. అదైతే ఫలితం నా  జీవితకాలంలో చూడగలను. అనుభవించగలను’’.

‘‘ఏంటది?’’ ఆశ్చర్యంగా అడిగింది దుర్గ.

‘‘ఒక మంచి బత్తాయి  అంటు తెప్పించి  ప్రేమగా పెంచుతున్నాను. అది నవనవలాడుతూ పెరుగుతోంది. రోజూ ఉదయాన్నే దానికి నీళ్ళు పోసి ఆ ఆకుల  నిగనిగలు , కొమ్మ నేవళం చూస్తుంటే కడుపు, మనసు నిండిపోతుంది. ఈ చెట్టు  పెద్దదవుతుంది. తియ్యని పళ్ళు కాస్తుంది. అవి నేనూ తింటాను. అందరికీ పంచుతాను.  ఆ రసం ఎంత మధురంగానో ఉండాలి అనుకుంటూ నీళ్ళు పోస్తాను. ఆ క్షణాన కలిగే ఆనందానికి సాటివచ్చేది లేదనుకో’’ దుర్గ నవ్వింది చిన్నగా.

‘‘సరే కబుర్లతోనే సరిపెడతాం ? పాట ఎత్తుకుంటాం ?’’

శారద ‘‘ఎందరో మహానుభావులు  అందరికీ వందనము’’ అని మధురంగా పాడుతుంటే, దుర్గ వీణ వాయిస్తూ తనూ గొంతు కలిపితే, ఇంట్లో వారంత వింటూంటే ఆ సంగీత సంధ్య క్రమంగా సంగీత పూర్ణ పౌర్ణమి అయింది. ‘‘ఈ పాటలు  పాడి  ఎన్నాళ్ళయిందో ` అమ్మా  మీరిద్దరూ మా పాటలూ  కూడా వినాలి’’. శారద మారాం చేస్తున్నట్లు అడిగింది.

‘‘వినకపోతే ఊరుకుంటావా . పాడు’’ అంది దుర్గా .

‘‘ఆకలి మంటలు  మలమల  మాడే అనాథందరు లేవండోయ్‌’’ అని శారద గొంతెత్తి పాడుతుంటే దుర్గ కళ్ళు, మనసు ఆర్థ్రమయ్యాయి. శారద అంతటితో ఆగకుండా ‘‘అరుణ పతాకమా’’ అని పాడ వీరరసం ఉప్పొంగించింది. ‘‘ఇక జనగణమన’’ పాడకపోతే నువ్వు నన్ను కమ్యూనిస్టుని చేస్తావు. పదండి పడుకుందాం’’ అంటూ లేచింది దుర్గ.

***

గమనమే గమ్యం- 32

 

olga title

రామకృష్ణయ్య వచ్చాడు .

‘‘మనం ఈ రాత్రికే గాంధీజీ హత్యను ఖండిస్తూ సభ జరపాలి’’

‘‘ఈ రాత్రికా?’’

‘‘ఔను. కార్యకర్తలు  చాలామంది ఊళ్ళోనే ఉన్నారు. ఆరెస్సెస్‌ రాజకీయాలను ఎండగట్టాలి. కాస్త పొద్దుబోయిన తర్వాతే  పెడదాం. ఇవాళ ఎవరికీ తిండ సహించదు. నిద్ర రాదు’’

‘‘గుర్తుందా నీకు ఉప్పు సత్యాగ్రహానికి  ముందు గాంధీ మద్రాసు వచ్చారు . ఎట్లా పని చేశాం ఆ సభ కోసం. గాంధీ మనల్ని చూడాలని, నవ్వాలని  ఒక మాట మాట్లాడాలని తపించాను నేను. ఉప్పు సత్యాగ్రహం  గుర్తుందా ` అదంత కాదు. గాంధీ 1920లో కోర్టులో చెప్పిన మాటలు ` గుర్తున్నాయా నీకు. నువ్వింకా చిన్నవాడివి అప్పుడు. నాకు పదిహేనేళ్ళు. చదువు మానేసి సహాయనిరాకరణంలోకి వెళ్ళిపోదామని అంత సిద్ధమయ్యా. గాంధీ మాటలు  నిరంతరం నా  దేహంలో ప్రతిధ్వనిస్తుండేవి. గొప్ప ఆవేశంతో ఊగిపోయేదాన్ని –  చదువు, ఇల్లు , తల్లిదండ్రులు  అన్నీ ఒదిలి గాంధీ దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నాను . కానీ వెళ్ళలేకపొయ్యా. వెళ్ళలేకపొయ్యా’’.

శారద దు:ఖాన్ని తగ్గించటం రామక్రుష్ణయ్య, మూర్తీ ఇద్దరి వల్లా కాలేదు.

‘‘శారదా – ఆనాడు వెళ్ళలేదు గనుకనే నువ్విప్పుడు కమ్యూనిస్టువైనావు. కమ్యూనిస్టు కావటం కంటే గొప్ప సంగతేమీ లేదు’’. రామక్రుష్ణయ్య మందలించాడు కాస్త తీవ్రంగానే.

‘‘నువ్వు మహిళా సంఘ సభ్యులకు కబురు పంపు. రాత్రి తొమ్మిది గంటలకు మీటింగు – ఆరెస్సెస్‌ హత్యా రాజకీయాన్ని ఉతికి ఆరెయ్యాలి’’ శారద శక్తిని కూడగట్టుకుని లేచింది.

సుబ్బమ్మ శోకాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఒక్క ఇల్లేమిటి, ఊరేమిటి, దేశం దేశమంత ఏడుస్తోంది.

volgaతొమ్మిదిన్నరకంత మీటింగు మొదలైంది. నాయకులంతా మాట్లాడారు. ఆరెస్సెస్‌ వాళ్ళను కడిగి వదిలారు. మీటింగు పూర్తవుతుందనంగా వార్త వచ్చింది. ఆరెస్సెస్‌ వాళ్ళు గాంధీ మరణాన్ని ఒక విజయంగా భావించి ప్రదర్శన చేస్తున్నారని  . ప్రజలకు, గాంధీని జాతిపితగా భావించే ప్రజలకు, దేశ స్వాతంత్రప్రదాత అని నమ్మిన ప్రజలకు,  ఆయన చెప్పిన మాట కోసం, ఆయన చూపిన బాటలో నడవటం కోసం ఆస్తులను, ఆప్తులను, ప్రాణాలను లెక్కచెయ్యక స్వాతంత్రాగ్నిలో దూకిన ప్రజలకు ఈ ఆరెస్సెస్‌ ప్రదర్శన సహించరానిదయింది. గాంధీ మరణంతో శోక సంద్రాలైన వారి మనసులో కోపకెరటాలు లేచాయి. ప్రదర్శన మీద రాళ్ళు రువ్వారు . పోలీసులు  వచ్చి కొందరిని అరెస్టు చేశారు. ఆరెస్సెస్‌ చేస్తున్న ఈ హీనమైన పనికి సహజంగానే కమ్యూనిస్టు యువకులకు కోపం వచ్చింది. తమ మీటింగుకు వచ్చిన వారిని కొట్టబోయారు. నాయకులు  ఒచ్చి ఆపారు. అంత కాస్త గందరగోళమైంది. ప్రతివాళ్ళూ ఉద్రిక్తంగానే ఉన్నారు. ఆ గలాభాలోకి పోలీసులు  ఎప్పుడొచ్చారో గమనించేలోగా పోలీసులు  లాఠీతో కమ్యూనిస్టులపై పడ్డారు. ఆరెస్సెస్‌ కార్యకర్తలు  పదిమందీ ఎటు పోయారో తెలియదు. కమ్యూనిస్టులను కొట్టటం, అరెస్టు చేయటం మొదలెట్టారు. గాంధీ హత్యను ఖండించేవారిని అరెస్టు చేసి, గాంధీని చంపిన వారిని సమర్థించిన వారిని రక్షించే పనికి వచ్చాము  అన్నట్లుంది పరిస్థితి. అప్పటికే ప్రకాశం ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ ఒకటుంది కమ్యూనిస్టు అరెస్టుకి. ముఖ్యమైన నాయకులు  అక్కడ నుంచి పరిగెత్తారు. మొగల్రాజపురం గుండా పారిపోయి రహస్య స్థావరంకు చేరుకున్నారు. మరునాడు  ‘ప్రజాశక్తి’ లో ఆరెస్సెస్‌ వారిపట్ల చూసీచూడనట్లు మెతకగా ప్రవర్తిస్తున్న పోలీసులను విమర్శిస్తూ వార్తలు, వ్యాసాలూ వచ్చాయి . చేయవలసిన పని చేయకుండా పోలీసులు  పత్రికమీద దాడ చేశారు. పత్రికలో పనిచేసే  కొందరిని అరెస్టు చేశారు.

ఫిబ్రవరిలో కలకత్తా  కమ్యూనిస్టు మహాసభలు  జరగబోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఆంధ్రలో ఈ నిర్భంధం. శారదాంబ, మూర్తి కలకత్తా  మహాసభకు వెళ్ళటానికి సన్నద్ధమవుతున్నారు. అనేకమంది నాయకులు  రహస్య జీవితంలోకి వెళ్ళటంతో బహిరంగంగా పని చేసే వారి లో  ముఖ్యమైన వాళ్ళు మహాసభలో పాల్గొని తమ అభిప్రాయాలు  చెప్పవలసిన అవసరం ఉంది. తెలంగాణా పోరాటం ముమ్మరంగా జరుగుతోంది. ఆ పోరాటం గురించి మాట్లాడి  ఆ పోరాటం  దిశా నిర్దేశం చెయ్యాలి.

మహాసభలో జరిగిన చర్చతో పార్టీలో ఉన్న రెండు భిన్న ధోరణులను ముఖ్యనాయకుందరూ చర్చించక తప్పని పరిస్థితి.

శారదాంబ తను పాల్గొన్న సమావేశంలో ఆంధ్ర ప్రాంత పరిస్థితిని స్పష్టంగా వివరించింది. 1939 నుండి  గడచిన పదేళ్ళలో ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు గ్రామీణ ప్రాంత ప్రజలలోకి చొచ్చుకుపోయారు. యుద్ధంలో బ్రిటన్‌కి మద్దతిచ్చిన ప్రజలు  అర్థం చేసుకున్నారు. సోవియట్‌ సాహిత్యాన్ని న్ని, సోవియట్‌ విప్లవ క్రమాన్నీ కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు సన్నిహితంగా తీసికెళ్ళింది. రైతు యువకులు  పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలై అంకితభావంతో పనిచేస్తున్నారు. . మహిళా సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం, ట్రేడ్‌ యూనియన్లూ అన్నీ చాపకింద నీరులా కమ్యూనిస్టు పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి. దీనిని స్థిరపరుచుకుని దీర్ఘకాలం  ప్రజల  పక్షాన, ప్రజలకు మేలు  చేసే చట్టాల  కోసం, పరిపాలన పద్ధతుల  కోసం పార్టీ ప్రయత్నించాలి. కాంగ్రెస్‌ పార్టీ కమ్యూనిస్టులకు ప్రజలలో దొరుకుతున్న ఆదరణను చూసి భరించలేకపోతున్నది. బ్రిటీష్‌ వారి నిర్బంధాన్ని మించిన హింసాకాండ జరపటానికి దాయి వెతుకుతోంది. జమీందార్ల పక్షం నిలబడుతోంది. ఈ పరిస్థితులలో మన వ్యూహాలలో కొత్తదనం ఉండాలి. ప్రజలు  మరింతగా మనతో రావాలి . నిర్బంధాన్ని ఎదిరించటానికి మొరటు పద్ధతులు  కాకుండా సృజనాత్మక  పద్ధతులేమిటని ఆలోచించాలి. లేకపోతే కార్యకర్తలను కోల్పోతాం. కార్యకర్తలు  అలాంటి ఇలాంటి వారు కాదు. సాహసం, త్యాగం , అంకితభావం ఉన్నవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళను నిలబెట్టుకోగలిగితే రెండు మూడేళ్ళలో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రలో అతి బలమైన శక్తిగా మారుతుంది. ఆ వైపుగా పార్టీ తీర్మానాలు , కార్యక్రమాలు

ఉండాలి అని వాదించింది. కానీ రణదివే వర్గం అధిక సంఖ్యలో ఉన్నారు. ఆయననే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. . పొలిట్‌బ్యూరోలో స్త్రీల ను ఈసారి కూడా తీసుకోలేదు. ఈసారి ఆ విషయాన్ని చర్చకు చేపట్టాలనుకున్న శారదాంబ అది ముఖ్య విషయమని మర్చిపోయేలా చేశాయి పరిస్థితులు . మహాసభ తీర్మానాల్లో  ఒక తీర్మానం గా  ‘‘నెహ్రూ ప్రభుత్వాన్ని  సాయుధ పోరాటం ద్వారా  కూలదోయాలి’’ అనేది ప్రవేశపెట్టారు. నెగ్గించుకున్నారు. శారదాంబకది మింగుడు పడలేదు. అది అసాధ్యం, ఆచరణీయం కాదు అని ఆమె మనసు ఘోషిస్తున్నా  పార్టీ క్రమశిక్షణకు కట్టుబడ తీర్మానాన్ని  ఆమోదించి వచ్చారు  శారద, మూర్తి.

శారద, మూర్తి, రామస్వామి వంటి కొందరికి ఈ మొత్తం పరిణామాల  మీద ఆందోళనగా ఉంది. ఎక్కడో ఏదో లోపం జరుగుతోంది. కాంగ్రెస్‌ ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రాబ్యల్యం  తగ్గించాలని విచక్షణా రహితంగా ప్రవర్తిస్తోంది. ఆ విచక్షణ లేనితనంతో అంతే మూర్ఖంగా తలపడుతున్నామా? వేరే దారిలో మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సిన సమయంలో కార్యకర్తల  ప్రాణాలను పణంగా పెడితే భయభ్రాంతులైన ప్రజలను సమీకరించేవారెవరు?

శారద మనసు విరుచుకుపడుతోమ్ది . రామక్రుష్ణయ్య దొరకటం అసంభవంగా ఉంది. శారద ఇల్లు ఆసుపత్రి పోలీసు పహారాలో ఉన్నట్లున్నాయి . ఎవరో తెలియని వ్యక్తులు  అపుడపుడూ తెచ్చే ఉత్తరాలు  తప్ప తన ఆలోచనలను పంచుకునే దారి లేదు.

ఒకరోజు ప్రసవానికని వచ్చిన స్త్రీని పరిక్ష  చేస్తుంటే ఆమె పొట్ట దగ్గర కట్టుకు వచ్చిన డాక్యుమెంట్లు కనిపించాయి. నర్సుని కూడా రానివ్వకుండా గబగబా ఆ డాక్యుమెంట్లను దాచేసి ఇంత దూది గాజు గుడ్డతో మళ్ళీ పెద్ద పొట్ట తయారుచేసి పంపింది.

olga titleప్రాణాలకు తెగించి చేస్తున్నారు స్త్రీ పురుషులు  ఈ పనిని. వారి ప్రాణాలను రక్షించాల్సిన పని ముఖ్యమైనది కాదా?

ఆ డాక్యుమెంట్లనీ మూర్తీ, శారదా కలిసి రెండు రోజు చదివారు. డాంగే మితవాది – అంటే తెలంగాణా పోరాట విరమణ చేయమంటున్నాడు. రణదివే తెలంగాణా పోరాటం కొనసాగించాల్సిందేనంటున్నాడు.

నిజాం పాలన అంతమయ్యాక సాయుధ పోరాటం అవసరం లేదని తెంగాణా నాయకుడైన రావి నారాయణ రెడ్డి  అంటున్నాడు. అనటమే కాదు. తెలంగాణా వదిలి ఆయన బొంబాయి వెళ్ళిపోయాడు.

పోరాటం విరమించాలా ఒద్దా అనే విషయమై పైస్థాయి నాయకులందరిలో విబేధాలున్నాయని ఆ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి. శారదకు ఆ విషయాలు  తెలియనివి కావు గానీ ఇప్పుడు డాక్యుమెంట్ల వల్ల  స్పష్టంగా ఎవరి వైఖరి ఏమిటనేది సాక్ష్యాధారాల తో తెలిసినట్లయింది.

గ్రామాల  పరిస్థితి దారుణంగా ఉంది. మలబారు పోలీసులు  భయంకరంగా హింసాకాండ కొనసాగిస్తున్నారు. ఎమర్రు కాటూరులో ప్రజలను దిగంబరం చేసి గాంధీ విగ్రహం చుట్టూ నిలబెట్టటం గురించిన వార్తతో ప్రజలందరిలో కాంగ్రెస్‌ అంటే కోపం అసహ్యం కలిగాయి. ఇళ్ళు తగలబెట్టటం, అనుమానించిన వారిని కాల్చిచంపటం పళనియిప్పన్‌ పేరంటేనే కొందరిలో భయం మరికొందరిలో అసహ్యం. ఒక్క మహిళా సంఘాన్ని తప్ప కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ప్రజాసంఘాలను, ట్రేడ్‌ యూనియన్లను నిషెధించారు.

శారద మనసు ఆగ్రహంతో రగులుతోంది. ఈ హింసాకాండను ఎదుర్కోవటానికి కొత్త పోరాట వ్యూహాలు  రచించాలని, ప్రజలలో ఉన్న సానుభూతికి ఒక రూపం ఇచ్చి వారి ఆగ్రహంతోనే ఈ బీభత్సానికి  తెరదించాలనీ ఆమె అనుకుంది. మూర్తి కూడా శారద ఆలోచనను బలపరిచాడు. రామస్వామి మరికొందరు శారద ఆలోచను సరైనవన్నారు.

ఇంతలో పార్టీని నుంచి ఆదేశం వచ్చింది ‘‘కంటికి కన్ను – పంటికి పన్ను’’ అనేదే మన మార్గమని – ఇది శారదకసలు మింగుడు పడలేదు. ఈ సమయంలో ఆదేశంతో కార్యకర్తలు ప్రాణాలు  పోగొట్టుకుంటారనే ఆందోళనతో కుంగిపోయింది. దీనిని ఆపేదెలా? తానేమైనా చేయగలదా అనే ఆలోచనతో రగిలిపోయింది.

చివరకు మద్రాసు వెళ్ళాలని నిర్ణయించుకుంది. దుర్గాబాయి తో  మాట్లాడి  నెహ్రూతో ఇంటర్వ్యూ అడిగి చూడానుకుంది. ప్రకాశం గారితో మాట్లాడి ప్రయోజనం లేదు. ఆయన తను చెప్పినదానికి అంగీకరించి, మర్నాడు  ఇంకెవరో తనకు వ్యతిరేకంగా చెబితే మనసు మార్చుకుంటాడు. ఎంత స్థిరమో, అంత అస్థిరం, ఎంత బలమో అంత బలహీనత – ఆయన మనసులో గట్టిగా ఏదైన అనుకుంటే మార్చటం ఎవరితరం కాదు. వీరేశలింగం తాతయ్యకు వ్యతిరేకంగా వాదించి ఆయనను ఓడించటం సరికాదని ఆయన అంతరాత్మకు తెలియదూ? తెలిసిన ఒట్టి తర్కానికి, , తన సామర్ధ్యాన్ని  నిరూపించుకోటానికీ ఆ పని చేశాడు. నాన్నకు, హరి బాబాయికి ఎంతో కోపం వచ్చింది. ప్రకాశం గారు నవ్వేసి మరి నేను ప్లీడర్ని – నా వాదన పటిమ నిరూపించుకోవద్దా అన్నారు. హరిబాబాయి చెప్పేవాడు ` కాంగ్రెస్‌ సభలో ఒకసారి బ్రాహ్మణులకు వేరుగా భోజనాలు  ఏర్పాట్లు  చేయించాడనీ, హరి బాబాయి మరికొందరూ వెళ్ళి అడిగితే ‘‘అది తప్పంటావా  ? సరే తీసేద్దాం’’ అని అదో ప్రిన్సిపల్‌కి సంబంధించిన విషయం కాకుండా ఏర్పాట్లకు  సంబంధించిన విషయమన్నట్లు మాట్లాడారట. అందువల్ల  ప్రకాశం గారితో మాట్లాడటం వృధా. దుర్గ అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకోక పోయిన ఒక్కసారి నెహ్రూ గారితో ఇంటర్వ్యూ ఇప్పించగలిగితే చాలు . సరోజినీదేవి ఆరోగ్యం బాగోలేదు. లేకుంటే హరీన్‌ తో వెళ్ళి ఆమె ద్వారా  నెహ్రూని కలిసినా  బాగుంటుంది. ఇంత ఆలోచించి మద్రాసు ప్రయాణం పెట్టుకుంది.

*

 

 

***

 

గమనమే గమ్యం-31

 

volgaఅన్నపూర్ణ, అబ్బయ్య శారదతో మాట్లాడదామని చాలా రోజు నుంచీ ప్రయత్నిస్తున్నా  శారద వారికి దొరకటం లేదు. కబుర్లు చేసీ, ఉత్తరాలు రాసి, టెలిఫోన్లు చేసి విసిగిపోయిన అన్నపూర్ణ చిన్న పెట్టెలో వారానికి  సరిపడా బట్టలు  సర్దుకుని బెజవాడ వచ్చేసింది. సుబ్బమ్మ ఆనందం చెప్పనలవికాదు.

‘‘వారం రోజులు ఉంటావుటే – మా తల్లే, మా శారద నాకే నల్లపూసయి పోయింది ` అంత గందరగోళంగా ఉంది. పసిపిల్ల  తల్లి కోసం మారాం చేస్తోంది. కానీ ఈ పిల్ల  కోసం నా  బంగారు తల్లి ఆగితే ఎట్లా చెప్పు. ఆస్పత్రి సంగతి సరేసరి – పార్టీ వాళ్ళు ఎంతెంత పనులు , ఎంతెంత త్యాగాలు చేస్తున్నారు . ప్రాణాలకు తెగించేశారనుకో. శారద కూడా అంతేగా – ఏ క్షణంలో జైలు కెళ్ళాల్సి వస్తుందోనని నాకు కంగారుగా ఉంది ` ’’

సుబ్బమ్మ మొదలుపెడ తే ఇంక ఆ కబుర్లకు అంతుండదు. అన్నపూర్ణ ఆమెను ఆపి

‘‘దేశానికి స్వతంత్రం వచ్చింది గదమ్మా ` ఇంకా జైలుకెందుకెళ్ళాలి?’’ అంది.

‘‘అయ్యో పిచ్చిదాన – స్వతంత్రం అందరికీ ఎక్కడొచ్చింది? ఆ జమిందార్లంత కాంగ్రెస్‌లో చేరితే వాళ్ళకొచ్చింది స్వతంత్రం. రైతులు , పేదవాళ్ళు, మాల మాదిగలు  వీళ్ళందరికీ స్వతంత్రం రావొద్దూ? పార్టీ వాళ్ళకోసం పోరాడకుండా వాళ్ళకెలా స్వతంత్రం వస్తుంది?’’

అన్నపూర్ణ సుబ్బమ్మ గారికున్న స్పష్టతకు ఆశ్చర్యపోయింది.

‘‘ఐతే అమ్మాయ్‌ – నువ్వింకా ఆ కాంగ్రెసులోనే ఉన్నావా  ? పాపం ఈ పేద రైతు పొట్టకొడుతున్నారుగా మీరు ` ’’

అన్నపూర్ణ నోటమాట రాలేదు. తనెందుకిక్కడకు వచ్చిందో ఆ పని జరగదని అనిపించింది.

‘‘నేను పేద రైతు పొట్ట కొట్టేదానిలా  కనిపిస్తున్నానా  అమ్మా’’ అంది పేలవంగా నవ్వుతూ `

‘‘నువ్వంటే నువ్వు కాదులే ` మీ పార్టీ – ’’

‘‘మా పార్టీలో నువ్వన్నట్లు జమీందార్లు వాళ్ళూ వీళ్ళూ పనికిమాలిన వాళ్ళంత ఉన్నారమ్మా. కానీ ప్రభుత్వం, స్వతంత్రంగా ఏర్పడింది. ఈ గడ్డీ గాదం ఏరెయ్యటానికి సమయం కావొద్దూ? గాంధీ గారూ, నెహ్రూ గారూ ఊరుకుంటారా చెప్పు జమీందార్లు రైతుల్ని చంపేస్తుంటే. రెండొందలేళ్ళు పరాయి వాళ్ళు  భ్రష్టు పట్టించిన దేశాన్ని బాగుచేసుకోటానికి కనీసం రెండు మూడేళ్ళు సమయం కావాలా ఒద్దా – ఆ సమయంలో మనం మనం కొట్టుకుంటే ఎలా? జమీందార్లను నేనూ వ్యతిరేకిస్తాను. నాలాంటి వాళ్ళింకా ఉన్నారు. మాతో కలిసి ఒక పద్ధతిగా అన్నిటినీ మన చేతిలోకి తెచ్చుకోవాలి గానీ, ఇప్పటికిప్పుడు జమిందార్లను వెళ్ళగొట్టాలంటే కుదిరే పనేనా ? చట్టాలు  చెయ్యాలి. దానికోసం సంప్రదింపులు  చెయ్యాలి గానీ తుపాకీతో మనలో మనం పోట్లాడుకుంటే నష్టం ఎవరికమ్మా?’’

సుబ్బమ్మ ఏం సమాధానం చెప్పాలోనని ఒక్క క్షణం ఆలోచించలేదు.

‘‘లేదులేమ్మా – శారదకూ, పార్టీ వాళ్ళకూ ఈ సంగతి తెలియదంటావా ? నువ్వు చెప్పినట్టు జరగదు. ప్రజలు  పోరాడాల్సిందే ` ’’

సుబ్బమ్మ గారే ఇలా ఉంటే ఇక శారద, మూర్తీ తన మాటలు  వింటారా ? ఒప్పుకోవటం సంగతలా ఉంచి ఇంత సింపుల్‌గా తన నోరు మూయించి పంపించేస్తారేమో – అయిన సరే శారదతో మాట్లాడాల్సిందే. వచ్చిందేమో వచ్చింది. పిల్లల్ని  అబ్బయ్యకు వదిలి వచ్చింది. నటాషాతోనన్నా  స్నేహం చేసుకు వెళ్తుంది అనుకుని స్థిమిత పడింది.

రెండు రోజుల  పాటు సుబ్బమ్మకు వంటలో సాయం చేస్తూ నటాషాతో ఆటలు పాటల తో కాక్షేపం చేశాక గానీ శారద దర్శనం కాలేదు.

అన్నపూర్ణ కనిపించేసరికి అలసటంత ఎటుపోయిందో శారద హాయిగా నవ్వుతూ ఆమెను కావలించుకుంది.

అన్నపూర్ణ చంకలో ఉన్న నటాషాకూ తల్లి స్పర్శ దొరికింది ఆరురోజుల  తర్వాత .

‘‘నట్టూ – అత్తతో బాగా ఆడుకున్నావా ?’’

‘‘అమ్మా అత్త చాలా పాటలు  నేర్పింది’’ అంది నటాషా ముద్దుగా.

‘‘ఏదీ ఒకటి పాడూ’’ కూతుర్ని ముద్దు పెట్టుకుని ఒళ్ళో కూచోబెట్టుకుంది శారద.

‘‘నేనొచ్చి రెండు రోజులయింది. వారం రోజులుందామనే వచ్చాను గానీ ఈ వారమూ నువ్వు ఇంటికి రావేమోనని భయం వేసింది. నా  అద్రష్టం బాగుంది’’.

‘‘చాల్లే ` ఊరుకోవోయ్‌. పనులలా ఉన్నాయి. నేను స్నానం చేసి వస్తాను. తర్వాత  తీరిగ్గా మాట్లాడుకుందాం’’ శారద లోపలికి వెళ్ళింది.

‘‘స్నానం చేశాక అమ్మ వెళ్ళిపోతుంది. నువ్వూ వెళ్తావా ?’’

నటాషా అడిగిన తీరుకి అన్నపూర్ణ హృదయం ద్రవించి ఆ పసిదాన్ని గుండెకు హత్తుకుంది.

‘‘నువ్వు పెరిగి పెద్దయ్యి మీ అమ్మ కంటే గొప్ప పనులు  చేస్తున్నపుడు అర్థమవుతుంది నీకు మీ అమ్మ’’ చిన్నపిల్లకు  ఆ మాటలు  అర్థం కావని తెలిసీ అనకుండా ఉండలేక పోయింది.

అన్నపూర్ణ, శారద మునిగినన్ని పనుల్లో మునగక పోయిన పిల్లలకు  తనమీద నిరసన ఉంది అనే సంగతి తెలుసు.

ఇప్పుడంటే పెద్దవాళ్ళయ్యారు గానీ చిన్నతనంలో వాళ్ళకూ తల్లి తమను పట్టించుకోకుండా ఎక్కడెక్కడ కో వెళ్ళిపోతుందనే బాధ, కోపం ఉండేవి. అప్పుడు పెరిగిన దూరం పదిహేడేళ్ళ వయసులో కూడా అన్నపూర్ణ కూతురు స్వరాజ్యానికి తగ్గలేదు. పద్నాుగేళ్ళ కొడుకు మాత్రం వీలైనంత ఎక్కువగా అమ్మకు అతుక్కుపోవాలని చూస్తాడు.

రాత్రి భోజనాలయ్యాక స్నేహితులిద్దరూ కబుర్లతో మొదలెట్టి రాజకీయాలలోకి దిగారు. అన్నపూర్ణ వచ్చిన పనే అది.

‘‘ఏంటి శారదా – మీ పార్టీ వాళ్ళు దేశానికి స్వతంత్రమే రాలేదంటున్నారు’’ అని తేలిక ప్రశ్నతోనే మొదలెట్టింది.

olga title

‘‘మరి ఏం మారిందోయ్‌ ` అధికారం చేతులు  మారింది. అంతే గదా ` జమిందారీలు  పోయాయా ` భూస్వాముల  దోపిడీ పోయిందా? పెట్టుబడీదారులు  దోచుకోవటం ఆగిందా?’’

‘‘స్వతంత్రం రాగానే అవన్నీ జరిగిపోతాయా? సమయం కావొద్దా. ఎన్ని శాసనాలు  చేసుకోవాలి. ఎన్ని చట్టాలు  రావాలి. . అవతల రాజ్యాంగం  ఒకటి తయారవుతోంది. అది అందరికీ న్యాయం  చెయ్యటానికి వీల్లేకుండా అడ్డుపడేవాళ్ళున్నారు. అంతెందుకు హిందూ కోడ్‌బిల్లు  తయారవటానికి ఎంత చర్చలు  – ఇవన్నీ ఒక్క రోజులో తయారవుతాయా? ఒకరిద్దరి వల్ల అవుతాయా?

మనం వాటికోసం పనిచెయ్యాలి. మన అభిప్రాయాలు  గట్టిగా వినిపించాలి. అంతే కాదు శారదా – ప్రజల్ని తయారు చెయ్యాలి గదా – ప్రజలు  సిద్ధంగా ఉన్నారా  మనం కలలు గంటున్న సమాజానికి? భార్యాభర్తలిద్దరూ సమానులని చదువుకున్న మగవాళ్ళే ఒప్పుకోరు. మా ఆయనకెన్ని పరిమితులున్నాయో నాకు తెలుసు. మూర్తి సంగతి నీకు తెలుసు -` స్త్రీల  విషయంలో వీళ్ళే సరిగ్గా లేరే సమాజం సంగతి చెప్పేదేముంది. చట్టాలు  చేసి వాటిని జనం అర్థం చేసుకుని అంగీకరించేలా చేసే  పని మన మీదుంది. అదంత మానేసి జమీందార్లతో తొత్తులతో కిరాయి రౌడీల  చేతుల్లో అమూల్యమైన ప్రాణాలు  పోగొట్టుకుంటున్నారు మీ కార్యకర్తలు . జమీందార్ల పని అయిపోయింది ` ’’

‘‘ఎక్కడయిపోయిందోయ్‌ – వేషాలు  మార్చుకుని అంత మీ కాంగ్రెస్‌లో దూకుతున్నారు గదా ` ’’

‘‘మీరూ దూకండి – లేదా కాంగ్రెస్‌ గురించి ప్రజలకు తెలియజెప్పండి ’’.

‘‘మీ కాంగ్రెస్‌ గురించి మీరు చెప్పుకోండోయ్‌ ` నమ్ముతారు’’.

‘‘నిజం. కాంగ్రెస్‌ ఎప్పుడూ బాగాలేదు. ఇప్పుడూ బాగాలేదు. మా పార్టీ మీద నాకున్నంత కోపం నీక్కూడా ఉండదు. అంత పాడయింది. కానీ మనం పార్టీలకతీతంగా జనాన్ని చైతన్యవంతం చెయ్యాలి ` జనం మారాల్సింది లేదా ` బానిస బుద్ధులు  ఒదిలించేలా మనం చెయ్యాలా ఒద్దా ` ’’

‘‘మేం అదే చేస్తున్నామోయ్‌ ` అది భరించలేకే మమ్మల్ని వెంటాడుతున్నారు. రేపో మాపో నిషేదిస్తారని  వార్తలొస్తున్నాయి. నువ్వు మళ్ళీ సంస్కరణోద్యమం ప్రారంభించమంటావా ? మా ధ్యేయం విప్లవం. విప్లవమే సమూలంగా మార్చగలుగుతుంది’’.

‘‘విప్లవం గురించి నేను నీకు చెప్పేంతదాన్ని కాను. కానీ విప్లవానికి దాయి వేయాల్సిన సమయంలో సాయుధ పోరాటం అని సమాజంలో మార్పు తెచ్చేవాళ్ళనీ, సమాజానికి ఎంతో మంచి చేసేవాళ్ళనీ పోగొట్టుకుంటున్నారు మీరు. ఎలాంటి మనుషులు  చనిపోతున్నారో నా  కంటే నీకే ఎక్కువ తెలుసు. ఆలోచించు శారదా. కనీసం పార్టీలో చర్చను  పెట్టు ` ’’ ఆవేదనగా అంది అన్నపూర్ణ.

చనిపోతున్న కార్యకర్తలను సహచరులను తల్చుకుంటే శారదకూ దు:ఖం వచ్చింది.

‘‘ఇదంత తప్పదు – నువ్వింతగా చెబుతున్నావుగా. ఆలోచిస్తా. పార్టీలో కూడా మా అన్నపూర్ణ ఇలా అడిగిందని చర్చ లేవదీస్తా. సరేనా  . ఇక పడుకో – పొద్దు పోయింది. నేను ఉదయాన్నే ఆస్పత్రి పని చూసుకుని నా  పనిలో పడాలి. తొందరలో మహిళా సంఘం మహాసభలు  జరపాని ప్రయత్నిస్తున్నాం’’.

ఇద్దరూ నిద్రకు ప్రయత్నించారు గానీ నిద్ర రాలేదు. ఎవరి మంచ  మీద  వాళ్ళు మసలుతూనే ఉన్నారు.

అన్నపూర్ణ ఆ రోజు ఉండి  మర్నాడు  వెళ్తూ నటాషా బడికి వెళ్ళనని పేచీ పెడుతుంటే సుబ్బమ్మ గారు బతిమాడలేక సతమతమవటం చూసింది.

సుబ్బమ్మ లాంటి తల్లి ఉండటం శారద అదృష్టం అనుకుంది. శారద ఇంట్లో  ఉన్నా  లేకపోయిన ఆ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు అంతు లేదు. ఒక రకంగా ఇది రెండో పార్టీ ఆఫీసు. సాంస్కతిక కేంద్రం. ఒకవైపు పెద్ద హాలుంటుంది. శారద ప్రత్యేకంగా రిహార్సిల్స్‌ కోసం అది కట్టించింది. అక్కడ నాటకాు, రకరకాల  కళారూపాలు  రిహార్సిల్స్‌ జరుగుతూ ఉంటాయి. ఒకటి రెండు ముఖ్యమైన చిన్న సమావేశాలు  జరుగుతుంటాయి. మద్రాసు నుంచో, మరో చోట నుంచో వచ్చిన ప్రముఖులకు అక్కడే బస. ఆ ఇంట్లో పొయ్యి మలుగుతూనే ఉంటుంది.

ఇదంత సుబ్బమ్మ లేకపోతే జరగదు. సుబ్బమ్మకు ఓపిక తగ్గుతున్న సమయంలో ఆమెను ఆదుకోటానికి పద్మ వచ్చింది. పద్మ సుబ్బమ్మకు మేనగోడలు . ఆ దంపతులిద్దరికీ శారదంటే ప్రాణం. శారద ఏం చెపతే  అది ఆజ్ఞ వాళ్ళకు. ఇంటి పనులు  పార్టీ పనుల్ప్ప్  అన్నీ బాధ్యతగా చేస్తుంటారు.

అన్నపూర్ణ ఆ హడావుడి నంతటినీ చూసి, దీనికి మూలస్తంభమైన శారదను మనసులో మరీ మరీ మెచ్చుకుని వెళ్ళిపోయింది.

1948 జనవరి 30. మామూలుగానే తెల్లవారింది. శారదను మూర్తిని కలవటానికి రైతు సంఘం నాయకులొచ్చారు. చల్లపల్లి  జమిందారు మీద జరిపే  పోరాటంలో విజయాలు  ఇచ్చే ఆనందం కంటే కార్యకర్తల  ప్రాణాలు  పోవటం ఎక్కువ బాధ కలిగిస్తోంది. పోలీసు జమీందారులు  వైపు. ప్రభుత్వం జమీందారు పక్షం. ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలనే చర్చలు  జరుగుతున్నాయి. ‘‘మనం అనుకున్న లక్ష్యం ఆలస్యమైనా  ఫరవాలేదు. కార్యకర్తల  ప్రాణాలు   చాలా ముఖ్యం. త్వరలో ప్రభుత్వం మనమీద నిర్బంధం పెంచుతుంది. దాన్ని తట్టుకోవాలి. ఒక కార్యకర్తను కోల్పోయామంటే పదేళ్ళు వెనక్కి వెళ్ళినట్టే అనుకోండి  . తెలంగాణాలో పోరాటం ఒకవైపు విజయాల  వైపు వెళ్తున్నట్టు కనిపించిన యూనియన్‌ సైన్యం  వచ్చిన తర్వాత  పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ఆయుధాలు  సేకరించటం కంటే ప్రజలను సమీకరించటం చాలా అవసరం. ఒకరిద్దరు సాయుధ కార్యకర్తలను చూసి తాత్కాలికంగా  భయపడతారేమో కానీ వేల మంది ప్రజలను సమీకరిస్తే  అది శాశ్వత విజయాల ను ఇస్తుంది.’’

‘‘మన రైతు మహాసభలకు లక్షమంది రైతులు  వచ్చారు గదండీ’’ అన్నాడో యువకుడు. అతనికి శారద మాటలు  బొత్తిగా నచ్చలేదని తెలుస్తోంది.

‘‘అది స్వతంత్రానికి పూర్వం. ఇప్పుడు ప్రజల్లో మార్పు రాలేదా?’’

‘‘మన కృష్ణాజిల్లా ప్రజల్లో మార్పు రాలేదు. స్వతంత్రం వచ్చినా  కాంగ్రెస్‌ అంటే మండ పడుతున్నారు. మనం స్వతంత్ర పోరాటానికి భిన్నంగా యుద్ధానికి సహకరించినపుడే రైతులు  మనతో ఉండి  మహాసభకు బళ్ళు కట్టుకుని, నడచీ వచ్చారు . ఇప్పుడు కూడా రైతులు  మనతోనే ఉన్నారు’’.

శారదకు పరిస్థితి అర్థమైంది. యువకులంతా  తెలంగాణా పోరాటం తో  ఉత్తేజితులై ఉన్నారు. వారితో వాదించి లాభం లేదు. అనుభవమే వారికి నేర్పాలి.

రైతులు  పెట్టవలసిన జమిందారీ వ్యతిరేక డిమాండ్ల గురించి చర్చలు  మళ్ళించి సాయంత్రానికి వాటికొక రూపం తెచ్చారు . సాయంత్రం అందరికీ కాఫీు వచ్చాయి. సమావేశం ముగిసింది గనుక అందరూ విడిపోయి ఇద్దరు, ముగ్గురు కలిసి ముచ్చట్లాడుతున్నారు. కొందరు సిగరెట్‌ తాగేందుకు బైటికి వెళ్ళారు. శారద హాస్పిటల్‌కి వెళ్ళటానికి తయారవుతోంది.

మూర్తి హడావుడ గా లోపలికి వచ్చి

‘‘శారదా – గాంధీ – గాంధీజీని హత్య చేశారు’’. అరిచినట్టే చెప్పాడు. శారదకొక క్షణం ఏమీ అర్థం కాలేదు.

‘‘గాంధీజీ మరణించారు. ఆయన్ని చంపేశారు’’.

‘‘ఎవరు’’ శారద కళ్ళనుంచి కన్నీళ్ళు కురుస్తున్నాయి.

‘‘ఇంకా తెలియదు’’. రేడియో పెడుతున్నాడు.

శారద కుర్చీలో కూలబడింది. గుండేలు దడదడ కొట్టుకుంటున్నాయి. ఒళ్ళంత నీరసం కమ్మేసింది. ఎన్నడూ ఇలా జరగలేదు శారదకు. రేడియోలో చెబుతున్నదేమిటో వినబడటం లేదు.

గాంధీ లేరు. చనిపోయారు. సహజ మరణం కాదు. హత్య. చంపేశారు. ఎవరు? జాతిపితను కాల్చేసిందెవరు? ఎవరికంత కోపం ఆయన మీద. హిందూ ముస్లిం కలహాలను ఆపే  క్రమంలో ఆయన చేసిన కృషికి ఎవరు కోపగించారు. హిందువులా? ముస్లిములా? ఉన్మాదానికి  మతమేమిటి? కానీ గాంధీ హిందువు. ఒక ముస్లిం ఆయనను చంపాడంటే దాని పర్యవసానాలు  ఊహించలేం. మళ్ళీ మారణకాండ. శారదకు గాంధీ గురించీ, ముస్లింల  గురించీ కూడా గుండెల్లోంచి దు:ఖం తన్నుకొచ్చింది.

‘‘శారదా – గాంధీని చంపింది ఆరెస్సెస్‌ వాళ్ళు. నాధూరాం  గాడ్సే అట తెలిసింది’’.

శారదకు కొంచెం తెరిపనిపించింది.

‘‘ఆరెస్సెస్‌ వాళ్ళ క్రూరత్వానికి  అంతే లేదా? హత్యా రాజకీయాలా? ఎవరిని వాళ్ళు చంపింది – ఇడియట్స్‌. జాతిద్రోహలు . మారణకాండకు నాయకులై ఏం సాధిస్తారు’’.

శారద కోపంతో ఊగిపోయింది. విషయం తెలిసి జనం గుంపుగా కూడుతున్నారు.

***

 

గమనమే గమ్యం-30

 

volgaచీకట్లోంచి నడిచొచ్చిన అన్నపూర్ణను చూసి ఆనందంతో కేకేసింది శారద.

‘‘ఇదేంటి –  ఇంత పొద్దుబోయి. అందరూ బాగున్నారు గదా’’

‘‘అందరం బాగున్నాము. మా బంధువు పెళ్ళికని పొద్దునే వచ్చా. ఇవాళ రాత్రి నీతో కాసేపు మాట్లాడి  రేపు పొద్దున వెళ్దామని ` ’’

ఇద్దరూ ఒకరినొకరు పరిశీలనగా సంతోషంగా చూసుకున్నారు.

‘‘ఎలా జరిగాయి ఎన్నికలు ?’’

‘‘ఓడిపోతాననిపిస్తోంది. మీ కాంగ్రెస్‌ వాళ్ళూ ` ’’

‘‘మా కాంగ్రెస్‌ అనకు. వాళ్ళు ఏలూర్లో  చేసిన పిచ్చి పనులన్నీ నాకు తెలుసు “.

‘‘నువ్వూ వచ్చి కాంగ్రెస్‌కి ఓటెయ్యమని ప్రచారం చేస్తావనుకున్నాను’’.

‘‘మా పార్టీ వాళ్ళు చాలా ఒత్తిడ చేశారు ఏూరు వెళ్ళమని. వెళ్తాను వెళ్ళి శారదకు ఓటెయ్యమని ప్రచారం చేస్తానన్నాను. దాంతో వెనక్కు తగ్గారు’’.

‘‘నిజంగా అలా అన్నావా ?’’

‘‘మరి – అసలు  నీకు ఎదురుగా ఎవర్నీ నిబెట్టొద్దన్నాను. వజ్రంలాంటి మనిషిని ఏకగ్రీవంగా గెలిపించాలని  అంటే అక్కడ వినేవాళ్ళెవరు? నీ విలువ  తెలిసినవాళ్ళెవరు?’’

‘‘నా  స్నేహితురాలివని తెలుసుగా –  నీ మాటలేం పట్టించుకుంటారు గానీ ` పోనీ ` మీ పార్టీ సంగతి తెలిసొచ్చింది గదా ` మా పార్టీలో చేరిపోరాదూ?’’

‘‘కాంగ్రెస్‌ అంటే ఈ మురికి మనుషులే అనుకుంటున్నావా ? గాంధీ, నెహ్రూ, సరోజినీ, దుర్గాబాయ్  -ఎలాంటి వాళ్ళు నడిపిస్తున్నారు. ఆ కాంగ్రెస్‌ని ఒదలటమే. ఒడ్డున నీళ్ళు మురిగ్గా ఉన్నాయని  నదీ ప్రవాహాన్నే కాదంటామా? నేనూ ఆ మహా ప్రవాహంలో ఓ నీటిబొట్టుననుకుంటే కలిగే తృప్తి వేరు. పార్టీ గొడవ ఒదిలెయ్‌. బాగా నలిగిపోయినట్లున్నావు. నట్టూ నిద్ర పోయిందా? దానిని కాస్త పట్టించుకో. మా పిల్లల్ని  నేను చిన్నతనంలో పట్టించుకోలేదని ఇప్పుడు సతాయిస్తారు.’’

‘‘ఎలా కుదురుతుంది చెప్పు అన్నపూర్ణా? ఆస్పత్రి, మహిళా సంఘం, పార్టీ పనులు , మనలాంటి వాళ్ళు పిల్లల్ని  కనకూడదేమో `

రాజకీయాలోకి వచ్చి పని చేయటమంటే ఆడవాళ్ళకెంత కష్టం. మనలా అన్నిటికీ తెగించిరావటం కాదు. ప్రతివాళ్ళు తేలికగా రాజకీయాల్లోకి వచ్చే వీలుండాలి. మా ప్రభుత్వం వస్తే  మేం అలాగే చేస్తాం.’’

‘‘ఏం చేస్తారు?’’

‘‘అబ్బో – చాలా చేస్తాం.తల్లుల కోసం, పిల్లల  కోసం ఎన్ని పథకాలు  నా  బుర్రలో ఉన్నాయో  నీకు తెలియదు. నీకే కాదు – మా వాళ్ళకూ తెలియదు. నేనన్నీ రాసి  పెడుతున్నాను . ఆడవాళ్ళు ఆనందంగా తల్లులు కావాలి. రాజకీయాలు  నడపాలి. ప్రతి గ్రామంలో ఆడవాళ్ళు రాజకీయాధికారం పొందుతారు. అప్పుడు అక్కడ తల్లులందరూ కలిసి తమ పిల్లల  పెంపకం గురించి, ఆరోగ్యం గురించి, చదువు సంధ్య గురించి కలిసి మాట్లాడుకుని అందరికీ బాగుండే సామాజిక నిర్ణయాలు  తీసుకుంటారు. సోవియట్లలో అలాగే జరుగుతోంది.’’

‘‘ఔనట. నేనూ విన్నాను. ఈ మధ్య అబ్బయ్య సోవియట్‌ పుస్తకాలు  తెచ్చి చదువుతున్నాడు. ఆయన చదివాక నేనూ, అమ్మాయి కూడా చదువుతాం’’.

‘‘అమ్మాయేమిటి – స్వరాజ్యమని పేరు పెట్టి – మీ అబ్బాయి పేరు మాత్రం గుర్తుండదోయ్‌ నాకు –  అసలు వాడిని  చూసిందే తక్కువ. అన్నపూర్ణా ఈ సారి నువ్వొక్క దానివీ వస్తే  ఊరుకోను. పిల్లల్ని తీసుకుని, అబ్బయ్యని కూడా తీసుకుని రావాలోయ్‌. నటాషాకు మీ పిల్లల  స్నేహం కావాలిగా – అసలు  అబ్బయ్యికి బెజవాడ కాలేజీలో ఉద్యోగమైతే ఎంత బాగుండేది ` ’’

‘‘మేమొచ్చి మీ ఇంట్లో కాపురం పెట్టేవాళ్ళం’’

‘‘తప్పేముంది. ఆ పని చెయ్యకుండా వేరే ఉంటే నేనొప్పుకుంటానా ?’’

ఆ రాత్రి స్నేహితుల  కబుర్లతో తెల్లవారింది.

ఎన్నికలలో ఓడిపోవటం శారదనంతగా బాధించలేదు గానీ ఎన్నిక గురించి సమీక్షించుకునేందుకు ఏర్పాటు  చేసిన సమావేశం శారదను కుదిపి వేసింది. మహిళా సంఘం సభ్యులు  కుంగిపోయారు. కొందరు ఏడ్చారు. వాళ్ళందరినీ శారద ఓదార్చగలిగింది. ఎన్నికలలో పోటీ చేయటం కేవలం  గెలవటం కోసం కాదనీ, మన సిద్ధాంతాలు  ప్రజలలో ప్రచారం  చేసుకునే అవకాశంగా చూడాలని, ప్రతి పక్షాలు  తప్పును ఎత్తిచూపగలగటం కూడా చిన్న విషయం కాదనీ చెపితే చాలామంది సమాధాన పడ్డారు.

 

img111‘‘అంతమంది ప్రజల ను మనం ఎలా కలుస్తాం? మన సానుభూతి పరుతో మనం మాట్లాడటం వేరు. మనల్ని వ్యతిరేకించే వారిని కూడా ఆలోచింప చేయగలగటం ఎన్నికలోనే సాధ్యం. నేను గెలిచిన , గెలవకపోయిన పార్టీకి, ప్రజలకూ దగ్గరగానే ఉంటాను. అందులో తేడా లేపుడు మనకెందుకు బాధ’’ అంటూ మళ్ళీ సభ్యులలో ఉత్సాహం  నింపింది.

కానీ పార్టీ ముఖ్యులు  చేసిన సమీక్షలో శారద ఓడిపోయినందుకు కారణం మహిళా సంఘం సభ్యులు , శారద చూపిన అత్యుత్సాహం, తెగువ, తెంపరితనం అని చెబుతుంటే నిర్ఘాంత  పోయింది.

‘‘నువ్వు కాంగ్రెస్‌ సభలో వాళ్ళ వేదిక మీదికి ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది?’’

‘‘వాళ్ళు అసు విషయాలు  కాకుండా అవాకులు  చెవాకులు చెపుతుంటే విని ఆనందించాలా?’’ శారద తీవ్రంగా అడిగింది.

‘‘వాళ్ళ మీటింగులో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. మనం వెళ్ళి జోక్యం చేసుకోవటం వల్ల  శారద తెగించిన మనిషని, అహంభావి అని ఇంకా ఇక్కడ నేను చెప్పలేని నానా  మాటలూ  మాట్లాడుకున్నారు. ఆ అవకాశం వాళ్ళకెందుకివ్వాలి?’’

‘‘కానీ ఆ తర్వాత  నా  వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మానేశారు’’

‘‘నీ పెళ్లి గురించి మానేశారేమో – కానీ టోటల్‌గా నీ క్యారెక్టరు గురించి చాలా చెడ్డ ప్రచారం చేశారు. పైగా మహిళా సంఘం వాళ్ళు రౌడీలను కర్రతో కొట్టారు. ఆ రాపూట ఇళ్ళ మీద రాళ్ళేస్తే  బైటికి రాకుండా ఉంటే సరిపోయేది. వచ్చి వాళ్ళను కొట్టటంతో కమ్యూనిస్టు ఆడాళ్ళకీ, రౌడీలకూ తేడా లేకుండా పోయింది.’’

‘‘ఆత్మ రక్షణకు, రౌడీయిజానికీ తేడా తెలియకపోతే తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది గానీ, ఆత్మ రక్షణ చేసుకోకపోతే ఎట్లా?’’

‘‘కమ్యూనిస్టు ఆడవాళ్ళని మగరాయుళ్ళుగా మారుస్తున్నారనే పేరు వచ్చింది. అది మంచిది కాదు.’’

‘‘మగ రాయుళ్ళేమిటి? వాళ్ళ గొప్పేమిటి? ఆడవాళ్లు తమ మీదికి ఎవరైన వస్తే  ఆత్మరక్షణ చేసుకోగలరని నమ్మి, వాళ్ళకలాంటి శిక్షణ ఇచ్చాం  మనం. అది తప్పెలా అవుతుంది?’’

‘‘ఎన్నికల  సమయంలో తప్పే  అవుతుంది. మామూలు  ప్రజలు  ఆడవాళ్లు వినయంగా, ఓర్పుగా ఉండాలనుకుంటారు. ఆ నమూనాను మనం ఇవ్వలేదు కమ్యూనిస్టు ఆడవాళ్ళు ` ’’

‘‘ఫాసిస్టు వ్యతిరేక దళాలుగా స్త్రీలు  కూడా బెజవాడ వీధుల్లో కవాతు చేశారు. పార్టీ మెచ్చుకుంది. రేపు అవసరమైతే తుపాకులు  కూడా పట్టుకుంటారు.’’

‘‘ప్రత్యేక సమయాలు  వేరు. ఎన్నికలు  వేరు.’’

‘‘మనం ఏమిటో, ఎలా ఉంటామో ప్రజలకు ఎప్పుడైన ఒకటే మెసేజ్‌ వెళ్ళాలి. ఎన్నికలప్పుడొకటి, ఇంట్లో ఒకటి, బైట ఒకటి ఇదేంటి?’’

‘‘ఇంట్లో భర్త కొడితే కమ్యూనిస్టు భార్య తిరిగి కొడుతుందా?’’

‘‘వై నాట్‌. ఎందుకు కొట్టకూడదు ? కాదు – ఆ ప్రశ్నే తప్పు. భర్త కొడితే తిరిగి కొట్టాలి. అప్పుడే అతను భార్యను కొట్టటానికి భయపడతాడు. మీరేమంటారు? భర్త కొడుతుంటే పడాలా?’’

‘‘మరి ఇద్దరూ కొట్టుకుంటే ఆ సంసారం ఎలా సాగుతుంది?’’

‘‘ఆ సంసారం సాగకపోతే ఏం? లోకానికి ఏం జరుగుతుంది. ఆ సంసారం సాగితే ` ’’

‘‘శారదా – నువ్వు మాట్లాడే మాటలు  మహిళా సంఘంలో మటుకు మాట్లాడకు. వాళ్ళు భయపడతారు. భర్తలు  ఒక మాటంటారు. ఒక దెబ్బ వేస్తారు. కాస్త సర్దుకు పోవాలి’’.

శారదకు ఈ చర్చ అవసరమనిపించింది. కమ్యూనిస్టుల్ని బోలెడు మార్చాలి . ఆమెకు జర్మన్‌ ఐడియాలజీలో మార్క్స్‌ రాసిన వాక్యాలు  గుర్తొచ్చాయి. మగవాడు ఆడదానితో ఎలా వ్యవహరిస్తున్నాడో అనేదానిని బట్టే అతను మనిషిగా ఏ స్థాయిలో ఉన్నాడో తెలుస్తుందని చాలా లోతైన తాత్విక విషయంగా చెప్పాడు.

శారద అది చాలా వివరంగా చెప్పింది. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. ఇరవై నిమిషాలు  శారద ఉత్సాహంగా మాట్లాడి  ఆపేసిన తర్వాత  ‘‘ఆ ` ఎజెండాలో తత్వాటి  విషయం ఏంటి? చూడండి  ’’ అన్నాడు ఆనందరావు.

అందరూ ఆ సంగతి మాట్లాడుతున్నారు. శారద ముఖం అవమానంతో ఎర్రబడింది.

తర్వాతితి సమావేశంలో శారద నోరు తెరవలేదు. తను ఇట్లా మార్క్సిస్టు సిద్ధాంతాలను  స్థానిక సమస్యలకు అన్వయించి, మార్క్స్‌, ఏంగెల్స్‌ రచనలను  ఉదాహరిస్తూ మాట్లాడినప్పుడల్లా ఇలాంటి మౌనమే ఎదురయిందనే విషయం ఆరోజు అర్థమైంది.

తనను క్రమంగా ఆరోగ్య విషయాలకే పరిమితం చేస్తున్నారనీ, మహిళా సంఘానికే పరిమితమవుతున్నాననీ కూడా అనిపించింది.

మహిళా సంఘానికే పరిమితం అవటంలో చిన్నతనమేమీ లేదు. కానీ అక్కడ కూడా తను చేసే  పొరపాట్లుగా ఆడవాళ్ళకు ఓర్పు, వినయం నేర్పలేకపోవటాన్ని చూపిస్తున్నారు.

తనను ఒక మేధావిగా, కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల లో  ఒకదానిగా గుర్తించటానికి నిరాకరిస్తున్నారు.

‘‘ఛ –  తను మరీ ఎక్కువ ఆలోచిస్తోంది’’  అనుకుని అప్పటికి ఆ ఆలోచనలను  పక్కకునెట్టి సమావేశంలో ఇతర అంశాల  మీద మాట్లాడుతున్న వారి మాటలు  శ్రద్ధగా వినసాగింది.

***

దేశానికి స్వతంత్రం రాబోతోందనే వాతావరణం వస్తుండగా కమ్యూనిస్టు మీద నిర్భంధం ఎక్కువైంది. బ్రిటీష్‌ వాళ్ళ ప్రయోజనాలు  తీరిపోగానే వాళ్ళకు కమ్యూనిస్టులే అసలు  శత్రువులని, వారు తమ వారసులు గా ఎవరికి అధికారం అప్పగించి పోవాలనుకున్నారో వాళ్ళకు కూడా కమ్యూనిస్టులే శత్రువులనీ అర్థమైంది. నిర్బంధం పెరగటంతో మళ్ళీ పార్టీ యంత్రాంగమంత చెల్లాచెదరైంది. రహస్యంగా పత్రికలు  నడపటం, నాయకుల  అజ్ఞాతవాసం, ప్రజా సంఘాల  పని పెరగటం ఎన్నో ప్రతికూలతల  మధ్య పని చేయాల్సి వచ్చింది. తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులు  పేద ప్రజలకు అండగా నిలిచారు. సంగాలుగా  ప్రజల్లో కలిశారు. సంగపోళ్ళంటే పేద రైతు కూలీలు , చిన్న కులాల   వాళ్ళూ ప్రాణాలిచ్చే స్థితికి వచ్చారు. శారదాంబ తెలంగాణా నాయకులకు ఆశ్రయం కల్పించటం వంటి పనులు  అదనంగా మీద వేసుకుంది. రజాకార్ల ఆగడాలకు తట్టుకోలేని వాళ్ళు తాత్కాలికంగా  బెజవాడ వైపు వచ్చి కొన్ని రోజులు  శక్తి పుంజుకున్నారు. వారికి వైద్యం అవసరమైతే శారద ఉండనే ఉంది.

దేశానికి స్వతంత్రం – అర్థ శతాబ్దం దాటిపోయిన స్వతంత్ర సంగ్రామంలో విజయం. భారతదేశం ఒకవైపు విజయోత్సవాలలో మరోవైపు దేశ విభజన సృష్టించిన విలయాలలో  మునిగింది. ఉత్తర భారతదేశంలో హిందూ ముస్లిం మధ్య పగలు  ప్రతీకారాలు  పెరిగిపోయి చరిత్రలోనే అతిపెద్ద విధ్వంసకాండ ఆరంభమైంది. దక్షిణ భారతదేశంలో అది లేదు గానీ హైదరాబాద్‌ నిజాం గురించిన ఆలోచనలు , చర్చలు  మొదలైంది. స్వతంత్ర భారతదేశంలో చేరకుండా తన స్వయం ప్రతిపత్తి నిలబెట్టుకుంటానన్న నిజాం నవాబుపై తెంగాణాలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు ఆర్యసమాజం వంటి అన్ని పార్టీలలో సాంఘిక గ్రూపుల్లో వ్యతిరేకత ఎక్కువయింది. కాంగ్రెస్‌ కంటే కమ్యూనిస్టు ప్రాబల్యం  పెరగసాగింది. ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్టు జమిందారీ వ్యతిరేక పోరాటాలు ముమ్మరం చేయాలనుకున్నారు. దానితో జమీందార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ఆశ్రయించారు. కాంగ్రెస్‌లో అంతకు ముందున్న పెద్ద భూస్వాముల  సంఖ్య, వారి ప్రాబల్యం  కూడా తక్కువ కాదు. దానితో గ్రామాల్లో వర్గ పోరాటం మొదలైందా అన్నంతగా తీవ్ర వైరుధ్యాలు  కనిపిస్తున్నాయి.

మారిన ఈ పరిస్థితులలో శారదకు ఒక్క క్షణం తీరిక దొరకటం లేదు. కూతురికి కూడా ఒక్క గంట సమయం ఇవ్వలేకపోతోంది. అమ్మమ్మ పెంపకంలో నటాషాకు వచ్చిన లోటేమీ లేదు గానీ తల్లి కోసం పసి మనసు లోపల  ఎక్కడో ఒక ఆరాటం, ఆ ఆరాటం సంతృప్తి  చెందక పోవటంతో చిన్న కోపం చోటు చేసుకుంటున్నాయి. మూర్తి దాదాపు ఇంటి పట్టున ఉండటం లేదు. శారద ఆస్పత్రిని ఒదలలేదు గాబట్టి ప్రయాణాలు  తగ్గి స్థానిక బాధ్యతలు  పెరిగాయి. కృష్ణా గుంటూరు జిల్లాల  గ్రామాల లో చిన్న రైతులకు భూస్వాములకు, చల్లపల్లి జమీందారు వంటి జమీందార్లకు మధ్య పోరు పెరగటంతో కమ్యూనిస్టులు  తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ప్రాణాలు  ప్రమాదంలో పడుతున్నాయి. కొందరు ప్రాణాలు  కోల్పోయారు.

*

గమనమే గమ్యం-29

img111

 

ఇది తెలిసి శారద ఆలోచనలో పడింది. . ఇంటింటికీ వెళ్ళి ఈ ప్రచారం  నీచమైనదని చెప్పటం వల్ల  సమయం వృధా  తప్ప ప్రయోజనం ఉండదు. అందరికీ ఒకేసారి సమాధానం ఇవ్వాలి.  ముఖ్యంగా కాంగ్రెస్‌ పెద్దలకు. ఎలా? ఎక్కడ? ఎప్పుడు. శారద ఆలోచన తీవ్రత గుర్తించినట్లు ఆ సమయం రానే వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్‌ వాళ్ళు బహిరంగ సభ పెట్టారు. పెద్దా, చిన్నా  నాయకులంతా  వేదిక ఎక్కుతారని వాళ్ళు వేసిన కరపత్రం చూస్తూ తెలిసింది. శారదకు తన కర్తవ్యమేమిటో కూడా అర్థమైంది. హుషారుగా లేచింది. నవ్వుతూ వస్తున్న శారదను చూసి ప్రచారం చేయటానికి బయల్దేరుతున్న ఆడవాళ్ళంత ఆమె చుట్టూ చేరారు.

‘‘ఇవాళ సాయంత్రం మనం ఇంటింటి ప్రచారానికి వెళ్ళటం లేదోయ్‌. ప్రోగ్రాం మారింది’’.

‘‘ఎందుకు? ఏం మారింది? ఎక్కడ కి వెళ్తాం? ఏం చేద్దాం?’’ అందరూ కుతూహలంగా ఆత్రంగా అడిగారు.

‘‘కాంగ్రెస్‌ మీటింగుకోయ్‌’’ శారద ఉత్సాహంగా చెప్పిన మాటకు అందరూ విస్తుపోయారు.

‘‘కాంగ్రెస్‌ మీటింగ్‌కా? మనమా?’’

‘‘ఔను. మనమే. వెళ్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. మీరేం కంగారు పడకండి . అంతా నే చూసుకుంటాను. మీరు సభకు వస్తే చాలు “ శారద ఏదో మంచి ఆలోచనే చేసి ఉంటుందని అందరూ నమ్మారు. ధీమాగా తమ పనులకు తాము వెళ్ళిపోయారు. సాయంత్రం ఎంత తొందరగా వెళ్దామన్నా అందరూ తెమిలే సరికి ఆలస్యం అవనే అయింది.

‘‘అవతల మీటింగు మొదలయిందోయ్‌ రండి’’ అంటూ శారద ముందు నడిస్తే వెనకా అందరూ గుంపుగా నడిచారు. వీళ్ళు వెళ్ళేసరికి కాంగ్రెస్‌ నాయకుడొకడు గొంతు చించుకుంటున్నాడు.

‘‘ఆ శారదాంబ డాక్టరు కావచ్చు. కానీ ఆమె చేసిన పనేమిటి? కాంట్రాక్టు పెళ్ళి చేసుకుంది. మనం ఎప్పుడైన విన్నామా? మన సంప్రదాయమేనా ? అసలామెకు ఏ పెళ్ళయినా ఎందుకు? బెజవాడలో ఆవిడ ఇంటికి రాణి  మొగాడున్నాడా  వాళ్ళ పార్టీలో? అది ఇల్లా? సానికొంపా? బెజవాడలో ఎవరినైన అడగండి చెబుతారు. బెజవాడ ఒదిలి ఇపుడు ఏలూరుని ఉద్ధరిస్తానంటుంది. ఏలూరులో కూడా ఒక సానికొంప నడపాలనుకుంటుందా?’’

వింటున్న మహిళా సంఘం వాళ్ళ రక్తాలు  మరిగిపోయాయి. శారద వాళ్ళను ఒట్టి చేతుతో రావాలని  ఆజ్ఞాపించింది. లేకపోతే చేతిలో కర్రలుంటే వాళ్ళు ఆ కాంగ్రెస్‌ నాయకుడి  తల పగలగొట్టే వారే. శారద వాళ్ళ ఆగ్రహాన్ని గ్రహించినట్టు వెనక్కు తిరిగి నవ్వుతూ ‘‘వాళ్ళ మాటలకు కోపం తెచ్చుకుంటే వాళ్ళ బలం పెరుగుతుంది. నవ్వుతూ నవ్వుతూ సమాధానం చెప్పాలి. ఆ పని నే చేస్తాను. చూస్తూ ఉండండి ’’.

అంటూ వడి వడి గా నడుస్తూ వేదిక మీదికి ఎక్కేసింది. వేదిక మీది వాళ్ళంత విస్తుపోయి, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళేకే తెలియనితనంలో అందరూ లేచి నిలబడ్డారు. సభలో జనమూ నివ్వెరపోయి ఎక్కడ వాళ్ళక్కడ నిశ్శబ్దమైపోయారు.

శారద వేదిక మీది వాళ్ళను ఆజ్ఞాపిస్తున్నట్లు ‘‘కూచోండి ’’ అంది గర్జించినట్లే.

అందరూ టక్కున కుర్చీల్లో కూర్చున్నారు ఆ ఆజ్ఞకోసమే ఎదురు చూస్తున్న వాళ్ళలా.

మైకు దగ్గరి నాయకుడి ముఖంలో నెత్తురుచుక్క లేదు.

‘‘జరగండి – వెళ్ళి మీరూ కూచోండి ’’ ఆజ్ఞాపించింది శారద.

ఆయన అమ్మయ్య అనుకున్నట్లు పరుగు పరుగున వేదిక చివరనున్న తన కుర్చీలో పోయి పడ్డాడు.

‘‘కాంగ్రెస్‌ నాయకులను నేనొకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎన్నికల ప్రచారం కోసం సభ పెట్టారా ? శారదాంబ జీవితాన్ని గురించి ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేయటానికి సభ పెట్టాం ? మనవి వేరు వేరు పార్టీలు . వేరు వేరు ప్రణాళికలు. ఎన్నికలలో గెలిచి మనం ప్రజలకు ఏం చేస్తామో చెప్పటానికి సభలు  పెట్టుకోవాలి. ప్రజల  సమస్యలేమిటి, మన రాజకీయాలేమిటి అన్నది ప్రజకు వివరించాలి. కమ్యూనిస్టులతో మీకు విభేదాలెక్కడ ఉన్నాయో చెప్పండి . మీకు తప్పనిపించిన విధానాలను ఎంతైన విమర్శించండి . ఎన్నికల ప్రచారమంటే అది. ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు రేపు ప్రజలకు ఏం చేస్తారు? ఎవరెవరి వ్యక్తిగత జీవితాలు  ఎలా ఉన్నాయో చూసి ప్రజలకు చెప్పుకుంటూ పోతారు?  ఒక స్త్రీని గౌరవించే సంస్కారం లేదు మీకు. రాజకీయాలలోకి వచ్చిన స్త్రీలను గురించి ఇట్లా మాట్లాడి వాళ్ళను వెనక్కు నెట్టడమా మీ ఉద్దేశం. మీ పార్టీ తరపున ఒక స్త్రీ పోటీ చేస్తోంది. ఆవిడంటే గిట్టనివారు నా ఎదురుగా ఆమెను కించపరిచేమాట ఒక్కటి మాట్లాడిన నేను సహించను. వాళ్ళ నోరు మూయిస్తాను. ఆమెను నా  సోదరిగా ఆలింగనం చేసుకుంటాను. కర్ణుడిని సూతపుత్రుడని అవమానించినట్లు నన్ను నా  ‘‘పెళ్ళి’’ పేరుతో అవమానించదల్చుకున్న వాళ్ళకు నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను . కొత్తగా ఆవిర్భవిస్తున్న భారతదేశంలో కులాన్ని అణగదొక్కుతాం. శీలం, నీతి, అవినీతి, పెళ్ళి అయింది, కాలేదు అంటూ స్త్రీలను అవమానించేవారిని ఇంకెంతమాత్రం సహించం. మీ పాత నీతులు  పనికిరావు. స్త్రీలు  తమ గురించి, దేశం గురించి బాధ్యత తీసుకుంటారు. బెజవాడలో మా ఇల్లు  ఆపదలో ఉన్నవారికి ఆశ్రయమిచ్చేచోటు. అది నా ఇల్లు  కాదు. మీ అందరిదీ. మీరందరూ రావచ్చు. మా అమ్మ అన్నం పెడుతుంది. బెజవాడలో నా ఇల్లంటున్నారే ఆ ఇంట్లోనే కాదు. మద్రాసులో మా నాన్న రామారావు గారిల్లు  ఉండేది. భారతదేశంలో పండితుందరూ వచ్చి మా అమ్మ చేతి భోజనం చేసి మా నాన్నతో సంప్రదించి వెళ్ళేవారు. వీరేశలింగం గారు మా ఇంట్లో ఉండేవారు. ఔను – జీవితాన్నంత సమాజం కోసం ధారపోసిన ఆయననూ అవినీతిపరుడన్నారు. వయసు మీదబడి భార్యా  వియోగంతో కుంగిపోతున్న ఆయన మీద అవినీతి ఆరోపణలు  చేసింది మీ వాళ్ళే ` మీ టంగుటూరి ప్రకాశం గారే ప్లీడరుగా తన చమత్కారమంతా  చూపించి ఆయనను ముద్దాయిగా నిలబెట్టి దోషిగా నిరూపించాడు. మీరు ఆ సంస్కారాన్ని వదలండి .

స్త్రీలను గౌరవించటమంటే ఏంటో నేర్చుకోండి . ఆధునిక స్త్రీ, ఆధునిక మహిళ మీ కళ్ళు మిరుమిట్లు గొలిపి, మీరు కన్నెత్తి చూడలేనంతగా ఎదుగుతోంది. చరిత్ర నిర్మిస్తుంది. చరిత్ర తిరగరాస్తుంది. సిద్ధంగా ఉండండ ఆమెతో తలపడటానికి. ఎన్నికల్లో ఎవరైన గెలవొచ్చు. కానీ నైతికంగా ఇవాళ మీరు ఘోరంగా ఓడిపోయారు. చరిత్రలో తల ఎత్తుకోలేనంత ఘోరంగా ఓడిపోయారు. నేను ఘన విజయం సాధించాను.

ప్రజలారా – నేను నైతికంగా గెలిచి మీ ముందు ధీమాగా నిలబడ్డాను. వేదిక మీది ఈ పెద్దలు  ఓడిపోయి తలలు దించుకున్నారు. నమస్కారం. శలవు’’

ఒక నిర్మల గంభీర ప్రవాహంలా సాగిన శారద ఉపన్యాసం తర్వాత  అంత నిశ్శబ్దమై పోయింది. శారద వేదిక దిగి జనం మధ్యలో నుండి నడుచుకుంటూ వచ్చింది. జనం గౌరవంగా ఆమెకు దారి ఇచ్చారు . ఆ రోజుకి ఇక సభ జరిపే  ధైర్యం కాంగ్రెస్‌ నాయకులకూ, వినే మానసిక స్థితి ప్రజలకూ లేదు.

***

olga title

ఎన్నికలు  దగ్గరబడుతున్న కొద్దీ మహిళా సంఘ ప్రచారానికి ప్రజలు  ఆకర్షితువుతున్నారు. అది అవతలి పక్షం వారిని చాలా కలవరపెడుతోంది. ఏమైనా  సరే ఇక్కడ కమ్యూనిస్టులను గెలవనివ్వకూడదనే పంతం పెరిగి అది వారి విచక్షణా జ్ఞానాన్ని తినేసింది. మహిళా సంఘం వారిని భయపెట్టి ఏలూరు నుంచి తరిమేస్తే  సగం పీడా ఒదులుతుందన్నారెవరో –

‘‘ఎట్లా? వాళ్ళు రాక్షసులు . వాళ్ళను భయపెట్టటం కల్లో మాట. మనల్ని భయపెడతాయి ఆ దెయ్యాలు ’’ కసి తప్ప మరొకటి లేదా మాటల్లో. చివరకి మతిలేని, గతిలేని వీధి రౌడీలను ఆశ్రయించటం తప్ప మరో మార్గం కనిపించలేదు స్థానిక పెద్దలకు. వారికి కాస్త నోరూ, చేతులూ  తడిపి మహిళా సంఘం వాళ్ళు బస చేసిన  ఇళ్ళ మీదకు దాడి చేయమని అర్థరాత్రిపూట పంపారు.

వీధి రౌడీలు  ఆడవాళ్ళని అల్లరిపెట్టి  బెదిరించి యాగీ చేసి వద్దామని హంగామాతో బయల్దేరారు.

ముందు ఇళ్ళమీద రాళ్ళు వేశారు. పగలంత తిరిగీ తిరిగీ వచ్చి ఇంత తిని పడుకున్న ఆడవాళ్ళు అలజడి గా మేలుకున్నారు . వాళ్ళకు అర్థమైంది. ఒకరివంక ఒకరు అర్థవంతంగా చూసుకున్నారు. చీరలు  బిగించి కట్టారు. కొంగు నడుముల్లో దోపుకున్నారు. తలుపులు  దబదబ బాదగానే అవి తెరుచుకుని తమ నెత్తిన కర్రలు  విరుచుకుపడతాయని తెలియని రౌడీలు  లబోదిబోమన్నారు. తామూ నిలబడి కర్రలు తిప్పారు. అరగంట పాటు ఆ స్త్రీల కర్రసాము చూస్తూ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు సబ్తులై నిలబడిపోయారు. రౌడీలు ఎటు పోయారో కూడా చూసే అవకాశం లేకుండా పారిపోయారు. ఫాసిస్టు వ్యతిరేక దళాలుగా ఏర్పడినప్పుడు నేర్చుకున్న కర్రసాము ఇప్పటికి సార్థకమయిందని సంతోషపడుతూ ఆ రాత్రి మరి నిద్రపోలేదు ఆ స్త్రీలు . జోరుగా పాటలు  ఆటలతో సందడి చేశారు.

శారద మర్నాడు బెజవాడ నుండి వచ్చేసరికి అందరూ ఒకేసారి మాట్లాడి రాత్రి  జరిగిన యుద్ధాన్ని  సచిత్ర ప్రదర్శనలాగా చెప్పారు. తనను ఓడించటానికి కాంగ్రెస్‌ వాళ్ళు ఎలాంటి పనికైన తెగబడతారని అర్థమైంది శారదకు. అందరూ కలిసి ఒకటి లేదా రెండు జట్లుగా తిరగాలనీ, ఒకరిద్దరుగా ఎవరూ ఎక్కడకీ వెళ్ళొద్దని గట్టిగా చెప్పింది. ప్రచారాన్ని  ఎంత పద్ధతిగా సాగించాలో వారందరినీ కూర్చోబెట్టి వివరించింది. ఎన్నికల ప్రణాళిక అందరికీ కరతలామకమే. ఐతే ప్రతిచోటా శారదాంబ గారిది కాంట్రాక్టు పెళ్ళట – అదేంటి అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది.

చైతన్యంతో సమాధానం చెప్పగలిగిన వాళ్ళు అవతలి వాళ్ళకు అర్థమయ్యేలా చెబుతున్నారు. కానీ మహిళా సంఘంలోకి అపుడపుడే వచ్చినవాళ్ళు, రాజకీయ ప్రచారం   సంగతి తెలియని వాళ్ళూ ఇచ్చే సమాధానాలు  సంజాయిషీలాగా

ఉండేవి. ‘డాక్టరు గారు చాలా గొప్ప మనిషి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అదంతా  పట్టించుకోవాల్సింది కాదు.’ ఇట్లా మాట్లాడేవాళ్ళను ఉమ, రాజమ్మ రాత్రిపూట సరిదిద్దేవారు. అదంతా  శారద చెవిన పడుతూనే ఉండేది.

సంజాయిషీల్లాంటి ఆ వివరణలు  విన్న శారదకు నవ్వాలో, ఏడవాలో  తెలిసేది కాదు. జీవితమంత ఇలాంటి సంజాయిషీలు  తనో, తన తరపున మాట్లాడేవాళ్ళో  ఇవ్వాల్సిందేనా ?

ఇవ్వాల్సిందే. సమాజంలో ఉన్న భావాలు  వేరు.  ప్రేమ గురించి చం గారు ఎంత రాసిన ,  ప్రేమకు సంఘనీతి అడ్డం వస్తుందన్నా  సంఘనీతి మనుధర్మాల  మీద ఆధారపడ స్త్రీలకు తీరని అపకారం చేసేదనీ, దానిని కూకటివేళ్ళతో పెళ్ళగించి కొత్త పద్ధతులను జీవితంలోకి తెచ్చుకోవాలని ఎంత చెప్పినా  దానిని అర్థం చేసుకోవటం కష్టం. చాలా సంవత్సరాలే పట్టవచ్చు ఆడవాళ్ళ  ప్రేమను నీతి -అవినీతి అనే చట్రం నుంచి విడదీసి చూడటానికి.

ఆడవాళ్ళు చిన్న గీటు దాటినా  దానిని సమాజం సహించలేదు.  ప్రేమ అనేది తెలియక ముందే పెళ్ళిళ్ళయ్యే పరిస్థితి. తర్వాత   ప్రేమవిలువ  తెలిసి కావానుకుంటే తెంచుకోలేని బంధాలు . సరైన విడాకుల  చట్టం లేనపుడు, పెళ్ళయిన వ్యక్తికి  ప్రేమించే హక్కు లేదు. హక్కు కోసం సమాజానికి విరుద్ధంగా పోయే వ్యక్తులున్నపుడే హక్కు అవసరం సమాజానికి అర్థమవుతుంది.

రావు కమిటి హిందూ కోడ్‌ బిల్లు  తయారు చేస్తోంది గానీ దానిలో  ప్రేమకు ఏం చోటుంటుంది?

విడిపోవటానికి  ప్రేమ లేకపోవటం అనే కారణం కాకుండా పరమ నికృష్టమైన  కారణాలు  ఉంటాయి. ఆస్తి, భరణం, వారసత్వం ఇవి ప్రధానమవుతాయి. కానీ ఆడవాళ్ళకు అది కూడా చాలా అవసరం. అంతకు మించి ఇప్పుడే ఎక్కువ ఆశించలేం.

భార్య మీద  ప్రేమ లేదు విడాకులివ్వండి అంటే ఎవరికీ అర్థం కాదు. నా  భార్య రోగిష్టిది. సంసార జీవితానికి పనికిరాదు అంటే విడాకులు  ఇవ్వమని అడగొచ్చని, పొందవచ్చని రావు కమిటి చెబుతుంది. జబ్బు పడిన భార్యను  ప్రేమగా చూసుకునే భర్తులుంటారు. రోజూ భార్య నుండి సంసార సుఖం పొందుతూనే వాళ్ళను ద్వేషించే భర్తులుంటారు. ఈ  ప్రేమ, ద్వేషాలు  భార్యాభర్తల  సంబంధాలో ఎట్లా ఉంటాయో, ఎట్లా పని చేస్తాయో ఆలోచించే చట్టాలు రావటం అసాధ్యం.

ప్రేమ పేరుతో మగవాళ్ళు మోసం చేసే  స్థితిలో ఉండటం – నిస్సహాయ స్థితిలో ఆడవాళ్ళుండటం వాళ్ళకి హక్కుల్ని లేకుండా చేస్తోంది. వాళ్ళకు, మనుషులు గా స్వతంత్ర వ్యక్తులు గా పనికొచ్చే హక్కు కాకుండా పరాధీనులుగా, బానిసలుగా, బాధితులుగా చూసే  హక్కు అడగగలిగిన పరిస్థితులే ఉన్నాయి. ముందు ఆడవాళ్ళ స్థాయి మారి సమానత్వం వస్తే తప్ప ‘ ప్రేమ’ ను అర్థం చేసుకోలేం. అపుడు పెళ్ళి ఉండదు.  ప్రేమే ఉంటుంది. ఎంగిల్స్‌ కుటుంబం వ్యక్తిగత ఆస్తిలో శారదకు చాలా ఇష్టమయిన వాక్యాలు  మనసులో మెదిలాయి.

ఎన్నికలు  ముగిసేనాటికి శారదకు ఫలితం ఏమిటో అర్థమైంది. ‘‘ఒక తరం మగవాళ్ళు తమ జీవిత కాంలో గానీ, ధనంతో గానీ, సామాజికాధికారంతో గానీ స్త్రీని లోబర్చుకునే సందర్భం ఎదురుకానపుడు, అదే విధంగా నిజమైన  ప్రేమతో తప్ప మరే కారణంతోనైన ఒక స్త్రీ మగవాని చెంత చేరవసిన అవసరం లేనపుడు, ఆర్థికపరమైన భయం చేత  ప్రేమికులు  కలియలేని పరిస్థితులు  తొలిగినపుడు, దానికి సమాధానం దొరుకుతుంది. ఆ మాదిరి జనం పుట్టాక, వారి ప్రవర్తన గురించి ఈనాడు మనం చెప్పే సలహాలకు వారు చిల్లిగవ్వవిలువ  కూడా ఇవ్వరు. తమ పద్ధతును తామే నిర్ణయించుకుంటారు. వ్యక్తుల ఆచరణకు అనుకూలంగా జనాభిప్రాయాన్ని సృష్టించుకుంటారు’’.

ఇది ఎప్పుడు జరుగుతుంది? బహుశ తన జీవితకాంలోనే జరుగుతుందేమో `- వ్యక్తుల  ఆచరణకు అనుకూలంగా జనా భిప్రాయం సృష్టించుకోవటం మానేసి పాతబడిన జనాభిప్రాయాల  ప్రకారం వ్యక్తులను నడవమనే ధోరణే ఇంకా కమ్యూనిస్టు పార్టీలోనూ నడుస్తోంది. ఇది మారెదెప్పుడు. మార్చాలి . ఎన్నికల  కంటే అది ముఖ్యం. తను ఓడి పోతుంది. కాంగ్రెస్‌ ఎన్నిక నిబంధనలన్నీ ఉల్లంఘిస్తోంది. తన ఓటు వేసి బెజవాడ వచ్చి ఆ ఎన్నిక గురించి మర్చిపోదామనీ, కూతురితో ఆడుకుంటూ ఒక రోజన్నా  గడుపుదామనీ అనుకుంది. నటాషాకు నాలుగేళ్ళు నిండలేదింకా – మంది చేతుల  మీద పెరుగుతోంది. ఐన అమ్మను చూస్తే  అతుక్కు పోతుంది. చిన్నతనం నుంచీ శారద నవ్వు అందరినీ ఆకర్షించి సమ్మోహితుల్ని చేసేది. చిన్న నటాషాకి కూడా అమ్మ నవ్వంటే ఎంతో ఇష్టం. హాయిగా, మనసారా  , నిష్కల్మషంగా నవ్వే తల్లిని కళ్ళార్పకుండా చూసి ఆ బొమ్మను కళ్ళగుండా మెదడులో గట్టిగా ముద్రించు కుంటున్నట్టు చూసేది. నటాషాను గుండెకు హత్తుకుని ‘‘తొలి నే చేసిన పూజా ఫలమా’’ అంటూ త్యాగరాజ  కీర్తన అందుకునేది. తల్లి పాట వింటూ నటాషా నిద్రపోతుంటే శారద ఆ పాపని, తన  పేర్మ  ఫలాన్ని తనివిదీరా  చూసుకునేది. అట్లాంటి రోజు ఆ తల్లీ కూతుళ్ళకు అరుదే గానీ వాటిని శారద ఎంత అపురూపంగా చూసుకునేదో, ఎంత పరవశంతో అనుభూతి చెందేదో, ఎలాపులకించి పోయేదో శారదకే తెలుసు. నటాషాకి కూడా తెలియదు.

రాత్రి నటాషా పెందలాడే నిద్రపోయింది. మూర్తి ఇంకా ఎన్నిక గొడవల్లోంచి బైటపడలేదు. బహుశ ఫలితాలొచ్చే వరకూ ఏదో ఒక పని ఉంటుంది. శారద చాలా రోజుల  తర్వాత  సుబ్బమ్మతో కలిసి భోజనం చేసింది. సుబ్బమ్మ చాలా తక్కువ తింటోందనో, చిక్కిపోయిందనో అనిపించింది.

‘‘అమ్మా – నీ గురించి పట్టించుకోవటం లేదు. ఇంత చిక్కిపోయావేమిటి? అంత తక్కువ  తింటున్నావేంటి? కొంచెం  వడ్డిస్తానుండు’’ అంటూ హడావుడి  చేసింది.

‘‘నువ్వు నన్ను పట్టించుకునేదేంటి? ఆ పని నాది. నువ్వేమో నా  చేతికి చిక్కకుండా తిరుగుతున్నావు. . నాకు  వయసు మీద పడటం లేదా? తిండీ, నిద్రా తగ్గుతాయి. ఒళ్ళు తగ్గితే మంచిదే’’ సుబ్బమ్మ నవ్వుతూ తీసిపారేసింది శారద మాటల్ని.

‘‘మాట్లాడకుండా రేపు నాతో ఆస్పత్రికి రా  . అన్ని పరీక్షలూ  చేస్తాను’’ గట్టిగా అంది శారద.

‘‘అలాగే. రానంటే ఊరుకుంటావా  ? కాళ్ళూ చేతులూ  కట్టి పడేసైనా  లాక్కుపోత వు. అలాగే చెయ్యి నీ పరిక్షలు .’’

భోజనాలు  ముగించి ముంగిట్లో కాసేపు చల్ల గాలికి కూచుందామని వచ్చేసరికి గేటు తీసుకుని ఎవరో వస్తున్నారు.

