ఉత్తమ నటనకు చిరునామా – ఓం పురీ

  

ఓం పురీ  వెళ్ళిపోయాడు.

66 ఏళ్ల వయసుకే కొంపమునిగిపోయినట్టు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. గుండెపోటు… ఒంటరిగా తన అపార్ట్ మెంట్ లో మరణం.

ఓం పురీ నటనలో ఊసరవెల్లి లాంటివాడు.

అనంత్ వేలంకర్ గా (అర్థ సత్య)… ఉన్నాడు.  హరి మండల్ (ఆరోహణ్) గా అబూ మియా గా (మిర్చ్ మసాలా) ఉన్నాడు. అహుజా గా (జానే భీదో యారో) ఉన్నాడు. దుఖీ గా (సద్గతి), భిక్కూ గా(ఆక్రోశ్) ఉన్నాడు. దుర్యోధనుడు, రాజరాజ చోళుడు ఇంకా ఎందరెందరో చారిత్రక పురుషులు (భారత్ ఎక్ ఖోజ్) గా ఉన్నాడు.  నాథూ (తమస్ టీవీ ఫిల్మ్) గా ఉన్నాడు. ఇంకెన్నో సినిమాల్లో ఎందరెందరుగానో ఉండిపోయాడు.   ‘భారత్ ఎక్ ఖోజ్’ లో తన నిండైనగొంతుతో అతనిచ్చిన కామెంటరీ మరపురానిది.

ఎందరెందరి వ్యక్తిత్వాలలోనో తనని తాను లీనం చేసుకుని, ఆ కష్టాలూ అనుభవాలూ తనవి చేసేసుకుని సినిమాల్లో ఆవిష్కరించాడు. ‘Method Acting’ నుంచి తరచి చూశాడు.  Method Actors నటించరు. పాత్రలోకి ప్రవేశం చేసి, ఆటుపోట్లన్నీ అనుభవిస్తారని సాధారణంగా అనుకునే మాట.

“ముంబైకీ ఫిల్మ్ ఫీల్డ్ కు తనను బలవంతం చేసి రప్పించినందుకు  నాకే ఆ క్రెడిట్ ఇచ్చాడు. అది నాకు బాగానే ఉందిగానీ నిజానికి తనని ఎవరూ తీసుకు రావక్కర్లేదు. స్టేట్ బాంక్ ఆఫ్ పాటియాలా లో పని చేస్తూ ఉండిపోయినా సరే, సినిమాలు అతన్ని వెదుక్కుంటూ వచ్చేవి” – నసీరుద్దీన్ షా.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉన్నప్పుడు షా కొంచెం అల్లరిగా ఉంటూ నటనను తేలిగ్గా తీసుకునేవాడట. శ్రద్ధగా నేర్చుకోవటం మీదే దృష్టిపెట్టే ఓం పురీ ని చూస్తుంటే తమాషాగా ఉండేదట.  ఒకసారి అక్కడ ‘కబుకీ’ నాటకం వేస్తున్నారని తెలిసి తానూ అందులో వేద్దామని ఉత్సాహపడ్డాడట. కానీ తనకు అవకాశం రాలేదు. ‘ఇబరాగి’ అనే ఆ కబుకీ ప్లే లో జపాన్ యోధుడిగా ఓం పురీని చూశాక  అతని మీద ఉన్న ఈర్ష్య పోయి, ఆరాధించే స్థాయికి వచ్చానని చెప్తాడు. స్కూల్ ఆఫ్ డ్రామాలో వేసిన తన నాటకాలు ఏవీ ‘ఇబరాగి’ లో ‘ఓం’ చేసిన అభినయానికి కనీసం దగ్గరగా కూడా రాలేకపోయాయని ‘షా’ తన ఆత్మకథ ‘And Then One Day – A Memoir లో  చెప్తాడు.

ఓం పురీ బిడియస్తుడు.

Method Actors, సున్నితమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అందరి జీవితాలూ జీవిస్తూ, వాటిని తట్టుకుంటూ బయటపడాలంటే తప్పనిసరిగా కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉందేమో.  కానీ అతని కుటుంబజీవితం సరిగ్గా లేదు.

జర్నలిస్ట్ నందితా ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు. నందిత ఓంపురి జీవితకథను రాసింది. తనగురించి ఏవేవో రాసేసిందని బాధపడిపోయాడు. అవసరం లేదు. నసీరుద్దీన్ షా లాగా బతుకు పుస్తకాన్ని తెరిచిపెట్టి, తనను చూసి తాను హాయిగా నవ్వుకోనూ వచ్చు. నవ్వుకోలేదు. బాధపడి పోయాడు. నందితతో విడిపోయి మూడేళ్ళయింది.

ఓం పురీ ధైర్యస్తుడు.

స్ఫోటకం మచ్చలతో పీలగా ఉన్న తను,  చెయ్యీ కాలూ సరిగ్గా ఎలా కదపాలో తెలియకపోయినా మంచి రూపాలే పెట్టుబడిగా సినిమాల్లోకి దిగిన హీరోల పక్కన బతకగలనని అనుకోవటానికి ఎంత ధైర్యం ఉండాలి!  ఎన్. ఎస్. డీ లో మంచి పేరు తెచ్చుకున్నా,  మధ్యమ స్థాయిలో ఉన్న చక్కటి స్వరం ఉన్నా, రూపం కారణంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇతనికి నటన విభాగంలో చేరటం కష్టమైంది. గిరీష్ కర్నాడ్ జోక్యంతో సీట్ వచ్చింది.  ఇంతగా నటన ఊపిరైపోయిన ఈ పంజాబీ కుర్రాడికి రెండు ప్రిమియర్ ఫిల్మ్ స్కూల్స్ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్) చుట్టివస్తే గానీ నటనలు నేర్చే దాహం తీరలేదు. నేర్చిన నటనకు సార్ధకతను ఇవ్వటానికి అదృష్టంకొద్దీ  సమాంతర సినిమా అనే మంచి చోటు దొరికింది.  ఆ సినిమాలవి అసలే కుదించుకున్న బడ్జెట్ లు. ఏవో కొంచెం డబ్బులు పారేసి (ఇది ఓం పురీ చెప్పిన మాటే)  తనను ఆ సినిమాల్లో వేయమంటే వేసి, ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో ఎలా బతుకుతున్నాడో లెక్క చెయ్యకుండా గడిపిన కాలంలో మెచ్చుకోళ్ళూ అవార్డులే ముందుకు నడిపించాయి.  హాలీవుడ్ లో అడుగుపెట్టాకే  సంపాదన బాగా పెరిగింది.

ఓం పురీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే శక్తి తనకు అబ్బురంగా అనిపించేవని అంటాడు మిత్రుడు నసీరుద్దీన్ షా. స్మితా షబానాల లాగే నసీర్ ఓం పురీల పేర్లు విడదీయలేనివి. నటనలో స్పర్ధతో పాటు ఆకలినీ ఆనందాలనూ కలిసి పంచుకున్న మిత్రులు ఇద్దరూ.

 

ఓం పురీ  ఒక అనంత్ వేలంకర్ 

హిందీ సినిమాలో అప్పట్లో Angry Youngman మూసనొక దాన్ని చేసి సలీం జావేద్ లు అమితాబ్ బచ్చన్ కు తొడిగారు. కానీ అసలైన Angry Youngman ఎలా ఉంటాడో ఎలాంటి పరిస్థితుల్లో తయారౌతాడో మొదటిసారి చూపించాడు గోవింద్ నిహలానీ ‘అర్థ సత్య’లో. జనం బాగా చూసిన సినిమా అది.  అనంత్ వేలంకర్ ఒక పోలీస్ కొడుకు. పీలగా బలహీనంగా ఉన్న అతని తల్లిని బలిష్టంగా ఉన్న తండ్రి కొడుతుంటాడు. కొడుకును కూడా పోలీస్ ఫోర్స్ లో చేరమని బలవంతం చేస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్ అయిన అనంత్ తండ్రి లాగ తను జీవితంలో ఎప్పుడూ ఎవరిమీదా జులుం ప్రదర్శించకూడదని అనుకుంటాడు. అందులో చేరిన ప్రతి ఒక్కరినీ ముందు మొరటుగా మార్చిపడేసే పోలీస్ డిపార్ట్మెంట్ బలం ముందు అనంత్ ఎంతపాటి వాడు?

 

“చక్రవ్యూహంలోకి అడుగు పెట్టకముందు నేనెవరిని?ఎలా ఉండేవాడిని?

గుర్తేలేదు.

దానిలోకి వెళ్ళేకగానీ దానికీ నాకూ ప్రాణం తీసేంత దగ్గరితనం ఉందని తెలియనేలేదు.

ఈ చక్రవ్యూహంలోంచి బయటపడితేనే నేను విముక్తుడినౌతాను.

అయితేమాత్రం? చక్రవ్యూహ రచనలో ఏం తేడా వస్తుంది గనుక?”

ఇదీ అనంత్ వేలంకర్ అస్తిత్వ వేదన.

ఓం పురీ అనంత్ వేలంకర్నీ అతని వేదననూ తనమీదికి ఆవాహన చేసుకున్నాడు.

ఎన్నో సినిమాల్లో, టీవీ ఫిల్మ్స్ లో, వేరే దేశాల సినిమాలూ టీవీలలో నటించి మెప్పించాడు. నాటక రంగాన్ని ఎంతో ప్రేమించాడు. తెలుగులో కూడా ‘అంకురం’ సినిమాలో అతను వేసిన ‘సత్యం’ రోల్ చాలామందికి గుర్తుండే వుంటుంది.  ఏ పాత్రలో వేసినా అది ఏ ప్రాంతానికి సంబంధించినదైనా ఏ భాషా చిత్రమైనా, అక్కడి సాంస్కృతిక నేపధ్యానికి అనుగుణంగా అన్నీ కూలంకషంగా తెలుసుకుని నటించేవాడు.  పోచంపల్లి నేతపనివాళ్ళ మీద శ్యాంబెనెగల్ తీసిన ‘సుస్మన్’ లో నేతగాడుగా ఆవిర్భవించాడు. అప్పట్లో నేతపని నేర్చేసుకుని మరీ నటించాడు. అవన్నీ ఒకెత్తు. ‘అర్థసత్య’ ఒకెత్తు. చిన్నపాత్ర వేసినా ప్రధానపాత్రలో కనిపించినా, వాటికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా నటించాడు.

తానెంతో ప్రేమించిన నటనతో కలిసి చివరిదాకా నడిచాడు కానీ అర్థాంతరంగా జీవితనాటకం నుంచి నిష్క్రమించాడు ఓం పురీ.

–ల.లి.త.

 

 

కథలు కావవి వ్యాసాలు –ల.లి.త.

2.మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా
లక్షరూపాయల కథ – దగ్గుమాటి పద్మాకర్.  కులం ఇప్పుడు ముసుగులూ మొహమాటాలూ తొలగించుకుని గర్వంగా తనని తాను ప్రదర్శించుకుంటున్నది. కులగర్వాలు ఎక్కడ లేని దర్జాలూ ఒలకబోస్తున్న ఈ రోజుల్లో పాపం ఒక బక్క చిక్కిన అభ్యుదయ రచయిత ధనబలం ఉన్న రెడ్డిగారి కళ్ళలో పడ్డాడు. ఆయనకి  ఈ రచయిత చక్కగా పేరుచివర రెడ్డి అని ప్రదర్శించుకుంటే మనకులంలోనూ ఒక మంచి రచయిత ఉన్నాడని చెప్పుకోవచ్చుగా అని సరదా పుట్టింది. అలా కులంతోక తగిలించుకుంటే లక్షరూపాయలు ఇస్తానంటాడు.  రెడ్డిగారి కుల ధన బలప్రదర్శన ముందు రచయిత అభ్యుదయం రెపరెపలాడి ఆరిపోయింది.
కథ రాయటంలో పద్మాకర్ sharpness గురించి కొత్తగా చెప్పేదేముంది?  ఈ కథని మరో యాభై ఏళ్ల తరువాత మన తరువాతివాళ్ళు assess చేశారనుకోండి.  కులంకొండ ముందు అభ్యుదయం తలవంచుకున్న ఇప్పటి పరిస్థితులు అతిశయోక్తులూ అభూతకల్పనలూ లేకుండా సరిగ్గా అర్థం అవుతాయి. మన కాలాన్ని సరిగ్గా ప్రతిబింబించిన కథ. నిలిచేకథ అని నా ఉద్దేశ్యం.
 సవారీ జడుపు –  చింతకింది శ్రీనివాసరావు.  రాజెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయీలెవరో చూడమని శ్రీశ్రీ అంటే, మోసిన బోయీలు సరే, పెట్టెసవారీలో వెన్నువంగి నరాలు కుంగిన రాచపడుచును చూడమంటున్నారు శ్రీనివాసరావు. ఆమె పెట్టె పల్లకీలోకి ఎక్కిందంటే ‘ఎనిమిది గజాల చీరని అగ్గిపెట్టెలో దోపినట్టే’ నట.అన్ని అవయవాలూ బంధించుకుని గంటలతరబడి గాలాడని పల్లకిలో ప్రయాణించే ఒక రాజులమ్మాయి కష్టమిది. విషయం కొత్తది.  ఆ కుటుంబాల్లోని ఆడవాళ్ళకు  తప్ప ఇంకెవరికీ తెలియని కష్టం. శ్రీనివాసరావు వ్యంగ్యం, కథ చెప్పే నేర్పు, రెండూ కలిసి, కథ ఆగకుండా చదివిస్తుంది.
 2016 లో నాకు నచ్చని కథ..
 
బేతాళుడితో శైలజ – పి.వి. సునీల్ కుమార్.
సునీల్ కుమార్ కథలంటే వెంటనే చదవాలని అనిపిస్తుంది. కథ చెప్పటంలో కొత్తదనం, తెలివీ, వ్యంగ్యం, పరిశీలనా ఉండి రెండు మూడు మంచికథలు ఇప్పటికే బాగ్ లో వేసేసుకున్న రచయిత.  ‘బేతాళుడితో శైలజ’ కథ ఎంతో ఆసక్తికరంగా మొదలౌతుంది. శైలజ గోదావరి జిల్లాలోని తన పల్లెటూరు వెళ్తుంది. అక్కడ ఆడవాళ్ళ ప్రైవేట్ జీవితాలమీద మిగతా ఆడవాళ్ళు చేసే కామెంట్స్ ని భరించలేక తన బిజినెస్ మేనేజ్మెంట్  చదువు నేర్పిన తెలివితో ప్రశ్నలు అడిగినవాళ్ళకే తిరిగి దెబ్బకొట్టేలా మాట్లాడుతుంది. అక్కడితో కథ ఆగినా బాగుండును.  వ్యవస్థ మీద పెద్దపెద్ద ప్రశ్నలు వెయ్యకుండా వీళ్ళంతా ఇలా ఏమిటని శైలజ విసుగు. రచయితకీ విసుగే. ఊర్లలో ఉండేవాళ్ళ తెలివినీ హ్యూమర్ నీ మాట చాతుర్యాన్నీ గుర్తించకుండా సిటీల్లో ఉండి ఆలోచించి  తీర్పు చెప్పటం వల్ల ఈ కథ తేలిపోయింది.  నామిని పల్లెటూరి గాసిప్స్, చతుర్లమీద రాసిన చక్కని కథ ‘కుచ్చుంటే కత లేస్తే కత’ గుర్తొచ్చింది. ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళలో ఆ చతుర్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళూ రాజకీయాలు బాగానే మాట్లాడగలరు. సునీల్ కుమార్ నుంచి ఈ కథ రావటం నిరాశ కలిగించింది.
 3.      మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు-
.  Topical issues మీద కథల పేరుతో మామూలు వ్యాసాల్లాంటివి వచ్చేస్తున్నాయి. విషయాలమీద సరైన అవగాహన లేకుండా,  ‘ఏదో చెప్పేయాలి, మరేదో అన్యాయాన్ని ఖండించాలి’ అన్న గొడవే తప్ప, చదివేవాళ్ళ తెలివిని తక్కువ అంచనా వేస్తున్నామన్న స్పృహ లోపిస్తోంది. వీటిమధ్యలో ఎస్. జి. జిజ్ఞాస  రాసిన ‘కలకంఠి కంట కన్నీరేదీ’, ‘దుర్ముఖం’  (రెండూ ఆంధ్రజ్యోతిలోనే) కథలు భిన్నంగా ఉన్నాయి. రెండూ topical issues మీదే.  కథనవిధానం పాతదైనా (కలకంఠి.. లో యముడూ ఆధునిక సావిత్రీ సంవాదం,  ‘దుర్ముఖం’ లో జంతువుల మీటింగ్ లో చర్చలు) sharpness ఉన్న కథలు.
4.  తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?
వ్యక్తిగత, సాంఘిక, అంతర్జాతీయ మార్పులను స్పృశించే ప్రయత్నం తెలుగుకథ చేస్తూనే ఉంది. ఇంటర్నెట్ విప్లవం వల్ల ఎవరికి  తెలిసిన సమాచారం వాళ్ళు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివన్నీ కథలేనా అంటే చెప్పలేం. చాలామందికి  కథ రాసి దాన్ని తిరిగి చూసుకునే టైం కూడా ఉన్నట్టు కనిపించటం లేదు. మొత్తంగా తెలుగు కథ పల్చబడుతున్నట్టు కనిపిస్తోంది. వ్యక్తిగతంగా వస్తున్న మార్పులని చెప్పటానికి ఎక్కువ ప్రయత్నం జరుగుతోంది. వాదాలు నెత్తినవేసుకున్న కథలు మిల్లు చీరల్లా వేగంగా తయారైపోతున్నాయి. కాస్త సమయం పెట్టి చక్కటి కథలను నేయగలిగేవారు కథారంగంలో తగ్గిపోతున్నట్టుగా ఉంది.
5.      మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?
 ఆంధ్రజ్యోతి.

6.      కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

 కధావిమర్శ ఇప్పుడు తెలుగులో నిల్.

7.       కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

కథాసంకలనాలు చాలా అవసరం. కథాసాహితి ప్రచురణ పాతికేళ్ళ తెలుగుకథ చాలా మంచి సంకలనం. అది చదువుతుంటే సమాజంలో వస్తున్న మార్పులేమిటో, వాటిని అనుసరిస్తూ తెలుగుకథ  తొంభైల నుంచీ ఇప్పటివరకూ ఎలాంటి పోకడలు పోతోందో స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలా సంకలనాలు రావటం చాలా మంచిది. రచయితల కృషిని అంచనా వేసేందుకూ రకరకాల పత్రికల్లో వచ్చే మనం మిస్ అయిన కథలు చదివేందుకూ కథా సంకలనాలు మంచి అవకాశం.
–ల.లి.త.

బాలీవుడ్ భాష మారిపోతోంది!

2016 చివరకొచ్చేసింది. ఈ సంవత్సరం వచ్చిన మూడు ముఖ్యమైన బాలీవుడ్ ఫిల్మ్స్ గురించి చెప్పుకుని తీరాలనిపిస్తోంది.  సినిమాభాషని సరికొత్తగా పలికించటంతోపాటు ఇప్పుడున్న సమస్యలగురించి మాట్లాడ్డం ఈ సినిమాల ప్రత్యేకత.

ఎవరిగురించైనా మంచినీళ్ళు తాగినంత సులువుగా తీర్పులు చెప్పెయ్యటం డిజిటల్ యుగంలో మామూలయిపోయింది.  మనిషన్నవాడికి తీర్పులు చెప్పటం మంచి కిక్ ఇచ్చే విషయం. ముఖ్యంగా ఆడవాళ్ళూ,  మైనారిటీలూ, దళితుల విషయంలో చాలామంది తీర్పులుచెప్పే నిషాలోకి భలే తొందరగా జారిపోతుంటారు. ఆ నిషా sexist ఆలోచనలది కావచ్చు. నిజమైన మత్తుమందుల వెల్లువలో మనిషి జంతువైపోయే నిషా కావచ్చు. లేకపోతే మాకు తెలిసినదేదో అదే మనిషికుండాల్సిన sexual behaviour అని వాదించే మూర్ఖత్వపు నిషా కావచ్చు.

‘ఉడ్తా పంజాబ్’ లో జనం నోళ్ళలో తెగనలిగిన ‘చిట్టావే’ పాట చరణంలో ‘కుండీ నషేవాలీ ఖోల్ కె దేఖ్’ (నిషాతనపు గొళ్లెం తెరిచిచూడు) అంటాడు.  అలాంటి మూసుకుపోయి తుప్పు పట్టిన నిషాతనపు గొళ్ళేలు తెరిచి, మది తలుపుల్లోకి కొత్త వెలుతురు ప్రసరించాలని ప్రయత్నించిన సినిమాలివి మూడూ.

The issues of humanity and what is fair and good treatment of a fellow human being,  should not be based on a personal sense of right and wrong or judgment” –  Debbie Harry (American Rapper).

అలీగఢ్ యూనివర్సిటీలో పనిచేసిన మరాఠీ ప్రొఫెసర్ రామచంద్ర సిరస్ జీవితకథే ‘అలీగఢ్’ సినిమా. ‘గే’ అయినందువల్ల ఆయన్ను శారీరకంగా మానసికంగా హింసించి కేంపస్ నుండి వెళ్ళగొట్టారు.  పదవీకాలం ఇంకో ఆర్నెల్లుఉందనగా కోర్ట్ తీర్పుతో ఉద్యోగాన్నీ, కేంపస్ క్వార్టర్స్ ని సాధించుకున్నాడాయన.  మర్నాడు ఉద్యోగంలో చేరతాడనగా ముందురోజే అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన దీపూ సెబాస్టియన్ అనే జర్నలిస్ట్ చెప్పిన వివరాలు ముఖ్య ఆధారంగా ఈ సినిమా తీశాడు హన్సల్ మెహతా.

ఇష్టపూర్వకంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే స్వలింగసంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్ట్ జూలై 2009లో తీర్పు చెప్పింది. కానీ 2013లో సుప్రీం కోర్ట్ ఆ తీర్పుని కొట్టేసి స్వలింగసంపర్కాన్ని నేరమని నిర్ణయించే సెక్షన్ 377 అమల్లోనే ఉంటుందని చెప్పింది. ఈ రెండుతీర్పుల మధ్య కాలంలో 2010 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ రామచంద్ర సిరస్ ఇంటిమీద దాడి జరిగింది. ఏప్రిల్ ఒకటో తేదీన 2010 లో ఆయన అలహాబాద్ హైకోర్ట్ లో కేసు గెల్చాడు. ఏప్రిల్ 7వ తేదీ 2010 న తన అపార్ట్ మెంట్ లో చనిపోయి ఉన్నాడు. అటాప్సీ రిపోర్ట్ లో విషప్రయోగం జరిగిందని వచ్చింది. పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసినా, సరైన ఆధారాలు ఇవ్వలేకపోవటంతో అది హత్య కేసుగా నిలవలేదు.

‘అలీగఢ్’ సినిమా ఒక లాంగ్ పోయెమ్.  ప్రొఫెసర్ సిరస్ తో ‘కవిత్వంలోని పదాలు నాకు అర్థం కావం’టాడు జర్నలిస్ట్ దీపూ. ‘పదాల్లో ఏముంది అర్థం? పదాల మధ్య వున్న నిశ్శబ్దంలో ఉంటుంది గానీ’ అంటాడు శబ్దాల మధ్య ఒదిగున్న నిశ్శబ్దంలాంటి సిరస్. అతనికి లతా మంగేష్కర్ పాటలంటే ప్రాణం. మరాఠీలో కవిత్వం రాసి అచ్చేసుకున్నవాడు.  ‘Gay’ అనే  మూడు అక్షరాలలో ఓ మనిషిని కుదించటం ఏమిటని మౌలికమైన ప్రశ్న వేస్తాడు.  తన పార్టనర్ ని చూస్తే తనలోని ప్రేమ తనను నిలవనీయదని చెప్పి, ఆ పరిస్థితిని వీలైనంత స్పష్టంగా చిన్నమాటలతో  దీపూ కి వివరించటానికి ప్రయత్నిస్తాడు.

alia-bhatt-udta-punjab-trans

కథలోకొస్తే, రాత్రివేళ సిరస్ ఒక రిక్షాఅతనితో కలిసుండగా ఇద్దరు మనుషులు అతని ఇంట్లోకి చొరబడి వాళ్ళిద్దరినీ వీడియో తీసి, రిక్షాఅతన్ని కొట్టి, ఇద్దరిమీదా విరుచుకుపడి తిట్లకి దిగుతారు.  సిరస్ భీతితో ముడుచుకున్న పావురాయిపిల్లలా అయిపోతాడు. తరువాత ‘గే’ అనే ఆరోపణమీద అతన్ని యూనివర్సిటీ సస్పెండ్ చేస్తుంది. సిరస్ నమ్మిన తోటి ప్రొఫెసర్ ఒకాయన అతన్ని ఓ పక్క అసహ్యించుకుంటూనే మరోపక్క సాయం చేస్తున్నట్టుగా, తను ‘గే’ అని ఒప్పుకుంటూ క్షమాపణ పత్రం రాయమని సిరస్ కు సలహా ఇస్తాడు. ఏమీ తోచని సిరస్ అలాగే రాసి ఇచ్చేస్తాడు. ఇంతలో కేంపస్ లో సిరస్ శీలపరీక్ష, అతని దిష్టిబొమ్మ తగలేయటం లాంటి పనులు జరుగుతాయి. అప్పట్నుంచీ తలుపులు వేసుకుని అతను దిగులుగా భయంగా ఇంట్లోనే ఉండిపోతాడు.  వారంరోజుల్లో అతను యూనివర్సిటీ క్వార్టర్ ను ఖాళీ చెయ్యాలని చెప్పి, ఇంటికి ఎలక్ట్రిసిటీ లేకుండా చేసేస్తారు. దీపూ తన పత్రికకోసం ఈ విషయాన్నంతా స్టోరీ చేయాలన్న తపనతో, చాలా సానుభూతితో కష్టపడి సిరస్ కి చేరువై, అతన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో హక్కుల సంఘాలవాళ్ళు సిరస్ కు ఆసరా ఇచ్చి అతనిచేత కోర్ట్ లో కేసు వేయిస్తారు. అలీగఢ్ విద్యాలయాన్ని ఎంతగానో ప్రేమించిన సిరస్ యూనివర్సిటీ క్వార్టర్ విడిచిపెట్టి వేరేయింటికి మారాల్సివస్తుంది.  అతని వ్యక్తిగత జీవితంలోకి దౌర్జన్యంగా చొరబడి వీడియోలు తీసే హక్కు ఆ వ్యక్తులకీ, ఆ వీడియోల ఆధారంగా సిరస్ ను శిక్షించే హక్కు యూనివర్సిటీకీ లేదని వాదించి కూడా ఆవిధంగా ఒప్పించలేక, చివరకు స్వలింగసంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని precedent గా చూపించి కేసు గెలిపిస్తాడు లాయర్.

సిరస్ హక్కులంటూ పోట్లాటకు దిగలేని నెమ్మదస్తుడు.  లతామంగేష్కర్  పాటలూ కవిత్వమూ తప్ప ఇంకేం అక్కర్లేదు. కోర్ట్ లో కేసు వెయ్యటానికి కూడా అంతగా ఇష్టపడక ఇక తప్పని పరిస్థితిలో దానికి ఒప్పుకునేంత ఇంట్రావర్ట్.  తనగురించి కోర్ట్ లో వాదనలు జరుగుతుంటే అవన్నీ అర్థంకాక అలిసిపోయి చేతిలో పుస్తకం పట్టుకుని చిన్నకునుకు తీస్తుంటాడు.  అలీగడ్ లో మరాఠీ విభాగానికి హెడ్ గా ఉండటమంటే అక్కడ తను బయటివాడని అర్థం. అదేకాకుండా తనకు యూనివర్సిటీలో వున్న ప్రతిష్టను కూడా సహించలేని కొంతమంది ఇలా హింసకు దిగారని  దీపూ వొక్కడికే చెప్తాడు.

“అలీగడ్” ఒట్టి హక్కులూ పోరాటాల సినిమా కాదు. ఒంటరితనం.. వేధింపులకి గురై అలసిన ఒంటరితనం.. కొత్త ఇంట్లో చుట్టూ పరుచుకున్న సామాన్ల మధ్య దోమలు కొట్టుకుంటూ లతా పాటలూ, బయట హైవేమీదనుంచి పోతున్న లారీల చప్పుళ్ళమధ్య   ఇబ్బందిగా మసిలే ఒంటరితనం.. ‘గే’ అన్న ఒక్క తేలిక మాటతో తానెంతో ప్రేమించిన వాతావరణానికి క్రూరంగా దూరం చేస్తే గుక్కలు మింగే దుఃఖపు ఒంటరితనం ఈ సినిమా. ఇద్దరి ఏకాంతాన్ని వాళ్ళ అనుమతితో పని లేకుండా జొరబడి ధ్వంసంచేసి మనిషి విలువను నేలరాసి అవమానించటంలోని అమానుషత్వాన్ని ఎత్తి చూపించటమే ఈ సినిమా..  ఎంతో ఆర్ద్రంగా తీశాడు హన్సల్ మెహతా.  సిరస్ గా వేసిన మనోజ్ బాజ్ పాయ్, దీపూ సెబాస్టియన్ గా వేసిన రాజ్ కుమార్ రావ్ సినిమానుండి కన్ను తిప్పుకోనివ్వకుండా చేశారు. మనోజ్ బాజ్ పాయ్ కి  2016 కి best actor గా జాతీయఅవార్డు ఏకగ్రీవంగా రావాలి మరి.

Loudness ఏ కొద్దిగానూ లేకుండా ఆర్ట్ ఆఫ్ సినిమాని పట్టుకుంది ‘అలీగఢ్’. ఏదో ఒక విషయాన్ని రుజువు చెయ్యటానికో, సమస్యను వివరించటానికో పరిష్కరించటానికో తీసినట్టుగా ఉండదు. సమస్య తీవ్రతనీ  వ్యక్తి ఆవేదననీ కలబోసి చెప్పిన తీరులో గొప్పగా తూకం కుదిరింది అలీగఢ్ లో.  మనోజ్ బాజ్ పాయ్ నటన, సినిమాటోగ్రాఫర్  సత్యారాయ్ నాగ్ పాల్ సినిమాకిచ్చిన melancholic tone, visuals సినిమాకున్న  పొయటిక్ పోకడకి బాగా అనుకూలించాయి.  వ్యాపారాన్ని పక్కనపెట్టి తీసిన సినిమా కావటం వల్ల డబ్బు కంటే ఎక్కువగా పేరూ ప్రశంసలూ వచ్చాయి.

***

లైంగిక వేధింపులని రకరకాలుగా సమర్ధించుకుంటున్న పురుషాధిక్యతకి చాచిపెట్టి లెంపకాయ కొట్టింది ‘పింక్’.  ఏ పరిచయస్తురాలైనా, స్నేహితురాలైనా, గర్ల్ ఫ్రెండ్ అయినా, సెక్స్ వర్కర్ అయినా, నార్త్ ఈస్ట్ అమ్మాయయినా (వాళ్ళు సులువుగా దొరికేస్తారని చాలామంది మగవాళ్ళకి నమ్మకం), భార్య అయినా, అంటే అసలే స్త్రీ అయినాసరే నీ ప్రేమకీ కోరికకీ ‘వద్దు’ అని చెప్పిందంటే అది ఖచ్చితంగా ‘వద్దు’ అనే. ఇంకో వాదనకి అవకాశం లేదని సూత్రప్రాయంగా నిరూపించింది. నిర్భయ కేస్ తరువాత వచ్చిన నిరసనల్ని ఎదుర్కోలేక, పులి మేకమీద పడి తినేస్తే మేకదే తప్పన్నట్టుగా ఆడవాళ్ళ దుస్తులతీరు మీదా స్వాతంత్ర్యం మీదా ఏడ్చి, బాధితులనే నేరస్తులని చేసే దబాయింపుకి దిగారు కొంతమంది. ఏయే విషయాల్లో ఆడవాళ్ల ప్రవర్తన తప్పన్నారో ఆ పరిస్థితులన్నిటిలోనూ ఒక ముగ్గురు అమ్మాయిలని ఇరికించి, వాళ్ళమీద వచ్చిన లైంగికవేధింపులని ఇంకోమాట లేకుండా శిక్షించాల్సిన నేరాలుగా వాదించి ఒప్పించారు ‘పింక్’ సినిమాలో.

వాళ్ళు ముగ్గురూ ఉద్యోగాలు చేసుకుంటూ స్వేచ్ఛగా తిరిగే అమ్మాయిలు. మెట్రోసిటీలో ఈతరం అమ్మాయిలు వేసుకునే బట్టలు వేసుకుంటారు.  ఫ్రెండ్స్ ద్వారా అప్పుడే పరిచయం అయిన అబ్బాయిలతో వాళ్ళని నమ్మి డిన్నర్ కి రిసార్ట్ కి కూడా వెళ్తారు. మద్యం తాగటం తప్పనుకోరు. ఒకమ్మాయి ఇంటి బాధ్యతలకోసం డబ్బు అవసరమై పెళ్ళయిన వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది.  మరో అమ్మాయి ఆ ఊళ్లోనే తల్లిదండ్రులుంటున్నా వాళ్ళతో కలిసి ఉండకుండా విడిగా ఉంటుంది. ఈమె పెళ్లి కాకపోయినా వర్జిన్ కాదు.  మూడో అమ్మాయి పుట్టుకవల్లనే (నార్త్ ఈస్ట్) ఇంచుమించు సెక్స్ వర్కర్ గా, సెకండ్ రేట్ సిటిజన్ గా భావించబడే జీవి.  ఒక సంప్రదాయ సమాజంలో ఇవన్నీ ఆ అమ్మాయిలని త్రాసులో వేసితూచి ‘చెడ్డ అమ్మాయిలు’ అని ముద్ర వేసే పరిస్థితులే.

pink2

నిర్భయ కేస్ తరువాత వచ్చిన మేల్ డామినేటెడ్ సంప్రదాయ సమాజపు discourse  కు సరైన సమాధానం చెప్పటం కోసమా అన్నట్టు ఈ ముగ్గురు అమ్మాయిల్నీ సంప్రదాయ సమాజపు ‘చెడ్డ అమ్మాయి’ ముద్రలోనే పెట్టి వాదన పెట్టుకున్నాడు దర్శకుడు అనిరుధ్ రాయ్ చౌదురి.  కోరికలు పుడతాయి సరే, వాటితోబాటు వొచ్చే ఆలోచనలు సమానత్వమనే గీతదగ్గరే ఆగితీరాలని పట్టుగా చెప్పాడు.  అమాయకపు పల్లెటూరి పిల్లలుగానో, లేక అందరూ ఒప్పుకునే ‘పధ్ధతైన’ పిల్లలుగా ఉంటూనే అన్యాయాన్ని గట్టిగా ఎదిరించేవాళ్లుగానో కాకుండా చాలామంది వ్యతిరేకించే ‘థర్డ్ వేవ్ ఫెమినిస్ట్’ ల్లాగా ఉన్న అమ్మాయిల జీవితాలని చూపిస్తూ వాదించటంవల్ల ‘పింక్’ అర్బన్ యూత్ లోని ఆడామగా అందరికీ బాగా చేరిపోయింది.

చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న అర్బన్ మధ్యతరగతి మగవాళ్ళకి,  తమ స్పేస్ ని ఆక్రమించేదాన్ని దేనినీ సహించని థర్డ్ వేవ్ ఫెమినిస్ట్ ల జీవిత విధానాలను ఒప్పుకుని బ్రతకటం ఇప్పటికే అలవాటయింది.  ఇంట్లో పెంపకాల్లో అబ్బాయిలకి పొగరు, అమ్మాయిలకి ఒదిగుండేతనం నేర్పిపెట్టే కుటుంబాలకి ‘పింక్’ గట్టి మొట్టికాయ. ఈ సినిమా తర్వాత ‘పింక్’ హీరోయిన్ ‘తాప్సీపన్నూ’ కూడా తనమీద మగవాళ్ళు కొంతమంది తీసుకున్న sexual advances గురించి మాట్లాడింది. అప్పట్లో తల్లిదండ్రులు ఏం జరిగినా ఆడవాళ్ళదే తప్పనీ, నోరుమూసుకుని ఉండాలనీ నేర్పేవారు కాబట్టి తను అలాగే నోరుమూసుకుని ఉండేదని చెప్పింది.  ఆడామగా పెంపకంలో విడివిడి నీతులు పాటించేవాళ్ళని కడిగిపారేసిన ఈ సినిమా ఆడపిల్లలకు ఇంకొంచెం ధైర్యమిచ్చింది. ఇది చూసాకన్నా ‘ఆడది ముఖ్యంగా సెక్స్ టూల్, మనకే సొంతం, ప్రేమించానంటే కామించానంటే ఒప్పుకు తీరాల’ని మెదడులో ఇంకిపోయిన కొంతమంది వృద్ధులకీ వృద్ధుల్లాంటి కుర్రాళ్ళకీ  ‘పింక్’ మాట్లాడుతున్న సభ్యతా సమానత్వాల పరిభాష అర్థమౌతుందా? ఏమైనా చాలామందిని చేరుకుని, చర్చలకి దారి తీయించటంలో ‘పింక్’ టీమ్ గెల్చింది.

‘పింక్’ లో అమితాబ్ ఆక్సిజన్ కోసం మాస్క్ వేసుకు తిరుగుతుంటాడు. అదో మంచి ప్రతీక. ఢిల్లీ వాతావరణంలోని ఊపిరాడనితనాన్నీ, ఆడపిల్లల అభద్రతనీ మాంచి టెన్షన్ నిండిన మ్యూజిక్ తో నింపి సినిమా అంతా అందర్నీ  కుర్చీల అంచుల్లో కూచునేలా చేసేస్తుంది సినిమా.  శూజిత్ సర్కార్ ఆధ్వర్యంలోని సినిమా కాబట్టి నటులందరూ పోటీలుపడి జీవించక తప్పదు గానీ, ఈ ముగ్గురాడపిల్లల్నీ వేధించిన పోలీస్ ఆఫీసర్ గా వేసిన అమ్మాయిగురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎటూ కాని చదువులతో  ఉద్యోగంలో చేరిపోయి ఉన్న తెలివీ పోయి, బండతనం నేర్చేసుకున్న కింది లెవెల్ ఆడపోలీస్ ల మగ మనస్తత్వాన్ని ఆమె కళ్ళకి కట్టేస్తుంటే, ధర్నాలు చేసే ఆడవాళ్ళని లాఠీలతో కొట్టి వాన్ ఎక్కించే పోలీస్ ఆడవాళ్ళ తీరు ఇలాగే ఉంటుంది కదా అనిపించింది.

***

“ఉడ్తా పంజాబ్” … విడుదలకి ముందే ఎంతో హడావుడి జరిగింది దీనిగురించి. సెన్సార్ బోర్డు కసిగా కత్తిరించి పోగులు పెట్టాలని చెప్పిన తర్వాత కష్టపడి ఎలాగో బయటికొచ్చిందీ సినిమా. వరసగా పంజాబ్ లోని ఊర్ల పేర్లన్నీ చెప్పి, అవన్నీ డ్రగ్స్ మయం అయిపోయాయని ఒక డయలాగ్, పంజాబ్ ని మెక్సికో ఆఫ్ ఇండియా అని మరో డయలాగ్, ఇలా అదరగొట్టి, పంజాబ్ నీరసించిపోతోందన్న నిజాన్ని కటువుగా చెప్తుంది ‘ఉడ్తా పంజాబ్’.  ఎంతో సెన్సిటివ్ సినిమా.  ఇంత స్థాయిలో డ్రగ్స్ కి అలవాటు పడుతున్న మనుషులు, డ్రగ్స్ రవాణా, డీ అడిక్షన్ సెంటర్స్, మత్తుమందుల వ్యతిరేక ప్రచారం వరకూ సమస్య సాగిందని చూపిస్తుంటే ఇదంతా నిజమేనా మనదేశంలోనే జరుగుతోందా అనిపిస్తుంది.

పేరుకూడా ఎవరూ గుర్తుపెట్టుకోని బీహారీ వలసకూలీ పిల్ల (అలియా భట్) (హాకీ ఆడగలిగే ఈ పిల్లకి పొలంలో పాకిస్తాన్ బోర్డర్ నుండి విసిరిన పెద్ద మత్తుమందు పొట్లం దొరుకుతుంది. దాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించాలని వెళ్లి చిక్కుల్లో పడుతుంది), సెలెబ్రిటీ అయినతర్వాత మీదపడే అభద్రతతో వీడ్ కొట్టి, చస్తూబతుకుతూ బూతులు కురిపిస్తూ గాలిపటంలా తిరిగే రాప్ సింగర్ (షాహిద్ కపూర్),  డ్రగ్స్ రోగులకి వైద్యంచేస్తూ ఈ దందాని పూర్తిగా బయటపెట్టాలని ప్రయత్నించే social activist లాంటి డాక్టర్ (కరీనా కపూర్),  డ్రగ్స్ రవాణాదార్ల దగ్గర లంచాలు కొడుతూ, సొంత తమ్ముడే addict అయాడని తెలిశాక డాక్టర్ కి సాయంచేసి, డ్రగ్ మాఫియాని బైటపెట్టే ప్రయత్నం చేసిన చిన్నస్థాయి పోలీసూ(పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్) ఈ సినిమాని నడిపిస్తారు.

కమర్షియల్ మసాలా అంతా ఉన్న సినిమా. కానీ ట్రీట్ చేసిన పద్ధతి కొత్తది.  అభిషేక్ చౌబే దీనికి డైరెక్టర్. అనురాగ్ కాశ్యప్ ఛాయలు కొన్ని కనిపిస్తున్నా పూర్తిగా ఆ శైలి కూడాకాని freshness తీసుకొచ్చాడు చౌబే.  డ్రగ్స్ వాడకాన్ని ఏదో మాయగా మేజిక్ లాగా చూపించడు. దానిలోనే భీభత్సాన్నే చూపించి భయపెడతాడు. చెడుని ఆకర్షణీయంగా చూపిస్తూ చివరకి నీతులు చెప్పే సినిమాలాంటిది కాదు ఉడ్తా పంజాబ్. మత్తుమందుల ఊబిలోకి నిస్సహాయంగా జారిపోతున్న పిల్లలని చూపించి భయపెడుతుంది. బలవంతంగా డ్రగ్స్ ఎక్కిస్తుంటే అచేతనంగా అయిపోయే అమ్మాయిని చూపించి పిచ్చెక్కిస్తుంది.  తన్ని తాను కూడదీసుకుని మత్తుమందుని గొప్ప మనోధైర్యంతో resist చేసే ఆ పిల్ల పట్టుదలని కూడా చూపించి, కాస్త గాలి పీల్చుకునేలా చేస్తుంది. తల విదుల్చుకుని తానెవరో తన బాధ్యత ఏమిటో తెలుసుకున్న రాప్ సింగర్ ‘హమ్మయ్య’ అనిపిస్తాడు. మత్తుమందుతో విచక్షణపోయి, విలువైన ప్రాణాన్ని ఇట్టే ఊదేసిన పిల్లవాడిని చూసి ఏడుపొస్తుంది.  మన దేశంలోని ఒక రాష్ట్రంలోనే  మనుషులు ఇంతగా బలవుతున్నారా అని బాధేస్తుంది.

సెలబ్రిటీ సిండ్రోమ్ ని కూడా పట్టుకుంటుంది ఉడ్తా పంజాబ్.  ఈ సినిమాలోని రాప్ సింగర్ టామీసింగ్ aka గబ్రూ,  ఇప్పటి పంజాబీ పాటగాడు హ్రిదేష్ సింగ్ aka యోయో హనీసింగ్ ని గుర్తుచేస్తాడు.  ఆడవాళ్ళమీద ‘ఐ స్వేర్  ఛోటీ డ్రెస్స్ మే బాంబ్ లగ్తీ మైనూ’ లాంటి లోకువ పాటలు పాడే sexist రాపర్ హనీసింగ్.  ‘చెన్నై ఎక్స్ప్రెస్’ సినిమాలో ‘లుంగీ డాన్సు’ పాటతో దేశమంతా పేరుగడించిన ఈయనీమధ్య రెండేళ్ళపాటు మానసిక వ్యాధివల్ల పాటలకి సెలవిచ్చుకున్నాడు.  ఆ పంజాబీ rap culture, ఆ frustration, ఆ బూతులూ, అవన్నీ మర్యాదస్తుల సంస్కరణకి లొంగని నిజాలే. Psychedelic music లో బూతుల్లో  డ్రగ్స్ ఉన్మాదాన్ని చూడమంటుంది ‘ఉడ్తా పంజాబ్’.  దాస్యం చేయించే మాదకతనీ దాన్లోంచి బయటపడాలన్న  తపననీ బాగానే చూపించాడు ‘గబ్రూ’గా షాహిద్ కపూర్.

ఒక పదేళ్ళనుంచీ పంజాబ్ మత్తుమందుల మీద ఒంటరి పోరాటం సాగిస్తోందని న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. హరితవిప్లవం తర్వాత అక్కడ విపరీతంగా పొలాల్లో వాడిన పురుగుమందుల ఫలితంగా చాలామందికి  కేన్సర్ వచ్చింది. మాల్వా ప్రాంతానికి చెందిన జిల్లాల్లో కేన్సర్ సోకినవాళ్ళు భటిండా నుండి బికనీర్ వెళ్ళే ట్రైన్ లో బికనీర్ వెళ్లి అక్కడ వైద్యం చేయించుకుంటారు. ఆ ట్రైన్ కే కేన్సర్ ట్రైన్ అని పేరొచ్చేసింది. అంతలా కేన్సర్ పాకిపోయింది. దీనికితోడు నార్కో కేన్సర్ పంజాబ్ ని చుట్టేసింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా పంజాబ్ కి అదుపు లేకుండా వస్తున్న హెరాయిన్ వ్యాపారానికి రాజకీయ నాయకులు, పోలీసులు అవినీతిమరకల చేతులు కలిపి సాయపడుతున్నారు. డ్రగ్స్ కి అలవాటు పడ్డ జనం బతికున్న శవాల్లా తయారవుతున్నారు. హెరాయిన్ సప్లై ఆగిపోతే అది అందక వెంటనే మనుషులు చచ్చిపోతారనే భయంతో ఊళ్లలో పెద్దవాళ్ళు సప్లై ఆపవద్దని అధికార్లని కోరేటంత దీనస్థితికి వచ్చారని Pioneer డైలీపేపర్ చెప్తోంది. ధైర్యానికీ పోరాటానికీ పేరుపొంది, ప్రతి ఇంటినుంచీ సైన్యానికో యువకుడిని పంపించే సంప్రదాయం, ఆరోగ్యంగా ఆటలాడుతూ పతకాలు గెల్చే దమ్మూ ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని యువత ఈ రోజు నీరసంగా మత్తులో తూలుతోంది.  ఇప్పుడీ సినిమా విడుదలవటం, సక్సెస్ కావటం సహజమే కాదు అవసరం కూడా కదా.

***

‘దంగల్’, ‘నీర్జా’, ‘ఎయిర్లిఫ్ట్’ లాంటి మంచి సినిమాలూ, ‘క్యా కూల్ హై హమ్’, ‘మస్తీ జాదే’ లాంటి ఒట్టి చెత్త సినిమాల మధ్యలోంచీ  పై మూడు ముఖ్యమైన topical సినిమాలనిచ్చింది ఈ సంవత్సరం బాలీవుడ్. కొత్తగా కథలు  చెప్పటంలో త్వరత్వరగా ఎదుగుతున్న bollywood sophistication వొచ్చే సంవత్సరం ఇంకెన్ని మంచిసినిమాలిస్తుందో చూడాలి.

ఇక్కడ ‘అలీగఢ్’లో మనోజ్ బాజ్ పాయ్ నటన చూడండి…

 

 

 

 

 

 

 

 

ఓ బంగారు ‘కుట్టపాయ్’ కథ

 

 mahy

‘మాహీ’ నా తొమ్మిదేళ్ళ బుజ్జి ఫ్రెండ్. పక్కింటి బీహారీ పిల్ల. ఇంటి తలుపులు ఎప్పుడూ తీసే ఉంచుతాను. ఈ చిన్న సీతాకోకచిలక స్కూల్ లేని టైంలో బుద్ధి పుట్టినప్పుడల్లా నా మీద వచ్చి వాలుతూ ఉంటుంది.  టాటాస్కై చానెల్ లో వస్తున్న ‘ఓట్టాళ్’ మలయాళీ సినిమా చూస్తున్నాను. వచ్చి వాలింది మాహీ. కూచోబెట్టి సినిమా చూడమన్నాను. కుర్చీ తెచ్చుకుని కూర్చుంది బుద్ధిగా.

ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ అంటూ ఓ చానెల్ కి పేరు పెట్టి 2015లో వచ్చిన కొన్ని మంచి సినిమాలు వేస్తోంది టాటాస్కై. ఇంతకుముందు దూరదర్శన్ చేసేపనిని చేస్తోందన్నమాట.

‘ఓట్టాళ్’ అంటే అర్థం ‘చేపల్ని పట్టే బుట్ట’ అని. ఇదేదో 70ల్లో వచ్చిన ఆర్ట్ ఫిల్మ్ లా ఉన్నట్టుందిలే, మాహీ తితిలీ రెక్కలు విదిలించి లేచెళ్లిపోతుందని అనుకుంటూనే ఉన్నా, ఇంతలోనే నన్నూ మాహీని బుట్టలో పెట్టేసింది ఆ సినిమా. బుద్ధిని కాదు. మనసుని నిజాయితీగా స్పర్శిస్తోంది ‘ఓట్టాళ్’.

‘వాంకా’ కథ ఏంటన్ చెకోవ్ ది.  వాంకా అనే ఒక చిన్న పిల్లవాడు తన తాతకు రాసిన ఉత్తరం అది. తాత అతన్ని మాస్కోలో ఒకరింట్లో పనికి పెడతాడు. అక్కడ వాళ్ళు తనను పెట్టే హింస అంతా వివరిస్తూ తనను ఇంటికి తీసుకుపొమ్మని ఏడ్చుకుంటూ వాంకా పల్లెటూళ్ళో వున్న తాతను బతిమాలుతూ రాసిన ఉత్తరం ఆ కథ.  చివరకు అడ్రెస్ రాయాల్సిన చోట ‘To my grandfather, The village’ అని రాసి కొంచెం ఆలోచించి తాత పేరు కూడా రాసి పోస్ట్ డబ్బాలో వేసేస్తాడు. మనుషుల అడ్రెస్ లెలా ఉంటాయో తెలియని అమాయకపు పిల్లగాడు వాడు. ఆ రాత్రి నిద్రపోతూ తాత తన ఉత్తరాన్ని చదువుతోన్నట్టు కలగంటూవుంటాడు. కథంతా చదివాక ‘అబ్బా, వీడిబాధ ఇక ఇంతేనన్నమాట’ అని నిస్సహాయతలో పడతాం.  చెఖోవియన్ టచ్…

mahy5

ఈ కథని కేరళకి లాక్కొచ్చి కుట్టనాడ్ నీలాల నీళ్ళూ, ఆకుపచ్చ పొలాలూ, అడుసునేలల మీద నిలబెట్టేడు దర్శకుడు జైరాజ్. (దేశాడనం, కలియాట్టం లాంటి సినిమాలుతో పేరు తెచ్చుకున్న జైరాజ్ ఇంకో సినిమా ‘వీరమ్’ ఈ డిసెంబర్ లో వస్తోంది. ప్రముఖుల సాహిత్యాన్ని సినిమాలు తీయటం ఈయనకు ఇష్టం). చెఖోవ్ కథకు పర్యావరణస్పృహనీ  కుట్టనాడ్ జీవనశైలినీ జోడించి ‘ఓట్టాళ్’ సినిమా తీశాడు జైరాజ్.  ఈ సినిమాలో వున్న తాతా మనవళ్ళ అనుబంధమంత బలంగా కనిపించదు చెఖోవ్ కథలోని వాళ్ళిద్దరి అనుబంధం.  కాకపోతే బాలకార్మికుల వ్యవస్థ నూటముప్ఫై ఏళ్ల కిందట చెఖోవ్ కథనాటికీ ఈనాటికీ మురికిగుంటలా ఊరుతూనే ఉంది.

కేరళ సాంప్రదాయనృత్య రీతులమీదా, సంగీతం, జానపద శైలుల మీదా ఆసక్తి ఉన్న జైరాజ్ ఈ సినిమాకి నాటకరంగ ప్రముఖుడూ కవీ అయిన కావలమ్ నారాయణ పణిక్కర్ ను సంగీతదర్శకునిగా తీసుకున్నాడు. తాతా మనవడూ విడిపోయే ముందు ఒక పాట వస్తుంది. బాధనంతా రంగరించి పణిక్కర్ ఆ పాట రాశారు. (ఆర్నెల్ల కిందటే పణిక్కర్ చనిపోయారు) ఆయనసంగీతం, పాటా తోనే సినిమాకు సగం ఆర్ద్రత వచ్చేసింది. మరింత తడిని అద్దింది సినిమాటోగ్రాఫర్ ఎం.జే.రాధాకృష్ణన్.  ఎంత బడ్జెట్ ఉన్నా ఎడిటింగ్ సూట్ దగ్గర రంగులన్నిటినీ  సాచురేషన్ బార్ చివరికి తీస్కెళ్ళి, ఆకుపచ్చరంగుకైతే  రేడియం అద్దినట్టుచేసి మన మొహాన గుద్దుతున్న  సినిమాలూ సీరియళ్ళనుండి పెద్ద రిలీఫ్ ‘ఓట్టాళ్’.  రేడియం ఆకుపచ్చ కాకుండా పచ్చనిఆకు రంగు దొరుకుతుంది ఈ సినిమాలో.  ఫిష్ ఐ లెన్స్ తో మనోహరమైన కుట్టనాడ్ భూమినీ నీళ్ళనీ వంచినా, బాతులమంద వంకీలు వంకీలుగా నీళ్ళమీద చేసే విహారాన్ని సరైన లెన్సింగ్ తో పట్టినా, ‘కుట్టపాయ్’ నల్లటి చిన్ని మొహంలోని కళ్ళమీది వెలుగుని ఇట్టే పట్టుకున్నా రాధాకృష్ణన్ అన్నిట్లోనూ లీనమై చేశాడు.

mahy2

పై ఫోటో రితు రాజ్ కన్వర్ (‘ది హిందూ’ ఫోటోగ్రాఫర్) అస్సాం వరదలప్పుడు 2014 లో తీసినది. ఈ ఫోటో చూశాకా ‘వాంకా’ కథను ఎలా తీయాలన్న విషయమై ఒక స్పష్టత వచ్చిందని అంటాడు జైరాజ్. తన సినిమాలో కూడా ఇలాంటి ఫ్రేమ్ ను తీయాలని అనుకున్నాడట. అలా కుట్టనాడ్ లోకి వచ్చిదిగింది ‘వాంకా’ కథ.

స.వెం. రమేశ్ ప్రళయకావేరి కథల్లాగా ‘ఓట్టాళ్’ కుట్టనాడ్ జీవనసరళిని గానంచేసే దృశ్యకావ్యం.  ఇది బాలల చిత్రం. పర్యావరణ చిత్రం. తాత్విక చిత్రం. ఇంకా మనిషిని ప్రకృతినుంచి లాక్కెళ్ళి ఎక్కడెక్కడో పరాయిచోట్లకి విసిరేసే అసమానతలనీ బీదరికాన్నీ, డబ్బుకోసం బాల్యాన్ని కాటేసే పాముల దౌష్ట్యాన్నీ  చూపించే చిత్రం.

చలం బెన్నూర్కర్ తీసిన తమిళ డాక్యుమెంటరీ ‘కుట్టి జపానిల్ కులందైగళ్’ (Children of mini Japan) శివకాశీ పరిశ్రమల్లో నైపుణ్యం లేని బండచాకిరీలు చేసి కునారిల్లే బాలకార్మికుల కథల్ని చెప్తూ బాధిస్తుంది. మీరా నాయర్ తీసిన ‘సలాం బాంబే’ చూస్తే ముంబై రెడ్ లైట్ ఏరియాలో కాలిపోతున్న బాల్యపు మొగ్గల కమురువాసన ఘాటుగా ఆవరించి చెమటలు పట్టిస్తుంది. ‘ఓట్టాళ్’ ఓ పక్క ప్రకృతితో మనల్ని ముడేస్తూనే మరోపక్క తెగిన బంధపువేళ్ళ తడిని కంటిమీదికి రప్పిస్తుంది.

mahy4

‘ఓట్టాళ్’ ని తీరికగా ఎక్కడా ఆగకుండా (టాటాస్కై అలాగే వేస్తోంది యాడ్స్ బాధ లేకుండా) కళ్ళకు నింపుకుంటూ చూడాలి. నెమ్మదైన జీవితవిధానానికి తగ్గట్టున్న విలంబిత లయ ఈ సినిమాది. ఎప్పుడూ గేలం వేసి ఒడ్డున కూచుని ఎదురుచూసే ఒక పరిచయస్తుడైన వృద్ధుడు “చేప పడటంలోనే కాదు. ఇలా కూచోడంలో కూడా ఆనందం ఉంది” అంటాడు కుట్టపాయ్ తో. ఎదురుచూడటాన్ని ఎంతమంది ఆనందిస్తున్నారిప్పుడు? కుట్టపాయ్ ఆయనతో ‘నేను చదువుకుని సిటీకి వెళ్లి చాలా సంపాదించి నీకో పెద్ద గేలం కొనిస్తా’ అంటే ‘చేపలు పట్టటానికి చిన్న గేలం చాలు. చిన్నగా బతికితే చాలు’ అని హితవు చెప్తాడు.

డెబ్భైఅయిదేళ్ళ ‘వలియప్పచ్చాయ్’(వాసుదేవన్) తొమ్మిదేళ్ళ కుట్టపాయ్ (ఆశాంత్ కె. షా)కి తాత. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకు చనిపోగా మిగిలిపోయిన కుట్టపాయ్ ని కుట్టనాడ్ తీసుకొచ్చి బాతులమందను సాకుతూ బతుకు లాగుతుంటాడు. ఆ ఊర్లోనే ఉన్న పెద్దింటి పిల్లవాడు టింకూ కుట్టపాయ్ తో స్నేహం చేస్తాడు.  అతని తల్లి కుట్టపాయ్ ని కొంత దయతో చూస్తుంటుంది. టింకూ తండ్రికి మాత్రం కుట్టపాయ్ ఓ అలగాజాతి పిల్లవాడంతే. తాతను సతాయించి చేపా రొయ్యా పట్టి, గిన్నె గరిటా కొనిపించి మరీ టింకూ కోసం వంట చేయిస్తాడు కుట్టపాయ్.  టింకూని భోజనానికి పిలవటానికని కుట్టపాయ్ వస్తే, ఎందుకొచ్చాడో కూడా తెలుసుకోకుండా ‘మిగిలిన తిండి వస్తువులేవో  వాడికిచ్చి పంపించు’ అని భార్యతో అనగలిగేంత బండమనిషి టింకూ తండ్రి.  కలువపూలూ, బాతులూ, వాటి గుడ్లూ, వాటిని పొదిగే కోడిపెట్టా, పేరులేని కుక్క (దానినలాగే పిలుస్తాడు కుట్టపాయ్), పడవలవాళ్ళ కోసం ఎత్తయిన కర్రచివర్న దీపంపెట్టే పరోపకారీ, ఎప్పుడూ ఓపిగ్గా గేలంవేసి ఎదురుచూసే మరో పండుముసలాయనా,  కుట్టనాడ్ లో ఎవరికీ ఉత్తరాలు రావని చెప్తూ సైకిల్ మీద తిరిగే పోస్ట్ మాన్,  తాత కల్లు తాగే అంగడీ… వీటన్నిటి మధ్య ప్రకృతి పాఠాలతోబాటు బాతుల్ని సాకటం నేర్చుకుంటూ బతికే కుట్టపాయ్ కొంచెం అల్లరీ, ఎంతో తెలివీ, మరెంతో సున్నితత్వం నింపుకున్న బంగారుతండ్రి. స్వేఛ్చగా కుట్టనాడ్ ఒడిలో ఆదమరిచి వున్న వాడి కొంపముంచే మాయరోగం తాత ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. చావుకి దగ్గరలో ఉన్న తనతర్వాత ఈ పసివాడిని చూసుకునేదెవరని బెంగపడ్డ వలియప్పచ్చాయ్ పాపం ఈ బుజ్జి బాతుపిల్లను, శివకాశీ పరిశ్రమకి పిల్లల్ని అమ్ముకునే పాము మాటలు నమ్మి, వాడితో పంపించేస్తాడు. ప్రశాంత ప్రకృతిలోంచి గాడీరంగుల ఇళ్ళతో నిండిన శివకాశీకి ఒక్కసారి కుట్టపాయ్ తో వచ్చిపడటం మనకీ ఎంత బాధో!  జైరాజియన్ టచ్…

mahy3

ఇంకేముంది? తను పడుతున్న బాధలు వివరిస్తూ ఉత్తరం రాసి పోస్ట్ డబ్బాలో వేస్తాడు కుట్టపాయ్. వాడు రాసిన అడ్రెస్,  “మా తాతకి, కుట్టనాడ్” అంతే.  ఆ రాత్రి నిద్రపోతూ తన ఉత్తరాన్ని తాత, టింకూ కలిసి చదువుతున్నట్టు కలకంటుంటాడు. ఆ కల నిజం అయిపోతే బాగుండును  …

“నా మనసులోని పిచ్చుక ఏడుస్తోంది.

పంటలైపోయాయ్, పండుగలైపోయాయ్.

మనసులోని పిచ్చుక ఏడుస్తోంది.

దేశదిమ్మరిదొర కలలపిట్టా

ఎక్కడికి పోయావ్? ఎటు తప్పిపోయావ్?

మనం ఒకర్నొకరు కనలేదూ ?

ఒకర్నొకరం వినలేదూ?

మనస్సలా చూస్తూనే ఉన్నా, మౌనం ఇంకా బద్దలుకాలేదు.

నా బాతులమంద లాగా

నేను చెదిరిపోయాను.

నేను చెదిరిపోయాను.

మీసాల కొసలు చెదిరిపోయాయ్.

పంపానది ఆత్మలోకి మాయమైపోయాయ్.

కదిలే నా తెడ్లు చెదిర్చిన నీటిలాగా నేనూ చెదిరిపోయాను.”    

తాత చెదిరిపోయాడు. మనవడు పట్నంపాలై పోయాడు.

“ఇలా బాలేదు ఆంటీ. తాత దగ్గరికి ఇంక వెళ్లలేడా?” అని బెంగగా వెళ్ళిపోయింది మాహీ.

(ఈ సినిమా టాటాస్కై ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ చానెల్ లో పదేపదే చూపిస్తున్నారు. ఇంగ్లిష్ సబ్స్ తో సహా)

పాట ఇక్కడ ఉంది.

 

 

And, life goes on…!

abbas1

And Life Goes on …

ఈ నిజాన్నే, ఈ ప్రకృతి సూత్రాన్నే అనుసరిస్తూ గౌరవిస్తూ సినిమాలు తీశాడు అబ్బాస్ కియరోస్తమీ.

కియరోస్తమీ టెహరాన్ లో 1940 లో పుట్టాడు. సత్యజిత్ రాయ్ లాగే గీతల బొమ్మలు వేశాడు.  ఫోటోగ్రఫీ,  గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేశాడు. పర్షియన్ కవిత్వం చదువుకుని సున్నితత్వాన్ని పెంచుకుని చూపుని విశాలం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసి అకిరా కురసోవా లాంటి మహామహుల్ని ఆకట్టుకున్నాడు.  కియరోస్తమీ సినిమాలు చూస్తూ ఆ ప్రపంచంలో గడిపిన కాసేపూ తనలో క్షాళన జరుగుతుందంటాడు మార్టిన్ స్కోర్సేస్సీ. ఆయన అందించే  కళాత్మక స్ఫూర్తి ప్రపంచాన్ని ఒక కొత్త తాజా చూపుతో ఆశగా చూసేలా చేస్తుందంటాడు స్కోర్సేస్సీ.

తను పుట్టిన నేలమీద ఆడుకునే పిల్లలనీ, వాళ్ళకి సుద్దులు నేర్పే పెద్దలనీ, పనిపాటలు చేసుకునేవాళ్ళనీ అలవోకగా పలకరిస్తూ అతిసాధారణంగా ఒక డాక్యుమెంటరీలా సినిమాని తీసుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తుంది కియరోస్తమీ స్టైల్. కానీ ఆయన సినిమాని చూస్తూ ఉన్న కొద్దీ అందులో ఇంకేదో కూడా ఉందనే విషయం తట్టకుండా పోదు. కియరోస్తమీ సినిమాల్లో మలుపులు తిరిగే కథలుండవు గానీ మలుపుల దారుల్లో, గోధుమరంగు పొలాలమధ్య, మట్టిగోడలమధ్య తిరుగుతూ దేనికోసమో అన్వేషించే మనుషులుంటారు. ఏ బుజ్జి స్నేహితుడి హోంవర్క్ పుస్తకాన్ని తిరిగివ్వటానికో తిరిగే పిల్లలుంటారు.  ఏదో పనిమీద ఎవరినో కలవటానికో, లేదా సింపుల్ గా చచ్చిపోవడానికో ప్రయత్నిస్తూ తిరిగే  పెద్దలూ ఉంటారు. ఏ పనులూ ఎవరి నలుగుళ్ళూ  ఎలావున్నా .. life goes on..

కియరోస్తమీ డాక్యుమెంటరీకి, ఫీచర్ ఫిల్మ్ కీ మధ్యస్తంగా ఉండే పద్ధతిని పట్టుకున్నాడు. కామెరా ఏంగిల్స్ లో సంప్రదాయ పద్ధతులని వదిలేశాడు. దానితోబాటే హంగులని కూడా వదిలేశాడు. పదేపదే  అలికినాక నున్నగా తయారైనట్టున్న చిన్నచిన్న అందమైన మట్టి ఇళ్ళలో, బ్లాక్ టీ కప్పుల్లో, బురఖాలేసుకుని పన్లు చేసుకుంటూ తీరిగ్గా పిల్లల్ని సాకుతూ తిరిగే ఆడవాళ్ళలో, హుక్కాలు పీల్చే మగాళ్ళలో, ఎక్కడో ఉన్న బడికి చేరటానికో లేక అమ్మ పురమాయించే చిన్నచిన్నపనులమీదో పరుగెత్తే మగపిల్లల్లో.. ఇరానీవాళ్ళ బతుకుచిత్రాన్ని మనకి చూపిస్తాడు. సంగీతాన్ని పెద్దగా వాడడు గానీ డాక్యుమెంటరీల్లోలాగా తన సినిమాల్లో మాటలెక్కువ. నిశ్శబ్దంగా ఉండే క్షణాలు తక్కువ.

ప్రతి  సినిమా ఒక ప్రయాణం. ఆయన చూపించే ల్యాండ్ స్కేప్ మనోహరమూ కాదు. అలాగని సాధారణమూ కాదు. అదెలా వుందో అలాగే ఉంటుంది.  కానీ కొండల మలుపుల్లో ఓ క్లాసిక్ ‘Z’ కాంపోజిషన్ లో అమరిన పసుప్పచ్చని గోధుమ పంటల సౌందర్యం, ఎక్కడో ఓ మనిషి మెల్లిగా వల్లించే  పర్షియన్  కవిత్వం, దుమ్ము రేపుకుంటూ పోయే కారు స్ఫురింపజేసే అధునాతనత్వం, కొండల్లోని ఆదమరుపుతనాన్ని చెదుర్చుతూ డొక్కు బైక్ చేసే డబడబ శబ్దం, విసిరేసినట్టు అక్కడోటీ ఇక్కడోటీ ఉన్న గుబురుచెట్లమధ్య దాక్కున్న జామెట్రీని వెదికి పట్టుకునే కామెరా ఏంగిల్..  ఇవి దర్శకుడిగా ఆయన సంతకాన్ని పట్టి చూపిస్తాయి. సాధారణంగా కనిపించే ఆ సంతకంలోని అసాధారణ కోణాలని మనకి చేతనైనట్టు మనల్ని వెదుక్కోమని వదిలేస్తాడు.  ఏదో నెమ్మదైన డాక్యుమెంటరీ సినిమాలా ఉంది కదాని కళ్ళప్పగించి చూడ్డం కాదు. కియరోస్తమీ సినిమాకి మెదడు వాడాల్సిందే.

***

abbas2

చావనేది  తప్పనిదీ బ్రతుకు నిరంతరమైనదీనూ…

ఈ సాధారణమైన నిజాన్ని కథల్లో కవితల్లో సినిమాల్లో ఎంతో మెలోడ్రామానూ ఆశనూ కరుణ భీభత్స రసాలనూ  జోడించి చెప్పొచ్చు. ఉన్నతస్థాయి కళను సృష్టించటంలో ఇంతటి విస్తృతి ఉన్న వస్తువు ఇంకోటి లేదు. ఇరాన్ లో వచ్చిన పెద్ద భూకంపంలో తను చూసిన మృత్యుతాండవం కియరోస్తమీని చాలా కదిలించిందట.  అలాంటి అసాధారణమైన పరిస్థితుల్లో చావుమీద బ్రతుకు చేసే పోరాటాన్ని చాలా నాటకీయంగా తీయవచ్చు. కానీ కియరోస్తమీ Minimalist.. ఉత్పాతాల్లోంచి కాకుండా  రోజువారీ జీవితంలోనుంచీ  చావుబతుకులకి సంబంధించిన లోతైన ప్రశ్నలను కొంత ఆధునికతతో, మరికొంత ఇరానియన్ సంస్కృతితో కలుపుతూ సంధించి వదిలేస్తాడు.

కియరోస్తమీ తీసిన సినిమాల్లో రెండు ముఖ్యమైన సినిమాల గురించి…

కాన్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారం Palme d’or సాధించిన కియరోస్తమీ సినిమా “Taste of Cherry”.

‘బదీ’ ఆత్మహత్య చేసుకోవాలని కొండల్లోకి కార్లో బయలుదేరతాడు. టెహరాన్ నగరం దాటి ఒకచోట తనను పూడ్చటం కోసం గొయ్యి తవ్వి సిద్ధం చేసుకుంటాడు. అక్కడికి వెళ్లి నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనీ, ఆ తరువాత తనని ఎవరైనా పూడ్చిపెట్టాలనీ, మర్నాడు పొద్దునే వచ్చి చూసి ఒకవేళ తను చావకపోతే తనను తిరిగి ఇంటికి తీసుకు రావాలనీ  అతని కోరిక. ఆ ప్రాంతానికి కార్లో వెళ్తూ దారిలో కనబడిన వాళ్ళని ఆపి తనకు సాయం చెయ్యమని కోరతాడు. ఆ పని చేస్తే చాలా పెద్దమొత్తం ఇస్తానని చెప్తాడు.

అతనికి తారసపడిన ఒక సైనికుడు, ఒక మతపెద్ద అతని కోరిక విని ఆశ్చర్యపోయి ఆ పని చెయ్యటానికి నిరాకరిస్తారు.  చివరికి బాఘేరీ అనే ఒక taxidermist అతని మాటలను జాగ్రత్తగా విని,  ‘బదీ’ ని ఆత్మహత్యా ప్రయత్నం నుండి తప్పించాలని చాలా ప్రయత్నిస్తాడు. ఆత్మహత్య చేసుకుందామని అనిపించటం చాలా సాధారణమని చెప్తాడు. తనకీ ఓసారి జీవితాన్ని భరించలేని పరిస్థితి వచ్చి ఉరేసుకుని చనిపోదామని అనుకున్నాడట. తాడు బిగించడానికి మల్బరీచెట్టు ఎక్కాడట.  అంతలోనే చేతికి మెత్తగా తగిలిన మల్బరీ పళ్ళు  కోసుకు తిన్నాడట. ఆ రుచిని అందరికీ పంచకుండా ఉండలేక పోయానని చెప్తాడు.  మల్బరీ పండు తనను  ఆత్మహత్యాప్రయత్నం నుండి తప్పించిందని చెప్తాడు. అంతవరకూ తామిద్దరూ కార్లో తిరిగిన దుమ్ము క్వారీలను దాటించి టెహరాన్ కి వెళ్ళే  చక్కని చెట్లు నిండిన వేరేదారిలోకి కారుని మళ్ళిస్తాడు బాఘేరీ.  పచ్చగా ఉండే బతికేదారిని  వెదుక్కోవచ్చునని మెల్లగా సూచిస్తాడు. జీవితపు చెర్రీ పండు రుచిని కాదనవద్దని హితవు చెప్తాడు.

అన్నీ విన్నాక కూడా అలసట నిండిన మొహంతో బదీ అతన్ని తన కోరిక తీర్చమంటాడు. చేసేదేంలేక అతను సరేనని తనుండే చోట కారుదిగి వెళ్ళిపోతాడు. ‘బదీ’ లో చిన్న ఊగులాట. చావాలన్న నిరాశలోంచి చిన్నగా మొలకెత్తిన జీవితేచ్ఛ. పరుగెత్తుకుంటూ బాఘేరీ ఉండే చోటికి వెళ్లి మర్నాడు పొద్దున్న తప్పనిసరిగా వచ్చి చూసి తను బతికుంటే ఇంటికి తీసుకురమ్మని మళ్ళీ చెప్తాడు. మొదట్నుంచీ చివరిదాకా బదీ అసలు ఎందుకు చావాలని అనుకుంటున్నాడో మనకీ తెలియదు. తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించిన బాఘేరీకీ తెలియదు. ఒక స్థాయిలో తెలియనక్కర్లేదని మనకీ అనిపించేస్తుంది.

సర్దుబాటు, సంతృప్తి, ఆశావాదాలవైపు బాఘేరీ ఉంటే, తీవ్ర నిరాశ, అలసట, చావాలన్న బలమైన కోరికతో బదీ నలుగుతూ ఉంటాడు. కలవని ఈ రెండు పట్టాలమీద నడిచే బండిలా వీళ్ళ ప్రయాణం… రకరకాల వైరుధ్యాల మధ్యే మనుషుల బతుకులు తెల్లారుతుంటాయి. వీటితో ఏ సంబంధం లేకుండా ప్రతిరోజూ తెల్లవారుతూనే ఉంటుంది. ఈ స్పృహని అందిస్తూ ఈ సినిమా సాగుతుంది.

బదీ బ్రతుకుతాడా, చచ్చిపోతాడా అనే ఆత్రుత పెంచి, ఆఖరున  ఒక్కసారిగా ప్రేక్షకులని  సినిమానుంచి బైటకి లాగి నేలమీద నిల్చోబెడతాడు కియరోస్తమీ. And life goes on…

 

“The wind will carry us” — కియరోస్తమీ మనచేత చేయించే మరో ప్రయాణం…  బెహజాద్ మరో ముగ్గురితో కలిసి ఓ మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ మంచంమీదున్న చావ సిద్ధంగా ఉన్న ఓ ముసలమ్మ. ఆవిడ ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ ఊరివాళ్ళు చెయ్యబోయే కర్మకాండల తంతులను రికార్డు చేయటం ఈ నాగరికుల ఉద్దేశ్యం. కానీ ఊళ్ళోవాళ్లకి ఆ విషయం చెప్పకుండా తాము ఇంజనీర్లమని చెప్పుకుని ఊళ్ళో ఉండిపోతారు. ముసలమ్మ ఓ రోజు బాగుండి మరోరోజు బాగుండకా అలాగే గడిపేస్తూ ఉంటుంది. జీప్ లో ఎప్పుడూ పరుగులు తీస్తుండే బెహజాద్ పల్లెటూరి నత్త నడకలకూ  ఊళ్ళోవాళ్ళతో సంభాషించటానికీ  నెమ్మదిగా అలవాటు పడతాడు.

