అవ్యవస్థపై అపహాస్యం, ధిక్కారం పతంజలి అక్షరం

ఎన్ వేణుగోపాల్

 

venuమళ్లీ మళ్లీ చదివినకొద్దీ, ఆలోచించినకొద్దీ ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రేరేపించగల శక్తి పతంజలి రచనలది. అందుకు కొంతవరకు కారణం ఆ రచనలలోని బహుళార్థ సూచన, బహుళార్థబోధకత కావచ్చు. రచయిత అన్ని సందర్భాల్లోనూ ప్రయత్నపూర్వకంగా ఆ బహుళార్థ సూచన ఉద్దేశించారని చెప్పడం అతిశయోక్తే అవుతుంది. ఆయన అలా ప్రత్యేకంగా రాసిన సందర్భాలు కూడ కొన్ని ఉన్నాయి గాని అంతకన్న ముఖ్యంగా రెండు కారణాలు ఉండవచ్చునని అనిపిస్తుంది.

ఒకటి, విస్తృతమైన అధ్యయనం వల్ల, వస్తుశిల్పాలలో అపార వైవిధ్యం ఉన్న సాహిత్యాన్ని చదవడం మాత్రమే గాక జీర్ణం చేసుకున్నందువల్ల ఆయన రచనల్లోకి ఈ బహుళార్థకత సహజంగా ప్రవహించి ఉంటుంది. రెండు, ఆయన రచనలన్నిటిలోను మానవ అనుభవ, మానవ అస్తిత్వ సారాంశాన్ని నైసర్గికంగా, సహజంగా పట్టుకున్నారు గనుక మానవ అస్తిత్వంలో గుణాత్మక మార్పు వచ్చేవరకూ ఆ విభిన్న కోణాలు పఠిత స్ఫురణకు వస్తూనే ఉంటాయి. అంటే ఆ బహుళత్వం వ్యక్తీకరణ పొందుతూనే ఉంటుంది. అలాగే, మానవ అస్తిత్వ సారం అన్నప్పుడు కూడ సాధారణంగా సాహిత్యానికి, ప్రత్యేకంగా తెలుగు సాహిత్యానికి తెలిసిన పరిమిత, సంకుచిత, ఏకైక రూపంలో ఆయన అర్థం చేసుకోలేదు. దాన్ని కేవలం వేదనగానో, సంతోషంగానో, విచికిత్సగానో మాత్రమే ఆయన అర్థం చేసుకోలేదు, అన్నీ కలగలసినదిగా, విశాలమైనదిగా, లోతైనదిగా అర్థం చేసుకున్నారు. అందువల్ల కూడ ఆయన రచనలకు బహుళార్థ బోధకత వచ్చిఉండవచ్చు.

నిజానికి తెలుగుసాహిత్య చరిత్రలో పతంజలి రచనలు రాశి రీత్యా చాల ఎక్కువేమీ కావు. పది నవలలు (ఖాకీవనం – 1980, పెంపుడు జంతువులు – 1982, రాజుగోరు – 1983, వీరబొబ్బిలి – 1984, అప్పన్న సర్దార్ – 1986, గోపాత్రుడు – 1992, పిలకతిరుగుడు పువ్వు – 1995, ఒక దెయ్యం ఆత్మకథ – 1992, నువ్వేకాదు – 1996, రాజుల లోగిళ్లు – 2002 అసంపూర్ణం), ముప్పై లోపు కథలు, పదిహేనో పదహారో అనువాద/జ్ఞాపక కథలు, కొన్ని వ్యాసాలు, సంపాదకీయాలు…అన్నీ కలిపినా పద్నాలుగు వందల పేజీల సాహిత్యసంపద మాత్రమే. ఆ సాహిత్యరాశి కొంతవరకు తక్కువే అనిపించినా, అది సందర్భం మారినప్పుడల్లా, బహుశా మారనప్పుడు కూడా ఎప్పటికప్పుడు కొత్త పాఠకులను, కొత్త అర్థాలను, కొత్త చూపును పునరుత్పత్తి చేస్తున్నది. ఒక పఠనంలో అర్థం కాని విషయాలు మరో పఠనంలో తెలియవస్తున్నాయి. ఒక పఠనంలో తెలియని వైశాల్యమూ లోతూ మరొక పఠనంలో బైటపడుతున్నాయి. కొత్త అర్థాలు గోచరిస్తున్నాయి. పతంజలి సాహిత్యానికి ఈ అసాధారణమైన శక్తినిచ్చిన విశిష్టత గురించి కొన్ని ఆలోచనలు పంచుకోవడమే ఈ వ్యాసలక్ష్యం.

