బతుకు ‘బస్తా’ అయింది!

స్లీమన్ కథ-2

కల్లూరి భాస్కరం
కల్లూరి భాస్కరం

హైన్ రిచ్ తల్లి అప్పటికి చాలాకాలంగా అస్వస్థతతో ఉంది.  వంటమనిషిని ఉంచుకున్న భర్త ఆమెకు ఖరీదైన కానుకలు, నగలు, దుస్తులు, డబ్బు దోచి పెడుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోవడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది. మనోవ్యథ ఆమె శారీరక ఆరోగ్యాన్నీ దెబ్బతీసింది.

తను చనిపోవడానికి ముందు పెద్ద కూతురికి ఒక ఉత్తరం రాసింది. అది రక్తంతో రాసినట్టుగా కనిపించింది. దురదృష్టవంతురాలైన తల్లి మీద అంతకాలం చూపించిన ప్రేమకు అందులో కృతజ్ఞతలు చెప్పింది. తను జీవన్మరణ పోరాటం చేస్తున్నాననీ, తను చనిపోయినట్టు తెలిస్తే దుఃఖించవద్దనీ, ఎట్టకేలకు కష్టాలనుంచి విముక్తి లభించిందనుకుని సంతోషించమనీ కోరింది. ఇది కొంచెమైనా కనికరం లేని ప్రపంచమనీ; ఈ కడగండ్ల నుంచి తనను గట్టెక్కించమని రాత్రిళ్ళు నిశ్శబ్దంగా చేసిన ప్రార్థనలను ఆ దేవుడు ఆలకించలేదనీ, తన ఓరిమి నిష్ఫలమైపోయిందనీ నిష్టురమాడింది…

ఇదే ఆమె రాసిన చివరి ఉత్తరం. కొన్ని వారాలకే ఓ కొడుకును కని ఆమె కన్నుమూసింది.

ఆమె మరణానికి భర్తే కారణమని గ్రామస్తులకు తెలుసు. అతని మీద కోపంతో రగిలిపోయారు. తగిన శాస్తి చేయాలనుకున్నారు. కానీ అది చివరికి పిల్లలకు శిక్షగా పరిణమించింది. వారిని బంధువుల ఇళ్లకు పంపించే ఏర్పాటు చేశారు. హైన్ రిచ్ ను కల్కోస్ట్ అనే ఊళ్ళో పాస్టర్ గా ఉన్న అతని చిన్నాన్న ఫ్రైడ్ రిచ్ స్లీమన్ ఇంటికి పంపడానికి నిర్ణయం జరిగింది.

ఆ ఏర్పాటు ఒక కొలిక్కి రావడానికి ముందు కొన్ని వారాలు అతడు అంకెర్షగన్ లోనే ఉండిపోయాడు. ఇప్పుడతనికి దెబ్బ మీద దెబ్బ. అతన్ని కలవకుండా మిన్నాను తల్లిదండ్రులు కట్టడి చేశారు. గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురు ఇంటికి వెళ్ళి, అచ్చం మిన్నా లానే ఉండే ఆమె తల్లి ఓల్గార్తా చిత్రపటం ముందు నిలబడి హైన్ రిచ్ నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవాడు. “మిన్నా ఎడబాటు అమ్మ మరణం కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ బాధించింది. నా అనంతర జీవితంలో అనేక దేశాలు తిరిగి అంతులేని కష్టాలు పడ్డాను. కానీ, నా తొమ్మిదో ఏట మిన్నాకు దూరమై నేను అనుభవించిన దుఃఖానికి అవేవీ సాటిరావు” అని ఆ తర్వాత అతను రాసుకున్నాడు.

తన జీవితమంతా అతను మిన్నా సాహచర్యాన్ని కలలు కంటూనే గడిపాడు. ఎప్పటికైనా ఆమెను కలసుకుంటానన్న ఆశ అతనిలో నిరంతరం తళుకుమంటూనే ఉండేది. మిన్నా, ట్రాయ్…రెండూ అతని కలల ప్రపంచంలో ఒకేలా భాగమైపోయాయి.

