బీటలు వారిన ‘గాలి అద్దం’

‘ ఏరుకున్న దుఃఖంలో’ అంటూ నాయుడి మీద 22 ఏళ్ల క్రితం నేను రాసుకున్న కవిత ఇది:

వెన్నెల రెక్క తెగిన
అమావాస్య ఏడుపురా నువ్వు

 

శ్వాసలూ భాషల్లోనే మూల్గాయని

ఆత్మహత్యాత్మకంగా నొక్కి

 

తలవాకిట పడిగాపుల్లో

చీత్కార ప్రణయాన్ని ఖాండ్రించి నవ్వి

 

నువ్ తీస్తున్న దౌడు పాదాల

పియానో చప్పుడు-

 

మహానగర కూడలి చాపిన తారునాల్కకి

వెగటు రుచివి

మొండి గోడల్ని బీటలు చీల్చిన

గడ్డిపూ పజ్యానివి

కొడిగట్టిన దూదొత్తి రెపరెప కాల్చిన

ఒంటరి అరిచెయ్యివేరా ఏంతకీ

నువ్వు-

 

పెకలించినా మట్టంటని మొక్కలు

మరెప్పుడూ నేల చేరని వాన చినుకులు

అరచేతి గ్రహణాల్ని కప్పుకుని బావురుమనే

చందమామలు

ఈ గట్టునే ఊడలు దించిన మృత్యువు!

 

దెయ్యం కాళ్ల పరుగుల్తో

వెనక్కి నడిచే గడియారాలం

 

లబ్‌డబ్మని పెట్లుతున్న గుండెల

పింగాణీమోతలో

విన్పించని

కన్నీటి వీడ్కోలు తేమరా నువ్వు

 

ఆ గట్టు చేర్చకుండానే కూల్తుందీ వంతెన

 

ఆగాగు!

ఊడల్తోనైనా దాటాలీ చీకటి జన్మాల ఏరు

నువ్వైనా మరి

నేనైనా-

* * *

నాయుడి కవిత్వం- గాలి అద్దం సంకలనానికి రమణసుమనశ్రీ ఫౌండేషన్ అవార్డు అందిస్తున్న వేళ నాయుడు గురించి నాలుగు ముక్కలు మాట్లాడవల్సి వచ్చిన సందర్భంగా సుమారు పాతికేళ్ల మా సాన్నిహిత్యాన్నీ, 22 ఏళ్ల నాటి ఆ కవితనీ స్మరిస్తున్నాను. దాన్నిలా తలుచుకుంటున్న సమయాన దాని భావంతో, సారంతో, ఉద్వేగంతో నేనిప్పుడు ఎంత కనెక్టు అయ్యి ఉన్నాన్నో తరిచిచూసుకున్నాను.

‘తాను పారిపోతున్నాడో, లేక నేనిక్కడ బందీనే అయ్యానో తేల్చుకోలేక వీడ్కోలులా’  నాయుడు కోసం రాసిన ఆ కవిత గానీ, అందులోని ‘పర్సనల్’ సందర్భంగానీ తనకైనా గుర్తుండి ఉంటుందని అనుకోను. ‘అనుక్షణిక’మంటూ నాయుడు నాడు రాసుకున్న భగ్నకవిత అతని జ్ఞాపకాల్లో భద్రంగా ఉందని కూడా అనుకోను. ‘అతడు గీసింది కన్నా/ చెరిపింది ఎక్కువ ‘ అన్నారు ఇస్మాయిల్ గారు ‘పికాసో’ గురించి. నాయుడు కూడా రాసింది కంటే చెరిపిందే ఎక్కువ, మర్చిపోయిందే ఎక్కువ. బహుశా 1997లోనే అనుకుంటా, మో (వేగుంట మోహన ప్రసాద్ గారు) తనలానే అనుకంపన లయతో సంచలిస్తుండే అక్షరాల… పదాల… వాక్యాల… దొంతర్ని 47పులు (47 ఏడుపులుని 47 లోని ‘ఏడు’తో ‘పులు’ కలిపి pun చేస్తూ) పేరిట నాయుడు 47- కవితల సంకలనం- ‘ఇపుడే’కి ముందుమాటగా నాకు పంపారు, కంపోజ్ చేయించమని. ‘ఆ 47 కవితలకి మరిక మార్పులు, చేర్పులూ చేయవద్దని, తన తొలిపలుకు కంపోజ్ చేయించి పంపితే, నాయుడి తొలి సంకలనం- ‘ఇపుడే’ వేయించేస్తాననీ’ మో నాకు కవరింగ్ లెటర్ రాసారు. నేను పరమ విధేయంగా 47పుల్ని టైపించి ఒరిజినల్, ఓపెన్ ఫైల్ రెండూ పంపించేశాను. ‘ఇపుడే’ కోసం ఎదురుచూస్తున్నపుడే, మహా అయితే మరో నెల లోపు, ‘మో’ చెప్పారు- నాయుడు తన కవితల రాతప్రతి చింపి తగలబెట్టేశాడని. చెరపడం, మరవడం – నాయుడి విషయంలో అంత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, అపుడేపుడే నేను రాసినదేదో గుర్తుంటుందని కచ్చితంగా అనుకోను. నాయుడిది ఏరుకున్న, తనంతట తాను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకున్న దుఃఖమేనని అంటున్న ఆ నా కవితలో content- context ల దృష్ట్యా ‘పర్సనల్’ భాగంగా కొంత మేరకు వడకట్టేసి, depersonalise కాబడ్డ భాగం వరకూ మాత్రమే చూస్తే-

మహానగర కూడలి చాపిన తారునాల్కకి వెగటు రుచి వంటి, మొండి గోడల్ని బీటలు చీల్చిన గడ్డిపూ పజ్యం వంటి, కొడిగట్టిన దూదొత్తి రెపరెప కాల్చిన ఒంటరి అరిచెయ్యివంటి అతడు, తలవాకిట పడిగాపుల్లో ఛీత్కార ప్రణయాన్ని obvious కాన్కగా పొందిన ప్రేమోపహతుడు మాత్రమే కాదు, కవి కూడా. ఎటువంటి కవి? మాటలు, ఆలోచనలే కాదు, శ్వాసలు సైతం భాషల్లో మూల్గడాన్ని ఏవగించుకునే కవి.  నేను పై కవిత రాసిన 1994 నాటికి మహా అయితే ఓ పుంజీడు కవితలు రాశాడేమో, అప్పటికే తన కవిత్వం తిరగేసిన భాష అని తెలిసిపోయింది మిత్రులమైన మాకు.

“She dealt her pretty words like Blades/ How glittering they shone/ And every One unbared a Nerve

Or wantoned with a Bone..” అంటూ Emily Dickinson తరహా ఊహలల్లుకున్నాం నాయుడి కవిత్వం మీద. ఇక్కడ ఒక సర్రియలిస్ట్ సత్యమేమంటే, ఏ కవితలూ రాయకముందే మా సిద్ధార్థకి ప్రియమైన కవి అయిపోయాడు నాయుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఖైరతాబాద్ దక్షిణ హిందీ ప్రచార సభ కాంపౌండులో ఉన్న తన జిరాక్స్ సెంటరుకి అరుదుగా వచ్చే ఓ ఫిలాసఫీ కుర్రాడి కళ్లలో విలోమబింబాలుగా కదలాడుతున్న కవితలు చదివి రేపటి కవిని సిద్ధార్థ discover చేయడం – బహుశా ఏ దేశకాల సాహిత్య చరిత్రలోనైనా విశేషమైన, అపూర్వమనదగ్గ వృత్తాంతం.

ఒక తరం కవుల్ని, లేదా ఒక తరహా కవిత్వోద్యమాన్నీ అర్థం చేసుకునేటప్పుడు అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్నీ, యుద్ధాలు, క్షామాలూ వంటి ప్రాపంచిక పరిణామాల్నీ తరిచి చూసే విమర్శక, విశ్లేషణాత్మక పనిముట్లని ఆధునిక (పాశ్చాత్య) అధ్యయనం అలవాటు చేసింది. ఏమిటితని ఏడుపు, ఎందుకింత వగపు? ‘మధ్యతరగతి సుడో సుఖాల పడవ మునిగిపోతుందేమోనన్న వెంపర్లాట ‘గా అజంతా గారి కవిత్వం మొత్తాన్నీ తేల్చిపారేశాడు ఓ ఆధునిక విమర్శకుడు. ఒక తరం కవుల నిరాశకి, నిస్పృహకీ unemployment, underemployment కూడా కారణాలని చేసిన విశ్లేషణలూ విన్నాము. అంటే, ‘సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank- account, వొట్టిపోని ఆవు’ ఉంటే, మున్ముందు వాటి ఉనికికి ఏ ఢోకా లేదనుకుంటే అజంతా, నాయుడుల కవిత్వం ఉండేది కాదా? అలా సెటిల్ కాలేదనీ, తన జీవితం వడ్డించిన విస్తరి కాలేదనేనా నాయుడి దిగులు, గుబులు? నాకెందుకో ఈ వాదాలూ, విశ్లేషణలూ విచిత్రంగా, రొడ్డకొట్టుడుగా తోస్తాయి. నాయుడ్నే తీసుకుందాం. సుమారు పాతికేళ్లుగా గమనిస్తునానతన్ని. అతను కవిత్వం అయ్యే క్షణాల కోసం; అంతేకాకుండా, అతను కవిత్వం కాకుండా పోయే లిప్తల కోసం కూడా ఏకకాలంలో ఎదురుచూడటం నిజజీవితంలో నాకు ఎదురైన అధివాస్తవికత, కల-మెలకువల మధ్య తిర్యగ్ బిందువుని దర్శించడంలా అనుభవంగానే తప్ప మరింకే విధంగానూ అర్థం చేయించలేని అభాస!

అయితే, మన తెలుగు ఆధునిక సాహిత్యావరణంలో కొన్ని సాహిత్యేతర హిపోక్రసీలు గమనిస్తే భలే వినోదాన్నిస్తాయి. “Poets are, by the nature of their interests and the nature of artistic fabrication, singularly ill-equipped to understand politics…” అని W H Auden అంతటివాడు అన్నట్లు చదివో, కర్ణాకర్ణిగా వినో ఉంటారు. Artistic fabrication మాట దేవుడెరుగు, ఏమీ తెలియకుండా ఉండటంలో ఉండే సౌఖ్యాన్ని అనుభవిస్తూ, చాలా convenient గా intellectual disturbance వంటి అరువు సలపరింతలకి గురౌతుంటారు. ఆధునిక సంక్షోభ యుగంలో కవులెలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో ముందుగానే సిద్ధమై ఉన్న అలిఖిత రూల్ బుక్ లో కొన్ని పడికట్టు వాక్యాల్నే కాస్త అటూఇటుగా వల్లెవేస్తుంటారు: లౌకిక విషయాలు పట్టవనీ, నోట్లో వేలుపెడితే కొరకలేమనీ, రాయడానికి బద్ధకమనీ, ఎవరో చెవిలో గుసగుసలాడినట్టు కొన్ని కవితావాక్యాలలాగ తళుక్కుమంటాయనీ, ఇక రాసినవి దాచే అలవాటు బొత్తిగా లేదనీ…. ఇలా ఈ అబద్ధాలకి అంతులేదు. ఇవన్నీ నిజమని అమాయకంగా నమ్మి, బహుశా ‘రంజని’ వారనుకుంటా, making of a poem తెలుసుకోవాలని తపించే ఆధునిక కవిత్వాభిమానుల కోసం ఇరవై ఏళ్లక్రితం ఒక సంకలనం తెచ్చారు. ప్రసిద్ధ కవులు, వారి కవిత (లేదా కవితలు)- ఆ కవిత అంతిమ రూపం తీసుకోక ముందటి చిత్తుప్రతి. తెలుగు ఆధునిక కవి మోసం, కాపట్యాలకి landmark గా నిలిచిపోయిందా సంకలనం. కాబట్టి అటువంటి కాలుష్య వాతావరణంలో నాయుడుని గ్రహించడం కష్టం. Making of a poem – తెలుసుకోగోరే ఏ సీరియస్ పాఠకుడు, కవితాప్రేమి, సాహిత్య విద్యార్థికైనా-  రాసినవి చెరిపేసే తెంపరితనం, మిగిలినవాటిని దాచని నిర్లక్ష్యం, అక్షరమంటే అలవిమాలిన ఆపేక్ష, కుకవిత్వం మీద తీవ్ర అసహనం – సహజంగా ఉన్న అసుర (అంబటి సురేంద్రరాజు), నాయుడు వంటి అతి కొద్దిమంది కవులు మాత్రమే testimonial గా నిలుస్తారు.

కవిత ఎప్పుడు రెక్కలల్లార్చి, ఎప్పుడు ముడుచుకుంటుందో తనకే తెలియకపోవడం వల్ల కాబోలు, ఎటువంటి తారీఖుల బరువుల్నీ కవితల రెక్కలకి కట్టే ప్రయత్నం చేయలేదు నాయుడు. పఠితకి విశ్రాంతిని ఎర చూపే మాయలాడి విరామచిహ్నాలు ఉండనే ఉండవు. నాయుడి కవిత్వంలో లౌకికమైన కళ్లకి తోచే ఏ రకమైన సందర్భాలూ, కనీసం నెపాలుగానైనా ఎదురుపడవు. కుర్చీగానో, హోదాగానో తప్ప, మనిషిగా పరిచయమైన ఎవర్నైనా చవక చేసే లోకంలో గత్యంతరం లేక మసలుతుంటాడు కాబట్టి, సందర్భాలు పటాటోపంగానైనా ఎత్తిచూపే scholarship కనబడదు నాయుడిలో. కానీ, కె.ఎన్.వై. పతంజలి గారి మీద రాసిన ఎలిజీ ‘వాగ్విశ్రాంతి’ (గాలి అద్దం- పేజీ 171) చూడండి: “ఏదీ కోరని అక్షరాకాశానికి నక్షత్రఖచితమొనర్చాడు/ అంతర్థానమయ్యే అనుభవాల్లో/ నిబిడాంధకార శబ్దస్పర్శలు/ యాదృచ్ఛిక భవిష్యత్తులో వాక్యసామీప్యాలు లేవతనికి/…. / అతడొక వాక్యవిస్మృతి/ అతడొక వాగ్విశ్రాంతి”!

పతంజలి గారి రచనా సర్వస్వం మీద వచ్చిన అత్యుత్తమ విశ్లేషణలు, సిద్ధాంతాలు వేటికైనా తీసిపోతాయా ఈ స్మృతిగీత పాదాలు! మో మీద, త్రిపుర గారి మీద రాసిన ఎలిజీలు కూడా అదే స్థాయి.

అయితే, ‘గాలి అద్దం’ కవితా సంకలనం మీద నాకు అసంతృప్తి ఉంది. నాయుడు కానిది ఇందులో ఎక్కువగా కనిపించడంవల్ల కలిగిన అసంతృప్తి. నాయుడు కానిదాని వైపు నాయుడిని జీవితం నెట్టడాన్ని ప్రత్యక్షంగా చూసినప్పటి దుఃఖ్ఖాన్ని పోలిన అసంతృప్తి. అంతకుముందు, ఎన్నింటిని గుదిగుచ్చినా దేనికదే ప్రత్యేకంగా తోచేలా చేసిన కవిత్వాంశ తగ్గి, monotonous గా అనిపించాయి ‘గాలి అద్దం’లో కొన్ని కవితలు; మరికొన్ని వచనమై సోలిపోయాయి. కవిత్వం ఇలా స్పష్టత దిశగా పలచబారడానికి కారణమేమిటా అని ఆలోచిస్తే ఏమనిపించిందంటే- ఒకానొక upper yielding point కు కూడా చేరుకున్నాక, బద్దలైనట్టు నాయుడు అలిగాడు. ఆ అలకని చూపడంలో ఎవరి పద్ధతి వారిది అయినట్టు, కవిత్వాన్ని విస్పష్టత దారుల్లోకి మళ్లించడం నాయుడి స్టైల్ ఏమో. ఏదిఏమైనా, తాను కినుక వహించడానికి కారణమైన లోకంలో నేను సైతం భాగం కావడాన్ని మాత్రం ఎంత కక్షతోనైనా క్షమించుకోలేకపోతున్నా.

*

 

ఇక్కడ గొంతులు నొక్కబడును

డేవిడ్ కథకు పాఠాంతర పరామర్శ

ఆకాశంలా ఆవరించిన అనుభవంలో అరూప్యమైన మబ్బు తునకల వంటివి కదా జ్ఞాపకాలు. ఎగుడుదిగుడు అంతరంగంలో ఒకే జ్ఞాపకంగా కుదురుకున్న అనేకానేక సంఘటనల, సన్నివేశాల సమాహార బిందుసందోహాన్ని కలిపి గీసే contour line వంటి కథ ఎలా ఉంటుంది? మబ్బుపింజకి జరీ అంచులా మెరిసే కిరణపు అనాకృతిని పోలి ఉంటుందే తప్ప నిర్దిష్టంగా ఉండదు, ఉండాల్సిన అగత్యం లేదు. కానీ, అడ్డూఅదుపూ లేని, మొదలు- తుది ఉండనక్కర్లేని అటువంటి అపురూపమైన వంకర్ల పరివృత్తంగా కొనసాగుతున్న రచనని చప్పున ఒద్దికైన సరళరేఖగా వొంచిన తొట్రుబాటుకి, తొందరపాటుకీ తాజా ఉదాహరణ మన్నం సింధుమాధురి ‘డేవిడ్’!