ప్రక్రియ ఏమైనప్పటికీ, పతంజలి రచనలన్నిటికీ సాధారణ లక్షణం అవ్యవస్థను అపహాస్యం చేయడం, అవ్యవస్థ మీద ధిక్కారాన్ని ప్రకటించడం. నిజానికి ఈ లక్షణంలో పతంజలి ప్రత్యేకత ఏమీ లేదు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రధాన ధోరణి ఆ లక్షణమే. కందుకూరి వీరేశలింగం నాటి నుంచి ఇవాళ్టిదాకా ప్రతి తెలుగు రచయితా ఏదో ఒక స్థాయిలో అవ్యవస్థ గురించే రాస్తూ ఉన్నారు. అవ్యవస్థను కొందరు ఊరికే యథాతథంగా చిత్రించి ఉండవచ్చు, మరి కొందరు అసహ్యం కలిగేట్టు చిత్రించి ఉండవచ్చు. కొందరు అపహాస్యం చేయడమో, ధిక్కరించడమో చేసి ఉండవచ్చు. మరికొందరు ఇంకా ముందుకు వెళ్లి ఈ అవ్యవస్థను ధ్వంసం చేసే, ఒక కొత్త వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనలూ చేసి ఉండవచ్చు. మొత్తం మీద అవ్యవస్థ గురించి రాయని సాహిత్యకారులు, ఈ వ్యవస్థ బాగుందని రాసిన సాహిత్యకారులు తెలుగులో దాదాపుగా లేరనే చెప్పాలి.

అయితే పతంజలి విశిష్టత ఏమంటే వ్యవస్థనూ, అవ్యవస్థనూ అర్థం చేసుకునే పద్ధతిలో ఆయన గణనీయమైన మార్పు తెచ్చాడు. అప్పటివరకూ అసమగ్రంగా ఉన్న అవగాహనను ఆయన రచనలు విశాలం చేశాయి. అంతకు ముందు వ్యవస్థ పట్ల సమగ్ర అవగాహన ఉన్నవారిలో కూడ ప్రాధాన్యతల హెచ్చుతగ్గుల వల్ల దృష్టి పడని అవ్యవస్థలను, అవ్యవస్థల సూక్ష్మ, విస్మృత కోణాలను కూడ ఆయన రంగస్థలం మీదికి లాగి వాటిని తన విమర్శకు లక్ష్యం చేశాడు. నిజానికి అపహాస్యాన్నీ, ధిక్కారాన్నీ ప్రధాన సాధనాలుగా చేసుకుని, ఆయన అప్పటివరకూ విమర్శ అంటే ఉండిన అర్థాన్ని కూడ మార్చాడు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు వీరేశలింగం దగ్గరే అవ్యవస్థ మీద విమర్శ ప్రారంభమయిందనుకుంటే, పితృస్వామిక వ్యవస్థలోని (లేదా అవ్యవస్థలోని) స్త్రీ విద్యకూ పునర్వివాహానికీ అవకాశం ఇవ్వని ఒకటి రెండు చిన్న అంశాల మీదనే ఆయన ఎక్కుపెట్టాడు. అప్పటినుంచి బహుశా విప్లవ సాహిత్యోద్యమం వచ్చేవరకూ తెలుగు సాహిత్యంలో అవ్యవస్థను ఖండించిన రచయితలందరూ కూడ ఏదో ఒక అవ్యవస్థను, లేదా కొన్ని అవ్యవస్థలను, లేదా సామాజిక అవ్యవస్థలోని కొన్ని అంశాలను మాత్రమే పట్టించుకున్నారు, విమర్శించారు, మార్చడానికి ప్రయత్నించారు.