కల్కోస్ట్ లో చిన్నాన్న అతన్ని స్కూల్లో చేర్చాడు. ఆ స్కూల్లో ఉన్న హోమర్ శిలా విగ్రహం హైన్ రిచ్ ను ప్రత్యేకించి ఆకట్టుకుంది. చిన్నాన్న అతన్ని కన్నకొడుకులానే చూసుకున్నాడు. హైన్ రిచ్ చదువులో బాగా రాణిస్తున్నాడు. లాటిన్ అతనికి బాగా పట్టుబడుతోంది. లాటిన్ టీచర్ కార్ల్ ఆండ్రెస్ అది గుర్తించి అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అతనికి ఆసక్తి ఉన్న విషయాల మీద సొంతంగా లాటిన్ లో రాయిస్తూ, వ్యాకరణ దోషాలు దిద్దుతూ సానపట్టాడు. తండ్రి వల్ల తమ కుటుంబం చెదిరిపోవలసివచ్చినా హైన్ రిచ్ ఆయనను ఇప్పటికీ అభిమానిస్తూనే ఉన్నాడు. 1832 క్రిస్టమస్ రోజున ట్రోజన్ యుద్ధాల పై లాటిన్ లో ఓ సుదీర్ఘ వ్యాసం రాసి తండ్రికి కానుకగా పంపాడు. అక్కడక్కడ దోషాలు ఉన్నా ఆ వ్యాసం తండ్రికి సంతృప్తి కలిగించింది.

చదువులో హైన్ రిచ్ తన ఈడు పిల్లలను మించిపోయాడు. దాంతో మరుసటేడు అతన్ని న్యూ స్ట్రెలిజ్ అనే ఊళ్ళోని జిమ్నాజియంలో మూడో తరగతిలో చేర్చారు. మిన్నా ఎడబాటు, కుటుంబ పరిస్థితులు ఒకపక్క కుంగదీస్తున్నా; పై పైకి ఎదగాలన్న తపన, అందుకు అవసరమైన పట్టుదల, శ్రమించే తత్వం అతనిలో నిలకడగా ఉన్నాయి. ఏ ఆటంకం లేకుండా చదువు సాగితే ఏ రోష్టాక్ యూనివర్సిటీలోనో ఉద్యోగం సంపాదించుకునేవాడు. రోష్టాక్ యూనివర్సిటీ జర్మనీలో అతి పురాతన, ప్రసిద్ధ యూనివర్శిటీలలో ఒకటి.

కానీ జిమ్నాజియం చదువు మూడు నెల్ల ముచ్చటే అయింది. గ్రామస్తులు తన మీద కత్తి కట్టినా తీరు మార్చుకోని తండ్రే అందుకు కారణం. దాంతో గ్రామస్తులు అతన్ని పూర్తిగా పట్టి పల్లార్చడానికి కంకణం కట్టుకున్నారు. ఇతర నిందలతోపాటు, చర్చి నిధులు దుర్వినియోగం చేశాడన్న అభియోగం తెచ్చారు. పాస్టర్ గా ఉండడానికి పనికిరాడని తేల్చారు. బిషప్ అతన్ని అభిశంసించి సస్పెండ్ చేశాడు. చర్చి నుంచే బహిష్కరిస్తామని హెచ్చరించాడు. రాబడి తగ్గిపోవడంతో కొడుకు జిమ్నాజియం చదువు అతనికి తలకు మించిన భారం అయింది.

హైన్ రిచ్ ఓ మామూలు స్కూలుకు మారాల్సి వచ్చింది. ఆ స్కూల్లో అతను మూడేళ్లు గడిపాడు. అక్కడా చక్కగా రాణించాడు. అంతలో మరో పిడుగుపాటు. ఆర్థికంగా పూర్తిగా అడుగంటిపోయిన తండ్రి  ఆ స్కూలు ఫీజు కూడా కట్టలేనని చేతులెత్తేశాడు. అప్పటికి హైన్ రిచ్ కు పద్నాలుగేళ్లు. చదువు సంగతి దేవుడెరుగు, తిండికోసం వెతుక్కోవలసిన పరిస్థితి. ఆ వయసులో అతను చిన్నాన్న మీద ఆధారపడలేడు. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని తన బతుకును తన చేతుల్లోకి తీసుకోవలసిందే.

