Archives for May 2015

నేల కంపిస్తుందని తెలియని నీకు…

అఫ్సర్ 

1.

నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టి, లేదూ  కాస్తయినా జారిపోలేదు కాబట్టీ,  నీకు యింకా చాలా తెలియవ్. నిజానికి ఈ వివర్ణ ముఖాల నగరపు చలి  తప్ప యింకే జీవన్మరణ ప్రకంపనలూ తెలియవు కాబట్టి నీకు నువ్వో ఆ అవతలి ఇంకొక ముఖమో తెలియనే తెలియదు.

చలిలో ఎండాకాలాన్నీ, ఎండలో చలికాలాన్నీ అందంగా పునఃసృష్టించుకునే తెలివో తేటదనమో నీకు ఉండనే వుంది కాబట్టి అసలే జీవితం ఎలా తెల్లారుతుందో, అంత హటాత్తుగానే ఏ మరణం ఎందుకు దాపురిస్తుందో నీకు యెప్పటికీ తెలియకనే పోవచ్చు.

కాని, అసలవేవీ జీవితమే కాదంటావే, అదిగో అక్కడే నీ రహస్యం అంతా నిద్రపోతూ వుంటుంది, వొళ్ళూపై  లేకుండా!

 

2.

యెప్పటి నించి ఆలోచించడం మొదలు పెట్టావో నువ్వు, యెప్పటి నించి దేన్ని యెలా అనుభవించడం మొదలెట్టావో నువ్వు, వొక బాధలో యింకో వొంటరితనంలో మరింకో చావు కన్నా పీడలాంటి బతుకులో యేది యెందుకు యెలా కమ్ముకొస్తుందో యెవరిని యే క్షణం యెలా కుమ్మేస్తూ పోతుందో ఏదీ ఏదీ  నీ వూహకి కూడా అందదు.

నువ్వొక అద్దాల గదిలోపల గదిలో సమాధి తవ్వుకుంటూ వుంటావ్! దాన్ని  తెరిచే సూర్యకిరణపు తాళం చేయిని యెక్కడో పారేసుకుని వుంటావ్!

నువ్వు పడుకున్న గదిలో కాస్త చలిగా వుందనో, నీ పక్కన పడుకున్న దేహంలో కొంత  వెచ్చదనం చచ్చిపోయిందనో, నువ్వు ఎక్కాల్సిన మెట్టు చూస్తూ చూస్తూ వుండగానే చప్పున జారిపోయిందనో రాత్రీ పగలూ గుండెలు బాదుకొని యేడుస్తూ వుండిపోతావ్ తప్ప, యింకో గుండెలోకి  ప్రవేశించి అక్కడి గాయాన్ని పలకరించి రాలేవ్ నువ్వు.

వొక కోరిక నించి యింకో కోరికలోకి వలసెళ్ళే ఏమరుపాటులో తొందరపాటులో కూడా అన్ని స్థలాలూ, కాలాలూ, వూహలూ చెక్కుచెదరని అందమైన అమరిక  నీకు.

మహా బలిదానాలే చేయక్కర్లేదు, కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.

 

3

ఇవాళ నేలా వణికి పోతుంది గజగజ.

రేపు ఆకాశమూ తొణికిపోతుంది వానచుక్కలా.

యీ సూర్యుడూ యీ చంద్రుడూ యింకేవీ నిలబడవ్ యింత ఠీవిగా యిప్పటిలాగానే.

జీవితం కొన్ని చేతుల్లోంచి యెట్లా పట్టుతప్పి పోతుందో

అలాగే కచ్చితంగా అలాగే ఇవన్నీ నెలవు తప్పి ఎటేటో రాలిపోతాయి,

నీకేమీ చెప్పకుండానే.

 

4.

నిజంగా

నీకు యింకా చాలా జీవితం తెలియనే తెలియదు,

నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే!

*

 

జై భీమ్‌ డ్రమ్‌..రిథమ్ ఆఫ్ బహుజన్స్‌!

ఒమ్మి రమేష్‌బాబు

 

1. ఒక అద్భుతం..

2015 మే 3వ తేదీ రాత్రి. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆర్ట్స్‌ కాలేజీ మైదానం బాగమతి తారామతి ప్రాంగణంగా పేరు మార్చుకుంది. భీమ్‌ డ్రమ్‌ అనే వినూత్న ఆర్కెష్ట్రాకి వేదికగా మారింది. రిథమ్ ఆఫ్ బహుజన్స్‌ అన్నది ఆ కార్యక్రమ ట్యాగ్‌లైన్‌. అదే ఇప్పుడు ప్రత్యామ్నాయ సాంస్కృతిక, రాజకీయాలకు దారిచూపబోతున్న టార్చిలైట్‌.

రిధమ్ ఆఫ్ బహుజన్స్‌ అనేది ఒక కొత్త ప్రకటన. నవీన భావావేశపు వెల్లువ. ఉద్విగ్నభరిత సంబరం. అగ్రకులేతర అసంఖ్యక సమూహాల పాదాల జడి. లబ్‌డబ్‌లబ్‌డబ్‌ చప్పుడుగా మారిన డప్పుల పెనుప్రకంపన. చాతీలో వేడిపుట్టించిన గిటార్ వైబ్రేషన్. కదంతొక్కించిన కీబోర్డ్‌ హోహోహోరు. నరాల తంత్రుల్లోకి చిమ్మిన నల్లని నెత్తుటి కేరింత. ఆ రాత్రి ఆ గానాబజానా దళితం దళితం దళితం అని దళిత శతకోటిని దద్దరిల్లేలా ధ్వనించింది. యువతని దరువేయించింది. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య వంటి మేధావినే హైలయ్యగా మార్చి ఆడీ పాడించింది.

అవును.. ఆ రాత్రి ఓయూ ప్రాంగణం కొత్త ఉద్యమానికి తెరతీసింది. కొత్త అజెండాకి పల్లవిగా మారింది. కొత్త దర్శనానికి చూపుని పదునెక్కింది. ఆ రాత్రి… చీకటి కూడా తన నలుపుని చూసుకుని మరొక్కసారి మనసారా మురిసిపోయింది. నిశి మెరుపుల ఆకాశాన్ని ప్రశంసిస్తూ నేలతల్లి ఉరిమింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక నల్ల తటాకంగా మారారు. వారి మనస్సుల్లో నల్లకలువలు విరబూశాయి. బ్లాక్ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అని ఐలయ్య నినదిస్తే అక్కడ చేరిన గొంతులన్నీ ఏకమై ఆ నినాదాన్ని అందిపుచ్చుకున్నాయి. ఆ రేయి ఒకానొక జాగృదావస్థకి పీఠికగా మారింది.

ఇదంతా 3వ తేదీ సాయంత్రం నుంచి నడి రాత్రి వరకూ సాగిన భీమ్‌ డ్రమ్‌ మహిమ. నలిగంటి శరత్ అనే ఒక బక్కపల్చని కారునల్లాటి యువకుడు చేసిన మాయ. ఉన్నదున్నట్టు చెప్పాలంటే- ఉస్మానియానే “శరత్‌ మానియా”గా మార్చేశాడు. ప్రత్యామ్నాయ సాంస్కృతిక, సామాజిక, విద్యా, రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వాగ్గేయకారులను, అతిథులను, బహుజన నేతలను రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌ కార్యక్రమంలో ఏకం చేశాడు. విభిన్న సంస్థల ప్రతినిధులతోపాటు పలు విద్యార్థి సంఘాల నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఆర్కెష్ట్రాతో గొంతు కలిపారు. భిన్నత్వం ఉన్నప్పటికీ బహుజనతత్వం ముందు ఐక్యసంఘటన సాధ్యమేనని దీనిద్వారా శరత్‌ నిరూపించాడు. సంఘ పరివర్తన ద్వారా బహుజన రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడమే నిజమైన వాగ్గేయకారుడి లక్ష్యం అని ప్రకటించాడు. ఇందుకు స్ఫూర్తినిచ్చేలా డయాస్‌ని డికరేట్‌ చేశాడు. గౌతమ బుద్దుడు, పెరియార్‌ రామస్వామి, జ్యోతిరావ్‌ పూలే, సావిత్రీబాయ్‌ పూలే, అంబేద్కర్‌, కెజీ సత్యమూర్తి అలియాస్‌ శివసాగర్, కాన్షీరామ్‌, మైకేల్ జాక్సన్‌, మారోజు వీరన్న, బెల్లి లలిత తదితర స్ఫూర్తిప్రదాతలు ఫ్లెక్సీ మీద ఆశీనులై ఆద్యంతం ఆ కార్యక్రమాన్ని తిలకించి పులకించిపోయారు.
2 నేపథ్య స్వరం…

ఓయూ క్యాంపస్‌లో జరిగిన భీమ్‌ డ్రమ్‌ని కట్టెకొట్టెతెచ్చే చందంగా చెప్పడం అంటే కుట్రతో సమానం. ఎందుకంటే అది ఒక చారిత్రక సందర్భం. ఒక మార్పుకి సంకేతంగా నిలవబోతున్న నూతన కూర్పు. ఆ కార్యక్రమానికి కర్త కర్మక్రియ నలిగంటి శరత్‌. చాలామందికి ఆ యువరక్తపు నవతేజం పరిచయమే అయినా రెండు ముక్కల్లో మళ్లీ చెప్తాను. నలిగంటి శరత్‌ చమర్‌ అనే ఆ యువకుడు దళిత్‌ బహుజన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ఉద్యమకారుడిగా, రచయితగా బాగా పాపులర్‌ అయ్యాడు. సాంసృతిక సైనికుడి అవతరించాడు. అతనిదొక విలక్షణ స్వరం. మెరిసే నల్లని మేనిచ్ఛాయతో సంధించిన విల్లులా ఉంటుంది రూపం.

ఉస్మానియాలో బీఫ్‌ ఫెస్టివల్‌ జరిగినా, ఇఫ్తార్‌ పాటతో హిందూ- ముస్లింలతో అలాయి బలాయి పాడించినా… అది అతనికే చెల్లింది. ‘బీఫ్‌ ఈజ్‌ సీక్రెట్‌ ఆఫ్‌ మై నాలెడ్జి’ అనే అతని గీతం ఇతర రాష్ట్రాలకు కూడా పాకిపోయింది. నలిగంటి శరత్‌కి స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉంది. తన వర్ణం, వర్గం గురించిన స్ఫృహ కూడా కావలసినంత ఉంది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఎంఐఎం శరత్‌కి తమ పార్టీ టిక్కెట్‌ ఇచ్చి అంబర్‌పేట అభ్యర్థిగా పోటీలో నిలిపింది. అంబర్‌పేట నియోజకవర్గం జనరల్‌ సీటు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పోటీచేసిన స్థానం. నలిగంటి శరత్‌ దళితుడు. అప్పటికి శరత్‌ ఓయూలో పరిశోధక విద్యార్థిగా ఉన్నాడు. ఆ ఎన్నికల్లో కిషన్‌రెడ్డికి చుక్కలు కనిపించిన మాట వాస్తవం. నలిగంటి శరత్‌ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితేనేం… తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. ఇది జరిగిన కొద్ది నెలలకే అంటే గత సెప్టెంబర్‌ మాసంలో శరత్‌ రూముపై దాడి జరిగింది. అతని పుస్తకాలు, బట్టలు, సర్టిఫికెట్లు సహా అన్నింటినీ తగులబెట్టారు. పగలనకా రేయనకా ఎంతో శ్రమపడి పిహెచ్‌డి కోసం అతను తయారుచేసుకున్న రాతప్రతి కూడా ఆ ఘటనలో కాలి బూడిదయ్యింది.

ఈ దుర్మార్గాన్ని ఎవరు చేసి ఉంటారో విడమరిచి చెప్పాల్సిన పని లేదు. శరత్‌ కట్టుబట్టలతో మిగిలాడు. సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగితే.. పిల్లలు కుంగిపోతారు. నిరాశకి గురవుతారు. ధైర్యం కోల్పోతారు. కానీ శరత్‌ నిలబడ్డాడు. అదే క్యాంపస్‌లో నిలబడ్డాడు. భయపడితే బతుకెక్కడ…? అందుకే మరింత బలంగా, మనోనిబ్బరమే శిఖరంగా మారినట్టు నిలబడ్డాడు. అతనికి మేథావులు, అధ్యాపకులు, విద్యార్థులు అండగా నిలిచారు. అప్పుడెప్పుడో జార్జిరెడ్డి… ఇదిగో మళ్లీ ఇప్పుడు శరత్‌ అనిపించుకున్నాడు. (జార్జిరెడ్డిని భౌతికంగా అంతం చేయగలిగారు కానీ అతని భావాలను మాత్రం అంతంచేయలేకపోయారు) అతనికి చెడు చేయాలనుకున్న వారు మాత్రం కలుగుల్లో దాక్కున్నారు. భీమ్‌ డ్రమ్‌ కార్యక్రమం ద్వారా శరత్‌ తన శక్తి ఏమిటో చాటుకున్నాడు. దళిత, బహుజన, ఆదివాసీ, ముస్లిం, మహిళల రాజకీయాధికార లక్ష్య ప్రకటన చేశాడు. దాని సాంస్కృతిక అభివ్యక్తే భీమ్‌ డ్రమ్‌..!

sarat1

3. దళిత సాంస్కృతిక దర్శనం

భీమ్‌ డ్రమ్‌ ఒక విలక్షణ ప్రయోగం. అభ్యుదయ, విప్లవ, జానపద, తాత్వగీత, కవ్వాలీ రాగాల సమ్మేళనం. బహుభాషలలో సాగిన స్వరమాలిక. ఈ సందర్భంగా పాడిన పాటలు, ఆలపించిన రాగాలు, దరువుకి తగ్గట్టుగా విద్యార్థి బృందం లయబద్ధంగా వేసిన అడుగులు… ఒకదానికొకటి చేర్పుగా ఒక కూర్పుగా మారాయి. మరొక్కసారి మరొక్క పాట అని అడిగిమరీ పాడించుకున్నారు ఆహూతుల చేత. బీఫ్‌ యేంతమ్‌, బఫెల్లో సోల్జర్‌ గీతాలు “రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌” కాన్సెప్టుని ప్రతిఫలించాయి. గొడ్డు మాంసం తిన్న బుద్ధుడు, జీసస్‌, ఐన్‌స్టీన్‌, కారల్‌ మార్క్స్‌, అంబేద్కర్‌లే ఈ ప్రపంచాన్ని మార్చగలిగారనీ, వారే తమకు ఆదర్శప్రాయులనీ కంచ ఐలయ్య ఈ వేదిక మీదనుంచి విస్పష్ట ప్రకటన చేశారు.

అక్షరాలు ఉన్న చోట ఆలయాలా అని హేళనగా ప్రశ్నించారు. ఇకపై దళిత, బహుజనుల కళాకారులు నిండు వస్త్రధారణతోనే ప్రదర్శనలు ఇవ్వాలని ఐలయ్య పిలుపునిచ్చారు. ఇంగ్లీష్‌ చదువుల అభ్యాసం, దేశ విముక్తి అనే లక్ష్యం తమ ముందున్న కర్తవ్యాలని చెప్పారు. ఫ్యూడల్‌, మతోన్మాదశక్తులను ఎదుర్కొంటూ ఈ ఆశయ సాధన కోసం పునరంకితమవుతామని అన్నారు. ఉత్పత్తి కులాలు ఏకమైతే అధికారం తమదే అన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కొద్ది మాటలు కూడా ఆటపాటల మధ్య ఆటవిడుపుగా చెప్పినవే. ప్రధాన వక్తలుగా వచ్చిన కొద్దిమంది మినహా మిగతా అందరూ పాటలతోనే తాము చెప్పదలుచుకున్నది చెప్పారు.

భీమ్‌ డ్రమ్‌ జరుగుతుందని తెలిసి… ఇందులో పాల్గొనడానికి పలు సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా వచ్చారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి నుంచి మార్పు కళామండలి వ్యవస్థాపకులు ప్రత్యేకంగా విచ్చేసి అంబేద్కర్‌, ఫులేలపై పాటలు పాడారు. తన పాటతో అంబేద్కర్‌ని జయరాజ్‌ అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న మరోసారి దళిత చిందేశాడు. భీమ్‌ డ్రమ్‌ ఈవెంట్‌ కోసమే కామ్రేడ్‌ మిత్ర రాసిన గీతాన్ని విమలక్క బృందం గానం చేసింది. ధీమ్‌ సాంగ్‌గా స్కైబాబా రాసిన కవ్వాలీ ఓయూ క్యాంపస్‌లో అలాయి బలాయిని మళ్లీ ఆడించింది. భీమ్‌ బోలోరె మీమ్‌ కొ లేకే మీమ్‌ బోలోరె భీమ్‌ || భీమ్‌ || ఖాందా మిలాలే – దిల్‌ సె లగాలే || ఖాందా || బోలోరె బోలో భీమ్‌ భీమ్‌ భీమ్‌ || అంటూ సాగిన ఆ గీతానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ కోరస్‌ ఇచ్చారు. జిలుకర శ్రీనివాస్‌, కోట శ్రీనివాసగౌడ్‌, పసునూరి రవీందర్‌, గుర్రం సీతారాములు,సూరేపల్లి సుజాత వంటి దళిత థింకర్స్‌, రైటర్స్‌ కార్యక్రమంలో హుషారుగా పాల్గొని ఊపునిచ్చారు. కొత్త చూపుని అందించారు.

ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే… ఓయూ సాక్షిగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇంతటితో ఆగబోవడం లేదు. ఇదే తరహా కార్యక్రమాలను తెలంగాణలోను, ఇతర రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల్లో కూడా నిర్వహించాలని నలిగంటి శరత్‌ ప్రభృతుల ఆలోచన. విద్యార్థి, యువజనుల ముందు తమ ప్రణాళికను ఉంచాలనీ, కవిగాయక బృందాలను కదిలించి రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌లో కలుపుకు రావాలనీ వారి తాపత్రయం. తదనంతర కాలంలో దీనినొక రాజకీయ అభివ్యక్తిగా తీర్చిదిద్దాలన్నది వారి సంకల్పం. శరత్‌ అనే మొండిఘటానికి, ఐలయ్య అనే జగమెరిగిన దళిత మేధావి తోడవడంతో సమీప భవిష్యత్‌లోనే ఇందుకు వారు ఉద్యుక్తులు అవుతారన్న నమ్మకం కలుగుతోంది. ఇదీ మొత్తంగా భీమ్‌ డ్రమ్‌ అనే సాంస్కృతిక మహాప్రదర్శన తాలూకు అంతస్సారం…!

2009లో ఉస్మానియా విద్యార్థుల గర్జన తెలంగాణ ఉద్యమాన్ని ఏ మలుపు తిప్పిందో చూశాం. 2015 మే 3న కూడా ఉస్మానియాలో రిథమ్‌ ఆప్‌ బహుజన్స్‌ పేరుతో విద్యార్థులు గర్జించారు. దీన పరిణామ ప్రభావాలను ముందు రోజుల్లో చూడబోతాం.

*

అట్టలూ పోయాయి!

పి.మోహన్

 

P Mohanపదేళ్లకు మించిన అపురూప బంధం.. ఎన్నెన్ని సంభాషణలు, ఎన్నెన్ని స్పర్శలు! అసలు వియోగమనేది ఎప్పుడుందని? కడుపులోని బిడ్డకు తల్లి పేగులోంచి జీవాధారాలు అందినట్లు నిరంతరం నా బుర్రకు జ్ఞానధారను అందించిన నేస్తం. ఒక ఊరి నుంచి ఒక ఊరికి, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడల్లా బస్సుల్లో, లారీల్లో పసికూనలా తీసుకొచ్చి దాచుకోవడం.. ఏ నిధీ లేకున్నా అదే తరగని నిధి అని గర్వపడడం.. నిధి చాల సుఖమా, జ్ఞాననిధి చాల సుఖమా అని పాడుకోవడం.. అంతా ఒక వెర్రి ఆనందం!

ఇంటి నిర్మాణంలో ఒక భాగంగా అమరినట్లుండే నా ప్రియ నేస్తం శాశ్వతంగా దూరమైంది. నా ‘ఫంక్ అండ్ వాగ్నల్స్’ ఎన్ సైక్లోపీడియా ఇక కనిపించదు! మబ్బులు పట్టిన వేళ మిలమిల మెరిసే గిల్ట్ అక్షరాలతో ఇంటినీ, కళ్లనూ వెలిగించిన ఆ అనురాగ బంధం తెగిపోయింది. గత నెల నేను ఇంట్లో లేని ఒక శుభముహూర్తంలో మా ఆవిడ దాన్ని పాతపుస్తకాల వాడి తక్కెడతో పుటుక్కున తెంచేయించింది. వాడు కేజీల్లెక్కన  కొనేసి ఓ వంద మా ఆవిడ చేతుల్లో పెట్టిపోయాడు. పోతూపోతూ జ్ఞాపకంగా దాచుకొమ్మనేనేమో అట్టలను మాత్రం వదిలేసి వెళ్లాడు. అవి అమ్ముడుబోవట. ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక.. చాలా సేపటి తర్వాత.. ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించి, అదెక్కడా అని నేను కోపాన్ని అణచుకుంటూ శాంతంగా అడిగితే మా ఆవిడ సర్రున కోపం, చిరాకు, అక్కసు, వెటకారం, ఎత్తిపొడుపు వంటి సవాలక్ష రసాలతో ఇచ్చిన సమాధానం..

‘అమ్మి పారేసిన! కొంప ముందుగానే ఇరుకు. బోకులుబొచ్చెలకే గూళ్లు సరిపోవడం లేదు. ఇంక బుక్కులేడ పెట్టేది? చెమ్మకు రెండు పుస్తకాలకు చెదలు పట్టినాయి. అన్నిదాన్లకూ ఎక్కుతున్నాయి. అయినా నువ్విప్పుడు దాన్లను సదువుతున్నావా అంట! సదవనప్పుడు ఇంట్లో ఎందుకూ దండగ.. ! అందుకే అమ్మేసిన.. ఆ అటకబండపైన ఉన్న పుస్తకాలు కూడా ఎప్పుడో ఒకతూరి నీ నెత్తిపైనే పడతాయి.. దాన్లను కూడా ఎప్పుడో ఒకతూరి నువ్వు ఇంట్లో లేనప్పుడు అమ్మిపారెక్కుతా. అంతగా అయితే నువ్వు సొంత ఇండ్లు కట్టినాక కొనుక్కో ఆ బండపుస్తకాలను..’

తిరిగిరాని దాని కోసం కోపాలు, సంజాయిషీలు ఎందుకు. పైగా ఉన్నవాటినైనా కాపాడుకోవాలి కదా. అయినా అందులో ఆమె తప్పేముంది? పీత కష్టాలు పీతవి. ఇంటి సర్దుడులో ఆమెకవి శనిగ్రహాల్లా కనిపించి బెదరగొట్టేవి. అప్పటికి చాలాసార్లు విసుగుతో బెదిరించింది. ‘కోపమొస్తే దీన్లను ఎప్పుడో ఒకతూరి అమ్మిపారెక్కుతా’ అని. ‘చస్తా, చస్తా అన్న సవతే కానీ చచ్చిన నా సవితి లేద’న్న సామెతను గుడ్డిగా నమ్మి పట్టించుకోలేదు. అయినా ప్రియమైన వాటిని పోగొట్టుకోవడం కొత్త కనుకనా. అందుకే సోనియా గాంధీ ముందు మన్మోహన్ సింగు, మోడీ ముందు అద్వానీ దాల్చే మౌనముని అవతారం దాల్చేశా. బంధం తెగిపోతే పోయిందిలే, దాని ఆనవాళ్లుగా అట్టలయినా మిగిలాయిలే అనుకుని పిచ్చిగా సంతోషపడ్డాను.

3. maa avida mechin kalakhandalu

కానీ ఆ ఆనవాళ్లనూ మా ఆవిడ మొన్న పిచ్చి ఐదు రూపాయల బిళ్లకు అమ్మేసింది. ఈ సారి కొన్నవాడు మరీ పాతపాత పుస్తకాలవాడు అయ్యుంటాడు. అయినా ఇప్పుడు వగచి ఏం లాభం! అట్టలలైనా అలా పడుండనివ్వవే అని చెప్పకపోవడం నా తప్పే కదా ! జీవితంలో వస్తున్న అవాంఛనీయ, అనివార్య మార్పుల్లో భాగంగా గత నెల అప్పు చేసి ఓ కెమెరా ఫోన్ కొనుక్కున్నా. దాంతో నా ఎన్ సైక్లోపీడియాను ఫొటో తీసుకుని ఉంటే ఎంత బావుండేది! పోనీ, ఆ పుస్తకాలు అమ్మేసిన తర్వాత మిగిలిన అట్టలలైనా ఫొటో తీసుకునే ఉంటే ఆ జ్ఞాపకం నిలిచిపోయేది కదా. ఆ తెలివి లేకపోయింది నాకు(నాకు అసలు తెలివనేది ఉందా అని మా ఆవిడకు నిత్య అనుమానం. తెలివిగల వాళ్లు పుస్తకాలు చదవరని, వ్యాపారాలు చేసి బాగా సంపాదిస్తూ ఇళ్లు, కార్లు, బంగారం, చాటడంత సెల్ ఫోన్లు, పెళ్లాలకు పట్టుచీరలు కొంటుంటారని.. ఊటీ, కాశ్మీర్లకు తీసుకెళ్తుంటారని ఆమె ప్రగాఢ విశ్వాసం).

కెమెరా ఫోన్ అంటే నా తొలి కెమెరా ఫోన్ గుర్తుకొస్తోంది. నేను పుట్టిన కడప జిల్లా ప్రొద్దుటూరిలోని హోమస్ పేటలో ఉన్న ‘మా’ ఇంటి ఫోటోను పదేళ్ల కిందట డొక్కు కెమెరా ఫోన్ తో ఫొటో తీసుకున్నాను. ఐదారు కుటుంబాలు కాపురం చేసేంత పెద్ద ఇల్లు అది. 1980లలో దాన్ని మా పెదనాన్న తన తండ్రి, తమ్ముళ్లపై సామదానభేదదండోపాయాలు ప్రయోగించి తన పేర రాయించుకుని కొన్నాళ్ల తర్వాత లక్షలకు అమ్మేశాడు. కనీసం జ్ఞాపకంగానైనా ఉంటుంది కదా అని ఆ ఇంటి ముందు భాగాన్ని ఫొటో తీసుకున్నాను. 1950లలో కట్టిన ఆ ఇంటి వసారాలో రెండు పెద్ద బర్మాటేకు స్తంభాలుండేవి. వాటికి మా నాయనమ్మ నారమ్మ ఊయల కట్టి, అందులో నన్ను పడుకోబెట్టి ఊపుతూ  ‘రార.. రార సన్నోడా..’ అని పాడుతుండేదట. దూలాల్లాంటి ఇంటి అరుగుపైన మా తాత నాకు బిస్కెట్లు, తాటిముంజెలు, మెత్తని మాంసం ముక్కలూ తినిపిస్తుండేవాడట.

నేను తీసిన ఫొటోలో ఆ స్తంభాలు, అరుగులు కూడా పడ్డాయి. ఆ ఇల్లు మాకు దూరమైనట్టే ఆ ఇంటి ఫొటో ఉన్న కెమెరా కూడా దూరమైపోయింది. దాన్ని 2008లో హైదరాబాద్ సిటీ బస్సులో దొంగ ఎవడో కొట్టేశాడు. ఆ ఇంటిని కొన్నవాళ్లు దాన్ని కూల్చేసి, పెద్ద భవనం, కాంప్లెక్సు కట్టారని ఇటీవల తెలిసింది. దోగాడి, పాకి, పసుపుకొమ్ముల్లాంటి మా అమ్మ చేతులు, నల్లరేగు పళ్లలాంటి మా మేనత్త చేతులు పట్టుకుని ఆడుకున్న ఆ కడప బండరాళ్ల ఇంటి జ్ఞాపకం అట్లా శిథిలమైపోయింది.

2. atakekkin art pustakaalu

అలాంటి ప్రేమాస్పద దృశ్య జ్ఞాపకాలెన్నో తడిచూపుల మధ్య చెరిగిపోయాయి. బతుకు పోరాటంలో మా అమ్మ కోల్పోయిన చిన్నపాటి నగలు, కోపతాపాలతో ఇంట్లో వాళ్లూ, బంధువులూ పోటీలు పడి కాల్చేసుకున్న ఆత్మీయుల వస్తువులూ, అపురూపమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలూ, పదో తరగతిలో సంస్కృతంలో స్కూలు ఫస్ట్ వచ్చినందుకు ఓ కోమటాయన బహుమానంగా ఇచ్చిన ఐదొందలను బట్టలు కొనుక్కోకుండా ఇంటర్ పుస్తకాల కోసం ఖర్చుపెట్టిన దయనీయ సాయంత్రమూ.. ఇంకా ఇంటర్ గట్టెక్కలేక అవమానాలు భరించలేక ఉరేసుకున్న కుంటి మిత్రుడు రామ్మోహనూ, ఇంటి గొడవలతో 22 దాటకుండానే పురుగుమందు తాగిన ఆప్తమిత్రుడు నాగేశుతో దిగిన ఫొటోలూ.. చచ్చిపోయిన పెంపుడు కుక్కలూ, నల్లపిల్లులూ, తాబేళ్లూ, చిలుకలూ..

అయినా  కోల్పోయింది కేవలం దృశ్యాత్మక జ్ఞాపకాలనేనా? ఉద్యమోత్సాహంలో పచ్చగా కళకళలాడే అడవుల్లో, సెలయేళ్ల మధ్య అనుభూతించిన ఆత్మీయ ఆలింగనాలు, వెచ్చని బలమైన కరచాలనాలు, గుప్పుమని వీచే అడవి మల్లెల పరిమళాల వేళ కన్నీళ్లు లేని లోకం కలగంటూ రేయింబవళ్లు ఎడతెగకుండా జరిపిన ఎర్రెర్రని చర్చలు, మళ్లీ కలుసుకోలేమోనన్న భయంతో చివరిసారి అన్నట్లు మహాప్రేమతో కళ్లారా చూసుకుంటూ లాల్ సలామ్ అంటూ ఇచ్చిపుచ్చుకున్న తడిచూపుల వీడ్కోళ్లు..

ఇప్పుడవన్నీ ఎండమావులు. గతమంతా మసకమసక పగుళ్లు. యాదృచ్ఛికంగా తారసపడినా అంతా భ్రాంతియేనా అన్న భావన. గుర్తుకు వచ్చీ రాని పేర్లు, ముఖాలు, ఊళ్లు, బాటలు, ఎన్ కౌంటరయిపోయి నెత్తురు మడుగు కట్టిన స్మృతుల పరంపర. కాలం పాతగాయాలనే కాదు, అజాగ్రత్తగా ఉంటే మరపురాని జ్ఞాపకాలనూ మానుపుతుందేమో!

ఎన్ సైక్లోపీడియా నుంచి దారి తప్పి ఎక్కడికో వచ్చాను. ఇలా శాఖాచంక్రమణాలు చేయొద్దని ఎన్నిసార్లో అనుకుంటాను కానీ సాధ్యం కాదు. పన్నెండేళ్ల కిందట.. అప్పటికింకా ఇంటర్నెట్ ఇళ్లలోకి, ఫోన్లలోకి అంతగా చొచ్చుకురాని కాలం. ఏదైనా అవసరమొస్తే ఇంటర్నెట్ సెంటర్ కో, పబ్లిక్, యూనివర్సిటీల లైబ్రరీలకో వెళ్లి తెలుసుకునే కాలం. 2004లో పనిపై హైదరాబాద్ లో కొన్ని నెలలు ఉన్నప్పుడు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అబిడ్స్ కు వెళ్తుండేవాడిని. చాలా వరకు ఆర్ట్ పుస్తకాలనే కొనేవాడిని. ఒకసారి ఫంక్ అండ్ వాగ్నల్స్ న్యూ ఎన్ సైక్లో పీడియా 1991 ఎడిషన్ 29 వ్యాల్యూములూ దొరికాయి. బతిమాలి, బామాలి 1,600 రూపాయలకు కొన్నట్లు గుర్తు. వాటిని పెద్ద అట్టపెట్టెలో ఆటోలో రూమ్ కు తీసుకొచ్చాను. కొన్నాళ్లు ప్రతి వ్యాల్యూమునూ తడిమితడిమి చూసుకుంటూ ఉబ్బుతబ్బిబ్బయ్యాను. ఏ టు జెడ్ జ్ఞానం కదా.

ముఖ్యంగా ఆర్టిస్టుల బయాగ్రఫీలు, పెయింటింగులు చూస్తూ, చదువుతూ నిద్రాహారాలు మరచిపోయేవాడిని. అలా కొన్నాళ్లు గడిపాక, ఒక అనివార్యత వల్ల రూమ్ ఖాళీ చేసి, అనంతపురంలోని అక్కలాంటి, అమ్మలాంటి శశికళ ఇంటికి పంపాను, మా ఇంటికి పంపలేక.  కొన్నాళ్ల తర్వాత తిరిగి అనంతపురం వెళ్లాక వాటితో కుస్తీ పడుతూ గడిపాను. రాసుకున్న కవితలకు, ‘అడవి చిట్టీల’కు, ఉత్తరాలకు, పదీపరకా డబ్బులకు ఆ పుస్తకాలు భద్రస్థలాలు. డోంట్ కేర్ గా బతికిన కాలమది. కానీ కాలం లెక్కలు కాలానికుంటాయి. మనం లెక్కచేయకున్నా మనల్ని లెక్కచేసే దొంగనాయాళ్లు వేయికళ్లతో, లాఠీలు, తుపాకులతో కాచుకుని ఉంటారు. వాళ్ల బారిన పడి మనోదేహాలు ఛిద్రమయ్యాక అనంతపురాన్ని వీడి ఇంటికెళ్లాను, ఎన్ సైక్లోపీడియాను వెంటబెట్టుకుని.

బతుకులో అటూ ఇటో తేల్చుకోవాల్సిన కాలమది. కమ్చీ దెబ్బలు తిన్నవాడికి, తినని వాడికి చాలా తేడా ఉంటుంది. పైగా దెబ్బమీద దెబ్బ తినగలిగేవాళ్లు అతికొద్దిమందే ఉంటారు. నేను ఆ కొందరి కోవకు చెందని వాడిని కనుక మిత్రులు దెప్పుతున్నట్లు ‘సేఫ్’ సైడ్ ను ఎంచుకున్నాను. సామాన్యులకు సేఫ్ అనేది ఎప్పుడూ సాపేక్షికం, ఎన్ సైక్లోపీడియాలో ఎన్నిసార్లు చదివినా అర్థం కాని సాపేక్ష సిద్ధాంతంలా! కష్టం తప్ప ఏ సిద్ధాంతమూ కూడు పెట్టదని జ్ఞానోదయమయ్యాక పొట్ట చేతపట్టుకుని తిరిగి భాగ్యనగరానికి వచ్చాను. కాస్త సాపేక్షికంగా నా కాళ్లపై నేను నిలబడి, పెళ్లి చేసుకున్నాక నా ఎన్ సైక్లోపీడియాను తిరిగి తెచ్చుకున్నాను. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నా ఊరకే దాన్ని అప్పుడప్పుడూ తిప్పుతుండడం అలవాటుగా ఉండేది. ఇటీవల కొన్నాళ్లుగా అది తప్పింది. అందుకే ఒక గూటిలో సర్దుకుపోకుండా మరో గూటిని ఆక్రమించే ఆ పుస్తక సంచయం మా ఆవిడకు అక్కర్లేని పెను భూతమైపోయింది. అట్లా హైదరాబాద్ లో కొనుక్కున్న నా జ్ఞానభాండం ఎంతో భద్రంగా ఊళ్లు తిరిగి తిరిగి చివరికి ‘విధిరాత’లా మళ్లీ హైదరాబాద్ చేరి, అట్టలు వొలిపించుకుని బద్దలైపోయింది.

అరచేతిలో ఇంటర్నెట్ ఒదిగిన ఈ కాలంలో బోడి పాతికేళ్ల కిందట అచ్చయిన, డొక్కు, ఔట్ డేటెడ్, దండగమారి, అక్కర్లేని, చదలు పట్టిన ఎన్ సైక్లోపీడియా కోసం అంతగా వగస్తావెందుకు అంటున్నారు మిత్రులు. అన్నీ ఇంటర్నెట్ లో దొరుకుతాయని వాళ్ల భ్రాంతి(పోనీ నా భ్రాంతి కూడా అనుకోండి!) అక్కర సాపేక్షికం. పనికిరావని పారేసుకున్న వాటి అసలు విలువ ఏమిటో తెలిసినప్పుడు గుండె పట్టేస్తుంది. కళ్లు సజలమవుతాయి. దుఃఖపు ఉప్పెన జపాన్ అమర కళావేత్త హొకుసాయ్ వేసిన ‘కనాగవా మహాకెరటం’ చిత్రంలా వేయి పడగలతో విరుచుకుపడుతుంది. అల విరగిపడ్డాక బోల్తాపడిన శూన్యపు పడవల్లా మిగిలిపోతాయి కళ్లు.

1. funk and wagnalls

ఇప్పటికి మూడొందలకు పైగా పుస్తకాలు కొనుంటాను. అడుక్కున్నవీ, మళ్లీ ఇస్తానని తెచ్చుకుని ఇవ్వనివీ మరో రెండు వందలుంటాయి. నేను నా మిత్రులకిచ్చినవీ, వాళ్లు నా దగ్గర పుచ్చుకుని తిరిగివ్వనివీ అంతే సంఖ్యలో ఉంటాయి. స్థలం చాలక చాలా వాటిని మూటలు కట్టిపెట్టాను. తరచూ అవసరయ్యేవాటిని అటకెక్కించాను. ఈ అటక విద్య నాకంటే మా ఆవిడకు మరింత బాగా తెలుసు. ఇల్లు ఇరుకని గోలచేసే ఆమె తను మహా కళాఖండాలుగా భావించే బాతు, కుక్క, కొంగ, కోడి బొమ్మలను మాత్రం షోకేస్ లో చక్కగా విశాలంగా సర్దుతుంది. వారానికోసారి జాగ్రత్తగా తుడుస్తుంది. సంక్రాంతికి సంక్రాంతికి సబ్బెట్టి తోమితోమి స్నానాలు కూడా చేయిస్తుంది. నా పుస్తకాలను మాత్రం పనికిరాని చెండ్లలా అటకపైకి విసిరిపారేస్తుంది. ఎదుటివాళ్ల అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్యం. ఈ వింత ప్రజాస్వామ్యంలో నాకు ఏదైనా పుస్తకం అవసరమైతే మంచాలూ, కుర్చీలూ ఎక్కి ఆ అటకపైని పద్మవ్యూహంలోకి చొరబడి వెతుక్కోవడం. చాలాసార్లు అభిమన్యుడి చావులే.

కొన్నిసార్లు కొన్నిపుస్తకాలు కనిపించవు. ఆవిడకేసి చూస్తాను. ఆమె మౌనయోగినిలా చూసి పక్కగదిలోకి వెళ్లిపోతుంది. ఆ చూపులకు సవాలక్ష అర్థాలు! కనిపించని పుస్తకాలు ఒక్కోసారి విఠలాచార్య సినిమాల్లో దెయ్యాల మాదిరి అటకెక్కిన పాత కుక్కర్లో, పాతచీరల మధ్యలో, పాతసామాన్ల మూటల్లో, ఇంకా ఊహించశక్యం కాని నానాస్థలాల్లో దర్శనమిస్తాయి. అసలు కనిపించకుండా పోవడం కంటే ఎక్కడో ఒక చోట పడుంటే మేలు కదా. ఇంట్లో ఎన్ని పుస్తకాలున్నా ఎన్ సైక్లోపీడియానే చుక్కల్లో చందమామలా కొట్టొచ్చినట్టు కనపడేది 1,2,3…. 29 నంబర్లతో వరుసగా ఎర్రని అట్టలపై బంగారువన్నె అక్షరాలతో, యూనిఫామ్ లో వరుసగా నిల్చున్న బడిపిల్లల్లా.

ప్రతి ఇష్టానికీ కారణం లేకపోవచ్చు కాని, ప్రతి వియోగానికీ ఒక కారణముంటుంది. సామాన్యులకు ఎదురయ్యే వియోగాల కారణాల్లో చాలా తక్కువ మాత్రమే స్వయంకృతాలు, మిగతాన్నీ అన్యకృతాలు. బోడి పుస్తకాల కోసం ఇంత వలపోత ఎందుకని పాఠకులకు అనిపిస్తుండొచ్చు. ఒక నిర్దిష్ట కాలపు వ్యక్తుల సామూహిక  ఈతిబాధలు సహజంగానే చరిత్రలో భాగం అవుతాయని అంటారు కదా, అందుకని. అలాగని నా గోస చరిత్రకెక్కాలన్న తపనేం నాకు లేదు కానీ, రాసుకోకుంటే చాలా జ్ఞాపకాలను మరచిపోతాం కనుక ఇలా రాతకెక్కించడం.

గూళ్లు లేని ఇరుకు ఇల్లు, చదలు పట్టడం, కొన్నాళ్లుగా ముట్టకపోవడం వగైరాలు.. ఎన్ సైక్లోపీడియాతో నా అనుబంధం తెగడానికి కారణాలని మరోసారి సరిపెట్టుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ పాత పుస్తకాల షాపుల్లో ఫంక్ అండ్ వాగ్నల్స్ ను మించిన బ్రిటానికా, మ్యాక్ మిలన్ వంటి ఎన్ సైక్లోపీడియాలు పది, పదిహేను వేలకు వస్తాయి. బేరమాడితే ఇంకా తక్కువకు. కానీ.. కలం, కాగితం అక్కర్లేకుండా తయారైన ఈ వ్యాసాన్ని జీమెయిల్ లో ‘సారంగ’కు పంపుతున్న నాలో.. గూళ్లకు సరిపడే ఆ జ్ఞానభాండాగారాలను కొనాలన్న అభిలాష ఇంకా మిగిలి ఉందా అని?

*

 

 

అవ్యవస్థపై అపహాస్యం, ధిక్కారం పతంజలి అక్షరం

ఎన్ వేణుగోపాల్

 

venuమళ్లీ మళ్లీ చదివినకొద్దీ, ఆలోచించినకొద్దీ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రేరేపించగల శక్తి పతంజలి రచనలది. అందుకు కొంతవరకు కారణం ఆ రచనలలోని బహుళార్థ సూచన, బహుళార్థబోధకత కావచ్చు. రచయిత అన్ని సందర్భాల్లోనూ ప్రయత్నపూర్వకంగా ఆ బహుళార్థ సూచన ఉద్దేశించారని చెప్పడం అతిశయోక్తే అవుతుంది. ఆయన అలా ప్రత్యేకంగా రాసిన సందర్భాలు కూడ కొన్ని ఉన్నాయి గాని అంతకన్న ముఖ్యంగా రెండు కారణాలు ఉండవచ్చునని అనిపిస్తుంది.

ఒకటి, విస్తృతమైన అధ్యయనం వల్ల, వస్తుశిల్పాలలో అపార వైవిధ్యం ఉన్న సాహిత్యాన్ని చదవడం మాత్రమే గాక జీర్ణం చేసుకున్నందువల్ల ఆయన రచనల్లోకి ఈ బహుళార్థకత సహజంగా ప్రవహించి ఉంటుంది. రెండు, ఆయన రచనలన్నిటిలోను మానవ అనుభవ, మానవ అస్తిత్వ సారాంశాన్ని నైసర్గికంగా, సహజంగా పట్టుకున్నారు గనుక మానవ అస్తిత్వంలో గుణాత్మక మార్పు వచ్చేవరకూ ఆ విభిన్న కోణాలు పఠిత స్ఫురణకు వస్తూనే ఉంటాయి. అంటే ఆ బహుళత్వం వ్యక్తీకరణ పొందుతూనే ఉంటుంది. అలాగే, మానవ అస్తిత్వ సారం అన్నప్పుడు కూడ సాధారణంగా సాహిత్యానికి, ప్రత్యేకంగా తెలుగు సాహిత్యానికి తెలిసిన పరిమిత, సంకుచిత, ఏకైక రూపంలో ఆయన అర్థం చేసుకోలేదు. దాన్ని కేవలం వేదనగానో, సంతోషంగానో, విచికిత్సగానో మాత్రమే ఆయన అర్థం చేసుకోలేదు, అన్నీ కలగలసినదిగా, విశాలమైనదిగా, లోతైనదిగా అర్థం చేసుకున్నారు. అందువల్ల కూడ ఆయన రచనలకు బహుళార్థ బోధకత వచ్చిఉండవచ్చు.

నిజానికి తెలుగుసాహిత్య చరిత్రలో పతంజలి రచనలు రాశి రీత్యా చాల ఎక్కువేమీ కావు. పది నవలలు (ఖాకీవనం – 1980, పెంపుడు జంతువులు – 1982, రాజుగోరు – 1983, వీరబొబ్బిలి – 1984, అప్పన్న సర్దార్ – 1986, గోపాత్రుడు – 1992, పిలకతిరుగుడు పువ్వు – 1995, ఒక దెయ్యం ఆత్మకథ – 1992, నువ్వేకాదు – 1996, రాజుల లోగిళ్లు – 2002 అసంపూర్ణం), ముప్పై లోపు కథలు, పదిహేనో పదహారో అనువాద/జ్ఞాపక కథలు, కొన్ని వ్యాసాలు, సంపాదకీయాలు…అన్నీ కలిపినా పద్నాలుగు వందల పేజీల సాహిత్యసంపద మాత్రమే. ఆ సాహిత్యరాశి కొంతవరకు తక్కువే అనిపించినా, అది సందర్భం మారినప్పుడల్లా, బహుశా మారనప్పుడు కూడా ఎప్పటికప్పుడు కొత్త పాఠకులను, కొత్త అర్థాలను, కొత్త చూపును పునరుత్పత్తి చేస్తున్నది. ఒక పఠనంలో అర్థం కాని విషయాలు మరో పఠనంలో తెలియవస్తున్నాయి. ఒక పఠనంలో తెలియని వైశాల్యమూ లోతూ మరొక పఠనంలో బైటపడుతున్నాయి. కొత్త అర్థాలు గోచరిస్తున్నాయి. పతంజలి సాహిత్యానికి ఈ అసాధారణమైన శక్తినిచ్చిన విశిష్టత గురించి కొన్ని ఆలోచనలు పంచుకోవడమే ఈ వ్యాసలక్ష్యం.

ప్రక్రియ ఏమైనప్పటికీ, పతంజలి రచనలన్నిటికీ సాధారణ లక్షణం అవ్యవస్థను అపహాస్యం చేయడం, అవ్యవస్థ మీద ధిక్కారాన్ని ప్రకటించడం. నిజానికి ఈ లక్షణంలో పతంజలి ప్రత్యేకత ఏమీ లేదు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రధాన ధోరణి ఆ లక్షణమే. కందుకూరి వీరేశలింగం నాటి నుంచి ఇవాళ్టిదాకా ప్రతి తెలుగు రచయితా ఏదో ఒక స్థాయిలో అవ్యవస్థ గురించే రాస్తూ ఉన్నారు. అవ్యవస్థను కొందరు ఊరికే యథాతథంగా చిత్రించి ఉండవచ్చు, మరి కొందరు అసహ్యం కలిగేట్టు చిత్రించి ఉండవచ్చు. కొందరు అపహాస్యం చేయడమో, ధిక్కరించడమో చేసి ఉండవచ్చు. మరికొందరు ఇంకా ముందుకు వెళ్లి ఈ అవ్యవస్థను ధ్వంసం చేసే, ఒక కొత్త వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనలూ చేసి ఉండవచ్చు. మొత్తం మీద అవ్యవస్థ గురించి రాయని సాహిత్యకారులు, ఈ వ్యవస్థ బాగుందని రాసిన సాహిత్యకారులు తెలుగులో దాదాపుగా లేరనే చెప్పాలి.

అయితే పతంజలి విశిష్టత ఏమంటే వ్యవస్థనూ, అవ్యవస్థనూ అర్థం చేసుకునే పద్ధతిలో ఆయన గణనీయమైన మార్పు తెచ్చాడు. అప్పటివరకూ అసమగ్రంగా ఉన్న అవగాహనను ఆయన రచనలు విశాలం చేశాయి. అంతకు ముందు వ్యవస్థ పట్ల సమగ్ర అవగాహన ఉన్నవారిలో కూడ ప్రాధాన్యతల హెచ్చుతగ్గుల వల్ల దృష్టి పడని అవ్యవస్థలను, అవ్యవస్థల సూక్ష్మ, విస్మృత కోణాలను కూడ ఆయన రంగస్థలం మీదికి లాగి వాటిని తన విమర్శకు లక్ష్యం చేశాడు. నిజానికి అపహాస్యాన్నీ, ధిక్కారాన్నీ ప్రధాన సాధనాలుగా చేసుకుని, ఆయన అప్పటివరకూ విమర్శ అంటే ఉండిన అర్థాన్ని కూడ మార్చాడు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు వీరేశలింగం దగ్గరే అవ్యవస్థ మీద విమర్శ ప్రారంభమయిందనుకుంటే, పితృస్వామిక వ్యవస్థలోని (లేదా అవ్యవస్థలోని) స్త్రీ విద్యకూ పునర్వివాహానికీ అవకాశం ఇవ్వని ఒకటి రెండు చిన్న అంశాల మీదనే ఆయన ఎక్కుపెట్టాడు. అప్పటినుంచి బహుశా విప్లవ సాహిత్యోద్యమం వచ్చేవరకూ తెలుగు సాహిత్యంలో అవ్యవస్థను ఖండించిన రచయితలందరూ కూడ ఏదో ఒక అవ్యవస్థను, లేదా కొన్ని అవ్యవస్థలను, లేదా సామాజిక అవ్యవస్థలోని కొన్ని అంశాలను మాత్రమే పట్టించుకున్నారు, విమర్శించారు, మార్చడానికి ప్రయత్నించారు.

patanjali choopu

ఈ క్రమంలో సామాజిక అవ్యవస్థ అంతటికీ మూలకారణం అసలు వ్యవస్థలోనే చూడాలని, విడివిడి అంశాలలో కాదని అవగాహన పెరిగింది. కాని దానితోపాటే, వ్యవస్థను మార్చడమంటే ప్రధానంగా అధికార వ్యవస్థలను మార్చడమనే, విమర్శించడమనే అవగాహన కూడ పుట్టిపెరిగింది. అధికార వ్యవస్థలను విమర్శించడమే వ్యవస్థ మీద విమర్శగా సాగింది. సాధారణంగా పాశ్చాత్య ప్రజాస్వామిక సంప్రదాయంలో అధికార విభజనలో భాగంగా అధికార వ్యవస్థను మూడు అంగాలుగా – శాసననిర్మాణ, పాలక, న్యాయ విభాగాలుగా – విభజించడం అందరికీ తెలిసిందే. వీటినే సమాజానికీ, ప్రజాస్వామ్యానికీ మూల స్తంభాలుగా భావిస్తారు. నాలుగో స్తంభంగా పత్రికా వ్యవస్థను కూడ గుర్తించడం ప్రారంభించారు. ఈ నాలుగు రంగాలే సామాజిక అవ్యవస్థకు పాదులుగా ఉన్నాయి గనుక పతంజలి రచనలు ఈ నాలుగు రంగాల మీద విమర్శను ఎక్కుపెట్టాయి. ఈ నాలుగు వ్యవస్థలలోని అవ్యవస్థను ఆయన ఒక పద్ధతి ప్రకారం అపహాస్యం చేశారు, ధిక్కరించారు, అసహ్యం కలిగేలా చిత్రించారు, ఈ అవ్యవస్థ ధ్వంసమై, సువ్యవస్థ ఏర్పడక తప్పదనీ, ఆ సువ్యవస్థ నిర్మాణానికి తనవంతు కృషి చేయాలనీ పాఠకులు ప్రేరణ పొందడానికి అవసరమైన పేలుడు పదార్థమంతా తన రచనల్లో దట్టించారు.