ఆకతాయి అంగలతో టీనేజీ లోగిళ్ళు దాటుతున్నప్పుడు తోడైన చెంబుగాడు, యవ్వనారంభంలో వయసుపొదల మాటున ఎన్నో దైహిక రహస్యాలు దారికాసిన వైనాన్ని గుర్తుచేశాడు. నిజానికి ఆ గుట్టుమట్లన్నీ విప్పి చెప్పేంత ఆరితేరిన ఆగడీడు కాడు, చెబుతున్నట్టే తెలుసుకున్న ఆరిందగాడు.  తుంగభద్ర ఒడ్డున, హంపీ ఒడిలో చెట్టూ చేమా గుట్టా పుట్టా…. అన్నింటినీ తమ తూరుపూ- పడమరలంత దూరాల్ని రద్దు చేసేకుకొని మరీ ఆటాపాటా చేసుకున్న చిన్నారి నేస్తులు, ఆపై ఈడొచ్చిన పిల్ల ప్రేమికుల ఈ కథని ఒక సారాంశంగా రెండుమూడు వాక్యాల్లోకి కుదించుకొని చెప్పుకుంటే ఏముంటుంది విశేషం? కేవలం story for story sake గా, బండ్లకెత్తబడుతున్న అనేకానేక కథలకి మరో చేర్పు వంటి కథే అయినట్టైతే: నూనూగు ప్రాయల అమలిన ప్రణయం- విలనై విడదీసే విధి- చివర్లో శుభం కార్డుకు ముందు పునస్సమాగమం- అని మూడు ముక్కల్లో తేల్చేయొచ్చు! అలాంటప్పుడు దీనికి కథానాయకుడు లక్కవరప్పాడు, లేదా లక్నో, కాదంటే ఇలా లండన్- ఎక్కడి వాడైతేనేం?  కానీ, చిన్నదో… పెద్దదో – అదనుకొక అనుభవంగా, దిగంతాలే హద్దులుగా చెలరేగిపోయిన, విశృంఖల వాక్యాలుగా వెదజల్లుకుపోయిన కథనం కదా – ‘డేవిడ్’ అనే ఈ కథకి ప్రాణం… ప్రణవం! ఐతే, మొదట్లోనే ఆరోపించినట్టు- స్ఖలిత బ్రహ్మచారి డేవిడ్ virginityకి సంప్రదాయక మురిపెంతో నాయిక ఎసరుపెట్టడం ద్వారా ఉన్నట్టుండి కథ ఒక ఒద్దికైన సాదాసీదా ముగింపుకి చేరుకొని చదువరిని కుదేసింది. ఆత్మగతమైన ‘memoir’ని depersonalize చేసి ‘కథ’గా విశ్వజనీనం చేయడం, అన్యానుభవాన్ని కూడా సహానుభూతితో ‘స్మృతిరచన’గా సొంతం చేసుకొవడం- అనే రెండు భిన్నమైన genresకి ఒక మేలైన సంయోగంగా నడిచిన ఈ రచనని చిట్టచివర్లో రచయిత్రి తేల్చేశారన్నదే నా ప్రధాన అభియోగం.

(అసలు నా అభియోగంతోనే సమ్మతి లేనప్పుడు, ఇక ముందు నేను చేయబోయే వాదనలు పట్టించుకోనక్కర్లేదు, ఈ వాక్యాన్ని దాటి బహుశా చదివే శ్రమ తీసుకో పన్లేదు)

**           **           **

art: satya sufi

art: satya sufi

ఆదిమధ్యాంతరాలతో ఒక ఎత్తుగడలాగా, పతాక ఘట్టం ఒక పకడ్బందీ స్కెచ్ మాదిరిగా కథ ఉండవల్సిన పన్లేదని నవతరం కథకుల రచనలు  ప్రపంచ కథా సాహిత్యవీధుల్లో భాషాతీతంగా ఎప్పటినుంచో చాటి చెబుతున్న విషయం రచయిత్రి సింధు మాధురికి తెలియకే తన కథని ఒక సుఖాంత సీమలకి నడిపించారా? ప్రశ్నలా కనిపించే ముందు వాక్యానికి అవునో… కాదో రచయితకి బదులుగా- అభియోగాలు మోపి, ప్రశ్నలు సంధించిన నేనే వివరణ ఇవ్వడం హాస్యాస్పదం, అసంబద్ధం కావొచ్చు. నేనిక్కడ ఇవ్వబోయే వివరణ కథ తాలూకూ వాచకపు హద్దులు మీరి, text కు మాత్రమే పరిమితం అయ్యే (అవ్వడానికి మాత్రమే తయారుగా ఉన్న) పాఠకుడి హక్కుని కాలరాయడం వంటిది; పాఠకుడి కట్టెదురున ఉన్న  వాచకాన్ని దాటి పిల్లిమొగ్గలేసి, పాఠాంతరమైన మరేవో అసందర్భ అంశాల్ని అతని ముందుకు లాకొచ్చి ప్రదర్శించే దాష్టికంలాంటిది. ఇదంతా తెలిసి కూడా, ‘డేవిడ్’ అనే రచనకి సంబంధించిన వాచకానికి పరిమితం కాకుండా, ‘రచయిత – సింధుమాధురి (అక్షరంతో మాత్రమే)తో నాకు పరిచయం ఉంద’న్న సంజాయిషీ వంటి సాకులే పునాదిగా నా ఈ వాదన అనే మట్టిగోడని నిలబెట్టదల్చుకున్నాను.

**           **           **

‘నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా. అంచేత కథల్లో సన్నివేశాలకు, పాత్రలకు రవంత దూరంగా వుండడానికి ప్రయత్నించేవాణ్ణి, వాటితో నాకెంత గాఢమైన బంధం వున్నా…’ అన్నారు పాలగుమ్మి, త్రిపుర కథలకు 35 ఏళ్ల క్రితం రాసిన ముందుమాటలో. ‘బైటపడిపోతామేమో అన్న భయం’ ఒక్క పాలగుమ్మినే కాదు, మొత్తం ఆధునిక తెలుగు సాహితీకారులందరినీ పట్టిపీడించింది. ఇంకా ఆశ్చర్యమేమంటే, సాహిత్యం- జీవితం అనేది అసలు ద్వంద్వమే కాదని తన యావజ్జీవితాన్ని రుజువుగా నిలిపి చూపిన చలం గారి తర్వాత యుగం యావత్తూ ఆ భయానికే బద్ధులై ఉండటం.

ఇంతలో ఆధునికోత్తర యుగంలో ఒక విచిత్రం జరిగింది. విశ్వరచనలకీ, మహాకథనాలకీ సెలవంటూ, Jean-François Lyotard అనే సాహితీవేత్త ‘petits récits’ (meta-narrative) – అంటే స్వకీయమైన, స్థానికమైన, దుర్బలమైన కథనాలకు స్వాగతద్వారాలు తెరిచి, ప్రపంచానికి, ముఖ్యంగా మూడో ప్రపంచానికి ప్రాధాన్యత పెంచాడు. Lyotardని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆవాహన చేసుకొని తెలుగులో నామిని సుబ్రమణ్య నాయుడు వంటి రచయితలు గొప్ప సాహిత్యాన్ని కల్పించారు. అంతకు ముందటి తరాన్ని పీడించిన ‘బైటపడిపోతామేమో అన్న భయాన్ని’ మొదలంటా పెకలించి పడేసి, తామే హీరోలైన తమ రచనల్లో సన్నివేశాలకి, సందర్భాలకి, పాత్రలకీ కాస్తంత దూరంగా వుండడానికి కూడా ప్రయత్నించలేదు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ తరహా రచయితల తరం ఫోకస్ చేసిన అంశం ‘పేదరికం’. ప్రతిభావంతంగా చెప్పినా, తమ తమ మాండలికాల్లో చెప్పినా, చాప్లిన్ హాస్యంలా నవ్వించి గిల్లినట్టు చెప్పినా – తమ nostalgiaలో ప్రాధానంగా రాజ్యమేలింది ‘పేదరికమే’నని చిత్రించారు. వారి వారి కుల, ఉపకుల, మత, ప్రాంత, సామాజిక సాంస్కృతిక నేపథ్యాల భిన్నత్వం ఆ రచనల్లో కదలాడినా, స్థూలంగా చూస్తే అన్నీ మూసపోసినట్టై, ఆ లేమికి చెమర్చకపోతే, లేదా ఆ బీదతనాన్ని చూసి బిక్కపోకపోతే ఎక్కడ అగ్ర కుల.. మత దురహంకారమని ముద్రలేస్తారోనని భయంతో చదువరులు మూకుమ్మడిగా సంఘీభావాలు ప్రకటించేలా తయారయ్యాయి. దాంతో, అప్పటికే ఇబ్బడిముబ్బడిగా కీర్తి వచ్చిపడిపోతుండటంతో, చేయి మెలితిరిగిన రచయితలు కూడా తమని తామే అనుకరించుకునే దుస్థితికి చేరి, meta-narratives చిత్రణలో మీదుమిక్కిలి monotonyకి కారణమయ్యారు.

అదే స్వకీయ, స్థానికీయ కథనాల ఆధునికోత్తర వాతావరణం ఇచ్చిన దన్నుతో వచ్చినట్టే కనబడిన సింధుమాధురి తాలూకూ ప్రపంచం మానసికంగా, భౌతికంగా భౌగోళికంగా కూడా పెద్దది కావడమే విశేషంగా, ఆమె ప్రత్యేకత గానూ గుర్తించాలి. అంటే, పైన చెప్పిన, monotonous మంద నుంచి వేరై uniqueగా నిలిచిన సింధు మాధురి అనే ఈ రచయిత్రి దేశదేశాలూ తిరిగారా? తన కథలన్నీ ఆమె స్వానుభవాలా? – వంటి వ్యక్తిగతమైన ప్రశ్నలకి అనేకానేక ఆమె పాఠకుల్లో ఒకడిగా నాకూ సమాధానాలు తెలియవు. ఒకవేళ తెలిసిన వారెవరి వకాల్తా అయినా, పాఠకులుగా మనం వినవల్సిన అగత్యం లేదు. కానీ, గతంలో ప్రచురించబడిన కథల ఆధారంగా hypothesis వంటి కొన్ని తీర్మానాలు చేసుకోవడం ఏమంత పెద్ద పాఠాంతర దోషం కాదనుకుంటాను.

అటువంటి hypothesis ఆధారంగానే, డేవిడ్ కథలో నీరసపడిన ఉపసంహారానికి కారణాలు ఊహిస్తున్నాను:  ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో నాలుగేళ్ల క్రితం ‘కలాపి ‘ అనే కథ రాశారు సింధు మాధురి. ఐదారు పెళ్లిళ్లు చేసుకున్న ఓ polyandrous స్నేహితురాలి జీవితచిత్రాన్ని కథగా ప్రతిభావంతంగా చిత్రించారామె ఆ కథలో. అది ఆ తర్వాత వివాదాలకు దారితీయడం వేరే వ్యవహారం. కానీ, అంతకు ముందే, ఆ కథ ప్రచురించినప్పుడు దాని illustration గా protagonist రూపాన్ని నేరేటర్ సింధు మాధురి (ఫొటో ఆధారంగా ) పోలికలతో portrait గా గీశాడు ఆంధ్రజ్యోతి (మగ) ఆర్టిస్టు. ‘కలాపి’ అనే ప్రొతాగనిస్టుకి సింధు మాధురి అనే రచయిత బొమ్మ వేయడం తెలియకో, పొరబాటునో, యథాలాపంగానో జరిగింది కాదు. అటువంటి బరితెగింపుల కథానాయికగా రచయిత్రినే చేయడం వెనక సగటు మగవాడికి ఉండే photo morphing syndrome వంటిదే పనిచేసింది. ఇటీవల వచ్చిన ‘పింక్’ సినిమా పరిభాషలో చెప్పాలంటే, మగవాళ్ల రూల్ బుక్కులో అటువంటి లైంగికాంశాలు రాసే ఆడవాళ్లు ‘కొంచెం లూజు’, ఈజీగానే ‘పడతారు’!

రచన అంటేనే- అనలవేదిక ముందు అస్రనైవేద్యం; సింధు మాధురిలా లోనుంచి పెకలించుకు వచ్చే అనుభవాలను అక్షరబద్ధం చేసే రచయితల విషయంలో అయితే మరీనూ. జ్వాలా సౌందర్యాన్ని గాఢంగా కోరి, ఆ కాంతిలో ఐచ్ఛికంగా కాలి, దీపం సెమ్మ నీడలో రెక్కలు రాలిపడినా ఉపశమించని ఉసిళ్ళ మోహావేశం వంటి అనలాక్షరాపేక్ష ఉన్న ఇటువంటి రచయితలకు, అందులో ఆడవారైన పాపానికి రకరకాల రూపాల్లో, వేషాల్లో వేధింపులు ప్రతిఫలంగా ఎదురౌతుంటే ఏమవుతుంది? అక్షరానికి దాపరికం అవసరపడుతుంది, ముసుగుల పనిబడుతుంది, చివరికి సత్యాన్వేషణకి హిపోక్రసీ అడ్డుపడుతుంది.

‘… బాగా బేక్‌ అయిన కేక్‌లోకి నైఫ్‌ ‌దింపినట్టుగా ఉండే అనుభవాన్ని ఇద్దరం కలిసి చూద్దామ’ని బరితెగించి అడిగిన నెరజాణ సొంత కథే ఇది అనిపిస్తే అంటగట్టబడే vulnerabilities అన్నింటికీ వెరసి, కథతో తగుమాత్రం దూరాలు పాటించడానికే, బహుశా సింధు మాధురి ‘డేవిడ్’ కథకి నప్పనిదే అయినా, ఒక నాటకీయమైన ముగింపు ఇచ్చారని నా ఊహ. ప్రాచీన, అర్వాచీన తెలుగు సాహిత్యంలో(భారతీయ, ప్రపంచ సాహిత్యంల్లో కూడా కావొచ్చు) వినిపిస్తున్న స్త్రీ స్వరాలు- అయితే పురుషులవీ, లేకుంటే, యుగాల పురుషాధిక్య దౌర్జన్యం మీద reactionary గా పుట్టుకొచ్చిన ‘పెడసరి’ ‘గయ్యాళి’ స్త్రీవాదులవీనూ. ఎక్కడైనా అరుదుగా ఇప్పుడిప్పుడే సహజంగా వికసిస్తున్న, వినిపిస్తున్న గొంతుకల్ని కూడా నొక్కేసే దౌర్జన్యం పలు రూపాల్లో కొనసాగితే మిగిలేవి ముసుగులు, ముసురులే.

–నరేష్ నున్నా

డేవిడ్ కథను ఇక్కడ చదవొచ్చు.

ఒక Enigma ఆత్మకథ..

 

-నరేష్ నున్నా

~

మోహన్‌కి అరవై ఐదేళ్లు! !

అందమైన వాక్యం (అన్న భ్రమ)లో చెప్పాలంటే… మోహన్‌కి అరవై ఐదు వసంతాలు!!

ఇంతకంటే విచిత్రమైన, విపరీతమైన, విడ్డూరమైన వాక్యంనా దృష్టిలో మరొకటి లేదు.

ఈ విరిగిన కుర్చీ పదేళ్ళుగా పడి ఉంది
నా పదవీ విరమణకి ఇంకా నాలుగు సంవత్సరాలు
ఆ కూలిన బ్రిడ్జి కట్టి గట్టిగా పుష్కరమైనా అయితేనా…
……. ఇలాంటివే కాదు మరికొన్ని అర్థవంతమైన వాక్యాల్నిచెవికెక్కించుకోగలను. ఇంకా జియాలజిస్టులు పళ్లూడిన రాళ్ళ వయసు, బోటనిస్టులు గూడు జారినచెట్ల ఆయుష్షు….. అన్నేళ్లు….ఇన్ని శిశిరాలు…అంటూ లెక్కలు కడుతుంటారు. అవేవీతప్పని, నేరమనీ అనిపించదు గానీ, మోహన్‌కి ఈడొచ్చిందనో, జోడుకు వయసొచ్చిందనో….అంటూంటే ఆశ్చర్యమేస్తుంది.

అక్కడెక్కడో మహాశూన్యంలోమన అగణిత బుర్రలకి ఊహకైనా అందని మహావేగంతో భూమండలం చేస్తున్న ఆత్మప్రదక్షణలకి, సూర్యచంద్రుల ఋజువర్తనా చమత్కారాల కనుగుణంగా ఎగిరే కాలం రెక్కలకి ఖగోళ గందరగోళాల లెక్కలు వేలాడదీశాం, మన దుర్భలత్వానికి చిహ్నంగా. ఆ లెక్కల జమాబందీ ఉచ్చుల్లో చిక్కుకుని, గడియారాలు పంచాంగాల్లో ఇరుక్కున్న ఏళ్ళూపూళ్లు, వారాలూ వర్జ్యాలు, ఘడియలు-విఘడియలతో ‘సమయా’నికి తగు ‘తాళం’ వేస్తుంటాం, మన దిక్కుతోచనితనానికి గుర్తుగా. అంతమాత్రం చేత ఎంత అల్పత్వాలున్నప్పటికీ, ‘తగుదునమ్మా’ అని మోహన్ వయో పరిమితుల్ని, ప్రాయ- చిత్తాల్ని కొలిచే యశః కాయకల్ప చికిత్సకి తెగబడతామా? ఏకాంతాన్ని భగ్నం చేసే,  చైతన్యాన్ని నిలువరించే, మధుమోహాల్ని రద్దుపరిచే వస్తువులు, స్థలాలు, రాళ్లురప్పలకి గానీ, అటువంటి జడపదార్థాల్లానే బతికేస్తున్న మనుషులకేమో గానీ,మోహన్ వంటి చైతన్యశీలికి వయస్సేమిటి?

ఆయన ‘కాలం’ మనకి తెలిసిన, అర్థమైన కాలం కాదు. ‘టైమ్’కి మాత్రమే కాదు, ఆయన ‘టెన్స్’కి కూడా సాధారణ వ్యాకరణార్థంలో తెలిసిన భూత, వర్తమాన, భవిష్యత్ అర్థాలు లేవు. చూరునుంచి ఒక్కొక్కటిగా జారి ఇసుకలో ఇంకిపోతున్న వానచుక్కని ఒంటరిగా పట్టి ‘కాలనాళిక ‘లో ఒకసారి పరీక్ష చేయాలి. అందులో కదలాడే ఆయన టెన్స్‌ ని. అది గతించిన గతమా? తళుక్కుమనే తక్షణమా? ఆగామి అగమ్య గోచరమా?ఈ మూడు కలగలిసిపోయిన  ఫోర్త్ పర్సన్ సింగ్యులర్‌లా, ఫోర్త్ డైమన్షన్ ఇన్విజిబుల్లాంటి హ్యుమన్ టెన్సా?

