ఆకుపచ్చటి నెత్తుటి జాడ

P-172

Art: Srujan Raj

– కొట్టం రామకృష్ణా రెడ్డి

~

 

ramakrishnaదినాం తీర్గనే ఇయ్యాలగూడ పొద్దు మూక వట్టింది. పడమటి దిక్కు నల్ల తుమ్మల్లు దాపు జేసుకుంటున్నడు సూర్యుడు. దినాం తీర్గనే.

నెల్లాళ్ళ నించి గొడ్తున్న ఆనలకు మొలిసిన గడ్డీ గాదాన్ని కడుప్పలగ  మేసి కుదార్తంగ ఊరు మొకం పట్నయి పసులు, దినాం తీర్గనే.

నడూర్లున్న ఇంట్లకెళ్ళి కాలు బయటపెట్టి, ఎన్కనే పెద్దర్వాజ సప్పుడు జేసుకుంట దగ్గరేసిండు శంకర్రెడ్డి. దినాం తీర్గనే.

అప్పటిదాంక ఆకిట్ల యాపసెట్టు నీడల పండుకుని కూర్పట్లు పడుతున్న మచ్చల కుక్క, శంకర్రెడ్డి బయటికొచ్చుడు సూశి, తోకూపుకుంట ఆయనెన్కనే నడిసింది. దినాం తీర్గనే.

దూరంకెల్లి శంకర్రెడ్డి, ఎన్కనే మచ్చల కుక్కా నడిసొచ్చుడు సూశిన కోమటెంకటేశం, ఒక బిస్కేటు పుడ దీసి దుక్నం బయటికొచ్చి నిలవడి, శంకర్రెడ్డి దగ్గర్కి రాంగనే గా పుడ గాయన చేతిల బెట్టిండు. దినాం తీర్గనే.

ఎడ్మ చెయ్యి బాజుకు, కుడి చెయ్యి బాజుకు మూడ్నాలుగు మల్కలు తిరుగుకుంట, అడ్డమొచ్చిన మోరీల మీదికెల్లి పెద్ద అంగలేసుకుంట ఊరు బయటకొచ్చిండు.

నిలువెత్తు మడిసి అంచు పంచ గట్టి, మీద కమీజు తొడుగుకుని, ఎడ్మ భుజం మీద సెల్లేసుకుని నడుస్తుంటే, ఎదురుపడ్డ పిల్లా, జెల్లా, ఆడా, మగా బెదురువడ్డట్టు పక్కలకు జరుగుతున్నరు.

ఊరంచు  దాటి జరంత అవతల్కి పోంగనే శంకర్రెడ్డి తోట మొదలైతది. గాడ్నే, గా తోట మొదలు కాడనే, గేటసొంటి తడ్క పక్క పోంటి శంకర్రెడ్డి నాయన పెంటరెడ్డి బింగాణo (సమాధి).

గాడికి కూతేటు దూరoలనె బిచ్చగౌడు కొట్టమూ, పొలమూ.

కడుపున పడ్డ పొరలు, ఎవని తోవ ఆడు సూస్కున్నంక, ముసలి పెళ్ళాం తోటి ఊరివతల కాపురం బెట్టిండు బిచ్చగౌడు.

ఆడికెల్లి శంకర్రెడ్డి నడిసొచ్చుడు సూశిన బిచ్చగౌడు, పంచె సవరించుకుంట ఒచ్చిండు.

అట్లకెల్లి శంకర్రెడ్డి, ఇట్లకెల్లి బిచ్చగాడు ఒక్కపాలే గా బింగాణం కాడికి ఒచ్చిండ్రు .

‘ఏoది పటేలా! గియ్యాల జరంత పోద్దుబోయినట్టుంది’  అన్నడు గౌడు, బింగాణం కుడి పక్కకున్న బండరాయి మీద కూసునుకుంట .

‘ఔ మామా! షాద్నగర్ పొయ్యింటి……….ఎమ్మెల్యే సాబ్ తోటి తోడెం పని బడె. గాడ్నే పొద్దు బోయింది’, అనుకుంట బింగాణం ఎడ్మ పక్క పొంటి ఉన్న రాయి మీద వడ్డ దుమ్ము ఊది గూసున్నడు శంకర్రెడ్డి.

‘మీ నాయన బింగాణం కాడికి రాకపోతే నీకు తెల్లారదు గదే’.

‘ఏమో మామా! గట్ల అల్వాటయ్యింది’.

కమీజు జేవిలకెల్లి బర్కలి సిగిరేటు డబ్బి, అగ్గిపెట్టె తీసి, ఒక సిగిరేటు ముట్టిచ్చి, గుండెల్నిండ దమ్ము దీసుకున్నడు శంకర్రెడ్డి.

పంచె మడతలకెల్లి ముప్పై నంబరు బీడీ కట్ట దీసి, ఒకటి నోట్ల వెట్టుకుని, శంకర్రెడ్డి తానున్న అగ్గిపెట్టె తీసుకుని ఒక పుల్ల తోటి బీడి ముట్టిచ్చుకున్నడు బిచ్చగౌడు, దినాం తీర్గనే.

తోకూపుకుంట బిచ్చ గౌడు సుట్టు, బింగాణం సుట్టూ, తన సుట్టూ తిరుగుతున్న కుక్కను సూసి, బిస్కేటు పుడ ఇప్పి దాని ముందలేసిండు శంకర్రెడ్డి. అయ్యిట్ని సప్పరిచ్చుకుంట గూసున్నది మచ్చల కుక్క. దినాం తీర్గనే.

గదీ గిదీ ముచ్చట పెట్టుకుంట రెండు సిగిరేట్లూ, రెండు బీడీలు నుగ్గు జేశ్నంక బింగాణం పక్కపోంటున్నతడ్క దీస్కొని, లోపటికడుగు వెట్టి మల్ల గేటును ఎప్పటోలెనే దగ్గరేశి, తుమ్మకంప అడ్డమేసి లోపటికి నడిసిండు శంకర్రెడ్డి. ఎన్కనే మచ్చల కుక్క. గౌడు సిన్నగ లేసి ఇంటి మొకం బట్టిండు. దినాం తీర్గనే.

శంకర్రెడ్డికున్న ఇరవై ఎకరాల జాగల పన్నెండెకరాలు మామిడి తోట, రెండెకరాలు అచ్చుగట్టిండు. ఆనకాలం బీపీటి నాటుతడు, మల్ల ఎన్కసార్కి హంసలు అలుకుతడు. మిగిలిందంత శెల్క. ఒక్క కారు పంట. ఆనకాలం సినుకులు షురూ కాంగనే, దుక్కి  దున్నిపిచ్చి ఇత్తనాలేస్తడు. ఒక త్యాప మక్కలేస్తే, మల్ల త్యాపకు పత్తి వెడ్తడు. గీ నడ్మ గిసోంటి పంటలేస్తున్నడు గని, ఎన్కట్కి అయితే జొన్నలు, తైదలు, ఉల్వలు, బెబ్బెర్లు అన్నీ పండిస్తుండె. గిప్పుడందరు సుకాశికయ్యిండ్రు. ఎండ పొల్పు తగులొద్దుగని, కీసలైతే నిండాలె.

గీ మిలిగిన శెల్కకు పక్కపోంటున్న కుమ్మరి మల్లయ్య అద్దెకరం శెల్కతున్క శంకర్రెడ్డి శెల్కలకు, లోపటికి… పొడుసుకొచ్చినట్టుంటది. గాడ్నే గా మూలల్నే కుమ్మరి మల్లయ్య తన తల్లి మల్లమ్మ కాలం జేశినంక బింగాణం కట్టి, అమ్మ యాదిల ఒక మామిడి మొల్క నాటిండు. గా మొల్క పెద్దగై మానయ్యింది. సచ్చిపొయ్యిన మల్లమ్మకింత నీడనియ్యవట్టింది.

ఇంగ తోట నట్ట నడిమిట్ల రెండర్రల అంగ్రేజి కవేలి ఇల్లు కట్టించిండు శంకర్రెడ్డి.

పదేండ్ల కిందటి సంగతి, యాడ్నో, యాదో ఊల్లె దొరికిందంట గీ దొరసాని, తీసుకొచ్చి గీడ వెట్టిండు. గప్పటి సంది దినాం గిదే తీరు. పండుగైనా, పబ్బమైనా, ఊరు గొట్కపొయ్యినా శంకర్రెడ్డి పొద్దుమూకినంక అయ్యబింగాణం కాడ జరంత సేపు గూసోవాలె, రెండు సిగిరేట్లునుగ్గి జెయ్యాలె, మచ్చల కుక్కకి బిస్కేట్లు తినిపియ్యాలె, తోటల కాలు వెట్టాలె.

తెల్లారినంక ఎప్పటోలెనే, కూలినాలికి ఒచ్చినోల్లకి పనప్పజెప్పి ఊర్లకి నడవాలె.

గిచ్చితే రక్తమొచ్చేటట్టుంటది దొరసాని, గింత వయసొచ్చినా వన్నె తక్వగాలేదంటరు కూలినాలికొయ్యి దొరసానిని సూశినోల్లు. గట్లని ఇంటికాడ పెండ్లాం, ఆవు పాల మీగాడోలె పచ్చగుంటది. సూడంగనే ఒంగి దండం బెట్టాలనిపిస్తది.

శంకర్రెడ్డి అదృష్టవంతుడంటరు ఊరోల్లు. రెండు డ్యూటీలు జేస్తడు అంటరు సదూకున్న పోరగాల్లు.

Kadha-Saranga-2-300x268

 

******                                                                        ******

శంకర్రెడ్డీ, మచ్చల కుక్కా, బిచ్చగౌడూ బింగాణం కాడికి ఒచ్చేట్యాల్లకు కుమ్మరి మల్లయ్య గాడ్నే నిలవడున్నడు. శంకర్రెడ్డిని సూశి దండం బెట్టిండు.

ఎవ్వలి జాగల ఆళ్లు కూకున్నంక, ‘పటేలా! యాజ్జేసినవంట?’ అడిగిండు మల్లయ్య.

‘ఔ, గడ్డ బలిసిందిరా మీకు, నేనే యాజ్జెయ్యాలే,’ సిగిరేటు ముట్టిచ్చికుంట కోపమైండు శంకర్రెడ్డి.

‘గట్లనకు పటేలా! మీరనేటోల్లు, మేం పడేటోల్లం.’ శెల్ల రెండు చేతుల నడ్మ పిసుక్కుంట అన్నడు, కుమ్మరి మల్లయ్య.

ఎప్పుడుండే కతనే గిది అన్నట్టు బీడి దీసి ముట్టిచ్చిండు బిచ్చగౌడు.

‘గా మామిడి శెట్టు సంగతేం జేశ్నవ్?’ బిస్కేటు పుడ ఇప్పి మచ్చల కుక్క ముందలేస్కుంట అన్నడు శంకర్రెడ్డి.

‘ఏం జెయ్యాలె పటేలా?’.

‘అగో కత మల్ల మొదటికొచ్చే, మల్ల మొదాల్సంది జెప్పాల్నా నీకు?’ గుస్స జేశిండు.

‘నాకున్నది చిన్న తున్క పటేలా అద్దెకరానికి రెండు గుంటలు తక్వనే ఉన్నది, దాన్ని సూస్కనన్న బతుకుత, నీ మోచేతి కింద నీళ్ళు దాగేటోల్లం జరంత దయ సూడు,’ రెండు చేతులెత్తి మొక్కిండు.

‘ఔరా నీది నాకియ్యమన్ననా, గా మూలకున్న మామిడి చెట్టు నీడ, నా మడెల్పు పత్తి శేను మొల్వకుంట జేస్తున్నది, దాన్ని కొట్టెయ్యి’.

‘గట్లనకు పటేలా మా యమ్మ సచ్చినంక బొందవెట్టి, గ్యాపకంగ గాడ్నే పెట్టుకున్న మామిడి శెట్టు పటేలా!’, బతిలాడిండు మల్లయ్య.

‘గదంత నాకు తెల్వది, రెండు దినాలల్ల దాన్ని కొట్టి పారెయ్యి.’

P-172

‘పచ్చని చెట్టు పటేలా మల్లమ్మ మామిడి మా యమ్మ పేరు మీద సాదుకున్న చెట్టు, ఊరందర్కీ రుచులు పంచుతున్నది. సగం పండ్లు మీకే పంపుతున్న గదా పటేలా, జరంత పెద్ద మనసు జేస్కో.’ శంకర్రెడ్డి కాళ్ళు పట్టుకున్నడు కుమ్మరి మల్లయ్య.

కాళ్ళు ఇదిలిచ్చుకొని, నోట్లున్న సిగిరేటు కింద పడేసి చెప్పుతోటి రాసి నలిపి, ‘రెండ్రోజులల్ల దాని నరికెయ్యి, లేకుంటె నేనే నరికిపిస్త,’ అనుకుంట తోట లోపటికి బోయిండు, ఆయింత ఏదో యాదొచ్చినట్టాగి, ‘ గట్లనే గా సాకలి బాలిగాడ్ని ఓ పాలి ఒచ్చి కన్లవడి పొమ్మను, ఎల్లుండి అమాస తెల్లారి నాయన తద్దినం, గీ బింగాణానికి సున్నమేపియ్యాలె, మర్వకు.’ అనుకుంట లోపట్కిపొయ్యిండు శంకర్రెడ్డి. ఎన్కనే మచ్చల కుక్క.

ఇగ నేనేం జేతురా బగవంతా అనుకుంట బిచ్చగౌడు దిక్కు సూశిండు మల్లయ్య.

గౌడేం మాట్లాడ్తడు, జేవిలకెల్లి మల్లొక బీడిదీసి ముట్టిచ్చుకొని నిదానంగ తన పొలం దిక్కు అడుగేసిండు.

తన గోడు ఎవల్కి జెప్పుకోవాల్నో అర్తం కాక నెత్తిగోక్కుంట  ఊల్లెకు నడిసిండు మల్లయ్య.

 

******                                                                  ********

 

మాట మీద నిలబడే అసొంటోడు శంకర్రెడ్డి. ఒకపాలి నోట్లెంబడి ఓ మాటోచ్చిందంటే, దానికి తిరుగుండదు. రెండంటే సరీగ రెండ్రోజులు జూశిండు శంకర్రెడ్డి. తెల్లారి అమాస.

పొద్దుగాల కోడి కుయ్యకముందే లేసి  ఇద్దరు కూలోల్లను బిలిసి మామిడి చెట్టును నరకమన్నడు. గొడ్డన్లు సానెబెట్టి, తాళ్ళు మానుకు గట్టి, జరంత సేపట్ల పచ్చని చెట్టును మల్లయ్య తావులనే బడేటట్టు గుంజి నరికిండ్రు.

ఆయింత మాను గూలి మల్లమ్మ బింగాణం మీద వడ్డది. అది జరకంత కూలింది. కొమ్మలు తెగి బింగాణం మీద పడి తెల్లటి బింగాణం మీద ఆకు పచ్చటి మరకలయ్యినయ్యి. తెల్లగ తెల్లారేట్యాల్లకు నేల మొదాటికి నరికి గాడ మల్లమ్మ మామిడి ఆనవాళ్ళు లేకుండా చేసిండ్రు. ఇంతకు ముందు ఆడ మామిడి చెట్టు ఉండెనని గుర్తువట్టకుండ చేసిండ్రు.

ఇసయం దెల్సి దమ్ముదీస్కుంట ఉరుకొచ్చిండు మల్లయ్య, మల్లమ్మ మామిడి చెట్టు కోసరం లెంకిండు. చెట్టు కనిపియ్యక పిచ్చొని లెక్క దిక్కులు చూడవట్టిండు. కూలిన తల్లి బింగాణాన్ని  జూశి గుడ్లల్ల నీళ్ళు దీస్కున్నడు. కోపం తోటి మడిసి నిలువెల్ల ఒనుక్కుంట, ‘ త్పూ… నీ యవ్వ ఏం మనిసివిరా శంకర్రెడ్డీ, అమాస నాడు పచ్చటి సెట్టును మాయం జేశ్నవు. నీ ఇంట్ల పీనిగెల్ల, మా యమ్మ మల్లమ్మ బింగాణం కూలగొట్టిపిస్తావు. రేపు మీ నాయన తద్దినానికి, మీ బింగాణానికి సున్నమేపియ్యమంజెప్పి, మా యమ్మ బింగాణం కూలగొట్టిచ్చినవు, నాశనం అయితవురా నీ నోట్ల మన్నువడ, మడెల్పు శేను పొయ్యిందంటివి, యాడ వోయ్యింది, చాటెల్పు శేను ఖరాబు గాలె. మంది పచ్చగుంటె ఓర్వలేనోనివి, నువ్వేం పటేలువు, పండ్లనిచ్చే చెట్టుగొట్టిపిచ్చినవు, గందుకే గా దేవుడు నీకు పిల్లలుగాకుండ చేశిండు,’  అనుకుంట నిజంగనే దోసిట్ల ఇంత మన్ను దీస్కొని దుమ్మెత్తి పోసిండు మల్లయ్య.

శంకర్రెడ్డికి కోపమాగలె. పెద్దపులి మేకపిల్ల మీద వడ్డట్టు మల్లయ్య మీద పడి గవదవెట్టి గుంజి ఒక్కటి కొడితే, మల్లయ్య పొయ్యి తల్లి బింగాణం మీద పడ్డడు. ఎన్కనే ఉన్న మచ్చల కుక్క పండ్లు బయటవెట్టి మల్లయ్యను సూసుకుంట గుర్రుమన్నది.

దౌడ పండ్లు కదిలినయి. నోట్లకెల్లి నెత్తురు, మల్లమ్మ బింగాణం మీదున్న ఆకుపచ్చని మరకలమీదకి చిల్లింది. కుయ్యిమనలే కుమ్మరి మల్లయ్య.

 

 

 

********                                                                    **********

P-172దూరం కెల్లి శంకర్రెడ్డీ, ఎన్కనే మచ్చల కుక్కా నడిసొచ్చుడు సూశిన కోమటెంకటేశం, బిస్కేటు పుడ దీస్కొని దుక్నం బయటికొచ్చి నిలవడ్డడు.

దగ్గరికొచ్చిన శంకర్రెడ్డి బిస్కెట్ల పుడ తీస్కోకుంటనే సర్రున ముందటికి నడిశిండు. ఏం సమజ్గానట్టుశంకర్రెడ్డి దిక్కూ, మచ్చల కుక్క దిక్కుకొత్తగ సూస్కుంట బొమ్మోలె నిలవడ్డడు కోమటెంకటేశం.

గియ్యాల జరంత ముందుగాలనే ఒచ్చిన బిచ్చగౌడు, బింగాణం పక్కలున్న బండరాయి మీద గూసోని ఊరు దిక్కు సూస్కుంట, పంచ మడతలున్నబీడి దీసి ముట్టిచ్చిండు.

ఊరంచుకెల్లి శంకర్రెడ్డీ, మచ్చల కుక్కా దబ్బ దబ్బ నడిసొచ్చుడు కనవడ్డది. ఇంక జరంత దగ్గర్కి రాంగనే అడగనే అడిగిండు బిచ్చగౌడు, ‘ రేపు మీ నాయన తద్దినమంటివి, సాకలి బాలయ్య సున్నం రుద్దకనే పాయె బింగాణానికి,’ పల్కరించిండు.

శంకర్రెడ్డి ఒక్క మాట మాట్లాడకుంట సక్కగా తోట కాడి  తడ్క దీస్కొని, మల్ల మల్లి సూడకుంట లోపట్కిబొయ్యిండు. లోపట్కి పొయ్యిన శంకర్రెడ్డి దిక్కు సూస్కుంట గాడ్నే ఒక నిమిషం గూసోని, ఎన్కకు మల్లి  మల్ల ఊర్ల దిక్కు ఉరికింది మచ్చల కుక్క. కొత్తగ.

దినాం తీర్గ అయ్య బింగాణం కాడ కూసోకుంట, సిగిరేట్లు నుగ్గి సేయ్యకుండ గట్ల పాయె శంకర్రెడ్డీ కొత్తగ, అని పరేశానయ్యిండు, గౌడు.

తడ్క తీస్కొని లోపటికి పోయిన శంకర్రెడ్డి, తోట నడుమ ఉన్న ఇంట్ల కడుగు వెట్టి దొరసానిని పిల్సిండు. సప్పుడు లేదు. ఇల్లంత లెoకిండు. ఇంటెనక లెoకిండు. తోటంత లెoకిండు. దొరసాని సడీ సప్పుడు లేదు.

శంకర్రెడ్డికి పిచ్చివట్టినట్టయ్యింది, మల్లోకపాలి తోటంత తిరిగి తిరిగి దొరసానిని లెoకుతనే ఉన్నడు.

సుట్టుపక్కల పొలాలు లెoకిండు, ఊర్లు లెoకిండు గని దొరసాని పత్తా లేదు.

గామె కనపడక అయిదేoడ్లయ్యిoది. రెండేoడ్ల కిందనే మచ్చల కుక్కా సచ్చిపోయింది. ఒంటి మీద సోయి లేకుండ, పిచ్చివట్టినట్టు, దేశాలు వట్టుకుని  శంకర్రెడ్డి ఇంకా దొరసానిని లెoకుతనే ఉన్నడు.

జర మీకేడనయిన గా దొరసాని కనవడితే చెప్పుండ్రి మీకు పుణ్యముంటది గని.

 

*

 

 

ఆలోక

A19

-రాధిక

~

Radhikaవాళ్ళిద్దరినీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను.  ఇంకా రిటైర్ అయినట్టు లేరు. ఇద్దరూ రోజూ బయట వున్న చిన్ని తోట లో కూర్చుంటారు. ఆమె మాట్లాడితే అతను వింటుంటాడు. లేదా అతను మాట్లాడితే ఆమె వింటుంది. అప్పుడు వాళ్ళని  చూస్తే ప్రపంచం ఇంకేమీ లేదు… ఆమెకి అతను, అతనికి ఆమె.. మాత్రమే అనిపిస్తుంది.  పక్క పక్కన కూర్చుని  చేతిలో చెయ్యి వేసుకుని అనురాగాన్ని, ప్రేమని ఒకరిలో ఒకరు  నింపుకుంటున్నట్టు వుంటారు.

వెన్నల రాత్రులలో అయితే ఎక్కువ సేపు వెన్నెలలో తడుస్తూ అక్కడే భోజనం చేస్తుంటారు.  ఆరుబయట వుండటం వలన కావచ్చు, మొదటి ముద్ద ఒకరి చేతిలో ఒకరు పెట్టుకుంటారు.వాళ్ళ వంటగది మా బాల్కనీ లోకి కనబడుతుంది. అందులో ఆమెని ఎప్పుడూ ఒక్కదాన్ని చూడలేదు, అతను వూరిలో లేనప్పుడు తప్ప. ఆమెకి కావలిసినవి అందిస్తూనో, ఏమీ పనిలేక పొతే ఆమె జుట్టుని సవరిస్తూనో ఉంటాడు అతను. చూడటం సభ్యత కాదు అనిపించినా వాళ్ళిద్దరి మధ్యా వున్న ప్రేమని, అనురాగాన్ని పదే పదే చూడాలనిపిస్తుంది. ఇంత జీవితం గడిచిన తరువాత కూడా తొలి ప్రేమలో వుండే సున్నితత్వాన్ని, మాధుర్యాన్ని  ఇంకా ఎలా మిగుల్చుకున్నారో తెలుసుకోవాలనిపిస్తుంది.

 

వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే రవి గుర్తుకు వస్తాడు.ఇద్దరం కలిసి అలా వెన్నెలనీ, ప్రకృతినీ అనుభవించాలి అనిపిస్తుంది నాకు. “ఓ సరూ..నువ్వు అన్నీ రొమాంటిసైజు చేస్తావు. అక్కడ ఏమి లేదు” అని ఒక్క మాటలో కొట్టి పడేస్తాడు. నావి పనీ పాటా లేని భావాలుగా తీసి పడేస్తాడు. మనసు చివుక్కు మంటుంది. ఇదంతా భావవాదం ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. మనిషి పరిణామం లో భావాలు, ఆలోచనలు, స్పందనలు కూడా ఒక భాగామేకదా. ప్రకృతిని ప్రేమించటం, భావోద్వేగాలకు గురి కావటం ఎలా భావవాదం. ఇదంతా చెప్పి నేను రవిని ఒప్పించలేను. మొదటిలో కొన్ని సార్లు అడిగినా, మనసును పదే పదే నొప్పించుకోవటం ఇష్టం లేక అడగటం మానేసాను. నా ఏకాంతంలో విధ్వంసం, ఒంటరితనంలో నిశ్శబ్దం రవి.

“సరూ ఎంత సేపు… రా… డిన్నర్ చేద్దాము” నాన్న పిలుపు విని లేచాను.

ఎదో మెసేజ్ వచ్చినట్టు వుంది. సెల్ తీసుకుని చూసాను.

“సరయు.. వెన్నెలలో తడుస్తున్నారా. మీ అంత కాదుగాని వెన్నెల అద్భుతంగా వుంది కదూ”  అనీల్ నుంచి మెసేజ్.

ఆకాశం వైపు చూసాను. శరత్ కాలపు వెన్నెల పారిజాత పరిమళం లాగా మనసుని మెత్తగా తాకుతుంది. సంతోషం,దిగులు కలిసినట్టు వుంది వెన్నెల. వాళ్ళిద్దరి కోసం చూసాను. అక్కడే వున్నారు వాళ్ళు యుగయుగాల నుంచి ప్రేమించుకుంటున్నట్టు, ఒకరికోసం ఒకరు పుట్టినట్టు.

నెమ్మదిగా లేచి ఇంట్లోకి వెళ్ళాను.

***

ముగ్గురం నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నాం. మనసుకు శరీరానికి సంబంధం లేదేమో. ఎంత బాధలో వున్నా, ఆ బాధతో సంబంధం లేనట్టు ఆకలి వేస్తూనే వుంది. ఎవరి ఆలోచనలలో వాళ్ళు. ఏమనుకుంటున్నారో గాని, అమ్మా,నాన్న ..నన్ను ఏమీ అడగలేదు. వీలైనంత వరకు నన్ను సంతోషంగా ఉంచటానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఏమైనా మాట్లాడితే బాగుండు . టి.వి లో ఎదో సినిమా వస్తుంది.

“ఈ ఆర్చరి భలే గ్లామర్ గా వుంటుంది కదా నాన్నా” సినిమాలో ఎదో వార్ సన్నివేశం నడుస్తుంది. “మిగతావి అన్నీ ద్వంద్వ యుద్ధాలు. ఆర్చరి లో మాత్రం ఎక్కడి నుంచి అయినా శత్రువుని చంపవచ్చు.”

నా మాటకి నాన్న కూడా టి.వి వైపు చూసాడు.

“ఏ ఆయుధం అయినా ప్రయోజనం ఒకటే కదా” ఎదో ఆలోచిస్తూ అన్నాడు నాన్న.

మళ్ళీ మా మధ్య మౌనం పరచుకుంది.

“నిద్ర వస్తుంది. పడుకుంటాను” లేచి నా గదిలోకి వచ్చాను.

దస్తయేవస్కీ బుక్ తీసుకున్నాను. ఈ రష్యన్ రచయితలు మనసుని జల్లెడ పట్టినట్టు రాస్తారు.  ఏ ఒక్క అనుభూతిని జారిపోనివ్వరు. అనీల్ గుర్తు వచ్చాడు. అనీల్ కి కూడా ఈ బుక్స్ అంటే ఇష్టం.

“సరూ” అమ్మ లోపలికి వచ్చింది. అమ్మ వెనుకే నాన్న కూడా.

“కూర్చోమ్మా”

Kadha-Saranga-2-300x268

“సరూ… నువ్వు ఏమి  నిర్ణయించుకున్నావో తెలియదు. కాని నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము నీతోనే ఉంటాము. నువ్వు సంతోషంగా ఉండటమే మాక్కావలిసింది” నెమ్మదిగా నా చెయ్యి నిమురుతూ చెప్పింది.

“మా“ ఎందుకో తెలియకుండానే దుఖం వచ్చింది.

“మా.. రవి భర్త కాబట్టి ప్రేమించటం లేదమ్మా. తన నుంచి నేను అలాంటి స్థానం కూడా ఆశించటం లేదు. నాక్కావలిసింది  అది కాదు. ఒకరి అనుభూతులను  ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి స్పందనలకి  ఒకరు స్పందిస్తూ వుండే సాహచర్యాన్ని కోరుతున్నాను. వుద్యోగం  నాకు ఒక ప్రొఫెషన్. ప్రపంచమూ,పుస్తకాలు, వెన్నెలలు, వానలు… ఇవన్నీ నాలో భాగాలు. ఇంట్లో,ఆఫీసులో వుండే లాప్టాప్ లలో ఒకదానిగా నన్ను భావిస్తాడు రవి. అసలు ఈ రవిని కాదమ్మా నేను ప్రేమించింది. ఆ వ్యక్తి వేరే. నాకు ఎవరో తెలియని వ్యక్తితో కాపురం చేస్తున్నట్టు వుంది.”

నేను చెప్పేది అర్థం చేసుకుంటున్నట్టుగా అమ్మ నా చెయ్యి నిమురుతూ వుంది.

“అప్పటికీ రవి తో మాట్లాడటానికి ప్రయత్నం చేసాను.  చిన్న విషయాలకు కూడా ఎక్కువ స్పందిస్తానని, ప్రతి విషయాన్ని చాలా ఎక్కువ ఆలోచించి వుద్రేకపడతానని అన్నాడు రవి. నన్ను చిన్నప్పటినుంచి చూస్తున్నావు కదమ్మా రవి చెప్పేది నిజమేనా”

“చిన్నది పెద్దది ఏముంటుంది రా. ఒకరికి చిన్నది అనిపించేది వేరొకరికి పెద్దది కావచ్చు.ఎవరి కడుపునెప్పి వారిది.  ఎవరి అనుభవాలు వాళ్ళవి.” చెప్పింది అమ్మ.

“అక్కడ అలాగే  వుంటే నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా నేమో, నా ధోరణిలో నేను వున్నా నేమో అనిపించింది. కొద్ది రోజులు ఒంటరిగా వుంటే నాలో నేను తరచి చూసుకోవచ్చు అనిపించి ఇక్కడకు వచ్చాను.“

“జీవితం చాలా చిక్కుముడులతో  ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఎదుటివారి జీవితం సాఫీ గా గడచిపోతున్నట్టు గా అనిపిస్తుంది అంతే. మనం చెయ్యవలసింది ఏంటంటే నచ్చినట్టు గా జీవించటానికి ట్రై చెయ్యాలి.” నా పక్కకి వచ్చి కుర్చుని నాన్న చెప్పాడు.

