సుమేరులోనూ ఉన్నాడు శివుడు!

కల్లూరి భాస్కరం

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చెప్పబోయే విషయం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నదే కానీ, మరోసారి గుర్తుచేసుకోవలసిన అవసరం వచ్చింది…

ఏదైనా ఒక రచనను– ఇద్దరో ముగ్గురో కలసి రాసినట్టు ప్రత్యేకంగా చెప్పకపోతే– ఒక్కరు రాసింది(ఏకకర్తృకం)గానే  అనుకుంటాం. నిజానికి ఏ రచనైనా అనేకమంది రాసినదే(బహుకర్తృకం) అవుతుంది కానీ, ఏకకర్తృకం కాదు.  ఆ అనేకమంది మరెవరో కాదు; పాఠకులే! ఆ పాఠకులలో మళ్ళీ వేర్వేరు అభిరుచులు, అవగాహన భేదాలు ఉన్నవాళ్ళు ఉంటారు. కనుక ఒక రచన చేస్తున్నప్పుడు రచయిత దృష్టిలో కేవలం ఆ రచనావస్తువు మాత్రమే ఉండదు. వేర్వేరు అభిరుచులూ, అవగాహన భేదాలూ ఉన్న పాఠకులు కూడా ఉంటారు. తెరముందుకు వచ్చి రాస్తున్నది రచయితే అయినా, తెరవెనుక ఉండి ఆ రచన ఎలా ఉండాలో, తమకు ఎలా అందాలో నిర్దేశించేది ఈ వైవిధ్యం కలిగిన పాఠకులే. అందుకే రచయిత తన రచన ఎవరిని ఎలా తాకుతోందో నిరంతరం పరిశీలించుకుంటూనే ఉంటాడు. వారిని చేరేందుకు వీలైన వ్యూహాలు, ఎత్తుగడలు ఎప్పటికప్పుడు అప్రయత్నంగా రచించుకుంటూనే ఉంటాడు. రచనలో అవి కూడా భాగమవుతాయి.

ఆ మాటకొస్తే జీవితంలో కానీ, రచనా జీవితంలో కానీ ప్రతిదీ ఒక వ్యూహాన్ని అనుసరించే వెడుతుంది. అసలు రచన అంటేనే ఒక వ్యూహం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం, లేదా సంభాషణ ఎప్పుడు ప్రారంభమవుతుందో  అప్పుడే వ్యూహం అడుగుపెడుతుంది. ఇక్కడ వ్యూహం అనే మాటను తటస్థార్థంలోనే తీసుకోవాలి తప్ప వ్యతిరేకార్థంలో కాదు.

ఈ బహుకర్తృత్వ సూత్రం సినిమా, నాటకం లాంటి దృశ్యరచనలకూ వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ పాఠకుల స్థానంలో ప్రేక్షకులు వస్తారు. ఇదే మౌఖిక వాఙ్మయంలోనూ, నాటకం వంటి దృశ్య కళా రూపాలలోనూ అయితే శ్రోతలు, లేదా ప్రేక్షకులు ప్రత్యక్షంగా ఉండి కథకునీ, నటునీ, ఒక్కోసారి వస్తువునూ ప్రభావితం చేస్తారు. లిఖిత వాఙ్మయంలోనూ, సినిమా వంటి ఆధునిక దృశ్యకళారూపాలలోనూ పాఠకులు, ప్రేక్షకులు పరోక్షంగా ప్రభావితం చేస్తారు. అంతే తేడా!

