సిస్టర్ అనామిక

Art: Satya Sufi

తని
రెండు రెక్కల్లో చేతులు ఉంచి
టాయిలెట్ సీట్ నుంచి లేపి
పళ్ళుతోమి స్నానం చేయించి
ఒళ్ళుతుడిచి బట్టలు తొడిగి
జాగ్రత్తగా నడిపించి
మంచంపై పడుకోబెట్టి
“మీ అబ్బాయి రమ్మంటున్నాడని అన్నారుగా
వెళ్ళొచ్చు కదా?” అందామె
మాత్రలు వెతుకుతూ
నీటిపొర నిండిన కళ్ళతో
సీలింగ్ కేసి చూస్తూ ఉండిపోయాడతను
ఫోన్ కూడా చేయటం మానుకొన్న
బబ్లూ గాడిని గుర్తుచేసినందుకు.
*

శ్రమను లాలించే దయా దీవి

chinukuజి. వెంకట కృష్ణ ప్రసిద్దకథకుడు, కవి, విమర్శకుడు. వీరు ఇటీవల “చినుకు దీవి” పేరుతో కవిత్వ సంఫుటి వెలువరించారు. “చినుకు దీవి” పదబంధం ఆకట్టుకొనేలా ఉంది. కొంత అస్ఫష్టంగానూ అనిపిస్తుంది. అదే శీర్షికతో ఉన్న ఓ కవితలో ఆ పదబంధాన్ని విప్పుకొనే తాళం చెవి దొరుకుతుంది.

చినుకు సృష్టికి ఆది
శ్రమను లాలించే దయా దీవి — (చినుకు దీవి).

ఎంతగొప్ప భావన ఇది. చినుకు పడితేనే వ్యవసాయం నడుస్తుంది, రైతుల శ్రమ ఫలిస్తుంది, సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా ప్రజలు చేసుకొంటారు. మరీ ముఖ్యంగా వర్షాభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రాంతాలకు చినుకు అనేది ఎంత అపురూపమో, అవసరమో, చినుకు వాలటం ఎంతటి దయాపూరిత చర్యో పై వర్ణన తెలియచేస్తుంది. అలాంటి చినుకుని ఒక దయాదీవి గా పోల్చటం, ఆ పోలికనే కవితా సంపుటి శీర్షికగా ఎంచుకోవటం వెంకట కృష్ణ అభిరుచిని తెలియచేస్తుంది.

తెలుగు సాహిత్యాన్ని ప్రాంతాలవారీగా విడదీసి మాట్లాడటం ఒక అలవాటుగా మారింది. ఉత్తరాంధ్రనుంచి వచ్చే సాహిత్యానికి ఉద్యమనేపథ్యముంటుందని, గోదావరి జిల్లాల కవిత్వంలో కడుపు నిండిన వ్యవహారం కనిపిస్తుందని, సీమ సాహిత్యం కరువు, పంటలెండిపోవటం లాంటి అంశాలను వ్యక్తీకరిస్తుందని తెలుగు సాహిత్యకారుల్లో కొన్ని నిశ్చితాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. దీనికి కారణం, ఒక కవి తాను సృజించే కవిత్వంలో తాను బ్రతుకు తున్న ప్రాంతం యొక్క అస్థిత్వం, తాను జీవించే జీవితం తాలూకు పదచిత్రాలు ప్రవహించక తప్పదు. అదొక అనివార్యత. ఆ కారణంగా పరిణామ క్రమంలో అటువంటి నిశ్చితాభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చు. కానీ అదే సంఫూర్ణ సత్యం కాబోదు.

వెంకట కృష్ణ కవిత్వం అలాంటి పడికట్టు అభిప్రాయాల్ని బద్దలు కొట్టిందనిపిస్తుంది. సీమ కరువును, రైతు అస్థిత్వాన్ని ఎంతైతే బలంగా వ్యక్తీకరించిందో అంతే బలంగా చిక్కని భావుకతా, సౌందర్యం, సౌకుమార్యాలు కూడా అనేక కవితలలో అలవోకగా అంతే ప్రాధాన్యతతో ప్రతిబింబించాయి. దుఃఖమమయమైన సందర్భాల్ని చెప్పేకవితలకు కూడా చక్కని ఆశావహముగింపు ఇవ్వటం కూడా వెంకట కృష్ణ కవిత్వప్రత్యేకతగా భావించవచ్చు.

వెన్నెలను వర్ణిస్తూ…..

ఆకసం పొయ్యి లోన
పగలు మణిగిన జాబిల్లి పిల్లి
రాత్రి సంచారానికి లేచి
అంటిన బూదిని దులిపనట్లు వెన్నెలా — (వెన్నెల) — అంటూ చేసిన వర్ణన అపూర్వమైనది. అనాదిగా వెన్నెలను ఎంతమంది కవులు ఎన్నిరకాలుగా వర్ణించినా ఇంకా చాలానే మిగిలిఉందన్న భావన కలిగిస్తుంది.

ఇంటి మెట్ల అరుగులమీద కూచుని మూడు తరాల స్త్రీలు ఒకరి జడ ఒకరు అల్లుతూ కనిపించే దృశ్యం ప్రస్తుతం ఒక పురాస్మృతి. పల్లెటూర్లలో అయినా కనిపిస్తుందో లేదో!. జడ అల్లటాన్ని వస్తువుగా చేసి వ్రాసిన “జత పదార్ధం” అనే కవిత వెంకట కృష్ణ ప్రతిభకు గీటు రాయి. సామాన్యమైన వస్తువును కవిత్వీకరించటం కత్తిమీద సాములాంటిది.

ఇద్దరు తనూ లతలు – వొకరిలో ఒకరు చుట్టుకున్న వాళ్ళు
తమనవ్వులను పురితిప్పి అనుబంధాలను కదా అల్లటం//
జడ అల్లడమంటే
ముచ్చటగా ప్రేమను తురమటం// — (జత పదార్థం) — తనూలతలు, తురమటము అన్న పదాలు ఎంత అందంగా ఒదిగిపోయాయీ సందర్భానికి. నిజమే కదా! జడ అల్లటం అంటే ప్రేమను తురమటమే!

ఒక బైరాగిని వర్ణిస్తూ వ్రాసిన ఈ వాక్యాలలో పొంగే ఊహాశాలిత చాలాబాగుంది

అప్పుడప్పుడూ అతని పెదవులు తాకి
పరవశించి పాడుతాయి వెదురు కన్నులు
ఆ పాటలు వినడానికి భూమిలో నుండీ
తొంగి చూస్తాయి వజ్రపు తునకలు (రవ్వల దీవి)— వెదురుకన్నులు పరవశించి పాడుతాయనటం, వజ్రపుతునకలు ఆ గానాన్ని వింటున్నాయనటం నూతన అభివ్యక్తి.

వెంకట కృష్ణ కవిత్వంలో కాల స్పృహ అనేక కవితలలో బలంగా వినిపిస్తుంది. లో-హితుడు అనే కవితలో—

ఒక గొంతుకు వురి బిగించి
పెళపెళ పెటిళ్ళున
ఎన్ని గొంతుల గొలుసులు తెంపి
యిలాగైనా యీ దళపతుల నోటి కుట్లు
తెంపావురా! — (లో-హితుడు) — కుల వివక్షకు బలైన రోహిత్ ఆత్మహత్య వృధా కాలేదని కొన్ని కోట్ల గొంతులు ఎలుగెత్తి అన్యాయాన్ని ప్రశ్నించాయనటం, రోహిత్ మరణంలో మనంచూడాల్సిన మరోకోణంగా భావించవచ్చు.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా చర్చింపబడుతున్న అంశం రైతు ఆత్మహత్యలు. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో వ్రాసిన మూగ బాసట అనే కవితలో రైతుకు ఎద్దుకూ ఉన్న అవినాభావసంబంధాన్ని అత్యంత కరుణరసార్థ్రభరితంగా వర్ణిస్తారు.

పాదయాత్రలు చేసే వాళ్ళంతా
సింహాసనాల పైకే చేరుకుంటుంటే
ఎన్ని వేల పాదముద్రలో విత్తిన వాడు
చెట్టెందుకెక్కాడో
అట్నుంచీ పాడెందుకెక్కాడో
అర్ధంకాని మూగెద్దులు సలిపే సంభాషణ — (మూగ బాసట) రాజకీయ తంత్రంలో రైతు స్థానం కడపంక్తే. రైతు పిడికెడు మట్టై చెట్టుకు వేలాడాల్సి రావటం ఒక సామాజిక వాస్తవం. రైతు నేస్తం ఎద్దు. అలాంటి ఎద్దు కళ్ళనుండి “బాధా సర్పం జారిపడ్డదట”, “ఎద్దు పుండు ఎవరికిష్టం” అంటూ కవిత ముగుస్తుంది. రైతుకి ఎద్దుతో ఉండే ప్రేమానుబంధాన్ని అత్యంత అనుకంపనతో వ్రాసిన గొప్ప కవిత ఇది.

“తండ్రులు-కూతుళ్ళు” కవిత టీనేజ్ కూతుర్లున్న తండ్రులను తప్పక కదిలిస్తుంది. ప్రతీ వాక్యమూ గొండెలోపొరల్ని స్పృశిస్తుంది. గొప్ప ఆర్థ్రత నిండిన కవిత ఇది. (ఈ కవిత చదివినప్పుడల్లా ఇంటర్ చదువుతున్న మా అమ్మాయే నా తలపుల్లో మెసలుతాఉంది.)

“కవిత్వం మానవజీవితాన్ని ఆశ్రయించి ఉద్భవించిన కళ” అంటారు పింగళి లక్ష్మీ కాంతంగారు. కవి తాను జీవించే జీవితం, అనుభూతులు, తానునమ్మిన దృక్పథాలు తనకవిత్వంలో స్వాభావికంగానే ప్రకటితమౌతూంటాయి. ఎందుకంటే కవిత్వం ఎక్కువగా అంతశ్చేతనకు సంబంధించింది కనుక. వెంకట కృష్ణ కవిత్వంలో దళిత, బహుజన దృక్పథం , సమాజాన్ని చైతన్యపరచాలనే ఆకాంక్ష, బలహీనులపట్ల సహానుభూతి వంటివి అనేక కవితలలో కనిపిస్తాయి. ఇది ఇతని కవిత్వ తత్వం.

అరఅడుగు వొరలో వొదిగిన
ఆరడుగుల చీర
తనకంటే వొద్దికైన వాణ్ణి చూపించనా అంటుంది (కళతన నేతన్నా) అంటూ నేటి చేనేతకార్మికుల వెతలను అక్షరీకరిస్తాడు. ధనంనిండిన మార్కెట్ మాయాజాలం లో చిక్కుకొన్న నేతన్నలో స్థైర్యం, చైతన్యం నింపేలా కవిత ముగుస్తుంది.

పర్వాంతం అనే కవితలో ఈ దేశపు కర్షక, కార్మికులు సామాజికంగా, రాజకీయంగా ఎలామోసానికి గురవుతున్నారో, న్యాయం చేయమని తట్టిన న్యాయాలయాలు కూడా ఏ రకమైన తీర్పులు చెపుతున్నాయో చాలా వాస్తవికంగా ఆవిష్కరించారు వెంకట కృష్ణ

దేశంలోని ప్రతి రైతుదేహానికీ
ఒక తెల్లగుడ్డ
ప్రతి కార్మికుడి దేహానికీ
ఒక ఎర్రగుడ్డ
పరిహారం పంపిణీగా కోర్టు తీర్పు (పర్వాంతం) అంటూ ఆధునిక జీవనపోరాటంలో బలహీనుల పక్షాన నిలిచారు. ఈ కవితను ముగిస్తూ ఈ నాటకాన్ని మలుపు తిప్పాలనుకొనే ఔత్సాహికుడు, సాహసికుడు, ఉద్యమకారుడు అయిన ఒక పాత్ర ప్రవేశిస్తుంది అనటం ద్వారా ఒక ఆశావహ దృక్కోణం ఆవిష్కృతమౌతుంది.

సాధారణంగా ఉగాది కవితలు సౌందర్యంతో మెత్తమెత్తగా చక్కని ఉపమానాలతో సాగుతాయి. సమాజం పట్ల నిబద్దత, మార్పురావాలనే ఆకాంక్ష హృదయాంతరాళాలో పొదువుకొన్న ఈ కవి ఆ వచ్చిన ఉగాది అతిథికి….

శ్రమజీవన సౌందర్యానికి శ్రమదానం చెయ్యమని
నేల పాతరేసిన ఉషస్సును
జనానికి పంచమని! (అతిథి)— ఉపదేశిస్తాడు. గొప్ప సామాజిక చైతన్యం, ఈ వ్యవస్థ బాగుపడాలన్న నిబద్దత కలిగిన కవిమాత్రమే వ్రాయగల వాక్యాలివి.

ఒక హిజ్రా పై వ్రాసిన “స్వదేహ పరాయీకరణ” కవిత తీసుకున్న వస్తువులోని భిన్న పార్శ్వాలను స్పృశించిన తీరు అద్భుతమనిపించక మానదు. . చాలా గాఢత కలిగిన కవిత అది. అందులో ఒకచోట

జీవితమంతా అజ్ఞాతవాసంలో వుండటం
ఏ బృహన్నలకు మాత్రం సాధ్యం
రణరంగమొకటి రోజూ ఎదురొస్తుంటే
ఏ వొక్క క్షణాన్నీ ఎలా శాంతిగా గడపటం — అన్న వాక్యాల వద్ద తడిలాంటిదేదో చదువరుల హృదయాల్ని తాకుతుంది. వెంకట కృష్ణను- వాస్తవిక వాదిగా, వస్తువును శిల్పంగా, ఉద్వేగంగా, ఉదాత్త వాక్యాలుగా మార్చగలిగే శక్తి కలిగిన గొప్ప కవిగా నిరూపిస్తుందీ కవిత.