ఇసుక డొంకల్లో నగ్న పాదాల్తో చేతిలోని ఇప్పపూల దోనెతో పరుగులు తీస్తున్నప్పడు అందులోంచి చిందిపడే తేనేబిందువుల తుళ్లింతను పోలిన హ్యుమన్ టెన్స్‌ తో సంతులితమైన క్షణాలు. ఆ క్షణాల సమాహారమే మోహన్. అందుకే, 365 తేదీలుగా రద్దయిపోయే కేలండర్‌లో ‘డిసెంబరు 24’ అన్న ఒక్క రోజుమాత్రమే ‘పుట్టిన రోజు ‘ పేరిట ఆయనకి సంబంధించినదని అనడం విడ్డూరంగా ఉంటుంది.

mohan1

వ్యావహారిక పరిభాషలో మోహన్ ఒక చిత్రకారుడు, కార్టూనిస్టు, యానిమేటర్, ఇంకా మంచి రచయిత, చింతనాశీలి. ఇంత బహుముఖ ప్రజ్ఞ ఉన్న ఆర్టిస్టు గురించి రెండుముక్కలు రాయడానికైనా కొంత అర్హత అవసరం. రాత- గీత రంగాలలో పాత్రికేయ స్థాయి ఉపరితల అవగాహనైనా ఉండాలి. ఆంధ్ర దేశంలో ఆర్టు గురించి తెలిసిన అతిమైనారిటీ వర్గానికి చెందకపోయినా, అధిక సంఖ్యాకులకి ఉండే బండ బలమున్నా చాలు. పువ్వుల నేవళం గురించి తెలియకపోయినా, వాటిని గుదిగుచ్చిన దారాన్నివిడిచిపెట్టని మొండితనమున్నా చాలు. ఆ బండ, మొండితనంతోనే నా ఈ వ్యాసమనే ఉపరితల విన్యాసం: మోహన్ అనే ‘అసలు’గురించి కాదు, మోహనీయమనే ‘కొసరు’ గురించి. ‘మోహనీయమంటే మోహన్ తనమే,అదే దారం అనే motif!

సుమారు పాతికేళ్లు (మధ్య మధ్యలో విరామాలున్నప్పటికీ) దాదాపుగా ఆయనను రోజూ చూస్తూనే ఉన్నాను. అరికాళ్ల అంచున అలల ఘోష నిరంతరాయంగా ఉన్నా, కడుపులో చల్ల కదలనట్టుగా ప్రశాంతంగా తోచే సముద్ర గర్భాన్ని రోజూ చూసినా ఏం అర్థమవుతుంది? గుండుసూది కూడా దూరని రాతి ఒంపుల్లోకి ఉలిని పరుగులెత్తించి మలచిన మహాశిల్పాన్ని నిత్యం చూసినంత మాత్రాన ఏం తెలుసుకోగలం? అందులోనూ ఎన్ని పరిమళాల్తోను ఎదురొచ్చి ఆహ్వానించినా పరిచయమున్న పూలమొక్కంటే చులకన ఉన్నట్లు, పరిచయమైన కొద్దీ మనుషులుకూడా చవకవుతారు. అయినా ‘రోజూ చూస్తూ ఉండటం’ అనే బోడి క్వాలిఫికేషన్‌తోనే రాయక తప్పడం లేదు.

పైన ఇంతకుముందు ఏదో నాన్ సీరియస్ స్థితిలో, ఒక ఊపులో ‘చైతన్యశీలి ‘ అన్న విశేషణం వాడేశాను గానీ,మోహన్ ఎంతమాత్రం చైతన్యశీలికారు. ఒక సాధారణ అర్థంలో రక్తమాంసాలు, కామక్రోధాలు ఉన్న మనిషే కాదు. ఆయన ఒక phenomenon గామారిపోయారు కాబట్టి తరచి చూడకపోతే, ఆయనని పైకి స్థితప్రజ్ఞుడంటూనే జడుడని, enigmatic అంటూనే కొరకరానికొయ్యని అంటాం. పెదాల్తో నవ్వుతూ నొసట్లతో వెక్కిరించే అల్ప మానుషత్వంతోనే ఆయన స్నేహశీలిఅని, ఆపద్భాంధవుడని రకరకాల ముసుగు పేర్లతో శ్లాఘిస్తాం. మనఃశరీర సంబంధిత రాగద్వేషాల్లోనే రెండు కాళ్లునిలిపి, కుదుళ్ళుజొనిపి, మామూలుకంటికి కనిపించని సృజనాత్మక సౌందర్యం, తాత్విక సృజనావరణాల్లోకి తన మూర్తిమత్వపు శాఖోపశాఖల్నిచాపి విస్తరించిన మహావృక్షాన్ని పెరట్లో చెట్టులా చూస్తే అసలు రూపం ఎప్పటికీ బోధ పడదు.కుదుళ్ళకి, కొమ్మలకి ఉన్న బంధంలాంటి అంతర్నిహిత ప్రసారం ఒకటి ఆ వృక్షం లోపల జరుగుతుంటుంది. వేర్లలోని భౌతిక శక్తిని కొమ్మల్లోని ఆదిభౌతిక సత్తాలో అనుసంధానించడమనేది మోహన్‌లో నిరంతరం జరిగే ప్రక్రియ. అటువంటి మానవాతీతమైన అనుభవం వల్ల నిత్యమైన సృజనశీలిలో అన్నిభావోద్వేగాలు ఒక ఉచ్ఛస్థాయికి వెళ్లిపోతాయి. సుఖదుఃఖాలు, బాధానందాలు, వెలుగుచీకట్లు, నలుపుతెలుపుల వంటి ఎన్నోవిరోధాభాసలకి అందని ఒక ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాయి. అటువంటి ఆర్టిస్టులు ఏ ఉద్యమాల్నినడపరు; ‘ఎయిడ్స్ నుంచి రక్షణగా కండోమ్స్ వాడండ’ని జనాల్ని మేలుకొలపరు; ‘కల్లుమానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్’ అని పిలుపులివ్వరు; ఒక భార్య, ఒక జాణ, ఒకే బాణమని సుద్దులు చెప్పరు………దేనితో తలపడరు, దేనినీ మార్చరు. వాళ్లు చైతన్యశీలమైన ప్రవాహాలు కానే కాదు, ప్రవాహ గతిని మార్చే నిశ్చలమైన రెల్లు దుబ్బులు. సమాజాన్ని మార్పు దిశగా నడిపించే నాయకులకి స్ఫూర్తి దాతలు!

ఇటువంటివారు ముక్కుమూసుకుని ఏ గుహాంతర్భాగాల్లో ఉన్నా వారి ప్రభావం మాత్రం అమేయం. కానీ మోహన్ అలా అజ్ఞాతంగా, అజ్ఞేయంగా ఉండేవారేం కాదు. ఆయన మీద ప్రేమతో రకరకాల సందర్భాల్లోవ్యాసాలు రాసిన వారి ప్రకారం, మోహన్ ఒక గ్యాంగ్‌లీడర్. గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన డెన్ ఎప్పడూ కోలాహలంగా ఉంటుంది. ఆయన తన పరివారం, బంధుగణం శిష్య ప్రశిష్యుల మధ్య పరివేష్టితులై ఉంటారు. ఈ నిత్యకృత్యం లాంటి దృశ్యంలో అబద్ధం లేదు, దృశ్యాల్ని అన్వయించుకోవడంలో తేడా ఉందేమో. నాతో సహా ఆయన బంధుమిత్ర సపరివారమంతా మోహరించి ఉన్నప్పడు, ఒక అనంతమైన విషాదం ఆ దృశ్యంమంతా పిగిలి పొర్లిపోతుంటుంది. ఈ ప్రపంచగతిని మార్చే నెత్తురు మండే శక్తులు నిండే సైనికుల్నిపుట్టించి, ఎగదోయగలిగిన ఆర్టిస్టు ఒక వీల్‌ఛైర్‌లో కూర్చొన్న సాధారణ భంగిమలో మామూలు కంటికికన్పిస్తూనే, వేరే ఉన్నతపార్శ్వంలో యోగముద్రలో ఉన్నప్పడు ఆ టేబుల్‌కి ఇటుపక్కన ఆ planeకి ఏ మాత్రం సంబంధంలేని ఒక పోచుకోలు గుంపు ఉండటం-

– ఒక దుర్భర విషాద దృశ్యం!

మానుష స్థాయిలో మోహన్‌లోకొన్ని తెంపరి లక్షణాలు ఉన్నాయి (లేదా ఉన్నాయని నా పరిశీలనా ఫలితం). స్థిర, లేదా చర సంపదల పట్ల పూర్తి వైముఖ్యం, అధికారం, హోదాల పట్ల మహా నిర్లక్ష్యం, స్వోత్కర్ష ఏ రూపంలో లేకపోవడం, పొగడ్తల పట్ల చెడ్డ యావగింపు, …..ఇంకా వ్యక్తీకరణల్లోకి ఇమడని ప్రేమా బాధ్యతల్ని వర్షించడం, చదువుకి- జ్ఞానానికి వంతెనలు వేసుకునే బాల్య కౌమార తృష్ణల్నిసజీవంగా నిలుపుకోవడం మొదలైనవి మరెన్నో. ఇన్ని దశాబ్దాలుగా ఆయన చుట్టూ తిరిగే ఏ ఒక్కరికీఈ లక్షణాల్లో ఏ ఒక్కటి సావాసదోషంతోనైనా అంటుకోకపోవడం విచిత్రమైతే, అసలా లక్షణాల ఉనికే వారికితెలియక పోవడం మరోవిచిత్రం. దొంగ మర్యాదలు, కుర్చీని బట్టి గౌరవాలు, అవసరార్థం అరదండాలు….వంటి లౌకికనైచ్యాన్ని తన పరిసరాల్లోంచి పూర్తిగా నిషేధించాలని ఆయన చేసిన అకర్మక క్రియ వంటి అప్రయత్నప్రయత్నం మరోలా వికటించింది. అదేదో సినిమాలో ‘ఈ పూట మనం ఫ్రెండ్స్’ అని ప్రొఫెసర్ అన్న వెంటనే’సరే సోడా కలపరా’ అనికుర్ర స్టూడెంట్లు చనువుతీసుకున్నట్లు, భేషజాలు లేని వాతావరణం ఉండాలని మోహన్ ఆశిస్తే, ఆకాశమంత ఎత్తున ఉన్నఆయన భుజంమీద చెయ్యేసి, వారివారి స్థాయి ఊకదంపుడు ఉపన్యాసాలకి ఆయన్ని శ్రోతని చేసి,కోటలు దాటే ఆ కోతలతో అంతులేని  కాలహరణం చేస్తుంటారు.

బాపు వెనక నీడలా..ఇంకెవరూ మోహనే!

బాపు వెనక నీడలా..ఇంకెవరూ మోహనే!

ఇవన్నీ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది- ఆయన అలిగి కూర్చున్నారేమోనని. అలిగిన వారిని బుజ్జగించడం అయిన వాళ్ళకి ఒక ముచ్చట, ఒక మురిపెం, అంతకు మించిన బాధ్యత. అయితే అలిగినట్లే అర్థంకాక పోవడం కంటే దురదృష్టం మరేముంది? ‘నా కొరకు చెమ్మగిల్లు నయనమ్ము లేదు…’ అని దిగులు పడటం కంటే మించిన దురదృష్టం. నాలుగు దశాబ్దాల పై చిలుకు ఆయన చేస్తున్న సంతకం ఆయనది కాకపోవడం, అది ఒట్టి ఫోర్జరీసంతకమని ఎవరికీ పట్టకపోవడం ఎంత అన్యాయం! నీకోసం, నా కోసం మరేదో జెండా కోసమో గీసినగీతలు కాకుండా, తనకోసం తాను గీసుకున్న బొమ్మలెన్నో, గీయాలనుకున్న బొమ్మలెన్నెన్నో! ఎగ్జిబిషన్ల పేరిటో, కేలండర్ల కిందనో తనవైన ఆ బొమ్మల్ని ప్రదర్శించుకోవడం చెడ్డ చిరాకు ఆయనకి. కే.సి.డే మధుర స్వరాన్ని పందుల గురగురలు, వాహనాల చీదుళ్ళ మధ్య వినడానికి చలం పడిన చికాకులాంటిదది. అంకార్ వాట్, రామప్ప దేవాలయం….ఇంకా ఎన్నో మహోన్నతమైన చిత్ర, శిల్పకళాఖండాల దిగువున ఏ సంతకాలున్నాయని ఎదురు దెబ్బలాడతారు మోహన్. సంతకం చేయకపోవడమే భారతీయత అంటారు. ఇది కాళిదాసు విరచితమని, కవి నృప జయదేవ కృతియని, ఇంకా ఎందరో కవులు పద్య, శ్లోక మకుటాల్లో చేసిన సంతకాల్నిచూపించి, ‘ఇవి భారతీయం కాదా మోహన్!’ అని దబాయించి, ఆయన దాచుకున్నవి బయటకు లాగొచ్చు, ఆయన చేత బలవంతాన నిశానిముద్రలేయిస్తూ.

అయితే అంత కంటే ముందు ఆ స్థాయి ఆర్టిస్టు ప్రతి ఒక్కరికీ తమని ఏకాంత పరిచే ఒక అనంగరాగాన్నివినే వెసులు బాటు కల్పించాలి. ఆ  labyrinth of solitude లో కళాకారుడు చిక్కుకుపోవాలి; అలా చిక్కుకుపోయే సావకాశం ఏర్పాటుచేయాలి- నిజమైన బంధుమిత్ర సపరివారం. అప్పడే సృజనకి అవకాశం. అలా లేనప్పడు ఏ కళాకారుడైనా మోహన్‌లానే అలుగుతాడు. ఆయన అలక తీర్చేవాళ్ళలో కాకుండా, దానికి కారణమైన గుంపులో నేనొక్కడ్నిఅయినందుకు నన్ను ఎంతో కక్షతో ఐనా క్షమించుకోగలనా?

*

నీలాలు కారితే నే చూడలేను!

Neelaalu kaaritee_Naresh Poem_illustration (2)

మోళీవాడి కనికట్టులా
మొదల్లేని ఏడుపు పాయై
ధారగడ్తావు

జంట కంటి కంగారు నలుసై కారిపోతాను

నెత్తిమీద నీళ్లకుండ
జులపాల్లేని నీ జుట్టుక్కూడా
లెక్కతేలని చిక్కులేస్తుంది.

గంగవెర్రుల గంగాభవానిలో సత్తు కాసై మునిగిపోతాను

ముందే జరిగిన కప్పల పెళ్లికి బొంతకాకి కబురు
మూరెడు లేని సొరబూరలో ఎండనే ఎండని ఏరు

**           **           **

ఆదమర్చిన ఆల్చిప్పలో ఆవలింతల ఆకాశం
ఉట్టి మీద సట్టిలో తొణికిన ఉప్పుసంద్రం

కట్ట తెగే నీ కంటి దొరువులో
మూతి చాలని బుంగనై
మునకలేస్తాను
లొడలొడ బుడగల ఊటబావిని
చేంతాడు బొక్కెనై
చేదబోతాను
వైనాల వెక్కిళ్ల
వొంపు కాల్వలో
ఉగ్గిన్నెల యాతమేస్తాను

మంచు బూచోడికి భూగోళం కొసన కొరివి
విరిగిన వంతెన్ల మీద పగటికలల సవారి

దుఃఖనదివై కలకబారితే
దిగులు ద్వీపాన్నై
నొగిలిపోతాను
ఉవ్వెత్తు ఉప్పెన్లకి
నావ విరిగిన నోవానై
బిక్కబోతాను

పిందె గాయాల నీటికి నాలుకే లేపనం
గుట్టు చెప్పని చేప నాల్కకి ఖండనే దండనం

**           **           **

వెదురుబద్ద వెన్నెముక
మబ్బుదుబ్బుల మాటు
ఏడురంగుల్లో ఒంగిపోతుంది

చెట్టు మెటికలో నీటి సడికి ఊసరవెల్లై ఉలికిపడతాను

దుర్గమ్మ ముక్కెరని
పోటు కిట్టమ్మై
ముంచెత్తుతావు

చీదేసిన శ్లేష్మాన్నై జిగురు చాలక జారిపోతాను

మరిక మర్రాకు మీద నువ్ తెప్పతేలితే
బోసినోట్లో ఆ బొటనవేలేంటని
గద్గదంగా గదమాయిస్తాను

**           **           **

ఏడున్నర శ్రుతుల ఏడుపులో నాన్నని ఎడంచేసే నా చిన్నతల్లి ప్రహర్షకి

నరేష్ నున్నా

ఒక altruistic కథకుడు- ముందొక ముళ్లకిరీటం!

 daalappa1

కవి/ రచయిత నాకు తెలుసు అని చెప్పేవాళ్లని- ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారని- అప్పుడెప్పుడో 80 ఏళ్ల క్రితమే చలం గారు (యోగ్యతాపత్రంలో) వెక్కిరింపు, చీత్కరింపు గుర్తుకొస్తున్నా, దాలప్పతీర్థం కథారచయిత చింతకింది శ్రీనివాసరావుతో నా వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ప్రస్తావించడానికి వెనుకాడటం లేదు. ఐతే, అతని కథలకి Motive springs చూపడానికైతే కాదు. అతను నాకు వ్యక్తిగతంగా తెలియక పోతే, ‘దాలప్పతీర్థం’ కథలు మరోలా అర్థమయ్యేవి (లేదా అపార్థానికి గురయ్యేవి). నిర్మమత్వంతో చూడాల్సిన కథలకి నాకు అతనితో ఉన్న పరిచయం అడ్డు కాలేదు సరికదా, నాకు ఆ దిశలో మరింత తోడ్పడింది.