అమ్మ భుజానికి తల ఆనించి పడుకుంటే ఎంతో భరోసాగా వుంది. ఒక సంక్లిష్టతని అధిక మించే టప్పుడు మనలని  అర్థం చేసుకునే మనుషులు వుండటం ఎంత అదృష్టం.

ఇంకొంచెం గట్టిగా అమ్మ చేతిని పట్టుకున్నాను.

***

“గుడ్ మార్నింగ్ సరయు. లేస్తే కలిసి కాఫీ తాగుదాం” అనీల్ ఫోన్ కి మెలుకువ వచ్చింది.

“గుడ్ మార్నింగ్ అనీల్. తరువాత మాట్లాడతాను” చెప్పి ఫ్రెష్ అయి బాల్కనీ లోకి వచ్చాను. నా చూపు అనుకోకుండానే పక్కకి తిరిగింది. ఏ సమస్యలో కొట్టు మిట్టాడుతుంటామో బహుశా ప్రతి దాన్ని అదే కోణం లోనుంచి చూస్తామేమో. అందుకే వాళ్ళ గురించి అంతగా పట్టించుకుంటున్నాను.

“సరూ కాఫీ” కాఫీ ఇచ్చి నా పక్క నే కూర్చుంది. ఇవాళ ఆఫీస్ కి సెలవు. తీరిగ్గా వుంది అమ్మ.

“అమ్మా.. .నాన్న, నువ్వు ఎప్పుడైనా వాళ్ళు ఉన్నంత ప్రేమగా వున్నారా” కాఫీ అందుకుంటూ అడిగాను అమ్మని.

“ఎవరి గురించి…ఓ ఆలోక వాళ్ళ గురించా”

“నీకు తెలుసా వాళ్ళ గురించి”  నాకు వుత్సాహం వచ్చింది. “నాకు చెప్పవా”.ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా ధ్యాసలో నేను వున్నాను. ఎవరిగురించి తెలుసుకోలేదు.

“వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. నువ్వు ఇంతకుముందు సుడిగాలిలా వచ్చి వేళ్ళేదానివి. అందుకే గమనించలేదు.ఇప్పుడే కదా.. కాస్త నేల మీద కాళ్ళు పెట్టావు.” నవ్వింది అమ్మ.

“వివాహాలు వ్యక్తుల మధ్య కాకుండా ఆస్తులు,అంతస్తులు, కులాలు, మతాల మధ్య జరుగుతాయి. అందుకే ఇలాంటి పెళ్ళిళ్ళల్లో ప్రేమలు ఎక్కడో తప్ప కనబడవు అంటాడు అనీల్, నిజమే అనిపిస్తుంది నా క్కూడా . కాని వాళ్ళిద్దరినీ చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది. మీ అంత వయసే కదా వాళ్ళది, ఎలా సాధ్యమైంది “

“ఇప్పటిదా ..వాళ్ళ ప్రేమ. దాదాపు పదిహేను సంవత్సరాలు ఓపికపట్టి నిజం చేసుకున్నారు” చెప్పింది అమ్మ.

నాకేమీ అర్థం కాలేదు. అంటే ఏంటి…. వాళ్ళ వయసు అమ్మ,నాన్న అంత వుంటుంది. ఏంటో అంతా గందర గోళం గా వుంది.

“అర్థం అయ్యేటట్టు చెప్పమ్మా”

“భర్త నుంచి విడిపోయిన తరువాతే శశాంక.. ఆలోక జీవితం లోకి వచ్చాడని కొందరంటారు, కాని శశాంక ఆలోక జీవితంలోకి రావడం వలెనే ఆమె భర్త నుంచి విడిపోయింది అని కొందరంటారు. ఏది నిజమో నాకు తెలియదు  కానీ  పాప పుట్టినతరువాత భర్త నుంచి విడిపోయింది. శశాంక కు కూడా భార్యతో సయోధ్య వున్నట్టు లేదు. “

“మరి ఈ మధ్య నే పెళ్లి చేసుకున్నారంటున్నావు”

“ అవును. రెండు సంవత్సరాలు అయివుంటుంది. అందరూ అప్పుడే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. కాని పాపకోసం అగినట్టుంది. నీ సందేహాలన్నీ నేను తీర్చలేను. మనం ఆలోక దగ్గరకి వెళదాము. తను చాలా ఫ్రాంక్. ఏ విషయం అయినా చాలా ఓపెన్ గా చెబుతుంది. నాకు మంచి ఫ్రెండ్.నువ్వే మాట్లాడు. నీ జీవితానికి కూడా ఏమైనా ఉపయోగ పడుతుందేమో” చెప్పింది అమ్మ.

నాకూ తెలుసుకోవాలనే వుంది. రవి తో నా జీవితాన్ని ఎలా డీల్ చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. ఇంకో వైపు రిలెషన్ కోసం అనీల్ వత్తిడి.

“సరూ…. అనీల్ ని ఇష్ట పడుతున్నావా” నెమ్మదిగా అడిగింది అమ్మ.

“ఇష్ట పడుతున్నానా….వూ… సరిగ్గా అర్థం కావటం లేదు. లేదనుకుంటాను. రవి  వల్ల వచ్చిన వెలితిని పూడ్చుకునే ప్రయత్నమేమో అనిపిస్తుంది. ఒక ప్రేమ ని కొల్పొయినప్పుడు ఆ బాధనుంచి బయట పడటానికి ఇంకో ప్రేమ  కావాలనిపిస్తుంది కదా.ఇదీ అలాంటిదే ననుకుంటా. ఏమైనా నేను అనలైస్ చేసుకోవాలి ఇంకా ” ఆలోచనలను కూడా పెట్టుకుంటూ చెప్పాను అమ్మ తో.

***

A19“కొంత కాలం గడిచిన తరువాత జీవితం చాలా పొడవైనదనిపించింది సరయు. అమ్మ కోసం,నాన్న కోసం, బంధువుల కోసం, సమాజం కోసం అంత పొడవైన దారిని దాట లేననిపించింది. అందుకే విడిపొయాను. కానీ శశాంక పరిచయం తో అంత పొడవైన జీవితానికి ఎంత సుందరమైన బాట వేసుకోవచ్చో నాకు తెలిసింది. తన యవ్వన కాలం అంతా నాతో కలిసి గడపబోయే జీవితాన్ని వుహించుకుంటూ గడిపివేసాడు. ఒక మగవాడి గా సమాజం తనకు ఇచ్చే ప్రయోజనాలని వదిలేసాడు. “ ఆలోక కళ్ళలో సన్నటి తడి మెరిసినట్టుగా వుంది.

ఆ రోజు సాయంత్రమే ఆలోక ఇంటికి వెళ్ళాము. నన్నూ, అమ్మనీ చాలా ఆప్యాయంగా ఆహ్వానించింది ఆలోక.  దగ్గరనుంచి చూసినప్పుడు ఆలోక ఎంతో అందంగా కనబడింది.  సున్నితమైన గులాబీ లాగ చాలా భద్రంగా చూసుకోవాలి ఈమెని అనిపించేలాగా వుంది. ఇంత సున్నితంగా వుండే ఈమె, జీవితానికి  ఎంత ధైర్యంగా ఎదురు నిలిచింది అనిపించింది. కొంత వయసు వచ్చిన తరువాత కొన్ని చేదు అనుభవాలు గుండెల్లో వుండే వెచ్చదనం తో పాటు పెదవి చివర జాలువారే నవ్వుని మాయం చేస్తాయి. కాని ఆలోక ఆ నవ్వు ని నిలుపుకో గలిగింది. బహుశా శశాంక  ఆ నవ్వుకి కారణం కావచ్చు.

“వెంటనే ఎందుకు పెళ్లి చేసుకోలేదు” అడిగాను.

“ఎదో మూల మనపైన కుడా సమాజపు తాకిడి వుంటుంది. నా స్నేహితులంతా మా ఇద్దరినీ పెళ్లి చేసుకోమనే చెపారు.  శ్వేత కి వాళ్ళ నాన్న ఎవరో తెలుసు. నా జీవితంలోకి శశాంక రావటం అర్థమయ్యే వయసు కాదు దానిది.  పెళ్లి చేసుకుంటే ఇంట్లో, అమ్మ పక్కన  నాన్న బదులుగా శశాంక ని ఎలా రిసీవ్  చేసుకుంటుంది.  ఏమైనా మానసికంగా క్రుంగిపోతుందా అని బాగా మధన పడ్డాను. భర్త నుంచి ధైర్యంగా విడిపోయిన నేను కూతురి విషయం లో ధైర్యం చెయ్యలేక పోయాను. అమ్మా,నాన్న విడిపోయిన పిల్లలకు ఇక్కడ సామాజిక భద్రత తక్కువ . మనమేమి మెట్రో సిటీస్ లో లేము కదా. శ్వేత ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా వుంటుంది. నా నిర్ణయాన్ని ఎలా తీసుకుంటుందా అనుకున్నాను. తను ఏమి చెప్పిందో తెలుసా ”

శ్వేత గుర్తు వచ్చిన ఆనందం ఆమె ముఖం మీద ప్రతి ఫలించింది.

“అమ్మా… నువ్వూ,అంకుల్ నా కోసం చాలా జీవితాన్ని కోల్పోయారు. నీ డెసిషన్ నాకు చాలా సంతోషంగా వుంది అని చెప్పింది తెలుసా సరయు.”

అ అమ్మాయి ఎంత గొప్పగా అర్థం చేసుకుంది అమ్మని అనిపించింది నాకు.

“శ్వేతకి మీరు విడిపోయిన విషయం అన్ని రోజులు  తెలియకుండా ఎలావుంది?

“మనుషులలో కొంత దయ ఉంటుందనుకుంటాను. వాళ్ళు ఆ దయని కొద్ది మందికే పంచగలరు. శ్వేత నాన్న విడాకుల విషయంలో శ్వేత కు ఇబ్బంది కలగకుండా ఉంచటానికి అంగీకరించాడు.  అప్పటికే అతను ఉద్యోగరీత్యా వేరే చోట వుండటం, వీక్ ఎండ్స్ కి రావటం జరుగుతుండేది.  విడాకుల తరువాత శ్వేత ఇబ్బంది పడకుండా ఆ పద్ధతినే కొనసాగించాడు.  శ్వేతకి విషయం తెలిసే సరికి అర్థం చేసుకునే పరిణితి వచ్చింది.”

“మీ తోట చాలా బాగుంది” చెప్పాను.

“ఓహ్.. పెద్ద తోట, చిన్ని ఇల్లు కావాలనుకునే వాళ్ళం నేను,శశాంక. కాని అంత పెద్ద తోటని చూసుకోవటం కష్టం కదూ. అందుకే చిన్న తోట “ సంతోషంగా చెప్పింది ఆలోక.

“మీరు ఎందుకు విడిపోయారు” అడిగాను శశాంకని

“నాకు చదువంటే చాలా ఇష్టం. కూతురిని పెళ్లి చేసుకునే షరతు మీద నన్ను చదివించటానికి సహకరించాడు ఆమె నాన్న. నేనంటే ఇష్టమో కాదో ఆమెని నేనూ అడగలేదు. బహుశా భర్తలను ప్రేమించటం భార్యల భాద్యత కదా అని నేను అనుకున్నానేమో. వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేక నన్ను చేసుకుంది. ఆమె నాన్న చనిపొయిన తరువాత నాతో ఉండనని చెప్పింది. “  చెప్పాడు శశాంక.

“ భర్త నుంచి విడిపోయిన తరువాత అందరూ కూతురిని చూసుకుని బతక మన్నారు. శశాంక తో వుండబోతున్నానని తెలిసిన తరువాత ఈ వయసులో  పెళ్లి ఎందుకు మనవళ్ళని చూసుకుంటూ బతకక అన్నారు. జీవితంలో కావలసింది తోడు కాదు. ఒక సాహచర్యం, బతకటం కాదు జీవించటం అని అర్థమయిన తరువాత ఎవరినీ పట్టించుకోలేదు. నా నిర్ణయం నేను తీసుకున్నాను.వుండేది ఒకే జీవితం కదా. వీలైనంత సారవంతం చేసుకోవాలి.” నెమ్మదిగా చెప్పింది ఆలోక.

***

ఆలోక తో మాట్లాడిన తరువాత  మనసులో వుండే చీకటి గదులలోకి వెలుతురు ప్రసరించినట్టు అయింది. నా ఆలోచనలకూ ఒక స్పష్టత వచ్చింది.

“ అమ్మా … నేను రేపు వెళతాను” చెప్పాను అమ్మతో మెయిల్ ఓపెన్ చేస్తూ.

నా వైపు అర్థం కానట్టు చూసింది అమ్మ.

“ అమ్మా …..రవి మీద నేను కోపం, ద్వేషం పెంచుకోవటం అనవసరం. నా ప్రపంచం వేరు.రవి ప్రపంచం వేరు. మేమిద్దరం కలిసి ఉండాలంటే ఈ రెండు ప్రపంచాల మధ్య కొంతైనా సారూప్యం వుండాలి. అలా లేనప్పుడు మా ఇద్దరికీ జీవితం లో ఏమిమిగలదు. రవి తో  మాట్లాడతాను.బహుశా కలిసి వుండటం సాధ్యం కాదేమో.

అమ్మ ముఖంలో కొద్దిగా బాధ పారాడినట్టుగా వుంది. జీవితకాల బంధాలు అనుకున్నవి తెగిపోతుంటే ఆ బాధ ఉంటుందేమో ఎవరికైనా.

“అమ్మా…. ఆలోక, శశాంక ని చూడు. నా ముందు తరం వాళ్ళు. ఎంత ఓపికగా,తెగువగా జీవితాన్ని  ఫలవంతం చేసుకున్నారో. జీవితమంతా ఎండిపోయి బతకలేనమ్మా. కొన్ని హరిత వనాలు కావాలి.”

ఇన్ని రోజులు కృంగిపోయి, దీనంగా ఉన్న కూతురు ఆత్మ విశ్వాసంతో, స్పష్టత తో మాట్లాడటం చూసిన అమ్మ దగ్గరకు వచ్చి నా నుదిటి మీద చిన్న ముద్దు పెట్టుకుంది.

“మరి అనీల్….”

“అనీల్ శశాంక కాడమ్మా. అనీల్ కి జీవితంలో అక్కడక్కడ వున్న ఖాళీలు నాతో  నింపుకోవాలనుకుంటున్నాడమ్మా. కాని నేను అలా కాదు.”

అనీల్ కి మెయిల్ టైపు చెయ్యటం మొదలు పెట్టాను.

***

………… అనీల్.. నేను ప్రేమించే దేనినైనా చేతులు బార్లా చాచి నాలోకి ఆహ్వానించాలనుకుంటాను. నిన్ను ప్రేమించి ఎక్కడో మనసుపోరల్లో ఎవరికీ కనబడకుండా దాచుకుని చుట్టూ చీకటి పరుచుకున్న సమయంలో మాత్రమే నిన్ను హత్తుకోగలగటం నేను భరించలేను. నా గుండె గదుల్లో ఎదోమూలకు నిన్ను నెట్టి మిగతా గదులన్నీ పరాయి వాళ్ళ తో నింపలేను. నేను మనసా.వాచా, కర్మణా ప్రేమిస్తాను. నన్ను ప్రేమించేవాళ్ళు కూడా అలాగే నన్ను ప్రేమించాలి. సో అనీల్……

*

 

Artwork: Srujan Raj

 

 

 

.

 

 

నేను తోలు మల్లయ్య కొడుకుని…

 

– కృష్ణ జ్యోతి

 

krishnajyothiఆదివారం పెద్దకూర పండగా, నాటుసారా ఏడుకా గడిచిపోయాక సోమారం చెప్పుల దుకానం కాడ కూచోడం బలే కష్టమనిపిస్తది మారయ్యకి. కానీ తప్పదు. మళ్లీ వారమంతా అందరి కడుపు నిండి, మళ్ళా వారం చివర కాసింత సరదా కావాలంటే వారమంతా ఈడ కూచోని ఎదురు చూడాలి్సందే. దుకానమంటే ఏమంత కాదుగానీ, నేలమీద రెండు గోనెలు, సుత్తీ, అరా, పెద్దసూదీ, దారం, అతికిచ్చే బంక ఇంకా నాలుగు జతల పాత చెప్పులు! ఓ చిన్న టార్పాలిన్ షెడ్డు. అదీ వానా కాలం గాబట్టి. ఓ మనిషి పట్టేంత చోట్లో ఎదురు కర్రలతో షెడ్డు ఏశాడు. చలికాలం ఆకాశం కిందనే. ఎండకి మాత్రం ఓ గొడుగేసుకుని నల్లని గొడుగు కింద మండతా వుంటాడు. అలవాటై పోయింది.

నలభై ఏళ్లుగా ఇక్కడనే కూచుని వున్నాడు. రామారావు ముక్యమంత్రి కాకముందు, అయిన తరవాత ఊరికొచ్చినపుడు ఈ దారంటే ఊరేగింపు చేశాడు. అంత లావు రామారావుని జనం బుర్రలోంచి మరిపిచ్చేసిన ఈ మారాజేవరా అని చంద్రబాబుని ఎగిరెగిరి చూసి ఆశ్చర్యపోయాడు. అయితే రాజన్న మటుకు తక్కువా?! పంచెగట్టి చేతులూపుకుంటాపోతావుంటే జనాలు ఎంత ఇదైపోయారు. చూస్తానే వున్నాడు…అందర్నీ…. ఇక్కడే కూచుని. ముందుకీ పక్కకీ జరగలేదు గాని రోడ్డు ఎడల్పు చేసేప్పుడు కాసింత ఎనక్కి పోవలిసొచ్చింది!

సినిమా హాలు సెంటరు కాడ రాత్రి చానా పొద్దు దాకా జనాలు తిరగతానే వుంటారు. పెళ్లి గాక ముందు రేత్తిరిపూట సినిమా యిడిసిపెట్టేదాకా ఆడనే కాసుకుని ఉండేవాడు. రేత్తిరి సినిమాకి వచ్చే జనం పొయ్యే జనం…. ఇద్దరి ముగ్గురి చెప్పులన్నా తెగిపోయేయి. అయితే ఆ రోజుల్లో ఇప్పట్లా పతోళ్ళూ జోళ్ళు ఏసేవాళ్ళు గాదు.

ఆ సమయాన జోడు తెగితే మంచి గిరాకి. ఏళ గానీ ఏళ గాబట్టి తనకి ఓ రూపాయి ఎక్కువ వసూలు! ఆ వసూలైన డబ్బులు దాపెట్టి ఆదివారం జల్సా చేసేవాడు. పెళ్లైన తరవాత పొద్దు గుంకక ముందరే ఇంటికి పోవలిసొచ్చేది. సందకాడ ఉజ్జోగం మానేశాడు. అయినా ఇదివరకులా ఇప్పుడు తెగేదాకా చెప్పులు ఏసేవారు ఏడున్నారు. ఒక్కో మడిసికి నాలుగేసి రకాలాయె. పొద్దున లేస్తే వాకింగ్ కి ఒకటి, ఇంట్లో ఒకటి, ఆఫీసుకొకటి, ఆటలకొకటి, బజారుకి పోతే ఇంకొకటి. తిండికి లేనోడు తిండికి ఏడుస్తుంటే జరిగినోడు ఇట్ట…

అసలు జనాలు సినిమాలకి నడస్తా రావడం మానేశారు. తొక్కుడు రిక్షాలు పోయి ఆటోలు, సైకిళ్ళు పోయి మోటారు బళ్ళు, రకరకాల గుడ్డలు, ఇంకా … గుడ్డ రంగునిబట్టి జోళ్ళు!…. జోళ్ళు నలక్క ముందే పడేత్తన్నారు. ఇంక తెగేది ఎక్కడ? తనకి పని దొరికేదెక్కడ? పక్క సందులో సాయి బాబా గుడికాడ రకరకాల కొత్త జోళ్ళు వుంటాయి. ఆటిల్లో నాలుగు మనమే తెగబెరికేసి ఆడనే దుకానవెట్టి మళ్ళా కుట్టేస్తే బావున్ను! కానీ తనకట్టా చెయ్యను సేతగాదు. ఇప్పుడుగాదు, ఎప్పుడూ తప్పుడు పనులు జేసి డబ్బులు సంపాయించాలని చూళ్ళేదు. బిడ్డల చిన్నతనంలో ఇంటికాడ మంది తక్కువ, పనెక్కువ. ఇప్పుడు మంది పెరిగారు గాని పని రాన్రాను తగ్గిపోయింది. తనకొచ్చే సొమ్ముతో ఇల్లు గడవక, పెళ్ళాం పాలేనికి దగ్గర్లో టీచరమ్మకాడ పనికిజేరింది. మరి దానికి బైట రోజుకూలి పనికి పోయే ఓపిక లేదు, అలవాటు లేదు.

 

***

దుకాణం సర్దతానే తలెత్తి చూశాడు. ప్రతిరోజూ చూస్తాడు. ఎదురుగా కిళ్ళి షాపులో షబానా వుంటది. పెళ్లి కాకండానే ముసిల్ది అయిపొయ్యింది. ముసుగుల్లో వుండాలి్సన పిల్ల బజార్లో కూచుని వుండటానో, తల్లీ తండ్రికి తాహతు లేకనో ఆ పిల్లకి ‘నికా’ కాలేదు. షాపుకి మొగోళ్ళు సిగ్రేట్లకని, వక్కపొడికనీ ఒక్కోసారి కాలక్షేపనికనీ వస్తానే వుంటారు. షబానా ఎవ్వరివంకా తలెత్తి చూడదు. అందరితోను కోపంగా వున్నట్టు మాట్టాడుతుంది. కానీ తనవంక ఇష్టంగా చూసేది. తన మొహాన్నీ, బుజాలని, మొత్తం కండల్ని కళ్ళతో తడిమేది.

ఎప్పుడైనా ఒళ్ళు తేడాజేసి రెండ్రోజులు షాపు తెరవకపోయినా, ఆలిసంగా తీసినా కంగారు కళ్ళతో పలకరించేది. తను తలెత్తి చూడకుండానే షబానా తన్ని చూస్తందని కనిబెట్టగలడు. తనక్కూడా షబానా మీద మోజుండేది.

ఓ కాలంనాడు దయిర్నం చేసి మాట్టాడి లేవదీసుకుపోవాలనుకున్నాడు. కానీ ఇద్దరూ మంచం పొత్తు లేని జాతులై పోయా. పైగా అంగడి ఏవైపోద్దో అని గాబరా పడ్డాడు. ఈ రోజున పెళ్లీ పెటాకులు లేకండా దిగాలుగా వాడిపోయిన షబానాని చూస్తే జాతిని తీసుకెళ్ళి నూతిలో పారేసి నా ‘సూపరు మారికేట్టు’ ఎత్తి ఏ సందులో పారిస్తే పని జరక్కుండా పోయేదా!? దీనికోసరం ఆ పిల్లని ఉసురు పెట్టానా అని మనేద కలుగుద్ది. మేనమావ కూతురు రవనని మనువాడినా చానా మాట్లు రేత్తిరిల్లు తన పక్కన ఒత్తిగిల్లిన పిల్ల రవనలా కాకుండా షబానాలా కనబడేది!

అల్లంత దూరాన జగ్గయ్య పంతులూ, తనూ కనబడ్డాడు. ఇద్దరూ ఒకే కాలాన్ని పుట్టినోళ్ళు. ఇంటికాడ చొక్కా ఏసుకోడు, బజారోస్తే నీలం గళ్ళ చొక్కా ఏస్తాడు. మడిసి పచ్చగా తన నల్లటి సేతులతో తాకితే మాసిపోతా అనేలా వుంటాడు. కానీ తనంత గట్టిగా లేడు. మెడ కాడా, చెంపలకాడా జారిపోయింది. పంతులు తనూ ఒకే బడిలో పలకబట్టారు. తన సదువు నాలుగుతో ముగిస్తే పంతులు చానా దూరం పొయ్యాడు. పోతం పొయ్యాడుగాని ఎప్పుడూ అత్తెసరే. ఆడాడ లెక్కలు రాసి బతకతన్నాడు. వున్నా లేక పోయినా చొక్కా నలగనీడు. మడిసి చానా వుషారు. అయితే చాదస్తం బాపడు. లేకపోతే ఉళ్ళో ఎన్ని దుకానాలొచ్చాయి!? తన దగ్గరే చెప్పు తయారు చేబిచ్చుకుంటాడు. ఎంత అడిగినా బేరం ఆడకుండా ఇచ్చేస్తాడు. తనుగూడ ఎప్పుడూ పంతులినుండి ఎక్కువ గుంజాలని చూళ్ళేదు.

“ఆ, మారయ్యా మన బాటా కంపెనీ కొత్త మోడల్స్ తియ్యి. జోళ్ళు మార్చేద్దాం” జగ్గయ్య తన పరాచికానికి తనే యిరగబడి నవ్వుతా పక్కనే బల్లమీద కూలబడ్డాడు.

“ రా పంతులా, నీ కోసరం గాక ఎవురికోసరం ఈడ కూసుండి వున్నా?! అట్నే కుట్టేద్దాం., రేపొద్దుటికి.” తన పాత సావాస గాడినీ, కస్టమర్నీ చూసి మారయ్య మనసు కుశాలైపోయింది.

Kadha-Saranga-2-300x268

***

తోలు పని చేయడం గమ్మత్తనిపించినపుడు, బడి మానేసి పన్లో జేరతన్న సంగతి ఇంటికాడ కాకండా జగ్గయ్యతోనే చెప్పాడు. జగ్గయ్య బడి మానోద్దని బతిమలాడాడు. గోటింబిల్లా, గోలికాయలు, బచ్చాలు, ఇంకా అట్టాంటి చానా ఆటలు మారయ్య కాడనే జగ్గయ్య రహస్యంగా నేరిచాడు. అట్టాంటి గురువుని తన్ని వొదిలి పోతాడంటే జగ్గయ్యకి దిగులైపోయింది. కానీ మారయ్య ఇనిపిచ్చుకోల.

“రేపటినించీ బడికి రానంటే రానంతే” అన్నాడు.

సరేలే అని ఆ రోజంతా ఇద్దరూ ఆశతీరా ఆడుకున్నారు మాపటేళకి ఇంటిదారి బోతన్నారు. జగ్గయ్య ఇల్లు బజారు వెంబడే. మారయ్య గుడిసె మాత్తరం బజారు దాటి సివరాకర్న ఎక్కడో. ఆటకి అలిసి ఇద్దరికీ బలే దాహమైపోయింది.

“దాహంగా వుందిరా” అన్నాడు మారయ్య గస పెడతా.

జగ్గయ్య చప్పున ఇంట్లోకి పోయి లోటానిండా నీళ్ళు తెచ్చాడు. అంతట్లోకి యీదిలోంచి పెద్ద పంతులు – జగ్గడి నాన్న గుమ్మంలోకొచ్చాడు. మారయ్య సాయ ఎగాదిగా చూశాడు.

“ఎవరబ్బాయివిరా” అనుమానం!

“తోలు మల్లయ్య కొడుకుని” పాలెంలో మారయ్య నాన్నని అందరూ అట్టానే పిలుస్తారు. అట్టా పిలవడం మారయ్యకి భలే గొప్పగా అనిపిస్తాది.

“ దాహానికి నీళ్ళు తాగితే తాగావుగానీ, ఆ చెంబు ఇహ ఇంటికి పట్టుకుపో. మళ్ళా మాఅబ్బాయితో తిరగవాక” జగ్గన్ని బుజం పట్టుకుని ఈడ్చుకుపోతా చెప్పాడు.

మారయ్యకి ఆ చెంబు బలే నచ్చింది. ఉత్తికినే వచ్చింది పైగా. ఇంట్లో వున్న సత్తు సొట్టల చెంబు మాదిరిగాగాకండా ఇది తళ తళగా వుంటం మూలాన మొగం గూడ సూస్కోవచ్చు.

“యాడిదిరో చెంబు” పుల్లమ్మ కొడుకునీ, చెంబుని మార్చి మార్చి చూస్తా అడిగింది.

“జగ్గయ్య నాన్న పెద్ద పంతులిచ్చాడు. ఆడ నీళ్ళు తాగినా. ఎమ్మటే సెంబిచ్చేశారు” గర్వంగా గడ్డమెత్తి చెప్పాడు.

“నిన్ను తిట్టి కొట్టారా?” అంది అమ్మ గాబరాగా.

“లేదే! ఎందుకూ?” అమ్మ నేను ఆళ్ళకి తెలీకండా చెంబు తెచ్చాననుకుంటందనుకుంటా.

“ఏరే వాళ్ళైతే సంపినంత పని సేద్దురు. పెద్ద పంతులు దేవుడే. బిడ్దో, నీళ్ళ కోసరం అట్టా పెద్దోళ్ళ కొంపలమీద పడమాక. కడగొట్టోళ్ళం. ఆళ్ళని కళ్ళతో జూసిందే మనకి గొప్ప. అంతగా దప్పికైతే దోసిట్లో పోబిచ్చుకుని తాగు” అమ్మ జాగర్త చెప్పింది.

ఈ రోజుకీ ఆ చెంబుతోనే నీళ్ళు తాగుతాడు. ఆ చెంబు తన పుట్టుకని ఎగతాళి చేసేదని చానా కాలానికి గాని బుర్రకెక్కలేదు. పని తగ్గి కాళీ పెరుగుతున్న రోజుల్లో, పక్కనే వున్న ఇంకో పాలెం లోకి సున్నం పనికిబోయాడు. దండెం మీద తువ్వాలుకి కడిగిన చేతులు తుడిస్తే ఆ ఇంటి ఆడది నారాయణమ్మ తువ్వాలు ఎత్తకపొమ్మంది! అమ్మ జెప్పిన సంగతి గ్యాపకం వొచ్చింది. తను కడగొట్టు మడుసుల్లో కడగొట్టు. చర్చి కాడ కంచం పొత్తు సూబెట్టేవోళ్ళు ఇంటికాడ తేడా సూబెట్టేశారు.