తన రచన ఏయే పాఠకులను ఎలా తాకుతుందో, లేదా తాకాలని తను అనుకుంటున్నాడో చెప్పుకున్న కవి నాకు ఇప్పటికిప్పుడు ఒక్కరే గుర్తుకొస్తున్నారు. ఆయన, నన్నయభట్టు. పాఠకులను మూడు రకాలుగా వర్గీకరించుకుని ఆ మూడు రకాలవారినీ సంతృప్తి పరచేలా తన రచన ఉంటుందని, లేదా ఉండాలని ఆయన అనుకున్నారు. అంటే ‘వ్యూహ’ రచన ముందే చేసుకున్నారన్న మాట. ఆయన వర్గీకరణ ప్రకారం, కవీంద్రులు మొదటి రకం. వీరు తన రచనలోని ప్రసన్నకథతో కూడిన అర్థయుక్తిని లోతుగా చూసి మెచ్చుకుంటారు.  కవీంద్రులు కాకపోయినా శ్రావ్యతను ఆనందించేవారు రెండవ రకం. వీరు తన అక్షరరమ్యతను ఆదరిస్తారు. కవీంద్రులూ, శ్రావ్యతను ఆనందించేవారూ కాని ఇతరులు మూడవ రకం. చక్కని అర్థవంతమైన తన సూక్తులను వీరు ఇష్టపడతారు.

***

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం దేనికంటే, 21 వ్యాసాల క్రితం నలదమయంతుల కథతో ప్రారంభమై, అక్కడినుంచి ఓడిసస్ కథకు, ఆ తర్వాత అమ్మ తాత్వికతకు మళ్లిన ఈ వ్యాసాలు ఒక  పెద్ద గొలుసుకట్టు తంతుగా సాగిపోతున్నాయి. ఇది ఎక్కడ తెగుతుందో ఈ క్షణాన నాకు కూడా తెలియదు. అదలా ఉంచితే, ఈ వ్యాసపరంపర రాను రాను మరీ తాత్విక విషయాల్లోకి జారిపోవడమూ మీరు చూస్తూనే ఉన్నారు. దానికితోడు ఇంకా ‘అమ్మ తాత్వికత’ చుట్టూనే ఈ వ్యాసాలు తిరుగుతున్నాయి. ఇక్కడనుంచి  ‘అయ్య తాత్వికత’ లోకి వెళ్ళడం నా ప్రణాళిక. తీరా వెళ్ళిన తర్వాత అందులోంచి కూడా ఎప్పటికి పైకి తేలగలనో తెలియని పరిస్థితి. దాంతో ఇప్పుడు నేను కూడా పనిగట్టుకుని నన్నయభట్టులా పాఠకులను వర్గీకరించుకుని,  వీలైనంత ఎక్కువమందితో అనుసంధానం(connect) అవుతానో, లేదో చూసుకోవలసిన అగత్యంలో పడ్డాను(అంతటి వ్యక్తితో నన్ను పోల్చుకుంటున్నానని చటుక్కున అపార్థం చేసుకోవద్దు. ఆయన ఎదుర్కొన్న పరిస్థితితో మాత్రమే ఈ పోలిక).

తాత్విక విషయాల మీద అందరికీ రుచి ఉండదని నాకు తెలుసు. ఎవరివరకో ఎందుకు, నాకు కూడా నేల విడిచి సాము చేసే శుద్ధతాత్వికత మీద గొప్ప రుచి ఉందని చెప్పలేను. నావరకు అది రుచికరం కావాలంటే, చరిత్ర అనే తాలింఫును జోడించాల్సిందే. అప్పటికీ తాత్విక విషయాలు పడని పాఠకులు ఉండిపోతారనుకుంటే బహుశా చరిత్రాంశాలు వారికి రుచి కలిగించవచ్చు. పోనీ అదీ కాదనుకుంటే మన పురాణకథలు, దేవీ దేవతలు, ప్రతీకలతో; ఇతర పురాణ కథలకు, దేవీ దేవతలకు, ప్రతీకలకు ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలు ఆకట్టుకోవచ్చు. ఇలా పాఠకులను ఇంకా అనేక రకాలుగా వర్గీకరించుకునే అవకాశం ఉంది కానీ, దానిని మీ ఊహకే వదిలేసి ప్రస్తుతానికి ఒక ఆశ్చర్యకరమైన పోలికలోకి వెడతాను.