patanjali choopu

ఈ క్రమంలో సామాజిక అవ్యవస్థ అంతటికీ మూలకారణం అసలు వ్యవస్థలోనే చూడాలని, విడివిడి అంశాలలో కాదని అవగాహన పెరిగింది. కాని దానితోపాటే, వ్యవస్థను మార్చడమంటే ప్రధానంగా అధికార వ్యవస్థలను మార్చడమనే, విమర్శించడమనే అవగాహన కూడ పుట్టిపెరిగింది. అధికార వ్యవస్థలను విమర్శించడమే వ్యవస్థ మీద విమర్శగా సాగింది. సాధారణంగా పాశ్చాత్య ప్రజాస్వామిక సంప్రదాయంలో అధికార విభజనలో భాగంగా అధికార వ్యవస్థను మూడు అంగాలుగా – శాసననిర్మాణ, పాలక, న్యాయ విభాగాలుగా – విభజించడం అందరికీ తెలిసిందే. వీటినే సమాజానికీ, ప్రజాస్వామ్యానికీ మూల స్తంభాలుగా భావిస్తారు. నాలుగో స్తంభంగా పత్రికా వ్యవస్థను కూడ గుర్తించడం ప్రారంభించారు. ఈ నాలుగు రంగాలే సామాజిక అవ్యవస్థకు పాదులుగా ఉన్నాయి గనుక పతంజలి రచనలు ఈ నాలుగు రంగాల మీద విమర్శను ఎక్కుపెట్టాయి. ఈ నాలుగు వ్యవస్థలలోని అవ్యవస్థను ఆయన ఒక పద్ధతి ప్రకారం అపహాస్యం చేశారు, ధిక్కరించారు, అసహ్యం కలిగేలా చిత్రించారు, ఈ అవ్యవస్థ ధ్వంసమై, సువ్యవస్థ ఏర్పడక తప్పదనీ, ఆ సువ్యవస్థ నిర్మాణానికి తనవంతు కృషి చేయాలనీ పాఠకులు ప్రేరణ పొందడానికి అవసరమైన పేలుడు పదార్థమంతా తన రచనల్లో దట్టించారు.

అయితే ఈ అధికార వ్యవస్థల మీద, ప్రత్యేకించి మొదటి మూడు అధికారవ్యవస్థల మీద, ఇంకా తీవ్రమైన విమర్శ విప్లవ సాహిత్యోద్యమంలో కూడ ఉన్నదే. విప్లవ సాహిత్యం కన్న ఎక్కువ ఆదరణనూ, విస్తృతినీ పతంజలి రచనలు సాధించడానికి కారణమేమిటో అన్వేషించవలసి ఉంది. విప్లవ సాహిత్యం ప్రధానంగా ఈ అధికార వ్యవస్థల మీద గురి పెట్టింది గాని, అధికారం అమలు చేసే ఇతర వ్యవస్థలను గుర్తించలేకపోయింది. గుర్తించినా వాటి మీద విమర్శను తన సాహిత్యంలో భాగం చేయలేకపోయింది.

సమాజ చరిత్ర క్రమంలో “అనధికార వ్యవస్థలు” కూడ అధికారవ్యవస్థలతో సమానంగానో ఎక్కువతక్కువలుగానో అధికారాన్ని చలాయించడం ప్రారంభిస్తాయి. అధికారవ్యవస్థల మీద దృష్టి కేంద్రీకరణలో ఈ “అనధికార వ్యవస్థలు” విస్మరణకు గురి కాగూడదు. ఫ్రెంచి మార్క్సిస్టు తత్వవేత్త లూయీ ఆల్థూసర్  రాజ్యాంగయంత్రం గురించి వివరిస్తూ, ప్రభుత్వం, పాలన, సైన్యం, పోలీసులు, న్యాయస్థానాలు, జైళ్లు వంటి రాజ్యసాధనాలతో పాటే, అంతకన్న ఎక్కువగా వ్యవస్థా నిర్వహణలో పాల్గొనే మతం, విద్య, కుటుంబం, న్యాయభావన, రాజకీయాలు, కార్మికరంగం, ప్రచార సాధనాలు, సాహిత్య కళారంగాలు, క్రీడలు వంటి భావజాల రాజ్య సాధనాలు (ఐడియలాజికల్ స్టేట్ ఆపరేటస్) ఉంటాయని గుర్తించాలన్నాడు. రాజ్యసాధనాలు హింస మీద, బలప్రయోగం మీద ఆధారపడే ఏకీకృత శక్తిగా ఉండగా, భావజాల రాజ్య సాధనాలు బహుళత్వపు శక్తులుగా భావజాలం ద్వారా అదే పని చేస్తాయని అన్నాడు.