అయితే ఈ అధికార వ్యవస్థల మీద, ప్రత్యేకించి మొదటి మూడు అధికారవ్యవస్థల మీద, ఇంకా తీవ్రమైన విమర్శ విప్లవ సాహిత్యోద్యమంలో కూడ ఉన్నదే. విప్లవ సాహిత్యం కన్న ఎక్కువ ఆదరణనూ, విస్తృతినీ పతంజలి రచనలు సాధించడానికి కారణమేమిటో అన్వేషించవలసి ఉంది. విప్లవ సాహిత్యం ప్రధానంగా ఈ అధికార వ్యవస్థల మీద గురి పెట్టింది గాని, అధికారం అమలు చేసే ఇతర వ్యవస్థలను గుర్తించలేకపోయింది. గుర్తించినా వాటి మీద విమర్శను తన సాహిత్యంలో భాగం చేయలేకపోయింది.

సమాజ చరిత్ర క్రమంలో “అనధికార వ్యవస్థలు” కూడ అధికారవ్యవస్థలతో సమానంగానో ఎక్కువతక్కువలుగానో అధికారాన్ని చలాయించడం ప్రారంభిస్తాయి. అధికారవ్యవస్థల మీద దృష్టి కేంద్రీకరణలో ఈ “అనధికార వ్యవస్థలు” విస్మరణకు గురి కాగూడదు. ఫ్రెంచి మార్క్సిస్టు తత్వవేత్త లూయీ ఆల్థూసర్  రాజ్యాంగయంత్రం గురించి వివరిస్తూ, ప్రభుత్వం, పాలన, సైన్యం, పోలీసులు, న్యాయస్థానాలు, జైళ్లు వంటి రాజ్యసాధనాలతో పాటే, అంతకన్న ఎక్కువగా వ్యవస్థా నిర్వహణలో పాల్గొనే మతం, విద్య, కుటుంబం, న్యాయభావన, రాజకీయాలు, కార్మికరంగం, ప్రచార సాధనాలు, సాహిత్య కళారంగాలు, క్రీడలు వంటి భావజాల రాజ్య సాధనాలు (ఐడియలాజికల్ స్టేట్ ఆపరేటస్) ఉంటాయని గుర్తించాలన్నాడు. రాజ్యసాధనాలు హింస మీద, బలప్రయోగం మీద ఆధారపడే ఏకీకృత శక్తిగా ఉండగా, భావజాల రాజ్య సాధనాలు బహుళత్వపు శక్తులుగా భావజాలం ద్వారా అదే పని చేస్తాయని అన్నాడు.

మరోమాటల్లో చెప్పాలంటే మతం, కులం, వంశం, కుటుంబం వంటి ఆభిజాత్యాలు, దురభిప్రాయాలు, అవకాశాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నుడికారం వగైరా ఎన్నో మానవసంబంధాల వ్యవస్థలు మన ఆలోచనల మీద, అభిప్రాయాల మీద, ప్రవర్తన మీద బలమైన ప్రభావం వేస్తున్నాయి. అవన్నీ అవ్యవస్థ స్థితిలోనే ఉన్నాయి. అంటే అవ్యవస్థ మనకు బైట ఎక్కడో కాదు మనలోపలే ఉంది. మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో ఉంది. మనం గురి చూడవలసిన లక్ష్యం అవతల ఉన్నమాట ఎంత నిజమో, మనలోపల ఉన్నమాట కూడ అంతే నిజం. అందుకే పతంజలి పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు, న్యాయవ్యవస్థ వంటి ప్రత్యక్ష అధికార వ్యవస్థల అవ్యవస్థ మీద ఎంతటి పదునైన విమర్శ ఎక్కుపెట్టారో, అన్నిరకాల భావజాల సాధనాల అవ్యవస్థ మీద అంతకన్న పదునైన విమర్శ ఎక్కుపెట్టారు. పతంజలి రచనల్లో ఏ ఒక్కటి తీసుకున్నా అధికారిక అవ్యవస్థ మీద ఎంత అపహాస్యం, ధిక్కారం ఉన్నాయో, స్వయంగా చదువరి భావాల్లో, ప్రవర్తనలో ప్రబలంగా ఉన్న భావజాల అవ్యవస్థల మీద అంత వెటకారమూ, ధిక్కారమూ ఉంటాయి.

అందుకే పతంజలి రచన సమాజం మీద ఎంతగా విమర్శో, అంతగా ఆత్మవిమర్శ. చదువరులంగా మనం ఏకకాలంలో ఒక పోలీసు అధికారినీ, రాజకీయ నాయకుడినీ, న్యాయమూర్తినీ, పత్రికాధిపతినీ అపహాస్యం చేస్తున్నట్టుగానే, ధిక్కరిస్తున్నట్టుగానే, మనలో ఉన్న మోసకారితనాన్నీ, నంగితనాన్నీ, అధికారాపేక్షనూ, లాభాపేక్షనూ, అటువంటి అవలక్షణాలన్నిటినీ కూడ అపహాస్యం చేసుకోవలసి ఉంటుంది. సమాజాన్ని శాసిస్తున్న, నిర్వహిస్తున్న వారి మీద ఎంతగా విమర్శ చేయవలసి ఉందో, ఆ శాసనాన్నీ నిర్వహణనూ ఆమోదిస్తున్న, అనుకరిస్తున్న, మౌనంగా భరిస్తున్న మనమీద మనం కూడ అంతగా విమర్శ చేసుకోవలసి ఉంటుంది. పతంజలి రచనల ఆకర్షణా బలమూ అదే. సాధారణంగా ప్రత్యర్థిని బైట చూసి విమర్శ చేసినప్పుడు మనకు ఒక సంతృప్తీ గర్వమూ కలుగుతుంటాయి. కాని ఆ ప్రత్యర్థి లక్షణాల్లో ఎంతో కొంత, శతాంశమో, సహస్రాంశమో మనలో కూడ ఉన్నప్పుడు, ప్రత్యర్థి మీద విమర్శకు పదను తగ్గుతుంది. అప్పుడు తప్పనిసరిగా అవసరమైనది ఆత్మవిమర్శ. లోచూపు. అది కలిస్తేనే అవ్యవస్థ మీద విమర్శ బలోపేతమవుతుంది.

“సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నాచుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఫలితంగా ఒకొక్కప్పుడు నా వ్యక్తిగత ప్రకటనే మరొక స్థాయిలో సామూహిక ప్రకటన అవుతుంది. సామూహిక క్రోధమే ఒకొక్కప్పుడు నా వ్యక్తిగత క్రోధమవుతుంది. సామూహిక శోకం నాకంట్లో ఒక నీటి బొట్టవుతుంది. ఏది సమూహం, ఏది వైయక్తికం” అని పతంజలి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆయన రచనల సమాజం-వ్యక్తి సమ్మేళనానికి, విమర్శ-ఆత్మవిమర్శ స్వభావానికి నిదర్శనం.

మరొక అంశం కూడ చెప్పుకోవాలి. పతంజలి కేవలం సామాజిక విమర్శకుడు మాత్రమే కాదు. ఆయన గొప్ప కళాత్మకత ఉన్న సృజనాత్మక రచయిత. అందువల్ల ఆయన రచన నిస్సారమైన విమర్శగా, విశ్లేషణగా ఉండదు. అది అపహాస్యం, వెటకారం, వ్యంగ్యం వంటి కళాత్మక దినుసులు అద్దుకుని ఆకర్షణీయంగా తయారవుతుంది. అది ధిక్కారంలా కనిపించకుండానే ధిక్కారం అవుతుంది. అది మళ్లీ ఉట్టి వెటకారమేనా, ఉట్టి ధిక్కారమేనా అంటే అంతమాత్రమే కూడ కాదు. మరింత ఉన్నతమైన సందేశం వైపు చూపుతుంది. తెలుగు సాహిత్యంలో అలవాటైన మొరటు, తక్కువస్థాయి పద్ధతిలో సందేశం చెప్పలేదు గనుక అసలు పతంజలి సాహిత్య లక్ష్యం సందేశం కానేకాదని వాదించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. వాచ్యంగా సందేశం ప్రకటించిన ‘పతంజలి భాష్యం’ వంటి రచనలు ఆయనలోని కళాకారుడివి కావనీ, ఆయన కథలూ నవలలూ సందేశం లేనందువల్లనే గొప్ప కళాత్మక రచనలనీ ఆయన మౌలిక స్వభావాన్నే ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారు.

కాని పతంజలి రచనల్లో సందేశం ఉందా లేదా, సాహిత్య ప్రయోజనం అనే ఉదాత్త లక్ష్యానికి పతంజలి రచనలు లొంగుతాయా లేదా, ఆయన కేవలం కళ కోసమే కళ అనుకున్న రచయితేనా అనే చర్చే అనవసరం. వాస్తవంగా చెప్పాలంటే, వాచ్య రూప సందేశం కన్న ధ్వని రూప, వ్యంగ్య రూప సందేశమే ఎక్కువ శక్తిమంతమైనది. అలా చూస్తే సామాజిక అవ్యవస్థ గురించీ, వ్యవస్థ మారవలసిన అవసరం గురించీ పతంజలి ఇచ్చినంత బలమైన సందేశాన్ని ఇచ్చినవాళ్లు తక్కువమంది.

*

అమ్మల దినం కమ్మని కావ్యం

సుధా శ్రీనాథ్

sudha“అమ్మా! కొరియన్ భాషలో కూడా అమ్మని ‘అమ్మా’ అనే అంటారట!” పాప స్కూల్నుంచి వస్తున్నట్టేచెప్పింది. తన క్లాస్‍లో ఉన్న కొరియన్ అమ్మాయి చెప్పగా వాళ్ళు కూడా మనలా కన్న తల్లిని‘అమ్మా’ అనే పిలుస్తారని అ రోజే తెల్సిందట. ఆ రోజు శుక్రవారం. ఇంక రెండ్రోజులకే మదర్స్ డే.అందుకే స్కూల్లో మదర్స్ డే గురించే ఎక్కువ మాటలు నడుస్తుంటాయి. ఆ మాటల్లో ఈ విషయంతెలిసి పాపకు చాలా ఆశ్చర్యమయ్యిందట. నాక్కూడా చాలా ఆశ్చర్యమయ్యింది. చిన్న పిల్లలతో ఆర్ట్క్లాస్‌లో అమ్మలకని మదర్స్ డే కార్డ్ చేయించేటప్పుడు పిల్లల మాటల్లో బయట పడిన విషయమిది.కొత్త విషయలేం తెల్సినా ఆ రోజే నాకు చెప్పే అలవాటు పాపకు. పాప నా కోసం చేస్తున్న మదర్స్ డేకార్డ్ గురించి కూడా చెప్పింది. నా ఇటాలియన్ స్నేహితురాలు అమ్మను ‘మమ్మా’ అనిపిల్చినప్పుడు అది అమ్మా అనే మాదిరే ఉందనుకొని సంతోషించాను నేను. అయితే అచ్చ తెలుగుపదమనుకొన్న అమ్మ అనే పదాన్ని అదే అర్థంతో వాడే ఇంకో దేశముందన్న విషయం తెలిసిమహదానందమయ్యింది.

 నిజం చెప్పాలంటే నాకు ఈ అమ్మల దినం గురించి తెల్సింది అమేరికాకొచ్చిన తర్వాతే. మొదట్లోతమాషాగా అనిపించినా నా స్నేహితుల్లోని అమ్మలందరినీ అభినందిస్తానా రోజు. అమ్మాయికి అమ్మపట్టం దొరికేది మొదటి బిడ్డకు జన్మనిచ్చిన రోజే. అందువల్ల మొదటి శిశువు పుట్టిన రోజే అమ్మపుట్టిన రోజు. అందుకే పాప పుట్టిన రోజే నాకు మదర్స్ డే అనేదాన్ని. ఈ సారైతే అది సరిగ్గా పాపపుట్టిన రోజే రావడం మళ్ళీ విశేషం.

 ఆ రోజు కోవెల్లో మా తేనె తెలుగు క్లాసులో కూడా అమ్మల దినం గురించే మాటలు. జన్మనిచ్చినావిడేజనని, అమ్మ అని టీచర్ అంటున్నట్టే “In seahorses, the male seahorse delivers the babies. So, father is the mother.” చిన్నారి నితిన్ తుంటరి నవ్వులతో అపరూపమైన ఈసత్యాన్ని తెలియజేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవడమే కాదు, వారి ప్రశంసలకుపాత్రుడయ్యాడు. అమ్మ నాన్నలిద్దరూ ప్రేమ స్వరూపులే అనేందుకిదొక చక్కటి ఉదాహరణమనిటీచరిచ్చిన బదులు తన సమయస్ఫూర్తిని చూపింది.

ప్రతియొక్కరూ లేచి నిలబడి అమ్మ గురించి తమ భావాలను వెల్లడించ సాగారు. చిన్న పిల్లలు తమబాల భాషలో అమ్మ తమకిష్టమైనవి వండి పెడుతుందని కృతజ్ఞతలను తెలిపితే, ఇంచు మించుపదేళ్ళ వయస్సున్న వారు కొందరు అమ్మ తమ కోసం చేసే ఎన్నో పనులను లిస్ట్ చేస్తూధన్యవాదాలు తెలిపారు.

అమ్మ ప్రతి రోజూ అందరికన్న ముందే లేచి అందరికీ అన్నీ సమయానికి సరిగ్గా సమకూర్చేందుకుకృషి చేస్తుందని ప్రతియొక్కరూ గుర్తు చేసి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేసారు. “While she tells she isn’t working, she is the one who works seven days a week.” అమ్మ గురించి ఓపాప చెప్పిన ఈ మాట అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. అమ్మ పనులకు ఆదివారం కూడా సెలవుదొరకదు. అయితే ఇంత చిన్ని పాపలే అంతగా ఆలోచిస్తున్నారనేది విశేషం.

తమ తప్పులు తిద్దేటప్పుడు కసిరినా కూడా అమ్మ అన్ని వేళల్లోనూ సహాయం చేస్తుందన్నారుకొందరు పిల్లలు. కొందరు తమ కృషికి తగ్గ ప్రతిఫలం దొరకనప్పుడు తమకు సహానుభూతి చూపించితమ మనోబలాన్ని పెంచే పని కూడా అమ్మ చేసిందని చెప్పారు. పిల్లల్ని మంచి నాగరికులుగాతీర్చిదిద్ది సమాజానికి సమర్పించే పుణ్య కార్యంలో అమ్మల పాత్ర అతి ముఖ్యం. అదేంసామాన్యమైన పని కాదు. దాని కోసం ప్రతి దినం, ప్రతి క్షణం, శ్రమించే అమ్మలకు అందరూఅంజలీబద్ధులై నమస్కరించారు.

యా దెవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

సకల జీవరాసుల్లోనూ మాతృ రూపంలో ఉండి మాతృ భావనలను పెంపొందించే జగన్మాతకి నమస్సుమాంజలి. ఇంకో అమ్మని సిద్దం చేసే శక్తి అమ్మకే ఉంది. తన అమ్మాయిలకు పిల్లల్ని సహృదయ నాగరికుల్లా తీర్చిదిద్దడానికి కావలిసిన మౌల్యాలను, కౌశల్యాలను, సహనాశక్తిని కూడా దారబోసి పెంచగలిగింది అమ్మొక్కతే.

‘అమ్మా’ అనే రెండక్షరాల మంత్రం అన్ని సమయాల్లోనూ శక్తినిచ్చే మంత్రం. ఏదైనా నొప్పి పెట్టినప్పుడు పలికే పదం ‘అమ్మా’ అని. వింతలు విడ్డూరాలు చూసినప్పుడు ‘అమ్మా’ అంటాం. ఆకలైతే ‘అమ్మా’ అంటాం. కష్ట సుఖాల్లో హాయినిచ్చే మంత్రమే అమ్మ. అమ్మ అనే బంధం అత్యమూల్యమని, అమ్మ అంటే ఆప్యాయతకు మరో రూపమని, తల్లిని మించిన దైవం లేదని అందరూ ఏకగ్రీవంగా అనుమోదించారు. కొందరు ఊర్లో ఉన్న అమ్మను తల్చుకొని కంట తడి పెడ్తే ఇంకొందరు పోగొట్టుకొన్న అమ్మను తల్చుకొని అశ్రుతర్పణమిచ్చారు. ఆ రోజు అందర్నీ నిజంగా భావుకుల్ని చేసింది.

అతి సులభంగా రాయగలిగే తల్లీ పాపల చిత్రాన్ని బోర్డ్‍పై రాసిందో చిన్నారి. అమ్మో! ‘అ’ అక్షరాన్ని మూడు ముక్కలు చేసి రాసినట్టు కనపడే ఆ చిత్రం అచ్చం అమ్మ ఒడిలో పడుకొన్న పాపలా అగుపడింది. ఇంకో చిన్నారి బోర్డ్‌పైన ‘MOM’ రాసి, దాన్ని తల క్రిందులుగా చూస్తే ‘WOW’ అని చెబుతూ వాళ్ళమ్మను కౌగలించుకొంది. రెండూ అందరికీ ఎంత నచ్చాయంటే అందరం రెంటినీ నోట్ బుక్‌లో రాసుకొన్నాం.

అడగందే అమ్మైనా పెట్టదనే సామెతని గుర్తుచేశారొకరు. “That’s not a nice thing to say.”అంటూ తనకి అదస్సలిష్టం కాలేదంటూ అమ్మ వైపు చూసి బుంగమూతి పెట్టాడో చిన్నారి. “అమ్మ అని ఇంగ్లిష్‌లో రాసినప్పుడు a.m.m.a. is a palindrome because it reads the same from both sides. అమ్మ అనే పదమే చాలా స్పెషల్.” అంటూ తాను కనిపెట్టిన సత్యాన్ని సంతోషంతో చెప్పుకొనిందో చిన్ని పాపడు. Necessity is the mother of invention అని మదర్ పదం ఉన్నటువంటి ఇంగ్లిష్ ఉక్తిని చెప్పింది ఇంకో చిన్నారి. తల్లిని మించిన దైవం లేదన్నారింకొకరు.మొత్తానికి అందరి మాటలూ అమ్మ గురించే.

తెలుగు మాట్లాడే మనమందరం తెలుగు తల్లి పిల్లలం. ఆ తల్లి ఆశీర్వాదం మనకెప్పుడూ ఉంటుందన్నారు టీచర్ క్లాస్ ముగిస్తూ. తక్షణమే సప్తస్వరాల్లాగ ఏడు మంది పిల్లలు లేచి నిలబడి ఇంకో పది నిమిషాలు అందరూ అక్కడే ఉండాలని మనవి చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రంగు దుస్తుల్లో,వేర్వేరే రంగులు కాబట్టి ఆ ఏడుగురు ఇంద్రధనుస్సులా కనపడ్డారు.  వరుసగా నిలబడి ఏంజెల్స్‌లాగ చిరునవ్వులు చిందిస్తూ ‘అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా’ అంటూ అత్యంత మధురంగా పాడ సాగారు! అమ్మలు తమ చిన్నారుల కోసం చేసినట్టు ఈ చిన్నారులేడుగురు కలిసి అమ్మలందరికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. పాప ఈ మిగతా ఆరుగురితో కలిసి ఇదెప్పుడు నేర్చుకొనిందా అని ఆశ్చర్యపడ్డం నా వంతయ్యింది. అమేరికాంధ్ర పిల్లల్లా కాదు, అచ్చ తెలుగు పిల్లల్లా స్పష్టంగా వారు పాడిన ఆ పాట అందర్నీ తన్మయులై వినేట్టు చేసింది.

అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా

అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా

అమ్మ అన్న పదం సుస్వరాల వేదం

అమ్మ అన్న పదం సదా ప్రణవ నాదం

అమ్మ అన్న పదం సృష్టికి మూలాధారం

అమ్మ అన్న పదం సమదృష్టికి కొలమానం

పాట ముగుస్తున్నట్టే ఒకటే చప్పట్లు! పూర్వ సిద్ధత లేకుండా ఇంత మంచిగా పాడటం అసాధ్యం.పిల్లలీ పాటను ఎక్కడ, ఎప్పుడు నేర్చుకొన్నారనేదే అందరి ప్రశ్న. యూ ట్యూబ్లో గీతా మాధురి విడియోల ద్వారా తాము ఒక్కొక్కరే తమ ఇంట్లో మళ్ళీ మళ్ళీ వినిపించుకొని ఎవ్వరి సహాయమూ లేకుండానే నేర్చుకొన్నారట. ఒక్కే ఒక సారి కూడా జతగూడి పాడక పోయినా పర్ఫెక్ట్‌గా సింక్రొనైజ్ చేసి మా ముందుకు తీసుకొచ్చారు. మాకెవ్వరికీ పిల్లల ఈ ప్లాన్ గురించి మచ్చుకైనా అనుమానం రాలేదు. అంటే అంత బాగా రహస్యం కాపాడుకొచ్చారన్నమాట.

అమ్మను గురించి అమ్మ భాషలోనే ఒక పాటని యూట్యూబ్లో వెదుక్కొని, నేర్చుకొని, పాడి అమ్మను సంతోషపరచాలనే ఆ చిన్నారుల అంతరంగ భావనకు అమ్మలందరం అమితానందంతో ఊగిపోయాం.ఆ పది నిమిషాలను సక్రమంగా వినియోగించుకొని దీనికో అనుబంధం కూడా ప్లాన్ చేశారు పిల్లలు.అమ్మల దినోత్సవానికని ఆ రోజు కోవెల్లో స్వయంసేవకులు విశేషంగా తయారు చేసిన మహా ప్రసాదాన్ని తామే పట్టుకొచ్చి అమ్మలకు అమ్మ ప్రేమతో వడ్డించినారు. పిల్లలందరి ముఖాల్లో తాము కన్న కల సాకారమైన సంతోషం ఉట్టి పడుతోంది. అది కృషి చేసి లక్ష్యం సాధించిన సంతోషం. వారి మొహాలు సంతోషంతో మెరుస్తూ వుంటే ఒక్కొక్కరూ ఆణి ముత్యంలా అగుపించారు. అభం శుభం ఎరుగని చిన్నారులు ఎంతగా ఎదిగారనిపించింది. ఆ చిన్నారుల ప్రేమ అందరి కళ్ళలో ఆనంద బాష్పాలను తెచ్చింది.

Mother Nature is taken for granted. As a result, we are facing global warming. For a healthy, happy living we need to protect Mother Nature. మనమందరం ప్రకృతి మాత బిడ్డలం. ఈ మధ్య భూమి, నీరు, గాలి అన్నీ కలుషితమై పోతున్నాయి. తల్లిని ఆదరించినట్టే మనం ప్రకృతిని, పరిసరాలను ఆదరించాలి. అంటే పర్యావరణ రక్షణ కూడా మన నిత్య జీవితాల్లో ఒక ముఖ్య భాగం చేసుకోవాలన్నారు ఒక పెద్దావిడ. ఆ దిశలో మేమేం చేయగలమనే పిల్లల ప్రశ్నకు ఆవిడే బదులిచ్చారు. ముఖ్యంగా మూడు సూత్రాలను పిల్లలందరూ పాటించగలరని. ఒకటి: నీళ్ళు వృథా చేయకూడదు. రెండు: ఆహారం వృథా చేయకూడదు. మూడు: ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ఈ మూడింటిని పాటిస్తామని పిల్లలావిడకు మాటివ్వడం అమ్మలకే కాదు అందరికీ సంతోషాన్నిచ్చింది.

ఇటీవలి పదేళ్ళలో ఇండియాలో కూడా అమ్మల దినోత్సవం జరుపుకోవడం జనప్రియమవుతూందనేది ఒక శుభ సూచన. Taken for granted అనే భావన ఎవరికీ రాకూడదనే ప్రయత్నాలలో ఇదో ముందడుగు. అమ్మల సేవలు ప్రత్యేకంగా ఆదరింపబడి, పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని స్వస్థ కుటుంబం కోసమని తను చేసే త్యాగాలు గుర్తింపబడి గౌరవింపబడుతున్నాయి. ఏడాదికొక రోజు అమ్మకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రతి రోజూ తను మనందరి కోసం చేసే పనుల్లో పాలు పంచుకోవడమే పెద్ద గౌరవమన్నారు ఇంకో పెద్దాయన. దానికి అంగీకరించి తలూపనివారు లేరు. అందరికీ ఆ రోజు మాతృభూమియైన తెలుగుగడ్డపై ఉన్నట్టనిపించింది. అమ్మలకు తమ అమ్మతో ఉన్న అనుభూతినిచ్చి, చాలా హాయనిపించి, ఈ వేడుక ఒక కమ్మని కావ్యంలా మదిలో మెదులుతూనే ఉంది.

ఓ కురుక్షేత్ర సైనికుడి డైరీ -2

సిద్ధార్థ గౌతమ్

Goutham

రెండవ రోజు రాత్రి బట్టలు మార్చుకొని పడుకుందామని అనుకుంటుండగా పిలుపు వచ్చింది. మా సేనాని సమూహంలో ఉన్న సైనికులనందరినీ రమ్మన్నట్టున్నారు. అందరూ వరుసగా నిలబడ్డాము. అందరినీ ఆకాశం  వైపు చూడమన్నాడు సేనాని. చందమామ…సగం మూత పెట్టిన కుండ లోపలి పాలలా కనబడుతున్నాడు.

“రేపు సర్వ పాండవ సైన్యం అర్ధ చంద్రాకారం లో నిలబడి పోరాడబోతోంది. మన సమూహం ఎడమ వైపు నుంచి దాడి చేయాలి…” 

అని ఎవరెవరు ఏ  స్థానం లో నిలబడాలో వివరించాడు.

నన్ను  ఎడమవైపు చివర్లో నిలబెట్టాడు.

ఎవరి పక్కన ఎవరు నిలబడాలో గుర్తుంచుకున్నాము.

 కాస్త దూరం లో పాండవ సైన్యం లోని మిగతా సేనానులు తమ తమ సమూహాలకు సూచనలిస్తున్నారు.

మా సేనాని ఆవలించాడు.

 పాపం ఎంత అలసిపోయాడో. మమ్మల్ని వెళ్ళి విశ్రాంతి తీసుకొమ్మని చెప్పాడు.

నాకు అలసటగా ఉన్నా నిద్ర పట్టలేదు. గుడారం బయటికొచ్చి మళ్ళీ చంద్రుడిని చూసాను.

మేఘాలు కప్పేసాయి.  అర్థ  చంద్రాకరం కన్నా ఈ మేఘాల ఆకారం లోనిలబడితే బావుంటుందనిపించింది.

ఈ కొత్త ఆలోచన రేపు రాత్రి సేనాని తో చెప్పాలి.

చిన్నప్పుడు ఆరుబయట పడుకుని చండ్రుడిని చూస్తూ కబుర్లు చెప్పుకున్న రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు చందమామలో కుందేలుని చూసాము, చిన్న పిల్లాడికి అన్నం తినిపిస్తున్న అమ్మమ్మ ని చూసాము. యుధ్ధం లో శత్రువులని చంపటానికి కూడా చంద్రుడు ఉపయోగపడతాడని ఊహించలేదు. మేఘాల చాటున ఎర్రగా కనబడ్డాడు చంద్రుడు. వెళ్ళిపడుకున్నాను.

మూడవ రోజు –

రాత్రి మాకు ఇచ్చిన సూచనల ప్రకారం అర్ధచంద్రాకారం లో నిలబడ్డాము. కౌరవులు కూడా రాత్రి భోజనాల తరువాత కొత్త వ్యూహాలు వేసుకున్నట్టున్నారు. గత రెండు రోజుల్లా కాకుండా కొత్త ఆకారం లో నిలబడ్డారు. నా వెనకాల ఉన్న సైనికుడు “గరుడాకారం లో దాడి చేయబోతున్నారు..” అన్నాడు.  మాకైతే ఎలా నిలబడాలో ఆకాశం లో ఉన్న చంద్రుడిని చూపించి చెప్పాడు మా సేనాని. మరి కౌరవ సైన్యానికి అంత చీకటి లో ఎగురుతున్న గద్ద లను చూపించి ఎలా  సూచనలిచ్చారో?

అర్జునుడి రథం నా పక్కన వచ్చి ఆగింది. చిన్నగా రెండు అడుగులు వేసి  కృష్ణుడి పాదాలను దూరం నుంచే నమస్కరించుకుని మళ్ళీ నా స్థానానికి  వచ్చాను. కుడి వైపు చూసాను. అటు చివర భీమసేనుడు, మధ్యలో  ధర్మరాజు. కౌరవుల వైపు భీష్మ  పితామహుడు అందరికన్నా ముందు నిలబడి ఉన్నారు. గత రెండు రోజులుగా నేను పోరాడుతున్నకురుసైనికుడు వెనకాల ఎక్కడో ఉన్నాడు. నేను చెయ్యి ఊపాను. వాడు చూడలేదు కాని, వాడి పక్కన నిలబడ్డ మరో సైనికుడు చూసాడు. తనూ చెయ్యి ఊపాడు. తన పక్కనున్న వాడిని పిలవమని సైగ చేసాను. నా తలకి చిన్న రాయి తగిలింది. ఎవరు కొట్టారా అని పక్కకి చూసాను. మా సేనాని…కోపంగా చూసాడు నన్ను.

యుధ్ధ భేరి మోగించే వాడు నా పక్కనే  నిలబడి మోగించాడు. నా చెవులు తూట్లు పడేలా శబ్దం. రెండు క్షణాల పాటు తల తిరిగినట్టు అనిపించింది. కౌరవ సైన్యం మొత్తం మా అర్జునుడి మీదకు రావటం చూసి తేరుకున్నాను. ముందుకురికాను. భయం వల్లనో, కోపం వల్లనో తెలియదు కాని..ఒళ్ళు తెలియకుండా పోరాడాను.

 అర్జునుడి మీదకు వస్తున్న బాణాలు, ఈటెలు ఆపటానికి నా చేతనైనంత ప్రయత్నించాను.

కానీ.. ఆయనకు  సహాయపడటానికి, ఆయన్ని కాపాడటానికి  ఆయన రథసారధి ఉన్నాడు. శత్రువులు  ఎంత మంది దాడి చేసినా, ఎలా దాడి చేసినా..ఒక మహాసముద్రం లోకి సన్నటి కాగడాలు విసిరినంత వ్యర్థం.

ఇంతలో “ఘటోత్కచుడు…ఘటోత్కచుడు” అని ఎవరో అరిస్తే అటు చూసాను. భీమసేనుడి పక్కన ఆయన పుత్రుడు. ఈయన గురించి ఎన్నో కథలు విన్నాను, ఒకసారి దూరం నుంచి చూసాను. ఆయన్ని చూడగానే అందరిలో నూతనోత్సాహం. అందరితో  పాటు నేనూ కేరింతలు కొట్టాను.

ఇవేవీ పట్టనట్టు ఆయన, భీమసేనుడు దుర్యోధనుడి వైపు ఉరికారు. నన్ను వాళ్ళ వెంట వెళ్ళమని మా సేనాని ఆదేశించాడు. తండ్రీ కొడుకులు కలిసి దుర్యోధనుడి రధాన్ని ధ్వంసం చేసారు. నేను కూడా ఆ రథ చక్రాన్ని కాస్త విరగ్గొట్టాను. దుర్యోధనుడి రథం వెనక్కు తిరిగింది. నేను వదలకుండా దాని వెంట పరిగెట్టాను.

దూరంగా వెళ్లి  ఆగాక..దుర్యోధనుడు తన అక్కసు భీష్మపితామహుడి పై చూపించాడు. ఆయనపాండవ పక్షపాతి అని, అందువలనే వాళ్ళకు ఏ హానీ జరగకుండా చూస్తున్నాడని అన్నాడు. భీష్మ పితామహుడికి కోపంకట్టలు తెంచుకుని వచ్చింది. ఆయన్ని అలా చూస్తుంటే నాకు వణుకు పుట్టింది.

ఒక సింహం లా పాండవ సైన్యం పైకి దూకాడు. మా సైనికులని ఊచకోత కోసాడు. అర్జునుడు ఆయనని అడ్డుకోవటం తో ఆ వినాశనం కాస్త తగ్గింది. సాయంత్రమయ్యింది.

ghatotkach

ఈ పూట చనిపోయిన సైనికుల శరీరాలకు దహన సంస్కారాలు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఉదయం బధ్ధశత్రువులుగా కొట్టుకున్న ఇరువైపుల సైనికులు ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటున్నారు. నా  భుజం మీద ఏదో చేయి తగిలితే వెనక్కి తిరిగి చూసాను.

నేను మొదటి రెండు రోజులు పోరాడిన కురుసైనికుడు.

“బ్రతికే ఉన్నావా?” అనడిగాడు. నేను నవ్వి, ఔనన్నట్టు తలూపాను. “ఈ రోజు భీష్ముడి ప్రభంజనం లో నువ్వు కూడా పోయావేమో అని భయపడ్డాను. రేపటి నుంచి కృష్ణుడి పక్కనే  ఉండు. ఆయనొక్కడే నిన్ను కాపాడగలడు. జాగ్రత్త.” అన్నాడు. “మరి నీ పరిస్థితేంటి?” అనడిగాను.

“కృష్ణుడు మీ వైపు ఉన్నాడని తెలిసిన రోజే నేను హతమవ్వటం ఖాయం అని నాకు అర్థమైపోయింది. మా మహారాజులు తప్పులు చేసారు, మీ మహారాజులు శపథాలు చేసారు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని ఆలోచించకుండా మనలాంటి వాళ్ళు విశ్వాసంగా యుధ్ధం చేయాలి. నేనిక వెళ్తాను. నిన్ను చూసిపోదామని వచ్చాను.” అని వెళ్ళిపోయాడు.

రాత్రి ఏమీ తినకుండా గుడారానికి వచ్చేసాను.

నాతో పాటు గుడారం లో ఉన్న సైనికుడు ఇంకా పడుకోలేదు. తన పాదానికి గుచ్చుకున్న ముల్లు తీసుకుంటూ ఉన్నాడు.

“నేను తీస్తాను లే..” అని కింద కూర్చుని తన పాదం నా మోకాలి మీద పెట్టుకుని ముల్లు తీసాను.

“యుధ్ధం ఎంత దారుణమైనది సోదరా..” అన్నాడు. నేను ఏమీ సమాధానమివ్వలేదు.

“ఈరోజు భీష్ముడిని చూసి చాలా బాధకలిగింది. ఈ యుద్ధానికి వచ్చింది నాకు తెలిసిన భీష్మ పితామహుడు కాదు. ఈయన ఎవరో రాక్షసుడు. ఆమాట కొస్తే మన ధర్మ రాజుని చూస్తున్నా అలానే అనిపిస్తోంది.

భీష్ముడు, ధర్మరాజు లాంటి  మంచివాళ్ళు, గొప్పవాళ్ళు..ఒకరిని ఒకరు చంపుకోవటానికి యుద్ధం  చేయటమేమిటి? అసలు ఈరోజు చనిపోయిన సైనికులలో ఎంతమంది చెడ్డవాళ్ళు?” అన్నాడు. నేను నిశ్శబ్దంగా   ఉండేసరికి తనూ మాటలు ఆపేసాడు.

నా మనసేమీ బాగోలేదు. ఇల్లు గుర్తొస్తోంది. కృష్ణ పరమాత్మా…రేపు నేను నిద్ర లేచేసరికి ఈ యుధ్ధం ఆపేయవూ?

నాలుగవ రోజు –

ఉదయం లేచినప్పటినుంచి ఎవ్వరితోనూ మాట్లాడలేదు నేను. ఆకలిగా ఉంటే రెండు పళ్ళు తిన్నాను. నిన్న జరిగిన విధ్వంసం ఇంకా నా తలలో తిరుగుతూ ఉంది. అయిష్టంగా నే బయలుదేరాను. యుధ్ధం మొదలు పెట్టింది నేను కాదు..దీనినిఆపే శక్తీ నాకు లేదు. ఆదేశించిన పని చేయటం మాత్రమే నా చేతిలో ఉంది. యుద్ధానికి   వచ్చే ముందు చంపటానికి, చావటానికి సిధ్ధపడే వచ్చాను. కాని, ఇంతటి మనస్తాపం ఉంటుందని నేను  ఊహించలేదు, ఎవ్వరూ చెప్పలేదు. నాకే ఇలా ఉంటే..పాపం పాండవుల పరిస్థితి ఎలా ఉందో?

ఈ రోజు అభిమన్యుడి మీదకొచ్చారు కౌరవ సైన్యం. ఒక్కడిని చేసి అందరూ చుట్టు ముట్టి దాడి చేస్తున్నారు. అన్యాయమనిపించింది.

అభిమన్యుడు..తనని దాడి చేసినవారిని, చేయనివారిని..వందల మందిని చంపేసాడు. అన్యాయమనిపించింది.

దుర్యోధనుడు తన మిగతా సైన్యాన్నంతా  అభిమన్యుడిని చంపమని పంపాడు. అన్యాయమనిపించింది.

భీముడు, అర్జునుడు వచ్చి అభిమన్యుడికి  సహాయంగా నిలబడి యుధ్ధం చేసారు. ఈసారి భీముడిని అంతమొందించటానికి కొన్ని వేల ఏనుగులను పంపాడు దుర్యోధనుడు. అన్యాయమనిపించింది.

భీముడు ఉగ్ర రూపం దాల్చి నోరు లేని ఆ ఏనుగులను తన గద తో పిండి చేసేసాడు. అన్యాయమనిపించింది.

ఈ ఆలోచనలతో నాకు పిచ్చెక్కేలా వుంది.

ఎటు పరిగెడుతున్నానో..ఎందుకు పరిగెడుతున్నానో తెలియటం లేదు. రెండు క్షణాలు ఆగాను. కాలి మీద ఏదో చీమ కుట్టినట్టు అనిపించింది. మళ్ళీ పరిగెట్టాను. ఇప్పుడు  తేలు కుట్టినట్టు అనిపిస్తోంది. ఆగి కాలి వైపు చూసుకున్నా. బాణం…నా మోకాలి కింద. అది చూడగానే అసలు నొప్పి తెలిసింది. భరించలేని నొప్పి.

 అసలు ఈ బాణం  ఎవరు వేసారా అని అటూ, ఇటూ చూసాను. కూలబడిపోయాను. “అమ్మా..” అన్నాను బిగ్గరగా. మా అమ్మకి వినబడదు. “కృష్ణా…” అని పేగులు తెగేలా అరిచాను. ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయానో తెలియదు.

కళ్ళు తెరిచేసరికి నా గుడారంలో ఉన్నాను. పక్కన ఎవ్వరూ లేరు. లేవటానికి ప్రయత్నించాను. కాలు నొప్పి. కాలిలో దిగబడిన బాణం ఇప్పుడు లేదు. ఎవరో కట్టు కట్టారు. “మంచి నీళ్ళు” అన్నాను గట్టిగా. ఎవరో ఒకతను వచ్చి నీళ్ళు ఇచ్చాడు. “ఎవ్వరూ లేరా?” అనడిగాను. “అందరూ యుధ్ధానికి వెళ్ళారు. 

గాయపడిన వారిని చూస్తూ ఇక్కడే ఉండమని నాకు చెప్పారు. ఏమైనా తింటారా?” అనడిగాడు. వద్దని చెప్పాను. మా అమ్మ, నా భార్య పిల్లలు గుర్తొచ్చారు. ఏడుపొచ్చింది.

 నేను ఏడవటం చూసి ఆ నీళ్ళిచ్చినతను వెళ్ళిపోయాడు. 

ఎప్పుడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నానో గుర్తు లేదు. 

*

మనిద్దరి దేహాల మీదుగా…

ప్రసూన రవీంద్రన్

 

PrasunaRavindranరాధ ఉలిక్కిపడింది. తననెవరో గుసగుసగా పిలిచిన భావన. చాలా దగ్గరగా వచ్చిపిలిచినట్టు. చెవి పక్కన చెంపల మీదుగా జారి ఒంపు తిరిగిన కురులు కూడా చిన్నగా వణికాయ్.
అప్పటివరకూ నల్లనయ్యను తలుచుకుంటూ , కూనిరాగాలు తీస్తూ చిలికిన వెన్న జాగ్రత్తగా మట్టి కుండలోకి తీసిపెడుతున్నదల్లా రెపరెపలాడుతున్న హృదయంతో తలెత్తి చుట్టూ చూసింది. ఎవరూ లేరు… ఎప్పటిలాగే ఉన్నాయ్ పరిసరాలు.
తిరిగి తన పనివైపు దృష్టి సారించింది కానీ ఏదో అలజడి మనసంతా. ఆమెకు తెలీకుండానే అంతకంతకూ వేగవంతమవుతూ ఎదని ఊయలూపుతోంది ఊపిరి. బుగ్గలు బరువెక్కి , ఎరుపెక్కి ఏదో పరవశం పెదవుల్లోకి కూడా పాకి వణికిస్తోంది.

త్వరగా పని ముగించుకుని ముందు గదిలోకి వెళ్ళి గుమ్మానికానుకుని నిలబడి ఆకాశం వైపు చూసింది. నిండు చంద్రుడు కొంటెగా నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఏవిటో అర్ధంకాలేదు. ఇప్పుడే.. ఈ క్షణంలోనే నల్లనయ్యని చూడాలని ఆమె మనసు ఉవ్విళ్ళూరింది. కానీ ఎలా? ఈ సమయంలో వెళితే అమ్మ ఏమంటుందో. తల తిప్పకుండానే ఓరగా తల్లి వైపు చూసింది. చుట్టుపక్కల వారితో కలిసి ముచ్చట్లలో ఉందావిడ.

తిరిగి ఆకాశం వైపు చూసింది. అంతవరకూ లేనిది ఎక్కడి నుండి వచ్చాయో నల్లమబ్బులు. వేగంగా కదిలిపోతున్నాయ్. అప్పటిదాకా వెన్నెల్లో వెలిగిపోయిన పరిసరాలన్నీ కృష్ణవర్ణాన్ని పులుముకుని ఆమెకేదో చెప్పాలని చూస్తున్నట్టుగా అనిపించాయ్. చల్లటి గాలి తనువుని తాకి ఆమె పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది. ఎక్కడెక్కడి పూల పరిమళాలనో పట్టుకొచ్చి గాలి ఆమెని సాంత్వన పరచాలని చూసింది కానీ, ఆమె పరిస్థితి మెరుగవలేదు.

ఎక్కడినుంచో సమ్మోహన వేణు గానం తనని పిలుస్తున్నట్టుగా వినపడింది. అంతే, ఇక ఆమె తన ఎరుకని మరిచిపోయింది. మెరుపు వేగంతో కదిలింది.
“ఈ సమయంలో, ఈ వాతావరణంలో ఎక్కడికమ్మా …” అంటున్న తల్లి మాటలు రాధ చెవులకి వినపడలేదు.
రాధ తల్లి సరిగ్గా గమనించి ఉంటే రాధ అలా వెళ్ళడం వల్ల కదిలిన ఆమె జడ కుచ్చుల సవ్వడిలోనో, పద మంజీరాల కులుకుల్లోనో , పొడవాటి చెవి జూకాల ఊపులోనో ఆమెకి సమాధానం దొరికేసి ఉండేది.

ఏదో మాయ కమ్మినట్టుగా యమునా తీరంలోని ఆ పచ్చిక బయలుకేసి నదిలా కదిలింది రాధ.
ఆమె పరిమళాన్ని అల్లంత దూరంనుంచే ఆఘ్రాణించి లిప్త కాలంపాటు మురళీ గానాన్ని ఆపాడు కృష్ణుడు. అతని కళ్ళలో యమున వలపుగా మెరిసింది. చెంపల్లో తామరలు విచ్చుకుని రాలి ఒక విధమైన కెంపు మెరుపులతో ఆ ప్రదేశాన్ని వెలిగించాయ్.

పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్న రాధ అలా కృష్ణుడిని చూస్తూనే శిలలా నిలబడిపోయింది. రెప్ప మరచిన ఆమె కన్నుల నీలిమల్లో చంద్రోదయాలయ్యాయి. అమె కళ్ళలోంచి దూకుతున్న వెన్నెల వెలుగు, విశ్వ మోహనుడి తనూ వర్ణంతో కలిసి ఆ ప్రదేశమంతా అలౌకికమైన, అవ్యక్తమైన వర్ణంతో శోభిల్లింది. అక్కడి నీరూ, చెట్టూ, చేమా, పూలూ , తుమ్మెదలూ అన్నీ పరవశంతో ఉలిక్కిపడ్డాయ్.

తన్మయంగా కృష్ణుడిని చూస్తూ నెమ్మదిగా నడిచి వెళ్ళి ఆతని ఒడిలో వాలిపోయింది రాధ. ఆ మానస మనోహరుడి కన్నుల్లోకి ప్రేమగా చూస్తూ అంది-

“నిన్ను చూడగానే నాలో కలిగే ఈ ప్రేమ
ప్రపంచాన్ని ముంచేసేలా విస్తరిస్తుంటే
కృష్ణా…
కాలం కవిత్వమైపోయి
మనిద్దరి దేహాల మీదుగా ప్రవహిస్తున్నట్టు లేదూ… “

*

మరుపు కోసం

 

bhavani-phani.అతనికి ఒక్కసారిగా కనుపాపల్లోపల మెరుపేదో మెరిసినట్టయింది . ఓ నవోత్తేజం నరనరానా నిండిన అనుభూతి కలిగింది . ఎన్నో ఏళ్ళుగా కలిసి ఉన్న కనురెప్పలు ఇక ఆగలేనట్టుగా  తెరుచుకున్నాయి . ఎదురుగా ఏ దేవతా రూపమూ ప్రత్యక్షం కాలేదు . అశరీరవాణేదీ తన సందేశాన్నీ వినిపించలేదు . కానీ అతనికి అర్థం అయింది . తన కోరిక నెరవేరింది . తన తపస్సు ఫలించింది . ఇప్పుడు తన దగ్గర ఒక అసాధారణ శక్తి ఉంది . అతని మనసంతా ఆనందంతో నిండిపోయింది .

ఇక తపస్సు కొనసాగించే అవసరం లేకపోవడం వల్ల  ఉద్వేగం నిండిన మనసుతో  ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు .  కొంతసేపటికి వచ్చిన ఆ మనిషి యధాలాపంగా స్వామి వంక చూసి ఉలికిపడ్డాడు . ఎప్పుడూ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండే స్వామి, ఈ రోజు తనవైపు చిరునవ్వుతో చూస్తుండడంవల్లనేమో భయంతో ఒక అడుగు వెనక్కి వేసాడు .
“రావయ్యా రా కంగారు పడకు . వచ్చి ఇలా కూర్చో ” అన్నాడు స్వామి నవ్వుతూ .
ఇన్నేళ్ళుగా నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడని స్వామి ఆ రోజు అంత నోటి నిండుగా పలకరించేసరికి పులకరించిపోయిన ఆ ముసలి ప్రాణి, నోట మాట రానట్టుగా రెండు చేతులూ జోడించి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు .

” చూడు పెద్దాయనా , నీ పేరేమిటో నాకు తెలీదు . కానీ ఇన్ని సంవత్సరాలూ పళ్ళు ఫలాలు తెచ్చిస్తూ  నా మంచి చెడ్డలు చూసేందుకు నువ్వు పడిన తపన నేను గమనించాను . నా తపస్సు పూర్తయింది . నాకు ఒక అపూర్వ శక్తి లభించింది . నువ్వు చేసిన సేవకి ప్రతిఫలంగా నా శక్తితో ముందుగా నీకే లాభం చేకూర్చాలని అనుకుంటున్నాను . చెప్పు, నువ్వు మరచిపోవాలనుకునే మనిషి గానీ , విషయం గానీ ఉంటే చెప్పు . ఇక వాళ్ళకి చెందిన ఏ ఆలోచనా నిన్ను బాధపెట్టదు . ”
ఆ ముసలి వ్యక్తి అయోమయంగా చూసి ఓసారి బుర్ర గోక్కున్నాడు .
“స్వామీ , నువ్వనేదేంటో నాకు అర్థం కావట్లేదు . ఎవరైనా విషయాలు ఇంకా బాగా గుర్తు పెట్టుకోవాలనుకుంటారు గానీ మరచిపోవాలని ఎందుకనుకుంటారు! ”
స్వామి విశాలంగా నవ్వాడు  .
“నీకు తెలీదులే . అలా మరుపుని కోరుకునే వాళ్ళు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు . వాళ్లకి నా సహాయం అవసరం . నేను వెంటనే బయలుదేరాలి . అవకాశం వచ్చినప్పుడు నీ ఋణం తప్పక తీర్చుకుంటాను “అంటూ అతని వద్ద సెలవు తీసుకున్నాడు . తపస్సు ప్రారంభించే ముందు ఒక చెట్టుతొర్రలో  దాచిన తన పాత దుస్తులు ,కొద్ది పాటు డబ్బు జాగ్రత్త చేసుకుని జన జీవన స్రవంతిలోకి  అడుగు పెట్టాడు .

