ఇగ మనమే పోల్చుకోవాలె

 

painting: Rafi Haque

painting: Rafi Haque

 

చెక్క పెట్టెలకు నంబర్లే

పేర్లుండవు.

 

చెక్కపెట్టెల్లో కుక్కేసిన శరీరభాగాలే

గుర్తుపట్టటానికి ముఖాలుండవు…

ఒకప్పుడు బతికిన మనుషుల

ఆనవాల్లేవీ వుండవు.

 

*****

చాలా దూరం నుంచి వస్తము  బంధువులం  ఆప్తులం

దగ్గరి వాళ్ళం…

కళ్ళు తుడుచు కుంటూ శ్వాస  ఎగబీల్చుకుంటూ

ఇంకా మిగిలిన సత్తువను   కొంగులనో,  దస్తీ  లనో మూట  కట్టుకుని…

 

చాలా దూరం నుంచి వస్తము చివరి చూపైన దొరుకుతుందని,

కనీసం పోల్చుకుంటమని.

****

ఒక్కొక్క చెక్కపెట్టె తెరవండి…

శరీర భాగాలను చూసి మనుషుల్ని పోల్చుకుందాం

కోసేసిన స్థనాలు

చెక్కేసిన ముఖాల ముక్కలు

విరిచేసిన కాళ్ళూ చేతులూ

తూట్లు పొడిచిన తొడలు

వలిచిన ఛాతీ చర్మాన్ని పొడుచుకొస్తున్న పక్కటెముకలు

కడుపులనుండి బయటికొచ్చిన ఊగులాడుతున్న పేగులు

 

చెక్కపెట్టె #20   –

తల లేదీ స్త్రీ శరీరానికి

వెతుకుదాం తల కోసం

రాలిపోయిన కళ్ల కోసం

కళ్ళలో వెలిగిన చివరి కలల కోసం

వెతుకుదాం

చెల్లా చెదురైన భాగాల కోసం

తెగ్గోసిన నినాదాల కోసం

 

కూల్చిన చెట్లకు వెళ్లాడుతున్న పేగులు

యెండిన నల్లటి కొమ్మలనుండి కారుతున్న నెత్తుటి చుక్కలు

పచ్చి పచ్చి గా అడవినిండా అడుగడుగునా కోసిన గాయాలు

పదండి వెతుకుదాం

****

గుర్తుతెలియకుండా మూటకట్టిన మాంసపు ముద్దలు

యెవరెవరివో చంపినోడు ఎందుకు  చెప్తడు

యే శరీరానిదే భాగమో  ఛిద్రం చేసినోడు ఎందుకు  చెప్తడు?

ఇగ మనమే పోల్చుకోవాలె

 

మనమే ఒక్కొక్క భాగాన్నీ అతికించుకోవాలె

ఒక్కొక్క మాంసపు ముద్ద యెవరిదో

మనమే ఆనవాలు పట్టాలి

యే చిరునవ్వు ఎక్కడ రాలిపోయిందో

యే కొమ్మల కే నెత్తురంటిందో

యే చెట్ల  మొదళ్ళలో

యెవరి మాంసఖండాలున్నాయో

మనమే పోల్చుకోవాలి

 

చెల్లాచెదురైన

నెత్తుటి మరకల గుర్తులన్నీ

మనమే పోగు చేసుకోవాలె

 

బలవన్మరణాల జ్ఞాపకాలన్నీ

అతి పదిలంగా

గుండెలకు హత్తుకోవాలె

*

 

 

 

 

 

జ్ఞాపకాలు రాలిపోయిన ప్రపంచంలోకి ….

 

 

 

–      నారాయణస్వామి వెంకట యోగి

~

 

 

ఒక కవిని నాకు చాలా యేండ్ల నుండీ  తెలుసు అనుకోవడం కంటే, తొలి యవ్వన రోజులప్పటి నుండీ  తెలుసు అనుకోవడం ఒక గొప్ప విషయం. అట్లా తెలవడంలో ఒక ఆనందమున్నది. సాధారణంగా కవిత్వం రాసేవాళ్ళు తొలియవ్వన రోజుల్లోనే మొదలు పెడతారు. అట్లా అని వేరే దశల్లో రాయడం మొదలు పెట్టిన కవులు లేరా అంటే చాలా మందే ఉన్నరు కూడా. కానీ తొలియవ్వన రోజుల్లో రాయడం ప్రారంభించిన కవుల్లో మనం వేరు వేరు దశలను చూస్తాం. ఒక యెదుగుదలను, ఒక క్రమబద్ధ పరిణామాన్ని చూస్తాం. కవి వయసులో యెదుగుతున్న కొద్దీ కవిత్వంలోనూ పరిపక్వత (మెచూరిటీ) కనబడుతుంది. ఇదీ అందరి విషయం లో  నిజం కావాల్సిన అవసరమూ లేదు. యెన్నేండ్లు రాసినా యే యెదుగుదలా లేని కవులూ ఉన్నరు.

తొలియవ్వనం లో కనబడే ఒక ఆవేశమూ,విసురూ, ఉద్వేగమూ అప్పుడు రాసే కవిత్వం లో సహజంగానే కనబడుతుంది.  తర్వాత,  తర్వాత,  జీవితంలో అనేక ఒడి దుడుకులు సంభవించినంక,అనుభవం అనేక పాఠాలు నేర్పినంక కవిత్వం లో ఒక సాంద్రత వస్తుంది. చిక్కదనం వస్తుంది. వయసు తాలూకు పుస్తకాల్లో చిక్కిన అనేక క్షణాలు పూల రిక్కలై, నెమలీకలై కవిత్వంలో పరుచుకుంటాయి. కవిత్వానికి ఒక గొప్ప అందం వస్తుంది. కవితలో ఒక్కొక వాక్యం ఒక అద్భుత సౌందర్యం తో అలరారుతుంది. అయితే ఆ సౌందర్యం ఊరికే తళుక్కుమని మెరిసి మాయమయేది కాదు. గొప్ప పరిపక్వత తో వచ్చే సౌందర్యం. మనల్ని ఒకటికి పది సార్లు ఆగి ఆలోచించేటట్టు చేసే బాధతో కూడిన సౌందర్యం. కవికి అనుభవం నేర్పిన జ్ఞానమూ, తాత్వికతా, భావ పరిపక్వత కవిత్వం లో ప్రతిఫలించి మన అనుభవాన్ని మరింత సాంద్రంగా చేస్తుంది. సంపద్వంతం చేస్తుంది. ఒక కవిత మొత్తం చదివాక అందులో కవి చెప్పినదే కాకుండా చెప్పనివి కూడా మనకు గోచరించి మన ప్రపంచం మరింత విశాలమవుతుంది. మన ఊహా శక్తి కొత్త ప్రపంచాలకు ప్రయాణం  చేసి కొంగ్రొత్త ఆకాశాలను స్పృశిస్తూ విస్తరిస్తుంది. కవి చదువరి,  ఐతే అధ్యయన శీలి ఐతే, ప్రజా ఉద్యమకారుడైతే, తన కవిత్వం లో మనం ఆనందించేదే కాదు, ఆస్వాదించేదే కాదు నేర్చుకోవల్సిందీ చాలా ఉంటుంది.

అట్లా నాకు తొలియవ్వన రోజుల్లో పరిచయమైన కవి సుధాకిరణ్. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో జే యన్ టీ యూ ఇంజనీరింగ్ కాలేజీ  హైద్రాబాదు లో మా తొలి పరిచయం. ఇద్దరం ఒకటే అభిప్రాయాలని పంచుకున్నం . ఒకే రాజకీయ కార్యాచరణలో భాగమైనం. నేను సాహిత్యం లోనుండి రాజకీయాలలోనికి వస్తే తను రాజకీయాలనుండి సాహిత్యం లోనికి కవిత్వం లోనికి వచ్చిండని చెప్పవచ్చు – కొంచెం అటూ ఇటూ గా! కిరణ్ ఒక గొప్పకమిట్మెంటు తో కవిత్వం రాసిండు. రాస్తున్నడు. ఇన్నేండ్ల తర్వాత మేము యెవరి జీవితాల్లో వాళ్ళం పడినంక, క్రియాశీలక రాజకీయాచరణ నుండి ఒకింత దూరమై కనీసం సాహిత్యం లో నైన క్రియాశీలకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నం ఇద్దరమూ బహుశా నాకంటే యెక్కువగా కిరణ్! కవిత్వాన్ని జీవితంలో భాగం చేసుకుని కవిత్వమే జీవితంగా తపిస్తూ, మనం కలలు కన్న కొత్త సమాజం కోసం కవిత్వం యేదో మేరకు తోడ్పడుతుందని నమ్మి కవిత్వ సృజన చేస్తున్నడు కిరణ్.

కిరణ్ ఒక నిర్దిష్ట సామాజిక లక్ష్యంతో కవిత్వం రాసినట్టనిపించినా ప్రతి కవితలోనూ ఒక వైయక్తిక అనుభవం అనుభూతి ఉంటుంది. కవిత వైయక్తిక అనుభవం తోనే ఆ నిర్దిష్ట అనుభూతి తోనే ప్రారంభమైనా (అది విప్లవోద్యమం గురించి రాస్తున్నప్పుడు కావచ్చు అమరుల కోసం రాస్తున్నప్పుడు కావచ్చు బాబన్న, మల్లారెడ్డి లాంటి అన్ సంగ్ హీరో లగురించి వారి అమరత్వం గురించి రాస్తున్నప్పుడు కానీ ముందు గుండెల్ని కదిలించే వైయక్తిక అనుభూతితో ప్రారంభమౌతుంది కవిత. అట్లా యెత్తుకుని ఆ అనుభూతిని విశ్వజనీనం చేస్తాడు, తాత్వీకరిస్తాడు. అయితే ఇప్పుడు కిరణ్ రాసిన ఒక వైయక్తిక కవిత గురించి చెప్పబోతున్నాను. రాజకీయ అభిప్రాయాలను కవిత్వం లో ప్రకటించి, ఒక స్పష్టమైన సామాజిక లక్ష్యం తో కవిత్వం రాసే కవుల పైన ఒక దురభిప్రాయం ప్రచారంలో ఉన్నది. అదేమంటే వీరికి సహజమైన వైయక్తిక అనుభూతులుండవు – అన్నీ రాజకీయ అభిప్రాయాలనే నల్ల కళ్ళద్దాలనుండి చూస్తరు. అసహజంగా రాస్తరు అని. ఈ దుష్ప్రచారాన్ని చాలా మంది కవులు గతంలో అన్ని అంశాల గురించీ అద్భుతమైన కవిత్వం రాసి తిప్పికొట్టినరు. ఆ కోవలోకే కిరణ్ రాసిన‘విస్మృతి’  కూడా వస్తుంది. సామాజిక బాధ్యతతో రాస్తున్న కవుల కవిత్వం పట్ల ఇది ఒక దురభిప్రాయమే అని మరో సారి శక్తివంతంగా నిరూపించినడు కిరణ్ ఈ కవితలో. అల్జైమర్స్ కు గురై తన కళ్ళ ముందే క్రమ క్రమంగా క్షీణించి శిథిలమై పోతున్న తన అమ్మ గురించి రాసిన ఈ కవిత గుండె తలుపులు తట్టి యెక్కడో లోలోపలి పొరలను కదిలిస్తుంది.

 

జ్ఞాపకాలకీ, గుర్తు తెలియని తనానికీ మధ్య

దిగంత రేఖలా చెరిగిపోయిన

సన్నటి కన్నీటి పొరలాంటి గీత.

 

జ్ఞాపకాలు

ఒక్కొక్కటిగా ఆకులవలె రాలిపోతూ

ఎన్నటికీ తిరిగి చిగురించని

శిథిల శిశిరపు కరకు జాడలు.

 

అని ప్ర్రారంభమైన కవిత మనల్ని జ్ఞాపకాలు నెమ్మదిగా  చెదిరిపోతూ,  మెల్ల మెల్లగా ఒక రకమైన మసక వెలుతులాంటి చీకటిలోకి మాయమైపోతున్న  అమ్మ ప్రపంచంలోనికి తీసికుపోతుంది. అట్లా చెపుతూ యెందుకు జ్ఞాపకాలు యెందుకు రాలిపోతున్నయో మరింత కవితాత్మకంగా చెప్తాడిలా ….

 

జ్ఞాపకాలు..

చినుకులు చినుకులుగా

నిస్సహాయంగా నేలకు జారిపోగా

గాలి ముందు దీపంలా దీనంగా

మోకరిల్లిన ముదిమి మేఘం

అలలు అలలుగా విస్మృతి విస్తరించిన

సముద్రమొకటి.

తలపుల కెరటాలు తరలిపోగా
దిగులు దీపస్తంభంలా నిలిచిన

కడపటి తీరమొకటి..

 

గాలిముందు దీపంలా దీనంగా మొకరిల్లిన ముదిమి మేఘమని వృధ్ధాప్యాన్ని అద్భుతంగా చెప్తూ రెండు ఉత్రేక్షలలో అమ్మ పరిస్థితిని చెప్తున్నాడు కవి – ఒకటి అలలు అలలు గా విస్మృతి విస్తరించిన సముద్రమనీ, మరొకటి తలపుల కెరటాలు తరలిపోగా మిగిలిన దీపస్థంభం లాంటి తీరమనీ. కవి ఇక్కడ,  సముద్రాన్నీ తీరాన్నీ,  విస్తరించే అలలనీ  తరలి పోయే కెరటాలనీ,  ఒకే అర్థాన్ని శక్తివంతంగా చెప్పడం కోసం వైరుధ్యంలా కనిపించే ఉత్ప్రేక్షలను వాడుతూ ఒకే ఒక విరోధాభాసతో మన ముందు అల్జైమర్స్ బారిన పడ్డ తన అమ్మ చిత్రాన్ని చాలా శక్తివంతంగా కళ్ళకు గట్టినట్టుగా గీసి మనల్ని ఆ ప్రపంచంలోనికి పూర్తిగా తీసుకుపోతడు. ఇక మనం పూర్తిగా కవితతో కట్టివేయబడి కవితో అమ్మ ప్రపంచంలో ప్రవేశిస్తం.

 

 

 

జ్ఞాపకాల వెలుతురు

కొద్ది కొద్దిగా కుదించుకుపోతుందో

విస్మృతి చీకటి

మెలమెల్లగా విస్తరిస్తుందో

జ్ఞాపకాలు

జడివానలో కొట్టుకుపోతాయో

జ్ఞాపకాలు..

కరిగి, యిగిరి, ఆవిరై, ఎగిరి పోతాయో

 

మళ్ళీ ఇందులోనూ వెలుతురు కుదించుకుపోవడం చీకటి విస్తరించడం (రెండూ ఒకటే అర్థమైనపటికీ) రెండు వ్యతిరేకార్థాలతో సమానార్థాన్ని వెలుతురు చీకటీ జ్ఞాపకాలూ విస్మృతులతో సూచిస్తూ ఒక భావైక్యతను సాధిస్తున్నాడు కవితలో.

 

అట్లా ఈ కవితలో ఒకే భావాన్ని సూచించడానికి  వైరుధ్యాల్లా కనిపించే ప్రతీకలు ఉత్ప్రేక్షలూ వాడుతూ కవి గొప్ప విజయాన్ని సాధించిండు. చెప్పదలుచుకున్న భావాన్ని మరింత శక్తివంతంగా చెప్పిండు.

 

చివరగా కవిత ముగిస్తూ ….

చీకటిలో కదలాడే నిశ్శబ్దపు

నీడలకై వెదుకులాట.

వెలుగులో  కనిపించని నక్షత్రాలకై

శూన్యాకాశంలో అన్వేషణ.

వూడలుదిగిన మర్రిచెట్టులాంటి రాత్రి

ఋతువులు లేని కాలమొకటి.

కాలం కాటేసిన తలపుల వాకిలిలో,  

తలుపులు మూసుకుపోయిన

మలిసంధ్య జీవితమొకటి…

 

ముందు చెప్పిన కుదించుకుపోయిన వెలుతురు చీకటిగా, చీకటిలో కదిలే నిశ్శబ్దపు నీడల్లా మారిపోతే, చీకటేమో  వెలుతుర్లో కనిపించని నక్షత్రాలైపోయి , మర్రిచెట్టు లాంటి ఊడలు దిగిన రాత్రిలో రుతువులు లేని కాలంలా వృధ్ధాప్యం మిగిలిపోయిందని భిన్నమైన పొరలు  పొరలుగా చిత్రాలని గీస్తాడు. చివరికి ‘కాలం కాటేసిన తలపుల వాకిలి’ అని మతిమరపు వ్యాధి (అల్జైమర్స్) కాటేసిన తన తల్లి మలిసంధ్య జీవితాన్ని తన తల్లిలాంటిపరిస్థితినే యెదుర్కొంటున్న వారి జీవితాన్ని అద్భుతంగా మనముందుంచుతడు. తన వైయక్తిక వేదనకు పరిస్థితికీ ఒక విశ్వజనీనతను తీసుకొస్తడు. అటువంటి పరిస్థితినెదుర్కొంటున్న వారిని మనకు పరిచయం చేసి మన కంటనీరు బెట్టిస్తడు. తలుచుకుని దుఃఖింపజేస్తడు.

కవి ముఖ్యంగా కవితలో సాధించినది,   వైయక్తికతను విశ్వజనీనం చేయడం – అదీ పరస్పరం విభిన్నాలనిపించే ప్రతీకలతో ఉత్ప్రేక్షలతో సమానార్థాన్ని సాదిస్తూ  మన ముందు ఒక భిన్న పొరలు గల చిత్రాన్ని ఆవిష్కరించడం. హృదయాన్ని మెలితిప్పే అనుభవాన్ని కవితగా  మనలో  భాగం చేసిన కవి  సుధాకిరణ్ ను అభినందించకుండా ఉండలేము. ఈ కవితలో కవి చెప్పిన దానికన్నా యెక్కువగా చెప్పనిదే ఉన్నది – చెప్పని, మనకు తెలియని ఒక కొత్త ప్రపంచమూ దాని అనుభూతుల పొరలూ ఇంకా అనేకం ఉన్నయి. మనం కవితను నిదానంగా మన ఆలోచనల్లోకి ఇంకించుకున్నప్పుడు మన అనుభూతిలోకి వస్తుందా కొత్తప్రపంచం. కాలం కాటేసిన తలపుల ప్రపంచం –జ్ఞాపకాలు రాలిపోయిన యెండు మోడుల ప్రపంచం.

యిదీ మొదలు …..

 

-నారాయణస్వామి వెంకట యోగి 

~

 

యెలా ఉంటమో,

యేమై పోతమో,  

ఊహించుకోని క్షణాలవి

యెక్కడికి వెళ్తమో

యెవరెక్కడుంటమో 

యేదీ  అస్పష్టంగానే
ఉన్న రోజులవి

పెనుగాలులమై వీచినమో,

జడివానలమై కురిసినమో,

నల్లమబ్బులమై విరిసినమో

కాలం కనికరించని క్షణాలెన్నిటినో

దోసిళ్ళలో పట్టుకుని 

యెదురీదినమో

 

ఇప్పుడంతా,  

భోరుమనే ఆనందమూ ,  

కేరింతల దుఃఖమూ

కలగలిసిన 
ఒక తలపోత.

యెందరిని పోగొట్టుకున్నం,

యెన్ని సార్లు కాటగలిసినం

యెన్ని కన్నీళ్ళు 

మూటగట్టుకున్నం

 

యెన్ని క్షణాలు
యెన్ని నిమిషాలు 

యెన్ని యేడాదులెన్ని యుగాలు

కనుపాపలమీద స్మృతులు 
పూల ముళ్లై,  

విరబూసిన అనుభవాలు 

కవిత్వాక్షరాలై,

చివరికి మనమిప్పుడు 

సముద్రపుటొడ్డున నత్తగుల్లలతో ఆడుకునే

చిన్న పిల్లలం.

 

కలిసి అనుకునే నడిచినం

కలిసిన ప్రతిసారీ
కొంగ్రొత్త  నడకలతో 

కూడబలుక్కునే ప్రయాణించినం.

నెత్తురోడుతూ  రాలిన పూల రెమ్మలను 

మృదువుగా స్పృశించి

చెంపల మీద యెండిన నీటిచారికలకు

హత్తుకున్నం.

కంకర రాళ్ళూ,  పల్లేర్లూ గుచ్చుకుని 

చిట్లిన పాదాలకు 

చిరునవ్వుల లేపనాలు పూసుకున్నం.

అలసిపోయిన ప్రతిసారీ

ఇదే మొదటాఖరి మెట్టు అనుకున్నం.

గమ్యం కనబడని ప్రతిసారీ

పుస్తకాల్లో దాచుకున్న 
బంతిపూల రిక్కల్ని 

తడిమి చూసుకున్నం.

చాలాదూరం వచ్చేసామా మనం?  