మరోమాటల్లో చెప్పాలంటే మతం, కులం, వంశం, కుటుంబం వంటి ఆభిజాత్యాలు, దురభిప్రాయాలు, అవకాశాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నుడికారం వగైరా ఎన్నో మానవసంబంధాల వ్యవస్థలు మన ఆలోచనల మీద, అభిప్రాయాల మీద, ప్రవర్తన మీద బలమైన ప్రభావం వేస్తున్నాయి. అవన్నీ అవ్యవస్థ స్థితిలోనే ఉన్నాయి. అంటే అవ్యవస్థ మనకు బైట ఎక్కడో కాదు మనలోపలే ఉంది. మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో ఉంది. మనం గురి చూడవలసిన లక్ష్యం అవతల ఉన్నమాట ఎంత నిజమో, మనలోపల ఉన్నమాట కూడ అంతే నిజం. అందుకే పతంజలి పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు, న్యాయవ్యవస్థ వంటి ప్రత్యక్ష అధికార వ్యవస్థల అవ్యవస్థ మీద ఎంతటి పదునైన విమర్శ ఎక్కుపెట్టారో, అన్నిరకాల భావజాల సాధనాల అవ్యవస్థ మీద అంతకన్న పదునైన విమర్శ ఎక్కుపెట్టారు. పతంజలి రచనల్లో ఏ ఒక్కటి తీసుకున్నా అధికారిక అవ్యవస్థ మీద ఎంత అపహాస్యం, ధిక్కారం ఉన్నాయో, స్వయంగా చదువరి భావాల్లో, ప్రవర్తనలో ప్రబలంగా ఉన్న భావజాల అవ్యవస్థల మీద అంత వెటకారమూ, ధిక్కారమూ ఉంటాయి.

అందుకే పతంజలి రచన సమాజం మీద ఎంతగా విమర్శో, అంతగా ఆత్మవిమర్శ. చదువరులంగా మనం ఏకకాలంలో ఒక పోలీసు అధికారినీ, రాజకీయ నాయకుడినీ, న్యాయమూర్తినీ, పత్రికాధిపతినీ అపహాస్యం చేస్తున్నట్టుగానే, ధిక్కరిస్తున్నట్టుగానే, మనలో ఉన్న మోసకారితనాన్నీ, నంగితనాన్నీ, అధికారాపేక్షనూ, లాభాపేక్షనూ, అటువంటి అవలక్షణాలన్నిటినీ కూడ అపహాస్యం చేసుకోవలసి ఉంటుంది. సమాజాన్ని శాసిస్తున్న, నిర్వహిస్తున్న వారి మీద ఎంతగా విమర్శ చేయవలసి ఉందో, ఆ శాసనాన్నీ నిర్వహణనూ ఆమోదిస్తున్న, అనుకరిస్తున్న, మౌనంగా భరిస్తున్న మనమీద మనం కూడ అంతగా విమర్శ చేసుకోవలసి ఉంటుంది. పతంజలి రచనల ఆకర్షణా బలమూ అదే. సాధారణంగా ప్రత్యర్థిని బైట చూసి విమర్శ చేసినప్పుడు మనకు ఒక సంతృప్తీ గర్వమూ కలుగుతుంటాయి. కాని ఆ ప్రత్యర్థి లక్షణాల్లో ఎంతో కొంత, శతాంశమో, సహస్రాంశమో మనలో కూడ ఉన్నప్పుడు, ప్రత్యర్థి మీద విమర్శకు పదను తగ్గుతుంది. అప్పుడు తప్పనిసరిగా అవసరమైనది ఆత్మవిమర్శ. లోచూపు. అది కలిస్తేనే అవ్యవస్థ మీద విమర్శ బలోపేతమవుతుంది.

“సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నాచుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఫలితంగా ఒకొక్కప్పుడు నా వ్యక్తిగత ప్రకటనే మరొక స్థాయిలో సామూహిక ప్రకటన అవుతుంది. సామూహిక క్రోధమే ఒకొక్కప్పుడు నా వ్యక్తిగత క్రోధమవుతుంది. సామూహిక శోకం నాకంట్లో ఒక నీటి బొట్టవుతుంది. ఏది సమూహం, ఏది వైయక్తికం” అని పతంజలి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆయన రచనల సమాజం-వ్యక్తి సమ్మేళనానికి, విమర్శ-ఆత్మవిమర్శ స్వభావానికి నిదర్శనం.

