నక్షత్రాల్లాంటి ఆ కథలు…

kathana

రిత్రయుగం ఇప్పటికి అయిదువేల ఏళ్ళకిందట మొదలయ్యిందనుకుంటే, తాత్త్వికయుగం క్రీ.పూ 6-5 శతాబ్దాల్లో మొదలయ్యింది. చైనాలో, భారతదేశంలో, గ్రీసులో తలెత్తిన ఈ కొత్తధోరణి పురాణగాథలమీదా, పురాణక్రతువులమీదా, పురాణవిశ్వాసాలమీదా తలెత్తిన తిరుగుబాటు.

గ్రీసులో సోక్రటీస్ కి పూర్వపు తత్తవేత్తలు గ్రీకు పురాణకవులైన హోమర్ నీ, హెసియోద్ నీ  ధిక్కరించడంద్వారా, సాహిత్యంకన్నా, తత్త్వశాస్త్రం సత్యానికి ఎక్కువ సన్నిహితంగా ఉంటుందని వాదించారు. ఆ క్రమంలో పురాణకథల్లోని సంక్లిష్టతను తొలగించి మనిషికి మార్గనిర్దేశనంచెయ్యడానికి మంచిచెడుల్నివిడదీసిచూపించి, మంచికి ఉదాహరణలు చూపించడంకోసం బుద్ధుడుకథలు చెప్పడంతో ఉదాహరణకథలు( ఎగ్జంప్లం) వికసించాయి.

కాని మనిషి కేవలం సత్యంమీదా, నీతిసూత్రాల మీదా మాత్రమే బతకలేడు. మనిషికి సత్యంకన్నా సమగ్రత ముఖ్యం. తనజీవితానికీ, తన జాతిజీవితానికీ కూడా సమగ్రత సిద్ధిస్తుందంటే అతడు అబద్ధాలు చెప్పుకోవడానికి కూడా సంకోచించడు.

ఆసమగ్రతని ప్రతిష్టించుకోవడంలోఅతడికొక సంతోషముంది. ఆ సంతోషాన్నిగ్రీకునాటకకర్తలు play wisdom అన్నారు.

మనిషి తొలినాళ్ళల్లో నీతినియమాలతో సంబంధంలేకుండా కథలు చెప్పుకుంటున్నప్పుడు, చతురపాత్రలు సృష్టించుకుంటున్నప్పుడు అనుభవిస్తున్నది ఆ play wisdom నే. తాత్త్వికులు ఇవ్వలేకపోతున్నఆ play wisdom ని తిరిగి జానపదకథాధోరణిలో అందివ్వాలని నీతికథ ముందుకొచ్చింది. అయితే ఈ నీతికథ జాతకకథల తరహా నీతికథ కాదు. ఇది ఈసోపు తరహా నీతికథ. దీని మూలాలు చరిత్రపూర్వకాలంలోనే ఉండిఉండవచ్చు. కాని తన కాలానికి తగ్గట్టుగా ఈసోపు ఆ ప్రక్రియకు ప్రాణం పోసాడు.

ఈసోపు వల్ల మరొకసారి కథ ఎంత సముజ్జ్వలంగా భాసించిందంటే, సాహిత్యాన్నీ, కవుల్నీ, కథకుల్నీద్వేషించిన ప్లేటో కూడా చివరికి సోక్రటీస్ నోటి  వెంట ఒక ఈసోపు తరహా కథ చెప్పించకుండా ఉండలేకపోయాడు.

ఈసోపు తరువాత కథ రెండుదారులు తీసుకుంది. ఒకటి, పురాణగాథల్లాగ భౌతిక, అభౌతికప్రపంచాల మధ్య సేతువు నిర్మించడం. కాని అందుకోసం పురాణకథల్లాగా అభూతకల్పనల మీద ఆధారపడకుండా, ఈలోకాన్నీ, ఇక్కడి దైనందిన జీవితాన్నీకథావస్తువు చేసుకోవడం. చక్కటి రూపకాలంకారంలాగా, చూస్తున్నదాన్నిదృష్టాంతంగా చూపిస్తూ మనంచూడలేనిదాన్నీ, చూడవలసినదాన్నీచూపించడం.

బహుశా ఈ కఠినబాధ్యతని పారబుల్స్ చెప్పడం ద్వారా క్రీస్తు నిర్వహించినంతగా మరే కథకుడూ నిర్వహించలేకపోయాడని చెప్పాలి.

ఈసోపుకథలు తీసుకున్నమరొకదారి, ఈ ప్రపంచం లోనే వివిధ సామాజికవాస్తవాల మధ్య సేతువు నిర్మించడం. పురాణగాథల్లాగా ఆధికారికవిశ్వాసాలుగా స్థిరపడ్డ సామాజికవిశ్వాసాల్నీ, కథల్నీ, కల్పనల్నీ ప్రశ్నించడం. దీన్నివ్యంగ్యకథ అనవచ్చు. గ్రీకు, రోమన్ బానిస రచయితలు ఇందుకు  మానవాళికి తోవ చూపించారు.

ముఖ్యంగారోమన్ బానిసగా జీవితం ప్రారంభించి రోమన్ చక్రవర్తులతో సమానమైన గౌరవానికి పోటీపడ్డ ఫయాడ్రస్. పురాణగాథకి పూర్తి వ్యత్యస్తరూపం వ్యంగ్యకథ.

ఒక సామూహికవిశ్వాసాన్ని ఇవ్వడం ద్వారా సమాజాన్ని సమగ్రంగా నిలిపి ఉంచుతుందని ఆశ కల్పించిన పురాణకథ, వాస్తవంలో సమాజాన్నిచీల్చడానికే ఉపకరించిందని ఎత్తిచూపడమే వ్యంగ్యకథ ప్రయోజనం.

ఏ అతీతకాలం లోనో ఎన్నోసహస్రాబ్దాలకు పూర్వం గుహలముందు  నెగడి చుట్టూ కూచుని చరిత్రపూర్వయుగ మానవుడు, అక్షరపూర్వయుగ మానవుడు తాను చూసినదాన్నీ, చూడనిదాన్నీకూడా కథలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు.

బహుశా వినోదం కోసమే ఆ కథలు పుట్టి ఉండవచ్చు. కాని కాలక్రమంలో అవి సామాజిక, సాంస్కృతిక అవసరాలుగా మారిపోయాయి. కథలే లేకపోతే, సుమేరియన్, ఈజిప్షియన్, గ్రీకు, చీనా, భారతీయ, పారశీక సంస్కృతులిట్లా రూపొంది ఉండేవా అన్నది ప్రశ్నార్థకమే. కథ ఒక సామాజికఅవసరమే కాకపోయుంటే హోమర్, హెసియోద్, వర్జిల్, వ్యాసవాల్మీకులు ప్రభవించి ఉండేవారే కాదు. కథలుగా  చెప్తేనే మనుషులు తమ మాటలు మరింత బాగా వింటారని గ్రహించినందువల్లనే బుద్ధుడూ, క్రీస్తూ వంటి ప్రవక్తలు కూడా కథకులుగా, ఇంకా చెప్పాలంటే అద్వితీయకథకులుగా, మారారు. ఒకవేళ కన్ఫ్యూషియస్ వంటి గురువులు కథలు చెప్పకపోతే, వాళ్ళ జీవితంలోని చిన్నచిన్నసంఘటనల్నేవాళ్ల శిష్యులు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. సామాజికసమగ్రతని కాపాడటంకోసం తమ చక్రవర్తుల్నిదైవాంశసభూతులుగా ప్రతిష్టిస్తూ పురోహితులు చెప్పిన కథల్లోంచి చరిత్రయుగం మొదలైతే, మళ్లా ఆ పురాణగాథల నుంచి సామాజికసమగ్రతను కాపాడుకోవడం కోసం నిరక్షరాస్యులైన బానిసలు చెప్పుకున్నకథలతో చరిత్ర మరో మలుపు తిరిగింది.

ఈ పరిణామమూ, ప్రయాణమూ సవివరంగా ముందుముందు.

 

***        ***        ***

ప్రాచీనకథారూపాలు: పురాగాథ

 

మా ఊళ్లో ఒక కొండ ఉంది. దాన్నిజెండాకొండ అంటాం. మాది గిరిజనగ్రామం కాబట్టి పండగలప్పుడు ఊళ్లో వాళ్లంతా ఆ కొండ ఎక్కడం ఒక అలవాటు. ఆ కొండ కింద పెద్ద బండరాయి ఉండేది. ఆ రాయి పెద్దపాదం ఆకారంలోఉండేది. అది మధ్యలో పగిలిపోయికూడా ఉండేది. మా చిన్నప్పుడు మా ఊళ్లోవాళ్లు ఆ రాతి గురించి ఓకథ చెప్పేవారు. ఒకప్పుడు భీమసేనుడు ఆ కొండమీంచి కిందకి దిగాడనీ, అతడు పాదం మోపగానే ఆ బండరాయి పగిలిపోయిందనీ చెప్పేవారు. మా చిన్నప్పుడు మాకు అదంతా నమ్మదగ్గట్టే ఉండేది. ఆ శైశవం నుంచి బయటపడ్డాక, ఆ ఊరు వదిలాక, ‘విద్యావంతులం’అయ్యాక ఆ కథను నమ్మడం మానేశాం. కానీ ఇప్పటికీ ఆ కొండ దగ్గరికి వెళ్తే, ఆ బండరాతిని చూస్తే అది భీమసేనుడి అడుగే అని ఎక్కడో మానసికఅగాధాల్లో ఒక జలదరింపుకు లోనవుతూనేవుంటాం. ఆ రాతిచుట్టూ అల్లినకథా, ఆ కథ వినగానే మనసులో రేకెత్తకుండా ఉండలేని జలదరింపూ వీటినే మనం లెజెండ్ అంటాం.

చాలాకాలం పాటు పురాగాథ (లెజెండ్), పురాణగాథ (మిత్), జానపదగాథ (ఫోక్ టే ల్) ల మధ్య తేడా గమనించేవారు కాదు. కానీ వాటి మధ్య సున్నితమైన సరిహద్దురేఖలున్నాయని అత్యంత ప్రాచీనతెగలకు కూడా తెలుసని మానవశాస్త్రజ్ఞులు గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ప్రసిద్ధ మానవశాస్త్రజ్ఞుడు మాలినోవస్కీ తన ‘Myth in Primitive Psychology’ (1926) లో టోబ్రియాండ్ ద్వీపవాసులు గురించి రాస్తూ, వాళ్లకి మూడు రకాల కథనరూపాలున్నాయని వివరించాడు.

painting: Annavaram Srinivas

painting: Annavaram Srinivas

  • జానపదకథలు: కల్పితకథలు, నాటకీయంగాచెప్పుకునేకథలు. వ్యక్తులూ, కుటుంబాలూ చెప్పుకునే కథలు. హేమంతకాలంలో పంటలకోతల కాలానికీ, చేపలుపట్టే కాలానికీ మధ్యకాలంలో చెప్పుకునే కథలు. ఆ కథలు చెప్పుకుంటే పంటలు బాగా పండుతాయని నమ్మే కథలు.
  • పురాగాథలు: యథార్థంగా జరిగాయని నమ్మేకథలు. వాటిలో యథార్థమైన సమాచారం ఉంటుంది. అవి ఏ ఒక్క వ్యక్తికో, కుటుంబానికో సంబంధించినవి కావు. తెగ మొత్తానికి చెందినవి. వాటిని చెప్పుకోవడంలో కూడా ఒక మూసపద్ధతి ఉంటుంది. వాటికి మంత్రశక్తికూడా ఉందని నమ్ముతుంటారు.
  • పురాణగాథలు: అవి యథార్థమైన కథలే కాకుండా, పవిత్రమైన కథలు కూడా. వాటి పట్ల ఆ తెగమొత్తానికి  ఆరాధన, గౌరవం, సమర్పణభావం ఉంటాయి. తెగ మొత్తం పాల్గొనే సామాజిక, సామూహికక్రతువుల్లో ఆ పురాణగాథలదే ప్రధానస్థానం.

వీటిలో , పురాగాథని (లెజెండ్) జానపదకథ (ఫోక్ టేల్) నుంచి విడిగాతీసి, శాస్త్రీయంగా అధ్యయనం చేయడం 1975 నుంచి మొదలయ్యింది. మొదట్లో జానపద కథలకి ఉన్నంత నిర్మాణస్పష్టత పురాగాథలకి లేదనుకునేవారు. కానీ పురాగాథల్నిజానపదగాథలతో పోల్చిచూడటం మొదలైన తర్వాత పురాగాథలకు కూడా కొన్నిస్పష్టమైన, నిర్మాణపరమైన లక్షణాలున్నాయని భావిస్తున్నారు. వాటిని మనమిట్లా చెప్పుకోవచ్చు:

  • జానపదకథలు యథార్థవాస్తవాన్నివ్యంగ్యంగా చిత్రించడానికి ప్రయత్నిస్తే, పురాగాథలు యథార్థవాస్తవాన్నినమ్మదగ్గట్టుగా పునర్నిర్మిస్తాయి.
  • జానపదకథలు అంతరంగవాస్తవం గురించి పట్టించుకుంటే పురాగాథలు బాహ్యవాస్తవం గురించి ఆలోచిస్తాయి.
  • జానపదకథలు మనిషి గురించి ఆలోచిస్తే, పురాగాథలు మనిషికి ఏం జరుగుతోంది, మనిషి ఏమౌతున్నాడు ఆలోచిస్తాయి.
  • జానపదకథలు తమ సాంస్కృతిక వాతావరణం నుంచి కూడా బయటికి ప్రయాణించగలుగుతాయి.
  • కానీ పురాగాథలు చాలా స్పష్టంగా తమ సంస్కృతికి మాత్రమే పరిమితమై మనగలుగుతాయి. అవి ఆ సంస్కృతికి సంబంధించిన సంప్రదాయంతో, విశ్వాసాలతో, ఆ మానవసమూహం తాలూకు మానసికసంవేదనలతో ముడివడి ఉంటాయి. పురాగాథలు సాధారణంగా ఏదో ఒక్క సంఘటన మీంచి నిర్మాణమవుతాయి. అవి ఆ మానవసమూహం తాలూకు బాహ్యస్థలాన్నిఆంతరంగికస్థలంతో ముడివేస్తాయి. ఆ సామూహికగతం గురించిన జ్ఞాపకాల్నితరం నుంచి తరానికి అందిస్తూ, ఆ జాతికొక చారిత్రక అంతర్దృష్టి ని  సమకూరుస్తాయి.

పురాగాథల్నీ, జానపదకథల్నీపోల్చిచూసి, తిమోతి.ఆర్. తంగ్హెర్లేని అనే ఆధునిక జానపదవాజ్మయ పండితుడు లెజెండ్ ని  ఇట్లా సమగ్రంగా నిర్వచించడానికి (1990) ప్రయత్నించాడు:

‘లెజెండ్ అంటే సాంప్రదాయిక కథ. ఏక సంఘటనాత్మక కథ. నిర్దిష్టవాతావరణానికి తగ్గట్టుగా, చారిత్రకస్వభావాన్నిసంతరించుకున్నకథనం. సంవాదరూపంలో సాగే అభినయం. ఒక తెగ నమ్మకాల్నీ వారి సామూహికఅనుభవాల్నీమానసికస్థాయిలో నెమరువేసుకుంటూ ప్రతీకాత్మకంగా చెప్పే కథ. ఒక సమూహం తాలూకు సాంప్రదాయికవిలువల్నిపునరుద్ఘాటించడం కోసం చెప్పుకునే కథనం’

నిజానికి పురాగాథలు అచ్చుపుస్తకాల్లో చదువుకునేవి కావు, అవి అభినయరూపాలు. వాటికి నిర్ణీతవేళలుంటాయి. వాటి చుట్టూ కొన్ని నమ్మకాలుంటాయి. ఉదాహణకి సెనెకా ఇండియన్ తెగల్లో, ఇరోకో తెగల్లో ఏ కథలూ వేసవిలో చెప్పుకునేవి కావు. అట్లా చెప్పుకుంటే రెండు రకాల అనర్థాలు వాటిల్లుతాయని వాళ్ళు నమ్ముతారు. మొదటిది, వేసవిలో జంతువులకి పనీపాటా ఉండదు కాబట్టి, అవి మనుషులు చెప్పుకునే కథలు వింటాయనీ, అలా వింటున్నప్పుడు మనుషులు తమని తాము మరీ అతిగా పొగుడుకుంటే విని ఆగ్రహిస్తాయనీ ఒక నమ్మకం. రెండవది, అవి ఆ కథలు వింటూ మైమరచిపోతే ప్రకృతిలో వాటిచోటు తప్పిపోతుందనీ, ప్రకృతి నడక మారిపోతుందనీ మరొక భయం.

అందుకని ఆ కథలన్నీశీతాకాలంలో ప్రకృతి కునికిపాట్లు పడేటప్పుడు  చెప్పుకోవలసిందే.

సెనెకా తెగలో ఈ కథలు చెప్పడానికొక కథకుడుంటాడు. అతణ్ణి ‘హగెఓతా’అంటారు. కథలు చెప్పడాన్ని ‘ఎసెగెఒడె’అంటారు. అతడి దగ్గరుండే కథాభాండాగారాన్ని ‘గనొండసహగొ’అంటారు. కథలు చెప్పేటప్పుడు శ్రోతలు నిద్రపోయినా, ఊకొట్టకపోయినా కథకుడు అమర్యాదగా భావిస్తాడు. ఒకవేళ శ్రోతకి నిద్రొస్తుంటే అతడు కథకుణ్ణి కొంతసేపు ఆకథ కట్టెయ్యమని అడుగుతాడు. కథవిన్నాక శ్రోతలు కథకుడికి పూసలో, పొగాకో, ఏదో ఒక చిన్నకానుక ఇవ్వడం తప్పనిసరి.

ఒక జాతి తన సామూహిక, సమష్టిఅనుభవాల్నిఅర్థంచేసుకునే క్రమంలో, గుర్తుపెట్టుకునే క్రమంలో ప్రతీకాత్మకంగా మిగుల్చుకునే ఆనవాళ్లు పురాగాథలు. ఉదాహరణకి  ‘కథలుఎలాపుట్టాయి’అనే ఈ పురాగాథ చూడండి. సెనెకాఇండియన్లు చెప్పుకునే ఈ పురాగాథలో రాయి కథలు చెప్పటం చూస్తాం.

kesavareddyరాయి కథలుచెప్పడం ఆధునికమానవుడి దృష్టిలో, అయితే, ఒక మెటఫర్, లేదంటే, ఒక ఫాంటసి. కానీ సెనెకాఇండియన్లకి తమ చుట్టూ ఉండే ప్రకృతిలో ప్రతి ఒక్కటీ సజీవపదార్థమేనని మనం గుర్తిస్తే, ఈ పురాగాథ వాళ్ల సామూహికవిశ్వాసంతో ఎంతగా పెనవేసుకుపోయిందో మనకు అర్థమవుతుంది.

రామాయణంలోనూ, మహాభారతంలోనూకూడాఎన్నోపురాగాథలున్నాయి. ఐరోపీయ సాహిత్యంలో ఆర్థరియన్ లెజెండ్లు సుప్రసిద్ధం. తెలుగులో డా.కేశవరెడ్డి ‘మూగవానిపిల్లంగోవి’, ఆర్. వసుంధరాదేవి ‘రెడ్డెమ్మగుండు’కథలు లెజెండ్ తరహాలోచెప్పినవే.

 

 

***        ***        ***

సెనెకాఇండియన్లు1చెప్పుకునేకథ:  కథలుఎలాపుట్టాయి?

ఒకానొక కాలంలో ఒక అనాథ పిల్లవాడుండేవాడు. అతణ్ణి అతడి తల్లిదండ్రులకి బాగా దగ్గరగా తెలిసిన ఒక ఆడమనిషి పెంచింది. అతడు పెరిగి పెద్దవాడయినప్పుడు బలవంతుడు గానూ, బుద్ధిమంతుడు గానూ రూపొందాడు. అతడికి తగిన వయసు రాగానే ఒకరోజు ఆమె అతని చేతికి విల్లంబులు ఇచ్చి, ‘ఇక నువ్వు వేటాడడం నేర్చుకునే వయసు వచ్చింది. అడవికి పోయి వేటాడి ఆహారం తీసుకురా’ అని చెప్పింది. ఆ మర్నాడు పొద్దున్నే అతడు వేటకు వెళ్లాడు. మూడు పక్షులను కొట్టాడు. మధ్యాహ్నానికల్లా అతడి అమ్ములపొది వదులైంది. అల్లెతాడు బిగించుకోవడం కోసం అతడొక చాపరాయి మీద కూర్చున్నాడు.

ఇంతలో ఉన్నట్టుండి హటాత్తుగా అతణ్ణి ఎవరో ‘నీకో కథచెప్పమంటావా’అని అడిగారు.

అతడు తన ఎదురుగా ఒక మనిషి నించొని తనని అడుగుతున్నాడనుకుని తలపైకెత్తి చూశాడు. కాని ఎదురుగా ఎవరూ కనిపించలేదు.

‘నీకో కథ చెప్పమంటావా?’ మళ్లీ వినిపించిందాగొంతు.

ఆ కుర్రవాడికి భయమేసింది. అతను అన్నిదిక్కులా చూశాడు. కాని ఎవరూ కనబడలేదు. మళ్లా ఆ గొంతు వినబడేసరికి అప్పుడతనికి అర్థమైంది, ఆ గొంతు తాను కూర్చున్న బండ లోంచి వినబడుతోందని.

‘నీకో కథ చెప్పమంటావా?’

‘కథలంటే ఏమిటి?’ అని అడిగాడు ఆ పిల్లవాడు.

‘కథలంటే చాలాకాలం కిందట జరిగిన సంగతులు. నా కథలు నక్షత్రాల్లాగా ఎప్పటికీ చెక్కు చెదరవు.’

ఆ రాయి కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒక కథ పూర్తిచేస్తూనే మరో కథ మొదలుపెట్టింది.

అది కథలు చెప్తున్నంతసేపూ ఆ కుర్రవాడు తలవంచుకుని శ్రద్ధగా ఆ కథలే వింటూ కూర్చున్నాడు. సూర్యాస్తమయవేళకి ఆ రాయి హటాత్తుగా ఇలా అంది.

‘ఇక మనం ఇప్పటికి చాలిద్దాం. రేపు మళ్లారా. మీ వాళ్లందరినీ కూడా తీసుకురా. వాళ్లంతా కూడా నా కథలు వింటారు. వచ్చేటప్పుడు వాళ్లందరినీ నాకోసం తలా ఒక కానుక తీసుకురమ్మని చెప్పు’అంది.

ఆ కుర్రవాడు ఆ సాయంకాలం తన వాళ్లందరికీ ఆ కథలు చెప్పే రాయి గురించి చెప్పాడు. దాంతో మర్నాడు పొద్దున్నే ఆ ఊరిజనమంతా అతడి కూడా అడవిలోకి దారితీశారు. ప్రతిఒక్కళ్లూ రొట్టెలో, మాంసమో, పొగాకో ఏదోఒకటి తలా కొంత తీసుకువచ్చి ఆ రాతి ముందు పెట్టి కూర్చున్నారు.

అంతా నిశ్శబ్దంగా కూర్చున్నాక రాయి మాట్లాడడం మొదలుపెట్టింది.

‘నేనిప్పుడు మీకు చాలాకాలం కిందట జరిగిన కథలు చెప్పబోతున్నాను. మీలో కొంతమందికి నేనుచెప్పే ప్రతి ఒక్కమాటా గుర్తుంటుంది. కొంతమందికి కొంతే గుర్తుంటుంది. తక్కినవాళ్లకి అసలేమీ గుర్తుండదు. శ్రద్ధగా, జాగ్రత్తగా వినండి.’

ఆ ప్రజలంతా శ్రద్ధగా శిరస్సు వంచి విన్నారు. రాయి కథ చెప్పడం పూర్తిచేసేటప్పటికి పడమట పొద్దుకుంకింది. అప్పుడు ఆ  రాయి ఇట్లా అంది.

‘నా దగ్గరున్న కథలన్నీ చెప్పేశాను. మీరు వాటిని మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలపిల్లలకి చెప్పండి. అలా తరతరాలపాటు చెప్పుకుంటూనే ఉండండి. మీరెవరినైనా కథ చెప్పమని అడిగినప్పుడు మర్చిపోకుండా వాళ్లకిట్లా ఏదో ఒక బహుమతి ఇవ్వండి.’

అదీ, అలా జరిగింది. మనకి తెలిసిన కథలన్నీఆ రాయి మనకి చెప్తే విన్నవే. మన తెలివితేటలన్నీ ఆ రాతినుంచి మనకు దొరికినవే.

 

_________________________________________________________________________

1: సెనేకా ఇండియన్లు: అమెరికన్ఇండియన్లుగా పిలువబడే రెడ్ఇండియన్లు సుమారు 60 వేలఏళ్ల కిందట ఉత్తరఅమెరికాలో అడుగుపెట్టారు. మధ్యఆసియా మైదానాల నుంచి ఈశాన్యదిశగా సైబీరియాసరిహద్దులు దాటి వాళ్లు అమెరికాలో అడుగుపెట్టారు. వేటాడుతూ, ఆహారం ఏరుకుంటూ ఆ సమూహాలు కొలంబియానది పొడవునా రాకీలు దాటి దక్షిణంవైపు మెక్సికన్ మైదానాల మీదుగా సతతహరితారణ్యాలు దాటుకుంటూ యుకాటన్ అడవుల దాకా విస్తరించారు. ఆకాశంలో ఎన్నినక్షత్రాలున్నాయో అన్ని ఇండియన్ తెగలున్నాయని నానుడి. వాళ్లు దాదాపు 300 భాషలు మాట్లాడతారు.

 

1492 లో క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాలో   అడుగుపెట్టినప్పటినుండి 1890 దాకా నాలుగు శతాబ్దాల పాటు సభ్యప్రపంచం అమెరికన్లను వేటాడి, వాళ్ల సంస్కృతినీ, నాగరికతనీ ధ్వంసం చేసేసింది.

 

కానీ 19 వశతాబ్దపు ప్రారంభం నుండీ అంటే, 1830 ల నుంచి అమెరికన్ తెగల సంస్కృతి , మౌఖికసాహిత్యం, జీవనశైలి గురించి విరివిగా అధ్యయనాలు మొదలయ్యాయి.

అట్లా సమగ్రంగా అధ్యయనం జరిగిన తెగల్లో సెనెకాతెగ కూడా ఒకటి. సెనకా ఇండియన్లు న్యూయార్క్ ప్రాంతంలో జెనెసె నదికి కేనాన్ డైగువాసరస్సుకీ మధ్యప్రాంతంలో నివసిస్తారు.

ఆ తెగ ఒకప్పుడు చాలా పెద్దసమూహంగా ఉండేది. సెనెకా ఇండియన్లు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ జాతి. ఒకరకంగా మాతృస్వామికతెగ అని కూడా చెప్పవచ్చు.

సెనెకాఇండియన్ తెగలు చెప్పుకునే కథల్నిజెరిమియా కర్టిన్, జె.ఎన్.బి. హ్యూవిట్ నేవారు  Seneca Fiction Legends and Myths’ (1918)  పేరిట ప్రచురించారు.

సాంప్రదాయికఅమెరికన్ తెగల కథలు, పురాగాథల్ని ‘The Story Telling Stone’ (1965) పేరిట సుసాన్ ఫెల్డ్ మాన్  వెలువరించిన సంకలనంలోని కథ ఇది.  ఈ కథను కెనడాలో టొరంటొ దగ్గర సేకరించారు.

***        ***        ***

ఏడుపో, ఎతుకులాటో, యాతనో…!

screenshot_20161214-073853వాకిండ్లే వారగియ్యని  పల్లెల్నిర్సి మూసిన వాకిండ్లను తెర్సని టవున్లకు వలసొచ్చిన మట్టిమనుసులకు నాలుగ్గోడల మధ్యన బతుకు శానా ఇరుగ్గా అనిపిచ్చాది. అణువణువూ తెల్సిన ఊర్లో నుంచి అంగుళం గూడా తెలీని నగరంలోకి అడుగుపెట్టగానే మనసంతా అదోరకం ఎడారితనం ఆవహిచ్చాది. బెరీన ఆన్నుంచి తప్పిచ్చుకోని యాడికైనా పారిపోవాలనిపిచ్చాది. అట్లా ఆ ఇరుకుతనంలో నుంచి, ఆ ఉక్కిరిబిక్కిరి తనంలో నుంచి రోంతట్లా తలుపు తెర్సి సాగే సల్లని పల్లె ప్రయాణం ‘సగిలేటి కథల’ సంపుటి.

ఈ కథల్లోకి తవ్వుకుంటా పొతే ఒక్కోసాట ఒక్కో తడి తగులుతాంటాది.  అది ఏడుపో, ఎతుకలాటో, యాతనో, యాపమాను మీద ప్రేమో, సరసమో, చెతురో, ఆకలో, అమ్మతనమో ఏదో ఒకటి. కత కోనేటి ఊటై దప్పిక తీరుచ్చాది. ఏటిగట్ట్టై సేదతీరుచ్చాది. అట్లని అది ఎప్పుడూ సంబరమే గానక్కర్ల్యా. అప్పుడప్పుడు సన్నాసపకోళ్ళ తీరని ఆకలి కోరికల్ని మనకు రుచి సూపిచ్చి కళ్ళనిండా కన్నీళ్లను కుమ్మరిచ్చి పోతాది.( కురాక్కు సచ్చోటోన్నా…)

శాన్నాల్లకు అమ్మలేని ఊర్లో అడుగుపెట్టినప్పుడు , అప్పటికే మనసులో పూడ్చలేని అగాధం ఒకటుంటాది. ఆ ఎలితిలో ఊరు ఇదివరకు మాదిరి ఉండదు. మన మనసులోనే ఒక తెరప ఉంటే అవతల ఏదీ కూడా నిండుగా కాన్రాదు. ఏదో పేగుతెగి ఒక ఖాళీతనం మనలో సుడుల్దిరుగుతాంటాది. “ బస్టాండు దాట్తానే ఒక పెద్ద వొనుం ఉంటది. దాన్నిండా సెట్లుంటాయి. ఆ వనం సుట్టు సూచ్చి తెరపలు కనపద్తాంది. …రోడ్డుమీదికి కొమ్మలు సాపుకోని ఉన్నే శింతశెట్టు శేతులు కాళ్ళు పడిపోయిన మాదిరి కొమ్మలు తెగిపోయి దీనంగా సూచ్చాన్నెట్టు కనిపిచ్చ. “ రాతగాడు ఎదుటి ప్రాణిలో దూరిపోయి తనలో తొలిచే ఖాళీ తనాన్ని బూర్సుకునే ప్రయత్నమన్న మాట. ఆయప్ప ఆన్నే ఆగిపోడు. అట్లా ఇంగా శానా లోతుకు తవ్వుకుంటాడు.  ” దానితట్టు తేరిపార జూచ్చా “నన్ను గుడ్తు పట్నావా? ఎప్పుడూ నీ ఒళ్ళో ఆడుకుంటాంటి. మా యమ్మకాడ ఆడుకుంటాన్నట్టు. శింతశిగురు, పూత, పిల్ల శింతకాయలు, దోర శింతకాయలు, బొట్లు అన్నీ తెంపుకుని తింటాన్న గూడా ఏమి అనకపోతాండే(టివి)” మాయమ్మ మాదిరే. ఆయన్ని మతికొచ్చి ఉరుకుతాపోయి చెట్టును గట్టిగా కర్సుకోని ఎడుజామనుకుంటి, తమాయించుకోని అట్టనే నర్సుకుంటాపోతి.( ఎట్లపాయనో మాయమ్మ….)
 పదాలు ఇంత తడిగా కూడా ఉంటాయా  అనిపిచ్చాది. సెట్టును పట్టుకోని ఏర్సడమేంది పిచ్చిగాకపొతే, అనిపిచ్చాది. కానీ మనసులో ఉబికొచ్చే కన్నీటి ఊటను ఆ క్షణంలో బయటికి పారియ్యడానికి ఒక కాలవ గావాల. ఒక జీవం గావాల. చెహోవ్ కథ ‘బాధ’లో కొడుకు సచ్చిపోయినపుట్టుడు మనసులోని బాధను ఎల్లగక్కడానికి  జట్కా బండతను మనిసి దొరక్క ఆఖరికి తన గుర్రాన్ని పట్టుకుని ఏర్సడం గుర్తుకొచ్చాది. బాధ లోపల కాల్చేసేటప్పుడు ఎదురుగా ఉండేది మనిషే గానక్కర్ల్యా మండిపోడానికి. అది మానైనా పర్వాలేదు. మూగ జీవమైనా పర్వాలేదు.
kathana
 “మాయమ్మ  వెళ్ళి పోయినంక నా మనసు ఎట్ట శీకటయిందో అట్ట శీకటయింది. నేను హైదరాబాదు బస్సెక్కితే బస్సు గిద్దలూరు దావంబడి లైట్లు శీకటిని శీల్చుకుంటా పోతనాయి. లైట్ల ఎనక బస్సు, బస్సులో నేను, నా ఎనక శీకటి..ఆ శీకట్లో ఎనిక్కెనిక్కి పోతాన్నె మా ఊరు..”.
 పోలీసు స్టేషన్ కాడ యాపమాను కొట్టేసేటప్పుడు, ఆయప్ప గుండె రంపపు కోతకు గురైపోతాది. అధికారానికి తిరగబడి తగరారు పల్లేక మనసు మోనంగా ఎడుచ్చాది. మనసులోని ఆ అలజడే కండ్లపై తడిపొరై తచ్చాడతాది .

ఊర్లల్లో కొన్ని ‘గొప్ప’మాన్లుంటాయి . నిజంగా సెప్పాలంటే ఆ మాన్లను ఎవరు నాటింటారో, అయి ఎన్ని తరాల కిందటియో కూడా తెల్సుండదు. ఒక్కసారిగా ఆ మాన్లే గనకా కాన్రాకపోతే ఆడ శూన్యం సుడులు తిరుగుతాది. అంతా బోడిగుండు మాదిరి బోసిపోయినట్లుంటాది. కడుపులో తెడ్డు పెట్టి గెలికినట్లుంటాది. కూలిపోయిన ఆ మానుకింద పిల్లప్పుడు ఆడుకున్న్య గోలిగుండ్లాటలు, ఎండాకాలం సల్లని నీడను పరిసే ఆ మాను కొమ్మలు అన్నీ మతికోచ్చాయి.

 “తల్లిలాంటి సెట్టును నరుకుతాంటే ఇదేమన్యాయం అనడిగితే లోపలేశిరి( పోలీస్టేషన్ లో ). …బస్టాండుకు పోతా యాపసెట్టు తట్టు జూచ్చి. తుంటలు తుంటలు నరికి టేషన్ పక్కకు కువ్వ పోసిండ్రు. సెట్టు మొదలు తిట్టు జూచ్చి. ఎదిగి శేతికొచ్చిన కొడుకు సచ్చిపోతే రాగాలుదీసి ఏడుచ్చాన్న తల్లి మాదిరి అగుపిచ్చింది. కడుపులో ఎవురికీ సెప్పుకోలేని బాధ. …”( యాపశెట్టు).  ఇట్లా శానా దిగులు మోడాలు మనకు ఈ బుక్కులో ఎదురైతాయి. మన కండ్లల్ల ఇన్నిగనం కన్నీటి సినుకుల్ను రాల్చి పోతాయి. మనిషి కోసరం ఒక మనిషి పడే యంపర్లాట. ఇదో తవ్వులాట.
 ఊరంటే ఆడ ఒక్క మనిసే ఉండడు. మనిసితో పాటు ఎద్దులు ఎనుములు, కుక్కలు కోళ్ళు , సెట్లు శ్యామలు, వాగులు వంకలు, ఏర్లు బావులు ఇట్లా ఇయ్యన్నీ రోంతరోంతగా పెనేసుకొని ఉంటాయి. ఇయ్యన్నీ తడికెలో దబ్బలు గదా ఉన్నెట్లు ఒకదానికొకటి ఇడదీయరాకుండా అల్లుకోనుంటాయి. ఆ అమరికే ఊరైతాది. “ ఇట్టా చెతురు మాట్లాడుకుంతూమ్డగానే ఏరుదాటి మెయిన్ రోడ్డెక్కితిమి రోడ్డు మింద నుంచి మా ఊర్ని జూచ్చే నిద్దరపోడానికి ముందు తూగుతాన్న సిన్నపిల్లోని మాదిరున్నెది(సిన్నిగాడి సికారి ) . అది ఊరంటే.
“(ఊర్లో) బస్సు దిగుతానే తిర్నాల్లో దావ  తప్పోయి తల్లిని కనుక్కున్నా పిల్లోని మాదిరి అనిపిచ్చ ఎంకటేసుకు. ఊర్లో తెలిసిన వాళ్ళందరూ పలకరిచ్చాంటిరి. ఇంటిదావనర్సుకుంటా పోతాంటే ఊళ్ళో చెట్లు, పండ్లు, అంగళ్లు అన్ని నవ్వుతా పలకరిచ్చాన్నట్లుండె.” ( బతకలేక బాయిలోపడ్తే…) . ఆఖరుకు అట్లాంటి ఊర్లోనే బతుకు బండి వాటుపడి “తనకు సొర్గం సూపిచ్చాదన్న బూమిలోనే సొర్గస్తుడయిపోయిన” ఎంకటేసును తల్సుకుంటే కండ్లు సెమ్మగిలుతాయి.
నీళ్ళు ల్యాక, పనీబాటా ల్యాక బేకారుగా తిరిగే పిల్లోల్లు కూడా ఈ కథల్లో కనిపిచ్చారు. రాయలసీమలో పిల్సకుండానే పలికే కరువులు, ఎండిపోయిన సెరువులు, కడాకి “అమ్మకు కొత్త కోక కొనిపిచ్చే…” తాపత్రయంలో బతుకు బుగ్గిపాలు గావడం( నెత్తుటి మరకలు ), దిక్కులేని సుబ్బులు సచ్చిపోతే , బతికుండగా జరిగినయన్నీ మర్సిపోయి ఊర్లో తలా ఓ సెయ్యేసి  “…యాడ జేచ్చే ఏముందిలేండ్రా మంచి కులంలోనే పుట్టినట్లుంది. కాకపొతే కడుపాత్రం కోసరం ఇట్టయ్యింది గానీ, ఏ ఆడకూతురైనా ఇట్టాటి బతుకు బతకాలనుకుంటదా!” ( ఇంకుడు బతుకులు ) ఇట్లా ఈ కథలన్నీ మామూలోల్ల కథలే.
మట్టి మనుషుల కథలు సెప్పుకోవాలంటే భాషలో ఆ మట్టిమనుషుల మాట్లాడే యాసుండాల. పదాలకు షోకులు నేర్పకుండా సాదాసీదాగా , కట్టిర్సి పొయ్లో పెట్నేట్లుండాల. జానపద శైలి ఉండాల. రాయలసీమ యాసలో ఈ కథలు సదువుతాంటే “పొగలు వచ్చాన్న సంగటిని చేత్తో అట్టట్ట అదిమి తుంటలు తుంచి గోవాక్కారంలో పొల్లిచ్చి నోట్లో పెట్టుకుని( ఎంటిక )” మింగినట్లుంటాది. కారం కారంగా బలే కమ్మగుంటాది.
ఇప్పుడు రాయలసీమ తన ఉనికిని సాటుకోవాలంటే ఇట్లాంటి కథలు ఇంగా శానా రావాల. కరువు పేరిట ఎండి ఎడారై పోయిన పెన్నేటి గట్టు అసలు గుట్టు ఇప్పడానికి సీమ భాషలో, సీమ యాసలో, సీమ యాతనను పట్టి నిలిపే మరెన్నో కథలు రావాలి.
***

ఇక్కడ గొంతులు నొక్కబడును

డేవిడ్ కథకు పాఠాంతర పరామర్శ

ఆకాశంలా ఆవరించిన అనుభవంలో అరూప్యమైన మబ్బు తునకల వంటివి కదా జ్ఞాపకాలు. ఎగుడుదిగుడు అంతరంగంలో ఒకే జ్ఞాపకంగా కుదురుకున్న అనేకానేక సంఘటనల, సన్నివేశాల సమాహార బిందుసందోహాన్ని కలిపి గీసే contour line వంటి కథ ఎలా ఉంటుంది? మబ్బుపింజకి జరీ అంచులా మెరిసే కిరణపు అనాకృతిని పోలి ఉంటుందే తప్ప నిర్దిష్టంగా ఉండదు, ఉండాల్సిన అగత్యం లేదు. కానీ, అడ్డూఅదుపూ లేని, మొదలు- తుది ఉండనక్కర్లేని అటువంటి అపురూపమైన వంకర్ల పరివృత్తంగా కొనసాగుతున్న రచనని చప్పున ఒద్దికైన సరళరేఖగా వొంచిన తొట్రుబాటుకి, తొందరపాటుకీ తాజా ఉదాహరణ మన్నం సింధుమాధురి ‘డేవిడ్’!

ఆకతాయి అంగలతో టీనేజీ లోగిళ్ళు దాటుతున్నప్పుడు తోడైన చెంబుగాడు, యవ్వనారంభంలో వయసుపొదల మాటున ఎన్నో దైహిక రహస్యాలు దారికాసిన వైనాన్ని గుర్తుచేశాడు. నిజానికి ఆ గుట్టుమట్లన్నీ విప్పి చెప్పేంత ఆరితేరిన ఆగడీడు కాడు, చెబుతున్నట్టే తెలుసుకున్న ఆరిందగాడు.  తుంగభద్ర ఒడ్డున, హంపీ ఒడిలో చెట్టూ చేమా గుట్టా పుట్టా…. అన్నింటినీ తమ తూరుపూ- పడమరలంత దూరాల్ని రద్దు చేసేకుకొని మరీ ఆటాపాటా చేసుకున్న చిన్నారి నేస్తులు, ఆపై ఈడొచ్చిన పిల్ల ప్రేమికుల ఈ కథని ఒక సారాంశంగా రెండుమూడు వాక్యాల్లోకి కుదించుకొని చెప్పుకుంటే ఏముంటుంది విశేషం? కేవలం story for story sake గా, బండ్లకెత్తబడుతున్న అనేకానేక కథలకి మరో చేర్పు వంటి కథే అయినట్టైతే: నూనూగు ప్రాయల అమలిన ప్రణయం- విలనై విడదీసే విధి- చివర్లో శుభం కార్డుకు ముందు పునస్సమాగమం- అని మూడు ముక్కల్లో తేల్చేయొచ్చు! అలాంటప్పుడు దీనికి కథానాయకుడు లక్కవరప్పాడు, లేదా లక్నో, కాదంటే ఇలా లండన్- ఎక్కడి వాడైతేనేం?  కానీ, చిన్నదో… పెద్దదో – అదనుకొక అనుభవంగా, దిగంతాలే హద్దులుగా చెలరేగిపోయిన, విశృంఖల వాక్యాలుగా వెదజల్లుకుపోయిన కథనం కదా – ‘డేవిడ్’ అనే ఈ కథకి ప్రాణం… ప్రణవం! ఐతే, మొదట్లోనే ఆరోపించినట్టు- స్ఖలిత బ్రహ్మచారి డేవిడ్ virginityకి సంప్రదాయక మురిపెంతో నాయిక ఎసరుపెట్టడం ద్వారా ఉన్నట్టుండి కథ ఒక ఒద్దికైన సాదాసీదా ముగింపుకి చేరుకొని చదువరిని కుదేసింది. ఆత్మగతమైన ‘memoir’ని depersonalize చేసి ‘కథ’గా విశ్వజనీనం చేయడం, అన్యానుభవాన్ని కూడా సహానుభూతితో ‘స్మృతిరచన’గా సొంతం చేసుకొవడం- అనే రెండు భిన్నమైన genresకి ఒక మేలైన సంయోగంగా నడిచిన ఈ రచనని చిట్టచివర్లో రచయిత్రి తేల్చేశారన్నదే నా ప్రధాన అభియోగం.

(అసలు నా అభియోగంతోనే సమ్మతి లేనప్పుడు, ఇక ముందు నేను చేయబోయే వాదనలు పట్టించుకోనక్కర్లేదు, ఈ వాక్యాన్ని దాటి బహుశా చదివే శ్రమ తీసుకో పన్లేదు)

**           **           **

art: satya sufi

art: satya sufi

ఆదిమధ్యాంతరాలతో ఒక ఎత్తుగడలాగా, పతాక ఘట్టం ఒక పకడ్బందీ స్కెచ్ మాదిరిగా కథ ఉండవల్సిన పన్లేదని నవతరం కథకుల రచనలు  ప్రపంచ కథా సాహిత్యవీధుల్లో భాషాతీతంగా ఎప్పటినుంచో చాటి చెబుతున్న విషయం రచయిత్రి సింధు మాధురికి తెలియకే తన కథని ఒక సుఖాంత సీమలకి నడిపించారా? ప్రశ్నలా కనిపించే ముందు వాక్యానికి అవునో… కాదో రచయితకి బదులుగా- అభియోగాలు మోపి, ప్రశ్నలు సంధించిన నేనే వివరణ ఇవ్వడం హాస్యాస్పదం, అసంబద్ధం కావొచ్చు. నేనిక్కడ ఇవ్వబోయే వివరణ కథ తాలూకూ వాచకపు హద్దులు మీరి, text కు మాత్రమే పరిమితం అయ్యే (అవ్వడానికి మాత్రమే తయారుగా ఉన్న) పాఠకుడి హక్కుని కాలరాయడం వంటిది; పాఠకుడి కట్టెదురున ఉన్న  వాచకాన్ని దాటి పిల్లిమొగ్గలేసి, పాఠాంతరమైన మరేవో అసందర్భ అంశాల్ని అతని ముందుకు లాకొచ్చి ప్రదర్శించే దాష్టికంలాంటిది. ఇదంతా తెలిసి కూడా, ‘డేవిడ్’ అనే రచనకి సంబంధించిన వాచకానికి పరిమితం కాకుండా, ‘రచయిత – సింధుమాధురి (అక్షరంతో మాత్రమే)తో నాకు పరిచయం ఉంద’న్న సంజాయిషీ వంటి సాకులే పునాదిగా నా ఈ వాదన అనే మట్టిగోడని నిలబెట్టదల్చుకున్నాను.

**           **           **

‘నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా. అంచేత కథల్లో సన్నివేశాలకు, పాత్రలకు రవంత దూరంగా వుండడానికి ప్రయత్నించేవాణ్ణి, వాటితో నాకెంత గాఢమైన బంధం వున్నా…’ అన్నారు పాలగుమ్మి, త్రిపుర కథలకు 35 ఏళ్ల క్రితం రాసిన ముందుమాటలో. ‘బైటపడిపోతామేమో అన్న భయం’ ఒక్క పాలగుమ్మినే కాదు, మొత్తం ఆధునిక తెలుగు సాహితీకారులందరినీ పట్టిపీడించింది. ఇంకా ఆశ్చర్యమేమంటే, సాహిత్యం- జీవితం అనేది అసలు ద్వంద్వమే కాదని తన యావజ్జీవితాన్ని రుజువుగా నిలిపి చూపిన చలం గారి తర్వాత యుగం యావత్తూ ఆ భయానికే బద్ధులై ఉండటం.

ఇంతలో ఆధునికోత్తర యుగంలో ఒక విచిత్రం జరిగింది. విశ్వరచనలకీ, మహాకథనాలకీ సెలవంటూ, Jean-François Lyotard అనే సాహితీవేత్త ‘petits récits’ (meta-narrative) – అంటే స్వకీయమైన, స్థానికమైన, దుర్బలమైన కథనాలకు స్వాగతద్వారాలు తెరిచి, ప్రపంచానికి, ముఖ్యంగా మూడో ప్రపంచానికి ప్రాధాన్యత పెంచాడు. Lyotardని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆవాహన చేసుకొని తెలుగులో నామిని సుబ్రమణ్య నాయుడు వంటి రచయితలు గొప్ప సాహిత్యాన్ని కల్పించారు. అంతకు ముందటి తరాన్ని పీడించిన ‘బైటపడిపోతామేమో అన్న భయాన్ని’ మొదలంటా పెకలించి పడేసి, తామే హీరోలైన తమ రచనల్లో సన్నివేశాలకి, సందర్భాలకి, పాత్రలకీ కాస్తంత దూరంగా వుండడానికి కూడా ప్రయత్నించలేదు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ తరహా రచయితల తరం ఫోకస్ చేసిన అంశం ‘పేదరికం’. ప్రతిభావంతంగా చెప్పినా, తమ తమ మాండలికాల్లో చెప్పినా, చాప్లిన్ హాస్యంలా నవ్వించి గిల్లినట్టు చెప్పినా – తమ nostalgiaలో ప్రాధానంగా రాజ్యమేలింది ‘పేదరికమే’నని చిత్రించారు. వారి వారి కుల, ఉపకుల, మత, ప్రాంత, సామాజిక సాంస్కృతిక నేపథ్యాల భిన్నత్వం ఆ రచనల్లో కదలాడినా, స్థూలంగా చూస్తే అన్నీ మూసపోసినట్టై, ఆ లేమికి చెమర్చకపోతే, లేదా ఆ బీదతనాన్ని చూసి బిక్కపోకపోతే ఎక్కడ అగ్ర కుల.. మత దురహంకారమని ముద్రలేస్తారోనని భయంతో చదువరులు మూకుమ్మడిగా సంఘీభావాలు ప్రకటించేలా తయారయ్యాయి. దాంతో, అప్పటికే ఇబ్బడిముబ్బడిగా కీర్తి వచ్చిపడిపోతుండటంతో, చేయి మెలితిరిగిన రచయితలు కూడా తమని తామే అనుకరించుకునే దుస్థితికి చేరి, meta-narratives చిత్రణలో మీదుమిక్కిలి monotonyకి కారణమయ్యారు.

అదే స్వకీయ, స్థానికీయ కథనాల ఆధునికోత్తర వాతావరణం ఇచ్చిన దన్నుతో వచ్చినట్టే కనబడిన సింధుమాధురి తాలూకూ ప్రపంచం మానసికంగా, భౌతికంగా భౌగోళికంగా కూడా పెద్దది కావడమే విశేషంగా, ఆమె ప్రత్యేకత గానూ గుర్తించాలి. అంటే, పైన చెప్పిన, monotonous మంద నుంచి వేరై uniqueగా నిలిచిన సింధు మాధురి అనే ఈ రచయిత్రి దేశదేశాలూ తిరిగారా? తన కథలన్నీ ఆమె స్వానుభవాలా? – వంటి వ్యక్తిగతమైన ప్రశ్నలకి అనేకానేక ఆమె పాఠకుల్లో ఒకడిగా నాకూ సమాధానాలు తెలియవు. ఒకవేళ తెలిసిన వారెవరి వకాల్తా అయినా, పాఠకులుగా మనం వినవల్సిన అగత్యం లేదు. కానీ, గతంలో ప్రచురించబడిన కథల ఆధారంగా hypothesis వంటి కొన్ని తీర్మానాలు చేసుకోవడం ఏమంత పెద్ద పాఠాంతర దోషం కాదనుకుంటాను.

అటువంటి hypothesis ఆధారంగానే, డేవిడ్ కథలో నీరసపడిన ఉపసంహారానికి కారణాలు ఊహిస్తున్నాను:  ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో నాలుగేళ్ల క్రితం ‘కలాపి ‘ అనే కథ రాశారు సింధు మాధురి. ఐదారు పెళ్లిళ్లు చేసుకున్న ఓ polyandrous స్నేహితురాలి జీవితచిత్రాన్ని కథగా ప్రతిభావంతంగా చిత్రించారామె ఆ కథలో. అది ఆ తర్వాత వివాదాలకు దారితీయడం వేరే వ్యవహారం. కానీ, అంతకు ముందే, ఆ కథ ప్రచురించినప్పుడు దాని illustration గా protagonist రూపాన్ని నేరేటర్ సింధు మాధురి (ఫొటో ఆధారంగా ) పోలికలతో portrait గా గీశాడు ఆంధ్రజ్యోతి (మగ) ఆర్టిస్టు. ‘కలాపి’ అనే ప్రొతాగనిస్టుకి సింధు మాధురి అనే రచయిత బొమ్మ వేయడం తెలియకో, పొరబాటునో, యథాలాపంగానో జరిగింది కాదు. అటువంటి బరితెగింపుల కథానాయికగా రచయిత్రినే చేయడం వెనక సగటు మగవాడికి ఉండే photo morphing syndrome వంటిదే పనిచేసింది. ఇటీవల వచ్చిన ‘పింక్’ సినిమా పరిభాషలో చెప్పాలంటే, మగవాళ్ల రూల్ బుక్కులో అటువంటి లైంగికాంశాలు రాసే ఆడవాళ్లు ‘కొంచెం లూజు’, ఈజీగానే ‘పడతారు’!

రచన అంటేనే- అనలవేదిక ముందు అస్రనైవేద్యం; సింధు మాధురిలా లోనుంచి పెకలించుకు వచ్చే అనుభవాలను అక్షరబద్ధం చేసే రచయితల విషయంలో అయితే మరీనూ. జ్వాలా సౌందర్యాన్ని గాఢంగా కోరి, ఆ కాంతిలో ఐచ్ఛికంగా కాలి, దీపం సెమ్మ నీడలో రెక్కలు రాలిపడినా ఉపశమించని ఉసిళ్ళ మోహావేశం వంటి అనలాక్షరాపేక్ష ఉన్న ఇటువంటి రచయితలకు, అందులో ఆడవారైన పాపానికి రకరకాల రూపాల్లో, వేషాల్లో వేధింపులు ప్రతిఫలంగా ఎదురౌతుంటే ఏమవుతుంది? అక్షరానికి దాపరికం అవసరపడుతుంది, ముసుగుల పనిబడుతుంది, చివరికి సత్యాన్వేషణకి హిపోక్రసీ అడ్డుపడుతుంది.

‘… బాగా బేక్‌ అయిన కేక్‌లోకి నైఫ్‌ ‌దింపినట్టుగా ఉండే అనుభవాన్ని ఇద్దరం కలిసి చూద్దామ’ని బరితెగించి అడిగిన నెరజాణ సొంత కథే ఇది అనిపిస్తే అంటగట్టబడే vulnerabilities అన్నింటికీ వెరసి, కథతో తగుమాత్రం దూరాలు పాటించడానికే, బహుశా సింధు మాధురి ‘డేవిడ్’ కథకి నప్పనిదే అయినా, ఒక నాటకీయమైన ముగింపు ఇచ్చారని నా ఊహ. ప్రాచీన, అర్వాచీన తెలుగు సాహిత్యంలో(భారతీయ, ప్రపంచ సాహిత్యంల్లో కూడా కావొచ్చు) వినిపిస్తున్న స్త్రీ స్వరాలు- అయితే పురుషులవీ, లేకుంటే, యుగాల పురుషాధిక్య దౌర్జన్యం మీద reactionary గా పుట్టుకొచ్చిన ‘పెడసరి’ ‘గయ్యాళి’ స్త్రీవాదులవీనూ. ఎక్కడైనా అరుదుగా ఇప్పుడిప్పుడే సహజంగా వికసిస్తున్న, వినిపిస్తున్న గొంతుకల్ని కూడా నొక్కేసే దౌర్జన్యం పలు రూపాల్లో కొనసాగితే మిగిలేవి ముసుగులు, ముసురులే.

–నరేష్ నున్నా

డేవిడ్ కథను ఇక్కడ చదవొచ్చు.

మూడుపూవులు,  ఆరుకాయలు !                                                              

kathana

‘శంఖంలో పోసినవన్నీ తీర్ధమై పోయాయనట్టు’ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి.

యాదృచ్చికమే కావచ్చు నూతన ఆర్ధిక పారిశ్రామిక విధానాలు  ప్రవేశ పెడుతున్న రోజులు, ,  సింగరేణిలో నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కాలం ఒక్కసారే జరిగాయి. ఒకే ఆలోచన గల కొంతమందిమి కలిసి సింగరేణిలో ప్రవేశపెడుతున్న నూతన ఆర్ధిక విధానాలపై,  ప్రవేటీకరణలపై పిట్‌ మీటింగ్‌ పెట్టినప్పుడు,  నేటి స్థితిని ఊహించలేని కార్మికులు ఆశ్చర్యంగా,  వింతగా విన్నారు.  ప్రవేటీకరణ వల్ల సంభవించే పరిణామాలను చెప్పినప్పుడు ‘ వీళ్ళు ఇంతే,  రెటమతం’ అని కొట్టిపారేశారు.

తర్వాత,  తర్వాత పరిస్థితి విషమిస్తుండగా కార్మికులు చేసిన ప్రతి పోరాటంలో ప్రైవేటీకరణ ప్రధాన ‘అంశం’గా రూపు దాల్చింది. అప్పటి నుంచి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సింగరేణిలో ప్రైవేటీకరణ ప్రవేశ పెట్టడం మూలంగా కార్మికుల సంఖ్య ‘సగానికి’ చేరుకున్న దశలో కూడా ప్రవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలున్నాయి,  పోరాటాలు నడుస్తున్నాయి.

ఈ దశలో‘ హక్కుదార్లు’  కథ !

కథ ఉద్ధేశమల్లా సింగరేణి కంపెనీలో వచ్చిన లాభాల్లో మొత్తంలో కాదు,  పర్మినెంట్‌ కార్మికులకు కేటాయించిన కేవలం 23% లో ఎవరి వాటా ఎంత అని,  పంచుకోవాల్సిన వాళ్ళు ఎవరెవరూ అని చర్చకు పెట్టింది.  అవుట్‌ సోర్సుడు కార్మికులకు వాటా వుందని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి ?

అసలు ఈ చర్చ సమంజసమేనా ?

ఈ కృత్రిమ సమస్య సృష్టికి దారులెన్ని,  ఎక్కడి నుంచి ఎటునుంచి చూడాలి. ఇంకా మిగిలిన 77 % లాభాల  మాట ఎక్కడ దాక్కుంది. వాటిని ఎవరెవరు ఏ, ఏ రూపాల్లో అనుభవిస్తున్నారు ? కేవలం 23%  లాభాలవరకు మాత్రమే చర్చకు పెట్టి,  వాటాదారులు  ఎంత మందో తేల్చగలమా ?

అది కూడా పర్మినెంట్‌ కార్మికులకు చట్టపరంగా కలిగిన అవకాశాల మేరకు వనగూడిన వనరుల్లో ఇది ఒకటి. ఆ హక్కు వాటాలోకి కథలోని మానవీయకోణంతో  చేరాల్సిన వాటాదారులు మరి కొంతమంది వున్నారు. 1) అవుట్‌ సోర్సుడు కార్మికులు, 2) ఎక్కడినుంచైనా బొగ్గు రవాణా చేస్తే ఆ రోడ్డు పొడుగూత వుండే దుమ్ము,  ధూళితో ఇబ్బందు పాలౌతున్న గ్రామా ప్రజలు . 3) ఓపెన్‌ కాస్ట్‌ వల్ల నీటి జల ఇంకిపోయి పంటలు పండక నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్న రైతు. 4) భవిష్యత్తులో ఇంకా అనేకమంది కార్మికులకు  చెందిన 23%  లాభాల వాటాధనంలో భాగస్వాముఅవుతారు  అనడం,  లేక భవిష్యత్తులో మరెందరో ఈ గేటు ముందు తమ హక్కుల కోసం వచ్చి నిలబడతారేమో అనడం సమంజసమేనా ?

