గ్రీకు అమ్మవారు కూడా ‘కదంబ ప్రియే’!

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)అమ్మవారి స్తుతులలో ‘లలితా సహస్రనామాలు’ సుప్రసిద్ధాలు. అవి భౌతిక, భావవాదాల అంతస్సంబంధాన్ని వెల్లడించే అమ్మవారి తాత్వికతను చెబుతున్నాయని నాకు అనిపిస్తుంది.  వాటిలో అమ్మవారి ఆరాధనకు చెందిన చంద్రుడు, సర్పము మొదలైన ప్రతీకలు కూడా విస్తారంగా కనిపిస్తాయి. వాటిలోకి వెళ్ళకుండా ఇప్పుడు ఒక్క అంశానికి మాత్రమే పరిమితమవుతాను. అదేమిటంటే…

లలితా సహస్రనామాలలో పూవులు, వనాల ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది. కొన్ని చెప్పాలంటే, అమ్మవారి కురులు చంపకా(సంపెంగ పూలు)లతోనూ, అశోకాలతోనూ, పున్నాగ పువ్వులతోనూ, సౌగంధికాలతోనూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఆమె మహాపద్మాల వనంలో ఉంటుంది. కదంబ(పొన్న)వనంలోనూ ఉంటుంది. కదంబ పూల గుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. కదంబ కుసుమాలే కాక; చాంపేయ (నాగకేసరి), పాటలీ(కలిగొట్టు) కుసుమాలు కూడా ఆమెకు  ప్రియమైనవి. ఆమె దానిమ్మ పువ్వు కాంతితో ఉంటుంది. పువ్వులు ఆమె బాణాలు…

ఈ ఆహ్లాదకరమైన పూల నేపథ్యం నుంచి ఒకసారి జార్జి థాంప్సన్ వైపు తొంగిచూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనకు మన లలితా సహస్రనామాలతో పరిచయం ఉందని చెప్పలేం. ఆయన తనకు బాగా తెలిసిన గ్రీకు అమ్మవార్ల గురించి చెప్పుకుంటూ వచ్చారు. విచిత్రంగా ఆ వివరాలు మన అమ్మవారి గురించే చెబుతున్నట్టు అనిపిస్తాయి. గ్రీకు అమ్మవార్లలో మన అమ్మవారి పోలికలు కనిపిస్తాయి.

ఆయన The Making of a Goddess అనే అధ్యాయంలో, Herbal Magic అనే ఉపశీర్షిక కింద, గ్రీకు దేవతా సమూహంలోని అధికారిక దేవతలైన అమ్మవార్ల ఆరాధనలో అంతర్లీనంగా ఉన్న ఆదిమ మాంత్రికతను చర్చిస్తారు. మొక్కలు, మూలికలు, పువ్వులకు(herbal)చెందిన మాంత్రికతపై ప్రతి చోటా స్త్రీలదే అధికారమని ఆయన అంటూ, వాలెంగే తెగ మహిళలపై అధ్యయనం జరిపిన మిస్ ఎర్తీ మాటల్ని ఉదహరిస్తారు:

“దాదాపు అన్ని చెట్లు, మొక్కలు మాంత్రిక విలువ ఉన్నవే. నేను ఎప్పుడైనా వృక్షజాతులను సేకరిస్తుంటే వాళ్ళలో ఒక్కసారిగా కుతూహలం రేగేది. మొక్కలంటే మాంత్రికతకు, మందులకు సంబంధించినవే నన్న భావన వాళ్ళలో జీర్ణించుకుపోవడమే అందుకు కారణం” అని ఆమె అంటారు.

ఈ సందర్భంలో థాంప్సన్ ఇంకొక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. ప్రాచీన గ్రీకు వృక్షజాతుల గురించి డయోస్కరైడ్స్, ప్లినీ విస్తారమైన సమాచారం ఇచ్చారనీ, అయితే, గ్రీకు మతాన్ని అధ్యయనం చేసేవారు వాటిపై తగినంత దృష్టి పెట్టరని  ఆయన అంటారు. ఆదిమ కాలంలో మతపరమైన తంతులకూ, ప్రకృతి రూపంలోని భౌతికవాస్తవికతకూ ఉన్న పీటముడి ఆ తర్వాత తెగిపోయి; మతమూ, భౌతికవాస్తవికతా వేర్వేరు అయిపోయిన ఫలితమే ఇదని నాకు అనిపిస్తోంది. మన దగ్గర కూడా అదే జరిగింది. మన పౌరాణికులు, పండితులు కూడా మతాన్ని భౌతికవాస్తవికతనుంచి వీలైనంత దూరంగా తీసుకువెడతారు.

గ్రీకులకు చెందిన పూల రకాలలో ‘పియోని’(peony) అనే పువ్వు ఉంది. అది ఎర్రగా, మనకు తెలిసిన గులాబీ పువ్వులా ఉంటుంది. ఆ పువ్వు తొడిమెలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయని భావిస్తారు.  దానిని ఋతుస్రావమప్పుడూ, పురిటి సమయంలోనూ ఉపయోగిస్తారు. ఈ ఔషధ గుణాలు చంద్రుని నుంచే సంక్రమించాయనే భావనతో ఈ పువ్వును ‘మెన్యన్’(menion) లేదా ‘సెలెనోగొనన్’(selenogonon) అని కూడా పిలుస్తారు. ‘మెన్’ అంటే చంద్రుడు. ‘సెలెనే’ అంటే చంద్రదేవత.