ఇంతకుముందు ఒక వ్యాసంలో ‘జంటగొడ్డలి చెప్పే జగజ్జనని తత్వం’ గురించి చెప్పుకున్నాం. జంటగొడ్డలి కాకపోయినా, గొడ్డలి ప్రస్తావన లలితాసహస్రనామాలలో రెండు చోట్ల వస్తుంది. ఒకచోట అమ్మవారు ‘భవారణ్య కుఠారిక’. అంటే, సంసారమనే అరణ్యానికి గొడ్డలి. ఇంకోచోట ‘మృత్యుదారు కుఠారిక’. అంటే, మృత్యువు అనే చెట్టుకు గొడ్డలి. ఈ గొడ్డలి  కాకతాళీయంగా చేసిన ఆలంకారిక ప్రయోగం కావడానికి ఎంత అవకాశం ఉందో, ‘జంట గొడ్డలి’ని సూచించే ప్రతీక కావడానికీ అంతే అవకాశం ఉంది. ఎలాగో ముందు ముందు స్పష్టం కావచ్చేమో చూద్దాం.

 ‘జంట గొడ్డలి’ క్రీటు(మినోవన్)మతానికి చెందిన ప్రతీకలలో ఒకటి. అలాగే స్తంభమూ, ఎద్దు కొమ్ములూ కూడా. క్రీటు మతంలో సర్పం, పావురం వగైరాలతో పాటు వృషభం కూడా ముఖ్యమైన జంతువు. పంది లానే వృషభం కూడా పురుషుడిలోని పునరుత్పాదక శక్తికి ప్రతీక. పశువుల మందకు ప్రభువుగా దానిని పశుపతి అని కూడా అనచ్చు.  మనదేశంతో సహా వివిధ పశుపాలక, వ్యవసాయ సమాజాలలో నేటికీ ఎద్దును, ఆవును పూజించడం ఉంది.  యూరప్ కు చెందిన నూతన శిలాయుగ అవశేషాలలో వృషభ మూర్తులు కనిపించడం, అక్కడ కూడా వృషభ ఆరాధన ఉండేదనడానికి సూచన.

ఇక స్తంభం పవిత్ర వృక్షానికి సంకేతం. ఆదిమ సమాజాలలో వంటచెరుకు కోసం గొడ్డలితో చెట్లు నరకడం స్త్రీలే చేసేవారనీ, ఆవిధంగా గొడ్డలికి పవిత్రత వచ్చి ఉండచ్చనీ జార్జి థాంప్సన్ అంటారు. నిజానికి అన్న ఉత్పాదనకు ఉపయోగించే ప్రతి సాధనమూ పవిత్రమే. చెట్లను కూల్చుతుంది కనుక గొడ్డలికి పిడుగుపాటుతో పోలిక కుదిరి, వర్షానికి సంబంధించిన మాంత్రిక చర్యలలో భాగమైంది. ఆ తర్వాత గొడ్డలి యుద్ధసాధనం అయింది. మనకు బాగా తెలిసిన పరశురాముడి ఆయుధం గొడ్డలి.  పరశురాముని పోలిన పాత్ర గ్రీకు పురాణాలలోనూ ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్లలేం. ‘పరశువు’ అంటే గొడ్డలి.  అది జంతువును బలి ఇవ్వడానికి ఉపయోగించే సాధనం కూడా. క్రీటు మతంలో బలి ఇచ్చే జంతువులలో ముఖ్యమైనది వృషభం. పవిత్ర వృషభ రక్తంతో స్పర్శ వల్ల గొడ్డలికి పవిత్రత సిద్ధించి దాని శక్తి మరింత పెరిగింది.

క్రీటు అమ్మవారి సేవలలో ప్రధానంగా పాల్గొనేది స్త్రీలే, అంటే పూజారిణులు. వీరికి సహకరించడమే పురుషులు చేయవలసిన పని. ఈ పూజారిణులు కొన్ని తంతులలో నృత్యం చేస్తారు. మైసీనియాలో దొరికిన ఒక బంగారు ఉంగరంపై ఉన్న చిత్రంలో ఒక పూజారిణి నృత్యం చేస్తుంటే, ఇంకొక పూజారిణి ఒక పీఠం మీద తలవాల్చి శోకిస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఒక పురుష సేవకుడు వంగి ఒక చెట్టు ఫలాన్ని తెంపుతూ ఉంటాడు. సరే, మన పురాణాలలో శివుడు నటరాజు.