బడి మానేసి తోలుపనికి జేరేప్పటికి తను చిన్నోడే. మొదట్లో ఆ వాసనకి వాంతి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి అలవాటైంది. కానీ ఆ పని ఎన్నాళ్ళో సాగలేదు.

“తోలు పనీ ఇడిసి పెట్టేసేయ్ రా, అది ఒంటిని లోపట్నించి తినేస్తాది. పేనం వున్నప్పుడు మెరిసే తోళ్ళు పేనం పోయినాక కరిసేస్తాయి. నా రోగం తోలు నుంచే పుట్టిందే” సచ్చేముందు అయ్య మాట ఇన్న తరవాత తోలంటే బెదురు పుట్టింది. దాన్ని ఇడిసి పెట్టేశాడు. సినిమా హాలు కాడ దుకానం పెట్టాడు. జోళ్ళు బాగుచేసేది, తయారు చేసేది నేర్చుకున్నాడు. కొత్తగా పని జేసేప్పుడు పనిలో ఒళ్ళు దగ్గరుండాల! లేపోతే సేతులు సిల్లులే.

 

***

unnamed“పిల్లకాయలెట్టున్నారు పంతులా?”మారయ్య ఆరా తీశాడు. జగ్గయ్య మోహంలో కులాసా మాయమై దిగులొచ్చింది.

“ఆ ఏముంది మారయ్యా. పూజలు చేసే దానికి పనికి రాని పంతుళ్ళు. ఉజ్జోగాలు సంపాయించలేని మొద్దోళ్ళు. పెద్దోడు హైదరాబాద్ వెళ్ళాడు. చిన్నోడు ఇంకా ఏపని చెయ్యాలో తెలుసుకోక తిరుగుతా వున్నాడు”

“కానీయ్ లే పంతులా. ఏదో పనికి పోనీ”

“మాబోటోళ్ళని మీవోళ్ళు నేలకి తోక్కేసిన పాపం మీరిట్టా అనుబగిస్తన్నారేమో పంతులా” పరాచికంగా నవ్వతా అనేశాడు మారయ్య. జగ్గయ్య నోరారా నవ్వాడు.

“ఓ కాలం నాడు మేం గొడ్లు కాసుకుంటూ, గొడ్డుమాంసం తింటూ బతికామంట. తరవాత రాజుల్నీ, రాజ్యాల్నీ ఏలాం. ఈ రోజు నువ్వు తోలు కోసుకుంటా, గొడ్డుమాంసం తింటా బతకతన్నావు. రేపు నువ్వూ రాజ్యం ఏలతావులే” పంతులు భరోసా ఇచ్చాడు.

“నే రాజ్జానికి వొచ్చేలోగా ఇల్లు గడవాలిగా. మనవడికి వొళ్ళు ఎచ్చబడింది. మందు ఏపిచ్చాలి. రెండొందలప్పియి్య పంతులా” మారయ్యకి అవసరం గుర్తుకొచ్చింది.

పంతులు జాగర్తగా రెండు నోట్లు తీసి మారయ్య చేతిలో పెట్టాడు. మారయ్య డబ్బుని బొడ్లో దోపాడు.

“ఇంతకీ రాజ్యం చేతికొచ్చాక ఏం జేస్తావు మారయ్యా?” జగ్గయ్య నవ్వుతా అన్నాడు.

“నాకైతే ఆటిగురించి ఆలోశన లేదు. రాజ్జాలు ఏలేది ఒకరో ఇద్దరో. తీరా కురిచీలు ఎక్కాక మడుసుల్లో మారుపొచ్చేసుద్ది. నాకు దరమం కావాలి. నా పని గూడా అన్ని పనుల్లోకి సమానం కావాలి. అంటే సూది మందేసే బాబుతో నాకూ సమానంగా డబ్బుఇయ్యాలి. నాకే గాదు…. అన్ని పనులకీ అటు ఇటుగా ఒకే రేటువుండాలి. ఇగ అన్ని కులాలోల్లకి పని దొరకాలి! అప్పుడు ఎక్కువా తక్కువా తేడా ఏడుంటది?”

“ఓర్నీ అసాధ్యం గూలా! నువ్వూ సూదిమందిచ్చే డాక్టరూ ఒకటే?” పంతులు నమ్మలేనట్లు మొకం పెట్టి నవ్వాడు.

పొగాకు నముల్తున్న మారయ్య జవాబు చెప్పేదానికి తుపుక్కున ఉమ్మేశాడు. ఇంతట్లోకి గందరగోళంగా గోస ఇనపడింది. మంది జేరి రాలి చేస్తన్నారు. మారయ్య పెద్దకొడుకు కొండయ్య ముందర్నే నడస్తావున్నాడు.

ఆడు మందిలో లేకపోతే అనుకోవాల, ఉండకుండా ఎట్టా? మరి తన కొడుకు నాయకుడుగదా! కొండయ్యకి అన్ని కులాల్లో సావాసగాళ్ళున్నారు. ఎవురూ ఆడికి నీళ్ళు తాగిన చెంబిచ్చేసేదానికి, దోసిట్లో నీళ్ళు పోసేదానికి దయిర్నం చెయ్యరు. ఆడు పులిలాటోడు. ఆడికన్ని తెలుసు. కానీ ఇంకా సంపాదన్లోకి రాలేక పోతన్నాడు.

కొండయ్య ర్యాలి వదిలి నాన్న కాడి కొచ్చాడు.

“నువ్వు గూడా రాగూడదా నానా?”

“నువ్వు పోరా నాకు దుకానం వుంది”

“ఎప్పుడూ వుండే దుకానమేగా. ఆడ పారేసి రాగూడదా” కొడుకు ఆదుర్దా

“ఎందుకురా ఈ తంతు ఇయ్యాల?”

“ఉజ్జోగాల్లో న్యాయం జరిగేదానికి”

“ఎన్ని ఉజ్జోగాలున్నాయిరా?”

“ఎన్నైనాగానీ, పెద్ద పెద్ద ఉజ్జోగాల్లో మనోళ్ళు పోవాలి”

“నే రాలేను. నువ్వు పోరా” మారయ్య ఉన్న చోటునుంచి కదిలేదానికి ఇష్టపడలేదు. కొండయ్య కోపంగా సిరాగ్గా చూసి ఎల్లిపోయాడు.

రెండో కొడుకు బుద్ది పుట్టినపుడు ఆటోఏస్తాడు. తన కొడుకేంది, తనకి తెలిసిన కమ్మరోల్ల కొడుకులు, కుమ్మరోల్ల కొడుకులు, వొడ్డి పిల్లకాయలు ఆటోలు తోల్తానే వున్నారు. అంతకి మించి వాళ్ళకేం పని అగపడలా.

రాలీనే చూత్తా ఏం మాట్లాడకుండా కూర్చోనున్న పంతుల్ని చూస్తా “పాత రోజులే నయ్యం పంతులా. పని దండిగా దొరికేది. ఇయ్యాల జనాలెక్కువ. పనులు లేవు. పని వున్నోడికి పనిమీదనే వుంటది. లేనోడికి కోపంగా సిరాగ్గా వుంటది. పెద్ద పెద్ద కుర్చీల్లో వున్నోళ్ళు పిల్లోళ్ళకి పని చూపించలేక ఆళ్ళు రోడ్లట్టుకు తిరగతా ఆక్రోసిస్తా వుంటే నిమ్మళంగా వుంటారు. ఈ పిలకాయల్లో చురుకంతా ఎవురికీ పనికి రాకండా పోతంది. దీన్ని వాడుకోను లోకానికి చాతగావడంలేదు” అన్నాడు మారయ్య.

పంతులు ఏమీ మాట్లాడకుండా “వెళ్ళొస్తా మారయ్యా” అంటా ఇంటేపుకి నడిచాడు.

పంతులు తనని ‘అరే ఒరే’ అని బమగా పిలస్తాడు. కానీ తనట్టా పిలవలేడు. తను ఏ పనైనా జేసుకు బతగ్గలడు. కానీ పంతులట్ట బతకలేడు. తమకిద్దరికీ ఒకళ్ళ మీంద ఒకళ్ళకి అబిమానం వుంది గానీ ఒకళ్ళింటికి ఒకళ్ళు పోరు. కొండయ్య మాత్రం ఎవురింటికైనా పోగలడు. పెద్ద పెద్ద సంగతులు మాట్టాడగలడు. కానీ అదేందో మరి ఆడు గూడా సంతోషంగా లేడు.

 

***

నిట్టూరుస్తా చెప్పులు బాగు చేసుకోవడంలో పడ్డ మారయ్యకి ఇంటికి పోవలసిన తొందర గురుతొచ్చింది.

కూతురొచ్చింది. ముగ్గురు బిడ్డల తల్లి. అల్లుడు మరీ తట్టుకోలేనంత దెబ్బలు గొడితే వచ్చేసుద్ది. అల్లుడు అదో రకం. ఆడికి ఎప్పుడు తిక్కరేగినా పెళ్ళాం లోకువగా దొరుకుద్ది కదాని దాన్ని చావ బాత్తాడు. తిక్క రేగడానికి కారణాలు కూడా అక్కర్లేదు. ముద్ద మింగేప్పుడు పొలమారినా సాలు.

అమ్మమ్మ గ్యాపకంగా కూతురికి ఎంకటలచ్చిమని పేరెట్టాడు. పెళ్లి తరవాత అల్లుడు దాన్ని ఎలిజిబెతని మారిచాడు. అంతకు ముందు మాతమ్మ గుడి కాడ దన్నమెట్టే కూతురు ఇప్పుడు మరియమ్మ గుడికాడ గూడా నమస్కారం బెట్టుకుపోద్ది. అంతే! పేరు మారినా, కొలిచే దేవుళ్లు మారినా ఆ పిల్లకి పట్టదు.

“అన్నీ ఒగటేలే అయ్యా, తిని తీరిగ్గా కూచ్చునే వాడికి తగూలన్ని” కాచి వడబోసినట్టు చెప్పేసుద్ది.

అయితే రవనకి గానీ తనకి గానీ కొత్త పేరు నోరు తిరగలా. బిడ్డ అలవాటు చేసేసుకుంది. అడదిగదా, మొగోడు చెప్పినదానికి అలవాటు పడాల. కడగొట్టోళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే!

పంతులికి కూటికి ఇబ్బందే. చెప్పుకోడు. తనకి రేపటి రోజు ఎలా తెల్లారుద్దో తెలీని పరిస్థితి. కొడుక్కి తెలివి వుంది గానీ ఉజ్జోగం లేదు. షబానాకి ఇంకా మొగుడు దొరకడు. తన కూతురికి మొగుడు బారినుండి ఎలా బైట పడాలో తెలీదు. ఏదో మందపాటి గోడ అడ్డం బడతంది… ఈ బతుకులన్నిటి మద్దెన.

 

 

***

unnamedపెళ్ళామిచ్చిన టీ నీళ్ళు తాగి కింద గుడ్డేసుకోని పడుకున్నాడు మారయ్య. తలలో ఆలోచనలు దోమల్లాగా గిర్రున తిరగతన్నాయి.

ఏడోకలాసు కంటే ఎక్కువ ఎనిమిదో తొమ్మిదో చదువుతున్న ఎలిజిబెత్ కూతురుని పిలిచి అడిగాడు

“అమ్మీ, గట్టి ఉక్కు పోసి మందపాటి గోడ కట్టారనుకో… దాన్నెట్టా బద్దలు కొట్టేదీ!?”

“కింద బాగా వేడి పెట్టు తాతా కరిగిపోద్ది. అయితే వేడి చానా ఎక్కువ పెట్టాలి తాతో!”

కాసేపటికే బయట మబ్బు గమ్మి వాన పడతా వుంది. ఇంటి ఆడది బొగ్గుల కుంపటి రాజేసి పిలకాయల కోసరం మొక్కజొన్న కంకులు కాలస్తంది. కొండయ్య కుడా ఇంటి కాడనే వున్నాడు. అంతా చలికి వణికి పోతా వున్నారు. చేతులు ఎచ్చబెట్టుకోడం కోసరం కుంపటి కాడజేరి చేతులు జాపారు!

“ఎంతేడి పెడితే గోడ కరిగిద్దో ఇంత చలిలో!” పైకే అనుకుంటా మారయ్య గూడా లేచి వాళ్ళ పక్కకి జేరాడు

సెగ ఎచ్చగా నరాల్లోకి పాకింది.

 

********

artwork: Srujan Raj

 

కోరిన కొండ మింద వాన

 

 

Namini_Subramanyam_Naiduతిరప్తికి వుత్తరాన తిరమల కొండ. కపిల తీర్తం చుట్టుపక్కల యిండ్లొచ్చేసి యిరైయ్యేండ్లయిపాయ. యింక ఆ తట్టు పెరిగే పన్లా. తిరప్తికి తూరూగా వుండే కరకంబాడి గానీ, రేణిగుంట గానీ తిరప్తిలో కలిసిపాయ. తిరప్తికి పరంటగా యూనోర్సిటీలను దాటుకోని పుదిపట్లేమి, చెర్లోపల్లేమి, ముక్కోటేమి, చెంద్రగిరి దాకా లేఔట్లు పడిపాయ. యింక పెరగబొయ్యేదంతా తిరప్తికి దచ్చినంగా వుండే ఆర్‌సీ రోడ్డే. యిప్పుటికే మజ్జిక్కాలవ దాటి బైపాసు దాకా అపార్టుమెంట్లే వొచ్చేసినాయి. యింత దేనికి? కూచంద్రపేటకీ రామాపరానికీ నడి మద్దెన గుట్ట కింద పది పదైదెకరాల్లో విల్లాలు కట్టేదానికి రోడ్లేస్తా వుండారు, తుడా అప్రూవల్‌ తీస్కోని. తిరప్తిని కార్పొరేషను గూడా చేసేసినారు. మిట్టూరు, గంగిరెడ్డిపల్లి, నడవలూరు, నెన్నూరు గూడా తుడా కిందికి తెచ్చేసి కార్పొరేషన్‌లో కలిపీబోతారు.

యివన్నీ తెలవని ఆడమనిసేం గాదు జమునా. అందుకే అదరకుండా, పదరకుండా నిమ్మళంగా వుండాది. చిక్కి బిక్కిరించే కంటే యెనకాలనుండి యెక్కిరించేదే మేలు. అప్పుడే పన్లు జరుపుకోవచ్చు. నెత్తిన పెట్టుకోని మోస్తా వుండినట్టు కనిపించినామో దెబ్బ పడిపోతాది. యిప్పుడు చూడండేమి! బైరాగి పట్టెడలో యిల్లు కట్టాలనుకో. ముందు జాగా తియ్యాలి గదా. అంకణం రెండు లచ్చిలు బెట్టి అరవై అంకణాలు కొనాలంటే – బైరాగి పట్టెడలో వొక బిట్టొచ్చి అరవై అంకణాలు – కోటీ ఇరై లచ్చిలు బెట్టా. అంత డబ్బు పోసి జాగా కొన్నాక చుట్టూరా పదంకణాలైనా వొదిలి వొక టెంకాయ చెట్టు నాటుకునే దానికుండాదా! మొత్తం కట్టెయ్యాల. వొక డూప్లెక్సు యిల్లే కట్టాలంటే యీనంలో యీనం అదొక కోటి! పాలు పొంగించి యిండ్లల్లో చేరే నాటికి రెండు కోట్లా యిరై లచ్చిలు ! యిదే రెండు కోట్లా యిరై లచ్చిలు మిట్టూరు దాకా వొచ్చి నడవలూరు రోడ్డుకు అంకణానికి నలపై వేలు ఆడ పారేసి మున్నూరంకణాలు కొనుక్కుంటే! యాబై లచ్చిల్తో బెమ్మాళంగా వొకిల్లు గట్టుకోని చుట్టూరా టెంకాయ చెట్లూ, మాడి చెట్లూ, సపోటా చెట్లూ పెట్టుకుంటే! చూసేదానికి దిష్టికుండ పెట్టాల్సిందే. వొక పది లచ్చులు మనవి గాదనుకోని యిన్నోవా కారు కొనుక్కుంటే వుండే మతింపు! యింతా జేసి అర్దరేత్రి పూట గూడా తిరప్తి నుంచి పది నిమిసాలల్లో వనం మాదిరిగా వుండే యింట్లోకొచ్చి పడిపోవచ్చు.

ఈ తెలివితోనే యిప్పుడు తిరప్తోళ్లు వూళ్ల మిందికి దిగబడి పోతుండారు. మ్మరీ, రోడ్డు పక్క జాగాకు తనకలాడి పోతుండారు. తిరప్తిలో బైరాగి పట్టెడ నుంచి అది పొగులు పూటే గానీలే, కపిల తీర్తం పోవాలంటే ఆటో పిలగోడికి నూరియ్యాల. షేరాటోలెక్కితే మూడు మారి ముప్పై యియ్యాల. అదే మిట్టూరుకు రావాలంటే అన్నమయ్య సర్కిలు కాడ నిలబడి పది రూపాయలు యిచ్చి షేరాటో ఎక్కేస్తే గీత గీసినట్టు వొచ్చీయొచ్చు. బస్సయినా, బండయినా, కారయినా, షేరాటో అయినా పది నిమిసాలే. చెట్టూ జేమా నడిమద్దిన సుకంగా బతికిపోవచ్చు గదా. తిరప్తోళ్లకు చేటడు తెలివుంటే వూళ్లల్లో వోళ్లకు గంపడుంటాది గాబట్టే రోడ్డు పక్క జానడు జాగా యిచ్చే వోళ్లు లేరు. జమునా మాత్రం నెలకు ముందర యిచ్చేదానికి సిద్దపడిపొయ్‌ మిట్టూళ్లో వొక బ్రోకరు పనిజేసే వోడుంటే వోడికి చెప్పింది. ఆ బ్రోకరు యిరైనాళ్ల ముందర వొక పార్టీని గూడా పట్టకొచ్చి, ‘‘గన్‌పార్టీ జమునమ్మా. సింగిల్‌ సిట్టింగులో సెటిల్‌ జేసేస్తా.’’ అనేసి వొక డాక్టరును తొడుకోనొచ్చినాడు.

ఆల్రడీ బ్రోకరు ఆ డాక్టరుకు జాగాను గూడా చూపించేసినాడంట. జమూనాకు నడవలూరు రోడ్లో – ఆ రోడ్లో అప్లాయిగుంట మింద పుత్తూరు దాకా బస్సులు గూడా పోతుంటాయి – ముక్కుపుల్ల మాదిరిగా మూడు గుంటల కయ్యుండాది. సెంట్ల లెక్కన యిరై సెంట్లు, అంకణాల్లెక్కన యిన్నూటా నలపై అంకణాలు. దాన్ని, లడ్డుకమ్మ మాదిరిగా వుండే ఆ జాగాని అమ్మేదానికి కూచ్చునింది జమునా. వొచ్చిన ఆ పార్టీతో, నోరు తెరిచిందే తెరిచినట్టుగా, ‘‘అంకణం నలపై వేలు సార్‌. బేరాలు జేసే పనయితే యాపై వేలు. మీకు నీస్తే కుచ్చోండి, నీసక పోతే పోతా వుండండి, అన్ని మంచి నీళ్లు తాగేసి.’’ అని నెట్టుగా మాట్లాడింది. మ్మరి, అటుమంటి వొస్తవను చేతల్లో పెట్టుకోనుండాది జమునా. బ్రోకరు గూడా ఆ వూళ్లో మనిసే గాబట్టీ, జమునా సంగతి బాగా తెలుసు గాబట్టీ, ‘‘పార్టీని పట్టకొచ్చేంత వొరకే నా పని. నేనేమీ మార్జిను బెట్టుకోలేదే! నీ దగ్గిర వొక రేటుకు మాట్లాడుకోని అగ్రిమెంటు జేస్కోని యింగొకరికి అమ్మడం లేదు గదా. మీరూ మీరూ మాట్లాడుకోండి. నాకొక టూ పర్సెంటు యిచ్చీయండి.’’ అని మాత్రమే మాట్లాడి గమ్మనుండి పొయ్‌నాడు. దీనికి జమునా, ‘‘పర్సెంట్లు గిర్సెంట్లు నా దగ్గిర జాంతానై. కొనే వాళ్ల తావన నువ్వేమి తీసుకుంటావో, ఆయనేమిస్తాడో దాంతో నాకు సమందం లా. రామచంద్రాపరం నుంచి నెన్నూరు దాకా నలపై అంకణాలిచ్చే వోళ్లుంటే వోళ్ల దగ్గిరికే తొడుకోని పో. నేను బంగారట్టా జాగాను దారబోసుకుంటా నీకు పర్సెంటేజీలియ్యలేను. అంత్య నిస్టూరం కన్నా ఆది నిస్టూరం మేలు . పైగా నువ్వు వుండూరోడివి’’ అని గూడా అనేసింది. ఈ మాటకు, ‘‘నాకొక పర్సెంటన్నా యియ్యమ్మా’’ అని గానీ అన్లేక పొయ్‌నాడు బ్రోకరు.

మొదట్లోనే ఆ వొచ్చిన డాక్టరుకు ‘యిదయ్యే పని గాదులే’ అని అనిపించి నప్పటికీ, ఆయనకుండే తెలివిని బట్టి, ‘‘ఏందమ్మా నువ్వు చెప్పేది? ఈ వూళ్లో పొయ్‌ అంకణం నలపై వేలా! యిప్పుడు రా, తిరప్తికి. ఎస్‌జిఎస్‌ గ్రీన్‌ సిటీలో తుడా ఫైనల్‌ అప్రూవల్‌ అయ్యిందీ, లేఔట్లో నాలుగైదిండ్లూ రెండు అపార్టుమెంట్లూ గూడా పడిన చోటున్నే నీకు అంకణం నలపై వేలకిప్పిస్తా. విచిత్రంగా వుండాదే నువ్వు చెప్పేది. అంకణం నలపై వేలంటే ఎకరా నాలుగు కోట్లా అప్పుటికి?’’ అనేసి ముక్కున వేలేసుకున్నాడు. దీనిగ్గూడా, ‘‘డాక్టర్‌ సార్‌. ఎస్‌జిఎస్‌ గ్రీన్‌ సిటీకి మీరు అన్నమయ్య సర్కిల్‌ నుంచి పోవాలంటే ఎన్నిసార్లు స్టీరింగు తిప్పాల్నో ఆలోచించు. అది గూడా తొమ్మిది కిలోమీటర్లకు తక్కవేం వుండదు. మొన్న వొడమాలపేటకు పోతా పోతా ఆ లేఔట్‌ గూడా చూసినా. వొట్టి చవుడు నేల. నా నేల అట్టాంటిది గాదు. ఇంగొక పాయింటేమంటే స్కేలు మింద చీమ వొచ్చినట్టు వొచ్చీయొచ్చు నా ప్లాటు కాడికి. నువ్వు రామచంద్రాపరం దాకా నేరుగా వొచ్చి లెఫ్ట్‌కు వొక్క టర్నిచ్చుకుంటే బస్సు రూట్‌ మింద నా ప్లాటు చేరుకుంటావు. ఇది మెయిన్‌ రోడ్డు. ఎస్‌జిఎస్‌ గ్రీన్‌ సిటీకీ నా దానికీ నక్కకీ నాగలోకానికీ వున్నంత వారా వుండాది. అన్ని మాటలేల? లేచి పోవచ్చు.’’ అని మాటకు మాటేసింది. దీనికి రెండూ రెండు చేతల్తో మూస్కోలేక డాక్టరుకు గూడా చిన్నంగా రోషం మొదలై, ‘‘నీతో కొంచేపు మాట్లాడితే నువ్వు నీ జాగాను స్కొయర్‌ ఫీట్‌ యింత అని చెప్పేటట్టుండావు. రియల్‌ ఎస్టేటోళ్లు యాడబోవాల తల్లీ! వూరికే బేరం చేసి పోదామని రాలేదు. నిజంగానే కొనుక్కోవాలనీ, చక్కగా వొక యిల్లేసుకోవాలనీ, ప్రశాంతత కోసరం యింత దూరం వొచ్చినాను. నువ్వు తెగే రేటు చెప్పు. తెంచేద్దాం.’’ అనేసి ఆ రోషాన్ని కాసింత పక్కన పెట్టేసి అణిగినాడు. నిజానికి ముప్పైయ్యేలకు తెంచేద్దామని పై మాటగా నలబై అనింది జమునా.

Kadha-Saranga-2-300x268

నలబై అయితే కోటికి నాలుగు లచ్చిలు తక్కవవతాది. యీన పక్షం ముప్పెయ్యేసుకుంటే డెబ్బయి రెండు లచ్చిలొస్తాది. కానీ, ‘‘నలపైకి పైసా తగ్గను. బొటువుగా రూపాయి యిచ్చియ్‌. రూపాయంటే కోటి.’’ అనే బిగుసుకునింది. డాక్టరు పకపకా నవ్వి, ‘‘బేరానికి కుచ్చుంటే నాలుగు లచ్చిలు ఎక్కువ జేసినావన్నమాట. అసలు రోడ్డు ఎక్స్ టెండవతాదని గూడా అంటుండారు. నూరడుగుల రోడ్డు చెయ్యాలని ప్లానులో వుండాది. రోడ్డుకు పొయ్యే జాగాను పట్టుకోని నువ్వు అంకణం నలబై చెప్తుంటే ఎట్ల తల్లీ! మంచీ చెడ్డా చూసి చెప్పు’’ అనేసి అన్నాడు. ఈ మాటను పట్టుకోని జమూనా యింకా బలం తెచ్చుకోని, ‘‘యిప్పుడొచ్చినారు మీ అంతట మీరై దోవలోకి. నేనూ మీ దోవలోకే వొస్తానుండండి. యిప్పుటికే అది అరై అడుగుల రోడ్డు. నా ప్లాటు వుండేది ఉత్తర మొకం. వాస్తుకెంత మంచిది. కొలత చూసినావా! డెబ్బయి రెండుకి నూటిరవై. లెక్కాచారంగా ఇన్నూటా నలపై అంకణాలు. ఆ పక్కా యీ పక్కా రోడ్డుకెంత పోబోతాది! మహా అయితే యిరై అడుగులు పోతాది నాది. అదీ నూరడుగుల రోడ్డయితే! ఆడ అవబొయ్యేది ఎయిటీ ఫీటే. ప్లానులో వుండేది గూడా ఎయిటీ ఫీటే. రోడ్డుకు పదడుగులు పొయ్‌నా నీకు రోడ్డు పెద్దదయ్యింది గదా. రోడ్డు ఎంత పెద్దదైదే అంత రేటు. నూరడుగుల రోడ్డయితే నాది అంకణం లచ్చయాపై యేలు. ఇప్పుడు కరకంబాడి రోడ్డుకు మెయిన్‌ రోడ్డు రేటు రెండు లచ్చిలు. ఆ రేటే యీడా వొస్తాది. దేనికంటే రేడీస్టేషను నుంచి యాడ కరకంబాడి, యాడ మిట్టూరు! ఆడనే అంత రేటు పలకతా వుంటే`’’ అని వొక్క గుక్కలో మాట్లాడేసి, ఫైనల్‌గా, ‘‘మీరు లేచి పదండి చెప్తా, నా జాగా నాదిగా వుండనీండి, మీ డబ్బు మీదిగా వుండనీండి. పొగులు మాటలు పనికి చేటు, రేత్రి మాటలు నిద్రకు చేటు. డాక్టరుకు చెప్పాల్నా?’’ అని నవ్వేసింది. ‘‘మీరు మొగోడిగా పుట్టుంటే రాజ్యమేలే సుందురమ్మా!’’ అని నెంబరిచ్చీ, నెంబరు తీస్కోనీ ఆ పొద్దు పొయ్‌నోడు, యీ పొద్దు పది నిమిసాల ముందర ఏమిటికి కాల్‌ చేసినట్టు! యిప్పుడు గూడా ఆ మాట మిందనే వుండాది జమునా. ‘‘వొక రూపాయి తెచ్చిచ్చి ఫెన్సింగు రాళ్లు నాటుకో,రిజిస్టరు చేస్కోని. అదీ అగ్రిమెంటు గిగ్రిమెంటు ఏం లా. స్పాట్‌ పేమెంటు’’ అని రెండో మాట మాట్లాడకుండా ఫోను పెట్టేసింది.

