Archives for May 2015

చిగురించే… చేతివేళ్లు

  మొయిద శ్రీనివాసరావు

 

చింతనిప్పుల్లా మండే …
మా నాన్న కళ్ళలోకి
సూటిగా చూడలేని నేను
చెట్టు వేళ్ళు లాంటి

ఆయన చేతివేళ్లను

అదేపనిగా చూసేవాడిని

శ్రమని  పంచిన  వేళ్ళు
నన్ను నడిపించిన వేళ్ళు
ఊయలై ఊగించిన వేళ్ళు

ఆ వేళ్ళలోంచి… నిత్యం పని ప్రవహించేది
గిజిగాడి నిర్మాణ కౌశలం కనిపించేది
మానవ జీవన పరిణామక్రమం అగుపించేది

పల్లెలో… పిడికెడు మట్టిని
గుప్పెడు గింజలగా మలిచిన  ఆ వెళ్ళే
మిల్లులో… నారపోగులను
పంచదార గోనెలుగా మలిచాయి
చెమట చేతికి… ఆకలి నోటికి మద్య
దూరాన్ని కొలిచాయి

ఏ అవసరమో… అసహనపు పామై
బుర్రలో బుసలుకొట్టినప్పుడు
కాసింత ఖాళీ సమయాన్ని చుట్టగ చుట్టి
కాల్చేయగలిగిన ఆ చేతి వేళ్ళలో
ఓ రెండు మొండు వేళ్ళు కనిపించేవి

మా అమ్మ చిరుగుల చీరను

పైటగ చేసుకొని
గోడకు కొట్టిన పసుపు ముద్దలా

మా చెల్లి  చాపపై కూర్చున్నప్పుడు

యంత్రం నోటిలో పడి తెగిన … ఆ వేళ్ళే

అయిన వాళ్లకు నాలుగాకులేసి

చెల్లి నెత్తిన రెండక్షింతలేసి లేవదీసాయి

ఆ వేళ్ళే…
అక్షరమ్ముక్క

నాకు ఆసరా కావాలని
నా వేళ్ళ మద్య

నిత్యం కలం కదలాడేలా చేసాయి

ఎక్కడైనా…
వేళ్ళు నరికితే పచ్చని చెట్టు కూలుతుంది
సగం తెగిన మా నాన్న చేతి వేళ్ళపైనే
ఆశల పతాకమై  చిగురించాల్సిన
మా బతుకు చెట్టు  మొండిగా నిలిచింది
* * *

(నెల్లిమర్ల జ్యూట్ కార్మికులు తమ కుటుంబ అత్యవసర ఆర్దిక అవసరాలకై మిల్లు యంత్రంలో చేతివేళ్ళు పెట్టడాన్ని కన్నీళ్ళతో తలుచుకుంటూ…)

Moida

 

లెఫ్ట్ వాళ్ళకి అంబేద్కర్ ఏమిటో తెలియదు: నకుల్

 పి. విక్టర్ విజయ్ కుమార్

 

గత వారం ముజఫర్ నగర్ మీద డాక్యుమెంటరీ గురించి మీరు చదివారు.  నిండైన గడ్డం తో , గొప్ప చదువరి చూపులతో కనిపించే ఉత్సాహ వంతమైన యువ మేధావి నకుల్ సింగ్ సాహ్నీ నుండి డాక్యుమెంటరీ  దృక్పథం, ప్రణాళిక విషయాలతో పాటు పెరుగుతున్న మత ఛాందస వాదం  కుల రాజకీయాలు, ముజఫర్ నగర్ ఊచకోత సంఘటన యొక్క ప్రత్యేక స్వరూప లక్షణాలు, భారతీయ కిసాన్ యూనియన్  తిరోగమన పాత్ర, ప్రస్తుత పరిస్థితుల్లో మత ఛాందసవాద వ్యతిరేక పోరాటం లో అంబేద్కర్ ప్రాముఖ్యత, హిందూ ఛాందస వాదానికి వ్యతిరేకంగా పోరాడగలిగే సైద్ధాంతిక ఆలోచన ధోరణి లాంటి విషయాలపై  నకుల్ తో కాసేపు..

విజయ్ : నకుల్ గారు, మీరు  మీ టీం  కృషి ఘనంగా అభినందనీయం. శుభాకాంక్షలు ! ఈ దేశం లో ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా హిందూ ఛాందస వాదం పేట్రేగి పోతున్న సమయం లో , ద్వేషం  అసహనమే రాజకీయాలను నడుపుతున్నప్పుడు చాలా సమయానుకూలంగా మీ డాక్యుమెంటరీ రావడం జరిగింది. నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి  వచ్చి సమయం వీలు చేసుకుని ఈ సినిమా చూడ్డమే కాకుండా 10 డీ వీ డీ లు స్నేహితుల కోసం కొన్నాం.

నకుల్ : విజయ్ గారు,   మీకు సినిమా నచ్చడం సంతోషం.

విజయ్: ఈ డాక్యుమెంటరీ సున్నితంగా సూక్ష్మంగా మత ఛాందస వాదాన్ని పరిశీలిస్తుంది.  ” ముజఫర్ నగర్ బాకీ హై …” తీయడం లో మీ దృక్పథం ఏంటి ? అసలు ఇదే ప్రధాన విషయంగా ఎందుకు ఎన్నుకోవాలనిపించింది ?

నకుల్ : మనం కొని సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి. ”  Immoral Daughters of the land ”  అనే డాక్యుమెంటరీ మీద పని చేస్తున్నప్పుడు ఈ ఆలోచన తట్టింది. ఆ డాక్యుమెంటరీ హర్యానాలో ఖాప్ పంచాయితీల గురించి మరియు పరువు హత్యల గురించి తీయడం అయ్యింది. అకస్మాత్తుగా పరువు హత్యలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం చేసుకోదల్చుకున్నాను. ఒక ప్రధాన విషయం తెలిసిందేమంటే – నిమ్న కులాలలో పెరుగుతున్న ప్రకటిత భావనకు వ్యతిరేకంగా అగ్ర కులాలలో పెచ్చరిల్లిన విరోధం ప్రధాన కారణం. సరిగ్గా ఇదే అంబేద్కర్ చెప్తాడు. ” ఒక యువతి తన కులానికి బాహ్యంగా ఉన్న వ్యక్తితో పెళ్ళి చేసుకున్నప్పుడు, కుల వ్యవస్థను కాపాడే ఈ వివాహ వ్యవస్థను వ్యతిరేకించి,  ఈ కుల వ్యవస్థకున్న ఒక ప్రధాన పునాదిని పగలగొడుతున్నట్టే ! ” . ఈ డాక్యుమెంటరీ మీద పని చేస్తున్నప్పుడు డిసెంబర్ 2010 లో హర్యానా కు బయటి ప్రాంతాల్లో నివసిస్తున్న  జాట్ కులసముదాయం లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని  ముజఫర్ నగర్ వెళ్లాను. ‘ఖాప్ పంచాయత్ విధానం ‘ తిరిగి తెరపైకి రావడం నేను గమనించాను. జాట్ అస్తిత్వ రాజకీయాలు  అంతర్లీనంగా దళిత , మహిళా వ్యతిరేకమైనవి.

అప్పట్లో , పశ్చిమ యూ పీ లో , ఈ జాట్ అస్తిత్వ రాజకీయాలు త్వరలో హిందూ మతతత్వ రాజాకీయాలలోకి జారుకుంటున్నాయనే విషయం నాకు అనిపించింది. ఆ ప్రదేశాలు ముస్లిం జనాభా ఎక్కువగా కలిగినందువలన , ఆ రాజకీయాలు ముస్లిం మైనారిటీ వ్యతిరేక రూపాన్ని తీసుకుంటాయనే భావన నాకు కలిగింది. తిరిగి వచ్చాక మితృలతో మాట్లాడుతూ  అన్నాను ” ఈ జాట్ అస్తిత్వ రాజకీయాలు విషపూరితమైన హిందుత్వ రాజకీయాలుగా రూపు దిద్దుకుంటాయనే ఒక చెడు భావన నాలో ఉంది ” అని. మరి అదే జరిగింది ఇప్పుడు !. జాట్ ఛాందసవాదం అంటే అంతర్లీనంగా సాంఘిక ఛాదస్తాన్ని ఎగదోయడం, కులాంతర వివాహాలు చేసుకోకుండా మహిళలను నిరోధించడం. ఇలాగే, ఈ కులాంతర వివాహాలను అరికట్టకుంటే త్వరలో ఇది ముస్లిం లను హిందూ స్త్రీలు పెళ్ళి చేసుకోవడం కూడా ఆపలేదు. ఐతే ఈ ధోరణి ఎంత దాకా తెగించ గలదు అని నేను ఊహించలేదు . వాస్తవానికి, ఈ డాక్యుమెంటరీ, ముందు తీసిన డాక్యుమెంటరీకి తరువాయి భాగం లానే. అక్కడి నుండే నేను తీగ లాగాను.

విజయ్: హిందూ అగ్రకుల శక్తులు సమర్థిస్తున్న కుల తత్వ వాదము, కుల రాజకీయాలే ఈ మత ఛాందస వాదాన్ని ప్రోత్సాహిస్తున్నాయని మీరు అనుకుంటున్నారా ? కుల రాజకీయాలే మత రాజకీయాలకు భూమికగా నిలుస్తున్నాయా ?

నకుల్ : మత తత్వ వాదం అంటే బ్రాహ్మినీక మనువాద సిద్ధాంతానికి పొడిగింపే. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఛాందస వాదం పెరిగేకొద్ది – ఇది కేవలం ముస్లిం లకు మాత్రమే అభద్రత కాదు, మహిళలకూ మరియు పెద్ద స్థాయిలో దళితులకు కూడా. ఈ రాజకీయాలు అంతర్లీనంగా మైనారిటీ, మహిళా, దళిత వ్యతిరేక రాజకీయాలే. ఆ విధంగా ఈ ముజఫర్ నగర్ సంఘటన ఏ విధంగా పితృ స్వామ్యం, కులతత్వం మరియు మత తత్వం అనుసంధించబడ్డవో చెప్పడానికి అద్భుత ప్రామాణికం. హెడ్గేవార్ ఒక ఆర్ ఎస్ ఎస్ సంస్థను స్థాపించడం ఎందుకనే ఒక ప్రశ్నకు బదులిస్తూ ఇలా అన్నాడు ” ముస్లింల లో అగ్రెషన్ పెరుగుతుంది ” అని. అదే పొడిగిస్తూ ఇలా అన్నాడు ” దీనితో పాటు నిమ్న కులాల్లో కూడా అగ్రెషన్ పెరిగిపోతుంది ” అని. ఆయన పుట్టి పెరిగిన మహారాష్ట్రలో జ్యోతిబా ఫులే నుండి అంబేద్కర్ వరకు ఈ ఉద్యమాలు బ్రాహ్మాణధిపత్యాన్ని ప్రశ్నించడం పెరిగిపోయింది. ఆర్ ఎస్ ఎస్ ప్రధాన ఉద్దేశ్యం బ్రాహ్మనీక ఆధిపత్యాన్ని ఎత్తి పట్టడమే. అందువలన ఇది కేవలం ముస్లిం వ్యతిరేక తత్వమే కాడు , దళిత వ్యతిరేక తత్వం కూడా. కాబట్టి ఈ మత తత్వ వ్యతిరేక పోరాటం పురుషాధిక్య వ్యతిరేక  కుల వ్యతిరేక పోరాటాలతో గాఢంగా మిళితమవ్వాలి. ఈ మత ఛందస వాదులే కదా అంబేద్కర్ ప్రవేశ పెట్టిన హిందూ కోడ్ బిల్లును కూడా వ్యతిరేకించారు ?! వీళ్ళు బహిరంగంగానే మనుస్మృతిని సమర్థిస్తారు. ఇంకా కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కొంతైనా నటిస్తుంది. అదే బీ జే పీ మనుస్మృతిని ఇప్పటికీ పూజింపదగినదిగా భావిస్తుంది.  అవును, మీరు చెప్పిన దానితో నేను పూర్తిగా ఎకీభవిస్తున్నాను – ఇవన్నీ ఒకే హిందూ ఛాందసవాదాన్ని సమర్థించే భావజాలాలే.

nakul

విజయ్ : మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో హేయమైన మత ఘర్షణలు జరిగాయి.   అయితే ఈ ముజఫర్ నగర్ అల్లర్లలో ఎవైనా ప్రత్యేకాంశాలు మీరు గమనించారా ?

నకుల్ : ప్రతి మత ఘర్షణలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మిగతా అల్లర్లను ఇంత దగ్గిరగా నేను అధ్యయనం చేయలేదు కాబట్టి ఇదమిద్ధంగా వ్యాఖ్యానించలేను. కానీ నాకు కొన్ని పరిశీలనలు ఉన్నాయి. బాబ్రి మజీదు సంఘటన సమయంలో కూడా ఇక్కడ చిన్నా చితక అల్లర్లు తప్ప , అది కూడా , పట్టణ ప్రాంతానికి పరిమితమై ఉన్నాయి. ఈ సారి మాత్రం ఈ అల్లర్లు గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించాయి. ప్రతి అల్లరి వెనుక ఉండే సహజ సిద్ధమైన ఆర్థిక మూలాలు ఇందులో కూడా ఉన్నాయి.  భారతీయ కిసాన్ సంఘం ను విచ్చిన్నం చేసి రైతు ఉద్యమాలను నీరు గార్చడం ఒకటి. రైతు ఉద్యమాన్ని నీరు గార్చడం తో పాటు ఇది బీ జే పీ కీ మిల్ ఓనర్లకు దోహదం చేసింది. 2005 నుండి చూస్తే షుగర్ మిల్స్ క్రమంగా ప్రైవేటు పరం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో కులం , మతం మాత్రమే కాదు – కార్పోరేట్ ల లోభం కూడా ఉంది. ఎన్నో అంశాలు కలిసి దగ్గరకు వచ్చాయి. నిజాయితీగా చూస్తే – మోదీ గుజరాత్ అల్లర్లకు ప్రధాన కారణం అని ప్రతి కార్పోరేట్ కు తెలుసు మరెందుకు ఆయన్ను సమర్థించాయి ?

విజయ్ : మీరు క్షేత్ర స్థాయిలో పని చేసారు. బీ జే పీ అధికారం కోసం అర్రులు జాస్తున్నప్పుడు , మోదీ పదవి కోసం తీవ్రంగా మోహం లో ఉన్నప్పుడు జరిగిన ఈ అల్లర్లు మునుపు అల్లర్లతో పోల్చి చూస్తే – ముందుగానే ఊహించి, ప్రణాళిక బద్ధంగా , నేర్పుగా రచించబడ్డ  అల్లర్లుగా అనిపిస్తుందా ?

నకుల్ : అవును. ఇవి ముందుగానే రచించ బడ్డ అల్లర్లు. గుజరాత్ అల్లర్లు ఒక స్థాయిలో రచించబడ్డదైతే ఇవి ఇంకో స్థాయిలో రచించబడ్డాయి. ఇది డాక్యుమెంటరీలో కూడా చూపించడం జరిగింది. వీళ్ళు స్థిరంగా చిన్న చిన్న అల్లర్లను మలుస్తూ వచ్చారు. ముస్లిం జనాభా అధికంగా ఉండదం వల్ల పశ్చిమ యూ పీ ని ఎన్నుకున్నారు. వీళ్ళకూ తెలుసు – ముస్లిం లు తిరగబడితే ఈ గొడవలు త్వరగా వ్యాపిస్తాయి అని. భారతీయ కిసాన్ సంఘం ను ఉపయోగించుకున్న విధాన్ని చూసినా, రైతు ఉద్యమాన్ని నీరు గార్చిన విధానాన్ని గమనించినా, పన్నాగ పూర్వకంగా హిందూ స్త్రీల భద్రత గురించి ప్రచారం చేయడం పరిశీలించినా ఇది తేట తెల్లం అవుతుంది. ఇదంతా 6 – 7 నెలల ముందు నుండే పన్నాగం పన్నిన్నట్టు నాకు అనిపిస్తుంది.

విజయ్ : భారతీయ కిసాన్ సంఘం (బీ కే యూ ) గురించి – బీ కే యూ నిజాయితీగా రైతు సమస్యల కోసం అంతకు మునుపు పోరాడిందంటారా ? కనీసం ఆ మేరకు ఆ అల్లర్ల మునుపు వరకైనా చేసిందంటారా ?

నకుల్ : 1989 లొ చూస్తే బీ కే యూ చారిత్రక రైతు ఉద్యమాన్ని నడిపిందన్న మాట వాస్తవం. అయితే ఆ ఉద్యమం ధనిక రైతులకు ప్రాతింధ్యం వహించందనే మాట కూడా వాస్తవమే.

విజయ్ : ప్రాంతీయంగా బీ కే యూ ఉద్యమం ను హిందూ అగ్రకుల వ్యవసాయదారులు, ధనిక రైతుల సముదాయం చేజిక్కించుకుని ఒక నమ్మకమైన స్థానాన్ని సంపాయించుకుని, ఒక సంక్షేమ కారణం కోసం మాత్రమే పోరాటం చేసే నాయకత్వంగా నమ్మబలికే రూపాన్ని తీసుకున్నాక – తమ స్థాయిని ఇప్పుడు అల్లర్లను రెచ్చ గొట్టాడానికి ఉపయోగించుకున్నాయా ?

నకుల్ : మీరు సినిమాను గమనిస్తే గులాబ్ అహమ్మద్ అనే ముస్లిం నాయకుడు బీ కే యూ నుండి విడిపోతాడు.  బీ కే యూ ఉద్యమం ముస్లిం లను మరియు జాట్లను కలిపి ఉండడం వలన బలహీన పడ్డట్టు బీ జే పీ భావించింది. ఇది విచ్చిన్నం చేయడం ద్వారా మొత్తం రైతు సంఘటననే నిర్వీర్యం చేయొచ్చని భావించింది. ఆ తర్వాత బీ కే యూ కేవలం జాట్లు శాసించే సంస్థగా  మిగిలిపోయింది.

విజయ్ : మీ సినిమా ఎలా సాగిందో , ఎలా నమూనాగా రూపొందించుకున్నారో , ఆ విధానం ఎలా ఉందో వివరిస్తారా ?

నకుల్ : అల్లర్లు జరిగిన ఒక వారం తర్వాత నేను షూటింగ్ మొదలు పెట్టాను. ఎలా వెల్తున్నామో మాకు క్రమంగా అర్థం అయ్యింది అప్పుడు. ఎలా మాముందు వాస్తవాలు రూపుదిద్దుకుంటూ వచ్చాయో అలా మేము ప్లానింగ్ వేసుకుంటూ వెళ్ళాము. నెలకు 10-15 రోజులు మా మకాం అక్కడే. ఒక 2-3 నెలల తర్వాత కూర్చుని – స్క్రిప్ట్ పోగు చేయడం మొదలు పెట్టాను. మేము – నాతో పాటు ఇద్దరు జర్నలిస్టులు – అందులో ఒకరు నా భార్య, తారిక్ అన్వర్, కెమెరా మ్యాన్ మహమ్మద్ గని, కామేష్, పులోమా పాల్, ఆషిష్ పాండే మిగతా మిత్ర బృందం ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కెమెరా మ్యాన్ మహమ్మద్ గని పేరు మేము చాలా సార్లు మార్చి మార్చి జాగర్త పడ్డాము. ( నవ్వులు)

విజయ్ : షూటింగ్ తీసే సమయం లో ప్రాక్టికల్ సమస్యలు ఏవి ఎదుర్కున్నారు ? ఈ డాక్యుమెంటరీని అడ్డుకునే ప్రయత్నాలు ఏమన్నా జరిగావా ?

నకుల్ : మీరు సినిమా చూసారు. అందులో బీ జే పీ ఎం ఎల్ యే ఒకరు కెమెరాని మూసేస్తాడు. ఇది మొహమ్మీదనే చేస్తాడు. ప్రత్యక్షంగా ఏవీ నిర్దుష్టమైన బెదిరింపులు లేవు . కానీ, ఆ ప్రాంతపు మితృలు మాత్రం నన్ను ” నీ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ” అంటూ జాగర్త పరిచే వాళ్ళు.

nakul2

విజయ్ : వాస్తవానికి, అమిత్ షా రెచ్చ గొట్టే ఉపన్యాసం కూడా మీ కెమెరాలో చిక్కించుకున్నారు…..

నకుల్ : అవును. అది బట్ట బయలు చేసాక అమిత్ షా ను ఎన్నికల ప్రచారం ఒక వారం మేరకు చేయకుండా ఎన్నికల సంఘం నిరోధిస్తూ ఆంక్షలు విధించింది. నా భార్య ఒక ఆర్టికల్ కూడా వ్రాసింది. మేము ఈ క్లిప్ ను నెట్ లో పెట్టాము. కొన్ని పార్టీలు , ఈ క్లిప్ ఆధారంగా ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేసాయి.

విజయ్ : ఈ అల్లర్లలో దళితుల పాత్ర సహజంగానే వారికుండే సాంఘిక ఆర్థిక కారణాల దృష్ట్యా ఒక ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది. నాకు ఇందులో ఒక వ్యక్తి చెప్పే మాటలు గుర్తు ఉన్నాయి ” వాళ్ళకు ఈ విషయంలో ఏది ఎన్నుకోవాలో అస్కారం, అవకాశం లేదు. వాళ్ళు పారిపోయైనా వెళ్ళాలి లేదా బానిసలా బతకాలి ” అని. ఈ హిందూ ఛాందస వాదులు ఈ అల్లర్లు రెచ్చ గొట్టాడానికి దళీతులను వాడూకున్నట్టుగా మీకు అగుపించిందా ?

నకుల్ : ఈ నిర్దుష్టమైన అల్లర్ల విషయం లో కాదు. ఈ సినిమాలో ముస్లిం లు ‘ దళితులను మాలానే పరిగణించారు ‘ అని అనడం కనిపిస్తుంది. బీ ఎస్ పీ,   BAMCEF  యొక్క పాత్ర కూడా ఉంది ఇందులో. ఇందువలన కొన్ని దళిత కులాలు, ఉప కులాలు రాజకీయ చైతన్య వంతులు అవ్వడం జరిగింది. చాలా మందికి బీ జే పీ దళిత – ముస్లిం అల్లర్లను రెచ్చ గొట్టే ప్రయత్నం లో ఉందని అర్థం అయ్యింది . దళిత – ముస్లిం అల్లర్లను సృష్టించడానికి బీ జే పీ మురాదాబాద్ లో కూడా కృషి చేసింది . కానీ సఫలీకృతం అవ్వలేదు. ఎవో కొన్ని వాల్మీకి సముదాయం లోని కొన్ని సెక్షన్ లు బీ జే పీ కి మద్దతు ఇవ్వడం కనిపించింది. కాన్షీ రాం తర్వాత, మాయావతి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని చంపి వేసింది. ఆ తర్వాత బాం సెఫ్ ఉద్యమాన్ని కూడా క్రమ క్రమంగా చంపేసింది. అధికారం సంఘటించడం అవసరమే కాని అందుకు సిద్ధాంతాలను పణం పెట్టి కాదు. ఈ సినిమాలో ఒక దళితుడు చెప్పడం గమనించవచ్చు ” ఆమె పండిట్ లను చుట్టూ పోగేసుకుంది ” అని. అయితే , కాన్షీ రాం పోషించిన పాత్ర, దాని ప్రభావం ఇప్పటికీ ఉంది. బీ ఎస్ పీ ఒక్క సీట్ కూడా గెలవ లేకపోయింది కాని, 19 శాతం ఓట్లు సంపాయించగలిగింది కదా? ఎవరు వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ?. ఆ ప్రాంతాలలో దళిత – ముస్లిం అల్లర్లను రెచ్చ గొట్టడం బీ జే పీ కీ సులభతరం కాదు.

