అసలు సూత్రం..ఆ జీవితమే!

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshగోరటి వెంకన్న పాట విన్నారా?
‘గల్లి చిన్నది గరీబోని కథ పెద్దదీ’ అన్న పాట.

ఆ పాట ఒక గాథ.
అందులో ఎన్నో ఉదాహరణలు. మరెన్నో ఉపమానాలు. ఇంకెన్నో పోలికలు.
పగిలిన అద్దం. పండ్లు విరిగిన దువ్వెన. ఇంకా ఎన్నో…ఇంకెన్నో…

ఒక్కో దృశ్య సమాసం ఒక స్థితిని పంచుతూ ఉంటే మొత్తంగా అనేక దృశ్యాదృశ్యాలుగా ఆ పాట గల్లీ జీవితాన్నిఅద్దంలో కొండవలే చూపిస్తుంది. అయితే, జీవితాన్ని పరిపరి విధాలుగా… పదచిత్రాలుగా, జానపదాలుగా ఆయన గానం చేసిన తీరు అపూర్వం. కానీ, ఆ పాట నిజానికి ఒక దుస్థితి.

జీవితంలో అన్నీ ఉంటై. కష్టం- సుఖం. లాలనా- పీడనా…అన్నీ ఉంటై.
అయితే, అదొక పార్శ్వం మాత్రమే. ఆ కథ పెద్దది.
కానీ, దురదృష్టం ఏమిటంటే నా కథ చిన్నదనుకుంటారు.
కాదనే ఈ చిత్రం.

అసలు ఆర్థిక పార్శ్వం మినహాయిస్తే పేదవాడి జీవితం ఎంతటి భాగ్యవంతమో అని ఎలుగెత్తి చెప్పాలనిపిస్తుంది.
వెంకన్న కన్నా ఇంకా ఎత్తుకు ఎగిరి దుంకి ఆడి పాడి చెప్పాలనిపిస్తుంది. అవన్నీ చేయలేకే ఇలా చిన్నచిన్న దృశ్యాలు. దృశ్యాదృశ్యంగా గల్లీ జీవితాన్ని ఒకానొక జీవనదిలా మీలోకి ప్రవహింపజేయాలని ప్రయత్నం.

ఒక మహా రచయితా, దర్శకుడు అననే అన్నాడు, ఎప్పుడో!
‘చీకట్లో పాటలుండవా?’ అని.
పాడితే, చీకటి పాటలే పాడతామని!

కానీ, ముందే అన్నట్టు, ఆర్థికాంశాలే జీవితాన్ని నిర్ణయించవని వేల యుగాలుగా మానవ జీవితం చెబుతూనే ఉన్నది. మానవ సంబంధాలన్నీఆర్థిక సంబంధాలు కానే కావని మర్క్సిస్టులకు తప్పా మిగతావాళ్లకు ఎన్నడో తెలిసిపోనే పోయింది. ఇంకా చాలా ఉన్నాయని తేలిపోయి కూడా చాలా కాలమైంది. కానీ, కార్యకర్త తాలూకు జీవితమే అన్ని కార్యారంగాలను డామినేట్ చేస్తూ ఉండటం మూలాన ఒక్కోసారి జీవితాన్ని యధాతథంగా అంగీకరించడం ఆపేసి చాలా కాలమే అయింది.

అందుకే విచారం.

ఆర్థికాంశం మినహాయిస్తే జీవితంలో ఏ లోటూ లేదు.
అది ఉన్నంత మాత్రాన మనుషులను పేదవాళ్లుగా చూడటం అసలైన భావదారిద్ర్యం.

మనుషులు గల్లీలో ఉండవచ్చు, ఢిల్లీలో ఉండవచ్చు.
ధనవంతులు కాకపో్తే భాగ్యవంతులు కారా? అన్న సందేహం నాది.
అందుకే గల్లీ జీవితాన్ని ఒక అందమైన పాటగా చిత్రిస్తూ ఉండటం నాకొక అభిరుచి.

చిత్రిస్తూ ఉంటే, నిజానికి అటువంటి సందేహమే అక్కర్లేదని, జీవితం అందంగా హామీ ఇస్తూనే ఉన్నది.

అక్కడ అందం ఉంది. సౌందర్యం ఉంది.మనుషులకు తీరుబడి ఉంది.
గల్లీ ఒక పెద్దబడి. దాన్ని పూర్తిగా చూసేందుకు విద్యార్థులం కావాలి. కార్యకర్తలమే కాదు.

అందుకే ఈ చిత్రం.