తక్షణ సమస్య తిండి గడవడం. కనుక ఎంత చిన్న ఉద్యోగమైనా చేయకతప్పదు.  ఏ పచారీ కొట్లోనో కుదురుకుంటే కనీసం తిండి కైనా లోటు ఉండదనుకున్నాడు. ఈష్టర్ సెలవులు కాగానే పొరుగునే ఉన్న ఫర్ష్టెన్ బర్గ్ గ్రామంలో ఓ పచారీ కొట్టును వెతుక్కోవాలనుకున్నాడు. అంతలో అనుకోని ఓ ఘటన జరిగింది. అతనో రోజున న్యూ స్ట్రెలిజ్ గ్రామంలోని ఓ సంగీతవిద్వాంసుడి ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యం… అక్కడతనికి మిన్నా కనిపించింది!

నల్లని దుస్తులతో చాలా నిరాడంబరంగా ఉంది.  ఆ నిరాడంబరతే ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. అతనిలానే ఆమెకూ పద్నాలుగేళ్లు. కానీ ఈడును మించి ఎదిగినట్టు కనిపించింది. ఒకరి చేతుల్లో ఒకరు వాలిపోయారు. నిస్సహాయంగా ఒకరినొకరు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఇద్దరి చెక్కిళ్ళ వెంట కన్నీళ్లు ధారలు కట్టాయి. ఎంత ప్రయత్నించినా ఒక్కరికీ మాట పెగల్లేడు. అంతలో మిన్నా తల్లిదండ్రులు వచ్చి వారిని బలవంతంగా విడదీశారు.

అయిదేళ్ల వియోగం తర్వాత ,అదే వాళ్ళు మొదటిసారి కలసుకోవడం. అతను దుర్భరమైన ఏకాంతాన్ని, క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఆ అమ్మాయి మెరుపు తీగలా కనిపించి మాయమైంది. చెక్కిళ్లపై కన్నీరు జారుతుండగా ఆ సంగీత విద్వాంసుని ఇంట్లో ఆమె నిలబడి ఉన్న దృశ్యం అతనికి జీవితాంతం గుర్తుండిపోయింది. “మిన్నా ఇప్పటికీ నన్ను గాఢంగా ప్రేమిస్తోందన్న నమ్మకం నా ఆశలకు, ఆకాంక్షలకు గొప్ప ఇంధనం అందించింది. నాలో అంతులేనంత శక్తీ, ఉత్సాహం కట్టలు తెంచుకున్నాయి. అలుపెరుగని కృషితో జీవితంలో అన్నివిధాలా పైకి వచ్చి ఆమెకు తగిన వాడిగా నన్ను నేను నిరూపించుకోగలనన్న తిరుగులేని ఆత్మవిశ్వాసం నాలో నిండిపోయింది. నా కాళ్ళ మీద నేను నిలబడేవరకూ ఆమెకు పెళ్లి కాకుండా చూడమని ఆ దేవుణ్ణి వేడుకున్నాను” అని ఆ తర్వాత అతను రాసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత అతను ఫర్ష్టెన్ బర్గ్ కు ప్రయాణం కట్టాడు. అక్కడ హేర్ హోట్జ్ అనే ఓ వ్యక్తికి చెందిన పచారీ కొట్టులో నౌకరీకి కుదిరాడు. ప్రొఫెసర్ కావాలనుకున్నవాడు కాస్తా అలా పచారీ కొట్టులో తేలాడు.