విజయ్ : మీరు బీ జే పీ , ఆర్ ఎస్ ఎస్ వాళ్ళ నడవడిక గమనించినట్టైతే అంబేద్కర్ ను మమేకం చేసుకోడానికి ఆశ మీరిన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంబేద్కర్ హిందూ ఛాందస వాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత సైనికిడు. ” నేను హిందువులకు తోటలో పాము లాంటివాడిని ” అని స్పష్టంగా అన్నాడు. హిందూత్వం అని కూడా ఉల్లేఖించకుండా సరాసరి ” హిందువులే ” అనేసాడు. ఈ తృణీకార, నిస్పృహ వైఖరి వారిపై నిర్మొహమాటంగా ఎదురు తిరగడం లాంటిది. ఈ విషయం లో మీ నిర్దుష్ట అభిప్రాయం ఏంటి ? ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటారు ?

నకుల్ : నా మట్టుకు నేను ఈ విషయం లో లెఫ్ట్ ను తప్పు పడతాను. లెఫ్ట్ అంబేద్కర్ ను మమేకం చేసుకోలేకపోయింది. అందుకే రైట్ చేసుకుంటుంది. లెఫ్ట్ కుల సమస్యను సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయింది. అంబేద్కర్ ను మొత్తానికే నిర్లక్ష్యం చేసారు. సోవియట్ యూనియన్ నుండి తీసుకున్న నమూనాను పూర్తిగా భిన్నమైన ఈ దేశ సమాజం లో  ‘ కాపి అండ్ పేస్ట్ ‘ చేయ జూసారు. అసలు కులం, వర్గం లో సమైక్య భాగంగా ఎందుకు గుర్తింపు పొందలేక పోయింది ? . ఈ నాటికీ లెఫ్ట్ ఈ విషయం అర్థం చేసుకోలేదు. సీ పీ ఎం పార్టీ కాంగ్రెస్ ను ఇటీవలే పూర్తి చేసుకుంది. కానీ పోలిట్ బ్యూరోలో ఒక్క దళిత వ్యక్తి లేడు. లెఫ్ట్ అంబేద్కర్ ను దత్తత తీసుకుని ఉంటే రైట్ కు వేరే గతి ఉండేదే కాదు. అద్వాని రథ యాత్ర చేసినప్పుడు కులతత్వ రాముడి బొమ్మ పక్కనే అంబేద్కర్ బొమ్మను పెట్టుకునే సిగ్గుమాలిన తనం ప్రదర్శించారు. కానీ దురదృష్టం ఏంటంటే మార్క్స్ పక్కన పొరపాట్న కూడా అంబేద్కర్ ఫోటో పెట్టిన పాపానికి లెఫ్ట్ పోలేదు. కాబట్టి ఎవరిని ఈ విషయం లో నిందించాలి ?

విజయ్ : రాజ్యం ఏదన్నా అణచివేయలేకపోతే మమేకం చేసుకుంటుంది. అంబేద్కర్ ను మమేకం చేసుకోవడం అంటూ జరిగితే చాలా వినాశనం జరుగుతుంది.

నకుల్ : ఖచ్చితంగా అవును. చూడండి..” ఘర్ వాప్సీ ” కి అంబేద్కర్ స్పష్టంగా వ్యతిరేకం. కానీ ఈ విషయం లో అంబేద్కర్ ను అనుకూల స్వభావిలా చిత్రీకరించే యత్నాలు జరుగుతున్నాయి.

విజయ్ : నాకు ఈ డాక్యుమెంటరీ లో వ్యక్తిగతంగా కష్టం కలిగించిన విషయం ఒకటి ఉంది. హిందూ ఛాందస వాదమే కాదు అసలు హిందూత్వానికే వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వ్యక్తి అంబేద్కర్. ఆర్ ఎస్ ఎస్ హెడ్ క్వార్టర్స్ అయిన నాగ్ పూర్ లో బుద్ధిజం స్వీకరించిన సాహసం ఆయనది. చాలా ప్రణాళికా బద్ధంగా హిందూత్వం పై దాడి చేసిన వ్యక్తి ఆయన. ఈ సినిమాలో అంబేద్కర్ ను మెరుగుగా వాడే అవకాశం మీరు వినియోగించుకోలేదెందుకని ? ఈ సినిమా మొత్తం అంబేద్కర్ గురించి నిశ్శబ్దంగా ఉంది. ఈ సినిమాను ఈ విషయం లో మెరుగు పరిచే అవకాశం ఉందని మీరు అనుకోవడం లేదా ?

నకుల్ : ఈ సినిమా అతని తాత్విక వాదాన్ని ఎన్నొ విధాలుగా తీసుకువస్తుంది. మత ఛాందస వాదం పై పోరుకు అంబేద్కర్ తాత్విక వాదాన్ని మరింతగా అన్వేషిస్తుంది.బీ ఎస్ పీ ఈ విషయం లో విఫలమయ్యింది అనే విషయం కూడా సినిమలో చెప్ప బడుతుంది. మనకు అంబేద్కర్ కావాలి. భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది కావాలి. ఈ కుల, మత, వర్గ అంశాలు ఒకటినొకటి ముడి వేసుకున్న పరిస్థితిని మనం అంగీకరించాలి. మీరు చెప్పదల్చుకున్నదేంటో నాకు అర్థమయ్యింది. ఐతే ఈ సినిమా ఇంకా ఎన్నో విషయాల గురించి చెప్తుందనే విషయాన్ని కూడా చూడాలి. సినిమా లింగ సమస్యను, బీ కే యూ పరిస్థితిని …ఇలా ఎన్నిటినో చూపుతుంది. మీరు చెప్తున్నట్టుగా చేయాలంటే ప్రత్యేకమైన సినిమా తీయాల్సి ఉంటుంది. అంబేద్కర్ గురించి ప్రత్యేక ఉల్లేఖనలు ఉన్నాయి. అలాగే భగత్ సింగ్ గురించి కూడా. భగత్ సింగ్ మరియు అంబేద్కర్ కలిసి సహ జీవనం చేయగలరు అని కూడా గమనించాలి.

విజయ్ : హిందూ ఛాందస వాదాన్ని ఎదుర్కునడానికి ప్రత్యేక సైద్ధాంతిక వాదం ఏది సరి అయినది అని మీరు అనుకుంటున్నారు ? లేదా ఈ సమస్యను ఒక సాధారణ కోణం లో చూడ వలసిందేనా ?

 నకుల్ : నా ఉద్దేశ్యం లో సాంప్రదాయ మార్క్సిజం విఫలమయ్యింది. అంబేద్కర్ ను, ముస్లిం లను అర్థం చేసుకోగలిగే మార్క్సిజం కావాలి మనకు. చాలా మంది అగ్ర కులాల వాళ్ళు పైకి రిజర్వేషన్ లు ఎందుకు అని ప్రశ్నించినా – వాళ్ళ మనసుల్లో మన దేశం లో దళితుల పట్ల వ్యవస్థీకృతమైన వివక్ష ఒకటి ఉందనే విషయాన్ని ఒప్పుకుంటారు. ఐతే ఇంకా ఆ విధంగా ముస్లిం లు కూడా వివక్షకు గురవుతున్నారనే విషయాన్ని ఒప్పుకునే స్థాయికి రాలేదు. ప్రతి అగ్ర కుల వ్యక్తికి ” నాకు కులమంటే నమ్మకం లేదు ” అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే వాళ్ళూ దళితులకు మల్లే  దైనందిన వ్యవహారాల్లో కులం గురించి ఙ ప్తికి  తెచ్చు కోవాల్సిన పరిస్థితి రాదు. సాంఘిక న్యాయం వర్గ పోరాటం అంత ప్రధానమైనది.

 విజయ్ : ఇప్పుడు చివరి ప్రశ్న. ఇది మీ గురించే. మీ గురించి చెప్పండి. మీ భవిషత్ ప్రణాళికలు ఏవన్నా ఉంటే చెప్పండి

 నకుల్ : నేను ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ ఆనర్స్ లో గ్రాడ్యుయేషన్ చేసాను. తర్వాత పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో  2005-06 లో చేరాను. ”  Once upon a time in chheharta  ” అని నా మొదటి డాక్యుమెంటరి. శ్రామిక వర్గ పోరాట చరిత్ర గురించి తీసిందది. తర్వాత బోంబే లో 2 సంవత్సరాలు గడిపాను. ఐతే సృజనాత్మకతను పరిమితం చేస్తుందనే ఉద్దేశ్యం తో  కమర్షియల్ సినిమాల వేపు మొగ్గు చూపలేకపోయాను. ఖచ్చితమైన భవిష్యత్ ప్రణాళికలు లేవు కాని …ఒకటి మాత్రం చేస్తా – అది ” సినిమాలు తీస్తూ ఉండడమే ! ” ( నవ్వులు)

*

ఒకటిపై ఒకటి నీ ఉపాయాలు…

 అవినేని భాస్కర్ 

Avineni Bhaskarవెంకన్నకి మంగమ్మంటే వల్లమాలిన ప్రేమ, మోహం. ఆమెతో మాట్లాడటానికి, తీయ తీయగా ఆమె చెప్పే కబుర్లు వినడానికీ, ఏకాంతంగా ఆమెతో సమయం గడపడానికి, అతిమెత్తని ఆమె మేను తాకడానికీ, సరసాలాడటానికీ అతనెన్నెన్ని ఉపాయలు చేస్తాడో! “మహానుభావా, నీ ఎత్తుగడలన్నీ ఎందుకో నాకు బాగా తెలుసు” అని ప్రేమగా విసుక్కుంటుంది మంగమ్మ.

 
శ్రీవారి ఉపాయాలేవిటో శ్రీదేవి మాటల్లోనే పాటగా రాశాడు అన్నమయ్య!

పల్లవి
ఒకటిపై నొకటి నీవుపాయాలు
వెకలి నీ విద్యలెల్ల వెల్లవిరి గావా

చరణం 1
సందడి నాచేయి* ముట్టి సరసాలాడేకొరకే
పందెమాడవచ్చేవు పలుమారును
మందలించి నాచేత మాటలాడించవలసి
అందపుఁగత లడిగే వది నే నెఱఁగనా

చరణం 2
యేరా నాకుచగిరు లిటు ముట్టేయందుకుఁగా
హారములు చిక్కుదీసే వది మేలురా
గోరికొన దాఁకించేకొరకుఁగా చెక్కుముట్టి
యీరీతి వేఁడుకొనే విన్నియుఁ దెలిసెరా

చరణం 3
యీకడ నన్నుఁగూడే ఇందుకుఁగా నింతసేసి
యేకతమాడేనంటా నెనసితివి
పైకొని శ్రీవేంకటేశ బడివాయకుండా న-
న్నాకుమడిచిమ్మనేవు అవురా నీవు
 
               * మూలంలో “చేఇ” అని ఉంది.

తాత్పర్యం (Meaning) :

స్వామీ! నా పొందుకోసం నువ్వు పడే తపన, చేసే ప్రతిచర్య నాకు తెలుసు. వెకిలిగా నువ్వు వేసే ఎత్తుగడలకి భావాలేంటో నాకిట్టే తెలిసిపోతాయి.

దగ్గరచేరి పదేపదే నా చేతులు పట్టుకుని ఒట్లు పెట్టేది? నాతో సరసాలాడటానికే అని నాకు తెలుసు. నా మాటలు వినడం నీకు ఆనందం. నా చేత కబుర్లు చెప్పించుకోవడం, నన్ను అజ్ఞాపించి కథలు చెప్పించుకోవడం నా గొంతులో పలికే మాటలు వినడానికేనని నాకు తెలియదా?

నా మెడలో ఉన్న హారాలు, గొలుసులు సరిగ్గానే ఉన్నాయి. అయినా నువ్వు నా దగ్గరకొచ్చి హారాలు సవరించేది నా చన్నులను తాకాలన్న ఆశతోనే అని నాకు తెలుసు. మాటిమాటికీ నా ముఖాన్ని నీ చేతుల్లోకి తీసుకుని బతిమలాడేది మునివేళ్ళతో నా బుగ్గలు గిల్లుకోవడానికే అని నాకు తెలియదా?

నన్ను కలుసుకోవాలని ఏవో వింతలు, వుపాయాలు చేసి ఇలా దగ్గరయ్యావని నాకు తెలుసు. శ్రీవేంకటేశా,  తాంబూలం చిలకలు చుట్టివ్వమని అడిగేది నన్ను ఎక్కడికీ వెళ్ళనివ్వకుండా ఇంకాస్త సమయం నీ పక్కనే ఉంచుకోడానికే అని నాకు తెలియదా?
కొన్ని పదాలకు అర్థాలు :
ఉపాయాలు = Tricks, ఎత్తుగడలు, పన్నుగడలు, పొందులు
వెకలి = వెకిలి, పిచ్చి, అవివేకం
వెల్లవిరి = వెల్లడి, తెలిసిపోవడం, ప్రకటిమైపోవడం
సందడి = చుట్టుముట్టి, సమీపించి
పందెమాడు = ఒట్టుపెట్టు, ప్రతిజ్ఞచేయు
మందలించి = ఆజ్ఞాపించి
కుచగిరులు = చన్నులు
చెక్కు = చెంపలు, బుగ్గలు
ఏకతమాడు = పన్నాగంపన్నుట, ఉపాయం ఆలోచించుట
ఎనసితివి = దగ్గరచేరితివి, పొందుగూడితివవి
పైకొని = అక్కునచేరి
బడివాయక = వదిలిపెట్టకుండ

భావుకత అంచుల్లోకి ప్రయాణం..గ్లేసియర్!

మణి వడ్లమాని 

10694228_10152765337716095_4192333521636583623_oఅసలు ఏ స్త్రీ మూర్తి లో అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు మాతృప్రేమ ని చవి చూస్తాం అందరం . ఆ ప్రేమకి వయసు, జాతి, కుల, మతాల తో సంభందం లేదు. అలాంటి మాతృ ప్రేమ నాకు దక్కింది. జన్మ నిచ్చి అక్షరాలు నేర్పి,విద్యా బుద్దులు నేర్పిన ది మా అమ్మగారు అయితే సాహితీ జన్మనిచ్చి , నాచేత సాహితీక్షరాభ్యాసం చేయించి,నువ్వు రాయగలవు అంటూ నన్ను వెన్ను తట్టి ప్రోత్శాహించిన డాక్టరు మంథా భానుమతి గారి కి మాతృదినోత్సవ సందర్భంగా  శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
డాక్టరు మంథా భానుమతి గారు కధలు మద్య వయసు నుంచి రాయడం మొదలుపెట్టి అనతి కాలం లోనే ప్రాచుర్యం పొందిన రచయిత్రి గా పేరు తెచ్చుకున్నారు. ఆవిడ మొదటి కథానిక 1993 ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురితం అయింది.

ఆమె రాసిన నవలలో నాకు నచ్చిన నవల గ్లేషియర్ . ఇది ఆమె మొదటి నవల , రచన మాసపత్రిక నిర్వహించిన విశ్లేషణాత్మక నవలల పోటిలో. బహుమతి వచ్చిన నవల. ఈ నవల పోటికి పంపేటప్పుడు ఆమె అనుకున్నారట బహమతి వస్తుందా,పెడుతుందా? కాకపోతే ఒక అనుభవం వస్తుంది కదా అని సాహసం చేసారుట. ఆనాటి ఆవిడ సాహసమే ఈ నాడు తెలుగు సాహితీ లోకానికి ఒక చక్కటి విశ్లేషణాత్మక పూర్వమైన నవలని అందించింది. అది అసలు ఆవిడ మొదటి రచనలా అనిపించదు. నవల సహజత్వానికి ఎంతో దగ్గర గా ఉంటుంది. మనమూ కూడా పాత్రధారులతో మమేకం అయ్యి వాళ్ళతో పాటు తెల్లటి కొండలు. వాటి మధ్య నీలం రంగు గ్లేషియర్లు. క్రింద ఆకుపచ్చని నీళ్ళల్లో తేలుతున్న తెల్లటి హిమ శకలాలు. మధ్యే మధ్యే తెల్లటి నీటి పక్షులు ఆ పైన చుట్టూ కొండలూ, అడవులూ, సరస్సులూ, జలపాతాలూ. అలా .అలస్కా అందాలను చూస్తూ వెళుతూ ఉంటాము.

వర్ణనలు చూస్తూ ఉంటె చదువుతున్న రచయిత్రిలోని భావుకతా కోణం కూడా మనకి ఆవిష్కృత మవుతుంది. నవలలో చాలా భాగం క్రూజ్ లో నడుస్తుంది. ఈ నవలలో ముఖ్యపాత్ర గ్లేషియర్ దే! దాని చుట్టురా తిరుగుతుంది కధ ఆసాంతం.

అమలాపురం లో ఉన్న స్కూల్ లో తొమ్మిదో క్లాసు చదువుతున్న శాంత దగ్గరనుంచి కధ ప్రారంభం అవుతుంది.సాంఘిక శాస్త్రం పాఠం వింటూ అందు లో ఓడలు, గ్లేషియర్స్ గురుంచి విని అవి చూస్తె యెంత బావుంటుందో అని అనుకుంటుంది. కాలం తన గతులు మార్చుకుంటూ వెళుతున్నప్పుడు దానితో పాటే మనిషి కూడా జీవితం లో ఎదుగుతుంటాడు. అలాంటి జీవనక్రమం లో శాంత కి కృష్ణ తో పెళ్ళయి,ఇద్దరు పిల్లలు పుడతారు. వాళ్ళు పెరిగి పెద్దయి, పెళ్ళిళ్ళు చేసుకుని విదేశాలలో స్థిరపడతారు. అది గో అప్పుడు మళ్ళి శాంత లో గ్లేషియర్ చూడాలనే కోరిక బలం గ కలుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లోని కులూ మనాలి వెళతారు శాంతా కృష్ణ, కాని అక్కడ శాంతకి గ్లేషియర్ దగ్గరనుంచి చూడాలనే కోరిక తీరదు . దూరం నుంచే ఆ అందాలను చూసి తృప్తి పడుతుంది. అప్పుడు కృష్ణ అంటాడు. ఇక నుంచి మనం ప్రతి ఏడు తప్పక సిమ్లా వద్దాం అప్పుడు చూద్దువు గానే లే, అలా దిగులుపడకు అని సముదాయిస్తాడు. మూడేళ్లు గడచి పోతాయి. కానీ ఏదో కారణాల వల్ల మళ్ళి సిమ్లా వెళ్ళలేకపోతారు.

Glacier_large
ఇంతలో పిల్లలు అమెరికా రమ్మనమని చెబుతారు. మొదట చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళినప్పుడు శాంత తన కోరికనుచెబుతుంది. అమ్మా! నువ్వు అన్నయ్య ఊరు వెళ్తావు కదా అక్కడనుండి అలస్కా ట్రిప్ కి వెళ్ళచ్చు. అన్నయ్య అన్నీ ఏర్పాట్లు చేస్తాడు అని చెబుతాడు. అనుకున్నట్లుగా పెద్ద కొడుకు టికెట్లు కొని అలస్కా ట్రిప్ కి పంపిస్తాడు.
ఇక్కడ రచయిత్రి ప్రతి చిన్న విషయం కూడా చదువరులకు క్షుణ్ణంగా,వివరిస్తూ కధను సాగిస్తారు.ఓడ, తయారీ, అసలు క్రూజ్ లో ఏమేమి ఉంటాయి, వాటిలో ఎన్ని అంతస్తులు ఉంటాయి.,ఎన్ని డెక్ లు ఉంటాయి, ఎలా ఉండాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాది విషయాలు ఎంతో విపులంగా,విశ్లేషణ తో వివరించారు.