సిటీ నుంచి వొచ్చే ఫోన్ కాల్ కి సిగ్నల్ అందక, మొబైల్ ఫోన్లో  మాట్లాడ్డం కోసం జీప్ లో ఎత్తైన ప్రదేశానికి పరుగెడుతూ ఉంటాడు. ఎదురు చూస్తున్న ముసలమ్మ చావు ఎంతకీ రాదు. రోజూ తవ్వకం పని చేసే పరిచయస్తుడైన ఆ ఊరిమనిషి చావు అంచుకి వెళ్లి వస్తాడు. మొత్తానికి ముసలమ్మ చనిపోతుంది గానీ బెహజాద్ లో చావు బ్రతుకుల మధ్య పెద్దగా తేడా చూడని స్థితప్రజ్ఞత వచ్చి చేరుతుంది. చావుబతుకులను కలబోసుకుంటూ జీవితం ప్రవహిస్తూ ఉంటుంది. And life goes on…

కథ ఏమీలేని ఈ సినిమాని ప్రవహింపజేయటం అసాధారణమైన ఫీట్.  గట్ల మధ్య ఒదిగి పారే నిండైన నదిలా ఉంటుంది ఈ సినిమా.  ఊరికీ నగరానికీ,  బతుక్కీ చావుకీ, సంప్రదాయానికీ ఆధునికతకీ  మధ్య ఉన్న తేడా  ఎంత పెద్దగా కనిపిస్తుందో అంత చిన్నదనే భావన అలుముకుంటుంది.  ఈ వైరుధ్యాల లాగే తేలిగ్గా కనిపించే సంక్లిష్టమైన కథనం కియరోస్తమీ స్టైల్.

 

ఈ రెండు సినిమాల్లో కామెరాను ముఖ్యపాత్ర వరకే చాలావరకూ పరిమితం చేస్తాడు. Protagonist మాట్లాడుతూ ఉంటాడు. అవతల నుండి వొచ్చే సమాధానం ముఖ్యం. ఇచ్చేవాళ్ళు ఎవరన్నది  అప్రధానం.  Protagonist చేస్తున్న అన్వేషణ ముఖ్యం. వెదుకుతున్న దారుల్లో, దొరుకుతున్న సమాధానాలలో ఏముందో మనమే ఊహించుకోవాలి.  ఇరానియన్ న్యూవేవ్ సినిమాలో కిరోస్తమీ కనిపెట్టిన ఈ భాష సగం దృశ్యాలను మన ఊహలకే వదిలేస్తుంది. ఆయన  చూపించే దృశ్యాలతో   మన ఊహల్లోకి వచ్చే దృశ్యాలనూ మనుషులనూ కలిపి చూడగలిగితే కియరోస్తమీ సినిమా విశాలమైన గడ్డిమైదానాల్లో  విహారంలా ఉంటుంది.  అక్కడ సింహాలూ జిరాఫ్ లూ తారసపడవు.  రంగుల గడ్డిపూలూ ఆరుద్రపురుగుల్లాంటి మెత్తటి ప్రాణులే ఎదురౌతాయి. ఆ సూక్ష్మదర్శనం   ఇచ్చే అనుభూతులను అందుకుంటూ పోవటమే.

‘The wind will carry us’ లో బెహజాద్ పాల కోసం ఒక ఇంటికి వెళ్తాడు. చీకటిగా ఉన్న కొట్టంలో ఉన్న పశువు. అస్పష్టంగా ఆ చీకట్లోనే లాంతరు పెట్టుకుని పాలు పిండే అమ్మాయి. పాలపొదుగు, అమ్మాయి చేతివేళ్లు, ఆమె దుస్తులు.. మనకు కనబడేవి ఇంతే.  బెహజాద్ గొంతు మాత్రమే వినిపిస్తుంది. అతను ఆమెకు ఆ చీకట్లో ఇరానీ కవయిత్రి ‘ఫారో ఫరోక్ జాద్’ రాసిన కవిత వినిపిస్తాడు. కియరోస్తమీ దృశ్యంలో సాధించిన సింప్లిసిటీ కి మచ్చుతునక ఈ సీన్.

కియరోస్తమీకి కవిత్వం ఇష్టం. దృశ్యాలను పొదుపు చేసి కవిత్వంమీదే మన దృష్టిని నిలపటం ఇష్టం. కవితతో దృశ్యాన్ని జోడించటం ఇష్టం. దారులిష్టం. ప్రకృతిలో నిశ్శబ్దంగా లీనం కావటం ఇష్టం.

abbas3

(పైవన్నీ కియరోస్తమీ తీసిన ఫోటోలు)

 

“అవసరాల అన్వేషణలో మనిషి ప్రయాణానికి అభివ్యక్తి  ‘దారి ’.

శాంతిలేని ఆత్మకు వ్యాఖ్యానందారి

ఆత్మను ఓ చోటునుండి మరో చోటికి  మోసుకుపోయే శరీరం ఓ గాడిద.

ఈ గాడిదను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా సరే ప్రయాణాన్ని చివరిదాకా సాగించలేరు.

అయితేమాత్రం ?   వాళ్ళు లేకున్నాగానీ  మనిషి ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది.

మన దారులూ మనలాంటివే.

 

ఒకోసారి రాళ్ళూ రప్పలతో నిండి ఉంటాయి.  ఒకోసారి చదును చేసుంటాయి.

ఒకోసారి మెలికలు తిరుగుతాయి. ఒకోసారి తిన్నగా ఉంటాయి.

భూమ్మీద మనం గీసిన దారులు గీరుల్లా ఉంటాయి.

మనలోనూ వేరే  దారులుంటాయి.

 

విషాదపు దారులు, సంతోషపు దారులు, ప్రేమ దారులు, చింతనల దారులు,

పారిపోయే దారులు, ద్వేషపు దారులు, నాశనం చేసే దారులు,

ఎక్కడికీ చేరని దారులు, నిలవనీటి యేరులా ముగింపులేని దారులు…

తప్పించుకు తిరిగే ప్రదేశాల గురించీ, వెళ్తున్న ప్రదేశాల గురించీ మనిషి చేస్తున్న ఒప్పుకోలుదారి’.

 

జీవితమేదారి’. మనిషేదారి’.

ఎంత చిన్నదైనా సరే మనిషి దారి అస్తిత్వపు పుటమీదికి ప్రవహిస్తుంది.

ఒకోసారి ముగింపు ఎరగకుండా

ఒకోసారి విజయవంతంగా..  “                                

 

   —– అబ్బాస్ కియరోస్తమీ.

 

కియరోస్తమీ దారి విజయవంతంగా ప్రవహించి 2016 జూలై నాలుగున గమ్యాన్ని చేరుకుంది.

And Life goes on…

*

 

 

 

చూపులందు ‘మగచూపు’ వేరయా…

 

 

-ల.లి.త.

~

 

 

“There is always shame in the creation of an object for the public gaze”  —  Rachel Cusk.

చూపులు వెంటాడతాయి. చూపులు తడుముతాయి. చూపులు గుచ్చుకుంటాయి.

మగచూపుల తాకిడి… వయసు వచ్చినప్పటినుంచి ఇంటి బైట అడుగుపెట్టిన ప్రతి ఆడపిల్లకీ తప్పదు. ఆ చూపులు ఆరాధిస్తున్నట్టు కనిపిస్తే గర్వంగా, వొట్టికామం కనిపిస్తే అసహ్యంగా అనిపించటం కూడా జెట్ స్పీడ్ లో జరిగిపోతూ ఉంటుంది. ఏరకం చూపులెలాంటి వొంకరలు పోతున్నాయో అప్రయత్నంగా తెలిసిపోతుంది ఆడవాళ్ళకి. చూపులు ముసుగులు వేసుకున్నా కొంచెంసేపట్లోనే ఆ ముసుగుల వెనుక ఏ భావముందో చెప్పగలరు. మగచూపుని గుర్తుపట్టే ప్రాథమికజ్ఞానం వయసుతో పాటే పెరిగి వృక్షం అవుతుంది.

సినిమాలు తీసేవాళ్ళూ రాసేవాళ్ళూ వాటిలో వేసేవాళ్లూ మూడొంతులమంది మగవాళ్ళే అయినప్పుడు వాళ్ళు ఆడవాళ్ళను చూడగానే కళ్ళతో చేసే స్కానింగ్ సినిమాల్లోకి రావటం కూడా అసంకల్పిత చర్యే. అది డబ్బులకోసం  సినిమావాళ్ళు చేసే సంకల్పిత చర్యకూడా. ఎలా చూస్తామో అలాగే రాస్తాం. తీస్తాం. అసలు సినిమా అనేదే ఒక voyeuristic tool. మనుషుల్ని ఎలా కావాలంటే అలా,  ఏ పరిస్థితిలో కావాలంటే ఆ పరిస్థితిలో చూపెడుతుంది. ఇతర్ల జీవితాల్లోకీ, ఇళ్ళలోకీ, పడగ్గదుల్లోకీ తిరిగి చూపించటానికి కావలసినంత స్వేచ్ఛ ఉంది మూవీ కామెరాకి.  సినిమా చూడటంలోని సామూహిక వాయరిజంలోని దృష్టికోణం కూడా మగవాళ్ళదే.  స్త్రీల శరీరాలను ఇష్టమొచ్చినంతమేరా చూపించే అవకాశం ఉండటంతో మేల్ డామినేటెడ్ సొసైటీలో సినిమా ‘మేల్ గేజ్’ నే ధరిస్తుంది.  ఈ విషయాన్ని గ్రహించని ఆడవాళ్ళు ఉండరు గానీ  దాన్నెలా ఎదుర్కోవాలో అర్థంకాదు.  ‘స్త్రీలను సినిమాల్లో అసభ్యంగా చూపిస్తున్నార’ని గోలపెట్టేది ఇందుకే.  కానీ ‘ఇది సభ్యత, ఇది అసభ్యత’ అని గిరులు గీయలేనిది కళాభివ్యక్తి.  ఇదే అదనుగా చాలామంది చేతుల్లో మూవీ కామెరా చెలరేగిపోతూ ఉంటుంది.

లారా ముల్వే స్త్రీవాది. ఫిలిం క్రిటిక్ కూడా. 1975లో  ఆమె ‘మేల్ గేజ్’ అనే మాటను మొదటిసారిగా వాడుతూ సినిమాల్లో ‘మేల్ గేజ్’ గురించి సిద్ధాంతీకరించింది. సినిమాల్లో, వ్యాపారప్రకటనల్లో, టీవీల్లో కనపడుతూ ఉండే మేల్ గేజ్ స్వరూపాన్ని వివరించింది.  మేల్ గేజ్ రెండురకాలు. ఒకటి సినిమాలోని పాత్రల చూపు.  రెండోది సినిమా చూస్తున్న ప్రేక్షకుల చూపు. ఎక్కడైనా చూసేది మగవాళ్ళు. చూడబడేది ఆడవాళ్ళు. సినిమాలోని పాత్రల చూపునీ బయటున్న ప్రేక్షకుల చూపునీ ఏకం చేసేది టెక్నాలజీ. అంటే సినిమాటోగ్రఫీ.  ఒక సీన్లో అమ్మాయి నడుస్తూ వెళ్తోంది. హీరో ఆమెని చూస్తుంటాడు. కామెరా హీరో చూపుని అనుసరిస్తూ వెళ్తుంది.  అమ్మాయిని హీరో ఎక్కడెలా చూస్తాడో ప్రేక్షకులను కూడా అక్కడలా చూసేలా చేస్తుంది.  సినిమా కథని నడిపేది హీరోనే.  అతనిలోనూ చూసేవాళ్లలోనూ శృంగారపరమైన ఉత్సుకత రేపే రూపంతో హీరోయిన్ కనిపించాలన్నది సినిమా ముఖ్యసూత్రం. సినిమాటోగ్రాఫర్ బలమైన విజువల్స్ తో ఈ రూల్ ని పాటిస్తాడు. మేకప్ ఆర్టిస్టులు, దుస్తులు కుట్టేవాళ్ళు హీరోయిన్లను అందంగా ప్యాక్ చేస్తారు. ఇదే అలవాటు  వ్యాపారప్రకటనల్లోనూ కనిపిస్తుంది.

 

లారా చెప్పిన ‘మేల్ గేజ్’ కి క్లాసిక్ ఉదాహరణగా చాలామందికి గుర్తొచ్చేవి జేమ్స్ బాండ్ సినిమాలు. 1962లో వచ్చిన  ‘డాక్టర్ నో’ సినిమాలో ఉర్సులా ఏండ్రెస్ సముద్రంలోంచి రావటాన్ని కామెరా, బాండ్ వేషం వేసిన సీన్ కానరీ, ప్రేక్షకులూ తదేకమైన మగచూపుతో చూస్తారు. అలాంటి దృశ్యాన్నే నలభై ఏళ్ల తర్వాత 2002 లో వచ్చిన ‘డై ఎనదర్ డే’ లో హేల్ బెరీతో మరోసారి తీసినపుడు మగచూపు ఆమెను మరీ ఎక్కువగా తడుముతుంది. ఆడవాళ్ళ ఇమేజ్ అంటే మగవాళ్ళని రెచ్చగొట్టేలా ఉండాలని చెప్తున్నట్టుగా ఉంటాయి జేమ్స్ బాండ్ సినిమాలు.

సినిమాల్లో స్త్రీలు రెండురకాలుగా ఉంటారని చెప్తుంది లారా. లైంగికంగా చురుగ్గా ఉండేవాళ్ళు ఒకరకం. బొత్తిగా బలహీనులు రెండోరకం. ఆమె హాలీవుడ్ గురించే చెప్పినా, మన సినిమాల్లో కూడా ఇవే మూసలు కనిపిస్తాయి. మొదటిరకం ఆడవాళ్ళను అప్పట్లో వాంప్ లనేవారు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ గర్ల్స్ అంటున్నారు. వాళ్ళు శృంగారం కోసమే కనబడుతూ ఉంటారు.  రెండోరకం కథ నడకకి అడ్డం పడుతూ కన్నీరుకార్చే సచ్చీలురైన కలకంఠులు. అమ్మ, ఇంట్లోనే ఉండే భార్య, చెల్లెళ్ళ మూసలివి. వీళ్ళు కరుణరస ప్రదాయినులు. ఈ రెండు రకాలూ కాకుండా సగం శృంగారం, సగం పొగరూ లేదా మంచితనంతో హీరోయిన్ రూపాన్ని తయారు చేస్తారు. ఈ ఫార్ములాలు పెట్టుకుని వందల సినిమాలు వచ్చాయి.

మన సినిమాల్లోకి మొదట్లో  స్త్రీలు అడుగుపెట్టటమే అరుదు, అపురూపం. సినిమా వేషాలకోసం వచ్చినవారి కనుముక్కుతీరు, వాచకం బాగుంటే వేషాలిచ్చేవాళ్ళు. ఇప్పటి అందం కొలతల్లో ఇమడని భారీశరీరాలతో ఉన్న హీరోయిన్ల మీద కామెరా తన ప్రతాపం అంతగా చూపించలేదనే చెప్పాలి.  బిగుతైన బ్లౌజులు, పల్చటి పైటలు వేసుకునేవారుగానీ, వాళ్ళ అభినయంమీదా ముఖాలమీదే అందరి దృష్టీ ఉండేది.  తరువాత అరవైలనుండీ టైట్ పాంట్స్, బిగుతుషర్టుల్లో ఉన్న స్త్రీల శరీరాలమీద కామెరా క్లోజప్ షాట్స్ తో తన అజమాయిషీ మొదలెట్టింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మితల శరీరాలమీద మేల్ గేజ్ విశృంఖలంగా పాకింది. 70, 80, 90ల్లో వచ్చిన సినిమాల్లో ముఖ్యంగా మలయాళం సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో శృంగారం పేరుతో ఆడవాళ్ళ శరీరాలను ప్రదర్శనకు పెట్టారు.

lalita2

సినిమా చూసేటప్పుడు స్త్రీలు కూడా ‘మేల్ గేజ్’ తోనే చూస్తారని చెప్తుంది లారా. హీరోయిన్ల వొంటితో తమ వొంటినీ  బట్టలనూ పోల్చుకుని ఆడపిల్లలు కూడా మగవాళ్ళ కళ్ళలోంచే తమను తాము చూసుకుంటారు. మహిళాదర్శకులు కూడా ఎంత చేటు మేల్ గేజ్ తో  సినిమాలు తీశారో భానుమతి, విజయనిర్మలల సినిమాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ సినిమాల్లో రేప్ సీన్లు మగదర్శకులు తీసేవిధానానికి ఏమీ తీసిపోకుండా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి.

కళాత్మక సినిమాలు తీస్తున్నానంటూ కామెరాలోంచి స్త్రీల శరీరాలను మర్యాదలన్నీ అతిక్రమించి తడిమేశాడు రాజ్ కపూర్. ఈయన సినిమాల్లో హీరో (అంటే తనే) హీరోయిన్ కళ్ళలోకే తప్ప ఇంకెక్కడా చూడడు. మూడు రకాల మేల్ గేజ్ లలో రెండో రకాన్ని వదిలిపెట్టి హీరోచేత అమాయకపు మొహం పెట్టించి, ఆ మేరకి కామెరాతో ఆడవాళ్ళమీద మరింత దౌర్జన్యం చేస్తాడు. చిన్న దుస్తుల్లో తిరుగుతూ మోడల్స్ లా నడిచే పల్లెటూరి అమ్మాయిల వేషాల్లో ఆడవాళ్ళను  చూసి లొట్టలు వేసుకున్న సెన్సార్ మెంబర్లు రాజ్ కపూర్ mammary obsession ని కళాత్మక అభివ్యక్తిగా కొలిచారేమో అనిపిస్తుంది.

‘జ్యోతి’ లాంటి మంచి సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ఒక్కసారిగా తీసుకున్న చారిత్రాత్మక యూటర్న్ గురించి చెప్పుకోవాలి. ఆడవాళ్ళ శరీరభాగాలను ముక్కలుకోసి పళ్ళూ ఫలాల్లా మగవాళ్ళ కళ్ళముందర పళ్ళెంలో పెట్టి అందించాడు. రాఘవేంద్రరావు టెక్నిక్ ని చాలామంది అనుసరిస్తూ పోయారు. పోర్న్ స్టార్ సన్నీలియోన్ కి కూడా మన హీరోయిన్లలాగే బట్టలుకట్టి సినిమాల్లో చూపిస్తుంటే సంతోషంగా మగాళ్ళు చూస్తున్నారంటే ఇలాంటి titillation టెక్నిక్ కి దేశంలో ఉన్న ఆకర్షణ ఎంతటిదో తెలుస్తోంది. ‘వేదం’ లాంటి కొంచెం భిన్నంగా ఉండే సినిమాలో కూడా  ‘ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ’ పాటలోనూ ఇంకా చాలా దృశ్యాల్లోనూ అనుష్క మీద వాడిన కామెరా ఏంగిల్స్,  సెక్స్ వర్కర్ పాత్రేకదా అన్న సాకుతో molest చేస్తాయి.  పాటల చిత్రీకరణలో హీరోయిన్ బొడ్డూ పిరుదులూ రొమ్ముల క్లోజప్ లూ, ఆమె నడుంపట్టుకు వేలాడే హీరోలూ తెలుగు సినిమాలో కొల్లలు.

బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీల కథలను తీర్చిదిద్దిన దర్శకులు కూడా ఉన్నారు కదా. వాళ్ళ సినిమాల్లోకూడా  మేల్ గేజ్ లేకుండా ఉండదు. వుమన్ ఓరియెంటెడ్  సినిమాల్లో కూడా ఎక్కడో ఓ చోట మూవీకామెరా చూపు దానిపని అది చేస్తూనే ఉంటుంది. స్త్రీల సమస్యలమీద మంచి సినిమాలు తీసిన బాలచందర్ కూడా చాలాచోట్ల చూపులు తప్పాడు. ‘అంతులేనికథ’లో కామెరా జయప్రదతో ప్రేమలో పడిపోయి వదల్లేకుండా అయిపోవటాన్ని గమనించటం కష్టమేమీ కాదు. అలాగే ‘మరోచరిత్ర’ కూడా. ‘చక్ర’ సినిమాలో స్మితాపాటిల్ స్నానాన్ని చూపిస్తూ అప్రయత్నంగా కామెరా కొంచెంగా మోహంలో పడిపోయిందనిపిస్తుంది. అందం, బలమైన వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్ అంటే మోహం, ప్రేమ సినిమాటోగ్రాఫర్లలోనూ దర్శకుల్లోనూ కలగటం చాలా సహజం. దాన్ని అదుపుచేసి సినిమాని స్క్రిప్ట్ కి తగ్గట్టు తీసినప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. కానీ సినిమా ఆడాలంటే మేల్ గేజ్ ని పూర్తిగా వదిలేసే ప్రయోగాలు చెయ్యకూడదని పాపులర్ అయిన దర్శకులందరికీ తెలుసు. హీరోయిన్ అంటే ఖచ్చితంగా అందంగా ఉండాల్సిందే.

 

హాలీవుడ్ లో బలం, ధైర్యం ఉండి, యుద్ధాలు చేసే స్త్రీలుగా Uma Thurman (Kill Bill),  Angelina Jolie (Lara Croft etc.), Sigoumey Weaver (Alien) ల ఇమేజెస్ నిలుస్తాయి. అయినా వాళ్ళలోని ఆకర్షణని దర్శకుల మేల్ గేజ్ కొంతయినా ఎత్తి చూపిస్తూనే వచ్చింది. స్త్రీ శరీరాన్ని ఇష్టమొచ్చినట్టు చూపించే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా అణచివేతలోని బాధనీ అన్యాయాన్నీ తీవ్రంగా చూపించిన ‘బాండిట్ క్వీన్’ ని  మేల్ గేజ్ కి చాలావరకూ మినహాయింపనే చెప్పుకోవచ్చు. బాండిట్ క్వీన్ తీసిన శేఖర్ కపూరే ‘మిస్టర్ ఇండియా’లో శ్రీదేవి మీద పూర్తిగా మగచూపుని ఎక్కుపెడితే జనం డబ్బుల వర్షం కురిపించారు.

సినిమాకళతో చాలా ప్రయోగాలు చేసిన యూరోపియన్ సినిమాలో మేల్ గేజ్ అన్వయింపు సులభం కాదు. పాత్ర స్వభావం ఏమిటన్నదే వాళ్ళ దృష్టి. నగ్నత్వం ఎంతగా ఉన్నా దానిలో రెచ్చగొట్టే కోణం ఉండదు. నగ్నత్వం దానంతట అదే అసభ్యత అయిపోదు. చిత్రీకరించిన పద్ధతిని బట్టి అది ఆ సన్నివేశానికి అవసరమా లేక titillation కోసమేనా అన్నది ఎవరికైనా అర్థమౌతుంది. ఉదాహరణకి Jean Luc Godard సినిమాల్లో స్త్రీ అంటే ఒక వ్యక్తిత్వమే. దానికి తోడు ‘బ్రెక్టియన్ ఎలియనేషన్’ టెక్నిక్ కూడా వాడి, అరాచకాన్నీ అన్యాయాన్నీ బట్టలిప్పి చూపిస్తాడు. Godard సినిమాలో పాత్రలకంటే ఆ పరిస్థితులే మనకి భయానకంగా గుర్తుండిపోతాయి.  కొరియన్, చైనీస్ జాపనీస్ సినిమాల్లో ఎవరి కల్చర్ కి వాళ్ళు మేల్ గేజ్ ని కలిపి తీసినవీ, మేల్ గేజ్ ని వదిలి తీసినవీ కూడా గమనించొచ్చు. తరాల సంస్కృతికి  మేల్ డామినేషన్నీ ఆధునికత్వాన్నీ కలిపితే వచ్చే మగచూపులోంచి రకరకాల సినిమాలూ వ్యాపార ప్రకటనలూ తయారౌతున్నాయి.

lalita3

మేల్ గేజ్ ఉండకూడదని మడి కట్టుకుంటే శృంగారాన్నీ మోహాన్నీ సినిమాల్లో ఎలా చిత్రించాలన్నది ప్రశ్న. మంచి ఈస్తటిక్ సెన్స్ ఉన్న దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు శృంగార దృశ్యాలు తీసేటపుడు ఆ పాత్రల మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళు కథలో ఏ సామాజిక వర్గానికి చెందినవారన్నది కూడా గుర్తిస్తూ శృంగారాన్ని చిత్రీకరిస్తారు. కథనిబట్టి అది మొరటుగా ఉండొచ్చు, సున్నితంగా ఉండొచ్చు, హింసాత్మకంగానైనా ఉండొచ్చుగానీ స్త్రీలని మాంసఖండాలుగా చూపించేటట్టు మాత్రం ఉండదు. మన సినిమాల్లో ఆడవాళ్ళని వస్తువులుగా చూపించవద్దని  అనుకునేవాళ్ళు శృంగార సన్నివేశాల జోలికే పెద్దగా పోకుండా సినిమా లాగించేస్తారు.  Titillation లేకుండా శృంగారాన్ని చక్కగా తీసేవాళ్ళు తక్కువ.  సెక్స్ ని సహజంగా చిత్రీకరించటంలో ఇప్పుడొస్తున్న మల్టీప్లెక్స్ హిందీ సినిమా, కామెరా తడుములాటకి దూరంగా కొంత ముందుకి వెళ్ళింది.  మిగతా పాపులర్ సినిమాల్లో మేల్ డామినేషన్ ఎలాగూ తప్పదుగానీ, మన వారసత్వసంపద, అదే.. మన తెలుగుహీరోలు.. వాళ్ళ సినిమాల్లోలా వ్యక్తిత్వంలేని ఆడవాళ్ళను  మేకప్ కిట్స్ తో సహా దొరికే బార్బీ డాల్స్ లా చూపించకుండా ఉండే మేల్ గేజ్ మేలనుకోవాలి ప్రస్తుతానికి.

మేల్ గేజ్ ని ఎదుర్కోవాలంటే విజువల్ మీడియాలో ఫిమేల్ గేజ్ ని తీసుకురావాలని కొంతమంది చెప్తారు.  ఫిమేల్ గేజ్ చెయ్యాల్సిన పని,  మేల్ గేజ్ కున్న వాయరిస్టిక్ లక్షణాన్ని అందిపుచ్చుకుని దానిలాగే తెరను ఆక్రమించటం కాదనీ  మగచూపుకున్న అధికారాన్ని తగ్గించటానికి కృషి చెయ్యాలంటే వేరే రకాలుగా కూడా దృశ్యాలను చూపించటం నేర్చుకోవాలనీ అంటోంది Lorraine Gamman.  అంటే తెరమీది స్పేస్ ని స్త్రీపురుషులిద్దరూ పంచుకోవాలని చెప్తోంది.  సినిమాటోగ్రాఫర్లలో స్త్రీలు చాలా తక్కువ. సరైన దర్శకులతో పోటీ పడగల సమర్థత ఉండి, స్త్రీవాదికూడా అయిన సినిమాటోగ్రాఫర్ ఎవరైనా, అలవాటైన మేల్ గేజ్ ని వదిలించుకుని, ప్రయత్నపూర్వకంగా తనవైన కామెరా ఏంగిల్స్ చూపిస్తూ సినిమా తియ్యగలిగిననాడు ఆడచూపును కూడా నిర్వచించవచ్చేమో.                 

***

యాభై ఏళ్ల కిందటైతే వెకిలిచూపులు ఎదురైతే చీరకొంగు భుజాలచుట్టూ నిండా కప్పుకుని తప్పుచేసినట్టుగా తల వొంచుకునేవాళ్ళు భద్రమహిళలు. ఇప్పుడు బహిరంగస్థలాల్లో మగవాళ్ళతో ఇంచుమించు సమానసంఖ్యలో తిరగ్గలగటం వల్ల వొచ్చిన ధైర్యంతో తలెత్తి లెక్కలేనట్టు మామూలుగా హాయిగా తిరుగుతున్నారు. ఆడవాళ్ళ బాడీలాంగ్వేజ్ ఎక్కడున్నా ఏ ఇబ్బందీ లేనట్టుగా మారిపోయింది.  స్త్రీవాదం, ఉద్యోగాలు, ఆత్మవిశ్వాసం స్త్రీలను నిటారుగా నిలబెట్టేవరకూ తెచ్చాయి. ఇదెంతో బాగుంది. కానీ మధ్యలో అన్నిటికీ నేనున్నానంటూ సర్వవ్యాపి మార్కెట్ జొరబడిపోయి, ఉన్న స్వరూపాలని మార్చి గందరగోళం చేస్తుందే!  “నీ శరీరాన్ని అందంగా వీటితో అలంకరించు ఒంటిని తీర్చిదిద్దుకుని చక్కగా స్వేచ్ఛగా ప్రదర్శించు. నీ స్వేచ్ఛకి ఆకాశమే హద్దు” అని ఫెయిర్ అండ్ లవ్లీలాంటి వేలకొద్దీ వస్తువులతో చుట్టుముట్టి  అన్ ఫెయిర్ ఆటలు ఆడుతోందే!  అసలే అలంకార ప్రియులేమో, మార్కెట్ దెబ్బను సగటు అర్భకపు ఆడప్రాణాలు ఎలా తట్టుకోగలవు? వొంటిని కుదించీ పెంచీ, రంగులద్దీ,   ప్రకటనలు ఎలా ఆదేశిస్తున్నాయో అలాగే తయారవటానికి పరుగు పెడుతుంటాయి.

lalita1

నువ్వు నీలాగే ఉండమంటూ ఆ ‘నువ్వు’ ఎలా ఉండాలో చెప్తున్నారు.

 

సైజ్ జీరోలుగా చాలామంది అన్నపానీయాలు మానేసి రోగగ్రస్తులయాక అమెరికన్ fashion diva ‘కిమ్ కడాషన్’ ఈమధ్య కొత్త ట్రెండ్ ఒకటి తీసుకొచ్చింది. ఆమె తన పిరుదుల్ని సర్జరీతో పెద్దవిగా చేసుకుని అందమంటే ఇదేనంది. దానితో ‘బూటీ’ అని ఆడామగా అందరూ ముద్దుగా పిల్చుకునే పెద్దపిరుదుల మీదే ధ్యాసయిపోయింది కొంతమంది ఆడపిల్లలకి.  అవి పెద్దగా లేకపోతే బెంగ.  రేప్పొద్దున్న ఇంకే ఫాషన్ సీతాకోకచిలకో లేదా పిరుదుల్ని సాఫుచేసే మిషన్లని తయారుచేసేవాళ్ళో ముందుకొచ్చి,  ఫ్లాట్  హిప్స్ లేకపోతే బతుకు వ్యర్థమని  ప్రచారం చేస్తే ఆడపిల్లలకి కొత్తబెంగలు పుట్టుకొస్తాయి. మరోపక్క ‘నా వొళ్ళు నాయిష్టం’ అని సినిమాతారలు స్త్రీస్వేచ్ఛకి అర్థం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందంకోసం ముక్కులూ మూతులతో సహా శరీరభాగాలని కోయించుకుని, క్రీములు పూసుకుని మార్కెట్ గేజ్ కి తగ్గట్టు తయారై  ‘నాశరీరం నాయిష్టం’ అని చెప్పటం ఎంత తెలివితక్కువతనమో గమనించలేనంత మత్తులో మునిగున్నారు.  మన శరీరాలను తీర్చిదిద్దుకోవటంలో ఇప్పుడు మన ఇష్టం ఏమీ లేదనీ, కాస్మెటిక్ సర్జన్లూ బిలియన్లడాలర్ల కాస్మెటిక్ వ్యాపారం చేసేవాళ్ళూ బట్టలమ్ముకునేవాళ్ళూ కలిసి పిల్లలతో సహా అందరిమీదా మత్తుమందు జల్లుతున్నారనీ ఎవరికెవరు చెప్పగలరు?

పిట్టలపోరు పిల్లి తీర్చినట్టు ఈ మేల్ గేజ్  ఫిమేల్ గేజ్ ల గొడవని ‘మార్కెట్ గేజ్’ పరిష్కరించింది. ఇప్పుడు అన్నిటికంటే అదే బలమైనదని ఒప్పుకోవాలి. ఆడా మగా అందర్లోనూ నిద్దరోతున్న ‘Exhibitionism’ ని తట్టిలేపి దువ్వి ముద్దుచేస్తూ వేల వెరైటీల వస్తువులు అమ్ముకుంటోంది. అదీ మార్కెట్ చూపు.  సిక్స్ పాక్ ఛాతీలు ప్రదర్శించే ఫాషన్ వచ్చాక మగశరీరాన్ని కూడా ఖండాలుగా ప్రదర్శించేశారు.  అందరూ ఇప్పుడు ఉదారంగా, హక్కుగా, ఇష్టంగా తమ అందచందాలను ప్రదర్శిస్తున్నామని అనుకుంటున్నారు.

ముందు మనని మనం ప్రేమించుకున్నాక ఆ ప్రేమను అందరికీ చూపించుకోవాలి.  ఒకరు చేతిలో మొబైల్ ఫోన్ ని ఎత్తిపట్టుకుంటే ఐదారుగురు దానివైపే చూసే చూపు ట్రెండీ సెల్ఫీ గేజ్. ఎవరిని వాళ్ళు ఎప్పుడూ చూసుకుంటూ (narcissistic) అందరికీ తమని చూపెట్టుకుంటూ (exhibitionistic) ఉండేలా మార్కెట్ తన కనుసన్నల్లో జనాన్ని ఉంచుకుంటోంది.  మార్కెట్ గేజ్ ని ఎప్పటికైనా దాటగలిగితేనే కదా మన చూపుల్లో వేరే పోకడలు కూడా ఉండొచ్చని మనకు తెలియవచ్చేది!

*

 

 

 

 

 

అవధరించరయ్యా… !

 

 

-ల.లి.త.

~

 

సినిమాగోల లేని రోజుల్లో వినోద ప్రదర్శనలు తీరుతీరులు. ఒగ్గుకథలూ బుర్రకథలూ భజనలూ తప్పెటగుళ్ళూ యక్షగానాలూ.. ఇంకెన్నో.  భాగవతులు వీర శృంగార కరుణ రసాలురికిస్తూ కథలు చెప్పి అందరినీ కూచోబెట్టేవాళ్ళు. సురభి నాటకకంపెనీ భారీగా సెట్స్ వేసి నాటకాలతో ఊరందరినీ ఏకం చేసేది. చందమామా చుక్కలూ కూడా చూపులిటే వేస్తూంటే, ఊళ్ళో జనమంతా చాపలు పరుచుకుని చెంబుల్లో నీళ్ళు తాగుతూ చల్లగా రాత్రంతా ఆ ప్రదర్శనలొక్కటే చూసేకాలంలో ఎందుకు పుట్టలేదా అని నాక్కొంచెం దిగులేస్తుంటుంది. ఆడీ పాడే మనుషుల్ని కళ్ళారా చూసే కాలం అయిపోయి, వాళ్ళ ఛాయల్ని గ్రహణం చేసి తెరమీద ఆడించే సినిమాలొచ్చాయి. అవే వినోదమైపోయాక స్నేహితుల్తో చుట్టాల్తో సినిమాలకు వెళ్లి, నేలమీదా బెంచీలమీదా కుర్చీల్లోనూ కూర్చుని సినిమా చూసి, ఇంట్రబెల్లుకి ‘గోల్డ్ స్పాట్ : ద జింగ్ తింగ్’ తాగి, సినేమాకతలు చెప్పుకు తిరిగేవాళ్ళు జనం. ఇప్పుడు సినిమాకి వెళ్ళటం ఇంకోరకం అనుభవం. చాలామందికది  స్నేహితుల్తో కలిసి మాల్స్ కి వెళ్లి, మెక్ డోనల్డ్స్ తిండి కోక్ తో లాగించి, విండో షాపింగ్ చేసి, ఓ రెండుగంటలు చల్లగా మల్టీప్లెక్స్ థియేటర్ లో కూచుని రావటం. లేదా ఏకాంతంగా టీవీలో చూడటం లేదా సెల్ ఫోన్లో ప్రతిక్షణం ఎక్కడో ఓచోట ఛాయలతో కనెక్ట్ అయిపోవటం.

సినిమాని థియేటర్ లో చూడకుండా టీవీల్లో చూస్తుంటేనే ‘అది reduced experience’ అని గోల పెట్టాడు అదూర్ గోపాలక్రిష్ణన్. మరి సెల్ ఫోన్లో సినిమాలు చూడటాన్ని ‘bonsai experience’ అనాలేమో. విదేశాల్లో ఇప్పుడు టీవీ చూడటం కూడా తగ్గిపోయి ఇంటర్నెట్ లోనే పాటలూ బొమ్మలూ సినిమాలూ అన్నీ చూస్తున్నారట జనం. కామెరా రికార్డు చేసిన ప్రతిదాన్నీ ఇంటర్నెట్ వేగంగా అందిస్తుండటంలో లాభం కూడా లేకపోలేదు.  అలా దొరికిన ఒక పాత సినిమాలోని నృత్యనాటకాన్ని గురించి ఇలా…

***

సినిమాలొచ్చిన కొత్తల్లో అవెలా తియ్యాలో చేతగాకపోవటంతో సినిమాలన్నీ నాటక ప్రదర్శనని మూవీ కామెరాతో చిత్రించినట్టు ఉండేవి. చాలా రోజులవరకూ సినిమాలు తీసేవాళ్ళకి కథలూ నాట్యరీతులూ చూసివున్న అనుభవం వొదలక, సెమీ శాస్త్రీయ, జానపద నాట్యాలను శ్రద్ధగా సినిమాల్లో చూపించేవాళ్ళు. సినిమాకథకి ముడిపెడుతూ హరికథాకాలక్షేపాన్ని చూపించేవారు.  ‘వాగ్దానం’ సినిమాలో రేలంగి ‘భక్తులారా .. ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభై రోజులనుంచీ చెప్పినకథ చెప్పినచోట చెప్పకుండా చెప్పుకొస్తున్నా’నని చెప్పుకుంటూ పోతాడు.

 

“ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లుమనె, గుభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె జానకీ దేహము, ఒక నిమేషమునందె,  నయము, జయమును, భయము, విస్మయము గదురా!  శ్రీమద్రమారమణ గోవిందో హరి…” – అని ‘వాగ్దానం’ హరికథలో శివధనుర్భంగాన్ని వర్ణిస్తాడు కవి. ఈ పద్యంలోని క్రమాలంకారపు సొబగు ఘంటసాల గొంతులో రెట్టింపవుతుంది.

‘రామా కనవేమిరా’ అంటూ సీతాకళ్యాణ హరికథని మరోసారి సొగసుగా చూపించారు ‘స్వాతిముత్యం’ సినిమాలో.  ‘ఇదెక్కడిన్యాయం?’ అనే సినిమాలో హీరోయిన్ హరికథ చెప్తూ జీవిస్తుంది. నాయికగా వేసిన ‘ప్రభ’ నిజజీవితంలో హరికథా కళాకారిణి కావటంతో హీరోయిన్ని ఇలాంటి కొత్తరకం ఉద్యోగంలో చూపించే ఆలోచన వచ్చింది దర్శకుడికి.

రానురానూ ఈ కళారూపాలు ప్రభుత్వ సాంస్కృతిక సంస్థల్లో విదేశాలవాళ్లకి చూపించుకోడానికీ, దూరదర్శన్ లోనూ  తప్ప జనంమధ్య పెద్దగా లేకుండాపోవటంతో  సినిమాల్లో కూడా అవి కనబడటం మానేశాయి.  ఇవి ఎక్కువగా పురాణకథలు, జానపద కథలు. వీటితో సమకాలీన సమస్యలూ హాస్యమూ కూడా కలిపి సరదాగా చెప్తూ అలరిస్తారు కళాకారులు. వాళ్లకి భాష, నుడికారం, సంస్క్రతుల మీద మంచి పట్టు ఉంటుంది. అచ్చతెలుగు చిందుతో కలిసి సంస్కృత పదాలు నాట్యం చేస్తాయి. కథ చెప్పటంలో లయ, సాగదీత అన్నిటిలోనూ ఉంటాయి. చాలాకథల్లో సృష్టి కథ, ఎల్లమ్మకథ, భారత, రామాయణ గాథలూ, ఇంకా బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం లాంటి స్థానిక వీరగాథలూ ఉంటాయి.

ఈ కళారూపాలను సినిమాలకంటే ఎక్కువగా జాతీయ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం తమ ప్రచారంకోసం బాగా వాడుకున్నాయి. డబ్బు పెట్టగలిగేవాళ్ళే సినిమాలు తియ్యగలరు కాబట్టి వాళ్ళ అభిరుచుల ప్రకారమే మొదట్లో సంగీత నాట్యాలు సినిమాల్లోకి వచ్చాయి. అవి శాస్త్రీయ, జానపద ఛాయలతో ఉండేవి. సినిమాల్లో దళితులంటే సానుభూతి చూపిస్తూ వొట్టి బాధితులుగా చూపించటమే ఎక్కువ. వారి కళాభివ్యక్తి ఇంచుమించుగా సినిమాల్లోకి రాలేదు. అందుకే ఒక జాంబపురాణం ఏ సినిమాలోనూ కనిపించదు. పూర్తిగా ఎదగని తెలుగుసినిమా స్థాయి రానురానూ ఏ ఆసక్తీ లేనివాళ్ళు క్రమంగా ఆక్రమించటంతో పల్టీలు కొడుతూ పడిపోయింది.

తెలుగుదేశంలో ఇప్పుడు ఎటుచూసినా కనబడేవి రెండే. ఒకటి ఇంజనీర్లు. రెండు సినిమాలు. సినిమాదెబ్బకి నాటకరంగం నేలకంటుకుపోయుంది. నాటకం కంటే ముందటి కాలానికి చెందిన రకరకాల కతలు మాయం అవటానికి ముందుదశలో ఉన్నాయ్.

***

girija1

అరవైల్లో ఒక మల్టీస్టారర్ సినిమా వచ్చింది. పేరు ‘రహస్యం’. ఆ సినిమా ఏమీ నడవలేదుకానీ అందులోని  ‘గిరిజాకల్యాణం’ ఆలిండియా రేడియోలోంచీ అందరికీ చేరింది. రేడియోతో పాటు చిన్నప్పుడు “తగదిది తగదిది తగదిది ధరణీధరవర సుకుమారీ తగదిదీ.” అని అర్థం తెలీకపోయినా పాడేసుకుంటుంటే గొప్పగా గుర్రపుస్వారీ చేస్తున్నట్టనిపించేది. పిల్లల్ని కూడా ఆకర్షించగల శబ్దసౌందర్యంతో మల్లాది పాట రాస్తే, దానికి తగ్గ సంగీత ఝరీసౌందర్యంతో ఘంటసాల వరుస కట్టాడని అసలు తెలీదప్పుడు.

పురాణ ప్రేమకథలుగా రుక్మిణీ కల్యాణం, పార్వతీ కల్యాణం ప్రసిద్ధాలు. బ్రాహ్మణుడిద్వారా రుక్మిణి శ్రీకృష్ణుడికి ప్రేమవిన్నపం చెయ్యటం, ఆయన రుక్మిణిని రథంమీద ఎక్కించి తీసుకుపోవటం, అడ్డొచ్చిన రుక్మితో కృష్ణుడు పోరాడి అతన్ని అవమానం చెయ్యటం, ఇదంతా సాహసంతో కూడిన ప్రేమకథ.  పార్వతీ కల్యాణంలో శివపార్వతులకు అంత రొమాన్స్ లేకపోయినా మన్మధుడు పిలవని అతిథిలా వచ్చి శివుడిని రెచ్చగొట్టటమే ఈ కథలోని సాహసకార్యం. మన్మధుడే కలిగించుకోకపోతే పార్వతి అలా శివుడికోసం తపస్సు చేసుకుంటూ కూర్చుండిపోతే, అసలే విరాగి అయిన శివుడు ఎంతకాలానికి ఆమె వలపునూ భక్తినీ కన్నెత్తి చూడాలి? శివుడి ప్రత్యేకత ఇంకోటుంది. నటరాజు కదా, కోపం వొచ్చినా సంతోషం వొచ్చినా తాండవ నృత్య ప్రదర్శన చేస్తాడు. దీనివల్ల కూడా మన్మధ విలాసంతో కూడిన శివపార్వతుల కళ్యాణ సంరంభం డాన్స్ డ్రామాగా ఎక్కువ బాగుంటుంది. అది కూచిపూడి భాగవతుల ప్రదర్శనైతే ?

కృష్ణాజిల్లా మొవ్వ మండలంలో ఉన్న చిన్నవూరు కూచిపూడి. అక్కడ పుట్టిన కొన్ని వంశాలవారు ఇప్పటికీ ఆ నాట్యాన్ని కొనసాగిస్తున్నారు. ‘దేవదాస్’ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్యదీ కూచిపూడే.  నేర్చుకున్న నృత్యాన్ని ఎంతో మనసు పెట్టి తను తీసిన ‘రహస్యం’ సినిమాలో చూపించాడు.

‘తక్కధింతాం తకతధింతాం’ అంటూ అశ్వగమన లయతో మొదలుపెట్టి, మూలపుటమ్మకూ చదువులతల్లికీ పరాకులు చెప్తూ మొదలౌతుంది ‘గిరిజా కల్యాణం’. తరువాత వినాయకుడు, కుమారస్వాములను తలుచుకుంటారు. స్థానిక దేవతలైన మంగళగిరి నరసింహుడూ, బంగరుతల్లి కనకదుర్గా, కూచిపూడిలో నెలవైన వేణుగోపాలస్వామీ వరుసగా బహుపరాకులు అందుకుంటారు. ఆ తరువాత కథలోకి దిగుతారు కూచిపూడి భాగవతార్లు.

ఆ నృత్యరూపకాన్ని తయారు చేసిన వాళ్ళు సామాన్యులా?  “ప్రౌఢవాక్యాల, ముగ్ధభావాల.. వచనరచనకు మేస్త్రి” అని ముళ్ళపూడి వెంకటరమణ కీర్తించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి చేసిన రచనను నృత్యనాటకంగా తీర్చిదిద్దినది వేదాంతం రాఘవయ్య. సినిమా పాటలకు మెత్తని పట్టుదారాల్లాంటి వరుసలెన్నో అల్లిన ఘనుడు ఘంటసాల ‘గిరిజా కల్యాణా’నికి సంగీతాన్ని కూర్చాడు. (సినిమాపాటల గాయకుడిగా కొన్ని శృంగార గీతాల్లోనూ కెరీర్ చివర్లోనూ కాస్తగా ఫెయిల్ అయాడేమో గానీ,  సంగీత దర్శకుడిగా ఎల్లప్పుడూ మంచిస్థాయి సంగీతాన్నే సినిమాపాటలకిచ్చాడు ఘంటసాల).

సినిమాసంగీతం భాషా భావసౌందర్యాలకు ఎక్కువ విలువ ఇస్తుంది. శాస్త్రీయసంగీతంలో రాగ, స్వర ప్రాధాన్యత ఎక్కువ. భావాన్ని వినసొంపుగా చేయటంకోసం శాస్త్రీయసంగీత లక్షణాన్ని తగ్గిస్తూ లలితసంగీత లక్షణాలను పట్టించుకుంటూ వచ్చింది సినిమాసంగీతం. భాష బాగావచ్చిన కవులూ రచయితలూ, రాగాలు నేర్చి పాటకు వరసలు కట్టే కంపోజర్స్ ఉన్న కాలంలో సినిమాపాట గొప్పవెలుగు వెలిగింది. ‘రావో రావో లోలంబాలక రావో’ అని మల్లాది రామకృష్ణశాస్త్రి రాస్తే మరో రచయిత (కొసరాజు కావచ్చు) ‘ఉంగరాల ముంగురూల రాజా’ అని జానపద గీతాలతో మనసు దొంగిలిస్తాడు.  ఇక కర్ణాటక సంగీతాన్ని ఎన్నోయేళ్ళు అభ్యాసంచేసి, బడేగులాంఅలీఖాన్ ని కూడా అంతే ఇష్టంతో విన్న ఘంటసాల కూర్చిన తెలుగు సినిమాసంగీతం వినసొంపుగా ఉంటూనే రాగాలకు చక్కగా కట్టుబడి ఉన్న సందర్భాలే ఎక్కువని చెప్తారు. చిత్తూర్ సుబ్రమణ్యం పిళ్ళై లాంటి సంప్రదాయవాది ‘రహస్యం’ కు  ఘంటసాల ఇచ్చిన సంగీతాన్ని మెచ్చుకున్నాడట (వి.ఏ.కె.రంగారావు).

అంబా పరాకు  దేవీ పరాకు  మమ్మేలు మా శారదంబా పరాకు.

ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా బహుపరాక్ బహుపరాక్

చండ భుజామండల దోధూయమాన వైరిగణా షడాననా బహుపరాక్ బహుపరాక్

మంగళాద్రి నారసింహ బహుపరాక్ బహుపరాక్ బంగరుతల్లి కనకదుర్గ బహుపరాక్ బహుపరాక్

కృష్ణాతీర కూచనపూడి నిలయా గోపాలదేవ బహుపరాక్”.

 

అని తాళాలు వాయిస్తూ వేదాంతం రాఘవయ్య సూత్రధారిగా చేసే నృత్యమూ, సరిజోరుగా ఘంటసాల ఇచ్చిన ఆ లయా ఏ పాప్ సాంగ్ ఊపుకీ తక్కువకాదు.

అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా లలిత కళల విలువ తెలియు సరసులు పదింబదిగ పరవశులై”..

అని తమ విద్యను ఆస్వాదించి పరవశులయే వాళ్ళు లలితకళల విలువ తెలిసిన సరసులని గడుసుగా చెప్తూ

ఈశుని మ్రోల హిమగిరిబాల కన్నెతనము ధన్యమైన గాథ అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా అంటారు  సూత్రధారీ వంతపాటగాళ్ళూ.

కణకణలాడే తామసాన కాముని రూపము బాపి, అల కాముని రూపము బాపి, ఆ కోపి, కాకలు తీరి కను దెరచి, తను దెలసి, తన లలనను పరిణయమైన ప్రబంధము అవధరించరయ్యా అని కథను పరిచయం చేస్తారు.

ఇంతలో గిరిబాలా ఆమె చెలులూ ప్రవేశం…

రావో, రావో! లోలలోల లోలంబాలక రావో అని పార్వతిని ఆహ్వానిస్తూ

చెలువారు మోమున లేలేత నగవుల కలహంస గమనాన కలికీ ఎక్కడికే ?” అంటూ సఖులు ప్రశ్న వేస్తే

మానస సరసిని మణిపద్మదళముల రాణించు అల రాజహంస సన్నిధికే అని రాజహంసై వయ్యారం పోతుంది గిరిజ.

వావిలి పూవుల మాలలు కైజేసి, వయ్యారి నడలా బాలా ఎక్కడికే ?” అని నిలదీస్తే

కన్నారా నన్నేల కైలాస నిలయాన కొలువైన అల దేవదేవు సన్నిధికే” అని పరవశిస్తుంది.

ఇంతలో మధ్యవర్తి మన్మధుడు

తగదిది తగదిది తగదిది ధరణీధరవర సుకుమారీ తగదిది. అండగా మదనుడుండగా, మన విరిశరముల పదనుండగా, నిను బోలిన కులపావని తానై వరునరయగ పోవలెనా? ఆఁ ఆఁ ” 

కోరినవాడెవడైనా ఎంతటిఘనుడైనా కోలనేయనా సరసను కూలనేయనా, కనుగొనల ననమొనల గాసిజేసి నీ దాసు జేయనా! ఆఁ ఆఁ ఆఁ.

అంటూ ఆర్భాటం చేస్తూ వచ్చేస్తాడు.

ఈశుని దాసుని చేతువా అపసదా! అపచారము కాదా?  కోలల గూలెడి అలసుడు కాడు. ఆదిదేవుడే అతడు. సేవలు జేసి ప్రసన్నుని జేయ, నా స్వామి నన్నేలునోయీ. నీ సాయమే వలదోయీఅని పార్వతి  మదనుడిని వారిస్తే,

చిలుకతత్తడి రౌతా!  ఎందుకీ హుంకరింత ? వినక పోతివా ఇంతటితో నీ విరిశరముల పని సరి. కింకిణి పని సరి. తేజోపని సరి. చిగురుకు నీపని సరి మదనా అని ఆమె సఖులు కూడా హెచ్చరిస్తారు.

సామగ సాగమ సాధారా, శారద నీరద సాకారా, దీనాధీనా ధీసారా. ఇవే కైమోడ్పులు ఇవే సరిజోతలు  అని పార్వతి తపస్సు మొదలెడుతుంది. మన్మధుడు ఆత్రంగా పూలబాణాలు వేసేస్తాడు శివుడి మీద.

కళ్ళు తెరిచి శంకరుడు తాండవమాడగా మన్మధుడు కాలి బూడిదౌతాడు.

రతీదేవి పరుగెత్తుకొచ్చి విరులన్ నిను పూజసేయగా, విధిగా నిన్నొక గేస్తుజేయగా దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ.. పతిభిక్ష ప్రభూ”  అని ప్రాధేయ పడితే,

అంబా యని అసమశరుడు నను పిలిచెను వినవో, జనకుడవై ఆదరణతో తనయునిగా జేకొనవో, శరణంభవ శరణంభవ శరణంభవ స్వామిన్…”  అని పార్వతి శివుడిని వేడుతుంది.

మన్మధుడికి రూపు రావటంతో రతీదేవికి ఆనందం… ఇద్దరూ కలిసి పార్వతీ పరమేశ్వరులకిలా వందనం పాడతారు.

బిడియపడి భీష్మించి పెండ్లికొడుకైనట్టి జగమేలు తండ్రికీ జయవందనం జగమేలు తల్లికీ జయవందనం

సూత్రధారి కూడా మళ్ళీ ప్రవేశించి “కూచెన్నపూడి భాగవతుల సేవలందు దేవదేవా శ్రీ వేణుగోపాలా జయమంగళం, త్రైలోక్య మందారా శుభమంగళం అని మంగళం పలుకుతాడు.

సంస్కృతాన్నీ అచ్చతెలుగునీ సవ్యసాచిలా ప్రయోగించిన మల్లాది కవితానైపుణ్యాన్నీ శబ్దార్థసౌందర్యాన్నీ  వర్ణించటానికి నా భాష చాలదు. సినిమాపాటలను అంతెత్తున కూర్చోబెట్టేశాడాయన.

(లోలంబాలక=తుమ్మెదలవంటి ముంగురులు గలది. కోల=బాణం. గాసి=కష్టపెట్టు. అపసద=నీచుడా.  చిలుకతత్తడి రౌతు, అసమశరుడు, రసావతారుడు=మన్మధుడు.  కింకిణి=విల్లు.  గేస్తు=గృహస్థు)

***

ఈ పాట చెవులకి ఎంతగా పట్టేసినా, మల్లాది రవళికి దృశ్యాలను ఊహల్లో పేర్చుకోవటమే తప్ప సినిమా ఎక్కడా  దొరకలేదు. యుట్యూబ్ వచ్చాక ‘రహస్యం’ సినిమా దొరికింది. చక్కటి పాటలూ సంగీతం తప్పించి మిగతాదంతా చప్పగా, ఏవేవో రంగులేసిన భీకరమైన సెట్స్ తో ఉన్న ఆ సినిమాను రెండుగంటలపైగా భరిస్తే, ఈ గిరిజాకల్యాణ ఘట్టం లేనేలేదే! మొత్తానికి యుట్యూబ్ లోనే పాటకూడా రెండు భాగాలుగా కనబడింది. (యూట్యూబ్ లో పెట్టి, దీనిని చూడాలన్న నాలాంటివాళ్ళ చిరకాల వాంఛను తీర్చిన వసంత మాధవ గారికి కృతజ్ఞతలు) అరిగి రంగులుపోయి దీనావస్థలో ఉన్నా, ఈ నృత్యనాటకం చూస్తుంటే కూచిపూడి నాట్యరీతిని బాగానే పాటించినట్టుగా తోస్తుంది. సత్యభామ వేషంలో ఆరితేరిన కళాకారుడు వేదాంతం సత్యనారాయణశర్మ మన్మధుడుగా, కోరాడ నరసింహారావు శివుడిగా అభినయించటం వల్ల ఒక ప్రామాణికత వచ్చిన భావన. సూత్రధారి రాఘవయ్య, వంతపాటగాళ్ళు వేదాంతం రత్తయ్యశర్మ, భాగవతుల యజ్ఞనారాయణశర్మ. పార్వతిగా వేసిన బి.సరోజాదేవి, రతీదేవిగా వేసిన గీతాంజలి సినిమానటులు. మిగతా వేషాలలో కూచిపూడి భాగవతుల చేతనే నటింపజేస్తూ రాఘవయ్య తాను నేర్చిన కళపట్ల ఎంతో ప్రేమతో దీనికి నృత్యదర్శకత్వం చేశాడు. సినిమాసంకరం కాని కూచిపూడి శాస్త్రం దీనిలో ఎంతవరకూ ఉందో నాట్యశాస్త్ర విమర్శకులే చెప్పగలరు.

సంగీత సాహిత్య నృత్యాలు ముద్దుగా కుదురుకుని గర్వించదగ్గ తెలుగు సినిమాపాటగా ‘లలితకళల విలువతెలియు సరసులకు’ రసఝరీయోగాన్నిచ్చిన నృత్యనాటకం ‘గిరిజా కల్యాణం’. ఇది చక్కగా దక్కిన మనదైన తెలుగు వైభవం.

గిరిజా కల్యాణాన్ని ఇక్కడ వినండి.

http://www.allbestsongs.com/telugu_songs/Search-Telugu-Movie-Songs.php?st=Girija+Kalyanam&sa=Go%21

 

 

 

 

 

 

బాహుబలానికేనా బహుమతి ?

 

 

-ల.లి.త.

~

    ల.లి.త.

ల.లి.త.

‘మొత్తానికి మన తెలుగువాళ్ళకి వందకోట్ల లాటరీ తగిలినట్టు ఏకంగా ఉత్తమ సినిమా జాతీయ పురస్కారం వచ్చేసిందోచ్’ అని సంబరపడాలో లేక మన సినిమాతో ఉత్తమ సినిమా బహుమతి స్థాయి కిందకి దిగిందని విచారించాలో తెలియటం లేదు. పక్కనున్న తమిళ, మళయాళ, కన్నడ, మరాఠీ సినిమాల్లా బుద్ధిబలంతో కాకుండా బాహుబలంతో సాధించిన బహుమతిలాగా ఉందిది.  వేరే సినిమాలేవీ చూడకుండానే తెలుగు సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు రాలేదేమని నూతిలోకప్పల్లా బాధపడేవాళ్ళకి మాత్రమే ఈ గుర్తింపు ఆనందాన్నిస్తుంది.

అందరినీ అలరించే పాపులర్ సినిమా, కొంతమంది మేధావుల సృష్టికే పరిమితమయే ఆర్ట్ హౌస్ సినిమాల మధ్య అవార్డుల పోటీలో ప్రభుత్వం ఇచ్చే సినిమా పురస్కారాలు ఆర్ట్ హౌస్ కే ఇంతవరకూ దక్కుతున్నాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికయే సినిమాకు ఖచ్చితంగా మంచి ప్రమాణాలను అనుసరిస్తూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఉత్తమ నటుడు, నటి బహుమతులు నెమ్మదిగా ఆర్ట్ హౌస్ నుంచి ప్రధాన స్రవంతి సినిమాలకు కూడా రావటం మొదలయింది. ఇప్పుడు బాహుబలికి ఉత్తమచిత్రం పురస్కారం రావటంతో ఈ అత్యున్నత బహుమతి కూడా  ప్రధానస్రవంతి సినిమావైపుకి చూడటం మొదలు పెట్టిందని అనుకోవచ్చు. ఇది ఎలాంటి మార్పుకు ప్రారంభమో చూడాలి.

ఒక చిత్రం గానీ ఒక రచనగానీ ఉత్తమమైనదని నిర్ణయించటానికి దాని జనరంజకత్వాన్ని లెక్కలోకి తీసుకునే పద్ధతి సరైనది కాదు. ఈ ప్రమాణం సాహిత్యంలోకి కూడా వస్తే చేతన్ భగత్ కి  సాహిత్యంలో అత్యున్నత పురస్కారం ఇవ్వాలి.  ప్రపంచంలో ఎక్కడైనాసరే పాపులర్ సినిమా ఏ ప్రశ్నలూ వెయ్యదు.  కొత్త ఆలోచనలకు అవకాశం అక్కడ తక్కువ. ఓ రెండుగంటలు ప్రేక్షకులకు కలల్ని అమ్మటమే దానిపని.  వ్యాపారవిలువల్ని పక్కనపెట్టి, జీవితాన్ని అన్నిరంగుల్లోనూ నిజాయితీగా చూపించే ప్రయత్నం ఆర్ట్ హౌస్ సినిమాల్లో ఎక్కువగా ఉంటుందిగనుక జాతీయ బహుమతులు వాటికే వస్తాయి.  కలల్ని అమ్మి జనాన్ని నిద్రపుచ్చే సినిమాలు కాకుండా నిజాలు చెప్పి జనాన్ని ఆలోచింపజేసే సినిమాలకు బహుమతులు ఇవ్వటం ప్రభుత్వధ్యేయంగా ఉండేది. ఉండాలి కూడా.  సహజంగానూ  కళాత్మకంగానూ సినిమా తీసే పద్ధతిలో నిజానికి ఆర్ట్ హౌస్, పాపులర్ సినిమాల తేడా రానురానూ చెరిగిపోయి  మల్టీప్లెక్స్ సినిమాగా కుదురుకుంది.  కానీ అవి  నగరాల్లోని మధ్యతరగతి జీవితాన్నీ ప్రముఖుల జీవితచరిత్రలనే  ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి.  సారంలో మాత్రం తక్కువ డబ్బుతో తీస్తున్న ప్రాంతీయ సినిమాదే ఇప్పటికీ పైచేయి. సరైన ఆకృతి దిద్దుకోకపోయినా  సారవంతమైన సినిమాకే  ఉత్తమ చిత్రం బహుమతి వచ్చిన సందర్భాలూ లేకపోలేదు.  నేలమీద నిలబడటమే ఉత్తమ చిత్రం బహుమతికి  ప్రధాన అర్హతగా ఉంటూ వస్తోంది ఇప్పటివరకూ. డెబ్భైల్లో ఎక్కువగా వచ్చే ప్రాంతీయ సినిమాల మధ్య ఈ బహుమతి కోసం పోటీలూ వివాదాలూ లేకపోలేదు గానీ బాలీవుడ్ వీటి మధ్యలో ఎప్పుడూ దూరలేకపోయింది.

తెలుగులో తీసిన సినిమాలకు జాతీయ స్థాయిలో ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అందులో అనుమానం లేదు. తెలుగులో మృణాల్ సేన్ తీసిన ‘ఒకవూరి కథ’ ( ప్రేంచంద్ కఫన్ కథ ఆధారంగా తీసిన సినిమా), రవీంద్రన్ తీసిన ‘హరిజన్’, గౌతమ్ ఘోష్ తీసిన ‘మాభూమి’, శ్యాం బెనెగల్ తీసిన ‘అనుగ్రహం’  చాలా బలమైన సినిమాలు. ‘ఒకవూరి కథ’ కనీసం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానైనా ఎన్నికయింది. మిగతా మూడిటికీ ఏ బహుమతీ రాలేదు. ‘హరిజన్’ ప్రింట్ కూడా మిగలకుండా మాయమవటం గొప్ప విషాదం. కానీ ఈ సినిమాలను తెలుగువాళ్ళు కాదు, ఇతర భాషల దర్శకులు తీశారు. బహుమతులు రాకపోయినా ఎంతోమంది మెప్పు పొందిన సినిమాలివి.

సాహిత్యమూ సినిమా చెయ్యాల్సిన పని జీవితపు కిటికీలన్నిటినీ తెరిచి వెలుగు ప్రసరించటం ఒక్కటే కాదు. ఆ వెలుగుల్ని సొగసుగా పట్టి చూపిస్తేనే అది మంచి సాహిత్యమో  సినిమానో అవుతుంది. జీవమున్న చిత్రాలకు బహుమతులు రావటంతోపాటు వాటిని జనం అంతో కొంతో ఆదరించిన మంచిరోజులు ఉండేవి. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ చిత్రాలను చాలామంది చూసేవాళ్ళు.  రానురానూ ఉత్తమ జాతీయ చిత్రాలుగా ఎన్నికైన ప్రాంతీయ సినిమాల గురించి మీడియాలో పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయారు.  నెమ్మదిగా జాతీయ బహుమతులు ప్రధాన స్రవంతి సినిమావైపుకు రావటంతో వీటికి ఆకర్షణ పెరిగినట్టయింది. అంటే ఇవి కూడా  ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లాగా మారుతున్నాయని అనుకోవాలి.  దీని అర్థం .. చివరికి బాలీవుడ్ కే అన్నీ దక్కుతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాంతీయ సినిమా బడుగులు ఈ బహుమతుల ఆశ కూడా వదులుకోవాల్సిందే. బాలీవుడ్ మెరుపుల ముందు ప్రాంతీయ సినిమాల లోచూపూ నిరాడంబరత్వమూ ఎక్కడ ఆనుతుంది? బాహుబలికి వచ్చిన బహుమతి తెలుగువాళ్ళ కళాత్మక దృష్టికి వచ్చిన మెప్పుకోలు కాదు. CGI హంగులతో హిందీలో బాలీవుడ్ నీ, కరణ్ జోహార్నీ, రమేష్ సిప్పీవంటి వ్యాపార సినిమా దర్శకుడినీ మురిపించినందుకు వచ్చిన బహుమతి. జ్యూరీలో ఉన్న సభ్యుల తెలివిమీద కూడా అనుమానాలు వచ్చే సందర్భం ఇది. సాంస్కృతిక సంస్థల సింహాసనాలమీద ఆ రంగాల్లో కనీసార్హతా, విద్యా లేని అనామకులు కూర్చుంటున్న రోజుల్లో రమేష్ సిప్పీ జ్యూరీ విచక్షణకూడా ఏమంత గొప్పగా లేదు.

హాలీవుడ్ లా భారీ సినిమాలు తీయటమే సినిమా కళ అనుకుంటే అస్థిపంజరానికి కిలోలకొద్దీ నగలు తగిలించినట్టే ఉంటుంది. రక్తమాంసాలున్న మనుషులను చూపించే సినిమాలనూ, మనఆలోచనలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళి మానవత్వాన్ని ఆవిష్కరించే సినిమాలనూ  ప్రోత్సహించటం ఒక్కటేకాదు. వాటిని ప్రచారం చేసి జనంలోకి తీసుకెళ్ళే పని కూడా నిజానికి ప్రభుత్వమే చేయాల్సిన రోజులివి. ప్రభుత్వమే ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు వచ్చిన సినిమాలను దేశంలోని అన్నిభాషల్లోకీ డబ్ చేయించి అన్ని ప్రైవేటు టీవీ చానెల్స్ లో వేయటాన్ని తప్పనిసరి చేస్తే ఎంత బాగుంటుందో!  కానీ, అందరికీ కావలసిన చదువునీ వైద్యాన్నే వదిలేసిన ప్రభుత్వాలు కళాపోషణ పనుల్ని  నెత్తిన వేసుకుంటాయనుకోవటం అత్యాశ.  కనీసం ఉన్న అవార్డులు ఇచ్చేటప్పుడైనా బాధ్యత వహించకపోతే  బాలీవుడ్ అన్నిటినీ మింగేస్తుంది. కిందటి సంవత్సరం ఉత్తమ చిత్రంగా బహుమతి పొందిన ‘కోర్ట్’ సినిమా చూద్దామంటే ఎక్కడా దొరకదు. ‘షిప్ ఆఫ్ తిసియస్’ ను కిరణ్ రావు, ఆమిర్ ఖాన్ లు భుజాన వేసుకున్నారు కాబట్టి నలుగురికీ తెలిసింది. బాలీవుడ్ తారలకు జాతీయ బహుమతి వస్తే ప్రముఖ వార్త అవుతుంది. ట్రాన్స్ జెండర్ గా నటించిన సంచారి విజయ్ కి కిందటి సంవత్సరం ఉత్తమ నటుడి బహుమతి వచ్చింది. ఒక్క కన్నడిగులకు తప్ప అతనెవరో దేశంలో ఎవరికీ తెలియదు.

బాహుబలిని జ్యూరీ “మహోన్నత స్థాయి నిర్మాణ విలువలతో సినిమాటిక్ మెరుపుతో తెరమీద కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించిన ఊహాత్మక చిత్రం” అని మెచ్చుకుంది.  చిన్నపిల్లకి కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ అని తెలిసిపోయే దృశ్యాలు బాహుబలిలో చాలా ఉన్నాయి. శివలింగాన్ని ఎత్తటంలో, వందలమంది లాగలేని విగ్రహాన్ని ఒంటి చేత్తో ఆపటంలో, ఒక్కోటీ కిలోమీటరు దూరానున్న కొండలమీదనుంచి దూకటంలో హీరో దైవ సమానుడిలా ఉంటాడు.  అలసట, కష్టం వంటివి అంటని మానవాతీత హీరోని చూస్తూవుంటే  ఏ ఉద్వేగమూ కలగదు.  కొన్నిచోట్ల చాలాబాగా, చాలాచోట్ల నాసిరకంగా ఉన్న గ్రాఫిక్స్ ని బాహుబలి సినిమాటోగ్రాఫర్  సెందిల్ కుమార్ కూడా సమగ్రంగా ఉన్నాయని అనలేకపోయాడు.  సరిగ్గా అతకని గ్రాఫిక్స్ నీ దేవుళ్ళలాంటి హీరోలనీ పూజించే సినిమాల్లో తెలివైన ప్రేక్షకుల ఊహలు ఎంతదూరం వెళ్ళగలవు? అక్కడే చతికిలబడతాయి. అద్భుతకాల్పనిక ప్రపంచాన్ని సృష్టించిన బాహుబలిలో, విశ్వాసం పేరుతో బానిసత్వాన్ని romanticise చేయటం ఉంది. యుద్ధవిద్య నేర్చిన అమ్మాయిని వొట్టి అందమైన బేలగా మార్చటం ఉంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ లోకాల్లో తిరిగే మూసలు తప్ప మనుషులు లేరు. తెలుగు పాపులర్ సాంఘిక సినిమాలోంచి బాహుబలిలోకి పాకిన మూసలివి.  సుమోలు గాల్లో పేల్చేసి, యాభైమందిని నరికి పారేసే తెలుగుసాంఘికాల హీరో  జానపద బాహుబలిలో గ్రాఫిక్ కొండలమీదా జలపాతాలమీద దూకుతూ తేలుతూ, బాలీవుడ్ చేరి, అవార్డు కొట్టేశాడు. ‘దబాంగ్’ లాంటి మగ దబాయింపు మూస హిందీ చిత్రసీమలో ఎలాగూ ఉండనే ఉంది.  తల్లిస్థానంలో స్త్రీని కీర్తిస్తూ, భార్యగా ప్రియురాలుగా స్త్రీని తనకంటే తక్కువగా చూసే మగవాళ్ళు ఎక్కువగా ఉన్న ఉత్తరాదికి, దాన్నే తెరమీద  చూపించిన బాహుబలి నచ్చటంలో ఆశ్చర్యం లేదు. బాహుబలి అందించినది ఏ కొత్తదనమూ సున్నితత్వమూ లేకుండా ఒట్టి వ్యాపారంగా మారిపోయిన కళ.

బాహుబలి హాలీవుడ్ సినిమాలాగా వచ్చిందని చాలామంది సంతోషపడుతున్నారు. మరి ఏ ఒక్క హాలీవుడ్ చిత్రంలోనైనా ఆ కథ జరిగిన స్థల కాలాలు మనకి అర్థం కాకుండా ఉంటాయా? నాసిరకం హాలీవుడ్ సినిమాల్లో కూడా ఆ మనుషులు తిరిగే చోట్లు, బతికిన కాలం, నివసించే భవనాలు ఎలా ఉండాలో ఆలోచించుకున్నాకే వాళ్ళు సినిమా తియ్యడానికి దిగుతారు.  బాహుబలిలో నయాగరాని మించిన జలపాతాలు, ఆపైన మంచు కొండలు, ఇంకా పైన పచ్చని నేలలో దేవాలయాలలాంటి కోటలూ, యుద్ధం చేసే చోట తాటితోపులూ ఉంటాయి.  ఈ సినిమా కోసం భూగోళాన్ని ఇన్నిరకాలుగా సాగ్గొట్టేరు. మనకి తెల్సిన జాగ్రఫీ మర్చిపోవాల్సిందే. ఎంత చందమామ కథ అనుకున్నా ఇలాంటి రసహీనతని భరించటం కష్టం.  ఇంత అడ్డూ అదుపూ లేని కాల్పనిక ప్రపంచంలో విహరింపజేయటం హాలీవుడ్ కి కూడా చేత కాదు. వాళ్ళ సినిమాల్లో ఎంత పెద్ద హీరో అయినా పాత్రలోకీ ఆ పాత్రకు సంబంధించిన ప్రపంచంలోకీ చుట్టూరా ఉండే మనుషుల మధ్యలోకీ ఒదగాల్సిందే. మన హీరోలు దేవతలు కాబట్టి,  వాళ్ళకోసం పాత్రలనూ ప్రదేశాలనూ దర్శకులు రత్నాలు పొదిగిన దుస్తుల్లా తయారుచేసి తొడుగుతారు. ఆ దేవతావస్త్రాలను మెచ్చుకు తీరాలి కాబోలనే నిరంతర భ్రమలో వున్న జనం చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు.  ఇప్పుడు ప్రభుత్వం కూడా చప్పట్లు కొట్టడానికి తయారయింది.

సున్నితమైన కొత్త ఫాంటసీలా కథ చెప్తూ ‘ఈగ’ తో దేశమంతటినీ ఆకర్షించిన రాజమౌళి మంచి ప్రజారంజక దర్శకుడు. ఇప్పుడు పెద్ద హీరోల అహంకారానికీ దర్జాకూ తగ్గ కథల దుస్తులు అల్లుతూ, హాలీవుడ్ కలలుకంటూ, ఆత్మలోపించిన సినిమాలు తీస్తున్నాడు. ఆయన్ను అందుకు తగ్గట్టే గుర్తించి, బాహుబలికి ఉత్తమ ప్రజారంజక సినిమా కేటగిరీలో బహుమతి ఇచ్చివుంటే బాగుండేది. ఒకప్పటి ప్రమాణాల ప్రకారం శంకరాభరణం ఉత్తమ ప్రజారంజక సినిమాగానే ఎన్నికయింది. ఇప్పటి భారీ ప్రమాణాల ప్రకారం బాహుబలిని ఈ విభాగంలోనే చేర్చొచ్చు.

బాహుబలికి (అదీ ఇంకా సగం సినిమానే) అర్హతలేని బహుమానం దక్కింది. మన సినిమాల ఆరోగ్యానికి ఈ కొత్తధోరణి జాతీయ బహుమతులు మంచి చెయ్యవు.

 

 

 

తెంగ్లిష్ భూతం.. వేపమండల వైద్యం…

 

 

-ల.లి.త.

~

    ల.లి.త.

“భాషంటే ఓ అంటురోగం. అంతకు మించేం లే..”  ధాటిగా చెప్పేడు మా చెడ్డీల్నాటి నేస్తం సీనుగోడు.

“సగంనిజాల్ని గెట్టిగా చెప్పీసీవాళ్ళలో ముందువరస నీదే.  భాషంటే ఇంకా చాలావుందని చెప్పిన శాస్తుర్లంతా మొత్తుకోరూ? దానికెంత పెద్ద శాస్త్రముందిరా!” కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాను వాడి పళ్ళెంలో మరో దిబ్బరొట్టి ముక్క వేస్తూ.

“సుబ్బలచ్చిమి కవుర్లు సెప్పకే… అదంతే..” అని అల్లంపచ్చడీ రొట్టిముక్కపెచ్చుతో పాటు మాటల్ని కూడా నొక్కి నవిలీసేడు వాడు.

“నిరూపించరా అప్పారావ్..” అని నేనూ తగ్గకుండా నిలేశా.

“ఇవాళ దిబ్బరొట్టి వేస్తున్నాతల్లీ”. “ఇంకో రొట్టిముక్క వేసుకోరా” అని  వెన్నపూసిన దిబ్బరొట్టి జపం మీ అమ్మ వందలసార్లు చేసేకేకదా, దీనిపేరు ‘దిబ్బరొట్టి’ అని మన బుర్రల్లో నాటుకుంది! ఇంత కష్టపడి రెండు మూడు తరాలుగా మాటలు నాటి పెంచుతూ ఉంటేనే కదా భాష తేనెలో ముంచిన రొట్టెలా రుచులూరేది!”

“అంటురోగం అని చెప్తూ భాష నాటుడు కార్యక్రమంలోకి పోయావ్.  తిండెక్కువైనప్పుడల్లా పీతలా నడిచే నీ మెదడు లక్షణం ఏ మాత్రం మారలేదురా.” అని పొగిడేను.