***

ఆ కొట్టూ, దానికి సంబంధించిన ప్రతిదీ అతనికి కంపరం కలిగించాయి. యజమాని తన పేరులానే ఓ కొయ్య మనిషి. పొద్దుటే అయిదింటికి లేచి కొట్టు తెరవాలి. తుడిచి శుభ్రం చేయాలి. కౌంటర్ల దుమ్ము దులపాలి. యజమాని బూట్లు పాలిష్ చేయాలి. రాత్రి పొద్దుపోయేవరకూ పనే పని. ఆ తర్వాత  అక్కడే నిద్ర. అప్పుడైనా  కాసేపు పుస్తకం పట్టుకుందామనుకుంటె అలసటతో కళ్ళు వాలిపోయేవి. స్కూల్లో బట్టీ పట్టించిన వర్జిల్ పంక్తుల్ని కూడా మరచిపోతున్నాడు. ఆ పచారీ కొట్టు లోపల చీకటిగా, చలి చలిగా, దుర్భరంగా ఉండేది. అతని ఊహలకు మేత వేసే ఎలాంటి కథలూ అక్కడ వినబడవు. తగలబడుతున్న ట్రాయ్ లాంటి పురాతన చిత్రాలు కనబడవు.

రోజంతా ఒళ్ళు హూనం చేసుకున్నా గిట్టేది నామమాత్రం. ఊరు పేదది. ఒక్కోసారి యజమానికి కూడా పూట గడవడం కష్టమయ్యేది. రోజు మొత్తం మీద 12 టేలర్లు, అంటే ఇంచుమించు 3 పౌండ్ల విలువైన సరుకు అమ్మితే, అక్కడికి అదృష్టవంతులే. ఏడాదిలో 3,000 టేలర్ల వ్యాపారం జరగడం కనాకష్టం. లాభాలు తక్కువ, పని గంటలు ఎక్కువ.  త్వరగా ధనవంతుడైపోయి మిన్నా సాహచర్యాన్ని గెలుచుకోవాలనుకుంటున్న హైన్ రిచ్ కు అంతూపొంతూ లేని ఆ వెట్టి చాకిరీనుంచి బయటపడే దారి కనిపించలేదు.

పొద్దుట లేవగానే ఏకాంతంగా గడిపే ఒకటి రెండు గంటలు మాత్రమే అతని సొంతం. ఎనిమిదింటికల్లా యజమాని వచ్చి   బస్తాడు ఆలుగడ్డల మోతతో డిస్టెలరీకి పంపించేవాడు. మెక్లంబర్గ్ లో అంతా ఆలుగడ్డలనుంచి తీసిన విస్కీయే తాగుతారు. ఆ వెంటనే పరుగు పరుగున వచ్చి కౌంటర్ దగ్గర నిలబడాలి. చేపలు, వెన్న, పాలు, ఉప్పు, కాఫీ, చక్కెర, నూనెలు, కొవ్వొత్తులు, ఆలుగడ్డల విస్కీ వగైరాలు అమ్ముతూ రాత్రి పదకొండు వరకూ అక్కడే వేల్లాడాలి. సరకుతో వచ్చిన బరువైన పెట్టెలను కొట్లోకి దొర్లించడం, చేపల కేసుల్ని లెక్కపెట్టడం, సరకు సర్దడం చేస్తూ ఉండాలి. చదువుకోడానికి సమయం చిక్కకపోగా, అంకెలతో బుర్ర అరణ్యంలా తయారయ్యేది. చేప నూనెతో చేతులు జిడ్డోడుతూ ఉండేవి. బట్టల నిండా రంపంపొడి అతుక్కుని ఉండేది. ఉన్నది ఒకటే జత. దానికి కూడా మాసికలు. వేసవైనా, చలికాలమైనా అదే గతి.

ఇంతటి దుస్సహ పరిస్థితుల మధ్య కూడా అతని కలల ప్రపంచం పదిలంగానే ఉంది. దానికి అతనే రారాజు. చదువులో తను ఉన్నతశిఖరాలను అధిరోహించినట్టు, విపరీతంగా డబ్బు సంపాదించినట్టు, మిన్నాను పెళ్లాడి ఆమెతో కలసి ప్రణయసామ్రాజ్యాన్ని ఏలుతున్నట్టు ప్రతిక్షణం ఊహించుకునేవాడు. ఇప్పుడు అతని ఏకైక లక్ష్యం…డబ్బు, అంతులేనంత డబ్బు!