ఆ వారం రోజుల ట్రిప్ లో ఎంతో మంది సన్నిహితులవుతారు. వేరే వేరే దేశస్థులే కాకుండా ఇద్దరూ ఇండియన్ ఫ్యామిలీ లు కూడా వస్తారు. శాంత పాత్ర ఇలాఅనుకుంటుంది. “పరాయిదేశస్తులు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అదే మన దేశంవాళ్ళు,మనబాష బాషమాట్లాడే వారు మాత్రం అంటీముట్టనట్లుగా ఉండటం ఒకింత బాధను కలిగిస్తుంది.”
ఈ నవల ఏదో ఒక టూర్ గురించే కాకుండా,ఆ క్రూజ్ లో కలిసిన బాబ్,ఉర్సులా మధ్య నడిచేప్రేమ లోని సంఘర్షణలను చాలా బాగా మలచారు రచయిత్రి,ఆ నేపధ్యం లో ఉర్సులా ఎప్పుడూ అనుకుంటుంది, బాబ్ గ్లేషియర్ లా చలనం లేకుండా ఉంటాడని. కాని ఆమెకు క్రమేణా అర్థమవుతుంది. “ధీర గంభీరంగా ఉన్న గ్లేషియర్ కొననెమ్మదిగా వంగి కింద ఉన్న మంచు నది లో కలుస్తుందని”
అలాగే క్రూజ్ కెప్టన్, హోటల్ డైరెక్టర్ జో, పర్సర్ టెర్రీ, వీళ్ళందరూ కూడా మనకి మిత్రులుగా అనిపిస్తారు. అంటే ఆ నవల అంత గ ప్రభావితం చేస్తుంది.
“నార్తరన్ లైట్స్ ఎంతో చెప్పుకోదగ్గ విశేషం, ఆగష్టు నెలాఖరి నించీ ఏప్రిల్ మొదటివారం దాకా రాత్రిపూట ఆకాశం రంగులు పులిమేసిన ఒక చిత్రపటంలా, ఆ రంగులు రకరకాల రూపాలను సంతరించుకుంటూ వెలిగిపోతుంది. అది చూడటానికి కృష్ణ ని రమ్మన్నప్పుడు అబ్బ ఇంటికి వెళ్ళాక యు ట్యూబ్ లో చూద్దాం లే అనడం తో ,శాంత కొంత నిరుత్సాహ పడినా తను చూడటానికి ఒక్కత్తే అర్ధరాత్రి అలారం పెట్టుకుని మరీ వెళుతుంది.
మధ్య మధ్యలో అందమైన బొమ్మకు నగిషీలు చెక్కినట్లుగా నవలలో రచయిత్రి శాంత పాత్రకు భావుకతను జోడిస్తారు. ఆ భావుకత్వపు గుబాళింపు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. షిప్ వెళుతున్నప్పుడు సముద్రం లో దారి , ఏర్పడినట్లు రెండు పక్కలాసముద్రం చూస్తూ ప్రపంచంలో అతి సుందరమైన, రంగురంగుల ప్రదేశం అలాస్కా వే,అని శాంత అనుకుంటుంది.
ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి,దానిని పాఠకుల కి చెప్పడంలో సఫలీకృతులు అయ్యారు. అదే విధంగా ఎవరైనా సరే ఇప్పటికిప్పుడు అలస్కా వెళ్ళడానికి వీలుగా ప్రతి చిన్న విషయం కూడా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎంతైనా అధ్యాపకురాలు కదా !
నవల ఆసాంతం చదివిన తరువాత కలిగిన అనుభూతి గురుంచి మాటలలో వర్ణించడం కష్టం. అది పుస్తకం చదివిన వాళ్ళకే అనుభవైకవేద్యం అవుతుంది. అందుకే ఇది అందరూ తప్పక చదవాల్సిన నవల.
***

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 5

[  Anne Of Green Gables By L.M.Montgomery ]

anne5ఆన్, మెరిల్లా కలిసి గుర్రం బండి లో వెళ్తున్నారు. ఆన్ రహస్యం చెబుతున్నట్లు అంది- ” ఇలా వెళ్ళటాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నానండీ. నాకు తెలిసీ… గట్టిగా అనుకుంటే , ఇంచుమించు ఏదైనా బావుందనిపిస్తుంది.  గట్టి..గా అనుకోవాలంతే. ఈ షికారు అయాక మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళిపోవాలని గుర్తు చేసుకోదల్చుకోలేదు నేను…ఈ షికారు గురించి మటుకే ఆలోచిస్తా. అరె ! చూడండి, అడవి రోజా పువ్వు పూసింది అప్పుడే, ఎంత ముద్దు గా ఉందో కదా ! రోజా పువ్వుగా ఉండటం ఎంత బావుంటుందో ! రోజా పూలకి మాటలొస్తే మనకి భలే ఉంటుంది కదా … అవి మనకి మంచి మంచి కబుర్లు చెబుతాయి. పింక్ రంగు మనోహరంగా ఉంటుంది కదండీ  ? నాకెంతో ఇష్టం, కాని నాకు బావుండదు. ఎర్ర  జుట్టు ఉన్నవాళ్ళు ఊహల్లో కూడా పింక్ రంగు బట్టలు వేసుకోలేరు.  అవునండీ, చిన్నప్పుడు ఎర్ర జుట్టు ఉండి పెద్దయాక అది వేరే రంగుకి మారటం చూశారా మీరెప్పుడైనా ? ”

” ఊహూ.లేదు. నీ జుట్టు రంగు మారుతుందని కూడా  నాకేం నమ్మకం లేదు ”మెరిల్లా ఖచ్చితంగా అంది.

ఆన్ నిట్టూర్చింది…” ఇంకో ఆశ కూడా పోయిందండీ. ‘ నా జీవితం ఆశలకు సమాధి ‘ …ఒక పుస్తకం లో చదివాను  ఈ మాటలు. అప్పట్నుంచీ దిగులేసినప్పుడల్లా అవి తల్చుకుంటూ ఉంటాను, కొంచెం నయంగా అనిపిస్తుంది అప్పుడు  ”

మెరిల్లా ” అలా అనుకుంటే ఎలా నయంగా ఉంటుందో నాకేమీ అర్థం కావట్లేదు ”

” లేదు, నిజంగా నయం గా ఉంటుంది. నేనొక కథలో  అమ్మాయినే  అనిపిస్తుంది. నాకు కథల్లో లాగా ఉండటమంటే చాలా ఇష్టం. మనం ఇవాళ ‘ ప్రకాశమాన సరోవరం ‘ మీదుగా వెళ్తామా ? ” ఆన్ అడిగింది.

” బారీ చెరువు అనేనా నీ తాత్పర్యం  ? అటు కాదు, సముద్రపు  ఒడ్డు పక్కనుంచి  వెళతాం ” మెరిల్లా .

 

” సముద్రపు ఒడ్డు  పక్కనే దారి  ” ..ఆన్ మైమరచి పోతూ మళ్ళీ అంది . ” బావుంటుందా ? మీరు ఆ మాట అనగానే చటుక్కున అదెలా ఉంటుందో నా కళ్ళ ముందు కనిపిస్తోంది . ‘ వైట్ శాండ్స్  ‘ అనే పేరూ బావుంది. అవోన్లియా అంత కాదనుకోండి..అవోన్లియా అంటుంటే సంగీతం లాగా వినిపిస్తుంది. వైట్ శాండ్స్ ఎంత దూరం ? ”

” ఐదు మైళ్ళు ఉంటుంది. సరే, నువ్వు మాట్లాడి తీరాలీ అంటే కాస్త పనికొచ్చేవి మాట్లాడుకుందాం. నువ్వు ఎవరు , ఎక్కడినుంచీ వచ్చావు..ఆ విషయాలు చెబుతావా ? ” మెరిల్లా  అడిగింది .

” అవన్నీ చెప్పటానికి ఏమీ బావుండవు. నేనెవరో ఏమిటో  – నేను ఎలా ఊహించుకుంటానో చెప్పనా ? ” ఆన్ సూచించింది.

” ఊహూ. అస్సలు వద్దు. పచ్చి నిజాలు అంటారు చూడు, అవి చెప్పు. నువ్వు ఎక్కడ పుట్టావు ? నీకు ఎన్నేళ్ళు ? ”

‘ పచ్చి నిజాలు ‘ చెప్పేందుకు ఆన్ నిట్టూరుస్తూ సిద్ధమైంది ..” మొన్న  మార్చ్ కి నాకు పదకొండేళ్ళొచ్చాయి. నేను బోలింగ్ బ్రోక్ లో పుట్టానట. అది నోవా స్కోటియా లో ఉంది. మా నాన్న పేరు వాల్టర్ షిర్లే. ఆయన బోలింగ్ బ్రోక్ స్కూల్లో టీచర్.  మా అమ్మ పేరు బెర్తా షిర్లే. వాల్టర్, బెర్తా- పేర్లు బావున్నాయి కదండీ  ? మా నాన్న పేరు జెడేడియా లాంటిదేదో అయి ఉంటే ఎంత ఇబ్బంది గా ఉండేదో ”

” ఏ పేరైతేనేం ? మనిషి ప్రవర్తన బావుండాలి గానీ ” మెరిల్లా నీతి వాక్యం చెప్పింది, నిజానికి అదే నీతి మెరిల్లాకీ అవసరమే.

 

mythili1” ఏమో మరి ” ఆన్ ఆలోచన లో పడింది. ” ఎక్కడో చదివాను, రోజా పువ్వు ని ఇంకే పేరు తో పిలిచినా అది మంచి వాసనెయ్యకుండా పోతుందా అని. కానీ రోజాని ముల్లు అనో కాబేజ్ అనో పిలవటం ఏం బావుంటుంది  చెప్పండి ? మా నాన్నకి జెడేడియా అని పేరున్నా ఆయన మంచి వాడే అయి ఉండేవాడేమో, అయినా బాగోదు. మా అమ్మ కూడా ముందు టీచర్ గానే ఉండేదట, పెళ్ళయాక మానేసిందట.  వాళ్ళు చాలా బీదవాళ్ళని మిసెస్ థామస్ చెప్పింది. నా కంటే ముందు ఇద్దరు పాపలు పుట్టారట గానీ చచ్చిపోయారట. బోలింగ్ బ్రోక్ లో ఒక చిన్న పసుప్పచ్చ ఇంట్లో ఉండేవాళ్ళట. నేనెప్పుడూ ఆ ఇల్లు చూడలేదు, కాని చాలా ఊహించుకుంటాను. గేట్ లోపల లిల్లీ పూలూ, వాకిట్లో లిలాక్ లూ, కిటికీ పక్కనే హనీ సకల్ లూ ఉండి ఉంటాయి.    కిటికీ లకి మస్లిన్ పరదాలు కూడా ఉండి ఉంటాయి. మస్లిన్ పరదాలు ఉంటే చాలు, ఇల్లు గొప్పగా ఉంటుంది. నేను ఆ ఇంట్లోనే పుట్టాను. నా అంత సాదా సీదాగా ఉన్న పాపాయిని ఎప్పుడూ చూడలేదని మిసెస్ థామస్ అంది. పీల గా ఈసురోమంటూ ఉండేదాన్నట, మొహం లో కళ్ళు తప్ప ఏమీ కనిపించేవి కాదట. కాని మా అమ్మ మాత్రం నేను చాలా ముద్దుగా ఉన్నానని అనుకుందట.  అదే నిజం అయి ఉండాలి, అమ్మ చదువుకుంది కదా –  తనకి తెలుస్తుందా, మిసెస్ థామస్ కి తెలుస్తుందా ? మిసెస్ థామస్ మా ఇంట్లో పని చేస్తుండేది. నేను అమ్మకి ఆశా భంగం కలిగించలేదని తలచుకుంటే తృప్తిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ తర్వాత అమ్మ ఎక్కువ రోజులు బతకలేదు.  నాకు మూడు నెలల వయసున్నప్పుడు జ్వరం తగిలి చచ్చిపోయింది. నేను  ‘ అమ్మా ‘ అని పిలవటం  గుర్తుండేదాకా ఐనా అమ్మ బతికి ఉంటే బావుండేదనిపిస్తుంది. ‘ అమ్మ ‘ అనటం హాయిగా ఉంటుంది, కదండీ ? తర్వాత నాలుగు రోజులకి నాన్న కూడా చచ్చిపోయాడు, ఆయనకీ అదే జ్వరమట. నేను అనాథ పాప ఐపోయాను. నన్నేం చెయ్యాలో ఎవరికీ ఏం తోచలేదట, మిసెస్ థామస్ చెప్పింది. అంత చిన్నగా ఉన్నప్పుడు కూడా నన్ను పెంచుకోవాలని ఎవరికీ అనిపించలేదు చూడండి, నాకు అలా రాసి పెట్టి ఉన్నట్లుంది.   అమ్మా నాన్నా ఇద్దరి ఊళ్ళూ చాలా  దూరమట, చుట్టాలెవరూ లేరట. చివరికి మిసెస్ థామస్ నే నన్ను పెంచుకుంటానంది. వాళ్ళాయన తాగుబోతు, వాళ్ళకేమీ డబ్బూ లేదు, అయినా సరే, మిసెస్ థామస్ తన చేతులతో నన్ను పెంచింది.’  చేతులతో పెంచిన ‘  పిల్లలు మామూలుగా పెంచిన పిల్లల కంటే మంచిపిల్లలు అవుతారా అండీ , మీకేమైనా తెలుసా ? మిసెస్ థామస్ నేను అల్లరి చేసినప్పుడల్లా  అనేది – నన్ను చేతులతో పెంచాననీ నేను అంత చెడ్డ పిల్లని ఎలా అయానా అని …

మిస్టర్ థామస్, మిసెస్ థామస్ , తర్వాత బోలింగ్ బ్రోక్ నుంచి మేరీస్ విల్ కి వెళ్ళారు. వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టారు, అందరూ నా కన్న చిన్నవాళ్ళే. వాళ్ళని పెంచటానికి మిసెస్ థామస్ కి సాయం చేస్తుండేదాన్ని. కొన్ని రోజులయాక మిస్టర్ థామస్ రైల్లోంచి కిందపడి చచ్చిపోయాడు. మిసెస్ థామస్ వాళ్ళమ్మ ఆవిడనీ పిల్లలనీ తీసుకుపోతానంది, నన్ను మాత్రం వద్దంది. మిసెస్ థామస్ కి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు మిసెస్ హమ్మండ్ వచ్చి, నేను చిన్న పిల్లల్ని బాగా చూసుకుంటాను గనుక నన్ను ఇంట్లో ఉంచుకుంటానంది. ఆవిడ తో వెళ్ళిపోయాను. వాళ్ళ ఇల్లు ఎక్కడో విసిరేసినట్లు, నది పక్కన చిట్టడవిలో ఉండేది. మిస్టర్ హమ్మండ్ అక్కడ కలప మిల్ లో పని చేసేవాడు. నేను ఇంకెక్కడో ఉన్నట్లు ఊహించుకుంటూ ఉండకపోతే అక్కడ ఉండటం చాలా కష్టమయేది. వాళ్ళకి ఎనిమిది మంది పిల్లలు, మూడు సార్లు కవల పిల్లలు. నాకు చిన్న పిల్లలంటే ఇష్టమే, కాని కొంచెం మోతాదుగా ఉంటేనే ఇష్టం. ఒకరి తర్వాత ఒకరుగా అంతమంది పిల్లలని ఎత్తుకుని మోయటం కొంచెం కష్టంగానే ఉండేది.

mythili2

మిసెస్ హమ్మండ్ వాళ్ళతో రెండేళ్ళున్నాను. మిస్టర్ హమ్మండ్ కూడా చచ్చిపోయాడు, మిసెస్ హమ్మండ్ పిల్లల్ని చుట్టాల్లో అందరికీ పంచిపెట్టి అమెరికా వెళ్ళిపోయింది. ఇంకెవరూ నన్ను పెంచుకోవాలనుకోలేదు, అప్పుడు నన్ను అనాథాశ్రమం లో చేర్చారు. అక్కడ వాళ్ళూ అప్పటికే బోలెడు మంది పిల్లలున్నారు, నేను వద్దులే అన్నారు. కానీ రూల్ ప్రకారం నన్ను వద్దనకూడదట.  అలా మిసెస్ స్పెన్సర్ వచ్చేవరకూ అక్కడ నాలుగు నెలలు ఉన్నాను ” ఆన్ తన గాథ ముగించి ఊపిరి పీల్చుకుంది. తనని అక్కర్లేదనుకున్న ఆ ప్రపంచం లో తన అనుభవాలన్నీ చెప్పుకోవటం ఆన్ కేమీ ఇష్టం లేదు, తెలుస్తూనే ఉంది.

” ఎప్పుడైనా బడికి వెళ్ళావా ? ” మెరిల్లా ప్రశ్నించింది. గుర్రాన్ని సముద్రపు ఒడ్డు పక్కన ఉన్న బాట మీద నడిపిస్తోంది.

” ఎక్కువ రోజులు వెళ్ళలేదు . మిసెస్ థామస్ దగ్గర ఉన్నప్పుడు , ఆఖరి ఏడు వెళ్ళాను కొన్ని రోజులు. మిసెస్ హమ్మండ్ వాళ్ళ ఇల్లు ఊరికి చాలా దూరం కదా…చలికాలం లో అంత దూరం నడవలేకపోయేదాన్ని, వేసంకాలమేమో సెలవులిచ్చేసేవారు. వసంత కాలం లోనూ ఆకు రాలే కాలం లోనూ మటుకే వెళ్ళగలిగే దాన్ని. అనాథాశ్రమం లో ఉన్నప్పుడు రోజూ వెళ్ళాను. నాకు చదవటం బాగా వచ్చింది, బోలెడు పద్యాలు కంఠతా కూడా వచ్చు. ‘ హోహెన్ లిండెన్ సంగ్రామం ‘ , ‘ ఫ్లోడెన్ తర్వాతి ఎడింబరో ‘ , ‘ రైన్ తీరాన బింజెన్ ‘ మొత్తం వచ్చు.   ఇంకానేమో, ‘ లేడీ ఆఫ్ ద లేక్ ‘ , జేమ్స్   థాంప్సన్’ ఋతువులు ‘ – ఇవి చాలా వరకు వచ్చు. చదువుతుంటే వెన్ను జలదరిస్తుందే, అలాంటి పద్యాలు ఎంతో బావుంటాయి. ‘ పోలండ్ పతనం ‘ అని ఐదో తరగతి పుస్తకం లో ఉంటుంది, ఆ పద్యం అంతా అలాగే ఉంటుంది. నేనైతే   నాలుగో తరగతే , కానీ ఐదో తరగతి అమ్మాయిలు వాళ్ళ పుస్తకాలు అరువిచ్చేవాళ్ళు ”

” ఆ మిసెస్ థామస్, మిసెస్ హమ్మండ్ – వాళ్ళు నిన్ను బాగా చూసుకునేవాళ్ళా ? ” మెరిల్లా , ఆన్ ని ఓరకంటితో చూస్తూ అడిగింది.

” అదా..” ఆన్ తడబడింది. మొహం కందిపోయింది. ” నాకు తెలిసి,  నన్ను బాగా చూసుకోవాలనే అనుకునేవాళ్ళు. అలా మంచి ఉద్దేశం ఉన్నప్పుడు….ఒక్కోసారి చిరాకు పడినా పట్టించుకోకూడదు కదా ! వాళ్ళ బాధలు వాళ్ళవి…మిసెస్ థామస్ వాళ్ళాయన బాగా తాగేవాడు. మిసెస్ హమ్మండ్ కి మూడు సార్లు కవల పిల్లలు…ఎంత కష్టం చెప్పండి ? నాకు తెలుసు, ఇద్దరూ నన్ను దయగా ఇష్టంగా చూడాలని అనుకునేవాళ్ళు ”

మెరిల్లా ఇంకే ప్రశ్నలూ వెయ్యలేదు, పరధ్యానంగా బండి తోలుతోంది. సముద్రపు అందాన్ని చూసిన పరవశం లో ఆన్ మౌనంగా మునిగిపోయింది. మెరిల్లా ఆలోచిస్తోంది…ఆన్ చెప్పిన సంగతుల వెనక చెప్పకుండా దాచిపెట్టిన నిజాలు మెరిల్లాకి అర్థమవుతున్నాయి. ఈ చిన్న పిల్ల ప్రేమకోసం  ఎంత మొహం వాచిపోయి ఉంది ! ఎలాంటి పేదరికం లో, గొడ్డు చాకిరీ లో-  తన ఉనికిని ఎవరూ పట్టించుకోని జీవితాన్ని  గడిపి వచ్చింది ? తనకంటూ ఒక ఇల్లు ఉండబోతోందని అంతంత ఆనందపడిందంటే ఆశ్చర్యమేముంది ? పాపం…ఎందుకు వెనక్కి పంపెయ్యాలి అసలు ? మాథ్యూ కి ఆన్ ని అట్టే పెట్టుకుందామని బాగా ఉంది, అతను మనసు మార్చుకునేలాగా లేడు-  పోనీ , ఒప్పుకుంటే ఏం పోతుంది ? పిల్ల బుద్ధిమంతురాల్లాగే  ఉంది కదా, మెల్లిగా అన్నీ నేర్పుకోవచ్చు….

బండి వెళుతూ ఉన్న బాట కి ఆ వైపు న అడవి,  అంతా ఏకాంతం. ఏళ్ళ తరబడి సముద్రపు గాలులని ఎదిరించి పోట్లాడీ అలిసిపోయినట్లు లేని  ఫర్ చెట్లు గుబురు గుబురుగా . అక్కడక్కడా ఎగుడు దిగుడుగా ఎర్ర మట్టి దిబ్బలు, దారిని మూసేస్తూ, గుర్రం వాటిని దాటుంతూంటే బండి ఊగిపోతోంది. కిందికి చూస్తే నీటి నురగ కప్పిన పెద్ద పెద్ద రాళ్ళు. చిన్న చిన్న ఇసక దిబ్బలు, వాటి మధ్యలోంచి సముద్రపు రత్నాల లాగా గులకరాళ్ళు. అవతల ప్రకాశిస్తున్న  నీలపు సముద్రం. ఆకాశం లో సీ గల్ లు…ఎండలో వెండిలాగా మెరిసే రెక్కలతో …

” సముద్రం అద్భుతంగా ఉంటుంది కదూ ? ” ఆన్ అంది, చాలా సేపటి నిశ్శబ్దం తర్వాత,  విప్పారిన కళ్ళతో .  ” మేరీస్ విల్ లో మిస్టర్ థామస్ ఒకసారి పెట్టె బండి అద్దెకి తెచ్చాడు. సముద్రం ఒడ్డున పొద్దుట్నుంచీ సాయంత్రం దాకా  ఉన్నాం. అప్పటి ప్రతి నిమిషమూ గుర్తుంది నాకు, రోజంతా పిల్లలని ఆడిస్తూనే  ఉన్నా కూడా. మళ్ళీ మళ్ళీ గుర్తు  చే సుకుంటూనే ఉంటాను. ఇక్కడి సముద్రం మేరీస్ విల్ దానిలోకన్నా ఎంతో బావుంది. ఆ సీ గల్ లు దివ్యంగా ఉన్నాయి ! మీకెప్పుడైనా సీ గల్ ఐపోతే బావుండుననిపిస్తుందా ? నాకు అనిపిస్తుంటుంది, అంటే… మనిషి పిల్లని కాకపోయి ఉంటే. సూర్యుడు రాగానే నిద్ర లేచి ఆ నీలాల నీటి మీద వాలుతూ ఎగురుతూ రోజంతా గడిపేసి..రాత్రవుతూనే వెళ్ళి గూట్లో నిద్రపోతే….!

ఆ కనిపించే పెద్ద ఇల్లు ఎవరిదండీ  ? ”

” అది వైట్ శాం డ్స్ హోటల్. మిస్టర్ కిర్క్ నడుపుతాడు దాన్ని. కొద్ది రోజుల్లో బోలెడు మంది అమెరికన్ లు వస్తారు…ఈ సముద్రం వాళ్ళకి బాగా నచ్చుతుందని అంటుంటారు ”

ఇంకాస్త దూరం వెళ్ళారు . ” మిసెస్ స్పెన్సర్ ఇల్లు అదేనా ? ” ఆన్ బిక్కమొహం వేసుకుని అడిగింది. ” నాకు అక్కడికి వెళ్ళాలని లేదు …అక్కడితో అంతా ఐపోతుంది ”

[ ఇంకా ఉంది ]

“మరొక రాత్రి “ కావాలి ఈ కవిత్వం కోసం…!

రాజారామ్ తుమ్మచర్ల 

 

రాజారాం తుమ్మచర్ల

“ ఒక రాత్రి “ చాలడం లేదు…అనుభూతించడానికి

“మరొక రాత్రి “ కావాలి కోడూరి విజయ కుమార్ కవిత్వం కోసం..

నగరంలో ఒక ఉదయం తిరిగి అలసిపోయి ‘ ఒక సంభాషణ కోసం’ ‘అతడూ.. నేనూ.. ఒక సాయంత్రం’ బంగారు వాకిలి గుమ్మం ముందు అతిథిలా ఒక పరిచయస్తుడి గురించి, కొత్త స్నేహితురాలు గురించి వాళ్ళ ఇళ్ళలో  జరిగిన ఇటీవలి సంబరం గురించి మాట్లాడుకుండే మెలుకువలో యాకూబ్ విజయ్ కుమార్ ని పరిచయం చేసినట్టు జ్ఞాపకం. ఇంధ్రధనువుపై ఎగిరిన సీతాకోక చిలుక లా ,రాత్రులను వెలిగించే పద్యఋతువులా విజయ్ కవిత్వం ఏ తీరుగ నను దయ చూస్తుందా అనుకుంటున్న సమయంలో రహస్యంగా సంజాయిషీ యివ్వకుండా వచ్చి వాలింది ..ఒక రాత్రి నా ఇంట్లో. పుస్తకం తెరిచి తెరువగానే కనిపించిన వాక్యాలివి .