అవును ! కథలో చేప్పినట్టు అవుట్‌సోర్పుడు కార్మికులు  కష్టపడుతున్నారు, ఫలితం దగ్గర నష్టపోతున్నారు వాస్తవమే. పోరాటం చేయాల్సింది ఎవరి మీద ? పర్మినెంట్‌ కార్మికులకు, అవుట్‌ సోర్సుడు కార్మికులకు మధ్య  వైషమ్యాలను సృష్టించి సమస్య స్వరూపాన్ని మార్చిన కథ ….

యాజమాన్య స్వరంతో చెప్పబడిన కథ !

ఉదాహరణకు-

‘‘వాళ్ళలో ఏమి మార్పు వచ్చింది ?’’ (ఇక్కడ వాళ్ళు అంటే కార్మికులు) అడిగింది ప్రతిభ.

‘‘నీడ్స్‌ హైరార్కీ లో ఓ స్టెప్‌ పైకెళ్ళారు. చెప్పాలంటే ఇదివరకు ఆఫీసర్ల మానసిక స్థితికి ఇప్పుడు వాళ్ళు వచ్చారని నా కనిపిస్తుంది . ఇంకా చెప్పాలంటే టేబుల్‌కు ఆపోజిట్‌ సైడులో ఉండాల్సినవాళ్ళు రెండోవైపుకు వెళ్ళిపోయారు. ఒకప్పుడు మేనేజ్‌మెంట్‌ పని  చేయించేది అనుకుంటే కార్మికులు పని చేసేవారు. కొద్ది  మినహాయింపుతో ఇప్పుడు సంస్థ ఉద్యోగులంతా పని చేయించేవాళ్ళయ్యారు. అవుట్‌ సోర్సుడ్‌ కార్మికులు  పని చేస్తున్నారు.  మీరు గమనించే వుంటారు,  ఎలెక్టయిన యూనియన్‌ నాయకులు  ఆల్‌ మోస్ట్‌ ఒక డైరెక్టర్‌ హోదానే అనుభవిస్తున్నారు. ఎస్‌. యూ.వీ ల్లో తిరుగుతూ,  ఒక ప్రజా ప్రతినిధికో, పెద్ద కాంట్రాక్టరుకో తీసిపోనట్టు ఆకారం,  డ్రెసింగ్‌,  బాడీ లాంగ్వేజ్‌ తో, అనుచర గణంతో కన్పిస్తున్నారు.’’

ఇదండీ అసలు కథ .

అంటే సింగరేణీ కంపెనీలో కార్మికులు,  యాజమాన్యం(అధికారులు) కలసి పని చెప్పి,  అవుట్‌ సోర్సుడు కార్మికులతో పని చేయిస్తున్నారు. వీళ్ళు పనిచేయడం మూలంగానే కంపెనీ లాభాల్లో వుంది . అవుట్‌ సోర్సుడు కార్మికుల  నోరు కొట్టి పర్మినెంట్‌ కార్మికులు  మాత్రమే వచ్చిన లాభాలన్నీ దండుకుంటున్నారనే గదా –

ఇట్లా ఎక్కడైనా,  ఏ పబ్లిక్‌ సెక్టార్‌లోనైనా జరిగిందా ? జరుగుతుందా ? ఆశ్చర్యకరం.

కథలోని సారమంతా కంపెనీలోని కార్మికులు పని చేయడంలేదు. దర్నాలాంటి సమయాల్లో కూడా కంపెనీ అధికారులను, ఆఫీసు గేట్లు మూసి లోనికి పోనీయకుండా చేసినప్పటికీ చెట్ల కిందనే కూర్చొని తమ వెంటవున్న  ల్యాప్‌టాపుల్తో ఆఫీసు పనిగంటలు నష్టపోకుండా ఆఫీసు పని బయటినుంచే చేస్తున్నారు. గనుల్లో అవుట్‌ సోర్సుడు కార్మికులు  పని చేస్తున్నారు. అందుకే కంపెనీ గత పదేళ్ళుగా లాభాల్లోవుంది. ఆ లాభాలను పర్మినెంట్‌ కార్మికులు అన్యాయంగా పొందుతున్నారు. న్యాయంగా రావాల్సిన వాళ్ళకు వాటా ధనంలో భాగం ఇవ్వటం లేదు. అని కధలో చాలా వివరంగా వుంది.

చూడండి ఒక పాత్రతో ఎంత స్పష్టంగా అనిపిస్తారో….

‘‘ఆ….అవును..కిందపడ్డ చిక్కుడు గింజను సైతం పంచుకు తింటాం అంటారు. మీరు చాలా ఆశ  పడుతున్నారే !’’ అంది ప్రతిభ. ఈ మాటల్లోని వ్యంగ్యం ఎవరికైనా అర్దమౌతుంది. ఇట్లా కథలోని ప్రతి అంశాన్ని చూస్తే అనేకం కన్పిస్తాయి. స్పష్టంగా చెప్పాలంటే యాజమాన్య దృష్టి కనిపిస్తుది.

‘‘ హక్కుదార్లు’’ కథ రాసిన రఘువంశీ రచనలో బాగా చేయి తిరిగినవారవడం,  తన రచనా శైలీ,  నైపుణ్యంతో చాలా విషయాలు  గోప్యంగా చేప్పారు. భారతదేశంలో పబ్లిక్‌ సెక్టార్లు పనికిరావు,  అంటే సింగరేణి, ఆర్‌.టి.సి తదితరాలు వల్ల అభివృధ్ధి వుండదు, నష్టాలు చవి చూట్టమే తప్ప మరోటి కాదు,  ప్రత్యామ్నాయంగా ప్రైవేటీకరణే శరణ్యం. ప్రైవేటు కాంట్రాక్టర్ల చేతుల్లో దేశం సుభిక్షంగా వుంటుంది,  అభివృద్ధి కాబడుతుందని చెప్పకనే చెప్పారు.

ఈ దేశానికి అంబానీ,  బిర్లా అభివృద్ధి గొడుగు నీడ క్రింద మనుగడే రక్షణ కల్గిస్తుందనే అభిప్రాయానికి రావచ్చు.

ఇకపోతే-

నలుగురు కంపెనీ అధికారులు(కార్మికులకు పని చెప్పగలిగే అధికారం వున్న ఏ నలుగురైనా) కల్సి వున్నప్పుడు,  కార్మికుల్ని ఉద్ధేశించి మాట్లాడుకునే ధోరణి ఇలానే ఉంటుంది. వారి పట్ల అధికారుల పరిభాష అనొచ్చునేమో !? అభిప్రాయాలు కూడా –

యాజమాన్య దృష్ఠితో ఆలోచించినప్పుడు,  కార్మికులందరూ ఇలానే కన్పిస్తారు. పూర్తిగా ఏకపక్షంగా, యాజమాన్య దృష్టితో రాసిన కథ. ప్రైవేటీకరణని,  కాంట్రాక్టీకరణని భుజాన మోసి రాసిన కథలానే వుంది.

ఈ కథ గురించి ఎ.కె. ప్రభాకర్‌ గారు ‘ సారంగ’వెబ్‌ మ్యాగ్‌జైన్‌‘  లో చెప్పినట్టు  కార్మిక నాయకులు వర్గసృహ కోల్పోయారని,  వాళ్ళ వర్గాల  స్వభావమే మారిపోయిందని రచయిత రవిప్రసాద్‌ ముఖతః  చెప్పిన మాటల్లో నిజం  బాధించినప్పటికి అతని విమర్శనాత్మకత దృష్టిని కాదనలేం.’’ అని సరి పెట్టుకుందామా ?

అట్లా సరిపెట్టుకోవాలన్నా రచయిత విమర్శనాత్మకత దృష్టి కథలో ఎక్కడా కన్పించదు. పూర్తిగా ఒన్‌సైడ్‌ వకాల్తా పుచ్చుకొని రాసిన కథ మాత్రమే. ఈ కథ ఇట్లా రాయడానికి బాహ్య కారణాలు  వేరేవి అనేకం ఉండవచ్చు.

ఏ.కె. ప్రభాకర్‌గారు కథ మీద అభిప్రాయం రాస్తూ,  ఓ చిన్న కథను ఉదహరించారు. సింగరేణిలాంటి పబ్లిక్‌ సెక్టార్‌ను తుడిచేసుకుంటూపోతే,  ప్రైవేట్‌ కంపెనీల్లో కొద్ధిమంది కార్మికులతో ‘ వెట్టి’ చాకిరీ చేయించుకుంటూ, అధిక ఉత్పత్తి చేసుకుంటూ  పోతే….., 125 కోట్ల జనాభావున్న మనలాంటి దేశంలో పైన ఉదహరించిన కథలాంటి  ‘కథా వస్తువుకు’’ కొదువ వుండదు. మూడుపూవులు…  ఆరుకాయలే .

 

 

మన కథల తొలి ఆనవాళ్ళు

kathana

 

 

vadrevuప్రాచీనకాలంలోకథఎప్పుడుపుట్టిఉంటుంది? కఠినమైనప్రశ్న. మనంహోమోసెపియన్స్ గా  పిలుచుకునే ప్రస్తుతమానవజాతి రెండులక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికాలో తలెత్తింది. 1,70,000 సంవత్సరాలకిందట మనుషులు దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. 82 వేల సంవత్సరాల కిందట సముద్రపుగవ్వలతో ఆభరణాలు ధరించినట్టు ఆధారాలుదొరుకుతున్నాయి. 77 వేలసంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాగుహల్లో గీసిన చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. 40 వేలసంవత్సరాల కిందట స్పెయిన్ లో అల్టామీరాగుహల్లో చిత్రించిన ఆదిమగుహాచిత్రాల్లో జంతువులతోపాటు, మనిషిబొమ్మలు కూడా దర్శనమిస్తున్నాయి. భారతదేశంలో మధ్య ప్రదేశ్ లో వింధ్యపర్వతశ్రేణిలోని భీం భేట్క గుహలు పదిచదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు ఎనిమిదివందలశిలాశ్రయాలతో 500 పైగా చిత్రలేఖనాలతో అతిపెద్ద ప్రాచీనమానవనివాససముదాయంగానిలబడుతున్నాయి.40వేల సంవత్సరాలనుంచి మానవుడిఆలోచనలో ప్రపంచాన్నిగుర్తించి,తిరిగిదాన్నితనకోసంతాను చిత్రించుకునే క్రమంలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని మనం అంగీకరిస్తే, క్రీ.పూ. 3,200 నాటికి సుమేరియన్లు రాయటం మొదలుపెట్ట్టినదాకా దాదాపు 30-40 సహస్రాబ్దాలపాటు మానవుడు తనకోసంతాను ఎటువంటి కథలు చెప్పుకుని ఉంటాడు?

మనిషి రాయడం మొదలుపెట్టినప్పటినుంచి మానవచరిత్రలో చారిత్రకయుగం మొదలయ్యిందని మనం చెప్పుకుంటున్నాం. అంతకు పూర్వం ఉన్నదంతా చరిత్రపూర్వయుగం. దాన్నికూడా మనం పాతరాతియుగంగా, కొత్తరాతియుగంగా కాలమానంతో గుర్తించుకుంటున్నాం. 2,00,000 నుంచి 70 వేల సంవత్సరాలదాకా మధ్యపాతరాతియుగంగా, 50 వేలనుంచి 21 వేల సంవత్సరాలదాకా కొత్తపాతరాతియుగంగా, 20 వేలనుంచి 10 వేల సంవత్సరాలదాకా మధ్యరాతియుగంగా గుర్తిస్తున్నాం. కొత్తరాతియుగం 10 వేలసంవత్సరాల కిందట, అంటే, క్రీ.పూ. 8,000 కాలంలో మొదలయ్యిందనుకుంటే, అప్పుడే మెసొపొటేమియాలో వ్యవసాయంమొదలయ్యిందనీ, దాదాపుగా పట్టణనిర్మాణం కూడా మొదలయ్యిందనీ మనం చెప్పుకుంటున్నాం. క్రీ.పూ. 6,000 సంవత్సరాల కాలంలో భూతాపం  చల్లారి మానవుడు జీవించడానికి మరింత సానుకూలమైన వాతావరణంఏర్పడిందనీ, క్రీ.పూ. 3,300 నాటికి కాంస్యయుగం మొదలయ్యిందనీ చరిత్ర రాసుకున్నాం. కొత్తపాతరాతియుగం నుంచి కాంస్యయుగం దాకా మానవుడు జీవించిన జీవితం అత్యంతనాటకీయమైన, ఉత్కంఠభరితమైన, తీవ్రసంగ్రామసంక్షుభితమైనకాలం. ఆ  కాలమంతటా తనచుట్టూ ఉన్న ప్రాకృతికశక్తులతో తలపడుతూ మనిషి తనను తాను ఒక సాంఘికజీవిగా తీర్చిదిద్దుకునే క్రమంలోఅగ్ని,  ధనుర్బాణాలు,  బండిచక్రం అతడికి ఎంత సహకరించాయో అంతకన్నాకూడా కథ అతడికి ఎక్కువ దోహదపడిందని ఇప్పుడిప్పుడే  మనం గ్రహించగలుగుతున్నాం.

తక్కిన జంతువుల నుంచి మానవుణ్ణి వేరుచేసే అద్వితీయసామర్థ్యాల్లో అత్యంత అద్వితీయసామర్థ్యం కథలు చెప్పుకునే సామర్థ్యమే. మానవుడి మెదడు కుడి ఎడమ భాగాలుగా విడివడి ఉంటుందని మనకు తెలుసు. అందులో ఎడమ భాగంలోని ‘ఇంటర్ ప్రెటర్ ’ మానవుడి అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీకథలుగా అల్లుతుందనీ, అనువదిస్తుందనీ ప్రసిద్ధన్యూరోశాస్త్రవేత్త మైఖేల్ గజానిగ అంటున్నాడు. మానవుడి గ్రహణసామర్థ్యాల్లోనూ, ప్రజ్ఞానసామర్థ్యంలోనూ కథలుచెప్పేవిద్య అన్నిటికన్నా ప్రత్యేకమైన సామర్థ్యమని విజ్ఞానశాస్త్రం చాలాకాలం కిందటే గుర్తించింది. మన జ్ఞాపకాల్ని ఒక కాలక్రమంలో గుర్తుపెట్టుకోవడంలోనూ, గుర్తుకుతెచ్చుకోవడంలోనూ మనిషి ఉపయోగించే సామర్థ్యం కథనసామర్థ్యమే. అంతేకాదు, ఆ జ్ఞాపకాల్ని గుర్తుతెచ్చుకునేటప్పుడు మధ్యలోఉండే ఖాళీల్ని పూరించడానికి జరగని విషయాలుకూడా జరిగినట్టుగా తనకుతాను చెప్పుకునే నేర్పు కూడా మానవుడి మెదడుకి ఉంది. ఇట్లా లేనిదాన్నికల్పించగలిగేశక్తి బహుశా ఈ మొత్తం జీవజాలంలో మనిషికి మాత్రమే సొంతం.  ఈ సామర్థ్యం వల్లనే మనిషి మానవుడుగా మారుతున్నాడు.

తనకు సంభవించిన అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ మళ్లా గుదిగుచ్చుకోవడంలో అక్కడక్కడా మధ్యలో ఉన్నఖాళీల్ని పూరించడానికి లేనిదాన్ని కూడా జరిగినట్టుగా మానవుడు ఎందుకు ఊహించుకుంటాడు? దానికి ప్రధానమైన కారణం, మానవుడికి యథార్థాల్నిశకలాలుగా తిరిగి గుర్తుకుతెచ్చుకోవడంకన్నా, ఆ యథార్థాలను సమగ్రంగా తిరిగి తనకైతాను చిత్రించుకోవడం ముఖ్యం. అటువంటి సమగ్రచిత్రణ మానవుడి మెదడును తృప్తిపరుస్తుంది. అట్లా చిత్రించుకునేటప్పుడు మానవుడిలో ఒక ఉద్దీపన కలుగుతుంది. మామూలుగా జరిగిన సంగతులు జరిగినట్టుగా లెక్కవేసుకోవడంలో మానవుడి మెదడులోని ‘బ్రోకా’ భాగమూ, ‘వెర్నిక్’ భాగమూ మాత్రమే సంచలిస్తాయి. దుకాణం ముందు రాసిఉన్న ధరలపట్టిక చూసినప్పుడు మానవుడి మెదడులో ఆ రెండుభాగాలు మాత్రమే సంచలించి ఊరుకుంటాయి. కాని ఆ జాబితాను తన దగ్గరున్న సొమ్ముతో పోల్చి చూసుకోగానే మానవుడి మెదడు ఊహించలేనంతగా ఉద్దీప్తమవుతుంది. ఒక సాధారణ వార్త విన్నప్పటికన్నా ఒక రూపకాలంకారాన్ని విన్నప్పుడు మనిషి మెదడు మరింత ప్రజ్వలిస్తుంది.

ఇట్లా ప్రజ్వలించడానికిగల కారణాల్నిపరిశోధిస్తున్నన్యూరోసైంటిస్టులు ఇప్పుడు’న్యూరోఈస్తటిక్స్’ అనే కొత్త అధ్యయనాన్నిమొదలుపెట్టారు. ఈ అధ్యయనంలో విశేషమైన కృషిచేస్తున్న వి.ఎస్. రామచంద్రన్ మన మెదడులో, ముఖ్యంగా, దృష్టికి సంబంధించిన భాగంలోని న్యూరాన్లను ఉద్దీపింపజేసేపదిలక్షణాల్నిపేర్కొన్నాడు. వాటిలో ముఖ్యమైన ఒక లక్షణాన్ని ‘పీక్ షిఫ్ట్’ గాగుర్తిస్తున్నారు. 1950 ల్లో నికోటింబర్గన్ అనే శాస్త్రవేత్త సముద్రపక్షుల మీద కొన్ని ప్రయోగాలు చేశాడు. అందులో ఆ పక్షులు తమ కూనలకి ఆహారం తినిపించేటప్పుడు ఆ చిన్నికూనలు ఆ పక్షులముక్కుల్ని తాడిస్తుండటం చూసాడు. టింబర్గన్ ఆ పక్షుల ముక్కుల్ని పోలిన చిన్నచిన్నపుల్లలకి చివర ఎర్రటిచుక్కపెట్టి ఆ పక్షికూనలకు చూపించినప్పుడు అవి ఆ పుల్లల్నికూడా తాడించడం మొదలుపెట్టాయి. అప్పుడతడు ఆ పుల్లలమీద మూడు ఎర్రటిచుక్కలు చిత్రించి చూపించాడు. అశ్చర్యంగా, ఆ పిల్లలు మరింత ఉద్రేకంగా ఆ పుల్లల్నితాడించడం మొదలుపెట్టాయి. దాన్నిబట్టి ఆ శాస్త్రవేత్త రాబట్టిన ప్రతిపాదన ఏమిటంటే బయటప్రపంచంలో మనని ఉద్రేకించే విషయాలు వాటిని వక్రీకరించేకొద్దీ (డిస్టార్ట్) మనని మరింతగా ఉద్రేకిస్తాయనేది .

ఆదిమ మానవుడు తనకళలోనూ, తనప్రజ్ఞానంలోనూ కూడా ఈ సూత్రాన్నేపాటించాడని రామచంద్రన్ ప్రతిపాదిస్తాడు. అంటే మనిషి తనకు సంభవిస్తున్నఅనుభవాల్నిపొదువుకునే క్రమంలో తనను మరింత ఉద్రేకిస్తున్నఅనుభవాలను మరింతగా పొదువుకుంటాడనీ,  తిరిగి వాటిని గుర్తుచేసుకునేటప్పుడు వాటిలో తనను బాగా ఉద్రేకించినవాటిని మరింతగా గుర్తుచేసుకుంటాడనీ మనం భావించవచ్చు. తన అనుభవాలకీ, జ్ఞాపకాలకీ ఒక సమగ్రత సంతరించుకునే క్రమంలో మనిషి వాటిని ఒక కథగాపునర్నిర్మించుకుంటున్నప్పుడు, అవసరమైతే వాటి వరుసక్రమాన్నీ, యథార్థాన్నీ కూడా వక్రీకరించి చెప్పుకుంటాడు. అట్లా చెప్పుకునేటప్పుడు జరిగిన యథార్థాన్నిపక్కనపెట్టి జరగనిదాన్ని జరిగినట్టుగా చెప్పుకోవడానికి కూడా వెనుకాడడు. ఆ వక్రీకరణలో అతడు చూసేది మొత్తం వాస్తవాన్నితిరిగి మెనూకార్డు లాగా గుర్తుచేసుకోవడం కాదు. అందుకు బదులు ఆ జరిగిన సంఘటనలో తనను ఉద్రేకించిన రంగునీ, రుచినీ, సువాసననీ మరింత పెద్దవిచేసి, వాటిని మరింతగా తలచుకోవడం ద్వారా తననుతాను ఉద్దీపింపచేసుకోవడం. ఆ ఉద్దీపనలో అతడి మెదడు ఉద్దీప్తమై తద్వారా సంతోషాన్నిఅనుభవిస్తుంది. తన మెదడు పొందే సంతోషాన్నిఅతడొకప్రాణిగా, తన సంపూర్ణఅస్తిత్వంతో స్వీకరించి, సంతోషిస్తాడు.

ఇలా ఒక మనిషి ఉద్దీపన చెందుతున్నప్పుడు ఆ మనిషిని చూస్తున్న మరొక మనిషి కూడా అటువంటి ఉద్దీపనకే లోనవుతున్నాడు. దానికి కారణం మనిషి మెదడులోఉండే ‘మిర్రర్ న్యూరాన్లు’ అని న్యూరోసైంటిస్టులు చెప్తున్నారు. మిర్రర్ న్యూరాన్ల వల్ల ఒక మనిషి తనకు కలుగుతున్నబాధను గ్రహించడమేకాక, అదే పరిస్థితుల్లో ఎదుటిమనిషికి కలుగుతున్నబాధకికూడా అంతే తీవ్రంగా స్పందించగలుగుతున్నాడు. న్యూరాన్లకు స్వపరభేదం లేదు.

అందువల్ల ఒక మనిషి తాను పొందే సంతోషాన్నిమొత్తం తెగకీ, జాతికీ, తన చుట్టూ ఉంటే మానవసమూహమంతటికీ కూడా అందించడానికి ఉత్సాహపడటమే ప్రాచీనకళాస్వభావం, కథాస్వభావం. అందుకనే, ప్రాచీనమానవుడి కళారహస్యానికి అత్యంతసమీపంగా ప్రయాణించగలిగిన ఆధునికచిత్రకారుడు పికాసో  ‘అసత్యం ద్వారా సత్యాన్ని వెల్లడిచేయడమే కళ’ అన్నాడు.

ప్రాచీనగుహాలయాల్లో, స్పెయిన్ నుంచి ఆస్ట్రేలియా దాకా మానవుడు చిత్రించిన చిత్రలేఖనాల్లో ఈ కథనస్వభావాన్ని మనం గుర్తుపట్టవచ్చు. ఆ చిత్రలేఖనాల్లోని అడవిదున్నల కాళ్లు సన్నగా ఉంటాయి. కానీ మాంసపరిపుష్టమైన వాటి దేహాలు మాత్రం పరిపూర్ణవికాసంతో కనిపిస్తాయి. ఖడ్గమృగాలంటే కొమ్ములే. ఎలుగుబంట్లు బాగా బలిసి కనబడతాయి. మానవుల్ని చిత్రించడంలోనూ ఇదే ధోరణి. ప్రాచీన స్త్రీప్రతిమల్నిచూడండి, వాటిలో బాగా పరిపుష్టంగా ఊగే వక్షోజద్వయం, పెద్ద కడుపులు, కొట్టొచ్చినట్టు కనబడే స్త్రీజననేంద్రియాలు. ఆ ప్రతిమలకు కాళ్లూ, చేతులు, తల ముఖ్యంకావు. 25 వేల సంవత్సరాల కిందట మానవుడి దృష్టిలో స్త్రీ అంటే రతి, ప్రత్యుత్పత్తి, పుష్కలత్వం. అంతే. ఆ స్త్రీప్రతిమను చూడగానే ఆ మానవుడికి అతడి తెగకీ కూడా అవిచ్ఛిన్నసంతానక్రతువూ, ఆశావహమైన భవిష్యత్తు సాక్షాత్కరించేవి.

మానవుడి మెదడులోని కుడిభాగం విషయసేకరణకు సంబంధించింది కాగా, ఎడమభాగం ఆ విధంగా సేకరించినవిషయాల్నిబట్టి మానవుడికొక కథ అల్లిపెడుతుందని గమనించిన న్యూరోసైంటిస్టులు మరొకవిషయం కూడా గమనించారు. అదేమంటే, రకరకాల సందర్భాల్లో మానవుడిమెదడు దెబ్బతిన్నప్పుడు లేదా మెదడులోని రెండుభాగాల మధ్య పరస్పరసంకేతాలు తెగిపోయినప్పుడూ కుడిభాగంనుంచి సంకేతాలు అందినా అందకపోయినా ఎడమభాగం ఏదో ఒక విధంగా ఆ ఖాళీల్నితనకైతాను పూరించుకుని ఏదో ఒక విధంగా తన ముందున్న ప్రపంచాన్ని లేదా తాను లోనవుతున్నఅనుభవాల్నీఏదో ఒక విధంగా వివరించడానికి ప్రయత్నిస్తుంది. కనుకనే ప్రసిద్ధరచయిత జొనాథన్ గాడ్షాల్ మనిషిని ‘ద స్టోరీటెల్లింగ్ ఏనిమల్’ అన్నాడు. అతడిట్లారాశాడు:

‘పరిణామక్రమం మనకి కాలక్రమంలోమన మెదడు లోపల ఒక షెర్లాక్ హొమ్స ని రూపొందించింది. ఎందుకంటే ఈప్రపంచం (ఇతివృత్తాలు, సమస్యలు, సంఘటనలు, కార్యకారణసంబంధాలుమొదలైనవాటితో) పూర్తిగా కథామయం. కారణాల్నీ, కథల్నీవెతకడంలో ఒక ప్రయోజనంఉంది. మానవుడు పరిణామక్రమంలో స్థితిగతులకు తగ్గట్టుగా తనను తాను సర్దుబాటు చేసుకునే క్రమంలో కథలు చెప్పేమనస్సు కూడా ఒక ప్రాకృతికఅవసరంగా రూపొందింది. దానివల్ల మనం మన జీవితాల్నీ, సువ్యవస్థితంగానూ, సార్థకంగానూ అర్థంచేసుకునే అవకాశం లభిస్తున్నది. జీవితం తెంపులేని రణగొణధ్వనిగానూ, సంక్షోభంగానూ కాకుండా మనను కాపాడుతున్నది.

అయితే కథలు చెప్పేమనస్తత్వం పూర్తిగా పరిపూర్ణమైనది కాదు. మానవుడి మెదడులోని ఎడమభాగంలో కథలల్లేభాగాన్ని దాదాపు ఐదుదశాబ్దాలపాటు పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, మనలోని ఈ చిన్నమానవుడు నిజంగానే ఎంతో విలువైనవాడే అయినప్పటికీ, చతురుడు, కట్టుకథలల్లేవాడు కూడానని మైఖేల్ గజనిగ భావించాడు. ఎందుకంటే మానవుడిలోని కథలల్లే మనస్తత్వం అనిశ్చయాన్నీ, యాదృచ్ఛికతనీ, కాకతాళీయతనీ భరించలేదు. దానికి ఏదో ఒక అర్థంకావాలి. అట్లా అర్థంచేప్పుకోవడానికి అది అలవాటు పడిపోయింది. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న వివిధవిషయాల మధ్య సార్థకమైన అమరికక నిపించకపోతే అది దాన్ని తనంతటతనుగా ప్రపంచం మీద ఆరోపించడాని కివెనుకాడదు. క్లుప్తంగా చెప్పాలంటే, కథలు చెప్పేమనస్సు ఎంత వీలయితే అంత నిజమైన కథలు చెప్తుంది. అట్లా చెప్పలేనప్పుడు అబద్ధాలు కూడా చెప్తుంది.

ఇట్లా తనముందు కనిపిస్తున్నవాటికి ఏదో ఒక అర్థంచెప్పుకోవడానికి ప్రయత్నించడంలోనూ, అటువంటి అర్థం స్పష్టంగా గోచరించనప్పుడు తానే ఏదో ఒక అర్థాన్నిఆరోపించి చెప్పడంలోనూ, మానవుడు తొలికథకుడుగా రూపొందాడని మనం ఊహించవచ్చు.

అటువంటి తొలికథలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే, మనం చరిత్రపూర్వయుగంలోకి,  అంటే ఇప్పటికి ఐదువేలసంవత్సరాలువెనక్కివెళ్లాలి.  ప్రపంచమంతటా నేడు అన్నిజాతుల్లోనూ లిఖితవాఙ్మయానికి సమాంతరంగా మౌఖికవాఙ్మయం కూడా ప్రచలితంగా కనిపిస్తున్నది. దీన్ని మనం ‘ఫోక్ లోర్’ అని పిలుస్తున్నాం. కానీ ఈ ఫోక్ లోర్ మీద చరిత్రయుగపు మానవుడిభావజాలం, లిఖిత వాఙ్మయప్రభావం కూడా గణనీయంగా ఉన్నందువల్ల ఈ మౌఖికవాఙ్మయం ఆధారంగా మనం ఆదిమానవుడి తొలికథల్నిగుర్తుపట్టడం కష్టం. ఇటువంటి ప్రభావాలకు అతీతమైన తొలికథల్నిగుర్తుపట్టాలంటే నాగరికమానవుడి నీడ పడని ఆదిమమానవసమూహాలకథల్నిఅన్వేషించాలి. కానీ ఆ కథలు రాతపూర్వకంగా మనకు లభ్యంకావడంలేదు కాబట్టి, మనం చేయగలిగిందల్లా ఆనాటి మానవుడు జీవించిన జీవితానికి సన్నిహితంగా ఉండే జీవనసరళితో జీవిస్తున్న వివిధ మానవసమూహాల కథల్నిఅధ్యయనం చేయడం. ప్రపంచమంతటా అక్షరపూర్వ జీవనవిధానాన్ని అనుసరిస్తున్నఅనేకఆదిమజాతులు చెప్పుకునే కథల్లో మనకు చరిత్రపూర్వయుగం నాటి మానవుడు చెప్పుకున్నకథల తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆఫ్రికాలోని బుష్ మన్లు, జపాన్ లోని ఐనూలు, ఆస్ట్రేలియాలోని వార్లిపిరి, నర్రిన్యేరి తెగలు, పసిఫిక్ మహాసముద్రద్వీపాల్లోనివసించే టికోపియా, ఇఫలుక్ తెగలు, తూర్పుదీవుల్లోని రాపానుయి తెగ, ఆనవాళ్లులేకుండా అంతరించిపోయిన టాస్మేనియన్లు, యమానవంటి మానవసమూహాల కథల్లో మానవుడి తొలికథల పోలికలు కనిపిస్తాయి.

గత రెండుశతాబ్దాలుగా మానవశాస్త్రజ్ఞులు, భాషాశాస్త్రజ్ఞులు, అన్వేషకులు చేస్తూ వచ్చిన వివిధ పరిశోధనలద్వారా, అధ్యయనాల ద్వారా, తులనాత్మక అధ్యయనాల ద్వారా మనకు అటువంటి కథల ప్రాథమికరూపాల గురించి స్థూలమైన అవగాహన లభిస్తున్నది. ఆంద్రేజోల్స్ అనే ఒక కళాచరిత్రకారుడు వీటిని ‘సరళరూపాలు’ అన్నాడు. అతడి ప్రకారం ఆ సరళరూపాలు పురాగాథ, వీరగాథ, పురాణగాథ, పొడుపుకథ, సుభాషితం, ప్రామాణికగాథ, స్మృతి కథ, జానపదకథ, ఛలోక్తీను.

 

(కథలో  సంక్లిష్టత…వచ్చే  నెల)

మరి కొన్ని ప్రాతినిధ్యాలు…!

 katha

saipadmaగాలికీ కులముంది – కధా క్రమంబెట్టి దనిన

 -సాయి పద్మ
ఈ కధ ఎందుకు రాసాను ? అంటే – రాయకుండా ఉండలేక రాసాను. నన్ను చిరాకు పెడుతూ, ఏడిపిస్తోంది కాబట్టి, వదుల్చుకోవటానికి రాసేను. ఇది నాకు చాలా దగ్గరైన వొక దళిత అమ్మాయి నిజ కధ. చాలా కాలం వరకూ ఆమె ఎస్సీ అని నాకు తెలియదు. మాట్లాడుతూ ఉండేది. వొక్కోసారి దుఃఖంగా, వొక్కోసారి సంతోషంగా.. పిల్లలు కావాలి అన్న కోరిక విపరీతంగా ఉండేది. పిల్లల కోసం ఎవరేం తాయత్తు, మహిమ, మంత్రం ఉంది అన్నా, వెళ్ళిపోతూ ఉండేది. చాలా సార్లు సున్నితంగా కపుల్ కౌన్సెలింగ్ ఇలా చెప్పినా , ఏమీ మాట్లాడేది కాదు. వాళ్ళాయన రాడేమో అనుకోని వూరికొనే దాన్ని. నాకు తెలిసిన ఐ వీ ఎఫ్ సెంటర్ల గురించి చెప్పాను, వోకదానికి వెళ్లి ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేసింది కూడా. తర్వాత ఏమైందో తెలీదు. చాలా కాలం గ్యాప్ తర్వాత, వొకసారి ఫోన్ చేసి ఏడ్చింది. వాళ్ళ అత్తగారు, తాను కడిగిన గిన్నెలు మళ్ళీ కడుక్కొని పెట్టుకుంటుంది అన్నది, చాదస్తం ఏమోలే అంటే.. కాదక్కా , నేను తక్కువ జాతి దాన్ని కదా అంది. జాతి అంటారు, కులం కూడా కాదు అంటూ ఏడ్చింది. అయ్యో.. ఇంత చదువుకున్నావు బాధపడకు అంటే, వాళ్ళాయన దగ్గరకి తీసుకుంటూ.. ఇలా ఉంటె చాలదా.. నీతో పిల్లలు అంటే మళ్ళీ అదో వారసత్వపు గోల అన్నాడు అని.. కుళ్ళి కుళ్ళి ఏడ్చిన ఆ స్వరం ఇప్పటికీ నన్ను భయపెడుతూనే ఉంది.
నిజ కథలో క్లైమాక్స్ ఏంటి అంటే, వాళ్ళాయన తన కులపు అమ్మాయి, మరదలు వరస ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు. ఈ అమ్మాయి, రిజర్వేషన్ ఉపయోగించుకొని వచ్చిన, రాజకీయ పదవి, అనధికారంగా అనుభవిస్తున్నాడు. తోటలో ఇంట్లో, వొంటరిగా , మధ్యలో మొగుడు, ఉంచుకున్న వాడిలా వచ్చిపోతూ ఉంటె, తన వరకూ నగలు, చీరలు చూసుకొని త్రుప్తి పడుతోంది ఆమె. నాతో మాట్లాడినా ముభావంగా ఉంటుంది. పిల్లల కోసం ప్రయత్నించటం మానేసింది. చదువుకోమన్నాను. పీహెచ్డీ మొదలెట్టింది.
నాకే, ఇంకా ఆశ చావక మనుషుల మీదో, సమాజం మీదో, ఆమె గెలవాలన్న కసితో, క్లైమాక్స్ మార్చాను. ముఖ్యంగా థాంక్స్ చెప్పుకోవాల్సింది, రవీందర్ వీరేల్లి గారికి, ఈ కదా వాకిలి లో వేసేముందు, పాపం, సహనంగా నన్ను భరించి, కథని అక్కడక్కడా ఎడిట్ చేయటమే కాకుండా మంచి సూచనలు ఇచ్చారు. ఇంకో పెద్ద థాంక్స్ సామాన్య కిరణ్ గారికి, ఏ కధా సంకలనం లోనూ నా కదా రాలేదు, నా కథలు ఎవరికీ నచ్చవేమో అనుకోనేదాన్ని, ఈ కథ కావాలని అడిగి, ప్రాతినిధ్య లో వేసుకున్నందుకు భలే సంతోషంగా ఉంది.
ప్రాతినిధ్యం గా నిలుస్తున్న , అందరు, రచయిత్రులకీ, రచయితలకీ శుభాకాంక్షలు
~~

సీమ అస్తిత్వానికి  చిన్న చోటు

vijaykumar viktar

-విజయ్ కుమార్ 

 

‘ మూడ్రాల్ముక్రాయ్ ‘ నా మొదటి కథ. రచయితగా వేషం వేసుకున్నాక బయటపడిన మొదటి ప్రాడక్ట్ అది. పశ్చిమ కర్నూలు ప్రాంత నేపథ్యం లో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థలో బతికే ఒక యువ జంట ప్రేమ చుట్టూ ఈ కథ ఉంటుంది. ఒక్క రాయలసీమ ప్రాంతం లోనే ఎన్నో డైలెక్ట్స్ ఉన్నాయి. బహుశా ఈ ప్రాంత వ్యావహారిక శైలిలో కథ రావడం ఇది ప్రథమం అనుకుంటున్నా. ఈ కథ ‘ కినిగె ‘ లో ప్రచురణమయ్యింది. మెహర్ గారు నాకు ఇందులో సూచించిన కొన్ని చిన్న చిన్న సలహాలతో ఈ కథ లో డిక్షన్ మార్చడం జరిగింది. అందుకు ఈ సందర్భంగా మెహర్ గారికి కృతజ్ఞతలు  చెప్పుకోకుండా ఉండలేక పోతున్నా.

మాదేవి ఈ కథలో కథానాయిక. ఈ కథ తర్వాత నేను ‘ మా ఊర్ల పాకిస్తానోల్లు ‘ ( కినిగె) ; ‘ బతుకు తునకలు ‘ ( వాకిలి) ; ‘చిల్లర నాణేలు ‘ ( వాకిలి ) లో కథలు రాశాను. ప్రతి కథలోనూ ‘ మాదేవి ‘ అనే ఒక కేరక్టర్ కేమియో గా ఉంటుంది. ఎందుకంటే ‘ మా దేవి ‘ పాత్ర ఈ కథలో స్వచ్చమైన ప్రేమకు , కన్సర్న్ కు తార్కాణంగా ఉండిపోయిందని నా నమ్మకం. ఈ కథ లో మాదేవి కి ముక్రాయి ( ముక్కు పుడక ) బాగుంటుంది అన్న వీరేశు కాంప్లిమెంట్ మీద సాగిపోయే కథ ఇది.

సాహితీ రంగం నా ప్రధాన స్రవంతి కాకపోవడం వలన ఏమో ఎప్పుడో విన్నాను తప్ప సామాన్య గారి నాకు పరిచయం లేదు. మంచి కథలను ప్రోత్సాహిద్దాం అనే ఆమె తలపు అభినందనీయం. నిజానికి ఈ తెలుగు సాహితీ రంగం లో ఎంతో అసంబద్ధత, ఎన్నో తారతమ్యాలు ఉన్నాయనే నా బలమైన భావనతో నేను ఎక్కువగా ఇంగ్లీషు రచనలకు పరిమితమయ్యాను. అటువంటి సమయం లో సామాన్య గారు తనే ఇనీషియేటివ్ తీసుకుని నాకు ఫోన్ చేసి కథను ప్రచురణకు స్వీకరించి ప్రోత్సహించడం వ్యక్తిగతంగా నాకు ఆనందకరమే కాదు సంభ్రమం కూడా కలిగించింది. సారంగ తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియ జేసుకుంటూ , రాయలసీమ అస్తిత్వానికి సాహిత్యం లో చిన్న చోటు అయినా కలిపించడం తెలుగు సాహిత్య ప్రగతి వాద పథం లో విధివిహితమైనది అని గుర్తించవలసిందిగా ప్రతి సాహితీ వేత్తకు విన్నవించుకుంటున్నా.

*

ముఖ్యంగా ఒంటరితనం మనిషినెలా చీల్చేస్తుందో..!

 -షాజహానా

shahjahanaమనసుకి తగిలిన గాయాలన్నీ వరుసపెట్టి  ఒకదాని వెంట మరొకటి తరుముకొచ్చాయి. మనసులో మంట. ఎంతకీ ఆర్పలేని కార్చిచ్చులాంటి మంట. రాసాకగాని ఆరలేదు. ఒక్కటా రెండా.. ఎన్నో విషయాలు జలపాతంలా… దూక్కుంటూ దూసుకుంటూ… ఏదీ కావాలని రాసింది కాదు. మనసులో ఏమనుకుంటానో అదే raw గా వచ్చేసింది.. ఊటలా ఉప్పొంగి కన్నీటి నదిలా ఉబికి ఉబికి వచ్చింది. బతకమ్మ పేర్చినట్టు కథ పేరుకుంటూ పోయింది.

చైతన్య స్రవంతి అన్నారు. తాగి రాసావా అనడిగారు.. పాపం, చాలా మంది స్కై నే విలన్ అనుకున్నారు.. నవ్వొచ్చింది.

చాలా ఎక్కువమంది స్త్రీలు కథతో ఐడెంటిఫై అయ్యారు.. మరెంతోమందికి కథ కనెక్ట్ అయ్యింది. చాలామంది పేరు బాగుందన్నారు. కొందరు ఎంతగానో ఏడ్చామన్నారు.. ఇది స్త్రీలందరి కథ అన్నారు.. స్త్రీలందరి తరఫున ఇలాంటి కథ రాయగలగడం బాగుంది నాకు…

*

కొత్త కథా ప్రతినిధులు వస్తున్నారు!

pratinidhya

 

మిరకిల్స్ జరుగుతయ్ భాయ్, నేన్ నమ్ముత: వంశీ

కడగొట్టువాళ్ళ కన్నీళ్లు: కృష్ణ జ్యోతి

????????????????????????????????????

‘నేను తోలు మల్లయ్య కొడుకుని’ అని చెప్పుకున్న మారయ్య కథ నిజానికి నేను కావాలని రాసింది కాదు.   దానికి ఇంత గుర్తింపు వస్తుందని కూడా ఊహించలేదు.  It just happened!  ఇంట్లో పనులు త్వర త్వరగా ముగించుకుని, బడి సమయానికి గంట ముందు బడికి వెళ్లి, ఖాళీ తరగతి గదిలో కిటికీ పక్కన వేపచెట్టు గాలీ ఆస్వాదిస్తూ,  లోపల వున్న ఆలోచనలను ఊరికే అలా కాగితం మీద పెడితే… మారయ్య,   షబానా, ఎలిజిబెత్, కొండయ్య, జగ్గయ్య పంతులూ వీళ్ళంతా జ్ఞాపకం వచ్చారు.

మారయ్య సామాజిక చలనానికీ, విచలనానికీ ‘సర్వధీ సాక్షీభూతం’.  షబానా ‘పెళ్లి’అనే సామాన్యమైన  భౌతిక, మానసిక, శారీరిక అవసరానికి కూడా నోచుకోని అనేక మంది నిర్భాగ్య స్త్రీలకు ప్రతినిధి.  ఎలిజెబెత్, పెళ్ళిలో హింసను నిత్యమూ అనుభవిస్తూ, దాన్నుండీ బైట పడే పరిస్థితి లేని అనేకమంది  వివాహిత స్త్రీలకు ప్రతి రూపం.  కడగొట్టువాళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే!  ఇది నిజం.  బజార్లో నిలబడి, వర్గ పరంగా తనతో వేరైనా వారిపై ఆవేశంగా విరుచుకు పడిపోతూ,  సర్వ జన  సమానత్వం అంటూ ఉపన్యాసాలు దంచి, ఇంటికెళ్ళి ఇల్లాలిని కాలితో తన్ని మరీ అదుపులో ఉంచుకునే ‘పోరాట యోధుల్ని’నేను కళ్ళతో చూశాను!   ఇక జగ్గయ్య పంతులు, స్థాయి పరంగా మెరుగైన స్థానంలో వున్నట్టు కనబడతాడు.  కానీ నిజానికి లోపల వున్న దరిద్రాన్ని లోకం కళ్ళని పడకుండా నీలం గళ్ళ చొక్కా లోపల దాచేసి గుట్టుగా బతికేసే కోట్లాది మధ్య తరగతి ప్రజల్లో అతను ఒకడు.  వర్గ పరంగా చెడ్డ మనుషులుండరు.  మంచి మనుషులూ వుండరు.  వ్యవస్థలో వున్న లోపాలు మనుషుల్ని వేరు వేరు అవధుల మధ్య కట్టి పడేసి పీడిస్తాయి.  అంతే.  మరి ఈ వేదనకు అంతం ఎలా?!  బహుశా ఆర్ధిక అంతరాలను తొలగిస్తే మిగిలిన సమస్యలు చాలా వరకూ సర్దుకుంటాయేమో?!  చెప్పినంత సులువు కాదు అమలు.  కానీ ఒక ఆలోచన చేయడమైతే తప్పు కాదు కదా!

కన్నదే  విన్నదే  ఈ  కథ:  శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

‘నిప్పులనడకలోంచి కళ్యాణి ‘ కథ నిజానికి కథ కాదు యదార్ధ జీవన దృశ్యం. వికృతమైన మనుషుల మధ్యలోంచి బయటపడిన ఓ బాలిక జీవితం.   బంగారు భవిష్యత్ కోసం కలలు కనే ఆ బాలిక చెప్పిన విషయాలు నన్నెంతో కదిలించాయి. నా హృదయంలో తిష్టవేసి యాతనపెట్టాయి. విన్న నాకే ఇలా ఉంటే అనుభవించిన ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో .. ?! ఆ నీలినీడలనుండి బయటపడడం ఎంత కష్టమో కదా .. ఇలాంటి
వ్యధ మరే చిన్నారికీ ఎదురుకాకూడదు అనిపించేది.  కన్నతల్లి కూడా ఇలా ప్రవర్తించగలదా అన్న అనుమానం వేసేది . కన్నతల్లి కాదనుకున్న బిడ్డ జీవితం, కన్నతల్లే కాసులకోసమో .. మరెందుకోసమో కసాయిలకు అమ్మేసిన వైనం మనసులో మెలిపెడుతూనే ఉండేది.  కాలం గడుస్తున్నా అది మరుపుకు రావడం లేదు.

అమ్మాయిల అమ్మకం లేదా వేరే ప్రాంతానికి తరలించడం కొత్తగా జరుగుతున్నదేమీ కాదు.  కానీ , అలా ట్రాఫికింగ్ కి గురయిన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో అనుభవమే.  అలాంటిది కన్నతల్లి  బిడ్డని నరకకూపాల్లాంటి చోటుల్లో అమ్మేసేంతటి పరిస్థితులు ఏముంటాయో.. అనేకానేక ప్రశ్నలు వెంటాడుతుండేవి. అప్పటికే పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లలకి ఎలా ఎరవేసి తరలిస్తారో తెలుసు. ట్రాఫికింగ్ కి బలైన  వారి గాథలు కొన్ని  ప్రత్యక్షంగా విని వున్నాను. అప్పుడెప్పుడూ  లేని కదలిక ఓ పదిపదకొండేళ్ల బాలిక చెప్పిన విషయాలు విన్న తర్వాత నాలో కలిగింది. భరించలేని  యాతన నుండి బయటపడడం కోసం అక్షరీకరించడం జరిగింది. అదే నిప్పుల నడకలోంచి కల్యాణిగా ఇప్పుడు మీ ముందుకు వచ్చింది.
నా ఈ కథలో ముఖ్యపాత్రధారి “కళ్యాణి” ఒక పాత్ర కాదు.  ఒకమ్మాయి జీవితమని ముందే చెప్పాను కదా ..నాలో కలిగిన భావ సంఘర్షణ నుండి నేను బయట పడతాను కానీ ఆమెను వెంటాడి వేటాడే గతాన్ని గుర్తుచేయడం నాకిష్టం లేదు. ఆమె జీవితానుభవాలు ఒక కథగా వచ్చాయని  తెలిస్తే ఎలా ఫీలవుతుందో తెలియదు. కానీ ఆమె భవిష్యత్తు దృష్ట్యా చెప్పడం సముచితం కాదని నేనయితే ఆమెకీ విషయం చెప్పదలుచుకోలేదు.

ఇది నేను రాసిన కథ అయినా  చదువుతుంటే నా కళ్ళు చెమరుస్తూ తనరూపం కళ్ళముందు నిలుస్తుంది.  ఈ కథ కళ్యాణి జీవితంలాంటి జీవితంలోంచి, దుర్భర పరిస్థితుల్లోంచి నేర్పరితనంతో బయటపడి భవిష్యత్ కి బాటలు వేసుకుంటున్న కళ్యాణి లకి ఈ కథ అంకితం.

ఈ కథ … 80% పచ్చి నిజం: వనజ తాతినేని

vanajaప్రాతినిధ్య కోసం నా కథ ఎంపిక కావడం ఇది రెండొసారి . ఆ స్థాయికి తగ్గ కథ వ్రాసినందుకు సంతోషంగా ఉంది.ప్రాతినిధ్య వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను .  ఇక ఈ “మర్మమేమి” కథా నేపధ్యం ఏమిటంటే ..

  కొన్ని గంటల్లో వ్రాసిన ఆ కథకి నేపధ్యం చాలా ఉంది.  చిన్నప్పటి నుండి నేను మా చుట్టూ ప్రక్కల ఉన్న  ముస్లిం కుటుంబాల వారితో సన్నిహితంగా ఉండేదాన్ని,  వారిలో అభిమానం ఆప్యాయతలు మెండు. సమీపంగా చూడటం వల్ల వారి సంప్రదాయం తెలుసు.  నాలుగు గోడలమధ్య బందీగా ఉంటూ చిటికెడు స్వేచ్ఛ కరువై కన్నీరు మున్నీరుగా విలపించడం  తెలుసు.  స్త్రీలు  పేదరికం వల్ల చిరిగిన చీరలని కట్టుకుని పైకి మాత్రం ఘనంగా బురఖా వేసుకుని వెళ్లడం తెలుసు .  సంప్రదాయాన్ని  ఇష్టంగా  పాటించేవారు కొందరైతే , అయిష్టంతో దానిని విసర్జించాలి అనుకునేవాళ్లు కొందరు. నా నెచ్చెలుల  పెదాలపై నవ్వుల  పై పూతలే తెలుసు. హృదయపూర్వకంగా నవ్వడం కూడా నిషిద్ధం. తల్లులు పిల్లల మనసులో కోరికలు తెలిసి కూడా పురుషులకి భయపడి పిల్లల కోరికలని నిర్దాక్షిణ్యంగా నలిపేసేవారు. సంప్రదాయానికి మనసుకి మధ్య నలిగిన ఆడపిల్లల కథలు తెలుసు . వాళ్ళ కంటి చూరుని పట్టుకుని వ్రేలాడిన కన్నీటి చుక్కల ఆంతర్యం తెలుసు. షహనాజ్ పాత్ర అలా పుట్టిందే !
గుంటూరు లో అభ్యుదయ రచయితల సంఘం  కథానిక పాఠశాల నిర్వహించినప్పుడు .. విద్యార్థిగా  మారి మూడు రోజులపాటు  గుంటూరు విజయవాడల మధ్య ఒంటరిగా బస్ లో ప్రయాణించినప్పుడు .. నేను చూసిన దృశ్యాల సమాహారం ఈ  కథ. బస్ లలో  యువతీ యువకుల అసభ్య ప్రవర్తన చూసి అసహ్యం కల్గింది, ఆవేశం ముంచుకొచ్చింది . సంప్రాదాయం కోసం ముస్లిం స్త్రీలు ఇష్టమైనా కాకపోయినా   బురఖా ధరిస్తుంటే  ఆ మతానికి చెందని వారు  తప్పుడు పనులకోసం  బురఖా ధరించడం, బాయ్ ఫ్రెండ్ తో కలసి  తిరగడం కోసం స్కార్ఫ్ కట్టుకోవడం చూసి నివ్వెరపోయాను .  ఎవరిని మభ్య పెట్టుకోవడం కోసం ఈ ముసుగులు ? అన్న ఆవేదన కల్గింది.  ఒక యువతి భర్తని మోసం చేస్తుంటే వాస్తవేమిటో తెలియకపోయినా సరే  ఆ అమ్మాయికి సహకరించానే అన్న ఆపరాధభావం  తొలిచేసి .. ఆ కథ వ్రాయించింది. నేను వ్రాసిన ఈ కథ … 80% పచ్చి నిజం . దానికి  20% నా ఊహా శక్తిని జోడించి ముగింపునిచ్చాను . కథ కచ్చితంగా  అలానే  వ్రాయాలని నేను అనుకోలేదు ..  అలా వ్రాసుకుంటూ పోయాను. కొన్ని గంటల సమయంలో ఆ కథ పూర్తయింది. వెంటనే ఆంద్ర జ్యోతికి పంపించాను . మూడు వారాల్లో కథని అచ్చులో చూసుకోవడంతో  అమితానందం . అశేష పాఠకుల స్పందన నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది.  స్పందించిన వారిలో  ఎక్కువ మంది అమ్మాయిలూ లేరన్న బాధ కూడా మిగిలింది అయినప్పటికీ  తాత్కాలికంగా గొప్ప సంతృప్తిని ఇచ్చిన కథ ఇది .
 pratinidhya2

ఒక ఔట్లెట్ దొరికింది: పింగళి చైతన్య

chaitanyaఇది ప్రచురణ పొందిన నా మొదటి కథ. 2015, ఆగస్ట్ నెలలో  సారంగ పత్రికలో అచ్చు అయింది. ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ రాసిన తర్వాత మూడేళ్ళ వరకు నేనేం రాయలేదు. తెల్సిన వాళ్ళు ‘ఈ మధ్య ఏం రాసావ్?’ అని అడిగేవారు. నెత్తికి నూనె రాయటమే బద్ధకం, నేనేం రాస్తాను అని చెప్పలేక ఊరుకునేదాన్ని. వి. ఎం. ఆర్. జి. సురేష్ అనే జర్నలిస్ట్ మిత్రుడు, ఎప్పుడు కల్సినా సరే, ‘కథలు రాయి చైతన్యా’ అని సలహా ఇచ్చేవారు.  పైగా ‘కథలు రాయటం తేలిక’ అని కూడా చెప్పారు! ‘ఎంకరేజ్ చేయటానికి వంద చెప్తామ్’ అని అతను ఇప్పుడు నవ్వేస్తారు. కానీ నేను అప్పటికి తెలియక, నమ్మాను. అలా.. ‘కథ రాయటం’ అనే పురుగు బుర్రలోకి వచ్చింది. అదే టైమ్ లో కుప్పిలి పద్మ గారి కథ ఒకటి నచ్చి, ఆమెకి ఫేస్బుక్ లో మెసేజ్ ఇస్తే, ‘మీరెప్పుడు రాస్తారు’ అని అడిగారు. అసలే ఇష్టమైన రైటర్. మాటవరసకి అడిగారు కావొచ్చు కానీ.. నేను మాత్రం… అప్పుడే కూర్చొని ఒక కథ రాసేశాను.

నాకు మొదట మెదిలింది మా అమ్మ. ఆమె విడో. సింగల్ ఉమెన్ పట్ల మన సమాజం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అమ్మ వల్ల సింగల్ ఉమెన్ సమస్యలు బాగా అర్ధం అయ్యాయ్. అయితే, విడో పట్ల సమాజం కొంత దయ చూపిస్తుందేమో కానీ.. విడాకులు తీసుకున్నా, పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నా  సరే… ఆ స్త్రీలని వాళ్ళ ఇష్టానికి వదిలేసేపాటి జాలి చూపించదు మన సమాజం. ‘పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అని అడిగేవాళ్ళని, పెళ్లి ఎందుకు చేసుకున్నావ్? అని అడిగితే ఎలా ఉంటదా?’ అని ఎప్పటి నుండో నా మనసులో అనిపించేది.  దాన్నే పాయింట్ గా తీస్కోని, కథ రాశాను.

స్వాతి వడ్లమూడి అనే ఫేస్బుక్ ఫ్రెండ్ కి కథ పంపా. ఆమె బుర్ర నేను,  నా బుర్ర ఆమె తిన్నాక.. ఫేస్బుక్ లో చాలా సార్లు కనిపించిన ‘సారంగ’ పత్రిక ఓపెన్ చేసి..  మెయిల్ ఐ.డి తీస్కోని, అప్పటికప్పుడే పంపించేశాను. అక్షరదోషాలు సరి చేస్కోటానికి వెనక్కి తిరిగి చదవాలన్నా సరే, డిలీట్ చేస్తా అని భయం వేసింది. పంపేశాను. తెల్లారికే నాకు, అఫ్సర్ గారి దగ్గర నుండి మెయిల్ వచ్చింది. ‘అను లో కాదు, యూనీకోడ్ లో పంపండి, మీ గురించి కూడా రాసి  పంపండి’ అన్నారు. నాకు ఒక్కటే తెల్సు.  ఆ ముక్కే చెప్పాను. అప్పటికి ఈ కథ పేరు ‘తనదే ఆ ఆకాశం’ కాదు.  ఏదో పాత,  ముతక పేరు. ఇప్పుడు ఆ పేరు చెప్పి, నా పరువు నేనే తీస్కోటం  ఇష్టం లేక.. చెప్పట్లేదు. ఆ పేరు తీసేసి,  అఫ్సర్ గారే  ‘తనదే ఆ ఆకాశం’ అని పెట్టి,  యూనికోడ్ లో టైప్ చేయించి ప్రింట్ చేశారు. ‘సారీ సర్, మీకు ఇబ్బంది పెడుతున్నా ’ అని మెయిల్ చేస్తే, ‘కొత్త రచయిత ని చూసినప్పుడల్లా ఒక ఉత్సాహం వస్తుంది; ఇబ్బంది,  కష్టం తెలీవ్’ అని కూడా అన్నారు. ఈ కథ ప్రింట్ అయిన ఉత్సాహం లో కొన్ని కథలు రాశాను.

ఏం చేయలేక, ఏం చేయాలో తెలీక, పరిష్కారం అర్ధం కాక.. బాధ పెట్టే  విషయాలని, కథలుగా రాస్తున్నా. సాహిత్యం లో వాటి విలువ, స్థానం  నాకు తెలీదు. కానీ, ‘కథ’ల ద్వారా నాకో ఔట్లెట్ దొరికింది. అది చాలు.