***

 

గమనమే గమ్యం-28

 

 

volga‘‘శారదాంబకు ఈ ఉత్తరం ఇచ్చి రావమ్మా’’ అంటూ పార్టీ ఆఫీసుకి వచ్చిన కార్యకర్త ఒకాయన సత్యవతి చేతిలో ఒక కాగితం కట్టపెట్టాడు. ‘‘ఇది ఉత్తరమా’’ అనుకుని నవ్వుకుంటూ హుషారుగా బయల్దేరింది సత్యవతి. శారదాంబ ఇంటికి వెళ్ళటం అంటే సత్యవతికి చాలా ఇష్టం. శారదాంబ కనపడనంత సేపూ నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ కాసేపట్లోనే మనకు అండగా డాక్టరు గారున్నరనే భావాన్ని కలిగిస్తుంది. సుబ్బమ్మ గారు తినటానికి ఏదో ఒకటి పెడతారు. సుబ్బమ్మ మేనగోడలు పద్మ సరదాగా మాట్లాడుతుంది. మహిళా సంఘం ముచ్చట్లు చెప్పుకుంటారు. ఆ సంతోషం తొందర పెడుతుంటే వేగంగా నడుస్తూ వచ్చిన సత్యవతి ఇంటి ముందు ఆవరణలోనే ఆగిపోయింది. సెప్టెంబర్‌ నెలలో గులాబీలు ఇంత విరగబూస్తాయా అనుకుని కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది. ఇంటి ముందు తోటంత ఎర్రని, తెల్లని గులాబీ పంట పండినట్లుంది. గాలికి తలలు ఊపుతూ మనోహరంగా ఉన్నాయి. సత్యవతికి ఆ పూలన్నింటికీ అరచేయి వెడల్పులో, ఎర్రని ఎరుపు రంగులో ఉన్న రెండు గులాబీలను చూస్తె మనసాగలేదు. చేయి ఊరుకోలేదు. గబగబా వెళ్ళి వాటిని కోసింది. మహా అమూల్యమైన కానుక తీసుకెళ్తున్న భక్తురాలిలా లోపలికి వెళ్ళింది. శారద హాస్పిటల్‌కి వెళ్ళటానికి తయారై బయటకు వస్తూ సత్యవతిని చూస్తూ ‘‘ఏంటోయ్‌ ` పొద్దున్నే ఇలా వచ్చావు’’ అంటూ నవ్వుతూ భుజం మీద చేయి వేసి తట్టింది. సత్యవతి భగవంతుడికి సమర్పిస్తున్నట్లుగా ఆ గులాబీలను శారదాంబ కళ్ళముందుంచింది గర్వంగా. శారదాంబ ముఖంలో నవ్వు పోయి గంభీరమై ‘‘ఎక్కడవివి?’’ అంది. ‘‘మీ తోటలోవే’’ పెద్ద రహస్యం కనుక్కున్నట్లు చెప్పింది.
‘‘ఎందుకు కోశావు?’’
‘‘మీ కోసమే’’ ప్రేమగా చెప్పింది. ‘‘తల్లో పెట్టుకుంటే అందంగా ఉంటుందని’’ .
శారద కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ ‘‘నా తల్లో ఎన్నడైన ఈ పూలు చూశావా? నేను పూు పెట్టుకోవటం చూశావా ? హాయిగా అందంగా చెట్టుమీద ఉండే పూలని కోసెయ్యటానికి నీకు మనసెట్లా ఒప్పింది? కొంచెం ఆలోచిస్తే తెలిసేదే `-చెట్టున ఉంటే నాలుగు రోజులు అందరి కళ్ళకూ పండగలాగా ఉంటుంది. నా తల్లో నీ తల్లో సాయంత్రానికి వడలి పోతాయి. ఇంకెప్పుడూ గులాబీలు కొయ్యవద్దు’’ ఎంత పొరపాటు చేసిన నవ్వుతూ నవ్వుతూ సరిదిద్దే డాక్టర్‌ గారికి ఇంత కోపం వచ్చిందంటే అది చెయ్యకూడని పనే అని సత్యవతికి రూఢీ అయింది.
‘‘ఇలా తిరుగు’’ అని సత్యవతిని వెనక్కి తిప్పి ఒక పువ్వు ఆమె జడలో పెట్టి ` ‘‘ఇది మా అమ్మకివ్వు. చిన్న గిన్నెలో నీళ్ళు పోసి పెడుతుంది. రెండు రోజులు ఇలాగే ఉంటుంది. ఇంతకూ నువ్వు వచ్చిన పనేంటి?’’ శారద చేతిలో తను తెచ్చిన కాగితాల కట్ట పెట్టింది సత్యవతి. అది తీసుకుని బైటికి వెళ్తున్న శారదకు ఇద్దరు కార్యకర్తు ఎదురొచ్చారు. సత్యవతి వాళ్ళనెప్పుడూ చూడలేదు. ఖద్దరు పంచలు కట్టుకుని, అరచేతుల చొక్కాతో నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇద్దరి చేతుల్లో పచ్చని విచ్చీ విచ్చని పత్తి కాయలున్నాయి.
శారదాంబ కళ్లు వాటిమీద పడ్డాయి. వాటినీ వాళ్ళ ముఖాలనూ మార్చి మార్చి చూస్తున్న శారదను చూస్తుంటే సత్యవతికి ఏదో అర్థమైంది. ఇప్పుడేం జరగుతుందో చూద్దాం అనే కుతుహలంతో నాలుగడుగులు బైటికి వేసింది.
‘‘ఏంటా కాయలు ?’’ అనుమానంగా అడిగింది శారద.
‘‘పత్తి కాయలు డాక్టరు గారూ. పత్తి చేలకడ్డంబడి వచ్చాము లెండి . ఈ సంవత్సరం పత్తి బాగా అవుతుంది. చెట్టునిండా కాయలే `’’
‘‘ఏం లాభం రైతుకి రూపాయిండదుదు’’ శారద కఠినంగా అంది.
‘‘ఏం? ఏం? ఎందుకుండదు ?’’ ఆశ్చర్యంగా తమ చేతుల్లో బలంగా ఆరోగ్యంగా ఉన్న పత్తి కాయలను మార్చిమార్చి చూశారిద్దరూ.
‘‘పత్తి చేల మీద మీదుగా వచ్చిన ప్రతివాడ చేతులు దురద పెట్టి ఒక్కోడూ ఐదారు కాయలు కొస్తే ఇంకా పగిలి పత్తి ఇవ్వటానికి కాయలెక్కడుంటాయి. అమ్ముకోటానికి రైతుకి పత్తెక్కడుంటుంది? ఆ కాయలు ఎందుకైన పనికొస్తాయా? మీరు సరదాగా పట్టుకోటానికి తప్ప. కనీసం బాగా పగిలి పత్తి వస్తున్న కాయను కోసినా మీ ఇంట్లో వాళ్ళు ఆ పత్తిని దేనికైన ఉపయోగించుకుందురు. ఈ కాయలు ఎందుకు కోసినట్టూ’’
పాలిపోతున్న ఆ ఇద్దరు యువకుల ముఖాలు చూసి సత్యవతి ముఖంలో ‘‘బాగా అయ్యింది’’ అన్న తృప్తి, చిన్ననవ్వు, తన బాధ మర్చిపోయి ఎగురుతున్నట్టే లోపలికి పోయింది.
***
రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లరు ఓడిపోవటం వల్ల బ్రిటీష్‌ వాళ్ళకు కలిగింది తాత్కాలిక ఉపశమనమే అయింది. యుద్ధం పేరుతో ఏదో ఒక రకంగా వలస దేశాల్లో ఉద్యమాల ఉద్రుతిని ఆపుకొంటూ వస్తున్న సామ్రాజ్యానికి అది ఇక కుదరని పని అయింది. ముఖ్యంగా భారతదేశంలో వారి పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తోంది. తిరగబడని వర్గమంటూ ఏదీ మిగలలేదు. దేశంలో ఎక్కడ చూసినా కార్మికులు , ప్రభుత్వోద్యోగులూ తిరగబడుతున్నారు. సమ్మెలు ముమ్మరమయ్యాయి.
సైనికులు , నావికులు కూడా తిరగబడితే ఏ సామ్రాజ్యం తట్టుకునిలబడ గలుగుతుంది?
కానీ చివరి క్షణం దాకా సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలి, భారతదేశాన్ని సర్వ నాశనం చేసి గాని ఒదలకూడదనే పట్టుదలతో బ్రిటీష్‌ ప్రభుత్వం అన్ని రకాల ఉపాయాలను, వ్యూహాలను ఆశ్రయించి రోజులు పొడిగించుకోవాలని చూస్తున్నది.
ఆ వ్యూహాలలో ఒక భాగంగా ఎన్నికలను ప్రకటించింది. దేశం ఒదిలి వెళ్ళక ఎన్నికలు మీరు పెట్టేదేమిటని భారతీయులు అడగరనీ, కొత్తగా నేర్చుకున్న ఈ ఎన్నికల ప్రక్రియ మీద వారికి వల్లమాలిన మోజనీ ప్రభుత్వానీ తెలుసు. ప్రొవెన్షియల్‌ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి.
బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా జరగాల్సిన సభలలో, స్వాతంత్ర్యానంతరం దేశ పునర్నిర్మాణం కోసం భిన్న రాజకీయాలలో ఉన్నవారి మధ్య జరగాల్సిన సభలలో కొన్నిటినైనా భారతీయులు తమకు తామే వ్యతిరేకంగా మాట్లాడుకోటానికీ, కొట్లాడుకోటానికీ మళ్ళించటం ప్రభుత్వ ఉద్దేశమైతే అది నెరవేరింది. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. పూనా ఒడంబడిక ప్రకారం హరిజన అభ్యర్థులకు ముందు ప్యానల్‌ ఎన్నికలు జరిగాయి. రామకృష్ణయ్య, శారద, ఈశ్వరరావు వంటి అగ్రశ్రేణి నాయకులు పని చేసి లక్షమందితో బహిరంగ సభ జరిపారు. ప్యానల్‌ ఎన్నికలలో గెలుస్తామనే గట్టి ఆశ కృష్ణాజిల్లా రిజర్వుడు స్థానం మీద, క్రైస్తవ రిజర్వుడు స్థానంలోనూ కమ్యూనిస్టులకు ఉంది. అలాంటి ఆశతోనే ఏలూరు నియోజకవర్గంలో శారదాంబను నిలబెట్టాని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా , గోదావరి జిల్లాలలో శారదంటే ప్రజలలో అభిమానం ఉంది. సమర్థురాలు. తప్పక గెలుస్తుందని అందరికి నమ్మకం ఉంది.
అందరూ ఉత్సాహం గా శారదను అభినందిస్తుంటే మూర్తి ముఖమే కొంచెం కళాహీనమైంది.
శారద అది గమనించింది.
‘‘మూర్తీ! నువ్వు ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకుంటే నాకు సీటు వచ్చినట్టుందిగదోయ్‌’’ అంది నవ్వుతూనే.
‘‘నాకెందుకు సీటిస్తారు శారదా. నేనెవరిని? శారద భర్తను. ఆ కారణంగానే బెజవాడ వచ్చాను. వచ్చినవాడిని ఊరికే కూచోబెట్టటమెందుకని బాధ్యతప్పగించారు. అంతేగాని ఎన్నికల్లో సీటెందుకిస్తారు?’’ అన్నాడు పరిహాసంగానే ` నవ్వుతూనే.
‘‘నవ్వుతూ అంటున్నావా? నిజంగా నీ మనసులో ఏముంది మూర్తీ’’ శారదకు మనసులో ఏదో శంక మొదలైంది.
‘‘నా మనసులో ఏముందో గ్రహించలేనంతగా నాకు దూరమయ్యావా?’’ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మూర్తి.
శారదకు మూర్తి భావం అర్థం కాలేదు. అపార్థం చేసుకోబుద్ధి కాలేదు.
మూర్తిది అంత చిన్న మనసు అనుకోవటం అసాధ్యంగా ఉంది. కానీ కామేశ్వరరావుని ఇంట్లో ఉంచినపుడు అతని మానసిక స్థితి, అతను చేసిన పని గుర్తొస్తే – ఇప్పుడు కూడా అతన్ని పురుషాహంకారం వేధిస్తున్నదా అనే అనుమానమూ కలుగుతోంది. అహంకారం తలెత్తితే అంకురంలోనే తుంచివేయటం తప్ప మార్గం లేదు. తలెత్తకుండా ఉండేంతటి మహాత్ముడు కాదు మూర్తి. మగవాళ్ళను మహాత్ములుగా కాదు ముందు మగబుద్ధి ఒదిలించి మనుషులుగా మార్చుకోవాల్సిన పని కూడా ఆడవాళ్ళదే ` అబ్బా –ఆలోచిస్తేనే విసుగ్గా, అలసటగా ఉంది. కానీ తప్పదు – ఇది ముఖ్యమైన పని అనుకుంది శారద. ఆ పనికంటే ముందు ఎన్నికల పనులు వచ్చి మీద పడ్డాయి. మరి దేని గురించీ ఆలోచించే, పని చేసే వ్యవధానం లేదు.
***
ఎన్నికలంటే కోలాహలమే. ఏలూరు ఎన్నికలలో నిలబడుతున్నది ఇద్దరూ స్త్రీలే అవటం వల్ల మహిళా సంఘం అంత ఏలూరికి వచ్చేసింది. రెండు పెద్ద ఇళ్ళల్లో అందరికీ వసతి, భోజనం ఏర్పాట్లు చేయటంతో ప్రచార కార్యక్రమంలో అందరూ తలమునకలుగా ఉన్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం. పేటల్లో మీటింగు. పదిరోజులకోసారి చొప్పున నెల రోజుల్లో మూడు బహిరంగ సభలు. శారదాంబ బృందమే పకడ్బందీగా ఎన్నికల ప్రచారం జరిగే పద్ధతంత ప్లాను చేసుకున్నారు. శారద అంటే మహిళా సంఘం వాళ్ళందరికీ గౌరవం. ప్రేమ. అందరినీ ‘ఏమోయ్‌’ అంటూ చనువుగా కలుపుకుపోయే శారదలో నాయకురాలు , స్నేహితురాలూ కూడా వాళ్ళకు కనిపించి ఆమెకు అతుక్కుపోయారు. పాటలు , నినాదాలు తయారై పోతున్నాయి అప్పటికప్పుడు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి మహిళా సంఘం అంటూ ప్రత్యేకంగా లేదు. పెద్ద నాయకులు , మగవాళ్ళే ప్రచారంలో కనిపిస్తున్నారు. ఆడవాళ్ళు చనువుగా ఇళ్ళల్లోకి వెళ్ళటం, మంచీ చెడ్డా మాట్లాడటం, పోషకాహారం గురించి చెప్పటం, శారద వెళ్ళిన చోట తల్లీ పిల్లా ఆరోగ్యం గురించి విచారించి సూచనలివ్వటం వీటన్నిటితో శారద గేకుపు ఖాయమని అందరికీ అనిపించింది. మొదట్నించీ కమ్యూనిస్టులంటే పడని ‘ముకో’ పత్రికకు ఇది కంటగింపయింది. వెంటనే ‘శారదాంబ కాంట్రాక్టు పెళ్ళి’ అంటూ ప్రత్యేక కథనమొకటి ప్రచురించింది. కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళు దానిని కరపత్రాలుగా మార్చి ఇంటింటికీ పంచి పెట్టారు.
రాజమ్మ, , రాజేశ్వరి, ఉమ, విమల మరో ఆరుగురూ కలిసి ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఒక ఇంట్లో వాళ్ళు ఈ కరపత్రాలు చూపించి దీని సంగతేమిటి అనడిగేసరికి రెండు నిమిషాలు అందరూ నిశ్శబ్దమై పోయారు. ఉమ వెంటనే తేరుకుని ‘‘ఇట్లాంటి రాతలు డాక్టరు గారి గురించి రాసిన వాళ్ళకు మీరు ఓట్లెయ్యాలనుకుంటే వెయ్యండి . స్త్రీలను గౌరవించటం తెలియని పార్టీని ఎన్నుకోవాలంటే ఎన్నుకోండి . పుకార్లను నమ్మొద్ద’’ని చెబుతుంటే ఆ ఇంటావిడ ఉమను ఆపేసింది.
‘‘అదంతా తరవాత సంగతమ్మాయ్‌. పుకార్లని మీరంటున్నారు. నిజాలని కాంగ్రెస్‌ వాళ్ళు ఈ కరపత్రాలు పంచిపెట్టి వెళ్ళారు. నాకొక్కటే సమాధానం సూటిగా చెప్పండి . డాక్టరమ్మగారి భర్తకు అంతకు ముందే పెళ్ళయిందా లేదా? పిల్లలున్నారా లేదా?’’
నలుగురూ ముఖాముఖాలు చూసుకున్నారు.
రాజమ్మ ధైర్యంగా ఉన్న విషయం చెబుదామని నిర్ణయించుకుంది.
‘‘అంతవరకూ నిజమేనండి. డాక్టరు గారి భర్తకు అంతకు ముందే పెళ్ళయింది. అది చిన్నతనంలో జరిగిన పెళ్ళి ` ’’
రాజమ్మ మాటల్ని మధ్యలో ఆపేస్తూ ఇంటి యజమాని కాబోలు అడ్డు వచ్చాడు.
‘‘మేమందరం చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళమే. ఇప్పుడు నదురుగా ఇంకో మనిషి కనిపిస్తే పెళ్ళి చేసుకుంటే ఇదిగో ఈవిడేమైపోతుంది? అదట్లా ఉంచండి -కొందరు మగవాళ్ళు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎవర్నయిన ఉంచుకుంటారు. అది వాళ్ళిష్టం. మీ డాక్టరమ్మ ఆ ప్లీడరు గారిని సంప్రదాయ ప్రకారం సప్తపది మంగళసూత్రధారణతో వివాహం చేసుకుందా? అట్లా జరిగి ఉంటే అందులో విడ్డూరం లేదనుకునేవాళ్ళం. ఈ కాంట్రాక్టు పెళ్ళేమిటి? కాగితాలు రాసుకుంటే సరిపోతుందా? అది మాకు అర్థం కావటం లేదు. అంతకంటే డాక్టరమ్మ గారిని మద్రాసు ప్లీడరొకాయన ఉంచుకున్నాడంటే బాగా అర్థమవుతుంది ` ’’
మహిళా సంఘం వాళ్ళ రక్తం ఉడికి పోయింది. ఉమ తన చేతిలో ఉన్న కాగితాల కట్టతో ఆ మగమనిషి భుజం మీద ఒక్కటి వేసి ‘‘రండే పోదాం – వీళ్ళతో మనకు మాటలేంటి’’ అని గిరుక్కున వెనక్కు తిరిగింది. మిగిలిన వాళ్ళూ ‘‘ఛీ! ఛీ! ఏం మనుషులు ’’ అంటూ బైటికి నడిచారు.
‘‘మీ అఘాయిత్యం గూలా! ఆడవాళ్ళేన మీరు. చెట్టంత మగాడి మీద చెయ్యి చేసుకుంటారా ’’ అంటూ ఇంట్లో వాళ్ళు చేస్తున్న గోల వెనక నుంచీ వినపడుతూనే ఉంది.
***

గమనమే గమ్యం-27

img549

-ఓల్గా

~

olgaఆ రోజు సాయంత్రం పని ముగించుకుని డాక్టర్‌ రంగనాయకమ్మ గారి హాస్పిటల్‌కు వెళ్ళింది శారద. ఆమె దగ్గర ఎప్పుడూ ఒకరిద్దరు అనాథ స్త్రీలు  నర్సుగా శిక్షణ పొందుతూ బతుకుతుంటారు. ఎవరినైన తన దగ్గరకు పంపితే వాళ్ళు కాస్త తెలివైన వాళ్ళయితే సుభద్ర లేని లోటు తీరుతుంది. లేకపోతే తనకు హాస్పిటల్‌లో చాలా కష్టమవుతుంది.

రంగనాయకమ్మ గారికి కాన్పు కేసు ఉండి లేబర్‌ రూంలో ఉండటంతో. శారద చనువుగా ఇంట్లోకి వెళ్ళింది. చలంగారు, పద్మావతిగారు, ఇంకొంతమంది కూర్చుని ఉన్నారు.

శారదను పద్మావతి గుర్తుపట్టి లేచి వచ్చింది.

‘‘బాగున్నారా డాక్టర్‌’’ అంటూ కావలించుకుంది. మద్రాసులో రెండు కుటుంబాల  మధ్యా స్నేహం ఉండేది. శారదను ‘అక్కా’ అని పిల్చేది పద్మావతి.

‘‘నువ్వెంత బాగున్నావు పద్మా – చాలా అందంగా ఉన్నావు” అంది శారద.

‘‘అందుకే సినిమావాళ్ళు వెంటపడుతున్నారు’’ చలంగారు చురక వేశారు.

‘‘మీ స్నేహితురాలుండేది – ఏం పేరు? గుర్తురావటం లేదు. వాళ్ళమ్మ ఇంకో అమ్మాయిని చేరదీసింది. రాజ్యం  అని. ఆ పిల్ల  ఇపుడు సినిమా ప్రపంచానికి రాణి . చాలా అందమైనదిలే. నటన కూడా తెలుసు. మీ స్నహితురాలేం చేస్తోంది’’.

‘‘డిల్లీలో ఉందనుకుంటా. మంచి ఉద్యోగం, భర్త,పిల్లలు , సంసారంలో పడి పోయింది’’.

‘‘మంచి పని చేసింది. నాకు ఇల్లు, నాటక  కళా రెండూ కావాలని  కష్టపడుతున్నాను. నువ్వు రాజకీయాలు , వైద్యం, ఇల్లు  ఎట్లా చూసుకుంటున్నావక్కా ? ’’

‘‘రాజకీయాు ఆయన చూసిపెడతాడు. ఇల్లు  వాళ్ళమ్మ చూసిపెడుతుంది. వైద్యం మాత్రం ఆమే చూసుకుంటుంది. మన వొయ్యి లాగానే’’ అన్నారు  చలం .

డాక్టర్‌ రంగనాయకమ్మను కుటుంబంలో అందరూ వొయ్యి అంటారు.

శారద ఆశ్చర్యంగా ఆయన వంక చూసింది. ఆయన అన్ని మాటలు  తన గురించి మాట్లాడటం అదే మొదటిసారి.

శారదకు ఒక్కక్షణం ఆయనకు తన బాధ చెబుదామా అనిపించింది. మరుక్షణంలో ఆ ఆలోచనని తుడిచేసింది. తన సమస్య తనే పరిష్కరించుకోవాలి. మరెవరికీ ఆ శక్తి ఉండదు. తను సమర్థురాలని ముందు తను నమ్మాలి. ‘‘నా రాజకీయాలు  నేనే చూసుకుంటాను. నా  పనులు  నావే.  ఇల్లంటావా ? ఇల్లు  ఇంకా ఫ్యూడల్‌ దశలోనే ఉంది కాబట్టి మా అమ్మ దానిని పట్టుకుని ఒదటం లేదు. ఒదిలిన రోజు దానిని నేననుకున్నట్లు ఒక సామాజిక ప్రదేశంగా చేసేస్తాను. వైద్యం నేనే చేస్తానని మీరే ఒప్పుకున్నారు. గాబట్టి పేచీ లేదు’’ అని గలగలా నవ్వింది శారద.

‘‘నీ నవ్వు వల్ల  నీ మాటలు  నమ్ముతున్నాను’’. అన్నారు  చలం  శారదను మెచ్చుకోలుగా చూస్తూ

‘‘శారద గురించి నీకు తెలిసింది తక్కువ. ఎక్కువ మాట్లాడొద్దు. ఆమెలాంటి మనుషులుండరు’’ అంది పద్మావతి.

‘‘తక్కువ కాదు. అసలు  మాట్లాడను’’ అంటూ మౌనంలోకి వెళ్ళిపోయారాయాన. పద్మావతి సుబ్బమ్మ గారెలా ఉన్నారని  అడిగింది.

‘‘ఒకసారి ఒచ్చి చూడరాదూ ` అమ్మ సంతోషిస్తుంది. నీ గురించి ఎప్పుడూ తల్చుకుంటుంది. మీరు వేసిన నాటకాలు  వంటివి పద్మావతి కూడా వేయరాదా  అని గొణుగుతుంటుంది’’.

పద్మావతి నవ్వేసింది ‘‘ఏదో ఒక  నాటకాలు  వెయ్యమనే అమ్మ ఉంది నీకు. అదృష్టవంతురాలివి .

‘‘మీ ఆయనేమంటున్నారు? ఎలా ఉన్నాడు?’’

‘‘ఎప్పుడూ అనేదే. కొత్త ఏముంది. ఆయన సహకారం లేనిదే నా  కళారాధన కుదురుతుందా?’’

శారద నవ్వుతూ ‘‘వెళ్ళేలోగా మా ఇంటికొక్కసారి రండి  ’’ అంటుండగా రంగనాయకమ్మ ఒచ్చింది.

‘‘ఏంటి శారదా ? నీకు మా ఇంటికొచ్చేంత తీరికెలా దొరికింది’’

‘‘తీరికుండి కాదు. పనుండి వచ్చాను’’.

శారద తనొచ్చినదెందుకో చెప్పింది. రంగనాయకమ్మ లేచి ‘‘రా హాస్పిటల్‌కి వెళ్దాం. ఒకమ్మాయిని చూపిస్తా. నీకు నచ్చితే తీసుకుపోదువు గానీ ` ’’ ఇద్దరూ లేచి హాస్పిటల్‌కు వెళ్ళారు.

శారదకు క్ష్మిల బాగా నచ్చింది. అంత బాగా నచ్చకపోయినా  తీసుకునేదే. రంగనాయకమ్మకు థాంక్స్‌ చెప్పి లక్ష్మిని రెండు రోజుల్లో తన దగ్గరకు రమ్మని చెప్పింది. క్ష్మిల కొత్తచోటు ఎలా ఉంటుందోనని భయపడుతుంటే ‘‘ఈ దేశంలోనే ఆమెకంటే మంచి మనిషి ఉండదు. హాయిగా వెళ్ళు. మళ్ళీ నేనిటు రమ్మన్నా రానంటావు “అంది రంగనాయకమ్మ.

క్ష్మిల ఆశ్చర్యంగా చూస్తుంటే ‘‘నే చెప్పింది నిజమే. ఆమెలాంటివాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. నీ జీవితానికి మంచి దారి చూపిస్తుంది’’ అన్నది. క్ష్మిల భర్తనొదిలేసి వచ్చి రంగనాయకమ్మని ఆశ్రయించింది. ఆమె పడ్డ బాధలన్నీ విని డాక్టర్‌గా అన్ని రకాలు  వైద్యాలు  చేసి, తన దగ్గరే ఉంచుకుంది. అలా వాళ్ళింట్లో ఎప్పుడూ నలుగురైదుగురు ఉండేవారు. కొందరు పిల్లలని  డాక్టర్‌ గారి దగ్గర ఒదిలేసేవారు. వాళ్ళు ఆ ఇంట్లో పిల్లలతో  పాటు పెరిగే వారు. డాక్టర్‌గా ఆమెవారిని చేరదీస్తే , చలం  తన పిల్లలతో  పాటు వారికీ  ప్రేమాభిమానాలు  పంచేవాడు. అదొక సామాజిక కుటుంబంగా చూసే వారికి  కొత్తగా, వింతగా, కొందరికి రోతగా అనిపించేది.

img111

రెండు మూడు రోజులు  మూర్తి, శారద మధ్య ముభావంగా గడిచిపోయాయి. ఇద్దరికీ మాట్లాడాలని ఉంది గానీ ఎవరూ చొరవ తీసుకోలేదు. మూర్తికి ఇంతలో మద్రాసు వెళ్ళాల్సిన పనిబడింది.

‘‘నువ్వూ రారాదు ?  ’’ అని అడ గాడు.

‘‘రాను . నాకు చాలా పనులున్నాయి “ . అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

మూర్తి వెళ్ళాక ఒక రోజంతా  ఆస్పత్రి పనులతో తీరిక లేకుండా గడిచింది. చాలా రోజు నుండీ చేయించాల్సిన చిన్న చిన్న రిపేర్లు – పాతబడిన వస్తువులు  తీసెయ్యటం. కొత్తవి తెచ్చి సర్దటం – అందరితో కలిసి శారద కూడా పని చేసింది. సంక్రాంతి నెల. కాన్పు కోసం తప్ప ఆస్పత్రికి ఎక్కువ మంది రారు. కాస్త తీరిక దొరికింది.

మహిళా సంఘం మీటింగులతో మరో రెండు రోజులు  గడచిపోయాయి. అనేక నిర్ణయాలు  తీసుకున్నారు. శారద కూడా అదనపు బాధ్యతలు తీసుకోక తప్పలేదు. సుభద్రతో స్నేహంగా మాట్లాడి  ఆమె బెరుకు పోగొట్టింది. రెండు రోజుల పాటు అంతమంది స్త్రీలతో గడిపి అందరి సమస్యలూ  పంచుకునేసరికి శారద మనసు కూడా ఉల్లాసంగా మారింది. ముఖ్యంగా సుభద్ర తను పూర్తికాలం  పార్టీ కార్యకర్త అయినందుకు పడే సంతోషం, గర్వం చూశాక, పార్టీ అంటే ఆమెకున్న అంకితభావం చూశాక శారదకు మూర్తి చేసిన పని సబబుగానే తోచింది.

‘తనతో చెప్పలేదే’ అన్నదొక్కటే కలుక్కుమంటోంది మనసులో. ఆ సాయంత్రం మీటింగు ముగిశాక అందరూ వెళ్ళిపోయారు. మెల్లీ మాత్రం మిగిలింది.

‘‘నువ్వేమిటో బాధ పడుతున్నావు చెప్ప’’ మని ఒత్తిడి చేసింది. మెల్లీ తనను అంతగా పరిశీలించి అర్థం చేసుకున్నందుకు ఆశ్చర్యపడుతూ అంతా చెప్పింది శారద.

మెల్లీ మౌనంగా విని కాసేపు ఆలోచించి –

‘‘కామేశ్వరరావు విషయం నువ్వు మూర్తితో మాట్లాడలేదు గదా. అతనికి కోపం వస్తే  అది నీ నిర్ణయమన్నావు కదా ` అప్పుడు అతని గురించి నువ్వు ఆలోచించలేదు. అతను దానికి బదులు  తీర్చుకున్నాడు. మీరిద్దరూ అనేక విషయాలు  కలిసి నిర్ణయించుకోవాల్సి  వస్తుంది.

ఇవాళ ఏం కూర వండమంటారు అని మాత్రమేఅడిగే మామూలు  గృహిణివి కాదు నువ్వు. నీకో కొత్త చీరె కొని నగలు  చేయించి లోబరుచుకునే మామూలు  భర్త కాదు అతను. మీరు మీ హద్దులు  స్పష్టంగా గుర్తించాలి. ఎవరి ప్రాంతం ఏది?  ఎక్కడకి ఎవరు చొచ్చుకురాకూడదు. ఎక్కడ కి ఇతరును రానీయకూడదు `- ఈ విషయాల్లో గందరగోళ పడితే చాలా బాధలొచ్చి పడతాయి. మీరు కూచుని శాంతంగా మాట్లాడుకోండి ’’.

శారద మౌనంగా ఉండి పోయింది.

‘‘శారదా –  నీకు రాజకీయాలు, ఇల్లు, ఆస్పత్రి చాలా బాధ్యతలు. అంత బాధ్యతతో మూడింటినీ నడపాలి. నడుపుతున్నావు.  ఆ నీ సామర్థ్యం చూసి మూర్తి భరించలేకపోతున్నాడు. మగవాళ్ళకు చాల  అహం ఉంటుంది. కమ్యూనిస్టులైనంత మాత్రానా  అది పోదు. వాళ్ళు మగ కమ్యనిస్టులుగానే ఉంటారు. భార్యలను భార్యలుగానే చూస్తుంటారు. వాళ్ళను మనం మార్చాలి. . దానికి చాలా ఓపిక కావాలి. మీ ఇద్దరి మధ్యా ఉన్న  ప్రేమ  నీకు ఆ ఓపికను ఇవ్వాలి . ఇస్తుంది’’.

మెల్లీ మాటలకు శారదాంబ మనసు కొంత కొంత మెత్త బడింది .

olga title

‘‘మీతో మూర్తి ఈ విషయాలు మాట్లాడాడా?’’

‘‘మాట్లాడాడు. ఒక మగవాడ లాగానే మాట్లాడాడు. నేను చెప్పినది విన్నాడు  గానీ ఎంతవరకు అర్థం చేసుకున్నాడో అనుమానమే. ఎందుకంటే అతన్ని మార్చే శక్తి నీ దగ్గర తప్ప మరెవరి దగ్గం ఉండదు. మా అందరితో పని చేసేటపుడు అడ్డం రాని అహం నీ దగ్గరే వస్తుంది. నువ్వు భార్యవి కాబట్టి. అది చాలా సంప్రదాయ సంబంధం. దానిని మార్చాలి  మనం. ఆలోచిస్తే  నీకే తెలుస్తుంది. రాజీ పడొద్దు. కానీ మాట్లాడు. వివరించు. మూర్తి గ్రహించేలా చెయ్యి. ఎవరి చోటు వారు  నిర్ణయించుకోండి  . ఒకరి చోటునింకొకరు దురాక్రమణ చేయకండి . మొండితనం, పంతాలు  ఎవరికీ మంచివి కావు. వాటిని మీ మధ్యకు రానీయకు. మాట్లాడు. అదొక్కటే మార్గం’’. మెల్లీ మాటలు  మననం చేసుకుంటూ అంది శారద.

‘‘నేను అతని భార్యను కాను. సంప్రదాయం ప్రకారం అసలు  కాను. నన్నతను భార్యలా చూడటం నేనూ భరించలేకపోతున్నాను’’.

‘‘సంప్రదాయం ప్రకారం భార్యవు కాదు – నిజమే. కానీ మూర్తి నిన్నలాగే చూస్తున్నాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళూ అలాగే చూస్తున్నారు. దానిని నువ్వర్థం చేసుకోవ లి. నువ్వు కోటి మందిలో ఒకతివి. కోటిమంది నిన్నర్థం చేసుకోవటం మాటలు  కాదు. నువ్వు కత్తి మీద సాము చెయ్యాలని నాకు తెలుసు. కానీ తప్పదు’’

మెల్లీ మెల్లిగా శారదననునయిస్తూ మాట్లాడింది. శారద తనలోకి తను చూసుకుంటున్నట్టు మెల్లీకి చెప్పింది. ‘‘నేనూ మా ఇద్దరి సంబంధాన్నీ చాలా  ఉన్నతంగా అనుకున్నాను. ‘భార్య’గా ఉండాలని నాకు  లేకపోయినా  లోకమంతా  నన్ను మూర్తి భార్యగానే చూస్తోంది. భార్యగా కొందరూ, ఇంకో విధంగా కొందరూ మొత్తానికి  మూర్తికి నా  మీద మరెవరికీ లేని అధికారం ఉందని చెప్తున్నారు . నేను దానిని అంగీకరించటానికి సిద్ధంగా లేను. మూర్తితో ఆ విషయం స్పష్టంగా చెప్తాను. మేం  ప్రేమికులం . కలిసి బతుకుతున్నాం. ఇద్దరు మనుషులు  కలిసి బతుకుతున్నపుడు ఏవో గొడవలు, అహంకారాలు, అభిప్రాయ బేధాలు  వస్తాయి. వాటి  గురించి మాట్లాడి  ఒకరినొకరు అర్థం చేసుకోగల  పరిణితి మా మధ్యలో ఉంటేనే మా సంబంధం నిలబడుతుంది. అలా కాకుండా తరతరాలుగా  భార్యాభర్తల  మధ్య ఉన్న అధికార సంబంధాన్ని మా మధ్యకు మూర్తి తెచ్చాడా? ఒక్క క్షణం ఆ బంధం నిలవదు. ఆ విషయంలో రాజీ ప్రసక్తే లేదు. నన్ను నేను పోగొట్టుకోలేను.’’

శారద చేతిని తన చేతిలోకి తీసుకుని  ప్రేమగా నొక్కింది మెల్లీ.

‘‘ముందు నువ్వు ఏమిటో అది తెలుసుకో’’.

శారద గలగలా నవ్వేసింది.

‘‘నేనేమిటో నాకు తెలుసు మెల్లీ – నేను ఆధునిక స్త్రీని. అనుక్షణం సమాజంతో తలపడుతూ, దానిని మార్చాలని  తపనపడే ఆధునిక స్త్రీని. సమాజంలోని సకల  సంబంధాలనూ మార్చే గొప్ప పూనికతో పెరిగిన ఆధునిక స్త్రీని. నాకు సంకెళ్ళు లేవని కాదు – నిరంతరం ఆ సంకెళ్ళు తెంచే పనే నాది – ఒక సంకెల  తెగితే మరొకటి వచ్చి పడుతోంది. నేను పోరాడుతున్నాను . జీవిస్తున్నాను. స్త్రీగా, కమ్యూనిస్టుగా, డాక్టర్‌గా, కూతురిగా, తల్లిగా, ఒక పౌరురాలిగా జీవిస్తున్నాను. ఎంత ఘర్షణ మెల్లీ, ఎన్ని పరీక్షలు , ఎన్ని విజయాలు , ఎన్ని అపజయాలు  ఐనా  ఆనందంగా ఉంది. నేను నేనైనందుకు ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. జీవితం అంటే ఇట్లా ఉండాలనిపిస్తోంది. సవాళ్ళతో, సందిగ్ధతతో, ప్రశ్నలతో, సమాధానాలతో, ఎలాంటి సమయంలో జీవిస్తున్నామో  కదా మనందరం’’

వెలుగుతున్న శారద ముఖంలోకి చూస్తూ ఉండి పోయింది మెల్లీ.

***

గమనమే గమ్యం-26

img549

 

olgaశారద ఇంట్లో టెలిఫోను హాల్లో కాకుండా గదిలో ఉంటుంది. శారద ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకోవాలంటే వీలుగా  ఉంటుందనీ, హాల్లో అందరి ముందూ పార్టీకి సంబంధించిన విషయాలు  మాట్లాడటం మంచిది కాదనీ అలాంటి ఏర్పాటు   చేశారు. ఒకరోజు ఉదయం శారద ఆ గదిలోకి వెళ్లేసరికి మూర్తి మాట్లాడుతున్నాడు.

‘‘శారద ఉంది. విషయం ఏమిటో చెప్పండి . ఔనా ? అలాగా? మంచిది. కాముద్ని ఇక్కడ ఉంచటం కంటే మద్రాసు లో  ఉంచటం మంచిది. మానసిక రోగులకు మద్రాసులో మంచి హాస్పిటల్‌ ఉందిగా’’

శారద ఒక్క అంగలో ఫోను దగ్గరకు వెళ్ళి మూర్తి చేతిలో ఫోను తీసుకుంది.

‘‘హాల్లో – జోగయ్యా – చెప్పు. కామేశ్వరరావు కేమయింది’’.

ఐదారు నిమిషాలు  అవతల వ్యక్తి చెప్పేది  శ్రద్ధగా విని

‘‘కామేశ్వరరావుని ఇక్కడ కే తీసుకురండి . ఇక్కడ మా ఇంట్లోనే ఉంటాడు. అతని వైద్యం నేను చూసుకుంటాను. ఏం ఫరవాలేదు. ఇబ్బంది ఉంటే నేను చెప్పనా ?’’ ఫోను పెట్టేసి మూర్తి వైపు చూస్తే  అతనికి ముఖం అవమానంతో తెల్లబోవాలో , కోపంతో ఎర్రబడాలో తెలియనితనంతో తెలుపెరుపుల కలగలుపుతో  ఉంది.

‘‘మూర్తీ –  నా  తరఫున నువ్వు మాట్లాడాల్సిన పని పెట్టుకోకు. అది మనిద్దరికీ మంచిది కాదు. ముఖ్యంగా పార్టీ పనుల  విషయాలు . మన సంబంధం ఎంత దగ్గరిదైనా  నేను పార్టీలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సభ్యురాలిని’’.

అక్కడ నుంచి వెళ్ళిపోతూ ‘‘కామేశ్వరరావుకి పైన మేడమీది గది సిద్ధం చేయమని అమ్మతో చెప్తాను. మనం కొన్ని రోజులు  కింద గదిలోకి మారదాం’’ అంది.

‘‘నీ ఇష్టం’’ మూర్తి కోపాన్ని అణుచుకోటానికి ప్రయత్నిస్తున్నాడు.

శారద అది గమనించినా  గమనించనట్లు బైటికి వెళ్ళిపోయింది.

కామేశ్వరరావు బెంగాల్‌లో కరువు ప్రాంతాలను చూడటానికి వెళ్ళిన ఆంధ్ర బృందంతో  పాటు వెళ్ళాడు. అక్కడ పరిస్థితులను చూసి తట్టుకోలేక మతిస్థిమితం తప్పింది. ఈ కబురు ఈ ఫోన్‌ రాకముందే తెలిసింది. అతన్ని తన ఇంట్లో ఉంచుకుని నయం చేసి పంపాలని శారద అనుకుంది. మూర్తితో చెప్పింది. మూర్తి విని ఊరుకున్నాడు. మూర్తికి అభ్యంతరం ఉంటుందని శారదకు కాస్త కూడా సందేహం  లేదు.

ఇప్పుడు అతన్ని మద్రాసు పంపమనే సలహా ధారాళంగా ఇస్తున్న మూర్తిని చూస్తే కోపం వచ్చింది.

నాలుగైదు రోజులు  ఇద్దరిమధ్యా ముభావంగా, ముక్తసరి మాటలతో నడిచాక  మూర్తి భరించలేక పోయాడు.

‘‘శారదా – ఇది ఇల్లు – హాస్పిటల్‌ కాదు. కామేశ్వరరావుని ఆస్పత్రిలో ఉంచటం మంచిదని నాకనిపించింది. అందులో తప్పేముందో  నా  కర్థం కావటం లేదు’’. శారదకు మూర్తిని చూస్తె  జాలేసింది. ఇన్నేళ్ళుగా తన ఇంటికి సంబంధించిన నిర్ణయాన్నీ తనే తీసుకునే అలవాటున్న వాడు . ఆడవాళ్ళు అమాయకులు , అజ్ఞానులు , బలహీనులు  అనే ఆలోచన బాగానే ఒంటబట్టి ఉంటుంది. తను తీసుకునే తప్పు నిర్ణయాలు  సరిదిద్ది తన ఇంటిని, జీవితాన్ని  చక్కదిద్దాననుకుంటున్నాడు. సున్నితంగా తెలియజెప్పాలి.

‘‘తప్పేంలేదులేవోయ్‌. ఆ విషయం గురించి మనిద్దరికీ వేరు వేరు అభిప్రాయాలున్నపుడు ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయించుకోవాల్సింది. అలా చెయ్యకపోవటం ఇద్దరి తప్పూనూ – మనకిది కాక చెయ్యటానికి చాలా పనులున్నాయి. రేపు కాముడొస్తున్నాడు కూడా – అదుగో అలా ముఖం ఎర్రగా చేసుకోకు. ముద్దొస్తావు’’ అంటూ మూర్తి నుదుటిన ఒక ముద్దు పెట్టి వెళ్ళింది శారద. మూర్తి కాస్త చల్లబడ్డాడు.

మర్నాడు  కామేశ్వరరావు వచ్చాడు . ఇల్లంతా  సందడయింది. అతన్ని చూడటానికి ఎంతమందో వస్తున్నారు. అందరిలో శారద కొందరిని మాత్రమే అతని దగ్గరకు పంపిస్తోంది. అది చాలామందికి కోపం తెప్పించింది.

కామేశ్వరం వున్న స్థితిలో అందరినీ ఒక్కసారి చూడటం ప్రమాదం అని ఎంత చెప్పినా  ముఖం గంటుపెట్టుకునే వెళ్తున్నారు.

శారద హాస్పిటల్‌ పని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగించుకుని కామేశ్వరరావు దగ్గరకొచ్చి కూర్చుంటోంది.

మందుతో పాటు మాట్లాడటం, అతనిచేత మాట్లాడించటం కూడా అవసరం.

మెల్లిగా కామేశ్వరరావు బెంగాల్‌లో తను చూసిన బీభత్సం గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు.

శారద ఆ భీభత్సం వెనకా ఉన్న మానవ క్రూరత్వాన్ని  గురించి, ఆర్థిక కారణాల  గురించి వివరించి చెబుతోంది.

మూర్తికి పార్టీ పనులతోనే సరిపోతోంది. మనసంతా  అసంతృప్తితో నిండి పోతోంది. పార్టీ పనులలో అతనికి సహాయం చేసేవాళ్ళు  తక్కువవుతున్నారు. స్థానిక సమస్యలు  తెలియని వాడు పైనుంచి వచ్చాడని  అసహనం తెలియకుండానే అందరి మనసుల్లో తిష్టవేసుకుంది.

శారదకు పార్టీ పనులు  అసలు  లేవని కాదు గానీ అవి ఆమెకు నల్లేరు మీద నడక. ముఖ్యంగా మహిళా సంఘం పనులు  ఆమె చక్కబెట్టాలి. శారదంటే మహిళా సంఘంలో అందరికీ గౌరవమే. పనులు  చకచకా జరిగిపోతున్నాయి. హాస్పిటల్‌లో శారద ఉందంటే రోగులందరికీ ధైర్యం. గర్భీణీ స్త్రీలకు, ప్రసవానికొచ్చిన స్త్రీలకైతే అదొక ఆటవిడుపులా ఉండేది. శారద నవ్వుతూ, నవ్విస్తూ, గలగలా మాట్లాడుతూ హాస్పిటల్‌ని విశ్రాంతి మందిరంలా చేసేది. శారద లేనపుడు సుభద్రమ్మ ఇంకో పద్ధతిలో వాళ్ళను బాధ్యతగా చూసుకునేది.

ఇంట్లో వంట బాధ్యతలన్నీ సుబ్బమ్మ గారివే. శారదకు ఆ బాధ్యత ఎన్నడూ లేదు. వచ్చేపోయే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు  పరిష్కరించి పంపటమే. పార్టీ నాయకులు  తరచు వచ్చేవారు. శారద అవసరమైతేనే వారితో కూచునేది. లేకపోతే పలకరించి తన పనుల  మీద తాను వెళ్ళేది. ఇంటి ఖర్చుల  వివరాలు  మాత్రం కనుక్కుని డబ్బు ఎంత కావాలో  అంత ఉండేలా చూసేది.

ఇంటికి ఏ వేళప్పుడు ఎవరొచ్చినా  వారి ఆకలి తీరాల్సిందే. మర్యాదలు  జరగాల్సిందే.

మూర్తి ప్రాక్టీసు ఒదిలి వచ్చాడు . అతని ఆస్తి పాస్తులన్నీ మద్రాసులో కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసేందుకు  వీలైనట్టు చేసి వచ్చాడు . అలా చేసేదాకా శారద ఊరుకోలేదు. తరచు మద్రాసు వెళ్ళి రమ్మని మరీ మరీ చెప్పేది .

ఇక్కడ అతనికి ఏ లోటూ లేదు. శారద పేదవారికి  ఉచితంగా వైద్యం చేస్తూ ఇవ్వగలిగిన వారినుంచి వారిచ్చినంత తీసుకునేది. సంపన్న కుటుంబాల  వాళ్ళకు శారద హస్తవాసి మీద నమ్మకం. ధారాళంగానే ఇచ్చేవారు. వాళ్ళింటో పొల్లాలో పండే సమస్త పదార్ధాలు పంపేవారు.

ఇల్లు , హాస్పిటలూ, పార్టీ పనులు  అన్నిటినీ సమర్థతతో శారద నిర్వహిస్తున్న తీరు చూస్తె  మూర్తికి ఒకవైపు సంతోషం. ఇంకోవైపు ఆశ్చర్యం. మరోవైపు తెలియని బాధ. వీటిలో ఎప్పుడు దేనిది పై చేయి అవుతుందో అతనికే తెలిసేది కాదు. దానితో మనసులో ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉండేది. శారద దానినంత గమనించలేదు.

కామేశ్వరరావు ఉన్నన్ని రోజులూ  శారదకు మరో విషయం ఆలోచించటానికి కూడా తీరిక లేకపోయింది. ఒకోరోజు హాస్పిటల్‌కి కూడా వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళూ అతనితో మాట్లాడుతూ కూర్చోవాల్సి  వచ్చేది.

olga title

మూర్తి ఒంటరితనం భరించలేకపోయాడు. శారద తన భార్య అనే విషయం పదే పదే గుర్తొచ్చేది. గుండెలో అహం తన్నుకొచ్చేది. కానీ ఏం చెయ్యాలో తెలిసేది కాదు.

ఒకసారి నాలుగు  రోజులు  వరసగా హాస్పిటల్‌కి వెళ్ళలేదు శారద. మూర్తి పైకి వెళ్ళి గొడవ పెట్టుకోకుండా ఉండలేని స్థితికి వచ్చాడు . మూర్తి మేడ మెట్లెక్కి వస్తుంటే శారద మెట్లు దిగి వస్తోంది.

‘‘ఇవాళ కూడా హాస్పిటల్‌కి వెళ్ళవా ?’’

‘‘ఓపిక లేదు మూర్తీ! రాత్రంతా  కాముడు నిద్రపోనివ్వ లేదు. ఇప్పుడే అతను నిద్రపోయాడు. నాకూ  కాసేపు పడుకుంటే గాని ఓపిక రాదు’’.

‘‘కానీ ఇన్ని రోజులు  వెళ్ళకపోతే హాస్పిటల్‌ ఎలా నడుస్తుంది’’.

‘‘ఏం ఫరవ లేదు. సుభద్ర ఉందిగా. పాపం తనకి డిగ్రీ లేదనే గానీ చాలా అనుభవం. తెలివైనది. నేను చేసినంత తనూ చెయ్యగదు. ఈ నాలుగు  రోజుల్నించీ రోజుకిద్దరు ప్రసవం అయ్యారట. కంగారేం లేదని కబురు చేసింది. నేను సాయంత్రం వెళ్తాను. సుభద్ర నాకు  కుడ భుజం అంటారే అలాంటిది. హాస్పిటల్‌ గురించి నువ్వేం కంగారు పడకు. కాముడు మరో నెల రోజుల్లో మామూలవుత డు. పాపం ఒకటే ఏడుస్తాడు. ఏమన్నా  తినమంటే  ఆకలికి చచ్చినవాళ్ళను తిన్నట్టుందంటాడు. మాటల్లో పెట్టి, చిన్నపిల్లాడి కి చెప్పినట్లు కథలు  చెప్పి తినిపించాలి. నిద్ర పెద్ద సమస్యయింది. కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయతనికి’’ మాట్లాడుతూనే తన గదిలోకి వెళ్ళి పడుకుంది శారద.

మూర్తికి శారద ప్రతిమాటా తప్పుగానే అర్థమైంది.

సుభద్ర హాస్పిటల్‌ చూడటమేంటి? ఆమె పార్టీ మనిషి. పార్టీలో కూడా చాలా బాధ్యతగా పని చేస్తుంది. కానీ ఆమెకు హాస్పిటల్‌ అప్పగించి శారద ఈ పిచ్చివాడి కి అన్నం తినిపించి, నిద్రపుచ్చే అల్పమైన  పనులు  చేయటమేంటి ?

ఇలా దీనిని సాగనియ్య కూడదు. ఇవాళ కాముడు. రేపింకొకడు -ఇప్పటికే బైట గుసగుసలు  వినిపిస్తున్నాయి. మేడమీది గదిలో కామేశ్వరరావు, డాక్టరమ్మ ఉంటుంటే మూర్తిగారు కింద ఉంటున్నారని . తనకు శారద సంగతి తెలుసు. ఊళ్ళో అందరికీ ఏం తెలుసు?

భర్త ఇంట్లో ఉండగా తను వేరే మగాడితో వేరే గదిలో రాత్రింబగళ్ళూ గడుపుతుందంటే ఏమనుకుంటారు? అది శారదకెందుకు అర్థం కాదు. దీనిని ఎక్కడో ఒకచోట ఆపాలి.

ఇల్లూ , ఊరూ అంత హడావుడిగా ఉంది. బెంగాల్‌ కరువు గురించి సభ్యులు , నాటక ప్రదర్శనలు , బుర్ర కథలు …

ఈ హడావుడి  కొంత తగ్గాక ఒకరోజు మూర్తి సుభద్రను పార్టీ ఆఫీసుకి రమ్మని కబురు చేశాడు.

సుభద్ర పార్టీ ఆఫీసు నుంచి పిలుపు  అనగానే కాళ్ళు తొక్కుకుంటూ వచ్చింది. తీరా మూర్తి చెప్పింది వినగానే ఆమెకు చాలా సంతోషమనిపించింది.

‘‘ఆస్పత్రిలో ఉద్యోగం మానేసి పూర్తి కాలం  పార్టీ కార్యకర్తగా పనిచేయటానికి వచ్చెయ్యాలి’’.

సుభద్రకు పార్టీ అంటే ప్రాణం కన్నా  ఎక్కువ. పార్టీ కోసం ఏం చెయ్యటానికైన ఆమె సిద్ధమే. అలాంటిది పార్టీనే లోకంగా బతకటమంటే సుభద్రకు అంత కంటే కావలసింది ఏముంది. కానీ ఆస్పత్రి పనీ ఇష్టమే. అక్కడా తను అవసరం. అందువల్ల  తటపటాయించింది.

‘‘డాక్టరు గారితో ఒక్కమాట చెప్తాను. తర్వాత  నిర్ణయం తీసుకుంటా. మా ఆయనతో కూడా చెప్పాలనుకోండి . కానీ ఆయన కాదనరని నా  నమ్మకం’’. ఒక రకమైన ఉద్వేగంలో ఉంది సుభద్ర.

‘‘చూడమ్మా. డాక్టరుగారు కూడా పార్టీ ఆదేశానికి కట్టుబడి  ఉండాల్సిందే. నేను ఆమె భర్తనే కాదు. జిల్లా పార్టీ  నాయకుడనని నీకు తెలియదా? నేను నిర్ణయించి చెప్తున్నాను. నువ్వింకెవరినీ అడగక్కరలేదు. ఎవరి అనుమతీ తీసుకోనవసరం లేదు. పార్టీ నిర్ణయం. ఔనంటావా ? కాదని పార్టీని ధిక్కరిస్తావా ?’’

సుభద్ర కంగారుపడి పోయింది. పార్టీ ఆదేశం ధిక్కరించటమే! ప్రాణం పోయినా  తనా  పని చెయ్యదు.

‘‘నాకు ఇష్టమే నండీ. మీరే పని ఇస్తే అది చేస్తాను.’’

మూర్తి ఆమెకు ఆ క్షణం నుంచే పని చెప్పాడు. ఇట్నించి ఇటే ఆమె మహిళా సంఘానికి సంబంధించిన పని కోసం వెళ్ళాలి. ఆస్పత్రికి గానీ, ఇంటికి గానీ వెళ్ళే అవకాశం లేదు. పని పూర్తి చేసుకుని రాత్రికి ఇల్లు  చేరుకోవచ్చు. సుభద్ర వెళ్ళిపోయాక మూర్తి బాధ, భయం, సంతృప్తి , ఉపశమనం ఇన్ని కలిసిన మనసుతో ఏ పనీ చెయ్యలేక పుస్తకం తీసి మనసు లగ్నం చేయటానికి ప్రయత్నిస్తూ కూర్చున్నాడు.

సాయంత్రం హాస్పిటల్‌కు వచ్చిన శారద అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. ఇద్దరు స్త్రీలు  నొప్పులు పడుతున్నారు. పట్టించుకునేవాళ్ళు లేరు. ఉన్న ముగ్గురు నర్సులు  ప్రసవానికి సంబంధించిన అనుభవం ఉన్నవ ళ్ళు కాదు. మరో ఆలోచన లేకుండా వాళ్ళిద్దరినీ లేబర్‌ రూం చేర్పించింది. ఇద్దరినీ హుషారు చేస్తూ, అనునయిస్తూ ప్రసవం స్త్రీ శరీరంలో చేయగల ఎంత గొప్ప కార్యమో బోధిస్తూ వారి నుదుటి మీద ముద్దు పెడుతూ వారిని సిద్ధం చేసింది.

ఇద్దరూ కనేసరికి దాదాపు మూడు గంటలు  పట్టింది. ఒక్కతే అక్కడ పనంత సంబాళించుకునే సరికి మరో గంట పట్టింది.

బైటికి వచ్చి చూస్తె  ఆ రోజు డాక్టరు గారి దగ్గర చూపించుకోటానికి వచ్చిన వాళ్ళతో హాలు , వరండా కిటకిటలాడ పోతున్నాయి.

చక, చకా ఒక్కొక్కరినే నవ్వుతూ పలకరిస్తూ ‘‘అలా చేస్తే  ఎలాగోయ్‌ నీ ఆరోగ్యం గురించి నువ్వే పట్టించుకోకపోతే ఎవరికి పడుతుంది. వేరే ఏమీ చెయ్యొద్దు. రోజూ అన్నంలో ఆకుకూర పప్పో, పచ్చడో చేసుకు తిను. సాయంత్రం ఒక వేరుశనగ పప్పుండ తిను. నెల రోజుల్లో నీరసం, గీరసం ఎగిరిపోతుంది. రక్తం పట్టాలోయ్‌ నీకు’’.

‘‘మా ఆయన ఆకుకూర ఇంట్లోకి రానివ్వడు’’.

‘‘నువ్వు తిను. ఆయనకు పెట్టకు’’.

‘‘అలా ఎలా కుదురుతుంది డాక్టరు గారూ ` ’’

‘‘ఎందుకు కుదరదు. గుప్పెడు కూర నీ కోసం నువ్వొండుకోలేవా ? ఇంటిల్లిపాదికీ వంట చేస్తావు. ఈ స్వతంత్రం లేదా ` మీ ఇల్లెక్కడ?’’

‘‘మీ ఇంటి దగ్గరేనండి ’’

‘‘ఇంకేం రోజూ పన్నెందింటికి మా ఇంటికి – ఎవర్నయిన పంపు. నీకు కావసిన ఆకుకూర మా అమ్మ చేయించి పెడుతుంది. అట్లాగే ఒక పప్పుండ ఇస్తుంది. సరేనా ?’’

వెంకమ్మ లేచి శారద రెండు కాళ్ళూ పట్టుకుంది.

‘‘ఛీ! ఛీ! అదేం పనోయ్‌. నువ్వు వెళ్ళు. బైట ఎంత మందున్నారో చూశావుగా’’.

వెంకమ్మ లాంటి ఎందరికో శారద అంటే పిచ్చి ఆరాధన. పనంతా  ముగించుకుని చిన్న నర్సు సరస్వతిని అడిగింది.

‘‘సుభద్రమ్మకి ఏమయింది? ఒంట్లో బాగాలేక ఇంటికెళ్ళిందా?’’

‘‘తెలియదమ్మా. మధ్యాహ్నం ఎవరో వచ్చి పిల్చుకెళ్ళారు. పార్టీ ఆఫీసుకి వెళ్తున్నాను. అరగంటలో వస్తానంది. మళ్ళీ రాలేదు.’’

దానిని గురించి శారద పెద్దగా ఆలోచించలేదు. ఇంత సమయం పడుతుందనుకుంటే ఎవరో ఒకరి చేత తనకు కబురు

చేసే పని గదా అనుకుని ‘‘ఒకోసారి అదీ కుదరదు. అందరం ఎంత కష్టపడుతున్నాం. ఇల్లు, పని, పార్టీ పని, సుభద్రకు పిల్లలు  కూడా. ఎంత ఓపికగా అన్నీ చక్కదిద్దుకుని వస్తుందో. తనకు ఇంట్లో అమ్మ ఎంత అండగానో ఉంది కాబట్టి గానీ ` ’’ అనుకుంటూ ఒకసారి హాస్పిటల్‌లో ప్రసవమయ్యి ఉన్న వారినీ, ప్రసవానికని వచ్చి చేరిన వారినీ పకరించి, వారిని నవ్వించి ఇంటికి బయల్దేరింది.

ఇల్లు  చేరేసరికి అలసట కమ్ముకొచ్చింది. అన్నం కూడా తినకుండా నిద్రపోవాలనిపించింది. కానీ మూర్తీ సుబ్బమ్మ ఊరుకోలేదు. మూర్తి మరీ మరీ బుజ్జగించి తినిపిస్తుంటే సుబ్బమ్మ ముసిముసిగా నవ్వుకుంటూ అవతల గదిలో కూచుంది. కడుపు నిండేసరికి శారదకు ఉత్సాహం  వచ్చింది. గబగబా లేచి తాంబూలం  చుడుతూ

‘నను పాలింప నడచి వచ్చితివో  నా  ప్రాణ నాధ’ అంటూ త్యాగరాజ కృతి  అందుకుంది. మూర్తి గొంతు కలిపాడు.

‘వనజనయన మోమును జూచుట జీ

వనమని నెనరున ` మనసు మర్మము దెసి’

అని అతను పాడితే ` మళ్ళీ పల్లవి  శారద అందుకుంది.

ఇద్దరి మనసుల్లో పట్టరాని  ప్రేమ. మూర్తి శారద చుట్టూ చేతులు  వేసి నడిపిస్తూంటే శారద ఒళ్ళూ, మనసూ పులకరించింది.

‘‘మూర్తి  ప్రేమ  ఉంటే చాలు . ఎంత పనైన చేసేస్తా’’ అనుకుంది. అతని కౌగిలిలో నిశ్చింతగా నిద్రపోయింది.

మర్నాడు  ఇద్దరూ కాఫీ తాగుతూ ముచ్చటించుకుంటూ ఉన్నారు.

‘‘నిన్న ఎంత అలిసిపోయానో – సుభద్ర లేదు. పనిమీద వెళ్తున్నానని  నాకు  కబురు చెయ్యనూ లేదు. రెండు కాన్పులు . యాభై మందికి పైగా జనం. నువ్వు చేసిన ఉపచారం వల్ల గానీ లేకపోతే ఇవాళింత హుషారుగా లేవలేకపోయేదాన్ని’’.

‘‘ఉపచారము చేసే వారున్నారని  మరువకుమా’’ అన్నాడు  మూర్తి.

‘‘మరువకురా – త్యాగరాజు  కీర్తనలో ఒక్కక్షరం కూడా మనం మార్చకూడదు’’. సీరియస్‌గా అంది శారద.

‘‘సరేం ’’ అన్నాడు  మూర్తి సరదాగా. ఇద్దరూ నవ్వుకుంటూ లేచారు. వరసగా రెండు రోజు సుభద్ర  రాలేదు. శారదాంబ ఇక ఊరుకోలేక సుభద్ర ఇంటికి వెళ్ళింది.

ఇంట్లో సుభద్ర లేదు. ఆయన పిల్లలకు  ఒండి పెడుతున్నాడు. శారదను చూసి హడావుడి  పడుతూ ఏం చెయ్యాలో తెలియనట్టు నుంచున్నాడు.

‘‘సుభద్ర లేదా?’’

‘‘లేదు. పార్టీ పనిమీద మచిలీపట్నం వెళ్ళింది.’’

‘‘పార్టీ పని మీదా ` ’’

‘‘ఔనమ్మా. ఇప్పుడామె కూడా నాలాగే పూర్తికాలం  కార్యకర్త కదా. ఇద్దరం అవస్థ పడుతున్నాం . కానీ అలవాటవుతుందిలే ` ’’

‘‘నాకు  చెప్పనే లేదు’’.

‘‘ఎక్కడమ్మా – మూడ్రోజుల నాడు  పార్టీ ఆఫీసు నుంచి వచ్చి రెండు చీరలు  సంచీలో పెట్టుకు వెళ్ళింది. రేపు పొద్దున వస్తుంది. నాకే  ఏ సంగతీ సరిగా తెలియదు. పిల్లకు  ఆమెనొదిలి ఉండటం అలవాటులేక తిప్పలు  పెడుతున్నారు.’’

శారదకు మనసంత చేదయింది. ఇదంత మూర్తికి తెలుసు . తెలియటమేమిటి అతనే చేసి ఉండాలి. ఒక్కమాట తనకు చెప్పలేదు. చెప్పే  వ్యవధానం సుభద్రకు ఇవ్వలేదు.

‘‘రేపొకసారి సుభద్రను రమ్మన్నానని చెప్పండ ’’ అంటూ బైటికి నడిచింది. మూర్తితో ఈ విషయం మాట్లాడాలని కూడా అనిపించలేదు శారదకు. మనసు ఎడారయినట్లయింది.

అతనింత పని చేసి ఆ రోజు రాత్రి తనతో –

కళ్ళల్లోకి నీళ్ళు చిమ్ముకొచ్చాయి. తమాయించుకుంటూ ఆస్పత్రికి వెళ్ళింది. వెళ్ళేలోపే  గుండె దిటవు చేసుకుంది. సుభద్ర తనకు కుడి  భుజమే – కానీ తను ఎడం చేతితో ఎక్కువ పనులు  చేస్తుంది. చేసుకోగలుగుతుంది. ప్రాక్టీసు పెట్టిన దగ్గర నుంచీ ఉన్న సుభద్రకు అన్నీ తతెలుసు. పోన్లే – పార్టీలో ఎదుగుతుంది – సుభద్ర గురించి కాదు – మూర్తి సంగతేమిటి?

***

గమనమే గమ్యం -25

 

img549

 

 

బెంగాల్‌ కరువు గురించి చిన్నగా మొదలైన వార్తలు  కొన్ని రోజుల్లోనే దేశాన్ని ఒణికించేంత పెద్దవయ్యాయి. బెంగాల్‌ ప్రజలకు సహాయం చెయ్యాలనే ప్రచారంతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు కమ్యూనిస్టు యువతీ యువకులు. వారిలో కొందరు పాటలు రాశారు. మరికొందరు నాటకాు తయారు చేశారు. కొందరు ఒక బృందంగా  ఏర్పడి బెంగాల్‌ వెళ్ళి కరువుని స్వయంగా అధ్యయనం చేయాలనీ, దానితో పాటు వాలంటీర్లుగా అక్కడ పని చేయాలనీ నిశ్చయించుకున్నారు. ఆ బృందం లో  కామేశ్వరం వు ఉన్నాడని  తెలిసి శారదకు ఆందోళనగా ఉంది.

కామేశ్వరరావు శారదకు మంచి స్నేహితుడు. మేధావి. బాగా చదువుతాడు. శారదతో దీటుగా చర్చలు  చేయగల  సామర్థ్యం ఉన్న వాడు. కానీ అతి సున్నిత హృదయుడు. ఎదుటివారు బాధపడుతుంటే చూడలేడు. వారి కళ్ళు తడి  కాకముందే ఇతని చెంపలు  కన్నీటితో తడిసిపోత యి. అలాగే హటాత్‌ నిర్ణయాలు  తీసుకుంటాడు. కొన్ని రోజులు  ఎవరికీ కనపడకుండా ఎటో వెళ్ళిపోతాడు. ఇలాంటివాడు ఆ కరువు దృశ్యాలు  చూసి భరించగలడా అని శారదకు భయం వేసింది. వార్తల్లో చదువుతుంటేనే ఒళ్ళు జలదరించి, అన్నం సహించటం లేదు. కామేశ్వరావు అవన్నీ చూసి మనిషిలా తిరిగి రాగలడా అనిపించింది. కానీ ఏం లాభం ఎవరు చెప్పినా  వినే మనిషి కాదు. ఈ బృందంతో వెళ్ళకుండా బలవంతంగా ఆపినా  ఒక్కడే ఏదో ఒకరోజు కలకత్తా రైలు  ఎక్కేయగల  సమర్థుడు. దానికంటే పదిమందితో కలిసి వెళ్ళటమే నయం అనుకుని ఆందోళన అణుచుకుంది.

olgaఅణుచుకోలేని సమయంలో మూర్తితో చెబితే ‘‘నువ్వు ఇన్ని విషయాలు  ఎందుకు పట్టించుకుంటావు. ఒకవైపు ప్రజాయుద్ధ ప్రచారం. మహిళా సంఘం సభ్యులు . నీ హాస్పిటలు , పార్టీ సమావేశాలు  వీటన్నిటితో మళ్ళీ కామేశ్వరరావు ఏమవుతాడు? సోమేశ్వరరావు  ఏమవుతాడు అని ఒక్కొక్కరి గురించి పట్టించుకుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది. ఒక మనిషి చేసే  పనులేనా  నువ్వు చేసేది? అందరి బాధ్యతలూ  నువ్వేనా  మోసేది? కామేశ్వరరావు సంగతి తరువాత,  కాస్త నటాషా గురించి కూడా ఆలోచించు’’ అని మనసులో కోపమంత వెళ్ళగక్కి వెళ్ళాడు.

శారద ఈ ఉరుములేని పిడుగుల  జడి కి ఆశ్చర్యపోయింది? ఏమయింది మూర్తికి? ఏదో జరిగింది. లేకపోతే ఇంత ఉద్రేకపడడు అనుకుని మేడమీది నుంచి కిందకు దిగింది. కింద సుబ్బమ్మ నటాషాని ఎత్తుకుని నిలబడి ఉంది.

‘‘డాక్టరుగారి కూతురికి కాస్త ఒళ్ళు వెచ్చబడింది. డాక్టరు గారి మొగుడికి కోపం వచ్చింది’’ అన్నది తమాషాగా.

శారదకంతా అర్థమైంది. నటాషాను ఎత్తుకుని మేడమీదికి వెళ్ళి మందు తాగించి  నిద్రబుచ్చి మళ్ళీ భుజాన వేసుకుని వచ్చి తల్లికప్పగించింది.

‘‘ఇవాళ అన్నం పెట్టకమ్మా. పాలు చాలు . రేపటికి తగ్గిపోతుంది’’.

‘‘నీ కూతురి గురించి మీ ఆయనకు దిగులు . నా  కూతురి గురించి నాకు దిగులు.   మరీ పనులెక్కువవుతున్నాయి. తిండి  తినటం లేదు. నిద్ర పోవటం లేదు. ఎట్లాగమ్మా ఇట్లాగయితే’’.

‘‘ఏం ఫరవాలేదమ్మా. మా అమ్మ నా  పొట్ట మాడనివ్వదు. ఎలాగోలా నిద్రబుచ్చుతుంది’’.

సుబ్బమ్మ నవ్వి ‘‘మాటలు  చెప్తావ్‌. మూర్తి మాత్రం బాగా దిగుపడుతున్నాడు. అతను మద్రాసు నుంచి వచ్చినా  నీకు తీరిక దొరకదు. అక్కడున్నా  నీ గురించిన బెంగే కదా –  పాపం. పిల్ల కూడా నన్ను ఒదిలి తొందరగా అతని దగ్గరకు పోదు. ఈ దిగుళ్ళతో సతమతమవుతున్నాడు. తనూ ఇక్కడ కే వచ్చేస్తానంటున్నాడు.

‘‘వచ్చి ఇక్కడేం చేస్తాడు. మద్రాసు పనులు  ఎవరికి అప్పజెప్పి వస్తాడు? అతనిక్కడకి వస్తే నాకు  మాత్రం కాస్త తెరిపిగా ఉండదా? కానీ పరిస్థితులు  గందరగోళంగా ఉన్నాయమ్మా. అందరం సర్దుకుపోవాలి’’ అంటూ హాస్పిటల్‌కి వెళ్ళింది శారద.

మూర్తి బెజవాడకు వచ్చి పూర్తికాలం  ఇక్కడ పార్టీ పనులు  చూసుకోమంటున్నామని రాష్ట్ర కమిటీ నుంచి వార్త వచ్చిన రోజు శారద సంతోషించింది. ముఖ్యంగా నటాషా మూర్తి దగ్గరవుతారనీ నిశ్చింతగా అనిపించింది. ఇంట్లో వచ్చిన ఈ మార్పే కాదు బైట వాతావరణంలో కూడా మార్పు వస్తోంది.

ప్రపంచ యుద్ధంలో హిట్లరు పరాజయం  తప్పదని గట్టిగా రుజువవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ క్విట్‌ ఇండియా ఉద్యమంతో ప్రజలకు దగ్గరవుతుంటే కమ్యూనిస్టులు  ప్రజాయుద్ధ పంథాతో దగ్గర అయ్యారు. అది పై తరగతి మధ్య తరగతి వర్గం లో  ఎక్కువ కనిపిస్తోంది. కృష్ణా , గుంటూరు ప్రాంతంలో చిన్న రైతులలో, కూలీలలో కూడా వారు గట్టి పట్టు సంపాదించారు. క్విట్‌ ఇండియా అంటున్న ప్రజల  మనసుల్లో కూడా సోవియట్‌ యూనియన్‌ గురించి ఆసక్తిని పెంచారు. దాని ద్వారా సోషలిజం అనే భావనను బలం గా వ్యాపింప చేయగలిగారు. శారదాంబ, ఆమె చుట్టూ ఉన్న మహిళా బృందం చేసే  పనులు  మామూలు  ప్రజలకు ఆశ్చర్యంగా ఉండేవి కానీ వారి  పట్ల విముఖత కలగలేదు. ఒకవైపు బోసు, మరొకవైపు గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌, ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నా, కమ్యూనిస్టు భావనలు  ప్రజలకు దగ్గరయి కమ్యూనిస్టుల  మీద గౌరవం పెరిగిందంటే అది శారద, రామకృష్ణయ్య, ఈశ్వరయ్య, వెంకట్రావు, సూర్యావతి  వంటివాళ్ళ నాయకత్వ ప్రభావమే.

జర్మనీ ఓడిపోయిన రోజున పెద్ద పండగలా ప్రజలో ఉత్సాహం  నింపగలిగారు.

olga title

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత  మొదలైంది అసలు  సమస్య. ప్రజలలోకి ఎట్లా వెళ్ళాలి. ప్రజాయుద్ధ పంథా తర్వాత  ఆంధ్రప్రాంతంలో కార్యక్రమం ఏమిటి? ఈ చర్చలు  జరుగుతుండగానే ఒకవైపు ఎన్నికలు , ఇంకోవైపు తెలంగాణాలో నైజాం వ్యతిరేక పోరాటం లో  పెరుగుతున్న కమ్యూనిస్టు పార్టీ ప్రాబ్యల్యం , బెంగాల్‌లో కరువు గురించి పట్టించుకుని పని చేయాలనే నిర్ణయం, వీటన్నిటికీ తోడు కళా సాహిత్య రంగాల  ద్వారా  ప్రజల కు దగ్గరయ్యే కార్యక్రమాలు , రచయిత సంఘాల  ఏర్పాట్లు , నాటకాలు  –  ఒకటి కాదు ఆలోచించుకునే వ్యవధానం లేకుండా పనులు  వచ్చి మీద పడుతున్నాయి.

మూర్తి మద్రాసు నుంచి బెజవాడకు వచ్చేసిన రెండు నెలలకు అప్పటివరకూ శారద చూస్తున్న కృష్ణాజిల్లా బాధ్యతలు  మూర్తికి అప్పగించింది పార్టీ.

శారదకు ఆ మార్పెందుకో అర్థం కాలేదు.

‘‘నువ్వు కొత్తగా వచ్చావు. ఇక్కడ పరిస్థితుల  గురించి అవగాహన లేదు. పార్టీ నిన్ను గౌరవించటానికన్నట్లు, నీకో పని చూపటానికన్నట్లు ఈ బాధ్యత ఇచ్చిందనుకో -నువ్వెట్లా ఒప్పుకున్నావు? నా  వల్ల  కాదని ఎందుకు చెప్పలేకపోయావు?’’

శారద ప్రశ్నకు మూర్తి దగ్గర సమాధానం సిద్ధంగానే ఉంది.

‘‘నువ్వు చాల  అలిసిపోతున్నావు శారదా –  ఒకవైపు నీ ప్రాక్టీసు. ఇంకో వైపు మహిళా ఉద్యమం. ఇప్పుడు తల్లివయ్యావు. వీటన్నిటితో జిల్లా అంతటినీ నీ భుజాల కెత్తుకోవటం కష్టం. నా భుజాలు  ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ విషయాలు  నీ ద్వారా నాకు చాలా వరకు తెలుసు. తెలియనివి తెలుసుకుంటాను. పార్టీ నిర్ణయం వెనక కూడా ఇవన్నీ ఉన్నాయి’’.

‘‘గృహిణి ` భార్య, తల్లి ఈ పదాలు  నాకు నప్పవు. నచ్చవు. నువ్వు నా  జీవితంలోకి వచ్చినందువల్ల నా  జీవితం ఏమీ మారదు. మారనవసరం లేదు’’. విసుగ్గా అంది.

‘‘మారుతుందో మారదో ఆ సంగతి ముందు ముందు తెలుస్తుంది గానీ, నీకు బాధ్యతలు  పెరిగి పోయాయి. డాక్టర్‌గా నువ్వు చెయ్యవలసినంత చెయ్యలేకపోతున్నావు. నాకు  ఈ జిల్లా పనుల గురించి తెలియజెప్పటానికి నువ్వున్నావుగా’’ శారదకు ఏదో చికాకు మనసంతా – కానీ పార్టీ నిర్ణయాన్ని కాదనటం తేలిక కాదు. తను జిల్లా పార్టీ నాయకత్వం ఒదల కూడదని కాదు – తన స్థానంలో రావటానికి అర్హులైనవారు చాలామంది ఉన్నారు . సుబ్బారావుగారే ఉన్నారు. చాలా కింది స్థాయి నుంచీ  పైకి వచ్చిన కార్యకర్త. నిజమైన కమ్యూనిస్టు. ఊరికే మాటలు  చెప్పి తప్పించుకునే మనిషి కాదు. తన జీవితంలో ఆచరించే వ్యక్తి. మూర్తికి జిల్లా బాధ్యత అప్పగించటమంటే కేవలం  తన భర్త కాబట్టే – తమ పెళ్ళి కాకపోతే అతనిక్కడకి రానే రాడు కదా – ఇంత స్పష్టంగా కనపడుతున్న విషయానికి మూర్తి కళ్ళెందుకు మూసుకున్నాడు.

ఏదేమైన పార్టీ నిర్ణయించినపుడు తనకు ఇన్ని ఆలోచను అనవసరం అని అక్కడ తో సమాధానపడింది శారద.

***

సత్యవతి నాదెళ్ళ వారి పాలెంలో మహిళాసంఘం సభ తర్వాత  వాళ్ళన్నయ్య దాసుని కలిసింది. దాసు పార్టీ నాయకులతో మాట్లాడ ఆమెను రాజమ్మతో కలిసి పార్టీ ఆఫీసు వెనక గదిలో ఉండి మహిళా సంఘం పనులు  చేసేలా ఏర్పాటు  చేశాడు. రాజమ్మది, సత్యవతిది దాదాపు ఒకే వయసు. కాస్త రాజమ్మే పెద్దదేమో. ఇద్దరూ బాగా కలిసి పోయారు. రాజమ్మ చుట్టు పక్కల గ్రామాలన్నీ తిరిగి మహిళా సంఘ ఆశయాలు  వివరిస్తూ మహిళలను సమీకరించే పని చేస్తోంది.

సత్యవతికి బెజవాడలో మహిళా సంఘం పనులు  కొన్ని అప్పగించి రాజకీయ శిక్షణ కూడా ఇచ్చేలా ఏర్పాటు  చేశారు. చెరొక 20 రూపాయలు  నెలకు ఇచ్చేవారు. అద్దె, భోజనం, మిగిలిన ఖర్చులన్నీ అందులోనే. రాజమ్మకు గ్రామాలకు వెళ్ళినపుడు అక్కడ మంచి భోజనం దొరికేది. సత్యవతికి వంట సరిగా రాదు. మొదట్లో అవస్థ అయినా  రానురానూ  అలవాటు పడింది . పార్టీ ఆఫీసులో, మహిళా సంఘంలో చురుగ్గా పని చేస్తూ, కుదురుగా ముచ్చటగా ఉంటూ, ఎంతో సంస్కారంతో మాట్లాడే సత్యవతి పార్టీ సానుభూతిపరులైన కొందరి యువకుల మనసుల్లో కల్లోలం  రేపింది. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనే కోరికను పార్టీ పెద్దతో చెప్పారు. అవివాహిత బాధ్యత పెద్ద బాధ్యత అని పార్టీ భావించేది. వాళ్ళకు పెళ్ళి చేస్తే  తమ గుండె మీది బరువు తగ్గి, వాళ్ళ తిప్పలు  వాళ్ళు పడరారు అనే భావన తెలిసీ తెలియకా అందరిలో ఉండేది. దానితో సత్యవతికి ఇక్కడ కూడా సంబంధాలు రావటం మొదలైంది. సత్యవతి ప్రతి సంబంధాన్నీ తిరస్కరింఛి  పార్టీ నాయకులకు చికాకు, అనవసరమే అయినా  వచ్చింది.

ఈ సత్యవతి సంగతేమిటో తేల్చమని మహిళా సంఘ నాయకులకు ఆదేశాలిచ్చారు. అది శారద వరకూ వచ్చింది. శారద జరిగిందంతా తెలుసుకొని  నిర్ఘాంత పోయింది . ‘‘సత్యవతి పెళ్ళి తప్పించుకుని చదువుకోవాలని  వస్తే  చదువు గురించి ఆలోచించకుండా సంవత్సరంలో నాలుగైదు  పెళ్ళి సంబంధాలు  ఆమె ముందు పెట్టటం ఏమిటి? ఆ అమ్మాయి ఒద్దంటే ఈ అమ్మాయికి ఎవరూ నచ్చరేమిటని కోపగించుకుని అదొక చర్చ చేయటమేమిటని అందరినీ మందలించి – మీకు వీలైతే ఆ అమ్మాయిని బెనారెస్  మెట్రిక్‌కు తయారు చేయండి . లేదంటే జనరల్‌ పుస్తకాలు  చదువుతూ ఆ అమ్మాయి తనే తంటాలు  పడ చదువుకుంటోంది. మహిళా సంఘంలో పని చేస్తుంది కాబట్టి ధైర్యం, ఆత్మ విశ్వాసం లోకజ్ఞానం పెరుగుతాయి. ఆ పిల్లకు పదహారేళ్ళే – చిన్నపిల్ల. ఇది కూడా బాల్య  వివాహమే’’ అంటూ బాగా చికాకు పడింది .

శారద మాట్లాడిన తర్వాత  ఇక సత్యవతికి పెళ్ళి చెయ్యాలనే ఆలోచన అందరూ మానుకున్నారు. సత్యవతి నిశ్చింతగా తన పని తాను చేసుకుంటోంది. ‘కన్యాశుల్కం ‘ నాటకం, ‘‘పూర్ణమ్మ’’ గేయ రూపకం సాంస్క తిక బృందాల  ప్రదర్శనల్లో ముఖ్య భాగమైపోయాయి. పార్టీ సభ్యులు  స్వయంగా నటించి కన్యాశుల్కం  నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు. సుభద్ర, సుబ్బారావు దంపతు, కోటేశ్వరమ్మకు కన్యాశుల్కం  నాటకంతో బాగా పేరొచ్చింది. అంతకు ముందొకసారి ముసలి మొగుడి ని పెళ్ళి చేసుకోమనే అర్థం వచ్చే పాటులు  పాడారని మహిళా సంఘం వాళ్ళని తిట్టి మీకు ముసలివాళ్ళు పనికిరారా  అంటూ అర్థం లేని  మాటలు  మాట్లాడిన కార్యకర్తలకు బాల్య వివాహాల   గురించి, వాటి చెడు ఫలితాల   గురించి అర్థమైంది. అలాంటి మాటలు  వినిపించటం లేదు. రచయిత సమావేశాలు  తరచు జరగటంతో ఆంధ్రా ప్రాంతం లో  ఒక చైతన్యం వ్యాపించింది . అది రాజకీయాలకు సంస్కారాన్ని జతగలపటంతో కమ్యూనిస్టులంటే సంస్కారవంతులనీ, స్త్రీలను గౌరవిస్తారనే అభిప్రాయం సామాన్య జనం  లో కూడా ఏర్పడింది.

***

 

 

 

 

 

గమనమే గమ్యం-23

olga title

olga

 

శారదనూ, మహిళా సంఘ సభ్యులనూ నిరాశ లో  ముంచే వార్త మూడో రోజుకే చేరింది.

ఆ రోజు శారద ఉదయాన్నే సరోజినీ నాయుడి  కి ఫోను చేసింది. ఫోను ఎవరు ఎత్తారో  కూడా చెప్పకుండా శారద పేరు వినగానే ‘‘సరోజినిదేవి గారి రెండో అబ్బాయి నిన్న మరణించాడు . ఆవిడ కార్యక్రమాన్నీ రద్దు చేసుకున్నారు  అని చెప్పి ఫోను పెట్టేశారు.

శారద మనసు ఆ తల్లి కోసం కొట్టుకుంది. వెళ్ళి చూడాలనిపించింది గానీ కాటూరు సభ వారంలోకి వచ్చింది. పనులు . పనులు . పనులు . మెల్లీతో ఈ విషయం చెప్పి, మహిళా సంఘం ఆఫీసుకి కబురు చేసి ఆస్పత్రికి వెళ్ళింది.

కాటూరు మహిళా రాజ్యమా  అన్నట్లుంది. ఎక్కడెక్కడ నుంచోవచ్చారు స్త్రీు. ఎన్ని ఆశలో. ఎంత సంబరమో. ఎంత ఆకలో జ్ఞానం కోసం. నాయకులు  చెప్పే  మాటలు  విన్నారు  ఒళ్ళంతా చెవులు  చేసుకుని. శారద ఉపన్యాసాన్ని  తాగేశారు. పాటలు  పాడారు. బుర్ర కథలు  చెప్పారు. నాటకాలు  వేశారు. దేశ స్వాతంత్ర్యం, రైతు విముక్తి, మహిళ హక్కు సాధిస్తామని ప్రతిజ్ఞలు  చేశారు.

శారద స్త్రీలను ప్రత్యేకంగా సమావేశపరిచి ఆరోగ్యం, శరీరం గురించి మాట్లాడింది .

‘‘మగవాళ్ళందరూ రాజకీయాలు  మాట్లాడుతుంటే మనం ఈ విషయాల  గురించి మాట్లాడటమేమిటని అనుకుంటున్నారా  ?

గురజాడ ఏమన్నాడు ?  ‘‘తిండ కలిగితె కండ కలదోయ్‌, కండ గల  వాడేను మనిషోయ్‌’’ అన్నాడా? ఆయన మగవాళ్ళ  గురించి చెప్పినట్లున్నా  మనిషి అన్నాడు  గదా – అంటే మనుషులకు తిండి , బలమైన శరీరం కావాలి. మనకు బలమైన శరీరం  లేకపోవటమంటే రాజకీయాలు  సరిగా నడవటం లేదని అర్థం. మనకు సరైన తిండి  లేదంటే, ఉన్నా  తెలియని అజ్ఞానంలో మనం తినటం లేదంటే ఆడ వాళ్ళు బలహీనంగా ఉండాలని ఎవరో రాజకీయ కుట్ర చేస్తున్నారన్నమాట. మనం ఆరోగ్యంగా లేమంటే ఎవరో  కావాలని మనల్ని అనారోగ్యంలో ఉంచే రాజకీయాలు  నడుపుతున్నారన్నమాట. మన ఆరోగ్యం, శరీరం గురించి మాట్లాడటమంటే చిన్న విషయం కాదు. స్వతంత్రం పొందటమంత పెద్ద విషయం’’ ఒకొక్క విషయాన్నీ నవ్వుతూ నవ్విస్తూ చెప్పే  శారద మాటలంటే ఆడవాళ్ళందరికీ ఎంత ఇష్టమో. చాలా శ్రద్ధగా విన్నారు. మహాసభలయ్యేసరికి మరో కార్యక్రమం ఎదురు చూస్తూనే ఉంటుంది శారదను తనలోకి లాక్కోటానికి.

యుద్ధం రోజుల్లో రోజూ ఏదో ఒక హడావుడి  . శారదాంబ ఇంట్లో రెండు రోజులు గా ముఖ్యమైన సమావేశాలు  జరిగి ఆ రోజు మధ్యాహ్నంతో ముగిశాయి. స్థానిక నాయకులంతా  వెంటనే వెళ్ళిపోయారు. పొరుగు రాష్ట్రా నుంచి వచ్చిన వళ్ళు ఐదారుగురున్నారు. బొంబాయి నుంచి వచ్చిన విద్య కూడా ఉంది. విద్య, శారద మంచి స్నేహితుయ్యారప్పటికే – ఆ ఐదారుగురూ భోజనాలు చేస్తున్నారు  కబుర్లు చెప్పుకుంటూ. విద్య, శారద ఒకళ్ళను మించి మరొకరు ఛలోక్తులు  విసురుతున్నారు . ఆ సమయంలో పార్టీ ఆఫీసు నుండి  గోపాలరావు పదిహేనేళ్ళ అమ్మాయిని వెంటబెట్టుకుని ఆ ఇంటికి వచ్చాడు . శారద భోజనం నుంచి లేచి చేయి కడుక్కుని వచ్చింది.

‘‘ఏంటి గోపాలరావ్‌ –  ఎవరీ అమ్మాయి’’ అంది ఆ అమ్మాయిని పరిశీలనగా చూస్తూ. ‘‘తెలియదు డాక్టర్‌ గారు –  మన దాసు గారికి చెల్లెలి వరసట. సూర్యాపేట నుంచి వచ్చానంతోంది. ఎందుకంటే దాసుగారు రమ్మన్నా రంతోంది. మీ దగ్గరుంటే మంచిదని తెచ్చాను “  అన్నాడు .

వాడిన  ముఖం, రేగిన జుట్టు, అలసిన శరీరం –  ఐనా  కళ్ళల్లో, పెదవుల్లో కనిపించే పట్టుదల  – ఆ అమ్మాయి వంక చూసి ఆప్యాయంగా నవ్వింది శారద. ‘‘రామ్మా –  కాళ్ళూ ముఖం కడుక్కుని అన్నం తిన్న తరువాత  నీ కథ చెబుదువుగాని’’ అంటూ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని నీళ్ళతొట్టె దగ్గరకు తీసుకెళ్లింది.  ఆ అమ్మాయి కాళ్లూ చేతులు  ముఖం కడుక్కునే సరికి ఎవరో తువ్వాలు  తెచ్చి ఇచ్చారు . ముఖం తుడుచుకుని శారద వెంటే వెళ్ళింది. తెలియని మనుషులు  అందరూ ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయికి భయం, అయోమయం. శారద తినమని మధ్యమధ్యలో హెచ్చరిస్తూ వాళ్ళతో మాట్లాడుతుంది. రెండు రోజులు గా భోజనం లేకపోయిన ఆ వ్యక్తులందరి మధ్యాకూర్చుని కడుపునిండా తినలేక పోయిందా అమ్మాయి.

అందరినీ పంపించాక ఆ అమ్మాయిని తీసుకుని సుబ్బమ్మ గదిలోకి వెళ్ళింది శారద.

‘‘ఇప్పుడు చెప్పు. నీ పేరేమిటి? ఎక్కడ నుంచి వచ్చావు?’’ లాలనగా అడ గింది. ‘‘సత్యవతి నా పేరు . మాది సూర్యాపేట  పట దగ్గర ఒక చిన్న ఊరు’’ –  ‘‘ఐతే `’’ శారదను మాట్లాడనివ్వకుండా సత్యవతి చెప్పుకు పోయింది. ‘‘మా అమ్మది కాటూరు. చిన్నప్పుడు అక్కడా రెండేళ్ళు పెరిగాను. మా అక్కలకు పెళ్ళిళ్లు అయిపోయాయి. మా దగ్గరంతా  ఆడవాళ్ళకు ఘోషా పద్ధతి. ఐతే మా నాన్న ఇంట్లోనే ఒక పంతులు  గారిని పెట్టి తెలుగు రాయటం,  చదవటం మూడేళ్ళపాటు నేర్పించాడు. మా అన్నయ్యు ఆర్య సమాజంలో ఆంధ్ర మహాసభల్లో ఉన్నారు . మా ఇంటికి పుస్తకాలు , పత్రికలు  అన్నీ తెస్తారు. నాకు అవన్నీ చదవటం అలవాటయిందండి . అన్నం తినకుండా నన్నా  ఉంటాను గానీ పుస్తకం చదవకుండా ఉండలేను. ఏడాది నాడు ‘‘గృహాలక్ష్మి’’ పత్రికలో దుర్గా బాయమ్మ గారి ఫోటో చూశాను. ఆమె ప్లీడరి చదివి పట్టా తీసుకుంటూ కోటు వేసుకుని, నెత్తిన టోపీ పెట్టుకున్న ఫోటో –  ఎంత బాగుందంటే –  అప్పటి కప్పుడు నా  మనసులో నాకు  గొప్ప కోరిక పుట్టు కొచ్చిందండీ. ఎట్లాగయిన  చదువుకోవాలి. దుర్గాబాయమ్మ  లాగా పట్టా తీసుకుని అట్లా కోటు వేసుకోవాలి అని – మా ఇంట్లోనేమో నాకు పెళ్ళి సంబంధాలు  చూస్తున్నారు. బాగా డబ్బుందని ఒక రెండో పెళ్ళి సంబంధం కూడా తెచ్చారు. నేను చేసుకోనంటే చేసుకోనన్నాను. సరే ఆ సంబంధం కాకపోతే నీకు ఈడైన వాడినే  చూస్తాం అన్నారు . సంబంధాలు  చూస్తున్నారు. నేనేం చెయ్యను? మా దాసన్నయ్య కమ్యూనిస్టు. ఒక రోజు మా ఇంటికి వస్తే  అన్నయ్యతో చెప్పాను నాకు పెళ్ళి ఇష్టం లేదని, చదువుకోవాలని. సరే నేను ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు అన్నయ్య. తర్వాత  కొన్ని రోజులయ్యాక ఒక మనిషితో ఉత్తరం పంపించాడు. ఎట్లాగయిన బెజవాడరా  . అక్కడ బస్సులు  ఆగే చోట, పక్కనే భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుంటుంది. నువ్వక్కడకి వస్తే  నీ పెళ్ళి జరగకుండా పార్టీ చూస్తుంది. మహిళా సంఘంలో పనిచెయొచ్చని చెప్పిపంపించాడు. నేను సమయం కోసం చూస్తున్నాను. మా ఊళ్ళోనే మా బంధువుల  ఇంట్లో పెళ్ళి. అందరూ వెళ్ళారు. నేనూ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చి, కాసిని డబ్బులు  తీసుకుని సూర్యాపేట  వచ్చాను . అక్కడ మా పంతులు  గారుంటారు. ఆయన ఆంధ్ర మహాసభే –  ఆయన ఉండి  ఉంటే నాకీ తిప్పలుండేవి కావు. ఆయన ఊళ్ళో లేడు. ఎప్పుడొస్తాడో తెలియదు. ఇంక చేసేదేముంది? సూర్యాపేట లో  ఓ బస్సు ఎక్కాను. ఆ బస్సులో ఎవరో పద్మశాలీ భార్యా భర్తలు  బెజవాడ వెళ్తున్నామంతే  వాళ్ళతో స్నేహం   చేసుకుని వాళ్ళ పిల్లలాగానే వాళ్ళతోనే కూచున్నాను. జగ్గయ్య పేటలో రాత్రి  ఆగాం. వాళ్ళు ఒండుకుని తిని సత్రంలో పడుకున్నారు. వాళ్ళు న కులం  అడిగితే చెప్పానుగా –  నాకు వాళ్ళు ఒండుకున్నది పెట్టలేదు. మంచి నీళ్ళు త గి పడుకున్నాను. పొద్దున్నే మళ్ళీ ఇంకా బస్సెక్కి మధ్యాహ్నానినికి బెజవాడలో దిగాం. దాసన్నయ్య రాసినట్టే బస్సు దిగంగానే పార్టీ ఆఫీసు కనిపించింది. అక్కడ కి వెళ్ళి మా దాసన్నయ్య కావాలంటే వాళ్ళు  నన్ను మీ ఇంటికి పంపారు. నేను మళ్ళీ మా ఇంటికెళ్తే పెళ్ళి చేస్తారు. నేను పెళ్ళి చేసుకోను. చదువుకుంటాను. మహిళా సంఘంలో పనిచేస్తాను. దుర్గాబాయమ్మ  లాగా పట్టా తీసుకోవాలి నేను’’ కళ్ళల్లో నీళ్ళు అదిమిపట్టి గొంతులో జీరను పక్కకు నెట్టి చెబుతున్న సత్యవతిని ప్రేపమగా దగ్గరకు తీసుకుంది శారద. ‘‘అలాగే సత్యవతి. పెళ్ళి ఒద్దు. పాడూ ఒద్దు. చదువుకుంటూ మహిళా సంఘంలో పని చేద్దువు గాని ` ఇవాళ నాదెళ్ళవారి  పాలెంలో మహిళా సంఘం మీటింగు జరుగుతోంది. వెళ్దువు గాని. అక్కడ బోలెడుమంది అమ్మాయిులు  పరిచయం అవుతారు. నీకు స్నేహం కలుస్తుంది  వాళ్ళతో . ధైర్యం వస్తుంది. ఒంటరి దానివి కాదు నువ్వు. ఏమీ భయం లేదు. పద, కాసేపు పడుకుని సాయంత్రం వెళ్తావా ? ఇప్పుడే వెళ్తావా ? ఇప్పుడైతే మా పద్మావాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చు’’ శారదను చూస్తూ  ఆమె మాటలు  వింటే సత్యవతి బెరుకంతా  పోయింది.

‘‘ఇప్పుడే వెళ్తానండీ  ’’ అని ఉత్సాహం గా  లేచింది.

శారద సత్యవతిని నాదెళ్ళవారిపాలెం వెళ్ళే వాళ్ళకు అప్పజెప్పి, గత రెండు రోజుల  సమావేశా వివరాలు రాసుకోవటానికి కూర్చుంది.

కాగితం మీద కలం  పెడితే ఆ పదిహేనేళ్ళ సత్యవతి మాటలే గుర్తొస్తున్నాయి. దుర్గాబాయి  ప్లీడరు పట్టా పుచ్చుకుని దిగిన ఫోటో ఎందరు ఆడపిల్లల  మనసుల్లో ఎన్ని కలలు  రేపిందో `- అట్లా చదవాలనీ, అంతెత్తు ఎదగాలనీ ప్రపంచం అంత చూడాలనీ ఆడపిల్లల  గుండెల్లో ఎన్ని కలలు  రేపిందో –  ఎన్ని కోరికలు  గూడుకట్టుకుని ఉన్నాయో . శారద తెలియని భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరయింది. సంతోషం దిగులూ  రెండూ కమ్ముకొచ్చి కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ గుర్తొచ్చింది శారదకు

రాజ్యలక్ష్మ్మమ్మ  అమ్మమ్మ దగ్గరకు పెళ్ళి చెయ్యమంటూ వితంతువులు  వచ్చేవారు. ఆమె వాళ్ళను స్వంత పిల్లల్లా చూసుకునేది. ఇప్పుడు ఆడపిల్లలు  పెళ్ళి ఒద్దంటూ ఇళ్ళనుంచి బైటపడుతున్నారు. చదువు కోసం, జ్ఞానం కోసం తపిస్తున్నారు . అమ్మమ్మ అనుకున్న మార్పు వస్తుంది. కేవం పెళ్ళే కాదు విద్య కావాలంటున్నారు ఆడపిల్లలు . చదువుకుంటే వాళ్లకేదిమంచో ఏది కాదో వాళ్ళకే తెలుస్తుంది. అందుకేగా గురజాడ కన్యాశుల్కం నాటకం లో  బుచ్చమ్మకు పెళ్ళి చెయ్యకుండా చదువుకునే దారి చూపాడు. ఆ దారిలో నడుస్తున్నారు అమ్మాయిలు . ఆ రోజు వీరేశలింగం గారు చేసిన పనిని ఆయన వారసులు గా  కమ్యూనిస్టులు  చేస్తున్నారు. ఔను –  ఆయనకు, రాజ్యలక్ష్మమ్మకు వారసులు తామే –  కమ్యూనిస్టులమే. శారదకు గుండె నిండా ఆనందం పొంగింది. కమ్యూనిస్టులు  వీరేశలింగంగారి భావాలను , ఆయన చేసిన పనిని స్వంతం చేసుకోవాలి. ఆయనను గుర్తు చేసుకుంటూ సభలు  జరపాలి ఇంకా ఎక్కువగా. ఈ సారి దానిని పార్టీ కార్యక్రమంలో భాగంగా చెయ్యాలి. స్త్రీలో చైతన్యం పెరగాలనన్న, స్త్రీల  గురించి పార్టీ సభ్యులో చైతన్యం పెరగాలన్నా  అదొక మంచి మార్గం. కొత్త కొత్త కార్యక్రమాలెన్నో శారద మనసులో ఆకారం దాలుస్తున్నాయి .

***

గమనమే గమ్యం – 22

 

olgaఆంధ్రప్రాంత నాయకుల సమావేశం గంభీరంగా జరుగుతోంది.

‘‘యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ప్రజా యుద్ధమని బలపరుస్తున్నాం . కానీ యుద్ధం అంటే నాశనం. నిర్మాణం కాదు. ఏదో ఒక నిర్మాణం చెయ్యకుండా ప్రజా నాశనాన్ని పట్టుకు కూచోటం సరికాదు. రైతులు నీళ్ళు లేక పంటలు పండక చచ్చిపోతున్నారు. కాలవన్నీ పూడిక పట్టిపోయాయి. వాళ్ళకు ఒట్టి ఉపన్యాసాలు తప్ప ఏమీ ఇవ్వలేమా?’’ శారద ఆవేదనగా అన్నది.

‘‘ఏం చెయ్యగలం? బందరు కాలవ పూడిపోయి రైతులకు నీళ్ళందటం లేదు. ప్రభుత్వాన్ని అడిగాం – అడిగితే కూలీలకు దొరకటం లేదు. ఐనా ఇప్పుడది ముఖ్యం కాదు అన్నారు. యుద్ధం రోజుల్లో ఆహారానికి కరువుండకూడదంటారు. పంటల గురించి పట్టించుకోరు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏమీ చెయ్యకూడదు గాబట్టి ఆందోళన కూడా చెయ్యం. ఇక నిర్మాణ కార్యక్రమం ఏం చేస్తాం’’ వెంకట్రావు నిస్పృహ గా మాట్లాడాడు. కాసేపు అందరూ మౌనంగా ఉన్నారు . పదినిమిషాలు అలాగే గడిచాయి . రామకృష్ణయ్య మెల్లిగా అయినా ధృడం గా అన్నాడు .

‘‘నిర్మాణమే చేద్దాం. బందరు కాలవ పూడిక మనమే తీస్తే ’’ అందరి కనుబొమ్మలు పైకి లేచాయి శారదది తప్ప.

‘‘అద్భుతం – నిజంగా అద్భుతం. మనం ఆ పని చేద్దాం’’ అంది విప్పారిన ముఖంతో.

‘‘మనమా? ఎలా?’’

‘‘కూలి పనులు చేద్దామా?’’

‘‘మనమంటే ఎవరం? ఇక్కడ కూచున్న పదిహేను మందా?’’

‘‘డాక్టరు గారూ మీరు పార పట్టుకుంటారా? ’’

ప్రశ్నలు , నవ్వులు , వ్యంగ్య బాణాలూ శరపరంపరగా కురిసిన తరువాత శారద అంది.

‘‘అందరం కలిసి చేద్దాం. మనం పదిహేనుమందిమి కాదు. రైతు సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం అందరం కలిస్తే ఎంత సేపు – చెయ్యగలం . ఎంత పొడవుంటుంది పూడిక’’

‘‘బెజవాడ ఆనకట్ట నుంచి యనమలకుదురు దాకా నన్నా తియ్యాలనుకుంటాను. కనీసం నాలుగైదు మైళ్ళుంటుంది.’’ సుబ్బారావు గారికి బందరు కాలవ పుట్టు పూర్వోత్తరాలు బాగా తెలుసు .

‘‘ప్రజా సంఘాలన్నీ పని చేస్తే మరీ అసాధ్యం కాదనుకుంటా’’

‘‘రైతులకు మేలు జరుగుతుందంటే అందరూ వస్తారు ’’

‘‘ప్రభుత్వం చెయ్యాల్సిన పని మనమెందుకు చెయ్యాలి?’’

‘‘ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? చెయ్యనిస్తుందా?’’

‘‘యుద్ధం రోజుల్లో ఉత్పత్తిని పెంచే ఏ పనినీ ప్రభుత్వం అడ్డుకోదు. ప్రభుత్వం చెయ్యని పని మనం ప్రజల కోసం చేస్తున్నాం గనుక ప్రజలలో మనమీద సానుభూతి కలుగుతుంది. ప్రజాయుద్ధం అంటున్నామని మనమీద కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తగ్గుతుంది’’.

‘‘ఒట్టి కబుర్లు కాదు కమ్యూనిస్టులు గట్టిగా పనిచేసి చూపిస్తారనే నమ్మకం కలుగుతుంది’’.

