నాకు నచ్చిన చిత్రం: జయభేరి

‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యా కుచద్వయం; ఏక మాపాత మధురం అన్యదాలోచనామృతం.’ సంగీతం చెవిన పడినంతనే మధురం. సాహిత్యం అలా కాదు. ఆలోచిస్తే అమృతం. ఆలోచింపచేసే దే సాహిత్యం.” అని అంటారు దాశరధి రంగాచార్యులు గారు తమ ఋగ్వేద పరిచయ పుస్తకంలో. సినిమా అనేది- ఒక కళ. నటన, నాట్యము,  సంగీతము, సాహిత్యము మరియు దృశ్యము- సమపాళ్ళలో మేళవించి చెక్కిన శిల్పమే, ఈ దృశ్య కావ్యము. తెలుగు చలనచిత్ర స్వర్ణ యుగములో అజరామరమైన చిత్రాలు అందించినవారిలో శ్రీ పి. పుల్లయ్య ఒకరు. వందల చిత్రాలకు కధా, మాటలు, పాటలు సమకూర్చి, తన పదునైన సంభాషణలతో, ప్రేక్షకుల గుండె లోతులను తట్టినవాడు ఆచార్య ఆత్రేయ. ఒక రచయితగా, సినీ కవిగా, మాననీయ వ్యక్తిగా, అంతకంటే అందరిచే గురువుగా మన్ననలందుకున్న ఒకే ఒక వ్యక్తి, శ్రీ మల్లాది రామసృష్ణశాస్త్రి గారు. మేటి సంగీత దర్శకులలో తలమానికమైన సంగీత రసగుళికలు అందించినవారు, శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారు. ఈ ఉపోత్ఘాతమంతా ఎందుకంటే- ఈ అందరి మహామహుల అనితర సాధ్యమైన సాధనవల్ల, 1959లో శారదా ఫిలిమ్స్ పతాకంపై, శ్రీ వాసిరెడ్డి నారాయణరావు/ ప్రతిభా శాస్త్రి గార్ల నిర్మాణములో రూపొందుకున్న మహత్తర సంగీత, సాహిత్య , సందేశాత్మక దృశ్యకావ్యం, జయభేరి.

 

క్లిష్టమైన ఇతివృత్తంతో కొన్ని చిత్రాలు, ఇతివృతాలు ప్రధానంగా కొన్ని చిత్రాలు వచ్చాయి. మనకు ప్రేమ కథలు, కులాంతర విహాహాలు అరుదు కాదు. కవుల, కళాకారుల జీవితము, మతము, ఆచారాల కథనము క్రొత్తవి కావు. కాని వీటన్నిటిని రంగరించి, సంగీత సాహిత్యాలను మేళవించి, వైవిధ్యంగా, కష్టతమమైన అంశాలను అతి మెళుకువగా విశ్లేషించిన చిత్రాలు బహుకొద్ది. ఆ కోవలో ప్రజలను ఆలోచనాపరులను చేస్తూ, కళల మరియు మానవ పరమావధిని జనరంజకంగా చెప్పి, సంస్కరణకు ఉద్యుక్తులను చేసే మకుటాయమానమైన సందేశాత్మక చిత్రం, ‘జయభేరి’. ఆత్రేయ తెలుగువారికి అందించిన మరొక కావ్యం, ఈ జయభేరి.

ఒక సంగీత తపస్వికి, ఒక మహత్తమమైన గురువుకి ఆలోచనాసరళిలో తేడాలుండవచ్చు. ఆ విభేదము మనుషుల, మనసుల మధ్య ఈర్శ, ద్వేషాల కతీతమై, కళ పరమావధికి, దాని భవితకు చెందినదైతే, దాని పర్యవసానము ఏమిటి? కళ ప్రయోజనం, విద్వత్ సభలలో ప్రదర్శించి, పెద్దలను మెప్పించుటయే పరాకాష్టయని ఒకరు, జన సామాన్యానికి దూరమైన కళ, సంకుచితమై, సమసిపోతుందని, కళ బహుజన హితము, ప్రియము కావాలని తపించే వారొకరు.

జయభేరికి ముందూ, తరువాత కూడా ఎన్నో సంగీత, సాహిత్య, నాట్య పరమైన చిత్రాలు వచ్చాయి. రావచ్చు కూడా! ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ చిత్రంలోని ఒక సన్నివేశాన్నో, లేక ఒక అంశాన్నో తీసుకొని, మరిందరు చిత్రాలు తీశారేమో కానీ, ఆ ఆదర్శాన్ని ప్రతిబింబించలేదు . అంతేకారు, సంగీతము, సాహిత్యము, అభినయము సమపాళ్ళలో పోటీపడి, తమ సత్తా చాటుతూ సమ్మిళితమై, ఆనందముతో పాటు, ఆలోచనామృతాన్ని కలిగించిన తీరు నాటికి, నేటికి జయభేరి జయభేరియే! మధురమైన సంగీతముతోపాటు, మెదటికి పదునుబెట్టే మాటలు, పాటలు మనుషులను ఆలోచింప చేస్తుంది. మతము, ఆచారము, సాంప్రదాయము, ఈర్ష, అసూయలు – మానవత్వాన్ని విడిచి, మరిచి విజృంభిస్తే – మంచికి, మనసుకి, కళకి మనుగడ కరువు అవుతుందని కనులముందు ప్రత్యక్ష పరుస్తుంది.

పెండ్యాల నాగేశ్వరరావు గారు చక్కని శాస్త్రీయమైన బాణీలు కూర్చటంతోపాటు, కన్నడ మరియు చక్రవాక రాగాలను మిళితంచేసి, సృష్టించిన ‘విజయానంద చంద్రిక’ రాగంలో మల్లాది వారి సాహితికి మన ఘంటసాల ప్రాణము పోయగా, అక్కినేని అద్భుతంగా అభినయించిన పాట, ‘రసిక రాజ తగు వారము కామా’. గురు శిష్యుల సరళిని మమేకం చేస్తూ, పండిత పామరుల ప్రశంసలు పొంది, సినీ వినీలాకాశంలో ఒక తారగా నిలిచిపోయింది. ఈ ఒక్కపాటపై శ్రీ సత్యనారాయణ వులిమిరి గారు ఆరు పేజీల వ్యాసము వ్రాశారు. ఆనాటి మేటి గాయకులు: ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ మరియు రఘురాజ్ పాణిగ్రాహి కలిసి ఆలాపించిన, మల్లాది వారి, ‘మది శారదా దేవి మందిరమే’ మరొక అనితర సృజన. విజ్ఞుల అభిప్రాయంలో సంగీత-సాహిత్యపరంగా తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు సృజించబడిన మూడు అగ్రతమమైన పాటలలో, ఈ రెండు పాటలను ఉదాహరిస్తారంటే (మూడో పాట ‘జగతేకవీరుని కథ’ లోని ‘శివశంకరి శివానందలహరి’), జయభేరి అందుకున్న శిఖరాలేమిటో మరి నొక్కి చెప్పవలసిన అవసరం లేదేమో!

కధాగమన ప్రస్థానంలో, మూర్ఖుల ఛాందసాన్ని నిరసిస్తూ మనసులను నిలదీసే ఆత్రేయ సమయానుచిత వాదనకు, మహత్తర సందేశాన్ని జోడించి మహాకవి శ్రీశ్రీ అందించిన ‘నందుని చరితము వినుమా’ పాట ఒక కలికితురాయి. దేవుని చూడాలనే ఓ నిస్సహాయ చిన్నవాని ఆక్రందనకి, మూగబోయిన గొంతుని సవరించి, ఆలయాలలోనే దేవుడు లేడని, నందునికి మోక్షమిచ్చే శివుడున్నాడని, తన పాటతో అండగా నిలిచే అద్భుత అక్కినేని నటన మనముందుయించి, పుల్లయ్యగారు మన కంట కన్నీరు కురియించ, దీనికి మరి ప్రతి లేదు! ఈ పాటను, కుల నిర్మూలన ప్రచారానికై, ఆనాడు ప్రభుత్వము 16యమ్ యమ్ ప్రింట్లు తీసుకొన్నారని అంటారు పులగం చిన్నారాయణగారు తమ ‘ఆనాటి ఆనవాళ్ళు’ పుస్తకములో.

పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన మరికొన్ని ఆణిముత్యాలు:

 

  • రాగమయి రావే.. అనురాగమయి రావే (మల్లాది)
  • సవాల్ సవాల్ అన్న చిన్నదానా.. సవాల్ పై సవాల్ (మల్లాది)
  • నీవెంత నెరజాణనౌర (మల్లాది)
  • సంగీత సాహిత్యమే మేమే నా శృంగార (మల్లాది)
  • నీ దాన నన్నదిర, నిన్నే నమ్మిన చిన్నదిర (మల్లాది, చిత్రంలో లేదు)
  • యమునా తీరమున.. సంధ్యా సమయమున (ఆరుద్ర)
  • ఇంద్ర లోకంనుండి తెచ్చినారయ్యా (ఆరుద్ర)
  • హోయ్ వల్లో పడాలిరా పెద్ద చేప (ఆరుద్ర)
  • ఉన్నారా.. జోడున్నారా.. న్నానోడించే వారున్నారా (కొసరాజు)
  • దైవం నీవేనా, ధర్మం నీవేనా (నారపరెడ్డి, టి‌.ఎం. సౌందర్ రాజన్ పాడారు)

 

ఆచారాల అనాచారానానికి తమ్ముని, కడకు భార్యను కూడా త్యజించవలసిన పాత్రలో గుమ్మడి; తల్లి కాని తల్లిగా తన మరిది భవిత కోసం ప్రాణ త్యాగం చేసే ఇల్లాలుగా శాంతకుమారి; లోన వ్యక్తిత్వానికే విలువయిచ్చే మాననీయ గురువుగా నాగయ్య; ప్రజారంకంగా పాలించే కళా హృదయుడైన రాజుగా ఎస్‌.వి. రంగారావు; నాట్యంతో పాటకు జీవంపోసి, చాకచక్యంతో రాజా దండన నుంచి భర్తను కాపాడుకొనే పాత్రలో అంజలిదేవి; రాజ నర్తకిగా కపట యోచనతో ఒక తోటి కళాకారుని జీవితాన్ని కడతెర్చే కరకు పాత్రలో రాజసులోచన, మతం కోసం మానవత్వాన్ని పణంగా పెట్టె రాజగురువు పాత్రలో ముక్కామల, మనకు మరపురాని అనుభూతిని కలిగించారు. మరియు రమణారెడ్డి, రేలంగి, చదలవాడ, సూర్యకాంతం పోటీపడి, అత్యుత్తమ నటన అందించన ఈ చిత్రం, మీరు చూసివుంటే మరొక్కమారు చూడండి, లేకపోతే మీరు తప్పక చూడవలసిన చిత్రాల జాబితాలో ముందుంచండి.  ఈ విశ్లేషణని ముగించడం చాలా కష్టమనిపించింది. ఆలోచించగా, నాకు కనిపించిన ఈ Lancelot Hogben మాటలతో సశేషం (from his book ‘Mathematics for the Million’):

“Our studies in Mathematics show us that whenever the culture of a people loses contact with the common life of mankind and becomes exclusively the plaything of a leisure class, it is becoming a priestcraft. It is destined to end… To be proud of intellectual isolation form the common life of mankind and to be disdainful of the great social task of education is as stupid as it is wicked. It is the end of progress in knowledge. History shows that superstitions are not manufactured by the plain man. They are invented by the neurotic intellectuals with too little to do.”

ఆలాగునే యుగాల పరిణామములో, మహర్షుల తపో యజ్ఞములతో, సకల జీవకోటి శాంతి కోసం- ఆవిర్భవించిన మన వేదాలు, ధార్మిక వర్తన, సాహిత్యము, సంగీతము, ఇతర కళలు ఈనాడు సామాన్యునికి, యువతరానికి ఎంత చేరువలో ఉన్నాయి? వాటిని భూమార్గాన్ని పట్టించే భగిరధ ప్రయత్నము, ఆలోచించండి, ఎవరి చేతిలో ఉందో?

*

 

కలెబడె కవి అలిశెట్టి  

 

వులు, రచయితలు, కళాకారుల్ని బతికున్నప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత మాత్రమే గౌరవించడమనేది ఇవ్వాళ తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాన్ని పీడిస్తున్న జాఢ్యం. సరే కనీసం చనిపోయిన తర్వాతైనా పట్టించుకుంటున్నారన్నది కొంత సంతృప్తి ఇచ్చే విషయం. అయితే ఈ పనిని వారి మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఎక్కువగా చేస్తున్నారు. కానీ కవి, రచయిత తాను జీవితకాలం ఏదైతే సంస్థతో అసోసియేట్‌ అయి వున్నాడో ఆ సంస్థలు వాళ్ళని పట్టించుకోవడం లేదు. సమగ్ర రచనలు ప్రచురించకున్నా కనీసం జయంతి, వర్దంతులు కూడా నిర్వహించడం లేదు. ఇది ఏదో ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని చెబుతున్న విషయం కాదు. అన్ని సంస్థలు అట్లానే ఉన్నాయి. అరసం, విరసం, తెరసం ఏ సంఘమైనా కానివ్వండి అన్నీ అలానే వ్యవహరిస్తున్నాయి. ఇందులో కొంత విస్మరణ, మరికొంత వివక్ష, ఎక్కువగా నిర్బధ్యాత ఉన్నది. బాధ్యతగా భావించి గౌరవించాల్సిన ప్రభుత్వాలూ ఈ విషయంలో ‘సెలిక్టివ్‌’గా వ్యవహరిస్తున్నాయి.  ఈ వివక్ష, విస్మరణ ఇవ్వాళ 63వ జయంతి, 24వ వర్ధంతిని జరుపుకుంటున్న అలిశెట్టి ప్రభాకర్‌ విషయంలోనూ జరిగింది.

అభ్యుదయ రచయితల సంఘానికి ఆయువు పట్టుగా నిలిచి, నడిపించిన తాపీ ధర్మారావు సమగ్ర రచనలు ఇప్పటికీ తెలుగు పాఠకులకు ఒక్క దగ్గర అందుబాటులో లేవు. అలాగే విద్వాన్‌ విశ్వం రచనలు కూడా సమగ్ర సంపుటాలుగా అందుబాటులో లేవు. ఆళ్వారు స్వామి రచనలు సమగ్ర సంపుటంగా వెలువడలేదు. (తెలుగు అకాడెమీ ప్రచురించినా ఆ సంపుటం అసమగ్రం). వీళ్ళు పేరుకు మాత్రమే. ఇలాంటి సాహితీవేత్తలు ఎంతోమందివి సమగ్ర సంపుటాలు రావాల్సి ఉన్నవి. మరోవైపు పొట్లపల్లి రామారావు రచనల్ని భూపాల్‌ సాయంతో ఆయన కుటుంబ సభ్యులు వెలుగులోకి తెచ్చారు. విప్లవ రచయితల సంఘం స్థాపన నాటి నుంచి చనిపోయే వరకూ దాంట్లో భాగమైన కె.వి.రమణారెడ్డి రచనల్ని ఆయన కుటుంబ సభ్యులు వరుసగా ప్రచురిస్తున్నారు. అలాగే అలిశెట్టి ప్రభాకర్‌ రచనల్ని సమగ్ర సంకలనంగా ఆయన మిత్రులు నర్సన్‌, నిజాం వెంకటేశం, జయధీర్‌ తిరుమలరావు తదితరులు పూనుకొని వెలువరించారు. ఇందులో ఇంకా సిటీలైఫ్‌లో భాగంగా వెలువడ్డ కొన్ని కవితలు జోడించాల్సి ఉంది.

జీవిత కాలం సేవ చేసిన సంస్థలే పట్టించుకోకపోవడమనేది ఇవ్వాళ కొత్తగా జరుగుతున్నది కాదు. ఆది నుంచి ఈ తంతు ఇలాగే కొనసాగుతోంది. 1953కు ముందు హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ రచయిత సంఘం ఏర్పడింది. దీని ద్వారా ఎక్కువగా సంస్థ బాధ్యులైన దాశరథి, నారాయణరెడ్డిల స్వీయ ప్రచురణలే ప్రచురితమయ్యాయి. సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారి రచనలు వీళ్లు వెలువరించలేదు. దీని వల్ల ఆయన రచనలు సమగ్రంగా అందుబాటులో లేకుండా పోయాయి. ఆ యా సంఘాల తరపున దాని బాధ్యుల స్వీయ రచనలు అప్పుడూ వెలువడ్డాయి. ఇప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా వెలువడుతున్నాయి. అయితే తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయమైన సేవ చేసిన వెలుగుల రచనలన్నీ ఒక్క దగ్గర లేక పోవడం మూలంగా సాహిత్య చరిత్రకూ, సాహితీవేత్తలకు, సృజనకారుకు అన్యాయం జరుగుతోంది. న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన గౌరవం నుంచి వాళ్ళు వంచితువులతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున కొంతమంది విస్మ ృతుల్ని, వారి రచనల్ని పాఠ్యపుస్తకాల్లో జోడించాని ప్రయత్నించినపుడు అవి అందుబాటులోకి రాలేదు. దీనివల్ల వారి గురించి తెలుసుకునే అవకాశాన్ని కోల్పోయాం. అయితే అలిశెట్టి రచనలన్నీ ఒక్క దగ్గర ఉండడం మూలంగానే ఆయన రచనని పాఠ్యాంశంగా నిర్ణయించడానికి వీలయింది.

నిజానికి అలిశెట్టి ప్రభాకర్‌ 1993లో చనిపోతే 2013 వరకూ ఏ సంస్థా ఆయన మీద సభలు, సమావేశాలు నిర్వహించలేదు. ఒక్క విప్లవ రచయిత సంఘం మాత్రం ఆయన మరణానంతరం ‘మరణం నా చివరి చరణం కాదూ’ పేరిట చిన్న కవితా సంపుటిని వెలువరించింది. (అంతకు ముందు అలిశెట్టి తన సిటీలైఫ్ ని అచ్చేసి దాని ద్వారా వొచ్చిన డబ్బుని చెరబండరాజు చికిత్సకు అందించిండు) అయితే నర్సన్‌, నిజాం వెంకటేశం, దాసరి నాగభూషణం, వి.సామ్రాట్‌ అశోక్‌, గుండేటి గంగాధర్‌ ఇంకొంతమంది 2012 జనవరిలో అలిశెట్టి ప్రభాకర్‌ సంస్మరణ పెట్టేవరకు లబ్ధప్రతిష్టులైన ఆయన మిత్రులెవరికీ ఆయన స్మరణలో లేడు. బతికున్నప్పుడంటే తమకు పోటీ అవుతాడు కాబట్టి అలిశెట్టిని విస్మరించారు అనుకోవచ్చు. కానీ చనిపోయాక…అదీ 20 ఏండ్ల వరకూ ఆయన రచనలేవీ అందుబాటులో లేవు అంటే అలిశెట్టిని కవిగా ఖతం చేయడమే! ఇదే కాలంలో శ్రీశ్రీ రచనలు సమగ్ర సంపుటాలుగా విరసం, మనసు ఫౌండేషన్‌ వాళ్ళు ప్రచురించారు. అట్లాగే ఇప్పటికీ ఎవరో ఒకరు మహాప్రస్థానం ప్రచురిస్తూనే ఉన్నారు. ‘కవి’ అనే రెండక్షరాలతో ఇద్దరినీ పోల్చడం కాదు గానీ అలిశెట్టి కవిత్వం ఒక్కసారి చదివితే చాలు నిద్రాణంగా ఉన్నవాణ్ని సైతం నినాదమై మేల్కొల్పుతుంది

ఈ మేల్కొలుపు కవిత్వానికి పునాది జగిత్యాలలో పడింది. అలిశెట్టి 1974 నుంచి కవిత్వం రాస్తున్నా, 1978 జగిత్యాల జైత్రయాత్రలో ఔట్‌సైడర్‌గానే ఉన్నడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ కవుల రచనలు అతి తక్కువగా పత్రికల్లో  ప్రచురితమయ్యేవి. అడపా దడపా దాశరథి, సి.నారాయణరెడ్డి రచనలు మాత్రమే పత్రికల్లో అచ్చయ్యేవి. అయితే ఈ స్థితిని అధిగమించేందుకు తెలంగాణలో కొంత ప్రయత్నం అన్ని జిల్లాల్లో జరిగింది. దీంట్లో భాగంగా జగిత్యాల కేంద్రంగా బి.నర్సన్‌, గంగాధర్‌, రఘువర్మ, ధరన్‌ బాబులు పత్రికల వారికి ప్రత్యామ్నాయంగా కవితా సంకలనాలు తీసుకురావాని సంకల్పించారు. అందుకే తామే సొంతంగా వివిధ ప్రాంతాల్లోని కవులకు ఒక వేదికగా ‘సాహితీ మిత్ర దీప్తి’ ని ఏర్పాటు చేసిండ్రు. దీని ద్వారా దీప్తి, చైతన్య దీప్తి తదితర ఐదు కవితా సంపుటాలు వెలువరించిండ్రు. ఇందులో రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన వారి కవిత్వంతో పాటు తెలంగాణాకు చెందిన రామాచంద్రమౌళి, నందిని సిధారెడ్డి లాంటి ఆనాటి యువ కవుల కవిత్వం కూడా చోటు చేసుకునేది. ఈ కవితా సంపుటాల ప్రచురణ, నిత్య కవితా పఠనం, సాహితీ మిత్ర దీప్తి దోస్తానా అలిశెట్టిని కవిగా నిలబెట్టింది. అందుకు ఆయన ఎదిగొచ్చిన సమాజం, ఎదుర్కొన్న ఒడిదొడుకులు పాఠాలను నేర్పాయి. ఏదైనా పని ముందటేసుకుంటే దాని అంతు చూసే వరకూ, లేదా సమస్యకు పరిష్కారం కనుక్కునే వరకు దాంట్లోనే మునిగిపోయేవాడు. అందుకే తాను చూస్తున్న సమాజంలోని రుగ్మతలకు వెంటనే రియాక్ట్‌ అయ్యేవాడు.

నిజానికి 1970 నుంచే దొరలు, భూస్వాములు నక్సలైట్‌ ఉద్యమం రూపుదిద్దుకోవడాని కన్నా  ముందే తమ పిల్లల చదువు కోసం గ్రామాల నుంచి పట్టణాల బాట పట్టిండ్రు. దాదాపు ఇదే సమయంలో అప్పటికే పట్టణ ప్రాంతాల్లోని బీసీలు మొదటిసారిగా టీచర్‌, క్లర్క్‌ లాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరిండ్రు. అట్లాగే ఉత్తర తెంగాణలోని రైల్వే ట్రాక్‌ వెంబడి ఉన్న పట్టణాల నుంచి సింగరేణికి వలసలు పెరిగినయి. ఈ కాలంలోనే అలిశెట్టి ప్రభాకర్‌ తండ్రి చినరాజం టీచర్‌గా పనిచేసేవాడు. ఆయన అలిశెట్టికి 15 ఏండ్ల వయస్సున్నప్పుడు చనిపోయిండు. అప్పటి నుంచి అన్నీ తానే అయి తల్లి లక్ష్మి పెంచింది. నిజానికి అప్పటికీ ఇప్పటికీ జగిత్యాలో పద్మశాలీలది పెద్ద జనాభా. ఎక్కువ మందికి బీడీల్జేసుడే వృత్తి. ఈ దశలో తాను పుట్టినప్పటినుంచి ఉన్న జగిత్యాల పట్టణానికి చుట్టు పక్కల గ్రామల నుంచి వలసొచ్చిన వెలమ దొరలు, వాళ్ళ కొడుకుల దబాయింపు, అజమాయిషీని, ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక ప్రతిఘటించేవాడు. వాళ్ళ విచ్చలవిడితనం కూడా అలిశెట్టిని ప్రశ్నించేలా చేసింది. పిట్టపిల్ల కాయమైనా భౌతికంగా దాడిచేయడానికి కూడా వెనుకాడేవాడు కాదు. అందుకే అలిశెట్టి కవిత ‘రక్తరేఖ’లో ఇలా సాగుతుంది.

‘‘నువ్వు ఉరిమి చూసినప్పుడు

ఊరంతా పాలేర్లే

వాళ్ళే

ఊరినించి తరిమికొడితే

నీ బ్రతుకంతా పల్లేర్లే’’

అని దొరలను హెచ్చరించిండు. అలాగే నిరుద్యోగం గురించి..‘‘పుస్తకం లోంచి దులిపేసిన అక్షరాల్లా లక్షకి లక్షలు దేశమంతా నిరుద్యోగులై నిండుకున్నారు’’ అన్నడు. కవిత్వంలో రాజకీయాన్ని చీల్చి చెండాడిండు. తెలుగులో ఇంత పదునుగా రాజకీయ`కవిత్వం అల్లినవాళ్ళు అరుదు.

‘‘‘జలగాలు’ ‘బ్రహ్మ’జెముళ్ళూ

అవకాశవాది ‘రూలుకర్రా’

‘ఆరణాల కూలీ’

‘పునాది’లేని ‘భవనం’ నాచారం ‘సన్యాసులూ ’

వరుసగా ఎవరెవరు ముఖ్యమంత్రులైనా

ఇరవైనాలుగ్గంటలు కుట్ర ఇంకొకడ్ని ప్రమాణ స్వీకారం

చేయించినా-

అక్షరాలా అరాచకంలో మార్పుండదు’’ అని అంజయ్య, చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌, నాదెండ్ల ఇలా ఆనాటి ముఖ్యమంత్రుల ముసుగుల్ని తొలగించిండు. వాళ్ళ ఆరాచకాల్ని చిత్రికగట్టిండు.

జగిత్యాలో ఉన్న సమయంలో అలిశెట్టి కవితలు రాయడం, పోస్టు చెయ్యడమే పనిగా పెట్టుకున్నడు. తాను అనుభవించిన పేదరికం, దగ్గర నుండి చూసిన అణగారిన వర్గాల వెతలే అక్షరాలుగా తెలుగు నేలంతా అలికిండు. ఆ పంట నుంచి ఒక్కసారైనా బువ్వ తినని కవులు లేరంటే అతిశయోక్తి కాదు. తన కవిత్వంలో మహిళల పట్ల ప్రేమ, ఆర్తిని కలగలిపిండు. కైగట్టిండు. దళిత, ముస్లిం, చేనేత, గౌడ బతుకుల వెతలను రాసిండు. రైతు, కార్మికుడు, విద్యార్థి, ఇలా అందరి గురించీ రాసిండు. నిత్య చైతన్యంతో ఎదిగి వచ్చిన ఒక తరానికి తన రాజకీయ కవిత్వాన్ని సమాజాన్ని శస్త్ర చికిత్స చేసేందుకు ఇన్స్‌ట్రుమెంట్సుగా ఇచ్చిండు. గుండె లోతుల్లోకి వెళ్ళి ఛిధ్రమౌతున్న సమాజాన్ని, అడుగంటుతున్న మానవీయ విలువల్ని హృదయంతో చూసిండు. రక్తంతో రాసిండు. అందుకే కవిత్వమంటే ఏమిటో తాను 1978లో ప్రకటించిన తొలి కవితా సంకనం  ‘ఎర్రపావురాలు’ లో

‘‘నా గుప్పిట్లో

మండుతున్నా

ఎన్నో గుండెలు …

ఒక్కొక్కదాన్లో

దూరి,  వాటిని చీరి ,

రక్తాశ్రువులు ఏరి

పరిశీలిస్తాను నేను’’ అన్నాడు. ‘’వర్తమానానికి భావితవ్యానికీ నడుమ // ప్రగతి వంతెన కట్టాలని అనుక్షణం// పరితపిస్తున్నాను అని రాసిండు .

పేదరికం, ఆకలితో సహవాసం చేయడాన్ని అలవాటు చేసుకున్నడు. నిరుద్యోగం, నగర జీవితం గురించి రాసిండు. మెజారిటీ ప్రజల బాధలూ గాధలే తన కవిత్వానికి ముడి సరుకని చెప్పుకున్నడు. ‘గొర్రె మందతో నడిచేకంటే.. చీమల బారులో చేరితే మేలు’ అనే సోయున్నవాడు. ‘కవిత్వం, జీవితం’ రెండూ వేర్వేరు కావని కవమనమల్లినవాడు. భావజాల వ్యాప్తికన్నా బాధితుల గుండె చప్పుడు వినిపించడానికే ఎక్కువ ఇష్టపడ్డడు. ఆఖరి వరకూ ఆత్మాభిమానంతో ఉన్నడు. అందుకే

‘‘చితికి…చితికి…చివరికి

పత్రిక పారితోషికమే జీవనాధారంగా

స్వీకరిస్తున్న నేపథ్యంలో

హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు

చెప్పుకోనివ్వండీ’’

అని రాసిండు.  సామాజిక స్పృహ ఉన్నవాడు కాబట్టే

‘‘గడ్డ కట్టిన కారంచేడు నెత్తుటి మడుగులో

అగ్రవర్ణాల అహంకారపు గొడ్డళ్ళు మునిగి

ఉపరితలమ్మీద

ఆరుగురి  హరిజనుల శిరస్సులు మొలిచి

హాహాకారాలు చేస్తుంటాయ్‌’’ అన్నడు.

అలిశెట్టి ప్రభాకర్‌ అర్దాంతరంగా ప్రయాణం ముగించినా… ఆయన వేసిన దార్లు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఈ దారుల్లో కొంతమంది ‘టేక్‌ డైవర్షన్‌’ అని కొత్తగా బోర్డులు పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నవారూ ఉన్నరు. నిజానికి ఆయన గ్రామాల నుంచి నగరానికి దారులు వేసిండు. అక్షరాల్లో ‘సిటీ లైఫ్‌’ని చిత్రించిండు. అన్యాయం ఎక్కడ కనబడ్డా అక్షరాలనే గొడ్డళ్ళుగా చేసిండు. ఇవ్వాళ ఆయన్ని, ఆయన రచనల్ని ఆలింగనం చేసుకునే  సంస్థలు బాధ్యులూ ఎన్నడూ అలిశెట్టి కుటుంబం గురించి ఆలోచించలేదు. 1993లోనే కొంతమంది తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ మిత్రులం ఆనాటి తెలుగు యూనివర్సిటీ వీసీ సి.నారాయణరెడ్డి మీద ఒత్తిడి తెచ్చి అలిశెట్టి అర్ధాంగి భాగ్యకు అటెండర్‌ ఉద్యోగమైనా ఇప్పించాం. ఇన్నేండ్లూ కంటెజెన్సీగానే కొనసాగుతున్న ఆమెను తెలంగాణ ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసి, ఉండేందుకు ఇంత నీడ కల్పించాల్సిన అవసరమున్నది.

 

 

యాష్ లీలో ధర్మారావు ఊహల ప్రతిధ్వనులు

సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-10

 

‘వేయిపడగలు’, ‘గాన్ విత్ ద విండ్’-రెండూ వెయ్యి పేజీలు దాటిన బృహన్నవలలు.  తీరా వాటి మధ్య పోలికలు, తేడాలలోకి తొంగి చూడబోతే అదీ అంత భారీగానూ మారేలా కనిపించింది. కనుక వీలైనంతవరకు సంక్షేపించక తప్పదు.

రెండు రచనలూ చిత్రించినది ఒకానొక వ్యవస్థాపతనాన్నే, అయినా మళ్ళీ రెండు వ్యవస్థల మధ్యా తేడా ఉంది. స్థూలంగా చెబితే, వేయిపడగల వ్యవస్థ కాలికంగా ఎక్కువ నిడివీ, లోతు, ఘనీభావస్థితీ కలిగినదైతే; గాన్ విత్ ద విండ్ చిత్రించిన వ్యవస్థకు అంత కాలికమైన నిడివీ, లోతూ లేవు. మధ్యయుగాలనాటి వేయ్యేళ్ళ అంధచరిత్రనుంచి యూరప్ బయటపడి, పునరుజ్జీవన రూపంలో తెచ్చుకున్న అసాధారణ క్రియాశీలత అమెరికాలోకి ప్రసరించిన పరిణామంలో భాగమే గాన్ విత్ ద విండ్ లోని కులీన సమాజం. యూరప్ లో జరిగినట్టు, వేయిపడగల వర్ణ సమాజపు, లేదా ఆ వర్ణసమాజం గురించిన ఊహల తాలూకు పునాదులను కదిలించి పెద్ద ఎత్తున క్రియాశీలం చేయగల, పునరుజ్జీవనంతో పోల్చగల పరిణామం భారతదేశంలో ఆధునికకాలంవరకూ లేదు. లేకపోగా ఆ స్తబ్ధతను, ఘనీభవ స్థితిని, క్రియాశీల, పోరాటరాహిత్యాలను తాత్వికీకరించి ఘనంగా కీర్తించడం ఉంది. వేయిపడగల రచయిత ఒకచోట ఇలా అంటాడు:

ఆమె(జమీందారు రంగారావు పెళ్లాడిన ఆంగ్లేయయువతి శశిని) యొక స్వతంత్రదేశమున పుట్టినది. అచ్చటి మరియాదలకు అలవాటులకు పరదేశములవారు వచ్చి భిన్నముగా నడచినచో ఆమె మనస్సు చాలా బాధపడి యుండును. కాని తన యీ భిన్నప్రవర్తన యిచ్చటి దేశప్రజలకు బాధ కలిగించునని యామెకు యూహయే కలుగలేదు. కలుగవలసిన అవసరము లేదు.

ఈ దేశప్రజలు వచ్చిన కష్టములు దైవికములని వాని నోర్పుతో సహింతురు. తమ కిష్టము లేమి సూచించరు. ఒక విషయమున, ఒక కార్యాచరణమున, తమ యిష్టము లేమిని ప్రతిఘటించి తెలుపుట, శశిని పుట్టిన దేశమున ప్రధాన ధర్మము. తత్ప్రకృతులకు ప్రతిఘటించకపోవుట అంగీకారము క్రిందనే లెక్క!

మొదటి వాక్యాలలో అశక్తతనుంచి పుట్టే ఆక్రోశమూ, నిష్టురత్వమూ వ్యక్తమవుతుంటే; రెండో వాక్యాలు అశక్తతను తాత్వికీకరిస్తూ ప్రతిఘటనలేమిని గుణంగా, ఘనంగా చూపిస్తున్నాయి. ఇది అశక్తతను, అది కలిగించే న్యూనతను ఆధిక్యంగా చిత్రించుకునే ప్రయత్నం.

ఈ అశక్తతకుగల పర్యవసానాలలో ఒకటి రాజీపడడం. మరోచోట మంగమ్మ అనే పాత్రతో వేయిపడగల రచయిత ఇలా అనిపిస్తాడు:

సంఘములో కాని, మతములో కాని, మరొకదానిలో కానీ మీ రెన్ని మార్పులైన తేవచ్చును. ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, తద్వారా భక్తియో, జ్ఞానమో కలుగుటకు వీలుండెనేని మీరు తెచ్చిన మార్పు శిరోగ్రాహ్యము.

సంఘంలోకానీ, మతంలో కానీ మీరు ఎన్ని మార్పులైనా తేవచ్చు ననడంలో స్పష్టంగా వ్యక్తమవుతున్నది, మార్పులతో రాజీపడడమే. అయితే, ఆ మార్పులు ‘ఇంద్రియ, మనోనిగ్రహాలు; తద్వారా భక్తి, జ్ఞానాలు’ కలిగించేవిగా ఉండాలని షరతు పెడుతున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ‘నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు సకల సంపదలూ సాధించుకు రావా’లని పాతాళభైరవి సినిమాలో నిరుపేద అయిన తోటరాముడికి రాజు షరతు పెడతాడు. తోటరాముడు నేపాళ మాంత్రికుని జయించి పాతాళభైరవిని మెప్పించి సంపదలతో తిరిగి వచ్చాడంటే అది సినిమా! నిజ జీవితం సినిమా కాదు. భక్తి, జ్ఞానాల సంగతి దేవుడెరుగు; ఇంద్రియ, మనోనిగ్రహాలనే మెట్లు ఎక్కడమే రచయిత చెప్పినంత తేలిక కాదు. అమాయకత్వమనాలో మరేమనాలో తెలియదు కానీ; లౌకిక ప్రాతిపదికపై నడిచే సంఘానికి రచయిత అలౌకికమైన, ఆధ్యాత్మికమైన సిలబస్ విధిస్తున్నాడు!

విధించడమే కాదు, వేయిపడగల రచయిత గిరిక, ధర్మారావు, హరప్పల ద్వారా భక్తి, జ్ఞాన, కర్మమార్గాలనే సిలబస్ ను అమలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది వ్యవస్థా పతనాన్ని ఆపలేకపోయింది. చివరికి అరుంధతి రూపంలో పతివ్రతాధర్మం ఒకటి మిగిలిందని ధ్వనించి సంతృప్తి ప్రకటిస్తాడు.

లౌకికంగా క్రియాశీల, పోరాటశీలతలు లోపించిన మహాస్తబ్ధతలో మన ఊహల్ని అస్పష్ట, అవ్యక్త, అధ్యాత్మిక సీమల్లోకి నడిపించి శాంతిని, సమాధానాన్ని వెతుక్కోవడమే ఇది. అలాగని లౌకికజీవితాన్నీ, వాస్తవికతనూ అంత తేలిగ్గా ఎగరగొట్టడమూ సాధ్యం కాదు. దాంతో లౌక-అలౌకికతల మధ్య అంతులేని సంఘర్షణ, సంక్లిష్టత, వైరుధ్యాలు! నిస్సహాయతను నిర్లిప్తతగా ఎంత ఉన్నతీకరించుకున్నా వ్యవస్థాపతనంపట్ల తప్పని దుఃఖం!

రచయిత ఆదర్శీకరించిన చాతుర్వర్ణ్యవ్యవస్థ ఆయన ఊహలో ఉన్నట్టు అచ్చంగా అంత ఆదర్శవంతంగానూ ఎప్పుడైనా ఉందా అంటే, ఉండగల అవకాశమూ లేదు.  పునాదులను కదిలించి ఉపరితలంలో కీలకమైన మార్పును తేగల ఒక మహత్ పరిణామమేదీ లేకపోవడం; ఫలితంగా సుదీర్ఘకాలం వెంబడి కరడుగట్టిన భావజాలమూ, సమాజంపై దాని వక్రప్రతిఫలనమూ, ఆ రెంటి మధ్యా వైరుధ్యాలూ అలా ఉండగానే చాపకింద నీరులా పాకుతూ వచ్చిన మార్పులు; అవి ఎలాంటివో తెలుసుకుని స్పందించేలోగానే అవి జీవితంలో భాగం కావడం! వాటిపై ఏం చేయాలో తోచని నిస్సహాయత! ఇదీ వేయిపడగలు రూపు కట్టిన భారతీయసాంప్రదాయిక సమాజపతనం.

గాన్ విత్ ద విండ్ చిత్రించినది ఇందుకు భిన్నం. అందులోని కులీన సమాజం వేయిపడగల సమాజంలా తీసుకుని తీసుకుని మరణోన్ముఖమవుతున్న సమాజం కాదు. క్రియాశీలంగా మారి చావో రేవో తేల్చుకోవాలనుకుంటుంది. సాయుధ పోరాటానికి దిగుతుంది. ఓడిపోతే పోవచ్చు కానీ అందులో నాన్పుడు లేదు. వేయిపడగలకు రంగస్థలమైన సుబ్బన్నపేటలో ఆధునికమైన మార్పులు సాపేక్షంగా ఎక్కువ కాలవ్యవధిలో సంభవిస్తే; గాన్ విత్ ద విండ్ కు రంగస్థలమైన జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో అంతర్యుద్ధ పర్యవసానంగా నాలుగైదేళ్ళ వ్యవధిలో దాదాపు హఠాత్తుగా సంభవిస్తాయి. యుద్ధానికి ముందు పదివేల జనాభాతో ఒక పెద్ద గ్రామంలా ఉన్న అట్లాంటా యుద్ధకాలంలో ఎలా పెరిగిందో, యుద్ధానంతరం నగర స్థాయిని ఎలా అందుకుందో; ఆ క్రమంలో అది భౌతికంగానూ ఆత్మికంగానూ కూడా ఎలా మారిపోయిందో రచయిత్రి అద్భుతంగా కళ్ళకు కట్టిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రేష్టత్వం నిండిన సాంప్రదాయిక జీవనం నుంచి జారిపోయి సామాన్యత అనే ప్రవాహంలో అది గుర్తుపట్టలేనంతగా కలసిపోతుంది.  ఒక యుద్ధం తెచ్చిపట్టే భౌతిక, మానసిక పరివర్తనకు అంతర్యుద్ధకాలపు అట్లాంటా ఒక గొప్ప నమూనా. సుబ్బన్నపేటలో వచ్చిన మార్పుల చిత్రణ కూడా  ఇంచుమించు ఇలాగే ఉంటుంది కానీ; అది కల్పిత గ్రామమైతే అట్లాంటా వాస్తవికం.

కథాకల్పన, పాత్రచిత్రణ సహా రచనా సంబంధమైన వివిధాంశాలలో ఇద్దరు రచయితలమధ్య మౌలికమైన తేడాలూ ఉన్నాయి. ఆ తేడాలు మళ్ళీ ఇద్దరి దృక్పథాలలో ఉన్న తేడాను వ్యక్తీకరిస్తాయి. వేయిపడగలులో ధర్మారావు ప్రధానపాత్ర. రచయిత భావజాలం ప్రధానంగా అతని ముఖంగానే వ్యక్తమైంది. కథాకాలానికి ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి గతించాడు కనుక అతన్ని పక్కన పెడితే, ధర్మారావు తర్వాత చెప్పుకోదగిన పాత్రలుగా గిరిక, గణాచారి, అరుంధతి, రంగారావు, హరప్ప, పసరిక, కుమారస్వామి, మంగమ్మలు కనిపిస్తారు. అయితే వీరందరూ ధర్మారావు ప్రభావంలో మొదటి నుంచీ ఉన్నవారు, లేదా తర్వాత వచ్చిన వారే(ఉదాహరణకు రంగారావు, మంగమ్మ) తప్ప విరుద్ధభావజాలానికి చెందినవారు కాదు. రాధాపతి, చక్రవర్తి, వామనరావు తదితరులు విరుద్ధభావజాలంగలవారైనా ధర్మారావుతో తులతూగేవారు కాదు. అంటే ఏమిటన్నమాట! వేయిపడగల రచయిత ప్రణాళిక ఏకపక్షం. ఆయన భావజాలానికి తగిన ప్రతివిమర్శ కానీ, దానితో సమానప్రతిపత్తిగల పోటీ భావజాలం కానీ లేవు. సుదర్శనంగారు అన్నట్టు వేయిపడగలను ఆత్మాశ్రయకావ్యమనుకుంటే అది అలా ఉండడానికి ఒక సమర్ధింపు అవుతుంది.

ఇందుకు భిన్నంగా గాన్ విత్ ద విండ్ రచయిత్రి దృష్టి వస్త్వాశ్రయంగా ఉంటుంది. అందులో ప్రధానపాత్ర ఎవరన్న పరిశీలన చేయబోతే ఒకరు కాదు, నలుగురు పైకి తేలతారు: స్కార్లెట్ ఒహారా, రెట్ బట్లర్, మెలనీ, యాష్ లీ! రచయిత్రి స్కార్లెట్ ముఖంగా కథ చెబుతున్నట్టు కనిపించే మాట నిజమే. స్కార్లెట్ ప్రధానపాత్రే. అంతమాత్రాన రెట్ బట్లర్ తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు. అలాగే మెలనీ, అలాగే యాష్ లీ…

ఇలా నాలుగు పాత్రలకూ ప్రాధాన్యం లభించడానికి కారణమేమిటి? రచయిత్రి ఈ నలుగురి ముఖంగా నాలుగు దృక్పథా(లేదా ఒకే దృక్పథంలోని భిన్నచ్చాయ)లకు దాదాపు సమస్థాయిని కల్పించడమే. ఈవిధంగా వేయిపడగల లోని ఏకపక్షతకు భిన్నంగా రచయిత్రి బహుళపక్షతకు చోటిచ్చింది. మరోలా చెప్పాలంటే, కాన్ఫడరేట్ గా ఏర్పడి యూనియన్ తో యుద్ధం చేసిన  అమెరికా దక్షిణ రాష్ట్రాలు ఏ భావజాలానికి ప్రాతినిధ్యం వహించాయో ఆ భావజాలాన్ని రచయిత్రి నిరాకరించనూలేదు, స్వీకరించనూలేదు. ఆ భావజాలానికి కాల్పనిక స్థాయిలో యాష్ లీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కాకపోతే స్కార్లెట్, రెట్ బట్లర్ ల రూపంలో రచయిత్రి దానికి ప్రతిపక్షాన్ని సృష్టించింది. అలాగే, పాతను పూర్తిగా నెత్తిన పెట్టుకోవడం, కొత్తను పూర్తిగా తృణీకరించడం చేయలేదు. మెలనీ రూపంలో రెంటి మధ్యా మానవీయత అనే అతుకు పెట్టి ఒక గొప్ప సమన్వయాన్ని సృష్టించింది.

గాన్ విత్ ద విండ్ కు పరిమితమై చూసినప్పుడు ప్రాధాన్యక్రమంలో యాష్ లీ ది నాలుగవ స్థానమే. బహుశా నవల చదివిన పాఠకులందరికీ అదే అభిప్రాయం కలుగుతుంది. కానీ వేయిపడగలతో పోల్చి చూసేటప్పుడు అతను  ప్రథమస్థానంలోకి వస్తాడు. అతనిలో అడుగడుగునా ధర్మారావు పోలికలు కనిపించి ఆశ్చర్యం గొలుపుతాయి. ధర్మారావులానే అతను కూడా భావుకుడు. స్వాప్నికుడు. సాహిత్యప్రేమికుడు. సాంప్రదాయికత మీద గాఢమైన అనురక్తి ఉన్నవాడు. అవ్యక్తంలోని సౌందర్యాన్ని ఆరాధించేవాడు. అయితే ఒక తేడా; ధర్మారావుకు భిన్నంగా అతను పతనమవుతున్న వ్యవస్థ పక్షాన ఆయుధం పట్టి యుద్ధం చేస్తాడు. అయితే ఆ యుద్ధ ప్రయోజకత్వం మీద నమ్మకంతో కాదు. అయినా ఎందుకు యుద్ధం చేశాడంటే ‘స్వధర్మా’న్ని పాటించడానికి తప్ప మరో సమాధానం కనిపించదు. సాటి యువకులే కాక, తండ్రులు, తాతలు కూడా యుద్ధంలోకి దిగినప్పుడు అతను దిగకపోవడం ఊహకు అందని విషయం. యుద్ధసందర్భంలో యాష్ లీ మహాభారతంలోని అర్జునుని గుర్తుచేస్తాడు. యుద్ధానంతర పరిస్థితులగురించి అర్జునుడు వ్యక్తం చేసిన భయాలే యాష్ లీ లోనూ వ్యక్తమవుతాయి. అయినా సరే అర్జునుడు స్వధర్మానుసారం యుద్ధం చేసినట్టే యాష్ లీ కూడా చేస్తాడు. భార్య మెలనీకి రాసిన ఒక ఉత్తరంలో యుద్ధం గురించిన అతని ఊహలు ఇలా ఉంటాయి:

పడుకుని నక్షత్రాలవైపు చూస్తూ అనుకుంటాను, “దేనికోసం నువ్వు యుద్ధం చేస్తున్నా”వని. మన రాష్ట్ర హక్కుల కోసం, కాటన్ కోసం, డార్కీల కోసం, మనం ద్వేషించే ఆ యాంకీ(అప్పట్లో అమెరికాలోని ఉత్తరాదివారిని సూచించే నిందార్థకం)ల కోసం. కానీ నా పోరాటానికి ఇవేవీ కారణాలు కావు. నేను ట్వెల్వ్ ఓక్స్ (అతని నివాసం)ను మాత్రమే చూస్తున్నాను. తెల్లని స్తంభాలపై ఏటవాలుగా పడే వెన్నెలను, వెన్నెల్లో వికసించే చంపకాలలో వ్యక్తమయ్యే అలౌకికతను, ఎర్రని ఎండ కాసే మధ్యాహ్నం వేళ కూడా పక్క వసారాలో చల్లని నీడ పరుస్తూ ఎగబాకే గులాబీలను గుర్తుచేసుకుంటూ ఉంటాను. అమ్మ ఆ వసారాలో కూర్చుని కుట్టుపని చేసుకుంటున్న నా చిన్నప్పటి దృశ్యం కళ్ళకు కడుతూ ఉంటుంది. సంజె వేళ అలసిపోయి పొలాలనుంచి భోజనానికి ఇళ్లకు వెడుతూ డార్కీలు పాడుకునే పాటలు, బావిలోకి బొక్కెన దింపి నీళ్ళు చేదుకుంటున్న ధ్వనులూ వినబడుతూ ఉంటాయి. పత్తి పొలాల మీదుగా నదికి దారితీసే బాట తాలూకు పొడవాటి దృశ్యం, మసకచీకటిలో దిగువ భూములనుంచి పైకి లేచే పొగమంచు…వీటి కోసమే నేను ఇక్కడ ఉన్నాను. మృత్యువు, కష్టాలు, కీర్తిప్రతిష్టల మీద నాకు ప్రేమ లేదు. ఎవరిపట్లా  ద్వేషమూ లేదు. బహుశా ఇంటినీ, దేశాన్నీ ఇలా ప్రేమించడాన్నే దేశభక్తి అంటారు కాబోలు. కానీ, ఇది అంతకన్నా లోతైనది.  పైన చెప్పినవన్నీ నేను దేనికోసం నా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టానో, నేను ఏ జీవితాన్ని ప్రేమిస్తున్నానో దానికి ప్రతీకలు మాత్రమే. పాత రోజులకోసం, నేను గాఢంగా ప్రేమించిన పాత జీవితం కోసం పోరాడుతున్నాను. అయితే అవి శాశ్వతంగా అంతరించాయనిపిస్తోంది. ఎందుకంటే, గెలిచినా, ఓడినా మనం ఆ జీవితాన్ని కోల్పోతాం.

ఈ యుద్ధాన్ని, తద్వారా మనం స్వప్నించే కాటన్ సామ్రాజ్యాన్ని గెలిచినా మనం పరాజితులమే అవుతాం. కారణం, మనం విభిన్న వ్యక్తులుగా మారిపోతాం. వెనకటి ప్రశాంత జీవనసరళులు నిష్క్రమిస్తాయి. ప్రపంచం కాటన్ కోసం దేవిరిస్తూ మన గుమ్మంలో పడిగాపులు పడుతుంది. అప్పుడు, కాటన్ ధర మనం ఎంత చెబితే అంత. ఎవరి డబ్బు కక్కుర్తిని, సంపద పోగేసేకునే ప్రవృత్తిని, వ్యాపార ధోరణిని ఏవగించుకుంటున్నామో; ఆ యాంకీలలానే మనం కూడా మారిపోతాం.

ప్రమాదాలకూ, పట్టుబడడానికీ, గాయాలకూ, చివరికి మృత్యువుకు కూడా నేను భయపడడంలేదు. వెనకటి కాలానికి మళ్ళీ ఎప్పటికీ వెళ్లలేమనే భయపడుతున్నాను. నేను పాతకాలం వాణ్ణి. ఒకరి నొకరు ఊచకోత కోసుకునే ఈ ఉన్మత్త వర్తమానానికి చెందను. ఎంత ప్రయత్నించినా ఏ భవిష్యత్తులోనూ ఎక్కడా ఇమడలేనని అనిపిస్తోంది. నాలో ప్రవహించే రక్తమే నీలోనూ ఉంది కనుక నువ్వూ అంతే. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు; కానీ గత మంత అందంగా, తృప్తికరంగా మాత్రం ఉండదు.

పాతకాలం గురించిన యాష్ లీ ఊహల్లో ధర్మారావు ఊహల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. రుక్మిణమ్మారావుతో అతను అన్న మాటలే చూడండి: “తల్లీ! ప్రాతదంతయు పోవుచున్నది. క్రొత్తదంతయు వచ్చుచున్నది….నేను, మీ యందరును నశించిపోవుచుండగా చూచుటకు మాత్రము పుట్టిన మూర్తిని. నేనును ఈ కాలమునకు తగినవాడను కాను. ఇవి యన్నియు చచ్చిపోవుచున్న యొక జాతి చివరి మెరుపులు!”

ఇంకా ఆశ్చర్యకరంగా, వేయిపడగల రచయితలానే యాష్ లీ కూడా వ్యక్తావ్యక్తంగా ఉండడంలోనే సొగసు ఉందనుకుంటాడు. అతనొకచోట స్కార్లెట్ తో అంటాడు: యుద్ధంలోకి అడుగుపెట్టేవరకూ, జీవితం తెర మీద ఆడించే నీడల్లా తప్ప వాస్తవికంగా ఎప్పుడూ కనిపించలేదు. అదే నాకు ఇష్టంగా ఉండేది. ఆయా వస్తువుల బాహ్యరేఖలు మరీ ప్రస్ఫుటంగా ఉండడం నాకు నచ్చదు. అవి ఒకింత అవిస్పష్టంగా, మసక మసకగా ఉండాలి”

వేయిపడగల రచయిత అంటాడు: “అవ్యక్తమైన స్వరము మధురమైనట్లు, అవ్యక్తమైన భావము సుమనోరంజకమైనట్లు, అవిస్పష్టమైన వెలుగులలో శోభ యెక్కువ యున్నది. పూర్తిగా కనబడినచో జ్ఞానము, కనపడి కనబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.

యాష్ లీ యుద్ధం నుంచి తారా(స్కార్లెట్ పుట్టిల్లు)కు వచ్చిన తర్వాత ఒకరోజున అతనికీ, స్కార్లెట్ కు జరిగిన సుదీర్ఘ సంభాషణ అతనిలోని ధర్మారావు పోలికలను మరింతగా ఆవిష్కరిస్తుంది. వాటిని స్పృశించే ముందు, ఇద్దరి సారూప్యతను ఒక్క వాక్యంలో చెప్పాలంటే;

గాన్ విత్ ద విండ్ ను పూర్తిగా యాష్ లీ ముఖంగా చెప్పి ఉంటే, (కొన్ని తప్పనిసరి తేడాలతో) అది మరో ‘వేయిపడగలు’ అయ్యేది!

      (సశేషం)

ఉత్తమ నటనకు చిరునామా – ఓం పురీ

  

ఓం పురీ  వెళ్ళిపోయాడు.

66 ఏళ్ల వయసుకే కొంపమునిగిపోయినట్టు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. గుండెపోటు… ఒంటరిగా తన అపార్ట్ మెంట్ లో మరణం.

ఓం పురీ నటనలో ఊసరవెల్లి లాంటివాడు.

అనంత్ వేలంకర్ గా (అర్థ సత్య)… ఉన్నాడు.  హరి మండల్ (ఆరోహణ్) గా అబూ మియా గా (మిర్చ్ మసాలా) ఉన్నాడు. అహుజా గా (జానే భీదో యారో) ఉన్నాడు. దుఖీ గా (సద్గతి), భిక్కూ గా(ఆక్రోశ్) ఉన్నాడు. దుర్యోధనుడు, రాజరాజ చోళుడు ఇంకా ఎందరెందరో చారిత్రక పురుషులు (భారత్ ఎక్ ఖోజ్) గా ఉన్నాడు.  నాథూ (తమస్ టీవీ ఫిల్మ్) గా ఉన్నాడు. ఇంకెన్నో సినిమాల్లో ఎందరెందరుగానో ఉండిపోయాడు.   ‘భారత్ ఎక్ ఖోజ్’ లో తన నిండైనగొంతుతో అతనిచ్చిన కామెంటరీ మరపురానిది.

ఎందరెందరి వ్యక్తిత్వాలలోనో తనని తాను లీనం చేసుకుని, ఆ కష్టాలూ అనుభవాలూ తనవి చేసేసుకుని సినిమాల్లో ఆవిష్కరించాడు. ‘Method Acting’ నుంచి తరచి చూశాడు.  Method Actors నటించరు. పాత్రలోకి ప్రవేశం చేసి, ఆటుపోట్లన్నీ అనుభవిస్తారని సాధారణంగా అనుకునే మాట.

“ముంబైకీ ఫిల్మ్ ఫీల్డ్ కు తనను బలవంతం చేసి రప్పించినందుకు  నాకే ఆ క్రెడిట్ ఇచ్చాడు. అది నాకు బాగానే ఉందిగానీ నిజానికి తనని ఎవరూ తీసుకు రావక్కర్లేదు. స్టేట్ బాంక్ ఆఫ్ పాటియాలా లో పని చేస్తూ ఉండిపోయినా సరే, సినిమాలు అతన్ని వెదుక్కుంటూ వచ్చేవి” – నసీరుద్దీన్ షా.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉన్నప్పుడు షా కొంచెం అల్లరిగా ఉంటూ నటనను తేలిగ్గా తీసుకునేవాడట. శ్రద్ధగా నేర్చుకోవటం మీదే దృష్టిపెట్టే ఓం పురీ ని చూస్తుంటే తమాషాగా ఉండేదట.  ఒకసారి అక్కడ ‘కబుకీ’ నాటకం వేస్తున్నారని తెలిసి తానూ అందులో వేద్దామని ఉత్సాహపడ్డాడట. కానీ తనకు అవకాశం రాలేదు. ‘ఇబరాగి’ అనే ఆ కబుకీ ప్లే లో జపాన్ యోధుడిగా ఓం పురీని చూశాక  అతని మీద ఉన్న ఈర్ష్య పోయి, ఆరాధించే స్థాయికి వచ్చానని చెప్తాడు. స్కూల్ ఆఫ్ డ్రామాలో వేసిన తన నాటకాలు ఏవీ ‘ఇబరాగి’ లో ‘ఓం’ చేసిన అభినయానికి కనీసం దగ్గరగా కూడా రాలేకపోయాయని ‘షా’ తన ఆత్మకథ ‘And Then One Day – A Memoir లో  చెప్తాడు.

ఓం పురీ బిడియస్తుడు.

Method Actors, సున్నితమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అందరి జీవితాలూ జీవిస్తూ, వాటిని తట్టుకుంటూ బయటపడాలంటే తప్పనిసరిగా కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉందేమో.  కానీ అతని కుటుంబజీవితం సరిగ్గా లేదు.

జర్నలిస్ట్ నందితా ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు. నందిత ఓంపురి జీవితకథను రాసింది. తనగురించి ఏవేవో రాసేసిందని బాధపడిపోయాడు. అవసరం లేదు. నసీరుద్దీన్ షా లాగా బతుకు పుస్తకాన్ని తెరిచిపెట్టి, తనను చూసి తాను హాయిగా నవ్వుకోనూ వచ్చు. నవ్వుకోలేదు. బాధపడి పోయాడు. నందితతో విడిపోయి మూడేళ్ళయింది.

ఓం పురీ ధైర్యస్తుడు.

స్ఫోటకం మచ్చలతో పీలగా ఉన్న తను,  చెయ్యీ కాలూ సరిగ్గా ఎలా కదపాలో తెలియకపోయినా మంచి రూపాలే పెట్టుబడిగా సినిమాల్లోకి దిగిన హీరోల పక్కన బతకగలనని అనుకోవటానికి ఎంత ధైర్యం ఉండాలి!  ఎన్. ఎస్. డీ లో మంచి పేరు తెచ్చుకున్నా,  మధ్యమ స్థాయిలో ఉన్న చక్కటి స్వరం ఉన్నా, రూపం కారణంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇతనికి నటన విభాగంలో చేరటం కష్టమైంది. గిరీష్ కర్నాడ్ జోక్యంతో సీట్ వచ్చింది.  ఇంతగా నటన ఊపిరైపోయిన ఈ పంజాబీ కుర్రాడికి రెండు ప్రిమియర్ ఫిల్మ్ స్కూల్స్ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్) చుట్టివస్తే గానీ నటనలు నేర్చే దాహం తీరలేదు. నేర్చిన నటనకు సార్ధకతను ఇవ్వటానికి అదృష్టంకొద్దీ  సమాంతర సినిమా అనే మంచి చోటు దొరికింది.  ఆ సినిమాలవి అసలే కుదించుకున్న బడ్జెట్ లు. ఏవో కొంచెం డబ్బులు పారేసి (ఇది ఓం పురీ చెప్పిన మాటే)  తనను ఆ సినిమాల్లో వేయమంటే వేసి, ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో ఎలా బతుకుతున్నాడో లెక్క చెయ్యకుండా గడిపిన కాలంలో మెచ్చుకోళ్ళూ అవార్డులే ముందుకు నడిపించాయి.  హాలీవుడ్ లో అడుగుపెట్టాకే  సంపాదన బాగా పెరిగింది.

ఓం పురీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే శక్తి తనకు అబ్బురంగా అనిపించేవని అంటాడు మిత్రుడు నసీరుద్దీన్ షా. స్మితా షబానాల లాగే నసీర్ ఓం పురీల పేర్లు విడదీయలేనివి. నటనలో స్పర్ధతో పాటు ఆకలినీ ఆనందాలనూ కలిసి పంచుకున్న మిత్రులు ఇద్దరూ.

 

ఓం పురీ  ఒక అనంత్ వేలంకర్ 

హిందీ సినిమాలో అప్పట్లో Angry Youngman మూసనొక దాన్ని చేసి సలీం జావేద్ లు అమితాబ్ బచ్చన్ కు తొడిగారు. కానీ అసలైన Angry Youngman ఎలా ఉంటాడో ఎలాంటి పరిస్థితుల్లో తయారౌతాడో మొదటిసారి చూపించాడు గోవింద్ నిహలానీ ‘అర్థ సత్య’లో. జనం బాగా చూసిన సినిమా అది.  అనంత్ వేలంకర్ ఒక పోలీస్ కొడుకు. పీలగా బలహీనంగా ఉన్న అతని తల్లిని బలిష్టంగా ఉన్న తండ్రి కొడుతుంటాడు. కొడుకును కూడా పోలీస్ ఫోర్స్ లో చేరమని బలవంతం చేస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్ అయిన అనంత్ తండ్రి లాగ తను జీవితంలో ఎప్పుడూ ఎవరిమీదా జులుం ప్రదర్శించకూడదని అనుకుంటాడు. అందులో చేరిన ప్రతి ఒక్కరినీ ముందు మొరటుగా మార్చిపడేసే పోలీస్ డిపార్ట్మెంట్ బలం ముందు అనంత్ ఎంతపాటి వాడు?

 

“చక్రవ్యూహంలోకి అడుగు పెట్టకముందు నేనెవరిని?ఎలా ఉండేవాడిని?

గుర్తేలేదు.

దానిలోకి వెళ్ళేకగానీ దానికీ నాకూ ప్రాణం తీసేంత దగ్గరితనం ఉందని తెలియనేలేదు.

ఈ చక్రవ్యూహంలోంచి బయటపడితేనే నేను విముక్తుడినౌతాను.

అయితేమాత్రం? చక్రవ్యూహ రచనలో ఏం తేడా వస్తుంది గనుక?”

ఇదీ అనంత్ వేలంకర్ అస్తిత్వ వేదన.

ఓం పురీ అనంత్ వేలంకర్నీ అతని వేదననూ తనమీదికి ఆవాహన చేసుకున్నాడు.

ఎన్నో సినిమాల్లో, టీవీ ఫిల్మ్స్ లో, వేరే దేశాల సినిమాలూ టీవీలలో నటించి మెప్పించాడు. నాటక రంగాన్ని ఎంతో ప్రేమించాడు. తెలుగులో కూడా ‘అంకురం’ సినిమాలో అతను వేసిన ‘సత్యం’ రోల్ చాలామందికి గుర్తుండే వుంటుంది.  ఏ పాత్రలో వేసినా అది ఏ ప్రాంతానికి సంబంధించినదైనా ఏ భాషా చిత్రమైనా, అక్కడి సాంస్కృతిక నేపధ్యానికి అనుగుణంగా అన్నీ కూలంకషంగా తెలుసుకుని నటించేవాడు.  పోచంపల్లి నేతపనివాళ్ళ మీద శ్యాంబెనెగల్ తీసిన ‘సుస్మన్’ లో నేతగాడుగా ఆవిర్భవించాడు. అప్పట్లో నేతపని నేర్చేసుకుని మరీ నటించాడు. అవన్నీ ఒకెత్తు. ‘అర్థసత్య’ ఒకెత్తు. చిన్నపాత్ర వేసినా ప్రధానపాత్రలో కనిపించినా, వాటికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా నటించాడు.

తానెంతో ప్రేమించిన నటనతో కలిసి చివరిదాకా నడిచాడు కానీ అర్థాంతరంగా జీవితనాటకం నుంచి నిష్క్రమించాడు ఓం పురీ.

–ల.లి.త.

 

 

విశ్వనాథ నుంచి మిచెల్ దాకా…

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-9

*

దేశాలు, మనుషులు, సంస్కృతులు, సాహిత్యాలు, భాషలు వగైరాలలో భిన్నత్వం ఉంటుంది, నిజమే. కానీ ఏకత్వమూ ఉంటుంది. ఎంచి చూస్తే ఏకత్వమే ఎక్కువ ఉంటుందేమో కూడా.  కొందరు కేవలం భిన్నత్వాన్నే చూడడం, కొందరు ఏకత్వాన్ని కూడా చూడగలగడం వారి దృష్టి భేదాన్ని మాత్రమే సూచిస్తుంది. సగం నిండిన గ్లాసు ఉదాహరణతో చెప్పుకుంటే, కొందరికి నిండిన అర్థభాగం కనిపిస్తే, మరికొందరికి ఖాళీగా ఉన్న అర్థభాగం కనిపిస్తుంది.  వేయిపడగల రచయిత ఫ్రాక్ పశ్చిమ సాహిత్యాలలోనూ సంస్కృతీ, ఆచార వ్యవహారాలలోనూ, మనుషుల ప్రవర్తనలోనూ అంతటా భిన్నత్వమే చూస్తాడు. అందులోనూ శ్రేష్టతా, న్యూనతా అన్న తారతమ్య దృష్టిని ప్రదర్శిస్తాడు.  అది ఒక్కోసారి హాస్యాస్పదంగా కూడా పరిణమిస్తుంది. ఉదాహరణకు, ఒక విషాద ఘటనను ప్రస్తావించి దానిపై పాశ్చాత్యులైతే “బ్యూటిఫుల్ బ్యూటిఫుల్” అని స్పందిస్తారని ఒకచోట ఎద్దేవా చేస్తాడు. అది జాతులు, వారి మనః ప్రవృత్తులు, భాషలు, వ్యక్తీకరణల మధ్య తేడాగా సూత్రీకరిస్తాడు.

నిజానికి ఒక విషాదఘటనపై పాశ్చాత్యులందరి స్పందనా ఆ మాటలోనే వ్యక్తమవుతుందని చెప్పడం శ్రుతిమించిన సాధారణీకరణే. అదీగాక ఒక సృజనాత్మక వ్యక్తీకరణపై, అందులోని వస్తువుతో సంబంధం లేకుండా అలాంటి స్పందన, మన దగ్గర సహా సార్వత్రికంగా కనిపిస్తుంది. ఒకవిధంగా వేయిపడగల రచయిత చేసిన సాధారణీకరణ రససిద్ధాంతానికే వ్యతిరిక్తం. శోక, బీభత్స, వీరరసాదులు వస్తువుగా ఉన్న కావ్య, నాటక, చలనచిత్రాలను మనం పనిగట్టుకుని చదివి, దర్శించి అనుభవిస్తున్నామంటే కారణం, వాటి వెనుక ఉన్న సృజనాత్మక ప్రతిభా వ్యుత్పత్తులు కలిగించే ముగ్ధత్వమే. ఆ ముగ్ధత్వాన్ని ఎవరైనా సరే రచయిత ఎద్దేవా చేసిన మాటలో కాకపోతే, తత్తుల్యమైన మాటల్లోనే వ్యక్తీకరిస్తారు.