ఇప్పుడు ‘ప్రాతినిధ్య’ సంకలనం లో ఈ కథ వస్తోంది. ఆ పేరే ప్రేత్యేకం. రకరకాల గొంతులకి, వాదన లకి ప్రాతినిధ్యం వహిస్తున్న చోట.. నా కథ కూడా రావటం.. సంతోషంగా ఉంది. వి.ఎం.ఆర్. జి. సురేష్ గారిలాగా.. నన్ను ఎంకరేజ్ చేయటానికే వేసారేమో అని అనుమానం ఉన్నా సరే,  ‘కల్పన’ లాంటి గొప్ప కథ రాసిన సామాన్యకి ఈ కథ నచ్చటం.. కంట్రోల్ చేస్కోలేని సంతోషాన్ని ఇస్తోంది. మొదట అచ్చు వేసిన పత్రికలో.. నా మొదటి కథ..  సంకలనంలో అచ్చు అయిన మొదటి కథ గురించి రాస్తుంటే.. చాలా ఉత్సహం గా ఉంది. ‘ఇక చాల్లే, ఇప్పటీకే జనాలకి బోర్ కొట్టించి ఉంటావ్’ అనిపిస్తోంది కాబట్టి, ఇక్కడితో ఆపుతున్నాను.

 

pratinidhya1

మొదటి నాన్ పొలిటికల్ స్టొరీనేమో:వోల్గా

volgaవృద్ధాప్యాన్ని గురించి దయనీయమైన కథలు,పిల్లలు క్రూరంగా ప్రవర్తించే కథలు చదివి చదివి విసుగెత్తి భిన్నంగా ఏదయినా  రాయాలని రాసాను .తల్లీ  కూతుళ్ళ అనుబంధాన్ని ఆనందంగా రాసాను.అలా జీవించిన ,జీవిస్తున్న వాళ్ళు నాకు తెలుసు .జీవించలేక బాధ పడుతున్న వాళ్ళూ తెలుసు.వయస్సు పైబడిన తర్వాత రెండొవ బాల్యానికి కూడా పలు కోణాలు ఉంటాయి.ఈ కథలో తల్లిలా తన బాధ్యతను తీసుకోవాలని కూతురుని అడిగి ఒక హక్కుగా పొందిన గట్టి తల్లులూ ,దానిని గుర్తించి తల్లిదండ్రుల బాల్యాన్ని తాము ఆనందించే పిల్లలూ ఉంటె బాగుంటుందనే ఆలోచనే ఈ కథ.ఈఈ సమాజం లో అదంతా తేలిక కాదు .ఎందరికో ఎన్నో పరిమితులు .అయినా పరిమితుల్లోనో పరిధుల్లోనో అనుబంధాలు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి.బహుశా ఇది నేను రాసిన మొదటి నాన్ పొలిటికల్ స్టొరీనేమో .
(మిగతా  కథకుల ప్రతిస్పందనల  కోసం  ఎదురు చూస్తున్నాం! )

నీతి శాస్త్రమూ కాదు, అరాచకవాదమూ కాదు!

kathana

ఒక సంకలనం కోసం, కొన్ని వందలు వేల కథల్లోంచి డజను లేదా డజనున్నర మంచి కథలను ఎంపిక చేయడానికి పెద్ద కసరత్తే అవసరమవుతుంది. మంచి కథ అని దేనిని అనవచ్చు? అందుకు ఏది సిసలైన ప్రాతిపదిక? తరచు ఎదురయ్యే ప్రశ్న ఇది.

ప్రపంచ కథాసాహిత్యంలో ‘క్లాసిక్స్‌’ అని వి.ఎస్‌. ప్రిచ్చెట్‌ భావించిన కథలు (ఆక్స్ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, ఆక్స్ఫర్డ్‌ ప్రచురణ) వేరు, క్లిఫ్టాన్‌ ఫాడిమన్‌ ఎంచిన కథలు (పాన్‌ బుక్స్‌ లిమిటెడ్‌, లండన్‌ ప్రచురణ) వేరు. అట్లాగే సమకాలీన లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యంలో చక్కని, ప్రశస్తమైన కథలుగా అర్టురోటారెస్‌ రైసెకో సంకలించినవి వేరు, పాట్‌మెక్నీస్‌ మాన్సినీ ఎన్నుకున్నవి వేరు (ఫాసెట్‌ ప్రీమియర్‌, న్యూయార్క్‌ ప్రచురణలు) అని ఆ సంకలనాలు పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. తెలుగులో వివిధ సంస్థలచే ప్రచురితమయ్యే వార్షిక సంకలనాల్లోకి చేర్చుకునే కథల ఎంపిక ప్రమాణాలు విభిన్నంగా ఉండడం, కథల కూర్పు ఆయా సంపాదకుల / సంకలనకర్తల అభీష్టానుసారం లేదా వారి వారి అభిరుచుల ప్రకారం జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.

అంటే కథకు ముందు మనం తగిలించే ‘మంచి’ – కావ్యభాషలో ‘ఉత్తమ’ (ఇంగ్లీషులో ‘the best’)- అనేది అనిర్దిష్టమైన, అస్పష్టమైన, ఆత్మాశ్రయకమైన, సాపేక్షమైన విశేషణమేనా? ఉత్తమ కథల ఎంపికకు సంకలనకర్తల whims and fancies ఆధారమా?

నేను ఔననే అంటాను. వందలు, వేల కథల్లోంచి ఒక డజను లేదా డజనున్నర కథలను ఉత్తమమైనవిగా ఎంపికచేసే క్రమంలో సంపాదకుని/సంకలనకర్త వ్యక్తిగత అభిరుచులు, ఇష్టానిష్టాలు, దృక్పథం, మనఃప్రవృత్తి, భావావేశం తప్పక ప్రభావం చూపుతాయి. దేనినిగానీ ‘ఉత్తమం’ అని నిర్ధారించడానికి ఇక్కడ అబ్సొల్యూట్‌ టర్మ్స్‌ లేవు. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చకపోవచ్చు.

అయినప్పటికీ- తన నిర్ణయంలో శాస్త్రీయత, హేతుబద్ధత గరిష్టస్థాయిలో వున్నాయని చెప్పుకుని సమర్థించుకునే వీలు సంపాదకునికి వుంది. అదెప్పుడంటే- సాహిత్యం సామాజిక ప్రయోజనం పట్ల ఒక స్పష్టమైన అభిప్రాయంతోపాటు సాహిత్యాన్ని వస్త్వాశ్రయంగా విశ్లేషించగల విమర్శనాదృష్టీ, ప్రత్యేకించి ఒక విశిష్ట సాహిత్యప్రక్రియగా కథ పరిణామవికాసాలు, దాని ప్రస్తుత కొత్త పోకడల గురించిన అవగాహనా తనకు తగినంతగా ఉన్నప్పుడు.
సాహిత్యం శూన్యంలోంచి ఉద్భవించదు. కాలం, మనుషులు, సాంఫిుక పరిస్థితులు, ఉత్పత్తి సంబంధాలు- ఈ నాల్గింటి పర్యవసానమే సాహిత్యం. మనిషి ఆలోచించగల, అనుభూతించగల, వివేచించగల జీవి కాబట్టి వ్యవస్థలతో సంఘర్షించడం, అవస్థలకు ప్రతిస్పందించడం తన నైజం. అతని సంఘర్షణ, సంవేదన, స్పందనల, భావోద్వేగాల ప్రతిఫలనరూపాలే వేల సంవత్సరాల పూర్వం నుండి వస్తోన్న కళలూ, సాహిత్యం. మానవ సమాజ పురోగమనానికి సైన్సు (విజ్ఞాన శాస్త్రం) ఎంతగా దోహదపడుతూ వస్తున్నదో కళలు, సాహిత్యం సైతం అంతగా తోడ్పడుతున్నాయి. మన చుట్టూ ప్రకృతిలోని నిగూఢత్వాన్ని ఛేదించే ప్రయత్నమే సైన్సు. మన జీవితంలోని గందరగోళత్వానికి, విరోధాభాసలకు భాష్యం చెప్ప ప్రయత్నించేదే సాహిత్యం. అయితే సైన్సు ఫలితాలు, ప్రభావాలలాగా సాహిత్యం ప్రభావం భౌతికంగా తక్షణరూపంలో కనపడదు. మనుషుల భౌతికావసరాలను సులువుగా తీర్చే సాధనాలు, సామాగ్రిని సైన్సు సమకూరిస్తే, వారి చైతన్యస్థాయిని పెంచగల, ఆలోచనాపరిధిని విస్తృతపరచగల జీవిత సత్యాలను తెలియజేసే vicarious experience సృజనాత్మక సాహిత్యం అందిస్తుంది. ‘At its best it (literature) evokes unifying emotions; it makes the reader see the world momentarily as a unity’ అని ఒక మహానుభావుడు అన్నది ఇందుకే. జీవితాన్ని జీవించేందుకు అనేక అవకాశాలున్న ఈ లోకంలో తన అస్తిత్వానికి అర్థం వెతుక్కునేందుకు మనిషి పడే ప్రాకులాట, లోకం ఇలా కాకుండా మరోలా వుంటే బాగుండుననే అతని ఆశల, ఊహల విస్తృతి లక్ష గొంతుకల్లో సాహిత్యం ద్వారానే మనకు వినబడతాయి. వివిధ కాలాల్లో విభిన్న పాత్రలుగా పఠితకు కనపడే ఈ మనిషి మానవజాతి ప్రతినిధి అని వేరే చెప్పనక్కర్లేదు. కెన్నెత్‌ బర్క్‌ అన్నట్టు ‘literature serves as equipment for living’ కనుకనే అనాదిగా అది ప్రజల సామాజిక, సాంస్కృతిక జీవనంలో విడదీయలేని భాగమైపోయింది.

సాహిత్యసృజన మామూలుగా ఏ వ్యక్తి అయినా చేసే పనికాదు. సమాజంలో ముఖ్యమైన భాగంగా ముందున ఉంటూ, సమాజ చలనసూత్రాలను గురించి తనకున్న అవగాహనతో తను జీవిస్తూన్న సమాజం తీరుతెన్నులను లోతుగా పరిశీలిస్తూ విస్పష్టంగా వ్యాఖ్యానించగల వ్యక్తి- అనగా రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం. అలా కమ్యూనికేషన్‌ నెరపడం- అంటే సాహిత్యం సృజియించడం- ఒక రకంగా తన బాధ్యత అనుకుంటాడు రచయిత. నడుస్తూన్న కాలం మౌలిక స్వభావాన్ని దాని రూపం, సారంతో సహా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, మారని మనిషితనం (the eternal in the man), చరిత్ర వారసత్వం నేటి ప్రపంచంలో ఎలా నెగ్గుకుని వస్తున్నాయో తన రచనల ద్వారా చూపిస్తూ ఆ బాధ్యత నెరవేరుస్తాడు. రచయిత, సాహిత్యం, సమాజం- ఈ మూడూ ఒకటి మరోదానిపై ప్రభావం కలుగజేసుకుంటాయి. కాబట్టి సాహిత్యం ఎల్లప్పుడూ సామాజిక వర్తమానతను ప్రతిబింబిస్తూంటుంది.

సోఫోక్లీజ్‌, షేక్స్‌ పియర్‌, బెకెట్‌, సార్త్రెల నాటకాలు, టాల్‌స్టాయ్‌, దస్తోవ్‌స్కీ, గంథర్‌గ్రాస్‌, గెథే, ఎమిల్‌ జోలా, మార్క్వెజ్‌ల నవలలు ఈ విషయాన్నే నిదర్శిస్తాయి.

సాహిత్యసృజన వివిధ ప్రక్రియ (genre) లలో సాగుతుంది. కథ (short story) వాటిల్లో ప్రధానమైనది. నిరంతర పరిణామశీలమైన విశిష్ట సాహితీప్రక్రియ కథ. రూపంలోనూ, సారంలోనూ కొత్త సరిహద్దులను తాకుతూ అది తనను తాను పునర్‌ నిర్వచించుకుంటూ వస్తున్నది. కొండొకచో దండాన్వయానికి, వ్యాఖ్యానానికి లొంగీ లొంగక దోబూచులాడటం కథ విలక్షణత.

కథంటే కేవలం కల్పన కాదు, అలాగని పూర్తి వాస్తవమూ కాదు. సాధారణత్వం చెరిగిపోయేలా ఊహను మేళవించి, ఒక యథార్థ జీవిత శకలాన్ని ఉన్నతీకరించి ఆసక్తికరంగా మలచడం- అనగా నిజజీవితంలో అంతవరకూ మన అనుభవం లోకి రాని రీతిలో, మన ఆలోచనకు తట్టని కోణంలో ఒక పరిచితమైన విషయాన్ని లేదా సాధారణ ఘటనను లేదా మామూలు సన్నివేశాన్ని కొత్తగా చూపడం కథ అవుతుంది. ఈ ఆసక్తికరంగా మలిచే కొత్త కోణంలో చూపే పనినే ‘కళ’ అంటాము. కళ అంటే సాధారణ అర్థంలో ప్రకృతి అనుకరణ అని మనకు తెలుసు. ఈస్థటిక్స్‌ ప్రకారం ఆలోచనలు రేకెత్తించేలా వినూత్న పద్ధతిలో ఆవిష్కృతమయ్యే వాస్తవికత పార్వ్శం అని కూడా మనకు తెలుసు. అలా చూసినప్పుడు కథారచయితని కళాకారుడనే అనాలి. ఎందుకంటే కథ (fiction) ఒక రకంగా వాస్తవమూ, మరోరకంగా వాస్తవాన్ని ధిక్కరించే ఊహాకల్పన కూడా.

కథ లక్షణాలకి సంబంధించి అదంతా ఒక పార్శ్వం మాత్రమే. అయితే కథ ప్రయోజనం (impact) ముఖ్యమనీ, దాన్నిబట్టే కథ గుణగణాలను నిర్ధారించ వీలువుతుందనీ మనకు తెలుసు. ఆ impact ఎలా ఉండాలి? సరళమైన భాషలో బ్రిటిష్‌ రచయిత విలియం బాయ్డ్‌ ఒక సందర్భంలో ఇలా అన్నాడు: ‘Short stories are snapshots of the human condition and of human nature, and when they work well, and work on us, we are given the rare chance to see in them more than in real life.’ అలాంటి ప్రయోజనం నెరవేర్చే కథలు అనగా- ఆకట్టుకుని ఆలోచింపజేసే కథలు ప్రశస్తమయిన (brilliant) కథలు. అవి మన కళ్ల ముందు మరో ప్రపంచాన్ని చూపెడతాయి. ఇప్పటిదాకా లోకంలో చూసిందీ, మన చుట్టూ మనుషుల గురించి తెలిసిందీ చాలా తక్కువేనన్న సత్యాన్ని స్పురింపజేస్తాయి. రచయిత ప్రతిభ పై impact ఆధారపడి వుంటుంది. తెలుగులో చీకటి (అల్లం శేషగిరిరావు), ఇంగ్లీషులో ‘Another way to Die’ (హరూకి మురకామి) కథలు ఇందుకు ఉదాహరణలు.

మామూలు లేక సంక్లిష్ట సామాజికాంశమైనా, వైయక్తిక మీమాంసైనా, మనిషి సంకటస్థితి (predicament) అయినా- దాన్ని తాను అర్థం చేసుకుని ఏర్పరచుకున్న దృక్పథాన్ని కమ్యూనికేట్‌ చేసేందుకు రచయిత, all art is an order to form సూత్రం ప్రకారం, కొన్ని పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలను ఒక చట్రంలోకి ప్రవేశపెట్టి, వాటి మధ్య సంబంధ బాంధవ్యాలను కల్పించి, మన మస్తిష్కం లోని అంతర్నిహిత కుతూహల ప్రేరకాలను తాకేలా వాటిని కదిలిస్తాడు. తన కమ్యూనికేషన్‌ పఠితకు అందేలా చేయడానికి తానెంచుకున్న పద్ధతి ప్రకారం కథనం (narration)లో ఎత్తుగడ, విస్తృతి, ముగింపులకు స్థానమిస్తాడు. కథకు అవసరమని భావించిన మేరకే పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు, ప్రస్తావనలు ప్రవేశపెడతాడు. సన్నివేశాలు, పాత్రలు వాటి చర్యలు గతిశీలంగా వుండేటట్టు చూస్తూ ఒక సత్యం బహిర్గతమయ్యే పాయింటు వైపుగా మొత్తం యాక్షన్‌ను కేంద్రీకరిస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే కథానిర్మితిపరమైన ‘శాస్త్రీయత’ (exactitude) పాటిస్తాడు. ‘Smaller in its overall dimensions than the novel, it is a fiction in which society is surmised as the darkness around the narrative circle of light. In other words, the scale of the short story predisposes it to the isolation of the self.”

తాను చెప్పదలుచుకున్నది చదువరి గ్రహించినా గ్రహించకపోయినా ముందుగా తన రచన పఠనీయంగా వుండేటట్టు రచయిత కసరత్తు చేయాల్సి వుంటుంది. కుతూహలం రేపే అంశాలు కథలో పొందుపరిచి ఉన్నప్పుడే అది ఆసక్తికరంగా తోస్తుంది, ఆసాంతం చదివిస్తుంది. ‘ప్లాట్‌’ (ఇతివృత్తం)ని ఉత్కంఠభరితంగా నిర్మాణం చేయడం, గతంలో వేరే ఎవరూ స్పృశించని అంశాన్ని కథావస్తువుగా స్వీకరించడం, మనం సాధారణం అని భావించే సమస్యను కొత్తకోణంలో ఆవిష్క రించడం, పాలకవర్గాలు అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలను, సమకాలీన రాజకీయాల కుళ్లును హాస్య, వ్యంగ్యధోరణిలో విశ్లేషించడం… ఇవన్నీ చదువరులలో ఆసక్తి రేకెత్తించే కథన పద్ధతులు. రచయిత శ్రద్ధ పెట్టాల్సిన మరో విషయ మొకటుంది. అది కథాసంవిధానానికి సంబంధించినది. పాత్ర(ల) సంకటస్థితితో, సంఘర్షణతో, భావోద్వేగాలతో పఠిత మమేకమైపోయి, అవన్నీ తానే స్వయంగా అనుభవిస్తున్న ఫీలింగ్స్‌ కలిగేలా వాతావరణ చిత్రణ, పరిసరాల వర్ణన, సన్నివేశాల సృష్టి, ఘటనల పరంపర కథలో వుండాలి. అలా పాత్ర సంకటస్థితితో, పఠిత సంలీనమైపోయేంతగా ఆసక్తిగొలిపే కథానిర్వహణనే ‘శిల్పం’ అంటారు. అనుభవం, అధ్యయనం, అనుశీలనం, ఊహాపటిమ వున్న రచయితకు సాధారణంగా ఈ నేర్పు వుంటుంది. మంచి కథలో వస్తువు తాజాదనం గుబాళిం చడంతో పాటు వస్తువుకు తగ్గ శిల్పం వుంటుందని విమర్శకులు అందుకే అంటుంటారు.

కథాసాహిత్యం పట్ల ప్రత్యేకమైన అభిరుచి కలిగి వున్నవాడిగా లభ్యమైన కథలను క్రమం తప్పకుండా పరిశీలిస్తున్న నేను, గత పదిహేనేళ్ల నుండి తెలుగు కథలో కనపడుతోన్న గుణాత్మకమైన మార్పు గమనిస్తున్నాను. ఒకప్పటి విప్లవోద్యమ హోరు నేడు వినిపించడంలేదు. సామాజికాంశాల కన్నా వైయక్తిక సమస్యలు, స్పందనలు ఇవాళ్టి రచయితలకు కథావస్తువులవుతున్నాయి.  విశేషమేమిటంటే ఆధునిక జీవితంలోని కొత్త కోణాలను వారు ఒడుపుగా పట్టుకుంటున్నారు. తరాల అంతరాలు, పాత ఆచారాలు-కొత్త ఆలోచనల నడుమ ఘర్షణ, అర్థాలు మారుతున్న విలువలు, కొత్త నిర్వచనాల్లోకి ఒదిగిపోతున్న స్త్రీ పురుష సంబంధాలు, వైయక్తిక సుఖలాలస, భౌతిక వస్తుసంపత్తి వుండీ అయినవాళ్లు లేక ఒంటరితనంలో కూరుకుపోతున్న మనుషులు, ప్రపంచీకరణ ప్రభావాలు, అభివృద్ధి ఫలాలు అందని వర్గాల ఆందోళన, దళితుల, బిసిల, మైనారిటీల, మహిళల ఐడెంటిటీ అసర్షన్‌, విస్మృత వర్గాల అస్తిత్వ చైతన్యం… ఈ సంక్షుభిత వర్తమానమంతా వారి కథలకు అక్కరకొచ్చే సామాగ్రే.

ఈ సంకలనంలో చేర్చడానికి 15-20 మంచి కథలను ఎంపిక చేసేందుకు పూనుకున్న మేము 2015 సంవత్సరంలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన దాదాపు రెండు వేల కథలను సేకరించి వంతులవారీగా పరిశీలించాము. ముందుగా ఈ భారీ కథలరాశిలోంచి తాలును తూర్పారబట్టేందుకు ఒక ప్రాతిపదిక రూపొందించుకున్నాము. దీని పై మా నలుగురి- ఇద్దరు సిరీస్‌ ఎడిటర్లు, ఇద్దరు గెస్ట్‌ ఎడిటర్ల- నడుమ ఏకీభావం వుంది.
1. వినూత్నమైన శైలీ, శిల్పాలతో కూడిన కథనం, 2. కథావస్తువుకు సంబంధించి కొత్త సరిహద్దుల్లోకి ప్రవేశం, 3. సాధారణ అంశమే అయినా ఆవిష్కరించిన తీరులో సరికొత్తదనం, 4. అర్థవంతమైన ప్రయోగం, 5. అత్యంత ప్రాధాన్యమూ, ప్రాసంగికత కలిగివున్న సమకాలీన సమస్య, 6. విస్మృత వర్గాల జీవితచిత్రణ (వాళ్ల భాష యాసలోనే).
పై వాటిల్లో కనీసం ఒక్క షరతునైనా సంతృప్తిపరచని కథలను పక్కన పడేశాం. అన్నీపోగా 25 కథలు మిగిలాయి. నలుగురం మూడుసార్లు కూర్చుని చర్చించాక, మరో రెండు వడపోతల తర్వాత నిలబడ్డ గట్టి కథలు పన్నెండు మాత్రమే. వాటితోనే సరిపెట్టుకోక తప్పలేదు.

వీటిలో స్త్రీ-పురుష సంబంధాలను విశ్లేషించిన కథలు మూడున్నాయి. విప్లవ ఆదర్శాలు, లక్ష్యాల నెపంతో మగవాడు భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి పోగలడు కానీ వంటరిదైన స్త్రీ బతుకీడ్చి పిల్లలను రేవుకు తేవడానికి ఎన్నో కష్టనష్టాలు భరించాల్సి వస్తుంది. అంతులేని సంఘర్షణ, కన్నకొడుకు వ్యతిరేకత- ఈ నేపథ్యంలో స్త్రీ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని స్త్రీ కోణంలోంచే తెలియజేసిన కథ సావిత్రి. ఆడపిల్ల ఎదుగుతున్న క్రమంలోని వివిధ దశల్లో మగవాళ్ల గురించిన ఆమె ఆలోచనలు, అభిప్రాయాలు, మోహాలు, విరహాలు, స్వేచ్చా తపనలను ఆవిష్కరించిన కథ తొమ్మిదో నెంబరు చంద్రుడు. భావుకత నిండుగా వున్న కవితాత్మక శైలి, నిర్నిరోధమైన భావప్రకటనకు ఎంచుకున్న డిక్షన్‌ వల్ల ఇందులోని ఉత్తమ పురుష కథనానికి ఆకట్టుకునే గుణం వచ్చింది.

‘మనుషులకి అన్నిరకాల స్వేచ్చలూ వుండాలి, అదే అంతిమ విలువ’ అనే ఆధునిక భావన పునాదిగా స్త్రీ-పురుషుల సహజీవనం ఒక ట్రెండ్‌గా ఇప్పుడిప్పుడే మొదలైనా మన సమాజంలో ఇరువురికీ సమానంగా వర్తించే స్థాయికి ఆ భావన ఇంకా ఎదగలేదు. స్త్రీ మనోభావనలను, స్వేచ్చాపిపాసను స్త్రీ కోణంలోంచే హృద్యంగా వివరించిన కథ శతపత్ర సుందరి.

దళితుల జీవితం ఇతివృత్తంగా కల కథలు మూడు వున్నాయి. చివరి చర్మకారుడూ లేడు… కథలో ముసలి డానియేలు తర్వాతి తరంవారు- తమ్ముడు, అతని కొడుకులు- వేరే ఉపాధులు వెతుక్కుని మునుపటి నిమ్నస్థాయి నుండి పైకి ఎదిగిన వైనం కనపడితే, నేను తోలు మల్లయ్య కొడుకుని కథలో పాత, చెప్పులు కుట్టే వృత్తిని వదులుకోలేక, మరో వృత్తి వెతుక్కోలేక సతమతమయ్యే మారయ్య గుంజాటన కనపడుతుంది. దళిత కుటుంబాల్లో నేడు కనపడుతున్న పరిస్థితి రెండు రకాలుగా వుంది. ఒకటి- పాతవృత్తిని వదులుకోలేని వెనుకబాటు తనం, రెండోది- వేరే ఉపాధులు చేపట్టి సామాజిక నిచ్చెనమెట్లు ఎగబాకటం. రెండో కథ ఒక ప్రశ్న అయితే, మొదటి కథ దానికి జవాబు. Non-linear బహుళ దృక్కోణ కథనం వల్ల చివరి చర్మకారుడూ లేడు ఆసక్తికరంగా వుంటుంది.

ఇక మూడో కథ పరిశుద్ధ వివాహము: మూడో ప్రకటన విలక్షణమైనది. మన సమాజంలోని నిచ్చెనమెట్ల కులవ్యవస్థ తాలూకు కుళ్లు కంపు మతమార్పిడి- క్రైస్తవం పుచ్చుకున్న- తర్వాత కూడా గబ్బు కొడుతున్న యథార్థాన్ని వ్యంగ్య ధోరణిలో చెప్పిన కథ యిది.

ఇక మిగతా కథల గురించి. బడిపిల్లల ఎండాకాలం తాతిల్‌ (సెలవులు) మూడు తరాలవారికీ విశ్రాంతినిచ్చి శారీరకంగా, మానసికంగా సేదదీర్చే ఋతువు. ఈ సూక్ష్మం మన గ్రామీణ ప్రజలకు తెలుసు గనుకనే వారి కుటుంబబంధాలు, మానవ సంబంధాలు గట్టివి అని తెలియజేసే కథ తాతిల్‌.

అప్పులతో బేజారై నిరాశా నిస్పృహలతో కూరుకుపోతున్న రైతులోకానికి ప్రతినిధి ఊరవతల ఊడలమర్రి కథలోని నారాయణ. కానీ అందరిలాగా తను ఆత్మహత్య చేసుకోలేదు- ఊరంతా ఉరేసుకునే ఊడలమర్రిని తెగ నరకడానికి పూనుకున్నాడు. ఒక సామాజిక జాడ్యం పట్ల తిరుగుబాటును ప్రతీకాత్మకంగా తెలిపి ఆశావహ దృక్పథం చాటిన కథ.
భౌగోళిక తెలంగాణాయే కాని సామాజిక తెలంగాణ ఇంకా రాలేదన్నది చాలా మంది భావన. సబ్బండ వర్ణాలు కలిసి బతుకమ్మ ఆడటమనేది వేదికలకు, రాజకీయ సభలకు మాత్రమే పరిమితం కానీ ఊళ్లల్లో కాదు- ఈ పారడాక్స్ ని అంటరాని బతుకమ్మ కథలో చూడవచ్చు.

వడ్డీలెక్కల్లోకి పోకుండా అసలు మాత్రమే తీసుకుని అక్క వాటా భూమినీ, బీడునీ అక్కకిచ్చేస్తుంది నాగేస్పరి. రాతి మిద్దాయిన చిన్న కుమార్తె నాగేస్పరికున్న దొడ్డమనసు అందరికీ వుంటే సమాజం ఎంత బాగుండునో. కథలో చిత్తూరు మాండలికాన్ని, అక్కడి నుడికారాలను సొంపుగా వినిపించాడు రచయిత.

అతి సున్నిత పరికరమైన థియోడలైట్‌ని ఒక సవరజాతి కొండమనిషి డుంబ్రి, తన ప్రాచీన పనిముట్లతో మరమ్మత్తు చేసిన వైనాన్ని ఒక anecdote లాగా వివరించడం మూడుకోణాలు కథలో చూస్తాం. ‘ఇక్కడి శాస్త్రాలు ఆధునిక కాలంలో ఎక్కడికి పోయాయో,’ అంటూ కార్క్సన్‌ దొర వేసిన ప్రశ్న ఇప్పుడు మనమూ వేసుకోవాలి. కొండ ప్రాంతాల్లో కదలిక (అభివృద్ధి) రావడానికి చాలా కాలం ఎందుకు పడుతున్నదో కూడా మనం ఆలోచించాలి.
చెదిరిన వాస్తవాన్ని ఒక పల్లెమనిషి కల రూపంలో నీరెటుకాడి కలలో చూస్తాం. ఊరూ, నీటితావుల జలకళ, పచ్చని పరిసరాలు, వీటి మధ్య మన బాల్యం, మన బతుకు… గుర్తు చేసుకుంటూ మనమూ కలల్లో తేలిపోతాం.

ఇవీ మా దృష్టికి వచ్చిన కథలు. మా కోణంలో పరిశీలించి మాకున్న అవగాహనతో వీటిలోని వస్తు, శైలి, శిల్పాలను నిర్ధారించి బాగున్నాయని ఎంచిన కథలు. కథలను కథలుగానే చూశాం. రచయితలను బట్టి కాదు. కొన్ని కథలు ఇతరత్రా బాగున్నప్పటికీ మేలైన కమ్యూనికేషన్‌ లోపించింది. సమాజహితం కోరేది సాహిత్యం అని మనకు తెలుసు. అయితే సాహిత్యం నీతిశాస్త్రానికి ప్రత్యామ్నాయం కాకూడదనీ, అదే విధంగా అరాచకాన్ని ప్రోత్సహించకూడదనీ మా ఉద్దేశం. కొన్ని విషయాల్లో రాజీపడాల్సి వచ్చిందని ఒప్పుకోక తప్పదు. వస్తువు బాగుందనుకున్న చోట శైలీ శిల్పాలకు ప్రాధాన్యమివ్వలేదు. కమ్యూనికేషన్‌ తీరు బాగుందనుకున్నప్పుడు వస్తువును పట్టించుకోలేదు.

వేల సంఖ్యలో  కథలు  వస్తున్నా  మంచి  కథలకు  కొరత  వుందన్న  వాస్తవం ఉత్తమ అభిరుచి గల సాహితీప్రియులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. ఈ పరిస్థితి మారుతుందని ఆశిద్దాం.

ఇక చివరగా, చెప్పకుండా ఉండలేనిమాట. తెలుగు కథాసాహిత్యంలో ఉన్నత ప్రమాణాలను కాంక్షించే కథాసాహితి వారి కృషిలో పాలుపంచుకున్నందుకు సంతోషిస్తున్నాను.
హైదరాబాద్‌, 22 ఆగస్ట్‌ 2016

ఇతివృత్తాలూ….లక్ష్మణ రేఖలూ…

 

-చందు తులసి

~

తెలుగు కథల్లో సామాజిక అంశాలు మరీ పెరిగిపోతున్నాయి! వస్తువుకు మితిమీరిన ప్రాధాన్యం ఇస్తున్నారు!!
కొన్ని రకాల ఇతివృత్తాలతో రాస్తేనే మంచి కథ అనుకుంటున్నారు!!! ఫలితంగా మూసలో తెలుగు కథ చిక్కుకుపోయింది!
ఫలితంగా కథకు నష్టం జరుగుతోంది.  కథకుండే కళాత్మకత దెబ్బతింటోంది! ప్రమాణాలు పడిపోతున్నాయి. పాఠకులు తగ్గిపోతున్నారు!
ఈ మధ్య తెలుగు కథ గురించి వినిపిస్తున్న వాదనలు, ఆరోపణలివి….

సామాజిక అంశాలు పెరగడం వల్ల కథకు నష్టం జరుగుతుందా…?
వొక అంశం వల్ల  పాఠకులు దూరమో, దగ్గర అవుతారా…?
ఈ విషయం గురించి ఎవరేమనుకుంటున్నారు.? ఈ అభిప్రాయాలు మీ చర్చ కోసం

peepal-leaves-2013

కథకు, రచయితకు తను ఉద్దేశించిన పాఠకుల వర్గం వుంటుంది.  ఎవరి కోసం రాస్తున్నామో అనేది కూడా ముఖ్యం కదా. అలాంటపుడు చెప్పే తీరులో తేడా రావచ్చు. అలాగే సామాజిక ఇతివృత్తాలతో కథలు రాసేవారు కూడా కేవలం సమస్యను చెప్పడం దగ్గరే ఆగిపోకుండా…సమస్య లోతుల్లోకి వెళ్లి చర్చించాలి.  అపుడు
ఇటువంటి విమర్శకు అవకాశం వుండదు.  ఐతే విమర్శకులు కూడా గమనించాల్సింది రాసేవాళ్లని రాయనీయండి. మీ విమర్శ కూడా కథకుల్లో అధ్యయనం పెంచేలాగా ఉండాలి. నిర్మాణాత్మక సూచనలు చేయాలి. రచయిత తన కథను మెరుగుపెట్టుకునేలా వుండాలి.

– ఓల్గా

_________________________________________________________________________________________________

రాజకీయం వద్దనడమే పెద్ద రాజకీయం. కేవలం కళాత్మకంగా లేదనే పేరుతో సామాజిక ఇతివృత్తాలపై వచ్చే కథలని తక్కువ చేయలేం. సామాజిక ఇతివృత్తాలు రాయకూడదనుకుంటే ఎవరి జీవిత చరిత్రలు వారే రాసుకోవాల్సి వస్తుంది.  కళ ప్రజల కోసం, సామాజిక ప్రయోజనం కోసమే సాహిత్యం అనే వాదనను…తక్కువ చేయడం కోసమే వస్తున్న వాదన ఇది. ఉద్యమ సాహిత్యం కొంత తగ్గుముఖం పట్టినపుడు ఇటువంటి వాదనలు తలెత్తుతాయి. గురజాడ,  వీరేశలింగం కాలం నుంచి ఇప్పటి దాకా ..అనేక సార్లు ఈ వాదన వచ్చినా… ఎన్నడూ ఈ వాదన నెగ్గింది లేదు.  సామాజిక సాహిత్యం కోసం ఆలోచిస్తున్నవారు …ఇటువంటి వాదనలు వచ్చినపుడు మరింత అప్రమత్తంగా వుండాలి.  సాహిత్య కృషి మరింత పెరగాలి. రచయితలు ఆ దిశగా మరింత కృషి చేయాలి.

-ఎన్. వేణుగోపాల్

_________________________________________________________________________________________________

అసలు సమస్య …..సామాజిక ఇతివృత్తాలు పెరగడం, తగ్గడం కాదు.  కేవలం సామాజిక ఇతివృత్తాలతో కథలు రాసినా అది వ్యక్తిగతంగా రచయితకే తప్ప కథా సాహిత్యానికి జరిగే నష్టం ఏమీ లేదు. పైగా ఓ రచయిత రాసిన వొకటి రెండు కథలతో …అతని దృక్పథం అంచనా వేయలేము.  వెబ్ మ్యాగజైన్లు వచ్చిన తర్వాత….కొత్త తరహా పాఠకులు వస్తున్నారు. రచయితకు, పాఠకులకు మధ్య చర్చకు అవకాశం పెరిగిపోతోంది.  కాబట్టి సంప్రదాయ రీతిలో ఆలోచించి ….కొత్త తరం సాహిత్యానికి విలువలు ఆలోచించలేము.  అసలు ఇపుడు చర్చించాల్సిన విషయాలు వేరే వున్నాయి. కొత్త తరం రచయితల్లో చాలామంది….విషయాన్ని, సమస్యను లోతుగా అధ్యయనం చేయకుండానే కథలు రాస్తున్నారు.  రచనను సీరియస్ గా తీసుకుంటున్న వారూ తగ్గిపోతున్నారు. ఇవాళ మనం దృష్టి సారించాల్సిన అంశం
ఇది తప్ప…సామాజిక సమస్యలు పెరగడమే, తగ్గడమో కాదు.

-జీఎస్ రామ్మోహన్

_________________________________________________________________________________________________

సామాజిక స్పృహ అనేది రచయితకు వుండడం, తన రచనల ద్వారా వ్యక్తి తనలోనికి తను చూసుకునే విధానాన్నో, వ్యక్తి సమాజాన్ని చూసే చూపునో మార్చాలనుకోవడం తప్పు కాదు. బాధ్యత ఉన్న ఏ రచయిత ఐనా అదే పని చేస్తాడు. రచనకు అవసరమైన విషయం, అసలైన ప్రయోజనం కూడా అదే. ఐతే రచయిత తన బాధ్యత ఎంత ప్రతిభావంతంగా నెరవేరుస్తున్నాడనేది కథ ప్రమాణాలను నిర్ణయిస్తుంది. విమర్శకులు చేయాల్సింది అలాంటి గుణాత్మకమైన విశ్లేషణ.

ఇక మంచీ చెడు అన్ని కాలాల్లోనూ వుంటాయి. ప్రమాణాలు లేని రచనలూ ఎల్లపుడూ వుంటాయి. ఆ మంచి చెడ్డల నిష్పత్తి కొంచెం అటు ఇటుగా మారుతుండవచ్చు అంతే. పాతకాలం నాటి సాహిత్యం ప్రమాణాలతో ఇప్పటి సాహిత్యం పోల్చి గతమే మంచి అనుకోవడం మాత్రం పొరపాటు. ఈ రోజుకీ సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించే రచయితలు వున్నారు. అందులో కొంతమందైనా మంచి కథలు రాస్తూనే ఉన్నారు.

-రమణమూర్తి

_________________________________________________________________________________________________

రచయితలతో పాటూ, పాఠకులు కూడా రకరకాల స్థాయిల్లో వుంటారు. ఆ క్రమంలో నువ్వెక్కడ వున్నావు అనే ప్రశ్న వుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికిన రచయితలు ప్రకటించుకుంటారు. దొరకని వారు వెతుక్కుంటారు. ఆ అవసరమే లేదనే వారికి కూడా నిర్వచించలేని పరిధి ఏదో వుండి వుంటుంది. సమాజంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక పరిణామాలు ఏదో మేరకు సాహిత్యాన్ని కూడా
ప్రభావితం చేస్తాయి కనుక…లాభం, నష్టం కేవలం కథవి మాత్రమే కాదు. ఇవాళ తెలుగు కథలో బహుళ తాత్వికతల సమన్వయం జరుగుతోంది. మార్క్సిజం-అంబేడ్కరిజం, మార్క్సిజం-స్త్రీవాదం…వంటి కాంబినేషన్స్ ను రచయితలు స్వీకరిస్తున్నారు. ఇవి తక్షణ ప్రయోజనాలా, దీర్ఘ కాలిక ప్రయోజనాలా అన్నది వేరే చర్చ. నలుగురి మేలు కోరే ..భావాల్ని పంచుకోవాలనుకోవడం ప్రధానం. అది ఎంత గాఢంగా, కళాత్మకంగా ఉంటే అంతగా సాహిత్యం ఉత్తమ స్థితిలోకి వెళ్తున్నట్లు.

-కె.ఎన్ మల్లీశ్వరి.

_________________________________________________________________________________________________

కథకులు ఎంచుకునే అంశాల వల్ల కథకు నష్టాలుండవు, లాభాలూ ఉండవు. మంచి కథని ఎంచేటప్పుడు అందులో అంశం సామాజికమా, సాంస్కృతికమా, శాస్త్రీయమా అన్నది లెక్కలోకి రాదు. అంశమేదైనా, దాన్ని కథగా ఎలా మలిచారనేది ముఖ్యం. ఆ పని సవ్యంగా చేసినప్పుడు – ఇతివృత్తం ఏమిటనేదానితో సంబంధం లేకుండా అది కథకి మంచే చేస్తుంది. అయితే మంచి కథ రాయటం చాలా కష్టమైన విషయం.

మరి అంత కష్టపడటం ఇష్టం లేనివాళ్లు కథలు రాయాలంటే ఎలా? దానికో దగ్గరి దారుంది. అదే సీజనల్ సాహిత్యం. ఏదేని విషయంపై దేశంలో సంచలనం చెలరేగుతున్న తరుణంలో ఆ ఇతివృత్తంతో వచ్చే కథలకి ఎంతో కొంత డిమాండ్ ఉంటుంది. చిక్కటి కథనం, బలమైన పాత్రలు, పదునైన సంభాషణలు, ఇలాంటివేమీ లేకపోయినా కేవలం ఆ ఇతివృత్తానికి ఆ సమయంలో ఉన్న ‘గ్రావిటీ’ ఇలాంటి కథలకి లేని బరువు సమకూరుస్తుంది. తెలుగులో ఈ తరహా కథలు రాన్రానూ పెరిగిపోతున్నాయి. దారుణ సంఘటనల దరిమిలా జనాల్లో నెలకొనే తాత్కాలిక ఉద్వేగాలు, ఉద్రేకాలే ఇంధనంగా బండి నడిపించే ప్రయత్నాలివి. ఈ కథల్లో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వీటిలో చాలావరకు ఉదాత్తమైన వస్తువే తప్ప మంచి కథకుండాల్సిన లక్షణాలేవీ ఉండటం లేదు. ఆ విషయం ఎత్తిచూపిన వాళ్లని – ఆ కథలోని ప్రధానాంశాన్ని బట్టి – దురహంకారులనో, ప్రగతి నిరోధకులనో, మైనారిటీ వ్యతిరేకులనో, ఇంకోటనో ముద్రలేసే పరిస్థితి! దాంతో నికార్సైన విమర్శకులు నోళ్లు మూసుక్కూర్చుంటున్నారు. కథ ఎలా ఉన్నా చప్పట్లే రాలుతుంటే, అది చూసి, కథంటే ఇలాగే ఉండాలి కాబోలనుకుని యువకథకులూ అదే దారి పడుతున్నారు. హారర్, సస్పెన్స్, డిటెక్టివ్, క్రైమ్, హాస్యం – మొదలైన విభాగాల్లో మంచి తెలుగు కథొకటి చదివి ఎన్నేళ్లయిందో గుర్తు తెచ్చుకోండి. వెల్లువలా వచ్చి పడుతున్న ‘సందేశాత్మక’ కథల దెబ్బకి ఇతర తరహా కథలిష్టపడే పాఠకులు పారిపోయారు. ఫలితం? ప్రస్తుతం తెలుగులో పాఠకులకన్నా కథకుల సంఖ్య అధికం!

కాబట్టి నష్టం కలిగేది కథాంశం వల్ల కాదు. వస్తువుకి మితి మీరిన ప్రాధాన్యత ఇవ్వటం వల్ల; కొన్ని రకాల అంశాలని కళ్లకద్దుకుని కొలిచే ధోరణి వల్ల.

– అనిల్ -ఎస్-రాయల్

_________________________________________________________________________________________________

తెలుగు సాహిత్యం వికాసం. అభివృద్ధి, మొదటి నుంచీ వివిధ సంఘటనలతోనే ముడిపడి వుంది. మొదటి సంస్కరణ వాద కథల నుంచీ, అటు తర్వాత వామపక్ష ఉద్యమ ప్రభావం నుంచీ…ఇవాళ్టిదాకా అది విడదీయలేనంతగా కొనసాగుతూనే వుంది.

భవిష్యత్ లోనూ కొనసాగుతుంది. ఐతే  వ్యక్తి ప్రయోజనాలకే పెద్ద పీట వేసే పశ్చిమ దేశాల సాహిత్యం ప్రభావంతో మన దగ్గర కొందరు ఇటువంటి వాదన చేస్తున్నారు.  వర్తమానంతో సంబంధం లేని సాహిత్యం వుండదు.  కథలో కానీ, సాహిత్య రూపాల్లో కానీ వ్యక్తికి, అతని భావాలకు తప్పక ప్రాధాన్యం వుంటుంది. వుండి తీరాలి.  కానీ సమాజంలో కొన్ని సంఘటనలు జరిగినపుడు వ్యక్తి తప్పక ప్రభావితం అవుతాడు. అది కథగా మలిచినపుడు చెప్పిన తీరులో కొంత హెచ్చు తగ్గులుండవచ్చు. ఆ చెప్పిన తీరుపైన చర్చ చేయవచ్చు కానీ అసలు సామాజిక అంశాలే కథల్లోకి రాకూడదు అనడం అవగాహనా రాహిత్యమే.

-కరుణాకర్ ఎనికపాటి

_________________________________________________________________________________________________

ఫలానా అంశాల వల్ల కథకు నష్టం జరుగుతోందనే వాదన నేను విశ్వసించను. వొక రచయిత కథ చెప్పిన తీరులో తేడాలుండవచ్చు. వొక సారి ఉత్తమ స్థాయిలో చెప్పవచ్చు. కొన్ని సార్లు యథాతథంగా రచయిత చూసింది… జరిగింది రాయొచ్చు. ప్రతీ అంశాన్ని కళాత్మకంగా చెప్పే వెసులుబాటు రచయితకు ఉండకపోవచ్చు. చెప్పిన తీరుపైన చర్చ చేయవచ్చునేమో కానీ….ఫలానా అంశం చెప్పకూడదని అనలేం
కదా.

-పింగళి చైతన్య

_________________________________________________________________________________________________

మొత్తంగా ఈ అంశం సున్నితమైనదే కాదు… విస్తృతమైనది కూడా. కనుక ఈ అంశంపైన సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరముంది.
కథను సీరియస్ తీసుకున్న కొత్త తరం రచయితలకు, కథకు ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశమే ఈ చర్చలోని అసలు ఉద్దేశం. ఈ దిశగా మీ ఆలోచనలు, భావాలను పంచుకోవాలని కోరుతున్నాం.

ఖదీరుడి సరికొత్త ‘చిత్రం’!

 

 

 

–  వెంకట్ సిధా రెడ్డి

~

 

ఇది ఖదీర్ బాబు “కథలు ఇలా కూడా రాస్తారు” గురించి.

కానీ దానిగురించి చెప్పే ముందు….. నా గొడవ కొంచెం.

సినిమాల్లో కి వద్దామని అనుకున్నప్పుడు- మొట్టమొదట ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని పుస్తకాలు (సిడ్ ఫీల్డ్, రాబర్ట్ మెకీ ఇంకా చాలా) కొన్నాను. చాలా సార్లు ఆ పుస్తకాలు ఎంత బోరింగ్ గా ఉంటాయంటే, ఏంట్రా బాబూ ఈ సోది అనిపించేది. అలాగే కథలు రాయడం నేర్చుకోవాలని కాదు గానీ,ఎలా రాసారో చూద్దామని అయాన్ ర్యాండ్ – ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ లాంటి పుస్తకాలు కొని ఎన్నేళ్ళైనా ఇప్పటికీ పూర్తి చేయలేదు. చెప్పొచ్చేదేమిటంటే – క్రియేటివ్ ప్రాసెస్ కి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎంత వరకూ ఉపయోగపడతాయనేది నాకు పెద్ద అనుమానం. అదే సమయంలో సిడ్నీ లూమెట్  మేకింగ్ మూవీస్ పుస్తకం కొన్నాను. అది కూడా పైన చెప్పిన పుస్తకాల్లాగే పరమ బోరింగ్ గా ఉంటుందేమోనని భయపడుతూనే మొదలుపెట్టి ఒక రాత్రి పూర్తిగా చదివేశాను. సరిగ్గా అలాగే జరిగింది ఖదీర్ బాబు పుస్తకం విషయం లో కూడా.

ఈ రెండు పుస్తకాలకీ ఉన్న పోలిక ఏంటంటే – వీళ్లిద్దరూ కూడా వారి వారి రంగాల్లో ఎంతో సాధించిన తర్వాత, వారి అనుభవాలను చాలా ఇన్‍ఫార్మల్ వాయిస్ లో, ఎంతో ఆత్మీయంగా మనతో పంచుకుంటారు. అలాగే రెండు పుస్తకాల్లోనూ అథారిటేటివ్ వాయిస్ ఉండదు. టోన్ చాలా మోడెస్ట్ గా ఉంటుంది. మేము చెప్పిందే రైట్ అని తలబిరుపూ ఉండదు. అందుకే ఈ రెండు పుస్తకాలు చదువుతుంటే మనకి ఆప్తులైన వారితో మాట్లాడినట్టనిపిస్తుంది.

నేను కూడా ఈ మధ్య కథలు రాస్తున్నాను. ఇంకా రాయాలనుకుంటున్నాను. చాలా సార్లు నాకు తెలిసిన రచయితలతో కలిసి మాట్లాడి నా కథలని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అని సలహా తీసుకుందామనుకున్నాను. కానీ నాకు మరీ అంత బాగా పరిచయమున్న రచయితలు చాలా తక్కువ.అలాంటి సమయంలో ఈ బుక్ రిలీజ్ అయింది. రిలీజైన రోజే కొన్ని చాప్టర్స్ చదివేశాను. అప్పట్నుంచీ ఎప్పటికప్పుడు చదవాలనే ఉన్నా, చివరికి నిన్న చెన్నై ఐర్పోర్ట్ లో దొరికిన ఐదు గంటల ఖాళీ సమయంలో ఏకబిగిన చదివేశాను. చదివేశాను అనడం కంటే చదివించింది అనడం కరెక్ట్. అంతా ఒకేసారి చదివేసి ఆయాసపడకండి అని ఖధీర్ బాబు ముందే వార్నింగ్ ఇచ్చినా, చదవడం మొదలు పెట్టాక ఆపడం కష్టం. ఏదైతేనేం. పూర్తి చేశాను.

ఐతే ఒక మనవి. ఇది సమీక్ష కాదు. ఏదో నాకనిపించిన నాకు తోచిన నాలుగు మాటలునిజాయితీగా పంచుకోవడమే!

ఫస్ట్ కట్ 

పుస్తకం ఎలా ఉంది అంటే?… ఖదీర్ బాబు తో నాకు బాగా పరిచయం ఏర్పడి, ఒక సాయంత్రం పూట ఆయనతో కూర్చుని ఒక నాలుగైదు గంటలు – ఆయన కథల గురించి, ఆయనకు నచ్చిన కథల గురించీ – చెప్తుంటే హాయిగా విన్నట్టుంది. ఏదో మూడొందల పేజీల  భారీ నాన్‌ఫిక్షన్ పుస్తకం చదివిన ఫీలింగ్ లేదు. కథలు రాయాలనుకున్న వాళ్ళకి, రాస్తున్న వాళ్ళకీ తప్పకుండా ఉపయోగపడే పుస్తకం. అసలు కథ అంటే ఏ మాత్రం ఇంట్రస్ట్ ఉన్నా వాళ్ళకి కూడా నచ్చేసే పుస్తకం. అది చెప్పాలనే ప్రయత్నమే ఇది రాయడం!

khadeer book

పుస్తక కథకు హీరో ఫుట్ నోట్స్ 

ఇందులో మనం తెలుసుకున్న కొత్త కథలు, రచయితలు, వారి గురించి రాసిన ఫుట్ నోట్స్ చూస్తే – బాబోయ్, అసలు ఈ పుస్తకం ఎలా రాసాడ్రా బాబూ అనిపిస్తుంది. బహుశా వందేళ్ల తెలుగు కథ రాయబట్టే ఖధీర్ బాబు ఈ పుస్తకం రాయడం వీలైందేమో అనిపించింది. ఎందుకూ కాకపోయినా కేవలం ఫుట్ నోట్స్ కోసమైనా ఈ పుస్తకం చదవొచ్చు.

ఈ పుస్తకం చదివే తారాగణం? వారి పాత్రౌచిత్యా(త్రా)లు 

చాలామందే చదువుతారు. చదివిన ప్రతి ఒక్కరూ ఇంకొక్కరికైనా చెప్తారు. ఎందుకంటే ఇందులో కరుణ ఉంది. బోల్డెన్ని జ్ఞాపకాలున్నాయి. ఇంకా…తనకి తెలిసింది నలుగురికీ పంచుకోవాలనే గుణం ఉంది. తెలుగు లో ఇంకా మంచి కథలు రావాలనే తపన ఉంది. కాబట్టి ఇది కొత్త వాళ్లు,పాతవాళ్లు అందరూ చదువుతారు. ఎ ఉద్దేశంతో చదువుతారని అడిగితే గొప్ప చిక్కే …. ఎందుకంటే చదివేవారు అన్నిరకాల ఉద్దేశాలతో చదువుతారు. హమ్మయ్య ఈ పుస్తకం చదివేస్తే మనకీ కథలు రాయడం తెలిసిపోతుందనే అమాయకత్వం తోనూ, తొక్కలోది మనకి తెలియంది ఏం చెప్పుంటాడులే అనే గర్వంతోనూ, ఇతను ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎలా రాసెయ్యగలుగుతున్నాడనే ఈర్ష్యతోనూ, ప్రేమతోనూ, కోపంతోనూ – ఇలా అన్ని ఉద్దేశాలతో చదువుతారు. మొత్తానికైతే చదివి తీరుతారు.

 

కానీ చదివేముందు బుక్ కవర్, వెనుక చాప్టర్స్ లిస్ట్, ఇప్పటికే అక్కడా ఇక్కడా వచ్చిన టాక్ బట్టి ఇది ఆషామాషీ పుస్తకం కాదనే చేతులోకి తీసుకుంటారు. తెలుగులో కథలు రాయడం గురించి వచ్చిన చాలా తక్కువ పుస్తకాల్లో ఇది ఒకటి కావడం, సైజు కూడా భారీగా ఉండడం వల్ల – బోర్ కొడ్తుందేమోనని భయమూ, ఏదో తెలుసుకోబోతున్నామనే ఉత్సుకతతోనే ఈ పుస్తకం తెరుస్తాం. అయిపోయాక మంచి ఫీలింగ్ తోనే మూసేస్తాం. తెలుసుకోవాలన్నోడికి తెలుసుకున్నంత ఉంది. (ఇంకా ఉంటే బావుండేది. నిజానికి ఇంకా చాలా చాలా ఉండాలనిపిస్తుంది. ఆ విషయం గురించి తర్వాత.)

 

అసలు కథేమిటంటే ..?

ఒక సంవత్సరంలో తెలుగులో వేల కొద్దీ కథలొస్తున్నా అందులో మంచి కథలు చాలా తక్కువ ఉంటున్నాయి. అవి ఎక్కువ కావడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. కథలు రాయడానికి కాస్తా పిచ్చి ఉండాలి. కొంచెం భావుకత్వం ఉండాలి. అన్నింటికంటే ఎక్కువగా కరుణ ఉండాలి.రాయడంకంటే ముందు చదవడం తెలియాలి. మనకంటూ ఒక ధృష్టి కోణం ఉండాలి…అని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఇంతే కాదు. ఇంకా కథా రచనకు సంబంధించి ఎన్నో విషయలాను ఖదీర్ మనతో ఈ పుస్తకం లో షేర్ చేసుకున్నారు. కొత్తగా కథలు రాసేవాళ్లకంటే -ఆల్రెడీ రాస్తున్న వాళ్లకి, కొన్ని రాసి ఆపేసిన వాళ్లకి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. తట్టి లేపుతుంది. మనకి తెలియని ఎన్నో కథలని పరిచయం చేస్తుంది. ఎంతో మంది రచయితలకు దగ్గర చేస్తుంది. కొన్ని తెలిసిన విషయాలే అయినా భలే చెప్పాడే అనిపిస్తుంది. అసలు నాన్ ఫిక్షన్ ని కూడా ఇంత ఇంట్రస్టింగా రాయొచ్చా అనిపిస్తుంది. కాబట్టి ఈ పుస్తకం చదవాల్సిందే.

మరైతే అంతా ఒకేసారి కాకుండా అప్పుడప్పుడూ  ఒకటో రెండో చాప్టర్స్ చదవాలని ఖదీర్ బాబు చెప్పాడు కానీ, నేను చెప్పేదేంటంటే మొత్తం ఒకేసారి చదివెయ్యాలి. ఆ తర్వాత మనం రాయడం మొదలు పెట్టాలి. రాస్తూ ఉండగానో, రాయడం అయ్యాకనో అప్పుడు చాప్టర్ హెడింగ్స్ చూసుకుని మనకి కావాల్సినవి అప్పుడు మళ్లీ చదువుకుంటే మేలని నా అభిప్రాయం.

ఈ బుక్ లో ఏం చెప్పారు? అసలు థీమ్ ఏంటి?

ఇందులో ఖధీర్ బాబు భారీ ప్రకటనలు చేయలేదు. ఇలానే రాయాలని పట్టుపట్టలేదు. నేను ఇలా రాస్తుంటాను. నాకు నచ్చిన కొంత మంది ఇలా రాశారు. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే ఉంది ఈ పుస్తకంలో. ఆ పైన చాలా ప్రాక్టికల్ విషయాల గురించి మనతో షేర్ చేసుకున్నారు. చాలా వరకూ అందరికీ ఉపయోగపడేవే. థీమ్ అండ్ ప్లాట్ గురించి, శైలీ-శిల్పం గురించి, కాన్‍ఫ్లిక్ట్ గురించి వచ్చిన మూడు చాప్టర్స్ మాత్రమే కొంచెం హెవీగా ఉంటాయి. అసలు ఇలాంటి “హౌ టు ” బుక్స్  దెబ్బతినేదే ఇక్కడ. ఎందుకంటే పైన చెప్పినవి సాంకేతిక అంశాలు. టెక్నిక్ కి సంబంధించినవి. వీటి గురించి ఎంత లాగినా తెగదు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరెవరో ఎన్నో చెప్పారు వీటి గురించి. కానీ పూర్తిగా ఎవరికీ క్లారిటీ ఉండదు. అందుకే ఖధీర్ బాబు థీమ్ విషయం లో థాంక్ గాడ్ అనేసి తప్పించుకున్నాడు. కానీ శైలీ-శిల్పం విషయంలో, కాన్‍ఫ్లిక్ట్  విషయంలో కూడా డెఫినిషన్లతో విసిగించకుండా ఉదాహారణలతో చెప్పి అర్థమయ్యేలా చేశాడు. ఆ విధంగా ఇది హౌటు గైడ్ అని అనుకోవడం కంటే ప్రాక్టికల్ ఎడ్వైజ్ ఫ్రం ఏన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు.

 

ఎప్పటికీ నిలిచిపోయే చిత్రమేనా?”

తెలుగులో కొన్ని, ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో పుస్తకాలు కథల గురించి వచ్చుండొచ్చు కానీ ఇంతకు ముందు, ఆ తర్వాత కూడా ఇలాంటి పుస్తకం రాలేదు, వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే దీని వెనుక చాలా శ్రమ ఉంది. తను చేస్తున్న పని మీద చాలా శ్రద్ధ ఉంది. అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి స్థలమూ కాలమూ ఈ పుస్తకానికి ఆపాదించలేం. ఇంకో వందేళ్ళు కాదు. తెలుగు కథ ఉన్నంతవరకూ ఈ పుస్తకం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు – ప్రపంచంలో ఏ మూల ఉన్నవాడికైనా తెలుగు కథ గురించి తెలుసుకోవాలంటే ఖధీర్ రాసిన రెండు పుస్తకాల తర్వాతే ఏదైనా. ఒకటి వందేళ్ళ తెలుగు కథైతే రెండోది, ఈ పుస్తకం!