లేదూ నీకు,  నాకూ,  మనకూ 

ఇదేనా మొదటి అడుగు?

ఇప్పటికీఇన్నేళ్లకీ 

మనం కలిసే నడుస్తున్నాం కద

ఇదీ,  నిజమైన ప్రారంభం.

రా,
మరో సారి
సరికొత్తగా మొదలు పెడదమా

మన అలుపులేని 

ప్రాచీన ప్రయాణం

 

(సుధాకిరణ్ కి ఆత్మీయంగా)

పుస్తకాలూ, ప్రజల మధ్య చలసాని!

 నారాయణస్వామి వెంకట యోగి

  మా ఆఫీసు లో నాతో పాటు పనిచేసే అనిల్ అనే మిత్రుడు నెలరోజుల సెలవుపై వైజాగ్ వెళ్ళి,  వచ్చీ రాగానే ‘సార్ మీకో సర్ప్రైజ్ ఉంది’ అంటూ ఒక పాకెట్ తెచ్చి యిచ్చాడు. విప్పి చూద్దును కదా ‘సాహిత్య సమాలోచన’ కృష్ణా బాయి  గారి పుస్తకం, అందులో అందమైన దస్తూరి తో కృష్ణక్క ఉత్తరం – ఒక ఐదారు వాక్యాలతో మరో ఉత్తరం – ‘స్వామీ యెలా ఉన్నావ్ విద్యా పిల్లలూ  యెలా ఉన్నారు – ఈ ఒక్క పుస్తకం మా వదిన కోసం పంపి హెల్ప్ చెయ్యి – నినూ యెప్పటికీ మరవం’ అంటూ – వెనక నిన్నెట్ల్లా భరిస్తుందో అమ్మాయి అంటూ ఒక చురక – తనకు మాత్రమే సాధ్యమయ్యే పలకరింపు  వాక్యాలు – ప్రసాద్ గారి ఉత్తరం – చాలా సంతోషపడ్డా – గత దినాల స్మృతులన్నీ ఒక్క సారి చుట్టుముట్టినయి –

వెంటనే ఫోన్ చేసా వైజాగ్ కి – ‘యేమి నారాయణస్వామీ పూర్తిగా అమెరికనైజ్ అయిపోయావా  – ఇంక అక్కడే ఉండిపోతావా ‘   చాలా ఆత్మీయంగా,  హాయిగా పలకరింపు – ‘లేదండీ …’ అని నేనేదో అనబోతుంటే ‘అండీ యేమిటి నీ బొంద కొత్తగా ..’ అని ప్రేమగా చీవాట్లు – అదే చనువు అదే ఆత్మీయత అదే ఆర్తి గొంతులో..  యే మాత్రం మారలేదు – తనకి 83 యేండ్లు అంటే నమ్మ బుద్ది కాలేదు – పసి పిల్ల వాడిలా మాటలు – ఒక నాలుగైదు పుస్తకాల పేర్లు చెప్పి ఇవి వెతికి పంపు వెంటనే – వదిన (కృష్ణక్క) అడిగిన పుస్తకం వెంటనే పంపు – అని చనువుగా పురమాయింపు – పుస్తకాలు పంపాక ఫోన్ చేస్తే ‘అందినయి పుస్తకాలు చాలా థేంక్స్ – యెప్పుడొస్తావు ఇండియాకు – వచ్చేటప్పుడు మరిన్ని పుస్తకాలు తీసుకు వద్దువు కాని ‘ – పుస్తకాలే పుస్తకాలే ఇంకా యేమీ యెప్పుడూ అడగ లేదు,  కోరుకోనూ లేదు –

2005 లో అప్పటి వై ఎస్సార్ ప్రభుత్వం చర్చల ప్రహసనం ముగించి ‘ఎంకౌంటర్’ ల వేడి  నెత్తురు చిందించి ,  విరసం నిషేధించినప్పుడు, నిషేధం  యెత్తివేయాలని (అప్పుడు వీవీ ని కూడా జైల్లో పెట్టారు‌ )   సం తకాల సేకరణ కోసం శివారెడ్డి గారూ , వేణూ  నేనూ, యెం. టీ. వాసుదేవన్ నాయర్, కే. సచ్చిదానందన్ ల సంతకాల సేకరణ కోసం వెళ్ళినప్పుడు కలిసాం ప్రసాద్ గారిని – (నేనప్పుడే యేడేళ్ళ ప్రవాసం తర్వాత ఇండియా వెళ్ళి ఉండినాను) – ఒక డొక్కు స్కూటర్ వేసుకొని వచ్చారు – అదే ఇస్త్రీ లేని ముడుతల అంగీ , పాంటూ , బుజానికి సంచీ , లావుపాటి మసక కళ్ళద్దాలు – యేమివోయి స్వామీ యెప్పుడొచ్చావు – రాగానే నిషేధమా – నాకు సన్ ట్సు ‘ఆర్ట్ ఆఫ్ వార్ ‘ఒరిజినల్ స్పెషల్ ఎడిషన్ కావాలి – సంపాదించి పంపు యెట్లయినా ‘ – అప్పుడూ పుస్తకమే అడిగారు.

1984 లో శ్రీకాకుళం (మాకివలస) విరసం మహాసభల్లో చూసాను మొదటి సారి ప్రసాద్ గారిని – నేనంతకు ముందు సంవత్సరమే విరసం లో చేరాను. అప్పల్నాయ్డు గారి అధ్వర్యం లో చాలా గొప్పగా అద్భుతంగా జరిగినయి ఆ సభలు – అక్కడే నేను విరసం మహామహులందరినీ కలిసాను – కేవీ ఆర్, త్రిమరా, ప్రసాద్ ,సురా, అప్పల్నాయ్డు – ఇంకా చాలా మందిని మొదటి సారి కలిసేను –
సభ ప్రారంభం లో విరసం జెండా యెగరేసినాక

‘యెత్తినాం విరసం జెండా
అలలలుగా వరదలొత్తు
పోరు పోరు జెండా’
అధ్బుతమైన మమేకతతో ఆర్తితో నిండిన కంఠస్వరం తో కళ్ళు మూసుకుని గానం చేస్తుంటే ‘ఆయనే చలసాని ప్రసాద్’ అని చెప్పారెవరో – అప్పట్నుండీ ప్రతి విరసం సభలో సమావేశం లో రుద్రజ్వాల రాసిన పతాక గీతం ప్రసాద్ గారు పాడాల్సిందే!

‘సుబ్బారావు పాణిగ్రాహి సంధించిన కళల త్రోవ
మా యెన్నెస్ ప్రకాశరావ్ మండించిన కథనంలో ..
పరిటాలా రాములన్న ప్రతిఘటనా మార్గంలో
మా చెర యేతం పట్టిన విప్లవాల గానంలో ‘

గొప్ప తాదాత్మ్యం తో పాడే వారు ప్రసాద్ గారు – నాకూ నేర్పించండి పాట అంటూ వెంట పడ్డాను ఆయన వెంట – అప్పుడు నాకు 18 యేండ్లు – నవ్వి బుజం తట్టి ఓ తప్పకుండా అన్నారాయన ఆత్మీయంగా –

తర్వాత సభలో

‘ఈ విప్లవాగ్నులు యెచ్చటివని అడిగితే
శ్రీకాళం వైపు చూడమని చెప్పాలి
వెంపటాపు సత్యమెవరని అడిగితే
గిరిజనుల సత్యమని గొప్పగా చెప్పాలి

సత్యమూ మాస్టారు స్థానమెచటని అడుగ
గిరిజనుల హృదయాలు గుర్తుగా చూపాలి’

కళ్ళు పూర్తిగా మూసుకుని ఒక చేత్తో బల్ల మీద దరువేస్తూ మూసిన కళ్ళ వెనుక తడి ఉబుకుతుండగా చాలా ఆర్ద్రంగా గొప్పగా గానం చేసారు ప్రసాదు గారు. సభ అంతా పూర్తి నిశ్శబ్దంగా లీనమై పోయి విన్నారా పాటను. పాట తర్వాత నినాదాలు మిన్నంటాయి. అట్లే మరో పాట కూడా పాడే వారు – నాకు పూర్తిగా గుర్తు లేదు కానీ తనకు మాత్రమే సాధ్యమయ్యే గొంతు తో పలికే వింతయిన గమకాలతో పాడే వారు ‘స్టాలినో నీ యెర్ర సైన్యం ఫాసిజ వినాశ సైన్యం ‘ అంటూ – ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి ఉద్యమాల్లో ఉన్న అపారమైన అనుభవం ప్రసాద్ గారిది.

పల్లెర్లమూడిలో విరసం తరగతులు నిర్వహించినప్పుడు మాకు మార్క్సిస్టు తత్వశాస్త్రం – గతితార్కిక చారిత్రిక భౌతిక వాదాల పైన పాఠం చెప్పారు ప్రసాద్ గారు. అంత సంక్లిష్టమైన విషయాన్ని చాలా సులభంగా అర్థమయ్యేట్లు ‘in a nut-shell’ అనే పద్దతి లో గొప్పగా చెప్పారు పాఠాన్ని. నేనూ,  నా మిత్రుడూ సన్నిహితుడూ ఐన అమరుడు    మాధవస్వామీ పాల్గొన్నాం ఆ తరగతుల్లో – మాకు మార్క్సిస్టు తత్వశాస్త్రం  పునాదులేసింది ప్రసాద్ గారే. ఆ మొత్తం తరగతులైనన్ని రోజులూ మేమొకటి గమనించాం – ప్రసాద్ గారు గాడంగా యెప్పుడూ నిద్రపోయే వారు కాదు – వారిది పిట్ట కునుకే ! ఒక నాలుగైదు నిమిషాలు ఉన్నచోటే కూర్చునే కళ్ళుమూసుకుని కునికే వారు – తర్వాత మళ్ళీ యథాతథంగా చురుగ్గా ఉత్సాహంగా పనిచేసే వారు !

ప్రసాద్ గారు శ్రీ శ్రీ కి,  శ్రీ శ్రీ సమగ్ర సాహిత్యానికీ పర్యాయ పదం మా దృష్టిలో – శ్రీ శ్రీ అంటే వల్లమాలిన ప్రేమ – చిన్నపిల్లాడై పోయే వారు  శ్రీ శ్రీ పేరు చెపితే – ఈగ వాలినా  సహించే వారు కాదు – ఆయన యెప్పుడు యేది మాట్లాడినా రాసినా తప్పకుండా ఒక్క సారైనా శ్రీ శ్రీ కవితా వాక్యమో వచన వాక్యమో తప్పకుండా దొర్లుతుంది – శ్రీ శ్రీ సమగ్ర సాహిత్యం ప్రచురణ మొత్తం తన బుజాల మీద వేసుకున్నాడు – డబ్బుల సేకరణ దగ్గర్నుండీ, కవర్ పేజి డిజైన్ , ప్రూ ఫులూ, ఫుట్ నోట్సూ – సమస్తం ఆయనే – ఒక్కడే నెరవేర్చాడు అంటే అతిశయోక్తి కాదు –  సినిమా వాళ్లతో చాలా సంబంధాలుండేవి తనకి –తెలుగు సినిమా రంగంలో కొంత అభ్యుదయ భావాలున్న వారితోనే (ప్రత్యగాత్మ, కే.బి. తిలక్ తదితరులతో ..) సంబంధాలు – కొన్ని సినిమాలకి సహాయ దర్శకత్వం కూడా చేసారని విన్నాను – శ్రీశ్రీ  సమగ్ర  సాహిత్యం ప్రచురణ లో ప్రసాద్ గారు యెవరినీ ఇబ్బంది పెట్టలేదు – తన స్వంతపని లాగానే (యే విరసం పనైనా తాను అట్లే చేసేవారు గొప్ప కమిట్మెంటు తో డెడికేషన్ తో) అలుపెరుగకుండా చిరునవ్వుతో చేసారు – బాగా గుర్తు హైద్రాబాదు లో ఒకసారి కలిసినప్పుడు శ్రీ శ్రీ అనువాదం చేసిన 1968 ఫ్రెంచి విద్యార్థుల ఉద్యమం గురించిన గొప్ప పుస్తకం ‘రెక్క విప్పిన రివల్యూషన్’(The beginning of the End – Angelo Quattrochi) పుస్తకాన్నిచ్చి  – ‘యెట్లా వచ్చింది’ అని కనుబొమలెగరేసుకుంటూ కళ్లలో కించిత్తు సంతృప్తితో కూడిన గర్వం కదలాడుతుంటే అడిగారు – నిజంగా చాలా గొప్పగా అద్భుతంగా ప్రచురించబడిందా పుస్తకం.

విరసం సభలకే మరోమారు వైజాగ్ వెళ్ళీనప్పుడు ప్రసాద్ గారింటికి వెళ్ళాను. పుస్తకాలు,  పుస్తకాలు,  యెటు చూసినా పుస్తకాలే! విశాఖ సముద్రం ప్రసాదు గారింట్లో ఉన్నట్టనిపించిది – షెల్ఫ్ లో శ్రీ శ్రీ లండన్ మహాప్రస్థానం కనబడింది – ఆత్రంగా,  ఆకలిగా తీసుకుని చూడ్డం మొదలు బెట్టా! నా కళ్లలో వెలుగే చూసారో, పుస్తకా న్ని అంత వెల పెట్టి కొనుక్కోలేని నా అశక్తతనే గమనించారో  – ‘మా నారాయణస్వామికి ప్రేమతో’ అని రాసి సంతకం పెట్టి యిచ్చారా పుస్తకాన్ని – తనివితీరా శ్రీ శ్రీ నీ,  ప్రసాదు గారినీ  నీళ్ళు నిండిన కళ్ళతో గుండెలకు హత్తుకున్నా!

విరసం సంస్థాపక సభ్యులూ, జీవితాంతం నమ్మినదానికోసం నిలబడ్డ వారూ, అత్యంత సాధారణ జీవితం గడపిన వారూ, యెటువంటి ఆడంబరాలకూ, పటాటోపాలకు  పోకుండా చాలా సాదా సీదా గా జీవితాన్నీ , సాహిత్యసృజనూ కొనసాగించిన మహానుభావులు ప్రసాదు గారు. యెందరో రచయితలను ప్రచురించారు, వెన్ను దట్టి  ప్రోత్సహించారు – తాను స్వయంగా రాసిందానికన్నా యెక్కువగా,  ఆణిముత్యాల్లాం టి సాహిత్యాన్ని ప్రచురించారు విశాఖలో , తెలుగు నేలపైనా  విప్లవ సాహిత్యానికి మూలస్థంభంలా నిలబడ్దారు – యెంత సాదా సీదాగా ఉండే వారో అంతే సింపిల్ గా మాట్లాడినట్టున్నా గొప్ప లోతైన అర్థాన్నిచ్చేట్టుగా మాట్లాడే వారు – ‘ఆంధ్రప్రదేశ్ ఒక అందమైన అబద్ధం తెలంగాణ ఒక నిష్ఠూరమైన నిజం’ లాటి ఆణిముత్యాల్లాంటి వాక్యాలెన్నో ఆయన ముఖత చాలా యథాలాపంగా వచ్చేవి.

కేవలం పుస్తకాలే కాదు జీవితాన్ని, సమాజాన్నీ , ప్రజా ఉద్యమాలనీ క్షుణ్ణంగా చదివి పీడిత ప్రజా పక్షపాత ప్రాపంచిక దృక్పథాన్ని అణువణువునా వంటబట్టించుకుని అడుగడుగునా ఆచరించి చూపిన వారు ప్రసాద్ గారు. ఆయన ‘గాడిదా’ అని కానీ మరో రకంగా కానీ తిట్టినా చాలా ముద్దుగా ఉండేది. ఆక్షేపణీయంగా అసలు ఉండేది కాదు. ఆయన పాటలేకుండా విరసం సభలు ప్రారంభమవడం ఊహించడం కష్టంగా ఉన్నది. శ్రీ శ్రీ గురించి యెవరు యెక్కడ మాట్లాడినా వెంటనే స్పందించే వారు. ఆ మధ్య ఒడిస్సిస్ యెలైటిస్ ‘పిచ్చి దానిమ్మ చెట్టు’ పద్యాన్ని విన్నకోట అనువాదం చేస్తే వెంటనే స్పందించి ఇది శ్రీ శ్రీ యెప్పుడో అనువాదం చేసాడు – రవిశంకర్ అనువాదం కొంచెం తేడాగా ఉంది అంటూ స్పందించారు. సాహిత్యం , విరసం తదితర అంశాల మీద జరిగిన సుదీర్ఘ చర్చ లో వేల్చేరు తదితరులతో చురుగ్గా పాల్గొన్నారు. శ్రీ శ్రీ నిజమైన జయంతి యేప్రిల్ 30 అని చాలా పరిశోధించి నిర్ధారించారు. ఈ యేడాది,  ఆ రోజు వివిధలో విలువైన శ్రీ శ్రీ స్మృతులెన్నో పంచుకున్నారు. బహుశ అదేనేమో ఆయన చివరి ప్రచురితం.

నవంబర్ లో వచ్చేటప్పుడు తీసుకురా అని నాకో పుస్తకాల జాబితానిచ్చారు  ప్రసాదు గారు. అప్పల్నాయ్డు  గారితో పంపిద్దామనుకున్నా పుస్తకాలు.   నవంబర్ రాకముందే హడావిడిగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తలుచుకుంటే గుండె బరువెక్కుతోంది. కళ్లలో నీళ్ళు నిండుతున్నయి. రావిశాస్త్రి అంటే విపరీతమైన అభిమానం  ప్రసాదు గారికి.  రావిశాస్త్రి కథల్లోని, శ్రీ శ్రీ కవిత్వం లోని  అథోజగత్సహోదరులకోసం. పతితులు, భ్రష్టులూ, బాధాసర్పదష్టులకోసం,  జీవితాంతం సాహిత్య, సాంస్కృతిక సామాజిక రంగాల్లో కృషి చేసిన ప్రసాదు గారు అందరి హృదయాల్లోనూ , ప్రజల నాలుకల పైనా యెప్పుడూ జీవించే ఉంటారు. ఆయనకూ ,  అసాధారణమైనదీ  అయిన ఆయన జీవన శైలికీ మరణం లేదు.

*

తెలంగాణలో ఇప్పుడు మౌనం కాదు, నిర్మాణాత్మక విమర్శ అవసరం!

10433633_689328201180016_1300384855878113980_n

(ఈ 23 న తెలంగాణా ఎన్నారై అసోసియేషన్ తొలిసారిగా ఇస్తున్న తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన అవార్డుల సందర్భంగా)

గత  అరవై యేండ్లకు పైగా తెలంగాణ ప్రజల తండ్లాట తీరిపొయ్యి,  పోరాటం  సఫలమై,  కన్న కలలు  సాకారమై  ప్రత్యేక రాష్ట్రం యేర్పడ్డది. ఆంధ్ర వలస పాలకుల పాలన నుండి విముక్తి కలిగింది. పరాయి పాలన ను తరిమికొట్టిన తెలంగాణ ప్రజలు,  రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ రాజకీయ పార్టీని యెన్నికల్లో గెలిపించిండ్రు. అధికారం కట్టబెట్టిండ్రు. ఉద్యమానికీ, రాజకీయ పార్టీ కి నాయకత్వం వహించిన వారే యిప్పుడు తెలంగాణ ప్రభుతానికీ నాయకత్వం వహిస్తున్నరు. ఇది తెలంగాణ చరిత్రలో మొత్తంగా భారతదేశ చరిత్రలో అపురూపమైన సన్నివేశం.

ఉద్యమంలో ప్రదాన భాగస్వామ్యం వహించినందుకూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతా, ఆకాంక్ష వెనుకనున్న ఆరాటమూ పోరాటంగా మునుముందుకు రావడానికి కీలక పాత్ర వహించినందుకూ రాష్ట్ర యేర్పాటు తర్వాత  ప్రభుత్వ పగ్గాలు చేపట్ట్డడం వల్ల,  సహజంగానే నాయకత్యం పైన ప్రజలకు ఆశలూ చాల ఎక్కువగా ఉంటాయి. అట్లే తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాలా ప్రజానీకం పట్లా నాయకత్వానికి బాధ్యతా కూడా చాలా  యెక్కువగానే ఉంటుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ సమాజం లోని అన్ని  వర్గాల, సబ్బండ వర్ణాల ప్రజలు క్రియాశీలకంగా పాల్గొని తమవైన అనేకానేక నిర్దిష్ట  ఆశలనూ ఆకాంక్షలనూ యెజెండా మీదికి తెచ్చారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక అవన్నీ నెరవేరుతాయనీ, నెరవేరాలనీ ఆశించారు, కోరుకున్నారు. విభిన్న సమూహాలకు చెందిన ప్రజలు,  తమ తమ ఉమ్మడి సామాజిక కోర్కెలను, తరతరాలుగా అణచివేతకు గురైన  తమ అస్తిత్వ ప్రయోజనాలనూ  రంగం మీదికి తీసుకొచ్చి,  ప్రత్యేక రాష్ట్రం యేర్పాటైతే అవన్నీ సాధ్యమౌతాయని బలంగా నమ్మారు. తెలంగాణ లో బలంగా ఉన్న సామాజిక ఉద్యమాల నేపథ్యం లో ముందుకొచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అటువంటి నమ్మకాలకు ఆలంబన నిచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసం మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల అనేకానేక సమస్యల పరిష్కారం కోసం సాగిన విస్తృత ఉద్యమమైంది. అయితే ఉద్యమం సాగుతున్న క్రమంలో యెక్కడా నాయకత్వం ఉద్యమ పరిధుల్నీ , పరిమితుల్నీ స్పష్టం చేయడం జరుగలేదు, అది అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు కూడా!