భిన్నత్వాన్ని మాత్రమే చూసే దృష్టి మహాకవులను, పండితులను కూడా ఇలాంటి అతార్కిక, అసంబద్ధ నిర్ధారణలవైపు నడిపిస్తుంది. కేవలం భిన్నత్వాన్ని, అందులోనూ శ్రేష్టతా, న్యూనతా అనే తారతమ్య వివేచననే కొలమానాలుగా తీసుకున్నప్పుడు ఆయా దేశాలు, భాషల వారు ఎవరి సాహిత్యాన్ని వాళ్ళు ఆనందించవలసిందే తప్ప ఇంకొకరివి ఆనందించే అవకాశం ఉండదు. కానీ అలా జరగడం లేదు. పాశ్చాత్య సాహిత్యం వైపు మనం ఆకర్షితులైనట్టే ప్రాచ్య సాహిత్యం వైపు వారూ ఆకర్షితులు కావడం సార్వజనిక వాస్తవం.  భిన్నత్వాన్ని కేవలం ‘వారు వేరు, మేము వేరు’ అని విడగొట్టడానికి కాక, పరస్పరపూరకానికి అవకాశమిచ్చే జాగాగా అర్థం చేసుకున్నప్పుడు దృష్టి మారుతుంది. అప్పుడు దేశాలు, మనుషులు, సంస్కృతులు, సాహిత్యాల వెనుక ఏకత్వాన్ని దర్శించే వీలు కలుగుతుంది. ప్రత్యేకించి సాహిత్యం ప్రతిఫలించే మానవ అనుభవం నిండా ఏకత్వమే ఉంటుంది.

చరిత్రలోకి వెళ్ళి చూస్తే, భిన్నత్వం మనుషుల్ని విడగొట్టి ఘర్షణకూ, యుద్ధాలకూ దారి తీయించిన అనుభవాలు ఉన్నట్టే;  ప్రపంచంలోని భిన్న భిన్న సమాజాలు, వ్యక్తులు మానవ అనుభవంలోని ఏకత్వాన్ని దర్శిస్తూ; భిన్నత్వాన్ని పరస్పర పూరకమైన ఒక అవకాశంగా చూస్తూ ఒకరికొకరు దగ్గరై పరస్పరం వికాసం చెందిన అనుభవాలూ ఉన్నాయి. విశ్వనాథ వంటి గొప్ప సృజనశీలి, సాహిత్యమర్మజ్ఞుని దృక్పథాన్ని భిన్నత్వం విశ్వరూపంలో కమ్మేసి ఆయన చేత అతార్కికమైన, సంకుచితమైన నిర్ధారణలు చేయించిందంటే కారణం; నాటి చారిత్రక, సామాజిక నేపథ్యం. వలసపాలనలో ఆత్మన్యూనతలో మగ్గుతున్న జాతి ఆ న్యూనతా భావననే ఆధిక్యంగా మలచుకోడానికి ప్రయత్నించింది. ఎంతైనా ఇదొక తాత్కాలిక భావోద్రేకమే తప్ప స్థిరసత్యం కాలేదు. గురజాడ మీదుగా ప్రారంభమయిన ఆత్మవిమర్శ విశ్వనాథ దగ్గరికి వచ్చేసరికి ఆత్మోత్కర్షగా ఎందుకు పరిణమించిందో తెలుసుకోవాలంటే ఆ ఇద్దరి మధ్యకాలంలోని పరిణామాలలోకి తొంగి చూడవలసి ఉంటుంది.

దానిని అలా ఉంచితే…

‘వేయిపడగల’ గురించి రాస్తూ అందులోని ధర్మారావు పాత్రను విశ్లేషిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన రచనలు రెండు: మొదటిది, త్రిపురనేని గోపీచంద్ నవల ‘అసమర్థుని జీవయాత్ర’. రెండోది, మార్గరెట్ మిచెల్ నవల ‘గాన్ విత్ ద విండ్’.

‘అసమర్థుని జీవయాత్ర’లో వ్యక్తమైన గోపీచంద్ తాత్విక సంఘర్షణను ఆర్. ఎస్. సుదర్శనం ‘సాహిత్యంలో దృక్పథాలు’లో తనదైన కోణంలో విశ్లేషించారు కానీ అందులోని సీతారామారావుకు, ‘వేయిపడగలు’ లోని ధర్మారావుకు ఉన్న పోలికలను, తేడాలను ఎందుకో ప్రస్తావించలేదు. ఈ ఇద్దరి మీదా తండ్రి ప్రభావం ఉంది. అయితే, వల్లమాలిన అహం, ఆభిజాత్యం నిండిన తండ్రి ప్రభావం నుంచి బయటపడి; సరళత, సామాన్యత నిండిన తల్లివైపు పయనించలేకపోయిన సీతారామారావు, జీవితాన్ని ప్రశ్నల ముళ్లడొంకగా మార్చుకుని చివరికి ఉన్మత్తావస్థకు చేరుకుంటాడు. ఆ దశలో రామయ్యతాత అతనికి జీవితం గురించి బోధిస్తాడు కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందనుకున్న సీతారామారావు ఆత్మహత్య చేసుకుంటాడు.

లౌకికంగా చూసినప్పుడు ధర్మారావు కూడా సీతారామారావులానే నిష్క్రియుడే. సీతారామారావులా భిన్న రూపంలో శ్రేష్టతా-సామాన్యతల వివేచనలో గడిపినవాడే. మళ్ళీ భిన్నరూపంలోనే అతనిలోనూ సీతారామారావులో ఉన్నట్టు ఆత్మోత్కర్ష, లోకవిమర్శ, లోకనింద ఉన్నాయి.  తేడా అల్లా, సీతారామారావు శ్రేష్టత్వం నుంచి సామాన్యతవైపు పయనించడానికి కనీసం విఫలయత్నమైనా చేశాడు కానీ; ధర్మారావు శ్రేష్టత్వపు ఊహల్లోనే ఆగిపోయాడు.  చివరివరకూ అసామాన్యుడైన తండ్రి ప్రభావంలోనే ఉండిపోయాడు. అలాగే బాహ్యజగత్తుకు, ఆంతరిక జగత్తుకు మధ్య సామరస్యాన్ని కల్పించుకోడంలో సీతారామారావు ఎదుర్కొన్న తీవ్ర సంఘర్షణ ధర్మారావులో లేదు. ఇద్దరి మధ్యా ఇంకో ముఖ్యమైన తేడా, జీవితం గురించి బోధించడానికి సీతారామారావుకు ఒక రామయ్యతాత ఉన్నాడు. కానీ ధర్మారావు విషయానికి వస్తే, రామయ్యతాత, సీతారామారావులు అతనిలోనే ఉన్నారు. తనే లోకానికి గురువు కనుక ఇంకొకరికి బోధకు అతను చెవి యొగ్గే ప్రశ్నే లేదు.

మరీ లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు కానీ; అసలు ధర్మారావుకు సమాధానంగానే గోపీచంద్ సీతారామారావును సృష్టించాడా అన్న సందేహం కలుగుతుంది. ఈ కోణంలో ఇంతకుముందు ఎవరైనా పరిశీలించారా అన్నది కుతూహలజనకమైన మరో అకడమిక్ ప్రశ్న.

విచిత్రం అనిపించవచ్చు కానీ,  ‘వేయిపడగలు’తో పోల్చి చూడాలన్న గాఢమైన కుతూహలం కలిగించే మరో నవల ‘గాన్ విత్ ద విండ్’. రెంటి మధ్యా తేడాలు ఎలాగూ ఉంటాయి. వాటితోపాటు కొట్టొచ్చినట్టు కనిపించి ఆశ్చర్యం గొలిపే పోలికలూ ఉన్నాయి. ముందుగా తేడాల విషయానికి వస్తే, అతి పెద్ద తేడా ఆ ఇద్దరు నవలాకర్తల మధ్యే ఉంది. విశ్వనాథ(1895-1976) కన్నా మార్గరెట్ మిచెల్(1900-1949)వయసులోనూ, ఆయుఃప్రమాణంలోనే కాదు; సాహిత్యసృష్టిలోనూ, బహుముఖీన పాండిత్యంలోనూ కూడా చిన్నదే. ఆమె కౌమార వయసులో రెండు నవలలు రాసినా పరిమాణంలోనే కాక, ప్రసిద్ధిలోనూ చెప్పుకోవలసిన నవల గాన్ విత్ ద విండ్ ఒక్కటే.  ‘అట్లాంటా జర్నల్’లో జర్నలిస్టుగా పనిచేసిన మిచెల్ 1926 లో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, చీలమండకు తగిలిన గాయంతో ఇంటికే పరిమితమై అమెరికా అంతర్యుద్ధ(1861-1865) నేపథ్యంతో నవల రాయడం ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేసింది. గాన్ విత్ ద విండ్ నేషనల్ బుక్ అవార్డు, పులిట్జర్ అవార్డు పొందడంతోపాటు చలనచిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది. మిచెల్ తన 49 వ ఏట, 1949 ఆగస్టు 11న అట్లాంటాలో భర్తతో కలసి ‘ఏ కాంటర్బరీ టేల్’ సినిమాకు వెళ్ళి వస్తూ రోడ్డు దాటుతున్నప్పుడు కారు ఢీకొనడంతో చనిపోయింది.

అబ్రహాం లింకన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జరిగిన అమెరికా అంతర్యుద్ధానికి మూల కారణం బానిసత్వ సమస్య. యూనియన్ ప్రభుత్వం బానిసత్వాన్ని రద్దు చేయడానికి సంకల్పించింది. బానిసల శ్రమ మీద పత్తి వ్యవసాయక్షేత్రాలను అభివృద్ధి చేసి భారీ ఎత్తున కాటన్ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఏడు దక్షిణాది రాష్ట్రాలు(ఆ తర్వాత మరో నాలుగు రాష్ట్రాలు కలసి పదకొండు అయ్యాయి) బానిసత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘కాన్ఫెడరేట్’ గా ఏర్పడి యూనియన్ తో యుద్ధానికి దిగాయి. 1861నుంచి దాదాపు అయిదేళ్లపాటు జరిగిన ఈ అంతర్యుద్ధంలో 6 లక్షల 20 వేల నుంచి 7లక్షల 50 వేల మంది వరకు చనిపోయినట్టు అంచనా. రెండు ప్రపంచయుద్ధాలలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ.  దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న మౌలిక నిర్మాణాలు అన్నీ దాదాపు ఈ యుద్ధంలో ధ్వంసమయ్యాయి. చివరికి యూనియన్ సేనలే గెలుపొందాయి. యుద్ధానంతర పునర్నిర్మాణ చర్యలూ వెంటనే మొదలయ్యాయి. అంతర్యుద్ధంతో మిచెల్ కు ఉన్న ఆత్మీయ సంబంధం, అందులో ఆమె తాత పాల్గొనడం. ఆ యుద్ధం గురించిన కథనాలను ఆ కాలానికి చెందిన అమ్మమ్మలు, నాయనమ్మల ద్వారా ఆమె చిన్నప్పటినుంచీ వింటూ వచ్చింది. వాటికి తనదైన కాల్పనికతను, దృక్పథాన్ని, పాత్రచిత్రణ నైపుణ్యాన్నీ జోడిస్తూ వెయ్యి పేజీలను మించిన, గొప్ప ఐతిహాసిక స్థాయి గల నవలగా మలచింది.

బానిసత్వపు పునాదుల మీద లేచిన ఒక కులీన తరహా సమాజమూ, అందులోని యువతీ యువకుల కాల్పనిక మోహాలు, వ్యామోహాలు, ప్రణయావేశాలూ, విందు వినోదాలూ, విలాసాలూ, శౌర్యోత్సాహాలూ, డాంబికాలు, కట్టుబాట్లు, ఆచారాలు, ఆభిజాత్యాలు, వైభవోపేతమైన తమ జీవితం శాశ్వతమూ, స్థిరమూ అన్న భ్రమలతోసహా—అన్నీ తమ కళ్ళముందే- కేవలం నాలుగైదేళ్ళ స్వల్పవ్యవధిలో– కుప్ప కూలిపోవడాన్ని గాన్ విత్ ద విండ్ ఉద్వేగభరితంగా రూపుకట్టింది. ఆ పతనం వ్యక్తులలో కలిగించిన మానసిక, భౌతిక కల్లోలాన్ని; యుద్ధం వాళ్ళ జీవితాలలో తెచ్చిపెట్టిన అనూహ్యమైన మార్పులను అనితరసాధ్యమనిపించే రీతిలో ఆవిష్కరించింది. యుద్ధానికి ముందూ-తర్వాతా ఇతివృత్తంగా ప్రపంచ సాహిత్యంలో వచ్చిన ఎన్నదగిన రచనల్లో గాన్ విత్ ద విండ్ నిస్సందేహంగా ఒకటి. గాన్ విత్ ద విండ్ లాంటి యుద్ధరచన ప్రత్యేకించి భారతీయ సమాజానికి విలక్షణమైన, వినూత్నమైన ఎరుకను, అనుభవాన్నీ కలిగిస్తుంది. ఎందుకంటే, మహాభారతం తర్వాత ఒక యుద్ధం తాలూకు పూర్వాపర పరిణామాలను, పరిస్థితులను అతి పెద్ద కేన్వాస్ పై  ఐతిహాసిక ప్రమాణంలో చిత్రించిన రచన మరొకటి మనకు లేదు.

మహాభారతాన్ని కళ్ల ముందు నిలుపుకుంటూ; చరిత్ర, పురాచరిత్ర, మానవపరిణామచరిత్రలను కూడా తడుముతూ గాన్ విత్ ద విండ్ గురించి మాట్లాడుకోవడం నా వరకు ఎంతో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించే వ్యాసంగం. కానీ  సందర్భం కాదు కనుక దానిని అలా ఉంచితే, వేయిపడగలు, గాన్ విత్ ద విండ్ దాదాపు ఏక కాలంలో వెలువడిన రచనలు. మిచెల్ తన నవలను 1926లో రాయడం ప్రారంభించగా 1936లో అది ప్రచురితమైంది. విశ్వనాథ వేయిపడగలను 1934లో 29 రోజులలో చెప్పారు. అంటే, అప్పటికి గాన్ విత్ ద విండ్ ప్రచురితం కాలేదు. వేయిపడగలు 1937-38లలో ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడిన తర్వాత 1939లో పుస్తకరూపంలో ప్రథమముద్రణ పొందింది.

రెండింటి మధ్యా ప్రధానమైన పోలిక— ఒకానొక కులీన, శ్రేష్ట, సాంప్రదాయిక సమాజం ఎలా పతనమైందో చిత్రించడం. మిచెల్ చిత్రించిన సమాజం, వేయిపడగలు చిత్రించిన వర్ణసమాజంతో పోలిక ఉన్నదే. వేయిపడగల వర్ణ సమాజంలో అట్టడుగున శ్రామికవర్ణం(గోపన్న) ఉన్నట్టే గాన్ విత్ ద విండ్ లో బానిసల రూపంలో శ్రామికవర్ణం ఉంది. బానిసలలో కూడా మళ్ళీ హెచ్చు తగ్గులు. పొలంలో పనిచేసే బానిసల కంటే గృహంలో పనిచేసే బానిసలు ఉన్నతస్థానంలో ఉంటారు. యజమాని-సేవక సంబంధాల చట్రంలోనే మళ్ళీ యజమానులకూ, గృహ బానిసలకు మధ్య ఆత్మీయ సంబంధాలు ఉంటాయి. యజమానుల్లానే బానిసలు కూడా వ్యవస్థతో తాదాత్మ్యం చెందుతారు. వేయిపడగలలో చిత్రితమైన యజమాని-సేవక సంబంధాలు కూడా ఈ తరహాలోనే ఉంటాయి. సాంప్రదాయిక సమాజాలుగా కట్టుబాట్లు, ఆచారాలు, స్త్రీ-పురుష వివక్ష మొదలైన అంశాలలో కూడా రెండింటి మధ్యా పోలికలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మిచెల్ చిత్రించిన సమాజంలో  కొంతవరకు హైందవ సాంప్రదాయిక సమాజ ప్రతిబింబాన్ని చూడచ్చు. సామాజికంగా వస్తున్న మార్పులు విశిష్ట జీవితాన్ని, విశిష్ట వ్యక్తులను కబళించడాన్నే కాదు; అందరినీ అవి సామాన్యత అనే ప్రవాహంలో ఎలా ముంచి తేల్చుతున్నాయో కూడా రెండు రచనలూ చిత్రిస్తాయి. లోతైన సంస్కారం, అనుభూతి గాఢత లేని వారు ఆర్థికంగా, సామాజికంగా పైకి రావడాన్నీ; అవి ఉన్నవాళ్ళు అట్టడుగుకు జారిపోవడాన్ని రెండు రచనలూ రూపుగడతాయి. అలాగే, వేయిపడగలు దళితోద్ధరణ గురించి, దళితులు స్వతంత్రించడం గురించి చెబితే; గాన్ విత్ ద విండ్ బానిసల ఉద్ధరణ గురించి, వారు స్వతంత్రించడం గురించి చెబుతుంది.

ఈ పోలికల మధ్యే కీలకమైన తేడాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాచ్య, పాశ్చాత్య జీవన తాత్వికతలకు చెందినవనుకుంటే, కొన్ని ఇరు రచయితల దృక్పథ భేదానికి చెందినవి. గాన్ విత్ విండ్ కు వేయిపడగలకు ఉన్నంత బరువైన భావజాలవారసత్వం కానీ, అందుకు సంబంధించిన ఘర్షణ కానీ లేవు.  వేయిపడగలలో లౌకిక-అలౌకిక జగత్తులు ఒకదానికొకటి సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. గాన్ విత్ ద విండ్ లో అలాంటిది లేదు. అది కేవలం పాత నీటిని కొట్టేసి కొత్త నీరు చేరుతున్న లౌకికమైన ఒకే ప్రవాహంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే, గాన్ విత్ ద విండ్ కు ఉన్న అంతర్యుద్ధ నేపథ్యం వేయిపడగలకు లేదు. అందులో ఉన్నది భావజాల ఘర్షణే తప్ప భౌతిక ఘర్షణ కాదు.

ఈ ఇద్దరు రచయితల దృక్పథ భేదాన్ని తరచి చూస్తే తేలే ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాహిత్య సృష్టిలోనూ, ధిషణలోనూ విశ్వనాథ భుజాల వరకూ కూడా రాలేని మిచెల్ ఆయన కన్నా ఎక్కువ పరిణతిని చాటుకుందా అనిపిస్తుంది.

దాని గురించి తర్వాత…

*

 

ఆ ఎంట్రీ ఒక మెరుపు, కొత్త మలుపు!

krishnudu

 

ట్టమైన పొగమంచు. చలి చర్మాన్ని పదునుగా పలకరిస్తోంది. కాళ్ల క్రింద రహదారిని పోల్చుకోవడం కష్టంగా ఉంది. వాహనాల లైట్లే వాహనాలకు దారి చూపుతున్నాయి. ప్రయాణం చాలా దుర్భరంగా ఉంది. కనపడేవన్నీ నిజాలు కావు కాని కనపడాల్సినవన్నీ కనపడకపోతే.. మనిషిని మనిషి పోల్చుకోవడం కష్టం. కాని మనిషే సమీపించకపోతే.. బతుకు పొగమంచులో ప్రయాణం కన్నా నిస్సహంగా ఉంది. బతుకులోకి ఒక చలి ప్రవేశించింది. జీవితాన్నీ, శరీరాన్ని కొంకర్లు చుట్టేస్తున్నది. అప్రయత్నంగా మనిషి తనకు తాను కుంచించుకుపోతున్నాడు.

ఎదుటి మనిషిని కరచాలనం చేయకుండా పలకరించలేమా? కరచాలనం ద్వారా రక్తస్పర్శ పరిచయం చేయని వాడు దూరం నుంచి మన రక్తాన్ని ఎలా వేడెక్కించగలడు? మనిషిని మనిషి, మనిషిని నినాదాలు, మనిషిని దుర్మార్గాలు, దారుణాలు, మనిషిని హత్యలు, ఊచకోతలు వేడెక్కించడం మానేసి చాల రోజులైంది. ఊపిరి పీల్చి విడుస్తుంటేనే మన  వేడి మనకు తగలడం లేదు. ఇక రోడ్లపై, అడవుల్లో, గుట్టల్లో గుట్టలుగుట్టలుగా పడిఉన్న శవాలు ఎలా వేడెక్కిస్తాయి? కన్ను వేడెక్కితేనే చెలమ ఊరుతుంది.

ఈ ప్రశ్నలు ఇప్పటివి కావు. తెలుగు సాహిత్యానికి తిరుగుబాటు కొత్తది కాదు. ప్రశ్నలు కొత్తవి కావు. సామాజిక సంస్కరణల కవిత్వం, స్వాతంత్రోద్యమ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, ప్రగతి శీల కవిత్వం, దిగంబర కవిత్వం,  విప్లవ కవిత్వం, ఫెమినిస్టు కవిత్వం, దళిత అస్తిత్వ వాద కవిత్వం. ఒక కవిత్వానికి ఎన్ని శాఖలు? కవిత్వం చెట్టు కాదు శాఖలుగా విస్తరించడానికి?  కవిత్వం కాలం కత్తిపై నుంచి కారుతున్న రుధిరధార. రక్తానికి శాఖలు లేవు.

అందుకే ఒకానొక రాజు దాదాపు ముప్పైఏళ్ల క్రితం నేను పనిచేస్తున్న పత్రికా కార్యాలయానికి  పుంఖానుపుంఖాలుగా వస్తున్న కవిత్వ సంపుటాల్లో ఒక పుస్తకం తడమగానే నా రక్తాన్ని స్పృశించినట్లయింది.   దాని పేరే ‘రక్తస్పర్శ’.

raktasparsa

పేరును చూస్తే ఏ అడవుల్లోంచో  పసిరిక వాసన వచ్చినట్లు లేదు. విరసం ప్రచురణ కానే కాదు. రవళి ప్రచురణ అని పెట్టుకున్నా దాన్ని అచ్చువేయించింది ఒక పప్పుమిల్లు యజమాని. పడేద్దామా అనిపించింది ఒక్కక్షణం.  కాని ఆ పుస్తకంలోని అక్షరాలు నా కళ్లనూ, శరీరాన్నీ ఎంతవేగంగా లాగాయంటే నేను పుటల మధ్య బందీ అయ్యానన్న విషయం నాకే తెలియలేదు.  మొదటి కవితే నన్ను జీవితపు దుర్బర నరకం నుంచి మృత్యుసౌందర్యంలోకి లాక్కుపోయింది. అది అఫ్సర్ రాసిన ‘అంతిమ స్పర్శ’.

‘మెత్తటి గోధుమరంగు నేలపై పవళించి, నీ తలపై పచ్చిక ఎగురుతుండగా నిశ్శబ్దాన్ని ఆలకించే నీకు నిన్నా లేదు, రేపూ లేదు. కాలాన్ని మరిచి, జీవితాన్నిక్షమించి, శాంతిలో విలీనమయ్యే మృత్యువు అందంగానే ఉండి ఉంటుంది.. అని రాశాడు అస్కార్ వైల్డ్.

afsar3

‘మృత్యువు నిన్ను అంతిమంగా ముద్దాడింది- విశాలాకాశంగా వికసిస్తావో అశ్రుపూరిత మేఘంగా విహరిస్తావో, కాలంకురులపై మీటుకుంటూ వెళ్తావో  నీ ఇష్టం.. ‘అన్నాడు అఫ్సర్. ‘అశాంత నేత్ర జలపాతాల్లోంచి, ఇరుక్కుంటూ, ఇరుక్కుంటూ అనంతానంత మౌన ప్రవాహంలోకి మృత్యువు చిటికెన వేలు పట్టుకుని మెల్లిగా నిశ్శబ్దాలు రాలుస్తూ వెళ్లిపోయిన నీకు చదువుతూ చదువుతూ నువ్వు సగంలోనే వదిలిపెట్టి వెళ్లిన పుస్తకం ఒంటరితనం రెక్కలు రెపరెపలాడిస్తూ మళ్లీ వస్తావని అమాయకంగా నిరీక్షిస్తుందని ఎవరు గుర్తు చేస్తారు?’

ఎవరీ కవి? అన్ని పాతదనాల్నీ ఊడ్చేసి పాత కోట బురుజుల సందుల గుండా వెచ్చటి స్వచ్చమైన కిరణంలా ప్రవేశించిన ఈ కవి ఎవరు? చదవగానే అనిపించింది తెలుగు కవిత్వంలో మరో కొత్త గొంతుక ప్రవేశించిందని. ఇది యాంత్రికతను చేధించడం కాదు. ఇది స్తబ్దతను భగ్నం చేయడం కాదు.  నాటి రోజులు పిడికిలి బిగిస్తున్న చేతులే జోహార్లు అర్పిస్తున్న రోజులు, నినాదాలు చేసిన గొంతులే విషాద గీతికలు ఆలపిస్తున్న  కాలమది.  ఒక ప్రజాకళాకారుడి నెత్తుటి జోలె విస్తరిస్తున్నసమయం అది, గజ్జెల కాళ్లు గుండెలపై నర్తిస్తున్న ఘట్టం అది. ఆ సమయంలో  ఖమ్మం నుంచి వచ్చిన ఒక స్వచ్చమైన గాలి రెపరెప నన్ను తాకింది.  అవును మనం ప్రశ్శల ఉక్కబోతలో నే చిక్కుకున్నప్పుడు ఇటువంటి రెపరెపలు అవసరం.

రక్తస్పర్శ రాసిన ముగ్గురు కవులు అఫ్సర్, ప్రసేన్, సీతారామ్. ఇందులోని 59 కవితల్లో 27 అఫ్సరే రాశాడు. 22 ప్రసేన్ రాస్తే సీతారాం రాసింది పది కవితలు మాత్రమే. ముగ్గురూ ఒకే రకం కవులు కాదు. ప్రసేన్, సీతారాంలపై మినీకవితలు, దిగంబర కవితల ప్రభావం ఉన్నది. అఫ్సర్ అప్రభావితంగా  రాయడం మొదలుపెట్టిన కవి. అప్రభావితంగా ఎవడూ రాయడు అంటాడు ఒక మేధావి. చదివిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ లూ, ప్రతి ఘటనా స్వరాలు ఎక్కడకు పోతాయి? కాని చుట్టూ ఉన్న నిబిడ నిశ్చల నీరవ నిర్విరాణ నీలాకాశం మధ్య కొండకొనపై కూర్చుని ఉన్నట్లుండి గొంతులోంచి అప్రయత్నంగా ప్రకృతిని మైమరిపించే గొల్లవాడి గొంతులోంచి వెలువడిన కొత్త రాగమే అఫ్సర్ కవిత్వం. ఆ రాగం మూలాల్ని వెతకడం అతడి పని కాదు. అతడే ఒక దృశ్యమై, దృశ్యమే అతడై కేన్వాస్ నిండా పరుచుకున్న కవిత్వమది.

అవును శూన్యానికీ శూన్యానికీ మధ్య ప్రపంచాన్ని పరుచుకుని అంతర్వలయాల్లో విహరించే పక్షి అతడు.   నేలరాలిన వీరుడి పరాజయ హస్తాలు, ఆ ఒట్టి చేతులు తెగిపడ్డ ద్వారాల్లా అఫ్సర్ ని నిలదీస్తాయి. అంతర్ధానమైన చివరి చిర్నవ్వు అతడిని పలకరిస్తుంది. నిజం నీడలా వెంటాడుతుంది, నేలకొరిగిన ఏ సూర్యుడిలోంచి స్రవించిందో ఈ రక్తం అని వెతుకుంటాడు. రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా సైగల్ విషాదగీతం సజీవ వేదనాస్రవంతిగా ప్రవహిస్తుంది. వేయి వసంతాలను అరచేతుల్లో పట్టి బంధించేందుకు ఒక్క జ్ఞాపకం తన్లాడుతుంటాడు. అరణ్యాలు కాలుతున్న గుండెల్లో సజీవంగా సమాధి అవుతున్న స్వప్నాల్ని తలుచుకుంటాడు. రాత్రిలోంచి చీకటిలా, చీకటిలోంచి కలలా, కలలోంచి జ్ఞాపకంలా నడిచిపోతుంటే అతడి నీత అతడిని తృణీకరిస్తుంది. భావానికీ, అక్షరానికీ దూరం అపారమా?

సందేహాల మధ్య చుట్టుకుపోయి అతడి అంతరంగం తెరలు దింపుకుంటుంది. రాత్రి అంచుమీద కన్నీటి ఖడ్గం కోస్తూ పోతుంది. చీకటి గుండెల్ని కెలుకుతుంది. చెట్టు గుండెల్లోంచి గొంతువిప్పే పక్షిలా అతడిలో ఏదో అలజడి.

prasen

ప్రసేనైతే పూర్తిగా బహిర్ముఖుడు. రోడ్డుపై  రౌడీ చేతుల్లోంకి ఖాకీ జేబుల్లోకి మారిన రూపాయిని, బండివాడు విసిరేసిన ఇడ్లీముక్కను పసికడతాడు. అంతే కాదు ఉన్నట్లుండి అతడికి రోడ్డు మరోలా కనపడుతుంది.  నగర కన్యనాభిని ముద్దాడి నితంబమునల్లుకుని వలీ అవళిని నిమిరి పయోధరాలను బంధించి నయగారాలు గారాలు పోయే ఓణీ – ఈ రోడ్డు అంటాడు. ప్రసేన్ పరిచయమూ, అపరిచయమూ అతడి కవిత్వంలో దాక్కోవు. అతడి మెదడు వ్యబిఛారిలా మనసుతోనే లేచిపోతుంది. పల్లెలన్నీ ఇథియోపియాలే అనే ప్రసేన్ నిశ్భబ్దంలో జీవించాలనుకుంటాడు. కాని భయంకరంగా వినిపిస్తున్న గుండెస్పందనను తప్పించుకోలేడు.

ఇక సీతారాం ఒక నిరీక్షకుడు.  తెగిన జ్ఞాపకాల మధ్య ఎవరికోసమో నిరీక్షిస్తాడు. రాత్రిపూట ఒంటరిగా ఉండే గోడనూ, ఎప్పుడూ మేల్కొనే ఉండే అడవినీ, క్షణం ముందు వెళ్లిపోయిన అజ్ఞాత పథికుడినీ, చిట్లిన గేయాల్నీ, తెగిన గొంతుకల్నీ, తెగిన అక్షరాల్నీ ఆగిన పద్యాల్నీ స్మరిస్తుంటాడు.స్వర్ణ దేవాలయంపై  రాబందుగా ఎగురుతున్న పావురాల్నీ, దండకారణ్యాన్ని తూర్పార బట్టే తూటాల్నీ, కార్బైడ్ రాత్రుల గాలికేకల్నీ తలచుకుని గుండెకు గర్భస్రావం చేసుకుంటాడు. చిత్రాలకు కన్నీటి రంగులు అద్దుతుంటాడు.  అకస్మాత్తుగా  అన్నిటినీ వదిలి ఆకాశాన్నంటిన స్వప్న పర్వతాలవైపు ఆగకుండా పోవాలనుకుంటాడు.

రక్త స్పర్శలో కొత్త భావాల్నీ, కొత్త ప్రతీకల్నీ ముగ్గురు కవులు పలికించినప్పటికీ ముగ్గురిదీ ఒకే దారి కాదు. కాలం ముగ్గుర్నీ వేర్వేరు దారుల్లోకి, వేర్వేరు స్థాయిల్లోకి తీసుకువెళ్లింది. కాని తెలుగు కవిత్వం తిరిగిన రకరకాల మలుపుల్లో ఒక ముఖ్యమైన మలుపు రక్తస్పర్శ. దిగంబర కవిత్వం తర్వాత ప్రస్ఫుటంగా కనిపించిన మలుపు ఇది. రాను రానూ, ఈ మలుపు విస్తృతమై రహదారిగా మారిందనడం, కవిత్వం ఈ రహదారిలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుందనడం అతిశయోక్తి కాదు. అది నీ నెత్తురును ఎప్పుడూ స్పృశిస్తుంటుంది.

 

*

 

అలరుల నడుగగ …

untitled

అనువాద కవిత, మూలము – వైరముత్తు

 

కొన్ని రోజులకు ముందు యూట్యూబ్‌లో పాటలను వింటున్నప్పుడు ఈ పాటను వినడము తటస్థించింది.  పాట నడక, అందులోని కవితకు నేను పరవశుడిని అయ్యాను. ఈ పాటను “ఓ కాదల్ కణ్మణి” (OK కణ్మణి లేక ఓ ప్రేమ కంటిపాప) అనే తమిళ చిత్రములో  ఏ ఆర్ రహ్మాన్ సంగీత దర్శకత్వములో గాయని చిత్రా పాడినారు.  కొన్ని అన్య స్వరములతో కూడిన బేహాగ్ రాగములోని యీ పాట చివర రహ్మాన్ గొంతుక కూడ వినబడుతుంది. గీత రచయిత వైరముత్తు. పాటను వినిన తత్క్షణమే తెలుగులో అదే మెట్టులో దానిని అనువాదము చేయాలని నాకనిపించింది. ఈ పాటకు, తమిళ మూలము, ఆంగ్లములో, తెలుగులో (అదే మెట్టులో పాటగా, పద్యరూపముగా) నా అనువాదములను మీ ఆనందముకోసము అందిస్తున్నాను. పాటను క్రింది లంకెలో వినగలరు –

மலர்கள் கேட்டேன் வனமே தந்தனை

தண்ணீர் கேட்டேன் அமிர்த்தம் தந்தனை

எதை நான் கேட்பின் உனையே தருவாய்

 

మలర్‌గళ్ కేట్టేన్ వనమే తందనై

తణ్ణీర్ కేట్టేన్ అమిర్దమ్ తందనై

ఎదై నాన్ కేట్పిన్ ఉనైయే తరువాయ్

 

అలరుల నడుగఁగ వని నొసఁగితివే

జలముల నడుగఁగ సుధ నొసగితివే

ఏమడిగినచో నిన్నొసఁగెదవో

 

When I wished for flowers,

I received from you the whole garden

When I wished for water,

I received from you the drink of immortality

What should I wish for,

so that you  give yourself to me?

 

காட்டில் தொலைந்தேன் வழியாய் வந்தனை

இருளில் தொலைந்தேன் ஒளியாய் வந்தனை

எதனில் தொலைந்தால் நீயே வருவாய்

 

కాట్టిల్ తొలైందేన్ వళియాయ్ వందనై

ఇరుళిల్ తొలైందేన్ ఒళియాయ్ వందనై

ఎదనిల్ తొలైందాల్ నీయే వరువాయ్

 

కానను దప్పితి బాటగ వచ్చితి

విరులున దప్పితి వెలుగుగ వచ్చితి

వెటు దప్పినచో నీవిట వత్తువొ

While I was lost in the woods,

I saw you as the path forward

While I was lost in the darkness,

I saw you as the illuminating light

Where should I get lost,

so that you reveal yourself before me?

 

பள்ளம் வீழ்ந்தேன் சிகரம் சேர்த்தனை

வெள்ளம் வீழ்ந்தேன் கரையில் சேர்த்தனை

எதநில் வீழ்ந்தால் உந்நிடம் சேர்பாய்

 

పళ్ళమ్ వీళ్‌న్దేన్ శిగరమ్ శేర్తనై

వెళ్ళమ్ వీళ్‌న్దేన్ కరైయిల్ శేర్తనై

ఎదనిల్ వీళ్న్దాల్ ఉన్నిడమ్ శేర్పాయ్

 

పల్లములోఁ బడ నగ మెక్కింతువు

వెల్లువలోఁ బడ దరిఁ జేర్పింతువు

ఎందుఁ బడినచో నిను జేరుటయో

 

When I fell into the pits,

you carried me to the summit

When I fell into the whirlpool,

you rescued me to the safety of the shore

Where should I fall,

so that you become one with me?

(తందనై, కరై మొదలైన పదాలను పలికేటప్పుడు తమిళములో ఐ-కారమును ఊది పలుకరు, అది అ-కారములా ధ్వనిస్తుంది. ఛందస్సులో కూడ వాటిని లఘువులుగా పరిగణిస్తారు.)

పద్యములుగా మూడు పంచమాత్రల సంగమవతీ వృత్తములో  స్వేచ్ఛానువాదము –

సంగమవతీ – భ/జ/న/స UIII UIII – IIIU
12 జగతి 2031

సూనమును నేనడుగ – సొబగుగాఁ
గాననము సూపితివి – కనులకున్
పానమున కంభువును – బసవఁగా
సోనలుగ నిచ్చితివి – సుధలనే

ఆవిపినమం దెఱుఁగ – కలయఁగాఁ
ద్రోవగను వచ్చితివి – తురితమై
పోవఁగను జీఁకటులఁ – బొగులుచున్
నీవు వెలుఁ గిచ్చితివి – నెనరుతో

పల్లమున నేనెటులొ – పడఁగ రం-
జిల్లగను జేర్చితివి – శిఖరమున్
వెల్లువల నేనెటులొ – ప్రిదిలి కం-
పిల్ల దరి చేర్చితివి – వెఱువకన్

ఇచ్చుటకు నేమడుగు – టికపయిన్
వచ్చుటకు నేమగుట – వసుధపై
ఇచ్చ నిను జేరఁ బడు – టెచటనో
ముచ్చటగ రమ్ము మది – ముదమిడన్

*

 

ఆద్యంతాలు లేని ‘ఆగమనం’

arrival1

ప్పట్లాగే ఈ సంవత్సరం(2016)  కూడా హాలీవుడ్ లో ఓ మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా వచ్చేసింది. ‘టెడ్ చియాంగ్’ రాసిన ‘స్టోరీ అఫ్ యువర్ లైఫ్’ అనే కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఎరైవల్(Arrival)’ అనే పేరుగల ఈ సినిమా కథాంశం ఏలియన్ సంబంధితమైనది అయినప్పటికీ, ఈ దృశ్య ప్రవాహపు ప్రతీ కదలికా, మెలకువతో మెళకువగా చూస్తున్న జీవిత ఘట్టాల బిందు సమూహంలానే కనిపిస్తుంది.

ఒక ప్రాణాంతకవ్యాధి కారణంగా యుక్త వయసులోకి అడుగుపెడుతూనే మరణించిన కుమార్తెతో పాటుగా ఆశలనన్నిటినీ అంతం చేసుకున్నట్టుగా కనిపించే ‘లూయిస్’ కథతో సినిమా ఆరంభమవుతుంది. కానీ అప్పుడు కూడా ఆమె, తనకి ఆరంభాల మీదా అంతాల మీదా నమ్మకమనేది ఉందో లేదో చెప్పలేకపోతున్నానంటుంది. ఇంతకూ లూయిస్ ఒక  బహుభాషా ప్రవీణురాలు. అనేక భాషలపైన మంచి పట్టును కలిగి ఉన్న లూయిస్, యూనివర్సిటీలోని విద్యార్థులకి బోధన చేస్తుంటుంది. ఇంతలో అనుకోకుండా భూమి మీద ఏలియన్ షిప్ లు ల్యాండ్ అయ్యాయని తెలియడంతో ప్రజలంతా బెంబేలెత్తిపోతారు. అవి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు చోట్లకి వచ్చి ఆగుతాయి. .కానీ ఆ ఏలియన్స్ మనుషులకు హాని చేయడానికి రాలేదనీ, వారు తమతో మాట్లాడే  ప్రయత్నం చేస్తున్నారనీ భావించిన అమెరికన్ ఆర్మీ చీఫ్, వారి భాషను అర్థం చేసుకుని వివరించమని లూయిస్ ని కోరతాడు. ఆమెతో పాటుగా  ఫిజిసిస్ట్ అయిన అయాన్ అనే వ్యక్తిని కూడా ఆర్మీ ఈ పని నిమిత్తం నియమిస్తుంది. వారిద్దరూ కలిసి ఆ ఏలియన్ల భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏలియన్ల భాష శబ్ద ప్రధానమైనది కాదనీ దృశ్యరూపమైనదనీ గ్రహించి, ఆమె ఆ భాషను నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అందుకు కొంచెం సమయం అవసరమవడంతో, ఆ లోపుగా ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయి.

ఏలియన్స్ భాషను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన, వారు యుద్ధానికి సిద్ధమై వచ్చినట్టుగా భావించి  చైనా ఆర్మీ జెనెరల్ షాంగ్, వారిపై యుద్ధానికి పిలుపునిస్తాడు. అతనికి మరికొన్ని దేశాలు కూడా మద్దతు పలుకుతాయి. కానీ లూయిస్ కి మాత్రం ఏలియన్లు తమకి సహాయపడే ప్రయత్నం చేస్తున్నారనే నమ్మకముంటుంది. ఈ మధ్యలో ఆమెకు, తన కుమార్తెకి చెందిన కలలూ, జ్ఞాపకాలూ ఏర్పడటం ఎక్కువైపోతుంటుంది. ఆ ఏలియన్స్ కీ, తన కుమార్తెకీ మధ్య గల సంబంధమేమిటో ఆమెకి అర్థం కాదు. చివరికి అసలు విషయాన్ని అర్థం చేసుకుని, ఏలియన్ల సందేశాన్ని ప్రపంచానికి చేరవేసి యుద్ధాన్ని ఆపడంలో ఆమె సఫలీకృతురాలవుతుంది. ఈ క్రమంలోనే ఆమెకి అనుకోని ఓ రహస్యం కూడా తెలుస్తుంది. ఆ రహస్యమేమిటో సినిమా చూసి తెలుసుకుంటేనే బావుంటుంది.

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయాలు మూడు. మొదటిది, కథని ముందుకూ వెనకకూ జరపడంలోనూ, మానవీయ కోణానికీ, సెన్సిబిలిటీకీ పెద్ద పీట వెయ్యడంలోనూ దర్శకుడు చూపిన ప్రతిభ, సినిమా విజయానికి మూల కారణమైతే, అందుకు తగ్గ దృశ్య రూపావిష్కరణ చేసిన సినిమాటోగ్రాఫర్ ‘బ్రాడ్ ఫోర్డ్ యంగ్’  కృషి కూడా అభినందనీయం. ముఖ్య పాత్రధారిణి లూయిస్ గా నటించిన ‘అమీ ఏడమ్స్’ నటన అత్యంత సహజసిద్ధంగా ఉండి మనసును కట్టి పడేస్తుంది. ఇక సినిమాకు సంగీతాన్ని సమకూర్చిన జోహాన్ జోహన్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. ఇక కీలకమైన ప్రాముఖ్యత కలిగిన ఏలియన్ల భాషను ‘మార్టిన్ బెర్ట్రాండ్’ అనే ఆర్టిస్ట్ డిజైన్ చేసిందట.

arrival2

‘సికారియో, ప్రిజనర్స్, ఇన్సెన్డైస్’ వంటి మంచి సినిమాలను అందించిన దర్శకుడు ‘డెనిస్ విలెనెవ్’ ఈ సినిమా ద్వారా తన సమర్థతని మరోసారి నిరూపించుకున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతని సినిమాలలో, నాటకీయత – సహజత్వం విడదీయలేనంతగా కలిసిపోయి ఉండటం గమనించవచ్చు. ఈ సినిమా విషయానికి వస్తే, అసలు  సై.ఫి. సినిమాలంటేనే ముఖ్యంగా ఊహా ప్రధానమైనవి. అతికినట్టుగా అనిపించకుండా వాటిలో జీవాన్ని నింపాలంటే చాలా నేర్పు అవసరం. ఈ సినిమా ఇంత అద్భుతంగా అమరడానికి అటువంటి నేర్పే కారణమని చెప్పుకోవచ్చు. గొప్ప గొప్ప మలుపులూ, ‘ఇంటర్ స్టెల్లార్’ లా విపరీతమైన సైన్స్ పరిజ్ఞానమూ ఉపయోగించకుండానే ఒక పటిష్టమైన, ఆసక్తికరమైన సినిమాని తయారు చేయడం హర్షించదగిన విషయం.

లూయిస్ వ్యక్తిగత జీవితం, ఏలియన్స్ తో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉందన్న సందేహమే సినిమాను అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతుంది. ఆమె కుమార్తె ఏలియన్ నా? లేక చనిపోయి ఆ రూపంలో తిరిగి వస్తుందా? ఆమె మరణానికీ, ఏలియన్స్ కీ ఏమైనా సంబంధం ఉందా?…. వంటి సందేహాలు మన మనసుని ఎంగేజ్ చేసి దృష్టి మరల్చనివ్వకుండా చేస్తాయి. ఇక అయోమయానికి గురి చేయని కథనం కూడా సినిమాకు గొప్ప ఆకర్షణ.

సినిమాకి ప్రాణమైన అతి ముఖ్యమైన ఒక ట్విస్ట్ మాత్రం సగం దారి నించీ ఊహకు అందుతూ ఉంటుంది. తెలిసిపోయినా మళ్లీ తెలుసుకోవాలనిపించే వింత రహస్యమది. ముగింపులో మాత్రం సైన్స్ పరంగా కొద్దిపాటి క్లిష్టతరమైన అంశాలను జోడించినప్పటికీ, సై. ఫి. చిత్రం కనుక ఆ మాత్రం క్లిష్టత తప్పనిసరి. (ఇంతకు మించి వివరిస్తే, సినిమా చూడాలనుకునేవారికి స్పాయిలర్ అవుతుందన్న ఉద్దేశ్యంతో చెప్పడం లేదు). మొత్తానికి ఏదెలా ఉన్నా, కళ్లు తిప్పుకోనివ్వని విజువల్ ఎక్స్పీరియన్స్ కారణంగా ఈ సినిమా అసంతృప్తిని మిగిల్చే అవకాశమైతే మాత్రం అణువంతైనా ఉండనే ఉండదు.  కాలాలూ, పరిస్థితులూ ఎంతగా మారినా, మన ఊహలనేస్థాయిలో విశ్వపు అంచుల వరకూ విహరించేందుకు పంపినా, విలువలనూ, మానవ సహజమైన ప్రేమాభిమానాలనూ పోగొట్టుకోనంతవరకూ మనం మనంగానే ఉంటామన్న నిజాన్ని ఈ సినిమాకి లభించిన ఘన విజయం నిరూపిస్తుంది.

 

***

బాలీవుడ్ భాష మారిపోతోంది!

2016 చివరకొచ్చేసింది. ఈ సంవత్సరం వచ్చిన మూడు ముఖ్యమైన బాలీవుడ్ ఫిల్మ్స్ గురించి చెప్పుకుని తీరాలనిపిస్తోంది.  సినిమాభాషని సరికొత్తగా పలికించటంతోపాటు ఇప్పుడున్న సమస్యలగురించి మాట్లాడ్డం ఈ సినిమాల ప్రత్యేకత.

ఎవరిగురించైనా మంచినీళ్ళు తాగినంత సులువుగా తీర్పులు చెప్పెయ్యటం డిజిటల్ యుగంలో మామూలయిపోయింది.  మనిషన్నవాడికి తీర్పులు చెప్పటం మంచి కిక్ ఇచ్చే విషయం. ముఖ్యంగా ఆడవాళ్ళూ,  మైనారిటీలూ, దళితుల విషయంలో చాలామంది తీర్పులుచెప్పే నిషాలోకి భలే తొందరగా జారిపోతుంటారు. ఆ నిషా sexist ఆలోచనలది కావచ్చు. నిజమైన మత్తుమందుల వెల్లువలో మనిషి జంతువైపోయే నిషా కావచ్చు. లేకపోతే మాకు తెలిసినదేదో అదే మనిషికుండాల్సిన sexual behaviour అని వాదించే మూర్ఖత్వపు నిషా కావచ్చు.

‘ఉడ్తా పంజాబ్’ లో జనం నోళ్ళలో తెగనలిగిన ‘చిట్టావే’ పాట చరణంలో ‘కుండీ నషేవాలీ ఖోల్ కె దేఖ్’ (నిషాతనపు గొళ్లెం తెరిచిచూడు) అంటాడు.  అలాంటి మూసుకుపోయి తుప్పు పట్టిన నిషాతనపు గొళ్ళేలు తెరిచి, మది తలుపుల్లోకి కొత్త వెలుతురు ప్రసరించాలని ప్రయత్నించిన సినిమాలివి మూడూ.

The issues of humanity and what is fair and good treatment of a fellow human being,  should not be based on a personal sense of right and wrong or judgment” –  Debbie Harry (American Rapper).

అలీగఢ్ యూనివర్సిటీలో పనిచేసిన మరాఠీ ప్రొఫెసర్ రామచంద్ర సిరస్ జీవితకథే ‘అలీగఢ్’ సినిమా. ‘గే’ అయినందువల్ల ఆయన్ను శారీరకంగా మానసికంగా హింసించి కేంపస్ నుండి వెళ్ళగొట్టారు.  పదవీకాలం ఇంకో ఆర్నెల్లుఉందనగా కోర్ట్ తీర్పుతో ఉద్యోగాన్నీ, కేంపస్ క్వార్టర్స్ ని సాధించుకున్నాడాయన.  మర్నాడు ఉద్యోగంలో చేరతాడనగా ముందురోజే అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన దీపూ సెబాస్టియన్ అనే జర్నలిస్ట్ చెప్పిన వివరాలు ముఖ్య ఆధారంగా ఈ సినిమా తీశాడు హన్సల్ మెహతా.

ఇష్టపూర్వకంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే స్వలింగసంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్ట్ జూలై 2009లో తీర్పు చెప్పింది. కానీ 2013లో సుప్రీం కోర్ట్ ఆ తీర్పుని కొట్టేసి స్వలింగసంపర్కాన్ని నేరమని నిర్ణయించే సెక్షన్ 377 అమల్లోనే ఉంటుందని చెప్పింది. ఈ రెండుతీర్పుల మధ్య కాలంలో 2010 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ రామచంద్ర సిరస్ ఇంటిమీద దాడి జరిగింది. ఏప్రిల్ ఒకటో తేదీన 2010 లో ఆయన అలహాబాద్ హైకోర్ట్ లో కేసు గెల్చాడు. ఏప్రిల్ 7వ తేదీ 2010 న తన అపార్ట్ మెంట్ లో చనిపోయి ఉన్నాడు. అటాప్సీ రిపోర్ట్ లో విషప్రయోగం జరిగిందని వచ్చింది. పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసినా, సరైన ఆధారాలు ఇవ్వలేకపోవటంతో అది హత్య కేసుగా నిలవలేదు.

‘అలీగఢ్’ సినిమా ఒక లాంగ్ పోయెమ్.  ప్రొఫెసర్ సిరస్ తో ‘కవిత్వంలోని పదాలు నాకు అర్థం కావం’టాడు జర్నలిస్ట్ దీపూ. ‘పదాల్లో ఏముంది అర్థం? పదాల మధ్య వున్న నిశ్శబ్దంలో ఉంటుంది గానీ’ అంటాడు శబ్దాల మధ్య ఒదిగున్న నిశ్శబ్దంలాంటి సిరస్. అతనికి లతా మంగేష్కర్ పాటలంటే ప్రాణం. మరాఠీలో కవిత్వం రాసి అచ్చేసుకున్నవాడు.  ‘Gay’ అనే  మూడు అక్షరాలలో ఓ మనిషిని కుదించటం ఏమిటని మౌలికమైన ప్రశ్న వేస్తాడు.  తన పార్టనర్ ని చూస్తే తనలోని ప్రేమ తనను నిలవనీయదని చెప్పి, ఆ పరిస్థితిని వీలైనంత స్పష్టంగా చిన్నమాటలతో  దీపూ కి వివరించటానికి ప్రయత్నిస్తాడు.

alia-bhatt-udta-punjab-trans

కథలోకొస్తే, రాత్రివేళ సిరస్ ఒక రిక్షాఅతనితో కలిసుండగా ఇద్దరు మనుషులు అతని ఇంట్లోకి చొరబడి వాళ్ళిద్దరినీ వీడియో తీసి, రిక్షాఅతన్ని కొట్టి, ఇద్దరిమీదా విరుచుకుపడి తిట్లకి దిగుతారు.  సిరస్ భీతితో ముడుచుకున్న పావురాయిపిల్లలా అయిపోతాడు. తరువాత ‘గే’ అనే ఆరోపణమీద అతన్ని యూనివర్సిటీ సస్పెండ్ చేస్తుంది. సిరస్ నమ్మిన తోటి ప్రొఫెసర్ ఒకాయన అతన్ని ఓ పక్క అసహ్యించుకుంటూనే మరోపక్క సాయం చేస్తున్నట్టుగా, తను ‘గే’ అని ఒప్పుకుంటూ క్షమాపణ పత్రం రాయమని సిరస్ కు సలహా ఇస్తాడు. ఏమీ తోచని సిరస్ అలాగే రాసి ఇచ్చేస్తాడు. ఇంతలో కేంపస్ లో సిరస్ శీలపరీక్ష, అతని దిష్టిబొమ్మ తగలేయటం లాంటి పనులు జరుగుతాయి. అప్పట్నుంచీ తలుపులు వేసుకుని అతను దిగులుగా భయంగా ఇంట్లోనే ఉండిపోతాడు.  వారంరోజుల్లో అతను యూనివర్సిటీ క్వార్టర్ ను ఖాళీ చెయ్యాలని చెప్పి, ఇంటికి ఎలక్ట్రిసిటీ లేకుండా చేసేస్తారు. దీపూ తన పత్రికకోసం ఈ విషయాన్నంతా స్టోరీ చేయాలన్న తపనతో, చాలా సానుభూతితో కష్టపడి సిరస్ కి చేరువై, అతన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో హక్కుల సంఘాలవాళ్ళు సిరస్ కు ఆసరా ఇచ్చి అతనిచేత కోర్ట్ లో కేసు వేయిస్తారు. అలీగఢ్ విద్యాలయాన్ని ఎంతగానో ప్రేమించిన సిరస్ యూనివర్సిటీ క్వార్టర్ విడిచిపెట్టి వేరేయింటికి మారాల్సివస్తుంది.  అతని వ్యక్తిగత జీవితంలోకి దౌర్జన్యంగా చొరబడి వీడియోలు తీసే హక్కు ఆ వ్యక్తులకీ, ఆ వీడియోల ఆధారంగా సిరస్ ను శిక్షించే హక్కు యూనివర్సిటీకీ లేదని వాదించి కూడా ఆవిధంగా ఒప్పించలేక, చివరకు స్వలింగసంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని precedent గా చూపించి కేసు గెలిపిస్తాడు లాయర్.

సిరస్ హక్కులంటూ పోట్లాటకు దిగలేని నెమ్మదస్తుడు.  లతామంగేష్కర్  పాటలూ కవిత్వమూ తప్ప ఇంకేం అక్కర్లేదు. కోర్ట్ లో కేసు వెయ్యటానికి కూడా అంతగా ఇష్టపడక ఇక తప్పని పరిస్థితిలో దానికి ఒప్పుకునేంత ఇంట్రావర్ట్.  తనగురించి కోర్ట్ లో వాదనలు జరుగుతుంటే అవన్నీ అర్థంకాక అలిసిపోయి చేతిలో పుస్తకం పట్టుకుని చిన్నకునుకు తీస్తుంటాడు.  అలీగడ్ లో మరాఠీ విభాగానికి హెడ్ గా ఉండటమంటే అక్కడ తను బయటివాడని అర్థం. అదేకాకుండా తనకు యూనివర్సిటీలో వున్న ప్రతిష్టను కూడా సహించలేని కొంతమంది ఇలా హింసకు దిగారని  దీపూ వొక్కడికే చెప్తాడు.

“అలీగడ్” ఒట్టి హక్కులూ పోరాటాల సినిమా కాదు. ఒంటరితనం.. వేధింపులకి గురై అలసిన ఒంటరితనం.. కొత్త ఇంట్లో చుట్టూ పరుచుకున్న సామాన్ల మధ్య దోమలు కొట్టుకుంటూ లతా పాటలూ, బయట హైవేమీదనుంచి పోతున్న లారీల చప్పుళ్ళమధ్య   ఇబ్బందిగా మసిలే ఒంటరితనం.. ‘గే’ అన్న ఒక్క తేలిక మాటతో తానెంతో ప్రేమించిన వాతావరణానికి క్రూరంగా దూరం చేస్తే గుక్కలు మింగే దుఃఖపు ఒంటరితనం ఈ సినిమా. ఇద్దరి ఏకాంతాన్ని వాళ్ళ అనుమతితో పని లేకుండా జొరబడి ధ్వంసంచేసి మనిషి విలువను నేలరాసి అవమానించటంలోని అమానుషత్వాన్ని ఎత్తి చూపించటమే ఈ సినిమా..  ఎంతో ఆర్ద్రంగా తీశాడు హన్సల్ మెహతా.  సిరస్ గా వేసిన మనోజ్ బాజ్ పాయ్, దీపూ సెబాస్టియన్ గా వేసిన రాజ్ కుమార్ రావ్ సినిమానుండి కన్ను తిప్పుకోనివ్వకుండా చేశారు. మనోజ్ బాజ్ పాయ్ కి  2016 కి best actor గా జాతీయఅవార్డు ఏకగ్రీవంగా రావాలి మరి.

Loudness ఏ కొద్దిగానూ లేకుండా ఆర్ట్ ఆఫ్ సినిమాని పట్టుకుంది ‘అలీగఢ్’. ఏదో ఒక విషయాన్ని రుజువు చెయ్యటానికో, సమస్యను వివరించటానికో పరిష్కరించటానికో తీసినట్టుగా ఉండదు. సమస్య తీవ్రతనీ  వ్యక్తి ఆవేదననీ కలబోసి చెప్పిన తీరులో గొప్పగా తూకం కుదిరింది అలీగఢ్ లో.  మనోజ్ బాజ్ పాయ్ నటన, సినిమాటోగ్రాఫర్  సత్యారాయ్ నాగ్ పాల్ సినిమాకిచ్చిన melancholic tone, visuals సినిమాకున్న  పొయటిక్ పోకడకి బాగా అనుకూలించాయి.  వ్యాపారాన్ని పక్కనపెట్టి తీసిన సినిమా కావటం వల్ల డబ్బు కంటే ఎక్కువగా పేరూ ప్రశంసలూ వచ్చాయి.

***

లైంగిక వేధింపులని రకరకాలుగా సమర్ధించుకుంటున్న పురుషాధిక్యతకి చాచిపెట్టి లెంపకాయ కొట్టింది ‘పింక్’.  ఏ పరిచయస్తురాలైనా, స్నేహితురాలైనా, గర్ల్ ఫ్రెండ్ అయినా, సెక్స్ వర్కర్ అయినా, నార్త్ ఈస్ట్ అమ్మాయయినా (వాళ్ళు సులువుగా దొరికేస్తారని చాలామంది మగవాళ్ళకి నమ్మకం), భార్య అయినా, అంటే అసలే స్త్రీ అయినాసరే నీ ప్రేమకీ కోరికకీ ‘వద్దు’ అని చెప్పిందంటే అది ఖచ్చితంగా ‘వద్దు’ అనే. ఇంకో వాదనకి అవకాశం లేదని సూత్రప్రాయంగా నిరూపించింది. నిర్భయ కేస్ తరువాత వచ్చిన నిరసనల్ని ఎదుర్కోలేక, పులి మేకమీద పడి తినేస్తే మేకదే తప్పన్నట్టుగా ఆడవాళ్ళ దుస్తులతీరు మీదా స్వాతంత్ర్యం మీదా ఏడ్చి, బాధితులనే నేరస్తులని చేసే దబాయింపుకి దిగారు కొంతమంది. ఏయే విషయాల్లో ఆడవాళ్ల ప్రవర్తన తప్పన్నారో ఆ పరిస్థితులన్నిటిలోనూ ఒక ముగ్గురు అమ్మాయిలని ఇరికించి, వాళ్ళమీద వచ్చిన లైంగికవేధింపులని ఇంకోమాట లేకుండా శిక్షించాల్సిన నేరాలుగా వాదించి ఒప్పించారు ‘పింక్’ సినిమాలో.

వాళ్ళు ముగ్గురూ ఉద్యోగాలు చేసుకుంటూ స్వేచ్ఛగా తిరిగే అమ్మాయిలు. మెట్రోసిటీలో ఈతరం అమ్మాయిలు వేసుకునే బట్టలు వేసుకుంటారు.  ఫ్రెండ్స్ ద్వారా అప్పుడే పరిచయం అయిన అబ్బాయిలతో వాళ్ళని నమ్మి డిన్నర్ కి రిసార్ట్ కి కూడా వెళ్తారు. మద్యం తాగటం తప్పనుకోరు. ఒకమ్మాయి ఇంటి బాధ్యతలకోసం డబ్బు అవసరమై పెళ్ళయిన వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది.  మరో అమ్మాయి ఆ ఊళ్లోనే తల్లిదండ్రులుంటున్నా వాళ్ళతో కలిసి ఉండకుండా విడిగా ఉంటుంది. ఈమె పెళ్లి కాకపోయినా వర్జిన్ కాదు.  మూడో అమ్మాయి పుట్టుకవల్లనే (నార్త్ ఈస్ట్) ఇంచుమించు సెక్స్ వర్కర్ గా, సెకండ్ రేట్ సిటిజన్ గా భావించబడే జీవి.  ఒక సంప్రదాయ సమాజంలో ఇవన్నీ ఆ అమ్మాయిలని త్రాసులో వేసితూచి ‘చెడ్డ అమ్మాయిలు’ అని ముద్ర వేసే పరిస్థితులే.

pink2

నిర్భయ కేస్ తరువాత వచ్చిన మేల్ డామినేటెడ్ సంప్రదాయ సమాజపు discourse  కు సరైన సమాధానం చెప్పటం కోసమా అన్నట్టు ఈ ముగ్గురు అమ్మాయిల్నీ సంప్రదాయ సమాజపు ‘చెడ్డ అమ్మాయి’ ముద్రలోనే పెట్టి వాదన పెట్టుకున్నాడు దర్శకుడు అనిరుధ్ రాయ్ చౌదురి.  కోరికలు పుడతాయి సరే, వాటితోబాటు వొచ్చే ఆలోచనలు సమానత్వమనే గీతదగ్గరే ఆగితీరాలని పట్టుగా చెప్పాడు.  అమాయకపు పల్లెటూరి పిల్లలుగానో, లేక అందరూ ఒప్పుకునే ‘పధ్ధతైన’ పిల్లలుగా ఉంటూనే అన్యాయాన్ని గట్టిగా ఎదిరించేవాళ్లుగానో కాకుండా చాలామంది వ్యతిరేకించే ‘థర్డ్ వేవ్ ఫెమినిస్ట్’ ల్లాగా ఉన్న అమ్మాయిల జీవితాలని చూపిస్తూ వాదించటంవల్ల ‘పింక్’ అర్బన్ యూత్ లోని ఆడామగా అందరికీ బాగా చేరిపోయింది.

చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న అర్బన్ మధ్యతరగతి మగవాళ్ళకి,  తమ స్పేస్ ని ఆక్రమించేదాన్ని దేనినీ సహించని థర్డ్ వేవ్ ఫెమినిస్ట్ ల జీవిత విధానాలను ఒప్పుకుని బ్రతకటం ఇప్పటికే అలవాటయింది.  ఇంట్లో పెంపకాల్లో అబ్బాయిలకి పొగరు, అమ్మాయిలకి ఒదిగుండేతనం నేర్పిపెట్టే కుటుంబాలకి ‘పింక్’ గట్టి మొట్టికాయ. ఈ సినిమా తర్వాత ‘పింక్’ హీరోయిన్ ‘తాప్సీపన్నూ’ కూడా తనమీద మగవాళ్ళు కొంతమంది తీసుకున్న sexual advances గురించి మాట్లాడింది. అప్పట్లో తల్లిదండ్రులు ఏం జరిగినా ఆడవాళ్ళదే తప్పనీ, నోరుమూసుకుని ఉండాలనీ నేర్పేవారు కాబట్టి తను అలాగే నోరుమూసుకుని ఉండేదని చెప్పింది.  ఆడామగా పెంపకంలో విడివిడి నీతులు పాటించేవాళ్ళని కడిగిపారేసిన ఈ సినిమా ఆడపిల్లలకు ఇంకొంచెం ధైర్యమిచ్చింది. ఇది చూసాకన్నా ‘ఆడది ముఖ్యంగా సెక్స్ టూల్, మనకే సొంతం, ప్రేమించానంటే కామించానంటే ఒప్పుకు తీరాల’ని మెదడులో ఇంకిపోయిన కొంతమంది వృద్ధులకీ వృద్ధుల్లాంటి కుర్రాళ్ళకీ  ‘పింక్’ మాట్లాడుతున్న సభ్యతా సమానత్వాల పరిభాష అర్థమౌతుందా? ఏమైనా చాలామందిని చేరుకుని, చర్చలకి దారి తీయించటంలో ‘పింక్’ టీమ్ గెల్చింది.

‘పింక్’ లో అమితాబ్ ఆక్సిజన్ కోసం మాస్క్ వేసుకు తిరుగుతుంటాడు. అదో మంచి ప్రతీక. ఢిల్లీ వాతావరణంలోని ఊపిరాడనితనాన్నీ, ఆడపిల్లల అభద్రతనీ మాంచి టెన్షన్ నిండిన మ్యూజిక్ తో నింపి సినిమా అంతా అందర్నీ  కుర్చీల అంచుల్లో కూచునేలా చేసేస్తుంది సినిమా.  శూజిత్ సర్కార్ ఆధ్వర్యంలోని సినిమా కాబట్టి నటులందరూ పోటీలుపడి జీవించక తప్పదు గానీ, ఈ ముగ్గురాడపిల్లల్నీ వేధించిన పోలీస్ ఆఫీసర్ గా వేసిన అమ్మాయిగురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎటూ కాని చదువులతో  ఉద్యోగంలో చేరిపోయి ఉన్న తెలివీ పోయి, బండతనం నేర్చేసుకున్న కింది లెవెల్ ఆడపోలీస్ ల మగ మనస్తత్వాన్ని ఆమె కళ్ళకి కట్టేస్తుంటే, ధర్నాలు చేసే ఆడవాళ్ళని లాఠీలతో కొట్టి వాన్ ఎక్కించే పోలీస్ ఆడవాళ్ళ తీరు ఇలాగే ఉంటుంది కదా అనిపించింది.

***

“ఉడ్తా పంజాబ్” … విడుదలకి ముందే ఎంతో హడావుడి జరిగింది దీనిగురించి. సెన్సార్ బోర్డు కసిగా కత్తిరించి పోగులు పెట్టాలని చెప్పిన తర్వాత కష్టపడి ఎలాగో బయటికొచ్చిందీ సినిమా. వరసగా పంజాబ్ లోని ఊర్ల పేర్లన్నీ చెప్పి, అవన్నీ డ్రగ్స్ మయం అయిపోయాయని ఒక డయలాగ్, పంజాబ్ ని మెక్సికో ఆఫ్ ఇండియా అని మరో డయలాగ్, ఇలా అదరగొట్టి, పంజాబ్ నీరసించిపోతోందన్న నిజాన్ని కటువుగా చెప్తుంది ‘ఉడ్తా పంజాబ్’.  ఎంతో సెన్సిటివ్ సినిమా.  ఇంత స్థాయిలో డ్రగ్స్ కి అలవాటు పడుతున్న మనుషులు, డ్రగ్స్ రవాణా, డీ అడిక్షన్ సెంటర్స్, మత్తుమందుల వ్యతిరేక ప్రచారం వరకూ సమస్య సాగిందని చూపిస్తుంటే ఇదంతా నిజమేనా మనదేశంలోనే జరుగుతోందా అనిపిస్తుంది.