కానీ అతని ప్రయాణం మొదలైనంత సజావుగా సాగలేదు . ఎవరికి తన సహాయం అవసరమో , ఎవరు మరుపుని కోరుకుంటున్నారో స్వామికి అర్థం కాలేదు .మనుషుల మనసు చదివే శక్తి కోసం కూడా తపస్సులో కోరుకుని ఉండాల్సింది  అనుకున్నాడు . మళ్ళీ అంతలోనే అటువంటి ఆలోచన వచ్చినందుకు తనని తానే నిందించుకున్నాడు . సామాన్య ప్రజానీకంలా తను కూడా ఉన్నదానితో తృప్తి పడకపోతే ఎలా! కష్టపడనిదే ఏదీ సాధించలేమన్న విషయం తనకంటే ఎవరికి బాగా తెలుస్తుంది? తన అవసరం ఉన్న వాళ్ళని తనే వెతుక్కుంటూ వెళ్ళాలి అనుకుంటూ  మళ్ళీ తన ప్రయాణం కొనసాగించాడు . అలా ప్రయాణం చేస్తూ చేస్తూ జమ్మూ, అక్కడనించి కట్రా చేరుకున్నాడు .తను సరైన ప్రదేశానికే వచ్చాడు . భగవంతుడి దగ్గరకి కష్టాల్లో ఉన్నవారే ఎక్కువగా వస్తారు . వైష్ణో దేవి దర్శనం జరిగే  లోపుగా తన సహాయం అవసరమైన వాళ్ళు తప్పక తనకి తారసపడతారు అని సంతోషిస్తూ ఉత్సాహంగా కొండ ఎక్కడం ప్రారంభించాడు . పరిశీలనగా అందరి వైపూ చూస్తూ , ఎవరు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో అంచనా వేస్తూ నడవసాగాడు

అప్పుడు కనిపించాడా యువకుడు ఒంటరిగా. పచ్చని ఛాయతో మెరిసిపోతున్నాడతను.  చెయ్యెత్తు మనిషైనా ముఖంలో  ఉన్న సౌకుమార్యం అతని వయసు లేతదనాన్ని చెప్పకనే చెబుతోంది . భారమైన అడుగులు , భుజాల భంగిమ అతను పెద్ద కష్టంలో ఉన్నాడని సూచిస్తున్నాయి . స్వామి మెల్లగా అతని పక్కగా  వెళ్లి అన్నాడు .
“నీ ఉత్సాహానికి స్నేహితులంతా వెనకబడ్డారా భాయీ ”
ఆ యువకుడు ఆశ్చర్యంగా తల తిప్పి చూసాడు . “లేదు భయ్యా , ఒక్కడినే వచ్చాను . అయినా నన్ను చూస్తే అంత ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తున్నానా  మీకు ?” కొంచెం పంజాబీ యాస కలిసిన హిందీలో అన్నాడా అబ్బాయి .
“ఇంత చిన్న వయసులో ఎందుకంత నైరాశ్యం తమ్ముడూ , ఇష్టమైతే నీ కష్టమేమిటో నాతో చెప్పుకోవచ్చు ” స్వామి రోడ్డు పైనే దృష్టి నిలిపి చెప్పాడు .
ఆ యువకుడు నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు . ఏవో పదునైన వాక్యాలు అనేందుకు సిద్ధమై అంతలోనే విరమించుకున్నట్టుగా మళ్ళీ విషాదంలోకి తనని తాను ఒంపుకుంటూ  నడక మొదలుపెట్టాడు .
స్వామి వదిలిపెట్టలేదు
“సరే, నువ్వేమీ చెప్పద్దు , నేనే ముందు నా కథ చెబుతాను . నీకు నా మీద నమ్మకం కలిగితేనే మాట్లాడు “
ఆ యువకుడు అభ్యంతరం లేనట్టుగా భుజాలెగరేసాడు .
స్వామి నడక వేగం తగ్గించి మెల్లగా చెప్పడం మొదలు పెట్టాడు .
afsar-marupu
“ఇంచుమించు  పది సంవత్సరాల క్రితం నేను ప్రేమలో విఫలమయ్యాను . కోరుకున్న అమ్మాయిని దక్కించుకోలేక , అలాగని మరిచిపోనూ లేక ఎంతో విలవిలలాడిపోయాను . పిచ్చి పట్టినట్టుగా అయి దేశాటన ప్రారంభించాను . దక్షిణ భారతానికి చెందిన నేను , అలా తిరుగుతూ తిరుగుతూ ఈ పరిసర ప్రాంతాలకి చేరుకున్నాను . అప్పుడే నాకో ఆలోచన కలిగింది . మనకి  బాధ కలిగించే మనిషినీ, ఆ మనిషి తాలుకూ ఆలోచనల్నీ పూర్తిగా మరచిపోగలిగితే, మరిచిపోయేలా చేయగలిగితే ఎంత బాగుంటుంది అనిపించింది . అనుకున్నదే తడువుగా ఓ అనువైన స్థలం చూసుకుని తపస్సు ప్రారంభించాను . తపస్సు అంటే ఏ దేవుడి నామస్మరణో కాదు . కేవలం నా సంకల్పాన్నే పదే పదే మనసులో జపించసాగాను . ఎంతో కఠోర దీక్షతో చేసిన నా తపస్సు ఇప్పటికి ఫలించింది . నేను కోరుకున్న శక్తి నాకు లభించింది .” అంతవరకు చెప్పి ఆగాడు స్వామి .
ఆ యువకుడు స్వామి ముఖంలోకి పరిశీలనగా చూసాడు . “అయితే మీ లవర్ ని మీరు మర్చిపోయారా ?”
స్వామి  చిన్నగా నవ్వాడు . “నేను ఎందుకు ఇంత కష్టపడ్డానో నేనే మర్చిపోతే ఇతరులకి ఎలా సహాయం చేస్తాను? ఎవరైనా ఎవరి జ్ఞాపకాల్నైనా పోగొట్టుకోవాలని అనుకుంటే నేను వాటిని అంతం చెయ్యగలను ” అన్నాడు. తన శక్తి తన మీద పని చెయ్యలేదనీ, అయినా నిజానికి ఇప్పుడా అవసరం కూడా లేదనీ చెప్పడం ఇష్టం లేక .
ఆ యువకుడికి స్వామి మీద నమ్మకం కలిగినట్టుంది . ఇంకేమీ ప్రశ్నలు వెయ్యకుండా నేరుగా తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు .”నేనూ,ప్రకృతీ  చిన్నప్పటి నుండీ క్లాస్మేట్స్ . ఎయిత్ క్లాస్ కి వచ్చేసరికి మా స్నేహం మరింత బలపడింది . అప్పట్లో స్కూల్ ఎంతో సందడిగా ఉండేది . అప్పుడప్పుడే అడుగుపెడుతున్న యవ్వనం వల్ల ఎటు చూసినా జంట కోసం వెతుక్కునే స్నేహితులే. నేనూ , ప్రకృతీ కలిసి అటువంటి జంటల్ని కలిపే పని మొదలుపెట్టాం . ఆ పని మాకెంతో సంతోషం కలిగించేది . ఓ రోజు ఉన్నట్టుండి ప్రకృతి అడిగింది ” మనోజ్ , నీకెవరైనా ఇష్టమైతే చెప్పు . నేను వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడతాను ” అంది .
ఊహించని ఆ ప్రశ్నకి వెంటనే ఎలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు . కొంచెం ధైర్యం చేసి నాకిష్టమైన అమ్మాయివి నువ్వే అనేసాను . తను ఏ మాత్రం ఆలోచించకుండా నాకిష్టమే అంది .

అలా మొదలైంది మా ప్రేమ ప్రయాణం . నా పదమూడో పుట్టిన రోజుకి అమ్మా నాన్నా గిఫ్ట్ గా ఇచ్చిన మొబైల్ లో రోజూ అందరూ నిద్రపోయాక మొదలుపెట్టి తెల్లవార్లూ మాట్లాడుకునేవాళ్ళం . తను కూడా ఇంట్లో ఒకే అమ్మాయి కావడంతో  బోలెడంత గారం, ప్రైవసీ ఉండేవి . ఈ విషయం ఇంట్లో తెలీకుండా మాత్రం జాగ్రత్తపడేవాళ్ళం . ఎప్పుడైనా ఒక రోజో , రెండు రోజులో నాతో మాట్లాడటం కుదరదనుకుంటే గంటల తరబడి ఏడ్చేది . తన బాధ చూస్తే నాక్కూడా  ఏడుపొచ్చేది ” వింటున్నాడా లేదా అన్నట్టు ఆ యువకుడు ఓ సారి ఆగి స్వామి వైపు చూసాడు .స్వామి ముఖంలో ఆసక్తికి సంతృప్తి చెందినట్టుగా మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు .”టెన్త్ లోకి వచ్చేసరికి నా ఆలోచన మారిపోయింది . నా మనసు కొత్త కొత్త పరిచయాల కోసం తహతహలాడింది . కొందరు అమ్మాయిల్లా ప్రకృతి నాకు స్వేచ్ఛనిచ్చేది కాదు . ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేది . అందరు లవర్స్ లా ఎంజాయ్ చెయ్యడానికి సహకరించేది కాదు . ఎక్కువగా కలిసేది కాదు .ఫోన్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది . ఆ అసంతృప్తితో నేను కొత్త స్నేహాలు వెతుక్కునేవాడ్ని . ఆకర్షణీయమైన నా రూపం  వల్ల అమ్మాయిలు సులువుగానే నాకు ఎట్రాక్ట్ అయ్యేవారు . కొందరు వాళ్ళంతట వాళ్ళే వచ్చేవారు . అలా ఒకేసారి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ని మెయిన్ టైన్ చేసేవాడ్ని . ప్రకృతికి మాత్రం తెలియనిచ్చేవాడిని కాదు . కొన్ని రోజుల స్నేహంతోనే చాలామంది అమ్మాయిలంటే నాకు బోర్ కొట్టేది. కానీ ప్రకృతితో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడ్ని .

మెల్లగా మా మధ్య పోట్లాటలు మొదలయ్యాయి . ఎప్పడూ తనతోనే మాట్లాడుతూ కూర్చుంటే నాకు వేరే పని ఉండదా అని నాకు కోపం వచ్చేది . అసలే కోపం ఎక్కువ కావడం వల్ల అలాంటప్పుడు నోటి కొచ్చినట్టు తిట్టేవాడ్ని . కొన్ని రోజులు మాట్లాడటం మానేసినా మళ్ళీ తనే పలకరించేది. బ్రతిమలేది . తనంటే నాకు కూడా  చెప్పలేనంత ఇష్టం . అలా అని తనతో నిజాయితీగా ఉండలేక పోయేవాడిని . వేరే స్నేహాల సంగతి ఎలా ఉన్నా, పెళ్లి మాత్రం తననే చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను . ఎనిమిదేళ్ళు మా ప్రేమ అలా ఒడిదుడుకుల మధ్య కొనసాగింది . నాకు ఎం బి ఏ కూడా పూర్తి కావచ్చింది. తనని మెల్లగా నిర్లక్ష్యం చెయ్యడం మొదలు పెట్టాను . ఓ రోజు ఆ విషయం తను గట్టిగా అడిగి గొడవ చేసేసరికి కోపం వచ్చి, విడిపోదామని చెప్పి , బాగా తిట్టి ఫోన్ పెట్టేసాను . ” అపరాధ భావం వల్లనేమో అతను ఎటో చూస్తూ చెప్పసాగాడు .”ఒక నెల రోజులు బాగానే ఉన్నాను . అలా ఒక్కోసారి పది పదిహేను రోజులు మాట్లాడుకోకుండా ఉండటం మాకు అలవాటే . ఈసారి తను ఎంతకీ పలకరించకపోయేసరికి నేనే ఫోన్ చేసాను . అంతే, నాకు పెద్ద షాక్ తగిలింది . తను నన్ను మరిచిపోయిందనీ, నన్ను కూడా తనని మరిచిపోయి ముందుకు సాగమనీ చెప్పేసింది . ఇక చూడండి . అప్పుడు మొదలైంది నా బాధ . ఫేస్బుక్ లో , వాట్స్యాప్  లో , ఫోన్లో అన్ని చోట్లా నన్ను బ్లాక్ చేసేసింది . తన కజిన్స్ తో, మా కామన్ ఫ్రెండ్స్ తో ఎన్నో మెసేజ్ లు పంపాను . చివరికి బాగా జబ్బు పడ్డానని కూడా చెప్పించాను . అయినా తను లొంగలేదు . ఒక్క సారి మాత్రం ఫోన్ లో మాట్లాడింది .
నాతో పోట్లాడి పోట్లాడి అలిసిపోయానంది . నావల్ల తన ఎనిమిది సంవత్సరాలు నాశనం అయిపోయాయని చెప్పింది . నాతో మాట్లాడాలని ఎదురు చూస్తూ , నా నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక చాలా నలిగిపోయాననీ , ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉందనీ చెప్పింది . ఇప్పుడు తనకి నా మీద జాలి మాత్రమే కలుగుతోందనీ , ఏ మాత్రం ప్రేమ భావం లేదనీ , ఇక ఎప్పుడూ మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దన్నీ చాలా గట్టిగా చెప్పేసింది . నాలో గిల్టీ ఫీలింగ్ అప్పుడు మొదలయింది . నేను తనతో పాటుగా ఎందఱో అమ్మాయిల్ని ఏడిపించాను . ఈ ఎనిమిదేళ్ళ లో దాదాపు ముప్ఫై మంది అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాని చెప్పి , కొన్నాళ్ళకి బోర్ కొట్టగానే వదిలేసాను  . ఒక్కో అమ్మాయితో బ్రేక్ అప్ అయినప్పుడల్లా వాళ్ళెంతో ఏడుస్తూ తిడుతూ నాకు దూరమయ్యేవారు . ఆ పాపాలన్నీ నన్నిప్పుడు ఇలా వెంటాడి వేధిస్తున్నాయనిపిస్తోంది . ప్రతి నిమిషం అదే ఆలోచన . తనతో మాట్లాడాలనీ , మునుపటిలా ఉండాలనీ తీవ్రమైన కోరిక . తిండీ , నిద్రా కూడా తగ్గిపోయాయి . మనసు తేలిక పరచుకోవడం కోసం , నా పాపాలకి పరిహారం చేసుకోవడం కోసం ఇలా వచ్చాను . ఇప్పుడు నాకింకేమీ వద్దు . మళ్ళీ తను నా జీవితంలోకి వస్తే చాలు . కానీ ఇక తను రాదని నాకు తెలుసు . ” ఆ యువకుడి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి  .” చూడు భాయీ , నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు . మళ్ళీ అటువంటి పొరపాటు చెయ్యకు . ఆ అమ్మాయి వెనక్కి తిరిగి రాదని తెలిసినప్పుడు ఇంకా బాధ పడటం వల్ల ఏం ప్రయోజనం? మన ఆత్మనైనా సరే హింస పెట్టే హక్కు మనకి లేదు . నువ్వు కూడా ఆ అమ్మాయిని మర్చిపోవడం ఒక్కటే సరైన మార్గం ” అన్నాడు స్వామి అనునయంగా అతని భుజం మీద చెయ్యి వేస్తూ .
ఆ యువకుడు అదేమీ పట్టించుకోనట్టుగా మళ్ళీ చెప్పసాగాడు .”ఇప్పుడు నన్ను నిలువెల్లా దహించివేస్తున్న సందేహం ఒక్కటే . అసలు ఇన్నేళ్ళ ప్రేమ ఎలా అంతమైపోయింది? తను నన్ను ఎలా మరిచి పోగలిగింది! అసలు అలా మరఛిపోవడం సాధ్యమా? ఒక్కసారి కూడా మా మధ్య జరిగిన మంచి సంఘటనలు తనకి గుర్తు రావా ? నాతో మాట్లాడాలని అనిపించదా ? అసలు అదెలా కుదురుతుంది!! ఈ ఆలోచనలతో నేను సతమతమైపోతున్నాను . దయచేసి సమాధానాలు చెప్పండి భయ్యా ”  అతను కళ్ళలోంచి నీళ్ళు కారిపోతుంటే బిక్కమొహం వేసుకుని చిన్నపిల్లాడిలా అడిగాడు  .స్వామి ఒక్క నిమిషం అలోచించి చెప్పాడు.  ” తమ్ముడూ , మనిషి మనసు ఓ మహేంద్రజాలం . ఎప్పుడు ఎవర్ని ఎలా స్వీకరిస్తుందో మనం అంచనా వెయ్యలేం . దానితో పాటుగా సాగిపోవడమే తప్ప ఎదురుతిరిగి ప్రశ్నించే ప్రయత్నం చెయ్యకూడదు . ప్రపంచంలో ప్రేమ విషయంలో ఏ ఇద్దరి అనుభవాలూ ఒకేలా ఉండవు . ఆ సందేహాలన్నీ పక్కన పెట్టు . ఇప్పుడు నేను ఆ అమ్మాయి తాలుకూ ఆలోచనలన్నీ నీ మనసులోంచి తొలగిస్తాను . అప్పుడు నీకీ వేదన ఉండదు . “ఆ అబ్బాయి కొంతసేపు దీర్ఘాలోచనలో పడినట్టుగా ఉండిపోయాడు . తర్వాత అన్నాడు .” వద్దు భయ్యా , నేను తనని మరిచిపోతే నా జీవితానికి అర్థమే లేదు . ఎప్పటికైనా తను వెనక్కి తిరిగి చూస్తుందనే ఆశతో బ్రతికేస్తాను . కనీసం క్షమించినా చాలు . అయినా నేను ఇదంతా మరిచిపోతే మళ్ళీ నా కథ మొదటికే వస్తుంది .  చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చెయ్యడం నాకిష్టం లేదు. ఈ జీవితానికి నాకీ బాధ చాలు . “ అంటూ ఇక స్వామితో మాట్లాడటం ఇష్టం లేనట్టుగా వడివడిగా అడుగులేస్తూ అతను ముందుకు వెళ్ళిపోయాడు .స్వామికి ఆ అబ్బాయిని వెనక్కి పిలవాలనిపించింది . మరుపు అనేది మనిషికి సహజంగా లభించిన వరమనీ , ఆ అమ్మాయి తిరిగి చూసినా, చూడకపోయినా ఇప్పుడున్నంత బాధ కొద్ది రోజుల తర్వాత ఉండదనీ, అప్పటివరకూ పొరపాటు నిర్ణయాలేవీ తీసుకోకుండా ఓపికపడితే చాలనీ చెప్పాలనిపించింది. కానీ ఆ అర్హత తనకి ఉందా? తపస్సు పేరుతో తను పోగొట్టుకున్న సమయం గురించీ, తద్వారా లభించిన శక్తి వల్ల ఒనగూడే ప్రయోజనం గురించీ, తన భవిష్యత్తు గురించీ ఆలోచిస్తూ స్వామి అక్కడే నిలబడిపోయాడు.

***

నవ్వే లేకపోతే…

 లక్ష్మీ శైలజ
ఎలానూ నవ్వలేకపోతే

నీ జీవితం పువ్వులెరుగని ఖాళీ వనం
ఉండుండీ ఓసారైనా నవ్వులు కురవకపోతే
నీ ఉనికి, వెన్నెల లేని వొట్టి చంద్ర బింబం
చుక్కలు చుక్కలుగా  వెలుగును చిమ్ముతూ
ఉదయాంతరాల్లోంచి  నవ్వుతుంది నిండైన ఆకాశం
కొమ్మ కొమ్మపై నించి గమ్మత్తుగా రాలిపడుతూ
తెల్లగా  నవ్వులు పూస్తుంది  తుంటరి పారిజాతం
వంకర టింకర నడకతో
వడి వడిగా నవ్వుతాయి వెండి జలపాతాలు
వెదురు పుల్లల వెన్ను చరిచి
గాలి నవ్వులు విసురుతాయి ఇంకొన్ని సంధ్య వేళలు
ప్రకృతి ఒడిలో ప్రతి యేడూ జన్మిస్తూ
నవ్వే పచ్చని పసి పాపలు  వసంతాలు
పాదాల కింద గల గలా నలిగి
నవ్వయిపోతున్నవి ఎండుటాకుల శిశిరాలు
కడలి కొమ్మల్లో ఉయ్యాలలూగే
అలుపెరుగని అల్లరి పిట్టలు అవిగో ఆ  అలలు
బంగారు ఇసుకని మీటుతూ
వినిపిస్తున్నాయి తడి నవ్వుల కూని రాగాలు
ఎర్రని  పెదవుల రెప్పల్ని విడదీసి
పళ్ళ కనుపాపలతో ప్రపంచాన్ని చూడు
నీ చూపుల నవ్వుల గుండా
నీలోకి చేరేవి ఎన్నెన్ని సంతోషాలో !!!
lakshmeesailaja

లే!

వర్చస్వి

 

 

ఎందుకా దిగులు?

సంద్రపు వాలుగాలి నీకోసం మంద్రంగా

వీస్తూ వచ్చి నీ భుజం తడుతుంటే!

 

ఎందుకా క్షోభ?

నీ వెతల్ని కరిగిస్తూ వెన్నెల శీతల

శీకరాలు నీ తల నిమురుతుంటే!

 

బేల చూపులిక దులుపు మరి-

పచ్చిక నిన్ను మచ్చిక చేసుకుంటూ

తన పచ్చని వొళ్ళో జోల పాడుతోందిగా!

 

కంట ఆ వెచ్చని తడి తుడిచేయ్-

పచ్చని  పంట చేను తన పమిటతో

అద్ది ఓదారుస్తానంటోందిగా!

 

లేచి నిలబడి అడుగేయ్-

అడుగడుగూ దుమ్మురేగేలా

జయమ్ము తథ్యమ్ము అంటోందిగా అమ్మ ధాత్రి!

 

అయిదు వేళ్లూ బిగించు-

రెప్పవాల్చకుండా చూస్తోందిగా

ఆ కొండ నీ పిడికిట్లో పిండి పిండి కావాలని!

 

శుభాన్ని నిబ్బరంగా శ్వాసించు మరి-

ఆ వెర్రిగాలి నీ ఊపిరిలో

లయగా ఊగాలని తబ్బిబ్బవుతోందిగా!

*

varchasvi

 

అసలు సూత్రం..ఆ జీవితమే!

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshగోరటి వెంకన్న పాట విన్నారా?
‘గల్లి చిన్నది గరీబోని కథ పెద్దదీ’ అన్న పాట.

ఆ పాట ఒక గాథ.
అందులో ఎన్నో ఉదాహరణలు. మరెన్నో ఉపమానాలు. ఇంకెన్నో పోలికలు.
పగిలిన అద్దం. పండ్లు విరిగిన దువ్వెన. ఇంకా ఎన్నో…ఇంకెన్నో…

ఒక్కో దృశ్య సమాసం ఒక స్థితిని పంచుతూ ఉంటే మొత్తంగా అనేక దృశ్యాదృశ్యాలుగా ఆ పాట గల్లీ జీవితాన్నిఅద్దంలో కొండవలే చూపిస్తుంది. అయితే, జీవితాన్ని పరిపరి విధాలుగా… పదచిత్రాలుగా, జానపదాలుగా ఆయన గానం చేసిన తీరు అపూర్వం. కానీ, ఆ పాట నిజానికి ఒక దుస్థితి.

జీవితంలో అన్నీ ఉంటై. కష్టం- సుఖం. లాలనా- పీడనా…అన్నీ ఉంటై.
అయితే, అదొక పార్శ్వం మాత్రమే. ఆ కథ పెద్దది.
కానీ, దురదృష్టం ఏమిటంటే నా కథ చిన్నదనుకుంటారు.
కాదనే ఈ చిత్రం.

అసలు ఆర్థిక పార్శ్వం మినహాయిస్తే పేదవాడి జీవితం ఎంతటి భాగ్యవంతమో అని ఎలుగెత్తి చెప్పాలనిపిస్తుంది.
వెంకన్న కన్నా ఇంకా ఎత్తుకు ఎగిరి దుంకి ఆడి పాడి చెప్పాలనిపిస్తుంది. అవన్నీ చేయలేకే ఇలా చిన్నచిన్న దృశ్యాలు. దృశ్యాదృశ్యంగా గల్లీ జీవితాన్ని ఒకానొక జీవనదిలా మీలోకి ప్రవహింపజేయాలని ప్రయత్నం.

ఒక మహా రచయితా, దర్శకుడు అననే అన్నాడు, ఎప్పుడో!
‘చీకట్లో పాటలుండవా?’ అని.
పాడితే, చీకటి పాటలే పాడతామని!

కానీ, ముందే అన్నట్టు, ఆర్థికాంశాలే జీవితాన్ని నిర్ణయించవని వేల యుగాలుగా మానవ జీవితం చెబుతూనే ఉన్నది. మానవ సంబంధాలన్నీఆర్థిక సంబంధాలు కానే కావని మర్క్సిస్టులకు తప్పా మిగతావాళ్లకు ఎన్నడో తెలిసిపోనే పోయింది. ఇంకా చాలా ఉన్నాయని తేలిపోయి కూడా చాలా కాలమైంది. కానీ, కార్యకర్త తాలూకు జీవితమే అన్ని కార్యారంగాలను డామినేట్ చేస్తూ ఉండటం మూలాన ఒక్కోసారి జీవితాన్ని యధాతథంగా అంగీకరించడం ఆపేసి చాలా కాలమే అయింది.

అందుకే విచారం.

ఆర్థికాంశం మినహాయిస్తే జీవితంలో ఏ లోటూ లేదు.
అది ఉన్నంత మాత్రాన మనుషులను పేదవాళ్లుగా చూడటం అసలైన భావదారిద్ర్యం.

మనుషులు గల్లీలో ఉండవచ్చు, ఢిల్లీలో ఉండవచ్చు.
ధనవంతులు కాకపో్తే భాగ్యవంతులు కారా? అన్న సందేహం నాది.
అందుకే గల్లీ జీవితాన్ని ఒక అందమైన పాటగా చిత్రిస్తూ ఉండటం నాకొక అభిరుచి.

చిత్రిస్తూ ఉంటే, నిజానికి అటువంటి సందేహమే అక్కర్లేదని, జీవితం అందంగా హామీ ఇస్తూనే ఉన్నది.

అక్కడ అందం ఉంది. సౌందర్యం ఉంది.మనుషులకు తీరుబడి ఉంది.
గల్లీ ఒక పెద్దబడి. దాన్ని పూర్తిగా చూసేందుకు విద్యార్థులం కావాలి. కార్యకర్తలమే కాదు.

అందుకే ఈ చిత్రం.

నిజానికి మనకే తీరుబడి లేదు. సౌందర్యం లేదు. నిజం.
అక్కడ కళా ఉంది. పోషణా ఉంది. సరసం ఉంది. సంగీతం ఉంది. అన్నీ ఉన్నయ్.ఉపరితలం ఉంది. భూమికా ఉంది.
అర్థం చేసుకుంటే పగిలిన అద్దం ఒక స్థితి మాత్రమే.
దాంట్లో మనిషి కానరాకుండా పోలేదని గమనించాలి.అంతెందుకు?
ఒక మనిషిని చూశాను.
భార్యకు మాంగళసూత్రం కొంటున్నాడు. చిన్నదుకాణం అది. చూస్తే పసుపు తాడు.
ఫొటో తీయాలని ప్రయత్నిస్తే వారించాడు. భార్య కూడా కళ్లతో వద్దని సూచించింది.
అదొక మర్యాద. కొన్ని బంధాలను ఎవరు పడితే వాళ్లు, ఎప్పుడు పడితే అప్పుడు చూడకూడదు. తీసి దాయకూడదు. నలుగురికీ చూపనే కూడదు. వాళ్ల మాట మన్నించి గమనించసాగాను, ఒక మనిషిగా.ఆ పసుపుతాడు కొన్నాక ‘అది వట్టి పసుపు తాడే కదా…అంత సంతోషం ఏమిటి’ అన్నాను ఆయనతో.
నవ్వి చెప్పాడాయన…’బాబూ…నీకే కాదు, ఎవరికైనా ముందు సూత్రం తెలియాలి. తెలిస్తే ఏదైనా మంగళప్రదమే అవుతుంది’ అన్నాడు. అని ఊరుకోలేదు. ‘అది వట్టి తాడు కాదు. పసుపు తాడు’ అన్నాడు. ‘ ఆ తాడుకు పసుపుకొమ్మూ ఉందన్న అర్థంలో! ‘ఇంకేం కావాలి?’ అని కూడా అన్నాడు.

అసలు విషయం పవిత్రబంధం అని వాళ్లిద్దరూ అలా అర్థం చేయించారు.

వాళ్లు నిరుపేద కూలీలు.
ఇంకా పని నుంచి గల్లీలో ఉన్న తమ ఇంటికి వెళ్లలేదు.
దారిలో దుకాణంవద్ద ఈ కొనుగోలు. ఆ మట్టి మనుషులను చూస్తే ‘బంగారం’ అనిపించింది.

నిజం.

ఆమెను చూశాను. తృప్తిగా ఉందామె.
అందమంటే ఏమిటో అర్థమైంది.

అతడ్ని చూశాను, మోటుగా ఉన్నాడాయన.
మగసిరి అంటే ఏమిటో గమనించాను.

ఇద్దర్నీ కలిపి చూశాను.
భాగ్యవంతులు అనిపించింది.

పసుపుతాడు…పసుపు కొమ్ము కళ్ల ముందు మెదులుతుంటే – ఆర్థిక విషయాలతో మనుషులను దరిద్రులుగా చూడటం మానేయకపోతే మనం చాలా నిరుపేదలుగా మిగులుతామనే అనిపించింది. అందుకే పగిలిన అద్దాన్ని చూడవద్దంటున్నాను. బంగారు మాంగళసూత్రాన్నే చూడ ప్రయత్నించ కూడదంటున్నాను.

+++

ఈ చిత్రం అందుకే.  ఆమెను చూడండి.
గలగలలాడే ఆమె గాజుల చేతులు. ధృడంగా ఆ అద్దాన్ని పట్టుకున్నతీరు. ఇంకో చేతితో గాలికి ఎగిరే ఆ ముంగురులను నిదానంగా సవరించుకునే తీరూ చూడండి.

ఆమెను చూడమంటున్నాను.
అద్దం జీవితాన్ని ప్రతిఫలిస్తుంది. అంతే.
కానీ అద్దమే జీవితం కాదు.

గొప్ప పాటలు పూర్తి జీవితాలు కాదు.
జీవితమే పాట.
~

పలచని చెమటల బాహుమూలముల…

అవినేని భాస్కర్

 

Avineni Bhaskarజానపద శైలిలో, పామరుల వాడుక భాషలో, అచ్చ తెలుగులో అన్నమయ్య పలు కీర్తనలు రాశాడు. దంపుడు పాటలు, గొబ్బిళ్ళ పాటలు, జాజర పాటలు, వసంతాలాటల పాటలు (పసుపు నీళ్ళు చల్లుకునే పండుగ – హోలీ వంటిది), వెన్నెల్లో నృత్యం చేసుకుంటూ పాడే పాటలు, పెళ్ళి పాటలు, జలక్రీడా పాటలు ఇలా ఎన్నెన్నో జానపదాలు రచించాడు.

వెన్నెల్లో యువతీ యువకులు కోలాటం చేస్తూ పాడుకునే జానపదంగా “నెయ్యములు అల్లో నేరేళ్ళో” పాటని భావించవచ్చు. 

శ్రీవేంకటేశ్వరుడు-అలమేలుమంగలే యువతీ యువకులై నృత్యం చేస్తూ పాడుతున్నట్టు అన్వయించుకోవచ్చు. లేదా కోలాటం ఆడుతున్నవాళ్ళు పద్మావతి-పెరుమాళ్ళ సంగమాన్ని కీర్తిస్తున్నట్టూ అన్వయించుకోవచ్చు.
 
విరహంతో వేచి విభుణ్ణి చేరుకుంది తరుణి. ఆ దివ్య దంపతుల ప్రియసంగమమే ఈ కీర్తనలో పొందుపరిచిన భావం. ప్రణయ మూర్తులైన పద్మావతీ శ్రీవేంకటేశుల కలయికలో మనసులను మురిపించే ప్రేమ విలాసములు, తనువుల తపనలను తీర్చే శృంగార కేళీలు ఉన్నాయి. 
 
 
పల్లవి
నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో
 
చరణాలు
పలచని చెమటల బాహుమూలముల-
చెలమలలోనాఁ జెలువములే
థళథళమను ముత్యపుఁ జెఱగు సురటి
దులిపేటి నీళ్ళతుంపిళ్ళో
 
తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో
 
గరగరికల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలు(లే)
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాఁకులినుప గుగ్గిళ్ళో


తాత్పర్యం (Meaning):
అలమేలుమంగా-శ్రీనివాసుల పొందిక అల్లో నేరేడుపళ్ళలా తీయనిదా? “అబ్బా ఎంత అన్యోన్యమైన జంట!” అని ఉవ్వుళ్ళు ఊరించేటువంటిదా?
 
విరహంతో వేచియున్న ఆమె మేను చెమరించింది. అమె చంకలనుండి పలుచని చెమటలు కారిపోతున్నాయి. చెమటల ఊటలనిండిన ఆమె బాహుమూలములు కొలనులవలే అందంగా ఉన్నాయి. పైటంచులో ముత్యాలు పొదిగిన చీర కట్టుకుని ఉంది ఆమె. ఆ చీరచెంగుని తీసి విసనకర్రలా పట్టుకుని విసురుకుంది. చెంగులోని ముత్యాలు తళతళ మెరుస్తున్నాయి. విసిరిన జోరుకి చెమట చుక్కలు చిరుజల్లుల్లా రాలుతున్నాయి.
 
స్వామి వచ్చాడన్న తన్మయత్వంలో ఆమె కన్నులనుండి బాష్పాలు ఫళఫళమని రాలాయి. అప్పుడామె చిలిపి అలకలలు నటిస్తూ, పెదవుల్లో చిరునవ్వులు చిందిస్తూ ఉంది. మర్రిపళ్ళలా ఎర్రగా ఉన్న ఆమె పెదవులు కవ్విస్తున్నాయి. అధరామృతం పంచే ఆ పెదవులు అతనిని గుటకలు వేయిస్తున్నాయి.
 
నానావిధ పరిమళములతో సింగారములొలికే శ్రీవేంకటేశుడి కౌగిలిలో కలిసిపోయింది ఆ శ్రీమహాలక్ష్మి. తాళలేని విరహాన్ని ఆ విభుని కలయిక చల్లారుస్తుంది. ఆ జంటయొక్క మోహం ఎంత తీవ్రస్థాయికి చేరుకుందంటే… ఆ తాపవేళలో మోహానికి అధిపతియైన మన్మథుడు తన చెరకు విల్లునుండి వారి మీదకి పువ్వుల బాణాలు సంధించాడా లేక ఇనపగుగ్గిళ్ళు విసిరాడా అని సందేహం కలుగుతోంది. ఇనుపగుగ్గిళ్ళు విసిరాడా అన్న సందేహం ఎందుకు కలిగిందంటారా?  వారి నఖములూ, దంతములూ ఇరువురిమేనా చేస్తున్న గాయాలటువంటివి మరి?
 
విశ్లేషణ :
నెయ్యములల్లో నేరేళ్ళో = నెయ్యములు + అల్లో నేరేళ్ళు అని పదాలను అర్థం చేసుకోవాలి.
వెన్నెల రాత్రులెంత ఆహ్లాదకరమో అంత ఆహ్లాదకరం ఈ “అల్లోనేరేళ్ళో” అన్న నుడి. అంతకంటే ఆనందం పద్మావతీ-శ్రీనివాసులు ప్రణయం.
 
చమటలూరిన చంకలు అందంగా ఉన్నాయని వర్ణించడం ఏంటి అనిపించవచ్చు! మామూలుగా చెమట ఇంపైనది కాకపోయినా కోరికలవశమై మన్మథకేళికి సిద్ధమైనవేళ చంకల్లో కారే చెమటల్లో ఆకర్షించే పరిమళముంటుందట. అలసినప్పుడు ఒంటిపై కారే చెమటకీ, కామవశమైనప్పుడు చెమర్చే చమటకీ తేడాలుంటాయని నేటి పరిశోధనలు కూడా చెప్తున్నాయి. అన్నమయ్య కీర్తనల్లో పలుచోట్ల చంకల గురించి, చెమట గురించి వర్ణించబడియుంది. అన్నమయ్యే కాదు, మరి కొందరు కవులుకూడా చంకల చెమట గురించి అందంగా వర్ణించిన సందర్భాలున్నాయి. చంకల పరిమళాన్నిబట్టే హస్తిణి, చిత్తిణి, శంకిణి, పద్మిణి అని స్త్రీనలను గుర్తించేవారట. అన్నమయ్యే మరొక కీర్తనలో “కప్పులు తేరేటి కస్తూరి చంకల కొప్పెర గుబ్బల గొల్లెత” అని రాశాడు.
 
ఆమె విసనకర్రతో విసురుకుంది అని రాస్తే కవిత్వం ఎక్కడుంటుంది? పైట చెంగుతో విసురుకున్నట్టు రాయడంలోనే కవిహృదయం ఉంది. ఆ రోజుల్లో కూడా మగువలు “వర్క్ చీరలు” కట్టేవారు అన్నది మనం గమనించాలి.
 
ప్రణయంలో భావావేశాలు, మనోవికారాలూ, అలుకలూ, చిరుకోపాలూ, నవ్వులూ సహజం కదా? విరహంతో వేచి విసిగిపోయి ఉన్న నాయిక నాయకుని రాకతో వెంటనే ఆనందంలోకి జారిపోదు కదా? కోపం చూపుతుంది, నిందిస్తుంది, ఏడుస్తుంది, అలుగుతుంది. అతను ఆమె అలుక తీరిస్తేగానీ మనసు సహజ స్థితికి చేరుకోదు కదా?
 
శ్రీవేంకటేశుడు అలంకార ప్రియుడు. “గరగరికల వేంకటపతి” అట! వారి రతిలోని తీవ్రతని “మన్మథుడి పువ్వుల బాణాలు వారిని ఇనుప గుగ్గిళ్ళులా తాకాయి” అని సమర్థిస్తున్నాడు అన్నమయ్య.
 
ఈ కీర్తనని ఒకానొక సినిమాలో వాడుకున్నారు. బాలు పాడారు. స్వరపరచిన తీరువల్ల విన్నవారికి మరొక అర్థం స్ఫురించవచ్చు. కాబట్టి పైన ఇచ్చిన ఆడియోలు వినమని మనవి.
 
కొన్ని పదాలకు అర్థాలు (Meaning) :
నెయ్యము = స్నేహము, ప్రియము
అల్లోనేరేళ్ళో = ఆడపిల్లలు వెన్నెల రాత్రుల్లో ఆడుకునే ఒక ఆట, స్త్రీలుపాడే పాట (జానపదం)
ఒయ్యన = తిన్నగ, మెల్లగ, Gently, Softly
ఉవ్విళ్ళూ = తపనలు, తహతహలు, eagerness
 
పలచని చెమట = లేత చెమట, సన్నని చెమట
బాహుమూలములు = చంకలు, కక్షములు
చెలమలు = గుంటలు, pit, కొలనులు, పల్లము
చెలువము = అందము, సౌందర్యము
థళథళ = తళతళ
ముత్యపు = ముత్యాల
చెఱగు = చెంగు, చీర కొంగు, పైట
సురటి = విసనకఱ్ఱ
దులుపేటి = దులుపుతున్న
నీళ్ళా తుంపిళ్ళో = తుంపరలు, వాన చినుకులు
 
తొటతొట కన్నుల తొరిగేటి నీళ్ళు = అదురుతున్న కళ్ళనుండి రాలేటి కన్నీరు
(తొరిగేటి = రాలేటి)
చిటిపొటి యలుకలు = చిన్న చిన్న గొడవలు, చిలిపితగాదా, అల్పమైన , silly fights
చిరునగవే = చిరునవ్వులే
వటఫలంబు = మర్రిపండు
వన్నెల = సొభగు
మోవి = పెదవి
గుటక = ఒక్కసారి మింగగల
గుక్కిళ్ళు = గుటక మింగు శబ్ధము
 
గరగరికల = సింగారమైన, అలంకారములుగల, చక్కదనాలుగల
బచ్చనలు = కలయికలు, కూటములు, ఒదిగిపోవడము
మరునివింటి = మన్మథుడి చెరకు విల్లు
కమ్మని = కమ్మనైన
అంప విరులు = పువ్వుల బాణాలు / బాణాల పువ్వులు(!?)
గురి = లక్ష్యం
తాకు = తాకేటి
గుగ్గిళ్ళు = ఉడకబెట్టిన శనగలు

విశాలాక్షి విద్యాభ్యాసం        

 

విశాలాక్షి, కన్నెరికమౌతున్న వేశ్య
కోమలి, ఆమె తల్లి

కోమలి:        అమ్మాయీ, కన్నెపొర పోవడం నువ్వనుకున్నంత బాధాకరమేమీ కాదని ఇప్పుడు అర్థమైందా? తొలిరేయి ఒక పురుషుడితో గడిపావు. తొలి కానుకగా నూరు వరహాల భారీ బహుమతి అతడి నుంచి అందుకున్నావు. ఆ డబ్బుతో నీకో నెక్లేసు కొంటాను.

విశాలాక్షి:     అలాగేనమ్మా, నెక్లేసు కొను. జాతిరాళ్ళతో మెరిసే నెక్లేసు, ఆ పంకజం వేసుకుంటుందే అలాంటిది కొను.

కోమలి:        తప్పకుండా, అలాంటిదే కొంటాను. సరేగానీ, నువ్వు పురుషులతో ఎలా మసులుకోవాలో నాలుగు మాటలు చెప్తాను. జాగ్రత్తగా విని మనసుకు పట్టించుకో. రకరకాల పురుషుల్ని ఆకర్షించగల నీనేర్పు మీదే మన బ్రతుకు తెరువు ఆధారపడి ఉంది.

మీనాన్న పోయాక మనకు ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో నీకు తెలీదు. ఆయనున్నప్పుడు దేనికీ కొరతుండేది కాదు. ఇనప సామాన్లు తయారు చేసే కంసాలిగా ఆయనకు నగరంలో మంచి పేరూ, గౌరవం ఉండేవి. అట్లాంటి కంసాలి మరొకరు లేరని జనం చెప్పుకొనేవారు. ఆయన చనిపోయాక కొలిమి సామాన్లన్నీ రెండొందల వరహాలకు అమ్మేశాను. ఆ డబ్బుతో కొంత కాలం గడిచింది. నేను కుట్లూ అల్లిక పనులూ చేస్తూ కొంత గడించినా అది తినడానికి కూడా చాలేది కాదు. నా బంగారు కొండా, నానా తిప్పలూ పడి నిన్ను పెంచాను. ఇక నాకు మిగిలిన ఒకే ఒక్క ఆశ నువ్వేనమ్మా!

విశాలాక్షి:     అమ్మా! నేను సంపాదించిన నూరు వరహాల గురించేమన్నా చెప్తున్నావా?

కోమలి:        కాదమ్మా! అలిసిపోయిన తల్లికి నువ్విప్పుడు కాస్త ఆసరాగా ఉంటావని అనుకుంటున్నాను. అంతే కాదు. విలాస వంతంగా బతకడానికి కావలసినంత సంపాదించగలవని నమ్ముతున్నాను.

విశాలాక్షి:     నాక్కాస్త అర్థమయ్యేట్టు చెప్పమ్మా! అసలిదంతా ఎందుకు చెప్తున్నావు?

కోమలి:        పిచ్చిపిల్లా, నీకింకా అర్థం కాలేదా? కుర్రాళ్ళతో కలిసి కాస్త చనువుగా ఉండు, వాళ్ళు తాగేటప్పుడు తోడుగా ఉండు. వాళ్లకు పడక సుఖం అందించడానికి సదా సిద్ధంగా ఉండు. ఇదంతా ఉచితంగా కాదు, డబ్బు తీసుకొనే! అలాగైతే నువ్వు బోలెడంత డబ్బు సంపాదించగలవు.

విశాలాక్షి:     (చిరుకోపంతో) అంటే కోటిరత్నం కూతురు తిలకం లాగానా?

కోమలి:        అవును.

విశాలాక్షి:     తిలకం సానిపాప కదా!

కోమలి:        ఐతే ఏంటి? అందులో తప్పేముంది? నువ్వు ధనికురాలివౌతావు. నీకు అనేకమంది ప్రియులుంటారు. (విశాలాక్షి ఏడుస్తుంది..) నా బంగారుతల్లి కదూ, ఎందుకేడుస్తావు? సానిపాపల్ని ఎంతోమందిని చూస్తున్నావు నువ్వు. వాళ్ళ కోసం ఎంతమంది పడిగాపులు పడతారో నీకు తెలుసు. వాళ్ళు ఎంతెంత డబ్బు సంపాదిస్తారో నువ్వెరుగుదువు. శరీరానికుండే ఉపయోగం తెలియనప్పుడు మన పొరుగింటి  మోహనాంగి కటిక దరిద్రంలో ఉండేది. ఇప్పుడు చూడు. ఒంటినిండా బంగారం, ఖరీదైన బట్టలు, వెనకెప్పుడూ నలుగురు దాసీలు…. మహారాణి లాగా జీవిస్తోంది.

విశాలాక్షి:     ఆవిడ అవన్నీ ఎలా సంపాదించిందమ్మా?

కోమలి:        మొదట మంచి బట్టలేసుకొని అందరితో కలివిడిగా సంతోషంగా రాసుకు పూసుకు తిరిగింది. నీకు లాగా ప్రతి చిన్న విషయానికి ఇకిలించేది కాదు. చక్కగా చిరునవ్వు నవ్వేది. అది చాలా ఆకర్షణగా ఉండేది. నిక్కచ్చిగా వ్యవహరించేది. తన ఇంటికి వచ్చిన వాళ్ళను కానీ, తనను ఇంటికి తీసుకు పోయిన వాళ్ళను కానీ మోసం చేసేది కాదు. తనంతట తానుగా వాళ్ళను దేబిరించేది కాదు. ఎవరైనా డబ్బిచ్చి విందులో తోడుకోసం తనను తీసుకుపోతే, అక్కడ తాను తాగకుండా జాగ్రత్త పడేది. తన ప్రియురాలు తాగితే మగవాడు భరించలేడు. తినేటప్పుడు కూడా పశువులాగా ఆయాసం వచ్చేంతగా ఎగబడి తినేది కాదు. అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పడగ్గదిలో ప్రియుడికి నచ్చే విధంగా ఉండగలిగేది. తినేటప్పుడు సున్నితంగా మునివేళ్ళతో తీసుకొని నిశ్శబ్దంగా తింటుంది. వైన్ తాగేటప్పుడు కూడా నిదానంగా, నిమ్మళంగా, నిశ్శబ్దంగా చిన్న చిన్న గుక్కలు వేస్తూ తాగుతుంది కానీ, ఒక్క సారిగా ఎత్తి పట్టుకొని గ్లాసు ఖాళీ చెయ్యదు.

విశాలాక్షి:     ఒకవేళ బాగా దాహమేసిందనుకో, అప్పుడేం చేస్తుంది?

కోమలి:        పిచ్చిపిల్లా, ఎంత దాహమేసినా అలానే తాగుతుంది. అంతే కాదు, అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడదు. తన మనిషిని నొప్పించేలా మాట్లాడదు. తన విటుడి మీద నుంచి చూపు వేరొకరి మీదకు మరల్చదు. అందుకే ఆమె నందరూ మెచ్చుకుంటారు. పక్కమీద కూడా ఆమె అసభ్యంగా ప్రవర్తించదు. తనపనిని అందంగా, ప్రేమగా, జాగ్రత్తగా చేస్తుంది. పడగ్గదిలో ఆమె ఆలోచించేది ఒక్కటే. తనతో పడుకున్నవాడిని మెప్పించి తనకు శాశ్వతంగా చేరువయ్యేలా చేసుకోవడం. అందుకే ఆమె గురించి అందరూ చాలా గొప్పగా చెప్తారు. నువ్వీ పాఠాన్ని మనసు కెక్కించుకుంటే మనం కూడా ఆమె లాగే బోల్డంత సంపాదించవచ్చు. ఆమాటకొస్తే, ఆమె నీ అంత అందగత్తె కాదు కాబట్టి, ఆమె కంటే ఎక్కువే సంపాదించవచ్చు. ఇంతకంటే నేనేమీ చెప్పను. సకలైశ్వర్యాలతో చిరకాలం జీవించాలి నువ్వు.

విశాలాక్షి:     సరేగానమ్మా! నాకో మాట చెప్పు. నాకు డబ్బిచ్చేవాళ్ళంతా రాత్రి నాతో పడుకున్న రాజారావంత అందంగా ఉంటారా?

కోమలి:        అలాగనేమీ లేదు. కొంతమంది అంతకంటే అందంగా ఉంటారు. కొంతమంది అంతకంటే బలంగా, చురుగ్గా ఉంటారు. అంటే అర్ధమైందిగా! మిగిలినవాళ్ళు ఏదో మామూలుగా ఉంటారు.

విశాలాక్షి:     కుర్రాళ్ళతోనే కాకుండా పెళ్లైన సంసారులతో కూడా నేను పడుకోవాలా?

కోమలి:        అసలు వాళ్ళతోనే ముఖ్యంగా పడుకోవాలి. వాళ్ళే డబ్బు ఎక్కువ ఇస్తారు. అందగాళ్ళంతా వాళ్ళ అందాన్నే ఇవ్వాలని చూస్తారు గాని, డబ్బు కాదు. మళ్ళీ చెప్తున్నా; బాగా డబ్బిచ్చేవాళ్ళతోనే ఎక్కువ అనుబంధం పెంచుకో! ‘అదిగో, ఆ కోమలి కూతురు విశాలాక్షిని చూడండి. ఎంత సంపాదించిందో చూడండి. ఆ ముసలి తల్లికి ఎంత సంతోషం కలిగిస్తుందో చూడండి. దేవుడా పిల్లని చల్లగా చూడాలి.’ అని వీథిలో నిన్ను చూసిన వాళ్ళంతా మెచ్చుకోవాలి.

ఏమంటావమ్మా? అలా చేస్తావా మరి? ఈ ముసలి తల్లి చెప్పినట్టు చేస్తావా? చేస్తావు కదూ? నువ్వు గొప్ప గొప్ప వేశ్యల్ని తేలిగ్గా తలదన్నుతావు. వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్లి స్నానం చెయ్యి. రాజారావు ఈ రాత్రికి కూడా వస్తాడను కుంటా! వస్తానని వాగ్దానం చేశాడు కాదూ నా చిన్నారి కోసం. మీరిద్దరూ ఈ రాత్రికి మరిన్ని సుఖాలు చవి చూద్దురు గాని!