యింత కటీనంగా వుండబట్టే ఆ జాగాను యిన్నేండ్లుగా కంటికి రెప్ప మాదిర్తో కాపాడుకుంటా వొస్తుండాది జమునా. యింట్లో ముఠాలెదవలు యిద్దురుంటే యిద్దురికీ చెప్పింది, యీ మాదిర్తో డాక్టరు ఫోను చేసినాడూ అనేసి. దీనికి ఆ మొగుడైనోడూ, కొడుకైనోడూ ఏమని అన్నారో తెలుసునా: ‘‘ముప్పై వేలకు అమ్మి పారెయ్యక నువ్వు నలబైలోనే వుంటే ఎట్ట? పార్టీ నిలబడొద్దా?’’అనేసి అన్నారు. అసలికి, మొగోళ్లంతా యింతే. ఏ మొగోడికైనా అమ్మెయ్యాలంటే ఎంత కుశాలగా వుంటాదో! రైతు యీ మాత్రమన్నా అర్దమో నిర్దమో కయ్యాగామ చేతిలో పెట్టుకోనుండారంటే ఆడోళ్లే కారిణం. అమ్మి పారేసి జరగాల్సిన పనులు చూడాలంట. పదైదేండ్లకు ముందర వూళ్లో ఒక బిడ్డి పెండ్లి చెయ్యాలనేసి వొకాయన ఎకరా లచ్చా యాపైయ్యేలకు తిరప్తిలో కండక్టరు పన్జేసే వోడికి అమ్మేసినాడు, మెయిను రోడ్డుకి. యిప్పుడు ఎకరా ఎంతనేసి! ఆ కుటుంబరానికీ పొద్దు పిచ్చిపట్టి పొయ్యుండాది. నాలుగెకరాలు వుడ్డగా వొక చోట దొరకడమే లేదు, తిరప్తోళ్లు లేఔట్‌ యెయ్యాలంటే! లేఔట్‌ యేసేదానికి బయపడి చస్తుండారు, పార్కుకు జాగా వొదిలి, నలపై అడుగుల రోడ్లేసి తుడా అప్రూవల్‌ చెయ్యాలంటే – పెద్ద పెద్ద యాపారస్తుళ్లు గూడా. ఎకరా రెండు కోట్లు బెట్టి నాలుగెకరాలు కొని, తుడాలో లంచాలిచ్చి, రోడ్లకు పోను, పార్కుకు పోను ఎకరాకు ఏడొందంకణాలు మిగల్తాది. పెట్టుబడి పెట్టాల. దానికి నాలుగున్నర రూపాయ లొడ్డీలు గిట్టుబాటు కావాల. అంకణం యాపై వేలు పెట్టినా గిట్టుబాటు కాక మూస్కోనుండారు. యీ జాగా అట్లగాదే! యీ రోజుకీరోజున యిల్లు కట్టుకోవచ్చు. పైగా ఉత్తర మొకం. దచ్చినం పక్కగా వొక అరై అంకణాల్లో బెమ్మాళంగా మహడీ కట్టుకోని ముందంతా కాళీ జాగా వొదిలేస్తే వాస్తు అదిరి పోతింది. ఎవురబ్బా యీ తోటలో యిల్లు కట్టుకోనుండేది అనేసి కార్లల్లో పొయ్యేవోళ్లు గూడా దిగి చూస్తారు. దచ్చినాన యిల్లు. ఉత్తరాన కాళీ జాగాలో తోట. వాస్తుకెంత మంచిది! పదేండ్ల కింద అయిదు లచ్చిలు కట్నమిచ్చి వొక టీచరు సమందాన్ని తెచ్చి కూతురికి పెండ్లి జేసిందే గాని అప్పుడు గూడా కయ్య అమ్మలా. యిప్పుడు గూడా పది లచ్చిలు అప్పుండినా బయపడడం లా జమునా. అప్పుకు బయపడి ఆ పొద్దు యీ జాగా అమ్మేసుంటే-? యీ పొద్దు నోట్లో యేలేస్కోని గమ్మనుండుండాల. యిది గాక యింగొక ఎకరా వుండాది జమునా వాళ్లకు. అది బాగా లోపలికి. ఎప్పుడో రోడ్డు పక్కంతా లేఔట్లొచ్చినాక దానికీ గిరాకీ వొస్తాది. ఆ ఎకరా చాలు, మొగ పిల్లోడికి. యిప్పుడీ జాగా అమ్మతా వుండేది గూడా దేనికంటే – యీ మొగ పిల్లోడి కోసరమనే! ఏం చేసేది! చదువు తక్కవ కొడుకుని కని పడరాని పాట్లు పడతుండాది జమునా. చెప్పుకుంటే బైసాట్లు. ఇంక సమ్మచ్చరం పెడితే ముప్పైలో పడిపోతాడు కొడుకు. నాలుగేండ్లుగా పెండ్లి చెయ్యాలని పోరకలాడతా వుండాది. పిల్లనిచ్చేవోళ్లు లేరు. యాడ బట్టినా ఆడ పిలకాయలు చదువుకునేసుండారు. వీడేమో పది ఫయిలు. మళ్లా మళ్లా కట్టి రాసినాడు. పాసు గాలా. యింగ వొదిలేసింది. వుజ్జోగాలు జేసే మొగ పిలకాయకే ఆడ పిలకాయలు దొరక్క అల్లాడతా వుండారు. పది ఫయిలైన ఆడబిడ్డిని తెచ్చుకుందామన్నా వోళ్లు గూడా యియ్యాటం లా. ‘‘మీ కొడుక్కి వుజ్జోగం వుండాదా?’’ అనడగతా వుండారు. యింక ఎవుర్ని అడిగినా ఆ ఆడ పిలకాయలు డిగ్రీ దాకా చదివేసే వుండారు. పీలేరు టవునయి పాయ. ఆ చుట్టు పక్కల ఆడ పిలకాయలు యీ కాన్వెంట్ల మింద పడి చదివేసే వుండారు. మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, పెనుమూరు అన్ని వూళ్లూ టవున్లయి పొయ్యేసరికి ఆ చుట్టుపక్క వూళ్లల్లో ఆడ పిలకాయలు టవున్లకొచ్చేసి చదివేసుండారు. పైగా, ఎంత పది ఫయిలైన ఆడబిడ్డి అయినా గూడా ఎకరా కయ్య వుండనే వుంటాది. మొన్నటికి మొన్న మనుసు చంపుకోని పెనుమూరు దగ్గిర వొక సమందం వుంటే పొయ్యేసొచ్చింది. ఆ బిడ్డి కంట్లో గూడా పడలా. వీడి మాదిరగానే పది గూడా ఫయిలయ్యింది. ఆ బిడ్డి పేరుతో ఎకరా వుండాదంట. అదీ నీలుగు. పెనుమూరును వాళ్లు జెప్పేది ‘సెకండ్‌ బాంబే’ అంట. ఆడ గూడా రేట్లే. ‘మా బిడ్డికి యాపై లచ్చిలు సొత్తిస్తుండాం గదా. వుజ్జోగస్తుడికైతేనే యిస్తాం.’ అని తేల్చేసే సరికి చెవులు జాడించుకుంటా వొచ్చేసింది. సొంత అందమ్ముడి కూతుర్ని అడిగితే, ‘‘నీకిది న్యాయమే గాదు. నా కూతురు ఎంబిఏ చదివి పూనేలో నెలకు ముప్పై వేల జీతం తీస్తా వుంటే అడిగే దానికి నీకు నోరెట్టా వొచ్చింది!’’ అనేసి చెల్లెలి మొకాన మసి పూసినాడు ఆ అందమ్ముడు. ఆ రోజే గడప దిగేసి, ‘‘చదువు తక్కవ కొడుకును కన్నానని ఎగతాళి జేస్తుండావు. చదువు లేకపోతే మాత్రం నీ కూతుర్నడిగే దానికి నాకు సొంతం లేదా? తనా మనా అని ఎంచినావా నువ్వు? ఎంసిఏ చదివిన బిడ్డిని నా కొడుక్కి సమ్మచ్చరం తిరిగేకంతా తెచ్చి తగలగట్టక పోతే అప్పుడడుగు. ప్రభాస్‌ మాదిరిగా వుంటాడు నా కొడుకు! వోడికేం తక్కవ!’’ అని సవాలేసేసి వొచ్చింది.

కౌసల్య అని తిరప్తిలో వొకామెకు పెండ్లి సమందాలు చూసే పనే. ఆమెకు గూడా కొడుక్కత చెప్తే ఆమె నవ్వింది చూడండీ. జమునాకైతే తలగిల్లి మొలేసినట్లయ్యింది. ‘వుజ్జోగం లేని మొగ పిలకాయల ప్రొఫైళ్లే నేను తీసుకోనకా!’ అని వొక్క మాటలో తేల్చేసింది. అందుకే పంతానికి పొయ్‌ వొక ప్లానేస్కోని, ఆ ప్లాను ప్రకారం పొయ్‌ కొడుకుని ఒక దోవలోకి తెచ్చి మళ్ల మాట్లాడదామని వుండాది ఆ కౌసల్యతో. ప్లాను ప్రకారం పోవాలనే అగో, యిప్పుడీ జాగాను అమ్మాలని చూస్తుండాది జమునా. డాక్టరు ఫోను నంబరు యిచ్చేసి పోయినా, జమునా అయితే చెయ్యనే లా. అయినా, యీ పొద్దే చేసినాడు గదా. డాక్టరుకు తుత్తర పట్టకపోతే అప్పుడడగండి. దేనికంటే అంత వందనంగా డాక్టరింగొక ప్లాటును చూళ్లేడు. యీ వూళ్లో బ్రోకరూ చూపించ లేడు. డాక్టరు ఏమిగా అనుకుంటా వుండాడో వొక మాటగా అడిగి చూద్దామని బ్రోకరుతో మాట వరసకు గూడా ఫోనుజేసి మాట్లాళ్లేదు. జమునాకు కనిపించేటట్టుగా రోజుకు పది తూర్లు ఆ బ్రోకరు తిరుగులాడతా వుండినా బెట్టుకు పోయి పలకరించను గూడా లేదు. ‘ఈ పొద్దు యీ మాదిరిగా డాక్టరు ఫోను చేసినాడు’ అని వొక మాటగా అడగదామా వొద్దా అని సెల్లు చేతిలో బెట్టుకోని కొంచేపు కొట్టుకులాడింది. ఎగీదిలోనే బ్రోకరు యిల్లు. అయినా యింటికి పోకుండా మిస్సుడు కాలిచ్చి చూసింది. నిమిసంలో తిరిగి చేసినాడు బ్రోకరు ఫోను. వాడి ఆత్రం చూసినారా! జమునా ఎట్టాంటిది? ‘ఏమబ్బా ఫోను చేస్తివి?’ అనడిగింది. ‘నీ మిస్సుడు కాల్‌ చూసి చేసినాన’నేసి బ్రోకరన్నాడు. ‘నీ నంబరు ఫీడ్డయ్యుండాది గదా. నేను వొంట జేస్తా సెల్లును అట్టా యిట్టా పెడతా, పడతా వుంటే నీ నంబరు నొక్కుకునుంటాది. నేనెప్పుడూ ఎవురికే గాని మిస్సుడు కాలియ్యను. మాట్లాడితే బిల్లు పడిపోతాదనే యీనపు బుద్ది నాకు లేదబ్బా!’ అనేసి టకిక్కున ఫోను పెట్టేసి నవ్వుకొనింది జమునా. మూడో నిమిసంలో యింటికొచ్చేసినాడు బ్రోకరు. ఇంగా నవ్వుకొనింది. ‘‘జమునమ్మా. అంకణం నలబై చెప్పిందానివి యింగొక నాలుగు లచ్చిలెగేసి కోటి జేసేసి – అక్కణ్ణే కుచ్చుంటే నువ్వు అనుకున్న పన్లు జరగవు. నువ్వు ఓకే జేస్తే ముప్పైకి సింగిల్‌ సెటిల్మెంటులో అవగొట్టేస్తా. స్పాట్టే. నానుడెవ్వారం లేదు. డాక్టరు దగ్గిర్నే టూ పర్సంటు తీస్కుంటా. నువ్వేమీ గూడా యివ్వొద్దులే చెప్పు జమునమ్మా!’’ అని డైరెక్టరుగా పాయింటులో కొచ్చేసినాడు. అడుక్కునే కొందికి ముడుక్కో గూడదని చెప్పి, ‘‘నాది మాటంటే మాటే మునసామీ! అంకణం ముప్పై అయిదు వేలు, స్పాటూ అయితేనే డాక్టర్‌కి ఫోన్‌ చెయ్‌. లేదంటే నా గడప దిగి పూడువు’’ అనేసింది జమునా. బ్రోకరు మునస్వామి మళ్ల వొక్కడుగు తాంచారం చెయ్యకుండా డాక్టరుకు ఫోను చేసేసినాడు. కాలుగెంటలో జమునా యింట్లో డాక్టరు తేలినాడు. ‘యిద్దురూ ముందే మాట్లాడుకున్నారా ఎట్ట? రామచంద్రాపురం కాడ డాక్టర్ను పెట్టేసి వొచ్చినాడా బ్రోకరు’ అని గూడా యోచన జేసి, ‘‘ఏం డాక్టర్‌ సార్‌. మీకు డాక్టరు పనికంటే యీ యాపారమే ఎక్కువగా వుండాదే!’’ అనింది. లోపల్లోపల – యింత తొందర పడి రాకుండా వుండాల్సిందే – అని అనుకున్నాడో ఏం నాశినమో గానీ, నవ్వతా గమ్మనుండి పొయ్‌నాడు డాక్టరు, ‘నాకు పల్లెటూళ్లంటే యిష్టిం’ అనేసి. ‘ఈ రోజు తెగితే తెగినట్టు. లేకుంటే నేను టవున్లోనే చూసుకుంటా’ అని గూడా అన్నాడు. జమునా గూడా లెక్కగా, ‘‘డాక్టర్‌ సార్‌, నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతా. మునస్వామీ, నువ్వు అడ్డం రాబాక. డాక్టర్‌ సార్‌, మీరు మాట్లాడాలంటే మాట్లాడండి. నేను అడ్డం రాను. యిందాకా మునస్వామితో చెప్పినట్టే మీతో గూడా చెప్తుండా. నా రేటు ముప్పై అయిదు వేలు. యిప్పుడు చెప్పండి, ఎవురు మాట్లాడాల్నో!’’ అని తుంచినట్టు మాట్లాడింది. ‘‘సొత్తు నీదమ్మా. నువ్వే మాట్లాడు.’’ అన్నాడు డాక్టరు. దీనికి చెప్పాల్సినవన్నీ చెప్పేసింది జమునా. ‘‘నేనీ పొద్దు పోగొట్టుకుంటా వుండా. మీరు సంపాదించుకుంటా వుండారు. ఎవురు గానీ చెడిపోగూడదు. మీకు అరగెంట టయిమిస్తా వుండా. యీ మిట్టూర్లోకి పొయ్‌ చూడండి – అంకణం ఇరై రెండు వేలు లేకుంటే అప్పుడొచ్చి అడగండి. మొన్న వూళ్లో డైవోరుగా పనిజేసేటాయన ఒక ఎకరా వుంటే గీతలు గీసి జాగాలేసినాడు. ముందర పదైదడుగుల రోడ్డు. ఇరై రెండు వేలకు కొనుక్కున్నారు, వూళ్లో వోళ్లు గూడా. నాది మెయిన్‌ రోడ్డు. ముప్పై అయిదు వేలే చెప్తుండా. యింక నేను నోరే తెరవను.’’ అనేసి అనింది. దీనికి బ్రోకర్‌ మునస్వామి గూడా, ‘‘సార్‌ మా జమునమ్మది మాటంటే మాటే. నసుగుడు ఎవ్వారాలు ఆమె దగ్గిర కుదరవు. మొకాన్నే మాట్లాడతాది.’’. – ఆమె వాటం చూసి డాక్టరు గూడా వొకటికి పది మాటలు మాట్లాడాలనుకోలేదు. నోరంతా తెరిచి వొకే మాటన్నాడు, ‘టోకనెంతిమ్మంటావు’ అనేసి. టోకను గీకను కుదరదనేసింది. ‘‘మీరు నెల గావాలంటే టయిం తీసుకోండి. డబ్బిక్కడ తెచ్చి పెట్టండి వొకే తూరి. నేనొచ్చి రాసిస్తా. జాగా నా పేరు మిందనే వుండాది. మీకు నమ్మకం లేకపోతే మా యింటాయనా, నా కొడుకూ, నా కూతురూ గూడా వొచ్చి సంతకాలు పెడతారు’’ అని కడ మాటగా చెప్పేసింది.

namini newడాక్టరూ, బ్రోకరు మునస్వామీ యీదిలోకి పొయ్‌ సిగరెట్లు తాగేసి, ‘‘ఏ పొద్దు అనుకొనింది ఆ పొద్దు అయిపోవాల. నీ మింద నమ్మకం లేక గాదమ్మా, నిన్ను నేను మెచ్చినా. నీ అంత నీతిమంతురాలు మాట మింద నిలబడే మనిసీ నాకు కనబళ్లేదనుకుంటుండా. నేను కర్నూలు మెడికల్‌ కాలేజీలో చదివినాను మెడిసిను. కానీ నేను వేస్టు. ఎంత వేస్టునంటే మొన్నటికి మొన్న మా నాయిన సాంవత్సరీకం జరిగినప్పుడు నేనెంత బాద పడినానో చెప్పలేను. మా నాయిన చచ్చిపోతే ఎక్కడ పూడ్చినామో తెలుసునా! అన్నపూర్ణమ్మ గుడి వుందే అక్కడుండే స్మశానంలో. మా నాయినను వేసిన గుంత మింద కుక్కలు తిరగలాడతా వుంటే ఏడుపొచ్చేసింది. నేనూ నా భార్యా యిద్దరం డాక్టర్లమే. గవర్నమెంటిచ్చిన జీతాల మీద బతికిన వాళ్లమే. మా పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్యేటట్టుగా చదివించుకున్నాం గానీ పరుగులెత్తి సంపాయించు కోలేక పోయినాం. యిప్పుడు మా అమ్మకు ఎనబై అయిదు నడుస్తుండాయి. ఒక మంచి చెట్టూచేమా నడమ మా అమ్మ చచ్చి పోంగానే – అక్కడ పూడ్చి పెట్టి దినామూ దండం పెట్టుకోవాలనే నేను నీ జాగాను చూసినా. నాకు నచ్చింది. నువ్వు చెప్పిన మాటల్ని నేను వినకపోతే నేను చెడిపోతాననిపించింది. మా అమ్మను గూడా ఆ నీచమైన చోటే పూడ్చాల్సొస్తాది. నువ్వు దయదలిచి ఆ జాగా యిస్తే అక్కడే యిల్లు కట్టుకోని, మా అమ్మ చని పోంగానే అక్కడ్నే వొక మూల పూడ్చిపెట్టి చిన్న సమాది కట్టుకోవాలనేది నా కోరిక. యీ పొద్దే రిజిస్టే్రషను పెట్టుకుందాము. నా భార్య అమౌంట్‌ తీస్కోని బయల్దేరింది గూడా’’ అనేసి కండ్లనీళ్లు పెట్టుకున్నంత పని చేసినాడు డాక్టరు.

ఒక మంచి మనిసికి జాగా యిచ్చిందుకు చానా సంతోసపడింది జమునా. జాగా యిచ్చినందుకు ఎనబై నాలుగు లచ్చలివ్వడమే గాక యిరవై వేలు బెట్టి వుంగరాన్ని గూడా తీసిచ్చినాడు, పాపం. అంతే, ఇంక జమునా వేసుకున్న ప్లాను ప్రకారం పోయింది. ముందు పది లచ్చల రూపాయల అప్పు తీర్చుకొనింది. మిగిలిన దాంట్లో నలపై అయిదు లచ్చిలు బెట్టి త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాటు తీసుకొని గృహ ప్రవేశం కూడా కానిచ్చేసింది. ఇరై లచ్చలు బెట్టి కేశవాయన గుంటలో సూపర్‌మార్కెట్‌ పెట్టించింది కొడుక్కి. అయిదు లచ్చలు బేంకీలో కట్టుకొనింది. అప్పుడిచ్చింది పెండ్లి సమందాలు జూసే కౌసల్య చేతికి కొడుకు ప్రొఫైల్‌, యిచ్చి, ‘‘చూడు కౌసల్యా. నా కొడుకు తిరప్తిలో త్రిబుల్‌ బెడ్‌ రూంలో కాపరం పెట్నాడు. సూపర్‌ మార్కెట్టు పెట్టి బిజినెస్‌ చేస్తుండాడు. వూళ్లో ఎకరా బూముండాది. ఏమి తక్కవ చెప్పు? బిటెక్కు చదివుంటే వొక బీదరాలినయినా చేసుకుంటాడు. ఆ బిడ్డి చదివుంటే చాలు. నా చదువు తక్కవ కొడుక్కి మంచి చదువు చదివుండే వొక పిల్లను చూసి పుణ్యం గట్టుకోనాయమ్మా!’’ అనే అనింది. పద్దినాల్లో కౌసల్య నుంచి, ‘‘జమునక్కా నిన్ను సర్‌ప్రైజ్‌ చేద్దారనీ అంతా ఫైనల్‌ అయినాక చెబ్దామనీ యీ రోజు చెప్తుండా. నువ్వు కోరిన కొండ మింద వాన కురిసింది పో. అమ్మాయి పుత్తూరు వెంకటపెరుమాళ్లులో ఇంజనీరింగు చేసింది మెకానికల్‌. అమర్రాజాలో యిరై అయిదు వేల జీతం తీస్తుండాది. అమెరికా సమందాలొచ్చినా బిడ్డ కండ్ల ముందరుండాలన్జెప్పేసి యియ్యలా,ఫస్టు ఫస్టు నేను మన పిలగాడి సమందం చెప్తే, ‘నువ్వు నోర్ముయ్యి, పది ఫయిలైనోడికి మేమేటికిస్తాము? మా అమ్మాయి వొప్పందం చదువుకోనుండాల, వుజ్జోగం జెయ్యాల’ అని యీడెగిరి ఆడ దూకినారు. నేనుండుకోని, ‘బలే చెప్పినార్లే. మా పిలగోడికేమి? త్రిబుల్‌ బెడ్రూమ్‌ – అదీ సొంతం, దాంట్లో కాపరం వుంటా, సూపర్‌ మార్కెట్‌ పెట్టుకోని బ్రమ్మాండంగా బిజినెస్సు చేస్తుండాడు. పిలగోడు ప్రభాస్‌ మాదిర్తో వుంటాడు. వుజ్జోగం జేస్తే వొచ్చేది జీతమే. అట్ట కేశవాయనగుంటకు బొయ్‌ చూసేసి రాబోండి, సూపర్‌ మార్కెట్టు ఎట్ట జరగతాదో’ అనేసి కన్వీనియన్స్‌ చేసినా. ఆ అమ్మాయి తండ్రి గూడా సూపర్‌ మార్కెట్‌ చూసి ఫలానా ఫలానా అని చెప్పకుండా పిలగోడితో మాట్లాడి దినానికి ముప్పైయ్యేలకు మించి జరగతా వుండాదని తెలుసుకున్నాడు. నాకు తెలవకుండానే వాళ్ల పిల్లను గూడా తీసక పొయ్‌ పిలగోణ్ణి చూపించినారు. ‘అబ్బాయి సూపర్‌గుండాడని’ అమ్మాయి గూడా గ్రీన్‌ సిగ్నలు యిచ్చేసింది. కడాకు నీకు చెప్పకనే ఆ పిల్ల తల్లీదండ్రీ పిలగోడితో మాట్లాడేసినారు గూడా. ‘మీరు పిల్లనిస్తే పైసా కట్నమొద్దు’ అని పిలగోడు గూడా చెప్పేసినాడు. ఇంగేమి? పండగ జేస్కో. పేరు బలాలు గూడా బాగొచ్చినాయంట. నువ్వు ‘వోకే’ అంటే పద్దినాల్లో మూర్తం. నేను అమ్మాయి గల్లోళ్ల దగ్గిర్నే పదివేలు తీసుకుంటాలే. నువ్వేమీ యియ్యొద్దు. నా మాట అపద్దమైతే నీ కొడుకు సెల్లుకు ఫోను చెయ్‌, గెంటసేపు బిజీ రాకపోతే అప్పుడడుగు. పిలగోడు అమర్రాజా పిల్లతో వో అని మాట్లాడతా వుంటాడు. మొన్నెప్పుడో అపార్ట్‌మెంటుగ్గూడా వొచ్చి పొయ్యిందంట. ఇంగ నీదీ, నీ మొగుడిదే ఆలీసం. నీ కొడుకే నాకు ఫోను జేసి నీకు చెయ్యమన్నాడు. ఫోనులో చాల్నా? మిట్టూరొచ్చి పొమ్మంటావా? చదువు తక్కవ కొడుక్కి వుజ్జోగస్తురాల్ని తెచ్చినా నువ్వు కన్వీనియన్స్‌ కాకపోతే అది నీ కరమ్మ. ఏ సంగతీ రేత్రికి ఫోను చేసి చెప్పు’’ అని ఫోను పెట్టేసింది.

రేత్రి దాకా దేనికి, అప్పుటికప్పుడే ఫోను చేసింది జమునా – డబుల్‌ రైట్‌గా కన్వీనియన్స్‌ అయినాము అని చెప్పేదానికి!

 

*****

చిత్రం: భవాని ఫణి 

 

చుక్కల తాకిన చేతులు

 

 

Krishna Chaitanya Allamఉండాలా వద్దా అన్నట్టు పరధ్యానంలో ఏదో ఆలోచిస్తూ ‘లేక్ ఎలిజబెత్’ మీద పాలి పోయి ఉన్నడు సూర్యుడు. అస్తమించే సూర్యుని మనోభావాలను అంచనా వేసుకుంటూ ఈవినింగ్ వాక్ చేస్తున్నడు యాదగిరి. అక్కడక్కడ కొన్ని సీగల్స్ లేక్ దగ్గర్ల ఎగుర్తున్నయ్. జనాలు తమకు వీలుగా ఇండ్లనుండి పార్కుకు వస్తున్నరు. దూరంగ ఎక్కన్నో పోలీస్ కారు సైరన్ వినిపిస్తున్నది. క్రికెట్స్ కీకిరి కీకిరి చప్పుడు చేస్తున్నయ్. ప్రోటీన్ షేక్స్ చేత పట్టుకుని పిజ్జాలు కరగ దీస్తున్నరు కొందరు జాగర్స్. ఇవేమీ పట్టించుకోని కొన్ని పిచ్చి చెట్లు జాగింగ్ పాత్ కి అటూ ఇటూ మొలిచి కేర్లెస్ గ ఊగుతూ రెక్లెస్ గా వాటికవే మాట్లాడుకుంటున్నయ్.

పేరుకైతె అది పార్క్ కని అందుల స్మశానం లాంటి భయంకరమైన నిశ్శబ్దం ఎదో దాక్కుని ఉన్నట్టు అనిపిస్తది యాదగిరికి. ఆ ఫీలింగ్ సంతృప్తి ఇస్తదని కాదు కానీ అందులో ప్రశాంతతను వెతుక్కోవడం ఇష్టం తనకు. వాస్తవానికి పార్కంత పిల్లలూ పెద్దలతో సందడి సందడిగ కనిపిస్తుంటదికనీ ఆ దృశ్యాలు యాదగిరి కండ్లదాకా మాత్రమే పోగలవు, వాటిని దాటి మెదడులోకి చేరి మనసులోకి దూరాలంటే అంత ఈసీ కాదు. అతను మనసు చుట్టూ ఒక ఫైర్ వాల్ కట్టుకున్నడు. దాన్ని దాటి లోపలికి పోయే విషయాలు సంఘటనలు చాలా తక్కువ. ఎవరి కోసం కుడ అంత సునాయాసంగ తన మనశ్శాంతిని వృధా చెయ్యడు యాదగిరి.

పెళ్ళయి ఇరవై ఐదు వసంతాలు ఆ రోజుతోని. పొద్దున డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన గొడవ మతికస్తున్నది. ఇవాళ పెల్లిరోజని గుర్తున్నది కని ఏదో చేస్కోవాలన్న ఆసక్తి గాని పట్టింపు గానీ లేదు. మర్చిపోయిండని కమలకి కోపం వచ్చింది. పోద్దట్నుంది ఎదో నస పెడుతనే ఉన్నది. పార్క్ దగ్గర మనశ్శాంతి వెతుక్కుందామని ఇటు వచ్చిండు. నిర్భేధ్యమైన తన గుండె గోడలలో ఆ పట్టింపుల ప్రమేయాలు పాత్రలు ఎంత చిన్నవని ఆలోచిస్తున్నడు. కొత్తగా మొదలయిన సంబంధం కాదు, అలవాటయిందే కానీ ఈ రోజు ఎదో కొత్త అసహనం, కొత్త వెలితి.

ఆరు కావస్తున్నది. కోందరుపిల్లలు జారుడు బండలమీద జారుతున్నరు, ఇంకొందరు ఉయ్యాల ఊగుతున్నరు. అవి దొరకని వాళ్లు పక్కకు నిల్చోని తమవంతుకోసం చూస్తున్నరు. ఇద్దరు పిల్లలు తనకు. రాముడు వాషింగ్టన్ లో ‘లా’ చదువుతున్నడు. లక్ష్మణుడు న్యూయార్క్ ల గిటారు గోకుతుంటడు. ఏదైతే ఏమి డబ్బుల కోసం దగ్గరికి రాకుంటే చాలు అనుకుంటడు. ఇవాల అమ్మా నానల హ్యాపీ మ్యారేజ్ డే అని వాళ్లకి గుర్తులేదు. ఫోన్ చెయ్యలేదు. పిల్లలని గుర్తు తెచ్చుకొని పొద్దున కమల కళ్ళలో నీళ్ళు తిరుగుడు గమనించిండు కని కమలని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోతయని తెలిసినవాడు. నిజాన్ని ఒప్పుకొని నిజంతో కలిసిపొయి బతకగలిగిన వాడు.

ఆ అపారమైన స్వీయ కేంద్రీకృత పరధ్యానపు ప్రశాంతతలో, ఆ స్మశాన నిశ్శబ్ద విశేషాన్ని తన వైరాగ్యంతో కలిపి నడుస్తుండగా నిశ్శబ్దాన్ని పటాపంచెలు చేస్తూ ఒక గొంతు- “హాయ్ అంకుల్…” అని పిలిచింది. చూస్తే ఉయ్యాల దగ్గర గీత, ఆమె బిడ్డ సోనీ కనిపించారు. తమ స్ట్రీట్ లోనే ఉంటరు వాళ్లు కూడ. కమ్యూనిటీ ఈవెంట్స్ లో గీత, సోనీ తరచుగా కనిపిస్తుంటారు. గీత సింగిల్ మదర్. స్వతంత్ర భావాలు కలిగిన పిల్ల. ముప్పై ముప్పైరెండేండ్లు ఉండొచ్చు. సంసారం సరిగ సాగక విడాకులు తీసుకొని ఉండచ్చు. అంతే, అంతకు మించి ఎక్కువ  తను అడగలే. ఆమె చెప్పలే. వివరాలు తనకవసరం లేదు. ఇన్నేళ్ళ అమెరికా జీవితం స్పందన లేని గంభీరమైన జీవనవిధానాన్ని అలవాటు చేసింది కావచ్చు. వాళ్ళు చూడకుంటే తల తిప్పుకుని పొయేవాడె. తరచుగా మొహాలు చూస్కునే వాళ్ళం.. తప్పదని దగ్గరకు పోయిండు..

“హలో అంకుల్, హౌ ఆర్ యు?” గీత గ్రీట్ చేసింది

“హాయ్ గీతా”

“మమ్మీ ఐ వానా ప్లే విత్ గిరి అంకుల్.. ” ఈ మనిషిలో ఎం చూసిందో ఏమో గానీ గిరి అంకుల్తో ఆడుకునుడంటే అంటే ఇష్టం పిల్లదానికి.

“ఓకే సోనీ గో అండ్ ప్లే” అని సోనీ భుజమ్మీద చెయ్యి తీస్తూ “షీ లవ్స్ యు అంకుల్ ” అంది గీత.

“యా ఐ నో..” పైకి నవ్విండు కని ఎంత సేపుండాల్నో ఏందో అని లోపల్లోపలనే విసుక్కున్నడు.