పేరుకూడా ఎవరూ గుర్తుపెట్టుకోని బీహారీ వలసకూలీ పిల్ల (అలియా భట్) (హాకీ ఆడగలిగే ఈ పిల్లకి పొలంలో పాకిస్తాన్ బోర్డర్ నుండి విసిరిన పెద్ద మత్తుమందు పొట్లం దొరుకుతుంది. దాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించాలని వెళ్లి చిక్కుల్లో పడుతుంది), సెలెబ్రిటీ అయినతర్వాత మీదపడే అభద్రతతో వీడ్ కొట్టి, చస్తూబతుకుతూ బూతులు కురిపిస్తూ గాలిపటంలా తిరిగే రాప్ సింగర్ (షాహిద్ కపూర్),  డ్రగ్స్ రోగులకి వైద్యంచేస్తూ ఈ దందాని పూర్తిగా బయటపెట్టాలని ప్రయత్నించే social activist లాంటి డాక్టర్ (కరీనా కపూర్),  డ్రగ్స్ రవాణాదార్ల దగ్గర లంచాలు కొడుతూ, సొంత తమ్ముడే addict అయాడని తెలిశాక డాక్టర్ కి సాయంచేసి, డ్రగ్ మాఫియాని బైటపెట్టే ప్రయత్నం చేసిన చిన్నస్థాయి పోలీసూ(పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్) ఈ సినిమాని నడిపిస్తారు.

కమర్షియల్ మసాలా అంతా ఉన్న సినిమా. కానీ ట్రీట్ చేసిన పద్ధతి కొత్తది.  అభిషేక్ చౌబే దీనికి డైరెక్టర్. అనురాగ్ కాశ్యప్ ఛాయలు కొన్ని కనిపిస్తున్నా పూర్తిగా ఆ శైలి కూడాకాని freshness తీసుకొచ్చాడు చౌబే.  డ్రగ్స్ వాడకాన్ని ఏదో మాయగా మేజిక్ లాగా చూపించడు. దానిలోనే భీభత్సాన్నే చూపించి భయపెడతాడు. చెడుని ఆకర్షణీయంగా చూపిస్తూ చివరకి నీతులు చెప్పే సినిమాలాంటిది కాదు ఉడ్తా పంజాబ్. మత్తుమందుల ఊబిలోకి నిస్సహాయంగా జారిపోతున్న పిల్లలని చూపించి భయపెడుతుంది. బలవంతంగా డ్రగ్స్ ఎక్కిస్తుంటే అచేతనంగా అయిపోయే అమ్మాయిని చూపించి పిచ్చెక్కిస్తుంది.  తన్ని తాను కూడదీసుకుని మత్తుమందుని గొప్ప మనోధైర్యంతో resist చేసే ఆ పిల్ల పట్టుదలని కూడా చూపించి, కాస్త గాలి పీల్చుకునేలా చేస్తుంది. తల విదుల్చుకుని తానెవరో తన బాధ్యత ఏమిటో తెలుసుకున్న రాప్ సింగర్ ‘హమ్మయ్య’ అనిపిస్తాడు. మత్తుమందుతో విచక్షణపోయి, విలువైన ప్రాణాన్ని ఇట్టే ఊదేసిన పిల్లవాడిని చూసి ఏడుపొస్తుంది.  మన దేశంలోని ఒక రాష్ట్రంలోనే  మనుషులు ఇంతగా బలవుతున్నారా అని బాధేస్తుంది.

సెలబ్రిటీ సిండ్రోమ్ ని కూడా పట్టుకుంటుంది ఉడ్తా పంజాబ్.  ఈ సినిమాలోని రాప్ సింగర్ టామీసింగ్ aka గబ్రూ,  ఇప్పటి పంజాబీ పాటగాడు హ్రిదేష్ సింగ్ aka యోయో హనీసింగ్ ని గుర్తుచేస్తాడు.  ఆడవాళ్ళమీద ‘ఐ స్వేర్  ఛోటీ డ్రెస్స్ మే బాంబ్ లగ్తీ మైనూ’ లాంటి లోకువ పాటలు పాడే sexist రాపర్ హనీసింగ్.  ‘చెన్నై ఎక్స్ప్రెస్’ సినిమాలో ‘లుంగీ డాన్సు’ పాటతో దేశమంతా పేరుగడించిన ఈయనీమధ్య రెండేళ్ళపాటు మానసిక వ్యాధివల్ల పాటలకి సెలవిచ్చుకున్నాడు.  ఆ పంజాబీ rap culture, ఆ frustration, ఆ బూతులూ, అవన్నీ మర్యాదస్తుల సంస్కరణకి లొంగని నిజాలే. Psychedelic music లో బూతుల్లో  డ్రగ్స్ ఉన్మాదాన్ని చూడమంటుంది ‘ఉడ్తా పంజాబ్’.  దాస్యం చేయించే మాదకతనీ దాన్లోంచి బయటపడాలన్న  తపననీ బాగానే చూపించాడు ‘గబ్రూ’గా షాహిద్ కపూర్.

ఒక పదేళ్ళనుంచీ పంజాబ్ మత్తుమందుల మీద ఒంటరి పోరాటం సాగిస్తోందని న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. హరితవిప్లవం తర్వాత అక్కడ విపరీతంగా పొలాల్లో వాడిన పురుగుమందుల ఫలితంగా చాలామందికి  కేన్సర్ వచ్చింది. మాల్వా ప్రాంతానికి చెందిన జిల్లాల్లో కేన్సర్ సోకినవాళ్ళు భటిండా నుండి బికనీర్ వెళ్ళే ట్రైన్ లో బికనీర్ వెళ్లి అక్కడ వైద్యం చేయించుకుంటారు. ఆ ట్రైన్ కే కేన్సర్ ట్రైన్ అని పేరొచ్చేసింది. అంతలా కేన్సర్ పాకిపోయింది. దీనికితోడు నార్కో కేన్సర్ పంజాబ్ ని చుట్టేసింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా పంజాబ్ కి అదుపు లేకుండా వస్తున్న హెరాయిన్ వ్యాపారానికి రాజకీయ నాయకులు, పోలీసులు అవినీతిమరకల చేతులు కలిపి సాయపడుతున్నారు. డ్రగ్స్ కి అలవాటు పడ్డ జనం బతికున్న శవాల్లా తయారవుతున్నారు. హెరాయిన్ సప్లై ఆగిపోతే అది అందక వెంటనే మనుషులు చచ్చిపోతారనే భయంతో ఊళ్లలో పెద్దవాళ్ళు సప్లై ఆపవద్దని అధికార్లని కోరేటంత దీనస్థితికి వచ్చారని Pioneer డైలీపేపర్ చెప్తోంది. ధైర్యానికీ పోరాటానికీ పేరుపొంది, ప్రతి ఇంటినుంచీ సైన్యానికో యువకుడిని పంపించే సంప్రదాయం, ఆరోగ్యంగా ఆటలాడుతూ పతకాలు గెల్చే దమ్మూ ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని యువత ఈ రోజు నీరసంగా మత్తులో తూలుతోంది.  ఇప్పుడీ సినిమా విడుదలవటం, సక్సెస్ కావటం సహజమే కాదు అవసరం కూడా కదా.

***

‘దంగల్’, ‘నీర్జా’, ‘ఎయిర్లిఫ్ట్’ లాంటి మంచి సినిమాలూ, ‘క్యా కూల్ హై హమ్’, ‘మస్తీ జాదే’ లాంటి ఒట్టి చెత్త సినిమాల మధ్యలోంచీ  పై మూడు ముఖ్యమైన topical సినిమాలనిచ్చింది ఈ సంవత్సరం బాలీవుడ్. కొత్తగా కథలు  చెప్పటంలో త్వరత్వరగా ఎదుగుతున్న bollywood sophistication వొచ్చే సంవత్సరం ఇంకెన్ని మంచిసినిమాలిస్తుందో చూడాలి.

ఇక్కడ ‘అలీగఢ్’లో మనోజ్ బాజ్ పాయ్ నటన చూడండి…

 

 

 

 

 

 

 

 

ఆ నిర్లిప్తత భయావహం

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-8

 

sudrarsanamలౌకికం-అలౌకికం; సామాన్యత-అసామాన్యత అనే ద్వంద్వాల మధ్యనే ‘వేయిపడగలు’ నవల మొత్తం సాగుతూ ఉంటుంది. అయితే, అవి వేటి కవిగా ఉండిపోవడం తప్ప;  వాటి మధ్య ఒక లంకె ఉంటుందనే స్ఫురణను రచన కలిగించదు. అలౌకిక ప్రపంచంలో అర్థవంతంగా అనిపించే పాత్రలు లౌకిక ప్రపంచానికి వచ్చేసరికి తేలిపోతాయి. ఉదాహరణకు అలౌకికతనుంచి చూస్తే రామేశ్వరశాస్త్రి అసామాన్యుడు. “మా తండ్రి నేమనుకొంటివి? ఆయన లోకసామాన్యుడు కాదు. ఆయన గొప్పతనము దౌర్భాగ్యులకు యెట్లు తెలియును?” అని అరుంధతితో ధర్మారావు అంటాడు. లోకసామాన్యుడు కాని వ్యక్తి గొప్పతనం లోకంలోని అసంఖ్యాకులైన దౌర్భాగ్యులకు తెలియనప్పుడు ఆ గొప్పతనం వల్ల లోకానికి ఏమిటి ఉపయోగం అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.

లౌకిక జీవనానికి వస్తే, రామేశ్వరశాస్త్రి మొదట్లో సంపన్నుడు. జమీందారు తర్వాత అంతటివాడు. కానీ చేతికి ఎముక అన్నది లేకుండా దానధర్మాలు చేశాడు. బంధువులనూ, పేదలనూ, రైతులనూ, వర్తకులనూ కూడా ఆదుకున్నాడు. చివరికి చితికిపోయి శేషజీవితంలో దుర్భర దారిద్ర్యాన్ని ఎదుర్కొన్నాడు. బంధువులే కాక, అతని సాయంతో వృద్ధిలోకి వచ్చిన రైతులు, వర్తకులూ కూడా మొహం చాటేశారు. తను వివాహమాడిన మిగతా మూడు వర్ణాల స్త్రీలకు; భోగస్త్రీకి ముందే ఆస్తి పంచి ఇచ్చిన రామేశ్వరశాస్త్రి కొడుకు ధర్మారావుకు మాత్రం పేదరికన్నే మిగిల్చిపోయాడు.

‘వేయిపడగల’ రచయిత వాస్తవానికి రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా సామాజిక పరిణామ చరిత్రను చెబుతున్నాడు.  బ్రిటిష్ కాలంలో లేదా ఆధునికత అడుగుపెడుతున్న దశలో బ్రాహ్మణ్యం అగ్రహారాలనూ, ఇతర ఆస్తులనూ కోల్పోయి ఆర్థికంగా అణగారిపోతూవచ్చింది. అగ్రహారం భూములు  రైతుకులాల పరమయ్యాయి. దానికితోడు, తెలుగు ప్రాంతాలలోని గోదావరీ, కృష్ణా మండలాలలో నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల  వ్యవసాయం అభివృద్ధి చెంది చూస్తుండగానే రైతుకులాలవారు ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఉచ్చదశను అందుకోవడం మొదలైంది. రెండు మూడు తరాల వ్యవధిలోనే సంభవించిన ఈ పరివర్తనకు తెలుగు ప్రాంతాలలోని బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో సాక్షిగా నిలిచాయి. తాత తరంలో బ్రాహ్మణభూస్వామి కింద పాలెకాపులుగా ఉన్న రైతుకులాలవారు మనవడి కాలానికి వచ్చేసరికి రాజకీయంగా ఉన్నతపదవులు అందుకోవడం, బ్రాహ్మణ యువకులు ఉద్యోగాలకోసం వారిని ఆశ్రయించడం ఈ పరివర్తన క్రమాన్ని ఆశ్చర్యస్ఫోరకంగా  మన కళ్ళముందు నిలుపుతాయి.

ఆర్థికక్రమశిక్షణ, కుటుంబ భవిష్యత్తుపట్ల బాధ్యతా రాహిత్యాలతో బ్రాహ్మణులు ఆర్థికపతనాన్ని కొని తెచ్చుకున్నారన్న విమర్శ బ్రాహ్మణ్యంలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పతన చరిత్రలోని ఒక పార్స్వాన్నే హాస్యబీభత్సవంతంగా ‘కన్యాశుల్కం’ చిత్రించింది. ‘వేయిపడగల’లోని రామేశ్వరశాస్త్రి ఉదంతాన్ని చదువుతున్నప్పుడు ఆయన మరీ ముందు వెనకలు చూడకుండా దానాలు, సాయాలు చేసి కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టాడన్న భావన పాఠకులకు కలుగుతుంది. కానీ రచయిత వైపునుంచి ఆ అభిప్రాయం కానీ, విమర్శ కానీ ఉండవు. ఉండకపోగా రామేశ్వరశాస్త్రి ఆర్థికక్షీణతను కార్యకారణ సంబంధానికి అతీతమైన ఓ దైవఘటనగా, ఓడలు బండ్లు సామెతలా నిర్లిప్తంగా తీసుకోవలసిన పరిణామంగా చెబుతున్నట్టు ఉంటుంది. అదీగాక  రామేశ్వరశాస్త్రి అసామాన్యవ్యక్తి కనుక అతని లౌకిక ప్రవర్తనను సైతం లౌకిక కొలమానాలతో చూడకూడదన్న ధ్వనీ వ్యక్తమవుతూ ఉంటుంది.  అతను ఏం చేసినా ఒప్పే, ఏం చేయకపోయినా ఒప్పే. ప్రశ్నలకు, విమర్శలకు, కలిమిలేములతో సహా అన్నిటికీ అతను అతీతుడు. అసలు అతని, అతని కుటుంబపోషణ బాధ్యత అతనిది కాదు; రాజుదీ, లేదా సమాజానిదీ. విచిత్రమేమిటంటే, రచయిత రామేశ్వరశాస్త్రిని లౌకికానికి అందనంత పై మెట్టున నిలుపుతూనే; అతని వల్ల సహాయాలు పొందిన బంధువులు, బ్రాహ్మణేతరుల కృతఘ్నతను ఎత్తిపొడవకుండానూ ఉండడు.

ధర్మారావు లౌకిక జీవన చిత్రణ కూడా ఇలాగే ఉంటుంది. తేడా అల్లా, దాన ధర్మాలు చేయడానికి అతనికి తండ్రి ఏమీ మిగల్చలేదు. ఇంగ్లీష్ విద్యతో ఉద్యోగానికి అర్హత అయితే సంపాదించాడు కానీ, మొదట్లో ఉద్యోగం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడు. ఇల్లు గడవడానికి స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుంటాడు. మధ్యలో జాతీయకళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తాడు కానీ అందులో ఇమడలేక విడిచిపెట్టేస్తాడు. కళ్ళముందు భార్య అనారోగ్యంతో చిక్కిశల్యమవుతున్నా మందు ఇప్పించలేని లేమిలో మగ్గిపోతాడు తప్ప ఉద్యోగం కోసం ప్రయత్నించకపోవడం పాఠకులకు విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది. చివరికి జమీందారు రంగారావు కొడుకు హరప్పకు గురువుగా నియమితుడైన తర్వాత సంభారాలు కోట నుంచే వస్తుంటాయి. దాంతో తిండి సమస్య పరిష్కారమవుతుంది కానీ, చేతిలో డబ్బు ఆడని పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా రచయిత చెప్పదలచుకున్నది, ధర్మారావు కుటుంబ పోషణ చూసుకోవలసినది రాజు, లేదా సమాజమనే. అంటే, మారిన కాలంలో కూడా రచయిత వర్ణవ్యవస్థ తాలూకు బ్లూ ప్రింటును అమలు చేయడానికి ప్రయత్నించాడు.

viswanatha

రచయిత కల్పించే ఊహ ప్రకారం రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల డబ్బు సంబంధం కూడా ఓ తాత్విక ప్రశ్నలా ఉంటుంది.  డబ్బుతో వారికి అవసరం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఎంత డబ్బు అవసరమైనా వారు దాని వెంట పడరు, అదే తమ వద్దకు రావాలి! డబ్బు దగ్గర కూడా రచయిత బ్రాహ్మణ, బ్రాహ్మణేతర భేదం తీసుకొస్తాడు. ధర్మారావు మిత్రుడు కిరీటి తన మేనమామకు రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు:

నీవు నెలకు మూడువందలు తెచ్చుచున్నావు కనుక నీవే వివేకవంతుడవు కావు. ధనము సంపాదించుట వివేకము కాదు. ఏదో మనము బ్రాహ్మణేతరులము కనుక నెమ్మదిగా అందులోనుండి యందులోనికి మ్యాజిస్ట్రేటును, తహసీల్దారును, ఇంగ్లీష్ హెడ్ క్లార్కును, హుజూరు శిరస్తాదారును, డిప్యూటీ కలెక్టరునైనది. కానీ ప్రత్యేకముగా మనము రాజ్యాంగవేత్తలమా? మహాకవులమా? మహాశిల్పులమా? మతకర్తలమా? ఏమని?

సామాన్యార్థంలో చెప్పుకుంటే భౌతిక సంపద కన్నా జ్ఞానసంపద గొప్పదీ, సమాజం పోషించదగినదే. కానీ, పై వాక్యాలు  జ్ఞానసంపద ఉన్నవారికీ, ‘అలాంటి జ్ఞానసంపద’ లేని వారికీ మధ్య తారతమ్యాన్ని ఎంచి; జ్ఞానసంపద ఉన్నవారినీ, వారి జ్ఞానాన్నీ కూడా  ఎత్తు పీట మీద కూర్చోబెడుతున్నాయి. అసలు ఏది జ్ఞానమన్న మౌలిక చర్చ ఒకటి ఉండనే ఉంది. నిర్దిష్ట వర్గానికి చెందిన నిర్దిష్ట జ్ఞానమే జ్ఞానం కాదు. జ్ఞానం బహుముఖాలుగా ఉంటుంది. ఆ చర్చలోకి వెడితే కిరీటి నోట పలికించిన పై అభిప్రాయం అసమగ్రంగా తేలిపోతుంది. ఎంత గొప్ప జ్ఞానమైనా సామాన్యీకరణ చెంది ప్రజల పరం అయినప్పుడే దానికి విలువా, సార్థకతా.  కానప్పుడు అది అలంకారప్రాయంగా మారి షో కేస్ కు పరిమితమవుతుంది.

ధర్మారావుతో పోలిస్తే, అతని భావజాలంతో ప్రభావితుడై, దాని పక్షాన పోరాడిన కుమారస్వామి విశిష్ట వ్యక్తిత్వాన్ని చాటుకుంటాడు. కులం చెడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను ధర్మారావులానే ఉద్యోగంలో ఇమడలేక రెండు ఉద్యోగాలను వదిలేస్తాడు. ధర్మారావులా అతనికి కోటనుంచి సంభారాలు వచ్చే పరిస్థితిలేదు. అయినా సరే, దుర్భర దారిద్ర్యాన్నైనా అనుభవిస్తాను తప్ప, ఆత్మగౌరవం చంపుకుని ఉద్యోగం చేయనని అతను నిర్ణయించుకుంటాడు. ఆవిధమైన పోరాటశీలం కానీ, త్యాగం కానీ ధర్మారావులో లేవు. చివరికి మంగమ్మ తన ఆస్తిని కుమారస్వామికి రాయడంతో అతను ఆర్థికసమస్యలనుంచి బయటపడడం వేరే విషయం.

లౌకికంగా చూసినప్పుడు; ఊళ్ళో ఇళ్ళు అంటుకుని, తన ఇంటిని కూడా మంటలు చుట్టు ముట్టే ప్రమాదఘట్టంలోనూ  ధర్మారావు ప్రవర్తన విపరీతమనిపించి విస్మయం కలిగిస్తుంది. అతనిని ఒకవైపు నిర్లిప్తుడిగా, నిష్క్రియుడిగానే కాక; ఇంకోవైపు అసామాన్యుడిగా, అధికుడిగా చూపడానికి ఇక్కడా రచయిత తాపత్రయపడతాడు. బ్రాహ్మణుల ఇళ్లకు దగ్గరలో, వేణుగోపాలస్వామి గుడి వెనక  మత్స్యమాంసాలను అమ్మే మార్కెట్ అవతరించడం ద్వారా ధర్మానికి జరిగిన హాని ఈ అగ్నిప్రమాదానికి కారణంగా చూపుతాడు. ఊళ్ళో జనం మంటలు ఆర్పడానికి రంగంలోకి దిగినా ధర్మారావు మాత్రం కుటుంబంతో బయటకు వచ్చి నిలబడిపోతాడు. ఇతరుల ఇళ్లను ఆర్పడానికి సాయపడడు సరికదా; తన ఇంటిని కాపాడుకోడానికి కూడా ప్రయత్నించడు. తల్లి సామాన్లు బయటికి తీసుకురాబోతే వారిస్తాడు. అప్పుడతని మాటలు ఇలా ఉంటాయి:

ధర్మము, అగ్ని, తస్కరుడు, రాజు; వీరు నలువు రన్నదమ్ములు. ధర్ము డందరిలో పెద్దవాడు. అతని కవమానము చేసినచో తక్కిన మువ్వురకును కోపము వచ్చును. అగ్ని తగులబెట్టును. తస్కరుడు దొంగిలించును. రాజు రాబడి పన్నని, అదనపు పన్నని లక్షవిధములుగా ధనము హరించును. మనము ధర్మావమానము చేసినచో  కానిమ్ము. పాతికవేల ఇల్లే పోయినప్పుడు వంద, రెండు వందల రూకల సామాను రక్షించునా?

దీనికి కొస మెరుపు ఏమిటంటే, “అతని యింటి మీద నెక్కి యెవరును నీరు పోయలేదు” అన్న రచయిత ఫిర్యాదు. అంటే, ధర్మారావు ఇంటి మంటలను ఆర్పే బాధ్యత కూడా సమాజానిదే కానీ అతనిది కాదన్నమాట. లౌకిక వ్యవహారాలలో ధర్మారావులో చిత్రించిన ఈ నిర్లిప్తత, నిష్క్రియత భయం గొలుపుతాయి. ఇలాంటి జడీభూతస్థితికి తాత్వికార్థమిచ్చి ఆకాశానికి ఎత్తిన జడభరతుడిలాంటి ఉదంతాలు మన పురాణ ఇతిహాసాలలో కనిపిస్తాయి.  ధర్మారావు పాత్ర చిత్రణలో రచయిత ఊహల్ని అలాంటి నమూనాలు ప్రభావితం చేసి ఉంటే ఆశ్చర్యంలేదు. అయితే ఈ నిర్లిప్తతకు, నిష్క్రియతకు ఎంత గొప్ప తాత్విక అర్థాన్ని ఆపాదించినా, వాటికి సంస్కృతీ సంప్రదాయాల విచ్ఛిత్తీ, పారతంత్ర్యం వంటి లౌకిక పర్యవసానాలు ఉండకుండా ఎలా ఉంటాయి? ఆ పర్యవసానాలపైనే కదా ధర్మారావు ముఖంగా, ఇతర పాత్రల ముఖంగా రచయిత నవల పొడవునా చేసిన విమర్శ?!

ధర్మారావు భావజాలంతో ఏకీభవించేవారి వైపునుంచి చూసినా, స్వరాజ్యోద్యమం అలాంటి లౌకిక పర్యవసానాలనుంచి దేశాన్ని బయటపడేయడానికి ఉద్దేశించిన ఒక కీలక సందర్భమే. కానీ ధర్మారావు మాత్రం ఆ ఉద్యమంలో పాల్గొనడు. పాల్గొనకపోగా స్వరాజ్యోద్యమం గురించి అతని అభిప్రాయం ఇలా ఉంటుంది:

నాకు చూచిన కొలది, దేశమందరు నుద్యమములో చేరినచో స్వరాజ్యము రేపే వచ్చును. కానీ యెవరికి వారు స్వార్థపరాయణులై యున్నారు. అట్టి సమయములో మరియు నిబ్బందులలో నున్నవారు తమ జీవితమార్గమును చెడగొట్టుకుని సంకటపడినందువల్ల నాకు లాభము కనిపించలేదు.

దేశంలో అందరూ ఉద్యమంలో చేరితే రేపే స్వరాజ్యం వస్తుందంటాడు. కానీ ఎవరికి వారు స్వార్థం చూసుకుంటున్నారంటాడు. వారిలో తనూ చేరతాడన్న స్పృహ మాత్రం అతనిలో ఉండదు. ఇంకోవైపు, మరీ ఇబ్బందులలో ఉన్నవారు తమ జీవితమార్గాలను చెడగొట్టుకుని కష్టాలను కొని తెచ్చుకోవడం వల్ల ఎలాంటి లాభమూ లేదంటాడు. అంటే, మిత్రుడు రాఘవరావులా తను స్వరాజ్యోద్యమంలో చేరకపోవడానికి కారణం, అతని కంటే తను ఎక్కువ ఇబ్బందులలో ఉండడమే నని సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ సంజాయిషీ అతనిలోని భద్రలోగ్ మనస్తత్వాన్ని బయటపెట్టి భీరువుగా చూపిస్తుంది తప్ప అతనిపై గౌరవాన్ని కలిగించదు. తాము పడే ఇబ్బందులు ఎక్కువా తక్కువా అన్నది చూసుకుని ఎవరూ స్వరాజ్యోద్యమంలో చేరలేదు. ఉద్యమంలో చేరి జీవనోపాధులను చెడగొట్టుకోవడమే కాదు, ఆస్తులను కోల్పోయినవారు కూడా ఎందరో ఉన్న సంగతి మనకు తెలుసు.

అదలా ఉంచితే, గాంధీ నాయకత్వంలోని స్వరాజ్యోద్యమంలో ధర్మారావు చేరకపోవడానికి భావజాల పరమైన విభేదాలు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు, దళితుల దేవాలయప్రవేశానికి ధర్మారావు వ్యతిరేకి. ఆ వ్యతిరేకతను రచయిత ఒకచోట ఇలా చిత్రిస్తాడు:

గణాచారి ధర్మారావులు కలసి దారి వెంట పోవుచుండిరి. ఒక పంచముడు ఎదురుగా వచ్చుచుండెను. గణాచారి తొలగి పోబోయినది. అతడు మరియు సమీపమునకు రాబోయెను. ధర్మారా వతనితో, ‘ఒక్క పది యేండ్లాగుము. అప్పుడు గణాచారియే యుండదు. అప్పుడు మనమందరమును కలసి దేవాలయములోనికే పోదము. స్వామి కప్పుడు గణాచారి ప్రసక్తి యుండదు. మూలమైన బీజాక్షరపీఠమున శక్తి యప్పటికి సమూలముగా నశించును. నేను నీ వాడను పద’ యనెను. అతనికి తెలియలేదు. ధర్మారావు వంక వెర్రిమొర్రిగా చూచుచు నతడు దూరదూరముగా పోయెను.

ధర్మారావు మాటల్లోని వెక్కిరింత, వ్యంగ్యం స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. గాంధీతో భావజాల విభేదాలే ధర్మారావు స్వరాజ్యోద్యమంలో చేరకపోవడానికి కారణమని రచయిత సూచించి ఉంటే అది ధర్మారావుకు కొంత గౌరవప్రదంగా ఉండేది. అటువంటి స్పష్టత రచయితకు ఉండకపోవడానికీ అవకాశముంది. గాంధీ నాయకత్వంలో కాకపోయినా తనతో భావసారూప్యమున్న వ్యక్తులతోనో, సంస్థతోనో కలసి ధర్మారావు స్వరాజ్యానికి ప్రయత్నించి ఉండవచ్చు. అదీ చేయలేదు.

అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. అతని నిర్లిప్తత, నిష్క్రియత లౌకిక విషయాలలోనే. అలౌకిక విషయాలలో అతను క్రియాశీలిగా, నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నవాడిలా కనిపిస్తాడు. అది, దేవాలయం కేంద్రంగా సాంప్రదాయికతను లేదా వర్ణవ్యవస్థను పరిరక్షించడం. అలౌకిక జీవులుగా తోచే గణాచారి, గిరిక, పసరికలకు అతను అక్షరాలా అంగరక్షకుడిగా వ్యవహరిస్తాడు. ఆ ఘట్టాలలో అతను ఎంత క్రియాశీలంగా ఉంటాడంటే, మరో ధర్మారావు అనిపిస్తాడు. ఈ సందర్భాలలో రచన కూడా అనూహ్య వేగాన్ని, సంవిధానాన్ని పుంజుకుని పాఠకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ముఖ్యంగా పసరికను ఒక ఆంగ్లేయుడు అపహరించి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ధర్మారావు దానిని అడ్డుకుని పసరికను విడిపించిన తీరు మరింత ఆకట్టుకుంటుంది.

అదలా ఉంచితే, వ్యవస్థా పరిరక్షణలో భాగంగా యువరాజు హరప్పకు గురువుగా మారి అతన్ని కర్మయోగం వైపు నడిపించినట్టు, దేవదాసి అయిన గిరికను భక్తిమార్గంలో పరిణతను చేస్తున్నట్టు అర్థమవుతూ ఉంటుంది.  అయితే ఆ గురుత్వం చుట్టూ నిగూఢత అనే తెర వేలాడుతూ ఉంటుంది. చెల్లెలైన గిరిక చేత సాధన చేయించడంలో అది మరింతగా వ్యక్తమవుతుంది. గిరిక పూర్తిగా అతిమానుష లోకంలోనే జీవిస్తూ ఉంటుంది. ధర్మారావు లౌకిక జగత్తు నుంచి, మధ్య మధ్య గిరికకు చెందిన అలౌకిక జగత్తులోకి పయనిస్తూ ఉంటాడు. పాఠకుల్ని ఆకట్టుకునే అంశాలలో ఈ అన్నా-చెల్లెళ్ల అనుబంధ చిత్రణ ఒకటి.

లౌకికంగా చూసినప్పుడు సామాన్య పాఠకులలో గిరిక పాత్ర కూడా ఎన్నో ప్రశ్నల్ని రేపుతుంది. ఆ భక్తి ఏమిటో, అంత చిన్న పిల్ల దేవుణ్ణే(వేణుగోపాలస్వామి) పతిగా వరించి లౌకిక పరిసరాలు పట్టకుండా అతని స్మరణలోనే గడపడమేమిటో అనిపిస్తుంది. నాస్తికుల సంగతి అలా ఉంచి భక్తులకు సైతం విడ్డూరం గొలిపేలా ఆమె భక్తితత్పరత ఉంటుంది. శారీరకంగా ఆమెలో ప్రకృతిసహజమైన ఎదుగుదల, సౌందర్యం, లావణ్యం ఉంటాయి. కానీ మానసికంగా ప్రకృతి సహజమైన కోరికలకు అతీతంగా ఉంటుంది. వేణుగోపాలస్వామితోనే ఆమె శృంగారానుభవం. ఈ చిత్రణ చివరికి ప్రకృతికి, దైవానికి మధ్య వైరుధ్యంగా పరిణమిస్తుంది. గిరిక ఉదంతాన్ని విడిగా చిత్రిస్తే భక్తికి ఆమె ఒక పరాకాష్టగా కనిపించి భక్తులను అలరించి ఉండేదేమో కానీ; సామాజికవస్తువుతో కూడిన నవలలో భాగం చేయడం వల్ల సార్వత్రిక సమాజం ఈ పాత్రతో ఎలా అనుసంధానమవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పసరిక పాత్రతో పోల్చి చూసినప్పుడు ఈ తేడా అర్థమవుతుంది. పర్యావరణానికి ప్రతీకగా సృష్టించినది కనుక పసిరికతో సార్వత్రిక సమాజం తేలికగా అనుసంధానం కాగలుగుతుంది. భక్తి అనేది పర్యావరణం వంటి సార్వత్రిక అంశం కాదు కనుక గిరికతో అలాంటిది సాధ్యం కాదు. మళ్ళీ లౌకికంగా చెప్పుకుంటే గిరిక పాత్ర ద్వారా రచయిత దేవదాసీ వ్యవస్థను అసలు అర్థంలో నిరూపించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. అయితే గిరిక దేవదాసీ వ్యవస్థకు అచ్చమైన ప్రతినిధి అవుతుందా, ఏ కాలంలోనైనా దేవదాసీలు ప్రకృతి సహజమైన స్పందనలకు దూరంగా గిరికలా పూర్తిగా దేవుడికే అంకితమై ఆయనే లోకంగా జీవించారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎవరివరకో ఎందుకు, గిరిక తల్లి రత్నగిరి కూడా అలా లేదు. ఆమె రామేశ్వరశాస్త్రికి భోగస్త్రీ అయింది.

  (సశేషం)

 

 

 

 

కన్ఫెషన్స్ ఆఫ్‌ సిద్ధార్థ్ అభిమన్యు!

arvind-swamy-thanioruvan-01

 

“చదరంగానికి ప్రాథమిక సూత్రం ఎదుటివాడు వేసే ఎత్తు మనం ఊహించి, ప్లాన్ చేసుకోవడం కాదు.
ఎదుటివాడు ఎలాంటి ఎత్తు వేయాలో మనమే నిర్ణయించడం”

“ప్రపంచంలో చాలామంది పరిస్థితుల చేతిలో బందీలు, అవి ఎటు నడిపిస్తే అటు నడిపిస్తారు. అలా నడుస్తూ ఒక్కోసారి లక్కీ మీ అనుకుంటారు, మరోసారి హార్డ్ లక్ అని బాధపడతారు. ప్రేమ, కృతజ్ఞత, న్యాయం, అన్యాయం, ధర్మం లాంటి ముసుగు మాటలని తాళ్లుగా కట్టి వీళ్ళని తోలుబొమ్మలుగా ఆడిస్తూంటే ఆడుతూంటారు. జనం చదరంగంలో పావులైతే, వీళ్ళని కెదుపుతూ చదరంగం ఆడేవాళ్లు వేరు, వాళ్ళు చాలా తక్కువమంది. ఆ చదరంగంలో ఛాంపియన్‌ని నేను. సామాన్యమైన జనాన్ని పావులుగా చేసి చదరంగం ఆడుకుంటున్న కింగ్‌పిన్స్ నా చదరంగంలో పావులు – అంటే పరిస్థితులను నడిపిస్తున్నాం అనుకునేవాళ్ళని నడిపించేవాణ్ణి.

ఎక్కడో జరిగే దొంగతనం, మరెక్కడో హత్య – చేసేవాళ్ళకి తామిద్దరూ నా కోసం పనిచేసేవాళ్ళ కోసం పనిచేస్తున్నారని తెలియదు. ఎందుకు చేస్తున్నారో నాకు తప్ప మరెవరికీ తెలీదు. నా చదరంగపు టెత్తులు తెలియాలంటే నా స్థాయిలో ఆలోచించి, నా ఊహని పసిగట్టాలంటే నా మెథడ్స్‌ని ఎంతగా మెడిటేట్ చెయ్యాలి! ఇక ఆ ఆటలో నాతో తలపడి నన్నే దెబ్బకొట్టాలంటే ఇంకెంత కెపాసిటీ కావాలి? అందుకే ఏళ్ళపాటు నన్ను టచ్ చేయడం సంగతి అటుంచి, గెస్ చేయడానికి ప్రయత్నించినవాడెవడూ ప్రాణాలతో మిగల్లేదు. అలాంటిది.. వాడు నన్నే కుదిపేశాడు.

డబ్బు, కీర్తి, అధికారం లాంటివన్నీ నా నుంచి లాక్కుని, నాకు చెక్‌మేట్ పెట్టగలిగాను అనుకుంటే తప్పు. నాకు తగిలిన నిజమైన దెబ్బ – పరిస్థితుల్ని నేను నియంత్రించగల స్థితి నుంచి పరిస్థితులు నన్ను నియంత్రించే స్థితిలో నిలబెట్టడం. అంటే నేను ఈ చదరంగంలో పావులు కదపలేను, పావులా కదులుతాను. నా పదిహేనో ఏట పావుల్ని తీసేయడం, మంత్రిని కదపడం, గుర్రాన్ని జరపడం మొదలుపెట్టక ముందు ఎలా చదరంగంలో పావుగా ఉండేవాణ్ణో – మళ్ళీ అలాగే అయ్యాను.

I hate it – పరిస్థితులు నన్ను పరుగులు తీయించిన ఆ రాత్రి మళ్ళీ గుర్తొచ్చింది. మా అమ్మ గుర్తొచ్చింది.
****

పవన్  సంతోష్

పవన్ సంతోష్

రాజకీయ చదరంగంలో ఎప్పుడూ మానాన్న బంటుల్లోకీ బంటు. ఆ రాత్రి కూడా అలానే ఎవడో నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడని ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఇంట్లో మా అమ్మ ఎలా వుందో అతనికి తెలీదు. పన్నెండేళ్ల వయసున్న నాకు ఊహకందని జబ్బు అది. నానా తంటాలూ పడి అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. అయితే అదేమీ మా నాన్న బానిసగా ఉన్న నాయకుణ్ణి చేర్చిన గొప్ప ఆసుపత్రి కాదు, అలాంటి వాళ్లు పళ్లు పంచిపెట్టే పెద్దాసుపత్రి.

హాస్పిటల్ బయటా, నాలోపలా తుఫాను. మా బస్తీ జనం నాన్న వస్తాడేమోనని ప్రయత్నించారు. అయితే అతనున్న చోట లక్షల మంది జనం. అందరూ గాలి గట్టిగా వీస్తే ఒకే వైపుకు ఊగే గడ్డి మొక్కల్లాంటి పనికిమాలిన జనం. వాళ్ళలో మావోడు ఎక్కడున్నాడని తెలుసుకోవాలి. తెలిస్తే మాత్రం ప్రయోజనం..

జబ్బుపడ్డ భార్య మంచాన పడివుండగా, ఎవడో నాయకుడి ఆఖరి చూపు కోసం ఆస్పత్రికి పోయిన ఆ నా కొడుకు గురించి వెతకడం అనవసరం. ఓ పక్క తుఫాను పెరుగుతూంటే – వాళ్ళ గుడిసెలు కూలిపోతాయేమోనని చూసుకోవడానికి ఇప్పుడే వస్తాం అని ఒక్కొక్కడే వెళ్లిపోయాడు. డాక్టర్ వచ్చాడు, అప్పటికి జరిగిన టెస్టులు, పేషెంట్ ఉన్న స్థితి చూశాడు. పేషెంట్‌తో ఉన్నవాణ్ణి నేనొక్కణ్ణే, చిన్నపిల్లాణ్ణని ఆలోచించినా, తప్పక నాకే ఆమె స్థితి చెప్పాడు. ఆపరేషన్ చెయ్యడానికి ఇక్కడ ఎక్విప్‌మెంట్ లేదట, ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి నా దరిద్రం రికమెండ్ అయినా చెయ్యనివ్వలేదు. ఓ మందుల చీటీ మాత్రం రాశాడు, చూడాల్సినవాళ్లెవరైనా ఉంటే తీసుకువచ్చి చూపించండి అని క్యాజువల్‌గానే అయినా, కళ్ళలో ఓ జాలి పొర కదులుతూంటే చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ చీటీతో రోడ్డు మీదికి వెళ్ళిన నాకు తుఫాను గాలికి వదిలిన చీటీ, రూపాయి బరువు లేని మనిషీ ఒకటే అని తెలిసి రావడానికి టైం పట్టింది. జాలి, దయ కరెన్సీ కాదని, చెల్లవని తెలిసొచ్చింది. ఏడుస్తూ, ఓదార్చుకుంటూ వెనక్కి వచ్చిన నాకు వార్డులో అమ్మ ఉండాల్సిన మంచం ఖాళీగా కనిపించింది. గాలికి ఎగిరే చిత్తుకాయితంలా దారీ తెన్నూ లేక తిరిగీ తిరిగీ ఓ మూల నెత్తురు ఉబుకుతున్న బుగ్గలా కనిపించింది, ప్రాణానికి కొట్టుకుంటోంది.

అమ్మని ఆ స్థితిలో చూడగానే ఏమయిందో అర్థమైంది, కానీ చెప్పడం కాదు కదా తలచుకోవడం కూడా నాకిష్టం లేదు. బతకడానికి కాక చావడానికి ఆ ప్రాణం గింజుకుంటోంది. అంతే సుళ్ళుతిరుగుతున్న నా మనుసులో బాధ, నిశ్చలమైపోయింది. వందమైళ్ళ స్పీడులో వచ్చే కార్లు, బైకులూ ఢీకొట్టేసుకుంటున్న సిగ్నల్లా ఆలోచనలు ఢీకొట్టుకుంటూన్న నా మెదడు స్తంభించిపోయింది.

అమ్మ ప్రాణాన్ని నేనే తీసేశాను, ఆ క్షణమే మళ్ళీ పుట్టాను.

ప్రేమ, స్నేహం, మర్యాద, జాలి, దయ లాంటివాటి నిజమైన అర్థం తెలిసింది. అవి ఒకోసారి పాచికలు, ఒకోసారి ముసుగులు. అంతటితో ఆ మాటలకి విలువ ఇవ్వడం పూర్తిగా మానేశాను. పరిస్థితులు నన్ను తీయించిన పరుగులు చాలు, ఆ రాత్రి నేను చచ్చిపోయి బూడిదలోంచి మళ్ళీ పైకి లేచాను. అమ్మ ప్రాణం కోసం పరుగులు పెట్టినంతసేపూ అవి నాతో ఆడుకున్నాయి. ఆ ప్రాణాన్ని నేనే తియ్యడానికి నిర్ణయించుకోగానే నా చేతిలోకి వచ్చేశాయి.
సిద్ధార్థ్ అభిమన్యు … పరిస్థితులను శాసించే దేవుడు.

తెల్లవారాకా అందరూ వాలారు. శవాన్ని ముందుపెట్టుకుని నాన్న ఏడుస్తూంటే – నవ్వొచ్చింది. వాళ్ళూ వీళ్ళూ నేను డాక్టర్‌ని అయి, ప్రాణాలు కాపాడుతూ ఉచితంగా సేవ చెయ్యాలన్నారు. హహ్హహ్హహ్హ. మా అమ్మకి ఎవడు చేశాడు? ఎవడినీ నమ్మలేదు, అందరి మాటలూ విన్నాను.

నా సర్వశక్తులూ కూడదీసుకుని చదవడం మొదలు పెట్టాను – పుస్తకాలని, ప్రపంచాన్నీ, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తుల్ని. ప్రపంచాన్ని మన చేతిలోకి తీసుకోవాలంటే, మనికి ఓ సైన్యం ఉండాలి. కొందరు బంట్లు, రెండు ఏనుగులు, గుర్రాలూ, ఒంటెలు, మంత్రి ఇలా. మా నాన్ని బంట్లలోకెల్లా బంటు. అతన్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకుపోయి అవతలి గడికి చేర్చి మంత్రిని చేశాను.

ఇంతకీ నేను చేసిన ఆఖరి హత్య మా అమ్మదే. ఆ తర్వాత అంతా చదరంగం గడిలోంచి పావుల్ని తీసేయడమే తప్ప మరేం కాదు. అలాంటి నన్ను వాడు… వాడు….
వాడు పావుని చేసి ప్రాణాల కోసం అడ్డమైనవీ ఒప్పించాలనుకున్నాడు. చివరకు వాణ్ణి నా స్థానంలోకి తీసుకువచ్చి నేను తప్పించుకున్న ప్రమాదాలు తలకు చుట్టాను. మరి నేనంటే ఏంటి?

ష్‌… అదిగో జింకల గుంపు. నేనొస్తా”

పసుపు రంగు చర్మంపై, చారలు అలల్లా కదులుతున్నాయి. ఊపిరి మంద్రంగా అయింది, జింక తను అనుకున్న చోటికి రాగానే వందల కిలోల బరువు పంజాపై నిలిపి, వేట మీద వేటు వేసింది. జింకల గుంపులో కలకలం మధ్య ఆ జింక చట్టని నోటితో చీలుస్తూ …

“సిద్ధార్థ్‌ అభిమన్యు సైనింగ్ ఆఫ్‌”


(తని ఒరువన్, ధృవ సినిమాల్లో ప్రతినాయక పాత్ర సిద్ధార్థ్ అభిమన్యు కల్పిత చరిత్ర)

 అస్తిత్వానికి ఇంకో కోణం!

                  pothuri          

అస్తిత్వం.

ఆ మాట అందరికీ వర్తించటం ధర్మం.

కొన్ని దశాబ్దాల క్రితం వరకూ రాసేసుకున్నారుగా మీగురించే – ఇప్పుడక్కర్లేదులే అనటం అన్యాయం. చలనశీలమైన చరిత్ర లో కొత్త మనుషులు, వాళ్ళ సంగతులు- ఆ తర్వాత వాటిని తలచుకోవాలనుకునేవాళ్ళు – ఉంటూనే ఉంటారు.

90 లకి ముందర తెలుగు లో మనకు  ఆత్మాశ్రయ వచనం తక్కువ. ‘ అమరావతి కథలు ‘అమరావతి ని ఆశ్రయించుకున్నాయి గాని, ప్రత్యేకమైన మనుషులని కాదు. ‘ పసలపూడి కథలు ‘ దీ ఆ దారే. అది క్షేత్ర సాహిత్యం.

‘ పచ్చనాకు సాక్షి గా ‘ చదివి అందరం ఉలిక్కి పడ్డాం. నవ్వాం, ఏడ్చాం, జాలి పడ్డాం, కోపం తెచ్చుకున్నాం. ఆ తర్వాతి ‘ దర్గా మిట్ట కథలు ‘ – మరింకొంత ‘ సౌమ్యంగా ‘ అనిపిస్తాయి. అవీ బావున్నాయి . అంతకు ముందో ఆ తర్వాతో వచ్చిన ‘ మల్లె మొగ్గల గొడుగు ‘ . కథ ని మించి ఇతిహాసపు స్థాయి కి వెళ్ళబోయిన ‘ అంటరాని వసంతం ‘ ….

దర్గా మిట్ట కథలు  comfort zone  లో ఉండటం ఎక్కువనీ, పురాస్మృతులను romanticize  చేస్తున్నారనీ వచ్చిన విమర్శ కూడా నాకు తెలుసు. కావచ్చు. వేదన తోనో ఆగ్రహం తోనో మాత్రమే కాదు, ఇష్టం గానూ ముచ్చట తోనూ  కూడా  ఎవరి జ్ఞాపకాలను వారు రాసుకోవటం లో  తప్పు ఉందా ? ‘ ఎక్కువ కష్టాలను ‘ అనుభవించి ఉండకపోవటం అనర్హత అవుతుందా ? ” ఊహూ. నువ్వు అలా అనుకుని రాస్తున్నావు గాని జరిగింది అది కాదు, మాకు తెలుసు ” – అనేందుకూ వీలు లేదు. ఎన్నయినా దృక్కోణాలు ఉండవచ్చు –  ఉట్టిగా జ్ఞాపకాలనే పట్టుకుని ఎవరైనా తీర్మానాలు చేయబోతే అప్పుడు పేచీ పెట్టచ్చునేమో. నాకు తెలిసి , ఇటువంటి వాటి లక్ష్యమూ లక్షణమూ record  చేసి పెట్టటమే . తెలిసినదే రాస్తే దానిది సాధికారమైన  పరిమళం.

    సమగ్రమైన , విస్తృతమైన అధ్యయనం, తప్పని సరి గా పనిచేస్తుండవలసిన సహానుభూతి – ఇంకా చాలా కావాలి తీర్మానించటానికి.

ఈ  వర్గానికి మేము చెందుతాము, మా తీరూ తెన్నూ ఇదీ  అని రాసుకునే ధైర్యాన్ని కొద్దిగానైనా తెచ్చి ఇచ్చినవారు శ్రీ రమణ గారు. ‘ మిథునం ‘ పూర్తి గానూ, ‘ బంగారు మురుగు ‘ చాలా మేరకూ బ్రాహ్మణుల కథలు. ఇంకొక మంచి కథ ‘ ధనలక్ష్మి ‘ కూడా బ్రాహ్మణ, వైశ్య  వర్ణాల ప్రసక్తి లేకుండా సాగదు. భారత దేశం లో అప్పుడూ ఇప్పుడూ కూడా కులం ఉంది. ప్రతి కులం లోనూ రకరకాల ఆర్థిక స్థాయిలూ బౌద్ధిక పరిణతులూ ఉన్నా – సామాన్య ధర్మాలు గా కొన్ని గొప్పలు, కొన్ని తప్పులు , కొన్ని నడతలు, కొన్ని మమతలు .

ఒప్పుకోవటం లో సిగ్గు పడేదేముంది ? చెప్పుకోవటం లో అతిశయమేముంది ?

 అవును, నాలుగు వేళ్ళూ నోట్లోకి పోతున్నాయనే – 90 ల తర్వాత ఈ కథలు వచ్చాయి, అలాగే అనుకుందాం.

వ్యక్తిగతం గా నాకొక నేపథ్యం ఉంది. దానికీ కథ లోకి రావాలనే ఉబలాటం ఉంది.

 ‘ ఇల్లేరమ్మ కథలు ‘ – దాన్ని కొంత దగ్గరగా చూపించాయి . ప్రత్యేకించి ప్రస్తావించేందుకు రచయిత్రి వెనుకాడారేమోననిపిస్తుంది గాని,  అవి ఉద్యోగాలు చేసే మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల కథలు. మరి ముఖ్యం గా, పల్లెటూళ్ళని ముందు వదిలిపెట్టిన బ్రాహ్మణ శాఖ అయిన నియోగుల ఇంటి కథలు.

 ఆ తర్వాత వచ్చిన ‘ పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు ‘ – ఆవిడే చెప్పినట్లు ‘ పఠం ‘ కట్టిన బ్రాహ్మణ కథలు.[ వాక్యం లో రెండో భాగం ఆవిడ ది కాదు ]   పల్లెటూళ్ళవీ పట్నాలవీ – నా సొంత జిల్లా కథలు. నాకు తెలిసిన మనుషులే ఉన్న కథలు. Larger than life అనిపించే వాళ్ళవి.

 అసలు ఆ పేరు ఆ పుస్తకానికి పూర్తిగా తగదు. అందులో హాస్యం కానిది చాలా ఉంది.  హాస్యం మీద అఖండమైన గౌరవం  నాకు , అది కాదు ప్రశ్న. అవి ‘ హృద్యమైన ‘ కథలు. Feel good  అనే మాట కు తెలుగు ఏదో నాకు తెలియదు, ఇవి ఖచ్చితం గా అవే. ఈ feeling good  అనేది ముడుచుకు కూర్చోవటం కాదండీ, ‘ ఇచ్చుట లో ఉన్న హాయి ‘ .  వీటిలో మనుషులకి చాదస్తాలు, వెర్రి బాగుల తనాలు , పిచ్చి పట్టుదలలు – ఉన్నాయి. ఇంకొకడికి తిండి పెట్టటాలూ అందుకు వాళ్ళు  చిన్నబుచ్చుకోకుండా నెపాలు కల్పించటాలూ, పెద్దవాళ్ళు లెమ్మని, ఇబ్బంది అవుతున్నా చూసీ చూడనట్లుండటాలూ , ఆ పని మనదో కాదో ఎంచకుండా చేసుకుపోవటాలూ – ఇవీ ఉన్నాయి. తృప్తి గా బతకటం ఉంది. శాంతం గా ఊరుకోవటం ఉంది.  అంతా అనుకునేట్లు వియ్యాల వాళ్ళకి మధ్యలో ద్వేషాలూ పగలూ కాదు –  గౌరవాలూ మర్యాదలూ – దాదాపు గా మనస్ఫూర్తిగానే – ఉన్నాయి. ఈ కథల కొత్త ముద్రణ లో ‘ జ్ఞాపకాల జావళి ‘ అనే సీరీస్ ని కలపటం లో చాలా ఔచిత్యం ఉంది.

MythiliScaled

  రేడియో మోగుతుంటే కూర్చుని వినకపోతే అది నొచ్చుకుంటుంది . కరెంట్ పెట్టించుకుంటే షాక్ కొడితేనో …కట్టుకున్న మొగుణ్ణి కర్ర తో ఎట్లా కొడుతుంది అమ్మమ్మ ? టేప్ రికార్డర్ ని చూసి ‘ జాగర్త, అది వింటుంది ‘ అని భయపడతారు . అదొక అమాయకపు కాలం.

చెన్నా పట్నం నుంచి వస్తున్నాం కదాని వియ్యపురాలికి ఇంగిలీషు కూరలు తెచ్చిపెడతాడు వియ్యంకుడు. మా మామ గారు అటువంటి వారు. మా అమ్మకీ ఆయనకీ మంచి rapport  ఉండేది. ప్రాణాంతకమైన వ్యాధి తో మా నాన్న గారు హాస్పిటల్ లో చేరినప్పుడు – రెండు నెలల పాటు మామ గారే ఆయనని కనిపెట్టుకు ఉండిపోయారు.  చూసేవాళ్ళు తండ్రీ కొడుకులనో అన్నదమ్ములనో అనుకునేవారు.

ఉంటారు అటువంటి మనుషులు – చూశాము .

  భుక్తి గడవని వితంతువు చేత అట్ల దుకాణం పెట్టిస్తారు తాతగారు. ఆయన తో మొదలెట్టి ఆఖర్న అమ్మమ్మ కీ అవి నోరు ఊరిస్తాయి. ఏ పనీ రాని సీతా రావమ్మ కి ఊరికే తింటున్నాననిపించకుండా గుళ్ళో పాటలు పాడే పని ఇస్తారు. అదీ రాదు ఆవిడకి. ” వసుదేవాత్మజ రామా , కైలాసవాసా శ్రీహరీ ”- అదీ ధోరణి. ఆ పాటలు వినలేక దేవుడు పారిపోయి ఉంటాడనుకుంటారు, వరుణ యాగం చేసినా వానలు పడవు. అన్నమూ నీళ్ళూ మానేసి ఆవిడ పాడుతూ కూర్చుంటే రాత్రి పది గంటలు దాటాక వర్షం కురుస్తుంది. ఎందుకైతేనేమీ, ‘ పిచ్చి దాని పరువు దక్కింది ‘ . అవును – ఎవరికి మటుకు పరువు ఉండదు ? సీతారావమ్మకి  అక్క  భ్రమరాంబ గారు. నీళ్ళు తెచ్చి పోసి బతుకుతుంది, ఇబ్బందొచ్చినా చుట్టాలొచ్చినా చేసాయం చేసి పెడుతుంది. మిగిలిపోయినవి ఇస్తే తీసుకోదు, పాత చీర ఇస్తే సున్నితం గా వద్దంటుంది. మర్యాద గా భోజనం చేయమంటే చేస్తుంది, కొత్త చీర ఇస్తే నోరారా దీవిస్తుంది. ఎవరి ఋణానా పడకుండా దాటిపోతుంది.

   అల్లుళ్ళ మీద పెత్తనం చేసే మామ గారుంటారు ఇందులో. వాళ్ళకి ఇష్టమైన సినిమా ని కాదని తాను మెచ్చిన దానికి టికెట్ లు కొని కూర్చోబెట్టి మరీ వస్తాడు. చండశాసనుడు. ఆయనకి అన్నం వడ్డిస్తుంటే వంటావిడకి వణుకు పుడుతుంది – కాని చేతికి ఎముక లేని మనిషి. తన వాళ్ళూ కానివాళ్ళూ అని చూసుకోని మనిషి. ఈ అన్ని  లక్షణాలనూ

సంపూర్ణం గా మా మాతామహులు పూండ్ల రామమూర్తి రావు గారి లో చూశాను – ఆయన ఎంచి పెట్టే  ‘ లవకుశ ‘ వంటి సినిమాల తో సహా. ఆడ పెళ్ళి వాళ్ళ పనులనీ నెత్తి మీదేసుకుని చేయించే తాత గారి కథ ‘ మగ పెళ్ళివారమండీ ‘ చాలా మంచి కథ. అటువంటి తాత గారు నాకూ ఉండటం ఒకటే కారణం కాదు.

‘ పీత మీద కూతుని పాత పాదే ‘ పండు గాడి కథ అక్షరాలా గొప్ప కథ.బాగా  అలవాటయిపోయిన ఆ చిన్న వెధవ ని ఎక్కడికో వెంటబెట్టుకు పోదామనుకుంటే,  ‘ నేను లాను బాబూ. నాతు బోలెదన్ని పనులున్నాయమ్మా. నేనూ మా అమ్మ ఈ లాత్తిలి మీ బావిలో దూతి తచ్చిపోవాలి ‘ అంటాడు వాడు. అది నిజమే అని రాబట్టుకున్న ఈ కుటుంబం పెద్ద , పండుగాడి నాన్న కి ఊడిన ఉద్యోగాన్ని ఇంకోచోట వేయించి పెడతాడు. చిన్నదే ఉద్యోగం- చాలు, బతికేందుకు. పైకి చదువుతూంటే మా ఇంటి పెద్ద కంట తడి పెట్టిన కథ ఇది మాకు. 1992 లో అన్యాయం గా ప్రభుత్వ ఆసుపత్రి

పని లోంచి తీసేసినవాడికి  సొంత డబ్బు నలభై వేలు [ఆ. లంచమే ] ఖర్చుపెట్టి , జిల్లా కోర్ట్ లో కేసు వేయించి

తణుకు నుంచి ఏలూరు పదిసార్లు తిరిగి,   ఊడిన ఉద్యో గాన్ని మళ్ళీ వేయించిన  Deputy civil surgeon, మా నాన్న గారు గుర్తొచ్చారు.

గుర్తు చేసుకోనివ్వండి.

 వారానికి రెండు రోజులే పల్లెటూరికి వచ్చే తపాలా బంట్రోతు . ఆ వేళకి అంతా అక్కడికి చేరి వచ్చిన ఉత్తరాలన్నీ ముందే చదివేస్తుంటారు.

మా గుంటూరి బ్రాహ్మణేతర  మాండలికాన్ని ఈ ‘ రంగడు వస్తాడు ‘ [ ” ఎండన పడొస్తాడు, అన్నం తిననివ్వండి ముందు ” ]  లో ప్రయత్నించారు రచయిత్రి.

” సోమయ్య బావకి,

బావుండావా ? మా చెల్లి పిల్లలు బావుండారా ? బావా మా కోడలికి ఈ మధ్యన వొళ్ళు బాగాలేదు. …….

                   లక్ష్ముడు వ్రాలు ” [ ఈ ఉత్తరమూ వియ్యంకుడు రాసినదే ]

చెల్లెలికి పెళ్ళి సంబంధమని కబురు, సీతాపతి మేష్టారికి. ” నా మొహం నాకేం తెలుసు ? నాన్నే ఉంటే…” అని కళ్ళ నీళ్ళ పర్యంతమవుతాడు.

” ఉంటే బాగానే ఉండేది. లేనంత మాత్రాన ఏదీ అగదు. నాన్న లేకపోతేనేం బాబాయి ఉన్నాడు, చెట్టంత మేనమామ ఉన్నాడు…..అంతా సానుకూలం అయితే పెళ్ళే చెయ్యలేకపోతావా ? నువ్వు ఊళ్ళో ఉన్నావుగానీ అడవి లో లేవు కదా. మేమంతా లేమట్రా ? ” అని గదమాయించే తాతగారికి అందరూ అవునవునని వంత .

శంకరమంచి సత్యం గారు గుర్తు రాలేదా ?

ఇటువంటి theme నే మరొక సంపుటం’ పూర్వి ‘  లోని ‘ సుఖాంతం ‘ , ‘ పుణ్యాత్మురాలు ‘ కథల్లోనూ రాస్తారు.

గాజుల బత్తుడు విడిపోయి బతుకుతూన్న అన్నా చెల్లెళ్ళ మధ్యన వార్తలు మోస్తుంటాడు. ఇద్దరూ ముసలివాళ్ళే, దక్షత చేజారిన వాళ్ళే. విషయం తెలిసి తక్కినవారు సరిచేస్తారు. ఇక్కడా కంట తడి. నిజమే, చాలా చోట్ల ఉంటుంది. అది శోకం కాదు , బాధ్యత.

అప్పటి రోజుల్లో ప్రతి ఇంటా  ఉండిన బ్రాహ్మణ విధవ లు రెండు కథల్లో వస్తారు. అందరినీ పిల్ల విజయలక్ష్మి  గారు సినిమా కి తీసుకుపోయే కథ మహా సరదా గా ఉంటుంది. ఆవిడ ముద్ర కనిపించేది మరొకదాని లో- ‘సభల  సంరంభం ‘

 నెహ్రూ పోయాక లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ఇందిరా గాంధీ కాంగ్రెస్ సభలకి గుంటూరు వస్తుంది. కొత్త గా తండ్రి పోయిన ఆడపిల్ల అని, ఆవిడని ఇంటికి పిలిచి తీపి తో భోజనం పెట్టి చీరె పెట్టాలంటారు ఈ ముసలమ్మలు – కబురు అందిందనేవరకూ ఊరుకోరు. ” ఎంత గొప్పవాళ్ళైతే మాత్రం వాళ్ళకీ బాధలూ బరువులూ ఉంటాయి. మనం పిలవటం మర్యాద. అంత వీలు కాకపోతే ఆవిడే రాదు. అంతే గానీ అసలు పిలవకుండా ఎట్లా ? ” –

చెప్పండి, నవ్వొక్కటేనా వస్తోంది మీకు ?

పనిమనిషి కి తను అధ్యక్షు రాలిగా ఉన్న మహిళామండలి లో ఉద్యోగం వేయిస్తుంది అమ్మమ్మ. ఆమె ఆ తర్వాత ఈవిడ పనిని నిర్లక్ష్యం చేస్తోందని ఉడుక్కుని పీకేయమని బీడీవో కి ఉత్తరం రాయిస్తుంది. అంతలోకే చల్లబడిపోయి, ” పాపం, వద్దులే .ఉద్యోగం ఊడగొట్టి ఆ పాపం మూట కట్టుకోటం ఎందుకు ” అని ఆ ఉత్తరాన్ని వెనక్కి పట్టుకొచ్చెయ్యమంటుంది. డెబ్భై దాటిన  మా అమ్మకి  ఇట్లాగే పిచ్చి కోపమొస్తుంటుంది, ఇట్లాగే తగ్గిపోతుంటుంది.

 లేనివారి  ఇంటి పెళ్ళికి హడావిడిగా  అరిసెలు డబ్బాలకెత్తే ఇల్లాళ్ళు, గొప్పింటి  స్నేహితురాలికి ,ఇంట్లోవాళ్ళు కొని ఇవ్వరని,  పుణుకులు కొనిపెట్టేందుకు కనకాంబరాలు పెంచి అమ్మిన బీద పిల్లలు – ఇక్కడ ఉన్నారు. ఉండేవారు.

పూర్వి సంపుటం లోని బాలరాజు కథ నాకు చాలా ఇష్టం. విజయవంతం గా హోటల్ లు నడిపే ఒకాయన పూర్వాశ్రమం లో గల్ఫ్ వెళతాడు, ప్లంబర్ ఉద్యోగానికి. అక్కడి వాళ్ళకి కావలసింది వంటవాడు . పొరబాటు జరిగిందని

తిప్పి పంపించేస్తే చేసి వెళ్ళిన అప్పులు ఎట్లా తీరతాయి ? అక్కడి ఆఫీసర్ పూనుకుని, అతనికి వంట నేర్పి నిలబెడతాడు. చాలా ఏళ్ళ తర్వాత ఆయన్ని వెతుక్కుంటూ వెళతాడు హోటల్ యజమాని. పూర్తిగా మతిమరుపు [ Alzheimer’s ? ]  వచ్చేసి ఉంటుంది , కాని ఆఖరికి గుర్తు పడతాడు- ” నువ్వు రాజప్పడివి కదుట్రా ! వంట నేర్చుకున్నావా మరి ? ” – ఇతను సంబరం గా ఏడుస్తాడు.

” అన్నీ అంత సులువు గా అయిపోతాయా ఏమిటి ? అసలు అలా జరిగే వీలెక్కడుంటుంది ? ”  – అని ఒక రచయిత్రి నన్ను ప్రశ్నించారు.

సులువే. జరుగుతాయి. చాలా సార్లు.

పెద్ద మనసు ఉంటే.

అంటే ఏమిటంటే నేను చెప్పలేను.

*

 

మహానాయక్ ఉత్తమ్ కుమార్

 

uttam1

కలకత్తా లో, ఇంకా చెప్పాలంటే బెంగాల్ మొత్తం మీద అంతిమ యాత్ర  చరిత్రగా మిగిలిన సందర్భాలు రెండు ఉన్నాయని చెపుతారు. ఒకటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంతిమయాత్ర, ,మరొకటి అరుణ్ కుమార్ ఛటర్జీది.ఈ రెండు సందర్భాల్లో అశేష జనవాహిని, వారు అంతగా అభిమానించేవారి మరణాన్ని జీర్ణించుకోలేక, తీరని శోకం తో అంతిమయాత్ర లో పాల్గొని చివరి వీడ్కోలు పలికారు. అరుణ్ కుమార్ ఛటర్జీ మరణం తన అభిమానులకి జీర్ణించుకోవటానికి చాలా కాలమే పట్టింది. ఆ అరుణ్ కుమార్ ఛటర్జీయే బెంగాళీ సూపర్ స్టార్, మహానాయక్ ఉత్తమ్ కుమార్.

తన చివరి శ్వాస సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే వదలాలని అనుకునే ఉత్తమ్ కుమార్, ఈ ప్రపంచ రంగస్థలం నుండి అదే విధంగా నిష్క్రమించాడు. ‘ఓగో బొదు శుందొరి సినిమా షూటింగ్ సమయం లో గుండెపోటు రావడంతో బెల్లీవ్యూ హాస్పిటల్ లో చేర్పించారు. 16  గంటలపాటు డాక్టర్లు ఎంతగా శ్రమించినా తనని బ్రతికించలేకపోయారు.

దాదాపు మూడు దశాబ్దాలపాటు బెంగాలీ సినీరంగాన్ని రారాజుగా ఏలి, దాదాపుగా 250 వరకు (బెంగాలీ, హిందీ అన్నీ కలిసి) సినిమాల్లో నటించాడు. ఉత్తమ్ కుమార్ కేవలం నటన తో తన పిపాసని తృప్తి పరచుకోలేదు. దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా,నిర్మాతగా,నేపథ్య గాయకుడిగా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసాడు.

బెంగాళీ లోనే కాకుండా భారత దేశం లోనే అత్యుత్తమ నటుడిగా కిర్తించబడ్డ మహానాయక్ ఉత్తమ్ కుమార్.