అలాగే, ‘డిక్తామ్నోస్’(diktamnos) అనే ఒక తరహా కూరాకును ప్రసవసమయంలో ఉపయోగిస్తారు. ఆ కూరాకులను దండగా గుచ్చి, ప్రసవదేవత అయిన ఎయిలీతియా(Eileithiia) మెడలో వేస్తారు. విశేషమేమిటంటే, కదంబం లేదా పొన్న(ఇక్కడ థాంప్సన్ ఉపయోగించిన myrtle అనే మాటకు కదంబమని, పొన్న అనీ నిఘంటువు అర్థం ఇచ్చింది) మన అమ్మవారికి ఎంత ప్రియమైనదో గ్రీకు అమ్మవారు అఫ్రోడైట్ కు కూడా అంతే ప్రియమైనది. ఇది గర్భాశయాన్ని మూసి ఉంచి నెలలు నిండకుండా ప్రసవం జరిగే అవకాశాన్ని నివారిస్తుంది. అలాగే కలువపువ్వు కూడా అఫ్రోడైట్ కు ప్రియమైనది. ఇది ఋతుస్రావాన్ని అదుపు చేస్తుందని నమ్మకం. దృఢంగానూ, వంచడానికి వీలుగానూ ఉండే ఒక తీగ జాతి(withy)కి చెందిన ‘లిగోస్’(lygos) కూడా ఋతుస్రావాన్ని అదుపు చేస్తుందని భావిస్తారు.

కదంబం

స్పార్టా లో అర్తెమిస్ అనే అమ్మవారిని ‘లిగోడెస్మా’ (Lygodesma) అని పిలుస్తారు. ఈ దేవత మూర్తి లిగోస్ తీగల మీద వెలియడం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ తీగలతో చేసిన దండను దేవత మెడలో వేస్తారు.  సామోస్ అనే ప్రాంతానికి చెందిన హేరా అనే దేవత కూడా తన వనం లోని ఇలాంటి ఒక తీగ చెట్టు కిందే అవతరించింది. ప్రసవ సమయంలో గర్భం తెరచుకోవడం కష్టమైనప్పుడు ఒక రకమైన దుంప(galingale)తో కషాయం చేసి తాగిస్తారు. ఋతుస్రావంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక జాతికి చెందిన పసుపురంగు పువ్వుల(helichryse)ను ఉపయోగిస్తారు. స్పార్టాలోని అమ్మాయిలు ఈ పూలతో కిరీటం చేసి హేరాకు అలంకరిస్తారు. “తల్లీ! నీకు పసుపు పూల దండనూ, గలింగలే దండను సమర్పించుకుంటున్నాను. నన్ను కరుణించు” అని అమ్మాయిలు దేవతను ప్రార్థిస్తారు. హేరా, అర్తెమిస్, అఫ్రోడైట్లను గ్రీకులు ప్రసవదేవతలుగా కొలిచేవారు.

ప్రాచీన గ్రీకులకు బాగా తెలిసిన చెట్లలో దానిమ్మ చెట్టు ఒకటి. డిమీటర్ అనే దేవత, చేతిలో గసగసాల (లేదా నల్లమందు) గుత్తినో, దానిమ్మ పండునో పట్టుకుని కనిపిస్తుంది. ఒక్కోసారి రెండూ పట్టుకుని ఉంటుంది. ఏథెన్స్ లో విజయచిహ్నంగా నిలబెట్టిన ఎథెనా అనే దేవత కుడి చేతిలో శిరస్త్రాణాన్ని, ఎడమ చేతిలో దానిమ్మ పండును పట్టుకుని ఉంటుంది. ఒలింపియాలో మిలన్ అనే ఒక అథ్లెట్ విగ్రహం దానిమ్మ పండును పట్టుకుని కనిపిస్తుంది. ఈ అథ్లెట్ హేరా అనే దేవతకు పూజారిణి. అర్గోస్ అనే చోట హేరా విగ్రహం ఒక చేతిలో రాజదండాన్ని, ఇంకో చేతిలో దానిమ్మ పండును పట్టుకుని ఉంటుంది,  “దానిమ్మ గురించి నేను ఎక్కువగా చెప్పను. ఎందుకంటే, దానికి సంబంధించిన కథ ఓ రహ  స్యం” అని, పౌసానియా(క్రీ. శ. 110-180) అనే గ్రీకు యాత్రికుడూ, భౌగోళిక నిపుణుడూ అనడాన్ని ఈ సందర్భంలో థాంప్సన్ ప్రస్తావిస్తారు.

ఇంతకీ ఆ రహస్యం ఏమిటంటే, దానిమ్మ పండు ఎర్రటి రంగులో ఉంటుంది. అలాగే దాని గింజలు కూడా.  వాటిని గ్రీకు భాషలో ‘కొక్కోస్’(kokkos) అంటారు. దానిమ్మ పండు రక్తాన్ని సంకేతిస్తుంది. అది హింసాత్మక, లేదా బలవన్మరణానికి కూడా సంకేతం. టైటాన్ల చేతిలో మరణించిన డయోనిసస్ రక్తం నుంచి దానిమ్మ మొలకెత్తిందనే భావన గ్రీకు పురాణాలలో కనిపిస్తుంది. దానిమ్మ కలలో కనిపిస్తే గాయాల పాలవుతారనే నమ్మకం ఉండేది. అయితే ఇలాంటివి రెండో పక్షం. ప్రధానంగా దానిమ్మ రంగు ఒకరిని చంపినప్పుడో, గాయపరచినప్పుడో కారే రక్తానికి సూచన కాదు. అది ఋతురక్తానికి, పురిటి రక్తానికి సూచన. దానిమ్మను ఋతుస్రావమప్పుడు, ప్రసవమప్పుడు ఔషధంగా వాడతారు. గసగసాల గుత్తి కూడా సంతానసంబంధమైన ప్రతీకే. అందుకే డిమీటర్ చేతిలో దానిమ్మ, గసగసాల గుత్తి ఉంటాయి.