అసలు సబ్జెక్ట్ ని ఖధీర్ బాబు ఎలా డీల్ చేశారు?

చాలా తెలివిగా అని చెప్పొచ్చు. ఎందుకో చదివితే మీకే అర్థమవుతుంది. ఖధీర్ అన్నట్టు దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. ఒన్లీ బిగినింగ్.

అలాగే ఖదీరుడు పుస్తకానికి  టైట్ట్ పేరు తెలివిగా  పెట్టాడు. తెలివిగా అని ఎందుకన్నానంటే ఈ పుస్తకానికి పెట్టిన పేరు చూస్తే చాలు మీకర్థమవుతుంది. ఒక వేళ లోపలి కంటెంట్ లో ఒక్క పదం మార్చకుండా, ఈ పుస్తకానికి “కథలు ఎలా రాయాలి?” అని పేరు పెట్టుంటే – ఈ పుస్తకం అట్టర్ ఫ్లాప్ అయ్యుండేది. అంటే కేవలం టైటిల్ వల్ల సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు, కథలు నచ్చకపోవడాలు చాలా సార్లు జరిగాయి. టైటిల్ ది ఏముంది. అది చాలా ఆబ్వియస్ విషయం అనుకుంటాం. కానీ ఇక్కడే ఖధీర్ చెప్పిన చాలా చిన్న చిన్న విషయాలు మనకి ఉపయోగపడతాయి. మనం చాలా ఆబ్బ్వియస్ అనుకున్న విషయాల గురించి జాగ్రత్త వహించమని చెప్తాడు.

ఈ పుస్తకంతో నాకున్న కాన్ఫ్లిక్ట్ అను  పేచీ ఏంటంటే?

కథ అనేది ఎంతో విశాలమైన పరిధి కలిగి ఉన్నది. కథల్లో ఎన్నో రకాలున్నాయి. యాక్షన్ ఎడ్వంచర్ కథలుంటాయి. ఫాంటసీ కథలుంటాయి. డిస్టోపియన్ ఫిక్షన్ ఉంది. యంగ్ అడల్ట్ లిటరేచర్ ఉంది. ఎరోటికా ఉంది. హారర్, థ్రిల్లర్. మిస్టరీ హిస్టరీ. పల్ప్ ఫిక్షన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.అయితే ఈ పుస్తకంలో ఖధీర్ బాబు డీల్ చేసింది కేవలం “లిటరరీ ఫిక్షన్” గురించే. తెలుగులో మొదట్నుంచీ జాన్రా ఫిక్షన్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఖధీర్ బాబు కూడా దీన్ని వదిలేశారు. అయితే మొదట్నుంచీ ఖధీర్ బాబు రాసినవి లిటరరీ ఫిక్షన్ కథలే. కాన్ఫ్లిక్ట్ కూడా చాలా వరకూ ఎక్స్‍టర్నల్! కానీ ఈ మధ్యనే – మెట్రో కథలు, బియాండ్ కాఫీ –  లలో శైలి మార్చారు. బహుశా కొన్నేళ్ళ తర్వాత వచ్చే మరో ఎడిషన్ లో కొత్త ఛాప్టర్ లు యాడ్ అవుతాయని నమ్మకం. అప్పుడు – అసలు కథలు ఇలానే ఎందుకు రాయాలి? అనే ఒక చాప్టర్ ఉంటుందేమో!

 

క్లైమాక్స్ 

అసలు కథలు ఎందుకు రాస్తారు, ఎవరు రాస్తారు, ఎలా రాస్తారు లాంటి విషయాలతో మొదలైన పుస్తకం చివరికొచ్చేసరికి చాలా ప్రాక్టికల్ సజెషన్స్ తో ముగుస్తుంది. మధ్యలో సంభాషణలు ఎలా రాయాలి, పంక్చుయేషన్ ఎలా ఉపయోగించాలి లాంటి ఆవసరమైన విషయాలు చర్చించాక చివరి చాప్టర్స్ లో చాలా ఫ్రెండ్లీ అడ్వైజెస్ ఇచ్చారు ఖధీర్. ఇవన్నీ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా విమర్శను ఎలా తట్టుకోవాలి? పుస్తకం ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, వేశాక ఏం చేయాలి లాంటి విషయాలు కొన్ని కథలు రాసి కథకులుగా ప్రాక్టీస్ లోకి వస్తున్న వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి.

మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే – ఇది చాలా మంచి పుస్తకం. ప్రస్తుతం చాలా అవసరమున్న పుస్తకం. సాదా సీదా గా ఉంటూనే చాలా గొప్ప విషయాలను తెలియచెప్పే పుస్తకం. కాబట్టి తెలుగు కథకులు, పాఠకులు, విమర్శకులు చదవాల్సిన పుస్తకం.

కాబట్టి, దయచేసి చదవండి.

(శుభం కార్డు పడింది. ఇక దయచెయ్యండి.)

 

కేవలం సింపతి?!

 

– చైతన్య పింగళి

~

                రోహిత్ మీద రాసిన ఈ కథ కేవలం సింపతి ఉన్న కథ!

సాక్షి కథల పోటీలో వెంకట్‌సిద్ధారెడ్డి రాసిన ‘

’  కథ మొదటి బహుమతి గెలుచుకుంది. అందుకు అభినందనలు. ఈ కథని ఆదివారం ప్రత్యేక సంచిక కవర్‌పేజిగా కూడా వేశారు. అందుకు కూడా అభినందనలు.

రోహిత్‌వేములకి సంబంధించిన కథ అవటం వల్లా, ఆదివారం ప్రత్యేక సంచిక కవర్‌పేజిగా ఈ కథ వేయటం వల్ల,  చాలా మంది అగ్రకులస్థులతో పాటుగా ఒకరిద్దరు ఉద్యమకారులు కూడా దీన్ని గురించి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుల  వల్ల.. ఈ కథ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. కథని నడిపించిన తీరు, శైలికి చాలా ప్రశంసలే వచ్చాయి. ఒక యాక్టివిస్ట్‌గా, రచయితగానీ, వ్యాసకర్తగానీ.. ‘ఇంతకీ ఏం చెబుతున్నారు?’ అని చూస్తాను కాబట్టి–వాటి జోలికి నేను పోవటం లేదు. వ్యక్తిగా వెంకట్‌గారి మీద చేస్తున్న విమర్శ కాదు ఇది. ‘రోహిత్‌’ విషయాన్ని చాలా మంది అర్ధం చేసుకుంటున్న తీరు గురించి.. ఈ కథ నేపధ్యంలో మనం చర్చించాల్సిన అవసరం ఉంది.

రోహిత్‌వేముల కంటే ముందు, ఆ తర్వాత కూడా అగ్రకుల  ఆధిపత్యం కిందా, పెత్తనం కిందా ఎందరో దళితులు¬ దిక్కు మొక్కు లేకుండా నలిగి నాశనమయ్యారు. అవుతున్నారు. చంపబడ్డారు. దళిత వాడలు ఊచకోత కోయబడ్డాయి. ఎందరో దళిత స్త్రీలు రేప్‌కి గురికాబడ్డారు. అదే సెంట్రల్  యూనివర్సిటీ లో చాలా మంది దళితులు ఆత్మహత్య చేసుకున్నారు. మాటల్లో చెప్పలేని పైశాచిక, వికృత హింసని ఎదుర్కొన్నారు, ఎదుర్కొంటున్నారు.

ఇవి ఏవీ కూడా- అగ్రకులాలని రోహిత్‌వేముల ఆత్మ‘హత్య’ కదిలించినంతగా కదిలించలేదు. కారణం– ఆ ఉత్తరంలో ప్రతిఫలించిన అతని మేథస్సు, అంతకంటే ముఖ్య కారణం– రోహిత్‌తన చివరి లేఖలో ఎవరీనీ తన చావుకు బాధ్యుల్ని చేయకపోవటం. విసి అప్పారావుని కానీ, దత్తాత్రేయను కానీ, స్మృతి ఇరానీని కానీ, చివరికి సుశీల్‌కుమార్‌పేరును అయినా సరే.. అతని ఉత్తరంలో రాసి ఉంటే– రోహిత్‌కి సవర్ణుల నుండి ఏమాత్రం మద్దతు వచ్చేదో మనం ఊహించగలిగేదే.

ఈ కథలో కూడా సరిగ్గా ఇదే ప్రతిధ్వనించింది. ఇందులో నాయకుడు సినిమా హీరోలా డెనిమ్‌జీన్స్,  రౌండ్‌నెక్‌టీ షర్టు వేసుకుని లైబ్రరిలోకి ఉత్సుకతతో వస్తుంటాడు. స్కాలర్‌షిప్‌డబ్బుని ఇల్లు గడపటానికి పంపిన రోహిత్‌ని రొమాంటిసైజ్  చేసి చూపించటంలో ఇబ్బంది ఉన్నా సరే, తప్పేం లేదు కాబట్టి ఏమీ అనలేం. కానీ కథ చివర్లో.. రోహిత్ చనిపోటానికి వెళ్తున్నప్పుడు.. భారతి అతన్ని ఆపటానికి ప్రయత్నిస్తుంది. వారి మధ్య జరిగిన సంభాషణలో.. మూడు ముఖ్యమైన ప్రశ్నలు ఆమె అడుగుతుంది.

res

మొదటిది– ‘బర్త్ సర్టిఫికెట్‌నుండి కులం తీసేస్తే..?’ అని. ‘దాని వల్ల ఉపయోగం లేదు, మనుషుల మనసుల్లో నుండి కులం పోవాలి’ అని అతను సమాధానం ఇస్తాడు.

సర్టిఫికెట్ల నుండి కులం తీసేయటం అనేది కథలోనే కాదు.. బయట ఉన్న చాలా మంది ‘మంచి’ సవర్ణులు కుల నిర్మూలన కోసం చెప్పే ఒక చిట్కా. ‘నీకు చొక్కా ఉంది, నాకు చొక్కా లేదు కాబట్టి, మనం ఇక చొక్కా గురించి మాట్లాడుకోవద్దు’ అన్నట్టు ఉంటుంది ఈ మాట.

సర్టిఫికెట్లలో కులం ఉండేదే, కుల నిర్మూలన  దిశగా ఒక అడుగు అనే అవగాహన ఉండదు. ఈ కథలో భారతి కూడా అమాయకంగా అలాగే అడిగింది. ఆమె అలా అడగటం పట్ల నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ భారతి సోకాల్డ్  అగ్రకుల ‘భారతమాత’లా చిత్రీకరించారు కాబట్టి ఆమె అలా అడగటం సహజమే.

కానీ.. రోహిత్‌తో చెప్పించిన సమాధానం.. అసలు సమస్య. నీరు ఆవిరి అయినంత సహజంగా, మనుషుల మనసుల్లో నుండి పోయేదా కులం? దీన్ని అంగీకరిస్తే.. స్త్రీ రిజర్వేషన్లు, సమాన వేతనాలు, నియమిత పనిగంటలు.. అసలు ఒకటేంటి.. దేని గురించి ఎవరు ప్రశ్నించినా.. సరే, రోడ్డు మీదకొచ్చినా సరే.. ముందు మనుషులు  మారాలి అని ఒక తాత్విక స్టేట్‌మెంట్‌ఇస్తే సరిపోతుంది. ఈ మనషులు  మారాలి, మనసు తేటపడాలిలాంటి మాటలు.. వ్యక్తిని కార్యాచరణ నుండి దూరం చేసే మాటలు. హ్యూమన్‌డిగ్నిటి, గౌరవం లేకపోవటం.. అనే రెండు హార్డ్‌రియాలిటిస్‌కి.. ‘మనసుల్లో నుండి పోవాలి’ అనే  ఒక అభౌతికమైన సమాధానం చెప్పటం న్యాయమా? పైగా ఈ మాట అనిపిస్తోంది.. ‘బర్త్ సర్టిఫికెట్‌నుండి కులం తీసేస్తే..?’ అనే భావజలం మీద సంవత్సరాలు పొరాడిన ఒక ఫైటర్‌అయిన రోహిత్‌తో! అదే అసలు సమస్య.

‘మనస్సు నుండి కులం  పోవాలి’ అని సాధారణంగా ఎవరు అంటారు? కుల వ్యవస్థ వల్ల ప్రయోజనాలు, ఆధిపత్యాలు, అవకాశాలు పొందుతున్న అగ్రకులస్థులు అంటారు. కారంచేడులో, చుండూరులో దళితుల్ని నరికేసిన విషయం గుర్తు చేస్తే.. ‘ఈ కులం అనేదే పోవాలండి’ అంటారు. అంతకుదాటి, కార్యాచరణలోకి కానీ, ఆ విషయాల మీద పోరాడుతున్న వారికి సంఫీుభావం తెలపటంలోకానీ.. ముందుండరు. ఎందుకు? సవర్ణులకి  అంతవరకే కన్వీనియంట్‌కాబట్టి. చివరికి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న మనిషిని అడిగి చూడండి.. ‘మనుషుల మనసుల్లో నుండి కులం  పోవాలి’ అని చక్కగా ఒప్పేసుకుంటాడు. కులం  ఎలా పోవాలి? కులనిర్మూలనకి మనం చేయాల్సిన పని ఏంటి? కార్యాచరణ ఏంటి? లాంటి సీరియస్‌ప్రశ్నల  జోలికి వెళ్తే.. ఆ మనిషి ‘గాయబ్‌’. అనుమానం ఉంటే.. ‘మంచి సవర్ణుల’ మీద టెస్ట్ చేసి చూడండి.

మనుషుల మనస్సులో నుండి కులం పోవాలి అని  ఏ పాత్రతో అయినా, చెప్పిచ్చి ఉంటే.. అభ్యంతరం ఉండేది కాదు. కానీ.. ఈ  మాట  చెబుతోంది.. రోహిత్‌! కులనిర్మూలన కోసం కులసంఘలుగా సంఘటితమవ్వాల్సిన అవసరన్ని.. తెలిసి.. అంబేడ్కర్ పేరు మీద ఉన్న, ‘అంబేడ్కర్ యువజన సంఘం’ లో  పని చేసిన రోహిత్ అంటాడు! వెలివేత అనే అబ్సోల్యూట్  రియాలిటికి గురి అయిన, ఒక కుర్రాడు అంటూన్నాడు! పైగా మామూలు కుర్రాడు కాదు.. కులనిర్మూలనా పోరాటానికి ఇప్పుడు ఒక చిహ్నంగా మారిన కుర్రాడు అంటున్నాడు!!

ఇక భారతి అడిగిన రెండో ప్రశ్న. ‘అంబేద్కర్‌తో ఎనిహిలేషన్‌ఆఫ్‌క్యాస్ట్‌స్పీచ్‌ని మళ్ళీ ఇప్పిస్తే.. అది విని అందరూ మారిపోతే..’ అని. అప్పుడు రోహిత్‌చెప్పే సమాధానం.. ఆయన ఒక్కడి వల్లే అయ్యుంటే.. ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు అని. ఇది రోహిత్‌ సమాధానం!

కుల నిర్మూలన మీద అంబేద్కర్‌ఉపన్యాసాన్ని రద్దు చేసింది.. దానిలో ఉన్న కంటెంట్‌వల్ల. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల మూలాల్లోకి వెళ్ళి, కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించటం వల్ల. ముఖ్యంగా.. కులం  పునాదుల  మీద నిర్మాణం జరిగి, ఆ పునాదులు  లేకపోతే రూపాన్ని కోల్పోయే హిందూ మతాన్ని వదిలేస్తాను అని అంబేద్కర్  తేల్చి చెప్పటం వల్ల. ఆ ఉపన్యాసాన్ని ఇప్పుడు ఇప్పించే పరిస్థితి ఉందా అసలు. ‘దమ్ముందా?’ అని అడగటం నిజానికి సరైన ప్రశ్న. మన విద్యా పీఠాల్లో, సిలబస్‌నిర్దేశించే కమిటీల్లో.. ‘మంచి’ బ్రాహ్మణులు, ‘మంచి’ సవర్ణులు  కాక, కుల వ్యతిరేకత ఉన్న మనుషులు ఉండి ఉంటే.. అంబేద్కర్‌కి మంచి నీళ్ళివ్వని జాలి కధ బదులు.. ‘కుల నిర్మూలన’ పాఠ్యాంశం అయి ఉండేది. ‘ఇది’ కథలోని భారతికి కూడా అవగాహన లేదు కాబట్టి.. పాపం సాదా సీదాగా, ఏం కుట్రకుతంత్రం లేకుండా.. ఈ ప్రశ్న అడిగింది అనుకోవచ్చు.

ఇక్కడ మళ్ళీ సమస్య.. రోహిత్ తో  చెప్పించిన సమాధానం. ‘ఆయన ఒక్కడి వల్లే అయ్యుంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చుండేది కాదు’. హమ్‌మ్‌. రోహిత్‌ని దగ్గరగా కాదు, అతని ఫేస్‌బుక్‌పోస్టుని చూసిన వారు కూడా.. ఇటువంటి సమాధానం అతను చెప్పడని చాలా ఈజీగా చెప్పేయగలరు. గాంధీ ఒక్కరి వల్లే స్వతంత్రం రాలేదు అని పోట్లాడే వాళ్ళలాగా.. ‘అంబేద్కర్‌ఒక్కడి వల్లే, కులం మీద అవగాహన రాలేదు. కులం ఎప్పుడు పుట్టిందో, కుల నిర్మూలన  పోరాటం కూడా అప్పటి నుండే పుట్టింది’ అనే ‘లిబరల్స్‌’ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను.

సమసమాజాన్ని సాధించటానికి శాస్త్రీయ పద్థతిలో ఒక దారిని చెప్పింది మార్క్స్‌ఒక్కరే. అలాగే  అంబేద్కర్‌కూడా ఒక్కరే. మశూచి అనే రోగం వచ్చినప్పుడే, కాల్చి వాత పెట్టటం దాని మందు.. అనే విధానం కూడా రోగ నివారణ పద్ధతిగా ఉండేది. ఆ తర్వాత తర్వాతే దానికి వ్యాక్సిన్‌ని కనుగొన్నారు. కులం ఏర్పడినప్పటి నుండే, కుల నిర్మూలనా పద్ధతులు ఉన్నాయి అనేది కూడా.. ఈ నాటు వైద్యం లాంటిదే. కులాన్ని ఒక శాస్త్రీయ విధానంలో అధ్యయనం చేసి, ఆ రోగానికి మందు కుదర్చటానికి ఏం చేయాలో చెప్పింది.. అంబేద్కర్‌ఒక్కరే. అంబేద్కర్‌ని దేవుడిని చేసి, అయన విమర్శకు అతీతుడు  అని నేను అనటం లేదు. కుల అసమానతలు అనేవి ఎంత లోతుగా వేళ్ళూనాయో, సమాజానికి అవెంత అపాయమో.. శాస్త్రీయ పద్ధతిలో చెప్పింది.. అంబేద్కర్‌ఒక్కరే అంటున్నాను. ఆయన ఆ పని చేయబట్టి, ‘బండి’ ఇక్కడి దాకా వచ్చింది అంటున్నాను. అంబేద్కర్‌పట్ల అయిష్టత ఉన్న సవర్ణులు, ఆయనకి ధీటుగా చాలా మందే ఉన్నారు అని గుచ్చి గుచ్చి చెబుతుంటారు. అది నిజమే కూడా. కానీ ఒక ఎలాబరేటడ్‌సమాధానంలో ఉండాల్సిన విషయాన్ని, కుదించి ఒక్క మాటలో ఆయన ఒక్కరి వల్లే కాదు అని తేల్చి చెప్పటం అభ్యంతరకరం. కథ బ్రివిటి కోసమయినంత మాత్రాన.. సిద్ధాంత విషయంలో అక్షరం తూలకూడదు.

ఇక భారతి అడిగే మూడో మాట.. వేదాలు , పురాణా ల మూలాల్లోకి వెళ్తాను అని. ‘కులనిర్మూలన’ అధ్యయనం చేసి ఉంటే, మూడో మాట వచ్చేదే కాదు. వేదాలు, పురాణాల  విషయాల్ని అంబేద్కర్‌కూలంకషంగా ‘కులనిర్మూన’లో చర్చించాడు.

చివర్లో.. ఈ కథకి ఇది ముగింపు కాదు అని భారతి, చనిపోటానికి వెళ్తున్న రోహిత్‌తో అంటే.. ‘నాది కథ కాదు, జీవితం’ అంటాడు. డెభ్భైు, ఎనభై దశకాల్లో అన్యాయానికి గురి అయిన సినిమా హీరోయిన్‌డైలాగ్‌లా ఉంది ఈ మాట.

ఒక మనిషిని.. తింటానికి తిండి, ఉంటానికి చోటు లేకుండా చేసి.. అనాగరికంగా వెలివేసి.. ఊపిరి ఆడనీయకుండా చేసి.. రక్తం అంటకుండా చేసిన హత్య ఇది. ఆత్మహత్య రూపంలో జరిగిన ఇన్‌స్టిట్యూషనల్‌మర్డర్‌అని అంతర్జాతీయంగా అందరూ మొత్తుకుంటోంది.. ఇందుకే. క్రైమ్‌ని గుర్తించాలని. కానీ.. ఈ కథలో ఆ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, అన్యాయాన్ని.. ఎస్టాబ్లిష్‌చేయకుండానే.. రోహిత్‌పేలవంగా, ఏ కులానికి నొప్పి కలిగించని డైలాగులు చెప్పి ‘వెళ్ళిపోయాడు’! కానీ.. వాస్తవంలో రోహిత్‌అలా లేడు. పోరాటం చేశాడు. ఖాళీ కడుపుతో ఆ యూనివర్సిటి నేల మీద పడుకుని.. ఆకాశం చూస్తూ.. ఆ దుర్మార్గాన్ని ఎదుర్కొన్నాడు. అగ్రకుల ఆధిపత్యాన్ని కాలరు పట్టుకుని గుంజి మరీ, అడిగాడు. చివరి అస్త్రంగా, తన శరీరాన్ని వాడాడు.

రోహిత్‌బతికి ఉండి.. ఈ పోరాటాన్ని చేసుంటే.. సవర్ణుల  నుండి ఇంతటి మద్దతు వచ్చేది కాదు. ఈ కథలో కూడా మనసుల్లో నుండి కులం పోవాలి అని కాకుండా, కాస్త గట్టిగా.. కాస్తంత గట్టిగా.. ‘నువ్వు నా సమానత్వం గుర్తించటం లేదు కాబట్టి.. అనో.. నువ్వే నా హత్యకు బాధ్యుడివి అనో.. ’ ఇలాంటి ఫీలింగ్‌ఏమన్నా.. పాఠకునికి తగిలి ఉంటే.. ఈ కథని.. అచ్చొచ్చొ అని అంతమంది అగ్రకులం  వాళ్ళు నెత్తికెత్తుకునే వాళ్ళు కాదు.

కులం అనేది జలగలా ఎలా రక్తాన్ని పీలుస్తుందో తెలిస్తే చాదు.. చందమామ కథల్లో దెయ్యాల  మాదిరి ఎన్ని మారు వేషాల్లో రాగలదో.. ఎంత సోఫిస్టికేటడ్‌లెవల్స్‌లో పని చేయగలదో.. గుర్తించగలగాలి. ఈ సమస్యని గుర్తించకపోటమే పెద్ద సమస్య. కులం మీద పోరాటం ఎంత కన్వీనియంట్‌గా ఉంటే సవర్ణులు అంత ఎక్కువ గుర్తిస్తారు. ఇష్టపడతారు. ఈ కథలో అదే జరిగింది. రోహిత్ మీద కథ వచ్చిన ఆనందం లో .. రోహిత్ నోట  అగ్రకుల భావజాలన్ని చెప్పించటాన్ని.. నిర్లక్ష్యం చేయకుడదు. ఇది రోహిత్‌విషయంలో ఒక సింపతి కలిగిన కథ మాత్రమే. రోహిత్‌మీదా , అతను ఎదుర్కొన్న సవాళ్ళ మీద, అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అంశాల మీదా.. ఎంపతి కాని, రెప్రజంటేషన్ కాని కలిగిన కథ కాదు. దళితులు, దళిత సాహిత్యము.. సింపతి కోరుకోటాన్ని దశాబ్దాల  క్రితమె దాటారు.  ఇప్పుడు సమానాత్వాన్ని గుర్తించమని అడగటం అనే  పరిధిని కూడా దాటి సమానాత్వాన్ని అంగీకరించమని చెప్పే  స్థాయికి  వచ్చారని సాహిత్యకారులు అర్ధం చేసుకోవాలి.

– చైతన్య పింగళి

 

 

 

*

(చిత్రాలు: అన్వర్ – సాక్షి సౌజన్యంతో)

కథ అంటే ఒక ఆవాహన..

 

 

రాయడమంటే ఏమనుకుంటున్నావు…?

 నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే….రాయడమంటే నీలోపలి అగ్ని గుండాన్ని బద్దలు కొట్టుకోవడం….

 నీకు జరిగింది కథ కాదు– నీలో జరిగింది కథ.

ఈ మూడు ముక్కలు చాలు. కథను, కథా రచనను వెంకట్ సిద్ధారెడ్డి ఎలా భావిస్తున్నారో చెప్పడానికి. మొదటి కథ సోల్ సర్కస్ తోనే ప్రతిభ చాటుకున్నారు సిద్దారెడ్డి.  సోల్ సర్కస్, కాక్ అండ్ బుల్ స్టోరీ, టైం ఇన్ టూ స్పీడ్  ..ఇప్పటి వరకూ రాసింది మూడు కథలైనా ప్రతీ కథా దేనికదే  ప్రత్యేకమైనది.  తనదైన శైలితో, భిన్నమైన గొంతుకతో కథారచన సాగిస్తున్న వెంకట్ సిద్ధారెడ్డితో చందు తులసి  మాటా మంతీ.

 

మొదటి కథ సోల్ సర్కస్ తోనే ఆకట్టుకున్నారు. ఆ కథ వెనక నేపథ్యం ఏమిటి..?

ఎప్పటినుంచో ఓ మంచి కథ రాయాలని అనుకుంటున్నాను. ఏదో రాయాలి అని ఆలోచించడం. ఏం రాయాలో మాత్ర స్పష్టత లేదు. అలా చాలాకాలం పాటూ ఆలోచించగావచ్చిన కథ సోల్ సర్కస్. ఈ కథే కాదు. మిగిలిన కథలు కూడా అంతే. కథ రాయాలనుకున్నపుడు ఓ ఆలోచన….మెరుస్తూ ఉంటుంది కానీ…కచ్చితంగా ఇదీ అన్న స్పష్టత ఉండదు. ఏదో కొంత రాయడం, దిద్దడం, మళ్లీ రాయడం, దిద్దడం….ఇలా అనేక సార్లు జరుగుతుంది. ఓ వారానికో, సంవత్సరానికో కథ మీద పట్టు దొరుకుతుంది.  ఇక ఆ తర్వాత కథ మనం రాయాల్సిన అవసరం ఉండదు. కథే నాతో రాయిస్తుంది.  ఉదాహరణకు సోల్ సర్కస్ కథలో చిత్వాన్ పాత్ర చనిపోతుందని మొదట కథ రాసేటపుడు నాకు కూడా తెలీదు. అలా రాస్తూ పోతుంటే కథ నన్ను ఆవహిస్తుంది. ఆ తర్వాత వెనక్కు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. దానంతట అదే సాగిపోతుంది.
సాధారణంగా మనం చాలా కథలు చదువుతుంటాం. కానీ కథతో  పాటూ గుర్తుపెట్టుకునే పాత్రలు అరుదుగా వుంటాయి. అలాంటిదే చిత్వాన్ పాత్ర.  చిత్వాన్ పాత్రకు మీ జీవితంలో ఎవరైనా ప్రేరణ ఉన్నారా..?
కచ్చితంగా ఫలానా వ్యక్తి ప్రేరణ అని చెప్పలేను కానీ….నేను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో చదివేటపుడు నాకో ఫ్రెండ్ ఉండేవాడు. అతను నన్ను బాగా ఇన్ స్పైర్ చేసినాడు. సాహిత్యం అంటే ఏమిటి..? అసలు ఏ సాహిత్యం చదవాలి. అని నాకు చాలా సలహాలిచ్చేవాడు. దేశ, విదేశాల్లోని మంచి సాహిత్యం గురించి పరిచయం చేశాడు. అలా ఆ సాహిత్యం చదువుతూ అతనితో గంటలు గంటలు చర్చించే వాడిని. ఇక సాహిత్యాభిలాష పక్కకు పెట్టి చూస్తే…వ్యక్తిగతంగా ప్రవర్తన, ఆలోచన అన్ని రకాలుగా ఓ ప్రత్యేకతతో ఉండేవాడు. అలా  అతని గురించి ఓ కథ రాద్దామనకున్నాను. అతనికో భిన్నమైన నేపథ్యం ఉండాలని భావించాను. అప్పుడే ఆలూరి బైరాగి గారి దరబాను కథ చదివి ఉండడం వల్ల అయ్యుండొచ్చేమో – చిత్వాన్ కి నేపాలీ బ్యాక్ డ్రాప్ అయితే ఎలా ఉంటుంది అనుకున్నాను.  అలా నేపాల్ గురించి వివరాలు సేకరిస్తుండగా…నేపాల్ లోని ఓ అడవి చిత్వాన్ అని తెలిసింది. అలా చిత్వాన్ పేరు పరిచయమైంది.  అలా ఆ పాత్రకు చిత్వాన్ అని పేరు పెట్టాను.

kathana

ఇప్పటికే సినిమా అనే మరో మాధ్యమంలో ఉన్న మీరు…. ఇలా కథల వైపు ఎందుకు దృష్టి సారించారు. .?
నన్ను అపార్థం చేసుకోనంటే….నన్ను నేను సంతోష పరుచుకోవాడానికి కథలు రాస్తున్నాను. అంటే ఇపుడొస్తున్న కథలేవీ నాకు పూర్తిగా నచ్చడం లేదు. అలాగని ఇపుడొస్తున్న కథలు బాగా లేవని కాదు. మంచి కథలు చాలా వస్తున్నాయి. కానీ ఆ మంచి కథలు కూడా వ్యక్తిగతంగా నన్ను సంతృప్తి పరచడం లేదు. నాకేవో వేరే కథలు కావాలి. అవి ఇలా ఉండాలని చెప్పలేను కానీ, గతంలో అలాంటి కథలు బైరాగి, త్రిపుర, ఆర్.యస్ సుదర్శనం, ఆడెపు లక్ష్మీపతి లాంటి వారు రాయగా చదివాను. వేరే భాషల్లో చాలానే చదివాను. అలాంటి కథలు ఇప్పుడు చాలా కొద్ది మంది రాస్తున్నారు. మెహర్, వంశీధర్, మహి ఇలా కొత్త వాళ్ళు కొత్త టెక్నిక్ తో కథలు రాస్తున్నారు. కానీ ఇప్పుడు రాస్తున్న వాళ్లు రాయగలిగి కూడా విరివిగా రాయడం లేదు. ఆ అసంతృప్తిలోంచి, నాకు నచ్చే కథలు నన్ను నేను సంతృప్తి పరుచుకునేందుకు రాస్తున్నాను. మంచి కథలు రావడం లేదని కాదు…కానీ నాకు నచ్చే కథలు రావడం లేదన్న అసంతృప్తిలోంచి మొదటి కథ సోల్ సర్కస్ రాశాను.

అది రాయడం వెనుక దాదాపు పదేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇది నేను మొదటి కథ అంటున్నాను కానీ, నేను 8th క్లాస్ లో ఉండగా నా కథ ఒకటి చతురలో వచ్చింది. ఒక ఇంగ్లీష్ కథ కి అనుకరణ అది. ఆ తర్వాత 2005 లో నాలుగైదు కథలు నవ్యలో వచ్చాయి. తర్వాత బ్లాగుల్లో కూడా రెండో మూడో కథలు రాశాను. కాబట్టి సోల్ సర్కస్ మొదటి కథ కాదు కానీ, నాకు నచ్చినట్టు రాసిన మొదటి కథ అది.

2005 లో కథలు రాసిన తర్వాత, ఉద్యోగం, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక కథలు రాస్తానని అనుకోలేదు. కానీ రాస్తే బావుంటుందని మాత్రం ఎక్కడో ఉండేది. కానీ రాస్తే అంతకు ముందు రాసిన స్టైల్ లో మాత్రం రాయకూడదని అనుకునే వాడిని. మరి నేను రాయాలనుకునే కథ స్టైల్ ఏంటి? అనే ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది.

ఒక రోజు ఢిల్లీలో ఉండగా ఫుట్ పాత్ మీద మురకామీ అండ్ ది మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్ అనే బుక్ దొరికింది. అప్పటికే నాకు మురకామీ అంటే చాలా ఇష్టం. ఆ పుస్తకంలో మురకామీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఒక విషయం నన్ను బాగా ఆకట్టు కుంది.

 

I suspect that there are many of you in the audience who think it strange that I have talked all this time without once mentioning another Japanese writer as an influence on me. It’s true: all the names I’ve mentioned have been either American or British. Many Japanese critics have taken me to task for this aspect of my writing. So have many students and professors of Japanese literature in this country.

The simple fact remains, however, that before I tried writing myself, I used to love to read people like Richard Brautigan and Kurt Vonnegut. And among Latin Americans I enjoyed Manuel Puig and Gabriel Garcia Marquez. When John Irving and Raymond Carver and Tim O’Brien started publishing their works, I found them enjoyable too. Each of their styles fascinated me, and their stories had something magic about them. To be quite honest, I could not feel that kind of fascination from the contemporary Japanese fiction I also read at that time. I found this puzzling. Why was it not possible to create that magic and that fascination in the Japanese language?

So then I went on to create my own style.

ఇది చదివాక నాకు బల్బ్ వెలిగింది. అప్పట్నుంచే మళ్లీ కథలు రాయాలనిపించింది.

 

తెలుగులో మీకు నచ్చిన కథా రచయిత..? కథ…?
అలా చెప్పాలంటే చాలా మంది ఉన్నారండీ.  ముఖ్యంగా శ్రీపాద, మల్లాది లాంటి రచయితలు చాలా ఇష్టం.  త్రిపుర, బైరాగి రచనలు కూడా చాలా ఇష్టంగా చదువుతాను. అలాగే  కంఠమనేని రాధాకృష్ణ మూర్తి గారి కథలు బాగా ఇష్టం. నా దృష్టిలో  తెలుగు కథా రచయితల్లో  ఆయన చాలా గొప్ప రచయిత. ఆ తరహా కథలు తెలుగులో ఇంకెవరూ రాసినట్టు లేరు. ఆయన కథలని ఫలానా వర్గానికి చెందుతాయనో, లేదా ఓ విభాగానికి చెందుతాయనో చెప్పలేని ఏ జాన్రా లోనికి ఇమడని కథలు రాసారాయన.  తెలుగులో  ఉత్తమ కథల్లో ఆయన రాసినవీ తప్పకుండా ఉంటాయి.

మీ కథల్లో ఓ లోతైన తాత్వికత, అన్వేషణ కనిపిస్తుంది…?
బహుశా అది నా వ్యక్తిగత జీవితం, ప్రస్తుతం నా జీవితంలోని పరిస్థితుల వల్ల ఆ తరహా ఆలోచన కనిపిస్తుండవచ్చుననుకుంటా.  హెచ్. సీ.యూలో చదువు పూర్తై ఓ పెద్ద కార్పోరేట్ కంపెనీలో ….లక్షల రూపాయల వేతనం తీసుకుంటూ ఏ సమస్యా లేకుండా జీవితం గడిపిన నేను…ఆ తర్వాత అది జీవితం కాదని తెలుసుకున్నాను. ఓ గమ్యం కోసం, లక్ష్యం కోసం  ఉద్యోగం వదిలేసి ఇండియాకొచ్చాను.  నా గమ్యాన్ని చేరుకునే క్రమంలో ప్రతీక్షణం ఇప్పుడు నేను సంఘర్షణ అనుభవిస్తున్నాను.  రేపు ఎలా గడుస్తుందో తెలీని పరిస్థితి…అభద్రత. బహుశా ఇలాంటి వన్నీ నా ఆలోచనను ప్రభివితం చేస్తుండవచ్చు.  నా బాధను ప్రపంచానికి  చెప్పాలనన్న తపన, ఆరాటం …ఇవన్నీ కూడా నాకు తెలియకుండానే నా కథల్లో ప్రతిఫలించి ఉండవచ్చు.
కవికి గానీ, కథకుడికి గానీ…పోనీ ఏ సృజనకారుడికైనా సామాజిక బాధ్యత ఉండాలని మీరు నమ్ముతారా. ?
ఇలాంటి వాటి మీద నాకు స్పష్టంగా ఓ అభిప్రాయమంటూ లేదు కానీ….ఏదైనా కవితో, కథో రాసేముందు మన భావాలని స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తాం. అంతే కానీ సామాజిక బాధ్యత, స్పృహ ఇలాంటి వాటి గురించి ఆలోచించం. ఐతే మన రాతల వల్ల సమాజానికి చెడు చేయకుంటే చాలు అనుకుంటాను.

 

venkat4కానీ మీ కాక్ అండ్ బుల్ స్టోరీ… ఓ సామాజిక అంశాన్ని చర్చించింది.
అక్కడికే వస్తున్నాను. ఆ కథ వచ్చిన సందర్భంలో ఆ రోజు ఉన్న పరిస్థితుల మీద…. మా నెల్లూరు యాసలో ఓ కథ రాయాలనుకున్నాను. అలా కాక్ అండ్ బుల్  కథ వచ్చింది. వాస్తవానికి ఆ కథ మా ఊరిలో జరిగిన ఓ చిన్న  సంఘటన స్ఫూర్తితో రాసినది.

 

మనం రాసిన కథ సమాజం పైన ప్రభావం చూపుతుందా. ?
చూపుతుందనే అనుకుంటాను. కానీ ఆ ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు. కథ చదివిన పాఠకుడికి మనసులో ఎక్కడో ఆ కథ దాగి వుంటుంది. ఏదో ఓ దగ్గర, ఎప్పుడో అప్పుడు కథలోని ఇతివృత్తం, సందేశం పాఠకుడిని తప్పక ప్రభావితం చేస్తుంది. కాబట్టి కథ గానీ మరోటి గానీ …ప్రభావం చేస్తాయనే అనుకోవాలి.  ఉదాహరణకు ఈ మధ్య అల్లం వంశీ రాసిన మిరకిల్ కథ చదివాను. నాకు చాలా నచ్చింది. అదే విషయం చాలా మందికి చెప్పాను. దాన్ని మిత్రుడు కత్తి మహేశ్ షార్ట్ ఫిలింగా కూడా తీస్తున్నారు. రిజర్వేషన్ సమస్య గురించి సున్నితంగా లోతుగా చర్చించిన కథ అది.  దళితులు మాల పల్లె లోనుంచో, మాదిగ గూడెంలో నుంచో మన మధ్యకి వచ్చే దాకా రిజర్వేషన్ సమస్య కొనసాగుతుంది. కాబట్టి సామాజిక సమస్యల మీద వచ్చే కథలు మన మీద ఎంతో కొంత ప్రభావం చూపుతాయి.

 

సాధారణంగా కథలు, నవలలు రాసి సినిమారంగం వైపు వెళతారు. మీరు రివర్స్ లో సినిమాల నుంచి కథల వైపు వచ్చారు.
సినిమా కానీ, కథ కానీ ఏదైనా ప్రాథమికంగా సృజన, అనుభూతి ప్రధానమైనవే కదా. సినిమాలకు స్క్రీన్ ప్లే రాస్తున్నపుడే…ఓ దృశ్యాన్ని ఎలా విజువల్ గా చూపించాలో ప్రయత్నిస్తాము. అలాగే నా కథల్లో కూడా విషయాన్ని   సాధ్యమైనంత ఎక్కువగా విజువలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకే నా కథలు చదివిన వాళ్లు..ఆ అనుభూతి ఫీలయ్యామని చెపుతుంటారు.
మీ కథల్లో చీకటిని ఎక్కువగా నేపథ్యంగా తీసుకుంటున్నారు….ప్రత్యేకమైన కారణమేమైనా ఉందా…?
నా జీవితం..అంటే నేను వర్క్ చేసేది పగలు కన్నా రాత్రి ఎక్కువగా ఉంటుంది. నాదంతా చీకటి జీవితం..( నవ్వులు) అందుకే చీకటిని ఎక్కువగా ఇష్టపడుతుంటాను. స్నేహితులతో మాట్లాడుతున్నపుడో, రాత్రి నేను ఆలోచించేటపుడో నా కథలు చీకటిలోనే పుడుతుంటాయి.  చీకటిని ఎక్కువగా రాయడం విజువలైజ్ చేయడంలో భాగంగానే.  సోల్ సర్కస్ కానీ, మిగిలిన కథల్లో కానీ చీకటి ప్రధానంగా వుంటుంది.

 

ఈ మధ్య కొత్తగా కథలు రాస్తున్న తరంలో మూడు కథలతోనే వొక భిన్నమైన శైలిని చూపిస్తున్నారు. కథను చెప్పడంలోనూ ప్రత్యేకత కనబరుస్తున్నారు.

 

అది కావాలనే ఎంచుకున్నదే .  ఫలానా కథలు బాగుంటాయి, ఫలానా కథలు బాగుండవని కాదు కానీ….నేను ఎక్కువగా ఇలాంటి కథలనే  ఇష్టపడుతుంటాను.  చాలా మంది నా కథలు త్రిపుర గారి కథల్లాగా వుంటాయని… త్రిపుర గారి ప్రభావం వుందని అన్నారు. ప్రధానంగా సోల్ సర్కస్ కథకొచ్చిన స్పందన.  జపాన్ రచయిత హరుకీ మురకామీని నేను ఎక్కువగా ఇష్టపడతాను.  కేవలం ఓ చిన్న వాక్యంలో ఎంతో పెద్ద అర్థాన్నిచ్చేలా అద్భుతంగా రాయగల రచయిత ఆయన. అసలు అలా రాయొచ్చని మనకు ఊహకు కూడా తట్టని విషయాన్ని ఎంతో నేర్పుగా చెబుతారాయన.  ఉదాహరణకు మీరు సోల్ సర్కస్ కథలో చూడొచ్చు. ఓ అమ్మాయి  కాఫీ కలుపుతుంటే అక్కడ అనేక భావాలు కనిపిస్తాయి. అది మురకామీ లాగా రాయాలని ప్రయత్నించి రాసిందే.  అలా రాయడం నాకు చాలా ఇష్టం.

 

కథా రచయితగా మీకంటూ ఎలాంటి గుర్తింపును కోరుకురుంటున్నారు. ?
నాకలాంటి ఉద్దేశం లేదు. భవిష్యత్ లో  నేను ఇంకో కథ రాస్తానో లేదో కూడా తెలియదు.  రాయాలనైతే ఉంది కానీ ఎప్పుడు రాస్తానో నాకే తెలీదు. రాయకపోవచ్చు కూడా. కథ రాయాలంటే నేనందులో జీవించాలి. దానికి చాలా సమయం పడుతుంది.  ప్రస్తుతానికి నాకంత సమయం లేదు. రాయాలనిపించినప్పుడు రాస్తాను అంతే.

 

ఇపుడు ….మీతో పాటూ రాస్తున్న కొత్త తరం  రచయితల కథలు ఎలా వుంటున్నాయి…?
ఇపుడు గతంలో కన్నా చాలా అవకాశాలు పెరిగాయి. చాలా మంది రాస్తున్నారు. ముఖ్యంగా వెబ్ పత్రికలు వచ్చిన తర్వాత ఫలానా విధంగా రాయాలనే  కండిషన్స్ పోయాయి. గతంలో కొన్ని ఆంక్షలు వుండేవి. ఇప్పుడు అవి లేవు కదా. కొత్త ప్రయోగాలకు అవకాశం పెరిగింది.  ముఖ్యంగా ఇన్ని పేజీలే వుండాలనే నిడివి సమస్య  పోయిన తర్వాత మంచి కథలు రావడానికి అవకాశం వచ్చింది. నా కథలదీ అదే పరిస్థితి. ఇన్ని పేజీల్లోనే రాయాలంటే నా కథలు వెలుగు చూసేవి కాదు. అంతర్జాల పత్రికల వల్ల కథలకు, రచయితలకు మేలు జరిగింది. ఇది మంచి పరిణామం. కాబట్టి భవిష్యత్ లో కూడా మరిన్ని మంచి కథలు రావడానికి అవకాశం వుంది.

 

మీ నేపథ్యం గురించి చెబుతారా..?
మాది నెల్లూరు జిల్లా.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటిలో చదివిన తర్వాత టీసీఎస్ లో పనిచేసాను. యూకేలో ఐదేళ్పు పనిచేసాను. సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేశాక ఇక చాలనిపించింది. అప్పటికే పెళ్లయింది.  ఇద్దరమూ ఉద్యోగాలు వదిలేశాము.  తను కర్నాటక సంగీతంలో సాధన చేస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది.  నేను సినిమా రంగంలో పనిచేస్తున్నాను. సినిమాకోసం ప్రయత్నం చేస్తున్నాను.  నేను కథ రాసేటపుడు పాఠకులు మెచ్చుకోవాలనుకునో, ప్రశంసలకోసమో రాయను. మొదట… పాఠకుడిగా నేను సంతృప్తి చెందాలి. అలాగే నేను రాసిన చాలా కథల వెనుక రంజని తో జరిగిన డిస్కషన్స్ కారణం. నేను రాసిన తర్వాత మొదట తనే చదువుతుంది. తనకి నచ్చితే నాకు చాలనిపిస్తుంది. నేను రాసిన  మొదటి కథను మా అమ్మకు చూపించాను. మా అమ్మ బాగా చదువుతుంది. మా అమ్మకు నా కథ నచ్చింది. ఆ విషయాన్ని నేను గర్వంగా చెప్పుకుంటాను.

venkat7
నేను సాహిత్యం చదవడానికి, రాయడానికి ప్రధానమైన కారణం మా అమ్మే. మా అమ్మ నాతో చాలా సాహిత్యం చదివించింది. ఐదు, ఆరు క్లాసుల్లో ఉండగానే యండమూరి లాంటి రచయితల పుస్తకాలన్నీ చదివేశాను. మా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల నేను  మా అమ్మ మేం చదివిన వాటి గురించి చర్చించుకునే వాళ్లం. అలా సాహిత్యం పైన ఆసక్తి కలగడానికి కారణం అమ్మే. మా నాన్న కూడా చదువుతారు గానీ ఏమీ మాట్లాడరు.

సినిమా ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి…?
నా మొదటి కథ లాగే ఇప్పటికీ  సినిమా విషయంలో స్పష్టత లేదు. సినిమా తీయాలని అనుకుంటున్నాను కానీ ఎలాంటి సినిమా తీయాలనేది ఇప్పటికీ తెలీదు.  నేను ఏదైతో ఆలోచిస్తానో దాన్ని క్లియర్ గా చెప్పగలగాలి. సోల్ సర్కస్ కథ కోసం …పదేళ్లు ఆలోచించాను. సంఘర్షణ పడ్డాను.  అలాగే సినిమా కోసం కూడా ఎంత కాలమైనా ఎదురు చూస్తాను.

 

(మిత్రుడు మహి బెజవాడకు కృతజ్ఞతలతో…)

 

మనసూ ప్లస్ ఆలోచనా =’కేన్యా టు కేన్యా’

 

 

(డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ లో నవంబరు 1, 2015 న ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంథాలయం లో ఆరి సీతారామయ్య గారి కథా సంకలనం ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణానంతరం ఈ కథలపై చర్చ జరిగింది. ఈ సమీక్ష ఆ చర్చ సారాంశమే.)

-కూనపరెడ్డి గిరిజ Girija

~

 

ఆరి సీతారామయ్య గారి కథలు చాలా విభిన్నమైనవి. ఆయన ప్రతి కథా మన బుర్రకి బుల్లెట్ గురిపెట్టినట్లే. సమస్య మనది కాదు. కానీ … “మన కథ అయితే” అనే ఆలోచన ప్రతి కథకీ కలుగుతుంది. ఎందరి జీవితాలకో, ఎన్ని సమస్యలకో మనకి కిటికీలు తెరిచి తెలియజేయటమే కాదు, పరకాయ ప్రవేశం చేయించేస్తారు. ‘సుచిత్రా చంద్ర ‘ మొదటి కథ. ఇక్కడి యువతరం సైకాలజీ మరియు జీవితం పై వారి దృక్పథానికి అద్దం పట్టారు. సామాన్యంగా అమ్మాయి సర్దుకుపోవటం, అబ్బాయి సమర్ధించుకురావటం – ఇది మన నాయికానాయకుల లక్షణాలు. కానీ ఇప్పటి మన పిల్లల జీవితాల్లో ఆ పాత్రలు తారుమారవుతున్నాయి. మనం మారాము అనుకున్నా ఇంకా ఆ ఎత్తుకు ఎదగలేదనిపిస్తుంది. ‘చంద్ర’ లో ఏ సంకుచితం కనపడదు మనకి. సుచిత్ర పాత్రలో సంఘర్షణకి చంద్ర చక్కటి సమాధానం. అలాటి సమాధానం మన అమ్మాయిలందరికీ దక్కాలి. Just kidding … బులుగు తెలుగు అనుకున్నట్లున్నారు సీతారామయ్య గారు.

“ఉదారస్వభావం’ కి వస్తే, ‘రామాయణ’, ‘మహాభారత’ బ్రతుకులే మనవి ఇక్కడ. అది ఉదారస్వభావం అని వెంకట్ అనుకోవచ్చుగాక. ఆంగ్ల ఉవాచ ఒకటి ఉంది, ‘బ్రతుకు – బ్రతకనివ్వు’ అని. కానీ మనం మన పిల్లల జీవితాలు మనమే జీవించేయాలని చూస్తున్నాం. మారుతున్న కాలంతో పాటు విద్య పట్ల, సంపాదన పట్ల మన ఆలోచన మార్చుకోవాలి.

‘పై చదువు’ – ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి, క్రొత్తగా దేశంలోకి వచ్చిన ఇండియన్ విద్యార్థికి కలిగే అనుభవాలు ఆసక్తికరంగా చిత్రీకరించారు.

‘పరివర్తన’ – ఇది మనకు ఎక్కువగా మనసులో రొద పెడుతుంది. ముందు అసంపూర్ణం అనిపించి పూర్వాపరాలు తెలుసుకోవాలి అని ఆదుర్దా అనిపించినా, ఈ కథ ఉద్దేశం బహుశహ ఇక్కడి system గురించి ‘ఏది పరివర్తన?’ అని చెప్పడం కాబోలుననిపిస్తుంది.

పచ్చ సంచీ – అనువాద కథ. మనసుకు తగలవచ్చు, తగలకపోవచ్చు, దేశకాల పరిస్థితులు వేరు కాబట్టి.

టెస్ట్ – మనసును కదిలించే ఇతివృత్తం. సుజాత పరిస్థితి చాలా బాధాకరం. కాన్సర్ ఎక్కువైపోతున్న ఈ కాల పరిస్థితుల్లో మన ప్రతిస్పందన ఏమిటి ఆ పరిస్థితిలో ఉన్నవారితో అని ఆలోచింపజేస్తుంది. చావు బ్రతుకు అనే సమస్య చాలా గడ్డుది.

అలనాటి ఆర్జ నర్తకి – వయసులో ఒక వెలుగు వెలిగిన తార ముసలి వయసులో ఎదుర్కొన్న దుర్భర పరిస్థితి. అనువాద కథే అయినా కళ్ళు తెరిస్తే మన చుట్టుప్రక్కల చాలానే కనిపిస్తాయి ఇటువంటి జీవితాలు. మనసులు కూడా తెరవాలి మనం.

పెద్దా చిన్నా – అమెరికాలో ఉన్న కొడుకు కోడలు దగ్గరకి వచ్చిన రామ్మూర్తి గారి అనుభవాలు. చక్కటి కథ. మనకి సుపరిచితం కూడా. కోడలితో మంచిగా చెప్పించారు, “గాడిదల్ని పెంచి అమెరికాకి పంపించినా బెంగుళూరు పంపినా వాళ్ళు గాడిదల్లాగే ప్రవర్తిస్తారు … దానికీ అమెరికాకీ సంబంధం లేదు”.

లైఫ్ సైన్స్ – హఠాత్తుగా ఒంటరి అయిపోయిన జానకి జీవితం. తను లేక పోయినా, ఆమె జీవితం ఎంతో కొంత సుగమం చేయాలని తపించిన ఆమె భర్త సుబ్బు మనకి కనువిప్పుగా ఉంటారు. జీవితంలో ఎన్నో ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు గానీ చెప్పలేం ఎంత ఓర్చుకోగలమో.

లక్ష్మమ్మ – టూకీగా చెప్పినట్లు చెప్పినా ఈ కథ నిజానికి ఒక కథాపాఠం. మన గిరిలోంచి బైటకి వచ్చి ప్రక్క మనిషి మనసు తెలుసుకొని మసలమంటుంది.

దేశీ విదేశీ – తమాషా అయిన కథ. ఇండియాలో మాట్లాడే ఇంగ్లీష్ కి ఇక్కడి వ్యవకారిక భాషకి మధ్య తేడాకి పడే అగచాట్లు చాలా తమాషాగా ఉన్నాయి. కానీ ఇండియాలో ఉన్నవాళ్ళు చదివితే మళ్ళీ అజిత్ పరిస్థితే వాళ్ళకి. It will be lost in translation!.

ముగింపు – ఇక్కడ గాయత్రికి వచ్చే ఆలోచన మనందరికీ వస్తుంది. వైద్యం ఎంతో పురోగతి చెందిన ఈ కాలంలో ఎంతవరకు దేవునితో యుద్ధం సాగించి మరల సాయంతో మరణాన్ని ఆపగలుగుతారో … అందుకు మన శరీరాల్ని ఆటవస్తువులుగా వదలాలా వీడిపోవాలా అన్నది అందరం ఆలోచించాలి – ప్రణాళిక వేసుకోక తప్పదు!

ప్రయాణం – విదేశాల్లో పనిచేసే అబ్బాయిలు, వారిని చేసుకున్న అమ్మాయిల అగచాట్లు చెప్పకనే చెప్తుంది ఈ కథ. విదేశీ వ్యామోహం ఆశతో వస్తే అగాధంలో అడుగేసినట్లే ఇలాటి పెళ్ళిళ్ళతో భవితవ్యాలు!

గింజలు – Most thought provoking story. బాధ్యత నెరవేరుస్తున్నాననుకొని ఒకటి, బాధ్యత వదలలేక ఒకటి – రెండు పక్షుల కథ. మన దైనందిన జీవితాలకు అద్దం పట్టిన కథ. ఒక్కోసారి ఈ బాధ్యత అనే ముసుగులో, సంపాదన మత్తులో మునిగిపోయి మనం జీవితంలో ఎన్నో విలువైన సంబంధాలను పలుచన పరుచుకుంటున్నాం. జీవితం జీవించటమే మరచిపోతున్నాం. చెల్లి పక్షి అలాగే బలైపోయింది పాపం.

ఆఖరుగా కేన్యా టు కేన్యా – పుస్తకానికి ఈ పేరే పెట్టారంటే ఈ కథ విలువ తెలుస్తుంది మరి. స్టీవెన్ ఆయేషాలకు వచ్చిన పరిస్థితి ఏ భార్యాభర్తలకూ రాకూడదు. వచ్చినా, వారికున్నంత మనోధైర్యం, స్థైర్యం ఉండాలి. ఆ పరిస్థితుల్లో మన నిర్ణయం అదే కాకపోవచ్చు. కానీ వారికి తోచిన నిర్ణయం నిర్భయంగా చేసుకున్నారు.

ఆరి సీతారామయ్య గారు మంచి ఆలోచన ఉన్న రచయితే కాదు, ఆలోచింపజేయగల రచయిత. ప్రతి కథా అక్కడి నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డ మన జీవితాల్లో కలిగే వింత అనుభవాలకూ, సమస్యలకూ,  సంఘటనలకు ప్రతీక. ఇండియాలోనూ, ఇక్కడ ప్రతి ఒక్కరు చదివి ఆనందించ తగ్గ కథా సంపుటి ఇది. కథలు చదివేసినా, పుస్తకం మూసేసినా, అది తెరిచిన కిటికీలు మూతపడడానికి చాలా సమయం పడుతుంది. అంతగా మనసుకు దగ్గరకొస్తాయి కొన్ని కథలు.

*

కొత్త రెక్కలు పుట్టాలె!

 

 

–కృష్ణ చైతన్య అల్లం

~

 

Krishna Chaitanya Allamకొత్త కథల పుస్తకం  ఎప్పుడన్న కొన్నప్పుడు సూచిక చూస్తం. కథ పేరు ఏదైనా కొత్తగ కనిపిస్తే అది ముందు చదవాలని అనిపిస్తది.

పెద్ద పెద్ద పేరాలు ఉన్న కథలని తరవాత చదువుదాం లె అనిపిస్తది.

కథలో పిల్లలుంటే కథనం ఉత్సాహభరితంగ ఉన్నట్టు అనిపిస్తది. పిల్లల ఉత్సాహం, ఎనర్జీ కథకు కూడా అన్వయించబడ్డట్టే ఉంటది.

చిన్న చిన్న వాక్యాలతో మొదలైన కథో, కథనమో, వ్యాసమో తొందరగా ముగించవచ్చునన్న భావన కలిగిస్తది.

మామూలుగా పిల్లల కథలు రాసేటప్పుడు ఈ రకమైన పద్దతులు పాటిస్తరు. మరి పిల్లల దగ్గర సఫలీకృతమైన ఈ ప్రక్రియ ఎక్కడ ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయింది?

కాల్పనిక సాహిత్యం వయసు అవధులు దాటి బయటకు వచ్చే సరికి చాలా వరకు మన సాహిత్యంలో దీన్ని సస్పెన్స్ థ్రిల్లర్ కథో, హారర్ కథో అనే టాగ్ తో సాధారణీకరిస్తరు. రాసే పద్ధతిల కూడా చాలా వరకు సినిమా ధోరణి కనిపిస్తది. నా వరకు మధు బాబు నవలలు, షాడోలు లాంటి కవర్ పేజీలు చూసినపుడు ఈ పుస్తకం చదవాలే అని అనిపించలే ఒక్క సారి కూడా. ఎందుకంటే మామూలుగా పాటించే కథ తీరూ తెన్నులూ పాటిస్తయి ఈ ప్రక్రియలు. ఎట్టకేలకు అవన్నీ మళ్ళీ కలిసి మెలిసి కంచికి పోతై. ఊహించని ఘటన జరిగిన సన్నివేశం చదువుతున్నా కూడా అట్ల జరుగబోతుంది అనే మైండ్ ఆల్రెడీ సెట్ అయి ఉంటుందన్న డీఫాల్ట్ కేటగిరీ. కొత్తగా ఆశిద్దాం అనుకునే ఆశ చూపెట్టడంలో విఫలం అయితై.