సుమేరులోనూ ఉన్నాడు శివుడు!

కల్లూరి భాస్కరం

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చెప్పబోయే విషయం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నదే కానీ, మరోసారి గుర్తుచేసుకోవలసిన అవసరం వచ్చింది…

ఏదైనా ఒక రచనను– ఇద్దరో ముగ్గురో కలసి రాసినట్టు ప్రత్యేకంగా చెప్పకపోతే– ఒక్కరు రాసింది(ఏకకర్తృకం)గానే  అనుకుంటాం. నిజానికి ఏ రచనైనా అనేకమంది రాసినదే(బహుకర్తృకం) అవుతుంది కానీ, ఏకకర్తృకం కాదు.  ఆ అనేకమంది మరెవరో కాదు; పాఠకులే! ఆ పాఠకులలో మళ్ళీ వేర్వేరు అభిరుచులు, అవగాహన భేదాలు ఉన్నవాళ్ళు ఉంటారు. కనుక ఒక రచన చేస్తున్నప్పుడు రచయిత దృష్టిలో కేవలం ఆ రచనావస్తువు మాత్రమే ఉండదు. వేర్వేరు అభిరుచులూ, అవగాహన భేదాలూ ఉన్న పాఠకులు కూడా ఉంటారు. తెరముందుకు వచ్చి రాస్తున్నది రచయితే అయినా, తెరవెనుక ఉండి ఆ రచన ఎలా ఉండాలో, తమకు ఎలా అందాలో నిర్దేశించేది ఈ వైవిధ్యం కలిగిన పాఠకులే. అందుకే రచయిత తన రచన ఎవరిని ఎలా తాకుతోందో నిరంతరం పరిశీలించుకుంటూనే ఉంటాడు. వారిని చేరేందుకు వీలైన వ్యూహాలు, ఎత్తుగడలు ఎప్పటికప్పుడు అప్రయత్నంగా రచించుకుంటూనే ఉంటాడు. రచనలో అవి కూడా భాగమవుతాయి.

ఆ మాటకొస్తే జీవితంలో కానీ, రచనా జీవితంలో కానీ ప్రతిదీ ఒక వ్యూహాన్ని అనుసరించే వెడుతుంది. అసలు రచన అంటేనే ఒక వ్యూహం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం, లేదా సంభాషణ ఎప్పుడు ప్రారంభమవుతుందో  అప్పుడే వ్యూహం అడుగుపెడుతుంది. ఇక్కడ వ్యూహం అనే మాటను తటస్థార్థంలోనే తీసుకోవాలి తప్ప వ్యతిరేకార్థంలో కాదు.

ఈ బహుకర్తృత్వ సూత్రం సినిమా, నాటకం లాంటి దృశ్యరచనలకూ వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ పాఠకుల స్థానంలో ప్రేక్షకులు వస్తారు. ఇదే మౌఖిక వాఙ్మయంలోనూ, నాటకం వంటి దృశ్య కళా రూపాలలోనూ అయితే శ్రోతలు, లేదా ప్రేక్షకులు ప్రత్యక్షంగా ఉండి కథకునీ, నటునీ, ఒక్కోసారి వస్తువునూ ప్రభావితం చేస్తారు. లిఖిత వాఙ్మయంలోనూ, సినిమా వంటి ఆధునిక దృశ్యకళారూపాలలోనూ పాఠకులు, ప్రేక్షకులు పరోక్షంగా ప్రభావితం చేస్తారు. అంతే తేడా!

తన రచన ఏయే పాఠకులను ఎలా తాకుతుందో, లేదా తాకాలని తను అనుకుంటున్నాడో చెప్పుకున్న కవి నాకు ఇప్పటికిప్పుడు ఒక్కరే గుర్తుకొస్తున్నారు. ఆయన, నన్నయభట్టు. పాఠకులను మూడు రకాలుగా వర్గీకరించుకుని ఆ మూడు రకాలవారినీ సంతృప్తి పరచేలా తన రచన ఉంటుందని, లేదా ఉండాలని ఆయన అనుకున్నారు. అంటే ‘వ్యూహ’ రచన ముందే చేసుకున్నారన్న మాట. ఆయన వర్గీకరణ ప్రకారం, కవీంద్రులు మొదటి రకం. వీరు తన రచనలోని ప్రసన్నకథతో కూడిన అర్థయుక్తిని లోతుగా చూసి మెచ్చుకుంటారు.  కవీంద్రులు కాకపోయినా శ్రావ్యతను ఆనందించేవారు రెండవ రకం. వీరు తన అక్షరరమ్యతను ఆదరిస్తారు. కవీంద్రులూ, శ్రావ్యతను ఆనందించేవారూ కాని ఇతరులు మూడవ రకం. చక్కని అర్థవంతమైన తన సూక్తులను వీరు ఇష్టపడతారు.

***

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం దేనికంటే, 21 వ్యాసాల క్రితం నలదమయంతుల కథతో ప్రారంభమై, అక్కడినుంచి ఓడిసస్ కథకు, ఆ తర్వాత అమ్మ తాత్వికతకు మళ్లిన ఈ వ్యాసాలు ఒక  పెద్ద గొలుసుకట్టు తంతుగా సాగిపోతున్నాయి. ఇది ఎక్కడ తెగుతుందో ఈ క్షణాన నాకు కూడా తెలియదు. అదలా ఉంచితే, ఈ వ్యాసపరంపర రాను రాను మరీ తాత్విక విషయాల్లోకి జారిపోవడమూ మీరు చూస్తూనే ఉన్నారు. దానికితోడు ఇంకా ‘అమ్మ తాత్వికత’ చుట్టూనే ఈ వ్యాసాలు తిరుగుతున్నాయి. ఇక్కడనుంచి  ‘అయ్య తాత్వికత’ లోకి వెళ్ళడం నా ప్రణాళిక. తీరా వెళ్ళిన తర్వాత అందులోంచి కూడా ఎప్పటికి పైకి తేలగలనో తెలియని పరిస్థితి. దాంతో ఇప్పుడు నేను కూడా పనిగట్టుకుని నన్నయభట్టులా పాఠకులను వర్గీకరించుకుని,  వీలైనంత ఎక్కువమందితో అనుసంధానం(connect) అవుతానో, లేదో చూసుకోవలసిన అగత్యంలో పడ్డాను(అంతటి వ్యక్తితో నన్ను పోల్చుకుంటున్నానని చటుక్కున అపార్థం చేసుకోవద్దు. ఆయన ఎదుర్కొన్న పరిస్థితితో మాత్రమే ఈ పోలిక).

తాత్విక విషయాల మీద అందరికీ రుచి ఉండదని నాకు తెలుసు. ఎవరివరకో ఎందుకు, నాకు కూడా నేల విడిచి సాము చేసే శుద్ధతాత్వికత మీద గొప్ప రుచి ఉందని చెప్పలేను. నావరకు అది రుచికరం కావాలంటే, చరిత్ర అనే తాలింఫును జోడించాల్సిందే. అప్పటికీ తాత్విక విషయాలు పడని పాఠకులు ఉండిపోతారనుకుంటే బహుశా చరిత్రాంశాలు వారికి రుచి కలిగించవచ్చు. పోనీ అదీ కాదనుకుంటే మన పురాణకథలు, దేవీ దేవతలు, ప్రతీకలతో; ఇతర పురాణ కథలకు, దేవీ దేవతలకు, ప్రతీకలకు ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలు ఆకట్టుకోవచ్చు. ఇలా పాఠకులను ఇంకా అనేక రకాలుగా వర్గీకరించుకునే అవకాశం ఉంది కానీ, దానిని మీ ఊహకే వదిలేసి ప్రస్తుతానికి ఒక ఆశ్చర్యకరమైన పోలికలోకి వెడతాను.

ఇంతకుముందు ఒక వ్యాసంలో ‘జంటగొడ్డలి చెప్పే జగజ్జనని తత్వం’ గురించి చెప్పుకున్నాం. జంటగొడ్డలి కాకపోయినా, గొడ్డలి ప్రస్తావన లలితాసహస్రనామాలలో రెండు చోట్ల వస్తుంది. ఒకచోట అమ్మవారు ‘భవారణ్య కుఠారిక’. అంటే, సంసారమనే అరణ్యానికి గొడ్డలి. ఇంకోచోట ‘మృత్యుదారు కుఠారిక’. అంటే, మృత్యువు అనే చెట్టుకు గొడ్డలి. ఈ గొడ్డలి  కాకతాళీయంగా చేసిన ఆలంకారిక ప్రయోగం కావడానికి ఎంత అవకాశం ఉందో, ‘జంట గొడ్డలి’ని సూచించే ప్రతీక కావడానికీ అంతే అవకాశం ఉంది. ఎలాగో ముందు ముందు స్పష్టం కావచ్చేమో చూద్దాం.

 ‘జంట గొడ్డలి’ క్రీటు(మినోవన్)మతానికి చెందిన ప్రతీకలలో ఒకటి. అలాగే స్తంభమూ, ఎద్దు కొమ్ములూ కూడా. క్రీటు మతంలో సర్పం, పావురం వగైరాలతో పాటు వృషభం కూడా ముఖ్యమైన జంతువు. పంది లానే వృషభం కూడా పురుషుడిలోని పునరుత్పాదక శక్తికి ప్రతీక. పశువుల మందకు ప్రభువుగా దానిని పశుపతి అని కూడా అనచ్చు.  మనదేశంతో సహా వివిధ పశుపాలక, వ్యవసాయ సమాజాలలో నేటికీ ఎద్దును, ఆవును పూజించడం ఉంది.  యూరప్ కు చెందిన నూతన శిలాయుగ అవశేషాలలో వృషభ మూర్తులు కనిపించడం, అక్కడ కూడా వృషభ ఆరాధన ఉండేదనడానికి సూచన.

ఇక స్తంభం పవిత్ర వృక్షానికి సంకేతం. ఆదిమ సమాజాలలో వంటచెరుకు కోసం గొడ్డలితో చెట్లు నరకడం స్త్రీలే చేసేవారనీ, ఆవిధంగా గొడ్డలికి పవిత్రత వచ్చి ఉండచ్చనీ జార్జి థాంప్సన్ అంటారు. నిజానికి అన్న ఉత్పాదనకు ఉపయోగించే ప్రతి సాధనమూ పవిత్రమే. చెట్లను కూల్చుతుంది కనుక గొడ్డలికి పిడుగుపాటుతో పోలిక కుదిరి, వర్షానికి సంబంధించిన మాంత్రిక చర్యలలో భాగమైంది. ఆ తర్వాత గొడ్డలి యుద్ధసాధనం అయింది. మనకు బాగా తెలిసిన పరశురాముడి ఆయుధం గొడ్డలి.  పరశురాముని పోలిన పాత్ర గ్రీకు పురాణాలలోనూ ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్లలేం. ‘పరశువు’ అంటే గొడ్డలి.  అది జంతువును బలి ఇవ్వడానికి ఉపయోగించే సాధనం కూడా. క్రీటు మతంలో బలి ఇచ్చే జంతువులలో ముఖ్యమైనది వృషభం. పవిత్ర వృషభ రక్తంతో స్పర్శ వల్ల గొడ్డలికి పవిత్రత సిద్ధించి దాని శక్తి మరింత పెరిగింది.

క్రీటు అమ్మవారి సేవలలో ప్రధానంగా పాల్గొనేది స్త్రీలే, అంటే పూజారిణులు. వీరికి సహకరించడమే పురుషులు చేయవలసిన పని. ఈ పూజారిణులు కొన్ని తంతులలో నృత్యం చేస్తారు. మైసీనియాలో దొరికిన ఒక బంగారు ఉంగరంపై ఉన్న చిత్రంలో ఒక పూజారిణి నృత్యం చేస్తుంటే, ఇంకొక పూజారిణి ఒక పీఠం మీద తలవాల్చి శోకిస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఒక పురుష సేవకుడు వంగి ఒక చెట్టు ఫలాన్ని తెంపుతూ ఉంటాడు. సరే, మన పురాణాలలో శివుడు నటరాజు.

ఇప్పుడు మనం ఒకసారి క్రీ.పూ. 2500 నాటి సుమేరుకు వెడదాం. ఫిలడెల్ఫియా లోని యూనివర్సిటీ మ్యూజియంలో ఆ కాలానికి చెందిన ఒక మట్టిపలక ఉంది. దాని మీద ఒక చిత్రం ఉంది. దాని పేరు, Moon-Bull and Lion-Bird. అందులో మానవ ముఖం కలిగిన ఒక వృషభమూ, దానిని చంపుతున్న సింహముఖం కలిగిన ఒక గరుడపక్షీ కనిపిస్తాయి. అయినాసరే, వృషభ ముఖంలో ఒకవిధమైన ప్రశాంతతా, ఆనందమూ ఉట్టిపడుతూ ఉంటాయి.  జోసెఫ్ క్యాంప్ బెల్ (Occidental Mythology) వివరణ ప్రకారం, చంద్ర సంబంధి అయిన వృషభం, చంద్రుడిలానే జనన మరణ చక్రానికి ప్రతీక. దానిని చంపుతున్న గరుడపక్షి సూర్య(సౌర) సంబంధి. ఆ వృషభం నాలుగు కాళ్లనుంచీ దివ్యశక్తి మెరుపులు జాలువారుతూ ఉంటాయి. దాని మానవ ముఖానికి నలుచదరపు ఆకారంలో గడ్డం ఉంటుంది. అది ప్రాచీన సుమేరు, ఈజిప్టులకు చెందిన చిత్రశైలిని సూచిస్తుంది. సర్పమూ, వృషభమూ లాంటి దేవతా సంబంధులకు ఇలాంటి గడ్డమే ఉంటుంది. భూమిలో విత్తనాలు నాటడానికి ఇది ప్రతీక.

ఈ వృషభం ముంగాలు ఒకటి ఒక గుట్ట మీద ఆని ఉంటుంది. ఈ గుట్ట పవిత్ర విశ్వపర్వత శిఖరానికీ, భూదేవి దేహానికీ ప్రతీక. కింది భాగంలో కొమ్ములు లాంటివి కనిపిస్తున్నాయి. అవి క్రీటుకు చెందిన పవిత్ర శృంగాలను పోలి ఉన్నాయి. వృషభదేవునికీ, భూదేవికీ మధ్య అనుసంధానం కలిగిస్తున్నవి ఈ కొమ్ములే. ఆ కొమ్ముల మధ్యలో వృషభం కాలు ఒకటి చొప్పించబడి ఉంది. రెండు కొమ్ముల మధ్య ఆ కాలు ఒక త్రిశూలాకారాన్ని కల్పిస్తోంది. వృద్ధి క్షయాలకు ప్రతీక అయిన ఈ వృషభచంద్రుడి నుంచే, చంద్రుడి నుంచి కురుస్తున్నట్టుగా, జీవుల పునరుత్థానానికి అవసరమైన మంచు, వాన కురుస్తున్నట్టు ఈ చిత్రం సూచిస్తుంది. మంచు, వాన అనేవి భూగర్భాన్ని ఫలవంతం చేసే వీర్యాలు.

క్యాంప్ బెల్ ప్రత్యేకించి చెప్పకపోయినా, సింహముఖం కలిగి, సూర్య సంబంధి అయిన గరుడపక్షి వృషభాన్ని కబళించడమంటే జీవిని కాలం కబళించడమే. మన పురాణాల ప్రకారం కూడా కాలానికి సూర్యుడే కారకుడు. కాలంలోనే చావు, పుట్టుకలు సంభవిస్తూ ఉంటాయి. ‘కాలుడు’ అనే పేరు కూడా కలిగిన యముడు సూర్యుని కొడుకే.

sun lion

మళ్ళీ క్యాంప్ బెల్ వివరణకు వెడితే, భూమి అడుగున నీరు ఉంది. క్రీటు-మైసీనియాకు చెందిన దేవుడు పోసెడియన్. అతని వాహనం వృషభం. అతను త్రిశూలం ధరిస్తాడు. సముద్రాలు, ఊటబావులు, పాతాళ జలాలు అతని నివాసాలు. అలాగే, భారతీయ దేవుడు శివుడి వాహనం కూడా వృషభమే. ఆయన చేతిలో కూడా త్రిశూలం ఉంటుంది. ఆయన అర్థాంగి పార్వతి పేరు పర్వత పుత్రిక అని సూచిస్తుంది. ఆమె వాహనం సింహం. శివుడు పార్వతితో కలసి కైలాసపర్వతం మీద ఉంటాడు. ఆయన ప్రధానంగా లింగరూపంలో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆయన పాతాళ జలాల నుంచి పైకి వచ్చే లింగమైతే, భూమి యోని.

శివుడు నటరాజు కూడా. ఆయన తన కుడి పాదాన్ని అజ్ఞానమనే మరుగుజ్జు మీద ఉంచి అణగదొక్కుతూ ఉంటాడు. ఎడమకాలిని కుడికాలికి అడ్డంగా పైకి ఎత్తుతాడు. కుడిపాదంతో జీవసృష్టికి అవసరమైన తన సృష్టిశక్తిని అందిస్తున్నాడనీ, ఎడమపాదంతో జీవులను జన్మ నుంచి విముక్తుల్ని చేస్తున్నాడనీ ఈ భంగిమ సూచిస్తుంది, ఆవిధంగా నటరాజమూర్తి జననమరణ చక్రానికి ప్రతీక. పై సుమేరు చిత్రంలోని వృషభం తన ముందు కాళ్లను చాపిన తీరు కూడా ఆ భంగిమనే సూచిస్తోంది.

నటరాజు గురించి మరికొన్ని వివరాలు చెప్పుకునే ముందు, ఇంకొకటి చూద్దాం. సుమేరు పట్టణమైన ఊర్(ఊరు)లోని రాచసమాధులలో షుబ్-అద్ అనే రాణిని సమాధి చేసిన చోట వెండితో చేసిన గోముఖం ఒకటి కనిపించింది. ఆమె భర్త అ-బర్-గి సమాధిలో బంగారు వృషభ ముఖం దొరికింది. దానికి కూడా నలుచదరపు గడ్డం ఉంది. దానిని చిన్న వీణమీద తాపడం చేశారు. ఈ వీణ వృషభచంద్రుని ఆహ్వానించే గీతికి ప్రతీక. అలాగే, తన ప్రియుడైన భర్తతో కలసి మృత్యులోకానికి రమ్మని రాణిని ఆహ్వానించడానికి కూడా ప్రతీక. రాణి తన పరివారంతో కలసి భర్తతో సహగమనం చేసినట్టు ఈ మొత్తం వివరాలు సూచిస్తాయని క్యాంప్ బెల్ అంటారు.

nataraju

మెసపొటేమియాకు చెందిన వేరొక ఉదంతం వృషభాన్ని ఎలా బలి ఇచ్చేవారో చెబుతుంది. ఢంకా, లేదా డమరుకాన్ని వృషభచర్మంతో తయారు చేస్తారు. ఇది వృషభం ప్రాముఖ్యాన్నే కాక, పురా ప్రపంచం తాలూకు తంతులలో కళా రూపాలకు, వాద్యాలకు గల ప్రాధాన్యాన్ని కూడా సూచిస్తుంది. ఒక దేవాలయంలో కొత్త డమరుకాన్ని తయారు చేసుకోవలసి వచ్చింది. అందుకు ముందుగా చేయవలసింది ఒక వృషభాన్ని బలి ఇవ్వడం. బలికి అన్ని వృషభాలూ పనికిరావు. వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఉదాహరణకు, దానికి సంపూర్ణంగా రూపొందిన కొమ్ములు, మూపురం ఉండాలి. అది నల్లటిదై ఉండాలి. ఒంటి మీద ఎటువంటి గాయాల గుర్తులూ ఉండకూడదు.

నేలమీద దర్భలు పరచి వృషభాన్ని వాటి మీద ఉంచుతారు. మేక వెంట్రుకలతో పేనిన తాళ్ళతో దాని కాళ్ళు కట్టేస్తారు. వృషభ బలికి ముందు ఒక గొర్రెను బలి ఇస్తారు. ఆ తర్వాత వృషభం నోటిని నీటితో శుద్ధి చేసి దర్భలు పట్టుకుని దాని చెవిలో గుసగుసగా మంత్రాలు చదువుతారు.  తర్వాత దానిని దేవదారు చెట్టునుంచి స్రవించే జిగురు లాంటి ద్రవంతో సంప్రోక్షిస్తారు. ఆ తర్వాత నిప్పుల పాత్రతో, కొరకంచుతో ప్రతీకాత్మకంగా వృషభాన్ని మంత్రపూతం చేస్తారు. ఆ తర్వాత వృషభం చుట్టూ పిండితో ముగ్గు పెట్టి కత్తితో దానిని వధిస్తారు. గుండెను వేరు చేసి, దానిని పాత డమరుకం ముందు ఉంచి, ఒక ప్రత్యేక తరహాకు చెందిన పిండితో కలిపి దేవదారు, సైప్రెస్ కలపతో దగ్ధం చేస్తారు. దాని ఎడమ భుజం నుంచి స్నాయువులను(ఎముకతో కండరాన్ని అతికే తంతులు) తొలగించి, చర్మాన్ని ఒలిచి, మిగతా కళేబరాన్ని పశ్చిమ ముఖంగా ఉంచి సమాధి చేస్తారు. చర్మాన్ని ఒలవడానికి కూడా కొన్ని కచ్చితమైన నిర్దేశాలూ, పద్ధతులూ ఉంటాయి. ఆ చర్మాన్ని కొత్త డమరుకం చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ బలి ఇచ్చే ప్రక్రియ అచ్చంగా మన వైదికమైన తంతును గుర్తు చేయడమే కాక, ఆదిమ సమాజాలలో ప్రతి చిన్న కర్మకూ (ఇక్కడ కొత్త డమరుకం చేయడానికి అవసరమైన ఎద్దు చర్మం కోసం) ముందు ఎంత పెద్ద తంతు జరిపేవారో కూడా చెబుతోంది.

ఇప్పుడు క్యాంప్ బెల్ వివరణలోకి మరోసారి వెడితే…

వృషభచంద్రుడు విశ్వంలోని లయ(rhythm)కు కర్త. అతని గీతికి అనుగుణంగా జీవులన్నీ జననమరణాల వలయంగా ఏర్పడి నృత్యం చేస్తూ ఉంటాయి. డమరుక ధ్వనులు, ఆలయంలోని ఇతర వాద్యధ్వనులు అందులో భాగమే. గరుడపక్షి కబళిస్తున్న వృషభం ముఖంలో కనిపించే ప్రశాంతత మరణానంతర జ్ఞానానికీ, కాలాతీత జ్ఞానానికీ సూచన. వృషభ మరణం నిజానికి మరణం కాదు. అది భూమిపైన జీవులకు సంజీవిని. అది పైకెత్తిన ముంగాలూ, క్రీటు పౌరాణిక చిహ్నమైన ఎడమ కొమ్మూ దీనినే సూచిస్తాయి. ఈ చిహ్నం భూమ్యాకాశాలకు; అంటే దేవీ, దేవుళ్ళ కలయికకు కూడా ప్రతీక. వీరు రెండుగా కనిపించినా, ఒక్కరే. అంటే, అర్థనారీశ్వరం. రెండుగా కనిపించడం ద్వైతం. ఒకరుగా కనిపించడం అద్వైతం.

ప్రాచీన సుమేరు పురాణ కథలో ‘అన్’ అంటే స్వర్గం. ‘కి’ అంటే భూమి. దానినే స్త్రీ పురుషులకు అన్వయిస్తే, స్వర్గం పురుషుడు. భూమి స్త్రీ. వీరు మొదట అవిభాజ్యంగా ‘అంకి’ అనే పర్వతరూపంలో ఉన్నారు. ఆ తర్వాత ‘ఎన్ లిల్’ అనే కొడుకు పుట్టి వీరిని రెండుగా విడదీశాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మాత్రం చెప్పుకుని మిగతా వివరాలలోకి తర్వాత వెడదాం. అదేమిటంటే, ఈ సుమేరు ‘అంకి’ నుంచే ‘ఎంకి’, ‘వెంకి’, ‘వెంకటేశ్వరుడు’ అవతరించాడని రాంభట్ల అంటారు.

అదలా ఉంచితే, సుమేరు మట్టిపలక మీది వృషభంలో కనిపించే లక్షణాలే నటరాజులోనూ కనిపిస్తాయి. ఆయన ఒకచేతిలో డమరుకం పట్టుకుంటాడు. డమరుక ధ్వని కాలానికి సంకేతం. అది సృష్టిని సంకేతించే ధ్వని కూడా. ఇంకొక చేతిలో అగ్ని ఉంటుంది. అది మృత్యుంజయత్వాన్ని సూచించే జ్ఞానాగ్ని. అది జీవికి కాలంతో ఉండే ముడిని దహిస్తుంది. వృషభం తన నాలుగు కాళ్లనుంచి జ్వాలలు విరజిమ్ముతున్నట్టే, శివుడు కూడా విరజిమ్ముతుంటాడు. తన జటాజూటంలో మృత్యుసూచిక అయిన కపాలాన్ని, చావు పుట్టుకల సంకేతమైన చంద్రవంకను ఆభరణాలుగా ధరిస్తాడు. శివుడు పశుపతి. అలాగే సుమేరు మహాదేవుడైన దుముజి, ఇతర చోట్ల ఆయన ప్రతి రూపాలైన తమ్ముజ్, అడోనిస్ లు కూడా పశుపతులే. శివుడికి నందిలానే వీరి జంతువు కూడా వృషభమే. గ్రీకుదేవుడు డయోనిసస్ కూడా శివుడిలానే నటరాజు. వధిస్తున్న సింహమూ, వధింపబడుతున్న వృషభమూ కూడా ఆయన రూపాలే.

మన శివుడి ప్రతిరూపాలు, శివతత్వం దాదాపు ప్రపంచవ్యాప్తమని ఈ వివరాలు చెబుతున్నాయి.

మిగతా విశేషాలు తర్వాత….

 

 

 

 

   గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్- ఆరో అధ్యాయం

                    మెరిల్లా నిర్ణయం 

 

మొత్తానికి ఇద్దరూ మిసెస్ స్పెన్సర్ ఇల్లు చేరారు. వైట్ శాండ్స్ సముద్రానికి పక్కనే ఉంది ఆ పెద్ద ఇల్లు, పసుప్పచ్చ రంగు వేసి ఉంది దానికి. ఆవిడ బోలెడు ఆశ్చర్యపోయింది వీళ్ళని చూసి

” అరె ! మీరా…రండి, రండి. భలే వచ్చారే ! మెరిల్లా, గుర్రాన్ని ఇక్కడ కట్టేస్తావా ? ఆన్..బాగున్నావా ? ”

   ” అలాగే మిసెస్ స్పెన్సర్. కాసేపు ఉంటాముగా, గుర్రానికీ అలుపు తీరుతుంది. కాని త్వరగా వెళ్ళిపోవాలి.. మాథ్యూ ఎదురుచూస్తుంటాడు. అవునూ, …మేము పది పదకొండేళ్ళ అబ్బాయిని కదా తీసుకురమ్మని అడిగాము ?  మీ తమ్ముడు రాబర్ట్ కి అదే చెప్పాం కదా, ఇదేమిటి మరి ? ”

   మిసెస్ స్పెన్సర్ కంగారు పడిపోయింది. ” అదేమిటి మెరిల్లా…మీరు అడిగింది అమ్మాయిని కాదూ ? రాబర్ట్ వాళ్ళమ్మాయి నాన్సీ తో అలాగనే కబురు చేశాడు…కదూ ? ” మెట్లుగు దిగుతున్న తన కూతుర్ని కూడా రెట్టించింది .

” అవును మిస్ కుత్ బర్ట్, అంతే కదా  ” వంతపాడింది ఆమె కూతురు ఫ్లోరా జేన్. మెరిల్లా తల అడ్డంగా ఊపింది.

” క్షమించాలి మెరిల్లా. మీరు అడిగినట్లే చెయ్యాలని ఈ ఆన్ ని వెతికి పట్టుకొచ్చాను. ఇదంతా మా తమ్ముడి కూతురు నాన్సీ పనే..తనే తప్పు సమాచారం ఇచ్చి ఉంటుంది. ఆ పిల్ల అంతే. …దాని నిర్లక్ష్యానికి ఇదివరకు ఎన్నిసార్లు తిట్టిపోశానో…”

” తప్పు మాదేలే. ఇలాంటి ముఖ్యమైన విషయాలు మేమే వచ్చి చెప్పాలి గాని ఎవరితోనో కబురు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లని వెనక్కి పంపించటం కుదురుతుందా ? వాళ్ళు చేర్చుకుంటారా ?”

” చేర్చుకుంటారేమో ” మిసెస్ స్పెన్సర్ ఆలోచిస్తూ అంది- ” కాని అలా అక్కర్లేదేమో. నిన్ననే మిసెస్ పీటర్ వచ్చింది. నీకు తెలుసుగా, వాళ్ళది పెద్ద సంసారం. సాయం చేసేందుకు ఒక అమ్మాయి ఉంటే బావుండునని ఎంతగానో అనుకుంటోంది. ఆమెకి ఆన్ సరిగ్గా సరిపోతుంది, కలిసిరావటమంటే ఇదే ”

MythiliScaled

మెరిల్లాకి మాత్రం అది కలిసిరావటంగా అనిపించలేదు ఎందుకో. ఈ అక్కర్లేని అనాథని వదిలించుకునే అవకాశం అనుకోకుండా వచ్చిందే  కాని అదేమీ  బావుండలేదు ఆమెకి.  మిసెస్ పీటర్ ని మెరిల్లా కొద్దిగా ఎరుగును. ఒక్క క్షణం ఖాళీ గా కూర్చోదు, ఎవరినీ కూర్చోనివ్వదు అని చెప్పుకుంటారు…పొద్దస్తమానమూ ధుమధుమలాడుతూనే ఉంటుందట.  ఆమె పీనాసి తనాన్నీ చేయించే గొడ్డు చాకిరీనీ  తట్టుకోలేక ఎవరూ ఆమె దగ్గర  ఎక్కువరోజులు పని చేయలేరు. అలాంటి ఆమె చేతుల్లో ఆన్ ని పెట్టేందుకు మెరిల్లా కి మనసు ఒప్పుకోవటం లేదు.

” సరే, మిసెస్ స్పెన్సర్. చూద్దాం లే ”

” ఇదిగో, మిసెస్ పీటర్ మాటల్లోనే వచ్చేసిందే ! అందరూ లోపలికి రండి, మాట్లాడుకోవచ్చు ”- మిసెస్ స్పెన్సర్ ఇంటి హాల్ లో అన్ని తలుపులూ కిటికీలూ  బిగించేసి ఉన్నాయి.  బయటి వెచ్చదనపు ఆహ్లాదం ఏదీ లోపలికి రావటం లేదు

. ” మెరిల్లా, అలా కూర్చో. ఆన్, నువ్విక్కడ . మెసలకుండా బుద్ధిగా కూర్చో. ఫ్లోరా జేన్ ! కాస్త ఆ కెటిల్ ని పొయ్యిమీద పెట్టమ్మా ! మిసెస్ పీటర్, ఈమె మిస్ కుత్ బర్ట్. మెరిల్లా, ఈవిడే…అయ్యో.ఒక్క క్షణం. ఫ్లోరాకి ఓవెన్ లోంచి బన్ లు తీసెయ్యమని చెప్పటం మర్చిపోయాను..మాడిపోతాయేమో..” మిసెస్ స్పెన్సర్ లోపలికి పరిగెత్తింది.

ఆన్ , ఒళ్ళో చేతులు పెట్టుకుని మెదలకుండా కూర్చుంది. మిసెస్ పీటర్ వైపే రెప్ప వెయ్యకుండా చూస్తోంది. మిసెస్ పీటర్ ఆన్ ని పురుగుని చూసినట్లు  చూసింది. ఈవిడకి తనని అప్పజెబుతారా ? ఆన్ గుండె గుబుక్కుమంది. కళ్ళమ్మట నీళ్ళు ఆపుకుందామన్నా ఆగటం లేదు. మిసెస్ స్పెన్సర్ ఇంట్లోంచి బయటికి వచ్చింది. ఎట్లాంటి ఇబ్బందినైనా ఇట్టే చక్కబెట్టెయ్యగల నన్న  నమ్మకంతో  ఆవిడ మొహం వెలిగిపోతోంది.

” చూడు మిసెస్ పీటర్..ఈ అమ్మాయిని మెరిల్లా వాళ్ళ కోసం తెచ్చాను. వాళ్ళసలు అబ్బాయి కావాలని అడిగారట, మా నాన్సీ నాకు ఆ మాట తేడాగా చెప్పేసరికి ఇలా పొరబాటైపోయింది. సరే, ఐందేదో ఐంది- నిన్ననే  నీకు అమ్మాయి అవసరమని చెప్పావుగా, ఈ పిల్లని తీసుకు వెళతావా ? ”

మిసెస్ పీటర్ ఆన్ ని నఖ శిఖ పర్యంతం అంచనా వేస్తోంది.

” ఏయ్ అమ్మాయ్ ! నీ పేరేమిటి ? నీ కెన్నేళ్ళు ? ”

”ఆన్ షిర్లే అండీ ” బిక్కచచ్చిపోయింది ఆన్…ఎక్కడైనా తప్పు చెప్పబోతానేమోనని కూడబలుక్కుంటూ   ” నాకు పదకొండేళ్ళండీ ”

” హూ. ఒంటి మీద పిడికెడు కండైనా ఉన్నట్లు లేదు. కానీ గట్టి శరీరంలాగే ఉందిలే. ఇలాంటి వాళ్ళే బాగా పనిచెయ్యగలరు. ఇదిగో అమ్మాయ్… నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన పనల్లా చేశావంటే నీకు మూడు పూట్లా తిండి పెడతాను. మిస్ కుత్ బర్ట్, ఇప్పటికిప్పుడే ఈ పిల్లని మీరు వదిలించుకోవచ్చు, నేను తీసుకెళ్ళిపోతాను. ఇంటి దగ్గర చంటాడు పోరు పెట్టి ఏడుస్తున్నాడు, సముదాయించలేకుండా ఉన్నాను.తక్కిన ఆరుగురూ ఒక్కొక్కళ్ళూ ఒక్కొక్క పేచీ. అవతలేమో  బోలెడంత పని నాకు, ఆయన భోజనానికి వచ్చేస్తారు   ”

మెరిల్లా ఆన్ వైపు చూసింది. తప్పించుకున్న బోను లో మళ్ళీ చిక్కుకుపోయిన ప్రాణిలాగా ఉంది ఆన్. ఆ మూగ బాధ కి మెరిల్లా కరిగిపోయింది. ఆ చూపు ని నిర్లక్ష్యం చేసి ఊరుకుంటే తను చచ్చిపోయేదాకా అదే వెంటాడుతుందని అనిపించింది.

మిసెస్ పీటర్ ఏమీ ఆకర్షించలేదు మెరిల్లాని. ఆన్ లాంటి సున్నితమైన పిల్లని ఆవిడ చేతుల్లో పడేసే బాధ్యత మెరిల్లా తీసుకోదల్చుకోలేదు.

mythili1

” ఏమో లెండి ” అంది మెల్లిగా. ” ఈ పిల్లని ఉంచుకోవద్దనేమీ మేమింకా నిర్ణయించుకోలేదు. మాథ్యూ కి ఐతే ఉంచేసుకోవాలనే ఉంది. అసలీ పొరబాటు ఎక్కడ జరిగిందో కనుకుక్కునేందుకు వచ్చాను అంతే. ఇప్పటికి ఆన్ ని ఇంటికి తీసుకు వెళతాను…ఇంట్లో  ఇద్దరం మాట్లాడుకోవాలి, నేనొక్కదాన్నే ఏ విషయమూ తేల్చటం కుదరదు. మేము ఆన్ ని పంపించెయ్యాలనుకుంటే రేపు రాత్రికల్లా మీ ఇంటికి చేరుస్తాము,  చేర్చలేదూ అంటే పంపించదల్చుకోలేదూ అని అర్థం ” ఇంత పొడుగున చెప్పుకొచ్చింది.

” సరేలేండి, ఏం చేస్తాం ” అంది మిసెస్ పీటర్ , కాస్త పెడసరంగా.

మెరిల్లా మాట్లాడుతూ ఉండగా ఆన్ మొహం లో సూర్యోదయం సంభవించింది. మొదటి మాటలతో బాధ నలుపు మాయమయింది, ఆ తర్వాత  లేత గులాబి రంగులో ఆశ విచ్చుకుంది. కళ్ళు ధగధగా మెరిసిపోయాయి. ఏదో పని మీద మిసెస్ పీటర్, మిసెస్ స్పెన్సర్ లోపలికి వెళ్ళగానే దిగ్గున లేచి మెరిల్లా దగ్గరికి ఎగిరి వెళ్ళింది.

” మిస్ కుత్ బర్ట్…నన్ను గ్రీన్ గేబుల్స్ లో ఉం చేసుకుంటారా , నిజంగానే ? ” ఊపిరి బిగబట్టి గుసగుసగా ప్రశ్నించింది, ఆ మాటలే పెద్దగా అనేస్తే అలా జరగదో ఏమో అన్నట్లు. ” మీరు నిజంగానే అన్నారా , లేకపోతే నేను అలాగని ఊహించుకుంటున్నానా ? ”

మెరిల్లా –    ” నీ’  ఊహాశక్తి ‘ ని  కొంచెం అదుపులో పెట్టుకో …నిజానికీ ఊహకీ తేడా తెలీకుండా పోతోంది నీకు ” చిరాగ్గా అంది. ” అవును, అన్నాను, అంతకు మించి ఇంకేం అనలేదు. మేమింకా తేల్చుకోవాలి, బహుశా మిసెస్ పీటర్ దగ్గరికే పంపించేస్తామేమో ! ఆవిడ కే నువ్వు ఎక్కువ అవసరం కూడానూ ”

ఆన్ ” అంత కంటే నన్ను అనాథాశ్రమానికే పంపించెయ్యండి, వెళ్ళిపోతాను. ఆవిడ…ఆ మిసెస్ పీటర్…ముళ్ళ కంచెలాగా ఉన్నారు ”

 

మెరిల్లా నవ్వు ఆపుకుంది. అలా అన్నందుకు ఆన్ ని మందలించాలి గనుక అంది –

” పెద్దావిడ ని అలా అనచ్చా ? నీకావిడ తో పరిచయం కూడా లేదు పైగా..  మంచి పిల్లలాగా నోరు మూసుకుని వెళ్ళి నీ కుర్చీలో కూర్చో ”

ఆన్  ,  గంభీరంగా  – ” నన్ను మీరు కావాలనుకుంటే, మీతో ఉంచేసుకుంటామంటే ….ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తానండీ ” – వెళ్ళి కూర్చుంది.

వాళ్ళిద్దరూ వెనక్కి వెళ్ళేసరికి మాథ్యూ ఇంటి బయటే తచ్చాడుతున్నాడు. ఎందుకో మెరిల్లా కి తెలుసు, ఆన్ ని కూడా తీసుకొచ్చినందుకు అతని మొహం విప్పారటాన్నీ గమనించింది.  ఐనా   అప్పుడే , అదీ  ఆన్ ఉండగా- ఏమీ చెప్పదలచుకోలేదు. తర్వాత కొంతసేపటికి, ఇంటి వెనక ఆవుల కొట్టం లో పాలు తీసేందుకు వెళ్ళినప్పుడు –  మిసెస్ స్పెన్సర్ ఇంట్లో జరిగిందంతా క్లుప్తంగా వివరించింది.

మాథ్యూ , తనకేమాత్రం అలవాటులేని రౌద్రం తో అన్నాడు- ” నాకు ఇష్టమైన కుక్కపిల్లని కూడా ఇవ్వను ఆ మిసెస్ పీటర్ కి, అలాంటి మనిషి  ఆవిడ ”

” నాకూ నచ్చలేదులే ఆ మనిషి . మరి ఆవిడ కి ఇవ్వకూడదూ అంటే మనమే అట్టే పెట్టుకోవాలి ఆన్ ని, కదా ? ” అనాథాశ్రమానికి పంపెయ్యచ్చు అనే అవకాశం లేనట్లే మాట్లాడింది మెరిల్లా. ” నువ్వు పెంచుకోవాలనుకుంటున్నావు గా..మరి..నేనూ ఆలోచించాను ఇప్పటిదాకా. నాకూ ఇష్టమే అనుకుంటున్నాను. ..అది నా బాధ్యత అనిపిస్తోంది. కాకపోతే నాకు పిల్లల్ని పెంచిన అనుభవం బొత్తిగా లేదు…అందులోనూ ఆడపిల్లని…సరిగా పెంచలేనేమో …ఐనా ప్రయత్నిస్తాలే. సరే మాథ్యూ, ఆన్ ని పెంచుకుందాం ”

మాథ్యూ మొహం ప్రకాశించింది.

” నీకూ తెలుస్తుందనే ఎదురుచూస్తున్నాను మెరిల్లా. ఆన్ భలే పిల్ల , నిజంగా ! ”

” సరేలే. కాస్త పనికొచ్చే పిల్ల అయితే కదా మనకి మంచిది…ఇంకనుంచీ తర్ఫీదు చెయ్యటం మొదలెడతాను. నువ్వు మాత్రం నా  పద్ధతుల్లో జోక్యం చేసుకోకూడదు .   పిల్లల్ని పెంచటం నీ కంటే నాకు బాగానే తెలుసు. అంత నెత్తిమీదికి వచ్చినప్పుడు నిన్ను సాయం అడుగుతాలే ”

” నీ ఇష్టం మెరిల్లా, నువ్వు ఎలా అంటే అలా. మరీ గారాబం చెయ్యక్కర్లేదుగానీ ఆన్ ని కొంచెం దయగా, ప్రేమగా చూడు అంతే. ప్రేమగా ఓర్పుగా చెబితే తను ఏం చెయ్యమన్నా చేస్తుందనుకుంటాను…”

మాథ్యూ మాటలు పెద్ద గా పట్టించుకోనట్లు మొహం పెట్టి , మెరిల్లా, పాలబిందెలు ఎత్తుకుని వెళ్ళిపోయింది. వెన్న తీసే యంత్రం లో పోస్తూ ,  తనలో తను అనుకుంది – ” ఇప్పుడు చెప్పను ఆన్ కి… ఉత్సాహం ఎక్కువై రాత్రంతా నిద్ర పోదు.  మెరిల్లా కుత్ బర్ట్, నిండా మునిగావు ఇందులో !  ఇలాంటి పని చెయ్యగల నని కలలోనైనా అనుకున్నావా అసలు ? మాథ్యూ మాత్రం…ఆడపిల్లలంటే నే హడలిపోయే మనిషి…ఈ పిల్ల ఎందుకు నచ్చిందో ! మొత్తానికి ఒక ప్రయోగం మొదలు పెడుతున్నాం , ఏమవుతుందో మరి ..చూడాలి ”

[ ఇంకా ఉంది ]

 

  మూతపడ్డ వ్యాపారం

ఆంగ్ల మూలం: సోమర్సెట్ మామ్
అనువాదం:     ఎలనాగ

 

సోమర్సెట్ మామ్ పరిచయం

 

సోమర్సెట్ మామ్ (1874 – 1965) ఇంగ్లండ్ దేశానికి చెందిన ఒక ప్రసిద్ధ నాటక, నవలా, కథా రచయిత. అతనికి పది సంవత్సరాల వయసు వచ్చేసరికే తలిదండ్రులిద్దరూ చనిపోవడంతో, పెదనాన్న దగ్గర పెరిగాడు. మామ్ మెడికల్ డాక్టరు. 1897 లో మామ్ రాసిన మొదటి రచన – లిజా ఆఫ్ లాంబెత్ అనే నవల – ఎంత విపరీతంగా అమ్ముడు పోయిందంటే, దాంతో ఆయన తన వైద్యవృత్తిని వదిలి పూర్తిస్థాయి రచయితగా స్థిరపడిపోయాడు.

మామ్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రెడ్ క్రాస్ సంస్థలో పని చేసి, తర్వాత బ్రిటిష్ గూఢచారి విభాగంలో చేరాడు. అప్పుడతడు స్విట్జర్లాండ్, రష్యాలలో పని చేశాడు. ఇండియాలోనే కాక, మలయా (మలేషియా) వంటి దక్షిణప్రాచ్య దేశాలలో పర్యటించి, అక్కడ తనకు ఎదురైన అనుభవాలను కథలుగా, నవలలుగా మలిచాడు. భారత దేశానికి వచ్చినప్పుడు అక్కడి తత్వవేత్తలు చెప్పిందాని గురించీ, తాను విన్న వీణావాద్య కచేరీ గురించీ, చూసిన ఫకీర్ల విన్యాసాల గురించీ ద సమింగ్ అప్ అన్న పుస్తకంలో మనం చదవవచ్చు.

తనపట్ల నిర్లక్ష్యాన్ని చూపిన పెదనాన్న కారణంగా, ఇంకా స్కూలు అనుభవాల మూలంగా మామ్ జీవితపు మొదటి భాగంలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయి. అతనికి నత్తి వచ్చింది.

మామ్ రాసిన నవలల్లో ఆఫ్ హ్యూమన్ బాండేజ్ (1915) అత్యంత పేరెన్నిక గన్నది. Theodore Dreiser అనే ప్రసిద్ధ అమెరికన్ విమర్శకుడు ఆ నవలను బేథోవెన్ సింఫనీతో పోల్చాడు. 1907 లో మామ్ వి నాలుగు నాటకాలు ఒకే సమయంలో లండన్ లోని నాటక ప్రదర్శనశాలల్లో ఆడినప్పుడు Punch పత్రిక ఒక కార్టూన్ ను ప్రచురించింది. అందులో మామ్ నాటకపు పోస్టర్ను చూసి షేక్స్పియర్ ఆందోళనతో గోళ్లు కొరుక్కుంటున్నట్టుగా చిత్రించబడిందట!

మామ్ దాదాపు 30 నవలలు, 25 నాటకాలు రాయడమే కాక ఎన్నో కథాసంకలనాలు, ఇతర రకాల రచనలు చేశాడు. నవలల్లో ఆఫ్ హ్యూమన్ బాండేజ్ కాక, ద మూన్ అండ్ సిక్స్ పెన్స్, ద పెయింటెడ్ వేల్, ద రేజర్స్ ఎడ్జ్, కేక్స్ అండ్ ఏల్, క్రిస్మస్ హాలిడే మొదలైనవి చెప్పుకోతగినవి. ఆయన రాసిన కథల్లో రెయిన్, ద ఏలియెన్ కార్న్, ద వెసెల్ ఆఫ్ ర్యాత్, మిస్టర్ నో ఆల్, ఫూట్ ప్రింట్స్ ఇన్ ద జంగిల్, లార్డ్ మౌండ్రాగో, గిగోలో అండ్ గిగోలెట్ మొదలైనవి ప్రసిద్ధమైనవి.

***

 

 

నేను వివరించకుండా ఉండలేని ఈ సంఘటనలు ఏ ఆనందమయ దేశంలో జరిగాయో ఆ దేశం పేరును చెప్పేలా నన్ను ఏదీ చెయ్యజాలదు. కాని అది అమెరికా ఖండంలోని ఒక స్వతంత్ర దేశం అన్న విషయాన్ని చెబితే ఏ హానీ ఉండదని తెలుసు నాకు. ఈ రకంగా చెప్పడంలో సరిపోయినంత అస్పష్టత వుంది కనుక, దీంతో ఏ విధమైన రాజకీయ సమస్యా తలెత్తే ఇబ్బంది వుండదు. ఆ దేశ అధ్యక్షుడు ఒక అందమైన స్త్రీ మీద కన్నేశాడు.

ఆ అధ్యక్షులవారి రాజధాని సూర్యకాంతి పుష్కలంగా ప్రసరించే ఒక విశాలమైన నగరం. అక్కడ ఒక దుకాణాల సముదాయం వుంది. ఒక చక్కని చర్చి భవనమూ కొన్ని పురాతన స్పానిష్ గృహాలూ కూడా ఉన్నాయి. మనసుల్ని రంజింపజేసే గుణం ఉన్న ఒక యువకుడు మిషిగన్ నుంచి ఆ నగరానికి వచ్చి అదే స్త్రీ మీద మనసు పారేసుకున్నాడు. ఆ అధ్యక్షుడు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రేమను ఆమెకు వెల్లడించాడు. ఆమె కూడా అతని పట్ల తన ప్రేమను వ్యక్తపరచటంతో సంతుష్టుడయ్యాడు. కాని ఆ యువకునికి ఒక భార్య, ఆ స్త్రీకి ఒక భర్త అవసరం కావటమన్నది తాను ఆమెను పొందటానికి అడ్డంకిగా మారిందని తెలుసుకుని మానసిక క్షోభకు గురయ్యాడు. పెళ్లి చేసుకోవాలనే స్త్రీసహజమైన కోర్కె ఉన్నదామెకు.

అది అతనికి అసమంజసం అనిపించినా ఒక అందమైన స్త్రీ తనను కోరుకున్నప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయే అమాయకుడు కాదతడు. ఆమెకు పెళ్లి అయ్యేందుకు అనువైన పరిస్థితులు నెలకొనేలా చేస్తానని ఆ అధ్యక్షుడు వాగ్దానం చేశాడు. అతడు తన ఆస్థానంలోని న్యాయకోవిదులను పిలిపించి విషయాన్ని వాళ్ల ముందుంచాడు. తన దేశంలోని వివాహచట్టాలు చాలా పాతబడిపోవటం వల్ల అవి ఎంతమాత్రం సవ్యంగా లేవని తాను యెప్పట్నుంచో అనుకుంటున్నట్టూ, దేశం అభివృద్ధిపథంలో పయనించాలంటే  ఆ చట్టాలలో సమూలమైన మార్పుల్ని తేవాలని తాను భావిస్తున్నట్టూ తెలిపాడు వాళ్లకు. ఆ న్యాయకోవిదులు అధ్యక్షులవారి నుండి సెలవు తీసుకుని పోయి, ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని రోజులకే ఒక విడాకుల చట్టాన్ని తయారు చేసుకుని తెచ్చారు. దాన్ని రూపొందించేటప్పుడు అది అధ్యక్షునికి నచ్చేట్టు ఉండేలా జాగ్రత్త పడ్డారు వాళ్లు. కాని నేను చెబుతున్న దేశం ఎంతో నాగరికత, ప్రజాస్వామ్యం ఉన్నది కావడమే కాక గొప్ప ప్రతిష్ఠ ఉన్నది కావటంవల్ల, అక్కడ ఏం చెయ్యాలన్నా చాలా జాగ్రత్తగా, చట్టబద్ధంగా చేయాలి. అక్కడ దేశాధ్యక్షునిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తికి ఎంత గొప్ప గౌరవం ఉన్నా కొన్ని సూత్రాలను పాటించకుండా అతడు ఏ చట్టాన్నీ ప్రవేశపెట్టలేడు – ఆ చట్టం తనకోసం చేసుకున్నదైనా! కాబట్టి ఆ పనికి కొంత కాలం పట్టింది.