నిజానికి మనకే తీరుబడి లేదు. సౌందర్యం లేదు. నిజం.
అక్కడ కళా ఉంది. పోషణా ఉంది. సరసం ఉంది. సంగీతం ఉంది. అన్నీ ఉన్నయ్.ఉపరితలం ఉంది. భూమికా ఉంది.
అర్థం చేసుకుంటే పగిలిన అద్దం ఒక స్థితి మాత్రమే.
దాంట్లో మనిషి కానరాకుండా పోలేదని గమనించాలి.అంతెందుకు?
ఒక మనిషిని చూశాను.
భార్యకు మాంగళసూత్రం కొంటున్నాడు. చిన్నదుకాణం అది. చూస్తే పసుపు తాడు.
ఫొటో తీయాలని ప్రయత్నిస్తే వారించాడు. భార్య కూడా కళ్లతో వద్దని సూచించింది.
అదొక మర్యాద. కొన్ని బంధాలను ఎవరు పడితే వాళ్లు, ఎప్పుడు పడితే అప్పుడు చూడకూడదు. తీసి దాయకూడదు. నలుగురికీ చూపనే కూడదు. వాళ్ల మాట మన్నించి గమనించసాగాను, ఒక మనిషిగా.ఆ పసుపుతాడు కొన్నాక ‘అది వట్టి పసుపు తాడే కదా…అంత సంతోషం ఏమిటి’ అన్నాను ఆయనతో.
నవ్వి చెప్పాడాయన…’బాబూ…నీకే కాదు, ఎవరికైనా ముందు సూత్రం తెలియాలి. తెలిస్తే ఏదైనా మంగళప్రదమే అవుతుంది’ అన్నాడు. అని ఊరుకోలేదు. ‘అది వట్టి తాడు కాదు. పసుపు తాడు’ అన్నాడు. ‘ ఆ తాడుకు పసుపుకొమ్మూ ఉందన్న అర్థంలో! ‘ఇంకేం కావాలి?’ అని కూడా అన్నాడు.

అసలు విషయం పవిత్రబంధం అని వాళ్లిద్దరూ అలా అర్థం చేయించారు.

వాళ్లు నిరుపేద కూలీలు.
ఇంకా పని నుంచి గల్లీలో ఉన్న తమ ఇంటికి వెళ్లలేదు.
దారిలో దుకాణంవద్ద ఈ కొనుగోలు. ఆ మట్టి మనుషులను చూస్తే ‘బంగారం’ అనిపించింది.

నిజం.

ఆమెను చూశాను. తృప్తిగా ఉందామె.
అందమంటే ఏమిటో అర్థమైంది.

అతడ్ని చూశాను, మోటుగా ఉన్నాడాయన.
మగసిరి అంటే ఏమిటో గమనించాను.

ఇద్దర్నీ కలిపి చూశాను.
భాగ్యవంతులు అనిపించింది.

పసుపుతాడు…పసుపు కొమ్ము కళ్ల ముందు మెదులుతుంటే – ఆర్థిక విషయాలతో మనుషులను దరిద్రులుగా చూడటం మానేయకపోతే మనం చాలా నిరుపేదలుగా మిగులుతామనే అనిపించింది. అందుకే పగిలిన అద్దాన్ని చూడవద్దంటున్నాను. బంగారు మాంగళసూత్రాన్నే చూడ ప్రయత్నించ కూడదంటున్నాను.

+++

ఈ చిత్రం అందుకే.  ఆమెను చూడండి.
గలగలలాడే ఆమె గాజుల చేతులు. ధృడంగా ఆ అద్దాన్ని పట్టుకున్నతీరు. ఇంకో చేతితో గాలికి ఎగిరే ఆ ముంగురులను నిదానంగా సవరించుకునే తీరూ చూడండి.

ఆమెను చూడమంటున్నాను.
అద్దం జీవితాన్ని ప్రతిఫలిస్తుంది. అంతే.
కానీ అద్దమే జీవితం కాదు.

గొప్ప పాటలు పూర్తి జీవితాలు కాదు.
జీవితమే పాట.
~

మీ మాటలు

  1. P Mohan says:

    రమేష్ గారూ,
    ఫోటో చాలా బావుంది. ఈ గల్లీ ‘దర్పణ సుందరి’ని కాళిదాసు చూసుంటే గొప్ప కావ్యం రాసి ఉండేవాడు. పెచ్చులూడిన గోడ, పెచ్చు లాంటి అద్దం.. అయినా సంపూర్ణ జీవన సౌందర్యం. పెచ్చులు పోయిన గోడ, ఆమె గాజుల రంగులకు ఎంత ఒద్దిక! ఇస్మాయిల్ కవితలు గుర్తుకొస్తున్నాయి. కాంతిమంతమైన ఈ సంరంభంలో కుడి చివర దృశ్యాదృశ్యంలా ఉన్నఆ చీకటి రూపం ఏమిటో?

  2. kandukuri ramesh babu says:

    mohan garu

  3. kandukuri ramesh babu says:

    మోహన్ గారు, అ నైరూప్యం మరొక సుందరిదే!
    థాంక్స్ ఫర్ ది నైస్ కామెంట్.

  4. Dr. Vijaya Babu, Koganti says:

    “ఆర్థిక విషయాలతో మనుషులను దరిద్రులుగా చూడటం మానేయకపోతే మనం చాలా నిరుపేదలుగా మిగులుతామనే అనిపించింది.”

    ప్రస్తుత సమాజం కట్టుకున్న గంతలు , పెంచుకున్న పొరలు తొలగించు కుంటే ధనాతీతంగా ప్రతి వ్యక్తీ జీవితంలోను వెల్లివిరిసే సౌభాగ్యమ్ తేటతెల్ల మౌతుంది.

    బాగుంది రమేష్ గారు.

  5. kandukuri ramesh babu says:

    థాంక్స్ ప్లీజ్.

మీ మాటలు

*