“ తాము దయతో పండించే

తిండి గింజల్ని తిని

వెర్రి పరుగులు తీసే ఈ నగరం

కాసింతయిన కరుణ చూపిస్తుందని కదా

ఈ మట్టి పాదాలు ఇక్కడి దాకా ప్రయాణించింది “

ఏ మట్టి పాదాలు ..మీద  నగరమంతా మోకరిల్లింది ?.ఎందుకు తిండి గింజల్ని ప్రసాదించండి అని అసహన హారన్ లు మ్రోగిస్తున్నారు  ఈ నగరమంతా.. నగరం రాకాసి బాహువులతో పొలానని అనకొండలా మింగేయ బోతున్నది ఎందుకని ..?ఇదంతా మనకి అర్థం కావాలంటే. విజయ కుమార్ రాసిన” నగరంలో ఒక ఉదయం”

కవిత చదువాల్సిందే. నగర కలుషిత “వాతావరణం “ లో “ అక్వేరియంలో బంగారు చేప “ను రక్షించడానికి ఒక

యుద్ధ “అనంతరం “ “ఒకరాత్రి.. మరొకరాత్రి “ అయిన లెక్కచేయకుండా కవిత్వ కరవాలాన్ని దూస్తున్న కవి కోడూరి విజయ కుమార్ . “ “ డాక్టర్ .రామనాథంని .. చంపేశారు స్కూలుకి సెలవని తెలిసిన రోజున నా జ్వరానికీ తీయటి మందులిచ్చిన డాక్టర్ని ఎందుకు చంపారో” అని తెలియక ఏడ్చిన చిన్నపిల్లాడు విజయ కుమార్ ఆ రోజు. కానీ ఈ రోజు “ దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది ఏదో ఎరుక కలిగిన కవి.తన నేల మరోక పోరాటా నికి సిద్ధమయ్యాక కార్యాలయ రణరంగాలకన్నా “ టీ బల్ల దగ్గరే సంభాషణ ప్రారంభిద్దాం “అని ఆహ్వానించిన కవి  విజయ కుమార్. తనది అయిన నేల కోసం స్వప్నించిన మరొక పూవు వికసించకనే నేల రాలిపోవడాన్ని సహించలేక కరిగిపోయే కవిత్వంరాసిన కరుణార్ధ్ర కవి విజయ్ కుమార్.

విజయ కుమార్ “ ఒకరాత్రి మరొక రాత్రి “ కవితా సంపుటిలో ముప్పై ఆరు కవితలున్నాయి.’ జీవితం భయపెట్టిన గడ్డు కాలం ‘ఇప్పుడు లేకపోయినా అలాంటి స్థితిలో వున్న సామాజిక, కౌటుంబిక ,వైయుక్తిక అనుభవాల తాత్విక సారాన్ని అక్షరాల్లో అందంగా పట్టి బంధించి అతి చిక్కని సాంద్రతా సహిత కవిత్వాన్ని ఈ సంపుటిలో అందించాడు.

IMAG0549_1

విజయ్ కవిత్వంలో నగరపు జీవితపు రొద వుంది. ఆ రొదలో గగ్గోలు పొందే జీవితం వుంది. చావు భయం చుట్టుకున్న దుఃఖం వుంది. లోపల సుడులు తిరిగే బాధ వుంది. పురా జీవితాన్వేషణ , ఆ జీవిత కష్ట సుఖాల చింతన వుంది.అంత కన్నా నిరంతరంగా సంభవించే సామాజిక సం‍క్షోభ సన్నివేశాలను ఒడుపుగా కళ్ళ ముందువుంచే జీవత్వం వుంది.తునిగిపోతున్న కుటుంబ సంబధాల అతికింపు పట్ల అపేక్ష వుంది. నెమలీక వంటి జ్ఞాపకాల సుగంధం వుంది. బంతిపూల , సన్నజాజుల ,పారిజాతాల సహజ సౌకుమార్య లాలిత్య  స్త్రీత్వం విజయ కుమార్ కవిత్వంలో వుంది కాబట్టే  ఈయన పద్యాన్ని ప్రేమతో హత్తుకోవాలనిపిస్తుంది.

“ కనుల అంచులు తాకే నిదుర పడవకై

ఇలా మెలుకువ తీరాన యెదురు చూడవలసిందే

యిక, ఈ రాత్రి నదిని భారంగా ఈదవలసిందే “ ( ఒకరాత్రి మరొక రాత్రి )

ఒకరాత్రి ..కాదు మరొక రాత్రి కాదు..ఏడేడు రాత్రులు అలా రెండు చేతుల నడుమ ముఖాన్ని కప్పుకొని ..దాటుకోవడమే కదా అని మరణ  చింతన ఒక చేతనతో చెబుతాడు.

రాత్రిని  నది చేసి నిద్రని పడవ చేసి మెలుకువని తీరంచేసి  గాయపరిచిన మాటల ముక్కల మధ్య ,పుస్తకాలతో కొంచెం  జీవితాన్ని మరచిపోయి ,విషాద గీతాల అలల మీద జీవితం నుంచి పారిపోయేటప్పుడు జీవ యాత్ర సుఖంగా సాగదని ,చివరకు జీవితం గాయాల గానంతోనే మిగులుతుందనే ఎరుకను తెలుపుతాడు ఈ కవి. ఎప్పటికి వెళ్ళలేవనే సత్యం దేహంలో ఒక కన్నీటి బిందువుగా నిలిచిపోతుందంటూ..ప్రకృతి లోని పావురాల కువకువలు ,వేసవిలో కురిసిన వాన చినుకులు ,చంద మామ,  ఇవన్నీ మాయ అని భ్రమని అంటూ..ఏడు కట్ల సవారీ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తూ..ఒక తాత్వికతని రేకెత్తిస్తూ మరణ ఊరేగింపు కూడా ఏ వైభవం లేకుండా కనీసం ఆ మరణానికి విలపించే రెండు కళ్ళు కూడా లేని ఏకాకి తనంతో వెళ్ళపోవల్సిన అనివార్యతను చాల గొప్పగా చెబుతాడు ఈ కవి.  ఎందుకీ ఈ మరణ చింతన ?ఇక ఎప్పటికి వెనక్కి వెళ్ళ లేనన్న సత్యమేదో హృదిని తొలిచిందా?అదేది కాదు ఈ కవి ఒక జీవిత వాస్తవిక సత్యాన్ని చెప్పాలని అనుకోవడమే. క్షణికమైన సుఖాలలో ఓలలాడించే యాంత్రిక సాధనాల వేటలో శరీరాన్ని పరుగులు పెట్టించిన మానవ జీవిత ఆఖరు దశను ఇలా చెబుతాడు విజయ కుమార్.

‘ నీ శరీరమొక మరమ్మత్తులకు వొచ్చిన వాహనం

ఒకప్పుడు రింగులు ,వాచీలతో ఊరేగిన చేతులకు

దొరకని నరాల కొసం గుచ్చినసిరంజి గాయాలు

రంగు రంగుల వస్త్రాల కప్పుకొని ,పౌడర్లు అద్దుకొని

తిరిగిన నీ దేహ నావని అల్లుకొని ప్లాస్టిక్ పైపుల లతలు

నీ తల్లి దండ్రులు జ్ఞాపకం వొస్తారు

వయో భారంతో శుష్కించిన దేహాలకు

ఆసరా ఇమ్మని ప్రాధేయపడిన వాళ్ళ కళ్ళు గుర్తుకొస్తాయి “ ( దేహ యానం )

అదే మనిషి పుటినప్పటినుంచి ముసలి తనం వచ్చే దశకు చేరుకునే వరకు పొందే స్థితిని  ఇలా రాస్తాడు ఈ విజయ కుమార్.

“నూనూగు మీసాలు మొలిచిన నాడు

ఈ శరీరానికే కదా రంగు రంగుల దుస్తులు చుట్టి

పౌడర్లు ,సుగంధ ద్రవ్యాలు అద్ది

వన్నెల సీతా కోకలకై పడిగాపులు గాసింది

వలచిన సీతాకోక ఒకటి చెప్పా పెట్టక ఎగిరిపోయినప్పుడు

గుబురు గడ్డం పెంచి ,మధువు తాగి, సిగరెట్లు పీల్చి

ఈ దేహాన్ని కదా నువ్వు గాయపరిచింది

వయసు పైబడినపుడు ఈ తోలు తిత్తికే గదా

రంగులు వేసి వయసుని దాచచేయాలని ఆరాటపడింది “

ఆ సుదూర విశ్వవీధులలోని  మనిషి ఆదిమ స్థావరానికీ చేరుకోవడం వరకు జరిగే దేహయానం గురించి, అట్లాంటి వ్యక్తికి వచ్చే చివరి రోజు వరకువున్న స్థితికి కవి చేసిన కవితాత్మక వ్యాఖ్యానం ఈ కవిత. దేహమే ఈ భూమ్మీదకు మనల్ని మోసుకొచ్చే పడవ అని ఊహించే పోలికనే చెప్పిన ఈ కవిత ఆరంభం నుండి ముగింపు వరకు ఈ కవి ఏ జ్ఞాపకాలను మిగుల్చుకొకుండా వెళ్ళిపోయే వాళ్ళ దయనీయతను ,రాజ్యాలను జయించే అలెగ్జాండర్ అయినా దేహయాత్ర కు కాలం చెల్లిపోయిన తరువాత ఆసుపత్రి భాషే వింటాడని కన్ను తెరుచుకొని ఆలోచించేవిధంగా చెబుతాడు.

వచన కవిత్వం రాసే వాళ్ళు మరీ ముఖ్యంగా ఇటీవలి కవులు సాధారణ సంభాషణ శైలిలోనే వాక్య విన్యాసాన్ని ఎక్కువగా వాడుతున్నారు.చదువరులను కానీ ,పాత్రలని కానీ సంభోధిస్తూ రాసే సంభాషణ శైలి వచన కవిత్వానికి బాగా నప్పుతుందని కొందరి అభిప్రాయం.

“ఒక రాత్రి మరొక రాత్రి “ లో కూడా ఈ కవి తన కవితల్ని పాత్రల్ని సంభోదిస్తునో ,చదువరులను సంభోదిస్తునో రాశాడు. “రాత్రులను వెలిగించే పద్యాల ఋతువు “ ఇలా మొదలవుతుంది.

“ఒరేయ్ నాయనా .. ఇది ఇలాగే వుంటుందిరా

పగలు నిలకడ వుండదు రాత్రి వుండదు

ప్రేమ దీపం చుట్టూ తిరిగి తిరిగీ

మసై పోయిన శలభాల కథలకు అంతముండదు “

పాత్రను సంభోధిస్తూ అత్యద్భుత ప్రేమను పరామర్శిస్తూ రాసిన కవిత ఇది.ప్రేమకు బలయిపోయిన అతన్ని ఉద్దేశించి సంభోధిస్తూ రాసిన కవిత.ఆకాశంలో నక్షత్రం లాంటి ప్రేయసి కాంతిని వాగ్దానం చేసిన అంటే ప్రేమను ఇవ్వకుండా పోతే ఆమె పోయిన ఆమె జ్ఞాపకాలు పోవు కదా అని ఈ కవి చెబుతాడు.ఒక్కొక్క రాత్రిని ఒక్కొక్క పద్యం చేసి ఆ పద్యాల హారాన్ని కానుకగా పంపు.ఎప్పుడో ఓసారి ఆ కానుకను చూడక పోదు.పోగొట్టుకున్నది తానే అని బాధ పడితే ఓదార్చి,ప్రేమలు పద్యాలు మాత్రమే పెడతాయేమో కానీ బువ్వలు మాత్రం రూకలే పెడతాయని చెబుతూ, నాలొ అలివికాని ప్రేమవుందని నీకే తెలియ చేసిన నీ ప్రేయసికి కృతజ్ఞతలు చెప్పమంటాడు ఈ కవి.అలవి కానీ ప్రేమ వుంటే మరో ఒప్రేమ నక్షత్రం ఒడిలో వాలుతుందని నాలుగు పాదాల్లో గొప్పగా చెప్పాడు.ఆ నక్షత్రాన్ని లాలనగా దగ్గరగా తీసుకొని యుగయుగాల ప్రేమని పంచు అని అంటాడు.

ఎదురుగా వున్న తెల్ల కాగితం నువ్వు దూకితే మింగేసే లోతైన బావి అవుతుందని ,వేళ్ళ నడుమ వున్న పెన్ను లోపల వున్న బాధని పెకిలించే ఖడ్గం అవుతుందని చెబుతూ  అప్పుడు నువ్వు భాషను నేర్చుకొని  ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తు పద్యం రాస్తే నీ లాంటి వాడు ఆ పద్యాన్ని హత్తుకుంటే నీవు తిరిగి జన్మిస్తావని అంటు బాధవల్ల పద్యం పుడుతుందని ఆ పద్యమే కవిని పున్ర్జీవితున్న చేస్తుందని పరోక్షంగా ప్రస్తావిస్తాడు. “పగలే కాదు ..రాత్రి కూడా వొకటి వుందన్న చేదు నిజం రాత్రయ్యాకే గుర్తుకొస్తుంది “-అని అనటంలో జీవితంలో సుఖం వున్నప్పుడు కష్టాలు కూడా వుంటాయన్న నిజాన్ని ధ్వనితో చెబుతాడు.

స్త్రీ పురుషుల మధ్య ముఖ్యంగా మూడుకాళ్ళ ముదిమి వయసులో వుండాల్సిన సంబంధాన్ని, ఆ  భార్యలైన స్త్రీలతో భర్తలకు  వుండాల్సిన అనుబంధ సంబంధాన్ని  అద్భుతంగా  చెప్పిన కవిత “ఏ తీరుగ నను ..” అనేది. “యౌవ్వనంలోనైనా, ముదిమిలోనైనా ఒకపాటొ ,పద్యమో ,తోడులేని బతుకు ఎంత దుర్భర్మో కదా ! “అంటూ  “ జీవితాలని బలిగోరిన పురుషులు ,జీవితాంతం పరాన్న జీవులుగా బతికే పురుషులు ,ఒక శ్రావ్యమైన పాటకూ అందమైన పద్యానికీ నోచుకోని పురుషులు ,స్త్రీల వలె జీవితాన్ని కళగా జీవించడం తెలియని పురుషులు “ అంటూ  సాయంకాలాలు పాటలలో మునిగిపోయే స్త్రీల కన్నా పురుషుల జీవితం దుర్భరమని ఒక జీవిత సాదృశ్యాలతో స్త్రీల జీవన వైషిష్ట్యాన్ని గొప్పగా నిరూపిస్తాడు.

“సూర్యుడి కన్నా ముందు నిన్ను నిద్రలేపి ఇక ఆరోజు మొదలయ్యే పరుగు” పెడుతూ గడియారపు రెండు ముళ్ళ మధ్య చిక్కుకొన్న క్రమం తప్పని దిన చర్య  ఎవరికైనా తప్పదని అంత మాత్రానా అందరి తల్లి తండ్రులు లాగానే నిన్ను వారు పెంచారని చెబుతూ ..జీవిత ఆనంద రహస్యాన్ని  తెలుసుకోమని ఇలా చెబుతాడు.

“ఒక భాగవత శ్లోకాన్ని నెమరువేసుకుంటునో

రాత్రి ఆరుబయట వెన్నెల్లో రేడియోలో ముఖేష్ పాట వింటునో

మైమరచి పోయిన నీ తండ్రి రూపం

పగలంతా ఇంటి పనితో అలసిపోయినా

కళ్ళ నిండా కాటుకతో, కాసంత బొట్టు తో

నిండుగా ముస్తాబయ్యే నీ తల్లి రూపం

రెండు కళ్ళు లేకున్నా కంచికి వెళ్ళిన కథలని

నీకు వినిపించి మురిపించిన అమ్మమ్మ రూపం

అన్నీ ఒక్క సారి జ్ఞాపకం తెచ్చుకొని చూడు

ఒక రహస్యమేదో వాళ్ళు నీకు చెప్పినట్టున్నారు “

అంటూ కాంక్రీటు నిర్మాణపు నగరపు విసుగులోంచి బయటపడే గొప్ప ఆత్మ విశ్వాసాన్నిపొందే రహస్యాన్ని కుటుంబ సంబంధాల నుంచే పొందవచ్చనే స్పృహనిస్తాడు.

“ఆమె సమయాలు “ అనే కవిత భార్య పట్ల భర్తకుండాల్సిన బాధ్యాతాయుతమైన ప్రేమను పూల పోలికలతో సౌకుమార్యంగా చెప్పిన కవిత. “ఇటివల సంబరం “ అనే కవిత తన యింటి టెర్రస్ మీదకి కువకువ రాగాలతో కుశలం అడుగుతూ వొయారంగా వాలిన అనుకోని అందమైన అతిథులైన పావురాలకు చేతిలోని గిన్నె లోని గింజెలతో విందు చేస్తున్న తన బిడ్డ చేస్తున్న ఆ పనిని  అపురూప దృశ్యంగా కవిత్వం చేశాడు. ఏ ఆడబిడ్డయినా తన తండ్రిని “ నువ్వు అబ్బాయి పుట్టాలని కొరుకున్నావా నాన్న ? అని అడిగితే ఏం చెబుతాడు ? అవునని అనగలడా? కానీ అవునని చెబుతూ .

. నిజమే కొన్ని బలహీన  క్షణాలలో

నా అనాది మగ దురహంకారాల మైకంలో

అబ్బాయి పుట్టాలనే కోరుకున్నానేమో?

తన తప్పును ఒప్పుకొంటూ ..” కానీ నా బంగారు తల్లీ..! నాలో జీవం నింపి నన్నొక మనిషిని చేసింది స్త్రీలేనని ఎలా మరచిపోగలను “ అని పశ్చాతాపం ప్రకటించడ ప్రకటిస్తూ. “ నా లోలోపలి లాలిత్యాన్ని రక్షించింది స్త్రీలేనని “.స్త్రీల పట్లగల తన కృతజ్ఞతను ప్రకటిస్తాడు.కానీ ఈ నాటి సమాజంలో కట్నాల విలువ కట్టే విఫణి వీధులు, నిర్లజ్జగా దొర్లే యాసిడ్ సీసాలు  వున్న స్థితుల్లో నువ్వు అబ్బాయివైపుడితే బాగుంటుందన్న ఒక సామాజిక వికృత స్వరూపాన్ని ,ఆ సమాజం స్త్రీల పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను అద్భుత ధ్వనితో సూచించాడు. ఇది గొప్ప కవిత్వ లక్షణం.

ఈ కవి   నిరుపమాన భావుకతతో పాటు గొప్ప సామాజిక బాధ్యతను గూడా  కలిగివున్నాడు.”ఎన్నికల ఋతువు “  “నగరంలో ఒక ఉదయం “ ఇలాంటివి కవి సామాజిక దృక్పథాన్ని చూపెడతాయి.నగరం లో రైతులు చేస్తున్న ధర్నాలతో రాస్తారోకోలతో కూడళ్ళలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన నగర ప్రజలు “ పనీ పాటా లేని పల్లె పొద్దున్నే నగరంలోకి జొరబడి విలువైన నగర సమయాన్ని ధ్వంసిస్తుంది “-అని అంటున్నప్పుడు ఈ కవి “ పొలమూ.. విత్తనాలు..ఎరువులూ, ఆకాశం దయతో కురిసే వర్షమూ తప్ప, మరోలోకం , లేని వాళ్ళు కదా తమలోకం విడిచి ఈ నగర మాయాలోకంలోకి యిట్లా బాధల మూటలతో వాళ్ళు మాత్రం యిష్టంగా వస్తారా? “-అని అంటాడు.అంతే కాదు ఆ రైతులను “ఈ నిర్లజ్జ నగరం తన రాకాసి బాహువులు సాపి మిగిలిన మీపొలాలని  కూడా అనకొండ లా మింగివేయబోతుందని “ హెచ్చరిస్తాడు. ఏదో ఒకనాడు ఈ నగరం తిండి గింజల కోసం రైతుల కాళ్ళ మీద పడి మొక్కే కాలం వొస్తుందని ధైర్యమైన ఆశనిస్తాడు.

హైద్రాబాద్ నగరంలో సంభవించిన పేలుళ్ళ పై రాసిన ఉన్నత కవిత”  అతడూ.. నేను.. ఒక సాయంకాలం “ అనేది. “ విధ్వంసంతో మళ్ళీ కొన్ని దేహాలనైతే ధ్వంసం చేసాడు కానీ మా ఇద్దరి నడుమ విశ్వాసాన్ని స్పృశించలేక ఓడ్పోయాడు “. అనే వాక్యంతో చెదరని హిందూ మహమ్మదీయ మైత్రిని సూచించాడు.ఇలా ఎన్నో ఉత్తమ కవితల సమాహారంగా వుండిన ఈ సంపుటిని పరిచయం చేయడానికి “ఒక రాత్రి చాలదని అనుభూతించి రాయడానికి మరో రాత్రి కూడా కావాలని అంటున్నా.

తప్పించుక తిరుగుతావు లోకం నుండి ఈ కవిత్వం చదివితే.చదువకపోతే లోకమే నీ నుండి.. దూరంగా పోతుందంటున్నా.కొన్ని మాటలు లుంగలు చుట్టుకు పోయి ఈ కవిత్వం గురించి ఇంక రాయలేక ఎవరితో ఇంకా పంచుకోలేక గొంతులో లోపల చిక్కుకున్న మాటల్ని ఇక రాయలేక.. పాఠకులు సీరియస్ గా చదువాల్సిన కవిత్వం విజయకుమార్ దని అభినందిస్తున్నా.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“ తాము దయతో పండించే

తిండి గింజల్ని తిని

వెర్రి పరుగులు తీసే ఈ నగరం

కాసింతయిన కరుణ చూపిస్తుందని కదా

ఈ మట్టి పాదాలు ఇక్కడి దాకా ప్రయాణించింది “

 

ఏ మట్టి పాదాలు ..మీద నగరమంతా మోకరిల్లింది ?.ఎందుకు తిండి గింజల్ని ప్రసాదించండి అని అసహన హారన్ లు మ్రోగిస్తున్నారు  ఈ నగరమంతా.. నగరం రాకాసి బాహువులతో పొలానని అనకొండలా మింగేయ బోతున్నది ఎందుకని ..?ఇదంతా మనకి అర్థం కావాలంటే. విజయ కుమార్ రాసిన” నగరంలో ఒక ఉదయం”

కవిత చదువాల్సిందే. నగర కలుషిత “వాతావరణం “ లో “ అక్వేరియంలో బంగారు చేప “ను రక్షించడానికి ఒక

యుద్ధ “అనంతరం “ “ఒకరాత్రి.. మరొకరాత్రి “ అయిన లెక్కచేయకుండా కవిత్వ కరవాలాన్ని దూస్తున్న కవి కోడూరి విజయ కుమార్ . “ “ డాక్టర్ .రామనాథంని .. చంపేశారు స్కూలుకి సెలవని తెలిసిన రోజున నా జ్వరా

నికీ తీయటి మందులిచ్చిన డాక్టర్ని ఎందుకు చంపారో తెలియక ఏడ్చిన” కవి విజయ కుమార్ ఆ రోజు.కానీ

ఈ రోజు “ దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది ఏదో ఎరుక కలిగిన కవి.తన నేల మరోక పోరాటా నికి సిద్ధమయ్యాక కార్యాలయ రణరంగాలకన్నా “ టీ బల్ల దగ్గరే సంభాషణ ప్రారంభిద్దాం “అని ఆహ్వానించిన కవి  విజయ కుమార్. తనది అయిన నేల కోసం స్వప్నించిన మరొక పూవు వికసించకనే నేల రాలిపోవడాన్ని సహించలేక కరిగిపోయే కవిత్వంరాసిన కరుణామూర్తి కవి విజయ్ కుమార్.

