అన్నపూర్ణ, అబ్బయ్య శారదతో మాట్లాడదామని చాలా రోజు నుంచీ ప్రయత్నిస్తున్నా శారద వారికి దొరకటం లేదు. కబుర్లు చేసీ, ఉత్తరాలు రాసి, టెలిఫోన్లు చేసి విసిగిపోయిన అన్నపూర్ణ చిన్న పెట్టెలో వారానికి సరిపడా బట్టలు సర్దుకుని బెజవాడ వచ్చేసింది. సుబ్బమ్మ ఆనందం చెప్పనలవికాదు.
‘‘వారం రోజులు ఉంటావుటే – మా తల్లే, మా శారద నాకే నల్లపూసయి పోయింది ` అంత గందరగోళంగా ఉంది. పసిపిల్ల తల్లి కోసం మారాం చేస్తోంది. కానీ ఈ పిల్ల కోసం నా బంగారు తల్లి ఆగితే ఎట్లా చెప్పు. ఆస్పత్రి సంగతి సరేసరి – పార్టీ వాళ్ళు ఎంతెంత పనులు , ఎంతెంత త్యాగాలు చేస్తున్నారు . ప్రాణాలకు తెగించేశారనుకో. శారద కూడా అంతేగా – ఏ క్షణంలో జైలు కెళ్ళాల్సి వస్తుందోనని నాకు కంగారుగా ఉంది ` ’’
సుబ్బమ్మ మొదలుపెడ తే ఇంక ఆ కబుర్లకు అంతుండదు. అన్నపూర్ణ ఆమెను ఆపి
‘‘దేశానికి స్వతంత్రం వచ్చింది గదమ్మా ` ఇంకా జైలుకెందుకెళ్ళాలి?’’ అంది.
‘‘అయ్యో పిచ్చిదాన – స్వతంత్రం అందరికీ ఎక్కడొచ్చింది? ఆ జమిందార్లంత కాంగ్రెస్లో చేరితే వాళ్ళకొచ్చింది స్వతంత్రం. రైతులు , పేదవాళ్ళు, మాల మాదిగలు వీళ్ళందరికీ స్వతంత్రం రావొద్దూ? పార్టీ వాళ్ళకోసం పోరాడకుండా వాళ్ళకెలా స్వతంత్రం వస్తుంది?’’
అన్నపూర్ణ సుబ్బమ్మ గారికున్న స్పష్టతకు ఆశ్చర్యపోయింది.
‘‘ఐతే అమ్మాయ్ – నువ్వింకా ఆ కాంగ్రెసులోనే ఉన్నావా ? పాపం ఈ పేద రైతు పొట్టకొడుతున్నారుగా మీరు ` ’’
అన్నపూర్ణ నోటమాట రాలేదు. తనెందుకిక్కడకు వచ్చిందో ఆ పని జరగదని అనిపించింది.
‘‘నేను పేద రైతు పొట్ట కొట్టేదానిలా కనిపిస్తున్నానా అమ్మా’’ అంది పేలవంగా నవ్వుతూ `
‘‘నువ్వంటే నువ్వు కాదులే ` మీ పార్టీ – ’’
‘‘మా పార్టీలో నువ్వన్నట్లు జమీందార్లు వాళ్ళూ వీళ్ళూ పనికిమాలిన వాళ్ళంత ఉన్నారమ్మా. కానీ ప్రభుత్వం, స్వతంత్రంగా ఏర్పడింది. ఈ గడ్డీ గాదం ఏరెయ్యటానికి సమయం కావొద్దూ? గాంధీ గారూ, నెహ్రూ గారూ ఊరుకుంటారా చెప్పు జమీందార్లు రైతుల్ని చంపేస్తుంటే. రెండొందలేళ్ళు పరాయి వాళ్ళు భ్రష్టు పట్టించిన దేశాన్ని బాగుచేసుకోటానికి కనీసం రెండు మూడేళ్ళు సమయం కావాలా ఒద్దా – ఆ సమయంలో మనం మనం కొట్టుకుంటే ఎలా? జమీందార్లను నేనూ వ్యతిరేకిస్తాను. నాలాంటి వాళ్ళింకా ఉన్నారు. మాతో కలిసి ఒక పద్ధతిగా అన్నిటినీ మన చేతిలోకి తెచ్చుకోవాలి గానీ, ఇప్పటికిప్పుడు జమిందార్లను వెళ్ళగొట్టాలంటే కుదిరే పనేనా ? చట్టాలు చెయ్యాలి. దానికోసం సంప్రదింపులు చెయ్యాలి గానీ తుపాకీతో మనలో మనం పోట్లాడుకుంటే నష్టం ఎవరికమ్మా?’’