ఇగ రెండో పద్ధతి సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఫిక్షన్ ఇంకా సోషియో ఫిక్షన్. ఇది ప్రపంచం అంతా అత్యధికంగా వాడే ప్రక్రియలు. మన దగ్గర మాత్రం ఎందుకో ఇది పిల్లల పుస్తకాలుగా మాత్రమె పరిగణింపబడే కళా ప్రక్రియ. పెద్ద పెద్ద కథలూ, నవలలూ, టీవీ సీరిస్, సినిమాలూ కోకొల్లలుగా ప్రపంచం అంతటా వాడబడింది. స్టీఫెన్ కింగ్ డ్రమాటిక్ కాల్పనికత, ఆర్ ఎల్ స్టైన్ అభూత కల్పనలు, జే జే అబ్రం గ్రహాంతర శక్తులు, ఆర్ ఆర్ మార్టిన్ కాల్పనిక పీరియడ్ డ్రామాలు, ఒక్కోల్లది ఒక్కో శైలి. కానీ బాల్యం నుండి ఈ ప్రక్రియ వేరు చేయబడినపుడు వీళ్ళ కథా ప్రమాణాలు మారిపోతయి. అనూహ్యమైన మలుపో, ఊహించని పరిణామమో కథని ఎలివేట్ చేస్తుంది. చదువుతున్నప్పుడు కంచికి పోవాల్సిన కథనం కొండలు గుట్టలు ఎక్కుతుంటే మనసు ఉరకలు వేస్తది. అందుకే అరవై డెబ్బై ఏళ్ళు మీద పడ్డ  మనుషులు కూడా స్టార్ వార్స్, స్టార్ ట్రెక్, గేం ఆఫ్ త్రోన్స్ అని ఉరకలు పెడుతరు.

తెలుగు ఫాంటసీ ఫిక్షన్ ఇంకా గండర గండని దగ్గరనుండి బయటకు రాలేదు. గండర గండడు ఇంకా బాల మిత్ర, బాల జ్యోతుల్లోనే ఉండిపోయిండు. ఎదిగి పెద్దవాడై గ్రహాంతర వాసులతో స్నేహం చేసి, సూపర్ మాన్ తో యుద్ధం చేసి, కాల బిలాలలో పయనించి, కాలాంతర ప్రయాణాలు చేసే కలల ప్రపంచంలో ఇంకా విహరించలేదు. ఒక వేళ వాలినా దానికి దైవిక శక్తి అనో, దయ్యం అనో  అని పేరు పెట్టి కోడి రామ కృష్ణలు ఎలాగోలా కథని మళ్ళీ కంచికి పంపుతరు.

కలల్లో వినీలాకాశాల్లో విహరించి మేఘాల్లో తేలిపోయిన మనసులని కథల్లో, కళా రూపాల్లో మాత్రం నేల దాటనియ్యరు.

ప్రఖ్యాత అభూత కల్పనల సృష్టికర్త ఆర్ ఎల్ స్టైన్ అంటాడు, తన కథలో మూడే భాగాలు ఉంటాయని. ఆరంభం, కథనం, మలుపు. మరి ముగింపు? అని అడిగితె, మలుపు మలిచే కథనమే ముగింపు అంటాడు.

గొప్ప ఫాంటసీకి అర్ధవంతమైన ముగింపు ఇయ్యడం కోసం దాన్ని దైవిక శక్తి అనో, భూతమో ప్రేతమో అని నమ్మింప చేసే ప్రయత్నంలో కథ ఆత్మని కోల్పోతది. సెన్స్ ఆఫ్ క్లోసర్(Sense of closure) అంటున్నం దీన్ని. క్లోస్ చేయాలె ఎట్లనో అట్ల. మొదలు పెట్టిన ప్రతీ బ్రాకెట్ క్లోజ్ అయితేనే కోడింగ్ కంప్లీట్. కలకూ, కళకూ ఎం కోడింగ్ ఉంటది. తెల్లారి లేచినంక సగంలో ఆగిపోయిన కల మళ్ళీ రమ్మంటే వస్తదా? వస్తే? దీని గురించి నాలో ఒకడు అని సిద్ధార్థ్ సినిమా ఒకటి వచ్చింది ఈ కాన్సెప్ట్ మీద ఈ మధ్య. కల మళ్ళీ కొనసాగించ బడుతది పడుకున్నపుడల్లా. ఆలోచన ఎంత అద్భుతం? దేవుడూ దయ్యం ఎమీ లేదు. మనిషితో మనిషి పడే సంఘర్షణ. మనిషి లోపల జరిగే సంఘర్షణ.

వాస్తవిక సాంఘీక జీవనం నుండి వేరు పడిన పిల్లల కథలు అమాంతం పెద్దవాళ్ళ జీవితాల్లోకి వస్తే, ఆఫీసుల డైనోసారో డ్రాగనో కనిపిస్తే, డాల్ఫిన్లు తిమింగలాలు ఆకాశంలో ఎగురుతూ పొతే, భూమి మీద కాకుండా ప్లూటో మీద జీవం ఉంటే, పొలాల్ల మొక్కలు, పెంపుడు ప్రాణులూ మనతోని మాట్లాడుతే.. అంతూ పొంతూ లేని కల్పనా శక్తి. కోరికలు మాత్రమే గుర్రాలై ఎందుకెగరాలె? కలలు, కలాలు, కళలు గుర్రాలై ఎగిరితే తప్పేముంది?

నిత్యం మనలో మనకు ఎన్నో సంఘర్షణలు. సమాధానాలు వెతికే స్వభావం. అన్నీటికి సమాధానాలు కావాలె.

అన్నింటికీ అర్ధం పరమార్ధం ఉండాలంటాడు. కానీ గమ్యం వేటలో ప్రయాణం తాలూకు అనుభూతులని మూటలు కట్టుకోవడం మరిచిపోతుంటడు. గమ్యం చేరుకున్న మనిషి కథ బాగానే ఉంటది. ప్రయాణం కూడా బాగానే ఉంటది. చివరికి ఒక గమ్యం ఆశిస్తున్నాం కాబట్టి. గమ్యం చేరని మనిషి ప్రస్తానం గూడా బాగనే ఉంటది. దారి పొడుగుతా ఎందరో మనుషులు, ఎన్నో అనుభవాలు. ఎన్నో ముచ్చట్లు. ప్రతీ మలుపూ గొప్ప కథే. మనిషి నిత్యశోధకుడు. అమితంగ కుతూహలం ఉన్నవాడు. అంతిమ గమ్యం ఉన్నవానికి తెలుసు దిశానిర్దేశాకత్వాలు. వాడు వాని శోధన గమ్యాన్ని కలిపి  రాస్తడు. గమ్యం లేని వాడు శోధన మాత్రమె రాస్తడు.

గమ్యాల నిర్దేశికత్వం గురించి మాట్లాడుకోవాలె. ఎందరో నడిచిన దారుల్ల పుస్తక రూపం దాల్చిన గమ్యాలు దిశా నిర్దేశాకత్వాలు. ఇటు పోతే ఇది వస్తది. గమ్యం అంటే అది ఇది వరకే నడిచిన దారి, గమ్యం లేకపోవడం కొత్త దారులని వెతుక్కోవడం. సమాజం, నాగరికత ఇది వరకే నడిచిన దారులని చూపిస్తది. ఇందులో ఉపాధి, మనుగడలు కూడా ఉంటయి. ఇవన్నీ సామూహిక ధోరణి కిందనే చెందుతయి. కొత్తగ పుట్టిన వారసులకు పాత దారులని అన్వయిస్తయి. నా కొడుకు డాక్టర్, బిడ్డ ఇంజనీర్ కావాలని కోరుకుంటరు కానీ, మానవీయ సమాజపు ప్రాథమిక సూత్రానుసారం అన్వేషి కావాలని అనుకోరు. సూత్రాల ధిక్కరించి వెలుగు రవ్వలు పుడుతూనే ఉంటై. చదువు కొలమానం కాదన్న సాధారణ  కలాంలు, సగటు మనుషులతో చదువుకునే అర్హత సంపాదించలేని ఐన్స్టీన్ లూ పుడుతూనే ఉంటరు. ఇమిడి పోవాలనుకునే స్వభావాన్ని సామాజిక సాధారనీకతగ చెప్పవచ్చు. సమాజం అంగీకారం కోసమో, మనుగడ కోసమో అన్వేషి జాతి స్వతహాగా తనకు అబ్బిన స్వభావాన్ని రాజీ పడి ధిక్కార స్వరాన్ని కోల్పోతడు. ఇముడ్చుకోవడాన్ని  ఇష్ట పడతాడు. Low Profile స్వభావాన్ని ఆపాదించుకుంటడు. ఎదిగిన కొద్దీ ఎదగాల్సిన స్వరాన్ని, తపననీ, మనసునీ, అన్వేషణనీ కట్టడి చేస్తడు. ఎగరలేని మనసు కలల్లో ఎగిరిస్తుంది. కలల్లో ఆకాశాన్ని అందుకున్నవా ఎపుడన్నా? దానర్ధం నువ్వు ఎగరాల్సిన చోట ఎగరడం లేదని. ఎగరాల్సిన సమయం వచ్చిందని.

*

 

 

మట్టి పరిమళం ఎగజిమ్మిన కధలు

 

 

రమాసుందరి

రమాసుందరి

కొంతమంది వ్యక్తులు ఉంటారు. స్వాప్నిక సుషుప్త అవస్థలో మనకు అత్యంత చేరువగా ఉంటారు. స్నేహంగా స్పర్శిస్తారు. ప్రేమగా సంభాషిస్తారు. అమితంగా స్పందిస్తారు. మన ప్రాచీన స్మృతిలో పోగొట్టుకొన్నదాన్నేదో గుర్తు చేస్తారు. చెయ్యి పట్టుకొని అందమైన తోటల్లోకి, అద్భుతమైన సమాజంలోకి మనల్ని విహంగ విహారం చేయిస్తారు.  అలాంటి వ్యక్తులు కధలలో పాత్రలుగా మారితే నిజ జీవితంలో మనసు మారుమూలల్లోకి వెళ్ళి పేరుకొని పోయిన అశుచిని శుద్ధి చేస్తారు. ఆ పాత్రలే ఒక సైన్యంగా మారి మనిషిలో దాగున్నశత్రువును హతమారుస్తాయి. అలాంటి  పాత్రలు ఉన్న కధలు మనిషి పరిమళంతో, స్వచ్ఛమైన స్నేహ పరిమళంతో, కులరహిత సమాజ పరిమళంతో, కల్తీలేని ప్రేమ పరిమళంతో, నికార్సైన అనుబంధాల పరిమళంతో, బలమైన జ్ఞాపకాల పరిమళంతో, అడవి పరిమళంతో, త్యాగాల పరిమళంతో, సహజీవన సౌందర్య పరిమళంతో, సమసమాజాన్ని స్వప్నించిన  యువతీ యువకుల ఆశల పరిమళంతో .. యిన్ని పరిమళాలు కలగలిసిన  ‘జాజి పూల పరిమళం’తో మనసంతా సుగంధం చేసి సంతోష పెడతాయి.

‘జాజిపూల పరిమళం’ పుస్తకం (కధలు) ఎందుకు చదవాలి అంటే నేను చాలా కారణాలు చెబుతాను. అవన్నీ నా యిష్టానికి, తత్వానికి సంబంధించినవి. వాటితో సంబంధం లేకుండా  ‘కధను ఎంత సులభంగా చెప్పవచ్చో’, ‘సంభాషణలు ఎంత సహజంగా రాయవచ్చో’, ‘కధనాన్ని ఎంత నిరలంకారంగా నడిపించవచ్చో’ ఈ కధల ద్వారా  నేర్చుకోవచ్చు. వీటన్నిటిని మించి పుస్తకం ద్వారా అబ్బే సంస్కారం ఒకటి ఉంటుంది. దాన్ని ఈ కధల ద్వారా పుష్కలంగా అందుకోవచ్చు. సమాజాన్ని అపోసన పట్టిన వ్యక్తుల నుండి జిజ్ఞాస గలిగిన వ్యక్తులు అందుకొనే ఎరుక  అద్భుతమైన ఆహ్లాదాన్నిఇస్తుంది. మనసు తెరిచి మంచిని ఆహ్వానించే వాళ్ళు ఆ ఆహ్లాదాన్ని అమితంగా పొందవచ్చు. దాదాపు నలభై కధలు ఉన్న ఈ పుస్తకంలో కొన్ని కధలు పురుషాధిక్యత, స్త్రీ పురుష సమానత్వం, సామాజిక కుటుంబిక దొంతరలలో స్త్రీలపై జరిగే అణచివేతలను  మైక్రో లెవెల్ లో చర్చించాయి. అయితే ఈ పుస్తకంలో సగం కధల్లోని కధా వాతావరణం పాఠకులకు కొత్తగా ఉంటుంది. కొన్ని సమస్యలు కూడా కొత్తవే. మనుషుల మధ్య సంబంధాలకూ, అనుబంధాలకూ, త్యాగాలకూ, సంతోషాలకూ కొత్త అర్ధం ఈ కధలు తెలియచేస్తాయి. ఈ కధల్లో ప్రధాన పాత్రలు స్త్రీలే. చైతన్యవంతులైన స్త్రీలు సమాజాన్ని అర్ధం చేసుకొనే క్రమాన్ని అద్భుతంగా రాశారు షహీదా.

కులం మనిషి జీవితంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? ‘దేవుడే అందర్నీ చేశాడు కాబట్టి మనుషులందరూ సమానమే’ అనే ప్రాధమిక భావన నుండి ‘కులం తోటివారి నుండి మనల్నివేరు చేస్తుంది’ అనే స్పృహ పిల్లలకు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా పరిణితి చెందినట్లు. అగ్రకుల లాభ ఫలాలు అనుభవం అయ్యే పిల్లల్లో కూడా కులం లేని జీవితంలో ఉన్న మాధుర్యం, సహజత్వం అనుభవం అయ్యాక యిక దాన్ని ప్రతిఘటించటం అనివార్య చర్య అవుతుంది. ఆ ప్రతిఘటన ఒక్కోసారి నిరసనగా  ‘మీరు! మేము??’ కధలో శ్రీవిద్య లాగా బాత్రూమ్ లో నీళ్ళు పారబోయటం దగ్గర కనిపిస్తుంది.  ఇంకోసారి ‘విభజన రేఖలు’ కధలో శిరీషలాగా తనకు కూడా వీరన్నలాగే ఆకులోనే అన్నం పెట్టమని భీష్మించిన ధిక్కారంగా మారుతుంది. కులం గురించి ఇంకా గాఢంగా చర్చించిన కధ ‘ఒకటీ, ఒకటీ ఎప్పుడూ రెండేనా?’  సమాజపు కట్టుబాట్లను ఎదిరించిన ‘సక్సెస్ ఫుల్ దళిత యువకుడు’, ‘ప్రోగ్రెసివ్ అగ్రకుల యువతు’ ల మధ్య చివురించిన ప్రేమ వారిద్దరికి సంబంధించినదైనా పెళ్లి మాత్రం సమాజానికి సంబంధించిందనే అవగాహన ఈ కధ నేర్పుతుంది. ‘చదువుకొని పైకి వచ్చిన దళిత యువకులను అగ్రవర్ణ యువతులు ఎగరేసుకొని పోతే మా దళిత ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా’ అనే ప్రశ్నకు చలించి పోయిన మౌనికకు ‘కులాంతర వివాహాలు చేసుకొని కుటుంబానికి పరిమితం అయితే యిలాంటి ప్రశ్నలే వస్తాయి. కుల నిర్మూలన కోసం ఆ దంపతులు కృషి చేస్తేనే ఆ వివాహానికి నిజమైన అర్ధం ఉంటుంది.’ అని అంతర్లీనంగా కధ యిచ్చిన జవాబు ఎంత సముచితమైనది! ఈ జవాబు విప్లవోద్యమంలో కలిసి పని చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకొంటున్న అనేకమంది యువతీ యువకులకు చక్కటి వివాహ సందేశం. గుంపుగా కలిసి తిరిగే చిన్న చేపలు అన్నీ కలిసి ఒక పెద్ద చేపను స్ఫురింప చేస్తాయనే అనే అర్ధవంతమైన ప్రతీకతో కధ ముగుస్తుంది.

ఈ పుస్తకంలో చక్కటి ప్రేమ కధలు కూడా ఉన్నాయి. ఆ ప్రేమలు రూపం, డబ్బు, హోదా, కెరీర్ లాంటి కృతకపు విలువలను మోసే వ్యక్తులను కాకుండ వస్త్ర, అలంకార రహితమైన వ్యక్తి నికార్సైన ఆత్మలను ప్రేమిస్తాయి. వ్యక్తులతో అనుసంధానమైన సామాజిక బాధ్యతలను ప్రేమిస్తాయి. వ్యక్తి ప్రేమ నుండి సామాజిక ప్రేమకు అవి ప్రవహిస్తాయి. అందుకు సంబంధించిన షరతులకు తలవొగ్గక పోతే ఆ ప్రేమను తిరస్కరిస్తాయి. కొంకణీ  వెళ్ళే రైలులో తారసపడిన ఒకప్పటి ప్రియురాలు ‘సుజీ’ చిక్కిపోయి, కళ్ళు గుంటలు పడి, వెంట్రుకలు నెరిసి పోయి ఉన్నా ఆలోచనలలో యవ్వనంగానే ఉంది. ఆరెంజ్డ్ మారేజ్ చేసుకొన్న ఆమె ఒకప్పటి ప్రియుడు మందుల కంపెనీలో పని చేస్తుంటే ఆమె ఒక మతోన్మాద వ్యతిరేక సంస్థలో పూర్తి కాలం పని చేస్తుంది. ఇద్దరూ గతాన్ని వడబోసుకొంటారు. ఈ కధలో బాబ్రీ మసీదు కూడా ఒక పాత్రే. ప్రేమికులను విడదీసిన దుష్ట పాత్ర. ఆ దుష్టత్వం పరోక్షంగా వాళ్ళిద్దరినీ విడదీసింది. ‘నేను లేక పొతే తను ఉండలేదనే అనుకొన్నాను అన్నాళ్ళూ …. కానీ నాలాంటి బలహీనుడికే తన అవసరం ఎక్కువుందని అర్ధం కావడానికి ఎంత కాలం పట్టిందో … తనదేముంది తన విలువలతో బతికేస్తుంది …’ అనుకొంటాడతను. ‘పైకి ఎంత అభ్యుదయంగా ఉన్నా నీలో తొంగి చూసిన ఆ హిందుత్వవాదిని ఆ రోజు చూసి తట్టుకోలేకపోయాను… నిన్నే కాదు ఎవర్నీ, దేన్నీ సగం సగం ప్రేమించడం రాలేదురా, ఇప్పటికీ అంతే …’ చెప్పుకొంటుందామె. అయితే ఆమె ప్రేమద్వారా పొందిన ఉన్నత సంస్కారం అతనిలో నిగూఢంగా దాగి ఉంది. గుజరాత్ అల్లర్లలో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డను తెచ్చి సాక్కుంటాడు. ఆ విషయం అప్పటికే తెలుసుకొన్న సుజీ అతని ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళింటికి అతిధిగా వెళ్లడానికి ఒప్పుకోవటంతో కధ ముగుస్తుంది.

అలాంటిదే ఇంకో కధ  ‘విప్లవంలో ఓ ప్రేమ కధ’. ‘అతను నక్సలైట్లలో కలుస్తాడు నాకు తెలుసు. బతుకు పాడు చేసుకోకు’ ఎస్సై హితబోధ. ‘అతనలా ఉంటాడనే నేను యిష్టపడింది. అందుకోసం వదిలేయమంటాడేంటి?’ ఆమె విస్మయం. ఆమె విశ్వాసం ఆమె ప్రేమ మీద మాత్రమే కాదు. అతని ప్రిన్సిపుల్స్ మీదా, జీవితం పట్ల అతనికి గల దృక్పధం మీద, అన్యాయాన్ని ఎదిరించి దేనికైనా సిద్దపడే అతని స్వభావం మీద. ఇతరుల కోసం త్యాగం చేసే తత్వం, నిస్వార్ధం లేకుండా అతను లేడు. అతని పై శ్యామల ప్రేమా ఉండదు. విప్లవానికి వారిద్దరూ ఉండరు. ప్రేమ అనే మాటను ధైర్యంగా ఉపయోగించే అవకాశం కల్పిస్తుంది శ్యామల. ఆ నమ్మకంతోనే అడివికి వచ్చి అమరురాలు అవుతుంది.

మదర్ థెరేసా మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకొనే వాళ్ళకీ, మదర్ థెరేసాల అవసరమే లేని సమాజం రావాలని కోరుకొనేవాళ్ళకు ఉన్న తేడా ఎంత? సమాజాన్ని యిలాగే ఉంచి ఉద్ధరిద్దామని అనుకొనేవాళ్ళకూ, దాన్ని సమూలంగా మార్చివేయాలని కోరుకొనే వాళ్ళకూ ఉన్నంత తేడా. బడుల్లో సోషల్ వర్క్ క్లాసుల గురించి క్రిటికల్ గా రాసిన కధ ‘సోషల్ వర్కూ – సోషలిజమూ’. ఇంచుమించు ఇలాంటి సందేశాన్నే మోసుకు వచ్చిన కధ ‘జ్ఞాపిక’.  ‘లోపలి’ నుండి వచ్చిన ఒక మహిళా రోగి నర్మద బాధ్యత సంతోషంగా స్వీకరిస్తాడు శంకర్. కొద్దిగా కోలుకొన్నాక ఆసుపత్రి నుండి యింటికి తీసుకొని వెళతాడు. ఆమెతో సాహిత్యం, సినిమాల గురించిన అభిప్రాయాలు పంచుకొంటాడు. కలిసి వండుకొని కబుర్లు చెప్పుకొంటారు. ఆమె ప్రేమ కవిత్వాన్ని బిడియంగా చదువుతుంటే విని ఆస్వాదిస్తాడు. కొనే ప్రతి వస్తువు దగ్గర ఆమె ‘ప్రజల డబ్బు’ అంటూ జాగ్రత్త పడుతుంటే అబ్బురపడతాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణం ఒక గొప్ప అనుభవంగా, పాఠంగా దోసిలి పడతాడు. ఆమె ‘లోపలికి’  వెళ్ళి పోయే రోజు దగ్గర పడుతుంది. దిగులుగా అలిగి కూర్చోంటాడు. ఎన్ని రోజులుగానో అతనిని వేధిస్తున్న ప్రశ్నకు జవాబు చెప్పటానికి ఆమె సంసిద్ధం అవుతుంది ఆమె అప్పుడు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె దాచుకొన్న భరిణా, అందులో వంద రూపాయల నోటూ ఎవరి జ్ఞాపికలు? ప్రేమించి ఆమెతో అడవి దాకా అడుగులు వేసిన ఆమె భర్తవనే అనుకొంటాడు. కానీ ఆమె వెళుతూ చెప్పిన చివరి పాఠం అన్నిటి కంటే అమూల్యమైనది. డబ్బే లేని సమాజం రావాలని కోరుకొనే వాళ్ళు డబ్బు దాచుకోనవసం లేదు. ఆ నోటు ‘తీసుకోవటమే తప్ప యివ్వటం చేతకాని’ ఆమె చిన్నప్పటి పనిమనిషి యిచ్చినది. పార్టీ తనలాంటి పేద ప్రజల విముక్తి  కోసం పనిచేస్తుందనే నమ్మకంతో పంపిన పార్టీ చందా అది. అలాంటి లక్షలాది విప్లవాభిమానుల ఆశలనూ, కోరికలనూ మనసులో మోసుకొని నర్మద ‘లోపలికి’ వెళ్ళి పోతుంది.

పార్టీలు, ప్రజా సంఘాలు ఎలా నడవాలి? ఎవరి కోసమైతే పని చేస్తున్నామో ఆ  పేద ప్రజల మీదే ఆర్ధికంగా ఆధారపడితే వాళ్ళు ఏమి యివ్వగలరు? అసలు వాళ్ళను ఎలా అడగగలం? ఇలాంటి సందేహాలు విప్లవోద్యమంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో వస్తాయి. ఆ సందేహాలకు చెంప చెళ్లుమనే సమాధానం ‘అర్ధ శేరు ధాన్యం’ కధ చెబుతుంది. సంఘం కోసం బియ్యం, డబ్బులు అడుగుతూ పేద దళిత వాడకు వెళతారు. ఎవరికి తోచింది వాళ్ళు కాదనకుండా యిస్తారు. దరిద్రం, అనారోగ్యం, పోషహాకార లోపం పిల్లల్లో, మహిళల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. చివరి ఇంట్లో భర్త వలస పోయి ఉంటాడు. భార్య జ్వరం వచ్చిన కొడుకుకు గుడ్డ కూడా కప్పలేని దారిద్యంతో ఉంటుంది. ఆమెను మంచి నీళ్ళు మాత్రం అడిగి పోయించుకొని తాగి తిరిగి రాబోతారు. ‘అందరిండ్లలో అడిగిన్రు .. మమ్మల్నడుగుత  లేరన్నా?’ ఆమె ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ‘సగం శేరు దంచిస్తా’ అని వాళ్ళను కూసోబెట్టి అక్క వేస్తున్న ఒక్కొక్క పోటు వాళ్ళ సందేహాలను పటాపంచలు చేస్తుంది. ఎంత ఆర్ధ్రమైన కనువిప్పు! పేద వాడల్లో విరాళాలు వసూలు చేయటం అంటే వాళ్ళతో బంధాన్ని గట్టి పరుచుకోవటమే కదా.

రహస్యోద్యమాన్ని వెన్నుతో కాచిన వాళ్ళు విప్లవ సానుభూతిపరులు. కుటుంబాలకు కుటుంబాలు, తరాలకు తరాలు ఉద్యమాలకు  నిండు హృదయంతో సహాయ సహకారాలు అందించటం వలనే అవి మనగలిగాయి. ఏళ్ళ క్రితం అందించిన ఆయుధాలను భద్రంగా దాచి ఇవ్వాల్సిన వాళ్ళకు యివ్వాల్సిన పద్దతిలో అందచేయటం చేయటంలో పార్టీకి గుర్తు చేసిన కర్తవ్యం ‘మళ్ళీ మొదలు పెట్టమని’. ఆ సమూహాలు ఎన్ని రోజులు పార్టీకి భౌతికంగా దూరంగా వున్నా మానసికంగా అక్కడే ఉంటాయి. ఆ కార్మికవర్గ మనస్తత్వాన్ని కళ్ళకద్దుకొని ఆ కర్తవ్యాన్ని తలకెత్తుకోవాలనే చెప్పే కధ ‘మొదలు’.

ఎన్ని కధలు! ఎంత జీవితం! ఎంత ఘర్షణ! ఎన్ని పోరాటాలు! ఎన్ని మథనాలు! ఎన్ని సందేశాలు! ఇవన్నీ ఎంత సహజంగా రాయగలిగారు షహీద! నీటిలో చేపలాగే ప్రజలలో మమేకమైన వారికే కదా ఇంత బతుకు తెలిసేది! ప్రజల ఆకాంక్ష, వాంఛ, భాష, నడక, నడత తెలిసిన వాళ్ళు మాత్రమే కదా ఇంత బాగా వ్యక్తీకరించగలిగేది!

*

రచన వ్యక్తపరిచే తాత్వికతే రచయిత!

సామాన్య  

 ” రచయితని ” అని నాకు నేను ట్యాగ్ చేసుకునేంత విస్తృతంగా రాయలేదు నేను . ఎవరన్నా అలా పిలిచినా నాకేవిటో కొత్తగా, భయంగా వుంటుంది . కానీ ఆ కారణం చేత మాత్రమె ”కథన రంగం” కిరాయకుండా ఇన్ని రోజులూ  ఆగలేదు . అది కూడా ఒక కారణమైనప్పటికీ …ఇంకో కారణమేమిటంటే నా వరకు నాకు రచయిత , రచన వేర్వేరు . రోలాండ్ బార్ట్ ”డెత్ అఫ్ ది ఆథర్ ” తో నేను ఏకీభవిస్తాను .

రచనకి మించి రచయిత తో సంభాషించడమూ , రచనకిమించి పాఠకులు, రచయిత జీవితాలలోకి వెళ్ళడమూ రచనని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా సహాయ పడతాయి అని నాకో మీమాంస . అస్తిత్వ వాదాలని గౌరవించినప్పటికీ రచయితకి పరిధి ఉండటాన్ని ,ఒకే అస్తిత్వంలో ఆగిపోవడాన్ని  నేను అంగీకరించను . రచన చెయగలగడమనేది జెనటికల్ గా వచ్చిన ఒక ప్రత్యేక సామర్ధ్యమనీ , ఆ సామర్ధ్యం చేత రచయిత ఇతరుల అంతరంగాలను శోధించగలద/డనీ, ఇతరులకు అర్థంకాని విషయాలను అర్థం చేసుకోగలద/డనీ నేను నమ్ముతాను .

ఈ రోజు ఉదయం నన్ను పలకరించిన ”కేర్లీ రే జెప్సిన్”పాట నన్ను ముచ్చట పరిచింది ” i know this isn’t love ,but i need to tell you something / i really really really really really like you ” అని విన్నపుడు నాకు భలే అనిపించింది కానీ దానికోసంనేను జెప్సిన్ ఈ  వాక్యాలని ఎలా రాసింది ?అసలు జెప్సిన్ ఎవరు ?ఇది ఆమె అనుభవమేనా అని వెతకను . రచయిత ఇతరుల అనుభవాలని తన అనుభవాలుగా చేసుకోగలదనీ ,సామాన్య అనుకున్నదిజెప్సిన్ రాయగలదని నమ్ముతాను . ”మన మనసులోక్కటి అయితే మాయ పెళ్లి ఏటికి చల్ మోహన రంగా /మంగళ సూత్రమేటికి ”అన్న చల్ మోహన రంగ గీత రచయిత ఇంటర్వ్యూ చదవకపోవడం వల్లఆ భావానికి ఏమయినా లోపమొచ్చిందా అని ఒక ఆలోచన .

”పుష్పవర్ణ మాసం” వచ్చినపుడు ఒక స్నేహితుడు అనేక ఏళ్ళ తరువాత ఆ కథనో సందర్భం చేసుకుని   పలకరిస్తూ   నన్ను ”వీణాధరీ” అని సంభోధించాడు . అందులో నేను వీణాధరినని అతనికి ఎందుకు అనిపించింది ?రచయితలం తప్పకుండా రచనలో ఎక్కడో ఓ చోట వుంటాం కానీ నేను వీణాధరినే ఎందుకయ్యాను ?”విషాద కామరూప ”లోకథా నాయకుడు ఇంద్రజిత్ ని తానేనని చెప్తుంది రచయిత్రి ఇందిరా గోస్వామి ,ఏం … నేను పుష్పవర్ణ మాసం లో గదిలో గూడు కట్టుకుని ఆకుపచ్చటి పాటతో ఆ అమ్మాయి ప్రేమను అతనికి చెప్పినకోయిలని అయి ఉండొచ్చు కదా … ”ఏరియల్ ”ని అర్థం  చేసుకోవడానికి ”సిల్వియ ప్లేత్” ఆత్మహత్య చేసుకుందని తెలుసుకొని తీరాలా…  ఇవన్నీ రచయితగా ఇది రాయాలనుకున్నపుడు నన్ను ఇబ్బందిపెట్టిన  ఆలోచనలు . ఇదంతా ఎందుకంటె రచయిత మనస్థత్వమో, నేపధ్యమోమొ  , మతమో ,  పాఠకులకు  దగ్గరగా తెలియడం వల్ల పాటకులు రచనని ఆస్వాధించడంలోనో ,అర్థం చేసుకోవడంలోనో తమకుతెలియకుండా కొన్ని పరిమితులకు లోబడి పోతారు ,చాలా సార్లు రచన అంతరార్థం బిట్వీన్ లైన్స్ కూడా వుంటుంది బహుశా రచయిత పరిచయం పాటకులలోని ఈ ఆలోచనావిస్తరణ యొక్క సామర్ధ్యాన్నిదెబ్బ తీస్తుందనీ అనుకుంటాను .

ఇలాటి భావాలతోనే రచయితగా ఎక్కడయినా పరిచయం కావాలన్నా, మాట్లాడాలన్నా నాకు అయిష్టం. అయినా ఇది ఎందుకు రాసానంటే కొన్ని స్నేహాలు , ప్రేమలూ మనసిద్ధాంతాల కంటే విలువైనవీ , లెక్కింపదగినవీ గా భావిస్తాను గనుక రాసాను .

అదలా ఉంచితే ఇప్పుడు ఈ క్షణంలో ఆలోచిస్తున్నాను రచయితగా నేనేమిటీ అని ? మూడు అంశాలు తట్టాయి . నేను ఎందుకు రాస్తాను ?ఏం రాస్తాను ?ఎలా రాస్తాను ?అని  .అసలు నేను ఎందుకు రాస్తానుఅని ఆలోచిస్తే ఆశ్చర్యమేసింది , నాకు ఏడుపొచ్చినప్పుడు నేను రాస్తున్నాను  . ఏడ్చి ఏడ్చి చాలా ఏడ్చాక గుండెలో ఏదో నొప్పిలాంటిది వస్తుంది నాకు అది  భరించలేక రాస్తున్నాననుకుంటా బహుశా .కిషన్ జీ ని గమనిస్తూ వుండేదాన్ని ఎప్పుడూ … ఎన్కౌంటర్ జరిగాక ”కబీర్ సుమన్ ” ఒక పాట  రాసి పాడాడు ”బీర్ మొరె   బీరేర్ మతో బీర్ మొరె  ఏకా …”[వీరుడు వీరుడిలా మరణిస్తాడు ,వీరుడువొంటిగా మరణిస్తాడు ]అని అది విన్నపుడు నాకు నన్ను నేను అదుపులో వుంచుకోలేనంత ఏడుపొచ్చింది .

 

సామాన్యఇంట్లో వాళ్ళు ఓపికగా ఓదార్చి దాన్ని చానలైజ్ చేయించినపుడు రాసిన కవిత ”జనగణ్ ”అలాగే2007 నుండి మహిత శవాన్ని గుండెల మీద మోసుకు తిరిగి తిరిగీ ఇక తిరగలేక రాసిన కథ మహిత , అంతరాల సమాజం  ఆత్మాభిమానపు అనితను నా ముందు ఏడ్చేలా చేసినపుడు  సిగ్గుతో నాకుఏడుపు వచ్చి రాసిన కథ ”అనిత పాడిన పాట ”.. అలా నేను రాసిన లేదా రాయబోయే కథలైనా  లేదా కవితలైనా  ఎందుకు రాస్తానంటే నా దుక్కాన్ని ఏం చెయ్యాలో తెలియక ,రాయడమనేది అయాచితంగావచ్చింది కనుక ఆ రూపంలోకి నా కన్నీటిని ఒంపేసి వదిలించుకోనే సౌకర్యం వుంది కనుక వదిలించుకోవడానికి రాస్తాను . అందుకని రాస్తాను .

ఏం  రాస్తానంటే .. నాది చాలా చిన్న ప్రపంచం , ఏకాంత ప్రపంచం . నా జీవితంలో అత్యధిక భాగాన్ని నేను ఏకాంతపు గదులలో గడిపాను ,గడుపుతూ వుంటాను . ఆ గదిలోకి ఆత్మీయులు వస్తూ  వెళ్తూవుంటారు .అంతర్బాహిరాలలో నన్ను పెనవేసుకుపోయి వున్న  ఏకాంతాన్ని చిద్రం చేయడానికి రకరకాల కాల్పనిక మనుష్యులను నా గదులలోకి , హృదయంలోకి తెచ్చుకోవడం నేర్చుకున్నాను చాలాచిన్నపుడే . అలా మొదలయింది చదవడం .

నాకు పుస్తక జ్ఞానం అంతో ఇంతో వుంటుంది కానీ ప్రాపంచిక జ్ఞానం చాలా తక్కువ . ప్రాపంచిక జ్ఞాన శూన్యురాలనయిన నా దగ్గరికి పిల్లల కోసం మేత తెచ్చేఅమ్మలా బయటి ప్రపంచాన్ని మోసుకోస్తారు  నా తమ్ముళ్ళు ఉదయ చైతన్య ,శ్రీకాంత్ నా సహచరుడు కిరణ్ .  ఆ మేత పెట్టడమే కాదు ,నాతో చర్చించి  నా హృదయంలో…  అవును మెదడులో కాదుహృదయంలో ఎలా ఆలోచించాలనే  విధానాన్ని ఓపికగా పొదుగుతాడు కిరణ్ . అలాగే ”వినయ” లాటి నా స్నేహితులు స్త్రీ అంతరంగాన్ని ,మోస్తున్న భరువులని,వారి   దుక్కాలకి సంబంధించిన పిక్టోగ్రాఫ్ నినా హృదయం పై పరుస్తారు . నాకోచ్చే సందేహాలని నేను వ్యక్త పరుస్తాను ,వెదుక్కుంటాను ,చదువుకుంటాను ,ఆలోచించుకుంటాను .

దుక్కమనిపిస్తే సంగీతమనే డ్రగ్ ని హృదయం లోకి ఇంజెక్ట్ చేసుకునిదుక్కాన్ని వదిలించుకుంటాను ,లేదంటే ”మిల్స్ అండ్ బూన్”లోకి పారిపోయి ప్రపంచమంతా భలే రొమాంటిక్ గా ఉందనీ కాసేపు భ్రమ పెట్టుకుంటాను . ఇంకా .. మరీ రాయాలని చాలా అనిపిస్తే రాస్తాను . నాఆదిమ సహజాతం ఏంటంటే నాకు ఎవరైనా ఇంకోరి మీద పెత్తనం చేస్తే నచ్చదు ,కొందరు ఒదిగి వుండటం ,కొందరు చాతీ విరుచుకుని వుండటం అసహ్యం . అసూయ, ద్వేషం ,దురాశ…  బైబిల్ లో చెప్పినసైతాన్  అంటే వీటి కలయికే   అని నమ్ముతాను . ఈవిల్ అంటే అసహ్యం నాకు . వీటన్నిటి గురించి రాయాలని ,అంత పరిణతి రావాలని తాపత్రయ పడతాను. ”ఎంత జ్ఞాన విహీనమయినది మానవహృదయం !భ్రాంతి అనేది ఒక పట్టాన తొలగి పోదు .యుక్థి , వివేచన ఎంతో ఆలశ్యంగా ప్రవేసిస్తాయి మనస్సులో ..”అంటూ రత్న గురించి రాసిన టాగోర్ లాగా  ,”  మొపాసా లాగా   ,హెన్రీ లాగా  ,గోగోల్ లాగా ,”తిరగేసి కొట్టు అనే వ్యూహాత్మక సిద్ధాంతాన్ని ”తెలియ చెప్పిన పతంజలిలలాగా .. ఇలా అత్యద్భుత ప్రతిభా సంపన్నులయిన రచయితలని చూసి దిగ్భ్రమ చెంది వారి లాగా  రాయాలని ఆశ పడతాను.

నాకు అంత ప్రతిభ లేదు కనుక నేను రాసినవి తిరిగి చూసుకోవడం కూడా నాకు అసహ్యం . నాకు నచ్చవు . అందుకని రాసినవన్నీ అచ్చుకివ్వను . అచ్చయిన వాటి మొహం కూడా చూడను . ఇంకా అత్యంత రహస్యం  ఏంటంటే నా హృదయంలో విన్సెంట్ వాంగో ,కాఫ్కా .. అఫ్ కోర్స్ చండీ దాస్ వంటి వాళ్ళు ఇల్లు కట్టుకుని వున్నారు .చాలా ఏళ్ళుగా వాల్లిక్కడ  రెసిడెంట్స్  . నా పిచ్చితో వాళ్ళు ,వాళ్ళమేజిక్ తో తో నేను ,మా మూడ్ స్వింగ్స్ తో కిరణూ సహజీవనం చేస్తుంటాం . నా రాతనీ ముఖ్యంగా జీవితాన్ని ఇలాటి వాళ్ళందరూ లీడ్ చేస్తుంటారు . కిరణ్ పాపం మార్క్స్ ని ,మావో ని, బుద్ధుడ్నీ ,అంబేద్కర్ ని తోడు పెటుకుని నా తిక్కకి మందులు నూరుతుంటాడు   .  నేను రాసే రాతలో ఆత్మ కిరణ్ అక్షరం నేను . చేసే పనిలో ఆలోచన కిరణ్ ఆచరణ నేను .

ఎలా రాస్తాను అనేది శైలీ శిల్పాలకి సంబంధించిన విషయం కదా .. . నేనేమనుకుంటానంటే వస్తువు దాని శిల్పాన్ని అదే వెతుక్కుంటుందీ అని . రాయడమనేది” రివర్ కోర్స్” లాటిది అనుకుంటా  . మనంకలం పట్టుకుంటాం అంతే . మన నిమిత్త మాత్రత్వంతో రక్తమాంస భరితమయిన పాత్రలు నది లాగే ఊహించని రీతిలో వాటి గమనాన్ని అవే నిర్దేసించుకుంటూ సాగుతాయి . కాకపోతే రచయితహృదయంలోని సౌజన్యం ,సౌశీల్యత ,సహన శీలత,ధీరత  రచనలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ వుంటుంది . ముగింపుని అదే  నిర్దేశిస్తుందనుకుంటా . రచన వ్యక్త పరిచే తాత్వికతే రచయిత .

మనిషిగా నాకు రిజిడిటీ అంటే అయిష్టం ,సరళత అంటే ప్రేమ . ఎరాక్లితోస్ చెప్పినట్లు ”There is nothing permanent except change..” [ఇంక్లూడింగ్ మై అబౌవ్ వోర్డ్స్ ]

 

 

లైఫ్ ల కొద్దిగ పాజిటివ్ టర్న్…

అల్లం వంశీ

 

“నువ్వు కథలెందుకు రాస్తున్నవ్??”
ఉట్టిగనే.. రాస్తుంటే మంచిగనిపిస్తుంది కాబట్టి రాస్తున్నా..

మంచిగనిపించుడంటే?
ఓ కథ రాస్తా.. అది ఎన్లనో ఒక దాన్ల పబ్లిష్ ఐతది.. అది చదివి ఓ నలుగురు ఫోన్ చేసి మంచిగున్నది అంటరు.. ఇంకొందరు అక్కడికి ఆగకుంట “నీ కథల, మమ్మల్ని మేం చూస్కున్నం.. అదంత చదివినంక మావోళ్లు మతికస్తున్నరు. మా ఇల్లు మనాది సలుపుతున్నది, పొయి రావాలె.. మాక్కొద్దిగ మారాల్ననిపిస్తున్నది..” అని ఇంకో రెండు మూడు ముక్కలు ఎక్కువ మాట్లాడుతరు.. బస్… అది చాలు.. దిల్ ఖుష్.. అందుకే మంచిగనిపిస్తది అంటున్న..

గంతేనా? ఇంకేం లేదా??
లేదా అంటే మా ఉన్నదికని అందంత చెప్తే క్లాస్ పీకినట్టు ఉంటదని చెప్తలేను..

పర్వాలేదు చెప్పు..
చదువుకుంటె మనిషి సంస్కారవంతుడైతడు అంటరుకదా, అది వంద శాతం నిజం.. కాకపోతే “ఏం” చదువుకుంటే సంస్కారవంతుడైతడనేది చానమందికి తెలువకపోవుడే అసలు సమస్య..
న్యూటన్ గమన నియమాలు బట్టీకొడితెనో, మైటోకాండ్రియా నిర్మాణం పొల్లుపోకుండ యాదుంచుకుంటెనో, మొఘల్ చక్రవర్తుల వంశ వృక్షం మక్కీకి మక్కి అప్పజెప్పగలిగెతెనో కుప్పలు తెప్పలుగా సంస్కారం వచ్చిపడుతది అనుకుంటరు చానమంది!

అంటె? చదువుకు సంస్కారానికి సంబంధంలేదనా నీ ఉద్దేశ్యం?
అరే.. మొత్తం వినూ.. అదే చెప్తున్నా… ఇంతకుముందు చెప్పినయన్ని చదువుతె ఆ సబ్జెక్టుల నాలెడ్జీ పెరుతది కావచ్చు కని దునియాల మంచీ చెడుల గురించి ఏం తెలుస్తది చెప్పు??
ఇక్కడ నీకో చిన్న ఉదాహరణ చెప్తె మంచిగ సమజైతదికావచ్చు! నూట యాభై దేశాల రాజధానులూ + వాటి కరెన్సీలు టకా టక్ అప్పజెప్పే పదేండ్ల పిలగాడొకడు నాకు తెల్సు.. (మా సైడ్ బాగ ఫేమస్, “మస్తు తెలివిగల్లోడు” అని)… ఆ పిలగాడు మొన్నోసారి వాళ్ల కుక్క తోకకు సుతిల్ బాంబు కట్టి పేల్చిండు, పాపం దాని తోక తెగిపొయి, తొడలు మొత్తం కాలి పుండై రక్తం కారుతుండే.. అట్ల చేసినందుకు వాళ్ల అమ్మనాన (ఇద్దరూ గవర్నమెంట్ టీచర్స్) పిలగాన్ని ఏమనకపోంగా ఆ కుక్కను మా కుక్క కానే కాదన్నట్టు ఊరవుతల ఇడ్శిపెట్టచ్చి చేతులు కడుక్కున్నరు.
ఇక్కడ పిలగాడు చదువుకున్నోడే, వాళ్ల అమ్మనానలూ చదువుకున్నోళ్లే! మరి అందరు మంచోళ్లే అయినంక ఆ కుక్క బతుకు నిజంగనే “కుక్క బతుకెందుకైతది” చెప్పు…?

ఎందుకైందంటవ్ మరి?
వాళ్లు చదువుకున్నోళ్లే కనీ, సంస్కారం లేనోల్లు కనుక అట్లైందన్నట్టు..

నువ్ రాసే కథల గురించి నేనడుగుతుంటే, నువ్వింకేదో పిట్టకథల్ చెప్తున్నవ్??
పిట్టకథల్ కాదు భై.. మంచి సాహిత్యానికీ మనిషి వ్యక్తిత్వానికి సంబంధం ఉంటదని చెప్తున్నా.. “మనిషి మనిషి లెక్కనే ప్రవర్తించాలంటే” రెండే రెండు దారులుంటయ్.. ఒకటి మంచోళ్ల సోపతి, ఇంకోటి మంచి పుస్తకాలతోని దోస్తాని..
నీకు తెల్సో తెల్వదో కని, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ప్రపంచం.. ఒక్కో కథ ఒక్కో జీవితం.. అందుకే ఎంత చదివితే మన “ఆలోచనలకు” అంత మంచిది..

అచ్చా.. సమజైంది.. ఇంతకు నువ్వెందుకు రాశుడు షురూ చేష్నవో చెప్పలే..
ఈ రాశుడు సెవెంత్ క్లాస్ ల షురూ అయ్యి ఇక్కడిదాంక వచ్చింది.. అప్పుడు వార్త పేపర్లో “మొగ్గ” అని చిన్న పిల్లల పేజి ఒకటి వస్తుండే, దానికి పోస్టుకార్డు మీద కథలు రాసి పంపుతె ఓ రెండు మూడు సార్లు వాళ్లు పబ్లిష్ చేశిన్లు, అప్పుడు చూడాలె మా స్కూల్ల నా ఫెయితూ.. కథా కార్ఖానా.. అగో అప్పుడు షురూ అయి, నా కథ ఇక్కడి దాంక వచ్చింది..

అప్పటికీ ఇప్పటికీ ఏమన్న తేడా ఉన్నదా లేదా మరి?
అప్పుడు చిన్నగున్నప్పుడు కథ పడకపోయినా పర్వాలేదుకని పేపర్లో మన పేరు కనపడాలె, అది చూశి అందరు మస్తు పొగడాలె అని ఉండేది.. ఇప్పుడు మాత్రం రివర్స్ ల నా పేరు వెయ్యకపొయిన మంచిదే కని కథ మాత్రం బాగ మందికి రీచ్ కావాలె అనిపిస్తుంది.. ఇదికూడా కొంతవరకు స్వార్థపు ఆలోచనే కావచ్చుగని.. నిజాయితిగ చెప్తున్న, నాకైతె అట్లనే అనిపిస్తున్నది, చానమంది చదవాలె అని..
చదివి అందులో వాళ్లను వాళ్లు పోల్చుకోని లైఫ్ ల కొద్దిగ పాజిటివ్ టర్న్ తీసుకుంటె చాలు.. ఖుష్..

vamsi

 

వాళ్ల లైఫ్ పాజిటివ్ టర్న్ తీసుకుంటే నీకెందుకు ఖుష్? (నీకేంది లాభం?)
ఇంత పిచ్చి ప్రశ్న నా జిందగీల ఇంకోటి విన్లే.. ఇది చదువుతున్న వాళ్లల్లో చానామందికి దీనికి జవాబు ఎరికేగనీ.. ఇంకేమన్న అడుగవోయ్..

ఓకే.. ఓకే.. సినిమాలకు పనిచేసినట్టున్నవ్.. దాని గురించి కొంచం..
సినిమా రైటర్ ప్రస్థానం మస్తు పెద్ద కథ..
రెండేండ్లల్ల మూడున్నర సినిమాలు రాసిన.. (రెండున్నర వాటికి కథలూ+మాటలు, ఒక దానికి ఉట్టి మాటలు).. వాటిల్లో ఏ ఒక్కటీ కూడా ఇంకా రిలీస్ కాలే.. ఒకటి షూటింగు ఐందని తెలుసు, మిగిలిన రెండున్నర అసల్ సెట్ల మీదికి ఎక్కినయా/ఎక్కుతయా లేదా అన్నది నాకింక డౌటే.. “ఆ ప్రపంచం” మంచిగనే ఉంటది కని రచయితకు వంద “బార్డర్లు” గీసి మద్యల నిల్చోపెడ్తరు… బడ్జెట్ అనీ, భాష అని.. వంద ఉంటయ్..

 

బార్డర్లంటే?? కొంచం క్లియర్ గ చెప్పరాదు..
ఒకరు బూతు జోకులుండాలంటే, ఇంకొకరు పంచు డైలాగులు పడాలంటరు.. ఒకరు లాజిక్స్ లేకున్న పర్వాలేదుకని ఫ్రేము ఫ్రేముకీ ఫిమేల్సు కనిపించాలంటే, ఇంకొకరు నువ్వేం చేస్తవో నాకు తెల్వదు సాంగ్ అయిపోయిన వెంటనే గన్ ఫైర్ జరిగి స్క్రీన్ అంత రక్తం కారిపోవాలె అంటరు!!
తలకాయి తోక ఉండొద్దుకని గొర్రెను గియ్యమంటరు.. ముక్కూ చెవులు ఉండకున్నా మొహం అందంగా రావాలంటరు.. అదే సినిమా ప్రపంచం.. (అందరు అసొంటోళ్లు ఉంటరని కాదు.. కొందరు కత్తిలాంటి మహేషన్నలు, మంచి మహేందరన్నలు కూడా ఉంటరు.. కాని మస్తు అరుదు).. అందుకే అవన్ని నాతోటి కావనిపించి, ఆ ఫీల్డులో మనుషులు నాకు నచ్చినా, “ఆ సిస్టం” నచ్చక వదిలేష్నా..
ఇంక ఆ టాపిక్ లైట్.. వేరే ఏమన్న మాట్లాడుదాం..

ఓకే.. ఓకే.. ఇందాక సాహిత్యం అనుకున్నం కదా మరి సాహిత్యంలో కథా, కవిత, నవల, పాట, పద్యం.. ఇట్ల ఎన్నో ప్రక్రియలు ఉండంగ నువ్వు కథనే ఎందుకు ఎన్నుకున్నవ్?
ఇక్కడ చిన్న థియరీ చెప్పాలె.. “కడుపు నిండుగా తిన్నా కానీ, నోట్లో ఇంకా ఆకలవడం” అన్న కాన్సెప్టు నువ్వెప్పుడన్న విన్నవా?

అహా విన్లే..
చెప్త విను.. – నాకు చిన్నప్పటి నుంచి ఆకలైనపుడు ఎన్నిరకాల ఓల్డ్ స్టైల్ టిఫిన్లు(అంటే ఫర్ ఎక్సాంపుల్ రొట్టె/పూరీ/ గారె/ దోశే లాంటివి) తిన్నా, ఎన్నిరకాల లేటెష్ట్ వెరైటీలు (లైక్- పిజ్జా/బర్గర్/ నూడిల్స్ గీడుల్స్ లాంటివి) తిన్నా.. నా కడుపైతె మస్తుగ నిండుతది కని ఆకలి మాత్రం అస్సల్ తీరదు.. ఇంకా “ఏదో” తక్కువైన ఫీలింగ్ ఉంటది.. చిన్నప్పుడు మా అమ్మకు అదే చెప్పేటోన్ని- “కడుపైతె నిండిందికని నోట్లో ఇంకా ఆకలైతుందమ్మా” అని.. (వాస్తవానికి అది నోట్లో ఆకలవడం కాదుగాని, “తిన్న ఫీలింగ్” రాకపోవడం అన్నట్టు.. దాన్నే తెలుగుల “తృప్తిగా భోంచెయ్యడం” అంటరనుకుంట!) అప్పుడు మా అమ్మ ఆ టిఫిన్లు పక్కకు పెట్టి, ఇంతంత అన్నంలో కూరో చారో కలిపి తినిపించేది.. అదేం విచిత్రమోకాని ఒక్క రెండు బుక్కల అన్నం తిన్నా చాలు టక్కున ఆకలి తీరిపొయ్యేది.. ఇప్పటికి తిండి విషయంలో నాదదే థియరీ, “అన్నం” ఒక్కటే నా ఆకలి తీరుస్తదీ అనీ..
ఈ కథంతా ఇప్పుడెందుకు చెప్తున్నా అంటే- అన్నం ఎట్లైతె నా ఆకలి తీరుస్తదో, “కథ” కూడ సేం అట్లనే రాయాలన్న నా “కూతి”ని తీరుస్తది..

ఏం “కూతో” ఏందో.. ఇంత వెరైటీ పోలిక నేనైతె ఇప్పటిదాంక విన్లే!!
థాంక్యూ..

రకరకాల టిఫిన్లు ట్రై చేసినట్టు, సాహిత్యంలో కూడా అన్ని రకాలు ట్రై చేసే ఉంటరు కదా?
కావల్సినన్ని ట్రై చేశ్నా… కవితలూ, వ్యాసాలు, పాటలు, మాటలు(సినిమాలకు), కాలేజీల కామెడీ స్కిట్లూ + సగం రాసి విడిచి పెట్టిన నవలలూ…. నేన్ చెయ్యని ప్రయోగంలేదు..

మరి వాటిని ఎందుకు విడిచి పెట్టినట్టు??
నేను వాటిని విడిచి పెట్టుడుకాదుగనీ, అవే నన్ను విడిచి పెట్టినయ్… కథొక్కటే నన్ను పట్టుకోని ఉన్నది పాపం..

అట్లకాదు, కరెక్ట్ కారణం చెప్పు..
ఒక్కటని ఏం చెప్పను..! కవితలను, రాసిన నేను తప్ప ఇంకొకరు చదవకపోవడం కావచ్చు.. పేపర్లకు రాసి పంపిన వ్యాసంలో పావో, సగమో తప్ప మిగిలినదాన్ని వాళ్లు “ఎడిటింగు” చేసి నేన్ రాసినట్టు కాకుండా వాళ్లకు కావల్సినట్టు మార్చడం కావచ్చు, పాటల రికార్డింగు ఖర్చుతో కూడుకున్నదని కావచ్చు, నవలరాస్తుంటే ఒళ్లు బద్దకమవుడు కావచ్చు, స్కిట్ లు రాద్దామంటే ఇప్పుడు నేను కాలేజీలో లేకపోవడం కావచ్చు.. సవాలక్ష కారణాలు..

ఒక్కటడుగుతె ఇన్ని చెప్తున్నవ్? సరే సరే మళ్లీ “కథలోకి” వద్దాం.. ఇంకా చెప్పు కథలెందుకు ఇష్టం..
ఒకటే ప్రశ్నను మార్చి మార్చి ఎన్నిసార్లు అడుగుతవ్ చెప్పు..!

నువ్వు మంచి సాలిడ్ & వ్యాలిడ్ రీజన్ చెప్తలెవ్వు.. అందుకే మళ్ల మళ్ల అడుగుతున్నా ..
కవిత రాస్తే నాకు నేనే(ఎవరో ఒక్కరే) మాట్లాడుకున్నట్టు ఉంటది, మహా ఐతె ఇంకొకర్ని చొప్పించచ్చు కావచ్చు..
కాని కథల అట్లకాదు ఎంతమందిని కావాల్నంటే అంతమందితోని మాట్లాడిపియ్యొచ్చు…

కథలో-“మనకు నచ్చిన విషయం- నచ్చిన పాత్రతోటి- నచ్చిన సంధర్భంలో- నచ్చిన పద్ధతిలో- నచ్చిన చోట- నచ్చిన టైముకు- నచ్చిన భాషలో- నచ్చిన యాసలో- నచ్చిన పదజాలంతోని చెప్పే అద్భుతమైన సౌలత్ ఉంటది”.. (ఇవన్ని నచ్చకపోతే, రచయితగా మనం కూడా ఆ కథా సన్నివేశంలోకి దూరి మరీ మనమేం చెప్పాలనుకున్నమో చెప్పవచ్చు).. “కథ”ల ఇన్ని సౌలత్ లు ఉంటయి కాబట్టే నాకు మిగిలినవాటికన్నా “కథలు” రాశుడంటెనే ఎక్కువ ఇష్టం..

అంత సాలిడ్ గ లేదు కని, కొంచం వ్యాలీడ్ గనే ఉంది కాబట్టి ఈసారికి వదిలేస్తున్నా…
అవునా.. థ్యాంక్స్..

ఇంకా.. నువ్వు రాసిన కథలకు సంబంధించి హ్యాపీగ అనిపించిన సంధర్భాలు??
చాన్నే ఉన్నయ్.. చదివిన వాళ్లు ఫోన్ చేసి “చదివినం, మంచిగుంది” అన్న ప్రతీసారి నాకు పండుగే.. ఇంకా మస్తు మంచిగనిపించె విషయమేందంటే చాన మంది సీనియర్ రచయితలు కూడా ఎక్కడో ఓకాడ నా కథ ఏదో ఒకటి చదివి, గుర్తుపెట్టుకోని మరీ కాలో, మెసేజో చేస్తున్నరు.. అటువంటివాళ్లు మంచిగుందన్నా, మాములుగ ఉన్నదన్నా నాకానందమే… చదవనైతె చదివిన్లు కాబట్టి..
ఇక్కడ అఫ్సరన్న కు ప్రత్యేకంగ కృతఙ్ఞతలు చెప్పుకోవాలే, ఎందుకంటే ఆన్ లైన్ మ్యాగజైన్ అనే మాధ్యమం తోని మస్తుమంది కొత్తవాళ్లను మస్తు ఎంకరేజ్ చేస్తున్నందుకు.. (ఈ విషయంల అఫ్సరన్న తర్వాతనే ఇంకెవరైనా..)
ఈ ఆన్ లైన్ మ్యాగజైన్స్ గొప్పతనం ఒకటున్నది, అదికూడ ఈ సంధర్భంల చెప్పుకోవాలె…

అదేందంటే… 24X7, 365 రోజులూ దునియాల అందరికీ ఇవి అందుబాటుల ఉంటయ్.. వీక్లీ పేపర్ల అచ్చైనవైతే ఆదివారం దాటితే మళ్ల మనకంటికి కనపడవు, కానీ ఆన్ లైన్ లో పబ్లిష్ అయినవాటిని ఇవ్వాల కాదుకదా ఇంకో పదేండ్లకు కావాల్నన్నా మనకు ఒక్క క్లిక్కు దూరంలనే ఉంటయి.. నాకందుకే ఈ పద్దతి మస్తు నచ్చింది..
(అఫ్సరన్న & టీం తోని పాటూ మిగిలిన ఆన్ లైన్ మ్యాగజైన్స్ నిర్వాహకులందరికీ మళ్లొక్కసారి కృతఙ్ఞతలు..)