అందరిలో ఏదో తెలియని ఉత్సాహం కమ్ముకుంటోంది. నిర్ణయాలు వేగంగా జరిగిపోతున్నాయి. ప్రజా సంఘాల బాధ్యులకు ఉత్తర్వులు చేరుతున్నాయి. అందరిలో ఒక సంచలనం.

‘‘బందరు కాలవ పూడిక తీస్తారంట’’ మండుటెండలే మోసుకెళ్తున్నాయి ఆ వార్తను.

యువకులు , యువతులు మాత్రమే రావటం లేదు. పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి చేరుతున్నారు. కాలవలో వారి స్వేద జలం ప్రవహించి పంటలు పండేలా ఉన్నాయి .

శారద, రామకృష్ణయ్య, మెల్లీ వంటి పెద్ద నాయకులు కూడా తట్టలతో మట్టి మొయ్యటం చూసిన సామాన్యుల ఉత్సాహానికి అంతు లేదు. జన సంద్రం ముందు కాలవ వినయంగా వంగింది. లొంగింది. కుంగింది.

ప్రతిరోజూ పని చేసిన వారికి మధ్యాహ్నం కడుపునిండా భోజనం తప్ప డబ్బేమీ ఇచ్చే పరిస్థితి లేదు.

భోజనానికి కరువు లేదు. పాటలు , నవ్వులు , దు:ఖాలు , దెబ్బలు , గాయాలు అన్నీ మట్టిలోనే –

మహిళా సంఘంలోని ఆడవాళ్ళకు అది అలవాటు లేని పని – ఐనా డాక్టరు గారు చేస్తుంటే మనం చెయ్యలేమా? ఐనా ఈ పని ఎవరిది? మనది. కోటేశ్వరమ్మ, రాజమ్మ పాటలు ఎత్తుకున్నారంటే కృష్ణానదే తుళ్ళి పడేది. అందరి గొంతులూ కలిస్తే ఆకాశం కిందికి దిగాలని చూసేది . ఈ పని చేసేవాళ్ళు చేస్తుంటే చూసేవా ళ్ళు ప్రవాహంలా వచ్చి పోతుండే వాళ్ళు. ఇంతపని స్వచ్ఛందంగా జరగటం వాళ్ళు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. శ్రమదానం ఇంత పెద్ద ఎత్తున జరగటమూ చూడలేదు. సమూహంగా, సమిష్టిగా పని చెయ్యటంలో ఎంత ఆనందముంటుందో వాళ్ళకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్నది ఏదో స్వప్నంగా ఉంది వాళ్ళకు. కానీ అది యదార్థం.

రెండు నెలల పాటు వందమంది పనిచేస్తే కాలవ జల ప్రవాహ యోగ్యమైంది. వానలు కురిస్తే చాలు , కృష్ణమ్మ కాస్త నాలుగు బారలు సాగితే చాలు కాలవ నిండుగా ప్రవహిస్తుంది. అవతల పంట పొలాలకు ఈ వార్త చేరి అదునుకు పదునెక్కి నిరీక్షిస్తున్నాయి .

‘‘కమ్యూనిస్టులంటే ఇదా’’ అనుకున్నారు కొందరు.

‘‘కమ్యూనిస్టులంటే ఇది ’’ అనుకున్నారు మరికొందరు.

ఆ రెండు నెలల కాలం ఆ పనిచేసిన వారి జీవితాల్లో మర్చిపోలేనిదయింది. దేశంలో కాలవన్నీ బాగుచేద్దాం. కొత్త కాలువలు తవ్వుదాం. నీటి కొరత లేకుండా చేద్దాం అనిపించింది అందరికీ.

అందరి కోసం పనిచెయ్యటంలోని ఆనందం, గర్వం, త్యాగ భావనతో మనసు నిండి కష్టమన్నదే తెలియలేదు.

‘‘నువ్వు కూడా రావోయ్‌’’ అని అన్నపూర్ణకు కబురంపింది శారద.

‘‘రాలేను. యుద్ధ కాలం లో ప్రబుత్వానికి సహకరించటం నాకు సమ్మతం కాదు. మీరు చేస్తున్న పని మంచిదే. కానీ చేస్తున్న సమయం, సందర్భం మాత్రం మంచివి కావు. నేనెంత మాత్రం ఈ పనిలో కలిసి రాను’’ అని సమాధానం పంపింది అన్నపూర్ణ. శారద నవ్వుకుంది. రైతులకు సహాయం చెయ్యటానికీ, పంట పండించేందుకు సమయానికి నీరివ్వటం కంటే మంచి సమయం ఏముంటుంది? కానీ రాజకీయాలు ఒకే సమయాన్ని ఎట్లా మార్చేస్తాయో గదా అనుకుంది. అన్నపూర్ణ దేశం కోసమే కాలువ తవ్వే పని నుంచి దూరంగా ఉంది. తనూ దేశం కోసమే కాలువ తవ్వే పనిలో మునిగిపోయింది. ఇద్దరం సమాంతర రేఖల్లా ప్రయాణిస్తున్నాం. గమ్యం ఒకటే – దేశ స్వాతంత్య్రం. అక్కడ కలుస్తాం. సమాంతర రేఖలన్నీ కలిసే చోటు దేశ స్వాతంత్రం. అన్నపూర్ణకు కాలువ తవ్వే దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తూ రాసిన న ఉత్తరాల్లో ఈ వాక్యాలు రాసింది శారద.

కృష్ణాజిల్లాలో మొదలైన ఈ పూడిక తీ స పని గోదావరి జిల్లాకూ పాకింది. అక్కడ కార్యకర్తలు బ్యాంకు కాలవ పూడిక తీశారు.

***

olga title

కృష్ణాజిల్లా కాటూరులో మహిళా సంఘం మహాసభ తలపెట్టినప్పటి నుంచీ శారదకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా దొరకకుండా ఉంది. కాటూరు కమ్యూనిస్టు గ్రామంగా అప్పటికే ప్రసిద్ధి పొందింది. అక్కడ మహిళా సంఘం సభలు జరిపితే ఎక్కడా ఏ ఆటంకమూ ఉండదు. ఆ ఊరి ప్రజలే కాదు యిరుగు పొరుగు గ్రామాల ప్రజలు కూడా సహకరిస్తారు.

శారద, మెల్లీ, సూర్యావతి రాష్ట్ర నాయకులతో కలిసి కార్యక్రమమంతా నిర్ణయిస్తున్నారు. కావలసినవి చెబితే ఏర్పాట్లు చేసే యువ కార్యకర్తలకు లోటు లేదు.

ఆ రోజు శారదకు తమ్ముడు వరసయ్యే లక్ష్మీపతి నుంచి ఫోను వచ్చింది.

‘‘మీ సభలకు సరోజినీ నాయుడ గారిని ఆహ్వానించకూడదూ?’’ అంటూ

‘‘ఎందుకు కూడదోయ్‌ – ఆహ్వానించాలనే ఉంది గానీ ఎలా చెప్పు. ఆవిడ నా కంటే పెద్దావిడ. నువ్వు ఫోన్‌ చేసినట్లు ఆవిడకు ఫోన్‌ చేసి మా సభలకు కాటూరు రండి అని చెప్పలేను గదా! ఆవిడ ఎప్పుడు ఎక్కడుంటారో కూడా తెలియదు. వెళ్ళి పిలుద్దామంటే. పోనీ మా తరపున నువ్వు ఆహ్వానించకూడదటోయ్‌ – ఖర్చులన్నీ ఇస్తాం’’.

‘‘కాదక్కా – నువ్వే ఆహ్వానించు. ఆవిడ రేపు రాత్రి విజయవాడలో అరగంట ఆగుతారు. రైలు స్టేషన్ లో – విశాఖ నుండి సికింద్రాబాదు వెళ్తున్నారు. నువ్వు వెళ్ళి కలిసి ఆహ్వానించు. నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం. వాళ్ళ తమ్ముడు హరీన్‌ చెప్పాడట నీ గురించి. చాలా గౌరవంగా మాట్లాడింది నీ గురించి. నువ్వే వెళ్ళి అడిగితే కాదనదు’’.

‘‘మంచి మాట చెప్పావోయ్‌ – ఈ సారి మనింటికి వచ్చినపుడు నీకేం కావాలో అడుగు ఇస్తాను. రేపు రాత్రి ఆవిడను కలుసుకుంటానోయ్‌ ’’

శారద ఫోను పెట్టి వెంటనే పార్టీ ఆఫీసుకి వెళ్ళింది. అక్కడ నుంచి బెజవాడలో మహిళా సంఘంలో సభ్యులందరికీ కబురు వెళ్ళింది. మర్నాడు రాత్రి రైల్వే స్టేషన్ కి రావాలని . కొందరు ఊళ్ళో లేని వాళ్ళు తప్ప దాదాపు ముఖ్యులందరూ పాతికమంది దాకా వచ్చారు . అందరిలో ఉత్శాం ఉరకలేస్తోంది.

ఉప్పు సత్యాగ్రహం లో స్త్రీలు కాస్త వెనక్కు తగ్గండి అని గాంధీ అంటే వెంటనే ఆ మాటను ధిక్కరించి వెళ్ళి మొదటి దళం సత్యాగ్రహుల్లో ముందు నిలబడిన సరోజినీ దేవి అంటే ఇష్టం లేనిదెవరికీ – గాంధీతో సహా ఎవరితోనైన పరిహాసమాడగల చొరవ, సమయస్ఫూర్తీ, తన ఉపన్యాసాలతో జనాలను తట్టి లేపగల శక్తి, సున్నితమైన కవి హృదయం , త్యాగబుద్ధీ – సరోజినీ నాయుడు గురించి వినని వారెవరూ లేరు ఆ మహిళా సంఘంలో `

‘‘ఆమె రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ, తన మేనత్త శారదాంబ వలే ఈ దేశంలో ఎన్నదగిన స్త్రీ. నాన్న ఆమెను చూశాడా? విన్నాడా? తెలియదు. తమ మధ్య ఆమె గురించి మాటలు జరగలేదా? తను మర్చిపోయిందా? ఇప్పుడు నాన్న ఉంటే నన్ను చూసి సంతోషించే వాడా? డాక్టరుగా, కమ్యూనిస్టుగా నాన్న కల, , తన కల కూడా నిజం చేసుకున్న తనను చూసి సంతోషించేవాడు. తండ్రి గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి . తండ్రి తో పాటు రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మా గుర్తొచ్చింది. ఆవిడే తన భవిష్యత్తుకు అక్షరాభ్యాసం చేసింది. వీరేశలింగం తాతయ్య మాట తీసుకున్నాడు డాక్టర్‌ కావాలని – ఇవాళ ఎందుకు అందరూ గుర్తొస్తున్నారు – తన పక్కన ఇంతమంది ఆడవాళ్ళున్నారు . కాటూరులో వేలమంది వస్తారు. ఒక్కతే ప్రయాణం ప్రారంభించింది. సమూహంలో కలిసింది.

కోటీశ్వరమ్మ, సత్యవతి, రాజమ్మ వంటి వాళ్ళంత సరోజినీ నాయుడిని కలుస్తామనే సంతోషంతో తలమునకలవుతున్నారు.

రైలు వచ్చింది.

కంపార్టుమెంటులోకి అందరూ ఎక్కారు.

శారద వెళ్ళి సరోజినిదేవికి నమస్కారం చేసి తనను రాను పరిచయం చేసుకుంది నవ్వుతూ.

సరోజినిదేవి ఆనందంగా శారదను ఆలింగనం చేసుకుంది.

‘‘హరీన్‌ చెప్పాడు నీ గురించి – నీలాంటి వాళ్ళే కావాలి దేశానికి. వీళ్ళంత మహిళా సంఘం సభ్యులా ? ’’ అందరినీ ఆప్యాయంగా పలకరించింది.

సమయం ఎక్కువ లేదు. వచ్చిన పని చెప్పింది శారద.

‘‘తప్పకుండా వస్తాను. మంచి అవకాశం. ఒదులుకుంటాన ? నేనొక వారం రోజులు హైదరాబాదులోనే ఉంటాను. రెండురోజులాగి ఫోను చెయ్యి. ఏం లేదు. మర్చిపోతానేమోనని’’.

ఇద్దరూ దేశంలో మహిళా ఉద్యమం చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకుంటుండగానే సమయం లేదని గార్డు వచ్చి అందరినీ దిగమన్నాడు.

శారద ఆమెకు నమస్కరించింది.

అందరూ కోలాహలంగా మాట్లాడుకుంటూ స్టేషను బైటకు వచ్చారు. శారద అందరూ జాగ్రత్తగా ఇళ్ళు చేరేలా జట్లుగా వారిని పంపి తను కూడా ఇంటికి వెళ్ళింది.

అందరూ నిద్ర పోతున్నారు. నటాషా నిద్రలో నవ్వుతోంది. పాపను మెల్లిగా ముద్దు పెట్టుకుంది.

ఇప్పుడిక నిద్ర రాదు . గర్భిణీ స్త్రీ ఆరోగ్యం గురించి తను రాస్తున్న పుస్తకం తీసింది.

ఈ పుస్తకం రాస్తున్నాని తెలిస్తే నాన్న ఎంత సంతోషించేవాడో. తగిన సమయం దొరకటం లేదు. త్వరగా పూర్తి చేయాలి. ప్రజల్లో ఎన్ని మూఢ నమ్మకాలు – వాళ్ళ శరీరాల   గురించి వాళ్ళకే మాత్రం తెలియదు. శరీరం విూదా మనసు విూదా అధికారం సంపాదించినపుడే మనకో వ్యక్తిత్వం వస్తుంది. అది స్త్రీలు సాధించాలనే ఈ పుస్తకం రాస్తోంది తను.

పది నిముషాల్లో వ్రాత లో మునిగిపోయింది. రెండు గంటల పాటు రాసి తృప్తి గా కలం మూసి వచ్చి పాప పక్కన పడుకుని నిద్రపోయింది.

***

గమనమే గమ్యం-21

Picture 026

-ఓల్గా

~

శారద, మూర్తిలకు జరిగింది వివాహం కాదని బంధుగణం చెవులు  కొరుక్కున్నా  సుబ్బమ్మ చలించలేదు. శారద జీవితంలో వచ్చిన కొత్త ఆనందాన్ని  కళ్ళారా చూసి ఆనందపడుతోంది. అసలు  శారద ఒంటరిగా ఉండి పోతుందేమోననే భయం తొలగి శారదకు ఇష్టమైన తోడు దొరికిందని తృప్తి కలిగిందామెకు. కానీ మనిషి తృప్తికి తృప్తిపడ ఊరుకునే గుణం లేదు. అందుకే సుబ్బమ్మ మనసులో కొత్త కోరికలు  చిగుర్లు వేస్తున్నాయి. శారదకి చిన్న పాపాయి పుడితే అన్న ఊహ బీజంగా ఆమె మనసులో పడి మహా వృక్షమై సుడిగాలికి కంపించినట్లు అలజడి సృష్టిస్తోంది. శారదను అనుక్షణం కనిపెడుతూ ఉంది. శరీరంలో గానీ, ప్రవర్తనలో గానీ, మానసికంగా గానీ శారదలో ఏ మార్పయిన వచ్చిందా అని పరిశీలిస్తోంది. శారద వయసు తక్కువ కాదు. తొందరగా బిడ్డను కంటే మంచిది. డాక్టరయిన కూతురికి ఈ సంగతి తను చెప్పక్కర్లేదన్న వివేకం ఆమెకుంది. కానీ ఒకోసారి వివేకం లేకపోవటమే మంచిదేమో. కూతురితో ఈ సంగతన్నీ నేరుగా ప్రస్తావించలేక, అది అణుచుకోలేక సుబ్బమ్మ ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడింది. రక్తపోటు పెరిగింది. శారద మందులైతే ఇచ్చింది గానీ తల్లి ఎందుకు అశాంతి పడుతోందో, అలజడికి లోనవుతుందో అర్థం కాలేదు.

ఒకరోజు తీరిక చేసుకుని సుబ్బమ్మ పక్కనే పడుకుని ఆమె పొట్టమీద చేయివేసి అక్కడున్న పెద్ద పులిపిరిని చేతితో మెల్లిగా నిమురుతోంది. అది శారదకు చిన్నప్పుడైన అలవాటు. ఇప్పుడు తల్లి పక్కన చేరిన చెయ్యి అలవాటుగా పొట్టమీది పులిపిరిని వెతుక్కుంటుంది.

‘‘ఎందుకమ్మా నీ రక్తపోటు పెరుగుతోంది? ఎందుకో నీ మనసు పాడుచేసుకుంటున్నావు. దేనికో బాధపడుతున్నావు. నాతో చెప్పవా ? ’’ లాలనగా శారద అడ గిన తీరుకి సుబ్బమ్మ కళ్ళు తడిఅయ్యాయి.

‘‘చెప్తాను. నువ్వు నవ్వకూడదు. తీసిపారెయ్యకూడదు.’’ చిన్నపిల్లలా అంటున్న తీరుకి శారద నవ్వి `

‘‘అలాగే ` నవ్వను. ఒట్టు. చెప్పు’’ అంది పెదిమలు  రెండూ బిగించుకుంటూ.

‘‘ నాకు మనవడో, మనవరాలో ఎవరో ఒకరు కావాలి’’

శారద పెదిమలు  విచ్చుకున్నాయి. నవ్వు చెట్టులాంటి శారద ముఖమంతటి నుండీ పువ్వు జలజలా రాలటం  మొదలయింది. సుబ్బమ్మ ముఖం చిన్నబోయింది.

శారద నవ్వు ఆపి తల్లిని కావలించుకుని `

‘‘అమ్మా !  దీనికా ఇంత కథ చేసి అనారోగ్యం తెచ్చుకున్నావు. నాకీ నెల  నెలసరి అవలేదు. ఇంకో రెండు వారాలు  చూసి నీకు చెబుదామనుకున్నాను. నీకు ఎవరు కావాలో కరెక్టుగా చెప్పు.’’ సుబ్బమ్మ ఆనందం కట్టలు  తెంచుకుంది. శారదను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ

‘‘నిజం చెప్పనా? నాకు నీలాంటి మనవరాలే కావాలి. నిన్ను మళ్ళీ పెంచుకుంటాను’’.

శారదకు సుబ్బమ్మను చూస్తే ఎందుకో ఒక్కసారి దిగులనిపించింది.

తండ్రి చనిపోయాక, తనే లోకం ఆమెకు. తను ఏ ప్రపంచాన్ని ఏర్పరుచుకుందో, ఆ ప్రపంచాన్నంత  ప్రేమించింది. మామూలు  మనుషుల్ని ఎదిరించింది. తను ఏం చెయ్యాలనుకున్నా ‘పద ముందుకు’ అని ప్రోత్సహించింది. మిగిలిన ఆడపిల్లలందరి కంటే భిన్నంగా పెరుగుతున్న తనను ఒక్కరోజు ‘అదేమిటమ్మా ఇలా ఎందుకమ్మా’ అనలేదు. అనంతమైన విశ్వాసం తనమీద. అమ్మకు ఎంత చేసిన తక్కువే. తనేమో ఆమె ఆరోగ్యాన్ని గురించి కూడా పట్టించుకోలేని పనుల్లో మునిగిపోతోంది.

‘‘ఏంటి తల్లీ ఆలోచిస్తున్నావ్‌’’

‘‘ఏం లేదమ్మా  నాలాంటి మనవరాలు  ఎందుకమ్మా? నా వల్ల  నీకన్నీ కష్టాలే’’.

‘‘కష్టాలా?’’ ఆశ్చర్యపోయింది సుబ్బమ్మ.

‘‘కష్టాలు  కాక ఏముంది? అందరి ఆడపిల్లల్లా  లేను గదా నేను. నా వల్ల  ఎన్నో మాటలు  పడ్డావు. మామూలు  ఆడపిల్లనై ఉంటే ఈ పాటికి నలుగురు మనవ సంతానంతో హాయిగా ఆడుకుంటూ ఉండేదానివి. ఇప్పుడేమో పిల్లల్ని  కంటాన లేదా అని దిగులు  పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నేనొక మామూు ఆడపిల్లనయితే…’’ సుబ్బమ్మ శారద నోరు మూ ససింది.

‘‘నువ్వొక మామూలు  ఆడపిల్లవయితే ఏముందే – నువ్వూ, నేనూ అనామకంగా ఎక్కడో పడి ఉండేవాళ్ళం. మీ నాన్న నిన్ను డాక్టర్‌ చదివిస్తానని అన్నరోజు నుంచీ నేను నీ గురించి కలలు  కనటం మొదలుపెట్టాను. నా కలలన్నీ  నిజం చేశావు. నీ కళ్ళల్లో జ్ఞానం మలుగుతుంటుందమ్మా – మామూలు  ఆడపిల్లల్లా  అమాయకంగా, మడి కట్టుకుని, వండి వారిస్తే, అదే నీ బతుకైతే నేను ఈ పాటికి హరీ అనేదాన్ని. నిన్ను చూస్తుంటే నువ్వు ఠీవీగా నడుస్తుంటే, మగవాళ్ళతో సమానంగా, ఒక్కోసారి వాళ్ళకంటే ఎక్కువగా వ్యవహారాలు  నడుపుతుంటే, డాక్టరుగా గౌరవం, డబ్బు సంపాదించి నీ స్వతంత్రం నువ్వు నిలబెట్టుకుంటుంటే – పిచ్చితల్లీ !  నా  కంటే అదృష్టవంతులెవరమ్మా? ఎవరు కన్నారమ్మా?  న బంగారు తల్లివంటి దాన్ని. మీ నాన్న , నేను నిన్ను గురించి ఏమనుకున్నామో అలాగే జరిగింది. మీ నాన్న ఉంటే ఎంత బాగుండేదనే దిగులు  తప్ప ఇంకే లోటు లేదు. నా  జీవితంలో గర్వపడేది నిన్ను చూసే ’’ `

‘‘నా  కంటే నువ్వే గొప్పదానివమ్మా – నేనిలా ఉన్నానంటే నీ వల్లే గదా’’ తల్లిని కావలించుకుని ముద్దులు  కురిపించింది శారద.

‘‘సరేలే గాని, ఆరోగ్యం జాగ్రత్త.’’

‘‘అమ్మా ` నేను డాక్టర్ని. ప్రసూతి -శిశుపోషణ అన్న పుస్తకం రాస్తున్నాను . బాగా తింటాను. వ్యాయామం  చేస్తాను. ఆనందంగా ఉంటాను. చాలా?’’

ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. తండ్రి  గురించి కబుర్లు అడిగి అడిగి చెప్పించుకుంది శారద. తీరిక వేళల్లో వాళ్ళకు అది ఇష్టమైన కాలక్షేపం.

‘‘అమ్మా !  నీకు చెబుదామనుకుంటూ మర్చిపోయాను. హరి బాబాయికి మన బెజవాడలో షష్టిపూర్తి ఉత్సవం చేస్తున్నారట. మనం తప్పకుండా వెళ్ళాలి. హరి బాబాయిని చూసి ఎన్ని రోజులయిందో.’’

‘‘మనింటికి పిలువమ్మా. నాలుగు  రోజులుండి వెళతాడు. మీ నాన్న, ఆయన ఒకే ప్రాణం అన్నట్లుండేవారు. హరి మామూలు వాడు కాదే –  హరిలాంటి మనుషులుండరే అని రోజుకోసారి ఆయిన అంటుండేవారు.’’

‘‘గ్రంథాలయ ఉద్యమం వాళ్ళు ఇదంతా  చేస్తున్నారు. నేనూ కొంత డబ్బు సాయం చేశాను. ముందు వాళ్ళపని పూర్తయ్యాక మనింటికి పిలుస్తాను.’’

‘‘ఇంతకూ ఎప్పుడూ షష్టిపూర్తి సభ?’’.

‘‘ఇంకో పదిహేనురోజులుందిలే. మనిద్దరం వెళదాం’’.

శారద హాస్పిటల్‌కు వెళ్ళాలంటూ లేచింది.

‘‘ఫలహారం తిని వెళ్ళు. మళ్ళీ ఎప్పుడొస్తావో’’ అంటూ సుబ్బమ్మా లేచింది.

ఇద్దరి మనసులూ  తేలిక పడ్డాయి. సుబ్బమ్మ నీరసం, రక్తపోటు ఎటుపోయాయో గాని ఎక్కడలేని ఉత్సాహంతో తిరుగుతోంది.

హరి సర్వోత్తమ రావు గారి షష్టిపూర్తి ఉత్సవం చాలా బాగా జరిగింది. పాతూరి నాగభూషణం చొరవ, శారదాంబ వంటి కొందరి సహాయంతో ఒక ఆంధ్రుడని, తెలుగు జాతి గర్వించదగిన ఒక యోధుడని, ఆలోచనాపరుడని జాతి సన్మానించుకోగలిగింది. గౌరవించుకోగలిగింది.

సన్మానం  అయిన తరువాత  శారద ఆయనను తమ ఇంటికి తీసుకొచ్చి సంబరంగా నలుగురినీ పిలిచి విందు చేసింది. హరిగారికి శారదంటే పుత్రికా వాత్సల్యం . తన స్నేహితుడ కూతురు ఇంత ఎదిగి అటు రాజకీయాలలో ఇటు వైద్య వృత్తిలో రాణిస్తున్నదంటే ఆయన పొంగిపోయాడు. వినటం వేరు. కళ్ళారా చూడటం వేరు.

‘‘మీ నాన్న ఉంటే ఎంత గర్వపడేవాడో’’

‘‘మీరు సంతోషంగా ఉన్నారుగా  బాబాయ్‌  నాన్న ఉన్నట్టే ఉంది నాకు. మళ్ళీ మీ దగ్గర వెల్లూరు జైలు  కబుర్లు చెప్పించుకోవాలని ఉంది. చిన్నప్పుడు అవి చెప్పేవరకూ మిమ్మల్ని పీడించేదాన్ని కదా ` ’’

‘‘నేను ఇష్టంగానే చె ప్పవాడిని. ఇప్పుడలా అడిగేవాళ్ళు లేక అన్నీ మర్చిపోయాను.’’

‘‘అన్నీ రాయండి  బాబాయ్‌. పుస్తకాల  కోసం గ్రంథాలయ ఉద్యమం నడుపుతున్నారు. మీ అనుభవాలు  పుస్తకంగా రాయరా ?’’

‘‘నేనంత గొప్పవాడినా ? నా జీవితం గురించి ఏముంది రాయటానికి’’ నిరాడంబరంగా, నిజాయితీగా నవ్వాడాయన.

‘‘మీ జైలు  జీవితం గురించి రాయండి.  . తరువాతి తరం కు  తెలియొద్దా? అది వింటుంటే నాకు దు:ఖం వచ్చేది. వీర రసం ఉప్పొంగేది. బ్రిటీష్‌వాళ్ళ మీద కోపంతో రగిలిపోయేదాన్ని. అదంత మా పిల్లలకు  తెలియొద్దా?’’

‘‘పిల్లలంటున్నావు ?  ’’ అర్థవంతంగా చూశాడాయన.

‘‘మీరూ, ద్వారకా ఇక్కడకొచ్చి ఉండి పొండి బాబాయ్‌’’ అన్న మాటకు నవ్వి ఊరుకున్నారు. అప్పటిదాకా వీళ్ళ మాటలను మౌనంగా వింటున్న సుబ్బమ్మ

‘‘మీరు చినతాతగారు కాబోతున్నారు’’ అని నవ్వింది. హరిగారు శారద తలమీద చేయి వేసి నిమిరి లోలోపలే ఆశీర్వదించాడు.

‘‘సంతోషం తల్లీ. బెజవాడ వచ్చినందుకు శుభవార్త విన్నాను. రామారావు  ఒకటే గుర్తొస్తున్నాడు. శారదమ్మకు పుట్టే బిడ్డను నెత్తిన పెట్టుకు మోసేవాడు. నాకు ఆప్తమిత్రుడు, నా  ప్రాణమైన నా భార్యా  ఇద్దర్నీ కోల్పోయిన దురదృష్టవంతుడని’’ అందరూ కన్నీరు పెట్టుకున్నారు.

కనీసం నాలుగు  రోజులుండి  వెళ్ళమన్నా ఆయన వెంటనే ప్రయాణం అయ్యారు.

కూతురు ద్వారకకు బట్టలు, పళ్ళు, పిండివంటలూ  అన్నీ సిద్ధం చేయించి ఉంచింది సుబ్బమ్మ.

‘‘మద్రాసు వస్తే  మా ఇంటికి వచ్చి మీ చెల్లిని చూడమ్మా’’ అంటూ ఆయన తల్లీ కూతుళ్ళ దగ్గర శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

olga title

***

తొమ్మిదో నెలలో కూడా శారద తన పనులు  ఏమాత్రం తగ్గించుకోలేదు. తల్లి విశ్రాంతి తీసుకోమంటే ‘‘తిని కూచుంటే కాన్పు కష్టమవుతుంది. హాయిగా పనులన్నీ చేసుకోండని నేనందరికీ చెబుతాను. నేను తిని కూచుంటే నా  మాటలెవరు నమ్ముతారమ్మా ` నేను వ్యాయామం  చేస్తున్నాను, పనులు  చేస్తున్నాను –  ఎంత తేలిగ్గా పురుడు పోసుకుంటానో చూడు’’ అని తల్లి మాటలు  కొట్టేసేది. ‘‘ఏమో తల్లీ –  నీ పుటక గుర్తొస్తే  నా కిప్పటికీ ముచ్చెమటులు  పడతాయి. ఆ కుగ్లర్‌ ఆసుపత్రిలో నేనూ, డాక్టర్లు ఎంత కష్టపడ్డామో చెప్పలేను’’.

‘‘నిన్ను నాన్న, నానమ్మ బాగా గారాబం  పెట్టి ఉంటారు. ఇటు పుల్ల  తీసి అటు పెట్టి ఉండవు. ఆ బద్ధకం నీ కడుపులో ఉన్న నాకూ అంటుకుని బైటికి రావటానికి బద్ధకించి సోమరిగా ఉండుంటాను. నా  బిడ్డ చూడు ఎంత చురుగ్గా నీ చేతుల్లోకి వస్తుందో’’.

శారద చెప్పినట్లే ఒక శుక్రవారం ఉదయాన్నే శారద తనొక్కతే హాస్పిటల్‌కు వెళ్ళింది. గంటలోపలే నర్సు వచ్చింది డాక్టరమ్మ గారు ఆడపిల్లను కన్నారన్న  కబురుతో. సుబ్బమ్మకు కాళ్ళూ, చేతులూ  ఆడలేదు. మేనగోడలు  పద్మ ఆమెను పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్ళి బిడ్డను చేతిలో పెడితే ఆమె కళ్ళనిండా నీళ్ళు.

‘‘నిన్నెత్తుకున్నట్టే ఉందే శారదా’’ అని ఏడ్చేసింది.

తండ్రి  కోసం అమ్మ ప్రాణం కొట్టుకుంటోందని గ్రహించింది శారద. శారదకూ దు:ఖం వచ్చింది.

ఇద్దరూ నవ్వూ ఏడుపూ కలగలిసిన అనుభూతితో ఉక్కిరి బిక్కిరయ్యారు.

మూర్తి వచ్చేసరికి సుబ్బమ్మ, మిగిలినవాళ్ళు బైటికి నడిచారు.

‘‘మొత్తానికి  నీలాంటి అమ్మాయినే ఇచ్చావు.’’ అని నుదుటి మీద ముద్దు పెట్టాడు మూర్తి.

‘‘నేనివ్వటమేమిటి? నువ్వే ఇచ్చావు. మగవాళ్ళ వీర్యకణాల వల్లే పుట్టే బిడ్డ ఆడా, మగా అనేది ఆధారపడుతుంది. సో ` థాంక్స్‌. మా అమ్మ కోరిక తీర్చావు. నాకెవరైన ఒకటే.’’

‘‘అబ్బా !  నువ్వు ఏ మిస్టరీని అలా అందంగా ఉండనివ్వవుగదా’’.

‘‘మిస్టరీ అంటేనే అది ఎప్పుడో ఒకప్పుడు విడిపోతుందని అర్థం. మిస్టరీను విడగొట్టి తెలుసుకోవటమే మానవుల పని. అదే అందం. అదే ఆనందం’’.

‘‘అలసటగా లేదూ?’’

‘‘కొంచెం –  కాసేపు నిద్రపోతా ’’

మూర్తి కూడా బైటికి వెళ్ళాక కళ్ళు మూసుకుని పడుకుంది శారద.

శారద మూడోరోజే ఇంటికొచ్చింది. ఐదవరోజుకి కబురొచ్చింది కాశీలో నరసమ్మ గారు కీర్తిశేషులయ్యారని.

సుబ్బమ్మ కన్నీరు మున్నీరయింది.

శారద పదేళ్ళ పిల్లగా  ఉన్నపుడు అందరినీ ఒదిలి కాశీ వెళ్ళినామె మళ్ళీ రానే లేదు. కొడుకు చనిపోయాడనే వార్తకూ చలించలేదు. అప్పటినుంచీ ఉత్తరాలూ  తగ్గాయి. కాశీలో వాళ్ళే అయినవాళ్ళయ్యారు. అన్ని కర్మలూ  చేయించారు. మనవరాలిని చూస్తూ ‘‘మీ నాయనమ్మ పేరు పెట్టుకుందామే’’ అంది.

శారదకు నాయనమ్మ చిన్నతనపు జ్ఞాపకం. ఆమె పంతం గురించి తప్ప మిగిలినవి అంతగా గుర్తులేవు. తన విషయంలో పేచీ పడ అందరికీ దూరమైందనేది రానురానూ  శారదకు ముల్లులా  గుచ్చుకునేది. ఆ విషయం మర్చిపోటానికి ప్రయత్నించేది. ఆమె పేరు  పెట్టాలనే ఉత్సాహం  శారదకు లేదు.

‘‘చూద్దాం లేమ్మా’’ అంది ముభావంగా.

పాప పేరు గురించి మూర్తీ, శారద చాలా రోజు నుంచే మాట్లాడుకుంటున్నారు. మగపిల్లవాడయితే  రామారావు  తప్ప మరో పేరు అని ఎవరూ అనుకోలేదు. ఆడపిల్ల  అయితే – మూర్తి ఏవేవో అందమైన పేర్లు చెబుతుంటే శారద ఒకరోజు అంది.

‘‘మూర్తీ మనిద్దరం కలిసి చదివి, కలిసి నవ్వి, కలిసి ఏడ్చి సాహిత్యానుభూతిని  పొందిన పుస్తకం నీకు గుర్తుందా?’’

‘‘ఎందుకు లేదు? టాల్‌స్టాయ్‌ ‘‘యుద్ధము – శాంతి’’ ’’

‘‘మరి మన పాపకు ఆ పేరు పెడ తే బాగుండదూ?’’

‘‘ఏమని? శాంతి అనా ?’’

‘‘కాదు –  ఆ పుస్తకంలో మనిద్దరం ఇష్టపడి   ప్రేమించి తపించిన పాత్ర  పేరు మన పాపకు పెట్టుకుందామోయ్‌’’

‘‘నటాషా నా ?’’

‘‘ఊ!` నటాషా. ఎంత బాగుంది కదా’’

‘‘బాగుంది. కానీ మన పేరు కాదుగా’’

‘‘ఇంకా మన పేరేమిటోయ్‌ ` ప్రపంచమంత ఒక్కటే కావాలనిని కాదూ మన కల. మన కలల  ప్రతిరూపం కదూ మనకు పుట్టబోయే బిడ్డ’’.

మూర్తి ఇక మాట్లాడటానికేముంది? ఆడపిల్ల  పుడితే నటాషా అని పేరు పెట్టానుకున్నారు.

తల్లి మనవరాలితో ఆడుకుంటూ ఆనందంగా ఉన్న సమయం చూసి శారద నటాషా పేరు, ఎందుకా పేరు పెట్టాలనుకుందీ వివరంగా చెప్పింది.

‘‘సరేలే – కాలం మారింది. అవతారం మారింది. నరసమ్మ నటాషా అవదా? నటాషా – బాగుంది. నా  చిట్టితల్లికి కొత్త పేరు. నటాషా. నరసమ్మా , నరసమ్మ! నటాషాగా పుట్టావా ?’’ అంటూ నవ్వుతూ ముద్దులాడింది.

పదకొండోరోజు నుంచీ శారద మళ్ళీ తన పనుల్లో తను పడింది. నటాషా అమ్మమ్మ ఒళ్ళో, గుండెల మీదా హాయిగా ఆడుకుంటుంది. రాత్రిళ్ళు అమ్మ గుండెకు హత్తుకుని నిద్రపోతోంది.

***

గమనమే గమ్యం-20

olga title

 

మూర్తికి మద్రాసులో కుటుంబ బాధ్యతలు , పార్టీ బాధ్యతలు , బంధు మిత్రల  బంధాలు  చాలానే ఉన్నాయి. వీటన్నిటి మధ్యా తరచు బెజవాడ రావటం, ఎక్కువ రోజులు  ఉండి వెళ్ళటం మొదయింది.

మూర్తి  రాకకోసం ఎదురు చూడటం శారదకో కొత్త అనుభవం అయింది. మూర్తి మీద  ప్రేమ  అప్పుడూ ఇప్పుడూ ఒకటే. అప్పుడూ మూర్తి రావాలని  అనిపించేది. ఐదారునెలలకోసారి మూర్తి వచ్చినపుడు ఉత్సాహంగా  కబుర్లు చెప్పుకునేవారు. పార్టీ మిత్రులతో కలిసి మాట్లాడుకునేవారు. ఏ నాటకానికో, మీటింగుకో వెళ్ళేవాళ్ళు.  నాలుగు రోజులుండి  మూర్తి వెళ్తుంటే శారద తెరిపిగానే అతనికి వీడ్కోలు చెప్పేది.

మూర్తితో దగ్గరి సంబంధం పెళ్ళి పేరుతో ఏర్పడిన తర్వాత  మూర్తి నుంచి దూరంగా ఉండటం కష్టంగా ఉంది.

మానవ జీవితంలో సెక్స్‌కి ఉన్న పాత్ర గురించి తెలియని చిన్నపిల్ల  కాదు శారద. ఐనా  లైంగిక సంబంధం ఒక మనిషి మీద ఇంత అధికారాన్ని  ఇవ్వటం ఆశ్చర్యంగా అనిపించింది. శారీరక సంబంధం లేకముందు మూర్తితో సంబంధం మానసికం మాత్రమే. అతన్ని  ప్రేమించింది. ఆ  ప్రేమ ఇప్పటికంటే అప్పుడు తక్కువ లేదు. కానీ శారీరక సంబంధం వల్ల  ఆ  ప్రేమలో ఏదో మార్పు వచ్చింది. అతని మీద ఏదో హక్కు ఉన్నట్లు. అది సరైందా కాదా? ఒక మనిషి మీద అధికారం, హక్కూ ఉన్న భావన కలిగితే అది ఆ సంబంధానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? అనే ప్రశ్నలు  శారద మనసులో.

‘‘తమది అందరి లాంటి బంధం కాదు. సంప్రదాయ పెళ్ళిళ్ళలో ఈ హక్కూ , అధికారం  చాలా మామూలు . అవి అన్నీ పురుషుల  పరంగానే ఉంటున్నాయి. వాటివ్ల స్త్రీలు  చాలా బాధ  పడుతున్నారు. తమ బంధం ఇద్దరు స్వతంత్ర వ్యక్తులు  ఒక బాధ్యతతో ప్రత్యేక పరిస్థితులలో ఏర్పరుచుకున్నది. డబ్బు, ఆస్తులు , కుటుంబ సంబంధాల  ప్రమేయం లేదు.

చుట్టు పక్కల  వాళ్ళంతా  మూర్తిని తన ‘భర్త’గా చూసినంత మాత్రానా భర్త అనే మాటకున్న ఏ అర్థంలోనూ అతను తనకు భర్త అనిపించుకోడు. ఐనా  తమ మధ్య ఆ సంబంధం ఏర్పడే ప్రమాదం ఉంది. దాని నుంచి తనను తాను రక్షించుకోవాలి. మూర్తితో కూడా దీని గురించి మాట్లాడాలి. పరాధీనత ఎవరికీ మంచిది కాదు. ఒకరినొకరు  ప్రేమించటంలో ఆధారపడటం అనేది ఎంత మాత్రమూ మేలు  చేయదు.’’

మూర్తి లేనపుడు ఇలాంటి ఆలోచనలతో తమ సంబంధం గురించి ఆలోచించేది. మూర్తి వచ్చాడా  ఇక ఆలోచనకు ఆస్కారమే లేదు. అతనున్న వారం పది రోజులూ  అతని సమక్షం ఒదలాలంటే పరమ అయిష్టంగా ఉండేది. ఏ పనీ చేయబుద్ధి అయ్యేది కాదు. అతన్ని చూస్తూ కూచుంటే చాదా జీవితానికి అనిపించేది. అతని కోసం ఏదైన చేసి సంతోషపెట్టాలనిపించేది. చేయటానికి ఏమీ ఉండేది కాదు.

olga

ఒట్టి మాటలు , నవ్వులు , పాటలు , కథలు , కబుర్లు వీటి మధ్య నుంచి రాత్రి తెల్లవారుతుంటే  అతన్ని ఒదిలి వేరుబడి వేరే పనుల  కోసం వెళ్ళాలి గదా అని బాధగా ఉండేది. దానిని జయించటం ఒక సవాలుగా మారింది శారదకు.

ఆ సాయంత్రం బైటి పనులన్నీ ముగించుకుని శారద వచ్చేసరికి మూర్తి టేబిల్‌ దగ్గర కూచుని ఏదో పని చేస్తున్నాడు.

వీలైనంత నిశ్శబ్దంగా వెళ్ళి వెనకనుంచుంది శారద. ఎక్కడ సంపాదించాడో తెల్లని చెక్కముక్కలు  చిన్నచిన్నవి పెట్టుకుని వాటికి చతురస్రాకారంలో చిన్న మేకు కొట్టి బిగిస్తున్నాడు. పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన అతన్ని చూస్తూ నిలువున కరిగిపోయింది శారద. అతన్ని గట్టిగా హత్తుకోవాలనే కోరిక నిగ్రహించుకుని అతను చేస్తున్నది చూస్తోంది. ఆ చదరంలో అతను పెట్టిన ఫోటో చూసి ఆశ్చర్యపోయింది.

‘‘ఈ ఫోటో… ’’ అనుకోకుండా శారద నోట్లోంచి వచ్చిన మాటకు మూర్తి ఉలిక్కిపడి  వెనక్కు తిరిగాడు.

రెండు చేతులూ  సాచింది శారద. మూర్తి నవ్వుతూ ఆ చేతులలోకి వెళ్ళి చిక్కుకు పోయాడు.

‘‘ఆ ఫోటో `’’

‘‘గుర్తులేదా?  నువ్వు ఇంగ్లండ్‌ వెళ్తున్నపుడు ఒక  రాత్రి అపురూపంగా గడిపాం. ఆ రోజు నే తీసిన ఫోటో.’’

‘‘నాకింతవరకూ  చూపించలేదెందుకు?’’

‘‘నా  కోసం తీసుకున్నది. నువ్వు నీ దగ్గరే ఉన్నావు. నీకెందుకిది? నా  కోసం. నిన్ను నా  దగ్గరే బంధించటం కోసం’’

‘‘నేను నా  దగ్గరే ఉన్నట్లు లేదు మూర్తీ. నీ లోపల  ఉన్నట్లుంది. అక్కడే ఉండి  పోవాలని ఉంది. బైటికి రావాలనీ, ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చెయ్యాలనీ అనిపించటం లేదు.’’

‘‘వీటన్నిటినుంచీ ఎక్కడికైనా  దూరంగా వెళ్ళిపోదామా?’’

‘‘ఎక్కడ కి?’’

‘‘ఎక్కడ కైనా – మనిద్దరం తప్ప మరెవరూ లేని చోటికి’’

‘‘మైదానంలోకా? ఏటి ఒడ్డున మైదానంలోకా?’’

ఇద్దరూ ఫక్కున ఒక్కసారి నవ్వారు.

‘‘నిజంగా అలా వెళ్ళిపోదామా?’’ ఎంతో కోరికతో అడిగింది శారద.

‘‘నేను రాగలను. నువ్వే రాలేవు.’’

‘‘ఒస్తా. ఒస్తా. ఒస్తా’’ మూర్తిని ఊపిరాడకుండా ముద్దుపెట్టుకుంటూ అంది శారద.

‘‘అలాగే -వెళ్దాం పద. ఇప్పుడు ఈ నిముషంలో’’

‘‘ఈ నిముషం దేనికోసమూ డిస్ట్రబ్‌ కాను.’’ పొంగుతున్న  ప్రేమనూ కాంక్షనూ పరిపూర్ణంగా అనుభవిస్తోంది శారద.

olga

మూర్తి ఉన్న రోజులన్నీ శారదకు నిమిషాల్లాగా గడిచిపోతున్నాయి. మూర్తి మద్రాసు బయల్దేరాడా – భరించలేని అసహనం. మిగిలిన విషయాలలో స్వతంత్రంగా ఉండగల తను మూర్తితో ఎమోషనల్‌గా అస్వతంత్రురాలవుతున్నానని గ్రహించింది. దీనినుంచి బైట పడాలా ఒద్దా అన్నదొక సమస్య.

ఈ అస్వతంత్రత ఎంతో బాగుంది. ఒక్క నిమిషం కూడా మూర్తిని ఒదిలి ఉండలేననే అనుభూతి బాగుండటమేమిటి. అది పరాధీనత కాదా?  ప్రేమ ముందు తన మిగిలిన స్వతంత్ర గుణాలేవీ నిలబడటం లేదేమిటి?

ఈ విషయాు మాట్లాడటానికి మూర్తి తప్ప మరెవరూ లేరు. పరస్పర ఆధారాన్నీ, పరాధీనతను వేరు చేసి చూడాలన్నాడు మూర్తి.

‘‘అది నాకు తెలియదా? నేను ఎమోషనల్‌గా, మానసికంగా ఒకరు లేకపోతే భరించలేని స్థితిలో ఉండటాన్ని పరాధీనత అంటున్నాను. ఇంతకుముందు లేని ఈ స్థితి ఈ బంధం వల్ల ఎందుకొస్తుంది అంటున్నాను.  ప్రేమ ఈ స్థితిని కల్పించేటట్లయితే  ప్రేమలో ఏదో లోపమున్నట్లే కదా ! ప్రేమ మనిషికి బలమవ్వాలి  గానీ బలహీన పరచగూడదు కదా. నేను నీ విషయంలో ఇంతవరకూ చాలా బలంగా  నిబడ్డాను. ఈ కొత్త సంబంధం నన్ను బలహీనపరుస్తోందా అనిపిస్తోంది.’’

‘‘నీ మాటలు  నాకు అర్థం కావటం లేదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపించటం బలహీనమెలా అవుతుంది’’.

శారద చాలా సేపు ఆలోచించి

‘‘అది బలమూ కాదు. బలహీనత కాదు. ఒకానొక మానసిక స్థితి. ఈ స్థితిని అవతలి వ్యక్తి అలుసుగా తీసుకోనంత వరకూ, ఈ స్థితిని గౌరవించినంతవరకూ, తనూ ఈ స్థితిని ఆనందించినంత వరకూ ఈ స్థితి వల్ల ప్రమాదమేం లేదు. అవతలి వ్యక్తులు  అలుసుగా తీసుకున్నపుడు వాళ్ళు వీరిని పరాధీనుగా చేస్తారు. పరాధీనత అనుభవించే వారికి బాగుండదు గానీ స్వాధీనం చేసుకున్నవాళ్ళకు బాగుంటుంది. దానివల్ల  వాళ్ళకు లాభం కూడా –  అదే బాగుంటుందనీ, అదే మంచిదనీ, భద్రత అనీ పరాధీనుల్ని అంటే స్త్రీలను పురుషులు  నమ్మిస్తారు.  ప్రేమ, పరాధీనత, పాతివ్రత్యం, ఇవన్నీ కలగలిసి చిక్కగా చిక్కుబడిపోతాయేమో మామూలు  భార్యాభర్తల  సంబంధాల్లో. చాలాసార్లు ఆ సంబంధంలో  ప్రేమ ఉండదు. ఇక అప్పుడది నరకమే `

ప్రేమ బలాన్ని ఇస్తుంది. ఇపుడు నేననుభవించే స్థితి కేవలం  ప్రేమ కాదు. మోహం కలగలిసిన  ప్రేమ అనిపిస్తోంది. బహుశ ఈ మోహ తీవ్రత కాలం  గడిచే కొద్దీ తగ్గవచ్చు.’’

‘‘శారదా – మరీ చీల్చి చూడకు – కొంత మిస్టరీ మిగుల్చు. అపుడే బాగుంటుంది.’’

‘‘నీకు మిస్టరీ బాగుంటుంది. నాకు స్పష్టత బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఏంగెల్స్‌ ‘‘కుటుంబం – వ్యక్తిగత ఆస్తి’’ చదవ లోయ్‌ మనిద్దరం కలిసి’’.

‘‘చలం, క ష్ణశాస్త్రి, నండూరి కవిత్వాలను  చదవాల్సిన సమయంలో ఏంగెల్స్‌ని చదవాలంటావు. నీకు మరీ మేధావితనం పెరిగిపోతోంది. ఇలాగైతే నాకు నచ్చదు’’.

‘‘నేను ఇంగ్లండ్‌లో ఉన్నపుడు నువ్వు రాసిన ఉత్తరాల   నిండా అవే గదా’’.

‘‘ఔను ప్రపంచంలోని కవులంత మనకోసమే, మన ఆనందం కోసమే  ప్రేమ కవిత్వం రాశారు. సంగీతమంత మన  ప్రేమనే గానం చేస్తోంది. ప్రకృతి  మన  ప్రేమనే పరిమళిస్తోంది.’’

 

శారద తన్మయంగా మూర్తి వంక చూస్తూ ఉండిపోయింది. ఆలోచనలన్నీ ఆగిపోయాయి. అనుభూతి, పరవశం,  ప్రేమ మనశ్శరీరాలను  దురాక్రమించాయి. ఆ దురాక్రమణకు లొంగిపోయి పొంగిపోయారు మూర్తి, శారద.

***

గమనమే గమ్యం-19

olga title

-ఓల్గా 

~

ఆ సమావేశానికి శారద వెళ్ళింది. చర్చలో అందరినీ కడిగి పారేయాలని అనుకుంది. అటూ ఇటూ తేల్చుకోవాలనుకుంది. స్త్రీల  గురించీ, వారిని చూసే దృక్పథం గురించీ పార్టీలో ఒక తీర్మానం చేయించాలనుకుంది. ఆధునిక స్త్రీ గురించి నిర్వచించాలని పార్టీని డిమాండ్‌ చేయానుకుంది. కానీ సమావేశంలో ఈ అంశం గురించి చర్చ మొదలవుతూనే మొట్టమెదటి వాక్యంలోనే వెంకట్రావు శారద పెళ్ళి చేసుకోవాలని ప్రతిపాదించాడు.

‘పెళ్ళా? నేనా?’’ శారద అనుకోని ఈ దాడికి విస్తుపోయింది. వెంకట్రావుని మించి అక్కడున్న వారందరూ ఒక్క గొంతుతో శారద పెళ్ళి చేసుకోవాలని తీర్మానించారు.

అందరూ అదేమాట అంటుంటే – వాళ్ళందరికీ తెలిసిన విషయమే అయినా శారద తాను మూర్తిని ప్రేమించాననే విషయం చెప్పింది. ‘‘మేం పెళ్ళి చేసుకోమనేది కూడా మూర్తినే’’ అత్యుత్సాహంగా చెప్పారు.

‘‘మూర్తికి పెళ్ళయిందని తెలిసీ విూరీ మాట ఎలా అంటున్నారు?’’ శారదకంతా అయోమయంగా ఉంది.

‘‘ప్రేమించిన వాడిని పెళ్ళాడటం తప్పుకాదు.’’

olga

‘‘విూ పెళ్ళికి మూర్తి భార్య అంగీకరించింది’’

‘‘మూర్తికి కూడా అభ్యంతరం లేదు.’’

ఒక్కొక్కరూ ఆనందంగా చెబుతుంటే శారద నోట మాట రాలేదు. అందరి ఉత్సాహమూ, మాటలూ  అణిగాక అన్నది.

‘‘నాకసలు  పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు. మూర్తినే కాదు -ఎవరినీ’’

‘‘పెళ్ళి చేసుకోకుండా మహిళా ఉదమాన్ని నువ్వు నిర్మించలేవు. నిన్ను ఆదర్శంగా స్త్రీలు  తీసుకోవాలన్నా, నాయకురాలిగా అంగీకరించాలన్నా నువ్వు పెళ్ళి చేసుకోవాలి. పెళ్ళికాని ఒక స్త్రీ నాయకురాలిగా ఉండటంలో ఎన్నో చిక్కులున్నాయి. ఎన్నో సమస్యలొస్తాయి. పార్టీ, నువ్వు వివాహం చేసుకు తీరాలని నిర్ణయించింది’’. వెంకట్రావు ఇక ఆ మాటకు తిరుగులేదన్నట్లు చెప్పాడు.

‘‘వివాహమైన వాడితో పెళ్ళి ఎలా సాధ్యం?’’

‘‘సాధ్యమే – విూరిద్దరూ పరస్పర అంగీకారంతో భార్యా భర్తలుగా జీవించటాన్ని పార్టీ ఆమోదిస్తుంది. ఆ ప్రకారం పత్రాలు  రాసుకుని సంతకాలు  చేయటమే. సంప్రదాయ పద్ధతిలో మనం పోముగదా! దండలు  మార్చుకుని ఒప్పంద పత్రాల  మీద సంతకాలు పెడితే సరిపోతుంది.’’ బాపయ్య తేలికగా చెప్పేశాడు.

శారదకు కోపం వచ్చింది. బాధ కలిగింది.

‘‘పెళ్ళి నా వ్యక్తిగత విషయం పార్టీ ఎందుకు జోక్యం చేసుకోవాలి?’’

‘‘పార్టీ సభ్యుల  వ్యక్తిగత జీవితం కూడా పార్టీ నిర్దేశిస్తుంది. మన స్వీయ ప్రయోజనాల  కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం.’’

‘‘మేం నీకు ఇష్టం లేని మనిషిని కట్టబెట్టాలను కోవటం లేదు. నువ్వు ప్రేమించిన మనిషినే పెళ్ళాడమంటున్నాం.’’

‘‘ఎవరి ప్రేమకు కట్టుబడి అసలు  పెళ్ళే ఒద్దనుకున్నావో ఆ మనిషినే పెళ్ళాడమంటోంది పార్టీ.’’

‘‘పెళ్ళికాని స్త్రీని సమాజం అనుమానంగా చూస్తుంది. పార్టీ నాయకురాలైన నిన్నలా చూడటం మాకు అంటే పార్టీకి ఎలా ఉంటుందో ఆలోచించు’’ ఒక్కొక్కరూ మాట్లాడుతున్న ఆ మాటలు  శారదకు కంపరంగా ఉన్నాయి.

పెళ్ళికాని స్త్రీకి విలువ లేదు. ఆమెను అనుమానిస్తారు. చిన్న చూపు చూస్తారు. తనను ఇప్పుడలా వీళ్ళంతా చూస్తున్నారు. ఆ చిన్నచూపు ఇంకా పెద్దదవకుండా తను పెళ్ళాడాలి, దాంతో గౌరవం వస్తుంది. దీనిని మింగటానికి శారద సిద్ధంగా లేదు, పెళ్ళితో వచ్చే నాయకత్వం, ఆ గౌరవం, ఆ విలువ తనకొద్దని వాదించింది.

‘‘అదంతా మేం నమ్మటం లేదు. మేం అంత సంస్కార హీనులం కాదు. కానీ జనం, జనం కోసం. జనానికి మన విలువలు  నేర్పాలి. నిజమే. కానీ జనానికి ఏం నేర్పాలన్నా ముందు వాళ్ళకు మనవిూద గౌరవం ఉండాలి.’’

వాద ప్రతివాదాలు  చాలా సేపు సాగాయి. శారద ఒక్కత్తీ ఒకవైపు. మిగిలిన వారంతా ఒకవైపు.

‘‘పార్టీ కోసం త్యాగం చేస్తున్నాననుకో. పెళ్ళి మాత్రం చేసుకోవాల్సిందే’’ గట్టిగా అన్న రాజు మాటకు శారదకు ఒళ్ళు మండుకొచ్చింది. ఆ కోపాన్ని అణుచుకోటానికి చాలా సేపే పట్టింది. అందరూ ‘త్యాగం’ అనే మాటను పట్టుకుని శారద త్యాగం చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. తను చేయాల్సిన త్యాగాలూ  ఎప్పుడూ ఇలా ఉంటాయేమిటనుకుంటే శారదకు దుఃఖంతో పాటు నవ్వూ వచ్చింది.

శారద చదువు మానేసి సహాయనిరాకరణ ఉద్యమంలో వెళ్తానంటే చదువుకోవటమే త్యాగమని పెద్దందరూ కలిసి వాదించి శారదను ఒప్పించారు. ఇపుడు పెళ్ళి అనే బంధం లేకుండా పార్టీలో పని చేస్తానంటే పెళ్ళి చేసుకోవటమే త్యాగమని ఒప్పించాలని చూస్తున్నారు. ప్రేమించిన మనిషిని పెళ్ళాడమని అందరూ నిర్భంధించటం, స్త్రీ నిరాకరించటం. ఎవరి జీవితంలో నైనా ఈ విచిత్రం జరుగుతుందా అనుకుంది శారద.

తల్లి తన సంప్రదాయపు ఆలోచనలన్నీ పక్కనబెట్టి మూర్తిని పెళ్ళాడమని అడిగితే శారద ఒప్పుకోలేదు. ఇపుడు పార్టీ అడుగుతోంది. పార్టీ ఆడది పెళ్ళి చేసుకు తీరాలనే సంప్రదాయాన్ని కాపాడటం కోసం పెళ్ళి చేసుకోమంటోంది. మగవాడు పెళ్ళి మానేసి బ్రహ్మచారిగా  దేశసేవ చేస్తానంటే అది త్యాగం అవుతుంది. ఆడవాళ్ళు పెళ్ళి మానేసి దేశసేవ చేస్తుంటే సంఘాలకీ, పార్టీలకు ఎక్కడలేని అప్రదిష్ట వచ్చి పడుతుంది. శారద పెళ్ళాడితే ప్రజల మనసులు  శాంతిస్తాయి. ఇంటికి ఒక మగదిక్కు ఏర్పడుతుంది. ఒక పద్ధతిలోకి వస్తుంది. ఇపుడున్నది ఇల్లు  కాదు. అరాచక సత్రం. అక్కడి నుంచి పార్టీ పనులు  జరగటం పార్టీకి ఇష్టంగా లేదు. ప్రతిష్ట దెబ్బ తింటుంది. తను ఇదుగో నా మొగుడని ఒక మగవాడిని తీసికేళ్తేఅందరూ తనను గౌరవిస్తారు. తన చదువు, జ్ఞానం, సాహసం, పార్టీ నిర్మాణ దక్షత, తెలివి, మేధావితనం, ఇవన్నీ ఎందుకూ పనికిరావు ఒక మొగుడంటూ లేకపోతే. తనలోని శక్తులన్నీ రాణింపుకు రావాంటే ఒక మగాడు కావాలి. ఆ మగాడు మూర్తి. శారదకి నవ్వొచ్చింది.

పాపం మూర్తి – లోపల  తనవిూద ఎంత ఆశ ఉన్నా తను అంగీకరించదని ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. తను ఎన్నో సంవత్సరాలుగా మూర్తి విూద ప్రేమను తన మనసులోనే అణచివేసుకుంది. ఇప్పుడు నిర్భంధిస్తున్నారు మూర్తిని పెళ్ళాడాల్సిందేనని. పెళ్ళాడాలా? పార్టీని ఒదలాలా? పెళ్ళాడితే పార్టీ, మూర్తి తన జీవితంలో భాగం. పెళ్ళాడకపోతే మూర్తి ఎలాగూ ఉండడు. తను పార్టీకి రాజీనామా చెయ్యాలి? దేనికోసం, పార్టీని ఒదలాలనే ఆలోచన భరించలేకపోతోంది. పార్టీ పొరపాటుని లోపల ఉండి మార్చాలి. పార్టీ నుంచి తప్పుకుంటే ఇక ఈ ధోరణి ఎన్నటికీ మారదు. ప్రజలను అనేక విషయాలలో చైతన్యం చేసే అవకాశం రాదు. ఆలోచనలతో శారద మనసు అలిసిపోయింది.

చివరకు తనకు కొంత గడువు కావాలని అడిగింది. వారం పది రోజులలో తేల్చమన్నారు పార్టీ ముఖ్యులు.

ఇంటికి వచ్చిన శారద ముఖం చూసి ఆశ్చర్యపోయింది సుబ్బమ్మ. ఇంత నీరసంగా నిరుత్సాహంగా శారద ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేదు. అందులోనూ ఫాసిస్టు వ్యతిరేక ప్రచార కార్యక్రమం తీసుకున్న తర్వాత మహా ఉత్సాహంతో పనిచేస్తోంది.

‘‘ఏంటమ్మా అలా ఉన్నావు’’ ఒద్దనుకుంటూనే అడిగింది సుబ్బమ్మ.

‘‘ఇలా రామ్మా చెప్తాను’’ అని వెళ్ళి మంచం మీద పడుకుంది శారద.

సుబ్బమ్మ వెళ్ళి పక్కన కూచుంది. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ

‘‘పార్టీవాళ్ళు నన్ను పెళ్ళాడమంటున్నారు. ఎవర్ననుకున్నావ్‌? మూర్తిని’’ సుబ్బమ్మకు ఆ మాట మనసులో ఇంకగానే సంతోషంతో ముఖం వికసించింది.

‘‘నాకు తెలుసు, పార్టీవాళ్ళు నిన్ను కన్నవాళ్ళలా కాపాడతారని. చూశావా? నేను చెప్పిన మాటే వాళ్ళూ చెప్పారు. శారదా`పెళ్ళి చేసుకోమ్మా-  నేను నిన్ను ఎప్పుడూ ఏదీ అడగలేదు. నాకిది ఇష్టం. ఈ పని చెయ్యమని అనలేదు. కానీ ఏ సుఖం లేకుండా మోడులా తిరుగుతున్న నిన్ను చూస్తుంటే నాకు బాగోలేదు. జీవితంలో అన్నీ అనుభవించాలమ్మా ` నీకు పిల్లలు  పుడితే వాళ్ళను పెంచాలనే కోరికతో నా మనసు కొట్టుకు పోతోంది. నా తల్లీ`బంగారు తల్లీ – పార్టీవాళ్ళు కూడా నాలాగే ఆలోచించి ఉంటారు. నా ఈ ఒక్క కోరికా తీర్చు శారదా. ఇంక నేనేం అడగను. మూర్తిని పెళ్ళి చేసుకో!!’’

శారద రెండు మూడు నిమిషాలు  తల్లి నలాగే చూసింది.

తన చిన్నప్పటి నుంచీ తనే లోకంగా బతికిన తల్లి. తన చేతులు  పట్టుకుని అడుగుతోంది. తన ప్రపంచం అనుకున్న పార్టీ దాదాపు ఆజ్ఞాపిస్తున్నట్టే చెబుతోంది.

శారద గబుక్కున లేచి కూర్చుని ‘‘సరేనమ్మా! నీ మాట వింటాను. మూర్తిని పెళ్ళాడతాను. పిల్లల్ని  కంటాను. నువ్వు పెంచుదువు గాని  ’’

అని అటు తిరిగి పడుకుంది. కళ్ళవెంట ఆగకుండా నీళ్ళు కారుతున్నాయి. సుబ్బమ్మ కాసేపు శారద తల నిమురుతూ అట్లాగే కూచుని తరువాత లేచి మెల్లిగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళింది. శారద ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది.

***

శారద పెళ్ళి మద్రాసులో పార్టీ ముఖ్యుల  ముందు ప్రమాణ పత్రాల  విూద సంతకాలు  పెట్టటంతో జరగాలని నిర్ణయిమైంది.

శారద సుబ్బమ్మ వారం రోజుల ముందే మద్రాసు వెళ్ళారు.

బంధు మిత్రులకు విందు చేయాని సుబ్బమ్మ పట్టుబట్టింది. పెళ్ళి గురించి ఒకసారి మనసులో నిర్ణయించుకున్నాక శారద ఉత్సాహంగానే వుంది. నిరుత్సాహం, నీరసం అనే మాటలు  శారద నిఘంటువులో లేవు. శారద మద్రాసు వెళ్ళగానే మూర్తిని కలిసింది.

‘‘మొత్తానికి నాకు మొగుడివి అవుతున్నావు’’ అంది శారద నవ్వుతూ

‘‘ఇదంతా ఇలా జరుగుతుందనీ, మనం భార్యాభర్తలవుతామనే ఆశాలేశం కూడా లేదు నాకు. కానీ జరుగుతోంది. విధి అనేది ఒకటుందని నమ్మాలని పిస్తోంది.’’ అన్నాడు మూర్తి.

‘‘ ఆవిడ ఒప్పుకుందన్నారు. బాగా బాధపడిరదా?’’

‘‘లేదు శారదా. మా మధ్య యాంత్రిక సంబంధమే ఉంది. ఆవిడ దృష్టిలో నేను మామూలు  మగవాడిని. మగవాళ్ళు కొందరు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎవరినన్నా ఉంచుకుంటారు. తప్పులేదు. ఆడదానిగా తను మాత్రం నీతిగా ఉంటుంది. దీనికి అంత విలువ  ఇవ్వదు. అసలు  కళ్ళనీళ్ళు పెట్టలేదనీ కాదు-  నేను కొన్ని హావిూలివ్వలేదనీ కాదు`’’

‘‘హావిూ లేమిటి?’’

‘‘నీ మోజులో ఇంటిని, పిల్లల్ని  గాలి కొదిలెయ్యనని’’

శారదకు మనసు చివుక్కుమంది. కానీ ఇవి తప్పవు.

‘‘నేనూరుకుంటానా?నువ్వలా చేస్తే – ఏమైనా నేనీ పరిస్థితిలో పడినందుకు నన్ను నేను సమాధాన పరుచుకోవటం చాలా కష్టమైంది. అది నీకూ, మిగిలిన వారెవ్వరికీ అర్ధం కాదు.’’

శారద గొంతులో దుఃఖం చూసి మూర్తి విలవిలాడాడు. ‘‘నువ్వు బాధపడి మన ఆనందాన్ని దూరం చెయ్యకు. డాక్టర్‌ శారదాంబ నా భార్య. నువ్వేమిటో, నీ విలువేమిటో నాకు తెలుసు. శారదా ఇదంతా నిజమేనా అనిపిస్తుంది.’’ మూర్తి ఆకాశంలో విహరిస్తున్నాడు. మూర్తి ప్రేమలో శారద మనసు కూడా లీనమయింది.

‘‘ఈ లోకంలో నాకు ఒక పురుషుడిలా కనిపించేది నువ్వొక్కడివే. ఆ రోజు సముద్ర తీరంలో మొదటిసారి, శారదా, అని నువ్వు పిల్చినపుడు నాలో కలిగిన సంచలనం నీకు చెప్పలేను. అది తల్చుకుంటే ఎప్పుడూ ఒక పులకింత. నన్నెంతమందో నా పేరుతో పిలుస్తారు. కానీ నువ్వు పిల్చినపుడు నాకు అర్థమైంది. నేను  నీకోసం శారదగా పుట్టానని. ఎందరో మగాళ్ళు నన్నాకర్షించాలని ప్రయత్నించారు. ఇంగ్లండులో రామనాధం ఎంతో ప్రాధేయపడ్డాడు. కానీ నా దృష్టిలో పురుషుడంటే నువ్వే. నేను స్త్రీని. నువ్వు పురుషుడివి’’.

శారదను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు మూర్తి. శారద ఆ క్షణం నుంచీ తన మనసులో మరింకే సంకోచాలూ లేకుండా మూర్తిని తన వాడనుకుంది.

బంధు మిత్రులను విందుకు ఆహ్వానించటం చాలా పెద్ద పని. బంధువుల సంగతి తల్లికి అప్పగించి తను స్నేహితులను కలిసే పని పెట్టుకుంది. విశాల ఎక్కడుందో తెలియలేదు. అందుకని ముందుగా కోటేశ్వరి దగ్గరకు వెళ్లింది. కోటేశ్వరి ఇపుడు ట్రిప్లికేన్‌లో మంచి విశాలమైన ఇంట్లో ఉంటోంది. ఆ సంగతి తన ఊరి నుంచి వచ్చిన బంధువొకతను చాలా వ్యంగ్యంగా చెప్పాడు. శారద ఆ ఇల్లు  వెతుక్కుంటూ వెళ్ళింది. నిజంగానే ఇంతకుముందు ఇంటికీ దీనికీ పోలికే లేదు. రాజ్యం సినిమాల్లో వేషాలు  వేస్తోంది. మంచి పేరే సంపాదించింది. రాజ్యం అందం వెండితెరను వెలిగించింది. ఆ వెలుతురు కోటేశ్వరి ఇంట్లో ప్రతిఫలిస్తోంది. కోటేశ్వరి శారద పెళ్లి మాట విని సంతోషించింది. విశాల ఒక్కసారి కూడా కోటేశ్వరిని చూడటానికి రాలేదట. ఈవిడ మాత్రం కూతురి వివరాలన్నీ కనుక్కుంటూనే ఉంది.

‘‘ఇద్దరు పిల్లల్ని  కన్నది. లోపలేం జరుగుతుందో గాని బైటికి బాగానే ఉంటోంది. పెద్ద ఆఫీసరయింది. మొగుడికింకా పెద్ద హోదా. కావాలసిందంతా సాధించుకుంది. మహా మొండిది. నా పోలికే’’ అని నవ్వింది కోటేశ్వరి. అందులో దిగులే గాని గర్వం కన్పించలేదు. కోటేశ్వరి నుంచి విశాల  చిరునామా తీసుకుంది శారద.

శారదను చూసి విశాల చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పది నిముషాల్లో తన హోదా, సంపద, సంతృప్తి అంతా శారదకు అర్థం చేయించాలని తాపత్రయ పడిరది. ఇల్లు, పిల్లలు, భర్తా, నౌకర్లు, ఫర్నిచరు అంతా గర్వంగా చూపించింది.

‘‘అంతా నువ్వనుకున్నట్టే జరిగింది. బాగున్నావు’’ అంది శారద.

‘‘మేమిద్దరం ఢల్లీిలో పోస్టు కోసం ప్రయత్నిస్తున్నాం. దేశం స్వంతంత్ర మవుతుంది త్వరలో. అప్పటికి ఢల్లీిలో ఉన్నవాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మంచి పొజిషన్స్‌లోకి తేలిగ్గా వెళ్ళొచ్చు’’.

శారద తన పెళ్ళి సంగతి చెప్పింది.

Jpeg

Jpeg

‘‘ఆయనకు పెళ్ళాం, పిల్లలూ  ఉన్నారుగా’’ అంది విశాల  ఆశ్చర్యంగా.

‘‘ఉన్నారు. ఐనా మేం ప్రేమించుకున్నాం’’ తేలిగ్గా తీసేసింది.

‘‘శారదా ఎంతో తెలివైనదానివి. ఇంత పిచ్చిపని చేస్తున్నావేంటి. నీ పెళ్ళికేం విలువ  ఉంటుంది. అందులో మంగళసూత్రం లేని, మెట్టలూ , సప్తపది, ఏదీ లేని కాగితాల  పెళ్ళి. ఏ రకంగా దాన్ని పెళ్ళంటావు. దానిని ఎవరు గౌరవిస్తారు. నిన్నెవరూ మూర్తి భార్య అనరు’’ ఆవేశపడుతున్న విశాల ను ఆపింది శారద.

‘‘ఏమంటారో నాకు తెలుసులేవోయ్‌ ` ఈ పెళ్ళిళ్ళలో నా కసలు  నమ్మకం లేదు. మా మధ్య ప్రేమ ఉంది. పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే ఈ తంతు జరిగేది కాదు.’’

‘‘అవసరమా – అంటే’’

‘‘అంటే నా రాజకీయాలు  నీకు తెలుసుగా. పెళ్ళికాని స్త్రీ రాజకీయాలలో ఉంటే ప్రజలంతా గౌరవించరని –  ఆ గౌరవం కోసం పెళ్ళాడుతున్నా –  రెండోపెళ్ళి వాడయినా ఒక మగవాడు పక్కనుంటే గౌరవం. అందుకని పెళ్ళాడుతున్నా’’ కాస్త విసురుగా కసిగా అంది.

‘‘నీకా గౌరవం రాదు. ఉన్నగౌరవం పోతుంది. గౌరవం ఉన్న వాళ్ళెవరూ ఈ పెళ్ళిని గౌరవించరు’’.

‘‘గౌరవించేవాళ్ళు గౌరవిస్తారు. లేనివాళ్ళు లేదు. ఇది పార్టీ నిర్ణయం. ఒకరకంగా నేను సంతోషంగానే ఉన్నాను’’.

‘‘నేను సంతోషంగా లేను’’ అంది విశాల  నిర్మొహమాటంగా.

‘‘సరే సంతోషంగా లేకపోతే నేనిచ్చే విందుకు రావొద్దులేవోయ్‌’’ పేలవంగా నవ్వింది శారద.

‘‘శారదా –  ఇప్పటి నీ పరిస్థితిలో పడతానని నేను ఎన్ని సంవత్సరాలు  భయపడ్డానో నీకు తెలియదూ . నువ్వు చూసి చూసి ఆ స్థాయికి ఎందుకు దిగిపోతున్నావు? పైగా సంతోషంగా –  మనిద్దరికీ ఎంత తేడానో చూడు’’.

‘‘విశాలా –  నీకూ నాకూ చాలా తేడా ఉంది. నీకు వివాహం మీదా, స్త్రీకి అది తెచ్చిపెట్టే గౌరవం మీద, ఎంతో నమ్మకం ఉంది. నాకా నమ్మకం లేదు. నీకు నీ చుట్టూ ఉన్న లోకం ఇచ్చే పైపై గౌరవాలు  కావాలి. నేను ఈ లోకాన్ని మార్చాలి. ఇప్పటి నా పెళ్ళిలో వింత, వైరుధ్యం ఏమిటంటే నేను లోకం ఇచ్చే గౌరవం కోసం ఈపెళ్ళి చేసుకుంటున్నాను. అది నాకు ఇష్టం లేదు. నేను మూర్తిని ప్రేమించాను. అతను తప్ప మరెవరినీ నా జీవితంలోకి రానిచ్చే ఉద్దేశమే లేదు. తీరా అతనితో వివాహం నా కోసం కాకుండా లోకం కోసం జరుగుతుంది. ఇదంతా అర్థం చేసుకోవటం నాకే కష్టంగా ఉంది. నీకసలు  అర్థమే కాదు. ఒదిలెయ్‌ –  రావానిపిస్తే మమ్మల్ని అభినందించటానికి రా –  లేకపోతే లేదు. నే వెళ్తా’’ శారద లేచింది.

‘‘ఆగు’’ అంటూ విశాల  లోపలికి వెళ్ళి వెండి పళ్ళెంలో రవికె గుడ్డ, పూలూ , పళ్ళూ తీసుకొచ్చి, శారదకు బొట్టుపెట్టి పూలూ  పళ్ళూ రవికె ఇచ్చింది.

‘‘పూర్తిగా బ్రాహ్మణుల్లో కలిసి పోయావా.’’ అంది శారద నవ్వుతూ.

‘‘ఔను శారదా ` నా పిల్లలు  బ్రాహ్మణులు . బాగా చదువుకుంటున్నారు. నన్ను చూసి గర్వపడతారు. మా అమ్మను చూసి నేనేనాడూ గర్వపడలేదు. సిగ్గుపడ్డాను. బాధ పడ్డాను. కోపం తెచ్చుకున్నాను. ఆ పరిస్థితిలో నా పిల్లలు  పడకూడదనుకున్నాను. నా అదృష్టం. అన్నీ నేననుకుంటున్నట్టే జరుగుతున్నాయి. మా అమ్మ, మా కులం ఇవన్నీ నా పిల్లలకు  తాకకుండా జాగ్రత్తగా పెంచుతున్నాను’’.

‘‘చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు గ్రహించే ఉంటావు. మీ అమ్మంటేనే నాకు గౌరవం. నువ్వంటే జాలి `’’

‘‘నేను జాలిపడాల్సిన స్థితిలో లేను శారద –  నేను పెద్ద చదువు హోదా, అధికారం ఉన్న ఆధునిక స్త్రీని. నన్ను చూసి జాలి ఎందుకు ` ’’ తీవ్రంగా అంది విశాల .

శారద విశాల  భుజం తట్టి బైటికి వచ్చేసింది.

విశాల  మాటు శారదలో కలకలం  రేపాయి. విశాల  తనను తాను ఆధునిక స్త్రీ అనుకుంటోంది. చదువు, ఉద్యోగం, హోదా, ఇల్లాలుగా, తల్లిగా గౌరవం ఇవేనా ఆధునికతకు లక్షణాలు?. చదువు గురించి సందేహం లేదు. తమను ఆధునిక స్త్రీగా చూడానుకున్న  రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ, నాన్న, హరిగారూ అందరూ చదువు ఆధునికతకు మొదటి మెట్టు అనుకున్నారు. విశాల  ఎవరి ప్రోత్సాహం లేకుండానే కష్టపడి చదివింది. ఇద్దరూ ఎవరి కులం, సంప్రదాయాలను వాళ్ళు వ్యతిరేకించారు. విశాల  తల్లికి దూరమైతే, తాను నాన్నమ్మకు దూరమైంది. లేదా తన ఆధునికత నాన్నమ్మను అందరికీ దూరం చేసింది. ఇప్పుడు విశాల  తల్లిని దూరం చేసుకుని తను ఆధునికం అని నమ్మిన దారిలో నడుస్తుంటే, అందులో ఏదో పొరపాటుందని తనకు అనిపిస్తోంది. సంప్రదాయబద్ధంగా పెళ్ళి చేసుకోకుండా పెళ్ళయినవాడిని ప్రేమించి, కాగితాల  మీద సంతకాలతో, పార్టీ ఆదేశంతో పెళ్ళాడుతుంటే అది తప్పని విశాల కు అనిపిస్తోంది. పెళ్ళికి కాక ప్రేమకు మివివ్వటం ఆధునికత అని తను నమ్ముతోంది. ఎవరిది పొరపాటు?  ఆధునికతను అర్థం చేసుకోవటంలో తనది పొరపాటు కాదు. మార్క్సు కమ్యూనిస్టు మేనిఫెస్టోలో వివాహం గురించి రాసింది చదివి తను ఎంత ఉప్పొంగిపోయింది. ఈ బూర్జువా వివాహ వ్యవస్థను గౌరవించాల్సిన పని లేదు. దాని విధి నిషేధాల  మీద తిరగబడటమే ఆధునికత. కానీ పార్టీ ఆదేశానికి ముందు తాను తిరగబడాలనుకోలేదు. పార్టీ లోకానికి గౌరవం ఇచ్చి తనను పెళ్ళాడమనేవరకూ తను మూర్తిని దూరంగా ఉంచింది –  ప్రేమ ఉన్నపుడు అదే ముఖ్యమని ఎందుకు అనుకోలేక పోయింది ?  మరో స్త్రీని బాధ పెట్టాల్సి వస్తుందనా ?  ఎన్ని సంక్లిష్టతలు ?  ఎన్ని వైరుధ్యాలు?  ఔను ఆధునికతకు దారి సుగమం కాదు. నలుపు తెలుపు గా  స్పష్టంగా కనపడవు. ఆధునికత అనేక స్థాయిలలోఉంటుంది. విశాలకు చదువు, పెళ్ళి, తనకు చదువు, రాజకీయాలూ , సమాజాన్నంతా సమ సమాజం చేయాలనే తపన – ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి. అందరూ ఒకలాగే ఉండాలనుకోవటం అత్యాశ. ఏదైనా తిరుగుబాటు ఆధునికత – విశాల కూడా తన కులం మీద తిరగబడిరది. కానీ ఆ తిరుగుబాటులో ద్వేషం లేకుండా న్యాయం మాత్రమే ఉంటే బాగుంటేది. ద్వేషం లేకుండా తిరగబడటం -ఇదేంటి వర్గ ద్వేషాన్ని నమ్మే తనలో విశాల ద్వేషం గురించి అభ్యంతరం ఎందుకు? కానీ గాంధీ చెప్పింది ద్వేషం లేని తిరుగుబాటే కదూ – అది తనకు బాగా నచ్చింది. చిన్నతనం నుంచీ అది తన జీవితానుభవం. నాన్నమ్మ, నాన్న, అమ్మ, తనూ అందరూ తాము నమ్మినవాటికోసం ఎవరినీ ద్వేషించకుండానే తిరుగుబాటు చేశారు. కానీ అది అన్ని కులాల వారికీ, వర్గాల  వారికీ సాధ్యం కాకపోవచ్చు’’.

శారదను ఆ రాత్రంతా ఈ ఆలోచనలు  వేధించాయి. వీటికి సమాధానం వెతకాలి, మూర్తితో కలిసి, తన తోటి సహచరులతో కలిసి, అనుకుని సమాధానపడి ఎప్పటికో నిద్రపోయింది.

శారద మూర్తిని పెళ్ళాడటం నిజానికి బంధుమిత్రులలో ఎవరికీ అంతగా నచ్చలేదు. అందరూ విశాలలా బహిరంగంగా చెప్పలేదు. విందుకు హాజరయ్యి శారదనూ, మూర్తినీ అభినందించారు. నోటితో నవ్వి నొసలితో వెక్కిరించే మనస్తత్వం నాగరికతతో పాటు పెరుగుతూ వస్తోంది.

దుర్గాబాయి విశాఖపట్నంలో ఎమ్‌.ఎ చదవటం పూర్తయింది. లా చదువుతోంది. శారదను అభినందిస్తూ ఉత్తరం రాసింది. అందులో దుర్గాబాయి కూడా తమకిద్దరికీ ఉన్న తేడాను చూపింది.

‘‘రాజకీయాల కోసం నేను వివాహం నుంచి ఐచ్ఛికంగా బైటికి నడిచాను. నీ రాజకీయాల  కోసం నువ్వు ఒకప్పుడు వద్దనుకున్న వివాహబంధంలోకి నడుస్తున్నావు. ఇది బంధం కాకుండా చూసుకో. ఏ పని చేసినా స్త్రీ విద్య గురించి మర్చిపోకు. ఈ ఆధునిక ప్రపంచంలో విద్య, ఆర్థిక స్వేచ్ఛ మాత్రమే స్త్రీలను కాపాడగలవు’’ అంటూ దుర్గ రాసిన ఉత్తరం కూడా శారదను ఆధునికత గురించి ఆలోచింప చేసింది.

అన్నపూర్ణ, అబ్బయ్యు మద్రాసు రాలేదు. వారొస్తారని శారదా అనుకోలేదు.

శారద ఒక వారం మద్రాసులో గడిపి మూర్తితో కలిసి బెజవాడ వెళ్ళేసరికి విజయవాడలో మిత్రులందరూ ఘనంగా స్వాగతం పలికారు. ఎంతోమంది వచ్చి అభినందించారు. శారద దగ్గర వైద్యం చేయించుకున్నవారు ఒద్దన్నా కానుకలు  తెచ్చి ఇచ్చారు. ఈ సందడంతా అణిగాక వచ్చింది అన్నపూర్ణ.

శారద కోసం ఖద్దరు చీర, మూర్తి కోసం పంచ తెచ్చింది.

‘‘మొత్తానికి పెళ్ళి చేసుకుని అమ్మ దిగులు  తీర్చావు’’ అంది.

‘‘పార్టీవాళ్ళు పట్టుబట్టారు. ఇంకా నయం. మూర్తినే చేసుకోమన్నారు. లేకపోతే ఏం చేసేదానినో ` ’’

‘‘మీ పార్టీ వాళ్ళకు మరో దారి లేదే – నీకు, డాక్టర్‌ శారదాంబకు నీ చదువుకీ, హోదాకి, చైతన్యానికీ ముఖ్యంగా నీ వయసుకీ సరిపోయే వరుడు ఎక్కడ దొరుకుతాడు మీ పార్టీ వాళ్ళకు. మీ ప్రేమ సంగతి తెలుసు గాబట్టి అమ్మయ్య అనుకుని గుండె మీద బరువు దించుకున్నారు’’ స్నేహితులిద్దరూ మనసారా నవ్వుకున్నారు.

‘‘ఇంతకు ముందు ఆడపిల్ల  పెళ్ళి తల్లిదండ్రులకే సమస్య. ఇపుడు రాజకీయ పార్టీలకూ సమస్య అయింది’’ అన్నది అన్నపూర్ణ.

‘‘సమస్యగా చూసే తత్త్వం నుంచి మార్చేందుకు మనలాంటివాళ్ళం కృషి చెయ్యాలి’’.

స్నేహితులిద్దరూ రాజకీయ చర్చల్లో మునిగారు.

శారదాంబ శ్రీమతి అయింది. తాత్కాలికంగా చాలామంది నోళ్ళకు తాళాలు  పడ్డాయి. ఐతే శారదను ఎప్పుడూ, గౌరవంగా చూస్తూ తమకు ఆదర్శంగా నిలుపుకున్న సామాన్య జనానికి శారదను కొత్తగా గౌరవించేందుకేం లేకపోయింది.

***

గమనమే గమ్యం-18

IMG

యుద్ధం. యుద్ధం యుద్ధం. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇదే మాట. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. హిట్లరు విజృంభిస్తున్నాడు. సామ్రాజ్యవాద దేశాల దగ్గరున్న సంపద, అధికారాల మీద అతని కన్నుపడిరది. బ్రిటన్‌తో సహా మిగిలిన యూరోపియన్‌ దేశాలను జయిస్తే ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందనుకున్నాడు. బ్రిటీష్‌ ప్రభుత్వం అన్ని వలసదేశాల ప్రజలనూ యుద్ధంలో తమకు సహకరించమంది. ఆ మాట అన్నది గానీ బలవంతంగానే యుద్ధంలోనికి ప్రజలను లాగుతోంది. కాంగ్రెస్‌ వారికి, కమ్యూనిస్టులకూ కూడా బ్రిటీష్‌ ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన తీరుమీద ఎన్నో ఆలోచనలు . చర్చలు . వాదాలూ. యుద్ధంలో ప్రభుత్వానికి సహకరించే సమస్యే లేదని కమ్యూనిస్టు పార్టీ తీర్మానించింది. గాంధి వ్యక్తిగత సత్యాగ్రహ కార్యక్రమం ఇచ్చారు. అది అంతగా బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేది కాదనే విమర్శ కమ్యూనిస్టులు  చేశారు. కమ్యూనిస్టుల  మీద బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. దొరికిన వాళ్ళను అరెస్టు చేస్తుండటంతో అనేకమంది అజ్ఞాతవాసానికి వెళ్ళారు. నవశక్తి పత్రిక కూడా అజ్ఞాతంలోనే అచ్చయి పంపిణీ అవుతోంది. శారద పని ఇంకా పెరిగింది. అజ్ఞాతంలో ఉన్నవారికి కావలసిన బస తదితర ఏర్పాట్లు, వారి కుటుంబాలను రాజకీయంగా చైతన్యపరచటం, డాక్టరుగా పని – ఒకటి కాదు. పది పనులను ఇరవై చేతులతో చేస్తున్నా చేయవలసినది ఇంకా మిగిలే ఉంటుంది.

శారద ఉపన్యాసాలకు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లా ప్రజలు  విపరీతంగా వస్తున్నారు.

olga

‘‘మన దేశ సంపదను, ప్రజలను తన సామ్రాజ్య రక్షణకు బ్రిటీష్‌ ప్రభుత్వంవాడుకుంటుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. మనం బ్రిటీష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకం. యుద్ధంలో ఆ సామ్రాజ్యం బలహీనమైతే మన బలం పెరుగుతుంది. హిట్లర్‌ నియంత. ఫాసిస్టు, సందేహం లేదు. కానీ బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పేరుతో వలస దేశాలో నియంతల్లా వ్యవహరించటం లేదా? ఫాసిస్టు చర్యలు  చేయటం లేదా? వురి తీశారే విప్లవ కారులను – జలియన్‌వాలాబాగ్‌ ఫాసిస్టు చర్యకాక మరేమిటి? అసమ్మతిని, నిరసనను నొక్కివేయటంలో హిట్లర్‌ రాజకీయాలోకి రాకముందే బ్రిటీష్‌వాళ్ళు నిపుణులయ్యారు. వారు హింసించటంలో సుశిక్షితులై ఉన్నారు. కాకపోతే చట్టమనే పేరుతో పార్లమెంటు పేరుతో ఫాసిజానికి ప్రజాస్వామ్యపు రంగు పూసారు. దానివల్ల వారి పని తేలికయింది గానీ వలస దేశాల  ప్రజల  మీద ఆంక్షలు , నిర్భంధాలు  పెరగలేదా? ఇంగ్లండు, జర్మనీ వైరం వాళ్ళనీ, వాళ్ళనీ తేల్చుకోనివ్వండి. మనం మాత్రం సహకరించకూడదు’’.

బ్రిటీష్‌వాళ్ళ మీద నిప్పులు  చెరుగుతూ శారద ఈ మాటలను ఉదాహరణతో  చెబుతుంటే ప్రజల  రక్తం మరిగేది. వారు వ్యక్తి సత్యాగ్రహం చెయ్యకుండా  ఉండలేకపోయేవారు. జైళ్ళు నిండిపోతున్నాయి. కాంగ్రెస్‌ మంత్రులందరూ రాజీనామా చేశారు.

జాతీయ, రాష్ట్రీయ ప్రభుత్వాల  ఏర్పాటుకు అనుమతిస్తే యుద్ధంలో సహకరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ పూనా మీటింగులో తీర్మానం చేసింది. గాంధీజీకి ఈ తీర్మానం ఇష్టంలేకపోయినా సమావేశంలో ఆమోదం పొందిందంటే అర్థం ఏమిటని శారద, అన్నపూర్ణా ఆవేదన పడ్డారు. దీని వెనక రాజాజీ ఉన్నారని అన్నపూర్ణ విశ్వాసం. ప్రకాశం పంతులు  గారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో ఈ సంగతులు  చర్చించేటపుడు అన్నపూర్ణ, అబ్బయ్య కూడా ఉన్నారు. ప్రకాశంగారి ఆవేదన వారికి పూర్తిగా అర్థమయ్యింది. నిజానికి ప్రకాశంగారికి ప్రజలలో ఉన్న పలుకుబడికీ, ఆయనలోని నాయకత్వ క్షణాలకు, త్యాగానికి, సాహసానికీ ఎవరూ చాలరు. కానీ కేంద్ర నాయకత్వం ప్రకాశం గారికి ఇవ్వవలసినంత విలువ  ఇవ్వటం లేదని అన్నపూర్ణకి కోపం వస్తుండేది. శారదకు కూడా ప్రకాశం పంతులు  గారంటే గౌరవం ఉంది గానీ, ఆయన బలాలతో పాటు బహీనతలు  కూడా ఆమెకు తెలుసు. చిన్నతనం నుంచీ ఆయనను దగ్గరగా చూసింది.

ఏమైనా రాజకీయాలే ఊపిరిగా బతికే స్త్రీల  సంఖ్య పెరుగుతోంది. ఇంతలో ప్రపంచ పరిస్థితులు  వేగంగా మారిపోతున్నాయి.

హిట్లర్‌కీ, సోవియట్‌ రష్యాకి మధ్య జరిగిన నిర్యుద్ధ ఒడంబడికను హిట్లరు ఖాతరు చేయబోవటం లేదనీ, రష్యా మీదికి కూడా దండెత్తుతాడనీ రాజకీయ వేత్తలు  చెప్పుకోసాగారు. సోవియట్‌ రష్యా యుద్ధానికి సన్నద్ధమవుతుందనే వార్తలు మెల్లిగా వినపడటం ప్రారంభమై గట్టిగా ప్రతిధ్వనించ సాగాయి.

దీనితో కమ్యూనిస్టులు  పెద్ద చిక్కులో పడ్డారు. వారి దృష్టిలో సోవియట్‌ రష్యా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి చుక్కాని. అది ప్రమాదంలో పడకుండా కాపుకాయాలా? మన సంగతి మనం చూసుకోవాలా? సోవియట్‌ రష్యా తనను తను రక్షించుకోగలదు. మనం మన సంగతి చూసుకోవాల్సిందే అన్నారు కొందరు. రష్యా యుద్ధంలో ఓడిపోతే ఇక ఏ దేశంలోనూ కమ్యూనిస్టు పార్టీ బతికిబట్ట కట్ట లేదన్నారు మరి కొందరు. చర్చలు  ఎడతెగకుండా సాగాయి.

శారద మనసు, మెదడు మండిపోతున్నాయి. ప్రపంచానికి సోవియట్‌ రష్యా ఒక ఆశాజ్యోతి. ఆ జ్యోతి ఆరిపోకూడదు. బ్రిటీష్‌ ప్రభుత్వం వెయ్యి చేతుల రాక్షసి. దాని చేతులు  నరకకుండా ఆ చేతులకు ఆయుధాలు  అందించే పనికి పూనుకోకూడదు.

అసలీ యుద్ధమేమిటి? దీనినెలా అర్థం చేసుకోవాలి?

అగ్ర నాయకులందరూ సమావేశమయ్యారు. రోజుల తరబడి చర్చలు  జరిగాక జోషిగారు తన వాదనతో అందరినీ ఒప్పించగలిగాడు.

‘‘ఇది ప్రజా యుద్దం’’ అన్నాడాయన.

సోవియట్‌ రష్యా యుద్ధంలోకి రాకముందు, ఇది సామ్రాజ్యవాదుల  మధ్య పంపకాలు, దోపిడీ కోసం జరిపిన యుద్ధం. కానీ ఇప్పుడా స్వభావం మారింది. హిట్లరే సోవియట్లను మింగదల్చుకున్నారు. అది ప్రపంచ ప్రజలందరికీ హాని చేస్తుంది. సోవియట్‌ యూనియన్‌లో ప్రజలు  యుద్దంలోకి దిగారు. ఆ ప్రజలకు తోడు మనం. ప్రజా యుద్ధం మన యుద్ధమే.

మాటలే మంత్రాలు. మాటలకు మంత్రశక్తి ఉంటుంది. వాటిలో ఉన్న భావానికి, వాటిని విన్నవారికీ మధ్య ఒక గొప్ప సమన్వయం కుదురుతుంది. ఇక వాళ్ళు ఆ మాటలకు మంత్రముగ్ధులై పోతారు వశులైపోతారు. ‘‘ప్రజాయుద్ధ’’మనేమాట కమ్యూనిస్టులలో అనేకమంది మీద మంత్రంలాగే పనిచేసింది.

olga title

శారదకు మాత్రం అది ఒక పట్టాన కొరుకుడు పడలేదు. యుద్ధంలో బ్రిటీష్‌వాళ్ళకు సహకరించటం ఆత్మహత్యా సదృశ్యమనిపించింది. ఇన్నాళ్ళూ యుద్ధ వ్యతిరేకత, ప్రజల్లో ప్రచారం చేసి, ఇప్పుడు హఠాత్తుగా యుద్ధానికి అనుకూలంగా మాట్లాడటమెట్లా! వాళ్ళకేం చెప్పాలి? ఎలా చెప్పాలి? శారద చాలాసేపు వాదించింది. కానీ ఫలితం లేదు. మెజారిటీ సభ్యులు  ‘‘ప్రజాయుద్ధం’’లో పాల్గొనటానికి సిద్ధమైపోయారు. శారద మద్రాసు వెళ్ళి మూర్తితో మాట్లాడిరది. మూర్తి కూడా అది ప్రజాయుద్ధమనే అంగీకరించాడు. సోవియట్‌ రష్యా ప్రజలు  హిట్లర్‌ నెదిరించి చేస్తున్న యుద్ధం, పోరాటం, భారతదేశంలో అసమాన త్యాగాలుగా కీర్తిస్తున్నారు. స్టాలిన్‌  తిరుగులేని కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజల హృదయాలలో ముద్ర వేసుకుంటున్నాడు. శారద పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ప్రజాయుద్ధ  భావనను అంగీకరించింది. సోవియట్‌ రష్యా ప్రభుత్వమూ ప్రజలు  ప్రదర్శిస్తున్న సాహసం గురించి ఆమెకెలాంటి సందేహమూ లేదు. కానీ ఆమె మనసులో ఎంతో సంచలనం. జ్ఞానం వచ్చిననాటి నుంచీ ద్వేషించి వ్యతిరేకించిన బ్రిటీష్‌ పాలకులతో సహకరించాలంటే ఆమె భరించలేక పోతోంది. కానీ అది మింగేసి ప్రజలందరితో ఆ మాట చెప్పాలి. ఎలా చెప్పటం? చెప్పక తప్పదన్నది కమ్యూనిస్టు పార్టీ.