“తిండెక్కువ పెట్టి గెరిల్లాయుద్ధం చేసే నీ బుద్ధీ అలాగే ఉందిగా”.. వాడూ పొగిడేడు నన్ను.

“బాసింపట్టు వేసుకున్నావుగా దిగరా ఇంక వాదంలోకి!”

“సుబ్బరంగా ‘మఠఁవేసుకుని’ కూచున్నానే.  విజయవాడెళ్ళి మన ‘మఠా’న్ని ‘బాసింపట్టు’ చేసీసేవు. ఇదీ అంటురోగమంటే. ఒక్కటే దెబ్బకి నిరూపించి పారేసినానా నేదా సుబ్బలచ్చిమీ”

“మఠం వెయ్యడాన్ని ఒక్కో వూళ్ళో ఒక్కోలా అంటార్లేరా బంకుశీనూ. నాలాంటి పండితుల్ని విడిచిపెట్టి సాధారణీకరించవోయ్.”

“రెండూర్లు తిరిగి నాలుగు ముక్కలు ముక్కునట్టుకున్న నీలాటోల్లంతా శాత్రం మాటాడీసీవోలే.  గట్టిగా పదివాక్యాలు గుంటూరుభాషలో మాట్లాడు నీ సంగతి తేలుస్తా.”

“అల్లంపచ్చడి ఘాటు తలకెక్కేక నీమాట నువ్వే వినవురా మహేశ్ బాబూ. నామాటలేం వింటావు?”

“ఇదీ నీ గెరిల్లా యుద్ధతంత్రం. కాలికేస్తే మెడకీ మెడకేస్తే కాలికీ.. నీ మొగుడు ఎప్పుడూ లాగిపెట్టి తన్నలే?” ఉక్రోషం వొచ్చీసింది శీనయ్యకి.

“నువ్వు తన్నగలిగేవనా అతను తన్నడానికి?”  ప్రకాశ్ రాజ్ లాంటి శీనుగాడి ఆకారాన్ని చూస్తూ కొంచెం భయంగా  అన్నాను.

“నీతో ఇలా లాభం లేదు.  నేను పూర్తిగా చెప్పేకే నీకు మాటాడ్డానికి అనుమతి ఉంది.”  అంటూ నా మాట చొరనివ్వకుండా కన్హయ్యా కుమార్ లా రంగఁవెక్కి కదం తొక్కేడు మావాడు.  వాడి ‘ఆగ్న’ దాటలేక బ్రాకెట్లలో నిశ్శబ్దంగా మాట్లాడుకున్నాన్నేను. దాని విధానమిది …

“దిబ్బరొట్టె పేరుతో తరాలుగా మన తలకెక్కిన ఈ అద్భుత పదార్థాన్ని మనచేత ఎవరైనా ‘పాన్ కేక్’ అనిపిస్తే అది   అంతర్జాతీయ కుట్ర. రసాయనాయుధాలకంటే బలమైనది అన్యభాషాప్రసారం.  ఇది గమనించకుండా అన్యమత ప్రచారం అంటూ ఊగిపోతున్న ఆంధ్రదేశపు హిందూవాదులు తెంగ్లిష్ ప్రచారాన్ని ఎందుకు ఖండించరని అడుగుతున్నా.  అడుగుతున్నా నేనడుగుతున్నా.. మొబైల్ ఫోన్ని “చరవాణి” అని వాడుకలోకి తెస్తూ తరవాణిని   గుర్తుకు తెప్పిస్తున్న పత్రికాధిపతిని! (అబ్బ. పొద్దున్నే వాము కలిపిన తరవాణిలో ఆవకాయో మిరపకాయో కొరుక్కుని బొజ్జనిండా తిని, బళ్ళో మత్తుగా ఊగిన రోజుల్ని ఏమన్నా తిరగదోడేవా ప్రియనేస్తం!)  ఏమనీ? తెలుగు వార్తాపత్రికలూ టీవీచానెళ్ళ మధ్య నలుగుతున్న తెలుగోళ్ళని ఒక్కసారంటే ఒక్కసారి… రక్తాశ్రువులొలుకుతున్న తెలుగుతల్లి కళ్ళలోంచీ  పరిశీలించమని… ఓపక్క పత్రికల్లో తెలుగుని ఉద్ధరిస్తూ  మరోపక్క కొత్త కొత్త దూరదర్శన పాయల్ని (టీవీ చానెల్స్)  మూర్ఖానందపు పెట్టె (టీవీ) లోకి పంపిస్తూ వాటిద్వారా తెలుగుభాషా కల్పవృక్షాన్ని నాశనం చెయ్యటం కోసం పరదేశీ వేరుపురుగుల్నీ, కాండంతొలిచే పురుగుల్నీ అగ్గితెలుగునీ, అదే.. అగ్గితెగుల్నీ వ్యాపింపజేస్తున్న తీరుని ప్రశ్నిస్తున్నా. దీనివల్ల జనం, చదూతున్న పత్రికలభాషనీ చూస్తున్న టీవీ తెంగ్లిష్ నీ  వింటున్న ఎఫ్ఫెమ్ రగడనీ (బాగా చెప్పేవ్. తెంగ్లిష్ నగిషీల్లో ఆర్జేల పనితనం తనిష్క్ ని మించినదే)  కలిపి గిలకొట్టి,  కొత్తరకం కంగారుభాష మాటాడుకుంటూ గెంతుకుంటూ పోతున్నారని నేను సోదాహరణంగా వివరించగలను మీడియా మహారాజులారా!  చిత్తశుద్ధి లేని మీ శివపూజల్ని నేన్నిరసిస్తున్నా”. (ఉపన్యాసం బాగుంది గానీ ‘లక్స్ సినిమాతారల సౌందర్య సబ్బు’ నాటి రోజుల్నుండీ ఈనాటిదాకా టీవీ యాడ్ లు కూడా తెలుగుని మరీ దుంపనాశనం చేసిపెడుతున్నాయిరా నాయినా).

ఊపిరి పీల్చుకోడానికి ఆగేడు శీనుగాడు.

“ఈ మధ్య మనకీ కొత్త కొత్త వంటల చానెళ్ళు వొచ్చీసేయి పిల్లా చూసేవా నువ్వు?  నీలాటి బక్కప్రాణికి అన్నిరకాల  వంటల పేర్లు వింటేనే నీరసం వొచ్చిస్తుంది. మీ అమ్మ వంటలు మర్చిపోతావ్.  మ్మ్.. అలా కాదులే.  మీ అమ్మా అమ్మమ్మల వంటలని కూడా ఎలా చెయ్యాలో వీడియో తీసి ఆ చానెల్ కి పంపిస్తే కాస్త పేరూ డబ్బూ కూడా వస్తుందనుకుంటా చూసుకో.  ఒకటి మర్చిపోకు సుమా.  ఆ వంటెలా చెయ్యాలో పూర్తిగా తెలుగులోనే చెప్పాలని వాళ్లకి షరతు పెట్టు. (‘షరతు’ అనే మాట ఎక్కణ్ణుంచి వచ్చిందో తెల్సుకోవా శీనూ)  ఆ చానెల్ చూసి తీరాల్లే. చక్కగా బొద్దుగా ఉండే అమ్మాయిలే అంతానూ.  (అంతా నీలాగే గుండ్రంగా ఉంటే ఎంతానందంరా నీకూ!)  అరె…  అలా అనుమానంగా చూసి శీలశంక చెయ్యకు. (అదేంట్రా మూలశంకలా?)  స్త్రీవాదమే మాటాడుతున్నాలే. సున్నాకొలత వొదిలి మనుషులంతా ఎవరి కొలతల్ని వారు ప్రేమించుకోవాలని నా ఆశయం. (అలా నీ పొట్ట చుట్టుకొలతని ప్రేమించుకుంటూ ఉండు. గుండెపోటొచ్చీగల్దు.)

ఇంతకీ నువ్వు మాటాడకుండా ఉంటే ఎటో వెళ్తున్నాన్నేను. (మీ మగాళ్ళంతా అంతేగా. దార్లో పెట్టడానికే మేమున్నాం.)  అసలు విషయం ఏమిటంటే అమ్మలూ.. చిన్న అనుకరణ చేసి చూపిస్తా చూడు ఓ కార్యక్రమాన్ని!” –  శీనులోని నటుడు ఆవలిస్తూ నిద్రలేచాడు.

***

పాలకోవా వ్యాపారి  శంకర్రావు గారి దగ్గరకు వంటల చానెల్ అమ్మాయి వచ్చింది.

అమ్మాయి :  “అసలు మీ పాలకోవాకున్న ఇంత టేస్ట్, ఇంత స్పెషాలిటీ ఏంటో అర్జంట్ గా తెల్సుకోవాలని వచ్చేసానండీ.”

శంకర్రావు :  “తప్పకుండా.. రండి… ఊక పొయ్యి మీదే కోవా వండుతామండి. ధాన్యం మిల్లు నుండి తీసుకొస్తామండి ఊక..  రైస్ మిల్లులో రైస్ సెపరేట్ అయ్యేక వొచ్చే పొట్టుని ఊక అంటారండి.

అమ్మాయి :  “జెనరేషన్ ఇంత ఫాస్ట్ గా వెల్తోంది కదా..  గాస్.. గాస్ స్టవ్స్, ఇంకా అప్డేటెడ్ చాలా వచ్చాయి కదా. మీరెందుకింకా ‘ఊక’ వాడ్తున్నారు? (ఊక అనే మాటనే అంత బెరుగ్గా అంటావెందుకు తెలుగుపిల్లా?)  మీ సీక్రెట్స్ లో వన్ అఫ్ ది సీక్రెట్స్ ఊకపొయ్యి అన్నమాట…  సరే. కోవా రెడీ అవడానికి ఎంత టైం పడుతుందండీ?”

శంకర్రావు:  “పదిలీటర్లు పాలు కోవాగా తయారవటానికి గంట, గంటన్నర పడుతుందండి”.

అమ్మాయి :  “ఓకే ఓకే. ఆ పాలు టెన్ లీటర్సాండీ ?

శంకర్రావు:  “అవి ఫార్టీ లీటర్స్అండీ. ఇవి టెన్ లీటర్స్ అండీ.”  (ఒప్పేసుకున్నా శీనూ. భాష వొట్టి అంటురోగమే. పాపం ఆయనకీ అంటించేసిందీ పిల్ల. అసలే అన్యభాషా వ్యాధినిరోధకశక్తి లేనివాళ్ళం).  … కోవాకి పాలు బాగా మరిగి చిక్కబడాలి”.

అమ్మాయి :  “అంటే బాగా రెడ్డిష్ రావాలాండీ?”

శంకర్రావు:  “ఔనండీ రెడ్డిష్ రావాలి”. (ఇదేంబాధ శంకర్రావుగారూ మీకు? మధ్యలో మా కళ్ళు రెడ్డిష్..  ఛ ఛా .. ఎర్రబడిపోతున్నాయ్ ఆర్. నారాయణమూర్తిలా).

అమ్మాయి :  “పెద్దలు నడిచిన ‘మాట’లో (బాట అనే మాట తెలీదీ పిల్లకి) మనమూ నడిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పొందుతామనటంలో మీరు ట్రూ ఇన్స్పిరేషనండీ. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండీ?

శంకర్రావు :  పందొమ్మిది వందల యాభైలో నాన్నగారు స్టార్ట్ చేశారండీ.. (మీకూ ‘స్టార్ట్’ అయిందండీ అంటువ్యాధి.)

అమ్మాయి :  శివరావు గారంటే మీ ఫాదర్ గారాండీ? మీది పుట్టుకతోనే ‘సంపున్న’ కుటుంబమా?” (నీ సంపుడేంది తల్లీ ?)

***

“ఇప్పుడేమంటావ్? ఈ అమ్మాయిని వేషం మార్చి శంకర్రావుగారింట్లో రెండ్రోజులుంచి వాళ్ళంతా మాటాడుకునే భాషలో ముంచి తీస్తే తప్ప ఈ పిల్ల తన వొచ్చీరాని వింగిలీష్ని ఆయనకీ అంటించడం ఆపదు.  నువ్వూ నేనూ, తెలుగులో కథలూ కబుర్లూ రాసే అల్పసంఖ్యాక వర్గాలవాళ్ళూ, తెలుగు భాషాశాస్త్రవేత్తలూ (ఈ జాతి ఇంకా మిగిలుందంటావా?)  పిల్లలకి బడుల్లో తెలుగు నేర్పించే అభాగ్యులూ మనభాష గురించి ఆలోచిస్తే చాలదు తల్లీ.  టీవీకి తెంగ్లిష్ చీడ వదిలిన్నాడే  తెలుగుజాతి మొత్తం బాగుపడేది. అదెలగంటావా? మొదటగా తెలుగు టీవీ చానెల్ యజమానులందర్నీ కూచోబెట్టి,  దేశభక్తికంటే గెట్టిగా తెలుగుభక్తిని ఒళ్లంతా నలుగుపిండిలా రుద్ది తలంటు పొయ్యాలి.  (తెంగ్లిష్ మదగజాన్ని అణచగలిగే అంకుశాలున్న అసలైన మావటీలెవరో బానే కనిపెట్టేవుగానీ వాళ్ళని లాక్కొచ్చి ఆ ఉద్యోగంలో పెట్టే శక్తి ఎవరికుందో చెప్పలేవు శీనూ నువ్వు.).  తెలుగుమాటల మధ్యలో అతిగా ఇంగ్లీష్ ముక్కలు వేస్తూ దీన్నో వ్యాధిలా అందరికీ అంటించడాన్ని దేశద్రోహనేరమంత..  అదేలే.. భాషాద్రోహనేరమంత  హీనంగా చూస్తూ వేళాకోళం చెయ్యాలి.  ఎవరైనా “సండే.. థర్టీయత్ నైట్.. టూ లాక్స్ తీస్కుని స్టార్ట్ అవుతున్నా”… అంటుంటే  “టీవీ, కంప్యూటర్, కామెరా లాంటివాటికి సరేగానీ  ‘ఆదివారం.. ముప్పయ్యో తేదీ రాత్రి… రెండులక్షలు తీస్కుని బయల్దేరుతున్నా’ అని చెప్పడానికి ఇంగ్లీషుముక్కలెందుకు బంగారూ?” అని నెత్తిమీద సోలడు నూనింకిపోయీలా కొట్టీయాలి. తెలుగుమాటలు అందిస్తూ అంటిస్తూ పోవాలి.  (ముక్యమంత్రిగోరే  తెంగ్లిష్ ని నాలికమీదున్న సరస్వతీదేవిలా మొక్కీసోట  ఇయన్నీ చేసీదెవులో చెప్పకుండా నీ గోలేందిరా?)  ఇంతకు ముందు ఇరుగు పొరుగుల్తో సుబ్బరంగా తెలుగులో మాటాడుకునే ఇల్లాళ్ళభాషని కూడా చెడగొట్టి తెంగ్లిష్ ని నాటుకుంటూపోతున్న టీవీ చానెళ్ళని ఏం చేసినా పాపం అంటదు.  తెలుగు మాటా పాటా మర్చిపోయి,  బుల్లితెరల మీద సినిమాపాటలు పాడి ఎగురుతూ,  టీవీ పీతబుర్రలు కనిపెట్టిన వెర్రాటలాడుతూ, ‘ఆరెంజ్ కలర్ టాప్ మీద జరీ వర్క్ చేసిన హాండ్స్ తో గ్రీన్ కలర్ బాటమ్, కాంట్రాస్ట్ గా బ్లాక్ కలర్ చున్నీ ఉన్న డ్రెస్ నో, పింక్ కలర్ బాడీమీద రెడ్ కలర్ ప్రింట్స్ వేసిన రిచ్ సిల్క్ సారీనో బ్యూటిఫుల్ గిఫ్ట్స్ గా కొడుతూ’ కాలం దొర్లించేస్తున్నారు కొంతమంది ఇల్లాళ్ళు.

అసలూ,  తెలుగురాని వింతజీవాల్ని ఏంకర్స్ అనే పేరుతో మనమీదికి వొదుల్తున్న టీవీ చానెల్ యజమానులు ఇంగ్లీష్ ముక్కలతోనే జ్ఞానం వొచ్చీసిందనుకునే జడ్డితనాన్ని పక్కనపెట్టి,  ఓ చిన్నపని చెయ్యొచ్చుగా!  ఒక్క రెండునెల్లంటే రెండునెల్లు.. టీవీ వ్యాఖ్యాతలుగా ఉద్యోగమిచ్చి తీసుకున్న వాళ్ళనందర్నీ ఓచోట కూచోబెట్టి తెలుగులో శిక్షణ ఇప్పిస్తే వాళ్ళకున్న కోట్లు కరిగిపోతాయా? నడ్డివంచి తెలుగుని వడ్డిస్తే, ఇప్పుడు మాట్లాడుతున్న పిచ్చిభాష మళ్ళీ మాటాడే ధైర్యం చెయ్యగలరా ఈ వ్యాఖ్యాతలు?  చైనావాళ్ళంతటి వాళ్ళే మనవాళ్ళతో ‘మీ పేరేమిటి?’ అనడగటానికి ఎంతోకష్టపడి ఇంగ్లీష్ లో మర్యాదగా ‘వ్హాటార్యూ?’ అంటూ పాపం తప్పోతడకో ఏదోటి మాటాడేసి వ్యాపారవృద్ధి  చేసుకుంటూపోతుంటే,  ఉద్యోగం నిలబెట్టుకోవడంకోసం మనవాళ్ళు మనభాషని ఆపాటి నేర్చుకోలేరా?”

“ఒక కీలకం ఉంది సుబ్బూ.. ‘అన్యాయాలో, అక్రమాలో, హిందూమతపు జడలదెయ్యాలో, వర్గపోరాటాలో, ఆలో పొలో’మంటూ ఆయాసపడేవాళ్ళ  పూలు పుయ్యని ముళ్ళగులాబీపొదలాంటి భాషని టక్కున కత్తిరించి పడేసి సరికొత్త జాతీయాన్ని అందుకుని శైలీ ప్రకటన (స్టైల్ స్టేట్మెంట్ ని ఇలా తెలుగు చేశారా గురూగారూ ?) చేసీసేడు చూడూ.. ఆ కుర్రాడిలా దారి తియ్యాలి.  భావాల ఎత్తూ ఆదర్శాల లోతూ ఇవాళ ఎవరికీ అక్కర్లేదమ్మీ!  దేనిగురించైనా ప్రచారం ఎంత తెలివిగా చేసేవాఁ అన్నదే కిటుకు. తెంగ్లిష్ మీద విరుచుకుపడి, ‘చక్కగా తెలుగు మాట్లాడ్డమే, తెలుగుతో ప్రయోగాలు చెయ్యడమే నాగరికత’ అనుకునేంతగా తెలుగువారందరిలోనూ స్వాభిమానం గంతులు వేసేలా శైలీప్రకటన చెయ్యగల ధీరులు వొచ్చేవరకూ ఇంతే సంగతులు” రొప్పుకుంటూ ఆగింది బండి.

అవకాశం దొరికింది కదాని ముందుకి దూకి,

“ఓకే బాస్. ఏదో పెరిఫెరల్గా మాట్లాడుతూ, ఇంగ్లీష్ వైరస్ ఇంతగా గ్రో అవడానికీ మన రెసిస్టన్స్ లేమికీ గల కారణాలజోలికి వెళ్ళకుండానే ప్రాబ్లెమ్ ని మీరు డీప్ ఫ్రై చేసారనీ,  సాల్వ్ చేసే వర్క్ కి పూనుకున్నారనీ అర్థం అవుతోంది. ఏదెలావున్నా మీరు చెప్పినట్టు తెలుగువంటని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్ట్ చెయ్యడం ముఖ్యం.  మొదటిగా తెలుగులాంగ్వేజ్  మిల్క్ ని విలేజెస్ నుంచి ముందురోజు నైట్ కలెక్ట్ చేస్కుని, దాన్లోవున్న కొద్దిపాటి ఇంగ్లీష్ నలకల్ని ఫిల్టర్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీనికి భాషాభిమానం అనే సుగర్ ని ఏడ్ చేసి, పరభాషాద్వేషం అనే చిటికెడు ఇలాచీ పొడిని మిక్స్ చెయ్యాలి.  ఇది ఎక్కువేస్తే పాకం స్పాయిల్ ఔతుంది సుమా.. తరువాత  డయలెక్ట్ అనే ఊక స్టవ్ మీద నేటివిటీ అనే ఇత్తడి కడాయిపెట్టి ఈ మిక్స్ ని డైరెక్ట్ గా వేసి కంటిన్యువస్ గా ఇడియమ్ అనే తెడ్డుతో తిప్పితే ఒకటి రెండు డికేడ్స్ అయ్యాక చక్కటి తెలుగుకోవా స్మూద్ గా టేస్టీగా వస్తుంది. ఈ పని కలెక్టివ్ గా తెలంగాణా ఉద్యమం రోజుల్లో రోడ్లమీద చేసిన వంటలంత ఇంటెన్సివ్ గా చెయ్యాలి.  నీ ప్రభావంతో నేను కూడా ఈజీ సొల్యూషన్స్ చెప్పేస్తున్నా చూసేవా శీనూ!  పోనీ కుంభకర్ణుణ్ణి బుల్లి రాక్షసులు నీడిల్స్ తో పొడిచినట్టు ఆన్లైన్ పిటిషన్స్ పెట్టి మీడియాని పొడుద్దామా?  సరే.  అదలా వుంచి, మన తెలుగు పాలకోవాలోకి వచ్చేద్దాం. డిఫెరెంట్ రుచున్న ఈ స్పెషల్ తెలుగు డిష్ వెరైటీని కొత్త జెనరేషన్ పిల్లలు ఎంజాయ్ చెయ్యటం స్టార్ట్  చేసారంటే తెలుగుమమ్మీ శ్రమ ఫలించినట్టే.  ఎక్సెలెంట్ టేస్ట్ తో ఉన్నఈ కొత్త తెలుగుభాష కాన్సెప్ట్ సినిమాల్లోకి ‘వర్కౌట్’ ఔతుంది. తెలుగు ఫిక్షన్లోకి కూడా ఇంపోర్ట్ ఔతుంది”  అని  చెప్పుకుపోతూ అంతలో తెలివి తెచ్చుకుని,  “అయ్యో, ఏంటో శీనూ, ఒక్కరగంట ఏ తెలుగు టీవీచానెల్ చూసినా, వాటిలో మూడోతరం తెలుగు సినిమా హీరోలూ ముంబై హీరోయిన్ల ముచ్చట్లు విన్నా నాకిలాంటి మాటలే ఒచ్చిస్తున్నాయ్.  వీళ్ళ మధ్య ఝాన్సీ లాంటి మేలిమి బంగారు  వ్యాఖ్యాతలక్కూడా కిలుం పట్టిపోతోంది.” అని గింజుకున్నాను.

“ఇంగ్లీష్, తెలుగు అనే రెండు అందమైన భాషలు పెళ్ళాడి బుజ్జి తెంగ్లిష్ ని ఎప్పుడు పుట్టించేయో మనకి సరిగ్గా అర్థం కాకముందే అది వామనావతారంలా ఎదిగి మననెత్తిన కాలు పెట్టేసింది. ఈ బిడ్డకి ఊబవొళ్ళు వొచ్చేసిందని  అనుకునేవాళ్ళు తక్కువమంది. ఆ కాలు కిందే ఇంకెన్ని తరాల తెలుగువాళ్ళు బతుకుతారో తెలీటం లేదు. ఇప్పటికే సగం చచ్చిన తెలుగు ఇంకే అవతారం ఎత్తుతుందో అంతకన్నా తెలీదు.  ఏంచేస్తాం? ఇప్పుడు నెమ్మదిగా మన చిన్నప్పటి తెలుగుపాఠానికి రా.  చెంపకు చెయ్యి పరంబగునపుడు కంటికి నీరాదేశంబగును. తెంగ్లిష్ నీకు ఎక్కినపుడల్లా చిన్నప్పటి ఈ సంధిసూత్రం గుర్తు తెచ్చుకుంటూ లెంపకాయ్ వేసుకో.  బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా అన్నాడు వేమన. తెలుగుటీవీ ఏంకర్లనే గ్రహాంతరవాసుల్లోంచి ఉద్భవించి, సమాజానికంతటికీ పట్టిన తెంగ్లిష్ భూతాన్ని పచ్చపచ్చని తెలుగువేపమండల్తో తన్ని మరీ వదిలిస్తే తప్ప మనజాతి బాగుపడదు. జాతి మొత్తం గొడవ మనకెందుగ్గానీ నీపాటికి నువ్వు ఎప్పుడైనా టీవీ చూస్తే తెలుగు వేపమండల వైద్యం చేసుకుంటూ ఉండు” అంటూ ప్రకాశ్ రాజ్ లా నవ్వేడు మా శీనుగాడు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

స్మితా పాటిల్: వెలిగి నిలిచిన రూపం…

 

 

ల.లి.త.

~

 

    ల.లి.త.

మట్టిప్రమిదలో వెలిగిన దీపం ఆమె. చుట్టుగుడిసె ముందు పెట్టిన మట్టిప్రమిదలోని దీపానికి ఉన్న ఆకర్షణకి ఏది సాటి? నూనెదీపం చీకటి అసల్లేనేలేదనే భ్రాంతి కలిగించదు. చీకట్లని చిన్నగా చెదరగొడుతూ వెచ్చటి కాంతిని పరుస్తుంది. గాలేస్తే వణుకుతుంది. చినుకు మీదపడబోతే ఆరినంతపని చేస్తుంది. నూనె సరిగ్గా అందకపోతే కొడిగడుతుంది. ఎక్కువ అందితే పెద్ద జ్వాలవుతుంది. భ్రమించిన రెక్కలపురుగుల్ని చుట్టూ తిప్పుకుంటుంది. పంచభూతాలనీ పరవశించి మరీ నశిస్తుంది.

‘స్మితాపాటిల్’ అనుకోగానే అందంగా గాఢంగా వెలిగే మట్టిదీపం, మెత్తటి నాగేటి చాలు, ఆషాఢపు జల్లుకు తడిసిన నేలవాసనా, బలమైన సరుగుడు చువ్వా గుర్తొస్తాయి. స్మిత జీవితం పుస్తకంగా వస్తే బాగుండుననిపించేది. ఇన్నాళ్ళకి వచ్చేసింది. స్మిత జీవితంలోని ఒక్క మలుపునీ మెరుపునీ కూడా వదిలిపెట్టకుండా మైథిలీ రావు “Smitha Patil, A brief Incandescence” ను ఎంతో ప్రేమతోనూ ఇష్టంతోనూ రాసింది.  స్మిత జీవితఝరిని తమ జ్ఞాపకాల దోసిళ్ళలోంచి ఆమె తల్లీ, ఆమె స్నేహాన్ని ఎప్పటికీ మరచిపోలేని స్నేహితులూ అందిస్తే  మైథిలీరావు ఆ గంగను అందరికీ పంచింది.

ఒక్క పన్నెండేళ్ళే. అంతకంటే ఎక్కువ లేదు స్మితాపాటిల్ సినిమాల్లో నటించిన కాలం. 1955లో పుట్టిన ఈ నల్లటి బక్కపిల్ల న్యూ వేవ్ సినిమాని వెలిగిస్తుందని ఎవరూ ఊహించలేదు. తల్లి విద్యాతాయి నర్స్ గా పనిచేసింది. సంఘసేవిక కూడా. తండ్రి శివాజీరావు పాటిల్ రాజకీయాల్లో ఉండేవాడు. ఇద్దరూ తమ కులమేమిటో పిల్లలకు చెప్పకుండా పెంచిన ఆదర్శవాదులు. అందరికీ ఉపయోగపడటమే జీవితం అనుకున్నవాళ్ళు.  వాళ్ళ ముగ్గురాడపిల్లల్నీ రాష్ట్రీయ సేవాదళ్ అనే గాంధీవాద సంస్థలో చిన్నప్పుడే చేర్పించారు. దానితో వాళ్లకి కులమతభేదాలు లేకుండా అందరూ సమానమే అనుకోవటం చేతనయింది. చిన్న స్మిత tomboy లా తిరుగుతూ మగపిల్లలతో వాలీబాల్ ఆడుతూ, వాళ్ళని తిడుతూ తిరిగేదట.

సినిమాల్లోకి వస్తానని స్మిత ఎప్పుడూ అనుకోలేదు.  దూరదర్శన్లో మరాఠీ న్యూస్ ప్రెజెంటర్ గా స్మితను రోడ్డుమీద టీవీ షాప్ లో చూసిన అరుణ్ ఖోప్కర్ తన ఇరవై నిముషాల FTII డిప్లొమా ఫిల్మ్ “తీవ్ర మధ్యమ్ (1974)” లో ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు. బహుమతులతోపాటు మంచిపేరు కూడా వచ్చిన డిప్లొమా ఫిల్మ్ అది.  అందులో తాన్పురా పట్టుకుని నిశ్చలంగా నిర్మలంగా ఉన్న స్మిత రూపాన్ని షబానా అజ్మీతో సహా చాలామంది కళ్ళు ఫోటో తీసుకున్నాయి.  కామెరా ఆమెతో ప్రేమలో పడిపోవటం అక్కడే మొదలైందంటారు మైథిలీ రావు.

తరువాత శ్యాంబెనగల్ ‘చరణ్ దాస్ చోర్’ లో చిన్న వేషమిచ్చాడు. ఇక వరుసగా జబ్బార్ పటేల్, బెనెగల్, ముజఫర్ అలీ, మృణాల్ సేన్ ఇంకా న్యూ వేవ్ సినిమా మహామహులందరికీ స్మితాపాటిల్ ముద్దుబిడ్డయిపోయింది. 70, 80 ల్లో దేశమంతటా పరమచెత్త అని ఏకాలంలోనైనా ఎవరైనా చెప్పగల సినిమాలు వచ్చేవి. మరోపక్క సత్యజిత్ రాయ్ నీ, ఫ్రెంచ్ న్యూ వేవ్ నూ, రిత్విక్ ఘటక్ నూ అనుసరిస్తూ సినిమా అంటే ఒట్టి కలే కాదు మన బతుక్కూడా కావచ్చని చెప్పేవీ,  సినిమాకి ‘కళా’యిపూత పెడితే మెరుస్తుందని కూడా చెప్పేవీ కొన్ని సినిమాలు వచ్చేవి. 90ల నుండీ ప్రపంచవ్యాపారంతో మనం ఏకమవటం మొదలెట్టాక ‘న్యూ వేవ్ సినిమా’ సారంలోనూ రూపంలోనూ అరుదై, పూర్తిగా నశించింది.

స్మితాపాటిల్ దశావతారాలు గా 10 సినిమాలను ఎన్నుకుంది మైథిలీ రావు. అవి మంథన్, జైత్ రే జైత్ (మరాఠీ), భూమిక, అకాలేర్ సంధానే(బెంగాలీ), చక్ర, ఉంబర్తా(మరాఠీ)/సుబా(హిందీ), అర్థ్, బాజార్, తరంగ్, ఆఖిర్ క్యూఁ.  వీటిలో ఒక్క ‘అర్థ్’ మాత్రం పూర్తిగా షబానా అజ్మీ సినిమా.  తను షబానా పక్కన చిన్నగీత అవుతానని తెలిసీ స్మిత అందులో వెయ్యటం గొప్పధైర్యంతో చేసిన పని. సాటి స్త్రీ సంసారాన్ని పాడుచేసిన(?) రెండో స్త్రీగా అప్పటి సమాజం ఏ మాత్రం సానుభూతికి చోటివ్వని బలహీనమైన పాత్ర.  ఆ బలహీనురాలి  split personality ని తను ఎంతబాగా చూపించగలదో తెలియచెప్పడానికే స్మిత ‘అర్థ్’ లో చేసి ఉండొచ్చు. ఏదయినా చేసెయ్యగలనన్న ధైర్యం తనకుండేది. (‘ఇజాజత్’ లో అనూరాధా పటేల్ వేసిన neurotic other woman ను చూస్తే ‘అర్థ్’ లో స్మిత నటనలోని పస తెలుస్తుంది).

smita1

చిన్న వూరినుంచి వచ్చి (అప్పటి పూణేకు ఇప్పటంత నాజూకుతనం లేదు. పైగా స్మిత చదివింది కాన్వెంట్ లలో కాదు) సినిమాల్లో నిలదొక్కుకోవటమే కష్టంగా ఉన్న స్మితకు షబానాఅజ్మీతో పోటీ పెద్ద బాధ అయిపోయింది.  ఉప్పూ నిప్పూలాంటివాళ్ళు ఇద్దరూ. షబానాలో మనసుకంటే బుద్ధి ఎక్కువగా పనిచేస్తుంది. స్మిత సరిగ్గా ఆమెకు వ్యతిరేకం. పైగా తమ ఇద్దరి నటనకీ పోలిక తేలేని ‘అర్థ్’ లాంటి సినిమాలో పోలిక తెచ్చి,  స్మిత రెండో నాయికగానే పనికొస్తుందని షబానా అనటం ఆమెను మండించింది.  ‘అర్థ్’ లో స్మిత నటనను ఆమె దశావతారాల్లో ఒకటని చెప్పి   మైథిలీరావు షబానామీద sweet revenge తీసుకున్నారు.

‘చక్ర’, ‘మంథన్’ లాంటి సినిమాల్లో ఊరిని ఒంటినిండా నింపుకున్న స్మితను చూశాక,  తనకు బైక్ నీ  కార్లనీ   వేగంగా నడపటం ఇష్టమనీ, ఎప్పుడూ జీన్స్ లోనే ఉండేదనీ తెలుసుకోవటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఫోటోలు కూడా చక్కగా తీసేదట. దూరదర్శన్లో వార్తలు చదివేటప్పుడు జీన్స్ మీదే మంచి నూలుచీరలు కప్పుకుని చదివేసేదట. స్టార్ కి ఉండాల్సిన లక్షణాలు అసల్లేవని దిలీప్ కుమార్, రాఖీ మూతులు విరిచారట. చిన్నప్పటి రాష్ట్రీయ సేవాదళ్ స్నేహితుడు తరువాత జూనియర్ ఆర్టిస్టుగా కనిపిస్తే అంత మందిలోనూ స్నేహంగా వాటేసుకుని అతన్ని ఇబ్బందిలో పెట్టేసిందట. అల్లరిస్మితనీ,  సాయం చెయ్యటానికి ఎప్పుడూ ముందుకురికే స్మితనీ ఎంతో ఇష్టంగా గుర్తు చేసుకున్నారు స్నేహితులు. ‘అకాలేర్ సంధానే’ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా సర్దుకుపోతూ, అందరూ మాంసం, చేపల్తో భోజనం లాగిస్తుంటే, వంటమనిషినడిగి ఓమూల స్టవ్ మీద తను అన్నం, కూరగాయలు వండుకు తినేదట. కరువు ప్రాంతంలోని పేద రైతుకూలీగా ఆమెను తప్ప వేరెవరినీ ఊహించలేనని ధ్రితిమాన్ చటర్జీ (నటుడు) చెప్పాడు. “ఆమెలో పల్లెటూరి అమ్మాయిల ఒంటికదలికల్లాంటి ఒక లయ ఉంటుంది.. మిరపకాయకో రుచీ వాసనా ప్రత్యేకంగా ఉన్నట్టే  స్మిత వ్యక్తిత్వానికి ప్రత్యేకత ఉంటుంది”  అంటాడు అరుణ్ ఖోప్కర్.

ఈ వజ్రాన్ని మెరుగు పెట్టినవాడు శ్యాంబెనెగల్.  మరాఠీనటి హంసావాడ్కర్  జీవితం ఆధారంగా తీసిన “భూమిక’ లో చేసేనాటికి స్మిత వయస్సు ఇరవై ఒక్కేళ్ళు. ఇంకా జీవితమే తెలీని ఆవయసులో,  మొగుడితో బాధలు, ముగ్గురు మగవాళ్ళతో ప్రేమలు, నటన, నాట్యం, పాట … ఇలా ఎన్నో అలజడులున్న హంసా వాడ్కర్  పూర్తి జీవితంలోని ప్రతివొక్క షేడ్ నీ చూపెట్టేస్తుంది స్మిత.  తను మిగతావారిలా NSDలోగానీ  FTIIలో గానీ నటనలో శిక్షణ తీసుకోలేదు. అయినా పుణేలోని FTII  లో స్నేహితులతో తిరుగుతూ ఎప్పుడూ కనిపిస్తూ ఉండటంవల్ల  FTII లో చదువుతోందేమో అనుకునేవారట. నిజానికి శ్యాం బెనెగలే స్మితకు గురువు. ఏదైనా ఇట్టే పట్టేసే చురుకుతనం ఆమె జీవలక్షణం.  సంతోషమొస్తే చిన్నపిల్లలా కీచుగొంతుతో నవ్వే స్మితనవ్వును హస్కీగా తీర్చి, ‘గుండెలోంచి మాట్లాడు’ అని చెప్పి ఆమె ‘నిండుగొంతుక’ను బైటకు తెచ్చాడట శ్యాం బెనెగల్.

స్మిత అందం కూడా వేరే.  నలుపురంగు. ఎదుటివాళ్ళని నిలబెట్టేసే సాంద్రమైన కళ్ళు.  పక్కనుంచి చూస్తే చెక్కిన శిల్పంలాంటి మొహం, పొడవైన మెడా, ‘సన్నగా ఉన్నానని నా శక్తిని తక్కువ అంచనా వెయ్యకండ’ని హెచ్చరించే దృఢమైన చెక్కిళ్ళూ, నిండు పెదవులూ, చువ్వలా నిటారుగావుండే ఆకారం .. ఇవీ స్మితంటే. పెద్దగా ఆరోగ్యవంతురాలు కాదు. ఏ కోణంలోనుంచి చిత్రీకరించినా ఆమె అందంగానే ఉంటుందంటాడు గోవింద్ నిహలానీ.  నిజానికి మరీ అందం ఉట్టిపడే ఐశ్వర్యా రాయ్ లాంటి నటుల్ని చూస్తూ, నటన కంటే మనం వాళ్ళ అందాన్ని ఎక్కువ ఆస్వాదిస్తూ ఉండిపోతాం. స్మిత ఫోటోజనిక్ మొహంలోంచి సినిమాపాత్ర వ్యక్తిత్వం, బలం, బలహీనతా అన్నీ ముందుకు వస్తాయి. గాఢమైనకళ్ళతో మాట్లాడే మనదేశపు ఆడవాళ్ళ sensuality ని  స్మితాపాటిల్ తో ఎంతబాగా చూపించవచ్చో అర్థమయింది ఆర్ట్ హౌస్ సినిమా దర్శకులకు. ‘భూమిక’, ‘మంథన్’ (శ్యాం బెనెగల్), ‘ఉంబర్తా’ (జబ్బార్ పటేల్), ‘చిదంబరం’ (అరవిందన్), ‘తరంగ్’ (కుమార్ సహానీ) సినిమాలు ఆమె స్త్రీత్వానికి హారతిచ్చేశాయ్. ‘నమక్ హలాల్ ’ లో ‘ఆజ్ రపట్ జాయేతో హమే నా ఉఠయ్యో’ అంటూ స్మిత, అమితాబ్ బచ్చన్లతో ప్రకాష్ మెహ్రా  చేయించిన వానపాటలో ఆమె ఆడతనం చిన్నబోయింది.  ఆ పాట చేశాక స్మిత బాగా ఏడిస్తే  అమితాబ్ తనని ఎదగమని(?!!) సలహా యిచ్చి ఓదార్చేడట. ‘ఉంబర్తా’ లాంటి స్త్రీవాద చిత్రాన్నీ ‘నమక్ హలాల్’ లాంటి పక్కా కమర్షియల్ సినిమానీ  ఒకేసారి చేసిందట. పదిరోజులు ‘ఉంబర్తా’ షూటింగ్ చేస్తే మరో పదిరోజులు ‘నమక్ హలాల్’.  నటిగా ఆమెది ఎంత స్కిజోఫ్రెనిక్ బ్రతుకో  చెప్పటానికి ఇది చాలంటాడు జబ్బార్ పటేల్. వ్యాపార, సమాంతర చిత్రాల్లో దేనికెలా చెయ్యాలో సరిగ్గా అర్థం చేసుకునే తెలివి ఉంది కాబట్టే అంతబాగానూ రెండిట్లోనూ నెగ్గిందని ఓంపురి అంటాడు.

 

‘చక్ర’ సినిమాలో ఆమె చేసిన స్నానంసీను పెద్దపోస్టరైపోయి  అంతటా కనిపించటం స్మితను బాధించింది. నిజానికి ఆ దృశ్యం ఉద్దేశ్యం మురికివాడల్లో ఉండేవాళ్ళ జీవితంలో దేనికీ ఏకాంతం దొరకదని చూపించటమే. అక్కడ ఆడవాళ్ళు బైట పంపు దగ్గర స్నానం చెయ్యటం చాలాసహజం. ఇప్పుడా సీన్ పెద్దవిషయం కాకపోవచ్చు గానీ 80ల్లో సాహసమే.   స్మిత గట్టినిజాయితీతో  ‘చక్ర’ లో ‘అమ్మ’ పాత్రకున్న బలాన్నీ  ధైర్యాన్నీ చూపిస్తూ  ఆ సినిమాలోని ‘voyeurism’ ను దాటి నిలవగలిగిందని మైథిలీ రావు అంటారు.

smita4

వ్యాపార చిత్రాల్లో చేస్తే స్టార్ డమ్ వస్తుంది కాబట్టి ఆ ఆకర్షణతో తను చేసే సమాంతర సినిమాలకు ఎక్కువమంది జనం వస్తారనీ, అలా సమాంతర సినిమాను గెలిపించాలన్న ఆలోచనతోటే వ్యాపార చిత్రాలు చేస్తున్నాననీ  స్మిత చెప్పేది. అలా అనుకుంటూ చెత్త సినిమాలు కూడా చేసేసింది. వాటిలో ‘ఆఖిర్ క్యూఁ’ తప్ప చెప్పుకోదగ్గది లేదు. అయినా వాటిలో ఆమె ఎంత నిజాయితీగా చేసిందో వివరిస్తూ ఆ సినిమాకథలు కొన్ని రాసుకొచ్చింది  మైథిలీరావు . విసుగనిపించినా స్మితాపాటిల్ చేసిన ప్రతి పాత్రనూ ఆవిడ వర్ణించటం వల్ల సమాంతర, వ్యాపార చిత్రాలు ఎంత భీకరమైన తేడాలతో ఉండేవో బాగా అర్థం అవుతుంది.  ప్రతి దృశ్యంలోనూ ఆమె నటనను వర్ణిస్తూ మోహంలో పడిపోతారు మైథిలి.  నిజానికి స్మితను ఎప్పుడూ కలవనేలేదట ఆవిడ.

స్మితాపాటిల్ అంటే గాఢత (intensity) కు నిర్వచనం అంటారు ప్రతి ఒక్కరూ.  “తనే పాత్రగా మారిపోయి లీనం కావటం స్మిత పధ్ధతి కాదు. దర్శకుడికి తనలోని నటిని పూర్తిగా అప్పచెప్పి ఆమె మనసుకు తోచినట్టు నటిస్తుంది. లోపలున్న intensity  ఆమె వేసే పాత్రల మనసు మూలాల్లోకి  ప్రవహిస్తుంది. అందువల్ల చెత్త సినిమాల్లో కూడా ఆమె చేసినపాత్రల ఉద్వేగాలు మనల్ని నమ్మిస్తాయి.  స్మితలాంటి గొప్ప నటులు నటనలో చాతుర్యాన్ని కూడా దాటేసి ఆ సినిమాలు మన జ్ఞాపకాల్లో భాగమైపోయాక కూడా ఎప్పటికీ మనల్ని తాకుతూనే ఉంటార”ని బంగారంలాంటి మాటంది మైథిలీ రావు.

స్మితాపాటిల్  తను నటిస్తున్న పాత్రలు ఎలాటిచోట పుట్టేయో ఎలా నడిచి ఎలా నవ్వి  ఎలా మాట్లాడి  బతుకుతాయో, ఎలాటి బట్టల్లో కనిపిస్తాయో లోతుగా తెలుసుకుంటుందని, ఆలాంటి కుతూహలం అందరిలోనూ ఉండదనీ ‘అనుగ్రహం’ సినిమాకి పనిచేసిన ఆరుద్ర అనేవాడు.

స్మిత తల్లి విద్యాతాయి గట్టిగా కర్రపట్టుకుని పిల్లలను పెంచింది. ఆవిడతో ఎంత ఘర్షణ పడ్డా తల్లే స్మితకు రోల్ మోడల్. ‘ఉంబర్తా’లో సంఘసేవికగా వేస్తున్నప్పుడు ప్రతి నిముషం అమ్మను గుర్తుచేసుకుంటూ నటించిందట. ‘ఉంబర్తా’ కథ విన్నాక జబ్బార్ పటేల్ తో ‘ఈ సినిమా నాదే. ఇంకెవరినైనా తీసుకుంటే నిన్ను చంపేస్తా’నందట. రాజ్ బబ్బర్ తో స్మిత పెళ్లిని విద్యాతాయి ఒప్పుకోలేకపోయింది. బిడ్డను దూరం చేసుకుంది. స్మిత తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు ఫిల్మ్ జర్నలిస్టులు తీవ్రంగా విమర్శించారు. ఒక్క స్నేహితులే వ్యక్తిగా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. “సమాంతర సినిమాకి  పోస్టర్ గర్ల్ లాంటి  స్మితాపాటిల్, నిజజీవితంలో పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నవాడిని  ప్రేమించటాన్ని ఆమె వ్యక్తిత్వంలో భాగంగా సమాజం చూడలేకపోయింద”ని చెప్తాడు మహేష్ భట్. స్మితాపాటిల్ లో కూడా ‘అర్థ్’ లో ఆమె వేసిన పాత్రలోని వైరుధ్యం లాంటిదే ఉందంటాడు. స్మిత చిన్నప్పటినుంచీ తాననుకున్నదే చేసేదట. ‘తను బొహీమియన్’ అంటాడు ఓం పురి. ఓరాత్రి  అందరు స్నేహితులూ కలిసి మాట్లాడుకుంటూ ఓ గదిలో ఉండగా ఓంపురి ఒక్కడినీ బైటకు తీసుకుపోయి నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ఆవరణలో కాసేపు కూర్చుని మాట్లాడిందట. “ఆమెను చూసి ఐదు నిముషాల్లోనే  ప్రేమలో పడని మగవాళ్ళు ఉండరు. ఆమెతో మాట్లాడిన ప్రతివాడూ తననే ప్రేమిస్తోందనీ అనుకుంటాడు. తన ఉద్దేశ్యం అదికాదని ఆమె స్పష్టం చేశాక ఒడ్డునవేసిన చేపలా గిలగిలా కొట్టుకుంటాడు” అంటాడు మోహన్ అగాషే.

రాజ్ బబ్బర్ తో తన పెళ్ళిని అందరూ ఒప్పుకోవాలని అనుకోవటం ఆమె అమాయకత్వం.  పసుపు కుంకుమలూ, పేరంటాలకు విలువిచ్చేదనీ, సీమంతం కోసం ఆరాటపడిందనీ చెప్తుంది మైథిలీరావు కథనం. తను సహచరులుగా ఎన్నుకున్న మగవాళ్ళు కూడా ఆమెకు తగనివాళ్ళే.  “మగవాళ్ళకు నాతో బతకటం చాలా కష్టం. నన్ను నేను ఎంతగా ఇచ్చుకుంటానో అంతగానూ నావాడి నుండి తీసుకోవాలనుకుంటాను. అంత ఆదర్శంగా పరిస్థితి లేద”ని చెప్పిందట స్మిత. గంగమ్మలాంటి స్మితను మోయగల నిబ్బరం ఉన్న శివుడు ఆమె సర్కిల్లో దొరకటం అంత అసాధ్యమేమీ కాదనిపిస్తుంది.  పెళ్లి విషయంలో తనను గట్టిగా తప్పుపట్టిన జర్నలిస్టులను పట్టించుకోకుండా ఉండలేకపోయింది. వ్యాపార చిత్రాల్లో  తెగ నటించి ఆమె అంతరాత్మ అలిసిపోయింది. ఇక ఎక్కువకాలం అవి చెయ్యలేని పరిస్థితి కూడా వచ్చింది. పెళ్ళయిన స్టార్లకే రెండోభార్యలుగా మారిన హేమమాలిని, షబానాఆజ్మీ, శ్రీదేవిల నిర్ణయాలను కొన్నాళ్ళకి సమాజం ఒప్పుకుంది.  ఎలాంటి వ్యాపార చిత్రాల్లో నటించాలో ఎన్నుకోవటంలో కూడా షబానాయే స్మిత కంటే ఎక్కువ తెలివిగా ప్రవర్తించింది.

దీపక్ సావంత్ స్మితాపాటిల్ కి సొంత మేకప్ ఆర్టిస్టు. వ్యాపార సినిమాల్లో ఆమెను సున్నంకొట్టినట్టు కాకుండా సరైన లేతరంగుల మేకప్ లో చూపించటం అతని ప్రతిభ. స్మిత అతన్ని పదేపదే ఓ వింత కోరిక కోరేదట. తను చచ్చిపోయినప్పుడు తనను పుణ్యస్త్రీ (సుహాగన్)గా సాగనంపాలని..  Premonitions  తనకు వస్తుండేవట.  పిల్లలంటే చాలా ఇష్టం. గంపెడు పిల్లల్ని కనాలని కోరిక. కుటుంబంతో స్నేహితులతో సడలని బంధాలను అల్లుకుంది. తనా పరా అనేదిలేకుండా   ప్రేమను పంచుతూ పోవటమే.  సేవ చెయ్యటం, పరిచయమైన అందరితో కలిసిపోవటం, కోపమొస్తే తిట్టటమే తెలుసు. ఇప్పటికీ సినిమావాళ్ళు వాళ్ళ ప్రేమల గురించి పత్రికలతో మాట్లాడరు. ఎనభైల్లోనే స్మిత తనకు వినోద్ ఖన్నాతో  సంబంధం ఉండేదని ఫిల్మ్ ఫేర్ కి చెప్పేసుకుని తరువాతి  గోలను తట్టుకోలేకపోయిందట.  ‘తారా’ధూళిని  వెదజల్లటం చేతకాని మామూలు మనిషి…

స్మిత అమ్మకాబోయే రోజుల్లో నెమ్మదిగా విద్యాతాయికి దగ్గరయింది. సముద్రం విశాలంగా కనిపించే చోటా, బాల్కనీలో పడే వానజల్లుల్లో తను హాయిగా తడిసే వాలూ వీలూ ఉన్నచోటా ఒక అపార్ట్ మెంట్ ను బొంబాయిలో కొనుక్కుంది. తనఇంటిని కట్టడంలో శ్రమపడిన కూలీలే గృహప్రవేశానికి మొదటి అతిథులవాలనుకుంది. బిడ్డను కన్నాక  రాజ్ బబ్బర్ ను వదిలేస్తానని స్నేహితురాలితో చెప్పిందట. కొత్త ఇంట్లోకి వెళ్ళకముందే, ప్రతీక్ ను ప్రసవించిన రెండు వారాలకే డిసెంబరు 13, 1986 న బ్రెయిన్ ఫీవర్ తో మరణించింది. బాలెంత జ్వరంతో మూడురోజులు ఆమె హాస్పిటల్ కు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోవటం అర్థంకాని పజిల్. పరిస్థితి విషమించాక జస్లోక్ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు.

“ఆమె స్థానాన్ని ఇంకెవరూ పూరించలేరు” అన్నాడు సత్యజిత్ రాయ్. దీపక్ సావంత్ స్మితను సుహాగన్ లాగే ముస్తాబు చేసి సాగనంపాడు.

***

ఈ పుస్తకాన్నిబట్టి,  స్మిత చిన్నతనమూ 1974 నుంచీ 1980 వరకూ వేసిన సినిమాలూ చూస్తే, అభ్యుదయవాదులతో, మేధావులతో, కళాకారులతో సావాసం, స్వేచ్ఛ, తనకు సంతోషాన్నిచ్చే పాత్రలు, షబానాతో పోటీ.. ఇదీ ఆమె జీవితం. ‘80 నుంచీ ’86 లో  చనిపోయేవరకూ వ్యాపారచిత్రాలూ, వాటి జర్నలిస్టులూ, తారలూ కూడా తన జీవితాన్ని ఆక్రమించారు. రెండుచోట్లా బాగానే చేస్తున్నట్టు కనిపించినా రెండురకాల సినిమాల ప్రభావమూ ఆమె మీద పడిందేమో! బొహీమియన్ గా కనిపించిన మనిషి, పెళ్ళీ పసుపు కుంకాల సెంటిమెంట్లలోకి వెళ్లి మనసు బాధ పెట్టుకుందంటే, రెండు ప్రపంచాల మధ్యా సరిగ్గా రాజీ పడలేకపోవటమే అయుంటుందేమో అనిపించింది. నిండైన స్త్రీత్వం కూడా ఒక బాధే…

smita3

స్మితాపాటిల్ జీవితాన్ని తలుచుకుంటే నాకు అరుంధతీరాయ్ ‘గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్’లోని ఒక వాక్యం గుర్తు వస్తుంది. అందులో  రాహెల్ తనతల్లి అమ్ము చనిపోయిన వయసును (31 వ ఏట అమ్ము చనిపోతుంది) ‘a viable die-able age’ అంటుంది. 31 వ ఏటనే చనిపోయిన స్మితాపాటిల్ సినిమాజీవితం వరకూ ‘viable die-able age’ లోనే పోయింది. ఇంత నిస్పృహతో ఎందుకంటున్నానంటే ఆ తరువాత సినిమాల్లో వచ్చిన స్త్రీ పాత్రల్లో దమ్మున్నవి ఎంతవరకూ ఉన్నాయి? “మరో ‘ఉంబర్తా’ నా కోసం తియ్యవా?” అని జబ్బార్ పటేల్ ను బతిమాలారట తబూ, మాధురీ దీక్షిత్.  గాఢతలో స్మితాపాటిల్ కు తీసిపోని తబూ లాంటి నటులకు ఎన్ని మంచి సినిమాలు దొరికాయి?

ఊళ్లలో వాడల్లో ఉన్న ‘మిర్చ్ మసాలా’లాంటి  సోనుబాయ్, ‘మంథన్’ లో ‘బిందు’లాంటి దళితమందారం, ‘చక్ర’ ని తిప్పిన మహాశక్తి ‘అమ్మ’, ‘చిదంబరం’ శివగామి లాంటివాళ్ళని సినిమాల్లోకి తెచ్చేవాళ్ళెవరూ ఇప్పుడు లేరు.  సరైన సమయంలో పుట్టి, సరైన సమయంలో సరైన సినిమాల్లో వేసి వెళ్ళిపోయింది ఆమెలోని ఆర్టిస్ట్.  కానీ నిండుగా  జీవితాన్ని అనుభవించాల్సిన మానవి స్మితాపాటిల్ కథ అర్ధాంతరంగా ముగిసిపోయింది.  బతికుంటే 90ల నుంచీ తనకు తగ్గ సినిమాల్లేక మానసిక హింస పడేదేమో అనిపిస్తుంది, ఈ పుస్తకంలో ఆమె వ్యక్తిత్వం ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాక..

ఆంగ్ల సాహిత్య నేపధ్యంవున్న మైథిలీరావుకి నటన అంటే ఏమిటో బాగా తెలుసు. “Smitha Patil, A brief Incandescence”  చదివితే స్మితాపాటిల్ సినిమాలు చూడనివాళ్ళకు వెంటనే అన్నీ చూసేయాలనిపిస్తుంది.  స్మిత నిండైన స్త్రీ. పరిపూర్ణమైన కళాకారిణి. ఆమె జీవితచరిత్రను మైథిలీరావు లాంటి మనసున్న స్త్రీ రాయటం మరీ సంతోషం.

స్మితాపాటిల్ ను తలుచుకుంటూ శ్యాంబెనెగల్ విద్యాతాయికి ఉత్తరం రాస్తూ, జలాలుద్దీన్ రూమీ కవితను ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో చేర్చిన ఆ కవితతోనే …..

I died mineral and turned plant.

Died a plant to turn sentient.

Died a beast to wear human clothes.

So when by dying did I grow less?

Again from manhood I must die,

And once again released,

Soar through the sky

And here as well I must lose place.

Everything passes, but His face.

*

 

 

 

 

పోతే పోనీరా..

 

ల.లి.త.

~

    ల.లి.త.

డార్క్ కామెడీలు మన సినిమాల్లో చాలా తక్కువ.  ఒకే ఒక్కటి, “జానే భీ దో యారో”.  1983లో వచ్చిన మంచి డార్క్ చాక్లెట్ లాంటి ఆ సినిమాకి కొనసాగింపుగా 2010లో వచ్చిన ‘పీప్లీ లైవ్’ తప్ప మరోటి కనిపించదే! ‘జానే భీ దో యారో’ తీసిన కుందన్ షా కూడా మళ్ళీ అంత వాడిగా మరో సినిమా తియ్యలేకపోయాడెందుకో !

అనురాగ్ కాశ్యప్ ‘గాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ లో శుభ్రంగా తీసిన లంపెన్ కామెడీలో కొంచెం నల్లటి ఛాయలు తగిలినా, అతను చెప్పిన తరాల రక్తచరిత్రను పూర్తి హాస్య చిత్రం ‘జానే భీదో యారో’ తో పోల్చలేం. నల్ల కామెడీలో మన ప్రఖ్యాత ‘ముత్యాల ముగ్గు’ కాంట్రాక్టర్ ఎంత మాత్రమూ తీసిపోని ఘనుడే గానీ, ఆ కథ పూర్తిగా అతనిదైతే కాదు. ముత్యాల ముగ్గు “కుటుంబ కథా” చిత్రంలోని బూజు సెంటీ.. మ్మ్.. లాభం లేదు సెగట్రీ..

ఆవూ పులీ కథ చిన్నప్పుడు అందరం విన్నదే.. అడవిలో తప్పిపోయిన ఆవు పులికి దొరికిపోతుంది. దూడకి పాలిచ్చే టైం అయిందని పులిని వేడుకుని, ఆఖరుసారి పాలిచ్చి వచ్చేస్తానని ఒట్టేస్తుంది. ఆ నీళ్ళునిండిన నల్లకళ్ళ ఒట్టును నమ్మి, దొరికిన ఆహారాన్ని వదిలేయటం క్రూరపుకళ్ళ పులి నైజానికి పొసిగే పనేనా? దూడకు పాలిచ్చి పులికి ఆహారం అవటానికి ఆవు తిరిగిరావటం? రావచ్చేమో. బేలకళ్ళ అమాయకత్వంతో పుట్టిన జీవి కాబట్టి.. పులి కళ్ళనీళ్ళు పెట్టుకుని దాన్ని చంపకుండా వదిలిపెట్టటంతో మరీ అత్యాశావాదపు యుటోపియన్ కథైపోయింది. కలికాలం ధర్మం ఒంటికాల్తో నడుస్తుందని నమ్మే ధర్మాత్ములు కూడా ఈ కథని కృతయుగం కేటగిరీలోనే వేసేస్తారు.

దీనికి విరుద్ధంగా చిన్నప్పుడు అందరం వినే మరో పులీ మేకా కథ డార్క్ హ్యూమర్ కి సరిపోతుంది. మేక తనమానాన తాను నీటిపాయకు ఎగువన నీళ్ళు తాగుతుంటే దిగువవైపు నీళ్ళు తాగుతున్న పులి, మేకతో వాదానికి దిగుతుంది. ‘నువ్వు తాగి ఎంగిలి చేసిన నీళ్ళు నేను తాగాలా’ అని దెబ్బలాడి మరీ దాన్ని చంపేస్తుంది. మేకని చంపడానికి ఈపాటి కబుర్లు కూడా పులికి టైం వేస్టే. ఐనా తను ఎంత తెలివిగా మాట్లాడగలదో చూపించాలనే సరదా పుట్టి మాట్లాడుతుందంతే. నీటిపాయకు దిగువవైపు నీళ్ళు తాగినా మేక బతికేది లేదుగదా.  పులిన్యాయమే సృష్టిలో ఎక్కువగా అమలవుతుందని చెప్పేది డార్క్ హ్యూమర్.  (చదవండి రావిశాస్త్రిని). లోకంలోని చెడుని తేలిగ్గా హాస్యంగా ఎత్తి చూపించి, మంచి గెలిచి తీరుతుందనే నమ్మకాన్ని హేళన చేసే డార్క్ హ్యూమర్  సాహిత్యంలోనూ  సినిమాలోనూ కనబడే మంచి ప్రక్రియ. ఇవి రాసి, తీసి మెప్పించటం సులభంకాదు.  పేరుకే కామెడీగానీ ‘సత్యం వధ’ అనిచెప్పే ట్రాజెడీలివి.

***

‘హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్’ అని స్ఫూర్తిగీతం పాడుకుంటూ తిరిగే రకాలు ఒక్క శ్రామికులూ మానవ హక్కులవాళ్ళే నేంటి? దేశభక్తులూ అయాన్ రాండ్ శిష్యులూ కూడా ఈ పాటని సొంతం చేసేసుకున్నారు, చేగువేరాని చొక్కాల కంపెనీలు లాక్కుపోయినట్టు.  ఈ ‘కామ్యాబ్’ గీతాన్ని నిజానికి ఫోటోగ్రఫీ వ్యాపారంకోసం, అందులోనూ ఫాషన్ ఫోటోగ్రఫీతో కూడా పైకెదిగి పోవాలన్న ఆశతో పాడుకున్నా, ‘జానే భీదో యారో’ నాయకులిద్దరూ పాపం గట్టి నైతికవిలువల ఫ్రేం లో ఉండిపోయే మనుషులే.  జేబులో డబ్బులు పోలీసు కొట్టేసినా సరే, టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కడానికి బాధ పడేవాళ్ళే. అవినీతికి లొంగటంలోని సుఖంకంటే అవినీతిని బైటపెట్టటంలోని ఆనందమే ఎక్కువనుకునే జాతికి చెందినవాళ్ళే.

నసీరుద్దీన్షా మరియూ రవీ బస్వానీలు, ఫొటోగ్రఫీలో పేరూ డబ్బూ మూటగట్టేందుకు కలల వలల్ని భుజాలమీదేసుకుని  బొంబాయిలో ఓ ఫోటోగ్రఫీ దుకాణం తెరుస్తారు.  గుండెల్లో పూర్తి నమ్మకం నింపుకుని ‘హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్’ అనుకుంటూ తెరిచిన దుకాణంలో మూణ్ణెల్లయినా ఈగలు తోలేపని తప్ప ఇంకేం ఉండదు. ఇంతలో ‘ఖబడ్దార్’ పత్రిక ఎడిటర్ శోభా సేన్ (థియేటర్ నటి భక్తీ బార్వే అపూర్వంగా ఈ పాత్ర వేసింది) వీళ్ళకి ఓ పని అప్పజెప్తుంది.. మున్సిపల్ కమిషనర్ డిమెల్లో (సతీష్ షా)  కాంట్రాక్టర్ తర్నేజా (పంకజ్ కపూర్)ల అవినీతి లావాదేవీల ఫోటోలు రహస్యంగా తీసేపని. ఈ పనిని వీళ్ళు భక్తిశ్రద్ధలతో చేసి ఆమెకు సమర్పిస్తారు.  ఇక ఈ మేకల్ని వాడేసుకుని డిమెల్లో తర్నేజాల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు కొట్టేసే వ్యూహంలో ఆమె మునిగి వుండగా… న.షా మరియూ ర.బ.లు గొప్ప అవినీతి వ్యూహాన్ని ఛేదించి దేశసేవ చేస్తున్న ఆనందంతో పొంగిన ఛాతీలతో దూసుకెళ్ళి డిమెల్లో, తర్నేజా మరో కాంట్రాక్టర్ అహూజా (ఓం పురీ)ల అమర్యాదకర, అవినీతికర ఎన్కౌంటర్స్ ని టేపుల్లో రికార్డు చేస్తూ ఫోటోలు తీస్తారు. శోభా సేన్ ఇచ్చిన పన్లో దేశసేవ తప్పించి పైసలేం కనబడవు. కడుపుకోసం డబ్బు సంపాదన తప్పదు కదా ఇంకేం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే వీళ్ళకి నగదుబహుమతులిచ్చే ఫోటోగ్రఫీ పోటీ ఒకటి దృష్టిలో పడుతుంది. ఆ పోటీకి పంపటం కోసం ఫోటోలు తీస్తుండగా అనుకోకుండా ఒక ఫోటోలో చేతిలో పిస్టల్ పట్టుకున్న ఆకారం కనిపిస్తుంది. ఆ ఫోటోని పెద్దది చేస్తే ఆ ఆకారం తర్నేజా దని తెలుస్తుంది. తర్వాత జరిగేవన్నీ మనల్ని బుగ్గలు సాగేంత నవ్వుల్తోనూ న.షా. మరియూ ర.బ.ల్ని మహా నిర్ఘాంతాల్తోనూ నింపేస్తాయి.  చివరకి అవినీతిపరులంతా రాజకీయనాయకుల్లాగే ‘కామ్యాబ్’ లయిపోతారు.  నిజాయితీగా సత్యశోధన చేసిన మన న.షా. మరియూ ర.బ.ల గతి ? … ‘సత్యం గెలుస్తుంది అన్యాయం ఓడిపోతుంది’ అని మంచివాళ్ళు నమ్మే సూత్రానికి సరిగ్గా విరుద్ధంగా ఏంకావాలో అదే అవుతుంది. (సస్పెన్స్ కూడా వున్న ‘జానే భీదో యారో’ యు ట్యూబ్ లో దొరుకుతోంది).

lalita2

తర్నేజా నేరాన్ని బైటపెట్టిన ఆ ఫోటోని వీళ్ళు ఒక పార్క్ లో తీస్తారు. ఆ పార్క్ కి Antonioni park అని పేరు పెట్టాడు కుందన్ షా.  Antonioni తీసిన ‘Blow Up” సినిమాలో కూడా ఫోటోగ్రాఫర్ ఒక పార్క్ లో తీసిన ఫోటోలో నేరాన్ని వెదుకుతాడు. ‘Blow Up’ సినిమాలోని తాత్వికత పూర్తిగా వేరు. అయినా ఆ చిన్న పోలికను గుర్తు తేవటం కోసం కుందన్ షా ‘Antonioni Park’ అనటం ఫిల్మ్ బఫ్స్ కి సరదా వేస్తుంది.

పత్రికల వాళ్ళు నేరాల్ని బైటపెట్టటం మానేసి రాజకీయనాయకులని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే కార్యక్రమాన్ని మొదట చిత్రీకరించిన సినిమా ‘జానే భీదో యారో’ నే అయి ఉండాలి. దీని తరువాత వచ్చిన ‘న్యూఢిల్లీ టైమ్స్’ కూడా మీడియా అవినీతిమీద ఫోకస్ చేసింది. వీటికంటే ముందు వచ్చిన సినిమాల్లో పత్రిక ఎడిటర్లు నిజం చెప్పి ఎన్నో కష్టాలు పడేవాళ్ళు.  జర్నలిస్టులంటే నిజాల్ని భుజాలమీద వేలాడే సంచుల్లో వేసుకు తిరిగేవాళ్ళని ఒకే ఒక అర్థం ఉండేది. తర్నేజా పైపైకి ఎదిగాడంటే ఎంతమందిని కిందకి తొక్కేశాడో చెప్పమని అతన్ని నిలదీసిన జర్నలిస్టులు కూడా ‘జానే భీదో యారో’లో ఒకసారి కనిపిస్తారు. ఎడిటర్ శోభా సేన్ ది వీళ్ళకి రెండో వైపున్న ముఖం. ‘పీప్లీ లైవ్’ లో జర్నలిస్టుల అన్ని ముఖాలూ దర్శనమిస్తాయి.

పేరున్న దర్శకుల సినిమాలు చూస్తే సినిమా ముఖ్యంగా దర్శకుడి మీడియం అనే అనిపిస్తుంది. వాళ్ళవి కొన్ని సినిమాలు చూస్తుంటే అవి అంత బాగా రావటానికి ఒక్క దర్శకుడే కారణమనికూడా అనలేం.  సత్యజిత్ రాయ్ లాంటి నిరంకుశుడైన దర్శకుడి విషయంలో జయం, అపజయం అన్నీ ఆయనవే.  ‘సత్య’ లాంటి సినిమాల్లో, తీసిన రాం గోపాల్ వర్మ కంటే  స్క్రీన్ ప్లే, మాటలూ అంత బాగా రాసిన అనురాగ్ కాశ్యప్ సౌరభ్ శుక్లాల వాటా ఎక్కువనిపిస్తుంది. ‘జానే భీ దో యారో’  వెనుక కుందన్షా తో పాటు స్క్రీన్ ప్లే రాసిన సుధీర్ మిశ్రా, మాటలు రాసిన సతీష్ కౌశిక్, రంజిత్ కపూర్లు ఉన్నారు. రేణూ సలూజా కూర్పు ఉంది. వనరాజ్ భాటియా సంగీతం ఉంది.

అమెరికానుంచి తిరిగొచ్చిన మున్సిపల్ కమిషనర్ డిమెల్లో అక్కడ తాగేనీళ్ళూ మురుగునీళ్ళూ వేరువేరుగా ఉంటాయని మురిసిపోతూ చెప్తాడు. అమెరికాలో తక్కువగా తిని ఎక్కువగా పారేస్తారు కాబట్టి స్విట్జర్లాండ్ కేక్ ని కొంచెం తిని మరింత ముక్కని బైటకి విసిరేస్తే మజాగా ఉంటుందని డిమెల్లోకి చెప్తాడు న.షా.  కిటికీ బయటున్న ర.బ. కి కేకు ముక్క అందాలని అతని ఉద్దేశ్యం. అమెరికా గొప్పలు మనం చెప్పుకోవటం అనే అనాది అలవాటుతో పాటే వాళ్ళ తిని పారేసే వినిమయతత్వాన్ని కూడా ఎత్తి చూపించే ఈ ముప్పై ఏళ్ల కిందటి మాటల్ని ఇప్పుడు వినటం మజాగానే ఉంటుంది.

స్క్రీన్ ప్లే వాస్తవికత మీద కంటే సెటైర్ మీదా ప్రహసనం మీదా గట్టిగా నిలబడింది. నటనను స్లాప్ స్టిక్ కామెడీలోకి ఎక్కువగా పోనీకుండా ప్రహసనం స్థాయిలో పట్టి ఉంచగల్గిన నటులు అందరూ ప్రతి ఒక్క పాత్రలో ఉన్నారు. వీళ్ళంతా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి వచ్చినవాళ్ళవటంతో నాజూకుతనాన్ని తీసుకొచ్చారు. సినిమాలో ఎక్కువసేపు శవంగా జీవించిన సతీష్ షా ఒక అద్భుతం. కాఫిన్ లో ఉన్న ఆ శవంతో కబుర్లు చెప్పే తాగుబోతు అహూజా ప్రహసనం చూడాల్సిందే. శవం బోలెడన్ని మేకప్ లు వేసుకుంటుంది. చివరకు ద్రౌపది వేషంలో స్టేజ్ కూడా ఎక్కుతుంది. ద్రౌపది వేషంలోని శవంకోసం పాండవులూ కౌరవులూ అంతా పోట్లాడుకోవటం వింతైన ప్రత్యేక సన్నివేశం. దుర్యోధనుడు ద్రౌపదిని పొగిడి, వస్త్రాపహరణం ఐడియాని డ్రాప్ చేసేశానంటాడు. కృష్ణుడు రాకుండానే మిగతా అందరూ ద్రౌపదిని కీర్తిస్తూ మాన సంరక్షణ చేసి స్టేజ్ దాటించి తీసుకుపోదామని చూస్తారు.  దుశ్శాసన పాత్రధారి ఎంత ప్రయత్నించినా ద్రౌపదిమీద చెయ్యి వెయ్యలేక విఫలమైపోతాడు.  ద్రౌపదీవస్త్రాపహరణంలో మగ ద్రౌపదుల బట్టలూడిపోయిన మొరటు సీన్లు చాలా సినిమాల్లో మామూలే గానీ ‘జానే భీదో యారో’లోని ఈ సీన్లోని సున్నితమైన హాస్యం వేరు.

lalita3

‘జానేభీదో యారో’ నాటికీ ఇప్పటికీ జీడీపీ పాపంలా పెరిగిపోయింది. డిమెల్లోలు ఈరోజూ అవే ఆటలు ఆడుతున్నారు. శోభా సేన్లు మీడియాలో నిండిపోయారు.  మంత్రులు నేలని ఖనిజంముక్కలుగా బొగ్గుచెక్కలుగా అమ్ముకుంటున్నారు.  తర్నేజా అహూజాలు ఇంకా ఎదిగిపోయి ప్రభుత్వాలని మారుస్తూ దేశాన్ని పంచుకుంటున్నారు.  RTI బావిలో నిజాలు తవ్వుతున్న సత్యశోధకుల పీకలు తెగుతున్నాయ్. నవ్వుకోవటం మానేసి జనం ప్రతి చిన్నదానికి తామెవరో గుర్తు చేసుకుంటూ మనోభావాలను తెగ గాయపర్చుకుంటున్నారు. ఇప్పుడు డార్క్ కామెడీలకు ఎన్ని వస్తువులో!  ‘జానే భీ దో యారో’ అని తేలిగ్గా నవ్వుకునేలా ఉంటూనే ఆలోచనకు వీలిచ్చే లోతైన సినిమాలు రావాల్సిన సమయంలో మనకిప్పుడు దొరుకుతున్న సినిమాల్లో హాస్యం ఒట్టి గరం మసాలా. అదిలేకపోతే ఎవరూ చూడరు. ఉండి అది నెరవేర్చే ప్రయోజనమూ లేదు. తెలుగుసినిమాల్లో హీరోలకైతే పంచింగ్ బాగ్స్ లా కూడా ఉపయోగపడుతున్నారు హాస్యనటులు.

‘It’s my fault’ అంటూ రేప్ గురించి తీసిన ఈ చిన్న సెటైర్ లోని డార్క్ హ్యూమర్ని చూడండి…

*

 

 

 

 

 

ఐనా …  మనిషి మారలేదు.

 

-ల.లి.త.

~

 

    ల.లి.త.

“ఎవరైనా సరే న్యాయాన్ని కాస్త తక్కువగా ప్రగతిని కాస్త ఎక్కువగా నమ్ముతారు” –  కొరాడో.

ఇదేదో గట్టి నిజంలాగే అనిపిస్తోంది.  తాతకంటే తండ్రి  మరికొంచెం ఎక్కువ సంపాదించి ఇంకొంచెం సుఖంగా బతుకుదామనుకుంటే, కొడుకు మరింత సంపాదించి విలాసాన్ని రుచి చూద్దామనుకుంటాడు. మనవడు విలాసాల అంతు చూద్దామని బయలుదేరతాడు. ఇదే కదా మనిషి ప్రగతి!  కానీ దీనికి కొన్ని కనీసన్యాయాలు అడ్డు వస్తాయి. ముఖ్యంగా ప్రకృతిన్యాయం. అది ప్రతీ ఒక్కరికీ అవసరమైనవన్నీ ఇస్తుందిగానీ అందరి విలాసాలనీ  తీర్చే శక్తి దానికిలేదు. ప్రకృతిన్యాయాన్ని పట్టించుకోకుండా మాయాబజార్ సినిమాలో తిండిముందు కూచున్న ఘటోత్కచుడిలా ప్రతీదీ ఈ జన్మలోనే తిని అరిగించుకోవాలని తెగబడుతున్నాం.  దేనిమీద బతుకుతున్నామో దానిమీదే ఇంతటి దురాక్రమణ ఇంకే జంతువూ చెయ్యదు.

***

“ఎవరైనా సరే న్యాయాన్ని కాస్త తక్కువగా ప్రగతిని కాస్త ఎక్కువగా నమ్ముతారు” –  కొరాడో.