అరుదుగానైనా అతనిలో సంతోషాన్నీ, సంతృప్తినీ నింపిన క్షణాలు లేకపోలేదు. ఓ రోజు రాత్రి ఓ తాగుబోతు తూలుకుంటూ దుకాణానికి వచ్చాడు. చమురు దీపం ముందు నిలబడి హఠాత్తుగా హోమర్ నుంచి కొన్ని గ్రీకు పంక్తులు వల్లించడం ప్రారంభించాడు. హైన్ రిచ్ మంత్రముగ్ధుడై వింటూ ఉండిపోయాడు. అతను గ్రీకు చదవలేడు, అర్థంచేసుకోలేడు. కానీ ఆ భాషలోని లయ అతని హృదయతంత్రిని మీటింది. అలా ఆ తాగుబోతు వంద పంక్తులు పూర్తిచేశాడు. హైన్ రిచ్ మరోసారి …అప్పటికీ తనివి తీరక మూడోసారి అతని చేత వల్లింపజేసి విన్నాడు. సంతోషం పట్టలేక మూడు గ్లాసుల విస్కీ అతనికి ఉచితంగా తాగబొశాడు. దాని ఖరీదు, అంతవరకు తను పొదుపు చేసిన స్వల్పమొత్తంతో సమానం.

హైన్ రిచ్ ఆ తాగుబోతుతో పరిచయం పెంచుకున్నాడు. అతని కోసం రోజూ ఎదురుచూస్తూ ఉండేవాడు. అతని పేరు నీడర్ హోఫర్. వయసు ఇరవై నాలుగేళ్ళు. రోబెల్ కు చెందిన ఓ ప్రొటెస్టెంట్ పాస్టర్ కొడుకు. ఎందులోనూ రాణించలేకపోయాడు. చెడునడత కారణంగా అతన్ని స్కూలునుంచి బహిష్కరించారు. స్కూల్లో ఉండగా బట్టీ పట్టించిన ఆ వంద పంక్తులు మాత్రం అతనికి గుర్తుండిపోయాయి. వాటినే శ్రావ్యంగా వల్లిస్తూ ఉండేవాడు. ఆ పంక్తులు వింటున్నప్పుడు తన కళ్ల వెంట ఆనందబాష్పాలు జల జలా రాలాయనీ, తనకు గ్రీకు భాష తెలిసేలా చేయమని “ఆ క్షణం” నుంచే దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాననీ హైన్ రిచ్ ఆ తర్వాత రాసుకున్నాడు.

ఆ రోజుల్లోనే అతను అమెరికాకు పారిపోవాలని అనుకునేవాడు. అక్కడి వీథుల్ని బంగారంతో తాపడం చేశారనీ, ఆ దేశంలో కరువు తీరేలా కావలసినన్ని పుస్తకాలు కొనుక్కోవచ్చనీ చెప్పుకుంటుండగా విన్నాడు. అప్పట్లో పడమటి భూములనుంచి వేల సంఖ్యలో జనం అమెరికాకు వలసపోతూ ఉండేవారు. కొంత ఖర్చు భరించే మేరకైనా తన దగ్గర డబ్బు సమకూడితే న్యూయార్క్ పంపే ఏర్పాటు చేసేలా ఒక ఏజెంట్ తో ఒప్పందం చేసుకున్నాడు. అప్పుడతని వయసు పద్దెనిమిదేళ్లు. కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని తండ్రికి రాశాడు. ఆయన సమస్యల్లో ఆయనున్నాడు. ఒకామెను పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత వదిలేసి మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్యా ఎడతగని కీచులాట. చివరికి వ్యవహారం కోర్టువరకూ వెళ్లింది. తండ్రి నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో హైన్ రిచ్ తీవ్ర ఆశాభంగం చెందాడు. ఇక ఈ పచారీ కొట్టును, వెట్టి చాకిరీనీ తప్పించుకునే మార్గంలేదనుకున్నాడు. అంతలో అతని జీవిత గమనాన్నే మార్చేసే ఓ ఘటన జరిగింది.