కొత్త విడాకుల చట్టాన్ని ప్రవేశపెట్టిన కొద్ది కాలంలోనే ఆ దేశంలో విప్లవం మొదలైంది. దురదృష్టవశాత్తు ఆ దేశాధ్యక్షుణ్ని రాజధానిలోని ప్రధాన కూడలిలో చర్చి ముందర ఒక స్తంభానికి ఉరి తీశారు. హృదయాలను రంజింపజేసే యువకుడు ఆదరాబాదరాగా ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోయాడు. కాని ఆ చట్టం అట్లాగే ఉండిపోయింది. దాని నిబంధనలు సరళంగా ఉన్నాయి. ముప్ఫై రోజులపాటు భార్యాభర్తలిద్దరు కలిసి బతికింతర్వాత వంద డాలర్లకు సమానమైన బంగారాన్ని ఇస్తే భర్త కాని భార్య కాని తన జీవిత భాగస్వామికి విడాకులివ్వవచ్చు – అదీ ఏ రకమైన సమాచారాన్నీ ముందుగా ఇవ్వకుండానే. ఉదాహరణకు ఒక భార్య తాను తన ముసలి తల్లితో ఓ నెల రోజులపాటు ఉండబోతున్నట్టు భర్తతో చెప్పి వెళ్లిపోవచ్చు. తర్వాత ఒకరోజు ఉదయాన అల్పాహారం తర్వాత భర్త తనకు వచ్చి ఉత్తరాలను చూసుకుంటున్నప్పుడు తాను విడాకులిచ్చి వేరే పురుషుణ్ని పెళ్లి చేసుకున్నట్టు భార్య రాసిన ఉత్తరం అతనికి కనపడవచ్చు.

ఈ సంతోషకర వార్త స్వల్పకాలం లోనే అంతటా వ్యాపించింది. న్యూయార్క్ నుండి మరీ ఎక్కువ దూరంలో లేనటువంటి ఒక దేశ రాజధానిలో సమశీతోష్ణ వాతావరణంతో పాటు మరీ అంత ఇబ్బందికరం కాని వసతి సౌకర్యం ఉన్నదనీ, అక్కడ స్త్రీలు తమకు చిరాకును కలిగించే వివాహబంధం నుండి తక్కువ సమయంలో తక్కువ డబ్బు ఖర్చుతో విముక్తిని పొందవచ్చుననీ తెలిసిపోయింది ప్రజలకు. భర్తకు తెలియకుండానే అటువంటి తతంగాన్ని నడుపుకోగలగడం అన్నది కేసు నడుస్తున్నప్పుడు మనసుకు క్షోభను కలిగించే వాదప్రతివాదాల నుండి తప్పించుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఒక ప్రతిపాదనకు వ్యతిరేకంగా పురుషుడు ఎంతగానైనా వాదించవచ్చును కాని, చివరకు ఆ వాదాన్ని వదిలి తోకాడిస్తాడని ప్రతి స్త్రీకీ తెలుసు. తనకొక రోల్స్ రాయిస్ కారు కావాలని భార్య అడిగితే భర్త తనదగ్గర అంత డబ్బు లేదనవచ్చు. కాని ముందు చెప్పకుండా ఆమె ఆ కారును కొన్నదనుకోండి. అప్పుడతడు పిల్లిలాగా చెక్కుమీద సంతకం పెట్టి ఇస్తాడు. అందువల్ల కొద్ది కాలంలోనే  అందమైన స్త్రీలు పెద్ద సంఖ్యలో ఆ నగరానికి తరలి వచ్చారు.

వ్యాపార వ్యవహారాలతో అలసిపోయిన స్త్రీలు, ఫ్యాషన్ ప్రపంచంలో వెలిగిపోయిన స్త్రీలు, ఖుషీయే జీవన విధానం అయిన స్త్రీలు, ఏ పనీపాటా లేక రికామీగా ఉండే స్త్రీలు – ఇటువంటి వాళ్లంతా న్యూయార్క్, షికాగో, సాన్ ఫ్రాన్సిస్కో, జార్జియా, డకోటా మొదలైన అన్ని రాష్ట్రాలనుండి వచ్చారు. దాంతో ఆ నగరానికి వచ్చే ఓడల్లో వసతి బొటాబొటిగా మాత్రమే సరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక ఓడలో ప్రత్యేకమైన గది కావాలంటే ఆరు నెలలు ముందుగానే రిజర్వు చేసుకోవాలి. ఆ నగరం అలా సంపదతో వర్ధిల్లిపోయింది. కొద్ది కాలంలోనే అక్కడి న్యాయవాదులకు గిరాకీ బాగా పెరిగి, ప్రతి లాయరూ ఫోర్డ్ కారును కొనుక్కోగలిగే స్థాయికి చేరుకున్నాడు. గ్రాండ్ హోటలుకు యజమాని అయిన డాన్ ఆగస్టో ఎంతో ఖర్చు పెట్టి అదనంగా చాలా బాత్ రూములను కట్టించాడు. అయితే అలా చేసినందుకు అతడు విచారించలేదు. ఎందుకంటే ఎంతో లాభం వచ్చిందతనికి. పూర్వ దేశాధ్యక్షుణ్ని ఉరి తీసిన స్తంభం ముందునుండి పోయిన ప్రతిసారీ అతడు హుషారుగా దానికి వందనం చేశాడు.

ఒకసారి “అతడు మహానుభావుడు. ఏదో ఒకరోజు అతనికోసం శిలావిగ్రహాన్ని కట్టించి నిలబెడతారు” అన్నాడు డాన్ ఆగస్టో.

సౌకర్యవంతమైన, సమంజసమైన ఆ చట్టం ద్వారా కేవలం స్త్రీలే  లాభపడ్డారని చెప్పాను నేను. కాని అమెరికాలో పవిత్ర వివాహబంధం అనే జంజాటం నుండి విముక్తిని కోరుకునేవారు స్త్రీలు మాత్రమేననీ, పురుషులు కాదనీ సూచిస్తాయి నా మాటలు. అయితే నా ఉద్దేశం అది కాదని నా నమ్మకం. ఆ దేశానికి ఎక్కువగా స్త్రీలే ప్రయాణించినప్పటికీ అట్లా ఆరు వారాల పాటు సొంత ఊరు వదిలి వెళ్లటం (పోవడానికీ రావడానికీ ప్రయాణం కోసం ఒక్కొక్క వారం, ఆ దేశవాసిగా గుర్తింపు కోసం నాలుగు వారాలు) ఆడవాళ్లకే సులభం కావటమే అందుకు కారణం అంటాను నేను. మగవాళ్లకైతే అంత కాలం పాటు తమ వ్యవహారాలన్నిటినీ వదిలేసి పోవటం కష్టం కదా. వేసవి సెలవుల్లో అక్కడికి పోవచ్చునన్నది నిజమే కాని, ఆ వేడిమి కలిగించే బాధను అనుభవించాల్సి వస్తుంది. పైగా అక్కడ గోల్ఫ్ మైదానాలు లేవు. ఒక నెల పాటు గోల్ఫ్ ఆడే అవకాశాన్ని వదులుకునే బదులు, భార్యకు విడాకులివ్వకపోవటం వైపే ఎక్కువ మంది పురుషులు మొగ్గు చూపుతారని మనం అనుకోవచ్చు. గ్రాండ్ హోటల్లో ఇద్దరుముగ్గురు మగవాళ్లు నెలరోజుల పాటు మకాం వేశారన్నది నిజమే. కాని వాళ్లు వ్యాపార పరమైన పని మీద వచ్చారట. అసలు కారణం అంత స్పష్టంగా బోధపడటం లేదు. వాళ్ల వ్యాపకాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే నా ఊహ ప్రకారం వాళ్లు ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఏకకాలంలో అటు మజా చేసే స్వాతంత్ర్యాన్నీ, ఇటు వ్యాపారంలో లాభాన్నీ పొందారనిపిస్తుంది.

ఈ గొడవనట్లా వుంచుదాం. అసలు వాస్తవమేమంటే, గ్రాండ్ హోటల్లో చాలా వరకు ఆడవాళ్లే బస చేశారు. లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత వాళ్లు వరండాలో కమాను ఆకారంలో ఉన్న పైకప్పుల కింద చిన్న చతురస్రాకారపు బల్లల చుట్టూ కూచుని షాంపేన్ తాగుతూ తమ వైవాహిక ఇబ్బందుల గురించి చర్చించుకుంటూ సమయాన్ని ఆనందంగా గడిపారు. డాన్ ఆగస్టోకు మిలిటరీ అధికారులు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, వర్తకులు, స్థానిక యువకులు – వీళ్లందరి ద్వారా బోలెడంత వ్యాపారం జరిగి, పిచ్చిగా లాభాలు వచ్చాయి. ఎందుకంటే, తన హోటల్లో బస చేసిన అందమైన స్త్రీలను చూడటం కోసం వీళ్ళందరూ వచ్చేవారు. కాని పూర్తిగా సవ్యమైనది ఈ ప్రపంచంలో ఎప్పుడూ దొరకదు కదా! ప్రతిదాంట్లో ఏదో ఒక అపసవ్యత వుంటుంది. భర్తలను వదిలించుకోవాలనుకునే ఆ స్త్రీలు చాలా మట్టుకు ఆందోళనగా ఉండేవారు. వాళ్ల వైపునుండి ఆలోచించినప్పుడు మరి అది సమంజసమే.

వాళ్లను సంతోషపెట్టడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ఆ చిన్న నగరంలో ఎన్నో మంచి అంశాలున్నా వినోదకర ప్రదేశాలు మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నాయని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ వున్న ఒకేఒక్క సినిమా టాకీసులో ఆడే చిత్రాలు చాలా కాలం క్రితం హాలీవుడ్ లో వెలువడినవై ఉంటాయి. పగటి వేళల్లో ఆ స్త్రీలు తమ లాయర్లతో మంతనాలు జరుపవచ్చు, గోళ్ళకు పాలిష్ వేసుకోవచ్చు, కొంచెం షాపింగు కూడా చేసుకోవచ్చు. కాని సాయంత్రాలను గడపటం దుర్భరంగా ఉంటుంది. నిబంధనలో వున్న నెల రోజుల బస అన్నది ఎక్కువ అని చాలా మంది ఫిర్యాదు చేశారు. సహనం కొరవడిన ఒకరిద్దరైతే ఆ వ్యవధిని నలభై ఎనిమిది గంటలకు కుదించి చట్టంలో బలాన్నీ ఉత్సాహాన్నీ కొంచెం పెంచవచ్చును కదా అని తమ లాయర్లను అడిగారు. డాన్ ఆగస్టో శక్తియుక్తులున్న మనిషి. ఆయన ఈ విషయంలో స్ఫూర్తిని పొంది, మారింబా అనే వాద్యాన్ని వాయించే గ్వాటెమాలా దేశపు కళాకారుల బృందాన్ని తన హోటల్లో నియమించాడు. ఆ సంగీతం ఎట్లా ఉంటుందంటే, దానికన్న ఎక్కువగా కాళ్లలో చలనాన్నీ ఆపుకోలేనంత ఉత్సాహాన్నీ కలింగించేది ప్రపంచంలో మరొకటి వుండదు.

హాల్లో ఉన్న ప్రతి ఒక్కడూ దాన్ని వినగానే వెంటనే నిలబడి డాన్సు చేయడం మొదలెట్టాడు. ఆ ఇరవై ఐదుగురు స్త్రీలు డాన్సు చేయాలనుకున్నప్పుడు, తమతో పాటు ఆ హోటల్లో బస చేసిన కేవలం ముగ్గురు పురుషులు మాత్రమే సరిపోరన్నది స్పష్టం కాబట్టి, సైనికాధికారులూ స్థానిక యువకులూ వచ్చి ఆ డాన్సులో చేరుతారు. అప్పుడు వాళ్ల నల్లని కళ్లు ఆనందంతో మెరుస్తాయి. గంటలూ రోజులూ ఎంత వేగంగా గడిచాయంటే, అప్పుడే నెల రోజుల వ్యవధి ముగిసిందా అని ఆశ్చర్యం కలిగింది వాళ్లకు. ఒకావిడైతే వెళ్లిపోయేటప్పుడు తనకు మరికొన్ని రోజులపాటు ఆ హోటల్లో ఉండాలనిపించిందని చెప్పింది. డాన్ ఆగస్టో ముఖం ఆనందంతో, విజయగర్వంతో వెలిగిపోయింది. తన కస్టమర్లు సంతోషంగా ఉండటం అతనికి ఇష్టం. తాను చెల్లించిన డబ్బుకన్న రెండు రెట్లు ఎక్కువ విలువ చేసింది మారింబా బ్యాండు – అనుకున్నాడతడు. డాన్ ఆగస్టో పొదుపరి కనుక, రాత్రి పది కాగానే తన హోటల్లోని మెట్లమీదా, వరండాల్లో లైట్లను కట్టేయించాడు. దాంతో సైనికాధికారులూ, స్థానిక యువకులూ మాట్లాడే ఆంగ్లభాష అద్భుతంగా మెరుగైపోయింది.

పెళ్లివారి బ్యాండు మేళంలాగా అంతా సజావుగా సంతోషంగా గడిచిపోయింది. ఈ వాక్యంలోని మొదటి పదాలు ఎంత అరిగిపోయినవైనా వాటిని ఉపయోగించాలనే కోరికను ఆపుకోవటం కష్టం కనుక, వాటిని వాడుతాను నేను. అంతా బాగా జరుగుతోందనుకుంటున్న సమయంలో ఒకరోజు మేడం కొరాలీ అనే ఆవిడ తాను భరించిన దుర్భర పరిస్థితి ఇక చాలు అనే నిర్ణయానికి వచ్చింది. ఆమె డ్రెస్ తొడుక్కుని, తన స్నేహితురాలైన కార్మెన్సిటాను కలవటం కోసం వెళ్లింది. తాను యెందుకు వచ్చిందో మేడం కొరాలీ కొన్ని పదాల్లో బిగ్గరగా చెప్పగానే కార్మెన్సిటా ఒక పనిమనిషిని పిలిచి, లా గోర్డా అనే మరో ఆవిడను ఉన్నపళంగా తీసుకురమ్మని పురమాయించింది. ఒక ముఖ్యమైన విషయాన్ని లా గోర్డాతో చర్చించాలని అనుకున్నారు వాళ్లిద్దరు.

భారీ శరీరంతో పాటు పుష్కలంగా మీసాలను కలిగివున్న లా గోర్డా వచ్చి వాళ్లతో చేరింది. ఆ ముగ్గురు మలాగా అనే మద్యాన్ని తాగుతూ గంభీరమైన చర్చలను జరిపారు. తద్వారా ఏర్పడ్డ పరిణామమేమంటే, తాము మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ వాళ్లు దేశాధ్యక్షునికి ఒక ఉత్తరం రాశారు. భారీ శరీరం కలిగిన కొత్త అధ్యక్షుని వయస్సు ముప్ఫై ఏళ్లకన్న కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అతడు ఒక అమెరికన్ షిప్పింగ్ కంపెనీలో సామాన్లను మోసేవాడిగా పని చేశాడు. తన మనసులోని ఉద్దేశాన్ని నొక్కి చెప్పాలనుకున్నప్పుడల్లా అతడు తన వాగ్ధాటినీ, తుపాకీనీ ప్రభావవంతంగా ఉపయోగిస్తూ ప్రస్తుత ఉన్నత హోదాకు చేరుకున్నాడు. తన కింది అధికారి ఒకతను ఆ ఉత్తరాన్ని తన ముందుంచినప్పుడు అతడు నవ్వి, “ఈ ముగ్గురు వృద్ధ స్త్రీలకు నా నుండి ఏం కావాలట?” అన్నాడు.

కాని అతడు మంచీ మర్యాదా ఉన్న మనిషే కాక, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. తను కూడా ప్రజల్లో ఒకడు అనీ, ప్రజలను సంరక్షించడం కోసమే తను ప్రజల చేత ఎన్నుకోబడ్డాడనీ అతడు మరచిపోలేదు. పైగా అతడు తన యవ్వనదశలో మేడం కొరాలీ దగ్గర చిన్నచిన్న పనులమీద బయట తిరిగే ఉద్యోగం చేశాడు. ఆ ముగ్గురు స్త్రీలను తాను మరుసటి రోజు ఉదయం పది గంటలకు కలుస్తానని తన సెక్రెటరీకి చెప్పాడు దేశాధ్యక్షుడు. వాళ్లు సరైన సమయానికి అధ్యక్ష భవనాన్ని చేరుకున్నారు. అక్కడి ఉద్యోగి ఒకతను వాళ్లను వెంట తీసుకుని దివ్యమైన మెట్లదారి మీదుగా సందర్శకుల హాలు వైపు నడిచి, అక్కడికి చేరుకోగానే తలుపును చిన్నగా తట్టాడు.

ఇనుప కమ్మీలున్న లావుపాటి లోహపు ద్వారం తెరుచుకుని, అనుమానపు చూపులున్న ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఈ అధ్యక్షుడు మునుపటి అధ్యక్షునిలాగా ప్రాణాంతక దుష్ట పరిస్థితిని ఎదుర్కోదల్చుకో లేదు కనుక, వచ్చిన సందర్శకులు ఎంతటి వారైనా సరే జాగ్రత్త పడకుండా వాళ్ల ముందుకు రాకూడదనే నియమం పెట్టుకున్నాడు. వాళ్లను తీసుకువచ్చిన ఉద్యోగి ఆ ముగ్గురు స్త్రీల పేర్లను చెప్పగానే అసలైన లోపలి తలుపు తెరుచుకుంది. కాని లోపలికి వెళ్లే తోవ కొంచెం ఇరుకుగా వుంది. వాళ్లు లోపలికి పోయారు. ఆ హాలులో హుందాతనం, దర్జా కనిపించాయి. అక్కడ చిన్నచిన్న టేబుళ్ల దగ్గర పొట్టిచేతుల చొక్కాలనూ, ప్యాంటు వెనుక జేబులో పిస్తోళ్లనూ కలిగిన సెక్రెటరీలు తీరిక లేకుండా టైపింగ్ చేస్తున్నారు. భారీ తుపాకులతో, బులెట్లతో ఒకరిద్దరు యువకులు సోఫా మీద కూర్చుని సిగరెట్లు తాగుతున్నారు. అధ్యక్షుడు కూడా పొట్టి చేతుల కోటు తొడుక్కున్నాడు. బెల్టులో ఒక పిస్తోలు వుంది. తన రెండు బొటనవేళ్లను కోటు జేబుల్లోకి దూర్చి నిలుచున్నాడు. అతడు పొడుగ్గా బలిష్ఠంగానే కాక, హుందాగా కూడా కనిపించాడు.

“ఏం కావాలి? దేనికోసం వచ్చారు మీరు?” అని అడిగాడతడు. అతని తెల్లని దంతాలు తళతళ మెరుస్తుంటే, “ఎంత దివ్యంగా కనిపిస్తున్నారు డాన్ మాన్యుయెల్ గారూ! చక్కని దేహపుష్ఠి వున్న పురుషుని లాగా ఉన్నారు మీరు” అన్నది లా గోర్డా.

అతడు వాళ్లకు హాండ్ షేక్ ఇచ్చాడు. అతని సిబ్బంది తాము చేస్తున్న శ్రమపూరితమైన పనిని ఆపి వెనక్కి ఒరిగి, ఆ ముగ్గురు స్త్రీల వైపు స్నేహపూర్వకంగా చేతులు ఊపారు. నిజానికి వాళ్లందరు ఒకరికొకరు పాత మిత్రులే. అందుకే వాళ్ల స్వాగతం పైకి కొంచెం మామూలుగా కనిపించినా అందులో సుహృద్భావం ఉంది. ఆ ముగ్గురు స్త్రీలు ఆ నగరంలోని ముఖ్యమైన వేశ్యాగృహాలకు యజమానురాళ్లు అని నేనిక్కడ చెప్పాల్సి వుంది. వినేవాళ్లు నిస్సందేహంగా నన్ను అపార్థం చేసుకోని విధంగా జాగరూకత నిండిన వివేకంతో ఈ విషయాన్ని చెప్పగలను నేను. అయినా మీరేమైనా అనదల్చుకుంటే నిస్సంకోచంగా అనవచ్చు. లా గోర్డా, కార్మెన్సిటా స్పెయిన్ దేశపు మూలాలున్న స్త్రీలు. వాళ్లు తమ తలలమీద నల్లని శాలువాలను కప్పుకుని, అందమైన నల్లని దుస్తుల్లో వున్నారు. కాని మేడమ్ కొరాలి ప్రెంచ్ స్త్రీ. ఆమె తన తలమీద ఒక హ్యాట్ ను పెట్టుకుంది. వాళ్లు ముగ్గురూ నడి వయస్సులో ఉన్నారు. వాళ్ల ప్రవర్తనలో వినయం కనపడుతోంది.

అధ్యక్షుడు వాళ్లను కూచోమన్నాడు. ఆ తర్వాత వాళ్లకు మదీరా అనే మద్యాన్నీ, సిగరెట్లనూ ఇవ్వబోయాడు. కాని ఆ వాళ్లు వాటిని తీసుకోలేదు.

“మీ ఔదార్యానికి కృతజ్ఞతలు మాన్యుయెల్ గారూ! కాని మేము సొంత వ్యాపారపు పని మీద వచ్చాము కనుక వాటిని స్వీకరించలేము” అన్నది మేడమ్ కొరాలీ.

“సరే. అయితే నేను మీకెలాంటి సహాయం చెయ్యగలను?”

లా గోర్డా, కార్మెన్సిటా మేడమ్ కొరాలీ వైపు చూశారు. మేడమ్ కొరాలీ వాళ్లిద్దరి వైపు చూసింది. ఆ యిద్దరు స్త్రీలు అంగీకారాన్ని సూచిస్తూ తలలు ఊపడంతో, తనే మాట్లాడాలని వాళ్లు ఆశిస్తున్నారని గ్రహించి ఇలా అన్నది మేడమ్ కొరాలీ.

“డాన్ మాన్యుయెల్ గారూ! అసలు సంగతేమిటంటే, మేం ముగ్గురం ఎన్నో సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాము. ఈ దీర్ఘకాల వ్యవధిలో మా పరువుకు మచ్చ తెచ్చే పని ఒక్కటి కూడా చెయ్యలేదు మేము. మేము నడుపుతున్న వేశ్యాగృహాలంత పేరెన్నిక గన్న గృహాలు మొత్తం అమెరికా ఖండంలో మరెక్కడా లేవు. అవి ఈ అందమైన నగరానికి గర్వకారణాలుగా నిలుస్తాయి. అంతెందుకు? నేను నిర్వహిస్తున్న వేశ్యాగృహానికి హంగుల్ని సమకూర్చడం కోసం గత సంవత్సరమే ఐదు వందల డాలర్లను ఖర్చు పెట్టి అధునాతనమైన అద్దాలను అమర్చాను. మేమెప్పుడూ మర్యాదగానే, గౌరవప్రదంగానే ఉన్నాము. ప్రతి సంవత్సరం పన్నులను సకాలంలో కట్టాము. ఇన్నేళ్లు మేమెంతో శ్రమ పడ్డాక దాని ఫలాలను మా నుండి లాక్కోవడం బాధాకరంగా వుంది. ఇంత కాలంగా మేము నిజాయితీతో, వ్యాపారం పట్ల విచక్షణాత్మకమైన ధ్యాసతో కృషి చేశాక మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అన్యాయమని చెప్పడానికి నేను సందేహించను”

అధ్యక్షుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు.

“కాని నా ప్రియమైన కొరాలీ! నువ్వు దేనిగురించి మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు నాకు. చట్టానికి వ్యతిరేకంగా కాని లేక నా కన్నుగప్పి కాని మీ డబ్బును ఎవరైనా గుంజుకున్నారా?”

అతడు ఒక అనుమానం నిండిన చూపును తన సెక్రెటరీల వైపు విసిరాడు. వాళ్లు తమకేమీ తెలియదన్నట్టు అమాయకంగా కనిపించే ప్రయత్నం చేశారు. వాస్తవంలో వాళ్లు అమాయకులే అయినా తమ ముఖాల్లోని ఇబ్బందిని దాచలేకపోయారు.

“మేము కొత్త చట్టం గురించి మాట్లాడుతున్నాము. మేము సర్వనాశనం కాబోతున్నాము”

“ఏంటీ? సర్వనాశనమా?”

“కొత్త విడాకుల చట్టం అమలులో ఉన్నంత వరకు మేము మా వ్యాపారాలను చేసుకోలేం. మేము నిర్వహిస్తున్న అద్భుతమైన వేశ్యాగృహాలను మూసుకోవాల్సి వస్తుంది”

తర్వాత మేడమ్ కొరాలీ తమ ఇబ్బందిని ఎంత నిర్మొహమాటంగా వివరించిందంటే, ఆమె అన్న మాటలను నేను కొద్దిగా మార్చి చెబుతున్నాను. ఆమె వెళ్లబోసుకున్న గోడు సారాంశమేమంటే, పరాయి ప్రాంతాల నుండి అందమైన స్త్రీలు ఆ నగరానికి రావటంతో, హుందాతనం నిండిన తమ మూడు బంగళాలు పూర్తిగా దిక్కుమాలినవి ఐపోయాయి. వాటిమీద తాము ముగ్గురూ అన్ని పన్నుల్ని సక్రమంగా కడుతున్నా కూడా, నాగరికతను అవలంబించే యువకులు తమ సాయంత్రాలను గ్రాండ్ హోటల్లో గడపటం వైపే మొగ్గు చూపుతున్నారు. డబ్బు చెల్లిస్తే మాత్రమే వేశ్యాగృహాల్లో లభించే సరసమైన వినోదం ఆ హోటల్లో ఉచితంగా దొరుకుతోంది.

“హోటలువాళ్లను మనం నిందించలేం” అన్నాడు అధ్యక్షుడు.

“నేనేం వాళ్లను నిందించటం లేదు. కాని ఆ స్త్రీలను తప్పు పడుతున్నాను. ఇక్కడికి వచ్చి మా పొట్టలమీద కొట్టే హక్కు వాళ్లకు లేదు. డాన్ మాన్యుయెల్ గారూ, మీరు ప్రజల్లోని ఒక మనిషే తప్ప రాచరికంలో ఉన్నవారు కారు. ఈ దుష్ట వ్యాపారస్థుల చేత మేం తరిమి కొట్టబడితే మీ దేశం దాన్ని ఎట్లా వ్యాఖ్యానిస్తుంది? వాళ్లు చేస్తున్నదాంట్లో న్యాయం ఉందా? నిజాయితీ వుందా?”

“కాని నేనేం చేయగలను? హోటల్లో బస చేసిన ఆ అందమైన స్త్రీలను ముప్ఫై రోజుల పాటు గదుల్లో బంధించి వుంచలేను కదా. ఈ విదేశీ స్త్రీలకు మర్యాద లేకుంటే దానికి నేనెలా బాధ్యుడినవుతాను?”

“బీద స్త్రీలు ఆ విధంగా చేయటం వేరు. ఎందుకంటే పాపం వాళ్లకు వేరే మార్గం వుండదు. కాని వీళ్లు అట్లా చేయటమన్నది సమంజసమెలా అవుతుందో నాకర్థం కాదు”

“ఈ చట్టం చెడ్డది, క్రూరమైనది” అన్నది కార్మెన్సిటా. అధ్యక్షడు ఒక్కసారిగా లేచినిలబడి తన రెండు చేతులను పక్కలకు చాపి, ఇలా అన్నాడు. “ఈ దేశానికి సంపదనూ శాంతినీ తెచ్చిన ఆ చట్టాన్ని నిషేధించాలని అడగకండి. ప్రజలచేత ఎన్నుకోబడ్డ నేను ప్రజల్లో ఒకణ్ని. నా మాతృదేశపు ఐశ్వర్యం నా హృదయానికి చాలా దగ్గరగా వుండే విషయం. విడాకుల చట్టం మన దేశపు ముఖ్య పరిశ్రమ. చచ్చినా దాన్ని నేను నిషేధించను”

“ఓరి దేవుడా! ఆఖరుకు ఇట్లాంటి గతి దాపురించింది. నా ఇద్దరు కూతుళ్లు న్యూ ఆర్లియెన్స్ లోని కాన్వెంటులో చదువుతున్నారు. అయ్యో భగవంతుడా! ఈ వ్యాపారం చాలావరకు దుఃఖాన్ని తెచ్చిపెట్టేదే. అయినా నా ఇద్దరు కూతుళ్లు చక్కగా పెళ్లిళ్లు చేసుకుంటారనీ, నేను ఈ పనిని మానుకునే సమయం వచ్చినప్పుడు వాళ్లు దీన్ని నడిపే బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకుంటారనీ ఆశ పడుతూ ఎప్పుడూ నన్ను నేను సముదాయించుకున్నాను. ఈ వ్యాపారమే లేకపోతే న్యూ ఆర్లియెన్స్ వంటి మహానగరంలోని కాన్వెంటులో వాళ్లను అంత సులభంగా ఉంచగలనా?” అన్నది కార్మెన్సిటా.

“మరి నా సంగతి? నా బంగళాను మూసేసుకుంటే నా కొడుకును హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎవరు చదివిస్తారు?” అని అడిగింది లా గోర్డా.

“నేను మాత్రం దీన్ని ఖాతరు చేయను. ఫ్రాన్స్ కు వెళ్లిపోతాను. నా తల్లికి ఇప్పుడు ఎనభై ఏడు సంవత్సరాల వయసుంది. ఆమె ఇంకా ఎంతో కాలం బతకదు. తన అవసానదశలో నేనామె పక్కన వుంటే ఆమెకు ఊరటా మనశ్శాంతీ దొరుకుతాయి. కాని ఈ అన్యాయం నన్నెంతగానో బాధ పెడుతోంది. అయ్యా, మాన్యుయెల్ గారూ! తమరు కూడా ఎన్నో సాయంత్రాలను నా బంగళాలో ఆనందంగా గడిపారు. మీరు మాతో ఇలా వ్యవహరిస్తుంటే మా మనసులు గాయపడుతున్నాయి. ఒకప్పుడు నా దగ్గర చిన్నచిన్న పనులను నిర్వహించే ఉద్యోగం చేసి, నా బంగళాలోకి దేశాధ్యక్షుని హోదాలో గౌరవ అతిథిగా వచ్చినప్పుడు అది మీ జీవితంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సందర్భం అని మీరు స్వయంగా నాతో అనలేదా?” అన్నది మేడమ్ కొరాలీ

“అది వాస్తవం కాదని అనటం లేదు. నేనెప్పుడూ నిజాయితీగానే వ్యవహరిస్తాను” అని డాన్ మాన్యుయెల్ ఆ హాలులో అటూయిటూ నడుస్తూ, అలవాటుగా మధ్యమధ్య తన బుజాలను పైకి లేపాడు. దీర్ఘాలోచనలో మునిగిన అతడు “నేను ప్రజల మనిషిని. ప్రజలచేత ఎన్నుకోబడినవాడిని. ఇక్కడ వాస్తవమేమిటంటే, ఈ స్త్రీలు విశ్రాంతి తీసుకోకుండా పని చేశారు” అని తన సెక్రెటరీలతో నాటక ఫక్కీలో మళ్లీ ఇలా అన్నాడు. “నా పరిపాలన మీద ఇదొక మచ్చ. నైపుణ్యం లేని విదేశీయులు నిరంతరం నిజాయితీతో కృషి చేసే ఇక్కడి మనుషుల పొట్టలను కొట్టడం నా సిద్ధాంతానికి విరుద్ధం. ఈ స్త్రీలు నన్ను ఆశ్రయించి నానుండి రక్షణను కోరటం సరైనదే. ఈ వ్యవహారం ఇంకా ఇలా కొనసాగటాన్ని నేను అనుమతించను”

అతని మాటలు నిశితంగా ప్రభావవంతంగా ఉన్నాయి కాని, వాటిని విన్నవాళ్లందరికి కేవలం ఆ మాటల వల్ల ఏం లాభం చేకూరదని తెలుసు. మేడమ్ కొరాలీ కొట్టొచ్చినట్టుగా పెద్దగా వుండే తన ముక్కు మీద పౌడరును అద్దుకుని, తన పర్స్ లోని చిన్న అద్దంలో ఒకసారి చూసుకుంది.

“మానవ నైజం ఎట్లా వుంటుందో తెలుసు నాకు. ఆ అందమైన విదేశీ స్త్రీల పని ఐపోయే రోజు వస్తుంది” అన్నదామె.

“మనం ఒక గోల్ఫ్ మైదానాన్ని తయారు చేయవచ్చు. కాని అది కేవలం పగటి వేళల్లో మాత్రమే జనాన్ని ఆకర్షిస్తుందనేది వాస్తవం” అన్నాడొక సెక్రెటరీ.

“కులకడానికి వాళ్లకు మగాళ్లు అవసరమైతే వాళ్లే తమతో పాటు తెచ్చుకోవచ్చు కదా?” అన్నది లా గోర్డా.

“భగవంతుడా” అని అరిచి, కొంత సేపు కదలక మెదలక నిల్చున్నాడు అధ్యక్షుడు. తర్వాత “దీనికో పరిష్కారం వుంది” అన్నాడు. అంతర్వివేచనా, వివేకమూ లేకుండానే అతడు అంతటి ఉన్నత స్థానాన్ని చేరుకోలేదు. ఆయన ఉల్లాసంతో నవ్వి ఇలా అన్నాడు. “చట్టాన్ని మార్చేద్దాం. ఇకముందు పురుషులు మునుపటి లాగానే ఏ ఆటంకం లేకుండా వస్తారు. కాని, స్త్రీలు మాత్రం భర్తలతోనే రావాలి, లేదా హామీ పత్రాన్ని ఇవ్వాలి”. వెంటనే తన సెక్రెటటరీల చూపుల్లో నిరాశను గమనించి, “అయితే భర్త అనే పదాన్ని అత్యంత విస్తృతార్థంలో చూడాలని ఇమిగ్రేషన్ అధికారులకు మనం ఆదేశాలను ఇస్తాము” అని వాళ్ల వైపు చేయి ఊపాడు అధ్యక్షుడు.

“భలేగా వుంది. ఆ విధంగా ఆ స్త్రీలతో పాటు మగవాళ్లెవరైనా వస్తే ఇతర పురుషులెవరూ మధ్యలో జోక్యం చేసుకునే అవకాశముండదు కనుక, మా కస్టమర్లు మేము నడుపుతున్న వేశ్యాగృహాలకే తిరిగి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. డాన్ మాన్యుయెల్ గారూ, మీరొక అద్భుతమైన వ్యక్తి అంటాన్నేను. ఏదో వొక రోజున ప్రజలు మీ శిలావిగ్రహాన్ని తప్పక ప్రతిష్ఠిస్తారు” అన్నది మేడమ్ కొరాలీ.

చాలా సార్లు చిన్నచిన్న ఉపాయాలే పెద్దపెద్ద కష్టాలనుండి మనను గట్టెక్కిస్తాయి. డాన్ మాన్యుయెల్ సూచించిన విధంగా చట్టం మార్చబడింది. పుష్కలమైన సూర్యరశ్మినీ, వైశాల్యాన్నీ కలిగిన ఆ స్వతంత్ర దేశం సంపదతో తులతూగటం వల్ల, మేడమ్ కొరాలీ తను ఆశించినట్టుగా తన వ్యాపారాన్ని కొనసాగించి బాగా లాభాలను గడించింది. కార్మెన్సిటా కూతుళ్ళిద్దరూ న్యూ ఆర్లియన్స్ నగరంలో ఖరీదైన విద్యను పూర్తి చేశారు. లా గోర్డా కొడుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మంచి మార్కులతో పట్టభద్రుడయ్యాడు.

 

 

 

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మనలోపలి మరో ప్రపంచం..కోడూరి కవిత!

జయశ్రీ నాయుడు

 

jayaజ్ఞాపకాలనీ, ప్రస్తుత నగర జీవితపు అలుపెరుగని ఆరాటాన్నీ సమాంతర చాయలుగా చిత్రించిన దృశ్య కవిత కోడూరి విజయకుమార్ – అపుడపుడు… (ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటి నుంచి). మనసులో మనం మోస్తూ వుండే మరో ప్రపంచపు ప్రతీక ఈ కవిత. ఆ మరో ప్రపంచమే లౌక్యపు లోకంలో కఠినత్వపు నాగరిక చాయల్లో జీవిస్తున్నా మనలో మానవత్వపు గుబాళింపులు జీవింపజేసే అంతర్గత అమృతత్వం. 

కవిత మొదటి పంక్తుల్లోనే రెండు విభేదాత్మక ప్రపంచాలు మనముందు నిలుస్తాయి – ఒకటి నగర జీవితం మరొకటి కవి నిరంతరంగా తన అంతరంగంలో ప్రేమగా తడుముకునే తన వూరి ఆనుపానులు. అయితే ఇక్కడ కవి వర్తమానం లో నుండి గతాన్ని వర్నించుకుంటూ మళ్ళీ తిరిగి వర్తమానం లోకి వస్తూ ఒక వృత్తాన్ని పూరిస్తాడు. ఆ దృశ్యాన్ని చిత్రించుకోవడానికి ఒక కుంచే సరిపడా రంగులూ మన మనసుకు అందించి నిష్క్రమిస్తాడు. భవిష్యత్తుని అసలేమాత్రమూ స్పృశించకుండా అసంపూర్తి కవితా చిత్రాన్ని అందించడం లోనే జీవితపు సత్యం ఆవిష్కృతమవుతుందేమో..

కవిత మొదలయ్యేది  ఇలా …

దేహాత్మలను ఉక్కిరిబిక్కిరి చేసే 

ఈ మహానగర ఉక్కుకౌగిలి నుండి బయటపడి

అపుడపుడూ అలా నీ వూళ్ళో వాలిపోవాలి

ఉక్కు కౌగిలి అన్న పదంలోనే నగర జీవితపు కఠినత్వం ఆవిష్కృతమవుతుంది. నువ్వు అంటూ చదువరిని సంబోధిస్తూ మొదలైన కవిత, కవి తనని మనల్నీ కలిపి మాట్లాడుకుంటున్న ఏకత్వానికి ప్రతీకగా తీసుకోవొచ్చు. ప్రతి చదువరీ తన అంతరాత్మలో తెలియకనే తనకు ఇష్టమైన ప్రదేశాల్లోకి తొంగి చూసుకోవడం మొదలుపెడతాడు.

బాల్యపు దినాలను దాచుకున్న తన ఊరి నేలా, దాహం తీర్చిన చేదబావీ , అప్పటి ఇరికిరుగు మూడుగదుల ఇల్లూ, ఇప్పటికీ కవికి జ్ఞాపకాలుగా అపురూపమే.   వెనువెంటనే, హెచ్చరికగా అవేవీ ఇప్పుడా వీధిలో లేకపోవచ్చునేమో అన్న ఆవేదనా రేఖని జతచేస్తాడు.

తన ఊరికి వెళ్ళినపుడు కళ్ళముందు కదలాడె జ్ఞాపకాలన్నీ అతని మనోఫలకానివి. వర్తమానంలో మాత్రం కుచించుకుపోయిన తన బడి ఆటస్థలం, తన లెక్కల మాస్టారి లెక్ఖ ఈ లోకంలో ముగిసిందన్న స్నేహితుడి కబురూ ఒకేసారి స్ఫురణకు వస్తాయి.

OkaRatriMarokaRatri600

మరో చోట, అదే కవితలో, బెంచీలపై పడుకుని సినిమాలు చూసిన తన వూరి డబ్బారేకుల టకీసు, ఇప్పుడా చోటుని ఆక్రమించిన మల్టీప్లెక్ష్ అడుగున నవ్వుకుంటోందన్న విషయం విషాదాన్ని వినోదంగా మేళవించిన తీరు ఇది. అప్పట్లో “సినిమాకెళ్ళడం ఒక పండగ కదా… “అంటాడు కవి. టీవీలూ, ఇంటర్నెట్లూ లేని కాలం లో బాల్యం గడిపిన తరానికి మాత్రమే తెలిసిన అనుభూతి అది. తన యవ్వన దినాల పరుగులనీ తిరుగుళ్ళనీ దాచిన నేలపై తిరిగి రావడానికే తన మనసు అక్కడికి పరుగులు తీస్తుందన్న రహస్యాన్ని ఆత్మీయంగా వెల్లడించుకుంటాడు.

అవే ఈ మహానగరంలో బ్రతకడనికి అవసరమైన మణిమాణిక్యాలు. కవికి తన ఊరిపైని వ్యామోహాన్ని ప్రశ్నించే నగజీవులెందరికి ఈ విషయం అర్థం అవుతుంది???

నగర జీవనం, నాగరికతా ఊళ్ళను కూడా అబగా కబళించేస్తున్నాయన్న నిజాన్ని ఆర్ద్రత మేళవింపుతో చదువరి కి పంచిన కవిత ఇది.

 

పూర్తి కవిత ఇక్కడ…

 

 అపుడపుడూ… 

కవి: కోడూరి విజయకుమార్

 “ఒక రాత్రి మరొక రాత్రి” కవితసంపుటి నుంచి

 

దేహాత్మలను ఉక్కిరిబిక్కిరి చేసే

ఈ మహానగర ఉక్కుకౌగిలి నుండి బయటపడి

అపుడపుడూ అలా నీ వూళ్ళో వాలిపోవాలి

***

నీ బాల్య దినాల నడకలనీ,

నీ నవయవ్వన దినాల పరుగులనీ

నీ బలాదూరు తిరుగుళ్ళనీ

అట్లా పదిలంగా దాచిపెట్టిన

నీ వూరి నేల పైన తిరిగి రావాలి

ఒకప్పుడు మూడు ఇరికిరుగు గదుల్లో

నీ కుటుంబమంతా తలదాచుకున్న ఆ ఇల్లు

ఎంతో మంది దాహం తీర్చిన ఆ పెద్ద చేదబావి

అవేవీ ఇప్పుడా వీధిలో లేకపోవొచ్చు

కానీ నీవు వెళ్ళినపుడు

ఆ రేగుపళ్ళ చెట్టు కింద పిల్లల కేరింతలు

నీవు దారాలు కట్టి ఎగరేసిన తూనీగలు

వెన్నెల్లో దాగుడుమూతల ఆటలు

లిప్తపాటు నీ ముందు అన్నీ కదలాడతాయి

గొప్ప ఆశ్చర్యంగా వుంటుంది నీకు

ఒకప్పుడు అతి పెద్దగా వుండిన నీ బడి ఆటస్థలం

ఇపుడింత చిన్నదిగా వుందేమిటి అని…

నీ తరగతి గది గోడ పలకరిస్తుంది

లెక్క తప్పు చేసావని ఇక్కడే కదా నిన్ను

లెక్కల సారు గోడకుర్చీ వేయించింది

క్రితం సంవత్సరం ఆయన పోయారని

మిత్రుడిచ్చిన సమాచారం గుర్తుకొస్తుంది నీకు

ఒకప్పటి డబ్బారేకుల టాకీసుని కూల్చివేసి

ఊరి మధ్యలో వెలిసిన మల్టీప్లెక్స్

కళ్ళనీ చెవులనీ మాయ చేసే రంగుల చిత్రాలు

బెంచీలపై పడుకుని సినిమాలు చూసిన

ఆరోజులు గుర్తుకొస్తాయి నీకు

అప్పుడు సినిమాకి వెళ్ళడమొక పండుగ కదా

మల్టీప్లెక్స్ అడుగున పడివున్న నీ

డబ్బరేకుల టాకీసు నవ్వుకుంటుంది

ఆ వీధి మలుపు దాటేక ఎనిమిదో యింట్లోనే కదా

ఒకనాటి నీ ఏంజిల్ వుండేది

తను కనిపించినా వినిపించినా

ఒక దూది పింజమై తేలిపోయేవాడివి

గుర్తుందా… ఏంజిల్ పెళ్ళైన రోజు రాత్రంతా

వూరి రోడ్లపైన నీవు పిచ్చివాడిలా తిరగడం

వీధి మలుపులో తను ఎదురుపడుతుందేమో అని

ఒక క్షణం భ్రమించి నవ్వుకుంటావు

*     *     *

పెద్దగా పరిచయం లేని ఎవరో అడుగుతారు –

చాలా తరుచుగా వూరికి వెళ్ళొస్తావేమని?

ఈ మహానగరంలో బతకడానికి అవసరమైన

కొన్ని మణిమాణిక్యాలని తెచ్చుకునేందుకు

అని అతడికి చెప్పాలనుకుంటావు

మరి, అతడికి అర్థం అవుతుందంటావా?

*

“ఓకే బంగారం” Casual Sex నే ప్రచారం చేస్తోందా?

వినోద్ అనంతోజు 

 

vinod  పోయిన వారం సారంగలో నేను రాసిన “ఇది బంగారం కాదు కాకి బంగారం” వ్యాసం వచ్చింది. ఓకే బంగారం సినిమా ప్రచారం చేసే హానికరమైన భావజాలాన్ని విమర్శిస్తూ రాసిన వ్యాసం అది. దానికి స్పందనగా పాఠకులు కొంతమంది సమర్థిస్తూ రాశారు. కొందరు విమర్శిస్తూ రాశారు. విమర్శలలో కొన్ని ముఖ్యమైన వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

 

వ్యక్తిగత అభిప్రాయాలు ఎక్కడిదాకా?

(Q1) “ఒకే బంగారం” సినిమా ద్వారా మణిరత్నం ఆయన అభిప్రాయాలని పంచుకున్నాడు. ఆయనేమి సమాజాన్ని ఉద్ధరించడానికి సినిమా తీయలేదు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని విమర్శించే హక్కు మీకు ఎక్కడ ఉంది?

(జ) ఏ మనిషికైనా తనకు పరిచయం ఉన్న ప్రతి విషయం మీద ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం గురించీ, సామాజికమైన విషయాల గురించీ ఏవో అభిప్రాయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సుబ్బారావు కి బాగా డబ్బులున్నాయి అనుకుందాం. ఆయన లంచం ఇస్తే పనులు త్వరగా జరుగుతాయి. సుబ్బారావుకి లంచగొండితనం ఉండటం చాలా సుఖంగా, సౌకర్యవంతంగా అనిపించవచ్చు. అది అతని వ్యక్తిగత అభిప్రాయం. అలాగని అతను లంచగొండితనం మంచిదనీ, పెరగాలనీ సినిమాల ద్వారానూ, నాటకాల ద్వారానూ ప్రచారం చేస్తానంటే కుదురుతుందా? వ్యక్తిగత స్థాయిలో అభిప్రాయాలు ఎలా ఉన్నా పెద్ద పట్టింపు ఉండదు. సామాజికమైన విషయాల గురించి తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చెయ్యాలనుకుంటే విమర్శలు తప్పకుండా ఎదురవుతాయి.

 

(Q2) ఇది మంచి ఇది చెడు అని ఎలా generalize చేస్తారు? ఒక్కొక్కరికీ ఒక్కో విషయం మంచిగా అనిపించవచ్చు. ఇంకొకళ్ళకి అదే విషయం చెడుగా అనిపించవచ్చు. మీకు సినిమా చెడుగా అనిపించినంత మాత్రాన అది చెడ్డదైపోతుందా? మీ అభిప్రాయాలు పక్కవారి మీద రుద్దకూడదు.

(జ) ఇది కూడా పై ప్రశ్నలాంటిదే. వ్యక్తులకి మంచి “అనిపించడం” – “అనిపించకపోవడం” మీద సామాజిక విషయాలు ఆధారపడవు. అప్పారావుకి ఈవ్ టీజింగ్ సరదాగా, ఆనందంగా, మంచిగా “అనిపించవచ్చు”. కానీ అది అవతలి అమ్మాయి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఆమె హక్కుల్ని ఒక రకంగా హరించివేస్తుంది. కాబట్టి ఈవ్ టీజింగ్ చెడు. మంచి “అనిపించడం” – “అనిపించకపోవడం” అనే లెక్క వ్యక్తిగత విషయాలలో పనికివస్తుందేమో గానీ సామాజిక విషయాలలో కాదు. సామాజిక విషయాలలో మంచి చెడులు నిర్ణయించడానికి వేరే సూత్రం కావాలి.

“ప్రతి మనిషికీ సమానమైన హక్కులు – సమానమైన బాధ్యతలు.” ఈ సూత్రం అందరు మనుషులకు అన్ని కోణాల్లోనూ సమానత్వాన్ని ఇస్తుంది. సమాజం ఆ “సమానత్వ” స్థితికి చేరినప్పుడు అందులో ఆర్ధిక అసమానతలు ఉండవు, స్త్రీ పురుష సంబంధాల్లో అసమానతలు ఉండవు, జాతి కుల మత వివక్షలు లాంటి ఏ ఇతర అసమానతలు ఉండవు. సమాజాన్ని అటువంటి స్థితి వైపుకి నడిపించే ఏ మార్పు అయినా, ఏ భావజాలం అయినా అది మంచే ! అసమానతలని పెంపొందించేది ఏదయినా అది చెడే ! ఈ సినిమా ప్రచారం చేసిన Casual Sex Relationships / Free Love concepts స్త్రీ పురుష సంబంధాల్లో అసమానతల్ని పెంచుతాయి. అందువల్ల అది చెడు.

“మానవులందరూ సమానంగా ఉండాలి” (సర్వ మానవ సమానత్వం) అనే దాన్ని మీరు ఒప్పుకోకపోతే ఈ వ్యాసం చదవడం ఇక్కడితో ఆపేయండి. ముందు ముందు చెప్పబోయేవి మీకు ఉపయోగపడవు.

bangar2

 

(Q) ఏ స్త్రీ పురుషులు సంబంధంలో ఉండాలో అది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛ. దానికి ఎవరూ పరిమితులు విధించడానికి వీలు లేదు.