“అంకుల్ కెన్ యు హెల్ప్ మీ అవుట్ హియర్?” ఊగి ఊగి బోర్ కొట్టి వెల్లిపోయిండు తెల్ల పిల్లడు. సోనీ నంబర్ వచ్చింది. ఉయ్యాల ఊపమని అడుగుతున్నది.

సరే అని ఉయ్యాల ఊపుతున్నడు.

“సోనీ, ఐ విల్ బి బాక్ ఇన్ ఫ్యు మినట్స్ ఒకే?”

“ఓకే మామి.”

“ఐ యాం గోన గో యూస్ ద రెస్ట్ రూమ్ అంకుల్. ఐ విల్ బి బాక్ ఇన్ అ బిట్” గీత సోనిని యాదగిరికి వదిలేసి పోయింది.

“స్యుర్, నో ప్రాబ్లెం.”

యాదగిరి ఉయ్యాల ఊపుతున్నాడు. సోనీ తలను వెనక్కి వాల్చి, కాళ్లను ముందుకు చాపి ఉయ్యాల ఊగుతూ,  ఆకాశాన్ని చూస్తూ “అయాం ఫ్లయింగ్ అంకుల్.. సీ.. అయాం ఫ్లయింగ్” అని సంబరంగా అరుస్తోంది.

యాదగిరికి ఆ మాటలు వినపడలే, పిల్ల సంబరం కనపళ్ళే. గీత పోతున్న దిక్కే చూస్తూ ఎదో ఆలోచిస్తున్నడు. ‘ఎట్ల ఉంటది ఈ పిల్ల ఒక్కతే? ఈ మహా నగరంలో ఒంటరితనం బయం అనిపించదా? ఏం పిల్లలో ఏమో. సర్దుకుపోయే గుణమే ఉండది వీళ్ళకు. ఎంతైనా అందరూ మన లాగా చంచల మనస్తత్వంతో ఉండరు కద. అసలు మనుషులందరూ తనలాగానే ఎవరి పని వాళ్ళు చూస్కొని ఎవరి గోలలో వాళ్ళుంటే బాగుంటది కదా.’

తను ఉయ్యాల ఊపుతున్నడు స్పీడ్ గా. ఇంకొంచం స్పీడ్ గా. స్పీడ్… ఇంకా.. ఇంకా.. ఇంకా.. ఊపుతనే ఉన్నడు. పిల్లదానికి కళ్ళు తిరిగినయేమో పాపం.

“స్టాప్ ఇట్ అంకుల్ ఐ యాం డిజీ” అన్నది సోని.

జీవిత సత్యాలన్నీ అదే టైం ల ఆలోచిస్తున్నడు యాదగిరి. ఆ మాలోకపు ప్రపంచంలో పిల్లదాని మాటలు ఎక్కడనో కొట్టుకు పోయినై. మాటలు చెవుల నుండి మెదడు దాక పోలే. ఆ స్పీడ్ కు సోని కింద పడ్డది. అట్లనే చూస్తున్నడు కని కనీసం లేపే ప్రయత్నం కుడ చేయలే. మాలోకం మనిషి కదా లోకంలకు రావడానికి కొంచెం టైం పడతది.

పిల్లదానికి పట్టలేని కోపం వచ్చింది. ఇంగ్లీష్లో ఎడా పెడా తిడుతుంది. డోనట్లు, కాండీలు అది ఇది అని పొద్దంత పది రకాలుగ షుగర్ తింటూ ఉంటరు వాళ్ళు. అత్యుత్సాహం, అతి ఆనందం, అతి ఆవేశం, అతి కోపం ఉంటై వాళ్లకు. బుడంకాయ అంత పిల్లది చెట్టంత మనిషిని పట్టుకుని అందరి ముందర నానా మాటలంటుంటే యాదగిరికి అవమానం అనిపించింది. సోనీకి ఎం మాట్లాడాలో, ఎం మాట్లాడ వద్దో మర్యాద నేర్పుతున్నడు.

అపుడే వచ్చిన గీత బిక్క మొహం వేసుకున్న కూతుర్ని, కూతురికి మర్యాద నేర్పుతున్న యాదగిరిని చూసింది. అమ్మని చూడంగనే కూతురు ఏడుపు మొదలు పెట్టింది.

“ఆర్ యు హర్ట్ సోనీ” కూతుర్ని దగ్గరకు తీస్కోని ముద్దు పెట్టి బుదరకిస్తున్నది గీత.

“అదేందంకుల్  పిల్లలు అన్నంక అల్లరి చేస్తరు, మరీ అంత కోపమైతే ఎట్ల?”

“సారీ గీతా.. ఐ డిడ్ నాట్ మీన్ దట్.. ఎదో ఆలోచిస్తూ.. ఐ వాస్ లాస్ట్ ఫర్ అ బిట్ దేర్ అండ్ లాస్ట్ మై కంట్రోల్”

“బట్ షి ఈస్ లర్నింగ్ బాడ్ వర్డ్స్, యు షుడ్ వాచ్ ఆన్ దట్” మళ్ళీ తనే స్కూల్ టీచర్ కి కంప్లైంటు ఇచ్చే పిల్లాడి లాగా చెప్పిండు.

“డిడ్ యు సే బాడ్ వర్డ్స్ టు గిరి అంకుల్? సే సారి టు గిరి అంకుల్”

“సారి అంకుల్”

“ఐ యాం సారీ టూ సోనీ. ఇట్ వాస్ మై ఫాల్ట్” అంతకు మించి కంఫర్ట్ ఎట్లా చేయాలనో తెలవదు తనకు.

“లెట్స్ గో ఫర్ ఐస్ క్రీం సోనీ, వాట్ డు యు సే?” ఇంకో షుగర్ వేరియంట్ ఆఫర్ చేసిండు.

“నో . ఐ వాన ప్లేయ్ ట్రెజర్ హంట్. లెట్స్ ప్లే ట్రెజర్ హంట్.”

Kadha-Saranga-2-300x268

“వి విల్ ప్లేయ్ టుమారో ఓకే సోనీ?” యాదగిరి నచ్చ చెప్పిండు.

“నో ఐ వాన ప్లేయ్ ఇట్ నౌ. మామి అండ్ మీ ప్లేయ్ ఇట్ హియర్ ఎట్ ద లేక్ ఎవరీ డే” పిల్లది ఎదో చెపుతుంది.

“ఇట్స్ వెరీ లేట్ సోనీ, వి విల్ ప్లేయ్ టుమారో, ఒకే” వాళ్ళ మమ్మీ చెప్పంగనే ఒకే అన్నది పిల్లది.

మన దగ్గర ఐతే ఒక్కటి వేసేవాళ్ళు. ఇక్కడ ఎంత బతిమాలి, నచ్చ చెప్పి ఒప్పిస్తరో పిల్లల్ని. పిల్లల ఎమోషన్స్ కూడా గుర్తించి వాటికి విలువిస్తారో, లేదంటే ఇక్కడి రూల్స్ కి భయపడో తెలవదు కానీ, పిల్లలు మాట విన్నపుడు ముచ్చటగా ఉంటది. గీత అంటే ఎంత ప్రేమో పిల్లదానికి గీత ఎంత చెప్తే అంత దానికి. తన పిల్లల బాధ్యత దాదాపుగ కమలే చూసుకునేది. ఎంత ఒపికనో కమలకు అని మళ్ళీ ఆలోచనలో పడ్డడు యాదగిరి.

“సోనీ గో ప్లేయ్ విత్ కెన్ని.” గీత చెప్పంగానే సోనీ తెల్ల పిల్లడితో ఆడుకోడానికి పోయింది.

“ఆర్ యు ఓకే అంకుల్? యు సీమ్ వెరీ ఆఫ్ టుడే” గీత అడిగింది.

“ఎం లేదు గీతా. ఇంట్లో ఏవో గొడవలు. రోజు ఉండేవే, ఇవాళ పెళ్లి రోజు. నేను పండగలు చేస్కునే మనిషిని కాను. ఉంటాయ్ లె ఇంకా అవీ ఇవీ…”

“ఆంటీ కోసం అయినా కనీసం చిన్నగ చేస్కోవచ్చు కదా. ప్రతీ సారీ అన్నీ మనకు నచ్చినంటే ఉండాలంటే ఉండవు కద.”

“ఇంకో పెళ్లి చేస్కొని ఇరవయ్ ఏళ్ళ తరవాత చెప్పు ఇదే మాట”.. ఎక్కువ మాట్లాడానా అనుకున్నాడు.

“ఇప్పట్లో ఇంకో పెళ్లి ఆలోచన అయితే లేదంకుల్. బయట పని, ఇంట్లో పని, సోని. ప్రస్తుతానికి ఇదే జీవితం.” నవ్వుకుంటనే చెప్పింది.

గీత మోహంలో వీసమెత్తు నిర్వేదం లేదు. ప్రతీ రోజూ తమని తాము సంతోషంగా ఉంచుకునుడు ఎంత పెద్ద పని. ఎంత కష్టమైన పని.

“సోనీ నీ దగ్గరే ఉంటదా?”

“యా అంకుల్ హాల్ఫ్ వీక్ నాదగ్గర, హాల్ఫ్ వీక్ ఆయన దగ్గర.. వీకెండ్స్ వీలుని బట్టి ఎవరో ఒకరం…

“ఓహ్.. ఓకే”

“బాగుంది నీ పని, పెళ్లి చేస్కొని కలిసుండి పెద్దగా నేను సాధించింది కూడా ఎమీ లేదు, ఇద్దరు కొడుకుల్ని కనుడు తప్ప” నిర్వేదానికి ప్రతినిధిలాగ చెప్పిండు యాదగిరి.

“అట్ల ఎందుకు అంకుల్, ఏ కాంప్లికేషన్స్ లేకుండా సాఫీ గ జీవితం నడవడం కుడ చాలా అదృష్టం. అందరికీ దొరకదు. ఓల్డ్ స్కూల్ మారేజీ, సొంతగా బతికే కొడుకులు, పెద్దగా బాధ్యతలు లేని ఉల్లాసమైన జీవితం. ఎంత మంది మిమ్మల్ని చూసి జెలస్ అయితరో” నవ్వుకుంటనే చెప్తుంది.

“అవునా, ఐతే మనం ప్లేసులు మార్చుకుందాం. కమలని నువ్వు చూస్కో, సోనీ ని నాకిచ్చేయ్. ఏమంటవ్?”

గీత చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నది. టాపిక్ చేంజ్ చేయాలని అర్ధం అయింది యాదగిరికి.

“అవునూ, రోజూ ట్రెషర్ హంట్ ఆడతరు అన్నది సోనీ. ఎం ట్రెషర్ హంట్ ఆడతారు. ఎక్కడ?”

“ఇక్కడనే ఆడతం అంకుల్.”

“ఎం ట్రెషర్ వెతుకుతరు.”

“రోజూ ఎదో చాక్లెట్ తీస్క వచ్చి దాచి పెడత, సోనీకి ఈసిగా దొరికేటట్టు.”

“మరి నువ్వేం హంట్ చేస్తావ్?”

గీత వెంటనే బదులియ్యలేదు.  ముఖ కవళికల్లో చిన్న తేడా స్పష్టంగా కనపడుతుంది. కిందికి చూస్తూ బీరిపోయింది. ఎదో ఉంది తన లోపల అనిపించింది.

“చాలా ఏళ్ళుగా హంట్ చేస్తున్న అంకుల్ దొరుకుతలేదు, ఎప్పుడో ఎక్కడో పోయింది. ఇక్కన్నే ఉన్నట్టు అనిపిస్తుంది” గీత గొంతుల ఇప్పటి దాక కనిపించిన నవ్వు లేదు. తల పైకెత్తకుండానే బదులిచ్చింది.

ఎదో ఆలోచనలో ఉంది.

“సారీ.. ఎం అనుకోవద్దు. ఏదైనా అడగరానిది అడిగితె.” యాదగిరికి ఎట్ల రియాక్ట్ కావాలనో అర్ధం కాలే.

“అయ్యో అదేం లేదంకుల్. చెప్పడానికి నాకేం ప్రాబ్లెం లేదు. మీకు వినే ఓపిక, తీరిక ఉంటె చెప్తా.” గీత మొహంలో మళ్ళీ చిన్న నవ్వు ప్రత్యక్షమయింది.

ఇప్పుడు ఉన్నపళంగ ఇంటికెళ్ళి చేసేదేం లేదు కదా అని  “సరే చెప్పు గీత, ఎం వెతుకుతున్నవ్” అన్నడు యాదగిరి.

అతను చెరువునే చూస్తూ ఆమె చెప్పేది వింటున్నడు..  గీత కూడా చెరువునే చూస్తుంది..

గీత ఎప్పటిదో స్వగతం ఎదో చెప్పడం మొదలు పెట్టింది.

***

“మా ఊరి పేరు రాగుల పల్లె. మా ఊరికి చివర చిన్న చెరువు ఉండేది. రాగుల చెరువు అనేవాళ్ళు. దాని పక్కన్నే ఏళ్ళనాటి గుడి ఒకటి ఉండేది. చెరువు చుట్టూ అనేకరకాల చెట్లు. పెద్ద పెద్ద వేపచెట్లూ, నాలుగైదు కొబ్బరి చెట్లూ, గట్టున గుడి చుట్టూ రకరకాల పూల చెట్లూ బంతిపూలూ, మందారాలూ, పారిజాతం చెట్టూ, పేద్ద బొడ్డుమల్లె చెట్లూ. రెండు జామ చెట్లూ, ఒక దానిమ్మ చెట్టు. రేగు చెట్లు, సీతాఫలాలూ.. ఎవ్వెవో చెట్లూ గుడి చుట్టూ చెరువు గట్టూ చుట్టూ అనేకం ఉండేవి. చెరువు నిండా కలువ పూలు.. గట్టు మీద నుంచి రాలిన పూలు, వేప పూతా, చెరువుల కలువలు అన్నీ కలిపి నీళ్ళ మీద చుక్కలు పరిచినట్టు అనిపించేది వాటిని చూస్తుంటే.” గీత బాల్యపు స్మృతిలో లీనమై చెపుతూ ఉంది.

“ఇంకా గుడి వెనక ఒక పెద్ద రావి చెట్టు ఉండేది.”

“ఆ చెట్టు మీద దయ్యం ఉండేది అంతే కదా?” అంతా తెలుసనే తన తత్త్వం ప్రదర్శించిండు యాదగిరి.

“హహహ.. దయ్యం లేదు ఎం లేదు. చెట్టు ఊరికేనే ఉండేది అంతే. మంచి చెట్టు” గీత నవ్వుకుంట చెప్పింది.

“ఓ సరే సరే కంటిన్యూ చెయ్.”

“ఊర్లో ముగ్గురు పిల్లలు. అంటే ముగ్గురే పిల్లలని కాదు. ఈ కథకు సంబంధం ఉన్న ఒక ముగ్గురు పిల్లలు అన్నమాట.  మేమే ఆ ముగ్గురం.  నేను, శంకర్, ఇంకా మా సయ్యద్. సయ్యద్ మా ఇంటి పక్కన ఉంటుండే. నాకంటే రెండేళ్ళు చిన్న. అక్కా అక్కా అనుకుంటు ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండేవాడు. శంకర్ మా ముగ్గురిలో పెద్ద. మాకు దూరపు చుట్టం. వరసకు నాకు బావ. మేం ముగ్గురం ఒక టీం. కలిసి ఆడుకునే వాళ్ళం..”

“బడి అయిపోగానే చెట్టు దగ్గర తెలేవాళ్ళం ముగ్గురం. రావి చెట్టు కొమ్మొకటి గుడి మీది దాకా పాకి ఉండేది. ఆ కొమ్మ మీదినుండీ ముగ్గురం ఆ చెట్టెక్కి చెరువునూ చూస్తూ ఏవో ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం .. చీకటైతె  పాములు తిరుగుతాయ్ అని ఒంటరిగా గుడి దగ్గరికి పోవద్దని చెప్పేవాళ్ళు.  సాయంత్రం అయేసరికి ఆ కొంత నిర్మానుష్యంగా ఉండేది. కానీ మాకు అలవాటైన పరిసరాలు కాబట్టి భయం ఉండక పోయేది..”

“చెట్టెక్కడం మాకు నిత్య కృత్యం.  ఆ కొమ్మ మీద నుండి చూస్తె సూర్యాస్తమయం ఒక వర్ణనాతీతమైన దృశ్యం. వర్షం పడ్డప్పుడు ఐతే ఒక్కొక్క చినుకూ నీళ్ళని తాకుతున్నపుడు చిందర వందరగా ఏర్పడే చిన్న చిన్న అలల సమాహారం తేలుతున్న పూలతో కలిసి ఆటలాడుకున్నట్టు, తడిసిన పూలన్నీ చుక్కలై నవ్వుతున్నట్టు. వర్షపు సాయంత్రాలనెన్నో మూటలు కట్టుకున్న గురుతులు..”

ఒక రోజు రాత్రి ఇదే దాదాపు ఇదే టైముకు చెట్టు కొమ్మ మీద ముగ్గురం కూచొని చెరువులో నక్షత్రాల మిణుకుల్ని చూస్తూ ముచ్చట పెడుతున్నం.”

“రాగుల చెరువు అని ఎందుకు అంటార్రా దీన్ని?” సయ్యద్ అడిగిండు శంకర్ ని. వయసులో పెద్దయినా కలిసి పెరుగుడు తోటి శంకర్ని రా అనే చనువు, నన్ను రావే, పోవే అనే చనువు ఉంది వాడికి. ఉందంటే వాడే తీస్కున్నడు.

“ఏం లేదురా, అప్పట్ల గుడికి వచ్చినోల్లంతా ఈ చెరువుల పైసలు వేసేటోళ్ళు. ఇందుల పైసలేసి  మొక్కుకుంటె మంచి అయితదని అప్పట్ల నమ్ముతుండె.”.. శంకర్ అన్నడు..

“పైసలేస్తె పైసల చెర్వనాలెగని రాగుల చెరువనెందుకంటర్రా?”

“అంటే, ఆప్పట్ల అన్ని రాగి పైసలే ఉంటుండె కదరా అందుకే..”

“దగ్గర పైసలు లేనపుడు దగ్గర ఏ రాగి వస్తువు ఉన్నా చెరువులో వేసి మొక్కుకునేవాల్లట.. రాగి చెంబులూ పళ్ళాలు గ్లాసులు” నేన్ చెప్పిన..

“మరి రాగి పైసలు లేని కాలంల బంగారం, వెండి పైసలు ఉండేటివి కద. అవి కూడా అందులేసి ఉంటారంటవారా?” అని సయ్యద్ అడగంగనే వీడిప్పుడు ఎదో మొదలు పెడతడు అని చిన్న కంగారు మొదలయింది నాకు.

“ఏమోరా ఉండొచ్చు. ఉండక పోవచ్చు. ఎవరికి తెలుసు.” శంకర్ అన్నడు.

“రాగియి వేస్తెనే మంచిగైతదన్నప్పుడు ఇంక బంగారం వెండియేస్తే ఇంకెంత మంచి గావాలె చెప్పు? ఎవడో ఒకడు నా లాంటోడు ఏశే ఉంటర్రా బంగారాలు కూడా.. “

“వేస్తె వేసి ఉండొచ్చు కానీ ఇంక ఇప్పటిదాక ఉంటయారా అవన్నీ! ఏం ఉండయీ.. ఒకవేళ ఉన్నాగానీ అప్పుడెపుడో వేసినయి కాబట్టి ఈపాటికి ఎప్పుడో లోపటికి మట్టిలకు పొయ్యి ఉంటాయ్. భూమి మధ్యల దాంక కూడ పోవచ్చు” నేను చెప్పిన.

“ఏదన్నా ఒక్క బంగారు బిళ్ళ దొరకదంటావానే” సయ్యద్ అడిగిండు.

వాళ్ళ అబ్బా కుట్టు మిషన్ కుడతడు. పేద కుటుంబం. ఊళ్ళో ఎంత మంది రోజూ బట్టలు కుట్టిస్తరు. వాడి ఆశ వెనుక ఏముందో మాకు అర్తమైతుంది. కానీ వానితోని ఇంక ఆ టాపిక్ సగదీస్తే వాడేం చేస్తడో మాకు తెల్సు కాబట్టి ఇంక ఆ టాపిక్ అక్కడికి కట్ చేసి-

“ఇప్పటికే బాగా పొద్దు పోయింది కని ఇంటికి పోదాం పద..” అని తొందర పెట్టిన.

ముగ్గురం ఇంటికి నడుస్తున్నం కాని వాని మనసంతా బంగారు బిల్లల మీదనే ఉందని మా ఇద్దరికి తెలుస్తోంది.

***

కొన్ని రోజులకు అంతా మర్చిపోయినం. బడి, గుడి, ఆటలు, పాటలు. ఎన్నో డిస్ట్రాక్షన్స్ కదా పిల్లలకు..

ఒక రోజు తుఫాను లాంటి వాన. రెండు మూడు రోజులు ఆపకుండ కురుస్తనే ఉన్నది. ఊరు ఊరంతా చెరువయ్యి, బురదయ్యింది. మాకు బడి బందయ్యింది. వర్షం పడ్డపుడు చెరువు చేపలతోని, గట్టు కప్ప పిల్లలతోని నిండిపోతది. ఎక్కన్నించి వస్తయో ఏమో, ఆకాశం నుండి పడుతయనుకునేది మేమైతె!

“అక్కా అక్కా .. ” పొద్దున్నే సయ్యద్ తలుపు కొడుతున్నడు.

“చెరువు దగ్గరికి పోయి చేపలు పట్టుకుందాం పా” గాలం తో సహా ప్రత్యక్షమయిండు వాడు.

“బయట మొత్తం బురద బురద ఉన్నది రా, నేను రాను. కావాల్నంటె రేపు పోదాం..”

“సరే నువ్వుండు. నేను, శంకర్ పోయ్యోస్తం”. అని నేను వద్దని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెల్లిపోయిండు శంకర్ దగ్గరికి.

మళ్ల సాయంత్రం ఆరింటికి ఇద్దరుకలిసి ఇంటికి వచ్చిన్లు. చేతుల్లో చాపలు లెవ్వు!

“గీతా, తొందరగా రావే, బయటకు పోదాం” సయ్యద్ అన్నడు. వాని మొకం వెలిగిపోతున్నది.

“ఎక్కడికి రా?”

“చెప్తగని ముందు చెప్పులేస్కోని రా..”

“అమ్మా ఇప్పుడే సయ్యద్ వాళ్ళింటికి పోయ్యస్తనే”, అమ్మకు చెప్పి బయటికి పోయిన వాల్లతోని.

“నాకు అర్ధమయింది వాళ్ళు చెరువు దగ్గరికే తీస్కపోతున్నరని.

“నీకోటి చూపిస్త అక్క, ఎవ్వరికి చెప్పద్దు. సరేనా?”.. సయ్యద్ కి ఆత్రుత ఎక్కువ.

“సరే రా ఎవ్వరికి చెప్ప, చూపెట్టు..”

“ఒట్టు?”

“ఒట్టు!”

“సరే చేట్టేక్కుదాం పద.. చెట్టు మీదనే ఉన్నది.”

“ముగ్గురం చెట్టెక్కి ఎప్పుడు కూచునే కొమ్మ మీద కూచున్నం..”

“అరేయ్ నువ్వు తీస్కరార.”. శంకర్ సయ్యద్ ని ఎదో తీస్కోని రమ్మన్నడు.

వాడు చెట్టు మీదికి ఎక్కిండు. అక్కడొక చిన్న తొర్ర చెట్టుకి. అందుల నుండి ఎదో వస్తువు తీస్కున్నడు. నాకు కనపడకుండా వెనకకు పెట్టుకొని తీస్క వచ్చిండు వాడు.

“అక్కా నువ్ కండ్లు మూస్కోవే”

“ఊ..” నేను కండ్లు మూసుకున్న..

“చెయ్ పట్టు..”

“ఊ..”

ఎదో బరువైన వస్తువు చేతుల పెట్టిండు వాడు.

కళ్ళు తెరిచి చూస్తె, అది ఒక కత్తి. చూస్తె చాన పాతదాని లాగ ఉన్నది.

“ఎక్కడిది రా ఇది?”

“పొద్దున చేపలు పట్టడానికి పోదామంటె శంకర్ కూడ రానన్నడు, అందుకే నేనొక్కన్నే వచ్చిన. ఒక్క చేప కూడా పల్లేదు. ఇంటికి పోదాం అనుకునే లోపల గాలానికి ఇది తలిగింది.” అన్నడు కత్తిని చూస్తూ. వాని మొకం ఇంకా వెలుగుతనే ఉన్నది.

“బంగారమే అంటావానే ఇది?” శంకర్ అడిగిండు.

“ఏమ్మో రా? ఇత్తడి కూడ ఇట్లనే ఉంటది కద?” అన్నా నేను. సయ్యద్ గాడి మొహం వాడి పోయింది.

“బంగారం కుడా కావచ్చు” చేసిన తప్పుని వెంటనే సరిదిద్దుకున్న. మళ్ళి వెలిగిపోయింది వాడి మొహం.

“ఇంకా అందులో ఏమేం ఉన్నాయో కదరా?” శంకర్ అడిగాడు.

“ఏముంటే ఎందుకు. అది చాలా లోతు. ఇది దొరికింది కదా చాలు.”. నేనన్నా.

“సరేరా మీ అబ్బాకు చూపించు. ఆయనకు ఎమన్నా తెల్సేమో..” శంకర్ అన్నడు.

“ఇప్పుడద్దుగని. రంజాన్ ఉంది కదా వచ్చే నెల అప్పుడు చూపిస్త.”

“ఇది బంగారం ఐతే ఎం చేస్తావ్ రా..” అడిగిన నేను.

“ఒక పేద్ద విమానం కొనుక్కుంట. ఇంకా మా అబ్బాకు మంచి కుట్టు మిషన్ కొనిస్త. ఒక పెద్ద బంగాళా కట్టిస్త. అప్పుడు మీరే మా ఇంటికి వస్తరు. మా అమ్మికి..  ” వాడు చెపుతూనే ఉన్నడు చీకటి పడే దాకా.

రాత్రైంది అంతలోనే. కొంచెం చీకటి పడ్డప్పుడు గుడి మీద నుండి చూస్తె చెరువులో చుక్కలు తేలేవి. చెరువు చుక్కలని ఒదిమి పట్టుకునేది. చందమామని, కలువల్ని ఒక్క దగ్గర చేర్చి వెన్నెల రాత్రులని పిల్లలకు కానుకలిచ్చేది. ఒక పువ్వు రాలినపుడు నీల్లలో చిన్న రిపుల్. పూల రంగులన్నీ రాత్రికి మాయమై హై కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ సీనరీ ఒకటి ప్రత్యక్షమయ్యేది. ఆ వెలుగు జిలుగుల దృశ్యం ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో కనిపిస్తది. సయ్యద్ ని చూస్తుంటే నాకూ ఆనందంగా ఉండే. ఎదో మాట్లాడుతూ చాలా సేపు అక్కన్నే ఉన్నం. కాలం కాసేపు అక్కన్నే ఆగినట్టు ఉండే. శంకర్ మాత్రం ఎందుకో మౌనం గా ఉండే చాల సేపు.

బడి అయిపొంగనే రోజూ గుడికి వెళ్ళేవాళ్ళం. వాడు రోజుకొక్క సారైనా ఆ కత్తిని చూస్కోకపోతే వానికి మనసున పట్టేది కాదు.

కొన్ని రోజుల తరవాత, అలవాటు ప్రకారం సయ్యద్ కత్తికోసం మీదికెక్కిండు, నేనూ శంకర్ కొమ్మ మీద కూర్చున్నాం. చెరువు ప్రశాంతంగ కనిపిస్తుంది. నాకు చెరువులో ఎదో మెరిసినట్టు అనిపించింది. అంతలోనే మాయమైంది. ఇంతలో,

“అక్కా..” గట్టిగా అరిచిండు వాడు.

“ఏమైందిరా?” ఇద్దరం కంగారు పడ్డాం.

“కత్తి లేదు.”

“చూడురా అక్కడే ఏడనో ఉంటది.”

krishna

“మొత్తం చూసిన అక్కా ఏడ లేదు..!” వాని గొంతులో సన్నటి ఏడుపు.

“ఏదైనా కోతో, ఉడతో ఎత్తుక పోయి ఉంటుందేమో.. ఈన్నే ఏన్నో పారేసి ఉంటది. చెట్టు చుట్టూ పక్కల వెతుకుదాం పా” శంకర్ అన్నడు.

రాత్రయే వరకూ వెతుకుతనే ఉన్నాం. కని అది దొరకలేదు.

సయ్యద్ మొహం వాడి పోయింది. కదిలిస్తే ఏడిచేటట్టు ఉన్నాడు వాడు.

“అక్కా, అది జారి మళ్ల చెరువుల పడ్దదేమోనే, నేను చెరువుల దూకి వెతుకుత. ” ఉన్నట్టుండి డిసైడ్ అయిపొయిండు సయ్యద్.

” వద్దు రా ..  డేంజర్ అది ..చానా లోతుంటది.”

“దొరుకుతది గావచ్చు అక్కా”

“నా మాట విను, అంత పెద్ద చెరువులో ఎక్కడని వెతుకుతావ్”

“లేదక్కా, ఆ కత్తి కాకుంటే ఇంకో కత్తి .. లేదంటే ఇంకో వస్తువు ఏదైనా దొరకవచ్చు. బంగారు బిల్లలేమన్న దొరకవచ్చు.” వాడు వినిపించుకునే పరిస్తితిలో లేడు.

నేనేదో చెప్పే లోపే “పోనియ్యవే వాణ్ని, వాడు వినడు. అయినా వాడు ఈత బాగానే కొడతాడు కదా. ఇంక దేనికి భయం..” శంకర్ వానికి వంత పాడిండు.

మొత్తానికి సయ్యద్ చెరువుల దూకిండు. మేం అరవై లెక్కపెట్టేలోపు వాడు ఇంకా లోపలనే ఉంటె శంకర్ లోపలకు దూకి సయ్యద్ ని తీసుకు రావాలని ఒప్పందం.

వాడు పైకి తేలలేదు. 45, 46, 47.. నా గుండె వేయి ముక్కలయ్యేలా కొట్టుకుంటుంది.

53, 54, 55 అరికాళ్ళు, అర చేతులు చెమటలు పట్టినయ్.

58, వాడు రాలేదు..