heinrich

అతనో పెద్ద చికోరీ పెట్టెను దొర్లించబోయాడు. పెద్దదే కానీ మరీ అంత బరువైందేమీ కాదు. అదే అతనికి కష్టమై హఠాత్తుగా రక్తం కక్కుకున్నాడు. నేల మీద ఉన్న రంపంపొడి రక్తంతో ఎర్రబడిపోయింది. ఇంక తను ఆలుగడ్డల బస్తాలను, వెన్న చిలికే పెద్ద పెద్ద కవ్వాలను మోయగల స్థితిలో లేడని అతనికి అర్థమయింది. ఆ చీకటి కొట్లోనే తన జీవితం తెల్లారిపోతుందనుకుని భయపడ్డాడు.

వెంటనే హాంబర్గ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అది సముద్రతీరంలో ఉంది కనుక అక్కడినుంచి అమెరికాకు తేలిగ్గా వెళ్లిపోవచ్చు. అప్పటికతను 30 ప్రష్యన్ డాలర్లను, అంటే దాదాపు 7 పౌండ్లను పొదుపు చేశాడు. ఆ డబ్బు తీసుకుని కట్టుబట్టలతో కాలినడకన రోష్టాక్ మీదుగా హాంబర్గ్ కు బయలుదేరాడు. రోష్టాక్ లో కొన్ని రోజులు ఆగి బుక్-కీపింగ్ నేర్చుకున్నాడు. సాధారణ విద్యార్థులకు ఏడాది నుంచి ఏణ్ణర్థం పట్టే ఆ కోర్సును కొన్ని రోజుల్లోనే పూర్తిచేశాడు.

రోష్టాక్ నుంచి హాంబర్గ్ కు బయలుదేరిన హైన్ రిచ్ కు చిన్నాన్న కూతురు సోఫీ స్లీమన్ వీడ్కోలు చెప్పింది. హాంబర్గ్ లోని అయిదు ఎత్తైన బురుజుల్ని దూరం నుంచే చూసి ముగ్ధుడయ్యాడు. నిజానికి అతను తన చరమ జీవితం అంతా ఎత్తైన కోట బురుజుల్ని చూస్తూ ముగ్ధుడవుతూనే గడిపాడు. శివార్లలో నిలబడి సెప్టెంబర్ ఆకాశపు గొడుగు కింద ఆ నగర దృశ్యాన్ని చూస్తూ “హాంబర్గ్…హాంబర్గ్’’ అని మాటి మాటికీ గొణుగుతూ ఉండిపోయాడు. ఒక నగరాన్ని చూడడం అదే అతనికి మొదటిసారి. అక్కడి విశాలమైన ఆవరణల మధ్య ఠీవి ఒలికే వర్తక ప్రాసాదాలు, ఎక్కడబడితే అక్కడ మార్కెట్లు, తీర్చి దిద్దిన రహదారుల మీద చప్పుడు చేసుకుంటూ సాగిపోయే బళ్ళు, గడియారపు మోతలు, ఎత్తైన చర్చి గోపురాలపై గంటల గలగలలు…ప్రతిదీ అతన్ని ఉత్తేజితుణ్ణి చేశాయి. చెవులు చిల్లులు పొడిచే ఆ రణగొణ ధ్వనుల మధ్య తనను తాను మరచిపోయాడు. తన కష్టాలను మరచిపోయాడు. నిద్రలో నడుస్తున్నట్టు నడిచాడు. ఇక్కడ తన అదృష్టాన్ని ఎలా పండించుకోవాలన్న ఆలోచన చేశాడు. “హాంబర్గ్ నన్ను ఆకాశానికి ఎత్తేసింది. నన్నో స్వాప్నికుడిగా మార్చేసిం”దని సోదరికి ఉత్తరం రాశాడు.