కథల్లోకి వెళ్లే ముందు, కథా రచయిత రాతలకి సంబంధం లేదనిపించే కొన్ని సంగతులు:

ఆంధ్రప్రభ అనే ఒకానొక బుల్లి దినపత్రికని సామ్రాజ్యంగా భావిస్తూ, దానికి తానో చక్రవర్తినని విర్రవీగుతూ, తన భ్రమకి కించిత్ భంగం వాటిల్లినా అందుకు కారణమైన ఉధ్యోగులు అనే కీటకాల్ని కఠినంగా శిక్షిస్తూ- ఓ వేయి విషపడగల వాసుకి! ఆయన ఫ్యూడల్ హయాంలో రకరకాల శిక్షలకి గురైన వాళ్లలో ‘అవిధేయతా’ నేరం కింద అక్కడెక్కడో రూర్కేలా అనే శంకరగిరి మాన్యాలు పట్టిపోయిన వాడు చింతకింది శ్రీనివాసరావు. ఆంధ్రప్రభకి మంచిరోజులు తెచ్చి, దాన్ని భూమార్గం పట్టించిన ఎడిటర్ నిజం శ్రీరామ్మూర్తి గారు- ఆయన టైమ్‌లో తిరిగి తన విశాఖపట్నం గూటికి చేరే ముందు, ఒక నెల రోజులు పాటు హైద్రాబాదులో ఉన్నాడు చింతకింది. వాసుకి బాధితులు సాధారణంగా సెల్ఫ్ పిటీతో కుంగిపోతుంటే, వారి పట్ల సానుభూతి చూపించడంలో మిగతా సహోద్యోగులకి గొప్ప తృప్తి, ఒక మెట్టు ఎగువన ఉన్నామన్న ఆనందం కలిగేవి. కానీ, అటువంటి వారందరికీ చింతకింది ఒక చెంపపెట్టులా కనిపించాడు. సానుభూతి కాదుకదా, ఏ మాత్రం నంగిరితనాన్ని సహించనితనం ముఖాన కుంకుమ బొట్టులా మెరిసేది (ఇంటర్వ్యూలో తొలి ప్రశ్నగా శాఖ ఏమిటని నన్నడిగిన మా వాసుకి నెలకొల్పిన వాతావరణం వల్లనేమో, కొలీగ్స్ కులం సదరు కొలీగ్ కంటే ముందే తెలిసిపోతుండేది. కాబట్టి మెడలో నళినాక్షితాల మాల, స్పటిక పూసల హారం, ఆ పక్కన జంధ్యం, ముఖాన కుంకుమతో, మెడ ఎత్తి చూడాల్సిన చెయ్యెత్తు మనిషి- చింతకింది బ్రాహ్మడని మాకు ముందే తెలుసు). అలాగని ధూంధాంలాడుతుంటాడా అంటే, భారతీయ స్వభావాత్మ వంటి సత్-చిత్-ఆనంద తత్వానికి ప్రతినిధిలా ముఖాన చెదరని నవ్వు. 1990ల ద్వితీయార్థంలో నాతో చిన్నపాటి పరిచయం, తదనంతరం వీడ్కోలు- అంతే.

నేను వైజాగ్ బదిలీఐ వెళ్లాక చింతకింది నాకు నిజంగా పరిచయమయ్యాడు.

పన్నెండేళ్ల క్రితం నా కళ్ల ముందు నిలిచిన ఒక దృశ్యాన్ని చెప్పక పోతే, నేనిక్కడ రాసేదంతా అసంపూర్ణం. బాబ్జీ అనే సహద్యోగి. చిన్న వయసువాడే. రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా చనిపోయాడు. పోస్టుమార్టం అయ్యాక, దగ్గరి బంధువులు, కొలీగ్స్ ఎవ్వరూ కూడా శవం దగ్గరకి వెళ్లడానికి తటపటాయిస్తున్న సందర్భం. ఒక్కడే ఒక్కడు చింతకింది బాబ్జీ శవాన్ని భుజాన మోసుకుంటే బైటకి వచ్చినప్పటి దృశ్యం. శనిదానం. మృత్యుంజయ దానాలు పట్టే బ్రాహ్మడు, శవాన్ని మోసే బెస్త, పాడెగట్టే కాష్ఠమల్లడు, కాటిలో ప్రేతగోపుడు… అన్నీ అతడే. అసందర్భమే గానీ, సతిని మోస్తూ ప్రళయ తాండవం చేసిన రుద్రుడు గుర్తొచ్చాడు. శివుడితో పోలిక లేకపోలేదు, ఆయన గరళాన్ని గొంతులో దాచుకుంటే, చింతకింది దుఃఖాన్ని దాచుకున్నాడు. ఎవరు అతని నోట పలికించే వారోగానీ, చనిపోక ముందు తరుచూ అనేవాడు బాబ్జీ- ‘ నవ్విన నాప చేనే పండుతుందిలే. నన్ను చూసి నవ్విన నువ్వే ఓ రోజు నన్ను భుజాన ఎక్కించుకొని ఊరేగిస్తావు చూడ్రా బావా’. ఆ మాట మరోలా నిజం కావడం వల్ల పొర్లుతున్న, పొగులుతున్న దుఃఖాన్ని గొంతులోనే దాచుకున్న చింతకింది – అగ్ని పర్వతంలా గుంభనంగా కనిపించే మంచుకొండ – అప్పటి నుంచి ఆత్మబంధువు అనుకుంటాను. ఇంకా తరిచి చూసుకుంటే అతను నాకొక subject matter, ఒక phenomenon!

బతుకు కోరేవాడు బావమరిది అంటారు, అలా కోరడానికి చుట్టరికాలు కలవనక్కరలేదు, చింతకిందిలా కలేసుకోవచ్చనుకుంటా. ఒక్క బాబ్జీ యే కాదు, అందరూ ఆయన బావలు, తమ్ముళ్లు, చెల్లెళ్లు, వదినెలే. పిఆర్ వ్యవహారంలా నీళ్లమీద నూనె తెట్టెలా urbanized పైపై పలకరింపులు కావు. ఎంతవాడ్నైనా ‘ఒరే’ అంటూ పలకరించే చింతకిందిలో సామాజికంగా బ్రాహ్మణ్యం అందించే దాష్టీకం లేదు. ఆ మాటకొస్తే అనూచానంగా వచ్చే అలవాట్లే తప్ప ఆయన కులాన్ని పట్టించే లక్షణాలు మచ్చుకి కూడా లేవు. దాచుకోవడం తెలియని, ఇవ్వడానికే ఉన్నట్టు సాగిన ఆజానుబాహుత్వం ఉన్న ఇటువంటి వారికి, తమ దగ్గర లేనప్పుడు, మోకాళ్ల వరకూ వేళ్లాడే ఆ నిడద చేతులతోనే తీసుకోవడం, లేదా లాక్కోవడం అనే లక్షణాలు కూడా ఉంటాయి. కానీ, అడగటం, తన చేయి కింద కావడం చింతకింది స్వభావంలో లేదు. “….. శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,/ బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ/ ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్/ గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?” అని బలి చక్రవర్తిలా తనది పైచేయి అనిపించుకోవాలన్న మెహర్బాణీ కూడా లేదు. తన చుట్టూ ఉన్న లోకం అంతా ఆయనకి ఒక కుటుంబం, ఒకే కుటుంబం. చింతకిందిలో మరో ముఖ్యమైన లక్షణం నైతికత. అది మర్యాదస్తుల దొంగ ముసుగు కాదు. ఒక పల్లెటూరి నిసర్గమైన నీతి. ఆరడుగుల పైనుండే చింతకింది సమక్షంలో చెట్టు నీడన సేదతీరుతున్నట్టుండే ఆడవాళ్లని గమనిస్తుంటే ఆశ్చర్యమేసేది. జింక- పులి సంబంధానికి సమాంతరంగా ఉండే ఆడ-మగ లోకంలో మానంత మనిషిలా కనబడేవాడు చింతకింది. అతని సమక్షంలో ఏ స్త్రీ కూడా తన పరిమితులు గుర్తొచ్చి న్యూనత పడటం, తన ఉనికి గురించి ఉక్రోషపడటం, తన భద్రత గురించి భయపడటం మచ్చుకైనా ఉండేవి కావు (అతనిని అందరూ అన్నగా భావించడం, నేను తనతో ముందే బావగా వరసలు కలిపేయడం వల్ల, నా వరకైతే భలే బాగుండేదనుకోండి).

ఇక వృత్తి పరంగా కూడా నికార్సైన జర్నలిస్టు. సాధారణంగా చలామణిలో ఉన్న పాత్రికేయం, ముఖ్యంగా ప్రాంతీయ పాత్రికేయం అంటే ఓ పవర్, ఒక దబాయింపు, పరోక్ష (ప్రత్యక్ష) బ్లాక్‌మెయిలింగ్, ఇంకా పైరవీకి synonym. కానీ, ఈనాడులో రిపోర్టరుగా చేరింది మొదలు, ఈరోజు ‘పబ్లిక్’ అనే దినపత్రిక ఎడిటర్‌గా ఎదిగినంత దశ వరకూ చింతకిందికి జర్నలిజం అతని ప్రవృత్తికి కొనసాగింపు. సొంతలాభమనే ప్రయోజనాన్ని ఆశించి, బెదరింపు లాంటి, ఎత్తుగడలాంటి, గూడుపుఠాణీ లాంటి, పోనీ భజనలాంటి రిపోర్టులు ఇతని నుంచి వచ్చే అవకాశమే లేదు. రాజకీయ నాయకుల మొదలు, సెలబ్రిటీస్ అందరితోనే విస్తారమైన పరిచయాలు ఇతనికి. పడవతో నీటికుండే తగుమాత్ర సంబంధంలాంటివే అవన్నీ.

కవులతో, రచయితలతో, కళాకారులతో మాత్రం ప్రగాఢమైన అనుబంధం. స్వతహాగా మంచి గాయకుడు. చాలా తక్కువ మందికి వంటబట్టే పద్య పఠనం అబ్బింది. పీసపాటి వారి నుంచి ఎందరో నాటకరంగ కళాకారులతో పాత్రికేయేతర బాంధవ్యం. మూర్తీభవించిన నియంతృత్వ నియతిలా కనిపిస్తాడు గానీ, పైపై నియమనిబంధనలకి అతీతంగా కళాకారుల్లో ఉన్న artistic moralityకే ఎక్కువ విలువిస్తాడు. చీమకుర్తి నాగేశ్వర్రావు గారికి వైజాగ్ రైల్వే స్టేషనులో చింతకింది పాదాభి వందనం చెసినప్పుడు చుట్టూ ఉన్న సభ్య సమాజం బిత్తరపోయింది. చీమకుర్తి అంతటి కళాకారుడని తెలియక పోవడం వల్లే కాదు, ఆ పచ్చి తాగుబోతు ఒక విసిరేసిన చింకిపాతలా ఉండటం కూడ బహుశా ఒక కారణం.

ఇంత సజ్జన సాంగత్యం, పురా- నవ సాహిత్య పరిచయం, భాషాభినివేశం, నిబద్ధత, కార్యశూరత్వం ఉన్న చింతకింది, 2010 వరకూ, అంటే తన 46 ఏట వరకూ సాహిత్య రంగ ప్రవేశం చేయలేదు, సాహిత్యానికి పాఠకుడిగా ఉన్నాడే గానీ. అదేదో నేరారోపణగా చెప్పడం లేదు. తొలి కథ ‘నిదర్శనం’ 2010 మధ్యలో రాస్తే, దాన్ని 25 జూలై, 2010 ‘ది సండే ఇండియన్’ పత్రికలో ప్రచురించే గౌరవం, ఆ పత్రిక ఎడిటర్‌గా నాకే దక్కింది. చింతకింది కథ రాయడం నాకేమంత ఆశ్చర్యం కాదుగానీ, ‘నిదర్శనం’ వంటి కథ రాయడం నాకు గొప్ప అబ్బురం. దాని కథాకాలంలో ఒక గమ్మత్తుంది. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల సమీపంలోని మొయిదా గ్రామ పొలిమేర్లలో గాలులు ప్రచారం చేసే శతాబ్దం నాటి గాథల్ని 21వ శతాబ్దం తొలి దశకం తర్వాత విన్నాడు రచయిత. విని, దాన్ని కథగా మార్చి, రెండు కాలాలకి గడుసుగా ముడి వేశాడు చింతకింది. జ్యోతిష్య, ఆగమాది శాస్త్రాల్లో నిష్ణాతుడైన ఓ పండితుని నిన్నటి తరాల కథే- నిదర్శనం. గత (మృత) బ్రాహ్మణీయ సమాజాల పునరుద్ధరణ ప్రీతిని ప్రతిఫలించినట్టుండే ఈ కథని తొలికథగా రాయడమే నా విస్మయానికి కారణం. అనుభవాల మీద (అరువు) ఆలోచనలు పెత్తనం చేస్తూ, అవి కథల, లేదా ఇతర సాహిత్య ప్రక్రియల రూపంలో ప్రతిపాదనల స్థాయికి దిగజారి రాజ్యమేలుతున్న వర్తమాన సాహిత్య వాతావరణం, రాజకీయాలూ తెలిసి తెలిసీ, ‘నిదర్శనం’ వంటి కథని రాయడం నా దృష్టిలో సాహసమే. ప్రగతి నిరోధకమనో, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలమనో, పాతచింతకాయ పచ్చడనో పక్కకి తోసేసే వీలున్న కథ.

ఆధునికత అందించిన అత్తెసరు జ్ఞానంతో నిర్లక్షించిన, పక్కకి తోసివేయబడ్డ అంశాల్ని ఆధునికోత్తర టార్చిలైట్లతో వెదికి, వెలితీయాలని ఊదరగొడుతున్న వర్తమానంలో, ఆధునిక పూర్వ సమాజాల బహుముఖీనతని ప్రదర్శించే ఏ కథనైనా తల మీద పెట్టుకోవల్సిందే. కానీ, అది అగ్రవర్ణ బ్రాహ్మణ సమాజాలదైతే ‘మార్కెటింగ్’ చాలా కష్టమే గాక, ఎదురు నిందలు మోయాల్సి ఉంటుందని తెలిసి కూడా ‘నిదర్శనం’ రాశాడు చింతకింది.

రెండవ కథ, ఈ సంకలన శీర్షికగా నిలిచిన- దాలప్ప తీర్థం. ‘నిదర్శనం’లా దీనిని పుక్కిటి కథ అని తేల్చేయడానికి వీల్లేని, స్థల పురాణానికీ- వీరగాధకి మధ్యన నిల్చే ఆధునిక కాలానికి చెందిన కథ. ఈ వైవిధ్యం చూపించిన తర్వాత, సాధారణంగా రచయితకి ఒక అలసట ఉంటుంది. కానీ, ఈ సగటుతనాలు తనకి ఆపాదించడం కుదరదన్నట్టు నిండా మూడేళ్లు తిరక్కుండా 14 కథలతో ఒక కథాసంకలనంగా ముందుకొచ్చాడు (ఇంకొన్ని కథలు పక్కన పెట్టాడనుకుంటా). ఇదంతా గోళ్లు గిల్లుకుంటూ బోల్డు తీరుబడి దొరికి చేయలేదు; ఒక పక్క ‘సాక్షి’లో పని ఒత్తిడి, మరో పక్క తన పీహెచ్‌డీ థీసెస్.

ఇక ఈ కథల్లో సూత్రపాత్రల విషయానికొస్తే, దాదాపు అందరూ ‘పరోపకారమిధం శరీరం..’ అన్న సుభాషితం గురించి చదివే జ్ఞానం, వినే తీరుబడి లేని బొటాబొటీ బతుకుల వాళ్లే; అయినా ఆ సూక్తిని మనసా, కర్మణా ఆచరించిన వారే. ‘పిండిమిల్లు’ హుస్సేనయ్య (అనబడే షేక్ మక్బూల్ హుస్సేన్), ‘గుడ్డముక్కలు’లో సిలపరశెట్టి తాతయ్యలు, ‘పాలమ్మ’, ‘చెరుకుపెనం’ తెప్పగా ఏరు దాటించే రాపర్తి భూషణం, ‘జలగల డాక్టర్’ – సివ్వాల రామునాయుడు….

అందరూ రచయిత పుట్టి పెరిగిన చౌడవరం వాళ్లే, లేదా కాస్త ఇరుగూ పొరుగూ ఊళ్లోళ్లు. అతని చిన్ననాటి జ్ఞాపకాల్లోంచి, నోస్టాల్జియాలోంచీ మేల్కొని, కాగితాల మీదకి నడిచొచ్చిన వాళ్లే.

‘వసుధైక కుటుంబ’మనే అమూర్త భావాలకీ, అతిసాహస, వీరపరాక్రమ యోధానుయోధుల, దీరోదాత్తుల మహాకథనాలకీ వీడ్కోలుగా petits récits అనబడే స్థానీయ కథనాలకి Jean-François Lyotard దారులు వేశాక, ప్రపంచంలో, ముఖ్యంగా మూడో ప్రపంచంలో, ఆ ప్రపంచంలోని తెలుగు లోకంలో అటువంటి కథలు వెల్లువెత్తాయి. కాబట్టి, చింతకింది శ్రీనివాస్ ‘దాలప్పతీర్థం’ ఆ ఒరవడిలో కొత్తదేమీ కాదు. ఆ మాటకొస్తే, చింతకింది కాకుండా (నాకు వ్యక్తిగతంగా తెలియని) ఏ రచయితైనా ఇవే కథలు రాసి ఉన్నట్టైతే నాకు కచ్చితంగా విసుగొచ్చేది, ఈ మీదుమిక్కిలి మంచితనం, పరహితత్వం సరిపడక వెగటేసేది. అదేదో మహాభారత కాలం నాటి ద్వాపర యుగంలో ధర్మరాజుకి ఒక్క చెడ్డవాడు, దుర్యోధనుడికి ఒక్క మంచివాడు కనబడలేదన్న పిట్ట కథ గుర్తొచ్చేది. మల్లాది రామకృష్ణశాస్త్రి వారంతటి విద్వన్మణి రాసిన ‘తేజోమూర్తులు’లో చిత్రించిన సమాజం, పల్లె, ప్రజ… అందరూ మరీ ఆదర్శప్రాయమై అదేదో రచయిత కలల ప్రపంచం లెమ్మనుకున్నట్టే మరోసారి అనిపించేది.