మరొక అంశం కూడ చెప్పుకోవాలి. పతంజలి కేవలం సామాజిక విమర్శకుడు మాత్రమే కాదు. ఆయన గొప్ప కళాత్మకత ఉన్న సృజనాత్మక రచయిత. అందువల్ల ఆయన రచన నిస్సారమైన విమర్శగా, విశ్లేషణగా ఉండదు. అది అపహాస్యం, వెటకారం, వ్యంగ్యం వంటి కళాత్మక దినుసులు అద్దుకుని ఆకర్షణీయంగా తయారవుతుంది. అది ధిక్కారంలా కనిపించకుండానే ధిక్కారం అవుతుంది. అది మళ్లీ ఉట్టి వెటకారమేనా, ఉట్టి ధిక్కారమేనా అంటే అంతమాత్రమే కూడ కాదు. మరింత ఉన్నతమైన సందేశం వైపు చూపుతుంది. తెలుగు సాహిత్యంలో అలవాటైన మొరటు, తక్కువస్థాయి పద్ధతిలో సందేశం చెప్పలేదు గనుక అసలు పతంజలి సాహిత్య లక్ష్యం సందేశం కానేకాదని వాదించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. వాచ్యంగా సందేశం ప్రకటించిన ‘పతంజలి భాష్యం’ వంటి రచనలు ఆయనలోని కళాకారుడివి కావనీ, ఆయన కథలూ నవలలూ సందేశం లేనందువల్లనే గొప్ప కళాత్మక రచనలనీ ఆయన మౌలిక స్వభావాన్నే ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారు.

కాని పతంజలి రచనల్లో సందేశం ఉందా లేదా, సాహిత్య ప్రయోజనం అనే ఉదాత్త లక్ష్యానికి పతంజలి రచనలు లొంగుతాయా లేదా, ఆయన కేవలం కళ కోసమే కళ అనుకున్న రచయితేనా అనే చర్చే అనవసరం. వాస్తవంగా చెప్పాలంటే, వాచ్య రూప సందేశం కన్న ధ్వని రూప, వ్యంగ్య రూప సందేశమే ఎక్కువ శక్తిమంతమైనది. అలా చూస్తే సామాజిక అవ్యవస్థ గురించీ, వ్యవస్థ మారవలసిన అవసరం గురించీ పతంజలి ఇచ్చినంత బలమైన సందేశాన్ని ఇచ్చినవాళ్లు తక్కువమంది.

*

మీ మాటలు

  1. buchi reddy gangula says:

    వ్వవ్యస్త మారవలిసిన అవసరం గురించి పతం జ లి గారు ఇచ్చినంత బలమయిన సందేశాన్ని యిచ్చిన వాళ్ళు చాల తక్కువమంది — excellent..ఆర్టికల్ sir…
    చాల బాగా చెప్పారు

    వారు ఉన్న కాలం లో — వారికి అంతగా గుర్తింపు రాలేదని —అని నేను బావిస్తాను

    very.. good..writer…..
    ——————————————బుచ్చి రెడ్డి గంగుల ———————

  2. saakya maharaj says:

    ఎన్ వేణుగోపాల్ పతంజలి రచనల మీద ఇంత బలహీనమైన వ్యాసం రాస్తారని అనుకోలేదు. అవ్యవస్థ – వ్యవస్థ అనే భావనలను కాస్తా విడమర్చి చెప్తే బావుండేది. పతంజలి అవ్యవస్థను విమర్శించాడు అని భావిస్తే, వ్యవస్థ ను కోరుకున్నాడని అర్థం. వ్యవస్థాగతమైన విలువలను, జ్ఞానాన్ని పతంజలి అంగీకరించ లేదు. ఉదాహరణకు, ఒక దయ్యం ఆత్మకథ. వేణు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు.కానీ చెప్పలేక పోతున్నాడు. పతంజలిని మార్క్సిస్ట్ చట్రంలో ఇరికించాలని అతడి ప్రయత్నం. అది విఫలమైంది. వ్యంగ్యం, ధ్వని, వెటకారం వంటి మాదక ద్రవ్యాలను అందరూ వాడారు. వాటినే గుర్తుచేయటం తప్ప వేణు ప్రసరించిన వెలుగు ఒక్కటీ నాకు కనిపించలేదు. పదాడంబరం బావుంది. సారభూతమైన వాక్యం ఒక్కటున్నా ఎంత బావుండేదో కదా!