ఉత్తమ్ కుమార్ మరణించిన రోజు కొంత మంది సినీ ప్రముఖులు:

“బెంగాళీ చిత్రపరిశ్రమకే దారిచూపించే దివిటీ వెళ్లిపోయింది. తనకు ముందు గానీ తరువాత గాని అలాంటి హీరో లేడు”

~~ సత్యజిత్ రే         

“మా అందరు హీరోల్లో ఉత్తమ్ కుమార్ బెస్ట్”

~~రాజ్ కపూర్

“ప్రపంచంలోని ఏ నటుడితో అయినా పోల్చగల సమర్థత ఉన్న నటుడు ఉత్తమ్ కుమార్. తనలో ఉన్న గొప్ప సుగుణం శ్రద్ధ.

చాలా మంది నటులకు పుట్టుకతోనే ఆ ప్రతిభ ఉంటుంది. కానీ ఆ ప్రతిభ,  శ్రద్ధ లేకపోవటం వల్ల త్వరగానే అంతరిస్తుంది. కానీ ఉత్తమ్ కుమార్ కి  ప్రతిభతో పాటు అకుంఠిత శ్రద్ధ ఉంది. అందువల్లే ఆ నట నక్షత్రం ఇంకా వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.

  ~~ తపన్ సిన్హా

ఉత్తమ్ కుమార్ సినీ ప్రస్థానం లో అద్భుతమైన సినిమాలు ఎన్నో ఉన్నాయి.  దస్తూరి లా, తన సొంతదైన ప్రత్యేక నటనాశైలి తో భావి నటులకి సమగ్రంగా ఒక “నటనా నిఘంటువుని” సమకూర్చాడు. ఆయన  చేసిన ఒక్కొక్క పాత్ర, ఒక్కో నటనా శైలిని ఆవిష్కరిస్తాయి. తను చేసిన కొన్ని పాత్రలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని పాత్రతో పాటుగా మనల్ని పయనింపజేస్తాయి. ఉత్తమ్ కుమార్ నటనా తాలూకా ప్రభావం మనల్ని అంత సులువుగా వదలదు. ఆ పాత్రలు మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి. చూసిన ప్రతీసారి , ఆ పాత్ర తాలూకు కొత్త కోణం ఏదో కనపడుతుంది.

తన నటన గురించి చెపుతూ ” నేను నా సహజ నటనా పద్ధతులనే అనుసరిస్తాను. మనం నిజ జీవితం లో ఎలా మాట్లాడుకుంటాము? ఎలా కోపగించుకుంటాము ? అలాంటి సహజమైన నటననే నేను ఇష్టపడతాను” అని అంటాడు మహానాయక్.

అంత స్టార్డం ని , ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఉత్తమకుమార్ కి విజయ శిఖరాల వైపు ప్రయాణం అంత సులువుగా జరగలేదు.ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని , కలకత్తా పోర్ట్ ట్రస్ట్ లో క్లర్క్ గా ఉద్యోగం నుండి మహానాయక్ ఉత్తమ్ కుమార్ గా ఎదిగేవరకు ఎన్నో అపజయాలు ఎప్పటికప్పుడు తనని పరీక్షిస్తూనే ఉన్నాయి.

మొదటి సినిమా విడులకి నోచుకోలేదు. తరువాత చేసిన 4 -5  సినిమాలు పరాజయంపాలు కావటంతో ఎన్నో అపజయాలు,హేళనలు, అవమానాలు తనని ప్రతి నిత్యం పలకరించేవి. ఇలా వరుస అపజయాలతో విసిగిపోయి, సినీరంగాన్ని వదిలివెళ్ళి క్లర్క్ ఉద్యోగానికి వెళ్లిపోదామనుకునే తరుణంలో భార్య గౌరి దేవి “మీకు ఇష్టమైన కళని వదులుకుని , ఏమాత్రం ఇష్టపడని ఆ ఉద్యోగం చేయటం కంటే,మీరు ఖాళీగా ఉన్నా ఫరవాలేదు ” అని ఉత్తమ్ కి ధైర్యాన్నిచ్చింది.

బెంగాళ్-బాంగ్లాదేశ్ లో అంతలా అభిమానులని సంపాదించుకున్న చరిత్ర బహుశా ఉత్తమ్ కుమార్ కే సొంతం.

దిలీప్ కుమార్దేవానంద్ఉత్తమకుమార్ ముగ్గురూ సమకాలీన నటులు. ముగ్గురూ దాదాపుగా తమ సినీరంగ ప్రయాణం ఒకేసారి మొదలుపెట్టారు.

దిలీప్ కుమార్ ఎక్కువగా త్యాగపు ఛాయలు ఉన్న పాత్రలకి పెద్ద పీట వేస్తే, దేవానంద్ ప్రేమికుడి గా, డైనమిక్ గా ఉండే పాత్రల్ని ఎంచుకునేవాడు.అందుకు భిన్నంగా ఉత్తమ్ కుమార్ అన్నిరకాలయిన కథలని ఎంచుకునేవాడు. తాను ఎంచుకునే కథలూ, పాత్రలు అప్పటి బెంగాళీ హీరోలు పాటించే పద్దతులకి భిన్నంగా ఉండేది.

అయితే ఈ కథల్ని ఎంచుకునే ప్రక్రియ తనకి అంత సులువుగా రాలేదు. తన సినీ జీవితం లో ఎదుర్కున్న అపజయాలనుండే ఈ కొత్త పాఠాలు నేర్చుకున్నాడు.

బెంగాళీ ప్రొడ్యూసర్లకి ఉత్తమ్ కుమార్ ఒక కల్పవృక్షమే. అగ్రస్థాయి నిర్మాతలు ఇద్దరు ముగ్గురు తమ సినిమా ఒప్పుకోవడానికి ముందే బ్లాంక్ చెక్స్ పంపేవారట. అప్పటి హీరోయిన్స్ ఉత్తమ్ పక్కన నటించడం ఒక అదృష్టం లా భావించి, తమకి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా? అని అనుకునేవారట. సినిమా రిలీజ్ కి ముందే ‘హౌస్ ఫుల్’ బోర్డ్స్ కి ఆర్డర్లు ఇచ్చేవారట.

ఉత్తమ్ కుమార్ సెప్టెంబర్ 3, 1926 తేదీన తన మేనమామ ఇంట్లో జన్మించాడు. ఉత్తమ్ కుమార్ అసలుపేరు అరుణ్ కుమార్ ఛటర్జీ,తల్లిదండ్రులు, చపలాదేవి-సత్కారి ఛటర్జీ.

సౌత్ సబర్బన్ స్కూల్ లో చదివి , గోయెంకా కాలేజీ లో డిగ్రీ పూర్తి అవకముందే కలకత్తా పోర్ట్ ట్రస్ట్ లో క్లర్క్ గా ఉద్యోగం రావడం తో,  క్లర్క్ గా పనిచేస్తూనే నాటక రంగానికి పయనం.

ఉత్తమ్ కుమార్ కుటుంబానికి సుహృద్ సమాజ్, అని ఒక నాటక సంస్థ ఉండేది.  చిన్నతనంలోనే ఆ వాతావరణం ఉండటం వల్ల తన నటన కి సంబందించిన బీజాలు అక్కడే పడ్డాయి. నటనే కాకుండా రకరకాలయిన ఆటలు, ఈత, టెన్నిస్, కుస్తీ పోటీలు,గుర్రపు స్వారీ ఇలా ఒకటేమిటి అన్నిట్లో తన ప్రతిభ కనబరిచేవాడు.

నితిన్ బోస్ దర్శకత్వం లో వచ్చిన మొదటి సినిమా “మాయాదోర్”, కానీ అది విడుదల అవలేదు.

ద్రిష్టిదాన్ (1948 ) విడుదలయిన మొదటి సినిమా. ఆ తరువాత విడుదల అయిన, 4 -5 సినిమాలు వరుసగా ప్లాప్. అందువల్ల ప్రతి సినిమాకు తన పేరు మార్చుకున్నాడు. అరుణ్ ఛటర్జీ నుండి అరుణ్ కుమార్ అని , ఆ తరువాత ఉత్తమ్ ఛటర్జీ అని, చివరగా ఉత్తమ్ కుమార్ అని మార్చుకున్నాడు. ఆ పేరుతోనే బెంగాళ్ సినీ చరిత్రలో చిరస్థాయిగా, మహానాయక్ గా నిలిచిపోయాడు.

uttam2

‘బసుపరిబార్ ‘ సినిమా కొంతమేర విజయాన్ని సాధించగలిగింది.ఆ తరువాత విడుదలయిన ‘అగ్ని పరీక్ష'(1954 ) ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్తమ్ కుమార్సుచిత్ర జంటగా నటించిన ఇది. ఈ సినిమా తరువాత ఈ జంట రొమాంటిక్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది.

సుచిత్ర-ఉత్తమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని:

శిల్పి ,సప్తపది, పతే హోలో దేరి,హరనో సుర్, ఛోవాపావా, బిపాషా ,జిబాన్ త్రిష్ణ.

ఉత్తమ్ కుమార్కొన్ని విశేషాలు::

కలకత్తాలో ఉత్తమ్ స్మారకార్థం ఒక థియేటర్ ని (ఉత్తమ్ మంచ) నిర్మించారు.

కలకత్తా టోలీగంజ్ ప్రాంతం లో ఉత్తమ్ కుమార్ భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. సెంట్రల్ రైల్వేస్ వారు టోలీగంజ్ మెట్రో స్టేషన్ ని ఉత్తమ్ కుమార్  స్టేషన్ గా మార్చారు.

శిల్పి సంసద్ అని పేద, వృద్ధ కళాకారులని ఆదుకోవడానికి ఉత్తమ్ స్థాపించిన సంస్థ తన కార్యకలాపాల్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది.

2009  లో భారత ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ పేరు మీద  “ఉత్తమ్ కుమార్ది లెజెండ్ అఫ్ ఇండియన్ సినిమా” అని  స్టాంప్ ని విడుదల చేశారు.

సినిమా టైటిల్ క్రెడిట్డ్స్ లో తన పేరుకి ముందుగా హీరోయిన్ పేరు ని వేయించే సంప్రదాయాన్ని మొదలు పెట్టాడు ఉత్తమ్ కుమార్.

భారతరత్న సత్యజిత్ రేఉత్తమ్ కుమార్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో నాయక్ సినిమా అత్యద్బుతమైనది. కొన్ని సంవత్సరాల క్రితం సత్యజిత్ రే సినిమాలు ఏవో చూస్తూ అనుకోకుండా నాయక్ సినిమా చూశాను. ఉత్తమ్ కుమార్ నటన నన్ను మెస్మరైస్ చేసింది. ఒకసారి చూశాక మళ్లీ చూశాను. అలా మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. ప్రముఖ హీరో అరింధం ముఖర్జీ గా ఉత్తమ్ కుమార్ నటన మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

అసలు ఉత్తమ్ కుమార్ ని నేను అంతలా అభిమానించడానికి కారణమే ,నాయక్(1966) సినిమా.

దీని గురించి వచ్చేవారం….!

*

 

జ్ఞానానికి అడ్డుగోడ

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-7

 

sudrarsanamధర్మారావు ఊహాప్రపంచంలో అప్రత్యక్షానికి, అతీతజ్ఞానానికి, అవ్యక్తానికే ప్రముఖస్థానం. నేత్రాల కన్నా మనసుకు, మనసుకన్నా ఆత్మకే ప్రాధాన్యం. అతని సిద్ధాంతాలు, సూత్రీకరణలు అన్నీ వీటి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే, ఎంతసేపూ ప్రత్యక్షం నుంచీ, వాస్తవికత నుంచీ దూర దూరంగా పయనించడమే.

ఒక చోట మడికి, పరిశుభ్రతకు మధ్య తేడాను ఇలా చెప్పుకొస్తాడు:

“పరిశుభ్రముగా నుండవలయును గాని, మడిలో ఏమున్నదనును. పరిశుభ్రముగా నుండుటలో మాత్రమేమున్నది?…ఏనాది వారు, కొందరు నీచజాతివారు అసహ్యమైన దేహములతో గుడ్డలతో తినుట లేదా? వారనాగరకులు, బుద్ధిమాలినవారు, నేను నాగరకుడను, నాకు పరిశుభ్రముగా నుండవలయు ననును. పరిశుభ్రముగా నుండుట నాగరకత యైనచో భోజనము చేయువేళ మడిబట్ట యని, దానితో నింకెవరిని తాకనని నియముగా నుండుట మరియు నాగరకత యేమో! మురికి యుండుట లేకపోవుటలలోని తారతమ్యము ప్రత్యక్షము; శుభ్రమైన వస్త్రమునకు, మడిబట్టకును గల తారతమ్య మప్రత్యక్షము. నీవు దేవుడున్నాడందువేని అది అప్రత్యక్ష విషయము. అప్రత్యక్షమై బుద్ధిమంతునిచేత నూహింపబడునదియే మతము. అదియే దివ్యము. అది నీ సామాన్యజ్ఞానమును దాటి యుండును. సద్విషయమును నీ వాచరించవేని యది నీకే నష్టము.”

ఇంకోచోట రచయిత ఇలా అంటాడు:

“అవ్యక్తమైన స్వరము మధురమైనట్లు, అవ్యక్తమైన భావము సుమనోరంజకమైనట్లు, అవిస్పష్టమైన వెలుగులలో శోభ యెక్కువ యున్నది. పూర్తిగా కనబడినచో జ్ఞానము, కనబడి కనబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.”

ఈ మాటలు సాహిత్య సందర్భానికి వర్తించేటట్టు ఉన్నా, రచయిత తాత్వికతకూ సమానంగా వర్తిస్తాయి.

ఏనాది వారు, అలాంటి ‘నీచజాతివారు’ ‘అసహ్యమైన దేహాలతో గుడ్డల’తో తినడానికి కారణమైన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి ధర్మారావుకు అక్కర్లేదు. ఆ పరిస్థితులు మారితే వారూ పరిశుభ్రతకు మళ్ళవచ్చునన్న ఊహ అతనికి లేదు. ఆ ఊహ కలగడానికి అతనిలో పరిణామస్పృహే లేదు. ఆ స్పృహ ఉండడం అతని సిద్ధాంతాలకు భంగకరం కూడా. కనుక అతని దృష్టిలో తను విశ్వసించే చాతుర్వర్ణ్యవ్యవస్థలానే, నీచజాతులన్నవి కూడా ఒక స్థిరసత్యం. అవి ఎప్పటికీ స్థిరంగా ఉండవలసిందే. ఎందుకంటే, కొన్ని ‘నీచజాతులు’ ఉండడంలోనే వర్ణవ్యవస్థ ఉనికి కూడా ఉంటుంది. అవి పరస్పర ఆధారితాలు.  ఈ ‘నీచజాతు’ల విషయాన్ని పట్టించుకోని ధర్మారావు, పరిశుభ్రత గురించి వాదించే ‘నాగరకుల’తో పోటీపడి, మడిబట్ట కట్టుకోవడం అంతకంటే నాగరకం అంటాడు. ఆపైన శుభ్రతకు, మడికి తారతమ్యం అప్రత్యక్షం, అంటే కంటికి కనిపించదంటాడు. మడితోపాటు అప్రత్యక్షాలైన దేవుణ్ణీ, మతాన్నీ కూడా తీసుకొచ్చి అవి దివ్యాలంటాడు. మతం కేవలం బుద్ధిమంతుని ఊహకు మాత్రమే అందుతుందని, సామాన్యజ్ఞానాన్ని దాటి ఉంటుందనీ అంటాడు. ఇలాంటి సద్విషయాలను ఆచరించకపోతే నీకే నష్టమని బెదిరిస్తాడు.

లోకం ప్రత్యక్ష, వ్యక్త, వాస్తవికజ్ఞానాన్ని అనుసరించి నడుస్తుంది. అలాగని అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానం లేదనీ అనాల్సిన అవసరం లేదు. అది వ్యక్తుల స్థాయిలో అనుభూతమయ్యే జ్ఞానం కావచ్చు. కానీ సాముదాయిక స్థాయిలో ప్రత్యక్ష, వ్యక్త, వాస్తవికజ్ఞానానికే ప్రాధాన్యం.  ఈ జ్ఞానరంగాన్ని ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, ఉపయోగకరంగా మలచుకుంటూ ఉన్నప్పుడే  ప్రపంచం అందరికీ సమానంగా వాసయోగ్యం అవుతుంది. ఎంత అసామాన్యజ్ఞానాన్నైనా సామాన్యీకరించి అధికసంఖ్యాకులకు అందుబాటులోకి తేకపోతే దానివల్ల లోకానికి ఉపయోగం ఉండదు.  ఒక పోలిక చెప్పుకుంటే, ఒకప్పుడు మహర్షులు దివ్యదృష్టితో ఎక్కడ ఏం జరుగుతోందో దర్శించేవారంటారు. అది నిజమో, కాదో మనకు తెలియదు. ఒకవేళ నిజమే అనుకున్నా ఆ దివ్యదృష్టి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం. అదే శాస్త్రవిజ్ఞానానికి వస్తే, టెలివిజన్ రూపంలో అలా చూడగల అవకాశాన్ని అది సాముదాయికం చేసింది. ఇలా అప్రత్యక్ష అతీతజ్ఞానాన్ని సామాన్యీకరించి సాముదాయకం చేయాలన్న దృష్టి ధర్మారావులో కనిపించదు. శాస్త్రవిజ్ఞానానికీ, ఆధ్యాత్మికతకూ మధ్య విరోధాన్ని ఊహించుకుని శాస్త్రవిజ్ఞానం కన్నా ఆధ్యాత్మికమే గొప్పదని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. ఒకచోట ఇలా అంటాడు:

“సర్వశాస్త్రములు ఆదిహేతువును కాదు, తద్వికారములను గూర్చియే యుపన్యసించును. ఈ యీ పదార్థములయందీ ధర్మమున్నదని యుపన్యసించును గాని యా ధర్మమేల యున్నదో శాస్త్రము చెప్పలేదు. ఆకాశమునం దా నైల్య మేల కనిపించుచున్నది? వాయువో, జ్యోతిస్సో యేదో యొకానొక తరంగసమితి ప్రసరించుటవలన ఈ నీలవర్ణ మేర్పడుచున్నది. దానిని శాస్త్రజ్ఞులైన సి.వి. రామన్ గారు కనిపెట్టిరి. దానికే ‘రామన్ గారి సిద్ధాంతమ’ని పేరు వచ్చినది. ఆ రీతిగా అట్టి తరంగప్రసారమువలన ఆ నీలవర్ణ మేల ఏర్పడవలయు నన్న ప్రశ్న కా మహానుభావు డేమి చెప్పును? అట్టి తరంగ ప్రసరణ మా నైర్మల్యమునకు హేతువనునది ధర్మము. ఆ శాస్త్రజ్ఞుడా ధర్మమును చూచెను. ఆయన చూడక ముందా ధర్మమున్నది. ఆ ధర్మము నిత్యమైనది. తన్నిత్యతా జ్ఞానముండుట కాస్తిక్యమని పేరు. చంద్రుడు, నక్షత్రములు, ఆకాశము; యీ సర్వము తద్ధర్మోపన్యాసమునే చేయుచున్నవి.

…ఆ ధర్మము శాస్త్రజ్ఞులు చెప్పిననే కానీ యితరులు విశ్వసించరట! ఆ శాస్త్రజ్ఞులనైనను, అందరు శాస్త్రజ్ఞులు ఒప్పుకొనవలయునట! వారును పదార్థవిజ్ఞానశాస్త్రవిషయోపన్యాసము లొప్పుకొందురట. ఆధ్యాత్మికవిజ్ఞానశాస్త్ర విషయములందు సందేహమేనట! భౌతికమునకు ఆధ్యాత్మికమునకు నడుమ నున్న మహాసముద్ర మెవ డుల్లంఘించగలడు?”

ఇలా అన్న ధర్మారావు,  మిగతా వానరవీరులెవరూ చేయలేని సముద్రోల్లంఘనను ఆంజనేయుడు ఒక్కడే చేయడాన్ని ఉదహరిస్తాడు. ఆంజనేయుడి సముద్రోల్లంఘనను మిగతావారు విశ్వసించారు కనుక సరిపోయింది కానీ, విశ్వసించకపోతే అతని బతుకేమయ్యేదంటాడు. ప్రతిదీ అందరి అనుభవంలోకి రావలసిందే నంటే, ఐన్ స్టీన్, రామన్, బోసు మొదలైనవారు చెప్పినవన్నీ అందరి అనుభవంలోకి వస్తున్నాయా, అయినా విశ్వసించడం లేదా అని ప్రశ్నిస్తాడు. “ఇది ధర్మమని చెప్పినచో విశ్వసించవలయును…ఒకడు తర్కముచే చూచిన దొకడు విశ్వాసముచేత చూచును”: ఇదీ అంతిమంగా అతని నిర్ధారణ.

visanaa

దీనినిబట్టి ఏమర్థమవుతోంది? శాస్త్రవిజ్ఞానంతో సహా అన్ని రకాల జ్ఞానాలకూ ఆఖరి మెట్టు ఆధ్యాత్మికజ్ఞానం. అది ఎలాంటి జ్ఞానమంటే, అప్రత్యక్షం, అవ్యక్తం, అతీతం! అది ఏ కొందరికో మాత్రమే అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రాని అసంఖ్యాకులు ఏం చేయాలంటే, తమకు అనుభవంలోకి వచ్చిందని చెప్పిన ఆ కొద్దిమందినీ నమ్మాలి! ఏ కొందరి అనుభవంలోకో వచ్చే ఆధ్యాత్మికజ్ఞానాన్ని అన్ని జ్ఞానాలకూ ఆఖరి మెట్టుగా నిలబెట్టి, ఆపైన తర్కాన్ని, ప్రశ్నల్ని నిషేధించి విశ్వాసాన్ని స్థాపించడమంటే ఏమిటి? జ్ఞానాన్వేషణకు హద్దులు గీయడమే! నువ్వెంతైనా జ్ఞానాన్వేషణ చేయి, అది అంతిమంగా విశ్వాసం దగ్గర ఆగిపోవాలి!

జ్ఞానంలోనూ ధర్మారావులో విభజన దృష్టే. శాస్త్రజ్ఞానమే అయినా, ఆధ్యాత్మికజ్ఞానమైనా జ్ఞానం అనేది ఒకదానితో ఒకటి ముడిపడిన సరళరేఖలాంటిదే. కానీ ధర్మారావు శాస్త్ర, ఆధ్యాత్మికజ్ఞానాలను పరస్పర సమాంతరాలుగా ఊహించుకుంటాడు. రెండింటి మధ్యా పోటీ పెడతాడు. ధర్మారావు చెప్పే ఆధ్యాత్మికజ్ఞానాన్ని కూడా శాస్త్రవిజ్ఞానం పరీక్షకు పెడుతుంది తప్ప మొండిగా నిరాకరించదు. దేనినైనా మొండిగా నిరాకరించేది శాస్త్రవిజ్ఞానమే కాదు. కాకపోతే, ఏ జ్ఞానమైనా నిరూపణకు అందాలని చెబుతుంది. ఇందుకు భిన్నంగా  ఆధ్యాత్మికజ్ఞానం విశ్వాసాన్ని నొక్కి చెబుతుంది.  ఎప్పుడైతే విశ్వాసం అనే అడ్డుగోడను కట్టేశారో, ఆ తర్వాత ఇక జ్ఞాన విస్తరణా ఉండదు, వికాసమూ ఉండదు. ధర్మారావు ఊహల పర్యవసానం అలా ఉంటుంది.

శాస్త్రవిజ్ఞానం నిరూపణ మీద ఆధారపడుతుందన్న అవగాహన ధర్మారావులో లేదు. అందులోకి కూడా విశ్వాసాన్ని తీసుకొచ్చి, ‘శాస్త్రజ్ఞులు చెబితే కానీ నమ్మరట’ అని ఎత్తిపొడుస్తాడు. వాస్తవం ఏమిటంటే, ఐన్ స్టీన్, బోస్, రామన్ లాంటి శాస్త్రజ్ఞులు చెప్పారు కనుకే ఎవరూ గుడ్డిగా నమ్మడం లేదు. వారి సిద్ధాంతాలు, సూత్రాలు తాము అర్థం చేసుకోగలిగిన, నమ్మగలిగిన భౌతికప్రమాణాలకు అనుగుణంగా ఉండి, నిరూపణకు అందుతున్న మేరకు నమ్ముతారు. అధ్యయనమూ, ప్రయోగమూ, నిరూపణా అనేవి శాస్త్రవిజ్ఞానరంగంలో నిరంతరం సాగుతూనే ఉంటాయి.

మనుషులను విశిష్టులుగా, సామాన్యులుగా విభజించే ప్రయత్నంలో రచయిత పశుపక్ష్యాదులను కూడా విభజిస్తాడు. అనసూయ(చిన్న అరుంధతి తల్లి, ధర్మారావు అత్త), ధర్మారావుల మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది:

అన:…యాథార్థ్య మతీతజ్ఞాన విషయము గాని యెక్కువమంది చెప్పునది కాదు. గొర్రెలు మంద యుండును. ఏనుగులు రెండో, మూడో. గౌరవ మేనుగులకే. ఏనుగు గొప్ప యేమనినచో యేమని చెప్పగలము? అది మనసునకే తెలియును.

ధర్మా: ధర్మము కూడ నట్టిదే. అదియు మనసునకే తెలియును. మన మేనుగుల కిచ్చినంత గౌరవము పాశ్చాత్యులీయరు.

ఎక్కువమంది చెప్పలేని, మనసుకు మాత్రమే తెలిసే యాథార్థ్యం అనే అతీత జ్ఞానంతో కానీ, ఏనుగుల గొప్పతనంతో కానీ అసంఖ్యాకులకు పనేమిటన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. సమస్య ఏమిటంటే, రచయిత నొక్కి చెప్పే అప్రత్యక్ష, అతీత జ్ఞానం కేవలం జ్ఞానస్థాయిలోనే ఉండిపోదు. బౌద్ధికజీవితంపైనే కాక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయజీవితంపై వాటి ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. లౌకికమైన అన్ని రంగాలలోనూ విశిష్టత, సామాన్యత అనే తారతమ్యాలు ఏర్పడతాయి. విశిష్టత, సామాన్యతా సూత్రాన్ని రాజకీయ పరిపాలనారంగాలకు అన్వయిస్తే అది వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల అనుశాసనం మాత్రమే చెల్లుబాటు అయ్యే రాచరికం అవుతుంది. అధికసంఖ్యాకుల ఆమోదం మీద సాగే ప్రజాస్వామ్యం దానికి పూర్తి భిన్నం.

రాచరికవ్యవస్థతో సంపూర్ణ తాదాత్మ్యాన్ని చాటుకున్న వేయిపడగల రచయిత, అధికసంఖ్యాకుల ఆమోదానుసారం నడిచే ప్రజాస్వామ్యాన్ని తృణీకరించిన సందర్భాలు అనేకచోట్ల కనిపిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడమంటే వైవిధ్యాన్ని నిరాకరించడమే. ఆయన కసలు ప్రజాస్వామ్యపు మౌలిక స్వభావమే అర్థం కాలేదు. “రాజును నా వంటి వాడే యని వీతిలో నిలుచుండి యనుము. ఏమగును? ఉరికి జానెడు బెత్తుడులో నుందువు” అని ధర్మారావు ఒకచోట అంటాడు.  ప్రజాస్వామ్యంలో ప్రధానిని, ముఖ్యమంత్రిని, మంత్రులను నిస్సంకోచంగా విమర్శించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజలే ప్రభువులు. మంత్రులు వారి ప్రతినిధులు, సేవకులు మాత్రమే. రాచరికంలో ప్రభునింద తప్పైతే ప్రజాస్వామ్యంలో ప్రజానింద తప్పవుతుంది. రచయిత ప్రాపంచిక దృక్పథం ప్రకారం సామాన్యులు, అసామాన్యుడి ముందు తమ అల్పత్వాన్ని అంగీకరించి అతని ఆధిపత్యానికి తలవంచాలి. అతడు ఏం చెబితే అది నమ్మాలి. ఈ నమ్మడం అనేది కేవలం అలౌకిక విషయాలకు మాత్రమే కాక, అన్ని లౌకిక విషయాలకూ వర్తిస్తుంది. సామాజికంగానే కాక సృష్టి సహజంగా కూడా మనుషుల సామర్ధ్యాలలో, ఆలోచనాసరళిలో, జీవన విధానాలలో, ఆహారపు అలవాట్లలో, విశ్వాస, అవిశ్వాసాలలో వైవిధ్యం ఉంటుంది. కానీ విశిష్టత- సామాన్యత అన్న విభజన సూత్రం ఆ వైవిధ్యాన్ని గుర్తించదు. తనదైన మూసలోకి అందరూ రావలసిందే నని శాసిస్తుంది. రానివాళ్లపై హింసను ప్రయోగిస్తుంది. గోరక్షణ పేరుతో గుజరాత్ లోని ఉనాలో దళితుల వీపులపై లాఠీల స్వైరవిహారం ఒకానొక ఉదాహరణ. విశ్వాసి కానివాడికి, ప్రశ్నించేవాడికి ఈ స్కీములో చోటు ఉండదు. అవిశ్వాసి నోరు ఎత్తడానికి వీలులేదు. నోరెత్తితే అతని జీవితం నరకమవుతుంది. భౌతికంగానే గల్లంతు అవుతుంది. అలనాటి చార్వాకుడి నుంచి, ఇటీవలి కల్బుర్గి, ధభోల్కర్ ల వరకు ఇందుకు అనేక ఉదాహరణలు.

ప్రజాస్వామ్యం రాచరికానికి పూర్తిగా తలకిందుల రూపం. ఇందులో అధికసంఖ్యాకుల మాటకే చెల్లుబాటు. అధికసంఖ్యాకులు ఆమోదించిన రాజ్యాంగం ప్రకారమే ఇందులో పరిపాలన సాగాలి తప్ప కొందరు రుద్దే విశ్వాసం ప్రకారం, కొందరి మనసులో ఉన్న ఊహల ప్రకారం; అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానం ప్రకారం పరిపాలన సాగదు. జ్ఞానాన్ని అందరికీ అందనంత ఎత్తుకి తీసుకువెళ్లడం విశిష్టుల పాలనలో పద్ధతి. జ్ఞానాన్ని జనానికి అందే ఎత్తుకి తీసుకురావడం ప్రజాస్వామ్యంలో అనుసరించవలసిన పద్ధతి. ప్రజాస్వామ్యం ఎవరి వ్యక్తిగత విశ్వాసాలనూ ప్రశ్నించదు. సాముదాయిక ప్రయోజనాలనే ఉమ్మడి ప్రాతిపదికపై అది పనిచేస్తుంది. సామాజిక సామరస్యానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించనంతవరకు అది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛనూ అడ్డుకోదు.

అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రజాజీవితంలోకి తీసుకొచ్చినప్పుడు జరిగే నష్టం బహుముఖంగా ఉంటుంది. అది పరిపాలనారంగంలో పారదర్శకతను హరిస్తుంది. భావోద్వేగ అంశాలను నినాదాల రూపంలో ముందుకు తెస్తుంది. పాలకుల చుట్టూ కాంతి వలయాన్ని సృష్టించి వారిని దైవసమానులుగానే కాదు,  దైవాలుగా, మెసయ్యాలుగా మారుస్తుంది.  రకరకాల వైరుధ్యాలపై తెర కప్పి జనంలో అయోమయాన్ని సృష్టిస్తుంది. జనం నమ్మకాలను, బలహీనతలను, భావోద్వేగాలను అధికారానికి నిచ్చెనమెట్లుగా వాడుకుంటుంది.  ఆ ప్రయత్నంలో జనాన్ని బెదిరిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, హింసకు పాల్పడుతుంది.

పైన ఉదహరించిన  “సద్విషయమును నీ వాచరించవేని యది నీకే నష్టము”  అన్న ధర్మారావు మాటలో ఉన్నది బెదిరింపు, బ్లాక్ మెయిలే. అప్రత్యక్ష, అతీత జ్ఞానాల పేరుతో విశ్వాసాన్నిజనం మీద రుద్దడంలోనే మాయలూ, మోసాలూ అడుగుపెడతాయి. ‘వేయిపడగ’ల కంటే చాలా ముందే వెలువడిన గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో సారాయి దుకాణం వెనక తోటలో బైరాగి, మునసబు సోమినాయుడు, సాతాని మనవాళ్ళయ్య, జంగం వీరేశ, దుకాణదారు రాందాసు, హెడ్ కానిస్టేబుల మధ్య జరిగే సంభాషణ ఇందుకు చక్కని నమూనా:

మునసబు: గురూ! బంగారం సేస్తారు గదా, అదెట్టి హరిద్దోరంలో మటం కట్టించక మాలాటోళ్లని డబ్బెందు కడుగుతారు?

బైరాగి: మేం చేశే స్వర్ణం మేవే వాడుక చేస్తే తల పగిలిపోతుంది.

హెడ్: అవి వేరే రహస్యాలు. వూరుకొండి మావా! గురోజీ! హరిద్వారంలో చలి లావు గాబోలు?

బైరాగి: నరులక్కద్దు. మాబోటి సిద్ధులకు చలీ, వేడీ, సుఖం, దుఃఖం యెక్కడివి?

హెడ్: ఆహా! అదృష్టవంటే సిద్ధుల్దే అదృష్టం.

మునసబు: గురూ, హరిద్దోరం నుంచి యెప్పుడు బైలెళ్ళారు?

బైరాగి: రెండు రోజులయింది. మొన్న వుదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం శేవించాం. ఖేచరీగమనమ్మీద ఆకాశమార్గాన పోతూవుండగా మీ వూరి అమ్మవారు వనం దగ్గర గమనం నిలిచిపోయింది. యేమి చెప్మా అని యోగదృష్టిని చూసేసరికి అమ్మవారి విగ్రహము కింద ఆరునిలువుల లోతున మహాయంత్రం వొకటి స్థాపితమై కనపడ్డది. అంతట భూమికి దిగి, అమ్మవారిని శేవించుకొని ప్రచ్ఛన్నంగా పోదావనుకుంటే యీ భక్తుడు మమ్మల్ని పోల్చి నిలిపేశాడు.

దుకాణదారు: చూడగానే నేను సిద్ధుల్ని పోలుస్తాను గురూ!…

మునసబు: సుక్కేసేవోళ్లని మా బాగా పోలుస్తావు! మా వూరమ్మోరు జగజ్జనని! మా చల్లని తల్లి.

ధర్మారావు చెప్పే అప్రత్యక్షాన్ని ప్రత్యక్షీకరిస్తే ఇలాంటి సన్నివేశాలు ఏర్పడతాయి. తన నీడను చూసి తనే భయపడినట్టుగా, అప్రత్యక్షజ్ఞానాన్ని సృష్టించినవాడే దానిని నమ్మవలసీ, భయపడవలసీవస్తుంది. ‘కన్యాశుల్కం’ నుంచే ఇంకో సన్నివేశం. బ్రహ్మరాక్షసిని సీసాలో బంధించానంటూ పూజారి గవరయ్య, అతని తోడుదొంగ అసిరిగాడు లుబ్ధావధాన్లుతో ఒక ఆట ఆడుకుంటారు:

లుబ్ధావధాన్లు: బాబ్బాబు! సీసా నా యింట్లో పెట్టకు. మీ యింట్లో పెట్టించండి.

గవరయ్య: మా పిల్లలు తేనె సీసా అని బిరడా తీసినట్టాయనా, రెండు దెయ్యాలు వచ్చి మళ్ళీ మీ యింట్లోనే వుంటాయి.

లుబ్ధా: అయితే సీసా భూస్థాపితం చెయ్యండి.

గవ: భూస్థాపితం మజాకా అనుకున్నారా యేవిటీ? భూస్తాపితం చెయ్యడానికి ఎంత తంతుంది! పునశ్చరణ చెయ్యాలి, హోమం చెయ్యాలి, సంతర్పణ చెయ్యాలి.

లుభ్దా: నా యిల్లు గుల్ల చెయ్యాలి.

(సశేషం)

అతని ఊహా వైపరీత్యం!

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-6

 

sudrarsanamనిజానికి ‘వేయిపడగలు’ లోని ధర్మారావు ఒక మనస్తత్వ సంబంధమైన కేసు. నవలలో చిత్రితమైన మేరకు అతను జీవితం పొడవునా చేసినది ఒకటే… వాస్తవిక జగత్తు అనే చతురస్రంలో కాల్పనిక జగత్తు అనే వలయాన్ని ఇరికించే ప్రయత్నం. అది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. అయినా విసుగూ, విరామం లేకుండా ధర్మారావు చేసింది అదే. ఆ వైఫల్యమే అతనిలో నిస్పృహ, నిర్వేదం, నిస్సహాయత, నిష్క్రియతా పెంచి; స్వరాజ్యోద్యమంలో పాల్గొన్న అతని మిత్రుడు రాఘవరావుతో పోల్చినా అతనినొక నిరుపయోగిగా మార్చింది. అలాంటి ధర్మారావును యోగిగా, విరాగిగా, నిర్లిప్తుడిగా చూపించబోవడం రచయిత విశ్వసించే తాత్వికతలోని ఒక వైచిత్రి.

ధర్మారావుకు చెందిన కాల్పనిక జగత్తు ఒక విశిష్టమైన జగత్తు. అందులో అందరూ విశిష్టులే ఉంటారు. వారిది ఎంతో విశిష్ట సంప్రదాయం. వారిలో గాఢమైన, లోతైన రసజ్ఞత, అనుభూతి సాంద్రతా ఉంటాయి. వారు మనసును నియమించుకుని, నిగ్రహించుకోగల స్థితిలో ఉంటారు. వారిలో అతీతమైన, అలౌకికమైన జ్ఞానం వెల్లివిరుస్తూ ఉంటుంది. వాస్తవిక జగత్తు అందుకు భిన్నం. అందులో అంతా సామాన్యులు, నేలబారు మనుషులు;  లోతైన రసజ్ఞత, అనుభూతి గాఢత  లేనివారు, లౌకికమైన సుఖాలకోసం, సంపదకోసం పాకులాడేవారు ఉంటారు. గొప్ప జ్ఞానిగా, వివేకిగా  రచయిత చిత్రించిన ధర్మారావులోని భ్రమాజనిత విశ్వాసం ఎలాంటి దంటే; ఒకప్పుడు ఈ దేశంలో అందరూ విశిష్టులు, ఉన్నతులే  అయిన  వ్యవస్థ నిజంగా ఉండేది!

ధర్మారావు ఊహల్లోనూ, అతను మిగతా పాత్రలతో జరిపే సంభాషణల్లోనూ ఈ విశిష్టతా-సామాన్యతల మధ్య వివేచన నవల అంతటా జరుగుతూనే ఉంటుంది. పింగళి సూరన కావ్యం ప్రభావతీ ప్రద్యుమ్నం చదివి రసస్ఫూర్తిని పొందిన ధర్మారావు, అందులోని “(కొన్ని) భాగములు నేటి కసభ్యములుగా నగుచున్నవి. గాఢమైన శీలము చచ్చినకొలది ప్రాణములు ప్రతి సంగతిలో లోతులు వాంఛించవు. పైపై మెరుగులతో తృప్తి చెందును. అదియే నాగరికత యని విర్రవీగును” అనుకుంటాడు. మిత్రుడు రాఘవరావుతో కలసి రెడ్డి రాజుల రాజధాని అయిన కొండవీడుకు వెళ్ళి అక్కడి శిథిలాల మధ్య తిరుగుతున్నప్పుడు, “ఆ రెడ్లు, వారి పరాక్రమము, వారి ఔదార్యము, వారు పోషించిన కవులు” వారి హృదయాలను ఆనందభరితం చేస్తాయి. “అది యొక పుణ్యసమయము. మన మపుడైన బ్రతికి యున్నాము కాదు” అని ధర్మారావు అనుకుంటాడు. ఇంకోచోట, “రసమునందు పర్యవసించుట యెవనికి? రసజ్ఞుడైన వానికి. ప్రతివిషయము నెవడు హృదయము దాక తెచ్చుకొనగలుగునో వాడు రసజ్ఞుడు. ప్రతివాడు నట్లు చేయలేడు…భగవంతుడెంతయైన లోతైన విషయము. ఆ లోతు మహాపరిపక్వ దశయందున్న దేవదాసి మనస్సునకే తెలియుచున్నది” అనుకుంటాడు.

రాణి రుక్మిణమ్మారావుతో మాట్లాడుతూ, “తల్లీ! ప్రాతదంతయు పోవుచున్నది. క్రొత్తదంతయు వచ్చుచున్నది. రంగాజమ్మగారిని చూడుడు! ఆమె పూర్వపు భావోన్మాదము, పాతివ్రత్యము, వర్ణస్వచ్ఛతకు చిహ్నమైన మూర్తి. అవి యన్నియు యామెతో నంతరించినవి. కృష్ణమనాయుడుగారు పూర్వరాజచిహ్నము. ఆయనతో అది పోయినది. దేవదాసితో దేవదాసీత్వమే నశించిపోవును. మీతో మహారాజ్ఞీత్వమే నశించును…నేను మీ యందరును నశించిపోవుచుండగా చూచుటకు మాత్రము పుట్టిన మూర్తిని. నేనునూ ఈ కాలమునకు తగినవాడను కాను. ఇవి యన్నియు చచ్చిపోవుచున్న యొక జాతి చివరి మెరుపులు!” అంటాడు.

రాచరికవ్యవస్థతోనూ, గతంతోనూ ధర్మారావు తాదాత్మ్యం ఎంతటి దంటే, “కోటకు కోట యాకృతి పోయి యొక పెద్ద ధనవంతుని యింటి యాకారము పడినది” అనుకుని బాధపడతాడు.

ఇంతకీ ధర్మారావుకు అంత ఆదర్శవంతంగా కనిపించిన సుబ్బన్నపేటలోని రాచరిక వ్యవస్థ ఎలాంటి పునాదుల మీద లేచింది? అది మరో ఆశ్చర్యం. రచయిత ఏ మాత్రం దాపరికం లేకుండా దానిని బయటపెడతాడు.  అయిదారు జతల ఎడ్లను కిరాయికి తిప్పుకుంటూ  జీవించే వీరన్ననాయడు అనే సాధారణ సంసారి, టిప్పు సుల్తాన్ పై యుద్ధానికి వెడుతున్న ఇంగ్లీష్ వారికి తన ఎడ్లనిచ్చి సాయపడతాడు. వారు శ్రీరంగపట్నాన్ని దోచుకుంటారు. అప్పుడు వీరన్ననాయడు తనవంతు దోపిడీకి అవకాశమిమ్మని అడుగుతాడు. వారు కోటలోని ఒక కొట్టును చూపించి దానిని దోచుకొమంటారు. అతని అదృష్టం కొద్దీ దానినిండా నవరసులు ఉంటాయి. వాటిని అతను రహస్యంగా ఎడ్లకు ఎత్తుకుని ఇంటికి తోలుకుంటాడు.

veyi

ఆ దోచుకున్న ధనబలంతోనే అతను సుబ్బన్నపేటకు రాజవుతాడు. స్థానికంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు అతనికి తోడవుతాడు. ఫలానా చోట కోట కట్టుకోమని అతనే చెబుతాడు. బ్రాహ్మణునికి కావలసింది ఆ ఊళ్ళో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టించడం. కోట నిర్మాణం, గుడి నిర్మాణం ఒకేసారి మొదలవుతాయి. వారిద్దరి అన్యోన్యత అలా ప్రారంభమై నానాటికీ బలపడుతుంది. విశేషమేమిటంటే,  వీరన్ననాయడు ఏ కులంవాడో రచయిత మొదట్లో ఎక్కడా చెప్పడు. కానీ రాజు కాగానే ‘క్షత్రియు’డైపోతాడు. మన దేశంలో వివిధ రాచవంశాల పుట్టుక గురించి ఇక్కడ విశ్వనాథ వాస్తవాన్నే బయటపెడుతున్నారు. ఈ దేశంలోనే ఉన్న ఇతర రాజ్యాలను దోచుకునో; లేదా దేశీయుడా, విదేశీయుడా అన్న తేడా కూడా చూడకుండా దోపిడీ శక్తులకు సాయపడో గడించిన సంపద పునాదుల మీద లేచినవవి. దోచుకున్న వ్యక్తి ఏ కులానికైనా చెంది ఉండవచ్చు; కానీ అధికారబలం, ధనబలం లభించగానే  బ్రాహ్మణ్యం అతనికి క్షత్రియత్వం కల్పిస్తుంది. ఇది ఉభయతారకమైన ఏర్పాటు. దోచుకున్న సొమ్ము అయితేనేం, అందులో కొంత దేవాలయానిర్మాణం వంటి దైవకార్యాలకు వినియోగిస్తే అది పవిత్రమైపోతుంది. ఈ రోజున కూడా తిరుపతి హుండీలో నల్లడబ్బు ఏ ప్రమాణంలో చేరడం లేదు?

ధర్మారావు ఊహాజగత్తులో అత్యంత విశిష్టంగా, ఆదర్శవంతంగా రూపుదిద్దుకున్న సుబ్బన్నపేట జమీందారి యథార్థరూపం ఇదీ. తన ఊహాశాలితను కాస్త నేలమీదికి మళ్లించి జమీందారీ మూలాలను తడిమి ఉంటే, అది దోపిడీ సొమ్ము మీద లేచిన వైభవోపేత నిర్మాణం అన్న సంగతి ధర్మారావుకు తెలిసేది. కానీ వాస్తవికత అనే నేల విడిచి ఊర్ధ్వయానం  సాగించడమే తప్ప కిందికి ప్రసరించే తత్వం అతని ఊహాశాలితకు లేదు. ఆ ఊర్ధ్వయానంలో పై పైకి వెళ్ళిపోయి కింద వాస్తవిక ప్రపంచం అనేది ఒకటుందన్న సంగతిని కూడా అతను ఒక్కోసారి మరచిపోతాడు. కావ్య రసాస్వాదన విషయానికే వస్తే, అతను తరచు రసప్రపంచంలో తప్ప మనుష్యలోకంలోనే ఉండడు. కావ్యజగత్తు గురించిన అతను చేసిన కింది  ఊహలు, వ్యవస్థ గురించిన అతని  కాల్పనిక ఊహలకూ యథాతథంగా వర్తిస్తాయి:

“ఓహో! కావ్యజగత్తు కల్పితజగత్తనుకొంటిని. కావ్యజగత్తే యథార్థమైన జగత్తు. అపరిపక్వమైన మనస్సులు, కృత్రిమ ప్రకృతులు, అసహజమైన మనోభావములు కలిగిన మనమే కల్పిత జగత్తు. యథార్థమైన మనోభావములు, నిర్మలమైన హృదయము, మహానాగరకత పొందిన బుద్ధీంద్రియములు కలిగినచో, తన దృష్టి, తన రక్తము కల్మషరహితమై, ధర్మగుణభూయిష్ఠములైనచో శీలము నందంత గాఢత్వముండును. అంత యేకాగ్రత యుండును…వర్ణసంకరము లేని రక్తము స్వచ్ఛమైనది.”

రాచరికవ్యవస్థ గురించిన అతని ఊహలు ఇంకా ఎంత హాస్యాస్పదంగా వ్యక్తమవుతాయంటే; అవి నవ్వునీ, బాధనీ కూడా కలిగిస్తాయి. అతనొకసారి ఇలా అనుకుంటాడు:

“మా తండ్రి నన్నేమో మహావైదికుని చేయవలెననుకొనెను. అన్న రామచంద్రరాజును గొప్ప విలుకానిని చేసి, అతనికి బ్రహ్మోపదేశము చేసి అధర్వవేదము పునరుద్ధరించి బ్రహ్మాస్త్రము మొదలైనవి కల్పితములు కావు, యథార్థములని రుజువు చేయించి, జగత్తు మరల క్షత్రియులచే నేలించవలయు ననుకొన్నాడు.”

ఈ నవల రచించే కాలానికి ఎంతో ముందే యుద్ధతంత్రంలోకి ఆధునిక మారణాయుధాలు ప్రవేశించాయి. మరో ఒకటిన్నర దశాబ్దాల కాలంలో అణ్వాయుధాలు కూడా ప్రయోగంలోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మారావు విలువిద్య గురించి, అధర్వవేదాన్ని పునరుద్ధరించి బ్రహ్మాస్త్రం మొదలైనవి కల్పితాలు కావని నిరూపించడం గురించి, జగత్తును(ఒక్క భారతదేశాన్నే కాదు) క్షత్రియులచే ఏలించడం గురించి కలలు కనడం అతని మానసికవైపరీత్యాన్నే సూచిస్తుంది. అతని ఊహలు పరిణామశీలాన్ని గుర్తించకపోవడమే కాదు; కాలాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తున్నాయి. క్షత్రియుడి పాలనను జగత్తు మొత్తానికి విస్తరింపజేస్తున్నాయి.

అతని ఊహలు, మధ్య మధ్య రచయిత చేసిన నిర్ధారణలు హాస్యాస్పదాలే కాదు; తర్కానికీ, హేతుబద్ధతకూ, శాస్త్ర నిరూపణకూ, చరిత్రకూ నిలవనట్టు ఉంటాయి. ఒకచోట రచయిత ఇలా అంటాడు: “ఏదో బలహీనపు గాలి మన దేశము మీదికి విసిరెను. ఆజానుబాహులై, విశాలవక్షులై, యేనుగు తొండము పూని విరువగల జాతికి; గుజ్జులై బక్కపలచనై, తెల్లవారి లేచినంతనే యేదియో యాహారము లేకపోయినచో తపతపలాడిపోవు జనులు పుట్టిరి.” మనదేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా ఒకప్పుడు అందరూ ఆజానుబాహులు, విశాలవక్షులు ఉండి; ఇంకొకప్పుడు అందరూ గుజ్జులు, బక్కపలచని వారు ఉండడం జరుగుతుందా? శరీరాకృతులు కానీ, ఆరోగ్యఅనారోగ్యాలు కానీ, ఆయుర్దాయంకానీ ఆయా కాలాలలో పుష్టికరమైన ఆహారలభ్యత, వైద్యసేవలు, ఆర్థిక సమానత లేదా అసమానత  మొదలైన భౌతిక, శాస్త్రీయ కారణాలపై ఆధారపడి ఉంటాయి తప్ప నిత్యసత్యాలుగా ఉండవు.

రక్తం, వర్ణం మొదలైన ప్రాతిపదికలపై జాతులను, మనుషులను విడగొట్టి చేసే ఊహలు కూడా అంతే అతార్కికంగా, అశాస్త్రీయంగా ఉంటాయి. ఆయా భాషల్లోని ఆయా వైచిత్రుల సమగ్రత తెలియడం, అవి అర్థమవడం ఆ దేశాల్లో పుట్టి ఆ భాషలు చిన్నప్పటినుంచి మాట్లాడితే కానీ సాధ్యం కాదని ధర్మారావు అనుకుంటాడు. “ఒక జాతి గుణములు, మతాభిప్రాయములు, తజ్జాతి రక్తము నెట్లుండునో, ఆ జాతి మాట్లాడు భాషలోని సమగ్రమైన రసాభావాదులర్థము చేసికొనుట కూడ శరీరములోని తద్రక్తము వలననే సంభవించు నని”  ఊహించుకుంటాడు. “వర్ణసంకరము లేని రక్తము స్వచ్ఛమైనది” అనుకుంటాడు. “ఆవు చురుకైన జంతువు. బర్రె మందమైన జంతువు…ప్రకృతిలోని యా మాంద్యము దాని రక్తమందున్నది. ద్రవ్యమును బట్టియే గుణము వచ్చినది. వాని రెండింటికి నవినాభావ సంబంధమున్నది. బ్రాహ్మణుని చూడగానే బ్రాహ్మణుడని తెలియుచున్నది. తుని వైపు క్షత్రియులను చూడుము. వెంటనే క్షత్రియుడని తెలియును…క్రైస్తవుడు క్రైస్తవునివలె కనిపించుచున్నాడు. అది భేదమే. అది వర్ణమే…అందర మొక్కటి యను సిద్ధాతము పశువులన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటిది…అట్లే భిన్న వర్ణములందు భేదములున్నవి” అంటాడు. “ఆత్మలో భేదము లేదు. జీవునిలో భేదమున్నది…జలమే తాను తన యున్న భిన్నప్రదేశమును బట్టి భిన్నత్వము తెచ్చుకున్నది. తదుపాధిగత గుణదోష సంక్రాంతిచేత జీవుడు భిన్నుడగుచున్నాడు” అని తీర్మానిస్తాడు.

పోనీ వాదానికి రక్తభేదం, వర్ణభేదం ఉన్నాయని ఒప్పుకున్నా; అవి సంకరం కాకుండా ఎప్పుడైనా ఉన్నాయా? ప్రపంచచరిత్రలోకి వెడితే వర్ణసంకరం, జాతి సంకరం కాని కాలమే కనిపించదు. నాగరికత సోకని ఏవో మారుమూల ఆదివాసుల ప్రాంతాలలో తప్ప; నాగరికత పరిధిలోకి వచ్చిన ప్రపంచ జాతులు, మనుషుల మధ్య సాంకర్యం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. వర్ణసాంకర్యం గురించి మహాభారతంలోని అర్జునుడే గగ్గోలు పెట్టిన ఉదాహరణ ఉండగా, ‘వేయిపడగలు’ రచయిత ఏ వర్ణస్వచ్ఛత గురించి మాట్లాడుతున్నట్టు?

ఇంకోచోట, “కులవిద్యయే  కూడు బెట్టును. ఇప్పుడు కులవిద్యలు చెడిపోయి, సంపాదించుటకు చదువు కొనవలసివచ్చుచున్నది” అంటాడు. ఇక్కడ కులవిద్య అనే మాటను వృత్తి విద్యగా తీసుకుంటే బ్రిటిష్ పాలనలో వృత్తులు క్షీణించి వాటిని ఆశ్రయించుకున్న జనం అల్లాడవలసివచ్చిన మాట నిజమే. వారికి తగిన ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందని మేరకు పై అభిప్రాయంలో కొంత నిజం ఉన్నమాట వాస్తవం. అయితే, కులవిద్య అన్నప్పుడు ఏ విద్య ఏ కులానిది; ఎక్కడ హద్దులు గీయగలం అనే ప్రశ్న వస్తుంది. బ్రాహ్మణులు మంత్రులుగా, సేనానులుగా లేరా? యుద్ధాలు చేయలేదా? అలాంటప్పుడు వారి కులవిద్య ఏదని చెబుతాం? అలాగే, వర్ణవ్యవస్థ ప్రకారం రాజ్యాధికారం క్షత్రియుడిది అనుకుంటే, రాజ్యాధికారంలోకి వచ్చిన వాళ్ళు అందరూ క్షత్రియులేనా? రాజులుగా ఉన్నవాళ్ళు అందరూ పుట్టు క్షత్రియులు కారనీ, వారికి క్షత్రియత్వం కల్పించారనీ, అందుకు హిరణ్యగర్భ క్రతువు వంటి అనేక ప్రక్రియలను అనుసరించారనీ తెలిపే ఉదాహరణలు అనేకం కనిపించడం లేదా? కులవిద్యనే అంటిపెట్టుకుని ఉంటే, ఒక వ్యవసాయదారుడు, ఒక కమ్మరి, కుమ్మరి, రజకుడు అధికారి, మంత్రి కాగలరా?

ఎలాంటివాడు ధర్మారావు? ఒకవైపు ఒక సంప్రదాయం చచ్చిపోతోందంటాడు. ఏదో బలహీనపు గాలి దేశం మీదికి విసిరిందంటాడు. ఒక మహా ప్రచండవాయువు వీస్తూండగా ఒరిగిపోయే వృక్షాలను నిందించి ఏం లాభమంటాడు. ఎవరిలోనూ ఉత్తమగుణాలు లేవంటాడు. మహార్థవంతమైనవన్నీ నశించిపోతున్నాయనీ, అల్పప్రయోజనములైనవన్నీ విజృంభిస్తున్నాయంటాడు. ఇంకోవైపు, ఇంతటి విపత్కరస్థితిలో కూడా కులవిభజన, వర్ణవిభజన, జాతి విభజన అంటూ ఎక్కడికక్కడ మనుషుల్ని చీల్చి మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ఉమ్మడిగా ఎదుర్కొంటున్న పతనం నుంచి బయటపడడానికి ఐక్యంగా ఏం చేయాలన్న ఆలోచనే అతనిలో కనిపించదు. అతని ఉద్దేశంలో వర్ణవ్యవస్థ మళ్ళీ అవతరించి, జగత్తును అంతటినీ ఏలే అధికారం తిరిగి క్షత్రియుడికి కట్టబెడితే చాలు, అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయి.

అతనిలోని విభజిత దృష్టికి అంతే కనిపించదు. మనుషుల్నే కాదు మతాలను విభజిస్తాడు, సాహిత్యాన్ని విభజిస్తాడు, శిల్పాన్ని విభజిస్తాడు, చిత్రకళను విభజిస్తాడు. ఈ విభజనలో కొన్ని చోట్ల ఎక్కడైనా, ఏ కొంచమైనా వాస్తవం ఒకింత తళుక్కు మంటే అనవచ్చు. కానీ అతనిలో విరాట్ రూపంలో వ్యక్తమయ్యే స్వ, పర చింతన దానిని పూర్తిగా కప్పివేస్తుంది. అన్ని నదులూ సముద్రంలో కలసినట్టు ధర్మారావు ఊహలన్నీ ఆత్మోత్కర్షలో కలుస్తాయి. ఎందులోనైనా సరే మనమే గొప్ప. “మన దేశమునందు పుట్టిన దేనికి మాపులేదు. ఖద్దరు గుడ్డకు మాపేమిటి? అది యెప్పుడును పవిత్రమే. ఎప్పుడును నిర్మలమే” వంటి నిర్ధారణలు సర్వత్రా కనిపిస్తాయి. మళ్ళీ ‘మన దేశీయులు’ అన్నప్పుడూ అక్కడ మరో విభజన:

“మన దేశమనగా నాల్గు హద్దులు గల ప్రదేశమని కాదర్థము. ఇచ్చటి మతము, సంఘము, ఆచారములు సర్వము నని యర్థము. ఈ భూఖండము నందు పుట్టినంతలో నొరిగినది లేదు. మన మతసంఘాచారములయందు పుట్టవలయును. వాడూ మన దేశస్థుడు.”

(సశేషం)

 

 

 

ధర్మారావులో ఒక ‘అపరిచితుడు’

 

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-5

 

sudrarsanamదుఃఖించే మనిషిని చూడండి. అప్పుడతని, లేదా ఆమె ముఖకవళికలను చూడండి. దుఃఖం కళ్ళను తడిపి, ఆ తర్వాత, సృష్ట్యాదినుంచీ తన లోపల గడ్డ కట్టిన  ఒక పెద్ద మంచుఖండం వేదనా విలయాగ్నికి కరిగి ఒక మహా ప్రవాహంలా మారి కళ్ళు అనే రెండు ఇరుకు బిలాలనుంచి ఒక్కుమ్మడి ముందుకు దూకడానికి ప్రయత్నిస్తోందా అన్నట్టు ఉంటుంది!

ఎప్పుడైనా, ఎవరిదైనా సరే దుఃఖం హఠాత్తుగా మనల్ని ఒక అలౌకిక జగత్తులోకి తీసుకుపోయి అస్తిత్వం తాలూకు అనాది ఆర్తారావాన్ని శబ్దంగానూ, నిశ్శబ్దంగానూ కూడా ధ్వనిస్తుంది.

ప్రతి దుఃఖం వెనుకా గొప్ప కారణం ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి దుఃఖమూ అర్థవంతం కావాల్సిన అవసరమూ లేదు. అమ్మతో అయిదేరాళ్ళ కుర్రాడు జనసమ్మర్దంలోకి వెళ్లినప్పుడు, అంతవరకూ పక్కనే ఉన్న అమ్మ, అంతలో కనిపించకపోతే భయవిహ్వలతతో బావురు మన్నప్పుడు కూడా ఆ దుఃఖంలో అస్తిత్వపు అనాది ఆర్తారావమే తళుక్కుమంటుంది.  కొత్తగా అత్తింటికి వెళ్ళే నవవధువు తల్లిదండ్రులను విడిచి వెళ్ళేటప్పుడు పడే దుఃఖం కూడా అలాంటిదే. బిడ్డ పోయినప్పుడు తల్లి, తల్లి పోయినప్పుడు బిడ్డ పడే దుఃఖం వీటికన్నా సహస్రాంశాలు పెద్దవిగా, అర్థవంతమైనవిగా మనకు అనిపించవచ్చు.  కానీ దుఃఖితుడిలో అలాంటి తేడాలు ఏవీ ఉండవు. ఆ క్షణంలో తన దుఃఖమే తీవ్రం. అందుకు దారి తీయించినదే గొప్ప కారణం.

దుఃఖానికి ఇంకొక విలక్షణ స్వభావం కూడా ఉంది. దుఃఖితుడు, అతని లోపాలోపాలు, దుఃఖకారణాలు, అందుకు సంబంధించిన తర్కవితర్కాలు సహా అన్నింటి నుంచి అది వేరుపడి స్వతంత్రను స్థాపించుకుంటుంది. అప్పుడా అశ్రుధార ఏ మాలిన్యాలూ అంటని స్వచ్ఛజలం. తన ‘పరమపావన వంశాన్ని’ వెలగా చెల్లించి కొనుక్కున్న ‘కడజాతి’ ఇల్లాలు మరణించినప్పటి నిగమశర్మ దుఃఖం కూడా అంతటి స్వచ్ఛమే.

ఒక కోణం నుంచి చూస్తే గొప్ప అనుభూతి గాఢత నిండిన కవిత్వమూ, గొప్ప దుఃఖమూ విమర్శకు అతీతాలు. ‘వేయిపడగలు’ పేరుతో వేయి పుటల మీదుగా ప్రవహించినది, విశ్వనాథవారి అలాంటి మహాదుఃఖం. మహాకవితాత్మక దుఃఖం. అది గతించిన, గతించిపోతున్న ఒకానొక వ్యవస్థను గురించిన దుఃఖం. బహుశా అప్పటికి ఎంతోకాలంగా హృదయంలో సుడులు తిరుగుతున్న ఆ దుఃఖం ఒకానొక క్షణంలో కట్టలు తెంచుకుని ఇరవై తొమ్మిది రోజులపాటు ఏకబిగిని ప్రవహించి అక్షరరూపం ధరించి మహా శోకప్రవాహం అయింది. ఆ ప్రవాహపు ఉరవడిలో మనం ఉక్కిరిబిక్కిరవుతాం, అప్రతిభులమైపోతాం, మనకు తెలియని ఒకానొక అపూర్వ జగత్తులో …అనేకానేక సందేహాలు, విచికిత్సల మధ్య దిక్కు తోచని స్థితిలో కొట్టుకుపోతాం.

రచనాంతంలో, ‘ఏమి మిగిలింది?’ అని ప్రశ్నించుకున్న ధర్మారావుతో, ‘నేను మిగిలాను’ అని చిన్న అరుంధతి అంటుంది. ‘అవును. నీవు మిగిలితివి. ఇది నా జాతి శక్తి. నా యదృష్టము. నీవు మిగిలితివి’ అని ధర్మారావు అంటాడు. కానీ, పుస్తకాన్ని మూసేసి,  ఇంతకీ రచన ఏం చెప్పిందని సవిమర్శకదృష్టితో ప్రశ్నించుకునే పాఠకునికి ధర్మారావుకి లభించిన సంతృప్తి లభిస్తుందా అంటే సమాధానం దొరకదు.

ఒక కారణం, రచన పరిణామశీలాన్నే నిరాకరించడం. రచయిత చిత్రించినది, కాంక్షించినది ఎటువంటి మార్పులకూ, కొత్తదనానికి చోటివ్వని…కాలంలో ఘనీభవించిపోయిన ఒక వ్యవస్థను! రచన చివరిలో ఇలా అంటాడు:

“ఆహా! ఏమి కాలము!  ఏమి మార్పు! ఎన్నెన్ని ప్రాతవి నశించిపోయినవి? ఎన్నెన్ని క్రొత్తవి తలచూపినవి! లోకమంతయు నూత్నత్వము శక్తి యనుకొనుచున్నది. నూత్నత్వము నూత్నత్వమే కానీ శక్తి యెట్లగును? కొత్తలో గాడిదపిల్ల కూడ కోమలముగానే యుండును. ఆహా! ఎంత నశించిపోయినది? నశించిపోయినదానిని చూచినచో కడుపు తరుగుకొని పోవుచున్నది. ఈ నశించిన దంతయు వ్యర్థమై తేజోరహితమైనదైనచో దుఃఖము లేదు. నా జాతి యింత దైవోపహతమైన దేలకో? ఈ జాతి చేసిన పాపమున కంతులేదు కాబోలు!”

నిత్య పరిణామానికి సాక్షులుగా ఉండి, దానిని సహజంగా తీసుకుని, పాత, కొత్తల మధ్య ఒక సమన్వయానికి నిరంతర సాధన చేసే జనాలముందు పై వాక్యాలు ముందుకీ, వెనక్కీ కూడా  వెళ్లలేని ఒక అడ్డుగోడను రెండు వైపులా నిర్మిస్తాయి. అయోమయాన్ని కల్పిస్తాయి. విశ్వనాథవారు లక్షించిన వ్యవస్థే కానీ, మరొక వ్యవస్థే కానీ ముందు వెనకల ఎలాంటి పరిణామసూత్రమూ  లేకుండా స్వయంభువుగా అవతరించి అలా ఉండిపోయిందా అని ప్రశ్నించుకున్నప్పుడు రచనలో సంతృప్తి కరమైన సమాధానం దొరకదు.