కానీ,  చింతకింది గురించి ఆసాంతం తెలుసు కాబట్టి ఈ కథాస్థలం కల్పితం కాదనీ, రచయిత పుట్టి, తనకంటే ముందే పుట్టేసిన పలు చింతకింది శ్రీనివాసరావుల్ని చూస్తూ పెరిగి, వారిని తలుచుకుంటూ ఈ కథాశ్రేణికి కారణమయ్యాడనీ, మున్ముందు ఇంకా మరింత అవుతాడనీ అర్థమయ్యింది. ఒక సామాజిక న్యాయం కోసం, తనదైన అస్థిత్వం కోసం స్థానికత పడరానిపాట్లు పడుతూ, తనదైన చరిత్రని ఈ చిన్ని చిన్ని కథల ద్వారా పునర్నిర్మించుకుంటోంది. ఆ పునర్నిర్మాణ ప్రక్రియకి తన కథల ద్వారా చింతకింది చేసిన (చేస్తున్న) కాంట్రిబ్యూషన్ అధికం. ఈ కథల్లో ఇంటిపేర్లతో సహా తను అలవోకగా ప్రస్తావించిన పేర్ల వరకూ చాలు, ఒక ఉత్తరాంధ్ర గ్రామ సామాజిక జీవన వైవిధ్యాన్ని సమగ్రంగా గ్రంథస్థం చేయడానికి. ఆకెళ్ల సోమిదేవమ్మ, కాకరపర్తి సీతాలక్ష్మి, చింతలపాటి సత్యమాంబదేవి, పాలఘాట్ కృష్ణయ్యర్, అగ్గాల సన్నాసి, గరిమెళ్ల సూర్యకాంతమ్మ, అబ్బరాజు సూర్యారావు, మండా రామ సోమయాజులు, భమిడిపాటి యజ్ఞేశ్వరరావు, సచ్చరి పైడయ్య, నడుపూరి ఓబలేసు, జక్కవరం పైడితల్లి, బళ్ల కనకారావు, చుక్కా సీతయ్య, కర్రి పార్వతీశం, పిడపర్తి విశ్వేశ్వర సోమయాజులు, రాళ్లపల్లి కామేశ్వరరావు, పెన్మత్స కృష్ణభూపతి, పిప్పల నారాయణ, కొమ్మిరెడ్డి రాంబాబు, ఈతలపాక వెంకటేశం, గూనూరు గణేషుడు, బుద్ధ నాగజగదీషు, గండి గౌరునాయుడు, ధన్యంరాజు నరసయ్య, బోయిన గౌరీసు, నేమాని పార్వతీశం, యర్రంశెట్టి వీర్రాజు, కోయిలాడ వెంకట్, సుగ్గు వరాలు, మంత్రిప్రగడ గోపాల కృష్ణ, చుండూరు కామేశ్వరరావు, గాటూరి అప్పన్న, బయిన పాపారావు…. ఇంకా ఎందరో…. శారదా నది, బొడ్డేరు, తాచేరు, మానేరుల మధ్య చోడవరం, వడ్డాది, కొత్తకోట, మేడివాడ, అర్జాపురం, దొండపూడి వగైరా ఊళ్లలో ఎదురయ్యే పాత్రలు. వీటితోపాటు, ఉత్సవ సమయాలు, పొర్లు దండాలు, ఏకాకితనాలు, సామూహికత్వాలు, కుడి ఎడమలు, చీకటి వెలుగులు, ద్వంద్వాలు… వెరసి, “To see the world in a grain of sand, and to see heaven in a wild flower, hold infinity in the palm of your hands, and eternity in an hour”అన్న William Blakeని గుర్తుకు తెస్తాయి.

మళ్లీ మొదటిగడి (square one) దగ్గరకే వస్తే, పఠితకి రచయిత (వ్యక్తిగతంగా) తెలియడం అన్న కాన్సెప్ట్ మీద నిర్మించబడ్డ వ్యాసం ఓ పేకమేడ. ‘దాలప్పతీర్థం’ బాగోగులు ఎటువంటి ఊతకర్రల సాయంలేకుండా, దాని textకే పరిమితమై చూస్తే, ఒక అనుభవాన్ని అందించే ముందే రచయిత ఉద్దేశ్యాల మీద ఒకానొక అనుమానాన్ని రేకెత్తించే అవకాశముంది. కథాంశంలోని మానవీయతని సాకుగా చూపించి, కథన రీతి మీద నోరు మెదపకుండా చదువరిని emotionalగా కట్టడి చేసే ఎత్తుగడకి రచయిత పాల్పడుతున్నాడా అన్న అనుమానం. ‘నిదర్శనం’ కథతో తనమీద దాడికి కవ్వించిన తెగువ, లేదా ఆ కథాంశాన్ని మిషగా తనని మొగ్గగానే తుంచేసే అవకాశాన్ని తానే చేజేతులా అందించిన తెంపరితనం మరే కథల్లోనూ కనిపించదు. కథాంశం, దాని నేపథ్యం, దాని వెనుక చిత్తశుద్ధి, తత్పరతలు మాత్రమే కథకి సాహిత్య గౌరవాన్ని చెచ్చిపెట్టవు. వాటి దన్నుతో, take-it-for-granted దిలాసాతో, అభ్యాసం కూసువిద్యలా మూడేళ్లలో 14 కథలు రాసిపారేసినట్టు పాఠకుడికి తోచిందా- ఇక ఆ రచయిత (రచన మీద కూడా) గౌరవం తగ్గుతుంది, నమ్మకం సడలుతుంది. నిజానికి రచయిత నిబద్ధతంటే కమ్యూనిస్టులు చెప్పే మూసల్లోకి రంగూ, రుచీ లేకుండా ఒదిగిపోవడం కాదు, పాఠకుడికి రచన ద్వారా గతంలో ఇచ్చిన భరోసాని, కలిగించిన క్రెడిబిలిటీనీ నిలబెట్టుకోవడం. అటువంటి నిబద్ధత కోసం చింతకింది ఇంకా అక్షర దాస్యం, ధ్యానం చేయాలి. ‘శిఖండిగాడు’, ‘చిదిమిన మిఠాయి’ వంటి కథల్లో శైలీగతమైన లోపాలు కొన్ని కనిపిస్తున్నాయి. రచయిత సర్వజ్ఞుడేమీ కాదు కాబట్టి, కొన్ని ఖాళీల్ని (సహజంగా) వదిలేయడం కూడా రచనా సంవిధానంలో భాగమే. ఈ విషయం సాహిత్య అకాడమీ అవార్డులు సొంతం చేసుకొని, జ్ఞానపీఠాల మీద గురిపెట్టిన తెలుగు మహామహోపాధ్యాయులకే ఎక్కడం లేదు కాబట్టి, చింతకింది వంటి వారిని కార్నర్ చేయడం సబబు కాదేమో. అయినా, అక్షరలోకంలో చిన్నా పెద్దా ఉండవు కాబట్టి అటువంటి excuses, concessions దొరకవని చింతకింది శ్రీనివాస్ గ్రహించాలి. ‘కళింగాంధ్ర వారసుడు’ అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు అంతటి సాహితీవేత్త అనడం ఒక ప్రశంసగా కాకుండా, దాన్నొక ముళ్లకిరీటంగా చూడాలి, దాన్ని ధరించడానికైనా, విడనాడటానికైనా-

నరేష్ నున్నా

 ఈ పుస్తకం ఇక్కడ దొరుకుతుంది.

త్రిపుర traits:ఒక జ్ఞాపకపు ఛాయ!

tripura_336x190_scaled_cropp

ఎవరైనా సమకాలీన రచయిత గొప్ప అక్షరంగా పరిచయమయ్యాక, నన్ను తరచి తవ్విపోశాక, చెప్పరాని చనువై మనసయ్యాక, ఆ రచయితని వ్యక్తిగతంగా కలవడానికి ఆరాటపడను. తీరా కలిస్తే- సిరా మరకలు కూడా అంటని కుదురైన జమాబందీలానో, మహా పోతరం కమ్మిన ఆరోగ్య సూత్రంలానో, అతి భద్రమైన జీవిత బీమాలానో, ఫక్తు డీఏ ఎరియర్‌లానో, జున్ను ముక్కల్ని దాష్టికంగా కప్పెట్టిన మిరియాల పొడిలానో ఎదురవుతాడేమోనన్న జంకు వల్ల కావచ్చు; లేదా దురద పుడితే నాలానే గోక్కుంటున్నాడేమిటన్న లౌకిక విస్మయాలతో సదరు రచయిత (కవి) చవకవుతాడేమోనన్న నా వెరపు వల్ల కావచ్చు- నాలోకి తెగబడిన రచయితని బయట కలవాలని ఎగబడను.

కానీ త్రిపురని కలుసుకోవాలని ఆత్రపడకపోవడానికి పై శంకలేవీ కారణాలు కాదు; వస్తు-రూప ద్వంద్వానికి అంతు చిక్కని, నెపం వంటి కేవల రూపాన్ని మించి ప్రచ్ఛన్నంగా పరుచుకొని సారమై నిలిచిన త్రిపుర రాతల లోంచి ఆయన మూర్తిమత్వాన్ని ఊహిస్తూ… గుట్టలుగా పోగుపడ్డ నా appraisals  వల్లనే ఆయనని కలవాలని వెంపర్లాడలేదు. ‘త్రిపుర ఎలా ఉంటారు?’ అన్న ప్రశ్న త్రిపురని కలవడం కంటే మనోహరంగా ఉండేది.

“మెత్తగా నల్లగా చుంచులాంటి ముఖాలు. రహస్యంగా నక్కలాంటి ముఖాలు. అప్పుడే చంపిన గేదెని చీరుతున్న పులి ముఖాలు. దుమ్మలగొండి ముఖాలు. బెదిరిన కుందేలు ముఖాలు. సన్నగా పగగా పాము ముఖాలు. మార్కోవిచ్ సిగరెట్ ప్యాకెట్ మీద ముఖం లాంటి ముఖాలు. డిటెక్టివ్ ముఖాలు. దొంగ ముఖాలు.”

బింబం మాటున సత్యాన్ని అద్దం వెనక వార్నిష్‌ని గోకి తెలుసుకోవాలన్న ఆయన ఉత్సుకతకి అక్షరాలై బద్దలైన అద్దంలో మన ఇన్నిన్ని ముఖాలు చూపెట్టిన త్రిపుర ముఖం ఎలా ఉండి ఉండొచ్చు?

-బిత్తరపడి చేజారిన బాల్యంలోంచి చేజేతులా చేసుకున్న యవ్వనానికి పారిపోయిన కాలనాగు శేషాచలపతి. ‘మృదువైన కాంతిలో పడగెత్తి నాట్యం చేసే’ నాగుబాము శేషు convulsive స్ఫురద్రూపంతో వణికిస్తుందా?

-గదుల్లో ఇమడని ధ్యానం, చింతన చినబోయిన మౌనం, దారులు ఒగర్చే యానం- భాస్కరం. అనుభవాలు అంటని, రంగులు ముంచని, మనసు మళ్లిన ‘ఓల్డ్ టెస్ట్‌మెంట్ ప్రొఫెట్’ భాస్కరం ఒంటరితనంలా వణికిస్తుందా?

-పోటీ… పొగరు… పంతం… పరుగు… పాముల నిచ్చెన్ల బండ బతుకు కొత్త altruistic  గమ్యాల దిశగా తీసుకున్న యూ టర్న్- వీరాస్వామి. ‘పసుపు కాని, ఆకుపచ్చ కాని, మిరమిట్లు గొలపని, నాలుగు ముఖాల అందం’- జర్కన్ వంటి వీరాస్వామిలా విలువ, ఖరీదు అర్థం కానట్టుంటుందా?

-‘కనిపించని ద్వారం’మీద దిష్టిచుక్క కాదు, నిన్నలోకి నెర్రెలిచ్చిన తలపోతల అద్దంలో ‘పాపిటి దగ్గర గరుకు నల్లటి పుట్టుమచ్చ’ మాత్రమే కాదు, కొంకర్లుబోయిన ముఖంలో కవళికలు మారినా కాంతి తరగని కళ్ల కింది నల్లని వలయం- నారాయణ. కెరటాల హోరులో బదుళ్ల నిశ్శబ్దాన్ని భరించలేకి ఆ ప్రళయ తరంగ తాండవంలోకి జారిన నారాయణ ఒకానొక బుడగై చిట్లినట్టుంటుందా?

-‘పిలకలు, కిర్రుచెప్పులు, చెవులకి కుండలాలు, ఆరవేసిన అంగవస్ర్తాలతో’ భగవంతం సనాతనత్వంలా ఉంటుందా?

కళ్లు ‘బోధిసత్వ అవలోకితేశ్వరుడివిగా, ఒళ్లు హెర్క్యులస్‌ది’గా గొప్ప విరోధాభాసలా ఉంటుందా? పోనీ ఇవేమీ కాకుండా, ఇన్ని అక్షర అతిశయోక్తుల్ని కలగన్న సుబ్బారాయుడిలా next door సుబ్బారావులా సాదాసీదాగా ఉంటుందా? సీజరు కాని, జుడాస్ కాలేని, ఎటుకీ చెందని ఆ ముఖాన్ని ఏమరుపాటుగా ఉన్నప్పుడు పొంచి చూసేయాలి. నా ఎడతెగని ఎక్స్‌పెక్టేషన్ల కుంచెలతో గీసుకున్న ముఖాలతో పోల్చి చూసుకోవాలి.

కనక, త్రిపురను చూడటం కంటే, తొంగి చూడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. అందుకే ఆయనను కలిసిన దాని కంటే పొంచి చూసిన సందర్భాలే ఎక్కువ. వైజాగ్‌లో నేనున్నప్పుడు రామలక్ష్మీ ఎస్టేట్స్‌కి అలా ఉట్టినే వచ్చి వెళ్లిపోతుండటం చూసి లక్ష్మి గారి కళ్లలో ‘మిలియన్ డాలర్ల ఆశ్చర్యం.’  ‘బెంగాలీ కథల మీ అనువాదం అద్భుతమ’ని (నిజమే కావచ్చు) ఎన్నిసార్లు చెప్పగలను?

ముఖాముఖినో, పొంచి ఉండో చూడడానికి త్రిపుర ఇప్పుడు లేరన్న ఆలోచ తెరలుతెరలుగా సంవేదనై కమ్ముతుంటే అనిపిస్తోంది – ఆయనతో ఇంత ముడివడిపోయానా అని.

నన్ను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే కవులు, రచయితలు… అన్నమయ్య, కృష్ణశాస్త్రి, బాదెలేర్, చలం, బుచ్చిబాబు, ఫ్లెబర్, మొపాసా. వీరందరూ నేను పుట్టకముందే నన్ను దొంగిలించిన తీవ్ర నేరం వల్ల నా వాళ్లయ్యారు. అటువంటి సారూప్యాలేవీ లేని కాఫ్కా, త్రిపుర, మో… వంటివారు కూడా నా వాళ్లు కావడం నాకెప్పుడూ ఆశ్చర్యమే.

వాళ్ల ప్రపంచాలు ఆత్మాశ్రయాలనే ఆరోపణల మాటున అత్యంత విశాలమైనవి. వారి రచనల ద్వారా వారు చేసిన అన్వేషణ అనంతమైనది. ఆధునికత అనే ఔషధం వికటించి కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ వీరిని బాధించినంతగా నన్ను ఇబ్బంది పెట్టలేదు. త్రిపుర విషయానికొస్తే,  ‘భౌతికంగానూ, మానసికంగానూ ఈ కథల పరిధి చాలా పెద్దది’(పాలగుమ్మి వారి మాటల్లో). ఆయన పాత్రలు చాలా elitist, ఐతే ఆర్థికంగా, లేదా తాత్వికంగా. శేషు లాంటి దాష్టికరాయుళ్లకి బెలూచిస్థాన్, జర్మనీలు స్పిరుచ్యువల్ హోమ్స్, భాస్కరం వంటి ఏక్ నిరంజన్‌లకి ‘తెల్లగా నిర్మానుష్యంగా ఉందనిపించే సైబీరియా’ స్పిరిచ్యువల్ హోమ్. రాణీవాసపు చెర వైభవాల లలితాదేవి, విమల ప్రభాదేవీలు, ఇన్‌గ్రెడ్ బెర్గ్‌మెన్‌లా ఉండే జాహ్నవులు, Monty Clift లా ఉండే శివరామన్‌లు… అవే కావు, మురికివాడలు, గల్లీలు, పేదరికం, నక్సలిజం… కూడా ఉన్న ప్రపంచం త్రిపురది. అందులో ‘గొలుసులు-చాపం-విడుదల భావం’ ఒక్కటే నాది. మా హోమియో డాక్టర్ (నా గురువుగారు కూడా) ఎన్‌వీ బ్రహ్మం గారు- నేను Argentum nitricum కేసు అనేవారు.

‘ఎందులోనూ ఏ చెయ్యీ బాగా ఎట్టకుండానే ఎళ్దామనుకుంటాను, మన దారిని మనం. అయితే అన్నిట్నీ గుద్దేస్తూ.

…ఎందుకు అన్నిట్నీ గుద్దేస్తుంటారూ? కళ్లకి చూపు తక్కువా, వొళ్లు ఊపు ఎక్కువా? మతిమరుపా, కండ కావరమా, మదవా రోగమా? అసలు తత్వమే అంతా? నడుస్తూ యింట్లోనే అందర్నీ అలా గుద్దేయడమేమిటి? బుర్ర దువ్వుకుంటూ అద్దాన్నే గుద్దేయడం… అలా గుద్దుకుంటూ నడిస్తే గాని…’- ఇవే లక్షణాలు!