(జ) ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి సంబంధంలో ఉంటారు అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ. నిజమే. ఇది స్త్రీ పురుషులకి మాత్రమే కాదు. Trans genders, Lesbians, Gays, Bisexuals (LGBT) అందరికీ ఉన్న స్వేచ్ఛ. కానీ ఆ స్వేచ్ఛకి కొన్ని పరిమితులు ఉంటాయి. స్త్రీ పురుష సంబంధాల్లో వారి స్వేచ్ఛ ఎక్కడి దాకా అంటే సామాజిక సమస్యలు సృష్టించనంత దాకా.

ఉదాహరణకి: స్త్రీ కి తన శరీరం మీద పూర్తి స్వేచ్ఛ ఉంది. తను గర్భం ధరించాలో లేదో నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉంది. ఇష్టంలేకపోతే గర్భాన్ని అబార్షన్ చేయించుకునే హక్కు కూడా స్త్రీకి ఉంది. అలాగని కడుపులో ఉన్నది ఆడబిడ్డో, మగబిడ్డో తెలుసుకుని, ఆడబిడ్డ కాబట్టి అబార్షన్ చేయించుకునే హక్కు ఎవరికీ లేదు. చాలా సందర్భాలలో భ్రూణహత్యలు చేయించుకునే కుటుంబాలలో ఆడవాళ్లే భ్రూణహత్యలని సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. ఇక్కడ కూడా ఇలాంటి వాదన చెయ్యవచ్చు “నాకు ఆడపిల్లని కనాలో మగపిల్లాడిని కనాలో నిర్ణయించుకునే హక్కు లేదా? నా శరీరం మీద వేరొకరు పరిమితులు విధించడం ఏమిటి?”

ఆ వాదన ఇక్కడ చెల్లదు. ఎందుకంటే ఆ హక్కు ఉంటే పోను పోను జనాభాలో ఆడపిల్లల సంఖ్య తక్కువ అయ్యి అదొక సామాజిక సమస్య అయ్యి కూచుంటుంది.

కాబట్టి వ్యక్తిగత స్వేచ్ఛలకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు కూడా పాత సామాజిక సమస్యలు పోవడానికి, కొత్తవీ పుట్టుకురాకుండా ఉండటానికి ఉంటాయి. స్త్రీ పురుష సంబంధాలలో పరిమితులు లేని స్వేచ్ఛ కలిగించే సామజిక సమస్యలేంటో తరవాత చూస్తాం.

స్త్రీ పురుష సంబంధాలు సామాజిక విషయాలా?

(ప్ర) స్త్రీ పురుష సంబంధాలు సామాజిక విషయాలు అంటారేంటి? నేను, నా భార్య. మా ఇద్దరి మధ్య సంబంధం మా వ్యక్తిగతం కాదా?

(జ) బయట “కుటుంబం అనేది వ్యక్తుల వ్యక్తిగత విషయం” అని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవానికి స్త్రీ పురుష సంబంధాల్లో జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఒక్కటి తప్ప మిగతావి అన్నీ సామాజికమైన విషయాలే. శారీరక సంబంధాన్ని మాత్రమే స్త్రీ పురుష సంబంధంగా అర్థం చేసుకోవడం వల్ల ఈ గందరగోళం వస్తుంది. స్త్రీ పురుష సంబంధాల్లో శారీరక సంబంధంతో పాటు ఇంకా అనేక ముఖ్యమైన విషయాలున్నాయి.

          మీ భార్య ఇంటిపట్టునే ఉంటూ మీకు, మీ పిల్లలకూ సపర్యలు చేస్తూ, మీరు బయట ఉద్యోగాలు చేసుకోవడానికి తోడ్పడుతున్నారు అనుకుంటే, ఆవిడ చేసే శ్రమ అంతా సామాజికమైనదే. ఒక వ్యక్తి తన భార్యని తిట్టినా, కొట్టినా, వరకట్నం పేరుతో హింసించినా అవన్నీ సామాజికమైన విషయాలే. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి చేసే పునరుత్పత్తి (Reproduction), పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ ఇవన్నీ సామాజిక విషయాలే.

 

(ప్ర) ప్రస్తుత పెళ్లి వ్యవస్థలో బోలెడు లోపాలున్నాయి. ఆస్తులు, భూములు, బంగారం పేరుతో జంటలకి బలవంతంగా పెళ్ళిళ్ళు చెయ్యట్లేదా? అక్కడ మాత్రం ముందు శోభనం జరిగి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదా?

(జ) ఈ లోపాలన్నిటి గురించి నేను నా వ్యాసంలో చాలా స్పష్టంగా రాసాను. “ప్రస్తుతం అమలు లో ఉన్న “పెళ్లి” వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. అది ఆడా మగల మధ్య అసమానతలు పెంచేదిగా ఉంది. పైగా వ్యక్తుల ఇష్టాయిష్టాల కంటే డబ్బు, ఆస్తి, కులం, మతాలే “పెళ్లి”లో ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయి. నిజమే. ఈ కారణాల చేత పెళ్లిని వ్యతిరేకించవచ్చు.” అని రాసాను. దీని అర్థం ఏమిటి?

అంతే కాకుండా “ఒక ఆడ మగా ఎటువంటి ప్రలొభాలూ (ఆస్తి, కులం, మతం…) లేకుండా, పూర్తి వివేచనతో, ఇష్టపూర్వకంగా ఒకరినొకరు జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం, వారితోనే కలిసి ఉండటం సరైన సంబంధం అవుతుంది.” అని రాసాను. దాని అర్థం ప్రస్తుతం ఉన్న “పెళ్లి” సంబంధాలు సరైనవిగా లేవని చాలా స్పష్టంగా చెప్పినట్టు కాదా? పైగా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి పెళ్లి అనే కార్యక్రమం అవసరమే లేదన్నాను.

          ఇంత సూటిగా రాసిన తరవాత కూడా “పెళ్ళిలో లోపాలున్నాయి కదా?” అని నన్ను ప్రశ్నిస్తారు ఏమిటి? ఇప్పుడున్న పెళ్లి వ్యవస్థే సర్వ శ్రేష్టమైనది అని డబ్బా కొట్టేవాళ్ళని ఎవరినైనా అడగండి ఈ ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళని ఏమనాలి? వీళ్ళకి తెలుగు చదవడం రాదా? లేక కింద పేరా చదివేటప్పుడు పైన పేరా లో చదివింది మర్చిపోతారా??

ఒకే బంగారం Casual Sex నే ప్రచారం చేస్తోందా?

(ప్ర) ఎంతసేపూ సెక్స్.. సెక్స్.. అంటారేమిటి? మణిరత్నం చూపించింది Unconditional Love. మీకు అందులో ప్రేమ కనపడకపోవడం మీ తప్పు.

(జ) సినిమా కథని ఒకసారి క్లుప్తంగా చూడండి. ఆది తారాలు పరిచయమైన నాలుగు రోజులకో శారీరికంగా కలిసారు. “ఆరు నెలల తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. ఈ ఆరు నెలలు కలిసుందాం. ఆ తరవాత ఎవరి లైఫ్ వాళ్లది” అని ఒప్పందం చేసుకుని కలిసుండటం మొదలు పెట్టారు. [అంటే ఆ 6 నెలల వరకే ఒకరితో ఒకరికి సంబంధం. ఆ తరవాత ఆది ఇంకొక అమ్మాయితో ఇలాంటి relationship మొదలుపెట్టినా తారాకి ఏమీ సంబంధం ఉండదు. అలాగే తారా చేసినా ఆదికి సంబంధం ఉండదు. ఇది Casual Sex / Free Love స్వభావం. ఇందులో ప్రేమ ఉండదు. ఆకర్షణ మాత్రమే ఉంటుంది.] ఈ ఆరు నెలలలో ఒకరికొకరు మానసికంగా దగ్గరయ్యారు. గణపతి తన భార్య మీద చూపించే ప్రేమ చూసి పరివర్తన చెంది పెళ్లి చేసుకున్నారు. ఇది కథ.

          ఈ సినిమాలో అధిక భాగం ప్రేమ అనే ముసుగులో Casual Sex / Free Love ని ప్రమోట్ చెయ్యడం జరిగింది. అలా చెయ్యలేదు అని మీకు అనిపిస్తే, పోనీ Casual Sex ని సినిమాలో వ్యతిరేకించిన సన్నివేశాలు ఏమున్నాయి? చివరలో పెళ్లి తప్ప ఒక్క సన్నివేశం కూడా లేదు. ఆ పెళ్లి కూడా వ్యతిరేకించడం కాదు. ఎందుకంటే, వ్యతిరేకించాల్సిన భావాలు ఉన్న ఆది, తారాలను సినిమా అంతా హైలైట్ చేసుకుంటూ వచ్చి, చివరికి వాళ్ళిద్దరి కథకు పెళ్లి పేరుతో సుఖాంతం చెయ్యడం వ్యతిరేకించడం అవ్వదు సమర్థించడం అవుతుంది.

నేను ఇంతకు ముందు వ్యాసంలో రాసినట్టు ఈ సినిమా “ప్రేమకీ మోహానికి మధ్య తేడా లేకుండా చేస్తోంది. చూసేవాళ్ళ మెదళ్లని గందరగోళ పరుస్తోంది. ఇప్పటికీ మీకు సినిమాలో “Casual Sex” అసలు కనపడకుండా మొత్తం ప్రేమే కనపడుతూంటే మీరు కూడా ఆ గందరగోళంలో ఉన్నట్టే.

 

(ప్ర) మణిరత్నం యువతని బాగు చెయ్యడానికి సినిమా తీయలేదు. ప్రస్తుతం ఉన్న యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేసారు అని ఎందుకు అనుకోకూడదు?

(జ) ప్రతి దర్శకుడు తన సినిమా ద్వారా ఏవో కొన్ని అభిప్రాయాలు సమాజంతో పంచుకోవాలి అనుకుంటాడు. కొన్ని సార్లు పంచుకోవాలి అని ఉద్దేశం లేకపోయినా తనకి తెలియకుండానే ఏవో కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తాడు.

మొన్నామధ్య చూసిన ఒక తెలుగు సినిమాలో హీరో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసే మగవాళ్ళని అందరినీ వరసగా పెట్రోల్ పోసి తగలపెడుతూ ఉంటాడు. దర్శకుడు హీరో ద్వారా ఆడవాళ్ళని Sex Objects లాగా చూడటం తప్పు అని సందేశం కూడా ఇప్పించాడు. కానీ అదే సినిమాలో హీరోయిన్లతో విపరీతమైన exposing చేయించాడు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? కథ చెప్పడంలో దర్శకుడి ఉద్దేశం మంచిదే అయిఉండవచ్చు. కాని అతనికి తెలియకుండానే అతని అభిప్రాయాలు సినిమాలో కనపడిపోయాయి. లేదా తెలిసే సినిమా commercial benefits కోసం అలా చేసి ఉండొచ్చు.

మణిరత్నం ఉద్దేశం నిజంగా ప్రస్తుత యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో చూపించడం మాత్రమే అయి ఉండవచ్చు. కాని ఆయనకి తెలియకుండానే Casual Sex లాంటి దాన్ని సమర్థించాడు. లేదా తెలిసే అది పెద్ద వ్యతిరేకించాల్సిన విషయం కాదని అనుకుని వదిలేసి ఉండవచ్చు.

 

Casual Sex అంటే ఏమిటి?

(ప్ర) మీ ఫేస్బుక్ పోస్ట్ కింద కామెంట్స్ అన్నీ చదివాను. Casual Sex గురించి ఎక్కువ వాదన జరుగుతోంది. అసలు Casual Sex అంటే ఏమిటి?

(జ) పెద్దగా పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఎటువంటి కమిట్‌మెంట్లు లేకుండా, సెక్స్ కోరికలు తీర్చుకోవడాన్ని Casual Sex అంటారు. దీనికే Free Love అనీ, Open Relationships, Hookup culture అనీ రకరకాల పేర్లున్నాయి. చిట్టిపొట్టి తేడాలతో అన్నీ ఒకటే. దీంట్లో ప్రేమ లాంటిది ఏది ఉండదు. కలిసి ఉండాలి, బాధ్యతలు పంచుకోవాలి లాంటి కమిట్‌మెంట్లు ఉండవు. ఆకర్షణ, మోజు ఉన్నంత కాలం కలిసి ఉంటారు. మోజు తీరిపోగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కలిసి ఉండటం ఒక రోజు కావొచ్చు, ఒక నెల కావొచ్చు, ఆరు నెలలు కావొచ్చు, ఒక్క రాత్రే కూడా కావొచ్చు. ఇలా ఎంత మందితో అయినా Casualగా Sex చేసుకోవచ్చు. ఈ రకం స్త్రీ పురుష సంబంధాలు అమెరికా లాంటి దేశాలలో 1960లలో బాగా ప్రచారంలోకి వచ్చి ఇప్పుడు అక్కడ బాగా స్థిరపడిపోయాయి. అక్కడి ఆడా మగా ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా, ఇష్టపూర్వకంగా దీన్ని అందిపుచ్చుకున్నారు. ఈ Free Love Culture ని సమర్థించే వారు ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానమైన స్వేచ్ఛ ఇస్తుందనీ, ఎవరి ఇష్టప్రకారం వారు ఉండవచ్చనీ, పెళ్లి పేరుతో ఒకరు ఇంకొకరికి దాస్యం చెయ్యాల్సిన అన్యాయం ఈ పద్ధతిలో ఉండదనీ చెప్తారు. మన దేశంలోకి ఇప్పుడిప్పుడే సినిమాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ప్రింట్ మీడియా ద్వార దిగుమతి అవుతోంది.

 

Casual Sex / Free Love Culture కి స్త్రీ పురుష అసమానతలకి సంబంధం ఏమిటి?

 

ఇంతకు ముందు చెప్పినట్టు స్త్రీ పురుష సంబంధాలు అనగానే శారీరక సంబంధం మాత్రమే కాదు. శారీరక సంబంధంతో పాటు ఇంట్లో శ్రమ విభజన, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ ఇవన్నీ కూడా స్త్రీ పురుష సంబంధాలలో భాగాలే. కాకపొతే మిగతా విషయాలన్నీ ఒక రకం, శారీరక సంబంధం (పునరుత్పత్తి, Reproduction) ఒక రకం. పునరుత్పత్తి కార్యక్రమం వల్ల ఒక కొత్త ప్రాణి భూమి మీదకి వస్తుంది. పుట్టే ప్రతి బిడ్డకు కొన్ని హక్కులు ఉంటాయి. అది మనం ఎప్పుడూ మరవకూడని విషయం.

          పునరుత్పత్తి కార్యక్రమం వ్యక్తుల వ్యక్తిగత విషయంగా కనిపిస్తున్నప్పటికీ, మనుషుల పునరుత్పత్తి సంబంధాలు (Sexual Relationships) ఎలా ఉన్నాయి అనేది సామాజికమైన విషయం. దీని ప్రభావం అనేక ఇతర సామాజిక విషయాల మీద ప్రత్యక్షంగా పడుతుంది. జనాభా పెరుగుదల –తరుగుదల, Women Literacy, Women employment, లైంగిక వ్యాధులు (Sexually Transmitted Diseases), స్త్రీలు ఏ వయసులో గర్భవతులు అవుతున్నారు, పుట్టే పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం వంటి అంశాలన్నిటి మీదా ఇది ప్రభావం చూపిస్తుంది. సమాజంలోని పేదరికం, Crime Rate వంటి వాటి మీద పరోక్ష ప్రభావం ఉంటుంది.

          పిల్లల్ని కనే సామర్ధ్యం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది ప్రకృతి సహజమైన లక్షణం. జంతువులలో పిల్లల్ని కన్న తరవాత తల్లే తన పిల్లలని సంరక్షించి పెంచుతుంది. జంతు సమాజాలలో Biological Father ఉంటాడేమో గానీ, పిల్లల వైపు నుంచి “తండ్రి” అనే సంబంధం ఉండదు. మానవ సమాజంలో అలా కాదు. పిల్లల్ని తల్లి తండ్రులు ఇద్దరూ కలిసి పెంచుతారు. “తండ్రి” అనే సంబంధం మానవ సమాజపు ప్రత్యేక లక్షణం. 

మానవ సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లల్ని సంరక్షిస్తూ పెంచుతారు, ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఆ తల్లిదండ్రులని వృద్ధాప్యంలో సంరక్షిస్తారు. “వృద్ధుల సంరక్షణ” కూడా మానవ సమాజపు ప్రత్యేక లక్షణం. జంతువులలో ఇది ఉండదు.

పైన చెప్పిన రెండు లక్షణాలని వదిలెయ్యడం అంటే దాని అర్థం మానవత్వం నుంచి తిరిగి జంతుత్వం వైపుకి ప్రయాణం చెయ్యడమే.

 

Casual Sex / Free Love లో ఏం జరుగుతుంది? ఆడ మగా ఇద్దరూ సెక్స్ వాంఛలు తీర్చుకోవడానికి తాత్కాలికంగా సంబంధాలు పెట్టుకుంటారు. ఒక స్త్రీ వైపు నుంచి చూస్తే, ఆవిడ ఇవ్వాళ ఒకడితో సంబంధంలో ఉంటే, రేపు ఇంకొకడితో, ఎల్లుండి ఇంకొకడితో సంబంధంలో ఉండవచ్చు. కొన్ని నెలల తరవాత ఆవిడ గర్భవతి అయితే, ఆ గర్భం ఎవరివల్ల వచ్చిందో తను అయినా గుర్తించే స్థితిలో ఉంటుందా? ఉండదు. ఒకవేళ గుర్తించినా ఆ ఫలానా మగవాడు ఆ పుట్టబోయే బిడ్డ తండ్రిగా ఉండటానికి ఒప్పుకుంటాడా? సాధారణంగా ఒప్పుకోడు.  “నేనే తండ్రిని అని గ్యారంటీ ఏంటి?” అని అడుగుతాడు. ఏ DNA పరీక్షలో చేయించి నిరూపించినా “హేయ్… అప్పుడేదో ఇద్దరికీ నచ్చి Casual గా సెక్స్ చేసుకున్నాం. Pills సరిగా వాడకపోవడం నీ తప్పు. Abortion చేయించుకోకపోవడం నీ తప్పు.” అని తప్పించుకునే ఆస్కారం మగవాడికి ఎప్పుడూ ఉంటుంది. అంతిమంగా ఆ బిడ్డ బాధ్యత అంతా ఆ బిడ్డ కన్న తల్లిది “మాత్రమే” అవుతుంది.

          ఈ Casual Sex / Free Love బాగా వ్యాప్తి చెందడం అంతే మగవాడికి భూమ్మీద “స్వర్గం” తయారయినట్టే. ఇప్పుడయితే ఆడవాళ్ళు కమిట్‌మెంట్ లేకుండా శారీరక సంబంధానికి ఒప్పుకోరు. సెక్స్ కోసం వాళ్లకి మాయమాటలు చెప్పి మోసగాడు అని చెడ్డపేరు మొయ్యాలి. లేదా వేశ్యల దగ్గరికి వెళ్లి తిరుగుబోతు అనిపించుకోవాలి. [ఇందులో వేశ్యల తప్పు ఏమీ లేదు. అది పూర్తిగా మగవాడి తప్పు]. Free Love culture మగవాడికి ఈ “ఇబ్బందులు” లేకుండా స్త్రీలే తమంతట తాముగా “ఇష్టపూర్వకంగా” మగవాళ్ళకి లొంగిపోయేలా చేస్తుంది. మగవాళ్ళు కావలసినంత మంది స్త్రీలతో సెక్స్ పొందవచ్చు. ఒక్క స్త్రీ కూడా పెళ్లి చేసుకోమని అడగదు. గర్భం వస్తే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా మగవాడికి ఉండదు. అవన్నీ స్త్రీల తలనొప్పులు! చివరికి ఇది ఎటు దారి తీస్తుంది అంటే సెక్స్ కోరికలు తీర్చుకునే “హక్కు” ఇద్దరిదీ. దాని వల్ల వచ్చే పిల్లల బాధ్యత మాత్రం స్త్రీలది. అంటే ఈ రకం సంబంధాలు స్త్రీల మీద ఇంతకు ముందు కంటే ఎక్కువ భారాన్ని పెంచి పురుషులకి ఇంతకు ముందుకన్నా స్వేచ్ఛని పెంచుతాయి.

          స్త్రీ పురుష సంబంధాలు సరైనవి అవ్వాలంటే ఆ సంబంధాలో ఉన్న ఆడ మగా ఇద్దరికీ “సమానమైన హక్కులు, సమానమైన బాధ్యతలు” ఉండాలి. అప్పుడే అది ఇరుపక్షాలకీ న్యాయమైన సంబంధం అవుతుంది. ఈ సూత్రం ప్రకారం లేని ఏ సంబంధం అయినా అది అసమానతలని (inequalities)ని సృష్టిస్తుంది. అసమానతలని సృష్టించేది ఏదయినా సమాజానికి హానికరమైనదే.

ప్రస్తుతం అమలులో ఉన్న పెళ్లి/కుటుంబ వ్యవస్థలో స్త్రీ కంటే పురుషుడికే ఎక్కువ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, బాధ్యతల విషయంలో పురుషుడు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. డబ్బు సంపాదన, పిల్లల సంరక్షణ, పెంపకం లాంటివి. ఈ Free Love/ Casual Sex తండ్రికి ఉండాల్సిన బాధ్యతలని లాగేసి తల్లి మీద పడేస్తుంది. ఆ తల్లి ఇక పిల్లల ఆలనాపాలనా, పోషణ, చదివించడం లాంటివి చేస్తూనే ఇంకోవైపు ఉద్యోగాలు చేస్తూ అన్ని బాధ్యతలు ఒంటరిగా మొయ్యాలి. అదే టీనేజ్ లో తల్లులైన ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణం. తల్లి ఇలా కష్టపడుతుంటే ఆ “తండ్రి” ఏం చేస్తుంటాడు? ఇంకో అమ్మాయిలతో Casual Sex చేస్తుంటాడు!!

ఇవన్నీ ఊహాగానాలు కాదు. ఇది ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది గానీ USAలో 1960లలోనే బాగా వ్యాపించింది. అక్కడ దీని ప్రభావం ఎలా ఉందో ఆ దేశం విడుదల చేసే పలు రిపోర్టులు చూస్తే మనకి తెలుస్తుంది.

2014లో U.S. Census Bureau విడుదల చేసిన సర్వే వివరాలు ప్రకారం

  • ప్రస్తుతం అమెరికాలో ఉన్న మొత్తం కుటుంబాలలో 25% పైగా కుటుంబాలు Single Mother Families. అంటే ఆ కుటుంబాలలో తల్లి పిల్లలు మాత్రమే ఉంటారు. [ఆ పిల్లల తండ్రులు అంతా ఏమయ్యారు? 25% కుటుంబాలు అంటే మొత్తం సమాజంలో నాలుగో వంతు కుటుంబాలు తండ్రి లేని కుటుంబాలే!]
  • ఈ సంఖ్య 1960 నుంచి 2014 నాటికి మూడింతలు (3 times) పెరిగింది. [Casual Sex బాగానే పెరిగిందన్నమాట.]
  • మొత్తం దేశంలోని పిల్లల్లో 1/3rd మంది తండ్రి లేకుండానే పెరుగుతున్నారు.
  • ఈ Single Mother Families లో 77% కుటుంబాలు పేదరికంలో బతుకుతున్నాయి. [కారణం? తల్లి ఒక్కదాని సంపాదన మీదే అందరూ బతకాలి కాబట్టి!]
  • ప్రపంచంలోనే Highest Crime Rate ఉన్న అమెరికాలో నమోదయ్యే జువెనైల్ కేసుల్లో 90. 5% మంది పిల్లలు Single Parent Families నుంచి వచ్చినవారే. [ తల్లులు పాపం రోజువారీ సంపాదన కోసం ఉద్యోగాల వెంట తిరుగుతూ పిల్లల మీద సరైన శ్రద్ధ పెట్టలేరు. పెరిగే వయసులో సరైన సంరక్షణ లేకుండా పెరిగే పిల్లలు ఎలా తయారవుతారు మరి? వీరిలో అత్యధిక శాతం మంది డ్రగ్స్ కి అలవాటు పడినవాళ్ళు ఉన్నారు.]

 

ఇవన్నీ వ్యక్తిగత విషయాలా? సామాజిక విషయాలా? Casual Sex వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయేది teenage ఆడపిల్లలు. సెక్స్ అనేది చాలా “Casual” విషయం అనీ, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందే హక్కు అందరికీ ఉందనీ, ఆడా మగా సెక్స్ చేసుకోవడం అంటే కలిసి క్యారం బోర్డు ఆడుకోవడం అంత సింపుల్ విషయమనీ TVలు, సినిమాలు, పాటలు తెగ ప్రచారం చేస్తుంటాయి. అప్పుడప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తూ, శరీరంలో వస్తున్న మార్పులనీ, కొత్త లైంగిక వాంఛలనీ అర్థం చేసుకునే వయసు రాకముందే వీటి ప్రభావానికి లోనవుతారు. ఫలితంగా గర్భం ధరించడానికి కావాల్సిన శారీరక పరిపక్వత పూర్తిగా రాకముందే గర్భవతులు అవుతున్నారు.

ఇది ఒకళ్ళిద్దరు అమ్మాయిల పరిస్థితి కాదు. ఆ దేశంలో ఈ విచ్చలవిడితనం ఎంత బలంగా నాటుకుపోయిందంటే ఆ దేశంలో తల్లులైన ఆడవాళ్ళలో 15% మంది 19 సం|| లోపు అమ్మాయిలే! వీరిలో అత్యధిక శాతం మంది 15 సం|| లోపు వాళ్ళు. అంటే పదో తరగతి చదివే వయసున్న చిన్నపిల్లలు తల్లులై ఇంకొంత మంది పిల్లల్ని కని పెంచుతారు అన్నమాట. వాళ్ళ పోషణ కోసం చదువులని మధ్యలోనే ఆపేసి చిట్టిపొట్టి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారన్నమాట.

అదే రిపోర్టు బయటపెట్టిన ఇంకొన్ని విషయాలు చూడండి.

  • టీనేజ్ తల్లుల్లో కేవలం 1/3rd మంది మాత్రమే తమ High School చదువు పూర్తి చెయ్యగలుగుతున్నారు. [ఇది Women Literacy మీద తీవ్రమైన దెబ్బ. సరిగా చదువు కూడా పూర్తి చెయ్యలేని ఆడవాళ్ళు స్త్రీ పురుష సమానత్వం ఎలా సాధిస్తారు?]
  • టీనేజ్ గర్భాలలో 82% గర్భాల Unplanned గా సంభవిస్తున్నాయి.
  • 10 లో 8 మంది టీనేజ్ తండ్రులు తమ పిల్లల తల్లితో కలిసి ఉండటం లేదు. [అవును మరి, వాళ్లకి ఆ అవసరం లేదు కదా.]

దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఈ Casual Sex సిద్ధాంతం అమ్మాయిల మీద అనంతమైన భారాన్ని మోపి, అబ్బాయిలని పూర్తి స్వేచ్ఛా జీవులని చేస్తుంది. దీన్ని ప్రచారం చేసేవారు “వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం” లాంటి పదాలు వాడి ప్రజలను తప్పు దోవ పట్టిస్తారు. నిజానికి ఇది స్త్రీలకి ద్రోహం చేస్తుంది.

ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. “అసలు పిల్లల్ని కంటే కదా ఈ సమస్యలన్నీ. ఎన్నో సురక్షితమైన Contraceptive పద్ధతులున్నాయి కదా? ఎన్నో అత్యాధునిక అబార్షన్ పద్ధతులున్నాయి కదా? అవన్నీ వాడుకుని Safe గా Casual Sex చేసుకోవచ్చు కదా?”

ఈ ప్రశ్నకి సమాధానం పాఠకులకే వదిలేస్తున్నాను. అమెరికాలో ఈ “Super Safe Contraceptives” సులభంగానే దొరుకుతున్నాయి కదా. అక్కడి జనాలకి Sexual awareness బాగానే ఉంది కదా. అయినా ఆ దేశంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి.? ఆలోచించండి. హేతుబద్ధంగా (Rational) ఆలోచిస్తే అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి.

ఈ సిద్ధాంతానికి ఇంకో వికృతమైన రూపం కూడా ఉంది. Sexually Transmitted Diseases (STDs) – సుఖరోగాలు! ఈ పద్ధతిలో సుఖరోగాలని అదుపు చెయ్యడం అత్యంత కష్టసాధ్యమవుతుంది. అమెరికా ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు విడుదల చేసిన రిపోర్టులో దీనికి సంబంధించిన వివరాలున్నాయి.

  • S. లో నమోదయిన STD కేసులలో సగంపైన 15-24 సం|| లోపు వాళ్ళే.
  • HIV కేసులలో మగవారిలో 2/3rd మంది 13-19 సం|| వాళ్ళే. [అంత చిన్న వయసులో సుఖరోగాలు!!]

 

అమెరికన్ మీడియా Free Love/Casual Sex ని భుజాల మీదకి ఎత్తుకుని ప్రచారం చేసింది. అక్కడి సినిమాలలో నూటికి 90 శాతం సినిమాల దీన్ని ఎంతో ఆకర్షణీయంగా, సాధారణమైన విషయంగా చూపిస్తాయి. దీన్ని ప్రచారం చేసేవాళ్ళు దీని దుష్పరిణామాలలో ఒక్కదానిని కూడా ముట్టుకోరు. ఎంతసేపూ సమానత్వం, సమాన హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ లాంటి పదాలు వాడుతూ అదేదో గొప్ప విప్లవకరమైన విషయంగా ప్రచారం చేస్తారు. అసమానతలతో నిండిన కుటుంబ వ్యవస్థకి ఇదొక గొప్ప alternative గా చూపిస్తారు. పైపైన చూస్తే నిజమే కాబోలు అనిపించేలా ఉంటుంది వీరి వాదన.

ఇది సమానత్వాన్ని సాధించడానికి ఏ రకంగానూ పనికి రాదు. స్త్రీలు ఎంతో కష్టపడి సాధించుకున్న కాసిన్ని హక్కులని కూడా ఇది హరించి వేస్తుంది. స్త్రీల మెదళ్ళని తప్పుడు భావజాలంతో నింపి తమ నాశనాన్ని తామే తెచ్చుకునేలా చేస్తుంది. కుటుంబ వ్యవస్థలో ఉన్న లోపాలని తీసివేయ్యడం ఎలాగో ఆలోచించాలి గానీ, దానికి alternative పేరుతో మళ్ళీ అసమానతలు సృష్టించుకోవడం తెలివిమాలిన పని.

నేను సాంప్రదాయవాదినా?

           పాఠకులు కొంతమంది నేను పచ్చి సాంప్రదాయవాదాన్నే వినిపించాననీ, నేను సాంప్రదాయవాదిననీ అన్నారు. సరిగ్గా గమనిస్తే పోయిన వ్యాసంలోగానీ ఈ వ్యాసంలో గానీ నేను సాంప్రదాయాల గురించీ గానీ, భారతీయ సంస్కృతి గురించీ గానీ, ఆచారాల గురించీ గానీ ఎక్కడా మాట్లాడలేదు. కేవలం “హేతుబద్ధత” ని ఆధారంగా చేసుకుని ఈ వివరణలు చేసాను. మీకు ఇందులో లోపాలు ఏమైనా కనిపిస్తే సహేతుకంగా ఎత్తి చూపించండి. అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నా మీద సాంప్రదాయ వాద ముద్ర వేసి Casual Sex లాంటిదాన్ని సమర్ధించుకోవడం కుదరదు.

 

 

యూరిన్ పోలిటిక్స్

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

vijaykumar viktar” యూరిన్ కాషాయం రంగులో ఉందిరా ఇప్పుడు “

 ఇండియా గేట్ ను ఎగా దిగా చూస్తూ నాలుక కొస నుండి సిగరెట్ పొగ వదుల్తూ అన్నాడు మా వాడు. వాడి పేరు రాబర్ట్ నాగేంద్ర. వాళ్ళ తాతకు బ్రిటీష్ టైం లో రాబర్ట్ అనే దొర హెల్ప్ చేసాడని వీడి పేరుకు ఆ తల అతికించాట్ట.  సన్నగా జొన్న మొక్క బెండులా ఉంటాడు. దానికి తోడు నాగజెముడు పొదల్లా గడ్డం. పైన బట్ట తల. కేప్ పేట్టి ఒసామా బిన్ లేడెన్ అంటే నమ్మేయొచ్చు.

” టెస్ట్ చేయించుకో…..అబ్బ….బాబూ ! ఆ సిగరెట్ ఆపరా… ఆ కంపు భరించలేను నేను ” అన్నా. ” పబ్లిక్ లో తాగుతూ చట్టాన్ని కూడా అతిక్రమిస్తున్నావు. పోలీసోడు చూస్తే ఫైన్ వేస్తాడు ”

వాడు ఫక్కున నవ్వాడు. ” అరేయ్ బాబాయ్ ! నీవు ఫ్రాంక్ గా ఒక మాట చెప్పరా. సిగరెట్ పబ్లిక్ గా తాగితే  Cigarette and Other Tobacco Products Act  కింద రెండొందలు లేదా ఐదొందలు జరిమానా వేస్తారేమో. ఇంట్లో మొక్కల చుట్టూ రోజూ యూరిన్ పోస్తే పక్కింటొడికి వచ్చే కంపుకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 268 కింద పబ్లిక్ న్యూసెన్స్….అదెంత పెద్ద అఫెన్స్ తెల్సా ? బొక్కలోకి తొయ్యొచ్చు ”

” వెళ్ళి గడ్కారికి చెప్పు ” నేను పార్కులో మొక్క కున్న పువ్వు తెంపి ముక్కు వద్ద పెట్టుకుని పీల్చాను.

నా మొహం మీద పొగ ఊదాడు. వాడికి నేనంటే చిన్నప్పటుండీ ఒక ఎగతాళి. కలిసే పెరిగాం కదా అందునా బాల్య స్నేహం …భరించాలి !

” గడ్కారి ఇంట్లో మొక్కలకు యూరిన్ పోస్తానంటే పక్కింటోళ్ళకు న్యూసెన్స్ . అది అఫెన్స్ అనే విషయం వదిలేసి యూరిన్ లో గొప్ప తనాలు వెతుకుతారేంద్ర భయి ?! ”

” యూరిన్ లో లీటర్ కు పది గ్రాముల దాకా యూరియా ఉంటుంది. నీవు నెల రోజులు ఒక మొక్క చుట్టూ పోస్తూ ఉంటే కనీసం పావు కేజీ యూరిన్ దానికందుతుంది. అదే క్వాంటిటీ యూరియా ఫర్టిలైజర్ కొనాలంటే కేజీ సుమారు ఐదు, ఆరు రుపాయలౌతది. సేవింగ్ ఏ కదమ్మా ఇదంతా ? ”

వాడు గడ్డం వాడే లాక్కుని అన్నాడు ” ఈ లెక్కన టాయిలెట్స్ రావడం వల్ల మన దేశ సంస్కృతి కూడా దెబ్బ తింటుంది అన్న మాట ” ఏదో అనలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.

” తెలుసు….పబ్లిక్ గా పిస్ కొట్టడమే కదా ?”

‘ ధభా ‘ అని వీపు చప్పరించి ఫక్కున నవ్వాడు ” వెరీ షార్ప్ ”

” సోచ్ హోతో శౌచాలయ్ హై…రాంగ్….సోచ్ హో తో శౌచాలయ్ నహీ కరెక్ట్. చాలా విచిత్రంగా మోదీ ఒకటి కష్టపడి చెప్తాడా ? ఆయన వెనకాలే వీళ్ళందరూ ఇంకోటి చెప్తారేంద్ర భయ్ ” వేసాడు ఇంకోటి వీపు మీద.

ఒక ఫేమిలీ దూరంగా పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు. చిన్నపిల్లోడు చల్లటి సాయంత్రం లో పచ్చటి గడ్డి బయల్ల మీద బాల్ తో ఆడుకుంటున్నాడు. అక్కడ ఇంకా కొన్ని ఫేమిలీస్ కలిసి సమయం గడుపుతున్నారు.  సాయంకాలం ఇండియా గేట్ దిట్టంగా కనిపిస్తుంది.  మధ్యలో ద్వార ప్రవేశం ‘ కొండంత అండగా ఉంటాను నీవిటొచ్చేయ్ ‘ అన్నట్టు ఉంటుంది.

BottledUrine

” మన హైదరాబాద్ రింగ్ రోడ్డులో చెట్లు నాటుతున్నారు. ఒక్కో చెట్టుకు ఒక్కో కవర్ కట్టి ”  Please piss here. We shall be glad  ‘ అని పెట్టాలి ” అన్నాడు.

” యా….అసలు పెద్ద పనికే ఒక ప్రొవిజన్ పెడ్తే ఇంకా బాగుంటుంది.  you get lot of organic fertiliser   ”

” రోడ్డు మీద ట్రావెల్ చేసే వాళ్ళకు  ” Please carefully drive…organic fertilisation in process   ‘ అని పెట్టాలి ”

ఇంకో సిగరెట్టు తీసాడు. ” ఒరేయ్…ప్లీజ్…దూరంగా వెళ్ళి తాగురా…” అన్నా.

వాడో అనాథ. చిన్నప్పుడు బీడీలు తాగేవాడు. చదువు లో మాత్రం ఫస్ట్ ఎప్పుడూ. నేనే లాస్ట్. వాడికి ఉద్యోగం చేయడమంటేనే అలర్జీ . నే ఉద్యోగం చేస్తూ పది సంవత్సరాలు గడిపినా వాడు మాత్రం ఇంకా హైదరాబాదులో నిరుద్యోగిగా పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు.

” ఏదో రోజు ….ఇదే కంపును ఆనందంగా అహ్వానించే రోజు రాక మానదు లే నీకు. కంపుగున్నవి , కంటగింపుగా ఉన్నవి ఇంపుగా, ఇల సొంపుగా అవుతాయి.  వెయిట్ అండ్ సీ ….శివుడు హాలాహలం కంఠం లో దాచుకున్నందుకు ఆ వేడిని తట్టుకోడానికి ఏం తాగాడో తెలుసా ? ఇదే పొగనిచ్చే గంజాయిని…..ఈ పొగ కూడా డివినిటీ తీసుకుంటుంది త్వరలో….ఇదే పొగను రిఫైన్ చేసి ఆహా ఒహో అంటూ వాడుకునే  రోజులొస్తాయ్ ఇక……” అని ఆ చివరి సిగరెట్టును జాగర్తగా జెబులో కూర్చోబెట్టాడు.

” మరేం   !…….కౌ యూరిన్ రిఫైనరీ రాజస్థాన్ లో పెట్టారు. డివినిటీ నో గాడిద గుడ్డో…ఐడియా జీవితాన్ని మార్చేసింది కదా ?! ”

” హలో….చెన్నై లో సిటీ మధ్యలో పొంగిపొర్లే  డ్రైనేజ్ గంగ పక్కనే 2000 సంవత్సరం లో ప్లాంట్ పెట్టి ఇప్పటి వరకు …అందులో డ్రైనేజి వాటర్ నుండి మినరల్ వాటర్ కన్నా మంచి నీళ్ళు తయారు చేస్తున్నారు. లీటర్ కు ఐదు పైసల కన్నా తక్కువ ఖర్చులో. నీటి బెడద ఉన్న  ప్రాంతాల్లో ఫేక్టరీకి కావాల్సిన నీళ్ళు అవే వాడుకుంటున్నారు.  ఇంతకన్నా మంచి ఆయిడియా ఉందా , యాక్చువలీ ?  ”

” ఓహో ! నీటి కొరత ఉండే చెన్నై లో ….అంత మంచి నీళ్ళు మరి జనాలకు సప్లై చేయొచ్చు కదా ? ”

” మన దేశ సంస్కృతి గో మూత్రం తాగడం పర్మిట్ చేస్తుంది. మనుష్యులది కాదు ”

నేను వాడి భుజం మీద ఆప్యాయంగా చేయేసాను. వీడికి మనుష్యులంటే మాత్రం ఎందుకంత మక్కువో ?!  చూడ్డానికి వాడు సమాజం లో చితికి పోయిన  నిరుద్యోగి లా ఉంటాడు కానీ , ఒక స్ట్రక్చర్ లో పని చేయాలంటే చిరాకు వాడికి. అందుకే మార్కెటింగ్, సాఫ్ట్ వేర్, పబ్లిక్ రిలేషన్స్ లలో వాడికో మూడు , నాలుగు ఉద్యోగాలొచ్చినా ఎక్స్ పెరిమెంట్ చేసి, పడక వచ్చేసాడు.

కలిసి నడుస్తున్నాము.

మబ్బులు కమ్ముకున్నాయి కదా…..ఇండియా గేట్ మీద మేఘాలు అందంగా అటూ ఇటూ తచ్చాడ్డం బాగుంది.

వాడు గడ్డం గోక్కుంటూ కంటిన్యూ చేసాడు.

” బయో డైజెషన్ ప్రాసెస్ తెల్సు కదా ? గో మూత్రమే కాదు …ఏ మూత్రమైనా….ప్రాసెస్ చేస్తే మీథేన్ వస్తుంది…అదే మన అంబాని అందరికీ టొపీ పెట్టిన సహజ వాయువు….వీళ్ళ బొంద…..గో మూత్రం కెమికల్ కంపోజిషన్ గమనిస్తే , గొర్రె మూత్రం చూసినా, ఒంటె మూత్రం చూసినా కొంత తేడా ఉంటుంది కాని ఆర్గానిక్ ప్రాపర్టీస్, మెటీరియల్ గా ఏవీ తేడా ఉండదు. ”

‘ వీడిప్పుడు టెక్నాలజీ మూడ్ లోకి వెళ్ళాడు ‘ అనుకున్నాను. ”  Urine is Urine. Its excreta of living beings containing several biological waste elements   ” అని పక్కనుండి పాస్ అయిన పటియాలా డ్రస్ పంజాబీ అమ్మాయిని సాలోచనగా చూస్తూ అన్నాడు.

వాడి గడ్డం లాగి నా వేపుకు తిప్పుకుని, వాడు వదిలేసిన పాయింటు దగ్గర కంటిన్యూ చేసాను.  ” మొరార్జీ దేశాయ్ గొప్పోడురా…అప్పట్లోనే …మూత్రం తాగేసాడు మొహమాటం లేకుండా. … జనాలే అపహాస్యం చేసారు. కానీ …ఇంట్రెస్టింగ్ ఏంటంటే…మొరార్జీ సిండ్రోం  కళ్ళ ముందు ఉండగా, జంకకుండా, గడ్కారీ ఇలా ఓపెన్ గా చెప్పుకోడానికి భలే తెగింపులే  ? ”

State of waters - boy and frog

” ఎంత ధైర్యమైనా వస్తుందిరా. ఇంతకు మునుపెప్పుడన్నా దేశ ప్రతిష్ట గంగలో కలిసి పోతుంది అనే కాన్సెప్ట్ తో చట్టం పని చేయడం చూసావా ? ”

” లే ”

” దేశ జనాభా , కుటుంబ నియంత్రణ అని స్మరించే మనము – పందుల్లా పదేసి మందిని కనడం మన కర్తవ్యం, గురుతర బాధ్యత అని ధైర్యం చేసి ఎవడన్నా అంటాడు అని ఊహించావా ? ”

” లే ”

” ఇదీ అంతే ….. సౌదీలో ఇస్లామిక్ ఆర్థిక శాస్త్రం ఉంటుంది. ఇక్కడ కూడా అదే తరహాలో మత ఆర్థిక శాస్త్రం …. ”

నేను వెంటనే అన్నాను ” వెస్ట్రన్ ఎకానమిస్ట్స్ ఇస్లామిక్ ఆర్థిక శాస్త్రాన్ని ఆకాశానికెత్తినప్పుడు దీన్ని ఎందుకు తలకెత్తుకోరు ?! ”

” వెస్ట్రన్ నాయాళ్ళు. స్పైన్ లేని నాయాళ్ళు. వాళ్ళ మాట చెప్పక ”

వాడు – మేము కాలేజీలో ఉన్నప్పుడు నేను రంగ నాయకమ్మ పుస్తకాలు చదివితే ఇరిటేట్ అయ్యి లాక్కుని ” సెల్ఫ్ లవ్ ‘ స్టోరీలు చదవక ” అని విసిరికొట్టి చేతిలో ” చీకటి రోజులు ” ” చిత్ర హింసల కొలిమిలోంచి ” లాంటి నావల్స్ పెట్టేవోడు. ఏమిరా అంటే ” లోయలో పడే మనుష్యులను రక్షించాలనుకునే రచయితలు లోయలో పడే మనుష్యుల వ్యథను  వివరిస్తారు…వర్ణిస్తారు….కాని లోయల నైసర్గిక పరిణామాలను, జారి పడే మనుష్యుల అవలక్షణాలను  విశ్లేసిస్తూ తమ ఐ క్యూ ను, ఏప్టిట్యూడ్ ను చాటిచెప్పుకుంటూ ‘ సెల్ఫ్ లవ్ ‘ డిస్ప్లే చేయరు ” అనే వాడు.

వాడికి సిగరెట్ తాగాలనే అర్జ్ పెరిగినట్టుంది. అందునా ఒకటే సిగరెట్ మిగిలి ఉంది వాడి దగ్గర. ఊరికే చేతులు జేబు మీద పెట్టి తడుముతున్నాడు.

” లుక్…మన దేశ సంస్కృతిని మనం ఎత్తి పట్టాలి ”

” అందుకేగా టాయిలెట్స్ తీసేయాలి అనేది. అదే భారతీయ సంస్కృతి కూడా !”

పిల్లోడు ఆడుకుంటున్న బాలు ‘ టపీ ‘ మని రాబర్ట్ గాడి యెదపై వచ్చి కొట్టుకుంది. పిల్లోడు బాలు పట్టుకుని వెనక్కి చూడకుండా పరిగెత్తుకెళ్ళాడు…పొరపాట్న ఎక్కడ ఆపేస్తాడో అన్నట్టు.

రాబర్ట్, బంతి దెబ్బకు జేబులో నలిగి పోయిన సిగరెట్టును వేళ్ళ మధ్య అటూ ఇటూ తిప్పుతూ చూస్తూ ఉన్నాడు.

” మన సంస్కృతికి , రాజకీయాలు ముడేస్తే ఏమౌతుంది ? ”

” ఉ____   రాజకీయాలు పుడ్తాయ్ !! ”

వాడికి బాగా కాలినట్టుంది …………… …………..!!!!

అమ్మ యాది

కందుకూరి రమేష్ బాబు

 

Kandukuri Rameshఎవరిది వాళ్లకు మామూలుగానే ఉంటుంది.
కానీ, ఒక చిత్రం వల్ల ఎవరెంతగా కనెక్ట్ అవుతారో తెలుస్తున్న కొద్దీ అది మామూలు అనుభవం కాదు!
అపురూపం.

ఈ చిత్రం అటువంటిదే.

ఇందులో ఉన్నది మా పొరుగింటి అక్కా, అతడి కొడుకూ.
వీళ్లను రోజూ చూస్తూనే ఉంటాం. కానీ, నేను చూసి వదిలేయకుండా ఉండటం వల్ల వీళ్లు మీ దాకా చేరుకున్నారు.
నిజం. ‘మామూలే’ అని అనుకోకపోవడమూ ఒక రహస్యమే.

చిత్రమేమిటంటే, ఏ కొంచెం సమయం దొరికినా చాలు, తల్లో పేలు చూడటం వాడకట్టు మనుషుల్లో పరిపాటే.
అలాంటి మామూలు దృశ్యమే ఇది. కానీ ఒక మధ్యాహ్నం రుస్తం అన్న చిత్రకారుడు కలిసినప్పుడు ఈ చిత్రం మామూలు స్థాయిని దాటిపోయింది…నా వరకు నాకు!

ఆయన అడిగారు, “ఏం చేస్తున్నారని!”
యధాలాపంగానే అడిగాడు.

‘మామూలే. ఉద్యోగం, ఇలాం చిన్నగా ఫొటోగ్రఫి’ అన్నాను నేను.
చూపమంటే కొన్నిచిత్రాలు చూపాను.

ఈ చిత్రం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఒక్కపరి ఉద్వేగానికి గురయ్యిండు.
తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కంట నీరు ధార కట్టింది.
అర్థం కాలేదు.

కొన్ని క్షణాల మీదట కుర్చీలోంచి లేచి హృదయపూర్వకంగా కావలించుకున్నాడాయన.
“మా అమ్మను గుర్తు తెచ్చినావు భయ్యా” అన్నాడు.

అప్పుడర్థమైంది.
అతడు ఎంత దూరం వెళ్లాడో లేదా ఎంత దగ్గరగా వెళ్లాడో అని!

ప్రేమతో, జ్ఞాపకాల తడితో భారంగా మారి, కాసేపట్లో తేరుకుని, చిన్ననాడే తాను తల్లిని కోల్పోయిన విషయాన్ని ఆయన పంచుకున్నారు. తర్వాత అన్నారు, “ఇంతకన్నా…బాబుకన్నా అదృష్టవంతుడెవరుంటారు” అని కూడా అన్నారు. అని, మళ్లీ ఆ పిక్చర్ ను ఆనందంగా చూసి ముచ్చటపడ్డారాయన.

నిజానికి ఇది మామూలు చిత్రమే. కానీ అతడన్నాక నాకు మరింత ప్రియంగా మారిందీ చిత్రం.
దృశ్యాదృశ్యం అంటే ఇదే కాబోలనిపించింది!
మనదాకా రావడం, హత్తుకోవడం అంటే ఏమిటో బోధపడింది.

ఇంకా ఆలోచిస్తే అనిపించింది, అతడు స్వయంగా కళాకారుడు. చిత్రకారుడు. కానీ, ఒక వర్ణ చిత్రం కన్నా మరొక చాయా చిత్రం విలువైందేమో అనిపించింది, ఒక రకంగా!

అవును మరి. ఛాయా చిత్రలేఖనంలో కల్పనకు తావులేదు. జీవన ఖండిక అది.
అందుకే మనిషి తన జ్ఞాపకాల ఒడిలోకి వెళ్లి జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవడంలో కళ కన్నా జీవకళ అయిన ఛాయాచిత్రలేఖనం మరింత దగ్గరేమో!

పెయింటర్ రుస్తుం భాయ్ కలిసినప్పటినుంచీ ఒక ఫొటోగ్రాఫర్ గా ఇదే అనుకుంటూ ఉన్నాను.