గ్రీకు అమ్మవార్లకే కాదు, బాబిలోనియా అమ్మవారు ఇష్టార్ కూ దానిమ్మ పండు ప్రియమైనదే. ఆమె దానిమ్మనే కాక యాపిల్ నూ ఇష్టపడుతుంది. ఇష్టార్ ప్రేమదేవత కూడా. స్త్రీ, పురుషులలో లైంగికవాంఛ రేకెత్తించేది ఈ దేవతే. మెసపొటేమియాలో దొరికిన వేలాది మట్టిపిడకలలో ఒకదానిపై ఇష్టార్ ను ఉద్దేశించిన ఒక మంత్రం ఉంది. యాపిల్ నో, దానిమ్మనో చేతిలో ఉంచుకుని మూడు సార్లు ఈ మంత్రాన్ని పఠించి తను ఇష్టపడిన స్త్రీ చేత దానిని కొరికిస్తే ఆమె వెంటనే వశమవుతుందని ఆ మట్టిపిడక మీది రాత చెబుతోంది.

 

డిమీటర్ కు స్త్రీలు కొన్ని రహస్యమైన తంతులు జరుపుతారు. వాటిలో ఒక తంతు పేరు ‘థెస్మొఫోరియా’(Thesmophoria).  ఈ తంతు జరిపే రోజుల్లో స్త్రీలు రాత్రిపూట ఒకరకమైన తీగలతో చేసిన పడక మీద పడుకోవాలి. లైంగికచర్యకు దూరంగా ఉండాలి. దానిమ్మ తినకూడదు. తీగలతో చేసిన పడక మీద పడుకోవడం వల్ల రెండు లాభాలు ఉంటాయి. మొదటిది, లైంగిక స్పందనలను అది నివారిస్తుంది. రెండోది, పాముల్ని అది దూరంగా ఉంచుతుంది. దానిమ్మపై నిషేధానికి కారణం కూడా, అది లైంగిక ఉద్రేకాన్ని రెచ్చగొడుతుందన్న భావనే.

అమ్మవారికి సంబంధించిన వ్రతాలలో, పూజలలో మనదగ్గర కూడా స్త్రీలకు ఇలాంటి నియమాలు, నిషేధాలు ఉంటాయి కనుకనే వీటి గురించి ఈ ప్రస్తావన.

దానిని అలా ఉంచితే, ‘థెస్మొఫోరియా’లో ఇంకొకటి కూడా జరుగుతుంది. అది, స్త్రీలు పందులను బలి ఇవ్వడం! నిజానికి ఇది పంటల వృద్ధిని ఉద్దేశించిన తంతు. అంటే సౌభాగ్యవర్ధనానికి సంబంధించినదన్నమాట.  అలాంటప్పుడు ఈ తంతు జరిపే స్త్రీలు సౌభాగ్య సంబంధమైన లైంగికత్వానికి దూరంగా ఎందుకు ఉంటారని థాంప్సన్ ప్రశ్నిస్తూ, ఈ ఆదిమ కాలపు తంతులోని అసలు ఉద్దేశాన్ని మరచిపోవడం వల్లనే నంటారు.

ఈ తంతు ఏటా అక్టోబర్ చివరిలో జరుగుతుంది. స్త్రీలు డిమీటర్ కు నివేదించడం కోసం కొన్ని పందుల్ని బలి ఇచ్చి వాటి కళేబరాలను ఒక గుహలో భద్రపరుస్తారు. మూడు రోజుల తర్వాత పాములను తరమడానికి చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్ళి కుళ్ళుతున్న స్థితిలో ఉన్న పందుల అవశేషాలను తీసుకెళ్లి మరుసటి పంటకు ఉపయోగించే విత్తనాలలో కలుపుతారు. స్త్రీలకు చెందిన కుందేలు, పావురం మొదలైన వాటిలానే పంది కూడా ఎక్కువ సంతానాన్ని కంటుంది. ఆ విధంగా సంతాన వృద్ధికేకాక; మగవాడి పుట్టుకకు, పంటలకు కూడా పంది ప్రతీక. ఇంకా చెప్పాలంటే, థాంప్సన్ ప్రకారం పంది అంతకంటే కూడా ఎక్కువ. అది సాక్షాత్తూ స్త్రీకి ప్రత్యామ్నాయం!

ఎలాగంటే, ఋతు రక్తానికీ, ప్రసవరక్తానికీ పంటలను పోషించే లక్షణం ఉన్నట్టు భావించేవారని చెప్పుకున్నాం. మొదట్లో ఈ రెండు రకాల రక్తాలను రహస్యంగా భద్రపరచి, విత్తనాలలో కలిపేవారు. ఆ తర్వాత వాటి స్థానంలో  పంది రక్తాన్ని వాడడం ప్రారంభించారు. అప్పటినుంచే స్త్రీల లైంగికతకు సంబంధించిన చర్యలు సానుకూల విలువను కోల్పోవడం, వాటిని మైలగానూ, అపవిత్రాలుగానూ చూడడం మొదలైందని థాంప్సన్ వివరణ. లేదా, ఋతురక్తాన్ని, ప్రసవరక్తాన్ని మైలగానూ, అపవిత్రంగానూ చూడడం మొదలైన తర్వాత, వాటికి ప్రత్యామ్నాయంగా పంది రక్తాన్ని వాడుతూ వచ్చారనీ అనుకోవచ్చు.