రచయిత లక్ష్యం స్పష్టమే. చాతుర్వర్ణ్యవ్యవస్థను అత్యంత వైభవోపేతంగా, ఆదర్శప్రాయంగా చిత్రించడం. నాలుగు వర్ణాల వారూ ఎవరి ఎవరి వృత్తి ధర్మాల పరిధిలో వారు ఉంటూనే దేవాలయం, దైవభక్తి కేంద్రంగా పరస్పర ప్రేమాభిమానాలతో హృదయైక్యతతో ఉండడం. ఇందులో పంచములకు స్థానం లేదు. అయితే, ఈ వ్యవస్థకు కాల్పనికప్రపంచంలో ఉన్నంత ఉనికి వాస్తవిక ప్రపంచంలో కనిపించదు. అందుకు తగినట్టే ఇందులోని పాత్రలు రామేశ్వరశాస్త్రి, ధర్మారావు, కృష్ణమనాయుడు, రుక్మిణమ్మారావు, సరోజిని, హరప్ప, గిరిక, గణాచారి, పసిరిక, రంగాజమ్మ, రత్నగిరి మొదలైన పాత్రలు కాల్పనిక ప్రపంచజీవులుగా, అతి మానుషులుగా కనిపిస్తారు. పెళ్లై అత్తింటికి వచ్చిన ధర్మారావు భార్య పెద్ద అరుంధతిని కూడా ఆశ్చర్యచకితం చేసిన అతిమానుష స్వభావం వారిది.  ధర్మారావు మిత్రులు కిరీటి, సూర్యపతి, కుమారస్వామి, రాఘవరావు తదితరులు, మంగమ్మ  వాస్తవిక ప్రపంచానికి చెందిఉంటూనే ధర్మారావుకు చెందిన అతిమానుష కాల్పనిక జగత్తుపట్ల సానుకూలతను, ఆరాధనాభావాన్ని చాటుకుంటూ ఉంటారు. రాధాపతి, చక్రవర్తి, పత్రికాసంపాదకుడు వామనరావు తదితరులు  ఆ భావజాలానికి ప్రతివాదులు. కుమారస్వామి అయితే ధర్మారావుకు విస్తరిత రూపమే. ధర్మారావులోని భావతీవ్రతే అతనిలోనూ ఉన్నా, ధర్మారావు ఉగ్రతను శాంతం కప్పి ఉంచితే కుమారస్వామి ఉగ్రత నేరుగా వ్యక్తమవుతుంది. కుమారస్వామి అని పేరుపెట్టడంలో దేవతల సేనాని అయిన కుమారస్వామిని రచయిత దృష్టిలో ఉంచుకున్నట్టు అనిపిస్తుంది. చివరిలో చిన్న అరుంధతిని పెళ్లాడిన ఘట్టంలో ధర్మారావుకి శివునితో సామ్యం కనిపిస్తుంది.

viswanatha

రామేశ్వరశాస్త్రి, కృష్ణమనాయుడు, రుక్మిణమ్మారావు, సరోజిని తదితర పాత్రలను అలా ఉంచితే; నవలలో దాదాపు చివరివరకు జీవించిన గిరిక, గణాచారి, పసిరికలు పూర్తిగా అతిమానుషప్రపంచంలోనే ఉండిపోతారు. ధర్మారావు ఒక్కడే అతిమానుష, వాస్తవిక ప్రపంచాలకు మధ్య లంకెగా ఉంటూ, వాటి మధ్య పరిభ్రమిస్తూ, రెండింటి తారతమ్యాలను అడుగడుగునా వివేచించుకుంటూ  గడుపుతాడు. అతని స్థితిని రచయితే ఇలా చెబుతాడు:

“ధర్మారావునకు రెండు జగత్తులు. ఒక జగత్తులో మూకీభావము. మరొక జగత్తులో అనియత వాగ్వ్యాపారము. ఒక జగత్తు దివ్యము, ఒక జగత్తు భౌమము. భౌమములో అతి భౌమము. ఒకటి పునీతము, ఒకటి ఇంద్రియ పరాభూతము. దివ్యమునుండి భౌమమునకు వచ్చుట ఎంత కష్టమో, దీనినుండి దానికి పోవుటయు అంతే కష్టముగా నున్నది. సెలవులు వచ్చినచో గణాచారి, దేవదాసి, పసిరిక, అరుంధతి! సెలవులు లేనిచో కిరీటి, శివరావు, కళాశాల”.

దివ్యజగత్తులో గడిపే ధర్మారావుకు భౌమ(భూసంబంధమైన)జగత్తులో గడిపే ధర్మారావుకు మధ్య ఎంతో వ్యత్యాసం. భౌమ జగత్తులో గడిపే ధర్మారావు పాఠకులు హృదయాలపై గాఢంగా ముద్రపడతాడు. ఈ జగత్తులో అతను నిరహంకారి, నిగర్వి, గొప్ప మానవీయత కలిగినవాడు, వ్యక్తిత్వమూ, శీలమూ, స్వాభిమానమూ, స్నేహశీలమూ ఉన్నవాడు. వాటితోపాటు కొన్ని లౌకికమైన బలహీనతలూ ఉన్నవాడు. అతని స్నేహశీలాన్ని, మానవీయతను, కృతజ్ఞతను వెల్లడించే హృద్యమైన ఘట్టాలు నవలలో అనేకం ఉన్నాయి. మిత్రుడు రాఘవరావు భార్య మశూచితో చనిపోయినప్పుడు, అంతిమ సంస్కారానికి ఎవరూ సాయపడనప్పుడు; ధర్మారావు, అతని మరో మిత్రుడు సూర్యపతి స్వయంగా శవాన్ని శ్మశానికి తీసుకెళ్లి పాతిపెట్టిన ఘట్టం వాటిలో ఒకటి. అలాంటిదే జేబుదొంగ అయిన ఆసిరి అనే కుర్రవాడిని ఆదరించిన ఘట్టం. నాయర్ అనే ఒక దుకాణదారు తన అవసరానికి రెండు రూపాయలు ఇచ్చి ఆదుకున్నప్పుడు, తన చేతిలో డబ్బు పడీపడగానే అతని బాకీ తీర్చడానికే ధర్మారావు  తొలి ప్రాధాన్యం ఇస్తాడు. తీరా అతని దుకాణానికి వెడితే, అతను తీర్థయాత్రలకు వెళ్ళినట్టు తెలిసి ఎంతో నిరాశ చెందుతాడు. ఇది అతనిలో కృతజ్ఞతాబుద్ధిని చూపుతుంది.  అతను అనుభవించిన పేదరికం మన మనసుల్ని మెలిపెడుతుంది.

లౌకికంగా అతను కూడా అందరూ ఎదుర్కొనే సాంసారిక సమస్యలు ఎదుర్కొంటాడు, డబ్బు కోసం ఇబ్బంది పడతాడు. ఇంగ్లీషు చదువుతాడు. ఉద్యోగం కోసం ఆరాటపడతాడు. ఒక యవ్వనవంతుడిలో ఉండే సహజమైన వాంఛలు అతనికీ ఉంటాయి. మళ్ళీ తను కూడా అందరిలానే ప్రవర్తిస్తున్నానే అన్న స్ఫురణా ఉంటుంది. తన కార్యానికి తానే వందరూపాయలు పుట్టించుకుని అత్తవారింటికి వెడతాడు. వెళ్ళే ముందు దేవాలయానికి వెళ్ళి శివపార్వతులను చూసి, శివుడికే సంసార జంజాటం తప్పనప్పుడు తనెంత అనుకుంటాడు. ‘ధర్మారావు సగము విరాగి, అతనిలో వైరాగ్యమెంతయో లాలసత యంత’ అని రచయిత అంటాడు. అయితే శోభనం గదిలో పడక మీద భార్య సరసన ఉండి కూడా అతను దైవచింతనలోకి జారుకోవడం కొంత విపరీతంగా అనిపిస్తుంది. అది రక్తికే కానీ, భక్తికి సందర్భం కాదు. అతనిదా వయసూ కాదు. నవలలో విశేషంగా ఆకట్టుకునే వాటిలో ఒకటి, దాంపత్య శృంగార చిత్రణ. దానిని విశ్వనాథ అంత అందంగా, హృదయదఘ్నంగా చిత్రించినవారు మరొకరు లేరేమో ననిపిస్తుంది.

ఇదే ధర్మారావులో కొన్ని ఇతర లక్షణాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది విశ్వనాథ వాస్తవికతను అనుసరించిన ఫలితం కావచ్చు. ఎవరితోనైనా వాదించేటప్పుడు ధర్మారావు ఆవేశపడతాడు. అదే సమయంలో తాను ఆవేశపడుతున్నానన్న స్పృహ అతనిలో ఉంటుంది. అలాగే, సారంగధర నాటకానికి వెళ్లినప్పుడు ఒకవైపు నాటకం జరుగుతుండగానే తనూ, కుమారస్వామి అందులోని పాత్రధారులపై, వారి ఆహార్య, అభినయాలపై వ్యాఖ్యలు చేస్తారు. అది పక్కవారికి ఇబ్బందికరమన్న చిన్న విషయం ధర్మారావుకు స్ఫురించదు. ఒక ప్రేక్షకుడు దానిని ప్రశ్నించినప్పుడు కోపం పట్టలేకపోయిన ధర్మారావు తెలిసిన ఒక రౌడీని అతనిపైకి పురిగొల్పుతాడు.

ఇక ధర్మారావు, అతని భావజాలం… అదొక విచిత్ర సంబంధం. ధర్మారావు వ్యక్తిగత లౌకిక ప్రవర్తనలో  వక్రత, సంకుచితత్వం, అమానవీయత, అహంకారం  లేవు. కానీ అతను త్రికరణశుద్ధిగా విశ్వసించే భావజాలంలో అవి ఉన్నాయి.  భావనాత్మకంగా, లేదా సిద్ధాంతపరంగా చెప్పుకుంటే  ఆ భావజాలంలోనూ వక్రత, సంకుచితత్వం, అమానవీయత లేవు. కానీ ఆ భావజాలపు లౌకికప్రతిఫలనంలో ఉన్నాయి. వ్యక్తిగా ధర్మారావులో ఆధిక్యభావన, కింది కులాలపట్ల వివక్ష, ఇతర జాతులపట్ల తృణీకారభావం లేవు. కానీ భావజాలం దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ వ్యక్తమవుతాయి. అవి కూడా వాస్తవానికి ఆ భావజాల నిర్మాణంలో ఉన్నాయి. సనాతనధర్మం, హిందూ వ్యవస్థా ధర్మం అనేవి ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వం ద్వారా దృశ్యమానమవుతున్నాయని సుదర్శనంగారు అన్నారు కానీ వాస్తవానికి వాటిలోని వక్రత, సంకుచితత్వమే ధర్మారావులో దృశ్యమానమవుతున్నాయని భావించడం న్యాయం. మనకిప్పుడు బాగా తెలిసిన ఒక పోలికతో చెప్పాలంటే, ధర్మారావు, అతని భావజలాల సంబంధం ‘అపరిచితుడు’ సినిమాలో హీరో తరహాలో ఉంటుంది.

ఆ భావజాలానికి కాల్పనిక జగత్తులో ఉన్న ఉనికి లౌకిక జగత్తులో లేకపోవడం ఈ వైరుధ్యానికి కారణం. అందులో ప్రాధాన్యం వహించే చాతుర్వర్ణ్యవ్యవస్థ అందరినీ ఇముడ్చుకోగలిగినంత వైశాల్యం కలది కాదు. పంచములకు, మతేతరులకు, విజాతీయులకే కాదు సరికదా; దేవాలయం కేంద్రంగా ఉన్న ఆ వ్యవస్థలో, చాతుర్వర్ణ్య వ్యవస్థలోనే ఉన్న నాస్తికులకు కానీ, ఆ వ్యవస్థను ప్రశ్నించేవారికి గానీ స్థానం ఉండదు. ఆవిధంగా అది ఇరుకుగానే కాక, నిరంకుశంగా కూడా మారుతుంది. దేవాలయాన్ని, దేవుడినీ, మతాన్ని వ్యక్తిగతం చేసి; భిన్న ప్రాతిపదికపై అందరినీ కలిపే ఏర్పాటుకు అందులో అవకాశం లేదు. ఆ వ్యవస్థలోని మూసుకుపోయిన లక్షణమే ధర్మారావు ఆలోచనల్లోనూ మాటల్లోనూ వ్యక్తమవుతూ ఉంటుంది. అతని దృష్టిలో తన దేశానికి, మతానికి, సంప్రదాయానికీ, సాహిత్యానికి, శాస్త్రాలకూ చెందినవన్నీ గొప్పవే; అందులో చెడు ఉండడానికి అవకాశమే లేదు. ఇతరుల మతాలలో, సంప్రదాయాలలో, సాహిత్యంలో అతనికి అన్నీ లోపాలే కనిపిస్తాయి. ఈ రకమైన అతని తారతమ్య వివేచనలో అక్కడక్కడ అర్థవంతమైన, లోతైన భావాలు కనిపించినప్పటికీ ఆ వివేచన  చాలాచోట్ల అశాస్త్రీయంగానూ, హాస్యాస్పదంగానూ పరిణమిస్తుంది. అతను వర్ణభేదం, జాతిభేదం రక్తంలోనే ఉన్నాయని అంటాడు. ఇతర జాతులలోని చెడును విమర్శించేటప్పుడు అలాంటిదే స్వజాతిలోనూ ఉన్న విషయాన్ని విస్మరించి ఆ చెడును ఆ ఇతర జాతి మొత్తానికే ఆపాదిస్తాడు. ఉదాహరణకు, బ్రాహ్మణ యువతి అయిన మంగమ్మ కూడా డబ్బు మీద ఆశతో రామేశ్వరం అనే బ్రాహ్మణేతరునితో సంబంధం పెట్టుకుంటుంది. అలాగే డబ్బుకోసం జమీందారు రంగారావును పెళ్లాడిన ఆంగ్లేయయువతి శశిని చర్య మాత్రం ఆ జాతి స్వభావంగా  కనిపిస్తుంది. లౌకికంగా హృదయవైశాల్యం ఉన్నవాడిగా  కనిపించే ధర్మారావు భావజాలం దగ్గరికి వచ్చేసరికి కరడుగట్టి కనిపిస్తాడు.  జాతిమతవర్ణభేదాలను ఎత్తి చూపుతూ మనుషుల్ని ఎక్కడిక్కడ చీల్చి తనను ఆధిక్యస్థానంలో నిలుపుకుంటాడు. ఇందులో పరవిమర్శే తప్ప ఆత్మవిమర్శ తక్కువగా ఉంటుంది.

veyi

ఆధునికమైనవీ, నేడు ప్రగతిశీలకంగా భావించే వాటిని అన్నిటినీ ధర్మారావు మూలమట్టంగా వ్యతిరేకిస్తాడు. అతని దృష్టిలో బాల్యవివాహాలే మంచివి. పంచములు దేవాలయంలోకి రాకూడదు. విద్యుద్దీపాలకన్నా ఆముదం దీపాలే శ్రేష్టం. పర్యావరణం గురించి, ప్రకృతిపట్ల ఆనుకూల్యత గురించి అతని ముఖంగా, లేదా ఇతర పాత్రల ముఖంగా  రచయిత చెప్పే అనేక విషయాలు అర్థవంతంగా ఆలోచనీయాలుగా  కనిపిస్తాయి. అయితే పరిణామగతిలో కొంత మంచితో పాటు చెడూ కొత్తగా వచ్చి చేరుతూ ఉంటుందనీ, ఆ చెడును తొలగించే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉండాలన్న స్పృహకు బదులు; అసలు పరిణామశీలాన్నే వ్యతిరేకించి గతంలోనే ఘనీభవించాలన్న ఒక అసహజమైన, సృష్టి వ్యతిరేకమైన ధోరణి వ్యక్తమవుతూ ఉంటుంది.

ధర్మారావులో ప్రశ్నను, విమర్శను కూడా నిషేధించే వైఖరి కనిపిస్తుంది. భార్య అరుంధతి తన మామగారు రామేశ్వరశాస్త్రి నాలుగువర్ణాల వారినీ పెళ్లి చేసుకోడంగురించి, ఆయనకు రత్నగిరి అనే భోగం స్త్రీవల్ల కలిగిన దేవదాసి గిరిక గురించి ఎత్తినప్పుడు అతనికి కోపం వస్తుంది. ఆ ప్రస్తావననే అతడు నిషేధిస్తాడు. ప్రశ్నకన్నా విశ్వాసమే అతని ఆలోచనాసరళికి కేంద్రబిందువు అవుతుంది.

అసలు ధర్మారావుకు ఆదర్శప్రాయమైన ఆ వ్యవస్థ అంత ఆదర్శవంతంగానూ ఎప్పుడైనా ఉనికిలో ఉందా అని ప్రశ్నించుకుంటే దానికీ సమాధానం దొరకదు. ఆ వ్యవస్థకు తనలానే మొత్తం బ్రాహ్మణ్యమంతా ప్రాతినిధ్యం వహిస్తోందా అంటే, మంగమ్మ భర్త, ఉపాధ్యాయుడు అయిన జోశ్యులు తన వ్యక్తిత్వాన్ని చంపుకుని తాలూకా బోర్డు అధ్యక్షుడైన రామేశ్వరం ప్రాపు కోసం ఎందుకు పాకులాడతాడు? తన భార్యను అతను లొంగదీసుకునే పరిస్థితిని ఎందుకు కల్పిస్తాడు? మంగమ్మ డబ్బు మీద ఆశతో ఎందుకు కాలుజారుతుంది? ధర్మారావు అత్తగారివైపు వారు కూతురిపట్ల అంత నిర్దయగా, ధర్మవిరుద్ధంగా ఎందుకు వ్యవహరించారు? రామేశ్వరశాస్త్రి మంచి స్థితిలో ఉన్నప్పుడు అతని వల్ల లాభపడిన బంధువులు అతను చితికిపోగానే ఎందుకు మొహం చాటేశారు?

కనుక ధర్మారావు తను లక్షించిన ఆ వ్యవస్థకు ప్రతినిధి తనొక్కడే తప్ప, సాటి బ్రాహ్మణ్యం తోడు కూడా అతనికి లేదు. మరి బ్రాహ్మణ్యం ఇలా ఎందుకు దిగజారింది అంటే అందుకు కారణం పరాయి పాలన, పాశ్చాత్యపు పోకడలని ధర్మారావు చెప్పగల సమాధానం. అసలు అంత గొప్ప వ్యవస్థ పరాయి పాలనకు, పాశ్చాత్యపు పోకడలకు ఎందుకు అవకాశమిచ్చింది; ముందే తను దిగజారడం వల్ల అలా జరిగిందా, లేక అది జరిగినందువల్ల తను దిగజారిందా? ఏది ముందు, ఏది వెనక? అన్న ప్రశ్నలకూ సమాధానం దొరకదు.

(సశేషం)

 

 

 

 

ఓ బంగారు ‘కుట్టపాయ్’ కథ

 

 mahy

‘మాహీ’ నా తొమ్మిదేళ్ళ బుజ్జి ఫ్రెండ్. పక్కింటి బీహారీ పిల్ల. ఇంటి తలుపులు ఎప్పుడూ తీసే ఉంచుతాను. ఈ చిన్న సీతాకోకచిలక స్కూల్ లేని టైంలో బుద్ధి పుట్టినప్పుడల్లా నా మీద వచ్చి వాలుతూ ఉంటుంది.  టాటాస్కై చానెల్ లో వస్తున్న ‘ఓట్టాళ్’ మలయాళీ సినిమా చూస్తున్నాను. వచ్చి వాలింది మాహీ. కూచోబెట్టి సినిమా చూడమన్నాను. కుర్చీ తెచ్చుకుని కూర్చుంది బుద్ధిగా.

ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ అంటూ ఓ చానెల్ కి పేరు పెట్టి 2015లో వచ్చిన కొన్ని మంచి సినిమాలు వేస్తోంది టాటాస్కై. ఇంతకుముందు దూరదర్శన్ చేసేపనిని చేస్తోందన్నమాట.

‘ఓట్టాళ్’ అంటే అర్థం ‘చేపల్ని పట్టే బుట్ట’ అని. ఇదేదో 70ల్లో వచ్చిన ఆర్ట్ ఫిల్మ్ లా ఉన్నట్టుందిలే, మాహీ తితిలీ రెక్కలు విదిలించి లేచెళ్లిపోతుందని అనుకుంటూనే ఉన్నా, ఇంతలోనే నన్నూ మాహీని బుట్టలో పెట్టేసింది ఆ సినిమా. బుద్ధిని కాదు. మనసుని నిజాయితీగా స్పర్శిస్తోంది ‘ఓట్టాళ్’.

‘వాంకా’ కథ ఏంటన్ చెకోవ్ ది.  వాంకా అనే ఒక చిన్న పిల్లవాడు తన తాతకు రాసిన ఉత్తరం అది. తాత అతన్ని మాస్కోలో ఒకరింట్లో పనికి పెడతాడు. అక్కడ వాళ్ళు తనను పెట్టే హింస అంతా వివరిస్తూ తనను ఇంటికి తీసుకుపొమ్మని ఏడ్చుకుంటూ వాంకా పల్లెటూళ్ళో వున్న తాతను బతిమాలుతూ రాసిన ఉత్తరం ఆ కథ.  చివరకు అడ్రెస్ రాయాల్సిన చోట ‘To my grandfather, The village’ అని రాసి కొంచెం ఆలోచించి తాత పేరు కూడా రాసి పోస్ట్ డబ్బాలో వేసేస్తాడు. మనుషుల అడ్రెస్ లెలా ఉంటాయో తెలియని అమాయకపు పిల్లగాడు వాడు. ఆ రాత్రి నిద్రపోతూ తాత తన ఉత్తరాన్ని చదువుతోన్నట్టు కలగంటూవుంటాడు. కథంతా చదివాక ‘అబ్బా, వీడిబాధ ఇక ఇంతేనన్నమాట’ అని నిస్సహాయతలో పడతాం.  చెఖోవియన్ టచ్…

mahy5

ఈ కథని కేరళకి లాక్కొచ్చి కుట్టనాడ్ నీలాల నీళ్ళూ, ఆకుపచ్చ పొలాలూ, అడుసునేలల మీద నిలబెట్టేడు దర్శకుడు జైరాజ్. (దేశాడనం, కలియాట్టం లాంటి సినిమాలుతో పేరు తెచ్చుకున్న జైరాజ్ ఇంకో సినిమా ‘వీరమ్’ ఈ డిసెంబర్ లో వస్తోంది. ప్రముఖుల సాహిత్యాన్ని సినిమాలు తీయటం ఈయనకు ఇష్టం). చెఖోవ్ కథకు పర్యావరణస్పృహనీ  కుట్టనాడ్ జీవనశైలినీ జోడించి ‘ఓట్టాళ్’ సినిమా తీశాడు జైరాజ్.  ఈ సినిమాలో వున్న తాతా మనవళ్ళ అనుబంధమంత బలంగా కనిపించదు చెఖోవ్ కథలోని వాళ్ళిద్దరి అనుబంధం.  కాకపోతే బాలకార్మికుల వ్యవస్థ నూటముప్ఫై ఏళ్ల కిందట చెఖోవ్ కథనాటికీ ఈనాటికీ మురికిగుంటలా ఊరుతూనే ఉంది.

కేరళ సాంప్రదాయనృత్య రీతులమీదా, సంగీతం, జానపద శైలుల మీదా ఆసక్తి ఉన్న జైరాజ్ ఈ సినిమాకి నాటకరంగ ప్రముఖుడూ కవీ అయిన కావలమ్ నారాయణ పణిక్కర్ ను సంగీతదర్శకునిగా తీసుకున్నాడు. తాతా మనవడూ విడిపోయే ముందు ఒక పాట వస్తుంది. బాధనంతా రంగరించి పణిక్కర్ ఆ పాట రాశారు. (ఆర్నెల్ల కిందటే పణిక్కర్ చనిపోయారు) ఆయనసంగీతం, పాటా తోనే సినిమాకు సగం ఆర్ద్రత వచ్చేసింది. మరింత తడిని అద్దింది సినిమాటోగ్రాఫర్ ఎం.జే.రాధాకృష్ణన్.  ఎంత బడ్జెట్ ఉన్నా ఎడిటింగ్ సూట్ దగ్గర రంగులన్నిటినీ  సాచురేషన్ బార్ చివరికి తీస్కెళ్ళి, ఆకుపచ్చరంగుకైతే  రేడియం అద్దినట్టుచేసి మన మొహాన గుద్దుతున్న  సినిమాలూ సీరియళ్ళనుండి పెద్ద రిలీఫ్ ‘ఓట్టాళ్’.  రేడియం ఆకుపచ్చ కాకుండా పచ్చనిఆకు రంగు దొరుకుతుంది ఈ సినిమాలో.  ఫిష్ ఐ లెన్స్ తో మనోహరమైన కుట్టనాడ్ భూమినీ నీళ్ళనీ వంచినా, బాతులమంద వంకీలు వంకీలుగా నీళ్ళమీద చేసే విహారాన్ని సరైన లెన్సింగ్ తో పట్టినా, ‘కుట్టపాయ్’ నల్లటి చిన్ని మొహంలోని కళ్ళమీది వెలుగుని ఇట్టే పట్టుకున్నా రాధాకృష్ణన్ అన్నిట్లోనూ లీనమై చేశాడు.

mahy2

పై ఫోటో రితు రాజ్ కన్వర్ (‘ది హిందూ’ ఫోటోగ్రాఫర్) అస్సాం వరదలప్పుడు 2014 లో తీసినది. ఈ ఫోటో చూశాకా ‘వాంకా’ కథను ఎలా తీయాలన్న విషయమై ఒక స్పష్టత వచ్చిందని అంటాడు జైరాజ్. తన సినిమాలో కూడా ఇలాంటి ఫ్రేమ్ ను తీయాలని అనుకున్నాడట. అలా కుట్టనాడ్ లోకి వచ్చిదిగింది ‘వాంకా’ కథ.

స.వెం. రమేశ్ ప్రళయకావేరి కథల్లాగా ‘ఓట్టాళ్’ కుట్టనాడ్ జీవనసరళిని గానంచేసే దృశ్యకావ్యం.  ఇది బాలల చిత్రం. పర్యావరణ చిత్రం. తాత్విక చిత్రం. ఇంకా మనిషిని ప్రకృతినుంచి లాక్కెళ్ళి ఎక్కడెక్కడో పరాయిచోట్లకి విసిరేసే అసమానతలనీ బీదరికాన్నీ, డబ్బుకోసం బాల్యాన్ని కాటేసే పాముల దౌష్ట్యాన్నీ  చూపించే చిత్రం.

చలం బెన్నూర్కర్ తీసిన తమిళ డాక్యుమెంటరీ ‘కుట్టి జపానిల్ కులందైగళ్’ (Children of mini Japan) శివకాశీ పరిశ్రమల్లో నైపుణ్యం లేని బండచాకిరీలు చేసి కునారిల్లే బాలకార్మికుల కథల్ని చెప్తూ బాధిస్తుంది. మీరా నాయర్ తీసిన ‘సలాం బాంబే’ చూస్తే ముంబై రెడ్ లైట్ ఏరియాలో కాలిపోతున్న బాల్యపు మొగ్గల కమురువాసన ఘాటుగా ఆవరించి చెమటలు పట్టిస్తుంది. ‘ఓట్టాళ్’ ఓ పక్క ప్రకృతితో మనల్ని ముడేస్తూనే మరోపక్క తెగిన బంధపువేళ్ళ తడిని కంటిమీదికి రప్పిస్తుంది.

mahy4

‘ఓట్టాళ్’ ని తీరికగా ఎక్కడా ఆగకుండా (టాటాస్కై అలాగే వేస్తోంది యాడ్స్ బాధ లేకుండా) కళ్ళకు నింపుకుంటూ చూడాలి. నెమ్మదైన జీవితవిధానానికి తగ్గట్టున్న విలంబిత లయ ఈ సినిమాది. ఎప్పుడూ గేలం వేసి ఒడ్డున కూచుని ఎదురుచూసే ఒక పరిచయస్తుడైన వృద్ధుడు “చేప పడటంలోనే కాదు. ఇలా కూచోడంలో కూడా ఆనందం ఉంది” అంటాడు కుట్టపాయ్ తో. ఎదురుచూడటాన్ని ఎంతమంది ఆనందిస్తున్నారిప్పుడు? కుట్టపాయ్ ఆయనతో ‘నేను చదువుకుని సిటీకి వెళ్లి చాలా సంపాదించి నీకో పెద్ద గేలం కొనిస్తా’ అంటే ‘చేపలు పట్టటానికి చిన్న గేలం చాలు. చిన్నగా బతికితే చాలు’ అని హితవు చెప్తాడు.

డెబ్భైఅయిదేళ్ళ ‘వలియప్పచ్చాయ్’(వాసుదేవన్) తొమ్మిదేళ్ళ కుట్టపాయ్ (ఆశాంత్ కె. షా)కి తాత. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకు చనిపోగా మిగిలిపోయిన కుట్టపాయ్ ని కుట్టనాడ్ తీసుకొచ్చి బాతులమందను సాకుతూ బతుకు లాగుతుంటాడు. ఆ ఊర్లోనే ఉన్న పెద్దింటి పిల్లవాడు టింకూ కుట్టపాయ్ తో స్నేహం చేస్తాడు.  అతని తల్లి కుట్టపాయ్ ని కొంత దయతో చూస్తుంటుంది. టింకూ తండ్రికి మాత్రం కుట్టపాయ్ ఓ అలగాజాతి పిల్లవాడంతే. తాతను సతాయించి చేపా రొయ్యా పట్టి, గిన్నె గరిటా కొనిపించి మరీ టింకూ కోసం వంట చేయిస్తాడు కుట్టపాయ్.  టింకూని భోజనానికి పిలవటానికని కుట్టపాయ్ వస్తే, ఎందుకొచ్చాడో కూడా తెలుసుకోకుండా ‘మిగిలిన తిండి వస్తువులేవో  వాడికిచ్చి పంపించు’ అని భార్యతో అనగలిగేంత బండమనిషి టింకూ తండ్రి.  కలువపూలూ, బాతులూ, వాటి గుడ్లూ, వాటిని పొదిగే కోడిపెట్టా, పేరులేని కుక్క (దానినలాగే పిలుస్తాడు కుట్టపాయ్), పడవలవాళ్ళ కోసం ఎత్తయిన కర్రచివర్న దీపంపెట్టే పరోపకారీ, ఎప్పుడూ ఓపిగ్గా గేలంవేసి ఎదురుచూసే మరో పండుముసలాయనా,  కుట్టనాడ్ లో ఎవరికీ ఉత్తరాలు రావని చెప్తూ సైకిల్ మీద తిరిగే పోస్ట్ మాన్,  తాత కల్లు తాగే అంగడీ… వీటన్నిటి మధ్య ప్రకృతి పాఠాలతోబాటు బాతుల్ని సాకటం నేర్చుకుంటూ బతికే కుట్టపాయ్ కొంచెం అల్లరీ, ఎంతో తెలివీ, మరెంతో సున్నితత్వం నింపుకున్న బంగారుతండ్రి. స్వేఛ్చగా కుట్టనాడ్ ఒడిలో ఆదమరిచి వున్న వాడి కొంపముంచే మాయరోగం తాత ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. చావుకి దగ్గరలో ఉన్న తనతర్వాత ఈ పసివాడిని చూసుకునేదెవరని బెంగపడ్డ వలియప్పచ్చాయ్ పాపం ఈ బుజ్జి బాతుపిల్లను, శివకాశీ పరిశ్రమకి పిల్లల్ని అమ్ముకునే పాము మాటలు నమ్మి, వాడితో పంపించేస్తాడు. ప్రశాంత ప్రకృతిలోంచి గాడీరంగుల ఇళ్ళతో నిండిన శివకాశీకి ఒక్కసారి కుట్టపాయ్ తో వచ్చిపడటం మనకీ ఎంత బాధో!  జైరాజియన్ టచ్…

mahy3

ఇంకేముంది? తను పడుతున్న బాధలు వివరిస్తూ ఉత్తరం రాసి పోస్ట్ డబ్బాలో వేస్తాడు కుట్టపాయ్. వాడు రాసిన అడ్రెస్,  “మా తాతకి, కుట్టనాడ్” అంతే.  ఆ రాత్రి నిద్రపోతూ తన ఉత్తరాన్ని తాత, టింకూ కలిసి చదువుతున్నట్టు కలకంటుంటాడు. ఆ కల నిజం అయిపోతే బాగుండును  …

“నా మనసులోని పిచ్చుక ఏడుస్తోంది.

పంటలైపోయాయ్, పండుగలైపోయాయ్.

మనసులోని పిచ్చుక ఏడుస్తోంది.

దేశదిమ్మరిదొర కలలపిట్టా

ఎక్కడికి పోయావ్? ఎటు తప్పిపోయావ్?

మనం ఒకర్నొకరు కనలేదూ ?

ఒకర్నొకరం వినలేదూ?

మనస్సలా చూస్తూనే ఉన్నా, మౌనం ఇంకా బద్దలుకాలేదు.

నా బాతులమంద లాగా

నేను చెదిరిపోయాను.

నేను చెదిరిపోయాను.

మీసాల కొసలు చెదిరిపోయాయ్.

పంపానది ఆత్మలోకి మాయమైపోయాయ్.

కదిలే నా తెడ్లు చెదిర్చిన నీటిలాగా నేనూ చెదిరిపోయాను.”    

తాత చెదిరిపోయాడు. మనవడు పట్నంపాలై పోయాడు.

“ఇలా బాలేదు ఆంటీ. తాత దగ్గరికి ఇంక వెళ్లలేడా?” అని బెంగగా వెళ్ళిపోయింది మాహీ.

(ఈ సినిమా టాటాస్కై ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ చానెల్ లో పదేపదే చూపిస్తున్నారు. ఇంగ్లిష్ సబ్స్ తో సహా)

పాట ఇక్కడ ఉంది.

 

 

విప్లవంలో స్వేచ్ఛా సమానత్వాల సాహచర్యం

karuna

 

‘విప్లవ రాజకీయాలు చదువుకున్నవారికి చేరాలంటే మార్గం సాహిత్యమే’ అని నమ్మి ఆచరించిన  ఆమె అసలు పేరు పద్మ. పదిహేనేళ్ళ వుద్యమ జీవితంలో అన్నీ వొదులుకొన్నట్టే సొంత పేరును కూడా వదిలేసింది. 1994లో తాయమ్మ కథ రాసి కరుణగా సాహిత్య లోకానికి పరిచయమైంది. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి పదేళ్ళు కావొస్తున్నా , అటు తర్వాత మరో ముప్ఫైకి పైగా కథలు రాసినా ఆ తొలి  కథే  కరుణకు చిరునామా అయ్యింది. ‘తాయమ్మ’ ఆమె యింటి పేరయ్యింది. ఆ కథ పొడవునా వున్న కఠోర జీవన వాస్తవికత పాఠకుల బుద్ధిని రాపాడితే , ముగింపులోని తాయమ్మ దు:ఖం మాత్రం  గుండెను మెలిపెడుతుంది.  కరుణ చిత్రించిన తాయమ్మ , కవులమ్మ , లచ్చుమమ్మ మొదలైన గ్రామీణ స్త్రీ  పాత్రలు మన కళ్ళముందు కదలాడే  నిజ జీవితంలోని వ్యక్తులే  కావడం వల్ల వాటికి యెంతో  సహజత్వం అబ్బి  పది కాలాలపాటు నిలచిపోయేలా రూపొందాయి. ఒక రచయిత పేరు చెప్పగానే వాళ్ళ రచనల్లోని పాత్రలు వెంటనే స్ఫురించడం ఆ రచయిత సాధించిన విజయంగానే భావించాలి.

విప్లవాచారణలో తలమునకలై  సాహిత్యం  గురించి తీరిగ్గా ఆలోచించటానికీ, నగిషీలు చెక్కటానికీ వీలులేని జీవితంలో – నిత్య నిర్బంధాల మధ్య అణచివేతల మధ్య  కథా శిల్పానికి  మెరుగులు దిద్దడానికి సరైన వనరులు అందుబాటు లేని పరిస్థితుల్లో , యెవరికైనా చదివి వినిపించి దిద్దుకోడానికి సైతం వెసులుబాటు దొరకని సందర్భం లో కథ పట్ల అందులో తాను చెప్పదల్చుకొన్న విషయం పట్ల వొక ప్రత్యేక శ్రద్ధ, దాని రూపం పట్ల కూడా అంతర్గతంగా వొక అదృశ్య స్పృహ వుండటం వల్ల కరుణ కథలు విప్లవ సాహిత్యంలో సైతం ప్రత్యేకగా నిలుస్తున్నాయి. సరళమైన నిరాడంబర శైలి ,   కథనంలో సూటిదనం స్వీకరించిన వస్తువునే కాదు;  రచయిత దృక్పథాన్ని సైతం దీప్తిమంతం చేస్తాయి అనడానికి కరుణ యిటీవల రాసిన ‘సహచరులు’ కథ చక్కటి వుదాహరణ(అరుణతార, మే 2016).

[కథ లింక్ : http://virasam.org/article.php?page=57  ; పే.20 – 26]

విప్లవోద్యమాల్లో స్త్రీపురుష సంబంధాల గురించి లోపలా బయటా యెన్నో సందేహాలు , అపోహలు. వాటిలో  పాలక వర్గాలు పనిగట్టుకొని చేసే దుష్ప్రచారం వొక యెత్తయితే , వుద్యమ భావజాలాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక వుద్యమకారుల నైతిక వర్తనపై బురద జల్లడానికి మరీ ముఖ్యంగా  పితృస్వామ్య విలువలతో స్త్రీల శీల హననానికి చేసే కువిమర్శలు మరో యెత్తు. ఇవి గాక కొన్నాళ్ళు వుద్యమ జీవితం గడిపి బయటకు వచ్చిన స్త్రీలు జెండర్ పరంగా విధాన నిర్ణయాల్లో , యితరత్రా తామెదుర్కొన్న వివక్షతల గురించి లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించిన అంశాలు కూడా సాహిత్యంలో విస్తృతమైన చర్చలకి కారణమయ్యాయి.

ఆ నేపథ్యంలో వుద్యమాల్లో నూతన మానవ ఆవిష్కరణ లక్ష్యంగా  వొకే మార్గంలో పయనించే క్రమంలో యిద్దరు స్త్రీ పురుషుల మధ్య యేర్పడే సాన్నిహిత్యం సాహచర్యంగా మారినప్పుడు ఆ బంధం యెంత బలంగా వుంటుందో స్వేచ్ఛా సమానత్వ భావనలతో యెంత ప్రజాస్వామికంగా వుంటుందో అతి సున్నితంగా ఆవిష్కరించిన కథ ‘సహచరులు’.

విప్లవోద్యమ జీవితంలో సహచరులకి కష్టాలే గానీ సుఖాలుండవు. సొంత సుఖాలపైకి వారి ఆలోచనలు పోవు. అడవిలో కేంప్ లో డెన్ లో యెక్కడ యెన్నాళ్ళుంటారో తెలీదు. ఎప్పుడు కలిసుంటారో యెప్పుడు విడిపోతారో తెలీదు. ఒకే దళంలో వున్నా ప్రశాంతంగా మాట్టాడుకొనే అవకాశమే చిక్కకపోవచ్చు. శత్రునిర్బంధంలో అసలుంటారో పోతారో తెలీని అభద్ర జీవితం. కార్యాచరణకి అనుగుణంగా  సహచరుల మధ్య ప్రేమనీ యెడబాటునీ పార్టీయే ఆదేశిస్తుంది. వారి వుద్వేగాల్ని ఆలోచనల్నీ జీవన గమనాన్నీ  వుద్యమావసరాలే నిర్దేశిస్తాయి. అనుక్షణం ప్రమాదాల  కత్తి అంచున నిలబడి కూడా సాహచర్యంలోని సాధకబాధకాల్ని అర్థంచేసుకున్న దీప అనిల్ అనే యిద్దరు వుద్యమకారుల జీవిత శకలాల ద్వారా విప్లవోద్యమాల్లో స్త్రీ పురుష సంబంధాలు వుద్వేగభరితంగా యెంత మానవీయంగా వుంటాయో యీ కథలో  కరుణ చాలా ‘ఆత్మీయం’గా పాఠకుల ముందుంచింది.

దీప, అనిల్ ఉద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తలుగా వచ్చాకనే సహచరులయ్యారు. దీప గ్రాడ్యుయేట్, అనిల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. పార్టీలోకి దీపకన్నా ఎనిమిదేండ్లు ముందు అనిల్ వచ్చాడు. అతను సెక్రటేరియట్ మెంబర్. ఆమె జిల్లా కమిటీ సభ్యురాలు. ఎవరి ఏరియాల్లో వాళ్ళు పని చేస్తున్నారు. పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం, ప్రేమ. ముఖ్యంగా దీపకు అనిల్ మీద గౌరవం.’ అతను ఆమెకి జీవితంలోనూ , వుద్యమంలోనూ వొక విధంగా మెంటర్ , మార్గదర్శకుడూ.  ‘అనిల్ దగ్గర ఉంటే దీప తల్లికోడి చుట్టూ తిరిగే పిల్లకోడే.’ రవికిరణం తాకిన పద్మమే. వారి మధ్య ఆధిపత్యాలకి తావులేదు.  అభిప్రాయాల్ని  పంచుకుంటారు. వాటిని పరస్పరం మన్నించుకుంటారు. డెన్ లో వుంటే యింటి పనులన్నీ ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. ఒకరి క్షేమం పట్ల మరొకరికి  లోలోపల వొక ఆతురత , కన్సర్న్.

అలా అన్జెప్పి వారి మధ్య వైరుధ్యాలు లేవని కాదు. ‘ఒకరికొకరు ఎంత అర్థమైనా కొన్నిసార్లు కొన్నిమాటలు ఇబ్బందిగానే ఉంటాయి. కాకపొతే ఆ ఇబ్బంది దీప అనిల్ ల మధ్య కొద్దిసేపే. పొరపాటును గుర్తించడం , క్షమాపణలు చెప్పుకోవడం .. లేదా క్షమాపణలు చెప్పుకోకున్నా లోపల బాధపడుతున్న విషయం ఇద్దరికీ అర్థమవడం …’  ఆ క్రమంలో వైరుధ్యాల్ని యే విధంగా పరిష్కరించుకుంటారన్నదే కథలో ప్రధానాంశం.

నిజానికి కథ వొక  వైరుధ్యంతోనే మొదలవుతుంది. అలా మొదలు పెట్టడంలోనే కథా నిర్మితిలో రచయిత పరిణతి తెలుస్తుంది. దళం నుంచి ‘సైడ్’ కి వెళ్ళినప్పుడు (అలా సైడ్ కి వెళ్ళాడానికి వుండే యిబ్బందుల్నీ దళ కమాండర్ కి తెలియజేయకుండా వెళ్తే  యెదురయ్యే ప్రమాదాల్నికూడా రచయిత కథలో ప్రస్తావించింది) వర్షంలో టెంట్ సరిగ్గా కట్టడం చేతకాలేదని  దీప అనిల్ పై విసుక్కుంటుంది. అక్కడనుంచి కథ గతంలోకి ప్రయాణం చేస్తుంది. రహస్య జీవితంలో వాళ్ళిద్దరూ నడిచిన తొవ్వలోకి రచయిత స్వయంగా మన చెయ్యిపట్టి యెటువంటి కుదుపూ లేకుండా నెమ్మదిగా  తీసుకెళ్తుంది.

అనిల్ మృదు స్వభావి. శారీరికంగా కూడా సున్నితంగా వుంటాడు. అంతర్ముఖుడు. పనిలో యెటువంటి వూగిసలాటా వుండదు. కేడర్ కు అతనంటే ప్రాణం. కేడర్ కి గానీ తన గార్డుకి గానీ పనులు చెప్పడు. నాయకత్వ స్థానంలో వుంటూ యెప్పటి కప్పుడు స్వయం విమర్శకి సిద్ధంగా వుండేవాడు.

దీపది బడాబడా మాట్లాడే స్వభావం. మాటల పోగు. మనసులో ఏదీ దాచుకోదు. కొద్దిపాటి అసహనాన్నైనా వెంటనే వ్యక్తం చేసేస్తుంది.  ఒక్కోసారి ‘పుసుక్కున మాట జారుతుంది.’ అసలు ‘లౌక్యం’ తెలీదు. ఆమెకు తన సహచరుడితో వీలైనంత యెక్కువసేపు గడపాలనీ మనసారా మాట్లాడాలనీ వుంటుంది.

కానీ అనిల్ కి ప్రేమని ప్రదర్శించడం రాదు. ఇంట్లో యిద్దరే వున్నా మాట్టాడేది తక్కువే. ఇక నలుగురిలోనో మూడో వ్యక్తి సమక్షంలోనో  భార్యాభర్తలుగా మెసలడానికి అతనికి యిష్టం వుండదు. మరీ ముడుచుకు పోతాడు. దీపతో కాసిన్ని మాటలు కూడా బందై పోతాయి. దాంతో చాలాసార్లు ఆమె నొచ్చుకుంటుంది. అవమానంగా భావిస్తుంది.  అతని యీ తత్త్వాన్ని యితరుల ముందు తనని లెక్కజేయనట్టు ప్రవర్తించే ‘మొగుడి అహంకారం’గా భావించి తప్పు పడుతుంది. ఒకసారి ఆ కారణంగా అనిల్ ఆమెని ‘బుద్ధిలేద’ని తిడడతాడు. బయట కుటుంబాల్లో స్త్రీ పురుషుల మధ్య వుండే  వుండే అసమ సంబంధాలని చూసి విసిగి  ‘వాటిని ఎదిరించి , మార్పును ఆశించి పార్టీలోకి వస్తే అక్కడా అదే పరిస్థితా’  అని ఆమె కోపించింది, బాధపడింది, దు:ఖించింది. ఆత్మాభిమానతో నిరసన ప్రకటించింది.  తన ప్రవర్తనకి అనిల్ సంజాయిషీ యిచ్చుకొంటే గానీ దీప శాంతించలేదు.

ఇటువంటి సంఘటనల్ని కేవలం మనస్పర్థగా భావించకుండా ఆత్మ విమర్శతో కుటుంబ సంబంధాల్లోని వైరుధ్యాల్ని అర్థంచేసుకొనే తమని తాము సవరించుకొనే ప్రయత్నం చేస్తారిద్దరూ. తమ ప్రవర్తనకి తాము పుట్టి పెరిగిన నేపథ్యాలెంత వరకు కారణమో విశ్లేషించుకుంటారు. అభివృద్ధి నిరోధకమైన భావజాలాన్ని వదిలించుకోడానికి సిద్ధంగా వుంటారు.  నిజానికి సహచరులు యిద్దరూ నిరంతరం యెంతో చైతన్యవంతంగా వుంటేనే గానీ వారి మధ్య అడపా తడపా చోటు చేసుకొనే వైరుధ్యాల్ని పరిష్కరించుకోలేరు.  అందుకు అవసరమైన పరిణతి కూడా వారికి వుద్యమభావజాలం నుంచే లభించిందని కథలో సూచ్యంగా పాఠకులకి తెలుస్తూ వుంటుంది. పురుషాధిపత్య భావజాలంతో నడిచే బయటి సమాజంలోని పరిస్థితికి భిన్నంగా ప్రగతిశీల శిబిరాల్లో స్త్రీ పురుష సంబంధాలు వుదాత్తంగా ఆదర్శవంతంగా వుంటాయనీ – వుండాలనీ రచయితకున్న బలమైన ఆకాంక్ష వొకటి కథ పొడవునా అంతస్సూత్రంగా కనిపిస్తుంది.

భార్య మెత్తగా ఉంటే భర్త ఆడించడం, భర్త మెత్తగా ఉంటే భార్య పెత్తనం చెలాయించడం … ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలనుకోవడం … ఒకరిని మరొకరు అణచాలని చూడటం. భార్యాభర్తల సంబంధం ఇల్లనే చిన్న రాజ్యంలో అధికారపీఠం కోసం జరిగే యుద్ధంలా’  పరిణమించడానికి గల కారణాల్ని తాత్త్వికంగా అన్వేషించే ప్రయత్నం కూడా కథలో చోటుచేసుకొంది.

భార్యా భర్తలు కూడా యెవరి స్వేచ్ఛా పరిధుల్లో వాళ్లుండాలనీ , భార్య అయినా భర్త అయినా ఎవరైనా కావచ్చు కొన్ని ‘గిరులు’ ఉండాల్సిందేననీ ,  ఆ గీతలు దాటితే ‘నేను చెప్పినట్టల్లా అవతలి వ్యక్తి వినాలి’ అనే వరకు వెళ్లి ఒకరిపై మరొకరి ఆక్రమణ ఆధిపత్యాలు చోటు చేసుకోవచ్చనీ , అది మొదలయ్యేది ప్రేమ పేరుతోనే  అనీ అనిల్ ముఖత: రచయిత చేసిన సూత్రీకరణలు వుద్యమ జీవితంలోనే కాదు స్త్రీ పురుష సమభావనలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేని  యే కుటుంబానికైనా అన్వయించుకోవచ్చు. possessiveness లోనే వొకరిపై మరొకరు అధికారాన్ని ప్రకటించే వైఖరి దాగి వుంటుందని మరోకోణాన్ని చూడగలం.

‘విప్లవకారుల్లో పరిమితులు దాటిన ప్రేమ ఏవిధంగా చూసినా అనర్థమే. ‘తామిద్దరే’ అనే స్పృహ వస్తే విప్లవోద్యమాన్ని వీడటానికి కూడా వెనుకాడక పోవచ్చు. లేదా సహచరున్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళలేని  స్థితి రావచ్చు. పార్టీలో భార్యా భర్తలిద్దరూ ఒకే దగ్గర ఉండటం అనేది అసాధ్యం.’

అనిల్ మాటల్లో భార్యా భర్తల సంబంధం కన్నా వుద్యమావసరాలూ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని బలమైన ధ్వని వుంది. లొంగుబాటుల కారణాల విశ్లేషణ వుంది. ఉద్యమకారులకి వుండాల్సిన  కర్తవ్య నిష్ఠ త్యాగ నిరతి కూడా అతని మాటల్లో వ్యక్తమవుతాయి. అదీగాక యెప్పుడు యెవరికి యేమౌతుందో తెలీని వుద్యమ జీవితంలో హద్దుల్లేని  ప్రేమ మంచిది కాదని అనిల్ ఆలోచన. సాన్నిహిత్యం పెరిగితే వుద్యమ కార్యాచరణలో అది ఆటంకంగా పరిణమిస్తుందేమోనని అతని భయం. అనిల్ ఆలోచనతో భయంతో  ఏకీభావం వున్నప్పటికీ   ‘ఎప్పుడో ఏమో అవుతదని ఉన్నంతకాలమూ మనసును కష్టపెట్టుకుంటూ ఉంటామా ?’ అని దీప వాదన.

జీవితం పట్ల ప్రేమాభిమానాల పట్ల స్త్రీ పురుషుల ఆలోచనల్లో సహజంగా వుండే తేడాని ఆవిష్కరించడానికి కరుణ కథలో యెంతో సున్నితమైన సన్నివేశాల్ని కల్పించింది.అనిల్ దీపల మధ్య యేకాంత సందర్భాల్ని చక్కగా వుపయోగించుకొంది. భావ వినిమయానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించింది. అందుకు యే మాత్రం కాఠిన్యానికి తావులేని మృదువైన  సంభాషణాత్మకమైన నిరాడంబరమైన శైలిని ఆశ్రయించింది.  కథాంశంలోని సంక్లిష్టతని కథచెప్పే పద్ధతిలోకి రానీయకుండా జాగ్రత్తపడింది.

సర్వసాక్షి కథనంలో రచయితే కథ చెప్పడంవల్ల అనిల్ దీపాల ప్రవృత్తిలోని మంచిచెడ్డల్ని, మనోభావాల్ని, బలాల్నీ బలహీనతల్నీ నిశితంగా విశ్లేషించగలిగింది. వారి అంతరంగాల లోతుల్ని తడమగలిగింది. సందర్భానుసారంగా వారి మాటల ద్వారా రాజకీయ సిద్ధాంత చర్చల్ని సైతం నడపగలిగింది. వారిద్దరి మధ్య సంభాషణలు సంవాదాలుగానో వివాదాలుగానో  పరిణమించకుండా వుద్వేగ ప్రధానంగా నడపడంలో గొప్ప సంయమనాన్ని ప్రదర్శించింది. కరుణ కంఠం దీపలో విన్పించకుండా తాటస్థ్యాన్ని పాటించింది. కానీ యిదంతా ఆమె అనుభూతిలోకి వచ్చిన విషయమేనని కథ చదువుతోన్నంతసేపూ  అనిపిస్తుంది.  జీవితాన్ని సిద్ధాంతాలతో గాక అనుభవాలతో వ్యాఖ్యానించడం వల్ల విప్లవోద్యమానికి చెందిన కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తూ కథ ఫ్రెష్ గా వుంది.

కరుణ స్వీయ వుద్యమ జీవితానుభవం నుంచే వచ్చిన కథ కావడం వల్ల ‘సహచరులు’ లో పార్టీ నిర్మాణంలో వుండే క్రమశిక్షణ గురించి దాన్ని పాటించడంలో వ్యక్తుల బలాబలాల గురించి లోటుపాట్ల గురించి , అడవిలోపల  దళాల కదలికల గురించి , బయట  డెన్  లో రహస్య పరిరక్షణ కోసం తీసుకొనే టెక్ జాగ్రత్తల గురించి పాటించాల్సిన  గోప్యత గురించి  ఆమె నిర్దిష్టంగా ప్రస్తావించిన అంశాలకు ప్రామాణికత లభించింది.    

ఆ క్రమంలో తాను నడిచి వచ్చిన వుద్యమాల బాటలో యెదురైన సవాళ్ళని చర్చకి పెట్టడానికి కూడా రచయిత్రి యెక్కడా వెనుకాడలేదు. పార్టీలో అమలయ్యే కేంద్రీ కృత ప్రజాస్వామ్య విలువల గురించి , పాత కొత్త ఆలోచనల మధ్య రేగే వైరుధ్యాల గురించి , దీర్ఘకాలిక ప్రజా యుద్ధం పట్ల నాయకత్వ స్థానంలో వున్న వారి తప్పుడు అవగాహన గురించి , క్రమశిక్షణ విషయంలో వైయక్తికంగా నాయకులు ప్రదర్శించే వుదార వైఖరి వల్ల కలిగే అనర్థాల గురించి , గ్రామాల నుంచి పట్టణాలకి వుద్యమ స్ఫూర్తి వ్యాపించాల్సిన అవసరాల గురించి దీపా అనిల్ ల మధ్య నడిచిన మాటలు సైద్ధాంతికంగా లోతుగా ఆలోచింపదగినవి. ఆ సందర్భంలో  ‘ఒక మనిషి జీవిత కాలంలో విప్లవ విజయాన్ని చూడాలి’   వంటి వ్యాఖ్యలు ప్రత్యేకంగా పరిశీలించాల్సినవి.

నిజమే అటువంటి బలీయమైన ఆశ వుంటేనే విప్లవాచారణలో స్థిరంగా నిలబడగల్గుతాం. కానీ రాజ్యాధికారమే అంతిమ విజయమైతే అది వొక మనిషి జీవిత కాలంలో సాధ్యం కావచ్చు – కాకపోవచ్చు. విప్లవ విజయాన్ని తమ జీవితంలో చూడలేక ఆచరణనే తప్పుబట్టే ప్రమాదం వుంది. అందుకే విప్లవాచారణలో స్వల్పకాలిక లక్ష్యాలనూ దీర్ఘకాలిక లక్ష్యాలనూ యెప్పటికప్పుడు నిర్వచించుకుంటూ ఫలితాల్ని మూల్యాంకనం చేసుకుంటూ ముందుకు సాగాల్సి వుంటుంది.

రహస్యోద్యమాల్లో పనిచేసే ఆడ మగా మధ్య లైంగిక విశృంఖలత్వం గురించి జరిగే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కథలో వొక సందర్భాన్ని రచయిత ప్రత్యేకంగా సృష్టించుకొంది. వస్త్వైక్యత చెడకుండా అది కథలో వొదిగి పోయింది. కథకి లోతుతో పాటు విస్తృతిని కల్గించింది. నిండుదనాన్నిచ్చింది.

స్త్రీ పురుషులు విచ్చలవిడి సంబంధాలకోసం  చావుకు సిద్ధపడి విప్లవం బాట పట్టాల్సిన అవసరం లేదనీ , నిజంగా అటువంటి సంబంధాలు పార్టీలో ఉంటే అందులో పడి కొట్టుకుపోతారు తప్ప విలువలకోసం  ప్రజల తరపున నిలబడి పోరాడలేరు – నిర్బంధాన్ని తట్టుకోలేరనీ చెబుతూ దీప అటువంటి ‘సంబంధాల కోసమైతే బయటే ఉండొచ్చుగా’  అని మరో మాట అదనంగా అంటుంది.

‘ఉద్యమంలో దోపిడీ పీడనల అంతం ఒక్కటే కాదు. పురుషుడికి మల్లే స్త్రీకి స్వేచ్ఛా సమానత్వం ఉండాలని కోరుతున్నామంటే అర్థం  …  అనైతిక సంబంధాల విషయంలో కాదు. దంపతీ వివాహం ఉన్నతమైందని పార్టీ నమ్ముతుంది. అమలు చేస్తుంది.  ఊహల్లో ప్రేమతో కాదు , నిజమైన ప్రేమతో సహచరులు కలిసి ఉంటారు.’ అని ఆమె ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్య గమనించదగింది.

పార్టీలో యెట్టి పరిస్థితుల్లోనూ అనైతిక సంబంధాల్ని అంగీకరించరని బలంగా చెప్పడమే  ఆమె వుద్దేశం. నిజానికి యే యిద్దరు స్త్రీ పురుషుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడినా వెంటనే వాళ్లకి పెళ్లి చేసేయడం కమ్యూనిష్టు వుద్యమాల్లో మొదటి నుంచీ వుంది. దీన్ని నైతికత విషయంలో భూస్వామ్య విలువల నుంచీ బయటపడక పోవడంగానే భావించే వీలున్నప్పటికీ బయటి వాళ్లకి వేలెత్తి చూపే అవకాశం యివ్వడం పార్టీకి కీడు చేస్తుందని వాళ్ళ నమ్మకం.

 విప్లవ పార్టీల రాజకీయ ఎజెండాలో స్త్రీల నిర్దిష్ట సమస్యలకి చోటులేకుండా పోతుందనే విమర్శకి కూడా రచయిత దీప ఆలోచనల ద్వారా సమాధానం చెప్పించి వుంటే బాగుండేది కానీ కథలో ఫోకస్ పాయింట్ పక్కకి పోయే ప్రమాదం వుంది. అది మరో కథకి వస్తువౌతుంది. కథ మాత్రమే చెప్పాలన్న స్పృహ కథా రచయితకి వుండటం వల్ల ప్రయోజనమిది.

 

దీప అనిల్ మధ్య మాటల్లో సాహిత్య విషయాలెన్నో చోటు చేసుకునేవి. నిజానికి మాటల్లో యెంతో పొదుపరి అయిన అనిల్ సాహిత్యం గురించి , సిద్ధాంతం గురించి మాట్టాడాల్సి వస్తే మాత్రం గొప్ప ప్రవాహ శీలి అయిపోతాడు. కథ గురించి అతనికి నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ‘ఎవరూ ఎన్నుకోని వస్తువుని ఎన్నుకున్నప్పుడే కథ నిలుస్తుందనేవాడు. వస్తువు పాతదాన్నే ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కొత్త ముగింపునో , కొత్త శైలినో ఎన్నుకోవాలి అనేవాడు. శిల్పం గురించి అవసరం లేదంటారు కానీ చెప్పే పధ్ధతి బాగుండాలి…’ కథలో వస్తు శిల్పాల ప్రాధాన్యాల గురించిన అనిల్ ఆలోచనలు రచయిత్రివే  ( వాటి వెలుగులో కరుణ కథల్ని ప్రత్యేకంగా  అధ్యయనం చెయ్యొచ్చు ).

అందుకే కథ ముగింపు విషయంలో కూడా కరుణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చివరికి సామరస్య వాతావరణంలో  ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ’ అని అనిల్ నవ్వుతూ అంటే  , ‘పితృస్వామ్యం నశించాలి’ అని దీప రిటార్ట్ యివ్వడంతో కథ ముగుస్తుంది. ఐక్యత – ఘర్షణ – ఐక్యత అన్న గతితార్కిక అవగాహనని అతి సున్నితంగా ఆవిష్కరించిన ముగింపు పెదాలపై నవ్వు పూయిస్తుంది. ఉద్యమాల్లోనే కాదు ; యెక్కడైనా స్త్రీ పురుష సంబంధాలు అసమానతలకీ ఆధిపత్యాలకీ తావులేకుండా సంతోషమయంగా వుంటే బావుంటుంది గదా అని అనుకోకుండా వుండలేం.

ఇప్పుడిహ  యిది యే అస్తిత్వ వాదానికి చెందిన కథో అని విమర్శకులు విద్యాత్మక పరిశోధనలు మొదలెట్టొచ్చు. ఇదంతా శత్రు వైరుధ్యమా మిత్ర వైరుధ్యమా అని తలలు బద్దలుకొట్టుకొనే వాళ్ళని వాళ్ళ  మానానికి  వొదిలేసి కరుణ తన యెరుకలోకి వచ్చిన  జీవితాన్ని కథలుగా మలిచే కృషిని యిలాగే నిరంతరం కొనసాగించాలని  కోరుకుంటున్నాను. విప్లవోద్యమ సాహిత్యానికి కరుణ లాంటి రచయితల అవసరం యెంతైనా వుంది.

 

 

 

డియర్ జిందగీ

zindagi

ఏక్టర్లు: అలియా భట్, షా రుఖ్ ఖాన్.
కేమియో పాత్రల్లో-కునాల్ కపూర్, అలీ జఫర్, అంగద్ బేదీ, ఈరా డూబే.
రిలీస్ తేదీ-నవెంబర్ 25, 2016.

రెడ్ చిల్లీస్, ధర్మా ప్రొడక్షన్స్, హోప్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద- గౌరీ షిండే దర్శకత్వంలో, గౌరీ ఖాన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా. కరణ్ జోహార్ కో-ప్రొడ్యూసర్.
లక్ష్మణ్ ఉతేకర్ ఫోటోగ్రాఫర్.

బాల్యంలో జరిగిన ఒక సంఘటనో, ఏదో అనుభవమో, పెద్దయ్యాక జీవితాలమీద ఏదో దశలో ప్రభావం చూపించకుండా ఉండదు. ఇది సామాన్యంగా ప్రతీ ఒక్కరూ, ఎప్పుడో అప్పుడు ఎదురుకునేదే. ఈ పాయింటునే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, తీసిన సినిమా ఇది.

కథ: సినిమా ప్రారంభంలో, క్రేన్ మీద కూర్చుని ఒక సీన్ షూట్ చేస్తూ కనిపించిన కైరా(అలీయా భట్ )-ఉర్ఫ్ కోకో 20లలో ఉన్న ఒక సినిమాటోగ్రఫర్. ముంబయిలో ఆమె గడిపే జీవిత విధానాన్నీ, ఈ తరపు యువత కష్టపడి పనిచేసి, అంతే ఉల్లాసంగా పార్టీలలో పాల్గొనడమూ అవీ చూస్తాం. కైరాకి జీవితంలో ఎంతో సాధించాలన్న ఆశ ఉంటుంది. కాకపోతే, వృత్తివల్ల పొందగలిగే సంతృప్తి దొరకదు. తనకి తారసపడిన యువకులతో ప్రేమలో పడుతూ కూడా, ఏ బంధానికీ కట్టుబడి ఉండలేకపోతుంది.
మొండి స్వభావం, ముక్కుమీదుండే కోపం. డిప్రెషన్‌కి గురై- స్నేహితులయిన ఫాతిమా, జాకీతోనే గడపడంతోనూ, ఈ బే లో షాపింగ్ చేయడంలోనూ ఓదార్పు వెతుక్కుటూ ఉంటుంది. బోయ్ ఫ్రెండ్‌కి ఇంకెవరితోనో ఎంగేజ్‌మెంటవుతుంది.

ముంబాయిలో, తనున్న అపార్టుమెంటులో పెళ్ళవని వాళ్ళని ఉండనివ్వనని ఇంటి యజమాని చెప్తాడు. వీటన్నిటివల్లా, ఇన్సొమ్నియక్‌గా తయారవుతుంది. దిక్కు తోచక, అయిష్టంగా, తల్లితండ్రులుంటుండే తన స్వంత ఊరైన గోవా వెళుతుంది. వాళ్ళతో సంభాషణ అన్నా, కలిపి ఉండటం అన్నా విముఖత. తన హోమోసెక్స్యువల్ స్నేహితుని మాట విన్న తరువాత, ఒక మెంటల్ అవేర్‌నెస్ కాన్ఫెరెన్సులో సైకోలొజిస్ట్ జహంగీర్ ఖాన్ (బ్రెయిన్ డాక్టర్- షా రుఖ్ ఖాన్, కైరా మాటల్లో-జగ్)మాట్లాడుతుండగా విని, అతని క్లినిక్కి వెళుతుంది.
ఒక థెరపీ సెషన్లో కోకో- తను బాల్యంలో అనుభవించిన వేదనా, నిస్పృహా, ఆశాభంగాన్నీ అతనికి వెల్లడిస్తుంది. తన చిన్నప్పటి అనుభవాలని బట్టి, వదిలివేయబడటం అంటే కలిగిన భయం వల్ల తానే ఏ బంధాన్నీ నిలుపుకోలేకపోతోందని జగ్ చెప్పి, కైరా తన తల్లితండ్రులని క్షమించనవసరం లేదు కానీ వారిని ఒక తప్పు చేసిన, సామాన్యమైన మనుష్యులుగా మాత్రం చూడమని సూచిస్తాడు.

ఈ సినిమాలో ఖాన్‌కీ, ఆలియాకీ ఈ సినిమాలో ఏ శృంగారపరమైన సంబంధమూ ఉండదు. కాబట్టి ఖాన్ సినిమా అనుకుంటూ చూద్దామని వెళితే కనుక, నిరాశకి లోనయే అవకాశం ఉంది.
“నీ గతం నీ వర్తమానాన్ని బ్లాక్‌మైల్ చేసి, అందమైన భవిష్యత్తుని నాశనం చేయకుండా చూసుకో” అన్న జగ్ సలహా ప్రకారం, కన్నవాళ్ళతో రాజీపడి ఎన్నాళ్ళగానో వెనకబడి ఉన్న తన షార్ట్ ఫిల్మ్ పూర్తి చేస్తుంది.
బీచ్ మీద తన జీవితంలో భాగం అయిన వారందరిముందూ ఫిల్మ్ స్క్రీన్ చేసినప్పుడు- వారిలో, త్వరలోనే తను ప్రేమలో పడబోయే ఆదిత్య రోయ్ కపూర్ కూడా ఉంటాడు.
నిజానికి, సినిమాకి ప్లాటంటూ ఏదీ లేదు. కథనం సాగేది కొన్ని సంఘటనల, కదలికల, భావోద్వేగాలవల్లే.

కైరాకి సినిమాటోగ్రఫీలో సామర్థ్యం ఉందని మొదటి సీన్లోనే చూపించినప్పటికీ, తన వృత్తిలో ఆమె పడే శ్రమకానీ ప్రయాస కానీ కనపడవు. నిజానికి, ఆమె ఆకర్షణీయమైన జీవితం గడుపుతున్నట్టుగా కనిపిస్తుంది. అందమైన అపార్టుమెంటూ, ఆర్థిక ఒత్తిడి లేకపోవడం, మద్దత్తుకి ఇద్దరు స్నేహితురాళ్ళూ, రొమాన్సుకి ముగ్గురు అందమైన అబ్బాయిలూ.

కైరా పాత్రకీ, ‘హైవే’ సినిమాలో చివర సీన్లలో ఆమె చూపిన కొన్ని లక్షణాలకీ బాగా పోలిక ఉంది. అవే అణిచివేయబడిన అనుభూతులూ, వేదనాభరితమైన జ్ఞాపకాలని వదిలిపెట్టి, ముందుకు సాగాలన్న సందేశాలూ. అయితే, దీనిలో మట్టుకు వీటిని చూసినప్పుడు మనకి అంత బాధ కలగదు.
ఖాన్ ట్రేడ్ మార్కులయిన శరీర భంగిమలు, పెదవి విరుపులూ అవీ ఈ సినిమాలో కనబడవు. సూపర్ స్టార్‌గా కాక, ఆలియా పాత్రకే ప్రాముఖ్యతని వదిలి, తను పక్కకి తప్పుకున్నాడు. పూర్తి ఫోకస్ ఉన్నది ఆలియా భట్ మీదనే.
గోవా వీధులూ, సముద్రం, ప్రామాణికతని కనపరుస్తాయి. ఆలియా వేసుకున్న బట్టల డిసైన్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఉంటాయన్నదాన్లో సందేహం ఏదీ లేదు.