‘మెదడులోని మతడల్ని చూశావా ఎప్పుడేనా, తమ్ముడూ, మెదడులోని మెకానిజం? ఆలోచింపజేస్తుందే ఆ మెకానిజం? చూళ్ళేదూ, అవును నీకెందుకూ అలాటివి. పోయి, వీధుల్లో ఆడపిల్లల్ని చూస్తానంటావ్ కాబట్టి నీకేం తెలీదు, వెళ్ళి చూడు…’

– వాళ్లన్నయ్య ఆ కథా నాయకుడితో అన్నాడా, త్రిపుర నాతో అన్నారా?

(పై కథని మినహాయిస్తే) త్రిపుర కేవలం శైలీగత కారణాలతోనే నాకు దగ్గరయ్యారా? నాకూ సరైన స్పష్టత లేని ఈ ప్రశ్నే బహుశా ఆయనని, ఆయన రచనల్ని కొన్నిసార్లు scepticalగా చూసేలా చేసిందేమో.

ఉపరితలంలో చూస్తే ఆయన కథలు రాసిన కాలం 1963- 73 (ఆ తరవాత నాదీ అని పైన చెప్పుకున్న కథ 1981లో, 1987లో మరొకటి). అంటే 1928లో పుట్టిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర్రావ్ అనే త్రిపుర తన 35-45 ఏళ్ల మధ్య ఓ 13 కథలు రాశారు. సాధారణంగా రచయితలు తమ యవ్వన ప్రాదుర్భావ వేళ కవిత్వం రాస్తారు. జలపాతం ఉధృతిని మైదానం నెమ్మదించాక వచనం వైపు మళ్లుతారు. కానీ త్రిపుర విషయంలో ఇది తిరగబడింది. ఆయన 50 ఏళ్లు పైబడ్డాక కవిత్వం మొదలెట్టారు (తన 47వ పుట్టినరోజు నాడు 1975లో రాసిన సెగ్మెంట్స్ ఇంగ్లీష్ దీర్ఘ కవిత సెమీ ఆటోబయోగ్రాఫికల్). ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తన 70వ పడిలో రాశారు కవిత్వం. ఇటువంటి విలోమ ప్రయాణం గురజాడలో మాత్రమే ఉంది. అయితే, గురజాడ సీరియస్ సాహిత్యవేత్త. అంటే త్రిపుర నాన్ సీరియస్ అని కాదు. సవాలక్ష వ్యాపకాల వల్ల తాను రాయాలనుకున్న, ‘రాయవల్సిన’ దాంట్లో పదో వంతు మాత్రమే రాసినా (యుగకర్త, మహా కవి వంటి విశేషణాలు తీసేసి చూసినా), గురజాడ ఓ సాహిత్య ఉద్యమకారుడు.

ఈ విధంగా చూస్తే, త్రిపుర సాహిత్యం తెలుగు పాఠక లోకానికి ఏమవుతుందో గానీ, త్రిపురకి మాత్రం తన సాహిత్యం ఓ passing cloud, ఆ మబ్బు రాల్చే సాంత్వన జల్లు అయితే కావచ్చు. అసలు తానొక రచయితగా కూడా claim చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు (తనమీద, తన రచనల మీద రచయిత చేసుకునే ఏ తెలుపు నలుపు క్లెయిమ్స్ అయినా పట్టించుకోవాల్సిన అవసరం పాఠకుడికి లేదనుకోండీ). ఆయనకి తన రాతలంటే ఖాతరు లేదు గానీ సాహిత్యం, ముఖ్యంగా ఇంగ్లీషు సాహిత్యంతో జన్మాంతర బంధం, ఆత్మగత సంబంధం. గురజాడని ఆధునికతకి ఒక కొండ గుర్తుగా తీసుకుంటే ఆయన మొదలు, స్వాతంత్ర్యానికి ముందటి వరకూ పుట్టిన కవులూ రచయితలు (ముఖ్యంగా బ్రిటిషిండియాలో ఉన్న కోస్తాంధ్ర రచయితలు) అందరూ ఇంగ్లీష్ సాహిత్య ప్రేమికులే. అందులోనూ వ్యాహాళికి నాయుడుపేట నుండి మద్రాసు వెళ్లి ఆల్బర్ట్ కామూ, సార్ర్త్‌లతో తిరిగి రాగలిగిన వెసులుబాటున్న పెద డాక్టరు గారబ్బాయి త్రిపుర పేరు ప్రత్యేకంగా ప్రస్తావించవలసిందేముంది? ఎమ్మే ఇంగ్లీష్ చేసిన కలోనియల్ బుర్రలు రెండాకులు ఎక్కువ చదవడంలో విడ్డూరమేముంది? ఉంది! ఆ విషయంలో త్రిపుర మహా తేడా. బెనారస్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ ఎమ్మెస్సీ అర్ధాంతరంగా ఆపేసేనాటికి కూడా ఆయనకి వ్యవసాయంలో ఓనమాలు తెలియవు; ఫీల్డ్ ఫిజియాలజీ చేయవలసి వచ్చిన నాటికి అసలు వరి కంకే తెలియదు. పాత గురువు గారి సలహా మీద ఎమ్మే ఇంగ్లీష్ ఆనర్స్‌లో చేరడం-ఎకడమిక్ ఎదుర్రాయి కొట్టుకోవడం కాదు.

అలాగని అది తోవ చూపించిన వేలు కూడా కాదు. రెక్కమాను శిథిలమైన కూడలిలోకి ఆయనని నడిపించిన చేయి. ఏ తోవ ఎటు పోతుందో వెదుక్కోవడమే ఆయన చదువు.

అధ్యయన విషయంలో కూడా త్రిపుర గొప్ప తేడా మనిషి. ఆయన ఏ పుస్తకాన్నీ ఏకబిగిన చదవగలిగేవారు కూడా కాదు (ముఖ్యంగా తనని డిస్కవర్ చేసి సారూప్యాల్ని ఘనంగా ఎత్తిచూపిన బెకెట్, కాఫ్కా, కామూ వంటి రచయితల్ని). కొన్ని పుస్తకాలు ఏళ్లు గడిచినా పేజీలుగా ముందుకు నడవని సందర్భాలు కోకొల్లలు. తెల్లని కాగితాల మీద కథలని చీమలబారుల్లా ఎడమ నుంచి కుడికి పరుచుకున్న అక్షరాల్ని వాటి నిజ రూపాలతో దర్శించడమనే శాపాన్ని ఆయన జన్మతః పొందారు.  Genuine poetry can communicate before it is understood అన్న టీఎస్ ఎలియట్ రివలేషన్‌కి మరికొంత పొడిగింపు త్రిపుర అభిశప్తానుభవం: ‘పూర్తి’గా చదవకముందే ఎన్నో గ్రంథాల ఆత్మదర్శనం కావడం.

‘ఆలోచన’కి ‘తెలుసుకోవడాని’కి మధ్య అఖాతాన్ని గెంతి, దుమికి ‘సీసాలో బాతు పైకి వచ్చేసింది’ అని మాండో రూపంలో చెప్పే జవాబులు సృజన సాహిత్యంలోనో, తాత్విక వాఙ్మయంలోనో కుదురుతుందేమో కానీ ఇలా ఒకానొక పచ్చి వచన వ్యాసంలో ప్రతిపాదించడం ‘గేమ్ రూల్’ కాదని, అబ్సర్డ్ అని ఇంగిత జ్ఞానం నాకు లేకపోలేదు. అయితే త్రిపుర విషయంలో ఆయన సాహచర్యం వల్ల, అంతకుమించి, ఆయనను పొంచి చేసిన అపరాధ పరిశోధన తరహా పరిశీలన వల్ల నేను గ్రహించిన సత్యమది.

గ్రంథ సారాన్ని దివ్య చక్షువులతో గ్రహిస్తారన్న మిత్‌ను గానీ, ’రాబో’ సినిమాలో యంత్రుడిలా అలా అలవోకగా పుస్తకాలని స్కాన్ చేసిపారేస్తారన్న సోషియో ఫాంటసీనో ఏకరువు పెట్టడం లేదు నేను. ప్రభావాలకి గురికావడంలో కూడా తన, తన ముందు తరం రచయితల (ఒక్క తెలుగులోనే కాదు)కి కూడా త్రిపుర పూర్తిగా భిన్నమైన వారని గ్రహించినట్లు విన్నవించుకోడమే నా అభిమతం. శామ్యూల్ బెకెట్ ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ప్రభావంగా చెప్పుకునే ‘భగవంతం కోసం’ రాసేనాటికి ఆ నాటకాన్ని త్రిపుర చదవలేదు. దానిమీద వచ్చిన సమీక్ష (కూడా) చదవలేదు, చూశారంతే. విశాఖపట్నం ఏవీఎన్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఓ మలయాళీ కాకా హోటల్లో కూర్చుని కబుర్లాడుకునేటప్పుడే – భగవంతం పదమూడో నంబర్ బస్సులోనో, ఇటు ఏడో నంబర్ బస్సులోనో వస్తాడని త్రిపుర ఎదురు చూశారు. నాటి ఎదురుచూపు కథగా ఆకారం తీసుకోవడానికి ‘వెయిటింగ్ ఫర్ గోడో’ అన్న శీర్షిక ఒక ప్రేరణ వంటి నెపం. అలానే, ఆయనకి కాఫ్కా రచనల కంటే Kafkaesque తనమే ఎక్కువ చేరువని ఆయన కాఫ్కా థీమ్ కవితా సంకలనం (త్రిపుర కాఫ్కా కవితలు) చెప్పకనే చెబుతుంది.

తన సృజనాత్మక రచన విషయంలోనే కాదు, ఆయన ప్రసంగాలలో కూడా ఇదే ఒరిజినాలిటీ కనబడుతుంది. ఓసారి విజయవాడలో యూజిన్ అయొనెస్కో మీద ప్రధాన ప్రసంగానికి ‘మో ఆయనను ఆహ్వానించారు. మూడు గంటలు పైగా సాగిన నాటి ప్రసంగంలో ది న్యూ టెనెంట్, ది చైర్స్, ది లెసన్, అమెడీ వంటి అయొనెస్కో నాటకాల ప్రస్తావనైతే ఉంది గానీ, స్థూలంగా ఆ ప్రసంగమంతా అయొనెస్కో ఆత్మతో (అప్పటికి అయొనెస్కో చనిపోయాడు) త్రిపుర చేసిన సంభాషణ; ఏ అకడమిక్ పుస్తకాల్లో కనిపించని వ్యాఖ్యానం, ప్రకాశంగా చేసిన స్వగతం. ఈ సమావేశానికి హాజరు కూడా కాని విలేకరులు తమ సాహితీ ‘source’ల ద్వారా కనుక్కుని రాసిన వార్త శీర్షిక ఇది: అబ్సర్డ్ నాటకకర్త అయొనెస్కోపై మరో ప్రముఖ అబ్సర్డ్ రచయిత త్రిపుర ప్రసంగం!

 

**      **      **      **

సౌరభమ్ములేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికలనేల వెదజల్లు చందమామ, గాడ్పేల విసురు, ఏల సలిలమ్ము పారు… అన్న కవిత గుర్తుకు తెస్తూ, రచన కూడా ఒకానొక ప్రాకృతిక ధర్మమేమో అన్పించేలా సృజన చేసిన త్రిపుర స్వయంప్రకాశకత్వాన్ని సూక్ష్మంగానైనా గ్రహించాను. నాకు తెలిసిన అక్షర ప్రపంచంలో మహా కవుల్ని, గొప్ప రచయితల్ని కలిశాను గానీ, నేను దర్శించిన తొలి ‘ఒరిజినల్’ రచయిత త్రిపురే. ఆ రెవలేషన్ తాలూకు ఉద్వేగం జ్వరంలా నిలువెల్లా కమ్మిన ఓ సందర్భంలో ఒక catharsis ఉపశమనం లాంటి సాష్టాంగ దండప్రమాణం చేశానాయనకి.  ‘a’uthor గా కూడా గుర్తింపుకి ఇష్టపడని తనని ‘A’uthor గా డాబు చేసిన నా సాష్టాంగ నమస్కారం ఆయనని చాలా గాయపరిచింది. ఆ భంగపాటుని ఎంతమాత్రం దాయనితనం ఆయన కళ్లలో ప్రస్ఫుటంగా కన్పించి మళ్లీ కలవడానికి కొంతకాలం ముఖం చెల్లలేదు.

పాద నమస్కారాల కాలం పరిఢవిల్లుతున్నందువల్ల ఆయన నన్నప్పుడు ఆశీర్వదించి తన అనుంగు శిష్యుడిగా స్వీకరించి అక్కున చేర్చుకున్నా అంతకంటే ఎక్కువ సిగ్గుపడేవాడ్నే. అంటే, ఆ క్షణం ఒక్కటే ఒక స్థితి; ముందు వెనకలు పొడిగింపులు లేని స్థితి, ఆయనకైనా, నాకైనా. రచయితగా ఆయన విస్తృతిని నేను దర్శించిన ఆ క్షణంలోనే, రచయితగా తన పరిధిని ఆయన ప్రదర్శించారు. అటువంటి అపురూపమైన క్షణం వెలిగించగలగడం ఒక్క త్రిపురకు తప్ప తెలుగుదేశంలో మరొకరికి సాధ్యమవుతుందని అనుకోను. జీవితాన్ని గాఢంగా తరచి, మథించి, శోధించి, అనుభవించి, అంతలోనే తామరాకు మీద నీటిబీట్టులా తటస్థమవడమే సాహితీ తత్వవేత్త త్రిపురలోని వెలుగునీడలు. కాలక్రమణికతో గణాంకాల బట్టీ త్రిపురని చూస్తే చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. 85 ఏళ్ల నిండైన జీవితంలో (63 ఏళ్లు సాహిత్యంతో, తత్వ శాస్త్రంతో మమేకమై ఉండి కూడా) ఆయన పట్టుమని పదిహేను కథలకి మించి ఎందుకు రాయలేదు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన బెనారస్ హిందూ వర్సిటీలో వామపక్ష రాజకీయాల్లో ఉండి, ఆ తరవాత ఉద్యోగరీత్యా దేశదేశాలూ తిరిగి, అగర్తలాలో నక్సల్స్‌తోనూ సంబంధాలు పెట్టుకొని, ఒకపక్క మార్క్స్‌నీ మరోపక్క బుద్ధుడ్నీ మధ్యలో స్పినోజా, షొపన్ హావర్‌లనీ చదువుకున్న త్రిపుర తన 35 వ ఏట (1963) వరకూ రాయాలని అనిపించకపోవడమేమిటి? 45వ ఏడు వచ్చేసరికి, అంటే పదేళ్లలో 13 కథలు రాసేసి, ఇహ కలం మూసేయడమేమిటి? లెడ్జర్ బుక్కు జీవితంలో లౌకిక, సాంసారిక బ్యాలెన్స్ షీటు తయారు చేసుకునే భద్రమైన జీవితాన్ని ప్రేమించేవాడైతే తనని తాను Segments గా నిర్దాక్షిణ్యంగా కోసుకుని చూసుకునేవారా?

సెగ్మెంట్స్ ఒక సెమీ ఆటోబయాగ్రఫికల్ కవిత. 1975లో తన 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ దీర్ఘ కవిత రాశారు త్రిపుర. ప్రపంచ ప్రఖ్యాత పెరూ మహాకవి César Vallejo కవిత  »El alma que sufrió de ser su cuerpo’  శీర్షికే ఎపిగ్రాఫ్‌గా మొదలవుతుంది దీర్ఘ కవిత. 46 ఏళ్లు మాత్రమే బతికిన  వల్లెజో  (1892`1938) తన జీవిత కాలంలో వెలువరిచినవి కేవలం మూడు సంపుటాలే (అందులో ఒకటి ఆయన మరణానంతరం విడుదలైంది). కానీ ఆధునిక కవుల్లో ప్రపంచవ్యాప్తంగా అంతటివాడు లేడన్న పేరు. మౌలికంగా ఆయన విప్లవ కవి, స్వయంగా స్పెయిన్ అంతర్యుద్ధంలో కమ్యూనిస్టుల తరఫున పోరాడిన యోధుడు. చే గువేరాని అత్యంత ప్రభావితం చేసిన కవి  వల్లెజో. అమెరికా చే గువేరాని మట్టుపెట్టాక, చేగువేరా సంచీలో దొరికిన పుస్తకంలో తన స్వదస్తూరీలో రాసుకున్న  వల్లె, నెరూడా వంటి అతి కొద్దిమంది కవితలు బయటపడ్డాయి. మన మహాకవి శ్రీశ్రీ కూడా  వల్లెజో కవిత్వాన్ని అనువాదం చేశారు. అయితే, త్రిపుర ఎంచుకున్న  వల్లె కవిత పూర్తిగా భిన్నమైంది, తాత్వికంగా చాలా గాఢమైనది,  వల్లె దాదాపు మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు రాసినది. ఆ కవితా శీర్షికకి అర్థం ‘దేహమై క్షోభ పడ్డ ఆత్మ’. అంతుచిక్కని రుగ్మతతో అర్ధాంతరంగా కన్నుమూసిన  వల్లెజో దేహాత్మల ద్వంద్వాన్ని ప్రదర్శిస్తూ, అంతలోనే ఆ ద్వైతాన్ని రద్దు చేయడమే ఆ కవిత.

సెగ్మెంట్స్ కవిత రాసేటప్పటికి త్రిపుర మనఃస్థితి కూడా అంతటి సంక్షోభమయమే, సంవేదనాత్మకమే.