ఇంకా ఈ సంపుటిలో, యస్. ఆర్. శంకరన్, అరుణ్ సాగర్, కొండేపూడి నిర్మల, మార్క్వెజ్, కొప్పర్తి లపై వ్రాసిన ప్రేమపూర్వక కవితలున్నాయి.

ఈ సంపుటిలో మొత్తం 49 కవితలున్నాయి. ఈ పుస్తకానికి  కాశీభట్ల వేణుగోపాల్, శ్రీ జి.ఎస్. రామ్మోహన్ లు ఆప్తవాక్యాలు వ్రాసారు.

రఫీక్ అహ్మద్ అందమైన ముఖచిత్రాన్ని అందించారు.

పుస్తకం వెల: 100/-

కాపీల కొరకు: 8985034894

*

నాలుగు రంగులు మిగిల్చే కవిత

painting: Mandira Bhaduri

painting: Mandira Bhaduri

ఏ కవితైనా అది కవియొక్క స్వీయప్రకటన. దానికి సృష్టికర్త కవే . ఆ కవితను చదువుతున్నంత సేపూ ఆ కవి మనస్సులో ఆ సమయంలో కదలాడిన భావాలే కాక, ఆ కవి హృదయసంస్కారం కూడా అంతర్లీనంగా కనిపిస్తూంటుంది. కొన్ని కవితలు తమవైన కొత్తలోకాల్ని సృష్టించి, మనల్ని చేయిపట్టుకొని వాటిలోకి తీసుకెళ్ళి అలౌకికానందాలను పంచుతాయి. కవితపూర్తయ్యాకాకూడా ఆ లోకంలోనే సంచరిస్తూ ఆ మథురభావనల్లో ఉండిపోతాం చాలాసేపు.

మానస చామర్తి వ్రాసిన “వర్ణచిత్రము” అనే కవిత చదివాకా ఎందుకో ఈ మధ్య వచ్చే కవిత్వానికి భిన్నంగా అనిపించింది.

ప్రకృతి జీవితంలోకి ఎలా ప్రవేశించాలని ప్రయత్నిస్తుందో అదే సమయంలో జీవితం ఆ సౌందర్యాన్ని పీల్చుకొని జ్ఞాపకాలుగా మలచుకొని భద్రపరచుకోవాలని ఎంతెలా ఆరాటపడుతుందో – అనే Conflict ను భలే గొప్పగా పట్టుకొందీ కవిత.

కొత్తరోజులన్నీ ఖాళీకాగితాలై అంటూ మొదలౌతుంది కవిత. ఎంత చక్కని భావన! గతకాలపు బరువులు లేకుండా తేలికగా ఎగిరే సీతాకోకచిలుకల్లా – కొత్తరోజులన్నీ తెల్లకాగితాలైతే, ఎన్నెన్ని వర్ణ చిత్రాల్ని చిత్రించుకోవచ్చో కదా అనిపించకమానదు. మంచి ఎత్తుగడకు ఉండే అడ్వాంటేజ్ ఇది. చదువరిని వేగంగా లోనికి లాక్కొంటుంది. డిసెంబరు పూవులు, ఆకుపచ్చని కొండలు, సూరీడు, చంద్రవంక అంటూ ఒక్కొక్క వర్ణచిత్రాన్నీ ఒక్కో పూలరేకలా విప్పుకొంటూ, కవిత ముగింపుకు వచ్చేసరికి ఒక రోజు కాలచక్రాన్ని పూర్తిచేస్తారు మానస గడుసుగా.

పసిమికాంతుల నెగురవేస్తూ, తెల్లగా నవ్విన చంద్రవంక, గొడుగులు పట్టే ఆకుపచ్చని కొండలు వంటి ప్రయోగాలు నవ్యమైన అభివ్యక్తి. హృద్యంగా ఉంది. What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself అంటాడు John Stuart Mill ఒక దృశ్యాన్ని చూసి చలించిన హ్రుదయం తన ఉద్వేగాల్ని తనంతతాను పదాలలోకి అనువదించుకొంటుంది సహజంగా. ఆ అనుభవం కొన్నిసార్లు పైకి ఆనందాన్నిమాత్రమే ఇచ్చేదిగా కనిపించినప్పటికీ హృదయాన్ని మార్ధవం చేసే శక్తిని లోలోపల కలిగిఉంటుంది.

హృదయసంస్కారాన్నివ్వటం కన్నా ఉత్తమోత్తమమైన సామాజికప్రయోజనం ఏముంటుంది? అందుకనే కదా కవిత్వాన్ని “హృదయసంబంధి” అని ఇస్మాయిల్ అన్నది.
“నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో” ఇలాంటి కవితలే “నాలుగు రంగులు మిగిల్చిపోతాయి” అనటానికి నేనేమాత్రం సందేహించను.
*

వర్ణ చిత్రం

-మానస చామర్తి

~
కొత్తరోజులన్నీ ఖాళీ కాగితాలై
రంగులద్దుకోవాలని నా ముందు రెపరెపలాడతాయి.
తైలవర్ణచిత్రమేదో గీయాలని తొందరపడతాయి
వేళ్ళు. వీచే గాలికి ఉబలాటంగా ఊగుతూ
ఖాళీ కాన్వాసు మీదకి ఎగిరి చూస్తూంటాయి
డిసెంబరు పూవులు ఊదారంగు సముద్రం,
పైనేమో నీలాకాశం
గరుడపచ్చ పూసలకు గొడుగులు పడుతున్నట్టు
ఆకుపచ్చాపచ్చని కొండలు
పసిమి కాంతుల నెగురవేస్తూ
వెనుకొక లోకం గీతలుగా మెదులుతూ
చెదురుతున్న చిత్రం పూర్తయ్యీ అవకుండానే
గుప్పెళ్ళతో కెంజాయలు రువ్వి
ఎర్రటి సూరీడెటో మాయమవుతాడా-
నల్లని రెప్పల తాటింపునాపి
నివ్వెరపాటుతో నిలబడిపోతుంది
కుంచె జీవితంలోని వర్ణాలనో
వర్ణాల్లోని జీవితాన్నో జ్ఞాపకంగా నిల్పుకునే నేర్పు లేక
ఒళ్ళంతా ఒలకబోసుకుంటుంటే
అక్కడెక్కడి నుండో తొంగిచూసి
తెల్లగా నవ్విన చంద్రవంక
పెదాలపై నవ్వు ముద్దరై వెలుగుతుంది.
చిత్రం పూర్తవకపోతేనేం..?
చలిలోకి ముడుచుకునే వేళయ్యేసరికి
ఆనందం అర్ణవమయ్యీ,
సౌందర్యం అనుభవమయ్యీ,
తీరం వెంట తడితడిగుర్తులతో
అసంపూర్ణ చిత్రాలన్నీ పరుగులు తీస్తాయి.
నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో,
నా బొమ్మలు నాలుగు రంగులు మిగిల్చి పోతాయి.

చిత్రం: టి. చంద్రశేఖర రెడ్డి

చిత్రం: టి. చంద్రశేఖర రెడ్డి

రెండు పదుల దక్కనీ ఘోష!

Siddharta Book Coverసిద్దార్థ 1994 లో “దీపశిల” తో తెలుగు సాహితీలోకానికి వచ్చి “దీపశిల సిద్దార్థ” గా పేరు తెచ్చుకొన్నారు. ఇప్పుడు తన ఇరవై సంవత్సరాల కవిత్వాన్ని ఒకచోటకు చేర్చి ‘బొమ్మలబాయి’ పేరుతో సంపుటిని తెచ్చారు. సిద్దార్ధ కవిత్వంలో – గొప్పజీవన కాంక్ష, ఆదిమ సౌందర్యం, వలస దుఃఖం, గ్రామ్యజీవనం వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. ఇప్పుడు వస్తున్న కవిత్వ తీరులకు పూర్తి భిన్నంగా ఉంటూ చదువరులకు సరికొత్త పఠనానుభవాన్ని కలిగిస్తుంది.

ప్రముఖ మళయాలి కవి సచ్చిదానందన్ “కవిత్వానికి సమాంతర భాష కావాలి” అంటారు. అంటే – కవిత్వంలో వాడే పదాలు తమ మామూలు అర్థాల్ని వదిలి వేరే విశిష్టార్థాల్ని ధ్వనించాలని, వాక్యాలు ఒట్టి వాచ్యంగా ఉండకుండా భిన్న పొరలలో ఒక అనుభవాన్ని దర్శింపచేయాలని ఆయన ఉద్దేశం. అలాంటి కవిత్వంలో పదాల అర్ధాలు క్రమక్రమంగా అదృశ్యమై మనోద్వేగం (Emotion) మాత్రమే మిగుల్తుంది. పదాలు అర్ధాల్ని వీడి ఉద్వేగాన్ని తొడుక్కొంటాయి. ఏ ఉద్వేగానికి కవి లోనై ఆ కవితను సృజించాడో అది యధాతధంగా స్పష్టంగా దర్శనమిస్తుంది. “సమాంతర బాష” అని సచ్చిదానందన్ అన్నది అలాంటి కవిత్వభాష గురించే. ఇది ఉత్తమోత్తమ కవిత్వాభివ్యక్తి.

తెలుగు సాహిత్యలోకంలో సమాంతరభాషలో కవిత్వం వ్రాసే అతికొద్దిమందిలో సిద్దార్థ ఒకరు.

కురిసిన వానలన్ని ఏమయిపొయ్యాయి
పక్కటెముకల ఎద్దూ ఆకాశమూ
ముచ్చటించుకొంటున్నాయి
భూమిపొరల్లో దొరికిన వొకడి అస్థిపంజరం గురించి
అందులో పడుకుని నిద్రిస్తూన్న
పచ్చచిలుక దేహం గురించి—- “వానలు సిప్తల వనాలు” అనే కవిత ఒక భయంకరమైన కరువును సమాంతర భాషలో దృశ్యమానం చేస్తుంది. ఆ అస్థిపంజరం రైతుది కావొచ్చు, అతనిలో నిద్రిస్తున్న పచ్చచిలుక అంటే అతను జీవితకాలమంతా ఎదురుచూసిన పచ్చదనం అవ్వొచ్చు. ఇక్కడ పదాల అర్ధాలు అదృశ్యమై వాక్యాలు కరువుకాలపు ఉద్వేగాల్ని ఆవిష్కరిస్తాయి.

‘బొమ్మలబాయి’ లో కనిపించే అనేక దేశీపదాలు, ప్రయోగాలు జానపద సాహిత్యరూపానికి దగ్గరగా ఉంటాయి. సమకాలీన కవిత్వరీతులతో పోల్చితే ఇది ఒక భిన్నమైన స్వరం. బండమైసమ్మ, గట్టుమైసమ్మ, ఒగ్గుకథలు, బాలసంతు, పెద్దలకు బియ్యాలివ్వటం, శివసత్తు, ప్రభలు, మల్లన్న, గండెమ్మ, జోగిని, చిందెల్లమ్మ వంటి వివిధ విషయాలు, ఒక ప్రాంత సంస్కృతికి, ఆధునీకరణ పేరుతో మార్జినలైజ్ అవుతున్న జీవనరీతులకు ప్రతీకలు. వీటిని స్మరించుకోవటం, అక్షరాలలో పదిలపరచటం నేటి కాలానికి చాలా అవసరం. సిద్దార్థ తన కవిత్వం ద్వారా ఆపని చేసినట్లు బొమ్మలబాయి నిరూపిస్తుంది.

సిద్దార్థ కవిత్వం నిండా పల్లెదనం ఉంది. అక్కడ గడిపిన బాల్యం ఉంది. ఖేదమో మోదమో అర్ధంకాని ఆధునిక జీవనముంది. తనకలలకు, జ్ఞాపకాలకు వారధిగా నిలిచి తనలోకి కవిత్వప్రవాహాల్ని ఒంపిన మహా నగరముంది.

సీమసింతకాయ నవ్వినట్టు
నల్లతుమ్మ పువ్వు పసుపై రాలినట్టు
తనకడియాల దరువులో కాలమంతా పొగిలినట్టు -(బుశ్శెడ) అంటూ పల్లె సౌందర్యాన్ని కళ్లకుకడతాడు.

సిటీ కదులుతూంటే
ఎటుతిరిగినా వొక బరువుంటుంది
నన్ను నాకుతూనే వుంటుంది
వలసపోవటం ఎంత నరకం
నా గూడుకు నేనే కిరాయి కడుతున్నాను -(సింగాడ) అంటూ నగర జీవనపు ఒరిపిడిని, వలస దుఃఖాన్ని పట్టుకొంటాడు.

బాకీ మొత్తం/అతివాస్తవం
వొక మల్టిమీడియా బ్లూ సరస్సు
దానిపైని ఫ్లైవోవరు
పేగును కొరికే కరెంటు బిల్లు
కుత్కెలోపల వంకరగా దిగిన రేగుముల్లు// -(కర్రెసామీ జంగపోడా) వాక్యాలలో నగరజీవితాన్ని నగ్నంగా మనముందు నిలుపుతాడు. ఫ్లైవోవర్లు, హైటెక్ సిటీలతో అందంగా కనిపించినా, తీర్చాల్సిన అప్పులు, కరంటుబిల్లు కట్టలేనితనం, మహాకవి కాళోజీ “ఏం తినేట్టు లేదు, ఏం తాగేట్టు లేదు” అన్నట్టు గొంతులో దిగిన ఆకలిముల్లు….. అని ఒకానొక భీభత్స దృశ్యాన్ని చూపిస్తాడు చిన్న చిన్న పదాలలో. సిద్దార్థ కవిత్వగొప్పతనం అది.