ఈ నిజాన్ని బాగానే అర్థం చేసుకున్నాడు కాబట్టే ఇటాలియన్ దర్శకుడు Michelangelo Antonioni తన సినిమా ‘Deserto Rosso’ (ఎర్రని ఎడారి)లో మనిషితనానికీ పారిశ్రామిక అభివృద్ధికీ మధ్య ఉన్న ఘర్షణను చిన్నపాటి  సర్దుకోగలిగే సమస్యగా మాత్రమే చూపించాడు. ఇది యాభై ఏళ్ల కిందట తీసిన సినిమా. సినిమాగా గొప్ప కళాఖండం అని  చెప్పాలి.  Antonioni  పారిశ్రామికీకరణను సంతోషంగా ఆహ్వానించే లెఫ్టిస్టుల తరం దర్శకుడు. వామపక్షవాదం ఒక కన్నూ అస్తిత్వవాదం మరో కన్నూగా జీవించిన తరం అది. అతను ఈ కళ్ళతో మనిషి చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని కూడా చూడకపోలేదు. అయినా సరే, ప్రగతిని ఎక్కువగా నమ్ముతాం కాబట్టి విధ్వంస ప్రకృతితో కలిసి బతకటానికి అలవాటు పడాలనే ధోరణి Deserto Rosso లో కనిపిస్తుంది. సర్దుకుని బతకటం పరిణామ సిద్ధాంతంలో భాగం.  పిట్టయినా, జంతువైనా, మనిషైనా చుట్టూ ఉన్న ప్రపంచంతో సర్దుకు బతక్క తప్పదు. అది చేతకాని జీవాలు నశిస్తాయి. కానీ అలా నశించేవి కూడా చాలావరకూ ప్రపంచానికి ఏదోవిధంగా పనికొచ్చేవే అయివుంటాయి. నిజానికి మనిషిజాతి నశిస్తే భూమికి జరిగే నష్టం ఏమీ ఉండదనీ, పైగా పుష్టిని పెంచుకుంటుందనీ, అదే చిన్నచిన్న కీటకాలు నశిస్తే భూమి ఉనికికే ప్రమాదం అనీ కీటక శాస్త్రజ్ఞులు చెప్తారు.

సినిమాలోని వద్దాం. జులియానా భర్త ఉగో, పెట్రో కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్నతోద్యోగి. ఆమె తన ఏడేళ్ళ కొడుకుతో భర్తతో ఫ్యాక్టరీ పరిసరాల్లోనే  నివాసం ఉంటుంది.  ఉగో, అతని వ్యాపార సహచరుడు కొరాడో, అక్కడ పనిచేస్తున్నవాళ్ళూ అందరూ ఆ వాతావరణంలో నీటిలో చేపలంత సహజంగా బతుకుతుంటారు. అవే పరిసరాల్లో జులియానా ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటూ ఉంటుంది. ఉగోకు ఆమె కష్టం పట్టదు. కొరాడో ఆమెను ఆకర్షణతో కూడిన సానుభూతితో అర్థం చేసుకుంటాడు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీ గొట్టాలు, గోడలు, కాలుష్యం నిండుతున్న చెరువుల మధ్య జులియానా చిన్ని చిన్ని వేర్లతో తేమను వెదుక్కుంటున్న మొక్కలా తోస్తుంది. ఎక్కడ ఎవరితో ఏ వస్తువుతో బంధం పెంచుకోవాలో తెలియక అశాంతిగా తిరుగుతూ వుంటుంది.  చుట్టూ వున్న మనుషులతో అర్థంలేని మాటలు మాట్లాడి బైటపడడానికి చూస్తుంది. మానసిక స్వస్థత దొరుకుతుందేమో అన్న ఆశతో కొరాడోతో శారీరకంగా కలుస్తుంది. ఆ బంధంకూడా ఆమెకు నిలకడ ఇవ్వదు. కొడుకు వలేరియోతో ఫ్యాక్టరీ ఆవరణలో తిరుగుతూ ఆ పిల్లాడు వేడి ఆవిర్లగొట్టాల వైపు వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకుంటూ రంగులూ పొగల మధ్య జడుసుకున్న కుందేల్లా వణికే చేతులు పిసుక్కుంటూ కాలం గడుపుతుంది. ఇదీ ఆమె కథ.

“ఆ పసుప్పచ్చ పొగలు ఏమిటమ్మా?”  – వలేరియో.

“అవన్నీ విషపు పొగలు”.  –  జులియానా.

“బుజ్జిపిట్టలు అటువైపు వెళ్తే చచ్చిపోవూ?”  –  వలేరియో.

“బుజ్జిపిట్టలు అటువైపు వెళ్లకూడదని అర్థం చేసుకుని వెళ్ళటం మానేశాయి.”  –  జులియానా.

***

ఇంత సాఫుగా ఉందా నిజం? పిచుకలు సెల్ టవర్లవైపు వెళ్తే గుడ్లు పెట్టలేమని అర్థం చేసుకున్నాయో లేదోగానీ బతికిన నాల్రోజులూ దిగులుగా రెండు గింజలకోసం, కాసిని నీటి చుక్కలకోసం దేవులాడుతున్నాయి. కొట్టేసిన చెట్లలోంచి, అడవుల్లోంచి బైటకొచ్చిన జంతువులు మనుషుల ఇళ్ళలో పొలాల్లో దూరుతున్నాయి. ఫ్యాక్టరీ గొట్టాల విష వాయువులు భోపాల్ లాంటిచోట్ల అర్థరాత్రి మెల్లగా జనం ఊపిర్లను కాజేశాయి. న్యూక్లియర్ రియాక్టర్లు ఎక్కడెక్కడో  విషం చిమ్మాయి. జనం నిశ్చింతగా బారైన వినాయక విగ్రహ నిమజ్జనాలు మహోత్సాహంతో చేస్తూ, పేపర్ టిష్యూలతో మూతులు తుడుచుకుంటూ, ఆన్ లైన్ షాపింగులు చేస్తూ, సెల్ ఫోన్లలో క్యాండీ క్రష్ ఆడుకుంటూ,  ఇంటర్నెట్ లో ప్రతి కొత్త ఒంటరి ఆటకూ అలవాటు పడుతున్నారు.

***

పానవట్టం, శివలింగం ప్రాచీన స్త్రీపురుష  ప్రతీకలైతే,  న్యూక్లియర్ రియాక్టర్లు,  పొగగొట్టాలు ఆధునికయుగం చేసిపెట్టిన సెక్సీ ప్రతీకలు. వీటిని అందంగా, బతుకు ఒత్తిడికి ప్రతీకలుగా, నిలువుగా అడ్డంగా జామెట్రీ  సిమెట్రీ కొలతలతో ఫోటోలు తియ్యటం ఒక కళగా వెలిసింది. ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ అనేది ఒక పెద్ద ఫోటోగ్రఫీ శాఖ. యంత్రంతో మన్ని మనం పోల్చుకోవటం, మళ్ళీ విడదీసుకోవటం, యంత్రాన్ని ప్రేమించటం, మళ్ళీ అసహ్యించుకోవటం, యంత్రాల మధ్య ఒంటరిగా ఓ మూలకి పోవటం  … ఇలా ఎన్నో ప్రేరణలూ భావాలూ కవిత్వంలోలాగే ఫొటోగ్రఫీలోనూ వచ్చేశాయి.  Deserto Rosso లో Antonioni  భూతాల్లాంటి ఫాక్టరీలను, ఓడలను విస్మయ గౌరవాలతో చిత్రీకరించాడు.  ఏదో రహస్యం, మరేదో అద్భుతం  ఆ పెద్ద పెద్ద ఆకారాలను ఆవహించి ఉంటాయి. ఓడలో వంపులు తిరిగిన గొట్టాలు, చువ్వలు, టవర్లు, నూనెతెట్టులా పచ్చగా నీటిని ఆవరించిన రసాయనాలు, ఊపిర్లు భారంగా వదిలే ఆవిర్లు, జులియానాను తమలో కలుపుకునేట్టు కనిపించే గోడలు, ఆమె మీదకు వచ్చిపడుతున్నట్టు ఉండే లేత రంగులు … ఇవేవీ భయంకలిగించవు. ఆసక్తిగా తొంగి చూస్తున్న మనలోని చిన్న పిల్లను యంత్ర నాగరికత తన డిజైన్ ఏమిటో వచ్చి చూడమని ఆకర్షిస్తూ పిలుస్తున్నట్టు ఉంటుంది.  ఇది Antonioni  ఇంద్రజాలం.

lalita1

 

జులియానా  వాలెరోకు ఒక కథ చెప్తుంది. ఒక కౌమార ప్రాయంలో ఉన్న పిల్ల. గులాబిరంగు ఇసుకా, తేటనీళ్ళ బుల్లి అలల సముద్రమూ వున్నచోట  ఒడ్డున ఒక్కతే ఆడుకుంటూ, ఈదుతూ ఉంటుంది. ఓ రోజు సముద్రంలో ఎవరూలేని పెద్ద ఓడను చూస్తుంది. ఆ ఓడ ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. మరునాటినుంచీ ఆ పిల్లకు ఒక పాట వినిపిస్తూ ఉంటుంది. ఆ పాట అలల్లోంచి, ఒడ్డునుంచి, మెత్తటి గోధుమ పిండిముద్దల్లా ఉన్న రాళ్ళ మధ్యనుంచి వినిపిస్తూ ఉంటుంది. ఆ పాట ఆ పిల్లకోసమే అన్నట్టు ఉంటుంది. దాన్ని వినగలిగే శక్తికూడా తనకొక్కదానికే ఉన్నట్టు ఉంటుంది.

Antonioni ఈ సముద్ర తీరాన్ని, ఆ పిల్లను, మెత్తటి రాళ్ళను, అతీత శక్తిలాంటి ఆ పాటను ఎంత బాగా చిత్రిస్తాడో ఫాక్టరీలను, పొగ గొట్టాల శబ్దాలను, ఓడలను గోడలను కూడా అంతే అందంగా అద్వైత భావంతో తీస్తాడు. (ఆ పాటనూ,  శబ్దాలనూ దృశ్యాలతో కలిపి చూస్తూ వినితీరాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం).  ప్రాకృతికమైన అందానికీ మానవ మేథ సృష్టించిన యంత్రలోకాల అద్భుతానికీ తేడా లేదు. మనిషి ఉభయచరంలా రెండుచోట్లా జీవించాలి.

***

రెండుచోట్లా బతుకుతున్నాడు మనిషి దేనికీ చెందకుండా…  తలెత్తకుండా పనికొచ్చేవీ పనికిరానివీ ఏవేవో తయారు చేస్తూ ఎవరికో డబ్బులు పోగేసిపెడుతూ… మధ్యమధ్యలో తల విదిలించి వారం పదిరోజుల పాకేజ్ టూర్లు కొట్టి నయాగరా జలపాతంలో వెలుగులని తాగి, సింగపూర్లో బంగారం కొని థాయిలాండ్ లో పెంపుడు పులులతో ఫోటోలు దిగుతున్నాడు.  అష్ట దిక్పాలకులను శాసించిన రావణాసురుడిలా దేశాలను పాకేజ్ టూర్లుగా అమ్ముతున్నాడు.

“ఐనా …  మనిషి మారలేదు. ఆతని కాంక్ష తీరలేదు”.  ….               

Antonioni ఈ పరిణామాన్ని ఎందుకు ఊహించలేదో !  పల్లెటూరంటే వట్టి ఆదర్శం తప్ప ఏమీ కానట్టు తీసి పారేసి మనం ఎంచుకున్న మహాపట్నాలు నిజంగా అంత బాగుంటే ఇన్ని రోగాలూ అభద్రతలూ దిక్కుమాలిన చావులూ ఎందుకు? అన్నిటినీ మించి,  ఎవరికీ దేనికీ చెందనితనపు మహా భారాన్ని మనిషి ఎలా మోయాలి ?

“నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నా వస్తువులన్నీ తీసుకుపోతా ఆష్ ట్రే తో సహా!”  – జులియానా.

“ఇక వెళ్ళటం ఎందుకు? ఇక్కడే ఉండు. నా ఊరూ నా వీధీ అంటూ..”  – కొరాడో.

ఉన్నచోటే పాతుకు పోయేవాళ్ళూ, కాళ్ళలో చక్రాలున్నట్టు తిరిగేవాళ్ళూ అని మనుషులు రెండు రకాలు. పాతుకోవటం, తిరగటం తమ ఇష్టప్రకారం జరిగితే అది సహజత్వం. ఈ రెండు పనులూ మనమే సృష్టించుకున్న పరిస్థితుల వల్ల చెయ్యాల్సి వస్తే ఏమనాలి?

***

lalita2

“ఎవరైనా సరే న్యాయాన్ని కాస్త తక్కువగా ప్రగతిని కాస్త ఎక్కువగా నమ్ముతారు” –  కొరాడో.

ప్రగతిని కాస్త తక్కువగా నమ్మే సాయి పరాంజపే లాంటివాళ్ళు ‘దిశ’ లాంటి సినిమాలను తీస్తారు. 90లలో వచ్చిన ఈ సినిమా పల్లెటూరిలో సరిగ్గా బతకలేక ముంబై భీవండీ మిల్లుల్లో పని చెయ్యటానికి వెళ్ళి నాలుగు డబ్బులు కళ్ళ చూస్తూ 40 మందితో కలిసి జంతువుల్లా ఓ గదిలో బతికే గ్రామస్తుల కథ. ఊరినే నమ్ముకున్నవాడు పట్టుదలగా అనుకున్నది సాధిస్తాడు. ఇరుకు పట్నాల జీవితం చాలు, ఊరిదిశగా మళ్ళాలని సింపుల్ గా హెచ్చరిస్తుంది సాయి పరాంజపే.

ప్రగతిని హాలీవుడ్ ఎంతగానో నమ్ముతుంది.  ప్రకృతి ప్రదర్శిస్తున్న భీభత్సరసాన్ని, దానికి చాలావరకూ కారణమైన మనిషినీ చూడక తప్పని పరిస్థితి వచ్చేసింది మేధావులకు. స్పీల్ బర్గ్  ‘జురాసిక్ పార్క్’ తీస్తే, జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ సినిమా తీశాడు.

“నీ కంటే ముందువాళ్ళు సంపాదించి అందించిన జ్ఞానంతో బాధ్యత, విచక్షణ లేకుండా హడావుడిగా సృష్టికి ప్రతిసృష్టి చేసేసి, పేటెంట్లూ పేకేజ్ లతో లంచ్ బాక్స్ లలో కూరి” చేస్తున్న వ్యాపారాన్ని ఎత్తి చూపిస్తూ డాక్టర్ మాల్కోం మాట్లాడే రత్నాల్లాంటి మాటలు జురాసిక్ పార్క్ లో చాలా ఉంటాయి.  చైనా ప్రగతి చూసి, వాళ్ళలాగే మేకిన్ ఇండియా వ్యాపారం చేసేద్దామని అనుకునే మన గొర్రె మనస్తత్వపు నాయకుల ఛాయల్ని జురాసిక్ పార్క్ లో దర్శించవచ్చు.  ‘అవతార్’ మరింత తాత్వికంగా ముందుకెళ్ళి వానర వారసులైన మనుషులను ప్రకృతితో తోకలు ముడేసుకోమని చెప్పింది. అంతే కాకుండా ఎప్పుడూ ప్రపంచాన్ని ఉద్ధరించే  తెల్లతోలు వీరుడు మూలవాసుడిగా డీ ఎన్ ఏ తో సహా మారిపోవటం నలుపు, గోదుమరంగుల వారికి మరీ నచ్చుతుంది.  తెల్లవాడు డీ-రేస్ అయిపోవటం కంటే సంతోషించేది ఏముంటుంది ప్రపంచానికి ? కనీసం ఇలాంటి ఫాంటసీల్లో అయినా సరే! ‘అవతార్’  కళారూపంగా చాలా నాసిరకం సినిమా అయినా భావం గొప్పది.

క్రిస్టఫర్ నోలన్ మరింత ముందుచూపుతో స్టీఫెన్ హాకింగ్ జోస్యాన్ని నమ్మాడు.  భూమి రిపేర్ చెయ్యటానికి వీల్లేనంతగా పనికిరాకుండా అయిపోయింది కాబట్టి,  భౌతికశాస్త్రంలో నాలుగవ, ఐదవ కొలతల గురించి కూడా  తెలుసుకుని గ్రహాంతరాలకు మనిషి ప్రయాణం కట్టాలని చెప్తాడు తన ‘ఇంటర్ స్టెల్లార్’ సినిమాలో.  మెరుగైన జీవితం కోసం కాదు,  గాలీ నీరూ కోసమూ  బతికి ఉండటం కోసమే మనిషి వెదుక్కుంటూ పోయే పెద్ద వలసను సూచిస్తాడు నోలన్.

***

ఇప్పుడు న్యాయాన్ని మరీ తక్కువపాళ్ళలో నమ్ముతూ ప్రగతినే భుజాలమీద మోస్తున్నాం మన సినిమాల్లో.  పాత విజయావారి తెలుగు సినిమాల్లో చందమామ చక్కగా నిండుగా కనిపించేది. నిజం చందమామ, నిజం జాజితీగలు అక్కడ లేకపోయినా ‘ఎచటినుంచి వీచెనో ఈ చల్లనిగాలి’ అనీ ‘రావోయి చందమామా’ అని పాడేవారు. సినిమాల్లో  సాంకేతిక పరిజ్ఞానం అంతగా వికసించక పోయినా “క్రూర మృగమ్ముల కోరలు తీసెను. ఘోరారణ్యములాక్రమించెను. హిమాలయముపై జండా పాతెను. ఆకాశంలో షికారు చేసెను. ఐనా…. మనిషి మారలేదు. ఆతని కాంక్ష తీరలేదు.” అని పాటలు రాసి తీసేంత తాత్వికత ఉండేది. జోలపాటలూ చిన్నపిల్లలూ, వెన్నెలా, ఊరూ జీవితంలో భాగాలుగా ఉండేవి కాబట్టే సినిమాల్లో కూడా అవి కనిపించేవి. మనకిప్పుడు వస్తువే సమస్తమైపోయింది కాబట్టి ఉపమాలంకారం నోకియా, నైకీ, కేపుచ్చినోలను అందిపుచ్చుకుంది. భాష  పట్టుతప్పి అద్భుతమైన విదేశీయ ప్రకృతి అందాల మధ్య కూడా  ‘చంపేస్తున్నావే నను నలిపేస్తున్నావే’ ‘పొమ్మన్నా పోవేంరా’ లాంటి చప్పటి మాటల్లోంచి దీనంగా చూస్తోంది.  ‘చాలులే నిదురపో జాబిలికూనా, ఆ దొంగ కలువరేకుల్లో తుమ్మెదలాడేనా..  తూనీగలాడేనా’ అనీ,  ‘నిదరోయే కొలనునీరు కదపకూడదు’ అనీ పాటలు రాసిన కృష్ణశాస్త్రీ, ‘బంతీ చేమంతీ ముద్దాడుకున్నాయిలే’ అనీ, ‘సందె పొద్దులకాడ సంపంగి నవ్విందీ’ అనీ మురిసిన వేటూరీ వారసుల్లేక  పైనుంచి నిరాశగా చూస్తున్నారు.  అమ్మో…  ప్రగతి నిరోధక రొమాంటిక్ ట్రాక్ లోకి వెళిపోతున్నా..

ఐనా  (ఇక్కడ గాయని పి.లీల లా రాగం తియ్యాలి) ….  ప్రగతిని కొంచెంగానూ న్యాయాన్ని చాలా ఎక్కువగానూ నమ్మే మనుషులు ఎక్కువైతే బాగుండును.

***

చివరగా, ఈ వ్యాసం చదివినవారు తప్పకుండా ఈ youtube లింక్ చూసి తరించాలి.

ముందుగా మిమ్మల్ని పెయింట్ డబ్బాలో అపార్ట్ మెంటులో లేక online  చెడ్డీలో కొనమని ad విజ్ఞప్తి వస్తుంది.  తర్వాత ఘంటసాల, లీలల పాట వస్తుంది.  చివరగా ‘మస్సాలా మిర్చీ పిల్లా మజ్జా చేద్దాం వస్తావా’  అనే పాట ad వస్తుంది. పింగళి పాటకు ముందూ వెనుకా ఘన నివాళులు ఇవి…

 

                                                                                  *

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

బిత్తిరి సత్తీ,  సిమ్మాద్దిరీ

 

 

 

    ల.లి.త.

ల.లి.త.

సత్తీ… ఓ బిత్తిరి సత్తీ…   గిది చెప్పు. గిట్ల టీవీవార్తలల్ల ఊరి ముచ్చట్లు వెట్టాలని ఆలోసన ఎవురు జేశిన్రు? అదీ ఇంత అందమైన బాసల! తెల్సులే. మల్లన్న గదా! ఆయన మొదులు వెట్టిండు. ఆయనా, రాములమ్మా రచ్చ రేపిన్రు. గిప్పుడేమో నువ్వూ, మీ సాఫిత్రక్కా, మంగోలి మా అందరికీ  ఇంటి మనుసుల్లెక్కయిన్రు.  రాత్రి తొమ్మిదిన్నర కొట్టంగనే దినామూ  టీవీ తాన కొచ్చేస్తం. ఇగ శురూ ఐతది మీ ముగ్గురి తమాస. వార్తలు ఎవురైనా ఇంత సోపతితోని ఎన్నడైన జెప్పిన్రా?

ఎన్నడో దూరదర్శన్ తప్ప మరొకటి లేని కాలంల.. ఆఁ … వాల్లెవురబ్బా? కోమల్ జీ బీ సింగ్, రీనీ జోసఫ్, షమ్మీ నారంగ్… వాల్లందరూ ఎంత మంచిగ సదివెటోల్లు వార్తలు! ఏ బాసల వార్తలు జెప్తే ఆ బాసని నిండుగ, తియ్యగ పంచదార సెవుల బోసినట్టు పల్కెటోల్లు!  గిప్పుడా? ఇంగ్లిసోల్ల లెక్క సూట్లు, బూట్లేసుకొని మంచిగ తెల్గుల సుత మాట్లాడలేనోల్లంతా వార్తలు సెప్పనీకొస్తున్రు.  థూ, తెల్గుల గా ఇంగిలీసు మాటలు కల్పి పాయసంల ఉప్పు వోసినట్టు చేస్తున్రు. ఇగ పోరలకు బాసేమి నేర్వనొస్తది?  యాడ జూడు “రేటెంత? సెవెంటీ రుపీస్. టైమెంత? సిక్స్ ఫార్టీ ఫైవ్. సండే కలుస్తవా? రాలేను. మండే సూస్త” అనవట్టిన్రు అందురూ.  డిల్లీల సుత గీ బాస ఉండది. “సత్తావన్ రుపై, పచత్తర్ రుపై” అనుకుంటా మంచిగ ఆల్ల బాసల లెక్కలు సెప్పుకుంటరు వాల్లంతా. మన్ని పిసోని లెక్క జూస్తా అరవ్వోడు వాని బాసల్నే అన్నీ అర్సుకుంటడు.  బెంగాలోడు మా టాగోరో అనుకుంటా ఆయన్ని మించినోడు లేడనుకుంటా  డప్పుగొట్కుంటా తిర్గుతడు.

బాసను గిట్ల సావనూకుతున్రని తెలుగు టీవీల వార్తలు సూసుడే బందు జేసినం మా అసుంటి పాత మనుసులం. గింతలో మీరచ్చిన్రు.  మా బాస, మా తిండి, మా సంబురాలంటూ మన తెలంగాన ఉద్యమంల మీ అసుమంటోల్లు కూడా దిగిన్రు. నాయం, అన్నాయం, అన్నదమ్ములు ఇడిపోటం.. ఈ పెద్ద పెద్ద రాజకీయాల ముచ్చట్లకేమొచ్చెగానీ,  గింత బంగారం బాసను టీవీలల్ల ఎంత మంచిగ లెబట్టిన్రు!

మంచి మంచి సామెతలు కల్పి సెప్తరబ్బా నువ్వూ మీ సాఫిత్రక్కా వార్తలల్ల! దినాం వీల్లేమి ముచ్చట్లు జెప్తరో అని ఎదురు చూస్తం. నువు బిత్తిరోని లెక్క యాక్సన్ జేస్కుంటా నవ్విపిస్తవ్ గని, నీ మాటలల్ల షానా నిజముంటది సత్తీ!  అన్ని టీవీలూ పార్టీ  పెద్దోల్ల టీవీలే అని మందికి తెల్సిన ముచ్చటే గదా! అందుకే మీరు కేసీయార్ దొరను పొగుడ్తున్నా,  మోడీ దొరకు, సెంద్రాలు సార్ కు కాల్తున్న కట్టెతోని వాతలు వెడ్తున్నా ఏమనుకోములే సత్తీ! తీన్మార్ వార్తలల్ల మీ బాసకే ముందుగాల  మేం మొక్కేది.

ఇట్లంటే సత్తి గుస్సా అయితడేమో! లేదులే, నువు చెప్పేటియి గూడ శానామంది టీవీలల్ల వొర్రే ఇసయాలకంటే మంచిగుంటయి సత్తీ. ఒగసారి ఎండ మండుతుంటే సిన్న టెంటునీడల కుసోని, ఎండలల్ల తిరిగెటోల్లు ఎంత కష్టవడాలోనని నువు యాష్టబోతుంటే సిన్న సిన్నోల్లు, అవీ యివీ అమ్ముకునేటోల్ల బాదలు యాదికచ్చి కండ్లకెల్లి నీల్లచ్చినయ్. టీవీలోల్లు ఎండ ఎట్ల సంపుతున్నదో సెప్పనీకి సిటీలల్ల పంకాలు తిరక్కపోవుడు, ఇండ్లలో కోడి పెట్టల్లెక్క కుసున్న మన్సులు అసోబుసో మనుడే సూపిస్తరు. మల్ల గవుర్న్మెంటు కరెంటు ఇస్తలేదని నిష్టురవడ్తరు. రైతులగ్గూడ ఇయ్యనీకుంట జేసి, ఉన్న తక్వ కరెంటును ఎక్వగా నూక్కపోతున్న పెద్ద పెద్ద సీరెల షాపులోల్లు, మాల్స్ పెద్ద మన్సుల్ని మీ టీవీలోల్లు ఒక్క మాట సుత అనరేం?

సీప్ లిక్కర్ని కేసీయార్ తెస్తున్నడని శాన నెత్తినొప్పొచ్చింది నీకు. ఊకుంటవా మరి! బిత్తిరి ఏసంతో సురక పెట్టుడే నీ తీరైపాయె. ఇగ సార సీసాలు వట్కోని ఒకటే ఎగురుడు. మంది ఆరోగ్యం కోసమే గిదంతా అని పద్మారావు సారు మాటలు యాది జేస్తూ, ఇంకా సిటీలల్ల ఎక్కువ మందు షాపులేంది, జిల్లాల పొంటి  అంత తక్కువేందని యాగీ జేసినవ్. మంచు లచ్మక్క, తాగి బండి నడిపెటోల్లకు పోలీస్ ఠానాల కూసొబెట్టి బుద్దులు జెప్తదని విని, తాగి బైక్ ను నడిపిస్తివే రోడ్డు మీద! అందర్నీ సారా తాగమని పద్మారావు సారూ, తాగి బండి నడపొద్దని నాయిని సారూ, తాగుబోతులకు మంచి ముచ్చట్లు జెప్తనని మంచు లచ్మీ తీన్మార్ ఆటలు ఆడుతుంటే బైక్ మీద నీ ఆటలూ, ముచ్చట్లూ నువ్ శురూ జేసినవ్….  మస్తు నవ్విపిచ్చినవ్ లే సత్తీ.  పక్కపొంటి యీ సావిత్రి పిల్ల ‘అన్నీ మంచికే’ అనవట్టుడు. సచ్చ బారత్ అంటా సీపుర్లు బట్టి పోటువలు దిగెటోల్లను మంచిగ బనాయించినవ్. వాల్లందరి కంటే సీపురుతో ఊడ్సి పంజేసిన నువ్వే కరెష్టయిన  బ్రాండు అంబాసిలండర్ వని చెప్పుకున్నవ్. సెత్త గుట్టలతాన నీ సెల్ఫీల కత జూశినంక గీ సేల్ఫీష్ ల పిసోల్లకు, ప్యాసను పోరగాన్లకు ఏమైనా గ్యానమొస్తదంటవా సత్తీ!  వానలు బగ్గ పడాలని లీడల్ర లెక్క యాగం జేస్తివి. గింత సుతారంగ వాతలు వెట్టుడు యాడకెల్లి  నేర్సిన్రమ్మా మీరంతా?

ఇంగిలీసును తెలుగు లెక్క మార్సి నవ్విపిచ్చుడు పాత కతే గానీ, నువ్ అది జేసి మంచిగనే నవ్విపిస్తవ్ తియ్. ఎల్నినో ని ఎల్లినూనె, గూగుల్ ను గుల్గుల్, విటమిన్లను ఈతముల్లు, ఎక్స్ క్లుసివ్ ని హెచ్చుకూలీ, హెరిటేజ్ ని ఎర్రి స్టేజీ … గిది నీ అందాల బాస. “సూస్కుందమిక” అనుకుంటా సిన్న పొల్లగాని లెక్క లాజిక్కులు మంచిగ తీస్తవ్! అయన్నీ జంగు పట్టిన మా దిమాగ్ లను తోముతా ఉంటయ్.

మీ సాఫిత్రక్క, మంగోలి కట్టే బట్టలు సూస్తనే సంతోశమైతది సత్తీ.  బుగ్గ సేతుల జాకిట్టేస్కోని, నూలుసీరెలు గట్టి, సన్న గొంతుతోని సక్కదనాల సాఫిత్రక్క వార్తలు జెప్తుంటే షాన మంచిగనిపిస్తది. మీ ముగ్గుర్లో  గా సక్కనిసుక్క మంగోలికి సురుకెక్కువ.  గా పిల్లకు ఐదరాబాదు మాటలు, ఇంగిలీసు మంచిగస్తయ్.  నీ లొడాసు అంగీలైతే బాగున్నయ్ గాని, వార్తలు సదివేటప్పుడు ఆ కోట్ ఏంది సత్తీ? మంచిగ పంచె, అంగీ కట్టు…  ఓహో, నీ బిత్తిరి మాటలకు ఆ యేషం నడుస్తదో లేదో అని గా కోటు తగిలించినావ్? మీ అన్న మల్లన్న ఎంత మంచిగ పంచె గట్టి, తలపాగ జుట్టి, సేత కర్ర బట్టి అచ్చెటోడు! గా యేషంల ఆయన పెద్ద పెద్ద రాజకీయ నాయకుల తానికి పొయ్యి, తీరొక్క ముచ్చట్లు, వాతలు బెట్టెటోడు. పొన్నాల లక్ష్మయ్యతోని, ఇంకా లీడల్ర తోని మల్లన్న పెట్టిన ముచ్చట్లు ఏమన్న ఉన్నయా? పెద్ద మన్సి  కాని పెద్దమన్సి మన మల్లన్న, దమ్మున్నోడు. ఇంకొక మాట గూడ ఉన్నదిలే. గాయన తెలంగాన ఉద్యమం జోర్ల  వీ సిక్స్ తీన్మారని మొదులు వెట్టిండు. ఉద్యమం వేడిగుండే. అప్పుడాయన ఏ ముచ్చట ఏ తీర్గ సెప్పినా నడ్సింది. మల్లన్న తెల్వి మల్లెపువ్వు లెక్క ఆసన గొట్టింది. ఇప్పుడు నీకు అలాంటి శాన్సు లేదులే సత్తీ. అందుకే బిత్తిరి యేశాలేసి నవ్విపిస్తా కొన్నైనా నిజాలు సెప్పనీకి సూస్తున్నవ్. కోదండరాం సార్ తో ఎంత గౌరవంగ మాట్లాడిండు మల్లన్న!  గా పెద్ద సార్ను ఓ సారి అర్సుకోవా నువ్వు సత్తీ.  ఇప్పుడాయన ఏం చేస్తుండో ఎట్లున్నడో!

ఊరోనివి నువ్వు. అందుకే నీకు రైతులంటే అంత  పాయిరం.  వాన మొగిల్లు అయిదరాబాద్ కెందుకు, ఊర్లపొంటి పోకుండానని మొత్తుకుంటివి. రైతులు జీవి దీస్కుంటాంటే అర్సుకోని సర్కారును ఏమీ అనకుండా, సిటీల కూలీలై బత్కుతున్న బక్క రైతులకు నువ్వే దైర్నమియ్యనీకి సూస్తివి. ఇసుమంటి న్యూస్ రిపోర్టింగ్ నీతోనే మొదులయింది తమ్మీ. నీది కొద్దిగా ‘ఆల్ ఈజ్ వెల్’ సెంటిమెంటులెక్క గొడ్తది తమ్మీ ఒక్కొక్కసారి. త్రీ ఇడియట్స్ సిన్మ జూసినవా? బిత్తిరిగా ముచ్చట్లు వెడ్తానే మల్లన్నలెక్క రాజకీయాలోల్ల సెవుల్నుండి రక్తం దియ్యాలే. కష్టమంటవా? కావచ్చులే!

ఎన్డీటీవీ, టైమ్స్ నౌ  … గిసుమంటి ఇంగ్లీసు సానెల్లన్నీ ఏదో ఓ పార్టీకీ మతానికీ అంబానీకీ అదానీకీ కాల్మొక్తా బత్కుతయ్ తమ్మీ. నీకు తెల్వని కత గాదు. ఎన్డీటీవీ ఇంగ్లీసు సానెల్ ముచ్చటకేమి గానీ, ఆల హిందీ సానెల్ల ‘రవీష్ కీ రిపోర్ట్’ అని ఓ ప్రోగ్రాం వస్తది సూడు. సుట్టూ ఎన్నెన్ని అన్యాలాలు జర్గుతున్నయో అయన్నీ మనకు సూపెట్టుడే గా రవీష్ సార్ పని. ఆయ్న పనికి అడ్డు వెట్టకుంట వొదిలేసిన్రు ఎన్డీటీవీ హిందీ సానెలోల్లు. ఈ మాయలోకంల ఆయనకెట్లనో దొర్కింది మంచిగ నిజాలు సెప్పే మోక. నువ్ కూడ సానెలోల్లను మస్కగొట్టి సెప్పెయ్ నిజాలు.

మీరు తెలంగాన సంస్కృతి అని గర్వంగ చెప్తరు గదా! తెలంగాన సంస్కృతి, మాట, ముచ్చటే మీ ప్రోగ్రామ్ కు పానం కదా!  గీ సంస్కృతిల సిన్మా సెత్తను ఎందుకు గుసాయిస్తున్నవ్ తమ్మీ అప్పుడప్పుడు?  యాక్సను మంచిగ జేస్తురు గదా మీరంతా సినేమాలల్ల గుసాయిస్తరేమోనని బుగులు వెడ్తది.  ఆంద్రల సుత సెక్కబజన్లు, హరి కతలు, బుర్రకతలు, నాట్ల పాటలు, తోలుబొమ్మలు… ఎన్నో ఉండేయి. అయన్నీ ఇడ్సిపెట్టి జనం సిన్మాలెంట పడిన్రు. ఇంత మంచిగ బత్కమ్మ సంబురాలు, బోనాలు జేస్కోని, ఒగ్గుకతలు మంచిగ  సెప్పుకుంటా, పాటే పానమైన తెలంగానోల్లకు గీ సిన్మాల సీడ ఏంది సత్తీ? సిటీల లోకంతీరు ఎట్లున్నా, తీన్మార్ వార్తలల్ల తెలంగానా ఊర్లెంట తిర్గి పెద్దమన్సులు, రైతులు, సిన్న పిల్లల కతలు సూపిస్తున్నరు మీరు!  సిన్నిబిడ్డ యశ్వంత్ వొగ్గుకతను ఎంత మంచిగ సెప్తున్నడో సూపించింది గదా సాఫిత్రక్క.  గట్లనే పండుగలు, సంబురాలు, పాటలు రిపోర్ట్ సెయ్యుండ్రి.  పరబాసు, రాం చరణ్, తమన్నాలను ఇడ్సిపెట్టురి. సాఫిత్రక్క కట్టే సీర్లకూ సిన్మలోల్ల ష్టైలు ముచ్చట్లకూ కుదరది. గా మతిలేని ఫేషను షోల ముచ్చట్లు మనకెందుకు తమ్మీ? మంచిగ బొమ్మలేసే తెలంగాన తమ్ముల్లను సూపియుండ్రి. ఏ గోండు గూడెంతాననో మెట్ల కిన్నెర తీగలు బిగించే పెద్ద మన్సిని సూపెట్టురి. సాలోల్లను అర్సుకో తమ్మీ.

ఓ సాఫిత్రక్కా, మంగోలి, బిత్తిరి సత్తీ… మీకూ, మీ ఎనకున్న టీం.. అందరికీ శనార్తులు. మీ తీన్మార్ వార్తలు  సల్లగుండాలె.

***

ఇన్నావా సిమ్మాద్దిరీ, ఆలంత గొప్పగ ఆల బాసలో సెప్పుకుంతన్నారు వార్తల్ని. మనకాడేటుంది అలగ?  మన సంగతులు సేప్పీ వోలు ఎవులూ నేరు. టీవీల మన్ని సేరదీసీవోడూ నేడు. ఆల్లాల్ల నూసులు, గొప్పలు ఆలే సెప్పుకుంతారు. మనకేదేనా ఆపదొస్తే, వరదొస్తే మనూర్లకొచ్చి ఇంటర్వీలు సేత్తారు మన్ని. అంతే. మన రోజువారీ మాటా, పాటా, ఇకటాలూ ఎవులిగ్గావాలి?

మన సెంద్రబాబుని, జగన్ రెడ్డినీ  ఆలు సెంద్రాలుసారు, జగనాలుసారు అని పిల్సి ఎంత బాగా ఇకటాలాడతారు సూడుమీ. అసలుకి మన సెంద్రబాబే మన యేసాన్నీ బాసనీ పట్టిచ్చుకోట్లేదని నాకు వనుమానం వర్లచ్చిమీ! అందర్నీ గొప్పోల్లు సేత్తా, ఊర్ని సింగపూరు సేత్తా అంటాడా బావు. మనూరు సింగపూరు ఐపోతే ఆకిరికి మనం ఆ సింగపూరోల్ల  బాస నేర్సుకోవాలో ఏటో! అసలికే ఆ బావు,  సెరిత్రలు సదవొద్దు, అందరూ వింజినీర్లు ఐపోయి డబ్బు కూడబెట్టీయాలంతాడు. డబ్బులు సెట్లకి రాల్తాయేటి? అయినా ఒక్క డబ్బుంటేనే సరిపోద్దా మణిసికి? నాకూ ఆ బిత్తిరిసత్తిలాగే టీవీలో కెలిపోయి మన కవుర్లు సెప్పీయాలని శానా యిదిగా ఉంది వర్లచ్చిమీ! మన కుర్రోల్లు కూడా టీవీల్లో మన బాసే మాటాడితే మనకెంత బాగుంటాది? గానీ ఆలు యిప్పటికే సినేమాల బాస నేరిసీనారు. ఎలగో ఏటో! పల్లెటూరోల్లని ఎర్రబస్సుగాల్లని ఇకటాలాడ్డం కాదు. మనకాడా ఎన్నో ఇసయాలు నేరుసుకోవొచ్చని సిటీలు పట్టీసినోల్లకి ఏనాటికి బోద పడాల? మనకీ తీన్మారోల్ల లాగే ఒక్కరగంట టీవీలో సోటిత్తే  ష్టాపు నెగ్గొట్టీవాఁ ? ఆ సేత్తోటే రాయల్సీమోల్లకీ, ఇంకా మన రకరకాల యాసల బాసలకీ ఒక్కొక్క అరగంట శాన.

ఎంతాశ సిమ్మాద్దిరీ నీకు?

ఓ టీవీలోల్లూ, ఎవులైనా ఆలకిత్తన్నారా?

*

 

 

 

 

 

 

Birdman: A Thing is a Thing. Not what is said of the Thing!

 

ల.లి.త.

 

 

lalitha parnandi“సృష్టించాలి…  సాధించాలి…  నిజాయితీగా సృష్టించి సాధించాలి…  అక్కర్లేదు. పాత కీర్తి మళ్ళీ వద్దు… కొత్తగా చెందాలి. తనకి తాను చెందాలి..  ఎందరికో చెందాలి..  గుర్తుండాలి.”

ఇది ఓ కళాకారుడి వేదన.  

‘బర్డ్ మాన్’ అనే సినిమా సీరీస్ మూడిట్లో నటించి బాగా పేరు తెచ్చుకున్న రోజుల్లోనే అతడు తన హాలీవుడ్ కెరీర్ ను విడిచిపెట్టేస్తాడు.  ఓ ఇరవై ఏళ్లయిన తర్వాత మళ్ళీ నటుడుగా నాటక ప్రయోక్తగా న్యూయార్క్  బ్రాడ్వే నాటకశాలలో కొత్త అవతారం ఎత్తటానికి ప్రయత్నిస్తాడు.  ఇప్పుడు రకరకాల కళారూపాల పోకడలన్నీ క్లైమేట్ చేంజ్ తో గ్లేసియర్లు కరుగుతున్నంత జోరుగా అంతర్జాల మహా సాగరంలోకి ప్రవహిస్తూ అస్తిత్వాలను ముంచేస్తున్నాయని తెలిసీ ఇలా సాహసం చెయ్యటం అంటే … అతను ఎంత పెద్ద రాయిగా ఘనీభవించి కాలు నిలదొక్కుకోవాలో! 

“కళ గురించి కాదు నీ బాధ. మళ్ళీ నిన్ను అందరూ పట్టించుకోవాలి.  బ్లాగర్లనీ ట్విట్టర్ నీ అసహ్యించుకుంటావ్. ఫేస్బుక్ పేజ్ లేదు నీకు. అంటే నువ్విక లేనట్టే.  అసలు నువ్వు చచ్చేంత భయపడుతున్నది నీ గొడవ ఎవరికీ అక్కర్లేదనే… మాలాగే.  మేం కూడా అంతే ..” అంటుంది అతని కూతురు.

“నువ్వు ‘బర్డ్ మాన్’ లాంటి చెత్త సినిమాలతో ఎంత చేటు చేశావ్!  ‘అన్నీ తమకోసమే’ అనుకుంటూ స్వార్థంతో బతికే పిల్లల్ని తయారు చేశారు మీలాంటివాళ్ళు.  చెడగొట్టేశారు. అసలైన ‘కళ’ అంటే ఏమిటో వాళ్లకి నేర్పలేదు.  వాళ్ళు దానికోసం కనీసం ప్రయత్నించే స్థాయిలో కూడా లేరు. నీ నాటకానికి చెత్త సమీక్ష రాసి నిన్ను నాశనం చేస్తాను” అంటుంది ఓ ఆర్ట్ క్రిటిక్.

“Popularity is the slutty little cousin of Prestige.  కళనీ సంస్కృతినీ ఊచకోత కోసేస్తున్న మీ హాలీవుడ్ స్నేహితుల దగ్గరకు తిరిగి వెళ్ళిపో. నీకు గొప్ప నాటకాలు ఎందుకు” – అంటూ సాంస్కృతిక ఆధిక్యతను ప్రదర్శిస్తూ తన పాపులారిటీని కింద పడేసి కసాపిసా తొక్కేద్దామని చూసే సహనటుడు. అందులోనూ అతనొక పేరున్న బ్రాడ్వే నటుడు కూడా.

అన్నిటినీ మించి..

వీళ్ళందరి గొడవతో మనసు ఏ కొంచెం చెదురుతున్నా “మళ్ళీ ‘బర్డ్ మాన్’ అయిపో.  పాత వైభవం తెచ్చుకుందాం. అరవయ్యేళ్ళ వయసంటే ఈ రోజుల్లో కొత్త ఇరవైలు. మొహానికి సర్జరీలతో కొత్త కళ తెచ్చుకో.” అంటూ సతాయించే తన ‘బర్డ్ మాన్’ అస్తిత్వం.

ఇలా గురి చూసి గుండెను చీల్చేసే మనుషుల మధ్యలో ఎంత బాధో వేదనో అతనికి తన అభివ్యక్తిని వెదుక్కోవటంలో ! భార్యతో కూతురితో తెగిపోయిన బంధాల దారాలు పోగేసుకుని మళ్ళీ పేనుకోవటంలో !

***

2014 కి ఆస్కార్ ఉత్తమ చిత్రం “బర్డ్ మాన్”.  ఈ Black Comedyని తీసినాయన Alejandro Inarritu.  మెక్సికన్ దర్శకుడు.

కథకొస్తే, ఒకప్పుడు ‘బర్డ్ మాన్’ సినిమాల హీరోగా ప్రఖ్యాతుడైన రిగ్గన్ థామ్సన్ (Bat Man సిరీస్ లో వేసిన Michael Keaton)  ఇప్పుడు నడివయసు కొసన ఉన్నాడు. భార్యతో విడిపోయాడు. కూతురు మత్తుమందుల అలవాటు వదిలించుకోవటానికి రిహాబ్ సెంటర్ కు వెళ్లి వచ్చింది. ఇప్పుడు అతన్ని హీరోగా గుర్తించి ఆరాధిస్తున్నవాళ్ళెవరూ లేరు. ‘బర్డ్ మాన్’ నీడ మాత్రం అతన్ని మళ్ళీ పాత వైభవం కోసం ప్రయత్నించమని వేధిస్తూ ఉంటుంది. అతని చిన్నప్పుడు స్కూల్ నాటకంలో నటించాడట. అది చూసిన రచయిత రేమండ్ కార్వర్ అతని నటనను మెచ్చుకుంటూ చిన్న టిష్యూ పేపర్ మీద రాసి సంతకం చేసిచ్చాడట. ఆ పేపర్ ను అపురూపంగా దాచుకుని మంచి నటుడు కావాలన్న కోరికను మనసులో పెట్టుకుంటాడు. తర్వాత కామిక్ స్ట్రిప్ హీరో బర్డ్ మాన్ గా హాలీవుడ్ నటుడయి, మంచి దశలో ఉండగా సినిమాను విడిచిపెట్టేస్తాడు.   ఇరవై ఏళ్ల విరామం తర్వాత తనకు చిన్నతనంలో స్ఫూర్తినిచ్చిన కార్వర్ రాసిన ఓ కథను  నాటకంగా న్యూయార్క్  బ్రాడ్వే థియేటర్లో వేయాలన్న కోరికతో నాటక రంగంలోకి దిగుతాడు. తన హాలీవుడ్ పాపులారిటీని, డబ్బునీ, ఇంటినీ అన్నీ తాకట్టు పెట్టి, ఓ 800 మంది ప్రేక్షకులు స్టేజ్ మీద చూడబోయే తన magnum opus సృష్టి కోసం తపిస్తాడు. నెమ్మదిగా చివరకు తన ఆత్మతోనూ, తనలోని కళాకారుడితోనూ, భార్యా బిడ్డతోనూ, తన అభివ్యక్తితోనూ సమన్వయాన్ని సాధించి శాంతంగా నవ్వుకుంటాడు ‘బర్డ్ మాన్’ అనబడే రిగ్గన్.

Photo 2

పైకి చిన్నగానే కనబడే చాలా పెద్ద అస్తిత్వ సమస్యలు అతనివి. తను ఒకప్పటి సెలబ్రిటీ. బర్డ్ మాన్ 4 అని వో సినిమా తీస్తే మళ్ళీ ఒకప్పటి పేరుని తిరిగి సంపాదించ గలిగే అవకాశం ఉన్న రోజులు ఇవి. అయినా ఆ గర్వాన్నంతా అణుచుకుని ఆర్టిస్ట్ గా నాటకంలోకి కొత్తగా అడుగుపెడతాడు. పాపులర్ సినిమాను అసహ్యించుకునే సాంస్కృతిక నియంతలు ఉన్న నాటక రంగం అది.  అక్కడ చౌకబారు పాపులారిటీ ఉన్న హాలీవుడ్ నటుడు,  నాటక దర్శకుడిగా నటుడిగా మెప్పు పొందటం అంటే పరుగులు తీస్తున్న కుర్రాళ్ళ బృందంతో కలిసి ముసలాడి ఎవరెస్ట్ ట్రెకింగే.

***

‘బర్డ్ మాన్’  వేదన ‘సాగర సంగమం’ లోనూ కనిపిస్తుంది. ఇష్టమైన నాట్యంలో తనను తాను వ్యక్తీకరించుకోవటానికి ‘సాగర సంగమం’లో అతని పేదరికం అడ్డవుతుంది. అలా అతని పతనం భౌతికమైన సమస్య దగ్గరే మొదలౌతుంది. విఫలమైన కళాకారుడి  చిక్కని వేదనను కె. విశ్వనాధ్ ‘సాగర సంగమం’ లో గాఢంగా చూపిస్తాడు.  పాపులర్ సినిమాకు అవసరమని కొంతా, తన సొంతమే అయిన మరికొంతా sentimentality ని కలిపి విశ్వనాధ్ తీసిన మంచి ఇతివృత్తం  ‘సాగర సంగమం. ‘కళాకారుడి వేదన’ అనే విషయం వరకే ఈ రెండు సినిమాల పోలిక. ‘బర్డ్ మాన్’ సంక్లిష్టమైన రోజుల్లో తీసిన సంక్లిష్టమైన సినిమా.

చాలా ఎక్కువ సూక్ష్మదృష్టీ, అసాధారణమైన తెలివీ ఉన్నవాళ్ళు మామూలు మనుషులతో అంటుకుని బతకటానికి ఎక్కువ కష్టపడతారు. అడుగడుగునా ఎదురయ్యే అతి మామూలుతనాన్ని అర్థం చేసుకోలేరు. తమతో సమానంగా సంభాషించేవాళ్ళు ఎక్కువమంది కనపడరు. మనుషులతో సంబంధాల్లో వాళ్ళకో అపసవ్యత వచ్చి చేరుతుంది. దాన్ని తొలగించుకోలేక ఇబ్బంది పడతారు.  ఆ బాధను జయించి, తమలో పుట్టే కొత్త కొత్త ఆలోచనలను మిగతా సమాజానికి అందించగలిగే వాళ్ళవల్లే సమాజంలో మార్పులు వస్తాయి.  అది చెయ్యలేని వాళ్లలో మేధాశక్తి ఒంటరి మంచుపర్వతమై, తెలివే శాపమై వాళ్ళు పిచ్చివాళ్ళయే ప్రమాదం కూడా ఉంటుంది. ‘తెలివెక్కువై పిచ్చోడై పోయాడ’ని  కామెంట్ సంపాదించుకునే అభాగ్యులు ఈ రకం. అతి మామూలుతనం మధ్య బతికే ఇలాటి పిచ్చిమేధావి ప్రయాణాన్ని ప్రముఖ మళయాళ దర్శకుడు అదూర్ గోపాలక్రిష్ణన్ తన ‘అనంతరం’ అనే సినిమాలో చూపిస్తాడు.

‘అనంతరం’ లో ఒక మేధావి తన తెలివిని సమాజంతో సమన్వయం చెయ్యలేకా, ‘సాగర సంగమం’ లో కళాకారుడు తన   కళాచాతుర్యాన్ని చేర్చాల్సిన స్థాయికి  చేర్చలేకా విఫలమైతే, ‘బర్డ్ మాన్’ ది వీళ్ళకి సరిగ్గా వ్యతిరేకమైన యాతన. మొదటి రెండు సినిమాల్లో  తెలివైనవాడు తన ఆధిక్యతనుండి న్యూనతవైపు జారిపోతే, ‘బర్డ్ మాన్’ న్యూనత నుంచీ బయలుదేరి  నెమ్మదిగా జీవితాన్నీ కళనూ గెలుస్తాడు. (అమితాబ్ బచ్చన్ నటన సూపర్ స్టార్ అనబడే స్థాయి నుండి బయలుదేరి ‘పీకూ’ సినిమాలో చక్కగా పరిణతి చెందినట్టు). ఈ ప్రక్రియలో కళాకారులకుండే రోంత పిచ్చితనమూ రిగ్గన్ను ఆవహించి, పిస్టల్ లో గుళ్ళు నింపి, నాటకం చివర్లో నిజంగానే తన్ను తాను కాల్చుకుంటాడు. అది చూసి, విజయం సాధించిన అతని నాటకం గురించి ఓ కళావిమర్శకురాలు ‘The unexpected virtue of ignorance’  అని న్యూయార్క్ టైమ్స్ లో రాసి పారేస్తుంది.  పొరపాటున  అతడు గుళ్ళున్న పిస్టల్ తో కాల్చుకున్నాడు కాబట్టి అతని అదృష్టం కొద్దీ ‘సూపర్ రియలిజం’ అనో  కొత్త ప్రక్రియ పుట్టిందని రాస్తూ అతని ప్రయోగంతో అమెరికన్ నాటకానికి కొత్త రక్తం ఎక్కిందని చెప్తుంది.

ఎవరేమనుకున్నా చివరకు రిగ్గన్ మానసిక స్థితే వేరు. రిగ్గన్ గదిలో “A thing is a thing. Not what is said of the thing” అని రాసి వుంటుంది. నాటక ప్రదర్శన తరువాత అతను తానేమిటో తెలుసుకుంటాడు. ఎవరు ఏమనుకుంటున్నారన్నది అతనికి ఇక అనవసరం.

***

‘బర్డ్ మాన్’ లో పొరలు చాలానే ఉన్నాయి. రిగ్గన్ నాటక బృందంలో ఉన్న లెస్లీ, లారా, మైక్ … ఈ ముగ్గురూ కూడా నటులే కాబట్టి ఆవేశాలు ఎక్కువే. అహంకారంతో రిగ్గన్ను తీసి పారేస్తూ, సహజ నటన అంటూ స్టేజ్ మీదే తాగుడూ శృంగారం కూడా నిజంగా చేసెయ్యాలని చూసే మైక్ లో వేరే సున్నితమైన మనిషి కూడా ఉంటాడు. ఆ మనిషి రిగ్గన్ కూతురు సామ్ ముందు బయట పడతాడు. రిహాబ్ సెంటర్ నుండి వచ్చిన సామ్ నాటకంలో తండ్రికి కావలసినవి చూసుకుంటూ సాయపడుతూ ఉంటుంది. అభద్రతా భావం నిండుగా ఆవరించిన సామ్, సోషల్ మీడియా కలిగించే అభద్రతతో పాటు దాని శక్తి ఇంకెంత గట్టిదో నొక్కి చెప్తూ ఉంటుంది.  తక్కువసేపే కనిపించినా ‘టైమ్స్’ పత్రిక ఆర్ట్ సెక్షన్ విమర్శకురాలు రివ్యూలతో కళాకారులని కత్తిరించటమో సైజు పెంచటమో చేస్తూ పోయే ఆర్ట్ క్రిటిక్ లకి గొప్ప ప్రతినిధి. ఈమెను అసలు మర్చిపోలేం.

Photo 3

మొత్తం అంతా కళను శోధించే మనుషుల కథ కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు తాజాగా కొత్తగా ఉన్నాయి. ఆ హాస్యం, పంచ్ కొన్నిసంభాషణలను మళ్ళీ వినమంటాయి. గాబ్రియేల్  మార్క్వెజ్ పుట్టిన సెంట్రల్ అమెరికా నుంచే వచ్చిన ఈ చిత్ర దర్శకుడు Alejandro Inarritu,  సాహిత్య సౌరభాలను సినిమాలో వెదజల్లాడు. మరీ ఎక్కువ తికమక పెట్టని మోతాదులో మాజిక్ రియలిజాన్ని ఉపయోగించాడు. ఇన్ని చేసి “ప్రపంచమే ఒక నాటక రంగం” అన్న షేక్స్పియర్ ని వదిలేస్తే ఎలా? మేక్బెత్ నూ కాస్త వాడాడు.

సినిమా కథా కాలం 3 రోజులు.  మొత్తం ఆ థియేటర్ ఉన్న భవనంలోనే వీళ్ళంతా ఉండటం, మొదటి రెండు రోజులూ ప్రివ్యూ షోలు గా నాటకం వేయటం, అందులోనే అన్ని రభసలూ జరిగిపోతాయి. మూడవ రోజు అసలు నాటకం. అంతే.  ఆ భవనం కాకుండా రిగ్గన్, మైక్ ఒక బార్ లోకి వెళ్తారు. బ్రాడ్వే వీధిలో ఓసారి. ఇంతే స్థల పరిధిలో  నాటకానికి సంబంధించిన ఇతివృత్తం ఉన్న సినిమాను నాటకరూపం లోనే తీశాడు Inarri tu. ఇంకా “బర్డ్ మాన్” సినిమాటోగ్రఫీ కి కూడా ఆస్కార్ వచ్చింది. Inarritu  ప్రణాళిక  ప్రకారం డైరెక్టర్ అఫ్ సినిమాటోగ్రఫీ EImmanuel  Lubezski   (ట్రీ అఫ్ లైఫ్, గ్రావిటీ లకు పని చేశాడు) ‘బర్డ్ మాన్’  సినిమా మొత్తాన్ని ఒకే షాట్ లో తీసినంత భ్రమ కలిగించాడు. ఎడిటర్ కు బొత్తిగా పనిలేని సినిమా ఇది. అసలు పనంతా స్క్రిప్ట్ రైటర్స్ Inarritu మరో ఇద్దరిదీ. (వీళ్ళు ముగ్గురికీ కూడా రాక తప్పని ‘ఒరిజినల్ స్క్రీన్ ప్లే’ ఆస్కార్ వచ్చేసింది).  శంకర్ మహదేవన్ బ్రెత్లెస్ పాటలో ఎక్కడ ఊపిరి పీల్చుకున్నాడో వెదుక్కున్నట్టు, Lubezski  షాట్  ఎక్కడ ఆగి, ఎక్కడ మళ్ళీ మొదలయిందో వెదికి వెదికి పట్టుకోవాల్సిందే. సినిమా విద్యార్థులకు మంచి అభ్యాసం.  ఒకే కామెరా అలా అందరి భావోద్వేగాల మీదా చిన్న పొడవైన కారిడార్లలో, గదుల్లో, స్టేజ్ మీదా అలా దగ్గరగా, దూరంగా, నిశితంగా, పరికిస్తూ వెళ్తూ ఉంటుందంతే. చూస్తున్న మనమూ అలాగే తిరుగుతూ తరవాత ఏమిటాని కుతూహలంగా చూస్తుంటాం.  నటుల ఉద్వేగాలతో  Inarritu బాలే చేయిస్తే దానికి తగ్గట్టు కామెరాతో బాలే చేయించాడు Lubezski.  కొద్దిపాటి జాజ్ ధ్వనులే సంగీతం.

ఆర్ట్ హౌస్ సినిమాకూ పాపులర్ సినిమాకూ తేడాలు చెరిపేయగల్గుతున్నారు Inarritu లాంటివాళ్ళు. నిజానికి ఈ కథా వస్తువును సుఖంగా సెంటిమెంటల్ స్థాయికో లేక తక్కువమంది మాత్రమే అందుకోగలిగే ఉన్నత స్థాయి ఉద్వేగానికో తీసుకువెళ్ళటం సులువు. రిగ్గన్ అసహాయత  మనకి కొంచెం జాలి కలిగిస్తూ ఉండగానే … అవతలివాడికి దొరికిపోతూ, ఓడిపోతున్నట్టు మొహం పెట్టి అతను అలిసిపోగానే … సినిమాలో సరిగ్గా ఆ క్షణాల్లోనే మందకొడితనమో sentimentalityనో వచ్చేస్తాయి సోమరిపోతు దర్శకుడైతే. Inarritu అలా జరగనివ్వడు. రిగ్గన్ వెంటనే తన ఆత్మనంతా కూడదీసుకుని ఎదుర్కొంటాడు పరిస్థితిని. లేకపోతే దర్శకుడే ఆదుకుని పాపం అతని చీప్ పాపులారిటీకి కూడా చిన్న విలువ కలిగిస్తాడు. ఒకోసారి చెత్తెస్ట్ జనరంజకత్వాన్నీ గొప్ప తత్వదర్శనపు కబుర్లనీ పక్కపక్కనే కూర్చోబెట్టి రిగ్గన్ను ఆటపట్టిస్తాడు. ప్రస్తుతం మన అంతర్జాల దర్శనం ఇదే కదా!

రిగ్గన్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు.

Journalist 1 :    As you are probably aware, Barthes said.. “The cultural work done by gods and epics

is now being done by laundry detergent commercials and comic strip characters..

 

Riggan :             Ablosutely,  like you said.. Barthes said… ‘Birdman’,  like Icarus..

Journalist 2 :     Ok hang on, who is this Barthes guy.. Which ‘Birdman’ was he in?

Journo 1      :      Roland Barthes, was a French philosopher and if you knew anything about the

history of..

 

Journo 2      :      Now, is it true you have been injecting yourself with semen from baby pigs?

Riggan :             I’m sorry, What?

Journo 2      :     As a method of facial rejuvenation..

Riggan :             Where did you read it?

Journo 2       :     It was tweeted by @prostatewhispers.

Riggan :             That’s not true.

Journo 2        :    Ok, I’ll write you are denying it.

***

తను జీవించిన కాలాన్ని ఇంత బాగా ఒడిసిపట్టి సినిమాలోకి చరిత్రీకరించటం అంత తేలికైన పని కాదు.

Me Saludar Senor Inarritu ! 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వాళ్ళ ‘ఇడా’, మన ‘దువిధా’!

 

ల.లి.త.

lalitha parnandiఇప్పుడు వస్తున్న చాలా సినిమాలు గతవైభవాల స్మరణా, భజనా చేస్తున్నాయి.  కాస్త పెద్ద బడ్జెట్ అయితే చాలు ఒకప్పటి అద్భుత మానవుల సంశయాలు, విజయాలే కథా వస్తువులు. Period films పేరుతో  ప్రేమ, ఈర్ష్య, బానిసత్వం, దురాశ లాంటి మానవ లక్షణాలు అన్నిట్నీ ముదురు రంగుల్లో ముంచి తీసి సినిమాకు పులుముతున్నారు.  ఆ కాలానికి చెందిన కుండా, చట్టీ, చెప్పూ, కారూ సినిమాలోకి ఎంత కరెక్ట్ గా తెచ్చి చూపించామా అన్నది  అసలు సినిమా కంటే పెద్ద గొడవై కూచుంది.  దాని తర్వాతది రక్తధారలు ధారాళంగా కురిపించటం. ఒక్క మాటలో Period,  Detail,  Graphic violence… ఈ మూడిటి మధ్యే  ఈనాటి సినిమా కుదించుకు పోయింది. 

ఈమధ్య ప్రపంచానికి అమెరికా ‘Game of Thrones’ అనే మహత్తర టీవీ సీరియల్ ను ప్రసాదించటంతో ఈ మూడు దినుసుల గిరాకీ మనకీ మరింత ఎక్కువ కాబోయే ప్రమాదం  కనిపిస్తోంది.  ఇంత పెద్ద పెద్ద డైనోసార్లలాంటి దేశ విదేశ సినీ హీరోల సినిమాల, సీరియళ్ళ హంగామా మధ్య వింతగా ఓ చిన్ని కుందేలు పిల్ల లాంటి  సినిమా మన వొళ్ళోకి వచ్చి కూర్చుని అలరించింది.  అది  2014 సంవత్సరానికి ఉత్తమ విదేశీ చిత్రంగా అకాడమీ అవార్డ్ అందుకున్న పోలిష్ సినిమా ‘ఇడా’. ఆస్కార్ ఆర్భాటాలే గానీ  ఉత్తమ విదేశీ చిత్రం అవార్డ్  పొందే సినిమాలు మన సినిమా హాళ్ళలోకి రావు. నిజానికి కొన్నిసార్లు ఇవే ఆస్కార్ లు గెల్చిన అమెరికన్ సినిమాల కంటే బాగుంటాయి.

‘ఇడా’ గురించి సినిమాప్రియుల్లో  చర్చ బాగా జరిగింది.  ఇదీ గతకాలపు కథనే చెప్పినా, ఇప్పటి గ్రాఫిక్ మహిమల మహా గాథలకూ ఏ అలంకారాలూ లేని ‘ఇడా’ కథకూ పోలికే లేదు.  దర్శకుడు పావెల్ పావ్ లోవ్ స్కీ, సినిమాటోగ్రాఫర్  లుకాస్ జాల్ కలిసి ఈ సినిమాను బెర్గ్ మన్,  బ్రెస్సోఁ  ల పక్కన కూచోబెట్టే ప్రయత్నం చేశారు. ఆ మహా దర్శకులను గుర్తుకు తీసుకొచ్చింది ‘ఇడా’.

తనవారు ఎవరూ లేని ‘ఇడా’ ఓ కాన్వెంట్ లో పెరుగుతుంది. సన్యాసినిగా ప్రతిజ్ఞలు తీసుకోబోయే ముందు ఆమెకున్న ఒకే ఒక్క బంధువు, ఆమె పిన్నిని ఓసారి చూసి రమ్మని పంపిస్తుంది కాన్వెంట్ మదర్.  తనకో పిన్ని ఉందని తెలియటం ఇడా కు పెద్ద ఆశ్చర్యం అయితే, తన  తల్లిదండ్రులు యూదులనీ,  రెండో ప్రపంచ యుద్ధకాలంలో బలైపోయారనీ తెలియటం ఊహకందని మరో వ్యథ.  వాళ్ళు ఎలా చనిపోయారో, ఎవరు చంపారో తెలుసుకునే అన్వేషణలో ఈ ఇద్దరు ఆడవాళ్ళూ బయలుదేరుతారు. ఒద్దికైన ఇడాకు పూర్తి వ్యతిరేక స్వభావం ఆమె పిన్నిది. ఈ ఇద్దరి అనుభవాలూ, భావాలూ, సహానుభూతులూ వైరుధ్యాల కెలైడోస్కోప్ ఈ సినిమా.

 

photo 2ఫ్రేమ్ ల పొదుపరితనంలో బ్రెస్సోఁ స్థాయి పరిపక్వతకు దగ్గరగా వచ్చేసింది ‘ఇడా’. మరి మొత్తమంతా ఓల్డ్ మాస్టర్స్ లాగే తీసేస్తే మన ముద్ర ఏదని ఆలోచించుకున్నారో ఏమో, ఫొటోగ్రఫీలో ఈ మధ్య ఎక్కువగా వాడుతున్న  ‘negative space’ ను సినిమాలోకి తెచ్చిపెట్టారు దర్శకుడూ సినిమాటోగ్రాఫర్ కలిసి.  జాగ్రత్తగా వాడకపోతే బెడిసికొట్టే మందు ఈ ‘negative spacing’.  ఫ్రేమ్ లో సబ్జెక్టు ఆక్రమించిన ప్రాంతం తప్ప, ఖాళీగా ఉన్న మిగతాదంతా negative space.   ఫ్రేమ్ లో సబ్జెక్టు (positive space) సైజు కంటే ఎక్కువగా వదిలేసిన ఆ ఖాళీకి సరైన అర్థం, తూగు ఇవ్వగల్గితే మంచి ఫోటో అవుతుంది.  ఇవ్వలేకపోతే అది అతి మామూలు  ఫోటోగా కూడా కాదు, వెర్రి ఫోటోగా మిగుల్తుంది.  ఇడా లో ఈ  ‘negative spacing’ సరిగ్గా సమకూడింది.  ప్రారంభంలోనే  ఇడా క్రీస్తు బొమ్మకు రంగేస్తూ సినిమా ఫ్రేమ్ కు కిందున్న ఎడమ మూలలో కనిపిస్తుంది. ఇలా సినిమా అంతా చాలావరకూ మూలల్లోనూ, ఫ్రేమ్ కి అడుగుభాగానా సర్దుకుంటారు ఇద్దరు ఆడవాళ్ళూ.  వాళ్ళ ఒంటరితనం, నిస్సహాయ పరిస్థితిని తోపింపచేయటం ఈ  ఫ్రేమ్ ల లక్ష్యం అనిపిస్తుంది. చివర్లో ఇడా తన బ్రతుకు గురించిన నిర్ణయాన్ని తీసుకుని అడుగులు వేసేటప్పుడు ధీమాగా  ఫ్రేమ్ లో సరిగ్గా కనిపిస్తుంది.

photo 3

సినిమా అంతా ఉట్టిపడే  పిక్టోరియల్ ఫోటోగ్రాఫిక్ దృశ్యాల గురించి చెప్పనే అక్కర్లేదు. వాటితో వచ్చే క్లాసిసిజం తిరుగు లేనిది.  అందులోనూ మళ్ళీ అందంగా కొత్తరకంగా పిక్టోరియల్ నియమాలు దాటేస్తూ వచ్చారు.  ఒక్కటి కూడా అనవసరమైన ఫ్రేమ్ కనిపించదు. 1:1.33 academy ratio లో తీయటం వల్ల ఈ పోకడలన్నీ సాధ్యపడ్డాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సినిమా స్కోప్ (దీర్ఘ చతురస్రం) కాకుండా పాత సినిమాల్లాగ నలుచదరంగా అన్నమాట. ఇంకా, ఒక సీన్లో మంచు మధ్యలో గుండ్రటి గట్టు మధ్య నిలబడి ఉన్న క్రీస్తు విగ్రహాన్ని  “Christ is the Key” అని తోచేట్లుగా తీసిన కెమెరా కోణం ఎంతటి ఊహ ఉంటే సాధ్యపడుతుంది?  ‘ఇడా’ కు వాడిన లైటింగ్ పధ్ధతి కూడా సినిమాటోగ్రాఫర్ లకు తెలిసిన పాఠాలనే మళ్ళీ కొత్తగా నేర్పుతుంది.  Linear narrative  గా ఉంటూనే  ‘ఇడా’ రూప ప్రధానమైన సినిమా కూడాను.  ఈ సినిమాటోగ్రఫీ విధానం చాలా ఆకర్షణీయంగా కొత్తగా ఉండటంతో ‘ఇడా’ ప్రేమలో పడి ఎడాపెడా దాన్ని చాలామంది దర్శకులూ సినిమాటోగ్రాఫర్ లూ వాడే అవకాశం కూడా ఉంది.  ఆ పని ఇప్పటికే మొదలైపోయి ఉండవచ్చు.

photo 4 (1)

 

మన దర్శకులూ, సినిమాటోగ్రాఫర్ లలో తెలివికి ఏ లోటూ లేదు. ‘ఇడా’ను సృష్టించినవాళ్ళు పడిన కష్టంలో పదోవంతైనా వీళ్ళు ఎప్పుడైనా పడి మనదైన సినిమాను తీస్తారా? ఏమో !

మనదైన సినిమా కోసం తపన పడ్డ దర్శకుడు రిత్విక్ ఘటక్.  ప్రాచీనం కాని సినిమా మీడియంలో ప్రాచ్యాన్ని దర్శింపజేయాలన్న ఆశయం ఆయనది.  భారతీయ సినిమాలో మణి కౌల్, కుమార్ సహానీలది రిత్విక్ ఘటక్ స్కూల్.  ఇది రూప(form) ప్రధానం. దీన్ని సాధించి ఒప్పించటం కష్టం.  ‘మో’ కవిత్వంలా, త్రిపుర కథలా సరిగ్గా కుదిరితే formalist  సినిమా బ్రహ్మానందాన్నిస్తుంది.  ఏపాటిగా అటుదిటైనా తేలిపోయి నవ్వులపాలై పోతుంది. కుమార్ సహానీ తీసిన ‘మాయా దర్పణ్’, మణి కౌల్ తీసిన ‘ఉస్కీ రోటీ’  1970ల్లో formalist సినిమాలు గా చెల్లిపోయినా ఇప్పుడు చూస్తే అర్థంపర్థం లేనట్టు ఉంటాయి. అనురాగ్ కాశ్యప్ 2007 లో తీసిన ‘నో స్మోకింగ్’ ఓ మంచి formalist సినిమా.  కానీ కాశ్యప్ కు మన కళలతో, భారతీయాత్మతో పెద్దగా అనురాగం లేదు.

‘ఇడా’ చూశాక మణి కౌల్ పూర్తిగా శిల్ప ప్రాధాన్యతతో  ఏ తడబాటూ లేకుండా 1970 ల్లో తీసిన ‘దువిధ’ గుర్తుకు వచ్చింది. ‘దువిధ’ ఒక రాజస్తానీ జానపద కథ.  విజయ్ దన్ ధేతా కథనం. ఈయన కథలన్నీ ‘సందిగ్ధ’ పేరుతో సంకలనంగా తెలుగులోకి కూడా అనువాదం అయాయి.  దువిధ అంటే సందిగ్ధత. కొత్తగా పెళ్ళయిన అమ్మాయి, అబ్బాయి పల్లకీలో వెళ్తుండగా చెట్టునున్న ఒక దయ్యం చూసి, ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు.  ఎంతసేపటికీ కాసులు లెక్క పెట్టుకునే ఆ అబ్బాయి కొత్త పెళ్లి కూతుర్ని తన తల్లిదండ్రులతోనే వదిలేసి వేరేచోటికి వ్యాపారం చెయ్యటానికి వెళ్ళిపోతాడు. ఈ అవకాశం పోగొట్టుకోకూడదని ఆలోచించిన దయ్యం ఆ అబ్బాయి రూపంలో ఈమె దగ్గరకు వచ్చి భర్తగా ఉండిపోతాడు. (నిజాయితీగా తానెవరో ఆమెకు చెప్పి మరీ).  కొన్నేళ్ళు దయ్యంతో సుఖంగా గడిపేక ఆమె గర్భవతి అవుతుంది. తమ వంశం కొత్త చిగురు వేస్తోందని పెద్ద షావుకారు ఊరందరికీ బెల్లం పంచుతాడు.  ఈమె పురిటి నొప్పులు పడుతున్న సందర్భంలో అసలు భర్త తిరిగొస్తాడు. ఈ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు తన కొడుకో పోల్చుకోలేక గాభరా పడతాడు పెద్ద షావుకారు.  చివరకు ఒక గొర్రెల కాపరి తన జిత్తులమారితనాన్నంతా ఉపయోగించి, దయ్యాన్ని పట్టిస్తాడు.  ప్రేమను ఇచ్చి పుచ్చుకున్న దయ్యం అంతమైతే ఆమె మాటలేక మౌనమైపోతుంది.

photo 5

photo 6

ఈ కథను formalist cinema గా తీయటానికి పూనుకున్నాడు మణి కౌల్. భారతీయ చిత్రకళ అతను ఎంచుకున్న form.  మన చిత్రకళలో పొడవూ, వెడల్పేగానీ మూడో కొలత అయిన లోతు కనిపించదు. ఈ చిత్రకళా రూపాన్ని సినిమాలోకి తర్జుమా చెయ్యాలంటే ఎలా?  దానికోసం ఎక్కువగా లాంగ్ ఫోకస్ లెన్స్ ను వాడాడు.  అది ఫ్రేమ్ లో ‘లోతు’ కొలతను అసలు రానివ్వదు. అంటే  ఫ్రేమ్ లో దగ్గరగానూ దూరంగానూ ఉన్న వస్తువులూ, మనుషులూ, బ్యాక్ గ్రౌండ్, అన్నీ కూడా మన పెయింటింగ్స్ లా ఒకే తలంలో కనిపిస్తాయి.  ఈ flatness మీద  గాఢమైన రంగులు, విభిన్నమైన కెమెరా కోణాలు ప్రయోగించి మేజిక్ చేశాడు మణి కౌల్.  (కాఫీని ‘వట్టి గోధుమరంగు వేడి ఊహ’ గా మార్చిన త్రిపురలా)  ‘హై కీ’ ఫోటోగ్రఫీని వాడటంతో లేతరంగు గోడలు, ఆర్చ్ లూ నీటి రంగుల చిత్రంలో తడి ఆరుతున్న కుంచె గీతల్లా కానవస్తాయి. కదిలే ఇంప్రెషనిస్టిక్ పెయింటింగ్ లా ఉంటుంది ‘దువిధ’ సినిమా.  వేదనా భరితమైన రాజస్తానీ జానపద గీతాలూ, రంగుల తలపాగాలూ పెయింటింగ్ లోని ముఖ్యమైన డీటెయిల్స్ లాగా భాసించాయి.  ఇన్ని చేసీ,  ఇంత గొప్ప డ్రమటిక్ కథలోంచి ‘డ్రామా’ ను (డ్రామా మన భారతీయ పద్ధతే అయినా!) పూర్తిగా బైటకు గెంటేసి non-narrative style ను అనుసరించాడు మణి కౌల్.  అయినా ‘దువిధ’ చూస్తుంటే విషాదాన్నీ ఆనందాన్నీ తూలికతో మనసుమీద ఎవరో తేలికగా అద్దిన భావనకు లోనవుతాం. అలా అది ఓ అర్థవంతమైన formalist  సినిమాగా నిలుస్తుంది. తూర్పుమీద కాస్తగా పడమరను పూసి  తనదైన కళ నిండిన సినిమాను సృష్టించాడు మణి కౌల్.

photo 7

photo 8

‘ఇడా’, ‘దువిధ’ … రెండూ తీరికగా ఆలోచించి, ధ్యానించి తీసిన సినిమాలు.  రెండిటిలోనూ స్త్రీ ‘సందిగ్ధ’ యే.  రెండిటిలోనూ రూప సారాలు ఒకదానికొకటి మంచి నేస్తాల్లా నిలబడ్డాయి.  రెండిట్లోనూ అవి పుట్టిన నేల వాసన బలంగా  వస్తుంది. ‘ఇడా’ కొన్ని క్లాసిక్ ఫోటోల కూర్పులా ఉంటే దువిధ పెయింటింగ్ ల సమాహారంలా ఉంటుంది.  తేడా ఒకటే. ‘ఇడా’ మామూలు పద్ధతిలో చెప్పిన కథ. ‘దువిధ’ non narrative గా మరింత ఎక్కువగా మేథో విన్యాసం చేస్తుంది.