సుబ్బమ్మ ఏం సమాధానం చెప్పాలోనని ఒక్క క్షణం ఆలోచించలేదు.
‘‘లేదులేమ్మా – శారదకూ, పార్టీ వాళ్ళకూ ఈ సంగతి తెలియదంటావా ? నువ్వు చెప్పినట్టు జరగదు. ప్రజలు పోరాడాల్సిందే ` ’’
సుబ్బమ్మ గారే ఇలా ఉంటే ఇక శారద, మూర్తీ తన మాటలు వింటారా ? ఒప్పుకోవటం సంగతలా ఉంచి ఇంత సింపుల్గా తన నోరు మూయించి పంపించేస్తారేమో – అయిన సరే శారదతో మాట్లాడాల్సిందే. వచ్చిందేమో వచ్చింది. పిల్లల్ని అబ్బయ్యకు వదిలి వచ్చింది. నటాషాతోనన్నా స్నేహం చేసుకు వెళ్తుంది అనుకుని స్థిమిత పడింది.
రెండు రోజుల పాటు సుబ్బమ్మకు వంటలో సాయం చేస్తూ నటాషాతో ఆటలు పాటల తో కాక్షేపం చేశాక గానీ శారద దర్శనం కాలేదు.
అన్నపూర్ణ కనిపించేసరికి అలసటంత ఎటుపోయిందో శారద హాయిగా నవ్వుతూ ఆమెను కావలించుకుంది.
అన్నపూర్ణ చంకలో ఉన్న నటాషాకూ తల్లి స్పర్శ దొరికింది ఆరురోజుల తర్వాత .
‘‘నట్టూ – అత్తతో బాగా ఆడుకున్నావా ?’’
‘‘అమ్మా అత్త చాలా పాటలు నేర్పింది’’ అంది నటాషా ముద్దుగా.
‘‘ఏదీ ఒకటి పాడూ’’ కూతుర్ని ముద్దు పెట్టుకుని ఒళ్ళో కూచోబెట్టుకుంది శారద.
‘‘నేనొచ్చి రెండు రోజులయింది. వారం రోజులుందామనే వచ్చాను గానీ ఈ వారమూ నువ్వు ఇంటికి రావేమోనని భయం వేసింది. నా అద్రష్టం బాగుంది’’.
‘‘చాల్లే ` ఊరుకోవోయ్. పనులలా ఉన్నాయి. నేను స్నానం చేసి వస్తాను. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం’’ శారద లోపలికి వెళ్ళింది.
‘‘స్నానం చేశాక అమ్మ వెళ్ళిపోతుంది. నువ్వూ వెళ్తావా ?’’
నటాషా అడిగిన తీరుకి అన్నపూర్ణ హృదయం ద్రవించి ఆ పసిదాన్ని గుండెకు హత్తుకుంది.
‘‘నువ్వు పెరిగి పెద్దయ్యి మీ అమ్మ కంటే గొప్ప పనులు చేస్తున్నపుడు అర్థమవుతుంది నీకు మీ అమ్మ’’ చిన్నపిల్లకు ఆ మాటలు అర్థం కావని తెలిసీ అనకుండా ఉండలేక పోయింది.
అన్నపూర్ణ, శారద మునిగినన్ని పనుల్లో మునగక పోయిన పిల్లలకు తనమీద నిరసన ఉంది అనే సంగతి తెలుసు.
ఇప్పుడంటే పెద్దవాళ్ళయ్యారు గానీ చిన్నతనంలో వాళ్ళకూ తల్లి తమను పట్టించుకోకుండా ఎక్కడెక్కడ కో వెళ్ళిపోతుందనే బాధ, కోపం ఉండేవి. అప్పుడు పెరిగిన దూరం పదిహేడేళ్ళ వయసులో కూడా అన్నపూర్ణ కూతురు స్వరాజ్యానికి తగ్గలేదు. పద్నాుగేళ్ళ కొడుకు మాత్రం వీలైనంత ఎక్కువగా అమ్మకు అతుక్కుపోవాలని చూస్తాడు.
రాత్రి భోజనాలయ్యాక స్నేహితులిద్దరూ కబుర్లతో మొదలెట్టి రాజకీయాలలోకి దిగారు. అన్నపూర్ణ వచ్చిన పనే అది.