అజంతా కవిత్వంలో పదే పదే వచ్చే భయం- రాక్షసాకారం దాల్చి రక్తం పీల్చే మహానగరం పట్ల భయకంపితుడైన వ్యక్తి వైయక్తిక అనుభవంలా అనిపిస్తుంది అంటారు నున్నా నరేష్ ఒక మిసిమి పత్రికా వ్యాసంలో. ‘బొమ్మలబాయి’ లో కూడా భయం, ఒక భీతావహ వాతావరణం అనేక కవితల్లో కనిపిస్తుంది. కానీ ఇది వైయక్తిక అనుభూతిగా కాక ఒక సామాజిక ప్రకటనలా వ్యక్తమౌతుంది.

భయం తింటున్న జాతివాణ్నని
తిట్టూ తిట్టూ నాకేమీ సిగ్గులేదు//
నా భయమో పదిజిల్లాలంత వెడల్పూ
ఏడు సముద్రాలంత లోతూ. — అంటాడు (భయచరాన). ఇక్కడ పదిజిల్లాలు అనటం ద్వారా తన సమాజపు చారిత్రికనేపథ్యాన్ని ప్రతిభావంతంగా ప్రతిబింబించగలిగాడు సిద్దార్థ. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే మలిదశ తెలంగాణా పోరాట సాహిత్యం ఇంకా ఊపందుకోని కాలం లోనే (1999) సిద్దార్థ భవిష్యత్తుని దర్శించాడు. ఆ తరువాత కాలంలో విరివిగా వచ్చిన తెలంగాణ అస్థిత్వ సాహిత్యానికి సిద్దార్థ కవిత్వం చక్కని భూమికను ఏర్పరచిందనటంలో సందేహం లేదు.

సిద్దార్థ కవిత్వాన్ని ఓపికగా చదవాలి. ఏ వాక్యమూ వాచ్యంగా ఉండదు. అంతా ధ్వనిప్రధానంగా ఉంటుంది. ఆ వాక్యాన్ని మనోలోకంలో మరోసారి చదువుకొన్నప్పుడు ఏదో దృశ్యం కనిపిస్తుంది. దాన్ని అలా మనకు మనం ఏర్పరుచుకొన్నప్పుడు గొప్ప తృప్తి ఆనందం కలుగుతాయి. ఇది ఒకరకంగా డీకోడింగ్ చేసుకోవటం లాంటిదే. ఆ కాస్త ప్రయత్నం చేయని/చేయలేని వారికి సిద్దార్థ కవిత్వం జఠిలంగా కన్పించవచ్చు. కవిత్వం రాయటంలో కవి పడే తపనతో పోల్చుకొంటే, పాఠకుడు కూడా ఎంతోకొంత శ్రమించకపోతే కవిత్వప్రయోజనం ఎలా దక్కుతుందీ?

కినిగె పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “కవిత్వం అనేది నేచర్. నేను మీడియం మాత్రమే. మన చుట్టూతా ఉండే అనేకానేక శక్తులు మన మీద దాడి చేసి, మనల్ని ఎంచుకుని, ఒక మీడియంలా వాడుకుని వదిలేస్తాయి. అప్పుడు కవిత్వం పుడుతుంది” అంటారు శ్రీ సిద్దార్థ. ఈలోకంలో చెట్టు, పుట్టా రాయి రప్పా వాగు గుట్టా వాటి పనులు నిర్వహిస్తున్నట్లే నేనూ నా పని నిర్వహిస్తున్నాను అంటూ కవిత్వాన్ని ఒక ఒక సహజమైన స్వభావంలా భావించే శ్రీ సిద్దార్థ ‘బొమ్మల బాయి’ మంచి, చిక్కని కవిత్వాన్ని ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. ఎందుకంటే ఇది స్పందించే హృదయమున్న కవి రెండు దశాబ్దాల జీవితపు కవితాయాత్ర.

పుస్తకం పేజీలు: 208
వెల: 150/-
ప్రతులకు: 9848015364

తెలుగు సాహితీమేరువు సోమసుందర్

soma2

1989లో మా యానాం డిగ్రీ కాలేజ్ వార్షికోత్సవానికి శ్రీ సోమసుందర్ గారిని ముఖ్య అతిధిగా పిలిచారు. అప్పుడు ఏం మాట్లాడారో గుర్తులేదు కానీ, ఆయన వస్త్రధారణ ఆకర్షించింది నన్ను. సన్నని దేహం, మడతనలగని పంచె, లాల్చీ లతో గొప్ప కాంతితో కనిపించిన ఆయన రూపం నా ఊహల్లో ఇంకా తాజాగానే ఉంది.

బదిలీపై 2007 లో కాకినాడ వచ్చాకా మరలా ఆవంత్స సోమసుందర్ గారిని కలిసాను. వారితో సంభాషించాకా, వారిగురించి ఏదైనా చిన్నవ్యాసం వ్రాసి అంతర్జాలంలో పెట్టాలన్న కోర్కె కలిగింది. మూడు నాలుగు సార్లు కలిసి కొన్ని వివరాలు సేకరించి వ్యాసం తయారు చేసి వికి పీడియాకు పంపాను. వారు అంగీకరించి యధాతధంగా తీసుకొన్నారు.

ఈ కలయికల ద్వారా సోమసుందర్ గారిని కొద్దిగా అర్ధం చేసుకోగలిగాను. ఆయనకు భాష పట్ల అపారమైన పట్టు ఉంది. ఇప్పటికీ బాగా గుర్తు ఉన్న అంశం – ఒకసారి ఆయన నన్ను “పీయూషమంటే ఏమిటి” అని అడిగారు మా జువాలజీలో పీయూష గ్రంధి (Pituitary gland) ఉంటుంది. కానీ పీయుషం అంటే ఏమిటో తెలీదు. అదే నసుగుతూ అంటే ‘పీయూషమంటే అమృతం” అని చెప్పి ‘కవిత్వం వ్రాసేవ్యక్తికి భాషమీద పట్టు ఉండాలి, అది విస్త్రుతంగా చదవటం ద్వారా వస్తుంది” అన్నారు.

వారికి వాక్యనిర్మాణం పట్ల చాలా శ్రద్ద. నా కవితల్ని కొన్ని చదివి వినిపించుకొన్నారు. ఒక చోట “ఏదైతే ఉందో అది” లాంటి ఒక దూడ వాక్యాన్ని పట్టుకొని “ఛి ఛి ఎందుకలా భావాన్ని అన్ని వంకర్లు తిప్పటం, సూటిగా రాయి” అని మందలించారు.

soma1

శ్రీశ్రీ , తిలక్, నారాయణబాబు, ఆరుద్ర, కృష్ణ శాస్త్రి వంటి మహామహులతో వారి అనుభవాల్ని ఎన్నో చెప్పారు. ఆయనతో జరిపిన ఆనాటి మూడు నాలుగు సమావేశాలు నాకు సంబంధించి మంచి సాహిత్యపాఠాలు. ఆయన శతాధిక గ్రంధకర్త,, వేయి పున్నములు చూసిన పూవనం, మేరుసమానమైన సాహితీమూర్తి, … అయినప్పటికీ, ఏదైనా ఆయనకు నచ్చిన వాక్యం కనిపిస్తే, కల్మషమెరుగని హృదయంతో నిండార నవ్వుతూ, భలే ఉంది ఊహ…. బాగు బాగు అంటూ మెచ్చుకొనే వారు.

ఆ తరువాత  సోమసుందర్ ఏటా నిర్వహించే అవార్డుల సభకు రెండుమూడు సార్లు వెళ్ళాను. పోయినేడాది కాకినాడ బుక్ ఎక్జిబిషన్ ప్రారంభించటానికి ఆయన వచ్చినప్పుడు- పెద్దవయసు కదా గుర్తుపట్టగలరా అంటో సందేహిస్తూ వెళ్ళికలవగా ‘నువ్వు బాబా వి కదూ? ఏం రావటం లేదు, రా ఒకసారి’ అని ఆశ్చర్యపరిచారు.

గత నెల 10 వ తారీఖున  అవధానుల మణిబాబుతో కలిసి వెళ్ళి  సోమసుందర్ గారిని కలిసినపుడు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఉత్సాహంగా కనిపించారు.

soma3
అక్కడ అల్మారా డిస్ప్లే లో వీరు వ్రాసిన “పాబ్లో నెరుడా కవితా జీవితయాత్ర” పుస్తకాన్ని చూసి ‘సార్ .. ఈ పుస్తకం నాకు కావాలి’ అని అడగ్గా వెంటనే ఆయన పక్కనే ఉన్న కిటికీ గూడులోని ఆ పుస్తకాన్ని తీసి ఇచ్చారు. సంతకం పెట్టి ఇవ్వండి సార్ అంటే సంతకం కూడా చేసారు దానిపై.
నీ వయసెంత అని అడిగారు- చెప్పాను నేను. చాలా చిన్నపిల్లాడిలా కనపడుతున్నావు అన్నారు. బయటకు వచ్చేసాకా – అదేమిటి పెద్దాయన అలాగ అంటారు? అని మణిబాబుని అడిగితే, “ఆయన వయసు 94, ఆయనకు మీరు చిన్నపిల్లాడిలా కనపడక ఇంకెలా కనపడతారు అని తిరిగిప్రశ్నించాడు నన్ను.

అద్దేపల్లి రామమోహనరావు గారు గతించి ఇంకా ఏడాది కూడా కాలేదు, ఇప్పుడు  సోమసుందర్ గారు. కొద్దో గొప్పో వారిరువురితోనూ భౌతికంగానో, మానసికంగానో సన్నిహితంగా మసలిన నాలాంటి వారికిది తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

సోమసుందర్ గారు తమ దేహాన్ని రంగరాయ మెడికల్ వైద్యకళాశాలకు దానమివ్వటం వారి శాస్త్రీయ దృక్పధానికి నిదర్శనం.

సోమసుందర్ గారిపై నేను వ్రాసిన వ్యాసం లింకు

http://sahitheeyanam.blogspot.in/2009/01/blog-post_25.html

 

సమాంతర భాష: వొక సంభాషణ!

sach

 

1

కె. సచ్చితానందన్ కేరళకు చెందిన ప్రముఖ భారతీయ కవి, విమర్శకుడు, అనువాదకుడు.  ఈయన ఇంతవరకు    ఇరవైరెండు కవితాసంపుటులు, పదహారు అనువాద కవిత్వ సంకలనాలు, పంతొమ్మిది సాహిత్యవ్యాస సంపుటులు, నాలుగు నాటకాలు – వెలువరించారు.  ఆధునిక మళయాల సాహిత్యానికి బీజంవేసిన వారిలో సచ్చిదానందన్ ఒకరు.   సరళమైన భాష, కొత్తఒరవడి, ప్రతీకాత్మకత, సునిశితమైన వ్యంగ్యం వంటి లక్షణాలతో ఉండే సచ్చితానందన్  కవిత్వం దేశవ్యాప్తంగా మంచి పేరుతెచ్చుకొంది.

2

ప్రశ్న: కవిత్వానికి తనదైన భాష ఉంటుందా? (A CONVERSATION WITH K. SATCHIDANANDAN ~ Rizio Raj  గారి ఇంటర్వూ లో ఒక ప్రశ్న)

సచ్చితానందన్ జవాబు:  కవి ఆత్మను సంపూర్ణంగా ఆవిష్కరించటంలో  భాష సరిపోదని కొన్ని కవితల్లో చెప్పాను. నేను వ్రాసిన కాక్టస్ అనే కవితలో, పదునుగా గుచ్చుకొనే సమాంతర భాష ఆవిష్కృతమవటం గమనించాను. ఉత్తర కేరళలో జరిగిన హింసాత్మక ఘటనలపై వ్రాసిన An attempt at Conversation  అన్న కవితకూడా అలాంటిదే. ప్రస్తుత కవులు- సంప్రదాయాల్ని, పునరుక్తుల్ని ధిక్కరించే కొత్త నుడికారాల్ని, భాషని వెతుక్కొని- నూతన తాత్వికతను, వినూత్న కోణాల్ని ఆవిష్కరిస్తున్నారు.

Tadeus Rozewicz – యుద్దానంతర కవిత్వం గురించి మాట్లాడుతూ- “ఆ కవిత్వం- భయకంపితమైన, కసాయివాళ్ళకు ఒదిలిపెట్టబడిన జీవన్మృతుల కొరకు వ్రాయబడి – తుక్కులోంచి తీసిన  పదాలతో, ఆకర్షణ లేని పదాలతో, కాపాడుకొన్నపదాలతో నిండి  ఉంటుంది” అంటాడు.  చివరకు కవిత్వం అంటే దాని పదాలే. Paz  “తన అస్తిత్వాన్ని తన పదాలుగా మార్చుకొన్నమనిషే కవి” అని అంటాడు. మనిషి- తనతో , ఇతరులతో, ప్రకృతితో , అగోచరత్వం తో చేసే సంభాషణలో కలిగే చిక్కులన్నీ అతని కవిత్వంలో ప్రతిబింబిస్తాయి.