  3. P Mohan says:

    వ్యాసం బావుంది సర్. నాకు కూడా గురజాడలో మాదిరే పతంజలి లోనూ చదివిన ప్రతిసారి కొత్త కోణాలు తగులుతాయి. ‘నాలుగు స్తంభాలాట’ లో సమిధలైపోతున్నమనుషులపై అంతులేని ప్రేమే పతంజలి భాష్యం. ఆత్మ విమర్శ కమ్యూనిస్టులకే బూతు మాటలా వినిపిస్తున్న ఈ రోజుల్లో వేల మంది పతంజలులు అవసరం.
    శాక్య మహారాజ్ గారూ..
    అవ్యవస్థ – వ్యవస్థ భావనలను కాస్తా విడమర్చి చెప్పి వుండాల్సిందన్నమీ సలహా బావుంది, కానీ వేణు ఇది వరకు పతంజలిపై రాసినవి కూడా చదవండి వీలయితే. చరిత్రలో ఏ వ్యవస్థా శాశ్వతం కాదు. మానవ సమాజం ఆటవిక దశ నుంచి అంతకంటే మెరుగైన నానా వ్యవస్థల గుండా సాగుతూ పోతోంది. రేపు మార్క్సిజానికి మించిన మంచిది రావొచ్చు. పతంజలిని ఎవరూ, ఏ చట్రంలోను ఇరికించనక్కర్లెదు. భావ వాద చట్రంలో అసలే అక్కర్లేదు.

  4. ఎ. కె. ప్రభాకర్ says:

    “ఈ అధికార వ్యవస్థల మీద, ప్రత్యేకించి మొదటి మూడు అధికారవ్యవస్థల మీద, ఇంకా తీవ్రమైన విమర్శ విప్లవ సాహిత్యోద్యమంలో కూడ ఉన్నదే. విప్లవ సాహిత్యం కన్న ఎక్కువ ఆదరణనూ, విస్తృతినీ పతంజలి రచనలు సాధించడానికి కారణమేమిటో అన్వేషించవలసి ఉంది. విప్లవ సాహిత్యం ప్రధానంగా ఈ అధికార వ్యవస్థల మీద గురి పెట్టింది గాని, అధికారం అమలు చేసే ఇతర వ్యవస్థలను గుర్తించలేకపోయింది. గుర్తించినా వాటి మీద విమర్శను తన సాహిత్యంలో భాగం చేయలేకపోయింది.”
    మంచి పరిశీలన వేణూ! పతంజలిని విప్లవ సాహిత్య రచయితలు ఎలా అర్థం చేసుకోవాలో , ఎలా ఆదర్శంగా స్వీకరించాలో మొహమాటం లేకుండా చెప్పినందుకు అభినందనలు.అయినా శాక్యమహారాజుకి వేణుగోపాల్ పతంజలిని మార్క్సిస్ట్ చట్రంలో బిగించినట్టు అనిపించడం ఆశ్చర్యమే.సారంలో పతంజలి మార్క్సిస్టే. కాదంటే మరేంటో కాదనే వాళ్లే చెప్పాలి.వ్యవస్థలో పాతుకుపోయిన అన్ని అవ్యవస్థల్నీ ప్రశ్నించిన మార్క్సిజమంటే అంత అసహనం ఎందుకో దాని ద్వేషులు ఆత్మ విమర్శ చేసుకొవాలి. అప్పుడు మాత్రమే పతంజలి చూపు వెంట నడవగలరు.

  5. buchi reddy gangula says:

    శాక్య మహారాజ్ గారు —మీ ఒపీనియన్ చాల బలహీనంగా ఉంది
    మరొక్కసారి చదవండి సర్—
    సారభూత మయినా వాక్యం అంటే ఏమిటి శాక్య గారు
    కొద్ది రోజుల క్రింద వి .వి గారి —( పతంజలి గారి గురించి ) వ్యాసం చదవండి
    శాక్య మహారాజ్ —-మీ కలం పేరా –మీ పేరా సర్

    ——————————–బుచ్చి రెడ్డి గంగుల ——-

  6. చదువరులంగా మనం ఏకకాలంలో ఒక పోలీసు అధికారినీ, రాజకీయ నాయకుడినీ, న్యాయమూర్తినీ, పత్రికాధిపతినీ అపహాస్యం చేస్తున్నట్టుగానే, ధిక్కరిస్తున్నట్టుగానే, మనలో ఉన్న మోసకారితనాన్నీ, నంగితనాన్నీ, అధికారాపేక్షనూ, లాభాపేక్షనూ, అటువంటి అవలక్షణాలన్నిటినీ కూడ అపహాస్యం చేసుకోవలసి ఉంటుంది.
    మంచి మాట!
    పతంజలి సాహిత్యం రాశిలో తక్కువైనా వాసిలో కాదు.

మీ మాటలు

*