~

ఎవరు “ఉత్తమ్”? ఎవరు విలన్?

మోహన్ రావిపాటి
mohan
త్రేతా యుగం లో  ఉత్తముడు  ఒక లోకంలో , అధముడు (విలన్) మరో లోకం లో ఉండే వారట. ద్వాపరయుగంలో  ఉత్తముడు ,అధముడు (విలన్) పక్క పక్కనే అన్నదమ్ముల రూపంలో ఉండే వారట. ఇప్పుడు కలియుగంలో ఉత్తముడు,(విలన్) ఒకరిలోనే ఉన్నారు . అలాంటి కథ చెప్పే  ప్రయత్నమే ” ఉత్తమ విలన్” .  పరిస్థితులను బట్టి మనిషి లోఉన్న ఈ మంచి చెడు బయటకు  వస్తూ ఉంటాయి . ఇలాంటి ఒక కథ అది కమల్ హాసన్ లాంటి ఇమేజ్ ఉన్న ఒక నటుడు సినిమా ద్వారా చెప్పాలి అనుకోవటం సాహసమే .
కమల్ హాసన్ విభిన్నమైన పాత్రలు పోషించటానికి ఎప్పుడూ సిద్దం గానే ఉంటాడు . ఒక ఇమేజ్ చట్రం లో బందీ కాకుండా తనను తాను ఎప్పటి కప్పుడు కొత్తగా మలచుకోవటం ఆయనకు ఎప్పుడు అలవాటే. అందుకే కమల్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది .ఈ సినిమాకూడా  అలాంటి క్రేజ్ తోనే  విడుదల అయ్యింది .  కమల్ హాసన్ నుండి ప్రతి ప్రేక్షకుడు ఒక వైవిధ్యాన్నే కోరుకుంటాడు , కాకపొతే ఒక్కోసారి ఆ వైవిధ్యాన్ని సామాన్య ప్రేక్షకుడు కు అర్ధం అయ్యేలా చెప్పటంలో  విఫలమవుతూ ఉంటాడు . ఈ “ఉత్తమ విలన్ ” కూడా  సామాన్య ప్రేక్షకుడి కి కొంచెం దూరంగానే ఉండి పోతాడు.
భారతీయ ప్రేక్షకులకు సర్రియలిజం సినిమా చూపించటం , ఆ సినిమాను సామాన్యప్రేక్షకుదు అర్ధం చేసుకోవాలి అనుకోవటం కొంచెం సాహసమే.
“మనోరంజన్” (కమల్ హాసన్) ఒక సూపర్ స్టార్ , అయన కొత్త సినిమా రిలీజు సందర్భంగా మనోరంజన్ కొడుకు, మనోరంజన్ ఇంకా ఇప్పటికీ కుర్ర హీరోల పాత్రలు వెయ్యటం నచ్చదు. ఇలా ఉండగా మనోరంజన్ కి బ్రెయిన్ ట్యూ మర్ ఉందని తెలుస్తుంది . ఇక చివరి సినిమా గా మంచి సినిమా చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో  తన కు కెరీర్ మొదట్లో మంచి చిత్రాలు ఇచ్చిన తన గురువు మార్గదర్శి ( కె.బాల చందర్) ని తన చివరి సినిమా  దర్సకత్వం వహించమని అడుగుతాడు . ఈ నిర్ణయం నచ్చని మనోరంజన్ భార్య ( ఊర్వశి) మామ పూర్ణ చంద్ర రావు( కె.విశ్వనాధ్) తో గొడవ పడి ఇంటి నుండి బయటకు వస్తాడు . ఈలోపు జాకబ్ ( జయరాం) మనోరంజన్ ని కలుస్తాడు . మనోరంజన్ వరలక్ష్మి ని పెళ్లి చేసుకోకముందు అతనికి యామిని కి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తాడు . యామిని మనోరంజన్ ద్వారా గర్భవతి అయినట్లు మనోర్మణి అనే కూతురు  చెప్తాడు . యామిని ని నుండి ఎటువంటి పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది , అందుకు కారణం ఎవరు ?అనేది ఓ వైపు సాగుతుండగా , మనోరంజన్ చివరి చిత్రం ద్వారా 12 వ శతాబ్దం లో జరిగిన ఒక కథ  ను పాయింట్ గా తీసుకోని  మనిషి ప్రవర్తనను మనకు తెలియ చెప్పే ప్రయత్నం చేస్తాడు .
నిజానికి ఇది సర్రియలిస్టిక్ కథ, 12 వ శతాబ్దంలో జరిగిన కథకు ఇప్పటి కథకు నేరుగా ఎలాంటి లింక్ ఉండదు . కాని దాని ద్వారా మానసిక సంఘర్షణ ,మనషి ప్రవర్తన చెప్పే ప్రయత్నం చేసాడు,కానీ ఇది సా మాన్య ప్రజలను చేరుకోలేకపోయింది. మధ్య మధ్యలో వఛ్చే  ఆ కథకు ఇప్పటి కథకు మధ్య సంబంధం అర్ధం కాక కన్ఫ్యూజ్ అవుతాడు
ఇక సాంకేతిక అంశాల కొస్తే కమల్ హాసన్ అధ్బుతంగా నటించాడు అని ఎప్పటిలాగే చెప్పాలి.  దీనికి కథ, స్క్ర్నీన్ ప్లే కూడా కమల్ హాసనే సమకూర్చాదు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది . రమేష్ అరవింద్ దర్సకత్వం లో పేరు పెట్టాల్సింది ఏమీలేదు శామ్ దత్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఎలివేట్ అయ్యింది జిబ్రాన్ సంగీతం సినిమా మూడ్ కు అనుగుణంగా పర్ఫెక్ట్ గా సరిపోయింది.
 
మొత్తం మీద ఇది ప్రేక్షకుడు కు అర్ధం కాని ఒక మంచి  సినిమా . టైటిల్ కి తగ్గట్టే ఇది ఉత్తమ చిత్రం కానీ ప్రేక్షకుడి కి అర్ధం కాక చెత్త చిత్రంగా ఉండి పోతుంది.

మైదానంలో వొంటరి రాజేశ్వరి!

నామాడి శ్రీధర్

sri1​శివలెంక రాజేశ్వరీదేవి. జన్మత: ఓ అద్భుతమైన కవిత. మనమధ్యన ఒంటరిగా జీవించిన అమాయక బాలిక. శరత్‌, చలం, చండీదాస్‌ రచనల్లోంచి రెక్కలు కట్టుకువచ్చిన దయాళువైన వనిత. ఎల్లల్లేని స్వేచ్ఛలోకి అశ్రుబిందువై హరించుకపోయిన ముక్త.

ఆమెది జననంతో ప్రాప్తించిన ఏకాకితనం. దివాస్వప్నం లో కరిగిన యవ్వనం. ప్రత్యుత్తరం లేని ప్రేమలేఖనం. పీటలమీద ఆగిపోయిన కళ్యాణం. ఒక్క గదిలో కొనసాగిన ప్రపంచయానం. సాహిత్యం, సంగీతం తోడునీడలుగా తనలో తాను మాట్లాడుకొన్న శూన్యావరణం. ఎదురెదురుపడే నిరాదరణంతో తలపడే దినదినం. ఏ ఒక్క సంతోషరేణువునో గుప్పెట బంధించాలన్న జాగరణం. ఆ అరవయ్యేళ్ల నిష్ఫలపరంపరకు ముగింపుగా ఆఖరికి ఆదరించినది మరణం.

* * *

1984-94 మధ్య రాజమండ్రిలో నా విద్యాభ్యాసం. ఉద్యమకాలం. అంతరాంతరం నవచైతన్యంతో వికసిస్తోన్న యవ్వన ప్రాయం. కవిత్వమొక తీరని దాహమైన దేశదిమ్మరితనం. అప్పుడొక పత్రికలో రాజేశ్వరీదేవి కవిత కనబడింది. ఎంత బావుందీ కవిత, ఎవరీ కవయిత్రీ అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఆనాటి నుంచి ఇవాళ్టికీ ఆమె కవితని అపురూపంగానే భావించాను. మిత్రు లతో ‘కంజిర’ (1990-95) ప్రారంభించాక, కవిత కోసం పోస్ట్‌కార్డ్‌ రాశాను. ‘టెలిఫోన్‌టాక్‌’ పంపించింది. నాల్గవ బులిటెన్‌లో అచ్చు వేశాం. అటుపిమ్మట హైదరాబాద్‌ ‘వార్త’ రోజుల్లో (1995-98) కూడ సాహిత్యం పేజీ, సండే మ్యాగజైన్‌లలో కొన్ని కవితలు ప్రచురించాం.

నేను ఉద్యోగం వదలివేశాను. స్వస్థలం చేరుకొన్నాను. ఓ రోజు ఒమ్మి రమేష్‌బాబు వచ్చేడు. మా కబుర్లలో… సి.వి.ఎస్‌. మహేష్‌, కవులూరి గోపీచంద్‌, టి.వి.ఎస్‌.రామన్‌, కలేకూరి ప్రసాద్‌, శివలెంక రాజేశ్వరీదేవి ఇత్యాది వుల పుస్తకాలు రావడంలేదు. మనం పూనుకోవడం మంచిదనుకున్నాం. ఆ తర్వాత రాజేశ్వరీదేవికి ఫోన్‌ చేశాను. ‘మీ కవిత్వమంటే మాకిష్టం, పుస్తకం వేయండి. లేదా, కవితలన్నీ మాకివ్వండి. పుస్తకం తీసుకొస్తాం’ అని సంభాషణ ప్రారంభించేను. ఆమె ఏ కొంచెం కూడ ఉబ్బితబ్బివ్వలేదు. ఇప్పుడెందుకులే అన్నట్టు మాటమార్చింది. ఆ ప్రథమ పరిచయంలోనే ఒక ముఖ్యమైన సంగతి చెప్పింది…’శ్రీధర్‌, నీ తల్లి అకాలమరణంతో నువ్వెంతగా దుఖ్ఖించావో విన్నాను. ఆ బాధ నేనెరుగుదును. ఆమె తిరిగిరాదు. ఇక నేనే నీకు అమ్మనని…ఆ రోజుల్లో ఉత్తరం రాశాను. నాన్నా!  అది పోస్టుచేయలేదు.’ అప్పటినుంచి ఆమె నాకు అమ్మతో సమానం.

అయితే, అక్కడితో నేను ఆగిపోలేదు. నా దగ్గరున్న పత్రిక లు, ప్రత్యేక సంచికలు, సంకలనాలు వెతకసాగాను. స్నేహితులనీ వాకబు చేశాను. పది కవితలు వెలికితీశాను. తెలుగు కవిత్వంలో ఆమెది ఓ ప్రత్యేక తరహా. మధ్యేమధ్యే అందం కోసం రంగుల పూసలవలె ఆంగ్లపదాల్ని గుచ్చుతుంది. పాత సినిమా పాటల్లో చరణాల్ని చేర్చుతుంది. స్వతంత్ర భావం, ఇంపైన పరిభాష. ప్రభాత పవనం, నిర్మలమైన నీరెండ కలగలిసి మనని స్పృశిస్తోన్న అనుభూతి కలుగుతోంది. ఏ కవిత పనిగట్టుకొని రాసినట్టుండదు. అసలు ఆ అవసరమే లేదామెకు. కవనం కొండవాగుమల్లే  స్వచ్ఛంగా సాగు తోంది. వాక్యం స్వేచ్ఛగా సంచరిస్తోంది. పగిలిన అద్దంలో, కవితాత్మ కత, ఒంగిన గగనం, ద్వైతం, రంగులు వెలసి రాగాలు వినిపించని వేళ, ఇక శెలవా మరి…ఇలా కొన్నిటిని సేకరించాను. ఇవిగో మీ కవితలని కొరియర్‌లో పంపాను. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆలస్యంగా తెలిసిన నిజమేమిటంటే, ఇంట్లోని పాత న్యూస్‌పేపర్స్‌లో కలిసిపోయిన ఆ కవితల కాగితాలూ తూకానికి వేసేశారని.

raj1

* * *

కొత్తలో ప్రతిరోజు ఎడతెగని మాటలు. కాలక్రమంలో ముక్తసరి సంభాషణలు. నేను పనిలో పడి రెండ్రోజులు ఉలుకూ పలుకూ లేకుంటే ఎదురుచూపులు. ఉమ్మడి మిత్రులెవరికైనా ఫోన్‌ చేసేది. నా కుశలం తెలుసుకొన్నాక స్థిమితపడేది.

రాజేశ్వరీదేవికి నిరంతరం సాహిత్యమే. సాహిత్యమే సర్వ స్వం. బుద్ధిపూర్వకంగా సాహిత్యం మినహా ఇతరేతర చిల్లర విష యాలు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. శరత్‌, చలం, చండీదాస్‌, ఆలూరి బైరాగి, శేషేంద్రశర్మ, మోహన్‌ప్రసాద్‌, చినవీరభద్రుడు అంటే ఆమెకు అపరిమితమైన మక్కువ. ఆ అక్షరాలంటే అపార మైన సమ్మోహం. ఆమె హృదయంలో ఇంకిపోయిన, రుధిరంలో సంలీనమైన రచనలవి. ఆ కథలు, నవలల్లోని పాత్రలు ఆమెకు చిరపరిచితమైన వ్యక్తులు, నేస్తాలూను. కొన్ని సంభాషణలు కంఠో  పాఠం. కవిత్వ చరణాలనేకం అవలీలగా ఉదహరించేది. బాలసర స్వతి పాటలు, శారదాశ్రీనివాసన్‌ మాటలు మరిమరి చెప్పేది. శేషేంద్ర, చండీదాస్‌ మరణించినప్పుడయితే రోజులకి రోజులు బాధపడిపోయేం, ఇరువురం అదేపనిగా చర్చించుకున్నాం. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, నండూరి రామ్మోహనరావు, ఎబీకే ప్రసాద్‌, ఇంద్ర గంటి శ్రీకాంతశర్మ, కె.శ్రీనివాస్‌, అఫ్సర్‌, ఆర్టిస్ట్‌ మోహన్‌ రచనల గురించి ఇష్టపూర్వకంగా ముచ్చటించేది.

* * *

రాత్రి నడిజాము దాటే దాకా చదువుకోవడం, పొద్దెక్కేక లేవడం, కాఫీ తాగడం, నాలుగు న్యూస్‌పేపర్లు చూడడం, ఎడిట్‌ పేజీల్లో చదవవలసినవి పక్కనపెట్టడం, ఇష్టమైన పుస్తకం పట్టుకుని కూర్చోవడం, అప్పుడప్పుడు టీవీ, సాయంకాలం వాహ్యాళి.ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మిత్రుల్ని ఫోన్‌లో పలుకరించడం, సాహిత్యం పేజీల్లో, సండేమ్యాగజైన్లలో వచ్చిన కవితలు, కథలు, వ్యాసాల గురించి మాట్లాడం, హిందీ, బెంగాలీ, తెలుగు ఆర్ట్‌ సినిమాలని గుర్తుచేయడం, పాతపాటలని తలచుకోవడం. ఏడాదికోసారి విజయవాడ పుస్తకోత్సంలో కొత్త పుస్తకాలు కొనడం…ఇంతే జీవిత పర్యంతం. ఆమె కాలాతీత వ్యక్తి. ఇరవైనాలుగు గంటల్లో ఏ క్షణమైనా ఫోన్‌ చేసేది. ఊరకనే పలుకరించేది. బదులు లేకపోతే, గుడ్‌నైట్‌ లేదా గుడ్‌మోర్నింగ్‌ మైడియర్‌ బాయ్‌ అనే మెసేజ్‌. కిందన ‘మా’ అని రాసేది.

ఆమె ఎంచుకున్న స్నేహితులు తక్కువ. ఒమ్మి రమేష్‌బాబు, గుడిపాటి, కుప్పిలి పద్మ, జుగాష్‌విలి, ఎమ్మెస్‌ నాయుడు, ఆర్టిస్ట్‌ అన్వర్‌, జూలూరి గౌరీశంకర్‌, ఎమ్మెస్‌ సూర్యనారాయణ, భాస్కర్‌ జోగేష్‌, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, ఘంటశాల నిర్మల, మరో ఇద్దరు ముగ్గురు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కవిత్వ పఠనం కోసం తొలినాళ్ల రాకపోకల్లో కొన్ని పరిచయాలు, కొందరు మిత్రు లు. అన్నీ నెమ్మదిగా చెల్లాచెదిరిపోయిన స్మృతులు.

* * *

రాజేశ్వరీదేవికి అంకెలు,లెక్కలంటే భయం. అహం ప్రదర్మిం చే తెలివితేటలంటే అసహ్యం. నానాటికీ డబ్బు ఊబిలో కూరుకు పోతున్న అవివేక సమాజమంటే ఛీత్కారం. వేళకి భోజనం అలవాటు లేదు. ఒక్కతే రోడ్డు దాటడమనేది తనవల్లకాని పని. ప్రయాణమంటే మహా హైరానా. ఎన్నడూ సర్వసాధారణమైన సౌఖ్యాలవేపు మొగ్గ లేదు. మానవీయ విలువల కోసం అన్వేషణ ఆ గొంతులో ధ్వనిం చేది. ఆమెది సంపూర్ణంగా హృదయసంబంధం. పేదరికమంటే చలించి, తలకు మించిన సాయంచేసే కనికరం. ఇవన్నీ ఇంటా బయటా ఆమెకు కష్టం కలిగిస్తుందన్న ఎరుక లేకపోలేదు. అయినా సరే మనుషుల్ని ప్రేమించడమే ఆమె బలమూ, బలహీనత అయింది.

ఇన్నేళ్లలో ఆమెని ఒకేఒక్క పర్యాయం చూడగలిగాను. 2008లో కాబోలు, కేంద్రసాహిత్య అకాడెమీ రాజమండ్రిలో సదస్సు నిర్వహించింది. అందులో నేను పాల్గొంటున్నానని తెలిసి, ఎంతో దూరం నుంచి నన్ను చూడవచ్చింది. ఓ తెల్లని పారదర్శకమైన గాజుబొమ్మమల్లే అనిపించింది. అలా తాకగానే చిట్లిపోతోందేమో అన్నంత సున్నితంగా కనిపించింది.

* * *

‘మా ఇంటిలో ఇమడలేపోతున్నాను. నాకు ఎవ్వరున్నా రని, ఎక్కడికని వెళ్లను?’ అన్నది అనేకసార్లు. కోనసీమకు రండి. మా ఇంట, మాతో బాటు ఉండండి. అనేక పుస్తకాలు, నలువైపులా నీరు, వరిచేలు, కొబ్బరితోటలు, ఒంటరితనంనుంచి ఒకింత బయట పడే కొత్తవాతావరణంలోకి ఆహ్వానించాను. మీ కవితలన్నీ తీసుకు రండి. నేను పుస్తకం వేస్తాను. నలుగురూ చదువుతారు. మీతో మాట్లాడతారు. అది ఉత్సాహకారకంగా ఉంటుందనీ అభ్యర్థించాను.

ఆద్యంతం, ఆమెకు ఈ రెండేరెండు మాటలు చెప్పుకొచ్చాను. ఒక్కటీ లక్ష్యపెట్టలేదు. ఆమెకు ఇష్టంలేక కాదు. ఏనాడో ఆ సాంప్రదాయక కుటుంబం, రాజేశ్వరీదేవి అనే ఇంద్రధనుస్సుని ఒక గుంజకి కట్టిపడేసింది. అరవయ్యేళ్ల పెనుగులాటలో దేహం మాత్రమేనా అలసిపోయింది. ఏ తెగువ చేయలేని మనిషీ నిలువెల్లా విసిగిపోయింది. కడకు కోకిలవంటి హృదయం సైతం నిశ్చలన మయింది. లేకపోతే, తొలుత ఆమె హాయిగా బతుకుతుండేది. సాహిత్యలోకంలో వైభవోపేతమైన కవిత్వ సంపుటమూ నిలిచేది. ఇప్పుడు తెగిపోయిన ఆ హరివిల్లు అదృశ్యతీరానికి తరలి పోయింది.

నా చిన్నతనంలో శరత్‌నీ, చండీదాస్‌నీ, డాక్టర్‌ కేశవరెడ్డినీ పరిచయం చేసింది నన్ను కన్నతల్లి. విచిత్రంగా ఆ రచనల గురించి పదేపదే చర్చించిన అమ్మ రాజేశ్వరీదేవి. ఇరువురూ, నా ఎడల అవ్యాజప్రేమని చూపారు, నా శ్రేయస్సుని కోరుకున్నారు. ‘ఆకుపచ్చ లోయ’ని శిశువువలె అక్కున జేర్చుకొన్నారొకరు. ‘బంధనఛాయ’ని అభిమానించి మురిసిపోయారు మరొకరు. అయితే నాకు ఒక్కమాట మాత్రం చెప్పకుండానే, ఇద్దరూ హఠాత్తుగా అదృశ్యమైనారు.

.

రాజేశ్వరీదేవి కవిత

ద్వైతం

నేనసలే గంగను కదా

నాకు పర్వతమూ ఇష్టమే పొలమూ ఇష్టమే

గండశిలల్నించి కరిగి కిందికొచ్చినందుకే

ఈ మునిగిపోయిన పేదపల్లెల కన్నీళ్లు ఇష్టం.

రాళ్లు పగిలితేనే గానీ కన్ను చెమ్మగిలదు

మీరేదో అనుకుంటారు ఆ గుండె ఆగాధమని

కానీ ఎంతనొప్పో ప్రథమ శిశువుకి పాలు తాపేప్పుడు

ఆ తీయని బాధలో మృత్యువుని జయించిన లోయలకేక

కాశీ వారణాసి బెనారస్‌లో చూడండి నన్ను

నా దేహంమీద కాలీకాలని ఎన్ని కళేబరాలో

కానీ ప్రేమ హర్మా ్యల్లోంచి మీరంతా రిక్తహస్తాలతోనే కదా

ఈ నా పుణ్యక్షేత్రానికి చేరుకునేది!

కేదారనాధ్‌ బదరీనాధ్‌ అమరనాధ్‌ అన్నీ నేనే

ఏనాటి వాడో ఆదిశంకరాచార్యుడ్ని తల్చుకుని

మీ పాపాల చేతుల్నీ పాదాల్నీ కడిగేసుకుంటున్నామనుకుంటున్నారో

కానీ అదంతా హిమాలయాలపైకి మీ ఒట్టి ఎగశ్వాస, దిగశ్వాస

ఎండమావినీ నేనే, తొలకరి మబ్బునీ నేనే

కలకత్తా కాళికనీ నేనే, సలాం బాంబేనీ నేనే

మదర్‌ థెరిసానీ నేనే, ‘బీస్ట్‌ అండ్‌ బ్యూటీ’ని నేనే

పుట్టిన కేకనీ నేనే, ఆఖరి కౌగిలినీ నేనే.

(కవిత్వం ప్రచురణలు. 1990లో వెలువరించిన ‘గురిచూసి పాడేపాట’ పుస్తకం నుంచి)

*

మనసు భాషకి అతనే నిఘంటువు!

ఆర్. దమయంతి 

 

damayanthi‘తాగితే మరచిపోగలను.  తాగనివ్వదు.

మరచిపోతే తాగ గలను – మరవనివ్వదు.’

హు! – అంటూ  ప్రేక్షకుల చేత  కన్నీళ్ళు తాగించిన కవి! ప్రేమపూదోటమాలి.

మనసు మీద మాయని ఒక తీపి గాయం

వలపెరిగిన వారి ఎద మీద పచ్చ బొట్టయిన చందం

– ఆ అక్షరం!

వెనక జన్మ బాసలకి

వెన్నెల విషాదాలకీ కన్నీటి సాక్ష్యం.

తేటతేట తెనుగు పదాల భాండాగారం

సినీ గీతాల మకుటం.

అందరకీ  – ఒక మనసైన సంతకం.

ఆత్రేయ – పేరంటేనే సదా సంతసం.

******

 ఒక మగాడు – స్త్రీ కోసం కన్నీరవడం ఎంత రసవత్తరం గా వుంటుందో, ఆ విషాదపు రుచి ఎలా వుంటుందో చవి చూపించిన కవి ఎవరని అడిగితే, నాకు చప్పున – ఆత్రేయ గారే గుర్తొస్తారు. కథానాయిక దూరమైపోతున్నప్పుడో, లేదా విడిచి వెళ్లిపోతున్నప్పుడో, ఇక దక్కదని తెలుసుకున్నప్పుడో –  అప్పుడు, ఆ నాయకుడు విలవిల్లాడిపోతూ విలపిస్తుంటే..గుండె గాయాలని గీతాలు గా చేసి ఆలపిస్తుంటే..అబ్బ!మనిషన్న వాడి గుండె నొక్కుకు పోతుంది. ఉద్వేగ భారంతో గొంతు పట్టుకుపోతుంది. మరి మనల్ని అంతగా కదిలించిన కవి ఎంత గా కదలి పోయుండాలి. కాదు ఎంతగ  కడలి అయిపోయుండాలి కదూ!

చదివి రాసిందానికీ, జ్వలించి రాసిన అక్షరానికి అగ్గి పుల్లకు, అగ్ని గుండానికీ వున్నంత తేడా వుంటుంది. ఏ కవికైనా, రైటర్ కైనా స్వానుభవం తో తెలుస్తుంది.

బాలూ గారు  ఒక సారి మాటల్లో ఈ కవిని గుర్తు చేసుకుంటూ చెప్పారు.

‘నేనొక ప్రేమ పిపాసిని’ అనే  పాటని పాడమని అడిగేవారట. పాట వింటూ భోరున విలపించారట.

ఇది వినంగానే  బాధగా తలొంచుకున్నాను. ఆయన మీద ఎనలేని జాలి కలిగిన హృదయంతో.

కళ్ళల్లో వున్నదేదో కళ్ళకి తెలుస్తుంది. గుండెలో వున్న గాయాలు ఎందరికి తెలుస్తాయని. ఆయన మాటల్లో నే చెప్పాలంటే – పూల దండలో  దారం దాగుంటుందని తెలుస్తుంది. కాని, పాల గుండెలో ఏం దాగుందో ఎవరికైనా ఎలా తెలవడం?

ఇంకా  చెప్పాలంటే – ప్రేమంత మధురం గా వుండదు  ప్రియురాలు. పై పెచ్చు కఠినం కూడ.

కొండను ఢీ కొన్న అల

శిలను తాకిన ఎద

రెండూ విరిగి పోయేవే.

కాకుంటే,

– ఒకటి శబ్దిస్తూ..మరొకటి నిశ్సబ్దిస్తూ.

మనసూ, అద్దం ఒకటే. పగిలితే అతకదు. అతికించే ప్రయత్నం చేసినా అది వృధా యత్నమే.

ఆఫ్ట్రాల్ హృదయం అని కొట్టేపారేయకు… నీకేం తెలుసోయ్! దాని విలువ?-  రక్తమెంతగ ధార పోస్తే   మాత్రం దొరుకుతుందా మళ్ళా హృదయం? వేస్ట్. ఉత్తి వేస్ట్. మనసు లేని బ్రతుకొక నరకం  అని బోధించిన మనసాత్మ – ఆత్రేయ.

ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అతను ఆమెకి దూరం గా జరుగుతాడే కాని వ్యధ నించి తప్పించుకోలేకపోతాడు. ఆ పై విలపిస్తాడు. తిరిగి తనని తానే ఓదార్చుకుంటాడు. ‘పోనియి. విడిచి వుండలేనా ఏం లే. మరచిపోలేనా ఆమాత్రం? అని సరిపుచ్చుకుంటాడు.ఎలా అంటే, ఇలా-

వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా

మనసిచ్చినదే నిజమైతే ,మన్నించుటయే రుజువు కదా? అని ధీరోదాత్తను ప్రదర్శిస్తాడు.

వింటుంటే ఎంత నీరౌతుందనీ గుండె! ప్రేమిచిన ఆ బేల హృదయం పని ఎంత కరుణ కలుగుతుందనీ!! ఆత్రేయ అక్షరం లోని ఆర్ద్రత మాటలకందనిది. మడిసి తోటి ఏలా కోలం ఆడుకుంటే బావుంటాది కాని, మనసు తోటి ఆడకు మావ, పగిలిపోతె అతకదు మల్లా..’ మనసుని ఒక్క కుదుపు కుదిపి వొదిలేసే మాటలు కావు మరి!

అయినా, ఈ లోకంలో ఎన్ని అగాధ ప్రేమ గాధలున్నాయో మీకు తెలుసా? అవిఎన్నేసి విలాపాల విందు కావించుకున్నయో చెబుతారుచూడండి. ఆ ఎడబాసిన జంటలను చూద్దం – వీరి పద బింబాలలో. ప్రతిబింబాలలో.

‘ఎదురు చూపులు ఎదను పిండగ యేళ్ళు గడిపెను శకుంతల

విరహ బాధను మరచిపోవగా నిదుర పోయెను ఊర్మిళ..’

అహా! ఎంత ఓదార్పు మాటలవి !

అయినా, అసలు ప్రేమేమిటీ, ఈ మాయేమిటీ? అసలు మనసేవిటీ? ఈ మరచిపోలేని అవస్థేమిటయ్యా, ఆత్రేయా? అని అడిగితే..ఆత్రేయ నవ్వుతారు వేదాంతిలా!- తనకు మాత్రమేం తెలుసనట్టు, మౌనమైపోతారు.   ‘ ఎందుకు వలచేవొ ఎందుకు వగచేవో…ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో.. ‘ అంటూ మనసు భాష మాత్రం మౌనం అంటూ నిర్వచిస్తారు.

మరొక డౌట్ కూడా వెలిబుచ్చుతారు. మనసు లేని దేవుడు మనిషికెందుకు మనసిచ్చాడూ అంటూ కూడా వాపోతారు. అంతే కాదు, మనసు లేని బ్రతుకూ బ్రతుకు కాదు. నరకం అని తేల్చి చెప్పేస్తారు.

నిజానికి మనసంటే అర్ధం ఇదీ అనే ఒక నిజమూ వివరించారు. ఇందులో పదాలు చిన్నవే. అర్ధాలే పెద్దవి. చాలా చాలా పెద్దవి.

ఒకరికిస్తే మరలి రాదు

ఓడిపోతే మరచి పోదు

గాయమైతె మాసిపోదు

పగిలిపోతె అతుకు పడదు – ఇదీ మనసు గతి.

ప్రతి మాట వెనక ఒక సముద్ర రోదనా హృదయం వినిపిస్తుంది.

ప్రతి పదమూ –  కాసిన్ని కన్నీళ్లతో కలిపిన గంధం వోలే – ఓ విషాదం పరిమళిస్తుంది. వెరసి ఆత్రేయ హృదయం అద్దమౌతుంది. అక్షరాల అద్దకమౌతుంది. అది మనసున్న మనిషికే అర్ధమౌతుంది. గుండెకి హత్తుకుని వుంటుంది. అందుకే ఆయనతో తెలుగు వాని అనుబంధం జనమజనమకది గట్టి పడతది.

ఈయన్ని దీక్ష గా వింటుంటే అనిపిస్తుంది..వలచి వైఫల్యం పొంది, జీవితమంతా వగపు లోనే మిగిలిపోవడంలో-  ఇంత గొప్ప మాధుర్యం వుంటుందా అనే ఆలోచనకి ఆశ్చర్యమౌతుంది. కాదు అబ్బురమౌతుంది. కాదు కాదు విరహ కావ్యమౌతుంది.

ఎన్ని మౌన దుఃఖాల యెక్కిళ్ళు విన్న మనసో – ఆయన హృది కదా అనిపిస్తూ వుంటుంది నాకు. లేకపోతే? ఇంత అద్భుతం గా మనసుకి అద్దమెలా పట్టారు? కన్నీటి వూసుల్నెలా గుండెకి పూస గుచ్చారూ అనిపిస్తుంది మనసుకి.

 

అవునూ,  మనిషికి అన్నేసి కన్నీళ్ళెలా వస్తాయి?

మనసు ఇచ్చినందుకా, తిరస్కరించినందుకా ?

విరిగినందుకా? విరక్తి చెందినందుకా?

ఏ మిష వల్ల కళ్ళు కన్నీటి వాకిళ్ళౌతాయి?

‘తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు

కల్లలు కాగానే కన్నీరౌతావు..’ జస్ట్ అంతే.

అదీ, ఆత్రేయ చెప్పిన కన్నీటి వెనక గల రహస్యం. వెరీ సింపుల్ ఫాక్ట్ లా దోత్యమౌతుంది కానీ, ఎన్ని జీవితానుభవాల మూటలు విప్పిన మాటల సత్యాలు కదా ఇవి అని అర్ధమౌతుంది.

మన నించి మాయమైన మనసు జాడ తెలీని మనిషికి  నిదురెలా వస్తుంది. కానీ అంటారు ఆత్రేయ –

‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది..కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది ‘అంటూ జో పుచ్చుతారు. పాట తీయగానే వుంటుంది. వింటుంటేనే – మనసు చేదౌతుంది.  ఏ కాలమూ, అదొక ఇష్టమైన బాధ గా వింటం అలవాటౌతుంది. అందమన అలవాటు గా అయిపోతుంది.

ఎలా ..ఎలా వచ్చి చేరాయి, ఆ అక్షరాలలోకి ఆ అమృతపు జాలు?  వెన్నెలమడుగుల విషాదాలు? మనసుని మెలి పెట్టి, మైమరపించే గీతాలు? కన్నీట హర్షాలు?

‘ మరు జన్మ వున్నదో లేదో..ఈ మమతలప్పుడేమౌతాయో..’అనుకుంటూ వెళ్ళిపోయిన కవి, ‘మనసు లేని దేవుడు మనిషి కెందుకు మనసిచ్చాడని’ ప్రశ్నిస్తూ మళ్ళీ ఎప్పుడు రావడం?

పిచ్చి ప్రశ్న! అస్తమయం -రవికి కాని, కవికెక్కడుంది?

ప్రతిరోజూ జన్మదినోత్సవమే కాదా!

హాపీ బర్త్ డే టు యూ – ఆత్రేయ గారు!

మీకివే నా సుమాంజలి.

(మే 7  మన కవి, మన సుకవి –  ఆత్రేయ గారి జయంతి సందర్భంగా..)

గ్రీకు అమ్మవారు కూడా ‘కదంబ ప్రియే’!

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)అమ్మవారి స్తుతులలో ‘లలితా సహస్రనామాలు’ సుప్రసిద్ధాలు. అవి భౌతిక, భావవాదాల అంతస్సంబంధాన్ని వెల్లడించే అమ్మవారి తాత్వికతను చెబుతున్నాయని నాకు అనిపిస్తుంది.  వాటిలో అమ్మవారి ఆరాధనకు చెందిన చంద్రుడు, సర్పము మొదలైన ప్రతీకలు కూడా విస్తారంగా కనిపిస్తాయి. వాటిలోకి వెళ్ళకుండా ఇప్పుడు ఒక్క అంశానికి మాత్రమే పరిమితమవుతాను. అదేమిటంటే…

లలితా సహస్రనామాలలో పూవులు, వనాల ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది. కొన్ని చెప్పాలంటే, అమ్మవారి కురులు చంపకా(సంపెంగ పూలు)లతోనూ, అశోకాలతోనూ, పున్నాగ పువ్వులతోనూ, సౌగంధికాలతోనూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఆమె మహాపద్మాల వనంలో ఉంటుంది. కదంబ(పొన్న)వనంలోనూ ఉంటుంది. కదంబ పూల గుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. కదంబ కుసుమాలే కాక; చాంపేయ (నాగకేసరి), పాటలీ(కలిగొట్టు) కుసుమాలు కూడా ఆమెకు  ప్రియమైనవి. ఆమె దానిమ్మ పువ్వు కాంతితో ఉంటుంది. పువ్వులు ఆమె బాణాలు…

ఈ ఆహ్లాదకరమైన పూల నేపథ్యం నుంచి ఒకసారి జార్జి థాంప్సన్ వైపు తొంగిచూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనకు మన లలితా సహస్రనామాలతో పరిచయం ఉందని చెప్పలేం. ఆయన తనకు బాగా తెలిసిన గ్రీకు అమ్మవార్ల గురించి చెప్పుకుంటూ వచ్చారు. విచిత్రంగా ఆ వివరాలు మన అమ్మవారి గురించే చెబుతున్నట్టు అనిపిస్తాయి. గ్రీకు అమ్మవార్లలో మన అమ్మవారి పోలికలు కనిపిస్తాయి.

ఆయన The Making of a Goddess అనే అధ్యాయంలో, Herbal Magic అనే ఉపశీర్షిక కింద, గ్రీకు దేవతా సమూహంలోని అధికారిక దేవతలైన అమ్మవార్ల ఆరాధనలో అంతర్లీనంగా ఉన్న ఆదిమ మాంత్రికతను చర్చిస్తారు. మొక్కలు, మూలికలు, పువ్వులకు(herbal)చెందిన మాంత్రికతపై ప్రతి చోటా స్త్రీలదే అధికారమని ఆయన అంటూ, వాలెంగే తెగ మహిళలపై అధ్యయనం జరిపిన మిస్ ఎర్తీ మాటల్ని ఉదహరిస్తారు:

“దాదాపు అన్ని చెట్లు, మొక్కలు మాంత్రిక విలువ ఉన్నవే. నేను ఎప్పుడైనా వృక్షజాతులను సేకరిస్తుంటే వాళ్ళలో ఒక్కసారిగా కుతూహలం రేగేది. మొక్కలంటే మాంత్రికతకు, మందులకు సంబంధించినవే నన్న భావన వాళ్ళలో జీర్ణించుకుపోవడమే అందుకు కారణం” అని ఆమె అంటారు.

ఈ సందర్భంలో థాంప్సన్ ఇంకొక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. ప్రాచీన గ్రీకు వృక్షజాతుల గురించి డయోస్కరైడ్స్, ప్లినీ విస్తారమైన సమాచారం ఇచ్చారనీ, అయితే, గ్రీకు మతాన్ని అధ్యయనం చేసేవారు వాటిపై తగినంత దృష్టి పెట్టరని  ఆయన అంటారు. ఆదిమ కాలంలో మతపరమైన తంతులకూ, ప్రకృతి రూపంలోని భౌతికవాస్తవికతకూ ఉన్న పీటముడి ఆ తర్వాత తెగిపోయి; మతమూ, భౌతికవాస్తవికతా వేర్వేరు అయిపోయిన ఫలితమే ఇదని నాకు అనిపిస్తోంది. మన దగ్గర కూడా అదే జరిగింది. మన పౌరాణికులు, పండితులు కూడా మతాన్ని భౌతికవాస్తవికతనుంచి వీలైనంత దూరంగా తీసుకువెడతారు.

గ్రీకులకు చెందిన పూల రకాలలో ‘పియోని’(peony) అనే పువ్వు ఉంది. అది ఎర్రగా, మనకు తెలిసిన గులాబీ పువ్వులా ఉంటుంది. ఆ పువ్వు తొడిమెలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయని భావిస్తారు.  దానిని ఋతుస్రావమప్పుడూ, పురిటి సమయంలోనూ ఉపయోగిస్తారు. ఈ ఔషధ గుణాలు చంద్రుని నుంచే సంక్రమించాయనే భావనతో ఈ పువ్వును ‘మెన్యన్’(menion) లేదా ‘సెలెనోగొనన్’(selenogonon) అని కూడా పిలుస్తారు. ‘మెన్’ అంటే చంద్రుడు. ‘సెలెనే’ అంటే చంద్రదేవత.

అలాగే, ‘డిక్తామ్నోస్’(diktamnos) అనే ఒక తరహా కూరాకును ప్రసవసమయంలో ఉపయోగిస్తారు. ఆ కూరాకులను దండగా గుచ్చి, ప్రసవదేవత అయిన ఎయిలీతియా(Eileithiia) మెడలో వేస్తారు. విశేషమేమిటంటే, కదంబం లేదా పొన్న(ఇక్కడ థాంప్సన్ ఉపయోగించిన myrtle అనే మాటకు కదంబమని, పొన్న అనీ నిఘంటువు అర్థం ఇచ్చింది) మన అమ్మవారికి ఎంత ప్రియమైనదో గ్రీకు అమ్మవారు అఫ్రోడైట్ కు కూడా అంతే ప్రియమైనది. ఇది గర్భాశయాన్ని మూసి ఉంచి నెలలు నిండకుండా ప్రసవం జరిగే అవకాశాన్ని నివారిస్తుంది. అలాగే కలువపువ్వు కూడా అఫ్రోడైట్ కు ప్రియమైనది. ఇది ఋతుస్రావాన్ని అదుపు చేస్తుందని నమ్మకం. దృఢంగానూ, వంచడానికి వీలుగానూ ఉండే ఒక తీగ జాతి(withy)కి చెందిన ‘లిగోస్’(lygos) కూడా ఋతుస్రావాన్ని అదుపు చేస్తుందని భావిస్తారు.

కదంబం

స్పార్టా లో అర్తెమిస్ అనే అమ్మవారిని ‘లిగోడెస్మా’ (Lygodesma) అని పిలుస్తారు. ఈ దేవత మూర్తి లిగోస్ తీగల మీద వెలియడం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ తీగలతో చేసిన దండను దేవత మెడలో వేస్తారు.  సామోస్ అనే ప్రాంతానికి చెందిన హేరా అనే దేవత కూడా తన వనం లోని ఇలాంటి ఒక తీగ చెట్టు కిందే అవతరించింది. ప్రసవ సమయంలో గర్భం తెరచుకోవడం కష్టమైనప్పుడు ఒక రకమైన దుంప(galingale)తో కషాయం చేసి తాగిస్తారు. ఋతుస్రావంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక జాతికి చెందిన పసుపురంగు పువ్వుల(helichryse)ను ఉపయోగిస్తారు. స్పార్టాలోని అమ్మాయిలు ఈ పూలతో కిరీటం చేసి హేరాకు అలంకరిస్తారు. “తల్లీ! నీకు పసుపు పూల దండనూ, గలింగలే దండను సమర్పించుకుంటున్నాను. నన్ను కరుణించు” అని అమ్మాయిలు దేవతను ప్రార్థిస్తారు. హేరా, అర్తెమిస్, అఫ్రోడైట్లను గ్రీకులు ప్రసవదేవతలుగా కొలిచేవారు.

ప్రాచీన గ్రీకులకు బాగా తెలిసిన చెట్లలో దానిమ్మ చెట్టు ఒకటి. డిమీటర్ అనే దేవత, చేతిలో గసగసాల (లేదా నల్లమందు) గుత్తినో, దానిమ్మ పండునో పట్టుకుని కనిపిస్తుంది. ఒక్కోసారి రెండూ పట్టుకుని ఉంటుంది. ఏథెన్స్ లో విజయచిహ్నంగా నిలబెట్టిన ఎథెనా అనే దేవత కుడి చేతిలో శిరస్త్రాణాన్ని, ఎడమ చేతిలో దానిమ్మ పండును పట్టుకుని ఉంటుంది. ఒలింపియాలో మిలన్ అనే ఒక అథ్లెట్ విగ్రహం దానిమ్మ పండును పట్టుకుని కనిపిస్తుంది. ఈ అథ్లెట్ హేరా అనే దేవతకు పూజారిణి. అర్గోస్ అనే చోట హేరా విగ్రహం ఒక చేతిలో రాజదండాన్ని, ఇంకో చేతిలో దానిమ్మ పండును పట్టుకుని ఉంటుంది,  “దానిమ్మ గురించి నేను ఎక్కువగా చెప్పను. ఎందుకంటే, దానికి సంబంధించిన కథ ఓ రహ  స్యం” అని, పౌసానియా(క్రీ. శ. 110-180) అనే గ్రీకు యాత్రికుడూ, భౌగోళిక నిపుణుడూ అనడాన్ని ఈ సందర్భంలో థాంప్సన్ ప్రస్తావిస్తారు.

ఇంతకీ ఆ రహస్యం ఏమిటంటే, దానిమ్మ పండు ఎర్రటి రంగులో ఉంటుంది. అలాగే దాని గింజలు కూడా.  వాటిని గ్రీకు భాషలో ‘కొక్కోస్’(kokkos) అంటారు. దానిమ్మ పండు రక్తాన్ని సంకేతిస్తుంది. అది హింసాత్మక, లేదా బలవన్మరణానికి కూడా సంకేతం. టైటాన్ల చేతిలో మరణించిన డయోనిసస్ రక్తం నుంచి దానిమ్మ మొలకెత్తిందనే భావన గ్రీకు పురాణాలలో కనిపిస్తుంది. దానిమ్మ కలలో కనిపిస్తే గాయాల పాలవుతారనే నమ్మకం ఉండేది. అయితే ఇలాంటివి రెండో పక్షం. ప్రధానంగా దానిమ్మ రంగు ఒకరిని చంపినప్పుడో, గాయపరచినప్పుడో కారే రక్తానికి సూచన కాదు. అది ఋతురక్తానికి, పురిటి రక్తానికి సూచన. దానిమ్మను ఋతుస్రావమప్పుడు, ప్రసవమప్పుడు ఔషధంగా వాడతారు. గసగసాల గుత్తి కూడా సంతానసంబంధమైన ప్రతీకే. అందుకే డిమీటర్ చేతిలో దానిమ్మ, గసగసాల గుత్తి ఉంటాయి.

గ్రీకు అమ్మవార్లకే కాదు, బాబిలోనియా అమ్మవారు ఇష్టార్ కూ దానిమ్మ పండు ప్రియమైనదే. ఆమె దానిమ్మనే కాక యాపిల్ నూ ఇష్టపడుతుంది. ఇష్టార్ ప్రేమదేవత కూడా. స్త్రీ, పురుషులలో లైంగికవాంఛ రేకెత్తించేది ఈ దేవతే. మెసపొటేమియాలో దొరికిన వేలాది మట్టిపిడకలలో ఒకదానిపై ఇష్టార్ ను ఉద్దేశించిన ఒక మంత్రం ఉంది. యాపిల్ నో, దానిమ్మనో చేతిలో ఉంచుకుని మూడు సార్లు ఈ మంత్రాన్ని పఠించి తను ఇష్టపడిన స్త్రీ చేత దానిని కొరికిస్తే ఆమె వెంటనే వశమవుతుందని ఆ మట్టిపిడక మీది రాత చెబుతోంది.

 

డిమీటర్ కు స్త్రీలు కొన్ని రహస్యమైన తంతులు జరుపుతారు. వాటిలో ఒక తంతు పేరు ‘థెస్మొఫోరియా’(Thesmophoria).  ఈ తంతు జరిపే రోజుల్లో స్త్రీలు రాత్రిపూట ఒకరకమైన తీగలతో చేసిన పడక మీద పడుకోవాలి. లైంగికచర్యకు దూరంగా ఉండాలి. దానిమ్మ తినకూడదు. తీగలతో చేసిన పడక మీద పడుకోవడం వల్ల రెండు లాభాలు ఉంటాయి. మొదటిది, లైంగిక స్పందనలను అది నివారిస్తుంది. రెండోది, పాముల్ని అది దూరంగా ఉంచుతుంది. దానిమ్మపై నిషేధానికి కారణం కూడా, అది లైంగిక ఉద్రేకాన్ని రెచ్చగొడుతుందన్న భావనే.

అమ్మవారికి సంబంధించిన వ్రతాలలో, పూజలలో మనదగ్గర కూడా స్త్రీలకు ఇలాంటి నియమాలు, నిషేధాలు ఉంటాయి కనుకనే వీటి గురించి ఈ ప్రస్తావన.

దానిని అలా ఉంచితే, ‘థెస్మొఫోరియా’లో ఇంకొకటి కూడా జరుగుతుంది. అది, స్త్రీలు పందులను బలి ఇవ్వడం! నిజానికి ఇది పంటల వృద్ధిని ఉద్దేశించిన తంతు. అంటే సౌభాగ్యవర్ధనానికి సంబంధించినదన్నమాట.  అలాంటప్పుడు ఈ తంతు జరిపే స్త్రీలు సౌభాగ్య సంబంధమైన లైంగికత్వానికి దూరంగా ఎందుకు ఉంటారని థాంప్సన్ ప్రశ్నిస్తూ, ఈ ఆదిమ కాలపు తంతులోని అసలు ఉద్దేశాన్ని మరచిపోవడం వల్లనే నంటారు.

ఈ తంతు ఏటా అక్టోబర్ చివరిలో జరుగుతుంది. స్త్రీలు డిమీటర్ కు నివేదించడం కోసం కొన్ని పందుల్ని బలి ఇచ్చి వాటి కళేబరాలను ఒక గుహలో భద్రపరుస్తారు. మూడు రోజుల తర్వాత పాములను తరమడానికి చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్ళి కుళ్ళుతున్న స్థితిలో ఉన్న పందుల అవశేషాలను తీసుకెళ్లి మరుసటి పంటకు ఉపయోగించే విత్తనాలలో కలుపుతారు. స్త్రీలకు చెందిన కుందేలు, పావురం మొదలైన వాటిలానే పంది కూడా ఎక్కువ సంతానాన్ని కంటుంది. ఆ విధంగా సంతాన వృద్ధికేకాక; మగవాడి పుట్టుకకు, పంటలకు కూడా పంది ప్రతీక. ఇంకా చెప్పాలంటే, థాంప్సన్ ప్రకారం పంది అంతకంటే కూడా ఎక్కువ. అది సాక్షాత్తూ స్త్రీకి ప్రత్యామ్నాయం!

ఎలాగంటే, ఋతు రక్తానికీ, ప్రసవరక్తానికీ పంటలను పోషించే లక్షణం ఉన్నట్టు భావించేవారని చెప్పుకున్నాం. మొదట్లో ఈ రెండు రకాల రక్తాలను రహస్యంగా భద్రపరచి, విత్తనాలలో కలిపేవారు. ఆ తర్వాత వాటి స్థానంలో  పంది రక్తాన్ని వాడడం ప్రారంభించారు. అప్పటినుంచే స్త్రీల లైంగికతకు సంబంధించిన చర్యలు సానుకూల విలువను కోల్పోవడం, వాటిని మైలగానూ, అపవిత్రాలుగానూ చూడడం మొదలైందని థాంప్సన్ వివరణ. లేదా, ఋతురక్తాన్ని, ప్రసవరక్తాన్ని మైలగానూ, అపవిత్రంగానూ చూడడం మొదలైన తర్వాత, వాటికి ప్రత్యామ్నాయంగా పంది రక్తాన్ని వాడుతూ వచ్చారనీ అనుకోవచ్చు.