 

3.

“సంభాషించటానికి ఒక ప్రయత్నం” అన్న కవితలో సచ్చితానందన్ ఒక బీభత్స ప్రపంచాన్ని మనముందుంచుతాడు.  ఇది కవిత్వభాష.  వాచ్యం కాదు, ధ్వని పూరకం. మన చుట్టూ జరుగుతున్న హింసకు రక్తాన్ని ప్రతీకగా తీసుకొని చెపుతాడు. ఫుట్ నోట్సులు ఉండేది కవిత్వమే కాదు అని త్రిశ్రీ అన్నప్పటికీ ఈ కవితలో వచ్చే కొన్ని అంశాలకు ఇచ్చిన ఫుట్ నోట్సులు కవితను పరిపుష్టం చేస్తాయి. కొన్ని  పాతవిషయాల్ని సచ్చితానందన్ ఎలా ప్రస్తుతానికి అన్వయించాడో అర్ధమౌతుంది.

2వ ఖండికలో వచ్చే  Ezhuthachan, రాముని కథను రామచిలుక తో చెప్పించిన ప్రసిద్ద మళయాలకవి.

7వ ఖండికలో వచ్చే  Asan అనేది ఒక కవిపేరు. అతను  వ్రాసిన ఓ కవితలో సీత, రాముని పాతివ్రత్యాన్ని ప్రశ్నిస్తుంది.

9వ ఖండికలో  “మన భాష చచ్చిపోయింది” అన్న వాక్యం వ్రాసి ఆత్మహత్య చేసుకొన్నది సుబ్రమనియదాస్ అనే ఓ యువ రాడికల్.

 

ఈ కవితలో ఖండికలన్నీ- కవి తనతో, సమాజంతో చేసే సంభాషణలు.  చెల్లాచెదురుగా, ఒకదానికొకటి సంబంధం లేకుండా కనిపిస్తున్నప్పటికీ బీభత్సం, మానవత్వం రెండు రైలు పట్టాల్లా సమాంతరంగా సాగినట్లు- ఏదో ఏకసూత్రత    అన్నింటినీ బంధిస్తుంది.

ఈ కవితలో కనిపించే చేదు అంతా, ఒక కవి  అంతర్, బాహ్య లోకాలతో చేసిన సంభాషణలలో పలికిన చేదుగా అర్ధం చేసుకోవాలి.

 

 

సంభాషించటానికి ప్రయత్నంశ్రీ కె. సచ్చితానందన్

 

 

1
మనం ఒక కత్తినీడలో జీవిస్తున్నాం
ఎవరో పెంచిపోషించిన కత్తి అది.
ఎవరి హృదయమో చీల్చబడుతుంది.
ఆ రక్తం మనల్ని అంధుల్ని చేస్తుంది.
రక్తంలో స్నానం చేసి అన్నం తింటాం
రక్తంలో స్నానం చేసి ప్రేమించుకొంటాం
ఆఖరకు కలల్లో కూడా రక్తమే.
2

Ezhuthachan కు రామాయణ గాథ చెప్పిన రామచిలుక
మండేఎండలో టివి కేబుల్ పై విశ్రాంతి తీసుకొంటోంది
దాని ముక్కుపై నక్షత్రకాంతులు లేవు
దాని రెక్కలు కూడా రక్తమోడుతున్నాయి.
3

నాకు కన్నీళ్ళు లేకుంటే
నేనూ ఒక కత్తిగా మారి ఉండేవాడినేమో.
మా అమ్మ నాకు కన్నీళ్ళు ఇచ్చింది
ఆమె గొప్ప పాటకత్తె కాదు అయినప్పటికీ
ఆ స్త్రీమూర్తి సంగీతంలో నేను మునిగిపోయాను
4

నేను అమ్మాయినయితే బాగుండేదని ఆశపడేవాడిని
నా చిన్నతనంలో కళ్ళకు కాటుకపెట్టుకొని
పొట్టిగౌనులు వేసుకొని అద్దం ముందు ఆడుకొనేవాడిని
వద్దు వద్దు… ఏదో ఓ రాత్రిఫూట ఓ ఇరవై మందిచే
ఈ దేహం చీలి ఛిద్రమవటం నేను కోరుకోను.
నా సహచరీ! దయచేసి మూడో అమ్మాయిని ఈ లోకంలోకి తీసుకురాకు.
5

మా అమ్మ కన్నీళ్ళలో నేను పండించుకొన్న ముత్యాలు
ఏ సాగరాల్నీ వెలిగించలేక పోయాయి.
వాటి పిలుపును ఎక్కడో విన్న ఒకే ఒక్క అమ్మాయి
తన కనులు తెరిచి, ఓ పూవుగా మారింది
6

కత్తులు పూలగురించి మాట్లాడవు.
దారుల్ని, స్థలాల్ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తుంటాయి
హృదయాల్లోకి చొచ్చుకొని అరుస్తాయి ‘నీ మతమేమిటి అంటో
పదాల్లోకి ప్రవేశించి గర్జిస్తాయి ‘నీదే పార్టీ అనీ.
7
Asan వర్ణించిన సీత
అడవికి, భర్త పేర్చిన అగ్నిపరీక్షకు మధ్య కూర్చొని
ప్రేమంటే ఏమిటో తొలిసారిగా నేర్పిన రావణుని త్యాగాన్ని
జ్ఞాపకం చేసుకొంటుంది.
ఆమె గర్భాశయం రాక్షస శిశువుని కాంక్షిస్తుంది
తన రావణుడు కోరుకొన్నంత బలంగా…
8
ప్రేమ పదాలు అన్నీ అయిపోయాయి
ఒక్కో పదము ఇప్పుడో పగిలిన సారాసీసా ముక్క
మనం ఒకరినొకరం దానితో గాయపర్చుకొంటూఉంటాం.
ఈ ప్రపంచం, కోర్టునోటీసులు మన తలుపులకు అంటించాకా
ప్రేమించుకోవటం అంటే ఒకరి రక్తం ఒకరు తాగటమే.
9
‘మన భాష చచ్చిపోయింది’ అన్న వాక్యం వ్రాసిన వాడు పారిపోయాడు
ఆ భేతాళ శవాన్ని మనమింకా మోసుకు తిరుగుతున్నాం
దాని ప్రశ్నలకు సమాధానాలు
పక్షి కువకువల్లో లేదా గజ్జెల గలగలల్లో ఎక్కడా లభించవు
10
తడబడుతూ మాట్లాడేవారు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు
నాలిక కత్తిరింపబడిన వ్యక్తి మాటల్లా నేను అస్పష్ట శబ్దాలు చేస్తున్నాను
అంతా కుదుటపడుతుందని, పూర్వస్థితి వస్తుందని ఏదో సంకేతం చెపుతుంది
నమ్మబుద్దికాక నన్నునేను కొరడాతో కొట్టి చూసుకొంటాను
11
బ్రహ్మపుత్ర నదీతీరాలపై గుల్మొహర్లు విచ్చుకొన్నాయి
నువ్వు ఈ గదిలో లేవు
నా భుజాలు మరల సలుపుతున్నాయి
మరో శవాన్ని మోయటానికేమో
లేక ఏ కత్తీ ఖండించలేని రెక్కలు మొలవటానికో

బయట నిప్పులు చెరిగే ఎండలో
జటాయువు తన తెగిన రెక్కల్ని తపతప లాడిస్తోంది

 

 

(An attempt at Conversation by Sri.K. Sachithanandam)

తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

 

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

 

-బొల్లోజు బాబా

~

 

ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు.  నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం.  ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం.  ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.

ప్రముఖ కవయిత్రి,  మీనా కందసామి వ్రాసిన ఈ కవిత ఈనాటి రాజకీయ సామాజిక వాస్తవికతకు అద్దంపడుతుంది. కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు, అక్కడి వాసితులను బలవంతంగా తొలగించటానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ఇద్దరు యువకులను, జనవరి 2015 లో అరెష్టు చేసింది ప్రభుత్వం.

అదీ ఈ కవితకు నేపథ్యం.

ఈ కవితలో ‘నిన్ను’ అన్న సంభోధనలోనే ఈ ప్రపంచంతో నీ మనుగడ ప్రశ్నార్ధకమైందన్న అంశం దాగిఉంది.  ఆ ‘నువ్వు’  లో ‘నేను’  లేను అనుకోవటం మనల్ని మనం మోసగించుకోవటమే. చివర్లో  నిశ్శబ్దమా వర్ధిల్లు అనటం ఈ సమాజం ప్రదర్శిస్తున్న నిర్లిప్తతపై గొప్ప వక్రోక్తి.

 

*******

 

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ ఇంట్లో ఏదో సమస్యాత్మక పుస్తకం ఉందని ఆధారం చూపుతారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పోలీసులు చెప్పారని ప్రసారమాధ్యమాలన్నీ నిన్ను తీవ్రవాది అనటాన్ని నీ మిత్రులు టివిలో చూస్తారు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. లాయర్లందరినీ భయపెడతారు.  నీ కేసు తీసుకొన్న లాయర్ ఆ పైవారం అరెష్టు చేయబడతాడు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఆ మర్నాడు నిన్ను ఫేస్ బుక్ లో చూస్తారు నీ మిత్రులు.  పోలీసులే నీ పేరుతో ప్రవేశిస్తారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పిటిషన్ పై  వెయ్యి సంతకాలు తీసుకోవటానికి నాలుగురోజులు పడుతుంది నీ మిత్రులకు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ చిట్టితల్లి UAPA  అంటే ఏమిటో తెలుసుకొంటుంది.  నీ మిత్రులకు సెక్షన్-13 అర్ధమౌతుంది.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ప్రజలకు నువ్వు ఒక లెఫ్టిస్ట్ వి,  లెఫ్టిస్ట్ లకు నువ్వు ఒక అతి-లెఫ్టిస్ట్ వి.  ఎవరూ మాట్లాడరు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఇకపై జీవితాంతం నీవు తీవ్రవాదిగానే పరిగణించబడతావు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  వాళ్ళు ఒక జాబితా తయారుచేస్తారు.  ఖండించినవారి పేర్లు అందులోకి చేరుతూంటాయి.

 

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నిన్ను హెచ్చరిస్తారు.  నీవే ప్రతిఒక్కరికీ ఒక హెచ్చరిక అవుతావు-  కార్పొరేట్ సాలెగూటిలో వేలుపెట్టినందుకు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఈ రాత్రి నీ ఇల్లు సోదాచేస్తారు.  నిన్ను ప్రశ్నించటానికి తీసుకెళతారు.  మాట్లాడకు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  కోర్టు ఓ అరుదైన చర్యగా నీకు బెయిలిస్తుంది.  మరో కేసులో నువ్వు మళ్ళా అరెష్టు చేయబడతావు

రేపు  ఎవరో నీ పిల్లల్ని అరెష్టు చేస్తారు.  నీవు అజ్ఞాతంలోకి వెళిపోతావు.  ప్రజాస్వామ్యాన్ని బతికించటానికి కొన్ని జాగ్రత్తలు తప్పవు.

 

నిశ్శబ్దమా వర్ధిల్లు!

 

 

మూలం: మీనా కందసామి ( The End of Tomorrow)     – తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

అలుపూ అలకలూ లేని అద్దేపల్లి..

 

 

 -బొల్లోజు బాబా

~

 

baba“శయనిస్తున్న అతనెలా ఉన్నాడు? యోధునిలాగా లేక కవిలాగ?     హ్మ్…… కవిత్వ యోధునిలా” — జె.డి. రోబ్

ఓ మాస్టారికి ఒక  కిళ్ళీ కొట్టు వద్ద ఖాతా ఉండేది.   అయిదేళ్ళు గడిచాకా, ఓ మిత్రుడు ఆ కొట్టు యజమానికి ‘ఈయనే ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు” అని పరిచయం చేసాడు.  ఆ కొట్టు యజమాని  ఓ బైండు చేసిన పుస్తకాన్ని తీసి చూపిస్తూ మనస్సు బాగోనప్పుడల్లా ఈ పుస్తకాన్ని చదువుతుంటానని చెప్పాట్ట.  ఆ పుస్తకం పేరు “అంతర్జ్వాల”.  అది  అద్దేపల్లి  రచన.  ఒక కవికి ఇంతకు మించిన పురస్కారం ఏ అకాడమీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వాలు ఇవ్వగలవు?

యాభై ఏళ్ల సాహితీప్రస్థానంలో సుమారు 30 పుస్తకాల్ని వెలువరించి, వందకు పైగా ముందుమాటలు వ్రాసి, వివిధ సభల్లో రెండువేలకు పైగా అద్యక్షోపన్యాసాలు ఇచ్చి, ఎన్నో వందల పుస్తకాలను సమీక్షించి, కొన్ని వందల తెలుగు గజల్స్ ను వ్రాసి, గానం చేసి- తెలుగు సాహితీలోకంలో ఒక కవిత్వయోధునిలా జీవించిన  అద్దేపల్లి రామమోహనరావు జీవిత చరమాంకంలో కూడా  ఒక యోధునిలానే నిష్క్రమించారు.

గత మూడునెలలుగా ఆయన అస్వస్థతకు గురయ్యారని కాకినాడ సాహితీమిత్రుల మధ్య గుసగుసలుగానే ఉండింది.  కానీ ఇంత త్వరగా విడిచిపోతారని ఎవరూ అనుకోలేదు.