పెద్ద హిట్ అయిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాని డైరెక్ట్ చేసిన గౌరీ షిండే, మరి ఎందువల్లో కానీ ఈ సినిమాలో అంత ఎక్కువ వ్యక్తీకరించలేకపోయిందనిపిస్తుంది.
2.5 గంటల నిడివి కొంచం ఎక్కువే అనిపించినప్పటికీ, 4 ఏళ్ళల్లోనే 10 సినిమాల్లో నటించి, ఆలియా ఒక ఏక్టర్గా ఎంత ఎదిగిందో అని చూడటానికి ఈ అదనపు టైమ్ వెచ్చించడం సమంజసమే.

అమిత్ త్రివేదీ సంగీతం తేలిక్గా ఉంది. ‘గో టు హెల్’ అన్న పాట, హర్టుబ్రేక్ తర్వాత కలిగే నొప్పిని చక్కగా వర్ణిస్తుంది. ‘లవ్యు జిందగీ’ పాట వింటే, జీవితాన్నీ అది కలిగించే అనుభూతులన్నిటినీ అంగీకరించాలనిపిస్తుంది. కౌశార్ మున్నీర్ లిరిక్స్ ఇంపుగా ఉండి, అర్జీత్ సింగ్ పాడిన ‘ఏ జిందగీ’’ పాట, ఇప్పటికే అందరి నాలికలమీదా ఆడుతోంది.

ఖాన్‌తో థెరపీ సెషన్స్ అయిన తరువాత తప్ప, కైరా చిరాకెందుకో మనకకర్థం అవదు. తన తల్లితండ్రులతో, బంధువులతో కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియదు.

ఒక యువతి అంతర్గత జీవితాన్ని ఇంత విశదంగా అన్వేషించిన బోలీవుడ్ సినిమాలు చాలా తక్కువ.
ఈ ఫిల్మ్ ఉద్దేశ్యం కేవలం ప్రేక్షకులకి ఒక కథ అందించడమే అనీ, ఏ సామాజిక సందేశాలనీ ఇవ్వడం కాదనీ షిండే, భట్, ఖాన్ ముగ్గురూ-ఇంటర్వ్యూల్లో చెప్పినప్పటికీ, ఈ మధ్యే కొంతమంది సెలెబ్రిటీలు తాము తమ డిప్రెషన్తో ఎలా పోరాడారో అని పబ్లిక్గా చెప్పిన వెనువెంటనే, మానసిక ఆరోగ్య థెరపిస్టులని విసిట్ చేయడం అంటే ఏ పిచ్చిలాంటిదో ఉన్నప్పుడే, అన్న భ్రమని డియర్ జిందగీ కొంతలో కొంతైనా తొలిగించగలుగుతుందేమో!

సినిమా చూసిన తరువాత ప్రతీ ఒక్కరికీ బి డి (బ్రెయిన్ డాక్టర్) అవసరం తప్పక ఉంటుందనీ, దాన్లో తప్పేమీ లేదనీ మనం అంగీకరిస్తాం.
ఒక సీన్లో, కైరా బోయ్ ఫ్రెండ్‌కి ఇంకెవరితోనో ఎంగేజ్‌మెంటయిందని స్నేహితురాలైన ఫాతిమా( ఇరా డూబే) చెప్పినప్పుడు, పచ్చిమిరపకాయొకటి కొరికి నమిలి మింగేసి, ఎగపీలుస్తూ, ‘అది మిరపకాయవల్లే’ అని ఫాతిమాతో అని, తప్పించుకుంటున్న ఆలియా మొహంలో చూపిన షాక్, అపనమ్మకం లాంటి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే, ఒక ఏక్టర్గా ఈ మధ్య తనకి ఇంత చిన్న వయస్సులోనే, ఇంత పేరెందుకు వస్తోందో అర్థం అవుతుంది.

ఇకపోతే, షిండే చాలా భారీ పాఠాలన్నిటినీ ఒకే స్క్రిప్టులో కూరడానికి ప్రయత్నించిందేమో అనిపించక మానదు.

కైరాని, ఆమె అంకుల్ తను ‘లెస్బియనా?’ అని అడగడానికి బదులు ‘లెబనీసా?’ అని అడగడం హాస్యం అనిపించదు.
సినిమాకి అతకకపోయిన కొన్ని ఇలాంటి చెదురుమదురు సీన్లు తప్పితే, డియర్ జిందగీ తప్పక చూడవలిసిన ఫిల్మ్.
*

 

 

మీటితే చాలు, పలికే మురళి!

balamurali

మంగళంపల్లి బాల మురళి గారు పరమపదించారు అన్న వార్త నేను కాకినాడలో మా ఇంటి ముందు వరండాలో వాలు కుర్చీలో కూచుని మా మామిడి చెట్టుని చూస్తూ  అమితమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో నాకు చెప్పిన ఆ మానవుడిని లాగి లెంపకాయ కొట్టాలనిపించింది. ఎందుకంటే అబద్ధాలాడే వారంటే నాకు అయిష్టం.

కానీ, వెనువెంటనే అప్పుడే వచ్చిన రోజు వారీ పత్రికలూ, నేను ఇండియాలో అరుదుగా చూసే టీవీల వలన ఆ వార్త  నిజమే అని తెలియగానే నా మనసు 1968, జనవరి మూడో వారానికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను బొంబాయి I.I.T లో M. Tech చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో మా కేంపస్ లో “స్వరాంజలి” అనే శాస్త్రీయ సంగీత అభిమానుల గుంపు ఉండేది. మహమ్మద్ షేక్ అనే అతను ప్రధాన నిర్వాహకుడు. సమస్య అల్లా.. ఆ గుంపు లో ఉన్న వారందరికీ భారతీయ శాస్త్రీయ సంగీతం అంటే కేవలం హిందూస్థానీ మాత్రమే. బెంగాలీ వారి రబీంద్ర సంగీత్, మరాఠీ వారి సంగీతం మొదలైన కచేరీలు కూడా ఏర్పాటు చేసే వారు..కానీ కర్నాటక సంగీతం అనగానే చిన్న చూపుతో ఒక్క కార్యక్రమం కూడా జరగ లేదు. అప్పటికి చాలా చిన్న వయసులో ఉన్న నా దృష్టిలో వారి అవగాహనా రాహిత్యం ఒక కారణం అయితే, కేంపస్ లో ఉన్న దక్షిణ భారతీయులు కొందరు బెంగాలీ, మరాఠీ, హిందూస్థానీ సంగీతాలని ఆస్వాదించడం ప్రగతి పథంలో పయనించి తమ విశాల దృక్పథం ప్రదర్శించుకోవడంగా భావించుకునే వారు. కర్నాటక సంగీతాన్ని పట్టించుకునే వారు కాదు.

సరిగ్గా ఆ తరుణంలో మంగళంపల్లి వారు సయాన్-మాటుంగాలో ఉన్న షణ్ముఖానంద వేదికలో కచేరీ చేస్తున్నారు అనే వార్త వచ్చింది. నేనూ, నా ఆప్త మిత్రులు భాగవతుల యజ్ఞ నారాయణ మూర్తీ,  పులపాక రామకృష్ణా రావు (గాయని పి. సుశీల తమ్ముడు) ఆ కచేరీకి టిక్కెట్లు కొనేసుకున్నాం. కానీ మా కేంపస్ లో విశ్వనాథన్ గారూ (చిట్టి బాబు సహాధ్యాయిగా మంచి వీణా విద్వాంసులు), AIR మొదటి గ్రేడ్ లో అద్భుతమైన గాయని నాగరాజ మణీ నటరాజన్, ఇతర కర్నాటక సంగీతాభిమానులూ పట్టుపట్టి “స్వరాంజలి” వారిని ఒప్పించి బొంబాయి IIT కేంపస్ లో మొట్టమొదటి శాస్త్రీయ కర్నాటక సంగీత కచేరీ…బాల మురళి గారిచే చేయించే ఏర్పాట్లు చేశారు.  ఐ ఐ టి లో అనగానే బాలమురళి గారు తక్షణం అంగీకరించారు.

కానీ ఒక సమస్య వచ్చింది. ఏ కారణానికో ఇటువంటి సంగీత కార్యక్రమాలు జరిగే “లెక్చర్ థియేటర్” అనే 300 మంది పట్టే ఆడిటోరియం దొరక లేదు. అందుచేత  మా మైన్ బిల్డింగ్ లో నాలుగో అంతస్తులో ఒక సర్వ సాధారణమైన హాలులో ఈ కచేరీ ఏర్పాటు చేశారు. అంటే పెద్ద స్టేజ్ , హంగులూ, ఆర్భాటాలూ లేకుండా ఒక చాంబర్ కాన్సెర్ట్ లా అనమాట. ఒక వేపు హిందుస్థానీ పద్దతిలో రొజాయిలూ. దిండ్లు పెట్టి పాడే వాళ్లూ, వినే వాళ్లూ అందరూ నేల మీదే కూచోడమే! రాత్రి భోజనాల తర్వాత 9 గంటలకి బాలమురళి కొలువు తీరారు. ఇప్పుడు 90 సంవత్సరాల అన్నవరపు రామస్వామి గారు వయోలిన్, దండమూడి రామ్మోహన రావు గారు మృదంగం. సుమారు వంద మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు…అంతే…ఆ రోజు బాలమురళి రెచ్చి పోయారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లారగట్ట  ఒంటి గంట వరకూ..

ఆ రోజు ఆయన చేయని సంగీత విన్యాసం లేదు. చెయ్యని ప్రయోగం లేదు. పాడని కృతి లేదు. అలుపూ, సొలుపూ అసలు లేనే లేదు. మా…లేదా మన దురదృష్టవశాత్తూ ఆ రోజుల్లో కెమేరాలూ, విడియోలూ లేవు. అరా కోరా ఉన్నా ఎవరికీ అందుబాటులో లేవు. అదృష్టవశాత్తూ …నా మనోఫలకం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తెరిచే ఉంటుంది..నాకు నేనే ఎప్పడు కావాలంటే అప్పుడు ఆవిష్కరించుకుంటూ ఉంటాను. గత వారం రోజలుగా నేను నలభై ఏళ్ల నా బాలమురళీ పరిచయాన్ని ఆవిష్కరించుకుంటున్నాను. ఆయనతో నా తొలి పరిచయం 1968 లో బొంబాయి లోనే!

ఆ తరువాత గత నలభై ఏళ్లుగా ..ఒకటా రెండా .కనీసం పాతిక సార్లు ఆయన కచేరీలు వినడం కానీ, నిర్వహించడం కానీ జరిగాయి. ఆ మహానుభావుడితో వ్యక్తిగత అనుబంధం పెంచుకోవడం నా పూర్వ జన్మ సుకృతం. ఆయన హ్యూస్టన్ ఎన్ని సార్లు వచ్చినా ఆయనతో కచేరీలు ఆనందించడమే కాకుండా ఆయనతో కాలం గడపడం, విహారాలకి తీసుకెళ్లడం, ఆయన చిద్విలాసంగా చెప్పే కబుర్లు వింటూ ఆనందించడం ..అవన్నీ తీపి గుర్తులే! ఆయన పోయిన మర్నాడు మా కాకినాడ సరస్వతీ గాన సభ -సూర్య కళామందిరంలో జరిగిన సంతాప సభలో నా జ్ఞాపకాలు నెమరువేసుకున్నాను. ఆయన ఆ సభకి బాలమురళి గారు గౌరవాధ్యక్షులు. అలనాటి సూర్య కళా మందిరాన్ని ఆధునీకరణ చేసి 2003 లో బాలమురళి గారే పున:ప్రారంభం  చేశారు. ఆ వేదిక బాలమురళిగారికి అత్యంత ఆత్మీయమైన వేదిక. ఆ సభలో స్థానిక ప్రముఖులు, మునుగంటి శ్రీరామముర్తి గారి కుమారులు వెంకట్రావు గారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాకినాడ-సూర్య-కళా-మందిరంలో-బాలమురళి-గారి-నివాళి

కాకినాడ-సూర్య-కళా-మందిరంలో-బాలమురళి-గారి-నివాళి

బాలమురళీ గారి సంగీత ప్రాభవం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు కానీ, ఒక వ్యక్తిగా ఆయన హాస్య ప్రవృత్తి గురించి నేను విన్నవీ, స్వయంగా తెలిసినవీ  కొన్ని మాటలు చెప్పగలను. ఒక సారి ఒక పెద్దాయన మృదంగం నేర్చుకున్న తన కొడుకు బాల మురళి గారితో ఒక కచేరీలో వాయిస్తే చాలు. అతని కెరీర్ కి ఉపయోగపడుతుంది అని బతిమాలితే ఆయన ఒప్పుకున్నారు. కచేరీ అయ్యాక ఈ తండ్రి బాలమురళి గారిని “మా వాడికి తన్యావర్తనం అవకాశం కూడా ఇస్తారు అనుకున్నాను. అంటే కచేరీ మధ్యలో మృదంగం ప్రతిభ చూపించుకునే అవకాశం. దానికి బాలమురళి గారు “ఇవ్వకేం ..మొత్తం మూడు గంటలూ తను చేసింది తన్యావర్తనమేగా. నేనేదో పాడుతున్నాను. అతనేదో వాయించుకు పోయాడు. అంత కంటే ఏం కావాలి” అని చురక అంటించారుట.

అలాగే ఒక సారి ఆయనా, మరి కొందరూ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మీద రైలు కోసం ఎదురుచూస్తూ ఉంటే “ఫలానా రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుచుచున్నది” అని స్పీకర్ల లోంచి ఒకావిడ మెసేజ్ వినపడింది. అందరూ విసుక్కుంటూ ఉంటే బాలమురళి గారు “పాపం ఆ ఏనౌన్సర్ ని ఏమీ అనకండి. ఆవిడే ఒప్పుకుందిగా రైలు నడుచుచున్నదీ అని. రైలు పరిగెడితే సమయానికి రాగలదు కానీ నడుస్తుంటే ఆలస్యం అవదూ” అని వాతావరణాన్ని తేలిక పరిచారు.

ఆయనకీ వచ్చిన బిరుదులు కేవలం యాదృచ్చికం. ఆయనకీ అవసరం లేనివి. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ “నేను ఒక వాయిద్యం లాంటి వాడిని, మృదంగం మీద చిన్న దెబ్బ వేస్తే ఆ దరువు వినపడుతుంది. వీణ మీటితే నాదం వినిపిస్తుంది. అలాగే నన్ను మీటితే సంగీతం వస్తుంది. నాకు ఎక్కువ సాధన అక్కర లేదు. నా సహ వాయిద్యం వారికోసం సాధన చేస్తాను” అన్నారు.

అపర త్యాగరాజు, కర్నాటక సంగీతానికి, యావత్ భారతీయ సంగీతానికి రారాజు శ్రీ మంగళంపల్లి బాల మురళి గారి కి ఇదే నా ఆత్మీయ నివాళి.

*

 

 

ధర్మారావు గెలిచాడు!

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-4

 

sudrarsanam‘వేయిపడగలు’పై సుదర్శనంగారి విశ్లేషణ తీరును రెండు ఉపమానాలతో చెప్పుకోవచ్చు. రెండూ పరస్పర విరుద్ధమైనవి.

మొదటగా, ఇంగ్లీషు చదువుల శిక్షణ నుంచి లభించిన  సునిశితమైన తర్కమూ, హేతుత్వమూ అనే సూది మొనను దానికి తాకించి చూశారు. దాంతో అది గాలిబుడగలా పేలి పోయింది. అయితే, అలా పేలిపోతే ఎలా?  ధర్మారావు అనే పాత్రను సనాతన ధర్మాన్ని దర్శించిన జ్ఞానిగానూ, వ్యవస్థాధర్మానికి సాధికార వ్యాఖ్యాతగానూ, అతనిది ఆజన్మ సిద్ధమైన జ్ఞానమార్గంగానూ రచయిత చెబుతున్నాడే! కనుక రచయిత ధర్మారావు గురించి చెప్పిన దానికీ, ధర్మారావు నడవడికీ మధ్య నున్న వైరుధ్యంలో మన అవగాహనకు అందనిది ఏదైనా ఉందేమో!

తీరా అదేమిటో చూద్దామనుకునేసరికి నవల గుండ్రాయిగా మారి సూదిమొనే వంగిపోయింది.

ఈ పరిస్థితిలో, తనకు సైతం సానుకూల దృక్పథం ఉన్న హైందవ ధర్మమూ, తాత్వికతా అనేవి నవలలో ధర్మారావు మనస్తత్వంలోని వక్రత నుంచీ, సంకుచితత్వం నుంచీ వ్యక్తమవుతున్నాయి కనుక అవే నిజమైన హిందూ ధర్మమూ, తాత్వికతా  కావన్న నిర్ధారణకు రావడమే మార్గం.  రచయిత చిత్రించదలచుకున్నది నిజమైన హిందూధర్మ, తాత్వికతలు కాక;; వాటికి ఆలంబనంగా తనను తాను భావించుకునే ధర్మారావు అనే, వక్రత, సంకుచితత్వం మూర్తీభవించిన వ్యక్తి ఆత్మకథను! ఆపైన, అసలు రచయిత చిత్రించదలచుకున్నది హైందవ వ్యవస్థను, తాత్వికతను కాదు, తెలుగు దేశాన్ని, తెలుగుదనాన్ని!

హైందవ ధర్మమూ, తాత్వికతా, ధర్మారావులోని వైరుధ్యాలు…ఈ గంద్రగోళాన్ని అంతటినీ పక్కన పెట్టేసి, కేవలం సాహిత్య కోణం నుంచి ఒక రచనగా ‘వేయిపడగ’లను అంచనా వేయడం అంతకన్నా సురక్షితమైన మార్గం. ఆ విధంగా చూసినప్పుడు అందులో గొప్ప పఠనీయత ఉంది. అద్భుతమైన పాత్రపోషణ ఉంది, తెలుగుదనం ఉంది. ఆధునికత తెలుగువారి జీవితంలో తీసుకొచ్చిన అనేకానేక పరిణామాలను ఒక చిన్నసైజు విజ్ఞాన సర్వస్వం స్థాయిలో చిత్రించడం ఉంది. అది, కాల్పనికోద్యమకాలంలో వెలువడిన ఆత్మాశ్రయకవిత్వ శాఖలో ఒక అపురూపమైన కావ్యం!

ఈవిధంగా సుదర్శనంగారి వేయిపడగల పరిశీలన అందులోని హైందవ ధర్మ, తాత్వికతల పరిశీలనతో ప్రారంభించి అది సంతృప్తి కలిగించకపోవడంతో, దానిని తెలుగుదేశమూ, తెలుగుదనాలకు కుదించి ఒక ఉత్తమ సాహిత్య సృష్టిగా నిలబెట్టడంతో ముగుస్తుంది.

ధర్మారావు గురించి రచయిత చెప్పిన దానికీ, ధర్మారావు నడవడికీ మధ్యనున్న వైరుధ్యం ఎలాంటిదన్నది పరిశీలించకపోవడం –విశ్వనాథ ప్రాతినిధ్యం వహించే భావజాలానికి బాహ్య మిత్రుడిగా ఆయనకు గల పరిమితి.

***

అసలు ఆ వైరుధ్యంలోనే హిందూ ధర్మ, తాత్వికతలు ఉన్నాయని ఎందుకు అనుకోకూడదు? ధర్మారావు, అతని తండ్రి రామేశ్వరశాస్త్రే ఆ  హైందవ ధర్మానికి, తాత్వికతకు అసలు సిసలు ప్రతినిధులు ఎందుకు కాకూడదు? వాటికి భిన్నమైన, నిజమైన హైందవధర్మమూ, తాత్వికతా వేరే ఉంటాయని ఎందుకు అనుకోవాలి?

ఎందుకంటే, వాటిలో తనూ ఒక వదులైన భాగమే అయినా, వాస్తవంగా వాటి జన్మస్థానంతోనూ, అక్కడి జీవితాలతోనూ, వారి తలపులతోనూ  గాఢమైన పరిచయం లేని బాహ్యుడు కనుక!

దూరం నుంచి చూసినప్పుడు అదొక గొప్ప రొమాంటిక్ అడ్మిరేషన్ కలిగిస్తుంది. అందులో భాగమై చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తుంది. అందుకే దాని తలుపులు చాలావరకు మూసి ఉంటాయి. తెరచుకున్నప్పుడు కూడా బయటినుంచి చూసినప్పుడు కలిగే రొమాంటిక్ అడ్మిరేషన్ ను నిలబెట్టే మేరకే ఓరగా తెరచుకుంటాయి.

విశ్వనాథ దృష్టిలో రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల గురించి తను చెప్పినదానికీ, వారి నడవడికీ మధ్య ఎలాంటి వైరుధ్యం ఉండడానికి వీలులేదు. అంత పెద్ద లోపాన్ని ఆయనకు ఎలా ఆపాదిస్తాం? కనుక ఆ వైరుధ్యం బయటినుంచి చూసినప్పుడు కలిగే భ్రాంతి. అంతర్గతంగా చూసినప్పుడు అందులో వైరుధ్యం ఉండడానికి అవకాశం లేదు. అది రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల దృష్టిలో కూడా వైరుధ్యం ఎప్పుడవుతుంది? వారు కూడా దానిని, గుర్తించి అంగీకరించినప్పుడు. వారు గుర్తించే అవకాశం లేదు కనుక అది వైరుధ్యం కానే కాదు. ఆపైన అది  వైరుధ్యమా, కాదా అన్నది నిర్ధారించవలసిన అధికారం కూడా వారిదే కనుక; ఇంకొకరు అలాంటి ఆరోపణ చేయడం చెల్లదు.

కనుక రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా హైందవ వ్యవస్థా, తాత్వికతలను చిత్రించడంలో విశ్వనాథ నిజాయితీని పాటించారు. వారు అలా తప్ప ఇంకోలా ఉండే అవకాశమే లేదు. ఒక వ్యక్తి జీవన సరళే అతని తాత్వికతను అభివృద్ధి చేస్తుందని అనుకుంటే, రామేశ్వర శాస్త్రి, ధర్మారావుల జీవితమే వారి తాత్వికత. వారే హైందవ ధర్మ, తాత్వికతలకు నిర్ణేతలు, భాష్యకారులు, హక్కుదారులు కనుక వారి జీవితమే హైందవధర్మ, తాత్వికతలకు ప్రతిబింబం.

విశ్వనాథ అజాగ్రత్త ఉంటే ఎక్కడ ఉంటుందంటే, హైందవధర్మ, తాత్వికతలను చిత్రించడానికి ఆధునిక ప్రక్రియ అయిన నవలను స్వీకరించడంలో. ఆపైన దానిని ఇంగ్లీషు చదువుల శిక్షణనుంచి సంక్రమించే తార్కికతా, హేతుత్వాల ఉపకరణాలతో చూసినప్పుడు అది ఎలా పరిణమిస్తుందన్న సంగతిని విస్మరించడంలో. ఆధునిక నవలా ప్రక్రియలో వ్యక్తుల జీవిత చిత్రణ విధిగా వాస్తవికతను అనుసరిస్తుంది. అలాగే, హైందవ వ్యవస్థా, తాత్వికతలను వస్తువుగా తీసుకున్నప్పటికీ  రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల జీవితచిత్రణలో ఆయన వాస్తవికతను అనుసరించారు. తీరా చూస్తే ఆ వాస్తవికత ఆయనకు తెలియకుండానే వస్తువుకీ, పాత్రలకూ మధ్య వైరుధ్యాన్ని ఎత్తిచూపి రెండింటి పట్లా అపోహలకు దారితీయించింది.

సుదర్శనంగారే దీనిని గుర్తించి మిల్టన్ పారడైజ్ లాస్ట్ తో పోలిక తెచ్చారు. ఆయన ఇలా అంటారు:

“మిల్టన్ తన పారడైజ్ లాస్ట్ (Paradise Lost)లో సృష్టించిన సైతాన్ (Satan)పాత్ర కవి ఉద్దేశానికి భిన్నంగా, అంటే వీరోచితంగా, ఆకర్షణీయంగా రూపొందడం వల్ల, “He was of the Devil’s party without knowing it” అనే విమర్శ వచ్చింది. కొంతవరకు ఈ విమర్శ విశ్వనాథ ఈ మూడు నవలలకూ(ఏకవీర, వేయిపడగలు, చెలియలికట్ట)వర్తిస్తుంది.”

హైందవ ధర్మ, తాత్వికతలు ఎంత విశిష్టమైనవి, లోతైనవి అన్నది వేరే పరిశీలన. రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా  వాటి ప్రతిఫలనం ఎలా ఉందన్నదే ఇక్కడ విచారణ.

viswanatha

విషాదం ఏమిటంటే, రామేశ్వరశాస్త్రి, ధర్మారావులు తమ ప్రతిబింబం ఎలా ఉందో చూసుకోడానికి ఎదురుగా వేరే అద్దం ఏదీ లేదు. తామే అద్దం. తాము ఎలా ఉన్నారో చెప్పడానికి, లేదా ప్రశ్నించడానికి వేరొకరికి తాహతు లేదు, అధికారం లేదు, జ్ఞానం లేదు. తాము ఉన్నదే జ్ఞానకాంతులు విరజిమ్మే లోగిలిలో. గడప దాటితే అవతల అంతా అజ్ఞానాంధకారం. అంతిమ పర్యవసానం…తులనాత్మకంగా చూడడానికి అవతల మరొకటి లేని స్థితిలో, ఉన్నా చూడదలచుకోని స్థితిలో, తమ విశ్వాసాలను, కోరికలను, లౌల్యాలను, తమ జీవన సరళిని, అందులో ఇతరులకు వైరుధ్యాలుగా కనిపించేవాటితో సహా అన్నిటినీ ధర్మబద్ధం చేసి, తాత్వికీకరించి చివరికి తాము సైతం అవే నిజమనుకునే భ్రమలో గూడులో రెక్కలు ముడుచుకుని ఉండిపోవడం!

తాత్విక స్థాయిలో బ్రహ్మం ఎలా అనిర్వచనీయమో, ఎలా కంటికి కనిపించదో, ఎలా ద్వంద్వాలకు, ప్రశ్నలకు, సందేహాలకు అతీతమో జీవనస్థాయిలో రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల నడవడి కూడా అంతే. రామేశ్వరశాస్త్రి యోగి, వర్ణాశ్రమధర్మాల ముద్ద కట్టిన మూర్తి. కానీ పైకి భోగిలా, రసికుడిలా కనిపిస్తాడు. ఆయన నాలుగువర్ణాల స్త్రీలనూ పెళ్లి చేసుకున్నాడు. ఒక భోగాంగనను చేరదీశాడు. నాలుగువర్ణాల వారినీ పెళ్లిచేసుకునే అర్హత ఆయనకు తప్ప ఇంకొకరికి లేదు. ఎందుకులేదని ప్రశ్నించడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం ఆయనకు ఒక్కడికే ఆ అర్హత కల్పించింది. మళ్ళీ ఆ ధర్మశాస్త్రానికి కర్త ఆయనే.

ధర్మారావూ అంతే. అయితే, అతని దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి మారింది. ఆధునికత విజృంభిస్తోంది. ఇంగ్లీషు చదువులు రాటుదేలుతున్నాయి. తాము ముడుచుకుని ఉన్న భ్రమల గూడుమీదే దెబ్బలు పడుతున్నాయి. అంతవరకు తమకు ఆశ్రయమూ, అధికారమూ ఇచ్చిన  జమీందారీ వ్యవస్థా, దానితోపాటే తమ ఆశ్రయమూ, అధికారమూ కుప్ప కూలుతున్నాయి. ధర్మారావు తమ జ్ఞాన కాంతుల లోగిలి నాలుగు గోడల మధ్య నుంచి అప్పుడప్పుడు ఆజ్ఞానాంధకారపు బాహ్య పరిసరాలలోకి రావలసి వస్తోంది. ఇంగ్లీషు చదవవలసివస్తోంది. కానీ భౌతికంగా అతను బాహ్య పరిసరాలలోకి వస్తున్నా అతని ఆత్మ మాత్రం తన భ్రమల గూడును విడిచి రావడంలేదు. దాని మీద దెబ్బలు పడుతున్న కొద్దీ అతను మరింతగా అందులో ముడుచుకుంటున్నాడు. బాహ్య పరిసరాలు ఎంత మారుతున్నా, వాటికి అనుగుణంగా తానూ ఎంతో కొంత  మారుతున్నా అతని ఆత్మలో మార్పు లేదు. అది ఎప్పటిలానే తన భ్రమల గూడును పట్టుకుని వేలాడుతూనే ఉంది. శిథిలమవుతున్న  ఆ గూడును తలచుకునే అతనిలో నిస్పృహా, నిర్వేదం. అదే వేయిపడగలు.

మారిన పరిస్థితిలో, బహుశా తండ్రి రామేశ్వరశాస్త్రికి అదనంగా, ధర్మారావు జీవితంలో అస్తిత్వం తాలూకు అభద్రత ప్రవేశించింది.  ఆ అభద్రత రెండు రకాలు. మొదటిది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అభద్రత. ఇంగ్లీషు చదువుకుని ఉద్యోగం వైపు మళ్లి ఆ అభద్రతను జయించవచ్చు. ధర్మారావు కాకపోయినా ధర్మారావు వారసులు అదే చేయబోతున్నారు. రెండవది, తమ సాంస్కృతిక, మత, తాత్విక, ధార్మిక, రాజకీయ ఆధిపత్యానికి కలుగుతున్న అభద్రత.

ధర్మారావు వైపునుంచి చెప్పుకుంటే  ఈ రెండు రకాల అభద్రతలకు అంతస్సంబంధం ఉంది. సమాజంలో తను అల్పసంఖ్యాకవర్గం. శ్రమ చేయలేడు. బలిష్టుడు కాదు. ఈ బలహీనతలనే బలంగా మార్చుకోవడం, అవి కల్పించే అభద్రతనుంచే భద్రతను నిర్మించుకోవడం –ఇదీ అతని తాత ముత్తాతలనుంచీ జరుగుతూ వచ్చింది. ఈ ప్రయత్నంలోంచే అతని మతం, తాత్వికత, ధర్మశాస్త్రం, సాహిత్యం, సమస్త వాఙ్మయం పుట్టాయి.  ఇప్పుడు వీటన్నిటితో కూడిన వ్యవస్థకే అభద్రత వాటిల్లింది. ఇందుకు ధర్మారావుకు కనిపించిన పరిష్కారమేమిటంటే, ఆ అభద్రతను ఎదుర్కోవడానికి, అలాంటి అభద్రత నుంచే పెంపొందించిన వ్యవస్థలోనే తిరిగి భద్రత వెతుక్కోవడం!

ఒక కోణం నుంచి చూస్తే ధర్మారావు పాత్ర జాలిగొలుపుతుంది. అతనిలో తాను సర్వాధికుడినన్న భావన. అది అతనిలో అధికారాన్ని, అహాన్ని మాత్రమే కాదు; తన ఊహలను, అభిప్రాయాలను సమానఫాయీలో ఇంకొకరితో పంచుకోలేని ఒంటరితనాన్నీ అతనిపై విధిస్తుంది. అతను వ్యాఖ్యానించని విషయం ఉండదు. కానీ అవతల ఉన్నది ఎవరు? అతని వ్యాఖ్యలపై  ప్రతిస్పందించడానికి అతనితో సమానమైన జ్ఞానమూ, స్థాయీ లేని మూగ శ్రోతలు. వక్తా, శ్రోతా కూడా తనే. తన గొంతు ప్రతిధ్వని తనకే వినిపిస్తుంది. గోడకు కొట్టిన బంతి తిరిగి తన దగ్గరకే వచ్చినట్టుగా తన అభిప్రాయాలూ, వ్యాఖ్యలూ మళ్ళీ తన దగ్గరకే వస్తాయి.

veyi

అతని మాట, ప్రజాస్వామికమైన డైలాగ్ కు అవకాశం లేని, ఒక మోనోలాగ్. అక్కడ ప్రైవేట్, పబ్లిక్ అన్న తేడా  చెరిగిపోతుంది. డైలాగ్ కు అవకాశం లేని స్థితిలో అతని ప్రైవేట్(వైయక్తిక)ఊహాప్రపంచమే పబ్లిక్ గా మారిపోతుంది. డైలాగ్ కు అవకాశం లేనప్పుడు అక్కడ తర్కం, హేతుత్వం ఉండవు. పైగా అవి అక్కర్లేదన్న అహం ఉంటుంది. చరిత్ర ఉండదు. అది అక్కర్లేదన్న అహం ఉంటుంది. సాలె పురుగు తనలోంచే దారాన్ని సృష్టించుకుని, దానితో గూడు కట్టుకుని అందులో ఎలా ఉండిపోతుందో; తన ఊహల దారాలతో తనే అల్లుకున్న గూడులో తను ఉండిపోవడం…ఇదీ అతని బౌద్ధిక జీవితం.

తనే లోకానికి గురువు. కనుక వేరెవరికీ, ఎప్పటికీ శిష్యుడు కాలేని పరిస్థితి అతనిది. దాంతో అతనికి కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. ఋష్యశృంగుడు ఉన్నచోట అనావృష్టి ఉండదు. అలాగే, తన ఉనికే లోకకళ్యాణం కోసం!

తీరా  సుదర్శనంగారు తర్కమూ, హేతుత్వమూ అనే తూనిక రాళ్ళతో వేయిపడగలను తూచబోయేసరికి అది తేలిపోయింది. అందులో బరువైన సరకు బదులు డొల్ల కనిపించింది. అయితే ఆ డొల్లను పట్టుకుని ఉన్న మనిషి నిజం. తన భ్రమల గూడుపై పడుతున్న దెబ్బలకు అతను పడుతున్న కలవరం, అస్తిత్వ భయం, అవి కలిగించే హృదయభారం నిజం. అవి నవలలో ప్రతిభావంతంగా వ్యక్తమయ్యాయి.

***

ముందే చెప్పినట్టు, ధర్మారావును తెలుగుదనం మూర్తీభవించిన వ్యక్తిగానూ, వేయిపడగలను ఆధునికత  తెలుగునాట తెచ్చిన  మార్పుల చిత్రణగానూ కుదించడం ధర్మారావు బౌద్ధిక జీవితానికి ‘బాహ్యు’నిగా సుదర్శనంగారికి గల పరిమితి. నిజానికి ధర్మారావు భారతదేశమంత వైశాల్యం కలిగిన పాత్ర. అతని సంఘర్షణ మూలాలు భారతీయ సమాజం తాలూకు అతి పురాతనపు లోతుల్లో ఉన్నాయి. భారతదేశపు సామాజిక, సాంస్కృతిక, మత, రాజకీయ స్థితిగతులకు అతను శాసనకర్త. ఇంత వైవిధ్యవంతమైన దేశాన్ని తన దృష్టికోణం అనే మూసలో ఇరికించడానికే అతని నిరంతర ప్రయత్నం. ఆ ప్రయత్నంలో అతనికి విజయాలూ ఉన్నాయి, అపజయాలూ ఉన్నాయి. అతని పెనుగులాట ఎంత వైయక్తికమో, అంత వ్యవస్థాగతం. చరిత్ర పొడవునా జరుగుతున్నఅతని పెనుగులాటా, అందులో అతని గెలుపు, ఓటముల చరిత్రే ప్రధానస్రవంతికి చెందిన భారతీయ వాఙ్మయం.  పాశ్చాత్య నాగరికతా ప్రభావమూ, అవైదిక ధోరణుల విశృంఖలత్వమూ నేపథ్యంగా వేయిపడగలులో చిత్రితమైనది– అతని అనేకానేక పెనుగులాటలలో ఒకటి మాత్రమే.

వేయిపడగలు అతని ఒకానొక తాత్కాలికమైన  ఓటమిని చెబుతుంది. అది అతనికి కలిగించిన నిర్వేదాన్ని, నిస్పృహను చెబుతుంది. అయితే తన చరిత్రలో అనేకసార్లు జరిగినట్టుగా , అంతులేని నిరీక్షణ తర్వాత అతను మళ్ళీ గెలిచాడు. ఇప్పుడు కనుక ధర్మారావు చరిత్రను తిరగరాస్తే, అది ఒక విజేత చరిత్ర అవుతుంది. ఇప్పుడతనిలో నిస్పృహా, నిర్వేదం లేవు. వాటి స్థానంలో అతని ముఖం నిండా విజయదరహాసం!

(సశేషం)

 

 

 

వాగర్థాలు కలిసి మురిసిన మురళి!

mangalam

ఆయన  తల్లి గారి పేరు సూర్యకాంతమ్మ గారు.  కృతుల సంకలనానికి ఉంచిన పేరు ‘ సూర్య కాంతి ‘ . ఆయన మాత్రం చల్లని వారు –  మేలుకొలుపులు పాడినప్పుడూ వెన్నెట్లోకి రమ్మన్నట్లే ఉంటుంది. చూడలేక కళ్ళు చిట్లించుకోవలసినది అందులో ఏవేళ లోనూ లేదు.  అమ్మ ఒళ్ళో కూర్చున్న పిల్లాడు ” దా ! దా ! ” అన్నట్లు. అమ్మ ఆయన కి సొంతం కనుక మనందరినీ అలాగే చూస్తుందనే పసి నమ్మిక అది – నిజమెందుకు కాదు ,  ఆయన ఉండగా. అరటి పండు ఒలిచిపెట్టిన వెండిపళ్ళెం మనకే.

  అపండితులకూ ” ఆహా , సంగీతం వింటున్నామ ” న్న గర్వాన్ని ఆయన సృష్టిస్తారు.  ప్రాసాదాల నడవా లలోకీ  సాదా పెంకుటిళ్ళ  పంచల లోకీ ఒక్కలాగే  కురిసిన చంద్రిక ఆయన పాట. అరుదుగా –  సమయా సమయాలున్నాయేమో కాని వృద్ధి క్షయాలు లేవు.

ఎటువంటి సంగీతజ్ఞానమూ లేని మాడ్రైవర్ ,  పాతిక ముప్ఫై ఏళ్ళ యువకుడు – రోజూ కార్ లో వినబడే రామదాసు కీర్తనలని వినీ వినీ గొంతు కలపేసేవాడు. వినకుండా  ఉండలేకపోయేవాడు. ఆ పని   మరింకొక విద్వాంసుల వలన కాదు ,  నాకు తెలియదు. తన స్వరూప స్వభావాలనేమీ మార్చుకోకుండానే వసంతం తరలి వచ్చింది .   దిగి రాలేదు. ఆ పైన నువ్వు అందిస్తే నీ చేయి పుచ్చుకుని తీసుకుపోతుంది – మరింకా వేర్వేరు చోట్లకి. నాతో సహా ఇంకెంతెంత మందికో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చేసిపెట్టిన ఉపకారం అది.

  ఖంగున మోగే గొంతులూ సర్కస్ చేసే  పాటలూ తెలుగువారికి ఇష్టం . చలం గారెన్నడో అని ఉన్నట్లు , కష్టమైన సంగతుల విన్యాసానికి  మాత్రమే చప్పట్లు కొట్టే మోటుతనం మనది. సహజ ప్రశాంతమైన మాధుర్యం చప్పున లాగదు  . అటువంటి గుండెల్లోకీ చొరబడగలగటం ఆయనకి చేతనయిన ఒక విద్దె. సంగీతాన్ని దాని అన్ని రూపాలలోనూ ఆయన కౌగలించుకోగలరు , సినిమా పాటలతో సహా. దేన్నీ చిన్నబుచ్చగలిగే నిర్దయ అక్కడ ఉండే అవకాశం లేదు.

ఈ వైపునుంచి  –  సమస్త  ప్రపంచం లోని అన్ని విధాలైన పద్ధతులనూ కర్ణాటక సంగీతం తనలో ఎలాగ ఇముడ్చుకోగలదో చేసి చూపించిన పని అది. మీరూ నేనూ మాట్లాడుకునే మాటలకీ స్వరాల ఆధారాన్ని ఇవ్వగలరు . లయ సమంగా ఉందో లేదో తేల్చగలరు.  నాదం , దాని వెనుక శబ్దం – అది సర్వవ్యాప్తమైన ఆకాశలక్షణం గా చెప్పబడే భారతీయత – మన కాలానికి ఎంచుకొని ధరించిన రూపమది , ఇంతకాలమూ. భాష తెలియనివారికీ భావమేదో స్ఫురించేలాగా , తెలిసినవారికి తెలిసివచ్చేలాగా – వాగర్థాలు కలిసి ఉండటానికి బ్రహ్మాండమైన నమూనా  .

  అరే, అదేమి నవ్వు , అదెంతటి ఉల్లాసం !!! స్మితమో మందహాసమో మొహాన కనిపించకుండా పాడటం ఎప్పుడన్నా ఉందా ? ఒక కొత్త కల్పనను వేదిక మీద అప్పటికప్పుడు చేశాక వచ్చే దరహాసం- ఆ   బంగారపు జరీ అంచుల తళతళ…  ఎవరన్నా పలకరించి మాట్లాడినా ఆహ్లాదమే తిరిగి వచ్చేది. ఇంకొందరు ఉన్నతులలో లాగే ఆ హాస్య స్ఫూర్తి  ” అబ్బే. తూచ్ ! ఇందులో ఏమీ లేద ” నే ఎరుక. మనుషుల పైన అనురాగం ప్రతి చేత లోనూ కవళిక లోనూ చిందిపోవటం అదొక దివ్యమైన బహూకృతి – ఆయనకూ మనకూ. బహుశా కళ మనిషిలో లీనమైతే రాగల బహిఃఫలం.

ఉత్సాహం పోకుండా, ఫిర్యాదులు రాకుండా –  అంతా తెలిసిందనీ లక్ష్యాలు లేవనీ అనకుండా – అది గొప్ప పుట్టుక !

” మా రోజుల్లో అయితేనా ..” అన్న మాటలు రాలేదు కడదాకా.

వినా దైన్యేన జీవనం.

   ఏ వ్యక్తిగత పరిచయమూ లేని ఎన్నో లక్షల మందికి ఆయన తమవాడు – నాకూనూ.  రోజూ చూడని వాడైనా మళ్ళీ కనిపించని బాధ అందరిదీ , నాది కూడా. మాట్లాడే అర్హత ఉందీ లేదూ కాదు – ఒక చంద్రుడు సమస్త జీవులకు తానొక్కొకడయి తోచును గనుక, నూలుపోగును  తప్ప ఇవ్వలేను గనుక.

     వేయికి పైనే పున్నములు గడిచినాయి గానీ చాలదు.  అద్దం లోనూ నీళ్ళలోనూ  పట్టి దాచుకున్నదే  చాలుతుండాలి ఇక మీదట .  

      అంతే.  

          *                                     

 

నేను నేనే నేను!

samvedana logo copy(1)నోట్ల రద్దుమీద కొంతమంది మిత్రుల అభిప్రాయాలు చూశాక ఇది రాయాలనిపించింది. నోట్ల రద్దు ఫలానా ఫలానా కంపెనీలకు లాభం చేకూర్చడానికి అని మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫలానా ఫలానా వారికి ముందే తెలుసు అని ఆరోపిస్తున్నారు. రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌భార్య ముఖేశ్‌అంబానీ భార్య ఇద్దరూ సిస్టర్స్ అని కొత్త కోణాలు వెలుగులోకి తెస్తున్నారు. ఇవన్నీ నిజమా కాదా అనేది అంతగా ప్రాధాన్యమున్న అంశం కాదు. సమస్య తీవ్రతను తక్కువగా చూస్తున్నారు. మోదీ పాలనను కాంగ్రెస్‌స్థాయికి కుదించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ అవినీతిపరుడు అయినా కాకపోయినా అది పెద్ద సమస్య కాదు. అంతకంటే పెద్ద సమస్య భావజాల పరమైనది. హిట్లర్‌తో సమస్య అవినీతి కాదు.

నేను, నేనే, నేను మాత్రమే అనేది సమస్య. ఈ దేశాన్ని నేను మాత్రమే దారిలో పెట్టగలను అని ఒక మనిషి అనుకోవడం సమస్య. తాము అనుకున్న లక్ష్యాలు చేరడానికి వ్యవస్థ-నిర్మాణాలు-నిబంధనలు అడ్డంకి అనుకోవడం సమస్య. వ్యవస్థ కంటే తాను పెద్ద వాడిననుకోవడం సమస్య. నేనే నిజాయితీపరుడిని, ఇంకెవరూ కాదు అనుకోవడం సమస్య. తాను కోరుకున్నట్టుగా వ్యవస్థను మార్చే ముళ్లకిరీటాన్ని తన మీద తానే పెట్టుకున్నవాడు అధికారంలో ఉండడం సమస్య. మన పూర్వీకుల సాంకేతికతకు పుష్పక విమానమనే పురాణ ఉదాహరణలు చూపగలిగే మనిషి, గణేశుడి తలని శస్త్రచికిత్స పరిజ్ఞానానికి ఉదాహరణగా సైన్స్‌కాంగ్రెస్‌లోనే ప్రకటించగలిగిన మనిషి అటువంటి స్థితిలో ఉండడం అసలు సమస్య.

మోదీ నిజంగానే బ్లాక్‌మనీని ఈ విధంగా అరికట్టాలని అనుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. అతనికి ఆ చిత్తశుధ్ది ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎలుకను చంపాలనుకున్నవాడు అందుకోసం ఇల్లు తగులబెడితే అతనికి ఎలుక విషయంలో చిత్తశుధ్ది లేదు అనగలమా! సమస్య అతను అవినీతిపరుడా కాదా అనేది కాదు. ఆ మాట కొస్తే కేంద్ర కేబినెట్లోనూ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులుగానూ వ్యక్తిగతంగా అవినీతి జోలికి పోనివారు అనేకులున్నారు. సో వాట్‌!

మోదీ నిర్ణయం చూస్తే కనీసం ఆర్థికమంత్రి, రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌లనైనా విశ్వాసంలోకి తీసుకున్నారా అని అనుమానం వస్తుంది. వాళ్లకి తెలీకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను నేనే నేను మాత్రమే అనుకునే మనిషి ఏమైనా చేయగలరు? ఇంత పెద్ద వ్యవస్థను నడిపే ఆర్థిక వేత్తలకు ఎటిఎంలలో కొత్త నోట్లు పెట్టడానికి ఎంతకాలం పడుతుంది అనే విషయం తెలీకుండా ఉంటుందని అనుకోలేం. 86 శాతం కరెన్సీ పోతే సిస్టమ్‌ఎలా కుప్పకూలుతుందో తెలీకుండా ఉంటుందని అనుకోలేం. కోరి కోరి ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటారని అనుకోలేం. భావజాలపరంగా విభేదించొచ్చు కానీ పరిజ్ఞానంలో వారి స్థాయిని తక్కువగా అంచనా వేయలేం. 90 లతర్వాత పెరిగిన కరెన్సీ ప్రాధాన్యం గురించి ఏ కాస్త ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవాళ్లైనా సులభంగా చెప్పేయగలరు అది ఎంత అల్లకల్లోలమో! దేశభక్తికి 56 ఇంచీల ప్రతినిధి అయిన ప్రధానుల వారు వాళ్లను సంప్రదించారా అనేది సందేహమే.

అవినీతిని దాటి ఆలోచించకపోతే చాలా విషయాల్లో బోల్తాపడే ప్రమాదం ఎక్కువ. బలమైన భావజాలమున్న శత్రువుపై ఆ అస్త్రం పూచికపుల్ల లాంటిది. చావల్‌బాబా రమణ్‌సింగ్‌అవినీతిపరుడు కాకపోవచ్చు. ఆ మనిషి నవ్వు చూస్తే ఇతను చీమకైనా హానితలపెట్టగలడా అనిపించొచ్చు. కానీ చత్తీస్‌గఢ్లో ప్రభుత్వ బలగాలు వారి వత్తాసు ఉన్న బలగాలు ఆదివాసీలపై కొనసాగించిన అరాచకాలు మాటలకందనివి. నవీన్‌పట్నాయక్‌క్లీన్‌, ఎడ్యుకేటెడ్‌, శావీ అనిపించే పెద్దమనిషి కావచ్చు. కానీ ఆయన పాలనలో ఉన్న నేలమీద జరిగిన మారణకాండ,అంతకుమించి అక్కడనుంచి బయటకొస్తున్నకోణాలు మనిషి అనే పదం సిగ్గుతో తలవంచుకునేవి. నిజాయితీ-వ్యక్తిగత అవినీతి అనేవి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రమాదం ముందు చిన్నవి. అవి కాంగ్రెస్‌స్థాయి వ్యవహారాలు.

500-rupees
అసలు సమస్య నోట్లకోసం క్యూలో ఉండడం దేశభక్తి అనే మాటలో ఉంది. తానేం చేసినా దానికి దేశభక్తి అనే పేరుపెట్టడంలో ఉంది. దీన్ని వ్యతిరేకించే వారంతా దేశద్రోహులు అనే భావజాలంలో ఉంది. మా వైపు లేకపోతే ఉగ్రవాదుల వైపు ఉన్నట్టే, మే చేసిన దాన్ని ప్రశ్నిస్తే దేశభక్తి లేనట్టే అనే వాదనలో ఉంది. ప్రతీదీ దేశభక్తే. ఎనిమిది మంది అండర్‌ట్రయల్స్‌ని చట్టవిరుద్ధంగా చంపేస్తే దేశభక్తి. చట్టం, రూల్‌ఆఫ్‌లా, మనమే ఏర్పరుచుకున్న నిబంధనలను ఇలా ఉల్లంఘిస్తూ పోతే ఎలా లాంటి ప్రశ్నలు మామూలుగా వేయగలిగే వారిమీద కూడా ఈ దేశభక్తి అనే మాట పనిచేస్తుంది,. ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన సర్జికల్‌స్రయిక్సే చేసినప్పటికీ బహిరంగంగా ప్రకటించడం అనే పని చేసినందుకు అది దేశభక్తి అవుతుంది. అదేంటి, ఎలా జరిగింది, నిజంగా మీరు చెప్పినట్టే జరిగిందా అనిప్రశ్నిస్తే మళ్లీ ఈ దేశభక్తి అనే అస్త్రం ముందుకొస్తుంది.

ఎవరో హేతువాదులపై దాడులు చేస్తారు. ఇంకెవరో బీఫ్‌తినడం దేశద్రోహం అంటారు. విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్‌-మార్క్స్‌వాదులను ఎవరో పనిగట్టుకుని వేధిస్తూ ఉంటారు. రోజూ ఎక్కడో ఏదో జరుగుతూనే ఉంటుంది. అదేదో విడిఘటనలాగా ఉండదు. మన హేతుబద్ధత, మన లాజిక్‌, మన ప్రజాస్వామికత ఓడిపోయినట్టుగా పదే పదే అనిపిస్తుంది. రాజ్యం మన అందరిమీదా కత్తికట్టినట్టుగా అనిపిస్తుంది. మనకు తెలీకుండా మన వెంటనీడలాగా వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మన నెత్తిమీదే ఒక కెమెరా పెట్టినట్టుగా మన చుట్టూ ఒక కంచె వేసినట్టుగా అనిపిస్తుంది. బాలగోపాల్‌సంస్మరణ సభలో రత్నం చాలా చక్కని మాట వాడారు. విశ్వవిద్యాలయాలను గ్రామాల స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు అని. ఈ మధ్య ఒక జర్నలిస్టు పెద్దాయనతో మాట్లాడుతుంటే ఒక పదం వాడారు. ఇతను వచ్చినప్పటినుంచి రోజూ టెన్షన్‌ఉంటోంది అని. అదీ సరైన అవగాహన. ప్రమాదాన్ని గుర్తించడమంటే అదీ.

ప్రతి సందర్భంలోనూ ఈ దేశభక్తి అనే పదాన్ని ముందుకు తేవడం అత్యంత ప్రమాదకరమైన సంకేతం. తాము చేసే ప్రతిపనిని సమర్థించుకోవడానికి భావజాలంతో ముడిపెట్టడం సిద్ధాంతం అనేది ఉన్న ప్రతి పార్టీ చేసే పనే. ఈ పని కమ్యూనిస్టు పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్న దేశాల్లో వేరే కోణంలో చేస్తాయి. భావజాలం కూడా దానికది సమస్య కాదు. కాకపోతే అది మనుషులందరికీ ఒకే విలువ ఉంటుందని నమ్మే భావజాలమా, సమానత్వాన్ని నమ్మే భావజాలమా దానికి విరుద్ధమైన భావజాలమా అనేది ముఖ్యమైనది. ఇపుడు మన దేశాన్ని పాలిస్తున్న భావజాలం మనుషులందరూ సమానమని నమ్మేదికాదు. పేదలు-దళితులు-మైనార్టీలు- ఆదివాసీలు -మహిళల హక్కులను గుర్తించేది కాదు.

పైగా ఆర్థికరంగంలో పెట్టుబడీదారీ విధానాలను పాలనా వ్యవహారాల్లో ఫ్యూడల్‌భావజాలాన్ని కలిపి కొట్టే వింత మృగం. దేశాన్ని పాలిస్తున్న మనిషి తాను అన్నింటికీ అందరికీ అతీతుడనని తానే సర్వం అని నమ్మేమనిషి. తాను కోరుకున్నట్టుగానే అందరూ ఉండాలని తాను ఆలోచించినట్టుగానే అందరూ ఆలోచించాలని కోరుకునే మనిషి. తాను చేస్తున్న పని దాని ప్రయోజనాల గురించి పరిధి గురించి వాజ్‌పేయికి కనీసం కొన్ని సందేహాలైనా ఉండేవి. ఇతనికి అలాంటివేవీ ఉన్నట్టు కనిపించడం లేదు. రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌ప్రకటించాల్సిన నిర్ణయాన్ని ప్రధాని తనంతట తాను ప్రకటించడంలోనే చాలా విషయం ఉంది. మనుషుల కంటే, మనం ఏర్పరుచుకున్న వ్యవస్థీకృత నిర్మాణాల కంటే నిబంధనల కంటే దేశం గొప్పదనేదేదో ఉంది. దేశం కోసం అంటూ నిర్ణయం తీసుకుంటున్నపుడు మిగిలినవాటిని పట్టించుకోనక్కర్లేదు అనే భావన నిలువునా జీర్ణించుకుపోతే అది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అది కూడా జాతి లాంటిదే. దేశభక్తి అనేదాన్ని నాటి యూదు జాతీయత అనే స్థాయికి తీసుకువస్తున్నారు. అరవై డెబ్భై ఏళ్లుగా సిస్టమ్స్ ఎంతో కొంత ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకా ఏమయిపోయి ఉండేదో అని భయం వేస్తుంది.

కాంగ్రెస్‌మీద గురిపెట్టినట్టుగా బిజెపి మీద అవినీతి అస్ర్తాన్ని ప్రధానం చేయలేం. మోదీ అధికారంలోకి వచ్చినపుడు ఆ అస్ర్తాన్నే ఎలా తన అధికారం కోసం ఉపయోగించుకున్నారో ఒకసారి గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్‌అవినీతి మన దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తుంది. కానీ బిజెపి మన మెదళ్లను కంట్రోల్‌చేయాలని చూస్తుంది. నీ ఆలోచనలు భిన్నంగా ఉన్నా సహించనంటుంది. నీ మెదడు మీద నీ ఆలోచన మీద, నీ హేతుబద్ధత మీద, నీ నాస్తికత్వం మీద నీ హక్కుల ప్రకటన మీద, నీ వస్ర్తధారణ మీద, నీ తిండి తిప్పల మీద యుద్ధం చేస్తుంది. ఇవన్నీ తాను కోరుకున్న పద్ధతిలో ఉండాలని భిన్నంగా ఉంటే సహించనని అంటుంది. అక్కడ ఉంది అసలు ప్రమాదం. నోట్ల రద్దులో ఉన్నది అవినీతే అయితే అదంత పెద్ద సమస్య కాదు. అపుడు ఇంత భయానక వాతావరణం ఉండదు. ఇది అహంకారం-అజ్ఞానం-అధికారం కలగలిసిన మనిషి సృష్టించిన బీభత్సం. నేను అనుకుంటే ఏదైనా చేయగలను అనే మనిషి అహంకారానికి అడ్డుకట్ట వేయడం ఎలా అనేదే ఇవాళ మన ముందున్న ప్రశ్న.

*

అర్థాన్ని వెతికిన ప్రయాణం!

                                         Mythili

   సంతెశివర లింగణ్ణయ్య భైరప్ప గారు తెలుగువారికి బాగా పరిచయమైన కన్నడ రచయిత . నవోదయ, నవ్య, నవ్యోత్తర – ఏ కన్నడ సాహిత్య విభాగం లోనూ ఆయనను చేర్చటం వీలవదు గానీ , 2007 కు ముందు ప్రగతిశీలులందరూ ఏటవాలుగానే అయినా [ చాలా ‘ పాపులర్ ‘ రచయిత కనుక ] అక్కున చేర్చుకున్న రచయిత. ఆ ఏడు ‘ ఆవరణ ‘ నవల విడుదలయాక ‘’నవల రాయటమే రాదని ‘’ అనిపించుకున్నరచయిత కూడా . ఎవరన్నారు, ఎందు వలన అనేది చాలా పెద్ద చర్చ. మొత్తం మీద అదొక betrayal  గా తీసుకోబడింది.

బి.వి.కారంత్, గిరీష్ కర్నాడ్ లు – భైరప్ప రాసిన వంశవృక్ష, తబ్బలియు నీనదె మగనె నవలలని  సినిమాలు గా తీసుకున్నంత మాత్రాన  వారు అనుకున్నవన్నీ భైరప్ప లో అప్పటివరకూ ఉండినాయా ? ఉంటే వారు అనుకున్న పద్ధతి లోనే ఉండినాయా ?

కాకపోవచ్చు.

పరిమాణం లొనూ నేపథ్యం లోనూ మాత్రమే కాదు – తాత్వికం గా కూడా భైరప్ప గారి సరిహద్దులు పెద్దవి. ఆ సంగతి నాకు ‘ వంశవృక్ష ‘ నవల చదినప్పుడు అర్థమైంది. అందరి మాదిరే ఆ కథ ను నేను 1980 లో బాపు గారు సినిమా తీస్తేనే తెలుసుకున్నాను. మళ్ళీ వివాహం చేసుకున్న సరస్వతి [ నవలలో ఆమె పేరు కాత్యాయని ] వైపుకి మొగ్గిందన్నది స్పష్టమే. అందులో ఏమీ అన్యాయం అప్పుడు తట్టలేదు, ఇప్పుడు అంతకన్నా తట్టదు. కాని కథ లో కొన్ని ఖాళీ లు కనిపించినాయి సినిమా చూస్తుంటే. సరస్వతి ఇంటికి రాని రోజున మామ గారు ‘ చీకటి పడింది కదా, దారి తప్పి ఉంటుంది ‘ అంటాడు. అది చాలా లోతయిన వాక్యమని అప్పట్లో చెప్పుకోవటం గుర్తు.   సినిమా కథ పరం గా అది తప్పు ధోరణి.   అయినప్పుడు ఆ మాటలను అంత గంభీరం గా అనిపించటం లో ఔచిత్యం ఏముంది ? శంకరాభరణం లో వేసి జె. వి. సోమయాజులు గారు దొరికారని కాకపోతే, సినిమా లో బాపు గారు తేల్చినదానిలో    పెద్దాయన కు ఔన్నత్యాన్ని ఆపాదించేందుకు చోటు ఎక్కడ ?  ఆ పాత్ర చాలా linear గా ఉంటుంది సినిమా లో. చివరకు ‘ కనువిప్పు ‘ కలిగాకా అంతే. ఆ తర్వాత సరస్వతి కి బిడ్డలు దక్కకపోవటం ఒక విషయం. అందుకు  ఆమె అపరాధ భావనతో కృశించటం లో నాకు  అర్థమూ అగత్యమూ కనిపించలేదు.

 మరొక ఇరవై ఏళ్ళ తర్వాత – ‘ ఆ. ఎందుకులే ‘ అనుకుంటూనే చదివిన నవల నాకు మరి కొన్ని కిటికీలను తెరిచింది.

” ఇది జీవితం. ఇలాగే ఉంటుంది. ఇంత కర్కశం గా, నిర్దాక్షిణ్యం గా ఉంటుంది ” – అది రచయిత చెప్పదలచినది. ఏ పాత్రనూ సమర్థించలేదు, విమర్శించ లేదు. విభిన్నమైన ధర్మాల , కామన ల సంఘర్షణ ను చాలా నిజాయితీ గా చిత్రీకరించారు.భైరప్ప లో సర్వదా , సర్వత్రా ఒకటి కన్న ఎక్కువే దృక్కోణాలు ఉంటాయి . ఒక వృద్ధ బ్రాహ్మణ పండితుడి disillusionment  కనుక దానికి ఒక్క వైపు భాష్యమే ప్రసిద్దికెక్కింది. ఆ యేడు సితార పత్రిక అవార్డ్ లు ఇచ్చింది – వంశవృక్షం అత్యుత్తమ చిత్రం, శంకరాభరణం ద్వితీయ ఉత్తమ చిత్రం.

   భైరప్ప గారివి నేను  చదివినవి ఆరు నవలలు.  వంశవృక్ష, గృహభంగ, దాటు , పర్వ – తెలుగు లో; ఆవరణ , సార్థ ఇంగ్లీష్ లో. మొత్తం ఇరవై నాలుగింటి లో ఈ సంఖ్య కొద్దిదే. కాని అవన్నీ వేర్వేరు దశలలో రాసుకున్నవి కనుక రచయిత చేసిన ప్రయాణం ఏ మాత్రమో అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ అవగాహన లో నా అంతస్సూత్రాలు పనిచేయలేదని అనను. ఎన్ని సూత్రాల అన్వయానికైనా భైరప్ప గారి సంకీర్ణత లో వీలుంది.

 ” మృత్యువు నాకు అత్యంత  సన్నిహితం గా, అతి అనివార్యమైనది గా కనిపిస్తుంది. ఆ రహస్యానికి దగ్గరవుదామనే , అన్వేషణ లో భాగం గా  తత్త్వ శాస్త్రాన్ని  అధ్యయనం చేశాను ” అని ఆయన చెప్పుకున్నారు. ఎనిమిదేళ్ళ వయసు లో తల్లినీ, ఇద్దరు సోదరులనూ ఒక అక్కనూ ప్లేగు వ్యాధి వల్ల పోగొట్టుకున్న నిర్వేదం , నిర్లిప్తత , భీతి – ప్రాణమున్నంత వరకూ పోవు , మరిక ఎన్నటికీ ‘ మామూలు ‘ అయేది లేదు. చిన్న పనులు చేసీ ఒకోసారి బిచ్చమెత్తీ చదువుకున్నారు. ఫిలాసఫీ లో ఎం. ఏ, ఆ తర్వాత పి. హెచ్. డి ‘ సత్యం- సౌందర్యం ‘ [Truth and Beauty ] అన్న విషయం లో. ఇటువంటి మనిషి ఏ వాదం లోనైనా ఎట్లా ఇముడుతారు ?

ఆ దుర్భరమైన బాల్యాన్నంతా ‘ గృహభంగం ‘ లో రాస్తారు. లేదు. ఏమీ నిష్కృతి లేదు. నివృత్తి లేదు. ఇచ్చేందుకు రచయితకు మనసొప్పలేదు. ప్రపంచపు మహా విషాద కృతులలో చోటు చేసుకోదగిన నవల అది – వివరించేందుకు నాకూ చేతులు రావు.

 ‘ దాటు’ లో  ఒక బ్రాహ్మణ అమ్మాయి వక్కళిగ అబ్బాయిని ప్రేమిస్తుంది. కర్ణాటక లో వక్కళిగులు ఆర్థికం గానూ రాజకీయం గానూ బలమైనవారు. ఆ వివాహం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని అబ్బాయి తండ్రి కొంచెం ఊగుతాడు, అమ్మాయి తండ్రి ఒప్పుకోక పోయాక మరింకొక వివాహ పథకాన్ని వేసుకుంటాడు కొడుకుకి. అబ్బాయి

తండ్రిని ఎదిరించలేనివాడు. అమ్మాయి  తీవ్ర స్వభావ. ఆమె  తండ్రి అంత కన్నా తీవ్రుడు – ప్రతిగా తనని తను హింసించుకుంటాడు.  ఎవరికీ ఆ పల్లెటూరు వదిలిపోయేందుకు లేదు. అదీ నలుగుబాటు.

    భైరప్ప గారి నవలలో కాలం ఒక ముఖ్యమైన పాత్ర – అది సాగే కొద్దీ ప్రవృత్తులు కాస్త కాస్త గా మారుతూ ఉండటాన్ని అతి దగ్గర గా చూపించగల శక్తి ఉంది ఆయనకు.  బ్రాహ్మణుడిని    ‘ మచ్చ లేనివాడు ‘ గా ఏమీ చూపించలేదు. ఉందనే చెబుతారు, కావాలనే – అయితే అది గతం లోనే  ముగిసిపోయిన సంబంధం . అతను  గానీ ఆ నిమ్నజాతి స్త్రీ గానీ దాన్ని ఎప్పటికీ కొనసాగించాలనో దాని వల్ల తమ జీవితాలు మారిపోవాలనో అనుకోరు. ఎందుకంటే ఆ కాలానికి అది సహజం కాదు. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అభిమానమైతే ఉంటుంది ఆ తర్వాత కూడా – వారు జంతుసములు కారు. అంతకు మునుపే వచ్చిన ‘ సంస్కార ‘ లో అటువంటి సంబంధానికే ఇచ్చిన నాటకీయతను భైరప్ప గారు ఇవ్వదలచుకున్నట్లులేదు.

 పర్వ.   దీనికి చాలా ప్రశంసలు వచ్చాయి . మహా భారత ఇతిహాసాన్ని మరొక వైపునుంచి చూడటం కన్న సరదా పని ఇంకేముంటుంది ? ఇందులో గాంధారి నిస్పృహ తో కళ్ళ గంతలు కట్టుకుంటుంది. పాండురాజు ఇంచుమించు నపుంసకుడు. కుంతి అతనిని ఆకర్షించలేకపోతుంది. ఆమె శారీరకం గానూ మానసికం గానూ కూడా  ‘ పృథ ‘ – ఆమె ముందు పాండురాజు కు తను తక్కువవాడిననిపిస్తుంటుంది. మాద్రి ని డబ్బు ఇచ్చి తెచ్చుకుంటారు. పాండవులు దేవతలకు కాక హిమాలయ ప్రాంతాల లోని కొందరు ఉన్నత వ్యక్తులకు జన్మిస్తారు.

  భీమసేనుడి తండ్రి కుంతిని నిజంగా ప్రేమిస్తాడు, తన తో వచ్చేయమని బ్రతిమాలుతాడు. అతని వేదన, కుంతి నిస్సహాయత  నొప్పిస్తాయి. ధర్మరాజు, దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు – వీళ్ళలో రక రకాల ఛాయలు తెలుగుపౌరాణిక చలన చిత్రాలలో మనం చూసి ఉన్నవే, ఆశ్చర్యం కలిగించవు. భీముడిని మాత్రం పరిపూర్ణమైన వాడిగా , గొప్ప ప్రేమికుడిగా, మత్సరం లేని వాడి గా చూపిన తీరు నిండుగా ఉంటుంది. [ ‘ పర్వ’ భీముడి కోసం ఇంకా వెతుకుతూ భీముడే నాయకుడు గా ఎం.టి. వాసు దేవన్ నాయర్ ‘ రండా మూళ్జం ‘ వెతికి చదివాను – ఊహూ. ]

ద్రౌపదీ అర్జునుల మధ్య  అనురాగం, దాని లోని నెరసులు, విసుగులు – ఆమె మీద కక్ష తో సుభద్ర ను పెళ్ళాడితే – ద్రౌపది ముందు సుభద్ర ధూపానికి కూడా ఆగకపోవటం – గొప్ప చాతుర్యం తో రాస్తారు. అది అందం ప్రసక్తి కాదు , వ్యక్తిత్వం- ముఖ్యం గా తెలివితేటలు, ఆసక్తి కరమైన సాహచర్యం. సుభద్ర నిద్రపోతుంది అర్జునుడు మాట్లాడుతూండగానే – బుర్ర తక్కువదా అనిపించేలా [ పద్మవ్యూహాన్ని వివరించేప్పుడు సుభద్ర నిజం గానే పాపం నిద్ర పోయింది ] .