స్త్రీకి పంది ప్రత్యామ్నాయం కావడం వల్ల స్త్రీపట్ల ఏర్పడిన అపవిత్రతా లేదా ఈసడింపు భావనే పంది మీదకు విస్తరించి అది కూడా నిందార్థకంగా మారిందని థాంప్సన్ అంటారు. విచిత్రంగా మన దగ్గర కూడా ‘పంది’ అనే మాట తిట్టుపదమే. అలాగే,  గ్రీకులో దానిమ్మ గింజలను సూచించే ‘కొక్కోస్’ అనే మాట కూడా అశ్లీలవాచకంగా మారింది. మనకు తెలిసిన కొక్కోకమనే కామశాస్త్రానికీ, ఈ మాటకూ ఏమైనా సంబంధం ఉందా అన్నది తెలియదు.

మన లలితా సహస్రనామాలలో ధాన్యాలు, రకరకాల అన్నాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. అలాగే, డిమీటర్ ప్రధానంగా తృణధాన్యాలకు చెందిన దేవత. అర్తెమిస్ అటవీభూములకు, చిత్తడి నేలలకు, పచ్చిక భూములకు చెందిన దేవత.  అర్తెమిస్ విల్లమ్ములు ధరించి కొండల మీద తిరుగుతూ ఉంటుంది. అడవిలోని అప్సరసలతో కలసి ఆడుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒక కథ ప్రకారం, లెట్రినోయి అనే చోట ‘అర్తెమిస్ అల్ఫియా’ అనే గుడి ఉంది. ఆ పక్కనే  ‘అల్ఫియాస్’ అనే నది ప్రవహిస్తోంది. ఆ నది అర్తెమిస్ ను ప్రేమించింది. అయితే, కన్యాత్వానికి అంకితమైన అర్తెమిస్ తన ప్రేమను అంగీకరించదనుకున్న అల్ఫియాస్, ఆమె అప్సరసలతో కలసి రాత్రంతా జరిగే ఒక జాతరకు వెళ్లినప్పుడు రహస్యంగా ఆమెను సమీపించాలనుకున్నాడు. అర్తెమిస్, ఆమె నేస్తాలు దీనిని పసిగట్టి అతను గుర్తు పట్టకుండా ముఖాలకు బురద పూసుకున్నారు.

పెళ్లీడు వచ్చిన అమ్మాయిలు నదికి వెళ్ళి అందులోని బురదను ఒంటికి పూసుకోవడం ద్వారా నీటిలోని జీవశక్తిని సంగ్రహించే ఒక రహస్యమైన తంతును ఈ కథ వెల్లడిస్తుందని థాంప్సన్ అంటారు. బురదలో ఔషధగుణాలు ఉంటాయనీ, అల్ఫియాస్ అనే పేరు ఆ గుణాలనే సూచిస్తుందనీ ఆయన వివరణ. అల్ఫియాస్ నదీజలాలు కుష్టు లాంటి చర్మరోగాలను నివారిస్తుందని ప్రాచీన గ్రీకులు అనుకునేవారు. మన దగ్గర కూడా నదీజలాలకు ఇటువంటి ఔషధగుణాలను ఆపాదిస్తాం.

గ్రీకు పల్లె ప్రాంతాలలో ప్రతిచోటా ఊటబావులు, సెలయేళ్లు ఉన్నాయి. వాటిని ‘పార్థేనియా’ లేదా ‘పార్థెనోయిస్’ అని పిలుస్తారు. మతపరమైన ఉత్సవాలకు ముందు కన్యలు వాటిలో స్నానం చేసి పరిశుద్ధులవుతారు. పెళ్ళికి ముందు నదికి తీసుకువెళ్ళో, లేదా నదీజలాలను తెప్పించో వధువుకు స్నానం చేయించే ఆనవాయితీ అక్కడ ఉండేది. మన దగ్గర కూడా పెళ్ళికి ముందు మంగళస్నానం చేయించడం ఉంది.  థాంప్సన్ ప్రకారం, మొదటిసారి ఋతుమతి అయినప్పుడు నదిలో స్నానం చేసి శుద్ధి పొందే ఆచారమే పెళ్లికి విస్తరించింది. అంతేకాదు, పెళ్ళికి ముందు నదిలో స్నానం చేయడంవల్ల ఆమె సంతానయోగ్యం అవుతుందని భావించేవారు. నీటికి జీవం పోసే శక్తి ఉందనీ, నీటివల్లనే స్త్రీ గర్భం ధరిస్తుందనే విశ్వాసం గ్రీసులోనే కాక అనేక దేశాలలో ఉందని ఆయన అంటారు. స్నానానికి ముందు కన్యలు, “ఓ నదీదేవుడా! మా కన్యాత్వాన్ని హరించు” అని ప్రార్థించడమూ గ్రీసులో కొన్ని చోట్ల ఉంది. పెళ్ళికి ముందు నదీస్నానం చేసిన వధువులు ‘అప్సరస’(nymphs)లు అవుతారనీ, నదీ దేవుణ్ణి కౌగలించుకోవడం వల్ల వారికి వీరపుత్రులు కలుగుతారనీ నమ్మేవారు. గ్రీకు భాషలో వధువులను nimphai అంటారు.