తన అనారోగ్యం గురించి ఎవరికి తెలియనివ్వలేదు  అద్దేపల్లి.  ఎవరినీ ఎక్కువగా కలిసే వారు కాదు.  గతమూడునెలలుగా ఎవరైనా ఆయనను కలిసినా అస్వస్థత ప్రస్తావన లేకుండానే మాట్లాడేవారు.  ఇవతలి వ్యక్తికి తెలిసినా, ఆయన ధోరణిని బట్టి, తెలియనట్టుగానే మాట్లాడాల్సివచ్చేది.  అలాగని నిర్వేదంలో పడిపోయారా అంటే అదీకాదు,  మరణానికి వారంరోజుల ముందు వరకూ కూడా స్వయంగా ఆటో ఎక్కి రేడియేషన్ చేయించుకొని వచ్చిన వ్యక్తి.  ఒక సాహితీ మిత్రునికి ఫోన్ చేసి, ఈ సంవత్సరం ఎలాగైనా “సాహితీ స్రవంతి” పత్రికను ప్రారంభించాలి అని దిశానిర్ధేశం చేసిన వ్యక్తి  అద్దేపల్లి.  “మీరు రేడియేషన్ చేయించుకొన్నారు కదా జాగ్రత్తగా ఉండాలి” అని కుటుంబసభ్యులొకరు అన్నప్పుడు, “అన్ని సిట్టింగులు అయిపోయాయి,  రేడియేషన్ అన్న మాట ముగిసిపోయిన అధ్యాయం, ఇకదాని గురించి మాట్లాడకండి” అని వారికే తిరిగి ధైర్యం చెప్పిన వ్యక్తిత్వం  అద్దేపల్లిది.  మరణాన్ని కూడా ప్రశాంతంగా స్వీకరించాలంటే గొప్ప   రుషిత్వం ఉండాలి.

కవిగా, విమర్శకునిగా, వక్తగా, వ్యక్తిగా ఆయన పోషించిన వివిధ పాత్రలను తెలుసుకోవటం ద్వారా  అద్దేపల్లి చేసిన సాహిత్యకృషిని అర్ధం చేసుకొనవచ్చును.

అద్దేపల్లి కి ప్రాచీన సాహిత్యంపై  గొప్ప  పట్టు ఉండేది . మొదట్లో చందోబద్దమైన కొన్ని వందల పద్యాల్ని రచించారు.  1960 లో తొలికవిత కృష్ణాపత్రికలో అచ్చయింది.  కాలక్రమేణా తాను విశ్వసించే  హేతువాద దృక్ఫధం, అభ్యుదయత, ప్రగతిశీల భావాలకు వచనకవిత్వమే సరైనదని అనుకొని వచన కవితామార్గాన్ని ఎంచుకొన్నారు.  ప్రపంచీకరణ ప్రభావం వలన చిధ్రమౌతున్న మానవజీవనంపై కవిత్వం వ్రాసిన తొలి తెలుగుకవి  అద్దేపల్లి.  వీరి కవిత్వ సంపుటాలలో అంతర్జ్వాల (1970), రక్త సంధ్య (1978), గోదావరి నా ప్రతిబింబం (1992), పొగచూరిన ఆకాశం, సంఘం శరణం గచ్చామి, మెరుపు పువ్వు, గీటురాయి వంటివి ప్రముఖమైనవి. మినీ కవితల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి గొప్ప ప్రాచుర్యాన్ని కలిగించారు  అద్దేపల్లి.  తెలుగులో అనేక వందల గజల్ లను రచించి వాటిని గొప్ప రాగయుక్తంగా ఆలపించి అనేక సభలను రంజింపచేసేవారు. వీరి అనేక కవితలు వివిధ భాషలలోకి అనువదింపబడ్డాయి.  కవిగా  అద్దేపల్లి తెలుగు సాహితీలోకంలో ఎప్పటికీ చిరస్మరణీయుడే.

విమర్శకునిగా  అద్దేపల్లి పాత్ర గణనీయమైనది. శ్రీశ్రీ మహాప్రస్థానంపై వీరి మొదటి విమర్శనా గ్రంధం వచ్చి పలువురి ప్రసంశలు పొందింది.  ఈ వార్తవిన్న శ్రీశ్రీ యే స్వయంగా “సరోజినీ, ఈ విషయం విన్నావా, నా పుస్తకం మీద సమీక్షా గ్రంధం వస్తోంది” అని చెప్పటం ఒక మధురమైన ఘట్టం.  కుందుర్తి వచన కవితా వైభవం, స్త్రీవాద కవిత్వం-ఒక పరిశీలన, మహాకవి జాషువా కవితా సమీక్ష, తెలుగు కవిత్వంపై ఆధునికత, అభ్యుదయ విప్లవ కవిత్వాలు- సిద్దాంతాలు, శిల్పరీతులు వంటివి  అద్దేపల్లి వెలువరించిన వివిధ విమర్శనా గ్రంధాలు.  మంచిని విస్తారంగా చర్చించి, చెడును సూచనప్రాయంగా ఎత్తిచూపటం  అద్దేపల్లి విమర్శనా శైలి.

వక్తగా  అద్దేపల్లి సమకాలీన సాహితీవేత్తలెవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటారు.  సభలకు ఎవరైనా పిలిస్తే దూరభారాలకు వెరవకుండా,  తప్పనిసరిగా హాజరయ్యి, ఆ సంస్థలకు, అక్కడి యువకవులకు ఎంతో స్పూర్తిని, ఉత్తేజాన్ని నింపే గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవారు. రిజర్వేషన్ లేకపోతే 80 ఏళ్ళ వయసులోకూడా జనరల్ భోగీలో ప్రయాణించైనా సరే వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొనేవారు  అద్దేపల్లి.  ఈ లక్షణాన్ని గుర్తించిన తెలుగు సాహితీలోకం  అద్దేపల్లికి  “సాహితీ సంచార యోధుడు” అన్న బిరుదును ఇచ్చి సత్కరించింది.  ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై లోతైన అవగాహనతో వీరు చేసే అనర్ఘళమైన ఉపన్యాసాలు, చక్కని ఉటంకింపులతో,  చలోక్తులతో సాగి సభికులను రంజింపచేసేవి.  వీరు గత ముప్పై ఏళ్ళుగా ఇచ్చిన ఉపన్యాసాలు రెండువేలకు పైమాటే.

వ్యక్తిగా అద్దేపల్లి స్నేహశీలి, నిరాడంబరుడు, భోళాశంకరుడు, నిరంతర సాహితీకృషీవలుడు. సమయపాలన విషయంలో  అద్దేపల్లి నిక్కచ్చిగా ఉండేవారు.  వీరు అద్యక్ష్యత వహించిన సభలలో కాలం తూకం వేసినట్టు నడిచేది.   తనకన్నా చిన్నవారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వారి కవిత్వంలోని గుణగణాలను విప్పిచెప్పి ప్రోత్సహించేవారు. ఎవరైనా   మంచి వాక్యం వ్రాస్తే భలే ఉంది అంటూ వెన్నుతట్టి మెచ్చుకొనేవారు. అద్దేపల్లి అద్యక్షత వహించిన ఒక సభలో నేను నా కవిత వినిపించి వెళిపోతుంటే, నన్ను ఆపి — బొల్లోజు బాబా కవిత్వం వాచ్యంగా ఉండదు ధ్వని ప్రధానంగా ఉంటుంది, ఇప్పుడు చదివిన కవితా పంక్తులలోని సొబగులు ఇవి అంటూ విశ్లేషించి, అభినందించటం— నేను ఎన్నటికీ మరచిపోని ఒక తీపి జ్ఞాపకం.

తెలుగు కవిత్వయోధుడు అద్దేపల్లి రామమోహనరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ…….

 

*

 

 

 

 

 

 

 

 

ప్రేమతో “సహ చరణం” — జగద్ధాత్రి కవిత్వం

 

బొల్లోజు బాబా

 

సమకాలీన సాహిత్యంలో ఉత్తరాంధ్రనుంచి బలంగా వినిపించే గొంతు జగద్ధాత్రి గారిది. కథలు, వ్యాసాలు, అనువాదాలు, కవిత్వం, సభానిర్వహణ – ప్రక్రియ ఏదైనా తనదైన శైలి, ముద్ర ఆమె రెండు దశాబ్దాల సాహిత్యసేవ ద్వారా ఏర్పరచుకొన్నారు.

జగద్ధాత్రి గారు ఇటీవల వెలువరించిన కవిత్వ సంకలనం పేరు “సహచరణం”. “కవిత్వంలో కవి తనను తాను బయిల్పరచుకొంటాడు” అంటారు.  ఈ సంకలనంలోని కవితలన్నింటిలో, ప్రేమ, ఆప్యాయతలు, ఆరాధన, ఆత్మవిశ్వాసం, ప్రకృతిసౌందర్యం పట్ల ఆశ్చర్యం, సామాజిక అంశాలపట్ల సహానుభూతి వంటి అనేక జీవనస్పందనలు కన్పిస్తాయి.  ఇవన్నీ మానవవిలువలు.  మానవుల ఉత్తమజీవనానికి సహాయపడే విలువలు. ఇవి ఈ కవయిత్రిని గొప్ప ప్రేమమయిగా నిరూపిస్తాయి. ఈ కవిత్వాన్ని గొప్ప కవిత్వంగా నిలబెట్టాయి.

 

ఇన్నేళ్ళకి ఒక స్వతంత్ర నిర్ణయం

తీసుకొన్న సాయింత్రం

నిర్భీతిగా, నిశ్చలంగా

సంధ్య కెంజాయలోకలిసి

నీరవ నిశీథిలోనికి

ఒక వెలుగు రేఖ కోసం పయనించిన

సాయింత్రం…..!!!

        —   పై వాక్యాలు “పయనం” అనే కవితలోనివి.  జీవితంలో నిస్సహాయ స్థితి ఆవరించాకా, ఆశలన్నీ ఆవిరవగా, మొండి ధైర్యంతో ఒక వెలుగు రేఖకోసం ఒక వ్యక్తి పయనం సాగించటం ఈ కవితకు వస్తువు.  నాకొచ్చిన కష్టమిదీ, నేను తీసుకొన్న నిర్ణయమిదీ అని కవయిత్రి ఎక్కడా చెప్పదు.    అయినప్పటికీ చదువరి, కవయిత్రి దుఃఖంతోను, ధైర్యంతోనూ మమేకమవుతాడు.  మనస్థితిని అక్షరాలద్వారా అందచేసి అదేస్థాయిలో భావతీవ్రతను కలిగించటం అనేది ఉత్తమ కవితా లక్షణం.

 

ఒంటరితనం మనిషికి చాలా అవసరం

మనిషితనం మిగులుందో లేదో అప్పుడప్పుడూ

ఎవరికి వారు చేసుకునే అంతరీక్షణ

 — (వరం) ఈ కవితలో ఒంటరితనం మనల్ని మనకు దర్శింపచేసే సాధనంగా, అంతరంగపు అద్దంలో విశదంగా చూసుకొనే వరంగా అభివర్ణించటం ఒక నూతన అభివ్యక్తి.

 

తనవారి కళ్ళలో తానో జ్ఞాపకంగా మెదిలే

ఈ అశ్రువుల ముత్యాలు ప్రేమకు మానవత్వానికి

సార్వకాలిక ప్రతీకలు

మానవునికి సృష్టి ఒసగిన అపురూప అమూల్య

కానుకలు …. కన్నీళ్ళు..

(ఇవీ).  అపూర్వమైన ఆలోచనతో కూడిన వాక్యాలు ఇవి. కన్నీళ్లని చెలులుగా, స్మృతుల చినుకులుగా, ముత్యాలుగా, సృష్టి ఒసగిన కానుకలుగా వర్ణించటం గొప్ప ఊహ.  ఎంతో రమ్యంగా సాగే కవిత ఇది.

 

రంగురంగుల కాగితాలతో

నన్ను ప్రియంగా అందంగా చేసావు

నాకో అస్తిత్వాన్నిచ్చావు

నీ ఆశలతోక తగిలించి గాలిలోనికి వదిలావు.   (పతంగ్) ……

Jagathi

కారణాలేమైనా తల్లిపై ప్రేమను వ్యక్తీకరిస్తూ వచ్చినంత సాహిత్యం తండ్రి పై రాలేదు. ఇప్పుడిప్పుడే ఈ లోటు భర్తీ అవుతున్నది.  పతంగ్ అనే కవితలో ఈ కవయిత్రి తన తండ్రి తనను ఒక గాలిపటాన్ని చేసి ఎగరేసారంటూ, ఆ గాలిపటం తుఫానుగాలులకు జీవితపుచెట్టుకు చిక్కుకోగా, ఆ తండ్రి ప్రేమను ఏ విధంగా స్పూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు నడుస్తున్నదీ– అంటూ సాగే ఈ కవిత కథనాత్మక శైలిలో ఒక కూతురు తన తండ్రిని ఏ విధంగా దర్శించిందో అక్షరీకరిస్తుంది.  ఈ కోవలో వచ్చిన కవితల్లో ఇది వినూత్నంగా నిలుస్తుంది.

 

అప్పుడే క్షణంలోనే

అంతరాంతరాల్లో

భావ బీజావాపన జరిగే

దివ్య క్షణం లోనే అదాటుగా

అతను నా దేహాన్ని ఆక్రమించుకొన్నాడు

వారించానా….

తగవును వరించానన్న మాటే

అందుకే నిశ్శబ్దంగా

నాలోకి నేను జారుకొన్నా—- (అంతర్యానం).