బెజవాడలో బహిరంగసభ పెట్టి ప్రజలకు ప్రజాయుద్ధ భావన గురించి వివరించే పని శారదకే అప్పజెప్పింది. శారద మనసులో ద్వైదీ భావం పోయిందా లేదా? పూర్తిగా పార్టీలైనుకి కట్టుబడిరదా లేదా అన్నది తేల్చుకోవాలని కొందరు సభ్యులు  ఆతృత పడుతున్నారు. శారదలో ఏమాత్రం బలహీనత కనపడినా దాని ఆధారంగా క్రమశిక్షణా చర్యలు  చేపట్టాని వాళ్ళ కోరిక. శారద ఒక ఆడదనే సంగతి వాళ్ళకు అనుక్షణం గుర్తొస్తుంది. శారద చదువువల్లా, చిన్నతనం నుంచీ ఉద్యమాల్లో భాగమవటం వల్లా, కమ్యూనిస్టుపార్టీ తొలితరం నిర్మాతలో మొదటి స్త్రీ అవటం వల్లా, తన ఇల్లుని పార్టీ కేంద్రంగా చేసి, తన సంపాదన లెక్కచూడకుండా పార్టీకి ఖర్చు పెట్టటం వల్లా, పార్టీ తప్ప ఇక వేరే కుటుంబం లేకుండా బతకటం వల్లా, మార్క్స్‌, ఎంగెల్స్‌ రచను అర్థం చేసుకుని వివరించగల శక్తివల్లా, శారదను అగ్రనాయకురాలిగా అంగీకరించక తప్పదు వారికి. జనంలోకి, స్త్రీలోకి చొరవగా చొచ్చుకుపోయే స్వభావం వల్లా, ఇతరులకు ఏ ఆపదా, అవసరం వచ్చినా నేనున్నానంటూ దూకే స్వభావం వల్లా శారదంటే ప్రజలో విపరీతమైన అభిమానం. దానివల్ల ఆమెకు పార్టీలో కొందరు వ్యతిరేకులు  తయారయ్యారు. కొందరికైతే వారికే తెలియకుండా అంతరాంతరాల్లో శారదంటే వ్యతిరేక భావం పెరుగుతోంది. ఆమె చొరవను, ఒక ఆడదానికి ఉండకూడని క్షణంగా వాళ్ళు భావించేవారు. పురుష నాయకులతో సమానంగా తిరుగుతూ, వారి భుజాల మీద చేతులు  వేసి మాట్లాడుతూ, బెరుకన్నది లేకుండా ఉండే ఆమె తీరు వారికి నచ్చదు. పెళ్ళి చేసుకోలేదు. ఎవరినో ప్రేమించింది. రకరకాల  పుకార్లు. వీటన్నిటితో ఆమెమీద వారికే తెలియని వ్యతిరేకత. జ్ఞానం కలిగిన స్త్రీని, మేధావి అయిన స్త్రీని, నాయకత్వం లక్షణాలు  కలిగిన స్త్రీని సహించి భరించగలిగిన స్థితిలో ఉండే పురుషులు  చాలా తక్కువ. అలాంటి స్త్రీలూ  తక్కువమందే కానీ జాతీయోద్యమం కొందరినైనా అలాంటి స్త్రీలను తయారు చేసింది. వాళ్ళు తయారయ్యారు. వాళ్ళను ఎప్పుడెలా అణిచివెయ్యాలా అనే తత్త్వమూ తయారైంది. నాయకులుగా ఎదగాల్సిన అనివార్యతను, నాయకులుగా తమను సహించలేని పురుష ప్రపంచానికీ మధ్య శారదలాంటి మహిళలెందరో నలుగుతున్నారు.

1942 వ సంవత్సరం నాటికి కమ్యూనిస్టులంతా దాదాపు బహిరంగంగా పని చేస్తున్నారు. ఆ రోజు శారదకు పరీక్ష. బెజవాడలో బహిరంగ సభ నిర్వహణ బాధ్యత ఆమెదే –

‘‘జనం వస్తారంటారా?’’ అడిగింది తనతోపాటు ఆ సభలో మాట్లాడాల్సిన సుబ్బారావుని.

‘‘చూద్దాం. ఎంతమంది వస్తే అంతమందితోనే  ’’ అన్నాడాయన. శారద కమ్యూనిస్టుపార్టీ తీర్మానాలు, డాక్యుమెంట్లు వీటికంటే సోవియట్‌ యూనియన్‌ నాజీలను ఎదుర్కొంటున్న తీరూ, నాజీ దుర్మార్గం గురించి వివరించాలనుకుంది. నాజీల  మీద ప్రజలకు ద్వేషం కలగాల్సిందే. ఫాసిజం ఏ మూలనున్నా ప్రపంచానికి కీడేగాని మేలు  జరగదు. ఆ కీడుని ప్రజల  చేత గుర్తింపు చేయటంలో తప్పులేదు. దానిమీద కేంద్రీకరించి మాట్లాడాలనుకుంది.

కానీ ప్రజలెంతమంది వస్తారు? కాంగ్రెస్‌ వాళ్ళొచ్చి మీటింగ్‌ భగ్నం చేస్తారా? రాళ్ళు వేస్తారా? సందేహాలున్నా ముందుకి దూకక తప్పదు. సాయంత్రం అన్సారీ పార్కులో మీటింగు దగ్గరున్న జనాన్ని చూసి శారద నిట్టూర్చింది. ఫరవాలేదు ` మూడొందల  మంది దాకా ఉన్నారు. కాంగ్రెస్‌ వాళ్ళూ వచ్చారు గానీ అల్లరి చేయకుండా మర్యాదగానే కూర్చున్నారు. శారదాంబ అంటే వారికున్న గౌరవం అది.

శారద ఏం చెబుతుందో విందామనే వాళ్ళంతా వచ్చారు.

శారద గంటకు పైగా ఫాసిస్టు ప్రమాదం గురించి మాట్లాడిరది. ప్రపంచాన్ని ఫాసిజం నుంచి రక్షించుకోవటం ప్రపంచ ప్రజలందరి కర్తవ్యం అనిప్రజలకర్థమయ్యేలా మాట్లాడిరది. మీటింగయిపోయాక జనం గ్రూపుగా విడిపోయి మాట్లాడుకుంటుంటే వింటూ వారి మధ్యగా నడుస్తోంది శారద. పార్కు చివరికొచ్చేసరికి అక్కడ అన్నపూర్ణ నించుని ఉంది. ఆమె కళ్ళల్లో కోపం, నిరసన, అసహనం.

‘‘నువ్వూ వచ్చావుటోయ్‌ – రా పోదాం. మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం’’ అంటూ అన్నపూర్ణ భుజం మీద చేయి వేసి లాక్కుపోయింది శారద. ఇల్లు చేరి సుబ్బమ్మను పలకరించి ఆమె చేతివంట తినేసరికి అన్నపూర్ణ కోపం సగం తగ్గింది. మిగిలిన సగం తగ్గకముందే మాట్లాడాలని ‘‘మీ పార్టీకి పద్ధతి, పాడూ లేదా’’ అంటూ మొదలుపెట్టింది.

‘‘ఫాసిజం’’ అంది శారద దానికి తిరుగు లేదన్నట్టుగా.

IMG

‘‘శారదా!  ఫాసిజం గురించి నాకు చెప్పకు. బ్రిటీష్‌వాళ్ళ ఫాసిజాన్ని కళ్ళారా చూశాం. మనకు తెలియదా ?  హఠాత్తుగా బ్రిటీష్‌వాళ్ళు ఫాసిస్టులు  కాకుండా మీకు మిత్రులైపోయారు. సోవియట్‌ రష్యా ఎలా ఆడిస్తే అలా ఆడతారా’’.

‘‘నీకు నచ్చే సమాధానం నేను చెప్పలేను అన్నపూర్ణా. కానీ సోవియట్లకు సహాయపడటం మనందరి కర్తవ్యం. ప్రపంచంలోకెల్లా అందమైన కల ఒకటి వాస్తవమై పురుడు పోసుకుంది. పొత్తిళ్ళలో ఉన్న ఆ చిన్ని పాపాయిని రక్షించుకోకపోతే ప్రపంచానికి భవిష్యత్తనేదే లేదు. కమ్యూనిస్టుగా అది నా బాధ్యత.’’

‘‘నువ్వు ముందు భారతీయురాలివి. తర్వాతే కమ్యూనిస్టువి’’.

‘‘కమ్యూనిస్టుకు దేశాలూ, సరిహద్దులనే సంకుచితపు పరిధులు లేవు. ప్రపంచ శ్రామికులందరిదీ ఒకే జాతి. ఒకే దేశం’’ ప్రేమగా చెప్పింది శారద.

‘‘ఐతే ఇక నేను మాట్లాడేదేం లేదు. కానీ ఇది మంచిది కాదు. నీకూ మీ పార్టీకి’’.

‘‘మంచిదే అన్నపూర్ణా – హిట్లర్‌ వంటి నియంత కు వ్యతిరేకంగా నిలబడటం మంచిదే – నాకూ, మా పార్టీకి , మన దేశానికి.’’

‘‘హిట్లర్‌ నియంతే ఒప్పుకుంటాను. కానీ చర్చిల్‌ నియంత, మోసగాడు కాదా?’’

‘‘మా పార్టీ లైను ప్రకారం చర్చిల్‌ హిట్లరంత నియంత కాడు’’

‘‘నీ మనస్సాక్షికి?’’

‘‘నా మనసు పార్టీకి అంకితం. నా మనసు ఈ పనే చెయ్యిమంది.’’

‘‘నీ మనసు దివాలా తీసింది. సత్యాసత్యా విచారణ మానేసింది. విచక్షణ అడుగంటింది. మూఢత్వం ఒకటే మిగిలింది.’’

‘‘అన్నపూర్ణా ఇక మాట్లాడకు -పార్టీ మినహా జీవితం లేదు నాకు.’’

‘‘కాంగ్రెస్‌ ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే నేను కాంగ్రెస్‌ నుంచి బైటికి వచ్చేసేదాన్ని’’.

‘‘మీ కాంగ్రెస్‌ వాళ్ళకు క్రమశిక్షణ లేదు. మాకు క్రమశిక్షణే ప్రాణం’’.

‘‘ఊపిరాడకుండా చేసే క్రమశిక్షణకు విలువేముంది.’’

‘‘అన్నపూర్ణా –  ఒదిలెయ్యవోయ్‌ – మన అభిప్రాయాలు  కలవవోయ్‌.

అన్నపూర్ణ వదలలేదు. ఆ రాత్రంతా వాదించుకుంటూనే గడిపారు. ఐనా వారి మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి కొంచెం కూడా ద్వేషం కలగలేదు. అయ్యో – శారద ఇంత తెలివితక్కువగా ఉందేమిటని అన్నపూర్ణా , అన్నపూర్ణకు ఇంత ప్రపంచజ్ఞానం లేదేమిటి, అంతర్జాతీయ పరిస్థితుల  గురించి పట్టించుకోదేమిటని శారదా –  ఇద్దరూ ఒకరి మీద ఒకరు జాలిపడ్డారు.

ప్రజా యుద్ధపంధాను వివరించి సభను విజయవంతం చేసినందుకు శారదను పార్టీ అభినందించింది. శారదను వ్యతిరేకించేవారు నోరెత్త లేకపోయారు. శారద మాత్రం చాలా నలిగిపోయింది. మనసు చంపుకుని క్రమశిక్షణకు కట్టుబడటం అంటే అన్నపూర్ణకు చెప్పినంత తేలిక కాదు. కానీ శారద మనసులో సగంపైగా సోవియట్‌ స్వప్నం నిండిపోవటం వల్ల  ఆమె తొందరగానే బాధ నుంచి బైటపడిరది. సోవియట్ల రక్షణ కంటే మించిన కర్తవ్యం లేదు అని స్థిరంగా నమ్మిన శారద ఇక ఉత్సాహంగా ప్రజాయుద్ధ ప్రచార రంగంలోకి దూకింది. భారతదేశం మీదా యుద్ధమేఘాలు  తారాడుతున్నాయి. జపాన్‌ మంచి దూకుడు మీద ఉంది. మద్రాసు మీద బాంబులు  పడతాయనే వార్తలూ , విశాఖపట్నం మీద బాంబులనే వార్తలతో  – అందరూ ఆందోళనలో పడ్డారు. కమ్యూనిస్టు పార్టీ తన సభ్యులకు, సానుభూతి పరులకూ సైనిక శిక్షణ కూడా ఇవ్వటం మొదలు  పెట్టింది. బెజవాడలో వీధుల్లో స్త్రీ పురుషులు  కవాతు చేస్తున్నారు. వారిలో ఫాసిస్టు వ్యతిరేక సమరోత్సాహం ఉప్పొంగుతోంది. ప్రచార దళాల్లో నాటకాలు , బుర్ర కథలు , జానపద కళారూపాలన్నీ బైటికొచ్చాయి. అన్నిటికీ కేంద్రం శారద ఇల్లే. బెజవాడలో ఒక చిన్నపాటి కమ్యూన్‌ కూడా ఏర్పాటయింది. పార్టీలో పూర్తికాలం  పనిచేస్తున్న వారందరూ ఒక చోటే ఉండటంతో అందరిలో ఒక విశ్వాసం, ఆత్మీయతా భావం అంకురించాయి. ఆ కమ్యూన్‌లో స్త్రీలు  కూడా ఉండేవారు. ఒకే ఆశయంతో వచ్చి చేరిన స్త్రీ పురుషుల  మధ్య ప్రేమ చిగురించడం సహజం. ఆ సంగతి శారద కనిపెట్టిందంటే ఇక వారి పెళ్ళి అయిపోయినట్టే. వారికి కూడా ఆ రోజు తమ పెళ్ళి జరుగుతుందని తెలియకుండా హఠాత్తుగా జరిపేది. ఏదో ఒక పండగ రోజు ఆ ప్రేమికులనూ, దగ్గర్లో ఉన్న పార్టీ పెద్దలనూ పిల్చి రెండు దండలు  తెప్పించి వారిచేత మార్పించి పెళ్ళయిందనేది.

చిన్న టీ పార్టీ ఇచ్చేది – అందరూ సంతోషించేవారు.

‘‘మా శారద అందరి పెళ్ళిళ్ళూ చేస్తోంది. తన పెళ్ళి మాత్రం జరగదు’’ అనుకుని నిట్టూర్చేది సుబ్బమ్మ.

సుబ్బమ్మ కమ్యూనిస్టుపార్టీ సభ్యత్వం తీసుకోలేదు గానీ పార్టీ చెప్పిన పనులు  ఎవరికీ తీసి పోకుండా చేసేది. ఏ వేళప్పుడు ఎవరొచ్చినా వారి ఆకలి దప్పుల  సంగతి చూసేది సుబ్బమ్మే.

కమ్యూనిస్టు పార్టీకిపుడు ప్రభుత్వ అండ ఉంది. వారి మీద నిర్బంధం లేదు. పార్టీ ప్రచారం కూడా ఊపందుకుని గ్రామాల్లో బలం  పెరుగుతోంది. ఇది సహించలేని ఇతర రాజకీయ పార్టీలు  , ముఖ్యం కాంగ్రెస్‌, హీనమైన పద్ధతులకు దిగాయి. కమ్యూనిస్టు నాయకుల  మీద ఆరోపణలు .

శారదకేవో సంబంధాలు  అంటగట్టడం  ‘‘ములుకొల’’ అనే పత్రికలో రాసే రాతలు  సత్యం కాదని అందరికీ తెలిసినా, వాటి గురించి చెవులు  కొరుక్కునేవారు, చర్చించేవారూ ఉండనే ఉంటారు. నిప్పు లేనిదే పొగ రాదుగా అనేవారే ఎక్కువ. ఆ కామెర్ల రోగపు పత్రికలో శారదతో కమ్యూనిస్టు నాయకుడైన రామకృష్ణ పేరు జతచేసి బురద చల్లారు. రామకృష్ణ మద్రాసులో చదువుకునే నాటినుంచీ శారదను ‘అక్కా’ అని పిల్చేవాడు. తన సందేహాలో, ఆందోళనలో నిరాశా నిస్పృహలలో శారద వంక చూసేవాడు. శారద రామకృష్ణకు స్వంత అక్కలా అండగా ఉండేది. ఆ చిన్నప్పటి చనువు పోయేది కాదు. అది పార్టీలో మొదటి నుంచీ ఉన్నవారికి తెలుసు. ఐనా సానుభూతిపరులలో ఇదొక చర్చ రేపింది. ఆ విషయం గురించి ఏదో ఒక నెపం కల్పించుకుని మాట్లాడటం మెల్లిగా మొదలైంది.

శారద పెళ్ళి చేసుకోకుండా ఉండటం నచ్చని వాళ్ళు ‘ఇది కారణం’ అని చెప్పుకోటానికి ఆ పత్రిక ఒక హీనమైన కారణాన్ని ఇచ్చినట్లయింది. రామకృష్ణ, శారదాంబా ఈ మాటకు నవ్వుకుని దానిని తీసి అవతల పడెయ్యగ సామర్థ్యం

ఉన్నవారే. కానీ ఇద్దరూ ప్రజలలో పనిచేస్తున్నారు. ఆ ప్రజలు  రకరకా చైతన్యాలతో ఉన్నారు. వాళ్ళలో కొందరు తప్పకుండా అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకుని పార్టీకి దూరమైతే పార్టీకి నష్టం. అందులోనూ ఎంతోమంది మహిళా కార్యకర్తులుగా, సానుభూతిపరులుగా ఉన్నారు. వాళ్ళంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. శారద వాళ్ళలో కొందరికి వింతగా కనిపిస్తుంది. తమంత విధేయంగా, అణకువగా శారద పార్టీలోని పురుషులతో ప్రవర్తించటం లేదనుకుంటారు. పార్టీలో పురుషులను వీరు అన్నయ్యా, తమ్ముడూ అంటూ వాళ్ళను గౌరవిస్తూ, వారి మాటలు  అక్షరాలా పాటిస్తూ, వినయంగా ఉంటారు. వారికి ఏదైనా సహాయమో, సేవో చేయగలిగితే తమ జన్మ ధన్యమన్నట్లు ఉంటారు.

శారద మగవాళ్ళతో సమానంగా, వాళ్ళకే ఆజ్ఞలిస్తూ, నవ్వుతూ తుళ్ళుతూ హాస్య చతురతతో మాట్లాడుతూ, జ్ఞానాధికారంతో శాసిస్తూ, నడిపిస్తూ ఉంటుంది. స్త్రీలలో కొందరికి శారద చాలా నచ్చుతుంది. డాక్టరమ్మలా మనమూ ఉండానుకుంటారు. కానీ చాలామంది ఆడమనిషి అలా ఉండటమేమిటి అనుకుంటారు. ఆమె చొరవ వాళ్ళకు అర్థం కాదు. ఇక మగవాళ్ళలో మొదటినుంచీ శారద పరిచయం  ఉన్నవాళ్ళు, ఆమె కుటుంబ నేపథ్యం గురించి తెలిసినవాళ్ళు శారద గురించి ఏ కంప్లయింట్లూ లేకుండా ఉంటారు. మిగిలిన సభ్యులందరికీ శారదను చూస్తే బెదురు. వారికే తెలియని భయం. కోపం, ఆందోళన, ఒక ఆడమనిషి ఇలాగా ఉండేది –  ఆ నవ్వటమేమిటి? రామకృష్ణంతటి వాడి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడటమేంటి? ఆ మాటలేమిటి? వినయం లేదు. ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదని లేదు. ఇంగ్లీషు బాగా వచ్చని గర్వం. ఇంగ్లండు వెళ్ళి చదివి వచ్చిందిగా అక్కడ ఏం చేసిందో ఏమో `-ఇక్కడ మన ఆడవాళ్ళిలా తయారైతే ఇక అయినట్లే – ఇలా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళందరికీ ములుకోల రాతలు  బాగా దొరికాయి.

ఆవిడ మూలంగా దేవుడిలాంటి రామకృష్ణ మీద అపవాదు వచ్చిందని కొందరు, ఏమో ఆవిడిల్లు రహదారి బంగాళాలాంటిది. ఎవరెవరో వస్తారు పోతారు. లోపలేం జరుగుతుందో చూసిన వారెవరూ అని మరికొందరు, పార్టీకింత అప్రదిష్ట వచ్చిందని మరికొందరు, గొణగటం మొదుపెట్టారు. పైకి అందరూ ములుకోల రాతల్ని విమర్శించేవారే గానీ లోపలోపల  కొందరు ఉడుకుతున్నారు. అసలా అవకాశం ములుకోలకు ఎందుకివ్వాలి మనం? అనేది వారి ప్రశ్న. రంధ్రాన్వేషకులు  తామే చిల్లులు  పెట్టి ఇదిగో ఇక్కడ చిల్లు  వుందని గగ్గోలు  పెడతారని వారికి చెప్పి సమాధాన పరిచేవారు లేకపోయారు. ఎందుకంటే ఈ విషయాల  గురించి గంభీరంగా, దానిని పరిశీలించి అందులో ఉన్న సామాజిక విషయాలను గురించి, స్త్రీ పురుష సంబంధాల గురించి, ఆధునిక స్త్రీని అర్థం చేసుకోవటం గురించి బహిరంగంగా కింది నుంచి పై వరకూ చర్చ జరగటం మంచిదని ఎవరూ అనుకోవటం లేదు. అసలు  ఆ ఆలోచనే ఎవరికీ రాలేదు. ఎంతకూ ఇదేదో జరగరానిది జరిగింది – దీనిని దాచిపెట్టాలి, దీని గురించి మాట్లాడకూడదు, దీనిని తుడిచేయాలి అనే అనవసర  అపరాధ భావనతోనే పార్టీ పెద్దలు  కూడా ఉన్నారు. చివరకు ఒకరోజు రామకృష్ణ కూడా ముఖం వేలాడేసుకుని శారద దగ్గరకు వచ్చాడు.

శారద ఎప్పటిలాగానే ‘‘చూశావటోయ్‌ ఈ గోల’’ అని గలగల నవ్వింది.

‘‘ఎలా నవ్వగలుగుతున్నావక్కా’’ అన్నాడు రామకృష్ణ.

‘‘నవ్వక – నువ్వు నవ్వటం లేదా? అదేంటా ముఖం అలా ఉంది. ఆ పత్రిక రాతల్ని నిజంగానే పట్టించుకున్నావా ఏంటి ` రామకృష్ణా – నీకు పిచ్చా’’ అంది ఆశ్చర్యపోతూ.

‘‘పిచ్చి నాకు కాదు. లోకానికి. లోకంలో కొందరు నమ్ముతున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు.’’

‘‘నాకు చాలా బాధగా ఉంది. పార్టీలో ఇలాంటి గొడవ రావటం’’.

olga title‘‘ఆడమగా కలిసి పని చేసేటపుడు వస్తాయి ఇలాంటి సమస్యలు. ఇంతకుముందు జరగని పని గదా – వింతగా చూస్తారు, విడ్డూరంగా చెప్పుకుంటారు. వంకర మాటలు  మాట్లాడతారు. వీటి గురించి మనం బాధ పడటం కాదు. వాళ్ళతో, స్త్రీ పురుష సంబంధాల గురించి కొత్త విషయాలు  కొత్త పద్ధతిలో మాట్లాడాలి. అదొక కార్యక్రమంగా ఉండాలి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. మనం మాట్లాడుతూ మన పని చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకు ఇలాంటివి సర్దుకుంటాయి. ఆడ, మగ, అన్నాచెల్లెళ్ళలానో, తండ్రీ కూతుళ్ళలానో, భార్యాభర్తలు గానో కాకుండా స్నేహితుల్లా, కామ్రేడ్స్‌లా కలిసి పని చెయ్యొచ్చని అర్థం చేయించాలి. ఇది చాలా పెద్ద పని. కానీ అవసరమైన పని’’.

శారద కళ్ళు ఆ పని గురించిన బాధ్యతతో మలుగుతున్నాయి.

రామకృష్ణ ఆ మాటలు  పట్టించుకునే మానసిక స్థితిలో లేడు.

అందుకే అనాలోచితంగా ‘‘చాలా మందికి నీ ప్రవర్తన నచ్చటం లేదు’’ అన్నాడు.

శారద ముఖం చిట్లించింది.

‘‘అంటే – ప్రవర్తన అంటే ` ’’

రామకృష్ణ శారద ముఖం చూస్తూ ఎలా చెప్పగలిగాడో గాని

‘‘నువ్వలా ఎక్కడైనా ఎవరి ముందైనా పెద్దగా నవ్వటం, మన కామ్రేడ్స్‌ భుజాల మీద చేతులు  వెయ్యటం, వీపు తట్టడం. నీ అతి చనువు. ఆడవాళ్ళిలా ఉంటే ప్రమాదమనుకుంటున్నారు’’.

‘‘ఎవరనుకుంటున్నారు?’’

‘‘అందరూ –  సీనియర్స్‌ కూడా  నువ్వు కొంత మారితే మంచిదనుకుంటున్నారు.’’

‘‘నువ్వేమనుకుంటున్నావు రామకృష్ణా’’

‘‘నాకు నీ గురించి తెలుసక్కా. కానీ మిగిలిన వాళ్ళకు నువ్వర్థం కావు. దానివల్ల  పార్టీలో కొస్తే ఆడవాళ్ళిలా తయారవుతారని భయపడుతున్నారు.’’

శారద గంభీరమైంది. ఆమె ముఖం ఎరుపెక్కింది.

‘‘నువ్వు మాట్లాడే మాటలు నేను సీరియస్‌గా తీసుకుంటే నేను పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళాలి’’.

‘‘అది కాదక్కా –  నా ఉద్దేశం అది కాదు. నువ్వు కాస్త మారితే –  పార్టీ కోసం’’ రామకృష్ణకు తనెంత ప్రమాదంలో పడ్డాడో తెలిసి ఆగాడు.

‘‘ఏం మారాలి? గ్రామాల  నుంచి ఇప్పుడే కళ్ళు తెరిచి కొత్తలోకంలో భయంగా, బెరుకుగా, జంకుగా అడుగుపెడుతున్న ఆడదానిలా నేను తలదించుకుని మగ కామ్రేడ్స్‌తో మాట్లాడాలా? వాళ్ళకు నేను వినయంగా ఆదేశాలు  ఇవ్వాలా? వాళ్ళను నా తోటి కామ్రేడ్స్‌లా కాకుండా నా కంటే ఎక్కువైన వాళ్ళలా, ‘మగ’, వాళ్ళలా చూడాలా? కొంగు కప్పుకోవాలా భుజాల  చుట్టూ. వాళ్ళకంటే ముందు నడవకుండా వాళ్ళ వెనకాల  నడవాలా? వాళ్ళడిగితే తప్ప సలహాలివ్వకుండా ఓర్పుగా ఎదురు చూడాలా? నిజమే మహిళోద్యమ కార్యకర్తలు  మగ కామ్రేడ్స్‌తో చాలా, పరిమితుల్లో ఉంటున్నారు. అది కొత్త కాబట్టి. ఎప్పటికీ వాళ్ళలా ఉంటే వాళ్ళకింక కమ్యూనిస్టు పార్టీ ఎందుకు?’’‘‘అదంతా నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి పోవాలిగా. ఏటికి ఎదురీదలేంగా’’.

‘‘పరిస్థితుల్ని మార్చటానికా మనం ఉంది, పరిస్థితుల్ని బట్టి పోటానికా? ఏటికి ఎదురీదాలి కమ్యూనిస్టులు . నేను ఆధునిక స్త్రీని రామకృష్ణా. బహుశ మీరు నన్ను భరించలేకపోతున్నారు. నా తల్లిదండ్రులు  నేనూ ఈ సమాజం మీద ఎంత పోరాటం చేస్తే నా చదువు సాధ్యమైందనుకున్నావు? చదువుకునే రోజుల్లో నన్నెందరు ఎన్ని మాటలన్నారనుకున్నావు. బూజు దులిపినట్లు దులిపేశాను ఆ మాటల్ని. వాటన్నిటినీ పట్టించుకుంటే నేను కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరినయ్యేదాన్నా. నేను ఎప్పుడూ గలగలా నవ్వటమే మీకు కనిపిస్తోంది. అలా నవ్వటం నా హక్కు అని అర్థం చేసుకుని నవ్వటానికి నాలో జరిగిన స్ట్రగుల్‌ నీకు తెలియదు. నీ భుజం మీద చేయి వేసి మాట్లాడతాను. నిజమే. ఆ పరిస్థితికి రావటానికి ఆటంకంగా ఉన్న ఎన్ని పర్వతాలను దాటి, సముద్రాలను ఈది వచ్చానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. నీకు తెలియదసలు . నీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఇంకా నేనెన్నిటికి బందీగా ఉన్నానో, ఎన్ని తెంచుకోవాలో అని ఆలోచిస్తుంటాను. మరిన్ని సంకెళ్ళు వేసుకుని ఎప్పటికీ బందీగా జైల్లో ఉండమంటావా?’’

రామకృష్ణ ముఖం నల్లగా మాడిపోయింది. గొంతు పెగుల్చుకొని

‘‘అందరూ అనుకుంటున్నారని చెప్పా గానీ – నాకేం అభ్యంతరం లేదు.’’

‘‘అబ్బా – చాలా చాలా విసుగ్గా ఉంది. అలిసిపోయాను. ప్రతివాడికీ అభ్యంతరమా లేదా అని ఆలోచించి బతకాలా నేను’’.

IMG

‘‘నన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదక్కా. నేను మాట్లాడేదంతా పార్టీ కోసం’’.

‘‘పార్టీ అంటే ఏమిటి? మనందరం కాక విడిగా పార్టీ ఏమన్నా రాతి గుహా? దేవాలయమా? మనం కదా పార్టీ ఎలా ఉండాలని నిర్ణయించేది.

‘‘జనం ఒప్పుకోని పనులు ….’’

‘‘జనం ఒప్పుకునే పనుల కోసం కమ్యూనిస్టు పార్టీ ఎందుకు? భూస్వాముల  దోపిడీని ఒప్పుకుంటారు జనం. తమ కర్మ అనుకుంటారు. కులాన్ని ఒప్పుకుంటారు – మనం వాటిని ఒప్పుకోమని చెప్పాలి గదా’’.

‘‘అది వేరు – ఇది వేరు. నీతి నియమాల  గురించి జనం అభిప్రాయాలు  అంతగా మారవు అప్పుడే.

‘‘నీతి!  నీతి అంటే ఏంటి? నేను నవ్వటం, చకచకా నడవటం, పెద్దగా మాట్లాడటం అంతా నీతికి విరుద్ధంగా ఉందా? దానినుంచి నేను మారి నీతి మార్గంలోకి రావాలా?’’

‘‘నువ్వు ఆవేశంగా ఉన్నావు. అదంతా తగ్గి నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది.’’

‘‘ఆడవాళ్ళు ఆవేశంగా ఉండకూడదు కాబోలు . ఆర్గ్యుమెంట్లు చెయ్యకూడదు కాబోలు . నువ్వు నా ప్రవర్తన మార్చుకోమనగానే సిగ్గుపడి భయపడి మార్చుకుని`’’

రామకృష్ణ రెండు చేతులూ  ఎత్తి దణ్ణం పెట్టాడు శారదకు.

‘‘ఒదిలెయ్‌ ` నా మాటలు  తప్పని ఒప్పుకుంటాను. క్షమించెయ్‌. కానీ మన శత్రువులు  చేస్తున్న ప్రచారం గురించి పట్టించుకోకపోతే మనకే నష్టం జరుగుతుంది. ఏం చెయ్యాలో ఆలోచించు. నేను ఒస్తాను.’’ అంటూ రామకృష్ణ అక్కడ్నించి లేచి వెళ్ళిపోయాడు.

శారదకు గుండె మండిపోతోంది.

చివరికి – చివరికి  కమ్యూనిస్టులు  కూడా కట్టడి చేయటమే.

తమ గురించి ఎవరేం అనుకుంటారో అని ఆలోచించటం మొదలు పెడితే ఇక దానికి అంతెక్కడ?

ఎంతమంది మగవాళ్ళ చూపుల్ని, మాటల్ని ఎదిరించి ఇంతదూరం వచ్చింది? తను నవ్వుతూ ఉంటుందని తన జీవితం పూలబాట అనుకుంటారేమో కానీ ప్రతి సందర్భంలో పోరాటం, ఘర్షణ, రాజీ, రాజీపడక తప్పని పరిస్థితి గురించి వేధించే మనను. వీటన్నిటినీ పక్కన బెట్టి కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తోంది. ఎందుకు? ఇక్కడొక కొత్త ప్రపంచం గురించిన కల, ఆశ, ఆ ప్రపంచంలో కూడా ఆంక్షలూ , నిర్భంధాలూ  అయితే ఇంక ఏముంది? చదువుకుని, ఉద్యోగం చేస్తూ గుట్టుగా, గుంభనగా ఉంటూ పెళ్ళి చేసుకుని, మొగుడికి ఒళ్ళు, మనసు, సంపాదన అన్నీ అప్పగించి ఎక్కడుంది  ఆధునికత ? ఆరేళ్ళ వయసునుండీ తనను ఆశపెట్టీ, ఆలోచన రేకెత్తించి, పరుగు పెట్టించిన ఆ మాటకు అర్థం ఏమిటి? పరిధులు  లోపలి మాటేనా?

ఈ చిచ్చు ఆరేది కాదని అనిపించింది శారదకు. అనుకున్నట్టే అయింది. పార్టీ అత్యున్నత కమిటీ శారద వ్యవహారాన్ని పరిష్కరించాలని కూర్చుంది.

***

 

 

 

గమనమే గమ్యం-17

 

img038

మద్రాసు ఒదిలి వెళ్ళాలంటే శారదకు ఒకవైపు ఉత్సాహం గానే ఉన్నా ఇంకోవైపు దిగులూ  ఉంది. బ్యాల్యంలోనే మద్రాసు వచ్చేసింది. ఆమె నేర్చుకున్నదంతా ఇక్కడే. శారద శారదలా తయారవటానికి కారణం మద్రాసే. ఆ పల్లెటూళ్లో ఉండిపోయినట్లయితే శారద నాన్నమ్మ కోరుకున్నట్టూ బాల్య  వివాహం జరిగి ఉంటే శారదకీ పాటికి పిల్లలు పుట్టి వాళ్ళు మళ్ళీ పెళ్ళికి తయారయ్యేవారు. అన్నపూర్ణ పిల్లకప్పుడే పదేళ్ళు దాటుతున్నాయి. రామారావు శారదను డాక్టర్‌ చదివించాలనే పట్టుదతో మద్రాసు రావటం వల్లే శారద డాక్టర్‌ అయింది. శారద జీవితం విశాలమైంది ‘ఈ నగరం నాకు చాలా ఇచ్చింది’ అనుకుంది శారద. చిన్ననాడు చదివిన స్కూలు కి కూడా వెళ్ళి అందరినీ పలకరించి వచ్చింది.

మద్రాసు కాంగ్రెస్‌ పెద్దలనూ కలిసింది. శారదను అందరూ ఇష్టపడతారు. శారద మద్రాసు వదిలి వెళ్ళటం మంచిది కాదని చెప్పిన వాళ్ళూ ఉన్నారు. రాజకీయాల్లో గాని, డాక్టర్‌గా గానీ శారద ఇక్కడే బాగా రాణించగలదని వారి ఉద్దేశం. రాజకీయాలకు దూరమవుతావేమో ఆలోచించుకోమన్నారు. నాలుగైదేళ్ళు మద్రాసులోనే ఉండి ప్రాక్టీసు చేస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆశ పెట్టారు. శారద నవ్వి ఊరుకుంది. రాజకీయాలకు బాగా దగ్గర కావాలనే ఆమె బెజవాడ వెళ్తోంది. కాంగ్రెస్‌లో కొందరికి రాజకీయాలంటే పదవులు  మంత్రులవటం అనే ఆలోచన మొదలైంది. శారద ప్రజా రాజకీయాల  కోసం బెజవాడ వెళ్తుందని చాలామందికి తెలియదు.

ఆంధ్ర నుంచి ఎన్నో పార్టీ రిపోర్టులు  అందుతున్నాయి శారదకు. ఆ కార్యక్రమాలు , అక్కడ గ్రామాల్లో జరుగుతున్న పోరాటాలు  శారదకు చాలా ఉత్సాహం కలిగించాయి. పార్టీ రిపోర్టు, డాక్యుమెంట్లు అధ్యయనం చేస్తూ, ఆకళింపు చేసుకుంటూ, తనకూ, హాస్పిటల్‌కు కావలసిన వస్తువులు  కొనుక్కుంటూ క్షణం తీరిక లేకుండా తిరుగుతోంది శారద.

బెజవాడలో బంధువులు , స్నేహితులు  కలిసి వెతికి రెండిళ్ళు శారద కోసం అద్దెకు తీసుకున్నారు. ఒకటి ఆస్పత్రికి ఒకటి ఉండేందుకు. రెండూ వసతిగానే ఉన్నాయి. సుబ్బమ్మ పనివాళ్ళ సాయంతో ఇల్లు సర్దిస్తుంటే, శారద ఆస్పత్రి పని చూసుకుంది.

olga

బెజవాడ అప్పటికే కమ్యూనిస్టు కేంద్రం అవటానికి సిద్ధంగా ఉంది. పత్రిక ఆఫీసు తెరవబోతున్నారు. శారద ఆస్పత్రి పనితో పాటు కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో పార్టీ పనులు , మహిళా సంఘం పనులూ  వెంటనే మొదలు  పెట్టింది.

బెజవాడలో అప్పటికే రంగనాయకమ్మగారు మంచి లేడీ డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆస్పత్రి పనులు  ఒక కొలిక్కి రాగానే ఆవిడను వెళ్ళి చూడటం మర్యాదగా ఉంటుందనుకుంది శారద. రాత్రిళ్ళు వెళ్తేనే డాక్టర్లు తీరికగా ఉంటారు. ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలకు సుబ్బమ్మ ఇచ్చిన పిండివంటలూ , పళ్ళూ తీసుకుని డాక్టర్‌ రంగనాయకమ్మ దగ్గరకు వెళ్ళింది. శారదను చూసి ఆమె చాలా సంతోషించింది. ఆస్పత్రి, ఇల్లూ అంతా చూపించింది. చగారిని పరిచయం చేసింది. శారద గురించిలం చలం గారికి తెలుసు. లోకరీతికి భిన్నంగా బతుకుతున్న స్త్రీలంటే ఆయనకు ఆసక్తి. కానీ ఆయన ఎక్కువ మాట్లాడలేదు. శారద నమస్కారానికి చెయ్యి ఊపి చిరునవ్వుతో ‘‘మీరు కమ్యూనిస్టుటగా’’ అని అడిగారు.

‘‘ఔను’’ అంది శారద ధీమాగా.

‘‘ఇదొక శాఖ బయల్దేరుతోంది గాబోలు  మనుషుల్ని విడదీయటానికి వెలివేయటానికి’’ అన్నారు నిదానంగా చలం.

శారదకు కోపం వచ్చింది.

‘‘కమ్యూనిజం ప్రపంచంలో  ప్రజలందరినీ కలుపుతుందండి. విడదీయదు. మనుషులంతా ఒకటేనని అందరూ సమానులనీ కమ్యూనిజం చెబుతుంది’’ ఆవేశంగా అంది శారద.

‘‘నేను కమ్యూనిజాన్ని ఏమనలేదు. అది గొప్ప ఆదర్శం. నాకూ కమ్యూనిజంలో బతకాలని ఉంటుంది. నేనన్నది కమ్యూనిస్టు పార్టీ గురించి. ఐనా నా మాటలు  అంత పట్టించుకోకు. నేనేదో మాట్లాడతాను. అందరికీ కోపం తెప్పిస్తుంటాను. కావాలంటే డాక్టర్‌గారి నడుగు’’. అంటూ ఆయన తను చదువుతున్న పుస్తకంలోకి తల వంచాడు.

రంగనాయకమ్మ శారదను ఇంట్లోకి తీసికెళ్ళి పిల్లలందరినీ పరిచయం చేసింది. ఒక్కరూ బడికో, కాలేజీకో వెళ్ళటం లేదు. చలంగారు బడి చదువుకి వ్యతిరేకి అని తెలుసుగానీ, స్వంత పిల్లలనును బడికి పంపనంతగా ఆయన తన ఆదర్శాలను పాటించే నిజాయితీగల  మనిషి అని తెలియదు శారదకు. ఆ పిల్లల  జ్ఞానం, సంస్కారం చూసి ఆశ్చర్యపోయింది. ఎవరో తెలియనివాళ్ళు ఆస్పత్రిలో కని వదిలేసి వెళ్ళిన పిల్లలు   కూడా చలం గారి పిల్లలతో  సమానంగా పెరుగుతున్నారు.

‘‘మీలా ఒక్కరినైనా డాక్టర్‌ చెయ్యరా’’ అడిగింది.

‘‘వాళ్ళకిష్టమైతే ఒకరు చేసేదేమిటి – వాళ్ళే అవుతారు. వాళ్ళకిష్టంలేని పని ఈ ఇంట్లో ఎవరూ చేయించరు. చలంగారి బిడ్డల  శిక్షణ చదవలేదా ` ’’

‘‘కానీ ఏం చెయ్యకుండా సమయమంతా  ’’

‘‘శారదా అదంతా నువ్వు చలంగారితో మాట్లాడాల్సిందే –  అది ఒదిలేయ్‌. నీ ఆస్పత్రి గురించి చెప్పు’’

శారద తనెలా ఆస్పత్రి నడపాలనుకుంటుందో చెప్పింది. దానిలో సాధక బాధకాలు  రంగనాయకయ్య వివరించింది.

రాత్రి పొద్దుపోతోందని శారద లేచేవరకూ స్త్రీల ఆరోగ్యం గురించీ స్త్రీకు తమ శరీరాల  గురించి కనీస జ్ఞానం లేకపోవటం  గురించి డాక్టర్‌ రంగనాయకమ్మ గారు చెబుతూనే ఉన్నారు.

olga title

‘‘అక్షరజ్ఞానం ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయాలు  చెప్పేవాళ్ళు లేరు. నీలాంటి వాళ్ళు తేలికభాషలో స్త్రీ ఆరోగ్యం, శరీరం వీటి గురించి రాస్తే చాలా ఉపయోగం ఉంటుంది’’ అన్నదావిడ.

‘‘తప్పకుండా రాస్తాను.’’ మాట ఇచ్చేసింది శారద.

కమ్యూనిస్టు కాంగ్రెస్‌ పార్టీలో చేరి సోషలిస్టుగా చెప్పుకుంటూ చేయాలనుకున్న పనులు  చాలా జిల్లాల్లో మొదలయ్యాయి. జమిందార్లకు వ్యతిరేకంగా రైతులను, పెద్ద భూస్వాములకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలనూ సమీకరించి, సంఘాలుగా చేసి, సమ్మెలు  చేయించే పని ప్రధానంగా సాగుతోంది. చిన్న చిన్న రంగాలలో కూడా యూనియన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రెస్‌ వర్కర్లు, మిల్లు  కార్మికుల  వంటి వారిని సంఘటితం చేసి జీతాల  పెంపు కోసం, పని పరిస్థితుల  పెరుగుదల  కోసం డిమాండ్లు పెట్టిస్తున్నారు. రాష్ట్ర కమిటీ కృష్ణా, గోదావరి జిల్లా కమిటీలకు అనుసంధానం చేసుకుంటూ, జిల్లా కార్యకర్తల  పనులు  సమీక్షిస్తూ శారద తీరికలేకుండా పని చేస్తూనే, మహిళా ఉద్యమం మీద కూడా కేంద్రీకరించింది. మహిళలు  చాలా చైతన్యంతో మహిళా సంఘ సభ్యులవుతున్నారు. వాళ్ళకు ఆరోగ్య విషయాలు చెబితే మరింతగా పార్టీకి దగ్గరవుతున్నారు. గర్భిణీ స్త్రీ ఆరోగ్యం గురించి, పౌష్టికాహారం గురించి, స్ల్రీ ఆరోగ్య సమస్య గురించీ శారద చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవారు స్త్రీలు.

అవి అంత ముఖ్య విషయాలు  కాదనీ, వాటికి శారద అంత సమయం పెట్టనవసరం లేదనీ, రాజకీయాలకు ఎక్కువ సమయం ఇవ్వాలనీ ఒక విమర్శ పురుషుల  నుంచి వచ్చింది.

‘‘స్త్రీల  ఆరోగ్యం రాజకీయ విషయం కాదని మీరెందుకనుకుంటున్నారు’’ అని శారద అడిగిన ప్రశ్నకు అందరూ చాలా తేలికగా తీసేసి నవ్వేశారు.

శారద  వాళ్ళనలా నవ్వులను  ఒదలదల్చుకోలేదు. స్త్రీల  ఆరోగ్యం రాజకీయ విషయం ఎలా అవుతుందో గంటసేపు చెప్పింది. స్త్రీ సంతానోత్పత్తి శక్తి ఎంత కీలకమైన విషయమో మార్క్స్‌, ఏంగెల్స్‌ మాటలతో శారద చెప్తుటే అందరూ విన్నారు. కొందరు అర్థం చేసుకున్నారు. కొందరికి అర్థం కాలేదు. నచ్చలేదు. వాళ్ళు విసుకున్నారు. ఈవిడ డాక్టరనీ, చదువుకున్నదనీ చూపించుకోవాలి గదా అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. అర్థం చేసుకున్నవాళ్ళు ఇకమీద జరిగే రాజకీయ తరగతుల్లో ఆరోగ్యం గురించి శారద తప్పకుండా ఒక క్లాసు తీసుకోవాలని తీర్మానించారు.

‘‘ఇక నన్ను స్త్రీ స్పెషలిస్టుని చేసి మిగిలిన రాజకీయాల  నుండి దూరం చేస్తారా ఏంటి’’ అని నవ్వింది శారద.

అన్నది గానీ మహిళా ఉద్యమ నిర్మాణం అత్యవసరమనీ, ఆ పనిలో తను అలసిపోకూడదనీ అనుకుంది.

అన్నపూర్ణ, అబ్బయ్య గుంటూరుకి రావటంతో మళ్ళీ శారదకు వాళ్ళతో స్నేహం గట్టిపడిరది. ఐనా ఇద్దరిమధ్యా తీవ్రమైన వాదోపవాదాలు  జరిగేవి. అన్నపూర్ణకు కమ్యూనిస్టు కాంగ్రెస్‌ సభ్యులు గా చేరి తమ పని తాము చేసుకోవటం మీద చాలా విమర్శ ఉండేది.

‘‘మీ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళంతా మా కాంగ్రెస్‌లో ఎందుకు చేరుతున్నారు? కాంగ్రెస్‌ని బలహీన పరుద్దామనా? అది మీరు ఎన్నటికీ చేయలేరు’’ అనేది.

‘‘కాదోయ్‌! కాంగ్రెస్‌లో సోషలిస్టు శక్తును బలపరచటానికి. మేం అలా చెయ్యకపోతే మీ కాంగ్రెస్‌ సనాతన వాదులతో కుళ్ళిపోతుంది. మీలో ఉన్న సోషలిస్టు కళ్ళు తేలేసి బైటికి నడవాలి. మేం ఉంటే వాళ్ళకు కాస్త అండ. వాళ్ళను బలపరుస్తాం. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ ఇవాళ జయప్రకాష్‌ నారాయణ వంటి యువకుల మాట మీద నడుస్తుందంటే, కాంగ్రెస్‌ ముసలి నాయకులు  వీళ్ళని చూసి బెదిరి వీళ్ళకు కాస్త విలువ ఇస్తున్నారంటే అదంతా మా కమ్యూనిస్టుల పుణ్యమే’’ అని నవ్వేది శారద.

లాహోర్‌ సోషలిస్టు పార్టీ కాంగ్రెస్‌కి అన్నపూర్ణ, శారద ఇద్దరూ వెళ్ళారు. అక్కడ కాంగ్రెస్‌ సోషలిస్టుకూ, కమ్యూనిస్టుకూ మధ్య వచ్చిన విభేధాలలో శారదా, అన్నపూర్ణా తీవ్రంగా వాదించుకున్నారు.

‘‘కార్యవర్గాన్నంతా కమ్యూనిస్టులతో నింపాలని చూస్తే మేమేమన్నా పాలు  తాగే పసిపిల్లలమా? ఆ మాత్రం తెలివిలేదా మాకు. ఆ పిచ్చిపని మానేసి మీరెంత వరకుండాలో అంతవరకు ఉండండి’’ అంటుంది అన్నపూర్ణ.

‘‘మా వాళ్ళు ఎక్కువమంది ఉన్నపుడు ఎక్కువ ప్రాతినిధ్యం కావాలని కోరుకోవటంలో తప్పేమిటి? తమిళనాడులో, ఆంధ్రాలో ఉన్నదంతా మావాళ్ళే. మేం ఎందుకు ఊరుకుంటాం? పోటీ పడతాం. మా ప్యానల్‌ మేం పెడతాం’’ అంది శారద.

‘‘పెట్టండి – ఆ వచ్చే కొందరు కూడా కార్యవర్గంలోకి రాకుండా పోతారు’’ అని విసురుగా వెళ్ళిపోయింది అన్నపూర్ణ.

అన్నపూర్ణ మాటే నిజమయింది. కమ్యూనిస్టు ప్యానెల్‌ ఓడిపోయింది.

కమ్యూనిస్టు బలం  ఎక్కువవుతోందని సోషలిస్టు పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. కమ్యూనిస్టులు  తాము ఎక్కువ అంచనా వేశామనుకున్నారు. అన్నపూర్ణ వచ్చి ‘‘చూశావా –  నేను చెప్పినట్లే జరిగింది’’ అంది గర్వంగా.

‘‘నీ రాజకీయ పరిజ్ఞానానికి నా జోహార్లు’’ అని నవ్వేసింది శారద.

‘‘నిన్న మన వాదనతో నువ్వింక నాతో మాట్లాడవేమో అనుకున్నానే’’ అంది అన్నపూర్ణ స్నేహంగా శారద భుజం మీద చెయ్యివేసి.

‘‘అందరం దేశంకోసమే కదోయ్‌ పనిచేస్తున్నాం. భిన్నాభిప్రాయాలుండవా? అంత మాత్రాన మనం మాట్లాడుకోకుండా విరోధం తెచ్చిపెట్టుకుంటామా?’’

‘‘అలాగే ఔతున్నారు శారదా – కాంగ్రెస్‌లో ఒకరి వెనకా ఒకరు ఏవేవో గోతులు  తీస్తుంటారు. అవి భరించలేక మా ఆయన దూరంగా ఉంటున్నారు. నేనూ  అంతే. నన్ను భరించలేరు. ఆడదాన్నిగదా. ఇంకా లోకువ.’’

‘‘మీలాంటి వాళ్ళను దూరం చేసుకుంటే కాంగ్రెస్‌కి తీరని నష్టం’’ అన్నపూర్ణ నిరాశగా నవ్వి చెప్పింది.

‘‘కాంగ్రెస్‌లో డబ్బుకి, పదవుకి, పలుకుబడికి విలువ పెరుగుతోంది. నిజాయితీకి, నిస్వార్థానికి మునుపున్న గౌరవం లేదు. ఉన్నవ వారు ఈ విషయంలో చాలా విచారంగా ఉన్నారు.’’

‘లక్ష్మీబాయమ్మ గారెలా ఉన్నారోయ్‌ ` గుర్తుందా. మన చిన్నతనంలో ధనలక్ష్మి పెళ్ళి తప్పించి లక్ష్మీబాయమ్మగారి దగ్గరకు పంపాలనుకున్నాం.’’

‘‘ఔను. ఆ రోజుల్లో ఆమె గురించి నీకే ఎక్కువ తెలుసు. నాకేం తెలియదు. ఇప్పుడు నేనావిడ శిష్యురాలిని. శారదనికేతన్‌, ఆపనీ లేకపోతే నాకు పిచ్చెక్కేది – నువ్వొకసారి వచ్చి చూడు. ఆడపిల్లల  చదువు కోసం మేం పడుతున్న కష్టాలు  చూడవా? నువ్వు సునాయాసంగా డాక్టరువయ్యావు. అందరూ అలా కాలేరు’’.

‘‘సునాయాసంగా? మర్చిపోయావా? మా నాన్నకి ఎంత పెద్ద కష్టం. మా నాన్నమ్మను నా తొమ్మిదో ఏట చూడటమే. మా నాన్న, నాన్నమ్మ ఒకరంటే ఒకరు ప్రాణం విడిచేవారు. మా నాన్న ముందు చనిపోయాడు. మా నాన్నమ్మకు చివరిచూపు కూడా లేదు. నా చదువుకి నాన్నమ్మ ఆ మూల్యం  చెల్లించింది. నాన్న తల్లి ఉండీ లేనివాడయ్యాడు. ఇక మా అమ్మ బంధువులతో ఎన్ని మాటలు  పడిరదో. ఒంటి చేత్తో ఎన్ని యుద్ధాలు  చేసిందో. శారద గొంతు తనవారి కష్టాలతో పూడుకు పోయినట్లయింది.

‘‘నిజమేలే. ఒక ఆడపిల్ల  డాక్టర్‌ కావాలంటే మాటలు  కాదు. కానీ నిన్నూ, నీ నవ్వునీ చూస్తే అసలే కష్టమూ లేకుండా పూల మీద నడిచొచ్చినట్లుంటావు. సరేగాని పెళ్ళి చేసుకోవా? మీ అమ్మముఖం చూసైనా ఎవర్నో ఒకర్ని వరించవే’’ తమాషాగా అంది.

‘‘వరించటం వల్లే వచ్చాయి తిప్పలు ’’ నిట్టూర్చింది శారద.

‘‘ఐతే నే విన్నది నిజమేనా?’’ కుతూహలం గా అడిగింది అన్నపూర్ణ.

‘‘ఏం విన్నావోయ్‌’’

‘‘నువ్వు ఎవర్నో ఒక పెళ్లయినాయనతో ` ’’

‘‘మీ కాంగ్రెస్‌ వాళ్ళకేం పని లేదా?’’ మధ్యలోనే ఆపేసింది శారద.

‘‘మా కాంగ్రెస్‌ వాళ్ళే కాదు. మీ కమ్యూనిస్టులే అంటున్నారు. మీ వాళ్ళే అబ్బయ్యతో చెత్తగా మాట్లాడారంట. అబ్బయ్య వాళ్ళను కొట్టినంత పనిచేసి డాక్టర్‌గారంటే ఏమనుకుంటున్నారు. ఆమె పేరెత్తే  అర్హత లేదు మీకు’ అన్నాడట. వాళ్ళింకా వెకిలిగా ‘నీకూ ఆవిడికి ఏంటి – నీకు పొడుచుకొచ్చిందేంటి అని అసహ్యంగా మాట్లాడారట’’ అన్నపూర్ణ శారద ముఖం చూసి ఆగిపోయింది. కాస్త ఆగి ‘‘క్షమించు శారదా ` ఆడవాళ్ళ గురించి వాగటంలో కాంగ్రెసనీ, కమ్యూనిస్టులనీ తేడాల్లేవు. ఇంకా నీ హోదా, ఇంటా, బైటా మీ కుటుంబానికున్న పలుకుబడి, పార్టీ నాయకురాలివవటం వీటన్నిటితో నిన్ను ఉపేక్షిస్తున్నారు. ఇవేవీ లేని ఆడదాని పరిస్థితి  ’’

శారద నిరుత్సాహంగా నవ్వింది.

‘‘నాకు తెలుసు గానీ – కమ్యూనిస్టులు  ఆడవాళ్ళని చాలా గౌరవిస్తారు. కొందరింకా పాత సంప్రదాయాల  నుంచి బైటపడలేదంతే – వాళ్ళు ఎడ్యుకేట్‌ అవుతారు. మనం వాళ్ళని మార్చాలి. నా గురించి ఎవరేమనుకున్నా నేను లెక్కచేయను. నా గౌరవానికి భంగం కలుగుతుందనుకోను. నన్ను నేను గౌరవించుకున్నంత కాలం  ఇతరుల  అగౌరవం నన్నేం చెయ్యలేదు. నన్నసలు  తాకదది’’

అన్నపూర్ణ శారదను దగ్గరకు లాక్కుని తనకు హత్తుకుంది.

***

గమనమే గమ్యం-16

 

19BG_VOLGA_1336248eరెండేళ్ళు గడచిపోయాయంటే నమ్మబుద్ధి కావటం లేదు. శారద వచ్చేస్తుందని మూర్తి మనసు గంతులేస్తుంది. సుబ్బమ్మ హడావుడికి అంతులేదు. విశాల  ఎమ్మే పాసవగానే ప్రభుత్వోద్యోగం దొరికింది. ముత్తులక్ష్మీరెడ్డి సహాయం చేసింది. దుర్గాబాయి మెట్రిక్‌ పాసై బెనారెస్‌లో చదువుతానని వెళ్ళింది.

శారద వచ్చిన రోజు బంధువులు , స్నేహితులతో ఇల్లు  కిటకిట లాడిపోయింది. మూర్తికి పదినిమిషాలు  శారదతో ఏకాంతంగా మాట్లాడటమే కుదరలేదు. శారదకు ప్రయాణపు బడలిక అని చెప్పే వ్యవధానం కూడా ఎవరూ ఇవ్వలేదు. దగ్గర బంధువులు  సుబ్బమ్మ దగ్గర శారద పెళ్ళి ప్రస్తావన తెచ్చారు. 1935 వ సంవత్సరంలో 29 ఏళ్ళ వయసున్న స్త్రీ పెళ్ళి కాకుండా ఉండటం సాధారణ విషయం కాదు.

‘ఇపుడు ఇంగ్లండ్‌ వెళ్ళొచ్చిన వాళ్ళను చూడాలి శారదకు. మాటలు  కాదు’’ అన్నారు కొందరు బంధువులు .

‘‘ఇప్పుడు పెళ్ళేమిటి? ఎవరు చేసుకుంటారు. ఇక్కడుండగానే చాలా వ్యవహారాలు  నడిపిందట. ఇంగ్లండ్‌లో ఏం చేసిందో ఎవరికి తెలుసు’’ అని మూతులు  విరిచారు దూరపు బంధువులు .

ఇన్ని మాటల  మధ్యలోంచి శారదకు బాబాయి వరసయ్యే ఒక కార్యదక్షుడు సంబంధం గురించి మాట్లాడాడు.

‘‘ఇంగ్లండ్‌ వెళ్లొచ్చిన డాక్టరే ఉన్నాడు. నాకు తెలిసినవాళ్ళే. మన వాళ్ళే. మీరు సరేనంటే అబ్బాయిని తీసుకొస్తాను. ఇక్కడే ప్రాక్టీసు చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ప్రాక్టీసు చేస్తే ఇక చెప్పేదేముంది?’’ అన్న ఆయన మాటతో అందరూ నిశ్శబ్దమయ్యారు.

సుబ్బమ్మకూ, దగ్గరి బంధువులకూ ఈ మాటలు  తోసిపుచ్చేందుకేమీ కనిపించలేదు.

‘‘శారదాంబతో మాట్లాడి వారం రోజుల్లో కబురు చేస్తాను’’ అంది సుబ్బమ్మ.

రెండు మూడు రోజులో ఇంట్లో హడావుడి తగ్గి తల్లీ కూతుళ్ళు కాస్త తెరిపిన పడ్డారు.

కానీ పది రోజులయినా శారదతో ఈ విషయం మాట్లాడే సమయం దొరకలేదు.

బంధువులంతా ఎటు వాళ్ళటు వెళ్ళాక ఒకరోజు రాత్రి శారద గదిలోకి వచ్చింది సుబ్బమ్మ. శారద చదువుకుంటూ ఉంది.

‘‘ఇంకా ఏం చదువమ్మా ?  పొద్దు బోయింది’’ అంటూ పక్కమీద కూచుంది.

‘‘నా సంగతి సరేగాని నువ్వెందుకింత సేపు మేలుకున్నావు. ఒంట్లో బాగుందా?’’ అంటూ తల్లి నుదుటి మీద చేయి వేసి చూసింది.

‘‘ఏం లేదు ` ఏంటి చెప్పు’’ అంది.

‘‘నీ పెళ్ళి విషయం తల్లీ. చదువు పూర్తయింది. ఇంక జరగవసిది పెళ్ళే గదా. అది కూడా అయితే నా బాధ్యత తీరుతుంది. మీ రామనాధం బాబాయి చెప్పిన సంబంధం బాగానే ఉంది. ఆ అబ్బాయిని చూస్తావా?’’

శారదకు ఈ విషయం తేల్చెయ్యానిపించింది. తేల్చి చెప్పకపోతే తల్లి ఈ విషయం గురించి మధన పడుతూనే ఉంటుంది. అది అనవసరం. కష్టంగా ఉన్నా ఒకసారి సత్యం తెలిస్తే అదే క్రమంగా మనసులో ఇంకి స్థిరపడుతుంది. ఆ తరవాత అశాంతి, అలజడి తగ్గిపోతాయి.

‘‘అమ్మా. నేను చెప్పే విషయం నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. నా మీద నీకు నమ్మకం ఉంది గదా.’’

సుబ్బమ్మ నవ్వి ‘‘ఏం అడుగుతున్నావే ?  చెప్పు’’ అంది.

తను ఎవరినో ప్రేమించినట్టుగా శారద చెబుతుందని ఆమె ఊహించింది. అతను డాక్టర్‌ కాకపోయినా ఫరవాలేదు. కులమేదైనా ఫరవాలేదు. శారద ఇష్టపడే మనిషి అంతంత మాత్రంగా ఉండడు. ఒక్కక్షణంలో ఆమె మనసులోకి వచ్చారు. వారంతా తరచూ ఇంటికి వచ్చే యువకులే.

‘‘అమ్మా, నేనసు పెళ్ళి చేసుకోను’’. శారద గొంతులో గంభీరత్వం వింటే సుబ్బమ్మకు సమస్య పెద్దదనిపించింది.

‘‘ఎందుకు అలా అంటావమ్మా ?  జీవితంలో అన్నీ చూడాలి. పెళ్ళి, పిల్లలూ  ఇదంతా లేకుండా ఎందుకు? ఒక్క చదువేనా పరమార్థం. పెళ్ళంటే ఎందుకిష్టంలేదు’’ శారద ఆమెకి డాక్టర్‌గా కాక చిన్నపిల్లలా  కనిపించింది.

‘‘ఇష్టంలేకపోవటం కాదమ్మా. నేను పెళ్ళాడదల్చుకున్న మనిషికి ఇదివరకే పెళ్ళయిపోయింది.’’

సుబ్బమ్మ నిర్ఘాంతపోయింది. ఆమెకు వెంటనే మూర్తి గుర్తొచ్చాడు.

‘‘ఎవరూ? మూర్తా?’’

‘‘నీకూ తెలిసే ఉంటుంది. మా యిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ పెళ్ళి మాత్రం కుదరదు’’.

సుబ్బమ్మకు గుండె నీరయింది. ఎంతో తెలివైన శారద ఇంత పెద్ద చిక్కులో ఎలా పడిరది? దీనికి పరిష్కారం ఏమిటి?

‘‘జీవితమంతా పెళ్ళి లేకుండా గడుపుతావా? ఎంత కష్టం’’ దు:ఖం తన్నుకొచ్చింది.

‘‘కష్టమేం కాదమ్మా. ఒకళ్ళని ఇష్టపడుతూ ఇంకొకళ్ళని పెళ్ళాడటమే కష్టం’’.

‘‘మూర్తి ఏమంటాడు?’’

‘‘నేనేమంటే అదే అంటాడు. అంతకన్నా ఏమనగలడు’’ నిరుత్సాహంగా నవ్వింది.

olga title

సుబ్బమ్మకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇది తలకు మించిన సమస్య అనిపించింది. శారదతప్ప దీనినెవరూ పరిష్కరించలేరనిపించింది.

‘‘అమ్మా. ఇక మాటిమాటికీ పెళ్ళి గురించి అడగొద్దు. నాకు నా పనులు  ఊపిరాడకుండా ఉంటాయి. పెళ్ళి, పిల్లలు  వీటన్నిటి గురించీ ఆలోచించే తీరిక లేనన్ని పనులు  పెట్టుకుంటున్నాను. నేను సంతోషంగానే ఉంటానమ్మా. నా గురించి దిగులు  పెట్టుకోకు’’.

సుబ్బమ్మ మెల్లిగా అక్కడినుంచి లేచి ఆమె గదిలోకి వెళ్ళింది.

కూతురు పెళ్ళి లేకుండా ఉంటుందంటే తల్లి మనసు ఒకంతట దానిని జీర్ణించుకోలేకపోతోంది.

సుబ్బమ్మకు అత్త నరసమ్మ గుర్తొచ్చింది.

పదో ఏటనే శారదకు పెళ్ళి చెయ్యమని పంతంపట్టి, ఆ పంతం నెగ్గదని తెలిసి ప్రాణానికి ప్రాణమైన కొడుకుని వదిలి కాశీకి వెళ్ళిన అత్తగారు గుర్తొచ్చింది. మళ్ళీ ఇటు రాకుండా అక్కడే కన్ను మూసిందావిడ.

ఆమెతో చెప్పుకుని భారం దించుకోవాలనిపించింది.

‘అత్తయ్యా. మన శారద పెళ్ళి చేసుకోదట. దానికి పెళ్ళి మీద కోర్కె లేక కాదు. దానికి కావసినవాడిని పొందలేక!’.

నిజానికి సుబ్బమ్మ భరించలేనిది కూడా అదే. కూతురు ఏం కావాలన్నా సమకూర్చటమే ఆమెకు తెలుసు. ప్రతిది సాధిస్తూ ఆనందంగా ముందుకు సాగిపోయే శారదే ఆమెకు తెలుసు. ఎక్కడా ఏ లోటూ ఎరుగని శారదే ఆమెకు తెలుసు. ఏ పనైనా సాధించనిదే నిద్రపోని శారదే తెలుసు.

ఆగిపోయిన శారద, కోరిక తీరదని చిన్నబోయిన శారద, ఓడిపోయిన శారద ఆమెకు తెలియదు.

‘‘పెళ్ళి ఇష్టం లేక కాదు. అది ఇష్టపడినవాడు దానికి దక్కడు’’ ఈ వాస్తవం సుబ్బమ్మకు మింగుడు పడటం లేదు.

భర్తలేని లోటు ఎన్నడూ లేనంతగా మీదకు విరుచుకుపడిరది.

‘ఎవరితో చెప్పుకోవాలి? కూతురు తనతో చెప్పుకుంది. తను ఎవరితోనూ చెప్పుకోలేదు. ఆ రాత్రంతా సుబ్బమ్మకు కలత నిద్రయింది. ఏవో కలలు. కలలో అత్తగారు నరసమ్మ కనిపించింది.

ఆమె చిన్ని శారద తల  నిమురుతూ ‘పెళ్ళయితే ఏమైందే? నిన్నూ చేసుకుంటాడు. నువ్వంటే ఇష్టమున్న వాడు పెళ్ళెందుకు చేసుకోడు? చేసుకో. పెళ్ళి చేసుకో’’ అంటున్నది.

సుబ్బమ్మకు మెలకువ వచ్చింది. అత్తగారుంటే ఈ పెళ్ళి జరిపించేదేమో ఆమెకు పెళ్ళయినవాడనే పట్టింపు ఉండేది కాదా?

ఈ ఆలోచనతో సుబ్బమ్మకు కూతురి మీద జాలి పొంగుకొచ్చింది.

‘పోనీ –  రెండో పెళ్ళివాడని అంటారు. అంటే అంటారు. శారదను ఇంత దూరం ఇంత స్వేచ్చగా ఒదిలినందుకే ఎంతోమంది ఎన్నో అన్నారు. కానీ శారదను రోజూ చూస్తున్న తనకు ఎంత ఆనందంగా ఉంది? పిల్ల  హాయిగా గలగలా నవ్వుతూ, ఎప్పుడూ పదిమందిలో మెప్పు పొందుతూ నాయకురాలిలా వెలిగిపోతుంటే గర్వంగా అనిపిస్తుందేగాని లోకుల  మాటలు ఒక్క క్షణం కూడా గుర్తు రాలేదు. ఇప్పుడు కూడా మూర్తీ శారదా కళకళలాడుతూ ఇంట్లో తిరుగుతుంటే, ఇష్టమైనవాడితో శారద సుఖపడితే ఎవరేమనుకుంటే ఏమిటి?

రెండు రోజులు  పాటు ఆమె మనసులో ఈ ఆలోచనలు  కల్లోలం  రేపాయి. ఎంత ఆలోచించినా శారద మూర్తిని పెళ్ళాడితేనే బాగుంటుందనిపించింది. ఒక రోజు కాదు పది రోజులు  మధనపడి శారదతో ఆ మాటే చెప్పింది సుబ్బమ్మ.

తల్లి ఎలా ఆ నిర్ణయానికి వచ్చి ఉంటుందో ఒక్క క్షణంలో అర్థమైంది శారదకు. కూతురి సుఖం కోసం తనకు వ్యతిరేకమైన ఆలోచనని అనుకూలం  చేసుకోటానికి తల్లి తనలో తను ఎంత సంఘర్షణ పడి ఉంటుందో అర్థమై శారద తల్లిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఉధృతం తగ్గాక ‘‘అమ్మా ` దీనిని గురించి ఆలోచించటం మానెయ్యి. నా మీద నమ్మకం  ఉంచు’’. అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

తల్లిని పట్టించుకోవద్దన్నది గానీ మద్రాసు పట్టణంలో తన స్నేహితులు , తోటి కామ్రేడ్స్‌ అందరూ ఇదే ఆలోచిస్తున్నారని శారదకు క్రమంగా తెలిసి వచ్చింది.

***

ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలో దత్‌ – బ్రాడ్లీ థీసీస్‌ గురించి తీవ్రమైన చర్చలు  జరుగుతున్నాయి. శారద కూడా నాగపూర్‌ కేంద్ర కమిటి సమావేశానికి హాజరై దత్‌ – బ్రాడ్లీ థీసిస్‌ని వివరించింది. శారద ఇంగ్లండ్‌లో పామీదత్‌ని కలుసుకుంది. ఈ విషయం గురించి చర్చించింది కూడా. ఆ ధీసిస్‌ సరైనదనే నిర్ణయానికొచ్చింది. కమ్యూనిస్టు మీద బ్రిటీష్‌ ప్రభుత్వం నిర్భంధం రోజురోజుకీ పెరుగుతోంది. ఏ పనైనా రహస్యంగా చేయాలి. శక్తి సామర్ద్యాలతో, ఆదర్శావేశాలతో రగులుతున్న యువతరానికి రహస్యంగా చేసే పని చాలటం లేదు. ఇంకేదో చెయ్యాలని రగిలిపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రజలలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల  మీద వ్యతిరేకతను పెంచటం. ఆ పని కాంగ్రెస్‌ పార్టీ సరిగా చేయటం లేదని కమ్యూనిస్టుల  అభిప్రాయం. ఐతే కాంగ్రెస్‌లో కొందరు ఆ పనిని చాలా బాగా చేస్తున్నారు. పైగా కమ్యూనిస్టుల్లా రహస్యంగాకాక బహిరంగంగా చేస్తున్నారు. అలాంటప్పుడు కమ్యూనిస్టులు  కూడా కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ పేరుతోనే తామనుకున్న పని బహిరంగంగా చేయవచ్చు. జాతీయ భావాలను మరింత వేగంగా ప్రజలలోకి తీసికెళ్ళవచ్చు. రైతుల సంఘాలనూ యువజన సంఘాలను కాంగ్రెస్‌ పార్టీ కింద నిర్మించటం తేలిక. ఆ పని చేస్తూ ఆ సంఘాలలో కమ్యూనిస్టు భావాలు  వ్యాపింపచేయాలి. ఆ భావాల  పట్ల అంకితభావం చూపినవారికి కమ్యూనిస్టుపార్టీ సభ్యత్వం ఇవ్వొచ్చు. అప్పుడు అందరి శక్తియుక్తులు  వందశాతం ఉపయోగపడతాయి.

ఇది స్థూలంగా దత్‌ – బ్రాడ్లీ థీసిస్‌ సారాంశం. ఇంకా దేశ రాజకీయ ఆర్థిక వ్యవహారాల గురించి ఎంతో సమాచారం, విశ్లేషణ ఉన్నా కార్యక్రమానికి సంబంధించి ఈ పని ముఖ్యమైనది. శారద దీనికి తోటి కామ్రేడ్స్‌ ఆమోదం సంపాదించటంలో చురుకుగా పనిచేసింది. ఫలితంగా కమ్యూనిస్టులమనుకున్నవారంతా మళ్ళీ కాంగ్రెస్‌లో సభ్యులయ్యారు. ఆంధ్రప్రాంతంలో ఎక్కడికక్కడ రైతుల సమస్య మీద యువతీ యువకులను సమీకరిస్తున్నారు.

శారద ప్రాక్టీసు మొదలుపెట్టడం గురించి కూడా పార్టీ చర్చించింది. మద్రాసులో కంటే బెజవాడలో ప్రాక్టీసు పెడితే బాగుంటుందని యూత్‌ లీగ్‌ అభిప్రాయపడిరది.

ఇక్కడ చైతన్యమవుతున్న యువతీయువకులను శారద బాగా నడిపించగలుగుతుంది. డాక్టర్‌గా కూడా శారద అవసరం మద్రాసులో కంటే బెజవాడలో ఎక్కువ ఉంది అని వారి వాదన. ఆ వాదనలో నిజముంది గానీ దాని వెనక వేరే కారణం కూడా ఉంది. అది శారదకు తెలియదు.

శారద బెజవాడ వెళితే మూర్తికి దూరమైతే వారిద్దరిలో మార్పు రావొచ్చని యూత్‌ లీగ్‌ అనుకుంది. శారద గురించి నలుగురూ నాలుగు రకాుగా అనుకోవటం గురించి సుబ్బమ్మకు బాధ లేదు గానీ పార్టీకి చాలా బాధగా ఉంది. కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు  అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి గానీ వేలెత్తి చూపించుకోకూడదు అని వారి భావన. మద్రాసులోని రాజకీయ వర్గాలలో శారద, మూర్తి ప్రేమ రకరకాలుగా ప్రచారమవుతూ ఉంది. దానిని ఆపటానికి, పార్టీని ఆంధ్రప్రాంతంలో వృద్ధి చేయటానికీ  శారద బెజవాడలో ప్రాక్టీసు పెట్టటమే మంచిదని అందరూ భావించారు. అందరూ ఏకగ్రీవంగా ఆ మాట చెప్పినపుడు శారద తోసిపుచ్చలేకపోయింది.

డాక్టర్‌ వృత్తికీ, కమ్యూనిస్టు పార్టీకీ జీవితం అంకితం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. మూర్తి కొన్ని వందల  మైళ్ళ దూరంలో ఉండటం వల్ల  తమ ప్రేమ పోతుందని ఆమె అనుకోలేదు. ఇంగ్లండ్‌లో ఉన్న రెండేళ్ళలో వారి ప్రేమ పెరిగిందే తప్ప తరగలేదు.

శారద ఉత్సాహంగా తల్లితో బెజవాడ మకాం మార్చాలని చెప్పింది. మద్రాసు ఒదిలి వెళ్ళటం సుబ్బమ్మగారికంత ఇష్టంగాలేదు.

‘ఇది పెద్ద పట్టణం. ఇక్కడ ఇంకొకరి గురించి పట్టించుకోవటం తక్కువ. ఆ బెజవాడలో శారద ఇమడగలదా? శారద మాట, నవ్వూ, నడక అన్నిటికీ వంకపెడతారు. శారదను ఏదో రకంగా ఇబ్బంది పెడతారు’. ఇదీ సుబ్బమ్మ సందేహం. ఆ సందేహాలన్నీ చెబితే శారద నవ్వేసింది.

‘‘అమ్మా ఆ వాతావరణాన్నంతా మార్చి ఇరుకు వీధులను విశాలం చేయానే నేను బెజవాడ వెళ్దామనుకుంటున్నా. నాలాటి వాళ్ళను వందమందినైనా తయారు చెయ్యాలిగదమ్మా. అక్కడ మన పార్టీవాళ్ళు చాలామంది ఉన్నారు. నా అవసరం ఉంది. నా గురించి భయపడకు. నన్నే సముద్రంలో పడేసినా హాయిగా ఈదుకుంటూ బైటపడతా ` ’’

‘‘సముద్రం గురించి భయం లేదు శారదా ` మురుక్కాలవ గురించే ` ’’

‘‘మురుక్కాలవలను  బాగు చేసుకోవాలమ్మా. లేకపోతే ప్రజల  ఆరోగ్యం చెడిపోతుంది. డాక్టరుగా ప్రజారోగ్యం నా బాధ్యత. బెజవాడ వెళ్ళాలమ్మా’’ శారద బెజవాడ వెళ్ళటం గురించి గట్టిగానే అనుకుంటోందని సుబ్బమ్మ ప్రయాణపు ఏర్పాట్లలో పడిరది.

మరో నెలలో శారద బెజవాడ ప్రయాణం ఉందనగా విశాల  తన పెళ్ళి శుభలేఖలు  తీసుకుని వచ్చింది. విశాల  ముఖంలో అంత ఆనందం, తెరిపిదనం శారద ఎన్నడూ చూడలేదు. ఎప్పుడూ ఎవరి మీదో ఫిర్యాదు చెయ్యబోతున్నట్లుండే విశాల  ముఖంలో ఏదో శాంతి ఆవరించినట్టుంది. ఎప్పుడూ తన జీవితం గురించిన అసంతృప్తితో అనంగీకారంతో బతికేది విశాల . ఆమె ఇలా సంతోషంగా ఉందంటే అదంతా పెళ్ళి మహత్యమేనా అని సూటిగా అడిగేసింది శారద. విశాల  సిగ్గుపడుతూ, నవ్వుతూ పెళ్ళి వివరాలు  చెప్పింది. గోపాల శాస్త్రి ప్రభుత్వోద్యోగమే. బ్రాహ్మణుడు. విశాల ను ప్రేమించాననీ పెళ్ళాడతాననీ తనంత తాను వచ్చి అడిగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయిష్టంగానే ఒప్పుకున్నారు. గోపాల శాస్త్రే ఒప్పించాడు. ఐతే వాళ్ళు ఒక షరతు పెట్టారు. విశాల ను గోపాలం  వాళ్ళ మేనమామ దత్తత తీసుకుంటాడు. వాళ్ళే విశాల  తల్లిదండ్రుగా వివాహం జరిపిస్తారు. విశాల  తన తల్లితో సంబంధాలు  పూర్తిగా ఒదిలేసుకోవాలి. విశాల  చెప్తూంటేనే శారదకు కోపం వచ్చింది.

‘‘దీనికి నువ్వెలా ఒప్పుకున్నావు? ఎంత దారుణం. వాళ్ళకెంత ధైర్యం’’ శారద ఆవేశపడుతుంటే విశాల  ఆశ్చర్యపోయింది.

‘‘నీకెందుకే అంత కోపం? ` నా కులం , మా అమ్మ కులవృత్తిలో ఉండటం, నాటకాలు  వేయటం నాకే ఇష్టం లేదు. వాళ్ళెలా సహిస్తారు? ఎలా ఒప్పుకుంటారు. వాళ్ళడిగినదానిలో తప్పేముంది? నేను ఎమ్మేలో చేరిన దగ్గరనుంచి మా అమ్మ నుంచి దూరంగానే ఉంటున్నాను. ఇప్పుడు నేను కొత్తగా మా అమ్మకు దూరమయ్యానని అనటానికేమీ లేదు. బాధపడటానికంతకంటే ఏమీ లేదు’’.

‘‘మీ అమ్మ నిన్నెంత ప్రేమగా పెంచిందే. చదివించింది. నీ సాధింపులన్నీ భరించింది. కాల్చుకు కు తిన్నావు గదే ఆమెను. ఆమెను ఒదిలెయ్యటం అన్యాయం. ముసలితనంలో ఆమెకు దిక్కెవరే ` ’’ కోటేశ్వరిని తల్చుకుంటే శారదకు దు:ఖం వచ్చింది.

img443

‘‘ఉందిగా – ఆ రాజ్యం ` మా పిన్ని కూతురు ` మా పిన్ని, ఆమె కూతురు మా అమ్మని అతుక్కుపోయారు. రాజ్యాన్ని నాటకాల్లోకి దించారు. ఇప్పుడు మా అమ్మకు నాకంటే రాజ్యమే ఎక్కువ. మా అమ్మకు బతకటం తెలుసులే’’ అంది విశాల  గొంతు ఇంత చేసి.

‘‘నా పెళ్ళికి తప్పకుండా రావాలి. మీ అమ్మగారిని కూడా తీసుకురా’’ విశాల ఉత్సాహం చూస్తే శారదకు ఏవగింపు పుట్టుకొచ్చింది.

‘నే రాను నీ పెళ్ళికి’ అని తెగేసి చెప్పాలనిపించింది.

తల్లిని గౌరవంగా చూడనవసరం లేదని, దూరంగా ఉంచాలని విశాలకు ఏ చదువు నేర్పించింది? ఈమెకు ఏ సంస్కారం అబ్బింది? ఇదేం ఆధునికత? సంస్కర్తలు  నేర్పించిన సంస్కారం ఫలితమా? తన కులాన్ని ద్వేషించే సంస్కారం, తల్లిని ఒదులు కునే తత్త్వం ఎలా అబ్బాయి విశాలకు ?

శారద మనసులో ఎన్నో ప్రశ్నలు . అన్య మనస్కంగానే విశాలను తల్లి దగ్గరకు తీసికెళ్ళింది. సుబ్బమ్మ విశాల  నోరు తీపి చేసింది. విశాల  పెళ్ళికి వెళ్ళకూడదనుకుంది శారద.

రెండురోజుల  తర్వాత ట్రిప్లికేను మీదుగా వస్తుంటే శారదకు కోటేశ్వరిని చూడానిపించింది.

అక్కడికి వాళ్ళిల్లు  దగ్గరే. కూతురు చేస్తున్న పనితో ఆమె ఏమైందో అనుకుంటూ వెళ్ళింది.

కోటేశ్వరిని చూడగానే అర్థమైంది, విశాల  ఆమెను ఎంత దెబ్బ కొట్టిందో.

‘‘తెలిసిందామ్మా ? మన విశాల  పెళ్ళి చేసుకుంటోంది’’ అంది కళ్ళనీళ్ళతో. కూతురి పెళ్ళి వార్తను కన్నీళ్ళతో చెప్పాల్సిన పరిస్థితికి సిగ్గుపడుతూ, వెంటనే ఆ కన్నీళ్ళు తుడిచేసుకుంది.

‘‘తెలిసిందమ్మా. తను చేసిన పని నాకేం నచ్చలేదు. వాళ్ళు కూడా తల్లితో సంబంధం ఉండకూడదనటం…’’

‘‘వాళ్ళంటారమ్మా ` వాళ్ళు పెద్దకులం  వాళ్ళు’’

‘‘కానీ గౌరవం, గౌరవం అని ఏడుస్తుంటే విశాల  బుద్ధేమయింది? తనను  వాళ్ళు అవమానిస్తున్నారని దానికి అర్థం కావొద్దూ’’.

‘‘అయ్యో రాత ` మొదట్నించీ దానికీ నాకూ అదేగా తగాదా. పోన్లేమ్మా అది సుఖంగా ఉంటే అంతే చాలు . ఇప్పుడు మాత్రం నాతో ఉంటుందా పెడతందా? మూడునేల్లకోసారి ముఖం చూపించేది. ఇక అదీ ఉండదు. దేవుడు నాకింకో బిడ్డ నిచ్చాడమ్మా. మా రాజ్యం నేనంటే ప్రాణాలు  ఇడుస్తుంది. అమ్మాయ్‌ –  రాజ్యం’’ అని పిల వగానే వచ్చింది పదహారేళ్ళు నిండిన రాజ్యం.

శారద నివ్వెరపోయి కన్నార్పకుండా కాసేపు చూసి తేరుకుంది. రాజ్యం ఎదురుగా ఉంటే ఆ పిల్ల  మీద నుంచి కళ్ళు తిప్పుకోవటం కష్టం. ఇంతింత కళ్ళు. పచ్చని, పల్చని శరీరం. మంచి ఎత్తు. బంగారు బొమ్మ అంటే ఇలా ఉంటుందనిపించింది.

శారద అతికష్టం మీద ఆ పిల్ల  మీద నుంచి చూపు మరల్చుకుని కోటేశ్వరిని చూస్తూ.

‘‘చదివిస్తున్నావా అమ్మా’’ అని అడిగింది.

‘‘ఐదు వరకూ చదివిందమ్మా. ఇప్పుడు ఒక పంతులు  గారొచ్చి తెలుగు వాక్యాలు  చదివిస్తున్నారు. సంగీతం కూడా నేర్చుకుంటోంది’’.

‘‘ఇంగ్లీషు కూడా నేర్చుకో’’ అంది శారద మళ్ళీ రాజ్యం మాయలో పడుతూ.

‘‘నేర్పిస్తానమ్మా, ముందు ఆ పద్యాలు , పాటలు  వస్తే నాటకాల్లో రాణిస్తది. ఆ తర్వాత ఇంగ్లీషు, లెక్కలూ  చెప్పిస్తే లోకంలో నెగ్గుకొస్తది. విశాల  లాగా దీన్ని కాలేజీ చదువుకు పంపించే ఉద్దేశం మటుకు లేదు’’ అంది కోటేశ్వరి కచ్చితంగా.

శారదకు ఫల హారం పెట్టి కాఫీ ఇచ్చి మర్యాద చేసింది.

‘‘విశాల  పెళ్ళికి వెళ్ళాలని లేదమ్మా. నేను వెళ్ళను’’ అంది శారద.

‘‘అయ్యో. అట్టా చెయ్యమాకమ్మా. నీ మీదే ఆశపెట్టుకున్నాను. ఈ పిల్లకు బొత్తిగా ఎవరూ లేరు, ఏ అండా లేదు అనుకుంటే వాళ్ళు దానిని మరీ లోకువ చేస్తారమ్మా. నువ్వు, మీ అమ్మా, ఇంకా నీ స్నేహితులు  గొప్పవాళ్ళెవరన్నా ఉంటే వాళ్ళను కూడా తీసుకెళ్ళమ్మా. అత్తగారింట్లో దానికి గౌరవం ఉండాలిగా’’ కోటేశ్వరి తెలివికి శారద ఆశ్చర్యపోయింది. తనను వెలివేసిన కూతురి క్షేమం గురించి ముందు చూపుతో ఆలోచించే ఆ తల్లికి నమస్కారం చేసి, పెళ్ళికి వెళ్తానని వాగ్దానం చేసి ఇంటికి వచ్చింది. ఏదన్నా ఒక పని మంచిదనుకుంటే అది పూర్తిగా చేసేంతవరకూ శారదకు నిద్రపట్టదు.

తనతోపాటు కొందరు కాంగ్రెస్‌ పెద్దల్ని కూడా తీసుకెళ్ళాలనుకుంది. విశాలకు కాంగ్రెస్‌ పెద్దలు  బాగా దగ్గరివాళ్ళనే అభిప్రాయం కలిగించాలనుకుంది. ఒక్కొక్కరి ఇంటికీ వెళ్ళి వాళ్ళకు సమస్య వివరించి చెప్పి ఒక్క గంట సేపు తన స్నేహితురాలి పెళ్ళికి రమ్మని అడిగింది. శారద అడిగిన తీరుకి అందరూ ఒప్పుకున్నారు.

పెళ్ళిలో విశాల  తరపున వచ్చి నిలబడిన వాళ్ళని చూసి విశాలే విస్తుపోయింది. విశాల మామగారి బంధువులంతా తలకిందుయ్యారు. వాళ్ళు మిగిలిన పనులు  పక్కన బెట్టి కాంగ్రెస్‌ పెద్దలకు, అందునా బ్రాహ్మణ పెద్దలకు ఉపచారాలు చేస్తూ  ఉండిపోయారు.

విశాల  పక్కన ఎవరూ లేని సమయం చూసి శారదకు కృతజ్ఞతలు  చెప్పింది. తనమీద శారదకున్న ప్రేమ మర్చిపోలేనంది.

‘‘పిచ్చిదానా. ఈ ఆలోచన నా బుర్రలో పుట్టలేదు. నేనసలు  నీ పెళ్ళికి రావొద్దనుకున్నాను. మీ అమ్మ చెప్పింది ఇట్లా చేస్తే అత్త గారింట్లో నీ గౌరవం పెరుగుతుందని చెప్పింది. మీ అమ్మ బతిమాలి నా చేత ఈపని చేయించింది.’’

విశాల  ముఖం పాలిపోయింది.

‘విశాలా మీ అమ్మకు నువ్వు లేవు గానీ నీకు మీ అమ్మ ఉంది. అది మర్చిపోకు. ఎప్పుడైనా అవసరమైత మీ అమ్మ దగ్గరకు సందేహం లేకుండా వెళ్ళు.’

శారద మాటలకు విశాల  ముఖం మాడిపోయింది.

ఇంతలో ఎవరో వచ్చి పెళ్ళి కూతురు కావాలంటూ తీసుకుపోయారు. శారద పెళ్ళింట్లో భోజనం చేయకుండా వెళ్దామనుకుంది గానీ సుబ్బమ్మ అలా కుదరదంది. అక్కడ ఆవిడ దూరపు బంధువులెవరో కన్పించారు కూడా.

సాయంత్రం ఇదంతా మూర్తితో చెప్పి నవ్వుకుని సేద దీరింది శారద.

***

గమనమే గమ్యం-15

olga title

Volga-1చూస్తూ చూస్తూ ఉండగానే శారద ఇంగ్లండ్‌ ప్రయాణం దగ్గర పడింది. విశాలకు ఎమ్‌.ఏ లో సీటు దొరికింది. విశాల ఇక ఆ ఇంట్లో ఉండదల్చుకోలేదు. హాస్టలు వసతులు  సరిగా లేవు. ఐనా ఇంటినుంచి బైట పడింది. ఇంట్లో నుంచి విశాల వెళ్తున్న రోజు కోటేశ్వరి ఏడుపుకు అంతులేదు. విశాల తల్లిని ఓదార్చే ప్రయత్నం కొంతసేపు చేసి లాభంలేదని తనకవసరమైన సామాను తీసుకుని వెళ్ళిపోయింది. పద్నాలుగేళ్ల రాజ్యం కోటేశ్వరిని ఓదార్చి అన్నం తినిపించి పడుకోబెట్టింది . ‘‘ఇక నుంచీ ఇదే నా కూతురు. అది నా కడుపున పుట్టింది గానీ మనసున పుట్టలేదు’’ అనుకుని రాజ్యాన్ని దగ్గరకు తీసింది కోటేశ్వరి.

రెండేళ్ళు శారదను చూడలేననుకుంటే మూర్తికి ఊపిరాడనట్లుగా ఉంది. శారదకు ప్రయాణపు హడావుడి ఎంతున్నా మనసులో ఓ మూల శూన్యంగా అనిపిస్తుంది. అమ్మ, మూర్తి వీళ్ళిద్దరినీ ఒదిలి ఉండటం తననుకున్నంత తేలిక కాదని తెలుస్తూనే ఉంది.

అందరికంటే సుబ్బమ్మ సంతోషంగా ఉంది. కూతురిని ఇంగ్లండు పంపించాలని రామారావు కన్న కలలు ఆమెకు పూర్తిగా తెలుసు. ఆ కలల్లో ఆమెకూ భాగముంది. భారం ఆమె మీద వేసి తన కల నెరవేరుతుందనే పూర్తి నమ్మకంతో ఆయన వెళ్ళిపోయాడు. ఆ నమ్మకాన్ని వమ్ముకానీయకుండా ఇన్నాళ్ళూ సుబ్బమ్మ కూతురి బాధ్యత తీసుకుంది. శారద ఇంగ్లండ్‌ వెళ్ళి ఆ డిగ్రీ తీసుకువచ్చేస్తే భర్తకిచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న ధీమాతో బతకొచ్చునని ఆమె ఆశ. శారద పెళ్ళి గురించి ఆలోచించే పని సుబ్బమ్మ ఏనాడూ తన నెత్తిన పెట్టుకోలేదు. శారద మేనమామలు  శారద మెడిసిన్‌లో చేరగానే సంబంధాలు  చూడబోయారు. శారద తన వివాహం తానే చేసుకుంటానని, ఎవరి జోక్యాన్ని సహించనని గట్టిగా చెప్పింది. సుబ్బమ్మ ఆనాటి నుంచీ శారద పెళ్ళి గురించి నిశ్చింతగా ఉంది. కూతురి మీద ఆమెకు కేవలం ప్రేమ మాత్రమే కాదు –  గౌరవం నమ్మకం కూడా ఉన్నాయి. కూతురు ఏ నిర్ణయం తీసుకున్నా అది చాలా మంచిదని అనుకుంటుంది. ‘‘అమ్మా. అందరూ నన్ను ఆధునిక స్త్రీ అంటారు. నువ్వు ఆధునిక అమ్మవమ్మా’’ అనేది శారదాంబ. ‘‘అదంతా నాకేం తెలియదు. శారదకు తల్లిని అంతే’’ అనేది సుబ్బమ్మ.

శారద ప్రయాణం దగ్గర పడుతుండగా బంధువులందరూ వచ్చి శారదను అభినందించి వెళ్ళారు. మరో నాలుగు రోజుల్లో ప్రయాణమనగా పార్టీ సమావేశం కూడా జరిగింది. శారద ఇంగ్లండ్‌లో పార్టీ వారిని కలుసుకుని చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకున్నారు. సమావేశం పూర్తయ్యాక శారదను ఇంటి దాకా దింపే బాధ్యత మూర్తి తీసుకున్నాడు.

‘‘ఒక రోజంతా మనం కలిసి గడపాలి శారదా. రేపు నాతో రాగలవా?’’ మూర్తి సాహసం చేస్తున్నాననుకున్నాడు.

‘‘రాగలను’’ అంది శారద స్థిరంగా.

‘‘ఎక్కడికని అడగవేం’’.

‘‘నువ్వెక్కడికి తీసికెళ్తే అక్కడికి’’ మూర్తి భుజం మీద స్నేహంగా చేయి వేసింది శారద.

 

‘‘రేపు ఉదయం పదిగంటలకు వస్తాను. సిద్ధంగా ఉండు. మళ్ళీ ఎల్లుండి పది గంటలకు మీ ఇంట్లో ఉంటావు’’.

‘‘అలాగే’’ మధురంగా నవ్వింది శారద.

రెండేళ్ళ ఎడబాటు ఒక రోజంతా కలిసి ఉండటంతో తీర్చుకోవాలని చూడటం గురించి వాళ్ళిద్దరికీ సందేహం లేదు.

మర్నాడు శారదను తీసుకుని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు మూర్తి. ఆ స్నేహితుడు కుటుంబంతో సహా స్వగ్రామం వెళ్ళాడు.

అంత ఏకాంతంలో వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవాలని అనిపించలేదు. ఒకరి ఎదుట ఒకరు మౌనంగా కూర్చున్నారు. కొన్ని గంటలు అలా గడిచాక మూర్తి అడిగాడు.

‘‘ఏం చేద్దాం శారదా?’’

‘‘ఏ విషయం’’ తెలిసీ అడిగింది.