యిప్పుడు రాష్ట్రం సాకారమయ్యాక ఒక విచిత్రమైన వాతావరణం నెలకొని ఉన్నది. ప్రజలు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం తన పద్దతి లో తాను పరిపాలన కొనసాగిస్తున్నది.  ప్రభుత్వ నాయకత్వం , తెలంగాణ ప్రజా సమస్యల పట్ల తనదైన దృక్పథంతో పని చేస్తూ, తాను సరైనవనుకున్న నిర్ణయాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నది. రాష్ట్రం యేర్పడి ఆరు నెలలే ఐంది కాబట్టి, ప్రభుత్వానికి దొరికింది ఆరు నెలలే కాబట్టి,  అప్పుడే అది విఫలమైందా సఫలమైందా అని తీర్పు చెప్పడం సరైంది కాదు. చేసిన ప్రకటనలూ, అమలు చేస్తున్న కార్యక్రమాలనూ  బట్టి ప్రభుత్వం పనితీరుని బేరీజు వేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ పనితీరు పట్ల అభిప్రాయాలూ, వైఖరీ, విమర్శా యెట్లా ఉండాలి అనే అంశాల మీద భిన్న ధోరణులు మనకు కనబడుతూ ఉన్నాయి.

తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. తెలంగాణ ప్రజలు అత్యంత సమరశీలులూ, ఆలోచనల్లో అత్యంత పరిణతి చెందినవాళ్ళూ అనడం లో యెంత మాత్రమూ సందేహం లేదు. అందుకే  ప్రత్యేక రాష్ట్రం  యేర్పడగానే మనం యేమి జరుగుతుందని ఊహించవచ్చో,  యేమి ఆశించవచ్చో , తెలంగాణ ప్రబుత్వం యేమి చేయగలుగుతుందో, యేమి చేయలేదో, యేవి  దాని పరిధి కి లోపల  ఉన్నాయో యేవి బయట ఉన్నాయో, ప్రభుత్వ పరిమితులేమిటో అనే విషయాలపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతునాయి. ఈ అభిప్రాయాలు సమాజం లోని భిన్న దృక్పథాల ప్రజానీకం నుండి వెలువడుతున్నయి కాబట్టి సహజంగానే వాటి మధ్య అనేక వైరుధ్యాలు ఉంటాయి.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ పార్టీ తో నున్న వారు రాష్ట్ర యేర్పాటు తర్వాత సహజంగానే ప్రభుత్వం తో, ప్రభుత్వం  నడిపే పార్టీ తో ప్రదాన స్రవంతి రాజకీయాలతో యేకీభవి స్తూ, ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి  తమకు సరైందని తోచిన పద్దతుల్లో తోడ్పడుతున్నారు. ఈ క్రమంలో అవినీతీ, స్వలాభాపేక్ష తదితర అంశాలని కొంచెం సేపు పక్కకు పెడితే,  వీరికి ప్రభుత్వం పట్లా , ప్రభుత్వ కార్యక్రమాల పట్లా పద్దతుల పట్లా విమర్శనాత్మక దృక్పథం సహజంగానే ఉండదు. ప్రభుత్వం , ప్రభుత్వాన్ని నడిపిస్తున్న  నాయకత్వమూ, పార్టీ అంతా సవ్యంగానే చేస్తుందని, అందులో  విమర్శించడానికేమీ లేదనీ , విమర్శిస్తే మనం చేజేతులా మనం  నిర్మిస్తున్న భవంతిని మనమే కూలగొట్టుకున్న వాళ్లమౌతామని బలంగా నమ్ముతారు. తెలంగాణ వాదమే ఊపిరిగా ఉన్న రాజకీయ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా యేదీ చేయదనీ,   దాన్ని విమర్శించడం అంటే తెలంగాణ వాదాన్ని విమర్శించడమే అని గట్టిగా వాదిస్తారు.

‘అయితే మీరు మా వైపు లేదా తెలంగాణ వ్యతిరేకుల వైపు’ అని నిర్దంద్వంగా వర్గీకరిస్తారు.  మరో పక్క, తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు,  ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కావచ్చు లేదా మరేదైనా ప్రదాన స్రవంతి రాజకీయ అభిప్రాయాలను సమర్థించే వారైనా కావచ్చు – అదే పనిగా ప్రభుత్వం మీదా, నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ మీదా దుమ్మెత్తి పోస్తుంటారు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ, నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ , అమలు చేయాలను కున్న ప్రతి పథకాన్నీ భూతద్దం లో చూపి  , పూర్తిగా నిరాకరిస్తూ  తీవ్రంగా విమర్శిస్తారు. విమర్శలో యేమాత్రం నిర్మాణాత్మకత ఉండదు. తెలంగాణ సమాజం తాత్కాలిక లేదా దీర్ఘకాలిక లక్ష్యాలకు గానీ ఉపయోగపడేది ఈషణ్మాత్రమైనా ఉండదు. యిటువంటి విమర్శ వినాశాత్మక విమర్శ. అది కేవలం తమ స్వప్రయోజనాలనాశించి, అవి యెట్లయినా సరే నిలుపుకోవాలనే పట్టుదలతో, హ్రస్వదృష్టి తో  చేసే  స్వార్థ పూరిత విమర్శ. యిటువంటి విమర్శ తెలంగాణ సమాజానికి చేటు  కలిగిస్తుంది.

అయితే, ప్రదాన స్రవంతి రాజకీయాలకు, అధికార రాజకీయాలకు వెలుపల వాటికి భిన్నమైన అభిప్రాయాలు కలిగి, ప్రగతిశీల ఆలోచనా విధానం కలిగి ఉన్న ప్రజా సమూహాలు తెలంగాణ లో యెన్నో ఉన్నాయి. వీరంతా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యెంతో ఉద్యమ స్ఫూర్తితో అత్యంత క్రియా శీలకంగా పాల్గొన్నారు. ప్రాణాలకు లెక్క చెయ్యకుండా ఉద్యమాల్లో దూకి లెక్క లేనన్ని పోలీసు కేసులు, నిర్బంధాలనూ తట్టుకున్నారు. తమదైన ఆశలతో, ఆకాంక్షలతో నిర్దిష్ట వ్యూహంతో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర యేర్పాటు లో వీరి కృషి సామాన్యమైనది కాదు.

telanga

అయితే ఆశ్చర్యంగా,  రాష్ట్రం యేర్పడ్దాక వీళ్లలో చాలా మంది ఒక రకమైన వింత మౌనాన్ని పాటిస్తున్నారు.  నిర్లిప్తతను ప్రకటిస్తున్నారు. వీళ్లలో చాలా మందికి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాలా వద్దా,  విమర్శిస్తే తమని తెలంగాణ వ్యతిరేకులంటారా అనే సందేహాలు బలంగా ఉన్నాయి. కొంతమందికైతే, ‘ ప్రత్యేక రాష్ట్రమొస్తే యేదో జరుగుతుందని తాము కేవలం  భ్రమ పడ్డామా ?   యిప్పుడీ ప్రభుత్వ పని తీరు చూస్తుంటే ఆ భ్రమలన్నీ పటాపంచలయ్యాయా? ’  అనే అభిప్రాయాలు కూడా బలంగానే కలుగుతున్నాయి. అయితే దీనికి కారణం ప్రత్యేక రాష్ట్ర యేర్పాటు వల్ల తెలంగాణ లో సాధ్యమయ్యే వాటి కున్న పరిధులూ పరిమితుల పట్ల సంపూర్ణ అవగాహన లేకపోవడమన్నా కావాలి, లేదా తాము కలగన్నట్టు, తాము అనుకున్నట్టు, ఆశించినట్టు ప్రభుత్వమూ , నాయకత్వమూ ప్రవర్తించాలి అన్న అత్యాశా ఐనా కావాలి.

ముందుగా కొన్ని విషయాలని స్పష్టం చేసుకోవాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర యేర్పాటు కొన్ని పరిధుల్లో పరిమితుల్లో  జరిగింది అని మర్చి పోరాదు. భారత దేశ పార్లమెంటరీ విధానం లో భాగంగా  రాజకీయర్థిక  వ్యవస్థలో భాగంగా, భారత రాజ్యాంగానికి  అనుగుణంగా, భారత చట్ట, న్యాయ వ్యవస్థలకనుగుణంగా మిగతా అన్ని రాష్ట్రాల లాగానే ఆ పరిధి లోనే ఆ పరిమితుల్లోనే జరిగింది. దీనికి భిన్నంగా ఇక్కడేదో భిన్నమైన వ్యవస్థ ఉందనీ, భిన్నమైన చట్టం , న్యాయం , రాజకీయార్థిక వ్యవస్థ అమలు చేయవచ్చనీ అనుకోవడం సరైంది కాదు. అమాయకత్వమౌతుంది. తెలంగాణ ను విముక్తి చేసి   సమసమాజాన్ని యేర్పాటు చేయవచ్చని అనుకోవడం సరైంది కాదు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో పీడిత ప్రజలు రాజ్యంస్థాపించుకోగలరు అని ఆశ పడడమూ సరైంది  కాదు. భారత రాజ్యాంగం పరిధిలో యేది సాధ్యమౌతుందో అది మాత్రమే తెలంగాణలో వీలౌతుంది. నిజానికి అత్యంత ప్రగతి శీలమైన భారత రాజ్యాంగంలో ప్రజలకు మేలు చేసే వాటన్నిటినీ అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తేవచ్చు.

ఆ దిశగా సరికొత్త పునర్నిర్మాణ ఉద్యమం నిర్మించవచ్చు. అందుకు భిన్నంగా వ్యవహరించి ప్రజలని అణచి వేసే వైఖరికి పాల్పడితే ప్రభుత్వం విధానాలను విమర్శించవచ్చు  – ఉద్యమించవచ్చు. అట్లా భారత రాజ్యాంగానికనుగుణంగా, రాజ్యాంగ పరిధిలో  తెలంగాణ లో ప్రజల విముక్తి, అభివృద్ధి, వికాసం కోసం తెలంగాణ ప్రభుత్వం (యే యితర రాష్ట్రాల ప్రభుత్వాలు యిప్పటిదాకా చేయక పోయినా, చేయ నిరాకరించినా ) సృజనాత్మకంగా యేమి చేయవచ్చో  యెజెండా మీదికి తీసుకురావాల్సిన అవసరమూ బాధ్యతా మనందరి పైనా ఉన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రస్తుత పథకాలనూ , కార్యక్రమాలనూ నిర్ణయాలనూ , పనితీరునూ , ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యెజెండా మీదికి తెచ్చిన  నినాదాలకు  (“ మన నీళ్ళూ, మన నిధులూ, మన నియామకాలూ మన కోసమే , పరాయి వలస పాలన నుండి విముక్తి, ఆత్మగౌరవ పాలనా లక్ష్యం” )  అనుగుణంగా ఉన్నయా లేదా అనే గీటు రాయి మీద పరీక్షించాల్సి ఉంటుంది. యెక్కడైనా ప్రభుత్వం దాన్ని నడిపిస్తున్న నాయకత్వమూ దీనికి భిన్నంగా ఉందనిపించినా,  మళ్ళీ ఆంధ్రా వలస పాలకులకు, దోపిడీ పెత్తందార్ల కు  అడుగులకు మడుగులొత్తినట్టనిపించినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆశలకు నష్టం కలిగించేలా వ్యతిరేకంగా ఉందనిపించినా విమర్శించాల్సిన బాధ్యత  మనపైనున్నది.

అట్లే కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు మాత్రమే కాకుండా ప్రజా బాహుళ్య  సంక్షేమం, అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి , విముక్తి, వారి కనీస జీవిత అవసరాలని తీర్చడం, అందరికీ విద్య ఆరోగ్యం, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పనా , సామాజికాభివృద్ధీ, కనీస ప్రజా స్వామిక హక్కులు  లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని తన కనీస బాధ్యతలని గుర్తుచేస్తూ నిర్మాణాత్మక విమర్శ చేయడం ఇప్పటి పరిస్థితుల్లో మనందరి బాధ్యత! ముఖ్యంగా ప్రధాన స్రవంతి రాజకీయాలకు బయట ఉండి, యెటువంటి స్వలాభాపేక్షా, స్వార్థ ప్రయోజనాలూ లేకుండా కేవలం సమాజం మేలు కాంక్షిస్తూ ఉద్యమ స్ఫూర్తి గల  వారి పై ఈ బాధ్య త మరింత యెక్కువగా ఉన్నది. అట్లే మొత్తం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఖండాంతరాలలో ఉన్నా , తమ హృదయాలను తెలంగాణ లోనే పదిలంగా ఉంచి  ఉద్యమానికీ , రాష్ట్ర యేర్పాటు తర్వాత పునర్నిర్మాణానికీ యెంతో తోడ్పడు తున్న ఎన్ ఆర్ ఐ ల పైనా ఈ బాధ్యత యెంతో ఉన్నది.

అట్లా కాకుండా మౌనాన్నీ నిర్లిప్తతనూ పాటిస్తే తీవ్రమైన నష్టాలనెదుర్కోవాల్సి వస్తుంది. మాట్లాడాల్సిన వాళ్ళు, నిర్మాణాత్మక విమర్శ చేయా ల్సిన వాళ్ళూ తమకెందుకులే అనే నిర్లిప్తత ను పాటించినా , విమర్శిస్తే యేమౌతుందో అనే సందిగ్ధం లో పడి పోయినా,  ‘యింక అంతా యింతేలే ‘ అనే నైరాశ్యంలో పడిపోయినా తెలంగాణ సమాజం చాలా కోల్పోతుంది. అప్పుడు కేవలం ప్రభుత అనుకూల వ్యతిరేక అనే స్వలాభాపేక్షకలిగిన స్వార్థ పూరిత విమర్శలే తప్ప నిజాయితీ తో కూడిన నిర్మాణాత్మక విమర్శ ఉండదు. అందువల్ల  తాను తెలంగాణ సమాజావసరాలను తీర్చడంలో యెక్కడ నిర్ధిష్టంగా విఫలమైందో , యెందుకు విఫలమైందో తెలుసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికుండదు. అటువంటి పరిస్థితుల్లో పాలకులు  తాము చేసేదే యెల్లప్పుడూ సరైంది,  విమర్శించే వారంతా తెలంగాణ ద్రోహులు అనే ద్వంద్వాత్మక వర్గీకరణ (binary categorization) చేసి నియంతృత్వ పోకడలకు పోయే ప్రమాదమున్నది.

భిన్న అభిప్రాయాలకు, వాటి ఘర్షణలకు తావు లేని సమాజం ప్రగతి దిశగా  ముందుకు నడవడం అసాధ్యం. అట్లాంటి పరిస్థితి తెలంగాణా సమాజానికి రాకుండా ఉండాలంటే ఆలోచనా పరులు, బుద్ధి జీవులూ, ఉద్యమ శక్తులూ స్వార్థ ప్రయోజనాలకతీతంగా తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై నిర్మాణాత్మక విమర్శ చేయాల్సి ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను,  అవి సరిగా లేవనుకున్నప్పుడు,  విమర్శిస్తూ , సమస్యల కు నిర్దిష్టమైన ప్రత్యామ్నాయాలను సూచించాల్సి ఉన్నది.  భిన్న అభిప్రాయాలకు చోటునిస్తూ ప్రజాస్వామికంగా చర్చ చేయాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సమాజం పునర్నిర్మాణం జరిగి సర్వతోముఖా భివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది.

-నారాయణస్వామి వెంకటయోగి

swamy1

‘లాల్ బనో ….’ కవి: అలుపెరగని ఎర్ర కవిత!

10801896_10152571579726700_7233801900523835577_n ఒకానొక జనవరి నెల సంక్రాంతి రోజుల యెముకలు కొరికే చలి కమ్ముకున్న ఉదయపు కాలం! దాదాపు 24 గంటల విరసం సర్వసభ్య సమావేశం తర్వాత చర్చల్లో వేడెక్కిన వాతావరణంలో శీతాకాలపు మంచుతెరల్ని చీలుస్తూ ఒక కంఠస్వరం – వొక కవిది ….

“తోటా రాముని తొడకు కాటా తగిలిందాని

చిలుకా చీటీ తెచ్చెరా ఓ విలుకాడ ..”

శివసాగర్ పాట – గొప్ప ఉద్విగ్నత తో పాడుతున్నది – కళ్ళు మూసుకుని పూర్తిగా లీనమై – మూసిన కళ్ళ వెనుక తడి –

మధ్యలో “వాగూ వల వల యేడ్చెరా …” అనే చరణం పాడుతున్నప్పుడు తానే వాగై వల వల యేడుస్తూ .

పాట ప్రవహిస్తోంది –

“చెల్లెలా చెంద్రమ్మా …” అంటూ మరొక పాట శివసాగర్ దే మరింత ఉద్విగ్నతతో –  ఒక చరణం లో

“కత్తి యెత్తి వొత్తి పొత్తి కడుపులో గుచ్చి …”

భూస్వామి కడుపులో చెంద్రమ్మ గుచ్చిన కత్తి కసిని గొంతునిండా నింపుకొని పదునుగా ….

ఆ పాట కాగానే మరొకటి శివసాగర్ దే ….

“మేరిమి కొండల్లో మెరిసింది మేఘం …”

ఉద్యమాల్లో వెనుదిరుగక మునుముందుకే యెన్ని త్యాగాలకైనా సిద్ధమై పడవను నడిపే విప్లవకారుల నుద్దేశించిన పాట –   అట్లా వరుసగా పాడుతూనే ఉన్నారాయన! అలుపు లేదు – గొంతులో అదే ఉద్విగ్నత జీరగా – అరమోడ్పు కళ్ళ వెనుక అదే తడి – అదే ఆవేశం, అదే యెమోషన్ –

ఆయనే యెన్ కే. యెన్ కే పేరు తో కవిత్వం రాసి కవి గా ప్రసిద్దికెక్కిన అతని పూర్తి యెన్ కే రామారావు అని తర్వాత తెలిసింది. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ లాబ్ లో రసాయనాలతో పని చేసే ఆయన జీవిత సత్యాలని మానవ సంబంధాల రసాయనాలతో ప్రయోగాలు చేసి కనుక్కుని వచన కవిత్వం లోనూ పాటల్లోనూ అద్భుతంగా పలికించాడు. ముఖ్యంగా విరసం సమావేశాలకు, ఆయన వస్తాడు పాడతాడు అని, ఆశగా వెళ్ళేవాళ్ళం.

యెందుకంటే మాకు ఆ అవకాశం వేరే సందర్భాల్లో దొరికేది కాదు. ఆయన కనబడగానే యెన్ కే పాట పాడవా అని అడిగామో లేదో ఒక పక్క కూర్చుని కళ్ళు మూసుకుని పాడే వాడు. శివసాగర్ అగ్నాతంలోనుండి రాసి పంపే ప్రతి పాటకు బహుశా తనదైన ట్యూన్ కట్టి గొప్ప నిమగ్నతతో ఉద్విగ్నతతో పాడే వారు యెన్ కే. ఆయన కవిత్వం కూడా అంతే ఎమోషనల్ గా ఉండేది. ఆయన రాసిన పాటల్లోనూ తనదైన ఒక విశిష్టత – ముఖ్యంగా చిత్తూరు లో బూటకపు యెంకౌంటర్ లో పోలీసులచే హత్య చేయబడ్డ నాగరాజు గురించిన పాట

ఒక చేత్తో కన్నీరు తుడుచుకుని

వేరొక చేత్తో ఎర్ర జండ యెత్తుకుని

అంటాము మేము నాగరాజు

గుండెల మండేవు రాజుకుని రోజు రోజు

తెనాలి సభలో ... (జుగాష్ విలి సౌజన్యంతో)

తెనాలి సభలో …
(జుగాష్ విలి సౌజన్యంతో)

యిది యెన్ కే పాడుతుంటే వినడం ఒక అనుభవం. మొదటి సారి విన్నప్పుడే విపరీతంగా నచ్చేసి నాకు వచ్చీ రాని శ్రుతి లయ తాళాలతో పాడడానికి ప్రయత్నించే వాణ్ణి. ఈ పాట నాకూ నా సన్నిహిత మిత్రబృందం సుధాకిరణ్, ప్రకాష్ లకు చాలా యిష్టం కూడా! అట్లే మిత్ర (అమర్ ) కూడా బాగా యిష్టపడేవాడీ పాటను. నా ట్యూన్ మిత్ర నుండే నేర్చుకున్నా (యెన్ కే పాడే ట్యూన్ కొంచెం వేరని తెలుసు, కానీ నాకెప్పుడూ అది పట్టుబడలేదు – ఆ విషయం విమల (కవి) చెప్పే దాకా నాకు తెలియలేదు ).