1950 ప్రథమార్ధం నాటికే బెనారస్‌లో చదువు, ఉద్యోగం, విరమణ కూడా అయిపోయాయి. 1954`57 వరకు మాండలే (బర్మా)లో ఉద్యోగం;  1957`59 మధ్య మదనపల్లి, విశాఖల్లో చిన్న మజిలీల తరవాత ఆయన అగర్తలా (త్రిపుర)లోని మహారాజా బీర్‌బిక్రమ్ కాలేజీలో చేరారు. ఆయనకి నక్సల్స్‌తో సంబంధాలుండేవి, వారికి సాయం చేయడానికి బ్యూరోక్రసీతో సన్నిహితంగా మెలిగారు కూడా. ఆయనలో ‘జుడాస్’ ఎలిమెంట్ లేకపోవడం వల్ల తమ రహస్య బృందంలో ‘జుడాస్’ని కనిపెట్టలేక, ఆ ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించి, మతి చెడి పిచ్చాస్పత్రి పాలయ్యారు. ఇదంతా ఆయన వెదుకులాట. తోవలు వెదుక్కున్నారు, కనుక ఎదురు దెబ్బలూ తిన్నారు, అసలు తోవంటూ ఏదీ లేదన్న తాత్విక స్థితికి చేరుకున్నారు 1963`73 మధ్య రాసిన 13 కథల్లో, ఆ కథల్లో కదలాడిన భాస్కరం, శేషు, వీరాస్వామి, రాజు, మున్నీ, ముక్తాదేవి, కల్యాణి… అనేక పాత్రలతో ఆయన చెప్పాలని ప్రయత్నించిన వాక్యం

‘చచ్చిపోలేదు గానీ, జీవితంలో మిగిలి ఉంది ఏమీ లేదు’.

ఆ ప్రకారం చూస్తే కథలకి కలం మూసేసిన రెండేళ్లకి రాసిన Segments ఆయన అర్ధాంతర సాహిత్య ప్రస్థానానికి ఒక ముగింపు; ఆత్మకథలో ఆఖరి అంకం. ఏదో తనకి సానుకూలమైన సమాధానం చెప్పుకుని తప్పుకోవడమో, సౌలభ్యం చూసుకుని తప్పించుకోవడమో కాదు, దారి లేదని తెలుసుకోవడం. తనకు తాను కూడా మిగలని స్థితిలో శాంతి లేదు, సుఖం అంతకంటే లేదు. వెయ్యి యుద్ధాలతో తలపడే తెగువును మించినదేదో ఉండాలి, ఆ లోన పెనుగులాటని తట్టుకోవడానికి.

సోదరుడు Abel ని హత్య చేసి కూడా, »…am I my brother’s keeper? అంటూ దేవుడ్నే బుకాయిస్తాడు Cain. »…am I my brother’s keeper?? అన్న వాక్యాన్నొక allusion లా వాడతారు త్రిపుర తన  Segmentsలో. ప్రలోభాలకి లొంగి  ద్రోహం చేసి తమ్ముడి దుర్మణానికి కారణమవడమే కాకుండా, తన మతిస్థిమితం కోల్పోవడానికి కూడా కారణమైన ‘జుడాస్’ ల ప్రస్తావన ఉండే గానీ, వారి మీద నింద లేదు; స్వీయనింద ఉంది.

Couldn’t you too have died you’re your brother did,/ or at least bled… (నువ్వూనూ నీ తమ్ముళ్లానే/ చావలేకపోయావా?/ కనీసం గాయపడనైనా లేకపోయావా? ..అనువాదం ‘మో’)

YOUR WERE CLEVER / you did not spill a single/ drop of your brother’s / blood coarsing in your arteries..  అంటూ తనని తాను నిర్దాక్షిణ్యంగా చీల్చుకుంటారు. ఓ నిరపాయకర ప్రేక్షకుడిగా కేవల సానుభూతిపరుడిగా రణక్షేతాన్ని చూడడం, తమ్ముళ్ల త్యాగాన్ని భద్రంగా కీర్తించడం ఆయనను ఆత్మనిందకు పురిగొల్పుతాయి. కానీ కన్ఫెషన్‌తో కుమిలిపోతున్న ఈ కవి స్వాభావికంగా ఏకాకి.

..the skeletal arms of giant trees/ bend close from either side darkly to embrace me/ into/ their land of ‘No’/ which’s but/ a heartbeat away/ gurgling its marshy messages:/ soft black whispers./ “vanish into Zero the Perfect State”

సంపూర్ణమైన సున్నాలోకి అదృశ్యమవ్వాలనే వాంఛ మరో పక్క. ఇదీ ఆయన పెనుగులాట. సామాజికతకి, ఆత్మాశ్రయతకి మధ్య ఆయన నలిగిపోయారు. I see now CLEARLY/ my mirror reflects my terrible shame…..  అని కుంగిపోతారు తన నలభయ్యేడు సాయంతనాల సాంధ్యధూళిలో.

‘చచ్చిపోలేదు గానీ, జీవితంలో మిగిలి ఉంది ఏమీ లేద’న్న దిగులే ఆయన చేత సెగ్మెంట్స్ అనే ఎపిలోగ్ రాయించింది. ఆ తరవాత రాసిన కథలు (గొలుసులు-చాపం-విడుదల భావం  1981;  వలస పక్షుల గానం  1987), కవిత్వం (బాధలూ సందర్భాలూ 1990; త్రిపుర కాఫ్కా కవితలు  2001) ఆయన తనని ఏకాంతపరచుకునేందుకు మీటుకున్న ఏక్‌తార సాంత్వన సంగీతం మాత్రమే.

**      **      **      **

పట్టుమని పదమూడు కూడా లేని ఆయన కథల్ని text కి సంబంధం లేకుండా context పరంగా చూస్తే మరొకటి స్ఫురిస్తుంటుంది. అదేమిటో చెప్పాలంటే, ముందు ప్రదీప్ చౌధురి గురించి, ఆయనకి త్రిపురతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకోవాలి. పశ్చిమబెంగాల్ సాహిత్య ప్రపంచంలో 1961`65 మధ్య వచ్చిన ఉప్పెన- హంగ్రీ జనరేషన్. మన దిగంబర కవులకు మల్లే హంగ్రీ జనరేషన్ కవులు మలయ్‌రాయ్ చౌధురి, అతని సోదరుడు సమీర్‌రాయ్ చౌధురి, శక్తి చటోపాధ్యాయ, దేవీరాయ్ (హరధోన్ ధార) కూడా అమెరికా ‘బీట్ జనరేషన్’తో ప్రేరణ పొందారు. అయితే బీట్ కవుల్లో ‘పేరుమోసిన’  ఎలెన్ గిన్స్‌బర్గ్ మన కాశీఘట్టాలు, కలకత్తా వీధుల్లో తిరిగి, మన అఘోరాలతో, బూడిద స్వాములతో చెట్టపట్టాలేసుకుని బతికినప్పటి (1963) వరకూ బీట్ కవిత్వాన్ని హంగ్రీ జనరేషన్ కవులు చూడనేలేదని కొందరు సాహిత్య చరిత్రకారులు వాదిస్తారు. ఈ వివాదాలు సాహిత్య పరిశోధకులకే వదిలేసి స్థూలంగా చెప్పుకుంటే, పశ్చిమబెంగాల్ హంగ్రీ జనరేషన్, మన దిగంబర కవులూ, కొలంబియా Papelipolas, స్పానిష్ Generation µ68 వంటి కవి బృందాల ఆక్రోశం, ఆగ్రహాల్లో సారూప్యాలున్నాయి.

Statusquoని నడ్డి విరిచి, ధ్వంసం చేసి కొత్త దారి వేయాలన్న వారి ఉద్రేకాల్లో పోలికలున్నాయి. అటువంటి హంగ్రీ జనరేషన్ కవులలో ప్రదీప్ చౌధురి ఒకడు. మాతృభాష బంగ్లాతో పాటు ఇంగ్లీషు, ఫ్రెంచిలలో కూడా అదే స్థాయి అభివ్యక్తి ఉన్నవాడు.అందరిలోనూ బహుశా చిన్నవాడైనందు వల్లనేమో కొంచెం దుందుడుకువాడు కూడా. 13,14 ఏళ్లకే కవిత్వం మొదలెట్టి ‘చెడి’పోయాడు. నలభయేడేళ్లకే చనిపోయిన బీట్ కవి, రచయిత Jack Kerouac తో మమేకమైనవాడు (Kerouac స్మరణలో శుద్ధ కవిత్వమై, పచ్చి వచనమై కూడా తేలిపోయినవాడు). తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తా వదిలి ఢిల్లీ, అగర్తలాల్లో చదువుకున్న ప్రదీప్‌కి పాఠాలు చెప్పినందుకే కాదు, ప్రేరణ అయినందువల్ల కూడా త్రిపుర గురువు అయ్యారు, మిత్రుడయ్యారు, తరవాత సహోద్యోగి కూడా అయ్యారు (ప్రదీప్ కొంతకాలం జూనియర్ లెక్చరర్‌గా మహారాజా బీర్‌బిక్రమ్ కళాశాలలో పని చేశారు). ఈ గురుశిష్యుల మైత్రి ఆనాటి నుంచీ కొనసాగింది. త్రిపుర Segments(1975)ని ప్రదీప్ తాను నడిపే త్రిభాషాపత్రిక ‘స్వకాల్’ లో 1979లో ప్రచురించారు కూడా.

ప్రదీప్ గురించి త్రిపుర నాకు చెప్పిన అనేక సంగతుల్లో ఒకానొక అప్రధానమైన సంఘటన:

పేరున్న ఓ కళాశాల వారు విశ్వకవి రవీంద జయంతి సందర్భంగా అట్టహాసంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రదీప్‌ని ముఖ్య అతిథిగా రవీంద్రుడి మీద ప్రధాన ప్రసంగానికి ఆహ్వానించారు. ఆర్భాటమైన ఆవరణ, మంద్రంగా రవీంద్ర సంగీతం, రంగులన్నీ అక్కడే పుట్టాయా అన్నట్టున్న శోభాయమానమైన ఆ ప్రాంగణం చుట్టూ ఒక చెయ్యి త్రిపుర భుజం మీద వేసి, మరో చేత్తో నాటు సారా ప్యాకెట్లు తాగుతూ కలియదిరుగుతున్నాడు ప్రదీప్. అప్పటికే నిలదొక్కుకోలేని స్థితిలో తప్పతాగి ఉన్న ప్రదీప్, త్రిపుర ఎంత వారించినా వినకుండా జేబులోంచి ప్యాకెట్ల మీద ప్యాకెట్లు తీస్తూ తాగుతూనే ఉన్నాడు. సభ ఆరంభమై ముఖ్య అతిథి ప్రదీప్‌ను వేదిక మీదకి ఆహ్వానించారు నిర్వాహకులు. అతికష్టంమీద వేదిక మీద మైకు దగ్గరకు వెళ్లిన ప్రదీప్, భళ్లున పెద్ద వాంతి చేసుకుని,  ‘రవీంద్రుడు బెంగాలీ సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికి చేసిన కాంట్రిబ్యూషన్ పట్ల నా అభిప్రాయం ఇదే’ అన్నాడు(ట).

త్రిపుర కథలని contextual గా చూస్తే- తెలుగు కథ స్తబ్ధత మీద, వస్తు-రూపాల మొనాటనీ మీద నిరసనగా భళ్లున కక్కిన వాంతి అని అనిపిస్తోంది. తెలుగు కథకి గురజాడ కంటే ముందు ఓ సాంఖ్యాయన శర్మ, లేదా మరో భండారు అచ్చమాంబ కథలు రాశారంటూ సాహితీ పరిశోధకులు నిగ్గుతేల్చుతున్నారు గానీ, ఆ తొలినాటి కథకుల ఔత్సాహిక తప్పటడుగుల్ని పక్కన పెట్టి, సీరియస్ కథకి pioneer గా గురజాడని తీసుకుంటే 20వ శతాబ్దపు తొలి దశకంలో ప్రారంభమై, రెండు, మూడు, నాలుగో దశకాల్లో ఉచ్ఛ దశకు చేరుకున్న తెలుగు కథ, 1950ల్లో నెమ్మదించి, ఆ దశకం చివరి నాటికి క్షీణ దశకి చేరుకుంది. ఆధునికతకి ముందటి కంటే ఆధునిక యుగంలో కాలం నడకలో వడి హెచ్చింది. అంతకుముందు పరిణామాలన్నీ ఒకెత్తు, ఒక్క 20వ శతాబ్దపు మార్పులన్నీ ఒకెత్తుగా దూకిన కాలంలో పుట్టి, కలం పట్టిన వారిలో కూడా అదే దూకుడు ఉండాలి. దశాబ్దంలోపే దూసుకొస్తున్న కొత్త తరం వెనకటి తరం కంటే ఎక్కువ సౌకర్యాలు పొందే సుఖానికే కాదు, మరింత చిక్కని సంక్లిష్టతలు ఎదుర్కోవాల్సిన కష్టానికీ సిద్ధం అవాల్సి వచ్చింది. వెనకటి తరం వేసిన దారిలో కొంత అనాయాసమైన ప్రయాణం చేస్తూనే, ఆ దారిని మరింత వెడల్పు చేయాల్సిన తరాలు, అలా చేయకపోగా దానిని ఒక ఇరుకు డొంక చేసేశాయి. కథంటే ప్రాపగాండా, ముందే సిద్ధం చేసుకున్న ఒక ప్రతిపాదన, ఎత్తులు నిర్ణయమైపోయిన శకుని పాచిక. పాత్రలు తాను ఆడించినట్లు ఆడే తోలు బొమ్మలు, తానొక సృష్టికర్త. కథ చెప్పే గొంతుకలో గొప్ప గోరోజనం. ఆ కనిపించని కన్ను, తెర వెనక మూకీకి తెలియని సంగతులే లేవు, చూడని లోతులూ లేవు, ఆడా మగా తేడాల్లేకుండా పాత్రల అంతరంగాల అల్లకల్లోలాల్ని అక్షరాల్లోకి అలవోకగా ఆవిష్కరిస్తుంది.

Leo Tolstoy ‘వార్ అండ్ పీస్’ కథానాయిక నటాషా పాత్రకి పూర్తి ప్రేరణగా పరిశోధకులు నిర్ధారించిన ఆయన చిన్న మరదలు  Tanya Behrs ఆయననొక ఉత్తరంలో నిలదీస్తుంది-  ‘సైనికాధిపతుల్ని, యోధుల్ని, భూస్వాముల్ని పాత్రలుగా మలచటంలో ఎంతో నేర్పు ఉండొచ్చు. కానీ ప్రేమలో మునిగి ఉన్న ఒక స్త్రీ మనసులోకి మీరెలా తొంగిచూడగలరు?’ అంటే ఆధునిక సాహిత్యం అనుభవాత్మకమే కానీ, ఊహాత్మకం, వ్యూహాత్మకం కాదని, కాకూడదన్నదే టాన్యా నిలదీత అంతరార్థం. రాయడానికి ముందు తన పాత్రలు చెప్పేది శ్రద్ధగా వింటానని Charles Dickens అంతటి మహా రచయిత వినయంగా ప్రకటించిన చోటే author- authority కి పర్యాయపదమైపోయాడని,  ‘కొత్తా దేవుడి’ అవతారమెత్తాడని  Roland Barthes (Death of the author)  వంటి విమర్శకులు గోలపెట్టారు. రచయిత అంటే author కాదని, అతనొక

scripter మాత్రమేనని అన్నారు. రచనతో పాటు పుట్టాడే తప్ప సర్వాంతర్యామిలా సకలం తెలిసిన మిడిసిపాటుతో ‘వివరించటం’, ‘ప్రబోధించటం’ కూడదని గగ్గోలుపెట్టారు.

గొప్ప రచనలు ఏవైనా ఏ కాలంలోనైనా సిద్ధాంతాలకి precursors లాంటివే గానీ, సైద్ధాంతిక దిశానిర్దేశం నుంచి పుట్టనే పుట్టవు. 1960 దశకం చివరి దశలో పుట్టి, మరో దశాబ్దం ఆలస్యంగా భారతదేశంలో ప్రవేశించిన రోలాండ్ బార్త్ వంటి కొత్త తరం విమర్శకుల స్ఫూర్తి 1963 నాటికే త్రిపుర రాసిన కథలలో between the lines తొణికిసలాడటం ఓ అద్భుతం.

రచనతో పాటే పుట్టటం అన్న స్ఫూర్తిని మరో రకంగా అన్వయించుకుని,  ‘నేను’ కేంద్రకంగా, డాబుసరిగా ఒక సొంత డప్పులా, అద్దం ముందూ ఆత్మవంచనలా ‘ఉత్తమ పురుష’ కథల శైలి కూడా కదం తొక్కింది (తొక్కుతోంది) తెలుగు సాహిత్య సీమలో.

“మీలో ఒక గొప్ప గుణముంది. ఏ అనుభవాన్నీ కాదనరు. కానీ వాటిని మీ రక్తంలోకి అరబడనీయరు. అవునా?’ అన్నాడు, మళ్లీ రాత్రి అనుభవం నా కళ్లలో ఇంకా మిగిలి ఉందేమో అని పరీక్షగా చూస్తూ.

అవునో కాదో అప్పుడు చెప్పలేకపోయాను. జవాబు ఇదీ అని ఊహించుకుని మాటల్లో చెప్పదలచుకుంటే, చెప్పడానికి ప్రయత్నిస్తే ఒఖ్ఖసారిగా గర్వం,  ‘అహం’ తెలియకుండా వెనకపాటుగా ముట్టడి చేసి… మాటల్లో విపరీతమైన ‘ట్విస్ట్’, అసత్యం… బంగారు పూత… వెలిగే అసత్యం. ‘నిజం’ యొక్క కఠోరత్వాన్ని కప్పి పుచ్చే అసత్యపు ఆకర్షణ… ఇవీ, నిజం యొక్క అసలు వెలుగును చూడలేక బెదరడం, భయం; మనసుతో ‘తెలుసు’కోగలిగినా,  ‘తెలుసుకోవడం’ నా శిక్షణలో ఒక భాగమైనా, ’నేను’ అన్న మాటలలో ఖంగుఖంగుమని సత్యం ఎప్పుడూ మోగదని, ఏది నిప్పులాగ నిజమో, ఏది వేషధారణో చెప్పలేననీ…”

 

ఇది జర్కన్ కథలో వీరాస్వామి, కథకుడు భాస్కరం మధ్య సంభాషణ, స్వగతం. ఇదే సాహిత్యంలో ఉండాలని త్రిపుర పదేపదే ప్రస్తావించే కన్ఫెషనల్ ఎలిమెంట్. ‘నేను’ని నిర్దయగా చీల్చి చూసుకోవడం. స్వోత్కర్ష గొప్ప సుఖమే గానీ, ఈ నేరాంగీకారం ఎంతమాత్రం సులువు కాదు.