ఆఖరుగా దర్శకుడు రాబర్ట్ బ్రెస్సోఁ ని మరోసారి స్మరిద్దాం. ఆయన అభిప్రాయంలో ఫిల్మ్ మేకర్ పని సృష్టించటం కాదు. జరుగుతున్నదాన్ని గుర్తించటం. కెమెరా ఆన్ చేసి దృశ్యాన్ని, కదలికలనూ చూస్తూ పోతుంటే ఎక్కడో ఒక సరైన కదలిక, ఒక సరైన ఫ్రేమ్,  చాలా యాదృచ్చికంగా వస్తుందట. దాన్ని గుర్తించటమే  ఫిల్మ్ మేకర్ పని అంటాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ గ్రహణం సినిమాను కమ్మేస్తున్న రోజుల్లో ఇంతటి జెన్ ధ్యానం చెయ్యగల సినీ మహానుభావులు నూటికి ఒకరైనా ఉంటారా? ఉండకపోరు. వాళ్ళ వల్లే ఇలాటి సినిమాలు ఎప్పుడైనా ఓసారి వస్తుంటాయి.

*

 

 

 

 

 

 

 

 

‘బ్యోమ్ కేష్ బక్షీ’ ఆఫ్ దిబాకర్ బెనర్జీ…

ల.లి.త.

 

lalitha parnandiElementary …” –  Sherlock Holmes.

షెర్లాక్ హోమ్స్ అభిమానులంతా ఈ మాట పట్టుకుని మురుస్తూ ఉంటారు. నేర పరిశోధనలో ఎవరూ కనిపెట్టలేని అతి చిన్న వివరాన్ని పట్టుకుని విషయమేమిటో తేల్చటం elementary.  అసలు డికెష్టీ (బుడుగు భాషలో) వాడంటేనే  అసామాన్యుడు.  సూపర్ మాన్ లు, బాట్ మాన్ లు, ఇంకా అడ్డమైన మాన్ లూ తెలీకముందు డికెష్టీ, పోలీసువాడు, రైలింజన్ డ్రైవర్ … వీళ్ళే బుజ్జి మగపిల్లల దృష్టిలో గొప్ప హీరోలు.

సరైన డిటెక్టివ్ సాహిత్యం తలకెక్కితే మరి దిగదు. గొప్ప ఆటగాడిలా నేరస్తుడికి చెక్ చెప్పటానికి డిటెక్టివ్ వేసే   చదరంగపుటెత్తులేమిటో ఊహించేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాం. అంతటి ఘనమైన డిటెక్టివ్ సాహిత్యంలో పేరున్న బెంగాలీ డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ. బ్యోమ్ కేష్ కథతో బెంగాలీబాబు దిబాకర్ బెనర్జీ సినిమా తీస్తున్నాడంటే చాలామంది ఎదురుచూపులు… కానీ దిబాకర్ తెలివికి ఇది పెద్ద పరీక్షే. ఎందుకంటే బ్యోమ్ కేష్ అంటే నేనేనంటూ ఇప్పటికే తిష్టవేసి కూర్చున్నాడు రజత్ కపూర్. తొంభైల్లో దూరదర్శన్ లో వచ్చిన ‘బ్యోమ్ కేష్ బక్షీ’ హిందీ సీరియల్ ను జనం బాగా ఆదరించారు. పంచె కట్టి,  విశాలమైన నుదురుతో, కళ్ళను మెరిపిస్తూ, చిరునవ్వుల్తో తను కేసునెలా పరిష్కరించాడో వివరించే రజత్ కపూర్ అందరికీ తెలిసిన డిటెక్టివ్ బ్యోమ్ కేష్. ఈ పాత్రను సృష్టించినది శరదిందు బందోపాధ్యాయ. శరదిందు కథల్ని హిందీ సీరియల్ గా తీసిన బాసు చటర్జీ మరో ఘనమైన బెంగాలీ. అంతవరకూ బెంగాలీ వాళ్ళకే పరిమితమైన బ్యోమ్ కేష్ బక్షీ ని ఈ హిందీ సీరియల్ తో దేశమంతా గుర్తించింది.

గొప్ప డిటెక్టివ్ లందరికీ ఆదిగురువు షెర్లాక్ హోమ్స్. షెర్లాక్ పెద్ద మర్రి చెట్టయితే మిగతా డిటెక్టివ్ లంతా ఆ చెట్టు ఊడలే.  షెర్లాక్ కి వాట్సన్ లా బ్యోమ్ కేష్ కి కూడా రచయిత అజిత్ బాబు తోడుంటాడు.  షెర్లాక్ పాత్రను రచయిత కానన్ డాయల్ ఓసారి అంతం చేసేసినా పాఠకుల కోర్కెతో మళ్ళీ బతికించి తీసుకొచ్చాడు. రచయిత శరదిందు, బ్యోమ్ కేష్ కు కూడా పెళ్లి చేసి రిటైర్మెంట్ ఇప్పించినా, పాఠకులు ఇంకా అతన్ని ఆదరిస్తున్నారని గ్రహించి, మళ్ళీ తీసుకొచ్చి డికెష్టీ పనులు మొదలు పెట్టించాడు. ఈ పోలికలతో పాటు షెర్లాక్ లో ఎంత బ్రిటిష్ తనం ఉంటుందో, బ్యోమ్ కేష్ లో అంతగానూ బెంగాలీతనం ఉంటుంది . షెర్లాక్ నూ బ్యోమ్ కేష్ నూ కలిపేదీ ఈ లక్షణమే. వాళ్ళిద్దరినీ విడదీసి దూరంగా నిలబెట్టేదీ ఈ లక్షణమే. ఎంతగా విశ్వ సాహిత్యం తలకెక్కించుకున్నా, మన వేళ్ళు మన నేలలోనే దృఢంగా ఉండటమంటే ఇదే. ఈ ప్రత్యేకతతోనే బాసు చటర్జీ సీరియల్ బ్యోమ్ కేష్ బక్షీ కూడా అలరారింది.

 

దిబాకర్ బెనర్జీ “డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ” సినిమాలోనూ బెంగాలీతనానికి లోటు లేదు. పంచె కట్టి, దానిమీద బాటా షూ వేసి, మనుషులు పరుగెడుతూ లాగే రిక్షాల్లో, కలకత్తా ట్రాముల్లో తిరుగుతుంటాడు బ్యోమ్ కేష్. పాతకాలం పాన్ డబ్బా, అందులో మసాలాతో పాటు దాచుకున్న కొక్కోక శాస్త్రం, వింటేజ్ కార్లు, చైనా దంతవైద్యం, ఇత్తడి చెంబులు, గ్లాసులు, బక్కచిక్కిన బెంగాలీ మొహంలో పెద్ద పెద్ద కళ్ళేసుకుని పాత గెస్ట్ హౌస్ లో ఆశ్చర్యపోతూ తిరిగే వంటవాడు… వీటిమధ్య 1942 కలకత్తాలో మనని విహారం చేయిస్తాడు దిబాకర్. పీరియడ్ లుక్ కోసం ఎంత సూక్ష్మంగా వెళ్ళాడంటే, సినిమా పోస్టర్లు నలభైలనాటి సినిమా పోస్టర్లలా ఉన్నాయి. మన ‘చందమామ’ బేతాళకథలకు వేసిన బొమ్మల్లా కూడా !

ఇప్పటి మల్టీప్లెక్స్ హిందీ సినిమాల్లో హీరోలు, నటుల అసలు ముఖాలు కనిపించటం లేదు. ఆ పాత్రలే కనిపిస్తున్నాయి. హాలీవుడ్ మాదిరిగా ‘కాస్టింగ్ డైరెక్టర్స్’ ను పెట్టుకుని పాత్రకు తగ్గ మొహాలు, శరీరాలు ఉన్నవాళ్ళని నటులుగా ఎన్నుకోవటంలోనే  సినిమా కళ దాగుందని కనిపెట్టేశారు మనవాళ్ళు కూడా…  ఇలా పాత్రలకు తగ్గ మంచి నటులు ఎక్కువమంది సమకూడిన సినిమాలకు ఈమధ్య ‘best ensemble cast’ అని అవార్డులు కూడా ఇస్తున్నారు.  ఈ సినిమాలో, కనపడే పాత్రలతో పాటు కీలకమైన, మనకు అసలు కనపడని ఒక జీనియస్ వ్యక్తిత్వం-  అతనికి సంబంధించిన బట్టల పెట్టే, పాన్ డబ్బా… అతని కొడుకు చెప్పే కొన్ని మాటలూ… వీటితోనే ఎంతబాగా అర్థం అయిపోతుందంటే, కథ చదువుతూ మనం పాత్రను ఊహించుకున్నట్టే !  సినిమా ప్రక్రియను సాహిత్య ప్రక్రియ లాగా కూడా సాధించిన అరుదైన దర్శకుల పేర్లలో దిబాకర్ పేరూ చేర్చాల్సిందే.

శరదిందు కథల్లో బ్యోమ్ కేష్ కి తనను డిటెక్టివ్ అని పిలవటం కూడా ఇష్టం ఉండదు. ‘సత్యాన్వేషి’ నని చెప్పుకుంటాడు. అలాంటి సత్యాన్వేషిగా అలరించిన రజత్ కపూర్ తో పోటీకి రాగల నటుడిని బ్యోమ్ కేష్ పాత్రకు ఎంచుకోవటం కూడా కష్టమైన పనే.  ఈ సినిమాలో బ్యోమ్ కేష్ గా సుశాంత్ సింగ్ రాజపుత్ కూడా బానే ఉన్నాడు. నటించాడు.  వీళ్ళిద్దరికీ పొడుగు, చురుకు కళ్ళు, అల్లరి నవ్వు సమాన లక్షణాలు. బుద్ధికుశలత తప్ప బల ప్రదర్శనలేవీ పెద్దగా ఉండవు. సుశాంత్ సింగ్ అయితే గట్టి దెబ్బలు తిన్నాడే గానీ అవకాశమున్నా ఫైట్లు అసలు చెయ్యలేదు. ఇది దిబాకర్ బ్యోమ్ కేష్ బక్షీ పాత్రకు ఇచ్చిన గౌరవమే.

Byomkesh-Bakshi-is-Indias-answer-to-Sherlock-Homes

శరదిందు కథ ‘సత్యాన్వేషి’లో కలకత్తా చైనా టౌన్ లో మత్తుమందు అమ్మకాలు, హత్యల నేపథ్యంలో బ్యోమ్ కేష్ నేరస్తుడిని పట్టుకుంటాడు. ఆ కథనే సూత్రంగా తీసుకుని రెండో ప్రపంచయుద్ధం, మత్తుమందులు, కలకత్తా ఆక్రమణకు జపాన్ వ్యూహాలు, ఇదంతా ఒకే చేత్తో… సారీ ఒకే మెదడుతో, బ్యోమ్ కేష్ ఆపెయ్యటం… ఇలా కథను పెంచుకుంటూపోయి, బ్యోమ్ కేష్ ను సూపర్ హీరో చేసేశాడు దిబాకర్ బెనర్జీ. కథను వంద మలుపులు తిప్పి larger than life స్థాయిలో సినిమా చేశాడు. దిబాకర్ లాంటి దర్శకుడి  మీద కూడా ఈ అట్టహాసపు హాలీవుడ్ ప్రభావం తప్పదా అని దిగులు… సినిమా నిశితంగా, తీరిగ్గా మనస్తత్వాల్లోకి తడిమి చూస్తుంది.  హాలీవుడ్ సినిమాలాంటి విస్తృతితో మలుపులు తిరిగి, చూసేవాళ్ళని కొంతసేపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయినా సరే, విస్తృతినీ, నిశితత్వాన్నీ సరిగ్గా బాలన్స్ చెయ్యలేకపోయిన లోటు ఏదో మిగుల్చుతుంది.

ఇంతకు ముందు దిబాకర్ తీసిన సినిమాల్లో సూపర్ హీరోలు లేరు. ఇతని దర్శకత్వంలో వచ్చిన ‘షాంఘై’ లో నాయకుడు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి. రాజకీయ మాఫియాగాళ్ళను కూడా తెలివితోనే లొంగదీస్తాడు. ఫైట్లు, రక్త పాతాల జోలికి వెళ్ళడు.  కానీ ‘డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ’ సినిమా చాలా గ్రాఫిక్ గా ఉండే హింసతో ప్రారంభమై, గ్రాఫిక్ గా ఉండే హింసతోనే ముగుస్తుంది. మధ్యలో బ్యోమ్ కేష్ తెలివితో పోటీ పడి, అతన్ని తప్పుదారి పట్టించగల దీటైన విలన్ ఆడే ఆటలు.. బ్యోమ్ కేష్ అదంతా ఛేదించి, కలకత్తాను జపాన్ ఆక్రమణలోకి వెళ్ళిపోకుండా అడ్డుకోవటం… జరుగుతాయి. చిన్న కేసుల్లోనే పక్కాగా వ్యూహం రచించే బ్యోమ్ కేష్ బక్షీ ఈ సినిమాలో చివర్లో తీసుకునే రిస్క్ చూస్తే, అది ఆ సత్యాన్వేషి పాత్రకు తగిన వ్యూహంలా అనిపించదు.  నేరం బైటపెట్టే క్రమంలో డిటెక్టివ్ లు రిస్క్ తో కూడిన తప్పనిసరి నిర్ణయాలు తీసుకోవటం సహజమే. ఆ నిర్ణయాల ఫలితం ఏవో కొన్ని జీవితాలకో, ఒక నేరస్తుడికో పరిమితమైతే పర్వాలేదు కానీ, ప్రేమించిన అమ్మాయి అన్న కోసం భీకరమైన నేరస్తులతో ఆటాడి, కలకత్తా మొత్తాన్నే ప్రమాదంలో పెట్టే పని సరైన ఏ డిటెక్టివ్ అయినా చెయ్యగలడా అనేది ఇక్కడ ప్రశ్న. ఇలాటి ప్రశ్నలకి దారి తీయటమే ఈ సినిమా చెయ్యకూడని పని. కానీ చేసేసింది. దీనితో రావాల్సిన క్లాసిక్ లక్షణం సరిగ్గా రాకుండా పోయింది.

షెర్లాక్ కి వన్నె తేవటం కోసం మోరియార్టీలాంటి బలమైన ప్రతినాయకుడిని సృష్టించాడు కానన్ డాయల్. మోరియార్టీ మేథకు అయస్కాంత శక్తి ఉంది. Benedict Cumberbatch  షెర్లాక్ గా వస్తున్న బి.బి.సి. సీరియల్ లో కూడా మోరియార్టీని చాలా ఆకర్షణీయంగా తయారుచెయ్యకుండా ఉండలేక పోయారు.  మోరియార్టీ పాత్ర ప్రభావంతోనేమో, దిబాకర్ బెనర్జీ కూడా తన సినిమాలో ‘అనుకూల్ గుహ’ అనే పాత్రతో మైండ్ గేమ్స్ ఆడించాడు. బ్యోమ్ కేష్, గుహ లిద్దరూ ఒకరి తెలివిని ఒకరు అభినందించుకుంటారు. అనుకూల్ గుహగా నటించిన నీరజ్ కబి ని తట్టుకోవటం సుశాంత్ సింగ్ కు బాగా కష్టమై ఉంటుంది. అంత బాగా చేశాడు అతను. చివరకు “నా ప్రేమనే తట్టుకోలేక పోయావ్. నా ద్వేషాన్ని ఎలా తట్టుకుంటావో చూస్తాను” అని బ్యోమ్ కేష్ ను ఉద్దేశించి గుహ ప్రతిజ్ఞలు చెయ్యటంతో సినిమా పూర్తవుతుంది. ఈ ముగింపు చూస్తే ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన ఉన్నట్టుంది. కొన్ని లోపాలున్నా ఇలాంటి సినిమాలనూ, సీక్వెల్స్ నూ కూడా ఇష్టపడే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు.

స్నేహా కన్వల్కర్ “గాంగ్స్ అఫ్ వాసేపూర్” కు అసలైన జానపద బాణీలను వాడి ఆ సినిమాను మెరిపించింది. కానీ బ్యోమ్ కేష్ సినిమాకు తగిన సంగీతం ఇవ్వలేకపోయిందనిపించింది. డిటెక్టివ్ సినిమాల ట్యూన్స్ అంటే, అవి మనల్ని వెంటాడుతూ ఉండాల్సిందే !  అది ఈ సినిమాలో జరగలేదు. పైగా హోరుగా ఉన్న సంగీతంతో ప్రేక్షకులని ఈ కథకి ఎలా శృతి చేద్దామని అనుకున్నారో అర్థం కాలేదు. బ్యోమ్ కేష్ లాంటి పీరియడ్ ఫిల్మ్ లో ఇలాంటి సంగీతం కోసం కాలేజ్ పిల్లలు కూడా వెదుక్కోరు. లేక సినిమా ప్రమోషన్ కోసం, పాత తరం సినిమా అని ఎక్కడ రావటం మానేస్తారో అని భయపడి అందర్నీ ఆకర్షించటం కోసం, అలాంటి metal rock సంగీతపు ట్రాక్ అవసరమనుకునే ఊహ వచ్చిందేమో!

బ్యోమ్ కేష్ బక్షీ హిందీ సీరియల్ లో సాంకేతిక విలువలు అంతగా బాగుండవు. ఏవో బడ్జెట్ పరిమితులతో తీసినదది. కానీ దానికి ఆనంద్ శంకర్ ఇచ్చిన థీమ్ సంగీతం మాత్రం అద్భుతంగా ఉంటుంది.  ఆ టైటిల్ మ్యూజిక్ ఇక్కడ…

https://www.youtube.com/watch?v=zlOAN3Gb-8c

Jeremy Brett  షెర్లాక్ హోమ్స్ గా నటించిన గ్రానడా టీవీ క్లాసిక్ సీరియల్ “షెర్లాక్ హోమ్స్” టైటిల్ థీమ్ ఇక్కడ…

https://www.youtube.com/watch?v=3AoK2dqb1vs

Benedict Cumberbatch  షెర్లాక్ హోమ్స్ గా బి.బి.సి. తీస్తున్న సీరియల్ థీమ్ ఇది…

https://www.youtube.com/watch?v=gzCEIBaV1Es

షెర్లాక్ హోమ్స్ చెప్పినట్టుగా  “There is nothing so important as trifles” అన్న సూత్రానికి బాగానే కట్టుబడ్డ సినిమా “డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ”

కానీ,  “ప్రతిసారీ అసాధ్యమైన విషయాల్ని విడిచిపెడుతూ పోతే మిగిలేది, జరగటానికి అతి తక్కువ ఆస్కారం ఉన్నదైనా సరే, అదే సత్యం” (“Whenever you have eliminated the impossible, whatever remains, however improbable, must be the truth” – Sherlock Holmes) అనే షెర్లాక్ సత్య శోధన పధ్ధతిలో సినిమా తీసేటప్పుడు, హాలీవుడ్ బాలీవుడ్ ల భారమైన అసాధ్యపుటూహలను కూడా పక్కన పెడితేనే సత్యమైన సినిమా బైటకొస్తుంది.

That’s  “Elementary….”  My dear Dibakar!

                                                                                            *

ముల్లూ, అరిటాకూ… ఒక సమాంతర హింసా…

ల.లి.త.

 

lalitha parnandiలెస్లీ ఉడ్విన్ బి.బి.సి. కోసం తీసిన “India’s Daughter” డాక్యుమెంటరీ నిషేధంలో ఉంది.  కోర్టు దీన్నింకా పరిశీలిస్తోంది.   ‘నిర్భయ’ పేరుతో దేశంలో అందరూ పిలుచుకున్న జ్యోతీ సింగ్ ఢిల్లీలో హింసాత్మకమైన సామూహిక అత్యాచారానికి గురై చనిపోయిన  డిసెంబర్ 16, 2012 నుండీ, నిందితులకు కింది కోర్టు మరణశిక్ష విధించిన రోజు వరకూ జరిగిన ప్రజా ఉద్యమాన్ని వివరించింది ఈ డాక్యుమెంటరీ.  ముఖ్యంగా జ్యోతి తల్లిదండ్రులూ, నేరస్తుడు ముఖేష్ సింగ్ మాట్లాడారు ఇందులో.  నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని లేవగొట్టి, ప్రజాస్వామ్యం సాధించిన చరిత్రాత్మక విజయాన్ని వివరించిన డాక్యుమెంటరీ…  దీనిలో మన దేశానికి జరిగిన అవమానం ఏమీ లేదు.

ఒక సమాజంలోని పరిణతి చెందిన యువతరం ఈ సంఘటనకు ఎంత బాగా స్పందించిందో చెప్పటం మనల్ని తక్కువ చెయ్యటం ఎలా అవుతుంది? దీనిలో పచ్చిగా స్త్రీ జాతికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన లాయర్లతోబాటు సంస్కారం మూర్తీభవించిన జ్యోతి తండ్రీ, ఆమె ట్యూటర్, నిర్భయ చట్టం తయారు చేసిన న్యాయమూర్తుల్లో ఒకాయన కూడా ఉన్నారు.   ఖప్ పంచాయితీలు ఆడపిల్లల చేతుల్లోంచి సెల్ ఫోన్లు లాక్కున్నట్టుగా సమస్యని మూతవేసి, ప్రభుత్వం బి.బి.సి. మీద చట్టపరమైన చర్యకు దిగుతామనటం పిల్లకాయల ఉక్రోషంలా ఉంది.

*****

రేప్ –  “స్త్రీ శరీరం మీద హక్కు స్త్రీది కాదు. అది పురుషుడిది”  అని కొంతమంది బలంగా చేస్తున్న స్టేట్మెంట్.

“మీరు ఏ చట్టాలు చేసుకున్నా మాకు ఒకటే. ఆడది అంటే మాకు ఒక వినోదం. ఆడ శరీరాల మీద హక్కులు మావి. బయటి ప్రపంచం మాది. అక్కడ ఆడవాళ్ళు కూడా తిరుగుతామంటే మేం వాళ్ళని  ఏమైనా చేసేసే అధికారం మాకుంది.”  — ఇది కొద్దిమంది మగవాళ్ళ ఆలోచనే కావచ్చు. కానీ చాలా సంస్కారవంతులుగా కనిపించే మగవాళ్ళు కూడా ఈ మురికి ఆలోచనాధార లోని చిన్న పాయను పంచుకుంటూనే ఉన్నారు. రేప్ జరిగిందని విన్నప్పుడు ఈ పాయలు ఇలా ప్రవహిస్తూ ఉంటాయి.  “ఈ ఆడపిల్లలు సరిగ్గా బట్టలు కట్టుకోరు. అందుకే అత్యాచారాలు జరుగుతాయి… ఆడపిల్లలు రాత్రివేళ తిరుగుళ్ళు ఏమిటి?… అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి తిరగటం ఎక్కువైపోయింది…”

ఆడపిల్ల కట్టుకున్న బట్టకీ రేప్ కీ సంబంధం ఉంటే పల్లెటూళ్ళలో ఒళ్ళు కప్పుకునే తిరిగే ఆడవాళ్ళ మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి?  తెలంగాణా పల్లెల్లో పొలంపని చేసేటప్పుడు పైటను తీసి నడుం చుట్టూ కట్టేస్తారు ముందు తరం ఆడవాళ్ళు. ఉత్తరాంధ్రలో బ్లౌజ్ వేసుకోవడం అంటే సిగ్గు పడే ముసలి వాళ్ళు ఇంకా ఉన్నారు.  జీన్స్, టీ షర్టుల్లో స్త్రీలను చూడటం అలవాటైన చదువుకున్న ‘టెకీ’లకు లంగా, ఓణీల్లో కనిపించే నడుము ఓ వింత.  ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతపు దుస్తులూ, నగరాల్లో సౌకర్యంకోసం పేంట్, షర్ట్ లూ వేసుకు తిరుగుతారు అమ్మాయిలు.  ‘మనకు తెలిసిందే సంస్కృతి’ అనుకునే హ్రస్వదృష్టినుండి వచ్చినదే ఈ దుస్తుల సెన్సారింగ్.

ప్రతీ స్త్రీ ఏదో ఒక పని చేస్తూ బయట తిరిగి ఇంటికీ దేశానికీ తనవంతు తాను ఉపయోగపడుతూ ఉంటే, ఇంకా దుస్తులూ, పగలూ, రాత్రీ అంటూ మాట్లాడటం ఎంత అర్థ రహితం! అయినా రాత్రి అంటే ఎన్ని గంటలు? ఢిల్లీ, హైదరాబాద్ లాంటి అనేక ప్రదేశాల్లో రాత్రి 8 గంటలంటే సాయంత్రం కిందే లెక్క. అలాంటి సమయంలో జ్యోతి రేప్ కు గురయింది.  మాటు వేసే వేటగాళ్ళు పగటిపూట కూడా తిరుగుతారు. ఆడా, మగా కలిసి చదివి, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కలిసి తిరగటం, మాట్లాడుకోవటం, ఇష్టపడటం కూడా ఉంటాయి కదా!  రేప్ నేరాల్ని అదుపు చెయ్యటం అనే వంకతో ఇప్పుడు ఆడవాళ్ళందరినీ వంటిళ్ళలోకి తోసెయ్యటం అసాధ్యం కదా! తిరగబడతారు. తాలిబన్లలాంటి వాళ్ళో, ఖప్ పంచాయితీలో గట్టి పట్టు పడితే తప్ప ఆడవాళ్ళ తిక్క కుదరదనుకుంటే అత్యాచార సమస్యకు అది కూడా పరిష్కారం కాదు. ఎందుకంటే తాలిబన్లకు కూడా రేప్ అజెండా ఉంది మరి!

 

జ్యోతి కేసులో నేరస్తుల తరఫున వాదించిన లాయర్ ఏ.పి. సింగ్ చదువుకున్న చదువు అతని మూర్ఖత్వాన్ని ఏమాత్రం తీసెయ్యలేక పోయింది. “నా చెల్లెలో, కూతురో ఇలా పెళ్ళికి ముందు మగవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే ఫార్మ్ హౌస్ లో కుటుంబం అందరిముందూ దాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను” అని ఆనాడు న్యూస్ చానెల్స్ కు చెప్పిన మాటనే మళ్ళీ నొక్కి చెప్పాడు ఈ డాక్యుమెంటరీలో.

nirbhaya-case

రేప్ –  “పబ్లిక్ స్పేస్ ఆడవాళ్లది కాదు” అనే ఒక తీవ్రమైన స్టేట్మెంట్.

“ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉంటారు. ఉండాలి. అదే వాళ్ళ చోటు. బయట వాళ్ళకేం పని? బైటకొస్తే కుటుంబ సభ్యులతోనే రావాలి. ఒంటరిగా తిరగరాదు. మగ స్నేహితులతో అసలు తిరగరాదు.”  ఈ రూల్ బుక్ పట్టుకుని ప్రవచించే మగవాళ్ళు మనకి చాలామందే ఉండటం మరో బాధ. ‘అరిటాకు మీద ముల్లు పడ్డా ముల్లు మీద అరిటాకు పడ్డా అరిటాకుకే నష్టం’ అనే సామెతను పాతబడనీయకుండా రేప్ నేరాల్లో బాధితులే నేరానికి కారణం అని నింద వేస్తున్నారు.  ఇలాంటి వాళ్ళతో,  స్త్రీలు బయట స్వేచ్ఛగా తిరిగే హక్కు కోసం స్త్రీలూ, స్త్రీవాదులూ, కొంతమంది  మగవాళ్ళూ చేస్తున్న యుద్ధాన్ని ఎంతైనా అభినందించాలి.

కొంతైనా మార్పు అనేది మగపిల్లలను పెంచే తీరు, పోలీసుల బాధ్యతాయుతమైన ప్రవర్తన, నేరానికి శిక్ష త్వరగా వెయ్యటం … వీటివలన వస్తుంది కానీ, ఇంకా ఆడపిల్లలను గంపకింద కోడిపిల్లల్లా మూసిపెట్టాలనుకునే ఆలోచనల వల్ల రాదు. బాధాకరమైన విషయం ఏమిటంటే పబ్లిక్ స్పేస్ కోసం మనసులో ఎంత తాపత్రయ పడుతున్నా, ఢిల్లీ లాంటి చోట్ల ఆడపిల్లలు సాయంత్రం ఏడుగంటలనుండీ గంపకింద చేరుతున్నారు.  రేప్ కి కారణం ఆడవాళ్లేనని ఎక్కువమంది చెప్తుంటే ఆడవాళ్ళలో అభద్రత ఎలా పోతుంది? ఎవరు పోగొట్టగలరు? అలా మాట్లాడేవాళ్ళను  గట్టిగా నిరసించటంలో మాత్రం స్త్రీలు వెనుదియ్యటం లేదు. రేప్ జరిగితే ధైర్యంగా రిపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి సంధి కాలంలో “వీళ్ళు నోళ్ళు విప్పే ధైర్యం చేస్తే ఊరుకోం” అంటూ దౌర్జన్యాన్ని సిగ్నల్ గా పంపిస్తోంది రాతిలా ఘనీభవించిన పురుషాధిక్యత.  ఈ డాక్యుమెంటరీలో నేరస్తుడు ముఖేష్ సింగ్ “బట్టలు విప్పటం, దౌర్జన్యం చెయ్యటం లాంటివి చేస్తే ఎవరూ బైటకు చెప్పుకోలేరనే ధైర్యంతోనే తన అన్న రాం సింగ్ (జైలులో ఉరేసుకుని చనిపోయిన నిర్భయ రేపిస్టు) ఇలాంటి పనులు చేస్తుండేవాడ”ని చెప్తాడు.

చదువుకున్న స్త్రీకి అలవడే చైతన్యం ఈ అణచివేతను ప్రశ్నించకుండా ఉండనివ్వదు. మీడియా ఈ చైతన్యానికి సహాయాన్ని అందిస్తోంది.  అప్పుడిక రాజకీయ నాయకులూ, మేథావులూ, వివేకవంతులైన యువకులూ, అందరూ ఈ సమస్య గురించి ఆలోచించక తప్పదు. మొత్తం సమాజం అంతా కూడా ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక అసమానతల వైపు నడుస్తూ, ఆడవాళ్ళను మాత్రం ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించి చట్టాలు చేస్తోంది. ఇది  నిర్భయ చట్టాన్ని తక్కువ చేయడం కాదు. చట్టాలను సరిగ్గా ఉపయోగించుకోవాలంటే,  మొదటిగా పబ్లిక్ స్పేస్ ఆడవాళ్లది కూడాననే అవగాహనను నాయకులూ, పోలీసులూ తల కెక్కించుకుంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

కొందరు మహా ఉద్రేకంగా రేప్ నేరస్తులకు మరణశిక్ష వెయ్యలంటారు. ఇది మాస్ హిస్టీరియాలోంచి వచ్చిన మాట. అసలు మరణ శిక్షనే రద్దు చెయ్యాలనే మానవీయ ప్రయత్నం నుంచీ వెనక్కు తీసే పరుగు.  ఈ మాట చెప్పేవాళ్ళు “India’s Daughter” లో నిర్భయ కేసులో నేరస్తుడు ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ చూడాలి. అతని దృష్టిలో రేప్ చాలా సామాన్యమైన నేరం. దానికి మరణశిక్ష ఏమిటో అతనికి అర్ధం కాదు. “రేప్ కి మరణశిక్ష లాంటిది ఏదైనా వస్తే, రేపిస్టులు బాధితుల్ని చంపి పారేస్తారు.  Death … అంతే”. అన్నాడతను చాలా మామూలుగా.

రేప్ – విల్లాలుగానూ మురికి కూపాలుగానూ విడిపోయిన రెండు ప్రపంచాల ఘర్షణలో స్త్రీల విలవిల.

ముఖేష్ సింగ్ ప్రపంచమే వేరు. “రేప్ కి మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ బాధ్యులు. ఆడవాళ్ళు ఇల్లు చూసుకుంటూ ఉండాలి. రాత్రివేళ అబ్బాయిలతో సినిమాలూ డిస్కోలూ ఏమిటి? జ్యోతికీ, ఆమె స్నేహితుడికీ అలా తిరగకూడదని మా అన్న ఓ పాఠం చెప్పాలనుకున్నాడు. వాళ్ళు తిరగబడి అతన్ని కొట్టడంతో అది రేప్ కి దారి తీసింది. అయినా ఆమె ప్రతిఘటించకుండా ఉండాల్సింది. (నోరు మూసుకుంటే చచ్చిపోకుండా ఉండేదని ధ్వని)…     ఇవీ అతని ఆలోచనలు.

ముఖేష్ సింగ్ మాటల్లో అపరాధ భావన కనిపించదు. “You are what you were before fourteen years of age” … ఎటువంటి బాల్యం అతనిది? వాళ్ళు ఉండే రవిదాస్ క్యాంపు అనే ఢిల్లీ మురికివాడలో నేరస్తులు ఆరుగురూ స్నేహితులు అయారు. తిండి కూడా సరిగ్గా లేని బాల్యం అందరిదీ. తిట్లూ, దెబ్బలూ వాళ్లకు అతి సామాన్యం. తల్లిని, అక్క చెల్లెళ్ళనూ  కొడుతూ ఉండే మగవాళ్ళు…  నోళ్ళు మూసుకునే ఉండే ఆడవాళ్ళు, తిండి కోసం శరీరంతో వ్యాపారం చేసే ఆడవాళ్ళు… వీళ్ళు చూడని మొరటుతనం అంటూ ఏదీ మిగిలిలేదు.  ఆడవాళ్ళు ఎప్పుడూ మగవాళ్ళకు లోబడే ఉండాలనుకునే తత్వాన్ని చేపకు ఈతంత సహజంగా అలవరచిన వాతావరణం… ఇదొక అథోజగత్తు.

మరోవైపు మాల్స్ అనే దివ్యలోకాల్లో కొంతమందికే దొరికే సంపద మెరుపు…  ఆ అథోజగత్తుకీ,  ఈ ఇంద్ర భవనాలకీ మధ్య నిచ్చెనలు వెయ్య ప్రయత్నించే మధ్య తరగతి…

నగరాల్లో మధ్యతరగతి అమ్మాయిలమీద చేసే దాడి, స్త్రీ మీద ఆధిక్య ప్రకటనే కాకుండా, తమకంటే బాగా బతికే మనుషులమీద తీర్చుకునే కక్ష కూడా!  “మన సిటీ బాగానే ఉంటుంది. బైటనుంచి పనులకోసం వస్తున్నారు చూడండి. వాళ్ళవల్లే నేరాలు పెరిగిపోతున్నాయి” అంటారు కొందరు.  సిటీ కొందరికోసం ధగధగ మెరిసే జీవితాన్ని అందిస్తోంది. మరి కొందరికోసం మురికివాడల్ని తయారు చేస్తోంది. ఈ ఎగుడు దిగుళ్ళ నేలమీద ముందుగా బలయ్యేది ఆడవాళ్ళు, పిల్లలు.

దిగువ మధ్యతరగతికి చెందిన జ్యోతి తండ్రి, తల్లి.  వీళ్ళిద్దరూ సంస్కారంలో తమ సమాజంలో చాలా మంది కంటే ముందున్నారు. జ్యోతి చదువుకోసం పొలం అమ్మారంటే, వాళ్ళు తమ బిడ్డకు ఎంత విలువ ఇచ్చారో అర్థం అవుతుంది. ఇది ఉత్తర భారత దేశంలో చాలా అరుదైన విషయం.  “జ్యోతి పేరు బైటకు చెప్పటానికి నాకు సంకోచమేమీ లేదు. జ్యోతి ఒక చిహ్నంగా మారిపోయింది. ఈ సమాజం ఆడవాళ్ళకి ఇస్తున్న విలువ ఏమిటని ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది”.  అంటున్నాడు జ్యోతి తండ్రి.

మరోపక్క పైపైకి ఎదిగే ఆశలతో ఢిల్లీ మధ్యతరగతి యువత… ఆడా మగా కలిసి భుజాలు కలిపి చదువులూ, ఉద్యోగాలతో పబ్లిక్ స్పేస్ ని సమంగా పంచుకుంటున్న తరం. సినిమాకు అమ్మాయీ అబ్బాయీ కలిసి వెళ్ళటం అనే మామూలు విషయాన్ని గురించి కొంతమంది పెద్దవాళ్ళు అదేదో తప్పులా మాట్లాడటం వీళ్ళకు అర్థమే కాదు.  వీళ్ళ  ప్రపంచం జ్యోతిమీద జరిగిన దారుణాన్ని తట్టుకోలేక పోయింది.  ఏ నాయకుడూ లేకుండానే నెల రోజులపాటు ఉద్యమం చేసి నిర్భయ చట్టాన్ని సాధించుకుంది.  ఆ కొత్తల్లో మరికొన్ని రేప్ కేసులు కూడా కోర్టుల్లో వేగంగానే కదిలాయి.

nir1

రేప్ – జాతుల, తెగల, కులాల, వర్గాల కుమ్ములాటలో స్త్రీకి తగిలే లోతైన గాయం.

నిర్భయ చట్టం వచ్చిన తరువాతే ఉత్తరప్రదేశ్ బదాయూఁ లో చీకటివేళ బహిర్భూమికి వెళ్ళిన ఇద్దరు ఆడపిల్లలని చెట్టుకు ఉరివేసి చంపినవాళ్ళ రాక్షసత్వానికి దేశమంతా నిర్ఘాంతపోయింది. ఆ కేసులో అరెస్టులు జరిగినా, సరిగ్గా కేసును వివరించ లేకపోయారు పోలీసులు. ఆ పిల్లల హంతకుల రహస్యాలు గంగానది వరదల్లో సమాధి అయిపోయాయి.  ఈ హీనమైన అత్యాచారాల వెనుక ఉన్న బలమైన స్టేట్ మెంట్ ఏమిటి ? ఆధిక్య ప్రదర్శన… అసలు రేప్ స్వభావమే అణచివేత…  యుద్ధాలు జరిగే చోట్ల రేప్ లు అడ్డూ ఆపూ లేకుండా జరుగుతాయి. ఆస్తుల మీదా, భూమి మీదా ఆధిక్య ప్రకటన కోసం చేసే అణచివేత ఆడవాళ్ళ మీద మానభంగం అనే రూపాన్ని తీసుకుంటుంది. అక్కడ అది ఒక అజెండా. ఆడవాళ్ళ గర్భాల్లో తమ మతాన్నీ తెగనూ పాతి, వేరే మతాన్నీ తెగనూ అణచివేసే ఎత్తుగడ.  అలాగే దళితులూ స్త్రీలూ “మేమూ మీతో సమానమే. భూమి హక్కులు కావాలి. ఆత్మ గౌరవం కావాలి” అని తిరగబడ్డచోట (కారంచేడు, ఖైర్లాంజీ, రాజస్తాన్ లో భన్వారీదేవి), ఊరి పెద్దలు ఆ దళితుల్లో మగవాళ్ళను నరికీ, ఆడవాళ్ళను రేప్ చేసీ ఆధిక్యత ప్రకటిస్తారు. మానభంగాన్ని శిక్షగా వేస్తున్న సమాజాలు ఇంకా ఉన్న దేశం మనది.  పల్లెటూళ్లలో రేప్ కి ఉన్న ఈ అణచివేత స్వభావాన్ని అందరం ఇంచుమించుగా ఒప్పేసుకుంటాం. మన గ్రామీణ ప్రపంచం ఇప్పుడు మనకు సంబంధించినది కాదు. అందుకే బదాయూఁ, రోహతక్ లు అందరి దృష్టినీ ఆకర్షించవు. నగరాల్లో బతుకుతూ మీడియా తో సహా అందరం దీన్నంతా collateral damage గా భావించి మర్చిపోతాం.

రేప్ –   ఒంటరి మనసుల్లోంచి సుడి తిరిగి బైటపడుతున్న ఉన్మాదపు వాంతి.     

నిర్భయ సంఘటన జరిగిన రెండేళ్లకు, మళ్ళీ అదేరకమైన రేప్ కేసు వార్తల్లోకి వచ్చింది.  ఈ మధ్య మతి స్థిమితంలేని ఒక నేపాలీ అమ్మాయిమీద రోహతక్ లో దాడి జరిగింది.  జ్యోతీ సింగ్ శరీరంలో గుచ్చినట్టే ఈమె శరీరంలోనూ బ్లేడ్లు, రాళ్ళు గుచ్చారు. అత్యాచారం చెయ్యటమే కాకుండా మధ్యయుగాల మాదిరిగా శరీరాన్ని హింసించటం చూస్తుంటే, ఈ చిత్రహింసల ఊహలు ఎక్కడినుండి వస్తున్నాయని  భయం వేస్తుంది. ఆ అమానుషత్వం చూడలేక ఢిల్లీ లాగే రోహతక్ కూడా వణికింది.  ప్రజలు రోడ్డున పడ్డారు.  ఆ రోజు ఒళ్ళు చితికిపోయి ఆరిపోతున్న జ్యోతి, తన శక్తంతా కూడదీసుకుని గుప్పున వెలిగి, జరిగిందేమిటో చెప్పి పోరాడింది.  తనకేం జరిగిందో కూడా సరిగ్గా చెప్పలేని ఈ పిచ్చి పిల్లకు  నోరు విప్పే అవకాశమే లేకుండా చేసి చంపి పారేశారు రాక్షసులు.  జనం గోల పెడితే గానీ పోలీసులు ఈసారీ కదల్లేదు.

ప్రపంచం అంతా ఒకే ఊరుగా మారాక  ఒక్కసారిగా 24 గంటల టీవీలూ, సినిమాలూ, క్రైమ్ సీరియళ్ళు, ప్రతి వీధిలో వైన్ షాపులూ, నెట్ లో సెక్స్ ట్యూబులూ సునామీలా మనల్ని చుట్టేశాయి. అరచేతిలో ఇమిడే సెల్ ఫోన్ అనబడే నిషిద్ధ ఫలం ఇప్పుడు అందరిదీ…  సినిమాలని చాలామంది తప్పు పడతారు గానీ,  వాటికంటే ఇంటర్నెట్ సెక్స్ వీడియోల విచ్చలవిడి అందుబాటుకీ, స్త్రీల మీద జరిగే అత్యాచారాలకీ ఉన్న సంబంధం గట్టిదేనేమో ఆలోచించాలి.

అన్నీ ఉన్నతనం, ఏమీ లేనితనం … ఈ రెండూ నిరంతరం ఎదురెదురుగా బతుకుతున్నాయి మన నగరాల్లో. డబ్బు చెట్టు విస్తరించి ఎన్ని పళ్ళు పండినా, అవి చాలా మందికి అందని ద్రాక్షలై, రాళ్ళతో చెట్టును కొట్టి పళ్ళను అందుకోమంటున్నాయి.  తీరని కోరికలూ, ఉక్రోషాలూ, తలకెక్కుతున్న వికారాలూ కలిసి దౌర్జన్యానికి ఉసిగొల్పుతున్నాయి.  ఏదెలా ఉన్నా అసమాన సమాజపు అణచివేతలూ, నేరాలూ, ఆధిక్య ప్రకటనల్లో జరిగే collateral damage  ఆడవాళ్లకే… ఎప్పుడైనా… ఎక్కడైనా…

 

 *

 

 

 

 

 

 

 

 

 

 

ఆరోగ్యం అందరి హక్కూ …. “Sicko”

యువరాజ్ సింగ్, లీసా రే, మనీషా కోయిరాలా లాంటి కేన్సర్ బాధితులు కేన్సర్ తో పోరాడాలని సందేశాలిస్తూ అందరినీ యుద్ధ సన్నద్ధులను చేస్తుంటారు. కేన్సర్ రాగానే యువీ లాగానో, మనీషా లాగానో పోరాడి, ఏదోలా బతుకు జీవుడా అనుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? తేడా అల్లా డబ్బున్నవాడికి యుద్ధం చెయ్యటానికి ఏకే ఫార్టీ సెవెన్ల లాంటి స్టార్ ఆస్పత్రులుంటే లేనివాడి చేతుల్లో చిన్న కట్టెపుల్ల లాటి ధర్మాసుపత్రి కూడా సరిగ్గా ఉండదు. గట్టి జబ్బులొస్తే బతుకు గాల్లో దీపమై రెపరెపలాడుతుంది. ప్రాణ దీపాలు ఆరిపోతే పట్టించుకునేవాళ్ళూ లేరు.

అమెరికాలో ఒక పెద్దమనిషికి ప్రమాదంలో మధ్యవేలు, ఉంగరంవేళ్ళ తలకాయలు రెండూ తెగిపోయాయి. వాటిని తిరిగి అంటించి నిలబెట్టడానికి ఉంగరం వేలికైతే 12 వేలు, మధ్యవేలికైతే 60 వేలు అడిగారట ఆస్పత్రిలో. ఆయనకు పాపం ఆరోగ్య బీమా లేదు. డబ్బూ లేదు. రెండువేళ్ళనీ దక్కించుకునే మార్గం లేక 12 వేలిచ్చుకుని ఉంగరం వేలిని రక్షించుకుని మధ్యవేలి తలని చెత్త కుప్పలో వదిలేశాడట. ఆరోగ్య బీమా లేని ఇంకో నిర్భాగ్యుడు మోకాలికి దెబ్బ తగిలితే స్వయంగా తనే కుట్లు వేసుకుంటూ కనిపిస్తాడు. వీరిద్దరితో “Sicko” సినిమాను మొదలు పెడతాడు మైకల్ మూర్. కానీ “Sicko” సినిమా ఆరోగ్య బీమా లేని 50 మిలియన్ల అమెరికన్ల గురించి కాదు. బీమా రక్షణ ఉన్న 250 మిలియన్ల మంది గురించే చర్చిస్తుంది.

మైకల్ మూర్ అమెరికన్. మంచి పేరున్న డాక్యుమెంటరీ దర్శకుడు. “ఫారన్ హీట్ 9/11” సినిమాతో ప్రపంచాన్ని కుదిపేశాడు. “Sicko” 2007 లో తీశాడు. ఈ సినిమా, లోపలంతా పురుగు పట్టిన ‘అమెరికన్ హెల్త్ కేర్’ మేడి పండును చాలా నాటకీయంగా, ఆసక్తికరంగా విప్పిచూపిస్తుంది.

అమెరికాలో ఆరోగ్య బీమా లేనివాళ్ళకు ఒకటే చింత. బీమా ఉన్నవాళ్ళకు మాత్రం వంద బాధలు. బీమా కంపెనీ ఏ జబ్బు కుదుర్చుకోవటానికి డబ్బులిస్తుందో, ఏ జబ్బుకు వీలు కాదంటుందో అంతా ఆ కంపెనీ ఇష్టమే. ఏ మనిషికైనా వచ్చిన జబ్బుకి అంకురం బీమా కట్టటానికి ముందే పడిందని నిర్ణయించి, ఆ జబ్బుకి వైద్యం తమ బీమా పరిధిలోకి రాదని నిర్ణయించటానికి కంపెనీలు అన్ని ప్రయత్నాలూ చేస్తుంటాయని చెప్తున్నారు బాధితులు. బీమా బాధితుల వివరాల కోసం మైకల్ మూర్ అడిగిందే తడవుగా వారంలోపునే 25,000 మంది అతనికి ఈ మెయిల్ లో తమ కథలు వినిపించారట. బీమా ఉన్నప్పటికీ అది తమ మందుల ఖర్చుకు సరిపోక, ఒక 79 ఏళ్ల పెద్దాయన మందుల కంపెనీలో వాష్ రూములు కడగటం దగ్గర్నుంచీ అడ్డమైన పనులూ చేస్తున్నాడు. దీర్ఘ రోగులైన తనకీ, భార్యకీ అక్కడ మందులు దొరుకుతాయని, అందుకని చచ్చేవరకూ ఆ పని చేస్తాననీ చెప్తున్నాడు. ఒక్కోటీ 200 డాలర్ల ఖరీదున్న పెయిన్ కిల్లర్ కొనుక్కోలేక ఆ మందు కంటే ఓ పెగ్ బ్రాందీ తనకి తనకి చాలంటోంది వాళ్ళావిడ. మధ్యతరగతి భార్యా భర్తలు లారీ, డోనా స్మిత్ లు. బీమారక్షణ ఉన్నప్పటికీ లారీ కి మూడు సార్లు వచ్చిన గుండె పోటు, డోనాకు వచ్చిన కేన్సర్ వైద్యాల దెబ్బతో వాళ్ళిద్దరూ ఇల్లు అమ్ముకుని కూతురింట్లో స్టోర్ రూమ్ లో ఇరుక్కుని బతకాల్సి వస్తుంది.

అమెరికన్ ఆరోగ్య బీమా కంపెనీలు విపరీతమైన లాభాల్లో ఉంటాయి. లాభం తగ్గకుండా ఉండేందుకు, వచ్చిన కేసుల్లో 10 శాతం కేసుల్ని బీమా పరిధిలోకి రావని డాక్టర్లు నిర్ణయించాలి. ఇది ఆస్పత్రులకూ, బీమా కంపెనీలకూ డాక్టర్లకూ మధ్య ఉండే ఒప్పందం. ఇలా ఎన్ని దరఖాస్తులను తిరగ్గొడితే డాక్టర్లకు అంత బోనస్ ఇస్తారని ఒక వైద్యురాలు చెప్తుంది. బీమా కేసులు మరీ ఎక్కువైతే వాటిని ఏదో వంకపెట్టి తిరగ్గొట్టటానికి అన్నిచోట్లా ఉన్నట్టే ఇక్కడా హిట్ మన్ ఉంటారు. లీ ఐనర్ అనే హిట్ మన్ తను చేసిన పాపాలు చెప్పేసి, ఇప్పుడు తను ఆ పని చెయ్యటం మానుకున్నానంటాడు. హ్యుమానా అనే హాస్పిటల్, తన భర్త ట్రేసీ కొచ్చిన బ్రెయిన్ కాన్సర్ కు వైద్యం నిరాకరించి, అతన్ని చావుకు ఎలా దగ్గర చేసిందో అతని భార్య చెప్తుంటే ఆ అమానవత్వం గడ్డ కట్టిన చావులా మనను తాకుతుంది.

హ్యుమానా లో పని చేసిన మెడికల్ రెవ్యూయర్ డాక్టర్ లిండా పీనో, ఆపరేషన్ అవసరమైన వ్యక్తి కేసును తిరగ్గొట్టి అతని చావుకు తను కారణమైనానని, కంపెనీకి తను చేసిన పనివల్ల ఓ అర మిలియన్ డాలర్లు మిగిలాయి కాబట్టి తన మీద ఏ కేసూ రాలేదని, తనూ డబ్బు సంపాదించుకుందని యు.ఎస్. కాంగ్రెస్ ముందు అందర్లోనూ చెప్పి పశ్చాత్తాపం ప్రకటిస్తుంది. తను తిరగ్గొట్టిన కేసుల కాగితాలన్నీ కళ్ళ ముందుకొచ్చి తనను నిలదీస్తున్నాయని బాధ పడుతుంది.

అసలీ రాక్షసత్వానికి బీజాలు 1971లో నిక్సన్ కూ, ఎడ్గార్ కైసర్ కంపెనీకీ జరిగిన ఒప్పందంతోనే పడ్డాయని చెప్తున్నాడు మైకల్ మూర్. ఆరోగ్య రక్షణ తక్కువగా ఇచ్చి ఎక్కువ లాభాలు సంపాదించే కంపెనీల వల్ల ప్రభుత్వం, పార్టీలు లాభపడతాయి కాబట్టి ఇదేదో బాగా ఉందని కైసర్ చేతిలో అమెరికన్ల ఆరోగ్యాన్ని పెట్టేశాడు నిక్సన్. దానితో పేదలకు దారుణమైన జబ్బులకు వైద్యం అసలు అందకుండా పోయింది. హిల్లరీ క్లింటన్ రాజకీయాల్లోకి వచ్చాక అందరికీ సరైన హెల్త్ కేర్ ఇవ్వాలని, దానికి తగిన విధానాన్ని ప్రభుత్వంచేత చేయించాలని చాలా పట్టుబట్టింది కానీ కంపెనీలు, కాంగ్రెస్ సభ్యులూ కలిసి ఆమె నోరు మూయించారు.

అమెరికాలో సోషలిజం వచ్చేస్తోందంటూ గోల చేశారు. ముఖ్యంగా డాక్టర్లకు మరీ భయం. గవర్నమెంట్ ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చెయ్యాల్సి వస్తుందనే ఊహే వాళ్ళు భరించలేరు. అంతగా ముదిరిపోయిన వ్యక్తివాదం. డాక్టర్లు దేశమంతా తమ చుట్టుపక్కల ఉండే అందర్నీ పోగు చేసి, ‘అందరికీ వైద్యం’ అనే విషయం ఎంత చెడ్డదో వివరించే ఒక రికార్డును వినిపించారు. రోనాల్డ్ రీగన్ గారి ఈ రికార్డు “Sicko” లో మంచి కామెడీ ట్రాక్. మొత్తానికి బీమా కంపెనీలు ఒక వంద మిలియన్ డాలర్ల దాకా ఖర్చు చేసి, హిల్లరీ తీసుకు రావాలనుకున్న హెల్త్ కేర్ పాలసీని ఓడించేశాయి. జార్జ్ బుష్ వచ్చాక మరిన్ని కొత్త పాలసీలతో మందుల కంపెనీలు కూడా బలిశాయి.

అమెరికాలో హెల్త్ కేర్ ఇలా ఏడుస్తుంటే, మైకల్ మూర్ పక్క దేశాల హెల్త్ కేర్ ఏమిటో చూద్దామని కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ తిరిగాడు. ఈ దేశాల్లో రోగులకు దొరుకుతున్న రాజభోగాలు చూసి కళ్ళు తిరిగి బోర్లా పడ్డాడు. ఎవరూ వైద్యంకోసం చేతిలోంచి పైసా ఖర్చు పెట్టక్కర లేదు. అతి తక్కువ డబ్బుకి మందులు దొరుకుతున్నాయి. కెనడాలో చేతి వేళ్ళన్నీ తెగిపోయిన మనిషికి 24 గంటల పాటు ఆపరేషన్ చేసి అన్ని వేళ్ళూ ఉచితంగా కుట్టేసి పంపించారు. మనకి వెంటనే అమెరికాలో మధ్యవేలా ఉంగరంవేలా అని వేలాడిన మనిషి గుర్తొస్తాడు. బ్రిటన్ ఆసుపత్రిలో వైద్యం పూర్తి అయిన రోగి తిరిగి ఇంటికి వెళ్ళటానికి డబ్బు లేకపోతే ఆస్పత్రి వాళ్ళే దారిఖర్చు ఇచ్చి ఇంటికి పంపటం చూశాడు మూర్. డాక్టరు సంతృప్తిగా ఎగువ మధ్యతరగతి జీవితం గడపటాన్ని చూశాడు. రోగుల చేత చెడు అలవాట్లు మాన్పించి ఆరోగ్యం బాగయేలా చేసే డాక్టర్లకు బోనస్ కూడా దొరుకుతుంది. అమెరికా కథని తిరగేసి రాసినట్టు ఉంటుంది లండన్ లో. డాక్టర్లు రాత్రీ పగలూ లేకుండా అత్యవసర పరిస్థితుల్లో రోగుల ఇళ్ళకు వచ్చి వైద్యాన్ని అందించటాన్ని రికార్డు చేశాడు మూర్. ఫ్రాన్స్ లో రోగం పూర్తిగా తగ్గేదాకా పూర్తి జీతంతో రోగికి విశ్రాంతినిచ్చే పధ్ధతి చూసి ఆశ్చర్యపోయాడు. కొత్తగా తల్లులైన ఆడవాళ్ళకు సాయం చెయ్యటానికి ప్రభుత్వం వారానికి రెండు సార్లు ప్రభుత్వోద్యోగులైన నానీలను ఆ తల్లుల ఇళ్ళకు పంపటం చూశాడు.

“ఇది ప్రజలకు చేస్తున్న ఉద్ధరింపు ఏమీ కాదు. ప్రజలనుంచి పన్నులు ప్రభుత్వం వసూలు చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు రోగాలొస్తే వైద్యం అందించాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం ఎలా తప్పించుకోగలదు? రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ లో మేం ఆరోగ్యరక్షణ కోసం మంచి చట్టాలు చేసుకున్నాం. వీటిని మార్చే ధైర్యం ఎవరూ చెయ్యలేరు” అంటాడు ఒకాయన.

“Sicko” లో మైకల్ మూర్ కొంతమంది రోగుల్ని వెంటేసుకుని పక్కనున్న క్యూబాకు మూడు పడవల్లో వెళ్లి, వాళ్ళందరికీ అక్కడి ఆస్పత్రిలో వైద్యం చేయించి అతి తక్కువ ఖర్చులో దొరికే మందులు ఇప్పించే సేవా కార్యక్రమం కూడా చేశాడు. వీళ్ళలో ఎక్కువమంది అగ్నిమాపక దళంలో పనిచేస్తూ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాద దాడిలో నేల కూలినప్పుడు గ్రౌండ్ జీరోలో అతిగా పని చేసి, ఆ పొగల్లో నుసిలో రోగగ్రస్తులైనవాళ్ళు. వీళ్ళ అనారోగ్యాన్ని అమెరికా మామూలుగానే ఏమాత్రం పట్టించుకోలేదు. క్యూబాలో ఉచిత వైద్యం, అక్కడి అగ్నిమాపక దళం దగ్గర ఆదరణ పొంది, వీళ్ళంతా అమెరికాకు తిరిగి రావటంతో ఈ డాక్యుమెంటరీ పూర్తవుతుంది.

220px-Sickoposter
“ఎక్కడైనా మంచి కార్ తయారౌతే మనం దాన్ని డ్రైవ్ చేస్తాం. ఎక్కడో తయారైన వైన్ ని మనం ఆస్వాదిస్తాం. వాళ్ళు రోగుల్ని ఆదరించే మంచి పద్ధతిని, పిల్లలకు చక్కగా బోధించే పద్ధతిని, పిల్లల్ని చక్కగా చూసుకునే పద్ధతిని, ఒకరితో ఒకరు ఆదరణగా మెలిగే పద్ధతిని కనిపెట్టినపుడు మనం వాటిని మాత్రం ఎందుకు గ్రహించం?

వాళ్ళు “మేము” అనే ప్రపంచంలో బతుకుతున్నారు. మనలా “నేను” అనే ప్రపంచంలో కాదు. మనల్ని “నేను” లు గానే ఉంచటానికి ప్రయత్నించే శక్తులు అమెరికా ఎప్పటికీ ఉచిత వైద్యం ఇవ్వని దేశంగానే మిగలాలని కోరుకుంటాయి. వైద్యం ఖర్చులు, కాలేజీ ఖర్చులు, పిల్లల డే కేర్ ఖర్చులు ఇవన్నీ లేని అమెరికా ఎప్పటికైనా వస్తుంది. అది తప్పదు.” అంటూ ఆశగా ముగింపు వాక్యాలు చెప్తాడు మైకల్ మూర్. జనం విపరీతంగా చూసిన ఇలాటి సినిమాలు కూడా పాలసీలను అంతో కొంతో కుదుపుతాయి.

ఒబామా చొరవతో అమెరికన్ హెల్త్ కేర్ ఇప్పుడు ఒబామాకేర్ గా కొన్ని సంస్కరణలకు గురైంది. అందులో అతి ముఖ్యమైనది, ఈ సినిమాలో చర్చించిన “pre-medical condition” అనేదాన్ని బీమానుంచీ తొలగించటం. రోగులకు వైద్యం ఇవ్వకుండా చెయ్యటానికి ఈ pre medical condition ని వాడుకునే అవకాశం ఇప్పుడు కంపెనీలకు లేదు. రెండోది, అందర్నీ నిర్బంధంగా బీమా పరిధిలోకి తేవటం. వీటి ఫలితాలు రాబోయే కాలంలో తెలుస్తాయి.

*****
“Sicko” ఇప్పుడు మన దేశంలో అందరూ చూడాల్సిన సినిమా. మన ఆరోగ్య వ్యవస్థ ఇంకా తప్పటడుగుల్లో ఉండగానే కార్పొరేట్ల చేతిలోకి వెళ్ళిపోయింది. పోలియో నివారణ, కుటుంబనియంత్రణ ఆపరేషన్స్, జ్వరాలు, టీకాలు … వీటికి మించి ప్రభుత్వం మనకొచ్చే ఏ జబ్బులకూ బాధ్యత లేకుండా చేతులు దులిపేసుకుని కూర్చుంది. 80ల్లో అమెరికా నుంచీ దిగుమతైన మన గొప్ప డాక్టర్లు అపోలో ప్రతాప్ రెడ్డి, మేదాంత నరేష్ త్రెహన్ లాంటివాళ్ళు అమెరికా హెల్త్ కేర్ పద్ధతిని మనకూ అంటించారు. నగరాల మధ్యలో ఇంచుమించు ఉచితంగా భూమి కొట్టేసి, నీళ్ళు, కరెంటు చౌకగా లాగేసి, గొప్ప గొప్ప భవంతుల్లో ఆస్పత్రులు కట్టి, ఎంత డబ్బు వెదజల్లగల్గిన వాళ్లకు అంత గొప్ప స్టార్ వైద్యాలు అందిస్తున్నారు. పేరుకి వీటిలో పేదవారికి కొంత వైద్యం చెయ్యాలని నియమాలు ఉంటాయిగానీ వాటిని వీళ్ళు ఏమీ పట్టించుకోరు. అసలు స్టార్ హోటళ్ళ లాటి ఆ ఆస్పత్రుల్లో తాము అడుగు పెట్టవచ్చనే ఊహ మధ్యతరగతి వాళ్ళకే రాదు. ప్రైవేటు ఆస్పత్రుల వైభవాలు ఇలా వెలిగిపోతుంటే మరోపక్క ఛత్తీస్గఢ్ లాంటి చోట ఎలకమందుల మధ్య ఆడవాళ్ళకు ఆపరేషన్లు చేసి తిరిగిరాని లోకాలకు పంపించే సమర్థత మన ప్రభుత్వ డాక్టర్లదీ ప్రభుత్వాసుపత్రులదీ.

ముందుతరం పారిశ్రామికవేత్తల్లాంటి వారు కాదు ఇప్పటి చురకత్తుల్లాంటి కార్పొరేట్లు. నిర్దాక్షిణ్యంగా పెద్దలనుండి పేదలను కోసి అవతలపెడతారు వీళ్ళు. ముంబై టాటా మెమోరియల్ లాంటి ఆస్పత్రులను ఇప్పటి కార్పొరేట్ల నుంచీ కలలోనైనా ఆశించగలమా?

నేలా, నీళ్ళూ, కరెంటూ కారుచౌకగా ప్రైవేటు ఆస్పత్రులకిచ్చేసి, పైగా అక్కడ పేదవారికి వైద్యం చేసినందుకు ప్రభుత్వం ఆ ఆస్పత్రులకు డబ్బులు కట్టటం ఇంత జనాభా ఉన్న దేశంలో సరైన పనేనా? శుభ్రంగా, కనీసావసరాలతో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులూ, వాటిలోకి చక్కటి ఆధునికమైన వైద్య పరికరాలూ, డాక్టర్లకు మంచి జీతాలూ ఇచ్చి, ప్రభుత్వ వైద్య కళాశాలలు మరిన్ని కట్టినా, కార్పొరేట్ల కిచ్చే దొంగ సబ్సిడీల కంటే ఎక్కువవుతుందా? ఎవరైనా లెక్కలు కడితే బాగుండును.
లెక్కలు సరి చూసుకునే ఓపిక ప్రభుత్వాలకు లేదు. ఎవరు సంపాదించిన డబ్బు వాళ్ళు లెక్కపెట్టుకోవటంతోనే సరిపోతోంది. స్టార్ ఆస్పత్రులు మరింత జోరుగా డబ్బులు లెక్కెట్టుకుంటున్నాయి. లక్షల ఖర్చుతో కొన్న ఒక ఆధునిక వైద్య పరికరం కోసం పెట్టిన డబ్బు కొన్ని నెలల్లోనే తిరిగొస్తుంది వాళ్లకు. ఆ పైన, కోట్లకొద్దీ లాభం. ఇవన్నీ కాక, ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా చేయించాలనుకునే వైద్యాలకు వీళ్ళ లాభం వాటా 15 శాతం దాకా కలిపి ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. ఈ ప్రైవేటు డాక్టర్లు మన ప్రభుత్వ పాలసీలను అంతా అమెరికన్ పద్ధతిలోనే తమకు కావలసినట్టు మారుస్తున్నారు. వాళ్ళ డాలర్ కలల్ని నిజం చేసుకుంటున్నారు.

“Sicko” సినిమాలో చూపించిన Cigna అనే ఆరోగ్య బీమా కంపెనీ దేశీయ TTK తో కలిసి మన దేశంలో రంగంలోకి దిగిందని ఒక టీవీ వ్యాపార ప్రకటనలో చూశాను. ఇప్పుడు మధ్యతరగతి కూడా ఈ బీమా కంపెనీల వైపు చూడక తప్పటం లేదు. మన మధ్యతరగతి కూడా ఈ సినిమాలో చూపించిన “pre-medical condition”, “denial” లాంటి పరిభాషలో గిరగిరా తిరిగే రోజులు ఎక్కువ దూరంలో లేవు. కార్పొరేట్ ఆస్పత్రులూ, మందుల కంపెనీలు, డాక్టర్లూ, బీమా సంస్థలూ మధ్యతరగతి రోగులతో ఆటాడుకునే బరిలోకి మనమూ వచ్చేస్తున్నాం. ఇంకా కింది పొరల్లో ఉన్నవాళ్ళు ఇప్పటికే నిండా మునిగిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ వైద్యం ఇవ్వాలంటే ప్రభుత్వం స్టార్ డాక్టర్లకి ఆకాశంనుంచి ఎన్నెన్ని నక్షత్రాలు తెంచి ఇవ్వాలి? ప్రభుత్వం మెదడు మోకాల్లో ఉంది కాబట్టి ఈ ఆలోచనలేవీ అంటకుండా కళ్ళు మూసుకుని జాతి మొత్తాన్నే ఉద్ధరిస్తున్నామంటూ పెద్ద పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల కోసం హెల్త్ పాలసీ తయారు చేస్తోంది.

అందరికీ ఉచిత వైద్యం గురించి మాట్లాడే ఒకే గొంతు ఇప్పుడు వినిపిస్తున్నది లెఫ్ట్ పార్టీలనుంచి కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచీ. ఆ గొంతును యువత అందుకుని ప్రభుత్వాలకూ కార్పొరేట్ వైద్యాలకూ ఉన్న ఫెవికాల్ బంధాన్ని తెంచి, వైద్యాన్ని అమెరికన్ మోడల్ లోకి వెళ్ళిపోకుండా, మైకల్ మూర్ చెప్పినట్టు “మేము” అని అందరూ మాట్లాడుకునే మోడల్ లోకి మళ్లిస్తే! ఎంత బాగుంటుందో! చర్చ మొదలైంది. కొనసాగించటం అందరి పనీ…

-ల.లి.త.

lalitha parnandi

“Sicko” — http://www.youtube.com/watch?v=9CDLoyXarXY

Private Operator — http://www.caravanmagazine.in/reportage/naresh-trehan-medanta-private-practice

చార్లీ హెబ్డో, చారు వాక్కూ …

Charlie_Hebdo_Tout_est_pardonné

The front cover of 14 January 2015 edition, with a cartoon in the same style as the 3 November 2011 cover, uses the phrase “Je Suis Charlie”. (Headline translation: “All is forgiven.”) [

 

“పెద్ద అబ్సర్డ్ డ్రామా లా లేదూ ప్రపంచం అంతా? ‘గోదా’ సినిమాల్లోలా ఎవడెప్పుడు ఎలా చస్తాడో అర్థం కానంత వయొలెన్స్…”

“మనం ఇక్కడ ఈ సోఫాలో కూర్చుని చిప్స్ తింటూ తెలుగు సినిమా ప్రమోషన్ జాతర చూడ్డం కంటే వయొలెన్స్ ఏముందిలే గానీ, నీ గొడవేమిటో అర్థమైందిలే. ఆ ఫ్రెంచి గోల వదిలేయ్”.

“ఫ్రెంచ్ వైన్, ఫ్రెంచ్ సినిమా, ఫ్రెంచ్ కిస్, వాళ్ళ సాహిత్యం, ఆ ఫ్రీ మైండ్స్. కొత్త ఆలోచనల సీతాకోకచిలకలు అక్కడే ఎన్నో పుట్టి ప్రపంచమంతా విహరించాయి…”

“ఇక చాల్లే. వాళ్ళ లోకంలో వాళ్లుండిపోయి కార్టూన్లేసుకుంటూ బైట ఏం జరుగుతోందో తెలుసుకోకుండా బతికేస్తే సరా”

“వాళ్ళకంతా తెలుసు. బతుకుని లెక్క చెయ్యలేదంతే.”

“బతుకునే లెక్క చెయ్యనివాడు పొలిటికల్ కరెక్ట్ నెస్ ని మాత్రం ఏం లెక్క చేస్తాడ్లే. ‘నేనూ చార్లీనే’ అని కొంతమంది అంటుంటే ఆ మాటలో రేసిజం కోసం వెదుకుతూ మరెంతో మంది సున్నిత మనస్కులు బాధ పడుతున్నారు చూడు. ఏ మతం వాళ్ళ మనోభావాలూ దెబ్బ తినకూడదట. ‘ప్రవక్త బొమ్మ వెయ్యటం అపచారం అని వాళ్లంటుంటే మళ్ళీ మళ్ళీ వేస్తారేమిటీ? అంత గనం ఏముందబ్బా చావు కొనితెచ్చుకోడానికి? మాట్లాడక ఊరుకుంటే పోలా’ అంటున్నారు చాలామంది.”

అ…చ్ఛా……

అదేం దీ…..ర్ఘం?

“ఒక్క ‘అచ్ఛా’ ని ఎన్ని రకాల అర్థాలతో వాడతామో చెప్పాడుగా ‘పీకే’ !”

“ఇవాళ అన్నీ నిషిద్ధ ఫలాల గురించే మాట్లాడతావా ఏంటి?”

“కోట్ల డబ్బులు చేసుకుంటోంది ‘పీకే’! దాన్ని జనాలు నిషిద్ధం చెయ్యలేదు. ఆశారాం బాపూ ల్లాంటి కేసుల్లో సాక్షులు రైలు పట్టాల మీదకి పోతున్నారు. ఇవన్నీ అందరూ చూడ్డం లేదనుకుంటున్నావా? Begone Godmen !”

“చచ్చి నాస్తిక స్వర్గానున్న అబ్రహాం కోవూరు గార్ని ఎందుకు కదిలిస్తావ్ లే !”

“నాస్తిక స్వర్గమా ? ఏం తమాషాగా ఉందా?”

“మరి ? ఇరవైల్లో మనిషి నాస్తికుడు అవాలట. ముప్పైయేండ్లక్కూడా ఆధ్యాత్మిక మార్గానికి రాకపోతే ఆ మనిషిలో ఏదో తప్పు ఉన్నట్టేనట. మా ఆరెస్సెస్ అఖిల్ చెప్పాడు”.

“వాళ్ళమాటలకేంలే వినోదం పంచుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీలూ, విమానాలు ఆకాశంలో తిప్పడాలూ, అణ్వస్త్రాలూ అన్నీ మన ఖాతాలోవే అంటున్నారు. ఇవన్నీ పురాతనమైనవీ, మనవే కాబట్టి కొత్తగా ఇప్పుడు కనిపెట్టేదేమీ లేదనే బ్రహ్మజ్ఞానంతో సైన్సు డిపార్టుమెంటుకి ఓ అయిదు పైసలు చాలంటున్నాది గవర్మెంటు.”

“అంటే, నీ తిక్క లెక్కల్తో మన ఆర్యభట్టు, మిహిరుడు, చరకుడు, శుశ్రుతుడు ఇంకా మనకి పేర్లు తెలీని గొప్పవాళ్ళు… వీళ్ళనీ గల్లంతు చేస్తున్నట్టున్నావే !”

Je_suis_Charlie.svg

The Je suis Charlie (“I am Charlie”) slogan became an endorsement of freedom of speech and press.

 

“ఛా… అపార్థుడా! లెక్కలకి ప్రాణం సున్నా. అల్లాంటి సున్నాని ప్రపంచానికిచ్చి, గ్రహస్థితుల లెక్కలు అప్పట్లోనే కరెక్టుగా చెప్పేశారుగా. మనవాళ్ళ తెలివిని తక్కువ చేస్తానా ? అలాటివాళ్ళు ఇంకా ఎవరెవరున్నారో తెలుసుకుని వాళ్ళు చేసిన పనేమిటో తవ్వి చూడటానికి చరిత్ర సైన్యాన్ని, సైన్సు సైన్యాన్ని పోషించాలిగానీ అది మానేసి, అన్నీ మావే అని దబాయింపుకి దిగుతుంటే ఎలా? మన పతంజలి, అదే… యోగసూత్రాల పతంజలి చాలడూ మనం ఛాతీ విరిచి పోజు పెట్టడానికి? అమెరికా మన యోగాని నెత్తినెట్టుకుని దాన్లో కొత్త ప్రయోగాలు చేస్తుంటే మనం చూడు… ఇది వాత్స్యాయనుడి భూమి కూడానని ఒప్పుకోడానికి ఇష్టపడరేం వీళ్ళు? పరమ పాశ్చాత్య విక్టోరియన్ ప్రూడరీని నెత్తినేసుకుని హిందూ మతోద్ధారకులం అంటూ పోజులు.”

“పతంజలి అంత పాపులర్ అంటావా అక్కడ?”

“అతను కాకపోతే అతనిచ్చిన యోగా. చాలదా? మన తెలుగు పతంజలి కూడా తక్కువ్వాడా? భూమి బల్లపరుపేనని వాదించి నిలబడ్డ గోపాత్రుడిలాటి గొప్పోడిని సృష్టించిన పతంజలి కంటే గొప్పవాడు ఎవడు? యోగ పతంజలి పేరు పెట్టుకుని, ప్రజాస్వామ్యంలో మందిబలాన్నిబట్టీ కులం పరపతినిబట్టీ భూమి గుండ్రమో బల్లపరుపో డిసైడ్ అవుతుందని బంగారమంటి మాటలు చెప్పి వెళ్ళాడు. ఈ పతంజలిని చదివితే సూర్యనమస్కారాలు చేసినంత రష్ వొచ్చేస్తుంది వొంట్లోకి.”

“అమ్మో పతంజలి పారవశ్యంలో పడకు. ఇక అందులోనే కూరుకుపోతావ్. చార్లీ హెబ్డో అని మొదలు పెట్టావు. దాంతో నా బుర్ర మతాల లోతుల్లోకి లావాలా ప్రవహిస్తోందనుకో.”

“అంతొద్దులే బాబూ. అవన్నీ పండితులకి వదిలేద్దాం. మామూలుగా మాట్లాడుకుందాం. మతాల సారం, అవి చెప్పే నీతులూ గొప్పవే. కాదంటే తంతారు గానీ, తమ మతాల్ని మిగతా మతాలతో తెగ పోల్చుకుని గొప్పలు పోతున్నారబ్బా చాలామంది !”

“అన్ని పాములూ తలెత్తితే లేడిక పాం కూడా తలెత్తిందట. కానీయ్. నీ గొప్పేంటో నువ్వూ చెప్పు.”

“నేను నాస్తికుణ్ణి. కులాన్ని, మతాన్ని నేను వదిలేసినా అవి నన్ను వదలవని గ్రహించిన నాస్తికుణ్ణి నేను.”