దూరాన తెరచాప అంచు

క్రమించి నావ తీరమాక్రమించు

ఉదయించే తొలివెలుగుల తూర్పు

ఆర్పలేదు విప్లవాన్ని యే పడమటి గాడ్పు

తెరచాపలు గాలి లోన ఆడుదాక

ఆకాశం యెర్రకాంతులీనుదాక

అంటాము మేము నాగరాజు

నువ్వు అమరుడివీ అమరుడివీ యీ రోజూ యే రోజూ …

 

యెప్పుడు ఈ పాట గుర్తుకొచ్చినా, నాలో నేను పూర్తిగా పాడుకుని యెన్ కే నూ, విప్లవం లో అమరులైన వేలాది మందినీ గుర్తు తెచ్చుకోవడం నాకు అలవాటయిపోయింది. యింక ఆ యెన్ కే గొంతు యెన్నడూ వినబడదంటే చాలా దుఃఖంగా ఉంది. గొంతు కు శాశ్వతంగా యేదో అడ్డం పడ్డట్టుంది. గ్నాపకాలు తేనెటీగల్లా ఝుమ్మంటూ ముసురు కుంటున్నాయి.

గద్వాల విరసం సభ్లలో యెన్ కే ఒక్ అద్భుతం చేసారు. ఆ రోజుల్లో ప్రగతి శీల శక్తులపై యే బీ వీ పి, ఆర్ యెస్సె స్ శక్తుల దాడులు విపరీతంగా ఉండేవి. దాదాపు వారానికి రెండు మూడు సంఘటనలు జరిగేవి. చాలా మంది ఆర్ యెస్ యూ పీ డీ యెస్ యూ కార్యకర్తలు ఆ దాడుల్లో అమరులయ్యారు కూడా! హైదరాబాదు లో వరంగల్ లో చాలా గోడల మీద యే బీ వీ పి వాళ్ళు ‘లాల్ గులామీ ఛోడో బోలో వందే మాతరం’ అంటూ రాసేవారు . దేశభక్తి అంటే తమ స్వంత సొత్తు అయినట్టు వందేమాతరం పై తమదే హక్కు అన్నట్టు యే బీ వీ పీ కార్యకర్తలు ప్రవర్తించే వారు. దౌర్జన్యానికి పాల్పడేవారు. ప్రగతిశీల విద్యార్థులది విదేశీ సిద్దాంతమని వారి ప్రధాన ఆరోపణ! అట్లా మతోన్మాద శక్తులు విచ్చలవిడిగా చరిత్రను వక్రీకరించి వీరవిహారం చేస్తున్న రోజుల్లో వారికి ధీటైన సరైన సమాధానం చెప్పడానికి మేమంతా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ‘లాల్ బనో గులామీ ఛోడో బోలో వందేమాతరం’ అంటూ ఒక అద్భుతమైన దీర్ఘకావ్యాన్ని రాసారు యెన్ కే!

మొత్తంగా ప్రపంచ, భారత దేశ చరిత్రనూ, నాగరికతనూ కవిత్వాత్మకంగా చెప్తూ , జాతీయోద్యమ కాలంలో వందేమాతరం యెట్లా ఉద్భవించిందో అది యెట్లా ప్రగతిశీలమైందో సోదాహరణంగా వివరిస్తూ చాలా ఉద్విగ్నంగా అద్భుతంగా , ఒక్కొక్క కవితా చరణం ఒక గొప్ప నినాదమంత గొప్పగా (కవిత్వం నినాదప్రాయం అవుతుందనే వారు, ఒక చరణం నినాదం కావాలంటే యెంత గొప్ప కవిత్వం కావాలో మనకున్న గొప్ప నినాదాలని పరిశీలిస్తే అవగతమౌతుంది) మొత్తం దీర్ఘ కావ్యం సాగుతుంది. ఆ రోజుల్లో మాకు ఆ కావ్యం గొప్ప ఆయుధం. యెక్కడ మతోన్మాద శక్తులతో తలపడాల్సి వచ్చినా ఆ కావ్యం గొంతెత్తి బిగ్గరగా చదివేది. ఆ కావ్యానికి మా ప్రత్యర్థుల దగ్గర సమాధానం ఉండేది కాదు. అట్లా ఆర్ యెస్సె యెస్ యేబీ వీ పి శక్తుల ప్రాబల్యం చాలా బలంగా ఉన్న గద్వాల లో విరసం మహాసభలు జరిపింది.

చివరి రోజు జరిగిన మహా సభలో పాటలు, ఉపన్యాసాల మధ్య యెన్ కే ను ‘లాల్ బనో గులామీ చోడో ..’   చదవమన్నారు. యేకబిగిన ఒక అరగంట పాటు అరుదైన శైలితో, గొప్ప ఉద్విగత, ఆవేశమూ , తడి నిండిన తన గంభీర కంఠస్వరంతో యెన్ కే కావ్యాన్ని గానం చేసారు. వచన కావ్యమైన ‘లాల్ బనో …; ను లయబద్దంగా యెన్ కే చదువుతుంటే వినడం ఆ రోజు ఒక జీవితకాల అనుభవం! యిప్పటికీ యెప్పటికీ మర్చిపోలేని గొప్ప మహత్తర అనుభవం! దాదాపు పది వేల మందికి పైగా హాజరైన ఆ బహిరంగ సభ మొత్తం నిశ్శబ్దంగా పూర్తి నిమగ్నమై విన్నారా కావ్యాన్ని! అయిపోగానే కెరటాల చప్పుడులా కరతాళధ్వనులు! యెన్ కే ను మనసారా అభినందించి కౌగలించుకున్నాము – ఆ రోజునుండీ ప్రగతిశీల శక్తుల చేతుల్లో గొప్ప ఆయుధమైంది యెన్ కే ‘లాల్ బనో ..’ కావ్యం! మా హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు యెన్ కే !

తర్వాత దాదాపు పదికి పైగా సభల్లో (నేను హాజరైనవి..) యెన్ కే ‘లాల్ బనో ..’ కావ్యాన్ని గానం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ కావ్యం చాలా ప్రాచుర్యం పొందింది. అనేక ముద్రణలు పొందింది. పాపినేని శివశంకర్ సంకలనం చేసిన ‘కవితా ఓ కవితా ‘ లో చోటు సంపాదించుకుంది. మళ్ళీ మతతత్వ శక్తులు పేట్రేగిపోతున్న ఈ రోజుల్లో యెన్ కే ‘లాల్ బనో …’ మళ్ళీ వెలుగు చూడాల్సిన అవసరం యింకా యెక్కువ ఉన్నది. ‘లాల్ బనో…’ కావ్యం ప్రగతిశీల శక్తుల అమ్ముల పొదిలో ఒక విలువైన బాణం.

యెన్ కే సృజన సాహితీ మిత్రుల్లో ఒకరనీ, బహుళ ప్రాచుర్యం పొందిన పాటలూ, కవిత్వమూ అనేకం రాసారని తెలిసి ఆయన మీద గౌరవం పెరిగింది.తర్వాత ఆయనను యెక్కువ ప్రత్యక్షంగా కలవలేకపోయినా ఆయన సమాచారం తెలుస్తూ ఉండేది. ఆయన కవిత్వం, పాటలు యెప్పుడూ గుండెల్లో మార్మోగుతూ ఉంటుంది. అద్భుతంగా అనేక పాటలని తన గొంతులో ప్రతిధ్వనించిన యెన్ కే అనారోగ్యం పాలయ్యారని, సరిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని తెలిసి చాలా బాధ కలిగింది. ఇవాళ్ళ యెన్ కే యింక మనకందనంత దూరం వెళ్ళిపోయారని తెలిసి హతాశుణ్ణయ్యాను. ఆయన కంఠస్వరం. కళ్ళలోనూ మనసులోనూ యెన్నడూ ఆరని తడి, గొప్ప ఆత్మీయతా , స్నేహస్వభావం యెన్నడూ మర్చిపోరానివీ, యెప్పుడూ వెన్నంటే ఉంటాయి.

-నారాయణస్వామి వెంకట యోగి

 

PK:చీకటి మత గురువులపై చెర్నాకోల

imagesHJG8UATD

ఆ మధ్య ఆఫీసులో ఒక స్నేహితుడు నాకు సంగీతమంటే ఇష్టమంటే యే సంగీతం ఇష్టం ఏ సంగీత కారులు ఇష్టం అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయనకూ సంగీతమంటే ప్రాణమని ఉపోద్ఘాతమిస్తూ ! నాకు హిందుస్తానీ అంటే చాలా ఇష్టం – ముఖ్యంగా బడే ఘులాం అలీ ఖాన్ అంటే అని నేను చెప్ప గానే నొసలు చిట్లించి యేం ఇక గాయకులే కరువా? ఆయన తప్ప మరొకరు లేరా? అంటే యెందుకు లేరు ఉస్తాద్ హమీద్ అలీ ఖాన్ , ఉస్తాద్ రషీద్ ఖాన్ ఉస్తాద్ అమీర్ ఖాన్ అని నేను పేర్లు చెప్తుంటే నన్ను ఆపేసాడు. వద్దు వద్దు ఇంక ఆపు – ఇంకెవరూ లేరా అంటే అప్పుడు కానీ నాకు తట్ట లేదు – ఉన్నారు పండిట్ భీం సేన్ జోషి పండిట్ జస్రాజ్ పండిట్ శివకుమార్ శర్మ అంటూ పేర్లు చెప్తుంటే ఆయన ముఖం కొంచెం వికసించింది. అయినప్పటికీ ముఖం గంభీరంగా పెట్టుకుని నాకందుకే ముస్లిం లు పాడే హిందుస్తానీ సంగీతమన్నా, ఖాన్ లు  డామినేట్ చేసే  హిందీ సినిమాలన్నా అసలు ఇష్టం ఉండదు. మొత్తం వాళ్ళే డామినేట్ చేస్తున్నారు అంటూ అసహనం ప్రదర్శించాడు. అదేమిటీ అవడానికి ముస్లిం లైనా హిందుస్తానీ సంగీతాన్ని ఔపోసన పట్టి భజనలు కూడా పాడుతున్నారు కదా అన్నాను. యేమో నాకసలు పడదు. హాయిగా కర్ణాటక సంగీతమే బాగుంటుంది హిందుస్తానీ అంటే నాకసలు పడదు అని చివాల్న లేచి వెళ్ళిపోయాడు.

ఒక భిన్నమైన వాతావరణంలో ఉన్నాం మనమిప్పుడు ముఖ్యంగా గత యేడాది కాలంగా, పార్లమెంటు యెన్నికలు జరిగి బీ జే పీ ఆర్ యెస్సెస్స్ శక్తులు అధికారంలోకి వచ్చాక! మనుషుల్ని ఫలానా అని ముద్ర వేసింతర్వాత కానీ వారి టాలెంటుని కానీ విజయాల్ని కానీ అపురూపమైన వారి వ్యక్తిత్వాల్ని చూడడానికి నిరాకరిస్తున్న వాతావరణం. ఒక సంగీత కారుడేమిటి, ఒక నటుడేమిటి ఒక సినిమా యేమిటి యేదైనా అది ఫలానా మతానికి చెందిన వారయితే దాని పట్ల యేహ్య భావం లేదా ముభావం ప్రకటించడం జరుగుతున్న వాతావరణం. ముఖ్యంగా ఇది మతానికీ, మతాచారాలకు , మత గురువులకు, మత సంప్రదాయాలకు సంబంధించిందయితే అది మరీ సున్నితమైన అంశంగా మారి వాగ్వివాదాలకు, ఘర్షణలకు దారి తీయడం జరుగుతోంది.

మతం మీద, దేవుడి మీదా, మత సంప్రదాయాలమీద, మత గురువుల మీదా విమర్శ చేసేటప్పుడు చేసే విమర్శ యేమిటి అది సరయిందా సవ్యమేనా కాదా అందులో నిజమెంత కల్పితమెంత అనే చర్చ కాకుండా విమర్శ చేసిన వాడెవడు, వాడి మతమేమిటి, వాడి కులమేమిటి, వాడి ఫలానా మతం మీదనే యెందుకు చేసాడు, వేరే మతాల మీద యెందుకు చెయ్యలేదు – మిగతా మతాలు సవ్యంగా ఉన్నాయని వాడి ఉద్దేశ్యమా లేక విమర్శ చేస్తే ఆయా మతాల వారి ఊర్కోరు గనక అన్ని విమర్శలనీ  గంగిగోవుల్లా మనమే భరిస్తున్నాం కాబట్టి మనమే తేరగా దొరికామా వాడికి – అంటూ అనేక భిన్న కోణాల్లో విమర్శ చేసిన వాడి మీద దాడి చేస్తారు. ఈ విమర్శ అంతా మనల్ని తెగిడి వేరే మతాల వారిని పొగడడానికీ నెత్తికెక్కించుకోవడానికీ మాత్రమే అని తేల్చి పారేస్తాం.

యింతకీ ఈ చర్చంతా ఈ మధ్యే విడుదలయిన పీకే అనే సినిమా గురించి అని వేరే చెప్పనక్కరలేదనుకుంటా!

పీ కే సినిమాలోకి వెళ్ళే ముందు 2012 లో వచ్చిన మరో సినిమా గురించి చెప్పుకోవాలి. ‘ఓ మై గాడ్ ‘ అనే పేరుతో వచ్చిన సినిమా దేవుని పేరు మీద జరిగే వ్యాపారాల మీదా , తంతుల మీదా, అర్థం పర్థం లేని మత సంప్రదాయాల మీద తీవ్రమైన విమర్శలే చేసింది. ఆ సినిమా లో పరేష్ రావల్ అనే నటుడు ప్రదాన పాత్ర పోషించాడు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించాడు. అయితే అన్ని విమర్శలు హేతువాద దృక్పథంతో చేసిన OMG సినిమా ఆసాంతం కృష్ణ భగవానుని పాత్ర పై ఆధారపడి నడుస్తుంది. బహుశా తన హేతు వాద విమర్శలకు, మత గురువులపై, సంప్రదాయా లపై  విమర్శలకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుందనేమో కృష్ణుని పాత్రని తోడు తెచ్చుకున్నా రు.

అయితే సినిమా గురించి సర్వత్రా ప్రశంసలూ పొగడ్తలూ  సద్విమర్శలూ మాత్రమే వినబడ్డాయి, నటుడు  పరేష్ రావల్ పై ప్రశంసల జల్లు కురిసింది. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత దాదాపు అట్లాంటి కథాంశం తోనే (అట్లా అంటే పీకే సినిమాని చిన్నది గా  చేసి  చూసినట్టు అవుతుందేమో ) వచ్చిన సినిమా పీ కే,  ఓ యెం జీ ఎక్కడ ఆగిపోయిందో  అక్కడ్నుంచి విమర్శని ముందుకు తీసికెళ్ళింది, యెక్కడ ఓ యెం జీ అధైర్య పడి విఫలమైందో  అక్కడ ధైర్యం చేసి విజయం సాధించింది (పూర్తి అని నేననను – కానీ ఓ యెం జీ కన్న ఒక పది మెట్లు ఎక్కువే) యేది చెప్పడానికి ఓ యెం జీ కృష్ణున్ని యెంచుకుందో దాన్ని మించి చెప్పడానికి పీకే మనిషిని యెంచుకుంది! అందుకే పీకే ఓ యెం జీ కన్నా చాలా అడుగులు ముందుకేసింది . అయితే మరి యెందుకు పీకే కు ఓ యెం జీ కన్నా నిందలు, తిట్లూ, శాపనార్థాలూ  ఎక్కువ వస్తున్నాయి. యెందుకు పీకే గురించి చర్చ మోడరేట్ గా జరగడం లేదు – అయితే ఒక చివర లేదూ మరో చివర అనే తీవ్ర స్థాయిలో యెందుకు జరుగుతోంది. ఓ యెం జీ వచ్చినప్పుడు యెవరూ ఆ సినిమాలో ఒక ఫలానా మతాన్నే యెందుకు విమర్శించారు యితర మతాలనెందుకు విమర్శించలేదు అని యెవరూ అడిగినట్టు గుర్తు లేదు – పీకే ను మాత్రం యెందుకు యితర మతాలని విమర్శించలేదు అని తీవ్రంగా దూషిస్తున్నారు.

నా మట్టుకు నాకు కొన్ని  కారణాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మొదటిది పరేష్ రావల్ మతం, అతని రాజకీయ విశ్వాసాలు, అతని రాజకీయ పార్టీ – రెండోది –పోయిన యెన్నికల్లో ఆ పార్టీ భారీ మెజారిటీ తో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. గత యెన్నికల విజయం తర్వాత భారత దేశ రాజకీయాలని శాసిస్తున్న అభిప్రాయాలు విశ్వాసాలు, యెటువంటి విమర్శలనూ యెంతమాత్రమూ సహించలేని ఒక తీవ్రమైన అప్రజాస్వామిక పరిస్థితి  దేశంలో భౌతికంగానూ, ప్రపంచ వ్యాప్తంగా దేశీయుల virtual world లోనూ నెలకొని ఉన్నది. తామనుకున్న అభిప్రాయాలపై  యెటువంటి  విమర్శను కానీ చర్చను గానీ సహించక దాడులకు దిగే ఒక అప్రజాస్వామిక పరిస్థితి. ముఖ్యంగా ఒక మతం వారిపై ప్రకటిత అప్రకటిత ద్వేషాలతో రగిలిపొతూ వారిని తీవ్రంగా isolate చేసే పరిస్థితి. అందుకే పీకే సినిమా వెనుక ప్రదానంగా ఉండి, తెరపై ఆ పాత్ర పోషించిన ఆమిర్ ఖాన్ ముస్లిం కావడం వల్లా సినిమా పై విమర్శలూ దాడులూ ప్రధానంగా ఆ కోణం నుండే జరుగుతున్నాయి.

యింతకీ పీకే సినిమా లో ఉన్నదేమిటి? అందులో చిత్రించిదేమిటి, చర్చించిదేమిటి? యెందుకింత రభస జరుగుతోంది? స్థూలంగా పీకే కథ ఇది – మనుషులు నివసించడానికి అనువైన మనలాంటిదే మరో గ్రహం (కొన్ని కాంతి సంవత్సరాల దూరం లో ఉన్నది) నుండి ఒక అంతరిక్షనౌక లో ఒక గ్రహాంతరవాసి భూమి మీద అడుగు పెడతాడు. అడుగు పెట్టీ పెట్టడం తోనే తాను వచ్చిన అంతరిక్షనౌక ను తిరిగి పిలవడానికి ఉపయోగించే రిమోట్ కంట్రోల్ చోరీ అవుతుంది. యిక తర్వాత ఆ గ్రహంతర వాసి తన రిమోట్ కంట్రోల్ ని తిరిగి సాధించుకోవడానిక్ చేసే నానా ప్రయత్నాలే సినిమా కథ.

తన గ్రహంపై బట్టలు లేకుండా నగ్నంగా ఉండే గ్రహాంతర వాసి భూమ్మీద మనుషుల్ని చూసి బట్టలు  కట్టుకోవడం తెల్సుకుంటాడు. పోయిన తన రిమోట్ కోసం దేవుళ్ళని ప్రార్థించాలనీ , అందుకు భూమ్మీద అనేక దేవుళ్ళున్నారనీ  , ఆయా దేవుళ్ళకు వేర్వేరు నివాసాలున్నాయని (చర్చి, గుడి, మసీదు వగైరా ), ఆయా దేవుళ్ళకు బ్రోకర్లు, మేనేజర్లు అనేకం ఉన్నారని, ఆయా దేవుళ్ల దగ్గరికి చేర్చడానికి అనేక మార్గాలూ మతాలున్నాయని అర్థం చేసుకుని తన ప్రార్థనలు మొదలు పెడతాడు. అన్ని ప్రార్థనలూ విఫలమౌతాయి. యే  దేవుళ్ళూ ఆయన ప్రార్థనలు వినరు. యింక విసుగొచ్చి, నిరాశ నిస్పృహ లకు లోనయి దేవుళ్ళు కనబడడం లేదు అని కరపత్రాలు పంచుతున్నప్పుడు జగ్గు అనే ఒక టీ వీ రిపోర్టర్ కు పరిచయమౌతాడు. ముందు యితని కథ నమ్మక పోయినా , చేతులు పట్టుకుని మనసుల్ని చదవగలనని నిరూపించిన జగ్గు  తర్వాత అతనికి సాయం చెయ్యాలనుకుంటుంది. పోయిన రిమోట్ కంట్రోల్ తన కుటుంబం అమితంగా గౌరవించి కొలిచే తపస్వి అనే మత గురువు తనకు హిమాలయాల్లొ దొరికిన శివుని గజ్జె అని ప్రచారం చేసుకోవడం చూసి యెట్లాగయినా దాన్ని తిరిగి పీకే కి ఇప్పించాలనుకుంటుంది. అమాయకత్వం తో పీకే వేసే సూటి ప్రశ్నలు మతగురువులు దేవున్ని చేరుకోడానికి రాంగ్ నంబర్లని వాటిని వ్యతిరేకించాలని మీడియా ద్వారా  ఒక ఉద్యమం లేవదీస్తుంది.