అదృష్టం పండించుకోవడం అలా ఉంచి, మాటి మాటికీ రక్తం కక్కుకుంటున్న ఈ జబ్బుమనిషికి పని దొరకడమే గగనమైపోయింది. ఎట్టకేలకు నెలకు 14 పౌండ్ల జీతం మీద ఓ పచారీ కొట్టులో పని దొరికింది. ఎనిమిది రోజులకే అది ఊడిపోయింది. ఆ తర్వాత బుక్-కీపర్ గా ఉద్యోగం వచ్చింది. అదీ వారం రోజులకే ముగిసింది. దాంతో క్లిష్టపరిస్థితిలోకి జారిపోయిన హైన్ రిచ్ క్రిష్టమస్ వరకు కాలక్షేపం చేయడానికి సరిపోయే మొత్తాన్ని అప్పుగా పంపమని ఓ బంధువుకి ఉత్తరం రాశాడు. అతను వెంటనే కొద్దిపాటి మొత్తాన్ని పంపుతూ, అంతగా అవసరం లేకపోతే  ఆ డబ్బు తిప్పి పంపమని ఉత్తరం రాశాడు. ఆ మాట హైన్ రిచ్ కు అవమానంగా తోచింది. ఏమైతేనేం, ఆ స్వల్పమొత్తం అతన్ని చావకుండా మాత్రం కాపాడింది. తనను అంత మంత్రముగ్ధం చేసిన హాంబర్గ్ ను క్రిష్టమస్ నాటికి శాశ్వతంగా విడిచిపెట్టేశాడు.

అదెలా జరిగిందంటే…అతని తల్లికి పరిచయస్తుడైన హెర్ వెంట్ అనే ఒక  ఓడల దళారీ అనుకోకుండా తారసపడ్డాడు. అతన్ని ‘డొరోతియా’ అనే ఓడ కెప్టెన్ కు పరిచయం చేశాడు. ఆ ఓడ వెనెజులా లోని లా గ్వైరా అనే చోటికి బయలుదేరబోతోంది. దక్షిణ అమెరికాపై అప్పటికే ఆసక్తి పెంచుకున్న హైన్ రిచ్ ఈ ప్రయాణం గురించి తెలియగానే ఎగిరి గంతేశాడు. అయితే అతని ఆరోగ్యం దెబ్బతినిపోయింది. మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరికి ఒక దుప్పటి కొనుక్కోగల స్తోమత కూడా లేదు. అంతలో అతనికి తన వెండి వాచీ గుర్తొచ్చింది. దానిని మూడు డాలర్లకు అమ్మేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో రెండు చొక్కాలు, ఒక కోటు, రెండు పంట్లాములూ, ఒక పరుపు, ఓ మాదిరి దుప్పటి కొనుక్కున్నాడు. ఓడ ఎక్కే సమయానికి జేబు ఖాళీ అయిపోయింది.

బయలుదేరిన కొన్ని రోజులకే ఓడ పెనుతుపానులో చిక్కుకుంది. హైన్ రిచ్ మరణం అంచులవరకూ వెళ్ళాడు…

                                                                                                               (సశేషం)

 

 

 

 

 

మీ మాటలు

  1. భాస్కరం గారూ,
    హైన్ రిచ్ చరిత్రను ఒక నవలలా కళ్లకుకట్టినట్టు అద్భుతంగా చెబుతున్నారు. తరువాయి భాగాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను. ఫిక్షన్ సాగరంలో మునిగిపోయిన తెలుగు సాహిత్యంలో ఇలాంటి రచనల అవసరం ఎంతో ఉంది.

  2. కల్లూరి భాస్కరం says:

    “ఫిక్షన్ సాగరంలో మునిగిపోయిన తెలుగు సాహిత్యంలో ఇలాంటి రచనల అవసరం ఎంతో ఉంది.”

    మనలో లోపించింది ఏమిటో గుర్తించే అరుదైన చూపును చెబుతున్న మీ వాక్యం నన్ను ప్రత్యేకించి ఆకర్షించింది. థాంక్స్.

మీ మాటలు

*