‘‘మన ప్రేమ గురించి’’

‘‘చెయ్యటానికేముంది? ప్రేమ ఉంది గదా – దానిని కాపాడుకుందాం’’

‘‘పెళ్ళి ’’

‘‘ఎలా కుదురుతుంది మూర్తీ ?  నేను చాలా ఆలోచించాను. నీకు పెళ్ళి అయింది కాబట్టి నిన్ను ప్రేమించకూడదని అనుకోవటం, ప్రేమించకుండా ఉండటం నా వల్ల కాలేదు. అసలు  ఆ ఊహే నాకు రాలేదు. స్నేహితుల్లా ఉందాం. పెళ్ళి చేసుకోవాలని ఏముంది? ఈ మూడు నాలుగేళ్ళ నుంచీ ఉన్నట్టే ఇకముందూ ఉందాం’’.

‘‘నువ్వు పెళ్ళి చేసుకోవా?’’

‘‘చేసుకోమంటావా?’’

‘‘నేను పెళ్ళాడి సంసార జీవితం గడుపుతూ నిన్ను ఒద్దని ఎలా అంటాను?’’

‘‘లేదు మూర్తీ – నేను నీ జీవితంలోకి రాకముందే నీకు పెళ్ళయింది. దానికి నీ బాధ్యత లేదు. కానీ నా మనసు నిండా నిన్ను పెట్టుకుని ఇంకొకరిని పెళ్ళాడటం నా వల్ల కాదు. పెళ్ళంటే చిన్నతనంలో ఒకందుకు భయపడ్డాను. చదువు ఆగిపోతుందని. ఇప్పుడూ భయపడుతున్నాను. ప్రేమ లేని పెళ్ళి చేసుకోటానికి. ఇంక ఆ విషయం మర్చిపోదాం. చెయ్యటానికి ఎన్నో పనులున్నాయి. ఇంతింత బాధ్యతలు  నెత్తిన వేసుకుని, డాక్టర్‌ వృత్తిలో ఉండి పెళ్ళి చేసుకోవటం కంటే ఇలా ఉండిపోవటం మంచిదని నాకెప్పుడూ అనిపిస్తుంది.’’ చాలా స్పష్టంగా, బలంగా చెప్పింది శారద.

‘‘కానీ – కానీ – ఒంటరిగా’’ మూర్తి గొంతులో ఏదో దీనత్వం.

‘‘నేను ఒంటరినా? కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిని నేను ఒంటరినేమిటి? అంతర్జాతీయ వ్యక్తులం మనం.’’

‘‘ఆ అర్థంలో కాదు’’

‘‘ఏ అర్థంలోనూ నేను ఒంటరిని కాదు. నాకు నువ్వున్నావు. లేవా?’’ శారద అడిగిన తీరు మూర్తి గుండె గొంతులోకి వచ్చింది.

‘‘నా శారదా’’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అలా చాలాసేపు  ఉండిపోయారు.

‘‘ఇంతకు మించి దగ్గర కాలేం కదా’’ జీరబోయిన గొంతుతో అడిగాడు మూర్తి.

‘‘కాలేం అనే నిస్సహాయత ఎందుకు? కాకూడదు అనే నియమం ఎందుకు? ఇంతకుమించి దగ్గర కావాలనే మహోధృతమైన కోర్కె మనలో పుట్టుకొచ్చిన నాడు ఇద్దరం ఒకరిలో ఒకరం ఐక్యమవుతామేమో. ఇపుడు ఆ కోర్కెకు అంత బలం ఉన్నట్టు కనిపించటం లేదు. మన రక్తంలో ఉన్న సంప్రదాయాలలో, నీతులలో, కొత్తగా అలవరుచుకుంటున్న భావాలో –  ఏవో మనల్ని ఇంతకన్నా దగ్గర కానివ్వటం లేదు. ఆ అడ్డు మనం కావాలని ఏర్పరచుకున్నది కాదు. దానంతటది వచ్చింది. దానంతటది తొలగిపోవాలి. మన జీవితకాలంలో తొలిగిపోతుందో లేదో చూద్దాం’’.

ఇద్దరి మనసుూ భారమవుతూ, తేలిక పడుతూ గంటలు గడిచిపోతున్నాయి.

‘‘ఇంగ్లండ్‌లో మంచి మనిషి తటస్థపడి నీకు ప్రేమ కలిగితే నిరాకరించకు’’ ప్రాధేయపడినట్టు చెప్పాడు.

‘‘అలాగే’’ నవ్వింది శారద.

‘‘నవ్వటం కాదు. నిజంగా అలా చెయ్యాలి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను’’.

‘‘నేనూ నిజంగానే అంటున్నాను. ప్రేమ ఎదురైతే నిరాకరించనివ్వదు. నీ ప్రేమ చూడు –  నన్ను ఎలా నీ దగ్గరకు తెచ్చిందో’’.

‘‘నా ప్రేమలో విడ్డూరం లేదు శారదా. నాకూ –  లోకానికి కూడా! ఎంతోమంది పురుషులు  పెళ్ళాడి, ఆ తర్వాత ప్రేమ దొరికి, ఆ ప్రేమనూ పొంది లోకంలో గౌరవంగా బతుకుతున్నారు. కానీ ఆడవాళ్ళలా కాదు. మన సంబంధాల్ని లోకం గౌరవించదు. నిన్ను చిన్నచూపు చూస్తుంది. అది నేను భరించలేను.’’

‘‘లోకానికి విలువ  ఇచ్చి కాదు మూర్తీ నేనిలా నీకు దూరంగా ఉంటున్నది. మగవాడు ఇద్దరిని ప్రేమించగలిగినపుడు – అది సహజమైనపుడు, విడ్డూరం కానపుడు స్త్రీ ఒకరికంటే ఎక్కువమందిని ప్రేమించగలదేమో –  ప్రేమించగలుగుతుంది -మా విశాల తల్లి కోటేశ్వరి చూడు. ఆమె చాలామందితో జీవితం పంచుకుంది. ఇష్టంగానే పంచుకుంది. ఆ వృత్తిలో ఉన్న స్త్రీలు  ఒకరి కంటే ఎక్కువ మందిని ప్రేమిస్తున్నారు ` మిగిలిన స్త్రీలు  రకరకా విధి నిషేధాలతో మనసు కట్టేసుకుంటున్నారేమో ?”

‘‘మన ప్రేమను అలా పోల్చకు శారదా’’

‘‘పోల్చటం కాదు. స్త్రీ పురుష స్వభావాల్లో తేడాలు రకరకా కారణా వల్ల వచ్చాయి తప్ప పుట్టుక వల్ల  కాదనిపిస్తుది. ఇంతకూ నాకు ఇంకో ప్రేమ ఎదురైతే ముందు నీకు చెప్తాను. సరేనా?’’

పేలవంగా నవ్వాడు.

‘‘నిన్ను పోగొట్టుకోవాలని లేదు శారదా’’.

‘‘నేనెక్కడికీ పోను. నిన్ను ఒదిలి నేనూ ఉండలేను. రెండేళ్ళు – ఎంతలో గడిచిపోతాయి  ? దిగులుపడకురా’’ బుజ్జగించింది.

పగలు  రాత్రయింది. రాత్రి కరుగుతూ ఉంది వాళ్ళ మాటల్లో. రాజకీయాలూ , సాహిత్యం, సంగీతం ఏవేవో మాటలు దొర్లుతునే ఉన్నాయి. నవ్వులు  రాలుతూనే  ఉన్నాయి. కన్నీళ్ళు జారుతూనే ఉన్నాయి.

‘‘అరే –  మర్చిపోయాను’’ అంటూ పక్కనున్న సంచీలోంచి ఒక కెమెరా తీశాడు మూర్తి.

‘‘ఈ రోజు నీ ఫోటో ఒకటి తీసుకుని దాచుకోవాలనుకున్నాను’’

శారద నవ్వుతూ చూస్తోంది. మూర్తి ప్రత్యేకమైన దీపాలు  వెలిగించి  చైతన్యాన్ని, ప్రేమను, స్నేహాన్ని ఒలికిస్తున్న శారద ముఖాన్ని ఫోటోలో భద్రపరిచాడు.

‘‘రోజూ చూస్తావా ఆ ఫోటో’’

‘‘పూజ చేస్తా’’

‘‘కమ్యూనిస్టు పార్టీ నుంచి పంపిచేస్తారేమో –  పూజలూ  అవీ చేస్తే’’

‘‘పిచ్చిదానా –  దేవుళ్ళని పూజచేస్తే పంపించేస్తారేమో ` మనుషుల్ని- గొప్ప మనుషుల్ని పూజిస్తే ఎందుకు బహిష్కరిస్తారు?’’

‘‘నేనేం గొప్ప మూర్తీ `-  నాలాంటి వాళ్ళు లోకం నిండా ఉన్నారు.’’

‘లేదు శారదా – నీలాంటి వాళ్ళు లేరు ` పోనీ కోటి కొకరు ఉంటారేమో. నువ్వు స్త్రీవే కాదు –  మనిషివి `- నీ తెలివి, చురుకు, మానవత్వం, స్నేహ గుణం, కమ్యూనిస్టు మేనిఫెస్టో చదివి అట్లా పులకరించి పోయిన మొదటి తెలుగు యువతివి నువ్వేనేమో – ప్రపంచాన్ని అంతా ఆలింగనం చేసుకోగల ఆధునిక యువతివి నువ్వేనేమో –  పోనీ ` నాకింకొకరు తెలియదు. సంగీతం, సాహిత్యం, విజ్ఞానం, సాహసం, త్యాగం –  శారదా ` నువ్వు అపురూపం’’.

శారద మూర్తి నోరు మూసి ‘‘నాకున్న అవకాశాలుంటే లక్షల మంది శారదలు  తయారవుతారు. అతి చెయ్యకు’’ అంది చిరుకోపంతో.

‘‘నీకున్న అవకాశాలు  లక్షమందికి లేవు గానీ, కొందరికి ఉన్నాయి. వాళ్ళు హాయిగా భర్త నీడన బతుకుతున్నారు. నువ్వు స్వేచ్ఛాగామివి. స్వేచ్ఛను ప్రేమించే, స్వేచ్ఛ కోసం తపన పడే నీ స్వభావమే నీ ప్రత్యేకత –  దాన్ని దేశం కోసం, ప్రపంచం కోసం ఉపయోగించాలనే బాధ్యతే నీ ప్రత్యేకత’’.

‘‘ఇంక ఆపు. నీకు స్త్రీల గురించి తెలిసిందెంతా? స్వేచ్ఛ కోసం స్త్రీలు చేసే పోరాటాలు నువ్వు ఊహించలేవు. బహుశ ఎవరూ ఊహించలేరు –  ఆఖరికి చలంగారు కూడా’’

‘‘సరే నువ్వు ఏ ప్రత్యేకతా లేని మామూలు  స్త్రీవి –  ఐనా నిన్ను నేను ప్రేమిస్తున్నాను – సరేనా’’ కోపంగా అన్నాడు మూర్తి.

శారద గలగలా నవ్వింది.

మాటలతో, నవ్వులతో కాలం ఆగదు. తెల్లవారింది. మూర్తి శారదను ఇంటివరకూ అనుసరించి వెళ్ళి వీడ్కోులు చెప్పాడు.

***

శారద వెళ్ళిపోయింది. మూర్తికి అన్ని విధాలుగా కాలం స్థంభించినట్లయింది. పార్టీ పనులు సాగుతున్నాయి. జాతీయోద్యమంలో ఒక రకమైన స్థబ్దత. ఎన్నిక గురించిన చర్చలు . హడావుడి. ప్రపంచ పరిస్థితులే ఉద్రిక్తంగా ఉన్నాయి. జర్మనీలో హిట్లర్‌ చర్యతో రెండవ ప్రపంచ యుద్ధం తప్పదని రాజనీతిజ్ఞులు  అంచనా వేస్తున్నారు. ఆర్థిక మాంద్యంలో ప్రజల  జీవితాలు  తల్లకిందులవుతున్నాయి. శారద ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్న ఇంగ్లండ్‌ గురించి మూర్తికి ఉత్తరాలు  రాస్తోంది. శారద ఉత్సాహం ఆమె ఉత్తరాల్లో కనబడుతూనే ఉంది. చదువు, పార్టీ పనులు , చిన్న ఉద్యోగాలు , ఇంగ్లండ్‌ కార్మికులతో వారి జీవితాలతో పరిచయం చేసుకోవటం, యూనియన్‌ నాయకులను కలవటం ` ఒక్కక్షణం తీరిక లేకుండా బతుకుతోంది శారద.

***

గమనమే గమ్యం-14

 

 

olgaదుర్గాబాయి మధుర జైలు  నుంచి విడుదలై కాకినాడ వచ్చిందనీ, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదనీ కాకినాడ నుంచి అన్నపూర్ణ ఉత్తరం రాసింది. శారదకు ఇంగ్లండ్‌ వెళ్ళేముందు ఒకసారి దుర్గాబాయిను చూసి రావాలనిపించింది. పైగా కృష్ణా గోదావరీ జిల్లాల్లో కూడా కమ్యూనిస్టు భావాలతో యువతీ యువకులు పనిచేస్తున్నారు. అక్కడివాళ్ళను కలిసివస్తే ఉత్సాహం పెరుగుతోంది. తల్లిని అడిగితే రాలేనంది. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఒకసారి విశాలాక్షిని కలిసి వద్దామనుకుంది.

శారద వెళ్ళేసరికి విశాలాక్షి చాలా ఆందోళనతో ఉంది. ఈసారైనా యూనివర్సిటీలో ఎకనామిక్సు శాఖలో సీటు దొరుకుతుందా లేదా అనే దిగులు  పెట్టుకుంది. పైగా కోటేశ్వరి నాటకం కంపెనీ కోసం ఇంకెవరినో ఇంట్లో చేర్చింది. అతన్ని చూస్తుంటే విశాలాక్షి కి   కంపరంగా ఉంది. పాపం అతను విశాలాక్షి  జోలికి రావటం లేదు గానీ విశాలాక్షి  అతని ఉనికిని భరించలేకపోతోంది. అమ్మ ఇట్లా ఎందుకు చేస్తుందనే కోపం, దు:ఖంతో ఉడికిపోతోంది. దానికి తోడు ఇన్నాళ్ళూ ఎక్కడుందో తెలియని ఒకావిడ పిన్నంటూ ఇంట్లో దిగింది. ఆమెకు పద్నాలుగేళ్ళ కూతురు. వాళ్ళిద్దర్నీ తల్లి ఆప్యాయంగా చూసుకుంటుంటే విశాలాక్షి కి  ఒళ్ళు మండిపోతోంది.

‘‘ఇన్నాళ్ళూ ఏమయ్యారమ్మా వీళ్ళూ. నాకెప్పుడూ చెప్పనన్నా లేదు నాకో పిన్ని ఉందని’’ అనడిగింది తల్లిని.

‘‘నా పిన్నమ్మ కూతురమ్మా. మేమూ చిన్నతనంలో చూసుకోటమే. రాజమండ్రిలో ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు కూతురిని పైకి తేవాలని పట్నం వచ్చింది. నాలుగైదు నెలల్లో ఏదో ఒకదారి చూసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళతో మరీ అంటీ ముట్టనట్టు ఉంటావెందుకు’’ అని కూతురిని సముదాయించబోయింది కోటేశ్వరి. విశాలాక్షి కి  ఆ పిల్ల ను చూస్తే ఒంటికి కారం రాసుకున్నట్లుండేది.

‘‘పద్నాుగేళ్ళ పిల్ల.  బళ్ళోకి వెళ్ళి చదువుకునే వయసు. ఎప్పుడూ అద్దం ముందు చేరి సింగారం. ఆ బట్టలు , ఆ తల దువ్వుకోవటం. నాకు చూస్తుంటే చీదరగా ఉంది. ఇల్లు ఒదిలి ఎటన్నా పోదామని ఉంది’’.

విశాలాక్షి  ఈ చిరాకులో ఉండగానే శారద వచ్చింది. విశాలాక్షి  చాటంత ముఖం చేసుకుని.

‘‘నువ్వెంత మంచిదానివి శారదా “ ఇన్నిసార్లు మా ఇంటికి వస్తావు. నేను మీ ఇంటికి రావటం లేదని పట్టించుకోవు’’ అని ఆహ్వానించింది.

‘‘దాన్లో ఏముందోయ్‌ – ఎవరింటికి ఎవరొస్తే ఏంటోయ్‌’’ అని గలగలా నవ్వింది శారద.

‘‘మా ఇంటికి రావటానికి చాలామంది సందేహిస్తారు. వచ్చేవాళ్ళను చూస్తే నాకు చిరాకు’’ అంటూ తన మానసిక పరిస్థితంతా శారదతో చెప్పుకుంది విశాలాక్షి. .

‘‘పోనీ ఒక పని చెయ్యి. నేను దుర్గను చూడటానికి కాకినాడ వెళ్తున్నాను. నువ్వూ నాతో రా. మార్పుగా ఉంటుంది. మనం తిరిగి వచ్చేసరికి నీ సీటు సంగతి కూడా తేలుతుంది’’.

విశాలక్షి కి  కూడా ఆ మాట నచ్చింది. కానీ వెంటనే ఓ సందేహమూ వచ్చింది.

‘‘శారదా –  మనం వెళ్ళే చోట్ల నన్నూ నిన్నూ ఒకేలా చూస్తారా? నిన్నో చోటా నన్నో చోటా భోజనం చెయ్యమంటారా?’’

‘‘అలాంటి చోటికి నేను వెళ్ళనే తల్లి. దుర్గ దగ్గరికే వెళ్దాం. దుర్గ సంగతి నీకెంత తెలుసో నాకు తెలియదు. చిన్నతనంలోనే నువ్వే ఇష్టపడని మీ ఇళ్ళకు వచ్చి గాంధీ పురాణం చెప్తానని, గాంధీ గారి గురించి చెప్పేది. మనకంటే చిన్నదే గాని ఎన్నో విషయాల్లో మనల్ని దాటి ముందుకెళ్ళింది’’.

‘‘నాకా రాజకీయాలు  పడవు తల్లీ’’.

‘‘అనారోగ్యంతో ఉన్న దుర్గను పలకరించడానికి రాజకీయాలక్కర్లేదు గానీ నువ్వు రావాలి. వస్తున్నావు. అంతే’’ తొందర చేసింది.

‘‘మా అమ్మతో చెప్పాలిగా’’

‘‘మీ అమ్మగారితో నే మాట్లాడుతాలే’’ అంటూ శారద లోపలికి వెళ్లింది. శారదంటే కోటేశ్వరికి ఎంతో ఇష్టం. మనసులో ఉన్నదంతా వెళ్ళబోసుకోటానికి ముఖ్యంగా కూతురి గురించి చెప్పుకోటానికి ఆమెకు శారద కంటే ఎవరూ దొరకరు. శారదను చూడగానే కూతురి ఆగడా గురించి మొత్తుకుంది.

‘‘విశాలాక్షి  మనసు వేరుగా ఆలోచిస్తోందమ్మా. కాలేజీలో చేరితే అన్నీ కుదిరిపోతాయి. ఈ లోపల ఒక నెలరోజు నాతోపాటు కాకినాడ తీసుకుపోదామనుకుంటున్నా. మీరు ఒప్పుకుంటే ` ’’

‘‘అయ్యో – నేనెందుకు ఒప్పుకోను. నువ్వడగటం నేను కాదనటమా? బంగారంలా తీసుకుపో. నీకున్న బుద్ధి దానికుంటే ఎంత బాగుండేది. నువ్వెంత గొప్పింటి బిడ్డవు. మీ నాయనమ్మెంత నిష్టాపరురాలు. మీ నాన్నెంత పండితుడు. ఆ ఇంటి పిల్లవు మా ఇంటికొచ్చి నా చేతి వంట తింటున్నావు. దానికింత కంటే ఏం గౌరవం కావాలి? ఎప్పుడూ ఏదో కుములుతుంటుంది. దాని కుముడు చూడలేకుండా ఉన్నాను. తీసుకుపోమ్మా. నెలరోజు నేనూ సుఖపడతాను.’’ అంది.

శారద నవ్వి ‘‘విశాలాక్షి కి  చదువైపోయి పెద్ద ఉద్యోగం వస్తే తనూ మీరు కూడా సుఖపడతారు’’ అంది.

‘‘ఉద్యోగాల్లో నామ్మా సుఖం, శాంతి ఉండేది. మనసులో ఉండాలి. దాని మనసు మంచిది కాదు’’ అంది కోటేశ్వరి.

‘‘అట్లా కాదులే అమ్మా – మంచిదే , నే చెప్తాగా’’ అంటూ విశాలాక్షి  దగ్గరికి వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోమంది.

ఇక కృష్ణా, గోదావరి జిల్లాల్లో పార్టీ సభ్యులను కలుసుకుంటానని పార్టీ అనుమతి కోసం అడిగింది. పార్టీ సభ్యులకు కబుర్లు వెళ్ళాయి. అందరికీ అనుకూలమైన రోజేదో తెలుస్తుంది. శారదకది మహా ఉత్సాహంగా ఉంది. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ చాపకింద నీరులా, నీళ్ళల్లో చేపలా పాకుతోంది. గ్రామాలకు గ్రామాలు  జమీందారీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక భావాలతో చైతన్యమవుతున్నాయి. వితంతు వివాహాలు  చేయటం, వయోజన విద్య వంటి కార్యక్రమాలతో ప్రజలోకి చొచ్చుకుపోతూ తమ ప్రత్యేకత చూపుతున్నారు. కాంగ్రెస్‌ సోషలిస్టుగా చలామణి అవుతున్నా అంతర్గతంగా వాళ్ళలో కమ్యూనిస్టు భావాలే జ్వలిస్తున్నాయి. గుంటూరులో ఏర్పడిన కమ్మ హాస్టలు  ఇలాంటి  భావాలున్న యువకులకు కేంద్రమైంది.

ముదునూరు, వీరుపాడు లాంటి గ్రామాలలో మహిళలు  కూడా ఇళ్ళు దాటి ముందుకు వస్తున్నారు.

olga title

అదంతా చూసి రావాలని శారదకు ఉంది. పార్టీ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఓ వారం రోజుల ఎదురుచూపు తర్వాత పార్టీ శారద ఆ ప్రాంత కమ్యూనిస్టులను కలుసుకునేందుకు అంగీకరించటం లేదనే అనంగీకార పత్రం అందుకుంది. అన్ని ప్రాంతాలలో పోలీసు నిఘా చాలా ఎక్కువగా ఉంది. ఇపుడు శారద వెళ్తే సమావేశాలు  ఏర్పాటు చెయ్యగలరనే నమ్మకం లేదు అని రాశారు. శారద ఉత్సాహం సగం చల్లారిపోయింది.

దుర్గ దగ్గర పదిరోజులుండి వస్తే చాలని విశాలతో కలిసి పది రోజులు  గడపటం కూడా మంచిదని అనుకుని సమాధానపడిరది.

కాకినాడలో రైలు  దిగి దుర్గాబాయమ్మ గారిల్లు  అంటే చెప్పలేని వారెవరూ ఉండరు. తేలిగ్గా దుర్గ ఇంటికి చేరారు. దుర్గను చూసి శారద భయపడిరది. ముఖంలో ఆ కళ, వర్చస్సు ఎటు పోయాయో ని;లువెల్లా నీరసంతో ఉంది. సన్నగా, నల్లగా, బహీనంగా ఉంది. శారదను చూసి దుర్గ చాలా సంతోషించింది.

దుర్గవాళ్ళమ్మా, తమ్ముడూ కూడా వీళ్ళకు చాలా మర్యాద చేశారు. విశాల చదువు సంగతి శారద చెప్పగానే దుర్గ ముఖంలో కాంతి వచ్చింది. విశాల  చేతులు  రెండూ గట్టిగా పట్టుకుని ‘‘తప్పకుండా చదువు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానకు’’ అంది.

‘‘ఈ సంవత్సరమన్నా సీటువస్తే’’ అని నిరుత్సాహంగా అంటున్న విశాల నోరు మూసి

‘‘ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. నేను ముత్తులక్ష్మీరెడ్డికి ఉత్తరం రాసిస్తాను. ఇక నీకు సీటు ఇప్పించటం ఆవిడ బాధ్యత. అవసరమైతే ప్రకాశం గారికి, కాశీనాథుని గారికి కూడా ఉత్తరాలు రాసిస్తాను. వాళ్ళూ సాయం చేస్తారు. నీకు సీటు తప్పకుండా వస్తుంది’’. ‘‘ఔను’’ అంది శారద.

‘‘విశాలా –  ముత్తులక్ష్మీరెడ్డి నీకు తప్పకుండా సాయం చేస్తుంది. మీ కులం వాళ్ళు ఆ వృత్తి వదలాలని ఆమె చాలా కృషి చేస్తోంది’’ అంది దుర్గ.

విశాలకు కొత్త ఆశ కలిగింది.

ఆ సాయంత్రం దుర్గని వీణ వాయించమని అడిగింది శారద.

దుర్గ వీణ వాయిస్తుంటే, శారద పాడుతుంటే త్యాగరాజకృతులకు విశాల అభినయం చేసింది.

చాలా రోజుల తర్వాత దుర్గ ఉత్సాహంగా ఉందని తల్లి సంతోషించింది.

‘‘ఈ వీణ నన్ను జైల్లో కాపాడిరది. నాకు పిచ్చెక్కకుండా చేసింది. సంగీతానికున్న శక్తి మరింక దేనికీ లేదు’’ అంది దుర్గ.

‘‘జైల్లోకి వీణ తీసుకెళ్ళారా’’ అంది విశాల ఆశ్చర్యంగా.

‘‘తీసుకెళ్ళలేదు. జైల్లో ఒంటరితనం, భయంకరమైన వాతావరణం భరించలేకపోయా. పిచ్చెక్కుతుందేమో అనిపించింది.ఆ స్థితిలో జైలు  సూపర్నెంటుని ఒక వీణ ఇప్పించమని అడిగా. నన్ను చూసి జాలిపడ్డాడేమో ,  తెప్పించి ఇచ్చాడు. వీణ వాయిస్తుంటే మళ్ళీ మనిషినయ్యాను నెమ్మదిగా. అబ్బా –  ఆ రోజులు   ఆ మనుషులు  ’’

‘‘అదంతా మర్చిపోవాలమ్మా ` ఆ జ్ఞాపకాలు  నీ ఆరోగ్యానికి మంచివికావు. అమ్మా శారదా –  మీ ముగ్గురూ కలిసి ఇంకో కీర్తన పాడండి. దుర్గ వీణ వాయిస్తూ పాడుతుంది’’ అంది అమ్మ.

ముగ్గురూ ఏం పాడదామంటే ఏం పాడదామనుకున్నారు.

ముగ్గురికీ నచ్చిన, వచ్చిన కీర్తన ‘సంగీత జ్ఞానము భక్తి వినా’ హాయిగా గొంతెత్తి పాడుతుంటే, ముగ్గురి గొంతుల  మధ్యనుంచీ వీణ మధురంగా పలుకుతుంటే వాతావరణమంతా ఆనందమయమైంది.

దుర్గ అప్పటికే బెనారెస్‌ మెట్రిక్‌ పరీక్ష ఇవ్వాలని నిర్ణయించుకుంది.

నాస్తిక భావాలు  ప్రచారం చేస్తూ, కాకినాడ కాలేజీలో ఉద్యోగం చేస్తున్న గోరా గారింటికి వెళ్ళి ట్యూషన్‌ చెప్పించుకుంటోంది. శారద తనున్న నాలుగు రోజులూ  దుర్గకు సైన్సు పాఠాలు చెప్పింది. విశాల ఇంగ్లీషు గ్రామరు చెప్పింది.

ముగ్గురూ కలిసి గోరా గారింటికి వెళ్ళారు.

ఆ ఇంటి వాతావరణం విశాలను ఆశ్చర్యపరిచింది. శారదా వాళ్ళ ఇల్లు   కుల మత బేధాలకతీతంగా నడుస్తున్నా ఇంట్లోకి రాగానే అది బ్రాహ్మణుల  ఇల్లని తెలుస్తుంది.  సుబ్బమ్మగారు దేవత విగ్రహాలు, పటాలు  ఇంట్లో అలంకరణగా పెడుతుంది. పెద్ద ఇల్లు .

గోరా గారి ఇల్లు ఒక పాక. విశాలమైన ఆవరణ ఉంది. దాని నిండా రకరకాల మొక్కలు . చెట్లు, పూల చెట్లు విరగబూసి ఉన్నాయి. పాకలో ఒకవైపు గోరాగారి ఇల్లు  ఏ మత చిహ్నాలు  లేకుండా ఉంది. పక్కనే ఉన్న గదిలో గోరాగారి తల్లిదండ్రుల పూజగది ఉంది. సరస్వతి గోరాగారి భార్య. ఆమె నాస్తికురాలు. అయినా అత్తమామల పూజకు కావసిన ఏర్పాట్లు చేసేది.

శారదా, సరస్వతి క్షణాల్లో స్నేహితులయ్యి ఎన్నాళ్ళబట్టో ఎరిగున్న వాళ్లలా కబుర్లు చెప్పుకున్నారు.

గోరా గారితో శారద నాస్తికవాదం గురించి చిన్న వాదన చేసింది. ప్రజలు  ఈ భావాలకు భయపడతారని శారద, ప్రజలలో అనవసర భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇవ్వటమే గదా మనం చెయ్యాల్సింది అని గోరాగారూ `

విశాలకిదంతా కొత్త ప్రపంచం. తన ఇంటి వాతావరణానికి ఇక్కడి ఈ ఇళ్ళకూ పోలికే లేదనుకుంది. ఐనా విశాల ఇక్కడ కూడా కలవలేకపోయింది. వీళ్ళు కూడా తనవాళ్ళు కాదనిపించింది. వాళ్ళు శారదను చూసినట్టే విశాలనూ చూస్తున్నారు. కానీ విశాలకు ఎక్కడో ఏదో తేడా ఉందనే అనిపిస్తోంది. ఆ ఆదర్శాలు  విశాలకు ఎక్కటం లేదు. వాళ్ళ మాటల్లో విశాల లీనం కావటం లేదు.

విశాల మనసులో మద్రాసు వెళ్ళగానే తను కలవబోయే ముత్తులక్ష్మీరెడ్డి, ఆమె తనకు ఇప్పించబోయే సీటూ తప్ప మరింకే ఆలోచనా నిలవటం లేదు. శారద మాత్రం కాకినాడ వచ్చి మంచిపని చేశాననుకుంది. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ గురించి దుర్గతో మాట్లాడదామనుకుంది గానీ ఆమెతో రాజకీయాలు  మాట్లాడవద్దని దుర్గ తమ్ముడు నారాయణరావు హెచ్చరించాడు. చూస్తుండగానే పదిరోజులు  గడిచాయి. దుర్గ బలవంతం మీద మరో ఐదు రోజులు ఉన్నారు. తిరిగి ప్రయాణమవుతుంటే దుర్గ తను ఒడికిన నూలుతో నేసిన చీరొ చెరొకటీ ఇచ్చింది.

‘‘జీవితాంతం ఇది దాచుకుంటా దుర్గ. ఎంతో అమ్యూల్యం నాకిది’’ అంది శారద ఆ చీరెను గుండెకు హత్తుకుంటూ.

ముగ్గురూ కలిసి మళ్ళీ త్యాగరాజ కీర్తన అందుకున్నారు. దుర్గ మధురంగా వీణ వాయించింది.

విశాల, శారద తిరిగి వచ్చీ రాగానే శారద తన పలుకుబడి ఉపయోగించి ముత్తులక్ష్మీరెడ్డిని కలిసే ఏర్పాటు చేసింది.

విశాల ఆమెతో తన పరిస్థితీ, తన కోరికా ఏమీ దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పింది. దుర్గాబాయి రాసిన ఉత్తరం ఇస్తే లక్ష్మీరెడ్డి నవ్వి ‘‘నీ మాటలన్నీ విన్నాక ఇంక ఎవరి సిఫారసూ అక్కర్లేదు. దుర్గాబాయి అంటే నాకెంతో గౌరవం. నిజమే. ఇప్పుడు నువ్వంటే ఎంతో ప్రేమ కలిగింది నాకు. నువ్వు ఏమ్‌.ఏ లో చేరటానికి కావసిన ఏర్పాట్లు చేసుకో –  శారదా. నువ్వు ఇంగ్లండ్‌ వెళ్తావా? మంచి పని –  నాకూ ఇంగ్లండ్‌ రావాని ఉంది.’’

ముగ్గురూ ఎన్నో విషయాలు  మాట్లాడుతూంటే రెండు గంటల  కాలం తెలియకుండా గడిచిపోయింది. ముగ్గురి మధ్యాస్నేహం కుదిరింది.

శారద మనసు ఎపుడెపుడు మూర్తిని చూద్దామా అని తహతహలాడుతోంది. ఆమె రాగానే ఆమె వచ్చినట్లు మూర్తికి కబురుపంపింది. రెండు రోజులు  గడిచినా మూర్తి రాలేదని దిగాలు  పడిరది. మళ్ళీ ఒక మనిషి కోసం ఇంత బలహీనమవుతున్నానేమిటని తనను తాను హెచ్చరించుకుంది.

మూడో రోజు మూర్తి వచ్చాడు.

‘‘మూడు రోజుకు తీరిందా’’ అంది నిష్టూరంగా.

‘‘పదిహేను రోజులు ఒక్కడినే ఒదిలి వెళ్తే నేనేమయ్యానో నీకు తెలియాలిగా’’.

‘‘బాగా తెలిసింది’’ నవ్వేసింది శారద.

గలగలా కాకినాడ కబుర్లన్నీ చెప్పింది. గోరాగారి గురించీ, వాళ్ళింటి గురించీ చెప్తూ ‘‘ఆయన వృక్షశాస్త్రంలో భలే పరిశోధన చేస్తున్నారు తెలుసా? ఒక వింత సంగతి చెప్తా విను. బొప్పాయి చెట్లలో ఆడచెట్లూ, మగచెట్లూ ఉంటాయి. తెలుసుగా?’’

‘‘బొప్పాయి చెట్లలో ఏంటి? సృష్టిలో ప్రతి ప్రాణిలో ఉంటాయి ఆడ, మగ. లేకపోతే సృష్టి సాగేదెట్లా.’’

‘‘అబ్బా ` నీకు లా తెలుసుగానీ వృక్షశాస్త్రం తెలియదు. బొప్పాయి చెట్లలో కొన్ని చెట్లకి ఆడ, మగ పూలు పూస్తాయి. మగపూలు రాలి ఆడపూలు కాయవుతాయి. కొన్ని చెట్లు మగ చెట్లుగానే ఉంటాయి. మగపూలే పూస్తాయి. అవి రాలిపోతాయి. కాయలు కాయవు. కొన్ని ఆడ చెట్లుగా ఉంటాయి. ఆ చెట్టు పూలన్నీ కాయలు కాస్తాయి. గోరాగారు మగచెట్టుని కూడా ఆడచెట్టుగా మార్చాలని పరిశోధన చేస్తున్నారు’’.

మూర్తి తల పట్టుకుని ‘‘మగవాళ్ళని ఆడవాళ్ళుగా మార్చనంతవరకూ ఎవరేం చేసుకున్నా నాకభ్యంతరం లేదు’’ అన్నాడు.

‘‘ఆడవాళ్ళను మగవాళ్ళుగా మారిస్తే’’

‘‘అది నువ్వు చెప్పాలి. నాకు నేను మగవాడిగా ఉంటే చాలు. మారాలని లేదు’’.

‘‘నాకేమనిపిస్తుందో చెప్పనా?’’ ముద్దుగా అడిగింది శారద.

‘‘చెప్పు’’ అన్నాడు ఆమెని రెప్పవాల్చకుండా చూస్తూ.

‘‘బొప్పాయి చెట్లలో కొన్ని చెట్లలాగా ప్రతి మనిషిలో ఆడ, మగ ఇద్దరూ ఉండాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అని వేరుగా ఉండనవసరం లేదు. రెండు క్షలణాూ ఉన్న మనుషులుండాలి. అప్పుడు ఈ తేడాలుండవు. ఎన్నో సమస్యలు పోతాయి’’.

‘‘కొత్త సమస్యలు  చాలా వస్తాయి’’ శారద నెత్తి మీద మొట్టికాయవేశాడు.

‘‘ఏమొస్తాయి’’ అమాయకంగా అడిగింది శారద.

‘‘సెక్సు –  సెక్సు ఎట్లా?’’

‘‘ఏముంది? సింపుల్‌. ఉదాహరణకు నీలో ఆడక్షణాలు  ఉద్రేకించినపుడు మగక్షణాలు  ఉద్రేకించిన మనిషి వైపు ఆకర్షించబడతావు. సెక్సు సాధ్యమవుతుంది. నీలో అపుడు అండం విడుదయితే అవతలి నుంచి వీర్యకణాలు  చేరతాయి. రెండూ కలిసి ఎవరి శరీరంలో స్థిరపడితే వారి గర్భంలో బిడ్డ పెరుగుతుంది’’.

‘‘శారదా –  ప్లీజ్‌ ` ఆపు. నువ్వు డాక్టర్‌వి. నిజమే గాని నువ్వు చెప్పేది వింటే నాకు కడుపులో వికారంగా ఉంది. ఇంక ఆపు. లేకపోతే నన్ను వెళ్ళిపొమ్మని సూటిగా చెప్పెయ్‌’’.

శారద గలగలా నవ్వి ‘‘నీతో తప్ప ఇలాంటి విచిత్రపు ఆలోచనలను ఇంకెవరితోనూ చెప్పలేను. అదేంటో –  సరేగానీ నువ్వూ దీని గురించి ఆలోచించవా.’’

‘‘చచ్చినా ఆలోచించను. మగాడు మగాడిలా, ఆడది ఆడదిలా ఉండాలి. వాళ్ళు ప్రేమించుకోవాలి. పెళ్ళాడాలి. ఇప్పటిలా పిల్లల్ని కనాలి. అదే సృష్టిధర్మం. నాకదే ఇష్టం’’.

‘‘సృష్టి ధర్మాలను కమ్యూనిజం మార్చదా? మార్పు ఇష్టం లేకపోతే కమ్యూనిస్టువి కాలేవు’’.

‘కమ్యూనిస్టు కోరేది ఇలాంటి మార్పు కాదు. ప్లీజ్‌ ఆ గోరా గారికో నమస్కారం. నీకో నమస్కారం. ఇంకేదన్నా చెప్పు. దుర్గాబాయి గురించి ఇంకా చెప్పు.’’

‘‘ఆమె చాలా నలిగింది. శారీరకంగా, మానసికంగా. చదువుకుంటోంది. కోలుకుంటుందిలే’’.

‘‘ఆమె జైల్లో గడిపిన దుర్భర జీవితాన్ని ప్రజల్లో ప్రచారం చేసి కాంగ్రెస్‌ పార్టీ తన ప్రతిష్ట పెంచుకుంటోంది’’.

‘‘పెంచుకోని. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టతో పాటు అందులో సోషలిస్టు ప్రతిష్టా పెరుగుతుంది.’’

‘‘దుర్గాబాయి సోషలిస్టు కాదుగా’’

‘‘ఏమో కావచ్చు. మన ఆశయాలు  ఆమెకు నచ్చుతాయి’’.

‘‘ఆమె ఎన్నటికీ కమ్యూనిస్టు కాదు’’.

‘‘కాకపోవచ్చు. కమ్యూనిస్టు కాకుండా మంచి మనుషులు  ఉండకూడదా?’’

‘‘ఉండొచ్చుగానీ – వాళ్ళ మంచితనం ఎవరికీ ఉపయోగపడదు’’.

‘‘ఇపుడు గాంధీ మొదలైన వాళ్ళ మంచితనం వల్ల ఏ ఉపయోగం లేదా?’’

‘‘ఉంది. కొంతవరకే.’’

‘‘ఆ – కొంత, కొంత,  కొంత కలిసి సంపూర్ణమవుతుంది. కొంత లేకుండా సంపూర్ణం లేదు. కాబట్టి కొంత కూడా పూర్ణమే. అందుకే మనవాళ్ళు పూర్ణమిదం పూర్ణమదం అన్నారు.’’

‘‘బాబోయ్‌ –  ఇవాళ నువ్వన్నీ తాత్విక చర్చలు  చేస్తున్నావు. నేను వెళ్ళొస్తా.’’

మూర్తిని ఆపింది శారద. రాత్రి పొద్దుబోయే దాకా చర్చలతో గడిపి భారంగా విడిపోయారిద్దరూ.

***

 

 

 

గమనమే గమ్యం -13

 

 

olga‘‘విశాలాక్షి స్వయంగా వచ్చి పిలిచింది. వెళ్ళక తప్పదు’’ అనుకుని చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి నాటకానికి వెళ్ళేందుకు తయారవ్వాలని లేచింది శారద.

విశాలాక్షికి ఆ సంవత్సరం ఎమ్‌.ఏ లో చేరేందుకు సీటు దొరకలేదు. నాటకాల్లో వేషాలు  వేయటమూ తప్పలేదు. కొత్త నాటకం వేస్తుంటే శారదను పిలిచేది. శారద ఒకసారి మూర్తిని, సుదర్శనాన్ని కూడా తీసికెళ్ళింది. ఆ నాటకాలు  పెద్ద బావుంటాయని కాదుగానీ విశాలాక్షి కోసం, కోటేశ్వరి కోసం వెళ్ళేది.

ఇప్పుడేదో సాంఘిక నాటకమని చెప్పింది.

శారద ముందుగా విశాలాక్షి ఇంటికి వెళ్ళింది. ఇద్దరూ కలిసే థియేటర్‌కి వెళ్ళారు. వాళ్ళంతా వేషాలు  వేసుకుంటుంటే శారద విశాలాక్షికి సాయం చేస్తూ కబుర్లు చెబుతోంది. ఇంకో పావుగంటలో నాటకం మొదలవుతుండగా విశాలాక్షి తల్లి కోటేశ్వరి సంతోషంగా వచ్చింది.

‘‘విశాలా. నీ అదృష్టం బాగుందే. బళ్ళారి రాఘవరావు గారు మన నాటకం చూడటానికి వస్తున్నారు’’.

‘‘ఎవరొస్తే మనకేమిటమ్మా. మన నాటకం మనం ఆడాలి. తప్పదుగా’’

‘‘తిండి పెట్టేది అవి. ఆ నాటకాల  గురించి ఎందుకట్టా మాట్టాడతావు. పెద్దాయన వస్తున్నాడు. నువ్వు వినయంగా నమస్కారం చెయ్యి. ఆయన తల్చుకుంటే నిన్ను మహానటిని చేస్తాడు.’’

‘‘మహానటిని కావాని నాకేం కోరికలేదు. ఐనా మహానటులు  ఎవరికి వారు కావాల్సిందే. ఇంకొకరు చేయలేరు. ‘‘దురుసుగా అంది విశాలాక్షి.

‘‘నా మాటలన్నీ నీకు తప్పుగానే వినపడతాయి. చూడు శారదమ్మా, నీ స్నేహితురాలి వరస’’ అంటూ పక్కకు వెళ్లింది .

‘‘ఎందుకే. మీ అమ్మనట్లా బాధపెడతావు’’ జాలిగా అంది శారద.

‘‘నా లోపల, నా జీవితం గురించి ఎంత అసంతృప్తి ఉందో నీకు తెలియదు. ఎంత ఆపినా ఆగకుండా ఇలా పైకి తన్నుకొస్తుంది. అమ్మకూ నాకూ ఇది అలవాటేలే ` ’’

‘‘బళ్ళారి రాఘవ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో మంచి నటుడు. నేను ఆయన నాటకాలు  చూశాను’’ ఉత్సాహపరచబోయింది శారద.

‘‘నేనూ చూశాను. గొప్ప నటులే – కాదన్నదెవరు?’’ నిర్లిప్తత పోలేదు విశాలాక్షి గొంతులో.

ఇంతలో నాటకం మొదలవుతుందనే పిలుపు. విశాలాక్షి వెళ్ళింది. శారద పెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది.

అది గొప్ప నాటకం కాదు గానీ విసుగు పుట్టించలేదు.

నాటకం పూర్తయ్యాక బళ్ళారి రాఘవను స్టేజీ మీదకు పిల్చారు. ఆయన వచ్చి నాటకం గురించి నాలుగు మంచి మాటలు చెప్పి, ఆంధ్రదేశంలో గొప్ప బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి నాటకరంగంలో చరిత్ర సృష్టిస్తున్న కొమ్మూరి పద్మావతి కూడా నాటకానికి వచ్చిందనీ, ఆమె వేదిక మీదికి రావాలని కోరారు. పద్మావతి స్టేజి మీదకు వచ్చి అందరికీ నమస్కారం చేసేసరికి ప్రేక్షకుల  ఉత్సాహం రెట్టింపయింది.

ఆ సభా తతంగం అయ్యాక లోపల  మేకప్‌ రూంలోకి చాలా మందే వచ్చి అభినందించారు. రాఘవగారు, పద్మావతి గారూ నలుగురితో కలిసి వచ్చారు.

‘‘మా అమ్మాయి బి.ఎ చదివిందండి’’ అంది కోటేశ్వరి గర్వంగా.

‘‘మంచిది. చదువుకున్న వాళ్ళూ, కుటుంబ స్త్రీలు  వస్తేనే నాటకరంగ ప్రతిష్ట పెరుగుతుంది’’ అన్నారు బళ్ళారి రాఘవ.

‘‘కుటుంబ స్త్రీలంటే ఎవరండీ? కుటుంబ స్త్రీలు  కానిదెవరండి? ’’ చాలా కటువుగా అడిగింది విశాలాక్షి.

అందరూ నిశ్శబ్ధమైపోయారు.

IMG (2)

బళ్ళారి రాఘవ పక్కనున్న తెల్లటి అందమైన మనిషి సన్నగా నవ్వి ‘‘తప్పు ఒప్పుకొని ఆ అమ్మాయిని క్షమాపణ అడగండి’’ అన్నాడు.

పద్మావతి కంగారుపడుతూ ‘‘మీరూరుకోండి’’ అన్నది.

‘‘అమ్మా – ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నా పేరు గుడిపాటివెంకట చలం. కథలూ  అవీ రాస్తుంటాను. నువ్వడిగిన ప్రశ్న చాలా సరైన ప్రశ్న’’.

బళ్ళారి రాఘవ గంభీరంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆయనతో వచ్చినవాళ్ళూ వెళ్ళిపోయారు.

చలంగారు రెండు నిమిషాలు  నిలబడి ‘‘మీ నాటకం నాకేం నచ్చలేదు గానీ నీ మాటలూ , నువ్వూ –  మర్చిపోలేను’’ అంటూ వెళ్ళిపోయారు.

శారద చలం గారిని చూసిన సంభ్రమంలో మిగిలినవన్నీ మర్చిపోయింది.

‘‘విశాలా – చలంగారు’’ అంది విశాలను కుదుపుతూ.

‘‘ఔను – అదే – చూస్తున్నా’’

కోటేశ్వరి అందరినీ గదమాయిస్తూ సామాను సర్దిస్తోంది. ఆమెకు కూతురి మీద పట్టరాని కోపంగా ఉంది. అంత పెద్ద మనిషిని పట్టుకుని అవమానించింది. బి.ఏ చదివానని పొగరు. దీన్తో ఎలా వేగాలో తెలియటం లేదు. ఆమెకి విశాలాక్షి భవిష్యత్తు గురించి బోలెడు భయం.

విశాలాక్షి ఇల్లు చేరాక తల్లితో పెద్ద యుద్ధమే చేసింది.

‘‘నేనింక నాటకాలు వెయ్యను’’ అని ప్రకటించేసింది.

‘‘ఒకపక్క ఆ బ్రాహ్మలావిడ నాటకాల్లోకి వస్తే – నీకు పరువు తక్కువైందా నాటకాలేస్తే’’ అని కూతుర్ని తిట్టింది కోటేశ్వరి.

‘‘ఔనమ్మా ` బ్రాహ్మలు, కుటుంబ స్త్రీలు నాటకాలేస్తే గొప్ప. మనం ఏం చేసినా గొప్ప కాదు. వాళ్ళను చూసినట్లు మనల్ని చూడరు.’’

‘‘నీకు ఏం కావాలే? ఇప్పుడు నీకేం తక్కువైంది?’’ అరిచింది తల్లి.

‘‘అది నీకూ తెలుసూ. నాకూ తెలుసు. మళ్ళీ నా నోటితో చెప్పాలా? “గయ్యిమంది కూతురు.

కోటేశ్వరికి మండిపోయింది.

‘‘సరే – నోర్మూసుకుని తిండితిని పడుకో. చేసే పని సంతోషంగా చెయ్యటం చేతగాని దద్దమ్మవి. నీ మీద నీకు గౌరవం లేదు. నిన్ను నువ్వు గొప్పనుకోవటం తెలియదు. ఎవరో నిన్ను గొప్ప దానివనాలా ?నీ గురించి నీకు తెలియదా?’

విశాలాక్షికి ఎవరో గట్టిగా నెత్తిమీద కొట్టినట్లయింది.

‘‘నీ మీద నీకు గౌరవం లేదు. ఎవరో నిన్ను గొప్పదానివనాలా ?’’ అన్న తల్లి మాటలు  అలజడి రేపాయి.

‘‘నిజమేనా? అసలు  సమస్య అదేనా? లోపం తనలోనే ఉందా?’’ విశాలాక్షికి బుర్రంతా గందరగోళమైంది. ఎంత ఆలోచించినా సమస్య తెగలేదు.

‘చిన్నతనం నుంచీ తను పడ్డ అవమానాలు తనకు తెలుసు. ఇప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక తప్పుడు కూత కూస్తూనే ఉంటారు. అవి పట్టించుకుని బాధ పడకుండా తను బతికెయ్యాలా? అది తనను తాను గౌరవించుకోవటమవుతుందా? తల్లి అలాగే బతుకుతోందా? ఏనాడూ ఆమె తన వృత్తి గురించి చిన్నతనంగా అనుకోలేదు. గౌరవం లేదని బాధపడలేదు. తనకెక్కడినుంచి ఒచ్చిందీ బాధ. అమ్మలాగా నిబ్బరంగా జీవితంతో తలపడలేకపోతున్నదెందుకు? అమ్మకీ తనకీ తేడా ఉండాలని ఎందుకనుకుంటోంది. అమ్మ తనను తాను గౌరవించుకుంటే తాను నలుగురి గౌరవం కోసం చూస్తోందా? అమ్మ తన జీవితాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించి దానితో తలపడుతోంది. తను అంగీకరించకుండా దీనంతటినుంచి బైటపడాలని పోట్లాటకు దిగుతోంది జీవితంలో. తనకు ఎక్కడినుంచి వచ్చింది ఈ అసంతృప్తి?.

కానీ తన ఆలోచనలే సరైనవి. అందరూ గౌరవించాలనుకోవటంలో తప్పేముంది?

తన కులమంటే గౌరవం లేదు తనకు. ఎలా వస్తుంది? ఆ వృత్తి మంచిది కాదు. తనకిష్టం లేదు. ఆ వృత్తి మంచిదని అమ్మెలా అనుకుంటోందో తనకర్థం కాదు. అమ్మకి అసలు ఆ వృత్తి మంచిదా కాదా అన్న ఆలోచనే లేదు. అది తమ కులవృత్తి. అంతే`

‘‘మంచీలేదు. చెడ్డాలేదు అంటుంది.’’

విశాలాక్షికి తల పగిలి పోతుంది. అతి ప్రయత్నం మీద ఆలోచనల్ని అణిచివేసి మండుతున్న కళ్ళను మూసుకుంది. కళ్ళనుంచి కన్నీళ్ళు కారి కాస్త చల్లబరిచాయి. ఎప్పటికో కాలే కడుపుతో, మండే గుండెతో నిద్రపోయింది విశాలాక్షి.

***

IMG (2)శారద ఎంతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఒక రోజు రాత్రి ఎనిమిది గంటవుతుండగా సన్నగా, బలహీనంగా కనపడుతున్న యువకుడు వచ్చి శారద ఇంటి తలుపు తట్టాడు. శారదే తలుపు తీసింది. అతను శారద చేతిలో చిన్న కాగితం ముక్క పెట్టి ‘‘రేపు సాయంత్రం ఆరుగంటలకు పరశువాకంలో ఈ చిరునామాకి రావాలి. కాగితం చించెయ్యండి’’.

ఆ యువకుడు ఆవేశంగా ఉన్నాడు. దూరం నుంచి నడిచి వచ్చినట్లు ఆయాస పడుతున్నాడు. ఒళ్ళంతా చెమటు.

శారద సందేహంగా ‘‘మీ పేరు –ఇంత రాత్రి వచ్చారూ – ఏం జరుగుతుంది అక్కడ ? నేనెందుకు?’’ అంటూ సరిగా అడగలేనట్లు ముక్కలు  ముక్కలుగా ప్రశ్నలు  వేసింది.

‘‘అదంతా అక్కడకు వచ్చాక తెలుస్తుంది. ఇది చాలా రహస్య సమావేశం. ఎవరితోనూ చెప్పకండి. ఆ కాగితం చించెయ్యండి. జాగ్రత్త. మీరు రావటం ఎవరైనా గమనించి మీ వెనుక వస్తున్నారనుకుంటే మధ్యలో దారి మార్చి మీ స్నేహితుల ఇంటికి వెళ్ళిపొండి. పరిసరాలు  గమనిస్తూ రండి’’.

శారదకిప్పుడు ఏ సందేహమూ లేదు. అతన్ని చూసి చిరునవ్వుతో  ‘‘మీరు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళి రండి’’ అని తలుపు వేసేసింది.

మర్నాడు పగంతా కాలేజీలో ఆస్పత్రిలో ఎలా గడిచిందో శారదకు తెలియదు.

సాయంత్రం సన్నని ఖద్దరు చీర కట్టుకుని తయారై తల్లి దగ్గరకు వెళ్ళింది.

సుబ్బమ్మ శారద ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ‘‘ఎక్కడికెళ్తున్నావు, ఈ వేళప్పుడేమిటి? వచ్చేసరికి ఎంత సమయం పడుతుంది’’ ఇలాంటి ప్రశ్నలు అడగదు. కూతురి మీద విపరీతమైన నమ్మకం. పిచ్చి ప్రేమ. తన కూతురి వంటి వాళ్ళు ఇంకొకరుండబోరని అనుకుంటుంది.

శారద ఈ రోజు తల్లితో వచ్చేసరికి ఆలస్యమవుతుందని, తన కోసం ఎదురు చూడకుండా నిద్రపొమ్మనీ చెప్పింది.

‘‘అలాగే – ఇవాళ ఏదో మీటింగున్నట్టుంది. రేపు నాకు ఆ విశేషాలన్నీ చెప్పాలి’’ అంది కూతురితో.

‘‘నే చెప్పక పోయినా నేను ఎక్కడికి ఏ పనిమీద వెళ్తున్నానో నీకెలా తెలుస్తుందమ్మా’’ అనడిగింది శారద.

‘‘నీ ముఖం చూస్తేనే నాకంతా తెలుస్తుందే చిట్టితల్లీ. నా ప్రాణాన్నీ నీ మీదే కదా. నా ప్రాణం సంగతి నాకు తెలియకుండా  ఎట్లా ఉంటుంది?’’.

మొదటిసారి శారదకు తల్లి ప్రేమను చూస్తే భయమేసింది. తానేవేవో పనులు  చెయ్యాలనుకుంటోంది. అమ్మ వాటన్నిటినీ ఆమోదించి తనతో వస్తుందా? రాకపోతే అమ్మకోసం తను ఆగగలదా? ఆగకపోతే అమ్మ ఏమవుతుంది? రెండు నిమిషాల పాటు ఆ ఆలోచన కంగారు పెడితే అలాగే ఆగి, తర్వాత ఈ పిచ్చి ఆలోచనతో ఇప్పుడే ఆగేలా ఉన్నానని నవ్వుకుంటూ బైటికి నడిచింది.

పరశువాకం శారదకు బాగానే తెలుసు. వడిమేలు కోసం వెళ్ళేది. కానీ ఈ చిరునామా అంత తేలికగా దొరకలేదు. ఆ ప్రాంతపు మురికి వాడు తెలుసు గానీ ఇది మరీ లోపలికి ఉంది.

ఆ పరిసరాలు ఎప్పుడూ శారద మనసుని కుంగదీస్తాయి.

వాటిని, అక్కడి మనుషులనూ అంతా పరిశుభ్రంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేయగలిగితే?

కమ్యూనిజంలో అది సాధ్యం. కమ్యూనిస్టులే అలా చేయగలుగుతారు అనుకుంటు గుర్తు వెతుకుతూ, సందులు తిరుగుతూ ఆ ఇల్లు చేరుకుంది. ఆ గది కాస్త విశాలంగానే ఉంది. పాతికమంది దాకా ఉన్నారు. శారద తప్ప అందరూ మగవాళ్ళే. ఆశ్చర్యంగా సుదర్శనం, మూర్తీ ఇద్దరూ లేరు. ఇద్దరు ముగ్గురు విద్యార్థులు తప్ప శారదకు తెలిసిన వాళ్ళు లేరు.

అందరూ శారదను ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూశారు. వడిమేలు శారద దగ్గరకు వచ్చి పక్కన కూచుని ఒక వ్యక్తిని చూపించి ‘‘సోవియట్‌ రష్యా నుంచి వచ్చిన కామ్రేడ్‌ అతనే’’ అన్నాడు.

అతను శారద వంక చూసి స్నేహంగా నవ్వాడు. శారద అప్రయత్నంగా నవ్వింది.’’ ఈయనకు మారు పేర్లు చాలా ఉన్నాయి. అసలు పేరు అమీర్‌ హైదరాలి ఖాన్‌. ఎన్నో దేశాలు తిరిగాడు. రష్యాలో అనేక సంవత్సరాలున్నాడు. భారతదేశంలో -ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టుపార్టీ నిర్మించాలని వచ్చాడు’’ వడిమేలు క్లుప్తంగా ఆయన పరిచయం చేశాడు.

‘‘ఈరోజు నా పేరు శంకరం’’ అంటూ అమీర్‌ హైదరాలి ఖాన్‌ చాలాసేపు మాట్లాడాడు. ముఖ్యంగా వర్గ సిద్ధాంతం గురించీ, వర్గాలనూ, వర్గ ప్రయోజనానూ కాపాడే రాజ్యం గురించి మార్క్సు, ఏంగెల్స్‌, లెనిన్‌లు  ఏం చెప్పారో దాని సారాంశాన్ని చెప్పాడు. శారద ఆయన చెప్పిన వాక్యాలన్నీ శిలా శాసనంలా మనసులో చెక్కుకుంది. పార్టీ నిర్మాణం గురించి, పాటించాల్సిన క్రమశిక్షణ గురించి, రహస్యంగా కార్యక్రమాలు నడపాల్సిన తీరు గురించీ ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు.

‘‘మనం కాంగ్రెస్‌లోనే ఉండాలి. కాంగ్రెస్‌లోని అతివాదులతో, సోషలిస్టు భావాలున్న వాళ్ళతో కలిసి పని చెయ్యాలి. ఆ పని చేస్తూనే ప్రజలలో కమ్యూనిస్టు భావాలు వ్యాపింప చేయాలి. ఈ పని పరమ రహస్యంగా జరగాలి. భావాలు ప్రజలోకి తీసికెళ్ళాలి గానీ మనం వీలైనంతవరకూ రహస్యంగానే ఉండాలి’’ అంటూ కొన్ని సూచనలు చేశాడాయన. ఆయన కోసం అప్పటికే పోలీసులు వెతుకుతున్నారు. పట్టుబడితే చంపుతారనే భయం ఉంది.

శారదకు ఎంతో బాధ్యత వచ్చి మీదపడినట్లయింది.

కమ్యూనిస్టు సాహిత్యం – మార్క్సు, ఎంగెల్స్‌, లెనిన్‌ రచనలను సంపాదించి చదవటం అత్యవసరమని – అవి చదివి చర్చించుకోవాలని అనుకున్నారు. త్వరలో భగత్‌సింగ్‌ని ఉరితీసి సంవత్సరం అవుతుందనీ, ఆ రోజు ఏదో ఒక పని చేసి ప్రజలలో సంచనం తెచ్చి, భగత్‌సింగ్‌ ఆశయాలను వారి హృదయాకు హత్తుకునేలా చేయాలని అన్నారు వడిమేలు, అమీర్‌.

‘‘దానికింకా నాలుగు నెలల సమయముందిగా’’ అన్నది శారద.

‘‘మనం రహస్యంగా పని చెయ్యాలి గనుక అది తక్కువ సమయమే. మనం బహిరంగంగా సభలు పెట్టి మాట్లాడలేం. కానీ మన ఆలోచనలను, మన భిన్న స్వరం ప్రజకు వినిపించాలి. అది తేలిక కాదు.’’

‘‘ఒక పత్రిక భగత్‌సింగ్‌ ఆశయాలు వివరిస్తూ తెద్దాం’’ శారద వడిమేలుతో అంది.

‘‘ఇక్కడ అచ్చేస్తే పోలీసుకు తెలుస్తుంది. పత్రిక అమ్ముతుంటే వారిని పోలీసులు పట్టుకోవచ్చు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచిద్దాం’’ హైదర్‌ఖాన్‌ మాటతో అందరూ అంగీకరించారు.

రాత్రి తొమ్మిది గంటలవుతుండగా సమావేశం ముగిసిందన్నారు. ఒక్కొక్కరుగా పది పదిహేను నిమిషాల వ్యవధానంలో బైటికి వెళ్ళాలనుకున్నారు. శారదను ముందుగా పంపించారు.

శారద ఇంటికి వచ్చేసరికి పది గంటలయింది.

‘‘ఇంకా ఆలస్యమవుతుందనుకున్నా. త్వరగానే వచ్చావే. ఏం మీటింగమ్మా’’ అప్పుడే పడుకోబోతున్న సుబ్బమ్మ లేచి వచ్చింది.

‘‘తల్లితో కూడా చెప్పకూడని రహస్య సమావేశం’’ మనసులో అనుకుంది శారద.

‘‘ఏదో విద్యార్థుల మీటింగ్‌లేమ్మా. ఉద్యమమంతా చల్లారింది గదా. మళ్ళీ వేడెక్కాంటే ఏం చెయ్యాలా అని మాట్లాడుకున్నాం’’.

‘‘ఆ గాంధీ గారు ఏం చెయ్యమంటే అది చేస్తారు. దానికి మీ ఆలోచనేమిటి? మీరు చెప్పింది ఆయన ఒప్పుకుని చేస్తాడా?’’

‘‘ఆయనకి ఎన్నో పనులమ్మా. ఇక్కడ మనం ఒక్కొక్కరం ఏం చెయ్యాలో పిలిచి చెప్తారా? పెద్ద ఉద్యమమైతే ఆయన అందరికీ పిలుపిస్తాడు. మళ్ళీ పెద్ద సత్యాగ్రహం చేసే లోపల మనం ఊరికే కూర్చోలేం కదా’’.

‘‘ఊరికే ఎక్కడ కూర్చుంటున్నారు. దుర్గ కాకినాడలో సమావేశాలు జరిపి అరెస్టయిందిగా ` మధుర జైల్లో ఉందిట. ఆ మీనాక్షి అమ్మవారే కాపాడాలి.’’

‘‘శారదకు దుర్గను తల్చుకుంటే బాధనిపించింది. సత్యాగ్రహపు రోజుల్లో అందరితో కలిసి జైలుకెళ్ళటం వేరు. ఇప్పుడు తనొక్కతే వెళ్ళటం వేరు. అప్పుడు జైలంతా సత్యాగ్రహం స్నేహితులు. ఇప్పుడు ఒంటరిగా మామూలు దొంగలతో, ఖూనీ కోర్లతో – ఎలా ఉందో ? దుర్గకు తను కమ్యూనిస్టునని తెలిస్తే ఏమంటుందో ? కానీ చెప్పకూడదు. అన్నపూర్ణకూ చెప్పకూడదు. మూర్తికి మటుకు చెప్పాలి. చెప్పటమేంటి మూర్తిని పార్టీలో చేర్పించాలి. ఎందుకు? తనకెందుకు మూర్తి విషయం? తనకు కాకపోతే మరెవరికి? మూర్తి మంచి స్నేహితుడు. స్నేహితుల గురించి ఆలోచించటం తప్పెలా అవుతుంది? అసలీ తప్పు అనే ఆలోచనే తన మనసులోకి రాకూడదు. ఒక మనిషి మీద ప్రేమ, స్నేహం కలిగి మనసులో ఆనందం కలుగుతుంటే అది తప్పవటమేమిటి?’

భోజనం ముగించి తల్లి హెచ్చరికతో నిద్ర నటిస్తూ రాత్రంతా మేలుకుని ఉంది.

కమ్యూనిస్టు పార్టీ పనులు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యమైన పని, విద్యార్థులకు, కార్మికులకు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు వివరించటమే. గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాటిల్లో మాట్లాడుతూ, చదువుతూ, చర్చిస్తూ –

ఇంకోవైపు కాంగ్రెస్‌ సోషలిస్టుగా కాంగ్రెస్‌ కార్యక్రమాలు కొన్నింటిలో పాల్గొనటం, ఆ మీటింగు ఏర్పాటు చేయటం.

కమ్యూనిస్టుపార్టీ సమావేశాలు అతి రహస్యంగా నిర్వహించాలి. అది ఎక్కడ ఎప్పుడు ఎంత రహస్యంగా నిర్వహించాలనేది నిర్ణయించటానికే ఎక్కువ సమయం పట్టేది. పత్రిక తీసుకురావటం మరింత కష్టంగా ఉండేది. అన్ని కష్టాలు పడుతూనే భగత్‌సింగ్‌ వర్థంతికి కరపత్రాలు ముద్రించారు. ఆ కరపత్రాలు చేతులో పట్టుకుని భగత్‌సింగ్‌ తనే అయినట్లు గర్వపడుతూ స్టేషన్‌లో, బీచిలో పంచింది శారద. ఆ కరపత్రం ఎలాంటిది? సలసలా రక్తాన్ని మరిగించే కరపత్రం. బ్రిటీష్‌ పాలాకుల  మీద ద్వేషాన్ని బుసబుస పొంగించే కరపత్రం. భగత్‌సింగ్‌ జీవించి ఉంటే తప్పక కమ్యూనిస్టు అయ్యేవాడు అనుకుంది శారద.

ఒకవైపు పరీక్షలు  తరుముకు వస్తున్నాయి. ఆఖరి సంవత్సరపు పరీక్షలు. ఈ పరిక్షయిన తర్వాత తండ్రి కోరిక ప్రకారం ఇంగ్లాండ్‌ వెళ్ళాలి. అది గుర్తొస్తే శారదకు నీరసం ఒస్తోంది.

పార్టీ పనులు, జాతీయోద్యమం, ఇక్కడి స్నేహితులు , తల్లి – అంతటినీ, అందరినీ ఒదిలి ఇంగ్లండ్‌ వెళ్ళాలంటే అసలు  మనసొప్పటం లేదు.

కానీ తండ్రి కోరిక. తన చిన్నతనంలో తండ్రితో రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ అదే చెప్పింది. చివరి రోజుల్లో దగ్గరై తాతయ్యా అనిపించుకున్న వీరేశలింగం పంతులు గారూ అదే చెప్పారు.

ఏం చెయ్యాలి? పరీక్షలు, అప్రెంటిస్‌షిప్‌ అయ్యేసరికి దాదాపు సంవత్సరం పడుతుంది – అప్పుడు ఆలోచించొచ్చులే అని పక్కకు పెట్టేసింది. దేనినైనా మనసులో పెట్టుకుని కుమలటం శారద తత్త్వం కాదు. నిర్ణయం తీసుకుందా అందులో మనసు నిమగ్నం చేస్తుంది.

IMG (2)

కానీ ఇంగ్లండ్‌ ప్రయాణం అంత తేలికైంది కాదు. కేవలం నిర్ణయంతో జరిగేదీ కాదు. డబ్బుతో కూడిన పని. శారదకు తన కుటుంబపు ఆర్థిక స్థితి గురించి అంతగా తెలియదు. సుబ్బమ్మ, తన అన్నదమ్ములతో రామారావుగారి వైపు బంధువులతో కలిసి ఆ విషయాలు చూస్తోంది.  పొలాల మీద వచ్చే ఆదాయం తగ్గిపోతోందని, ఆర్థిక కాటకం వల్ల  రైతులు చాలా దరిద్రంలో ఉన్నారనీ, అప్పు చెయ్యక తప్పటం లేదనీ అపుడపుడు మేనమామ తల్లితో చెబుతుండటం వినేది. ఆర్థిక కాటకం గురించి శారద సంఘపు సమావేశాల్లో చర్చించేది కూడా –  విద్యార్థి మిత్రులందరూ దాని బారిన పడినవారే – ఊళ్ళనుంచి తల్లిదండ్రులు డబ్బు పంపలేకపోతున్నారు. ఉద్యోగాలు దొరకటం లేదు. అంతకు ముందు మూడు పూటలా తినే వాళ్ళు ఇపుడు రెండు పూటలే తింటున్నారు. ఒక్కోసారి సగం తిండితో సరిపెట్టుకుంటున్నారు.

శారద డబ్బు విషయాలు తల్లితో మాట్లాడబోతే ఆమె ఊరుకునేది కాదు.

‘‘అవన్నీ మేం చూసుకుంటాంగా -నువ్వు చదువుకో. నీ చదువు పూర్తయితే తర్వాత అన్నీ నువ్వే చూసుకుందువుగాని’’ అనేది.

శారద అంతటితో ఆ సంగతి వదిలేసేది.

ఇంటినిండా ఎప్పుడూ బంధువు, స్నేహితులు ఉంటూనే ఉంటారు. ఖర్చుకి మితిలేదు. తండ్రి ఉన్నప్పటి దర్జా లేదు గానీ ఇది తక్కువైంది అనుకోటానికీ లేదు. శారద చేతిలో డబ్బు నిలవదని సుబ్బమ్మగారి అభిప్రాయం. ఎవరైనా అవసరం అంటే చాలు అది తీర్చేదాకా శారద అల్లాడిపోయేది. సుబ్బమ్మగారికి అది కొంచెం కష్టంగా ఉండేది. శారద తనకంటూ పెట్టుకునే ఖర్చేమీ ఉండదు. నూలు చీరొ, ఖద్దరు చీరొ కడుతుంది. నగలేమీ పెట్టుకోదు. కమ్యూనిస్టు సిద్ధాంతాలూ, గాంధీగారి ప్రభావమూ ఆమెను మరింత నిరాడంబరంగా తీర్చిదిద్దాయి. కానీ తన చుట్టూ  ఉన్నవారి అవసరాలు చూడటం, అవి తీర్చటం తన బాధ్యత అనుకుంటుంది. ఈ స్వభావం ఆమెకు తండ్రి నుంచి వచ్చిందని సుబ్బమ్మ అంటుంది.

‘‘ఈ కాటకం ఇప్పట్లో పోయేలా లేదు. ఇంగ్లండ్‌ వెళ్ళి చదవటం జరిగే పనేనా’’ అందిసుబ్బమ్మ.

‘‘జరక్కపోతే మరీ మంచిది మానేద్దాం’’ అంది శారద ఉత్సాహంగా.

‘‘ఎంత కష్టమైనా పడాల్సిందే. ఇంగ్లండ్‌ వెళ్ళాల్సిందే. నేను బతుకుతున్నదే అందుకు’’ అంది సుబ్బమ్మ.

‘‘డబ్బు లేకుండా ఎలాగమ్మా’’

‘‘డబ్బు ఎలాగోలా పుట్టిస్తాను. నేను చూసుకుంటాను. ఇవాళ్టి నుంచీ నువ్వు అనవసరపు ఖర్చు తగ్గించు. నే చెప్పినట్టు విను’’ కాస్త గట్టిగా అంది.

‘‘అనవసరపు ఖర్చు నేనేం పెడుతున్నానమ్మా’’ తల్లి నుంచి ఎన్నడూ చిన్నమాట అనిపించుకోవటం అలవాటులేని శారదకు కళ్ళలో నీళ్లు తిరిగాయి.

‘‘నిన్ను ఎవరైనా అవసరంలో ఉన్నామని అడగటమే పాపం కదా – ఇవ్వకుండా ఊరుకుంటావా? అది కాస్త తగ్గించు, అంటున్నా. అంతకంటే ఏమీ లేదు’’.

‘‘ఎవరైనా పది రూపాయలు కావాని అడిగితే నేను ఇంగ్లండ్‌ వెళ్ళాలి. అంచేత ఇవ్వలేను అనమంటావా?’’ దు:ఖాన్ని మింగేసి నవ్వబోయింది శారద.

‘‘నువ్వేమంటావో నాకనవసరం – ఆ ఖర్చుకు నన్నింక డబ్బు అడక్కు.’’ శారద కోపంగా అక్కడినుంచి వెళ్ళింది గానీ తల్లి మాటల్లో అబద్ధం లేదు. చాలా ఖర్చు తగ్గిస్తే గానీ ప్రయాణం కుదరదు.

శారదతో పాటు చదువుతున్న సరళను, మార్తాను మిషనరీ వాళ్ళే పంపుతున్నారు.

శారద పరీక్షలు  పూర్తయ్యాయి. మిగిలిన విద్యార్థులంతా ఇళ్ళకు వెళ్ళారు. శారద తన పనుల్లో తానుంటూనే, కమ్యూనిస్టు సాహిత్యంతో పాటు ఇతర సాహిత్యం చదవటం, ఇంగ్లండ్‌ వెళ్ళటానికి కావసిన ఏర్పాట్లు చేసుకోవటంతో తీరిక లేకుండా ఉంది.

*

గమనమే గమ్యం-12

 

olgaకాలం నెమ్మదిగా నడుస్తోందనిపించింది శారదకు. దేశం కూడా నెమ్మదించింది. అక్కడక్కడా ప్రదర్శనలూ , జండా ఎగరెయ్యటాలు  తప్ప పెద్దగా జరుగుతున్నదేమీ లేదు.

అన్నపూర్ణ, దుర్గ జైలు నుంచి విడుదలయ్యారు. అన్నపూర్ణ గుంటూరు చేరింది. దుర్గ కాకినాడ చేరింది. రామక్రిష్ణ జైలు నుంచి విడుదలై మళ్ళీ చదువు మొదలుపెట్టాడు. సత్యాగ్రహం మీద ఆశలు  పెట్టుకున్న వారందరూ నిరాశలో పడ్డారు. అన్నపూర్ణ కూతుర్ని కన్నది. స్వరాజ్యం అని పేరు పెట్టుకుంది.

సుదర్శనం, మూర్తీ, శారదా తరచు కలుస్తున్నారు.

మూర్తి తన ధోరణి ఏ మాత్రం మార్చుకోలేదు. శారద మీద అదే చనువు అదే అధికారం. మూర్తితో ఆ విషయం స్పష్టంగా మాట్లాడాలనుకుంటూనే జాప్యం చేస్తోంది శారద.

ఏదో బలహీనత తనలోనూ ఉందా అనుకుంటోంది.

కానీ శారద తనను కలుసుకోకుండా దూరంగా ఉంచుతోందని మూర్తికి అర్థమైంది. ఇంటికి వెళితే ఆహ్వానిస్తూ నవ్వుతుంది గానీ ఆ నవ్వులో జీవం ఉండదు. యాంత్రికంగా నవ్వుతున్నట్లు తెలుస్తూనే ఉంది. మిగిలిన యువకులందరూ మామూలుగానే ఉంటున్నారు  గానీ రామక్రిష్ణయ్య ముభావంగా ఉంటున్నాడు. మూర్తికి ఈ మార్పు ఎందువల్ల  వచ్చిందో అర్థమయింది. దాని గురించి శారదతో మాట్లాడటం తన బాధ్యత అనుకున్నాడు. కానీ శారదతో ఏకాంతం దొరకటం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు శారదనంటిపెట్టుకుని ఉంటున్నారు .

ఒక ఆదివారం నాడు శారద తమ ఇంట అందరికీ విందు చేయబోతున్నానని  ప్రకటించింది. కారణం అందరికీ తెలిసిందే. రామక్రిష్ణయ్య మద్రాసు ఒదిలి బెంగుళూరు వెళ్తున్నాడు. అక్కడ ఇంటర్‌ పూర్తి చెయ్యాలని సంకల్పం . రామక్రిష్ణయ్య , శారద మధ్య అనుబంధం అందిరికీ తెలుసు. అక్కా అని అతను పిలిచే  పిలుపు లో  రక్తసంబంధాన్ని మించిన సోదర భావం పలుకుతుందేది . ‘రా మూ’ ‘రా మయ్యా’ అంటూ శారద తన అభిమానాన్ని కురిపించేది. ఇద్దరూ కలిసి చదివే పుస్తకాలు , చేసే  చర్చలు , వాదోపవాదాలు  వారిని మరింత దగ్గర చేస్తాయి. రామక్రిష్ణయ్య ఒకోసారి  చాల నిరుత్సాహ పడేవాడు. ఈ దేశం ఎప్పటికి స్వతంత్రమయ్యేను? ఏది మార్గం? నేనేం చెయ్యాలి? రైతు, కూలీలు , పేదరికం, అంటరానితనం   –  ఒక్కసారి వీటన్నిటితో తలపడటం ఎట్లా? అసలు  గమ్యమేమిటి? స్వతంత్ర సాధనేనా  ? ఈ ప్రశ్నలను మధించి, మధించి, విసిగి వేసారి పోయేవాడు.

‘‘ఇక నా వల్ల కాదక్కా’’ అంటూ శారద దగ్గరకు వచ్చేవాడు. శారదకు నిరుత్సాహం  అంటే తెలియదు. సమస్యలు  వచ్చిన కొద్దీ సముద్రంలో తరంగాలు  వస్తుంటే చూసినంత ఆనందం. రామక్రిష్ణయ్య ఏది గమ్యం అని తల పట్టుకుంటే `

‘‘ప్రతి అడుగూ గమ్యమే. అమ్మయ్యా గమ్యం చేరామని కూర్చుందామని ఆశపడుతున్నావా  ? లేదు. నువ్వు చేరిన తర్వాత చూస్తె  ముందు మరో గొప్ప ఆశయం కనపడుతుంది. ఆయాసం తీర్చుకునే వ్యవధి కూడా ఇవ్వదు. వెంటనే అటువైపు అడుగు వేస్తాం మనం. వెయ్యకపోతే ఇక మన జీవితానికి అర్థమేముంది? నడుస్తూనే ఉంటాం జీవితం చాలదు. తరువాత వాళ్ళు  అందుకుంటారు – ఆ నడక అలా సాగుతూనే ఉంటుంది’’.

ఒకోసారి రామక్రిష్ణయ్య  శారద మాటల్ని కాదనేవాడు.

‘‘గమ్యం ఉండాలి. లేకపోతే నడవటానికి  ప్రేరణ  ఎలా వస్తుంది?’’

‘‘గమ్యం స్థిరం కాదని చెప్తున్నాను గానీ అసలు లేదనటం లేదు. మనం ఒకచోట గమ్యం సాధించామని ఆగకూడదని అంటున్నాను. ఆగామా – ఇక నిలవనీటి చందమే –  నాలుగు దిక్కులూ  ప్రవహించాలి మనం’’.

రామక్రిష్ణయ్య ముఖంలో వెలుగు కనిపించేంత వరకూ శారద మాట్లాడుతూనే ఉండేది.

రామక్రిష్ణయ్య బెంగుళూరు వెళ్తున్నాడంటే శారదకు బెంగగా ఉంది. దానిని పోగొట్టుకోటానికి ఈ విందు ఏర్పాటు చేసింది. అందరితో పాటు మూర్తికీ పిలుపు చేరింది.

రామక్రిష్ణయ్య కు  భోజనంలో కూడా ఆడంబరం గిట్టదు. అందువల్ల  సుబ్బమ్మ ప్రత్యేకం ఏమీ వండలేదు. కానీ ఆమె ఏం వండిన , వడ్డించిన , అది అమృతం తో  సమానమే ఆ యువకులకి.

పదిమంది స్నేహ బృందం  వెళ్ళి రామక్రిష్ణయ్య ను రైలెక్కించింది. రైలు  కదిలిపోతుంటే శారద ముఖంలో ఒక మబ్బుతెరలా దిగులు  వచ్చి వచ్చినంత త్వరగానూ వెళ్ళిపోయింది.

‘‘మన రామయ్య మరింత జ్ఞానం సంపాదించుకొస్తాడు. పదండి  పోదాం’’ అంటూ వెనుదిరిగింది.

స్నేహితులు  ఎవరి నెలవుకు వాళ్ళు వెళ్తామని తలోదారీ పట్టారు. శారద ట్రాము కోసం చూస్తూ నిలబడి  ఉంది. పది గజాలు  నడిచిన మూర్తి మళ్ళీ వెనక్కు వచ్చి శారద పక్కన నిలబడ్డాడు. ఏమిటన్నట్టు చూసింది శారద.

‘‘మనం కొంచెం మాట్లాడుకోవాలి. నా వైపు నుంచి నేను చెప్పుకోవల్సింది ఉంది’’.

‘‘నువ్వేం చెప్తావో నాకు  తెలుసు మూర్తీ’’

‘‘తెలిసినది మాత్రమే సర్వం అని నువ్వు కూడా అనుకుంటే ఎట్లా?’’

‘‘సర్వం అనుకోవటం లేదు. ఈ విషయంలో మరింత తెలుసుకోవాలని  మాత్రం అనుకోవటం లేదు.’’ అంది శారద నిర్లిప్తంగా.

‘‘కానీ చెప్పవసిన బాధ్యత  నాకుంది. చెప్పనంతవరకూ నాకు ఊపిరాడనట్టుగా ఉంటుంది. దయ చేసి ఒక్క గంట ` ’’ శారద మూర్తి ముఖంలోకి చూసింది. అక్కడ బాధ, నిజాయితీ తప్ప మరేమీ కనిపించలేదు.

olga title‘‘సరే – బీచ్‌కి పోదాం పద’’

మైలాపూర్‌ బీచ్‌లో సముద్రానికి కాస్త దూరంగా కూర్చున్నారిద్దరూ. సముద్రపు హోరు వాళ్ళ మనసుల్లో రేగుతున్న హోరు ముందు చిన్నదయింది. మూర్తి మాటల్ని పోగొట్టుకున్నట్టు ఆ సముద్రపు ఒడ్డున వాటిని వెతుకుతున్నట్టు చూస్తున్నాడు.

‘‘మూర్తీ – నీకు పెళ్ళయిందనే విషయం నాకు తెలిసింది. అదే నువ్వు నాకు చెప్పాలనుకుంటున్న విషయమని కూడా నాకు తెలుసు’’. శారదే మూర్తిని ఇబ్బంది నుంచి బైట పడేసింది.

‘‘కానీ శారదా – ఆ ఉదయం ఈ సముద్రపొడ్డున నిన్ను నేను చూసినపుడు నాకు పెళ్ళయిందనే విషయం నాకు గుర్తు లేదు. ఆ తరువాత  ఇంటికి వెళ్ళి ఆమెనూ, నా కొడుకూనూ చూసినా  కూడా నాకు పెళ్ళయిందన్న  విషయం నాకు గుర్తు లేదు. మర్నాడు , ఆ తరువాత  చాలా రోజులు  గుర్తురాలేదు. నేనొక ఉన్మాద  అవస్థలో పడిపోయాను. చివరికి తెలివొచ్చింది. నా  భార్య ఒక  రాత్రి గుర్తు చేసింది. నేను బిగ్గరగా ఏడ్చాను. ఆమె భయపడింది . ఆ దు:ఖం తగ్గాక ఆలోచించాను. నాకు పెళ్ళయితే ఏమైంది. నేను పెళ్ళి చేసుకున్న స్త్రీతో  ప్రేమలో పడలేదు. నాకు ఊహ తెలియక ముందే, స్త్రీ అంటే ఏమిటో,  ప్రేమంటే ఏమిటో, పెళ్ళంటే ఏమిటో తెలియకముందే  నా మీద ఆ బాధ్యత పడింది . బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నాను . ఇప్పుడు నాకు   ప్రేమ  ఎదురైంది.  ప్రేమకూ పెళ్ళికి మధ్య సంబంధం ఎలాంటిదో, ఎంత వాంఛనీయమో, అవాంఛనీయమో ఆలోచిస్తుంటే మతిపోతోంది. రెండేళ్ళ క్రితం చలం  గారి శశిరేఖ నవల  చదివి ‘‘ ప్రేమ ఉంటే ఇంక పెళ్ళెందుకూ’’ అన్న శశిరేఖ మాటను పిచ్చి మాటలుగా కొట్టేశాను. అర్థం కాలేదు నాకవి. ఇవాళ నాకు  అర్థమవుతున్నాయి –  ప్రేమ లేని పెళ్ళికి అర్థం లేదు.  ప్రేమ ఉంటే పెళ్ళితో అవసరం లేదు. ఇది నాకు తెలిసొచ్చింది గానీ సంఘంలో పెళ్ళికున్న విలువ  ప్రేమకు లేదు. ఇప్పుడు నేను నిన్ను  ప్రేమిస్తున్నాను  అని చెబితే ఆ మాటకు నువ్వు విలువ  ఇవ్వవు’’.

‘‘ఇస్తాను’’ గంభీరంగా అన్న శారద మాటకు ఆశ్చర్యపోయి చూశాడు మూర్తి. సముద్రం స్తంభించినట్లనిపించింది ఒక్క క్షణం.

‘‘మూర్తీ. మనం ఎప్పుడూ మనసు విప్పి ఒకరి మీద ఒకరికున్న  ప్రేమను చెప్పుకోలేదు.  ప్రేమ కలిగిన మాట వాస్తవం. దానిని నిరాకరించి ఆత్మవంచన చేసుకోవటం ఎందుకు? నీకు పెళ్ళయిందని తెలిసి నేను తల్లడిల్లిపోయిన మాటా వాస్తవమే. నీలాగే నేనూ  ప్రేమ, పెళ్ళి, వీటి పరస్పర సంబంధం, స్త్రీ పురుష సంబంధాలూ  మారుతూ వచ్చిన తీరూ, వీటి గురించి ఆలోచిస్తున్నాను. చదువుతున్నాను. సమాధానాలు  దొరుకుతున్నట్లే ఉంటున్నాయి గానీ ఆచరించే మానసిక స్తిమితం రావటం లేదు. నా ప్రేమ  నిజమై నీది విలువలేనిదవుతుందా? కానీ విలువ  వల్ల ఉన్న పరిస్థితి మారదు. మనం స్నేహితుల్లా ఉందాం.  ప్రేమ బంధం, భార్యాభర్తల  బంధం, పెళ్ళి తంతు వీటి గురించి మర్చిపోదాం. అక్కడ నీ జీవితం నిర్ణయమైపోయింది అంతే. అది మారదు. మార్చాలనుకోకు’’.

శారద మాటకు ఏం సమాధానం చెప్పాలో మూర్తికి తెలియదు.. ‘‘థాంక్స్‌ శారదా ` నన్ను స్నేహితుడుగా అంగీకరించావు. అది చాలు .  నన్ను దూరం చేస్తావేమో, అని భయపడ్డాను’’.

‘‘ఎందుకు దూరం చేస్తాను మూర్తీ. నువ్వేం నేరం చేశావని? నన్ను  ప్రేమించడం నేరం అనుకోమంటావా ? మరి నేనూ నిన్ను  ప్రేమించాను. నా ప్రేమ  నేరం కాకుండా నీ  ప్రేమ నేరమవుతుందా? కేవలం నీకు పెళ్ళయినందువల్ల  అది నేరమవుతుందా? –  పెళ్ళి ఒక సామాజిక బంధం. వ్యక్తి స్వేచ్ఛ అంటూ ఒకటుందిగా –  ఆ రెండింటికీ యుద్ధం జరుగుతుంది ఈ కాలంలో. బహుశా అన్ని కాలాల్లోనూ జరుగుతుందేమో మనకిప్పుడు తెలిసి వచ్చింది. మనం ఆ యుద్ధ రంగంలో ఉన్నాం . యుద్ధం చెయ్యాలని లేదు. ఉంది.  ప్రేమ అనే ఆయుధం ఉంది. చూద్దాం. ఆ ఆయుధానికి పదును పెట్టాల్సిన అవసరం వస్తుందేమో.’’

శారద మాటను మంత్రముగ్ధుడిలా వింటున్నాడు మూర్తి. చీకట్లు ముసురుకుంటున్నాయి. ఇద్దరికీ అక్కడనించి కదలాలని లేదు. సముద్రాన్ని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. తమ అంతరంగాలను చూసుకుంటున్నట్టే ఉంది. విరుచుకుపడే అలలు. అగాధమైన లోతు. అవతలి తీరం కనపడనంత దూరం. వెన్నెల తరకు, చీకటి నీడలు. అంతులేని సౌందర్యం. భయం గొలిపే  అద్భుతం.

లోకంతో పనిలేనట్టు, లోకమేమైనా  తనకేం పట్టనట్టూ ముందుకు విరుచుకు పడుతూ, భళ్ళున బద్దలై వెనక్కు తోసుకు పోతూ ఆ సముద్రం. ఆ సముద్రం తామే అన్నంత వివశంగా వాళ్ళిద్దరూ.

***

చదువు సాగుతోంది. ఉద్యమం చల్లబడినట్లుంది. యువమిత్రులు  తమ చదువుల్లో, పనుల్లో పడిపోయారు. ఒకటి రెండేళ్ళ కిందటి పరిస్థితికీ ఇప్పటికీ పోలికే లేదు. శారద సోషలిస్టు సాహిత్యం సంపాదించి చదువుతోంది. ఆ పుస్తకాలు  కలలను అందిస్తున్నాయి. ఆ కలలు నిజమవుతాయా? ఏదో నిరాశ. సందిగ్ధత.

ఈ నిరాశనుంచి, సందిగ్దత నుంచీ బైటపడటానికి శారదకు ఈ మధ్య వడిమేలు ఆలంబన అయ్యాడు.

వడిమేలు  నడిపే పత్రిక శారద తప్పనిసరిగా చదివేది. ఒకసారి సుదర్శనం తెచ్చిచ్చాడు. అంతే. శారద వడిమేలు  పత్రిక అచ్చయ్యే చోటికి వెతుక్కుంటూ వెళ్ళింది.

మద్రాసు నగరంలో ఇటువంటి ప్రదేశాలు  కూడా ఉన్నాయా అని సంపన్నులు  ఆశ్చర్యపడే మురికివాడలోని ఒక గది ముందు ఆగింది.

తలుపు ఓరగా తీసే ఉంది.

‘‘లోపలికి రావచ్చాండీ’’ అని కాస్త గట్టిగానే తమిళంలో అడిగింది. లోపల్నించి సన్నగా నల్లగా ఉన్న ఒకాయన లేచి బైటికి వచ్చాడు. ఎవరన్నట్టు చూశాడు శారద వంక.

‘‘నా పేరు శారద. డాక్టర్‌ కోర్సు చదువుతున్నాను. చాలా మంచి పత్రిక నడుపుతున్నారు. మిమ్మల్ని చూడాలని వచ్చాను’’.

ఆయన ముఖంలో ఆ ప్రశంసకు ఎలాంటి సంతోషమూ కనపడలేదు. సరిగదా కనుబొమ్మలు ముడివేసి.

‘‘పత్రిక చదవండి. నన్ను చూడటం ఎందుకు?’’ అన్నాడు.

‘మీ పత్రికకు సహాయం చెయ్యానుకుంటున్నా’’ పర్సు తీసి మూడు పదులు వడిమేకు ఇచ్చింది.

ఇప్పుడాయన ముఖంలో ముడి కాస్త వీడింది.

‘‘పత్రిక అమ్మి పెడితే ఇంకా పెద్ద సహాయం అవుతుంది’’.

‘‘తప్పకుండా అమ్ముతాను. కాపీలుంటే ఇప్పుడే ఇవ్వండి’’.

వడిమేలు  ప్రసన్నుడై ‘‘లోపలికి రామ్మా’’ అని తను నడిచాడు. లోపలికి వెళ్ళింది శారద. ఆఫీసు, ఇల్లు, ప్రెస్సు అన్నీ ఆ చిన్న గదిలోనే. పది కాపీలు  తీసి ఇచ్చాడు.

‘‘నాది బ్రాహ్మణ కులం. కానీ మీరు రాసే బ్రాహ్మణ వ్యతిరేక వ్యాసాలు బాగా నచ్చుతాయి. బ్రాహ్మణ తత్త్వం పోతేగాని దేశం బాగుపడదు’’. వడిమేలు నవ్వాడు. శారద తలమీద చేయిపెట్టి దువ్వాడు.

‘‘కమ్యూనిజం వస్తేగాని దేశం బాగుపడదు’’ అన్నాడు.

శారద ఉలిక్కిపడిరది. ఈ బలహీనుడైన వ్యక్తి కమ్యూనిస్టా?

ఆశ్చర్యంగా అడిగింది ‘‘మీరు కమ్యూనిస్టా?’’

‘‘ఏమో నాకు సరిగా తెలియదు. కానీ కమ్యూనిస్టునని చెప్పుకోవాలని ఉంది. దానికేం చెయ్యాలో తెలియదు’’.

‘‘ఏముంది? చెప్పుకోవటమే. ఈ రోజునుంచీ నేనూ కమ్యూనిస్టునని చెప్పుకుంటాను. ఇద్దరు కమ్యూనిస్టులుంటే మంచిదే గదా?’’ వడిమేలు మనసారా నవ్వాడు.

‘‘నీలాంటివాళ్ళే ఈ దేశానికి కావాలమ్మా’’ అన్నాడు.

శారద కాసేపు అక్కడ కూచుని వచ్చేసింది. ఆరోజు నుంచీ అప్పుడప్పుడూ వడిమేలుని చూడటానికి వెళ్ళేది. వట్టి చేతుల్తో ఎప్పుడూ వెళ్ళేది కాదు. ఏదో ఒకటి తినటానికి తీసుకెళ్ళేది. ఇద్దరూ కలిసి అవి తింటూ బ్రాహ్మణులను, వారి ఆచారాలనూ, బ్రిటీష్‌వాళ్ళను, వాళ్ళ దోపిడినీ తిట్టుకుంటూ కూచునేవారు. వడిమేలు పనిలో తను చేయగలిగిన చిన్న సాయమైనా చేసేది.

వడివేలంటే ఎంతో గౌరవం శారదకు. ఆ పేదరికంలో, ఆబలహీనతతో, అతి తక్కువ వనరులతో ఆయన ఎలాంటి పని చేస్తున్నాడో చూస్తే తనెంతెంత పనులు చెయ్యాలో గదా అనుకునేది.

ఎలాంటి మనుషున్నారు దేశంలో `

తను వడిమేలుని కలిసిన సంగతి సుదర్శనంతో, మూర్తితో చెప్పింది.

‘‘అక్కడికెందుకెళ్ళావు. పోలీసులు చూస్తే ప్రమాదం’’ అన్నారు ఇద్దరూ కూడబుక్కున్నట్టు.

‘‘పోనీలే, ఒక్క ప్రమాదకరమైన పనైనా చేశానని తృప్తి పడనీయండి’’ అని నవ్వేసింది శారద.

మూర్తి గురించి అతని సమక్షంలో శారదకు ఏ ఆలోచనలూ  రావు. మిగిలిన స్నేహితులతో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ ఏ రాత్రి పూటో ఒంటరిగాఉన్నపుడు మూర్తి గురించిన ఆలోచనలు చుట్టు ముట్టి అలజడి చేస్తుంటాయి. నియంత్రించబోతే శరీరం, మనసూ కూడా సహకరించవు.

ఏదో పనిమీద పరశువాకం వెళ్ళిన శారదకు వడిమేలుని చూడానిపించింది. చాలారోజులే అయింది అతనిని కలిసి. ఆలోచన వస్తే ఇక శారద ఒక్క క్షణం తటపటాయించదు. వెంటనే ఆచరణలో పెట్టేస్తుంది. ట్రాము దిగి సందుగొందులు తిరుగుతూ ఉత్సాహంగా వడిమేలు  గదిలోకి వెళ్ళింది.

ఆయన హడావుడిగా ఏదో పని చేసుకుంటున్నాడు. శారదను చూడగానే ఒక్కసారి ఆగి ముఖంనిండా నవ్వాడు. కూర్చోమని కూడా అనకుండా పత్రిక కాపీ కట్టను శారద చేతిలో పెట్టి.