సరే, మన పురాణ ఇతిహాసాల నిండా కనిపించే అప్సరసల గురించి చెప్పనే అవసరం లేదు. ‘అప్సు’ అంటే నీరుకనుక, అప్సరసకు, నదికి లేదా నీటికి ఉన్న సంబంధం స్పష్టమే. అదలా ఉంచితే, పై వివరాలు చదువుతున్నప్పుడు; ముఖ్యంగా నదీదేవుణ్ణి కౌగలించుకోవడం వల్ల వీరపుత్రులు కలుగుతారన్నప్పుడు మహాభారతంలోని కుంతికథ, గంగా-శంతనుల కథ చటుక్కున గుర్తొచ్చి ఉండాలి. కుంతి కన్యగా ఉన్నప్పుడే కర్ణుని కని నదిలో విడిచిపెట్టింది. కర్ణుడు వీరపుత్రుడే. అలాగే, గంగ అనే ‘నది’కి శంతనుని వల్ల కలిగిన భీష్ముడు కూడా మహావీరుడే. కాకపోతే, నదిని మనం స్త్రీ రూపంగా భావిస్తే, గ్రీకులు పురుషరూపంలో భావించారు. మెసొపొటేమియాను పాలించిన సారగాన్(క్రీ.పూ. 2350)ను అతని తల్లి రహస్యంగా కని, ఒక బుట్టలో ఉంచి దానిని తారుతో మూసి నదిలో విడిచిపెట్టింది. అతను కూడా వీరుడే. హిబ్రూ మోజెస్ పుట్టుక కూడా ఇలాంటిదే. ఇటువంటి పుట్టుకలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డెబ్బైకి పైగా ఉదంతాలు ఉన్నాయని జోసెఫ్ క్యాంప్ బెల్ అంటారు.

కుంతికి ‘పృథ’ అనే పేరు, అర్జునుడికి ‘పార్థు’డనే పేరు ఉన్నట్టు మనకు తెలుసు. గ్రీసులో కన్యలు స్నానం చేసే ఊటబావులను, సెలెయేళ్లను ‘పార్థేనియా’ అంటారని చెప్పుకున్నాం. ఈ పేర్ల మధ్య సామ్యం కనిపించడం లేదా అని నేను అంటే, “ఇక ఆపండి. మరీ ఎక్కువగా ఊహాగానాలు చేస్తున్నా”రని మీరు అనచ్చు. కనుక ఆపేస్తాను.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

,

మీ మాటలు

  1. Dr.Vijaya Babu,Koganti says:

    “మతమూ, భౌతికవాస్తవికతా వేర్వేరు అయిపోయిన ఫలితమే ఇదని నాకు అనిపిస్తోంది. మన దగ్గర కూడా అదే జరిగింది. మన పౌరాణికులు, పండితులు కూడా మతాన్ని భౌతికవాస్తవికతనుంచి వీలైనంత దూరంగా తీసుకువెడతారు.”

    కొన్నిసార్లు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసే పరిస్థితి కూడా కల్పించడం వాళ్ళకు తెలుసు కాబట్టే గందరగోళ పరిస్థితులు ఎర్ప డ్డై.
    మన పూర్వీకులు మనషుల మూర్ఖత్వం తెలిసే సామాజిక, భౌతిక, వైద్య విషయాలను మతంతో ముడిపెట్టారనిపిస్తుంది. ప్రస్తుతం అవి రెండూ పోల్చుకోలేనంత దూరం జరగబట్టే ఇంత గందరగోళమూ అనిపిస్తుంది.

    అందరు దేవతలూ కదంబ ప్రియలేనేమో! అభినందనలు భాస్కరం గారు.

    .

    • N. S K Chakravarthy says:

      చరిత్రకు నోచుకోని విచిత్ర యుగం! – ‘‘చరిత్ర పూర్వయుగం’’
      పురాతత్వశాఖ వారి తవ్వకాలలో బయటపడుతున్న మహా విషయాలకు సముచిత ప్రచారం లేదు. మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే మూఢ విశ్వాసాలు మన నెత్తికెక్కి కూర్చుని ఉండడం విచిత్రమైన వర్తమానం. ఈ మూఢ విశ్వాసాలు మన విద్యారంగాన్ని రెండువందలు ఏళ్లకు పైగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మూఢ విశ్వాసాలు విదేశీ దురాక్రమణదారుల వారసత్వ శకలాలు. ఒక్కొక్క ‘శకలం’ సకలంగా మారి మన జీవన రంగాలను ముక్కలు ముక్కలుగా మార్చివేస్తున్నాయి. మన వ్యవహారంలో, విజ్ఞానంలో సమన్వయం, సమగ్రత్వం లోపించడానికి హేతునిబద్ధత అడుగంటి పోవడానికి ఇలా ‘శకలం’ సకలమై కూర్చుని ఉండడం ప్రధాన కారణం. శకలాలను మళ్లీ ఒకటిగా కూర్చి సకలత్వాన్ని సాధించడానికి ఇప్పుడైనా కృషిజరగాలి. విద్యాప్రణాళికలలో, పాఠ్యపుస్తకాలలో, భాషాస్వరూపంలో సంస్కరణలు జరిగిపోవాలని ప్రచారం చేస్తున్నవారు ‘తవ్వకాల’ద్వారా బయటపడుతున్న చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వాస్తవాలను మన జాతీయ జీవనంతో సమన్వయం చేసుకోవాలి! భారతీయ సంస్కృతి గొప్పదని అంటున్నవారే ‘ఆర్యు లు’అనేవారు బయటినుంచి మన దేశానికి వచ్చిపడినారని కూడ పాఠ్యాంశాలలో ఇప్పటికీ ఇరికిస్తూ ఉన్నారు. ఇది మూఢ విశ్వాస చిహ్నం….
      ‘చరిత్ర’కు ప్రారంభ బిందువును నిర్దేశించడం పాశ్చాత్యుల విశ్వవిజ్ఞాన అవగాహనా రాహిత్యానికి శతాబ్దుల సాక్ష్యం! ఆ చారిత్రక ప్రారంభ బిందువునకు ముందున్న కాలాన్ని ‘చరిత్ర పూర్వయుగం’గా చిత్రీకరించడం కాలగతికి పాశ్చాత్య చరిత్రకారులు చేసిన ఘోరమైన గాయం… ఈ ‘తథాకథిత’- సోకాల్డ్- చరిత్ర పూర్వయుగం- ప్రి హిస్టారిక్ ఏజ్-లో మాత్రం మానవులు లేరా? కనీసం ప్రాణులు లేవా? వారిది లేదా వాటిది మాత్రం చరిత్రకాదా?? చరిత్ర కాదనడం చరిత్రకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయం చేసింది మిడిమిడి జ్ఞానం కలిగిన పాశ్చాత్య మేధావులు! ఈ ‘శకల’మే ‘సకల’మని ఐరోపా చరిత్రకారులు మనకు క్రీస్తుశకం పద్దెనిమిదవ, పంతొమ్మిదవ శతాబ్దులలో పాఠాలను చెప్పారు. ఆ పాఠాలను ఆ తరువాత మరింత నిష్ఠతో శ్రద్ధతో వల్లెవేస్తున్నాం! అందువల్లనే గొప్ప విషయాలను చెప్పదలచుకున్న మేధావులు, లేదా చెబుతున్నట్టు అభినయిస్తున్న మహా మేధావులు ‘చరిత్ర పూర్వయుగం’-ప్రిహిస్టారిక్ ఏజ్- అన్న విచిత్ర పద జాలాన్ని ఉటంకించడంతో ప్రారంభిస్తున్నారు!
      ప్రాచీన రాజధాని అమరావతి నవ్యాంధ్రప్రదేశ్‌కు మళ్లీ రాజధాని అవుతున్న సందర్భంగా ఈ ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న అర్థంలేని పదజాలం మళ్లీ విరివిగా ప్రచారవౌతోంది! ఈ ప్రచారం అతి ప్రాచీన అమరావతికి అవమానం. ఎందుకంటె అమరావతి లేదా కొందరు అంటున్నట్టు ‘ధాన్యకటకం’ ఐదువేల వంద ఏళ్లకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఉంది. అంతకు పూర్వం వేలాది ఏళ్లుగా ఉంది! కానీ బ్రిటిష్‌వారు మప్పిపోయిన ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న విచిత్ర పదార్థాన్ని ప్రచారం చేస్తున్నవారు ‘అమరావతి’ చరిత్రను రెండువేలు లేదా రెండు వేల ఐదువందల ఏళ్లకు పరిమితం చేస్తున్నారు! బ్రిటిష్‌వారు కాలాంతకులు, కాలాన్ని అంతంచేసినవారు… వారి వారసులు కూడ కాలాంతకులే! ‘‘చరిత్ర పూర్వయుగం’’ ఒకటుందని నమ్మడం ప్రచారం చేయడం మూఢ విశ్వాసబద్ధమైన బుద్ధికి నిదర్శనం! చరిత్ర అనాది… అనంతం… అందువల్ల చరిత్ర క్రమం ఆద్యం త రహితం! ‘‘చరిత్ర పూర్వయుగం’’,‘‘కోతియుగం’’,‘‘రాతియుగం’’,‘‘లోహయుగం’’ అన్నవి బ్రిటిష్‌వారు, పాశ్చాత్యులు ‘‘విజ్ఞానం’’గా భ్రమించిన మూఢవిశ్వాసాలు… బ్రిటిష్‌వారు మన దేశాన్ని వదలి వెళ్లినప్పటికీ, వారు అంటించిపోయిన ఈ మూఢ విశ్వాసాలు మన పుస్తకాలను, మస్తకాలను వదలకపోవడం భావదాస్య ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణం!
      పురాతత్త్వశాఖ వారి త్రవ్వకాలలో బయటపడుతున్న ప్రాచీన అవశేషాలు ‘‘హరప్పా మొహంజాదారో నాగరికత’’ కాలంనాటివని, అంతకు పూర్వంనాటివని వర్గీకరణలు జరుగుతున్నాయి. అంతవరకు కాలానికి సంబంధించిన పేచీలేదు. కాని ‘‘హరప్పా నాగరికత’’ లేదా ‘‘సింధునదీ పరీవాహక ప్రాంత- ఇండస్ వ్యాలీ నాగరికత’’అన్న పదజాలం మన జాతీయ అద్వితీయ తత్త్వానికి విఘాతకరమైనవి! ఈ దేశంలో గతంలో రెండుమూడు జాతులవారు పరస్పరం కొట్టుకొని చచ్చారన్న అబద్ధాన్ని ప్రచారం చేయడానికి బ్రిటిష్‌వారు ఈ ‘‘హరప్పా నాగరికత’’ను ‘‘కనిపెట్టి’’ పోయారు. ఈ హరప్పా నాగరికత కాలంనాటి మానవ అస్థిపంజరాలు నాలుగు ఇటీవల హర్యానాలో జరిగిన తవ్వకాలలో బయటపడినాయి. ఈ అస్థిపంజరాలు ఐదువేల ఏళ్లనాటివట! హరప్పా, మొహంజోదారో అన్న ప్రాచీన నగరాలు సింధూ పరీవాహ ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఉండి ఉండవచ్చు. కానీ నగరాల పేరుతో ‘నాగరికత’లు, ‘‘రాజ్యాలు’’ ఉండడం భారతీయ చరిత్రలో సంభవించలేదు. ఇలా ఉండడం గ్రీకుల పద్ధతి పాశ్చాత్యుల పద్ధతి! నగరాలు మన దేశంలో రాజధానులు మాత్రమే. ‘‘నాగరికత’’అన్నది దేశమంతటా విస్తరించి ఉండిన ఒకే ఒక అద్వితీయ సాంస్కృతిక వ్యవస్థ! అందువల్ల బ్రిటిష్‌వారు కనిపెట్టిన ‘‘హరప్పా నాగరికత’’ నిజానికి భారతదేశమంతటా సమకాలంలో విస్తరించి ఉండిన అద్వితీయ సామాజిక వ్యవస్థ! అది వేద సంస్కృతి, సనాతన సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి….