  1. శంకర్ దబెల్లుమని రాగేర్లో దూకిండు.

***

కెన్ని తో ఆడుకోవడం అయిపొయింది సోనికి. చాల సేపట్నుండి అడుగుతుంది ఇంటికి పోదామని.

“మామీ ఐ గాట యూస్ రెస్ట్ రూమ్.”

“ఓకే సోనీ”

“ఇప్పటికే బాగా లేట్ అయింది అంకుల్. సోనీ మళ్ళి అల్లరి చేస్తుంది. దానికి ఇంత తినిపించి పడుకోకబెట్టకపోతే నాకు రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది. మళ్లీ కలిసినపుడు మిగిలింది చెప్తాను. సగమే చెప్పినందుకు ఎం అనుకోకండి.” సోనీ ని తీసుకొని వెళ్ళిపోయింది గీత.

“సరే గీతా.” అన్నడు  తప్ప ఇంకేం చేయలేకపోయిండు.

“ఆంటి కోసం ఏదన్న తీస్కపోవడం మర్చి పోకండి.” ఎదో గుర్తొచ్చినట్టు వెనకకు తిరిగి చెప్పింది. చీకట్లో మాయమయ్యారిద్దరూ.

అప్పటి దాక తనతో ఉన్ననిర్వేదం, అసహనం ఎక్కడో మాయమయినయ్. అతని మనసులో నిశ్శబ్దం బద్దలయ్యి సయ్యద్ కి ఏమైంది? శంకర్ కి ఏమైంది? కత్తి ఎవరు తీస్కున్నరు? ఇంతకు అది బంగారమేనా? తరవాత ఏమైంది? ఒకదాని తరవాత ఒకటి ఎన్నో ప్రశ్నలు. కమల మీద చిరాకు, కోపం పోయింది. ఇప్పుడు గీత మీద కోపం కలుగుతుంది. ఎవరూ చేరలేని తన గుండె గోడలను పగల గొట్టి తన మనశ్శాంతి మీద ఎవరో బురద కాళ్ళతో నడుస్తున్నట్టు ఉంది. రేపు ఉంది కదా అని ధైర్యం చెప్పుకొని కార్ దిక్కు నడిసిండు యాదగిరి. కమల కోసం ఏదైనా తీస్కపోదాం. షి డిసర్వ్స్ సంథింగ్ అనుకున్నడు.

***

“హాప్పీ ఆనివర్సరీ కమలా.” చిన్న గిఫ్ట్ బాక్స్ కమల చేతిల పెట్టిండు యాదగిరి.

“ఏంటిది ఇది గిరి?” యాదగిరి మీద కోపం ఉన్న విషయం కూడా మర్చిపోయింది కమల.

బాక్స్ ఓపెన్ చేసింది కమల. చిన్న నక్షత్రం ఆకారంలో పెండెంట్, కమల కళ్ళూ ఒకే సారి మెరిసినై.

“ఐ షుడ్ నాట్ హావ్ యెల్డ్ ఎట్ యు, ఐ యాం సారీ” యాదగిరి కమల కళ్ళలోకి చూస్తూ .. తడుముకోకుండా చెప్పిండు.

“దట్స్ ఒకే, ఐయాం సారీ టూ గిరి.”

కమల కోపంలో కూడా తనకిష్టమైన వంటలు అన్ని చేసి తన కోసం చూస్తూ కూచున్నది. ఇద్దరు కలిసి డిన్నర్ చేసిన్లు. పిల్లల గురించి మాట్లాడుకున్నరు. తమ పెళ్లైన మొదటి రోజులగురించీ. అమెరికాకు రావడం గురించీ. ఎప్పటివో జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నరు.

కమల మీద అప్పట్లో ఎంత ప్రేమ ఉండేది. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం ఎన్ని చూస్కుంది తను. పిల్లల చదువులు, ఇల్లు కొనడం తన ఒక్కని సంపాదనతో అయ్యేదా? ఎంత గ్రాంటెడ్ గా తీస్కుని ఉంటా తన్ని, అనుకున్నాడు. కమల మీద గౌరవం, అభిమానం కలిగినయ్ యాదగిరికి చాలా రోజుల తరవాత.

తృప్తిగా తిన్నర్రిద్దరూ. వాకింగ్ చేద్దాం అని బయటకు వచ్చారు. ఇంటి ముందర పెద్ద చెట్టు. అప్పటిదాకా మరిచిపోయిన సగం కథ మళ్ళీ గుర్తుకు వచ్చింది. అప్రమేయంగ ఆకాశం దిక్కు చూసిండు. ఒక్కటంటే ఒక్క చుక్క కూడా కనపళ్ళేదు. లైట్ పొల్యూషన్ అనుకున్నడు మనసులో. నడుస్తూ నడుస్తూ గీత ఇంటి దాకా పోయారు. ఇంట్లో లైట్లు కూడా వెలగడం లేదు. ఎక్కడికి పోయిందో పిల్ల అనుకున్నడు.

ఇంటికి వచ్చినంక యాదగిరి మెల్లగా బెడ్ మీద ఒరిగిండు. ఆ సగం కథ కలవర పెడుతనే ఉన్నది.

కళ్లుమూసుకుంటే అదే నక్షత్రాల చెరువు….. ఊరవతల ఒంటరి చెరువు, చెరువు మీద పరిచిన చుక్కల తివాచి, వెన్నెల పోత పోసుకున్న రాత్రి ని చూస్తున్న దృష్యమొకటి మనసుల మెదులుతుంది.

ఆ ఆలోచనలతోనే మెల్లగా నిద్రలోకి జారుకున్నడు యాదగిరి.

తెల్లారింది..

నిద్ర అయితే పోయిండు కానీ, రాత్రంతా ఏవేవో కలలు. బంగారం దొరికినట్టు, చెరువుల దునికినట్టు, మళ్ళీ బడికి పోయినట్ట్టు.. ఆ కథలో తనను తాను ఊహించుకుంటూ..

ఆఫీస్ పని పూర్తి చేస్కొని సాయంత్రం ఫ్రెష్ అయి మళ్లా లేక్ దగ్గరికి పోయిండు. గీత ఇంకా రాలేదు. వేరే పిల్లలెవరో ఆడుకుంటున్నరు. అదే సూర్యుడు, అదే పార్క్, అదే లేక్. ఒక్కో క్షణం భారంగా ముందుకు కదులుతున్నది. నాలుగు సార్లు టైం చూస్కున్నాకాలం ముందుకు కదులుతలేదు. గీత మీద, కాలమ్మీద అసహనం పెరుగుతున్నది.

ఒక చిన్న రాయి తీస్కోని లేక్ ల విసిరిండు. బుడుంగ్ అని మునిగి పోయింది. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని లేక్ దిక్కే బీరిపోయి చూస్తున్నడు. కాసేపటికి ఎదో వెలుగుతుంది లేక్ ల అనిపించింది. అంతలోనే మాయమైంది. కరెంటు చేపలు ఉండవచ్చు ఇందుల అనుకున్నడు. సిక్స్ తర్టీ. గీత రాలేదు. వాళ్లింటికే పోయి మిగిలిన కథ చెప్పమంటే పద్దతిగ ఉండదని తమాయించుకున్నడు. చేసేది లేక రేపు చూద్దాంలెమ్మని నిరాశతో ఇంటికి పోయిండు.

మూడో రోజు.. ఆరాటం ఉంది కానీ మరీ మొన్నటంత కాదు.. ఆఫీస్ కు పొయ్యి తన పని తను చూస్కున్నడు. సాయంత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోని లేక్ దగ్గరికి పోయిండు. అదే సూర్యుడు, అదే లేక్, అదే పార్క్. నాలుగు సార్లు పార్క్ మొత్తం నడిచిండు. మళ్ళీ అదే పిల్లల ఏరియా దగ్గర ఆగి ఓ రాయి తీస్కోని లేక్ ల విసిరిండు. బుడుంగ్ అన్నది. ఏడున్నర అయింది. గీత రాలేదు. మళ్ళీ నీటిలో ఎదో చిన్నగా మెరిసి మాయమైంది.

నాలుగోరోజు.. ఆరాటం చాలా వరకు లేదు.. వాక్.. బుడుంగ్.. ఏడున్నర.. ఎదో మెరుస్తూ.. గీత రాలేదు.

ఐదో రోజూ.. గీత రాలేదు.

కొన్ని నెలలు గడిచినై. కథ గురించి మర్చిపోయిండు. మళ్లీ ఎప్పుడూ గీత కనిపించలేదు తనకు. ఏమైందీ, ఎటువెళ్లిందీ తెలుసుకోవాలన్న ఆరాటం పోయింది. ఎపుడైనా లేక్ దగ్గరికి పోతాడు. అప్పుడప్పుడు నీటిలో ఎదో చిన్నగా మెరుస్తూ కనిపిస్తది. సాయంత్రంతో తనకు ఒక చిన్న అనుబంధం. అంతే.

***

కొన్నేళ్ళు గడిచిపోయినై. లేక్ దగ్గరికి పోయే అలవాటు పోయింది. యాదగిరి రిటైర్మెంట్ తీస్కున్నాడు. రాముడు ప్రాక్టీసు మొదలు పెట్టిండు. నచ్చిన పిల్లను వాడే చూస్కోని పెళ్లి కూడ చేస్కున్నడు మొన్నీమధ్యనే. లక్ష్మణుడు ఇంకా గిటారు గోకుతున్నడు. నచ్చింది నమ్మి చేస్తున్నడు కాబట్టీ ఎప్పటికైనా స్థిరపడతడు అనే నమ్మకం ఉన్నది.

కమల మామూలే. వయసు మీద పడ్డంక ఇద్దరి మధ్యన ఎదో తెల్వని ఒప్పందం దానంతట అదే ఏర్పడ్డది. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు లేవు. ఒక రకమైన స్థిమితం ఏర్పడ్డది. వంట అయినంక పిలుస్తుంది. తన బంధువుల గురించి ఎప్పుడైనా ఏదైనా ముచ్చట చెప్తుంది. విని ఊరుకుంటడు. ఎక్కువ మాట్లాడడు. ఎందుకని ఆమె కూడా అడగదు. ఒక్కళ్ళ మీద ఒకల్లకు పెద్దగ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఒక్కో సారి యాదగిరి ప్రవర్తన ఆమెకి అర్ధం అయ్యేది కాదు. ఆమె ఎదో చెప్పాలని అనుకుని కూడా ఎమీ చెప్పకుండా ఉండిపోతది. ఏమైంది ఎందుకట్ల చూస్తున్నవ్ అని కూడా అడగడు యాదగిరి. తనలో తానె ముసి ముసి నవ్వులు నవ్వుతది కమల. ఏమైందే అంటే చెప్పదు. పిచ్చి మాలోకం అనుకుంటాడు. ప్రశాంతత లాంటి స్తబ్దత ఒకటి ఏర్పడ్డది. అప్పట్లో చిరాకు జీవితం చిరాగ్గా ఉన్నా నిరంతర చలన శీలమై ఉండేది జీవితం. ఒపికుంది. తీరికుంది. వ్యాపకాల్లేవు. వార్తలు చదివే అలవాటు లేదు. ఎవరినైనా కలవాలన్న ఉత్సాహం గానీ, ఎందులోనో ఎంగేజ్ అవాలన్న ఆసక్తి గానీ లేవు. ఎదో అసంతృప్తి మాత్రం పట్టి పీడించేది.

ఒకప్పుడు రోజూ లేక్ దగ్గరికి పోయే వ్యాపకం ఉన్నట్టు గుర్తుకు వచ్చింది. తీరిక లేకున్నా తీరిక చేస్కొని లేక్ దగ్గర గడిపే గంటన్నర జీవితంలో గుర్తించలేని తృప్తి ఎదో ఉండేది. అనుకున్నదే మొదలు కార్ తీస్కోని లేక్ దగ్గరికి పోయిండు..

లేక్ కొంత మెరుగు స్థితి లో కనిపిస్తుంది ఇపుడు. పిచ్చి మొక్కల్ని పీకి అందంగా చేసిన్లు. ఫెన్సింగ్ కి కొత్త రంగులు కనపడుతున్నయ్. పిల్లలాడుకునే ఏరియాలో కొన్ని కొత్త ఆట వస్తువులు వచ్చి పడ్డయ్. దూరంగా ఎవరో బార్బెక్యూ చేస్తున్నరు. చికెన్ వాసన వస్తున్నది. చాలా రోజులయింది వచ్చి కొంత జీవం కనిపిస్తున్నది ఇప్పుడు అనుకున్నడు. తన రెగ్యులర్ ప్లేస్ కి పోయిండు. ఆ బెంచ్ మీద కూచున్నడు. ఒక రాయి తీస్కోని.. బుడుంగ్..

ఇంతలో దూరంగా ఒక పాప. ఓ పదేల్లుంటాయేమో, తన దిక్కే నడుచుకుంటూ వస్తుంది. ఎక్కడో చూసినట్టుంది. ఎవరిదో చేయి పట్టుకుని నడుస్తుంది.. వాళ్ళ నాన కావచ్చు. పాప దగ్గరికి వచ్చింది..

“అంకుల్ డిడ్ యు రికగ్నైస్ మీ? ఇట్స్ మీ సోనీ.”

“ఓహ్ సోనీ.. ఇట్స్ యు.. వావ్.. యు ఆర్ సో బిగ్ నౌ.. ఐ కెన్ బేర్లీ  రికగ్నైజ్ యూ.”

“డాడ్, దిస్ ఈస్ గిరి అంకుల్.. మామిస్ ఫ్రెండ్..”

“హాయ్.. శంకర్..  నైస్ టు మీట్ యు..” సోనీ తో ఉన్నతను శంకర్ గా పరిచయం చేస్కున్నడు.

శంకర్ పేరు చెప్పంగనే ఒక్కసారి ఉలిక్కిపడ్డడు యాదగిరి.

“శంకర్ అంటే.. గీత చిన్నప్పటి ఫ్రెండు శంకరేనా?”

“యస్ యస్.. నేనే ఆ శంకర్ ని. ఫ్రెండ్ కం ఎక్స్ హస్బండ్. గీత నా పరిచయం చేసిందా ఆల్రెడీ..”

శంకర్ ని మిగిలిన కథ అడగాల్నా వద్దా అని ఆలోచించే టైం లేదు. డైరెక్టుగా  “ఆ రోజు” గురించే మాటలు మొదలుపెట్టిండు యాదగిరి-

“మీరేం అనుకోకపోతే ఐ వాంట్ టు నో వాట్ హాప్పెండ్ దట్ డే”

“ విచ్ డే?”

“అదే మీరు చెరువులో దునికినపుడు.”

శంకర్ కొద్దిగా కంగారు పడ్డడు.

“గీత ఆ విషయం ఎవరికీ చెప్పదనుకున్న. ఎనీ వేస్ అదెప్పుడో జరిగింది. తెల్సుకుని ఎం చేస్తరు.”

“ప్లీస్ చెప్పండి, నాకు తెలుస్కోవాల్నని ఉంది.”

“ఆ విషయాలు మీ దగ్గర చెప్పిందంటే యు మస్ట్ బి ఎ క్లోజ్ ఫ్రెండ్.  వి విల్ మీట్ ఓవర్ అ డ్రింక్. లెట్స్ మీట్ఎట్ లక్కి స్టార్ టునైట్ ఎరౌండ్ ఎయిట్.”

“స్యూర్”

***

 

ఎనిమిదిన్నర అవుతుంది. శంకర్ రెండు డ్రింక్స్ తరవాత,

“నాకు ఎక్కడ మొదలు పెట్టాలో కుడ అర్ధం అయితలేదు. నేనేం చెప్పినా మీరు నమ్ముతరనే నమ్మకం లేదు.

“అదేంలేదు శంకర్, యూ ప్లీస్ క్యారీ ఆన్ 60 లెక్కపెట్టేలోపు సయ్యద్ పైకి రావాలె. రాలేదు. ఆ తరవాత మీరు చెరువుల దూకిన్లు. ఆ తరవాత ఏమైంది?” డైరెక్టు గా కథలోకి తీస్కపోతే చెప్పడం మొదలు పెడతడని యాదగిరి కథలోకి తీస్కపోయిండు శంకర్ని.

శంకర్ చెప్పుడు మొదలు పెట్టిండు.

“మేము ముగ్గురం ఒక టీం. ఎక్కడికి పోయినా కలిసే పోతుండే.. ఏ ఆటాడినా కలిసే ఆడుతుండే..

నాకు సయ్యద్ అంటే బాగ ఇష్టం, వాడెప్పుడు అన్నా అన్నా అంటూ నా తోటే తిరిగే వాడు. సయ్యద్ కి ఆ కత్తి దొరికినపుడు నేను హాప్పీగ ఫీల్ అయిన. ఆ రోజు చాలా సేపు మాట్లాడుకున్నాం చెట్టు మీద కూచొని. ఎందుకో గీత ఎక్కువగా మాట్లాడలేదు.”

“కత్తి పోయినపుడు సయ్యద్ చెరువులో దూకుదామని అని మొండిగా సిద్ధం అయిండు. నేను వద్దు అన్నా గానీ “ఏం కాదు, వాడికి ఈత బాగనే వచ్చు కదా” అని గీతే ఒప్పించింది. నాక్కూడ ఈత వచ్చు కాబట్టి అరవై లెక్క పెట్టె లోపు వాడు పైకి రాకపోతే లోపలకు దూకి వాణ్ని తీసుకు రావాలని అని అనుకున్నం..”

గీత వర్షన్, శంకర్ వర్షన్ కొంత వేరేగా ఉంది. ఒకటే సంఘటన ఇద్దరి నోళ్ళలో మరోకల్లని వేరేగా చిత్రీకరిస్తుంది. శంకర్ ఇంకా చెప్తున్నాడు.

“అరవై అయిపోయినై. నేను క్షణం లేట్ చేయకుండా చెరువులో దునికిన. చెత్త మొక్కలు, పేరుకు పోయిన చెత్తా లోపల చాలా ఉంది. చిమ్మని చీకటి. కొద్దిగా గట్టిగా చేతికి ఏది తగిలినా అది సయ్యద్ ఏమో అని తడిమి చూస్కుంటున్న. ఊపిరి ఆడని దాకా వెతికిన. గాలి పీల్చుకుందామని ఒక్క సెకన్ పైకి వచ్చి మళ్ళీ లోపలికి పోయిన. పైన గీత కనిపించలేదు. అవన్నీ పట్టించుకునేంత టైం లేదు. మళ్ళీ లోపలికి పోయిన. ఇంతలో లోపల చిన్నగా ఎదో వెలుగుతూ కనిపించింది.”

చెవులు పెద్దవి చేస్కొని వింటున్నడు యాదగిరి. శంకర్ చెప్తున్నాడు..

“ప్రకాశవంతమైన వెలుగు. స్పష్టమైన ఆకారం లేదు. కేవలం వెలుగు. అది ఎంత ప్రకాశవంతమంటే చుక్కేదో తెగిపడి ఆ నీళ్ళలో రాలినట్టు ఉంది. ఖచ్చితంగా సయ్యద్ దాని వెంట పోయి ఉంటాడని అనిపించింది. చెయ్ ముందుకు చాచి వెలుగుని వెతుక్కుంటూ లోపలికి పోతూ ఉన్న. ఎంత దూరం పోయిన్నో తెలవదు. ఎంత లోపల ఉన్నానో, మళ్ళీ పైకి ఎట్లా రావాలనో తెలవదు. ఆ వెలుగు రవ్వని అందుకునే దూరం దాకా వచ్చినట్టనిపించింది. నా చుట్టూ వెలుగు. వెలుగులో నేను. గాల్లో ఎగిరిపోతున్నట్టుగా..మబ్బుల్లో తేలిపోతున్నట్టుగ.. ఏమైందో తెలవదు. స్పృహ కోల్పోయిన్నో లేదో తెలవదు. కళ్ళు తెరిచి చూసే సరికి చెరువు ఒడ్డుకు ఉన్నా.

గీత నేను కళ్ళు తెరిచేసరికి ఊపిరి పీల్చుకుంది. మా ఇద్దరి పరిస్థితి అయోమయం.

“సయ్యద్ ఎడిరా?” గీత కంగారుగా అడిగింది.

“ఏమో నాకు కనిపించలేదు.. వెలుగు.. సయ్యద్… “ ఎం చెప్పిన్నో గుర్తు లేదు.

గీత నిర్ఘాంతపోయి ఎమీ అర్ధం కానట్టు నా దిక్కే చూస్తుంది.

నాకు అక్కడ ఎం జరుగుతుందో అర్ధం కాలేదు. గీత రియాక్షన్స్ అంతకన్నా అర్ధం కాలేదు. నన్నే ఎందుకట్ల కన్నార్పకుండ చూస్తుందో అర్ధం కాలేదు.”

“ఎందుకు.. ఏమైంది.. సయ్యద్ ఏమయ్యాడు?” యాదగిరికి ఆత్రుత ఎక్కువయింది

శంకర్ చెప్తున్నాడు..

“అప్పటికి నీళ్లలో దూకి అరగంట దాటిందట, మాకు చేతనయింది ఏమీ లేదు. అప్పటిదప్పుడు ఊళ్లోకి పొయ్యి చెప్పినం ఈ విషయాన్ని.

కాసేపట్లో ఊరు ఊరంతా చెరువు దగ్గర. వారం రోజులు ఫ్లడ్ లైట్స్ పెట్టుకొని మరీ వెతికారు. సయ్యద్ గానీ, బాడీ కాని దొరకలేదు. మధ్యలో వెలుగు కనిపించిందా అని నేను అడిగినా, ఎవరూ పట్టించుకోలేదు.

ఏడుపులు కన్నీళ్ళ మధ్య ఆ ఘట్టం ముగిసేవరకు చాలా నెలలు గడిచినై. వాడు గుర్తుకు రాని రోజు ఉండేది కాదు.

నేనూ గీతా చెరువు దగ్గరకు పోవడం మానేసినం.”

“ఇక అప్పటినుంచి గీత ప్రవర్తన మాత్రం మారిపోయింది. సయ్యద్ పోయాడని తను ఒక్క సారి కూడా బాధపల్లేదు. అప్పుడప్పుడు వింతగా నా దిక్కే కన్నార్పకుండా చూసేది. ఎందుకలా చూస్తున్నవ్ అని అడిగితె సమాధానం ఉండక పోయేది. ఆ తరవాత ఎందుకో గానీ గీత నాకు బాగా దగ్గరయింది. నేనే తన లోకం అన్నంత దగ్గరయ్యింది. మెల్ల మెల్లగా నేను కూడా గీతకు బాగా దగ్గరయిన. కలిసే పై చదువులు చదువుకున్నాం. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి చేస్కున్నం.  గీతంటే ఇష్టమే, ప్రేమే కాని గీతకు నేనే లోకం. మాటల్లో చెప్పలేని ఎదో బంధం ఉండేది ఇద్దర్లో. అదేంటో గీతకు తెలుసనే నమ్మకం ఉండేది నాకు. ఆ బంధానికి అర్ధం నాకెప్పుడూ అర్ధం కాలేదు.”

“పెళ్లి చేస్కున్న కొన్ని రోజులకి ఉద్యోగ రిత్యా ఇండియా వదిలి రావాల్సి వచ్చింది. సోనీ పుట్టింది. గీత ఉద్యోగం మానేసింది. సోనీ ని చూస్కోవడం, రోజూ ఈ లేక్ కి రావడం, ఇవే గీత వ్యాపకాలుగా మారిపోయినయి.  కొన్ని ఇయర్స్ బాగానే ఉంది. ఉన్నట్టుండి ఏమైందో కానీ గీతలో ఎదో మార్పు. కన్నార్పకుండా నన్నే చూసే అవే చూపులు తిరిగి గీతలో కనిపిస్తున్నయ్. ఏమైందంటే చెప్పదు. ఒక రోజు సడ్డెన్ గా విడాకులు కావాలన్నది. నాకు నోట మాట రాలేదు. పెద్ద గొడవ చేసింది. కారణం చెప్పలేదు. చెప్పి చెప్పి విసిగిపోయి చివరికి డైవోర్స్ పేపర్స్ సైన్ చేసిన.”

“ఐ యాం సారీ. గీత ఎక్కడుంది ఇపుడు. ఎందుకు డైవోర్స్ అడిగింది.” యాదగిరికి అంతా అయోమయంగా ఉంది.

శంకర్ మళ్ళీ చెప్పుడు మొదలు పెట్టిండు..

“ఒక రోజు రాత్రి ఇంటికి వచ్చింది సోనీ ని తీస్కోని…

“ఇది నా టర్న్ అయినా సోనీ ని కొన్ని రోజులు నీ దగ్గరే ఉంచుతావా శంకర్?” గీత అడిగింది.

“ఎందుకు ఏమైంది..” అడిగిన నేను..

“చెప్తాను. కానీ నువ్వు నమ్మవు.” గీత సమాధానం.

“నిన్ను కాకపోతే ఎవర్ని నమ్ముతా నేను?.” నేను అన్న.

“ఆ రోజు నువ్వు చెరువులో దునికినప్పుడు చాలాసేపటిదాకా బయటకు రాలేదు. నాకు బాగా భయమైంది. నడుము లోతు నీళ్ళ దాకా వచ్చి చూసిన. నీళ్ళలో ఎదో మెరుస్తుంది. ఎదో జరిగింది. సడ్డెన్ గా ఎక్కన్నుంచో  వచ్చి నువ్వు నా చెయ్యి పట్టుకున్నవ్. తొందర తొందరగా నిన్ను పైకి తీస్కొచ్చిన. ఊపిరి ఆడుతుంది. సయ్యద్ ఏమయ్యాడో తెలవదు. నీ పరిస్తితి అర్ధం కాలేదు. నాకు గాబరాగ ఉండే. కాసేపటికి నువ్వు కళ్ళు తెరిచినవ్.

“శంకర్, ఏమైందిరా..”

“అక్కా”

“శంకర్ ఏమైందిరా నీకు.. నన్ను అక్కా అంటవెందుకు..”

“నేను సయ్యద్ ని అక్కా, శంకర్ అంటవేంది” అన్నవ్ నువ్వు.

నాకేం అర్ధం కాలేదు. కాసేపట్లోనే “గీతా సయ్యద్ ఏడి” అని అడిగావ్. నాకేం జరుగుతోందో అర్థంకాలేదు. నీ దిక్కే చూస్తూ ఉండిపోయిన.

ఆ తరవాత చాలా రోజులు నా దగ్గర ఒక సారి సయ్యద్ గా ఒక సారి శంకర్ గా మాట్లాడేవాడివి. నాకేం అర్ధం కాలేదు. నేను ఎప్పుడు సయ్యద్ గా మాట్లాడుతనో, ఎప్పుడు శంకర్ గా మాట్లాడతనో నాకే తెలవదట. అట్లా చిన్నపుడు చాలా సంవత్సరాలు చేసిన అని చెప్పింది. పై చదువులకు ఊరొదిలి వచ్చినంక మెల్లగా సయ్యద్ లాగా మాట్లాడుడు తగ్గింది అని చెప్పింది. తన ఒక్క దానితోనే సయ్యద్ లాగా మాట్లాడతా అని చెప్పింది.

ఆ అలవాటు పోయింది. చదువు, ఉద్యోగం, పెళ్లి, అమెరికా అన్ని వరుసగా జరిగిపోయినయ్.

కొన్నేళ్ళకు సోనీ పుట్టింది. పిల్లల పార్కు ఉందని రోజూ సోనీని తీస్కుని ఇక్కడకు వచ్చేది. లేక్ కి రావడం మొదలు పెట్టిన తరవాత మళ్ళీ నాలో సయ్యద్ కనిపించిండని చెప్పింది. ఒక రోజు “అక్కా..” అని పిలిచిన అట. రోజు రోజుకూ శంకర్ కన్నా సయ్యద్ గానే పిలిచేవాడిని అన్నది. తన వల్లనే నేను ఇన్ సేన్ గా అవుతున్నా అని మొదటి నుండి తనకు గిల్టీ ఉండేది అన్నది. భర్తగా, తమ్ముడిగా. తను భరించలేని స్థితి కి చేరుకుందో ఏమో మేమిద్దరం దూరం ఉంటేనే ఇద్దరికీ మంచిదని అనుకుని డైవోర్స్ తప్పని సరి అయింది అన్నది.  గీత చెప్పింది ఎంత వరకు నిజమో నాకు తెలవదు. అసలు నిజమో కాదో తెలవదు. కానీ ఆ రోజు సోనీ ని నా దగ్గర వదిలేసిన తరవాత మళ్ళీ గీత కనపడలేదు. “

“ఓహ్… గీత ఏమయింది. ఎక్కడికి పోయింది?”

“నో ఐడియా అంకుల్. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచిన. లాభం లేదు. వాళ్ళు కూడా వెతికి వెతికి చేతులు ఎత్తేసిన్లు”

“ఓ మై గాడ్ . సారీ టు హియర్ దట్.. తను ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందనుకుంటున్నంకని ఇలా జరిగిందని మాకు తెలీదు.. అయాం రియలీ సారీ.”

“దట్స్ ఓకే. లోకంలో సమాధానాల్లేని ప్రశ్నలు ఎన్నో ఉంటయ్. మీరివన్ని ఆలోచించి మైండ్ పాడు చేస్కోకండి. కలుద్దాం మరి.”

ఇద్దరు బై చెప్పుకుని ఎవరిదారిన వాళ్లు..

ఇంటికి డ్రైవ్ చేస్తున్నడు యాదగిరి.. మనసులో ఎన్నో ప్రశ్నలు. “గీత అబద్దం చెప్పిందా? శంకర్ చెప్పింది అబద్దమా? ఇద్దరి కథల్లో ఎందుకింత తేడా? వీల్లిదర్లో ఎవరో ఒకరు కత్తిని దొబ్బేసి తరవాత జరిగిన సంఘటనల పర్యవసానం ఎదుర్కొనడానికి అబద్దాలు సృష్టించిన్లా? కొంపదీసి శంకర్ గీతని, సయ్యద్ ని చంపిండా? లేక గీత సయ్యద్ ని ఏమైనా చేసి, శంకర్ తో నాటకాలు ఆడిందా.”