అయితే జగ్గు తాను బెల్జియం లో చదువుకునేటప్పుడు పాకిస్తాన్ కు చెందిన ఒక ముస్లిం యువకున్ని ప్రేమిస్తుంది. తన కుటుంబ గురువు అయిన తపస్వి ముస్లిం  మతానికి చెందిన వారంతా నమ్మక ద్రోహులు  కాబట్టి ఆ యువకుడు కూడా ఆమెకు ద్రోహం చేస్తాడని చెప్పడం నిజంగానే తనకు ద్రోహం జరగడం ఆమె మనసులో చెరగని ముద్ర వేస్తుంది. సినిమా చివరి ఘట్టానికి ముందు తీవ్రవాదుల (ముస్లిం) బాంబు దాడిలో తనకు తొట్ట తొలుత ఆశ్రయమిచ్చిన భైరన్ సింగ్ తన రిమోట్ చోరీ చేసిన వ్యక్తీ మరణించడంతో తన చివరి ఆశా కోల్పోయిన పీకే చివరి ఘట్టం లో టీవీ స్టూడియో లో తపస్వి తో తలపడతాడు. దేవుళ్ళనీ , ‘ధర్మాన్నీ’  రక్షించే మహా బాధ్యత మత గురువులు తీసుకోవాల్సిన అవసరం లేదనీ, అన్నిటికన్న మానవత్వం గొప్పదనీ, దాన్ని కాపాడాలనీ, యెవడూ ఈ భూమ్మీద ఫలానా మతస్తుడనే స్తాంపుతో పుట్టరనీ, అట్లే ఫలానా మతస్తులంతా మోసగాళ్ళో నేరస్తులో కారనీ అందరూ ఆ సృష్టికర్తముందు సమానమనీ, ఆ సృష్టికర్త తన రక్షణ తాను చూసుకుంటే మనుషులు మానవీయతను కాపాడాలనే సందేశంతో ముగుస్తుంది.

మొత్తం సినిమాలో పొరపాట్లు లేవని కాదు . కొంత నాటకీకరణ, కొని నమ్మశక్యం కాని కల్పనలు, సినిమాటిక్ స్వేచ్చలూ, డాన్సింగ్ కార్ల లాంటి వెకిలి తనమూ ఉన్నది. సినిమా హాస్య ప్రదానంగా సాగినా అటువంటివి సినిమాని పలుచన చేస్తాయి. ఒక వేశ్య దగ్గర 6 గంటల్లో భాష మొత్తం నేర్చుకున్న(సినిమాలో తీసుకున్న ఇదో  స్వేచ్చ) పీకే కాండోమ్స్ గురించి తెలవనట్టు ప్రశ్నించడం వెకిలితనానికి పరాకాష్ట. అయినప్పటికీ  ఈ లోపాలనన్నింటిని అధిగమించి సినిమాని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది దాని కథాంశం. దాదాపుగా ఇదే కథాంశంతో ఓ యెం జీ వచ్చిన పీకె ఆ సినిమాని దాదాపు అన్ని అంశాల్లోనూ మించిపోయింది. పాత్ర చిత్రీకరణే ప్రదాన తేడా! పీకే లో ప్రధాన పాత్ర ఒక అమాయకుడు. ఈ లోకం పోకడలు తెలువని ఒక పసివాడి లాంటి వాడు. ప్రశ్నించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, మానవీయంగా ప్రవర్తించడం మాత్రమే అతనికి తెలుసును.

ఓ యెం జీ లో ప్రదాన పాత్ర ఒక వ్యాపార వేత్త – వ్యాపార దృష్టి తోనీ దేవుళ్ళనీ దేవుళ్ళ పేర్ జరిగే తంతునీ వ్యతిరేకిస్తాడు. పీకే లో కేవలం ఒక మతం పైననో ఒక దేవుని పైననో మాత్రమే విమర్శ చేయలేదు. అందరు దేవుళ్లనూ అన్ని మతాలనూ హేతుబద్దంగా ప్రశ్నించారు. దేవుళ్లకి బ్రోకర్లుగా మేనేజర్లుగా తమను తాము చెప్పుకుంటున్న వారిని విమర్శించారు. దేవునితో మాట్లాడుతున్నాము, మాట్లా డుతాము మాట్లాడిస్తాము అని,  మనుషుల భయాలనీ, అభద్రతలనీ  మూఢ భక్తి గా మార్చుకుని కోట్లకు పడగలెత్తుతూ,  రాజకీయ పలుకుబడులతో  అండదండలనీ, భోగభాగ్యాలనూ  అనుభవిస్తూ భారతీయ సమాజం శాస్త్రీయంగా హేతుబద్దంగా ముందుకు పోకుండా అంధకారం లో కి నెట్టి వేస్తున్న నియంతల్లాంటి మతగురువులను యెండగడుతుందీ సినిమా! వారిని గుడ్డిగా నమ్ముతున్న కోటానుకోట్ల భక్త జనానికి కనువిప్పు కలిగించే ప్రయ్నం చేస్తుందీ సినిమా! ఆ ప్రయత్నం లో సినిమా సఫలీకృతమయ్యిందనే చెప్పాలి.

అయితే సినిమా మీద వస్తున్న విమర్శలు చిత్రంగా ఉన్నయి. ఒకటి ఆమిర్ ఖాన్ ముస్లిం కావడం వల్ల హిందూ మతాన్ని విమర్శించాడనీ (సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ, నిర్మాత విధు వినోద్ చోప్రా  హిందువులే మరి) , సినిమా లో పాకిస్తాన్ కు చెందిన ఒక ముస్లిం యువకున్ని మన దేశానికి చెందిన మతగురువు కన్న యెక్కువ నమ్మకస్తునిగా చూపించి మన మతాన్నీ ప్రజలకు ఆరాధ్యులైన మతగురువులని మన ‘శత్రు దేశమైన’ పాకిస్తానీయుని కన్నా హీనంగా చూపించడం ఘోరమైన నేరమనీ మరో  విమర్శ. హిందూ దేవుళ్ళని, విగ్రహారాధనీ తూలనాడాడని, ముస్లింలని క్రైస్తవులనీ యెమీ విమర్శించలేదని యింకో విమర్శ! యివేవీ నిజాలు కావు.

అయినా నిజమైన మానవత్వం యెక్కడున్నా దాన్ని స్వీకరించాలనే కనీస యింగిత ఙ్నానాన్ని మన పొరుగు దేశమ్మీద ఉన్న ద్వేషం మింగేయడం విచారకరం. ప్రతి దాన్నీ మత దురహంకారమూ  , విమర్శ సహించలేని చాందసవాదమనే  నల్ల కళ్ళద్దాలని పెట్టుకుని చూస్తే అట్లానే అనిపిస్తుంది. అయితే కొన్ని సార్లు అమాయకత్వంతోనో  , వినికిడి ఙ్నానంతోనో కూడా అటువంటి అభిప్రాయం కలగవచ్చు. మన మతాన్ని విమర్శించారు అన్న కోపం కన్నా వేరే మతాలను విమర్శించలేదు అనే క్షోభ సరైంది కాదు. అది మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయదు. పైగా వెరే మతాలు వెనుకబడి ఉన్నాయి, మూర్ఖంగా ఉన్నాయి కాబట్టి మేమూ  అట్లే యింకా వీలయితే అంతకన్నా హీనంగా ఉండడమే బాగుంటుంది అనుకుంటే అది  మనం హాయిగా మరింతగా తిరోగమించడానికి దోహదం చేస్తుంది.

సినిమాలో ప్రొజెక్ట్ చేసి, చర్చించిన అంశాలమీద దృష్టి వుంచి చర్చ జరిగితే అది మన పొరపాట్లని సరిదిద్దుకోవడానికీ మానవీయంగా, శాస్త్రీయంగా, హేతుబద్దంగా  ముందుకు పోవడానికి ఉపయోగబడుతుంది. లోపాల్ని యెత్తి చూపే చూపుడు వేలు యెటువంటిది అది యెవరిది అనే శుద్ద చాందస తర్కంలోనే మునిగిపోతే మనకు ఆ చూపుడు వేలే తప్ప మన లోపాలెప్పుడూ మనకు కనబడవు – మనల్ని మనం యెప్పుడూ సరిదిద్దుకునే అవకాశమూ రాదు యెప్పుడూ మన చూపుడు వేలు వేరే వాళ్ల వైపు ఎత్తి చూపడం తప్ప!

-నారాయణస్వామి వెంకట యోగి

swamy1

ఈ సాహిత్య నోబెల్ మరో ‘రాజకీయ’ దురాక్రమణ!

untitled

ప్రతి యేటా అక్టోబర్ మొదటి వారం రాగానే సాహితీ ప్రియులంతా ఆత్రుతగా యెదురు చూసేది, ఈ యేడు సాహిత్యంలో నోబెల్ బహుమతి యెవరికొస్తుందా అని! దాదాపు నెల రోజుల ముందు నుండే ప్రపంచ వ్యాప్తంగా నోబెల్ బహుమతి విజేతలు యెవరౌతారా అని బెట్టింగ్ ప్రారంభమౌతుంది! ఇంగ్లాండ్ కు చెందిన లాడ్ బ్రోక్స్ అనే బెట్టింగ్ సంస్థ వెబ్ సైట్ లో ప్ర్తతి యేడు లాగానే ఈ సంవత్సరం కూడా యెవరు నోబెల్ ఫేవరైట్స్ అని బెట్టింగ్ ప్రాంభమైంది . జపాన్ కు చెందిన నవలా రచయిత హారుకి మురకామి, సిరియా కు చెందిన మహాకవి అదోనిస్, అమెరికా కు చెందిన నవలా రచయిత ఫిలిప్ రాథ్ అమెరికా కవి గాయకుడు బాబ్ డిలాన్ తదితరులు దాదాఉ ప్రతి సారీ ఈ బెట్టింగ్ లలో ప్రధానంగా కనబడతారు.

కీన్య రచయిత గూగీ

కీన్య రచయిత గూగీ

అయితే ఈ సారి దాదాపు అన్ని బెట్టింగ్ లలో ప్రముఖ కేన్యా రచయిత న్గూగి వాథియాంగో ముందు వరసలో వినబడింది. గత రెండు మూడు యేండ్లుగా అదోనిస్ పేరూ వినబడింది. అమెరికన్ నవలా రచయిత ఫిలిప్ రాథ్ ప్రతి యేటా వినబడుతూనే ఉంది. బహుశా నాలాంటి వాళ్ళకు మాత్రం న్గూగి పేరు వినబడడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రజల విముక్తి కోసం నిలబడి, ప్రజా ఉద్యమాల్లో భాగమై, ప్రజాస్వామ్యం కోసం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం రచనలు చేసి, అనేక మార్లు జైలు పాలయి, ప్రవాసంలోకి నెట్టబడి , వ్యక్తి గతంగా యెన్నో ఒడిదుడుకులకు, ఇబ్బందులకు, కష్టాలకు లోనైనా వెనుకంజ వేయకుండా గొప్ప నిబద్దతతో ఉద్యమ సాహిత్యం సృష్టిస్తున్న న్గూగి కి నోబెల్ రావచ్చేమో అని ఒకింత ఆశ కూడా కలిగింది. నిజానికి గత రెండు మూడేళ్ళ నుండి అరబ్ మహాకవి అదోనిస్ కు రావాలని చాలా ఆశ కూడా ఉండింది. పాలస్తీనా మహాకవి దార్వీష్ ని (ఆయన జీవించి ఉన్నపుడు) , అదోనిస్ ని , న్గూగి ని నోబెల్ కమిటీ గుర్తిస్తుందని అనుకోవడం అత్యాశే నేమో!

అవార్డుల పట్ల మోజూ, యేవో అవార్డులొస్తేనే రచయితలు కవులు గొప్పవారనే దురభిప్రాయం లేకున్నా, ఆ అవార్డ్ ద్వారా, ముఖ్యంగా నోబెల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అవార్డు ద్వారా వారు ప్రతినిధులుగా ఉన్న ప్రజలూ వారి ఉద్యమాలూ , కన్నీళ్ళూ, కష్టాలూ, యుద్ధాలూ, జీవన్మరణ పోరాటాలు – వీటన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుందనీ, వెలుగు లోకి వస్తాయనీ ఒక ఆరాటం! వాటికి ఒక వేదిక, జాగా దొరుకుతుందని తండ్లాట!

చివరకు సాహిత్యం లో నోబెల్ ప్రకటించబడ్డది – ఫ్రెంచి రచయిత పాట్రిక్ మాడియానో కు నోబెల్ ఇచ్చారు. నాజీ దురాక్రమణలో నలిగిపోయి మరుగునపడిన జీవన ప్రపంచాల్ని , పట్టుచిక్కని మానవ అనుభవాలని ఆయన రచనల్లో గొప్ప గ్నాపక కళతో వెలికితీసినందుకు’ ఆయనకు నోబెల్ ఇచ్చినట్టు కమిటీ ప్రకటించింది. యెప్పుడూ వినలేదు చదవలేదు యెవరీ మాదియానో అని దాదాపు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఒక్క ఫ్రెంచివాళ్ళు తప్ప. ఫ్రాన్సు లో ఆయన బాగా ప్రసిద్ధి చెందిన రచయిత నట! కొన్ని మినహాయింపులతో ఆయన ప్రముహ ఫ్రెంచి రచయిత ప్రౌస్ట్ అంత వాడట! ‘తప్పిపోయిన మనిషి’ అనే 130 పేజీల నవల ఫ్రాన్సు లో బాగా ప్రసిద్ది చెందినదట! తన గ్నాపకశక్తి కోల్పోయిన ఒక డిటెక్టివ్ తన అస్తిత్వం కోసం చేసిన ప్రయత్నాన్ని ఆ నవల చిత్రించిదట! డిటెక్టివ్ నవలా ప్రక్రియకి (genre) చెందినదట! కోల్పోయిన జీవితాన్ని వెతుక్కోవడం లో ఉండే సమస్యలని (వెతుక్కోవడమూ, పొందడమూ, దాన్ని అర్థం చేసుకోవడమూ కాదు) మాదియానో తన రచనలలో చిత్రించాడని, చాలా సరళంగా , సులభంగా రాసినట్టున్నా మాదియానో రచనల్లో అత్యంత సంక్లిష్టమైన మానవ జీవితం ప్రతిఫలిస్తుందని పత్రికలు రాసాయి.

అయితే మాదియానో ఫ్రెంచ్ దేశస్తుడు – ఇప్పటి దాకా 14 ఫ్రెంచి రచయితలకు నోబెల్ వచ్చింది. ఈయన 15 వ వాడు. మాదియానో యూదుడు – ఇప్పటిదాకా 13 మంది యూదులకు (కేవలం సాహిత్య రంగంలోనే ) నోబెల్ వచ్చింది ఈయన 14 వ వాడు. అట్లా అని ఫ్రెంచి వాళ్ళకు యూదులకు నోబెల్ రావద్దని కాదు – కేవలం ప్రతిభనాధారం చేసుకునే నోబెల్ ఇస్తున్నారని మనమనుకుంటే అది అసాధ్యం కూడా కాకపోవచ్చు! కానీ నోబెల్ ప్రధానంగా ఐరోపా వారినే వరిస్తుందనీ, అదీ 1948 తర్వాత యూదులకే ఎక్కువసార్లు ఇచ్చారనీ (సాహిత్యమూ యితర రంగాల్లో కూడా) అపవాదు నోబెల్ కమిటీ పైనున్నది. అయితే అది పెద్ద సమస్య కాదు.

నిజంగానే యూదులు ప్రతిభావంతులు కాబట్టి వారికే నోబెల్ వస్తుందనీ అనుకోవచ్చు. నాజీ దురాక్రమణ , హోలోకాస్ట్ అనేవి మానవ జాతి చరిత్రలో పెద్ద మచ్చలే! వాటి గ్నాపకాలు వెంటాడి వేటాడుతుంటాయి నిజమే! కానీ ప్రధానంగా యూదులచే నడుపబడుతున్న పాశ్చాత్య రాజకీయార్థిక చట్రమూ (ప్రభుత్వాలూ, ఆర్థిక వ్యవస్థలూ ) దాని చే నియంత్రించబడుతూ తిరిగి దానిని ప్రభావితం చేస్తున్న సాంస్కృతిక వ్యవస్థా నాజీ దురాక్రమణనూ, హోలోకాస్టునూ విపరీతంగా ప్రచారం చేసాయి. ప్రపంచ సాంస్కృతిక చరిత్రా గమనమూ అంతా వాటిచుట్టే తిప్పాయి. అవే యింకా ప్రదాన సమస్యలుగా, అవి తప్ప ప్రపంచప్రజలకు యింక వేరే యే కష్టాలూ కన్నీళ్ళూ లేవన్నట్టుగా తీవ్రంగా ప్రచారం చేసి వాటిని ఒక సాంస్కృతిక వ్యవస్థలుగా యేరాటు చేసినయి. ఒక్క తీరుగా మనల్ని నమ్మించినయి.

ఎడోనిస్

ఎడోనిస్

నిజమే నాజీ ల దురాక్రమణలో యూదులు చెప్పనలవి కాని కష్టాలు పడ్డారు. కాదనడం లేదు. చరిత్రలో పాలకులు యెప్పుడూ ఒక పని చేస్తూ ఉంటారు. తమ చరితే ప్రజల చరిత్ర అనీ , తమ కష్టాలే అందరి కష్టాలూ అనీ, తమ సంస్కృతే అందరి సంస్కృతి అనీ ప్రచారం చేసి ఒక వ్యవస్థగా యేర్పాటు చేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓటమి తర్వాత దేశదేశాలకు వలసపోయిన యూదులకు ఒకే దేశం పేరు మీద ‘తమ దేశం ఇజ్రాయిల్’ అని ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఆయువుపట్టైన చమురు విస్తారంగా దొరికే మధ్యధరా సముద్ర తీర ప్రాంతాన్ని కబ్జా చేసుకోవడానికి, అక్కడి అరబ్బుల మీద ప్రత్యక్ష పెత్తనం చలాయించడానికి అమెరికా ఐరోపాలు కుట్రపూరితంగా ఇజ్రాయిల్ ని యేర్పాటు చేసారు. అప్పటిదాకా అక్కడ నివసిస్తున్న పాలస్తీనా ప్రజలని నిర్వాసితుల్ని చేసారు. పాలస్తీనా ప్రజలని తమ దేశంలోనే కాందిశీకుల్ని చేసి ఆ ప్రాంతాన్ని దురాక్రమించుకున్నారు.

యిప్పటికీ ఆ దురాక్రమణ కొనసాగుతున్నది. గత ఆరు దశాబ్దాలకు పైగా అక్కడి ప్రాంతం పాలస్తీనా ప్రజల నెత్తురు కన్నీళ్ళతో తడిస్తున్నది. నిన్న గాక మొన్న ఇజ్రాయిల్ గాజా మీద నెల రోజులకు పైగా యెడతెరిపిలేని దాడులు చేసి ఆప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వెయ్యి మందికి పైగా పాలస్తీనా ప్రజలను (స్త్రీలు పిల్లలు ముఖ్యంగా) హత్య చేసి లక్షలాది ప్రజల్ని నిర్వాసితుల్ని చేసింది. ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేసింది. నిజానికి నాజీ దురాక్రమణ, హోలోకాస్టు గత ఆరు దశాబ్దాలకు పైగా ఇజ్రాయిల్ అమెరికా ఐరోపా దేశాల సహయంతో పాలస్తీనా ప్రజలమీద చేస్తున్న దురాక్రమణ దాడుల ముందు వెల వెల బోతాయి. ఇజ్రాయిల్ అంత దుర్మార్గంగా దాడులు హత్యలు దురాక్రమణ చేస్తూ అది ఆత్మ రక్షణకోసమే అని బుకాయిస్తోంది కూడా!