      ఇలా దేశమంతటా ఉండిన దాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం పాశ్చాత్యుల పరిమిత బుద్ధికి నిదర్శనం. ‘తక్షశిల’ప్రాచీన విద్యాకేంద్రం, రాజ్యంకాదు, రాజధాని కూడ కాదు. కానీ గ్రీకు బీభత్సకారుడైన అలెగ్జాండరు క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలో కొంత భాగాన్ని గెలిచాడన్న అబద్ధాన్ని పాశ్చాత్య చరిత్రకారుడు క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దిలో ప్రచారం చేశారు. ఈ అబద్ధ ప్రచారంలో భాగంగా విశ్వవిఖ్యాత విద్యాకేంద్రమైన ‘తక్షశిల’ను ఒక ప్రత్యేక రాజ్యంగా కల్పించారు!! ఇదే పద్ధతిలో దేశమంతటా ఒకే జాతీయ సంస్కృతి అనాదిగా ఉండడం వాస్తవం కాగా, ఈ వేద సంస్కృతికి భిన్నమైన ‘‘హరప్పా నాగరికత’’ను పాశ్చాత్యులు ఏర్పాటుచేశారు. పైగా ఈ ‘‘హరప్పా నాగరికత’’ ధ్వంసమైన తరువాత మాత్రమే క్రీస్తునకు పూర్వం పదిహేనవ పన్నెండవ శతాబ్దుల మధ్య వేద సంస్కృతి ఈ దేశంలో పుట్టుకొచ్చిందన్న మరో భయంకర అబద్ధాన్ని కూడ పాశ్చాత్యులు మన చరిత్రకు ఎక్కించిపోయారు!! ఈ దేశంలో ‘యుగాలు’గా వేద సంస్కృతి పరిఢవిల్లుతోందన్నది వాస్తవ చరిత్ర. ఈ చరిత్రను చెరచి, వేదాల ప్రాచీనతను కేవలం మూడువేల ఐదువందల ఏళ్లకు కుదించడానికి బ్రిటిష్‌వారు చేసిన కుట్రలో ఈ తథాకథిత ‘‘హరప్పా నాగరికత’’ భాగం… ఈ కుట్రను భగ్నంచేయడానికి వీలైన అవశేషాలు తవ్వకాలలో అనేక ఏళ్లుగా బయటపడుతున్నాయి. ఇప్పుడు హర్యానాలో జరిగిన త్రవ్వకాలలో ఏడువేల ఐదువందల ఏళ్లనాటి పట్టణం బయటపడింది! ‘‘హరప్పా నాగరికత’’ కేవలం ఐదువేల ఏళ్ల ప్రాచీనమైనదన్న పాశ్చాత్య అబద్ధాన్ని ఈ ‘‘పట్టణం’’ ఇలా బట్టబయలుచేసింది.. భూస్థాపిత సత్యమిలా భువనమెల్ల మార్మోగెను….
      హరప్పా నాగరికతను ధ్వంసంచేసిన తరువాత వేదాలు వైదిక సంస్కృతి విలసిల్లాయన్న పాశ్చాత్యుల ‘‘అబద్ధాల చరిత్ర’’కు పెద్ద అవరోధం మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం కలియుగం పుట్టడానికి పూర్వం ముప్పయి ఆరవ ఏట జరిగింది! కలియుగం పుట్టిన తరువాత మూడువేల నూట రెండేళ్లకు క్రీస్తుశకం పుట్టింది. ఇలా క్రీస్తునకు పూర్వం 3138 ఏళ్లనాడు మహాభారతయుద్ధం జరిగిందని అమెరికా శాస్తవ్రేత్తలు సైతం నిర్ధారించిన సంగతి దశాబ్దిక్రితం ప్రముఖంగా ప్రచారమైంది. అమెరికా శాస్తవ్రేత్తలు నిర్ధారించకపోయినప్పటికీ ప్రాచీన భారత చరిత్రకారులు చేసిన నిర్ధారణలు నిజంకాకుండా పోవు. కాని పాశ్చాత్య భావదాస్య సురాపానం మత్తుదిగని భారతీయ మేధావులు అమెరికావారి ఐరోపావారి నిర్ధారణలను నమ్ముతున్నారు. ఆ నిర్ధారణ కూడ జరిగింది కనుక ఇకనైనా ‘హరప్పా’నాగరికత అన్న మాటలను వదలి పెట్టి దేశమంతటా అనాదిగా ఒకే వేద సంస్కృతి కొనసాగుతున్న వాస్తవాన్ని చరిత్రలో చేర్చాలి! ప్రాథమిక స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకు గల విద్యార్థులకు బోధించాలి! మహాభారత యుద్ధం జరిగిననాటికి, క్రీస్తునకు పూర్వం మూడువేల నూటముప్పయి ఎనిమిదేళ్లనాటికి, దేశమంతటా ఒకే జాతీయత ఒకే సంస్కృతి నెలకొని ఉన్నాయి! అలాంటప్పుడు అదే సమయంలో ‘‘వేద సంస్కృతితో సంబంధం లేని, వేదాలకంటె ముందు ఉండిన’’ ఈ హరస్పా ఎలా ఉండి ఉంటుంది??
      చరిత్రను ఆవహించిన మూఢవిశ్వాసాన్ని ఇకనైనా వదలగొట్టాలి!
      ‘రాతియుగం’, ‘కోతియుగం’వంటివి కృతకమైన కల్పితమైన కాలగణన పద్ధతులు. ‘చరిత్ర పూర్వయుగం’అన్నది ఉండడానికి వీలులేదు. ఎందుకంటె సహజమైన విశ్వవ్యవస్థ తుది మొదలు లేకుండా వ్యవస్థీకృతమై ఉంది! ఈ ‘తుది మొదలులేనితనం’ కాలానికీ- టైమ్- దేశానికీ- స్పేస్-వర్తిస్తున్న శాశ్వత వాస్తవం. ఈ వాస్తవం ప్రాతిపదికగా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం, కలియుగం వరుసగా తిరుగుతున్నాయి. శిశిర ఋతువు తరువాత వసంత ఋతువువలె రాత్రి తరువాత పగటివలె కలియుగం తరువాత మళ్లీ కృతయుగం రావడం చరిత్ర! ఇది సనాతనమైన నిత్యనూతనమైన హేతుబద్ధమైన వాస్తవం! ఈ వాస్తవం ప్రాతిపదికగా విద్యార్థులకు ఇకనైనా చరిత్రను బోధించాలి! ‘రాతియుగం’తోకాక కృతయుగంతో చరిత్రను మొదలుపెట్టాలి. కృత త్రేత ద్వాపర కలియుగాలు ఒకదానితరువాత ఒకటి రావడం ఖగోళ విజ్ఞానపు గీటురాయిపై నిగ్గుతేలిన నిజం!
      ఈ ఖగోళ వాస్తవాలను ఎవ్వరూ మార్చలేరు… వక్రీకరించలేరు. ఈ ఖగోళ వాస్తవం ప్రకారం ‘సప్తర్షులు’అన్న అంతరిక్ష సముదాయం భూమినుండి చూసినప్పుడు వందేళ్లపాటు ‘అశ్వని’వంటి నక్షత్రాలతో కలసి ఉదయిస్తుంది. ఈ సప్తర్షి మండలం అలా ‘రేవతి’వరకూ గల నక్షత్రాలతో ఉదయించే కాలఖండం రెండువేల ఏడువంద ఏళ్లు. ఈ ఖగోళ వాస్తవం ప్రాతిపదికగా కలియుగంలో ఇది యాబయిరెండవ శతాబ్ది! ఇది 5117వ సంవత్సరం. శాతవాహన ఆంధ్రులు కలియుగంలో 2269నుండి 2775వరకు 506 ఏళ్లపాటు మొత్తం భారతదేశాన్ని పాలించారు, దేశానికి రాజధాని గిరివ్రజం…!! ధాన్యకటకం అప్పటికే ఉంది, ధాన్యకటకం అమరావతి కావచ్చు, కోటిలింగాల కావచ్చు! ధాన్యకటకం రాజధానిగా సహస్రాబ్దులు పాలించిన తరువాతనే ఆంధ్రులు గిరివ్రజం రాజధానిగా భారత సమ్రాట్టులయ్యారు. ఇదీ యుగాల చరిత్ర…. ‘చరిత్ర పూర్వయుగం’ లేదు!
      హెబ్బార్ నాగేశ్వరరావు, ఆంధ్రభూమి, ఏప్రిల్ 30, 2015