అప్పటి దాకా విన్న కథలో నిజాన్వేషణలో ఉన్నాడు యాదగిరి.. కార్ లేక్ దగ్గరి దాకా వచ్చింది.. “లేకుంటే చెరువులో చుక్కలేంది. మనిషిలో మనుషులేంది.” అనుకుంటుండగానే, లేక్ లో ఎదో మెరుస్తూ కనిపించింది. ఎదో సందేహం. గుండె శరవేగంతో కొట్టుకుంటుంది. అరికాళ్ళు, అర చేతులు చెమటలు పడుతున్నయ్. కమలని కలవాలి. కమలని కలవాలి. “కమలని కలవాలి” లోపల అనుకునేది మంత్రంలాగా బయటికే జపిస్తున్నాడు గిరి అంకుల్. దారి పొడుగూతా అవే రెండు మాటలు.. “కమలని కలవాలి”

ఇంటి ముందరే కార్ ఆపి డోర్ కూడా వెయ్యకుండా ఇంటి లోపలకు పోయిండు.

“కమలా.. నేను ఎప్పుడన్నా నిన్ను ‘ఆంటీ’ అని పిలిచిన్నా”?

“ఎన్నో సార్లు.. ముద్దుగా పిలుస్తున్నారు అనుకున్న.. ఏమైంది గిరి?”

******

 

రాజ హంస

 

 

                    –  మైథిలి అబ్బరాజు 

 

Mythili1

ఉద్యాన   నగరం లో మే నెల సాయంకాలం సౌమ్యంగానే ఉంది  . ఆ కాస్త కాస్త వేడిని చల్లబరచుకుందుకు మెల్లి మెల్లిగా ఒక్కొక్కరూ అక్కడికి- వేడుక కోసం కంటే వాడుకయిన ఇష్టంతో.

ఆమె ఎప్పట్లాగే తన మూలలో…ఎక్కువ వెలుతురు రాని చోట. రోజూ తాగేదే , రోజూ తిరగేసేదే  , చూసీ చూడని చూపే.

ఆవాళ మటుకు అతను వచ్చాడు ఆమె ఎదటికి , మరెక్కడా ఖాళీ లేక.  ‘ ఫలూడా ‘  కోసం .  దొరికే కొద్ది చోట్లలో అది ఒకటి అని కొత్తగా వచ్చిన అతనికి చెప్పారెవరో.  హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు ..  ఎన్నెన్ని మాక్ టెయిల్స్ వచ్చినా అతనికి అది మాత్రమే  ఇష్టం.   తర్వాత గమనిస్తే  ఆమె ముందున్నదీ అదే.  తలెత్తింది.

కనీకనిపించని పూలతో తేలిక రంగు నూలు చీర. ఒద్దికగా పిన్ చేసి కట్టుకుంది. పూర్తి తెల్లగా వదిలేసిన బాబ్డ్ జుట్టు. పండిపోయిన నుదురు.. అగాధసరోవరాల  కళ్ళు .. ఏటి ఒడ్డున ఇసక మీది నొక్కుల తో   ఉలిపిరి కాగితపు చర్మం . లావణ్యం పోయిందిగాని సౌందర్యం ఇంకా ఉంది. కొంచెం నవ్వింది. గుర్తు పట్టాడు… కాస్త ఆశ్చర్యం…ఇలా స్ఫురించదు అతనికి.

పలకరించింది –  ” నా పేరు రాజహంస ”

” మీరు నాకు తెలుసు…రాస్తారుగా ?   ” – ఆమె చిన్నప్పటి ఫోటో చూసి ప్రేమించానని చెప్పలేదు అతను..ఊహూ.అప్పుడే కాదు.

” కొత్తగా వచ్చారా ? ”

” అవును…పది రోజులైంది .  చెన్నై లో ఆర్నెల్లుండి…”

” ఎప్పుడయిపోయింది చదువు ? ”

తన కుర్రతనాన్ని  వెక్కిరిస్తోందనిపించింది.

” కిందటేడు ”

కాసేపు స్మాల్ టాక్.

లేస్తూ – ” ఈ వీకెండ్ కి మా ఇంటికి వస్తారా ? మాట్లాడుకుందాం ”

ఆమెకేమి తెలుసు అతని గురించి ?  ఇద్దరికీ ఒకేలా అనిపించేవేముంటాయని….?

” సరే ” .

చిరునామా అందింది.

*                   *                       *               *               *

ఇంచుమించు గా సవ్వడి  లేని వీధి . ఒక అంచు న – రోజాపువ్వుల  సముద్రాలు పొంగే ప్రాంగణం. సంజ చీకట్ల మధ్యన మేఘమాలిక వంటి ఇల్లు.

తాకగలిగినవీ తాకలేనివీ  కలిసిపోయిన   పురాతనమైన శీతలత్వమేదో చుట్టుకుంది అతన్ని. ఒణికాడు. దీపాలు వెలి గించి న   పిలుపు.

చాలా పెద్ద లైబ్రరీ, ఆనుకుని ఉన్న స్టడీ. గోడల మీద నీటి రంగుల్లో కొండలూఅడవులూ  . మొజార్ట్  ..  మైసూరు చందనపు సువాసన.

కలలోకో, స్మృతిలోకో- నడిచి వచ్చిన అతను ఉండిపోయాడు.

Kadha-Saranga-2-300x268

అయిదారేళ్ళ కిందట , అనుకోకుండా –  గూగుల్ ఇమేజెస్ లో ఆమె ఫోటో నిలబెట్టేసింది అతన్ని. సెపియా లో ఆరుబయట తీసినది. స్టూడియో లో సాధించగల వెలుగు నీడలు లేకుండానే ఆమె స్పష్టంగా అక్కడ ఉంది –  పెదవుల్లో పువ్వులతనం , బుగ్గల నునుపు మీద ఆడుకుంటూ ఉన్న జుట్టు ,  కళ్ళలోంచి దూకుతున్న వెలుతురు .   పెద్ద రెసొల్యూషన్ ఉన్నదాన్ని వెతికి కాయితం మీద ముద్రించుకున్నాడు. స్నేహితులు ఏడిపించేవాళ్ళు- ఇప్పుడామె వయసు తెలుసా అని. నవ్వేసి ఊరుకునేవాడు.

ఆ తర్వాత ఆమె రాసినవి తెచ్చుకుని  చదవబోయాడు… లోపలికి ఎక్కలేదు – వివరాలు తెలిశాయంతే . ఇంగ్లీష్ లో రాసిన రెండో తరం భారతీయులలో ఆమెకి మంచి చోటు ఉంది. చదువు డూన్ స్కూల్ లో, ఉస్మానియాలో,  తర్వాత ఆక్స్ ఫర్డ్ లో. ఇంగ్లీష్ లో పి హెచ్ డి చేసీ ఉద్యోగం చేయలేదు..ఇష్టమైనవాటి గురించి, ఇష్టమొచ్చినట్లుగానే రాసింది. తల్లి ఫ్రెంచ్ నాట్యకారిణి , తండ్రి తెలుగు శాస్త్రవేత్త – అవివాహిత అని ఉంది వ్యక్తిగత వివరాలలో.

అతని వంటి , అతనితోటి  టెక్ విద్యార్థులకి  ఆమె జాన్రె చాలా దూరం .

ముద్దు గా ఇంటికి తెచ్చుకుందిగాని ఏమడగాలో ఇతన్ని ?

” ఏమి చదువుతూ ఉంటారు ? ”

సిగ్గు పడ్డాడు. అంత వెసులుబాటు ఎక్కడుందని ? ఎవరు నేర్పారని  ? సాహిత్యం చదవటమనేది ఇంకా గర్వించుకోవలసినదే గనుక అందరి లాగే చేతన్ భగత్ ని చదువుకున్నాడు.

అదే చెప్పాడు.

ఆమెచదివిందో , తెలుసుకుందో మరి  –  ఎక్కువగానే నవ్వింది. అతని ఉక్రోషానికి క్షమాపణ చెప్పుకుంటూ

” ఏమనుకోకండి, సాహిత్యమంటే అది కాదేమో అని… ”

” మరి ఏది ? ”

ఆమెకి ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత మాటలకోసం తడుముకోనక్కర్లేకపోయింది. మంత్రనగరి ద్వారాలు ఒక్కొకటే తెరుచుకున్నాయి.

ఇంకొన్ని, మరికొన్ని – వారాంతాలు . సాహిత్యం లోంచీ ఒకానొక సాంగత్యం లోంచీ వచ్చే నిండైన   ఆకర్షణ.

rajahamsayuri pysar

” రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి పుస్తకాలని ముందే చదివెయ్యకూడదు…ఆ నిరాశ కబళించేస్తుంది. మొదటి యుద్ధం ముందు నుంచి వెనక్కి వెళ్ళి తిరిగి రావాలి  ”

ఆ రోజు దట్టంగా మబ్బు. హోరుగాలి .

వుదరింగ్ హైట్స్ లోంచి చదువుతోంది .

” అతను ప్రశాంతమైన ఆనందంలో విశ్రమించుదామని అడిగాడు…నేను తళతళమనే  వైభవం లో నృత్యం చేయాలనుకున్నాను. అతని స్వర్గం లో జీవం ఉండదని నేను- నా ఉత్సవం లో తల తిరుగుతుందని అతను. అతనిదైన చోట నాకు నిద్ర వస్తుందని నేను – నేను అడిగే చోట ఊపిరి ఆడదని అతను ”[1]

ఆగిపోయింది.

” నన్నెందుకు కాదన్నావు ? నీ గుండెని నువ్వెందుకు మోసగించుకున్నావు ??  ” అతను ఆగ్రహం తో అరిచాడు. [2]

” ఏమిటి ? ఏమన్నావు ?? ”

అతనికేమీ తోచలేదు.

” ఏమో. ఎందుకు అన్నాను అలా ? ఎక్కడివి ఆ మాటలు ? మీకు తెలుసా ?”

” ఈ నవలలోవే ”

” ఎలా..ఇదెలా సాధ్యం…నాకా పేరే తెలీదే ” – అతనికి నిజంగానే తల తిరిగింది.

కాసేపాగి పిలిచింది – ” మౌళీ  ! ”

‘ అతని పేరు కాదు . కాని బదులు పలకబోయాడు  . ” అది నా పేరు కాదే ? ”

” ఇప్పుడు కాదేమో ”

” ఎవర్ని నేను ? ”

” నాకు తెలిసింది  నువ్వు అవునో కాదో … తెలీదు . ఏమో ‘’

లేచి అద్దం లో చూసుకున్నాడు..    ” ఈ మొహం నాదేనా ? ” అయోమయపు నవ్వొచ్చింది అతనికి. బుగ్గలు సొట్టలు పడ్డాయి. ఆ పోలికల వెనక ఉన్నదాన్నేదో ఆమె చూసుకుంది.

” నువ్వే ” – అనుకుంది.  ” ఆలోచించు ” అని మాత్రం అంది.

ఆ తర్వాత ఆ వారమంతా  ప్రయత్నించాడు . ఊహించినట్లుగా, ఆశపడినట్లుగా – ఒక్కసారిగా స్పష్టమయిపోలేదు  . చెదిరిన సన్నని గాజుధూళి  – వేయి రంగుల్లో  , …  వెతికేకొద్దీ కమ్ముకునే వక్రీభవనం.

ఫోన్ చేశాడు, ఆన్సరింగ్   మోడ్  లోకి వెళ్ళింది. వారం మధ్యలో వెళ్ళి చూశాడు- ఇంటికి తాళం వేసి ఉంది.

ఆఖరికి, ఆ శుక్రవారం సాయంత్రం , ఎప్పట్లాగా – అతన్ని లోపలికి ఆహ్వానించింది. ఆమె మొహం లోంచి దేహం లోంచి నడకలోంచి నవ్వులోంచి – వార్ధ క్యం  నీహారికలాగా జారిపోతోంది అతనికి.

” ఎవరు నువ్వు ? ” అడిగాడు.

” 1924 లో పుట్టాను ..ఆశ్చర్యం లేదుగా నీకు ? ” లేదు. అతనికి తెలుసు.

” చంద్రమౌళి నాకు హైదరాబాద్ లో పరిచయం. నేను కోఠీ వుమెన్స్ కాలేజ్ లో. అతను ఉస్మానియాలో- లిటరేచర్ .   ఇద్దరం మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాం. . రోజూ మధ్యాహ్నాలు కాలేజ్ పక్కని ఐస్ పార్లర్ లో ఫలూడా , సాయంత్రాలు ఇరానీ కెఫె లలో టీ , బోలెడంత కవిత్వం  .  చల్లని, వెచ్చని   అందమైన కాలం అది.

చదువైపోతూ ఉండగా  వాళ్ళ ఊరికి తీసుకు వెళ్ళాడు.   నిజానికి నన్ను ఒప్పుకోకూడదు  , కాని కొడుకు కోసం రాజీ పడ్డారు – నేను మా అమ్మ లాగా కాకుండా నాన్నలాగే ఉన్నాను…అందుకు కూడా.   షరతులు పెట్టారు – నా తల్లి ఫ్రెంచ్ ఆవిడ అని ఎక్కడా ఎవరికీ తెలియకూడదు , నా తల్లిదండ్రులతో ఏ సంబంధాలూ పెట్టుకోకూడదు ,  ఆ పల్లెటూళ్ళో ఉండిపోవాలి….

అక్కడి ఆస్తులూ వ్యవహారాలూ వదిలేసి అతను ఇంకెక్కడికీ వెళ్ళే వీలే లేదు. .. వాళ్ళనీ ఏమీ అనలేం, పరువూ ప్రతిష్ఠా ఇంకేవో. మా అమ్మా నాన్నా నన్ను స్వేచ్ఛగా పెంచారు , ఎక్కడా సర్దుకొనే అవసరమే రానీకుండా.  నన్ను మొత్తం పోగొట్టుకుని అక్కడ ఉండిపోవటం చావుతో సమానమనిపించింది- తిరస్కరించాను.అతనికి ఆ అఘాతం తట్టుకోలేనిది అయింది. ఎంత బ్రతిమాలినా నేను లొంగలేదు. అబద్ధాలతో మా జీవితం మొదలు కాకూడదనుకున్నాను.

కొన్నాళ్ళు ఆగితే ఎవరి మనసులు ఎలా మారేవో…కాని అతను అజాద్ హింద్ ఫౌజ్ లో చేరాడు…కోపమో తెగింపో దేశం మీద భక్తో- తెలీదు. 1945 లో బర్మాలో వాళ్ళు ఓడిపోయారు , అతను బతకలేదు.

అప్పుడు తెలిసింది  – అతను నాకు ఎంత అవసరమో. లేచి నిలుచునేందుకు కూడా శక్తి చాలదనిపించింది. అలాగ రెండు మూడేళ్ళు. గాయం నుంచి రక్తం కారటం తగ్గింది. అమ్మా నాన్నల మొహాలు కనిపించాయి…. బ్రతికాను. తర్వాత ఆక్స్ ఫర్డ్ తీసుకుపోయారు.  మంచి ప్రొఫెసర్ దొరికారు…చదువుకున్నాను. చాలా రోజులు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత కొంతకాలానికి- అతన్ని ఇంకెవరెవరిలోనో వెతికే ప్రయత్నం – కుదరలేదు…రాయటం మొదలు పెట్టాను . ఇన్నిఏళ్ళు గడిచాయి , ఎందుకు ఉన్నానో ..

నిన్ను  చూశాను .  తెలిసిపోయింది.

ఇంతకాలం ఎక్కడున్నావో ..వీరస్వర్గం లోనా ? ”

” అయి ఉండచ్చు ”  బుద్ధిగా ఒప్పుకున్నాడు అతను. ” ఏమీ గుర్తు రావటం లేదు … ప్రేమిస్తున్నానని తప్ప   ” – నిస్సహాయ మందహాసం .

” చాలులే. నేనంటే కొనసాగుతున్నాను…నువ్వు కొత్తగా మొదలయ్యావు కదా ” ఆమె కూడా నవ్వింది.

” ఇప్పుడేమిటి ఇక ? ”

” ఏముంటుంది…ఏ దేవతలో నన్ను క్షమించి కరుణించి ఇచ్చిన ఈ కొద్ది రోజులూ నావి , అంతే ”

కాదనిపించింది అతనికి .

” నా వయసు తొంభై ఒకటి . ఇంకెన్నాళ్ళుంటాను…  పెళ్ళి చేసుకో , చక్కటి  అమ్మాయిని చూసి. నాలాగా తొంభై ఏళ్ళు మాత్రం బతకద్దు…నన్ను అన్నాళ్ళు అక్కడ ఉంచుతారో లేదో… మళ్ళీ ఫలూడా తాగుతూ కలుసుకునేప్పుడు నాకు ఇరవై ,  నీకు డెబ్భై అయితే ఎలా మరి ? ‘’ .. వేళాకోళాన్ని   తెచ్చిపెట్టుకుంది …‘’  ఒకసారి అవకాశాన్ని పాడుచేసుకున్నాను…వచ్చేసారికి అంతా..సరిగ్గా..అవుతుందని ..” – మరొక కాలానికి ప్రవహిస్తూన్న మాటలు.

వ్యవధి ఎంత –  ఈ  ఉరవడి లో , స్వరానికీ స్వరానికీ మధ్య , మరణానికీ జన్మకీ మధ్య ?? పట్టు జారిపోతున్నప్పటి ఆక్రందన ఎవరికి పడుతుంది , ఒకర్నొకరు పారేసుకున్నాక ???

అతన్ని ఉన్మాదం ఆవేశించింది ఆ క్షణం – ” నువ్వు పోతే నేనూ వెంటనే పోవచ్చుగా…ఎంత సేపు అది, చేతిలో పని ”

” అలా వీలవదు అబ్బాయీ…దానికింకా పెద్ద శిక్షలుంటాయి ”

” రెండు హంసలు జన్మానికి ఒకేసారి జంట అవుతాయట కదా ” అతనికి తట్టింది.

” అవునులే  .. ఇవాళ మాత్రం నీది . నిన్నా రేపూ మనవి… అందాకా…ఆగచ్చు    ”

మూడో రోజున ఆమె కథ ముగిసింది.

ఆమెని సాగనంపి వచ్చిన  అతనిది  కూడా,  సహజంగానే.

*                *                    *                     *

 

  1. “He wanted all to lie in an ecstasy of peace; I wanted all to sparkle and dance in a glorious jubilee. I said his heaven would be only half alive; and he said mine would be drunk: I said I should fall asleep in his; and he said he could not breathe in mine.”
  2. ‘’ Why did you despise me  ?  Why did you betray your own heart, Cathy?’

 

[  Ray Bradbury కథ   ‘ The Swan ‘ (కొంత ) ఆధారంగా — జననాంతర సౌహృదాలను అంగీకరించిన పాశ్చాత్య రచయితలలో  Ray Bradbury  ప్రముఖులు. James Long రాసిన Ferney నవల కథా అటువంటిదే. ]

 

 

 

 

 

అబ్సలీట్ రియాలిటీ

 

satyaprasadచాలా సాధారణమైన ప్రశ్న అడిగింది. – “మీరేం అమ్ముతారు?” అని

నిజం చెప్పాలంటే చాలా అమాయకంగా వుందా ప్రశ్న.

పెళ్ళి చూపులులో భాగంగా, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారేమో అంటూ మమ్మల్ని ఏకాంతంగా ఇంటి మేడ పైన వదిలేశారు. చల్లగాలి. చొరవ చెయ్యాలా వద్దా అన్న చిన్న బెదురు. ఎదురుగా అరుదుగా కనిపించే అందం. అదీ ఆకుపచ్చని చీరలో. ఏం మాట్లాడాలా అని తటపటాయిస్తున్న క్షణాలు.

సరిగ్గా అప్పుడే ఆమె అడిగిన ప్రశ్న. “మీరేం అమ్ముతారు?” అని.

“నేను టీవీ ఛానెల్ లో పని చేస్తాను. అమ్మడం ఏమీ వుండదు” అన్నాను నేను.

“టీవీలో చేస్తారని చెప్పారులెండి. అక్కడ మీరేం అమ్ముతారు అనే అడుగుతున్నాను.” అంది. అమాయకత్వమా అజ్ఞానమా? అనుకున్నాను.

“మీరు టీవీలో చూస్తుంటారే… “మధ్యాహ్నం మహిళ”, “కొడితే కోటి రూపాయలు” ఈ షోలకి నేనే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్” అన్నాను

“నేను టీవీ చూడను”

అరుణ చెప్పిన ఈ మాట చాలా విచిత్రంగా అనిపించింది. “టీవీ చూడకపోవటమేమిటి? గేమ్ షోలు సరే… సీరియల్స్?”

“ఊహు”

“సినిమాలు? స్పోర్ట్స్? న్యూస్?”

“అసలు టీవీ ముఖమే చూడను మహాప్రభూ. మా ఇంట్లో అందరూ చూస్తారు” అన్నది. ఇంకేం చెప్పాలి?

“మీ నాన్నగార్ని, మీ అన్నయ్యలను చూసి నేను కూడా సేల్స్ ఉద్యోగం అనుకుంటున్నారా? నా ఉద్యోగం అలా కాదు” అన్నాను.

అరుణ నవ్వింది. నెమ్మదిగా నడుస్తూ మేడ మీదకు పాకిన కాగడామల్లెల తీగ నుంచి ఒక సన్నటి మొగ్గని తుంచి గాఢంగా వాసన చూసింది. ఆ తరువాత నా వైపు చూసి “కాదా?” అంది.

“కానేకాదు. నాది క్రియేటివ్ జాబ్” అన్నాను నేను. నా వైపు ఓ అర సెకను నిశ్చలంగా చూసింది. పిల్ల తెమ్మరలాంటి చూపు. ఆ చూపులో మెల్లెపూల సువాసనలు. కానీ ఆమె మాటల్లో…

“నా దృష్టిలో వుద్యోగాలన్నీ అమ్మకాలే. మీరు కూడా ఏదో అమ్ముతుంటారు. అదేంటో మీకే తెలియటంలేదు.” అంది చిరునవ్వు చెరగకుండా. పెళ్ళి చూపులు అయిపోయాక అమ్మాయి అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకోవడం అంటే కుటుంబం గురించో, అభిరుచుల గురించో, ఆర్థిక విషయాల గురించో మాట్లాడుకుంటారని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. ఇక్కడ వ్యవహారం ఏదో తేడాగా వున్నట్లు అనిపించింది.

“మీకు అలా ఎందుకు అనిపిస్తోందో కానీ, అన్నీ వుద్యోగాలు సేల్స్ వుద్యోగాలు కావండీ…” అన్నాను ఆమె కళ్ళలోకే చూస్తూ. సిగ్గో, నా చూపులో వున్న చొరవో తెలియదు కానీ, ఆమె కళ్ళతోనే నవ్వేసి, పిట్టగోడ పట్టుకోని కొంచెం ముందుకు వంగుతూ మాట్లాడింది.

“ఏం కాదు. ఇప్పటి ప్రపంచంలో ప్రతి ఉద్యోగం ఏదో ఒకటి అమ్మడానికే కల్పించబడింది. ప్రతి ఉద్యోగీ నేరుగా అమ్మకపోవచ్చు, కానీ ఏదో రకంగా అమ్మకానికే దోహదం చేస్తారు. ఒకోసారి ఆ ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళేమి అమ్ముతున్నారో” అంది.

“మరి స్కూల్ టీచర్ వున్నాడనుకోండి. ఆయనేం అమ్ముతున్నట్లు?”

Kadha-Saranga-2-300x268

“టీచర్లలో రకాలు వున్నాయి లెండి… ఒక రకం ర్యాంకులు, ఐఐటీ సీట్లు తద్వారా రాబోయే పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద జీతాలు… ఇంకో రకం ఉన్నారు పాపం వీళ్ళు జ్ఞానాన్ని, మన మీద మనకి నమ్మకాన్ని, జీవితం గురించి భరోసాని అమ్మాలనుకుంటారు. పాపం వాళ్ళ సరుకు అమ్ముడుపోదు…” కిసుక్కున నవ్వింది.

“చిత్రంగా మాట్లాడుతున్నారే… మరి గుళ్ళో పూజారి?”

“అమ్మో, ఆయన లిస్ట్ చాలా పెద్దది… భయం, భక్తి, ఆశ, దురాశ, స్వర్గం, నరకం…”

“సరే… సరే… మొత్తం మీద నేను చేసేది కూడా సేల్స్ ఉద్యోగమే అంటారు? పైగా నేను అమ్ముతున్నదేంటో నాకే తెలియదంటారు? అంతేనా” అన్నాను కాస్త తీవ్రంగా.

“అవును… మీరు అమ్మేదేంటో మీకు తెలియదు కాబట్టి… ఒక పందెం” కావాలనే అక్కడ ఆపింది. నేను అలాగే చుస్తూ వున్నాను. “ఏం. లేదు. మీరు అమ్మే ప్రాడక్ట్ ఏమిటో తెలుసుకోని నాకు చెప్పాలి… మన పెళ్ళి లోగా” అంటూ చీర కుచ్చిళ్ళని పైకి పట్టుకోని పరుగు లాంటి నడకతో మెట్లు దిగేసింది. మేడ పైన నేనూ, కాగడామల్లెతీగ మిగిలాము.

***

“ఏరా ఏమంటావ్?” అన్నాడు నాన్న కారు ఊరు దాటిన తరువాత.

ఆ అమ్మాయి మాటలు మళ్ళీ గుర్తుకువచ్చాయి. “మన పెళ్ళి లోగా…” అన్నదంటే ఆ అమ్మాయికి నచ్చినట్లే..! చెప్పకుండానే చెప్పేసింది! గడుసుదనం!!

“ఏరా? సమాధానం చెప్పవే?” నాన్న మళ్ళీ అడిగాడు.

“ఇంకేంటి చెప్పేది… అన్నయ్య అప్పుడే ఆ అమ్మాయితో డ్యూయెట్లు ఊహించుకుంటున్నాడు..” అంది చెల్లెలు శ్వేత.

“నాకు ఓకే నాన్నా… కాకపోతే కొంత టైం కావాలి” అన్నాను. ముందు సీట్లో డ్రైవర్ పక్కన వున్నాను కాబట్టి వెనక కూర్చున్నవాళ్ళ  ముఖాల్లో భావాలు తెలియట్లేదు. నా ముఖంలో వున్న భావాలు కూడా వాళ్ళకు కనపడవు కాబట్టి నా ఆలోచనలు వాళ్ళకు అర్థం కావు. “కోడితే కోటి రూపాయలు” గేమ్ షోలో కోటి రూపాయల ప్రశ్న దగ్గర ఆగిపోయిన అభ్యర్థిలా వుంది నా పరిస్థితి.

“ఇంకా టైం ఎందుకురా? నచ్చితే వచ్చే నెల్లోనే చేసేద్దామని వాళ్ళ నాన్నే చెప్పాడు” అమ్మ తన ఆతృతని బయటపెట్టింది.

“అది కాదులే అమ్మా… ఆ అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది. పెళ్ళిలోగా సమాధానం చెప్పాలి” అన్నాను నేను.

“పెళ్ళిలోగా చెప్పాలా? లేక సమాధానం చెప్తేనే పెళ్ళి లేకపోతే లేదు అన్నదా మా వదిన” అంది శ్వేత ఉత్సాహంగా.

శ్వేత మాటల్లో కూడా నిజముందేమో అనిపించింది నాకు. ఇది ప్రశ్నా? లేకపోతే పరీక్షా?

“వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ అమ్ముతాడు, పెద్దన్నయ్య కార్ షోరూమ్ లో కార్లు అమ్ముతాడు, చిన్నన్నయ్య సరే సరి బట్టల షాపు కదా… అలాగే నా ఉద్యోగంలో కూడా నేను ఏదో అమ్ముతానట. అదేంటో కనుక్కోని చెప్పమంది” అన్నాను నేను.

“టీవీ ఛానల్లో అమ్మేదేముంటుంది?” ఆశ్చర్యపోయాడు నాన్న. నాన్నకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే అవకాశంలేదు. దూరదర్శన్ కాలం నాటి మనిషి, అంతే ఆలోచించగలడని నాకూ తెలుసు.

“ఏముందిరా అన్నయ్యా! టీవీ ఛానల్ అంటేనే ఎంటర్టైన్మెంట్. నువ్వు ప్రోగ్రాములు ప్రొడ్యూస్ చేస్తావు కదా… అదే నీ ప్రాడక్ట్… అదే అమ్ముతున్నావు.” అంది శ్వేత చాలా సులభైన పరిష్కారం కనుక్కున్నట్లు.

నిజమే కదా? ప్రేక్షకులే నా కస్టమర్స్ అనుకుంటే, వాళ్ళని అలరించే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చెయ్యడమే కదా నా పని. అంటే నా షోలో కంటెంటంటే కదా నేను అమ్మేది. అంతే! ఫోన్ చేశాను.

“ఇంత త్వరగా ఫోన్ చేస్తారని అనుకోలేదు” అంది అరుణ. ఆమె గొంతు వినగానే ఏదో మధురభావన.

“కనుక్కున్నాను” అన్నాను క్లుప్తంగా.

“ఏమిటి?” అందామె.

“అదే నేను అమ్మేది.”

“చెప్పండి మరి”

“ఎంటర్టైన్మెంట్!” చెప్పాను.

“ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నారా? ఎవరికీ?”

“ప్రేక్షకులకి”

“అంటే ప్రేక్షకులే మీ కస్టమర్స్ అన్నమాట”

“అంతే కదా?” నా వెనకే కూర్చున్న శ్వేత ఉత్సాహంగా ముందుకు వంగి నా భుజం మీద తట్టింది.

“మరి కస్టమర్స్ అంటే మీరు అమ్మే వస్తువునో, సేవలనో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి కదా? మరి మీ ప్రేక్షకుడు కూడా ఇస్తున్నాడా?”

“ఇస్తున్నాడు కదా? కేబుల్ టీవీ ఆపరేటర్ కి…”

“అది కేబుల్ కనెక్షన్ ఇచ్చినందుకు, సర్వీస్ చేస్తున్నందుకు. అయినా ఆ డబ్బులు టీవీ ఛానల్ దాకా రావు కదా?”

“అవును నిజమే”

“తొందరపడకూడదు… నెమ్మదిగా ఆలోచించి, పది మందిని అడిగి సమాధానం చెప్పాలి.. ఏం?” అంటూ పెట్టేసింది. చివర్లో నవ్విందా? నవ్వలేదా? నేనే అట్లా అనుకున్నానా? ఏమైనా ఆ అమ్మాయి నవ్వు మనోహరంగా వుంటుంది వినడానికి కూడా.