ఇప్పుడు మనం ఒకసారి క్రీ.పూ. 2500 నాటి సుమేరుకు వెడదాం. ఫిలడెల్ఫియా లోని యూనివర్సిటీ మ్యూజియంలో ఆ కాలానికి చెందిన ఒక మట్టిపలక ఉంది. దాని మీద ఒక చిత్రం ఉంది. దాని పేరు, Moon-Bull and Lion-Bird. అందులో మానవ ముఖం కలిగిన ఒక వృషభమూ, దానిని చంపుతున్న సింహముఖం కలిగిన ఒక గరుడపక్షీ కనిపిస్తాయి. అయినాసరే, వృషభ ముఖంలో ఒకవిధమైన ప్రశాంతతా, ఆనందమూ ఉట్టిపడుతూ ఉంటాయి.  జోసెఫ్ క్యాంప్ బెల్ (Occidental Mythology) వివరణ ప్రకారం, చంద్ర సంబంధి అయిన వృషభం, చంద్రుడిలానే జనన మరణ చక్రానికి ప్రతీక. దానిని చంపుతున్న గరుడపక్షి సూర్య(సౌర) సంబంధి. ఆ వృషభం నాలుగు కాళ్లనుంచీ దివ్యశక్తి మెరుపులు జాలువారుతూ ఉంటాయి. దాని మానవ ముఖానికి నలుచదరపు ఆకారంలో గడ్డం ఉంటుంది. అది ప్రాచీన సుమేరు, ఈజిప్టులకు చెందిన చిత్రశైలిని సూచిస్తుంది. సర్పమూ, వృషభమూ లాంటి దేవతా సంబంధులకు ఇలాంటి గడ్డమే ఉంటుంది. భూమిలో విత్తనాలు నాటడానికి ఇది ప్రతీక.

ఈ వృషభం ముంగాలు ఒకటి ఒక గుట్ట మీద ఆని ఉంటుంది. ఈ గుట్ట పవిత్ర విశ్వపర్వత శిఖరానికీ, భూదేవి దేహానికీ ప్రతీక. కింది భాగంలో కొమ్ములు లాంటివి కనిపిస్తున్నాయి. అవి క్రీటుకు చెందిన పవిత్ర శృంగాలను పోలి ఉన్నాయి. వృషభదేవునికీ, భూదేవికీ మధ్య అనుసంధానం కలిగిస్తున్నవి ఈ కొమ్ములే. ఆ కొమ్ముల మధ్యలో వృషభం కాలు ఒకటి చొప్పించబడి ఉంది. రెండు కొమ్ముల మధ్య ఆ కాలు ఒక త్రిశూలాకారాన్ని కల్పిస్తోంది. వృద్ధి క్షయాలకు ప్రతీక అయిన ఈ వృషభచంద్రుడి నుంచే, చంద్రుడి నుంచి కురుస్తున్నట్టుగా, జీవుల పునరుత్థానానికి అవసరమైన మంచు, వాన కురుస్తున్నట్టు ఈ చిత్రం సూచిస్తుంది. మంచు, వాన అనేవి భూగర్భాన్ని ఫలవంతం చేసే వీర్యాలు.

క్యాంప్ బెల్ ప్రత్యేకించి చెప్పకపోయినా, సింహముఖం కలిగి, సూర్య సంబంధి అయిన గరుడపక్షి వృషభాన్ని కబళించడమంటే జీవిని కాలం కబళించడమే. మన పురాణాల ప్రకారం కూడా కాలానికి సూర్యుడే కారకుడు. కాలంలోనే చావు, పుట్టుకలు సంభవిస్తూ ఉంటాయి. ‘కాలుడు’ అనే పేరు కూడా కలిగిన యముడు సూర్యుని కొడుకే.