పర్వ లో గొప్ప న్యాయాన్ని చూపించింది కృష్ణుడి పాత్ర లో. నరకుడి చెర నుంచి విడిపించిన స్త్రీ లందరినీ ఆయన పెళ్ళాడిన కారణం వారికీ వారి సంతానానికీ సమాజం లో గౌరవాన్ని కల్పించాలని . ఆ కోణం భైరప్ప గారికి కనిపించటం విశేషం. అందరి తో ఒక్క రోజయినా  కృష్ణుడు గడపగలడని కాదు, అతి జాత్యుడని కాదు.

యుద్ధం – దాని భీకరత్వం, మిగిల్చే సర్వనాశనం – వీటిని అతి బిగ్గరగా వినిపించిన నవల ‘ పర్వ ‘ .అందులో ఉన్నది కేవలమైన పురాణవైరం కాదు

   నేను చదివినవాటిలో ‘ సార్థ ‘ కాలానుసారం ఆ తర్వాతది.నేను చదివిన వరస లో ఆఖరిది . వర్తకులను సార్థవాహులంటారు . వారి వెంట పంపబడిన నాగభట్టు అనే బ్రాహ్మణుడి కథ ఇది. సార్థ అన్న మాట లో  ఉన్న శ్లేష నవలంతా కనిపిస్తూనే ఉంటుంది

కథాకాలమైన ఎనిమిదవ శతాబ్దం లో వేద, జైన, బౌద్ధ మతా ల సంఘర్షణలు పతాక  స్థాయిలోకి చేరాయని రచయిత అంటారు. ఆదిశంకరుడు, కుమారిలభట్టు, మండనమిశ్రుడు, ఉభయ భారతి, రాజు అమరుకుడు – ఇందులో పాత్రలు గా వస్తారు. ఎక్కడికక్కడ న్యాయాన్ని  ప్రశ్నిస్తూ నవల నడుస్తుంది. ఎక్కడా నిలిచి stagnate  కాదు, అతి చలనశీలం గా ఉంటుంది. [ అలా రచయిత చెబుతూ ఉన్నది మనకు నచ్చుతోందా లేదా అన్నది కాదు ప్రశ్న .  ఆ ‘ నచ్చటం ‘ అనేది చాలా ప్రాథమికమైన చదువరుల లక్షణమని నేను అనుకుంటాను- ఉద్దేశపూర్వకం గా అలాగే ఉండదలచిన వారిది కూడానేమో, తెలియదు ] .

 రాజు అమరుకుడు నాగభట్టు భార్య ను కామించి అతని అడ్డు తొలగించేందుకు వర్తకుల రహస్యాలు తెలుసుకొనే మిష తో అతన్ని పంపించి వేస్తాడు. దారి లో ఎదురయిన బౌద్ధ విహారాలు. వాటిని నిర్మిస్తుండే శిల్పులలో ఒకరు నాగభట్టు తో మొర పెట్టుకుంటాడు – ‘ ఇదేమిటి ? వైదిక  దేవతల వర్ణన లకు తగినట్లు వారి దేవతల శిల్పాలు చెక్కమంటున్నారు ? ” – అని. బుద్ధుడు చెప్పివెళ్ళిన వర్ణరహిత  విరాగం లో ఎన్నెన్ని రంగులు – కొత్త కొత్త అవసరాల మేరకు చేరిపోయాయో రచయిత నిర్మొహమాటం గా రాస్తారు. ధనం, ఆధిపత్యం – వాటినే అవి ఎట్లా పెంచుకుంటూ పోతాయో

, వాటికి ఏమి పేర్లు తగిలిస్తారో కూడా.  ఒక నాటక సమాజం వారు అతని చేత కృష్ణుడి వేషం వేయిస్తారు – అక్షరాలా కృష్ణుడే అయినట్లు అతని రూపం సరిపోతుంది. అప్పుడు అతను అనుకుంటాడు – ” నిజం గా నేను అంత అందగాడినే అయితే నా భార్య రాజునెందుకు వలచింది ”- అని. ఈ ప్రశ్న ఆధునికానంతర కాలానికీ వచ్చి తగులుతుంది – అందం ఒకటీ చాలదు, అసలు ఏ ఒక్కటీ చాలకపోవచ్చు – ఎంచుతూ పోతే.

ఒక నాట్యగత్తె తో అతని స్నేహం , ఆమె దైహిక సంబంధానికి ఒప్పుకోకపోవటం – చివరికంటా నడుస్తుంది. ఒకే యోగి దగ్గర ఇద్దరూ ధ్యానాన్ని అభ్యసిస్తారు. ఆమె మున్ముందుకు వెళుతుంది, అతను అల్ప సిద్ధులను ఉపయోగించుకోబోయి పతితుడవుతాడు. తర్వాత కాపాలికుడయే ప్రయత్నం చేస్తాడు – ప్రయాణం సాగుతూనే ఉంటుంది.

నలందా విహారం లో – బౌద్ధుల రహస్యాలు తెలుసుకుందుకు మహా పండితుడైన కుమారిల భట్టు మారు వేషం లో చేరటం చరిత్ర లో ఉన్న విషయమే. పట్టుబడిన తర్వాత ఆయన ‘ గురు ద్రోహం ‘ [ బౌద్ధాచార్యుడి పరంగా ] చేసినందుకూ ఇటువైపున  లక్ష్యం  లో విఫలుడైనందుకూ తనకి తాను శిక్ష  విధించుకుంటాడు. వడ్ల పొట్టును పేర్చి మధ్యలో నిలుచుని దానికి నిప్పు అంటించటం ఆ శిక్ష. ఆ తీక్షణత్వం భైరప్ప రచన లో  చాలా చోట్ల కనిపిస్తుంది . సనాతన ధర్మం లో దేహం ప్రధానం కాకపోవటాన్ని అలా తీసుకొస్తారో లేక  కన్నడ దేశం లో ప్రబలిన జైనుల ఆత్మహింస [self molestation]  ఛాయ లో మరి …

 ఆ సంఘటన తర్వాత , కుమారిల భట్టు చెల్లెలు భారతీ దేవి [ ఉభయ భారతి ] కి వర్తమానం చెప్పేందుకు తిరిగి  నాగభట్టు స్వదేశం వెళతాడు. ఆమె భర్త మండనమిశ్రుడు ఒకప్పుడు తనకు గురువు. వారి ఇల్లు, గృహస్థ జీవనం, విద్యాదానం, అతిథులకు సత్కారం, అభ్యాగతులకు ఆశ్రయం – ఇది జీవిత పరమ ధర్మం గా రచయిత నిరూపిస్తారు.

కాని –

కర్మ యోగానుసారి అయిన మండనమిశ్రుడు జ్ఞాన యోగాన్ని వ్యాప్తి చేసిన ఆది శంకరుల చేతిలో ఓడిపోతాడు.  గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలు దాటకుండా బ్రహ్మచారి సన్న్యాసం తీసుకోవటం వేద విరుద్ధమని మండన మిశ్రుడు వాదించినా ఉపయోగం ఉండదు. బౌద్ధులకు విరుగుడు గా శంకరులు బలపరచిన మాయా వాదాన్ని ఒప్పుకోలేకపోతాడు. మధ్యస్థం వహించిన ఉభయభారతి కామశాస్త్రం లో ప్రశ్న లు అడగటమూ శంకరులు రాజు అమరుకుడి దేహం లో ప్రవేశించటమూ – ఇక్కడ , శిష్యులు వెళ్ళి హెచ్చరిస్తే గాని ఆ దేహాన్ని వదిలి రావాలని శంకరులకు తోచదు. మాయాబద్ధులయినారు కద.

    శంకరులు యువకుడు, ఎక్కువ జవసత్త్వాలున్నాయి. మండన మిశ్రుడి శరీరానికీ బుద్ధికీ కూడా వార్థక్యం వస్తోంది – అతను ఓడిపోతాడు. అలా అని భారతీ దేవే ప్రకటించవలసి వస్తుంది. మాట ఇచ్చిన మేరకు ఆయన సన్న్యాసి అయి శంకరులకు శిష్యుడవుతాడు.ఆ తర్వాత శంకరులు ఉభయభారతి ని శృంగేరి శారదాంబ గా ‘ ప్రతిష్టించారనే ‘ ఐతిహ్యం ఉంది. ఈ నవల లో భారతీ దేవి భర్త సగం లో వదిలేసి వెళ్ళిన పనిని నిబ్బరం గా పూర్తిచేసేందుకు సిద్ధమవుతుంది, అంతే.

  అనేకమైన కారణాల వలన ఒక వాదం  ఒక చోట, ఒక సమయం లో  వీగిపోవచ్చును – గెలిచినదే సత్యం అయి తీరాలని లేదు. ఈ విషయం బాహాటం గానే ప్రకటిస్తారు  రచయిత.

   అందరూ భిక్షుకులైతే భిక్ష పెట్టేవారెవరు ? అందరూ సన్న్యాసులైతే బిడ్డలను కని ప్రపంచాన్ని నడిపించేవారెవరు ? అలా కాక కొందరికే అది వర్తిస్తుందంటే దానికి ప్రచారమూ పోటీలూ దేనికి ? మేధా శక్తి ఎక్కువ ఉన్నవారిని ఆ వంక తో లోపలికి లాగితే తమ వాదం బలపడుతుందనా ? నిర్భయం గా రచయిత వేసిన ప్రశ్నలు ఇవి.

 నవల చివర లో అరబ్ ల దండయాత్ర. బలవంతపు మత మార్పిడులు జరుగుతుంటాయి. నాగభట్టూ అతని స్నేహితురాలూ ఇద్దరూ పట్టుబడతారు . అరబ్ సేనాని నాగభట్టు తో వాదిస్తాడు. ఇతను అంటాడు – ” నేను భగవంతుడున్నాడని నమ్ముతున్నానో లేదో నాకే తెలియదు. అలా కూడా ఉండేందుకు మా ధర్మం లో వీలుంది. ఎవరూ ఎందుకూ బలవంతపెట్టరు ” అని. అరబ్ ముందు ఆశ్చర్యపోయి తర్వాత హేళన చేస్తాడు – ” మీది అసలు మతమే కానట్లుందే ” అని.

  అవును.  అనాదిగా ఈ దేశంలో మతం లేదు – ధర్మం మాత్రమే ఉంది. బల ప్రయోగాలూ ప్రలోభపెట్టటాలూ ఇక్కడ పుట్టినవారూ బయటినుంచి వచ్చినవారూ  కూడా ఆ పిదపనే  చేసుకుపోయారు.

 ముగింపులో నాగభట్టును రక్షించేందుకు స్నేహితురాలు అరబ్ సేనానికి లోబడిపోయి  గర్భవతి అవుతుంది, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది.  ఇద్దరూ తప్పించుకోగలిగి గురువు దగ్గరికి వెళతారు. గురువు వారిని   వివాహం చేసుకొని గృహస్థాశ్రమం లో ప్రవేశించమనీ ఆ బిడ్డ ను నాగభట్టు బిడ్డ గానే పెంచమనీ ఆదేశిస్తాడు.

    సార్థ 1998 లో వచ్చింది. ఆవరణ ఆ తర్వాత తొమ్మిదేళ్ళకి వచ్చింది .

      స్వ స్తి.

*

                              

వేయి ప్రశ్నల ‘పడగలు’

 ‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-3

 

sudrarsanamవిశ్వనాథ భావజాలానికి ఆర్.ఎస్ సుదర్శనం ‘బాహ్యమిత్రు’డే కాక’, ఇంగ్లీషు చదువుతో భారతీయేతర గవాక్షం నుంచి దానిని చూసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన వ్యక్తి అన్న సంగతిని మరోసారి గుర్తుచేసుకుని ‘వేయిపడగల’కు వద్దాం.

వేయిపడగలు ఆయనకు పెద్ద పజిల్ గా మారింది. అనేక ప్రశ్నలు, సందేహాలతో పాటు చికాకునూ కలిగించింది. ‘ఏకవీర’లో కనిపించిన తాత్విక పటిమ కానీ, స్పష్టత కానీ ఆయనకు అందులో కనిపించలేదు.

‘నేతి నేతి’ అనే పద్ధతిలో ఆయన పరిశీలన ఇలా సాగుతుంది:

“వాఙ్మయమనగా నేమి?” అని ప్రశ్నించి చివరగా, “కావ్యాత్మయే కాక, కావ్యశరీరము, కావ్యస్వరూపము కూడా నీ జాతి సిద్ధాంతముల మీద నాధారపడియుండును…” అన్న విశ్వనాథ వారి వివరణను తీసుకుని, కావ్య శరీరము, కావ్యాత్మ వేయిపడగలులో ఎలా అనుసంధింపబడ్డాయో సుదర్శనం పరిశీలించారు. ముందుగా కావ్యాత్మను తీసుకుంటే, నవలలోని పాము- అంటే కథాస్థలమైన సుబ్బన్నపేటలో జమీందారు కట్టించిన ఆలయంలో,  బ్రాహ్మణుడు ప్రతిష్టించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు హిందూ వ్యవస్థాధర్మానికి ప్రతీక.  దానికి అతీతమైన, మౌలికమైన సనాతన ధర్మానికి అక్కడే ప్రతిష్టితమైన శివలింగం, లేదా నాగేశ్వరస్వామి ప్రతీక. కథా ప్రారంభంలో రచయిత ఈ ఇద్దరు దేవుళ్ళకు(అంటే వ్యవస్థాధర్మానికీ, సనాతన ధర్మానికీ)భేదం పాటిస్తాడు. కానీ ఆ వెంటనే మొదలుపెట్టి, రచన అంతటా రెంటికీ మధ్య అభేదాన్ని పాటించాడు. ఈ విధంగా, ఏకవీరలో ఉన్న తాత్విక స్పష్టత వేయిపడగలులో ముందే లోపించింది.

పోనీ వ్యవస్థాధర్మంతో అభేదం పొందిన ఆ సనాతనధర్మ నిరూపణే కావ్యాత్మ అవుతుందా? ఆ నిరూపణ ఇందులో చిత్రితమైన పాత్రల ద్వారా జరగాలి. ఇందులోని ముఖ్యపాత్ర ధర్మారావు. అతను ధర్మానికి ప్రతినిధి అని రచయిత ఉద్దేశం. అయితే, ధర్మారావు ఏ ధర్మానికి ప్రతినిధి; వ్యక్తి ధర్మానికా, వ్యవస్థాధర్మానికా, సనాతనధర్మానికా అని ప్రశ్నించుకుంటే  సంతృప్తికరమైన సమాధానం దొరకదు.  రచయితేమో, అతను సనాతనధర్మాన్ని దర్శించిన జ్ఞాని, వ్యవస్థాధర్మానికి సాధికారవ్యాఖ్యాత, లోకవ్యవహారానికి సాక్షీభూతుడు అంటాడు. అతనిది ఆజన్మ సిద్ధమైన జ్ఞానమార్గమనీ; భక్తి, కర్మమార్గాలను అనుసరించేవారికి కూడా అతను గురువనీ అంటాడు.

కానీ అతని నడవడి చూద్దామా అంటే ఇవేమీ కనిపించవు. అతను ఏకవీరలా సాధకుడు కాడు. అతనిలో సందేహాలూ, సంఘర్షణలూ లేవు. అయినా అతన్ని సనాతనధర్మాన్ని దర్శించిన జ్ఞాని అని రచయిత ఎలా (పూర్వజన్మ సుకృతం వల్ల కాబోలని సుదర్శనంగారి వ్యంగ్యం)అన్నారో? ఇక లోకవ్యవహారానికి సాక్షీభూతుడు అయ్యే నిర్లిప్తత అతని మనస్తత్వంలోనూ లేదు, దానిని సాధించే పరిస్థితులు అతని జీవితంలోనూ లేవు. ఆపైన అతనిలో ఎంతసేపూ లోకవిమర్శ తప్ప ఆత్మవిమర్శ లేదు. స్వోత్కర్ష మాత్రం కావలసినంత. జ్ఞానమార్గంలో అతను పొందిన పరిణామ మేమిటో రచయిత ఎక్కడా చెప్పలేదు. పైగా అతనిలో హిందూ వ్యవస్థా ధర్మానికి తనే వ్యాఖ్యాతా, సొంతదారు ననే విపరీత అహంకారం.

ధర్మారావు కర్మయోగి, జ్ఞానయోగి అయితే, కొత్త కొత్త పద్ధతుల మీద; జీవిత విధానాల మీద అంత ద్వేషభావం దేనికి? అది జిజ్ఞాసువు లక్షణం కాదు. అతనిలో సమన్వయ దృష్టిలేదు. అతనికి కొత్త ఒక రోత పాత ఒక నీతి. మారుతున్న పరిస్థితులలో కూడా హిందూధర్మం సృజనాత్మక శక్తే నని నిరూపణ చేసే ఉద్దేశమే నవలకు ఉన్నట్లైతే ధర్మారావు సృష్టి మరొక విధంగా ఉండేదన్న సుదర్శనం, ఇక్కడ కూడా ‘మాలపల్లి’తో పోలిక తెస్తారు. ధర్మారావుకు భిన్నంగా ‘మాలపల్లి’ నవలలోని సంగదాసు, రామదాసులు పాత కొత్తల సంగమస్థానంగా, మేలు కలయికగా కనిపిస్తారు.

కనుక కావ్యాత్మ సనాతనధర్మ నిరూపణ కాదు. సనాతన, వ్యవస్థా, వ్యక్తి ధర్మాల మధ్య స్పష్టమైన తేడాను పాటిస్తూ వీటి మధ్య సంబంధాన్ని నిరూపించే తాత్వికదృష్టిని వస్తు విన్యాసంలో రచయిత పాటించలేదు.

పోనీ  వ్యవస్థాధర్మనిరూపణ కావ్యాత్మ అవుతుందా? రచయిత చెప్పినట్టు వ్యవస్థ నాలుగు స్తంభాల ధర్మమంటపం. స్వామి(భగవంతుడు), రాజు, బ్రాహ్మణుడు, గణాచారి(కాలం)…ఈ నలుగురూ నాలుగు స్తంభాలు. స్వామి, ప్రభువు, ధర్మారావు(ధర్మం)ల మధ్య అభేద తాదాత్మ్యం.  ధర్మాచరణ రాజు కర్తవ్యం, ధర్మప్రచారం బ్రాహ్మణుని కర్తవ్యం. పసరిక పైరుపచ్చకు ప్రతీక, దేవదాసి శృంగారయుతమైన భక్తిమార్గం, హరప్ప వైదిక కర్మానుష్ఠానం, గోపన్న సేవావృత్తి. ఇదీ వ్యవస్థకు చెందిన అవయవ విభాగం. ఈ వ్యవస్థకు కేంద్రంలో ధర్మారావు. ఈ ధర్మారావు ఎటువంటి వ్యక్తో పైన కొంత చెప్పుకున్నాం. మరికొన్ని విషయాలు తర్వాత చెప్పుకుందాం.

జమీందారు, అంటే రాజువైపునుంచి, ధర్మాచరణలో జరిగిన ఒక లోపంతో నవల ప్రారంభమవుతుంది. ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి మాసికాన్ని జమీందారు నిర్లక్ష్యం చేస్తాడు. ధర్మారావు రుణగ్రస్తుడైనట్టు సేవకుడు గోపన్న వెళ్ళి చెప్పిన తర్వాతే తండ్రి మాసికానికి ధర్మారావుకు జమీందారు డబ్బు ఇస్తాడు. ముందే తెలుసుకోకపోవడం జమీందారు ధర్మాచరణలో జరిగిన లోపం. అందుకే అతనిని కలలో వేయిపడగల పాము కాటువేసి శిక్షిస్తుంది.  ఇక్కడ ధర్మాచరణ సమ్యక్ స్వరూపం మనకు ఏం తెలిసినట్లు అని సుదర్శనంగారి  ప్రశ్న.

రచయిత చిత్రీకరణ ప్రకారం, “రామేశ్వరశాస్త్రి వర్ణాశ్రమధర్మముల ముద్దకట్టిన మూర్తి, భారతదేశము యొక్క ఆత్మ, త్రయీధర్మవిద్య కొక వ్యాఖ్యానము.” మరోవైపు, రామేశ్వరశాస్త్రి అందగాడు, రసికుడు, దేశము నాలుగుమూలలా తిరిగివచ్చినవాడు. ఆయన వితరణ బుద్ధి హద్దులేనిది. జమీందారు తర్వాత జమీందారు. నాలుగువర్ణాల ఆడబడుచుల్నీ పెండ్లాడి ఒక భోగాంగనను చేరదీసినవాడు.  ఇలాంటి వాడు భోగి కానీ యోగి ఎలా అవుతాడని సుదర్శనంగారి ఆక్షేపణ. “వర్ణాశ్రమధర్మాల ముద్ద కట్టిన మూర్తి” గా రచయిత  చిత్రించిన రామేశ్వరశాస్త్రి గృహస్థుగానే మరణించాడే, మరి ఆయన పాటించిన ఇతర ఆశ్రమధర్మాలు ఏమిటన్నది ఆయన లేవనెత్తిన మరో ప్రశ్న. అలాగే రామేశ్వరశాస్త్రి చేసుకున్న వర్ణాంతరవివాహాలపైనా అనేక ప్రశ్నలు. అవి వర్ణధర్మాన్ని సమర్థిస్తున్నాయా అంటే, సమర్ధించడంలేదు. అవి నేటి వర్ణవిభేదాలకు పరిష్కారం సూచిస్తున్నాయా అంటే ఆ పరిష్కారం ఎంతమందికి నచ్చుతుంది? దాని యథార్థ స్వరూపం ఏమిటి? ఇలా వ్యవస్థా నిరూపణ ‘ఆదర్శం’ నుంచి ‘యాథార్థ్యం’లోకి దిగివస్తుందంటారు సుదర్శనం.

veyi

ధర్మారావు ‘బ్రాహ్మణత్వం’ అన్న ఆదర్శానికి ఎటువంటి సమర్థన అన్నది ఆయన సంధించిన మరో ప్రశ్న. బ్రాహ్మణత్వం అంటే కేవలం ‘ధర్మప్రచార’మేనా? ఈ విధంగా తర్కిస్తే నవలలో వ్యవస్థా ధర్మ నిరూపణం అసంతృప్తినే కలిగిస్తుంది. ఆకృతి(Form)కి తగిన పుష్టి(Substance) జరగలేదని అనిపిస్తుంది. అంతిమంగా చెప్పాలంటే,  నవలలో రచయిత సమర్థించబూనుకున్న వ్యవస్థకు అసలు ఉనికే లేదు– ఇదీ సుదర్శనంగారి నిర్ధారణ.

మొత్తానికి ఆయనకు ఇదొక  పెద్ద చిక్కుముడి. విశ్వనాథవారి మాటలను పట్టుకుని ఇందులో కావ్యాత్మ సనాతన ధర్మమా, లేక హిందూవ్యవస్థా ధర్మమా అన్నది వెతకబోతే ఆ దారి ఇలా మూసుకుపోయింది. “ఏతావాతా తేలే దేమిటంటే: హిందూ వ్యవస్థ యొక్క ఆదర్శాన్నీ, దాని పటుత్వాన్నీ నిరూపించే ఉద్దేశమే ‘వేయిపడగల’ కావ్యాత్మ అనటానికి, పాత్రచిత్రణమూ, కథాగమనమూ, దాని స్ఫూర్తీ  అందుకు భిన్నంగా ఉన్నా” యన్న నిర్ధారణకు వచ్చారు.

మరి ఇప్పుడేం చేయాలి? దారి మార్చుకోవాలి!

రామేశ్వరశాస్త్రి ‘వర్ణాశ్రమ ధర్మాలు ముద్దకట్టిన మూర్తి’ కాకపోతేనేం, అతనొక ఉత్తముడైన మానవుడే. ఆయన కానీ, ధర్మారావు కానీ ఆనాటి బ్రాహ్మణవర్గానికి ఏవిధంగానూ ప్రతినిధులు కాకపోతేనేం, తమలోని మానవత్వానికీ(సుదర్శనంగారు ఈ మాటను మానుషత్వం అనే అర్థంలో వాడినట్టుంది), దాని విశిష్టతకూ ప్రతినిధులు. అలాగే, అందులోని మిగిలిన పాత్రలు కూడా. “వారిలో ప్రకాశితమవుతున్నది వ్యక్తిగతమైన విశిష్టతే! ఇటువంటి వ్యక్తుల ద్వారా సమకాలీన సమాజంలోని వర్ణవిభేదాలను, వర్గీకరణను సమంజసమని సమర్థించడం ఎట్లా? నవలలో ధర్మారావు ద్వారా జరిగే వ్యాఖ్యానానికి, సమర్థనకూ ఈ దోషం సర్వత్రా ఉంది. అందువల్ల నవలలో వాచ్యముగా జరిగినంత మేర వ్యవస్థ నిరూపణము యాథార్థ్యం దృష్ట్యా జరగలేదనే చెప్పాలి” అని సుదర్శనంగారి తీర్మానం.

ఇలా ‘వేయిపడగలు’ కావ్యాత్మ సనాతన ధర్మ నిరూపణమా, లేక వ్యవస్థా ధర్మ నిరూపణమా అన్న విచికిత్స నుంచి బయటపడిన సుదర్శనంగారు, చివరికి అది ‘ధర్మారావు జీవిత చరిత్ర’ అని తేల్చారు. అది అతని మనస్థితికీ, ఆ మనస్థితికి కారణాలైన సాంఘికపరిస్థితులకూ దర్పణం అన్నారు. కనుక నవల కావ్యాత్మ ధర్మారావు వ్యక్తిత్వమే! సనాతనధర్మమో, హిందూ వ్యవస్థా ధర్మమో కావ్యాత్మ అనుకోవడం వల్ల వాటి నిరూపణ అసంతృప్తిని కలిగించి విమర్శలను రేకెత్తిస్తోంది కానీ, ఇలా దృష్టి మార్చుకుని, నవల కావ్యాత్మ ధర్మారావు వ్యక్తిత్వమే అనుకుని చూసినప్పుడు చిక్కుముడి విడిపోతుంది…. సనాతనధర్మం, హిందూ వ్యవస్థా ధర్మం అనేవి ఇందులో గౌణమే తప్ప ప్రధానం కావు. అవి ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వం ద్వారా మనకు దృశ్యమానమవుతున్నాయి. ఆ మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వం వాటిలోనూ దృశ్యమానమవుతున్నాయి…

ఇలా అనుకున్న సుదర్శనంగారు, ఇక్కడ చేసింది ఒకవిధమైన శస్త్రచికిత్స. తల్లి ప్రాణాన్ని కాపాడలేకపోయినా కనీసం బిడ్డనైనా కాపాడే ప్రయత్నం లాంటిది. విశ్వనాథ లక్షించిన వ్యవస్థాధర్మ నిరూపణ లేదా స్వీయ భావజాలం అనే ‘తల్లి’ నుంచి, ‘పాత్రలు’ అనే బిడ్డను వేరు చేసి వాటిని స్వతంత్ర జీవంతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో తల్లిని పక్కన పెట్టేశారు. అప్పుడిక ఆ పాత్రలలో ఎలాంటి వైరుధ్యాలు, వైపరీత్యాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతమైనవే తప్ప వ్యవస్థకు సంబంధించినవి కావు. ఇలా పాత్రల ముఖంగా చూసినప్పుడు విశ్వనాథ ఆదర్శం సార్వత్రిక హిందూ వ్యవస్థాధర్మాన్ని చిత్రించడం కాదు, తెలుగు దేశాన్ని, తెలుగుదనాన్ని చిత్రించడం!

ఇలా సుదర్శనంగారి ప్రకారం, నవలలో సుబ్బన్నపేటే తెలుగుదేశం. సుబ్బన్నపేట అంటే ధర్మారావు. ఇది కావ్యశరీరం. ధర్మారావు పాత్ర సమర్థించినది క్రమంగా అదృశ్యమవుతున్న గ్రామీణమైన తెలుగుదనాన్ని. ఆంగ్లభాషా, పాశ్చాత్య నాగరికతా సోకని తెలుగుదనం నిలబడలేదనే అతని ఆవేదన. అందులో లోటుపాట్లు అతనికి కనిపించవు. అదంతా హిందూధర్మ స్వరూపమే నని అతను భ్రమపడతాడు. దాని సమర్థనకోసం తను అహంభావం పెంచుకున్నా ఫరవాలేదనుకుంటాడు. తరచు భావం కంటే అహంభావమే అతనిలో ముందుకు వస్తుంది. రైలు మార్గాలు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాక్టరీలు, డబ్బు చలామణి, శారదా చట్టం, వితంతు వివాహాలు, హరిజనుల ఆలయప్రవేశం సహా అన్నిటినీ వ్యాఖ్యానిస్తాడు. అన్నిటినీ వ్యతిరేకిస్తాడు. ఇంగ్లీషు చదువుకుంటాడు, కానీ ఇంగ్లీషును ద్వేషిస్తాడు. తండ్రి మాసికానికి జమీందారు దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు, “నేను యాచించలేదు…ఆయనయే ఇచ్చెను” అని, భంగపడిన ఆహాన్ని సమర్థించుకుంటాడు. “అతనిలో స్వాభిమానము మెండు, దానికి బాధాకరమైన సత్యాన్ని దర్శించే చొరవ, సాహసం అతనిలో లేవు. ఆ పరిస్థితిలో సత్యరూపాన్ని భిన్నంగా తనకు అనుకూలంగా దర్శించే ప్రయత్నం చేస్తాడు. అందువల్లనే అతని ప్రవర్తన కూడా సమయానుకూలంగా ఉంటుంది” అని సుదర్శనంగారి వ్యాఖ్య.

ధర్మారావు అబద్ధం ఆడడానికి కూడా వెనుకాడడు. తను చదువుతున్న కళాశాలలో క్రైస్తవ విద్యార్థులు హిందూ మతాన్ని అవమానించినప్పుడు హిందూ విద్యార్థులు చేసిన సమ్మెలో అతను పాల్గొనడు. “ఎదిరించి నీ వేమైన చేయగలవా?”అని ఉపదేశిస్తాడు. ఇక్కడ సుదర్శనంగారి వ్యాఖ్య ఇలా ఉంటుంది: “ఇక్కడ ధర్మరక్షణ కంటే ఆత్మరక్షణ ప్రధానమైనది! ధర్మారావునకు హిందూ ధర్మముతో తాదాత్మ్యము, అది తనకు ఉపయోగపడునంతవరకే. దానికి తాను ఉపయోగపడవలసి వచ్చినప్పుడు వాగ్వాదము, వ్యాఖ్యానము కావలసినంత! ఇక్కడ అసలు విషయం, జమీ లేకపోయినా ధర్మారావు జమీందారు బిడ్డ. కష్టములను ఎదుర్కోవడం కంటే వాటిని తప్పించుకోవడమే అతని స్వభావం.”

ధర్మారావు కవి, భావుకుడు కూడా. తను కష్టపడి సాధించగలిగినదేమీ అతనికి మిగిలినట్లే తోచదు: ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలలో ధర్మారావు ఇటు అర్థం కోసం కానీ, అటు మోక్షం కోసం కానీ ప్రయత్నం చెయ్యడు. తనే ధర్మావతారం. పెళ్లి చిన్నతనంలోనే జరగడంవల్ల కామానికి ఇబ్బంది లేదు. ఇక సాధించవలసిందేమిటి? లోకానికి గురువు కావడం! ధర్మారావు గురుత్వం వహించని, సలహా ఇవ్వని అతనితో సంబంధం లేని పాత్రలేదు. ఏ విధంగానైనా అతనికి సమవుజ్జీయో, అధికుడో అయ్యే పాత్ర కనిపిస్తే అతనికి నవలలో చరిత్రే లేదు. వాదంలో ధర్మారావు ముందు ఓడిపోనివారు లేరు. తన గొప్పదనాన్ని గుర్తించని వారి మీద రౌడీలను పురిగొల్పడానికి వెనుదీయడు. ఇక అతని పనేమిటన్నది చూస్తే, స్వామికి ఉత్సవాలు జరిపించడం తప్ప ఏమీ చేయడు. ధనవంతురాలు, ‘పతిత’ అయిన మంగమ్మతో అతనికి ‘రహస్య’ సంబంధం. భార్య అనారోగ్యంతో ఉన్నా, మంగమ్మ ఇంటికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వస్తుంటాడు.

సుదర్శనంగారి ప్రకారం, తులనాత్మకంగా చూస్తే, ధర్మారావుతో పోల్చగల పాత్ర రవీంద్రుని గోరా. కానీ ఇద్దరి వ్యక్తిత్వాలలో ఎంతో తేడా. ధర్మారావులానే హైందవవాది అయిన గోరా, చివరికి ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య ‘ అన్నట్టుగా, “నేనీరోజున భారతీయుడిని. హిందువు, ముస్లిము, క్రైస్తవుడు…ఎవరైనా కానీ, నాలో ఇప్పుడు ఎలాంటి మతఘర్షణా లేదు. ఈ రోజున భారతదేశంలోని అన్ని కులాలూ నా కులమే” అనుకునే స్థితిని చేరుకుంటాడు. కానీ ధర్మారావుకు సర్వధర్మాలూ తనే నన్న భావము. అతను అసలు పయనించనే లేదు, గమ్య స్థానం చేరుకోవడమెక్కడ? ఈ భేదమే రవీంద్రుని విశ్వకవిని చేస్తే, ఆయన కంటే ప్రతిభావంతుడైన విశ్వనాథను తెలుగు కవిసమ్రాట్ గానే నిలిపిందని సుదర్శనంగారి వ్యాఖ్య. “‘నౌకాభంగము’ నుంచి ‘గోరా’వరకు రవీంద్రుడు ఎన్ని మెట్లు పైకి ఎక్కెనో, ‘ఏకవీర’నుంచి ‘వేయిపడగల’వరకు విశ్వనాథ అన్ని మెట్లు క్రిందికి దిగెను” అన్నది ఆ వెంటనే ఆయన చేసిన మరో కీలకమైన వ్యాఖ్య.

ఇలా ధర్మారావులోని లక్షణాలను సుదర్శనంగారు ఎత్తి చూపుతూనే, అతను ఆదర్శప్రాయుడు కాకపోతేనేం, “రాగద్వేషాలూ, రక్తమాంసాలూ, కష్టసుఖాలూ కలిగిన మనిషి. అచ్చమైన తెలుగువాడు. వ్యవస్థా ధర్మానికి, యోగమార్గానికి ప్రతినిధిగా తృప్తి కలిగించకపోయినా తెలుగుదనం ముద్దకట్టిన మూర్తి ధర్మారావు” అంటారు. ఆయన దృష్టిలో, (‘ఏకవీర’కు ఉన్నట్టు)’వేయిపడగలు’కు ఒక తాత్విక దృక్పథం ఆలంబనంగా లేకపోవచ్చు, కానీ అది కాల్పనికోద్యమకాలంలో వెలువడిన ఆత్మాశ్రయకవిత్వ శాఖలో ఒక అపురూపమైన కావ్యం. తెలుగుదేశంలో శిథిలమై అదృశ్యమవుతున్న పూర్వ నాగరికత చివరి మెరుగుల్ని చూచిన విశ్వనాథ హృదయం సంక్షోభించి వెలువడిన సుదీర్ఘ నిశ్వాసమే వేయిపడగలు. అది ఒక వైయక్తిక హృదయోద్వేగం. అంతేకాదు, సుదర్శనంగారి దృష్టిలో వేయిపడగలు, డి. హెచ్ లారెన్స్ నవల The Rainbow తో పోల్చదగింది కూడా.

***

ఈవిధంగా సుదర్శనంగారు వ్యవస్థాధర్మ నిరూపణం అనే ‘తల్లి’ నుంచి ‘పాత్రలు’ అనే బిడ్డను వేరు చేయడమే కాదు; రచనను  వైయక్తిక హృదయోద్వేగాన్ని చాటే గొప్ప సాహిత్యప్రతిపత్తి కలిగిన ఆత్మాశ్రయకావ్యస్థాయికి ఎత్తి సహృదయతను నిరూపించుకున్నారు. నవలలో ప్రకటితమైనది ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వాల మూసలోంచి వ్యక్తమవుతున్న  హైందవవ్యవస్థా ధర్మమే తప్ప అదే అసలు హైందవధర్మం కాదన్న భావనను ధ్వనింపజేశారు. అంటే, ఇందులో ప్రకటితమైన హైందవ ధర్మ, తాత్వికతలకు భిన్నమైన హైందవ ధర్మమూ, తాత్వికతా వేరే ఉన్నాయని ఆయన భావించారన్నమాట.

అలా భావించడంలో సుదర్శనంగారి ‘బాహ్యతా’, ‘మిత్రతా’ కూడా వ్యక్తమవుతున్నాయా?!

(సశేషం)

సిరివెన్నెల శివదర్పణ గీతం!

 siva

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గొప్ప గీతరచయితలే కాక గొప్ప శివభక్తులు కూడా. తమ గురువు గారైన సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో శివునిపై వేయి గీతాలు రాయాలని సంకల్పించారు. ఈ గీతాలలో కొన్ని “శివదర్పణం అనే పుస్తకంగా వచ్చాయి. ఈ పుస్తకంలోని పాటలు కొన్ని  రెండు ఆడియో క్యాసెట్లుగానూ వచ్చాయి. ఈ గీతరచనా సంకల్పం గురించి “శివదర్పణం”లో సిరివెన్నెల ఇలా చెప్పారు –

“అడగకుండానే, శ్రమించి సాధించకుండానే, మాటల్ని పాటల పేటలుగా కూర్చే చిన్ని విద్దెను పుట్టుకతోనే ఇచ్చిన పరాత్పరుడి కరుణాకటాక్ష వరానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బతుకుని అర్థవంతం చేసుకుని తరించే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అనిపించడమే శ్రీకారంగా, ఈ గీతాయజ్ఞం 1990లో ప్రారంభించాను. వెయ్యి పాటల్నీ వెయ్యి యజ్ఞాలుగా చేసి, సహస్రమఖ పూర్తి సిద్ధి పొంది, తద్వారా లభించే దేవేంద్రత్వాన్ని, దేవదేవుని సేవేంద్రత్వంగా మలచుకోవచ్చని అత్యాశ కలిగింది!”

ఆయన అత్యాశ మన పాలిటి వరమై, అద్భుత సాహితీ యజ్ఞమై నిలిచింది! ఈ పుస్తకంలో ఉన్న ప్రతిపాటా ఆణిముత్యం. భక్తిగా సిరివెన్నెల తనని తాను శివునికి అర్పించుకున్న విధానం మనసుని స్పందింపజేస్తుంది. ఈ పాటల్లో ఆయన వాడిన భాషని చూస్తే సిరివెన్నెల ఎంత పదసంపద కలవారో తెలుస్తుంది. సినిమా పాటల కోసం తనని తాను భోళాశంకరునిగా మలచుకున్నారే తప్ప ఆయనో మహోన్నత కైలాస శిఖరమని అర్థమవుతుంది!

“శివదర్పణం” అంటే శివుణ్ణి చూపించే అద్దం. అయితే సిరివెన్నెలకి శివుడంటే క్యాలెండర్ లో కనిపించే దేవుడు కాదు. శివుడంటే మనం, శివుడంటే సమస్తం! ఆయన మాటల్లోనే చెప్పాలంటే –

“జగత్తు మొత్తాన్నీ త్రికాలసమేతంగా సాకల్యంగా సజీవంగా సంక్షిప్తంగా ప్రతిబింబించే అద్దం మనం! అలాగే మనకీ ప్రపంచం అద్దమవుతుంది. అయితే మనలా సూక్షంగా లేదే? మన భౌతిక తత్త్వాన్ని సరిగ్గా మన పరిమాణంలోనే ప్రతిబింబించేలా ప్రపంచాన్ని కుదించగలమా? అలా కుదిస్తే ఆ అద్దం శివుడు అవుతుంది. శివుడంటే ప్రపంచమే! శివుడంటే మనమే! శివుణ్ణి సరిగ్గా చూడగలిగితే మనని మనం సరిగ్గా, సజీవంగా, సంపూర్ణంగా, చూడగలం. అలాంటి శివదర్పణాన్ని చూపించడమే నా ఉద్దేశ్యం!”

ఆయనిలా చక్కగా చూపించినా, అర్థమయ్యేలా వివరించినా, శివతత్త్వాన్ని గ్రహించడానికి చాలా సంస్కారం, జ్ఞానం ఉండాలి అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సిరివెన్నెల గీతధారలో తడిసే ఆనందం దక్కాలంటే మాత్రం హృదయం ఉంటే చాలు. అందుకే ఈ పుస్తకంలోని ఒక పాటని పరికించి పులకిద్దాం!

sirivennela

“తొలిజోత” అనే పేరుతో రాసిన ఈ గీతం పుస్తకంలో మొదటిది. శివదర్పణ యజ్ఞాన్ని మొదలుపెడుతూ వినాయకునికి ప్రార్థనగా రాసిన గీతం.

పల్లవి:

 

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత

ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత

నా తలపోత! కైతల సేత!

 

చరణం 1:

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత

ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!

అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత

అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట

ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

 

చరణం 2:

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత

స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత

అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత

శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా

తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

 

చరణం 3:

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత

కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత

శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత

సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత

అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

 

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత

ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత

నా తలపోత! కైతల సేత!

 

విఘ్నేశ్వర స్తుతిలోనూ తెలివిగా శివుణ్ణి ప్రస్తుతించారిక్కడ సిరివెన్నెల! “అగజాసూనుడు” అంటే పార్వతీ (అగజా) తనయుడైన (సూనుడు) వినాయకుడు! అఖిల జగాలూ ఏ పని చేసినా ముందుగా దణ్ణం పెట్టుకునేది వినాయకునికి! మరి ఆ వినాయకుడు భక్తిగా తొలిపూజ చేసేది ఎవరికి అంటే శివుడికి! ఆ శివుడికి సిరివెన్నెల తన గీతాలను అంకితం ఇస్తున్నారు. ఈ శివదర్పణ కృతి సిరివెన్నెల మేధలోంచి జాలువారిన  కవితామృతధార! ఆ తలపోత, కైతలసేత పొందే ధన్యత మనది!

 

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత

ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!

అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత

అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట

ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

 

వినాయకుడికి (హేరంబుడు) తొలి వందనాలు చేసి మొదలుపెట్టిన ఏ పనైనా ఆయన ప్రాపు (ఆలంబన) వల్ల విఘ్నాలు లేకుండా వేగంగా (అవిలంబితము) సాగుతుంది. ఇక్కడ సిరివెన్నెలకి అవ్వాల్సిన పని వేయి గీతాలు పూర్తిచెయ్యడం కాదు. ఆ గీతాల ద్వారా తాను చేసిన శత వందనాల చేష్టని (శత వందనముల చేత) ఆ శివుని చెంతన చేర్చడం!  ఇది తన వల్ల అయ్యేది కాదు కనుక చంద్రజేత అయిన వినాయకుని శరణుకోరుతున్నాను అంటున్నారు! ఆ వినాయకుడు శివుడికి రోజూ అర్పించే వందనాల (అంజలి) వెంట సిరివెన్నెల యొక్క  హృదయభారాన్నీ తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుని పాదాల చెంత అర్పించాలట! ఎంత చక్కని భావం!  చేత/జేత వంటి పదాలతో శబ్దాలంకారాలు చేస్తూనే గొప్ప అర్థాన్నీ సాధించారిక్కడ సిరివెన్నెల!

 

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత

స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత

అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత

శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా

తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

 

అల్పత్వ భావన లేనిదే భక్తి లేదు. ఆ భగవంతుని ముందు నేనెంత, ఆయన్ని స్తుతించడానికి నా అర్హతెంత అనుకున్నప్పుడే  ఆయన కటాక్షం వలన గొప్ప కృతులు పుడతాయి! ఇదే ఇక్కడ సిరివెన్నెలలో కనిపిస్తోంది.  “నా అర్హత ఏమిటో కొంచెం కూడా తెలుసుకోకుండానే (గణుతించక) ఆ శివుణ్ణి స్తుతించాలనుకున్నాను! అందుకే స్కందపూర్వజుడైన ఆ వినాయకుడిని శరణు వేడుకుంటున్నాను! ఆయనే దయతో నాకు చేయూత నివ్వాలి! పుట్టుకలేనివాడూ (అజాతుడు), ఆలోచనకి అందనివాడూ (అచింత్యుడు), అంతము లేనివాడూ (అనంతుడు), పరిమితులు లేనివాడూ (అమేయుడు) అయిన ఆ పరమేశ్వరుడి గొప్పతనాన్ని ఈ శివకీర్తనల ద్వారా ప్రకటించడానికి ప్రయత్నిస్తోంది నా అల్పత్వం. ఈ అల్పత్వం శర్వుడైన ఆ శివుణ్ణి సర్వమంగళంగా ప్రస్తుతించే అర్హతగా మారాలి అన్నది నా ఆశ.  ఈ నా ఆశని ఆ వినాయకుడే తన అపారమైన దయతో  తీర్చాలి!” అని వేడుకుంటున్నారు సిరివెన్నెల! ఇంత భక్తితో వేడుకుంటే వినాయకుడు తీర్చకుండా ఉంటాడా?

 

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత

కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత

శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత

సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత

అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

శివకవిత రాయాలంటే భక్తీ ప్రతిభతో పాటూ సుకృతమూ ఉండాలి! పరమాత్ముని కీర్తనం పుణ్యులకే సాధ్యపడుతుంది. అందుకే సిరివెన్నెల – “మంచి సంకల్పాలతో కూర్చబడిన (సంకలిత) ఈ శివకవిత, కూడబెట్టబడిన (సంచిత) నా సుకృతాల వలనే పుట్టింది (సంభూతము)” అంటున్నారు. పుణ్యాత్ములకే గొప్ప సంకల్పాలు కలుగుతాయి మరి!

ఈ సంకలనం “కవులలో కవి” అని ప్రస్తుతించబడిన సిద్ధివినాయకుని స్తోత్రం (గణన) వలన పవిత్రతను పొందింది (పరిపూత). అంటే తన గీతాలలో గొప్పతనమేదైనా ఉంటే అది కేవలం తన సుకృతం వల్ల, వినాయకుని దయ వల్ల, శివుని విభూతి వల్ల సాధ్యపడిందే తప్ప నాదంటూ ఘనత ఏమీ లేదని వినమ్రంగా సిరివెన్నెల చెప్పుకుంటున్నారు! “కవిం కవీనాం” అన్న వినాయక స్తుతిలో కవి అంటే కవిత్వం రాసేవాడు అని కాక జ్ఞాని, మేధావి అన్న అర్థం చెప్తారు. గొప్ప కవిత్వాన్ని కలిగిన ఈ శివదర్పణ సంకలనపు తొలిగీతంలో  “కవులలో కవి” అంటూ వినాయకుణ్ణి స్తుతించడం ఎంతైనా సముచితం!

ఆ శివుని ఆజ్ఞని ఎరుగని తన తిరస్కార (అవజ్ఞ) ధోరణిని ఆ విద్యాదినాధుడైన వినాయకుడే వంచుతాడు అంటున్నారు!  అంత భక్తితో, వినమ్రతతో ఉన్న సిరివెన్నెలకి తిరస్కారం ఎక్కడ నుంచి వచ్చింది? శివుని గురించి ఏమీ తెలియని అజ్ఞానం నాదని ముందు చరణంలో చెప్పుకున్నారు కదా, అలాంటి అల్పత్వం ఉన్నా లెక్కపెట్టక శివుణ్ణి స్తుతించే సాహసం చెయ్యడమే ఈ తిరస్కార ధోరణి! ఇలాంటి తిరస్కారం చూస్తే శివుడు కోప్పడడు సరికదా, కరిగిపోతాడు!

ఇలా ఆ వినాయకుని అండ వలన సింధురాస్యుడైన ఆ శివునికి అర్పితమైన ఈ శివకీర్తనలు పావనమై సిద్ధిని సాధిస్తాయి! “సర్వపాపాలూ నశింపజేసే మంత్ర” (అఘమర్షణము) సంహితలై అలరారుతాయి!

భక్తితో సిరివెన్నెల అర్పించిన పుష్పాలీ గీతాలు. పూజ ఆయనది, పుణ్యం మనందరిదీ! భక్తి ఆయనది, ఆ భక్తికి పులకించే హృదయం మనది. ఇన్ని గొప్ప గీతాలు రాసిన సిరివెన్నెలా ధన్యులే, ఈ గీతాలను విని ఆనందించే భాగ్యం కలిగినందుకు మనమూ ధన్యులమే! సిరివెన్నెల గారికి సహస్ర వందనాలు.

శశిప్రీతం సంగీతంలో బాలు ఆర్తిగా ఆలపించిన ఈ గీతాన్ని

 వినొచ్చు!

 

విరుగుతున్న రెక్కల చప్పుడు – ఉడ్తా పంజాబ్

alia-bhatt-udta-punjab-trans

 

‘ఫ్లైయింగ్ హై’ అనేది ఒక మెటాఫర్.  ఇది ఒక విజయవంతమైన ఆనందమనే కాదు, ‘ఒక మత్తు మందు ప్రభావంతో ఆకాశంలో విహరిస్తున్న అనుభూతిని పొందడం’ అనే అర్థాన్ని కూడా కలిగి ఉంది. మన దేశంలో సాధారణంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటే ‘తాగున్నావా?’ అనడుగుతారు. అదే డ్రగ్స్  వాడకం అధికంగా ఉన్న దేశాల్లో అయితే ‘ఆర్ యు హై?’ అని అడగటం పరిపాటి. దానికి అర్థం, ‘నువ్వు డ్రగ్స్  గానీ తీసుకుని ఉన్నావా?’ అని అడగటం. ‘ఉడ్తా పంజాబ్’ అంటే ఇక్కడ, పంజాబ్ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిపోయిందనీ, ఉన్నతమైన స్థితికి చేరుకుంటోందనీ అర్థం కాదు. డ్రగ్స్  మత్తులో మునిగి తేలుతోందని చెప్పడం. పేరుతో సహా అన్ని రకాలుగా ఈ సినిమా, పంజాబ్ లోని డ్రగ్ మాఫియా గురించి మాట్లాడబోతున్నట్టుగా

ముందుగానే ప్రచారం పొందింది. బాలీవుడ్ లో ఇప్పటివరకూ డ్రగ్స్  వాడకం కథాంశంగా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, అవేవీ పూర్తి స్థాయిలో ఈ సమస్య  గురించి చర్చించలేదు.

ఈ సినిమా ఒక రాక్ స్టార్ (షాహిద్ కపూర్), ఒక బీహారీ అమ్మాయి (ఆలియా భట్), ఒక సబ్ ఇన్స్పెక్టర్(దిల్జీత్ దోషన్జ్), ఒక డాక్టర్(కరీనా కపూర్) లు ప్రధాన పాత్రలుగా నడుస్తుంది. సినిమా మొదలవడమే రాక్ స్టార్ ‘గబ్రూ’ హోరెత్తించే పాటతో మొదలవుతుంది. పంజాబ్ లో చాలా మంచి రంగు కలిగిన అమ్మాయిలని ‘గోరీ చిట్టీ’ అని పిలుస్తారు. చిట్టా అంటే తెలుపు రంగని అర్థం. “ఓ చిట్టా వే” అంటూ మొదలయ్యే ఈ పాట తెల్లని డ్రగ్ పౌడర్ గురించి మాట్లాడుతుంది. మొత్తం పాటంతా ఒక తెల్లని అందమైన అమ్మాయికో లేక డ్రగ్ పౌడర్ కో, ఎలా అన్వయించుకున్నా సరిపోలే విధంగానే ఉంటుంది. డ్రగ్స్, వాటిని వాడినవారి నరాల్లో రేపేటంతటి హుషారూ, ఈ పాటకున్న సంగీతం కూడా రేపుతుంది.

లండన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చి రాక్ స్టార్ గా మారిన ఒక గ్రామీణ పంజాబీ యువకుడు టామీ సింగ్. అప్పటికే పూర్తి స్థాయిలో డ్రగ్స్ మత్తులో కూరుకుపోయిన ఇతడు, డ్రగ్స్ తీసుకునేందుకు యువత ఉత్ప్రేరితమయ్యే  విధంగా పాటల్ని రాసి పాడుతుంటాడు. బాగా ప్రాచుర్యాన్ని కూడా పొందుతాడు. అలాగే అక్కడికి దగ్గరలో మరోచోట ఒక బీహారీ అమ్మాయి(ఆలియా భట్)కి దొరికిన 3 కిలోల హెరాయిన్ ఆమెకి తీవ్రమైన సమస్యల్ని తెచ్చిపెట్టి, డ్రగ్ మాఫియా చేతిలో చిక్కుకుపోయేలా చేస్తుంది. వీరిద్దరూ ఒకరికొకరు అనుకోకుండా ఎదురుపడటం, టామీ సింగ్, బీహారీ అమ్మాయి ప్రేమలో పడటం, అప్పటికే తను చేస్తున్నది తప్పన్న ఆలోచనలో ఉన్న అతడు, ప్రేమ డ్రగ్స్  కంటే ఎక్కువ మత్తుని కలిగిస్తుందని భావించడం, ఆమెని డ్రగ్ మాఫియా బారి నుండి కాపాడి పోలీసులకి లొంగిపోవడం ఒక స్టోరీ.

ఇక అదే గ్రామానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ సర్తాజ్ సింగ్, తన తమ్ముడు డ్రగ్ ఎడిక్ట్ గా మారి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం వల్ల జ్ఞానోదయం పొంది, అప్పటికే యాక్టివిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ ప్రీత్ సాహ్నీతో కలిసి ఆ ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తాడు. కథ ఏవేవో మలుపులు తిరిగి చివరికి ఆ డాక్టరమ్మాయీ, ఇంకా కొందరి డ్రగ్ మాఫియా సభ్యుల మరణాలకి దారి తీస్తుంది. మొత్తానికి వీరి ప్రయత్నాల కారణంగా ప్రభుత్వంలో, ప్రజలలో కొంత ఉత్తేజంగా కలిగినట్టుగా భావించమనే విధంగా సినిమా ముగుస్తుంది.

సినిమా మొత్తానికి ప్రధానంగా చెప్పుకోవాల్సింది బీహారీ అమ్మాయిగా నటించిన ఆలియా భట్ గురించి. పూర్తిగా డీ గ్లామరైజ్ చేయబడిన పాత్రలో ఆమె నిజంగా చక్కని నటనను ప్రదర్శించింది. బీహార్ లో పనులు దొరకని కారణంగా చాలామంది అక్కడినుండి సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, జమ్మూ వంటి ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అక్కడ దొరికిన పనులు చేసుకుంటూ ‘జుగ్గీ’లనబడే తాత్కాలికమైన గుడారాల్లో కాలాన్నివెళ్లదీస్తుంటారు. అటువంటి ఒక పదిహేను, పదహారు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి పాత్రలో ఆలియా భట్ చక్కగా ఇమిడిపోయింది. వేషభాషలు, మాట్లాడే యాసా, బాడీ లాంగ్వేజ్ ఆమెకు సరిగ్గా సరిపోయాయి. (నాకైతే మేం జమ్మూలో ఉన్నప్పుడు, వీధి చివరి జుగ్గీలో ఉండే ఉషా అనే బీహారీ అమ్మాయే గుర్తొచ్చింది). అంతే కాక అధికమైన విల్ పవర్, ధైర్యం కలిగిన అమ్మాయిగా ఆమె పాత్ర సినిమాకు మంచి బలాన్ని చేకూర్చింది. మాఫియా ముఠా సభ్యులు ఆమెని డ్రగ్ ఎడిక్ట్ గా మార్చినప్పటికీ, తన నోట్లో తనే గుడ్డలు కుక్కుకుని ఆ కోరికని అణుచుకునే ప్రయత్నం చేయడం, ఇంకా ఆమె పాత్రకు చెందిన కొన్ని ఇతర సన్నివేశాలూ  చాలా సహజంగా, మనసుని కదిలించేవిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ అందించి హిప్ హప్ సంగీతం కూడా సినిమాకు చెందిన బలమైన విషయాలలో ఒకటిగా చెప్పుకోవాలి. దాంతోపాటుగా డ్రగ్స్  ప్రపంచానికి చెందిన ఆ చీకటి వాతావరణాన్ని సృష్టించడంలో సినెమాటోగ్రాఫర్ రాజీవ్ రవి సఫలమయ్యాడు

అయితే, మొదలవడం బాగానే మొదలైనప్పటికీ, ఎక్కడ తప్పిందో తెలీకుండానే కథ దారి తప్పి ఎటో వెళ్లిపోతుంది. ఒక జటిలమైన సమస్యకి కొంత కామెడీని కూడా కలిపి సినిమాను డార్క్ కామెడీగా ప్రజెంట్ చేద్దామనుకున్న దర్శకుడి ఆలోచన ఎక్కువై, అసలు విషయం పక్కకి తప్పుకుంది. ఈ సినిమా ద్వారా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇండియాలో, ముఖ్యంగా పంజాబ్ లో చాలా సులువుగా డ్రగ్స్  లభ్యమవుతున్నాయి. అవి కూడా ప్రాంతీయంగా తయారుచేయబడి

చాలా తక్కువ ధరలకే అన్ని మందుల దుకాణాలలోనూ దొరుకుతున్నాయి. ఇందుకు రాజకీయ నాయకుల, పోలీసుల అండాదండా పుష్కలంగా లభిస్తోంది. ఈ విషయాన్ని చెప్పడం కోసం దర్శకుడు ‘అభిషేక్ చౌబే’ ఎంచుకున్న కథలోనే కొంత తడబాటు ఉంది.

ఒక సమస్య  ఉందని చెప్పినప్పుడు, అది ఎందుకు ఎలా మొదలైందో మూల కారణాలను వెదకడం, అది ఇంకా ఏ విధంగా విస్తరిస్తోందో గమనించేలా చేయడం, అవకాశం ఉంటే ఆ సమస్యకు తోచిన పరిష్కారాన్ని సూచించడం ఒక పధ్ధతి. లేదూ, ఆ సమస్యని కథలో భాగంగా తీసుకున్నప్పుడు, కథను ప్రధానంగా నడిపించి సమస్యను అందులో సహజంగా లీనం చెయ్యడం రెండో పధ్ధతి. కానీ ఈ సినిమా రెండు పడవల మీదా కాళ్లు పెట్టి ప్రయాణించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే సెన్సార్ సమస్యని తీవ్రంగా ఎదుర్కొన్న చిత్రంగా కూడా ఈ సినిమా వార్తలకెక్కింది. నిజానికి కథకు అంతగా అవసరం లేని అశ్లీల పద ప్రయోగాలు సినిమాలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం.

ఇప్పటికే ధూమపానం, మద్యపానం కారణంగా అన్ని విధాలుగా నాశనమయిపోతున్న మన దేశం, సరైన పద్ధతిలో ఆలోచన చేసి ఈ సమస్య  మరింతగా విస్తరించిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిది.  అలా చెయ్యని పక్షంలో, ఈ సినిమాలోనే చెప్పినట్టుగా మన దేశం డ్రగ్స్ విషయంలో మరో మెక్సికోగా మార్పు చెందే సమయం పెద్ద దూరంలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. పాబ్లో ఎస్కబార్ అనే డ్రగ్ మాఫియా డాన్, 1970,80 లలో అమెరికన్ రాష్ట్రాలకి డ్రగ్స్  అక్రమంగా రవాణా చేసి, అక్కడి యువతను మత్తుపదార్ధాలకి బానిసలుగా చేసాడు. ఒకవేళ అవే మత్తు పదార్ధాలు ప్రాంతీయంగా తయారుచేయబడితే, తక్కువ ధరకే లభ్యం కావడంతో పాటుగా మన దేశంలోని అవినీతి కూడా తోడై అతి సులువుగా వ్యాపించిపోతాయి. ఒక్క సారి గనక జనం, ముఖ్యంగా యువతరం వాటికి అలవాటు పడితే, మానడమనే విషయం చాలా కష్ట సాధ్యమైపోతుంది. అందువల్ల ఇటువంటి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ కి చెందిన అసలైన చీకటి కోణాల గురించీ, వీడ్ అనీ పాట్ అనీ పిలవబడే మార్జువానా గురించీ, మెథ్, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్ధాల తయారీ, వాటి అక్రమ రవాణాల గురించీ, అవి కలిగించే దుష్ఫలితాల గురించీ, ఆ మాఫియా గ్రూప్ ల గురించీ సవివరంగా తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్  ఒరిజినల్ సీరిస్ అయిన “నార్కోస్” చూస్తే సరిపోతుంది. ఇది యథార్థ గాథ. అదికాక డ్రగ్స్ ప్రపంచానికి చెందిన కల్పిత గాథ ‘బ్రేకింగ్ బాడ్”. బాగా ప్రాచుర్యం పొందిన ఈ టీవీ సీరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది.

మనిషికి వెన్నెముకా, పక్షికి రెక్కల వంటి వారు దేశానికి యువత. ఇప్పుడవి డ్రగ్స్ మూలంగా పటపటా విరుగుతున్న చప్పుడు పంజాబ్ అంతా వినిపిస్తోందని ఈ సినిమా చెప్తోంది. మిగిలినవన్నీ పక్కన పెట్టి చూస్తే,  ‘డ్రగ్స్  విషయంలో పూర్తిగా ఆలస్యమైపోక ముందే మేలుకోవాల్సిన అవసరం ఉందంటూ’ దేశానికీ, సమాజానికీ ఈ సినిమా ఒక హెచ్చరికని జారీ చేసిందన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోవాలి.

***

 

దృశ్యాదృశ్య ఆవిష్కర్త – జాంగ్ యిమో

ram4

“Life is a strange mixture of bitterness and sweetness. A journey through the enormous dangers and sorrows as well as happy moments. If the music of love fills the heart…the life has its meaning even in headrest circumstances. This is the life of few simple and humble people. They are so ordinary. They just accept life as it comes, so naturally, without any complaints. If they are so ordinary what makes you hear their story. It is the love they have in their hearts.”

(మహాదర్శకుడు జాంగ్ యిమో చిత్రం “To Live” చూసినప్పుడు నేను నా డైరీలో రాసుకున్న వాక్యాలు)

 

“To do art, one thing should always remember – subjects of people in misery have deep meanings.”

– Zang Yimou

నల్లని మానవ జీవిత దుఃఖపు పొరల సందుల్లోంచి చిక్కగా పెల్లుబికే ఆనందపు కాంతిని ఒడిసిపట్టుకొని, విస్మయం కలిగించే చిత్ర విచిత్ర వర్ణపటలాల గుండా  మానవ హృదయం మీద గాఢంగా, లోతుగా అపూర్వమైన శక్తితోనూ, విభ్రాంతికరమైన తీక్షణతతోనూ ముద్ర వేసే దృశ్యాదృశ్య ఆవిష్కర్త, మహాకళాకారుడు జాంగ్ యిమో.

క్రూరమైన జీవిత పదఘట్టనల క్రింద నలిగే సాదాసీదా ప్రజల ఆత్మలలోని సౌందర్యం అణచివేయబడుతుందా? వారి హృదయాలలోని ఆనందాన్ని, ఉన్నతిని లోకపు మూఢత్వం, అజ్ఞానం, యుద్ధోన్మాదం చెరిపివేయగలవా?

దర్శకుడు జాంగ్ యిమో పాత్రలు దుఃఖానికి, ఆనందానికి అతీతమైన ఒక తీక్షణమైన ఎరుకలోకి మనల్ని నెట్టివేస్తాయి. మనం ఆయా పాత్రలుగా మారిపోతాం. పునర్జన్మిస్తాం. ఒక్కొక్క జీవితాన్ని జీవిస్తాం. మరణిస్తాం. చివరికి తిరిగి మన రోజువారీ జీవితంలోకి వచ్చినప్పుడు ఒక జ్ఞానాన్ని మోసుకొని వస్తాం. అప్పటి వరకు మనం జీవించిన అదే పాత మసకబారిన జీవితం కొత్త సాంద్రతతో, కొత్త వర్ణాలతో, కొత్త కాంతితో మెరిసిపోవడం చూస్తాం. ప్రేమ దుఃఖానికీ, ఆనందానికీ అతీతంగా మనలో ప్రవహించడం గమనించి ఆశ్చర్యపోతాం.

ram2

జాంగ్ యిమో మొదటి కమర్షియల్ చిత్రం జట్ లీ, డాని యాన్ ప్రధాన పాత్రలుగా 2002 లో Hero విడుదలైనప్పుడు ఆ చిత్రంలోని అత్యున్నతమైన సాంకేతికతకి, దృశ్య చిత్రీకరణాసంవిధానానికి hollywood విస్తుపోయింది. ఎన్నడూ చూడని ఖచ్చితత్వం, తీక్షణత ఆయన సృజించే దృశ్యాలను అనితర సాధ్యం చేస్తాయి. ఆయన దృశ్యావిష్కారానికి మంత్రముగ్ధమయింది యావత్ ప్రపంచమే కాదు, కఠినమైన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా. US Top 10 లో No.1 గా నిలచిన Hero చిత్రం 2003 వ సంవత్సరం జాంగ్ యిమోకి ౩వ ఆస్కార్ నామినేషని కూడా గెలుచుకుంది. ఎన్నో పర్యాయాలు ఆయన కళాఖండాల మీదే కాకుండా, ఆయన మీద కూడా నిషేధం విధించిన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి సైతం ఆయనను గౌరవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను చైనా దేశపు అత్యున్నత కళాకారునిగా గుర్తించడమే కాకుండా చైనా సినిమాకే ప్రతినిధిగా భావించింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభ మరియు ముగింపు ఉత్సవాలకు దర్శకత్వం వహించే గురుతర బాధ్యతను ఆయనకు  అప్పగించి గౌరవించింది. ఆ ఉత్సవాలలో జాంగ్ యిమో కళాత్మక ప్రజ్ఞను చూసి; చైనా దేశపు ఆధ్యాత్మిక, సాంస్కృతిక సారాన్ని అత్యున్నత సాంకేతిక ఉత్కృష్టతతో మేళవించి ఆయన రూపొందించిన శక్తివంతమైన కళారూపాల్నిదర్శించి ప్రపంచం అవాక్కయింది. ఏ ఒలింపిక్స్ లోనూ చూడనిది, ఇకపై చూడబోనిది అయిన ఆ కళాప్రదర్శన అనన్యసామాన్యం. ఎన్నో సంవత్సరాలు గడచినా ప్రజలు ఇంకా ఆ ఉత్సవాలను డీవీడీలు, బ్లూరేల వంటి మాధ్యమాల ద్వారా చూసి ఆనందిస్తున్నారు.

ram3

స్టీవెన్ స్పీల్ బర్గ్ ఆయనతో భారీ చిత్రాన్ని నిర్మించాలని ఆశపడినా; క్రిస్టిన్ బాలే, మాట్ డామన్ వంటి సూపర్ స్టార్లు ఆయన చిత్రంలో చిన్న పాత్ర చేసినా చాలని పరితపించినా, hollywood ఆయన సాంకేతిక ప్రజ్ఞను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించినా; ఆయన చైనాను, ఆ దేశపు సంస్కృతిక మూలాల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అలాగే కేవలం భారీ చిత్రాలకు పరిమితం కాలేదు. ఆయన కళాత్మక తృష్ణను తృప్తిపరచే బాధితుల, వ్యధార్తుల, దీనుల, నిష్కల్మషమైన ప్రేమికుల కథలను విడువలేదు. మానవీయతలో సుస్థిరంగా పాదుకొన్నఆయన దార్శనికత, అనన్యసామాన్యమైన ఆయన కళాత్మక శక్తి, ఆయనను చైనా సినిమాకే అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టినా, ఆయన చూపు ఎప్పుడు మట్టిలో అజ్ఞాతంగా ఒక క్షణం అత్యంత వైభవంతో ప్రకాశించి తిరిగి మట్టిలో కలిసిపోయే మాణిక్యాల(ఆయన కథలలోని పాత్రలు) మీదే ఉంటుంది.