బెంజమిన్ నెతన్యాహూ ని మరో హిట్లర్ గా, హిట్లర్ కన్నా దుర్మార్గుడిగా అనేక మంది (ప్రజాస్వామ్య వాదులైన యూదులతో సహా ) వ్యాఖ్యానించారు. జియోనిజం నాజీ లకన్నా దుర్మార్గంగా ప్రవర్తిస్తుందనీ, ప్రపంచాన్ని కబళించాలని పన్నాగాలు పన్నుతుందనీ ప్రజాస్వామిక వాదులు ప్రపంచవ్యాప్తంగా యెలుగెత్తుతున్నారు. నిరసిస్తున్నారు. అయినప్పటికీ జియోనిస్టు దురాక్రమణవాదులచే నియంత్రించబడుతున్న పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నయి. వారి సాంస్కృతిక యంత్రాగాలు మాత్రం యింకా నాజీ దురాక్రమణ గురించీ, హోలోకాస్టు గురించీ, వాటిలో యూదులు పడ్డ కష్టాల గురించీ ఆ గ్నాపకాల గురించీ పదే పదే ప్రచారాలు చేసి ప్రస్తుత చరిత్రలో తాము చేస్తున్న దుర్మార్గాలని, దాడులని, దురాక్రమణలనీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

నోబెల్ కమిటీ జియోనిస్టుల నియంత్రణలో ఉన్న పాశ్చాత్య ఆధిపత్య వ్యవస్థలకు అతీతమైంది కాదు. నిస్సందేహంగా వాటి నియంత్రణ లోనే ఉండి, ఆ పరిధిలోనే పని చేస్తుంది! కేవలం ప్రతిభకే పట్టం కడతామని చెప్పుకున్నా ప్రపంచంలోని ప్రతిభ అంతా పాశ్చాత్య దేశాల్లోనే ఉంది అదీ ఒక వర్గం ప్రజలకే ఉంది అని అవార్డులు ప్రకటించడం యాదృచ్చికమేమీ కాదు. హోలోకాస్టు కి వెయ్యి రెట్లకు మించి దురాక్రమణా దాడులకు, హింసకూ ప్రపంచవ్యాప్తంగా యెన్నో దేశాల్లో ప్రజానీకం గురవుతున్నారు. వారి కష్టాలూ కడగండ్లూ ఆనాడు యూదుల కష్టాలకన్నా నిస్సందేహంగా యెన్నో రెట్లు యెక్కువ కూడా! అది పాలస్తీనా లో కావచ్చు, ఆఫ్రికా దేశాల్లో కావచ్చు, లాటిన్ అమెరికా దేశాల్లో కావచ్చు – ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి మరో సారి హోలోకాస్టు గ్నాపకాల గురించి రాసిన ఐరోపా యూదునికే సాహిత్యం లో నేబెల్ ఇవ్వడం ఆశ్చర్యమూ అన్యాయమూ కూడా!

నిజానికి సాహిత్యం లో నోబెల్ ఇచ్చే పద్దతి చూస్తే దురాక్రమణలకూ దాడులకు గురవుతున్న దేశాల ప్రజల రచయితలకు ఆ బహుమతి ఇస్తారని ఆశించడం అత్యాశ కూడా! యెందుకంటే వారికి నోబెల్ అవార్డుల కమిటీ లలో యెటువంటి ప్రాతినిధ్యం లేదు గనక!

-నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

అమావాస్య యెరుగని చంద్రదీపం: ఎం. టి. ఖాన్

10603396_10203693605597290_3827708837853894168_n

1986 – 87 లో అనుకుంటా – విరసం లో సభ్యునిగా సిటీ యూనిట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయం. ఆ రోజుల్లో పేరుకు విరసం లో సభ్యున్నే కానీ దాదాపు అన్ని ప్రజా సంఘాల్లో చురుగ్గా పనిచేసే వాళ్ళం. వాటిల్లో PDSU విద్యార్థి ఉద్యమాలకు చేయూతా, పౌరహక్కుల ఉద్యమం APCLC ముఖ్యం. ఒక వైపు ఇంజనీరింగ్ కాలేజీ లో లెక్చరర్ గా పని చేస్తూ దొరికిన ప్రతి ఖాళీ సమయాన్నీ ఉద్యమాల్లో పనిచేయడానికే ఉపయోగించుకునే వాణ్ణి.

APCLC లో స్నేహితుడు వీరప్రకాష్ సభ్యుడు. ఆయనతో కలిసి ప్రతి APCLC సమావేశానికీ వెళ్ళేవాణ్ణి. ఒక సారి, విరసం లోనూ APCLC లోనూ సభ్యులూ నాయకులూ అయిన ఖాన్ సాబ్ యింటికి వెళ్ళి రావాల్సిన పని బడింది. అప్పటి దాకా ఆయనని చూడడం పలకరించడం తప్ప ఆయనతో ఎక్కువగా చనువు లేదు. ఖాన్ సాబ్ ఇల్లెక్కడ అంటే పురానా పూల్ పక్కనే అని చెప్పారు. నాకేమో అప్పటికింకా హైద్రాబాద్ హస్తసాముద్రికం ఇంకా పూర్తిగా పట్టుబడలేదు. పుట్టింది జజ్జిలిఖాన లో అని మా నాయనమ్మ చెప్పినా పాతనగరం ఎకువగా తెలియని పరిస్థితి. పురానా పూల్ దగ్గర బస్సు దిగి ఎవర్నడిగినా చెప్తారు అన్నారు.

సరే అని బయలుదేరా! బస్సు దిగి వెతుక్కుంటూ ఒకరిద్దరిని అడిగితే అదిగో అని చూపిస్తున్నారు కానీ నేను పోల్చుకోలేక పోతున్నా! సరే ఒకాయన యెవరో వేలు పట్టుకోని ఒక యింటి ముందు నిలబెట్టి ఇదే ఖాన్ సాబ్ ఇల్లు అని చూపించారు. నేను నివ్వెరపోయాను. ఖాన్ సాబ్ ఇల్లంటే యేదో పెద్ద భవంతినో బంగళానో ఊహించుకుంటున్నా! చూడబోతే అదేమో ఒక పాడుబడ్డ గోడలు కూలిన పాత యిల్లు. జంకు జంకుగా సందేహంగా తలుపు మీద కొట్టా! కొంచెం గట్టిగా కొడితే కూలిపోతుందేమో అన్నట్టుందా తలుపు.

కొంచెం సేపటికి ‘ఆ రహా హూ’ అనుకుంటూ తలుపు తెరిచారు ఖాన్ సాబ్. ‘ఆవో ఆవో’ అనుకుంటూ సాదరంగా లోనికి తీసుకెళ్ళారు. నేను యింకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు … ‘హా సాబ్’ అనుకుంటూ లోనికి నడిచాను. చాలా ప్రేమగా లోపలికి తీసికెళ్ళి ‘బైఠో ‘ అంటూ ఒక కుర్చీ చూపించారు. ఆ హాలులో రెండే కుర్చీలు. నేను కూర్చోవడానికి కొంచెం జంకితే ‘కూర్చో నారాయణస్వామీ ‘ అంటూ చేయి పట్టుకోని కూర్చోబెట్టి యెంతో ప్రేమగా సాదరంగా మాట్లాడారు ఖాన్ సాబ్. అంత పెద్ద మనిషి నా లాంటి పిల్లగానిని అంత సాదరంగా కూర్చోబెట్టడం అంత సేపు మాట్లాడ్డం నేను కలలో కూడా ఊహించలేదు. ఉద్యమాల్లో యెన్నో యేండ్లుగా పనిచేస్తూ , అందరిచేతా గొప్పగా గౌరవింపబడే ఖాన్ సాబ్ నన్ను అంత ప్రేమగా పలకరిస్తారని యేనాడూ అనుకోలేదు.

ఆయన ఇల్లుచూసే నివ్వెరపోయిన నేను, ఆయన నడవడి చూసి మరింత ఆశ్చర్య పోయాను. అప్పటికే ఆయన పట్ల యెంతో గౌరవం తో ఉన్న నా దృష్టిలో ఆయన వ్యక్తిత్వం మరింత ఉన్నతంగా యెదిగిపోయింది.

ఖాన్ సాబ్ జీవితాంతం అదే శిథిలావస్థ లో ఉన్న యింట్లోనే జీవించారు. అదే పేదరికంతో, అవే కష్టాలతో అంతే సాదా సీదాగా బతికారు. భౌతిక సుఖాలకు దూరంగా, జీవితమంతా ఒక సూఫీ తత్వం తో , తాను నమ్మిన ఆశయానికి కట్టుబడి, గొప్ప నిబద్దతతో జీవించారు. తాను యేది చెప్పారో అది ఆచరించి చూపించారు. నిష్కల్మషమైన చిరునవ్వుతో యెప్పుడూ యితరులకు ఇవ్వడమే తప్ప యెన్నడూ యేదీ ఆశించని నిస్వార్థంతో ఖాన్ సాబ్ ప్రజా ఉద్యమాలకు అంకితమయ్యారు. తనకంటూ ఆస్తుల్ని కూడబెట్టుకోవడం కానీ, సుఖ భోగాల్ని కోరుకోవడం కానీ అనుభవించడం కానీ, ఖాన్ సాబ్ యెన్నడూ చేయలేదు.

ఖద్దరు లాల్చీ, పైజామా తో, బుజానికి సంచీ తో ఖాన్ సాబ్ ప్రతి సమావేశానికీ ఒక విద్యార్థిలా వచ్చే వారు. తనకేదో తెల్సుకాబట్టి అది బోధించడానికి వచ్చేవారు కాదు. యెప్పుడూ నేర్చుకోవడానికి వచ్చే వారు. ఒక మూలకు నిశ్శబ్దంగా కూర్చుని తన పని తాను చేసుకుంటూ సమావేశాల్లో పాల్గొనే వారు. యెప్పుడూ వినే వారు. తక్కువ మాట్లాడినా యెన్నో విలువైన విషయాలు మాట్లాడే వారు. ఆయన ఉపన్యాసాలు దీర్ఘంగా కాక , చిన్నగా , సూక్తుల్లా గా, సూఫీ పలుకుల్లా ఉండేవి. ధారాళమైన వక్త కాకపోయినా చెప్పే మాటల్లో పదునూ, గ్నానమూ యెంతో ఉండేది. ఆయన రాతల్లో కూడా అంతే! విరసంలోనూ, APCLC లోనూ అంత ఉద్యమానుభవమూ, పరిగ్నానమూ ఉన్నా, పదవులున్నా సాధారణ కార్య కర్తలా పనిచేయగలగడం ఖాన్ సాబ్ కే సాధ్యమైంది. దానిక్కారణం ఆయన సామాజిక నేపథ్యమే! హైద్రాబాదు పాతనగరం (అదే అసలైన నగరం కూడా) లో పేద ముస్లిం కుటంబ నేపథ్యం – అదే నగరానికి పాలుతాపిన గొల్ల అమ్మ వొడిలో పాలు తాగిన సామాజిక నేపథ్యం !

10559901_10203693615637541_4934043015941360340_n

ఖాన్ సాబ్ తో వీవీ

ఖాన్ సాబ్ వెళ్ళిపోయారంటే, కటువైన ఆ వార్తను నమ్మాలంటే చాలా కష్టంగా ఉన్నది. దుఃఖంగా ఉన్నది. ఆయన తరం వాళ్లంతా ఒక్కరొక్కరే వెళ్ళి పోతూ ఉంటే వొంటరి తనమూ, దిగులూ చుట్టుముట్టి, వెంటాడుతున్నాయి. అంత నిర్మలంగా, నిష్కల్మషంగా, నిరాడంబరంగా, సూఫీ తత్వాన్నీ , విప్లవ తిరుగుబాటునూ నరనరానా జీర్ణించుకున్న సాధువులా జీవించిన మహోన్నత వ్యక్తిత్వం , యెంతో గ్నాన సంపన్నత ఉన్నా యేమీ తెలియనితనంతో, యెప్పుడూ నేర్చుకోవాలనే జిగ్నాసతో నిరంతర విద్యార్థిలా, ఉద్యమాలకు నాయకుడైనా, సాధారణ కార్యకర్తలా పనిచేయగలిగిన గొప్ప మానవతామూర్తి ఖాన్ సాబ్ 1935 లో హైద్రాబాద్ లో జన్మించారు.

ఖాన్ సాబ్, మొహమ్మద్ తాజుద్దీన్ ఖాన్ అసలు పేరైనా ఎం టీ ఖాన్ గా అందరికీ సుపరిచితుడు. ఖాన్ సాబ్ జీవితం – ఎనిమిది దశాబ్దాల హైద్రాబాదు సుసంపన్నమైన చరిత్ర – బహుళ సంస్కృతుల సమ్మేళనమైన డెక్కన్ చరిత్ర. సమస్త భారతదేశానికే తలమానికమైన సంపద్వంత తెలంగాణ చరిత్ర. తెలుగు నేలపైన జరిగిన మహోన్నత ప్రజా పోరాటాల చరిత్ర, భారత ప్రజల విప్లవోద్యమ చరిత్ర , విప్ల వ సాంస్కృతికోద్యమ చరిత్ర. తెలంగాణ కోసం జరిగిన మూడు దశల ప్రజాపోరాటాలతో – సాయుధ రైతాంగ పోరాటం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1994 – 95 లలో తిరిగి ఊపిరి పోసుకుని తెలంగాణ మహాసభ, జనసభ ల తో పుంజుకుని చివరికి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ యేర్పడే దాకా జరిగిన ప్రతి ఉద్యమంతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధాలుండి క్రియా శీలకంగా పాల్గొన్న ఉద్యమకారుడు ఖాన్ సాబ్.

చిన్ననాటినుండే మహాకవి మఖ్దూం మొయినుద్దీన్ తో సాంగత్య మూ, శిష్యరికమూ , ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నడిపిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రభావమూ, యిప్టా (అభ్యుదయ రచయితల సంఘం) కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర ఖాన్ సాబ్ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దినయి. పేద ముస్లిం, దళిత బహుజన సామాజిక నేపథ్యం (అప్పుడా ప్రత్యేక స్పృహ లేనప్పటికీ) ఆయనలోని నిరాడంబర, నిస్వార్థ సూఫీ సాధు తత్వాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాలు, పోరాటాలు తిరుగుబాటు మార్క్సిస్టు తత్వాన్ని ద్విగుణీకృతం చేసాయి.

ఆయన చిరకాల స్నేహితులు, సహచరులు బూర్గుల నర్సింగరావూ, కేశవరావు జాదవ్ గార్లతో ఖాన్ సాబ్ హైద్రాబాద్ లౌకిక ప్రజాస్వామిక సంస్కృతికీ చరిత్రకీ రూపకల్పన చేసారు. హిందూ ముస్లిం మతోన్మాదాలకు వ్యతిరేకంగా, పేద ముస్లిం లకు విద్య కనీసావసరాల కన్నా మసీదుల్లో మైకు లకోసం పాకులాడిన MIM మత రాజకీయాలకు వ్యతిరేకంగా, రాజకీయ విషసర్పాలు పడగ విప్పి బుస కొట్టిన మత కలహాలకు వ్యతిరేకంగా, పేద ముస్లిం, హిందూ ప్రజల ఐక్యత కోసం ఖాన్ సాబ్ చేసిన కృషి సామాన్యమైంది కాదు, అది చిరస్మరణీయమూ మనకందరికీ దారి చూపించేదీ!

బి యే పాసు అయినా కాకపోయినా ఎం యే విద్యార్థులకూ పాఠాలు నేర్పగల దిట్ట, మార్క్సిజం నరనరానా జీర్ణించుకుని, విద్యార్థులకు ముందుగా మనుషుల్లా బతకడం అన్నింటికన్నా ముఖ్యం అని యాకుత్ పురాలోని ధన్వంత కళాశాల లో పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడు ఖాన్ సాబ్! ఉర్దూ, పార్సీ, తెలుగు, ఆంగ్లం, మరాఠీ – ఐదు భాషల్లో ప్రావీణ్యత సాధించి – అన్ని భాషల్లో రచన సాగించిన ఖాన్ సాబ్ సియాసత్ న్యూస్ టైం లాంటి పత్రికల్లో జీవిక కోసం సంపాదక స్థాయిలో (పదవులు లేక పోయినా ) రాసారు.

భారత కమ్యూనిస్టు పార్టీ జడత్వానికి లోనై, పార్లమెంటరీ పంథా బురద లో కూరుకుపోయినప్పుడు ఉవ్వెత్తున యెగసిన నక్సల్బరీ తో ఉన్నారు ఖాన్ సాబ్! తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం కెరటంలా యెగసి పడుతున్న సందర్భం – నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళ నిప్పురవ్వలు రాజేస్తున్న సందర్బం – పాణిగ్రాహి లాంటి ప్రజాకవులు విప్లవ సాహిత్యానికి బీజాలు వేస్తున్న సందర్భం – విరసానికి కర్టెన్ రైజర్ లాంటి ‘అంటార్కిటా’ పోస్టర్ కవిత ను (వేణుగోపాల్, తేజ్ రాజేందర్ లతో ) రూపొందించారు ! విరసం. APCLC లలో సంస్థాపక సభ్యులు. 1972 లో పిలుపు పత్రికను ప్రారంభించారు. 1973 లో మీసా కింద వరవరరావు, చెరబండరాజులతో అరెస్టయ్యారు. సికింద్రాబాద్ కుట్రకేసులో నిందితుడయారు. ఎమర్జెన్సీ చీకటి రోజులు మొత్తం జైల్లో బందీ గా గడిపారు. అయినా చెక్కు చెదరలేదు. నిర్బంధాలూ, కుట్రకేసులూ, జైలు జీవితమూ , కటిక పేదరికమూ, కష్టాలూ , కన్నీళ్ళూ ఖాన్ సాబ్ ని యేమాత్రమూ మార్చలేదు. ఆయన వెనుకంజ వేయలేదు, దారితప్పలేదు. విరసంలో, APCLCలో చివరి ఊపిరిదాకా కొనసాగారు. AILRC ఉద్యమంలోనూ పాల్గొన్నారు.

1453335_10203693641238181_6506679510882453898_n

హైద్రాబాదులో సెకులర్, ప్రజాస్వామిక, విప్లవ ఉద్యమాలన్నిటిలో అలుపెరుగకుండా జీవితాంతం పాల్గొన్నారు. ఆయన జీవిత చరిత్రను ప్రజాస్వామిక లౌకిక హైద్రాబాద్ చరిత్ర కు ప్రర్యాయ పదంగా మార్చారు. 1992 లో APCLC కి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 90 వ దశకంలో వచ్చిన అస్తిత్వ, ప్రజాస్వామిక ఉద్యమాలకూ మద్దతునిచ్చారు. మలిదశ తెలంగాణా ఉద్యమంలో నిత్య యవ్వనంతో పాల్గొని 60 యేండ్ల తెలంగాణ కల తన జీవిత కాలం లో సాకారమైన నిత్య ఉద్యమ కారుడు ఖాన్ సాబ్!

హైద్రాబాద్ నగరానికి పెద్ద దిక్కు , కఠినమైన పేదరికంలో నూ నమ్ముకున్న ఆశయాలనూ, నడుస్తున్న ఉద్యమ బాటనూ వదలని ఉద్యమకారుడూ, సాహిత్యకారుడూ , పోరాటశీలీ ఖాన్ సాబ్ మనలని వదలి వెళ్ళిపోవడం అత్యంత బాధాకరామూ మనకు తీరని లోటూ! మొన్న చేరాగారూ, నిన్న ఖాన్ సాబ్
– ఒక్కరొక్కరే మనల్ని వదలి వెళ్ళిపోతుంటే తీరని దుఃఖంగా ఉన్నది –

వెళ్ళి పోతున్నారు
అంతా ….
ఒక్కొరొక్కరే

నిశ్శబ్దంగా,
యేమీ చెప్పకుండా
పట్టుకున్న వెచ్చని చేతులని
వదిలిచుకుంటూ
వెళ్ళిపోతున్నారంతా –

ఒకరు వీడిన కన్నీరు ఇంకా ఆరనే లేదు
మరొకరు,
కన్నీటి చుక్కల్ని పొడిపిస్తూ
నిర్దయగా ….

ముళ్ళూ రాళ్ళూ గుచ్చుకున్న పాదాలకు
అనునయంగా పదిలపు లేపనం పూసినోళ్ళు,
కన్ను పొడిసే చీకట్లల్ల
పురుగూ బూసి కరువకుండ జాగ్రత్తల దీపాలైనోళ్ళు,
పెచ్చులూడిన గోడలమీద
వెలిసిపోయిన రంగులని వెతుక్కుంటున్నప్పుడు
మెరిసిన జాజి రంగు నినాదాలైనోళ్ళు,

కష్టమైనా నష్టమైనా వెన్నంటే ఉంటామని
కొండంత అండైనోళ్ళు

వెళ్ళిపోతున్నారంతా …
బయటికి రాని శోకాన్ని పుట్టెడు దుఃఖాన్ని
మన గొంతుల్లో మిగిలించి …..