నగరంలో ఒక ఉదయం తిరిగి అలసిపోయి ఒక సంభాషణ కోసం అతడూ.. నేనూ.. ఒక సాయంత్రం బంగారు వాకిలి గుమ్మం ముందు అతిథిలా ఒక పరిచయస్తుడి గురించి ,కొత్త స్నేహితురాలు గురించి వాళ్ళ ఇళ్ళలో  జరిగిన ఇటీవలి సంబరం గురించి మాట్లాడుకుండే మెలుకువలో యాకూబ్ విజయ్ కుమార్ ని పరిచయం చేసి

నట్టు జ్ఞాపకం. ఇంధ్రధనువుపై ఎగిరిన సీతాకోక చిలుక లా ,రాత్రులను వెలిగించే పద్యఋతువులా విజయ్ కవిత్వం ఏ తీరుగ నను దయ చూస్తుందా అనుకుంటున్న సమయంలో రహస్యంగా సంజాయిషీ యివ్వకుండా వచ్చి వాలింది ..ఒక రాత్రి నా ఇంట్లో.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

హలో…హలో..అలోహా!

 సత్యం మందపాటి

 

 satyam mandapati ఎన్నాళ్ళనించో చూడాలనుకుంటున్న ‘హవాయీ ద్వీపాలు’ చూసి రావటం కూడా కొన్నేళ్ళ క్రితమే జరిగింది.  పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా వారి ఎనిమిది ద్వీపాల సముదాయమే హవాయి. అమెరికాలోని  యాభై రాష్ట్రాల్లో ఒకటి. అక్కడ ఈ ఎనిమిది ద్వీపాలు పక్కపక్కనే వున్నా, ఎక్కువ జనాభా వున్నవీ, చాలామంది యాత్రీకులు వెళ్ళేవీ నాలుగు లేదా ఐదు ద్వీపాలు మాత్రమే.

అన్నిటిలోకి పెద్దది ‘బిగ్ ఐలండ్’. దాన్నే ‘హవాయి ద్వీపం’ అని కూడా అంటారు. తర్వాత ‘మావి’ (Maui),

‘ఉవాహు’ (Oahu), కవూయి (Kauai) పెద్దవి. దాని తర్వాత వైశాల్యంలో ‘మలోకా’, ‘లానా’, ‘నీహావ్’, ‘కహులావి’   ద్వీపాలు వున్నాయి. (ఉవాహు ద్వీపాన్ని ఉఆహు అని కూడా పలుకుతారు)

వీటన్నిటి మీదా కొంచెం పరిశోధన చేసి, చివరికి నాకూ శ్రీమతికీ రెండు వారాలే సెలవు దొరికింది కనుక, ఒక వారం ఉవాహులోనూ, ఇంకొక వారం మావిలోనూ సరదాగా, విశ్రాంతిగా గడుపుదామని నిర్ణయించుకున్నాం. ‘బిగ్ ఐలండ్’ కూడా వెడదామనుకున్నాం కానీ, తీరిగ్గా చూడటానికి రెండు ద్వీపాలు చాలనిపించింది. కొంతమంది మిత్రులు, విమానంలో ఉవాహు వెళ్లి, అక్కడినించీ ఏడు రోజుల క్రూజ్ తీసుకుని, అన్ని ద్వీపాలు చూసి వచ్చారు. కానీ, మాకు అదీ అంతగా నచ్చలేదు.

మేము ఆ రెండు ద్వీపాలనే ఎందుకు చూద్దామనుకున్నామో, ఆ ద్వీపాల గురించి చెబుతుంటే మీకే అర్ధం అవుతుంది. చిత్తగించండి.

౦                           ౦                           ౦

ఆస్టిన్ నించీ లాసేంజలిస్, అక్కడినించీ ఉవాహు ద్వీపం మీద వున్న ‘హానొలూలు’ నగరానికి విమాన ప్రయాణం చేసి, అక్కడే వైకీకి బీచ్ మీద వున్న ఒక హోటల్లో వారం రోజులు బస చేశాం.

మా గది కిటికీలోనించీ, వెన్నెల్లో సముద్రం, వెండి రంగులో మెరిసిపోతున్న సముద్ర తరంగాలు, ఎంతో అందంగా వున్నాయి. రోజుకి కనీసం ఒకటి రెండుసార్లన్నా, ఆ సముద్రం ఒడ్డున రెండు మూడు మైళ్ళు నడుస్తూనే వున్నాం.

చక్కటి సముద్రం, దానిపక్కనే ఎన్నో హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపులు, పెద్ద పెద్ద భవనాలూ, శుభ్రమైన రోడ్లతో హానలూలు నగరం, ఫ్లారిడాలోని మయామీలాగా వుంటుంది. మయామీ చూసేశాం కనుక, అక్కడికి ఎందుకు వెళ్ళామంటే, ముఖ్య కారణం రెండవ ప్రపంచ యుద్ధంలో అక్కడే జరిగిన ‘పెరల్ హార్బర్’ భీభత్సం. తర్వాత

ఎన్నో పాలినీషియన్ ద్వీపాల సంస్కృతి ఇక్కడ కనపడటం. ఎంతోఅందమైన హనౌమా బే, వైకీకి బీచ్ లాటి ఎన్నో అందమైన సముద్ర తీరాలు.. ఇలాటి చూడవలసిన ప్రదేశాలు ఇక్కడ ఎన్నో వున్నాయి. ఈ ద్వీపం ఇటు ప్రకృతి సౌందర్యానికి, అటు ఎంతో అందమైన కట్టడాలకి నెలవే కాకుండా, చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం వున్న ప్రదేశం. అందుకే ముందుగా “ఉవాహు” ద్వీపానికి వెళ్ళాం.

hawai1

హవాయి భాషలో ఉవాహు అంటే, ప్రజా సముదాయం కలిసే కూడలి అని అర్ధం. ఈరోజుల్లో ఇక్కడికి వచ్చే జనాన్ని చూస్తే, ఆ పేరు సార్ధక నామం అని తెలుస్తూనే వుంటుంది. రెండు అగ్ని పర్వతాల మీద నించీ వచ్చిన లావాతో ఏర్పడిన ద్వీపమిది. ఆరువందల చదరపు అడుగుల వైశాల్యంతో, ఒక మిలియన్ జనాభా వున్న ద్వీపం.

మొట్టమొదటగా బస్ టూర్ తీసుకుని, పెరల్ హార్బరుకి వెళ్ళాం. అక్కడే USS ఆరిజోనా మెమోరియల్ యుద్ధ నౌక వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారి పేర్లతో పాటు, చరిత్ర మీద సరదా వున్న వారికి, ఇక్కడ చూడవలసినవి ఎన్నో వున్నాయి, సమాచారం ఎంతో వుంది.

తర్వాత పాలినీషియాన్ సాంస్కృతిక కేంద్రానికి వెళ్ళాం. హవాయి, తహితి, ఫిజి, టోంగా, సమోవ మొదలైన ద్వీపాల తెప్పల మీద వారి సంస్కృతిని తెలిపే నృత్యాలు చేస్తూ, రంగురంగుల దుస్తులతో పాటలు పాడుతూ, ఆడుతూ మనకి కన్నుల విందు చేసే ప్రదర్శన ఎంతో బాగుంటుంది.

 

అక్కడే కొబ్బరి చెట్లు గబగబా ఎక్కి, ఒక కొబ్బరిబొండాం కోసి, క్రిందికి దిగి వచ్చి దాన్ని ఎంత త్వరగా వలిస్తే వాళ్ళు గెలవటం, రకరకాల పాలినీషియాన్ నృత్యాలు చేసి చూపించటమే కాకుండా, మనకి కూడా నేర్పిస్తూ, వాళ్ళతో పాటూ మనమూ డాన్స్ చేయటం సరదాగానూ, చాల ఆకర్షనీయంగానూ వున్నాయి.

ఇంకా ఇక్కడ మాకు బాగా నచ్చింది హనౌమ బే.  పైన నీలి ఆకాశం, అందమైన సముద్రం, చుట్టూ పచ్చని చెట్లు, వాటికి ఎన్నో రంగురంగుల పూలు… ఎంతో సుందరమైన ప్రదేశం. ‘డోల్’ అనే కంపెనీ వారి పైనాపుల్ తోట బాగుంది. అప్పటికప్పుడు కోసిన పైనాపుల్ ముక్కల రుచి, మనం ఇక్కడ తినే వాటి కన్నా ఎంతో బాగుంటుంది. హవాయి ఆర్ట్ మ్యూసియం, అలోహా టవర్,  డైమండ్ హెడ్.. ఇలాటి ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు వున్నాయి.

వారం రోజులు వైకీకీ బీచ్ ఒడ్డున ఉవాహులో గడిపి, అక్కడి నించీ మావి ద్వీపానికి విమానంలో వెళ్ళాం.

హనొలూలు విమానాశ్రయంలో దిగుతున్నా, వెడుతున్నా ఎంతోమంది రంగురంగుల దుస్తులు వేసుకున్న అమ్మాయిలు ‘అలోహా’ అంటూ మన మెడలో పూలదండ (హవాయి భాషలో లై అంటారు) వేస్తారు. కలిసినప్పుడు వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు ‘అలోహా’ అంటారు. అంటే మన ‘నమస్తే’, ‘ఉంటామండీ’ లాగా అన్నమాట. అలోహా అనే మాటకు అసలు అర్ధం శాంతి, అనురాగం, దయ అని గూగులమ్మగారు చెబుతున్నారు.

మావి 730 చదరపు మైళ్ళ వైశాల్యంతో, దాదాపు లక్షన్నర జనాభా వున్న ద్వీపం. ఇది ఈ హవాయి పెద్ద ద్వీపాల సైజులో రెండవది. మావి ద్వీపానికీ, ఉవాహు ద్వీపానికీ వున్న పెద్ద తేడా, మావిలో కాంక్రీటు, స్టీలు కన్నా ప్రకృతి అందాలు ఎక్కువగా కనిపిస్తాయి. బీచ్ ఒడ్డున హోటల్ బిల్డింగులు కూడా అక్కడా ఇక్కడా కొన్ని తప్ప అన్నీ ఒకటి లేదా రెండు అంతస్తుల భవనాలే.

ఇక్కడ కూడా సముద్రం ఒడ్డునే ఒక రిసార్టులో గది తీసుకున్నాం. మా గది కిటికీలోనించీ సముద్రం, దానితో పాటు కొంచెం దూరంగా పక్కనే వున్న ఇంకొక ద్వీపం కూడా కనిపిస్తుండేవి.

ఇక్కడ చూడవలసిన వాటిలో ముఖ్యమైనది ‘హలేకలా నేషనల్ పార్క్’. ఇది సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తున, పర్వతాల మీద వున్నది, ఇది ఒక అగ్నిపర్వతం. ఇప్పుడు లావా బయటికి రావటం లేదు కానీ, అంతర్గతంగా ఇది అగ్ని పర్వతమే. ఎప్పుడు ఆ వేడి బ్రద్దలయి, అది బయటికి వస్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళటానికి వున్న ఘాట్ రోడ్డు ఎన్నో మెలికలు తిరుగుతూ పైకి వెడుతుంది. అక్కడే ఒక పెద్ద క్రేటర్ కూడా వుంది. క్రేటర్ అంటే ఆకాశంలోనించీ Asteroids భూమి మీద పడ్డప్పుడు ఏర్పడే ఎంతో పెద్ద గుంట. క్రింద మేము చూసిన క్రేటర్ ఫోటో కూడా ఇస్తున్నాను.

hawa3

మేము కారు అద్దెకి తీసుకున్నా కూడా, ఈ ప్రదేశానికి టూరు బస్సులోనే వెళ్ళమని చెప్పింది మా హోటల్లో వున్న అందమైన రిసెప్షనిస్టు.

‘మీరు ఆ మెలికల రోడ్డులో డ్రైవింగ్ మీద దృష్టి పెడితే, అక్కడి ప్రకృతి అందాలను సరిగ్గా ఆస్వాదించలేరు’ అని మెలికలు తిరుగుతూ అందంగా చెప్పింది.

సరే ‘మావి పాప’ చెప్పింది కదా అని, అప్పటికి అలా కానిచ్చి టూర్ బుక్ చేసుకున్నాము. అది ప్రొద్దున వెడితే, ఇక చీకటి పడ్డాకే తిరిగి రావటం. ప్రొద్దున్నే సాండ్విచ్ పాక్ చేసుకుని వెళ్ళాం.

దారిలో ఎన్నో రకాల పూల చెట్లు. పచ్చటి వృక్షాలు, మామిడి, బొప్పాయి, అరటి, పైనాపుల్ లాటి ఎన్నో పళ్ళ చెట్లు. పక్కనే క్రింద సముద్రం.. పైన నీలాకాశం. మధ్యే మధ్యే చిన్న చిన్న జలపాతాలు, లోయలు, అక్కడక్కడా చిన్న చిన్న గుహలు. ఇక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు. వాటి పక్కనే పళ్ళ తోటలు, పూల తోటలు. ఎన్నో ప్రకృతి అందాలు. ఆ అందాలను వర్ణించటం నాకు సాధ్యం కాదు.

మా గైడ్/డ్రైవర్ కూడా సరదాగా జోకులు వేస్తూ, ఆరోజుని మరువలేని రోజుగా మామీద ముద్ర వేశాడు.

 

hawa4

మావిలో మేము ఉత్సాహంగా చూసిన ఇంకొకటి – వేల్ వాచింగ్. అంటే సముద్రంలో తిమింగలాలను చూడటం.

ఒక బోటులో, పది మంది వుంటారేమో – రెండు గంటలసేపు తిమింగలాలను చూడటానికి వెళ్ళాం. అవి చటుక్కున బయటికి వచ్చి వెంటనే, ఒక పెద్ద కదులుతున్న ఆర్చిలా, వెంటనే నీళ్ళల్లోకి వెళ్లిపోయేవి. ఎవరికి అవి కనపడినా పెద్దగా అరుపులు, అందరూ కెమెరాలు అటు తిప్పి ఫోటోలు తీసేలోగా, అవి మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోవటం. అదొక ఆటలా సరదాగా గడిపాం.

ఇంకా మావి ద్వీపంలో చూడాలనుకునేవి, చేయాలనుకునేవి చాల వున్నాయి. హెలికాప్టరులో ద్వీపం అంతా చుట్టి రావచ్చు. స్నోర్క్లింగ్ చేయవచ్చు. స్కూబా డైవింగ్ చేయవచ్చు. పైనాపుల్ గార్డెన్స్ టూర్ వెళ్ళచ్చు. సర్ఫింగ్ చేయవచ్చు. బొటానికల్ గార్డెన్స్ చూడవచ్చు. ఇవన్నీ చేయాలన్నా, చూడాలన్నా వారం రోజులు నిజంగా చాలవు.

మా ‘మావి’ ప్రయాణం ఈ హవాయి ట్రిప్పులో ముఖ్యాకర్షణ.

అవకాశం దొరికితే, మళ్ళీ వెడతామా?

తప్పకుండా!

౦                           ౦                           ౦

 

కరెంటొచ్చె..! జనాలకి తీరిక సిక్కె..!

     సడ్లపల్లె చిదంబర రెడ్డి 

యనకటి  కాలంలో సేద్యాల్ని వాన దేవునిమింద బారమేసి సేస్తావుండ్రంట రైతులు. అదనుగా సినుకులు పడితే ఆనందము. ఏటిస్తే నీళ్ల నెదుక్కోని పొయ్యే వలస బతుకులంట.
 
    రాజులు తవ్విచ్చిండే సెరువుల కింద, ఏర్లు, వంకల తీరాల్లో యాతమెత్తి,గూడేసి,కపిలి(మోట)తో నీళ్లు తోడి కొందరు యవసాయం సేస్తా ఉండ్రంట.
 
    సేద్యాలు సేసేకి  బాయిలు తవ్వేది పజ్జెనిమిదో నూరేడు ఇరుమైలు ఒరుకు(18 వ శతాబ్దికి వెనకా ముందుదాకా) రైతులుకు తెలీదంట!!
 