ఔను కరెక్టే.. నేనూ అట్లనే అనుకుంటా… సో… ఇంకా?? మరి బాధనిపించిన సంధర్భాలు ఏమన్న ఉన్నయా? (కథలకు సంబంధించి)
ఆ.. అవికూడ కొన్నున్నయ్.. నా దగ్గరి దోస్తులల్ల చానమందికి తెలుగు చదువుడురాదు.. చదువరాదంటే మొత్తానికి రాదని కాదుగని, బస్ మీద “హైదరాబాద్” అనో “వరంగల్” అనో బోర్డు చదవటానికే వాళ్లకు అర నిమిషం పడ్తది.. ఇగ “కండక్టర్ కు సరిపడ చిల్లర………..” చదవటానికైతే సగం జర్నీ ఐపోతది..
అసొంటోళ్లు ఒక కథను చదవాల్నంటే కనీసం ఒక నెలో నెలన్నరో పడ్తది, అందుకే వాళ్లు చదవరు!!! (నా దోస్తులనే కాదు, ఇప్పుడు “బిలో థర్టీ” ఉన్నోళ్లు చానమంది అందుకే తెలుగు పుస్తకాలు చదువుతలేరు) అదొక బాధ.. పోనీ వాళ్లకు సమజయ్యేటట్టు నేనే ఇంగ్లీషులో రాద్దామంటే, రాయస్తలేదు.. అందుకు ఇంకో బాధ..

అబో.. మంచిది.. మంచిది! చివరగా.. ఇంకా నీకున్న ఆశలూ – ఆశయాలూ??
పెద్దగ ఏం లెవ్వు కానీ..
వల్డ్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ ల కనీసం నాయొక ఆరేడు పుస్తకాలన్న పట్టేటట్టు చెయ్యాలె.. ఇంకా..
కుడి చేతిలో నోబెల్ ప్రైజూ, ఎడమ చేతిలో ఆస్కార్ అవార్డూ..
బ్యాగ్రౌండ్ లో జన గణ మన..
ఫ్రంట్ రో లో అమ్మా నానా అన్నా..
మనశ్శాంతీ…..
ప్రపంచ శాంతీ… …. …… ………

అరేయ్.. లే.. వంశీ.. అరేయ్ వంశీ.. లే రా..
ఆ?? ఏందీ?? ఏందిరా??
ఏందో శాంతీ శాంతి అని కలవరిస్తున్నవ్? ఏంది కతా?? ఆ?? లే.. లేశి ఇన్నన్ని మంచినీళ్లు తాగు..
ఏందీ!! కలవరిస్తున్ననా??… షిట్..!! ఇదంత కలనా ఐతే?
(కొన్ని మంచినీళ్లుతాగి మళ్ల పడుకున్నంక సందీప్ గాడు మెల్లగ అడుగుడు బెట్టిండు)-

ఏం కలచ్చింది మామా?? శాంతెవర్రా??
శాంతిలేదు గీంతిలేదు.. అదేదో కలచ్చిందిరా..
ఏం కల రా??
అదేదో ఇంటర్వ్యూ మామా.. నన్నెవరో ఇంటర్వ్యూ చేస్తుండే..

ఇంటర్వ్యూనా? మంచిగ చెప్పినవా మరి? జాబ్ అచ్చిందా రాలేదా??
ఏ…. జాబ్ ఇంటర్వ్యూ కాద్ బే.. అదేదో “కథ”లకు సంబందించింది..

అచ్చా అదా… ఏమడిగిండేంది..?
అదే యాదికస్తలేద్రా.. కొద్దిగ ముక్కల్ ముక్కల్ మతికస్తుందంతే..

ఆ ముక్కలే చెప్పుమంటున్న..
ఆ.. ఆ.. ముందుగాల ముందుగాల ఓ కొచ్చనైతె అడిగిండురా నాకు బాగ మతికున్నది..
ఏం కొచ్చను??

“నువ్వు కథలెందుకు రాస్తున్నవ్??”

*

అలా మొదలు..పతంజలిలాగా రాయాలని…!

rsz_dsc_0092 (1)

చంద్రశేఖర్ ఇండ్ల

ఇప్పటికి అసలు కథలు ఎందుకు రాస్తారో తెలియదు నాకు, నేను మాత్రం కథలు రాసి డబ్బు సంపాదించాలని కథలు రాయటం ప్రారంభించాను, ఇంటర్ డిగ్రీ ల్లో వున్నప్పుడు  నాకు స్వాతీ బుక్ చదవడం అంటే చాల ఇష్టం, దాని లో వచ్చే సరసకతల పోటీ కి 10000 బహుమతులు అని వుంటే, ఎడతెరిపి లేకుండా కథలు రాసేసే వాడిని నా కున్న బూతు నాలెడ్జ్ ని ఆధారంగా  చేసుకొని. ఒక్క కథా పబ్లిష్ కాలేదు కదా, అసలు ఏమయ్యాయో కూడా తెలియదు, నేను మాత్రం నా డబ్బుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసేవాడిని. కోపం వచ్చేది. ఒక ఎనిమిది కథల తరువాత నేను రాసిన “వేర్ ఇస్ వన్ రూపీ కాయిన్” (సరస కథే అది కూడా పబ్లిష్ కాలేదు) అనే కథని నాకు తెలియకుండా నేనే జాగ్రత్తగా రాయడం గమనించాను (ఆ ఒక్క కాపి నా దగ్గర ఇప్పటికి బద్రంగా వుంది) ఎనిమిది కథలు రాసిన అనుభవం కాబోలు.

సలీం గారు రాసిన “రూపాయి చెట్టు” కథల సంపుటి దొరికింది మా బాబాయి ఇంట్లో. అది ఎందుకు చదివానంటే నా కంటే ఇయనేమి బాగా రాసాడో చూద్దామని, బాగానే రాసాడే అనిపించింది. ఆయన్ని కాపీ కొట్టాను, అంటే ఆయనెక్కడ చుక్కలు పెడతున్నాడు, ఎందుకు “ ఇన్వర్టెడ్ కామస్” వాడుతున్నాడు, ఎంత పెద్ద పేరాలు రాస్తున్నాడు అలాంటివి. కథ తయారయ్యింది, రచనలో కథల  పోటీ వుంటే స్వాతీని వదిలేసి (వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదని) దానికి పంపే. చాల కాలం తరువాత తెలిసింది నా కథ సెలెక్ట్ అయ్యిందని అదీ సాధారణ ప్రచురణకి, అక్కడా డబ్బులు రాలేదు.

ఎమ్మే నాటకరంగం చేరాక ఒక మా రాజీవ్ వెలిచేటి సర్ పతంజలి పుస్తకాల్ని పరిచయం చేసాడు. చదివా. ఇక అప్పటినుంచి పుస్తకాలు చదవటం మొదలుపెట్టా, సరస కథల్లోంచి బయటకొచ్చ, ఇక  పతంజలి గారి కథలు చదివి ఒక కథ,  ఇనాక్ గారి కథలు చదివి ఒక కథ, నామిని గారి కథలు చదివి ఒక కథ, ఇలా రాయడం మొదలుపెట్టా… అన్ని పత్రికల అడ్రసులు రాసుకొని అన్నిటికి కథల్ని తిప్పి తిప్పి పంపించడం మొదలుపెట్టా అబ్బే లాబం లేదు. బాదేసింది. అయిదు సంవత్సరాలు రాసిన ఆ కథల్ని చదువుకోవడం, మిగతా రచయితల కథలతో పోల్చుకోవడం, బహుషా ఈ లైన్ వల్ల, ఈ పదం వల్ల, నా కథ సెలెక్ట్ కాలేదేమో అనుకోవడం నా కథని మార్చడం ఇలాగె ఒక్కో కథని చాల సార్లు మార్చ. నా లక్ష్యం డబ్బులు సంపాదించడం దగ్గరనుంచి పేపర్లో నా కథ చూసుకోవాలి దగ్గరకొచ్చింది.

Ph.D లో వున్నప్పుడు గోవిందరావు శివ్వాల అనే తెలుగు లో ఎమ్మే  చేసి థియేటర్ ఆర్ట్స్ లో చేరిన ఒక జూనియర్ తో పరిచయం ఏర్పడింది. ఇక ఇద్దరం మాట్లాడుకోవటం, పుస్తకాలు షేర్ చేసుకోవడం, పోటా పోటీగా కథలు రాయటం, తప్పొప్పులు చెప్పుకోవటం ప్రారంభమయ్యింది. ఇప్పటి రచయితలు చాల మది స్వంత అనుభవాల్ని కథలుగా రాయటం గమనించా, నేను ప్రారంబించా, రాసా, “నీ కథను మాకు నచ్చింది సాక్షి లో వేస్తాం” అని పూడూరి రాజి రెడ్డి గారి దగ్గరనుంచి ఫోన్ వచ్చినప్పటి నుండి నిద్ర లేదు అది పుస్తకం లో చుసుకున్నదాక. పడింది. అందరికి చూపించుకొని ఆనందపడ్డ. అది మా సార్ కి చూపించి “పతంజలి గారి లాగా కథలు రాయాలని పిస్తుంది ఏమి చెయ్యల్సార్” అన్నప్పుడు, “వాళ్ళ సర్కిల్ వేరబ్బ” అని దానికి “వేరే ఆప్షన్ లేదు ప్రాక్టీసు తప్ప” అన్నాడు. అప్పుడర్డంయ్యింది నేను అయిదు సంవత్షరాలు ప్రాక్టీసు చేసాను కాబట్టి నా కథ సాక్షి లో సెలెక్ట్ అయ్యింది అని. అసలు రహస్యం తెలిసిపోయింది.

నా అనుభవాలు కథలు రాయటం మొదలు పెట్టా, నాకు నచ్చితే గోవింద్ కి చూపించటం లేకపోతే చిమ్పెయ్యటం. నచ్చినదాన్ని పత్రికలకి పంపించడం. ఇంతలో కథా గ్రూప్ మిత్రుడు మహి బెజవాడ పేస్ బుక్ లో కలవడం అతఃను కథా గ్రూప్ ని పరిచయం చెయ్యడం. వాళ్ళ కథలు చదవడం, డిస్కషన్ ల్లో పాల్గొనటం, నా కథలు చదివి వాళ్ళు సలహాలు ఇవ్వడం, వేంపల్లి షరీఫ్ గారు  నీ కథలో దృక్పదం ఏంటి అని అడగటం? ఇలాంటి చాల అనుభవాల తరువాత, నా కథలు చదివే వాళ్ళు ఉన్నారన్న  ఊపుతో నా పాత కథల్ని మల్లి చదివి పబ్లిష్ అవ్వడానికి దానిలో కొన్ని ట్రిక్కులు కలిప పంపిస్తే సెలెక్ట్ అయ్యాయి. ఒకటికాదు 2015 లో రెండు, 1250 రూపాయలు తెలుగు వెలుగు వాళ్ళు ఇచ్చారు. డబ్బులొచ్చాయి. నా ఫ్రెండ్స్ నా కథలు చదవటం మొదలెట్టారు. ఇప్పటికి నా కథను ఒక పెద్దరచయిత చదివి  ఒక్క కామెంట్ అయిన చేస్తే బాగుండు అని ఎదురు చూస్తా వుంటాను. అసలు పెద్ద రచయితలు మిగతా వాళ్ళ కథలు చదువుతున్నారా? అని ఆశ్చర్యం వేస్తుంది నాకు వాళ్ళ దగ్గర్నుంచి ఒక్క కామెంట్ రానప్పుడు.

ఇప్పుడు, స్వంత అనుభవాలు రాయటం బోరు కొడుతుంది, మిగతా రచయితల ని కాపి కొట్టి రాయటం బోరు కొడుతుంది.  అన్ని కథల్లాగే నా కథలు రాయటం బోరు కొడుతుంది, ఒకే పద్దతి కథలని పబ్లిష్ చేసే పత్రికలకి కథలు పంపటం బోరుకొడుతుంది, కొత్తగా రాయాలి, ఒక సారి రాసింది మళ్ళీ రాయకూడదు, కొత్త శిల్పాలు (సరియిన అర్ధం నాకు తెలియదు) తీసుకోవాలి అంటే సెక్స్, కామెడి, ఏడుపు, రొమాన్స్, బాధలు అన్ని రకాలు రాయాలని కోరిక. అందువల్ల ఒక్క సారి బాగుంది అన్న కథలాగే మల్లి రాయడం కుదరడంలేదు. కాని రాయడం ఆపటంలేదు. ఒక వేల నేను ఆపినా తెలుగు తెలియని నా భార్య మాత్రం “ఏంటి ఈ మద్య కథలు రాయడం లేదు” అని ఆడుగుతుంది. అందుకే నేను కథలు రాయడం ఆపను. కథా వస్తువులను పేపర్ లలో, బజార్లలో, మా ఊర్లో, మా ఇంట్లో, నా లైఫ్ లో వెతుక్కోవడం ప్రారంబించా… ఒక వస్తువు తీసుకోవడం దాన్లో వున్న నిజాన్ని సాగదీసో, పిండేసో, సూదీ దారంతో కుట్టేసో, వెనకది ముందు, ముందుది వెనక్కి పెట్టేసో దాన్ని అందరు ఈసీ గా ఇంటరెస్ట్ గా  చదివేలాగా కథలు రాయడమే ఇప్పటి నా ట్రిక్కు.

కాని కథల్ని కథల్లాగే పేద దానిలా వుంచటం నా కిష్టం లేదు, కథలతో డబ్బు సంపాదించాలన్న ఆశ మాత్రం ఇంకా చావలేదు. దానికి దారి కనుక్కోవాలి. నా నాటకానుభవం తో చెప్తున్నా, డబ్బులోస్తున్నాయని తెలిస్తేనే ఈ జనరేషన్ కథలవైపుకు వస్తారు, ఈ జనరేషన్ కథలవైపుకు వస్తేనే కథలు చదివేవాళ్ళు ఎక్కువమంది అవుతారు. కథలు చదివేవాళ్ళు ఎక్కువ మంది అయితేనే కథకు విలువ పెరిగి, కొత్త రచయితలు పెరుగుతారు. చాలామంది కథను నా తృప్తి కోసం రాస్తున్న అని చెప్తున్నప్పుడు నాకు ఇప్పటికి ఆశ్చర్యం వేస్తుంది. అంతే..

*

ఆలస్యం చేస్తే కథల పిట్టలు ఎగిరిపోతాయి…!

వారణాసి నాగలక్ష్మి 

 

  వందెకరాల్లో వనవాసానికనువైన తాటాకుల కుటీరం తాతగారిది. మైనింగ్ ఇంజనీరైన తాతగారు స్వాతంత్ర్య పోరాటంలో జైలుకెళ్లిన వ్యక్తి. స్వాతంత్ర్యం వచ్చాక చదువుకున్న వాళ్లంతా ఆఫీసుల్లో ఉద్యోగాలకి ప్రయత్నించకుండా సమృధ్ధి గా పంటలు పండించాలని కోరుకుని వందెకరాల అడవి చవగ్గా వస్తుంటే కొనడం, అప్పటికి వ్యవసాయ రంగంలో పట్టా పుచ్చుకున్న నాన్నగారు ఆయనకి  తోడుగా ఆ అడవికి వెళ్లడం జరిగింది. 

 ఆ అడవిలో స్వయంగా ఒక పర్ణశాల నిర్మించి, అక్కడ ఉంటూ, రాళ్ళూ రప్పలూ పొదలూ తుప్పలూ తొలగించి, నూతులు తవ్వి, కొద్ది కొద్దిగా ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా చేస్తూ వచ్చారు నాన్నగారు. వర్షాధారమైన నేలని మామిడి , నిమ్మ, జామ, సపోటా తోటలుగా, వరి పొలంగా మార్చారు. లాండ్ మార్ట్ గేజ్ బాంక్ లో పొలాన్ని కుదువ పెట్టి రకరకాల కూరగాయలు, ఇతర పంటలు పండించేవారు. నలభై సంవత్సరాల నిర్విరామ కృషి ఫలితంగా అక్కడ తయారయిన పచ్చని తోట, పాడి పశువుల సమూహానికి, ఎంత కట్టినా తీరని ‘బాంక్ లోను’ తోడయింది.

నాకు ఊహ తెలిసినప్పటి నించీ ఎటు చూసినా పచ్చని చెట్లూ, పశువులూ , పక్షులూ, వీచే గాలిలో తేలి వచ్చే అడవి పూల వాసనలూ. చూస్తున్నకొద్దీ మనశ్శరీరాల్ని ఆవహించే ప్రకృతి సౌందర్యం.

‘అరణ్యక’ నవల ( సూరంపూడి  సీతారాం గారు తెలుగులోకి  అనువదించిన  ‘ వనవాసి ‘ ) లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ అంటారు- ‘అరణ్య ప్రకృతి నా కళ్ళపై ఏదో మాయ కప్పి వేసింది . .. ఏకాంత స్థలం అంటే, నక్షత్ర మయమైన విశాల వినువీధి అంటే వ్యామోహం. ఇవి నన్నెంత  ప్రబలంగా ఆవహించాయంటే  కొద్దిరోజుల పాటు పాట్నా వెళ్లవలసొస్తే,  అక్కడ తారు వేసి గట్లు పోసిన రోడ్ల పరిధులు దాటి, మళ్ళీ ఎప్పటికి  ‘లవటులియా’ కానన వీధుల్లో పడగలనా అని ప్రాణం కొట్టుకు పోయింది. కప్పు బోర్లించినట్టుండే  నీలాకాశం కింద, మైదానాల తరవాత మైదానాలు, అడవుల పైన అడవులు ఎక్కడుంటాయో, ఎక్కడ మానవ నిర్మితమైన రాజ మార్గాలుండవో, ఎక్కడ ఇటుక గోడలుండవో, ఎక్కడ మోటార్ హారన్ ధ్వనులు వినబడవో, గాఢ రాత్రి నిద్రాభంగమైన సమయంలో దూరాన అంధకార వనంలో కేవలం నక్కల చీకటి ఘోషలు మాత్రమే  ఎక్కడ వినవస్తాయో, ఆ కాననాలకి ఎప్పుడు పోయి వాలుదునా అని మనస్సు కొట్టు మిట్టాడి పోయింది’ …’ దుర్బల చిత్తులైనవారు ఆ సౌందర్యం చూడకపోవడం మంచిదని నా అభిప్రాయం. దీని స్వరూపం సర్వ నాశన కరమైనది. ఈ మాయా మోహంలో పడిన వారు తప్పించుకుని బయటపడడం అసంభవం .. అయితే ఈ మాట కూడా చెప్పాలి. ప్రకృతి ఈ స్వరూపాన్ని చూడగలగడం మహా భాగ్యం. ఈ  ప్రకృతిని, నీరవ నిశీధులలో, వెన్నెలలో, చీకటిలో చూసే అదృష్టం సులభ సాధ్యమే అయితే పృధ్వి అంతా కవులతో పిచ్చివారితో నిండి పోదా?’ అని.

vnl 1

 ‘లవటులియా’ అడవులేమో గాని నేను పెరిగిన పరిసరాల్లో, చుట్టుపక్కల రెండు మైళ్ళ దూరం వరకు ఇంకొక్క ఇల్లుకూడా లేని ఏకాంతం.  పొలంగా రూపుదిద్దుకుంటున్న అడవి మధ్య, ఒంటరి ఇంట్లో, మా కుటుంబ సభ్యుల మధ్య  ఇరవయ్యేళ్ళు వచ్చేవరకు పెరగడం నిజంగా మహా భాగ్యమే. ఆ మాయా మోహం నన్నూ ఆవహించి, ఈనాటికీ వదిలిపెట్టలేదు. (నా కథలన్నీ వర్ణనాత్మకంగా, క్లుప్తతకి కొంత దూరంగా ఉండడానికి నా నేపధ్యం కారణమేమో అనిపిస్తుంది!). గీత రచన పట్ల, చిత్రలేఖనం పట్ల అభిరుచి కలగడానికి కూడా ఈ వాతావరణం దోహదం చేసిందనుకుంటాను. లోపల నిరంతరం కదిలే ప్రకృతి దృశ్యాలు చిత్రాలుగా మారాలని మారాం చేయడం, తీరా ప్రయత్నిస్తే, ఊహలో కనపడ్డ సౌందర్యం కాగితం మీద చేరేసరికి  ఆశాభంగం కలిగి మళ్ళీ కొన్నాళ్ళు కుంచెకి  దూరంగా ఉండడం….  

‘ సుమాల తాకగానే సుగంధాల సవారీ ,

వనాలు చేరగానే వసంతాల కేళీ,

పూల మ్రోల వాలి మధుపాలు మధువు గ్రోలి,

నలుదిశలా ఉల్లాసం ఊయలూగాలి

 

కోకిలమ్మ తీరి, ఆ కొమ్మ చివర చేరి, మురిపాల పూతలేరి చేసింది కచేరీ,

మామిడమ్మ తీరి, కొసరి చిగురులేరి, తేనె జాలువారే  కంఠ మాధురి-

కుసుమాల సొగసు చూసి భ్రమరాల కనులు చెదరి, ఝంకార సంగతులతో వనమెల్ల సందడి,

అందాలు జాలువారే మందార పూల చేరి , భృంగాలు తనివితీర చేసేను అల్లరి’

‘గుబులు నీ గుండెల్లో గూడు కట్టనీయకు ,

చేదు గురుతులేవి నీ మదిని చేరనీయకు

వసంతం రాలేదని వనిని వదలి పోవకు

శిశిరంలో చిగురు కోరి చింతించకు

 

మబ్బులున్న ఆకాశం మరచిందా మందహాసం?

అగ్ని మింగి కడలెపుడూ చూపలేదు నిరుత్సాహం

శీత కాలాన చిరు ఎండకు చలి కాచుకో

శ్రావణాన చినుకుల్లో చేను పండించుకో ’

… ఇలా కేవలం ప్రకృతి సౌందర్యం మీదే ఎన్నో పాటలు అల్లుకుంటూ ఉండేదాన్ని( పై పాటలకి ఇక్కడ ఒక్కొక్క చరణమే ఇచ్చాను).

అడపా దడపా వస్తూ కుదిరినంతకాలం మాతో ఉండిపోతూ ఎందరో బంధు మిత్రులు. వేసవి సెలవుల్లో వచ్చిన  పిల్లలందరితో కలిసి  పెద్ద వానర సైన్యంలా తోటలోకి  పరుగులు తీయడం,  మల్లె తోటల్లో మొగ్గలూ, మామిడి తోపుల్లో పచ్చికాయలు కోసుకుంటూ, ఆటల్లో పాటల్లో మాటల్లో పడి,  కనుచీకటి వేళ  చేల గట్ల వెంట పరుగులు తీస్తూ ఇల్లు చేరడం ఇప్పటికీ కళ్ళ ముందు కదిలే సజీవ చిత్రం.

పిల్లలందరికీ పెద్ద బావిలో ఈతలు నేర్పించి, రాత్రి పూట ఆరుబయట అందర్నీ తన చుట్టూ చేర్చుకుని, ఒంటరి ఇంటి చుట్టూ భయం గొలిపే చీకటిని తన మాటల వెన్నెలతో వెలిగించి, జీవితాన్ని ఎలా ఈదాలో శిక్షణ ఇచ్చే నాన్నగారు అందించిన  ఆశావహ దృక్పథం. (‘ఎంత ఆశావాదమండీ.. ఎలా సాధ్య మైందీ? మాక్కొంత అప్పివ్వరాదూ?’ అనడిగిన ప్రముఖ కథకులకి ఇదే జవాబు )

అంతమందినీ ఆదరించి, ఆర్ధికంగా సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నా తోటలో పండిన వాటితోనే వండి వడ్డించిన అమ్మా, మామ్మా కలలా తోచే వాస్తవం.

 అంతులేని ఆకాశం నీలంగా, ఎగిరే కొంగలూ, ఎండలో మబ్బులూ  తెల్లగా, మెరప చేలూ, కారబ్బంతి తోటలూ ఎర్రగా, వరిపొలాలు లేత పచ్చగా, ఆకు పచ్చగా, పసుపు పచ్చగా … ‘ఎన్నిపూవులెన్నిరంగులెన్ని సొగసులిచ్చా’డో గమనిస్తూ, ఆస్వాదిస్తూ, రైతు జీవితంలోని  వ్యధలూ, వృధా ప్రయాసలూ, ఆశా భంగాలూ, ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలూ అనురాగాలూ స్వార్ధాలూ అపార్ధాలూ అర్ధం చేసుకుందుకు ప్రయత్నిస్తుంటే ఏదైనా రాయాలనే తపన మొదలైంది. ఇంట్లో సాహిత్య వాతావరణం ఎంత మాత్రం లేకపోయినా  నాకన్నా పెద్దవాళ్ళతో విభేదించినపుడు ఎదురుగా చెప్పలేని భావాలని అక్షరాల్లోకి కుదించడం అలవాటైంది. వార పత్రికలు  తప్ప గొప్ప సాహిత్యం ఏదీ అందుబాటులో లేని వాతావరణంవల్ల  నా రాతలకి మెరుగులు దిద్దుకునే వీలుండేది కాదు.

 ఆరు కిలోమీటర్ల దూరంలో నూజివీడు ఊరు. ఏడేళ్ళ ప్రాయంలో తిన్నగా మూడో తరగతిలో కూర్చోపెట్టారు సంవత్సరం మధ్యలో. చదువుకోసం అంతదూరం వెళ్ళాల్సి వచ్చేది. దారంతా నిర్మానుష్యంగా ఉండేది. అన్నలిద్దరి  సైకిళ్ళమీద వెనక కూర్చుని నేనూ మా చెల్లెలు. ఏనాడూ ఏ ఆపదా ఎదుర్కోకుండానే చదువు పూర్తి  చేసి మొదటి సారిగా ఊరు వదిలి  హైదరాబాద్ ప్రయాణం. కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పై చదువు. చిత్ర లేఖనం లో విద్యాభ్యాసం కొనసాగించవచ్చని తెలియక రసాయన శాస్త్రం లోకి   ప్రవేశించాను. చదువు కొనసాగిస్తుంటే తెలిసింది మానవ సంబంధాలకీ, రసాయనిక బంధాలకీ చాలా సారూప్యత ఉందని. 

 పదహారేళ్ళ వయసులో బడికీ, కళాశాలకీ మధ్య కనపడ్డ తేడాని నేపథ్యంగా తీసుకుని ఒక కథ రాసి నూజివీడు సాహితీసమితిలో చదవడం, తెలుగు లెక్చరర్ శ్రీ యమ్వీయల్ గారి ప్రశంస పొందడం, యూనివర్సిటీలో స్నేహితురాలి కబుర్లలో దొర్లిన ఒక సంఘటన ‘మనసు మనసుకీ మధ్య’ కథగా జ్యోతి వారపత్రిక లో అచ్చవడం, దానికి బాపూగారు మధ్య పేజీకి రెండు వైపులా విస్తరించిన బొమ్మ వేయడం యుక్తవయసు జ్ఞాపకాలు.

2 (3)

చెట్టూ పుట్టా పిట్టా ఏది కనిపించినా మనసులో కదిలే పద మాలికలు లలితగీతాలుగా రూపొంది 2003లో ‘వానచినుకులు’ గేయ సంపుటిగా రూపుదిద్దుకున్నాయి. మొదటి పుస్తకం పాటల పుస్తకమే. దాన్ని హిందూ వార్తా పత్రికకి సమీక్ష కోసం పంపితే వాళ్లు అనుకోని విధంగా నన్ను ఇంటర్వ్యూ చేసి, మెట్రో ప్లస్ లో ‘A rain song’  పేర ప్రముఖంగా ప్రచురించడం , ఆ పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం నించి ఇరవై వేల నగదు బహుమతితో ‘సాహితీ పురస్కారం’ లభించడం మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. ఆ ఉత్సాహంలో అప్పటికి రాసిన కథలు రెండు పదులైనా లేకపోయినా వాటన్నిటినీ కలిపి ‘ఆలంబన’  కథా సంపుటిగా వేసుకున్నాను. దానికి ముందుమాట రాసిన ఛాయాదేవిగారికి ఆ కథలు నచ్చి, తన అత్తగారి పేర తానందించే ‘అబ్బూరి రుక్మిణమ్మ పురస్కారా’నికి నన్నెన్నుకోవడంతో ‘నేనూ కథలు రాయగలను’ అనే ధైర్యం కలిగింది.

అప్పట్లో మన దేశంలోకి కొత్తగా వస్తున్న ఇంటర్నెట్ విప్లవం గురించి, అక్కడక్కడ కనిపిస్తున్న నెట్ సెంటర్ల గురించి ఆలోచిస్తుంటే కలిగిన ఆలోచనలనే  ‘ఆసరా’ కథగా మలిచి కౌముది పత్రికకి పంపితే బహుమతి లభించింది. ఆ కథ ప్రచురించ బడ్డ కొద్ది రోజులకే కథలో నేను వర్ణించిన సంఘటన నిజంగా జరగడం, ‘ప్రేమికుల్ని వంచిస్తున్న ఇంటర్నెట్ సీజ్’ పేర ఈనాడులో వార్త రావడం జరిగింది. కథకు లభించిన బహుమతి కన్నా కారా మాస్టారి పలకరింపు, స్వయంగా మా ఇంటికి వచ్చి ఆయన అందించిన ఆత్మీయమైన ఆశీస్సు గొప్ప సంతృప్తినిచ్చాయి. ‘బొమ్మలూ పాటలూ అలా ఉంచి కథ పైన ఎక్కువగా దృష్టి పెట్ట’మని ఆయనన్న  మాటలతో, స్వతహాగా చాలా తక్కువగా కథలు రాసే నేను  ఆ తర్వాత  కొంచెం  వేగం పెంచి ‘ఆసరా’ కథా సంపుటికి సరిపడా కథలు రాసి, పుస్తకాన్ని వెలువరించాను 2010లో. నా పుస్తకాలకి ముఖచిత్రాలూ, లోపల చిన్న చిన్న స్కెచ్ లూ నేనే వేసుకోవడం ఒక అలవాటయింది. కొండవీటి సత్యవతి కోరిక మీద భూమిక స్త్రీవాద పత్రికలో మూడేళ్ల పాటు కథలకి బొమ్మలు వేశాను. కొంతమంది ఇతర రచయితల పుస్తకాలకి కూడా ముఖ చిత్రాలు వేశాను.

మనో వృక్షం పై వాలే పిట్టలు ఆలోచనలు. వాటిని పట్టుకుని కథలుగా మార్చుకోవచ్చు. ఆలస్యం చేస్తే అవి ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోయినవి ఎగిరిపోగా మిగిలిన కాసినీ  దాదాపు అరవై కథలై, నా పేరు కథకుల సరసన నిలబెట్టాయి.

మనో మందిరంలో చెల్లా చెదరుగా కదలాడే ఇతివృత్తాలు, ఆగకుండా రొద పెడుతూంటే శాంతి ఉండదు. వాటిని కథలుగానో, కవితలుగానో,పాటలుగానో మార్చి, వాటి వాటి స్థానాల్లోకి చేర్చేవరకూ ఏదో అవిశ్రాంత స్థితి. పాతవి రూపం దిద్దుకునే సరికి ఏవో కొత్త ఆలోచనల కలరవాలు మళ్ళీ మొదలవుతాయి. సాహితీ సృజన కొద్దో గొప్పో అలవాటైతే ఇక ఆ ‘మనిషికి సుఖము లేదంతే’. మబ్బులై ముసిరే సృజనాత్మక ఆలోచనలతో మనసు బరువెక్కితే అవి సాహిత్యమై కురిశాక కలిగే మనశ్శాంతి అనిర్వచనీయమైనది. ఒకసారి అలవాటైతే అదొక వ్యసనమైపోతుందేమో.

 

 

మరచిపోతానన్న భయంతోనే రాస్తున్నా..

“Short stories are tiny windows into other worlds and other minds and other dreams. They are journeys you can make to the far side of the universe and still be back in time for dinner.”
Neil Gaiman
కథ రాయడం అంటే  మనసుకీ ఆలోచనకీ ఒక కొత్త రెక్క మొలిచినట్టే! అది సరదాగానే రాయచ్చు, లేదూ మహాగంభీరంగానూ రాయవచ్చు. లేదూ, ఇవాళెందుకో మనసు బాగుండక రాయచ్చు. కాని, కథ రాసినప్పుడు ఆ రచనలో రచయిత హృదయం  తనకే తెలియని కొత్త స్వేచ్చని అనుభవిస్తుంది. అసలు కథే ఎందుకు రాయాలి? అన్న ప్రశ్నకి ఆ స్వేచ్చలో ఒక సమాధానం ఉన్నప్పటికీ, వొక్కో రచయితా వొక్కో పద్ధతిలో ఈ స్వేచ్చని వెతుక్కుంటారు. ఆ వెతుకులాట గురించి ప్రతి గురువారం  ఈ  “కథన రంగం” శీర్షిక కింద ఒక కథా రచయిత మీకు చెప్తారు.

ఈ వారం : వంశీధర్ రెడ్డి

 

నేనెందుకు రాస్తానంటే.. నాకు భయం, నా అనుభవాల్ని నేనెక్కడ మర్చిపోతానేమో అని-

నిజంగా.. నాకు భయం, నేనెక్కడ నా బాల్యపు భాషనీ, మట్టివేర్ల వాసనల్నీ పోగొట్టుకుంటానేమోనని..

అప్పటికీ ఇప్పటికీ జీవిక కోసమో, జీవనం కోసమో, అసంకల్పితంగా చాలానే ఆత్మ పదార్ధాన్ని పోగొట్టుకుని ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు ఙ్నాపకాల్లో పునర్నిర్మితమౌతుండే స్వకీయ నీడల రూపాల కలల్ని గుర్తుపెట్టుకోవాలంటే నాకున్న ఒకే ఒక్క దారి వాటిని రాసుకోడం,  లిఖితం చేసుకోడం, ఏదీ శాశ్వతంకాని ఈ వర్ధమాన చరిత్రలో వాటికి కాస్తంత స్వార్ధపూరిత మిధ్యా శాశ్వతత్వాన్ని ఆపాదించుకుని గుర్తుంచుకోడం..

అంతే, మరేంలే పెద్దగా.. ఎప్పుడైనా నాలాంటి అనుభవాలున్న మనుషులెవరైనా ఇవి చదివి పలకరిస్తే, పోగొట్టుకున్న ఆత్మశకలాలేవో ఎదురొచ్చినట్టు అనిపిస్తుంటుంది, ఆ అమూల్య క్షణాలకోసం తప్పితే పెద్దగా ఆశలేంలేవు రచనలద్వారా.. ఇక ,కథారచనే ఎందుకిష్టం అంటే, మన బ్రతుకుల్లోని ఒంటరితనం, అనిశ్చితత్వం, బానిసత్వం, కవిత్వంలో అర్ధరాహిత్యపు పదాల బడాయిగా దాచగలిగేంత క్లుప్తంగానూ అనిపించక, అలాని నవలీకరించగలిగే విస్తృత సామర్ధ్యమూ నాకు లేక..

కథారచన్లో శైలీ, శిల్పం టెక్నిక్కుల గురించి మాట్లాడేంత అవగాహన లేదుగానీ, నేను అనుభవించిన సంఘటనలని, మానసిక సామాజిక ఆర్ధిక రాజకీయ దృక్కోణాల పరిధుల్లో , నాకు తెలిసిన భాషలో , వీలైనంత సహజంగా చిత్రించే ప్రయత్నం చేస్తాను, నాతో నేను మాట్లాడుకునే ఒకలాంటి మిస్టిక్ మోనోలాగ్ లాగా, నాకది సౌకర్యం కూడా..

కథంటే “ఇలాగే ఉండితీరా”లన్న పురానియమాలేవీ లేకపోతేనే కథ మనగలుగుతుందేమో అలాంటి ఒక స్వేఛ్చావాతావరణంలో..

2

 

“బాసూ, అసల్నువ్వెందుకు రాస్తావ్రా” అని నన్నెవరైనా అడిగితే, ఏం చెప్పాలో తెలీదు నిజంగా..బలుపో కొవ్వో కాదుగానీ, నిజంగా..
ఎందుకంటే నేను రోజూ ముప్పయ్యారు గంటలూ అదే పన్లో ఉండను, కనీసం పేరుమోయించుకోవాలని పనిగట్టుకు అన్ని పుస్తకాలూ చదువుతుండే సీరియస్ సాహిత్యాభిమానిని కూడా కాదు..నేను చదూకున్నవి ఏవో పది నవలలు, కొంత కవిత్వమ్, అతి కొంత విమర్శ, నెగ్లిజిబుల్ గా కథలు…. అసల్నాకూ కథకీ సంబందమే లేదు మరీ మాట్లాడ్తే..
vamsidhar
ఎప్పుడో  నెలకో రెణ్ణెల్లకో ఒకరోజు అకస్మాత్తుగా ఓ పేరులేని విషాదమో, హాయో, ఆశ్చర్యమో, అనుభూతో లాగిపెట్టి ఫటేల్మని కొట్టెళ్ళినప్పుడు, ఎంత తాగినా కిక్కెక్కనితనంలాంటి అతిజాగరూక జాగృదవస్థలాంటి ఏదో మిస్టిక్ వాసన కళ్ళకి తగిల్నప్పుడో,  అదిగో అప్పుడు మాత్రమే నేనేదోటి రాస్తాను, ఏదోటి.. కథో, కవితో, సొల్లో, మరేదో.. అప్పటిదాకా మర్చిపోయిందేదో గుర్తొస్తుంది ఆ పవిత్రక్షణాల్లో, అప్పటిదాకా పోగొట్టుకున్న ఆత్మపదార్ధమేదో అర్ధమైనట్టు అనిపిస్తుంది ఆ విచిత్ర క్షణాల్లో.. మరి దానికి కాస్తంత సూడో శాశ్వతత్వాన్ని ఆపాదించుకుని గుర్తుపెట్టుకునే ప్రయత్నంలో చేతనైంది, సులువైందీ రాసుకోడమొక్కటేగా, నాకు మాత్రమే తెలిసిన నా భాషలో, నేను మాత్రమే తిరగ్గలిగే నా ఊహల్లో ఆ అనుభవాన్ని నిక్షిప్తం చేయడంతప్ప నేను చేసేదీ చేయగలిగిందీ ఏమీ ఉండదు..కేవలం అనిమిత్తమాత్రంగా శబ్దించుకోడంతప్ప..
 
నాకింకా నేనే పూర్తిగా తెలీదు,  అప్పుడప్పుడూ అనుమానపడ్తుంటాను, నేను నిజంగా ఉనికిలోనే ఉన్నానా, లేక ఇదంతా నా భ్రమా అని, మీకెప్పుడూ ఇలా అనిపించలేదా.. మీకెప్పుడూ మీ కలలో మీ సమాధిపక్కన మీరే ఏడుస్తున్నట్టు మెలకువ రాలేదా…మీకెప్పుడూ ఒక్కసారి చచ్చి చూద్దాం ఎలా ఉంటుందో అనిపించలేదా..ఎవ్రీ వన్ ఆఫ్ అజ్ హాస్ మెనీ లేయర్స్ ఆఫ్ బీయింగ్, ఆ ఒక్కో పొరా పరిచయించుకుంటూ పోవడమే మనం చేయాల్సింది అని నమ్ముతాన్నేను.. సామాజిక వైరుధ్యాలు రూపుమాపాలంటే  ముందు వైయుక్తిక సంఘర్షణల్ని మనం గౌరవించాలి, కనీసం అర్ధం చేసుకోవాలి.. అది సంపూర్ణంగా సాధ్యపడేది రాత ల్లోనే…కాస్త క్రిస్పీ గా ఉండే కథల్లోనే సాధ్యమది
మన ఏకాంతాల్నీ, బానిసతత్వాల్నీ, అనిశ్చితపు బ్రతుకును అర్ధరాహిత్యపు పదాల కవితల్లో దాచిపెట్టడం ఇష్టంలేక, అలాని నవలీకరించేంత సమగ్ర కృషి నాకులేక (పచ్చిగా చెప్పాలంటే చేతకాక) , కథల్రాసుకోడం సుఖం నాకు.. అల్టిమేట్ గా మనందరం ఇంకా బతికుంది సుఖపడ్డానికేగా..కాదా..
 
కవిత్వం పేరుతో కాస్తంత చెత్త రాసానుగానీ, నా కథలన్నీ (ఒకటో అరో తప్ప) నా అనుభవాల నీడలే..ఐనా వేరొకడి అనుభవాన్ని మనమెలా లిఖితం చేయగల్గుతాం..  నీతి కథలూ, పొలిటికల్లీ కరెక్ట్ కథలూ కాయితాల్లోనే కన్పిస్తాయ్, కాసేపు నవ్విస్తాయ్గానీ, వాటివల్ల పెద్దగా ఒరిగేదేంలేదు ఇప్పుడున్న టెక్నో ట్రెండీ కాలంలో… మనమున్న దేశకాలమాన పరిస్థితులుకూడా మన అనుభవాల పరిధులమీద నిర్మితమయ్యే అంతర్ఘర్షణలను నిర్దేశిస్తాయ్.. ఏ పాలస్తీనాలోనో సిరియాలోనో పుట్టుంటే పెన్నుకంటే గన్నే సేఫ్టీ అనుకునేవాళ్ళమేమో..అక్కడ యుధ్దం చేయగల్గేవాడే బ్రతుకుతాడు.. 
కొందరు భలే టైమింగుతో రాస్తారు ఊహా సామాజిక చైతన్యోన్ముఖులై, ఎన్నడూ కనీసం రోడ్డు పక్కన టీ కొట్టువాడితో నవ్వుతూ మాట్లాడకపోయినా, ఎప్పుడూ కనీసం ఇంటిపక్కన పారుతుండే మురిక్కాలవతో స్నేహించకపోయినా…ఎలా సాధ్యమో.. అదృష్టవంతులు వాళ్ళు..
 
ఈ కథల్ని అచ్చులో చూసుకోవాలనే కోరిక కూడా స్వార్ధపూరితమైందే, చదివిన వాళ్ళల్లో నాలాంటి ఒక్కరైనా ఉండకపోతారా అని,
అంతే మరేంలే.. ఇప్పుడున్న విపరీత పరిస్థితుల్లో సాహిత్యం నుంచి ఆశించేదికూడా పెద్దగా ఏంలే, ఒక్కో మనిషీ ఒక్కో సముద్రం కప్పుకున్న దీవయ్యాకా..ఎవరికీ ఎవరూ ఏమీ కాని శాపగ్రస్తపు ఒంటరులం మనమని మాటిమాటికీ రుజువౌతున్న నేటికాలంలో, అసలు బతికి ఉండడమే పెద్ద అచీవ్మెంట్ గా నిర్మొహమాటంగా నిరూపితమౌతున్న ఈ రోజుల్లో, అంతే..మరేంలే.. ఆశించిన ఆశాభంగం.. 

అనుభవాల మధ్య బంధుత్వమే మంచి కథ!

 రాధ మండువ

నేను చాలా చిన్నప్పటి నుంచే – ఐదవ తరగతి నుంచే పిల్లల కథలు చదివేదాన్ని. ఆ తర్వాత మా ఊళ్ళో నాగేశ్వరమ్మక్క, శేషమ్మక్క, విశాలక్క అందరూ మా వీధి వాళ్ళు ఒక్కొక్కరూ ఓ పత్రికని, నవలలని (అద్దెకి) ఒంగోల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటున్న నా చేత తెప్పించుకునే వారు. వాటిని వస్తూ వస్తూ బస్ లోనే చదివేసే దాన్ని.

ప్రభ, పత్రిక, భూమి, జ్యోతి, చందమామ, బాలమిత్ర ఒకటేమిటి ఏది దొరికితే అది…. అయితే అన్ని కథలు, నవలలు చదివినా ఏ రచయితనీ చూడలేదు. వాళ్ళంటే ఏదో చాలా గొప్పవాళ్ళని ఊహించుకునే వయసు అది.

నా పెళ్ళయ్యాక మద్రాసులో ఉన్నప్పుడు మా ప్రక్కింటి తమిళావిడ కథలు రాస్తుందని తెలిసింది. ఆ తమిళ రచయిత్రిని చూడగానే నాకేమీ కొత్త అనిపించలేదు. ఆమెని చూడగానే నాకూ కథలు రాయాలనిపించి నాలుగైదు కథలు రాసి పత్రికలకి పంపాను.

ఆంధ్రభూమి వాళ్ళు నా కథ “కాగితపు ముక్కలు” వేసుకున్నారు. డబ్బుల చెక్ వచ్చినపుడు తెలిసింది నా కథ పడిందని. టి. నగర్ లోని పాత పుస్తకాల షాపులకెళ్ళి వెతుక్కుని, పత్రికని పట్టేసి కథని చూసుకున్నాను. మిగిలిన కథలు తిరిగొచ్చాయో, ఇంకెక్కడైనా ప్రచురించారో లేదో తెలియదు.

తర్వాత ఇరవై ఏళ్ళ పాటు నేను కథారచన జోలికి పోలేదు. రిషీవ్యాలీ వచ్చాక ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు, అద్భుతమైన సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలు, సాయంకాలాల్లో వచ్చే లేత వంకాయ రంగుతో కలగలిసిన బంగారు కాంతి కిరణాలు, పచ్చని చెట్లు, వాటి గుబురుల్లో ఎక్కడో దాక్కుని వినిపించే పక్షుల కిలకిలారావాలు, వెన్నెల్లో స్వచ్ఛమైన తెల్లని కాంతినిచ్చే చంద్రుడు, ఏ పొరలూ లేకుండా మిలమిలా మెరిసే నక్షత్రాలు, విశాలమైన పచ్చిక మైదానాలు చూస్తుంటే ఇంత అద్భుతాన్ని లోపల ఇముడ్చుకోలేని అలజడితో రాసిన కథ “సమ్మోహనామృతం”. దాన్ని ఈమాట వాళ్ళు ప్రచురించారు.

అయితే ప్రకృతి వర్ణన రాసినంత మాత్రాన అది కథ కాదు కదా అనిపించి ఇతివృత్తాలని తీసుకుని వరసగా కథలు రాయడం మొదలు పెట్టాను. నా కథని (సాహచర్యం) మొట్ట మొదటగా ( ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత) ప్రచురించిన పత్రిక సారంగ. ఇక నా జీవితం లో కథలు రాయడం అనే ప్రస్థానం మొదలయింది. ఈ రెండున్నరేళ్ళలో ఇప్పటికి దాదాపు ముప్ఫై కథలు, నలభై దాకా పిల్లల కథలు, ఐదు సమీక్షలు, ఆరేడు మ్యూజింగ్స్, ఇరవై గుజ్జెనగూళ్ళ పేరుతో మా అక్క మనవరాలి మాటలు, కాసిన్ని కవితలు రాశాను. ముప్ఫై జానపద కథలని అనుసృజన చేశాను.

అయితే కథలు ఎందుకు రాయాలి?

ఈ లోకానికి మనం ప్రయాణీకులుగా వచ్చాం. సహ ప్రయాణీకులలోని వివిధ భావాలనీ, వైరుధ్య భంగిమలనీ పట్టుకోగలుగుతున్నాం. మంచి చెడుల రూపాలనీ వాటి ప్రభావాల్నీ చూడగలుగుతున్నాం. వాటిని అక్షరాలుగా తీర్చి దిద్దగలిగే సామర్థా్యన్ని పెంపొదించుకున్నాం. ఇక రాయకపోవడానికి అడ్డేమిటి అనుకోగానే కలం కదిలింది. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత నిశితంగా పరిశీలించడం మొదలయింది.

radhaస్త్రీ పురుషుల భావోద్యేగాలలో, ఆలోచనల్లో చాలా తేడాలుంటాయి. వాటిని అనుభవించే తీవ్రత – ముఖ్యంగా మాతృత్వం – స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని నేను “ఆకాశమల్లి” అనే కథలో చూపగలిగాను. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు కోల్పోకూడనిది – ఆత్మవిశ్వాసం, ఆత్మబలం అని కూడా ఆ కథ ద్వారా చెప్పాను.

చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు అభినందనలు తెల్పుతూ. ఆ ఫోన్ కాల్స్ అటెండ్ అవుతుంటే, పాఠకులతో మాట్లాడుతుంటే – రచనలు చేసేటప్పుడు రచయితకి ముఖ్యంగా కావలసినది ‘నిబద్ధత’ అని తెలిసింది. మనం రాసే ప్రతి వాక్యానికీ మనది కాని మరో దృష్టికోణం ఉంటుందని దాన్ని రచయితలు తమ తలలు వంచి మరీ చూడాలని అర్థమైంది.

జీవితమంటేనే అనుభవం. మన అనుభవాలకే కాకుండా ఇతరుల అనుభవాలకి స్పందించగలిగినపుడు, ఆ స్పందన తీవ్రతని అక్షర రూపంగా మార్చగలిగినపుడు కథ పుట్టడమే కాదు ఆ కళ మనలోని చైతన్య స్థాయినీ పెంచుతుంది. అనుభవాలని ఆవిష్కరించడానికి, సృజించడానికి రచయితలు పిల్లల్లా మారి తమ చుట్టూ గమనించాలంటాను నేను. వాళ్ళు దేన్నైనా ఎంత ఆసక్తిగా, ఏకాగ్రతగా గమనిస్తారో చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంటుంది. అంత దీక్షగా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తే, వారితో సహానుభూతి చెందితే మనలోని అంతర్ దృష్టి తనంతట తనే కథలను సృష్టించుకుంటుంది.

ఇలాంటి అనుభవంతో రాసిన కథ “చివరి చూపు” ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రచురణ.

అలాగే నాకున్న మరో అదృష్టం ఎప్పుడూ పిల్లలతో గడపగలిగే అవకాశం ఉండటం. ఈ పిల్లల సహాయంతోనే రాసిన మరో కథ “మనసుకు తొడుగేది” – ఇది కూడా ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రచురణే. స్కూల్లో కొత్తగా చేరిన పిల్లలని ఒకసారి ఈ చుట్టు ప్రక్కల ఉన్న కొండల మీదకి హైకింగ్ కి తీసుకు వెళ్ళి అక్కడున్న మూడు కొండలని చూపిస్తూ వాటి పేరు “త్రీ సిస్టర్స్” అన్నాను. అందరూ ఒక్కసారిగా నా మీదకు దూకి “ఎందుకా పేరు వచ్చింది? వాటికేమైనా కథ ఉందా?” అని అడిగిన వారి తీవ్రమైన ఆసక్తి వల్ల పుట్టినదే ఈ “మనసుకు తొడుగేది” కథ.

ఇక్కడ స్కూల్లో పిల్లలకి చెప్పులు రిపేరు చేసి పెట్టే కొండప్ప మౌనంగా ఎవ్వరితోనూ మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోవడం చూసి ఇన్ స్పైర్ అయి రాసిన కథ “చెప్పుల తాత” (కినిగె).

నాకు తాత్తి్వక కథలంటే ఇష్టం. అలాంటి కథలు రాసే ఆర్.ఎస్. సుదర్శనం, వసుంధరాదేవి, జలంధర, శ్రీవల్లీ రాధికలు రాసిన కథలు చదివీ, హై సొసైటీ వాళ్ళని దగ్గరగా చూస్తుంటాను కనుక వాళ్ళని గమనించీ రాసిన కథలు “విముక్తం” (ఈమాట) “నిర్వేదం” (ఆంధ్రభూమి వారపత్రిక), అంతర్మధనం (పాలపిట్ట).

పల్లెలో పెరిగాను, చిన్నప్పటి నుండే కుటుంబ బాధ్యతలు నెత్తిన పడ్డాయి కాబట్టి ఆ ఆనుభవాలతో రాసిన కథలు “మాన్యత” (విపుల), “చందమామోళ్ళవ్వ” (ఆటా బహుమతి లభించిన కథ), “చందమామ బిస్కత్తు” (ఫేస్ బుక్ కథ గ్రూప్ బహుమతి లభించిన కథ).

చుట్ఙు ప్రక్కల ఊళ్ళల్లోని యువకులని, యువతులని గమనించి రాసిన కథలు నాలుగైదు ఉన్నాయి. వాటిల్లో చాలా మందికి నచ్చిన కథ “గౌతమి” (ఈమాట). ఒక స్త్రీ గా తోటి స్త్రీల అనుభవాలతో, వారి భావాలతో సహానుభూతి (ఎంపతీ) చెంది రాసిన కథలు “ప్రేమ జీవనం” (వాకిలి), “కృతి” (ఇంకా ప్రచురింపబడలేదు). నిరర్థకమైన విషయాల కోసం కొంతమంది తమ జీవితాలను వృథా చేసుకుంటారెందుకో అనిపించి రాసిన కథలివి.

ప్రజల సమస్యల కోసం బంద్ లు చేయాలి. కాదనను. కాని వాటిల్లో నోరు లేని, అమాయకులైన పిల్లలని భాగస్వాములని చేయడం, స్కూళ్ళు మూసేయడం ఎంత అమానుషం? సీమాంధ్ర – తెలంగాణా బంద్ అప్పుడు స్కూళ్ళు మూసేయడం వల్ల ఇక్కడ ఉన్న పల్లె పిల్లల దుస్తితి చూసి రాసిన కథలు “సానుభూతి” (సారంగ), “ఎర్రసున్నా” (సాక్షి) – “ఎర్రసున్నా” నాకు చాలా నచ్చిన నా కథ.

ఉన్నదున్నట్లుగా, వాస్తవికంగా రాయడానికి ప్రయత్నించాలి అనే మాట నిజమే కాని కథకి చదివించే గుణం కావాలి కాబట్టి మనం కథకి కావలసిన టెక్నిక్ ని తెలుసుకుని రాయాలి. దాని కోసం మనం మన పాత రచయితలు వేసిన నిచ్చెనలు ఎక్కాలి. ఆ పఠనం వల్ల రచయితలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడే మనలో ఉన్న ముడిరూపానికి మెరుగులు దిద్దుకోగలిగే పరిజ్ఞానం కలుగుతుంది.

కథలు రాసి సామాజిక పరిస్థితుల్ని మార్చడం అనేది భ్రమ అంటారు కొంతమంది. కావొచ్చు కాని “రాయడమంటే సామాజిక బాధ్యత” అని రచయిత తెలుసుకోవాలి. మనం రాసిన రాతలకి మనమే జవాబుదారీ అని గ్రహించిన రచయిత వ్యక్తిగా ఎదుగుతాడు. కథ అనేది ముసుగులని తొలగించాలి తప్ప ముసుగులని తొడుక్కోకూడదని గ్రహిస్తాడు.

మనోప్రపంచంలో నా హక్కు కోసం…కథలు!

-కుప్పిలి పద్మ 
మాఘ చంద్రకాంతిని సాయంకాలపు నడకలో ప్రేమించి ప్రేమించి  యింటికొచ్చాక  వొక కథ రాసాను. నూట వొకటో  కథ. యిన్ని కథలు 5 సంకలనాలుగా వచ్చిన తరువాత యిప్పుడు యీ కథ దగ్గర నిలబడి  వెనక్కి చూసుకుంటే  అవును నేను  నా వ్యక్తీకరణకి కధాకాన్వాస్ ని  యెందుకు   యెంచుకున్నాను అని ఆలోచించటం వింతగా వుంది.  గమ్మత్తుగాను వుంది. కొత్తగానూ వుంది.  నాలోకి నేను చూసుకోవటం  ఆసక్తిగాను వుంది. థాంక్స్ టూ సారంగ. 
నాకు యేమనిపించిందంటే…
చిన్న పిల్లలు, వృద్ధులు  కథలు  చెపుతారు. సహజంగా వుంటాయి. ఆ  కథలకి యిమీడియట్ గా వొక లక్ష్యం ప్రయోజనం వుండదు. వుండాలని కూడా  యెవ్వరు అనుకోరు. బాల్యానికి  వృద్ధాప్యానికి మధ్యన కథలు చెప్పటం రాయటం అన్నది  యేదో వొక ప్రత్యేకమైన వ్యాపకంగా అని  అనుకుంటారు. కధలు  రాస్తే యెందుకు రాస్తున్నావు అని అడుగుతారు. దానికి అర్ధవంతంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత యేదో మన మీద వుందని మనం అనుకుంటాం. నిజానికి కథలు రాయటం మొదలుపెట్టటం అన్నది బాల్యానికి వొక కొనసాగింపుగానే జరుగుతుందనుకుంటాను. చిన్న పిల్లలకి వృద్ధులకి వొక మనో ప్రపంచంలో విహరించే వెసులుబాటు వుంటుంది.  నాకు ఆ వెసులుబాటు కావాలి అని చిన్నతనం దాటిన తరువాత యెవరైనా అంటే అది నలుగురికీ వొక వింతలా కనపడుతుంది. కాని అలాంటి వెసులుబాటు కావాలని అందరూ కోరుకుంటారు. కొంత మంది అమాయకత్వంతో మొండితనంతో ఆ వెసులుబాటును కల్పించుకొంటారు. చెప్పొచ్చేది యేమిటంటే కధలు చెప్పాలి,  మనకో మనో ప్రపంచం కల్పించుకొని అందులో విహరించాలని  అనుకోవటం ప్రతి వొక్కరి హక్కు.
అందుచేత నేను  కధలు యెందుకు రాస్తున్నాను అంటే చిన్నతనం మీద ప్రేమ వదలక. జీవితాన్ని రోజువారి ప్రపంచంలోనే యింకొంచెం విశాలంగా జీవించాలి అని కోరుకునే హక్కుని వదులుకోలేక అనే చెప్పాలి.
యికపోతే యిలాంటి కథే యెందుకు రాస్తున్నావ్? యింకొకలాంటి కథ యెందుకు రాయలేదు? కవిత్వం యెందుకు రాయవు ? యిలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే చాలా నిర్దిష్టంగా   కాకతాళీయంగా సంభవించిన అనేక సంఘటనలని  చెప్పుకోవాలి. అవి చాలా చెప్పాలి. కాని యిప్పుడు సందర్భం ఆది కాదు కనుక కొద్దిగా ఆ విషయాలని పంచుకొంటాను.
 20141231_171613~2~2
నా  వ్యక్తిత్వంలో  మూడు  ప్రధాన ధోరణులు వున్నాయి. వొకటి  భావుకత్వం.  రెండోది  స్వేచ్ఛ. మూడోది  చుట్టూ వున్నా వాతావరణంలో  లీనమైపోవటం. యిందులో  మొదటి  ధోరణికి కవిత్వం మాధ్యమంగా మారింది. రెండవ, మూడవ ధోరణికి  కథ ప్రధానమైన మాధ్యమంగా మిగిలింది. యీ మూడు ధోరణులకి  కాలమ్స్ మాధ్యమంగా మారాయి.
యీ మూడింటిని  విడదీసి వేరువేరుగా వుంచాలనే ప్రయత్నం నేను చేస్తున్నానా లేక అది మాధ్యమం వొక్క ప్రభావమా అనే ప్రశ్నకి సమాధానం  నాకు  తెలీదు.
యిలాంటి కథలే యెందుకు రాసాను అంటే బ్రీఫ్ గా చెప్పాలంటే వొక స్త్రీ జీవితానుభవం నుంచి నిలబడి ఆలోచిస్తుంటే యివి యే వొక్క స్త్రీ ఆలోచనే  కాదు.  ప్రపంచ వ్యాప్తంగా మా ముందు తరం స్త్రీవాదులు  ఆలోచిస్తున్న అనేక  విషయాలు  అర్ధమవుతూ వచ్చాయి. యీ కథలని స్త్రీవాద సృహ నుంచి రాస్తున్నాననే యెరుక, స్ర్తీ వాదం కూడా ప్రపంచంలో వస్తున్న అనేక ఆర్ధిక సామాజిక మాధ్యమాల మధ్య నిలబడే  తన స్వరాన్ని వినిపించాలన్న విషయం లోతుగా అర్ధమవ్వసాగింది. స్త్రీవాదం కేవలం స్త్రీలకి సంభందించినది మాత్రమే కాదని  పురుషుల జీవితాల గురించి కూడా స్త్రీవాద కోణం నుంచి ఆలోచించాను.  స్త్రీలు కూడా ఆధిపత్య వర్గాలలో ఆధిపత్య రాజకీయాల్లో భాగస్వామ్యం కలిగి వుంటారని తెలిసే కొద్ది   స్త్రీవాదం అంటే కేవలం స్త్రీలని విక్టిమ్స్ గా మాత్రమే చూపించటం కాదు అని ఆ యా రాజకీయాలని కధల్లో రాస్తున్నాను. 