sun lion

మళ్ళీ క్యాంప్ బెల్ వివరణకు వెడితే, భూమి అడుగున నీరు ఉంది. క్రీటు-మైసీనియాకు చెందిన దేవుడు పోసెడియన్. అతని వాహనం వృషభం. అతను త్రిశూలం ధరిస్తాడు. సముద్రాలు, ఊటబావులు, పాతాళ జలాలు అతని నివాసాలు. అలాగే, భారతీయ దేవుడు శివుడి వాహనం కూడా వృషభమే. ఆయన చేతిలో కూడా త్రిశూలం ఉంటుంది. ఆయన అర్థాంగి పార్వతి పేరు పర్వత పుత్రిక అని సూచిస్తుంది. ఆమె వాహనం సింహం. శివుడు పార్వతితో కలసి కైలాసపర్వతం మీద ఉంటాడు. ఆయన ప్రధానంగా లింగరూపంలో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆయన పాతాళ జలాల నుంచి పైకి వచ్చే లింగమైతే, భూమి యోని.

శివుడు నటరాజు కూడా. ఆయన తన కుడి పాదాన్ని అజ్ఞానమనే మరుగుజ్జు మీద ఉంచి అణగదొక్కుతూ ఉంటాడు. ఎడమకాలిని కుడికాలికి అడ్డంగా పైకి ఎత్తుతాడు. కుడిపాదంతో జీవసృష్టికి అవసరమైన తన సృష్టిశక్తిని అందిస్తున్నాడనీ, ఎడమపాదంతో జీవులను జన్మ నుంచి విముక్తుల్ని చేస్తున్నాడనీ ఈ భంగిమ సూచిస్తుంది, ఆవిధంగా నటరాజమూర్తి జననమరణ చక్రానికి ప్రతీక. పై సుమేరు చిత్రంలోని వృషభం తన ముందు కాళ్లను చాపిన తీరు కూడా ఆ భంగిమనే సూచిస్తోంది.

నటరాజు గురించి మరికొన్ని వివరాలు చెప్పుకునే ముందు, ఇంకొకటి చూద్దాం. సుమేరు పట్టణమైన ఊర్(ఊరు)లోని రాచసమాధులలో షుబ్-అద్ అనే రాణిని సమాధి చేసిన చోట వెండితో చేసిన గోముఖం ఒకటి కనిపించింది. ఆమె భర్త అ-బర్-గి సమాధిలో బంగారు వృషభ ముఖం దొరికింది. దానికి కూడా నలుచదరపు గడ్డం ఉంది. దానిని చిన్న వీణమీద తాపడం చేశారు. ఈ వీణ వృషభచంద్రుని ఆహ్వానించే గీతికి ప్రతీక. అలాగే, తన ప్రియుడైన భర్తతో కలసి మృత్యులోకానికి రమ్మని రాణిని ఆహ్వానించడానికి కూడా ప్రతీక. రాణి తన పరివారంతో కలసి భర్తతో సహగమనం చేసినట్టు ఈ మొత్తం వివరాలు సూచిస్తాయని క్యాంప్ బెల్ అంటారు.

nataraju

మెసపొటేమియాకు చెందిన వేరొక ఉదంతం వృషభాన్ని ఎలా బలి ఇచ్చేవారో చెబుతుంది. ఢంకా, లేదా డమరుకాన్ని వృషభచర్మంతో తయారు చేస్తారు. ఇది వృషభం ప్రాముఖ్యాన్నే కాక, పురా ప్రపంచం తాలూకు తంతులలో కళా రూపాలకు, వాద్యాలకు గల ప్రాధాన్యాన్ని కూడా సూచిస్తుంది. ఒక దేవాలయంలో కొత్త డమరుకాన్ని తయారు చేసుకోవలసి వచ్చింది. అందుకు ముందుగా చేయవలసింది ఒక వృషభాన్ని బలి ఇవ్వడం. బలికి అన్ని వృషభాలూ పనికిరావు. వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఉదాహరణకు, దానికి సంపూర్ణంగా రూపొందిన కొమ్ములు, మూపురం ఉండాలి. అది నల్లటిదై ఉండాలి. ఒంటి మీద ఎటువంటి గాయాల గుర్తులూ ఉండకూడదు.