“ప్చ్… అదీ ఓ మాటే? పాత ఫాషన్ ! ఎవరి మతపు గనిని వాళ్ళు తవ్వితీసి, దొరికిన వజ్రాల్ని గర్వంగా ప్రదర్శించుకుంటున్న కాలంలో నాస్తికుణ్ణి అనటం చప్పగా చల్లారిన కాఫీలా ఉంది.”

“అది మంచి ఓల్డ్ వైన్ నాయనా, మత పైత్యానికి విరుగుడు.”

“అది కూడా హిందూమతం వైన్ లోని ఓ పెగ్గే.”

“కాదన్నానా? ఎంతైనా హిందూ మతంలో కొన్ని మంచి సౌకర్యాలున్నాయి లెద్దూ ! ‘నేను నాస్తికుడిని’ అని హాయిగా చెప్పేసుకోవచ్చు. ఎవడూ తల తీసేస్తాడన్న భయం లేదు. అది చారు వాక్కు… అంటే మంచి మాట . అదే … చార్వాకుని దారి. ప్రత్యక్ష ప్రమాణం కావాలన్నాడు కదాని ఆయన్ని పాపం హెడోనిస్టుగా ముద్ర వేసెయ్యటానికి తరువాతివాళ్ళు ఏమాత్రం ఆలోచించలేదేమో!

“ఇక ప్రవహించకు ఆగు. మిగతా మతాల్లో నాస్తికులు ఉండరన్నట్టు గొప్పలు పోతున్నవ్. నీ తూకం హిందూ గొప్పతనం వేపు మొగ్గుతోంది చూసుకో.”

“ఆపవో! ఈ ఇజాల గులాబీలతో ముళ్ళ బాధకూడా తప్పట్లేదు! అందరూ ‘బిట్వీన్ ద లైన్స్’ చదూతున్నారు. మనది ఏ కులమో మతమో లెఫ్ట్ రైట్ సెంటర్ లో ఎక్కడ మన్ని సెట్ చెయ్యొచ్చో ఊహించి వెంటనే ఆ పని చేసేస్తున్నారు. ఈ మతంలో ఇది బాగుంది అంటే కూడా తప్పేనా? ఇస్లాం లో వడ్డీ తీసుకోవటం తప్పని చెప్పి ప్రవక్త నిషేధించాడని విన్నాం. అసమానతల్ని చెరపటంలో ఇదెంత ముఖ్యమైన విషయం ! అలాగే క్రిస్టియన్ మతంలో ‘క్షమ’ ఎంత గొప్ప విషయం! ప్రతి మనిషీ సాధించి తీరాల్సిన ఆదర్శం. కానీ దీనికి విరుద్ధంగా చర్చ్ చేసిన దారుణాలు, తీసిన ప్రాణాలు తక్కువా? ఇప్పుడు పోప్ కాస్త అభ్యుదయం చూపిస్తున్నాడు గానీ!. ఇంకో మాట కూడా చెప్పుకోవాల్లే. నెహ్రూ, కమ్యూనిస్టులూ కలిసి రేపిన సెక్యులరిజం హిందూమతాన్ని చక్కటి సాఫ్టీ ఐస్ క్రీంలా తయారు చేసేసింది. అది సరిపోనట్టు ఇంకా ఆక్కుండా ప్రభుత్వాలు, సెక్యులరిస్ట్ లూ ఓవరాక్షన్ చేస్తూ పోతుంటే, అదును చూసి ఆ రెండు పెద్ద వ్యాప్తిమతాలతో సమానంగా దీన్నీ వాటిపక్కన కూర్చోబెట్టే ప్రయత్నంలోకి వచ్చేశారు మన హిందూత్వులు. ఇక హిందూ మతంలో వెరైటీ, ఓపెన్ నెస్ ఏం మిగుల్తాయి? ఘర్ వాపసీలు, ఆడా మగా ఆంక్షలు, నలుగురేసి పిల్లల్ని కనమని బోధలు… స్టాండర్డ్ మత గ్రంథం ఒకటి సెట్ చేసెయ్యాలని ప్రయత్నాలు. ఈ న్యురాసిస్ అంతా ఏమిటో! కాపీ కేట్స్!”

“ఎక్కువ రెచ్చిపోకు. పెరుమాళ్ మురుగన్ లా నీతో కూడా క్షమాపణలు చెప్పించెయ్యగలరు. నీ నాస్తిక మతం ప్రవర్ధిల్లిన తమిళనాట ఆ రచయితకి అలాటి దుర్గతి ఏమిటో ! పెరియార్ వారసులంతా ఏం చేస్తున్నారో! మతాన్నైతే తిడతారు తప్ప కులం అనేసరికి మనుషులంతా ఓట్ల మందల్లా కనిపిస్తారేమో వీళ్ళకి?”

“అబ్బా! పట్టేశావు. ఏ సిద్ధాంతం మాత్రం లొసుగుల్లేకుండా అంత పరిపూర్ణం? మన వంకరల్ని తీర్చి మంచిమనుషులుగా దిద్దటానికి చేసే ప్రయత్నాలు సిద్ధాంతాలవుతాయి. ఒక్కొక్కటి ఏనుగంత భారీగా పెరిగి ఘీంకరిస్తే ఒక్కొక్కటి రామచిలకలా సన్నగా ఓ ముచ్చట చెప్తుంది. నాస్తికత్వం అలాంటి రామచిలకే అనుకో. మతాల అరణ్యంలో అదీ అవసరమే. మనలో మాట! మా నాస్తికుల్లోనూ కొంచెంకొంచెం తేడాలున్నాయి.. నాస్తిక సంఘంవాళ్ళు పూలు పనికి రావని కూరగాయల మాలలు వేసుకోటం లాంటివి నా దృష్టిలో పూర్ ఈస్తటిక్స్ బాబా!”

“అంతేనా! నీ నాస్తిక రామచిలక ఏ దేవుడి గుళ్ళోనో వాలకపోతుందా నేను చూడకపోతానా? దేవుడి గుళ్ళో పులిహోరలూ పరమాన్నాల రుచీ, మీ బషీర్ ఇంట్లో షీర్ ఖుర్మా, హలీం, జార్జి స్వయంగా తయారు చేసి నీ నోట్లో పెట్టే క్రిస్మస్ కేకూ… ఇవి లేకపోతే నీ బతుకు మాత్రం వ్యర్థం కాదూ? మతాలు లేకపోతే నాలిక్కి ఈ రుచులెక్కడ దొరుకుతాయి స్వామీ?”

“నాలిక్కే కాదు, కళ్లకోసం మంచి మంచి శిల్పాలూ చిత్రాలూ నాట్యాలూ, చెవులకోసం చక్కటి సంగీతాలూ … లేవన్నానా? అమ్మో నువ్వు నన్ను సెంటీ లోకి లాగుతున్నావ్. విషయానికి రా. చార్లీ హెబ్డో టీమ్ ని అన్యాయంగా చంపెయ్యటం మరీ కరుడు గట్టిన ముల్లాలకి తప్ప ఎవరికీ నచ్చట్లేదంటున్నారు కానీ, ఆ కార్టూనింగ్ తో చాలామందికి సమస్య ఉందని చెప్తున్నారు. చాలామందిది కండిషనల్ ఖండన. ఈ కండిషనల్ ఖండన చేసేవాళ్ళు ఎక్కువమంది ఏదో ఒక మతాన్ని గట్టిగా నమ్మేవాళ్ళే. మహమ్మద్ మీద కార్టూనేస్తే మన దేవుళ్ళ మీద వేసినా ఒప్పుకోవాలి కదా, అది చెయ్యలేము కదాని ఆలోచనలో పడతారు. ఇంకా చాలామంది సగం సగం సెక్యులరిస్టులు. లేదా మనస్సులో అమెరికా ఘోరాలు గుర్తు తెచ్చుకుంటున్నవాళ్ళు. ఇంత గందరగోళంలో నాస్తికత్వమే సరైన చేదుమందు. మతాలూ, ప్రవక్తలూ, పోప్ లూ, స్వాములూ… ఎవరూ విమర్శకీ కార్టూనింగ్ కీ అతీతులు కారు నాస్తికుడి దృష్టిలో. బ్లాస్ఫెమీ అంటే నాస్తికుడికి తిండి తినడమంత మామూలు సంగతి. జార్జ్ కార్లిన్ ‘Atheism is a Non Prophet Organisation’ అన్నదందుకే. నిజానికది మతాల కేటరాక్ట్ ని కోసి తీసేస్తుంది. అప్పుడే మతాలు శుభ్రమైన కళ్ళతో మనిషిని చూడగలుగుతాయి.”

Indian journalists expressed solidarity with the victims of attack at New Delhi on 9 January 2015. Displayed cartoon by Shekhar Gurera Main article: Charlie Hebdo shooting On 7 January 2015, two Islamist gunmen[50] forced their way into and opened fire in the Paris headquarters of Charlie Hebdo, killing twelve: staff cartoonists Charb, Cabu, Honoré, Tignous and Wolinski,[51] economist Bernard Maris, editors Elsa Cayat and Mustapha Ourrad, guest Michel Renaud, maintenance worker Frédéric Boisseau and police officers Brinsolaro and Merabet, and wounding eleven, four of them seriously.[52][53][54][55][56][57] During the attack, the gunmen shouted "Allahu akbar" ("God is great" in Arabic) and also "the Prophet is avenged".[50][58] President François Hollande described it as a "terrorist attack of the most extreme barbarity".[59] The two gunmen were identified as Saïd Kouachi and Chérif Kouachi, French Muslim brothers of Algerian descent.[60][61][62][63] The "survivors' issue" Main article: Charlie Hebdo issue No. 1178 The day after the attack, the remaining staff of Charlie Hebdo announced that publication would continue, with the following week's edition of the newspaper to be published according to the usual schedule with a print run of one million copies, up significantly from its usual 60,000.[64][65] On 13 January 2015 the news came on BBC that the first issue after the massacre will come out in three million copies.[66] On Wednesday itself it was announced that due to a huge demand in France, the print run would be raised from three to five million copies.[67] The newspaper announced the revenue from the issue would go towards the families of the victims.[68] The French government granted nearly €1 million to support the magazine.[69] The Digital Innovation Press Fund (French: Fonds Google–AIPG pour l’Innovation Numérique de la presse), partially funded by Google, donated €250,000,[70] matching a donation by the French Press and Pluralism Fund.[71] The Guardian Media Group pledged a donation of £100,000.[72] Je suis Charlie Main article: Je suis Charlie

Indian journalists expressed solidarity with the victims of attack at New Delhi on 9 January 2015. Displayed cartoon by Shekhar Gurera 

“హిందూ లిబరల్ కంఫర్ట్ జోన్ లో కూర్చుని ఎంత బాగా పలుకుతోందో ఈ నాస్తిక రామచిలక !”

“కంఫర్ట్ జోన్ లో ఉన్నానన్నమాట కాదన్ను గానీ లిబరల్ హిందువు నిరంతరం ఇలాంటివాటిని వ్యతిరేకిస్తూ ఆ కంఫర్ట్ జోన్ ని కాపాడ్డానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టే ఇన్ని తెగల, జాతుల, కులాల, మతాల మనుషులున్న ఈ నేల ఘనీభవించి ఒకే గడ్డగా అయిపోకుండా వుంది. ‘హైదర్’, ‘పీకే’ లాంటి సినిమాల సక్సెస్ చూస్తే అలా కరడు గట్టే అవకాశం ఉందని కూడా అనిపించట్లేదు. తీవ్రవాదులు ఘోరాలు చేసినప్పుడల్లా మామూలు ముస్లిమ్ లు ఇరకాటంలో పడుతుంటారు. గట్టిగా ఖండించలేకపోగా ఇలాటివి జరిగిన ప్రతిసారీ వాళ్ళు దేశానికి విశ్వాస ప్రకటన చెయ్యాలి. చాలామంది లిబరల్ ముస్లిమ్ లు ఈ చంపుడు పందేలు ఇస్లాం కాదని బాధ పడుతూ ఉంటారు. అంతకంటే ఎక్కువ మాట్లాడి మతాన్ని ఆఫెండ్ చేస్తే దేశాలు దాటి దాక్కోవటానికి అందరూ హుసేన్లూ, రష్డీలూ, తస్లీమాలూ కారు కదా! నాకనిపిస్తుంది వీళ్ళంతా వ్యక్తిగతంగా కాకపోయినా గుంపుగా కరడు గడుతున్న ఇస్లాం గురించి చర్చలు చేసి తీర్మానాలు చెయ్యవచ్చుగదాని !”

“నిజమే, ప్రజాస్వామ్యాల్లో ఆ పాటి స్వేచ్ఛ ఉంటుందిలే. అంతా నీ నాస్తికత్వం ప్రయోజకత్వమే కానక్కర లేదు.”

“అదే అసలు పాయింటు. ప్రజాస్వామ్యాల్లో స్వేచ్ఛ ఉన్నా, పతంజలి చెప్పినట్టు గుంపులే కదా భూమి గుండ్రంగా ఉందో బల్లపరుపుగా ఉందో నిర్ణయించేది ! అన్ని మతాలూ ఆన్ని రకాల ప్రశ్నల్నీ ఎదుర్కోవాలని, అప్పుడే అవి ప్రజాస్వామిక మతాలౌతాయనీ ఎక్కువమంది చెప్పట్లేదే! సూటిగా ఎవరూ మాట్లాడరేం? “మీ పేరేమిటి” అని గురజాడలా దేవుళ్ళనీ మతాలనీ ఇప్పుడు ఎవరూ ప్రశ్నించరేం? చార్లీ హెబ్డో కార్టూన్లు కల్చర్ షాక్ అని చెప్పడానికి వీల్లేదు. ప్రపంచంలో అందరూ ఇంటర్నెట్ ని వాడుకుంటూ అన్నిటి గురించీ తెలుసుకుని ఎవరికి కావలసింది వాళ్ళు ఏరుకుంటున్నప్పుడు, ఏ రకమైన అథారిటీనీ, అహంకారాన్నీ ఉతక్కుండా వొదిలిపెట్టని ఫ్రెంచ్ కార్టూనిస్టుల సెన్సిబిలిటీ స్థాయి మాత్రం ఎందుకు అర్థం కాదు? మతాన్ని ప్రశ్నించకూడదనే శుద్ధ అహంకారాన్ని పెంచి పోషించుకోవటం తప్ప ఏముంది ఇందులో? ఐ. ఎస్. తీవ్రవాదం వైపు వెళ్తున్న వాళ్ళలో ఎక్కువమంది సాఫ్ట్ వేర్ వాళ్ళని వినటం లేదా? క్రూడాయిల్ డబ్బుతో, ఆయుధాలతో రెచ్చిపోయి ప్రపంచాన్ని శాసించాలనే కోరికతో ఇస్లాం పేరుమీద ఇస్లామిస్ట్ స్టేట్, అల్ కాయిదా తీవ్రవాదులు చేస్తున్న తెగల నరమేధాన్ని, అమెరికా చేతుల్లో ముస్లింలు పడిన బాధలకు వాళ్ళు చేస్తున్న ప్రతీకారమని ఇంకా అనుకుంటే అమాయకత్వమే.”

“అది సరేలే. యజిదీ అనే తెగ ఉంది ఇరాక్ లో! వీళ్ళ జనాభా కొన్ని లక్షల్లోపే. ఆ తెగ నీ భాషలో ఐస్ క్రీం తెగ. పాపం ఆ అరిటాకు తెగ మీద ఈ ఐ.ఎస్. ముల్లు పడి చీల్చి పారేసింది. ఉన్మాదంతో వేలల్లో ఆ తెగ జనాభాని చంపేశారు ఐ.ఎస్. వాళ్ళు. యజిదీ ఆడవాళ్ళనీ పిల్లల్నీ బానిసలుగా మార్చారట. ఇవన్నీ చూసి మనకీ న్యురాసిస్ పెరుగుతున్నట్టుంది. మన గురూ రవిశంకర్ గారు వెళ్లి యజిదీలని ఓదార్చి వచ్చాడు. ఇది ఏ కాలం అంటావ్?”

“మతం ఫుల్ సర్కిల్ లోకొచ్చిన పిచ్చి కాలం. ప్రపంచమంతా కుడి వైపుకే నడవటంలో దాగున్న ప్రమాదాన్ని గమనించు. ఇప్పటికైనా తెలుస్తోందా చార్లీ హెబ్డో విలువేంటో! మన నేల మీద ‘పీకే’ గెలవటం కోసం ఆ సినిమావాళ్ళు జాగ్రత్తగా స్క్రిప్ట్ తో చేసిన తాడు మీద నడక లాంటి విన్యాసమేంటో! జనం తెలివిగానే ఉన్నారు. దేవుడి మేనేజర్లకు దేవుడినుంచీ కాకుండా ఇంకెవరో ఆకతాయి దగ్గరినుంచీ ఆదేశాలు వస్తున్నాయని మొదట ఊహిస్తాడు కదా ‘పీకే’! చివరికి మేనేజర్లే ఆకతాయిలని గ్రహిస్తాడు. జనం కూడా ఆకతాయి బాబాల్నీ, ముల్లాల్నీ చీడపురుగుల్లా ఏరి పారేయగలిగినప్పుడు, కరుడు గడుతున్న మతాలు కరిగి వెన్న అయి, ప్రశ్నల్లో కాగి, సమాజానికి ఉపయోగపడే జ్ఞానమనే కమ్మని నెయ్యి బయటపడుతుంది.”

“క్యా బాత్ హై! అలాగే ఊహా స్వర్గంలో విహరించు. ముఖ్యంగా మన నరేంద్ర దభోల్కర్ కీ నివాళులు అర్పించు. నమ్మకానికీ, ద్వేషానికీ తప్ప హేతువుకు కాలం కాదిది.”

“అందుకే ఇప్పుడే హేతువును నెత్తిన పెట్టుకుని ఊరేగాలి. నేనే చార్లీని, నేనే దభోల్కర్ ని, నేనే చార్వాకని, నేనే ప్రశ్నని, హేతువుని.

 

 

                                                                                                ల.లి.త.

చార్లీ హెబ్డో రేంజ్ కోసం ఇక్కడ చూడండి.

http://www.dailykos.com/story/2015/01/11/1357057/-The-Charlie-Hebdo-cartoons-no-one-is-showing-you#

ఈమె ‘చేతల’ సరస్వతి…

సరస్వతి

 

“ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? ఆర్థిక ప్రగతి అయిదు శాతమో పది శాతమో ఉంటే సంతోషం రెట్టింపు అవుతుందా? సున్నా శాతం ఎదుగుదల ఉంటే ఏమవుతుంది? ఇది ఒక రకంగా స్థిరమయిన ఆర్థిక విధానం కాదా? సాధారణమైన జీవనం గడుపుతూ అన్నిటినీ తేలికగా తీసుకోగలగటం కంటే మించినది మరేదైనా ఉందా?” — మసనోబు ఫుకుఒకా.

ఈరోజు కొంతమంది మాట్లాడే ఈ మాటలు జపాన్ ప్రకృతి సేద్యకారుడు ఫుకుఒకా నలభై ఏళ్ల కిందటే చెప్పాడు.

మేడిన్ చైనా విశ్వరూపం చూసి మురిసి , అమెరికన్ డాలర్ మెరుపు కలల్లో తూగి, మేక్ ఇన్ ఇండియా సంస్కృతిలోకి రాకెట్ వేగంతో “ఆ విధంగా ముందుకు పోతున్న” మనకు, ఫుకు ఒకా ఓ ఆదిమానవుడిలా కనిపిస్తాడు. కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఉన్న పర్యావరణ వాదులనబడే జీవులు కూడా అలాగే కనిపిస్తారు. మనమే చేతులారా పెంట పోగులా తయారు చేసుకున్న భూమ్మీదనుంచి, పోగేసుకున్న డబ్బుతో సహా పారిపోయి (బడుగు జీవాత్మలను ఇక్కడే వదిలేసి) ఏ గాలక్సీ ల్లో ఇళ్ళు కడదామా అనేంత ప్రగతి యుగంలో ఉన్నప్పుడు ఒక్క అడుగు వెనక్కు వెయ్యడమంటేనూ, ఒక్క రోజైనా ఎండని గానీ చలిని గానీ భరించడమంటేనూ డబ్బు చేసుకున్నవాళ్ళలో చాలా ఎక్కువమందికి ఎంతో కష్టం. ఆర్ధిక ప్రగతి రాల్చే చుక్కలు సరిగ్గా ఇంకని బతుకుల్లో మాత్రమే మిగిలిన పంచభూతాల తీవ్రతను నిజానికి అందరూ సమానంగా అనుభవించాలని చెప్పే పర్యావరణ వాదులను దూరం పెట్టేవాళ్ళే ఎక్కువ.

***

‘సరస్వతి కవుల’ అసలైన పర్యావరణ వాది. పర్యావరణ సంరక్షణ గురించిన చర్చలు పూర్తయిన తరువాత ఆ విషయాలు మాట్లాడేవాళ్ళ లో ఒక్కరు కూడా ఆ మీటింగ్ గదిలో ఫ్యాన్లూ లైట్లను ఆపకుండా వెళ్ళిపోతే ఎంతో చిరాగ్గా ‘ఇదేం అన్యాయం?’ అంటూ వ్యాసం రాసేసే సున్నితమైన మనసున్న మనిషి. రకరకాల సంస్థల్లో పనిచేసేవాళ్ళలో, చెప్పిన విషయాన్ని తమ జీవితంలో చేసి చూపించేవాళ్ళు అరుదు. చెప్పిందే చేసే సరస్వతి అందువల్లేనేమో, సంస్థల్లో కంటే ఒంటరిగానే తనపని తను చేసుకుంటూ పోతోంది.

నర్సీపట్నం దగ్గర రంగురాళ్ళ కోసం తవ్వకాలు విపరీతంగా జరిగే రోజుల్లో ధైర్యంగా అక్కడికి ఓ కామెరా పట్టుకుని వెళ్ళిపోయి ఆ విషయం మీద, అక్కడ జరిగే అన్యాయాలమీద 2004 లో చిన్న డాక్యుమెంటరీ తీసింది. దీనితో ఆమె చాలామంది దృష్టిలో పడింది. కొన్నేళ్ళపాటు ఆ ప్రాంతం మీద జరిగిన రేప్ ను కొద్ది రోజుల్లోనే ఒక్క విషయమూ వదలకుండా రికార్డ్ చేసింది. ఆ రోజుల్లో పత్రికలూ బాగానే రాశాయి. కానీ సరస్వతి కామెరాతో రికార్డ్ చేసింది కాబట్టి ఆ విషయమేమిటో పూర్తిగా తెలుసుకోవాలనుకునే భవిష్యత్తుకి అది ‘కుప్పుసామయ్యర్ మేడీజీ’… ఈ మేడీజీ లు డాక్యుమెంటరీల వల్లే సాధ్యమౌతున్నాయి కాబట్టే మనం బతుకుతున్న కాలంలో ఇవి గొప్పవి. విషయంతో బాటు ‘కలాపోసన’ కూడా చేయగల్గితే డాక్యుమెంటరీలను మించినవి ఏముంటాయి ? హోషంగ్ మర్చంట్ మీద “My  Dear Gay Teacher” అంటూ సరస్వతి తీసిన డాక్యుమెంటరీ లో కాస్త కళాపోషణ కూడా కనిపిస్తుంది. సరే ఇదిలా ఉంచితే, “Behind The Glitter” అనే రంగురాళ్ళ కథ ఏమిటో సరస్వతి డాక్యుమెంటరీ ద్వారా గుర్తు చేసుకుంటే …

తొంభైల్లో విశాఖ దగ్గర, నర్సీపట్నం దాపునున్న కొండల్లో వజ్రాల్లాంటి రంగురాళ్ళు దొరుకుతున్నాయని తెలియగానే నెమ్మదిగా తవ్వకాలు మొదలయ్యాయి. 2000 సం. లో alexandrite అనే మరీ విలువైన, నగల్లో వాడే రాయి దొరుకుతోందని తెలియగానే అక్కడి ఘరానా మనుషులే కాకుండా పక్క రాష్ట్రాలవాళ్ళు కూడా దిగిపోయేరు. అక్కడే ఉండే చిన్న చిన్న గూండాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, అందరూ సిండికేట్లు గా తయారైపోయి తవ్వకాలు జోరు చేశారు. అక్కడే బ్రతికే కొండవాళ్లకు, ఎక్కడినుండో కూలిపనికి వచ్చిన వాళ్లకు ఆ రాళ్ల విలువేమిటో తెలీదు; దొరికిన రాళ్ళను యజమానులకు అప్పచెప్పటం, రెండొందలో మూడొందలో తీసుకుంటూ, వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన బందెల దొడ్లలో బతకటం తప్ప… నిదురలో ఆదమరుపుగా వున్న ఆ కొండ పల్లెల్లోకి ఒక్కసారిగా ప్రైవేటు బస్సులూ, గుళ్ళూ గోపురాలూ, జీన్ పేంటులూ, కాస్మెటిక్స్, సెక్స్ అవసరాలు తీర్చే ఆడవాళ్ళూ, ఎయిడ్స్ రోగాలూ, అన్నీ బారులు తీరాయి. కాస్త డబ్బులు కళ్ళ చూసిన వాళ్ళు ఆ గ్రామాల్లోనే పక్కా ఇళ్ళు కట్టుకుంటే, ఎక్కువమంది వెర్రివాళ్ళు కూలోళ్లుగానే మిగిలారు. ఈ వరసనంతా అక్కడి జనం పూర్తిగా ఎరుక పరిచారు సరస్వతి డాక్యుమెంటరీలో.

“మా పరంటాన వజ్రాలు పడ్డాయి. మా కుర్రోలు ఓ పదిమంది ఎల్నారు. ఎల్తే ఒకో పదిమంది నాలుగు ఉజ్జీలు కట్టుకొని ఆలే తవ్వుకుంటన్నారు గానీ ఈలని తవ్వనివ్వలేదు” – అంటాడు అమాయకంగా ఓ మనిషి.

“ఇదంతా అయిపోయేక మా బాధలేటి? మొత్తానికి అడివి పీకేస్తుంటే మా పిల్లలకేముంటదక్కడ?” అనెంతో బాధగా అడుగుతుంది మరో కొండ మనిషి.

ఇంకో ఆడమనిషి భర్త అనుమతితోనే తను కుటుంబ కష్టాలు తీర్చటం కోసం అక్కడికొచ్చి వ్యభిచారం చేస్తున్నట్టు సామాన్యంగా చెప్తుంది.

ఎర్ర చందనం స్మగ్లర్లు రాయలసీమ అడవుల్లో చేసిన ప్రకృతి భీభత్సం లాటిదే ఇదీ అయినా, సరస్వతికి కాస్త జాగ్రత్తగానైనా ధైర్యంగానే ఈ డాక్యుమెంటరీ తీసే అడ్డంకులు లేని వెసులుబాటు 2004 లో దొరికింది. ఫారెస్టు అధికారుల్ని కూడా చంపి పారేసేంత క్రౌర్యం చందనం స్మగ్లర్లు చూపిస్తే, అంత అవసరం లేకుండా అమాయకుల్ని ఉపయోగించి ‘కరక’ లాంటి గ్రామాల్లో రంగురాళ్ళు తవ్వేసుకున్నారు పెద్దమనుషులూ వ్యాపారులూ. ఎవడికో ఆ రాళ్ళను ఇవ్వటం కోసం కొండ తవ్వుతూ కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.

సరస్వతి ఇంకా రకరకాల సమస్యల మీద NGOల కోసం పది పన్నెండు డాక్యుమెంటరీలు తీసింది. వీటిలో ఆమె రైతుల సమస్యలు చర్చించింది. రసాయనిక వ్యవసాయంతో రైతు పడే పాట్ల లోతులను తాకింది. సేంద్రీయ వ్యవసాయం మంచిదని హితబోధ చేసింది. మూసీనదిని పాడు చేసిన మనుషుల, అధికార్ల మురికితనాన్ని బైటపెట్టింది. చేపలు పట్టేవాళ్ళ జీవితాల్లో మరపడవలు రేపిన కల్లోలాన్ని కాస్త చూడమంది. ఈమధ్య పోలవరం బాధితుల గోడును రికార్డు చేసింది. థర్మల్, అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు చేసే నిరసనల్లో పాల్గొంది. కొవ్వాడలో రాబోయే అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టడానికి ప్రయత్నం చేసింది.

ప్రజల బాధల్ని డాక్యుమెంటరీలుగా చేస్తూ సంపాదించే ఆ కాస్తడబ్బుమీద బతకటం కూడా సరైనపని కాదని భావించేంత రొమాంటిక్ సరస్వతికి సమస్య తమ ఇంటి గుమ్మం దాకా వచ్చేవరకూ మనుషులు ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ బతికే భద్ర జీవితాలను ఉతికి ఆరేసే తత్వంతో ఎదుటి మనిషి ఇబ్బందిగా అటూ ఇటూ చూసి నత్తగుల్లలా ముడుచుకుపోయే పరిస్థితి కల్పిస్తుందీమె. అయినా ఆమె నిజాయితీకి మాత్రం ఎవరూ వంక పెట్టలేరు.

***

“నీ స్నానానికి ఒక్క బకెట్ నీళ్ళు మాత్రం ఇవ్వగలను” – అంది సరస్వతి.

ఆమె ఇప్పుడు ఓ కొండరాళ్ళ వరుస నానుకున్న చిన్న పొలంలో వ్యవసాయం చెయ్యటానికి ప్రయత్నిస్తోంది. ఇది అన్ని సౌకర్యాలతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుని పచ్చిగాలి పీల్చటం కోసం చేసే డబ్బున్న హాబీ వ్యవసాయం కాదు. పట్నాల్లో పరుగులతో విసుగెత్తి పల్లెస్వర్గానికి వెళ్ళిపోవాలని కలలు కనే మధ్యతరగతి రొమాన్స్ కూడా కాదు. అసలైన రైతు తత్వాన్ని ఇంకించుకుని, ఆధునికత్వాన్ని వదిలించుకుని, నేలతో మనసును ముడేసుకోవాలనుకునే ఆలోచన నుండి పుట్టిన ఆచరణ. పొలంలోనే ఓ రెండు గదులూ, చిన్న వరండా, పైన రేకుల కప్పు. మట్టి, ఇటుక, పైన సన్నని సిమెంట్ పూతతో కట్టిన ఆమె చిన్న ఇంటి ముందు వేప, సీతాఫలం చెట్లు, వంటింటి వాడకం నీళ్ళతో పచ్చగా మెరిసే అరటి చెట్లు… మెరిసే మూడు సోలార్ పానెల్స్ నుంచీ వచ్చే శక్తి ఓ రెండు బల్బులూ, ఓ ఫ్యాన్ వాడుకుందుకు సరిపోతుంది. ఈ చక్కటి నిరాలంకారమైన దృశ్యం అమరేముందు ఆమె పడిన పాటు తక్కువేమీకాదు.

ఆ ఉదయపు పచ్చి గాలుల్లో వరండా ముందు ఏపుగా ఎదిగి చిన్నగా ఊగుతున్న కంది మొక్కలు. కొన్నేళ్లలో తప్పక చెట్లయి నీడా, పళ్ళూ ఇస్తామని చెప్తున్న మామిడి మొక్కలు. ఎప్పటికీ నీ తోడు వదలం అంటున్న మొండి ఆముదం చెట్లు. ట్రాక్టర్ చాళ్ళ వెంట పురుగుల్ని హుషారుగా ఏరుకుంటున్న కొంగల వయ్యారి నడకలు … చిన్న హైకూ కవితలా బతికేస్తే సరిపోదా?

ముందురోజు రాత్రి దబదబా తలుపులు కొడుతున్న చప్పుడయి ఉలిక్కి పడ్డాను. ఊరికి దూరంగా ఉన్న ఆ పొలంలో ఇద్దరమే ఉన్నామన్న ధ్యాస టకీమని నెత్తిమీద కొట్టింది నన్ను. ఇంతకీ అది ఉడతలు చేసే హంగామా అట. రేకులమీదా తలుపులమీదా కొడుతూ సరస్వతి ప్రపంచంలో మేమూ సభ్యులమే అని ప్రకటన చేస్తూ ఉంటాయట. దూరంగా ఉన్న నల్లటి ఎత్తయిన రాళ్ళ వరుసలో ఉన్న రంగులున్న, రంగుల్లేని పిట్టలూ, నెమళ్ళూ అలా ఓ సారి పొలాన్ని పరామర్శించి, పాట కచేరీలు కూడా చేసి వెళ్తూ ఉంటాయి.

ఆ కొండలో ఎన్నో పక్షులూ జీవాలూ ఉన్నాయని, దానిని అలాగే వదిలెయ్యమని సరస్వతి అధికారులతో, కోర్టుతో ఎంత మొత్తుకున్నా విదేశాలకు సమాధిరాళ్ళు పంపించి డబ్బు చేసుకునే మనుషులు దాన్ని వదలలేదు. ఆ రాళ్ళ అదృష్టం బాగుండి అవి ఆ విదేశీ సమాధుల షోకుకు పనికిరాక పోవటంతో కాంట్రాక్టర్ ఆ పని వదిలి వెళ్ళాడు. ఇంకే నరుడి దృష్టికి ఆ నల్ల రాళ్ళు మళ్ళీ పగులుతాయో చెప్పలేం.

వర్షాధారపు భూముల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ నిలబడటానికి అమ్మ సాయంతో నడుం వంచి తను చేస్తున్న ప్రయత్నం ఒక్కో సంవత్సరం ఒక్కో రకం ఫలితాన్ని ఇస్తోంది. ఆ ఊళ్ళో ఉన్న రైతులంతా కొర్రలు, జొన్నలు వంటి పంటలు ఉంటాయని కూడా మర్చిపోయిన గ్రీన్ రెవల్యూషన్ తరం. వాళ్ళంతా నీళ్ళ కోసం తాపత్రయపడుతూనే మందులు జల్లి జోరుగా వరి మాత్రమే పండిస్తూ ఉన్నపుడు సరస్వతి కొర్రలు పండించింది. “మా దేశానికి కొర్రలు మల్ల తెచ్చినవా బిడ్డా” అని అనుభవాల ముడతలతో మొహాన్ని సింగారించుకున్న ఓ పండు ముసలామె మురిస్తే, ఆ మొహంలోని ముడతలన్నీ సాగి ఆనందంతో మెరవటం మరవలేను.

ఏదెలా ఉన్నా, ఏ శక్తులు ఎంత భయపెట్టినా, తను సమాజంలో కోరుకుంటున్న మార్పే తానయి బతికే ఇలాంటి సరస్వతులు చేస్తున్న పనే వృధా పోకుండా ఎప్పటికైనా భూమిని బతికిస్తుంది.

సరస్వతి డాక్యుమెంటరీల కోసం ఇక్కడ చూడండి.

http://saraswatikavula.weebly.com/

-ల.లి.త.

lalitha parnandi

 

 

 

 

 

 

 

 

“మాటల్లేని చిత్రాల” లోకంలో కాసేపు…

WP_20141202_001

 

ఏ విషయానికి చెందిన పుస్తకానికైనా “చరిత్ర” అనే పేరుంటే ఆ విషయంపట్ల చాలా ఇష్టం ఉన్నవాళ్ళు తప్ప సాధారణంగా అందరూ దాన్ని పక్కన పెడతారు. 675 పేజీలున్న “ప్రపంచ సినిమా చరిత్ర మొదటిభాగం – సైలెంట్ సినిమా 1895-1930” పుస్తకం పేరు చూసి భయపడక్కర్లేదు. గంభీరమైన సిద్ధాంత వ్యాసాల మాదిరిగా ఉండదీ పుస్తకం. మొదలెట్టాక పూర్తయేవరకూ చదవటం ఆపలేకపోయాన్నేను. జవనాశ్వంలా పరుగెత్తే శైలి. సీరియస్ సినిమా విద్యార్ధులు, ఛాయాగ్రాహకులు, ఎడిటర్లు, ఔత్సాహిక దర్శకులు ఈ పుస్తకంలోకి కాస్త తొంగిచూస్తే అమూల్యమైన విషయాలు తెలుస్తాయి.

తెలుగులో సినిమా పుస్తకాల గురించి చెప్పుకుంటే, ఇంతవరకూ సరైన “విమర్శ” రానేలేదు. ఈ మధ్య వస్తున్న పుస్తకాల్లో పాత తెలుగు సినిమాల గురించి సమాచారం, ఆ సినిమాలు తీయడానికి దర్శకులు నిజాయితీగా పడిన శ్రమ, నటీనటుల అనుభవాలు… వీటికి సంబంధించిన చరిత్ర వరకూ బాగానే వచ్చినట్టు కనిపిస్తుంది. దీన్ని మించిన పని చాలా మిగిలేవుంది. ఈ పరిస్థితిలో “ప్రపంచ సినిమా చరిత్ర రాయ తలపెట్టటమే ఓ సాహస చర్య. పైగా ఆ చరిత్రని స్థూలంగా రాయకుండా, సమగ్రంగా, సంక్లిష్టంగా విశ్లేషణాత్మకంగా రాయదలచడం మరింత సాహసంతో కూడుకున్నపని” అంటూనే ఈ పనిలో మొదటి భాగాన్ని పూర్తిచేసి మనముందు పెట్టారు పసుపులేటి పూర్ణచంద్రరావు.

పీటర్ కోవీ “Seventy Years Of Cinema” తన రచనకు స్ఫూర్తి అని చెప్తున్నారు పూర్ణచంద్రరావు. సంవత్సరాలవారీగా వచ్చిన సినిమాల గురించి రాస్తూనే ఫిల్మ్ గ్రామర్ ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందో వివరించే పీటర్ కోవీ పద్ధతినే తానూ అనుసరించినట్టు చెప్పుకున్నారు. 1895లో పుట్టిన సినిమా విదేశాల్లో ఎలా పెరిగిందీ, మనదేశంలో దాని వృద్ధి సమాంతరంగా ఎలా వున్నదీ చెప్తూ ఆసక్తికరమైన తులనాత్మక పరిశీలన కూడా చేశారు ఈ పుస్తకంలో. దేన్నీ దాచే శ్రద్ధ, అలవాటు లేని కారణంగా ఫిల్మ్ లు దొరక్క, మనదేశంలో తయారైన చాలా సినిమాల గురించి మనకు తెలియదు. (ఒక్క దాదా ఫాల్కే మాత్రం తను సినిమా తీస్తున్న పద్ధతినంతా మరో కామెరాతో తీయించడం వల్ల ఆయన తీసిన ఫిల్మ్ ముక్కలతో పాటు చేసిన కృషి కూడా అందరికీ అర్ధమైంది).

భారతీయ సైలెంట్ సినిమా గురించి ఉన్నంతలోనే వివరించారు ఈ పుస్తకంలో. మనదేశంలో తయారై, తరువాత ఆచూకీ తెలియకుండా పోయిన కొన్ని మూకీల గురించి రాయటానికి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆర్కైవ్స్ లో ఉన్న సినిమా ప్రకటనలు బాగా ఉపయోగపడ్డాయట. ఫిల్మ్ సొసైటీలకు సంబంధించిన మొదటితరంవాళ్ళూ, సినిమా వాళ్ళూ ఆనాటి పత్రికల్లో చదివిన సారం ఏమైనా ఉంటే, వారి మెదళ్లలోనే ఉండి ఉండాలి. అలాటివారి సంఖ్య కూడా ఇప్పుడు తక్కువగానే ఉంది. సి. పుల్లయ్య కాకినాడలో ‘భక్త మార్కండేయ’ సైలెంట్ సినిమాను 1925 ప్రాంతాల్లో తీశాడనీ, అదే తెలుగువాడు తెలుగునాట తీసిన మొదటి కథా చిత్రమనీ ఎప్పుడో ‘విజయచిత్ర’లో చదివిన గుర్తు. ఆ సినిమా ప్రస్తావన ఈ పుస్తకంలో లేదు. వి.ఏ.కే. రంగారావు వంటి పెద్దలు ఇలాంటి విషయాలు వివరించగలరు.

నాటక, సాహిత్య, సంగీత, చిత్రకళాకృతులే సినిమా శిల్పాన్ని తీర్చిదిద్దాయి. ఈ రంగాలన్నిటిమీదా కొంత పట్టు ఉన్నవాళ్ళు సినిమా గురించి రాస్తే దానికో దమ్ము ఉంటుంది. వీటిగురించి తెలిసి ఉండటం, వీధినాటక ప్రయోక్త కావటం, ఆంధ్రాలో ఫిల్మ్ సొసైటీ ఉద్యమానికి సేవ చేసిన మొదటి తరం వారిలో ఒకరవటం, దేశాలు తిరిగి రకరకాల సంస్కృతుల గురించి తెలుసుకుని మరీ మాట్లాడగలగటంతో పూర్ణచంద్రరావు సినిమా రాతలు సాధికారంగా సూటిగా ఉంటాయి. అరకొర జ్ఞానం పట్లా, అన్నిరకాల అణచివేతల పట్లా ఈయనకున్న విపరీతమైన అసహనం నిర్మొహమాటంగా బైటపడుతుంది ఈ పుస్తకంలో.

సినిమాశిల్పాన్ని మూకీ సినిమాల బంగారుకాలంలోనే సంపూర్ణంగా చెక్కి పెట్టేశారు జార్జ్ మెలీ, గ్రిఫిత్, ఐసెన్ స్టీన్ మొదలైనవాళ్ళు. వీళ్ళ పనితనం గురించి రచయిత మాటల్లో చదవటం బాగుంటుంది. గ్రిఫిత్ ఎంత గొప్ప సినిమా శిల్పకారుడో అంత అధముడైన జాత్యహంకారి కూడాననీ, చార్లీ చాప్లిన్ ఎంత గొప్ప మానవతావాద హాస్యాన్ని పండించినా, వాన్ స్టెర్న్ బర్గ్ చేత తానే తీయించిన సినిమాని విడుదల చేయకుండా స్వయంగా తగలబెట్టించిన అసూయాపరుడు కూడాననీ నిర్మొహమాటంగా వివరించారు. చాప్లిన్ సినిమాల గురించి ఈయన ఆప్యాయంగా వివరించిన తీరులో చాప్లిన్ అంటే ఉన్న ప్రత్యేకాభిమానం కనిపిస్తూనే ఉన్నా, నిష్పక్షపాతమైన పరిశీలనతో దర్శకత్వం విషయంలో చాప్లిన్ కున్న పరిమితులను గుర్తిస్తారు. చాప్లిన్ తో బస్టర్ కీటన్ ను పోల్చేటప్పుడు, బస్టర్ కీటన్ సినిమాటిక్ నైపుణ్యంతో పాటు అతని హాస్యంలోని మేధావితనాన్ని కూడా గుర్తించటం ఉంది.

సైలెంట్ సినిమాలకోసం థియేటర్లో మ్యూజిక్ బ్యాండ్ లు సంగీతాన్ని వినిపించటం, అక్కడే ప్రేక్షకులకు పల్లీలు అమ్మేవాళ్ళు తిరిగేస్తుండటం, సినిమా షోల ద్వారా వచ్చిన డబ్బుని ఎడ్లబండ్లలో వేసి బ్యాంకుకి తీసుకెళ్లారంటూ జనం చెప్పుకోవటం వంటి తమాషా విషయాలూ ప్రస్తావనకు వచ్చాయి. మొదటిసారి గ్రిఫిత్ వాడిన క్లోజ్ అప్ షాట్ చూసి             “Half Man !!!” అంటూ ఆశ్చర్యపోయారట ఆనాటి జనం. ఈ పుస్తకంలో కదిలేబొమ్మల వింతలు చూస్తున్న అప్పటి ప్రేక్షకులనుంచి వచ్చిన స్పందనలు చదువుతుంటే వేడి పకోడీల్లా మజాగా ఉంటాయి.

‘వెస్టర్న్’ సినిమా తీరుతెన్నుల్ని చెప్తూ కాస్త అమెరికా చరిత్రనూ, వెస్టర్న్ సినిమాల్లో వచ్చే పదజాలాన్నీ వివరించారు. ఇది ఆ సంస్కృతి తెలియనివారికి బాగా పనికొస్తుంది. ‘జర్మన్ ఎక్స్ ప్రెషనిజం’, ‘కామెడీ’, ‘మెలోడ్రామా కళ’ గురించి చేసిన స్థూల పరిచయం కూడా ఉపయోగపడేదే. సినిమా విద్యార్థుల కోసం “Battleship Potemkin” లో ప్రఖ్యాతమైన ‘ఒడెస్సా స్టెప్స్’ దృశ్యపు స్క్రిప్ట్ భాగాన్నీ, గ్రిఫిత్ ‘కటింగ్’ గురించి తెలుసుకోవటం కోసం “Intolerance” సినిమా నుంచీ కొంత స్క్రిప్ట్ భాగాన్నీ ఓపిగ్గా వివరంగా ఈ పుస్తకంలో అందించారు.

చాప్లిన్ సినిమాల రివ్యూలు, ఇంకా “ఫాంటమ్ చారియట్”, “గ్రీడ్”, “ద పాషన్ అఫ్ జోన్ ఆఫ్ ఆర్క్”, “ద జనరల్”, , “బ్లాక్ మెయిల్”, “ద మాన్ విత్ ఎ మూవీ కామెరా”, “పండోరాస్ బాక్స్” “నోస్ఫెరాటు”, ద లాస్ట్ లాఫ్”, “ద కవర్డ్ వేగన్”, “ద క్రౌడ్”, “ద జనరల్ లైన్”, “Un Chien Andalou”, “లిటిల్ సీజర్” సినిమాల రివ్యూలు పూర్ణచంద్రరావు నిశిత పరిశీలనతో పాటు ఆయనలోని కథకుడిని కూడా చూపిస్తాయి.

ఫాల్కే తీసిన ‘రాజా హరిశ్చంద్ర’ కంటే ముందే ‘పుండలీక్’ తీసినంత మాత్రాన దాదా తోర్నీని భారతీయ చలన చిత్ర పితామహుడు అనలేం. అలాగే 1916కే కొన్ని సినిమాలు తీసిన నటరాజ మొదలియార్ ను కాకుండా, శాస్త్రీయంగా పద్ధతిగా సినిమా రంగంలోకి దిగి 1921 లో పూర్తి స్థాయి సినిమా ‘భీష్మ ప్రతిజ్ఞ’ తీసిన రఘుపతి ప్రకాశ్ నే దక్షిణ భారత కథా చిత్రానికి మొదటి దర్శకుడిగా గుర్తించాలని అంటున్నారు రచయిత. ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు.

అలాగే తొలి తెలుగు తార పైడి జైరాజ్ గురించి, “శారీరక సౌష్టవంలోనూ, డైలాగ్ డెలివరీ లోనూ పృథ్వీరాజ్ కపూర్, సొహరాబ్ మోడీలతో పోటీపడి జైరాజ్ హిస్టారికల్ చిత్రాల్లో నటించేవాడు… చరిత్రకందిన మేరకు 1929 నుంచీ నటించిన పైడి జైరాజే తెలుగు వాళ్ళలో మొట్టమొదటి సినిమా నటుడిగా- మొదటి హీరోగా – మనం గుర్తించి తీరాలి”.  

‘Pollyanna’ (ఒక రకమైన మానవతావాదం) ను నెత్తికెత్తుకునే అమెరికన్ ఉదారవాదపు సినిమాల గురించి పూర్ణచంద్రరావు చేసిన పరిశీలన:   “ఇది ప్రధానంగా ప్రారంభ రోజుల్లో అమెరికాకు తరలి వొచ్చిన పేద తెల్లజాతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆనాటి అమెరికాకి అన్వయించుకున్న క్రిస్టియన్ తత్వం. అంతేగానీ, పేదల పక్షం వహించినంత మాత్రాన దీన్ని అన్ని వర్గాలనీ, అన్ని జాతుల్నీ కలుపుకున్న మానవతావాదంగా భావించాల్సిన పని లేదు…   ఈ సినిమాల గురించి నేనిక్కడ ఊరికినే చెప్పడంలేదు! మన భారతీయ ప్రారంభ చిత్రాల్లో కూడా ఇలాంటి false poverty ని చూపించే చిత్రాలు కోకొల్లలుగా వచ్చాయి! వీటినే మానవతావాద చిత్రాలుగా, చివరికి కమ్యూనిస్టు చిత్రాలుగా కూడా భారతీయ ప్రేక్షకులు భ్రమించారు! అక్కడి ఆ “తెల్ల మానవతా వాదం” తెలిసి చేసిన సంకుచిత వర్గతత్వం! ఇక్కడ గుడ్డిగా మనవాళ్ళు చేసిన కాపీ చిత్రాలన్నీ ఆత్మ వంచనలు!”

మనదేశంలో సినిమాలు మొదలైన దగ్గరనుండీ ఇప్పటికిదాకా కూడా హాలీవుడ్ ప్రభావమే ఎక్కువ. అక్కడి బోలుతనాన్ని, పై పై మెరుగుల్నీ చూసి మురిసి, వాళ్ళ ‘సి’ గ్రేడ్ సినిమాని అనుకరిస్తూ తీసినదాన్ని ఇంకా దిగజార్చి ‘ఎఫ్’ గ్రేడ్ కి చేర్చే ఘనులు మనదగ్గర ఉన్నారు. ఈ సందర్భంలో ‘సెసిల్ బి డిమిల్’ సినిమాల గురించి పూర్ణచంద్రరావు చేసిన వ్యాఖ్యానం చెప్పుకోదగ్గది; “అసలు డిమిల్ తీసిన సినిమాలన్నీ అమెరికన్ లోవర్-మిడిల్ క్లాస్ ప్రజలకు హైక్లాస్ వర్గాల ఫాషన్లు – పోకడలని కాపీ చేయడాన్ని నేర్పించడానికే తీశాడా అన్నట్లుంటాయి… ఇలాంటి సినిమాల్లో బీజ రూపంలో ప్ర్రారంభం అయిన ఈ పోసుకోలుతనం భవిష్యత్తులో కూడా చాలా కాలం కొనసాగింది, అంతే కాకుండా సినిమాకు ఈ పోసుకోలుతనమే ఓ నిర్వచనంగా కూడా మారిపోసాగింది! ఈ కృత్రిమ వేషాల హాలీవుడ్ పోసుకోలుతనం క్రమంగా ప్రపంచం అంతా ఎగుమతయ్యింది… ఇండియాతో సహా! అంతా డిమిల్ పుణ్యమే…!”   నిజమే, ‘జిందగీ నా మిలే దుబారా’, ‘యే జవానీ హై దివానీ’ లాంటి consumerist పోసుకోలు సినిమాలు రెచ్చిపోతున్న ఈ రోజుల్లో డిమిల్ ఆదిపాపాన్ని ఎలా మర్చిపోగలం?

వివరణకు లొంగని సర్రియలిస్ట్ సినిమాలను “అతి” వ్యాఖ్యానానికి పోకుండా, అలాగని మొత్తంగా కొట్టి పారేయకుండా (చాలామంది విమర్శకులు ఈ పనే చేస్తుంటారు) నేర్పుగానే మాటల్లోకి లొంగదీశారు పూర్ణచంద్రరావు. ముఖ్యంగా Bunuel తీసిన “Un Chien Andalou”, ‘ద గోల్డెన్ ఏజ్’ వంటి సినిమాలను.   ‘ద గోల్డెన్ ఏజ్’ సినిమా గురించి … “పెయింటింగ్ సంప్రదాయాన్ని సినిమాకు తర్జుమా చేస్తున్న ఓ ప్రక్రియ ఇది. దీన్ని ఆ terms లోనే అర్థం చేసుకొని వొదిలేయడం మంచిది. అంతకన్నా ఎక్కువగా అర్థం కోసం లాగకూడదు. ఇలాంటి చిత్రాల్ని appreciate చేయడానికి ప్రేక్షకులకు తొందరపాటుతనం కూడదు. చాలా ఓపికతో కూడిన receptive తత్వం కావాలి. … సినిమా కళ కన్నా ముందే బాగా అభివృద్ధి చెందిన “avant-garde” visual arts పట్ల కొద్దిగానన్నా అవగాహన వుండాలి – ఇలాంటి సినిమాల్ని చూడాలంటే!”  

1919 లోనే లెనిన్ రష్యాలో సినిమాని జాతీయం చేశాడు. స్టాలిన్ వచ్చాక సోవియట్ చిత్ర దర్శకులు పడిన పాట్లు ఇన్నీఅన్నీ కావు. ఈ బాధ సోవియట్ దర్శకులే కాదు టాకీల కాలంలో ఇరానీ దర్శకులూ పడ్డారు. జైళ్లకు కూడా వెళ్ళారు. సోవియట్ దర్శకుల ప్రతిభ ఎంతటిదో వాళ్లకు ప్రభుత్వాధికారులు పెట్టిన ఆంక్షలూ అంతటివే. రష్యన్ అధికారుల బుర్రలేనితనం మీద రచయిత వేసే వ్యంగ్యపు వేటు మహా ఘాటుగా ఉంది.

“సోవియట్ అధికారులకు నచ్చని ఫిల్మ్ మేకర్స్ ని “FEKS” అని నిక్ నేమ్ పెట్టి విమర్శించేవారు. “FEKS” అంటే “The Factory of the Eccentric Actors” అట.”        

“ఎంత స్టాలినిస్ట్ రోజుల్లోనైనా రష్యన్ ఆర్టిస్టులు “అటుబెట్టీ – ఇటుబెట్టీ” అధికారులు చెప్పిన విషయాన్నే తీస్తున్నాం అని మభ్యపెట్టి – ఎలాగోలా తమకి నచ్చిందే తాము చేశారని Meyerhold, Eisenstein, Vertov, Mayakovsky ల్లాంటి వాళ్ళ కళాఖండాల్ని చూస్తే తెలుస్తుంది.”  

“ అఫీషియల్ గా తియ్యమని ఇచ్చిన ప్రాపగండా విషయాన్ని కూడా ఎలా ఆర్టిస్టిగ్గా తీయాలా? అన్న తాపత్రయంతోనే, సోవియట్ దర్శకులందరూ అటూ ఇటూ కాని సినిమాల్ని తీశారు”.  

“ఎందుకిలా ఒకరిని మించి మరొకరు సోవియట్ దర్శకులు formalists (శిల్పానికి ప్రాధాన్యతనిచ్చే దర్శకులు)గా మారిపోతున్నారు? గొప్ప టెక్నికల్ అతిశయం మధ్య, శిల్ప విన్యాసం మధ్య విషయాన్ని ఎందుకు అస్పష్టం చేస్తున్నారు? విషయాన్ని ప్రాపగండా స్థాయికి దిగజార్చే డిమాండ్ ప్రభుత్వం చేస్తున్నంత కాలం, కళాకారులిలా శిల్ప విన్యాసాల వెనుక, విషయంలోని డొల్లతనాన్ని దాచిపెడుతూనే వుంటారు కాబోలు! “

‘విప్లవం, దాని విజయాలు’ అనే ఒకే ఒక్క విషయంతో నలుగురు మేధావులను పదేపదే సినిమాలు తియ్యమంటే వాళ్ళు పడే పాట్లు ఊహించుకోవలసిందే.  వాళ్లకేమో ఓ కొత్త కళారూపంగా సినిమాను దిద్దటంలోనే ఎక్కువ ఆసక్తి. మరోపక్క కళ అంటే తెలియని అధికారులను మెప్పించాలి. ఒక్క కమ్యూనిజమే అని ఏముంది, ఎటువంటి అధికార చట్రాల్లోనైనా కళాకారుడికి ఊపిరాడదు.

మన సినిమాల్లో ప్రతీ కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ మెప్పించటం కోసం అన్నీకలేసి రుబ్బటం మూకీల కాలంనుంచీ ఉంది. దీని ముచ్చట ఇది; “పౌరాణిక చిత్రాల్ని తీస్తున్నప్పుడు వాటికి ఎలాంటి శిల్పం కావాలో దాన్ని అన్వేషించకుండా, ప్రతి పౌరాణిక కథలోనూ, ప్రతి చరిత్రాత్మక కథలోనూ చిటికెడంత బ్రిటిష్ వ్యతిరేక – రాజకీయాంశాన్ని జొప్పించి, ‘కిచిడీ’ చేయడాన్ని ‘దేశభక్తి’గా భావించే రోజులవి. ఏ genre కి ఆ genre cinematic form and its purity ని భారతీయ దర్శక-నిర్మాతలు గౌరవించలేదు; ప్రతి genre లోనూ కొద్దిగా ‘దీన్ని’, కొద్దిగా ‘దాన్నీ’ పడేసి, కలేసి రుబ్బారు!”

మన తెలుగు పౌరాణిక చిత్రాల కళాత్మక విజయాన్ని గురించి కూడా కీలకమైన మౌలికాంశాన్ని పాఠకుల దృష్టికి ఇలా తీసుకొచ్చారు; “ఏ జాతి కథాసంపదైనా కూడా ఆ జాతి సంప్రదాయ గాథల్లోనే ప్రాథమికంగా నిక్షిప్తమై వుంటుంది…. ప్రజా – పౌరాణిక గాథల్ని తమ జాతీయ సంపదగా గుర్తించి జపనీస్, చైనీస్ …. సినిమా దర్శకులు, యూరోపియన్ దేశాల్లో స్కాండినేవియన్లు కూడా తమ తమ ప్రజా – పౌరాణిక గాథల్ని గొప్ప కళాఖండాలుగా తెరకెక్కించారు.  భారతదేశపు ఖర్మ ఏమిటోగానీ – సినిమా ప్రారంభ చరిత్రలో ప్రతి నిర్మాతకీ, దర్శకుడికీ తిండి పెట్టింది ఈ ప్రజా-పౌరాణిక గాథలే అయినా కూడా, వాటికి తగిన ఆధునిక సినిమా శిల్పాన్ని జోడించి ఉన్నత స్థాయి కళాఖండాలుగా రూపొందించే ప్రయత్నం చేయలేదు మనవాళ్ళు! … ఇందుకు ఎక్సెప్షన్ గా భారతదేశం మొత్తంలో వేళ్ళమీద లెక్కపెట్టగలిగే కొన్ని మంచి, ప్రజా, పౌరాణిక చిత్రాల్ని తీస్తే గీస్తే అవి కేవలం తెలుగువాళ్ళే తీయగలిగారు! కానీ తెలుగుజాతి ఖర్మేమిటోగానీ, ఆ “exceptionally better”పౌరాణిక చిత్రాల్ని వాటి విలువల్ని తెలుగు ఎల్లల్ని దాటి మనం project చేయలేకపోయాం”.

సైలెంట్ సినిమా యుగంలో పెద్దగా ఏమీ సాధించలేకపోయిన భారతీయ సినిమా గురించి ఈ ముగింపు చూడండి… “మన నిశ్శబ్ద చిత్రాలకి ఓ శిల్ప పరిణతి రానేలేదు. గొప్ప భారతీయ సైలెంట్ సినిమాల డిస్కవరీ మాట – దేవుడెరుగు…! ముందు 1930 ల నాటి సైలెంట్ నిర్మాతల ఆలోచనలెలా వున్నాయో చూడండి – 1930 నాటికి ఒక్కో భారతీయ నిశ్శబ్ద సినిమాని 20 వేల రూపాయిల్లో, పది రోజుల్ని మించకుండా లుంగ జుట్టేయొచ్చు! రెండు వారాలాడితే చాలు, పెట్టుబడి పోనూ, కొద్దో గొప్పో లాభం కూడా గారంటీయే! “మరి సౌండ్ సినిమాలొస్తే పూర్తిగా ఎక్విప్మెంట్ ని మార్చేయాల్సి వస్తుందేమో! ఖర్చు ఎలా వుంటుందో! టెక్నికల్ కంట్రోలంతా మన చేతుల్లోనే వుంటుందో – ఇతర్ల చేతిలోకి వెళుతుందో…! అన్నది నిర్మాతల ఆందోళన. సైలెంట్ సినిమాలంటే ఒక భాష అంటూ పరిమితి లేదు. టైటిల్ కార్డ్స్ ఏ భాషలోనైనా కొట్టి, అతికించవచ్చు. అదే టాకీలైతే ఒక భాషకే పరిమితం కావాలి; అంటే ఒక మార్కెట్ కే పరిమితం కావాలి…! “

సినిమా కళ, వ్యాపారం, ఎడిటింగ్, స్క్రిప్ట్, కామెరా, చరిత్ర, సమాజం … దేన్నీ విడిచిపెట్టకుండా లూమియర్ బ్రదర్స్ చూపించిన ‘రైలు స్టేషన్ లోకి రావటం’ అనే మొట్ట మొదటి కదిలే బొమ్మ నుండీ మన దేశంలో టాకీలు వచ్చేంతవరకూ, అంటే 1930 వరకూ వచ్చిన ప్రపంచ సినిమాను తెలుగులో వివరంగా తీసుకురావటానికి ప్రయత్నించిన పూర్ణచంద్రరావు కృషి అభినందనీయం.

Expressionism” అన్న పదాన్ని తొందరపడి తెలుగు చేయకపోవడం మంచిది. మక్కీ కి మక్కీగా కేవలం అర్థాన్ని అనువాదం చేసినంత మాత్రాన ఈ యూరోపియన్ సాంకేతిక పదాల క్లిష్టత మనకు అర్థం కాదు. పైగా అనువాదం చేస్తే తప్పుదారి పట్టే ప్రమాదం కూడా వుంది” అనటం వరకూ రచయిత మాట నిజమే కానీ సులువుగా తెలుగులో రాయగల్గిన చాలా పదాలు కూడా ఆంగ్లంలో దొర్లటం అనవసరం అనిపించింది. అది శైలీవేగాన్ని పెంచినా సరే! ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ భాష పుస్తకం విలువను ఎంతమాత్రం తగ్గించదు. పైగా హింగ్లిష్, తెంగ్లిష్ భాషలకు బాగానే అలవాటు పడిన మనకు చదవటం సులభంగా కూడా ఉంటుంది.

పండు వొలిచి చేతిలో పెట్టినట్టుగా సినిమా జ్ఞానాన్ని అందించిన ఈ పుస్తకంలో చివర్న ఇచ్చిన పది నిశ్శబ్ద కళాఖండాల పట్టిక, చెప్పిన విషయానికి సరితూగి, చాలామంది ఏకీభవించేటట్టు ఉంది. సినిమా ప్రేమికులతో సహా సినిమా రంగంలో ఉన్నవాళ్ళందరూ తప్పనిసరిగా అందుకోదగ్గ ఈ పుస్తకం “ఎమెస్కో” ప్రచురణ.

                                                                                        lalitha parnandi      ల.లి.త.

మిస్టరీల హిస్టరీ – దేవగిరి

1(1)

 

పెద్ద పెద్ద కోటల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు కలిగే అనుభూతులే వేరు. తక్కువ జనాభా ఉన్న ఆ రోజుల్లో అంత భారీయెత్తు కట్టడాల నిర్మాణానికి అంతమంది మనుషులు ఎక్కడనుండి దొరికారా అనిపిస్తుంది. ఒక రాజు కాస్త స్థిరపడి ఓ కోట కట్టించడం మొదలుపెట్టాడూ అంటే, మనం ఈ రోజుల్లో కట్టే భవంతుల్లా ఇట్టే అయే పని కాదు కదా! రాతిని పగలగొట్టడంనుంచీ ప్రతీదీ చేతులతో చేసుకుపోవాల్సిందే. అందుకే మహా కట్టడాలూ కోటలూ పూర్తిగా రూపు తీసుకునేటప్పటికి చాలా ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి. ఈ లోపున రాజులు కొట్టుకు చావడాలూ, పాత రాజుగారి తల కోటగుమ్మానికి వేలాడటం వంటివి జరిగిపోతూ ఉంటాయి. కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ ఇంటికి మనక్కావలసిన అందాలు దిద్దినట్టు, జయించిన కోటలో నచ్చనివి పగలగొట్టి కొత్త మెరుగులు దిద్దించడానికి పూనుకుంటారు కొత్త రాజుగారు. ఇలా మార్పులు చెందుతూ చివరకు ప్రజాస్వామ్యపు కాలానికొచ్చేసరికి కోట శిథిలావస్థకొచ్చినా ముసలి మంత్రగత్తెలా ఆకర్షిస్తుంది. “మీలాటి అల్పప్రాణాలని ఎన్నిటిని చూశానో” అంటూ మన ఉనికిని తేలిక చేస్తుంది.

దౌలతాబాద్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేర్లకి అవినాభావ సంబంధం. అక్కడ ఏం చూసి ఆయన దాన్ని దేశ రాజధాని చేసి, ఢిల్లీ జనాన్ని సైతం అక్కడికి తరలించే పని పెట్టుకున్నాడా అని ఆ కోటగురించి ఒక ప్రత్యేక ఆసక్తి నాకు. ఈ మధ్య ఔరంగాబాద్, అజంతా, ఎల్లోరాలు చూడటానికి వెళ్ళినప్పుడు దౌలతాబాద్ కోట కూడా చూశాం. దురాశ, అధికారదాహంతో తమలోతాము యుద్ధాలు చేసుకుంటూనే మధ్య ప్రాచ్యం నుంచీ దేశాన్ని కొల్లగొట్టేందుకు వచ్చినవారితో మరోపక్క తలపడుతూ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించిన మధ్యయుగపు రాజుల నాటి చరిత్రకు మౌనసాక్షి ఈ కోట. ఎనిమిది వందల యేళ్లలో ఎనిమిది రాజవంశాలు పెరిగి విరగడాన్ని చూసిన ఘనమైన కోట ఇది.

2(1)

యాదవ వంశానికి చెందిన ఐదవ భిల్లమరాజు నిధులు దొరకడంతో నిక్షేపరాయుడై, దేవగిరి అనే పేరుతో ఈ కోట కట్టించి రాజ్యం ఏలాడట. మామూలు మనుషుల బతుకులు గాల్లో దీపాల్లా అయిపోయిన ఆ కాలంలోనే సంత్ జ్ఞానేశ్వర్, నామదేవ్, గోరా కుంభార్ వంటివారు మహారాష్ట్ర అంతటా భక్తిని వెల్లువెత్తించారు. జ్ఞానేశ్వర్ ఈ కోటను దర్శించాడు. తరువాత ఇక్కడికొచ్చిన విదేశీ యాత్రీకులు ఇబ్న్ బటూటా, ఫరిష్తా. సిరిసంపదలతో ఠీవిగా తలెత్తి నిలుచున్న ఇలాంటి కోటమీద ఢిల్లీసుల్తాను కన్ను పడకుండా ఉంటుందా! అల్లాఉద్దీన్ ఖిల్జీ, మాలిక్ కాఫుర్ ఈ ప్రాంతపు యాదవులతో యుద్ధాలకు దిగి కొంత వరకూ వారిని లొంగదీసుకున్నారు. పెద్ద పెద్ద కోటలను వశం చేసుకోవటం ఒకేసారిగా కుదరదు కదా! మాలిక్ కాఫుర్ కొన్నాళ్ళు యాదవులను సామంతులుగా చేసుకున్నాడు. ఓడిన యాదవ రాజునే ఢిల్లీకి ప్రతినిధిగా నియమించి భారీ ఎత్తున కప్పం లాక్కుని వెళ్ళాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు రాజు హరపాలదేవ యాదవుడు స్వాతంత్యం ప్రకటించుకున్నాడు. దానితో ఆగ్రహించిన కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ఈ కోటమీద యుద్ధానికి దిగాడు. అతడు 1318 లో దీన్ని జయించాడు. తిరుగుబాటు చేసిన హరపాలదేవను బతికుండగానే చర్మం వొలిపించి, అతని శరీరాన్ని కోటగుమ్మానికి వేలాడదీయించాడని గాథ. నూట ముప్పై యేళ్ళు పాలించి, అందులో పాతికేళ్ళపాటు ఢిల్లీసుల్తానును ప్రతిఘటించిన యాదవ వంశం అలా విషాదంగా అంతరించింది. తరువాత వరుసగా తుగ్లక్, బహమనీ, నిజాంషాహి, మొఘల్, అసఫ్జాహి, పేష్వాల దర్జాలను ధరించి భరించింది దౌలతాబాద్ (సంపదల నిలయం)గా మారిన దేవగిరి. దేవగిరికి దౌలతాబాద్ గా పేరు మార్చింది తుగ్లక్.

***

అక్టోబర్ నెల దక్కను అంతటా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పరిచింది. దేవగిరి దగ్గర హైదరాబాద్ వాసనే వీస్తోంది. ఈ వాతావరణంలోనే గమ్మత్తు ఉంది. అతిగా చలిలేకుండా, అలాగని ఎండ బాధ కూడా ఎక్కువగా లేని ఈ సమతుల్యత తుగ్లక్ ను ఆకర్షించి ఉంటుందేమో! పైగా దేశం మధ్యలో మంచి కట్టుదిట్టంగా ఉండటంతో ఈ కోటతో ప్రేమలో పడిపోయి, చిన్న చిన్న రాజులందరి మీదా అజమాయిషీ సరిగ్గా చేయొచ్చనుకుని ఇక్కడికొచ్చి ఉంటాడు.

మూడు ప్రాకారాల కోట ఇది. మొదటి ప్రాకారం అంబర్ కోట్. దీనికీ, మహాకోట్ అనే రెండో ప్రాకారానికి మధ్య సామాన్యజనం ఉండేవారట. ఈ ప్రాంతమే ఇప్పటి దౌలతాబాద్ ఊరు. అంబర్ కోట్ దాదాపు శిథిలమయింది. కోటలో ప్రవేశించటానికి మహాకోట్ ప్రాకారపు ద్వారం దాటాలి. దాని చెక్క తలుపునిండా పొడుచుకొచ్చే ఇనుప ములుకులు ఉన్నాయి. అంటే ఏనుగుల తలలతో ఢీకొట్టించి తలుపును ధ్వంసం చేసే టెక్నిక్ ఇక్కడ పనికి రాదన్నమాట. వంచనతోనే తలుపు తెరిపించాలి. ములుకుల రక్షణ ఉన్న ఈ తలుపుల్ని కాలమూ యుద్ధాలూ ఏమీ చెయ్యలేకపోయాయి.

మహాకోట్ రెండోద్వారం ముందు కోటలకు అలంకారంగా కనబడే చిన్న ఫిరంగులు ఇనపబళ్ల మీద కనిపించాయి. వాటి మీద చిన్నపిల్లలు ఎక్కి ఆడుకుంటుంటే తల్లిదండ్రులు ఫోటోలు తీసుకుంటూ మురుస్తున్నారు. అవి దాటి రాళ్ళూ రప్పలమధ్య నుండి ముందుకి నడుస్తూ పోయాం. ఈ దారమ్మటే ఎన్ని ఏనుగులూ, గుర్రాలూ, ఎంతమంది రాజులూ, సామాన్యులూ, వాస్తు శిల్పులూ, కవులూ, జ్ఞానులూ నడిచివుంటారో…

‘బావ్డీ’ అని దక్కనులో పిలిచే బావులను సామాన్య జనం కోసమూ ప్రాసాదంలో ఉండే రాజుల కోసమూ కట్టించారు అప్పటి రాజులు. హాథీ హౌద్ అనే పెద్ద ట్యాంక్ కూడా కనిపించింది. ఇప్పుడు అందులో ఏ నీళ్ళూ లేవనుకోండి. తుగ్లక్ హడావుడిగా రాజధాని మార్చేశాడు గానీ ఆ జనాభాకు తగిన నీటి సదుపాయం సరిగ్గా చూడలేకపోయాడు. కారణాలేమైతేనేం రెండేళ్ళ తరువాత ఢిల్లీకి వెనుదిరిగాడు. తరువాత వచ్చిన నిజాంషాహి గారి వజీరు ‘మాలిక్ అంబర్’ దగ్గరలో ఉండే కొండల్లో చిన్న ఆనకట్టలు కట్టి, అక్కడినుండి పైపుల ద్వారా నీటిని ఈ బావుల్లోకి, ట్యాంక్ ల్లోకి, కందకాల్లోకీ ఎప్పుడూ వచ్చేలా ఏర్పాటు చేశాడట. దక్కను పీఠభూమిలో నీటి కోసం చెరువులు ఏర్పాటు చేసుకుని వాటిని నిర్వహించుకోవటం ముఖ్యమని నిజాం కాలంలో గ్రహించారు. ఇప్పుడు మనకి ఆ జ్ఞానం పోయింది. చెరువులమీద ఇళ్ళు కట్టుకునే మూర్ఖత్వానికి దిగి, నీటికోసం భూమి గుండెల్లో ‘బోరు’ గునపాలతో లోతుగా గాయాలు చేసే నాగరీకం లోకి వచ్చేశాం. నీళ్ళు సరిగ్గా దొరకని చోటినుంచి అన్వేషణ మొదలుపెట్టి సాధించుకున్న టెక్నాలజీ నీళ్ళను సమృద్ధిగా సంపాదించిపెట్టింది. ఇప్పుడు కళ్ళు మూసుకుని పాలు తాగే పందిపిల్లల్లా వాటిని మొత్తం వాడేసుకునే దశలో ఉన్నాం. భూమితల్లి గుండెల్లో నీరెండిపోతోంది. దొరకనితనం లోకి మళ్ళీ వెళ్తున్నాం కాబట్టి ఎంత కొత్త టెక్నాలజీ కనిపెట్టినా వాటితో పాత నిర్వహణ పద్ధతుల వైపు చూడాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో చరిత్ర మనకు పాఠాలు చెప్తూనే ఉంటుంది. అల్లరిపిల్లల్లా మనం విన్నా వినకపోయినా.

ఔరంగాబాద్ లో సూఫీ వేదాంతి బాబా షా ముసాఫిర్ దర్గా “పంచక్కి” అనే చోట ఉంది. ఈయన బుఖారా (రష్యా) నుంచీ వచ్చి ఇక్కడ ఉండిపోయాడు. ఈ దర్గాలో పంచక్కి (పానీ చక్కీ) అనే యంత్ర విశేషం చూడొచ్చు. 17 వ శతాబ్దంలో కట్టిన ఈ పిండిమరతో ఆ దర్గాను ఆశ్రయించుకుని ఉన్న ఎంతోమంది జనాభాకీ, ఇంకా సైనికులకీ కూడా కావలసినంత పిండిని తయారుచేసుకునేవారుట. కొండల్లో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలధారను మంచి ఉధృతితో భూమి అడుగునుండి మట్టి గొట్టాలద్వారా ప్రవహింపజేసి, ఇక్కడో బుల్లి జలపాతం సృష్టించి అక్కడనుంచి వచ్చిన యాంత్రికశక్తితో చక్కీని నడిపిస్తారు. ఇప్పుడిది ఒక అందమైన టూరిస్ట్ స్పాట్. ప్రకృతిని మనిషి అవసరాలకోసం ఉపయోగించుకోవాలనే ఆలోచనల్లోంచి టెక్నాలజీని సృష్టించుకున్న కాలం అది. అక్కడితో ఆగటం చేతకాక, మరిన్ని సుఖాలవేటలో టెక్నాలజీని పెంచుకునే కాలంలో ఉన్నమనం ఇలాంటి ప్రదేశాలు చూడ్డం ఒక మానసిక అవసరం. ఎక్కడినుండి ఎక్కడికి వెళ్తున్నామో బోధపడుతుంది.

3(1)

 

 

కోటలోకి మళ్ళీ వస్తే, హాథీ హౌద్ దాటాక విరిగి పడివున్న శిల్పవిశేషాలు ఏవో కనిపించాయి. అవేమిటో మొదట అర్ధం కాలేదు. ఆ పైన భారతమాత గుడి ఉంటుంది వెళ్ళమని చెప్పారు. గుమ్మటపు ప్రాకారం లోపల అతి విశాలంగా పరుచుకున్న ప్రాంగణం. నీడలు పొడవుగా సాగుతున్న సమయంలో అక్కడకి చేరాం. ఎన్ని ఆధిపత్యపు నీడలు ఇక్కడ ప్రసరించాయో! అసలుకి అదొక జైన మందిరం… యాదవులు కట్టించుకున్న ఈ మందిరాన్ని పడగొట్టించి మసీదుగా మార్పించాడట ముబారక్ ఖిల్జీ. ఆ శిథిలశిల్పాలు జైన మందిరానివే. నిజాంరాజ్యం భారతదేశంలో విలీనమైన వెంటనే అక్కడ భారతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారట.