మొదట్లో  కథలు  రాస్తున్నప్పుడు ఆ టీనేజ్ కి సంబంధించిన చూపుని వొక టీనేజర్ ఆంతరంగాన్ని వొక స్త్రీ దృష్టి కోణాన్ని ప్రతిబింబించే కథలు ‘మనసుకో దాహం’లో,  అప్పుడప్పుడే కుటుంబ వాతావరణం నుంచి బయటకి అడుగు పెట్టాలంటే యెలా పెట్టాలని ఆలోచించుకొంటు నిలబడటానికి నగరముందని నగరానికి వచ్చే అమ్మాయిలూ, వున్న నగరం చాలా వేగంగా  మారిపోతుండటం, సంక్లిష్టంగా వుండటం, యిలాంటి చోట యెలా నిలబడాలి అనుకుంటున్నవాళ్ళ  కధలు ‘ముక్త’లో  రాసాను. నగరంలో వస్తున్న మార్పులకి  కారణం  ప్రపంచంలో  వస్తున్న అనేక మార్పుల వల్ల అనే  విషయం అర్ధమవుతున్నప్పుడు ‘ సాలభంజిక ‘  కధలు చెప్పటం,  అన్ని వుండి కూడా యెదురుకొంటున్న యిమోషనల్  వయొలెన్స్ ని ‘ మంచుపూలవాన’ లో, వీటన్నిటి మధ్యా నిలబడి వెతుక్కుంటున్న చోటులో దాదాపు అన్ని విధాలా కోల్పోతోన్న అమాయకత్వం ‘ ది లాస్ అఫ్ యిన్నోసెన్స్’ లో ప్రతిబింబించాయి.

దాదాపు అన్ని కథల్లో ప్రోటోగనిస్ట్ స్త్రీ.

యికపోతే మొదటిసారి  కథ రాసినప్పుడు అది నలుగురు విన్నప్పుడు యెవరెవరు యెమన్నారు ? ఆ  అన్న మాటలకి మనం యెట్లా అర్ధం  చేసుకున్నాం…  యిదీ  చెప్పుకోవాలి. కాని అందుకు యిది సందర్భం కాదు.
మొత్తం మీద కథలు  యెందుకు  రాస్తున్నావ్ అంటే జ్ఞాపకాలని వున్న వాటిని వున్నట్లే వుండనివ్వకుండా తిరిగితిరిగి అనేక రకాల గతాలని వర్తమానాన్ని, భవిష్యత్తులని నా చేతులతో  నేను నిర్మించుకోవటం  కోసం.  

మిగిలిన సగాన్ని వెతుకుతూ…

(కథా రచనలో కృషికి ఈ నెల 25 న మాడభూషి రంగాచార్య అవార్డు  సందర్భంగా)
 
ఆటలు లేవు, వేరే పనేదీ లేదు, బడి లేదు, స్నేహితులు ముందే తక్కువ.
 
పూజ, వంట, భోజనాలతో అలసిపోయిన అవ్వ, నాయినమ్మ, అమ్మ.. అందరూ మధ్యాహ్నం కునుకు తీస్తారు. చప్పుడేదైనా చేస్తే నీ తాట తీస్తారు. తాత, నాన్న డిటో డిటో.
 
అలాంటి ఎంతకీ గడవని అతి నిశ్శబ్దమైన పొడుగైన వేసవి మధ్యాహ్నాలు నన్ను మంచి చదువరిగా మార్చాయి.
 
ఇల్లంతా కలియతిరిగితే మా నాయినమ్మ దగ్గర చిన్న పాకెట్‌ పుస్తకం ‘అంబరీష చరిత్రము’ దొరికింది. ఇక వేరే ఏమీ దొరకని పరిస్థితిలో దాన్నే బోలెడన్నిసార్లు చదివి విసుగొచ్చేసింది. అనుకోకుండా ఒక సాయంత్రం మా నాన్న నన్ను దగ్గర్లోని లైబ్రరీకి తీసుకెళ్లారు. ఒకటే ఆశ్చర్యం…. ‘ఇన్ని పుస్తకాలుంటాయా ప్రపంచంలో’ అని.
37cde126-fb20-46de-b8e7-bb261260aa54
అమితమైన ఉత్సాహంతో ‘సముద్రపు దొంగలు’ ‘అద్భుత రాకుమారి’ వంటి నవలలు చదువుకుంటూ ఉంటే.. అప్పుడు మొదలైంది అసలు బాధ.
పాడుబడుతున్న ఇంట్లో అరకొరగా నడిచే ఆ లైబ్రరీకి వచ్చేవాళ్లు అతి తక్కువమంది. అది సాకుగా ఆ లైబ్రేరియన్‌ వారంలో మూణ్ణాలుగు రోజులు సెలవు పెట్టేసేవారు. దాంతో ఆ లైబ్రరీ ఎప్పుడూ మూసే ఉండేది. పుస్తకాలు ఇంటికి తెచ్చుకోవచ్చని నాకు అప్పటికి తెలియదు.
తలుపులు మూసిన లైబ్రరీ లోపల, చక్కటి చీకట్లో – ఎలకలు, పందికొక్కులు పుస్తకాలను ఆరారగా చదువుతూనే ఉండేవి. అవీ పసివేనేమో, లేదా పిల్లల పుస్తకాల గది మరీ అనువుగా ఉండేదేమో తెలీదుగాని, నేను ఆత్రంగా చదివే పుస్తకాలకు ఆద్యంతాలు లేకుండా భోంచేసేవి మా ఊరి ఎలకలు.
సగం చదివిన పుస్తకం మిగతా సగం దొరక్కపోతే పడే బాధేమిటో ఇక్కడ చాలామంది అర్థం చేసుకోగలరు.
అందులోంచి పుట్టేవి ఊహలు. అవి ఆ కథల్ని పూర్తి చేసేవి.
అప్పటికి వాటిని కాగితం మీద రాయొచ్చని తెలీదు.
అందుకే నా ఊహాలోకంలో అల్లుకున్న ఎన్నో కథల సగాలు ఉదయపు మబ్బుల నీడల్లో, డాబా మీద నుంచి దూరంగా కనిపించే కొండల నీలిమలో, సాయంత్రం విరిసిన సన్నజాజుల సువాసనలో, రాత్రి మెరిసే చుక్కల మెరుపులో కలిసిపోయాయి.
మరికొన్ని కథలు వేసవి రాత్రుల్లోని ఉక్కపోతలో, చలికాలాల్లో ఉక్కిరిబిక్కిరి చేసే దుమ్ములో, వర్షపు నీటిలో కలిసిపోయిన కాలవల దుర్వాసన లో… కొట్టుకుపోయాయి.
ఇంకొన్ని కథలు అగ్రహారాల అనుబంధాల్లో, వేరంగా మారిపోతున్న సామాజిక దృశ్యాల్లో, అక్కచెల్లెళ్ల అన్నదమ్ముల అమెరికా సంబంధాల్లోకి చెరువు నీళ్లు మాయమైనట్టు మాయమైపోయాయి.
వాటన్నంటినీ తిరిగి తెచ్చుకోవడానికి వీల్లేనంత పరుగులో ఇప్పటి నేను చిక్కుపడిపోయాను.
వాటిని వెతుకుతున్న క్రమంలో ‘చందనపు బొమ్మ’ ఒట్టి ప్రిపరేషన్‌. అంతే.
arun1
పాత్రికేయ జీవితంలో పరిచయమైన కొందరు అపురూపమైన మనుషుల్ని, కొన్ని జ్ఞాపకాల్ని – ఇంకొన్ని అసంగతమైన విషయాలను గుదిగుచ్చడంలో చందనపు బొమ్మ నాకు సాయపడింది.
ఇప్పటికైతే నేను మంచి రచయిత్రినని అనుకోవడం లేదు. కాని మంచి పాఠకురాలిని.
మల్లాది, శ్రీపాద, రావిశాస్త్రి, పతంజలి, ఇస్మాయిల్‌ – వీళ్ల వాక్యాల్లోని పదును, సున్నితత్వమూ కూడా నాకెప్పటికీ పట్టుబడవన్న సత్యం తెలుసుకున్న దుఃఖభరితురాలిని.
వాళ్లందరి వరకూ ఎందుకు?
భావన ఏదైనా ఎంతో కవితాత్మకంగా వ్యక్తపరిచే నిషిగంధ, మెహర్‌, బండ్లమూడి స్వాతి, ప్రసూనారవీంద్రన్‌, మోహన్‌ ఋషి వంటి ఇంకొందరిని విస్మయంగా చూసే పాఠకురాలిని.
ఆంధ్ర మహాభారతాన్ని సావకాశంగా చదువుతూ వందల ఏళ్ల క్రితమే మానవ స్వభావ చిత్రణ చేసిన కవుల ప్రతిభకు ఆశ్చర్యపోతున్న అవివేకిని.
ప్రపంచం, జీవితం – రెండూ ఆటే అని అర్థం చేసుకున్నాక కలిగిన వైరాగ్యం కొంత, అందర్నీ ఆడనీ,  నేను ఆట్టే ఆడి అలసిపోవడమెందుకు అని అలవాటయిన బద్దకం కొంత –
 
వెరసి ఏమీ రాయడానికి మనసొప్పడంలేదు. రాయకుండా ఉండలేనని తెలుసుగానీ,
మా నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి నదుల్లాగా… అప్పుడు ఎండి, అప్పుడు పొంగే ఇంకెన్నో భావాలు ఉరకలెత్తితే , కథల్లో మిగిలిన సగాలు విస్తారంగా రాస్తానేమో మరి.
-అరుణా పప్పు 

కథ ఒక instant మాత్ర!

10994836_409436082540368_611743555_n

 

కథకుల అంతరంగం గురించి కొత్త శీర్షిక 

~

చిన్నప్పుడు చదివే అక్షరాల్లో…కథలైతే వాక్యాల వెంట కళ్ళు పరుగుతీయడమూ, వ్యాసాలైతే నత్తనడక సాగి కళ్ళు మూతపడడమూ- ఇదీ వరస! కథ పూర్తయ్యాక కూడా ఆ పాత్రలూ సంభాషణలూ నా మనసులో ఒక మూవీలా పదేపదే కదలడం, కొన్నిసార్లు ఆ పాత్రలు తమ కథాపరిధులుదాటి ఇంకా నా ఆలోచలనలో కథ ఇంకొంత కొనసాగి ఇంకో ముగింపు ఇవ్వడం, కొన్నిసార్లు ఆ పాత్రలు నా కలల్లో రావడం…. ఇలా జరుగుతూ ఉండేది. అందుకేనేమో కథలు మనసులో ఆలోచనలు రేగడానికి ఒక బలమైన సాధనం- అనే భావాన్ని బలపరిచాయి. ఉదాహరణకు రంగనాయకమ్మ ‘కాపిటల్’ కన్నా ‘జానకివిముక్తి’ ద్వారా అర్ధం చేసుకున్న వర్గపోరాటమే ఎక్కువ. నా ప్రాపంచిక జ్ఞానాన్ని పక్కన పెడితే సోషల్ వర్క్ చదువు, ఆ తర్వాత ఎన్. జీ. వో ల్లో నేను చేసిన ఉద్యోగాలూ, గాక, కథలు కూడా నన్ను ప్రభావితం చేసాయి. కథలవల్ల నా ఆలోచనలు హద్దులుదాటి ఎగిరాయి.

మరి నవల కాదా అంటే? అది కూడా. కానీ కథే నవల కన్నా బలమైనది. కథ ఒక instant మాత్రలాంటిది. కాంటెంపరరీ జీవితాన్ని అంత బ్రిస్క్ గా సాహిత్యం లో అద్దం పట్టే సాధనాలు కథలూ, కవితలూ. చదివడానికి తేలిక అనే కాదు. లౌకికంగా ఇప్పటి జీవన విధానంలో రచయితకూ పాఠకుడికీ చాలా వెసులుబాటిచ్చేది కథలే. రచనను త్వరగా పూర్తిచేసే వెసులుబాటు రచయితకు ఉంటే, అంతే త్వరగా చదివి విశ్లేషించగలిగే వీలు పాఠకుడికి ఉంటుంది. అయితే,  నాలుగు నుంచి పది పేజీల్లో కొన్ని పాత్రల సృష్టించి, వాటికో వ్యక్తిత్వాన్నద్ది, కాస్త ఎమోషనల్ సర్కస్ పకడ్బందీగా చేయించి మన పరిమిత ఆలోచనలలో చెక్ పెట్టడం చిన్న విషయమేమీ కాదు.

నాకు సాహిత్యపు బాటలో కథ ఒక కంపల్సివ్ మార్గంగానే తోచింది తప్ప ఎంచుకున్న మాధ్యమం కాదు. ఇంకోరకంగా వ్యక్తీకరించడం చేతగాకపోవడంవలన కూడాగావొచ్చు! సరే, రాయగలిగే సామర్ధ్యం, జీన్స్ ఉన్నాయని పదేపదే రెచ్చగొట్టారు సాహితీ శ్రేయోభిలాషులు. ఇక నేనూ కాస్త రాసాను. పొగడ్తకు పొంగిపోయి, ఉత్సాహం చల్లారాక దానికి ఆవల ఏంటో ఆలోచిస్తున్నాను. ఈ కథ అవసరం ఎంతుంది, ఎవరికి ఉపయోగం వగైరా…

రాస్తున్న కొద్దీ అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటికీ నిజంగా ప్రచురితమైనవి నాలుగు కథలే. కానీ ప్రతీసారీ అనిపిస్తుంది. ఇంకా చాలా పార్శ్వాలు కదలాలి. బోల్డన్ని పొరలు తొలచాలి. ఖలీల్ జిబ్రన్ అన్నట్టు దుఃఖ్హమూ, సంతోషమూ, ఆనందమూ, విషాదమూ, దయా, క్రూరత్వమూ, ఉన్నతమూ, నీచమూ ఇవన్నీ మనిషి ఆలోచనా స్రవంతిలో భాగాలే. ఇవి ప్రతిపాత్రలో కదలాలి. మానవత్వమనే మాట మనిషి తనకు తాను ఇచ్చుకుంటున్న మంచిపేరనీ, కాని మానవ మనుగడ అవసరం మీదే, ఇంకా చెప్పాలంటే సర్వైవల్ మీదే ఆధారపడి ఉంటుందనే నిజాన్ని చాటి చెప్పగలగాలి.

IMG_9390

స్వాతి కుమారి ఒక కథలో చెప్పినట్టు, ఇప్పటి సమాజపు నైతిక, అనైతిక నియమాలకావలగా చూడగలిగి రాయగలిగితే సృజనకు ఒక అర్థం ఉంటుంది. ఈ విషయం అర్ధమవుతున్న కొద్దీ ఇదివరకు కన్నా ఎక్కువగా మనుషులను గమనించడం పెరిగింది. ఆ గమనింపులో నేను నాలోని మనిషిని గమనిస్తున్న సంగతి క్రమంగా అర్ధమైంది. సాధారణకథలూ, నీతికథలూ, పాత్రలుబుద్ధి తెచ్చుకున్న కథలూ- ఇలాంటి కథలు నెమ్మదిగా బోరు కొడుతున్నాయి. looking and thinking beyond- ఇప్పటి నినాదం నాకు. ప్రణయాలూ, వ్యక్తిత్వాలూ, వాదాలూ….దీనికి మించింది ఏది? జీవితం నిజంగా ఒక linear పద్ధతిలో సాగుతోందా? కథలో పాత్రలు ఒక కాన్షియస్ లాజిక్ తో ప్రవర్తించడం నిజజీవితంలో ప్రతీసారీ జరుగుతుందా?

కథలు జీవితానికి అద్దంపడతాయంటారు. కాని కథలో ప్రస్తావించే సమస్య మాత్రమె జీవితం కాదుగా..!   మరలాంటి విషయాలు చెప్పగలిగే intertwined కథ రాయాలనుందిప్పుడు. ప్రతీ సమస్యా రెండు రకాలుగానే ప్రవేశిస్తుంది జీవితంలో. ఒకటి వ్యక్తీ నుంచి, ఇంకొకటి సమాజం నుంచి. ఇది అర్ధంయ్యాక వేరే సమర్ధనలేమీ దృష్టినాకర్షించడం లేదు.

అంతూ పొంతూ లేని ఆలోచనా స్రవంతిని ఇలా మీ ముందు పెడుతున్నా.  అసలు ప్రశ్నకొస్తే కథల ద్వారా నా వ్యక్తీకరణ మారిందా అంటే నేను రాసిన నాలుగు కథల మధ్య సామ్యభేదాలే మార్పు. నిజజీవితంలో వ్యక్తీకరణ మార్పులు అంటే స్నేహితులూ, ఆత్మీయులే చెప్పాలి. కాని కథ రాద్దామన్న ఆలోచనలో, నా చుట్టూ ఉన్న భారపు విలువల గోడల్ని కూల్చేసాను. అందువల ప్రతీ ఘటనలోనూ ఏ విధమైన  వాదాన్ని బుజాన్నేసుకునే బాధ్యతను వదిలించుకుని కేవలం ఒక విషయం గానే వ్యక్తపరచగలుతున్నా. ప్రస్తుతపు భావఝారిలో లోకం లో ఏ మనిషి ఏ పని చేసినా నాకు  వాటి కారణాలు అర్ధం చేసుకుందామనే అనిపిస్తుంది. దాదాపు Frictionలో ఉన్న ప్రతీ మనిషిలోను ఒక helplessness, ఒక dependence కనిపిస్తుంది. ఆ Friction ను దాటుకుని వచ్చి నెమ్మదిగా తమకు తామే నిలబడగలిగే వాళ్ళను చూస్తే అద్భుతంగా ఉంటుంది.   తమాషాగా అది నాలో రచయితను ధైర్యస్తురాలిని చేస్తుంది.

 -అపర్ణ తోట 

 

నిర్దిష్టత నుంచి నిర్దిష్టత లోకి . . .హరికిషన్ ప్రయాణం!

10491252_637115716394991_6117679910662129997_n
( ఆదివారం నాడు కర్నూల్లో  డా.హరికిషన్ కొత్త కథల సంపుటి ‘ కందనవోలు కథలు’ ఆవిష్కరణ)

సీమ సాహిత్యమే సీమ జీవితం – సీమ వెతలే సీమ కతలు : ఇదొక నానుడిగా చెలామణి అవుతున్న రోజుల్లో కర్నూలు కథని ప్రత్యేకంగా యెత్తి చూపిన రచయిత డా. హరికిషన్. నిర్దిష్టంగా కర్నూలు జీవితాన్నీ కథల్నీ అర్థం చేసుకోడానికి 2005 లో హరికిషన్ సంకలనం చేసిన ‘కర్నూలు కథ’ యెంతగానో తోడ్పడింది. ఆ సంకలనం ద్వారానే గొప్ప తవ్వకం పనిమంతుడుగా హరికిషన్ తో నాకు తొలి పరిచయం. రాయలసీమలో మరీ ముఖ్యంగా కర్నూలు ప్రాంతలో కొత్తగా ‘పరుగులు తీస్తున్న పెట్టుబడుల పదఘట్టనల కిందపడి నలుగుతున్న సామాన్యుడి జీవితాన్ని’ గురించి ఆ సంకలనం ముందుమాటలో ప్రస్తావించిన అంశాలు  నన్నెంతగానో ఆలోచింపజేయడమే గాక  హరికిషన్ సాహిత్య వ్యక్తిత్వాన్నీ ప్రాపంచిక దృక్పథాన్నీ యెరుకపరిచాయి.

నిజానికి హరికిషన్  కథారచనాప్రస్థానం తొలి అడుగుద్వారానే (పడగ నీడ – 1997) అతను పయనించబోయే తోవా నడక తీరూ అవగతమయ్యాయి. సీమ నేలని పట్టి పీడించే ఫ్యాక్షనిజం బహుముఖ పార్శ్వాల్ని అతను ఆ కథలో ఆవిష్కరించగలిగాడు. పార్టీ రాజకీయాలూ  కులాధిపత్యపోరాటాలూ  సారా వ్యాపారాలూ రియల్ ఎస్టేట్ దందాలూ చోటా బడా కాంట్రాక్టులూ భూగర్భ వనరుల దోపిడీ అటవీ సంపద అక్రమ తరలింపు . . . ఇవన్నీ ఫ్యాక్షనిజం పెంచుకొన్న కోరలేనని తెలియజేసాడు. అంతేకాదు వీటికి ప్రత్యామ్నాయంగా  మొగ్గతొడుగుతోన్న భూపోరాటాల్ని ప్రస్తావించాడు. పల్లెల్లో  విస్తరిస్తోన్న బి.సి.ల , దళితుల చైతన్యాన్ని ( ఎబిసిడి ల వర్గీకరణతో సహా ) గుర్తిస్తూనే పాలక వర్గాలు దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం  వాడుకొంటున్న వైనాన్ని సైతం వ్యాఖ్యానించాడు. వీటన్నిటినీ – నీళ్ళు లేక  పంటల్లేక పనుల్లేక రోడ్లులేక … ఎడారులై పోతున్న బీళ్ళతో… బీళ్ళవుతున్న పచ్చిక బయళ్ళతో … హత్యలు ఆత్మహత్యలు వలసలతో కునారిల్లుతున్న రాయలసీమ నిర్దిష్టత లోంచే అతను విశ్లేషించాడు. స్వీయ జీవితానుభవానికే అక్షర రూపంలా కనిపించినప్పటికీ  తన నేల మీద బలంగా కాళ్ళూని హరికిషన్ నిలబడ్డాడని  ‘పడగ నీడ’ నిరూపించింది. ఈ నిర్దిష్టత రాను రానూ అతనిలో మరింత పదునుదేరిందని యీ కొత్త కథల సంపుటి ‘కందనవోలు కథలు’ స్పష్టం చేస్తుంది. హరికిషన్ యిటీవల (2012–13ల్లో) రాసిన  ‘జై తెలంగాణ’ , ‘కొత్త కల’ కథలు అందుకు నిలువెత్తు సాక్ష్యాలు.

సీమ సాహిత్యకారుల్లో యింతకుముందు కన్పించిన ప్రాంతీయ స్పృహ తెలంగాణ రాష్ట్రోద్యమం నేపథ్యంలో రాజకీయ ఆర్ధిక రంగాల్లో ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంగా పరిణమించాల్సిన అవసరాన్ని యీ కథలు నిర్దేశిస్తున్నాయి. ఈ చైతన్యం సీమలోని తక్కిన జిల్లాల్లో కంటే ముందుగా కర్నూలు ప్రాంతంలోనే మొదలు కావడం యాదృచ్ఛికం కాదు; అదొక సామాజిక యథార్థత. ఆ యథార్థాన్ని ‘కర్నూలు సాహితీ మిత్రులు’ లో వొకడిగా డా. హరికిషన్ గుండె గొంతుకలోకి తెచ్చుకొని బలంగా వినిపిస్తున్నాడు. కృష్ణా నికర జలాల పంపిణీలో న్యాయబద్ధమైన వాటా గురించి డిమాండ్ చేయడం దగ్గరో హైదరాబాద్ ని స్విస్ బ్యాంక్ గా మార్చుకొన్న సీమ ఫ్యాక్షనిష్టుల వరకో  యీ రచయిత ఆగిపోవడం లేదు. ‘శ్రీబాగ్ ఒడంబడికను చిత్తుకాగితంగా మార్చిన పెద్దమనుషులతో కలసి నడవడం’ గురించి , ‘నాలుగు కాసుల కోసం భాషను సంస్కృతిని రాక్షసంగా మార్చి వెక్కిరించిన వారితో – పదవులు విసిరి ప్రాజెక్టులు కొల్లగొట్టిన పెద్దన్నలతో సహజీవనం చేయడం’ గురించి ‘మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టడం మాని గంజి మెతుకుల కోసం గలం విప్పి ప్రశ్నిద్దాం’ (ఒక ఆలింగనం కోసం) అని హెచ్చరిస్తున్నాడు. కోస్తా వలస ఆధిపత్యాలకి తలుపులు తెరచి వాళ్ళు విసిరిన అదనపు పెట్టుబడులకు  అమ్ముడుపోయిన అన్ని రాజకీయ నాయకత్వాల ద్రోహాల్నీ  (అప్పటి నీలం సంజీవరెడ్డి దగ్గర్నుంచి నిన్నటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ – మధ్యలో సందుకో వైన్ షాపు తెరిపించి , ఇటీవలే బెల్ట్ షాపుల రద్దుకి ‘మూడో సంతకం’ చేసిన చంద్రబాబు నాయుణ్ణి కలుపుకొని ) హరికిషన్   ప్రశ్నిస్తున్నాడు. అయితే అతనీ ప్రశ్నల్ని కేవలం రాయలసీమ చైతన్యం నుంచే అడగడం లేదు; మరింత నిర్దిష్టంగా కర్నూలు గడ్డని కేంద్రంగా చేసుకొని బైరాపురం కాలువ కింద నీరందక యెండిపోయి నెర్రెలిచ్చిన పొలాల జాడల్లోంచీ , కొండారెడ్డి బురుజు సాక్షిగా నడచిన బూటకపు ‘సమైక్య ఉద్యమాల’ నీడల్లోంచీ సంధిస్తున్నాడు. ద్రోహాల చరిత్రని తవ్వితీసి – మరోసారి మోసపోవద్దనీ   తెలంగాణ వుద్యమం నుంచీ స్ఫూర్తి పొందమనీ  యెండు డొక్కల సీమప్రజలకు వుద్బోధిస్తున్నాడు. ఛిద్రమైన రాయలసీమ ముఖచిత్రాన్నీ శిధిలమైన బతుకుల్నీ సామాజిక ఆర్ధిక రాజకీయ కోణాలనుంచి అధ్యయనం చేయడంవల్ల మాత్రమే అతనీ కథలు రాయగలిగాడని నేను నమ్ముతున్నాను. నా నమ్మకానికి బలమైన ఆధారాలు యీ సంపుటిలోనే ‘బతుకు యుద్ధం’ కథలో కనిపిస్తాయి.

‘బతుకు యుద్ధం’ రాసింది కూడా 2013 లోనే. సీమ కరువు వెతలు కథలుగావడం కొత్త కాదు గానీ  దాన్ని సమస్త విలువల్నీ నాశనం చేసే  కఠోర వాస్తవికతగా అభివర్ణిస్తూ యింతకుముందు పి.రామకృష్ణారెడ్డి ‘కరువు పీల్చిన మనుషుల్ని’  హృదయవిదారకంగా సాక్షాత్కరింప జేశారు. కరువులో  బతుకులు బుగ్గైన వ్యక్తుల నైతిక పతనాన్నే మరో రూపంలో చూపిన కథ ‘బతుకు యుద్ధం’. వరస కరువుల్తో ‘అప్పు కట్టలేక , అవమానం తట్టుకోలేక ఆఖరికి పొలంలోనే చింతచెట్టుకి వురేసుకొన్న’ బోయగేరి శంకరప్ప, ‘యవసాయం చేసేదానికన్నా కూలిపనికి పోవడమే మేలు’ అనుకొనే రైతు సుంకన్న , ఆ పనికూడా లేక ‘సూస్తూ సూస్తూ పస్తులతో సావలేక – నాలుగు వేళ్ళు నోట్లోకి పోవాలంటే ఏదో ఒగటి సెయ్యాల ‘ గాబట్టి ఫ్యాక్షనిష్టు రాజారెడ్డి కింద పనిచేస్తూ వ్యసనాల పాలైన సుంకన్న పెద్దకొడుకు వీరేష్ , వూరి బైట కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీ కింద భూమిని కోల్పోయి వచ్చిన దుడ్లు కరిగిపోయి ‘పుట్టినూళ్ళో గంజినీళ్ళు గూడా పుట్టక’ వూరుగాని వూరుపోయి దారిదొంగగా మారిన బలిజగేరి గోవిందయ్య …  యీ కథలో వీళ్ళంతా బతకడమే యుద్ధమైన చోట మంచీ చెడుల గురించి  నీతీ న్యాయాల గురించి ధర్మాధర్మాల గురించి లేవనెత్తే ప్రశ్నలకు జవాబులిమ్మంటారు.

పల్లెలన్నీ ప్లాట్లుగా , సెజ్జులుగా మారిపోయాక గ్రామాల్లోని సాలు సక్కగ వచ్చేటట్లు గొర్రు పట్టి విత్తనమేసే మొనగాళ్ళు , వంచిన నడుం ఎత్తకుండా చక చక నాట్లు వేసే పనిగత్తెలు , కొడవలి పడితే చాలు ఒక్కరోజే ఎకరాలకు ఎకరాలు పంటకోసే పాలెగాళ్ళు , గడ్డివాముల్ని ఎంతటి గాలివానకైనా చెక్కు చెదరకుండా నిర్మించే నేర్పరిగాళ్ళు’    మాయమైపోతున్నారనికూడా యీ కథలోనే రచయిత వాపోతాడు. అయితే యీ పరిస్థితి కేవలం రాయలసీమకే పరిమితం కాదు; కానీ వర్ణించిన భౌతిక/భౌగోళిక వాస్తవికత మాత్రం ఆ ప్రాంతానిదే.  ఆళ్లగడ్డ దున్నపాడు గూళ్యం బైరాపురం ఆలంపూర్  తర్తూరు గాజులదిన్నె కొండారెడ్డి బురుజు  కాల్వబుగ్గ యస్ టి బి సి కాలేజి కండేరి బండిమిట్ట   సి క్యాంప్  … యీ ప్రాంతాలన్నీ కథల్లో అత్యంత సహజంగా వొదిగిపోయి ఆ వాస్తవికత సాధిస్తాయి. రాయలసీమ అనగానే గుర్తొచ్చే అనావృష్టి పరిస్థితులకు భిన్నంగా తుంగభద్ర వరదల్లో కర్నూలు ప్రాంతం ముంపుకి గురికావడానికి కారణమైన పాలకుల నిర్లక్ష్య వైఖరిని పచ్చి కరువు (2004) వరద (2009) కథల్లో నిశితంగా విమర్శించినప్పుడు గానీ , పల్లెల్లో కులం బలంతో ఫ్యూడల్ న్యాయాన్నే అమలుపరుస్తోన్న రెడ్డి దొరతనానికి యెదురొడ్డి నిలవాలని మానసిక ప్రతిన తీసుకొన్న బోయ వెంకటేశ్వర్లు ( చిచ్చు – 2006 ) తెంపరితనాన్నివర్ణించినప్పుడు గానీ , ప్రాణాలకు తెగించి బ్రిటిష్ రాజ్ నెదిరించి కొండారెడ్డి బురుజు మీద మువ్వన్నెల జెండా యెగరేసి జైలు పాలైన విశ్వనాథం వంటి వారి త్యాగభరితమైన పోరాట చైతన్యాన్నీ , వారు సాధించిన స్వాతంత్ర్యం దాని ఫలాలు అవినీతిపరులు హంతకులూ అయిన ఫ్యాక్షనిస్టు రాజకీయ నాయకుల చేతిలో అపహాస్యం అవుతున్న ప్రస్తుత సందర్భాన్నీ బేరీజు వేసినప్పుడు గానీ ( గాయపడ్డ నమ్మకం – 2014 ) , ప్రజల్లో పాతుకు పోయిన మూధవిశ్వాసాల్ని అడ్డం పెట్టుకొని భూదురాక్రమణకు పాల్పడే పెదరెడ్డి కుతంత్రాలకు గురైన ఉలిగమ్మ దైన్యానికి పరిష్కారం చూపేందుకు ప్రయత్నించినప్పుడు గానీ ( బసివిరాలు బరితెగించింది – 2014 )  కర్నూలు స్థానీయతని వొక పరిమళంలా అద్దాడు హరికిషన్.

రచయిత సమకూర్చిన  స్థానీయతా నేపథ్యమే  యీ కథలని ‘కందనవోలు కథలు’ గా తీర్చిదిద్దదానికి ముఖ్యమైన వనరుగా తోడ్పడింది . కథల్లో సందర్భోచితంగా వాడిన కర్నూలు ప్రాంత మాండలికం కూడా అందుకు అదనపు హంగుని జోడించింది.  సూక్ష్మంగా  పరిశీలించినపుడు రాయలసీమ  నాలుగు జిల్లాల్లోనూ వొకే విధమైన జీవితం లేదనీ సమస్యల స్వభావం వేరనీ వాటిని పరిష్కరించుకోడానికి దారులు తీసే చైతన్య భూమిక ప్రత్యేకమైనదనీ వొకే కాలంలో ఆర్ధిక రాజకీయ సామాజిక రంగాల్లో చలనం భిన్నంగా ఉందనీ గతి తార్కికంగా నిరూపించడానికి యీ కథల సంపుటి వొక ఆకర గ్రంథంగా వుపయోగపడుతుంది. రాయలసీమ జీవితాన్ని యథాతథంగా చిత్రించడం దగ్గర ఆగిపోకుండా ఆ జీవితం అలా వుండడానికి కారణమైన  ఆర్ధిక భౌతిక సామాజిక  రాజకీయ శక్తుల్ని దృశ్యమానం చేయడానికి ప్రయత్నించడంవల్ల మాత్రమే అది సాధ్యమైంది.

ఉన్నత విద్యనభ్యసించిన వుపాధ్యాయుడిగా స్వీయ అనుభవాల్నీ, సామాజిక అవగాహననీ కథలుగా మలిచే సందర్భాల్లో సైతం హరికిషన్ తన నేల వాసనని వదులుకోలేదు. మన విద్యా వ్యవస్థలో రోజురోజుకీ పెరిగిపోతున్న అసమానతల్నీ జడలు విచ్చుకొన్న అమానవీయతనీ పాతుకుపోయిన అవినీతినీ అసంబద్ధమైన  పోటీనీ   దగ్గరగా చూస్తూ అందులో యిమడలేని  వూపిరాడనితనంలోంచీ తీవ్రమైన ఆవేదనకి లోనై అతనురాసిన కథలు వొక డజను వరకూ  వున్నాయి. ‘బాల్యంలోనే యుద్ధ ఖైదీలై చదువుల బోనుకు బందీలై’ శిక్షలు అనుభవించే పిల్లల్ని ప్రేమించేవాళ్ళ కోసమే’ ప్రచురించిన ‘ఒక చల్లని మేఘం’  కథల సంపుటి (2008) ద్వారా లోపలి వ్యక్తిగా హరికిషన్ నేటి విద్యా వ్యవస్థలోని సమస్త అస్తవ్యస్త పరిస్థితుల్నీ నిశితంగా చర్చకు పెట్టాడు. చాలామంది వుపాధ్యాయ – రచయితలు చేయని పనిని వొక సామాజిక ఆచరణలో భాగంగా నిర్వర్తిస్తున్నందుకు       డా. హరికిషన్ ని నావరకు నేను బహుధా అభినందిస్తున్నాను. ఈ సంపుటిలోకి యెక్కిన  ‘సదవకురా చెడేవు’ (2001) ‘ఒక చల్లని మేఘం’ (2002) ‘ఒక మైనార్టీ కాలేజి కథ’ (2005) విద్యారంగానికి చెందిన భిన్నపార్శ్వాలను విమర్శకు పెట్టిన  కథలు.

సదవకురా చెడేవు’ బహుముఖీన కథ. పరీక్ష హాల్లో యిన్విజిలేటర్ గా పనిచేసే వుపాద్యాయుడి అంతరంగంలో చెలరేగే సంఘర్షణకి అక్షర రూపమైన యీ కథలో ప్రభుత్వ విద్యా విధానాలు కార్పోరేట్ చదువులు పట్టణ గ్రామీణ విద్యార్థుల విద్యా ప్రమాణాల్లో అనివార్యంగా చోటు చేసుకొనే వ్యత్యాసాలు – వాటికి కారణాలు  ప్రైవేటీకరణలో పేద దళిత విద్యార్థులు  యెదుర్కొనే నిరుద్యోగ సమస్యలు రిజర్వేషన్ పాలసీలు మాతృభాషోద్ధరణ వాదాలు సినిమాల్లో సీమ ఫ్యాక్షనిజం . . . వంటి సవాలక్ష విషయాలు వొడ్డును కోసే వరద ప్రవాహ వేగంతో కదులుతూ వుంటాయి. పది వ్యాసాల పెట్టు యీ కథ. చైతన్య స్రవంతికి దగ్గరగా వుండే టెక్నిక్ ని ఆశ్రయించడంవల్ల యెన్నో విరుద్ధ అంశాలు కథలోకి యెక్కాయి. తానూ బోధించే చదువుల పరమార్థం తన చేతి నుంచి జారిపోయిన కారణంగా కల్గిన వొక విధమైన కసి యీ కథలోని వుపాద్యాయుడి ప్రవర్తనలో చూస్తాం , కానీ  నిజానికి ఆశక్తతలోంచీ పుట్టిన దుర్భరమైన ఆవేదన అది. పోటీ చదువుల్తో బాల్యానికీ ప్రకృతికీ దూరమౌతోన్న పిల్లలపట్ల అపారమైన ప్రేమతో రాసిన కథ ‘ఒక చల్లని మేఘం’. అనివార్యంగా కంట తడి పెట్టించే కథ యిది. పేదలకి విద్యనందకుడా చేసే మైనార్టీ గుట్టుని ‘ఒక మైనార్టీ కాలేజి కథ’ రట్టు చేస్తే , ‘నాలుగో స్తంభం’ కథ విద్యని లాభసాటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిన  కార్పోరేట్ కాలేజీల మధ్య నెలకొన్నఅనారోగ్యకరమైన పోటీనీ , పెట్టుబడులకు పెంపుడు జంతువైన మీడియా క్రూర దౌష్ట్యాన్నీ యేకకాలంలో యెండగట్టింది.  ఇదంతా మన చదువుల కుట్ర. దాన్ని ఛేదించడానికి పూనికతో కథనొక సాధనంగా యెన్నుకొన్న రచయిత  హరికిషన్. ఇప్పుడు కావల్సింది సంస్కరణలు కాదు – సమూలమైన మార్పు అని యీ కథలు చదివాకా అనుకోకుండా వుండలేం.

ఈ సంపుటిలో స్త్రీల ముఖత: వినిపించిన రెండు అద్భుతమైన మౌఖిక కథనాలు ( నిశ్శబ్ద ఆర్తనాదం – 2000 , పొద్దుపోని పంచాయితీ – 2010 ) నన్ను కట్టిపడేశాయి. వాటిలో గుక్కతప్పుకోకుండా పలికిన సాంద్ర దు:ఖ – క్రోధ భాష గుండెను బలంగా తాకుతుంది. కుటుంబ హింస , జెండర్ రాజకీయాల వస్తువా – వర్గ ప్రాంతీయ భాషా – మోనోలాగ్ శిల్పమా యేది ఆకట్టుకుంటుందో నేను చెప్పేకన్నా మీరే స్వయంగా చూసి తెలుసుకోండి. వస్తు శైలీ  శిల్పాల మేలు కలయికకి అవి అమోఘమైన సాక్ష్యాలు అని తప్పక అంగీకరిస్తారు.

ప్రపంచీకరణ ద్వారా మనం కోల్పోతున్నదాన్నీ కాపాడుకోవాల్సిన వాటిని కూడా  హరికిషన్ స్పష్టంగా గుర్తించాడు. గ్లోబల్ సందర్భంలో సాంస్కృతిక పరాయీకరణ అతణ్ణి ఎక్కువగా బాధించింది. రోజుల తరబడి మహా కథనాల్ని గానం చేసి సాంస్కృతిక వారసత్వ సంపదని కాపాడుకొస్తున్న  వుపకులాలకు చెందిన కళాకారులు తమ కళకి దూరమై  పూట గడవక బిచ్చగాళ్ళుగా మారిపోగా, టీవీ పెట్టెలకి అతుక్కుపోయి వొక మత్తులో కూరుకుపోయి చివరికి వూకుడు కథలు చెప్పేవాళ్ళూ కరువై మన పాటా కథా నశించిపోతున్న సందర్భాన్ని  మాయమైన గానం(2006), ఒక్క కథ(2010) ల్లో హరికిషన్ రికార్డు చేసాడు. అందుకే అతను రాయల సీమ పల్లె పట్టుల్లో లభించే జానపద గేయాల్నీ కథల్నీ పిల్లలకోసం సేకరించి ప్రచురిస్తున్నాడు. మనదైన అచ్చమైన దేశీయ  సాహిత్య  సంపదని కాపాడే లక్ష్యంతో చేస్తున్న ఆ పని చొచ్చుకొస్తున్న  సాంస్కృతిక సామ్రాజ్య వాద  ఆధిపత్యాన్ని ఎదుర్కొనే సాధనంగానే భావించాలి. మౌఖిక కథనాల్ని యథాతథంగా అందించడం వల్ల ఆ సాహిత్యలో వినిపించే కర్నూలు మాండలిక భాషా విశేషాలు అట్టడుగు కులాల సామాజిక చరిత్రని తెలుసుకోడానికి సైతం దోహదపడతాయి.

హిందూ ముస్లిం – భాయ్ భాయ్’ (2005) కథ నిచ్చెన మెట్ల సమాజంలో అట్టడుగున వున్న దళితులు వున్నతీకరణని కోరుకొన్నప్పుడు వారిని అణగదొక్కడానికి మత విద్వేషంతో వొకరిపై మరొకరు కత్తులు నూరే హిందూ ముస్లింలు వొకటౌతారన్న చేదు వాస్తవాన్ని విప్పి చెబుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా చేజారిపోయే సంక్లిష్టమైన వస్తువుని హరికిషన్ యెంతో సంయమనంతో నిర్వహించాడు. ఇదే జాగ్రత్త ‘జవా’ నిర్వహణలో కూడా చూస్తాం. ఇనాయతుల్లా దాదా హయాత్ షరీఫ్ లాంటి ఇన్ సైడర్స్ మాత్రమే రాయగల కథ యీ కథ ముస్లిం మతం లోపల ముల్లాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తుంది.

కులం – మతం – ప్రాంతం – జెండర్ నిర్దిష్టతల్లోంచి వస్తు  వైవిధ్యంతో తీర్చిదిద్దిన యీ  కథలకి  ప్రాణభూతమైన అంతస్సూత్రం (యాంకరింగ్ పాయింట్) మాత్రం వొక్కటే – వ్యవస్థీ కృతమైన అసమానతలపై తీవ్రమైన క్రోధం , సమస్త ఆధిపత్యాలపై నిరసన. అదే రచయితగా హరికిషన్ ప్రాపంచిక దృక్పథం. ఆ దృక్పథం వల్లే అతను ఐక్యత –  సంఘర్షణ సూత్రాన్ని అన్వయించుకొంటూ అనేక నిర్దిష్టతల్లోంచీ సాధారణీకరణం వైపు పయనిస్తూ గడ్డిపరకల్తో తాడు పేనుతున్నాడు.

సంపుటిలోని కథలన్నీ తడమలేని  అశక్తుణ్ని. చివరిగా వొక్క ముచ్చట చెప్పి మాత్రం ముగిస్తా –

మంచి కథలో పాత్రలు పాఠకుల్ని వెంటాడతాయి – లోపలా బయటా సంఘర్షణ ప్రధానంగా నడిచే కథల్లోని పాత్రలే పదికాలాలు గుర్తుంటాయి. బహుముఖీన (మల్టీ లేయర్డ్) కథల్లో పాత్రలు పాఠకుడిని వూపిరి తీసుకోనివ్వవు – సుఖంగా నిద్రపోనివ్వవు. అటువంటి బలమైన పాత్రల్ని కథల్లోకి తీసుకురావడానికి అనువైన సమాజమే మన చుట్టూ వుంది . హరికిషన్ కథల్లో యెక్కువ భాగం సింగిల్ పాయింట్ కథలు కావడం వల్ల పాత్రల వ్యక్తిత్వంలోని అనేక పొరలు ఆవిష్కారమవడానికి ఆస్కారం తక్కువ;  అయినప్పటికీ  ‘బతుకు యుద్ధం’లో గోవిందయ్య ,‘చూపు’లో ‘నేను’ , ‘ఒక చల్లని మేఘం’ లో హరి , ‘రాజమ్మ’లో రాజమ్మ , ‘బసివిరాలు బరితెగించింది’లో ఉలిగమ్మ , కోటయ్య  వంటి గుర్తుండే పాత్రల్ని మనముందు సాక్షాత్కారింపజేయగలిగాడు. బాధ్యతనెరిగిన రచయితగా  సమాజంలోని సంక్లిష్టతల్నీ సంక్షోభాల్నీ సాహిత్యీకరించే ఆచరణలో ముందువరసలో నడుస్తున్నాడు కాబట్టి హరికిషన్ నుంచి  ముందు ముందు మల్టీ లేయర్డ్ కథలూ పాత్రలూ తయారవుతాయని యీ సంపుటి భరోసానిస్తుంది. కథానిర్మాణం పై అతను తీసుకొనే శ్రద్ధ ముచ్చటగొలుపుతుంది.

నిరాడంబర శైలీ , ముక్కుసూటి కథనం , వస్తు వైవిధ్యం , శిల్పం పేరున ప్రయోగాలు చేయకపోవడం , పాత్రోచితమైన భాషాప్రయోగం చేస్తూనే కథనంలో సైతం తనదైన ప్రాంతీయ ముద్రని చూపే నైపుణ్యం , తనచుట్టూ వున్న సమాజం లోని గతిశీలతని భిన్నపార్శ్వాలనుంచి విశ్లేషించగల యెరుక , స్వీయ జీవితానుభావాలను  ప్రగతిశీల ప్రాపంచిక దృక్పథం నుంచి వ్యాఖ్యానించే నేర్పు , స్థానీయతకి పెద్దపీట వేసి వొక వాతావరణాన్ని నిర్మించే జాగరూకత,   మానవీయ స్పందనల్ని- వుద్వేగాల్ని నిర్దిష్ట సామాజిక సందర్భం నుంచి చూడగల సంయమనం , ‘కథా సమయం’ వంటి సంస్థలద్వారా పెంచుకొన్న సదసద్వివేచనా   రచయితగా హరికిషన్ కూడగట్టుకొన్న బలాలు. ఇవి భవిష్యత్తులో మరింత పదునెక్కుతాయని ఆశంస.

కర్నూలు జిల్లా చరిత్ర కారుడిగా , బాల సాహిత్య కర్తగా , జానపద సాహిత్య సేకర్తగా – పున: స్రష్టగా , కథా రచయితగా తనకంటూ వొక గుర్తింపు తెచ్చుకొన్న డా. హరికిషన్ నుంచి కర్నూలు ప్రాంత సమగ్ర సామాజిక చరిత్రకి అద్దం పట్టే మంచి నవలని ఆశించడం తప్పు కాదేమో! సీమ నవల అనకుండా కర్నూలు నవల అనటానికి కారణం – కర్నూలు నుంచి హరికిషన్ ని విడదీయలేకపోవడమేనని నివేదిస్తూ … కందనవోలు కథలకు సాదర స్వాగతం పలుకుతూ . . . సెలవ్.

                                                                 -ఎ.కె.ప్రభాకర్ 

 

కథ గొంతుకని పత్రికలు నొక్కేస్తున్నాయి

 

దోస్తు పలమనేరు బాలాజి, అతని మిత్రులు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ కథకులను చాలామందిని పిలుస్తూనే, కొత్త కథకులు కూడా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేలా కొన్ని ప్రశ్నలను అందిస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ విషయంలో వారిని అభినందించి తీరాల్సిందే.
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకునే ఒక స్పేస్‌ను కల్పించినందుకు వారికి షుక్రియా కూడా..
చర్చకోసం వారు వేసిన ప్రశ్నల్లోంచి కొన్నింటికి నా స్పందన ఇది.
పత్రికలు కథా స్వరూపాన్నే కాక, భాషను, సబ్జెక్టును కూడా నిర్దేషిస్తున్నాయి.
1. భాష: నేను ఇంట్లో మాట్లాడేది ఉర్దూ. మా గల్లీల్లో మాట్లాడేది తెలంగాణ తెలుగు. చదివింది మాత్రం కోస్తాంధ్ర ‘ప్రామాణిక’ భాష. నేను ఏ భాషలో కథ రాయాలి? తెలంగాణలోని తెలుగు-ఉర్దూ కలగలిసిన మా కమ్మని భాషలో కథలు రాస్తుంటే కొందరు ‘కంగాళీ’ భాష అని ఆడిపోసుకుంటున్నారు. మా మీద బలవంతంగా రుద్దబడిన కోస్తాంధ్ర ప్రామాణిక భాషలోని వాక్య నిర్మాణాలు, పదాలు ఎంత వదిలించుకున్నా వదిలిపోని జిడ్డులాగా మమ్మల్ని హింస పెడుతున్నాయి. అది చూసి కంగాళీ కామెంట్లు చేస్తున్న వారు ప్రత్యక్షంగా కొందరే గాని, పరోక్షంగా ఎందరో.. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ఇచ్చిన ఎరుకలోంచి మేం గట్టిగా ప్రతిఘటించగలుగుతున్నాం కాని ఇన్నాళ్లు మా ప్రాంతపు ఎందరో రచయితల్ని కోస్తాంధ్ర భాషాగ్రేసరులు నంజుకుతిన్నారు. అంతేగాక భాష విషయంలో పత్రికలు కథా రచయితల్ని నానా హింస పెడుతున్నాయి. ‘మాండలిక’ పేరుతో కొన్ని ప్రాంతాల కథల్ని పత్రికలు నిరాకరిస్తున్నాయి. దాంతో ఎంతోమంది కథకులు కేవలం కోస్తాంధ్ర ప్రామాణిక భాషలోనే కథలు రాయలేక ఊరకుండిపోతున్నారు. నిజానికి తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ కథకులకు ఆత్మాభిమానం ఎక్కువ.
అందుకే కోస్తాంధ్ర మీడియా నిర్దేశిస్తే వారు గంగిరెద్దుల్లా తలలూపే స్వభావం ఏమాత్రం లేనివారు. దాంతో అలాంటివారు పత్రికలకు కథలే పంపని వాతావరణం మనం చూస్తున్నాం. ఈ విషయంలో కోస్తాంధ్రకు చెందిన అగ్రకులాల రచయితలు మాత్రం హాయిగా రాసుకుని, ఏ ఆటంకం లేకుండా అచ్చేయించుకోగలుగుతున్నారు. అట్లా కడుపు నిండిన కథలు ఎన్నో వస్తున్నాయి. కడుపు మండిన కథలకు మాత్రం తావు లేకుండా పోయింది.
రాసుకుని పుస్తకాలుగా మాత్రమే తీసుకొచ్చే శక్తి ఎంతమందికి ఉంటుంది? అలా చేయలేనివారు రాయడమే మానుకోవడం చూస్తున్నాం.
మా లాంటి వారము ఆ పత్రికలకు కథలు పంపాలంటే మా భాషలో రాసుకున్నది మళ్లీ వారి భాషలోకి అనువదించి పంపాల్సిన దుస్థితి పట్టింది. ఏ కొన్ని పదాలు, వాక్యాలు మావి పడ్డా అవేవో పంటికింద రాళ్లుగా వారు చూసే వాతావరణం గోస పెడుతున్నది. తెలంగాణలో వేముల ఎల్లయ్య, భూతం ముత్యాలు లాంటివారు దళిత కులాల వ్యావహారిక భాషలో రాస్తున్నారు. ఈ మధ్యే జూపాక సుభద్ర, గోగు శ్యామల లాంటివారు తమ మాదిగ స్త్రీల కథల్ని సంపుటాలుగా తీసుకువచ్చారు. వారి కథలేవీ ఈ పత్రికలు ముర్క గూడ చూసే పరిస్థితి లేదు. నేను, పసునూరి రవీందర్‌ లాంటివాళ్లం మా ప్రత్యేక భాషల్లో కథలు రాసుకున్నాక నమస్తే తెలంగాణ పత్రికకైతే అలాగే పంపడం, ఆంధ్రా పత్రికలకు పంపాలనుకుంటే మాత్రం వారి భాషలోకి తిరిగి అనువదించి పంపుతున్నాం. రచయితలు తమ భాషల్లో రాసుకున్న కథల్ని ఉన్నది ఉన్నట్లు వేసే పత్రికలు చాలా అవసరం అని మేం భావిస్తున్నాం.
2. సబ్జెక్టు: పత్రికలు రచయితలు రాయాల్సిన సబ్జెక్టును కూడా నియంత్రిస్తున్నాయి. కుల ప్రస్తావన ఉన్న కథలను చాలా వరకు పత్రికలు అచ్చుకు స్వీకరించడం లేదు. మత ప్రస్తావన ఉన్న ఎన్నో కథలు నిరాకరించబడుతున్నాయి. ముఖ్యంగా యాజమాన్యాల కులం, ప్రాంతం కథల సబ్జెక్టును చెప్పకనే నియంత్రించడం బహిరంగ రహస్యమే. మాదిగ, మాల కథలు, పాకి పని చేసేవారి కథలు, మత ఛాందసం మీద వచ్చే కథలు, హిందూత్వ మీద వచ్చే కథలు అచ్చుకు నిరాకరించబడుతున్నాయి.
3. నిడివి: నిడివి అనేది మరీ సమస్యగా మారింది. పత్రికల్లో రెండు పేజీల కథలు కొన్ని పత్రికలు, మూడు పేజీల కథలు కొన్ని పత్రికలు వేస్తున్నాయి. అచ్చులో చూసుకోవాలంటే ఆ నిడివిలోకి కుదించి రాయాల్సిన అగత్యం రచయితలకు పట్టింది. దాంతో కథకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కథలు ఎన్నో కత్తిరింపులకు గురయ్యే పరిస్థితి ఉంది. గతంలో రచయితలు రాసిన కథల్ని కళ్లకు అద్దుకుని అచ్చేసుకున్న పరిస్థితి. ఇవాళ కత్తిరింపులతో రచయితల మనసులు చిన్నాభిన్నం చేస్తున్న దుస్థితి.
‘సారంగ’ లాంటి రెండు మూడు వెబ్‌ పత్రికలు మాత్రమే కథల్ని ఉన్నది ఉన్నట్లు అచ్చేస్తూ కొంతవరకు ఈ ఖాళీని పూరిస్తున్నాయి.
వెరసి ఏ హద్దులు గీయకుండా కథల్ని అచ్చేసేందుకు, కథా చర్చలకు ఏ అడ్డూ చెప్పని ఒక పత్రిక అవసరం ఎంతైనా ఉంది. రచయితలే అందుకు ఒక ట్రస్ట్‌గా ఏర్పడి ప్రయత్నిస్తే మంచిదేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పత్రికలు గానీ, ఇక ముందు వచ్చే పత్రికలు గానీ యాజమాన్యాల ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిచ్చే వాతావరణం బలపడిపోయింది.
– స్కైబాబ

అమెరికా తెలుగు కథ తొలి అడుగు వివాహ బంధాలు

imagesX3953B67

కథ అన్నాక దానికి ఏదో ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుకి ఓ నేపథ్యం ఉంటుంది. అమెరికా తెలుగు కథకి యాభయ్యేళ్ళు నిండాయని వంగూరి ఫౌడేషన్ వారు జరుపుతున్న స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ అమెరికా తెలుగు కథల్లో ఏ విషయాల మీద రాశారు అని పరిశీలిస్తే తరచూ కనబడిన సబ్జక్టు వివాహ బంధం. అమెరికా నేల మీద రాయబడిన మొదటి కథ (“పుట్టిల్లు” – చెరుకూరి రమాదేవి గారి రచన) కూడా వివాహ బంధం ఇతివృత్తంతోనే ఉండడం యాదృఛ్ఛికం కాదు. భారతీయులకి, అందునా తెలుగువారికి పెళ్ళీ, తద్వారా ఏర్పడే కుటుంబమూ జీవితంలో, మనుగడలో అతి ముఖ్యమైన అంశాలు. దానికి తోడు తొలి రోజుల్లో ఎక్కువగా కథలు రాసినది స్త్రీలు. అందుచేత ఈ కథల్లో వివాహ బంధాల చిత్రణ ముఖ్య వస్తువుగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.

తొలి తరం కథల్లో ఎక్కువగా ఈ మహిళా రచయితలు తమ అనుభవాలనే కథలుగా మలిచారు అనిపిస్తుంది. ఒక మధ్య తరగతి తెలుగమ్మాయి పెళ్ళి చేసుకుని భర్త వెనకాల అమెరికా రావడం. ఆమె పెద్ద చదువులు చదివి ఉండక పోవచ్చు, ఒక వేళ చదివి ఉన్నా ఈ అమెరికా పరిజ్ఞానం అంతగా ఉండక పోవచ్చును. అంచేత వచ్చిన కొత్తల్లో కొంచెం బిక్కుబిక్కుమంటూ ఉన్నా నెమ్మది మీద ఏదో ఒక విద్య నేర్వడం, సంపాదన పరులు కావడం, పిల్లల పెంపకం, దానిలో ఉండే పరీక్షలు, మాతృదేశంలో తమవారిని మిస్సవడం – ఇలాంటివన్నీ దినుసులుగా వీళ్ళు కథలు రాశారు. ఈ కథల్లో భర్త ఒక్కో సారి అస్సలు ఇంటి విషయాల్ని పట్టించుకోని బుద్ధావతారం లాగానూ, అప్పుడప్పుడూ భార్య కష్టాలని ఇబ్బందుల్ని పట్టించుకుని, కొంచెం ఇంటి పనిలో సాయం చేస్తూ భార్యని ప్రోత్సహించే స్నేహితుడిలానూ కనిపిస్తుంటాడు, కానీ ఈ కథలు ప్రధానంగా స్త్రీ పాత్రల ఆత్మకథనాలు, వారి ఆశయాలకూ భయాలకూ ప్రతిబింబాలు. అమెరికా ఇల్లాలు (కమల చిమ్మట), అమెరికా ఇల్లాలి ముచ్చట్లు (శ్యామల దశిక) వీటికి మంచి ఉదాహరణలు.