‘‘ఏంటి శారదా – మీ పార్టీ వాళ్ళు దేశానికి స్వతంత్రమే రాలేదంటున్నారు’’ అని తేలిక ప్రశ్నతోనే మొదలెట్టింది.

‘‘మరి ఏం మారిందోయ్ ` అధికారం చేతులు మారింది. అంతే గదా ` జమిందారీలు పోయాయా ` భూస్వాముల దోపిడీ పోయిందా? పెట్టుబడీదారులు దోచుకోవటం ఆగిందా?’’
‘‘స్వతంత్రం రాగానే అవన్నీ జరిగిపోతాయా? సమయం కావొద్దా. ఎన్ని శాసనాలు చేసుకోవాలి. ఎన్ని చట్టాలు రావాలి. . అవతల రాజ్యాంగం ఒకటి తయారవుతోంది. అది అందరికీ న్యాయం చెయ్యటానికి వీల్లేకుండా అడ్డుపడేవాళ్ళున్నారు. అంతెందుకు హిందూ కోడ్బిల్లు తయారవటానికి ఎంత చర్చలు – ఇవన్నీ ఒక్క రోజులో తయారవుతాయా? ఒకరిద్దరి వల్ల అవుతాయా?
మనం వాటికోసం పనిచెయ్యాలి. మన అభిప్రాయాలు గట్టిగా వినిపించాలి. అంతే కాదు శారదా – ప్రజల్ని తయారు చెయ్యాలి గదా – ప్రజలు సిద్ధంగా ఉన్నారా మనం కలలు గంటున్న సమాజానికి? భార్యాభర్తలిద్దరూ సమానులని చదువుకున్న మగవాళ్ళే ఒప్పుకోరు. మా ఆయనకెన్ని పరిమితులున్నాయో నాకు తెలుసు. మూర్తి సంగతి నీకు తెలుసు -` స్త్రీల విషయంలో వీళ్ళే సరిగ్గా లేరే సమాజం సంగతి చెప్పేదేముంది. చట్టాలు చేసి వాటిని జనం అర్థం చేసుకుని అంగీకరించేలా చేసే పని మన మీదుంది. అదంత మానేసి జమీందార్లతో తొత్తులతో కిరాయి రౌడీల చేతుల్లో అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మీ కార్యకర్తలు . జమీందార్ల పని అయిపోయింది ` ’’
‘‘ఎక్కడయిపోయిందోయ్ – వేషాలు మార్చుకుని అంత మీ కాంగ్రెస్లో దూకుతున్నారు గదా ` ’’
‘‘మీరూ దూకండి – లేదా కాంగ్రెస్ గురించి ప్రజలకు తెలియజెప్పండి ’’.
‘‘మీ కాంగ్రెస్ గురించి మీరు చెప్పుకోండోయ్ ` నమ్ముతారు’’.
‘‘నిజం. కాంగ్రెస్ ఎప్పుడూ బాగాలేదు. ఇప్పుడూ బాగాలేదు. మా పార్టీ మీద నాకున్నంత కోపం నీక్కూడా ఉండదు. అంత పాడయింది. కానీ మనం పార్టీలకతీతంగా జనాన్ని చైతన్యవంతం చెయ్యాలి ` జనం మారాల్సింది లేదా ` బానిస బుద్ధులు ఒదిలించేలా మనం చెయ్యాలా ఒద్దా ` ’’
‘‘మేం అదే చేస్తున్నామోయ్ ` అది భరించలేకే మమ్మల్ని వెంటాడుతున్నారు. రేపో మాపో నిషేదిస్తారని వార్తలొస్తున్నాయి. నువ్వు మళ్ళీ సంస్కరణోద్యమం ప్రారంభించమంటావా ? మా ధ్యేయం విప్లవం. విప్లవమే సమూలంగా మార్చగలుగుతుంది’’.
‘‘విప్లవం గురించి నేను నీకు చెప్పేంతదాన్ని కాను. కానీ విప్లవానికి దాయి వేయాల్సిన సమయంలో సాయుధ పోరాటం అని సమాజంలో మార్పు తెచ్చేవాళ్ళనీ, సమాజానికి ఎంతో మంచి చేసేవాళ్ళనీ పోగొట్టుకుంటున్నారు మీరు. ఎలాంటి మనుషులు చనిపోతున్నారో నా కంటే నీకే ఎక్కువ తెలుసు. ఆలోచించు శారదా. కనీసం పార్టీలో చర్చను పెట్టు ` ’’ ఆవేదనగా అంది అన్నపూర్ణ.