అంటూ మొదలయ్యే ఈ కవితా వస్తువు చాలా సాహసోపేతమైనది.  సంగమ సమయంలో, వాంఛలేకుండా శరీరాన్ని అప్పగించిన ఒక స్త్రీ ఆలోచనా తరంగాలు ఏవిధంగా సాగాయి అనేదే కవితా వస్తువు.  ఇలాంటి కవితకు ఎత్తుగడ, నడక, ముగింపు ఉత్తమంగా లేకపోతే  ఔచిత్యభంగం ఏర్పడి రసవిభ్రంశం కలుగుతుంది.   చదువరిని కవితలోకి సరసరా లాక్కొనే సరళమైన ఎత్తుగడ, బిగిసడలని నడకా, ఉదాత్తమైన ముగింపు ద్వారా కవయిత్రి తన ప్రతిభ అనన్యమని నిరూపించుకొన్నారు.

 

కలయిక అనే మరో కవిత

దేహాన్ని అర్పించడమంటే

మనసిచ్చినంత సులువుకాదు

మనసుముడి విప్పినంత తేలికగా

రవికె ముడి విప్పలేము ……

అంటూ చాలా బలమైన అభివ్యక్తితో సాగుతుంది.   అటువంటి వ్యక్తీకరణ స్త్రీవాద కవిత్వంలో ఇంతవరకూ కనిపించని ఒక కొత్త కోణాన్ని చూపిస్తూ, కొత్తవెలుగుని ప్రసరింపచేస్తుంది.

 

“వాసన” అనే కవితలో ఈ కవయిత్రి భావనా పటిమ శిఖరాల్ని చేరుకొని ఒక గొప్ప మొజాయిక్ చిత్రాన్ని మనకళ్లముందు నిలుపుతుంది.

కొన్ని దేహాలు మృగాల వాసన వేస్తాయి

కొన్ని ఆకలి వాసన వేస్తాయి

కొన్ని పురుషదేహాలు

వాంఛా సుగంధం వెదచల్లుతాయి

మరికొన్ని ఉన్మత్తతను పెంచుతాయి

 

ఆటవిడుపు అనే కవితలో-  గ్లోబల్ వార్మింగ్, పాలస్తీనాలో పాలుగారే పసిపిల్లల బుగ్గలపైనుంచి జారే కన్నీటి చుక్కలు, అంటార్కిటికాలో కరుగుతున్న మంచు, గోద్రా మంటలు, నందిగ్రామ్, ముదిగొండ పేలుళ్ళు వంటి సమకాలీన అంశాలను స్పృశిస్తూ,  ఇవి మానవాళి శాంతిని భగ్నం చేస్తున్నాయని, వీటినుంచి ఆటవిడుపు తీసుకొని కాసేపు ఆలోచించమని- ఆటవిడుపు అంటే విరామం కాదు,  ఆటగాళ్లుగా మనందరం విశ్వశాంతికై తర్ఫీదు పొందే సార్ధక సమయం అనీ కవయిత్రి అంటారు. సమకాలీన సమస్యలను భిన్న ఇజాలు ఎలా దర్శించినా, ఈ కవిత హ్యూమనిజం దృక్కోణాన్ని వ్యక్తీకరిస్తుంది.

 

ఈ కవితాసంపుటిలోని అనేక కవితలలో ప్రకృతి సౌందర్యం చక్కని అలంకారాలతో, శోభాయమానంగా కన్పిస్తుంది. అందమైన పదచిత్రాలను మనకళ్లముందు నిలుపుతుంది.

సాయింకాలపు గాలికి

అప్పుడే నీళ్ళోసుకున్న మల్లెతీగ

ఈడేరిన మొగ్గలతో నెమ్మదిగా

అటూ ఇటూ కాకుండా ఊగుతోన్నట్లు(సాలోచనగా)

 

మరో కవితలో

ఒక్కో చెట్టూ కొన్నివెల ఎర్ర జండాల సమూహంలా

ప్రపంచ కార్మికులంతా ఏకం కండి అన్నట్టు

వేనవేలుగా ఏకమై ఒక్కో చెట్టును రుధిర తేజస్సుతో నింపుతాయి

తురాయిలంటారట వాటిని (పూల సైనికులు)

51 కవితలు కలిగిన “సహచరణం” జగద్ధాత్రి గారి మొదటి కవిత్వసంపుటి.  ఈ కవితలలో కనిపించే పదునైన అభివ్యక్తి, లౌకిక చింతన, ప్రేమ, మైత్రి, ప్రకృతి పట్ల తాదాత్మ్యత వంటి వివిధ భావనలు మంచి పఠనానుభవాన్ని కలిగిస్తాయి. ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి గారు ఈ పుస్తకానికి వ్రాసిన ఆత్మీయవాక్యాలలో అన్నట్లు “She is not a frozen Feminist”.           జీవితంలోని అన్ని పార్శ్వాలకు తలుపులు తెరిచి, లోలోపల జనించే అలజడిని, ఆవేదనల్ని అక్షరాలలోకి వొంపిన గొప్ప “ప్రేమమయి”.  అందుకనే ఈ కవితలలో లోకంపట్ల ప్రేమ, దయ అంతర్వాహినులుగా ప్రవహించాయి.

పుస్తకం లభించు చోటు

చినుకు పబ్లికేషన్స్, విజయవాడ

ఫోన్: 984832208

కవిత్వమే ఫిలాసఫీ..

           ఒక కవితలో కవిత్వం గురించి చెప్పినపుడు సాహిత్య విమర్శనా భాషలో అక్కడ కవిత్వం అంటే – ప్రజలు వారు అనుభవించే అయోమయం నుండి ఒక అర్ధాన్ని ఏ విధంగా నిర్మించుకొంటున్నారనీ; ప్రజలు తాము ప్రేమించే వాటిని ఎలా ఎంచుకొంటున్నారనీ; జీవితంలో లాభనష్టాలని ఏ విధంగా సమన్వయపరచుకొంటున్నారనీ; అనుభవాల్ని కోర్కెలతో కలలతో ఎలా మార్చు కొంటున్నారనీ; చెల్లా చెదురైన ఏకత్వాన్ని ఏవిధంగా దర్శించి ఎలా ఒక చోటికి కూడదీసుకొంటున్నారనీ  అర్ధం చెప్పుకోవాలి. …Helen Vendler

           ప్రతికవికీ కవిత్వం పట్ల నిర్ధిష్టమైన అభిప్రాయాలుంటాయి.  వాటిని తన కవిత్వంలో ఎక్కడో ఒకచోట  బయటపెట్టు కొంటాడు.  మరోలా చెప్పాలంటే తన కవిత్వ మానిఫెస్టోని ఏదో కవితలో ప్రతీ కవి ప్రకటించుకొంటాడు. అలాంటి కవిత ద్వారా ఆ కవి కవిత్వసారాన్ని అంచనా వేయవచ్చు.  శ్రీశ్రీ  “కవితా ఓ కవితా”,  తిలక్ “అమృతం కురిసిన రాత్రి”, నెరుడా “కవిత్వం నన్ను వెతుక్కొంటూవచ్చింది” లాంటి కవితలు కొన్ని ఉదాహరణలు.  ఇవి ఆయా కవుల సొంత అభిప్రాయాలుగా కొట్టిపడేయలేం.  Helen Vendler  అన్నట్లు ఇవి ఆ కవిత వ్రాసినప్పటి ప్రజల అభిప్రాయాలకు విష్పష్ట రూపాలు.  తన దృష్టిలో ఉన్న సమూహానికి కవి ఒక ఉమ్మడి గొంతుక నిచ్చి ఆయా కవితలుగా వినిపిస్తున్నాడని బావించాలి.    

1780617_1429511017288248_4344470_n

           రెండున్నర దశాబ్దాలుగా కవిత్వరచన చేస్తూ ఒక స్వంతగొంతును, పరిపక్వ శైలిని ఏర్పరచుకొన్న  రాధేయకు మంచి కవిగా పేరుంది.  జీవన వాస్తవాలను, సామాజిక వాస్తవాలను తన కవితలలో ప్రతిబింబింస్తూ అనేక రచనలు రాధేయ చేసారు. వాటిలో  కవిత్వాన్ని వస్తువుగా చేసుకొన్న కవితలు కూడా ఉన్నాయి.  కవిత్వం గురించి మాట్లాడటం, స్వప్నించటం, కవిత్వం తనకేమిటో చెప్పటం కూడా ఒక సామాజిక వాస్తవాన్ని చిత్రించటమే.

“కవిత్వం నా ఫిలాసఫర్” అనే కవిత రాధేయ “అవిశ్రాంతం” అనే సంకలనం లోనిది. ఈ కవితలో కవి తన జీవితంతో కవిత్వం ఎంతెలా పెనవేసుకుందీ వర్ణిస్తాడు.

ఇందులో ఒకచోట  ప్రేమించటం రానివాడు ప్రేమికుడు కానట్లే దుఃఖించటం రానివాడు కవెలా అవుతాడూ అని ప్రశ్నిస్తాడు.  కవిత్వాన్ని దుఃఖానికి పర్యాయపదం చేస్తాడు కవి. ఇక్కడ దుఃఖం అంటే సొంత గొడవ కాదు,  “ప్రపంచపు బాధ”. ఈ కవికి దుఃఖపు సందర్భాల్ని కవిత్వ సమయాలుగా మార్చుకోవటం తెలుసు. కవిత్వం అంటే మనిషి ఇంకా జీవించే ఉన్నాడని చెప్పే ఒక సాక్ష్యం అని తెలుసు.  అందుకే, ఈ లోకపు దుఃఖాన్ని తన దుఃఖంగా చేసుకోకుండా, ఎవరినీ పట్టించుకోక స్వార్ధంతో మెలిగే వాడిని చనిపోయినవాడిగా పరిగణిస్తున్నాడు కవి.

 

అక్షరసైన్యం నా వెంట నడిస్తే చాలు/సర్వం కోల్పోయినా లెక్కచేయను/ కవిత్వమై మిగిలిపోతాను అనటం చెల్లా చెదురైన ఏకత్వాన్ని ఒకచోటకు కవిత్వం రూపంలో కూడదీసుకోవటమే.

స్పష్టమైన అభివ్యక్తి, సూటైన ప్రతీకలు, ఈ కవితకు సాఫీగా సాగే గమనాన్ని, పట్టుని ఇచ్చాయి.  కవిత్వాన్ని జ్వరంగా, కలగా, దుఃఖంగా, జ్ఞాపకంగా, ఎదురుదాడిగా, ఫిలాసఫర్ గా, గైడ్ గా  స్పృశించిన విధానం రాధేయను గొప్ప కవిగా నిరూపిస్తాయి. ఈ కవిత చదివినపుడు లోతైన  భావోద్వేగం, హృదయాన్ని కదిలిస్తుంది.

 -బొల్లోజు బాబా

baba

 

 కవిత్వం నా ఫిలాసఫర్  — రాధేయ

 

కవిత్వం నాకు కన్ను మూతపడని జ్వరం

కవిత్వం నా కన్రెప్పల మీద వాలిన నమ్మకమైన కల

ఒక్క కవితా వాక్యం

ఈ గుండె లోతుల్లోంచీ

పెల్లుబికి రావాలంటే

ఎన్ని రాత్రుల నిద్రని తాకట్టు పెట్టాలో

వేదనలోంచి పుట్టిన ఈ కవిత్వాన్నే అడుగు

అక్షరసైన్యం నా వెంట నడిస్తేచాలు

నా సర్వస్వం కోల్పోయినా

లెక్కచెయ్యను

కవిత్వమై మిగిలిపోతాను

ఈ గుండె చప్పుడు ఆగిపోయి

ఈ తెప్ప ఏ రేవులోకి చేరవేసినా

అక్కడ పచ్చని మొక్కై

మళ్ళీ ప్రాణం పోసుకుంటాను

భాష్పీకృత జీవద్భాష కవిత్వం

నరాలపై తంత్రీ ప్రకంపనం కవిత్వం

సారవంతమైన స్మృతిలో

పారదర్శకమైన జ్ఞాపకం కవిత్వం

ఏకాంత దుఃఖమా!

నీ పేరు కవిత్వమే కదూ!

నువ్వు పొగిలిపొగిలి ఏడుస్తున్నావంటే

కవిత్వమై రగిలిపోతున్నట్లే లెక్క

దుఃఖించనివాడూ

దుఃఖమంటే ఎరుగనివాడూ

కవి ఎలా అవుతాడు?

ప్రేమించని వాడూ

ప్రేమంటే తెలియనివాడూ

ప్రేమికుడెలా అవుతాడు

ఎవర్నీ పట్టించుకోనివాడూ

బతికున్నా మరణించినట్లే లెక్క

కన్నీళ్ళు బహిష్కరించేవాడికి

బతుకుపుస్తకం నిండా

అన్నీ అచ్చుతప్పులే!

జీవించే హక్కును

కాలరాచే చట్టాలతో

జానెడు పొట్టకోసం

పిడికెడు దుఃఖంగా

మిగిలేవాడు మనిషి

ఈ మనిషి బలహీనతలమీద

వ్యామోహాలమీద

ఎదురుదాడి చెయ్యగలవాడే కవి!

రోజు రోజుకూ దట్టమౌతున్న

ఈ మానవారణ్యంలో

చిక్కనవుతున్న వ్యాపారకాంక్షల్లో

ఓ మృధువైన మాటకోసం

ఓ ఆర్ధ్రమైన లాలనకోసం

ఓ వెచ్చటి ఓదార్పుకోసం

కాలం మైలు రాయిమీద

తలవాల్చి ఎదురుచూస్తున్నా

కవిత్వం నా ఫిలాసఫర్

కవిత్వం నా గైడ్!!