‘‘ఇంక ఈ పేరుతో పత్రిక రాదు. ఇదే చివరిది’’ అన్నాడు.

శారద ఆందోళనగా ‘‘ఏమైంది. పోలీసులు వచ్చారా?’’ అని అడిగింది.

‘‘పోలీసులు కాదు. కమ్యూనిస్టులే వచ్చారు’’ అన్నాడు వడిమేలు.

‘‘కమ్యూనిస్టులా? మనిద్దరం కాక కమ్యూనిస్టులింకా ఉన్నారా?’’ తేలిగ్గా నవ్వుతూ అడిగింది శారద.

‘‘ఉన్నారు. మనలాంటి వాళ్ళు కాదు. నిజం కమ్యూనిస్టు. ఒకతను రష్యా నుంచి వచ్చాడు. త్వరలో మనలాంటి వాళ్ళందరం అతనితో కలిసికూర్చోని మాట్లాడదాం. కమ్యూనిస్టు పార్టీ పెడదాం. మేం కమ్యూనిస్టులమని చెప్పుకుందాం’’ వడిమేలు  ఆపకుండా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు.

శారదకు శరీరం మీద పులకలు  వచ్చాయి.

‘రష్యా నుంచి కమ్యూనిస్టు వచ్చాడు. తను కమ్యూనిస్టు . కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు ’ ఏదో తన్మయత్వంలో పడి తేరుకుంటూ ‘‘నాకంతా చెప్పండి. ఇదంతా ఎప్పుడు జరిగింది?’’

‘‘నాకిప్పుడు సమయం లేదు. త్వరలో సమావేశం జరుగుతుంది. అంతా తెలుస్తుంది’’.

వడిమేలు  పని తెమిలేలా లేదు. శారదను పట్టించుకునే తీరిక లేకుండా కాగితాలతో కుస్తీ పడుతున్నాడు.

శారదకు అక్కడినుంచి కదలకతప్పలేదు.

ఇంటికి వెళ్ళానిపించలేదు ఇదంతా ` ఈ ఉద్వేగానుభూతినంతా వెంటనే ఎవరితోనైనా పంచుకోకపోతే ఊపిరాడేలా లేదు. పొంగుతున్న ఉత్సాహం ఎవరితోనైనా చెప్పందే నిలవనిచ్చేలా లేదు.

మూర్తి తప్ప ఎవరూ దీనిని, తను అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోలేరు. మూర్తిని చూడాలి. ఈ సమయంలో మూర్తి ఎక్కడుంటాడు. ఇంటి దగ్గరకు వెళ్ళిచూస్తే ` ఏమవుతుంది? ఏమీ కాదు.

శారద చకచకా ముందుకి నడిచి ట్రాము ఎక్కేసింది.

ట్రాము దిగి నాలుగు ఫర్లాంగులు  నడిస్తే గాని మూర్తి ఇల్లు  రాదు.

మూర్తి ఇల్లు తలుపు  తడుతుంటే గుండె దడదడలాడిరది.

మూర్తే వచ్చి తలుపు  తీశాడు. శారదను చూసి కంగారు పడ్డాడు.

‘ఏమైంది? ఎందుకొచ్చావ్‌?’’ హడావుడిగా అడిగాడు.

‘‘రాకూడదా?’’ నవ్వింది శారద.

శారద నవ్వుచూసి స్థిమితపడి ‘‘ఎందుకు రాకూడదు? ఇంతకు ముందెప్పుడూ రాలేదుగా’’ అని లోపలికి తీసికెళ్ళాడు.

ఇల్లంతా  నిశ్శబ్ధంగా ఉంది. మనుషులున్న అలికిడే లేదు.

‘‘ఎవరూ లేరా?’’

‘‘లేరు. బంధువులింట్లో పెళ్ళయితే వెళ్ళారు. నాకు ఆ పెళ్ళిళ్ళకు వెళ్ళటం విసుగు. ఇంటికి కాపలా ఉండిపోయాను. ఉన్నందుకు చూశావా ఎంత అదృష్టం కలిసొచ్చిందో’’.

శారద గలగలా నవ్వింది.

‘‘శారదా ` నువ్వు నవ్వుతుంటే ప్రాణాలు ఇచ్చెయ్యాలనిపిస్తుంది’’

‘‘మూర్తీ ` మనిద్దరం ప్రాణాలు అర్పించాల్సిన గొప్ప విషయం ఒకటుంది’’

‘‘ఏమిటది’’ ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి.

‘‘కమ్యూనిజం. మూర్తీ ,  నేను కమ్యూనిస్టుని. నువ్వూ కమ్యూనిస్టువే. కదూ ` ’’శారద ఆనందంగా కళ్ళనీళ్ళతో అడిగింది. మూర్తి ఆశ్చర్యానికంతు లేదు.

‘‘శారదా ,కమ్యూనిస్టేమిటి ? ఇంత ఆనందంగా ఉన్నావు. ఏం జరిగింది?’’.

olga title

‘‘కమ్యూనిజం అంటే నీకు తెలియదా? దేశంలో ఆకలి, దరిద్రం, బీదా గొప్ప తేడాలు  లేకుండా చేసేస్తుంది. అందరూ సమానులే . స్వంత ఆస్తి ఉండదు. అందరూ ఒళ్ళు వొంచి పని చేస్తారు. కావలసినంత తింటారు. చదువుకుంటారు. దేనికీ లోటుండని స్వర్గం. ఆ స్వర్గాన్ని నిర్మించేవాళ్ళు కమ్యూనిస్టులు’’

‘ఇదంతా నీకెలా తెలుసు?’

‘‘ఈ మధ్యే కమ్యూనిస్టు మానిఫెస్టో చదివాను. మూర్తీ! అది చదువుతుంటే నా రక్తం ఎలా ఉప్పొంగిందనుకున్నావు. ఎలా పోటెత్తిందనుకున్నావు. శరీరమంతా తేలిపోయింది. నరాలన్నీ మీటటానికి సిద్ధంగా ఉన్న వీణ తీగల్లా అయిపోయాయి. జలపాత స్నానానుభూతి. గొప్ప సౌందర్యం నా కళ్ళముందు. దానికి రూపం లేదు. రూపం లేని సౌందర్యం, సవ్వడి లేని సంగీతం, బ్రహ్మానందమంటారే అదేదో నాకు అనుభవంలోకి వచ్చినట్లయింది. ఇప్పటికీ కమ్యూనిజాన్ని తల్చుకున్నంత మాత్రాన ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నా తొలి వలపులా ఉంది. నేను కమ్యూనిస్టుని. నేనూ కమ్యూనిజం వేరు కాదు. ఒకటే . అద్వైతం ఇదే కదూ ` ’’ .

‘‘శారదా, ఉండు. నన్ను ఊపిరి పీల్చుకోనివ్వు. ఇవాళేమైంది? ఎక్కడి నుంచి వస్తున్నావు. అది చెప్పు’’.

శారద మెల్లిగా వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నట్టుగా చెప్పింది.

‘‘ఇవాళ వడిమేలుగారి దగ్గరికెళ్ళాను. ఆయన కూడా కమ్యూనిస్టే తెలుసా? ఇవాళ ఆయనే చెప్పాడు. రష్యానుంచి కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు వచ్చాడట . మద్రాసులో మనలాంటి వాళ్ళందరం కలుస్తాం. పార్టీని నిర్మిస్తాం. మూర్తీ !మనం , మనం కమ్యూనిస్టు పార్టీని నిర్మిస్తాం. ఇది అద్భుతంగా లేదూ?’’

మూర్తి చేతులు పట్టుకు ఊపేసింది శారద.

‘‘పరమాద్భుతంగా ఉంది. శారద ! నేనూ సుదర్శనం కూడా కమ్యూనిజం గురించి మాట్లాడుకున్నాం. నువ్వు గాంధీ భక్తురాలివి గదా కమ్యూనిస్టువి కావేమో అనుకున్నా . ’’

‘‘మూర్తీ! ఇవాళ నా మనసులో ఇంకే సందేహాలు  లేవు. నేను కమ్యూనిస్టుని ` ఐఆమ్‌ ఏ కమ్యూనిస్టు’’.

సంతోషం ఆపుకోలేక గలగలా నవ్వింది శారద.

‘‘నేనూ ` నేను కూడా’’ శారదను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.

శారదకాక్షణంలో ఏ సంశయాూ, సందేహాలూ  లేవు.

‘‘మూర్తీ! ఎంత గొప్పగా ఉందీ భావన’’.

కమ్యూనిస్టు కావటమంటే ఏమిటో తెలుసా? ఒక గొప్ప సత్యాన్ని  తెలుసుకోవటం ` జ్ఞానాన్ని సంపాదించటం — బుద్ధునిలా.

మొట్టమొదటి వాక్యమే సూర్యోదయంలా అద్భుతంగా ఉంది. ఏమంటున్నారో విను! ‘ఇంతవరకూ నడచిన సమాజపు చరిత్ర అంత వర్గ పోరాటాల  చరిత్రే’. ‘‘మూర్తీ –  అంతా  తేటతెల్లమైపోవటం లేదూ? ప్రపంచమంతటినీ పట్టి చూసినట్టు లేదూ? ఆ వాక్యం చదివినప్పుడు నా ఎదుట ఒక మహా విశ్వరూప సందర్శనం జరిగినట్లు అనిపించింది.

నిజంగా — ఈ సమాజపు నగ్న స్వరూపం కూడా చూశాను కమ్యూనిస్టు ప్రణాళికలో బూర్జువ వర్గం మనిషికి మనిషికి మధ్య నగ్నమైన స్వలాభం తప్ప కిరాతకమైన డబ్బు లావాదేవీలు  తప్ప ఇక ఏ సంబంధాన్నీ మిగలనివ్వలేదు. ఇంకా మార్క్స్‌ రాస్తాడిలా –అది మనిషి విలువను రూపాయల్లోకి మార్చేసిందనీ, వైద్యులనూ, న్యాయవాడులనూ , కవులనూ, శాస్త్రవేత్తలనూ అది తనకింద కూలికి పనిచే సేవకులు గా  మార్చేసిందనీ — ఎలాంటి మాటలివి ?  ఎంత అచ్చమైన, స్వచ్ఛమైన, సత్యమైన మాటలివి. అబ్బా మూర్తీ! ఈ బ్రిటీష్‌ సామ్రాజ్యం ఎలా కూలిపోతుందో నా  కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఈ ఆర్థిక సంక్షోభం, ఈ దరిద్రం, ఈ పీడన అంత బ్రిటీష్‌ సామ్రాజ్యం తన నెత్తిమీదకు తానూ  తెచ్చుకున్నదే – ఇదుగో నే చెప్తా విను’’ ` శారద గలగలా నవ్వింది.

నవ్వుతూ  నవ్వుతూ చెప్తోంది. పొంగుతున్న సంతోషంతో మాటలు  ఆగుతూ ఆగుతూ వస్తున్నాయి.

‘‘ఈ బూర్జువా సమాజం తన మంత్ర శక్తితో  సృష్టించిన భూతాలను  తాను  అదుపు చేసుకోలేక వాటి చేతిలో మంత్రగాడిలా చస్తుంది’’ ఆ నవ్వులో కసి కోపం కలగలిసి ఉన్నాయి. ‘‘మూర్తీ – మనిద్దరం చదువుదాం. మళ్ళీమళ్ళీ చదువుదాం. అర్థం చేసుకోవాలి  ఇంకా – ఇవాళ రామకృష్ణ ఎంత గుర్తొస్తన్నాడో. మేం చాల  పుస్తకాలు కలిసే  చదివాం. ‘ఆడవాళ్ళను సమాజం ఎప్పుడూ సమిష్టి ఆస్తిగా ఉంచిందన్నారు’ కమ్యూనిష్టు మేనిఫెస్టోలో. ఆ చరిత్రంతా తెలుసుకోవాలి.

మూర్తీ — చివరిగా పరమాద్భుతమైన మహాసత్యం చెప్పారు. అది చదువుతూ నేనేమయ్యానో నాకే తెలియదు. అదో విశ్వ రహస్యాన్ని కనుగొన్న, చూసిన గొప్ప అనుభవం. ‘కార్మికులు  పోగొట్టుకునేదేమీ లేదు. తమ సంకెళ్ళు తప్ప –  వారికి గెలవ వలసిన ప్రపంచం ఉంది.’’ ప్రపంచమంత ఒకటే – మనదే మూర్తీ –  మనదే – ఎలా ఉంది?

‘‘శారదా. నేను ఎన్నడూ అనుకోలేదు నా  కింత అదృష్టం పడుతుందని. నీ కలలు  నాతో ఇంత ఆత్మీయంగా, నువ్వే నేనన్నట్టు పంచుకుంటావని’’ శారదను మరింతగా హత్తుకున్నాడు.

శారద అతన్నించి విడిబడి నవ్వింది.

‘‘అదంతా తర్వాత ` మూర్తీ ` మనం నిజంగా మార్చేస్తాం కదూ దేశాన్ని. దించేస్తాం కదూ స్వర్గాన్ని’’.

‘‘తప్పకుండా. కానీ అదంత తేలిక కాదు’’.

‘‘తేలికో. కష్టమో. ప్రాణాలు  పోతాయో. ఏమవుతుందో. కానీ ఇవాళ నాకు ఆకాశాన్నందుకున్నట్టు ఉంది. ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిని కావలించుకున్నట్టుగా ఉంది. ఎంత తొందరగా ఆ సమావేశం జరుగుతుందా అని చూస్తున్నా’’.

శారద ముఖం వేయి సూర్యుల  కాంతితో జ్వలిస్తోంది. మూర్తికి ఒక క్షణం భయం వేసింది ఆ ప్రకాశ తీవ్రతను చూసి.

శారదే ఆపకుండా మాట్లాడింది. కమ్యూనిస్టు మేనిఫెస్టో గురించి.

శారద గొంతులోంచి జలపాతంలా దూకుతున్న ఆ మాట జడిలో తడిసి ముద్దయిపోయిన మూర్తికి ప్రపంచంలో ఈ క్షణం తప్ప మరింక ఏదీ వాస్తవం కాదనిపించింది.

ఇద్దరూ ఆదర్శ లోకాలలో విహరించటంలోని అత్యున్నత ఆనందాన్ని మనసారా అనుభవించారు.

రాత్రి పొద్దుబోయాక శారదను ఇంటి దగ్గర దించి వస్తున్న మూర్తికి తన పక్కన శారద ఉన్నట్టే ఉంది. ఇంట్లో మంచం మీద పడుకున్న శారదకు తన పక్కన మూర్తి ఉన్నట్లే అనిపించింది. ప్రపంచం మీద, ప్రపంచంలోని దీనులు , పేదల  మీద ప్రేమఒకరి హృదయంలోంచి ఇంకొకరి హృదయంలోకి ప్రవహించిన క్షణాల  బలం  ఎలాంటిదో ఇద్దరికీ అనుభవమైంది. ఆ బలం  వారిద్దరి స్నేహానికీ అంతులేని శక్తినిచ్చింది.

***

‘‘విశాలాక్షి స్వయంగా వచ్చి పిలిచింది. వెళ్ళక తప్పదు’’ అనుకుని చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి నాటకానికి వెళ్ళేందుకు తయారవ్వాలని లేచింది శారద.

విశాలాక్షికి ఆ సంవత్సరం ఎమ్‌.ఏ లో చేరేందుకు సీటు దొరకలేదు. నాటకాల్లో వేషాలు  వేయటమూ తప్పలేదు. కొత్త నాటకం వేస్తుంటే శారదను పిలిచేది. శారద ఒకసారి మూర్తిని, సుదర్శనాన్ని కూడా తీసికెళ్ళింది. ఆ నాటకాలు  పెద్ద బావుంటాయని కాదుగానీ విశాలాక్షి కోసం, కోటేశ్వరి కోసం వెళ్ళేది.

ఇప్పుడేదో సాంఘిక నాటకమని చెప్పింది.

శారద ముందుగా విశాలాక్షి ఇంటికి వెళ్ళింది. ఇద్దరూ కలిసే థియేటర్‌కి వెళ్ళారు. వాళ్ళంతా వేషాలు  వేసుకుంటుంటే శారద విశాలాక్షికి సాయం చేస్తూ కబుర్లు చెబుతోంది. ఇంకో పావుగంటలో నాటకం మొదలవుతుండగా విశాలాక్షి తల్లి కోటేశ్వరి సంతోషంగా వచ్చింది.

‘‘విశాలా. నీ అదృష్టం బాగుందే. బళ్ళారి రాఘవరావు గారు మన నాటకం చూడటానికి వస్తున్నారు’’.

‘‘ఎవరొస్తే మనకేమిటమ్మా. మన నాటకం మనం ఆడాలి. తప్పదుగా’’

‘‘తిండి పెట్టేది అవి. ఆ నాటకాల  గురించి ఎందుకట్టా మాట్టాడతావు. పెద్దాయన వస్తున్నాడు. నువ్వు వినయంగా నమస్కారం చెయ్యి. ఆయన తల్చుకుంటే నిన్ను మహానటిని చేస్తాడు.’’

olga title‘‘మహానటిని కావాని నాకేం కోరికలేదు. ఐనా మహానటులు  ఎవరికి వారు కావాల్సిందే. ఇంకొకరు చేయలేరు. ‘‘దురుసుగా అంది విశాలాక్షి.

‘‘నా మాటలన్నీ నీకు తప్పుగానే వినపడతాయి. చూడు శారదమ్మా, నీ స్నేహితురాలి వరస’’ అంటూ పక్కకు వెళ్లింది .

‘‘ఎందుకే. మీ అమ్మనట్లా బాధపెడతావు’’ జాలిగా అంది శారద.

‘‘నా లోపల , నా జీవితం గురించి ఎంత అసంతృప్తి ఉందో నీకు తెలియదు. ఎంత ఆపినా ఆగకుండా ఇలా పైకి తన్నుకొస్తుంది. అమ్మకూ నాకూ ఇది అవాటేలే ` ’’

‘‘బళ్ళారి రాఘవ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో మంచి నటుడు. నేను ఆయన నాటకాలు  చూశాను’’ ఉత్సాహపరచబోయింది శారద.

‘‘నేనూ చూశాను. గొప్ప నటులే ` కాదన్నదెవరు?’’ నిర్లిప్తత పోలేదు విశాలాక్షి గొంతులో.

ఇంతలో నాటకం మొదలవుతుందనే పిలుపు. విశాలాక్షి వెళ్ళింది. శారద పెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది.

అది గొప్ప నాటకం కాదు గానీ విసుగు పుట్టించలేదు.

నాటకం పూర్తయ్యాక బళ్ళారి రాఘవను స్టేజీ మీదకు పిల్చారు. ఆయన వచ్చి నాటకం గురించి నాలుగు మంచి మాటు చెప్పి, ఆంధ్రదేశంలో గొప్ప బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి నాటకరంగంలో చరిత్ర సృష్టిస్తున్న కొమ్మూరి పద్మావతి కూడా నాటకానికి వచ్చిందనీ, ఆమె వేదిక మీదికి రావాలని కోరారు. పద్మావతి స్టేజి మీదకు వచ్చి అందరికీ నమస్కారం చేసేసరికి ప్రేక్షకుల  ఉత్సాహం రెట్టింపయింది.

ఆ సభా తతంగం అయ్యాక లోపల  మేకప్‌ రూంలోకి చాలా మందే వచ్చి అభినందించారు. రాఘవగారు, పద్మావతి గారూ నలుగురితో కలిసి వచ్చారు.

‘‘మా అమ్మాయి బి.ఎ చదివిందండి’’ అంది కోటేశ్వరి గర్వంగా.

‘‘మంచిది. చదువుకున్న వాళ్ళూ, కుటుంబ స్త్రీలు  వస్తేనే నాటకరంగ ప్రతిష్ట పెరుగుతుంది’’ అన్నారు బళ్ళారి రాఘవ.

‘‘కుటుంబ స్త్రీలంటే ఎవరండీ? కుటుంబ స్త్రీలు  కానిదెవరండి’’ చాలా కటువుగా అడిగింది విశాలాక్షి.

అందరూ నిశ్శబ్ధమైపోయారు.

బళ్ళారి రాఘవ పక్కనున్న తెల్లటి అందమైన మనిషి సన్నగా నవ్వి ‘‘తప్పు ఒప్పుకొని ఆ అమ్మాయిని క్షమాపణ అడగండి’’ అన్నాడు.

పద్మావతి కంగారుపడుతూ ‘‘మీరూరుకోండి’’ అన్నది.

‘‘అమ్మా – ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నా పేరు గుడిపాటివెంకట చలం. కథలూ  అవీ రాస్తుంటాను. నువ్వడిగిన ప్రశ్న చాలా సరైన ప్రశ్న’’.

బళ్ళారి రాఘవ గంభీరంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆయనతో వచ్చినవాళ్ళూ వెళ్ళిపోయారు.

చలంగారు రెండు నిమిషాలు  నిలబడి ‘‘మీ నాటకం నాకేం నచ్చలేదు గానీ నీ మాటలూ , నువ్వూ –  మర్చిపోలేను’’ అంటూ వెళ్ళిపోయారు.

శారద చలం గారిని చూసిన సంభ్రమంలో మిగిలినవన్నీ మర్చిపోయింది.

‘‘విశాలా – చలంగారు’’ అంది విశాలను కుదుపుతూ.

‘‘ఔను – అదే – చూస్తున్నా’’

కోటేశ్వరి అందరినీ గదమాయిస్తూ సామాను సర్దిస్తోంది. ఆమెకు కూతురి మీద పట్టరాని కోపంగా ఉంది. అంత పెద్ద మనిషిని పట్టుకుని అవమానించింది. బి.ఏ చదివానని పొగరు. దీన్తో ఎలా వేగాలో తెలియటం లేదు. ఆమెకి విశాలాక్షి భవిష్యత్తు గురించి బోలెడు భయం.

విశాలాక్షి ఇల్లు చేరాక తల్లితో పెద్ద యుద్ధమే చేసింది.

‘‘నేనింక నాటకాలు  వెయ్యను’’ అని ప్రకటించేసింది.

‘‘ఒకపక్క ఆ బ్రాహ్మలావిడ నాటకాల్లోకి వస్తే –  నీకు పరువు తక్కువైందా నాటకాలేస్తే’’ అని కూతుర్ని తిట్టింది కోటేశ్వరి.

‘‘ఔనమ్మా ` బ్రాహ్మలు, కుటుంబ స్త్రీలు  నాటకాలేస్తే గొప్ప. మనం ఏం చేసినా గొప్ప కాదు. వాళ్ళను చూసినట్లు మనల్ని చూడరు.’’

‘‘నీకు ఏం కావాలే ? ఇప్పుడు నీకేం తక్కువైంది?’’ అరిచింది తల్లి.

‘‘అది నీకూ తెలుసూ. నాకూ తెలుసు. మళ్ళీ నా నోటితో చెప్పాలా? “గయ్యిమంది కూతురు.

కోటేశ్వరికి మండిపోయింది.

‘‘సరే – నోర్మూసుకుని తిండితిని పడుకో. చేసే పని సంతోషంగా చెయ్యటం చేతగాని దద్దమ్మవి. నీ మీద నీకు గౌరవం లేదు. నిన్ను నువ్వు గొప్పనుకోవటం తెలియదు. ఎవరో నిన్ను గొప్ప దానివనాలా ?నీ గురించి నీకు తెలియదా?’

*

గమనమే గమ్యం-11

 

olga

ఆసుపత్రిలో ఆ రోజు విపరీతంగా పని మీద పడింది శారదకు. సరళ అనారోగ్యంతో నాలుగు  రోజులుగా రావటం లేదు. ఆడవాళ్ళ వార్డులో డ్యూటీ శారద మీద పడింది. ఉదయం ఆరు గంటలకే వెళ్ళిన శారద ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. చాలా అలసటతో వెంటనే స్నానం చేసి నిద్రపోవాలనుకుంటూ వచ్చిన శారదను వాకిట్లోనే ఆపింది సుబ్బమ్మ.

‘‘అమ్మాయ్‌ , ఇంతాలస్యమా? ఎవరొచ్చారో చూడు. పొద్దున్నించీ మేమిద్దరం నీకోసం చూస్తున్నాము’’.

తల్లి ముఖంలో ఉత్సాహం చూస్తుంటే ఎవరో ముఖ్యులే అనిపించింది. బంధువు కాకూడదు భగవంతుడా అనుకుంటూ గదిలోకి వెళ్ళింది.

పుస్తకం చదువుకుంటూ కూచున్న విశాలాక్షి శారదను చూసి నవ్వింది.

శారద విశాలాక్షిని గుర్తుపట్టలేదు.

‘‘నేను శారదా. విశాలాక్షిని. అన్నపూర్ణా, నువ్వు `నేను’’ శారద ఒక్క గంతులో విశాలాక్షి దగ్గరకొచ్చి భుజాలు  పట్టుకుని ఊపేసింది.

‘‘విశాలా, ఎన్నేళ్ళకు కనపడ్డావు. అన్నపూర్ణ కూడా ఈ మధ్య నిన్ను చూడలేదంది. ఎలా ఉన్నావు. ఏం చేస్తున్నావు. నాకు ఉత్తరాలన్నా రాయొచ్చుగదా ` ’’

‘‘ఉండు శారదా, కాస్త ఊపిరి తీసుకో. అన్నీ చెప్తాను’’

ఇద్దరూ చిన్నపిల్లల్లా  కారణం లేకుండా నవ్వుకున్నారు.

శారద స్నానం చేశాక సుబ్బమ్మ ఇద్దరికీ విందు భోజనం పెట్టింది.

ఇద్దరూ శారద గదిలో మంచం మీద చేరారు.

‘‘గుంటూరు ఒదల్లేదు అమ్మ. ఆమెతో పాటే నేనూ.  బాబుగారు పోయాక అన్నీ అమ్ముకుని గుంటూరు చేరాం కదా ` ఆ తర్వాత మన ఊరు వెళ్ళలేదు నేను. గుంటూరులో ఎన్నో జరిగాయి .తర్వాత ఎప్పుడన్నా తీరిగ్గా చెబుతాలే . నా చదువు మాత్రం ఆగకుండా చూసుకున్నా. అమ్మ నాటకాల్లో వేషాలు  వేయటంమొదలుపెట్టి చివరకు తనే ఒక నాటకం కంపెనీ పెట్టింది. బి.ఏ. పూర్తి చేసి కూర్చున్నాను. రెండేళ్ళు ఊరికే గడిచిపోయాయి. మద్రాసులో చదవాలని నా కోరిక. అమ్మని అక్కడ నాటకం కంపెనీ మూసి ఇక్కడ తెరవాలని ఒప్పించే సరికి బ్రహ్మ ప్రళయం అయింది. ఎలాగైతేనేం వచ్చాం. ఎడ్మిషన్లకు ఇంకా చాలా టైముందిగా. ఈ లోపల కాస్త స్థిరపడాలి. నాటకాల్లో వేషాలు  వేయటం తప్పదు ` ’’

శారద ఆశ్చర్యంగా వింటోంది. విశాల నటిస్తుందా?

‘‘ఏం చదవానుకుంటున్నావు?’’

‘‘ఎమ్‌.ఏ.  ఎకనామిక్సు’’.

‘‘ఎకనామిక్సా? ఎందుకు?’’

‘‘ఎందుకేమిటి? నాకిష్టం. పైగా రేపు దేశానికి స్వతంత్రం వస్తే దేశాన్ని ఆర్థికంగా ఎలా నడిపించాలో ఎకనామిక్సు చదివితేనే తెలుస్తుంది.’’

‘‘ఓ! ఆర్థిక శాస్త్రవేత్తవవుతావన్నమాట’’

‘‘నువ్వు డాక్టర్‌వి కావటంలా’’

‘‘పాపం అన్నపూర్ణ చదువే ’’ జాలిగా అంది శారద.

‘‘పాపం అని జాలిపడనక్కర్లేదు. అది రాజకీయాల్లో దిగిందిగా. దేశానికి స్వతంత్రం వస్తే ఏ మంత్రో అవుతుంది. మనిద్దరం దాని దగ్గర చేతులు కట్టుకుని నిల్చోవాలి’’.

ఇద్దరూ ఆ దృశ్యాన్ని ఊహించుకుని నవ్వుకున్నారు.

‘‘ఇప్పుడేం నాటకం వేస్తున్నారు?’

‘‘ఏముంది? శాకుంతలం’’.

‘‘నువ్వు శకుంతవా?’’

‘‘ఊ,  నా పాట వింటావా?’’

అభినయిస్తూ పాడింది  విశాలాక్షి . ముగ్ధురాలయి చూసింది శారద.

‘‘నువ్వు ఆర్థికశాస్త్రం చదవొద్దు ఏమొద్దు. హాయిగా నాటకాలు వేసుకో. జనం నీరాజనాలు పడతారు’’.

‘‘వెంటపడతారే తల్లీ. మగాళ్ళున్నారే. ఛీ, ఛీ . ఒదలరు. కానుకంటారు. షికారుకి రమ్మంటారు’’.

‘‘అంతమంది వెంటపడుతుంటే బాగానే ఉంటుందేమో’’.

‘‘తన్నబుద్ధేస్తుంది ఒక్కొక్కడిని’’

‘‘ఒక్కడన్నా నచ్చలేదా?’’

‘‘ఛీ! మగాడా? నచ్చటమా? వాళ్ళ వెకిలి వేషాలు చూస్తే నిప్పెట్టబుద్ధవుతుంది.’’

‘‘నీతోపాటు వేషాలు వేసే నటులలో ` దుష్యంతుడెవరు?’’

‘‘యాక్‌. బీడి కంపు’’

ఇద్దరూ పొట్టు చేత్తో పట్టుకుని నవ్వీ నవ్వీ ఆయాసపడ్డారు.

‘‘మీ అమ్మ వాళ్ళందరితో కంపెనీ నడుపుతోంది. నువ్వు వాళ్ళని అసహ్యించుకుంటున్నావ్‌.’’

‘‘మా అమ్మని చూస్తే నాకు కాస్త కోపంగానే ఉంటుందే. మంచిదే సమర్థురాలే . కానీ  ఏం చెప్పాలి? బాబు గారంటే అమ్మకి చాలా ప్రేమ. ఆయన పోయాక గుంటూర్లో గోవిందయ్య అనే ఆయన అమ్మకు దగ్గరయ్యాడు. మంచిగానే ఉండేవాడు. అండగా ఉంటాడ్లే అనేది అమ్మ. నాలుగేళ్ళకు ఏమయిందో మళ్ళీ రాలేదు. కనపడకుండా పోయాడు. ఇక తనకు తనే అండ అని నాటకం కంపెనీ పెట్టింది అమ్మ. ఇక చుట్టూ ఎంత మంది చేరారో. నన్ను నేను వాళ్ళందర్నించీ రక్షించుకోవాల్సి వచ్చింది. అమ్మకు తనను తాను రక్షించుకోటానికి ఒకటే సూత్రం తెలుసు. రంగనాధరావు అనే ప్లీడర్‌ని దగ్గరకు రానిచ్చింది. ఆయనగారి మనిషి అంటే ఇక ఎవరూ పిచ్చి వేషాలెయ్యరు అంది. నిజంగానే ఆయన మా జీవితంలోకి వచ్చాక నాకు కాస్త తెరిపి వచ్చింది. బి.ఏ చదువు పూర్తయింది. ఆయన హఠాత్తుగా చనిపోయాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అమ్మ వయసయిపోయింది. నన్ను ఎవరి అండనైనా పెట్టాలని అమ్మ ఆలోచన. నాకు అక్కడే అమ్మను చూస్తే మండిపోతుంది. ఎమ్మే చదివి ఉద్యోగంలో స్థిరపడాని నా ఆలోచన. ఇద్దరం పోట్లాడుకుంటాం.

మా అమ్మ చాలా సమర్థురాలు. తెలివైంది. కానీ నేనావిడలా బతకను.’’ విశాలాక్షి ఆపకుండా చెప్పుకుపోతుంది. శారద తనకింతవరకూ తెలియని ప్రపంచాన్ని చూస్తున్నట్లు విశాలాక్షిని చూస్తోంది.‘‘నువ్వు మగపిల్లలతో  కలిసి చదువుతున్నావు. ఎవరినైనా ప్రేమించావా? ’’ అడిగింది విశాలాక్షి.

‘‘లేదు’’ అని నవ్వేసింది శారద.

‘‘ఇంత అందమైన నిన్ను ఎవరూ ఇష్టపడలేదా?’’

‘‘ఇష్టం, ప్రేమ, స్నేహం వీటి గురించి ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నా’’

‘‘ఆలోచించు మరి. పెళ్ళి వయసు దాటిపోతోంది. ఇప్పటికే ఆలస్యమైంది.’’

‘‘పెళ్ళా? నేను పెళ్లి చేసుకోను.’’

olga title

విశాలాక్షి నవ్వేసింది. ‘‘అందరు ఆడపిల్లలు  అనేమాటే నువ్వూ అన్నావు. ఐనా నువ్వెందుకు పెళ్ళి చేసుకోవు? నేను పెళ్ళి చేసుకోనన్నానంటే దానికో అర్థముంది’’.

‘‘ఏంటో ఆ అర్థం?’’

‘‘నన్ను ఏ మగవాడూ గౌరవంతో, ప్రేమతో పెళ్ళాడడు కాబట్టి. నా కులం, మా అమ్మ, ఈ నాటకాలు, వీటన్నిటినీ చూసి నన్ను ఎవరైనా గౌరవిస్తారా? నా అందం చూసి వస్తారనుకో. వాళ్ళు నాకక్కర్లేదు. నా పెళ్ళి అసాధ్యం’’.

‘‘అంత అసాధ్యం కాదులే. లోకం మారుతోంది. నాకు డాక్టర్‌గా నా వృత్తి, దేశ స్వాతంత్రం ఇవి తప్ప పెళ్ళీ, పిల్లలూ ఒద్దనుకుంటున్నా’’.

‘‘ఓ! అన్నపూర్ణ పిచ్చి నీకూ ఉందా?’’

‘‘పిచ్చేమిటే? నీకు స్వతంత్రం ఒద్దా?’’

‘‘కావాలే .చాలా చాలా స్వతంత్రాలు కావాలి. కానీ అన్నిటికంటే ముందు ఈ స్వతంత్రం కావాలంటున్నవాళ్ళు నన్ను మనిషిగా చూడాలి. నన్ను ఆడదానిగా చూసి వెంటబడే మనుషుల నుంచి స్వేచ్ఛ కావాలి. నా కులం నుంచి నా వృత్తి నుంచి బైటపడి బతికే స్వతంత్రం కావాలి. గౌరవప్రదమైన ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకునే స్వతంత్రం కావాలి. నా బతుకు నన్ను బతకనిచ్చే స్వతంత్రం కావాలి’’.

‘‘దేశం స్వతంత్రమైతే అవన్నీ నీకు వస్తాయి’’.

‘‘నువ్వు పిచ్చిదానివా? నన్ను పిచ్చిదాన్ననుకుంటున్నావా? ఏమీరావు. నా బతుకు మారాలంటే స్వతంత్రం చాలదే ` ఇంకా చాలా కావాలి. అవేంటో నాకు తెలియదు’’.

‘‘ఏమిటో తెలియనిదేదో రావాలంటే ముందు స్వతంత్రం రావాలి. జాతికి గౌరవం లేనిది నీకెలా వస్తుంది?’’

‘‘తోటి మనిషిని గౌరవించలేని జాతికి స్వతంత్రం ఎలా వస్తుంది? ఆ స్వతంత్రంతో ఎవరికైనా ఏం జరుగుతుంది?’’

‘‘నువ్వు మరీ నిరాశావాదిలా మాట్లాడుతున్నావు?’’

‘‘నా అంత ఆశావాది ఇంకొకరు లేరు. నా స్థానంలో నువ్వుంటే కూడా నాలా ఆశతో బతికే దానివా అనేది నాకు అనుమానమే. నేనింత హీనస్థితిలో కూడా కలలు కంటున్నా. ఎమ్మేపాసవుతా. ఇంకా పరీక్షలు రాస్తా. పెద్ద అధికారి నవుతా .  నా హోదా చూసి అందరూ నన్ను గౌరవిస్తారు. నేను రాగానే లేచినిలబడతారు. నా వెనక చెప్పుకుంటారేమో ఈమె తల్లి ఫలానా .ఈవిడా నాటకాల్లో వేషాలు  వేసేదట. కానీ నా ముందు నోరెత్తలేరుగా. అలాంటి అధికారం సంపాదిస్తా. ఆ ఆశతో బతుకుతున్నా’’

శారద విశాలాక్షి చేతిని తన చేతిలోకి తీసుకుని ధైర్యానిస్తున్నట్లు గట్టిగా తట్టింది.

‘‘నీ ఆశ నెరవేరుతుంది. నే చెప్తున్నాగా’’

వాళ్ళిద్దరూ ఆ రాత్రి నిద్రపోలేదు.

***

 

గమనమే గమ్యం-9

olga title

గాంధీగారు ఒస్తున్నారన్న వార్తతో మద్రాసు నగరమంతా ఉప్పొంగిపోతోంది. శారద సంగతి చెప్పనక్కరలేదు. ఆమె ఇంతవరకూ గాంధిని ప్రత్యక్షంగా చూడలేదు. అన్నపూర్ణ, దుర్గాబాయికు ఆ అదృష్టం పట్టింది. దుర్గాబాయి ఒట్టిగా చూడటం కాదు గాంధీకి ప్రీతిపాత్రురాలయింది. ఒకోసారి శారదకు అన్నీ ఒదిలి గాంధీ ఆశ్రమానికి వెళ్ళిపోవాలన్నంత ఆవేశం ఒచ్చేది. మళ్ళీ చదువు, తండ్రికిచ్చిన మాట, తల్లి తనమీద పెట్టుకున్న ఆశలు  ఇవన్నీ వెనక్కు లాగేవి.

‘‘గాంధీలో ఉన్న ఈ మాయ ఏమిటి? ఎందుకిలా నాలాంటి వారందరినీ ఆకర్షించి దేశం గురించిన ఆలోచనలను మరెవ్వరూ కలిగించలేనంతగా కలిగిస్తున్నాడు.’’

ఆ రోజు సాయంత్రం విద్యార్థి మిత్రులందరితో గాంధీ సభలో తామేం చెయ్యాలనే విషయమే శారద ప్రకాశం గారింటికి వెళ్ళి సభలో కార్యకర్తలుగా తమకు పనులివ్వమని అడిగింది. ఆయన మీరేం చేస్తారంటూనే శారదకు చాలా బాధ్యతలు  అప్పజెప్పాడు. శారద పరమానందంగా ఆ పనులు  చేయటానికి మిత్రులు  అందరితో కలిసి చక్కని ప్రణాళిక వేసుకుంది.

స్నేహితులంతా కలిసి మద్రాసు నాలుగు పక్కలా  తిరిగారు. గాంధీ గురించి, ఖద్దరు ధరించటం గురించి శారద ఆవేశంగా మాట్లాడుతుంటే ప్రజలు  శ్రద్ధగా విన్నారు. శారదకు  తన ఉత్సాహాన్ని అందరికీ అంటించటంలో ఎంతో ప్రతిభ ఉంది. ఆమె చురుకుతనం, కలుపుకుపోయేతత్త్వం, నవ్వు, ఠీవిగా నడిచే తీరూ అన్నీ ప్రత్యేకమే.

గాంధీగారు వచ్చిన రోజు మద్రాసు సముద్రం జన సముద్రం ముందు చిన్నదైపోయింది. అందరూ ఒకే ఒక ఆవేశంలో అలలు అలలుగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. లక్షలాది మంది ఒకే ఒక ఆదర్శంతో, అనుభూతితో ఐక్యమైతే అంతకంటే అందమైన దృశ్యం మరొకటి ఉండదు. ఐతే ఆరోజు సభలో శారద ముందు ఎవరూ ఆగలేకపోయారు. ఎవరో ఎందుకు గాంధీగారే నిలవలేకపోయారు. సభంతా తానై కలియ దిరిగింది. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ‘శారదా’‘శారదా’ అనే పిలుపులే. గాంధీ గారి కంటే శారద ఆకర్షణ పెరుగుతోంది. ఆ హడావుడిలో, ఆ సంరంభంలో మూర్తి శారదను కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆ రోజు మూర్తి గాంధీగారేం చెబుతున్నారో వినలేదు. గాంధీగారిని ఎక్కువసేపు చూడలేదు. ‘శారదా’ ‘శారదా’ అంటూ ఆ పేరు జపిస్తూ శారద వెళ్ళిన వైపు కళ్ళను మళ్ళిస్తూ కూచున్నాడు.

సభ ముగిసి అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయాక  చివరి పనులు  చేయిస్తూ అక్కడే ఉన్న శారద దగ్గరకు వెళ్ళి ‘‘శారదా’’ అని పిలిచాడు. శారద ఉలిక్కిపడి చూసింది. వెంటనే మామూలై గలగలా నవ్వింది.

‘‘మీరూ వచ్చారా? గాంధీగారి మాట అంతరార్థం గ్రహించారా? త్వరలో ఏదో జరుగుతుంది. ప్రజలంతా ఒక్కసారి తిరగబడే ఘట్టం సమీపంలోనే ఉంది. నాకది అర్థమైంది. నిజమే కదూ?’’

‘‘నేను గాంధీగారి మాటలు  వినలేదు శారదా’’

‘‘వినలేదా? మరెందుకొచ్చారిక్కడికి ` ఇక్కడ గాడిదలన్నా లేవే కాయటానికి’’ అంటూ గలగలా నవ్వింది మళ్ళీ.

‘‘వినలేదు. నా కళ్ళు మాత్రమే పని చేశాయివాళ. వాటితో మిమ్మల్నే చూస్తూ ఉండిపోయాను. నాకిక్కడ జరిగిందేమీ తెలియదు’’.

శారదకు చాలా చికాకుగా, కోపంగా అనిపించింది.

‘‘మూర్తిగారూ ` ఇక ఆ ధోరణి ఆపండి. మనం యువతీయువకులం. కొంత ఆకర్షణకు సహజంగానే లోనయి ఉంటాం. దానిని పక్కనపెట్టి ముందుకు వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. ఇక్కడే కాదు. నా చదువు, దేశ స్వతంత్రం ` వాటికి తప్ప మరి దేనికీ నా దగ్గర సమయం లేదు. నమస్కారం’’.

వెలవెలబోయిన మూర్తి ముఖాన్ని చూడకుండానే శారద అక్కడినుంచి వెళ్ళిపోయింది.

శారదకు గాంధీగారు అంటించిన ఉత్సాహం మనసు నిండా నిండిపోయింది.

రామకృష్ణ ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండేవాడు.

ఏదో జరగాలి. ఇది కాదు మార్గం. ఇలా దేశం స్వతంత్య్రం కాదు అని తపన పడుతుండేవాడు.

శారదకా నిరుత్సాహం నచ్చేది కాదు.

మార్గం ఇది కాదనుకుంటే ఇంకోమార్గం వెతుకు. ఇలా నిరుత్యాహపడకు. భగత్‌సింగ్‌ వేసిన మార్గం ఒకటుంది గదా ` నువ్వు కావాంటే మరో దారి వెతుకు. ఏ దారి అయినా గమ్యం స్వతంత్రమే గదా’’.

‘‘ఇంకో దారి వెతకగలనంటావా?’’ సందేహపడేవాడు రామకృష్ణ.

‘‘ఆ నిరాశ, సందేహాలే ఒద్దంటున్నాను. నువ్వు చాలా సమర్థుడివి. దేశం తప్ప, త్యాగం తప్ప మరింకేమీ తెలియదు నీకు. నువ్వు తప్పకుండా సాధిస్తావు. నీకు తగిన మార్గాన్ని, దేశానికి మేలు  చేసే దారిని వెతుకుతావు. కనిపెడతావు. నా మాట నమ్ము.’’

రామకృష్ణని ఉత్సాహపరిచేది శారద.

‘‘నీ మాటలే నేను నిరాశాసముద్రంలో మునిగిపోకుండా కాపాడుతున్నాయక్కా’’

‘‘ఔను గదా ` మరి నా మాటలే వింటూ నేను చెప్పినట్టు చెయ్యి. సరిపోతుంది’’ నవ్వేది శారద.

‘‘సరే గాని ` రష్యా విప్లవం గురించి కొత్త పుస్తకం సంపాదించాలన్నావు దొరికిందా?’’

‘‘లేదక్కా  ’’

‘‘నువ్వు చదవగానే అది నాకు ఇస్తావుగా’’

తప్పకుండా ` నాకు రష్యా విప్లవం గురించి చాలా తెలుసుసుకోవాలని ఉంది’’.

‘‘ఔను ` లెనిన్‌ గురించి కూడా.  నాయకుడంటే ఆయనే అనిపిస్తుంది.’’

‘‘ఔనక్కా .  నాకు గాంధీ కంటే లెనిన్‌ ఆలోచనలు, ఆచరణ ఉత్తమమైనవేమో అనిపిస్తోంది. ఆయన నిరూపించుకున్నాడు కూడా. రష్యాని నిరంకుశత్వాన్నించి విడిపించాడు. గాంధీగారు ఆ పని చెయ్యాలి’’.

‘‘చేస్తారు. నాకా నమ్మకం ఉంది తమ్ముడూ’’ రామకృష్ణ భుజం మీద ధైర్యం చెబుతున్నట్లుగా చెయ్యి వేసి తట్టింది.

‘‘అక్కా మనం ఎంతసేపూ లెనిన్‌, గాంధీ అంటూ నాయకుల మీద నమ్మకం పెంచుకుంటున్నాం. ప్రజల గురించి ఆలోచించటం లేదా? వారి మీద నమ్మకం లేదా మనకు? అదే లేకపోతే ఇక మన ఆలోచనలూ  కార్యక్రమాలూ  ఎందుకు? ఎవరికోసం.’’

‘‘పిచ్చివాడా ప్రజలే లేకపోతే వారిమీద నమ్మకమే లేకపోతే ఈ నాయకులెక్కడుంటారు?

‘‘ఔనుగాని అక్కా ` నమ్మకం ముఖ్యమా? కార్యకారణ విచక్షణ ముఖ్యమా?’’

‘‘విచక్షణతో కూడిన నమ్మకం’’.

Image (5)‘‘నువ్వింత బాగా చెప్తావు. నువ్వు లేకపోతే నేనిలా ఉండేవాడిని కాదు.’’

 

రామకృష్ణ శారదకంటే ఐదేళ్ళు చిన్నవాడు. కానీ అతని ఆలోచనలు  లోతైనవి. దేశం కోసం, ప్రజల కోసం అనుక్షణం ఆరాటపడుతుంటాడు. ఏ దారిన వెళ్ళాలో తెలియని నిరాశలో శారదను ఆశ్రయించి ఉత్సాహాన్ని పొందుతుంటాడు. ఆ

ఉత్సాహం మళ్లీ అతన్ని వెతుకులాటకు ప్రేరేపిస్తుంది. స్వంత అక్కాతమ్ముళ్ళ కంటే అపురూపమైన బంధం వారిద్దరిది ` వారి స్నేహబృందానికి వారిద్దరూ ఆదర్శం. అందరికీ శారద అక్కే . వాళ్ళంతా శారద అభిమానంతో, సుబ్బమ్మగారి ఆప్యాయతతో తడిసి ముద్దవుతుంటారు.

చివరికి అందరి ఆశలూ  చిగురిస్తాయనిపించే రోజులు  వస్తున్నట్లు వార్తలొచ్చాయి. గాంధీగారు మళ్ళీ సత్యాగ్రహం మొదలు  పెడతారట. ఈసారి ఉప్పుమీద పన్ను తొలగించాని డిమాండ్‌ చేస్తారట అనే వార్త శారదకు ఆమె స్నేహితులకూ చేరింది. కొందరు పెదవి విరిచారు.

‘‘ఉప్పేమిటి? మాకు స్వతంత్రం కావాలి ఇస్తారా చస్తారా అని అడగకుండా ఉప్పుమీద పన్ను తీస్తారా? తియ్యరా అని అడగటంలో ఏమన్నా అర్థం ఉందా?’’

‘‘సరే పన్ను తీసేస్తాం అంటారు. అప్పుడేం చేస్తారు? వైస్రాయి గారికి జై అని’’ జై కొడతారా?’’

‘‘ఏదో జరుగుతుందని ఇన్నాళ్ళూ ఖద్దరు ఒడుకుతూ, అమ్ముతూ కూచుంది ఇందుకా’’.

ఆవేశపరులైన యువకులు  ఉక్రోషంగా అరిచారు.

శారద వాళ్ళందరినీ శాంతపరిచేందుకు సిద్ధపడింది.

‘‘స్వతంత్రం ఇస్తారా? ఇవ్వరా? అని అడిగి వాళ్ళిస్తే హాయిగా తీసుకుని భుజాన వేసుకోటానికి అదేమన్నా కండువా అనుకున్నావా? ప్రజల్ని ఒక్కసారే చివరి గమ్యానికి సన్నద్ధం చెయ్యగలమా? ఉప్పుమీద పన్ను తీసేస్తారే అనుకుందాం. అది ఒక విజయం గదా. గాంధీ మీదా, కాంగ్రెస్‌ మీదా ప్రజలకు నమ్మకం కలుగుతుంది గదా ` శత విధాలుగా ప్రభుత్వం ఉప్పుమీద పన్ను తియ్యదు. మనల్ని ఉప్పు చెయ్యనివ్వదు. అప్పుడు ఆ అన్యాయాన్ని ఎత్తిచూపుతూ ప్రజలను బ్రిటీష్‌వాళ్ళకు వ్యతిరేకంగా సమాయత్తం చెయ్యొచ్చు. ప్రజల కోపం పెరిగితే అది దేశానికి మంచిదే కదా ` ’’

శారద మాటతో అందరూ చల్లబడ్డా రామకృష్ణ చల్లబడదల్చుకోలేదు.

‘‘ప్రజల కోపం పెరుగుతుంది. ఉద్యమంలోకి వస్తారు. సత్యాగ్రహం చేస్తారు. మంచి సమయం చూసి గాంధీగారు చల్లగా ఉద్యమం ఆపెయ్యమంటారు. ఈయనతో ఒక చావు కాదు గదా’’  అందరూ నవ్వారు. మొత్తానికి కాస్త నిరసన ఉన్నప్పటికీ అందరిలో ఉత్సాహం నిండుతోంది. శారద ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేయాని కంకణం కట్టుకున్నదానిలా మాట్లాడింది. అర్థరాత్రి దాటే వరకూ చర్చలు సాగుతూనే ఉన్నాయి. మర్నాడు ఆదివారం కావటంతో ఎవరికీ నిద్రపోవాలనే ఆలోచనే రాలేదు.

శారద ఆదివారం ఉదయం ఆలస్యంగా  నిద్రలేచినా బీచ్‌కి వెళ్దామనుకుంది. సత్యాగ్రహం మొదలైతే ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఉపన్యాసాలివ్వాలి. శారద ఉపన్యాసాలు  అభ్యాసం చేసి చాలా రోజులయింది. ఆ మూర్తి నా కార్యక్రమమంతా పాడుచేశాడు అని విసుక్కుని ఆలస్యమైనా ఫరవాలేదనుకుంటూ వెళ్ళింది. సముద్రాన్ని చూస్తూ దాని మీద నుంచి వస్తున్న తేమ గాల్లోని ఉప్పు వాసన తగిలితే శారదకు ఒళ్ళు పులకరిస్తుంది.

ఆనందంగా, ఉత్సాహంగా సత్యాగ్రహం చేయాల్సిన అవసరాన్ని కర్తవ్యాన్ని గురించి గొంతెత్తి సముద్ర తరంగాలతో మాట్లాడింది. ఉపన్యాసం ఆపి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటుంటే వెనక నుంచి చప్పట్లు వినిపించాయి. శారద వెనక్కు తిరిగి చూసింది.

మూర్తి నవ్వుతూ చప్పట్లు కొడుతూ నుంచుని ఉన్నాడు.

‘‘చాలా బాగా మాట్లాడారు. మీ గొంతు కూడా బలంగా  పలికింది. ఉత్సాహం సముద్రంలా ఉప్పొంగింది. కానీ అసలు  విషయమే రాలేదు’’.

శారద అసలు  విషయమేమిటన్నట్లు చూసింది.

‘‘ఇప్పుడు గాంధీగారు ఉప్పుని కదా గుప్పెట్లోకి తీసుకున్నారు. దాని సంగతేం రాలేదు’’.

‘‘నాకు దాని గురించి తెలిసిందంతా చెప్పాను’’.

‘‘తెలుసుకోవసింది చాలా ఉంది.’’

‘‘తెలుసుకుంటాను’’.

‘‘తెలిసినవాడిని నేనున్నానుగా , చెప్పనా?’’

శారద మౌనంగా మెల్లిగా బీచీ ఒడ్డున నడుస్తోంది. పక్కనే మూర్తి నడుస్తూ చెబుతున్నాడు.

‘‘మన దేశంలో కావసినంత ఉప్పు తయారవుతూనే ఉంది. కానీ బ్రిటీష్‌ ప్రభుత్వం లివర్‌పూల్‌ నుంచి, చెషైర్‌ నుంచి ఉప్పు మనకు దిగుమతి చేస్తోంది. ఎందుకు? ఇండియా నుంచి ఇంగ్లండ్‌కు బోలెడు సరుకులు  ఎగుమతి అవుతున్నాయి. ఎగుమతి ఏ నౌకలో అవుతున్నాయో, అవి మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలిగా .  వాటిలో ఏదో ఒకటి నింపి పంపాలిగా. ఏం పంపుతారు? మట్టి! మీకు తెలుసా? కొన్నాళ్ళు నిజంగానే మట్టి నింపుకుని అక్కడ హుగ్లీనుంచి ఉన్న పెద్ద కావలో ఆ మట్టి పోసి ఆ కావ పూడ్చేశారు. ఇంగ్లీషు వాళ్ళంత మూర్ఖులు  వాళ్ళే! ఇంక అట్లా పూడవటానికి కావ కూడా లేవు. దాంతో మట్టి బదులు ఏం పంపాలా అని ఒక పార్లమెంటు కమిటీ కూచుని రోజుల  తరబడి ఆలోచించి ఉప్పు పంపాలని నిర్ణయించింది. ఉప్పు వాళ్ళు ఎగుమతి చేసినా ఇక్కడ ఎవరు కొంటారు? మనకంతా సముద్ర తీరమే కదా. కాసేపు ఇక్కడ నడిచి ఇంటికెళ్ళి దులుపుకున్న ఉప్పుతో వంట చేసుకోవచ్చు.

శారద గలగలా నవ్వింది.

‘‘మీ నవ్వెంత బాగుంటుందో ! ’’

‘‘చెప్పండి. చెప్పండి’’ గంభీరత్వం తెచ్చిపెట్టుకుంది శారద.

‘‘ఇక్కడ వాళ్ళ ఉప్పెవరు కొంటారు? అందుకని మనవాళ్ళు తయారుచేసే ఉప్పు మీద మణుగుకు మూడున్నర రూపాయలు  పన్ను వేశారు. దాంతో బెస్తవాళ్ళకు ఎంతో నష్టం. వాళ్ళు ఉప్పు చేస్తారు. ఉప్పు చేపు చేస్తారు. బెస్తస్త్రీకది జీవనాధారం.

వాళ్ళు ఉప్పుకి పన్ను కట్టలేరు. తామే తయారుచేసుకుందామంటే ఎవరంటే వాళ్ళు ఉప్పు తయారుచేయకుండా నిషేధం పెట్టారు బ్రిటీష్‌వాళ్ళు. ఆఖరికి సముద్రంలో దొరకే నాచుతో తీగతో ఎలాగో తంటాలు  పడి ఉప్పు చేసుకుంటుంటే వాళ్ళకు జైలు  శిక్ష వేశారు. ఇక ఉప్పు తయారీని పెద్దపరిశ్రమ చేసి ధనిలకుకు అప్పగించారు. వాళ్ళకు లాభాలు  కావాలి. గాలీ, నీరూలా దాదాపు ఊరికే దొరికే ఉప్పు పండించే  నేలలో కొన్ని సంవత్సరాలు  దానిని పండిస్తే అవి పంట పొలాలవుతాయి. తెలుసా?

‘తెలియదు’

‘‘తెలుసుకో’’ హుందాగా అన్న మూర్తిని చూస్తే శారదకు ముచ్చటేసింది.

‘‘ఆ రకంగా ఎన్నో పొలాలు చవిటి పర్రుగా మిగిలిపోయాయి. జనం ఉప్పు వాడటం తగ్గించారు. దానివల్ల  ఆరోగ్య సమస్యలు … ఒకటి కాదు ఉప్పు కథ ఎంతో ఉంది. మొత్తం ఉప్పు వ్యాపారాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని జనం నోళ్ళలో దుమ్ముకొట్టింది.’’

మూర్తి మాట్లాడటమూ నడవటమూ ఆపి

‘‘ఇది చాలనుకుంటాను. గణాంకాలను ప్రజలంతగా పట్టించుకోరు’’

శారద నవ్వుతూ మూర్తి వైపు చూసి ‘‘మీరు పుస్తకాలు  బాగా చదువుతారనుకుంటాను’’.

‘‘ఊ’’ పుస్తకాలు  చదువుతాను. సంగీతం పాడతాను. ఫోటో తీస్తాను. బొమ్ము వేస్తాను. పొట్టకూటి కోసం కోర్టులో వాదిస్తాను. ఎన్నో పనులు  చేశాను ఇంతవరకూ ,  ఒక్క పని తప్పా.’’

‘‘ఏంటది?’’

‘‘ప్రేమించటం. ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను’’ మూర్తి సూటిగా చెప్పిన ఆ మాటకు శారదాంబ చంపులు  ఎర్రబడ్డాయి. మూర్తి మీద కోపం రాకపోగా మనసులో సంతోషం కలుగుతోంది. అది కలగకూడదని లోపలినుండి హెచ్చరికలూ  వినబడుతున్నాయి.

‘‘శారదా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక నా వశంలో లేదు. నిన్ను చూడకుండా ఉండలేను. ఈ పరిస్థితికి నాకూ కంగారుగానే ఉంది. కానీ నా చేతుల్లో ఏమీ లేనట్లుగా ఉంది.’’

‘‘నా చదువు నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంకోవైపు నేను దృష్టి మళ్ళించలేను.’’

‘‘నీ చదువు నాకూ ముఖ్యమే. నువ్వు నీ చదువు వల్లే, ఆ చదువు వల్ల నీలో ప్రకాశించే జ్ఞానం వల్లే నన్ను ఆకర్షించావు. నీ శరీరాన్ని కాదు నేను ప్రేమించేది. నీ మేధస్సుని, తెలివిని, నీలోని ఆధునికతను. ఇవన్నీ కలిసిన నిన్ను . నీ ప్రేమ నీ చదువుకి ఆటంకం కాదు. నాకేమీ అక్కర్లేదు. రోజూ నిన్ను చూసి నీతో మాట్లాడితే చాలు.’’

‘‘మా ఇంటికి మీరు నిరభ్యంతరంగా రావొచ్చు. నాకు చాలామంది స్నేహితులున్నారు. అన్నదమ్ములున్నారు. వాళ్ళందరితో పాటు మీరు రావొచ్చు.’’

‘‘వాళ్ళందరితో పాటు నేను కాదు. నాకేదో ప్రత్యేకం కావాలి’’.

‘‘ప్రత్యేకం’’ నవ్వింది శారద.

‘‘సరే. ప్రత్యేకమే. ఒకసారి రండి. వచ్చి మా స్నేహ బృందాన్ని చూడండి’’.

మూర్తి శారద స్నేహబృందానికి పరిచయమయ్యాడు. వాళ్ళలో అతనొకడయ్యాడు గానీ మిగిలినవాళ్ళందరికీ అతను ఏదో ప్రత్యేకంగానే కనిపించేవాడు. శారద మీద తనకేదో అధికారం ఉన్నట్టు, చనువు ఉన్నట్లు మాట్లాడేవాడు. శారద దానిని పట్టించుకోనట్లు కనిపించినా లోలోపల దానిని ఇష్టపడేది. అందువల్ల ఎవరి అధికారాన్ని సహించని శారద, మూర్తి ధోరణిని వారించేది కాదు. దానికి తోడు శారద, మూర్తి చాలాసార్లు ఉదయపు వేళల్లో సముద్ర తీరాన కలుస్తున్నారనే విషయం కూడా మిగిలిన మిత్రులకు తెలిసింది.

రామకృష్ణ మిగిలిన వారిలా మౌనంగా ఊరుకోలేకపోయాడు.

‘‘అక్కా ! మూర్తిగారి పద్ధతి ఏదో భిన్నంగా ఉన్నది. మిగిలిన విషయాలు  ఎలా ఉన్నా నీ మీద ఏదో అధికారం ఉన్నట్లు ప్రవర్తిస్తాడెందుకు? దానిని నువ్వు సహిస్తున్నావెందుకు? ఆ చనువు, ఆ పరిహాస ధోరణి నువ్వెందుకు భరిస్తున్నావు?’’

రామకృష్ణ నుంచి ఈ ప్రశ్న వస్తుందని శారద అనుకుంటూనే ఉంది. రామకృష్ణ కంటే తనకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి, సజ్జనుడు ఎవరూ ఉండరని శారదకు తెలుసు. అతని దగ్గర విషయం దాడచంలో అర్థం లేదనీ, ఉన్న విషయం చెప్పేద్దామనీ అనుకుంది.

‘‘మూర్తి నన్ను ప్రేమిస్తున్నాడు రామూ. అందుకే ఆయనకా అధికారం’’.

‘‘నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆయనకు పెళ్ళయింది కదక్కా’’. రామకృష్ణయ్య ఆందోళనగా అడిగాడు.

శారద ముఖం పాలిపోయింది. గుండె దడదడా కొట్టుకుంది. శరీరమంతా నిస్సత్తువగా అయిపోయింది. కాళ్ళు తేలిపోతున్నట్లయి దగ్గరున్న బెంచీమీద కూలబడింది.

‘‘ఆ సంగతి చెప్పలేదా? అది దాచి ప్రేమిస్తునన్నాడా?’’ రామకృష్ణ కోపంగా అంటున్న మాటలు  కూడా శారదకు వినిపించలేదు. అసలు  ఈ లోకం, ఎదురుగా ఉన్న రామకృష్ణ అంతా అదృశ్యమై పోయినట్లయింది. ఏమీ కనిపించటంలేదు. వినిపించటం లేదు. చీకట్లు కమ్మినట్లయింది.

రామకృష్ణ ‘‘అక్కా! అక్కా’’ అంటూ కుదిపాడు.

‘‘మూర్తికి పెళ్ళయిందా? నీకు తెలుసా?’’ చాలాసేపటికి అడిగింది శారద.

‘‘తెలుసు. నాకే కాదు. అందరికీ తెలుసు. ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. నీ దగ్గర దాచాడా ఇదంతా’’ రామకృష్ణ కళ్ళెర్రబడ్డాయి.

‘‘నేను అడగలేదు’’

‘‘నువ్వడగటం అలా ఉంచు. ప్రేమిస్తున్నానని చెప్పినవాడు తన పెళ్ళి విషయం చెప్పకపోతే ఏమిటర్థం?’’

‘‘పెళ్ళి గురించిన మాటే మా మధ్య రాలేదు రామూ. అతను నన్ను పెళ్ళాడతాననలేదు. ప్రేమిస్తున్నారా ఐతే పెళ్ళి చేసుకుందామని నేనూ అనలేదు. రామూ ` ఈ విషయం ఇంతటిలో ఆపేద్దాం. దీని గురించి వివేకంతో ఆలోచించగల సమర్థురాలిననే నమ్మకం నామీద ఉంచు. నువ్వు దీని గురించి ఆందోళన పడకు. ఇదంతా నేను తేల్చుకోవాల్సిన విషయం. నువ్వు ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దు. నేను తేల్చుకుంటా ` ’’ శారద అక్కడినుంచి వెళ్ళిపోయింది. దు:ఖం కట్టలు  తెంచుకు దూకింది. అడ్డు లేకుండా ప్రవహించింది. అదంతా అయిపోయాక శారద లేచి ముఖం కడుక్కుని కాశీనాథుని నాగేశ్వరరావు గారింటికి వెళ్ళింది.

శారద వెళ్ళేసరికి దుర్గాబాయి ఆసుపత్రినుంచి భర్తను తీసుకుని వచ్చింది. శారదను చూస్తూనే ఆమె ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టింది.

‘‘చూశావా. వస్తుందనుకున్న సమయం వచ్చేసింది. ఇంక మనదే ఆలస్యం. అందరం దూకాల్సిందే. శారదా ఎప్పుడెప్పుడు సత్యాగ్రహం చేద్దామా అని  మనసు ఆగటం లేదు.’’

ఆమె భర్త సుబ్బారావు ఏదో ఆయాసపడ్డాడు. దుర్గాబాయి ఆయనకు మంచినీళ్ళిచ్చి, మందు తాగించి విశ్రాంతిగా పడుకునే ఏర్పాటు చేసి వచ్చింది. ప్రతిపనీ ఎంతో శ్రద్ధగా చేస్తుంది దుర్గ.

పనిలో అందం, శ్రద్ధ రెండూ కనిపిస్తాయి.

భర్తపై ఇంత శ్రద్ధ. గృహిణిగా కర్తవ్య ధర్మం. ఎట్లా సత్యాగ్రహంలో కలుస్తుంది? అదే అడిగింది శారద.

‘‘శారదా ` దేశం పిలిస్తే, బాపూ ఆజ్ఞ వేస్తే ఇక నన్ను నేను నిలవరించుకోలేను. సర్వ ధర్మాలు  పక్కన పెడతాను. నా ఆత్మ బోధించే ధర్మం ఒక్కటే. నా దేశం’’.

‘‘మరి నీ భర్త?’’

‘నా భర్తను చూసుకునేవాళ్ళు ఉన్నారు. ఉంటారు. ఆయన నన్ను ఆపరు’. దుర్గ ముఖంలో ఆవేశం. ఆనందం. ఉత్సాహం.

‘‘భార్యాభర్తల సంబంధం ఎలాంటిది దుర్గా?’’

దుర్గ నవ్వింది.

‘‘నీకు తెలియదా? పెళ్ళి కాలేదనుకో ` ఐనా నీకు తెలియదంటే నేను నమ్మను.’’

‘‘భార్యాభర్తలందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారా?’’

‘‘నీకు ప్రేమ సమస్య వచ్చిందా? ప్రేమించుకుంటారు. ప్రేమించుకోరు. రెండూ ఉంటాయి. భార్య భర్తని సేవించాలి. అతనే లోకంగా ఉండాలి అంటారు ` నాకలా ఎప్పుడూ లేదు. పాపం ఆయనకు తనతోడిదే లోకంగా ఉండాలని ఉందేమో. నేనెప్పుడూ అలా లేను.’’

‘‘కానీ నువ్వు చేస్తున్న సేవ చూస్తుంటే…’’

‘‘నేనెవరికైనా అలాగే చేస్తాను. భర్త కాబట్టి మరింత బాధ్యతగా ఉంటాను. కానీ ఈ బాధ్యత ఇంక మొయ్యలేను. దేశం కోసం దీనిని అవతల పెట్టెయ్యగను’’.

‘‘కానీ స్త్రీంతా నీలా ఉండగలరా?’’

‘‘ఉండలేరు. వాళ్ళకా దృష్టి లేదు. ఎంతసేపూ ఇల్లూ , భర్తా, పిల్లలూ  ఇదే లోకం.

అబ్బా ` నాకా గుణం రాలేదు. వచ్చుంటే ఇక అక్కడే తెల్లార్చుకునేదాన్ని నా జీవితాన్ని.’’

‘‘భర్తను ప్రేమించకుండా దేశాన్ని ప్రేమించటం సరే ,  మరొక పురుషుడిని ప్రేమించటం సాధ్యమా?’’

‘‘ఆ విషయం నాకేం తెలియదు. ఆ ప్రేమ గురించి నేనెన్నడూ ఆలోచించలేదు’’

దుర్గ వెళ్ళి భర్తకు అంతా అనుకూలంగా ఉందా అని చూసి కాళ్ళ దగ్గర తొలగిన దుప్పటి సరిచేసి వచ్చింది.

‘‘నువ్వు నీ భర్తకంటే దేశాన్ని ప్రేమిస్తున్నావు. ఆ మాట ఆయనతోనే చెప్తున్నావు. నీ భర్త నీకంటే ఎక్కువగా ఇంకొకరిని ప్రేమిస్తున్నానని చెబితే ` ’’

‘‘అబ్బా ` అంతకంటే శుభవార్త ఉంటుందా? ఆ ఇంకెవరికో ఈయన బాధ్యత అప్పగించి నేను స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో పడి పరిగెత్తుతా’’ దుర్గ ఆ మాటన్న తీరుకి శారద నవ్వింది.

‘‘కానీ మామూలు  స్త్రీలు ఏడుస్తారు కదూ ` భర్త తనను కాదని ఇంకొకరిని ప్రేమిస్తున్నాడంటే ` ’’

‘‘ఏమో ` కొందరు ఏడవవచ్చు. కొందరు సంతోషపడవచ్చు. మరి కొందరు ప్రాణత్యాగం చేయవచ్చు. కానీ ఎక్కువమంది లోలోప సంతోషిస్తారేమో’’.

‘‘ఎందుకు?’’ ఆశ్చర్యంగా అడిగింది శారద.

‘‘ఈ భారం నుంచి విముక్తి లభించినందుకు. బతికినంతకాం ఒకే మనిషికి బాధ్యత వహించటం తప్ప మరింక జీవితంలో ఏ పనీ లేకుండా ఉండటం. ఆమనిషి ఎటువంటివాడైనా సేవించవలసి రావటం, స్వేచ్ఛ అన్నది లేకపోవటం , ఎటు చూసినా ఆజ్ఞలే , ఆదేశాలే. ఏమో నాకైతే ఈ వివాహబంధాన్ని మించి ఆనందం దేశ సేవలోనే ఉంది. కొందరికి మరింక దేన్లోనైనా దొరకొచ్చు. కానీ శారదా ,  ఆలోచించే అవకాశమే లేదుగా స్త్రీకు. ఎక్కడ నాకు ఆనందమని. ఊహ తెలిసిన దగ్గరినుంచి ఇదే నీ ఆనందం ముక్తి , మోక్షం అని చెప్తుంటారు. ఏమో ?ఆడవాళ్ళు ఈ బంధం నుంచి బైటపడి స్వతంత్రంగా వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వెతుక్కుంటే నయమనిపిస్తుంది నాకు.’’

‘‘స్వతంత్రం మనకీ కావాలిగా దుర్గా దేశానికి లాగే ! మనల్ని మనం పరిపాలించుకోవాలనిపించదు?’’

‘‘ఎందుకనిపించదు? కానీ దానికి ఎంతో శక్తి కావాలి. ముందు చదువు కావాలి. నువ్వు డాక్టర్‌వి అవుతావు. ఎంతమంచి సంగతి అది. నాకూ చదవాలని ఉంది. లాయర్‌ని కావాని ఉంది. దేశ స్వతంత్ర విషయాల్లో ఎన్నో తొసుకోవాలి. చదువు లేకపోతే మళ్ళీ ఆ చదువుకున్న మగవాళ్ళ మాటకు తలూపటం తప్ప మరేం చెయ్యలేం. చదువుకోవాలి శారదా ఆడవాళ్ళంతా చదువుకోవాలి. ఇంగ్లీషు చదువు  ’’ దుర్గ ముఖం వెలిగిపోతోంది జ్ఞానకాంక్షతో.

వాళ్ళ మాటల్లో చాలా సమయం గడిచింది.

శారద అడగాలనుకున్నది అడగలేదు. చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఎలా వెళ్ళిందో అలాగే తిరిగొచ్చింది. గుండెమీద బరువు ఏ మాత్రం తగ్గలేదు.

***

గమనమే గమ్యం -7

 

19BG_VOLGA_1336248e

మర్నాడు మధ్యాహ్నం శారద భోజనం చేసి ‘‘యంగ్‌ ఇండియా’’ పత్రిక పట్టుకుని చదువుతుండగా ఆమె స్నేహితులొచ్చారని వంటావిడ వచ్చి చెప్పింది.

శారద ఆశ్చర్యంగా వెళ్ళి వాళ్ళను కావలించుకుంది. ముగ్గురూ కూర్చున్న తర్వాత వెరోనికా అంది.

‘‘మేం కాలేజీకి వెళ్ళి దరాఖాస్తు ఫారాు ఇచ్చి వచ్చాం. నువ్వు ఇచ్చే ఉంటావులే’’ అని `

శారద వాళ్ళవంక జాలిగా చూస్తూ

‘‘మీరు కళాశాలో చేరుతున్నారా? నేను బహిష్కరిస్తున్నాను’’ అంది.

‘‘అదేమిటి? బహిష్కరించటం ఏమిటి? ఎందుకు? చదవవా?’’ వాళ్ళిద్దరూ కంగారుగా అడిగారు.

శారద వివరంగా ఉద్యమం గురించి, గాంధీగారి పిలుపు గురించి ఎంతమందో చదువు మాని ఉద్యమంలోకి దూకటం గురించీ, వాళ్ళూ చదువు మానెయ్యాల్సిన కర్తవ్యం గురించి ఆవేశంతో చెప్పింది. వాళ్ళను మార్చి కళాశాలకు వెళ్ళకుండా చెయ్యటమే తన కర్తవ్యమన్నట్లు చెప్పింది.

అంతా విని వెరోనికా, థెరిసా లేచి నిబడి ‘‘ఇక వెళ్ళొస్తాం’’ అన్నారు. శారద అర్థం కానట్లు చూసి.

‘కూర్చోండి. నా మాటలన్నీ విని మాట్లాడకుండా వెళ్ళిపోతామంటారేం ఏదో ఒకటి చెప్పండి. నేనన్న మాటల్లో తప్పేముంది?’’ అంటూ వాళ్ళను కూర్చోబెట్టింది.

‘‘తప్పు, ఒప్పు కాదు శారదా. మేం చదువు మానం. నువ్వు చదువు మానినా నీకేం నష్టం లేదు డబ్బుంది. పెళ్ళి చేసుకుంటావు. హాయిగా బతుకుతావు. నీకు ఇష్టమైన పనులు చేసుకుంటావు. మేం ఈ చదువు మానితే ఏముంది? మా వాడల్లో గౌరవం లేకుండా దుర్భరమైన బతుకు బతకాలి’’ థెరిసా మాటకు అడ్డం వచ్చింది వెరోనికా.

‘‘శారదా! ఈ చదువు లేకపోతే నీతో స్నేహం చెయ్యగలిగేవాళ్ళమా? అసు మాతో నువ్వు మాట్లాడేదానివా? మీ ఇంటికి వచ్చి నీ పక్కన కూర్చోగలిగే వాళ్ళమా? అట్లాంటి చదువు మానమంటున్నావా? నీకు చదువు ఉన్నా లేకపోయినా ఒకటే . డబ్బు, గౌరవం, ఆనందం అన్నీ ఉంటాయి. నిన్నెవరూ అవమానించరు. కానీ మాకు చదువు తప్ప ఇంకో ఆధారం ఏదీ లేదు. ఉన్న ఒక్క ఆధారం ఒదులుకోమంటావా? మేం చదువుకోటానికి ఎంతెంత త్యాగాలు  చేశారో మా కుటుంబాలవాళ్ళు, అవి చాలు . ఇంక మేం త్యాగం చెయ్యనవసరం లేదు’’.

శారదకు చాలా కష్టమనిపించింది. దు:ఖం వచ్చింది.

‘‘గాంధీ గారు ’’

‘‘ఆయనంటే మాకు గౌరవం ఉంది. కానీ ఆయనగానీ, మరెవరైనా గానీ మా కులం వాళ్ళ బతుకు బాగుచెయ్యగలరని నమ్మకం లేదు. మా చదువే మమ్మల్ని ఉద్ధరిస్తుంది. మేం చదువుకుని మా వాళ్ళకు చదువు చెబుతాం. సేవ చేస్తాం. అది కూడా దేశసేవే ! రాట్నం ఒడకటం, వందేమాతరం అని అరవటం మాత్రమే దేశసేవ కాదు’’ అంది థెరిసా.

‘‘మేం దీని గురించి ఆలోచించలేదనుకోకు శారదా . మేం మతం మార్చుకున్నాం కాబట్టి మమ్మల్ని కొంతవరకైనా మనుషుల్లా చూస్తున్నారు. తెల్లవాళ్ళ మీద నీకున్నంత కోపం మాకు లేదు. అసలు  కోపమే లేదు. మనకు చదువు చెప్పే అమ్మగార్లు ఎంత మంచివాళ్ళు. వాళ్ళు వచ్చి మా మతం మార్చి మమ్మల్ని చదువుల్లో పెట్టకపోతే ఏమయ్యేవాళ్ళం. మీ వాళ్ళు మమ్మల్ని అంటుకోరే ? మమ్మల్ని వెలివేశారే ? మీరు మమ్మల్ని చూసినట్లు తెల్లవాళ్ళు మిమ్మల్ని చూస్తే మీరు భరించలేకపోతున్నారు. మేం ఎట్లా భరిస్తాం’’.

‘‘గాంధీగారు హరిజనుల కోసం కూడా … ’’

‘‘అది మాకు చాలదు. గాంధీ గారు వచ్చినపుడు మా ఇళ్ళకు వచ్చిన మీవాళ్ళుఆ తర్వాత స్నానాలు చేస్తారు. మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చి ఆ ఇల్లంతా శుద్ధి చేసుకుంటారు. మీ వాళ్ళు మారరు. మా బతుకులూ  మారవు. చదువు మాత్రమే కొంతైనా మారుస్తుంది. ఆ చదువు మేం ఒదలం. అది ఒదిలితే ఇంక బతికున్న శవాలమే. నువ్వు కూడా మానొద్దు. మీ వాళ్ళల్లో మాత్రం ఎంతమంది ఆడవాళ్ళను చదవనిస్తున్నారు? నువ్వు డాక్టరువై ఎంతో సేవ చేస్తానని చెప్పేదానివి. అది మాత్రం సేవ కాదా?’’

థెరిసా, వెరోనికా మాటకు శారద సమాధానం చెప్పలేకపోయింది.

‘‘ఊళ్ళో మా వాడల్లోకి కూడా రాట్నాలు వచ్చాయి. మా వాళ్ళూ చేయగలిగింది చేస్తున్నారు. మాకు మాత్రం వాటి మీద నమ్మకం లేదు.’’

ఇంతలో సుబ్బమ్మ గారు వాళ్ళ కోసం ఫలహారాలు  తెచ్చారు.

‘‘నమస్కారమండీ. ఎప్పుడొచ్చినా మంచి మంచి ఫలహారాలు  పెడతారు.’’ అంటూ వాటిని తినే పనిలో పడ్డారు వెరోనికా, థెరిసాలు.

శారదకు చాలా గందరగోళంగా అనిపించింది. ఫలహారం రుచించలా. అన్యమనస్కంగానే వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. అన్నపూర్ణకు ఉత్తరం రాసినప్పటి  ఉత్సాహం ఇప్పుడు లేదు. ఎంత వెనక్కు నెట్టినా ఆగకుండా ప్రశ్నలు వస్తున్నాయి. చదువుమానటం అనేది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఆ పని చెయ్యని వాళ్ళను తక్కువగా చూడటం సరికాదు. అంటే చదువు మానేసి తను గొప్ప నాయకురాలై పోదు. అలా అవుతాననుకుంటే వెరోనికా, థెరిసా లను అవమానించినట్లే . కానీ హరిజనుల సంగతేమో కాని వేలమంది చదువులు  మానుతున్నారు.

కానీ విదేశీ విద్య లేకపోతే ఆడవాళ్ళకు, హరిజనులకు ఇట్లా బైటికొచ్చి ఇంతమంచి చదువు చదివే అవకాశం ఉండేదా ? అదంతా  తరవాత,  గాంధీగారు ఆలోచించకుండా ఈ కార్యక్రమం ఇవ్వరు గదా ! దీని ప్రయోజనం తర్వాత తోస్తుంది. ఇంతమంది పెద్దలు కళాశాలల్ని, కోర్టుల్ని, ఉద్యోగాలను ఒదిలేస్తుంటే అది మంచి పని కాకుండా ఎలా ఉంటుంది.?

శారదకు ఆ రాత్రంతా నిద్రలేదు. తండ్రినడగటానికి సంకోచం. చివరికి తన పరిస్ధితి తన స్నేహితుల పరిస్థితీ ఒకటి కాదు గాబట్టి వాళ్ళ నిర్ణయమూ, తన నిర్ణయమూ కూడా సరైనవనే ఆలోచనను మనసులో స్థిరపరుచుకుని కొంత శాంతి పొందింది.

రెండు రోజుల తర్వాత హరిగారు వచ్చేసరికి శారద ఆయనను ఉత్సాహంగానే ఆహ్వానించింది. నిజానికి ఆయననుతానే వెళ్ళి కలిసి మాట్లాడానుకుంటున్నదేమో, ఆయనే వచ్చేసరికి హడావుడిగా అతిథి మర్యాదలు చేసి ఆయన ముందు విద్యార్థిలా కూచుంది. హరిగారు ఏమీ తెలియనట్లుగా

‘‘ఏ కాలేజీలో చేరుతున్నావమ్మా’’ అని అడిగారు.

‘‘ఏ కాలేజీలోనూ చేరదల్చుకోలేదండి’’ అంది శారద ఒక రకమైన గర్వంతో `

‘‘అదేమిటి ? ఎందుకు?’’ హరిగారు శారదను పరిశీలనగా చూస్తూ అడిగాడు.

‘‘నేనిక ఈ చదువు చదవదల్చుకోలేదు. స్వదేశీ ఉద్యమంలో చేరి పని చేయాలనుకుంటున్నాను’’.

హరిగారు నవ్వారు.

‘‘అలాగైతే సంతోషమే. ఏం పనిచేస్తావమ్మా’’

‘‘రాట్నం తిప్పుతాను. ఇంకా మీలాంటి వారు ఏం చెయ్యమంటే అది చేస్తాను. అసలు నేనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడానుకున్నాను’’.

శారద ఉత్సాహం చూస్తుంటే హరిగారికి జాలివేసింది.

‘‘నేను చేసే పనులు రాయటమూ, ప్రజలను సమీకరించటమూ. ఆ రెండు పనులకూ నీకింకా వయసూ, అనుభవం కావాలి’’.

ఆయన మాటలు అర్థం కానట్లు చూసింది శారద.

‘‘రాజకీయాల గురించి రాయటానికి నువ్వింకా చదవాలి. ప్రజలను సమీకరించటానికి నీ వయసు చాలదు’’ మళ్ళీ నొక్కి చెప్పాడు.

‘‘నేనేం చెయ్యలేనంటారా?’’ ఆవేశంగా అడిగింది శారద.

‘‘జండా ఎగరేసి జైలుకి పోవచ్చు’’.

‘‘వెళ్తాను’’. దానికి తిరుగులేదనట్లు చెప్పింది శారద.

‘‘నువ్వు జైలుకి వెళ్ళి వచ్చేసరికి దేశంలో ఎన్ని మార్పులొస్తాయో. శారదా. నువ్వింకా చిన్నదానివి. మాకే ఈ ఉద్యమం సరిగా అర్థం కావటం లేదు. నువ్వు తొందర పడవద్దు. చదువుకుని తగిన వయసు వచ్చాక ఉద్యమం లోతుపాతు అర్థం చేసుకుని చేరితే బాగా పనిచేయగలుగుతావు.’’శారద అనుమానంగా, కాస్త అసహనంగా అన్నది ‘‘నాన్న నాతో ఇలా చెప్పమన్నారా?’’ అని.

‘‘చెప్పమంటే మాత్రం తప్పేముంది తల్లీ. మీ నాన్న ఆశలు నీకూ, నాకూ కూడా తెలియనివి కావు. నీకు ఏ పదో యేటనో పెళ్ళి చేస్తానని మీ నాన్న తలపెట్టి ఉంటే నేను అడ్డుచెప్పేవాడినా? సందేహమే! వచ్చి అక్షింతులు వేసి ఆశీర్వదించి వెళ్ళేవాడినేమో. నా ఆలోచన ఆడవాళ్ళ విషయంలో మీ నాన్న బుద్ధిలాగా పనిచేయదనుకుంటాను. మీ నాన్న నా ఆలోచనను ఎంతో మార్చాడు. ఆడవాళ్ళు చదువుకుంటే తప్ప దేశం బాగుపడదని అన్నాడు. మేమంతా ఒప్పుకున్నాం. మారాం. నా కూతురికి బాల్య  వివాహం చెయ్యననీ చదివిస్తానని ప్రమాణం చేసుకున్నాను. అంతగా మారాను. నిన్ను చదివించటానికి మీ నాన్నమ్మను ఒదులుకున్నాడు. ఎందుకు? పట్టుదలకా? పంతానికా? కాదు. దేశం కోసమే. నీ చదువు నీ కోసమో, మీ నాన్న కోసమో, నా కోసమో కాదమ్మా. దేశం కోసం. దేశం డాక్టర్లయిన స్త్రీ కోసం ఎదురు చూస్తోంది. నీలాంటి వాళ్ళు దేశానికి అవసరం. రాట్నం తిప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ డాక్టర్‌ చదివే అవకాశం, ఆసక్తి, వాళ్ళలో లక్షకి ఒకళ్ళకి కూడా ఉండదు. ఆ అవకాశం నీకుంది. నాకీ ఉద్యమం లోతుపాతులు బాగా తెలుసు. తెలిసిన వాడిగా చెబుతున్నాను. నీకు చదువే మంచిదనిపిస్తోంది. దేశంకోసం నువ్వీత్యాగం చెయ్యక తప్పదమ్మా.’’

శారద కంటి వెంట నీళ్ళు ధారగా కారుతున్నాయి. వాటిని ఆపుతూ అడిగింది శారద ` ‘‘మీరీమాట చదువు మానుతున్న యువకులందరితో ఇలాగే చెప్పగరా?’’

‘‘చెప్పను. చెప్పలేను. ఎవరి పరిస్థితులు వారికుంటాయి. కొందరు అత్యవసరంగా ఉద్యమానికి కావాలి. కొందరు నిదానంగా రావొచ్చు.’’

శారద కన్నీళ్ళు తుడిచారు హరిగారు.

‘‘నువ్వు చదువుకుంటూ కూడా చేయగలిగిన పనులు ఉన్నాయి. చాలా ఉన్నాయి. నేను నీ చేత ఆ పనులు చేయిస్తాను. ఉద్యమంలో భాగమయ్యావనే తృప్తి నీకు కలిగించే బాధ్యత నాది. రాట్నం ఒడకటమేనా? ఇంకా ఎన్నో పనులు చేయిస్తా నీ చేత.’’

శారద మనసు కుంగిపోయింది. మెదడు మండిపోతోంది.

చదువంటే శారదకూ ఇష్టమే. నెలరోజు ముందు వరకూ శారదకు చదువే సర్వస్వం. అలాంటి చదువును దేశం కోసం త్యాగం చేస్తే ఎంతో ఆనందంగా, తృప్తిగా, గర్వంగా ఉంటుంది. కానీ వీళ్ళంతా చదువు మానేసి చేయగలిగింది లేదని, చదవటమే మంచిదనీ చెప్తుంటే శారదకు నమ్మబుద్ధి కావటం లేదు.

నిరుత్సాహంతో, నిరాశతో వాడిన శారద ముఖం చూసి జాలి వేసింది హరిగారికి. కానీ శారద చదువు మానేసి చేసే పని కంటే డాక్టర్‌ కావటమే ఎక్కువ ప్రయోజనమని ఆయనకూ అనిపించింది.

‘‘నువ్వు విద్యావంతురాలిగా, మనుషుల ప్రాణాలు కాపాడగలిగే డాక్టర్‌గా ఆదర్శంగా నిబడాలమ్మా. నిన్ను చూసి ఎందరో ఆడపిల్లలు డాక్టర్లు కావాలి. ఆడపిల్లల  తల్లిదండ్రులు నిన్ను చూసి వాళ్ళ పిల్లలకు పెళ్ళి చేయటం కాకుండా చదివించటం మంచిదనుకోవాలి. ఆడవాళ్ళు విద్యావంతులైతే దేశానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. నీ ఆవేశం తాత్కాలికం. నీ ఆదర్శం శాశ్వతం. నా మాట నమ్ము తల్లీ’’.

శారదను బుజ్జగిస్తూ, కన్నీరు తుడుస్తూ ప్రేమగా హరిగారు చెబుతున్న మాటల్లో నిజముందని అనిపిస్తున్నా, వాటిని అంగీకరించటానికి శారద మనసు సుతరామూ అంగీకరించటం లేదు.

olga title

రామారావు కూడా అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పాడు. చివరకు ప్రకాశం పంతులు గారు కూడా ‘‘దేశ సేవకు ఇంకా సమయం ఉంది. నీకింకా మైనారిటీ కూడా వెళ్ళలేదు. పదిహేనేళ్ళు దాటకుండా నువ్వు చెయ్యగలిగిన పనులు  చాలా పరిమితం. కనీసం ఇంటర్‌ చదువు పూర్తిచెయ్యి. తర్వాత నేను నిన్ను నాతోపాటు తీసుకెళ్తాను’’ అని చెప్పారు.

కళాశాలలో దరాఖాస్తు చేయటానికి చివరి రోజున శారద ఎర్రగా ఉబ్బిన కళ్ళతో వెళ్ళి కాగితాలు  ఇచ్చి వచ్చింది. కళాశాల తెరిచిన రోజున బలవంతంగా వెళ్ళినట్టు వెళ్ళింది.

నెలలు గడిచి పోతున్నాయి. ఉద్యమంలోకి ప్రజలు వరదలా వచ్చిపడుతున్నారు. అన్నపూర్ణ, అబ్బయ్యతో కలిసి గుంటూర్లో కాపురం పెట్టింది. వారికి ఇరు కుటుంబాల వారూ ఆర్థికంగా అండగా నిబడ్డారు. ఉన్నవ లక్ష్మీనారాయణగారితో కలిసి పన్నుల నిరాకరణోద్యమంలో పని చేస్తున్నామని అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదివిన రోజు శారద పుస్తకం ముట్టుకోలేదు. అన్నం తినలేదు. తనుకూడా అన్నపూర్ణతో కలిసి గుంటూర్లో ఉండాని ఆ పిల్ల  మనసు కొట్టుకుంది. రామారావు కూతురి పరిస్థితి గమనించి అనేక విధాలుగా  నచ్చచెప్పాడు. రెండిరటికీ చెడవద్దని మొదటిసారి కూతురితో తీవ్రస్వరంతో మాట్లాడి కన్నీళ్ళు పెట్టుకున్న రామారావుని చూసి సుబ్బమ్మ కూడా శారదను కోప్పడింది.

తల్లిదండ్రుల బాధ చూసి శారద మనసును స్థిరంగా చదువు మీదే నిలపాలని నిర్ణయం తీసుకుంది. రెండేళ్ళపాటు ఊగిసలాటలో పడకూడదని స్నేహితురాలి అనుభవాలు  పంచుకోవటంతో తృప్తిపడాలని గట్టిగా అనుకుంది.

పత్రికలో పెదనందిపాడులో జరిగిన మిలటరీ మార్చ్‌ గురించి, పోలీసులు రైతులను పెట్టిన హింస గురించి, వస్తున్నవార్తలు  తనను ఉద్రిక్త పరుస్తున్నా నివరించుకుంటోంది. అబ్బయ్యకు కూడా లాఠీఛార్జిలో దెబ్బలు  తగిలాయని, ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడనీ, నయమయిందనీ అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదివి కన్నీరు కార్చింది. రోజులు  ఎంత వేగంగా గడిచి పోతున్నాయంటే శారద మొదటి సంవత్సరం పరీక్షు రాసి శలవల్లో చదవవలసిన ఇతర పుస్తకాల జాబితా తయారుచేయటం మొదుపెట్టింది. రామారావుగారికి ఆరోగ్యం బాగుండటం లేదు. శలవల్లో తండ్రి చెబుతుంటే తను రాసిపెడతానని చెప్పింది. ఆయన ఆనందంగా ఒప్పుకున్నాడు. కానీ ఆయన ఇంట్లో ఉండే రోజులే తక్కువ. సభలు, సమావేశాలని ఆంధ్రదేశమంతా చేసే పర్యటనలే ఎక్కువ.

శారద తండ్రి పుస్తకాలు సర్దుతూ ఉంది ఆ రోజు. ఆయన చదువుతున్న పుస్తకాలు, చేయవలసిన పని అర్థమవుతున్న కొద్దీ శారదకు ఆయన మీద గౌరవం పెరుగుతోంది. తన తండ్రి కేవలం తనకు తండ్రి మాత్రమే కాదనీ, ఆంధ్రదేశపు చరిత్ర నిర్మించే ప్రముఖ వ్యక్తని తోస్తున్న కొద్దీ శారద తండ్రిని తన కోరికలు  తీర్చే మనిషిగా కాక వేరుగా గుర్తించటం మొదలుపెట్టింది. తండ్రి గురించిన ఆలోచనలతో ఆయన పుస్తకాలతో ఉన్న శారదకు హాల్లో ఎవరివో మాటలు, నవ్వులూ వినిపించాయి. సుబ్బమ్మ ఎవరినో ‘‘ఎన్నాళ్ళకు కనపడ్డావమ్మా! రా! రా!’’ అంటూ ఆహ్వానించటం విని ‘ఎవరొచ్చారా’ అనుకుంది. అవతలి వ్యక్తి నవ్వూ, సమాధానమూ వినగానే ఒక్క పరుగున హాల్లోకి వచ్చి అన్నపూర్ణను కావలించుకుంది.

‘‘ఎప్పుడొచ్చావు? ఎలా వచ్చావు?’’ అని పక్కకు చూస్తే అబ్బయ్య కూడా ఉన్నాడు. శారద సంతోషానికి మితిలేకుండా పోయింది. వారిద్దరినీ కుశల ప్రశ్నతో ముంచెత్తింది.

అతిథులెవరు ఎప్పుడు ఆ ఇంటికి వచ్చినా ఆ ఇంట్లో ఎవరూ చెప్పకుండానే అన్ని మర్యాదలూ  జరిగిపోయే ఏర్పాట్లున్నాయి. ఐనా అన్నపూర్ణ, అబ్బయ్యు స్నానాలు ముగించి, ఫలహారాు చేసే వరకూ శారద నిలిచిన చోట నిలవకుండా హడావుడి పడింది.

అంతా విశ్రాంతిగా కూర్చోగానే ‘‘చెప్పండి. సత్యాగ్రహం ఎలా నడుస్తోంది? పన్నుల నిరాకరణ గురించి ఇవాళ మీరు నాకు అన్ని వివరాలు చెప్పాలి.’’

అబ్బయ్య, అన్నపూర్ణ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. శారద చెప్పమన్నట్లు చూస్తుంటే `

‘‘అయిపోయింది శారదా. ముగించేస్తున్నారు’’ అంది అన్నపూర్ణ నిరుత్సాహంగా.

‘‘అదేంటి. ముగించటం ఏంటి?’’

‘‘రైతులు ప్రభుత్వాన్ని ఎదిరించారు. పన్ను చెల్లించేది లేదని గట్టిగా నిలబడ్డారు. ఐతే బ్రిటీష్‌ ప్రభుత్వం ఎంత హింసించింది వాళ్ళని . రైతుల కుటుంబాలు  ఎన్నాళ్ళని ఈ హింసలు  పడతారు. కొందరు రైతుల్ని కాల్చేశారు తెలుసుగా ? ఈ ఒక్క ప్రాంతంలో జరిగితే ప్రయోజనం ఏముంది? ఈ ప్రేరణతో దేశమంతా అన్ని వర్గాల వాళ్ళూ పన్ను కట్టకుండా ఉంటే అపుడే ప్రభుత్వం భయపడుతుందేమో ? ఇపుడది ప్రజల్ని భయపెడుతోంది. ఇలా ఎంత కాలం? అసలు గాంధీగారు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టనే వద్దన్నారట. ఇక్కడ మనవాళ్ళు చేయలగమని మొదలుపెట్టారు. సరే మొదలు పెట్టినందుకు నాలుగు నెలలు ప్రజలు  ఎంతో ధైర్యంగా నిలబడ్డారు. ప్రభుత్వం హింసకు దిగింది. ఇక దీనికి అంతం ఏమిటి? ఇంకే ప్రాంతంలోనూ ఇలాంటి ఉద్యమం రాలేదు. ఒక్కచోట ప్రజలు ఎంతకాలమని చేస్తారు. అందుకని విరమించేస్తున్నారు. రేపో, మాపో ప్రకటన వస్తుంది. ప్రకాశంగారు వచ్చి ఉన్నవవారితో, వెంకటప్పయ్య గారితో మాట్లాడారు. అంతా నిశ్చయం అయింది’’.