  2. కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు విజయబాబు గారూ…ఈ వ్యాసాలలో అప్పుడప్పుడు చెప్పినట్టు పూర్వీకులది భిన్నమైన ప్రపంచం. మతానికీ, లౌకికానికీ వాళ్ళ దృష్టిలో తేడా లేదు. ప్రతి లౌకిక చర్యా మతపరమైన తంతుతో మొదలు కావల్సిందే. మతాన్నీ, లౌకికాన్నీ వేరుచేసి మతం వైపు పూర్తిగా ఒరిగిపోవడం ఇప్పటి ధోరణి.

  3. ch.venkateswarlu. says:

    కదంబ పుష్పం అంటె నాకు తెలిసినంత వరకు మీ వ్యాసంలో మధ్య చూపించిన రెండాకుల మధ్య గుండ్రని పూవు. వ్యాసం ప్రారంభంలో ఇచ్చిన చిత్రం పొన్న పూవుది కాదు, కదంబ పుష్పానిది కాదు. ఇక పూవులకు మనుషులకు మధ్య సంబంధం అనాదిది. పోలికలు కనిపించ వచ్చు. అందులో మన తెలుగు జాతికి మెసపొటేమియా జాతికి మధ్య ఏవో పురాతన సంబంధాలు ఉన్నట్లున్నై.ఆ సంబంధాన్ని బయట పెట్టాలి. ఆ ప్రయత్నం కూడా చేస్తారని ఆశిస్తున్నాను.

  4. కల్లూరి భాస్కరం says:

    వ్యాసం ప్రారంభంలో ఇచ్చినది పున్నాగ.

    తెలుగువారికి, మెసపొటేమియాకు ఉన్న సంబంధాల గురించి:– అది విడిగా చెప్పుకోవలసిన సబ్జెక్టు. భవిష్యత్తులో మరెప్పుడైనా దాని గురించి చెప్పాలనే ఉంది.

మీ మాటలు

*