‘యవ్వన ప్రౌఢ దశల్లో నేను తిరిగిన ప్రదేశాలు, పడ్డ మధనలు కథల్లో ప్రాణం పోసుకున్నాయి. ముఖ్యంగా నేను విద్యార్థిగా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న రోజులు, ఆ రోజుల్లో నాకు బాగా చనువైపోయిన నగువా, యూనివర్సిటీ గేట్, యూనివర్సిటీ ఘాట్, బిర్లా, బ్రోచా హాస్టల్సు, దశాశ్వమేథ్ ఘాట్, గల్లీలు, గంగ, ఆనాటి కొత్త ప్రభావాలు, ఊహల్లో నమ్మకాల్లో ఉప్పెనగా వచ్చిన పరిణామాలు, మానసిక సంఘర్షణలు, ఎన్నో- వాటిని గురించి నేను రాయలేకపోయాను. ఈ కథకుడు రాయగలిగాడు. నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా. అంచేత కథల్లో సన్నివేశాలకు, పాత్రలకు రవంత దూరంగా వుండడానికి ప్రయత్నించేవాణ్ణి, వాటితో నాకెంత గాఢమైన బంధం వున్నా. ఈ కథకుడు ఆ బంధాన్ని స్పష్టంగా బయటపెట్టడానికి సిగ్గుపడలేదు, సంకోచించలేదు. అందుకు నా జోహారులు’ అన్నారు పాలగుమ్మి, త్రిపుర కథలకు రాసిన ముందుమాటలో. స్వాభావికమైన వినయం, విస్తృతమైన అధ్యయనం వల్ల అబ్బిన జ్ఞానం వల్ల సర్వశక్తిమంతులమని, అపరబ్రహ్మలమని పాలగుమ్మి వంటి మహా రచయితలు అహంకరించలేదు గానీ వారు కూడా రచనల్లో తమని దాచుకోవడానికే ప్రయత్నించారు. గొప్ప సాహితీవేత్త కావడమే కాకుండా, బెనారస్ నేపథ్యముండటం వల్ల కూడా పాలగుమ్మిని ‘త్రిపుర కథల’ ముందుమాటకు ఎంచుకున్నారేమో అత్తలూరి నరసింహారావు.

నిజానికి బెనారస్ విశ్వవిద్యాలయం పాలగుమ్మి జీవితంలో ఓ మజిలీ కాదు, అతి ముఖ్యమైన మలుపు. బెనారస్‌కి ముందు పాలగుమ్మి మీద సంప్రదాయ సాహిత్య ప్రభావం ఎక్కువ. సంస్కృత వాఙ్మయం కూడా కరతలామలకం. ఆయన అప్పటికే అష్టావధానాలూ చేసేవారు. బెనారస్ విశ్వవిద్యాలయం ఆయన ఆలోచనల్ని ఆధునికత వైపు మళ్లించింది. ఈ మార్పు పాలగుమ్మి సాహిత్య జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవ్వాలే గానీ ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు, త్రిపుర కథలకి రాసిన ముందుమాటలో తప్ప (‘ఆనాటి కొత్త ప్రభావాలు, ఊహల్లో నమ్మకాల్లో ఉప్పెనగా వచ్చిన పరిణామాలు, మానసిక సంఘర్షణలు, ఎన్నో- వాటిని గురించి నేను రాయలేకపోయాను’). ఆ విధంగా ‘త్రిపుర కథలు’ ఆయన నాస్టాల్జియాని కెరలించాయి. ‘నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా’ అన్నారాయన. నిన్నామొన్నటి వరకంటే ఎప్పటివరకు? 1980లో ఈ పరిచయ వాక్యాలు రాయకముందటి వరకు; ఇంకొంచెం hypothetical గా చెప్పుకుంటే ‘త్రిపుర కథలు’ తనని పట్టి కుదపక ముందువరకూ అనుకోవచ్చేమో. ఎందుకంటే, ఆ ‘నిన్నామొన్నటి’ తరవాత కలిగిన కొత్త ఎరుకతో పాలగుమ్మి ఏ రచనా చేయలేదు. కనుక ఎంత కాదన్నా పాత నమ్మకాలు, అలవాట్లు ఓ పట్టాన పోవు కాబట్టి ‘ఇటువంటి కథలు నేను రాయగలనా’ అని నిట్టూర్పు వంటి ప్రశంసతో ముగించారు పాలగుమ్మి.

చైతన్యవంతమైన 1980ల నాటికే అలా ఉంటే, అప్పటికి 20 ఏళ్ల క్రితం, ఆధునిక కథాసాహిత్యం నిలవ నీరైపోయిన 1960లలో ఎంత స్తబ్ధత, మొఖం మొత్తే మొనాటనీ ఉండి ఉండొచ్చు? గబ్బిలాలై వేలాడే నిన్నటి నమ్మకాలు, పాత హాంగోవర్లు, మార్పు పట్ల ససేమిరాలు, ముఖం తిప్పేసుకోవడాల మీద ప్రదీప్ కక్కిన నిరసన వంటివే త్రిపుర కథలు కూడా. ‘అబ్సర్డ్ నాటకకర్త అయొనెస్కోపై మరో ప్రముఖ అబ్సర్డ్ రచయిత త్రిపుర ప్రసంగం’ అంటూ రాసేసిన విలేఖరుల మిడిమిడి జ్ఞానాన్ని పోలిన అజ్ఞానంతోనే- ఆయనని ప్రముఖ అబ్సర్డ్ రచయితగా చేసి, తనకి సంబంధం లేని విశేషణాల భుజకీర్తులు తగిలించిన తెలుగు సాహితీ ప్రపంచం పట్ల ఏవగింపు కూడానేమో.

అయితే, ఊసిన కారాకిళ్లీ మరకలో ఎరుపు మెరుపులు చూసినట్టు, ఆ కథల టెక్స్ట్‌లోని వచన కవిత్వాల జమిలీకి వ్యామోహపడి, తన నిగూఢ తాత్విక శైలీ విన్యాసానికి వ్యసనపడింది తెలుగు సాహిత్యం. పాపులర్ అయ్యే ప్రమాదం తప్పింది గానీ, context  అర్థం కాని సాహిత్యలోకానికి ఓ cult figure గా మిగిలారు త్రిపుర.

నరేష్ నున్నా

 

ఉన్మాది మనస్సినీవాలిలో…

స్పర్శ, చూపు, వినికిడులు అందించే పై పై ఐంద్రియక సమాచారానికి కూడా సవాలక్ష ఇంద్రియ పరిమితులున్న అంథులం, బధిరులం కదా-

……………… ఆధునిక కవనఘృణి విశ్వరూపసాక్షాత్కారం కోసం ‘చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో’ ఉన్న మహాకవి విన్న …. ‘ఉన్మాది మనస్సినీవాలిలో…. ఘూకంకేకా, భేకంబాకా….’

……………. సామాన్యులం మనమెలా వినగలం?

వినగలం!

జీవన వేదన ప్రచ్ఛన్నంగా, ప్రతీకాత్మకంగా వినిపించే వేనవేల ఘోషల్లో అతి సంక్లిష్టమైన ఘూకంకేకా, భేకంబాకా…. లను మనం సైతం వినగలిగే మహదావకాశాన్ని తెలుగులో కలిగించిన అతికొద్ది రచనల్లో రమణజీవి ‘సింహాలపేట’ కథాసంపుటి ముఖ్యమైంది.

రమణజీవి అనే కథోన్మత్తుడు, ఉన్మాది (కథాసంకలనమనే) మనస్సినీవాలిలోని వ్యక్తావ్యక్తాలాపనలు, వెర్రి ప్రేలాపనలే ఆ ఘూకంకేకా, భేకంబాకా! అంటే వాచ్యార్థంలో  గుడ్లగూబ అరుపు, కప్ప బెకబెకానూ.

అంటే, ఇవి పిచ్చి కథలు కావు గానీ, పిచ్చివాళ్ళ కథలు, ‘ఎయిర్స్’ వంటి ఏవేవో మాయపేర్లతో పిచ్చి ఎక్కించే కథలు.

ఉదాహరణకి, సముద్రం కథ –

ఒకానొక పిచ్చివాడు చెప్పిన ఓ fable- సముద్రం. ఈ పిచ్చివాడి కథలో నాయకుడు కూడా కథకుడిలా పిచ్చివాడే. వర్తమాన ప్రపంచంలో కథకుడు ఏ విధంగా ఒంటరో, ఆ కాల్పనిక గాథలో కథానాయకుడు ఏలే రాజ్యం కూడా పొరుగు రాజ్యాల మధ్య ఏకాకి. డబ్బులు చించేయ్యాలని తెగబడిన పిచ్చోడు ఈ నేరేటర్‌. అదే మాదిరిగా, బంగారంలాంటి బంగారాన్ని, అష్టైశ్వర్యాల్ని తెగనమ్మి ఇనుప గునపాలు కొనుక్కునేంత పిచ్చోళ్లు ఆ రాజ్య ప్రజలు. ‘ఒక అనుభూతి కోసం బతకాల’న్న సామూహిక నిర్ణయంతో, ఒక ఉమ్మడి ఆదర్శాన్ని నిజం చేయాలని తమని, తరతరాల్ని కూడా పణంగా ఒడ్డిన పరమపిచ్చోళ్లు. ప్రతిఫలాన్ని కాలానికి, దైవానికి అప్పగించిన నిష్కామయోగులు. వారి మహా సంకల్పానికి, ఏకైక లక్ష్యానికి మూలం వారి రాజు కన్న ఓ కల- సముద్రం!

ఆ మహద్విశ్వ స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చునేమోగానీ, సందేహపడితే మాత్రం కల కరిగిపోతుంది. ‘ఎప్పుడైతే దానికొక పేరు ఖాయం అయ్యిందో అప్పణ్ణించీ ఆ కల రావడం మానేసింది.’ దాని సాక్షాత్కారం ఆగిపోతుంది. జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. పాతబడే కొద్దీ మాసిపోవచ్చు కూడా. అందుకే కలని నిజం చేసే మహోద్యమం ప్రారంభించాడు రాజు. తన కలని తన వాళ్ళందరి ఉమ్మడి కల  చేయడం, కలని నిజం చేసే క్రమంలో సముద్రా న్నే తవ్వి దేశానికి కానుక ఇవ్వడం ఆ రాజు సంకల్పం.

ఇదిలా ఉంటే, ఈ కథలో రెండవ సూత్రపాత్రైన సముద్రానిది మరో రకం ఉన్మాదం.

ఇంతకీ సముద్రం అంటే ఏమిటి? అన్నీ నీళ్ళు అక్కడ ఒలకబోసిందెవరు? కెరటాల్ని ఎంత కాలమలా మెటికలు విరుచుకుంటూ యాష్ట పోతుంటుందది? ఇవేవి సైన్సుకు సంబంధించిన ప్రశ్నలు కావు. ‘లక్షలాది సముద్ర పక్షుల్ని, దట్టని మబ్బుల్ని వెంటేసుకుని జూలు విదిల్చి అది కదిలి వస్తుంటే,’ ప్రచండ మారుతాలు దానికి రెడ్‌ కార్పెట్‌ పరవడాన్ని తర్కంతో చూడలేము. అంటే సముద్రపుటుద్రేకాలు, ఉద్వేగాలు, ఉప్పని కన్నీళ్లు అన్నీ తర్కరహితమని కాదు, తర్కాతీతం! ఇరుకిరుకు మనుషుల్నేకాదు, మనుషుల దేవుళ్లని చూసికూడా సముద్రం ఈసడించుకుంది, తన తొలి ప్రయాణ సంపర్కంలో. ఇంత అందమైన లోకానికి మనిషి ఒక దిష్టిచుక్క అనిపించింది. కాని నిజమైన మనుషుల ముందు మోకరిల్లింది. కాయలు కాసిన వారి అరిచేతుల్లోంచి అగరు పరిమళాల్ని ఆస్వాదించింది. విభ్రాంతితో విచ్చుకున్న వారి కళ్లల్లో తన ఆత్మను దర్శించుకొని ధన్యమైంది.

Fableని తెలుగులో కొంచెం పెడసరిగా చెప్తే కట్టుకథ అని, సున్నితంగా చెప్పుకుంటే కాల్పానిక గాథ అని అనుకోవచ్చు. జంతువులు, చెట్లు, పుట్టలు చిత్రవిచిత్ర జీవులు, ప్రకృతి… అన్నింటికి మానవీయ లక్షాణాల్ని ఆపాదించి చెప్పే కథని fable అనవచ్చు. అలా చూస్తే ఈ నవీన యుగంలో, సాంస్కృతికంగా ఆధునికోత్తరత అని గుర్తింపు పొందిన ఈ యుగంలో తెలుగు సాహిత్యంలో వచ్చిన అత్యద్భుత fable ఇది.

కలగన్న మహాకడలిని ప్రజలకి కాన్క చేసే ఈ ఉటోపీయుడిలా ఇంకొందరో పిచ్చివాళ్ళు ఉన్నారీ  కథాసంపుటిలో.  ఆశపచ్చని లోకంకోసం నిర్జన భూగోళాన్ని (వి)నిర్మించిన హరకిరిస్టుడు, హోలోకాస్టుడు, సృష్టి చిట్టచివరి మనిషి కన్‌ఫెషనల్ కన్నీళ్ళని పుక్కిటపట్టిన ఫ్యూచరిస్టుడు, ‘కారుణ్యం లేక అద్భుత సృష్టికి అనర్హమైన’ మగజాతిని తోడేళ్ళ పాల్జేసిన పేరడాక్సుడు, చీమలపేట మీదుగా వెండిలోకం దాటీ దాటని కాఫ్కీయుడు, ఒకానొక జరతుష్రుడు, ఒక ఐకనోక్లాస్టుడు, మరొక రెబలుడు, వైపరీత్యుడు, ఒడిదుడుకుడు… ఇంకా ఇంకొన్ని పాత్రల, సూత్రపాత్ర (protagonist)ల కథలు; వస్తురూపశైలీగత వ్యథలై బద్దలైన అద్దం ముక్కలు. ‘మానవ సృష్టిలో ఉన్న మూసదనా’న్ని ఈ రచయితలానే వెక్కిరిస్తున్న గాజుపెంకులు.

ఏ ఒక్కటీ మరొకదానితో పొత్తే లేని ఆ శకలాలన్నింటిలో కుడిఎడంగా ప్రతిబింబించే ఏ స్థాయి ఉన్మీల ఉన్మాదమైనా అది రమణజీవే. తనని ఆరాధించిన, ఆదర్శించిన  లక్షలమంది తడికళ్ళలో సముద్రం ప్రతిబింబించినట్టు, అదే ఉద్వేగ స్థాయిలో ప్రతిఫలిస్తున్నాడు రచయిత, ఆ పాదరస బిందు సందోహంలో.

రమణ జీవి ఉన్మత్త తీవ్రత అర్థం కావాలంటే, అతని మనస్సినీవాలిలోని గుడ్లగూబ అరుపులు, కప్ప బెకబెకలూ between the lines బోధపడాలంటే, ప్రళయోధృతితో పోటెత్తుతున్న సముద్ర నీలి బీభత్స సౌందర్యాన్ని ప్రణయావేశంతో చూసి, ‘అడుగో నా కృష్ణుడం’టూ దూకేసిన చైతన్యుడి తాదాత్మ్య ఉన్మాదం అర్థంకావాలి. సన్నమూతి గాజుసీసా పగలగొట్టకుండా, లోన బాతుని చావకుండా బయిటకి తీయడానికి- ‘యోచన’కీ ‘గ్రహించడాని’కీ మధ్య అగాథాన్ని ఏ వంతెనల వైఫల్యంతో కాకుండా, ఒక్క అదాటున దాటేటువంటి తర్కాతీత వివేకస్థాయి కావాలో, దాన్ని అందుకోవాలి.

అవి లేకపోతే ఈ సంకలనమనే పిచ్చివాళ్ళ కథల్ని తెరవడానికి అనర్హులు… అంటున్నానంటే, నేనా ఉన్మాద, వివేక తీవ్రతని అందుకున్నానని ఎంతమాత్రం కాదు. మతిచెడిన వాళ్ళ పట్ల నా వ్యవహారం సగటు స్థాయికి ఎంతమాత్రం ఎక్కువేమీ కాదు. ఏ పిచ్చివాడి విషయంలోనూ నేను, నా చుట్టూ ఉన్న మర్యాదస్తులు చాలామందికి మల్లే, empathetic  కాదు సరికదా sympathetic కూడా కాదు. ఒకడిమీద జాలిపడాలంటే, తనని న్యూనపరిచి, నన్ను గొప్ప చేసుకునే సావకాశం చిక్కాలి కదా. కానీ, మనం వెంపర్లాడే పచ్చనోట్ల కాగితాలు చింపిపోగులు పెడతాడని, మనం అంగలార్చే పరువు ప్రతిష్టల్ని దిసమొలతో వెక్కిరిస్తాడని, మన ఇంటి ఇరుకుతనాలమీద ఉచ్చపోస్తాడని, మన విలువలు, మర్యాదలు,  తొడతొక్కిడి పరుగులు…. ఒకటేమిటి,

మనల్ని మనిషితనం నుంచి దూరం చేస్తున్న ప్రతి పార్శ్వాన్నీ పట్టి పట్టి గేలిచేస్తాడని కదా పిచ్చివాడిమీద మన అక్కసు!

పిచ్చివాడిని దూరంగా నెట్టేయడానికి తన చేతిలో రాయి ఒక నెపమౌతుంది సాధారణంగా. రమణజీవి అనే ఈ జీవనోన్మాది విషయంలో ఈ సంకలనమే రాయి అని నా (నాలో) revelation!