అబ్బయ్య చెబుతుంటే శారద నివ్వెరపోయి విన్నది.

‘‘ప్రజల త్యాగాలు వృథా కావాల్సిందేనా? నాలుగు నెలల్లో ఏం సాధించాం?’’ ఆవేశపడింది.

‘‘లేదు శారద గారూ, ప్రజలకు తమ మీద ఎంత కోపం ఉందో, ఎలా తిరగబడగలరో ప్రభుత్వానికి తెలిసింది. ప్రభుత్వం ఎంత క్రూరమైందో ప్రజలకీతెలిసింది. దీనిని కొనసాగించటం కష్టం. స్వరాజ్యం వచ్చేంత వరకూ పన్ను చెల్లించకుండా ప్రభుత్వానికి ఎదురుతిరిగి నిలబడటం చాలా కష్టం. ఒక్క ప్రాంతంవల్ల  ప్రయోజనం లేదు. మిగతా ప్రాంతాల్లో ఈ అగ్ని రాజుకోలేదు.’’

అబ్బయ్య, అన్నపూర్ణ ఉద్యమం గురించి చాలాసేపు మాట్లాడారు. చివరికి అబ్బయ్య అన్నాడు.

‘‘నేను మళ్ళీ కాలేజీలో చేరి పరీక్షలు రాద్దామనుకుంటున్నాను. కాలేజీవాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఇప్పుడే మాట్లాడి కాలేజీలు తెరిచే సమయానికి రావాలని అనుకున్నాం. అవసరమైతే మీ నాన్నగారి సాయం తీసుకుందామని వచ్చాం’’. అబ్బయ్య మాటలు శారదను అయోమయంలో పడేశాయి.

‘‘మళ్ళీ కాలేజీలో చేరతారా?’’

‘‘దేశానికి చదువుకున్న వాళ్ళు, ఏదో ఒక రంగంలోన నిష్ణాతులైనవాళ్ళూ అవసరమేననిపిస్తోంది. ఈ చివరి పరీక్ష రాస్తే ఎమ్మెస్సీ పట్టా చేతికొస్తుంది. ఏ కాలేజీలోనైనా ఉద్యోగం చేస్తూ విద్యార్థులలో జాతీయ భావాలు వ్యాపింపజేయవచ్చు’’

శారద మరేం మాట్లాడలేకపోయింది. అబ్బయ్య భోజనం చేసి కాలేజీకి వెళ్ళి స్నేహితులను కలుసుకుని వస్తానని వెళ్ళాడు.

అన్నపూర్ణ, శారద అంతు లేకుండా కబుర్లు చెప్పుకున్నారు.

ఆ రాత్రి రామారావు వచ్చాక అబ్బయ్య సంగతి తెలుసుకుని తను చేయగలిగిన సహాయం చేస్తానన్నాడు. మర్నాడే వెళ్ళి కొందరు ప్రొఫెసర్లను కలిసేందుకు నిర్ణయించుకున్నారు. అబ్బయ్య మళ్ళీ చదువుతాననేసరికి రామారావుకి కొండంత బలం వచ్చింది. ‘‘శారదను బలవంతంగా కాలేజీలో చేర్పించానా? తన గురించి శారద ఏమనుకుంటుంది? తనామె స్వాతంత్రాన్ని హరించాడా’’ అనే సందేహాలు రామారావుని అపుడపుడు బాధిస్తూ ఉండేవి.ఇపుడు అబ్బయ్య రాకతో ఆ సందేహాలు కాస్త ఉపశమించాయి. చదువుకోవటం అవసరమని శారద గ్రహిస్తుందనే కొత్త ధైర్యం వచ్చింది. అబ్బయ్యను అతి కష్టం మీద మళ్ళీ కాలేజీలో చేర్పించారు. ఆ పది రోజు శారదకు పది క్షణాల్లా గడిచాయి. అన్నపూర్ణకు మద్రాసంతా చూపించారు అబ్బయ్య శారదా కలిసి.

అబ్బయ్య ఉద్యమం గురించి నాయకుల గురించి ఎన్నో సంగతులు చెప్పాడు. నాయకులలో విభేదాలు, వారి అహంకారాలు, తీరుతెన్నులు, పంతాలు, పట్టింపులు,  వాటికోసం ఉద్యమానికి నష్టం కలిగినా పట్టించుకోని తత్త్వం, లేనట్టు కనిపిస్తూనే ఉన్న కులతత్త్వం అన్నిటి గురించీ అబ్బయ్య చెప్తుంటే శారదకు కొత్త ప్రపంచమొకటి పరిచయమైనట్లు అనిపించింది.

‘‘చాలా కష్టం రాజకీయాలో నెగ్గుకురావటం. నాలాంటివాడికి అవి సరిపడవని అర్థమైంది. నేను ప్రత్యక్షంగా దిగి పని చేయలేను. నాకు చేతనైన పని నేనూ విడిగా చేస్తా’’.

‘‘కానీ మరి ఎలా? అందరూ మీలా అనుకుంటే ` ’’

‘‘అనుకోరు. నాయకులు అనుకోరు. వారి అనుచరులు వారికుంటారు. నేను ఎవరికీ అనుచరుడిగా ఉండలేను. నా చేతనైన పనేదో నేను చేసుకుపోతాను. అంతే ` ’’

అబ్బయ్య మాటలు శారదను ఆలోచనలో పడేశాయి. తను ప్రత్యక్షంగా పాల్గొంటే తప్ప తెలియదనుకుంది శారద.

ఈసారి కాలేజీ తెరిచేసరికి శారద మనసు పూర్తిగా చదువుమీద లగ్నం అయింది. దేశ వాతావరణం కూడా తాత్కాలికంగా చల్లబడింది.

శారద ఇంటర్‌ పూర్తి చేస్తుండగా రామారావు జబ్బుపడ్డాడు. ఆయన చేసే పనికి ఆయనకున్న ఓపికకు పొంతన లేకుండా పోయింది. అది నేరుగా గుండె మీద పని చేసింది. ఆరోగ్యం పాడవుతున్నదని తెలిశాక రామారావు తన పనులను మరింత పెంచుకున్నాడు. తనకున్న సమయం అతి తక్కువని ఆయనకు అర్థమైంది. దాంతో ఆ తక్కువ సమయాన్ని పరిశోధన కోసం ఖర్చు చెయ్యటం అత్యవసరమనుకున్నాడు. చివరికో రోజు మంచంలోంచి లేవలేని పరిస్థితి వచ్చింది.

సుబ్బమ్మకు అంతకుముందు నుంచే అనుమానంగా ఉంది. ఆ రోజు రూఢీ అయింది. శారద ఆ రోజు చాలా కంగారు పడింది. మద్రాసులో పేరున్న వైద్యులందరూ వచ్చారు. అందరు చెప్పిందీ ఒకటే మాట. ఆయన చేస్తున్న పనులన్నీ మానేసి విశ్రాంతిగా కనీసం ఆరునెలలు గడపాలి. తర్వాతనే మందుల పని. విశ్రాంతే ఆయనకు మందు. విపరీతంగా అలసిపోయాడు. శారద తండ్రిని కదలనీయకుండా, చదవనీయకుండా రాయకుండా చూస్తానని అందరితో చెప్పింది. అది కష్టమైనపని అని కూడా శారద అనుకోలేదు.

కానీ ఒక్కరోజు మాత్రమే శారద ఆ పని చేయగలిగింది. రెండోరోజు రాత్రి పన్నెండు గంటలకు తండ్రిని ఒకసారి చూద్దామనిఆయన గదిలోకి వెళ్ళిన శారద నిర్ఘాంతపోయింది. ఆయన మంచం నిండా పుస్తకాలు. మంచం మీద దిండు, గట్టి అట్ట ఒళ్ళో పెట్టుకుని ఆయన రాసుకుంటున్నాడు. శారదకు కోపం వచ్చింది ఏం మాట్లాడకుండా వెళ్ళి మంచంనిండా పరిచి ఉన్న పుస్తకాలు తీయటం మొదలుపెట్టింది. రామారావు అది కూడా గమనించనంతగా పనిలో నిమగ్నమయ్యాడు. అన్ని పుస్తకాలు  తీసేసి చివరికి తండ్రి చేతిలో కలం తీసుకుంటున్నపుడు ఆయన స్పృహలోకి వచ్చాడు. అంత రాత్రివేళ శారద నిద్రపోకుండా తన గదిలోకి వచ్చినందుకు ఆయనకు కోపం వచ్చింది.

శారద ముఖం చూస్తే ఆమెకూ కోపంగానే ఉన్నట్టుంది. అందుకే శారద ఒళ్ళోనుంచి అట్ట తీసి పక్కనబెట్టి, దిండు తల దగ్గర వేసి, రెండు భుజాల మీదా చేతులు వేసి ఆయనను పడుకోబెడుతుంటే మాట్లాడకుండా పడుకున్నాడు. ఓ గంట తండ్రి పక్కనే కూచుని ఆయన నిద్రపోయాడని నమ్మి శారద వెళ్ళి పడుకుంది.

శారద వెళ్ళి పడుకుందని నమ్మకం కలగగానే ఆయన దొంగతనం చేసే వాడిలా వెళ్ళి దీపం వెలిగించుకుని పుస్తకాలు, కాగితాలు, కలం అన్నీ తీసుకుని రాసుకునే బల్ల  దగ్గరకు నడిచాడు.

మర్నాడు శారద ఉదయాన్నే తండ్రికి కాఫీ తీసుకొచ్చేసరికి తండ్రి బల్లమీద ఒంగి చదువుతూ ఉన్నాడు. రాత్రంతా ఆయనలాగే కూచున్నాడని శారదకు అర్థమైంది.

కాపీకప్పు బల్ల మీద పెట్టి శారద పెద్దగా ఏడ్చేసింది. రామారావు బిత్తర పోయి లేచాడు.

‘‘శారదా ! ఏమైందమ్మా’’ అని శారదను పట్టుకున్నాడు.

‘‘నాన్నా !నువ్వు లేకుండా నేను బతకలేను. నా కోసం నువ్వు క్షేమంగా ఉండాలి నాన్నా’’ అని వెక్కిళ్ళు పెట్టింది శారద.

‘‘నాకేమయిందమ్మా? బాగానే ఉన్నా’’

‘‘డాక్టర్లందరూ నిన్ను విశ్రాంతిగా ఉండమన్నారు. నువ్వేమో రాత్రింబగళ్ళూ పనిచేస్తున్నావు’’.

‘‘శారదా ` నీతో నేనెప్పుడు అబద్ధం ఆడలేదమ్మా. ఇప్పుడూ ఆడను. చదవకుండా, రాసుకోకుండా నేనుండలేను. మంచం మీద పడుకుంటే నిద్రరాదు. తలనిండా ఆలోచలను. నేను పరిష్కరించాల్సిన శాసనాలు  ఉన్నాయి. అధ్యయనం చెయ్యాల్సిన చరిత్ర ఉంది. అదంతా చేస్తూ రాయవలసిందెంతో ఉంది. అదంతా మానేసి మంచంలో కళ్ళు మూసుకుపడుకోవటం నావల్ల కాదమ్మా’’.

శారదకు తనముందున్నదెంత పెద్ద సమస్యో అర్థమై కాళ్ళూ చేతులు ఒణికాయి.

‘‘నాన్నా నీకేదయినా అయితే నేను తట్టుకోలేను’’.

‘‘నాకేం కాదమ్మా’’ బలహీనంగా పలికిన ఆయన గొంతుమీద ఆయనకే నమ్మకం కలగలేదు.

‘‘నా మాట వినక తప్పదు’’ అని తండ్రిని అక్కడి నుంచి లేపి స్నానాదులు అయ్యాక తనే దగ్గర కూచుని ఈ మాటా, ఆ మాటా చెప్తూ ఉంది. కళాశాలకు శలవవటంతో నాలుగు రోజు ఆయనను అంటిపెట్టుకుని ఉండి ఆయనను పుస్తకాల బారినుంచి రక్షించింది.

ఐతే శారదకు పరీక్షలు తరుముకొస్తున్నాయి. ఆమె చదువుకుంటూ తల్లికి ఈ బాధ్యత అప్పగించక తప్పలేదు.

శారద పరీక్షలు మొదలవకముందే రామారావు పరిస్థితి క్షీణించింది. వైద్యులు ఆయనను మద్రాసు నుంచి ఇంకెక్కడికైనా, పుస్తకాలు బొత్తిగా దొరకని చోటికి, పంపిస్తే తప్ప పరిస్థితి చక్కబడదన్నారు.

రామారావు తానెక్కడికీ వెళ్ళనన్నాడు గానీ శారద ఊరుకోలేదు. తండ్రిని తీసుకుని స్వంత ఊరు వెళ్ళటానికి ఏర్పాట్లు చేయటంలో పడింది.

ఆ రోజు రాత్రి సుబ్బమ్మ శారద దగ్గరకు వచ్చింది. రామారావు అనారోగ్యం పెరుగుతున్నకొద్దీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోడం ఎందుకో తగ్గిపోయింది. ఒకరిని చూడటానికి ఒకరు భయపడుతున్నట్లుగా ఉన్నారు.

తల్లి తన దగ్గరకు రావటంతో శారద తల్లికి ధైర్యం చెప్పాలనుకుంది.

‘‘అమ్మా నువ్వేం భయపడకు. నాన్నకు తగ్గిపోతుంది.’’

సుబ్బమ్మ ఆ మాటలు విననట్టుగా ‘‘మీ నాయనమ్మకు వెంటనే ఉత్తరం రాయి. ఉన్న విషయం ఉన్నట్టుగా రాయి’’ అంది.

శారద నోటమాట రాలేదు.

‘‘మీ నాయనమ్మ కాశీనుంచి రావాలనుకుంటే తగిన సమయం ఇవ్వాలి గదా శారదా ` తీరా ఆవిడ’’ అంటూ కొంగు నోట్లో కుక్కుకుంది. శారదకు ఆ మాట సారాంశం అర్థమయ్యేసరికి తల తిరిగిపోయింది. తండ్రిని రక్షించుకోగలననే ఆలోచన తప్ప ఆయనకేమైనా అవుతుందనే ఊహ లేదు శారదకు.

‘‘నువ్వు వెంటనే ఉత్తరం రాయి. లేదా టెలిగ్రామో ఏదో అంటారుగా అదైనా ఇవ్వు ` మీ నాన్న జబ్బు ఆవిడకు తెలియాలి’’.

స్థిరంగా చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది.

శారద రాత్రంతా అలాగే కూచుని ఉంది. ఆ అమ్మాయి మెదడులో ఏ ఆలోచనా లేదు. అంతా శూన్యం.

తెల్లవారిన తర్వాత ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్లు పనులు చేసుకుని టెలిగ్రాం ఇవ్వటానికి వెళ్ళింది.

నరసమ్మ కాశీ వెళ్ళిన కొత్తలో ఉత్తరాలు ఎక్కువగానే రెండువైపు నుంచీ నడిచేవి. రెండు మూడేళ్ళలో అవి క్రమంగా తగ్గాయి. క్షేమంగా ఉన్నానంటూ క్లుప్తంగా ఒక కార్డు మాత్రం వచ్చేది. రామారావు గారు క్రమం తప్పకుండా తల్లికి కావలసిన డబ్బు పంపుతుండేవాడు. మధ్యలో ఒకరిద్దరు స్నేహితులు కాశీ వెళ్ళొచ్చినవాళ్ళు నరసమ్మను చూశామనీ, ఆవిడ పూర్తిగా కాశీ మనిషై పోయిందనీ చెప్పేవాళ్ళు. గంగా స్నానం, ఈశ్వర దర్శనం, పురాణ పఠనం ఇవి తప్ప ఆవిడకు మరో ధ్యాస లేదనీ, అక్కడ తెలుగు  వాళ్ళందరికీ మంచీ చెడ్డా చెబుతుంటుదనీ, ఆవిడ చాలా ఆనందంగా ఉందనీ, ముఖంలో తేజస్సు పెరిగిందని, రుషిలాగా ఉంది గానీ మామూలు మనిషిలా లేదని చెప్పారు. సుబ్బమ్మ ఆశ్చర్యంగా వినేది.

‘‘అత్తయ్య మనందరికీ దూరంగా అంత ఆనందంగా ఎలా ఉన్నార’’ని రామారావు నడిగేది.

‘‘మనస్సు ఒకే విషయం మీద లగ్నమైనపుడు, ఇతర విషయాలు అంటనపుడు, ఆ లగ్నమైన విషయం మీద చేసే పనికి  ఆటంకం రానపుడు మనుషులకు ఆనందం కుగుతుంది. అదృష్టవశాత్తు మా అమ్మకు పరమేశ్వరుడి మీద మనసు అంత ఏకాగ్రతతో లగ్నమైనట్లుంది. చీకూ చింతా లేకుండా బతుకుతోంది. ఆవిడా అదృష్టవంతురాు. మనమూ అదృష్టవంతులం’’ అనేవాడు.

ఎక్కడున్నా ఆవిడ హాయిగా ఆరోగ్యంగా ఉందని బంధువులందరూ కూడా అదో విశేషంగా చెప్పుకునేవారు. తన చదువు కారణంగా నాయనమ్మ అంత దూరాన ఒంటరిగా ఉంటుందనే దిగులు శారదకు లేకుండా సుబ్బమ్మ, రామారావు శారదతో నాయనమ్మ గురించి ఎన్నో సంగతులు చెప్పేవారు.

ఇపుడు ఈ వార్త విని నాయనమ్మ తట్టుకుంటుందా? వస్తుందా? రాకుండా అక్కడే బాధపడుతూ ఎలా ఉంటుంది?

నాయనమ్మకిలా టెలిగ్రాం ఇచ్చామని నాన్నకు చెప్పవచ్చా ? అసలు నాన్న ఆరోగ్యం ఎందుకింత పాడయింది?

ఎన్నో సందేహాలు?

మధ్యాహ్నం ‘‘అందరం కలిసి భోజనం చేద్దా’’ మన్నాడు రామారావు.

ముగ్గురూ కలిసి తింటున్నారు గానీ ఎవరికీ ముద్ద గొంతు దిగటం లేదు.

‘‘మన ఇల్లు  బాగు చేయించారట నాన్నా. ఎల్లుండి  మనం బయుదేరుతున్నాం’’ అంది శారద.

‘‘మనం బయలు దేరటమేమిటి? నన్ను గదా డాక్టర్లు వెళ్ళమన్నది’’ అన్నాడు రామారావు.

‘‘మీరొక్కరూ వెళ్ళి ఏం చేస్తారు?’’

‘‘ఊ ` నువ్వొచ్చి నాకు ఒండి పెడుతూ ఉంటే ఇక్కడ శారద పరీక్షలు ఎలా రాస్తుందనుకున్నావు? తన సంగతి ఎవరు చూస్తారు?’’

‘‘నేనీ సంవత్సరం పరీక్షలు  రాయను నాన్నా. వచ్చే సంవత్సరం రాస్తాను’’.

‘‘ఆ మాట వింటుంటేనే నా జబ్బు పెరిగిపోతోంది. నువ్వు పరీక్షలు  మానేసి నా పక్కన కూచుంటే నాకు నయమవుతుందనుకుంటున్నావా? చాలా అధ్వాన్నమవుతుంది నా పరిస్థితి’’.

‘‘మరి ఒక్కడివే ` ఎలా’’

‘‘మన ఊరమ్మా అది .  ఎంతమందో ఉన్నారు. పైగా మన సోమేశ్వర రావు తెలుసు గదా ` ఆయన నాతోవస్తానన్నాడు. ఇద్దరం వెళ్ళి నాకు కాస్త నెమ్మదించగానే తిరిగి వస్తాం. నా మంచి చెడ్డా అన్నీ చూసుకోగలడు. మీఅమ్మకంటే వంట బాగా చేస్తాడు. నేను అంతా మాట్లాడాను ` ’’

తల్లీ కూతుళ్ళ ముఖాల్లో నెత్తురు చుక్క లేదు. రామారావు గారు నెమ్మదిగా చెబుతాడుగాని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దానినుంచి ఆయనను ఎవరూ మళ్ళించలేరని వాళ్ళకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు.

‘‘నేను బయల్దేరి వెళ్ళేప్పుడు మీరిద్దరూ కంటతడి పెట్టుకుంటే నేనక్కడ నిశ్చింతగా ఉండలేను. శారద ! నీకు పరీక్షల్లో మంచి మార్కు రావటం, మెడికల్‌ కాలేజీలో సీటు రావటం ఇవి నా ఆరోగ్యాన్ని చక్కబరుస్తాయని నీకు తెలుసు. అది జరగకపోతే నా ఆరోగ్యం బాగుపడదని చెప్పక్కర్లేదుగా. నా సంగతి నాకు ఒదిలి నువ్వు నిశ్చితంగా చదివి పరీక్షలు రాయి. నిన్ను మెడికల్‌ కాలేజీలో చేర్చటానికి నేను ఆరోగ్యంగా తిరిగి వస్తా’’.

రామారావు మాటలు భరించలేక సుబ్బమ్మ అక్కడినుంచి వెళ్ళిపోయింది. శారద దు:ఖాన్ని నిగ్రహించుకుంటూ అక్కడే తలదించుకు కూచుంది. మర్నాడు రామారావు గారు మద్రాసు నుంచి రెండు మూడు నెలల కోసం స్వగ్రామం వెళ్తున్నారని తెలిసి నుగురైదుగురు మిత్రులు  వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళతో ఉత్సాహంగా తన పరిశోధన గురించి మాట్లాడుతున్న తండ్రిని చూసి శారదకు ధైర్యం వచ్చింది.

ధైర్యంగానే తండ్రిని రైలెక్కించి వచ్చి చదువులో మునిగింది.

సుబ్బమ్మ కూతురికి అన్నీ అమరుస్తుందే గాని లోలోపల కుంగిపోతోంది. అది శారద గమనించకుండా జాగ్రత్త పడుతోంది .

నరసమ్మ కాశీ నుంచి ఉత్తరం రాసింది. రామారావు ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతూ, తాను కాశీ ఒదిలి ఎన్నటికీ రాలేననీ, తన బంధాలను  విముక్తం చేసుకునే క్రమంలో ఉన్నాననీ, ఏ బంధాలు  తనను గంగమ్మ నుండి విడదీయలేవనీ, తనను అర్థం చేసుకోమనీ రాసింది.

ఆ ఉత్తరం వచ్చిన రోజంతా సుబ్బమ్మ ఏడుస్తూనే ఉంది.

శారద చదువు అంత ముఖ్యమా అని మొదటిసారిగా అనిపించిందామెకు.

తల్లీ కొడుకు దూరమయ్యారు. తనకు అత్తగారి అండ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ చదువు మూలంగానే తను భర్తకు సేవ చేయకుండా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కూతురంటే ప్రాణమిచ్చే తండ్రికి జబ్బుచేస్తే పక్కన లేకుండా ఆ కూతురు చదివి ఉద్ధరించాల్సిందేమిటి? ఎవర్ని? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానమా అన్నట్లు రామారావు గ్రామం చేరుకోగానే ఒక ఉత్తరం రాశాడు.

ప్రియమైన సుబ్బమ్మకు `

నేను క్షేమంగా చేరాను. సోమేశ్వరరావు ప్రయాణంలో నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇక్కడ నాకు విశ్రాంతి దొరుకుతుందని వైద్యులు అనుకున్నారు. విశ్రాంతి వ్ల నా ఆరోగ్యం కుదుటపడవచ్చని అనుకున్నారు. కానీ రెండూ నిజాలు  కావు. నాకు విశ్రాంతి కావసింది శరీరానికి కాదు. మనసుకి. సరిగ్గా చెప్పాంటే మెదడుకి. అది అసంభవం. నిరంతరం నా మెదడు ఆలోచిస్తూనే వుంది. చరిత్ర గురించి తేలవసిన విషయాలు  ఎన్నో ఉన్నాయి. జాతికి చరిత్ర అవసరం. చరిత్ర లేని జాతి ముందుకు పోలేదు. మనకు చరిత్ర ఘనమైనది ఉండికూడా చరిత్రహీనుల్లా బ్రతకవలసి రావటం ఎంత దురదృష్టమో, అది నన్ను ఎంత బాధిస్తున్నదో నీకు అర్థంకాదు. ఆ చరిత్రను నిర్మించాలంటే ఎన్నో చిక్కు ప్రశ్నలు . ఆధారాలకోసం కీకారణ్యంలో గుప్తనిధులకోసం ఒంటరిగా వెతుకుతున్న వాడి చందంగా ఉంది నా పరిస్థితి. పరిష్కరించవసిన విషయాల నుంచి మనసుకి విశ్రాంతి దొరకటం లేదు. దానికోసం చదవవలసినవి చదవకుండా రాయవలసినవి రాయకుండా నేను జీవించలేను. ఆ పని చేస్తే నాకు నేను జీవించనని వైద్యులు చెబుతున్నారు. సత్యమేమిటంటే నేను ఎక్కువ రోజులు జీవించబోవటం లేదు. దీనిని నువ్వు జీర్ణించుకోవాలి.

ఈ ఉత్తరం చదివి నువ్వు బలహీనురాలివి కాకూడదు. బలాన్ని పొందాలి. ఎందుకంటే మనిద్దరి ప్రాణాలు మన శారదాంబ మీద పెట్టుకుని ఉన్నాం. నా ప్రాణాలు  పోతే శారదాంబకు ఎలాంటి లోటూ కలగకూడదు. శారదకు నా మరణం అశనిపాతంలా తగులుతుంది. మన అమ్మాయిని దానినుంచి రక్షించుకోవలసింది నువ్వే. అందుకు నువ్వు నీ సర్వశక్తులతో సిద్ధం కావాలి. అమ్మాయి చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. అమ్మాయి డాక్టర్‌ కావాలి. అది నాకు చరిత్ర రచనతో సమానమైన కోరిక అని నీకు తెలుసు. ఆ భారం, బాధ్యత నీవు ఒక్కదానివే వహించవలసి ఉంటుంది. నేను నీమీద ఇంత బరువు మోపి వెళ్ళటం అన్యాయమని నాకూ తెలుసు. కానీ నాకు వేరు గత్యంతరం లేదు. నాకు వచ్చిన జబ్బు ప్రాణాలు  తీసేదే గాని, ఆశను మిగిల్చేది కాదు.

నా మరణాన్ని శారద ఎట్లా తట్టుకుంటుందనే చింతే ప్రస్తుతం నా జబ్బు కంటే ఎక్కువ నన్ను బాధిస్తుంది. శారదకేం ఫరవాలేదు నేనున్నానని నీవు హామి ఇవ్వాలి. ఇది కఠినత్వమే. కానీ జీవించే రోజు తక్కువ ఉన్న మనిషికి కఠినత్వం కవచంలా రక్షణ ఇస్తుంది. ఆ కవచం ధరించే నేనీ ఉత్తరం రాస్తున్నాను. నన్ను క్షమించు, క్షమించకపో, అది నీ ఇష్టానికి, విచక్షణకు వదిలివేస్తున్నాను. కానీ శారదను స్వేచ్ఛగా ఏ లోటూ లేకుండా పెరగనివ్వు. మంచి డాక్టర్‌ కావాలి నా తల్లి. ఆధునిక మహిళ కావాలి నా కూతురు. ఈ దేశం గర్వించాలి మన అమ్మాయిని చూసి. చరిత్ర నిర్మించాలి నా చిట్టితల్లి. నాలా చరిత్ర రాయటం కాదు చరిత్ర నిర్మించాలి. అర్థమైందా? ఎంత పెద్ద ఆశతో జ్వలిస్తున్నదో నా ప్రాణం. సుబ్బూ ` ఇదంతా నీ వల్లే అవుతుంది. మన అమ్మాయి తెలివి, శక్తియుక్తులు మనకు తెలియనవి కావు. తప్పకుండా నా ఆశలన్నీ ఫలిస్తాయి.

ఇక్కడ ఎన్నిరోజు ప్రాప్తముంటే అన్ని రోజులుంటాను. శారద పరీక్షలయ్యాక మీరిద్దరూ కలిసి రండి.

నీవనుకుంటూ ఉండి ఉంటావు. శారద పరీక్షలు అంత ముఖ్యమా అని ? నువ్వనుకుంటున్నదానికంటే ముఖ్యం నాకు. శారద పరీక్షలు  మాని నా దగ్గర కూర్చుంటే నా అశాంతి, అనారోగ్యం పెరుగుతాయ్‌ కాని తరగవు. ఇంక రాయలేకపోతున్నాను. నేను రాయనివి, రాయలేనివి కూడా నీవు గ్రహించగవు.

నీ ప్రియమైన

రామారావు.

ఈ ఉత్తరం చదివి సుబ్బమ్మ గుండె రాయి చేసుకుంది. జరిగేది తొస్తూనే ఉంది జరగవసింది చూడాలి. అది కష్టమైనా సరే పళ్ళ బిగువున భరించాలి. శారద పరీక్షలు  అయ్యేంతవరకూ తన ముఖంలో బాధ కనపడకూడదు. తన కంట్లో కన్నీరు ఊరకూడదు.

ఒక కఠోర తపస్సులా ఆ రెండూ చేసింది సుబ్బమ్మ.

శారదకు తండ్రి క్షేమంగా ఉన్నానని ఉత్తరాలు  రాస్తున్నాడు. రెండు నెలలు  సుబ్బమ్మకు రెండేళ్ళలా గడిచాయి. శారద పరీక్షలు  ముగిశాయి. ఊరికి ప్రయాణమవుతున్నారు తల్లీ కూతుళ్ళు.

రామారావు మరి లేడనే వార్త ఆంధ్రదేశమంతా దావానలంలా  వ్యాపించింది. శారదకు స్పృహ తప్పింది. సుబ్బమ్మ కూతురిని గురించి అన్ని జాగ్రత్తలూ  తీసుకుంటూ ఊరికి వెళ్ళి భర్త అంత్యక్రియలన్నీ బంధువులు,  స్నేహితుల  సహాయంతో జరిపించింది.

ఆంధ్రదేశమంతా కన్నీరు కార్చింది. సాహితీవేత్తలు , పండితులు , చరిత్ర పరిశోధకులు , స్వతంత్రోద్యమ నాయకులు  ఒకరేమిటి రామారావు గారి నెరిగిన ప్రతివారూ తమ ఇంట్లో స్వంత మనిషి పోయినట్లుగా బాధపడ్డారు. జ్వరంతో మంచం పట్టిన శారదను తీసుకుని మద్రాసు వచ్చింది సుబ్బమ్మ.

***

గమ్యమే గమనం-6

 

Volga-1శారద బాధను మరిపించింది చదువే. మూడేళ్ళ పాటు చదువే లోకంగా గడిపి హైస్కూలు చదువు ముగించింది. కళాశాల శారద కోసం ఎదురు చూస్తోంది. హైస్కూల్లో చివరి సంవత్సరంలోనే శారదకు ఆంధ్రపత్రికతో అనుబంధం ఎక్కువైంది. దేశంలో ఏం జరుగుతోందనే ఆసక్తి పెరిగింది. అందుకే అహమ్మదాబాదులో ఆ సంవత్సరం జరుగుతున్న కాంగ్రెస్‌ సభల గురించి వస్తున్న వార్తలను అక్షరం ఒదలకుండా చదివి ఒంటబట్టించుకున్నది.

గాంధి భారతప్రజలందరిలాగానే శారద మనసులో క్రమంగా తిష్ట వేసుకుంటున్నాడు. అహమ్మదాబాద్‌ కాంగ్రెస్‌లో సహాయ నిరాకరణ స్వదేశీ నినాదాలు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది. దీంతో 1922 సంవత్సరం ఆరంభం నుంచీ కలకలం రేగుతూ వచ్చింది. శారద ఒకవైపు పరీక్షలు మరొకవైపు ఈ స్వదేశీ ఉద్యమ వార్తలతో సతమతమయింది. ప్రకాశం పంతులుగారు న్యాయవాదవృత్తి ఒదిలిపెట్టిన రోజున రామారావు మద్రాసులోనే ఉన్నాడు. ఆయనతో ఈ విషయం మాట్లాడటానికి చాలామంది వచ్చారు.

కొందరు ‘‘అదేమిటండీ అంత ఆవేశం. అంత సంపాదన హఠాత్తుగా ఎలా ఒదిలిపెడతాడు’’ అన్నారు. కొందరు ఆయన త్యాగాన్ని పొగిడారు. కొందరు ‘‘ఇప్పటికి ఆయన సంపాదించింది చాలు. రెండు తరాలు గడిచిపోతాయి. ఇంక ఇప్పుడు దేశసేవ చేసుకుని పేరు సంపాదించుకుంటాడు’’ అన్నారు. రామారావు ఆ మాటకి ఒప్పుకోలేదు. ‘‘కొద్దిరోజుల్లోనే ఆయన సంపాదించినదంతా దేశానికి ఇచ్చేస్తాడు. ఆయన పత్రిక పెట్టబోతున్నాడు. చాలా పనులు చేయబోతున్నాడు. ఆయనను తేలికగా అంచనా వేయకండి’’ అన్నాడు.

మొత్తానికి విద్యార్థి లోకంలో పెద్ద అలజడి రేగింది. శారద పరీక్షలు మొదలయ్యేరోజున గాంధి గారిని అరెస్టు చేశారు. ఆ ఆందోళనతోనే శారద పరీక్ష రాసింది. నాలుగు పేపర్లు రాయటం పూర్తయ్యేసరికి గాంధీగారిని విచారించటం, శిక్ష వేయటం కూడా జరిగిపోయాయి. ఆ రోజు గాంధీ కోర్టులో చేసిన ఉపన్యాసం ఆంధ్రపత్రికలో చదివి శారద శరీరమంతా పులకించిపోయింది.

ఎంత ధైర్యం! ఎంత సాహసం. బతికితే ఇలాంటి సాహసంతో బతకాలి. ఎదిరించాలి ఎంతటి అధికారాన్నయినా. ఒక్క చూపుతో, నవ్వుతో, ఒక తిరస్కారపు మాటతో, అనంగీకారంతో అధికారపీఠాన్ని గడగడలాడించాలి. శారద మర్నాడు పరీక్షకు చదవలేకపోయింది.

‘‘భారతదేశంలో జరిగే ఆందోళనలకూ, మరణాలకూ, హత్యలకూ నేనే బాధ్యత వహిస్తున్నాను. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్నీ, శాసనాధిక్కార ప్రణాళికనూ నడుపుతున్నది నేనే. నా ఉద్యమం వల్ల జరిగే సర్వ అనర్థాలకూ నేనే కారకుడిని. నన్ను మీరు శిక్షించండి. ఏ శిక్ష అయినా, ఆఖరికి మరణశిక్ష అయిన సరే ఆనందంగా అనుభవిస్తాను’’.

శాంతంగా గాంధీ పలికాడని పత్రికలో వచ్చిన ఆ మాటలు శారద మనసులో శిలాక్షరాల్లా నిలిచిపోయాయి. బాధ్యత తీసుకోవటమంటే ఏమిటో చెప్పాడాయన. అది శారదకు అర్థమైంది. గాంధీ కోసం దేశంలోని లక్షలమంది లాగే శారద మనసూ ఆక్రోశించింది. ఆయనను జైలులో పెట్టిన బ్రిటీష్‌ ప్రభుత్వం మీద తెలియని పగ, కోపంతో శారద మనసు నిండిపోయింది.

పరీక్షలు రాసింది కానీ శారదకు ముందేం చేయాలో పాలు పోలేదు. దేశంలో వేలాదిమంది విద్యార్థులు కళాశాలలు బహిష్కరిస్తుంటే తాను వెళ్ళి చేరాలా? ఛీ! ఎట్లా చేస్తుందాపని. ఎంత అవమానం. కానీ చదువు. చదువుకోవాలనే తన జీవితాశయం. డాక్టర్‌ కావాలనే ఆశ  కాలేజీలో చేరకుండా ఎట్లా  ఎట్లా సాధ్యం? ఏం చెయ్యాలి? రాను రానూ ఈ సంఘర్షణ తీవ్రమై శారద తిండి, నిద్రకు కూడా దూరమైంది. చిక్కిపోతోంది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రావలసిన అవసరం కూడా లేదు. శారద ఫస్టున పాసవుతుందనే విషయంలో ఎవరికీ సందేహం లేదు.

సైన్సు గ్రూపుతో మంచి కళాశాలలో చేరేందుకు అప్లికేషన్‌ తెచ్చాడు రామారావు.

‘‘శారదా. ఇది పూర్తి చేసి ఇవ్వమ్మా. రేపు మనిద్దరం కాలేజీకి వెళ్ళి ఇచ్చివద్దాం’’. అంటూ శారద చేతికి ఇచ్చాడు.

నిప్పుని తాకినట్లు, పాముని పట్టుకున్నట్లు అనిపించింది శారదకు.

తండ్రితో ఏం చెప్పాలో తెలియలేదు. ఆ కాగితాలు అక్కడే బల్లమీద పెట్టి ఏమాటా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.

మర్నాడు ఉదయం ఆ కాగితాలు ఎట్లా ఉన్నవి అట్లాగే ఆ బల్లమీదనే పడి ఉండటం చూసి రామారావుకేం అర్థం కాలేదు. అప్లికేషన్‌ నింపకుండా శారద ఏం చేస్తున్నట్లు?

‘‘శారదా! శారదా!’’

olga title

తండ్రి పిలుపు కోసం శారద ఎదురు చూస్తూనే ఉంది. రాత్రంతా శారద నిద్రపోలేదు. చిన్నతనం నుంచీ తన చదువు కోసం తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలు, వీరేశలింగం గారికిచ్చిన వాగ్దానం, నాయనమ్మ కాశీవాసం ఇవన్నీ శారదను ఒకవైపు అశాంతిలోకి అలజడిలోకి నెట్టాయి. ఇంకోవైపు గాంధీగారి మాటలు, ఆయన వెనక నడుస్తున్న విద్యార్థులు, ప్లీడర్లు, స్వయంగా ఎరిగిన ప్రకాశం గారు, వీళ్ళంతా ఒక వైపు. కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఆ చిన్న మనసులో. చివరకు నిశ్చయించుకుంది. కళాశాలలో చేరే ప్రశ్నలేదు. ఈ నిర్ణయానికి తిరుగులేదు. ఎవరేమన్నా సరే ` ఎవరేమంటారు? తండ్రిని ఒప్పిస్తే  చాలు. తండ్రి తన కోరికను కాదనడు. తను ఉద్యమంలో చేరుతుంది. ప్రకాశం గారి దగ్గర, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దగ్గర శిష్యరికం చేస్తుంది. ఖద్దరు తయారు చేస్తుంది. రాట్నం తిప్పుతుంది. శారద మనసు ఈ ఆలోచనలతో ప్రశాంతమయింది. తెల్లవారు ఝామున ఎప్పుడో  ఆలస్యంగా నిద్రలేచింది.

తనపనులు చేసుకుంటూ తండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తోంది.

రామారావు శారద వంక ఆశ్చర్యంగా చూస్తూ

‘‘ఈ అప్లికేషను ఇలాగే ఉంచావేం. పూర్తి చెయ్యలేదేం. ఇవాళ ఇచ్చిరావాలిగదా’’ అన్నాడు.

‘‘నేను కాలేజీలో చదవాలనుకోవటం లేదు నాన్నా’’ అంది శారద. రామారావు నిర్ఘాంతపోయాడు.

‘‘ఏంటమ్మా’’ అన్నాడు అయోమయంగా.

‘‘దేశంలో అందరూ కళాశాలలు బహిష్కరిస్తుంటే నేను ఇప్పుడు చేరి చదవనా? ఎట్లా చదువుతాను నాన్నా?’’

రామారావుకి అర్థమైంది. భయం వేసింది. శారద ఒక నిర్ణయం తీసుకుంటే మార్చటం కష్టమని ఆయనకు తెలుసు. దేశంలో జరుగుతున్న అలజడీ, దాని ప్రాముఖ్యమూ ఆయనకు తెలియనిది కాదు. ఆయన మిత్రులు, సహచరులు ఎందరో ఆ ఉద్యమంలో ఉన్నారు. ఆయనకు అతి సన్నిహిత మిత్రుడు హరి సర్వోత్తమరావు ఈ స్వదేశీ ఉద్యమం మొదలు పెట్టకముందే, 1908లోనే బిపిన్‌ చంద్రపాల్‌ రాజమండ్రికి ఒచ్చినపుడు విద్యార్థిగా పరీక్షలు బహిష్కరించి కళాశాల నుంచి బైటికొచ్చారు. ఆ తర్వాత స్వరాజ్య పత్రికలో సంపాదకీయం రాసి, ఆంధ్ర దేశంలో స్వతంత్రం కోసం మొట్టమొదట జైలుకెళ్ళిన యోధుడయ్యాడు. ఆ జైలు జీవితం గురించి ఆయన చెప్తుంటే రామారావు ఒళ్ళు గరిపొడిచింది. అంత క్రూరం. అంత కఠినం. అదంతా వేరు. దానిలో ఆసక్తి అభినివేశం ఉన్నవారు అటు వెళ్తారు.

శారద ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకుని, చదువు పాడుచేసుకుని, జీవితానికి అర్థం లేకుండా చేసుకుంటుందా?

‘‘ఎందుకమ్మా అనవసరంగా ఆవేశపడుతున్నావు’’ కూతురిని కొంచెం మార్చాలనుకున్నాడు రామారావు. ఇంతవరకూ శారద సందేహాలకు సమాధానమివ్వటమే ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన శారదను ప్రశ్నించి మార్చే పనిచేయటం ఎలాగో ఆయనకు కాస్త కష్టంగానే ఉంది.

శారదకూ తండ్రితో ఇలా నచ్చని విషయాలు మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఇంతవరకూ వారిద్దరికీ ఒకటే మాట. ఈ పరిస్థితి శారదకూ తేలికగా లేదు.

‘‘ఆవేశం కాదు నాన్నా. ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను’’ అంది శాంతంగా.

‘‘ఆలోచించటానికి నీకేం తెలుసమ్మా’’

శారద ఆ మాట అర్థం కానట్లు చూసింది.

‘‘రోజూ పత్రికలు చదివి, ప్రకాశం పంతులు వంటి వారిని చూసి ఆవేశపడుతున్నావు. అంతేగాని ఈ ఉద్యమం ఏమిటి, దాని మంచి చెడ్డలేమిటి అనేది నీకు తెలుసా?’’

‘‘నాకు తెలుసు నాన్నా. అన్నిటికంటే ముఖ్యం స్వతంత్రం’’.

‘‘నిజమే. కానీ కళాశాల మానేస్తే స్వతంత్రం ఒస్తుందా? మానెయ్యమన్న కాంగ్రెస్‌ వారికి స్వతంత్రం గురించి పట్టుదల ఉందా? ఇంతవరకూ వాళ్ళు ఆ మాట అనలేదు. మాకు పూర్తిగా స్వతంత్రం కావాలని వారింకా అడగలేదు. సందేహిస్తున్నారు. కాంగ్రెస్‌లో కూడా రకరకాల ధోరణులున్నాయి. నాయకులంతా ఒకే ఆలోచనతో లేరు. నీకు అన్నీ తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నావని నాకు నమ్మకం లేదు. కేవలం ఆవేశంతో ఒక జీవితకాలపు నిర్ణయం తీసుకుంటే ఎలాగమ్మా?’’.

‘‘గాంధీగారు జైలులో ఉన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం నడవొద్దా నాన్నా’’ శారద కొంచెం బలహీనంగా అంది.

‘‘గాంధీ ఇవాళో కార్యక్రమం ఇస్తాడు. రేపు ఇంకొకటి ఇస్తాడు. అవి రాజకీయాలు. నేను వాటిని తప్పు పట్టను. పట్టేంత పరిజ్ఞానం ఆ రాజకీయాల గురించి నాకు లేదు. కానీ వాటి గురించి ఏమీ తెలియకుండా దాన్లోకి దూకటం మంచిది కాదు. కాలం విలువైంది. ఒకటి రెండు సంవత్సరాలు వృధా చేసుకోవటం తప్ప జరిగేదేం ఉండదమ్మా’’.

‘‘అసలు ఈ చదువే మానేస్తా నాన్నా.’’

olga

‘‘డాక్టరవవా అమ్మా’’ రామారావు అడిగిన తీరుకి శారద గుండె కరిగిపోయింది. తండ్రికి తనమీద ఉన్న ఆశ ఆ పిల్లకు తెలిసినట్లు మరెవరికి తెలుసు? మాట్లాడలేకపోయింది.

‘‘దేశంకోసం కొందరు విద్యార్థులు కళాశాలలు, చదువులు బహిష్కరిస్తున్నారు. అది వారి పద్ధతి. దాని మంచి చెడ్డలు ఎంచొద్దు. స్వతంత్రం కోసం వారు త్యాగం చేస్తున్నారని అనుకుందాం. నువ్వు ఇంకో రకం త్యాగం చెయ్యమ్మా’’ శారదకు ఆ మాట అర్థం కాలేదు.

‘‘రేపు దేశం స్వతంత్రమైతే డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల చదువులు చదివిన వారూ అవసరం కాదా? ఒక్క లేడీ డాక్టరు కూడా లేకుండా స్వతంత్ర దేశం అభివృద్ధి చెందుతుందా? అప్పుడు చదవటం మొదలు పెడితే ఆలస్యం కాదా? స్వతంత్రం వచ్చేనాటికి నువ్వు సర్వసన్నద్ధంగా ఉంటావు ప్రజలకు సేవ చెయ్యటానికి. దాని కోసం ఇప్పటికిప్పుడు ఉద్యమంలో చేరి నీ స్వతంత్ర కాంక్షను ప్రదర్శించాలనే కోరికను త్యాగం చెయ్యి. ఇవాళ ఏదో ఒక మార్గంలోనే దేశం కోసం పనిచేస్తే సరిపోదమ్మా. అన్నివైపుల నుంచీ సన్నద్ధం కావాలి. నువ్వింకా చిన్నదానివి. ఉద్యమం లోతుపాతులు తెలియాలన్నా ఇంకా కొన్నేళ్ళు పోవాలి. మహా మహా వాళ్ళే ఈ కాంగ్రెస్‌లో ఇమడలేక, ఈ ఉద్యమంలో ఇమడలేక వేరేవేరే పనులు చేస్తున్నారు. ప్రకాశం అనుభవజ్ఞుడు అపారంగా చదివాడు. అన్నీ తెలిసినవాడు. ఆయనా, నువ్వూ ఒకటి కాదు, అతను నీ ఆదర్శం కాదు. నువ్వు వేరే దారి వెయ్యాలి. నీ ఆదర్శం నీకుండాలి. అది డాక్టరువై  ప్రజాసేవ చెయ్యటం. ఎన్ని ఆటంకాలచ్చినా దానిని నువ్వు ఒదలకూడదు. అలాగని నాకు నువ్వు మాట ఇవ్వాలి.’’

శారద తండ్రి మాటలకు ఉక్కిరిబిక్కిరయింది. కళాశాలలో చేరి చదివి డాక్టరవటం త్యాగం అనుకోవటం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. తనకెంతో ఇష్టమైనదాన్ని దేశం కోసం ఒదిలెయ్యటం త్యాగం అని ఆమె నమ్మింది. కానీ చదవటం కూడా దేశసేవకు ఒక మార్గమని తండ్రి చెప్పిన మాటను అంత తేలికగా తీసివెయ్యటం కూడా చేతకాలేదు. ఉద్యమం లోతుపాతులు తెలియవన్న మాటా నిజమే! కానీ దిగకుండా లోతు ఎలా తెలుస్తుంది. శారద అంతరాత్మ పోరాటం, శాసన ధిక్కారం వైపే ఉన్నాయి. ఆలోచనలో పడిన శారదను చూస్తే రామారావు మనసులో ఆశ రేకెత్తింది.

‘‘ఆలోచించు శారదా! తొందరేం లేదు. నాలుగు రోజులు ఆగి, ఆలోచించే అప్లికేషన్‌ ఇవ్వొచ్చు. నువ్వు తెలివైనదానివి. నేను చెప్పిన మాటల గురించి కూడా ఆలోచించు. అవసరమైతే పెద్దవాళ్ళ సలహా తీసుకో. హరిగారితో మాట్లాడు. తొందరపడొద్దు’’.

నిదానంగా నచ్చజెప్పి బైటికి నడిచాడు రామారావు.

ఆ రోజే శారదకు అన్నపూర్ణనుంచి ఉత్తరం వచ్చింది.

ప్రియ శారదా

క్షేమంగా ఉన్నావు కదా? దేశం ఎలా ఉందో చూస్తున్నావా? అందరూ దేశం కోసం నిలబడవలసిన సమయం వచ్చినట్లుంది కదూ. మా ఆయన కూడా చదువు మానేసి వచ్చాడు. రాట్నాలు తెచ్చాడు. నాకొకటి పంపాడు. నేనూ రాట్నం ఒడుకుతున్నాను. మన ఊళ్ళో అందరూ గాంధీని దేవుడిలా పూజిస్తున్నారు. నువ్వు కళాశాలలో ప్రవేశిస్తావా?లేదా? నాకు సందేహంగా ఉంది. ఇదంతా ఎంతో ఉత్సాహంగా ఉంది గానీ చదువులు మానెయ్యటం సరికాదేమోననే అనుమానం కూడా ఒక చెంప నన్ను వేధిస్తోంది. మా ఆయన చదువు ఈ ఏడాదితో పూర్తయ్యేది. ఆ తర్వాత ఉద్యోగం చూసుకుంటే మేమిద్దరం ఒకచోట ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. సంపాదన లేకుండా కాపురం ఒద్దని ఇన్నాళ్ళూ చెప్పారు.

ఇప్పుడు చదువు ఉద్యోగం లేకుండా సంపాదన ఎలా వస్తుంది. మా కాపురం సంగతేమిటి? మా అమ్మానాన్నలను కూడా ఈ ఆందోళన వేధిస్తోంది. నాకు ఒకపక్క ఆయన ఉద్యమంలో ఉన్నారని గర్వం. ఇంకోపక్క మా భవిష్యత్తు తల్చుకుంటే అయోమయం. భయం. ఆయన జైలుకెళ్తారనుకుంటే పట్ట లేని దు:ఖం. మళ్ళీ జైలుకెళ్ళిన వారి గురించి ఆలోచిస్తే చాలా గౌరవంగా ఉంటుంది. అంతా గందరగోళంగా ఉంది. విశాలాక్షి చదువుమానదట. గుంటూరు కాలేజీలోనే చదువుతుందట. వాళ్ళిప్పుడు అక్కడే ఉన్నారుగా. నువ్వు ఏమనుకున్నావో  రాయి. నీ చదువు మానొద్దనే నా సలహా. నువ్వు డాక్టర్‌వి కావాలి.

నీ ప్రియ నెచ్చెలి

అన్నపూర్ణ.

శారదకు ఆ ఉత్తరం చదివి చాలా ఉద్వేగం కలిగింది. అబ్బయ్య చదువు మానేశాడనే విషయం ఎక్కినట్లు ఆ అమ్మాయి మనసులోకి మరేదీ ఎక్కలేదు. తన నిర్ణయానికి బలం వచ్చినట్లనిపించింది.

రామారావు శారదను కళాశాలలో చేర్పించి హైదరాబాదు వెళ్దామనుకున్నవాడు కాస్తా ఆ ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఆయనకు ఇంత పెద్ద సమస్య ఎన్నడూ రాలేదనిపించింది. తల్లి కాశీ ప్రయాణం ఆయన మనసుని చాలా బాధించింది గానీ కూతురి భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంటే ఆ బాధను తొందరగానే స్థిర నిర్ణయంగా మార్చుకోగలిగాడు.

కానీ కూతురు ఇప్పుడు తన నిర్ణయం మార్చుకోకపోతే ఎలా? కూతురి నిర్ణయం సరికాదని ఆయనకు బలంగా అనిపిస్తోంది. చదువుమాని దేశసేవ చెయ్యనక్కరలేదు. చదువుకుని దేశానికెంతో చెయ్యొచ్చు. అందులో అదెలాంటి చదువు? ప్రజలకు ప్రాణం పోసే చదువు. శారదను ఇంగ్లాండ్‌ పంపాలనుకున్నాడాయన. ఇక్కడే చదవనంటున్న శారద ఇంగ్లండ్‌ వెళ్తుందా? ఇంగ్లండ్‌ వెళ్ళి చదవటం మహాపాపమంటుంది. కానీ గాంధి, నెహ్రూ, ప్రకాశం అందరూ ఇంగ్లండ్‌ వెళ్ళి చదివాకనే ఇట్లా దేశం కోసం పనిచేస్తున్నారని శారదకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తనమీదనే ఉందనుకున్నాడాయన. తనొక్కడే కాకుండా హరిసర్వోత్తమరావుతో వీలైతే ప్రకాశం గారితో కూడా చెప్పించాలనుకున్నాడు. ప్రకాశం గారు చెబుతారా? ఆయన శారద నిర్ణయాన్ని బలపరుస్తాడేమోననే భయం కూడా రామారావు మనసులో ఓ మూల ఉంది.

రెండేళ్ళుగా ఆయన తన పరిశోధను, చరిత్ర రచనలో పడి  శారద గురించి పట్టించుకోలేదనే అపరాధ భావనకు లోనయ్యాడు. ఎప్పటికప్పుడు ఈ ఉద్యమ విషయం శారదతో మాట్లాడి  ఆ అమ్మాయి ఆలోచనను ఒక క్రమంలో పెట్టి

ఉండాల్సిందని ఆయనకు బలం గా అనిపించింది. కానీ దేశ పరిస్థితి చూస్తే  శారద వయసులోని విద్యార్థులలో చాలా మంది  శారదలాగానే నిర్ణయం  తీసుకుంటున్నారు. . భయం అంటే తెలియని ఆయన మనసులో మొదటిసారి భయం మొదలై శరీరాన్ని  బలహీనం చేసింది. తన భయాన్ని పోగొట్టగలవాడు హరిసర్వోత్తమరావు ఒక్కడే అనిపించి ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో ముమ్మరంగా తిరుగుతున్నాడు . చదువునూ, కోర్టునూ బహిష్కరించమని పిలుపు ఇచ్చిన కాంగ్రెస్‌ సభలో పాల్గొన్నవాడు. కానీ ఆయన రామారావుకి  ఆప్తమిత్రుడు. తన బాధను అర్థం చేసుకుని సరైన దారి చూపగలవ్యక్తి అనిపించింది. అదష్టవశాత్తు ఆయన మద్రాసులోనే ఉన్నాడు. రామారావుని చూసి ఆనందంగా కౌగిలించుకున్నాడు.

కుశల ప్రశ్నలయ్యాక హరిగారు సంభాషణను రాజకీయాల  వైపు మళ్ళించాడు.

‘‘దేశం ఉద్యమాల బాట పట్టింది రామారావ్. మనం కూడా శక్తివంచన లేకుండా పనిచెయ్యాలి’’.

రామారావుకి ఆ మాటతో పట్టలేని ఆవేశం వచ్చింది.

‘‘మనం చెయ్యాలి గానీ అభంశుభం తెలియని యువకులు, యువతులు చదువు మానటం మంచిదంటావా?’’

‘‘విదేశీ చదువు స్థానంలో స్వదేశీ చదువు తీసుకురావాలి గదా’’ రామారావుకి ఒక్కసారి అంత ఆవేశమెందుకొచ్చిందో హరి గారికి అర్థం కాలేదు.

‘‘మనలాంటివాళ్ళం స్వదేశీ చదువు గురించి ఆలోచించి ఆ చదువు చెప్పే సంస్థను ఒక పద్ధతి ప్రకారం ఏర్పరిచాక పిల్లలు అటు రావచ్చు. ఇపుడు దారీ తెన్నూ లేకుండా ఏం చేస్తారు?’’

‘‘జాతీయ పాఠశాల ఏర్పాట్లవుతున్నాయి గా?’’

olga title

‘‘అవి చిన్నపిల్లలకు, కళాశాలో ఉన్నత విద్య సంగతేమిటి? ఆ జాతీయ పాఠశాల కూడా నిబడటం లేదే వాటికే అంకితమై వాటిని  మహా సంస్థగా రూపొందించే సమయం ఎవరి దగ్గరుంది? అందరూ ఉద్యమంలో తలమునకులుగా  ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థను ఏర్పరచి అభివృద్ధి చేయటం నిర్మాణ  కార్యక్రమం. ఇపుడు నిర్మాణాన్ని  ధ్వంసం చేసే  కార్యక్రమం నడుస్తోంది. దాంతో పాటు జాతీయ విద్యలాంటి అతిపెద్ద బాధ్యతను అంకితభావంతో చేపట్టగలవారెవరున్నారు? ఈ జాతీయ పాఠశాలలు, కళాశాలలు  నిలుస్తాయనే నమ్మకం నాకు లేదు’’.

రామారావు లో  పెరుగుతున్న ఆవేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు హరిగారు .

‘‘వాటి గురించి మీరెందుకు ఇంతగా ఆవేశపడుతున్నారు. కాలక్రమాన అన్నీ జరుగుతాయి’’.

‘‘హరీ! శారద చదువు మానేస్తానంటోంది’’.

హరికి వెంటనే రామారావు ఆవేశం అర్థమైంది. రామారావు వంక సానుభూతిగా చూశారు.

‘‘హరీ! శారద చదువు కోసం నేను పడే తపన నీకు తెలుసు. అసలు  ఆడపిల్లలని చదివించే వారు ఎంతమంది? నేను మా అమ్మను ఎదిరించటానికి, ఆమెను కాదని, ఆమె ఇల్లు ఒదిలి కాశీవెళ్ళి, మళ్ళీ నా  ఇంటికి రానని  చెబుతుంటే విని తట్టుకుని ఆమెను కాశీ పంపింది ఎందుకు? శారద డాక్టరవ్వాలనే  కదా? ఇప్పుడదంత మర్చిపోయి చదువు మానేస్తానంటే శారద ఏమవుతుంది? ఎక్కడ కి చేరుతుంది? తెలియని మహా సముద్రంలో దూకుతానంటే ఏం చెయ్యను చెప్పు. ఎలాగైనా  శారద మనసు మార్చాలి . కళాశాలో చేర్పించాలి .

రామారావులోని ఆవేశం హరిగారికి పూర్తిగా అర్థమైంది.

‘‘నేనేం చెయ్యను రామా?”

‘‘శారదతో మాట్లాడు. డాక్టరయ్యి దేశానికి సేవ చెయ్యటం ఉత్తమమని చెప్పు’’

‘‘నాకా అర్హత ఉందా? నేను గాంధీతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి సహాయ నిరాకరణ గురించి చెప్పినవాడిని.’’

‘‘అందుకే నిన్ను చెప్పమంటుంది .శారద శక్తీ తెలివి తేటలు ఇంట్లో కూర్చుని రాట్నం ఒడకటానికీ, జైలుకి వెళ్ళి ఏ పనీ లేకుండా కూచోటానికి ఖర్చవ్వాలా? ’’

‘‘నీకు ఆవేశంలో ఏమీ తెలియటం లేదు రామా. మన అభిప్రాయాలు  కూడా ఈ విషయంలో వేరు. కానీ శారద తండ్రిగా నాకు నువ్వు అర్థమవుతున్నావు. శారదని చదువుకోమని నేను చెబితే ఆ అమ్మాయి వింటుందా?’’

‘‘వింటుంది. ఆ  రాజకీయపు లోతు శారదకు తెలియవు. అక్కడ ఇమడలేదు. డాక్టర్‌ చదివి దేశానికెంతో సేవ చేయగలుగుతుంది. స్వతంత్ర దేశానికి డాక్టర్లు అక్కర్లేదా?’’

‘‘అందరూ కావాలి. కానీ ఇప్పటి ఉద్యమ అవసరం వేరు.’’

‘‘నా కోసం నువ్వు శారదతో మాట్లాడు హరీ! ఆమెను చదువుకోమను.’’

‘‘డాక్టరవటం వల్ల దేశానికి సేవ చెయ్యొచ్చని మాత్రం చెబుతాను. అంతకు మించి నా వల్ల కాదు’’.

రామారావు ముఖంలో కనిపించిన నిరాశ, కుంగుబాటు చూసి హరి గారికి కళ్ళవెంట నీళ్ళొచ్చాయి.

‘‘రామా! నేను నా ఆశయాలకు భంగం రాకుండా శారదను ఒప్పించటానికి ప్రయత్నిస్తాను.’’

‘‘అదే చాలు. నేనూ శారదను బతిమాలుకుంటాను.’’

రామారావు పరిస్థితి, ఆ తీవ్రత హరిగారికి అర్థమైంది. ప్రాణమిత్రునికి వీలైనంత సహాయం చెయ్యాలనే ఆయనకు అనిపించింది. రామారావు తన పనిలో ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయటం లేదు. ఇపుడు శారద గురించిన మనోవేదన కూడా తోడైతే అది మంచిది కాదనిపించింది. రామారావులాంటి మనుషులు  దేశానికి ఎంతో అవసరం. రామారావు ని  కాపాడటం స్నేహితునిగా తన కనీస ధర్మం అనుకున్నాడు. కానీ రాజీపడటం ఆయనకు బొత్తిగా చేతకాదు.

కళాశాలను బహిష్కరిస్తాననే నిర్ణయం తండ్రి కి చెప్పిన తరువాత  శారదకు పట్టలేనంత ఉత్సాహం  వచ్చింది. ఆ ఉత్సాహం లో  అన్నపూర్ణకు ఉత్తరం రాసింది.

ప్రియమైన అన్నపూర్ణ !

నీ ఉత్తరం, అందులోని విషయాలు నాకు ఎంత సంతోషం కలిగించాయో నీకు చెప్పలేను. నీ భర్త ఉత్తముడు. అతను చదువుమానటం చాలా గొప్పపని. మద్రాసు నుంచి అతను వెళ్ళేముందు నన్నొక్కసారి కలిసి ఉంటే ఎంత బాగుండేది. నా నిర్ణయం ఇంకొంచెం ముందుగా ధైర్యంగా, నిస్సందేహంగా తీసుకోగలిగేదాన్ని. ఇంతకూ నా  నిర్ణయం ఏమిటంటావు ? మనందరిది ఒకటే మార్గం.     నేను కూడా చదువు మానేస్తున్నాను . రాట్నం ఒడుకుతాను. ఖద్దరు ధరిస్తాను. దేశం కోసం పని చెయ్యమని నా  మనసు చెబుతోంది. అంతకంటే మహత్తరమైన పని లేదని చెబుతోంది. నా  మనసు మాట వింటాను. మా నాన్నకు బాధ కలిగిస్తున్నానని తెలుసు  గానీ ఎంతో మంది బాధ పడందే, త్యాగం  చెయ్యనిదే దేశానికి స్వతంత్రం వస్తుందా? ఇపుడు నా  మనసంత అదే ఆలోచన. ఇన్నాళ్ళు  ఇలా ఆలోచించలేదేమిటా అని సిగ్గుపడుతున్నాను.

ఇవాళే కళ్ళు తెరిచి దేశాన్ని కొత్తగా చూస్తున్నాను.. ప్రజల బానిసత్వం,  పరాయి పాలకుల దుర్మార్గం నాకు అర్థమవుతోంది. ఈ బానిస బతుకు మనం బతకవద్దు. నువ్వు నీ భర్తను అనుసరించు. ఉద్యమంలోకి  రా ! మీ కాపురం గురించే ఆలోచించి విలువైన  విషయాలను పక్కన పెట్టకు. నేనింకా నాన్నను ఒప్పించాల్సి ఉంది.  ఏం పని చెయ్యాలో నిర్ణయించుకోవాల్సి ఉంది. నేనింకా చిన్నదాన్ని, అనుభవం లేనిదాన్ని అంటారు నాన్న. ఈ వయసు నుంచే పనిచేసి అనుభవం సంపాదించే అవకాశం వచ్చింది కదా అనిపిస్తుంది నాకు. నా రక్తం ఉప్పొంగుతోంది. గాంధీ గారు కోర్టులో చెప్పిన మాటలు  పత్రికలో చదివావు కదూ? ఆ మాటలు  చదివి నేను రోమాంచితనయ్యాను. ఆ క్షణాన వెళ్ళి బ్రిటీష్‌ అధికారులు  ముందు నిలబడి నన్ను బంధించండి . నన్ను ఉరి తియ్యండి కావాలంటే ? నేనూ ఉద్యమానికి చెందిన దానినే అని అరవానిపించింది. నా  ప్రాణాలు  ఇవ్వాలనిపించింది దేశం కోసం. గాంధీ గారి కోసం.

అన్నపూర్ణా! నువ్వు, నీ భర్త , నేనూ అందరం దూకుదాం. అందరం కలిస్తే  ఎంత బలం?

నా  చదువు గురించి నాన్న నాలుగు  రోజులు  ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారు. నాలుగు  రోజులు  తర్వాత  మారని నా  నిర్ణయం గురించి నాన్నకు చెప్పి నా కర్తవ్యం నిర్వహిస్తాను. నేనేం చెయ్యాలో చెప్పమని నాయకులను  అడుగుతాను. వారు చెప్పిన పని ఆనందంగా, త్రికరణ శుద్ధిగా చేస్తాను.

విశాలాక్షి చదువుకుంటున్నందుకు నాకు సంతోషంగా లేదు. నా లాగా తనెందుకు ఆలోచించటం లేదు? నువ్వు గుంటూరు దగ్గర్లోనే ఉన్నావు గదా విశాలాక్షితో మాట్లాడరాదూ? చదువు మానెయ్యమని చెప్పించు . విశాలాక్షికి కూడా ఉత్తరం రాస్తాను నేను.

నీ ప్రియమైన

శారద.

 

ఆ ఉత్తరం రాశాక ఇక శారదకు సందేహమే లేదు. ఆనందంగా పత్రిక చదువుతోంది. ఆ వేడిలోనే విశాలాక్షికి ఉత్తరం రాసేసింది.

***

 

గమనమే గమ్యం-3

 

Volga-1ధనలక్ష్మి బడికి రాని లోటు ముగ్గురు స్నేహితులకూ తెలుస్తోంది. వాళ్ళలో వాళ్ళు ధనలక్ష్మి పెళ్ళి గురించి మాట్లాడుకున్నారు గానీ అదంత ఉత్సాహంగా సాగలేదు. ఇంకో వారంలో పెళ్ళనగా ముగ్గురూ కలిసి మళ్ళీ ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు. ఈసారి ధనలక్ష్మి ముఖంలో మునుపటి ఆనందం లేదు. చాలా దీనంగా ఉంది. చిక్కిపోయింది. పదిరోజుల్లో స్నేహితురాలు ఇలాగయిందేమిటని కంగారు పడ్డారు. వీళ్ళ ముగ్గుర్నీ చూసేసరికి ధనలక్ష్మికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బలవంతాన వాటిని అదిమిపెట్టి స్నేహితుల్ని దొడ్లో బాదం చెట్టు దగ్గరకు తీసుకుపోయింది.

నలుగురూ కాసేపు మాటలు రానట్టు కూర్చుండిపోయారు.

శారద ఎక్కువసేపు ఆ మౌనాన్ని భరించలేక ‘‘అలా ఉన్నావేం ధనం. ఒంట్లో బాగోలేదా’’ అంది అనునయంగా.

ఆ చిన్న అనునయపు మాటలకే ఉగ్గపట్టుకున్న దు:ఖం బైటికి ఉరికింది. ధనలక్ష్మి ఏడుస్తుంటే వీళ్ళకూ ఏడుపొచ్చింది.

చివరికి అన్నపూర్ణ ధనలక్ష్మి భుజం మీద చెయ్యివేసి ఏమయిందో చెప్పమని గట్టిగా అడిగింది.

విశాలాక్షి మరోవైపు నుంచి ధనలక్ష్మి చేయి పట్టుకుని బతిమాలింది.

ధనలక్ష్మి ఏడుపాపి, కళ్ళనీళ్ళు తుడుచుకుని ‘‘నాక్కాబోయే మొగుడికి నలభై ఏళ్ళట. అలా చెప్తున్నారు గానీ ఇంకా ఎక్కువేనంటున్నారు’’ అంది.

ముగ్గురూ భయంతో, పాలిపోయిన ముఖాలతో ధనలక్ష్మిని చూస్తూ కూచున్నారు. ఏం చెయ్యాలో వాళ్ళకు తెలియటం లేదు. ధనలక్ష్మిని చూస్తే ఏడుపొస్తుంది. చివరికి శారదాంబ గొంతు పెగల్చుకుని ‘‘నీకిష్టం లేదని చెప్పు’’ అంది.

‘‘నామాట ఎవరు వింటారు? వాళ్ళకి బాగా డబ్బుంది. మా వాళ్ళకి నా బరువు దిగుతుంది. మా అన్నయ్యకు ఉద్యోగం వస్తుంది’’ ఏడుపు ఆపుకుంటూ చెప్పింది ధనలక్ష్మి.

ఎంతసేపు కూచున్నా మాటలు సాగలేదు. ముగ్గురూ ఇంటికి వెళ్ళటానికి లేచారు.

ధనలక్ష్మి ఇల్లు దాటి కొంచెం దూరం గడిచాక ముగ్గురికీ కాస్త ఊపిరాడినట్లయింది.

‘‘పాపం ధనలక్ష్మి’’ అంది విశాలాక్షి.

‘‘ధనలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి’’ అంది శారద.

‘‘ఎక్కడికి?’’ భయంగా అడిగింది అన్నపూర్ణ.

‘‘రాజమండ్రి వీరేశలింగం గారి దగ్గరకు. అక్కడ ఆయన ఆడపిల్లలకు చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేస్తాడు. మా నాన్న చెప్పారు. నేనూ చిన్నప్పుడు వాళ్ళింటికి వెళ్ళాను. ఆ మామ్మగారు నాకు పూర్ణమ్మ కథ చెప్పారు. ఆ కథలో పూర్ణమ్మకు ఇట్లాగే ముసలివాడితో పెళ్ళి చేస్తారు. పూర్ణమ చెరువులో పడి చచ్చిపోతుంది’’.

‘‘ధనలక్ష్మి కూడా చచ్చిపోతుందా?’’ విశాలాక్షి కళ్ళు నీళ్ళతో నిండాయి.

‘‘పోనీ రాజమండ్రి వెళ్ళమని చెబుదామా?’’ అన్నపూర్ణ ఆలోచనగా అంది.

‘‘చెబుదాం. వెళ్ళమందాం’’ పట్టుదలగా ఉత్సాహంగా అంది శారద.

‘‘వెళ్ళమంటే ఎలా వెళ్తుంది? ఇంట్లోవాళ్ళు చూడరా? పోనిస్తారా? రైలు చార్జీలకు డబ్బెక్కడిది?’’

‘‘రాత్రిపూట లేచి నడిచి వెళ్ళటమె’’.

‘‘అమ్మో భయం కదూ’’

‘‘భయమైతే ఎట్లా? ఆ ముసలాడితో పెళ్ళి మాత్రం భయం కదూ?’’

‘‘పోనీ నేను మా అమ్మనడిగి డబ్బు తెచ్చి ఇస్తాను. రైలెక్కి వెళ్ళమందాం’’ అంది విశాలాక్షి.

‘‘నేనూ తెస్తాను’’ అన్నారు మిగిలిన ఇద్దరూ.

రైలెక్కి రాజమండ్రి వెళ్ళటం మాత్రం తేలికా? ఎంత దూరం. దానికంటే ఉన్నవ పెద్దనాన్న గారింటి కెళ్ళటం తేలిక కదూ. గుంటూరికి బండి కట్టుకుని వెళ్ళచ్చు. శారదాంబ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి.

నాన్నమ్మకు చెప్పి పెళ్ళి ఆపించగలిగితే ? నాన్నమ్మ మాట అందరూ వింటారు. ధనలక్ష్మి వాళ్ళ నాన్నకు కూడా నాన్నమ్మ అంటే భయం.

 

అసలు తండ్రి ఉంటే బాగుండేది. ఆయనెప్పుడూ మద్రాసు వెళ్ళి కూచుంటాడు ` ఇక్కడ పాపం ధనలక్ష్మి చచ్చిపోతుందో ఏమో ` గుంటూర్లో లక్ష్మీబాయమ్మ పెద్దమ్మయితే బాగా చూసుకుంటుంది. నాన్న ఉంటే ధనలక్ష్మిని అక్కడకు పంపించటం కుదిరేది.

ఇంటికి వెళ్ళగానే నాన్నమ్మతో ధనలక్ష్మికి జరగబోయే పెళ్ళి గురించి చెప్పి దాన్ని ఆపమని అడిగింది శారదాంబ.

నరసమ్మ శారద మాటలకు నవ్వి

‘‘చేతనైతే పెళ్ళి చెయ్యాలి గాని ` చెడగొట్టగూడదమ్మా, మహాపాపం’’ అంది.

‘‘ముసలాడితో పెళ్ళి చేస్తే ఎట్లా నాన్నమ్మా’’ నాన్నమ్మకు ఈ విషయంలో అన్యాయం అర్థం కాకపోవటం శారదకు మింగుడు పడలేదు.

‘‘అదృష్టం బాగుంటే అతను ధనలక్ష్మిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఒక పిల్లాడు పుడితే ఇంక మీ స్నేహితురాల్ని నెత్తిన పెట్టుకుంటాడు. లేదూ ` ఆ పిల్ల కర్మ అలా కాలిందనుకోవాలి. మనం ఎవరం ఆ అమ్మాయి తలరాత మార్చటానికి’’

‘‘నాన్నమ్మ  వీరేశలింగం గారు ధనలక్ష్మిని కాపాడతారేమో. అక్కడికి పంపితే’’.

‘‘ఆయన వితంతువులకు మళ్ళీ పెళ్ళి చేస్తున్నాడని విన్నాను. ఇలా చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చెడగొడతాడు కూడానా? నువ్వు చిన్నపిల్లవి. నీకీ సంగతులన్నీ ఎందుకు. వెళ్ళి అన్నం తిని పడుకో’’ అని గట్టిగా మందలించింది.

తల్లి కూడా ‘‘నాన్నమ్మ నీ మాట వినదు. ఊరుకో’’ అని వారించింది. శారద చిన్ని హృదయం మండిపోతోంది. అన్యాయం అనే భావన ఆ అమ్మాయికి మొదటిసారి చాలా దగ్గరగా వచ్చింది. అన్యాయాన్ని జరగనివ్వకూడదు. ఆపాలి అని ఆ పిల్లకెవరూ చెప్పక పోయినా అది చెయ్యటం చాలా అవసరం అని శారద మనసుకి గట్టిగా అనిపిస్తోంది. కానీ ఏ దారీ కనిపించలేదు. నాన్న ఉంటే బాగుండేది అనుకోవటం తప్ప మరోదారి కనిపించలేదు. విశాలాక్షి కి, అన్నపూర్ణకూ కూడా ఇంట్లో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ధనలక్ష్మి పెళ్ళి ఆపటం తప్పనే అన్నారు పెద్దలు. ధనలక్ష్మి కర్మ అలా ఉందనీ, తలరాత నెవరూ మార్చలేరనీ పదే పదే ఆ పసి పిల్లలకు చెప్పారు.

ఆ రాత్రి ముగ్గురు పిల్లలూ ఏడుస్తూనే నిద్రపోయారు.

మర్నాడు ఉదయం శారద తల్లిని డబ్బులు కావాలని అడిగింది. స్కూల్లో అవసరమేమోనని శారద అడిగిన రెండు రూపాయలూ ఇచ్చింది సుబ్బమ్మ. సాయంత్రం బడి వదిలాక ముగ్గురూ మళ్ళీ ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు. దొడ్లో బాదం చెట్టు నీడలో శారద తనకు చేతనైనట్టు ధనలక్ష్మిలో ఆశ కలిగించటానికి ప్రయత్నించింది. రెండు రూపాయలు ధనలక్ష్మికిచ్చింది.

‘‘బండివాడికివి ఇస్తే గుంటూరు తీసుకుపోతాడు. లక్ష్మీబాయమ్మ పెద్దమ్మ చాలా మంచిది. నువ్వక్కడ చదువుకోవచ్చు. ముందు నీ పెళ్ళి ఆగిపోతుంది’’

‘‘కానీ బండెవరు మాట్లాడతారు? నేనొక్కదాన్నే ఎక్కి గుంటూరు తీసికెళ్ళమంటే బండివాడు తీసికెళ్తాడా?’’ ధనలక్ష్మి బావురుమంది.

తప్పించుకోగలిగిన అవకాశం ఉండీ తప్పించుకోలేని నిస్సహాయపు ఏడుపది.

ముగ్గురూ ధనలక్ష్మికి ధైర్యం నూరిపోసేందుకు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.

తర్వాత రెండు రోజులకు ధనలక్ష్మిని పెళ్ళి కూతుర్ని చేశారు.

తలనిండా పూలతో కొత్త బట్టలతో కూడా ధనలక్ష్మి ముఖం కళావిహీనంగానే ఉంది.

ఆ తర్వాత రెండు రోజులకు అర్థరాత్రి పూట ధనలక్ష్మి పెళ్ళయిపోయింది. ఇంతెత్తున లావుగా, ఎర్రగా, మీసాలతో ఉన్న పెళ్ళికొడుకుని చూసి ధనలక్ష్మి భయంతో బిర్ర బిగుసుకుపోయింది. ఏడవాలని కూడా మర్చిపోయేంతగా భయపడిపోయింది.

అర్థరాత్రి పెళ్ళికి స్నేహితులు రాలేదు గానీ మర్నాడు శారదాంబ వాళ్ళ తోటలో కూర్చుని ధనలక్ష్మి కోసం ఏడ్చారు.

శారదాంబ పాలేరు తానా పెళ్ళి కొడుకుని చూశానని వర్ణించి చెప్పి వీళ్ళ దు:ఖాన్ని ఎక్కువ చేశాడు.

శారదాంబ తండ్రి కోసం ఎదురు చూడటమే పనిగా పెట్టుకుంది. పెళ్ళి జరిగినా సరే తండ్రి తల్చుకుంటే ఎలాగైనా ధనలక్ష్మిని రక్షిస్తాడు అనుకుని ఆ ఆలోచనతో బలం తెచ్చుకుంటోంది.

olga title

పదిరోజులు గడిచిపోయాయి. పదకొండో రోజు ఊరంతా గుప్పుమంది.

ధనలక్ష్మికి కటికి గర్భాదానం చేశారట. చచ్చిపోయింది.

శారదాంబ ముగ్గు చిప్ప అక్కడ పడేసి ఏడుస్తూ ఇంట్లోకొచ్చి పడిరది.

తల్లిని కావలించుకుని ఏడుస్తుంటే నరసమ్మ వచ్చింది.

‘‘ఆ పిల్ల దురదృష్టం కాకపోతే వాళ్ళకా పాడుబుద్ధి ఎలా పుట్టింది?’’ అంటూ శారదను దగ్గరకు తీసుకోబోతుంటే శారద నాన్నమ్మ మీద తిరగబడిరది.

‘‘ఆ పెళ్ళి ఆపమంటే ఆపలేదు నువ్వు  ఎప్పుడూ పెళ్ళి పెళ్ళి అంటావు. పెళ్ళి చేసుకుంటే చచ్చిపోతారు. ధనలక్ష్మి చచ్చిపోయింది. అమ్మా నే వెళ్ళి ధనలక్ష్మిని చూస్తానే’’ అని అరుస్తూ ఏడుస్తూ తల్లినుంచి విడివడేందుకు ప్రయత్నిస్తోంది.

సుబ్బమ్మ కూతుర్ని గట్టిగా పట్టుకుని

‘‘నువ్వు చూడలేవే భయపడతావు. ఇంక చూట్టానికేముంది? ఆ పిల్ల గొంతు కోశారు. అత్తయ్యా. కటికి గర్భాదానం చేశారట. పిల్ల అందుకే చచ్చిపోయిందట’’ ‘‘వీళ్ళ బతుకు చెడ. అట్లా ఎట్లా చేశారు? ఏం పోయేకాలం వచ్చింది? ఆ మొగుడు ముండా కొడుకు కావాలని ఉంటాడు. వీళ్ళు కాదనలేకపోయుంటారు. పాపం పిల్ల ఎంత బాధపడి ఉంటుందో’’.

నరసమ్మ మనసు కరిగిపోయింది. కళ్ళత్తుకుంది.

శారదాంబ ‘‘నువ్వు ఆపితే పెళ్ళి ఆగేది’’ అంది నాన్నమ్మతో కోపంగా.

‘‘పెళ్ళికీ, ఆ పిల్ల చావుకీ సంబంధం లేదే పిచ్చిదానా. పెళ్ళి చేసిన వాళ్ళంతా ఇలా కటికి గర్భాదానాలు చేసి పిల్లల్ని చంపుకోరు. నీ స్నేహితురాలు పెళ్ళి వల్ల చావలేదు. ‘ఆయుష్షు మూడి వాళ్ళకా బుద్ధి పుట్టి చచ్చింది’’ అంటూ గట్టిగా అరిచేసరికి శారద ఏడుస్తూ లోపలికి వెళ్ళింది.

వెళ్ళి చూసొద్దామా అనుకుని శారద వెంటబడి వస్తుందేమోననే అనుమానంలో నరసమ్మ కూడా ఆగిపోయింది. ఆ పూట అత్తాకోడళ్ళు, పనివాళ్ళూ అందరూ అవే మాటలు.

ఈ రోజుల్లో కటికి గర్భాదానం ఎవరు చేస్తున్నారమ్మా. మరీ కసాయివాళ్ళూ కాకపోతే అనేమాటే అందరూ అన్నారు.

దాంతో శారదకు ధనలక్ష్మి మరణం పెళ్ళి వల్ల కాదని అర్థం చేసుకుంది. నాన్నమ్మ మీద కోపం కాస్త తగ్గింది.

అసలు కారణాల గురించి తల్లినడిగితే ‘‘నీకు తెలియదు. చిన్నపిల్లవి చెప్పినా అర్థం కాదు’’ అని బుజ్జగించి నిద్రబుచ్చింది.

ఆ రాత్రి శారదాంబకు జ్వరం వచ్చింది. నరసమ్మ తనకు తెలిసిన గృహవైద్యం ఏదో చేసి, ఇంత విబూది నోట్లో వేసి, నుదుటికి పూసి రాత్రంతా మనవరాలి పక్కనే కూచుంది.

తెల్లారేసరికి జ్వరం తగ్గింది గానీ బడికి వెళ్ళలేకపోయింది. సాయంత్రం విశాలాక్షి, అన్నపూర్ణా వచ్చారు. ముగ్గురూ మాటలు లేకుండా ధనలక్ష్మి కోసం కన్నీరు కార్చారు చాలాసేపు. ఆ మౌనం భరించటం కూడా ఆ చిన్నమనసులకు కష్టమయింది.

‘‘గుంటూరు వెళ్తే ధనలక్ష్మి చచ్చిపోయేది కాదు కదూ’’ అంది విశాలాక్షి.

‘‘బండివాడు తీసికెళ్ళేవాడు కాదు. పురోహితుడి గారమ్మాయి ఎక్కడికో వెళ్ళి పోతోందని మళ్ళీ ఇంట్లోనే దించేవాడు’’ అన్నపూర్ణ వాస్తవం సహాయంతో దు:ఖాన్ని జయించాలనుకున్నట్టు అన్నది.

‘‘మా నాన్న ఉంటే ధనలక్ష్మిని గుంటూరు తీసికెళ్ళేవాళ్ళు’’ శారద కన్నీళ్ళు ఆగటం లేదు.

వారం రోజులకు గాని రామారావు రాలేదు. రాగానే శారదాంబను చూసి కంగారు పడ్డాడు.

‘‘సుబ్బూ అమ్మాయికేమైంది. ఇట్లా చిక్కిపోయిందేం. జ్వరంగాని వచ్చిందా? నాకు కబురు చెయ్యలేదేం’’ అని ఊపిరాడకుండా ప్రశ్నలేశాడు. సుబ్బమ్మ ధనలక్ష్మి సంగతంతా చెప్పింది. రామారావు చలించిపోయాడు. ఆయన కళ్ళల్లో కూడా నీళ్ళు నిండాయి.

‘‘పాపం చక్కటిపిల్ల. అన్యాయమై పోయింది. ఇట్లా ఎంతమంది ఆడపిల్లలు చచ్చిపోతున్నారో. బాల్య వివాహాలు కూడదని చట్టం రావాలి. ఈ బ్రిటీష్‌ వాళ్ళకేం తెలుసు. వితంతువులు పెళ్ళాడవచ్చని చట్టం తెచ్చారు గానీ చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యకూడదని చట్టం తేవాలనే జ్ఞానం లేకుండా పోయింది. ఆ మాత్రం తెలియదా? విజయనగరం మహారాజు గారు ఆ చట్టం తేవాలని కోర్టుకి కూడా వెళ్ళారు. ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేసి ఆపుతున్నారు’’.

రామారావు ధనలక్ష్మి విషాదంలోంచి మొత్తం సమాజాన్ని ఆవరించిన విషాదంలోకి వెళ్ళారు. దాని గురించి పత్రికల్లో రాయాలని, స్నేహితుల్తో చర్చించాలని ఎన్నో ఆలోచనలు ఆయన మనసుని ఆక్రమించి తాత్కాలికంగా ధనలక్ష్మి నుంచి పక్కకు మరల్చాయి.

సాయంత్రం బడి నుంచి వస్తూనే తన దగ్గరికి పరిగెత్తుకు వచ్చే శారద ఏ మాత్రం ఉత్సాహం చురుకుదనం లేకుండా పుస్తకాలు ఇంట్లోపెట్టి బట్టలు మార్చుకుని ఉయ్యాలబల్ల మీద పడుకోవటం చూసి ఆయనకు భయం వేసింది. స్నేహితురాలి మరణం శారదాంబను దెబ్బతీస్తుందా? అలా జరగకుండా తను కాపాడాలి.

రామారావు వెళ్ళి ఉయ్యాలబల్లమీద కూర్చుని శారద తలఎత్తి తన ఒళ్ళో పెట్టుకున్నాడు. తండ్రి ప్రేమపూరిత స్పర్శలో శారద దు:ఖం కట్టలు తెంచుకుంది. తండ్రి ఒళ్ళో తలపెట్టుకుని చాలాసేపు ఏడ్చింది. రామారావు శారద తల నిమురుతూ ఆ అమ్మాయి దు:ఖాన్ని ఆపే ప్రయత్నం చెయ్యకుండా పూర్తిగా బైటికి ప్రవహించనిచ్చాడు.

‘‘నాన్నా! నేను ఎప్పటికీ పెళ్ళి చేసుకోను’’ దు:ఖం తగ్గిన తర్వాత దీనంగా అంది శారద.

‘‘అలాగే తల్లీ. నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేద్దువుగాని. అసలు ఇప్పుడు పెళ్ళి అనే మాట ఎవరన్నారు? నువ్వు బాగా చదువుకోవాలి డాక్టరవ్వాలి అని కదా నేను చెబుతాను.’’

‘‘మరి నాన్నమ్మ పెళ్ళి చేసుకోవాల్సిందేనంటుందేం?’’

‘‘నాన్నమ్మకు నేను చెప్తానుగా. నాన్నమ్మకు చదువుకోవటం అంటే ఏమిటో తెలియదు. అందుకని అలా అంటుంది. నీకు నేనున్నానమ్మా. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను’’ శారద మనసు స్థిమితపడిరది. తండ్రి చెప్పే మాటలు మెల్లిగా శారద మనసులో ధైర్యాన్ని నింపాయి.

నెమ్మదిగా లేచి కూర్చుంది.

‘‘నాన్నా కటికి గర్భాదానం అంటే ఏంటి? అసలు గర్భాదానం అంటే ఏంటి?’’ కూతురి నుంచి ఈ ప్రశ్నలు ఎదుర్కొన్న మొదటి తండ్రి రామారావేనేమో. ఆయన నెమ్మదిగా లేచి వెళ్ళి స్త్రీల శరీర ఆరోగ్యం గురించి తన దగ్గర ఉన్న చిన్న పుస్తకం ఇచ్చాడు. నిజానికి అందులో ఏమీ లేదు. ఏవో బమ్మలు. శరీర పరిశుభ్రతను కాపాడుకోవటం గురించిన వివరాలూ ఉన్నాయి.

olga2a

‘‘అమ్మా శారదా. ఆడవాళ్ళకు పిల్లలు పుడతారు గదా. దానికి సంబంధించిన గర్భాదానం అంటే నీకిప్పుడు అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పటం నాకూ రాదు. మీ అమ్మనడుగు. ఏమైనా చెప్పగలదేమో. నువ్వు డాక్టరువయ్యాక ఇలాంటి విషయాలు అందరికీ అర్థమయ్యేలా మంచి పుస్తకం రాయి. నువ్వింక నీ స్నేహితురాలి సంగతి మర్చిపోయి చదువుకోవాలి. నీ చదువే నీకు అన్నీ చెబుతుంది సరేనా?’’ శారద సరేనన్నట్టు తలూపింది.

చీకటి పడటంతో నరసమ్మ దీపాలు వెలిగించి వాళ్ళ దగ్గరగా ఒకటి తెచ్చిపెట్టింది.

‘‘పిల్ల భయపడిందిరా’’ అంది కొడుకు సమీపంలో కూర్చుంటూ.

‘‘ఔనమ్మా. చాలా భయపడిరది. శారదా ` నువ్వెళ్ళి చదువుకో తల్లీ’’ అంటూ శారదను లోపలికి పంపి రామారావు లేచి తల్లి దగ్గరకు వెళ్ళి పక్కనే కూచున్నాడు.

తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని ‘‘అమ్మా శారద పెళ్ళి విషయం మర్చిపో. నేను ఈ విషయంలో నీమాట వినను. నీ మాటే కాదు ఎవరి మాటా వినను. శారదను డాక్టర్‌ కోర్సు చదివిస్తాను. ఇక్కడ మన దేశంలోనే కాదు. ఇంగ్లండ్‌ కూడా పంపించి చదివిస్తాను. ఎవరేమన్నా లెక్కచెయ్యను. దీని గురించి నువ్వింకేం మాట్లాడినా ప్రయోజనం లేదు.

అమ్మా  నువ్వంటే నాకు ప్రేమ, గౌరవం, భక్తి అన్నీ ఉన్నాయి. అది నీకూ తెలుసు. నీ విషయంలో నువ్వెలా చెయ్యాలంటే అలా చేస్తున్నావు. నాకు నమ్మకం లేకపోయినా నీ ఆచార వ్యవహారాలన్నీ ఏలోటూ లేకుండా సాగుతున్నాయి. ఎన్నడూ ‘నాకిది ఇష్టం లేదమ్మా’ అని కూడా అనలేదు నేను. నాకు కులంలో నమ్మకంలేదు. ఐనా నువ్వు బాధపడతావని ఇంట్లోకి ఇతర కులాల వాళ్ళను రానివ్వటం లేదు. కానీ శారద నా కూతురు. అది నా ఇష్టప్రకారం పెరగాలి. మారే లోకంతో పాటు మారుతూ పెరగాలి. నా కూతుర్ని గురించి నాకెన్నో ఆశలున్నాయి.

పదేళ్ళకు పెళ్ళి చేసుకుని, పదిహేనేళ్ళకు పిల్లల్ని కని ` వంటింట్లో, ఆ పొగలో మగ్గిపోవటం నేను భరించలేను. నా చిట్టితల్లి తన చేతుల్తో మనుషుల ప్రాణాలు కాపాడాలి. తను పిల్లల్ని కనటమే కాదు ఎంతోమంది పిల్లలను తన చేతుల్తో భద్రంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి. సరైన వైద్యంలేక మన దేశంలో ఎంతమంది తల్లీపిల్లలు చనిపోతున్నారో తెలుసా? నా కూతురు ఆ పరిస్థితిని మార్చేవాళ్ళలో ఒకతె కావాలి. అమ్మా! దయచేసి శారద పెళ్ళిమాట ఎత్తకు. నీకు దణ్ణం పెడతాను. నీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తాను’’

రామారావు తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. కళ్ళ వెంట నీళ్ళు కారుతూ నరసమ్మ పాదాల మీద పడుతున్నాయి.

నరసమ్మ మాటా పలుకు లేకుండా కొడుకుని చూస్తోంది. ఆమె కళ్ళల్లోనూ నీళ్ళు బుకుతున్నాయి గానీ ఆమె వాటిని కిందికి జారనివ్వకుండా అదిమి పట్టింది. ఆమెలో ఏదో ఒక నిశ్చయం, పట్టుదల, కఠినత్వం క్రమంగా కమ్ముకున్నాయి. రామారావు అక్కడినుంచి లేచి వెళ్ళిన తర్వాత కూడా ఆమె చాలాసేపు అలాగే కూర్చుంది.

సుబ్బమ్మ వచ్చి ‘‘అత్తయ్య ఫలహారం చేస్తారా?’’ అని అడిగితే సమాధానం లేదు. సుబ్బమ్మ దగ్గరికి వచ్చి అత్తగారిని చూసి భయపడిరది. ముఖం పాలిపోయి, కళ్ళు ఎక్కడో చూస్తూ, ఒంటినిండా చెమటలు. సుబ్బమ్మ రెండు చేతుల్తో అత్తగారిని పట్టుకుని కుదిపింది. నరసమ్మ ఈ లోకంలో అప్పుడే కళ్ళు తెరిచినట్టు సుబ్బమ్మ వంక చూసింది. సుబ్బమ్మకు భయం మరింత పెరిగింది.

‘‘అత్తయ్యా! ఫలహారం’’.

‘‘చేస్తాను. పద’’ నరసమ్మ కష్టంగా లేచి వంటింటి వైపు నడిచింది. సుబ్బమ్మ అత్తగారి వెనకే వెళ్ళి ఆమెకోసం సిద్ధం చేసిన ఫలహారం ఆమె ముందు పెట్టింది.

నరసమ్మ ఏం తింటుందో కూడా తెలియకుండా తింటున్నదని సుబ్బమ్మ గమనించింది. భోజనాల సమయంలో రామారావుతో ఆ మాటే అంది.

‘‘ఇవాళ అత్తయ్య అదోలా ఉన్నారు. ఫలహారం ఏం చేసిందో కూడా ఆమెకు తెలియలేదు. నాకు భయంగా ఉంది’’.

‘‘ఏం లేదులే. శారద పెళ్ళి విషయం మాట్లాడాను. పెళ్ళి ఇప్పుడు కాదనీ, చదివించాలనీ చెప్పాను. అది అరిగించుకోవటం ఆమెకు కష్టమే. కాదనలేం. కానీ అమ్మది వెళ్ళిపోయే కాలం. శారదది రాబోయే కాలం. అమ్మ కోసం శారద భవిష్యత్తుని పాడుచెయ్యలేను. నేను నిర్ణయం తీసుకున్నాను అది మార్చుకోను’’ తనను తను గట్టి పరుచుకునే ప్రయత్నం ఉంది ఆమాటల్లో.

‘‘కానీ ఆమెకు మీరొక్కరే కొడుకు’’

‘‘నాకు శారద ఒక్కతే కూతురు’’.

సుబ్బమ్మ మాట్లాడేందుకేం లేదు. మాట్లాడటం ఆమె స్వభావమూ కాదు. మొత్తంమీద ఆరోజు రాత్రి శారద ఒక్కతే నిశ్చింతగా నిద్రపోయింది. తండ్రి తనకు కొండంత అండ అని ఆ పిల్లకు అస్తిగతంగా అర్థమైపోయింది. నరసమ్మ రాత్రంతా ఆలోచిస్తూనే గడిపింది. రామారావుకీ నిద్ర లేదు. పెళ్ళి కాకుండా శారదాంబ పుష్పవతి ఔతుందనే ఆలోచన భరించటం నరసమ్మ వల్ల కాలేదు. ఈ అనాచారం సహించటం ఆమె వల్ల కాదు. ఆపటం కూడా ఆమె వల్ల అయ్యేట్టు లేదు. ప్రాణంగా పెంచుకున్న కొడుకే ప్రాణాల మీదకు తెస్తున్నాడనుకుంటే ఆమెకు దుర్భరంగా ఉంది.