   అపుడు గుళ్లూ గోపురాల దగ్గర నాలుగు మూల్లు సౌకంగా తవ్వి రాతి కట్టడం కట్టే  కోనేటి బావులు మాత్రమే తెలుసునంట. ఊర్లల్లో సేద బావులు గూడా నాలుగు మూళ్ల సౌకాలే!!
    కుంపిణీ వోని (ఆంగ్లేయుల కంపెనీ)కాలంలో రైతులకు పట్టాలిస్తూనే కొందరు బాయిలు తవ్వేది మొదలు పెట్రంట.  ఏటి గడ్డలో మెత్తగా ఉండే నేలని పదో పదకొండో అడుగులు తవ్వుతూనే దిక్కులేనన్ని నీళ్లు ఊర్తా ఉన్నంట. దానికి రాళ్లతో గోడ కడితే  నీళ్లూ మన్నూ కలిసిన(కొచ్చు) బురద, ముందరికి జరిగొచ్చి బాయిలన్నీ పూడుకు పోతా  ఉన్నంట.
   ఇట్లయ్యెల్లేదని ఎదురు పుల్లలు,లక్కిలి బర్రలు,పూలి కొమ్మలు నరుక్కొచ్చి తీళి తీగల్తో పెద్ద పెద్ద తడకలల్లి, బాయి తవ్వే కొద్దీ బూమి లోపలికి దించుతా వుండ్రంట. అపుడు మన్ను తడక ఎనకాలే నిల్సి, నీళ్లు మాత్రం బాయిలోనికి వొస్తా వున్నంట. వాట్ని “కొర్సు బాయిలు” అని పిలుస్తా వుండ్రంట!!
    ఒగసారి అరవ దేశం (మదరాసు రాష్ట్రం) నుంచి ఒగ ఇంజినీరు ఒచ్చినంట. ఆయప్ప సింత పలకల్ని గుండ్రంగా రింగుల మాదిరీ కోపిచ్చి,లోతుగా తీసిన బాయిలో అడుగున ఉంచేది, దాని మీద ఉలితో తొల్సిన రాళ్లను న్యారముగా (నీటుగా) కట్టేది, బురద మన్ను నూకినా కదలకున్నట్ల రాళ్లను పేర్సే ఇదానము రాళ్ల పని సేసే “వడ్డి” కులస్తులకు నేర్పినంట.
    అఫుడు అల్లో (అపుడు మా ఊరిదగ్గరున్నది పెన్నేరని చాలా మందికి తెలీదు.హళ్ల అంటే కన్నడంలో వంక అని అర్థం చాలా ఏళ్లవరకూ హల్ల అనే వ్యవహరించే వారు.) ఏడెనిమిది మట్లు (మట్టు=6 అడుగుల లోతు) బావులు తవ్వేది మొదలు పెట్రంట. రెండు మూడేండ్లు వానలు పడకుండా యగేసుకొంటే ఆ బాయిల మద్యలో పిల్ల గారండా (సిమెంటు రింగు లాంటిది.గారుతో చేసిన అండాకారం కలది) దించేది కూడా నేర్సిరి. బాయిల కన్నిటికీ అంతే  కొలతల్తో బార్లు తొలిసి కపిల బాన్లతో నీల్లు తోడి వానలు పడకున్నా గూడా సేద్యాలు సేసేది నేర్సిరంట.
     ఈ రకంగా సాగు బూమి యంత పెంచినా ఏంటేంటివో రోగాలొచ్చి పెట్టిన పంటంతా నాశన మయితా వున్నంట. అవుడు ఇంగిలీషోని రాజ్యమంట! ఆయప్పగారు పంటలకి మందులు సల్లమని రైతులకు పురమా యిస్తా వుండ్రంట. రైతులు వాళ్ల మాట ఇంటా వుండ్లేదంట. పంది రోగమని పైర్ల మింద పండులు కోసి రగతం సల్లేది,కొక్కెర రోగమని సేన్ల దగ్గర కోళ్లు కోసేది,ఎనుంపోతులు నరికేది సేస్తా వుండ్రంట.
 IMG_0008
    అపుడపుడే కొత్తగా సీమెరువులు(రసాయన ఎరువులు) ఒచ్చినంట. అవి మన్నులో ఏస్తే కరిగే దానికి రైతులు ఉప్పు అని పిలుస్తా వుండ్రంట. రైతులు బూములకు తోలే పశువులెరువులు,ఒండు మన్ను,పచ్చాకు జతకి రవ్వంత సేమెరువు సల్లండి పంటలు బాగా పండతాయని రెడ్డీ కరణాలు అందర్నీ పిల్సి బంగ పోతా వుండ్రంట. అయినా రైతుకు కిబ్బిబ్బీ (ఏమాత్రం)వాళ్ల మాట్లు ఇంటా వుండ్లేదంట!
     ఇట్ల అయ్యెల్లేదని కరణాలు రాతిరిపూట తలారోల్లని  పిల్సి సీమెరువులు,పురుగుల మందులూ ఇచ్చి– ఒగొగొ ఊర్లో ఒగొగు సేను గుర్తుపెట్టుకోని రహస్సింగా సల్లించేది మొదలు  పెట్రంట.
    సేమెరువులు మందులు తగిలిన పైర్లు ఏపుగా పెరిగి ఇరగ్గాసినంట. అది తెల్సి మిగతా జనాలుకూడా అవిట్ని వాడేది మొదలు పెట్రంట. దాంతో రెడ్డీ కరణాల జాతకాలు మారిపాయ నంట. యాలంటే గిరాకీ పెరిగి అవ్వి అంగాళ్లో సిక్కకుండా అయిపాయ నంట. రైతులు కొనల్లంటే రెడ్డీ కరణాల సంతకం కావల్లంట!!
   ఆ కాలంలో తిరుపతి యంగట్రాణస్వామి దర్శనం బిరీన అయితా ఉన్నంట గానీ,కరణం కంట్లో పడల్లంటే అయిదారు సార్లు అడుక్కు తినే వాళ్ల మాదిరీ రైతులు ఆయప్ప ఇంటిముందర పడిగాపులు కాయల్లంట. సేన్లో పండే కూరగాయలు,బెల్లము,నెయ్యి,టెంకాయలు,జున్నుపాలు… మోయ లేనన్ని మోసిస్తే గాని ఆయప్ప అర్జీ మింద సంతకం సేస్తా ఉండ్లేదంట.
    రెడ్డీ కరణాలు ఊర్లో కొస్తే సన్నాబన్నా జనాలు ఎర్సుకోని సస్తాఉండ్రంట. అపుడు యాడాదికి ఒగతూరి బూమి సిస్తు (రూకలు,కందాయము అనికూడా పిల్చేవారు)కట్టల్ల. గుత్త  రూకలు వసూలు సేసేది వాళ్లే.
      1960 ఇరుమైల్లో(వెనకా ముందు)నాకి ఆరేడు ఏండ్లు ఉండొచ్చు. రెడ్డీ కరణాలు ఊరంతా తిరిగి మా గుడిసి పక్కనుండే మా అప్పప్పా(చిన్నాయన) గుడిస్తా కొచ్చిరి. ఆయప్ప అయిదు రూపాయలు గుత్త రూకలు కట్లేదంట! దాని కోసరం జప్తు సేసి తలారాయప్ప  కుర్ర దూడని పట్టుకు పొయ్యి గుడి ముందర కట్టేశ.
     ఆపొద్దు మా నాయిన ఊర్లో ఉండ్లేదు. వానలు రాకుండా ఎగిచ్చుకోనుంటే ఇరాట పర్వం సదివేకి యావిదో ఊరికి పొయినట్లుండె. మా యవ్వ ఊరంతా దేబిరించినా అయిదు రూపాయల దుడ్లు పుట్టందం కాలేదు. కడాకి తాసిల్దారొస్తే ఆయప్ప కాళ్లు పట్టుకోని” ద్యావరా బంగారట్లా కుర్రదూడని పట్టుకు పోతే అది మేతా నీళ్లు లేక సస్తుంది. రెండు మూడు దినాలు గడువియ్యండి యాడో అప్పో సొప్పో సేసి కడతాము” అని అడుక్కోనె. అయినా ఆయప్ప సెవుల్లో ఏసుకో లేదు.
    ఇంగా ఎవురో కురవోళ్లు రెండ్రూపాయలు కట్టకుంటే ఇంటిని జప్తు సేసి ఇత్తడి తప్పేలా ఎత్తుకొచ్చిరి.
     సాయంత్ర మవుతూనే కుర్ర పెయ్యని ఇందూపురంలో వుండే బందుల దొడ్డికి తోల్రి. అపుడు మా యవ్వ “రాతిరంతా దాన్ని ఉపాసం సంపుతారు  మ్యాత ఎత్తుకుపొయ్యి ఏసి రారా “అని సిన్నాయన్ని పురమాయించె.
IMG_0021
    ఆయప్ప శానా అమాయికుడు, జతకి ఆని కాళ్లు సెప్పులు తెగి పొయ్యిండివి నడిసేకి శాతగాదు అని తెల్ల పదం పాడె.(నే చిన్నప్పుడు చాలా మందికి పదాల నిండా ఆనెలే.చెప్పులు కొనలేని చాలా మంది పాదాలకు పాత బట్టలు చుట్టుకొని నడిచేవారు. మా అమ్మకు, నాన్నకు,పెద్దన్నకు ఉండేవి. అది చర్మ రోగమో పరిశుభ్రతకు సంబందించినదో తెలియదు.ఇప్పుడు ఎక్కడా కనిపించదు).కడాకి మా సిన్నన్నయ్య రవీందర్రెడ్డి ఎండిండే రాగు తాళు మోపు మోసుకు పొయ్యి బందుల దొడ్డిలో కుర్రకు తినిపించి ఒచ్చె.
    రెడ్డీ కరణాలు 1982 దంకా పల్లుటూరి జనాల్ని పీతిరి పంతల మాదిరీ (రాబందుల్లాగా) పీక్కు తినిరి. అంత సేపటికి అపుల పాలై, సీమలో  సేద్యం సేసే బదులు అడుక్కితినేదే మేలని, మేము సేద్యం ఇడిసి పెడ్తిమి. ఇపుడు రైతుల్ని రాజ్యమే పీక్కు తింటావుందని గుస గుసలాడే వాసనొస్తావుంది!!
   సొతంతరం ఒచ్చిన పది పదకొండేండ్లకి, మా ఊరి పొలాలకి కరెంటొచ్చె!! అంతకు ముందు నీళ్లు తోడే కపిల బాన్లు, డీజలింజన్లని మూల కేసిరి. బాయిల దగ్గర రూములు కట్టించి కరెంటు మోటార్లు బిగిచ్చిరి.
    అయిదారు జతల ఎద్దులు,బీముని మాదిరీ వుండే మూడు జతల మగ మనిషులు పేగులు తెగి పొయ్యేతట్లు, పేడలో పులుగుమాదిరీ రాతిరీ పగలూ యంపిర్లాడినా రెండు కొడతల్ని నీళ్లు తడిపేకి అయితా వుండ్లేదు!! అట్లాది కరెంటు మోట్రు సుచ్చిని”టప్” న ఒత్తితే సాలు “జరో” అని ఇనుప్పైపుల్నిండా నీళ్లు పాతాళం నుండి ఎగజిమ్ముకోని ఒస్తావుండె.
    రైతుల ఆనందాన్ని కొల్సేకి మాటలు సాలవు. సాగు సేసే బూమిని పెంచి పారేసిరి. వేలాంతరం సన్న జీవాలు(గొర్రెలు,మేకలు),నూరారు ఊరి జీవాలు మేతకని ఇడిసిన బీడు బూములన్నీ మాయ మాయ.ఎద్దులకి పని తగ్గి పాయ. మనుషుల కష్టం తీరి పాయ.
    ఆడ మొదలాయనన్నా! అడవుల్ని అంతం సేసే ఆది కాలం!
    ఆడ మొదలాయనన్నా! పశువుల్ని కబేళా కెత్తే  కొత్త కాలం!
    ఆడ మొదలాయనన్నా! పని లేని జనాలు పట్నానికి తిరిగే కాలం!
    ఆడ మొదలాయనన్నా! ఓటలు తిండికి సినిమా బొమ్మలకి అలవాటు పడే  కాలం!
    ఆడ మొదలాయనన్నా! అప్పులు సేసి ఆస్తులమ్మే అద్దువాన్న కాలం!
    ఆడ మొదలాయనన్నా! ఆడబిడ్డల్తో కట్నం వొసూలు సేసే దుడ్ల కాలం!
    ఇంతకి ముందు పెడతా ఉండే ఆరుతడి పంట్లు రాగులు,జొన్నలు,సజ్జలు,కొర్రలు ఇడిసి పెట్టి సెరకు తోట్లు,మిరప సెట్లు,వొరి పైర్లు యేయ బట్రి.
   బూ మండలం తయారయ్యి యన్ని  యేల కోట్ల యేండ్లయ్యిందో !!??  ఆ పొద్దుట్నుంచి ఆ యమ్మ ఒంటి పొరల నిండా గంగమ్మ తల్లిని గుట్టుగా దాసుకో నుండె!! వానలు అయిదారేండ్లు పడకున్నా పై పైన మాత్రమే యండ పీరుపుకి బూని ఎండుకు పోతా వుండె. అట్లాది బాయిలకి బిగించిన కరెంటు పైపులు ఏనుగు తొండాల మాదిరీ నీళ్లని పీల్సి పారేశె. ఆకలి గొన్న పిల్లోడు పాల బుడ్డీని సిబికి సుక్కడు గూడా మిగలకుండా ఉత్తది సేసి నట్ల బూమితల్లిని నున్నగ పీల్సి పారేసిరి.
   దిక్కు లేనంత పంటలు పండిచ్చేది మొదలు పెట్రి. యంత జేసినా, ఇచ్చిన అప్పులకి ఒడ్డీలని, దళ్లాలని, రేట్లు పడిపొయ్యిండివని ఇందూపురం లోని యాపారస్తులు బతికి బాగు పడ్రేగాని రైతులకి కడాకి మిగిలింది అప్పులూ నొప్పులు  మత్రమే!!
   ఇదే కాలంలో అరవ దేశం కోయంబత్తూరు నుంచి యల్.జి.బాలక్రిష్ట్న అనే ఆయప్ప ఒచ్చె. మా ఊరికి మూడు నాలుగు మైళ్లదూరంలో నూరారెకరాల దిన్న (మెట్ట) బూమిని సూసు పాయ.
    ఉలవలు గూడా పండెల్లేదని ఇడిసిపెట్టిన బీడు బూములవి.గొర్రి మందలు, ఊరిజీవాలూ మేస్తావున్న పనికి రాని జమీన్లు. వాట్నంతా యకరా ఇరవై ముప్పై రూపాయలకే అరవాయప్ప కొనేసె. నూలు మిల్లు కట్టేది మొదలు పెట్టె.
   అపుడు రైతుల దగ్గర పని సేసేకి రెండణాలు(12 పైసాలు).కోయంబత్తూరాయప్ప పావలా( 25 పైసలు) ఇయ్య బట్టె. సుట్టూ పక్కల జనాలంతా మిల్లు కూలికే పోబట్రి.
   మిల్లు కట్టేకి ఇటికలు కావాల్సొచ్చె. ఏటి గట్టు రైతులు కొంద్రు సేద్యాలిడిసి ఒండు మన్నుతో ఇటిక బట్టీలు మొదలు పెట్రి. ఇటిక కాల్సేకి కట్టి కావల్ల గదా!! పెన్నమ్మ నది గట్లో నందన వనాల మాదిరీ వుండే కానుగ తోపుల్నంతా నున్నగా  నరికి పారేసిరి.
  గలగలా అని పార్తావుండే నీళ్లతో, పచ్చ పచ్చగా ఊగుతా వుండే అడవుల్తో నిండు ముత్తయిదువు మాదిరీ కళ కళా మెరుస్తావుండే పెన్నమ్మ— మొగుడు సస్తే తలకాయి కొరిగిచ్చుకోని కదలకుండా  మెదలకుండా మూల్లో కూలబడ్న ముండ మోపయిపాయ!!

నా మొదటి “సంఘ ప్రవేశం”

chitten raju

 

1961 సంవత్సరం..అంటే నేను ప్రీ యూనివర్సిటీ పరీక్ష పాస్ అయ్యాక మా అన్నయ్యలు ముగ్గురూ వ్యవసాయం, లాయరు, డాక్టరు వృత్తులు పంచుకున్నారు కాబట్టి నేను సహజంగానే ఇంజనీరింగ్ చదవాలని నిశ్చయం అయిపోయింది. అప్పుడే నా జీవితంలో మొదటి సారి “కులం దెబ్బ” కొట్టింది.  అంటే కేవలం అగ్ర కులం వాణ్ణి కాబట్టి తిన్న ఏకైక దెబ్బ. కానీ తంతే బూరెల గంపలో పడ్డట్టు దాని వలన నా మొట్టమొదటి  “సంఘ ప్రవేశం” కూడా జరిగింది. అంటే, అమ్మా, నాన్న గారూ, అన్నదమ్ములూ, అప్ప చెల్లెళ్ళల్ల పెరుగుతున్న ఆత్మీయ వాతావరణం నుంచి ఎవరూ తెలియని, సంబంధం లేని వ్యక్తుల మధ్య సంఘంలో ఒక్కడిగా జీవించడం, మన సమస్యలూ, ఆనందాలూ మనమే కొనితెచ్చుకోవడం, ఢక్కా మొక్కీలు తినడం, గాలి లో మేడలు కట్టుకోవడం వగైరా మొదలయిందన్న మాట.  

ఆ రోజుల్లో మన ప్రాంతాలలో విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం లో మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. అప్పటికే పరిపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి రాజధాని అయిన హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా స్థానిక ముల్కీ నిబంధనలు వగైరాలపై అవగాహన లేకా, ఇంకా మద్రాసుతోటే మానసికంగా ముడిపడి ఉండబట్టీ మహా అయితే అక్కడి గిండీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన ప్రాంతపు కాలేజ్ క్రిందనే లెక్క లోకి వచ్చేది. ఇక మద్రాసు, ఖరగ్ పూర్ ఐ.ఐ.టి. లు, బెంగళూరు ఐ.ఐ.ఎస్.సి. పేర్లు తల్చుకుని “అయ్యా బాబోయ్” అని భయపడడమే కానీ ఎంట్రెన్స్ పరీక్షల తతంగం మీద బొత్తిగా అవగాహన లేదు. అన్నింటికన్నా ముఖ్యం అయినది “మన కాకినాడలోనే ఇంజనీరింగ్ కాలేజ్ ఉండగా, అవన్నీ మనకెందుకూ, డబ్బు దండగ” అనేదే అందరి ఆలోచన..నాతో సహా. ఈ రోజుల్లోనూ, ఆ రోజుల్లోనూ కొందరి లాగా “ఇంట్లోంచి ఎప్పుడు బైట పడిపోదామా” అని ఎప్పుడూ అనుకో లేదు.  పైగా నేను పియుసి లో మా క్లాస్ ఫస్ట్, కాలేజ్ సెకండ్ రేంకు కాబట్టి సీటు రావడం గేరంటీ. ఆ రోజుల్లో ఆ రెండూ గవర్నమెంట్ కాలేజీలు కాబట్టి కాకినాడకీ, అనంత పురానికీ ఒకటే అప్లికేషన్ ఉన్నా, ఇక్కడి వారికి అక్కడ సీటు ఇచ్చే వారు కాదు. అయితే వైజాగ్ లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కి వేరే అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను కాకినాడ కాలేజ్ కి అప్లికేషన్ పెట్టాక, కేవలం ఎందుకైనా మంచిదని విశాఖపట్నం లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కి కూడా దరఖాస్తు పంపించాను ఆఖరి క్షణంలో. “ఎందుకు రా, వెధవ అప్లికేషన్ ఫీజు పది రూపాయలు దండగా. చేరేది ఎలాగా కాకినాడ లోనేగా” అన్నారు మా నాన్న గారు.

AU Logo

అదిగో, అక్కడే నన్ను “అగ్ర కులం దెబ్బ” కొట్టింది. కాకినాడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో  కులాల వారీ రిజర్వేషన్ పద్దతిలో నాకంటే అతి తక్కువ మార్కుల వచ్చిన వారికి సీటు వచ్చింది కానీ , మా అగ్ర కులం వారి అతి తక్కువ కోటా అర్జంటుగా దాటి పోయి నాకు కాకినాడలో సీటు రాలేదు.  కాకినాడ వాడిని కాబట్టి ఏదో వల్లకాడు రూలు ప్రకారం అనంతపురంలో నాకు సీటు ఇవ్వకూడదుట. నా అగ్ర కుల “ప్రభావం” నా జన్మలో మొదటి సారిగా, ఆ మాటకొస్తే ఆఖరి సారిగా నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. దానికీ, దేనికీ నిజమైన పోలిక ఎక్కడా లేదు కానీ ఆ తరువాత మళ్ళీ పదిహేనేళ్ళకి అమెరికాలో అడుగుపెట్టాక మాత్రమే అధికారికంగా ఏ విధమైన “రిజర్వేషన్లూ” లేకపోయినా అనధికారికంగా అమెరికా తెలుగు “సాంస్కృతిక” సంఘాలు ఏకకుల ప్రాధాన్యతని పాటిస్తూ కుల వ్యవస్థని నిరాటంకంగా అమలు పరిచే స్థాయికి “ఎదగడం” నేను గమనించాను. కానీ ఇక్కడ అనేక రాజకీయ, వ్యాపార తదితర కారణాలకి స్వకుల పక్షపాతం పాలు ఎక్కువే కానీ అన్య కుల వివక్ష దానికి కారణం అనుకోను. 

కాకినాడ పి.ఆర్. కాలేజ్ మొదటి రేంక్ విద్యార్థి అయిన నాకు అక్కడే ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు రాకపోవడంతో మా కుటుంబం షాక్ కి గురి అయ్యారు. ఇక మిగిలినదల్లా నేను యాదాలాపంగా పెట్టిన ఆంధ్రా యూనివర్సిటీ అప్లికేషన్. అదృష్టవశాత్తూ అక్కడ నుంచి ఇంటర్ వ్యూకి పిలుపు రాగానే ఊపిరి పీల్చుకుని వెంటనే అక్కడికి అన్నీ సద్దుకుని పరిగెట్టాను. నిజానికి అది ఇంటర్ వ్యూ కాదు, ఏకంగా ఎడ్మిషనే అని అక్కడికి వెళ్ళాక కానీ తెలియ లేదు. కాకినాడ లో సీటు రాక పోడానికీ, వైజాగ్ రావడానికీ కారణం నాకు ఇంగ్లీషులో మంచి మార్కులు రావడమే అని ఆ ఇంటర్ వ్యూలో అప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేసినది కృష్ణమాచార్యులు అనే ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారు. నా పూర్తి పేరు చూడగానే “నియాగప్పిండానివా? మరి మార్కులు బాగానే ఉన్నాయి కదా, కాకినాడలో సీటు ఎందుకు రాలేదూ?” అని అడిగారు. నేను ఆ మూడు ప్రశ్నలకీ ఏం చెప్పాలో తెలియక వెర్రి మొహం పెడితే ఆయన పక్కన ఉన్న మరో ప్రొఫెసర్ గారు “కాకినాడ లో మేథమేటిక్స్,  ఫిజిక్స్, లాజిక్ మార్కులు కలిపి చూస్తే మనం ఎందుకైనా మంచిది అని ఇంగ్లీషు కూడా కలిపి చూస్తాం. పైగా అక్కడ కోటా సిస్టం కదా. మనదేమో మెరిట్ సిస్టం” అని సగర్వంగా చెప్పి నా బదులు ఆయనే సమాధానాలు చెప్పాడు. “సరే అయితే వీడికి 5 th బ్లాక్ లో రూమ్ ఇద్దాం.” అని “ ఏరా, డబ్బు తెచ్చావా? ఆ ఆఫీసులో కట్టేసి, చలానా తీసుకుని హాస్టల్ లో చేరిపో” అని ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్ లో 5th బ్లాక్ లో గది ఇచ్చారు. మొదట్లో గదులు లేక ఐదో అంతస్తులో కామన్ హాల్ లో పది మంది తో కొన్నాళ్ళు ఉన్నా ఆ తరువాత 84 నెంబరు గది కేటాయించారు. ఆ కామన్ హాల్ లో నా రూమ్ మేట్ గుంటూరు శర్మ అనే ఆయన ఇప్పుడు డాలస్ లో ఉంటారు అని తెలుసు కానీ ఎప్పుడూ కలుసుకునే అవకాశం రాలేదు. ఈ మధ్య నేను పని కట్టుకుని నా గది చూసుకుందామని ఆ 5th బ్లాక్ కి వెళ్లితే గుమ్మం దగ్గర జవాను నన్ను లోపలికి వెళ్ళనియ్య లేదు. ఎందుకంటే అది ఇప్పుడు ఆడపిల్లల హాస్టల్  గా మార్చేశారుట. ఈ నాటి ఆ 5th బ్లాక్ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను..ఇప్పటి ఆడ పిల్లలతో సహా!

AU Eng Block 5

అన్నట్టు ఆడ పిల్లలు అంటే నాకు ఖచ్చితంగా గుర్తుకు వచ్చేది ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కేంపస్ మొత్తంలో భూతద్దంతో వెతికి చూసినా ఆడ “వాసన” వేసేది కాదు…అప్పుడప్పుడు అప్పటికింకా బిల్డింగులు కడుతున్న ఆడ కూలీలు తప్ప. అందులో కాస్త పడుచు వాళ్ళని “కంచు లా ఉంది గురూ” అని విద్యార్థులు వ్యవహరించే వారు. కానీ, ఏమన్నా పిచ్చి , పిచ్చి వేషాలు వేస్తే ఆ కడుతున్న బిల్డింగ్ సిమెంట్ లో కలిపి పాతరేసేస్తారేమో అని హడిలి చచ్చిపోతూనే ఉండే వారు స్ట్యూడెంట్స్ అంతా. పగలు క్లాసులు అయిపోయాక పొలో మని ఎక్కడో సౌత్ కేంపస్ లో ఉన్న ఔట్ గేట్ దగ్గర “విద్యారమా” హోటల్ కో, లైబ్రరీ వేపుకో,  ఖచ్చితంగా “లవర్స్ కార్నర్” దగ్గర బస్సులు ఎక్కే అమ్మాయిలని చూడడానికో పరిగెత్తే వారు. అంత అవస్త పడినా ఆ రోజుల్లో మొత్తం యూనివర్సిటీ లో అమ్మాయిల సంఖ్య తక్కువే. నాకు ఇంకా జ్జాపకం ఉన్న బ్యూటీ క్వీన్స్ శైలజ, ఛాయా జానకి,  ప్రొఫెసర్ ముత్తురామన్ గారి అమ్మాయి (పేరు గుర్తు లేదు). అప్పుడు నాకు తెలియదు కానీ, వీళ్ళలో ఛాయా జానకి  సుప్రసిద్ద సాహిత్య వేత్త అబ్బూరి రామకృష్ణా రావు గారి అమ్మాయి, అంటే అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి చెల్లెలు. గత ముఫై ఏళ్లగా మా హ్యూస్టన్ లోనే భర్త తిమ్మరాజు శివరాం తో నివసిస్తోంది. నాకు వాళ్లిద్దరూ, అమ్మాయి రుక్మిణి ఎంతో ఆత్మీయులు.

నాతో పాటు కాకినాడ నుంచి నా క్లాస్ మేట్స్ పేరి శాస్త్రి, లక్ష్మీ నారాయణ కూడా వైజాగ్ లోనే చేరారు. అక్కడ స్నేహితులైన వారిలో నాకు బాగా దగ్గర అయిన వారు నారాయణ మూర్తి, పోతయ్య మాత్రమే గుర్తున్నారు. అందులో నారాయణ మూర్తి అక్కడే లెక్చరర్ గా చేరి అకాల మరణం పొందాడని విన్నాను. మరొక క్లాస్ మేట్ డి. సీతారామయ్య 55 సంవత్సరాల తరువాత ఈ మధ్యనే మళ్ళీ ఇంటర్ నెట్ లో నన్ను గుర్తు పట్టి, పలకరించి మా పి.ఆర్. జూనియర్ కాలేజ్ భవన పునర్నిర్మాణానికి మూడు లక్షల రూపాయల విరాళం ఇచ్చాడు.  ఎంత సంతోషం వేస్తుందో ఆ సహృదయత తల్చుకున్నప్పుడల్లా.