యెడతెరపిలేకుండా
యెన్నో వెలుతురు ముచ్చట్లు చెప్పి
యెట్లా బతకాలో బతికి చూపించినోళ్ళు

కలలెప్పుడూ యిగిరిపోవద్దనీ,
కంట్లోనూ మనసులోనూ
తడి యెన్నడూ యింకిపోవద్దనీ
కంటినీరు తుడిచినోళ్ళు

యెన్ని పోగొట్టుకున్నా
యెన్నడూ మనిషితనం పోగొట్టుకోవద్దని,
శిథిలమైన బతుకుగోడల మధ్యా
చెదరని చిరునవ్వుతో చెప్పినోళ్ళు

ఒక్కొరక్కరే వెళ్ళిపోతున్నారు
మౌనంగా ….

నెమ్మదిగా తలలూపే చెట్లలాగా,
పొద్దుటి పూట చెమ్మగిల్లిన పూలలాగా,
లేత యెండలో మెరిసే చిగురుటాకుల్లా

నెరవేరని కలలనీ
అలుపెరుగని చిరునవ్వులనీ
మనకు మిగులుస్తూ…

ఒక్కొరక్కరే వెళ్ళిపోతున్నారు
మౌనంగా ….

 

యెన్నో తరాలకు చిమ్మ చీకట్లలో దారి చూపిన ఖాన్ సాబ్ చిరునవ్వు అమావాస్య యెరుగని చంద్ర దీపం!
మన గ్నాపకాల్లో, నెరవేరని కలల్లో ఖాన్ సాబ్ యెప్పుడూ జీవించే ఉంటారు, చిరస్మరణీయులై!

-నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

ఫోటోలు: కూర్మనాధ్

దళిత అస్తిత్వ పతాక నామ్ దేవ్ ధాసల్!

 art-culture-dalit-poet-namdeo-dhasal-dead.jpg itok=MkqHycCs

1970 ల్లో మరాఠీ సాహిత్యాన్ని, మొత్తం భారతీయ సాహిత్య రంగాన్నే  తీవ్ర సంచలనానికి గురిచేసి ఒక్క కుదుపు కుదిపిన ప్రముఖ కవి నామ్ దేవ్ ధాసల్ కనుమూసారు. ఆంగ్లం, జర్మన్ , ఫ్రెంచ్ , ఇటాలియన్ తదితర భాషల్లోకి అనువదింపబడి దళిత అస్తిత్వానికీ , పోరాటాలకూ ప్రతీకకగా నిలిచిన నామ్ దేవ్ ధాసల్ కవిత్వం చాలా పదునైనది. తీవ్రమైన భావవేశంతో, పదజాలంతో, అప్పటి దాకా తన మాటను, ఆలోచననూ, మొత్తంగా మరాఠీ సాహిత్యాన్ని నియంత్రించిన బ్రాహ్మణ మను వాద భావజాలాన్ని, భాషనూ తుత్తునియలు చేసి కొత్త భాష, కొత్త డిక్షన్ , కొత్త ఆలొచనల పద సామగ్రి కనుక్కొన్నారు ధాసల్ .

అమెరికా లో బ్లాక్ పాంథర్స్ ఉద్యమం ప్రేరణతో,  మహరాష్ట్రలో 1972 లో  దళిత పులుల ఉద్యమాన్ని   (dalit panthers movement)       ప్రారంభించి, ప్రదాన పాత్ర వహించారు. దళిత పులుల ఉద్యమం రాడికల్ రాజకీయాలని కార్యాచరణనూ సమర్థించి ఆచరించింది. 1973 లో గొల్పిత కవితా సంకలనం తో మరాఠీ సాహిత్యరంగం లో  ఒక కెరటమై విరుచుకుపడి , పెను ప్రభంజనమై వీచారు. ఆయన రాసిన ఒక్కో పద్యం ఒక్కో డైనమైటై పేలింది. బ్రాహ్మణ వాద, మను వాద సంప్రదాయాల్ని, సంకెళ్ళనీ , కట్టుబాట్లనీ ధిక్కరించి దళితుల విముక్తి కోసం తన ప్రతి పద్యాన్ని అతి తీవ్రమైన పదజాలంతో, ఆగ్రహ భావావేశాల్తో ఆయుధాల్లా సంధించారు నామ్ దేవ్ ధాసల్. బొంబాయి నగరం లోని అట్టడుగు ప్రజానీకం కోసం నామ్ దేవ్ ధాసల్ తన కవిత్వాన్నీ రాజకీయ కార్యాచరణనూ అంకితం చేసారు.

కామాటిపురా రెడ్ లైట్ ఏరియా లోని వేశ్యల హక్కుల కోసం, జీవితం తమని శపిస్తే రోడ్డు పక్క ఫుట్ పాత్ లపై, రైల్వే స్టేషన్ లలో, చింపేసిన విస్తరాకుల్లా, ఆకలీ, పేదరికమూ, మాదక పదార్థాలకు అలవాటు పడిన బాల్యాన్ని అక్కున చేర్చుకున్నారు.  నోరు లేని వారికి నోరిచ్చారు. ఆత్మలు అణచివేయబడి దోచుకోబడ్డ వారికి తన కవిత్వంతో ధిక్కార ఆత్మలనిచ్చారు. మరాఠీ మధ్యతరగతి వెసులుబాటు సుఖలాలసతకు, భద్రలోక జీవితపు విలువలకూ, అభిప్రాయాలకూ పెద్ద షాక్ ట్రీట్ మెంటు ఇచ్చారు నామ్ దేవ్ . మావోయిస్టు భావాలతోనూ కవిత్వం రాసారు. తన కవిత్వంతో దళిత సాహిత్యం లో వినూత్న సంతకం చేసారు. అనేక కవితా సంకలనాలను ప్రచురించారు ఆయన కవిత్వం ఆంగ్లం లో “Poet of the Underworld” అనే పేరు తో ప్రచురితమైంది.

అయితే దళిత పులుల ఉద్యమం యెక్కువ రోజులు కొనసాగలేకపోయింది.. 1980 ల కల్లా దళిత పులుల ఉద్యమంలో పగుళ్ళు ప్రారంభమైనయి. నామ్ దేవ్ దళిత ఉద్యమాన్ని ఇంకా విశాలం చేసి పీడిత ప్రజలందరినీ  అందులో భాగస్వామ్యం చేయాలని ఆశించాడు. తన రాజకీయ కార్యాచరణ అట్లా ప్రకటించాడు కానీ అది మిగతా వారికి నచ్చలేదు. తమ ఉద్యమం కేవలం దళితులకే పరిమితం చేయాలి అని పట్టు బట్టారు. రాజకీయంగా చైతన్యమై విప్లవాత్మక ధిక్కారం ప్రకటించిన దళితులని మనువాద బ్రాహ్మణవాద పార్టీలు అనేక ప్రలోభాలకు లోను చేసినయి. ఒక తాత్విక, రాజకీయ యేక సూత్రత లేని దళిత పులుల ఉద్యమకారులు రాజకీయ పార్టీల అనేక కుట్రలకు బలై పోయారు. చెట్టుకొకరూ పుట్ట కొకరూ అయి పోయారు. నామ్ దేవ్ క్రమంగా మద్యానికి అలవాటు పడ్డాడు.  ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. 1990 ల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నామ్ దేవ్ కరుడు గట్టిన మనువాద బ్రాహ్మణ వాద పార్టే శివసేన లో చేరాడు. అందులోనూ ఇమడలేదు. అయితే యెప్పటికప్పుడు తన రాజకీయ తప్పిదాలను , మెరుపుల్లాంటి తన కవిత్వంతో , పిడుగుల్లాంటి తన రాతలతో మరిపించే వాడు. క్రమంగా అనారోగ్యం బారిన పడ్డాడు. 2007 లో చికిత్సకైన ఖర్చు భరించడానికి ఇల్లు అమ్మబోతే సినీ నటులు అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ నిధులు సమకూర్చి నామ్ దేవ్ కు సాయపడ్డారు. . చివరి రోజుల్లో కాన్సర్ తొ బాధ పడుతూ ఆసుపత్రిలో కనుమూసారు.

రాజకీయంగా కొన్ని తప్పిదాలుగా చేసినా నామ్ దేవ్ సాహిత్యంలో చేసిన కృషీ , సాధించిన విజయాలూ అసమానమైనవి.  కరుడు గట్టిన బ్రాహ్మణవాద మనువాద చాందస భావజాలాన్ని, దుర్మార్గాలని , సంకెళ్ళని సవాలు చేస్తూ ధికరిస్తూ అవి చిరకాలం నిలిచే ఉంటాయి. దళితుల విముక్తి కోసం నిరంతరం కలలు గని దళిత అస్తిత్వం కొరకు పోరాడిన గొప్ప విప్లవకవి నామ్ దేవ్  చిరస్మరణీయుడు!  శ్రీ శ్రీ గురించి కాళోజీ  “నువు రాసి పారేసిన కవితలు గుబాళిస్తుంటే నువు తాగి పారేసిన సారా సీసాల కంపు మాకెందుకు” అని అన్నారు. అది ఈ రోజు నామ్ దేవ్ ధాసల్ కి సరిగ్గా సరిపోతుంది.

nanded

పంజరమంత బలంగా యేమీ లేదు.

పంజరం లో పిట్ట ఆశ కోల్పోయి

ఆలోచనల్లో మునిగిపోయింది.

బయట గుంపులోంచి ఒక పావురం

పంజరంలోని పిట్టతో అందిలా ..

మేము నిన్ను తప్పక చెర విడిపిస్తాం.
విధిలిఖితం అని చింతించకు
యెన్నడైనా విధి బందీ ఐన   వారిని విడిపించిందా?

సిద్దంగా ఉండు –
నీ రెక్కలకు తుప్పు పట్టనీయకు
రేపు అనంతాకాశంలో అంతెత్తున రివ్వున యెగరాలి నువ్వు!

 


—————————

ఆట

 

చూసాను అతన్ని

యెన్నో సార్లు తిరస్కరించాను

ఊరూరా తిరిగే నా శవం

ఈ సాయంత్రం వెలుగులో నిశ్చలంగా ఎదిరిచూస్తోంది

 

యెవడో తాగుబోతు దేవునికి ఫోన్ చేస్తున్నాడు

కుళ్ళి కృశించే జాలీ సానుభూతీ చూపకు నాపైన

బహుశా మన సంబంధం ముగిసిపోయిందేమో

బుజాల్ని విదిలించేయి దాన్ని వదిలించుకో

అట్లైనా, 
ఈ నీళ్ళని
గొడ్డలి తో నరకగలుగుతావేమో!

 —————————

కామాటి పురా

ఒక నిశాచర ముళ్ళపంది విశ్రమిస్తోందిక్కడ

ప్రలోభపెట్టే  బూడిద పుష్పగుచ్చం లా!

వంటినిండా శతాబ్దాల సిఫిలిస్ పొక్కులతో …
తన కలల్లో తానే కోల్పోయి
కాలాన్ని క్రూరంగా తరిమేస్తుంది.
మనిషి నోటి మాట పడిపోయింది.

తన దేవుడు బేదులు పెట్టిన అస్తిపంజరం.

ఈ శూన్యానికో గొంతు దొరుకుతుందా ,
ఒక మాటవుతుందా ఎప్పుడైనా?

నీక్కావాలనిపిస్తే దానిమీద ఒక ఇనుప కన్ను వేసి చూడు
దానిలో కన్నీటి చుక్క ఉంటే దాన్ని గడ్డకట్టించు!  కాపాడు!!

దాని చూపులు నిన్ను సమ్మోహనం చేసి
పిచ్చి ఉన్మాదం లోకి నెట్టేస్తాయి

ముళ్ళపంది హఠాత్తుగా నిద్రలేచి

నిన్ను యెక్కుపెట్టిన పదునైన ముళ్ళతో వెంటాడి
వొళ్ళంతా తూట్లు పొడిచి గాయపరుస్తుంది.

రాత్రి తన పెళ్ళికొడుకు కోసం సిద్ధమవుతూంటే

గాయాలు పుష్పిస్తాయి

అనంత పుష్ప సముద్రాలు పొంగిపొర్లుతాయి

నెమళ్ళు నాట్యం చేస్తాయి
ఇది నరకం

ఇది సుళ్ళు తిరిగే భయంకర మృత్యుగుండం

ఇది వికారమైన వేదన

ఇది గజ్జెలు కట్టి నాట్యమాడే  నొప్పి.

 

నీ చర్మాన్ని వదిలేయి.

వేర్ల నుండీ నీ చర్మాన్ని వలిచేయి.

ఈ విషపూరితమైన శాశ్వత  గర్భాలు విచ్చిన్నం కానీ!

ఈ స్పర్శ కోల్పోయిన మాంసపు ముద్దకు  అంగాల్ని మొలకెత్తనీకు!!
ఇదిగో దీన్ని రుచి చూడు

పొటాస్సియమ్ సయనైడ్ !

నువ్వు మరణిస్తున్నప్పటు క్షణంలో
వెయ్యోవంతు లిప్తలో
పాతాళంలోకి కుంగిపొతున్న నీ ప్రాణపు రుచిని  రాయి!
రాండ్రి!

మృత్య్వుని రుచి చూడాలనుకున్న వాళ్ళంతా
విషపు రుచి ఉప్పనో పుల్లనో తెలుసుకోవడాని
ఇక్కడ క్యూ కట్టుండ్రి!

మృత్యువు  ఆవృతమౌతుందిక్కడ
కవిత్వపు పదాల్లాగే …..
కొంచెం సేపట్లో కుంభవృష్టి కుర్వబోతోంది!

ఓ కామాటిపురా!

అన్ని రుతువులని నీ చంకలో బంధించి

బురదలో

కూలబడి ఉంటావలా!

నా వ్యభిచారాల సుఖాల్నన్నింటినీ దాటి

యెదిరిచూస్తాను
ఈ బురదలో
నీ పద్మం వికసించడం కోసం!

నారాయణస్వామి వెంకట యోగి

–నారాయణ స్వామి వెంకట యోగి

తెలంగాణా కవులు/ రచయితలూ ఇపుడేం చేయాలి?

 

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో నిలబడి ఉన్నారు. గత దశాబ్ది కాలంగా తెలంగాణ రచయితలు, తెలంగాణ అస్తిత్వాన్ని, విముక్తి, స్వేచ్చా స్వాతంత్ర్యాకాంక్షలను, ప్ర్రత్యేక రాష్ట్ర  ఆకాంక్షలను యెలుగెత్తి చాటారు. తమ రచనల్లో – పాట, కవిత్వం, కథ, నవల, సాహిత్య విమర్శ – అన్ని సాహితీ ప్రక్రియల ద్వారా ప్రధానంగా  వారు చాటింది ఈ ఆకాంక్షలనే! అయితే కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష్లని మాత్రమే చాటితే తెలంగాణ సాహిత్యం రాజకీయ ప్రచార సాహిత్యం మాత్రమే అయి ఉండేది. కానీ గత దశాబ్దంన్నర కాలంగా తెలంగాణ రచయితలు సృష్టించిన సాహిత్యం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మాత్రమే కాకుండా,  అనేక విషయాలని తడిమింది.

ముందుగా తెలంగాణ రచయితలు తమ అస్తిత్వాన్ని కనుక్కొన్నారు. తెలుగు భాష, సంసృతి, సాహిత్యం మొత్తం కూడా యెట్లా ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలోని కొన్ని సామాజిక వర్గాల  వారి గుప్పిట్లోనే ఉండిపోయి, వారు రాసిందే సాహిత్యం, వారు మాట్లాడిందే భాష, వారిదే అసలైన సంస్కృతి అనే పద్దతిలో చలామణీ అయిందో, ఈ క్రమంలో మిగతా వెనుకబడ్డ ప్రాంతాల వారి సాహిత్యం, భాష, సంస్కృతుల లానే తాము కూడా యెట్లా అణచివేతకు గురయ్యారో, అయితే తాము గురయిన అణచివేత కు ప్రత్యేక చారిత్రిక కారణాలూ, ప్రత్యేక సందర్భమూ యెట్ల్లా ఉన్నయో గుర్తించారు. నిజానికి ప్రజా సాహిత్యం లో ప్రజల భాషకు పెద్ద పీట వేసినప్పటికీ , మాండలిక భాష అంటూ తెలంగాణ భాషకున్న ప్రత్యేక అస్తిత్వాన్ని, చారిత్రిక నేపథ్యాన్ని ప్రగతిశీల వాదులుగా చెప్పుకుంటున్న వారు కూడా   గుర్తించ నిరాకరించారో, తెలంగాణ రచయితలు బట్టబయలు చేసారు. తెలంగాణ లో మరుగున పడ్డ అనేక గొప్ప సాహిత్యకారులను, వారు సృష్టించిన సాహిత్యాన్ని వెలికి తీసారు. సాహిత్య విమర్శకు కొత్త తెలంగాణ దృష్టిని దృక్కోణాన్ని అందించి పదునెక్కించారు. గత తెలుగు సాహిత్య చరిత్రనూ దృక్పథాలను తెలంగాణ దృక్పథంతో వినిర్మాణం చేసి సాహిత్య చరిత్రనూ, సాహిత్య విమర్శనూ తిరగ రాసారు. కొత్త తెలంగాణ సాహిత్య శకాన్ని సృష్టించారు.

అట్లే తెలంగాణ ప్రజా జీవితంలో, సంస్కృతిలో, చరిత్రలోని అనేక అంశాలని వెలికితీయడమే కాకుండా , కొత్తగా కనుగొన్నారు, సూత్రీకరించారు, సిద్ధాంతీకరించారు . దీని వెనుక – తెలంగాణ సాహిత్యకారులు తమ సాహిత్య చరిత్రను (గత చరిత్రనూ, నడుస్తున్న చరిత్రనూ)   పునర్నిర్మించడానికీ, పునర్లిఖించడానికీ,  వినూత్నంగా కనుక్కోవడానికీ (discover ), “కేవలం తెలంగాణ దృష్టీ దృక్పథమూ మాత్రమే ప్రధానం”  అనే ‘సంకుచితంగా’ కనబడుతున్నట్ట నిపించే భావన ఆలంబన ఐంది. ‘సర్వే జనా సుఖినోభవంతు’ నుండి ‘ప్రపంచ కార్మికులారా యేకం కండి”  నుండి, ‘రైతాంగ ఆదివాసీ విముక్తి పోరాటాలు వర్దిల్లాలి’ నుండి ఒక ప్రాంతీయ వాద దృక్పథానికి సాహిత్యంలో localized outlook కీ, expression కీ ప్రయాణించారు తెలంగాణ రచయితలు.

అయితే ఈ ప్రయాణానికి తెలంగాణ ఉద్యమ  చారిత్రక సందర్భం యెంత దోహదపడిందో , తాము తెలంగాణ సమాజపు అనేక దశల్లో సాధించిన పరిణామాలు, పరిణతీ, acquire చేసుకున్న చారిత్రిక అనుభవమూ, జ్ఞానమూ అంతే దోహదపడ్దాయి. యేదీ సమాజంలో చరిత్ర లేకుండా ఊడిపడదు కదా! అయితే కొన్ని సందర్భాల్లో తెలంగాణ రచయితలు ఒక తీవ్రమైన దృక్పథాన్ని అవలంబించి కొంత గత చరిత్రని నిరాకరించిన సందర్భమూ లేక పోలేదు. అచారిత్రికంగా అనిపించినా ఇది అన్ని అస్తిత్వ వాద ఉద్యమాల్లో మనకు సాధారణంగా కనబడే లక్షణమే! తమని తాము  నిర్మించుకునేందుకు, స్థాపించుకునేందుకు చాలా సార్లు పునాదుల్నీ, నేపథ్యాన్నీ పూర్తిగా నిరాకరించే ధోరణి సరైంది కాకపోవచ్చేమో కాని అసందర్భమూ అచారిత్రికమూ మాత్రం కాదు. ముఖ్యంగా ఒక ప్రాంతం విముక్తి కోసం పోరాడుతున్న ఉద్యమ నేపథ్యంలో, అన్ని రంగాల్లో  జరిగే assertions లో ఇది మనం చూస్తాం. అదే తెలంగాణ రచయితల్లో సాహిత్య విమర్శకుల్లో కూడా వ్యక్తమైంది.