చనిపోతున్న కార్యకర్తలను సహచరులను తల్చుకుంటే శారదకూ దు:ఖం వచ్చింది.
‘‘ఇదంత తప్పదు – నువ్వింతగా చెబుతున్నావుగా. ఆలోచిస్తా. పార్టీలో కూడా మా అన్నపూర్ణ ఇలా అడిగిందని చర్చ లేవదీస్తా. సరేనా . ఇక పడుకో – పొద్దు పోయింది. నేను ఉదయాన్నే ఆస్పత్రి పని చూసుకుని నా పనిలో పడాలి. తొందరలో మహిళా సంఘం మహాసభలు జరపాని ప్రయత్నిస్తున్నాం’’.
ఇద్దరూ నిద్రకు ప్రయత్నించారు గానీ నిద్ర రాలేదు. ఎవరి మంచ మీద వాళ్ళు మసలుతూనే ఉన్నారు.
అన్నపూర్ణ ఆ రోజు ఉండి మర్నాడు వెళ్తూ నటాషా బడికి వెళ్ళనని పేచీ పెడుతుంటే సుబ్బమ్మ గారు బతిమాడలేక సతమతమవటం చూసింది.
సుబ్బమ్మ లాంటి తల్లి ఉండటం శారద అదృష్టం అనుకుంది. శారద ఇంట్లో ఉన్నా లేకపోయిన ఆ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు అంతు లేదు. ఒక రకంగా ఇది రెండో పార్టీ ఆఫీసు. సాంస్కతిక కేంద్రం. ఒకవైపు పెద్ద హాలుంటుంది. శారద ప్రత్యేకంగా రిహార్సిల్స్ కోసం అది కట్టించింది. అక్కడ నాటకాు, రకరకాల కళారూపాలు రిహార్సిల్స్ జరుగుతూ ఉంటాయి. ఒకటి రెండు ముఖ్యమైన చిన్న సమావేశాలు జరుగుతుంటాయి. మద్రాసు నుంచో, మరో చోట నుంచో వచ్చిన ప్రముఖులకు అక్కడే బస. ఆ ఇంట్లో పొయ్యి మలుగుతూనే ఉంటుంది.
ఇదంత సుబ్బమ్మ లేకపోతే జరగదు. సుబ్బమ్మకు ఓపిక తగ్గుతున్న సమయంలో ఆమెను ఆదుకోటానికి పద్మ వచ్చింది. పద్మ సుబ్బమ్మకు మేనగోడలు . ఆ దంపతులిద్దరికీ శారదంటే ప్రాణం. శారద ఏం చెపతే అది ఆజ్ఞ వాళ్ళకు. ఇంటి పనులు పార్టీ పనుల్ప్ప్ అన్నీ బాధ్యతగా చేస్తుంటారు.
అన్నపూర్ణ ఆ హడావుడి నంతటినీ చూసి, దీనికి మూలస్తంభమైన శారదను మనసులో మరీ మరీ మెచ్చుకుని వెళ్ళిపోయింది.
1948 జనవరి 30. మామూలుగానే తెల్లవారింది. శారదను మూర్తిని కలవటానికి రైతు సంఘం నాయకులొచ్చారు. చల్లపల్లి జమిందారు మీద జరిపే పోరాటంలో విజయాలు ఇచ్చే ఆనందం కంటే కార్యకర్తల ప్రాణాలు పోవటం ఎక్కువ బాధ కలిగిస్తోంది. పోలీసు జమీందారులు వైపు. ప్రభుత్వం జమీందారు పక్షం. ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలనే చర్చలు జరుగుతున్నాయి. ‘‘మనం అనుకున్న లక్ష్యం ఆలస్యమైనా ఫరవాలేదు. కార్యకర్తల ప్రాణాలు చాలా ముఖ్యం. త్వరలో ప్రభుత్వం మనమీద నిర్బంధం పెంచుతుంది. దాన్ని తట్టుకోవాలి. ఒక కార్యకర్తను కోల్పోయామంటే పదేళ్ళు వెనక్కి వెళ్ళినట్టే అనుకోండి . తెలంగాణాలో పోరాటం ఒకవైపు విజయాల వైపు వెళ్తున్నట్టు కనిపించిన యూనియన్ సైన్యం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ఆయుధాలు సేకరించటం కంటే ప్రజలను సమీకరించటం చాలా అవసరం. ఒకరిద్దరు సాయుధ కార్యకర్తలను చూసి తాత్కాలికంగా భయపడతారేమో కానీ వేల మంది ప్రజలను సమీకరిస్తే అది శాశ్వత విజయాల ను ఇస్తుంది.’’