సధర్మ సదన

ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో అడుగు పెట్టగానే కాకినాడ లాంటి “చదును” నేల నుంచి వచ్చిన నన్ను ప్రధానంగా ఆకర్షించినది ఎర్ర మట్టి కొండల మధ్య భవనాలు, “సధర్మ సదన”, “వివేక వర్ధని” లాంటి అధ్బుతమైన ఆ భవనాల పేర్లు. అప్పుడు వైస్ చాన్సెలర్ గారు ఎ.ఎల్. నారాయణ గారు. ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి ప్రిన్సిపాల్ గారు దేవగుప్తాపు సీతాపతి రావు గారు. ఈయన టంగుటూరి సూర్య కుమారి కి దగ్గర బంధువులు. మా చిన్నన్నయ్యకి ఆ కుటుంబంతో మద్రాసులో చాలా  సాన్నిహిత్యం. అందు చేత నేను ముందు వైజాగ్ లో చేరినా సిలబస్, డిగ్రీ ఇచ్చేదీ ఆంధ్రా యూనివర్సిటీయే కాబట్టి  నన్ను కాకినాడ కి ట్రాన్స్ఫర్ చెయ్య మని మా చిన్నన్నయ్య వైజాగ్ వచ్చి ఆయన్ని అడిగాడు. ఆ రోజు నాకు ఇంకా జ్జాపకం. అసలే నూనూగు మీసాల వాడిని. జీవితంలో మొదటి సారిగా స్వంత ఊరు వదలి పెట్టి హాస్టల్ లో చేరి గట్టిగా వారం దాట లేదు. క్లాసులింకా మొదలెట్ట లేదు. అందులోనూ ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే భయం. ఒక పక్క సీనియర్స్ రాగింగ్. మరొక పక్క ప్రిన్సిపాల్ గారు అంటే దడ దడ. మద్రాసు రోజుల్లో బాగా తెలుసు కాబట్టి మా చిన్నన్నయ్యని ఆయన రాత్రి డిన్నర్ కి పిలిచారు.  నన్ను కూడా తీసుకెళ్ళి మా అన్నయ్య “మా రాజా మీ కాలేజ్ లో చేరాడు. వాణ్ణి కాకినాడ కి ట్రాన్స్ ఫర్ చెయ్య డానికి ఏం చెయ్యాలి?” అని అడిగాడు. దానికి ఆయన “కనీసం ఒక ఏడాది అయినా ఇక్కడ చదివితే కానీ కుదరదు. అది రూలు. వచ్చే ఏడు చూద్దాం. “ అనగానే వాళ్ళిద్దరూ నన్ను మర్చి పోయి వాళ్ళ కబుర్లలో పడిపోయారు. నేను చెమట్లు కక్కుకుంటూ కాలం గడిపేసి ఏడాది ఉండడానికి మానసికంగా తయారు అయిపోయాను.

సరిగ్గా నాలాటి కేసే మా వై.ఎస్.ఎన్. మూర్తి అనే కాకినాడ కుర్రాడిది. అయితే అతను బి.ఎస్.సి.కూడా పి.ఆర్. కాలేజ్ లోనే చదివాడు. కాకినాడ లో అప్పటికి అతను నాకు పరిచయం లేక పోయినా ఆ నాడు ఇద్దరం వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో క్లాస్ మేట్స్ గా పరిచయం అయి, ఏడాది తరువాత ఒకే సారి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ కి మరి పోయి, ఆ స్నేహం అంచెలంచెలు గా పెంచుకుంటూ, ఇప్పటికీ చాలా పనులు కలిసి చేస్తూ జీవిత కాల స్నేహం కొనసాగిస్తున్నాం. ఆతని స్నేహానికి, సహృదయానికీ, భార్య విజయ ఆత్మీయతకి విలువ కట్టడం నా వల్ల కాదు. కొడుకు లిద్దరూ అమెరికాలోనే ఉండడంతో దంపతులిద్దరూ అమెరికా వస్తూ, పోతూ ఉంటారు.

నేను ఆంద్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరినప్పుడు అది ఒక విధంగా సంధి కాలంలోనే ఉంది అని చెప్పాలి. అప్పటికి ఒక్క కెమికల్ టెక్నాలజీ బిల్డింగ్ ఒక్కటే పూర్తి అయింది. మిగిలిన వన్నీ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. హాస్టల్స్ అన్నీ మటుకు ముందే కట్టారు. యూనివర్సిటీ బస్సులు కాక వైజాగ్ ఊళ్ళో కి వెళ్ళడానికీ, అక్కడి నుంచి రాడానికీ ఒకే ఒక్క బస్…..అదే ప్రపంచ ప్రసిద్ది చెందిన నెంబర్ 10. ఈ బస్సులో ప్రేమాయణాల మీద చాలా కథలే వచ్చాయి. ఈ బస్సు మైన్ కేంపస్ ..అంటే సౌత్ కేంపస్ మీద నుంచి పెద వాల్తేరు లార్సన్ బే వేపు వెళ్ళేది.  ఇంజనీరింగ్ కేంపస్ వాళ్ళంతా ఊళ్ళో కి వెళ్ళాలంటే చచ్చినట్టు ఎర్ర మట్టి లో గంట సేపు నడుచుకుంటూ అక్కడ బస్సు ఎక్కాల్సిందే. నార్త్ కేంపస్ వేపు డైరీ ఫార్మ్ రోడ్ మీద ఒకే ఒక బస్సు ఉండేది. ఇక రెండు కేంపస్ ల కీ మధ్య రోడ్ దిగువ పిచ్చాసు పత్రి ఉండేది. అక్కడికి బస్సులు లేవు. ఉన్న ఏ బస్సూ కూడా రాత్రి 9 దాకానే.  ఎప్పుడైనా ఎల్లమ్మ తోట దగ్గర సినిమాకి వెళ్తే రాత్రి గవర్నర్ బంగాళా మీదుగా నడిచి వెనక్కి రావలసినదే….అవును…ఆ రోజుల్లో జగదాంబా సెంటర్ లేదు. ఈ రోజుల్లో ఎల్లమ్మ తోట లేదు. దేశం పురోగమించింది.

వైజాగ్ లో నా కేవలం ఏడాది చదువు ప్రహసనంలో ప్రధాన ఘట్టాలు  చాలానే ఉన్నాయి. విశేషం ఏమిటంటే అవన్నీ నా “సంఘ ప్రవేశానికి” సంబంధించినవే కానీ అసలు చదువు కి సంబంధించినవి కాదు. ఆ మాటకొస్తే సాహిత్య ప్రవేశానికి కూడా సంబంధించినవి కూడా కాకపోయినా ఖచ్చితంగా నాటకాలు, తెలుగు సంస్కృతి పట్ల నాకు మరింత అవగాహన కలిగించినవే. విద్యార్థి సంఘాల లో చేరకపోయినా పెద్ద సమ్మెలలో చురుగ్గా పాల్గొనడం కూడా నా జీవితంలో అదే మొదలు. అదే ఆఖరు.

ఈ వివరాలు వచ్చే సంచికలో…..

 

ఇది బంగారం కాదు, కాకి బంగారం!

వినోద్ అనంతోజు 

 

       vinod anantoju   ఒక ఫిల్మ్ మేకర్ గా నాకు మణిరత్నం మీద ఆయన సినిమాల మీద ఎంతో గౌరవం ఉంది. “నాయకుడు”, “రోజా”, “బొంబాయి” లాంటి సినిమాలు లెక్క లేనన్ని సార్లు చూసి, వాటిలోని ప్రతి చిన్న అంశాన్ని స్టడీ చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఆయనవి ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులని నిరాశ పరిచినప్పటికీ, నాకు మాత్రం అవన్నీ గొప్పగానే అనిపించాయి. చాలా కాలం తరవాత ఒక “ప్రేమకథా” చిత్రం (ఓకే బంగారం) తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ సినిమా మంచి ఆదరణ పొందడం, అందరూ “Maniratnam is Back” అని అంటూ ఉండడం చూసి చాలా సంతోషం కలిగింది. తీరా సినిమా చూశాక ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది. మణిరత్నం కి ఏమయ్యింది అసలూ?

సినిమా గురించి మాట్లాడుకునేముందు దాని కథ క్లుప్తంగా చూద్దాం. ఆది, తారా వయసులో ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి మీద నమ్మకం లేదు. ఒకసారి ఒక రైల్వే స్టేషన్ లో ఒకరినొకరు యాదృచ్చికంగా చూస్తారు. అదే మొదటి సారి చూడటం. ఆది గణపతి వాళ్లింట్లో పేయింగ్ గెస్ట్ గా దిగుతాడు. గణపతి భార్యకి ఆల్జీమర్స్ వ్యాధి ఉంటుంది. గణపతి ఆవిడని చాలా ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ళకి ఆది వాళ్ళ స్నేహితురాలి పెళ్లిలో తారా తారసపడుతుంది. పేర్లు తెలుసుకుంటారు, ఫోన్ నంబర్లు మార్చుకుంటారు. రెండు రోజుల తర్వాత ఇద్దరు కలిసి డేట్ కి వెళ్తారు. మూడో రోజు తారా ఏదో పని మీద అహ్మదాబాద్ వెళ్తుంటే ఆది కూడా వెళ్తాడు. నాలుగోరోజు రాత్రి ట్రైన్ మిస్ అవ్వడంతో ఒక రాత్రి ఒకే గదిలో ఇద్దరూ ఉండాల్సి వస్తుంది. తమని తాము నిగ్రహించుకోగలమో లేదో అని ఇద్దరికీ అనుమానమే. ఎలాగో ఆ రాత్రి ఒక పాట, పాట మధ్యలో కొన్ని కౌగిలింతలు, కొన్ని ముద్దులతో సరిపెడతారు.

తరవాత ఒకరోజుకో రెండ్రోజులకో ఆది “దుశ్శాసనుడిలా మారి తారా బట్టలు చింపేస్తా” అనడం, దానికి ఆ పిల్ల మురిసిపోవడం, తారా హాస్టల్ లోనే వాళ్ళిద్దరూ శారీరిక సంబంధం పెట్టుకోవడం జరిగిపోతాయి. అప్పటికి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు, కలిసి జీవించాలని కోరిక కూడా లేదు. కామ వాంఛ తప్ప. 6 నెలల తరవాత ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వేరే వేరే దేశాలు వెళ్లిపోవాలి. ఈ 6 నెలలు కలిసి గడుపుదాం (live–in) అని ఒప్పందానికి వస్తారు. ఓనర్ (గణపతి) ని ఒప్పించి ఆది ఉండే ఇంట్లోనే ఇద్దరూ ఉండటం మొదలు పెడతారు

ఇక ఇక్కడి నుంచి ఒక ఆరు నెలల పాటు వాళ్ళ “శారీరిక సహజీవనం” సుఖంగానే సాగుతుంది. విడిపోవడానికి ఇంకా పదిరోజులే ఉందనగా బాధలాంటిదేదో కలుగుతుంది. దాన్ని అధిగమించడానికి ఇంకా బలంగా “ఎంజాయ్” చేద్దాం అని డిసైడ్ అవుతారు. కాని ఆ పదిరోజులు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతుంటారు. గణపతి జబ్బుతో ఉన్న తన భార్య పట్ల చూపించే ప్రేమని ఆది తారాలు గమనిస్తూ ఉంటారు. చివరికి ఒక రోజు గణపతి భార్య కనపడకుండా పోతుంది. ఆవిడని వెతికే సమయంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అని గ్రహిస్తారు. ఆది తారాని పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు. తారా ఒప్పుకుంటుంది. పెళ్లి చేసుకుంటారు. ఇదీ కథ.

ఈ సినిమా చూసిన చాలా మంది అద్భుతం, మహాద్భుతం అని పొగడడం, కొత్త తరం ప్రేమలను/పెళ్లి సంబంధాలను మణిరత్నం redefine చేశాడని జేజేలు కొట్టడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. బహుశా చూసిన వాళ్ళు సంగీతానికి, సినిమాటోగ్రఫి ప్రతిభకి, నటీనటుల అందానికి ముగ్ధులయ్యుంటారు. ఇలాంటి ఎన్ని హంగులున్నా కథలోని లోపాలు ఎక్కడికి పోతాయి.

అసలు “ప్రేమ కథ” అని ఏ సినిమాని పిలుస్తారు? సినిమాలో ఎక్కడో ఒక చోట “I Love You” అనే పదం ఉంటే అది ప్రేమ కథ అయిపోతుందా? వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయిల కథ అయితే అది ప్రేమ కథ అయిపోతుందా? ఈ సినిమాలో రెండు ముఖ్య పాత్రల్లో ప్రేమ కంటే సెక్సు సంబంధం పెట్టుకోవాలనే వెంపర్లాటే ఎక్కువ కనపడుతుంది.

ఎన్ని అదనపు విషయాలున్నా ఈ సినిమా అంతా పెళ్లి అనే సంబంధం గురించీ, ఆడామగా కలిసుండాలంటే పెళ్లి అవసరమా అనే ప్రశ్న గురించీ ఎక్కువ చర్చిస్తుంది.

సినిమా మొదట్లోనే ఆది, తారాలు ఇద్దరూ పెళ్లి మీద అపనమ్మకం వ్యక్తం చేస్తారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, సినిమాలో ఏ పాత్రమయినా దర్శకుడి ఆలోచనలకి అనుగుణంగా, అతను నిరూపించదలుచుకున్న విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బలపరిచే విధంగానే ప్రవర్తిస్తాయి. ఆది, తారాలు పెళ్లిని వ్యతిరేకించడం కూడా అందుకే. దర్శకుడు పెళ్లి అవసరం లేదని నిరూపించడానికి వాళ్ళ చేత అలా చెప్పించి ఉండొచ్చు. లేదా వాళ్ళిద్దరి ఆలోచనలు తప్పు అని కథలో నిరూపించి పెళ్లిని బలపరచవచ్చు. ఏ పాత్ర ఏ రకం భావాలని వ్యక్తం చేసినా దర్శకుడు వాటిలో ఏ భావాలని సమర్థించాడు అనేదే ముఖ్యం.

పెళ్లిని వ్యతిరేకించిన ముఖ్య పాత్రలు, పెళ్ళి విధానానికి alternative గా ఏ విధానాన్ని ప్రతిపాదిస్తున్నాయి? కంటికి అందంగా కనిపించిన అమ్మాయిలతో అబ్బాయిలు, అబ్బాయిలతో అమ్మాయిలూ “ఇష్టపూర్వకంగా” తాత్కాలిక సెక్సు సంబంధాలు పెట్టుకోవడమే వీళ్ళ ప్రతిపాదన. ఇది సహజీవనం కాదు. ఇందులో ఎదుటి వ్యక్తి భావాలతో, అభిప్రాయాలతో, వ్యక్తిత్వంతో సంబంధం లేదు. కేవలం శరీరంతోనే సంబంధం. ప్రేమకసలు స్థానమే లేదు. ఆకర్షణ ఉంటే చాలు. ఎవరు ఎవరితోనైనా ఆకర్షణ ఉన్నన్ని రోజులో, లేక వేరే ఊర్లో పని పడేదాకో కలిసి పడుకోవచ్చు. ఆ తరవాత వేరే ఊరు వెళ్ళాక అక్కడ ఇంకొకరితోనో లేక అనేకమందితోనో సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇదే మనకి వాళ్ళు ప్రతిపాదిస్తున్న “శారీరిక సహజీవనాల” పధ్ధతి. దీనినే చాలా మంది ప్రేక్షకులు, విశ్లేషకులు “New-Age Relationships” కి ఈ సినిమా పునాది వేస్తోంది అని, పాత సంప్రదాయాలని బద్దలు కొడుతోందనీ అంటున్నారు.

                మొదట ఆలోచించవలసిన విషయం – పెళ్లి ఎందుకు? పెళ్ళిలో జరిగేది ఏమిటి? ఒకటి – అప్పటి దాక విడి విడి గా జీవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ క్షణం నుంచి కలిసి ఒక కుటుంబంగా జీవించడం మొదలవుతుంది. రెండు – వాళ్ళిద్దరూ ఒక కుటుంబంగా అయ్యారు అని చేసే సాంఘిక ప్రకటన. పెళ్లి ఐదు రోజులు జరిగినా, ఒక గంటే జరిగినా దాని సారాంశంలో ఏ తేడా ఉండదు. అది ఏ మత ఆచారం ప్రకారం జరిగినదీ, లేక ఏ ఆచారమూ లేకుండా జరిగినదా అనేది అప్రధానం. ఆ ఇద్దరూ వ్యక్తులూ ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా ఎంచుకుని కలిసి ఉండడమే ప్రధానమైన విషయం. వాళ్ళిద్దరూ పెళ్లి అనే కార్యక్రమం లేకపోయినా, కలిసి జీవిస్తూ, కష్టసుఖాల్లో బాధ్యతల్లో భాగం పంచుకుంటూ ఉంటే అది పెళ్ళే. పెళ్లి అనే పదం “కలిసి ఉండటం అనే సాంఘిక సంబంధం” మొత్తాన్నీ వివరిస్తుంది. ప్రస్తుతం అమలు లో ఉన్న “పెళ్లి” వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. అది ఆడా మగల మధ్య అసమానతలు పెంచేదిగా ఉంది. పైగా వ్యక్తుల ఇష్టాయిష్టాల కంటే డబ్బు, ఆస్తి, కులం, మతాలే “పెళ్లి”లో ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయి. నిజమే. ఈ కారణాల చేత పెళ్లిని వ్యతిరేకించవచ్చు. కాని ఆ వాదం ఈ సినిమాకి పొసగదు. ఎందుకంటే ఈ సినిమాలో ఆ లోపాలలో ఒక్కదాన్ని కూడా ముట్టుకోవడం జరగలేదు.

పైన చెప్పిన దాంట్లో, పెళ్లి అనే కార్యక్రమం లేకుండా కలిసి ఉండటం అంటే ఓకే బంగారం సినిమాలో చెప్పిన “శారీరిక సహజీవనం” అని అనుకోకూడదు. ఒక ఆడ మగా ఎటువంటి ప్రలొభాలూ (ఆస్తి, కులం, మతం…) లేకుండా, పూర్తి వివేచనతో, ఇష్టపూర్వకంగా ఒకరినొకరు జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం, వారితోనే కలిసి ఉండటం సరైన సంబంధం అవుతుంది. ఒకసారి ఎంచుకున్నాక కొంతకాలానికి ఎదుటి వ్యక్తి కలిసి ఉండటానికి వీలుపడనంతలా మారిపోతే, ఇబ్బంది కలిగిస్తుంటే ఆ వ్యక్తి నుంచి విడిపోయే హక్కు మొదటి వ్యక్తి కి ఎప్పుడూ ఉంటుంది. అంటే దీని అర్థం, తరవాత విడిపోయే స్వేచ్ఛ ఉంది కదా అని ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా సంబంధం పెట్టుకోవడం కాదు. అది తిరుగుబోతుతనం అవుతుంది. ఓకే బంగారంలో ఆది తారాలు సరిగ్గా ఇదే రకానికి చెందుతారు.

ఇందులో వాళ్ళిద్దరూ ఆరు నెలలలో వేరే దేశాలకు వెళ్లిపోతారని తెలిసే ఈ ఆరు నెలలు తాత్కాలికంగా ఒకరితో ఒకరు పడుకుని సహజీవనం చేద్దాం అని నిర్ణయించుకుంటారు. మణిరత్నం మీద ఎంత మంచి దృష్టితో చూసినా ఈ సహజీవనంలో ప్రేమ ఎలా కనపడుతుంది?

bangar1

అసలు ఇంతకీ మణిరత్నం దేన్ని సమర్థించాడు.? కొందరు మణిరత్నం పెళ్లిని వ్యతిరేకించాడు అనీ, కొందరు పెళ్లినే సమర్థించాడు అనీ, ఇంకొందరు ‘సమర్థించలేదు వ్యతిరేకించలేదు. కేవలం ప్రస్తుత యువత పరిస్థితి ని ఉన్నది ఉన్నట్టు చూపించాడని’ అర్థాలు చెప్తున్నారు.

కేవలం ఉన్నది ఉన్నట్టు చూపించాడు అనేది అవాస్తవం. సినిమా నిడివిలో నూటికి ఎనభై శాతం ఆ ఇద్దరి కామ కలాపాలనీ, చిలిపి సంభాషణలనీ అందమైన కెమెరా యాంగిల్స్ తో, ఆకర్షణీయమైన సంగీతంతో ఆకాశానికి ఎత్తి చూపించాడు. ఆది తారాల మీద ప్రేక్షకులకి సదభిప్రాయం కలిగించే ప్రయత్నమే ఇది. ఇది సమర్థించడమే.

విచ్చలవిడి ప్రేమలని వ్యతిరేకించాడు, పెళ్లినే సమర్థించాడు అనడం కూడా సరైనది కాదు. ఎందుకంటే డైరెక్టర్ ఖచ్చితంగా ఆది, తారాల పక్షమే నిలబడ్డాడు కాబట్టి. వాళ్ళిద్దరి మధ్య జరిగే రొమాన్స్ ని చూపించడం లో ప్రదర్శించిన ఉత్సాహం వాళ్ళ ఆలోచనలని తప్పైనవి గా చూపించడం లో ప్రదర్శించలేదు. పైగా ఆది తారాలకి ఇబ్బంది కలిగే ఒక్క సన్నివేశం కూడా కథలో రాకుండా జాగ్రత్త పడ్డాడు.

“మేమిద్దరం మీ ఇంట్లో ఒకే గదిలో ఉంటాం” అని ఆది ఇంటి ఓనర్ గణపతి ని అడుగుతాడు. “పెళ్లి చేసుకున్నారా?” అని అడుగుతాడు గణపతి. “లేదంకుల్. మాకు పెళ్లి మీద నమ్మకం లేదు. కొన్ని నెలల్లో ఆది అమెరికా వెళ్ళిపోతాడు, నేను పారిస్ వెళ్ళిపోతాను. అంతవరకూ కలిసి ఉందాం అనుకుంటున్నాం.” అని చెప్తుంది తారా. గణపతి ససేమిరా కుదరదంటాడు. కొన్ని మంచి ప్రశ్నలు వేస్తాడు. వాటిలో వేటికీ సమాధానం చెప్పకుండా “అంకుల్ ఒకసారి బయటికి రండి, convince చేస్తాను” అని చెప్పి ఆది గణపతిని బయటికి తీసుకెళతాడు. ఇంతలో తారా మంచి పాట ఒకటి పాడటం, దానికి గణపతి ముగ్ధుడైపోవడం, వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోవడం జరుగుతాయి. గణపతి వేసిన ఏ ప్రశ్నకీ ఎవరూ సూటిగా సమాధానం చెప్పరు. అలా చెప్పించాల్సి వస్తే ఆది తారా పాత్రల పట్ల ప్రేక్షకులకి కలగాల్సిన ఇష్టం తగ్గుతుందని దర్శకుడు సీన్ ని సంగీతం వైపుకి divert చేసాడు. పైగా గణపతి మీద “Old Fashioned” అని ఒక సెటైర్ కూడా వేయించాడు దర్శకుడు.