ఐతే తెలంగాణ జీవితాన్ని అనేక సందర్భాల్లోంచి, అనేక పార్శ్వాలనుంచి, అనేక కోణాలనుంచి తెలంగాణ సాహిత్యం తెలంగాణ ఉద్యమ బీజాలు మొలకెత్తడం ప్రారంభించిన 1990 దశాబ్దం అర్ధ భాగం నుండే అద్భుతంగా ఆవిష్కరించడం ప్రారంభించింది. యే కాలంలో నైనా , యే స్థలంలో నైనా సాహిత్యం ఉద్యమం రాకని యెలుగెత్తే వైతాళిక పాత్ర పోషిస్తుంది అనేది తెలంగాణ విషయం లో అక్షర సత్యం. కథల్లో, నవలల్లో, కవిత్వంలో, మరీ ముఖ్యం పాటలో తెలంగాణ జీవితం లోని, చరిత్రలోని మున్నెన్నడూ వెలికిరాని ప్రతిఫలించని అనేక కొత్త కోణాలు ఆవిష్కరించబడ్డాయి. సాహిత్య విమర్శ కొత్త దృక్పథాలని ప్రకటించింది. ఐతే ప్రాంతీయ వాద అస్తిత్వ సాహిత్యమూ ఉద్యమంగా కనబడ్డా,  తెలంగాణ ఉద్యమమూ సాహిత్యమూ ప్రధానంగా ప్రపంచంలోని బడుగు దేశాలనీ, ప్రాంతాలనీ, ప్రజలనీ ముంచెత్తి వేసిన ప్రపంచీకరణకు ధీటుగా తన అస్తిత్వాన్ని నిలబెట్టి,  సవాలు చేసి, ప్రత్యామ్నాయంగా ఒక కొత్త సామాజిక నమూనాని ప్రకటించి, తన వనరులని తానే అనుభవించగలిగే రాజ్యనియంత్రణ, అధికారమూ కోసం చేసిన, చేస్తున్న  ఒక గొప్ప చారిత్రిక యుద్ధం ! యెలుగెత్తిన ప్రజాగ్రహ ప్రకటన! ఇందులో తెలంగాణ రచయితలు గొప్ప చారిత్రిక పాత్రను పోషించారు. పోషిస్తున్నారు. యిట్ల్లా ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చిన అస్తిత్వ ఉద్యమాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది, తెలంగాణ సాహిత్యమూ సాహిత్యకారులూ తెలంగాణ ఉద్యమానికి జెండాలై రెప రెప లాడుతారు.

యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో ఉండడానికి కారణం తెలంగాణ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంధి దశ!

ఒక వైపు కేంద్రంలో అధికారం లోనున్న ఒక ప్రధాన జాతీయపార్టీ అనేక సంవత్సరాల జాప్యం తర్వాత ప్రజా ఉద్యమాల పెను ఉప్పెనల ఒత్తిడికీ, మరుగుతున్న తెలంగాణ ప్రజాగ్రహానికి జడిసి, యెడతెరపిలేకుండా కొనసాగుతున్న తెలంగాణ యువకుల ఆత్మబలిదానాలకు తలవంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా యెక్కడుందో కూడా తెలియని సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన మరుక్షణమే ప్రత్యక్షమై నాటినుండి నేటి దాకా అనేక కుట్రలూ, కూహకాలతో కేంద్రప్రభుత్వం మీద వత్తిడి పెంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టివేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా సీమాంధ్ర పెత్తందార్ల నాయకుల కనుసన్నల్లో నడుస్తూ చేతననంతగా ప్రయత్నించినస్తున్నది. తిరిగి 2009 డిసంబర్ ను పునరావృతం చేయాలని శాయశక్తులా కుట్రలు పన్నుతున్నది. అందుకే తెలంగాణ రచయితల మీద బాధ్యత నాలుగు రెట్లవుతున్నది.

నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

ఒకటి: గతంలో లాగే (వీలయితే ఇంకా ఉధృతంగా) తెలంగాణ అస్తిత్వం నిలుపుకునే సాహిత్యం సృష్టిస్తూ పోవడం,

రెండు: వచ్చిన తెలంగాణ యేదో ఒక రాజకీయ పార్టీ అనుగ్రహిస్తేనో, దయాదాక్షిణ్యాల భిక్షలాగానో రాలేదని అది తెలంగాణ ప్రజా ఉద్యమాల వల్ల, ఆత్మ బలిదానాల వల్ల వచ్చిందనీ స్పష్టంగా గుర్తెరిగి దానిని కాపాడుకునే దిశగా ఉద్యమ సాహిత్య సృష్టి చేయడం,

మూడు: జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం స్పష్టంగా సీమాంధ్ర పెత్తందార్ల , దొపిడీ దార్ల నాయకత్వంలో వారి ప్రయోజనాలకోసం సాగుతున్న ఉద్యమమనీ దానికి నిజంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు యెంతమాత్రమూ పట్టవనీ (నిజంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలే ప్రధానమై ఉంటే శ్రీకాకుళం నుండి అనంతపూర్ దాకా ప్రజలని పట్టి పీడిస్తున్న అనేకానేక సమస్యలమీద ఉద్యమం జరిగి ఉండేది) కేవల హైదరాబాదుని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న  రాజకీయార్థిక శక్తుల ప్రయోజనాలే ముఖ్యమనీ  యెలుగెత్తి చాటాలి.

నాలుగోదీ ముఖ్యమైనదీ – ఇప్పుడు పెత్తందార్ల కనుసన్నల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం కుట్రపూరితంగా  తెలంగాణా ప్రజలకూ, సీమాంధ్ర ప్రజలకూ మధ్య సృష్టిస్తున్న తీవ్రమైన వైషమ్యాలనూ, వైమనస్యాలనూ రూపుమాపేందుకు, తిరిగి సామాన్య తెలుగు ప్రజల మధ్య స్నేహపూరిత సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించేందుకు పూనుకోవాలి. ఈ పని రచయితలే చేయగలరు.

బాధ్యత సీమాంధ్ర రచయితలమీదా ఉన్నప్పటికీ, ప్రధానంగా ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించాల్సింది తెలంగాణ రచయితలే! యిరు ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఒకరి హక్కులను ఒకరు, ఒకరి స్వేచ్చను యింకొకరు, ఒకరి వాటాను యింకొకరు, ఒకరి అభివృధ్ధిని యింకొకరు, ఒకరికొకరు భంగం కలుగకుండా గౌరవించుకుని facilitate చేసుకుని, పంచుకునే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పే అత్యవసర కర్తవ్యానికి  తెలంగాణ రచయితలు పూనుకోవాలి. ఈ పని యిరు ప్రాంతాల రాజకీయ పార్టీలు వాటి నాయకులూ చెయ్యరు – అందుచేత దీనికి తెలంగాణ రచయితలే పూనుకోవాలి! అప్రజాస్వామిక వలస  పాలకులనీ, అన్ని రంగాల్లో  వారి అంతర్వలసీకరణ ఆధిపత్య ఆజమాయిషీ కుట్రలనీ యెట్లా ఐతే వ్యతిరేకించి తిప్పికొట్టడానికి పదునైన సాహిత్యాయుధాలని సృష్టించారో, అట్లే యిరుప్రాంతాల ప్రజలు విడిపోయి సఖ్యంగా ఉండేందుకు, విభజన సృష్టించే అభద్రతలను పోగొట్టేందుకు, విభజన తర్వాత పంపకాలు ప్రజాస్వామ్యయుతంగా జరిగేందుకు, యిరుప్రాంతాల ప్రజల్లో ఉన్న ప్రజాస్వామిక సంస్కృతినీ , ఆకాంక్షలను కలిసికట్టుగా నిలబెట్టేందుకు తెలంగాణ రచయితలు పెద్ద యెత్తున పూనుకోవాలి – నాయకత్వం వహించాలి! యీ క్రమంలో సీమాంధ్ర ప్రాంతపు రచయితలను ప్రజాస్వామ్యయుతంగా కలుపుకుని పోవాలి. విడిపోయి కలసి ఉండే ఒక సాంస్కృతిక వారధి నిర్మించాలి.

అంతే కాదు – విభజన జరింగితర్వాత జరిగే సాహిత్య, సాంస్కృతిక పునర్నిర్మాణానికి అవసరమయ్యే ఒక్కొక యిటుకరాయినీ యిప్పట్నుంచే సమకూర్చుకోవడమూ ప్రారంబించాలి! అందు కోసము అవసరమైన భవిష్యత్తు దృష్టినీ , నిర్మాణాత్మకమైన దృక్కోణాన్నీ దృక్పథాన్నీ అభివృద్ధి చేయాలి. అంటే యిప్పటిదాకా చేస్తూ వచ్చిన వినిర్మాణాన్ని కొనసాగిస్తునే కొత్తని ప్రయత్న పూర్వకంగా నిర్మించే చారిత్రిక దృష్టిని సమిష్టిగా యేర్పర్చుకోవాలి.

– నారాయణస్వామి వెంకట యోగి

index

———————————————————————-

తెలంగాణా కవులు నిశ్శబ్దంగా వున్నదెపుడని?

ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్రశ్నని ఎలా స్వీకరించాలన్నదే మొదటి సవాలు –

‘తెలంగాణా ప్రజల స్వప్నం’ సాకారమవుతోన్న వేళ ‘తెలంగాణా కవులు ఇపుడేం చేయాలి?’ అన్నదే అడిగిన వారి ఉద్దేశ్యమైతే నేనందుకు సిద్ధంగా లేను –

ఇంకా సవాలక్ష సందేహాలున్నాయి …

గతానుభవాలు మిగిల్చిన నమ్మక ద్రోహపు గాయాల సాక్షిగా, తెలంగాణా రాష్ట్ర సాకారం కల ‘ సంపూర్ణంగా’ నిజమైతే తప్ప, తెలంగాణా ప్రజలెవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు-

ప్రజాకవి కాళోజీ మాటల్లోనే చెప్పాలంటే- “ప్రజలూ – నేనూ కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాశులైన పాలకులకు చెబుతున్నాను”

కాబట్టి, తెలంగాణా రాష్ట్ర కల ఇంకా సాకారం కాలేదు కాబట్టి, తెలంగాణా కవులు తెలంగాణా ని తర  తరాలుగా  ఎలా గానం చేస్తూ వొస్తున్నారో ఆ పనిని ఇక ముందూ కొనసాగిస్తారు …

ఆ మాటకొస్తే, తెలంగాణా కవులు నిశ్శబ్దంగా వున్నదెపుడని? ….

కోడూరి విజయ్ కుమార్

కోడూరి విజయ్ కుమార్

తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట కాలంలో ప్రజల చేతిలో శక్తివంతమైన గేయాలనీ/కవితలనీ పెట్టి వాళ్ళని సాయుధులని చేసి, తాము కూడా స్వయంగా ఆ పోరాటం లోకి దిగిన కాళోజీ, సుద్దాల హనుమంతు లాంటి కవులు ఎందరో ?

అనంతర కాలంలో తెలంగాణా భారత దేశం లో విలీనమైన తరువాత కూడా భూస్వాముల/దొరల ఆగడాలను ప్రతిఘటిస్తూ సాగిన అద్భుత ప్రజా ఉద్యమాలనూ, ఆ ఉద్యమాలను అణిచివేసే క్రమంలో ప్రభుత్వాలు తెలంగాణా పల్లెలని రణభూములుగా, మరుభూములుగా మార్చి వేసినపుడు కూడా చెరబండరాజు, వరవర రావు, జ్వాలాముఖి, సిద్దారెడ్డి, అలిశెట్టి ప్రభాకర్, దర్భశయనం లాంటి కవులు గొప్ప కవిత్వాన్ని సృజించారు.

ఇక గద్దర్, గోరటి వెంకన్న లాంటి తెలంగాణా  ప్రజా వాగ్గేయకారుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? …. బహుశా, తెలంగాణా ప్రజా ఉద్యమాలతో కలిసి నడిచిన గత చరిత్ర వల్లనే అనుకుంటాను, మలి  దశ తెలంగాణా ఉద్యమంలో ‘పాట’ తరువాత,  తెలంగాణా కవిత్వమే ముందు వరుసలో నిలబడి ఉద్యమానికి బాసటగా నిలిచింది-

కాబట్టి, ఇంకా తెలంగాణా కల సాకారం కాలేదు గనుక, తెలంగాణా కవులు ఇప్పటిదాకా తాము పోషిస్తూ వొచ్చిన పాత్రనే మరింత శక్తివంతంగా పోషిస్తారు. ‘పోషించాలి’ అనే మాట ఎందుకు వాడడం లేదంటే, తెలంగాణా కవులు ఇప్పటి దాకా పోషించిన పాత్రని ఎవరో ఆదేశిస్తేనో / సలహా యిస్తేనో పోషించలేదు. తిరిగి కాళోజీ మాటనే తీసుకుంటే, తెలంగాణా కవి తన ప్రజా సమూహపు గొంతునే వినిపించాడు ఏ కాలంలోనైనా!

‘తెలంగాణా కవులు ఇపుడేం చేయాలి?’ … అనే ప్రశ్నని మరో విధంగా స్వీకరిస్తే … అంటే, ఒక వేళ తెలంగాణా కన్న కల సంపూర్ణంగా సాకారమైతే ….. అప్పుడు తెలంగాణా కవులేం చేయాలి?

ఒక్క కవులు మాత్రమే అని ఏముంది? …. ఆలోచనా పరులైన పౌరులు ఎవరైనా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఏ అన్యాయాలని సరిదిద్ద వలసి వున్నదని తెలంగాణా ఉద్యమించిందో ఆ దిద్దుబాట్ల ప్రక్రియ నిజాయితీగా జరుగుతున్నదీ, లేనిదీ జాగరూకతతో గమనించాలి. సాటి మనుషుల పట్ల, సమాజం పట్ల బాధ్యతతో మెలిగే పౌరులకు కవిత్వ కళ కూడా వుంటే, సమాజంలోని అసమానతలని  చూస్తూ ఏమీ ఎరగనట్లు సాక్షీ భూతులుగా పడి వుండ  లేరు … రేపటి తెలంగాణా లో కవులు అసలు ఉండలేరు.

బహుశా, ప్రజాకవి కాళోజీ లా “దోపిడి చేసే ప్రాంతేతరులను /దూరంగా తన్ని తరుముదాం /ప్రాంతం వారే దోపిడి చేస్తే /ప్రాణాలతో పాతరేస్తం ” అని మరొక యుద్ధ దుందుభి మోగిస్తారు!

అయితే, కవిత్వం ఒక కళ … కవులెవరైనా పనిగట్టుకుని, అది తెలంగాణ కోసమైనా, మరొక దాని కోసమైనా, కవిత్వం రాస్తే అది మిగలదు. ప్రజల ఉద్యమాలతో, వాళ్ళ సమస్యలతో మమేకం అయిన వాళ్ళు  స్పందించకుండా ఉండలేరు  … కవిత్వం చేయగల శక్తి వున్న  వారు ఆ వేదనని కవిత్వ రూపంలో వ్యక్తం చేస్తారు … అంతే  తేడా!

తెలంగాణా ఏర్పడిన తరువాత కవులు/రచయితలు చేయవలసిన పని, మిగతా వాటి సంగతి ఎలా వున్నా, ఒకటి మాత్రం వుంది అనిపిస్తుంది. కారణాలేమైనా, కారకులెవరైనా ప్రస్తుతం తెలుగు మాట్లాడే ప్రజల మధ్య ఒక భయానక అమానవీయ వాతావరణం కమ్ముకుని వుంది. బహుశా, కాలక్రమంలో ఒక మానవీయ వాతావరణాన్ని సృష్టించేందుకు ముందుగా తెలంగాణా కవులు చొరవ తీసుకోవలసి వుంది-

తెలంగాణా ఏర్పడినా, ఏర్పడక పోయినా ఎపుడేమి చేయాలన్న సంగతి తెలంగాణా కవులకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదనే అనుకుంటున్నాను …

ఎందుకంటే, “పరిస్థితులేట్లా వున్నాయని కాదు …. పరిస్థితులలో మనమెట్లా ఉన్నామని?” అన్న కాళోజీ లాంటి తెలంగాణా వైతాళికుల మాట ఒకటి వారికి ఎప్పుడూ దారి చూపిస్తుంది –

 

కోడూరి విజయకుమార్ 

హైదరాబాద్ – 17 సెప్టెంబర్ 2013

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

————————————————————————————

సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి

ఆరుపదుల పైబడిన ఉద్యమంలో ఈ  ప్రత్యేకరాష్ట్రకల సాకారమవడానికి ఇప్పుడు అతిదగ్గరలో ఉంది తెలంగాణా. ఈ కాలంలోనే రాష్ట్ర సాధన చివరిపేజీలోనించే ఓ భవిష్యత్ దర్శనం కావాలి. నిజానికి గత దశాబ్దిని “తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన దశ”గా అభివర్ణించుకోవలసిన అవసరం ఉంది.

తెలంగాణా సంస్కృతి, సంప్రదాయం,జీవితం సమైక్య రాష్ట్రంలో నిరాదరణకి , అణచివేతకి గురయ్యాక ఉద్యమంతో సాధించుకున్న ఫలాలు నిండుగ కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే తెలంగాణా కవులు,కళాకారులు,మేథావులు భాష పట్ల ఈకాలంలో ఎక్కువ శ్రద్దని కనబరిచారు.ఇది పొక్కిలి,మత్తడి మొదలైన సంకలనాలతో పాటు మునుం వరకు కూడా కవిత్వంలో ఒక ప్రధాన పరికరంగా జీవధారలా సాగుతుంది.

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఈ కాలాన్నించి గతకాలపు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తరానికి గతాన్ని ఎలా అందించాలనేది ఇప్పుడాలోచించ వలసిన సమయం. తెలంగాణా సాహిత్యం ,చరిత్ర,భాష  రేపటి తరానికి అందడానికి ఏంచేయాలనేది ఇప్పుడాలోచించ వలసిన అంశం.

అందుకోసం రూపొందించవలసిన ప్రధాన అవసరాలు భాషాచరిత్ర,సాహిత్య చరిత్ర,నిఘంటువు.తెలుగులోనే అధికశాతం నిఘంటువులు సాహిత్యనిఘంటువులే.ప్రజా సమూహంలో ఉన్నభాషని నిఘంటువు రూపంలోకి తేవాలి. గతంలో వచ్చిన  నలిమెల భాస్కర్-“తెలంగాణా పదకోశం”, రవ్వా శ్రీహరి “నల్ల గొండ జిల్లా ప్రజల భాష”కొంత మేరకు ఈ అవసరాన్ని తీరుస్తాయి.కాని ఇది ఇంకా విస్తృత రూపంలో రావాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణా భాషకుండే ప్రత్యేక లక్షణాలను బట్టి సాహిత్య , ఔపయోగిక,మౌఖిక,జాన పద ధోరణులనుండి , కళలనుండి వర్ణం , పదం, వాక్యం మొదలైన స్థాయిల్లో భాషనిర్మాణాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.ఇందుకోసం ఒక భాషా చరిత్ర కావాలి.

సుమారు ఆరువందల సంవత్సరాలు సుల్తానుల పరిపాలనలో ఉన్నా, రాజ భాష మరొకటైనా అవసరాల మేరకు ఆ పదజాలాన్ని తనలో సంలీనం చేసుకుంది కాని తన ఉనికిని కోల్పోలేదు.దేశీ మాధ్యమంగా ఉండటం వల్ల ద్రవిడ జాతుల ప్రభావమూ ఎక్కువే.ఆయా మార్గాలనించి భాషని విశ్లేషించు కోవల్సిన అవసరం ఉంది.

తెలంగాణాలో జానపద,మౌఖిక  సాహిత్యంతో పాటు లిఖిత సాహిత్యం అధికమే. వీటన్నిటినీ బయటికి తేవడమే కాక అన్ని ప్రక్రియలను సమగ్రంగా చిత్రించ గల, అన్ని వాదాలను సమూలంగా నిర్వచించ గల”సాహిత్య చరిత్రను “అందించ గలగాలి.ఈ క్రమంలో తొలిదశలో తెలంగాణ రచయితల వేదిక తీసుకొచ్చిన కథా సంకలనం గాని, ఆతరువాత వచ్చిన “నూరు తెలంగాణా కథలు”గాని గమనించ దగినవి. ఈ మార్గంలోనే  సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి.

తెలంగణ లోని సాహిత్య మూర్తుల జీవితాలను రానున్న తరాలకు అందించేందుకు వారి ఆదర్శ జీవితాలను చిత్రించాల్సిన అవసరముంది.చరిత్ర రచన రచయితల బాధ్యత కాకపోయినా  గతంలో వచ్చిన ఒకే ఒక తెలంగాణా చరిత్ర (సుంకి రెడ్ది నారాయణ రెడ్డి)రచయితలందించిందే.ఈ అవసరం దృష్ట్యా మరింత లోతైన పరిశీలనలు జరగాలి. మతాలకతీతంగా జరిగే పండగల గురించి ,సంస్కృతి సంప్రదాయాల గురించి అందించ గలగాలి.

ఈ క్రమంలో రచయితలు గతానికంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుందనేది సత్యమే అయినా కాపాడుకొని, సాధించుకున్న దానిని తరువాతి తరాలకు అందించ వలసిన అవసరమూ ఉంది.

              -ఎం.నారాయణ శర్మ