చైనా దేశపు సాంస్కృతిక వైశిష్ట్యాన్ని, తాత్విక సారాన్ని హృదయంలో ఇంకించుకున్న జాంగ్ యిమో కాలాతీతమైన విలువలకి సాటిలేని artistic authorityతో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇంత గొప్ప విజయాలు సాధించిన జాంగ్ యిమో, వాటికి అంటకుండా కర్మయోగిలా ఎంతో సాదాగా జీవితాన్ని గడుపుతారు.

చైనా దేశపు దర్శకులలో 5వ తరం వాడయిన జాంగ్ యిమో జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మావో నేతృత్వంలోని కమూనిస్ట్ సైన్యం చేతిలో చైనా జాతీయ ప్రభుత్వం పరాజయం పాలైన పరిస్థితుల్లో ఆయన 1950లో Shaanxi provinceలోని Xi’anలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించడం జరిగింది. 1960లలో ప్రారంభమైన క్లిష్టమైన సాంస్కృతిక విప్లవ కాలపు అస్థిర పరిస్థితుల్లో పాఠశాల విద్యను మధ్యలో ఆపివేయించి, వ్యవసాయ క్షేత్రానికి రైతులతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం అతనిని పంపించింది. ఆ తరువాత Xianyangలోని వస్త్ర పరిశ్రమలో కూలీగా కూడా ఆయన పనిచేయవలసి వచ్చింది. ఆ సమయంలోనే జాంగ్ యిమోకి చిత్రలేఖనం మీద, ఫోటోగ్రఫీ మీద అభినివేశం కలిగింది. అప్పుడే ఆయన తన రక్తాన్ని అమ్మి మొదటి కెమెరాని కొనుక్కున్నాడని చెబుతారు.

1976లో మావో మరణం తరువాత, సాంస్కృతిక విప్లవానంతరం, ఉద్రిక్త పరిస్థితులు సడలిన తరువాత బీజింగ్ పిల్మ్ అకాడమీలో చేరడానికి దరఖాస్తు చేసినప్పుడు వయసు ఎక్కువ కావడం వల్ల జాంగ్ యిమోకి ప్రవేశం నిరాకరించబడింది. అయితే ఆయన తీసిన ఛాయా చిత్రాలతో కూడిన portfolioను చూసిన తరువాత, ఆయన ప్రతిభకు ముగ్ధులయిన అధికారులు విచక్షణాధికారంతో ప్రవేశం ఇచ్చారు. అక్కడే 5వ తరం మహాదర్శకులైన  Chen Kaige మరియు Tian Zhuangzhuangలు  సహ విద్యార్థులుగా ఆయనకు పరిచయం అయ్యారు. సినిమాటోగ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన జాంగ్ యిమో Chen Kaige  సినిమాలకి పనిచేయడం ఆయనకి ఎంతో గుర్తింపు తెచ్చింది. వారిద్దరి కలయికలో Yellow Earth (1984) వంటి గొప్ప చిత్రాలు నిర్మితమయ్యాయి.

ram1

Central Academy of Dramaలో విద్యార్థిని అయిన గాంగ్ లీ(అనంతర కాలంలో ఆమె మహానటిగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు)ని పరిచయం చేస్తూ, జాంగ్ యిమో దర్శకత్వం వహించిన ఆయన మొదటి చిత్రం Red Sorghum(1997) ఆయనకి విశ్వ ఖ్యాతిని తీసుకురావడమే కాకుండా, 1998లో ఉత్తమ చిత్రంగా 38వ Berlin International Film Festival లో Golden Bear పురస్కారాన్ని తీసుకువచ్చింది. కాని ఆ తరువాతి  చిత్రాలయిన Judou మరియు Raisethe Red Lantern చైనాలో నిషేధానికి గురయ్యాయి. అలాగే To Live చిత్రంతో ఆయన పై దర్శకుడిగా నిషేధం విధింపబడింది. Judou మరియు Raise the Red Lantern చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకోవడమే కాకుండా ఆస్కార్ నామినేషన్ లతో సహా పలు అంతర్జాతీయ పురస్కారాలను ఆయనకు తీసుకువచ్చాయి. ఆ తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు, అసంఖ్యాకమైన పురస్కారాల్ని అందుకున్నారు.

ఆయన చిత్రాలు మన హృదయాల్ని ద్రవింపజేయడమే కాదు, జీవితాంతం మనలో భాగమై జీవిస్తాయి. మన దృక్పథాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రపంచంలో గొప్ప కళాత్మక చిత్రాలు తీసిన మహాదర్శకులు ఎందరో ఉన్నారు. అయితే వారి చిత్రాలు అందరి హృదయాలనీ తాకలేవు. కాని జాంగ్ యిమో చిత్రాలు మేధావులతో పాటు సామాన్యులను కూడా అలరిస్తాయి. ఎవరి స్థాయిలో వారికి అవి అర్థం అవుతాయి. Connect అవుతాయి. జీవిత మర్మాన్ని విశదపరుస్తాయి. ఇక విశ్వజనీనతని, అమేయమైన శక్తిని నింపుకున్న విశిష్ట కళారూపాలు ఆ దృశ్య మాంత్రికుని హస్తాల నుండి అనూహ్యమైన, మహిమాన్విత వర్ణాలలో, రంగులలో పుప్పోడిలా వెదజల్లబడతాయి.

జాంగ్ యిమో techinical excellencyని అందుకోవడం hollywoodకి సాధ్యం కాదు. అలాగే హృదయాన్ని నవనీతం చేసే ఆయన కవితాత్మకతని కూడా. ఆయన ఒక విశిష్ట కళాకారుడు. దృశ్య ద్రష్ట.

సుమారు 15 ఏళ్లుగా నిర్మాతలు ఆయనకు పారితోషకం ఇవ్వకుండా ఆయనను మోసం చేస్తున్నా, ఆయన వారితో చిత్రాలు తీస్తూనే ఉన్నారు. ఆయనకు గొప్ప చిత్రాలు తీయడం ఒక్కటే జీవితంలో ముఖ్యమని ఆయన చెప్పిన ఈ వాక్యం  చదివితే అర్థమవుతుంది.

“I hope before I am getting too old and when my mind is still functioning, I can tell some better stories.”

*

నీ పేరు జస్టిన్..

siva “నీ పేరు జస్టిన్”(Your Name is Justine) : ఇది పోలాండ్ చిత్రం. డైరెక్టర్ ఫ్రాంకో .

మారియోలా ఒక అందమైన యువతి. పోలాండ్ లోని లక్సెంబర్గ్ లో అల్లారు ముద్దుగా చూసుకునే తన అమ్మమ్మతో భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ హాయిగా జీవించే యువతి. తన అమ్మమ్మలా పాతతరం మనుషుల్లాగా సాదా సీదాగా సాఫీ జీవితం కాకుండా జీవితం ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా, భిన్నంగా, ఉత్తేజకరంగా తీర్చిదిద్దుకోవాలని ఉవ్విళ్ళూరుతూ కోటి కోరికలతో తపన పడుతూ ఉంటుంది. ముగ్గురు స్నేహితురాళ్ళలో ఉద్యోగం సంపాదించుకుని జీవితంలోని ప్రతి అడుగులో విజయం సాధించబోతున్న ప్రత్యేకమైన దానిలా ఉంటుంది .

ఆమెకు “ఆర్ధర్” అనే అందమైన ప్రియుడుంటాడు. ఒక రోజు ఆర్ధర్ మారియోలా దగ్గరి కొస్తాడు. ఒక సెలవు దినాన్ని యూరప్ వెళ్ళి సముద్రతీరంలో సృజనాత్మకంగా, అద్భుతంగా గడుపు దామని ఊరించే కబుర్లతో నచ్చజెప్పి మారియోలాను ఒప్పిస్తాడు. ఆర్థర్ ఆమె మాజీ ప్రియుడు కాబట్టి యూరప్ చుట్టూ విహార యాత్ర అనగానే మురిసి పోతుంది మారియోలా. విడిపోయిన ఆమెను తిరిగి పొందడానికి, ప్రేమగా మాట్లాడుతూ పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చి పెళ్ళికి ముందు అతని తండ్రి మారియోలాను చూడాలను కుంటున్నాడు కాబట్టి జర్మనీకి వెళదా మంటాడు. జర్మనీ లోని కొలోన్ లో ఉన్న ఆర్థర్ వాళ్ళ కుటుంబాన్ని సందర్శించడానికి పోలాండ్ నుండి ప్రయాణం చేయబోతున్నామని చెబుతాడు ఆర్ధర్. ట్రిప్ ప్రారంభానికి ముందు, అతను ఆమె నివసించే ప్రాంతానికి వచ్చి ఆమెను రకరకాల భంగిమల్లో నవ్విస్తూ కొన్ని ఫొటోలు, ఆమె అమ్మమ్మతో సహా కొన్నిఫొటోలు తీస్తాడు. నాన్న తమ పెళ్ళికి తొందర పడుతున్నాడనీ, ఆయనకి మారియోలాను చూపించడానికి జర్మనీకి తీసికెళ్తున్నానని కూడా అమ్మమ్మతో చెబుతాడు. తాను జర్మనీలో కాబోయే మామగారిని చూడ బోతున్నాననుకుని దారిలో చాలా ఉద్విగ్నంగా కొన్ని జర్మన్ పదాలు కూడా నేర్చు కుంటుంది మారియోలా. జర్మనీ దాటగానే బెర్లిన్ లో ఒక అపార్ట్ మెంట్ కి తీసికెళ్తాడు ఆర్ధర్. ఆ ఇంట్లో చంటిపాపతో ఉన్న ఒక మహిళ తనవంక వింతగా చూడడం, ఆ ఇంటి వాతావరణం అసాధారణంగా, తేడాగా ఉండడంతో ఆర్ధర్ తో “వెంటనే ఇక్కణ్ణుంచి వెళ్ళిపోదాం, వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం” అని అంటుంది మారియోలా. “ఒక్క రాత్రికే సర్దుకుందాం” అని అంటాడు ఆర్ధర్.

ఇంతలో ముగ్గురు రాక్షసుల్లాంటి మృగాళ్ళు వస్తారు. అతి కౄరంగా ఉన్న ఒకడు సరాసరి మారియోలా దగ్గరకొచ్చి దౌర్జన్యంగా మీద చెయ్యేస్తాడు. “ఇక నీకు ఎంతమాత్రమూ నీ అసలు పేరు మారియోలా అని ఉండదు. ఈ రోజునుంచి నీ పేరు జస్టిన్“అని అంటాడు. ఒక పక్క నుంచి తీవ్రంగా ప్రతిఘటిస్తూనే,”ఇతను మీదకొస్తున్నాడం”టూ గొప్ప నమ్మకంతో ప్రియుడికి అమాయకంగా ఫిర్యాదు చెయ్యబోతుంది మారియోలా. అందులో ఒకడి దగ్గరనుంచి నోట్ల కట్టలు అందుకుంటూ ప్రేక్షకులకు కనిపిస్తాడు ఆర్ధర్. ”నీ ప్రియుడు ఆర్ధర్ నిన్ను మాకు అమ్మేశాడు” అంటాడు చెర బట్టిన వాడు. ఆమె ప్రియుడు లోపల పైశాచిక ప్రవృత్తి గల అతి కౄరుడు. మారియోలాను పాస్ పోర్ట్ తో సహా ఒక వేశ్యను అమ్మినట్లు అమ్మేసి మరుక్షణంలో మాయమవుతాడు!

లక్సెంబర్గ్ సరిహద్దు దాటి జర్మనీలోకి ప్రవేశించి బెర్లిన్ లోని ఒక ఇంటికి తీసికెళ్ళే వరకూ ఆనందంగా ఉంటుంది మారియోలా. అంతే! ఆమె జీవితంలో సంతోషపు ఘడియ లంతరించిపోతాయి! మరుక్షణంలో జీవితం ఊహించని విధంగా భయానకంగా మారిపోతుంది! ఇక మారియోలా జస్టిన్ గా చెలామణీ అవుతూ ఉంటుంది!

అప్పటినుంచి జస్టిన్ జీవితంలో చూడలేని, భరింపరాని లైంగిక హింస మొదలవుతుంది. చెరబట్టిన ముగ్గురిలో ఇద్దరు జస్టిన్ ని చెప్పనలవి కానన్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఆమె వారించిన కొద్దీ విపరీతంగా కొట్టి కొట్టి రక్తాలు కారేలా చేస్తారు. వారిలో ఇద్దరు ఒకడి తర్వాత ఒకడు పశువులకంటే హీనంగా, నీచాతి నీచంగా ప్రవర్తిస్తారు.  జస్టిన్ కూడా చాలా బలంగా మంచి శరీర దారుఢ్యంతో ఉండి తన కున్న శక్తి నంతా ఉపయోగించి ధీటుగా ఎదిరిస్తూనే ఉంటుంది. ప్రచండంగా, భీకరమైన పోరులో శక్తి కొద్దీ శత్రువుతో పోరాడినట్లు ప్రతిఘటిస్తూనే ఉంటుంది. కానీ ఆమె శక్తి చాలదు. పెనుగులాడీ, పెనుగులాడీ నిర్జీవంగా మిగిలిపోతుంది ప్రతిసారీ. వారి రాక్షసత్వం ముందు ఆమె నిస్త్రాణంగా నిస్తేజంగా మిగిలిపోతూ ఉంటుంది. ఒకసారి కాదు,అనేకసార్లు ఆమె మీద బలప్రయోగం చేస్తారు. రోజుల తరబడి అత్యాచారం కొనసాగిస్తారు. చివరికి ఆమె కొట్టొద్దని దీనంగా వేడుకునే పరిస్థితికి వస్తుంది. వస్తూ,పోతూ తాళాలు వేసి బంధిస్తూ ఉంటారు. ఆ ఇల్లొక భూతాల కొంప లాగా, పాడుపడిన కొంపలాగా పరమ మురిగ్గా ఉంటుంది. ఎవరూ ఉండరు. తాగుదామంటే పంప్ లో నీళ్ళు రావు. ఫ్రిజ్ తెరిస్తే తినడానికేమీ ఉండవు. అమ్మమ్మను తల్చుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆకలితో అలమటించిపోతూ, ధ్వంసమైపోతున్న తన జీవితాన్ని తలచుకుని భయంకరమైన మానసిక సంఘర్షణకు గురౌతుంది. ఇంట్లో దయ్యం పట్టిన దానిలా తిరుగుతూ, తిండికోసం వెతుక్కుంటూ, అందంగా ఉన్న తన జుట్టును ఒక కత్తిని దొరిక బుచ్చుకుని బర బరా కోసేసు కుంటుంది.బట్టలు ఎక్కడివక్కడ చింపేసుకుంటుంది. అపార్ట్ మెంట్ కిటికీ తలుపుల్ని తన బలాన్నంతా ఉపయోగించి ఊడదీసి బయటికొచ్చి రక్షించమంటూ వెర్రి కేకలు పెడుతుంది. ఎవరికీ వినిపించని ఆమె కేకలు అరణ్య రోదనగానే మిగిలిపోతాయి. ఆ రాక్షసులు సుడి గాలిలా వస్తూనే ఉంటారు. భీభత్సం సృష్టిస్తూనే ఉంటారు!

వారిలో మూడోవాడు మాత్రం నేను నిన్నేమీ చేయను, నమ్మమంటాడు.  లైంగికంగా ఏ విధంగానూ వేధించడు. ఆమెను చూసి జాలి పడినట్లే, కనికరించినట్లే చేస్తాడు. ఒకరోజు తినడానికి కాస్త తిండీ, తాగడానికి డ్రింకూ తెచ్చిస్తాడు. అప్పుడప్పుడూ వచ్చి కాస్త తిండి, అవసరమైన చిన్న చిన్న వస్తువులు తెచ్చి పెడుతూ దయగా ఉంటాడు. నేను చెప్పినట్లు వింటే నీకిక్కడనుంచి విముక్తి కలిగిస్తానని నిరంతరంగా సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె వినక చేసేది కూడా ఏమీ లేదు. అతడికి వేరే ప్రణాళిక లుంటాయి!

ఆమెను బయటికి తెచ్చి ఒక హోటెల్ లో కాల్ గర్ల్ గా నియమిస్తాడు. ఆ హోటెల్ రూం రష్ ని కాలింగ్ బెల్ మోగడం – వాడొక పక్కన నిలబడి డబ్బు వసూలు చేసుకోవడం ద్వారా సూచిస్తాడు డైరెక్ట్రర్ ఫ్రాంకో. విటులుగా వచ్చిన ప్రతి ఒక్కరిని “నేను మోసపోయాను.నన్ను మా అమ్మమ్మ దగ్గరికి చేర్చి సహాయం చెయ్యమ”ని వేడుకుంటుంది. ప్రతి అడుగులోనూ పదునైన బాకులు పొంచి చూస్తున్నట్లు, పగబట్టినట్లున్న ఆమె జీవితంలో అంతటి అదృష్టమేది?

ఇంతలో ఒకరోజు ఎక్కడినుంచో ప్రియుడి రూపంలో ఉన్న కిరాతకుడు ఆర్ధర్ ఊడిపడతాడు.”నీకొక చెడు వార్త” అంటూ అమ్మమ్మ మరణం గురించి చెప్తాడు. అప్పటివరకూ అంతటి దుఃఖంలోనూ “అమ్మమ్మా! నీ రాజకుమారి కఠినమైన జైల్లో ఉంది. ఎవరూ చొరబడలేని కోట బురుజులున్న రాజ భవనంలో బంధింపబడి ఉంది. స్వేచ్చగా ఎగిరే పక్షుల్ని చూడాలనుకుంటుంది”అని అనుకుంటూ అమ్మమ్మని తల్చుకుని ఊహల్లోనైనా సేదదీరే జస్టిన్ కి ఆ ఆశ కూడా లేకుండా పోతుంది. పట్టరాని కసితో ఆర్ధర్ ని చంపేస్తుంది! జైలుకి వెళ్తుంది!!

మూడేళ్ళ జైలు శిక్ష ముగిశాక కూడా మన మారియోలా గొప్ప ఆశాజీవిగా కనపడుతుంది.తన జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించు కోవాలనుకుంటుంది. కానీ తన చుట్టూ ఉన్నబయటి ప్రపంచమంతా మారిపోయి ఉంటుంది. తనకి అమ్మమ్మ లేదు! ఊళ్ళో ఎవరూ లేరు! ఉన్న ఇద్దరు దోస్తులు గుర్తొస్తారు గానీ తాను జీవితం నుంచి ఎంత దూరం జరిగిందో తెలుసుకుని నిస్తేజపడుతుంది. అసలు న్యాయం ఎక్కడుంది? ప్రేమకు అర్ధమేమిటి? స్వేచ్చ అందని వస్తువేనా? అనడంతో సినిమా ముగుస్తుంది. ప్రేక్షకుల హృదయాలు భారమవుతాయి.

మహిళలు తరతరాలుగా ఆర్జించి పెట్టి ఈ సమాజానికి అందించిన జ్ఞానం, మాతృస్వామ్య వ్యవస్థనుంచి ఇంటిపెద్దగా వారి పాలనానుభవం, శక్తి సామర్ధ్యాలు, అందం, అధికారం, అనేకరకాల స్వభావాలతో ఈ ప్రపంచాన్ని అర్ధవంతం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని అగ్ర రాజ్యాలతో సహా ఏ దేశంలోనూ మహిళల్ని మానవులుగా సమాజంలో సగ భాగంగా భావించడం లేదు. మనసుని మెలిపెట్టే బాధతో, గుండెలవిసిపోయేలా గింజుకుని, ఊపిరాడక అల్లాడిపోయే ఈ జస్టిన్ పాత్రను ప్రపంచీకరణ నేపధ్యంలో దేశ దేశాల్లోని మహిళలు నిస్సహాయమైన పరిస్థితుల్లో లైంగిక దోపిడీకి బలవుతున్న మహిళలకు ప్రతీకగా చూడాలి.

ఈ సినిమా.కథలు రెండూ “ఒసామా”, “నీ పేరు జస్టిన్” మహిళలపై ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతమైన అసంబద్ధ క్రూరత్వం గురించి చెప్తాయి. ఒక శతాబ్దం వెనక్కి నెట్టే  ఇటువంటి పాత రాతియుగం ఆలోచనలు నమ్మటం కష్టం. మనం నవ నాగరికుల మని మురిసి పోతున్న ఈ కాలంలోనే ప్రపంచంలోని కొన్ని మూలల్లో జరుగుతున్న అమానుష చర్యలివి!

బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని,యవ్వనాన్ని, జీవితాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా ఆ యా దేశాల్లో స్త్రీల పట్ల

జరుగుతున్న వ్యవస్థీకృత హింసలను ఎంతో ఆర్ధ్రంగా అర్థం చేసుకుని నిజాయితీగా ప్రాణాలకు తెగించి గొప్ప స్కోప్ లో బర్మెక్ తెరకెక్కిస్తే, లైంగిక బానిసత్వాన్ని ఇతివృత్తంగా తీసుకుని దిగ్భ్రాంతి కలిగేలా చిత్రాన్ని మలిచారు డైరెక్టర్ ఫ్రాంకో. మన చలం లాగా స్త్రీల స్వేచ్చ కోసం తపించి ఆర్తితో పని చేసిన ఈ ఇద్దరికీ స్త్రీజాతి తరఫున ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1913 లో ప్రపంచ సినిమా విశ్వవేదిక మీద కొచ్చింది. సరిగ్గా శతాబ్ద కాలం గడిచాక కూడా అంటే 2013 లో వచ్చిన ఈ రెండు సినిమాలను పరిశీలిస్తే స్త్రీల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదనీ,వారు ఆత్మ గౌరవంతో జీవించే పరిస్థితులు అగ్రదేశాలతో సహా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవనీ రుజువైంది.

ఆశ్చర్యకరంగా వేరు వేరు ప్రాంతాల్లో తీసిన ఈ రెండు సినిమాల్లోనూ దుర్భర పరిస్థితుల్ని అనుభవిస్తున్న కథానాయికలిద్దరూ కూడా అమ్మమ్మ ప్రేమలో స్వాంతన పొందుతారు!

“చీకటి థియేటర్ లో సినిమా చూడడం ఒక ధ్యానం లాంటిది.  నా దృష్టిలో ఇంకే కళారూపం ఇలాంటి అనుభూతిని ఇవ్వ లేదు.  చికాకులు, మానసిక ఒత్తిడితో ఒంటరి దీవులుగా మారిపోయిన నేటి మానవ కుటుంబాన్ని సమైక్య పరచే ఏకైక శక్తి సినిమా-అంటారు ఆదూర్ గోపాలకృష్ణన్. స్త్రీలూ, పిల్లలూ, అట్టడుగు ప్రజలు, బలహీనులు. సమానత్వాన్ని కోరుకుంటారు. కాస్త మెరుగైన పరిస్థితుల్లో ఉన్న మనమందరం ప్రపంచ కుగ్రామం లోని వారి పట్ల సహానుభూతితో ఉందాం. ప్రపంచం సినిమా ద్వారా బాధాసర్పదష్టులకు దగ్గరవుదాం!

ఎక్కడో తాలిబన్ లో కదా “ఒసామా”కథ, పోలాండ్ లో కదా “నీ పేరు జస్టిన్” కథ జరిగింది అని తేలిగ్గా తీసుకోనక్కరలేదు. మన దేశంలో మొన్న మన నిర్భయకీ, నిన్నమన జిషాకీ జరిగిన ఘోరాల సంగతేమిటి? పసిపాపల పట్ల ప్రతిరోజూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు?

నటీ-నటుల గురించి, చిత్ర నిర్మాణం గురించి ఎంతైనా రాయొచ్చు. కానీ కేవలం కథలకే పరిమితమవుతున్నాను. 2013 లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో “Osamaచిత్రాన్ని, 2013 లోనే “celebrating women” పేరిట జరిగిన 18 వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో “Your Name is Justine” (“నీ పేరు జస్టిన్”) చిత్రాన్ని చూశాను.

(సెప్టెంబర్ 10,11 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన సదస్సు కోసంనన్ను ప్రభావితం చేసిన సినిమా సాహిత్యం” అనే అంశంపై రాసిన వ్యాసం)

                                                                                                                                    –

 

 

 

 

అసలు  ‘హక్కుదార్లు’ యెవరు ?

painting: Rafi Haque

painting: Rafi Haque

 

“అమ్మా నాకు చలి వేస్తుందే , మంట వేయవూ?”

“నాయనా బొగ్గులు లేవురా”

“అమ్మా బొగ్గులెందుకు లేవే?”

“మీ నాన్నకు పని పోయింది, బొగ్గులు కొనడానికి డబ్బు లేదు బాబూ!”

“నాన్నకు పనెందుకు పోయిందమ్మా?”

“బొగ్గు ఎక్కువగా ఉందిటరా బాబూ!”

_ రాషెస్డల్

యెంతో వింతగానూ వైరుధ్యభరితం గానూ మినీ కథలానూ వున్న యీ ఆర్ధిక విశ్లేషణ మన సింగరేణికి అతికినట్టుగా సరిపోతుంది. అందుకే గత మూడున్నర దశాబ్దాలుగా సింగరేణి సామాజిక ఆర్ధిక శాస్త్ర వేత్తలకి  అధ్యయన వేదిక అయ్యింది. అక్కడి సమాజం రచయితలకి సాహిత్య పాఠశాల అయ్యింది. 1981 లో బొగ్గు గనుల్లో యాభై ఆరు రోజుల పాటు జరిగిన చారిత్రిక సమ్మె దరిమిలా  సింగరేణి కార్మికుల ‘బండ కింది బతుకులు’ సాహిత్యంలో వస్తువు లయ్యాయి. ‘బొగ్గు పొరల్లో …’ మొట్టమొదటిసారిగా ‘నల్లకలువ’ లెన్నో వికసించాయి. రాజయ్య  , రఘోత్తం రెడ్డి, పి చంద్ వంటి రచయితల సామూహిక కర్తృత్వంలో (కార్మిక పేరుతో ) , సొంత పేర్లతో  కార్మికోద్యమ కథలెన్నో వెలువడ్డాయి. హక్కుల కోసం , మెరుగైన జీవితం కోసం సెమ్మాసులు పట్టిన కార్మికుల చైతన్యం ‘నల్లవజ్ర’ మై  మెరిసింది. క్రూర నిర్బంధాల నేపథ్యంలో కార్మికుల్లో పోరాట స్ఫూర్తి నింపిన  ఆ నాటి సాహిత్యం అపూర్వమైనది.

తర్వాతి కాలంలో ’90ల్లో మొదలైన నూతన ఆర్ధిక సంస్కరణలు గనుల్లో ప్రైవేటీ కరణకి దారులు వేశాయి. ప్రభుత్వాల బొగ్గు పాలసీలు కాలరీల్లో పెను మార్పులు తెచ్చాయి. కార్మికుల మెడ చుట్టూ కనిపించని వురితాళ్ళు పేనాయి. అణచివేత – అభివృద్ధి అనే ద్విముఖ వ్యూహాన్ని కంపెనీ అమలుపరచింది. ప్రైవేటు కాంట్రాక్టర్లకి రెడ్ కార్పెట్ పరిచింది. ఔట్ సోర్సింగ్ కంపారటీవ్ అడ్వాంటేజ్ అని నమ్మి- నమ్మించి ఆచరణలో పెట్టింది. అవుట్ సోర్సింగ్ ని ‘ఒక కిల్లర్ అప్లికేషన్ గా – ఒక పనసియా (సర్వరోగనివారిణి) గా ప్రచారం చేసింది. డిపెండెంట్ వుద్యోగాల్ని కూడా రద్దు చేసింది. కార్మికులు రిటైర్ అయితే వాళ్ళ స్థానంలో కొత్తవాళ్ళని తీసుకోవడం మానేసింది. ఓపెన్ కాస్ట్ ల సంఖ్యని పెంచి  వాటిలో భారీ యంత్రాలని దించింది.  కార్మికులకు పని యివ్వకుండా నిర్వ్యాపారులుగా కూర్చోబెట్టి కృత్రిమమైన సర్ప్లస్ మేన్ పవర్ ని సృష్టించింది. వాళ్ళ శక్తిని మరో చోట ఉపయోగించుకొనే అవకాశం వున్నప్పటికీ వోవర్ బర్డెన్ రిమూవల్ తో పాటు నెమ్మదిగా వొక్కో రంగాన్నీ ప్రైవేటైజ్ చేస్తూ పనులు కాంట్రాక్టర్లకి అప్పజెప్పింది. సంస్కరణల హేతుబద్ధతని ప్రశ్నించే వాళ్ళపై  తీవ్రవాద ముద్ర వేసి అణచివేతకి పూనుకొంది. గుర్తింపు పొందిన కార్మిక సంఘాల మద్దతు కూడగట్టుకొని వారితోనే వొప్పందాలు  చేసుకొంటూ మిలిటెంట్ స్వభావంతో పనిచేసే  సికాస లాంటి సంఘాలని నిర్వీర్యం చేయడానికి ప్రణాళికలు రచించింది.

1 లక్షా 20 వేలు వుండే కార్మికుల సంఖ్యని  సగానికి పైగా కుదించివేసి లాభాల బాటలోకి నడిపిన గత పదిహేనేళ్ళ చరిత్ర రక్త సిక్తమై  యెంత అమానవీయంగా వుందో తెలియజేస్తూ  పి చంద్ లాంటి రచయితలు కథలు  (జులుం) , యండి మునీర్ లాంటి వాళ్ళు వ్యాసాలు  రాశారు. అయితే యీ క్రమాన్ని మరో దృష్టికోణం నుంచి పరిశీలించిన కథ  ఎం. రఘువంశీ రాసిన ‘హక్కుదార్లు’. ( అరుణతార : ఆగస్ట్ 2016)

[ కథ లింక్ : http://www.virasam.in/article.php?page=223  పే.11-20 ]

“వచ్చిన లాభాల పంపకం వాటికి కారణమైన వాళ్ళ మధ్య సజావుగా ఉందా ? అసలు వాటాదార్లు ఎవరు?” అని ప్రశ్నిస్తుంది యీ కథ. అసలు నష్టాల్లో నడిచే కంపెనీ లాభాల్లోకి యెలా ప్రవేశించింది? ఆ క్రమంలో యెవరి పాత్ర యెంత? శ్రమ యెవరిది ? సిరి యెవరిది? వాటాలు పంచుకొనే దారిలో కార్మికుల్లో యెటువంటి  మార్పులు వచ్చాయి? కార్మిక సంఘాల ధోరణి ఏమిటి? కంపెనీ క్షేమం – కార్మిక సంక్షేమం మాటల నిర్వచనాలు యెలా మారిపోయాయి? సంస్కరణల అమల్లో యాజమాన్యాల కాంట్రాక్టర్ల విధానాలేంటి? మిడిల్ మేనేజ్ మెంట్ లో అధికారుల రోల్ ఏంటి? ఈ అంతటిలో పాలకుల వైఖరి ఏంటి?పబ్లిక్ రంగ సంస్థ ప్రాథమిక లక్ష్యం లాభార్జనేనా? దాని సామాజిక బాధ్యతలేంటి? కంపెనీ అభివృద్ధి ప్రాంతీయ అభివృద్ధికి యే మేరకి దోహదం చేసింది? ఈ క్రీ నీడలో మగ్గి పోయిందెవరు ? అందరూ పల్లకిల్లో వూరేగుతున్న పంచరంగుల స్వప్నావిష్కారంలో అసలు బరువు మోసిందెవరు? మేక్రో లెవల్లో ప్రపంచీకరణకు మైక్రో లెవల్లో సింగరేణి యెలా అద్దంగా నిలబడింది? … యిలా సవాలక్ష ప్రశ్నలకు వొక సాహిత్య రూపం యివ్వడం అందునా వాటికి సమాధానాలు వెతికే బృహత్ కార్యాన్ని వొక  కథలోకి కుదించే ప్రయత్నం సాహసమే. ఆ సాహసాన్ని యిష్ట పూర్వకంగా యెత్తుకొన్న రచయిత రఘువంశీ. ఈ పేరు యింతకు ముందు విన్నది కాదు. కథా వస్తువు , కథా రచన అతనికి కొత్త కాదు అనిపిస్తుంది. కథ రాసింది చేయి తిరిగిన యిన్ సైడ్ రచయితేనేమో అని  అనుమానం కలుగుతుంది. కథ నడిపిన తీరు కూడా దాన్నిబలపరుస్తుంది.

కథని కార్మికులవైపు నుంచీ గాక మిడిల్ మేనేజ్ మెంట్ లో పనిచేసే ఉద్యోగుల దృష్టి కోణం నుంచీ నడిపి పై ప్రశ్నలకి సమాధానం వెతికే ప్రయత్నం మరీ కత్తి మీద సాము లాంటిదే. ఆ సాములో  రచయిత యే మేరకు సఫలమయ్యాడో చూద్దాం.

లాభాల్లో కార్మికుల వాటా నిర్ధారించడానికి మెయిన్ ఆఫీసులో మేనేజిమెంట్ గుర్తింపు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపడానికి మీటింగ్ పెట్టుకొనే సమయానికి (సంస్థ లాభాలు గడించడం మొదలైన తొలి నాళ్లలో లాభాల్లో కార్మికుల వాటా పది శాతం వుండగా రాను రానూ అది  యిరవై శాతం వరకూ పెరిగింది. ఈ సంవత్సరం అది 23 శాతం) ఆఫీసు ముందు ఔట్ సోర్స్డ్ కార్మికులు ధర్నాకి దిగడం దగ్గర కథ మొదలైంది. ధర్నా కారణంగా ఆఫీసులోకి పోలేని ఆఫీసర్లు , ఉద్యోగులు, రెగ్యులర్ కార్మికులు చిన్న చిన్న గుంపులుగా బయట యే చెట్టు నీడనో కూర్చొని ధర్నా పూర్తి కాగానే లోపలోకి పోదామని యెదురు చూస్తుంటారు.

వాళ్ళలో అన్ని స్థాయీలకి చెందిన వాళ్ళున్నారు.  మే డే  ఫ్లెక్సీ మీద కూర్చొని స్మార్ట్ ఫోన్లలో విమన్స్ డే ఫోటోలు చూసుకొంటూ ముచ్చట్లు పెట్టుకొనే ఉద్యోగినులున్నారు. రావాల్సిన ప్రమోషనో కోరుకొన్న పోస్టింగో  రాక మేనేజిమెంట్ మీద అలిగిన ఆఫీసర్లున్నారు. మీడియా కెమెరా ముందు స్లోగన్లు యిచ్చి  కవరేజి అయిపోయాకా ధర్నా చేసే వాళ్ళు సర్దుకుపోతారని భావించే అత్యాధునికులున్నారు.  అమెరికాలో వున్న  కూతురు దగ్గరికో కొడుకు దగ్గరికో పోయొచ్చి అక్కడి నుంచీ తెచ్చుకొన్న వస్తువుల్ని ప్రదర్శించుకొనే క్లర్క్ లున్నారు.

యెవరి సామాజిక నేపథ్యాలు వాళ్ళకున్నా కళ్ళ ముందు జరిగే ధర్నా పట్ల వాళ్ళ వైఖరి మాత్రం వొక్కటే. నిర్లిప్తత. దాన్ని ఎష్టాబ్లిష్ చేయడానికి రచయిత చక్కటి వాతావరణం సృష్టించాడు.  మే డే వుమెన్స్ డే వేడుకలుగా కేవలం వుత్సవాలగానో మొక్కుబడి కార్యక్రమాలగానో  పరిణమించిన వైనం వంటి కథాంశానికి పనికి వచ్చే యెన్నో విషయాలు వాతావరణ వర్ణన ద్వారా ప్రతీకాత్మకంగా వ్యక్తమయ్యాయి.

అయితే ఔట్ సోర్స్డ్ కార్మికుల పట్ల వాళ్ళ సమస్యల పట్ల సానుభూతి , వాళ్ళ  డిమాండ్ లో న్యాయ బద్ధత పట్ల సహానుభూతి వున్న సీనియర్ ఆఫీసర్లు కూడా అక్కడ వున్నారు. వాళ్ళ మాటల్లో  సంస్థ పని తీరు గురించి యెన్నో విషయాలు చర్చకు వస్తాయి. ఔట్ సోర్సింగ్ కార్మికుల శ్రమే లాభాలుగా మారుతుందన్న స్పృహ కూడా వాళ్లకు వుంది. దాన్ని అర్హులందరికీ  పంచకుండా స్వార్థంతో తామే  అనుభవిస్తున్నామన్న అపరాధ భావనకూడా వుంది (ఒక విధంగా అటువంటి అపరాధ భావనే నాతో యీ వ్యాసం రాయిస్తోంది). హెచ్ ఆర్డీ లో పని చేస్తున్న సుదర్శన్ ఆలోచనల కేంద్రంగా చర్చ నడుస్తుంది. అదే డిపార్ట్ మెంట్ లో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ రవిప్రసాద్ చర్చల్లో వ్యక్తమైన  ఆలోచనల్ని తార్కికంగా విశ్లేషిస్తూ పబ్లిక్ రంగ సంస్థల లక్ష్యాల్ని నిర్వచిస్తూ ప్రగతిశీల భావజాలంతో వచ్చిన మార్పుల పట్ల సమగ్ర దృష్టి  ప్రదర్శిస్తాడు.  ఫైనాన్స్ అధికారి చక్రపాణి సమస్యలోని ఆర్ధిక కోణాల గురించి సందేహాలు లేవనెత్తుతూ వుంటాడు. వయస్సులో అనుభవంలో జూనియర్ అయిన ఎకనామెట్రిషియన్ ప్రతిభ మధ్యలో ప్రశ్నలు సంధిస్తూ వుంటుంది. సుబ్రహ్మణ్యం మోహన్ రావు లాంటి వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచీ మాటలు అందిస్తూ వుంటారు. వీళ్ళందరి మాటల్లో కార్మికోద్యమాల నేపథ్యంగా సంస్థ గత చరిత్ర  వర్తమాన పరిస్థితుల  మధ్య సేతు నిర్మాణం జరుగుతూ వుంటుంది.

ధర్నాలతో సమ్మెలతో పని స్తంభింప జేయలేమని ధర్నా చేస్తున్న వాళ్ళకి తెలుసు. బయట చెట్ల కింద కూర్చున్న ఆఫీసర్లు కొందరు  లాప్ టాప్ ల ద్వారా ఆన్ లైన్లో ఆఫీసు పని చేస్తూంటారు. వెన్యూ మార్చుకొన్న మీటింగ్ తో సహా  యేదీ ఆగలేదు.

లాప్ టాప్ లు వర్చ్యువల్ ఆఫీసులు నడపొచ్చేమో గానీ బొగ్గు తవ్వలేవని కూడా ధర్నా కార్మికులకు తెలుసు. ‘తుపాకులు బొగ్గు తొవ్వలేవని నల్లటి బొగ్గుతో రాసిన గోడమీది నినాదం మసకబారిందేమో గానీ వాళ్ళ మనసుల్లో నుంచీ మాత్రం చెరిగిపోలేదు. ‘టోపీల వర్తకుడు – కోతుల కథ లో లాగా వర్తకుడికే కాదు ; కోతులకూ వాళ్ళ తాత తమ అనుభవాలు , జరిగిన చరిత్ర చెబుతాడుగా !’ అని ఆ సందర్భంలో  రవిప్రసాద్ చేసిన  వ్యాఖ్యానం అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ రాబోయే చర్చలో అతని మాటల విలువని అంచనా కట్టడానికి తోడ్పడుతుంది.

కంపారటీవ్ అడ్వాంటేజ్ ప్రిన్సిపుల్ పేర్న అమల్లోకి వచ్చిన ఔట్ సోర్సింగ్ కొందరికే అడ్వాంటేజ్ గా పరిణమించడం గురించి , కార్మికులకీ మేనేజిమెంట్ కీ మధ్య వొకప్పటి ఘర్షణాత్మక వైఖరి పోయి  లాభాల పంపకాలు మొదలయ్యాకా  నెలకొన్న సామరస్య విధానాల  గురించి ,  ట్రేడ్ యూనియన్ల మారిన  ప్రాధమ్యాల గురించి,  ప్రైవేట్ కాంట్రాక్టర్ల యాజమాన్యపు పని తీరు  గురించి , లాభార్జనలో భాగంగా కార్మికుల సంఖ్యని తగ్గించడంలో చేపట్టిన చర్యల గురించి , ఉపరితల గనుల గురించి , మెకనైజేషన్ గురించి , ఉత్పత్తి పెంపు గురించి , పర్యావరణ పరిస్థితుల గురించి అనేక విషయాలు వారి మాటల్లో చర్చకు వస్తాయి.

ఇవ్వాళ మేనేజిమెంట్ కీ  కార్మికులకీ మధ్య వైరుధ్యాలు తొలగిపోయి సయోధ్య సామరస్యాలు ఏర్పడడంతో యిద్దరికీ  విన్ విన్ సిట్యుయేషన్ లా కనిపిస్తుంది అని వొకరంటే అది  ‘దొంగలూ దొంగలూ కలిసి ఊళ్ళు పంచుకొన్నట్టుంది’ అని గనుల్లో పనిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన  సుబ్రహ్మణ్యం తన భాషలో బదులిస్తాడు .

తన పాతికేళ్ళ వుద్యోజీవితాన్ని వొక్క సారి వెనక్కి తిరిగి చూసుకొన్న సుదర్శన్ కి సంస్థ గమనమంతా కళ్ళముందు కదలాడింది. జరిగిన సంఘటనల సారాంశం చూస్తే అతనికి యేదీ యాదృచ్ఛికంగా జరిగినట్టు అనిపించలేదు. అతనిలో యెన్నో సమాధానాలు తెలిసిన ప్రశ్నలే పునరావృతమౌతూ వుంటాయి.

సంస్కరణల అంతరార్థం అతనికి తెలుసు.  స్వచ్ఛంద పదవీ విరమణ(వి ఆర్ ఎస్) స్వర్ణ కరచాలనాలు (గోల్డెన్ షేక్ హాండ్స్) వంటి పథకాల అమలు ద్వారా ‘మిగిలిన ఉద్యోగ కాలంలో వచ్చే జీతాల కన్నా ఇవ్వజూపే పరిహారం ఎక్కువయ్యింది’. అయినా కంపెనీ వాటిని అమలు చేసింది. ఆ కార్మికుల ఉద్యోగుల స్థానంలో ఔట్ సోర్స్ కార్మికుల్ని తీసుకొంది. ఆ రోజోల్లో ఉత్పత్తి ఉద్పాదకత యంత్రీకరణ లాభాలు అన్న మాటలు తప్ప యాజమాన్యం కార్మికుల దృష్టి యితర విషయాల మీదికి పోకుండా వూదరగొట్టింది. అయితే ‘గనుల్లో కార్మికులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న మాన్ రైడింగ్ సదుపాయాలూ . షాఫ్ట్ లు ఏర్పాటు అవుతూ వచ్చాయి. సెమి మెకనైజేషన్ లో భాగంగా భూగర్భ గనుల్లో చిన్న స్థాయి యంత్రాలు వచ్చాయి. గని కార్మికులకు పీడకల లాంటి భుజాలపైనో తలపైనో తట్టలో ఖనిజం మోసే పని దగ్గర దగ్గర అంతర్ధానమైపోయింది.’ 80 ల్లో సింగరేణి కార్మిక కథల్లో రచయితలు వర్ణించిన దుర్భర పరిస్థితులు యిప్పుడు లేవు.

ఇదంతా – సంస్కరణల వల్లే జరిగిందని మేనేజిమెంట్ గొప్పగా చెప్పుకోవచ్చేమో గానీ – దశాబ్దాల పాటు కార్మికుల పోరాటాల ఫలితమే. ఉద్యమాల ద్వారా సాధించిన విజయమే.

ఈ విషయాన్ని కూడా రచయిత స్పష్టంగానే చెప్పాడు. ‘ ఇప్పుడున్న చట్టాలు … అందులోనూ కార్మిక చట్టాలు గమనిస్తే అనేక డిమాండ్ల ద్వారా … పోరాటాల ద్వారా ఇప్పుడున్న స్థితికి వచ్చాయి.’ అని పేర్కొంటాడు. అదేవిధంగా  సంస్థను అభివృద్ధిబాటలో నడిపించడానికి కార్మికుల హాజరు శాతం పెంచడం , ఉత్పత్తి ఉత్పాదకత పెంచడం , ఉత్పత్తి వ్యయం తగ్గించడం , యంత్రాల సామర్థ్యం పూర్తిగా వినియోగించడం వంటి సంస్కరణలు ఉడత సాయం లాంటివేననీ , ‘కృష్ణుడు చేసిన సాయం లాంటిది మాత్రం అవుట్ సోర్సింగేనని’ సుదర్శన్  నిర్మోమాటంగా  ప్రకటించాడు. ఆ గొంతు రచయితదే. సుదర్శన్  అవగాహనే రచయిత దృక్పథం.

అయితే కార్మికుల సంఖ్య కుదించడంతో మిగిలివున్న వారికి  వసతులు సౌకర్యాలు పెరిగాయి. ఒకప్పుడు నీటికోసం నీడకోసం గనుల్లో రక్షణ కోసం  కూడా సమ్మె చేయాల్సిన పరిస్థితులుండేవి. పర్మినెంట్ కార్మికుల జీతాలతో గానీ సదుపాయాలతో  గానీ పోల్చి నప్పుడు  ఔట్ సోర్స్డ్ కార్మికులు యెంత దోపిడీకి గురవుతున్నారో తెలుస్తుంది (ఔట్ సోర్స్డ్ కార్మికుల జీతం కంటే కంపెనీ కార్మికుల జీతం యెనిమిది రెట్లు యెక్కువ) .

ఈ క్రమంలో అన్ని విధాల  బాగుపడి బలిసిపోయింది  మాత్రం కాంట్రాక్టర్లే అన్నది జగమెరిగిన సత్యమే కానీ సంస్థ సాధించలేని దాన్ని వాళ్ళెలా సాధిస్తున్నారన్నదే తేలని నిగ్గు.

ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ , యెంతో పెద్ద సెటప్ , దశాబ్దాల అనుభవం , ప్రొఫెషనల్ మానేజిమెంట్ , డెవలప్ మెంట్ ప్రోగ్రాములు , ట్రైనింగులు , విదేశీ స్టడీ టూర్లూ చేయలేని చేయించుకోలేని పనిని యే మాత్రం అనుభవం లేని కాలేజి డ్రాపవుట్ కాంట్రాక్టర్ – కెపాసిటీ తక్కువ మెషీన్లతో తక్కువ ఖర్చుతో  క్వాలిఫైడ్ కాని వాళ్ళతో సాంకేతిక నైపుణ్యం లేనివాళ్ళతో  చిన్న సైన్యంతో చాలెంజి చేసి యెలా సాధించగలుగుతున్నాడన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న మిడిల్ మేనేజ్ మెంట్ ని సైతం తొలుస్తూనే వుంటుంది. కాంట్రాక్టర్ అనుసరించే పద్ధతుల్నే కంపెనీ కూడా ఫాలో అవ్వొచ్చుగా అంటే సమాధానం లేదు. లోపం ఎక్కడ వుంది? చేసే వాళ్ళలోనా – చేయించుకొనే వాళ్లలోనా ? కార్మిక వర్గ ప్రతినిధి అడిగే ప్రశ్నకి సమాధానం యిచ్చే నాథుడు లేదు.

అనేకమంది సృష్టించింది అందరూ అనుభవించాలి కానీ సంపద సృష్టించినవాడికి దక్కకుండా వొకరే అనుభవించడం  – యాజమాన్యం వొకప్పుడు – ఆ స్థానంలో మరికొంత మంది కార్మిక వర్గానికి చెందినవారు కూడా తోడవ్వడంతో  కార్మిక సమైక్యతకి పెద్ద విఘాతం ఏర్పడింది. కార్మికుడు మధ్యతరగతిగా యెదిగి తన మూలాలు మర్చిపోయి  పెటీ బూర్జువాగా తయారయ్యాడని కూడా రచయిత కథలో గుర్తించాడు.

కార్మికులు , చిన్న స్థాయి ఉద్యోగులు ‘నీడ్స్ హైరార్కీలో ఒక స్టెప్ పైకెళ్ళారు. ఇదివరకు ఆఫీసర్ల మానసిక స్థితికి ఇప్పుడు వాళ్ళు వచ్చారు…  టేబుల్ కి ఆపోజిట్ సైడులో ఉండవలసిన వాళ్ళు రెండో వైపుకు వెళ్ళిపోయారు. ఒకప్పుడు మానేజిమెంటు పనిచేయించేది అనుకుంటే కార్మికులు పనిచేసేవారు. కొద్ది మినహాయింపులతో ఇప్పుడు సంస్థ ఉద్యోగులంతా పనిచేయించే వాళ్ళయ్యారు. అవుట్ సోర్సుడు కార్మికులు పనిచేసున్నారు.’ కార్మికులూ కార్మిక నాయకులూ వర్గస్పృహ కోల్పోయారనీ వాళ్ళ వర్గస్వభావమే మారిపోయిందనీ రచయిత రవిప్రసాద్ ముఖత: చెప్పిన మాటల్లో  నిజం బాధించినప్పటికీ  అతని  విమర్శనాత్మక దృష్టిని కాదనలేం.

‘ప్రపంచాకార్మికులారా ఏకం కండు’ అని నినదించే ట్రేడ్ యూనియన్లు తోటి కార్మికుల కష్టాలకు స్పందించని స్థితికి చేరుకొన్నాయి. దేశంలో ట్రేడ్ యూనియనిజం వూబిలోకి స్వచ్ఛందంగా దిగిన   కార్మికులు  వేతనశర్మలుగా మారారు. సింగరేణి అందుకు మినహాయింపు కాదు.

 ‘ఎలెక్టయిన యూనియన్ నాయకులు ఆల్ మోస్ట్ ఒక డైరెక్టరు హోదా అనుభవిస్తున్నారు. ఎస్ యూ వీ ల్లో తిరుగుతూ,  ఒక ప్రజా ప్రతినిధికో , పెద్ద కాంట్రాక్టరుకో తీసిపోనట్టు ఆకారం , డ్రెస్సింగు , బాడీ లాంగ్వేజ్ తో అనుచచరగణంతో కనిపిస్తున్నారు’ .

రఘువంశీ పేర్కొన్న యూనియన్ నాయకుల యీ ధోరణిని ’80 ల్లో వచ్చిన కార్మిక కథల్లోనే రచయితలు తీవ్రంగా  అసహ్యించుకొన్నారు. చైతన్య వంతులైన కార్మికులు వారికి బుద్ధి చెప్పడం కూడా ఆ కథల్లో కనిపిస్తుంది.

యమ్మెన్సీ ల్లో గానీ కార్పోరేట్ సంస్థల్లో గానీ ట్రేడ్ యూనియన్ల వునికినే లేకుండా చేసిన పరిస్థితే కనపడుతుంది. అక్కడ కలెక్టీవ్ బార్గెయినింగ్ వుండదు. ఉద్యోగి యిండివిడ్యువల్ గా సంస్థతో డీల్ చేసుకుంటాడు. అక్కడ ఎంప్లాయీ మొబిలిటీ కూడా ఎక్కువే. కానీ పబ్లిక్ సెక్టార్లలో పరిస్థితి అలా కాదు. సంస్థతో ఉద్యోగులకు పర్మినెంట్ రిలేషన్ వుంటుంది. వేతన వొప్పందాల్లాంటివి యూనియన్ల ద్వారా జరగాల్సిందే.  కానీ సింగరేణిలాంటి సంస్థల్లో కూడా  ట్రేడ్ యూనియన్లు కార్మికుల బదిలీలు   క్వార్టర్ ఎలాట్ మెంట్లు లాంటి వాటికే పరిమితమయ్యాయి.

తొలి రోజుల్లో ఔట్ సోర్సింగ్ కీ మెకనైజేషన్ కీ ప్రైవేటీకరణకీ  వ్యతిరేకంగా పోరాడుతూ వాటిలోని అవినీతిని యెండ గడుతూ స్ట్రైక్ లూ  నిరసనోద్యమాలూ నడిపిన కార్మికుల్లో  తర్వాతి కాలంలో మార్పు వచ్చింది. ఉపరితల గనుల్లో లాగానే భూగర్భ గనుల్లో సైతం పనులు అవుట్ సోర్సింగు చేసి ఉత్పత్తి పెంచి ఇంటెన్సీవ్ ఇస్తే బాగుండునని భావించే దిశగా వాళ్ళు నడుస్తున్నారు.

ఒకప్పుడు నష్టాల వల్ల బి ఐ ఎఫ్ ఆర్ కి వెళ్ళి పునర్నిర్మాణ పేకేజీ కొన్ని మాఫీలు కొన్ని రాయితీలు కొన్ని ఆంక్షలతో కంపెనీ లాభాల బాట పట్టాకా  రెగ్యులర్ ఉద్యోగులకూ కార్మికులకూ బోనస్ రూపంలోగానీ ప్రత్యేక ఇన్సెంటీవ్ రూపంలో గానీ అందుతున్న లాభాల్లో  ప్రైవేట్ /కాంట్రాక్ట్ / ఔట్ సోర్స్డ్ కార్మికుల పాత్ర బుద్ధిపూర్వకంగానే విస్మరణకి గురైంది.  ఒకరి లాభం మరొకరి నష్టం అన్న సూత్రం ప్రకారం ఆలోచిస్తే విషయం స్పష్టమౌతుంది. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమే లాభాలుగా మారుతున్న విషయం తెలిసీ రెగ్యులర్ కార్మికులతో పాటు వారిక్కూడా వాటా పంచడానికి కంపెనీ సిద్ధంగా వుందా అన్నది ప్రధానమైన ప్రశ్న. అయితే ‘కింద పడ్డ చిక్కుడు గింజను సైతం నలుగురూ పంచుకావాల’న్న స్ఫూర్తితో  తోటి కార్మికులకి భాగం యివ్వడానికి కంపెనీ కార్మికులు అంగీకరిస్తారా అన్నది దాని అనుబంధ ప్రశ్న.

ధర్నాకి నాయకత్వం వహిస్తున్న ‘లక్ష్మణ్’ సరిగ్గా యిదే అడుగుతున్నాడు. శ్రమ ఫలాలు అందరికీ దక్కకపోవడం గురించే అతనికి పేచీ.

‘గత దశాబ్ద కాలంలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య ఎంత? అప్పటి ఉత్పత్తి ఎంత? ఇప్పటి ఉత్పత్తి ఎంత? పెరిగిన ఉత్పత్తి తగ్గిన మానవ వనరులతో ఎలా సాధ్యపడింది?? ఉత్పత్తిలోనూ లాభాలలోనూ పెరుగుదలకు ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత , అందులో కాంట్రాక్టరు ద్వారా పనిచేసే మా పాత్రేమీ లేదా?’ అని అతను నిలదీస్తున్నాడు. అందుకే కంపెనీ ఉద్యోగులతో పాటు లాభాలలో న్యాయబద్ధమైన  వాటాని డిమాండ్ చేస్తున్నాడు.

సాంకేతికంగా కంపెనీ యాజమాన్యానికి ప్రైవేటు కార్మికులతో సంబంధం లేదని కంపెనీ వాదన. నిజానికి కార్మిక కుటుంబాలకు విద్య – వైద్యం , వసతి సౌకర్యాలు , పి ఎఫ్ , గ్రాటిట్యుటి , ప్రమాదాల్లో నష్ట పరిహారాలు వంటి  కార్మిక  సంక్షేమాల  బాధ్యత నుంచి  తప్పించుకోడానికే ఔట్ సోర్సింగ్ వంటి నూతన విధానాల్ని కంపెనీలు అమల్లోకి తెచ్చాయి.

ఒకప్పుడు బర్మా క్యాంప్ , పంజాబ్ గడ్డ, ధనబాద్ కాలనీ లాంటి నరక కూపాల్లో నిత్య పీడననీ దోపిడీనీ యెదుర్కొన్న వలస కార్మికుల కంటే  ఔట్ సోర్సింగ్ కార్మికుల పరిస్థితి మెరుగేనని రచయిత పేర్కొన్నప్పటికీ కార్మిక చట్టాల్ని నిర్వీర్యం చేయండంలో కాంట్రాక్టర్లు ఆరితేరి పోయారు.  ఔట్ సోర్సింగ్ కార్మికులకు అన్ని విధాలా  కాంట్రాక్టరే యజమాని. కంట్రాక్టర్ కనీస వేతనాలు చెల్లించాలనీ పి ఎఫ్ వంటి కార్మిక చట్టాలని వర్తింపజేయాలనీ కంపెనీతో వొప్పందాలు వుంటాయి. కానీ అవి సరిగ్గా అమలవుతున్నాయా అన్న పర్యవేక్షణ నామమాత్రమే. ఔట్ సోర్స్డ్ కార్మికులకి కంపెనీ  మేనేజ్ మెంట్  అదృశ్య శత్రువు. దాంతో చేసే పోరాటం మేఘనాథుడితో యుద్ధం చేసినట్టే. అందుకే  కాంట్రాక్ట్ కార్మిక నాయకుడికి రచయిత ‘లక్ష్మణ్’ అని పేరు పెట్టాడు.

కంపెనీ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల మధ్య చీలిక తెచ్చి  శత్రు వైరుధ్యం సృష్టించడంలో యాజమాన్యం యేదో వొక మేరకి సఫలమైంది. అందుకే ధర్నా పట్ల కార్మికులకీ వుద్యోగుగులకీ వొక రకమైన అనాసక్తి. నిర్లిప్తత. ఒకప్పుడు ఆ ధర్నా స్థలంలోనే తాము కూర్చుని యెన్నో డిమాండ్లు సాధించుకొన్నా మని కూడా వాళ్ళు మర్చిపొయారేమో! లేదా న్యాయబద్ధమైన ఔట్ సోర్సింగ్ కార్మికుల పోరాటానికి మద్దతిస్తే తమ వాటాలో కోత పడుతుందని స్వార్థంతో కూడిన  భయంకూడా కావొచ్చు.  యాజమాన్యానికి వ్యతిరేకంగా  కార్మికులందరి పోలరైజేషన్ జరిగితే సంస్థ ఉద్యోగులూ కార్మికులూ యెటు నిలబడతారన్న విషయంలో కొత్త సందర్భంలో సందేహానికి తావు లేదు.

కథ నిర్మాణం విషయానికొస్తే కథలో సంఘటనల్లేవు. కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాతో కథ ప్రారంభమైనప్పటికీ తోటి వుద్యోగుగులకూ కార్మికులక్కూడా అదొక సంఘటనలా అనిపించలేదు. ఏదో రొటీన్ గా  అలవాటైన కార్యక్రమంలా ‘పెద్ద ఉత్సుకత కలిగించలేదు’. కథ మొత్తం  ధర్నాకి కారణమైన పరిస్థితుల్నే చర్చించింది కానీ సారంలో కథాంశాన్ని పాఠకులకు చేరవేయడంలో వొక  వ్యాసంలా నడిచింది. రఘు వంశీకి యిదే మొదటి కథ కాకపోవచ్చని కథ చదువుతుంటే బలంగా అనిపిస్తుంది. వ్యాసంలో చెప్పాల్సిన విషయాల్ని కథలోకి తీసుకురావడంలో యిబ్బందుల్ని అధిగమించడానికి రచయిత పడిన స్ట్రగుల్ అడుగడుగునా కనిపిస్తుంది. కార్మికుల వైపు నుంచీ కాకుండా ఆఫీసర్ల చర్చలు సంభాషణలు వాదోపవాదాల ద్వారా నడిపిన టెక్నిక్ కొత్తది కాదు ;కానీ యీ జెనర్ లో కథా నిర్వహణ చాలా కష్టం. తుమ్మేటి రఘోత్తం రెడ్డి ‘చావు విందు’ గుర్తుకు వచ్చినప్పటికీ ముళ్ళపూడి సుబ్బారావు ‘రెండు నదుల మధ్య’ లో వాడిన  టెక్నిక్ కి యిది దగ్గరగా వుంది (శిల్ప పరంగా ఇంగ్లీష్  సినిమా ‘Bridge on the River Kwai’ , రావిశాస్త్రి కథ ‘ఆఖరి దశ’ లీలగా తన మనస్సులో మెదిలాయని రచయిత నాతో మాటల్లో ప్రస్తావించారు).

కథ చివరికొచ్చేసరికి జరిగిన సంఘటన – రైతు ఆత్మహత్య. దాంతో కథలోకి నూత్న కోణాలు వచ్చి చేరాయి. కథలో రచయిత తన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి ఆ యా సందర్భాలకు అనుగుణంగా అవసరమైన కంఠ స్వరాల్ని యెన్నుకొన్నప్పటికీ రైతు ఆత్మహత్య ద్వారా దాన్ని బలంగా ఆవిష్కరించగలిగాడు. అంతవరకూ కేవలం తర్కబద్ధ వాదనలకీ సంభాషణలకీ పరిమితమై ఇమోషనల్ కోషేంట్ కి అవకాశంలేక డ్రైగా వున్న కథలోకి వొక బలమైన  వుద్వేగపు అల చొచ్చుకువచ్చి పాఠకుణ్ని తాకుతుంది.

ఉపరితల గనుల  పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు  దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో యెక్కడికక్కడ వ్యవసాయ భూములు సాగు యోగ్యతను కోల్పోయాయి. ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలు వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యం, చమురు కాలుష్యం పర్యావరణాన్ని ఎక్కువగా దెబ్బతీశాయి. జంతు జీవాలకూ ముప్పు యేర్పడింది. పంటపొలాల్లో భూసారం తగ్గిపోయి, ఎరువుల వినియోగం పెరిగిపోయింది. దీంతో రైతులకు సాగు ఖర్చులు పెరగడంతో పాటు , పంట దిగుబడులు కూడా తగ్గిపోతున్నట్లు , పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ రైతు మరణానికి అదృశ్య కారణాలే.

ఉత్పత్తి ప్రక్రియలో జరిగే పర్యావరణ విధ్వంసం గురించి , ఆ ప్రాంత ప్రజలు కోల్పోయిన మానసిక ప్రశాంతత గురించి , బొగ్గు రవాణా సందర్భంలో  చోటుచేసుకొనే యాక్సిడెంట్లు గురించి, ‘సోషల్ కాస్ట్’ గురించి , దాన్ని భరిస్తున్న పౌర సమాజం గురించి  లోతుగా ఆలోచించి  కంపెనీ లాభాల్లో న్యాయబద్ధమైన  యితర వాటాదార్లు గురించి ప్రస్తావించిన రచయిత దృష్టి యెందుకో రైతు చావుకి కారణాల పైకి , ఓపెన్ కాస్ట్ యజ్ఞంలో సమిధలైన  భూనిర్వాసితుల స్థితి గతులపైకి పోలేదు. అవన్నీ చెప్పాలంటే పెద్ద నవలే అవుతుందేమో! ఇప్పటికే కథ నిడివి పెరిగింది. కానీ సింగరేణి నిర్దిష్టత నుంచి మొత్తం దేశంలో కార్పోరేట్ కి అనుకూలంగా అమలయ్యే పారిశ్రామిక విధానంలోని అపసవ్యతని – పేద్ద భూతాన్ని చిన్న సీసాలో బంధించి చూపినట్టు – కథలోకి యిమిడ్చిన నేర్పు అభినందనీయం.

పాప పరిహారం లాంటి సి యస్ ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) లోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడానికి రచయిత వెనకాడ లేదు. దాన్ని చాటల కొద్దీ స్వయంపాకం తీసుకొని అందులో వొక గుప్పెడు గింజలు వొక కూరగాయ తిరిగి యిచ్చి రుణ విముక్తుడయ్యే యాయావార బ్రాహ్మణుడి వ్యవహారంతో పోల్చాడు. అది  కార్పోరేట్ సంస్థలు అపరాధ భావన నుంచి తప్పించుకొనే మొక్కుబడి  మాత్రమే. మళ్ళీ పాప పంకిలం లో దొర్లడానికి సిద్ధమయ్యే  గంగా స్నానం వంటి కంటి తుడుపు వ్యవహారం అది. అదొక పర – ఆత్మ వంచనల అందమైన మేళవింపు.

రైతు ఆత్మహత్య వుదంతాన్ని మరీ కథ చివర్లో కాకుండా కథ మధ్యలోనే చెప్పి దానికి కారణమైన పరిస్థితుల్నీ అందుకు వుపరితల గనుల్లో చోటుచేసుకొన్న రిగరస్ మైనింగ్ ప్రమేయాన్నీ ప్రస్తావించి కార్మికుల ధర్నానీ రైతుల వూరేగింపునీ సమాంతరంగా నడిపి వుంటే కథలో చిక్కదనం వచ్చేది. ‘ఒక వేళ కాంట్రాక్ట్ కార్మికులు పొందాల్సింది పొందితే తర్వాత మిగులులో వాటా కోసం రైతులే ధర్నాకి కూర్చుంటారేమో’ అని రచయిత ( సుదర్శన్ ద్వారా ) లేవనెత్తిన సందేహం మరింతగా జస్టిఫై అయ్యేది. కేవలం వాదోపవాదాలకే కాక ఉద్వేగ భరిత కథనానికి  కూడా కథలో చోటు దొరికేది. కథ పొడవునా వొక మూడ్ క్యారీ అయ్యేది. అల్లం రాజయ్య ‘అతడు’ కథలో యీ టెక్నిక్ ని గమనించవచ్చు.

యేది యేమైనా శ్రమజీవుల స్వేద ఫలం దాని నిజమైన ‘హక్కుదార్ల’కు  దక్కేవరకూ  మహాశ్వేతాదేవి బషాయి టుడు లాగా ‘అతడు’ -రమాకాంత్ కావచ్చు,  కథలోని లక్ష్మణ్ కావచ్చు, భూనిర్వాసితుడు కావొచ్చు , పర్యావరణ ప్రేమి కావొచ్చు  – మళ్ళీ మళ్ళీ పుడుతూనే వుంటాడు. ధర్నా చౌక్ రణస్థలి గానే వుంటుంది. పాత్రలు పాత్రధారులు మారినా అన్యాయానికి విరుద్ధంగా పోరాటాలు ఆగవు , పోరాడే శక్తులు యేదో వొక రూపంలో నిత్యం చలన శీలంగానే వుంటాయి-  అనే యెరుకని అంతిమంగా కల్గించినందుకు రచయితకి థేంక్స్.

 

  •