కొన్నేళ్ళు గడిచాక మన కథల ఫోకస్ పిల్లల పెళ్ళిళ్ల మీదికి తిరిగింది. అమెరికాలో పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యడం అంటే ముచ్చటగా మూడు ప్రత్యామ్నాయాలు కనబడుతున్నాయి. 1) తమలాగా ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగువారో భారతీయ సంతతివారో, 2) మాతృదేశం నుండి వెదికి పెళ్ళి చెయ్యడం, 3) భారతీయేతరులు. చివరి రెండిటిలో దేనిని ఎంచుకున్నా దానిలో మేలూ కీడూ రెండూ ఉన్నాయని మనవారు గుర్తించారు. ఈ బాగోగుల తులనాత్మక పరిశీలన, చర్చ మనకి చాలా కథల్లో కనిపిస్తాయి. ఈ కథలు శిల్పపరంగా గొప్ప ఆసక్తికరం కాక పోవచ్చునుగానీ ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న సామాజిక ధోరణులకు ఇవి అద్దం పడుతున్నాయి. తద్వారా ఒక సోషల్ డాక్యుమెంటరీగా ఈ కథలు ముఖ్యమైనవి.

మేడ్ ఇన్ అమెరికా (సత్యం మందపాటి), పెళ్ళి చేసుకుంటే చూడు (శేషుశర్మ పూడిపెద్ది), అబ్బాయి పెళ్ళి (రాధిక నోరి), ఇ – అ పెళ్ళి (సాయిలక్ష్మి కాళ్ళకూరి) కథలలో పెళ్ళి చేసుకోవలసిన పాత్రల ప్రమేయం నేరుగా లేకుండా, తలిదండ్రుల తరంలో జరుగుతున్న చర్చలాగా ఈ పెళ్ళి సమస్యయొక్క వివిధ రూపాలని ఆవిష్కరించారు. బయటి వారిని (తమ కుల, భాష, ప్రాంత, జాతికి చెందని వారిని) పెళ్ళి చేసుకోవడం అనుకోగానే, తల్లిదండ్రుల తరంలో – నా సాంప్రదాయమో, నా భాషో, నా సంస్కృతో .. అనే ఆక్రోశం పెద్దగా వినిపిస్తుంది. ఒక చోట పెళ్ళి కావలసిన అబ్బాయి తల్లితో అంటాడు – నువ్వు మాత్రం నీ భాషా సంస్కృతులని ఏ మాత్రం పాటిస్తున్నావని వాటిని నా మీద రుద్దటానికి చూస్తున్నావు – అని! ఇది ఆలోచించవలసిన ఆరోపణే!

ఈ వరుసలో కాగల కార్యం (రాధిక నోరి) కథ భలే ఆసక్తికరంగా ఉన్నది. ఇందులో పెళ్ళి కొడుకు ఒక తెల్లమ్మాయిని ఇష్టపడి, ఆమెకి తన కుటుంబం పరిచయం కావాలని ఒక వారం రోజుల పాటు ఆమెతో సహా తలిదండ్రుల ఇంట్లో ఉంటాడు. ఆ వారం రోజుల్లో ఆ తెల్లమ్మాయి ఈ పెళ్ళి తనకు అచ్చిరాదని గ్రహించి (మృదువుగానే) తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది. కథ ముగిసే సమయానికి అబ్బాయికి వేరే హీరోయిను ఎవరూ దొరకదు గానీ తల్లిదండ్రులు మాత్రం కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకున్నట్టే చిత్రించారు. ఈ కథలో తెల్లమ్మాయి లారా పాత్రని నిర్వచించిన తీరు ఆసక్తి కరంగా ఉన్నది. పెళ్ళికాని టీనేజ్ తల్లికి పుట్టిన లారా, తల్లిదండ్రుల ప్రేమ లేక అమ్మమ్మ దగ్గర పెరిగింది. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కొంత చదువుకుని ఒక మాదిరి ఉద్యోగం చేస్తోంది. ఆ పిల్లకు తన క్రిస్టియన్ మతం పైనా పెద్దగా శ్రద్ధ లేదు. ఉద్యోగం పట్ల కానీ కెరీర్ పట్ల కానీ ఒక ఉత్సాహం, ఏంబిషన్ లేవు. హీరో పట్ల కూడా ఏదో కొంత ఆకర్షణ తప్ప గాఢమైన ప్రేమ లేదు – అని హీరో తల్లి గమనిస్తుంది. మొత్తానికి ఆ పిల్ల – ఈ పెళ్ళి చేసుకుంటే సుఖం సంగతి పక్కన పెట్టి, ఈ అత్తారి కుటుంబంలో ఇమడ్డం లేని కష్టాన్ని తెచ్చుకోవడం అవుతుందన్న ఆలోచనతో – హీరోతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది. కేవలమూ వ్యక్తిగత స్థాయిలో చూస్తే ఆ తల్లిదండ్రుల స్థానంలో నేను ఉంటే నేనూ బహుశా వాళ్ళు ప్రవర్తించినట్టే, వాళ్ళు ఆలోచించినట్టే చేసి ఉండేవాణ్ణి. అభ్యుదయ ప్రగతి శీల ఆలోచనలను గురించి కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు, తనదాకా వస్తే కానీ తెలియదు కదా!

అంచేత, పాఠకులకి హీరో తల్లిదండ్రుల ప్రవర్తన చాలా రీజనబుల్ గా ఉన్నట్టే తోస్తుంది. ఒక వేళ లారా ఈ కథలో చిత్రించినట్లు కాకుండా, స్థిరమైన ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రుల సంతానమై ఉండుంటే, తన కెరీర్ పట్ల ఏంబిషన్తో ఉండుంటే అప్పుడీ కథ ఎలా ఉండేదో అని ఒక ఆసక్తికరమైన ఆలోచన. హీరో తన ఆశయాలకు తగినట్టు పెద్ద చదువులు చదవలేదనీ, డాక్టరు కాలేదనీ హీరో తండ్రి బాధ పడతాడు. దానికి తగినట్టు చివరికి హీరో ఇక ప్రేమా దోమా అన్నీ మరిచిపోయి లా కాలేజీలకి అప్లై చేస్తానని ప్రకటించడంతో కథ సుఖాంత మవుతుంది. వివాహానికి సంబంధించిన విషయాలతోబాటు సక్సెస్ అంటే ఫలాని చదువులు చదవాలి అనే ఉద్దేశం మనకి కనిపిస్తున్నది. కథలో పాత్రల ప్రవర్తన ఆయా పాత్రలకి వ్యక్తిగతం అనుకోవడం బాగానే ఉంటుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో – ముఖ్యంగా స్వ-పర భేదాల్ని చిత్రించే కథల్లో – ఈ పాత్రలు నిజజీవితాలకి, ఆశయాలకి, ఆలోచనలకి ప్రతీకలు అవుతుంటాయి.

భారత్ నించి అమ్మాయినో అబ్బాయినో వెతికి తెచ్చి పెళ్ళి చెయ్యడం ఇంకో ప్రత్యామ్నాయం. ఈ విషయం మీద కూడా కొన్ని కథలు వచ్చాయి. వీటిల్లో అబ్బాయి పెళ్ళికీ అమ్మాయి పెళ్ళికీ ఉన్న తేడా ఒకటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వధువు అమెరికా అమ్మాయి ఐతే, ఇండియానించి తెచ్చిన వరుడితో సర్దుబాటు అవడం కష్టం – ఆమె అలవరుచుకున్న స్వతంత్ర భావాలకీ, అతని పురుషాధిపత్య భావాలకీ పొసగదు అనేది ఇక్కడ సాధారణంగా చిత్రించబడిన ఆరోపణ – అంచేత ఇలాంటి పెళ్ళిళ్ళు ఎక్కువగా పెటాకులే అవుతున్నాయి. అమెరికా వరుడికి ఇండియానించి వధువుని తెచ్చుకుంటే మాత్రం పరవాలేదు – ఎందుకంటే, ఆ వచ్చే అమ్మాయి అమెరికా జీవితం కోసం తప్పకుండా సర్దుకుపోతుంది – ఈ ఆలోచనా ధోరణి కథల్లోనే కాదు, నేను నిజజీవితంలో చూసిన అనేక సందర్భాల్లోనూ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. పరిస్థితి ఏదయినా అమ్మాయే సర్దుకు పోవాలి అనేది ఇందులో అంతర్లీనంగా, అవాచ్యంగా మనకి అందే సందేశం. దేశాన్ని విడిచి వచ్చామే కానీ మనం వదులుకోవాలనుకున్నా కొన్నికొన్ని భావాలు మనలని అంత తేలిగ్గా వొదిలిపెట్టవేమో!

అమెరికాలోనే సంబంధాలు వెతుక్కోవడంలో – భారతీయులు, శ్వేతజాతీయులు కాకుండా ఇతర జాతులనుండి భాగస్వామిని వెతుక్కోవడం ఉంది. కానీ భారతీయులు ఈ దిశగా దృష్టి సారించినట్టు లేదు. మన కథల్లో కూడా ఇటువంటి ప్రస్తావన ఎక్కడా కనబడలేదు కానీ ఆరి సీతారామయ్యగారు దూరపు కొండలు అని ఒక మంచి కథ రాశారు. అందులో అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ సంతతి పిల్, అందులోనూ ఆలయపూజారి గారి అమ్మాయి, కెన్యా నుండి వలసవచ్చిన పిల్లాణ్ణి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ కథలో కూడా అసలు వధూవరులు మనకి కనబడరు – కథ మొత్తం అటు కెన్యా తల్లిదండ్రుల దృక్కోణం నించీ, ఇటు తెలుగు తల్లిదండ్రుల కోణం నించీ చెబుతూ – ఆ వూరికి ఈ వూరెంత దూరమో, ఈ వూరికి ఆ వూరూ అంతే దూరం అనే సత్యాన్ని సమర్ధవంతంగా ఆవిష్కరించారు. ఈ ఒక్క కథే కాదు, మారుతున్న సామాజిక నేఫథ్యంలో, అమెరికా ప్రవాసంలో వైవాహిక జీవితంలో అతి సాధారణంగా తలెత్తే అసమానతలని తన కథల్లో ప్రతిభావంతంగా చిత్రించారు సీతారామయ్యగారు.

వివాహం విఛ్ఛిన్నం కావటం కూడా మన కథల్లో తరచు కనిపిస్తున్న కథాంశం. భర్తకు వేరే స్త్రీ (సాధారణంగా వయసులో చిన్నదైన శ్వేత జాతి వనిత) పట్ల ఏర్పడిన మోజు విడాకులకు దారి తీసినట్లుగా చాలా కథలలో చిత్రించబడింది. ఉద్యోగంలో పై అంతస్తులకు చేరడం, లేదా స్వంత వ్యాపారంలో అపారంగా గడించడం ఆ మగవారికి ఈ ధైర్యాన్ని ఇచ్చినట్లుగా కూడా చిత్రించబడింది. ఐతే, ఈ సబ్జక్టుని డీల్ చేసిన కథల్లోనూ కొన్ని విలక్షణమైన కథలున్నాయి. నిడదవోలు మాలతి గారి నిజానికీ ఫెమినిజానికీ మధ్య అనే కథలో భర్త అభ్యుదయ భావాలు కలిగినవాడిగా తనను తాను భావించుకుంటూ ఉంటాడు. ఆదర్శాల ముసుగులో ఇతర స్త్రీలతో ప్రేమకలాపాలు సాగిస్తూ, భార్యను మోసం చేస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నాడనే నిజం భార్య అతన్ని నిలదీసేదాకా గ్రహింపుకు రాదు. కాపురం చక్కబెట్టుకోవాలనే తాపత్రయం వేరు, ఒక స్త్రీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం వేరు. ఆ తేడా స్పష్టంగా చూపించారు మాలతిగారు ఈ కథలో. మరొక కథలో (రచయిత, కథ పేరు రిఫరెన్సు అందుబాటులో లేదు) ఇరవయ్యేళ్ళుగా అమెరికాలో ప్రవాసం ఉండిపోయిన భార్య భారత్ లో జరుగుతున్న ఎన్నో పెళ్ళిళ్ళు మిస్సై పోతున్నానని బాధపడుతూ ఉంటుంది. ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతాను, విడాకులివ్వు అనడిగిన భర్తతో – ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మన ఊరి గుళ్ళోనే పెళ్ళి చేసుకోండి. కనీసం ఓ పెళ్ళి చూసిన ఆనందమైనా నాకు దక్కుతుంది – అంటుందామె. ఇది కూడా తనకి చేతనైన విధంగా ఆమె తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడమే!

ప్రమీల సూర్యదేవర రాసిన తోడునీడా అనే కథలో విడాకులు, తదనంతరం ఆ మహిళ సమాజంలో ఎదుర్కొనే వివక్ష, ఇంకా మళ్ళి పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఎదురయ్యే సమస్యలను చిత్రించే ప్రయత్నం చేశారు. ఈ కథలో వర్ణించిన సన్నివేశాలు ఎంతో సహజంగా ఉన్నా, కథా నిర్మాణంలో రచయిత్రి తగిన శ్రద్ధ చూపక కొంత అయోమయంగా తాయారయింది. సోమసుధేష్ణ రాసిన చైతన్యం అనే కథ కూడా విలక్షణమైనది. ఈ కథని నేను పది పన్నెండేళ్ల క్రితం మొదటి సారి చదివాను. శ్వేతవనిత మోజులో భర్త విడాకులు తీసుకుని వెళ్ళిపోతే ఆ స్త్రీ నిలదొక్కుకుని, అవసరమైన చదువు నేర్చుకుని మంచి ఉద్యోగమూ, ఇల్లూ సమకూర్చుకుని హాయిగా బతుకుతున్న సమయంలో ఒంటరి అయిన ఆ మాజీ భర్త మళ్ళీ ఆమెకి దగ్గరవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. పెద్దవారైన కూతుళ్ళిద్దరూ కూడా ఆయనకి సాయం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. స్త్రీ పురుష సంబంధంలా వొద్దుకానీ ఒక స్నేహితుడిగా నీతో స్నేహం చెయ్యడానికి నాకు అభ్యంతరం లేదు – అని ఆ స్త్రీ అన్నట్లు చిత్రించిన ఈ కథని మొదటి సారి పది పన్నెండేళ్ళ కిందట చదివినప్పుడు నాకు ఆ స్త్రీ పాత్ర మీద పిచ్చి కోపం వచ్చింది. కథ చివర్లో ఆమె అలా అనడం ఒక బలహీనతగా నాకు అప్పట్లో అనిపించింది. కానీ రచయిత్రి ఆ స్త్రీమూర్తిని ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో, మానసిక స్థైర్యంతో తీర్చి దిద్దారని తోచింది ఇప్పుడు మళ్ళీ చదివితే. మొత్తానికి విడాకుల అనంతర జీవితంలోని సంక్లిష్టతని పలుచన చెయ్యకుండా రాసిన ఒక మంచి కథ ఇది.

యువతీయువకులు తమంత తాము జీవితభాగస్వాములను వెతుక్కునే ప్రయత్నాలను గురించి రెండు తమాషా కథలు నా దృష్టిలో పడ్డాయి. విప్లవ్ రాసిన ఎంగేజిమెంట్ అనే కథలో అమెరికాలో పుట్టిపెరిగిన జంట తొలిచూపులో నచ్చారులే అనుకుని, ప్రధానం జరుపుకుని, దూరాభారపు సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి కొంత ప్రయత్నం చేసి ఇహ లాభం లేదని చేతులెత్తేయడం కనిపిస్తుంది. దీనికి జవాబుగా రాశారేమో అన్నట్టు నోరి రాధిక రాసిన తోడు అనే కథలో భారత్ నించి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్న జంట, ముందు స్నేహితులుగా ఉండి, పెళ్ళి గురించి రకరకాల అపోహలతో భయపడుతూనే ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనే నిశ్చయానికి వచ్చి పెళ్ళి చేసుకోవడం చూపారు. రెండు కథలలోనూ పాత్ర చిత్రణ సహజంగా ఉన్నా, అమెరికా జంట పైపై విషయాలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్టు చిత్రించడం ఒక ప్రతీకయేమో అనే అనుమానం రాకమానదు, అందులోనూ ఈ రెండు కథలనూ పక్కపక్కన పెట్టి చూస్తే.

అలాగని అన్నీ సమస్యలూ బాధలే కాదు, చక్కని వైవాహిక జీవితాలను చిత్రించిన కథలు కూడా చాలా ఉన్నాయి. చంద్ర కన్నెగంటి రాసిన సత్యం అనే కథలోనూ, లలిత జొన్నాళ్ రాసిన అభ్యాగతుడు కథలోనూ అన్యోన్యమైన దాంపత్యం కనిపిస్తుంది. వివాహం కాక ఇంకేవో విషయాల గురించి రాసిన కథల్లో నేపథ్యంగా హృద్యమైన దాంపత్య జీవన చిత్రణలు మనకు కనిపిస్తాయి. చిన్నపిల్లల్లాగా కీచులాడుకోవడం, అలకలు, బతిమాలడాలు, సర్దుకుపోవటాలు, ఒకరినొకరు అర్ధం చేసుకుని, అవతలి వాళ్ళకి ఏదైనా సమస్య మీద పడినప్పుడు ఆసరాగా ఓదార్పుగా ఉండడం – ఈ వెరైటీలన్నీ మనకి ఈ కథల్లో కనిపిస్తున్నాయి, నిజజీవితంలో లాగే.

చివరిగా అసలు వివాహ వ్యవస్థనే ప్రశ్నించిన ధీర వనిత నందిని కథని గురించి చెప్పుకోవాలి. భారత్ లో సాంప్రదాయక కుటుంబంలో పుట్టి పెరిగినా, చిన్నప్పటినించీ చదువే ధ్యేయంగా, అటుపైన తన పనే ఆరాధ్య దైవంగా పెరిగిన నందిని ఎప్పుడూ ప్రేమ గురించీ పెళ్ళి గురించీ పట్టించుకోలేదు. ఉద్యోగం కోసం అమెరికావచ్చి స్థిర పడటం ఆమెకి అంతకు మునుపులేని ఒక స్వేఛ్ఛని ఇచ్చింది. ఆమె వ్యక్తిత్వం స్థిరపడిన కొద్దీ ఆమెకు పెళ్ళి పట్ల విముఖత దృఢమవుతుంది. అలాగని ఆమె ఫెమినిస్టు సిద్ధాంతాలను గుప్పించదు. అన్ని విషయాల్లోనూ చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. కథ ముగింపు అంత కన్విన్సింగ్ గా అనిపించదు గానీ, ఒక మధ్య తరగతి ఆధునిక యువతి పెళ్ళిని గురించి ఎదుర్కునే సందిగ్ధాల సంక్లిష్టతని నందిని పాత్ర ద్వారా అద్భుతంగా ఆవిష్కరించాడు మిత్రుడు అక్కిరాజు భట్టిప్రోలు.

అమెరికా జీవితం వల్ల వివాహ బంధం మీద విచిత్రమైన వత్తిళ్ళు వస్తున్నాయన్నది నిజం. ఈ వత్తిళ్ళ ప్రభావాలను అమెరికా తెలుగు కథకులు బాగానే పట్టుకున్నారు. ఐతే ఈ సమస్యలను అర్ధం చేసుకుని విశ్లేషించే ప్రయత్నంలోనే కొన్ని సంచిత భావజాల ప్రభావాలు మనలను వదిలి పెట్టడం లేదు. పక్కనున్న సమాజాన్ని గురించి లోతైన అవగాహన కంటే స్టీరియోటైప్ లతో కూడిన అపోహలే మన కథనాలను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అలాగే కథలు రాసేది సాధారణంగా తొలితరం వలసవారు కాబట్టి మలితరం పాత్రల చిత్రణ కూడా అపోహల నీడలో మసకబారుతున్నాయి. జీవితంలోని సహజ సంక్లిష్టతలను పలుచన చెయ్యకుండా కొన్ని మంచి కథలు వచ్చాయి. ఏదేమైనా ఈ కథలు ఒక రెండు తరాల వలస ప్రజల ఆశలను ఆశయాలనూ అక్షరబద్ధం చేసిన సోషల్ డాక్యుమెంటరీలు.

 -ఎస్. నారాయణస్వామి

 nasy

డయాస్పోరా కథ ఇంకా పసిబిడ్డే!

Gorti

ఉత్తరమెరికా నుండి మొట్ట మొదటి తెలుగు కథ 50ఏళ్ళయిన సందర్భంగా “అమెరికాలో తెలుగు కథ” అన్న అంశంపై ప్రసంగించమని వంగూరి చిట్టెన్ రాజు గారు అడిగారు. ఆ సభలో ప్రసంగమే ఇది.

అమెరికాలో తెలుగు కథ అంటే అమెరికా రచయితలు రాసిన తెలుగు కథా, లేక అమెరికా జీవితం గురించిన తెలుగు కథా అన్న సందేహం వచ్చింది. అమెరికా జీవితం గురించే వారి భావన అయ్యుంటుందని నేను భావించి – ప్రస్తుత అమెరికా జీవిత తెలుగు కథ – దాని బాగోగులూ – భవిత గురించి నా పరిశీలన మీ అందరితో పంచుకుంటాను.

అమెరికాలో తెలుగు కథ పుట్టి ఏభయ్యేళ్ళు దాటినా అమెరికా తెలుగు కథకి ఒక రూపం, గొంతూ వచ్చింది గత పదిహేనేళ్ళుగానే అని చెప్పాల్సి వుంటుంది. అది కూడా ఇంటర్నెట్ సాంకేతిక మాధ్యమం వచ్చిన తరువాత డయాస్పోరా తెలుగు కథ అన్నది అందరి నోళ్ళల్లోనూ నలిగింది. అంతవరకూ తానా, ఆటాలకి సావనీర్లలో కథలు వచ్చినా అవన్నీ కథలుగా గుర్తించడం అన్నది తెలుగు కథా సాహిత్యకారులకి పట్ట లేదు. అడపాదడపా ఒకరిద్దరి పేర్లు వారికి తెలిసినా తెలుగు కథలో డయాస్పోరా అన్న సరికొత్త పాయని గుర్తించింది 1998, 99ల తరవాతనే!

దీనికి మొదటి కారణం కంప్యూటర్ సాంకేతిక ప్రగతి. అమెరికాలో తెలుగువారి సంఖ్యం పెరగడానికీ, సాహిత్య రంగం కొత్త పద్ధతుల్లో పాఠకులకి చేరవేయడానికీ ఇంటర్నెట్టే ముఖ్యకారణం. అప్పటి వరకూ ఎవరైనా కథ రాయాలంటే చిత్తు ప్రతి నుండి అచ్చుప్రతిలో కాగితానికి ఒక వైపునే రాసి ఇండియాలో పత్రికలకి పంపాలి. ఆ పత్రికలు వాళ్ళు అచ్చేస్తారో, చెత్త చేస్తారో తెలియని కాలం. ఇంటర్నెట్ సాహిత్య మార్గాన్ని సుగమం చేసింది. ఈమెయిల్ ద్వారా సరాసరి కథ పంపే మార్గం అయ్యింది. తెలుగులో టైపు చేసుకోవడానికి అనేక సాఫ్ట్వేర్లు వచ్చాయి. ఈ దరిలో చాలామంది కొత్త రచయితలు కలంపట్టారు, నాతో సహా!

వలసదారులతో ఏర్పడ్డ అమెరికా దేశంలో అనేక డయాస్పోరా కమ్యూనిటీలున్నాయి. చైనీస్, ఆఫ్రికన్లు, స్పానిష్ వాళ్ళు, ఐరిష్ వాళ్ళనీ వీరిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఉన్న ఊరునీ, కన్నవాళ్ళనీ, దేశాన్ని వదిలి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టడంటే అంత తేలికయిన విషయం కాదు. భాషా పరంగా, సాంస్కృతిక పరంగా అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ నిలదొక్కుకొనీ తమకంటూ ఒక ప్రత్యేక ఉనికిని చాటుకోవడం ఈ డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేక లక్షణం.

అంత వరకూ అమెరికా కథగా చెలామణీ అవుతూ వస్తున్న తెలుగు కథకులకి డయాస్పోరా అన్నది అన్వయించి, ఆ స్పృహ కల్పించింది వేలూరి వేంకటేశ్వరరావు గారు. అసలు డయాస్పోరా అంటే ఏవిటి? “The word diaspora often invokes – the imagery of traumas of seperation and dislocation, and this is certainly a very important aspect of the migratory experience. But diaspora are also potentially the sites of – hope and new beginnings. They are contested cultural – and political terrains – where individual and collective memories collide, reassemble and reconfigure.” – అని లండన్ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ – Avtar Brah – “Cartographies of Diaspora” పుస్తకంలో చెప్పిన మాటలివి.

గత వందేళ్ళుగా డయాస్పోరా మీద కొన్ని వందల వ్యాసాలూ, పుస్తకలూ వచ్చాయి. ఎన్నో సిద్ధాంతలూ, ప్రతిపాదనలూ, చర్చలూ జరిగాయి. వాటిలో ఈ మధ్య పుట్టుకొచ్చిందే – Third Space Theory. ఈ పదాన్ని సృజన లేదా కోయిన్ చేసింది – Oxford University లో హోమీ.కె.భాభా అనే ఒక ఇండియన్ ప్రొఫెసరు. ఈ డయాస్పోరా కమ్యూనిటీల గురించి చెబుతూ – The diasporic communities occupy a unique interstitial third space, which enables negotiation and reconfiguration of different cultures through hybrid interactions. Third Space Theory explains the uniqueness of each person, actor or context as a “hybrid”.

దీన్ని బట్టి చూస్తే డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత – మిశ్రిత జీవనం; ఏకత్వంలో భిన్నత్వం.

వీరికి రెండు కాదు – మూడు ప్రపంచాలు – మొదటి రెండూ, సొంత, వలస దేశాలయితే మూడోదే ఈ “కొత్త జాగా”. ఆ జాగాలో ఊపిరి పోసుకున్నదే డయాస్పోరా సాహిత్యం. ఈ మూడో జాగాలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి తమదైనా డయాస్పోరా అనుభవాలకి సాహిత్య రూపం ఇవ్వడం. రెండోది – తమ సాహిత్యాన్ని వలస దేశానికి చేరవేయడం.

మొదటిది అమెరికా కథకులు చేస్తున్నారు. రెండోది – వెల్చేరు నారాయణ రావు గారు లాంటి వారు చేస్తున్నది. అంటే – మన సాహిత్యాన్ని ఇక్కడి భాషలో అంటే ఇంగ్లీషులోకి అనువదించి మన సాహిత్యాన్ని అందించడం. మొదటి చాలా తేలిక. రెండోది అతి కష్టమైనది.

ఈ డయాస్పోరా లక్షాణాల్లో మొదటి నుండి పదివరకూ ఒకటే ఉంటుంది. అది – నాస్టాల్జియా (మాతృదేశపు జ్ఞాపకాలు). మిగతావి ప్రధానంగా మూడు వర్గాలు – 1) ఎన్నేళ్ళు వలస ఉన్నా పరాయి వాళ్ళమే అన్న భావన 2) భాష, సాంస్కృతుల సంఘర్షణ 3) విలువలు, ఉనికి, ఉమ్మడితనం, దృఢమైన ఏకత్వ నిరూపణ

కారణాలు ఏమయితేనేం, సాధారణంగా డయాస్పోరా కమ్యూనిటీలన్నిటిలో ఈ పైన చెప్పిన అన్నిలక్షణాలూ కనిపించాల్సిన అవసరం లేదు. ఏ కొన్నిలక్షణాలు ఉన్నా, దానిని డయాస్పోరా గా చెప్పవచ్చు.

మాతృదేశం వదిలి వలస వచ్చిన కొత్తలో ప్రతీ ఒక్కరినీ cognitive dissonance ఆవరించుకొని ఉంటుంది. cognitive dissonance అంటే – cognitive dissonance is the mental stress or discomfort experienced by an individual, who confronted by new information that conflicts with existing beliefs, ideas, or values. రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితి. ఈ సంఘర్షణకి అంతర్లీనగా సంస్కృతీ, అలవాట్లే హేతువులు అయ్యే అవకాశం చాలా వుంది.

ఈ సంఘర్షణలో – కొంత అస్పష్టతా, గందరగోళమూ, అపార్థమూ లేదా విబేధం ఏర్పడచ్చు. ఇవి కాకుండా కొంత ఉద్రిక్తతా, అఘాతం కూడా కలగవచ్చు. ఇవన్నీ వేరే జాతులు – అంటే అమెరికాలో ఉండే అమెరికన్లూ, ఆఫ్రికన్లూ, స్పానిష్ వాళ్ళూ, చైనీయులు, వంటి వారితో కలిసినప్పుడు కలగుతాయి. కేవలం మనుషుల మధ్యే కాకుండా వస్తుగతంగా కూడా ఉండచ్చు.

imagesX3953B67

ఈ లక్షణాల కలబోత వల్ల ఒక కొత్త మిశ్రిత జాగా ఏర్పడుతుంది. దాన్నే హైబ్రిడ్ స్పేస్ అని కూడా అంటారు. డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత ఈ మిశ్రిత జాగా – కేవలం వారికొక్కరికే పరిమితమైన ప్రపంచం. అందులో అనుభవాలూ, జ్ఞాపకాలూ వారికే సొంతం. అందుకే డయాస్పోరా అన్నదానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. డయాస్పోరా అనుభవాల్లోంచే కొత్త సాహిత్య రూపం వెలిసింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ అమెరికాలో ఉన్న మనలాంటి వాళ్ళకి రెండు ప్రపంచాలు కాదు. ముచ్చటగా మూడున్నాయి. రెండు ప్రాంతాల సాహిత్యాలకి వారధిగా ఉంటూ మనకి మనం ఏర్పరుచుకున్న కొత్త సాహిత్య వాతావరణం ఈ తెలుగు డయాస్పోరా! ఇంటర్నెట్ రాక మునుపు కొంతమంది డయాస్పోరా కథలూ, అనుభవాలూ రాసినా అవి పదిమందికీ, ముఖ్యంగా తెలుగునాట అంతగా ఎవరికీ అవగాహన లేదు. ఇప్పుడు ప్రతీ పది తెలుగు కుటుంబాలకి ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. అందువల్ల వాళ్ళకీ అవగాహన పెరిగింది. తద్వారా ఇక్కడి సాహిత్యాన్ని కూడా గుర్తించడం మొదలయ్యింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఈ తెలుగు డయాస్పోరా వేదికయ్యింది. వాళ్ళకీ ఇక్కడి అలవాట్లూ, పద్ధతులూ జీవన విధానంపై కొంత అవగాహన ఏర్పడింది. అందువల్ల ఇక్కడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన సాహిత్యాన్ని అర్థం చేసుకోడం సులభం అయ్యింది. ప్రపంచపు డయాస్పోరా సాహిత్యంలో ప్రత్యేకంగా చెప్పుకో తగ్గవి – మొదట ఆఫ్రికన్లూ, రెందు స్పానిష్ వాళ్ళూ. వీళ్ళు కాకుండా చైనీస్, వియత్నమీస్ వాళ్ళూ ఉన్నారు. భారత దేశాన్ని తీసుకుంటే ఎక్కువ డయాస్పోరా సాహిత్యం వచ్చింది పంజాబీలో. వాళ్ళ తరువాతే మిగతా వారిది. దక్షిణ భారత దేశం తీసుకుంటే డయాస్పోరా కథా సాహిత్యంలో తెలుగువాళ్ళే ముందున్నారు. ఇప్పటివరకూ నాకు లభించిన వివరాల ప్రకారం సుమారు నూట ఏభైకి పైగా డయాస్పోరా కథలు వచ్చాయి. ఉజ్జాయింపుగా సుమారు 50 మంది పైగా కథకులు కనిపించారు. వారిలో విరివిగా కొంతమంది రాస్తే, ఒకటి రెండు రాసినవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఈ నూట ఏభై కథల్లో 90 శాతం 1995 తరువాత వచ్చినవే ఎక్కువ. నేను కేవలం కథలు గురించే మాట్లాడుతున్నాను, వేరే సాహిత్య ప్రక్రియల గురించి కాదు. **

అమెరికా డయాస్పోరా కథల్లో తరచుగా కనిపించే వస్తువులు

0) ఇక్కడి రూల్సునీ, పద్ధతుల్నీ అవహేళన లేదా వెక్కిరించిన హాస్య రచనలు 1) అమెరికా చెత్త – ఇండియా గొప్ప 2) ఇక్కడి వయలెన్స్, టెర్రరిజం 3) పెళ్ళి, డేటింగ్ కల్చర్ లేదా వివాహేతర సంబంధాలు 4) కుటుంబ సమస్యలు – ముఖ్యంగా పిల్లల పెంపకం, ఇండియాలో తల్లి తండ్రులకి ఆసరా 5) ఇండియా తిరిగి వెళ్ళి పోవడం. 6) స్త్రీల గృహ హింస

అక్కడక్కడ ఒకటో, రెండో వేరే అంశాల మీద కథలు వచ్చినా స్థూలంగా ఈ కథాంశాలు దాటి ముందుకెళ్ళ లేదు. ముందుకెళ్ళక పోవడానికి కారణాలు కూడా ఉన్నాయి.

అమెరికాకి తెలుగు వారి వలస సంఖ్య గణనీయంగా పెరిగింది గత 16, 17 ఏళ్ళగానే! మిగతా జాతుల్లాగ అంటే చైనీస్, వియత్నమీస్, స్పానిష్ వాళ్ళల్లా సమాజంలో అన్ని తరగతుల విభిన్న వ్యక్తులూ ఇండియా నుండి ఇక్కడికి వలస రాలేదు. వచ్చిన వాళ్ళందరూ సరాసరి ఉద్యోగానికో, లేదా పై చదువుకో వచ్చిన వాళ్ళు తప్ప వేరే రకం వాళ్ళు కాదు. గత పదహారేళ్ళుగా వలస వచ్చిన తెలుగువాళ్ళల్లో 90 శాతం పైగా పెద్ద పెద్ద జీతాలకి వచ్చిన వాళ్ళే!

ఇక్కడున్న తెలుగువాళ్ళు అమెరికన్ మధ్య తరగతి వాళ్ళకంటే పైనే ఉన్నట్లు లెక్క. అంటే “యెబవ్ మిడిల్ క్లాస్” క్రిందకి వస్తారు. వీళ్ళందరికీ అమెరికా వ్యవస్థ లేదా జీవితంలో భాగం కావడం అన్న అవసరం లేదు.

ఎందుకంటే – ఉదయాన్నే ఆఫీసుకెళ్ళడం – సాయంత్రం రావడం – ఇంటికొచ్చి డిన్నర్ చేసి రాత్రి ఆగడో, దూకుడో సినిమా చూసుకోవడం – వీలయితే ఇండియాలో సొంత వాళ్ళని పలకరించుకోవడం – ఇంకాస్త టైము దొరికితే గ్రేట్ ఆంధ్రా సైటుకెళ్ళి గాసిప్ చదవడం – ఇవే రోజువారీ దినచర్య. వీకెండ్ వస్తే గ్రోసరీ, లేదా బర్త్ డే పార్టీలూ, మాల్స్ చుట్టూ ప్రదక్షిణాలూ ఇవి దాటి ఉండవు.

అందువల్ల వీళ్ళకి అమెరికన్ సమాజంలో భాగం అవడం కానీ, లేదా వారి జీవితాలతో సంబంధం ఏర్పరచుకోవడం కానీ చాలా చాలా తక్కువ. పోనీ పనికెళ్ళినప్పుడయినా వేరే వాళ్ళతో సంబంధం ఉంటుందా అంటే అదీ తక్కువే! అక్కడా ఇదే ఇండియన్ గ్యాంగ్! కొద్ది చైనీయులూ, మరికొంతమంది అమెరికన్లూ! వీరితో కలిసి మెలిసి తిరిగేదీ తక్కువే!

అందువల్ల ఇక్కడి అమెరికన్ సమాజంలో వుండే సమస్యలూ, తద్వారా వచ్చే ఘర్షణలూ, మంచి చెడ్డలూ తెలిసే అవకాశం సున్నా! ఇప్పుడు చెప్పినవన్నీ కథా రచయితలకీ వర్తిస్తాయి. అందువల్ల వారు రాసే కథలు కానీ, కథా వస్తువులు కానీ, పైన చెప్పిన అంశాలు దాటి వెళ్ళడం లేదు. కథా వస్తువు నేపథ్యం మాత్రమే అమెరికా అవుతోంది తప్ప మిగతాదంతా అచ్చమైన ఇండియా జీవితమే!

పేరుకి డయాస్పోరా కథ అనుకుంటున్నాం, అంతే తప్ప కథకి నేపథ్యం అమెరికానే అవ్వాల్సిన అవసరం లేని కథలు కూడా వున్నాయి. అదేకథ అమలాపురం, ఆముదాల వలసలో అయినా చక్కగా చెల్లుతుంది.

ఇది చాలా విచారించదగ్గ విషయం. మిగతా డయాస్పోరాలు, అంటే చైనీస్, మెక్సికన్ డయాస్పోరాల్లో వచ్చిన సాహిత్య వైవిధ్యం మన తెలుగు కథకి లేదు. ఎందుకంటే – మనకి ఒక స్థాయి మనుషులతోనే ప్రతీ రోజూ ప్రతిస్పందన ఉంటోంది. ఈ పరిస్థితి మారి తెలుగు కథా రచయితలు మరింత లోతుగా ఇక్కడి అధ్యయనం చేస్తే మంచి కథలు వచ్చే అవకాశం ఉంది. ** ఇహ ఈ అమెరికా తెలుగు కథలు వండి వార్చే రచయితల్ని చూస్తే – నాలుగు తరగతులుగా కనిపిస్తారు:

1) ఇక్కడి వాళ్ళు ఇక్కడి జీవితం గురించి రాసేవాళ్ళు 2) ఇక్కడి వాళ్ళు అక్కడి జీవితం లేదా అనుభవాలు గురించి ఎప్పడం ( ఇదే ఎక్కువ ) 3) అక్కడి వాళ్ళు ఇక్కడి సందర్శకులుగా వచ్చి ఇక్కడి జీవితం గురించి రాసేవాళ్ళు ఇవి కాకుండా నాలుగో కేటగరీ వుంది. ముందు ఈ మూడా చర్చించాక నాలుగోది చూద్దాం. ముందు చెప్పిన మొదటి రెండింటితే పేచీ లేదు. ఎందుకంటే ఇక్కడున్నవాళ్ళకి ఇక్కడి జీవితం బాగానే తెలిసే అవకాశం ఉంది. తెలుగునాట పెరిగి చదువుకున్నారు కనుక అక్కడి జీవితం గురించీ బాగానే తెలుస్తుంది. కాబట్టి ఆ కథల్లో కనీసం 80 శాతమయినా సాధికారత ఉండే అవకాశం చాలా ఎక్కువ.

అసలు పేచీ అల్లా మూడోది – అంటే అక్కడి వాళ్ళు నెలకో రెణ్ణెల్లకో, మహా అయితే మూణ్ణెల్లకో అమెరికా వచ్చి – ఇక్కడి జీవితాన్ని కాచి వడబోసినట్లుగా కథలు రాయడం.

కేవలం కథలే కాదు, నవలలూ, ట్రావెలాగ్లూ, చాలా వచ్చాయి. 1) అమెరికాలో ఉండే తెలుగు వారికి డాలర్లు తప్ప ఏం కనిపించవు. 2) ఎంతో యాంత్రికంగా, ఆర్టిఫిషీల్ గా బ్రతుకారు. 3) పగలు కారూ, రాత్రి గుర్రమ్మీద స్వారీ చేస్తారు. 4) రోజూ మంచి నీళ్ళ బదులు మందు తాగుతారు. 5) వాళ్ళందరివీ డొల్ల జీవితాలే తప్ప ప్రేమా ఆప్యాయతలు వుండవు. 6) ఇక్కడున్న పిల్లలు తల్లితండ్రుల్ని పట్టించుకోరు. (అక్కడికేదో ఇండియా కుటుంబాల్లో తల్లి తండ్రుల్ని మహా ప్రేమగా చూస్తున్నట్లు. ఒకే వూళ్ళో ఉండి తల్లి తండ్రుల్ని పట్టించుకోకపోయినా అక్కడ పరవాలేదు. చెల్లుతుంది కూడా)

ఈ విధంగా సాగుతాయి ఆ కథాంశాలు. ఈ కథలు చదివి అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళందర్నీ పాఠకులు రాక్షసుల్లా పరిగణించే ప్రమాదం ఉంది. ఈ కేటగిరీ కథకుల్ని Diaspora Story Visitors అనచ్చు. ఇహ నాలోగోదీ, చిట్ట చివరిదీ – ఇక్కడ అంటే అమెరికాలో ఒక్క సారీ కాలు మోప కుండా ఇక్కడి జీవితం గురించి రాసే అక్కడి వాళ్ళు. నా దృష్టిలో ఇది అత్యంత ప్రమాదకరమయిన గుంపు. వీరి సాహిత్య సేద్యానికి ఆయువు పట్టు ఇంటర్నెట్. రాత్రిబవళ్ళు నెట్టులో దున్నేసి కథలు రాసేస్తారు. అవి అచ్చుకూడా అయిపోతాయి. ఖర్మా కాలి – నా లాంటి వాళ్ళు ఎవరైనా అదేవిటని ప్రశ్నిస్తే – అంతే – సరికొత్త ప్రపంచ యుద్ధానికి తెర తీసిన వాళ్ళమవుతామన్నమాట. వాళ్ళు రాయకూడదని కాదు. రాసినదానికి సాధికారత ఉండాలి కదా? పది శాతం మించి కూడా ఉండదు, ఆ రచనల్లో! ఇంటర్నెట్ వచ్చి కొత్త రచయితల్నే కాదు, సరికొత్త రచనా రీతుల్ని కూడా మోసుకొచ్చింది. ఇలా రచనలు చేసే వాళ్ళని Distance writers లేదా దూరసంచార కథకులు అనచ్చు.

ఈ విధంగా అమెరికా తెలుగు కథ సరికొత్త పుంతలు తొక్కుతూ ఇంటెర్నెట్ క్లౌడ్ మీదుగా ఎగురుతోంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏవిటంటే – వలస జీవితమ్మీద వచ్చిన కథల్లో ఇక్కడ అమెరికాలో ఉన్న పోజిటివ్నెస్స్(positive aspects) మీద కథలు ఒకటో, రెండో వచ్చాయంతే! మనం అందరం సొంతూరిని, కుటుంబాలనీ వదిలేసి ఇన్ని వేల మైళ్ళ దూరం వచ్చి హాయిగా గడుపుతున్నామంటే కారణం ఇక్కడ ఉండే positiveness వలనే! నేను అమెరికా వచ్చాకా చాలా మంచి పద్ధతులు అలవర్చుకున్నాను. మొట్టమొదటిది – Time management – అంటే టైముని మేనేజ్ చెయ్యడం కాదు. మన టైముకీ, ఇతరుల కాలానికీ విలువనివ్వడం. ఉదాహరణకి – మీరెప్పుడైనా అమెరికన్ల పార్టీలకి వెళితే తెలుస్తుంది. అందరూ ఠంచనుగా టైం పాటిస్తారు. అనీ పద్ధతిగా ఉంటాయి. అలాగే – పదిమందితో కలిసి TEAM గా పనిచేయడం. ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి. అమెరికా వచ్చిన ఈ ఇరవయ్యేళ్ళల్లో ఒక్కసారి కూడా నేను లంచం ఇవ్వలేదు. ఇంకా – ఇక్కడ ఎంతో మంది వ్యాపారాలూ గట్రా చేస్తున్నారు. ఇండియాలో మనకి పక్క రాష్ట్రం వాళ్ళ పొడే గిట్టదు. అలాంటిది వేరే దేశాల వాళ్ళు వలస వస్తే మన ఇంత open గా ఉండగలమా? ఏమో – నాకు డౌటే!

ఇలాంటి అంశాలమీద కథలు అంతగా రాలేదు. వచ్చిన కథల్లో చాలా భాగం వ్యంగ్యంగా, హాస్యంగా, ఎగతాళి చేస్తూ వచ్చినవే! ఈ నేపథ్యం మారి మంచి కథలు రావాలి.

ఉదాహరణకి – చాలా కాలం క్రితం అంటే దాదాపు పదేళ్ళ క్రితం ‘ఒంటరి విహంగం’ అన్న కథొకటి రాసాను. భార్య పోయిన తరువాత ఇండియా నుండి ఓ పెద్దాయన కొడుకు దగ్గరకి అమెరికా వస్తాడు. కూతురు కూడా ఇక్కడే ఉంటుంది. కొడుకు ఒక సారి తను పనిచేసే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఓ అమెరికన్ పెళ్ళి రిసప్షెన్ కి తండ్రిని కూడా తీసుకెళతాడు. ఆ అమెరికన్‌కది రెండో పెళ్ళి. మొదటి పెళ్ళంతో విడాకులు తీసుకొని ఒంటరితనం భరించలేక పెళ్ళి చేసుకున్నాడని కొడుకు తండ్రికి పెళ్ళి కెళుతూ చెబుతాడు. కొంతకాలం ఇక్కడున్నాక తండ్రి ఇండియా వెళిపోతాడు. ఇండియా వెళ్ళిన తరువాత అతనికి హార్ట్ ఎటాక్ వస్తుంది. సరిగ్గా అదే సమయానికి అమెరికాలో కోడలి ప్రసవం రావడంతో కొడుకు ఇండియా వెళ్ళడు. కొన్ని పరిస్థితుల వల్ల అది కాస్తా వాయిదా పడుతూ వస్తుంది.

సరిగ్గా అదే సమయంలో తనకి అనారోగ్యం చేసినప్పుడు సాయం చేసిన ఒకామెను తండ్రి పెళ్ళి చేసుకుంటున్నాడనీ విషయం తెలుస్తుంది. కొడుకూ, కూతుళ్ళిద్దరూ పెళ్ళిని తిరస్కరిస్తూ తండ్రిని ఆడిపోసుకుంటారు. చివరి దశలో తనెందుకు పెళ్ళి చేసుకోవల్సి వచ్చిందో చెబుతూ ఉత్తరం రాస్తాడు తండ్రి. కొడుకు ఆయన ఉత్తరాన్ని అంగీకరించక చెత్త బుట్టలో పడేస్తాడు. స్థూలంగా ఇదీ కథ.

ఈ కథ చదివాక అందరూ ముసలి వయసులో తండ్రి పెళ్ళి అవసరమని కొందరూ, అవసరం లేదని ఇంకొందరూ వ్యాఖ్యలు చేసారు తప్ప ఇది ఒక డయాస్పోరా జీవితంలో ఎదురైన సంఘర్షణగా ఒక్కరంటే ఒక్కరు వ్యాఖ్యానించ లేదు. దృష్టి అంతా తండ్రి మీదకీ, ఆయన సమస్య మీదకీ మళ్ళింది తప్ప కొడుకు తండ్రిని అంగీకరించక పోవడానికి కారణం రెండు సంస్కృతుల ఘర్షణగా ఎవరూ గుర్తించ లేదు. ఆ ఘర్షణలో అతను తన పాత అభిప్రాయం వైపే వంగాడు. కథలో కొడుకు పాత్ర #cognitive dissonance# మానసిక స్థితికి ఉదాహరణ. ఇండియాలో ఉన్న పాఠకులని వదిలేస్తే అమెరికాలో ఉన్న పాఠకులూ, కథకులూ ఇది డయాస్పోరా కథ అని చెప్పడానికి సాహసించలేదు. ఈ ఒక్క కథేకాదు, చాలామంది కథకుల రచనలకీ ఇదే పరిస్థితి వుంది. ఇది చాలా దురదృష్టకరమైన అంశం.

ఇప్పుడే ఇలా ఉంటే తెలుగు డయాస్పోరా కథ భవిష్యత్తు ఎమీ అంత ఆశాజనకంగా కనబడడం లేదు నాకు. ఇంతకు ముందు చెప్పినట్లు తెలుగు డయాస్పోరా ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇప్పటివరకూ వలస వచ్చిన వాళ్ళు చాలా మందికి తెలుగు సెకండ్ లాగ్వేజ్ గానో లేదా తెలుగు మీడియం లోనో చదువుకున్నారు. అందువల్ల మా తరంలో వలస వచ్చిన వాళ్ళకి తెలుగుతో సంబంధం పోలేదు. ఎంత ఇంగ్లీషు మాట్లాడినా, తెలుగులోనే అంటే మాతృభాషలోనే ఆలోచనలు ఉంటాయి. అవే మెదడు తర్జుమా చేసి ఇంగ్లీషులో చెప్పేస్తుంది. కానీ 2000 తరువాత వచ్చిన చాలా మందికి తెలుగు చదవడం రాయడం వచ్చినా, తెలుగు భాషతోనూ, ముఖ్యంగా సాహిత్యంతో సంబధం తెగిపోయింది. అందరివీ ఇంగ్లీషు మీడియం చదువులే! ఒకళ్ళొ ఇద్దరికో తెలుగు రాయడం, చదవడం వచ్చు. అందులో వెతికితే కొంతమంది రాయడం పైన ఆసక్తి ఉండచ్చు. అందువల్ల ఇక్కడికొచ్చిన యంగ్ తెలుగు జెనరేషన్ కథకులు తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ. పోనీ కొత్తగా వచ్చే వాళ్ళతో ఆశాజనకంగా కనిపిస్తోందా? అంటే అదీ లేదు.

ముందు ముందు రాబోయే వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వాన్నం. వారు పేరుకి తెలుగువాళ్ళే కానీ, తెలుగు రాయడం, చదవడం రాని వాళ్ళు. ఇప్పటికే తెలుగు పాఠకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి వారు అమెరికా వలసవస్తే తెలుగులో రాయాల్సిన అగత్యమూ, అవసరమూ కనిపించడం లేదు. ఇప్పుడున్న పాతిక లేదా అయిదు పదుల తెలుగు కథకులే, అంటే నాలాంటి వాళ్ళు, ముసలితనం వచ్చే వరకూ కథలు రాస్తూ ఉండచ్చు. ఇవన్నీ ఆలోచిస్తే కొత్త కథకులు తయారయ్యే అవకాశాలు మృగ్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇప్పుడున్న తెలుగు డయాస్పోరా కొత్త కథకుల్ని తయారు చేసుకోవాలి. కొత్త కథకులకి మార్గమూ, అవకాశమూ కలిగించాలి.

దానికి వంగూరి ఫౌండేషన్, లేదా ఇతర సంస్థలు తానా, ఆటా దోహదం కలిగించాలి. తెలుగు కథని పరిపుష్టం చేసుకోవడానికి సాహిత్య సమావేశాలూ, వర్క్షాపులూ, చర్చలూ వంటివి తరచుగా నిర్వహించాలి. అలాగే సావనీర్లకే అమెరికన్ తెలుగు కథా రచయితల్ని పరిమితం చెయ్యకుండా ఇక్కడ వచ్చిన డయాస్పోరా కథల్లో కొన్ని మంచివి ఏరి ఒక పుస్తకంగా తీసుకువస్తే బావుంటుంది.

అలాగే డయాస్పోరా రచనలమీద వచ్చిన సమీక్షలూ, విమర్శా కూడా పెరిగే అవకాశమూ, పరిస్థితులూ కలిగించాలి. తెలుగు సాహిత్యం అంటే ఆంధ్రా నుండి దిగుమతి చేసుకునే స్థాయి నుండి మనకి మనమే ఒక కొత్త సాహిత్య ప్రపంచాన్నీ అభివృద్ధి చేసుకోవాలి. డయాస్పోరా కథ మనకే సొంతమయినా మూడో జాగా. దానికి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరి సహకారమూ, కృషీ అవసరం.

 -గొర్తి సాయి బ్రహ్మానందం

కుహనా సంస్కరణపై కొడవటిగంటి బాణం!

కొడవటిగంటి కుటుంబ రావు గారు (కొ.కు.) విడాకుల చట్టం (అప్పటికింకా దాని రూపం గురించి చర్చలు జరుగుతున్నట్లున్నాయి) గురించిన చర్చతో కథని మొదలుపెట్టారు. అసలు పాయింటు ‘భర్తలు భార్యల్ని హింసించడం’ అన్నట్టు, దాన్ని కొకు వ్యంగ్యంగా సమర్థిస్తున్నట్టూ కనిపించినా (ఏ మాత్రం శృతి కుదరని హస్తిమశకాంతరమున్న జంటల విషయంలో కనీసం) – ఆయన చెప్పదల్చుకున్నది ‘సమస్య యొక్క అసలు మూలాల దగ్గరకి వెళ్ళకుండా పైపైన పాయింట్లతో చెలరేగిపోయే సంఘసంస్కరణాభిలాషుల వల్ల కలిగే ప్రయోజనం సున్నా అనే.

ఈ కథ లోని ‘శివానందం’ పాత్ర సంస్కరణ పేరు చెప్పి పోజు కొట్టే అనేక మందికి ప్రతినిధి.
ఆనాటి నవీన విద్యావిధానంలో ఏదో అరకొరగా ఇంగ్లీషు నాగరికతా ముక్కల్ని మైండ్ లో పోగు చేసుకుని వాటన్నిటి నుంచే జీవిత సమస్యలకి పరిష్కారం దొరుకుతాయనుకునే అమాయకత్వం/మూర్ఖత్వం కలబోసిన మనిషి శివానందం.

ఇలాంటి వాళ్ళని మోసగాళ్ళు, స్వార్థపరులు అనడం సబబు కాదు. తమకే పరిష్కారాలు తెలుసునన్న దృక్పధం ఇలాంటి నవీన బుద్ధిశాలులలో చాలా ఎక్కువగా కనపడటం ఈనాడూ మనం గమనించవచ్చు.

ప్రేమ లేని శాపపు పెళ్ళిళ్ళలో వచ్చే సమస్యలన్నింటికీ (మానసిక శారీరక హింసలు, నస, అక్రమ సంబంధాలు వగైరా) అసలు పరిష్కారం వాటిని అర్థం చేసుకుని పరిష్కరించగల వివేకాన్ని తెచ్చుకోవడంలోనే ఉంటుందని వాచ్యంగా చెప్పకపోయినా సూచ్యంగా చెప్పినట్లున్నారు కొకు.

సంఘోద్ధరణకి బయల్దేరే లోతులు లేని సంస్కర్తల వైఫల్యాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపించడం లోనే ఈ సూచన ఉందనిపిస్తోంది.

లాలిత్యం – ప్రేమ మాట దేవుడెరుగు – చూడగానే కంపరం పుట్టించే రూపాలూ, అవిద్య, మూర్ఖత్వం వల్ల ముఖంలో ముద్ర పడిపోయిన కోపమూ, అసూయా, కుళ్ళుమోత్తనమూ – ఇటువంటి ‘విపరీత’ దాంపత్యాన్ని సంస్కర్తల అమాయకత్వాన్ని ఫోకస్ చేసేందుకే కథలో పెట్టాడేమో అనిపిస్తుంది.

KODAVATIGANTI-KUTUMBARAO

భారతదేశంలోని స్త్రీలందరూ పురాణాలలోని పతివ్రతలని ఫాలో అయ్యే వాళ్ళనీ, ‘సంస్కరణ యావత్తూ మగవాడికే చెయ్యవలసి ఉంది’ అనీ శివానందం నమ్మడం లోనే అతని అవివేకాన్ని, ముందు జరగబోయే కథని సూచిస్తాడు కొకు.

పెళ్ళాలని కొట్టకుండా మగవాళ్ళని ఆపడం కోసం శివానందం వేసిన ‘ప్లాన్ ఆఫ్ కాంపేన్’ (ఒపీనియన్ ఒకటి క్రియేట్ చెయ్యడం, ఉద్రేకిస్తూ ఓ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాయడం వగైరా) పెద్దగా ఫలించక చివరికి శ్రీరాములు గారనే పెద్దమనిషిని సంస్కరించబూనుకుంటాడు.

శ్రీరాములు గారు ఈ కుహనా సంస్కర్తకన్నా వెయ్యిరెట్లు తెలిసినవాడు. అయినా శివానందం తన ఉపన్యాసాయుధాన్ని శ్రీరాములు గారి మీద ప్రయోగించడం మొదలుపెట్టగానే ఆయన ‘పడిపోయినట్లు’ నటించి శివానందాన్ని అప్పుడప్పుడూ తన ఇంటికి వచ్చి తనలో కలిగిన పరివర్తనని చూసి తన కాపరాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండమంటాడు.

శివానందం తన స్నేహితుడితో (కథకుడు) కలిసి శ్రీరాములు గారి ఇంటికి వెళతాడు.

అక్కడ శ్రీరాములు గారి భార్య తన గయ్యాళితనాన్ని శివానందానికి రుచి చూపిస్తుంది. ఆడవాళ్ళని కొట్టే మగవాళ్ళని సంస్కరించబూనుకున్న శివానందం తనే ఆమెని కొట్టబోవడం, అతనికి శృంగభంగం కావడంతో కథ ముగుస్తుంది.

ఇంత జరిగినా శివానందంలో ఏమీ మార్పు రాలేదన్న విషయాన్ని చివర్లో శివానందం కథకుడితో అన్న మాటల ద్వారా సూచిస్తాడు కొకు. కొకు తను చెప్పదలుచుకున్నది ఏ ఆవేశమూ లేకుండా నింపాదిగా ఎంత బాగా చెప్పగలడు అన్న దానికి ఈ కథ ఒక ఉదాహరణ. క్రింది లింక్ లో చదవండి……

http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=14745

– రాధ మండువ

త్రిపుర కథా ప్రపంచంలోకి మరో సారి

నాకో తమాషా అయిన కోరిక వొకటి వుంది. ఆ కోరికని రిటైరైనా తీర్చుకోవాలని, ఒక రోజు రత్నాచల్ రైల్లో పొద్దున్నే, మర్నాడు శాతవాహనా అదీ పొద్దున్నే, మూడోరోజున పినాకినీ ప్రత్యూషాన్నే ఎక్కి, భుజాన వేలాడే సంచిలో రోజుకో పుస్తకం చొప్పున పరిగెడుతున్న రైల్లో నిదానంగా నడుస్తూ, ఒక్కొకరినీ పలకరిస్తూ విసిగిస్తూ ఈ పుస్తకం చదివి మళ్ళీ రైలు దిగేటప్పుడు ఇచ్చేయండి – అనాలని అని.

(-మిగిలిన ‘మో’  కబుర్లు ఈ పీడియఫ్ లో చదవండి-సెప్టెంబర్ రెండు త్రిపుర పుట్టిన రోజు )

సౌజన్యం: కే. కే. రామయ్య, సీత పొన్నపల్లి