నేలమీద దర్భలు పరచి వృషభాన్ని వాటి మీద ఉంచుతారు. మేక వెంట్రుకలతో పేనిన తాళ్ళతో దాని కాళ్ళు కట్టేస్తారు. వృషభ బలికి ముందు ఒక గొర్రెను బలి ఇస్తారు. ఆ తర్వాత వృషభం నోటిని నీటితో శుద్ధి చేసి దర్భలు పట్టుకుని దాని చెవిలో గుసగుసగా మంత్రాలు చదువుతారు.  తర్వాత దానిని దేవదారు చెట్టునుంచి స్రవించే జిగురు లాంటి ద్రవంతో సంప్రోక్షిస్తారు. ఆ తర్వాత నిప్పుల పాత్రతో, కొరకంచుతో ప్రతీకాత్మకంగా వృషభాన్ని మంత్రపూతం చేస్తారు. ఆ తర్వాత వృషభం చుట్టూ పిండితో ముగ్గు పెట్టి కత్తితో దానిని వధిస్తారు. గుండెను వేరు చేసి, దానిని పాత డమరుకం ముందు ఉంచి, ఒక ప్రత్యేక తరహాకు చెందిన పిండితో కలిపి దేవదారు, సైప్రెస్ కలపతో దగ్ధం చేస్తారు. దాని ఎడమ భుజం నుంచి స్నాయువులను(ఎముకతో కండరాన్ని అతికే తంతులు) తొలగించి, చర్మాన్ని ఒలిచి, మిగతా కళేబరాన్ని పశ్చిమ ముఖంగా ఉంచి సమాధి చేస్తారు. చర్మాన్ని ఒలవడానికి కూడా కొన్ని కచ్చితమైన నిర్దేశాలూ, పద్ధతులూ ఉంటాయి. ఆ చర్మాన్ని కొత్త డమరుకం చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ బలి ఇచ్చే ప్రక్రియ అచ్చంగా మన వైదికమైన తంతును గుర్తు చేయడమే కాక, ఆదిమ సమాజాలలో ప్రతి చిన్న కర్మకూ (ఇక్కడ కొత్త డమరుకం చేయడానికి అవసరమైన ఎద్దు చర్మం కోసం) ముందు ఎంత పెద్ద తంతు జరిపేవారో కూడా చెబుతోంది.

ఇప్పుడు క్యాంప్ బెల్ వివరణలోకి మరోసారి వెడితే…

వృషభచంద్రుడు విశ్వంలోని లయ(rhythm)కు కర్త. అతని గీతికి అనుగుణంగా జీవులన్నీ జననమరణాల వలయంగా ఏర్పడి నృత్యం చేస్తూ ఉంటాయి. డమరుక ధ్వనులు, ఆలయంలోని ఇతర వాద్యధ్వనులు అందులో భాగమే. గరుడపక్షి కబళిస్తున్న వృషభం ముఖంలో కనిపించే ప్రశాంతత మరణానంతర జ్ఞానానికీ, కాలాతీత జ్ఞానానికీ సూచన. వృషభ మరణం నిజానికి మరణం కాదు. అది భూమిపైన జీవులకు సంజీవిని. అది పైకెత్తిన ముంగాలూ, క్రీటు పౌరాణిక చిహ్నమైన ఎడమ కొమ్మూ దీనినే సూచిస్తాయి. ఈ చిహ్నం భూమ్యాకాశాలకు; అంటే దేవీ, దేవుళ్ళ కలయికకు కూడా ప్రతీక. వీరు రెండుగా కనిపించినా, ఒక్కరే. అంటే, అర్థనారీశ్వరం. రెండుగా కనిపించడం ద్వైతం. ఒకరుగా కనిపించడం అద్వైతం.