4(1)

మహాకోట్ తరువాత వచ్చేది కాలాకోట్ ప్రాకారం. ఈ రెండిటికీ మధ్య ‘చాంద్ మినార్’ అనే పెద్ద ఇటుకరంగు కట్టడం ఉంది. బహమనీ సుల్తాను తన విజయసూచకంగా దీన్ని కట్టించాడట. కాలాకోట్ వైపు వెళ్తున్నకొద్దీ ఒక నిగూఢత్వం లోకి నడుస్తున్న అనుభూతి. సాయంకాలపు నీరెండా, పచ్చని చెట్లమధ్య విస్తరిస్తూ మాయమౌతున్న రాతి ప్రాకారపు ఎత్తూ… ఇవి చాలు intrigue ని సాలెగూడులా బుర్రలో అల్లడానికి.

కాలాకోట్ లోపల చీనీ మహల్ కనిపిస్తుంది. చైనామట్టి పలకలతో అలంకరించారు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇప్పుడది శిథిలావస్థలో ఉంది. ఇక్కడ రాజవంశీకులను బందీలుగా ఉంచేవారట. గోల్కొండ తానాషా, బిజాపూర్ ఆదిల్షా, కాకతీయ గణపతిదేవుడు ఇక్కడ బందీలుగా ఉన్నారంటే, ఎంత జీవ వేదనను ఇముడ్చుకున్న కోట యిది! నిజాంషాహీలు కట్టించుకున్న మహల్ కూడా జీర్ణావస్థలో ఉంది. ఈ రెండిటి మధ్యా ఒక ఎత్తయిన వేదిక మీద ‘మెంధా తోప్’ అనే పేరుతో ఒక పెద్ద ఫిరంగి ఉంది. దాని వెనుకభాగం పొట్టేలుతల ఆకారంలో ఉంది. దాని మొదటిభాగంలో అందంగా అరబిక్ లిపిలో ఔరంగజేబ్ రాయించిన కురాన్ శాసనం ఉంటుంది. దీనినీ, ఇంకా పైనున్నఫిరంగుల్నీ పైకి చేర్చడానికి ఎంతమంది శ్రమపడి వుంటారో! ఆ ప్రయత్నంలో కొంతమంది వీటి కింద నలిగిపోయివుంటారేమోనని కూడా అనిపించింది. నిప్పులు కురిపించి ఎంతమంది ప్రాణాలు తీసిందో కానీ, ఈ ఫిరంగి గుండ్రంగా తిరగటానికి వీలుగా ఒక ఇరుసు కూడా ఉందక్కడ.

5(1)

 

ఈ మహళ్ళు దాటి వెళ్ళాక ఒక కందకం, దాన్ని దాటడానికి ఓ ఇనప వంతెనా కనిపిస్తాయి. వీటితో ఆ నిగూఢ వాతావరణం మరింత చిక్కబడింది. ఇక్కడ కోటలోకి శత్రుప్రవేశం ఇంచుమించు అసాధ్యం. లోతైన కందకంగోడలని నున్నగా చేసేశారు. దానితో అవి ఎక్కడానికీ పాకడానికీ వీల్లేకుండా ఉన్నాయి. కందకంలో నీళ్ళతో పాటు మొసళ్ళు కూడా ఉండేవట … ఇప్పుడున్న ఇనప వంతెన స్థానంలో తోలువంతెన ఉండేదట. అవసరాన్నిబట్టి, మడతపెట్టి దాచేసుకునేలాగన్నమాట… దాని కింద ఉండే రెండో వంతెనని అవసరమైతే నీటి స్థాయిని పెంచుతూ నీళ్ళలో ముంచి, శత్రువుకు అది కనపడకుండా వుండేలా జాగ్రత్త పడేవారట. ఇంత పెద్ద ప్రణాళికకు తగ్గ నీటిసరఫరా ఉండేదంటే, ఎంత గొప్ప ఇంజనీరింగ్ టెక్నిక్కో కదా! ఆ వంతెన మీద నిలబడి గొప్పగొప్ప కుట్రల ఊహల పద్మవ్యూహాల్లో కాసేపు విహరించాను. విశ్వనాథ ‘పులిముగ్గు’ లోని intrigue లాటిది కాసేపు నన్ను ఆవహించింది.

వంతెన దాటి లోపలికి వెళ్తే, మరిన్ని రహస్యాల గుసగుసలు. ‘అంధారీ’ అనే మార్గం, బైటకు విశాలంగా కనిపిస్తూ రమ్మని పిలుస్తుంది. తీరా లోపలికి వెళ్తే, కటిక చీకటి నెమ్మదిగా కమ్ముకుంటుంది. కొంతదూరం వెళ్లి, టార్చ్ సాయంతో ఆ చీకటిని జయించలేక వెనక్కు వచ్చేశాం. గబ్బిలాల సామ్రాజ్యం అది. అంతా చిక్కటి కాటుక చీకటి. దారి మెలికలుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినవాడు, దాహార్తుడు నీళ్ళకోసం తపించినట్టుగా వెలుగుకోసం తపిస్తాడు. అంతలో ఒక చిన్న కిటికీ కనిపిస్తుంది. వెలుగుకోసం అక్కడికి వెళ్తే, చక్కగా కందకంలోకి తోసిపడేసేవారట. ఆ పైన మొసళ్ళ బాధ. చచ్చి తీరాల్సిందే. చీకట్లో ఎక్కడైనా నిలబడిపోతే, రాళ్ళవర్షం కురిపించి చంపేవారట. ఇవన్నీదాటి దారి చివరకు చేరుకుంటే, పైనున్న పెద్ద పెద్ద మూకుళ్ళలోంచి ఉడుకుతున్ననూనె వచ్చి మీదపడుతుంది. శత్రువుకు దొరక్కుండా ఉండటం కోసం ఇన్ని హింసామార్గాలు కనిపెట్టి, నిశ్చింతగా ప్రాసాదంలో నిద్ర పోదామంటే ఆ రాజులకు వీలవలేదు. వందలాది సైనికుల శారీరకబలం కంటే శత్రువు పన్నే ఒకే ఒక్క కుతంత్రం చాలు… చీకటి కుట్రలు ఆ సొరంగపు చిమ్మచీకటి కంటే నల్లటివీ భయానకమైనవీ…

అంధారీ పక్కనున్న వేరే మెట్ల దారి మీదుగా పైకి చేరుకున్నాం. నిట్ట నిలువు మెట్లు. అదేమి ఇంజినీరింగో, సేవకులూ, సైనికులూ మోకాళ్ళ నొప్పులతో మూలపడే మాదిరిగా. లేక శత్రు సైనికులు పైకెక్కలేక ఆయాసపడుతుంటే వాళ్ళ పని పట్టేందుకు అంతంత నిలువుగా కట్టేరేమో!  పైన పేష్వాలు కట్టిన గణపతి గుడి, షాజహాన్ కట్టించిన బారాదరీ, మరో పెద్ద ఫిరంగి … మొఘల్ వాస్తు పనితనంతో ఉన్న బారాదరీ చెక్కుచెదరలేదు. అక్కడినుండి చూస్తే సందె వెలుగులో, చిరుగాలుల్లో ఔరా అనిపించే ఔరంగాబాద్ పరిసరాలు… మెట్లెక్కిన ఆయాసం తీర్చుకుంటూ అందరూ కూర్చుంటున్నారు. అంతలోనే కోట మూసేసే సమయం అయిందంటూ కిందనుండి గార్డుల విజిల్స్.

దేవగిరి కోట చెప్పే రహస్యాలను వింటూ… మనుషుల తెలివినీ, సృజనాత్మకతనూ, కాయకష్టాన్నీ, దోపిడినీ, రక్తదాహాన్నీ… అన్నిటినీ చూస్తూ లక్షలసార్లు ఆ కోటవెనుక అస్తమించిన సర్వసాక్షి ఆ రోజూ నారింజ రంగు విరజిమ్ముతూ అస్తమించాడు. చిరు చీకట్లలో చరిత్రను భారంగా మోస్తున్న ఆ కోటను వదిలి ఔరంగాబాద్ చేరుకున్నాం.

 

 

                                                                                      lalitha parnandi    ల.లి.త.

ఒక నీనా చెప్పిన సీత కథ “Sita Sings The Blues”

 

1

కారణం కూడా చెప్పకుండా రాముడు సీతను అడవుల్లో విడిచిపెట్టాడు.

కారణం కూడా చెప్పకుండా నీనా పేలీ ని భర్త విడిచిపెట్టాడు.

సీతమ్మ, తల్లి భూదేవిలో కలిసిపోయి ఓదార్పు పొందింది.

నీనా పేలీ రామాయణం చదివి, చక్కగా ఒక ఏనిమేషన్ ఫిల్మ్ తీసేసింది.

ఇంతకూ నీనా పేలీ ఒక అమెరికన్. పడమటి వాళ్ళు మన పురాణాలమీద పుస్తకాలు రాసినా, సినిమాలు తీసినా మనకీమధ్య అనుమానంగా ఉంటోంది. మనల్నీ, మన గ్రంధాల్నీ ఎద్దేవా చేస్తున్నారేమో, కనిపించని అజెండాలతో మన సంస్కృతిని భ్రష్టం చెయ్యటానికి తయారౌతున్నారేమో అని!   నీనా పేలీ పండితురాలు గానీ, ఇండాలజిస్ట్ గానీ, స్వచ్ఛంద సంస్థల్లోని మనిషి గానీ కాదు కాబట్టి ఆమె ఫిల్మ్ లో కుట్రలేవీ లేవనే అనుకోవచ్చు. కారణం చెప్పకుండా జీవిత సహచరుడని అనుకున్నవాడు తన పక్కన నడవటం ఆపేస్తే, ఏడ్చి బెంగ పెట్టుకుని, తరువాత కాస్త తేరుకుని, ఇలాంటి కేసులు ఇంకెక్కడ ఉన్నాయా అని చూస్తే ఆమెకు మన సీతమ్మ కనిపించింది.

రామాయణం చదివాక ‘అంత గొప్ప దేవతలకే ఎడబాటు తప్పనప్పుడు, మానవమాత్రురాల్ని నాదేముందిలే’ అనిపించి, ఆ దేవతలు తనకు చాలా దగ్గరివాళ్ళలా కనిపించారట నీనాకు. కష్టం వచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా అంతా ఇంచుమించు ఒకేరకంగా స్పందిస్తాం. ‘సీతకే కష్టాలు తప్పలేదమ్మా, మనవెంత?’ అని కష్ట సఖిని ఇష్ట సఖులూ, పెద్దమ్మలూ ఓదార్చడం మనకు మామూలే.

2

“Sita Sings The Blues” నీనా పేలే సొంత కథతో కలిపి అల్లిన సీత కథ. సీత లాగే ఈమెక్కూడా జీవితంలో దొరికినవి ప్రేమ, విరహం, అవమానం… చివరకు సీత అమ్మవడి చేరితే, నీనా తను చేసే పనిలో స్వేచ్ఛా సంతోషాలను వెదుక్కుంది. ఇదీ “Sita Sings The Blues” కథ. ఎందరో మళ్ళీ మళ్ళీ చెప్పిన ఇలాటి కథను సరికొత్తగా ఎలా చెప్పాలి? ఇందుకోసం ఈమె బోలెడన్ని రకాల ఏనిమేషన్ రేఖల్ని కలగలిపి, వాటి కదలికల్లో ప్రేమనూ, హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ, బాధనూ ఎంత చక్కగా ఒలకబోసిందంటే ఫిల్మ్ చూస్తూ ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేం.

ఈ ఫిల్మ్ కోసం ఏనిమేషన్ బొమ్మలు తనే స్వయంగా వేసింది నీనా. ఇందులో సీత మూడు రకాలుగా కనిపిస్తుంది. రాజస్తానీ పెయింటింగ్స్ లోని స్త్రీలా ఉండే సీత, క్యాలెండర్ ఆర్ట్ లో కనిపించే సీతాదేవి, తన మనస్థితికి తగ్గట్టుగా పాటలు పాడుకునే ఆధునిక సీత. సీతలాగే రాముడూ, మిగతా పాత్రలు కూడా మూడు శైలుల్లో ఉంటారు. ఇవి గాక రామాయణం గురించి మూడు తోలుబొమ్మలు సూత్రధారుల్లా చర్చించుకుంటూ ఉంటే కథ నడుస్తుంది. ఇలా నీనా పేలే మన చిత్రకళను చాలా వరకూ తెలుసుకున్నాకనే బొమ్మలు వేసుకున్నట్టు అర్ధమౌతుంది. 1920 ల్లో Annette Hanshaw అనే జాజ్ గాయని పాడిన పాటల్ని ఈ సినిమాలో సీత నోటినుంచి వింటాం. భానుమతి పాటల్లా మంచి పాత వాసన వేసే ఆ పాటల్ని ఆధునిక సీత తన పరిస్థితికీ భావోద్వేగాలకూ తగ్గట్టు పాడుకుంటూ ఉంటుంది. ఈ పాటల సీత బొమ్మ అమెరికన్ కానీ, ఇండియన్ కానీ కాకుండా కొంచెం Mario Miranda కార్టూన్ లోని సొసైటీ లేడీలా కనిపిస్తుంది. సీత అంటే మనం చూసిన బొమ్మలూ, ఊహించుకునే పద్ధతీ మన సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటాయి గానీ విదేశీయుల సృష్టికి ఈ రకమైన భారతీయ దృష్టి ఒక అడ్డంకి కాదు కదా! ఈమె ఏనిమేషన్ లో తూర్పూపడమరల నడకలు కలిసి, ఒక వింతైన ఫ్యూజన్ సాధ్యపడింది. మునులూ, ఆశ్రమ వాసులూ, అగ్నిదేవుడు, భూదేవి, శివుడు, సూర్యుడు, చంద్రుడు ఎవరికి వారే ప్రత్యేకంగా వెలిగిపోతుంటారు. Squiggle vision animation (బొమ్మలు వణుకుతున్నట్టుగా ఉండటం) లో కదులుతూ నీనా సొంత కథ కూడా ఈ సీతాయణంతో సమాంతరంగా నడుస్తుంది.   నీనా కథకు వేసిన బొమ్మలు చూస్తుంటే Roald Dahl (పిల్లల సాహిత్యం రాసిన బ్రిటిష్ రచయిత) కథలకు Quentin Blake వేసిన బొమ్మల ఛాయ కూడా కొంచెం కానవస్తుంది. మొత్తానికీమె రేఖల్లో మేరియో, రాజస్తానీ చిత్రాల ఛాయలు సొగసుగా ఒదిగాయి.

3

4

ఇన్ని రకాల గీతల్లో చాలా స్పష్టంగా కథను నడిపించటం మహా నేర్పుగా చేసేసింది నీనా పేలే. ఈ బొమ్మలకు ఏమాత్రం తీసిపోని ఫ్యూజన్ సంగీతం కథలో సరిగ్గా అమరిపోయి, ఫిల్మ్ అయిపోయాక కూడా చెవుల్లో ధ్వనిస్తూ ఉంటుంది. ఈమె బాలీవుడ్ నాట్యాన్ని కూడా వదిలిపెట్టలేదు. మంటల్లో నిలబడ్డ సీత వ్యధ మన శాస్త్రీయ నాట్యంలాగానూ, బాలీవుడ్ డాన్స్ లాగానూ బైటకొస్తుంది.

హాస్యం, చతురత, సున్నితత్వంతో అలరించే “Sita Sings The Blues” ఎన్నో తరాల సీతల వారసత్వపు ఆర్తిని కాసేపు తీవ్రంగా, కాసేపు మంద్రంగా వినిపిస్తుంది. బొమ్మల రంగులూ, కదలికలూ, నాట్యాలూ సీత పాటలతో కలిసి గమకాలు పోతాయి. కొన్ని దృశ్యాలివీ … సీత రాముడి గురించి ఓ ప్రేమ గీతం పాడేస్తూ తిరిగేస్తుంటే అతను ఓ చేత్తో రాక్షసుల తలలు ఎగరగొడుతూ మరో చేత్తో సీతను పట్టుకుని నాట్యం చేస్తుంటాడు. రావణుడు ఎత్తుకుపోయే ముందు, కుటీరంలో సీత రాముడిని తలచుకుంటూ పాట పాడుతుంటే సీతాకోక చిలుకలు కిటికీలో ముద్దుగా అడుగులు వేస్తుంటాయి. వాల్మీకి ఆశ్రమంలో నెమలి, కొంగ, కప్పలు ఆడా మగా జంటలుగా హాయిగా ఆడుతూ కనిపిస్తాయి. ఇంతలోనే మగవి ఆడవాటిని ఓ తన్ను తన్ని పారేయటంతో ఆడవన్నీ నిండు గర్భిణి సీత చుట్టూ కన్నీళ్ళతో, సహానుభూతితో చేరుతాయి. రాముడి గొప్పతనాన్ని ఏ భావం లేని మొహాలతో లవకుశులు, ఆశ్రమ వాసులూ పాడుతుంటారు. భూదేవిలో కలిసిపోయేముందు సీత తన చుట్టూ ఉన్నవాళ్ళను లెక్క చెయ్యకుండా గాలిలో తేలిపోతూ, అంతర్ముఖురాలైపోతూ పాడుకుంటుంది. హనుమంతుడి గంతుల నాట్యం మరో కొసరు.

 

ఈ కథను లక్ష్మీ దేవి ఓ గ్రామఫోన్ రికార్డు ద్వారా మొదలు పెట్టి మనకు చెప్తుంది. కథ పూర్తయాక, చివరి దృశ్యంలో పాల సముద్రం మీది బొమ్మ తిరగబడి, లక్ష్మీదేవి శేషతల్పం మీద శయనిస్తే, విష్ణువుగారు ఆమె పాదాలు ఒత్తుతూ ఉంటాడు5. లక్ష్మి కొంటెగా కన్ను కొట్టడంతో ఫిల్మ్ పూర్తవుతుంది. తీసినది స్త్రీ కాబట్టి ఇలా ముగిసింది. అదే బాపు సినిమా ‘మిస్టర్ పెళ్ళాం’లో అయితే, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల వైకుంఠపు దృశ్యం తిరగబడటం వేరుగా ఉంటుంది. ‘ఇద్దరం సమానమే కదా కాసేపు మన స్థానాలు మార్చుకుందామ’ని లక్ష్మి అడిగితే విష్ణువు సరేనంటాడు. ఇంకేముంది వెంటనే పతిదేవుడు తన పాదాలు ఒత్తుతున్నట్టుగా లక్ష్మి ఊహించేసుకుంటుంది. ఆవిడ ఊహలోంచి బయటకు వచ్చి చూడబోతే, తాను భర్త పాదాల దగ్గరే ఉంది. విష్ణువు విలాసంగా శయనించే ఉన్నాడు. కాకపోతే తన స్థానం కుడి వైపునుండి ఎడమపైపుకి మారిపోతుందంతే! ఇంత కుటిలంగా మగవాడు అటుదిటు చేస్తాడని సరదాగా చెప్పి వదిలేస్తాడు బాపు. ఇలా మన సినిమాల రెఫరెన్సులు చాలానే ఉన్నాయి “Sita Sings The Blues” లో. సొంత ప్రతిభతో వాటిని కలిపి కథ చక్కగా చెప్పి ఒప్పించగలిగింది కాబట్టి అవి రెఫరెన్సులయాయి.  చేతగాని ఫిల్మ్ మేకర్ వాడితే “సీన్లు అలాగే దించేశాడు” అంటాం.

6

 

Annette Hanshaw పాటలు తన సినిమాకి వాడుకున్నందుకు రాయల్టీల చిక్కుల్లో పడింది నీనా పేలీ. రెండు లక్షల డాలర్ల పైనే అడిగిన కాపీరైట్ హక్కుదారులతో ఒక ఒప్పందానికి వచ్చి, యాభై వేల డాలర్లు చెల్లించింది. తరువాత ఓ కొత్త పధ్ధతి మార్కెటింగ్ మొదలు పెట్టింది. డీవీడీలుగా కొన్ని కాపీలు మాత్రం అమ్మకానికి పెట్టింది. 2009 లో ఈ చిత్రాన్ని యూ ట్యూబ్ లో పెట్టేసింది. రామాయణం ఎలా అయితే హాయిగా ప్రజల మధ్య ప్రయాణం చేసిందో, తన ఫిల్మ్ కూడా అంతే స్వేచ్ఛగా తిరుగుతూ ఆ ప్రజల చెంతకే ఏ అడ్డంకులూ లేకుండా చేరాలని అనుకుంది నీనా. ఈ చిత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ప్రదర్శించుకోవచ్చు. డీవీడీలుగా అమ్ముకోవచ్చు. కానీ పాటలకు సంబంధించిన రాయల్టీని మాత్రం డీవీడీ అమ్మకందారులు మ్యూజిక్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. చందాల రూపంలో, బొమ్మల టీ షర్టుల అమ్మకాల్లో డబ్బు వచ్చింది. చానెల్ 13లో ఇంకా ధియేటర్లలో ప్రదర్శించినవాళ్ళు ఎంతో కొంత మొత్తాలు ఇచ్చారట. ఈ విధంగా మంచి లాభాలే వచ్చాయని చెప్తుంది నీనా పేలే. చక్కని చిత్రం తియ్యటమే కాకుండా దాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతూనే డబ్బు కూడా సంపాదించొచ్చని చెప్తూ తన వెబ్ సైట్ లో మొత్తం వివరాలు అందించింది..

“సీత” పేరుతో బొమ్మల రామాయణం రాసిన దేవదత్త పట్నాయక్ వంటి వాళ్ళు, సీతకు అన్యాయం జరిగిందని బాధపడేవాళ్లకు రామాయణంలోని ఇంకో కోణాన్ని చూపించటానికి ప్రయత్నిస్తారు. ‘నిజానికి రాముడు మాత్రం ఏం సుఖపడ్డాడు? మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కదా, సీతారాములిద్దరూ కొన్ని ఆదర్శాల చట్రాలలో బందీలే’ అనేది కూడా ఒక గట్టి విశ్వాసానికి సంబంధించిన వాదనే. సీత అవతారంలో లక్ష్మీదేవి దుష్ట రావణ సంహారం కోసం నిబ్బరంగా అన్ని బాధలూ భరించింది గానీ ఆమె అబల కాదని చెప్తారు వీళ్ళు. వాల్మీకి రామాయణాన్ని చదివే ఓపిక, అవకాశం లేని నేటి తరం ‘Sita Sings The Blues’ వంటి చిత్రాలు సులువుగా చూసేసి, సీతను ఒట్టి బాధితురాలుగా, రాముడినేమో భార్యను హింస పెట్టేవాడిగా అర్ధం చేసుకుంటారని, అంతేకాక హిందువులు భార్యను హింసించేవాడిని పూజిస్తారని కూడా పాశ్చాత్యులు అనుకుంటారని పట్నాయక్ ఉద్దేశ్యం. “వాల్మీకి సీతను ఒక నాయికగా చూశాడు. తులసీదాసు రాముడి దైవత్వానికి ఒక సంపూర్ణత్వాన్ని చేకూర్చిన వ్యక్తిగా సీతను చూశాడు. అద్భుత రామాయణంలో ఆమె కాళీ అవతారంగా కనిపిస్తుంది.” అంటాడు. రాజకీయనాయకులు, ఒక అసహాయురాలిని దుష్ట రాక్షసుల బారినుండి రక్షించిన వీరుడిగా రాముడి గురించి చెప్తే, స్త్రీవాదులు భార్యను హింస పెట్టిన మగవాడిగానే రాముడిని వర్ణిస్తారని చెప్తూ, ఎవరి ఎజెండాలు వారికి ఉన్నాయంటాడు పట్నాయక్.

జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా (వేటూరి) వాల్మీకి రామాయణ కావ్యగానం చేశాడంటారు. స్థూలంగా చూస్తే, ఎడబాసిన పక్షి జంట వంటి సీతా రాముల కష్టాల కథే రామాయణం. మిగతా ఎజెండా లన్నీ పక్కన పెట్టి అంతవరకే ఆ కథను తీసుకున్నా, భర్త వదిలేసినప్పుడు పడే బాధలో ఆడవాళ్ళకు సీత గుర్తుకు రావటం, ‘ప్రియసతియా లేక రాజ్యమా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినపుడు రాముడు రాజ్యాన్ని వదిలి, సీత వెంట ఉండవచ్చుకదా, అదీ ఒక ధర్మమే కదా’ అనుకోవటం సహజం.

ఎన్నో రామాయణాలు, ఎన్నో వాదాలు, ఛీత్కారాలు, ఉదాత్తీకరణలు, మనశ్శాంతి పొందటాలు …. వీటన్నిటికీ వాల్మీకి రామాయణం ఇచ్చినంత అవకాశం ఇంకే కావ్యమూ ఇచ్చి ఉండదు. ఎన్నో తరాలుగా ఆడవాళ్ళు మాత్రం ఒకపక్క రాముడిని దేవుడిగా పూజిస్తూనే మరోపక్క సీత కష్టాలకు విచారిస్తూ, సీతంటే సహనానికీ బాధకూ ప్రతిరూపంగానే గుర్తిస్తూ, చెప్పుకుంటూ వస్తున్నారు. రామాయణం ఉన్నంతకాలం సీతాయణం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో, అదీ స్త్రీలు చెప్పేటప్పుడు, నీరు పల్లానికి ప్రవహించినంత తేలిగ్గా స్త్రీవాద ఆలోచనా ధారలోకి వెళ్ళే అవకాశం రామాయణానికి బాగా ఉంది. ఇప్పటి సందర్భంలో ‘Sita Sings The Blues’ నీనా పేలే చేసిన ఒక చక్కని ఆధునిక సీతాయణ గానం.

 

ల.లి.త.

 

 

 

 

 

 

బొమ్మలోంచి సినిమాలోకి నడిచొచ్చిన ‘బాపూ తనపు’ హీరోయిన్!

 

1

రెండు జెళ్ళ సీతల్నీ, బుడుగునీ, సీగాన పెసూనాంబనీ, బక్కచిక్కిన ముగుడు గార్లనీ, లావుపాటి పక్కింటి పిన్నిగార్లనీ, గిరీశాన్నీ, రాధనీ, గోపాళాన్నీ, ఇంకా తెలుగు కథల, నవలల నాయికా నాయకులనీ, దుష్ట విలన్లనీ, బొర్ర రాజకీయ నాయకుల్నీ అవిశ్రాంతంగా గీతల్లో బంధించి మనకందించి, చిరకాల స్నేహితుడి దగ్గరకు వెళ్ళిపోయారు మన బాపు. అంతేనా? ‘నవ రసాలంటే నా కుంచె నుంచి జాలువారినవే’ అన్నారు. ‘అష్ట విధ నాయికల పోకడలిలానే ఉంటాయ’ని బొమ్మలు కట్టారు. రాముడూ, సీతా, తిరుమలేశుడూ, ఇంకా సమస్త దేవీ దేవతల రూపాల్ని ఇంతకంటే గొప్పగా ఎవరు గీయగలరో నేనూ చూస్తానంటూ కాపీరైట్ చేసేసుకుని మరీ పయనం కట్టారు. రావిశాస్త్రి, శంకరమంచి సత్యం, నామిని వంటివారు రాసిన ఒక్కొక్క కథనూ అద్దంలో కొండలా ఒక్కొక్క బొమ్మలోనే పట్టి చూపించిన ఈ ఘనుడి విస్తృతి మన తెలుగువారికే సొంతం అనుకోవటం మనకు ఒకింత గర్వంగానూ ఉంటుంది.

తెలుగు నేల మీద బాపు సినిమాలంటే ప్రాణం పెట్టే అభిమానులకూ, బాపు స్పెషలిస్ట్ లకూ తక్కువలేదు. కానీ సినిమాల్లో ఆయన పెట్టిన ఒరవడిని అందుకున్న దర్శకులెవరూ కనిపించరు. ఆయన స్ఫూర్తితో సినిమాలు తీశానన్న విజయనిర్మల కూడా పెద్దగా చేసిందేమీ లేదు. బాపు చిత్రకళ అంత స్థాయిలో కాకపోయినా ఆయన సినిమా కూడా కొంతవరకూ ప్రత్యేకంగానే ఉండిపోయిందీ అంటే, దానిక్కారణం ఒకటే అనిపిస్తుంది. బాపును సినిమాల్లో అందుకోవాలంటే కావలసిన దినుసు హాలీవుడ్ లో లేని మనదైన visual literacy మరియూ రస దృష్టి.

2

 

3

ఆయన ప్రపంచ సినిమా చాలానే చూశాడు. ఐసెన్ స్టెయిన్ లా, సత్యజిత్ రాయ్ లా బొమ్మలతో స్టోరీ బోర్డ్ తయారు చేసుకుని సినిమాలు తీశాడనీ అందరికీ తెలుసు. అరుదైన ఈ పద్ధతిలో, బాపూకి మాత్రమే చెందిన ఇంకా అరుదైన రీతి ఏమిటంటే, తన నాయికల కదలికలను తన చిత్రాల్లోని గీతల పరిధిలోనే ఉండేటట్టుగా శాసించటం. కట్టూ, బొట్టూ, మాటతీరు, నడక, నవ్వు, పెదవి విరుపూ, చురుకు చూపూ… బాపు హీరోయిన్ అంటే అచ్చం బాపు బొమ్మలాగే ఉంటుంది. ఆ stylization అనితర సాధ్యం. విజయనిర్మల, వాణిశ్రీ, హలం, జయప్రద, జ్యోతి, మాధవి, గీత, సంగీత, దివ్యవాణి, ఆమని, స్నేహల నుంచీ చివరకు ఛార్మి వరకూ కూడా ఆ మూసలో ఒదగవలసిందే. బాపు సినిమాల బ్రాండ్ కు వీరంతా అంబాసడర్స్. వినయపు, వందనపు బొమ్మల్లాంటి వాణిశ్రీ, సంగీతల నుండి, నేటికాలానికి వస్తున్నకొద్దీ అమ్మాయిల్లో వచ్చే మార్పులు దుస్తుల్లోనూ బాడీ లాంగ్వేజ్ లోనూ కొద్ది కొద్దిగా చేస్తూనే ఇవి తన బొమ్మలేనని ముద్ర వెయ్యటం బాపు ప్రత్యేకత.

4

బాపు నాయికల విషయంలో ఇది పూర్తిగా తెలుగుతనం మాత్రమేనని చెప్పలేం. ఆహార్యంలో తెలుగుతనం ఉట్టిపడుతూనే ప్రత్యేకంగా కనిపించే ‘బాపూతనం’ ఇది. స్మితా పాటిల్ గుజరాతీ పల్లె పడుచుగా (మంథన్, మిర్చ్ మసాలా), శ్రామికురాలిగా ఆదివాసీగా (చక్ర, ఆక్రోష్), తమిళ యువతిగా (చిదంబరం) ఆయా వర్గాలకూ, ప్రాంతాలకూ చెందిన స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన కదలికలు నటనలో ప్రదర్శిస్తుంది. తన నాయికల్లో అటువంటి సహజత్వానికంటే స్త్రీత్వానికే పట్టం కడతాడు బాపు. అమ్మాయికి కాటుకా, బొట్టూ పెట్టి, వాలు జడలో పూలు తురిమి, పాదాలకు పట్టీలు పెట్టి, చక్కని చీర కట్టి ముస్తాబు చేసి, వయ్యారపు నడక నేర్పి, ఇక చూడండని మనల్ని మురిపిస్తాడు. ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ప్రతీ మగవాడూ కలలు కనేటట్టు చేసేస్తాడు. బాపు కెమెరా కాటుక కళ్ళనీ, నల్లని పొడుగాటి వాలు జడనీ, వింత భంగిమల్లో నడుము వంపునీ చూడకుండా వదలదు. వాలు జడ అంటే, దాని మీద పాట రాయించుకుని చిత్రీకరించేంత ఇష్టం బాపుకి (రాధా గోపాళం). ఇంతటి Indulgent కొంటె camera కూడా సభ్యత గీత దాటిన సందర్భాలు తక్కువే. Celebration of the body beautiful, దాంపత్య శృంగారం, బాపు సినిమాల్లో ఉన్నంత అందంగా ఇంకెక్కడా ఉండవేమో!   బాపు తరువాత ఈ రెండిటిలో బాగా ఒడుపును సాధించిన దర్శకుడు తమిళ మణిరత్నమే.

అయిదు నిముషాలపాటు సజ్జాద్ హుస్సేన్ చేత మాండొలిన్ సంగీతం రికార్డ్ చేయించుకుని సంగీత, శ్రీధర్ మీద బాపు తీసిన హనీమూన్ దృశ్యాలు 1975లో ముత్యాలముగ్గులో చూసిన వారికి ఒక ఆశ్చర్యకరమైన కొత్త అనుభూతి. ఒక క్షణంపాటే ఎక్కుపెట్టినట్టున్న సంగీత పాదాన్నీ (పట్టీలూ, పారాణీ మామూలే), మొహం లో అరనవ్వునీ చూపిస్తూ మన ఊహకే ఎంతో వదిలేస్తాడు. పెళ్లి పుస్తకంలో అమ్ముకుట్టి, రాజేంద్ర ప్రసాద్ ల సరసాలు చూసి మురవని తెలుగు జంట ఉండదు.

తన నాయికలను తెల్లని రంగూ, సాంప్రదాయకమైన అందంతో తూచకుండా ఎన్నుకోవటం బాపులో ఉన్న అనేక సద్గుణాలలో ఒకటి. వాళ్ళు కాస్త బొద్దుగా ఉన్నా తన గీతలోకి వొదగటం ఒక్కటే ప్రధానం. తీరైన నల్లని శిల్పంలాంటి ముక్కూ మొహమూ గల వాణిశ్రీ ‘గోరంత దీపం’ లో ఉన్నంత అందంగా ఇంకే సినిమాలోనూ ఉండదు. విజయనిర్మల, రాధిక, జ్యోతి, సంగీత, దివ్యవాణి లాంటి సాధారణమైన అందంగల నాయికలను తక్కువ మేకప్ తోనే కావ్యనాయికల్లా మలిచాడు బాపు. బాపు హీరోయిన్ లను చూస్తుంటే, తెలుగు అమ్మాయిలను కాదని తెల్ల తోలు భామల్ని ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకొనే వెర్రితనంనుంచి మన తెలుగు సినిమా ఎప్పటికైనా బయట పడుతుందా అని దిగులేస్తుంది.

56

 

బాపు సినిమా గురించి చెప్తూ దర్శకుడు తేజ “మేమంతా ఏవో ఫ్రేములు తీస్తుంటాం గానీ బాపు ఫ్రేములు వేరు, అవి ఎవరికీ రావ’న్నాడు. ఒక గొప్ప చిత్రకారుడు సినిమా తీస్తే అలవోకగా జరిగే ప్రక్రియ ఇది. ఛాయాగ్రాహకులతో సహా చాలా మందికి ఈనాటికీ లేదీ visual sense. బాపు ఫ్రేముల్ని సరైన కాంతిలో, రంగుల్లో చూపించగలిగిన సత్తా గల   ఛాయాగ్రాహకులు ఇషాన్ ఆర్య, బాబా అజ్మీలిద్దరే. ఇషాన్ ఆర్యను వెదికి తెచ్చుకొనేవరకూ బాపు ఫ్రేముల అందం కూడా అప్పటి సినిమాటోగ్రాఫర్ల జూమ్ షాట్ల, క్రేన్ షాట్ల, Uncle Tom whitewash photography పనితనం ముందు వెలవెలబోయేది. ముత్యాల ముగ్గు నుంచీ బాపు ఫ్రేములు మిలమిలా మెరవటం మొదలెట్టాయి. ముత్యాల ముగ్గు, స్నేహం, గోరంత దీపం, తూర్పు వెళ్ళే రైలు … ఇషాన్ ఆర్య చేస్తే, వంశవృక్షం, మరికొన్ని సినిమాలు బాబా అజ్మీ చేశాడు. Long lens వాడకంతో పాత్రల ముఖకవళికల్ని స్ఫుటంగా మన కన్నుల్లో ముద్రిస్తాడు బాపు. పెళ్లి పుస్తకంలో ‘శ్రీరస్తు శుభమస్తు’ పాట మొత్తం long focal lens తో నడిపిస్తాడు. పెళ్లి పుస్తకం నాటికి తెలుగు నేల మీద సినిమాటోగ్రఫీ కూడా కాస్త మెరుగు పడింది.

హాలీవుడ్ సినిమాల ప్రభావం సత్యజిత్ రాయ్ వలే బాపు మీద కూడా ఎక్కువగానే ఉన్నా, వీళ్ళిద్దరూ కూడా సొంత నేల మీద వేళ్ళు తన్నుకున్న వృక్షాలే. ఈ లక్షణమే వీళ్ళ సినిమాల సౌందర్యం కూడా. కథ చెప్పడం వరకూ మాత్రమే వీళ్ళు హాలీవుడ్ ను అనుసరించారు. హాలీవుడ్ వెస్టర్న్ ‘High noon’ కథను సూత్రప్రాయంగా అనుసరించిన బాపు మొదటి సినిమా ‘సాక్షి’ లో కనపడే పల్లెటూరితనం, అమాయకపు పాత్రలూ, అతి తెలివి పాత్రలూ, దాన్ని అచ్చ తెలుగు సినిమాను చేశాయి. మొదట కాస్త పిల్లాటలా అనిపించిన సినిమా చివరలో రాత్రి లైటింగ్ లో మంచి పట్టుగా సాగుతుంది. కృష్ణ చేత కూడా నటింపజేయటానికి ప్రయత్నించాడు బాపు.

7

చాలా వరకూ బాపు సినిమాలు పౌరాణికాలయితే రామాయణం. సాంఘికాలైతేనూ రామాయణమే. ఇది ఆయన బలం అవునో కాదో గానీ బలహీనత మాత్రం ఖచ్చితంగా అవును. సినిమా ఎలా తీయాలో చాలా బాగా తెలిసిన పెద్దాయన రామాయణానికీ, మధ్య తరగతి దాంపత్యాలకీ, జమిందారీలకీ సంబంధించిన కథనాలకే ఎక్కువగా పరిమితం కావటం ఒక దురదృష్టమే. ప్రపంచ స్థాయి కథలను అర్ధం చేసుకుని, మెచ్చుకుని, వాటికి అర్ధవంతమైన బొమ్మలు వెయ్యగల సామర్ధ్యం ఉన్న పెద్ద మనిషి సినిమాల్లో వస్తు వైవిధ్యం ఇంత తక్కువగా ఉండటమేమిటో !

బాపు తన కథలకు పూర్తి విరుద్ధంగా చేపట్టిన సీరియస్ సినిమా ‘వంశవృక్షం’. ఎస్.ఎల్. బైరప్ప ప్రసిద్ధ నవలను అనుసరించిన కన్నడ సినిమాకంటే కూడా ఈ తెలుగు సినిమా బరువు ప్రేక్షకుల గుండెలనిండా నిండిపోతుంది. ఆ విషాద కావ్యాన్ని అంతటి అనుభూతితోనూ మనకందించిన బాపు సమర్ధత, మరిన్ని విభిన్నమైన కథా వస్తువులను స్వీకరించి ఉంటే, ముక్కలూ మెరుపులుగా కాకుండా ఇంకా కొన్ని సమగ్రమైన చక్కని సినిమాలు వచ్చుండేవి ! ఇలా ఆశించటం కూడా తప్పేమో! ఆయన మార్కెట్ బాధలు ఆయనవి.

బాపు సినిమాలకు ప్రాణమైన ఒకటో రకం హాస్యాన్నీ, అచ్చతెనుగు మాటనీ ఆప్త మిత్రుడు రమణ మూటగట్టి అందించాడు. చక్కని పాటలూ, సంగీతానికి తొంభైల వరకూ తెలుగులో తిరుగులేదు. ఈ కేన్వాసుల మీదుగా భక్తీ రక్తులలో ముంచిన కుంచెలతో బాపు అలవోకగా గీసిన కొన్ని సినీకళాకృతులు ప్రేక్షకుల మనసుల్లోంచి ఎప్పటికీ చెరగని బొమ్మలు.

                                                                                                        –   ల.లి.త.

lalitha parnandi

ఆ రోజు “గోముఖ్” ఒక మార్మిక చిత్రం…

1

బదరీనాథ్ వెళ్ళే దారిలో చమోలీ జిల్లాలో పిపల్ కోటి అనే ఓ మాదిరి ఊరుంది. అక్కడో చిన్న అందమైన హోటల్ లో మేం ఒక రాత్రి గడిపాం. విశ్రాంతిగా అందరం ముచ్చట్లు చెప్పుకుంటున్న ఆ రాత్రి వేళ దూరాన ఉన్న ఓ కొండ మీద మోదుగ పూల మాలలా మంటల చార వెలుగుతూ కనిపించింది. అంటుకున్న అడవి ఎప్పటికి చల్లారుతుందోననుకుంటూ నిద్రలోకి జారుకున్నాం.

మర్నాడు పొద్దునే మా స్నానాలకు బకెట్లతో వేడినీళ్ళు కాచి ఇచ్చేందుకు ఇద్దరు పిల్లలు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. ఆ నీళ్ళు తెచ్చుకుందుకు మేడ మెట్లెక్కి నేనూ వెళ్లాను. హోటల్ గదులు కింద ఉన్నాయి. పైనున్న అంతస్తుతో సమానంగా ఉన్న విశాలమైన కొండ భాగం. చూస్తే అక్కడో అందమైన దృశ్యం కళ్ళ ముందు పటం కట్టింది… ఒక వెయ్యి గజాల స్థలంలో వేసుకున్న రక రకాల పంటలు… వాటిలో పసుపు, వెల్లుల్లి దగ్గర్నుంచి గోధుమ వరకూ ఉన్నాయి. చిన్న గుడిసె పక్కనే విశ్రాంతిగా నెమరేసుకుంటున్న ఆవూ, పక్కనే దూడ… ఆ పక్కనే పొయ్యిమీద వేడినీళ్ళు కాగుతున్నాయి. ఈ చక్కని చిన్న ప్రపంచాన్ని పోషిస్తున్న వ్యక్తి ఎవరా అని చూస్తే, ఓ ముప్పయ్యేళ్ళ స్త్రీ నీళ్ళు మోసుకొస్తూ ప్రత్యక్షమైంది. రాత్రి అంటుకున్న అడవి గురించి అడిగితే, ‘నిర్లక్ష్యంగా విసిరేసిన చిన్న బీడీ నిప్పు చాలు అడవిని తగలబెట్టడానికి’ అంది. ఇలా అడవి అంటుకోవటం వల్ల వాగుల్లో నీళ్ళు తగ్గిపోతాయంటుంది. నీళ్ళు లేక తన ఆ చిన్న వ్యవసాయం ఎంత కష్టంగా ఉందో వివరించింది.

2

బదరీనాథ్ ఒక పది కిలోమీటర్ల దూరం ఉందనగా దారి చాలా ఇరుగ్గా మారింది. సూదిగా ఉన్న రాతి పలకలు ఒకదానిమీద ఒకటి పేర్చినట్టుగాఉన్న కొండచరియలు ఒకవైపు, లోయల అగాధాలు మరోవైపు… ఆ మధ్య దారిలో జాగ్రత్తగా బస్సును పోనిచ్చాడు మా డ్రైవర్. చినుకులతో పాటు సన్నని చలిని అనుభవిస్తూ మాకు ఏర్పాటు అయిన బసలో చక్కని భోజనం చేస్తుంటే, మా వెనుక బస్సులో వచ్చినవాళ్ళు తమ కళ్ళ ముందే ఒక ఇన్నోవా లోయలో పడిపోయిందని చెప్పారు. నోరంతా చేదెక్కింది. ఇలా వాహనాలు లోయల్లో పడి మనుషులు ప్రాణాలు పోగొట్టుకోవటం తరచుగానే జరుగుతుందట. మా డ్రైవర్ ఈ విపరీతాలకు కారణం వివరించాడు. వీలైనంత తక్కువ సమయంలో ఈ యాత్రలు పూర్తి చేసేద్దామని అనుకుంటూ డ్రైవర్ లకు రాత్రి సరిగ్గా నిద్రపోయే అవకాశం కూడా ఇవ్వకుండా, వెళ్ళకూడని వేగంతో కొండదారుల్లో పరుగులు తీయించే వాళ్ళ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని అతను చెప్పాడు. పరుగుల జీవిత వేగాన్ని కొండల్లోని నిదానపు నడక దారుల మీద overlap చెయ్యబోతే గమ్యం ప్రతీసారీ అనుకున్నట్టుగా అందదు.

బదరీనాథ్ దగ్గర అలకనంద పరవళ్ళు తొక్కుతోంది. గుడికి వెళ్లేందుకు నది మీద కట్టిన వంతెన పైన నించుని తదేకంగా నీటి ఉరవడి చూస్తుంటే ఒక్కసారిగా అందులోకి దూకేసి సుడి తిరిగి ముక్కలైపోదామనే వింతైన భయపు కోరిక… నది ఒడ్డున పితృదేవతలకు పిండాలు పెడుతున్న తంతు నిర్విరామంగా నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని బ్రహ్మ కపాలం అని కూడా అంటారు. ఇక్కడ సహజంగా ఏర్పడ్డ వేడినీటి గుండంలో మెడలోతు మునిగి చాలాసేపు చేసిన స్నానం ఒంటిని తేలికపరిచింది. ఆలయంలో బదరీనాధుడు సుందర మూర్తి .

మా తరువాతి గమ్యం గంగోత్రి వెళ్ళే దారిలో విశాలం గా పరుచుకున్న లేత గడ్డి మైదానాలూ, ఎండలో మెరిసే మేరు పర్వతం కనువిందు చేశాయి. గంగోత్రి దగ్గర గంగమ్మ పేరు భాగీరథి. భగీరథుడు ఈ ప్రాంతంలోనే గంగను భూమికి తీసుకొచ్చాడని పురాణ గాథ. సాయంత్రం వేళ నది వొడ్డున గుడిలో గంగాదేవికి ఆరతులూ పూజలూ జరిగాయి. గంగ భువికి దిగిన ఈ ప్రదేశం నుంచీ కాశీ వరకూ ‘గంగా మయ్యా’ అని గౌరవంగా పిలిపించుకుంటూ అన్నిచోట్లా సాయంత్రంవేళ ఆరతులు అందుకుంటూనే ఉంటుంది. హరిద్వార్ లో మే నెలలో గంగ దసరా అనే పెద్ద ఉత్సవం కూడా జరుగుతుంది.

3

కేదార్, బదరీ, గంగోత్రి యాత్ర అనుకున్నప్పుడే మా అన్నయ్యతో ‘గంగోత్రి వరకూ వెళ్లి గంగా నది జన్మస్థానం ‘గోముఖ్’ వెళ్ళకుండా ఎలా?’ అన్నాన్నేను. బయలుదేరిన 15 మందిలో గోముఖ్ వెళ్ళేవాళ్ళు అయిదుగురం లెక్క తేలాం. ‘సరే మీరు ఒక రోజులో గోముఖ్ వెళ్లి రండి. మిగతా వాళ్ళు గంగోత్రిలో మీ కోసం ఒక రోజు ఆగుతారు. తరువాత అందరం తిరిగి వద్దామ’ని తను ప్లాన్ చేశాడు. గంగోత్రి నుండి గోముఖ్ వెళ్లి రావటం మొత్తం 38 కిలోమీటర్ల ప్రయాణం. కొండల్లో ఎక్కేటప్పుడు గంటకు రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేము. ఒక రోజులో నడిచి వెళ్లి రాగలిగే పని కాదని అర్ధం అయింది. కానీ గంగోత్రి నుండి గోముఖ్ కు గుర్రాల మీద కూడా వెళ్ళొచ్చు. గుర్రాల మీద అయితే తెల్లారుజామునే బయలుదేరి చీకటి పడేలోగా వచ్చెయ్యగలమనే ఊహతో ముందు రోజే పర్మిట్లు తీసుకున్నాం. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, రోజుకు 15 గుర్రాలకూ 150 మంది వరకూ మనుషులకూ మాత్రమే గోముఖ్ వెళ్ళటానికి పర్మిట్లు ఇస్తారు. దీనికి కారణం, గోముఖ్ గ్లేసియర్ గడిచిన 70, 80 ఏళ్ళలోనే ఒక కిలోమీటరు దూరం వెనక్కు వెళ్ళిపోయిందని తెలుసుకోవటం… ఇంతకు ముందు గోముఖ్ కూడా మంచి ఆధ్యాత్మిక టూరిస్టు ప్రాంతం. జనం రాక పోకలూ, వ్యాపారాలూ, చెత్త కుప్పలతో కేదారనాథ్ లాగే ఉన్నట్టు అప్పట్లో వెళ్ళినవాళ్ళ అనుభవాల వల్ల తెలిసింది. మనుషుల దాడి తట్టుకోలేకేమో, గ్లేసియర్ బెదిరిన ఆవులా వెనక్కి అడుగులు వేస్తోందని గుర్తించాక, ప్రభుత్వం కళ్ళూ, చెవులూ తెరిచి, గోముఖ్ ప్రయాణాల మీద ఈ ఆంక్షలు పెట్టింది.

వెళ్ళే దారంతా తినటానికి ఏమీ దొరకదని తెలిశాక మరీ హాయి అనిపించింది. ముందురోజే గంగోత్రిలో రెస్టారెంట్ వాళ్ళను పొద్దున్నే మాకోసం పరాఠాలు తయారు చేసిపెట్టమని అడిగి, అవి తీసుకుని బయలుదేరాం. కొండల్లో వాతావరణాన్ని ఏమాత్రం నమ్మటానికి లేదు. ముందురోజు రాత్రే సన్నగా చినుకు మొదలై, వదలటం లేదు. అది ముసురు వాన లాగే అనిపించింది. ఎత్తుగా బలంగా ఉన్న అయిదు గుర్రాల మీద నేనూ, జయసూర్యా, శంకర్, జానకి, కాశ్యప్, మాతోపాటు గుర్రాలను నడిపించేవాళ్ళూ … అందరం తెల్లవారుజామునే బయలుదేరాం. నన్ను ఓ ఆడగుర్రం మీద ఎక్కమన్నారు. దాని పేరు భూరీ. కేదారనాథ్ దారిలో నేనెక్కిన పెంకి గుర్రాన్ని తలుచుకుంటూ, భయంగానే గుర్రం ఎక్కి కూర్చున్నాను. కాసేపటికి దాని వీపు మీద స్థిరంగా కూర్చున్నట్టు అనిపించిందో లేదో, ఒక్కసారిగా ఎత్తు రాళ్ళ మీదకు ఎగిరి, గట్టి చప్పుళ్ళతో డెక్కలు ఊని, నన్ను గాభరా పెట్టింది. భూరీని అదిలిస్తూ, అది నెమ్మదైన, తెలివైన గుర్రమేనంటూ నాకు ధైర్యం చెపుతున్నాడు భోలా.

4

వాన కాసేపు ప్రేమికుడి ప్రియవచనాల్లా మెత్తగా తాకుతోంది. కాసేపు పెద్దవాళ్ళ అదిలింపులా గుచ్చుకుంటోంది. లోపలి బట్టల్లోకి ఇంకటానికి అడ్డు పడుతున్న రెక్సిన్ జాకెట్ల మీదినుంచి అలుగుతూ బొట్లుగా జారిపోతోంది. పల్చని రెయిన్ కోట్లు ఒంటి నిండా వేసుకోవటానికి ప్రయత్నించినా ఆవంత సౌకర్యంగా అనిపించలేదు.

ఎక్కడా ఎండ పొడ వచ్చే ఆస్కారం కనిపించలేదు. ప్రకృతి నిశ్శబ్దంగా, సన్నని మబ్బుపొరలని ఆచ్చాదనగా చుట్టుకుని స్నానిస్తోంది. మేము తప్ప ఇంకెవరి అలికిడీ లేదు. చిన్నగా పడుతున్న చినుకులు గడ్డి పూలను వణికిస్తున్నాయి. సన్నని దారి దాటి పెద్ద వాగు దగ్గరికి వచ్చాం. నాకేమో గుర్రం దిగి నీటి పరవళ్ళ మీదినుంచి రాళ్ళ మీద అడుగులు వేసుకుంటూ వాగు దాటదామని అనిపిస్తోంది. నడిచి వెళ్ళే వారికోసం ఒక దుంగ కూడా నీళ్ళ మీద వేసి ఉంది. కానీ భోలా గుర్రం దిగవద్దని ఆజ్ఞాపించాడు. భూరీ ఆగిపోయి నీళ్ళ వైపు చూస్తోంది. మనం రాళ్ళమీద ఎక్కడ అడుగు వేద్దామా అని ఎలా చూసుకుంటామో సరిగ్గా అలాగే తల తిప్పుతూ అటూ ఇటూ చూసి, టక్ మని నీళ్ళలో అనువైన చోట అడుగు వేసింది. అలాగే నీటి ఉధృతిలో జాగ్రత్తగా నడుస్తూ నది దాటేసింది. భూరీని నమ్మొచ్చనుకుంటూ ఇక నిశ్చింతగా కూర్చున్నాను నేను.

‘చీడ్ వాసా’ చేరుకున్నాం. ఆ పేరుకు అర్ధం పైన్ చెట్ల అడవి అని. నిలబెట్టిన బల్లేల లాగా ఆకాశం వైపు చూస్తున్నాయి పైన్ వృక్షాలు. చుట్టూ కొండల వాలులంతా ఆవరించి ఉన్నాయి. వాటి ముదురాకుపచ్చని సూదుల్లాంటి ఆకుల్ని కూడా కమ్ముతూ మేఘాలు… ఈ రోజుకి ప్రకృతి ప్రసాదించినది ఈ monochrome చిత్రాన్నే. నలుపూ, తెలుపు వర్ణాల లోని అన్ని ఛాయలూ నింగీ నేలా మార్మికంగా పరుచుకున్నాయి. ఆ వెలుగులో, వర్షంలో అడవి నిగూఢంగా ఉంది. నిలువెత్తు ఆరోగ్యంలా కనబడుతున్న ఒక వ్యక్తి ఒక కర్ర పట్టుకుని గబా గబా నడుస్తూ పోతున్నాడు. సాయంత్రంలోగా తిరిగి వచ్చెయ్యాలంటూ మా గుర్రాలు దాటి వెళ్ళిపోయాడు.

పైపైకి పోతున్నకొద్దీ తడిసిన శరీరాలను చలి పొరలు చుట్టుకుంటున్నాయి. చినుకుల దాడి పదునెక్కింది. ‘భుజ్ వాసా’ – అంటే భూర్జ వృక్షాల (birch) అడవి మొదలైంది. భూర్జ పత్రాల మీద ప్రాచీన కవులు కావ్యాలు రాశారని మనం విన్నాం. తెల్లగా ఉండే ఈ చెట్టు కాండం నుండి సులువుగా ఊడే పొరలను కాగితంలాగా ఉపయోగించి చుట్టలుగా భద్రం చెయ్యొచ్చు. మరీ ఎత్తులేకుండా గుబురు అరణ్యంలా ఉన్న లేత చెట్లు ఎక్కువగా కనిపించాయి.

5

6

ఒకచోట ఎవరో చేసిపెట్టిన ఒంటి స్థంభపు మట్టిమేడల్లాగా పెద్ద పెద్ద స్వరూపాలు చాలా కనిపించాయి. కొన్ని ఎప్పుడైనా కూలిపోయేలా ఉన్నాయి. వానలకు కరిగి నీరుగారిన కొండల్లా ఉన్నాయి అవి. వాటి పక్కనుంచి ఇరుకైన దారి, ఒక మనిషి, లేదా ఒక గుర్రం మాత్రమే వెళ్ళేలా ఉంది. అక్కడ చరియలు విరిగి పడటం ఎక్కువేనట. Lord of the rings సినిమా లోని mood photography ని గుర్తు చేస్తోందా ప్రాంతంలోని ఆ వింత వాతావరణం.

‘భుజ్ వాసా’ చేరాక కాస్త కిందుగా ఉన్న లోయలో నది ఒడ్డున కొన్ని కట్టడాలు కనిపించాయి. లాల్ బాబా, రామ్ బాబా ఆశ్రమాలు, GMVN గెస్ట్ హౌస్ అక్కడ ఉన్నాయి. నిజానికి గోముఖ్ చూశాక అక్కడ నది ఒడ్డున ఆ రాత్రికి ఉండిపోయి మరునాడు బయలుదేరితే బాగుండేది.

అందరం గుర్రాలు దిగాం. అక్కడి నుండీ గోముఖ్ నాలుగు కిలోమీటర్లు. ఆ నాలుగు కిలోమీటర్లూ గుర్రాలు వెళ్ళటానికి అనుమతి లేదు. ఈ నియమాలు ఖచ్చితంగా ఎంత బాగా అమలు చేస్తున్నారో! ఈ ఆలోచన మిగతా కొండ ప్రాంతాల విషయంలో కూడా చేస్తే… తప్పని వాతావరణ మార్పులు ఎలాగూ తప్పవు, మన పొరపాట్ల వల్ల వచ్చే వినాశనమైనా తగ్గుతుంది కదా! గ్లేసియర్లు మననుంచి దూరం జరిగితే గానీ మనకు అర్ధం కావటం లేదు.

కాస్త తిని నడుద్దామని, తెచ్చుకున్న పరాఠాల పొట్లాలు విప్పి చూస్తే అవీ మా లాగే చలికి బిగుసుకుపోయి ఉన్నాయి. జయసూర్య అంత చలిలోనూ ఫోటోలు తియ్యటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను ఓ సగం పరాఠా తిన్నాననిపించి నడక మొదలు పెట్టాను, అడుగు ముందుకు సాగటం లేదు. చలి వెన్నులోంచి వణికిస్తోంది. ఇలా లాభం లేదని గబగబా నడవబోతే, ఊపిరి అందలేదు. మిగిలిన వాళ్ళంతా ముందు వెళ్ళిపోతున్నారు. కొంతదూరం వెళ్ళాక వెనక్కి చూసి, నాకేమైందో అర్ధం కాక ఆగిపోయారు. వాళ్ళను నడవమని చెప్పి, నేను నెమ్మదిగా నడక సాగించాను. పన్నెండు వేల అడుగుల ఎత్తులో పరుగెత్తడానికి నా ఊపిరి సత్తువ సరిపోవట్లేదని అర్ధం అయింది. దారి చూపించటానికి మాతోపాటు ఒక గుర్రం యజమాని వచ్చాడు. అతను నా అవస్థ గమనించి చిన్న గుబురు పొద నుంచి ‘గంగ తులసి’ ఆకులు కోసిచ్చి, అవి నలిపి వాసన చూడమన్నాడు. ఆ ఆకుల ఘాటైన వాసన గుండెలనిండా చేరి, ఆయాసాన్ని తగ్గించింది. గుర్రాలు కూడా దారిలో ఆ ఆకులు తినటం చూశాను.

ఆవరించిన మబ్బు పొగల మధ్య ఎటు చూసినా రాళ్ళ గుట్టలే. రాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న మొక్కలూ, చెట్ల ఆకులను తింటున్న భరల్ (కొండ మేకలు) సమూహాలు కనిపించాయి. గండశిలలు నిండిన ఆ ప్రాంతంలో నడక కష్టంగానే ఉంది. రకరకాల ఆకారాల్లో ఉన్న ఆ రాళ్ళు వింతైన రంగుల్ని చిమ్ముతున్నాయి..   కనిపిస్తూనే రాళ్ళ మలుపుల్లో మాయమౌతున్న గ్లేసియర్ మొత్తానికి దగ్గరయింది. ఆవు ముఖం లా ఒకప్పుడు కనిపించేదని అనుకునే  భాగీరథి జన్మస్థానం ఇప్పుడలా లేదు. నల్ల మట్టి చారలతో నిండిన గ్లేసియర్ నుంచి వస్తున్న నీరు ఆ మట్టిలోని ఖనిజాలనూ ఔషధ లక్షణాలనూ కూడా అందుకుంటూ ఉండవచ్చు. పసుపు పచ్చని ముక్కులున్న బలిష్టమైన కాకులు అదోరకంగా అరుస్తూ తిండి వెదుక్కుంటున్నాయి. గ్లేసియర్ వెనకనున్న శివలింగ్ మంచు పర్వతం మబ్బుల్లో పూర్తిగా దాక్కుంది. మేము కాక ఒకరిద్దరు విదేశీయులూ, సాధువులతో కలిసి మరో పదిమంది దాకా ఉన్నారక్కడ. వాళ్ళు కలలో కదిలే నీడలకు మల్లే అనిపించారు. ఓ పెద్ద కాన్వాస్ మీద ప్రకృతి గీసిన అతి పెద్ద impressionistic painting లో మేం కూడా ఒక చిన్న భాగమైనట్టుంది.

7

8

9

భాగీరథి ప్రవాహం నుంచి కాస్త నీటిని ఒక సీసాలో నింపుకుని వెనక్కు తిరిగాం. వాన మాత్రం వెనక్కు తగ్గటం లేదు. దిగుతున్నప్పుడు రాళ్ళ మీద నడక నాకు సునాయాసంగా అనిపించింది. గంగ తులసి ఆకులు గుండెకు కొత్త శక్తినిచ్చాయి. ‘భుజ్ వాసా ’ దగ్గర మా గుర్రాలున్న చోటికి చేరేసరికి, వాళ్ళంతా చిన్న చలిమంట వేసుకుని చుట్టూ కూర్చుని ఉన్నారు. అక్కడే కాళ్ళూ చేతులూ కాస్త వెచ్చ చేసుకుని మళ్ళీ గుర్రాలెక్కాం.

నా కాళ్ళ మీద నేను నిలబడటం, నడవటం అప్పుడు నాకెంత ముఖ్యమనిపించిందో ! నేర్చుకున్న వాళ్లకు గుర్రపు స్వారీ లో మజా ఉండొచ్చునేమో కానీ, గుర్రం మీద కూర్చుని కొండలెక్కటం మాత్రం కష్టమే. పోనీ ధీమాగా సోమరిగా కూడా కూర్చోలేం. పెద్ద పెద్ద రాళ్లున్నచోట గుర్రం మీద వెళ్తే, బాలన్స్ తప్పకుండా ఉండటం కోసం అది కిందకు దూకుతున్నప్పుడు మనం వెనక్కు వంగాలి. అది పైకెక్కేటప్పుడు మనం ముందుకు వంగాలి. గుర్రం కిందకు దూకేటప్పటి అదురుకు వెన్నూ, నడుమూ గట్టిగా లేనివాళ్ళకు ప్రమాదమే.

10

నిదానంగా ప్రకృతి నలుపూ తెలుపుల్లోంచి కుంచెను బయటకు తీసి, రంగుల్లో ముంచి విదిలిస్తోంది. సూర్యుడు ముదురు కాషాయ రంగులో బయట పడ్డాడు. ఒక్కసారిగా మార్మికతను వదిలించుకున్న కొండలు పచ్చటి రంగును వెదజల్లాయి. పక్షుల కూజితాలు మొదలయ్యాయి. గడ్డి పువ్వు నీటి రంగుల్లో మెరిసి ఠీవిగా తలెత్తింది. వాన పూర్తిగా వెలిసింది. భాగీరథి పర్వతం బంగారు రంగులో మెరిసింది. గుర్రాలు చిన్నగా పరుగు తీశాయి. అలసట అంతా మరిచిపోయి, ఇన్ని వన్నెచిన్నెలు చూపిస్తూ ఎన్నో రకాల మనస్థితుల్లోకి నెట్టిన ఆ ప్రకృతి దృశ్యాలను మెదడులో భద్రపరచుకుంటూ గంగోత్రికి ఉత్సాహంగా చేరుకున్నాం.

                                                                                             lalitha parnandi   ల.లి.త.

 

ఒక శైవ క్షేత్రం, ఒక విలయం మరియూ ఒక Butterfly Effect

ఎక్కడో ఒక సీతాకోక చిలుక రెక్క కదలికల్లో పుట్టే ప్రకంపనలు అలా అలా సాగి మరెక్కడో ఉత్పాతానికి కారణం కావొచ్చు … The Butterfly effect…

 

డెహ్రాడూన్ లో మామూలుగానే వర్షాలు ఎక్కువ.  2013 జూన్ లో ఓ మూడు రోజులు తెగని వాన కురిసింది. అప్పుడు  మేము మరోసారి గంగోత్రి, గోముఖ్ వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. ఇంతలోనే వాన మొదలైంది. నింగీ నేలా ఏకం.  ఇంకేం చేసేది లేక నీటి గొడుగుల్నీ, మడుగుల్నీ చూస్తూ, ఇంట్లోనే చేతులు కట్టుకుని కూర్చున్నాం.  మూసీ నదిలాగే మురికిగా బద్ధకంగా మా ఇంటి దగ్గర్లోనే ప్రవహించే రిస్పానా నది ఒక్కసారిగా ఒడ్డులొరిసి పారుతుంటే దానిని ఆనుకునున్న మురికివాడ భయంగా మేలుకునే ఉండిపోయింది.  నాలుగో రోజునుండి కేదార్ నాథ్ లోయ వరదల్లో కొట్టుకుపోయిందనీ, చాలా మంది యాత్రికులు చనిపోయారనీ వరసగా టీవీలో వార్తా ప్రసారాలు… ఊళ్లు తుడిచిపెట్టుకు పోయి, కుటుంబాలు ఛిన్నమై,  కొందరు కళ్ళముందే కొట్టుకుపోయి, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు సైన్యం సాయంతో కొండలు దిగి… ఇలా ఆ ఉత్పాతం అంతా టీవీలో చూసి చూసి కళ్ళూ, మనసూ అలసిపోయాయి. అంతకు ముందటేడు మేము చేసిన కేదార్ యాత్ర సంరంభం మదిని వదలనే లేదు ఇంతలోనే ఈ ఘోరం.  తండోపతండాలుగా తనని దర్శించుకోవటానికి వచ్చే యాత్రికులను నిరామయంగా చూస్తూ వుండే కేదారేశ్వరుడు ఎందుకో విసుగ్గా కనుబొమ్మ ముడిచి తల విదిలిస్తే, జటాజూటంలోంచి ఓ పాయ విడివడి, మందాకిని ఉత్సాహంగా కిందకు దూకి పరవళ్ళు తొక్కి, లోయంతా విహారం చేసినట్టయింది.  శైవక్షేత్రం శ్మశానమయ్యింది…

కార్చిచ్చుకు కాననమే లక్ష్యం.

బడబాగ్నికి సలిలం లక్ష్యం.

దేహాగ్నికి దేహమే లక్ష్యం.

ప్రళయాగ్నికి ప్రపంచాలు లక్ష్యం.

నీ మాయాగ్నికి నన్ను గురి కానీకు గుహేశ్వరా !    —   అల్లమప్రభు.

 

 

కేదార్ నాథ్ ఆలయం వెనుక మహోన్నతంగా కనిపించే చౌరాబరీ గ్లేసియర్ మందాకిని జన్మస్థానం. గ్లేసియర్ సరస్సు వానలతో నిండి, మంచు కూడా కరిగి ప్రవహించటంతో తొణికి,  దూకి, అక్కడే పుట్టిన మందాకినితో కలసి, అడ్డొచ్చిన గండ శిలల్ని అలిగిన పిల్లాడు గోళీకాయల్ని విసిరికొట్టినట్టు కొట్టి, లోయ స్వరూపాన్నే మార్చేసింది. లక్షలకొద్దీ యాత్రికులు వెళ్ళే దారిలో వానా, దానివల్ల వచ్చే ప్రమాదం గురించి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. యాత్ర ఆగలేదు. విధ్వంసం తప్పలేదు.

చౌరాబరీ గ్లేసియర్, కట్టడాలమధ్య ఒదిగిపోయిన కేదార్ నాథ్ గుడి

               

జరగాల్సిన నష్టం అంతా జరిగిన తరువాత, ఇది ప్రకృతి విలయమా మనుషుల స్వయంకృతమా అనే విశ్లేషణ చాలానే జరిగింది.  హిమాలయ పర్వతాలు వయసులో చిన్నవి.  పైగా గ్లేసియర్లు కదులుతూ, పెరుగుతూ, తరుగుతూ భూగర్భ శాస్త్రవేత్తలకు ఎప్పుడూ పని పెడుతూ ఉంటాయట. ప్రకృతిలోని ఈ  చిన్నా పెద్దా కదలికలకు తోడు ఆ కొండల్లో ‘చార్ ధామ్ యాత్ర’ పేరుతో మన కదలికలు కూడా ఎక్కువైపోయాయి. కేదార్ నాథ్ కొండల్లో లక్షలాది మనుషులు వేసిన  అడుగుల్లో నావి కూడా ఉన్నాయి.  2012 మే లో, అంటే ఈ విలయానికి ఒక సంవత్సరం ముందు,  కేదార్ నాథ్, బదరీనాథ్, గంగోత్రి..  ఈ మూడు క్షేత్రాలు దర్శించటానికి మా అన్నయ్య ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. మొత్తం 15 మంది బయలుదేరాం. మాతోపాటు, డ్రైవర్, వంటమనిషి, అతని సహాయకుడు. రావు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాం.

ఢిల్లీ నుండి బయలుదేరి, హరిద్వార్, ఋషికేష్ చూశాక రుద్రప్రయాగ, దేవ ప్రయాగల మీదుగా గుప్త కాశీ చేరుకున్నాం. దేవ ప్రయాగ దగ్గర అలకనంద, మందాకినీ నదుల సంగమం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. హిమాలయాల్లోనే  పుట్టిన ఈ రెండు హిమానీ నదాలు, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లా దేవ ప్రయాగ సంగమం దగ్గర రెండు రంగుల్లో తమ భిన్నత్వాన్ని చూపిస్తాయి. మందాకిని ఆకుపచ్చని నీలపు రంగులో ఉంటే, అలకనంద మట్టి రంగులో ఉంది.

దేవ ప్రయాగ శాంత మందాకిని

గుప్త కాశీ చేరుకున్నాక అక్కడినుండి మాలో ఆరుగురు హెలికాప్టర్ లో కేదార్ నాథ్ వెళ్ళిపోయారు. మిగతా తొమ్మిదిమందితో  మా బస్సు 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న గౌరీకుండ్ కు పొద్దునే బయలుదేరింది. పదిగంటలలోపు గౌరీకుండ్ చేరిపోతే అక్కడినుండి మరో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు నడుచుకుంటూ సాయంత్రం ఆరు గంటల లోపు చేరిపోవచ్చునని లెక్కలు వేసుకున్నాం. కానీ సగం దూరం తరువాత బస్సు కదిలితేగా!! ముందంతా ముసురుకున్న వాహనాలు. పే…ద్ద ట్రాఫిక్ జామ్. ఇంతలో మమ్మల్ని వెక్కిరిస్తూ బస్సులోకి ఒక ఈగల దండు వచ్చేసింది. అక్షరాలా ఈగలు తోలుకుంటూ  మధ్యాన్నం నాలుగ్గంటల దాకా బస్సులోనే ఈసురోమని, చివరకు గౌరీకుండ్ చేరాం. (అక్కడి జనం సందడి చూస్తుంటే ముంబైలో దాదర్ రైల్వే స్టేషన్ గుర్తువచ్చింది నాకు. “వానచినుకుల మధ్యనుండీ గుర్రాన్ని నడపటం ఏం గొప్ప? జనం ఆఫీసులకు వెళ్ళే సమయాల్లో పక్కవాడి చెమటచినుకులు ఒంటికి అంటకుండా దాదర్ స్టేషన్ నుంచి బైటికి రా చూద్దాం” అని నకులుడిని సవాలు చెయ్యొచ్చు).

గౌరీకుండ్ నుంచి నా స్నేహితురాలు లక్ష్మీ, మరో ఇద్దరూ గుర్రాలు ఎక్కి ప్రయాణం సాగించారు.  సాయంత్రం అయిదు గంటలకు కర్రలు చేత  పట్టుకుని నేనూ, జయసూర్యా, మా తమ్ముడు శంకర్, మరదలు జానకి, మేనల్లుడు కాశ్యప్ నడక మొదలు పెట్టాం. మరో బుజ్జి మేనల్లుడు ఏడేళ్ళ కౌశిక్ ని చిన్ని బుట్టలో ఎక్కించాం. ఇలా బుట్టల్లో యాత్రికులను వీపున మోస్తూ తీసుకెళతారు కొంతమంది.  అచ్చంగా హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తున్నట్టే అనిపించింది.  అక్కడ వాహనాలు దూసుకుంటూ మీదకొస్తాయి. ఇక్కడ గుర్రాలు, డోలీలు… వీటిని తప్పించుకుంటూ, కాస్త విశాలంగానే ఉన్నా, యాత్రికుల ట్రాఫిక్ తో ఇరుగ్గా అనిపించిన దారిలో ఏడు కిలోమీటర్లు నడక సాగించి, ‘రాం బాడా’ అనే ప్రదేశానికి చేరుకునేటప్పటికి రాత్రి సుమారు తొమ్మిదయింది. బురదలో, వాన చినుకుల్లో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని రెండు టార్చిలైట్ల సాయంతో అక్కడికొచ్చాక ఇక ఆ చీకట్లో ముందుకి సాగలేమని అర్ధమయింది. దారిపక్కన ఒక చిన్న ధాబాలాంటిది కనిపించింది. దాని యజమాని మనిషికో వంద రూపాయలిస్తే మాకు పడుకోవటానికి చోటు చూపిస్తానన్నాడు. ఒక పరదా వెనుక మాకు చెక్క మంచాలమీద పరుపులతో పక్కలు అమర్చి ఇచ్చాడు. అక్కడ వేడిగా రొట్టెలూ, అన్నం, పప్పుతో భోజనం కానిచ్చి రజాయిల్లో దూరాం. పక్కనే భీషణంగా నది చేస్తున్న రొద. నాకు ఒకంతట నిద్ర పట్టలేదు. పొద్దునే అయిదు గంటలకు మళ్ళీ బయలుదేరిపోయాం. కేదార్ నాథ్ చేరటానికి మరో ఏడు కిలోమీటర్ల దూరం ఉంది.  హెలికాప్టర్ లో, గుర్రాలమీదా వెళ్ళినవాళ్ళు ముందురోజే చేరిపోయి, మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే రోజు మళ్ళీ అందరం కేదార్ నాథ్ నుంచి వెనక్కు వచ్చెయ్యాలి. నడుస్తూ వెళితే, కేదార్ చేరేసరికి ఆలస్యం అవుతుందనిపించి, గుర్రాల మీద బయలుదేరాం.. రాం బాడా నుంచీ కొండ దారి విశాలమయింది.  రాగాలు తీస్తున్న పిట్టలు… బద్ధకాన్ని వదిలించుకుంటున్నట్టు తలలు విదిలిస్తూ, అడుగులు చురుగ్గా వేస్తూ గుర్రాలు… విరిసిన అడవి పూలు… సన్నగా చెవుల్లోంచి దూరి మెదడును చేరి, నిద్ర మత్తును వదిలిస్తున్న చలిగాలి.  ఆ సమయంలో వాన వెలిసి, ఖాళీగా ఉన్న తడిసిన దారిలో మెత్తటి లేయెండలో రామ్ బాడా నుంచి కేదార్ నాథ్ ప్రయాణం ఓ అందమైన పాటలాగా సాగింది.  సరిగ్గా మరో ఏడాదికి, 2013 జూన్ లో  విరుచుకుపడిన కేదార్ నాథ్ వరదల్లో ఆ చిన్నగ్రామం ‘రాం బాడా’ తుడిచిపెట్టుకు పోయింది. అలాగే గౌరీకుండ్ కూడా.  ఆ రాత్రి రాం బాడాలో మాకు ఆశ్రయం ఇచ్చిన ధాబా, అక్కడి మనుషులూ, ఆ గుర్రాలూ, అన్నీ ఏమయాయోనని ఆలోచిస్తే మనసు కలుక్కుమంటుంది.