‘‘మన రైతు మహాసభలకు లక్షమంది రైతులు వచ్చారు గదండీ’’ అన్నాడో యువకుడు. అతనికి శారద మాటలు బొత్తిగా నచ్చలేదని తెలుస్తోంది.
‘‘అది స్వతంత్రానికి పూర్వం. ఇప్పుడు ప్రజల్లో మార్పు రాలేదా?’’
‘‘మన కృష్ణాజిల్లా ప్రజల్లో మార్పు రాలేదు. స్వతంత్రం వచ్చినా కాంగ్రెస్ అంటే మండ పడుతున్నారు. మనం స్వతంత్ర పోరాటానికి భిన్నంగా యుద్ధానికి సహకరించినపుడే రైతులు మనతో ఉండి మహాసభకు బళ్ళు కట్టుకుని, నడచీ వచ్చారు . ఇప్పుడు కూడా రైతులు మనతోనే ఉన్నారు’’.
శారదకు పరిస్థితి అర్థమైంది. యువకులంతా తెలంగాణా పోరాటం తో ఉత్తేజితులై ఉన్నారు. వారితో వాదించి లాభం లేదు. అనుభవమే వారికి నేర్పాలి.
రైతులు పెట్టవలసిన జమిందారీ వ్యతిరేక డిమాండ్ల గురించి చర్చలు మళ్ళించి సాయంత్రానికి వాటికొక రూపం తెచ్చారు . సాయంత్రం అందరికీ కాఫీు వచ్చాయి. సమావేశం ముగిసింది గనుక అందరూ విడిపోయి ఇద్దరు, ముగ్గురు కలిసి ముచ్చట్లాడుతున్నారు. కొందరు సిగరెట్ తాగేందుకు బైటికి వెళ్ళారు. శారద హాస్పిటల్కి వెళ్ళటానికి తయారవుతోంది.
మూర్తి హడావుడ గా లోపలికి వచ్చి
‘‘శారదా – గాంధీ – గాంధీజీని హత్య చేశారు’’. అరిచినట్టే చెప్పాడు. శారదకొక క్షణం ఏమీ అర్థం కాలేదు.
‘‘గాంధీజీ మరణించారు. ఆయన్ని చంపేశారు’’.
‘‘ఎవరు’’ శారద కళ్ళనుంచి కన్నీళ్ళు కురుస్తున్నాయి.
‘‘ఇంకా తెలియదు’’. రేడియో పెడుతున్నాడు.
శారద కుర్చీలో కూలబడింది. గుండేలు దడదడ కొట్టుకుంటున్నాయి. ఒళ్ళంత నీరసం కమ్మేసింది. ఎన్నడూ ఇలా జరగలేదు శారదకు. రేడియోలో చెబుతున్నదేమిటో వినబడటం లేదు.
గాంధీ లేరు. చనిపోయారు. సహజ మరణం కాదు. హత్య. చంపేశారు. ఎవరు? జాతిపితను కాల్చేసిందెవరు? ఎవరికంత కోపం ఆయన మీద. హిందూ ముస్లిం కలహాలను ఆపే క్రమంలో ఆయన చేసిన కృషికి ఎవరు కోపగించారు. హిందువులా? ముస్లిములా? ఉన్మాదానికి మతమేమిటి? కానీ గాంధీ హిందువు. ఒక ముస్లిం ఆయనను చంపాడంటే దాని పర్యవసానాలు ఊహించలేం. మళ్ళీ మారణకాండ. శారదకు గాంధీ గురించీ, ముస్లింల గురించీ కూడా గుండెల్లోంచి దు:ఖం తన్నుకొచ్చింది.
‘‘శారదా – గాంధీని చంపింది ఆరెస్సెస్ వాళ్ళు. నాధూరాం గాడ్సే అట తెలిసింది’’.
శారదకు కొంచెం తెరిపనిపించింది.
‘‘ఆరెస్సెస్ వాళ్ళ క్రూరత్వానికి అంతే లేదా? హత్యా రాజకీయాలా? ఎవరిని వాళ్ళు చంపింది – ఇడియట్స్. జాతిద్రోహలు . మారణకాండకు నాయకులై ఏం సాధిస్తారు’’.
శారద కోపంతో ఊగిపోయింది. విషయం తెలిసి జనం గుంపుగా కూడుతున్నారు.
***