తల్లి పట్టుదల తెలిసిన రామారావుకి ఈ గండం ఎలా గడుస్తుందోననే భయం మనసును తొలిచేస్తోంది.

అటూ ఇటూ పొర్లుతున్న భర్తను చూస్తూ సుబ్బమ్మ ఎప్పటికో నిద్రపోయింది.

 

***

గమనమే గమ్యం-2

 

Volga-1కృష్ణానదీ తీరంలో గుంటూరుకు దగ్గరగా ఉన్న పెద్ద గ్రామంలో స్థితిమంతుల కుటుంబం రామారావుది. నాలుగైదొందల ఇళ్ళున్న ఆ గ్రామంలో మాగాణి భూములు బంగారం పండుతాయి. అన్ని వసతులూ ఉన్న గ్రామం. బ్రాహ్మణ కుటుంబాలు ముప్ఫై, నలభై మధ్యలో ఉన్నాయి. మిగిలినవి రైతు కుటుంబాలు, చేతి వృత్తుల వారి కుటుంబాలు. ఊరి చివర ఓ వంద గుడిశల మాలపల్లి ఉంది. మంచి బడి, పెద్ద గుడి ఉన్న గ్రామం.

గుంటూరికి, బెజవాడకూ దగ్గరగా ఉండటంతో పట్టణ పోకడలను తొందరగా అందిపుచ్చుకునే అవకాశం ఉన్న గ్రామం. రామారావు తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి అన్ని బాధ్యతలూ మోసి పెంచింది. అక్క శారదాంబ తమ్ముడిని అమితంగా ప్రేమించేది. పెళ్ళయి తను పట్నంలో కాపురం పెడుతూ తనతో పాటు తమ్ముడినీ తీసుకెళ్ళి కాలేజీ చదువు వరకూ తనే బాధ్యత తీసుకుంది. తమ్ముడి పెళ్ళి చేసిన రెండేళ్ళకే ఆమె మరణించింది. రామారావు అక్క మరణం నుంచి కోలుకోటానికే రెండేళ్ళు పట్టింది. చిన్న శారదాంబ పుట్టిన తర్వాత ఆయన మళ్ళీ మనిషై తనకు ఆసక్తి ఉన్న సాహిత్యం, చరిత్ర విషయాల మీద పని చేస్తున్నాడు.

నెలకు పదిరోజులు పైగా రామారావు మద్రాసు, విశాఖపట్నం, గుంటూరు, బెజవాడలు వెళ్ళటం ఇంట్లో వాళ్ళకి అలవాటే. ఇంటి పనులూ, పొలం పనులు అన్నీ తల్లి నరసమ్మే చూసుకుంటుంది. ఆవిడ చాలా సమర్థురాలు. ఇల్లూ, పొలం రెండూ ఆవిడ ఆదేశాల ప్రకారమే నడుస్తాయి. అన్ని పనులూ ఆవిడ మీద ఒదిలేసి రామారావు తన శాస్త్ర, సాహిత్య విషయాల్లో  మునిగిపోయే వీలుంది గాబట్టి ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోతోంది. శారదాంబ పెంపకం, ఇంటిపని, వంటపని రామారావు భార్య సుబ్బమ్మ అతి తేలిగ్గా చేసేస్తుంది. పాతికెకరాల సేద్యం. మామిడి తోటలున్నాయి. ఆర్థికంగా లోటు లేకపోవడంతో ఆయన జీవితం గురించి ఆలోచించే అవసరం లేకుండా ఇతర విషయాల మీద శ్రద్ధ పెట్టగలుగుతున్నాడు. పండితులతో స్నేహం, చర్చలు, సంఘం గురించిన ఆలోచనలు సామాన్య జనం గురించి, వారికి, విద్య, సాహిత్య, శాస్త్ర విషయాలు అందుబాటులోకి తేవటం గురించి ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఆ పని ఏ ఆటంకమూ లేకుండా చేసుకోవటానికి పెద్ద అండగా తల్లి నరసమ్మ ఉంది.

శారదాంబ అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. నరసమ్మ, సుబ్బమ్మలు ఆమెను కింద నడవనివ్వరు. చనిపోయిన కూతురు మళ్ళీ పుట్టిందని నరసమ్మ నమ్మకం. కంటిపాపలా చూసుకుంటుంది. ఆ ఊళ్ళో ఉన్న బడిలో ఎనిమిదో తరగతి వరకూ చదువు చెప్తారు. శారదాంబను ఆ బడికి పంపటానికి రామారావు తల్లితో చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే చదువు చెప్పించమని తల్లి, బైటి బడికి వెళ్ళి నలుగురితోపాటు చదువుకోవాలని రామారావు, చివరికి శారద బడికి వెళ్తానని పట్టుబట్టటంతో నాయనమ్మ లంగిరాక తప్పలేదు. బడికి వెళ్ళేనాటికే శారదాంబకు రాయటం, చదవటం బాగావచ్చు. ఏడో ఏట మూడో తరగతిలో చేరింది శారదాంబ.

ఆ రోజు బడంతా పండగ వాతావరణం. పిల్లలకు లడ్లు, బూంది పంచి పెట్టారు. శారదాంబ తరగతిలో అంతకుముందే ఇద్దరాడపిల్లలు ఉన్నారు. విశాలాక్షి, ధనలక్ష్మి. విశాలాక్షి దేవదాసి కుటుంబం నుంచి వచ్చింది. ధనలక్ష్మి వాళ్ళు బ్రాహ్మణులు తండ్రి పౌరోహిత్యం చేస్తాడు. పెద్ద కుటుంబం. ఇంట్లో ఏటా పిల్లలు. ఊళ్లో పెరిగే అప్పులు. భారంగా కుటుంబాన్ని లాగుతున్నాడు. శారదాంబ చేరిన నాలుగు రోజులకు అన్నపూర్ణ అనే రైతు కుటుంబపు అమ్మాయి చేరింది. నలుగురమ్మాయిలకూ మంచి స్నేహం కుదిరింది. రోజూ కలిసి బడికి రావటం, పోవటం మొదలైంది. విశాలాక్షి బ్రాహ్మణ వీధికొస్తే ధనలక్ష్మి కలుస్తుంది. ఇద్దరూ కలిసి శారదాంబ ఇంటికి చేరేసరికి ఆ అమ్మాయి వీధి వాకిట్లో వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటుంది. ముగ్గురూ కలిసి తూర్పు వీధిలోకి వెళ్తే అన్నపూర్ణ ఎదురొస్తుంది.

నలుగురూ కలిసి బడికి వెళ్తుంటే దారిలో ఇళ్ళ వాళ్ళంతా విడ్డూరంగా చూసేవారు. చదువు కోసం ఆడపిల్లలు బడికి వెళ్ళటం ఆ ఊళ్ళో అదే మొదలు. శారదాంబ తండ్రి రామారావుకి ఇంగ్లీషు చదువుల పిచ్చి ఉందని తెలుసు. పైగా వాళ్ళు స్థితిమంతులు. ఏం చేసినా చెల్లిపోతుంది. విశాలాక్షి గురించి ఎవరికీ పట్టింపు లేదు. ధనలక్ష్మి బడికి పోవటం ఊళ్ళో బ్రాహ్మణులెవ్వరికీ ఇష్టం లేదు. మూతులు విరుచుకుంటూ, ధనలక్ష్మి తల్లిని సూటిపోటి మాటలంటూ అక్కసు తీర్చుకునేవారు. అన్నపూర్ణ గురించి గొణుక్కునేవారు. నలుగురాడపిల్లలూ బడికి వెళ్ళి హెడ్‌మాస్టారు గదిలో కూర్చుంటారు. గంట కొట్టిన తర్వాత, మగపిల్లలందరూ క్లాసుల్లో కూర్చున్న తర్వాత తమ క్లాసు టీచరు వెనకాల నడుచుకుంటూ క్లాసులోకి వెళ్ళి ఓ పక్కన కూచుంటారు.

మగపిల్లలకీ వీళ్ళకీ మధ్య చాలా దూరం. పాఠాలు జాగ్రత్తగా విని పంతులుగారి వెనకాలే హెడ్‌మాస్టారు గారి గదిలోకి వచ్చి, మగపిల్లలంతా వెళ్ళిపోయాక నలుగురూ ఒక కట్టగా బయల్దేరతారు. మొదటి రెండేళ్ళూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఐదో తరగతిలోకి వచ్చాక అందరూ సాయంత్రం ఒక గంట శారదాంబ ఇంట్లో ఆగి ఆడుకుని, కబుర్లు చెప్పుకుని ఇళ్ళకు వెళ్ళటం అలవాటయింది. శారదాంబ వాళ్ళది పెద్ద దొడ్డి. జామ, మామిడి, సపోటా చెట్లతో అందంగా ఉంటుంది. బోలెడు పూల మొక్కలు. పిల్లలు ఆడుకున్నంత సేపు ఆడుకుని సన్నజాజి మొగ్గలు కోసుకుని మాలకడతారు. అన్నపూర్ణ వెతికి వెతికి సంపెంగ పూలు కోసుకుంటుంది. సుబ్బమ్మ అందరికీ శనగపప్పు, బెల్లం, అటుకులు, కాల్చిన అప్పడాలు, ఉప్పుడు పిండి రోజుకో రకం తింటానికి పెడుతుంది. అవి తిని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు కలుస్తామా అనుకుంటూ నిద్రపోతారు.

Image (13) (1)

చిత్రం: పార్వతి

శారదాంబ నరసమ్మ పక్కలోనే పడుకుంటుంది. ఆమె ఏవో పాటలు పాడుతుంది. రామాయణం, భారతం కథలుగా చెబుతుంది. విశాలాక్షికి కూడా తల్లి కోటేశ్వరి కీర్తనలు నేర్పుతుంది. కథలూ చెబుతుంది. ధనలక్ష్మి తల్లికి అంత తీరికుండదు. అన్నపూర్ణకూ ఇంట్లో చెప్పే వాళ్ళు లేరు. విశాలాక్షి శారదాంబ చెప్పే కథలూ, పాడే పాటలు కళ్ళూ చెవులూ అప్పగించి వింటారు. పాటలు నేర్చుకుంటారు. శారదాంబది మంచి కంఠం. ఆ పిల్ల గొంతెత్తి పాడితే ఎంతో బాగుంటుందని నలుగురూ చేరతారు.

రామారావు ఇంటిపట్టున ఉన్నపుడు శారదకు ఎన్నో విషయాలు చెప్పేవాడు . సైన్సు, చరిత్ర గురించి తండ్రి చెప్పే మాటలు అర్థమైనా, కాకపోయినా నోరు తెరుచుకు వినేది శారదాంబ. విన్నది విన్నట్లు అక్షరం పొల్లు పోకుండా స్నేహితురాళ్ళకు చెప్పేది. వాళ్ళు విని అడిగే ప్రశ్నలకు శారదాంబ దగ్గర సమాధానం ఉండేది కాదు. ‘‘మా నాన్నగారి నడిగి చెప్తాననేది’’. మళ్ళీ రామారావు మద్రాసు నుంచి వచ్చేసరికి కొత్త సంగతులు ఎన్నో ఉండేవి.

‘‘మా నాన్న నన్ను డాక్టర్‌ చదివిస్తాడు.’’ ఈ మాట ప్రతిరోజు ఒక రోజన్నా శారదాంబ తన స్నేహితులకు చెప్పవల్సిందే.

ధనలక్ష్మి శారదాంబ వంక భక్తిగా చూసేది. తను కూడా డాక్టరైతే అన్న కోరిక లీలగా ఎక్కడో ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించేది. ఎప్పుడన్నా ఆపుకోలేని రోజు ‘‘నేనూ డాక్టరైతే బాగుంటుంది కదూ’’ అనేది.

‘‘మనందరం డాక్టర్లమైతే’’ శారదాంబ మిగిలిన ఇద్దరివంకా చూసిందోనాడు. విశాలాక్ష్మి భయంగా ‘‘అమ్మో ` నేను డాక్టరవను. నాకు భయం. నేను హాయిగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉంటా. ఆ రోగాలూ నొప్పులూ నా కొద్దు’’ అంది.

అన్నపూర్ణ కూడా ముఖం చిట్లించింది.

శారదాంబ నిరుత్సాహ పడకుండా ‘‘పోన్లేవే ` మేమిద్దరం డాక్టర్లమవుతాం. మీకు మందిలిస్తాం’’ అన్నది.

నలుగురూ నవ్వుకుని కాసేపు డాక్టరు, రోగి ఆట ఆడుకున్నారు.

ఇంకో నాలుగు నెలలకు ఐదో తరగతి పూర్తయి ఆరో క్లాసులోకి వస్తారనగా ఓ రోజు ధనలక్ష్మి బడికి రాలేదు. ముగ్గురు స్నేహితురాళ్ళకూ ఏమీ తోచలేదు. బడి వదలగానే శారదాంబ ఇంటికి వెళ్ళకుండా ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు. అన్నపూర్ణకు, విశాలాక్షికి ధనలక్ష్మి ఇంట్లోకి ప్రవేశం లేదు. శారదాంబ లోపలికి వెళ్ళి ధనలక్ష్మిని పిల్చుకొచ్చింది.

వాళ్ళ వెనకే ధనలక్ష్మి వాళ్ళమ్మ కోటమ్మ వస్తూ

‘‘మీ సావాసగత్తె పెళ్ళి కుదిరింది. ఇంక మీ ఆటలు కుదరవు’’ అంది నవ్వుతూ. ముగ్గురూ ధనలక్ష్మి వంక ఆశ్యర్యంగా చూశారు.

‘‘నన్ను చూసుకోటానికి పెళ్ళివారొచ్చారు. అందుకే బడికి రాలా’’ అంది ధనలక్ష్మి సిగ్గుపడుతూ.

‘‘పెళ్ళికొడుకు బాగున్నాడా?’’ విశాలాక్షి ఆత్రంగా అడిగింది.

‘‘పెళ్ళికొడుకు రాలేదుగా’’ అమాయకంగా చెప్పింది ధనలక్ష్మి.

‘‘ఐతే నువ్వింక బడికి రావా?’’ శారదాంబ అనుమానంగా అడిగింది.

‘‘పెళ్ళయితే ఎట్లా వస్తాను? మీరు మాత్రం వస్తారా?’’

ధనలక్ష్మి ప్రశ్నకు ముగ్గురూ ముఖముఖాలు చూసుకున్నారు

‘‘మరి నువ్వు డాక్టర్‌ చదువుతానన్నావు’’ ధనలక్ష్మి ఏదో ఆడినమాట తప్పి తనకు ద్రోహం చేస్తున్నట్లు అడిగింది శారదాంబ.

‘‘పెళ్ళయితే ఇంక చదువెలా కుదురుతుంది? నువ్వయినా పెళ్ళి చేసుకోకుండా డాక్టరెలా చదువుతావు?’’

నెమ్మదిగా అడిగిన ధనలక్ష్మి మాటలకు రోషం వచ్చింది.

‘‘నేను అసలు పెళ్ళి చేసుకోను. డాక్టర్‌నవుతా?’’

ముగ్గురూ శారదాంబ వంక ఆశ్చర్యంగా చూశారు. ధనలక్ష్మి ఆలోచనలో పడిరది. కాసేపు నిశ్శబ్దం తర్వాత ధనలక్ష్మి మెల్లిగా చెప్పింది.

‘‘మా నాన్న నన్ను చదివించలేడు. ఈ పెళ్ళివారు నేనంటే ఇష్టపడి చేసుకుంటున్నారట. కట్నం ఇవ్వక్కర్లేదు. ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటారట. ఈ సంబంధం చేసుకుంటే మా అన్నయ్యకు ఏదో ఉద్యోగం కూడా ఇప్పిస్తారంట. అందుకని నేను పెళ్ళి చేసుకోవాలి. తప్పదు. ఐనా నేను సంతోషంగానే ఉన్నా’’.

ధనలక్ష్మి తన ముఖంలోకి రాబోతున్న నీలినీడలను తరిమి చిన్నగా నవ్వింది.

కోటమ్మ వచ్చి నలుగురి చేతుల్లో నాలుగు బెల్లం ముక్కలు పెట్టింది. నలుగురూ అవి నోట్లో వేసుకుని ఆ తీపి మింగుతూ దిగులు మర్చిపోయారు.

***

‘‘నాన్నమ్మా ! నాన్నమ్మా! ధనలక్ష్మి పెళ్ళి తెలుసా?’’ పుస్తకాలు ఓ పక్కన పెట్టి నాన్నమ్మ మీదికి దూకబోయింది శారద.

‘‘ముందు కాళ్ళూ, చేతులూ కడుక్కుని ఆ కిరస్తానం గుడ్డలు విప్పి శుభ్రమైన బట్టలు కట్టుకుని రా’’ కసిరింది నరసమ్మ.

శారద రోజూ అలాగే చేసేది. ఆ రోజు ధనలక్ష్మి పెళ్ళి కబురు ఎప్పుడెప్పుడు అమ్మకూ, నాన్నమ్మకూ చెబుదామా అనే హడావుడిలో మర్చిపోయింది.

గబగబా స్నానాల దొడ్లోకి వెళ్ళి నాన్నమ్మ చెప్పినట్లు చేసి వచ్చింది.

నరసమ్మ అప్పటిదాకా చేసిన వత్తులన్నీ తీసి వత్తుల పెట్టెలో పెట్టి లేవబోతోంది. శారద వచ్చి నాన్నమ్మ ఒళ్ళో ఎక్కి కూచుంది. నరసమ్మ శారద నెత్తిన ముద్దుపెట్టి గట్టిగా తనకేసి లాక్కుంది.

‘‘నాన్నమ్మా ధనలక్ష్మి పెళ్ళి తెలుసా?’’

‘‘తెలుసులేవే. వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు నిన్ననే. ఐనా స్నేహితురాలి పెళ్ళికే ఇంత హడావుడి పడుతున్నావు. నీ పెళ్ళి కుదిరితే ఇహ గంతులేస్తావా?’’

శారద నవ్వింది.

‘‘నాన్నమ్మా, నీకు తెలియదా? నేను పెళ్ళి చేసుకోనుగా. డాక్టర్‌ చదవాలిగా. పెళ్ళెలా చేసుకుంటాను?’’

‘‘డాక్టరమ్మవవుతావూ? నయమే. నా బంగారు తల్లి ఎప్పుడు పెళ్ళి కూతురవుతుందా అని నేను చూస్తుంటే.’’

శారద నాన్నమ్మ ఒడినే ఉయ్యాల చేసుకుని ఊగుతూ.

‘‘నాన్నమ్మా, నిజంగా నేను పెళ్ళి చేసుకోను. కావాలంటే నాన్ననడుగు. నాన్న నన్ను డాక్టర్‌ చదివిస్తానన్నాడు. నా చిన్నప్పుడు మేం రాజమండ్రి వెళ్ళాం. అక్కడా అమ్మమ్మ చెప్పింది. గుంటూర్లో పెద్దమ్మ కూడా చెప్పింది. నేను డాక్టర్నవ్వాలట. నాన్న వాళ్ళందరికీ చెప్పేశాడు. నన్ను ఇంగ్గండ్‌ కూడా పంపుతాడు. నీకు ఇంగ్లండ్‌ అంటే తెలుసా?’’

కూతురు ముద్దు మాటలను మురిపెంగా వింటున్న సుబ్బమ్మను చూసింది నరసమ్మ. కోడలంటే ఆమెకు ఇష్టమే. కానీ కొడుకు ఏ మాటంటే ఆ మాటకు గంగిరెద్దులా తలూపుతుందనే కోపం కూడా ఉంది. ఇప్పుడు శారద మాటలకు చిరాకు పడకుండా సంతోష పడుతున్న కోడలిని చూస్తే కోపం ముంచుకొచ్చింది.

‘‘చిన్న పిల్లలకు ఈ మాటలేనా నేర్పించేది. అసలు బడికి పంపొద్దంటే వినకుండా పంపుతున్నారు. డాక్టరు చదివిస్తాడేం. ముందు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి ఆ తర్వాత ఏం చేసుకుంటాడో చేసుకోమను. వాడంటే మగాడు. పది ఊళ్ళు తిరుగుతున్నాడు. కిరస్తానీ స్నేహాలు పట్టి అటూ ఇటూ ఊగుతున్నాడు. తల్లివి. నువ్వు పిల్లకు బుద్ధులు నేర్పుకోవద్దూ. కట్టుకున్నవాడు ఎట్లా ఆడమంటే అట్లా ఆడటమేనా? మొగుడికి బాధ్యతలు గుర్తు చెయ్యొద్దూ. అయ్యోరాత! చక్కగా ముస్తాబు చేసుకుని కూచోటం తప్ప నీకింకేం చేత కాదు. అన్నీ నేనే సమర్థించుకు రావాలి’’.

నాన్నమ్మ అమ్మని ఎందుకు కేకలేస్తోందో శారదకు అర్థం కాలేదు. మొత్తానికి నాన్నమ్మకు తను డాక్టరవటం ఇష్టం లేదని మాత్రం అర్థమైంది.

‘‘నాన్నమ్మ! అమ్మనేం అనకు. నన్ను డాక్టర్‌ చేసేది నాన్న’’

‘‘సరేలే సంబరం. పద. దీపాలు వెలిగించే వేళయింది. ఎక్కడి పనులు అక్కడే

ఉన్నాయి’’. మనుమరాలిని ఒళ్ళోంచి కిందికి దించి విసురుగా లోపలికి వెళ్ళింది.

నాన్నమ్మ కోపం చూసి శారద బిక్క ముఖంతో నుంచుంది. సుబ్బమ్మ శారదను దగ్గరకు తీసుకుని

‘‘నాన్నమ్మ అంతేలేమ్మా. నాన్న వస్తే నాన్నమ్మ కోపం పోగొడతారు. నువ్వు చదువుకో’’ అని ఆమె కూడా వంటింటి వైపు నడిచింది.

***

విశాలాక్షి కూడా ఇంటికి వెళ్ళగానే తల్లితో ఇదే విషయం హడావుడిగా చెప్పేసింది. కోటేశ్వరి పెద్ద ఆసక్తి చూపకుండా ‘అలాగా’ అని తన పని తను చూసుకుంటూ

ఉండిపోయింది. ఐతే ఆమె మనసు మాత్రం విశాలాక్షికి ఎప్పటికైనా తను పెళ్ళి చేయగలదా అనే ఆలోచనతో కొంత దిగులు నింపుకుంది.

కోటేశ్వరిది దేవదాసి కులం. ఆ ఊళ్ళోని వేణుగోపాల స్వామి ఆలయం చాలా పెద్దది. ఆ దేవుడి మాన్యం కూడా చాలా ఉంది. దాన్లో కొంత ఆదాయం కోటేశ్వరికి వస్తుంది. దానిని కోటేశ్వరి బెజవాడలో ఉంటూ వృత్తి చేసుకుంటున్న ఇద్దరక్కలకూకొంత కొంత పంచి తను కొంత వాడుకుంటుంది. ఉత్సవాల రోజుల్లో ఆలయంలో నృత్యం చేస్తుంది. పక్క ఊళ్ళోని ధనిక రైతు రంగయ్య గారు వీళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. ఆయనే విశాలాక్షి తండ్రి. కోటేశ్వరి ఆయననే నమ్ముకుంది. ఊళ్ళో కూడా కోటేశ్వరి అంటే అందరికీ ఆదరమే ఉంది. తిండికి, బట్టకు లోటు లేదు. అన్ని అవసరాలూ రంగయ్యగారు చూస్తాడు. విశాలాక్షి అంటే ఆయనకు చాలా ప్రేమ. కూతుర్ని బాగా చదివించాలని అంటుంటాడు. పరిస్థితులు అనుకూలిస్తే అమ్మాయిని సీమ పంపించి చదివిద్దాం అంటాడు. ఐతే కోటేశ్వరి కూతురికి ఎలాంటి ఆశలూ పెట్టలేదు. సంగీతం, నాట్యం నేర్పటం మానలేదు. ఎటుపోయి ఎటు వచ్చినా కులవృత్తే కూడు పెడుతుందని ఆమె నమ్మకం. కానీ దేవదాసి వృత్తి మీద లోకానికి చిన్నచూపు ఏర్పడుతోందని, రాబోయే కాలంలో అసలు దేవదాసీలే ఉండకుండా చట్టాలు తెస్తారని రంగయ్య చెబుతుంటే కోటేశ్వరి గుండె దడదడలాడేది. నాట్యం చేయటం, పాటలు పాడటం, ఓ పెద్ద దిక్కుని అండగా చూసుకుని నమ్ముకోవటం తప్పెందుకవుతుందో కోటేశ్వరికి అర్థమయ్యేది కాదు ` ఆమె పూర్వీకులు అలాగే బతికారు. గౌరవంగానే బతికారు. దేవుడి దయవల్ల తనకీ ఓ అండ దొరికింది, ఓ కూతురు పుట్టింది. అంతా సవ్యంగానే ఉందనుకుంటుంది. కానీ ఆమెకీ తెలుస్తూనే ఉంది. గుళ్ళో ఉత్సవాలలో ఆర్భాటం తగ్గుతోంది. నాట్యాన్ని ఇంతకు ముందులా ఆనందించే వారు తగ్గుతున్నారు. తన కులానికి గౌరవం తగ్గుతోంది. నిజమే ` తన కులంలో అవినీతి పరులూ, దురాశాపరులు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఏ కులంలో లేరు? మోసం చేసి బతికేవారు అన్ని కులాల్లోనూ ఉంటారు. ఎవరి వృత్తి వారు న్యాయంగా, ధర్మంగా చేసి కట్టు తప్పకుండా బతికేవారు, ఎప్పుడూ వేళ్ళమీద లెక్కపెట్టేంతమందే ఉంటారు. పైగా ఆర్థికంగా కటకటలాడే రోజుల్లో మోసాలు జరగక ఆగుతాయా?

వీరేశలింగం గారు తమ కులం గురించి మాట్లాడే మాటలు రంగయ్యగారు చెబుతుంటే కోటేశ్వరికి ఆగ్రహం వచ్చేది.

‘‘మా కులం గోల ఆయనకెందుకు? ఆయన కులాన్ని ఆయన్ని ఉద్ధరించు కోమనండి’’ అనేది.

రంగయ్య కాసేపు ఆయన్ని సమర్థించేవాడు. కాసేపు విమర్శించేవాడు.

‘‘నా కూతురు మాత్రం చదువుకుని తగినవాడిని పెళ్ళాడాల్సిందే’’ అనేవాడు. కోటేశ్వరి మనసు చివుక్కుమన్నా కన్నతండ్రి అలాగే అనుకుంటాడని ఊరుకునేది.

‘‘మీ కులవృత్తి మీద ఇంగ్లీషు వాళ్ళ కన్ను పడిరది. వాళ్ళ కన్నుపడిన ఏ కులవృత్తి సజావుగా నడిచింది? నేతపనివారు నాశనమయ్యారు. రైతులూ కటకటలాడుతున్నారు. ఒక్కో వృత్తిని నాశనం చెయ్యటమే పనిగా పెట్టుకున్నారు’’ అనేవాడు. కోటేశ్వరికి భయం పుట్టుకొచ్చేది. తనకు దేవుడి మాన్యం నుండి వచ్చే ఆదాయం లేకపోతే ఇద్దరక్కలూ వీధిన పడతారు. రంగయ్యగారు తనను చూసుకున్నా అక్కలిద్దరూ నిరాధారంగా నిలబడాలి. రంగయ్యగారు చెప్పినట్టు విశాలాక్షిని చదివించటమే మేలని అనుకుంది. విశాలాక్షి పెళ్ళి జరగటం అంత తేలిక కాదని కోటేశ్వరికి తెలుసు. కానీ చక్కని పిల్ల. ఎవరో ఒకరు చేరదీస్తారనే నమ్మకమూ ఉండేది. ఈ ఆలోచనలన్నీ ఒక్కసారి చుట్టుముట్టి ఆమె ధనలక్ష్మి పెళ్ళి గురించి సంతోషించనూ లేదు. విచారించనూ లేదు. విశాలాక్షి రోజూలాగే సంగీతం పాడుకుంటూ కూచుంది.

అన్నపూర్ణ ఇంట్లో మాత్రం ధనలక్ష్మి పెళ్ళి వార్త సందడి రేకెత్తించింది. అన్నపూర్ణ పెళ్ళి ఎప్పుడు చెయ్యాలి, ఎలాంటి సంబంధం తేవాలి అని తల్లిదండ్రులు వాదించుకున్నారు. తండ్రి చదువుకున్నవాడినే చూస్తానంటాడు. ఆస్తిపరుడు కావాలని తల్లి, నాయనమ్మా వాదించారు. అన్నపూర్ణ వాళ్ళ మాటలన్నీ వింటూ కూచుంది.

చదువు, పొలం రెండూ ఉన్నవాడు ఉండడా? అలాంటి వాడిని చూడొచ్చుగా ఎందుకిలా తగువుపడుతున్నారనే విసుగొచ్చేదాక వాళ్ళ మాటలు విని ఆ తర్వాత పుస్తకాలు తీసుకుని దీపం ముందు చేరింది?

***

ఉదయాన్నే చల్ల చిలికే చప్పుడికి నిద్ర లేస్తుంది శారద. అప్పటికే దాసి వచ్చి ఇంటి ముందంతా ఒత్తుగా పేడ కళ్ళాపి చల్లేస్తుంది. ఈ మధ్యనే నరసమ్మ శారదకు ముగ్గులు వేయటం నేర్పింది. ధనలక్ష్మి కూడా చాలా నేర్పింది. శారదా వాళ్ళింటి ముందున్నంత చోటు ఎవరింటి ముందూ లేదు. ఆ చోటంతా ముగ్గులు పెట్టటంలో అమిత శ్రద్ధ శారదకు. గంటకు పైగా తదేక దీక్షతో ముగ్గులలో మునిగిపోతుంది.

ఆ రోజు కూడా వాకిటి నిండా ముగ్గేసి అరుగు మీద కూచుని ఆనందంగా చూస్తుంటే ఊరినుంచి రామారావు వచ్చాడు.

శారద ఒక్క పరుగున వెళ్ళి తండ్రి చేతిలో సంచీ అందుకుంది.

‘‘నీకోసం బోలెడు పుస్తకాలు తెచ్చా’’నన్నాడు శారదను ఎత్తుకుని ముద్దాడి దించుతూ`

శారద ముఖం వికసించింది.

‘మిఠాయిలు కూడా తెచ్చాలే’’ అంటూ ఇంట్లోకి నడిచాడు. నరసమ్మ, సుబ్బమ్మ చేతిలోని పనులు వదిలేసి వచ్చారు. యోగక్షేమాలడిగి, ముఖ్యమైన సమాచారాలు చెప్పుకున్నాక రామారావు స్నానానికి వెళ్ళాడు. అత్తాకోడళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగారు. శారద స్కూలుకి తయారయింది. విశాలాక్షి వస్తుందని చూస్తోంది. తండ్రి తెచ్చిన కొత్త పుస్తకాలు స్నేహితులకు చూపించేదాకా నిలవలేకుండా ఉంది.

స్నానం ముగించి, పూజ చేసుకుని వచ్చిన తండ్రిని చూసేసరికి క్రితం రోజు జరిగినదంతా గుర్తొచ్చింది శారదకు.

‘‘నాన్నా. ధనలక్ష్మి పెళ్ళి కుదిరింది. ఇంక బడికి రాదట’’ అని తండ్రితో రహస్యం చెప్పినట్లు చెప్పింది.

రామారావు ‘‘అయ్యో’’ అన్నాడు.

‘‘నాన్నమ్మ నాకూ పెళ్ళి చేస్తుందట. నేనూ చదువు మానెయ్యాలట. నేను డాక్టర్‌ చదువుతానంటే నాన్నమ్మకు కోపం వచ్చి బాగా అరిచింది. అమ్మ ఏమీ అనకపోయినా అమ్మమీద కూడా అరిచింది’’. రామారావు ముఖం గంభీరమైంది. శారద పెళ్ళి విషయంలో తల్లితో గొడవ పడాల్సి వస్తుందని ఆయనకు తెలుసు. ఎంత గొడవవుతుంతోననే భయమూ ఉంది. ఎంత గొడవైనా సరే తల్లి మాట వినకూడదని మనసులో గట్టి నిర్ణయం చేసుకున్నాడు. కానీ తల్లిని ఎదుర్కోవాల్సిన గడ్డుకాలం దగ్గరపడిరదని ఆయనకు అర్థమైంది. మరో నాలుగు నెలల్లో శారదకు పదేళ్ళు నిండుతాయి. తల్లి ఊరుకోదు. ఏం చెయ్యాలి?  ఆయన మనసులో ఆందోళన ముఖంలో కనపడిరది. శారదకు తండ్రి ఆలోచన అర్థమయ్యి అవనట్లు ఉంది. ఇంతలో విశాలాక్షి పిలుపు విని ఒక్క పరుగు తీసింది.

రామారావు ఫలహారం చేసి బైటికి వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా నరసమ్మ వచ్చి పొలం పనులూ, వ్యవహారాలు చెప్పటం మొదలుపెట్టింది.

‘‘ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావమ్మా. నువ్వు చూసుకుంటే చాలు’’ అన్నాడు.

‘‘నేను ఎన్నాళ్ళు చూసుకుంటానురా. అన్నీ నీకు అప్పజెప్పి నేను హాయిగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ కూర్చుంటాను. నువ్వు ఈ తిరుగుళ్ళు మాని ఇంటిపట్టున ఎప్పుడుంటావో చెప్పు’’ అంది నిష్టూరంగా.

‘‘అమ్మా. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అక్క రాసిన పుస్తకం అచ్చు అవుతోంది. ఇంకా ఎన్నో పుస్తకాలు అచ్చు వెయ్యాలి. మన తెలుగు వారి చరిత్రంతా రాయించి ముద్రించాలి. ఆ పనులు నావి. ఇంటి వ్యవహారాలన్నీ నీవి.’’

నరసమ్మ కొడుకు భరోసాకు నవ్వింది.

‘‘సరేరా ా ఇంటి వ్యవహారాలన్నీ నేనున్నంత కాలం నే చూస్తా ా కానీ నీ కూతురి పెళ్ళన్నా నువ్వు చెయ్యవా? నాలుగూళ్ళూ తిరుగుతున్నావు. పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలు చేస్తున్నావు. మంచి సంబంధం చూసి శారద పెళ్ళి చేశావంటే ఇక నువ్వు ఎక్కడ తిరిగినా మాకు బెంగ ఉండదు. ఆ ఒక్క పనీ చెయ్యి నాయనా’’.

రామారావు గుండె దడదడలాడిరది. కానీ తేల్చి చెప్పాల్సిన సమయమూ ఇదేననుకున్నాడు.

‘‘శారద పెళ్ళికి తొందరలేదులే అమ్మా’’ అన్నాడు ప్రశాంతంగా. నరసమ్మకు ఆ మాటతో ఎక్కడ లేని ఆవేశం వచ్చింది.

‘‘తొందర లేదా? పదేళ్ళు నిండుతున్నాయి. పెద్దపిల్లయిందంటే ఎంత అప్రదిష్ట. ఎంత అనాచారం. పిల్ల పుష్పవతి కాకుండానే పెళ్ళి చెయ్యాలిరా’’.

‘‘అమ్మా అది జరిగే పని కాదు. శారదని చదివించాలి’’.

‘‘ముందు పెళ్ళి చెయ్యి. మొగుడికిష్టమైతే చదివించు. లేదా చదివించుకుంటానన్న మొగుడ్నే తీసుకురా!’’

‘‘అలా కాదులే అమ్మా! అంత చిన్నపిల్లకు పెళ్ళి మంచిది కాదు.’’

‘‘మంచిది కాదని నువ్వంటే సరిపోయిందా?’’ అష్టా వర్షేత్‌ భవేత్‌ కన్యా’’ అన్నారు. అదెలాగూ చెయ్యలేదు. పిల్ల ఈడేరకుండా పెళ్ళి చెయ్యాలని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. పెద్దలంతా అలాగే చేశారు. వాళ్ళందరికంటే నీకెక్కువ తెలుసా?’’

‘‘కాలం మారుతోందమ్మా’’ పట్టుదలగా అన్నాడు రామారావు.

‘‘ఆ కబుర్లన్నీ నాకు చెప్పకురా. మగవాడివి. ఏం చేసినా నీకు చెల్లిపోతుంది. ఆడవాళ్ళం. మాకు సంప్రదాయం, కుటుంబపరువు ప్రతిష్ట ముఖ్యం. వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం. శారద పెళ్ళి జరిగిపోవాల్సిందే. కావాలంటే కొడుకుని కనిచదివించుకో. నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో’’

ఇక ఆ మాటలకు తిరుగులేదన్నట్లు లోపలికి వెళ్ళిపోయింది నరసమ్మ.

రామరావుకి సమస్య తననుకున్నదానికంటే పెద్దదనిపించింది. తల్లి సంగతి ఆయనకు బాగా తెలుసు. ఆవిడ పట్టు పట్టిందంటే వదిలించటం ఎవరి తరమూ కాదు. ఎంతమంచి మనిషో అంత మొండి మనిషి. ఐతే ఆ మొండితనం రామారావుకీ ఉంది. తల్లి నుంచే వచ్చింది. శారదను డాక్టర్‌ చదివించాలనే పట్టుదల ఆయనకీ గట్టిగా ఉంది. ఈ చిక్కుముడి వీడే మార్గం మాత్రం ఆయనకు తెలియటం లేదు. ఆ రోజు రాత్రి తన బాధంతా భార్యముందు వెళ్ళబోసుకున్నాడు. ‘‘అంతా ఆ భగవంతుడి మీద వేసెయ్యండి. ఎలా జరగాలో అలా జరుగుతుంది’’ అందావిడ తేలిగ్గా తీసేస్తూ.

‘‘నీలాగా ఆలోచించకుండా బతికితే భలే సుఖంగా ఉంటుందే ా నేనట్లా బతకలేను గాని ా ’’

‘‘ఆలోచించి ఏం చేస్తారు? చేసేది లేనపుడు ఆలోచించటం దేనికి?’’

‘‘శారద పెళ్ళి గురించి ఏదో ఒకటి చెయ్యాలిగా’’

‘‘పెళ్ళి చెయ్యనంటుంటిరిగదా ` పెళ్ళి చేస్తే గదా ఏదో ఒక సంబంధం చూడటం, పెళ్ళి ఏర్పాట్లు ` వీటి గురించి ఆలోచించేది. చెయ్యనప్పుడేముంది?’’

రామారావు ఆశ్చర్యపోయాడు.

‘‘అంటే  శారదకిప్పుడు పెళ్ళి చెయ్యకపోతే నీకేం అభ్యంతరం లేదుగా?’’

‘‘లేదు. శారద డాక్టరవుతుందనుకుంటే నాకిప్పట్నించే గర్వంగా ఉంది. శారద పుట్టినపుడు కుగ్లర్‌ ఆసుపత్రిలో ఆ అమ్మగారిని చూశాగా. ఎంత ఠీవి. తెలివి. చాకచక్యం. మనుషుల ప్రాణాలు కాపాడటమంటే మాటలా? నా కూతురు ఎందరికి ప్రాణం పోస్తుందో’’

ఆనందాతిశయంతో రామారావు సుబ్బమ్మను గట్టిగా కావలించుకున్నాడు. తల్లంత కాకపోయినా భార్యతో కూడా తగవు పడాల్సి వస్తుందనుకున్నాడేమో, భార్య తనకన్నా ఒకడుగు ముందుందని తెలిసేసరికి ఆనందం పట్టలేకపోయాడు.

‘‘నాకు నీ మాటల్తో ఎక్కడలేని బలం వచ్చింది సుబ్బూ’’.

‘‘తెలుస్తూనే ఉంది’’ అని అందంగా నవ్వింది సుబ్బమ్మ.

ఆ మాటతో దంపతులిద్దరి మధ్యా సంభాషణ ఆగి సరసం మొదలైంది. నాలుగు రోజులు ఊళ్ళో గడిపి మద్రాసు ప్రయాణమయ్యాడు.

‘‘ఈసారి ఒట్టి చేతుల్తో రాకు నాయనా. మంచి కుర్రాడిని చూడు. పిల్లవాడు మంచివాడైతే చాలు. ఆస్తి అంతస్తుల గురించి మనం ఆలోచించవద్దు. మనకున్నదొక్కపిల్ల. దానికి సరిపడా మనకుండనే ఉంది’’ తల్లి మాటలు వినీ విననట్లు వెళ్ళిపోయాడు రామారావు.

***

గమనమే గమ్యం-1

 

సాయంకాలమైంది. రాజ్యలక్ష్మి ప్రార్థన మందిరానికి వెళ్ళటానికి సిద్ధమవుతోంది. చక్కబెట్టవలసిన పనులు చాలానే ఉన్నాయి. పెంపుడు కూతురు  ప్రేమావతి తలలో పువ్వులు పెట్టింది. గులాబీపూలు ప్రేమావతి తలలోంచి తనను నవ్వుతూ చూస్తున్నాయనిపించిందామెకు. ఆ పిల్ల తలను దగ్గరకు తీసుకుని ఆ పూలనోసారి వాసన చూసింది. రాజ్యలక్ష్మికి పువ్వులంటే మహాప్రీతి. ఏ కాలంలో పూసె  పూలు ఆ కాలంలో తన తలలో ముడవకుండా ఉండదు. తన చుట్టూ ఉన్నవారి  సిగలలో అలంకరించకుండా ఉండదు.

ప్రేమావతిని తలవైపు తిప్పుకుని ముఖాన్ని చేతులతో నిమిరి మెటికలు తన కణతలపై విరిచి

”వెళ్ళమ్మా – అందరికీ ప్రార్థన సమయమవుతోందని చెప్పు. పనులు ముగించుకుని రమ్మను” అన్నది రాజ్యలక్ష్మి.

ప్రేమావతి ఉత్సాహంగా పరిగెత్తుతున్నట్లే వెళ్ళింది.

తన తలలో కూడా రెండు గులాబీలు పెట్టుకుంటుంటే ఆవు సంగతి గుర్తొచ్చింది. ఆవు రేపో మాపో ఈనటానికి సిద్ధంగా ఉంది. దాని పరిస్థితేమిటో ఒకసారి చూస్తే మంచిదని పాకవైపు వెళ్తుంటే తోటమాలి పరిగెత్తుకొచ్చాడు. ”పంతులుగారు ఉన్న పళంగా రమ్మన్నారమ్మా” అంటూ రొప్పుతూ నిలబడ్డాడు. ”అంత పరుగు తియ్యటం దేనికిరా. ఐదు నిమిషాలలో కొంపలు మునుగుతాయా? ఆవు ఈనేలాగా ఉంది. అప్పడూ, నువ్వూ ఇక్కడ నుంచి కదలకండ ” అంటూ తోటవైపు నడిచింది రాజ్యలక్ష్మి.

‘ఈ సమయంలో తనతో ఏం పనిబడిందో – ప్రార్థనకు వేళవుతోంది. రాత పనులన్నీ ముగించుకుని తోటకు వెళ్ళారు. అక్కడ ఏం ఆలోచన వచ్చిందో. వచ్చిన ఆలోచన వెంటనే చెప్పకపోతే ఆయనకు తోచదు. కొత్తగా ప్రారంభించిన పాఠశాల గురించి ఎంత ఆలోచించిన ఆయనకు చాలటం లేదు. ఇంకా కొత్తగా ఏదో చేయాలనే ఆరాటం తీరటం లేదు. సరైన విద్య అంటే ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు.

ఆడపిల్లలకు చదవటం, రాయటం వస్తే సరిపోతుందా? ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయాలి. టీచర్లుగా, డాక్టర్లుగా పని చేయాలి. ఈ ఆలోచనలకు ఆయన పూర్తిగా సుముఖంగా లేరు. ఆ పనులకు ఇంకా సమయం ఉంది అంటారు. ఆడవాళ్ళు డాక్టర్లయితే ఎంత సుఖం తోటి ఆడవాళ్ళకు. ముఖ్యం పురుటిగదిలో – వైద్యుడిని  వైద్యుడి గానే చూడాలి. మగవాడు అనుకోకూడదు నిజమే.

కానీ ఆ మాట అర్థం చేసుకునేదెవరు? ఈ ఆచారపరాయణులు ఎవరు చెప్పిన వినరు. మగ వైద్యుని దగ్గరకు రానివ్వరు. ఎంతమంది ఆడవాళ్ళు ప్రసవ సమయంలో సరైన వైద్య సహాయం లేక చనిపోతున్నారో తల్చుకుంటే గుండె చెరువవుతోంది. ఇంత అవసరమైన పని ఉంటే ఆడపిల్లలకు సతీహితబోధిని మాత్రమే అందించి ఊరుకుంటే సరిపోతుందా? పంతులుగారితో వాదించాలి. ఒప్పించాలి. ఆయనకు కోపం ముక్కుమీదే ఉంటుంది. కానీ అది ప్రధమ కోపమే. వినగానే కాదంటారు గానీ ఆలోచిస్తారు. సబబనిపిస్తే ఒప్పుకుంటారు. ఇప్పుడాయనకు ఏ ఆలోచన వచ్చిందో”.

రాజ్యలక్ష్మి ఆలోచనలన్నీ తోటలోని చిన్న పందిరి దగ్గరకు వస్తుండగా ఆగిపోయాయి. దూరాన్నించి కూడా వారిద్దరూ కనిపిస్తూనే ఉన్నారు.

పంతులుగారి పక్కనే రామారావు వున్నాడు.  ఆయన చిన్న వయసులోనే ఆంగ్లాంధ్ర సాహిత్యాలలో మంచి పాండిత్యం సంపాదించినవాడు.

ఆయన అక్క శారదాంబ రాజ్యలక్ష్మికి మంచిస్నేహితురాలు. ఆమె బాగా చదువుకుంది. ఎన్నో పుస్తకాలు రాసింది. ఎన్నోచోట్ల స్త్రీల కోసం చిన్న సంఘాలు స్థాపించింది. స్త్రీల విద్య గురించి ఎంతో పని చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆమె సేవా స్వభావం ఒక ఎత్తు. రోగుల సేవ ఆమెకు ఇష్టమైన పని. ఆమె వైద్యురాలయితే ఎంతో రాణించేది.  వైద్యురా లు కాకపోయిన ఆమె చేసింది తక్కువ కాదు. ప్లేగువ్యాధి ప్రబలినపుడు ఎంతమంది ప్రాణాలో రక్షించింది. వారి సేవలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె డాక్టరయి ఉంటే అంత త్వరగా చనిపోయేది కాదేమో – రాజ్యలక్ష్మి ఆలోచనలు ఆ రోజు డాక్టర్ల గురించి, ఆడవాళ్ళు డాక్టర్లు కావాలనే ఆశ చుట్టూనే తిరుగుతున్నాయి.

రాజ్యలక్ష్మిని చూడగానే రామారావు  లేచి నమస్కారం చేశాడు.

రాజ్యలక్ష్మి ఆయనను దీవించింది. అప్పుడు గమనించింది ఆయన పక్కనున్న ఐదేళ్ళ చిన్నపాపను, ”మీ అమ్మాయా రామారావు గారు” అంటూ ఆ పిల్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది.

”ఔనమ్మా – మీ స్నేహితురాలి మేనగోడలు. ఆమె పేరే పెట్టుకున్నాను”.

రాజ్యలక్ష్మి ఆ పాపను మరింత దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది.

”మా అక్కపోయిన ఏడాదికి పుట్టింది. మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల”.

”బాగా చదివించండి’ అంది రాజ్యలక్ష్మి సిగ్గుపడుతున్న ఆ పిల్లను ముద్దాడుతూ.

”తప్పకుండా. మా అక్కయ్యలాగే  పండితురాలిని  చేస్తా”

”పాండిత్యం మంచిదే రామారావు గారూ – కానీ ప్రాణాలు పొయ్యలేదుగా. ఇవాళ మనకు కావలసింది వైద్యులు. అమ్మాయికి వైద్యం చెప్పించండి ”. రామరావు  కళ్ళల్లో ఆనందాశ్చర్యాలు ఒక్కసారే మెరిశాయి.

”అమ్మా – ఎంత మంచి మాటన్నారు. అమ్మాయిని తప్పకుండా డాక్టర్‌ కోర్సు చదివిస్తా. మీ ఆశీస్సుల కోసమే మా అమ్మ, ఆవిడా వద్దంటున్నా అమ్మాయిని నాతోపాటు తీసుకొచ్చాను” పొంగిపోతూ అన్నాడు రామారావు.

”విద్య, వైద్యం – ఈ రెండింటిలో ఆడవాళ్ళు ఎక్కువమంది ప్రవేశించాలని రాజ్యలక్ష్మి అభిప్రాయం.” అని పంతులుగారు మెల్లగా నవ్వారు.

”నిజమేనండి. అందులో సందేహమే లేదు. ఈ చిన్న శారదాంబ పుట్టుక ఎంత కష్టమైందనుకున్నారు. వీళ్ళమ్మను గుంటూరు తీసుకెళ్ళి కుగ్లర్‌ ఆసుపత్రిలో పురుడు పోయించాల్సి  వచ్చింది. ఆ మహానుభావులు కుగ్లర్‌ ఇక్కడకి వచ్చి గుంటూరులో ఆసుపత్రి పెట్టకపోతే నా  చిట్టితల్లి ఏమైపోయేదో, నా భార్యకేగతి పట్టేదో, ఆలోచిస్తే  చమటలు పడతాయి నాకు. ప్రతి ఊళ్ళో ఒక డాక్టరమ్మ ఉంటే పిల్లలకూ, తల్లులకూ ఎంత మంచిదో ఆలోచించండి . మా శారదాంబను తప్పకుండా డాక్టర్‌ చదివిస్తా. మా అక్కకు కూడా రోగులకు స్వస్థత కలిగించటమంటే ఎంతో ఇష్టం. ఆమెకూ కొద్దిపాటి వైద్యం తెలుసు. ప్లేగు రోగులకు సేవ చేస్తూనేగదా ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది”.

అక్క జ్ఞాపకాలతో రామరావు  ముఖంలో క్షణకాలం వన్నె తగ్గింది.

”అమ్మాయికి ఆధునిక వైద్యం చెప్పించండి ” అంది రాజ్యలక్ష్మి.

”అమ్మాయికి మీ దీవెనలు కావాలని వచ్చాను. అవి అందాయి. వాటితో పాటు నా  చిట్టితల్లి జీవితపథ నిర్దేశం కూడా జరిగిపోయింది. మీ మాట నాకు వేదవాక్కు. అమ్మాయిని డాక్టర్‌ చదివిస్తా. ఇంగ్లాండ్‌ పంపించి మరీ చదివిస్తాను” చిన్ని శారదాంబకు వాళ్ళ మాటలు తన గురించేననే విషయం అర్థమయింది. కొత్త మనుషులతో తండ్రి తన గురించి మాట్లాడటం ఆ పిల్లకు తెలియని సంతోషాన్ని కలిగించింది.

”అచ్చు మా నేస్తం శారదాంబలాగానే ఉంది. ఆ చూపుల్లో ఎంత తెలివో” రాజ్యలక్ష్మి మురిసి పోయింది.

ఆమెకు పిల్లలంటే ఎంతో  ప్రేమ. ఎంతమంది ఆడపిల్లలను తన స్వంత కూతుళ్ళలా పెంచిన ఆమె మమకారం తరిగిపోలేదు.

”నీ మురిపెంతోనే రామరావు కడుపునిండుతుందనుకున్నావా ? ప్రయాణం చేసి వచ్చాడు. ఫలహారం ఏర్పాట్లు -” పంతులుగారి మాట పూర్తికానివ్వలేదు రాజ్యలక్ష్మి.

”ఒక్క నిమిషం” అంటూ లోపలికి వెళ్ళింది. మధ్యాహ్నం వలిపించిన పనస తొనలు పళ్ళెం నిండా సర్దింది. వారి తోటలో పండిన  పండు అది. బెంగుళూరు నుంచి అంటు తెచ్చి పెంచారు. తొనలు మహాతీపి. రామారావుకి పనసతొనలు ప్రియమని ఆమెకు తెలుసు.

రోజూ వాళ్ళింట్లో అతిథులు ఉంటూనే ఉంటారు. వాళ్ళ ఇష్టాయిష్టాలన్నీ రాజ్యలక్ష్మికి తెలుసు.

పనసతొనలు తెచ్చి రామారావు  ముందుపెట్టింది. రామారావు  కూతుర్ని తీసుకోమని తనూ ఆప్యాయంగా తిన్నాడు. శారదాంబ నాలుగు తొనలు ఇష్టంగా తిని ఇంక చాలంది.

”శారదాంబను నాతో తీసికెళ్ళి ప్రేమావతితో స్నేహం కలుపుతాను. మీరిద్దరూ తీరికగా చర్చలు చేసుకోండి ”.

శారదాంబ చిన్న చేతిని పట్టుకుని నడిపించింది రాజ్యలక్ష్మి. రామారావు వస్తే  నాలుగైదు గంటలు శాస్త్ర చర్చలు చేయందే పంతులుగారు వదలరు.

రాజ్యలక్ష్మి కొత్త మనిషనే బెరుకు కలగలేదు శారదాంబకు. ఆమెతో పాటు ప్రార్థనకు వెళ్ళింది. ఆ ప్రార్థనలు శారదాంబకు కొత్త. ఆసక్తిగా, ఇష్టంగా విన్నది.

”ఈ పాటలు రాసింది త్యాగరాజ  స్వామేనా ?” అమాయకంగా అడిగింది.

”కాదమ్మా! నేనే రాశాను”.

శారదాంబ రాజ్యలక్ష్మి మాటలు నమ్మలేనట్టు చూసింది.

”మా అమ్మ, నాన్నమ్మా త్యాగరాజ స్వామి పాటలే పాడతారు.”

”అవి నాకూ వచ్చు”

”వస్తే మరి మీరెందుకు మళ్ళీ రాశారు?”

”త్యాగయ్య ప్రార్థించింది మానవరూపంలోని ఈశ్వరుడిని. నేను శక్తి రూపంలోని పరమేశ్వరుని గురించి రాశాను”.

శారదాంబకు ఆ మాటలు అర్థం కాలేదు. అర్థమవుతాయని రాజ్యలక్ష్మి అనుకోలేదు. అర్థం కాకపోయిన అమ్మా, నానమ్మా ఎంతో గౌరవించే త్యాగరాజ  స్వామిలా ఈ అమ్మమ్మ పాటలు రాయగలిగిందనే గౌరవం కలిగింది ఆ చిన్నారి మనసులో.

రాత్రి భోజనాల దగ్గర అన్నీ రామారావుకి  ఇష్టమైన వంటకాలే.

”మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారమ్మా – ఎందరో వస్తారు మీ ఇంటికి. ఎవరికి ఏం కావాలో మీకు తెలిసినట్టు వాళ్ళింట్లో వాళ్ళకు కూడా తెలియదేమో” రామారావు  తృప్తిగా భోజనం చేశాడు.

pic-3 (3)

శారదాంబకు ముందే తినిపించింది ప్రేమావతి.

రాజ్యలక్ష్మి భోజనం చేసి పడుకుందామని వస్తే   ప్రేమావతి నిద్రపోయింది గానీ, శారదాంబ కొత్త చోటవటం వల్లనేమో, కళ్ళు తెరుచుకునే ఉంది.

”నిద్ర రావటం లేదామ్మా?”

”ఊహు – మా నాన్నమ్మ కథ చెబితే గాని నాకు నిద్రరాదు”.

”నేను కథ చెప్తే నిద్రపోతావా?  మీ నాన్నమ్మ ఏం కథ చెప్తుంది?”

”రాముడి  కథ. కృష్ణుడి  కథ. ప్రహ్లాదుడి కథ”.

”నేను నీకు కొత్త కథ చెబుతాను వింటావా ?”

శారదాంబ సంతోషంగా తలూపింది.

”ఈ కథ పాటలాగా పాడుకోవచ్చు”

”మా నాన్నమ్మ కూడా పాడుతూ కథ చెబుతుంది. కుశలవుల కథ, ఊర్మిళా దేవి నిద్ర”.

”వాళ్ళంత ఇప్పుడు లేరు. ఇప్పుడున్న వాళ్ళ కథ చెప్పుకుందామా? పూర్ణమ్మ అని చిన్న పిల్ల – నీకంటే కొంచెం పెద్దది. ఆ కథ పాడతాను వింటావా?” అంటూ రాజ్యలక్ష్మి పూర్ణమ్మ కథను పాడటం మొదలుపెట్టింది.

శారదాంబ వింటూ నిద్రపోయింది.

పాట పూర్తి చేసి నిద్రపోతున్న శారదాంబ ముఖం చూస్తూ ఉండిపోయింది రాజ్యలక్ష్మి.

పిల్ల ముఖం ఎంత ముద్దుగానో ఉంది. ఆ ముఖాన్ని చూస్తుంటే….

తన స్నేహితురాలి జ్ఞాపకాలు శారదాంబను చూస్తుంటే కళ్ళముందు కదలాడుతున్నాయి.

తనకంటే ఇరవై ఏళ్ళు చిన్నది. కలుసుకున్నది అతి తక్కువసార్లు. కానీ ఎంత స్నేహం కుదిరింది. కారణం తన ఒంటరితనమేనేమో –

బంధువులందరూ వెలి వేశాక తనలాంటి ఆడవాళ్ళ స్నేహం దొరకక ఒకలాంటి బాధ గుండెలో గూడుకట్టుకుని ఉండేది.

ఊపిరాడని పనులతో కాలం గడచిపోతున్న మనుషుల కోసం ముఖం వాచినట్టు ఉండేది.

పద్దెనిమిదేళ్ళ శారదాంబ ఉత్సాహంగా వచ్చిందొక రోజు. చనువుగా పరిచయం చేసుకుంది. తన కూతురిలా అనిపించింది. అదేమాట శారదాంబతో అంటే అలా ఒద్దంటే ఒద్దంది. బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ విలువగలది అన్నది.

”నిజం చెప్పు రాజ్యలక్ష్మి – ”అని ఒక క్షణం ఆగి” నా కంటే చాలా పెద్దవాళ్ళు ఇలా చనువుగా పిలిస్తే  ఏమి అనుకోరుగా” అంది.

సమాధానంగా రాజ్యలక్ష్మి శారదాంబను హృదయానికి హత్తుకుంది.

రెండు నిమిషాలు అలా గడిచాక-

”చెప్పు రాజ్యలక్ష్మి – నీ బంధువులు నీతో మాట్లాడుతున్నారా?” అని సూటిగా అడిగింది.

రాజ్యలక్ష్మికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. శారదాంబతో అంతాచెప్పుకోవాలనిపించింది. చెప్పింది. తన మేనమామ తననెంత  ప్రేమగా పెంచాడో, అందరూ ఒద్దంటున్నా తనను బడికి పంపి ఎలా చదివించాడో, రోజూ తనతో పురాణ కథలెలా చదివించుకునేవాడో, తమ బంధం ఎంత  ప్రేమమయమో, ఆయన కోసం యిప్పటికి తన ప్రాణం ఎలా కొట్టుకు పోతుందో, అంతా చెప్పింది.

pic-2 (1)

”అసలు ఆయన ఏమంటారు?” శారదాంబకు కుతూహలం ఎక్కువ. ఏ విషయాన్నయినా చివరంటా తెలుసుకోనిదే ఊరుకోదు.

రాజ్యలక్ష్మి మాత్రం ఆ రోజుని మర్చిపోయిందా. శారదాంబకు చెప్పటం మొదలెడితే అంత నిన్న మొన్న జరిగినట్టు గుర్తొచ్చింది.

”శారదా – ఆరోజు నేను మర్చిపోలేదు. ఎప్పుడూ నా మనసులో సెల వేస్తూనే ఉంటుంది. మొదటి వితంతు వివాహం మా ఇంట్లో జరగబోతోందనే వార్త బయటికి పొక్కింది. మా మేనమామ, మేనత్త, వచ్చారు. నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న  చచ్చిపోతే కన్నబిడ్డలా పెంచారు. కంటిపాపలా చూసుకున్నారు. నన్ను ”బాపాయి” అని  ప్రేమగా పిల్చేవాడు.  నా అసలు పేరు బాపమ్మ కదా – పంతులు గారి కది నచ్చక రాజ్యలక్ష్మి అని పిలుస్తున్నారు.

మా మేనమామ ఆ రోజు వచ్చి దీనంగా నా  ముందు నిలబడితే నా గుండె పగిలిపోయింది.

”బాపాయి. నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచిన సంగతి మర్చిపోయావామ్మా” అని ఆయన అంటుంటే ”అంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నానవు మామయ్యా” అని కన్నీరు కార్చాను.

ఆయన ధోరణి వేరు.

”అమ్మా. ఈ అనాచారం ఏమిటి? నువ్వు తెలివి గల దానివి. నీ భర్తను ఈ పనులన్నీ ఒద్దని చెప్పి మాన్పించాలి. లేదంటే ఈ అనాచారపు కొంప నుంచి బైటికిరా . మేము నిన్ను కడుపులో పెట్టుకుంటాం” అన్నాడు.

”మామయ్యా – ఏమంటున్నావు. నేను ఆయనను ఒదిలి రావటమా. నీకు నోరెట్లా వచ్చింది” అని నేను బాధపడుతుంటే-

”నువ్వు భర్తను ఒదిలెయ్యాలని చెప్పటం లేదమ్మా. ఈ పనులు మానెయ్యకపోతే నేనీ ఇల్లు విడిచిపెడతానని నువ్వొక్క మాటంటే ఈ అనాచారాలన్నీ ఆగుతాయమ్మా” అన్నాడాయన.

”అప్పుడు నువ్వేమన్నావు?” శారదాంబ ఉద్వేగంగా అడిగింది.

”నేనేమని ఉంటానో ఊహించు” రాజ్యలక్ష్మి కన్నీళ్ళలోంచి నవ్వింది.

”పంతులుగారి మీద నీకెంత  ప్రేమో చెప్పి ఉంటావు, వదిలిరాలేనని అని ఉంటావు” కొంటెగా అంది శారదాంబ. రాజ్యలక్ష్మి నవ్వి –

”అలా అనలేదు శారదా – ఈ వితంతు వివాహాలు జరగాలని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. ఈ పనులు నాకిష్టం లేకుండా నా  భర్త కోసం చేస్తున్నవి కాదు. అనుకూలవతి, పతివ్రత అనిపించుకోవటం కోసం చేస్తున్నవి కాదు నా  జీవితధర్మం, లక్ష్యం, గమ్యం, నా  జీవన సాఫల్యం అన్నీ సంఘ సంస్కరణలో ఉన్నాయని నేనెంతో బలంగా నమ్మి చేస్తున్నాను. విశ్వాస రహితంగా ఏ పనీ చెయ్యని మనిషిని నేను. ఏ పనైన నా  మనస్సాక్షిగా నమ్మి చేస్తాను శారదా – ఏ కారణం వల్లనైన ఈ సంస్కరణ నుంచి పంతులు గారు వెనక్కు తగ్గిన నేను ముందుకే పోతాను.”

రాజ్యలక్ష్మి కళ్ళల్లో వెలుగుకి శారదాంబ ఆశ్చర్యపడిచూస్తోంది.

రాజ్యలక్ష్మి చెప్పుకుపోతూనే ఉంది.

”అంటే మమ్మల్నందరినీ ఒదిలేస్తావా?” అని మామయ్య అడిగాడు.

“నేను మిమ్మల్ని ఒదిలెయ్యను మీరే నన్ను ఒదిలేస్తారేమో!” అన్నాను నేను.

ఈ వెధవ ముండ పెళ్ళి మీ ఇంట్లో జరిగితే వదిలెయ్యక తప్పదు. మేమే కాదు. మొత్తం కులం, సమాజం అంత మిమ్మల్ని వెలివేస్తారు.  దిక్కులేని వారవుతారు అన్న మామయ్య మాటలకు అందరికీ దిక్కు ఆ పరమేశ్వరుడే అని ఒక నమస్కారం చేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు. నా  మీద వారికున్న  ప్రేమనంతా తెంచుకుని వెళ్లిపోయారు. వాళ్ళే  కాదు ఎందరో బంధువులు స్నేహితులు అందరూ దూరమయ్యారు. ఒంటరితనం. వాళ్ళ కోపాలు, తిట్లూ, శాపాలూ తప్ప వాళ్ళు మరి కనపడరు. నా  చేతి అన్నం తినరు. అదంతా తట్టుకున్నాను.

”మీ మామయ్య వెళ్ళిపోయాక పంతులుగారు నిన్ను ఓదార్చారా ? ఎవరున్నా లేకపోయినా  తనున్నానని ధైర్యం చెప్పారు గదూ” శారదాంబ మనసు కూడా ఆర్థ్రమై అడిగింది.

”ఆయన నన్ను ఓదారుస్తూ నా వల్ల నీకు ఇన్ని కష్టాలు అంటుంటే నాకు మరింత బాధ కలిగింది శారదా – ఆయనను అలా అనవద్దని వారించను, ఇవి కష్టాలైతే నేను కోరి తెచ్చుకున్నవే. స్త్రీల ఉద్ధరణ కోసం నేను కష్టపడుతున్నాను. కేవలం మీ కోసం పతిభక్తితో నేనీ పనులు చేయటం లేదు. మీరలా అనటం నాకు బాగుండదు. ఈ ఉద్యమం మీ ఒక్కరిదేనని లోకం అనుకుంటే అనుకోనివ్వండి . ఈ ఉద్యమం నాది కూడా – మనందరి కంటే ఎక్కువగా పునర్వివాహం కోసం సాహసిస్తున్న ఆ ఆడపిల్లలది అన్నాను.”

శారదాంబ రెప్పవాల్చకుండా ఆ మాటలను తాగేస్తున్నట్టుగా విన్నది.

ఆ రోజంతా తన వెనకాలే తిరిగింది. ఇద్దరూ కలిసి ఎన్ని విషయాలో మాట్లాడుకున్నారు.

ఆ శారదాంబ ఇప్పుడు లేదు. ఈ చిన్న శారదాంబ పెరిగి పెద్దదై ఆమె కలలన్నీ నిజం చేయాలి అనుకుంది రాజ్యలక్ష్మి.

పెద్ద చదువులు చదివిస్తాననీ, ఇంగ్లండ్‌ పంపిస్తాననీ ఆ పిల్ల తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చి రాజ్యలక్ష్మి మనసంత ఆనందంతో నిండి పోయింది. ఎన్నో ఆలోచనలు.

‘ఈ అమ్మాయి అద ష్టవంతురాలు. కొత్తతరంలో పుట్టింది. ఆడపిల్ల అనగానే పెళ్ళి గురించి ఆలోచించకుండా చదువు గురించి ఆలోచించే తండ్ర కి కూతురిగా పుట్టింది.

ఇంకో ఇరవై ఏళ్ళకు ఈ అమ్మాయి డాక్టరవుతుంది. మగవాడ లా అన్ని పనులూ చేయగలుగుతుంది. ఇంట్లో మగ్గిపోకుండా ప్రపంచాన్ని చూస్తుంది. పంతులుగారు ఆడవాళ్ళలా  మగవాళ్ళు, మగవాళ్ళలా ఆడవాళ్ళు ప్రవర్తించే అద్భుతదేశం గురించి కథ ఒకటి కల్పించి రాశారు. పెద్దయ్యేసరికి ఈ అమ్మాయి, ఈమె భర్తా  ఇద్దరూ కలిసి ఇంటి పనీ బైట పనీ సమానంగా చేసుకుంటారా?

ఈ పిల్ల డాక్టరైతే ఇంటి పనికి సమయమెక్కడ? పనికి మనుషుల్ని పెట్టుకోవటమే. డాక్టరయిన ఈ అమ్మాయి ఎంత ఆత్మ విశ్వాసంతో ఉంటుందో. హుందాగా నడిచే ఆమె నడకా, మాట తీరూ, స్వభావం, దుస్తులూ అన్నీ వేరుగా ఉంటాయి. పనికి మాలిన కబుర్లు చెప్పదు. జట్టీలు పెట్టుకోదు. అసభ్యమైన మాటలు మాట్లాడదు. విద్య, సంస్కారం ఉట్టిపడుతుంటాయి.

రాజ్యలక్ష్మి ఒక ఆధునిక యువతి రూపాన్ని తన మనసులో ఊహించుకుంటోంది. ఆధునిక యువతి, స్త్రీ అన్న మాట ఆవిడకు ఈ మధ్యనే పరిచయమైంది.

గురజాడ అప్పారావు ఈ మాట అన్నాడని పంతులుగారు చెప్పారు.

”ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది” అన్నాడట ఆయన. ఈ చిన్నది చరిత్ర సృష్టిస్తుంది.

తృప్తిగా శారదాంబ నుదుటి మీద చిన్న ముద్దు పెట్టింది రాజ్యలక్ష్మి.

మరో మూడు రోజులు రాజమహేంద్ర వరంలో రామరావు  పంతులు గారితో చరిత్ర గురించిన చర్చలో మునిగాడు. శారదాంబ, రాజ్యలక్ష్మి చుట్టూ తిరుగుతూ ఆమె నేర్పిన పాటలు, పద్యాలు నేర్చుకుంది. అపుడపుడూ వస్తుండమనే ఆత్మీయవచనాలను మనసారా ఆస్వాదిస్తూరామారావు  ఆ దంపతుల నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.

* *
శారదాంబను తీసుకుని రామారావు  రాజమండ్రి  నుండి  సరాసరి గుంటూరు వెళ్ళాడు. శారదాంబ పుట్టింది అక్కడే. పుట్టిన వెంటనే లక్ష్మీబాయమ్మ ఆశీర్వాదం ఆ పిల్లకు దొరికింది. ఇపుడు ఐదేళ్ళు నిండిన శారదాంబను మళ్ళీ ఒకసారి ఉన్నవ దంపతులకు చూపించి వాళ్ళ ఆశీస్సులు కూడా ఇప్పించి ఇల్లు చేరదామనిపించింది. శారదాంబను డాక్టర్‌ చదివించాలనే ఆలోచన రాజ్యలక్ష్మి ఆయన మనసులో నాటిన మరుక్షణం నుంచీ ఆయన ఆనందానికి అవధి లేకుండా పోయింది. నిజానికి ఆయనకు కుటుంబం గురించి శ్రద్ధ తక్కువనే చెప్పాలి.

చరిత్ర, సాహిత్యం వీటి గురించిన చర్చల్లోనూ, పనుల్లోనూ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఆ పని మీదే రాజమండ్రి  బయల్దేరితే శారదాంబ త నూ వస్తానని పచీ పెట్టింది. కూతురిని తీసుకెళ్ళి రాజ్యలక్ష్మికి చూపించాలని ఆ క్షణానే ఆయనకు అనిపించింది. తన ప్రియ సోదరికీ ఆమెకూ ఉన్న స్నేహం గుర్తొచ్చింది. తీరా  వెళ్ళిన తర్వాత రాజ్యలక్ష్మి అన్నమాటతో ఆయనకు వెయ్యేనుగుల బలం వచ్చింది. ఆ మాట వెంటనే లక్ష్మీనారాయణ దంపతులకు చెప్పాలనిపించింది. వారిద్దరూ వీరేశలింగంగారి శిష్యులే. స్త్రీ విద్య కోసం, వితంతు వివాహాలు జరిపించటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పాటుపడుతున్నారు. రామారావుని చూసి ఆ దంపతులు సంతోషించేరు. శారదాంబను  ప్రేమగా అక్కున చేర్చుకున్నారు. రాజ్యలక్ష్మి మాటను లక్ష్మీబాయమ్మ మరింత బలపరిచింది. శారదాంబను డాక్టర్‌ చదివించాలనే నిర్ణయం జరిగిపోయింది.

ఆ రాత్రి లక్ష్మీనారాయణ గారూ, రామారావూ అనేక విషయాలు మాట్లాడుకున్నారు. ఎక్కువ చర్చలు ఆడపిల్లల చదువు, వితంతు వివ హాల గురించే. సంస్కరణ భావాలు గిట్టని వారు తమ మీద రాసిన రాతలనూ, చల్లిన బురదనూ రామారావుతో చెప్పుకుని బరువుదించుకున్నాడాయన.  ప్రేమ అనే మాట అనుకోకుండా వాళ్ళ మాటల్లో దొర్లింది. అనుకోకుండా అని కూడా అనలేం. ఉన్నవ వారు గుంటూరు సమీపంలో ఓ గ్రామంలో జరిగిన ఒక సంగతి చెప్పాడు.

”ఒక రైతు కోడలు ఆ ఊరిలోని మరొక యువకుడితో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మంచి అమ్మాయి. నేను వాళ్ళింటికి చాలాసార్లు వెళ్ళాను. ఎంతో గౌరవంగా చూసేది. మాటతీరు, ప్రవర్తన అన్నీ హుందాగా ఉండేవి. భర్త మంచివాడే గాని బలహీనుడు. మేదకుడిలా కనిపించాడు. ఆమెకు అతని మీద  ప్రేమ లేదేమో. ఈ యువకుడు చదువుకున్న వాడు. అందగాడు. అతని మోహంలో పడివెళ్ళిపోయింది. జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది” విచారంగా చెప్పారాయన.

”నాశనం చేసుకుందని ఎందుకంటారు? ఆమె సుఖపడుతుందేమో. వారిద్దరి మధ్య  ప్రేమ కలిగిందేమో”.

” ప్రేమ అంటే ఏమిటి రామారావు  గారు?”

రామరావు  నవ్వాడు.

”నాకు కూడా తెలియదు. పెళ్ళి చేసుకున్నందున కర్తవ్యంగా భావించి భార్యతో చేసే కాపురంలో ప్రేమ ఉండదని, మనంగా ఎంచుకున్న మనిషిపై కలిగేది  ప్రేమ అనీ అంటారు. మనంగా ఎంచుకోవటం – ఎంత అర్థం లేనిమాట! మన వివాహాలు పెద్దలు నిర్ణయిస్తారు. మన ప్రమేయం చాలా తక్కువ. వేశ్యని తప్ప మనంగా ఒక స్త్రీని ఎలా ఎంచుకోగలం? మీరు చెప్పిన రైతు కోడలు ఒకతనిని ఎంచుకుని గదా వెళ్ళిపోయింది. అతనూ ఎంచుకున్నట్టేగదా – అక్కడ  ప్రేమ లేదంటారా?”

”అది  ప్రేమ కాదంటాను. తల్లిదండ్రులను, కన్నకొడుకుని, రెండు వంశాల పరువు ప్రతిష్టలను పణంగా పెట్టి ఆమె ఏం బావుకుంటుంది. అది  ప్రేమంటే నా మనసు అంగీకరించటం లేదు.  ప్రేమ ధర్మ విరుద్ధంగా ఉండరాదంటాను.”

” ప్రేమ మనోజనితం. ధర్మం సంఘజనితం. ఈ రెండింటికీ  మధ్య సయోధ్య కుదిరి ధర్మబద్ధమైన  ప్రేమ కలగటం కష్టమేమో. మీరు ధర్మ విరుద్ధం అన్నారు. సమాజం ఆ అమ్మాయిని వెలివేస్తుంది. ఆమె గతి ఏమవుతుందో – ఇలాంటి సంఘటనలు అక్కడ అక్కడా జరుగుతూనే ఉన్నాయి.

”అంత నిగ్రహం లేకుండా” ఉన్నవ వారి గొంతులో ఆగ్రహం రాబోయింది.

”నిగ్రహం లేని ప్రేమ గురించి మనిద్దరికీ తెలియదు. మనం మాట్లాడుకుని ఏం ప్రయోజనం?

”అర్థం చేసుకుందామని”

”రాధాక ష్ణుల  ప్రేమని మీరు ఎలా చూస్తారు” అడిగాడు రామారావు.

”అది దైవ సంబంధం. మానవులకు దాని అర్థం, సారాంశం గ్రహించటం సులభం కాదు.”

”ఒక మనిషికి సంఘ విరుద్ధమైన  ప్రేమ కలిగితే ఏం చెయ్యాలంటారు?”

” ప్రేమించవచ్చు. కానీ కామ సంబంధం పెట్టుకోకూడదు. ఆ మనిషిని చూసి ఆనందించవచ్చు. స్నేహంగా ఉండొచ్చు. ఆ మనిషికి సహాయం అవసరమైతే చేయవచ్చు. ఒక్క కామ సంబంధం తప్ప మరే సంబంధమైన ఉండవచ్చు.” అన్నారు  ఉన్నవ.

”అంత స్నేహం,  ప్రేమ ఉన్నచోట చేతులు కలిస్తే, దేహాలు కలిస్తే తప్పవుతుందా? మనసే ప్రధానం కదా? శరీరానిదేముంది?” దానినంగీకరించటానికి ఉన్నవ వారు సిద్ధంగా లేరు.

”శరీరం చాలా ముఖ్యం. శరీరమే కదా ధర్మసాధనం. శరీరానికి నిగ్రహం నేర్పితేనే మనసు దారికొచ్చేది. ఇంద్రియాలు కోరినవన్నీ ఇస్తే  శరీరం, మనసూ రెండూ పతనమవుతాయి”.

రామారావుకి  ఆ మాటల్లో పొరపాటేమీ కనిపించలేదు.

”మీరన్న దానిలోనూ నిజముంది. కానీ ఈ విషయాల గురించి ఎవరూ రాయరు. మాట్లాడరు. నేను టాల్‌స్టాయ్‌ రాసిన నవల” అన్నా కెరినిన ” సంక్షిప్తంగా ఆంగ్లంలో చదివాను.  ఇదే కథ. అన్నా  అనే ఆమె భర్తను, పిల్లలను ఒక యువకుని కోసం వదిలి వెళ్ళి చివరకు సంక్షోభంలో పడుతుంది. అట్లాంటి పుస్తకాలు చదివి ఈ ఆకర్షణలు,  ప్రేమలు, కామాలూ వీటి గురించి మాట్లాడుకుంటే ఇలాంటి అనర్థాలు  ఆగుతాయేమో!”

”నిజమే. మనం కూడా రాయాలి ఈ విషయాలు”

”మీరు రాయండి.  నేను ప్రచురిస్తాను”.

ఉన్నవ వారు పెద్దగా నవ్వారు. ఆ సంగతి అక్కడితో ఒదిలేశారు. తెలుగు సాహిత్యాన్ని కొన్ని తరాల పాటు ప్రభావితం చేయబోయే నవల ఒకటి ఆ సంభాషణలోంచి పుడుతుందని వారిద్దరూ ఆనాడు అనుకోలేదు.

తర్వాత వారి సంభాషణ మతమార్పిడుల గురించి సాగింది. మిషనరీలు విద్య, వైద్యం, సమానత్వం ఇవ్వటం ద్వారా మాల మాదిగలను ఆకర్షిస్తున్నారని రామారావు  అంటే ఉన్నవ వారు అందులో త ప్పముందన్నారు? ఆ పని మనమే చేయవచ్చు. చేసే మనసు మనకు లేదు. ధైర్యం లేదు. దానికి తగిన మూల్యం ఎప్పుడో ఒకప్పుడు చెల్లించవలసిందేననుకున్నారు ఇద్దరూ.

రాత్రి చాలా పొద్దుపోయే వరకూ ఈ చర్చలు సాగుతూనే ఉన్నానయి. తెల్లవారి లేచి స్నానం చేసి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు రామారావు.

ఎవరో బైటినుంచి లక్ష్మీనారాయణ గారూ అని పెద్దగా పిలవటంతో ఇద్దరూ బైటికొచ్చారు.

ఆ వచ్చినతని ముఖం పాలిపోయింది. దు:ఖం నిండిన గొంతుతో ”లక్ష్మీనారాయణ గారూ! ఘోరం జరిగిపోయింది. వీరేశలింగం పంతులు గారి భార్య రాజ్యలక్ష్మమ్మ గారు మరణించారట” అన్నాడు. ఇద్దరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. కాసేపటికి తేరుకున్న రామారావు  ”నాలుగు రోజుల క్రితం చూశాను. ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె చేతి భోజనం తిన్నాను. ఏ అనారోగ్యమూ లేదామెకు. ఎలా జరిగింది?”

pic-1

ఆ వచ్చినతను కన్నీళ్ళు కారుస్తూ చెప్పాడు.

”నిన్న రాత్రి నిద్రపోయినామె మరి నిద్ర లేవలేదట. అంతే. రాజమండ్రిలో  పంతులు గారింటికి తీర్థప్రజలా జనం వచ్చిపడుతున్నారట”.

”గొప్ప అద ష్టవంతురాలామె. అంత హాయిగా బాధపడకుండా వెళ్ళిపోయింది” ఉన్నవ బాధను దిగమింగుకున్నారు.

”పాపం పంతులుగారు ఒంటరైపోయారు. రామారావు  – రాజమండ్రి  వెళ్ళాలి. నాకైతే వెంటనే బయల్దేరి వెళ్ళాలనిపిస్తుంది. నీ సంగతేమిటి?” రామారావుకి  శారదాంబను ఇంటివద్ద దించి ఆ తర్వాతే రాజమండ్రి  వెళ్ళాలనిపించింది. మొన్నటికి మొన్న ఆమె తన చల్లని చేతులతో శారదాంబకు అన్నం పెట్టి నిద్ర పుచ్చింది. ఇప్పుడామెలేని ఆ ఇంటిని చూడటానికి ఆ చిన్నపిల్లను వెంటబెట్టుకుని వెళ్ళటం ఎందుకు? అదే ఉన్నవ వారితో చెప్పాడు.

లక్ష్మీబాయమ్మ గారితో ఈ విషాద వార్త చెప్పటానికి ఉన్నవ లోపలికి వెళ్ళారు.

రామారావు కి అంత అయోమయంగా అనిపించింది. మరణం ఇంత సులభమా? నాలుగు రోజుల క్రితం నవ్వుతూ శారదాంబను ఎత్తుకుని దీవించిన తల్లి, వండి వడ్డించిన తల్లి ఇపుడు లేదు. ఇక కనబడదు.

చిన్ని శారదాంబ, అదృష్టవంతురాలు. ఆమె ఆత్మీయతను రుచి చూడగలిగింది. శారదాంబకు ఈ విషయం ఎలా చెప్పాలి? చెప్పకుండా ఎలా ఉండాలి? శారదాంబ ఏదో ఒక ప్రశ్న అడగకుండా ఉండదు. ఏం చెయ్యాలి? ఆలోచిస్తుండగానే శారదాంబ లోపలినుంచి పరిగెత్తుకు వచ్చింది.

”నాన్న – ఆ అమ్మమ్మ చనిపోయిందటగా”

ఐదేళ్ళపిల్ల అలా అడిగేసరికి రామారావుకి నిగ్రహించుకున్న దు:ఖం బైటికొచ్చింది.

”ఔనమ్మా – దేవుడిదగ్గరకు వెళ్ళింది”.

”నాకు పాట నేర్పింది నాన్న”.

”పాటా – ”

”ఔను నాన్నా”

”పాడు తల్లీ – ఏం పాట నేర్పిందో వింటాం” అంది లక్ష్మిబాయమ్మ శారదాంబను దగ్గరగా తీసుకుని-

అందరూ శారదాంబ పాడిన పాట వింటూ ఉద్వేగ భరితులయ్యారు.

రామారావు శారదాంబలు వెంటనే బయల్దేరి వెళ్ళిపోయారు.

రాజమండ్రి కి ఎక్కడెక్కడ నుంచో పెద్దలు వస్తున్నారు . పంతులు గారిని పరామర్శిస్తున్నారు . అందరికీ రాజ్యలక్ష్మి అంటే గౌరవం. అందరూ ఆమెచేతి అన్నం తిన్నవారే.

ఆమె కొన్ని బీజాలను నాటింది. అవి తన తోటలోనే నాటలేదు. దేశమంతా నాటింది. దేశంలో ఎక్కడైన మొలకెత్తగల చేవగల విత్తనాలవి.

ఆ ఇంటికి జనం తెంపు లేకుండా వస్తున్నారు , కన్నీరు కారుస్తున్నారు. ”తనకు ఇంతమంది ఆప్తులున్నారని  రాజ్యలక్ష్మమ్మకు తెలుసా?”.

ఏమో జీవితమంత తన భావాల కోసం సంఘంతో యుద్ధం చేసిన మనిషి. తను చనిపోయాక సంఘం తనని ఇంత దగ్గరగా తీసుకుంటుందని ఆమె ఊహించి ఉండదేమో.

ఆ సమయంలోనే ఆ వీధి చివర ఎవరికీ కనపడకుండా ఒక మూలన ఒక యువకుడు విపరీతంగా ఏడుస్తున్నాడు.

”నా పాణం నిలబెట్టావు నీకో దండం కూడా పెట్టుకోలేనమ్మా”

అంటూ ఏడుస్తున్న ఆ యువకుడు మాలవాడు. అతనొక రోజు ఆ వీధిలో నడుస్తూ పడిపోయాడు. ఎండాకాలం విపరీతమైన దాహం. ఊళ్ళో ఎవరూ మంచినీళ్ళు పొయ్యరు. అడగాలని కూడా అతనికి అనిపించలేదు. వళ్ళు చీదరించుకుంటు ఇంతెత్తు నుంచి నీళ్ళు పో స్తే తాగాలని అతనికి ఇష్టంగా లేదు. ఎట్లాగైన వెళ్ళి మాలపల్లిలో పడితే బతికిపోతాను అనుకుంటున్నాడు.

రాజ్యలక్ష్మమ్మ ఇంటి దగ్గర కొచ్చేసరికి కళ్ళు గిర్రున తిరిగాయి. ఉన్నవాడు ఉన్నట్టు పడిపోయాడు తరవాత మెలకువ వచ్చేసరికి. తను పెద్ద ఇంటి లోగిట్లో నీడ పట్టున ఉన్నాడు. రాజ్యలక్ష్మమ్మ కొద్ది కొద్దిగా నీళ్ళు అతని నోట్లో పోస్తోంది.

అతను లేవటానికి ప్రయత్నించాడు. ఆమె దయగా వారించింది.

”లేవొద్దు నాయిన. కాసేపు ఈ నీళ్ళు తాగి పడుకో. మజ్జిగ అన్నం తెస్తాను. తింటే ఓపికొస్తుంది.

అప్పుడు వెళ్దువు గాని” అన్నదామె.

అతని తల తిరిగిపోయింది. ఆ పెద్దావిడ తనను తాకింది. మైల పడింది. ఇదంత వూరికే పోతుందా, తనను చంపేస్తారేమో.

భయపడుతున్న అతని భయం పోగొట్టి అన్నం పెట్టి పంపించింది.

తను మైల పడ్డానని గానీ, స్నానం చెయ్యాలని గానీ ఒక్క మాట అనలేదు. అతను అనబోతే అననివ్వలేదు.

”ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు . మనందరం ఒకటే. నువ్వు భయపడకుండా ఇంటికి వెళ్ళు నాయిన ” అంది.

ఇంటికి వెళ్ళే దోవ పొడుగున అతను ఏడుస్తూనే ఉన్నాడు.

వారం రోజుల తరవాత  రాజ్యలక్ష్మమ్మ తెల్లవారుఝామున లేచి వాకిలి తెరిచేసరికి వాకిలి  ముందు పాతిక పైగా కలువపూలు ఎవరో అందంగా అమర్చివెళ్ళారు. రాజ్యలక్ష్మమ్మ ఆనందంతో, ఆశ్చర్యంతో పంతులు గారిని పిల్చి చూపింది.

ఎవరో మనకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు అన్నారాయన .

ఇద్దరి మనసులూ ఆ ఉదయాన వీస్తున్న చల్లగాలిలా తేలిపోయాయి. దూరంగా నిలబడ్డ వీరిని చూసి ఆనందించే అతన్ని వీళ్ళు చూడలేదు. ఆ కలువ పూలతో కృత్ఞతలు తెలుపుకుంది ఆనాటి మాల యువకుడని రాజ్యలక్ష్మమ్మకు తెలియదు. ఇవాళ ఆ యువకుడు ఆమె పాదాల మీద కలువ పూలు వుంచి ఒక్క దండం పెట్టుకోవాలని ఏడుస్తున్నాడు. ఆ పని చేసే ధైర్యం అతనికి లేదు.

గంట సేపట్లా ఏడ్చి ఏడ్చి  వెళ్ళిపోయాడు.

రామారావు  రాజమహేంద్రవరం  చేరి వీరేశలింగం గారిని చూసేసరికి నోటమాటరాలేదు. చాలా సేపు మౌనంగా కూర్చుని ”ఆధునిక స్త్రీ గురించి కలలు కన్న కళ్ళు మూతబడిపోయాయి. ఆ కలలు నిజం చేసే  పిల్లలు పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళందరిలో మనం రాజ్యలక్ష్మమ్మను చూసుకోవాలి” అన్నాడు రామారావు. రాజ్యలక్ష్మి కలలు ఎవరికైన తెలుసా? పంతులు గారికీ, చనిపోయిన శారదాంబకు తెలుసా కలలు. శారదాంబ, రాజ్యలక్ష్మి ఒకటే కలలు కన్నారు. నిజానికి

రాజ్యలక్ష్మి కలలు శారదాంబకే బాగా తెలుసు. రాజ్యలక్ష్మి పంతులు గారితో వాస్తవ జీవితాన్ని పంచుకున్నంతగా స్వప్న జీవితాన్ని పంచుకోలేదు. పంతులిగారి కాలాన్ని వృధా చేయగూడదనే ఉద్దేశంతో ఆమె తన కలలను శారదాంబతోనే ఎక్కువ పంచుకుంది. ఆ శారదాంబ ఈమె కంటే ముందే మరణించింది. ఆధునిక స్త్రీల గురించి వారి కలలకు సాక్షులెవరూ లేరు.

పంతులుగారు అతి ప్రయత్నం మీద దు:ఖాన్ని నిగ్రహించుకుని ”నేను జీవచ్ఛవాన్ని” అన్నారు.

”అంతమాట అనకండి” అన్నాడు రామారావు.

”అది నా దు:ఖం ముందు చిన్నమాట రామారావ్ . రాజ్యలక్ష్మి మరణంతో నేను ప్రతి క్షణమూ మరణయాతన అనుభవిస్తున్నాను. ఇంక నేను ఏమీ చెయ్యలేననిపిస్తోంది.” ఈసారి దు:ఖం నిగ్రహించుకోవడం ఆయన వల్ల కాలేదు.

అది చూసి రామారావు కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి.

”మీరు ధైర్యం తెచ్చుకోవాలి. మాబోటి వాళ్ళకు ధైర్యం చెప్పాలి” అన్నాడాయన కన్నీళ్ళు తుడుచుకుంటూ.

”నాకు ధైర్యం ఎక్కడ నుంచి వస్తుందయ్యా. నా  ధైర్యమంతా  రాజ్యలక్ష్మేగదా. ఆమె లేనిది నేనేమీ చెయ్యలేను. నేను మొదట నాలుగడుగులు నడిచానేమో, నేను పడిపోకుండా ఈ దారంత నా చేయి పట్టుకుని నడిపించింది రాజ్యలక్ష్మే. ఈ ఇల్లూ, తోటలూ, శరణాలయం, పాఠశాల… ఇవన్నీ ఆమె లేకుండా ఎట్లా నడుస్తాయో అర్థం కావటం లేదు.”

ఆ ప్రశ్నకు సమాధానం కాలం తప్ప ఎవరు చెప్పగలరు?

*సశేషం 

ఒక తరానికంతా ఆమె కౌన్సిలర్!

మాలతీ చందూర్ ౩౦ వ దశాబ్దపు తొలి సంవత్సరంలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఆమె పదిహేడు సంవత్సరాల ఆధునిక యువతి. ఒక విశాలమయిన అర్థంలోనయినా ‘ఆధునికత’ అంటే చెప్పుకోవటం అవసరం. వ్యక్తికీ, వ్యక్తి కోరికలకూ, ఆకాంక్షలకూ ప్రాధాన్యత పెరగటం, స్త్రీపురుషులిద్దరికీ వ్యక్తులుగా గౌరవం, హుందాతనం దొరకాలనే భావాలు  ఏర్పడటం, స్వేచ్చ, స్వతంత్రతల గురించి, హక్కుల గురించి స్పృహ కలగటం, మానవుల బాధలు కేవలం వారి నుదుటి రాతలు, కర్మలే కాదనీ, ఆ బాధలను కొన్ని ప్రక్రియల ద్వారా తొలగించుకునే అవకాశాలున్నాయనే గ్రహింపు, హేతుబద్ధతకు విలువనివ్వటం, విశాలార్థంలో మానవులంతా సమానమనే భావన, ఈ భావనలకు అడ్డు వచ్చే సంప్రదాయాలను, ఆచారాలను నిరసించటం, ధిక్కరించటం వీటన్నిటినీ స్థూలంగా ఆధునికతగా చెప్పుకోవచ్చు.

5666_062

1947 వ సంవత్సరం, అంటే భారతదేశం స్వతంత్రమయ్యే నాటికి ఏలూరులో స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన మాలతి 50 లలో మద్రాసు వచ్చారు. అప్పటి నుంచీ ఆమె సాహిత్య జీవితం ఆరంభమయింది. అప్పుడు మద్రాసు తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలకు కేంద్రం గా వుంది. ఆకాశవాణి అక్కడే వుంది. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, పటాభి, బాపు, ముళ్ళపూడి వెంకట రమణ, భమిడిపాటి మొదలయిన రచయితలంతా అక్కడే వున్నారు. ఇంకో వేపు స్త్రీల పరిస్తితి గురించి, అభివృద్ధి గురించి దేశమంతా ఆలోచిస్తున్న కాలం.

మాలతి మంచి పాఠకురాలు. పుస్తక పఠనం ఆమెకు వ్యసనం. ఆ వ్యసనం ఎంత తారాస్థాయిలో ఆమెకు వంట బట్టిందంటే మొత్తం తెలుగు వారందరికీ ఆ వ్యసనాన్ని అంటించాలని ప్రయత్నిచిందావిడ.  తాగండి, తాగండి, ఈ సాహిత్యామృతాన్ని. అనేక జీవితానుభవాలను పిండి, ఫర్మంట్ చేసి వడగట్టిన జీవనామృతం ఇది. ఒక్క సారి తాగితే ఒదిలిపెట్టరు –అంటూ ఆ రుచిని పరిచయం చెయ్యటానికి మాలతి నడుం కట్టుకున్నది. ఆ ప్రపంచ సాహిత్య పఠనం ఆమెలోని రచయిత్రికి తొలి పాఠాలు నేర్పింది.

50 లలో దేశం స్వతంత్రమయ్యాక కొత్త తరంలో ఎన్నో ఆశలూ, ఆధునికతకు ఎన్నో నిర్వచనాలూ, జీవితాలను మార్చుకోవాలని, తీర్చి దిద్దుకోవాలని తపనలూ, నగరాలలో కొత్త పరిసరాలలో వచ్చే వైరుధ్యాలను పరిష్కరించుకోవటమెట్లా, తమని తాము కొత్త పద్ధతులలో సంస్కరించుకోవటమెట్లా అని సతమతమయ్యే యువతరానికి ఒక మంచి సలహాదారు, కౌన్సిలరు, తమకు దూరంగా ఉంటూ తమ జీవితాల్లో కొద్దిగా తొంగిచూచి మంచి మాట చెప్పే పెద్దదిక్కు కావలసి వచ్చింది. సమష్టి కుటుంబాల్లో పెద్దల మాటలూ సలహాలూ క్రమంగా పోతున్నాయి. సమస్యలు, సందేహాలు పెరుగుతున్నాయి. ఎవరితోనయినా పంచుకోకపోతే అవి వాళ్ళని నిలవనీవు. ఆ స్థితిలో ‘ప్రమదావనం’ శీర్షిక అందుకే అంత విజయవంతమయింది. మాలతి చందూర్ కి అంత కీర్తి వచ్చింది. సినిమా తారలకు సమానమయిన గ్లామర్ ఆవిడ సంపాదించటానికి ఆ శీర్షిక కారణమయింది.

ఓల్గా