ఇలాంటిదే ఇంకో సందర్భం. ఆది తారాలు ఒకే గదిలో ఉంటున్న సంగతి ఆది వాళ్ళ వదిన కనిపెట్టేస్తుంది. “ఇదేం పద్దతిగా లేదు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంటే చెప్పండి. నేను ముందుండి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను.” అని చెప్తుంది. దానికి తారా “పెళ్లి అనే సర్టిఫికేట్ ఉంటే ఇదంతా రైట్ అయిపోతుందా?” అని ఎదురు ప్రశ్న వేస్తుంది గానీ సరైన సమాధానం చెప్పదు. అప్పుడు వదిన “పోనీ మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా?” అని అడిగితే సమాధానం ఏం చెప్తుంది? “కలిసి ఉండటానికి ప్రేమ అవసరమా? సెక్స్ కావాలనే కోరిక సరిపోదా?” అని ఎదురు ప్రశ్న వేస్తుందా? ఎందుకంటే వాళ్ళిద్దరికీ మధ్య అప్పటికి ప్రేమ లేదు కదా. శారీరిక ఆకర్షణ తప్ప. ఆరు నేలలయ్యాక విడిపోవడానికే సిద్ధంగా ఉన్నారు కదా. తారాని ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో యిరికించకుండా సీన్ అక్కడితో కట్ చేసేశాడు దర్శకుడు.

ఇలాంటి సందర్భాలు అనేకం. నిజంగా విచ్చలవిడి సంబంధాలని మణిరత్నం వ్యతిరేకించాలి అనుకుని ఉంటే, ఆ సంబంధాల వల్ల కలిగే నష్టాలని కొన్నిటినైనా చూపించేవాడు. సినిమా మధ్యలో తారా ఆదిని గర్భనిర్ధారణ పరీక్ష కోసం అని అబద్దం చెప్పి ఒక గైనకాలజీ హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఆదిగాడు తెగ టెన్షన్ పడతాడు. అవును మరి, వాడు “తండ్రి” అనే బాధ్యతని స్వీకరించడానికి సిద్ధపడే ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడా? టెన్షన్ పడటం సహజమే మరి! దర్శకుడు దాన్ని ఒక హాస్య సన్నివేశం గా చూపించాడు. వ్యతిరేకించే ఉద్దేశం ఉంటే అక్కడ నిజంగానే ఆ అమ్మాయికి గర్భం వచ్చినట్టు చూపించి, అది తెలుసుకున్న ఆది గాడు చడీచప్పుడూ లేకుండా ఉడాయించినట్టు చూపించవచ్చు. అప్పుడు తారా అవతలి మనిషి వ్యక్తిత్వం తెలుసుకోకుండా, ప్రేమ కలగకుండా సెక్సు సంబంధం పెట్టుకుని తప్పు చేశాను అని పశ్చాత్తాప పడటం చూపించాలి. ఇలా కాకపొతే ఇంకోలాగా, ఇక్కడ కాకపొతే ఇంకో చోట, ఎక్కడో ఒక చోట వాళ్ళ ఆలోచనల లోని తప్పుని చూపించాలి. సినిమా మొత్తంలో ఒక్క చోట కూడా ఇలాంటి సందర్భం కనపడదు. దర్శకుడు కావాలని ఆది తారాలను రక్షిస్తూ వచ్చాడు.

“మరి చివరలో పెళ్లి చేసుకున్నట్టు చూపించాడు కదా?” అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడే దర్శకుడు తన కథ ని తనే అపహాస్యం చేసుకున్నాడు అనిపిస్తుంది. కథలో గణపతి జబ్బుతో ఉన్న తన భార్య ని ఎంతో ప్రేమతో బాధ్యతతో చూసుకుంటూ ఉంటాడు. పెళ్లి చేసుకున్న భార్యలని భర్తలందరూ అలాగే చూసుకుంటారు అని చెప్పడానికి లేదు. కానీ స్త్రీని ప్రేమించే మగవాడు అయితే ఖచ్చితంగా అంతే ఆప్యాయతతో చూసుకుంటాడు. కాబట్టి గణపతి చూపించే ఆ ఆదరణకి కారణం ఖచ్చితంగా ప్రేమే కానీ పెళ్లి అనే సంబంధం మాత్రమే కాదు. పెళ్లిని వ్యతిరేకించిన హీరో హీరోయిన్లు, గణపతి తన భార్య పట్ల చూపించే ప్రేమని చూసి పరివర్తన చెందడాన్ని చూపించాలి అనుకున్నాడు దర్శకుడు. ఆ పరివర్తన అవతలి వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించడం దిశగా సాగాలి గానీ, పెళ్లి వైపు కి కాదు. వాళ్ళు అప్పటిదాకా చెప్పిన సిద్ధాంతం ప్రకారమే కలిసి ఉండటానికి పెళ్లి అవసరం లేదు, ప్రేమ చాలు. ఆ ప్రేమ ఎలాగూ వాళ్ళిద్దరి మధ్య “సినిమా చివర”లో కలిగింది కాబట్టి ఇక పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వేరే దేశాలు వెళ్లి అక్కడ పని పూర్తి చేసుకుని, తిరిగి ఒకే దగ్గర కలిసి ఉండొచ్చు కదా, పెళ్లి లేకుండా? ఈ ప్రశ్నకి సినిమాలో ఎక్కడా సమాధానం లేదు. దర్శకుడికి ఈ ఆలోచన రాక వదిలేసి ఉండాలి. లేదా వచ్చినా సమాధానం చెప్పడం ఇష్టం లేక వదిలేసి ఉండాలి.

నాకు మాత్రం అది ఇలా అర్థమయ్యింది. క్లైమాక్స్ లో “నువ్ పారిస్ పో, ఎక్కడికైనా పో. నన్ను పెళ్లి చేసుకుని పో!” అని ఆది తారాని అడగుతాడు. నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి ఉంటే అలా అడగాల్సిన అవసరం ఉండదు. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా జీవితం నీతోనే పంచుకోవాలి అనుకుంటున్నాను. నువ్ పారిస్ నుంచి తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తాను. వెళ్లి చక్కగా చదువుకుని రా” అని కూడా చెప్పొచ్చు. కాని పెళ్లి చేసుకోమని అడగడం లో తమ ప్రేమ మీద అపనమ్మకమే కనపడింది నాకు. తారా పారిస్ లో ఉన్నన్ని రొజులూ, ఇక్కడ ఆదితో చేసినట్టే, అక్కడ తాత్కాలికంగా ఇంకొకడితో సహజీవనం చేస్తుందేమో అనే భయంతోనే ఆది అలా అడిగి ఉంటాడు అనిపించింది. ఇంత వికారంగా రాస్తున్నందుకు పాఠకులు నన్ను క్షమించాలి. ఆది తారాల పాత్రలని అంతే వికారంగా, ఆలోచనా రహితంగా, అత్మగౌరవం లేకుండా తయారు చేశాడు దర్శకుడు మరి.

ఇక్కడ నిరసించాల్సిన అసలు విషయం ఏమిటంటే, దర్శకుడు ఈ “శారీరిక సహజీవనాలని” ఎక్కడా విమర్శించలేదు సరికదా వీలైనప్పుడల్లా ప్రోత్సహించాడు. “ముందు అభిప్రాయాలతో, భావాలతో, వ్యక్తిత్వాలతో, ప్రేమతో సంబంధం లేకుండా ఎవరితో పడితే వారితో సంబంధం పెట్టుకోవడం. తరవాత అది ప్రేమగా టర్న్ అయితే పెళ్లి చేసుకోవడం…” ఇలా ఉంది దర్శకుల వారి తీరు. ఒకవేళ ఒక ఆరు నెలలు సహజీవనం నెరిపిన తరవాత ప్రేమ కలగకపోతే? “పోయేదేముంది. కావలిసినంత ఎంజాయ్మెంట్ దొరికిందిగా, ఇంకొకరిని వెతుక్కుంటాం” అని చెప్తారా? ఒకవేళ గర్భాలు వస్తే? “ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయ్యింది. అబార్షన్ చేయించుకుంటాం. సింపుల్ !” అని చెప్తారా? ఇంత దిక్కుమాలిన ఆలోచనలు మణిరత్నం నుంచి వస్తాయని ఎప్పుడూ ఉహించలేదు.

ఈ సినిమా ప్రేమకీ, సెక్స్ కోరికకీ తేడా మసకబరిచేది గా ఉంది. యుక్తవయసులో ఉండి ఏది ప్రేమో, ఏది మోహమో గ్రహించలేని స్థితిలో ఉన్న యువతీయువకుల మీద ఈ సినిమా చాలా చెడ్డ ప్రభావం చూపిస్తుంది. దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకడిగా చెప్పుకోబడే ఒక దర్శకుడికి తన కథ పట్ల, ప్రేక్షకుల పట్ల ఇంత కంటే చాలా నిబద్ధత అవసరం.

*

ఇప్పుడు కావాల్సింది శ్రీశ్రీ వచనం!

అఫ్సర్ 

 

1980.

అప్పుడు కాలేజీ అంటే వొక ఉద్యమం. రోజూ సాయంత్రాలు ఖమ్మంలోని రిఖాబ్ బజార్ స్కూలు ముందో వెనకో కూర్చొని, లోకం మీద ఆగ్రహాన్ని ప్రకటిస్తున్న రోజులు. పట్టలేని ఆగ్రహాన్ని చల్లార్చుకోలేక పక్కనే వున్న కాప్రి హోటెల్లో ఇరాని చాయ్ పంచుకొని “మన సోషలిజం ఇంతవరకేనా? ప్చ్…” అని ఆ పూటకి చప్పరించేసుకొని, రంగు డబ్బాలు తీసుకుని ఖమ్మం గోడల్ని ఎరుపెక్కించిన రాత్రులు. “నీ రాత స్ట్రోక్స్ శ్రీ శ్రీలా వున్నాయి” అని వొకరికొకళ్ళం కితాబులు ఇచ్చి పుచ్చుకునే అమాయక కాలం. కాని, ఇంకా శ్రీ శ్రీ కవిత్వం పూర్తిగా చదవలేదు అప్పటికి.

అలాంటి వొకానొక సాయంత్రం చీకటి వైపు పరుగు తీస్తుండగా…

అది చరమ రాత్రి అయితే బాగుణ్ణు అనిపించిన రాత్రి అది. ఆ రాత్రి శ్రీ శ్రీని కలిశాను. ఆయన వొక నిజం నిషాలో, నేను మరో రకం నిషాలో వున్నాం. ఆలోచన అలలు మాటల రూపంలో కొన్ని సార్లు అందంగా పెనవేసుకుంటున్నాయి.

ఆ రాత్రి మా ఇద్దరినీ కలిపినవాడు జేంస్ జాయిస్. అది కూడా నిజమే! పిచ్చి పట్టినట్టు జాయిస్ రచనలు చదువుతూన్న ఆ సమయంలో నా దగ్గిర వొక అమూల్యమయిన పుస్తకం వుండేది. దాని పేరు ” పిక్టొరియల్ గైడ్ టు యులిసిస్”. పుస్తకం ఎంత అందంగా వుండేదంటే,ఇంటికి తీస్కువెళ్ళి మరీ చాలా మందికి ఆ పుస్తకం చూపించేవాణ్ణి. అది నేను హైదరాబాద్ ఆబిడ్స్ లో వొక ఆదివారం రోడ్డు పక్క ఆ రోజుల్లో నాలుగు వందలు పెట్టి కొన్న పుస్తకం.

మాటల మధ్యలో ఆ పుస్తకం సంగతి చెప్పాక, శ్రీ శ్రీ గబుక్కున లేచి,గబ గబా చొక్కా వేసేసుకొని “ఇప్పుడే ఈ క్షణమే ఆ పుస్తకం చూడాలి” అంటూ నన్ను బయటికి లాక్కు వచ్చాడు.
“మీరు ఇక్కడే వుండండి. నేను తీసుకొస్తా.” అన్నాన్నేను.
“ఇక్కడ వున్నట్టే , రా!” అని హుకుం జారీ చెయ్యగానే నేను నా డొక్కు సైకిలు(చలం గారి భాషలో ముసలి గుర్రం) మీద రెక్కలు కట్టుకుని యెగిరిపోతున్నట్టుగా, రివ్వున దూసుకుపొయి, ఆ పుస్తకం తెచ్చి శ్రీ శ్రీకి చూపించడం మొదలెట్టాను. విద్యార్థి రాజకీయాల వల్ల, చదువు వెనక్కి పట్టి, ఇంట్లో అసమ్మతి పవనాల్ని యెదుర్కొంటున్న వొక ఇంటర్మీడియట్ కుర్రాడి అసంత్రుప్త బతుకులో అదొక అపూర్వ క్షణం. చాలా రోజుల శ్రమ, చాలా కన్నీళ్ళు ఆ పుస్తకం సంపాదించడం వెనక వున్నాయి. వొక్క క్షణంలో అవన్నీ యెగిరిపోయాయి.

ఆ పుస్తకంలో జాయిస్ “యులిసిస్”లో వర్ణించిన వూళ్ళూ, భవనాలూ, వాటి చరిత్రా వున్నాయి. ఆ నలుపూ తెలుపూ బొమ్మలు చాలా కాలం నా కలల్లోకి వచ్చి వెళ్ళిపొయేవి. ఒక రచయిత నిజం నించీ ఊహలోకీ, కల నించి తన ఇరుగుపొరుగులోకీ ఎలా ప్రయాణిస్తాడో బొమ్మ గీసినట్టుగా చూపించే పుస్తకం అది.

ఆ చిత్రాల్ని చూస్తూ, తన వృద్ధాప్యంముసురుకున్న వేళ్ళతో ఆప్యాయంగా తాకుతూ ఆ పుస్తకం తను చదివిన అనుభవాల్ని, అసలు తన వచనంలోకి చాలా భాషల చాలా మంది రచయితలు పరకాయ ప్రవేశం చేయడాన్ని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ రాత్రి శ్రీ శ్రీతో కలిసి వుండకపోతే, శ్రీ శ్రీ అంటే చాలా మందికి మల్లెనే నా ఆలోచన కూడా ‘మహాప్రస్థానం’ దాకానో, ‘మరో ప్రస్థానం’ దాకానో ఆగిపొయ్యేది. ఆ రెండు విస్తృతమయిన ప్రపంచాలని కాసేపు పక్కన పెట్టి, వచనంలో శ్రీ శ్రీ ఆవిష్కరించిన తనదయిన ప్రపంచాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం ఈ వ్యాసం.
*
శ్రీ శ్రీ అనే సంతకంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే, అది ఎప్పుడూ వొక కొత్త గాలిని వెంటబెట్టుకొని వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం “ఆధునికత” అనుకున్నా, ఇంకో పేరుతో పిలిచినా, ఏదో వొక కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించడం దాని తక్షణ లక్షణం. ఈ కొత్తదనం వస్తువులోనూ, రూపంలోనూ కనిపిస్తుంది. వస్తుపరంగా శ్రీ శ్రీ ఎప్పుడూ రాజీ పడలేదని ఇప్పుడు నేను విడిగా చెప్పకరలేదు, కాని, ఆ వస్తు నవీనత ఎలాంటి రూపాల్లో అతని వచనంలో వ్యక్తమయ్యిందో ఇప్పటికీ ఒక సంక్లిష్టమయిన విషయమే. ఒకే దృక్పథాన్ని అంటి పెట్టుకున్న అనేక వస్తువుల భిన్న రూపాల కలయిక శ్రీ శ్రీ వచనం.
వచనంలో శ్రీ శ్రీ – అటు సొంత రచనలూ, ఇటు అనువాదాలూ చేశాడు. అవి రెండూ వొక యెత్తు అయితే, ఉత్తరాల రూపంలోనో, వివిధ వ్యాసాల రూపంలోనో, ప్రసంగాల రూపంలోనో శ్రీ శ్రీ విస్తారమయిన/ సారవంతమయిన వచన సేద్యం చేశాడు. ఆ ప్రతి వచన రచనా విడిగా కూలంకషంగా చర్చించదగిందే. కాని, అది ఒక పెద్ద పరిశోధనా గ్రంధమే అవుతుంది. కాబట్టి, ఆయా వచన రచనలు వడపోసిన వొక సారాంశాన్ని మాత్రమే ఇక్కడ చూద్దాం.
శ్రీ శ్రీ కవిత్వం కానీ, వచనం కానీ వొకే వొక అంతస్సూత్రాన్ని అంటి పెట్టుకుని వుంటాయి. అది శ్రీ శ్రీ భవిష్యత్ వాదం: అంటే, రేపటిని ఈ క్షణాన దర్శించగలిగిన ముందు కాలపు చూపు. శ్రీ శ్రీ కవిత్వం రాస్తున్న కాలానికి అతను మార్క్సిజం చదివాడా లేదా అన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. కానీ, మార్క్సిజాన్ని ఒక పుస్తక రూపంలోనో, సిద్ధాంత రూపంలోనో చదవడానికి ముందే శ్రీ శ్రీ చుట్టూ ఒక పారిశ్రామిక వాడ వుంది. కార్మిక సమూహం అతనికి ఇరు వైపులా కాకపోయినా కనీసం వొక వైపు అయినా వుంది. ఆ స్థానిక ప్రపంచంలో శ్రీ శ్రీ లీనం అయి వున్నాడనడానికి అతని జీవన కథనాల్లో చాలా దాఖలాలు చూడ వచ్చు. అది శ్రీ శ్రీ చూస్తున్న వర్తమానం. కాని, అక్కడితోనే నిలిచిపోతే అది శ్రీ శ్రీ వ్యక్తిత్వం కాదు.
స్థానికత, వర్తమానం గీసిన బరిని దాటుకుని వెళ్ళే చూపు శ్రీ శ్రీది. ఒక వలస రాజ్యం సృష్టించిన నగరం విశాఖ. అక్కడి పరిశ్రమలూ, జన జీవనం, కళా సాంస్కృతిక రంగాల మీద ఆ వలస పాలన నీడలు కనిపిస్తాయి. శ్రీ శ్రీకి వాటి స్పృహ కూడా వుంది. కాని, వాటిని దాటి వెళ్ళే వలసానంతర వాదం శ్రీ శ్రీది. ఈ ప్రయాణం మనకి శ్రీ శ్రీ వచనంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వచనంలో శ్రీ శ్రీ స్థానికతని బయటి లోకంతో ముడి పెట్టే అంతర్జాతీయ వాది. వర్తమానాన్ని విమర్సనాత్మకంగా చూసే భవిష్య వాది.
ఈ వ్యాసాన్ని నేను జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన అభిమానంతో మొదలు పెట్టాను. జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన ఆతృతని జాగ్రత్తగా గమనిస్తే, అందులో ఒక శ్రీ శ్రీ సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించిన వొక అంశ వుంది. అది తన పరిసరాలకీ, తన స్థానికతకీ ఎడంగా స్పందించడం! (బహుశా, కొత్త అంశాల పట్ల తెగని ఆకర్షణ కూడా వుంది). తన కాలానికి చెందని వొక ఆలోచనని అందుకోవాలన్న వొక ఉబలాటం వుంది. శ్రీ శ్రీ వచన రచనల్లో నేను ఆ లక్షణం చూశాను. అయితే, ఆ ఆలోచనని తన కాలంతో ముడి వేసి, ప్రయోగించడం శ్రీ శ్రీ దారి. శ్రీ శ్రీ తన వచనాన్ని వూహించే ముందు ఇలాంటి కొంత మంది రచయితలు తనని ఆవహించేంతగా ఆ పఠనంలో మునిగిపోయాడు. కాని, ఆ మునక తరవాత మళ్ళీ వొడ్డుకి చేరడం ఎలాగో తెలిసిన వాడు కనుక, అతని అంతర్జాతీయ దృష్టి మళ్ళీ స్థానికతలోకి క్షేమంగా చేరుకుంది.
శ్రీ శ్రీ వచనంలో అనువాదాలు ఎక్కువే.అవి వివిధ దేశాల వివిధ రచయితలవి. కాని, ఈ అనువాదాలన్నీ ఒక్క సారిగా చదివితే, ఆ విడి విడి లోకాల్ని శ్రీశ్రీ ఒకే సూత్రంతో కట్టే ప్రయత్నం చేసాడని మనకి అర్ధం అవుతుంది, విలియం సారోయన్ మొదలుకొని ఆంటాన్ చెఖోవ్ దాకా. అదే చేత్తో, అతను చిన్న కథల్నీ, నాటికల్నీ, వ్యాసాల్నీ, సంభాషణల్నీ కలిపాడు. అనువాద వచన రచనలు శ్రీ శ్రీలో ఎదుగుతున్న/ క్రమ పరిణామం చెందుతున్న ఒక నవీన పంథాని ఆవిష్కరిస్తాయి. ఈ పనిని రెండు రకాలుగా చేశాడు శ్రీ శ్రీ. ఒకటి: అనువాదాల్ని అందించడం; రెండు: ఆ అనువాదాల వచనాన్ని తన సొంత రచనల్లోకి ప్రయోగించి చూడడం. ఇవి రెండూ విడదీయలేని కోణాలు.

అనువాదంలో శ్రీ శ్రీ ఆయా రచయితల వచన రూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే, తన సొంత రచనల్లో ఆ రూపాలను స్థానిక సంస్కృతికి మార్చి, పరీక్షించి చూసుకున్నాడు. ఇలా చెయ్యడం ద్వారా కొత్త రూపాలు తెలుగు సాహిత్య సాంస్కృతిక వాతావరణంలోకి ఎలా తీసుకు రావచ్చో బేరీజు వేసుకున్నాడు. “చరమ రాత్రి” దీనికి బలమయిన ఉదాహరణ. అది ఎంత బలమయిన వుదాహరణ అంటే, శ్రీ శ్రీ సాధారణ కవిత్వంతో తృప్తి పడని వాళ్ళు కూడా ఆ రచనని వొప్పుకునేంతగా!

అలాగే,ఈ వ్యాసం మొదట్లో నేను సమకాలీన సాహిత్యంతో నా అసంతృప్తిని కూడా చెప్పాను, వొక పాఠకుడిగా! శ్రీ శ్రీ వచన రచన ద్వారా ఏం చెప్పాడన్న దానికి అందులో ఒక సమాధానం వుంది.
శ్రీ శ్రీ వచన రచనలో పాఠకుడు చాలా ముఖ్యమయిన కోణం. తన పాఠక వర్గాన్ని తానే సృష్టించుకున్నాడు శ్రీ శ్రీ. అది ఎలాంటి వర్గం అన్నది అతని కవిత్వంలో కన్నా బలంగా అతని వచనంలోనే కనిపిస్తుంది. అది – పూర్వ సాహిత్య రూపాలని ప్రశ్నించి, కొత్త జవాబులు వెతుక్కునే తరం- పాత భావాలని ధిక్కరించి ఆధునికతని అక్కున చేర్చుకునే వర్గం. ఈ పాఠక వర్గానికి కావల్సిన కొత్త అలవాట్లని నేర్పే అనువాదాలూ, ప్రయోగాత్మక వచనం కొంచెం కొంచెం రుచి చూపించి, అభిరుచిని పెంచిన లాబరేటరీ ఆ వచనం అంతా!
ఈ రోజు శ్రీ శ్రీకి మనం ఇవ్వదగిన కానుక – ఆ వచన పాఠాల్ని తిరగదోడడమే!

(పాత వ్యాసమే…పునర్ముద్రణ…అఫ్సర్ బ్లాగ్ నించి…http://afsartelugu.blogspot.com/2010/08/blog-post_05.html)