-రాధేయ

కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్  –  కొప్పర్తి

నువ్వెళ్లిపోయాకా రక్తకన్నీరు కార్చుకొన్నాను నేను.  నా విషాదం పెరిగిపోయింది.  నీ నిష్క్రమణ మాత్రమే కారణం కాదు. నీతో పాటు నా నేత్రాలు కూడా నన్ను విడిచిపోయాయి.  ఇపుడు నేనెలా ఏడ్చేదీ? —- రూమీ

కవిత్వంలో రక్తం అనేది ఎక్కువగా యుద్దానికి, ప్రమాదానికి, ఉద్రేకానికి, భీభత్సానికి,  ధైర్యానికి ప్రతీకగా ఉంటుంది.  కన్నీరు దుఃఖం, వేదన, ప్రేమ, ఉప్పొంగే ఆనందం, కృతజ్ఞతలను సూచిస్తుంది.   పైనున్న రూమీ వాక్యంలో రక్తకన్నీరు అనే పదబంధంలో,  నేత్రాలు పోవటం అనే భీభత్సం, ప్రేయసి ఎడబాటు యొక్క వేదన ఏకకాలంలో ఇమిడిపోవటం చూడొచ్చు.  “గతమంతా తడిచె రక్తమున కాకుంటె కన్నీళ్ళులతో”….. అన్న శ్రీశ్రీ వాక్యంలో  రక్తమంటే యుద్ధాలనీ, కన్నీళ్ళు దాని తాలూకు దుఃఖమనీ అర్ధం చెప్పుకోవచ్చు.

59740_566066773423516_1763463627_n

రక్తం, కన్నీళ్లను పోలుస్తూ కొప్పర్తి వ్రాసిన “కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్” అనే కవిత,  రక్తం కన్నా కన్నీరే ఉత్కృష్టమైనదని ప్రతిపాదిస్తుంది.  రక్తమనేది మనిషి అస్థిత్వానికే తప్ప మనిషితనానికి చిరునామా కాదని, కన్నీళ్ళే మనిషిని మనిషిగా నిరూపిస్తాయని ఈ కవిత చెపుతుంది.  లోతైన తాత్వికత, మంచి శిల్పం, తర్కం నిండిన ఈ కవితను చదివినపుడు గొప్ప పఠనానుభూతి కలుగుతుంది.  ఆలోచనలు విస్తరిస్తాయి.

అవును

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి//…… అంటూ మొదలయ్యే కవితావాక్యాలు కవిత సారాంశాన్నంతా ముందే చెప్పేస్తాయి.

 

ఇక మొగ్గ ఒక్కొక్క రేకు విచ్చుకొన్నట్లుగా ఒక్కో వాక్యం, తేటగా, ఏ శషభిషలు లేకుండా  కవితా వస్తువును ఆవిష్కరిస్తాయి.  మెట్లు మెట్లుగా అనుభూతి శిఖరం వైపు నడిపిస్తాయి.

ఈ కవితను మూడు భాగాలుగా విభజిస్తే, మొదటి భాగంలో రక్తం ఏ ఏ సందర్భాలలో చిందించబడతాయో చెపుతాడు కవి,  రెండవ భాగంలో కన్నీళ్ళు ఏ ఏ సమయాల్లో చిప్పిల్లుతాయో చెపుతాడు, మూడవ భాగంలో రక్తం కన్నీళ్ళకంటే ఎందుకు గొప్పదో ముక్తాయిస్తాడు. మంచి ఎత్తుగడ, తార్కికంగా సాగే నడక, ఆలోచనాత్మక ముగింపులతో ఉండే కొప్పర్తి కవితలు తెలుగుసాహిత్యంలో  ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. ఈ కవిత మినహాయింపేమీ కాదు.

రక్తాన్నెక్కించగలరు కానీ

కన్నీళ్ళనెవరైనా ఎక్కించగలరా…… అనే ప్రశ్నతో ముగుస్తుందీ కవిత.  నిజమే కదా రక్తంతో ముడిపడిన సందర్భాలన్నీ దాదాపు బయటనుంచి వచ్చేవే, కానీ కన్నీటి సమయాల్ని మాత్రం ఎవరికి వారు తోడుకోవాల్సిందే.  అందుకనే  ఒకచోట “మనలోంచి మనం తవ్వుకొనే తెల్లటి మణులు కన్నీళ్ళు” అంటాడు కొప్పర్తి.

 

 -బొల్లోజు బాబా

 

 

కెమిష్ట్రీ ఆఫ్‌ టియర్స్‌ (“యాభై ఏళ్ళ వాన” సంకలనం నుండి)

 

అవును

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌

నిజమే కావచ్చు

బట్‌ నాట్‌ థిక్కర్‌ దేన్‌ టియర్స్‌

 

సూది గుచ్చుకున్నపుడు, బ్లేడు కోసుకున్నపుడు

రక్తం ఉబుకుతుంది

రక్తం ఉరలుతుంది

కత్తివేటుకు రక్తం ఉవ్వెత్తున లేచిపడుతుంది

రక్తం కళ్లచూడాలంటే

రాయి కర్ర సూది బ్లేడు కత్తి బుల్లెట్‌

ఏదో ఒకటి ప్రయోగింపబడాలి

 

అందరి రక్తం ఎర్రగానే ఉండడంతో

అందరూ ఒకటేనని ఒకప్పుడు చెప్పేవాళ్ళు

నిజమే రక్తం మనందరినీ ఒకటి చేసింది

ఒకే గొడుగు కిందకు తెచ్చింది

 

అందరిలోను ఒకే రక్తం ప్రవహిస్తోంది

ఎవర్ని కొట్టినా అదే రక్తం ప్రసరిస్తోంది

అమాయకుణ్ణి గుచ్చినా అదే రక్తం

నియంతను నరికినా అదే రక్తం

తెల్లవాణ్ణి నల్లవాణ్ణి

డబ్బులున్నవాణ్ణి లేనివాణ్ణి

మంచివాణ్ణి చెడ్డవాణ్ణి

ఎవర్ని ఎవర్ని నరికినా

అదే రక్తం చిందుతున్నప్పుడు

మనిషికి రక్తం అస్తిత్వాన్నిస్తున్నదే కానీ

మనిషితనానికి చిరునామా అవుతున్నదా

 

మంచి రక్తం చెడు రక్తం

అంటూ ఉంటాయి కానీ

మహామనిషి రక్తం

మామూలు మనిషి రక్తం అంటూ ఉంటాయా

 

అందుకే

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

 

లోలోపలి మనిషితనానికి

బాహ్యరూపం కన్నీళ్ళు

ఆరడుగుల మనిషికి ప్రాగ్రూపం కన్నీళ్ళు

 

తెలుసా

మనిషిలో కన్నీళ్ళ రహస్య తటకాలున్నాయి

నదీమూలాల్లాంటి కన్నీటి చెలమలున్నాయి

ఒకరు రాయి విసరనక్కరలేదు

మరొకరు కత్తి దూయనక్కరలేదు

గాయపరచేదైనా అనునయించేదైనా

చిన్నమాట చాలు

కళ్ళదోనెల్లో నీళ్ళు కదలాడుతాయి

చదువుతున్న పుస్తకంలో చిన్న సందర్భం చాలు, కన్నీళ్ళకి

చూస్తున్న తెరమీద ఒక్క సన్నివేశం చాలు, కన్నీళ్ళకి

కిటికీలోంచి కనిపించే ఒక జీవిత శకలం చాలు, కన్నీళ్ళకి

జీవితంలో ముంచి తీసిన కవిత్వ చరణం చాలు, కన్నీళ్ళకి

నిజానికి ఇవి కూడా అక్కరలేదు

ఒక్క ఊహ

వణికించి తొణికించే ఒక్క ఊహచాలు, కన్నీళ్ళకి

 

గుండె బరువెక్కి

ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి

కన్నీళ్ళు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి

 

కళ్ళు వర్షించినపుడు

మనిషి నల్లమబ్బుల ఆకాశం

కళ్ళల్లోకి నీళ్ళు తోడుకున్నపుడు

మనిషి జలవనరులున్న సస్యక్షేత్రం

మనలోంచి మనం తవ్వుకునే

తెల్లటి మణులు కన్నీళ్ళు

 

రక్తంలా కన్నీళ్ళు అనుక్షణం తయారు కావు

రక్తంలా కన్నీళ్ళు అణువణువూ ప్రవహించవు

మనిషికి ఇన్ని కన్నీళ్ళుంటాయనీ

ఉండాలని ఎవరు చెప్పగలరు

రక్తం చిందడానికి భౌతిక చర్య సరిపోతుంది

కళ్ళు చిప్పిల్లాలంటే

రసాయనిక చర్య జరగాల్సిందే

 

మనుషులందర్నీ ఒకటిగా కలిపిన రక్తం

కణసముదాయాలుగా విడిపోయింది

పాజిటివ్‌గా నెగిటివ్‌గా పాలిపోయింది

కన్నీళ్లు మాత్రం వర్షపు నీళ్లలా

స్వచ్ఛంగా ఉండిపోయాయి

 

యుద్ధ బీభత్స ప్రతీక – రక్తం

యుద్ధ విధ్వంస స్మృతి – కన్నీళ్లు

యుద్ధంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది

స్మృతుల్లో కన్నీళ్లు స్రవిస్తూనే ఉంటాయి

 

హృదయం రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ

దాని ఉనికిని చాటేది మాత్రం కన్నీళ్ళే

 

రక్త హీనత ఉన్నట్టే

దుఃఖ లేమి కూడా ఉంటుంది

రక్తాన్ని ఎక్కించగలరు కానీ

కన్నీళ్ళ నెవరైనా ఎక్కించగలరా

 

—–కొప్పర్తి

అభినందనలు

మీదపడి రక్కే సమయాల్ని
ఓపికగా విదిలించుకొంటూ,
తోడేళ్ళు సంచరించే గాలిని
ఒడుపుగా తప్పించుకొంటూ,
బాట పొడవునా
పరచుకొన్న పీడకలల్ని
జాగ్రత్తగా దాటుకొంటూ,
శీతలమేఘాలు చిమ్మే కన్నీళ్ళలో
మట్టిపెళ్ళై చిట్లీ, పొట్లీ
మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతూ
చివరకు చేరుకొన్నావా!

నీకోసమే పుట్టిన
నక్షత్రాన్ని తెంపుకొని
తురాయిలో తురుముకొని
గులాబిరేకలు, మిణుగురుపిట్టలు
నిండిన విజయంలోకి
చేరుకొన్నావా మిత్రమా!
అభినందనలు.

-బొల్లోజు బాబా

baba

కవుల కవి – ఇస్మాయిల్

ismayil painting rainbow

 
ఇస్మాయిల్ కవిత్వంలో నినాదాలు, సిద్దాంతాలు, వాదనలు కనిపించవు. ఇంకా చెప్పాలంటే ప్రకృతి కనిపించినంతగా జీవితం కనిపించదు కూడా. అయినప్పటికీ ఆయన కవిత్వాన్ని అభిమానించే వారిలో కవులు ముందుంటారు వారి వారి కవిత్వ కమిట్మెంట్లు వేరైనప్పటికీ. ఆ విధంగా ఇస్మాయిల్ కవుల కవి.

ఇస్మాయిల్ కవిత్వంలో సౌందర్యం, కరుణ, జీవనోత్సాహాలు నిశ్శబ్దంగా శబ్దిస్తూంటాయి. జీవితంలో తారసిల్లే అనేక సందర్భాలకు, దృశ్యాలకు, వస్తువులకు ఈయన కవిత్వగౌరవం కల్పించాడు. మనుషుల రసదృష్టి పై అచంచలమైన విశ్వాసంతో కవిత్వాన్ని పలికించాడు. కవితలో దండుగ పదాల్ని శుభ్రంగా తుడిచేసి సుందర స్వరూపాన్ని మాత్రమే మిగిలేట్లు చేయటం ఇస్మాయిల్ కవిత్వశైలి.

ధనియాల తిప్ప

అంతా ఒక తెల్ల కాగితం.

అందులో ఒక మూలగా

ఒక అడ్డుగీతా

ఒక నిలువు గీతా –

తెరచాప ఎత్తిన పడవ.

కిందిది నదీ

పైది ఆకాశమూ

కావొచ్చు.

సుమారు ముప్పై ఏళ్ళ క్రితం వ్రాసిన పై కవిత లో ఒక దృశ్యం ఇప్పటికీ సజీవంగానే కనిపిస్తుంది. నదీ ఆకాశం కలుసుకొన్న చోట ఒక పడవ. తెరచాప నిలువుగీత, పడవ అడ్డుగీత. అంతే అంతకు మించేమీ లేదు. ఇదే దృశ్యాన్ని నాబోటి వాడు “నది ఆకాశాన్ని ముద్దిడే సుదూర మైదానపు దారులలో ఒంటరి పడవ ప్రయాణం” అంటో వెలిసిపోయిన అలంకారాలతో, పదాల డమడమలతో కవిత్వీకరించవచ్చు. కానీ ఇస్మాయిల్ కవితలో ఒక దృశ్యం మాత్రమే పదాల ద్వారా వ్యక్తీకరించబడింది. అది చాలా నిశ్శబ్దంగా చదువరి హృదయంలో పడవలా సాగుతుంది. అందుకే శ్రీ వెల్చేరు నారాయణరావు ఒకచోట “…… మాట తనను తాను నిశ్శబ్దం చేసుకుంటే ఒక అపూర్వ శక్తిని సంపాదించుకోగలదని – ఆ పనిని మాటచేత చేయించగలిగిన వాడు ఇస్మాయిల్ ఒక్కరే” అని అంటారు.