ప్రాచీన సుమేరు పురాణ కథలో ‘అన్’ అంటే స్వర్గం. ‘కి’ అంటే భూమి. దానినే స్త్రీ పురుషులకు అన్వయిస్తే, స్వర్గం పురుషుడు. భూమి స్త్రీ. వీరు మొదట అవిభాజ్యంగా ‘అంకి’ అనే పర్వతరూపంలో ఉన్నారు. ఆ తర్వాత ‘ఎన్ లిల్’ అనే కొడుకు పుట్టి వీరిని రెండుగా విడదీశాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మాత్రం చెప్పుకుని మిగతా వివరాలలోకి తర్వాత వెడదాం. అదేమిటంటే, ఈ సుమేరు ‘అంకి’ నుంచే ‘ఎంకి’, ‘వెంకి’, ‘వెంకటేశ్వరుడు’ అవతరించాడని రాంభట్ల అంటారు.

అదలా ఉంచితే, సుమేరు మట్టిపలక మీది వృషభంలో కనిపించే లక్షణాలే నటరాజులోనూ కనిపిస్తాయి. ఆయన ఒకచేతిలో డమరుకం పట్టుకుంటాడు. డమరుక ధ్వని కాలానికి సంకేతం. అది సృష్టిని సంకేతించే ధ్వని కూడా. ఇంకొక చేతిలో అగ్ని ఉంటుంది. అది మృత్యుంజయత్వాన్ని సూచించే జ్ఞానాగ్ని. అది జీవికి కాలంతో ఉండే ముడిని దహిస్తుంది. వృషభం తన నాలుగు కాళ్లనుంచి జ్వాలలు విరజిమ్ముతున్నట్టే, శివుడు కూడా విరజిమ్ముతుంటాడు. తన జటాజూటంలో మృత్యుసూచిక అయిన కపాలాన్ని, చావు పుట్టుకల సంకేతమైన చంద్రవంకను ఆభరణాలుగా ధరిస్తాడు. శివుడు పశుపతి. అలాగే సుమేరు మహాదేవుడైన దుముజి, ఇతర చోట్ల ఆయన ప్రతి రూపాలైన తమ్ముజ్, అడోనిస్ లు కూడా పశుపతులే. శివుడికి నందిలానే వీరి జంతువు కూడా వృషభమే. గ్రీకుదేవుడు డయోనిసస్ కూడా శివుడిలానే నటరాజు. వధిస్తున్న సింహమూ, వధింపబడుతున్న వృషభమూ కూడా ఆయన రూపాలే.

మన శివుడి ప్రతిరూపాలు, శివతత్వం దాదాపు ప్రపంచవ్యాప్తమని ఈ వివరాలు చెబుతున్నాయి.

మిగతా విశేషాలు తర్వాత….

 

 

 

 

మీ మాటలు

  1. Saradhi Motamarri says:

    భాస్కరం గారు, ఒక విధంగా మన వేద వాంగ్ మయం సుమేరు తరువాతదనిన మీ భావన. ఎందుకో ఇది సమంజసం కాదనిపిస్తుంది. విశాల భారతావనిలో నాగరికత ముందే వెల్లివిరిసినదని నా అభిప్రాయమండి. సింధు శిలాపలకాలపై కూడా ఎద్దు ఉన్నట్లు గురుతు.

  2. కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు సారథిగారూ…
    “ఒక విధంగా మన వేద వాంగ్ మయం సుమేరు తరువాతదనిన మీ భావన. ఎందుకో ఇది సమంజసం కాదనిపిస్తుంది.”
    –ఇవి ఇంకా కొనసాగుతున్న వ్యాసాలు కనుక చివరివరకూ వెడితే తప్ప, నా భావన గురించిన మీ భావనపై ఇప్పుడేమీ చెప్పలేను. అంతవరకూ సస్పెన్స్ తప్పదు.
    కాకపోతే ఒక మాట. మీరు ‘భావన’, ‘అభిప్రాయం’ అనే రెండు మాటలు వాడారు. ఇలాంటి విషయాల్లో మనలో చాలామందికి కేవలం కొన్ని భావనలు, అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. ఉండడంలో తప్పులేదు కానీ, వాటికి నికరమైన అధ్యయనాన్ని జోడించి విశ్వసనీయత కల్పించినప్పుడే ప్రయోజనం.

మీ మాటలు

*