-రామ్ బాడా ధాబాలో వంట-

కేదార్ నాథ్ చేరాక అప్పటికే అక్కడికి చేరిపోయిన మావాళ్ళందరూ మమ్మల్ని చూసి తేలిక పడ్డారు. గౌరీకుండ్ నుండి ఇక సిగ్నల్స్ లేక మొబైల్ ఫోన్లు పనిచెయ్యలేదు. ఎవరి దారి వారిదే. ముందు రాత్రి మేము ఎక్కడ ఆగిపోయామో  వాళ్ళకు తెలియలేదు. “మేమంతా గుడికి వెళ్లి వచ్చేశాం. మీరూ తొందరగా దర్శనం చేసుకుని వచ్చేయండి. సాయంత్రానికి మళ్ళీ గుప్త కాశీ చేరిపోవా”లన్నారు.  స్నానాలు కానిచ్చి గుడికి పరుగెత్తాం. అక్కడ రద్దీ చూడాలీ… దర్శనం కోసం పెద్ద పెద్ద వరుసల్లో వేలాడుతున్న మనుషులు.  హెలికాప్టర్లు దిగి వచ్చిన వాళ్లకు మాత్రం ప్రత్యేక హోదా. ఎందుకంటే వాళ్ళు దర్శనం కానిచ్చి వెంటనే ఎగిరి వెళ్లిపోవాలి. ఏమి చెయ్యాలో అర్ధం కాక తిరుగుతున్న మా మీదకు ఓ పూజారి వల విసిరాడు. “మనిషికో వెయ్యి రూపాయలు ఇచ్చెయ్యండి. ఎలాగోలా లోపలికి పంపించేస్తాన”న్నాడు. “ఈ బేరాలేమిటి, దర్శనం లేకపోతే పోయిందిలే వెనక్కు పోదా”మనిపించి, చిన్నగా నస మొదలుపెట్టానుగానీ, జయసూర్య భక్తి పారవశ్యంలో నా సణుగుడు అణిగిపోయింది. దైవ దర్శనంతో అడ్డదారిన తలా కాస్తా పుణ్యం మూట కట్టుకుని బైటపడ్డాం. దర్శనం అయాక గుడి ఆవరణలో మమ్మల్ని కూర్చోబెట్టి పూజా కార్యక్రమం కానిచ్చి, రేటు మరి కాస్త పెంచి, మనిషికో పదిహేను వందల చొప్పున పండిట్ జీ  సొమ్ము చేసుకున్నాడు.

శ్రీశైలంలో చెంచులు చక్కగా అలంకారాలు చేసుకుని ఆటలు, పాటలతో శివుణ్ణి అలరిస్తారు. ఇక్కడ అలాంటి పూజలేమైనా ఈ గఢవాలీలు కూడా చేస్తారేమోనని ఆశించాను గానీ, సోమరిగా కూర్చుని భంగు కొట్టే సాధువులే తప్ప, జాతరల జాడలేవీ నాకు కనిపించలేదు.

ఊహించినట్టే కేదారేశ్వరుడి గుడి  పురాతనత్వం ఉట్టిపడుతూ ఉంది. ఆ రాతి గోడల మీదుండే చాళ్ళు (striations) ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాలపాటు మంచులో కూరుకుపోయి ఉందని చెప్తున్నాయని కొంతమంది భూగర్భ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరువాత గ్లేసియర్ వెనక్కు జరగటంతో ఆలయం బైటపడి ఉండవచ్చు. ఇది పాండవులు శివుడిని పూజించిన చోటని చెప్తారు. ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్యుడు ఈ ఆలయ నిర్మాణం చేశాడని చరిత్ర.  మొన్న జరిగిన విలయంలోనూ గుడి  చెక్కు చెదరలేదు. కొట్టుకొచ్చిన గండ శిలలు ఆలయ ప్రాంగణం బైటనే ఆగిపోయాయట. కేదార్ నాథ్ ఊరంతా సిమెంట్ భవనాలు కనిపిస్తుంటే, ఇది కూడా ఓ పెద్ద వేసవి విడిది కావటానికి ఎక్కువ కాలం పట్టదని అప్పుడు అనిపించింది కానీ ఇప్పుడా కట్టడాలన్నీ వరదలో సమాధి అయాయి. ఇక్కడే కాదు, ఉత్తరాఖండ్ లోని ఈ చార్ ధామ్ దారంతా కొండ వాలుల్లో సిమెంట్ అంతస్తులు ప్రమాదకరంగా, వికారంగా కనిపిస్తుంటాయి. సాంప్రదాయక కట్టడాలను  టూరిజం కోసం పూర్తిగా బలి పెట్టిన చోటు గడ్ వాల్.

గుర్రం యజమాని దేవ ప్రయాగ దగ్గర కాంక్రీట్ అడవి

మధ్యాహ్నం ఒంటిగంటకు మా బృందం గౌరీకుండ్ వైపు నడక ప్ర్రారంభించాం. ఈ సారి లక్ష్మి కూడా నడక మొదలుపెట్టింది. అలిసిపోయే వరకూ నడిచి, అక్కడి నుండి గుర్రం మాట్లాడుకుంటానంది. మనుషుల మీది నుండి కళ్ళను తప్పించి పక్కకు దృష్టి సారిస్తే, విశాలంగా మెత్తటి పష్మీనా శాలువాలా తెల్లని మంచును ధరించిన హిమాలయాల వరకూ అడ్డు లేకుండా దూసుకెళ్ళాయి చూపులు. కేదార్ నాథ్ లోయ మహా విశాలం. యాత్రికులకోసం మంచి రహదారి ఏర్పాటు చేసేశారు. చుట్టూ ప్రకృతినీ, యాత్రికుల సంరంభాన్నీ చూస్తూ నడవటమే. చేతుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ తో మంచినీళ్ళు పట్టుకుని, బట్టలూ తిండీ మూటగట్టి భుజాన వేసుకుని పయనం కట్టిన గ్రామీణులు… డోలీల్లో, బుట్టల్లో కదలకుండా కూర్చుని అలసిపోతున్న పట్నవాసులు… నిజంగా అలా కూర్చోవటం పెద్ద శిక్షే.  ఏమాత్రం కదిలినా మోసే వాళ్ళకి కుదురు తప్పి కింద పడిపోతామేమో అని భయం వేస్తుంది.

మలుపులు తిరుగుతూ, అలా అలా మళ్ళీ సన్నబడ్డ లోయ, ‘గరుడ చట్టీ’ దగ్గర, చీమల బారును శ్రద్ధగా వంగి చూస్తున్న పిల్లవాడిలా, యాత్రికుల వరుసలని వంగి గమనిస్తున్న కొండల బారు.  లయబద్ధంగా అడుగులు వేస్తూ ఊపిరి తీస్తూ, డోలీల్లో మనుషుల్ని మోసుకు పోతున్నవాళ్ళు… వీళ్ళను తప్పించుకుంటూ సాగే గుర్రాల ప్రయాణం… వీటి మధ్యలో కౌశిక్ తో పాటు నేనూ పరుగులు తీశాను. ఈ తిరుగు ప్రయాణంలో వాడు బుట్ట ఎక్కలేదు. నడుస్తానన్నాడు. నున్నగా అరిగిపోయిన ఆ రాళ్ళ దారిలో ఇద్దరం చాలాసార్లు జారిపడుతూ, నవ్వుకుంటూ పరుగెత్తాం. కౌశిక్ చేతిలోంచి జారిపోతున్న పెద్ద ఊతకర్ర వాడికంటే పొడవుగా ఉంది. దానికి తోడు చిన్నగా పరుగులు తీస్తూ మీద మీద కొస్తున్న గుర్రాలు. వీడు వాటి కాళ్ళ కిందకు ఎక్కడ వెళ్ళిపోతాడోనని నాక్కాస్త ఆందోళన.

కౌశిక్ తో నేను. అలసిన దేహాలు.

 

మొత్తానికి ప్రమాదాలేవీ లేకుండా  రామ్ బాడా వరకూ వచ్చాక, ఇక ఇలా నడుస్తూ ఉంటే గౌరీకుండ్ చేరేసరికి బాగా రాత్రయిపోతుందని శంకర్ అనటంతో మళ్ళీ అయిదుగురం గుర్రాలు తీసుకున్నాం.  రాం బాడా చెక్ పోస్టు దగ్గరా, కేదార్ నాథ్ లోనూ గుర్రాల సంఖ్య చూస్తే వేలలో ఉన్నట్టు  అనిపించింది. మే నుండి అక్టోబర్ వరకూ జరిగే ఈ యాత్రలో గుర్రాల మీద మనుషులను గమ్యం చేరుస్తూ కాస్త డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఎంతోమంది. అవి వరుసలు తీరి కాలకృత్యాలు తీర్చుకోవటం… పెద్ద సిమెంట్ తొట్లదగ్గర ఆగి నీరు తాగి మళ్ళీ అడుగులు వెయ్యటం… వీపు మీద మనుషులు లేనప్పుడు హుషారుగా దౌడు తియ్యటం… శివ తత్వమేదో అర్ధం అయినా కాకపోయినా, ‘అద్దె గుర్రాల జీవన విధానం’ మాత్రం కాస్త అర్ధమయింది.

నేనూ, జానకీ ఎక్కిన గుర్రాలను ఒకే మనిషి నడిపిస్తున్నాడు. అవి రెండూ అల్లరివే. అతని మాట ఏమాత్రం వినటం లేదు. కొండ అంచువెంటనే నడవటం వాటికి ఇష్టం. మా మోకాళ్ళు రాళ్ళకీ, విద్యుత్ స్తంభాలకీ రాసుకుపోతుంటే నేను కాస్త భయంతో బిగుసుకున్నాను. ఇంతలో ఎదురుగా వస్తున్న గుర్రాన్ని నా గుర్రం ఏమాత్రం లెక్క చెయ్యకుండా ధీమాగా  రాసుకుంటూ పోయింది. దీనితో నేను ఓ పక్కకు వాలిపోయి పడిపోబోయాను. ఈ అల్లరి గుర్రంతో ఇక సాహసం చెయ్యలేక, దిగి నడుస్తానని పట్టు పట్టేశాను. గట్టిగా ఒక పది నిముషాలు కూడా గుర్రం మీద వెళ్ళక పోయినా, గుర్రాల యజమానులకు మొదట అనుకున్న డబ్బు మొత్తం ఇచ్చి, నాతోపాటు మిగిలిన వాళ్ళు కూడా గుర్రాలు దిగిపోయారు. అందరం మళ్ళీ పరుగు లాంటి నడక మొదలు పెట్టాం. గౌరీకుండ్ చేరేసరికి ఏడు గంటలైంది. అప్పటికే చీకటి పడిపోయింది.

కేదార్ నాథ్ లో బయలుదేరినప్పుడే లక్ష్మి “నేను నెమ్మదిగా నడుస్తాను. మీరంతా ముందు నడవండి. నడవలేనని అనిపిస్తే గుర్రం తీసుకుంటాన”ని చెప్పటంతో మేమంతా తొందరగా నడిచాం. తను కొంత దూరం తరువాత కనిపించలేదు. దారిలో కూడా ఎక్కడా తగల్లేదు. ‘గుర్రం ఎక్కి మాకంటే ముందే చేరిపోతుందిలే’ అనుకున్నాం కానీ, మేము గౌరీకుండ్ చేరి అరగంట గడిచింది. గంట గడిచింది. తన జాడ లేదు. గౌరీకుండ్ ఒక పెద్ద సంతలా ఉంది. ఆ జనంలో తనని వెదకటం కష్టం. అప్పటికే నడకతో ఒళ్ళు అలిసిపోయి, అందరం తనకోసం ఎదురు చూస్తూ ఒకచోట కూలబడ్డాము. హెలికాప్టర్ లో వెళ్ళినవాళ్ళు గుప్త కాశీ చేరిపోయారు. మేమందరం మా బస్సులో అక్కడికి చేరాల్సి ఉంది. మళ్ళీ పొద్దునే నాలుగ్గంటలకు అందరం కలిసి గుప్త కాశీ నుంచి బదరీ నాథ్ కు బస్సులో బయలుదేరాలి.  మొబైల్ ఫోన్లు ఏవీ పని చెయ్యటం లేదు. ఆఖరుకు నేనూ, జయసూర్యా లక్ష్మి వచ్చేవరకూ అక్కడే వుంటాం అని, మిగతా వాళ్ళనందర్నీ వెళ్ళిపొమ్మని చెప్పాం. ఇంకేం చేసేదిలేక వాళ్ళంతా బస్సులో వెళ్ళిపోయారు. మనసులో ఆందోళన. ఒళ్ళంతా చితక్కొట్టినట్టు నొప్పులు. కడుపు ఖాళీ. ఎదురుగా అన్నీ తినటానికి దొరుకుతున్నా, ఏమీ తోచనితనంతో అక్కడక్కడే నీరసంగా తిరుగుతున్నాం. ఇలా గౌరీకుండ్ ఇంకా చేరనివాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడున్న చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ లో వాళ్ళగురించి అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళలో తెలుగువాళ్ళ పేర్లు కొన్ని వినిపించాయి. మేము కూడా పోలీసుల చేత అనౌన్స్ చేయించి, మైక్ లో మేమూ అరుస్తూ, ఎంతసేపు ఎదురు చూసినా ఫలితం లేదు. లక్ష్మి కొంత అనారోగ్యంతో ఉంది. అయినా చాలా ధైర్యస్తురాలు. సమయస్ఫూర్తి కూడా ఎక్కువే.  “దారిలో గుర్రం మీదనుంచి పడిపోయిందా? ఆ చీకటిలో ఎవరైనా చూశారా లేదా? ఆసలెలా ఉందో, ఎక్కడుందో?” ఇలా ముసురుతున్న మా ఆలోచనలు…  దారిలో ఏవయినా హెల్త్ సెంటర్ లు ఉంటే అక్కడ తనగురించి కనుక్కోమని పోలీసులను అడిగాము.  వాళ్ళు చాలా ఓపిగ్గా వీలైనంతవరకూ తప్పిపోయిన వాళ్ళ ఆరా కనుక్కుంటూనే ఉన్నారు.  దారిలో ఉన్న రెండు హెల్త్ సెంటర్ లకు చేరిన వాళ్ళలో తను లేదని చెప్పి, మాకు ధైర్యం చెప్పారు.  కాలం నెమ్మదిగా ఆవులిస్తూ రాత్రి పది గంటల్ని కూడా మింగింది.  జనం బాగా పల్చబడ్డారు. రాత్రంతా ఇక్కడ ఉండాల్సి వస్తే ఏం చెయ్యాలీ ఎక్కడుండాలీ  అని మేమిద్దరం ఆలోచిస్తూ అక్కడక్కడే చిన్నగా అటూ ఇటూ తిరుగుతున్నాం..  ఇంతలో హఠాత్తుగా ప్రత్యక్షం అయింది లక్ష్మి.  నోరంతా ఎండిపోయి, కళ్ళు వాలిపోతూ, మొహం పీక్కుపోయి, అయినా ధైర్యపు ఛాయ మొహం మీదనుంచీ కొంచెమైనా తొలగకుండా…  కొంచెం నీళ్ళు తాగాక స్థిమితపడి తను పడ్డ పాట్లన్నీ చెప్పుకొచ్చింది. జీను సరిగ్గా లేని గుర్రం ఎక్కటం, దానిమీదనుంచీ పడిపోవటం, పెద్దగా దెబ్బలు తగలకపోవటం, మళ్ళీ లేచి నడుచుకుంటూ రావటం.. ఇంకో గుర్రం ఎక్కటం… ఇలా … మొండిధైర్యంతో మమ్మల్ని ఎలాగైనా చేరటమే లక్ష్యంగా పెట్టుకుని, నోట్లో మంచినీళ్ళు పోసుకొనే సోయి కూడా లేకుండా పడుతూ లేస్తూ వచ్చేశానని చెప్పింది. అప్పటిదాకా భయంతో వణుకుతున్న నా గుండె తనని చూశాక  కాస్త స్థిరంగా కొట్టుకోవటం మొదలెట్టింది.  అక్కడున్న ఫలహారశాలలో కాస్త తిని, గుప్తకాశీ ఇప్పుడు ఎలా చేరగలమా అని చూస్తుంటే, ఒక ఇన్నోవా కనిపించింది. దానిలో ముగ్గురం బైలుదేరి గుప్తకాశీలోని మా వాళ్ళను చేరేసరికి రాత్రి పన్నెండు దాటింది. లక్ష్మిని చూసి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉండే కేదార్ నాథ్  హిమాలయాల ఒడిలో ఒదిగిన మహా సౌందర్యం.  కానీ, ఇంతలా   కొండల్లో ట్రాఫిక్ జామ్ లు సృష్టించుకుంటూ, మళ్ళీ వాటిని తప్పించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందని నేను ఊహించలేదు.   మన తెలుగువాళ్ళలో కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలు దర్శించే అలవాటు ఈనాటిది కాదు. ఏ కాలం నుంచో కష్టాలకోరుస్తూ ఈ యాత్రలు చేసినవాళ్ళున్నారు.  ఇప్పుడు తీర్థయాత్రలు కూడా ప్యాకేజీల్లో అమ్మకానికి వచ్చాక, ప్రయాస తగ్గి, పుణ్యం కొనుక్కోవటం ఎక్కువయింది. ఈ ఆధ్యాత్మిక వ్యాపారం ఎంతోమంది గుర్రాలు నడుపుకునే వాళ్ళకూ, డోలీలు మోసే వాళ్ళకూ, తిండి వస్తువులూ, పూజ సామాన్లూ అమ్ముకునే వాళ్ళకూ, వంట వాళ్ళకూ ఉపాధినిచ్చింది.  ఏ స్థాయి టూర్ ఆపరేటర్లు ఆ స్థాయిలో దండిగా జేబులు నింపుకున్నారు.  చిట్ ఫండ్ కంపెనీలు ఒక్కసారిగా దివాలా తీసినట్టు, ఈ యాత్రలన్నీ ఒక్కవరదతో కొట్టుకుపోయి ఉత్తరాఖండ్ ఆర్ధిక స్థితినే దెబ్బ తీశాయి. కనీసం ఇంకో అయిదేళ్ళ వరకూ కేదార్, బదరీ, గంగోత్రి దారులేవీ బాగుపడేటట్టు లేవు. కేదారేశ్వరుడు కూడా కొన్నాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోతాడేమో!

యాత్ర కళ కళ లాడే ఆ రోజుల్లో మేము సందడిగా, తొక్కిడిగా, ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా కేదార్ ప్రయాణం పూర్తి చేసుకుని ఆ జ్ఞాపకాల మూట మోసుకుని మరునాడు తెల్లారుజామునే బస్సులో బదరీనాథ్ బయలుదేరాం… (

 

(మిగతా యాత్ర గురించి మరోసారి…)

 

lalitha parnandiల.లి.త.

 

 

 

 

రాత్రి జీవితాన్ని గెల్చిన వాళ్ళ కథలు – “ Tales of Night Fairies ”

                  

     ‘తాను శవమై ఒకరికి వశమై, తనువు పుండై, మరొకరికి పండై’ …. అలిశెట్టి ప్రభాకర్.

ఆమెను ‘వేశ్య’ అని నాజూకుగా పుస్తకాల భాషలో పిలుస్తారు. ఇంకా కస్టమర్లు ఎక్కడికక్కడ రకరకాల మాండలీకాల్లో మొరటుగానూ, ముద్దుగానూ కూడా పిలుస్తారు.  ఈ రోజు ఆమెనే ‘సెక్స్ వర్కర్’ అంటున్నారు.  ఆ పేరు వినగానే మన కళ్ళముందు చకచకా కొన్ని దృశ్యాల్లో ఆమె జీవితచక్రం గిర్రున తిరిగేస్తుంది. ప్రియుడు మోసంచేసి వేశ్యాగృహాల్లో అమ్మెయ్యటం, బలవంతంగా ఆ ఊబిలోకి దిగటం, కొన్ని అబార్షన్లూ, ఒకరిద్దరు పిల్లలూ, చివరకు రోగాలపాలై ఒళ్ళు శిధిలమై, దిక్కు ఉండో లేకో చావటం… ఇదీ ఆ జీవిత చక్రం.  సమాజపు అంచులలో ప్రమాదకరమైన జీవితాలు గడిపే వీళ్ళకు పోలీసుల, రౌడీల చేతుల్లో తనువు పుండైపోకుండా చూసుకోవటమే ఒక నిరంతర పోరాటం. ఇలా మరకలు పడ్డ జీవితాలక్కూడా మెరుగులు పెట్టుకునే గడుసర్లు లేరా? అంటే … ఉన్నారు. “Tales of Night Fairies” అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ లో సెక్స్ వర్కర్లు హక్కుల పోరాటంతో తమ జీవితాల్ని ఎలా బాగుచేసుకున్నారో  చూడవచ్చు.

“సోనాగచ్చి”- కలకత్తా లోని మూడువందలేళ్ళనాటి రెడ్ లైట్ ఏరియా. అక్కడ మామూలు కుటుంబాలుండే ఇళ్ళతో పాటు, పక్కనే ‘లైన్ ఇళ్ళు’ అనే వేశ్యాగృహాలు కూడా ఉంటాయి. ఇక్కడుండే సెక్స్ వర్కర్ల  గురించి  డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలనే ఆలోచన ‘సోహినీ ఘోష్’ కు చిన్నతనంనుంచే ఉందట. సోహినీ ఘోష్ తల్లి తన ఉద్యోగరీత్యా కలకత్తా అంతా తిరుగుతూ ఉండేదట. ఆవిడ సోనాగచ్చిలో తిరిగేటప్పుడు కొన్ని ఇళ్ళ గోడలమీద “ఇది మర్యాదస్తుల ఇల్లు” అని రాసి ఉండటం చూసిందట. తల్లి తనకు ఈ విషయం చెప్పినప్పటి నుంచీ ఇది తనలో కుతూహలాన్ని రేపిందని చెప్తుంది సోహినీ.

డాక్టర్ స్వరజిత్ జానా ‘సోనాగచ్చి ప్రాజెక్ట్’ పేరుతో  హెచ్.ఐ.వి. ని  అదుపు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ 1990 లలో చేపట్టారు. ఇక్కడుండే సెక్స్ వర్కర్లను ఈ పనిలో భాగస్వాములను చెయ్యటం ఈయన చేసిన గొప్ప పని. ఈ క్రమంలోనే 1995 లో సోనాగచ్చిలో దుర్బర్ మహిళా సమన్వయ కమిటీ (DMSC) ఏర్పడింది. ‘Adult sex work’ ను నేరంగా పరిగణించకుండా దానికి ఒక సామాజిక గుర్తింపునిచ్చి, సెక్స్ వర్కర్లకు శ్రామిక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ఇవ్వాలంటూ ఈ కమిటీ పోరాడింది.  ఈ కమిటీలో 60,000 మంది సభ్యులున్నారు. ఈ విధంగా కమిటీ ఏర్పాటు చేసుకోవటం వల్ల పోలీస్ దాడులు పూర్తిగా ఆగకపోయినా, కొంతయినా తేడా వచ్చిందని చెప్తుంది సాధనా ముఖర్జీ అనే సెక్స్ వర్కర్.  “ఒకసారి ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి బంధించి, డబ్బులిస్తేనే వదులుతామని చెప్పారు. అప్పుడు మేము అక్కడ ధర్నా చేసి ఆఫీసర్ ను సస్పెండ్ చేయించాం. అలాగే రేప్ కేసులు కూడా తీసుకొనేవారు కాదు పోలీసులు.  పైగా “మిమ్మల్ని ఎవరైనా రేప్ చెయ్యటం ఏమిట”ని తేలిక మాటలు మాట్లాడేవారు. అలాంటిది ఈ రోజు మేం పోలీస్ స్టేషన్ లో కుర్చీలో కూర్చోగల్గుతున్నాం”… అంటుంది శిఖా దాస్.

ఈ చలిచీమలన్నీ ఒకచోట చేరి ఇంత బలంగా తయారవటమే కాక, కలకత్తాలో మార్చ్ 2001 లో సెక్స్ వర్కర్స్ మిలీనియం కార్నివాల్ ను ఏర్పాటు చేసి, ఘనంగా నిర్వహించి, మర్యాదస్తుల్ని నివ్వెరపరిచారు. సెమినార్లు, వర్క్ షాప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు .. అన్నీ నిర్వహించారు. ఈ కార్నివాల్ ను అడ్డుకుందుకు ఢిల్లీ మహిళా సంఘాలు చాలా ప్రయత్నించాయట. “మాలో చాలా మందికి చదువు రాదు. కార్నివాల్ లో సరదాగా అందరూ పాల్గొంటారు. ప్రపంచానికి “మేమూ నవ్వుతాం. ఆడుకుంటాం, పాడుకుంటాం” అని చూపించాలని మా ప్రయత్నం. మీరు అనుమతి ఇవ్వకపోతే వేలాదిమందిమి అందరం కలిసి రోడ్లమీద కూర్చుంటాం” అని బెదిరిస్తే గానీ మాకు ఈ పండగ జరుపుకుందుకు చివరి నిముషం వరకూ అనుమతి దొరకలేదు” అంటుంది మాలా సింగ్.  ఈ కార్నివాల్ కు వచ్చి చూసి “మీరు ఇలాంటి పండుగ ఎప్పుడు జరుపుకున్నా మాకు అభ్యంతరం లేద”ని చెప్పిన వాళ్ళ నుంచి వీళ్ళు సంతకాలు కూడా సేకరించారు.  సోనాగచ్చిలో వీళ్ళు బృందాలుగా ఏర్పడి, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా అందరినీ ప్రోత్సహించటం, హెల్త్ క్యాంప్స్ నిర్వహించటం, కండోమ్ వాడకం, వ్యక్తిగత శుభ్రత వంటి విషయాలు బోధించటం … చేస్తుంటారు.

సోహినీ ఘోష్ వీళ్ళలో ఒకరుగా కలిసిపోయి రాబట్టిన విషయాలేమిటో చూడండి….

ఉమా మండల్ :  అరవైలలో ఉన్న ఈమె గొడవలు పడకుండా కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలో అమ్మాయిలకు సలహాలిస్తుంది. హెల్త్ క్యాంపుల్లో చురుగ్గా తిరిగి అందరితోనూ పని చేయిస్తుంది.

ఉమా మండల్

“ఒక సెక్స్ వర్కర్ మాత్రమే ఇంకో సెక్స్ వర్కర్ తో సులభంగా కలిసిపోయి మాట్లాడగలదు. బైటివాళ్ళు ఈ పని చెయ్యటం కష్టం. అందుకే మాలో మేమే బృందాలుగా ఏర్పడి అందరినీ చైతన్యవంతుల్ని చేస్తున్నాం”.

“కోమల్ గాంధార్ … ఇది మా థియేటర్ గ్రూప్ పేరు. ‘కోమల్’ అంటే సున్నితం. ‘గాన్’ అంటే పాటలు. ‘ధార్’ అంటే కత్తికున్న పదును. సున్నితంగా పాడుతూ ఆడుతూ పదునుగా మా పరిస్థితిని వివరిస్తాం. మనుషుల ఆలోచనల్లోని  సంకోచాలను వదిలిస్తాం”.

“శ్రమచేసి వస్తువుల్ని సృష్టించే వాళ్ళను శ్రామికులంటారు. ‘మీరేం సృష్టిస్తున్నారు?’ అని మమ్మల్ని అడుగుతారు. మేం జనం మనసుల్లో ఆనందాన్ని సృష్టిస్తున్నాం”.

సాధనా ముఖర్జీ :  దుర్బర్ మహిళా సమన్వయ కమిటీ ఏర్పాటు కాకముందు కూడా సోనాగచ్చిలో సమస్యలు పరిష్కరించిన ధైర్యస్తురాలు.

మాలా సింగ్                                                                                                            సాధనా ముఖర్జీ

“నేను ఈ పనిలో ఉన్నానని మా ఇంట్లోవాళ్ళకు చాలాకాలం వరకూ తెలియదు. నా భర్త చాలా డబ్బున్నవాడని చెప్పి, మా నాన్నకు డబ్బు పంపిస్తూ ఉండేదాన్ని. ఒకసారి మా నాన్న నా దగ్గరకు వచ్చినపుడు ఆయనకు వీధి వాతావరణంలోనే తేడా తెలిసిపోయి నన్ను నిలదీశాడు. నిజం చెప్పాక కన్నీరుమున్నీరయిపోయాడు. కానీ నన్ను వదులుకోలేకపోయాడు”.

“ఇంతకుముందు మేము కూడా ఈ పని చెడ్డ పనీ, అనైతికమూ అనుకునేవాళ్ళం. అలాగని మనకెలా తెలుసు? పుడుతూనే ఈ ఆలోచనలతో మనం పుట్టలేదు. పెరిగి పెద్ద అవుతున్నకొద్దీ ‘తప్పుడు ఆలోచనలు’, ‘దిగజారిన ఆడవాళ్ళు’, ‘నిషిద్ధ స్థలాలు’ అనే పరిభాష నేర్చుకుంటాం. ఇవన్నీ గొప్ప మేధావులు, గౌరవనీయులు సృష్టించినవే!!

“ఇంతకుముందు ఆడవాళ్ళను బలవంతంగా ఇందులోకి దించేవాళ్ళు. నేనూ అలా వచ్చినదాన్నే. కానీ నా సంపాదనతో నా కుటుంబం మొత్తం బతుకుతోంది కాబట్టి దీన్ని నేను విడిచిపెట్టలేను. ఇప్పుడు కొందరు వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు”.    

“ఇంట్లోకి ఎవరిని రానివ్వాలీ ఎవరిని రానివ్వొద్దన్నది మా నిర్ణయమే. ‘నేనూ డబ్బులిస్తానుకదా’ అన్నా సరే మా ప్రాంతంలోనే ఉండే మగవారిని మేము రానివ్వం”.

మాలా సింగ్:  ఢిల్లీ లో తిరిగి అక్కడి జీ.బీ.రోడ్డు సెక్స్ వర్కర్లను కూడా చైతన్యపరచే పని చేస్తూ, వీధి నాటకాల్లో పాల్గొని మాట్లాడుతూ అందరికీ పెద్ద దిక్కులా ఉండే ఈమె కమిటీలో అతి చురుకైన వ్యక్తి.

“తొమ్మిదేళ్ళ వయసులో నన్ను ఈ పనిలోకి బలవంతంగా దించారు. రెస్క్యూ హోం నుంచి ఒక పోలీసు నన్ను పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్ళి చెప్పలేనంత హీనంగా అత్యాచారం చేశాడు. నా తొడల్ని కత్తులతో చీల్చాడు. పోలీసు స్టేషన్లో కంటే మా సెక్స్ వర్కర్ కాలనీలోనే ఎక్కువ భద్రంగా ఉంటాం”.

“ఈ పని తప్పని మొదట్లో అనుకునేదాన్ని. ఇప్పుడు నా ఆలోచన మారింది. నాకూ మా అమ్మకూ పెద్ద తేడా నాకేం కన్పించటం లేదు. మాకు తిండీ, బట్టా అమర్చటం కోసం మా అమ్మ మా నాన్నతో పడుకుంది. నేనూ అదే పని కొంతమందితో  చేస్తున్నాను. తేడా ఏమిటంటే నేనీ పనికి డబ్బు తీసుకుంటున్నాను. ఆ డబ్బుతో నా పిల్లలకు తిండీ, బట్టా ఇస్తున్నాను”.  

“నేను అడుక్కోవటం లేదు. దొంగతనం చెయ్యటం లేదు. కష్టపడి బతుకుతున్నాను.  నాకు జబ్బు చేస్తే ఎవరూ పట్టించుకోరు.  నా డబ్బులు తింటూ ఈ పోలీసులు నన్ను కొడుతున్నారు. పోలీసులను ఎప్పుడూ అసహ్యించుకునేదాన్ని. అవకాశం వస్తే వీళ్ళ పని పట్టాలని ఉండేది. ఒకసారి తాగినమత్తులో ఒక పోలీసు మా వాడకు వచ్చి ఆడవాళ్ళను బాగా కొట్టాడు. వెంటనే వాళ్ళను ఆసుపత్రికి తీసుకెళ్ళి, పరీక్షలు చేయించి, డాక్టర్ల దగ్గర అవసరమైన  పత్రాలు తీసుకున్నాను. మరునాడు ఈ ఆడవాళ్ళను, డాక్టర్ ఇచ్చిన పత్రాలను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళి కేసు పెడతానన్నాను. పోలీసులు బ్రతిమాలటం మొదలెట్టారు.  మా మీదకు తాగి రాబోమనీ, రైడ్స్ చెయ్యబోమనీ ఉదయం తొమ్మిది లోపు మా ఇళ్ళకు రాబోమనీ రాతపూర్వకంగా ఇమ్మని అడిగి, అలాగే రాయించుకున్నాను. పోలీసు ఆఫీసర్, నేనూ ఆ కాగితం మీద సంతకాలు చేశాం. ఒక కాపీని మా ఆఫీసులో ఉంచాను. కలానికున్న బలం చూడండి. అంతకు ముందెప్పుడూ ఈ కలంపోట్ల తోనే మేము ఇబ్బంది పడ్డాం. ఈ రోజు మేమూ వాళ్ళ ఆటలోనే వాళ్ళను చిత్తు చెయ్యటం నేర్చుకున్నాం”.

 “ప్రభుత్వం సెక్స్ వర్కర్ల ఉద్ధరణ గురించి చెప్పినప్పుడు నాకైతే నవ్వు వచ్చింది. ఒక్కసారిగా మా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందనుకున్నారు? మానవ హక్కులూ, శ్రామిక హక్కులూ అడుగుతున్నాం కదా!  ఏమీ అనలేక, పునరుద్ధరణ పేరుతో మమ్మల్ని అదుపు చేద్దామని చూస్తున్నారు. అసలు నన్ను ఉద్ధరించే అవకాశమే వాళ్ళకు లేదు. ఎందుకంటే నేను పని చేస్తూ నా బతుకు నేను బతుకుతున్నాను. బెంగాల్లో ఒక నలభై వేలమందిని ఉద్ధరించారని అనుకుందాం. మనది పేద దేశం. మరో నలభై వేలమంది ఇందులోకి రారని నమ్మకమేమిటి? ఢిల్లీలో స్త్రీల జాతీయ కమిషన్ లో మోహినీ గిరిని కలిసి ప్రస్తుతం మాతోనే ఉంటున్న ఒక 500 మంది వయసు మళ్ళిన వాళ్ళ పేర్లు ఇచ్చాను. ‘వీళ్ళకు పని లేదు. ఎవరూ పనిమనుషులుగా కూడా తీసుకోవటం లేదు. వీళ్ళకు ఆధారం కల్పించమ’ని అడిగాను. ఆ తరువాత అక్కడినుంచి ఏ జవాబూ లేదు. మాటకీ చేతకీ ఇంత తేడా ఉంటుంది”. 

శిఖా దాస్ :  శిఖా ఈ వృత్తిలోకి రాకుండా ఉందామని చాలా ప్రయత్నించింది. చదువుకుందామని అనుకుంది. రెండు సార్లు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంది. పని మనిషిగా చేసింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ లో పని చేసింది. చెత్త కాగితాలు ఎత్తింది. కానీ సెక్స్ వర్కర్ కూతురనే ముద్రా తప్పలేదు. చివరకు ఆ వృత్తీ తప్పలేదు.  తెలివిని కూడా కలబోసుకున్న ఈ బెంగాలీ అందం, డాక్టర్ జానా ప్రోత్సాహంతో 1999లో జమైకా వెళ్లి, అక్కడి సభలో పదిహేను నిముషాలు జంకూ గొంకూ లేకుండా మాట్లాడి అందర్నీ ముగ్ధులను చేసిందట.

సోహినీ ఘోష్ తో  శిఖా దాస్.                                                                                    దీప్తి పాల్, సాధనా ముఖర్జీ

“నేను సోనాగచ్చిలోనే పుట్టాను. అమ్మ ఒక సెక్స్ వర్కర్. నన్ను బళ్ళో వేసింది. అక్కడ అందరూ ‘మీ నాన్న కనిపించడేమ’ని అడిగేవారు. నేను జవాబు చెప్పలేక అమ్మను అసహ్యించుకునేదాన్ని. ఈ రోజు అమ్మను అలా తిట్టుకున్నందుకు సిగ్గు పడుతున్నాను. నాకూ బడికి వెళ్తున్న ఒక పాప ఉంది. బోర్డింగ్ స్కూల్ లో వేశాను. అక్కడి కాగితాల్లో నా వృత్తి ‘సెక్స్ వర్కర్’ అని రాశాను. పాపకు అన్నీ అర్ధం అవుతున్నాయి. ఏదేమైనా తానెవరో దాచవద్దని చెప్పాను”. 

“ప్రభుత్వం మాకు శ్రామిక హక్కులు ఇవ్వటం లేదు. చిన్న పిల్లలు ఇందులోకి రాకుండా చేసుకొనే ‘self regulatory boards’ కావాలి మాకు. కొత్తవాళ్ళు దీనిలో చేరేముందు మేం పరీక్షించాలి. 18 సంవత్సరాల లోపు పిల్లలైతే వాళ్ళ ఇళ్ళకు పంపించేస్తాం. కుటుంబం ఆమెను ఆదరించకపోతే ఎక్కడో ఒకచోట ఆశ్రయం కల్పిస్తాం”.

“కస్టమర్లను కండోమ్ వాడమని అడిగే ధైర్యం రావాలంటే ముందు మా శరీరాలమీద మాకొక్కరికే అదుపు ఉండాలి”.

తన విదేశయానం గురించి చెప్తూ శిఖా ఇలా అంటుంది. “విమానం ఫ్రాంక్ ఫర్ట్ లో ఆగింది. చలికి బిగుసుకుని నా దుపట్టాను చుట్టూ కప్పుకున్నా. ఫ్రాంక్ ఫర్ట్ దాటాక హిందీ తెల్సిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. సిగరెట్టు వెలిగించా. ఆల్కహాల్ ఇస్తున్నారు విమానంలో…  బీర్ నాకెంతో ఇష్టం…  కానీ ఎక్కువగా  తాగేస్తే,  ‘ఒక్కదాన్నే వెళ్తున్నా కదా నన్నెవరు చూసుకుంటార’ని భయం వేసి తాగలేదు. పైగా విమానంలో టాయిలెట్ కి వెళ్తే తలుపు బిగుసుకుని లోపలే ఉండిపోతానని మరో భయం”.

“సమావేశంలో నాకు అయిదు నిముషాలు కేటాయిస్తే, నేను పదిహేను నిముషాలు మాట్లాడేను. అది అవగానే అందరూ నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. నా మాటలు బాగా నచ్చాయని చెప్పారు. చదువు రాని ఒక భారతీయ సెక్స్ వర్కర్ ఇంత పెద్ద ఉపన్యాసం ఇస్తుందని వాళ్ళు ఊహించలేదు. అక్కడ ఎవరో నాకో నెక్లెస్ బహుమతిగా ఇస్తే నకిలీదేమో అనుకున్నా. ఎవర్నీ నమ్మకపోవటం ఈ వృత్తిలో అలవాటయింది”.

“నేను చచ్చిపోయేక నా పిల్లలు ఈ జమైకా ఫోటోలు చూసి ‘జీవితంలో కొంతైనా సాధించింది. చెప్పుకోదగ్గ మనిషి’ అని నా గురించి  అనుకుంటారు”.

ఇవీ సోహినీ ఘోష్ తన ఫిల్మ్ లో బంధించిన Night Fairies  చెప్పిన కథలు…

***

ఎనభైల్లో శ్యాం బెనెగల్ ‘మండీ’ అనే సినిమా తీశాడు. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళను ఓ పక్క వాడుకుంటూనే…  అవసరమైతే తరిమి కొడుతూ, మళ్ళీ దగ్గరకు తీస్తూ సమాజం ఎలా ఆడిస్తుందో చూపిస్తాడు బెనెగల్. అలాగే ఎంత చావగొట్టినా ఈ పురాతన వృత్తి చావదని కూడా నిష్కర్షగా, హాస్యంగా చెప్పేస్తాడు. ప్రపంచంలో డబ్బు, సెక్స్  అవసరాలూ, స్త్రీలూ, పురుషులూ ఉన్నంత కాలం ఈ వృత్తి కూడా నిలిచే ఉంటుందనిపిస్తుంది. దీనిని ఆపటం ఎవరివల్లా కాదు కాబట్టి, ఈ ‘adult sex work’ ను చట్టబద్ధం చేసి, ప్రాంతాలవారీగా ‘మేము సెక్స్ వర్కర్లం’ అని చెప్పుకునే వాళ్ళకు భద్రత కల్పించి, వేధింపులు లేకుండా చెయ్యటమే సమాజమూ, ప్రభుత్వమూ చేయదగ్గ పని.  పూర్తి స్థాయి సెక్స్ వర్కర్లు, అదీ చదువులేని పేదవారికి ఎటువంటి భద్రతా లేదనటంలో ఏ సందేహమూ లేదు.  ‘సెక్స్ వర్కర్’ అనే మాటను మనం వాడుతున్నామంటేనే, వారిని పనిచేసేవారిగా గుర్తిస్తున్నాం. కాబట్టి అన్ని రకాల పనివారికీ ఇచ్చే భద్రతా, రక్షణా వీరికి కూడా ఇవ్వవలసిన అవసరం ఉందనే అర్ధం కదా!  ‘ఇది మా వృత్తి’ అని చెప్పుకోకుండా వీలైనంత రహస్యంగా డబ్బుకోసం, ఉన్నతస్థాయి జీవన విధానం కోసం  ఒంటిని అమ్ముకుంటున్న అమ్మాయిలూ, గృహిణుల సంఖ్య కూడా సమాజంలో ఇవాళ పెరుగుతోంది. అలాగే మగ సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా. సరే ఇదంతా మరో సామాజిక సమస్య.

ఈ ఫిల్మ్ లో సెక్స్ వర్కర్లను ఒక అర్ధవంతమైన ప్రశ్న అడుగుతుంది ఒక సంఘసేవిక. “మీ వాదనలతో ‘నీతి’ అనేది ప్రమాదంలో పడింది. నా ఉద్దేశ్యంలో వేశ్యావృత్తి అంటే  ఆడవాళ్ళమీద జరిగే హింస. మీరేమంటారు?”  ఈ ప్రశ్నకు సుదీపా బిశ్వాస్ అనే ‘DMSC’ సభ్యురాలి జవాబు ఇది-  “మేము పనిచేసే చోటు అందరికీ తెలుసు. అది స్పష్టంగా హద్దులు గీసి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ వృత్తి జరుగుతుందని తెలిసి, అవసరమైన వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం వస్తారు. వాళ్ళ జీవితాల్లోని ఇరుకుదనాన్నుంచి కొంతసేపు తప్పించుకోవటానికి మా దగ్గరకు వస్తే, అది తప్పని నాకు అనిపించటం లేదు. ఇతరులకు సంతోషాన్నిచ్చి మేం డబ్బు తీసుకుంటున్నాం. అదే సమయంలో మేమూ ఆనందాన్ని పొందుతున్నాం. ఇది  హింసాత్మకమైన వృత్తిగా మేము భావించటం లేదు. ఇది  బాధాకరమైనదే అయితే, ఇన్ని వేల ఏళ్ళుగా నిలిచి ఉండేది కాదు”.

   ఈ వృత్తి బాధాకరమైనదైనా కాకపోయినా, దానిచుట్టూ బాధల విషనాగులు చుట్టుకుని కాటేయడానికి సిద్ధంగా ఉంటాయనటం అబద్ధం కాదు. పోలీసులు, రౌడీలు, మేడమ్ లు, గుప్త రోగాలు, తాగుడు, సిగరెట్లు … ఇవేమీ అబద్ధం కాదు. దీప్తి పాల్ ఇలా అంటుంది. “మొదట్లో ఇంత కలిసికట్టుగా ఉండేవాళ్ళం కాదు. ఒకసారి ఒకడు శాంతి దీ మెడమీద కత్తి పెట్టి “అయిదు వందలు ఇస్తావా, కత్తి దించమంటావా?” అని బెదిరించాడు. అందరం నిశ్చేష్టులమైపోయాం. మరోసారి ఒకడు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. నేనప్పుడు బాగా తాగి ఉన్నాను. తాగితే నేను ఎవరికీ భయపడను. వాడిని నాలుగు తన్నేను. అంతే.. ఆ తరువాత వాడు రెండు చేతులతో రెండు బాంబులు తీసుకొచ్చి నా మీద విసిరేస్తానన్నాడు. ఇంతలో సాధన వెనుకనుంచి నెమ్మదిగా వచ్చి వాడిని గట్టిగా పట్టుకొని, ‘విసురు. అందరం చచ్చిపోదాం’ అంది”.

ఈ దీప్తి పాల్, సాధనా ముఖర్జీ.. ఇద్దరూ కలిసి వీళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసే గూండాలను ఎదిరించారు. లట్టూ అనే గూండా రేజర్ తో దీప్తి ముఖాన్ని చీరేశాడట. అతన్ని ఎదుర్కోవటానికి సాధన మిగతా సెక్స్ వర్కర్స్ అందరినీ కూడగట్టింది. ఇన్ని అపాయాలనూ అన్యాయాలనూ ఎదుర్కొన్న తరువాత DMSC ఏర్పడి, బలోపేతమయింది.

2002 లో సోహినీ ఘోష్ తీసిన ‘Tales of Night Fairies’లో ఉన్నది ‘సెక్స్ వర్కర్ల సాధికారత’ అనే అంశం ఒక్కటే కాదు.  వాంఛల గురించి ఏ అరమరికలూ లేకుండా ఈ సెక్స్ వర్కర్లు మాట్లాడటం కూడా ఉంది. నితాయ్ గిరి ఒక మగ సెక్స్ వర్కర్. అతనికి జుట్టూ, గోళ్ళూ పెంచుకుని ఆడపిల్లలా తయారవటం ఇష్టం.  తన మగ శరీరంలోని ఆడ కోర్కెల్ని అర్ధం చేసుకొని, అంచనా వేసుకొని ఈ వృత్తిలోకి దిగటానికి ముందు అతను సమాజంతోనూ, ఇంట్లో వారితోనూ, పేదరికంతోనూ, తనతో తాను కూడా ఎంతో పెనుగులాడేడు. DMSC, కోమల్ గాంధార్ అతనికి పెద్ద ఆసరాగా, జీవితానికో ధ్యేయంగా నిలిచాయంటాడు.  అలాగే చిన్నప్పుడే హింసాత్మకమైన అత్యాచారానికి గురైనా, ఆ అనుభవంతో మనసును వంకరలు పోనివ్వకుండా  “జీవితంలో చక్కని విషయాలు రెండే. ఒకటి మంచి తిండి. రెండోది సెక్స్” అని మాలా సింగ్ చెప్పగలగటం కూడా నాకు విశేషంగా అనిపించింది.

 నితాయ్ గిరి                                                                                                

ఈ నిషేధ ప్రాంతాల గురించీ, నిషిద్ధ స్వప్నాల గురించీ మాట్లాడుతూ “చిన్నప్పుడు నన్ను మా అమ్మానాన్నలు చాలా సినిమాలకు తీసుకెళ్ళే వారు. కానీ,  కొన్ని సినిమాలకు మాత్రం నన్ను ఎందుకు తీసుకు వెళ్ళరో నాకు అర్ధం అయేది కాదు. వాటిగురించి చాలా కుతూహలంగా ఉండేది. నా కౌమారప్రాయంలో నేనూ నా స్నేహితురాళ్ళూ కలిసి ఒక ఊహాలోకంలో విహరించేవాళ్ళం.  “Prostitute’s Paradise” అనే ఊహాత్మక హోటల్లో, అందర్నీ మోహంలో ముంచెత్తే దేవకన్యల్లా మమ్మల్ని మేం ఊహించుకుంటూ ఉండేవాళ్ళం” అంటుంది సోహినీ ఘోష్.  అంటే … స్త్రీలు తమ ఫాంటసీలనూ, sexuality నీ కొంచెం లోతుగా వెదికి, నిర్భయంగా బైటకు చెప్పగల్గితే, పాతివ్రత్యం, వ్యభిచారం .. అనే భావజాలాల మధ్య ఉన్న సన్ననితెర కదిలి, లక్ష్మణ రేఖలు చెరిగిపోతాయేమో!  ఇంతగా ఎరుసు లేకుండా సోహినీ వీరితో కలిసిపోయి కెమెరా పట్టుకుంది కాబట్టే ఈ స్త్రీలంతా అరమరికలు లేకుండా తనతో మాట్లాడగలిగారు. ఫలితంగా ఒక మంచి సినిమా వచ్చింది. ఎనభైల్లోనే స్త్రీ వాదులు ధైర్యంగా శరీర భాష గురించి రాసిన కవితలను ‘ఒళ్ళు కొవ్వెక్కి’ రాసే తీరిక రాతలుగా పరిగణించిన ఒక ప్రపంచం మనకు తెలుసు.  అలాగే, ట్రాన్స్ జెండర్, లెస్బియన్, హోమో, ఇంకా రకరకాలైన  తమ లోపలి ముఖాలను దర్శిస్తూ, ‘మేం ఇదీ.. మాకిది కావాలి’ అని ధైర్యంగా చెప్పే సమూహాలున్న మరో ప్రపంచం కూడా మన పక్కనే ఉండటాన్ని ఈరోజు చూస్తున్నాం.

మొత్తానికి ‘Tales of Night Fairies’ సెక్స్ వర్కర్ల జీవితాల్లోని వెలుతురు కోణాలను మెరిపించి, వీరి చరిత్ర ఇంకెన్ని రకాల మలుపులు తిరుగుతుందో.. అనిపించేలా చేస్తుంది.

         lalitha parnandi  ల.లి.త.

‘ఖేల్’ … ఒక ‘యోగిని’ విషాదం ..

ఒక ఫాల్గుణ మాసపు మధ్యాన్నం ..  విశాఖపట్నం దగ్గర..  ఆకుపచ్చని కొండని మేలిముసుగులా ధరించినట్టున్న తలుపులమ్మ లోవ గుడిలో,  పూజారితో “ఈ దేవతకు పులిహోర, రవ్వ లడ్డూ మాత్రమె నైవేద్యం పెడుతున్నారా లేక మాంసం కూడానా?” అని అడిగాను. “తల్లికి మాంసం నైవేద్యవెడతానండి. అమ్మకేది కావాలో అదే పెట్టాలి కదా! బ్రాహ్మణ పూజారిని గవర్నమెంటు పెట్టింది కానండి, ఆయన పూజలు ఆయనవి” అన్నాడాయన.

తిరుపతి  పెద గంగమ్మ గుడిలో పూజారిణి, తరాలుగా దేవతను పూజిస్తున్న తనను ఆ పదవినుంచి తప్పించి, మగ పూజారిని పెట్టటానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరిస్తుంది.

ఆదిలాబాద్ దగ్గరలోని ఒక గోండు గ్రామం వెలుపల, చెట్ల మధ్య చిన్న చిన్న హిందూ దేవతల విగ్రహాలను పెట్టారు. “గోండు దేవతల రాజ్యంలో వీళ్ళు ఎక్కడినుంచి వచ్చారా?” అనుకున్నాను.

పాత దేవుళ్ళ ప్రభ తగ్గుతూ, కొత్త దేవుళ్ళు వెలుస్తూ, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకం పూజలూ, పద్ధతులది పైచేయి అవుతుండటం ముక్కోటి దేవుళ్ళూ, ఎంతో వైవిధ్యమూ ఉన్న హిందూ మతంలో సాధారణమే కానీ….

కొన్ని రకాల పూజా పద్ధతులూ, ఆచారాలూ … ముఖ్యంగా స్త్రీ దేవతల విషయంలో చాలా మార్పులు చెందిపోతూ వస్తున్నాయి.  ఏ సమాజంలో స్త్రీ ఎలా ఉండాలని అనుకుంటారో అదే పద్ధతిలో దేవతల మూసలూ తయారు చేసుకుంటుందా ఆ సమాజం?  ఎప్పుడైనా ఒక వింత ఆకర్షణతోనూ, భయంతోనూ,  అడ్డూ అదుపూ లేని స్త్రీ శక్తిని పూజించే రోజులు కొంతకాలంపాటు వచ్చినా, మళ్ళీ వెంటనే తేరుకుని దేవతను అదుపు చేస్తుందా పురుష స్వామ్యం?

*****

*

సబా దివాన్                                             రాహుల్ రాయ్

స్త్రీ శక్తి , పురుష దేవతల ఛాయగా ఎలా మారిపోయిందో, అదే ప్రక్రియ సమాజంలోనూ ఎలా కనిపిస్తోందో వివరించే ఒక డాక్యుమెంటరీ చిత్రం ‘ఖేల్’  ……

 సబా దివాన్, రాహుల్ రాయ్ అనే డాక్యుమెంటరీ చిత్ర దర్శకులు 1994 లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

బ్రాహ్మణ వాద మూసలోని స్త్రీత్వం కంటే భిన్నమైన స్త్రీ తత్వాన్ని వెదికే ఒక అన్వేషణగా ఈ చిత్రం మొదలవుతుంది. స్త్రీ శక్తి ఏ అడ్డంకులూ లేకుండా ప్రవహించే ఒక చోటు కోసం వెదుకులాట.  అచ్చంగా ఆడదానికి మాత్రమే పరిమితమైన ఆది భౌతికత కోసం చూడటం…

మహా యోగినిగా స్త్రీని చూడటం కోసం వారు బుందేల్ ఖండ్ తిరిగి, యోగిని గుడుల గురించి ఆరా తీసారు. బాందా జిల్లా లోని లోఖ్డీ గ్రామం దగ్గర ఒక కొండ మీద ఏ పూజలూ లేని గుడి వారికి కనిపించింది.  పెద్ద వృత్తాకారంలో కనిపించే స్థలంలో ఎటు చూసినా విరిగిపడిన స్త్రీ విగ్రహాలే. వృత్తం.. ఒక సామాన్యత లో ఒక పరిపూర్ణత.  ఆ పరిపూర్ణతను మేము  ఒప్పుకోమంటూ చేసిన విధ్వంసం భీభత్సంగా కనిపిస్తుంది. విరిగిన విగ్రహాల దగ్గర ఇప్పుడు భైరవుడు ఉన్నాడు. చాలా విగ్రహాలను దొంగలు పట్టుకు పోయారు.   అటువంటి వృత్తం మరోచోట కూడా వీరికి శిధిలావస్థలో కనిపించింది. ఆ స్థలంలో ఇంతకుముందు  ఏముండేదని వీరు అడిగితే,   స్థానికులు ఒక అఖాడా (వ్యాయామశాల) అని  చెప్తారు.

(తాంత్రిక విద్యల్లో ఆరితేరిన స్త్రీలు ఒకప్పుడు  ఉండేవారు. హఠయోగాన్ని నేర్చుకున్న వీరిని, యోగినులు అనేవారు. ఇవి రహస్య విద్యలవటం వల్ల, ఆ సమూహంలో ఉండేవారికి తప్ప, బయటి సమాజానికి వారిగురించి పెద్దగా తెలియదు. విచిత్రంగా, అన్నిటా మగవారి పెత్తనమే ఉండే కాలంలో… ఎనిమిది నుంఛీ  పదకొండో శతాబ్దం వరకూ ఉత్తర భారత దేశంలో యోగిని గుడుల నిర్మాణం జరిగింది. పురాణాలలో సప్త మాతృకలు అని చెప్పబడేవారు (బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి) (చండిక,మహాలక్ష్మి లతో కలిపి వీరిని నవ మాతృకలు అని కూడా అంటారు) దుర్గాదేవి శరీరం నుంచి పుట్టి, దుష్ట శక్తులతో ఆమె చేసిన యుద్ధంలో ఆమెకు సహాయం చేసిన సైన్యం.  ప్రతి మాతృకా ఒక యోగిని. వీరికి మళ్ళీ కొంతమంది యోగినులు అనుయాయులు.  మొత్తంగా వీరి సంఖ్య మాతృకలతో కలిసి, 64, లేదా 81 ఉంటుంది. ఇప్పటికీ ఈ యోగిని గుడులు ఒడిషాలో రెండు, మధ్య ప్రదేశ్ లో రెండు ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల వారికే సరిగ్గా తెలియదు.)

విరిగిన విగ్రహాల మధ్య ఒక యోగిని. (లోఖ్డీ వద్ద).

ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లోకి వెళ్తే..  ఇంకా అక్కడి అడవి ప్రాంతాల అన్వేషణలో చిత్ర దర్శకులకు  అరుదైన ‘జోగినుల’ గురించి తెలిసింది.. ఇక ఎన్ని కథలో. ‘కోల్’ తెగవారు నివసించే బుందేల్ ఖండ్ అడవుల్లో ఈ ‘జోగిని’ ఒక గొప్ప కల్పన,. మాయ. అద్భుతం.. నిజం..

పుల్లలూ, ఆకులూ ఏరుకుంటూ ఈ అడవుల్లో ఎక్కువగా తిరిగే ‘కోల్’ స్త్రీలకు జోగినులు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారట. సంస్కత కావ్య వర్ణనలలో యోగినిగా మారిన మహారాణి,  ఒక రాజకుమారుడిని చిలుకగా మార్చి, తనకు కావలసినప్పుడు అతన్ని మనిషి రూపం లోకి తెచ్చి ప్రేమించే యోగిని… వంటివి ఉంటే, అడవుల్లో చిన్న అందమైన బాలునిగా కనిపించి, చేతుల్లోకి తీసుకోగానే మాయమయ్యే జోగిని, చిన్ని బాలుని రూపంలో కనిపించి, చూస్తుండగానే పెద్ద మగవానిలా మారే మాయా జోగిని… ‘కోల్’ స్త్రీల సామూహిక అంతచ్చేతనలో సజీవంగా ఉన్నారు. మండు వేసవి మధ్యాన్నాల్లో జోగినులు పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ తమకు కనిపిస్తారని, పక్కింటివాళ్ళ గురించి చెప్పినంత సులువుగా వీరు చెప్తారు ఈ చిత్రంలో.  ఒక మగవాడు నది ఒడ్డున జోగిని మాయలో పడి, తోటివారు పిలుస్తున్నా పట్టించుకోకుండా నిలబడిపోతే, తమ కులదేవత వచ్చి చెంపదెబ్బ కొట్టి, అతన్ని రక్షించిందట.  స్త్రీల మాయాశక్తి గురించిన ఇలాంటి కథలు మనమంతా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం కదా!

సబా దివాన్ ఈ  ‘కోల్’ స్త్రీలను యోగినుల గురించి అడిగితే తమకు అదేమీ తెలియదని చెప్తారు. వారికి తెలిసిన జోగిని అడవినేలుతుంది.  క్రూర మృగాలను అదుపులో పెడుతుంది.   కలల్లో కనిపిస్తుంది. ఆవహిస్తుంది.

.

 

ఉత్తరప్రదేశ్ లో మాయమై, ఈ మధ్యనే ఫ్రాన్స్ నుంచి మన దేశానికి తిరిగి వచ్చిన పదవ శతాబ్దపు యోగిని విగ్రహం.

వృత్తాకారపు యోగిని గుడుల్లోని మాయ, అడవుల్లో తిరిగే ఈ జోగినీ మాయ ఒకటేనా? తాంత్రిక యోగిని, అడవి తెగల్లోని జోగిని ఒకటే ఎందుకు కాకూడదు? సప్త మాతృకల వలె జోగినులనూ ఏడుగురు అక్క చెల్లెళ్లుగా చెప్తున్నారు.

కాళిదాసు, భవభూతి వర్ణించిన  మహా యోగినుల జాడలు ఎక్కడ? ఈ అడవుల్లోనా? స్థల, కాల, సంస్కృతులనూ, కులాన్నీ, వర్గాన్నీ అధిగమించిన సామూహిక జ్ఞాపకాలు ఇవేనా? … ఇదీ సబా దివాన్ ఆలోచన.

‘ఖేల్’ లో ….

రామ్ కలీ, శివ కుమారి ..  అనే ఇద్దరు స్త్రీలు.

రామ్ కలీ .. దేవతకు అంకితమైన స్త్రీ.  పొయ్యి మంట వెలుగులో అలసిన మొహం, చెదిరిన జుట్టుతో నెమ్మదిగా ఎన్నో మాట్లాడుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు భూస్వామి తనను చెరచబోతే, అతన్ని చంపేసి పోలీస్ స్టేషన్ లో నింపాదిగా ఆ విషయం తెలియచేసిన చరిత్ర ఈమెకు ఉందట.  పుట్టిన మూడు రోజులకే ఈమెను దేవత ఎత్తుకుపోయిందని చెపుతుంది. ఎంత వెదికినా పిల్ల దొరకక, ఆమె తండ్రి అమ్మవారి గుడికి వెళ్లి అడిగితే, దేవత కనిపించి, తాను కాళి నని, ఏడుగురు అక్కచెల్లెళ్ళలో మొదటిదానిననీ చెప్పి, తనకు గుడి కట్టిస్తే ఈ పిల్లను తిరిగి ఇస్తానని చెప్పిందట.  పన్నెండేళ్ళ పాటు ఈ పిల్ల పెళ్ళీ, సంసారం లేకుండా తనకు సేవ చెయ్యాలని చెప్పిందట. ఆ మాట పట్టించుకోకుండా తండ్రి తనకు పెళ్లి చేస్తే,  దేవత అక్కడికి వచ్చి తన అత్తవారింట్లో అందరినీ నాశనం చేసిందని చెప్తుంది. ఊరంతా భయపడే ఒక పురుష శక్తి అడవిలో ఆకులు ఏరుకునేటప్పుడు తనను భయపెట్టాలని చూస్తే, తను ఏ మాత్రం భయపడక అతడిని తన మంత్రాలతో కట్టేసి ఊరికి తెచ్చానని చెప్తుంది.  కష్టపడి వంటలు చేసి, ఇదంతా దేవతకు పెట్టాలనీ, ఆమె సేవ చెయ్యకపోతే తను జబ్బు పడిపోతాననీ అంటుంది.

శివకుమారి .. అడవిలో కట్టెలు కొడుతూ, బక్క పల్చని శరీరంతో, విచారమూ, బతుకు భారమూ కలగలిసి ముఖాన్ని అద్దుకున్నట్టు కనిపిస్తుంది. దేవత ఆవహించి మూడు నెలల పాటు అడవిలోనే ఉండిపోయాననీ, పిల్లలని కూడా తన తోనే ఉంచుకుంటే, దేవత వారికి పళ్ళు సమకూర్చి వారి ఆకలి తీర్చిందనీ చెప్తుంది. దేవత ఆవహించినప్పుడు నెలల తరబడి తిండీ, నీరూ లేకుండా, ముళ్ళూ, రాళ్ళలో తిరిగానని చెప్తుంది. అదంతా ఒక నరకం లాగా ఉండేదని చెప్తుంది. సిగ్గూ, లజ్జా పోయాయంటుంది. ఇప్పుడు దేవత తనను వదలకుండా, తన సేవ కోసమే నువ్వు పుట్టావని అంటుందని చెప్తుంది.

వీళ్ళిద్దరూ దేవి ఆవహించినప్పుడు  జబ్బులు బాగుచేస్తామని చెప్తారు.

రామ్ కలీ, శివకుమారి .. వీరిద్దరూ కలుసుకునే సందర్భం కూడా ఈ చిత్రంలో ఒక చోట వస్తుంది. ఇద్దరు శక్తిమంతులైన స్త్రీలు.. ఇద్దరు న్యురోటిక్ స్త్రీలు.. సమాజపు అడుగుపొర లో బ్రతికే వీళ్ళు .. దేవత సాయంతో మగవారిని ధిక్కరించి, ఆజ్ఞాపించే వీళ్ళు.. కలిసిన సందర్భం అపురూపం. శివకుమారి వణికే చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆమె బేలతనాన్నీ, న్యురోసిస్ నంతా పోగొట్టేలా మెత్తగా మాట్లాడుతూ, ఒక తల్లి తన బిడ్డను లాలించినట్టు దగ్గరికి తీసుకుంటుంది రామ్ కలీ.

శివకుమారి                        శివకుమారి, రామ్ కలీ

శాంతి

ఈ చిత్ర దర్శకులతో మాట్లాడటానికే ఇష్టపడని స్త్రీ .. శాంతి. ఒకసారి మాట్లాడటం మొదలు పెట్టాక, ప్రవాహంలా చెప్పుకు పోతుంది.  కొండమీద ఉన్న గుడిలో పూజలూ, గుడి గంటల ధ్వనుల మధ్య ఆమె బాల్యం. ఎప్పుడూ దైవ సన్నిధానమే. పెరిగి పెద్దదౌతున్న కొద్దీ ఆంక్షలు. గుడికి వెళ్ళకుండా ఉండలేని ఆమె యాతన. తనకు బలవంతాన పెళ్లి చేసినా, తను మాత్రం   ఎనిమిదేళ్ళ పాటు  భర్త  నీడ కూడా తనమీద పడనివ్వలేదంటుంది.

 ఇక్కడ కథ మనల్ని బేడా ఘాట్ (మధ్యప్రదేశ్, జబల్పూరు దగ్గర) యోగిని గుడికి తీసుకుపోతుంది.  పూర్ణ వృత్తాన్ని  ఎనభై ఒక్క భాగాలుగా చేసి, విగ్రహాలను ప్రతిష్టించిన యోగిని గుడి.. కొన్ని విగ్రహాలకు మృగాల తలలూ, స్త్రీ శరీరాలూ ఉంటాయి. ఆది శక్తి వివిధ రూపాల్లో యధేచ్చగా ప్రవహించిన చోటు.. నేలంతా చదునుగా పరచిన నాప రాళ్ళు. చుట్టూ వేప చెట్లు.  గాలీ, వెలుతురూ నిండి ప్రకాశించే చోటు. యోగిని గుడులను అప్పటి మిగతా గుడుల వాస్తు సంప్రదాయానికి విరుద్ధంగా నిర్మించారు. చుట్టూ వలయంగా విగ్రహాలు. మధ్యలో ఖాళీ స్థలం. ఇదీ యోగిని ఆలయ నిర్మాణ శైలి. తాంత్రిక ఆరాధనా వ్యవస్థకు గొప్ప చిహ్నం.

బేడా ఘాట్

మహా భాగవత పురాణంలోని అంతగా ప్రాచుర్యం లేని ఒక శాక్తేయ వర్ణన ప్రకారం సతి, కాళి నీడగా మారి మంటలు రేపి, తన యోగిని అనుయాయులతో కలిసి, దక్ష యజ్ఞాన్ని భగ్నం చేస్తుందట.  తనను దక్ష యజ్ఞానికి వెళ్ళవద్దని చెప్పిన శంకరునిపై అలిగిన సతి, జుట్టు విరబోసుకుని, దిగంబరురాలై, నాలుక వేలాడేసుకుని, చెమటలతో తడిసి, ప్రచండంగా తన తల్లిని చేరుకుంటుంది. తల్లి ప్రసూతి ఈ దాక్షాయణిని దగ్గరకు తీసుకుని, చెంగుతో ముఖాన్ని తుదిచి, గుండెలకు హత్తుకుంటుంది.  దక్షుడు సతిని నిందిస్తాడు. అప్పుడామె భీభత్సంగా మారి, యోగినులతో కలిసి మదిరా పాన మత్తురాలై నాట్యంచేసి, యజ్ఞాన్ని భంగం చేస్తుంది. శంకరుడు వచ్చాక, ఆ చితి మంటలు మళ్ళీ రగిలి అతడు తన వంతు పూర్తి చేస్తాడట.  బేడా ఘాట్ యోగిని విగ్రహాలను చిత్రిస్తూ, స్తోత్రం వినిపిస్తూ, మధ్యలో ఈ కథను చెప్తుంది సబా దివాన్.

బేడా ఘాట్ గుడిలో చాలా విగ్రహాలు అంగాలు విరిగి కనిపిస్తాయి.  ఈ ఫిల్మ్ లో, ఆ విగ్రహాలతో అత్తవారింటిలో శాంతి పడిన అవస్తనూ, హింసనూ పోల్చి చూపిస్తుంటే, ఆ అణచివేత మనల్ని ఒక తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తుంది. తన వంటిలో ఏ భాగాన్నీ వదలకుండా ఎలా కొట్టి హింసించారో ఆమె చెప్తుంటే, చేతులూ, కాళ్ళూ, స్తనాలూ విరిగిన విగ్రహాలు కనిపిస్తూ ఎంతో బాధిస్తాయి.  యుగాలుగా స్త్రీ శక్తిని, మార్మికతనూ చూసి ఆకర్షితులౌతూనే, భయంతో మళ్ళీ దాన్ని అదుపులో పెట్టాలని ప్రయత్నించే పురుషస్వామ్యపు  విశ్వరూపం కళ్ళకు కడుతుంది.

చాలా సేపు బేడా ఘాట్ విగ్రహాలను అర్ధ వృత్తంగానే చిత్రీకరించి, మనల్ని మరో లోకం లోకి తీసుకెళ్తూ, ఒక్క సారిగా ఆ వృత్తపు మధ్య భాగాన్ని చూపిస్తారు.  ఒక షాక్.  ఆ మధ్యలో ఒక శివాలయం. దీన్ని తరువాతి కాలంలో ఎప్పుడు కట్టేసారో !  నిరాఘాటంగా స్త్రీ శక్తి ప్రవహించే చోటుని, ఆ మండలాన్ని ఛేదిస్తూ, సాంప్రదాయక శివాలయం…  ఇక్కడ పార్వతి శివుడి పక్కన అనుయాయి.  ఈ శివాలయ నిర్మాణంతో శక్తి మండలాన్ని విచ్చిన్నం చేసారంటుంది సబా దివాన్.  అలాగే మధ్య ప్రదేశ్ లోని మతౌళి దగ్గర ఇంకో వృత్తాకారపు గుడినీ చిత్రీకరించారు. అక్కడ స్త్రీ విగ్రహాలని తొలగించి, శివ లింగాలను ప్రతిష్టించారు. తాంత్రిక యోగినీ వ్యవస్థ గురించి మనకు తెలియకుండా చేసే ఈ ప్రయత్నాలూ, శాంతి వంటి స్త్రీల స్వేచ్చకు వేసే సంకెళ్ళూ ఒకలాంటివే

.

బేడా ఘాట్ యోగిని విగ్రహం       యోగిని స్థానం లో శివలింగం (మతౌళి)     వృత్తం మధ్య శివుని మంటపం (మతౌళి)

‘కోల్’ తెగ వారు జరుపుకునే నవరాత్రి పండుగలో ఒక రోజు దాక్షాయణి (సతి) తన తల్లిని కలుసుకొనే పండుగ జరుగుతుంది. కానీ ఈ ఉత్సవాల్లో స్త్రీలంతా ముసుగులు వేసుకుని కూర్చుంటే, మగవాళ్ళదే ‘ఖేల్’ అంతా! దేవత  భక్తురాలు శివకుమారి కూడా నిర్వికారంగా చూస్తూ కూర్చుంటుంది.

 

చివరిగా, శాంతి ఇంట్లో ఆమె కూతురు కేశ్ కలీ కనిపిస్తుంది.  అత్తవారింటి నుంచి వచ్చేసింది ఈమె.  వాళ్ళింట్లో అత్త తనను సరిగా పని చేయటం లేదని తిడుతూ, కొడుతూ ఉంటుందట. ఇక తను తల్లి దగ్గరే ఉంటానంటుంది.  ‘ఈ పిల్లను అత్త ఇంటికి పంపవా?’ అని శాంతిని అడిగితే, ‘తనకు ఇష్టమైతే వెళుతుంది. లేదా ఇక్కడే ఉంటుంది’ అని చెప్తుంది. తాను అనుభవించిన బాధ తన బిడ్డకు వద్దనుకొనే తల్లి మనసు శాంతిది. ఈ ‘సతి’ తన తల్లి దగ్గర ఊరట పొందుతోంది.

సతీ దేవి తన తల్లి దగ్గర చేరటం, శివకుమారి రామ్ కలీ దగ్గర ఊరట పొందటం, కేశ్ కలీ  తన తల్లి శాంతి దగ్గర ఉండిపోవటం… ఆడదాన్ని ఆడదే అర్ధం చేసుకోగలదనే భావాన్నీ, బిడ్డలను లాలించే దేవత కారుణ్యాన్నీ  సూచిస్తుంది. కథా చిత్రం కాకుండా ఒక డాక్యుమెంటరీ చిత్రంలో ఇంత హృద్యంగా ఇది చెప్పటానికి కుదరటం అనేది ఈ చిత్ర దర్శకులకు దొరికిన అరుదైన అవకాశం.

శుభా ముద్గల్ సంగీతం, గానం..  ముఖ్యంగా అడవుల్లో జోగినుల మార్మికతను మనమూ అనుభూతి చెందేలా తీసిన కొన్ని షాట్లు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. యోగిని గుడుల చిత్రీకరణ సరేసరి.

మనకు కలిగే  బాధ,  యుగాలుగా   స్త్రీలందరికీ

కేవలం యోగిని ఆరాధనా వ్యవస్థ గురించే అయివుంటే ఈ ఫిల్మ్ ఒక సంస్కృతిని మాత్రమె వివరించే డాక్యుమెంటరీ అయివుండేది. ఇది కల్పిత సినిమా కథా కాదు. ఇందులోని స్త్రీలు పాత్రలూ కావు.  ఒక anthropological/ ethnographic  డాక్యుమెంటరీలో రక్త మాంసాలతో అదే ప్రదేశంలో తిరుగాడే ఒక తెగ స్త్రీలూ, వారి భిన్నత్వం, తెగువ, మార్మికత, పేదరికం, బాధలు.. అన్నీ కలిపి చూస్తున్నప్పుడు

చెందిన సామూహిక అస్తిత్వ వేదన.

 

****

హిందూ సమాజంలో, పంటలనూ, బిడ్డలనూ కాపాడుతూ వుండే గ్రామదేవతలకున్న ఒక ప్రత్యేక స్థానం కొన్నాళ్ళకు అంతరించిపోతుందేమో అని అనుమానం వచ్చేంతగా బ్రాహ్మణీకరణ జరుగుతోంది. జాతరలు చేసి, బలులు ఇచ్చి, ఊరంతా సంబరాలు జరుపుకోవటం అనేది, సామూహికంగా స్త్రీ శక్తిని ఆరాధించే ఒక తంతు.  ఆదిమ పురుషుడికి స్త్రీత్వం, మాతృత్వం,  అద్భుతాల్లా కనిపించేయి. వ్యావసాయిక సమాజాల్లో పంటలనిచ్చే భూములనూ, పిల్లలనిచ్చే తల్లులనూ పోల్చి చూసుకుని, స్త్రీని దేవత రూపంలో కొలిచారు. పంటలూ, పిల్లలూ పదిలంగా ఉండాలంటే అమ్మ శక్తిని సంతృప్తి పరచాలని భావించారు. వీరిని పూజించటం లో భయం, భక్తీ .. రెండిటినీ ప్రదర్శించారు.  సాలగ్రామ పూజలు చేసే బ్రాహ్మణులూ కూడా గ్రామ దేవత పూజల్లో పాల్గొనటానికి మినహాయింపు కాదు.  బ్రాహ్మణ స్త్రీలు గ్రామ దేవతకు పెరుగన్నంతో చల్లని నైవేద్యం పెడతారు.  పసుపూ, కుంకం, చీరలూ సమర్పించుకుంటారు. మరి ఇప్పుడు గ్రామాలను మొత్తంగా పట్టణాలకు తరలించే పని పెట్టుకున్న ప్రభుత్వాలు మనవి. అదే అభివృద్ధి అంటున్నారు. ఈ వెల్లువలో కొట్టుకుపోతున్నవి ఊళ్ళలోని వృత్తులూ, వ్యవసాయమే కాదు. ఒక సంస్కృతి కూడా.

స్త్రీల శరీరాలే కాదు వారి గర్భాశయాలు కూడా అంగట్లో అద్దెకు దొరుకుతున్న ఈ రోజుల్లో స్త్రీ శక్తికి విలువేముంది? ఉగ్ర రూప గ్రామ దేవతలు కూడా సాత్విక వైష్ణవ అమ్మవార్లయిపోతున్నారు.  అన్ని రకాల దేవతల వైవిధ్యం నశించి, వారంతా సంస్కృత మంత్రాలూ, రాముడూ, సీతా, ఆంజనేయుడూ… వీటిలో హింద్వైక్యం చెందుతున్నారు. ఉగ్ర, ధైర్య, స్థైర్య, కారుణ్య రూపాలలో ఊరినీ, బిడ్డలనూ, పంటలనూ కాపాడే అమ్మ శక్తిని రాను రానూ సాత్వికతకు మాత్రమే ప్రతీకగా ఉండే ఒక నమూనాగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  కొన్నాళ్ళకు కలకత్తా కాళి కూడా రూపం మారి, సీత లాగా ముసుగు వేసుకుంటుందేమో!

ఒకపక్క స్త్రీలను పూజిస్తామంటూనే మరో పక్క మానభంగాలూ, ఆడ పిండాల హత్యలూ జరిగి పోతున్న సమాజాల్లో స్త్రీ దేవతల సాత్విక పరిణామం కూడా ఒక ‘ఖేల్’.

lalitha parnandi—  ల.లి.త.