స్త్రీకి పంది ప్రత్యామ్నాయం కావడం వల్ల స్త్రీపట్ల ఏర్పడిన అపవిత్రతా లేదా ఈసడింపు భావనే పంది మీదకు విస్తరించి అది కూడా నిందార్థకంగా మారిందని థాంప్సన్ అంటారు. విచిత్రంగా మన దగ్గర కూడా ‘పంది’ అనే మాట తిట్టుపదమే. అలాగే,  గ్రీకులో దానిమ్మ గింజలను సూచించే ‘కొక్కోస్’ అనే మాట కూడా అశ్లీలవాచకంగా మారింది. మనకు తెలిసిన కొక్కోకమనే కామశాస్త్రానికీ, ఈ మాటకూ ఏమైనా సంబంధం ఉందా అన్నది తెలియదు.

మన లలితా సహస్రనామాలలో ధాన్యాలు, రకరకాల అన్నాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. అలాగే, డిమీటర్ ప్రధానంగా తృణధాన్యాలకు చెందిన దేవత. అర్తెమిస్ అటవీభూములకు, చిత్తడి నేలలకు, పచ్చిక భూములకు చెందిన దేవత.  అర్తెమిస్ విల్లమ్ములు ధరించి కొండల మీద తిరుగుతూ ఉంటుంది. అడవిలోని అప్సరసలతో కలసి ఆడుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒక కథ ప్రకారం, లెట్రినోయి అనే చోట ‘అర్తెమిస్ అల్ఫియా’ అనే గుడి ఉంది. ఆ పక్కనే  ‘అల్ఫియాస్’ అనే నది ప్రవహిస్తోంది. ఆ నది అర్తెమిస్ ను ప్రేమించింది. అయితే, కన్యాత్వానికి అంకితమైన అర్తెమిస్ తన ప్రేమను అంగీకరించదనుకున్న అల్ఫియాస్, ఆమె అప్సరసలతో కలసి రాత్రంతా జరిగే ఒక జాతరకు వెళ్లినప్పుడు రహస్యంగా ఆమెను సమీపించాలనుకున్నాడు. అర్తెమిస్, ఆమె నేస్తాలు దీనిని పసిగట్టి అతను గుర్తు పట్టకుండా ముఖాలకు బురద పూసుకున్నారు.

పెళ్లీడు వచ్చిన అమ్మాయిలు నదికి వెళ్ళి అందులోని బురదను ఒంటికి పూసుకోవడం ద్వారా నీటిలోని జీవశక్తిని సంగ్రహించే ఒక రహస్యమైన తంతును ఈ కథ వెల్లడిస్తుందని థాంప్సన్ అంటారు. బురదలో ఔషధగుణాలు ఉంటాయనీ, అల్ఫియాస్ అనే పేరు ఆ గుణాలనే సూచిస్తుందనీ ఆయన వివరణ. అల్ఫియాస్ నదీజలాలు కుష్టు లాంటి చర్మరోగాలను నివారిస్తుందని ప్రాచీన గ్రీకులు అనుకునేవారు. మన దగ్గర కూడా నదీజలాలకు ఇటువంటి ఔషధగుణాలను ఆపాదిస్తాం.

గ్రీకు పల్లె ప్రాంతాలలో ప్రతిచోటా ఊటబావులు, సెలయేళ్లు ఉన్నాయి. వాటిని ‘పార్థేనియా’ లేదా ‘పార్థెనోయిస్’ అని పిలుస్తారు. మతపరమైన ఉత్సవాలకు ముందు కన్యలు వాటిలో స్నానం చేసి పరిశుద్ధులవుతారు. పెళ్ళికి ముందు నదికి తీసుకువెళ్ళో, లేదా నదీజలాలను తెప్పించో వధువుకు స్నానం చేయించే ఆనవాయితీ అక్కడ ఉండేది. మన దగ్గర కూడా పెళ్ళికి ముందు మంగళస్నానం చేయించడం ఉంది.  థాంప్సన్ ప్రకారం, మొదటిసారి ఋతుమతి అయినప్పుడు నదిలో స్నానం చేసి శుద్ధి పొందే ఆచారమే పెళ్లికి విస్తరించింది. అంతేకాదు, పెళ్ళికి ముందు నదిలో స్నానం చేయడంవల్ల ఆమె సంతానయోగ్యం అవుతుందని భావించేవారు. నీటికి జీవం పోసే శక్తి ఉందనీ, నీటివల్లనే స్త్రీ గర్భం ధరిస్తుందనే విశ్వాసం గ్రీసులోనే కాక అనేక దేశాలలో ఉందని ఆయన అంటారు. స్నానానికి ముందు కన్యలు, “ఓ నదీదేవుడా! మా కన్యాత్వాన్ని హరించు” అని ప్రార్థించడమూ గ్రీసులో కొన్ని చోట్ల ఉంది. పెళ్ళికి ముందు నదీస్నానం చేసిన వధువులు ‘అప్సరస’(nymphs)లు అవుతారనీ, నదీ దేవుణ్ణి కౌగలించుకోవడం వల్ల వారికి వీరపుత్రులు కలుగుతారనీ నమ్మేవారు. గ్రీకు భాషలో వధువులను nimphai అంటారు.

సరే, మన పురాణ ఇతిహాసాల నిండా కనిపించే అప్సరసల గురించి చెప్పనే అవసరం లేదు. ‘అప్సు’ అంటే నీరుకనుక, అప్సరసకు, నదికి లేదా నీటికి ఉన్న సంబంధం స్పష్టమే. అదలా ఉంచితే, పై వివరాలు చదువుతున్నప్పుడు; ముఖ్యంగా నదీదేవుణ్ణి కౌగలించుకోవడం వల్ల వీరపుత్రులు కలుగుతారన్నప్పుడు మహాభారతంలోని కుంతికథ, గంగా-శంతనుల కథ చటుక్కున గుర్తొచ్చి ఉండాలి. కుంతి కన్యగా ఉన్నప్పుడే కర్ణుని కని నదిలో విడిచిపెట్టింది. కర్ణుడు వీరపుత్రుడే. అలాగే, గంగ అనే ‘నది’కి శంతనుని వల్ల కలిగిన భీష్ముడు కూడా మహావీరుడే. కాకపోతే, నదిని మనం స్త్రీ రూపంగా భావిస్తే, గ్రీకులు పురుషరూపంలో భావించారు. మెసొపొటేమియాను పాలించిన సారగాన్(క్రీ.పూ. 2350)ను అతని తల్లి రహస్యంగా కని, ఒక బుట్టలో ఉంచి దానిని తారుతో మూసి నదిలో విడిచిపెట్టింది. అతను కూడా వీరుడే. హిబ్రూ మోజెస్ పుట్టుక కూడా ఇలాంటిదే. ఇటువంటి పుట్టుకలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డెబ్బైకి పైగా ఉదంతాలు ఉన్నాయని జోసెఫ్ క్యాంప్ బెల్ అంటారు.

కుంతికి ‘పృథ’ అనే పేరు, అర్జునుడికి ‘పార్థు’డనే పేరు ఉన్నట్టు మనకు తెలుసు. గ్రీసులో కన్యలు స్నానం చేసే ఊటబావులను, సెలెయేళ్లను ‘పార్థేనియా’ అంటారని చెప్పుకున్నాం. ఈ పేర్ల మధ్య సామ్యం కనిపించడం లేదా అని నేను అంటే, “ఇక ఆపండి. మరీ ఎక్కువగా ఊహాగానాలు చేస్తున్నా”రని మీరు అనచ్చు. కనుక ఆపేస్తాను.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

,

  ‘తప్పంతా వాళ్లదే!’

   ఆక్రోశ్

మన ఘనత వహించిన అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉద్దేశంతో కానీ, ఉద్దేశ రహితంగా కానీ చంపడం ఏమంత పెద్ద నేరం కాదని సల్మాన్ ఖాన్ కేసు తీర్పుతో మరోసారి తేలిపోయింది. సల్మాన్ తాగిన మైకంలో నిర్లక్ష్యంగా కారు నడపడంతో ‘కుక్క’ లాంటి ఒక మనిషి చచ్చిపోయి, ‘కుక్కల్లాంటి’ మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు కనుక కోర్టు ఐదేళ్ల శిక్షతో సరిపెట్టింది. దొంగలను, రేపిస్టులను పిట్టల్లా కాల్చేసి తక్షణ న్యాయం చేయాలని బాధ్యతగల పౌరులు డిమాండ్ చేస్తున్న వర్తమానంలో పదమూడేళ్లకు పైగా నడిచిన ఈ కేసులో.. చివరకు కాస్త శిక్షతోనే అయినా వచ్చిన ఈ తీర్పు ఆహ్వానించదగ్గదే.

సల్మాన్ హత్య చేయలేదు, నిజమే! కానీ తాగి కారు నడుపుతూ, ఫుట్ పాత్ పైకి దూసుకెళ్తే, అక్కడున్న జనం చస్తారని అతనికి తెలియదనుకోలేం. సినిమాల్లో డూపులు పెట్టుకునే ఆయనకు ఈ సంగతి ఇతరులకంటే మరింత బాగా తెలిసి ఉంటుంది. సినిమా కోర్టు సీన్లలో తిమ్మిని బమ్మిని చేసే వాదనలు, కూట సాక్ష్యాలు కూడా బాగా తెలిసిన ఆయన తాను కారు నడపలేదని నిన్న కూడా కోర్టులో చెప్పాడు. అప్పుడు కారు నడిపింది తన డ్రైవర్ అశోక్ సింగ్ అని కేసు చివరి దశలో చెప్పిన సల్మాన్ ఆ ముక్క 13 ఏళ్ల కిందటే ఎందుకు చెప్పలేదని ప్రాసిక్యూషన్ మంచి ప్రశ్నే వేసింది. చచ్చిన మనిషి  కారు కింద పడి చనిపోలేదని, ప్రమాదం తర్వాత కారును క్రేన్ తో ఎత్తుతుండగా కారు కిందపడ్డంతో చనిపోయాడని లాయర్ తో మరో సినిమా కథ చెప్పించాడు సల్మాన్.

ప్రమాదం తర్వాత తన నుంచి సేకరించిన రక్తంలో ఆల్కహాల్ ఉందని ఫోరెన్సిక్ నిపుణుడు ఇచ్చిన సాక్ష్యం కూడా చెల్లదన్నాడు ఆయన. ఆ నిపుణుడికి అసలు రక్తం సేకరించడమే తెలియదన్నాడు. ఇలాంటి తైతక్కలెన్నో ఆడాడు. కోర్టు ఇవేవీ నమ్మలేదు. ఇవన్నీ లా పాయింట్లు. బాధ్యతగల పౌరులకు అక్కర్లేదు. వాళ్లకు కావాల్సింది తక్షణ న్యాయం. అది 2012లో జరగలేదు. 2015లో కాసింత తక్షణంగా జరిగింది. హత్య కేసులే కాదు, సామూహిక ఊచకోత కేసులు కూడా దశాబ్దాల తరబడి నడుస్తున్న, పేలపిండిలా తేలిపోతున్న ఈ దేశంలో ఇది పెద్ద విశేషమేమీకాదు కనుక దీని గురించి చర్చ అనవసరం. కానీ ఈ కేసు తీర్పు తర్వాత సల్మాన్ కు మద్దతుగా కొందరు బాధ్యతగల సినీప్రముఖులు  చేసిన వ్యాఖ్యలు చూశాక చర్చ అవసరమనిపించింది.

‘కుక్క రోడ్డుపై పడుకుంటే కుక్క చావు చస్తుంది. రోడ్లు పేదల సొత్తు కాదు. రోడ్లున్నది కార్లకోసం. ముంబై ఫుట్ పాత్ లు అలగాజనం పడుకోవడానికా? ఫుట్ పాత్ నిద్ర ఆత్మహత్యలాంటి నేరమే.  సల్మాన్ కు అండగా నిలబడండి’ అని బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య ట్విటర్లో రాశాడు. తళుకెబెళుకుల జ్యుయెలరీ డిజైనర్ ఫరా ఖాన్ వంతపాడుతూ, ‘ఫుట్ పాత్ ల మీద పడుకునేవాళ్లు వాహనాల కిందపడి చావడానికి సిద్ధంగా ఉండాలి. మందు, డైవర్ను నిందించకూడదు. వేరే దేశంలో అయితే సల్మాన్ కారు మనుషులమీదికి పోయేదు కాదు. ఒకడు పట్టాలు దాటుతూ రైలు కింద పడి చనిపోతే రైలు డ్రైవర్ ను శిక్షించినట్లు ఉంది, సల్మాన్ కు వేసిన శిక్ష’ అంది(అందుకే ఈమెకు ఎవరో ‘ఇండియా మేరీ ఆంటోనెట్’ అనే బిరుదు కట్టబెట్టారు. ఈమెకు ఆంటోనెట్ గతి పట్టకుండుగాక).

సల్మాన్ అమాయకుడని కొందరు, ఏదో తెలీక చేస్తే ఇంత కఠిన శిక్షవేస్తారా అని కొందరు, అతడు దానవీరశూరకర్ణుడు, అపర గౌతమబుద్ధుడు కనుక వదిలేయాలని కొందరు వత్తాసు పలికారు. సారాంశం ఏమంటే.. సల్మాన్ ను శిక్షించకుండా వదిలేసి ఉండాల్సిందని, లేకపోపోతే నెలో, రెండు నెలలో ’అత్తగారింటికి‘ పంపి ఉండాల్సిందనీ. సల్మాన్ వీళ్లకు స్నేహితుడో, సాటి సినీ జీవో, బంధువో, గింధువో, అతనితో కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాతలో కావొచ్చు కనుక మద్దతు పలకడం సహజమే. సల్మాన్ బ్యాడ్ బాయ్ చేష్టలు, జింకలవేటలు, అతిలోకసుందరుల కోసం తోటి హీరోలతో చేసిన బాహాబాహీలన్నీ కన్వీనియంట్ గా మరచిపోయిన వీళ్ల వాదనతో బీదాబిక్కీకే కాదు, జనసామాన్యానికంతా పెద్ద ప్రమాదముంది. వీళ్ల మహత్తర ‘అభిప్రాయాలపై కాస్త ఆలోచించాలేమో, వీళ్లంటున్నది సమంజసమేనేమో’ అని మధ్యతరగతి బుర్రలు కూడా అప్పుడే ట్వీట్లు కొట్టేస్తున్నాయి. అసలే మనది సినిమాల వాళ్ల, రాజకీయ నాయకుల మాటలను వేదవాక్యంలా భావించే అమాయక చైతన్యవంతులున్న దేశమాయె! కార్లు, లారీలు రోడ్లపై వెళ్తాయో, పుట్ పాత్ లపై వెళ్తాయో తెలిసిన మహాజ్ఞానుల దేశమాయె!

‘తీర్పు ఇంత ఆలస్యంగా వస్తే ఏం ప్రయోజనం? నా కాలు పోయింది. బతుకు తెరువు పోయింది. జీవచ్ఛవంలా పడున్నా. వచ్చిన 3 లక్షల పరిహారంలో ఒకటిన్నర లక్ష లాయర్ ఫీజుకింద పోయింది..’ అని ఒక క్షతగాత్రుడు.., ‘నా తొడ చితికిపోయింది. వచ్చిన రూ. ఒకటిన్నర లక్ష చికిత్సకే సరిపోలేదు. ఇప్పుడు సల్మాన్ దోషిగా తేలితే మాత్రం నా కడుపు నిండుతుందా?’ అని మరో క్షతగాత్రుడు వెళ్లబుచ్చిన ఆక్రోశం మాత్రం సోషల్ మీడియా ప్రేమికుల చెవుల్లోకి ఎక్కలేదు. రోడ్లపై పడుకునోళ్లను చంపితే నేరం కాదు, పేదవాళ్ల కారణంగానే సల్మాన్ పాపం జైలుకెళ్లాల్సి వచ్చింది( సల్మాన్ ఇంకా జైలుకెళ్లలేదు, బెయిలు పుచ్చేసుకుని ఇంటికెళ్లాడు) అని బెంగటిల్లుతున్న సల్మాన్ అభిమానుల వాదనకే ఈ మీడియాలో, మామూలు మీడియాలో విపరీత ప్రచారం లభించింది.

వీళ్ల వాదన శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను పిట్టల్లా  చంపేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల, ఆ రాష్ట్ర మంత్రుల వాదనలా, ఆలేరులో ఐదుగురు తీవ్రవాద నిందితులను చంపేసిన తెలంగాణ పోలీసుల వాదనలా ఉంది(దొంగలు గతంలో అటవీ అధికారులను చంపడం, తీవ్రవాద నిందితులు పోలీసులు చంపడం నిజమే అయినా). దొంగతనంగా చెట్లు కొట్టేస్తే(మమ్మల్ని చంపితే, కాల్చితే ఊరుకుంటామా?) అని ఆ పోలీసులు చెప్పినట్లే.. ఫుట్ పాత్ లపై ఆదమరచి పడుకుంటే తాగినోళ్లు కార్లతో గుద్ది చంపకుండా పోతారా అన్నట్లుంది మహానటకుడి సమర్థకుల వాదన.

ఢిల్లీలో ‘నిర్భయ’పై పైశాచికానికి పాల్పడిన ముఖేశ్ సింగ్ కూడా బీబీసీ ఇంటర్వ్యూలో ఇలాంటి మాటలే అన్నాడు. ‘పరువున్నఆడపిల్ల రాత్రి 9 గంటకు బయట తిరగకూడదు. రేప్ కు మగాడు కాదు, ఆడదే కారణం. ఆడాళ్లకు ఇంటిపనే తగింది. డిస్కోలకు, బార్లకు వెళ్లకూడదు. చెడు పనులు చేయకూడదు(మగాళ్లు చేయొచ్చు!), ఒళ్లు కనిపించే బట్టలు వేసుకోవద్దు. ఆమె(నిర్భయ) మేం రేప్ చేస్తుంటే ప్రతిఘటించకుండా మౌనంగా భరించి ఉండాల్సింది. మా పని అయిపోయాక ఆమె స్నేహితుడిని కొట్టి, ఆమెను చంపకుండా వదిలేసి ఉండేవాళ్లం’ అని అన్నాడు.

ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు అడుగుతున్న, గుంజుకుంటున్న పాలకులు కూడా వాచ్యంగా ఇలా బరితెగించి చెప్పకున్నా ధ్వనిగానైనా ఇలాంటి వాదనలే చేస్తున్నారు, ‘రైతులకు భూములున్నది మాకివ్వడానికి కాక మరెందుకు? భూములు కలిగుండడమే వాళ్ల తప్పు. అవి లేకపోతే మా పని సులభమయ్యేది కదా’ అని.

ముస్లిం, క్రైస్తవులు తతిమ్మా హైందవేతరులందూ హిందూమతం పుచ్చుకోవాలని బెదిరిస్తున్న సంఘ్ పరివార్ కూడా ఇలాగే అంటోంది కదా, ‘ముస్లింలతో హిందూ జనాభాకు ముప్పు ఏర్పడింది. వాళ్లు ఎక్కువ మంది కనేస్తున్నారు. హిందువులూ ఎక్కువ మందిని కనాలి. ఈ దేశంలోని సమస్యలన్నింటికీ మూలం లౌకికవాదులే. వాళ్లు లేకుంటే సమస్యలే లేవు. హైందవేతరులే ఈ దేశానికి పీడ. అందరూ హిందువులైతే సమస్యలే ఉండవు..’

‘తప్పంతా ప్రేక్షకులదే. హింస, బూతు, రక్తపాతాలను ఎగబడి చూస్తున్నారు. అందుకే అలాంటి సినిమాలే తీస్తున్నాం. మమ్మల్ని తప్పుబడితే ఎలా?’

‘వాళ్లకు ఓట్లేసి గెలిపించారు కదా, మరో ఐదేళ్లు అనుభవించండి. అదే నన్ను గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్ కాదు స్వర్గం చేసేసి ఉందును.. గెలిపించలేదు కనుక తప్పంతా మీదే’

‘మేం పాఠాలు బాగానే చెప్పాం. తప్పంతా పిల్లలదే. క్రికెట్ మ్యాచ్ అనీ, సినిమాలనీ సరిగ్గా చదవకుండా ఫెయిలయ్యారు. అయినా గవర్నమెంట్ స్కూళ్లకు వచ్చే పిల్లలకు చదువెలా వస్తుందిలెండి?’

‘లక్షలు పోసి చదివించాం పిల్లలను. ఎందుకూ పనికిరాకుండా పోయారు. తప్పు వాళ్లదే..’

‘లంచాలివ్వకుంటే పనులు జరుగుతాయా? ఆ మాత్రం తెలియకపోతే ఎలా?’

‘తప్పంతా పాఠకులదే.. మేం రాసేవి మంచిపుస్తకాలు కాకపోవచ్చు. కానీ వాళ్లు అలాంటివే చదువుతున్నారు కనుక అవే రాస్తున్నాం’

‘మేం కమ్యూనిస్టులం. కానీ మా షాపుల్లో భారతరామాయణాలు, భగవద్గీతలు, భాగవతాలు, హస్తసాముద్రిక పుస్తకాలు.. ఇంకా కమ్యూనిజానికి బద్ధవ్యతిరేకమైనవన్నీ అమ్ముతాం. పాఠకులు వాటిని కొంటున్నారు కనుక. తప్పు మాది కాదు, వాళ్లదే’

‘…………………………………….’

‘…………………………………….’

‘…………………………………….’

నేరమేదైనా సరే బాధితులదే తప్పు! బాధితులు, పీడితులు లేకపోతే ఏ సమస్యా లేదని సూత్రీకరణ! పేదలు, అబలలు, అనాథలు, అభాగ్యులు లేని లోకం కోసం యమ పరితపించిపోతున్న ఈ దయామయుల, సమసమాజ స్వాప్నికుల, సున్నిత మనస్కుల ఆశయాలను నెరవేర్చడానికి బాధితులారా కదలండి! కదం తొక్కుతూ, పదం పాడుతూ కార్లకిందా, రైళ్లకిందా పడి చావండి! కామపిశాచాల అత్యాచారాలకు సహకరించండి! భూబకాసురుల ఆకలి తీర్చి గంగలో దూకండి! ఈ కరుణామయుల కలల సాకారానికి ఎన్నెన్ని రకాలుగా చావాలో, అన్నన్ని రకాలుగా చావండి!. ఛస్తే పోయేదేమీ లేదు, లోకం బాధలు తప్ప! !

*

 

 

నిశి వేళ

sani

చేమంతి: ఒక వేశ్య

పాండురంగ:ఒక విటుడు 

sani

పాండురంగ:    మన్మథుడు నన్ను చంపేస్తున్నాడు చామంతీ! నేనిక తట్టుకోలేను. వాడు చాలా క్రూరుడు.చామంతి:       వేశ్యని రాత్రికి మాట్లాడుకున్నావు, ఐదొందల నాణాలు చెల్లించావు, పక్క మీద చేరావు, తీరా ఇప్పుడు అటు తిరిగి పడుకొని మూలుగుతుంటే ఏమనుకోవాలి? ఇలాంటి చౌకబారు వేషాలు చూస్తే చిరాకొస్తుంది. డాన్సు హాల్లో వైను తాగి, ఊరికే కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నావు. అంతమందిలో ఏమీ తినకుండా వచ్చింది నువ్వొక్కడివే!. నేను చూస్తూనే ఉన్నాను. ఇప్పుడేమో బెల్టుదెబ్బలు తిన్న పిల్లాడి లాగా వెక్కిళ్ళు పెడుతున్నావు. ఇదంతా ఏంటి రంగా? నా దగ్గర దాచడ మెందుకు?

చామంతి:       నువ్వు కోరుకుంటోంది నన్ను కాదు. అంతవరకూ అర్థమైంది. నేన్నీకు మూడంగుళాల దూరంలో ఉన్నాను. ఇద్దరం నగ్నంగా ఉన్నాము. అయినా నీలో చలనం లేదు. కౌగిట్లోకి రావట్లేదు. నా ఒళ్ళు తగిలితే ఎక్కడ కదలిక వస్తుందోనని విప్పిన బట్టల్ని మూటకట్టి ఇద్దరి మధ్యా అడ్డుగా పెట్టావు. చెప్పు, నీ మనసులో ఉన్న ఆడదెవరో చెప్పు. నీకు సాయం చేస్తాను. ఇలాంటి సేవలు అందించడం నాకు కొత్తేమీ కాదు.

పాండురంగ:    ఆమె నీకు తెలుసు. నీక్కూడా ఆమె తెలుసనే అనుకుంటున్నాను. ఆవిడేమీ అసూర్యంపశ్య కాదు.

చామంతి:       ఆమె పేరేంటి?

పాండురంగ:    రంగనాయకి.

చామంతి:       రంగనాయకిలు ఇద్దరున్నారు. ఒకామె ఈ మధ్యనే కన్నెరికమయ్యి ప్రస్తుతం అవధాని ఉంచుకున్నావిడ. మరొకటేమో ‘నెరజాణ’ అని పేరుబడ్డది.

పాండురంగ:    ఆ నెరజాణే నాకు కావాల్సింది.

చామంతి:       ఓరి దేవుడా! నన్ను పిలిపించింది ఆ ముసలి లంజ పొందు కోసమని తెలిసుంటే అసలొచ్చేదాన్నే కాదు. తెల్లారుతోంది. కోడి కూసింది. నేనిక పోతా!

పాండురంగ:    తొందర పడకు చామంతీ! పోదువులే ఉండు! ఐతే రంగనాయకి ముసలిదే నంటావా? నిజమే అయ్యుండచ్చు. లేకపోతే తలపైన విగ్గెందుకు పెట్టుకుంటుంది, అలా పాలిపోయి, చర్మం మీద మచ్చలతో ఎందుకుంటుంది? ఇప్పుడు గుర్తొస్తే కంపరం పుడుతోంది.

చామంతి:       దాని అందాన్ని గురించైతే మీ అమ్మగార్ని అడుగు. స్నానానికి ఏటికెళ్ళినప్పుడు చూస్తారు గదా! దాని వయసును గురించైతే మీ తాతగార్ని అడుగు. ఆయన సరిగ్గా చెప్తారు.

పాండురంగ:    అట్లా ఐతే మనమధ్య ఈ అడ్డుగోడ ఇంకా ఎందుకు? ఆగు. ఈ బట్టల మూటని మంచం మీదనుంచి తీసేస్తాను. ఇప్పుడు మనం అడ్డు లేకుండా ముద్దాడుకోవచ్చు, ఒకరి ఒళ్ళు ఒకరం నిమురుకోవచ్చు. మంచి పిల్లల్లాగా కలిసిపోవచ్చు. అబ్బ, నీ తొడలెంత మృదువుగా ఉన్నాయి చామంతీ, వాటి మధ్య ఎంత ఆనందం పాతేసుకొని ఉందో తవ్వి చూడనీ!

*

మస్తు పరేషాన్ చేసే కవిత్వం!

నిశీధి 

“రేప్ ఇస్ రేప్…” అది మనిషిపై అత్యాచారం అయినా భూభాగాలని బలవంతంగా ఆక్రమించుకున్నా అని ఎవరన్నా అంటే తాళి కట్టిన దొరతనంలో  అయ్యగారు ఎన్ని సార్లు పశువులా ప్రవర్తించి పాశవిక ఆనందాలు పొందినా , అభివృద్ధి మంత్రం పేరు చెప్పి అందరు కలిసి ఆదివాసిలని అడ్డంగా దోచుకున్నా తప్పే కాదు అని నొక్కివక్కానించే ప్రభుత్వాలు ఉలిక్కిపడతాయేమో ఒక క్షణం . అందులోనూ చెప్పింది Carolyn Kizer లాంటి పులిట్జర్ ప్రైజ్ విన్నర్ లాంటి వాళ్ళు అంటే  కవులు సాహిత్యకారులతో పైసా లాభం ఉండదు కాని వీళ్ళతో మై పరేషాన్ పరేషాన్ పరేషాన్ హువా అని డ్రీంల్యాండ్ సాంగ్ ఒకటి వేసుకొని నెక్స్ట్ క్షణం ఆ  కలల ప్రపంచాన్నికూడా అమ్మి పెట్టె బేహారుల వేటలో పడిపోతుందేమో , ఏమయినా జరగోచ్చు ఆఫ్టర్ ఆల్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ది గ్రేట్ గవర్నమెంట్ డియర్ , కను  రెప్పకి తెలియకుండా కంటి పాపని ( పేరులో పాప ఉందని లోల్ ) రేప్ చేసేవాళ్ళని ని కూడా కాపాడే గొప్ప ఘన చరిత్ర కలిగినవాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా  చివరికి మిగిలేది  చరిత్ర చెక్కిళ్ళ మీద రక్తపుటేరులే కదూ. 
 
పోయెట్రి గురించి చదువుదామని వస్తే పోరంబోకు స్తలాలు అమ్ముకొనే వాళ్ళ మీద మాకు తెలియని టిప్పణిలా అని రీడర్స్ విస్తుపోయి బుగ్గలు నొక్కుకొనే లోపు  ఫెమినిజం అన్న పదం పుట్టక ముందే ప్రాక్టికల్ గా జీవితంలో  అక్షరాల్లో అటు ఆకాశంలో సగంకి  ఇటు అడుగంటిపోతున్న అవని తాలూకు ఆశావాదానికి   జరుగుతున్నఇన్ జస్టిస్ మీద తన స్వరం వినిపించిన కారోలిన్ (December 10, 1925 – October 9, 2014 , Pulitzer Prize for Poetry (1985), for Yin)  గురించి చదువుకోవటం ఉత్తమం 
 caro1
మనమేసుకున్న ముసుగులు మేలిమి ముత్యాల్లా మెరుస్తూనే ఉంటాయి అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఎక్కడ పగిలి మనం బయట పడతామో అని బెదిరిస్తూనే ఉంటాయి , అందుకే పూసుకున్న పై పూతలకే అందరం దాసులం అని చెప్పినా happiness is a Chinese meal,. While sorrow is a nourishment forever అని సంతోషాల క్షణకాల జీవితపు  మేడిపండు విప్పినా అది కచ్చితంగా కారోలిన్ కి మాత్రమే సాధ్యం . తన  మాటల్లో తన కవిత్వం గురించి చెప్పాలంటే ” ఎవరన్నా ఎదురుగా వచ్చి మొన్న మీర్రాసిన పొలిటికల్ పోయెం బాగుంది అంటే నేను ఆనందంతో  ఆశ్చర్య పోతాను అయితే అసలు పొలిటికల్ కానిది ఏది అని , అలాగే మీ ఫెమినిస్ట్ కవిత భలే ఉంది అన్నా అలాగే ఫీల్ అవుతాను , ఎందుకంటే నాది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ , నేను తీసుకున్న స్టాండ్ అవతల వాళ్ళకి అర్ధం అయినందుకు గర్వంగా అనిపిస్తుంది అంటారు . ( స్టాండ్ తీసుకోవటం , ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండటం అంటే ఏమిటి జీవితాలు అలా కూడా ఉంటాయా అనుకుంటారేమో నేటి కాలం రచయితలు ముఖ్యంగా కవులు ) 
 
కారోలిం లైఫ్ టైమ్లో ” A Muse of Water ”  ఎన్విరాన్మెంట్ మీద రాసిన గొప్ప కవిత అయినా  తప్పించుకోవటానికి వీలే లేకుండా మైథాలజీ చుట్టల్లో చుట్టేయండి స్త్రీ ని విలువల భారం అంతా ఆమె భుజాల మీద మోపి భూమికి ఆరడుగుల లోతున పాతరేయ్యండి తన వ్యక్తిత్వాన్ని అని క్లియర్ గా పురాణాల మీద అక్కడ నుండి స్త్రీ ఎలా ఉండాలి మొదలయిన నిర్వచనాలని అడ్డుకోతలో చూపిన Fearful Women కవిత ఎప్పటికి  ఫెమినిజం యూనివర్సిటీలో ఒక పూర్తి గ్రంధమే . 
 
యూరప్ పేరు వెనకే దాగుంది పశుత్వపు అత్యాచారం అంతా 
 
ఆమె చేయమంది కాబట్టి అంటూ  నిందానేరం మోస్తూ ఆమె అతనికి ఎప్పటికి చిన్న పక్కటేముకే 
 
చదువుకున్న స్త్రీ నుండి అపాయం ఉంది అందుకే నీ సహచరిని తాళం వేసి లొంగదియ్యి 
 
ఇలా ఒకో వాక్యంలో ఒకో మైథాలజీ చెత్తని తనదయిన స్టైల్ లో చీల్చి చెండాడుతూ రాసిన  ఈ కవిత మనల్ని కాసేపు అయినా పుక్కిటి పురాణాల పాతివ్రత్య కథల నుండి రక్షిస్తుంది , మరి చదువుకుందామా ? 
caro3
 
Fearful Women – Poem by Carolyn Kizer
 
 
Arms and the girl I sing – O rare
arms that are braceleted and white and bare
 
arms that were lovely Helen’s, in whose name
Greek slaughtered Trojan. Helen was to blame.
 
Scape-nanny call her; wars for turf
and profit don’t sound glamorous enough.
 
Mythologize your women! None escape.
Europe was named from an act of bestial rape:
 
Eponymous girl on bull-back, he intent
on scattering sperm across a continent.
 
Old Zeus refused to take the rap.
It’s not his name in big print on the map.
 
But let’s go back to the beginning
when sinners didn’t know that they were sinning.
 
He, one rib short: she lived to rue it
when Adam said to God, “She made me do it.”
 
Eve learned that learning was a dangerous thing
for her: no end of trouble would it bring.
 
An educated woman is a danger.
Lock up your mate! Keep a submissive stranger
 
like Darby’s Joan, content with church and Kinder,
not like that sainted Joan, burnt to a cinder.
 
Whether we wield a scepter or a mop
It’s clear you fear that we may get on top.
 
And if we do -I say it without animus-
It’s not from you we learned to be magnaminous. 
 
ఇదంతా చదివాక మన సీతలు ద్రౌపతులు అహల్యలు సావిత్రుల మీద సెకను పాటు అయినా జాలేసి వాళ్ళలా బ్రతక్కపోతే ఎలా అని  కండిషన్ తత్వాలు వల్లించే మనలో దాగున్న దెయ్యపు హృదయాలు  ఉలిక్కిపడతాయా ? లేదా యదా రాజ తదా ప్రజ సూత్రం ఫాలో అయిపొతాయో ? లేదా న్యూ ఫాషన్ కింద మళ్ళీ మనోభావాలు విరుచుకుంటాయో ? మన జీవితపు మేడిపండు రహస్యాలు తెలియంది ఎవరికి కదూ !
*
 

అలా మొదలు..పతంజలిలాగా రాయాలని…!

rsz_dsc_0092 (1)

చంద్రశేఖర్ ఇండ్ల

ఇప్పటికి అసలు కథలు ఎందుకు రాస్తారో తెలియదు నాకు, నేను మాత్రం కథలు రాసి డబ్బు సంపాదించాలని కథలు రాయటం ప్రారంభించాను, ఇంటర్ డిగ్రీ ల్లో వున్నప్పుడు  నాకు స్వాతీ బుక్ చదవడం అంటే చాల ఇష్టం, దాని లో వచ్చే సరసకతల పోటీ కి 10000 బహుమతులు అని వుంటే, ఎడతెరిపి లేకుండా కథలు రాసేసే వాడిని నా కున్న బూతు నాలెడ్జ్ ని ఆధారంగా  చేసుకొని. ఒక్క కథా పబ్లిష్ కాలేదు కదా, అసలు ఏమయ్యాయో కూడా తెలియదు, నేను మాత్రం నా డబ్బుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసేవాడిని. కోపం వచ్చేది. ఒక ఎనిమిది కథల తరువాత నేను రాసిన “వేర్ ఇస్ వన్ రూపీ కాయిన్” (సరస కథే అది కూడా పబ్లిష్ కాలేదు) అనే కథని నాకు తెలియకుండా నేనే జాగ్రత్తగా రాయడం గమనించాను (ఆ ఒక్క కాపి నా దగ్గర ఇప్పటికి బద్రంగా వుంది) ఎనిమిది కథలు రాసిన అనుభవం కాబోలు.

సలీం గారు రాసిన “రూపాయి చెట్టు” కథల సంపుటి దొరికింది మా బాబాయి ఇంట్లో. అది ఎందుకు చదివానంటే నా కంటే ఇయనేమి బాగా రాసాడో చూద్దామని, బాగానే రాసాడే అనిపించింది. ఆయన్ని కాపీ కొట్టాను, అంటే ఆయనెక్కడ చుక్కలు పెడతున్నాడు, ఎందుకు “ ఇన్వర్టెడ్ కామస్” వాడుతున్నాడు, ఎంత పెద్ద పేరాలు రాస్తున్నాడు అలాంటివి. కథ తయారయ్యింది, రచనలో కథల  పోటీ వుంటే స్వాతీని వదిలేసి (వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదని) దానికి పంపే. చాల కాలం తరువాత తెలిసింది నా కథ సెలెక్ట్ అయ్యిందని అదీ సాధారణ ప్రచురణకి, అక్కడా డబ్బులు రాలేదు.

ఎమ్మే నాటకరంగం చేరాక ఒక మా రాజీవ్ వెలిచేటి సర్ పతంజలి పుస్తకాల్ని పరిచయం చేసాడు. చదివా. ఇక అప్పటినుంచి పుస్తకాలు చదవటం మొదలుపెట్టా, సరస కథల్లోంచి బయటకొచ్చ, ఇక  పతంజలి గారి కథలు చదివి ఒక కథ,  ఇనాక్ గారి కథలు చదివి ఒక కథ, నామిని గారి కథలు చదివి ఒక కథ, ఇలా రాయడం మొదలుపెట్టా… అన్ని పత్రికల అడ్రసులు రాసుకొని అన్నిటికి కథల్ని తిప్పి తిప్పి పంపించడం మొదలుపెట్టా అబ్బే లాబం లేదు. బాదేసింది. అయిదు సంవత్సరాలు రాసిన ఆ కథల్ని చదువుకోవడం, మిగతా రచయితల కథలతో పోల్చుకోవడం, బహుషా ఈ లైన్ వల్ల, ఈ పదం వల్ల, నా కథ సెలెక్ట్ కాలేదేమో అనుకోవడం నా కథని మార్చడం ఇలాగె ఒక్కో కథని చాల సార్లు మార్చ. నా లక్ష్యం డబ్బులు సంపాదించడం దగ్గరనుంచి పేపర్లో నా కథ చూసుకోవాలి దగ్గరకొచ్చింది.

Ph.D లో వున్నప్పుడు గోవిందరావు శివ్వాల అనే తెలుగు లో ఎమ్మే  చేసి థియేటర్ ఆర్ట్స్ లో చేరిన ఒక జూనియర్ తో పరిచయం ఏర్పడింది. ఇక ఇద్దరం మాట్లాడుకోవటం, పుస్తకాలు షేర్ చేసుకోవడం, పోటా పోటీగా కథలు రాయటం, తప్పొప్పులు చెప్పుకోవటం ప్రారంభమయ్యింది. ఇప్పటి రచయితలు చాల మది స్వంత అనుభవాల్ని కథలుగా రాయటం గమనించా, నేను ప్రారంబించా, రాసా, “నీ కథను మాకు నచ్చింది సాక్షి లో వేస్తాం” అని పూడూరి రాజి రెడ్డి గారి దగ్గరనుంచి ఫోన్ వచ్చినప్పటి నుండి నిద్ర లేదు అది పుస్తకం లో చుసుకున్నదాక. పడింది. అందరికి చూపించుకొని ఆనందపడ్డ. అది మా సార్ కి చూపించి “పతంజలి గారి లాగా కథలు రాయాలని పిస్తుంది ఏమి చెయ్యల్సార్” అన్నప్పుడు, “వాళ్ళ సర్కిల్ వేరబ్బ” అని దానికి “వేరే ఆప్షన్ లేదు ప్రాక్టీసు తప్ప” అన్నాడు. అప్పుడర్డంయ్యింది నేను అయిదు సంవత్షరాలు ప్రాక్టీసు చేసాను కాబట్టి నా కథ సాక్షి లో సెలెక్ట్ అయ్యింది అని. అసలు రహస్యం తెలిసిపోయింది.

నా అనుభవాలు కథలు రాయటం మొదలు పెట్టా, నాకు నచ్చితే గోవింద్ కి చూపించటం లేకపోతే చిమ్పెయ్యటం. నచ్చినదాన్ని పత్రికలకి పంపించడం. ఇంతలో కథా గ్రూప్ మిత్రుడు మహి బెజవాడ పేస్ బుక్ లో కలవడం అతఃను కథా గ్రూప్ ని పరిచయం చెయ్యడం. వాళ్ళ కథలు చదవడం, డిస్కషన్ ల్లో పాల్గొనటం, నా కథలు చదివి వాళ్ళు సలహాలు ఇవ్వడం, వేంపల్లి షరీఫ్ గారు  నీ కథలో దృక్పదం ఏంటి అని అడగటం? ఇలాంటి చాల అనుభవాల తరువాత, నా కథలు చదివే వాళ్ళు ఉన్నారన్న  ఊపుతో నా పాత కథల్ని మల్లి చదివి పబ్లిష్ అవ్వడానికి దానిలో కొన్ని ట్రిక్కులు కలిప పంపిస్తే సెలెక్ట్ అయ్యాయి. ఒకటికాదు 2015 లో రెండు, 1250 రూపాయలు తెలుగు వెలుగు వాళ్ళు ఇచ్చారు. డబ్బులొచ్చాయి. నా ఫ్రెండ్స్ నా కథలు చదవటం మొదలెట్టారు. ఇప్పటికి నా కథను ఒక పెద్దరచయిత చదివి  ఒక్క కామెంట్ అయిన చేస్తే బాగుండు అని ఎదురు చూస్తా వుంటాను. అసలు పెద్ద రచయితలు మిగతా వాళ్ళ కథలు చదువుతున్నారా? అని ఆశ్చర్యం వేస్తుంది నాకు వాళ్ళ దగ్గర్నుంచి ఒక్క కామెంట్ రానప్పుడు.

ఇప్పుడు, స్వంత అనుభవాలు రాయటం బోరు కొడుతుంది, మిగతా రచయితల ని కాపి కొట్టి రాయటం బోరు కొడుతుంది.  అన్ని కథల్లాగే నా కథలు రాయటం బోరు కొడుతుంది, ఒకే పద్దతి కథలని పబ్లిష్ చేసే పత్రికలకి కథలు పంపటం బోరుకొడుతుంది, కొత్తగా రాయాలి, ఒక సారి రాసింది మళ్ళీ రాయకూడదు, కొత్త శిల్పాలు (సరియిన అర్ధం నాకు తెలియదు) తీసుకోవాలి అంటే సెక్స్, కామెడి, ఏడుపు, రొమాన్స్, బాధలు అన్ని రకాలు రాయాలని కోరిక. అందువల్ల ఒక్క సారి బాగుంది అన్న కథలాగే మల్లి రాయడం కుదరడంలేదు. కాని రాయడం ఆపటంలేదు. ఒక వేల నేను ఆపినా తెలుగు తెలియని నా భార్య మాత్రం “ఏంటి ఈ మద్య కథలు రాయడం లేదు” అని ఆడుగుతుంది. అందుకే నేను కథలు రాయడం ఆపను. కథా వస్తువులను పేపర్ లలో, బజార్లలో, మా ఊర్లో, మా ఇంట్లో, నా లైఫ్ లో వెతుక్కోవడం ప్రారంబించా… ఒక వస్తువు తీసుకోవడం దాన్లో వున్న నిజాన్ని సాగదీసో, పిండేసో, సూదీ దారంతో కుట్టేసో, వెనకది ముందు, ముందుది వెనక్కి పెట్టేసో దాన్ని అందరు ఈసీ గా ఇంటరెస్ట్ గా  చదివేలాగా కథలు రాయడమే ఇప్పటి నా ట్రిక్కు.

కాని కథల్ని కథల్లాగే పేద దానిలా వుంచటం నా కిష్టం లేదు, కథలతో డబ్బు సంపాదించాలన్న ఆశ మాత్రం ఇంకా చావలేదు. దానికి దారి కనుక్కోవాలి. నా నాటకానుభవం తో చెప్తున్నా, డబ్బులోస్తున్నాయని తెలిస్తేనే ఈ జనరేషన్ కథలవైపుకు వస్తారు, ఈ జనరేషన్ కథలవైపుకు వస్తేనే కథలు చదివేవాళ్ళు ఎక్కువమంది అవుతారు. కథలు చదివేవాళ్ళు ఎక్కువ మంది అయితేనే కథకు విలువ పెరిగి, కొత్త రచయితలు పెరుగుతారు. చాలామంది కథను నా తృప్తి కోసం రాస్తున్న అని చెప్తున్నప్పుడు నాకు ఇప్పటికి ఆశ్చర్యం వేస్తుంది. అంతే..

*

నాలోని ఇంకో రూపానికి..

పుష్యమి సాగర్

 

నాలోకి నేను
ప్రవహించే నదిని అయిపోవాలని
గల గలా పరవళ్ళు తొక్కుతూ, ఒడుపు గా
ఒక్కో చినుకై అంబరాన్ని తాకాలి
చేప లా ఈదుతున్న ఆలోచనలని
గాలం వేసి పట్టాలి
ఒక్కో ఎర ని జాగ్రత్త గా చూపి
కలం లో కవితలా, కుంచెలో రంగు లా
నా మనః పలకంపై చిత్రించాలి
పాదాలను ముద్దాడుతున్న
మట్టి పెళ్ళల అల్లర్లు ఇంకా
స్మృతి పధం నుంచి తొలగలేదు
నది ఒడ్డున కట్టిన పిచ్చికగూళ్ళు
తలుపులు తెరిచి రమ్మంటాయి
అక్షరమై కాగితం లో నిద్రపోవాలన్న
ఆరాటాన్ని గుండెకు హత్తుకోమంటాయి
ప్రకృతే వికృతి గా విరుచుకుపడిన
శకలాల రహదారుల్లో వెన్ను చూపక
ప్రాణం కంటే మరేది విలువ లేదని
గొంతు విప్పి, దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తాను
నన్ను నేను తరచి చూసుకోవాలి
మానవత ని వదిలేసిన క్రూరత్వాన్ని
నిప్పు లో కాల్చి , పునీతుడనై
లోకం లో నిలబడగలగాలి
ఒక్కో ఘటన సంకెళ్ళు తెంచుకొని
నా పై యుద్ధం ప్రకటించినపుడు
ధీరుడి లా పోరాడి
కన్నీటికి వెరువక
విషాదాల వాకిట రెపరెప లాడుతాను
నాలోని ఇంకో రూపానికి
నేను జవాబుదారి
నిన్న అన్నది కుబుసం విడిచిన పాములాంటిది అని
వర్తమానాన్ని తాగుతూ
కబళించే నిజాన్ని గొంతులోనే నోక్కేసినపుడు
ఓ ముద్దాయి లా ప్రశ్న ముందు నిల్చుంటాను
 పశ్చాతాపం నన్ను దహించివేస్తుంది
ఎందుకంటే ఇప్పుడు నేను నిలువెత్తు అబద్దాన్ని …!!!
sagar
*

కాగితం

శివుడు 

పిచ్చి గీతలు గీసాను, కొట్టేసాను, నలిపిపడేసాను, చించి విసిరేసాను

ఎమీ మాట్లాడవు, మౌనంగా ఉంటావు,

ధ్యానానికి తయరాయ్యే యోగి మనస్సంత నిర్మలంగా కనిపిస్తావు.. మళ్ళీ ఉపక్రమించమని !

 

మళ్ళీ ఎదో రాయడం మొదలవుతుంది, ఏ ఆలోచనో ఎక్కడికో తీసుకెళ్తుంది

బాగుంటే ముచ్చటపడి, మురిసి మొగ్గలేస్తాను

నచ్చకపోతే ముక్కలు చేసి పడేస్తాను

నిజానికి బాగోనిది నా భావన, ముక్కలైనవి నా అక్షరాలు

కానీ శిక్ష నీకు, మాట్లాడలేవు కదా!

మాట్లాడలేవన్న మాటే కానీ మదిలో కలిగే భావాలకి ప్రతిబింబానివి !!

 

వెల్లవేసిన తెల్లగోడలా మళ్ళీ ‘నేను తయారు’ అని కనిపిస్తావు

ఇంపైన రంగులతో నింపుతావో లేక ఇష్టానికి చల్లుతావో నీ ఇష్టం అన్నట్టు !

ఆరంభ శూరత్వంతో ప్రాంభమవుతుంది మళ్ళీ  ఏదో రాత,

కాస్త ఆలోచనకి పదును పెట్టి మళ్ళీ ప్రయత్నించు అని అన్నావని నిన్ను చెత్తబుట్టలో పడేసాను

అదినీ స్థాయి కాదు, నా భావుకత స్థాయి!

 

వర్షం వెలిసిన ఆకాశంలా మళ్ళీ నిర్మలంగా కనిపిస్తావు,

విహంగా శ్రేణినే ఊహిస్తావో, ఇంద్రధనుస్సునే చిత్రిస్తావో లేక కారు మబ్బులతో నింపేస్తావో నీ ఇష్టం అన్నట్టు !

మళ్ళీ మొదలైంది అక్షరాల పేర్పు

చూస్తే, శబ్దం తప్ప అర్ధం లేని రాతల మోత,

ఈసారి కూడా నీకు అదే మర్యాద!

 

నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది,శబ్దార్ధాలు సంగమించే వరకూ నీతోనే అని ప్రోత్సహిస్తున్నట్టు

ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా కనిపిస్తావు

ఒకటి మాత్రం చెప్పగలను, నిన్ను అందలం ఎక్కించే వరకూ ప్రయత్నిస్తునే ఉంటాను

మరో జనగణమన కాకపోవచ్చు కానీ రణగొణధ్వనం మాత్రం కాకూడదు అనిపిస్తుంది నిన్ను చూస్తే!

 

శబ్దమనే శరీరానికి అర్ధం ఆత్మ ఐతే, ఆ శబ్దార్ధాల సంగమమే నీకు ఆత్మ!

ఆత్మ దేహాన్ని విడిచి మరో దేహం లోకి ప్రవేశించినట్టు నువ్వు జీర్ణమైపోతే ఆ భావాత్మ మరో శరీరం లో కనిపిస్తుంది,

తాళపత్రం అని కాగితం అని, e-paper అని కాలాన్ని బట్టి నీ ఆకారం మారచ్చేమో గానీ,

మొత్తంగా చూస్తే ఒకటే, భావాత్మ వసించే శరీరానివి!

sivudu

*