చట్రాలు, తిరగళ్ళు కవిత్వానికి కట్టి ఊరేగిస్తున్న కాలంలో ఆ పద్దతికి ఎదురొడ్డి ఇస్మాయిల్ కవిత్వం నిలబడటం ఒక చారిత్రిక సత్యం. అలా తెలుగు సాహిత్యంలో ఒక విస్మరింపజాలని అధ్యాయంలా ఇస్మాయిల్ నిలిచిపోయారు. కవికి అనుభవంతప్ప వేరే ఆస్తి, అస్త్రం ఉండకూడదని ఇస్మాయిల్ భావించాడు. ఆయన కవితల్లో అనుభవసారం ఒక పదచిత్రంగా, ఒక ప్రతీకగా రూపుదిద్దుకొని పఠిత హృదయంలో దీపమై వెలుగుతుంది.

ప్రాపంచిక సంగతులను పారలౌకిక విషయాలతో గొప్ప నేర్పుతో అనుసంధానించటం ద్వారా గొప్ప కవిత్వానుభవాన్ని కలిగించటం ఇస్మాయిల్ కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తుంది.

పాట

సెలయేరా, సెలయేరా!

గలగలమంటో నిత్యం

ఎలా పాడగలుగుతున్నావు?

చూడు, నా బతుకునిండా రాళ్ళు.

పాడకుంటే ఏలా?

లోపల చిరుగుల బనీనుతో కృష్ణదేవరాయుల రాజసాన్ని పలికించే రంగస్థల నటుడో లేక గొంతుమూగబోయినా హృదయంతో అద్భుతగీతాలను గానంచేసిన కృష్ణశాస్త్రో, కళాకారుడెవరైనప్పటికీ నిత్యం గలగలమంటో పాడటంలోని అనివార్యతలాంటి జీరనేదో ఈ కవిత పట్టిచూపుతుంది. సౌందర్యభాషలో తాత్వికతను చెప్పినట్లుంటుంది.

కవిత్వం కరుణను ప్రతిబింబించాలని నమ్మిన వ్యక్తి ఇస్మాయిల్. జీవితాన్ని ప్రేమించి జీవనోత్సాహాన్ని గానం చేసిన సౌందర్య పిపాసి. కవిత్వంపై సామాజిక స్పృహ అనే బరువును వేసి బలవంతంగా మోయించిన రోజులవి. మోయలేము అనే కవుల్ని అకవులు అని నిందించే కాలంలో, ఇస్మాయిల్ గారు ఒక్కరే నిరసించి – మనం రోజూ చూసే విషయాలని, చిన్నచిన్న అనుభవాలనే కవిత్వంగా మార్చి ఇదీ అసలైన కవిత్వమని ప్రకటించారు. బాగా దాహం వేసినప్పుడు చల్లని మంచినీళ్ళు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. ఇది మనం అనేకసార్లు అనుభవించిన ఒక అత్యంత సాధారణమైన అనుభవం. కానీ ఈ అనుభవమే ఇస్మాయిల్ గారి చేతిలో పడి చక్కని కవితగా రూపుదిద్దుకొంది….. ఇలా…..

దాహం

వేసవి గాడ్పులకి

దాహపు ఖర్జూరచెట్టు

యెడారి గొంతులో

అమ్ములపొదిలా

విచ్చుకుని

గరగరలాడుతోంది.

చల్లటి నీళ్ళు

గొంతు దిగుతోంటే

ఎంత హాయి//

యెడారిగొంతు, ముళ్లతో ఖర్జూరచెట్టు విచ్చుకోవటం, గొంతులో గరగర వంటి పదచిత్రాలన్నీ ఒక అనుభవాన్ని ఎంతో అందంగా, హాయిగా (గరగరగా) మన అనుభూతికి తెస్తాయి.

ఇస్మాయిల్ కవిత్వంలో డబుల్ మెటాఫెర్స్ అద్భుతంగా ఒదిగిపోయి కవితకు అందాన్ని, లోతైన అర్ధాన్ని ఇస్తాయి. ఆయన పదచిత్రాల సౌందర్య రహస్యం అదే కావొచ్చు.

వాన వచ్చిన మధ్యాహ్నం

బరువెక్కిన సూర్యుడు

బతకనీడు భూమిని

ఉదయమ్మొదలు

ఊపిరాడనీడు

సర్వాన్ని అదిమిపట్టి

వీర్యాన్ని విరజిమ్మాడు.

ఆకల్లాడదు.

ఏ కాకీ ఎగరని

ఏకాకి ఆకాశం.

ఇంతలో హటాత్తుగా

ఇలకు కలిగింది మబ్బుకడుపు.

వేవిళ్ళ గాలులు

వృక్షాగ్రాల్ని వూపాయి.

ధాత్రీచూచుకాలు నల్లపడ్డాయి.

తటాకాల చెంపలు తెల్లపడ్డాయి.///

పై కవితలో వీర్యం, కడుపు, వేవిళ్ళు, నల్లబడ్డ చూచుకాలు ఇవన్నీ ఒక స్త్రీ గర్భవతి అవ్వటాన్ని సూచిస్తాయి. అదే విధంగా విపరీతమైన ఎండకాసిన తరువాత వానపడటం అనే విషయాన్ని సూర్యుడు, భూమి, ఆకు అల్లాడకపోవటం, మబ్బులు, గాలులు, ధాత్రి నల్లపడటం, తటాకాలు తెల్లబడటం వంటి వర్ణనలు తెలియచేస్తుంటాయి. రెంటి మధ్య సమన్వయాన్ని బరువెక్కిన సూర్యుడు, మబ్బుకడుపు, ధాత్రీచూచుకాలు, తటాకాల చెంపలు అనే పదబంధాల ద్వారా సాధించి కవితకు అద్భుతమైన లోతును వచ్చేలా చేసారు. చివరలో “వర్షాగర్భంలో వర్ధిల్లే శిశుపిండాన్ని” అంటూ కవి తనను తాను ప్రకటించుకోవటం, ఆ అనుభవాన్ని హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది. ఇదే రకమైన శైలిలో వ్రాసిన సంజె నారింజ అనే కవితలో….

దినపు రేకలపైన వాలెను

ఇనుని సీతాకోకచిలుక//

గులక రాళ్ళ పిట్టలతో

కులుకు తరుశాఖ ఏరు//

వొంగిన సాయింత్రపు రంగుల ధనసు

విసిరే గాలి బాణం

పై కవితలో దినాన్ని పుష్పంగా, సూర్యుడ్ని సీతాకోక చిలుకలా, ఏరుని వృక్షంగా, గులకరాళ్ళని పిట్టలుగా, ఇంధ్రధనస్సుని గాలి బాణంగా పోలుస్తూ ఒక దృశ్యాన్ని పదచిత్రాలుగా పేనిన కౌశలం అబ్బురపరుస్తుంది.

వానని అనేక మంది కవులు అనేక విధాలుగా వర్ణించారు. కానీ ఈ విధంగా వర్ణించటం ఇస్మాయిల్ కే సాధ్యం.

శ్రావణ మంగళవారం

సాయంత్రం

ఒకానొక మబ్బు డస్టరు

అకస్మాత్తుగా ప్రవేశించి

భూమ్మీది వెర్రి రంగుల్నీ పిచ్చిగీతల్నీ

పూర్తిగా తుడిచేసి,

మెరిసే వానసుద్దముక్క పట్టుకొచ్చి

వీధుల్లో కళ్ళనీ

రోడ్లపై పడెల్నీ

లోకంలో కాంతినీ

వెయ్యిపెట్టి గుణించేసి

చెయ్యూపి వెళ్ళిపోయింది///

ఈ కవితలో కూడా మబ్బుడస్టరు, వానసుద్దముక్క వంటి పదబంధాల ద్వారా అద్భుతమైన పదచిత్రాల్ని నిర్మించి ఒక సుందరదృశ్యాన్ని కళ్లముందు నిలుపుతారు.

స్వారీ అనే కవితలో ఒక మనోహర సందర్భాన్ని ఇస్మాయిల్ వర్ణించిన తీరు గమనిస్తే ఏ చదువరి మనసు కవిత్వ ఆర్గాజం పొందదు!

స్వారీ

కళ్ళెం లేని గుర్రమెక్కి

పళ్ళు గిట్ట కరచి

ఏ శత్రు సంహారం కోసమో

వైచిత్ర సమరంలోకి

స్వారి చేసే యోధురాలామె.

మళ్ళీ, యుద్ధాంతాన

కళ్ళు తేలేసి

నిర్వికల్ప సమాధిలో

సర్వాంగాలూ స్తంభించే

యోగిని కూడాను.

ఇస్మాయిల్ కవిత్వంలో కనిపించేమరో గుణం సున్నితత్వం. అనేక కవితల్లో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తూంటుంది.

చిగిర్చే చెట్లు

నడచివచ్చి నిశ్శబ్దంగా

నా కిటికీ దగ్గిరాగి

హటాత్తుగా

పటేలుమని

వంద వాయిద్యాలతో

వికసించిన బ్యాండుమేళంలా

ఒక రోజు

అకస్మాత్తుగా

చివురించిన చెట్టు

గవాక్షం వద్ద నన్ను ఆపేసింది.///

పై కవితలో చెట్టు చివురించటాన్ని “వందవాయిద్యాల బ్యాండుమేళం” అంటున్నాడంటే, అది కవి దృష్టిలో ఎంత పెద్దదో, ఈ కవెంత సున్నితమనస్కుడో అర్ధం చేసుకోవచ్చును. అందుకనే ఈయన కవిత్వంలో సూర్యకిరణాలు, చందమామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, కొత్తచినుకులు, సొట్టబుగ్గల బావులు, చెట్టుపై వాలినచిలకలు, పసిపాపలు, గులకరాళ్లు వంటి అనేక కవితావస్తువులు కనిపిస్తూంటాయి. వీటన్నింటిని మనం నిత్యం చూసేవే అయినా ఆధునిక జీవనపు రణగొణల్లో పడి ఆ అందాలకు అంధులం అవుతాం దాదాపుగా. అలాంటి సున్నితమైన విషయాలతోనే ఇస్మాయిల్ కవిత రచన చేసారు. చిన్న చిన్న అనుభవాలని అందమైన పదచిత్రాలలో బంధించి మనకందించారు.

పడిలేచిన అనేక కవిత్వరీతుల వెల్లువల్లో కొట్టుకుపోకుండా మూడున్నర దశాబ్దాలపాటు తనదైన శైలిలోనే ఇస్మాయిల్ కవిత్వాన్ని వెలువరించారు. రాజకీయ కవిత్వాలు తమ ప్రాసంగితను కోల్పోయాక సేదతీర్చేది ఇస్మాయిల్ మార్కు కవిత్వమే అనటంలో సందేహంలేదు. ఆయన తను సాగిన బాటలో ఎందరో అభిమానులను పోగేసుకొన్నారు. ఆయన శిష్యులుగా ఎంతో మంది అదేబాటలో పయనించి తర్వాతికాలంలో మంచి కవులుగా పేరుతెచ్చుకొన్నారు. గోదావరి శర్మ, విన్నకోట రవిశంకర్, ఆకెళ్ళ రవిప్రకాష్, తమ్మినేని యదుకుల భూషణ్, మూలా సుబ్రహ్మణ్యం, కొండముది సాయికిరణ్, బి.వి.వి. ప్రసాద్, హెచ్చార్కె, నామాడి శ్రీథర్, శిఖామణి, అఫ్సర్ వంటి కవులకు ఇస్మాయిల్ అభిమాన కవి. అలా ఇస్మాయిల్ కవుల కవిగా కీర్తిశేషులయ్యారు.

-బొల్లోజు బాబా

చర్మం రంగు

baba
“ముఖ్య అతిధికి బొకే నేను ఇస్తాను టీచర్”
“నువ్వొద్దు ….. అందుకు వేరే వాళ్ళను ఎంపిక చేసాం”
ఆ  “వేరేవాళ్ళకు” తనకూ ఉన్న తేడా
ఆ అమ్మాయికి కాసేపటికి తెలిసింది
చర్మం రంగు.
చరిత్ర లోయలోకి
నెత్తురూ, కన్నీళ్ళూ పారిస్తూ,
జీవన మార్గాలపై
చీకటివెలుగుల్ని శాసిస్తోన్న
చర్మం రంగు ….. చర్మం రంగు…..
సంచి కన్నా ఆత్మ గొప్పదని
వెర్రికేకలతో అరవాలనుకొంది ఆ అమ్మాయి.
finger-painting-in-the-dark
ఉబ్బిన మొహం, ఎర్రని కళ్లతో
తనకొచ్చిన ప్రైజుల్ని తీసుకొని
మౌనంగా నిష్క్రమించింది.
పదేళ్ళ తరువాత …….
“ముఖ్య అతిధి”  స్పీచ్ ముగించుకొని
వెళుతూ వెళుతూ
ఉబ్బిన మొహం, ఎర్రని కళ్ళతో ఉన్న
ఓ స్టూడెంట్ చేతిలో బొకే పెట్టి,
భుజం ఎందుకు తట్టిందో
ఎవరికీ అర్ధం కాదు
మరో పదేళ్ళ దాకా
–బొల్లోజు బాబా