శ్వేత పిలుపుతో మళ్ళీ ఈ లోకం లోకి వచ్చాను. “ఏమనింది వదిన?” మళ్ళీ అడిగింది.

“కాదటమ్మా… అమ్మకం అంటే ఒక కస్టమర్ వుండాలి, అతను డబ్బులు ఇచ్చి మన దగ్గర్నుంచి ఏదైనా తీసుకోవాలి. అదీ ట్రాన్జాక్షన్ (transaction)… లావాదేవి. అలా జరిగితేనే అమ్మకం జరిగినట్లు.”

“అలా అని వదిన చెప్పిందా?” అడిగింది. నేను తలాడించాను. “అయితే కరెక్టే అయివుంటుంది” నవ్వేసింది.

***

“అయితే నువ్వు వెళ్ళింది పెళ్ళి చూపులకి కాదన్నమాట… స్వయంవరం” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.

“ఏంట్రా? నువ్వేదో హెల్ప్ చేస్తావని అడిగితే నా మీదే జోక్ చేస్తున్నావా?” అన్నాను నేను ఉక్రోషంగా. ఇరానీ చాయ్ ఘుమఘుమల మధ్య వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది. మాతో ఛానల్ లోనే పనిచేసే వంశీ, శివరావ్ కూడా వున్నారు.

“అయినా కొశ్చన్ ఇంటరస్టింగా వుంది బ్రో” అన్నాడు శివరావ్

“నేనొకటి చెప్పనా?” అన్నాడు వంశీ. విషయాన్ని ముక్కలు ముక్కలుగా చెప్పడం న్యూస్ రీడర్ గా వాడికి కొట్టినపిండి. తరువాత వాక్యం కోసం అందరూ ఎదురుచూశారు. “ఇవన్నీమార్కెటింగ్ కి సంబంధించిన విషయాలు. మన ఇస్మాయిల్ ని అడిగితే చెప్పేస్తాడు” అన్నాడు. ఒకేసారి నా కళ్ళు పెద్దవి చేసి, చిరునవ్వు నవ్వుతూ నిటారుగా కూర్చున్నాను. అరుణతో పెళ్ళికి రెండు క్యూబికల్స్ దూరమే వున్నట్లు ఒక చిత్రమైన ఫీలింగ్. ఇస్మాయిల్ క్యాబిన్ లోకి వెళ్ళాను.

“కన్ఫూజ్ చెయ్యకు భాయ్. మనం ప్రేక్షకులకు అమ్మేదేంటి? ఎమోషన్స్… ఎంటర్టైన్మెంట్… ఆనందం, బాధ, టెన్షన్, కోపం, అసహ్యం, జుగుప్స…” చెప్పాడు

“అవన్నీ ఎక్కడున్నాయి ఇస్మాయిల్?”

“మన సీరియల్స్ లో, క్రైమ్ కథల్లో…. న్యూస్ పోగ్రామ్స్ లో ఎలాగూ తప్పదు” అన్నాడు నవ్వుతూ.

“కానీ ప్రేక్షకులు మన కస్టమర్స్ కాదంటోందే మా ఆవిడ” అన్నాను. ఆవిడ అన్న పదం నోరు జారింది కానీ అందులోనూ ఒక థ్రిల్ అనిపించింది. ఇస్మాయిల్ వెంటనే పట్టేశాడు.

“అరేయ్ భాయ్… అప్పుడే ఆవిడనేస్తున్నావే… కంగ్రాట్స్” అన్నాడు. ఆ తరువాత కాస్సేపు ఆలోచించి చెప్పడం మొదలుపెట్టాడు. “మనకి ఆదాయాన్ని ఇచ్చేవాడు కస్టమర్ అయితే, ప్రేక్షకుడు మనకి ఏ రూపంలోనూ డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి ప్రేక్షకుడు మన కస్టమర్ కాదు. అంటే ప్రేక్షకుడే కస్టమర్ అన్న భ్రమలో మనం వున్నాం. భలే పాయింట్ కదూ?” అన్నాడు.

“అయితే మన ఛానల్ కి డబ్బులు ఇచ్చేది ఎవరు?” అడిగాను ఆతృతగా. ఇస్మాయిల్ నవ్వాడు.

“అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఏజన్సీలు, కంపెనీలు…” మార్కెటింగ్ అనుభవమంతా కనపడింది అతని మాటల్లో. సమాధానం దొరికింది.

వెంటనే నా కాబిన్ లోకి వచ్చాను. మొబైల్ చేతిలోకి తీసుకోని ఫేవరెట్స్ లో మొదట వున్న అరుణకి ఫోన్ చేశాను.

“అపూర్వ ప్రశ్నల అరుణాదేవీ… తెలిసిపోయింది”

“అయితే చెప్పేయ్యండి రాకుమారా..” అంది నవ్వేస్తూ.

“మా కస్టమర్ ప్రేక్షకుడు కాదు, కార్పొరేట్ సంస్థలు, యాడ్ ఏజన్సీలు…” అన్నాను ఆవేశంగా.

“నాకు తెలుసు మీరు కనిపెడతారని. కానీ, నేను అడిగింది మీరు అమ్మేదేంటి అని కదా. మీరు ఎవరికి అమ్ముతున్నారో చెప్పారు” అంది అరుణ కాస్త వ్యంగం ధ్వనిస్తున్న గొంతుతో.

“వాళ్ళకి అమ్మేదేముంది… అడ్వర్టైజ్మెంట్ స్లాట్… అదే కదా వాళ్ళకు కావాల్సింది…” అన్నాను

“ఇంకేముంది… గెలిచినట్లే… కాకపోతే అడ్వర్టైజ్మెంట్ స్లాట్ అమ్మడానికి మీ ప్రోగ్రామ్ లకి సంబంధం ఏమిటి? రోజు రెండు గంటలో, మూడు గంటలో అడ్వర్టైజ్మెంట్లే ఒక కార్యక్రమంలా వేయచ్చు కదా?” అంది. ఆమెకు కావాల్సిన సమాధానం ఇంకా రాలేదని అర్థం అయ్యింది. ఆ విషయం నేరుగా చెప్పకుండా ప్రశ్నలతో సమాధానం రాబట్టాలని చూస్తున్నట్లుంది.

“చెప్పండి… సాయంత్రం ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ కి ఒక రేటు, మధ్యాహ్నం కార్యక్రమానికి ఒక రేటు ఎందుకుంటుంది?” మళ్ళీ అడిగింది.

“అది చూసే జనాన్ని బట్టి మారుతుంది. దాన్నే టీఆర్పీ అంటారు. ఎక్కువమంది చూసే టైమ్ ఎక్కువ విలువైంది. తక్కువ ప్రేక్షకులు చూసే టైమ్ లో అడ్వర్టైజ్మెంట్ అంటే తక్కువ రేటుకే…” ఆగిపోయాను నేను. ఏదో కొత్త విషయం తెలుస్తున్నట్లు అనిపించింది. అవతల వైపు నవ్వు.

“కాబట్టి ఇప్పుడు చెప్పండి. మీరు మీ ఉద్యోగంలో ఏం అమ్ముడానికి సహాయపడుతున్నారు?” అడిగింది చివరగా.

“ఐబాల్స్… ప్రేక్షకుల సమయం. మంచి ప్రోగ్రామ్ చెయ్యడం ద్వారా, ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలా చేసి, అలా చూస్తున్నారు కాబట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేసి మరీ ఆ సమయాన్ని అడ్వటైజర్లకు అమ్ముతున్నాము.” అన్నాను ఆలోచనతో పాటే మాట్లాడుతూ.

“అంతేనా, టమాటాలు గ్రేడింగ్ చేసినట్లు ప్రేక్షకుల సమయాన్ని గ్రేడింగ్ చేసి దానికి టీఆర్పీ అని పేరు పెట్టి, ప్రైమ్ టైమ్, స్లాక్ టైమ్ అని విభజించి అమ్ముతున్నారు…”

“అవును నిజమే…”

“ఇప్పుడు అర్థం అయ్యిందా నేను ఎందుకు టీవీ చూడనో… నాకు ప్రోగ్రామ్ అనే ఎరవేసి నా సమయాన్ని దొంగిలించి గ్రేడ్ చేసి అమ్ముకునేవాళ్ళకు సహకరించడం నాకు ఇష్టం లేదు. పైగా అలా మోసపోడానికి నేనే కేబుల్ చార్జెస్ రూపంలో ఎదురు డబ్బులు ఇవ్వాలి…”

నేను చాలాసేపు సమాధానం చెప్పలేదు. నేను చేస్తున్న ఉద్యోగాన్ని ఈ కోణంలో చూడటం కొత్తగా వుంది. ఇప్పటిదాకా నాది క్రియేటివ్ జాబ్ అనుకున్నాను, నన్ను వాడుకుంటున్నారని అర్థం అవటం అప్పుడే మొదలైంది.

“ఏంటి ఆలోచిస్తున్నారు?”

“ఉద్యోగం చెయ్యక తప్పదు కదా… ఇప్పట్లో వదిలెయ్యలేనేమో…”

“వదిలెయ్యమని నేను చెప్పలేదే… కాకపోతే మీ చేత ఏం పని చేయిస్తున్నారో తెలుసుకోని వుండాలి కదా?”

“అవును. అన్నట్లు ఒకటి మాత్రం చెయ్యగలను. మనింట్లో టీవీ వుండదు…”

“అయ్యో టీవీ లేకపోతే ఎలా? టీవీ వుండాలి… కేబుల్ అఖర్లేదు. అప్పుడప్పుడు మనిద్దరికీ నచ్చిన సినిమాలు డీవీడీ వేసుకోని చూడటానికి, మన పెళ్ళి వీడియో మళ్ళీ మళ్ళీ చూసుకోడానికి…” అంటూనే నవ్వేసింది అరుణ. నేనూ ఆమెతో శ్రుతి కలిపాను. ఛానల్ ఆఫీస్ లో ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. వాళ్ళా అరుపుల్లో, నా నవ్వు ఎవరికీ వినపడట్లేదు.

***

 

 మాయ

buddhiనిమీద బయటికెళ్లిన మాణిక్యరావు ఇంటికొచ్చాడు. ముందింట్లో నవనీత కనిపించకపోయేసరికి, నేరుగా వంటింట్లోకెళ్లాడు. ఆమె దొడ్లో బాట్టలు ఆరేస్తా కనిపించింది. బావి అరుగుమీదకెళ్లి నిల్చుని బక్కెట్‌లోని నీళ్లను కాళ్లమీద
కుమ్మరించుకున్నాడు.
“రేపు గుంటూరుకెళ్తున్నానే” అన్నాడు.
“అయితే కొనాలనే నిర్ణయించుకున్నావన్న మాట” అంది నవనీత, బట్టలకు క్లిప్పులు పెడతా.
“ఇప్పుడు కొనకపోతే, ఇంకెప్పుడూ అక్కడ కొనలేమే. ఇప్పుడే సెంటు లక్ష చెబుతున్నారంటే, ఇంకో ఏడు పోతే ఎంతవుద్దో. ఇప్పుడు కొంటే రెండేళ్లలో నాలుగైదింతలు రేటు పెరగడం గ్యారంటీ.”
“మనం ఉంటున్న ఈ చోటే సెంటు లక్షుంటే ఎక్కడో ఊరికి దూరంగా, ఇళ్లంటూ లేని చోట కూడా లక్షా? అంతెందుకుంటుంది?”
“మనం ఉంటున్న ఏరియాకీ, రాజధాని అమరావతి ఏరియాకీ లంకె పెడతావేందే. ఇక్కడ సెంటు స్థలం లక్ష కావడానికి ఎంత కాలం పట్టిందో నీకు తెలీదా. ఇప్పుడందరి చూపూ అమరావతి ఏరియా మీదే ఉంది. దాని చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దాకా ఎక్కడ స్థలం కొన్నా బంగారం కిందే లెక్క. ఆ చదువులయ్య చూడు. తెలివంటే ఆడిదే. రాష్ట్రం రెండుగా యిడిపోవడానికి ఏడాది ముందుగాల్నే గుంటూరు కాడ ఏకంగా అరెకరం స్థలం కొనేశాడు. ఇంకా రెండేళ్లు కాలేదు. అప్పుడే నాలుగింతలు రేటు పలుకుతోందంట. ఒక్క దెబ్బకు కోట్లు వెనకేసుకోబోతున్నాడు. మనమూ ఉన్నాం ఎందుకూ? ప్రతిదానికీ జంకే. తెగించి ఏం చేద్దామన్నా పడనియ్యవు కదా” అన్నాడు కాస్త విసురుగా.
వేటపాలెం ప్రాంతంలోని షావుకార్ల (మాస్టర్ వీవర్ల)లో మాణిక్యరావు ఒకడు. అతని చేతికింద నూటయాభై మగ్గాల దాకా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలామంది షావుకార్లు నష్టాలపాలై వేరే వ్యాపారాల్లోకి దిగారు. కొంతమందైతే తామే నేతగాళ్లుగా మారిపోయారు. మాణిక్యరావు ఒకేరకం బట్టని కాకుండా నాలుగైదు రకాల బట్టలు నేయిస్తూ కొద్దో గొప్పో సంపాదించాడు. మాణిక్యరావు మాదిరిగానే చదువులయ్యా మాస్టర్ వీవరే. కాకపోతే అతను ఒక్క మగ్గాల్నే నమ్ముకోలేదు. బట్టల వ్యాపారం మీదొచ్చిన డబ్బుతో మొదట్లో ఏడాదికి మూడు పంటలు పండే పొలాలు కొన్నాడు. తర్వాత వాటిని అమ్మేసి రెండెకరాల మామిడితోట కొన్నాడు. నాలుగేళ్లయ్యాక ఆ రెండెకరాల తోటని నాలుగెకరాలు చేశాడు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెని చూశాక రాష్ట్రం రెండుగా విడిపోతుందనే నమ్మకం బలపడి గుంటూరు కాడ స్థలం కొన్నాడు. అతడి నమ్మకం నిజమై ఇప్పుడది నాలుగింతల విలువకు చేరుకుంది. అతడి మాదిరిగా తను ఆస్తులు పెంచుకోలేకపోతున్నందుకు మాణిక్యరావులో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. చదువులయ్యకు వాళ్లావిడ సపోర్ట్ బాగా ఉండబట్టే తెగువతో ముందుకెళ్లిపోతున్నాడని అప్పుడప్పుడూ నవనీతని ఎత్తిపొడుస్తుంటాడు.
“ఇప్పుడు మనకేం తక్కువయ్యిందయ్యా. యాపారం బాగానే సాగుతా, హాయిగా గడిచిపోతోంది కదా. తిండికి కరువా, బట్టకి కరువా? మంచి మేడ కట్టుకున్నాం కదా. ఇద్దరు పిల్లల్నీ మంచి స్కూల్లో చదివించుకుంటున్నాం. కంటిమీద సుఖంగా కునుకుపడితే చాలు. లేనిపోని ఆశలతో తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడమెందుకంటా?” అంది ముందింట్లోకొచ్చి.
“నీకు చెప్పాను చూడూ.. నాదీ బుద్ధి తక్కువ. దేనికీ పడనియ్యవు కదా. ఎప్పుడూ ఇట్టాగే ఉండిపోతామంటావేం. మనిషన్నాక ఆశుండాలే. ఆశుంటేనే ఎదుగుతాం. ఈ యేటపాలెం ఏరియాలో మాణిక్యరావు అనేవాడు డబ్బున్నోడిగా, పెద్దమనిషిగా పేరు తెచ్చుకోవడం నీకిష్టం లేదా?” అంటా, అక్కడ బల్లమీద తను పెట్టిన సంచీని తెరిచాడు. దాంట్లోని శ్రద్ధగా మడతలు పెట్టిన ఆయిల్ పేపర్‌ను తీశాడు. అది మల్లెపువ్వంత తెల్లగా, పాదరసం అంత నున్నగా మెరుస్తోంది.
“మందెట్టా మైకాన్నిస్తుందో ఆశ కూడా అంతేనయ్యా. ఆ మైకంలో పడితే ఎవరేం చెప్పినా తలకెక్కదు” అంటా నెత్తికొట్టుకుంది నవనీత.
“నువ్వు చెప్పే నీతులు పుస్తకాల్లో రాయడానికీ, బళ్లో చదువుకోడానికీ పనికొస్తాయే కానీ జీవితానికి పనికిరావే మొద్దూ” అంటా మెరుపుల కాయితం మడతలు విప్పి, బల్లమీద పరిచాడు.
దానిమీద రంగురంగుల గీతలతో డబ్బాలు కొట్టున్నాయి. ఆ గీతలు, ఆ డబ్బాలు గజిబిజిగా కనిపించాయి నవనీతకు.
“ఇది ఆ స్థలానికి చెందిన లేఔటే. రాజధాని వొస్తున్న ఏరియాకి దగ్గరలో అమరావతి రోడ్ పక్కనే ఉంది ఈ సైటు. ఇక్కడ సెంటు లక్షకి దొరకడమంటే చాలా అదృష్టమనీ, ఆ రేటుకి ఆ చుట్టుపక్కల ఎక్కడా స్థలం దొరకట్లేదనీ గణపతి చెప్పాడు. ఈ అవకాశం వొదులుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అతను అబద్ధం చెప్పడు కదా. నిజానికి ఆ స్థలాన్ని చూడకుండానే కొనేయొచ్చు. కానీ చూశాకే తీసుకుంటానని చెప్పా తెలుసా” అన్నాడు, తనకు తెలివితేటలు ఎక్కువనే సంగతి ఆమె గ్రహించాలన్నట్లు.
“భూమితో యాపారం చేసే మనిషి అట్టా చెప్పకుండా ఇంకెట్టా చెబుతాడంటా. తన భూమి అమ్ముడుపోడానికి ఎన్ని కబుర్లైనా చెబుతాడు. తిమ్మిని బమ్మి చేస్తాడు. మెట్టని మాగాణని చెబుతాడు. పల్లాన్ని మెరకంటాడు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా అతను రాజకీయాల్లో తిరిగే మనిషి. అధికారం అండదండలున్నోడు” అంది నవనీత నచ్చచెబుతున్న ధోరణితో.
దాంతో కాస్త మెత్తబడ్డాడు మాణిక్యరావు. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. లేఔట్ కాయితాన్ని మడతలు పెడతా, కాస్త చిన్నగా “అందుకేగా రేపు గుంటూరు పోతోందీ. సైటు చూశాకే, నచ్చితేనే తీసుకుందాంలేవే” అన్నాడు.
కారులో కూర్చున్నాక “ఈ సైటుకు మీరన్నట్లు వాల్యూ పెరుగుతుందంటారా?” అడిగాడు మాణిక్యరావు.
“అసలా అనుమానం ఎందుకొచ్చింది మాణిక్యం. అది కొంటే బంగారం కొన్నట్లే. లేకపోతే నేనెందుకక్కడ ఆ సైట్‌కొని ప్లాట్లేస్తాను? ఏడాది తిరిగేసరికల్లా ఒకటికి రెండు రెట్లు రేటు పెరక్కపోతే అప్పుడడుగు” అన్నాడు గట్టి నమ్మకాన్ని మాటల్లో వ్యక్తం చేస్తూ గణపతి.
ఇటీవలి కాలంలోనే ఆ ఏరియాలో భూముల రేట్లు ఎట్లా పెరిగాయో, ఇంకా ఎట్లా పెరుగుతున్నాయో వర్ణించి వర్ణించి చెప్పాడు. ఉదాహరణగా హైదరాబాద్‌లోని మాదాపూర్ ఏరియాలో ఒకప్పుడు కాణీకి కొరగావనుకున్న భూములు చంద్రబాబునాయుడు హైటెక్ సిటీని ప్రకటించగానే ఎట్లా మారిపోయాయో, అక్కడ భూములున్న పేదోళ్లంతా రాత్రికి రాత్రే ఎట్లా కోటీశ్వరులైపోయారే చెబుతుంటే ఆసక్తిగా విన్నాడు మాణిక్యరావు. నిజానికి ఆ సంగతి అతనికెప్పుడో తెలుసు. కానీ గణపతి చెప్పే విధానంతో, తనూ కోట్లకు పడగలెత్తినట్లేనని ఊహించేసుకున్నాడు. ఆ ఊహ అతన్ని ఉద్వేగభరితుణ్ణి చేసింది. ఇప్పుడు ఆంధ్రలో కూడా అమరావతి ఏరియా అలాగే కాబోతున్నదనీ, దానికి తిరుగులేదనీ గణపతి చెప్పడంతో, మాణిక్యరావులో హుషారు ఎక్కువైంది. నవనీతవన్నీ ఉత్త భయాలు, అనుమానాలుగా తోచాయి.
“ఇంకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయా మాణిక్యం. మన సైట్లో నీళ్లకు కరువనేదే లేదు. పుష్కలంగా ఉంటాయి. మన సైట్‌కు దగ్గర్లోనే కృష్ణా నీళ్లు పారుతున్నాయి. భూమిలో చాలా తక్కువ లోతులోనే నీళ్లు పడతాయి. నిజం చెప్పాలంటే చుట్టుపక్కలున్న అన్ని సైట్ల కంటే మనదే విలువైన సైట్. కొన్న ఏడాదికే అమ్మకానికి పెట్టి చూడు. ఎంతలేదన్నా రూపాయికి ఐదు రూపాయల వొడ్డీ వొస్తుంది” అన్నాడు గణపతి.
ఇంక మాణిక్యరావు ఒక్క ప్రశ్నా వెయ్యలేదు. ఓ గంటన్నరలో సైట్ కాడికి వెళ్లిపోయారు. అమరావతి రోడ్డుకు బాగా దగ్గర్లోనే ఉందది. గణపతి చెప్పినట్లు అల్లంత దూరంలోనే కృష్ణ ప్రవహిస్తూ కనిపించింది.
గణపతి ఓసారి లేఔట్ తీసి, ఖాళీగా ఉన్న ప్లాట్లేవో చూపించాడు. ఈశాన్య మూల ప్లాట్ మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఒకటే ఉంది. దానికి మంచి డిమాండ్ ఉందనీ, ఈ రోజు సాయంత్రమే ఒకతను దానికి అడ్వాన్స్ ఇస్తానని చెప్పాడనీ, అది వొదిలేసి మిగతా వాటిలో దేన్నయినా తీసుకొమ్మనీ చెప్పాడు గణపతి. దాంతో ఆ ఈశాన్య మూల బిట్ తనకే దక్కాలని తీర్మానించేసుకున్నాడు మాణిక్యరావు.
“సాయంత్రం కాదు, నేనిప్పుడే బయానా (అడ్వాన్స్) ఇస్తున్నా. ఆ బిట్ నా పేరే రాయండి” అని జేబులోంచి డబ్బులు తీసి, పదివేలు గణపతి చేతిలో పెట్టాడు.
“మాణిక్యం.. నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావోయ్. చాలా కాలం నుంచి తెలిసిన మనిషివి కాబట్టి కాదనలేకపోతున్నా. సాయంకాలం వొచ్చే అతనికి ఏం చెప్పాలో, ఏమో. సర్లే.. నా తిప్పలేవో నేను పడతాలే. మొత్తానికి సూపర్ ప్లాట్ కొట్టేశావ్” అన్నాడు మెచ్చుకోలుగా.
అప్పుడే, ఆ నిమిషమే ఆ ఇరవై సెంట్ల స్థలం తనదై పోయినట్లు తబ్బిబ్బయిపోయాడు మాణిక్యరావు. ఆ స్థలంపై ఒక్కసారిగా ఆరాధనా భావం పెల్లుబికింది. ఆ ప్లాటుకు హద్దులుగా వేసిన రాళ్లను తనివితీరా చూసుకున్నాడు. ఓ రాయిని చేత్తో నిమిరాడు కూడా. విపరీతమైన ఉద్వేగం మనసుని ఊపేస్తుంటే కిందికి వొంగి, అక్కడి మట్టిని గుప్పిట్లోకి తీసుకున్నాడు. వొదల్లేక వొదల్లేక కొద్దికొద్దిగా మట్టిని వొదిలి, చేతులు దులుపుకున్నాడు. పిట్ట ఈక ఎంత తేలిగ్గా ఉంటుందో, మాణిక్యరావు గుండె అంత తేలికైపోయినంది. అతడి చేష్టల్ని ఆశ్చర్యపడతా చూశాడు గణపతి. అతని పెదాల మీదికి ఓ విధమైన నవ్వు విచ్చుకుంది.
ఇరవై లక్షల రూపాయలతో ఆ ఇరవై సెంట్ల ఈశాన్య మూల స్థలాన్ని సొంతం చేసుకున్నాడు మాణిక్యరావు. రిజిస్ట్రేషన్ కాయితాలు కూడా అతడి చేతికొచ్చాయి. రిజిస్ట్రేషన్ చేసేప్పుడు మాత్రం దాని విలువ సెంటుకు ఐదువేలుగానే రాశారు. గవర్నమెంటోళ్ల రేటు అట్లాగే ఉంటుందనీ, రేటు ఎక్కువ రాస్తే, రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ కట్టాల్సొస్తుందనీ గణపతి చెప్పాడు. మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ రేటు ఎప్పుడూ తక్కువే ఉంటుంది కాబట్టి తలాడించాడు మాణిక్యరావు. డబ్బు కట్టడానికి ఐదు లక్షలు తగ్గితే మూడు రూపాయల వడ్డీకి రెండు లక్షలు చదువులయ్య కాడే అప్పు తీసుకున్నాడు. నవనీత నగలు తాకట్టుపెట్టి బ్యాంకులో మూడు లక్షలు గోల్డ్ లోను తీసుకున్నాడు. మనసులో బితుకుబితుకుమంటున్నా అతని ఉత్సాహం చూసి, అతను చేసింది మంచి పనేనేమో, అనవసరంగా అనుమానిస్తున్నానేమోనని సమాధానపడింది నవనీత. ఇరవై లక్షలు పెట్టికొన్న ఆ ఈశాన్య మూల స్థలాన్ని చూసి రావాలనే ఆరాటం మొదలైంది ఆమెలో.
“రిజిస్ట్రేషన్ కూడా ఐపోయింది. ఇంకెప్పుడు చూపిస్తావ్ మన స్థలాన్ని?” అడిగేసింది ఉండబట్టలేక.
“కొనే ముందు దాకా ఎందుకు కొనడమంటూ గోలచేశావ్. కొన్నాక ఎప్పుడు చూపిస్తావని గోలపెడ్తున్నావ్. మీ ఆడాళ్లంతా ఇంతేనే” అని గర్వంగా నవ్వాడు మాణిక్యరావు.
“మేం గోలపెట్టినా మీ మగాళ్లు ఆగుతారా? చెయ్యాలనుకుంది చెయ్యక మానతారా?” అని తనూ నవ్వింది నవనీత.
3
పిల్లలకు సెలవు రోజు చూసుకుని ఆదివారం కారు మాట్లాడుకుని స్థలం చూసేందుకు బయల్దేరారు. ఆ ముందు రోజు రాత్రి పెద్ద వాన పడింది. ఆదివారం కూడా ఉంటుందేమో, వెళ్లడానికి కుదరదేమో అనుకుంది నవనీత. అయితే పొద్దున్నే వాన తెరిపియ్యడంతో స్థిమితపడింది ఆమె మనసు.
కార్లో వెళ్తుంటే రోడ్డు పక్కనే కాదు, రోడ్ల మీదే కాల్వలు  కనిపిస్తున్నాయ్. దాంతో కారు కాస్త నెమ్మదిగా వెళ్లింది. ఈసారి ప్రయాణం రెండు గంటలు పట్టింది. అయితే తను కొన్న ప్లాటు ఎక్కడుందో గుర్తుపట్టలేక పోయాడు మాణిక్యరావు. అతడికి అంతా అయోమయంగా ఉంది. తను కరెక్టుగానే వొచ్చాడే.
“ఈ ఏరియానేనా సార్? ఇక్కడంతా నీళ్లే కనిపిస్తున్నాయ్ కదండీ” అన్నాడు కారు డ్రైవర్.
“ఇదే ప్లేసయ్యా. నేనెందుకు మర్చిపోతాను?” అన్నాడు బలహీనమైన గొంతుతో, మాణిక్యరావు.
అతడు ప్లాటు కొన్న సైటులో ఒక్క అంగుళం భూమి కనిపించట్లేదు. ఆ ఏరియా అంతా పెద్ద చెరువులా తయారైంది. హద్దు రాళ్లు కూడా నీళ్లలో మునిగిపోయినట్లున్నాయి. నవనీత మొహం వొంక చూడాలంటే భయమేసింది మాణిక్యరావుకు.
“మన సైటేది నాన్నా?” ఉన్నట్లుండి అడిగాడు పదో క్లాస్ చదువుతున్న కొడుకు.
కొడుక్కి సమాధానం చెప్పకుండా అటూ ఇటూ చూశాడు మాణిక్యరావు. రోడ్డుకి రెండోవైపు పొలంలో కొంతమంది పనిచేస్తూ కనిపించారు. వాళ్లల్లో ఒకర్ని పిలుచుకు రమ్మని డ్రైవర్ని పంపాడు.
“ఏంటమ్మా. ఎక్కడ మన సైట్?” – ఈసారి తల్లిని అడిగాడు కొడుకు.
“ఆగు నాన్నా. నాన్న చూపిస్తాడుగా” అని నవనీత చెప్తుంటే, ఏడో క్లాస్ చదువుతున్న కూతురు “నాన్న కొన్న సైట్ ఈ నీళ్లల్లో ఉన్నట్టుందన్నయ్యా. అవును కదా అమ్మా” అంది, ‘చూడు నేనెట్లా కనిపెట్టేశానో’ అన్నట్లు.
మాణిక్యరావు మొహంలో నెత్తురు చుక్క లేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆశ ఉన్నచోట అజ్ఞానం ఉంటుందని ఎవరో పెద్దమనిషి అననే అన్నాడు. ఒకడి ఆశని ఇంకొకడు క్యాష్ చేసుకోవడం తన ఎరుకలోనే ఎన్నిసార్లు చూళ్లేదు. ఇప్పుడు తన ఆశని గణపతి క్యాష్ చేసుకున్నాడా?
ఒకతన్ని వెంటబెట్టుకు వొచ్చాడు డ్రైవర్.
“ఏమయ్యా.. ఈ చోటు గురించి నీకు బాగా తెలుసా?” అడిగాడు మాణిక్యరావు.
“ఎందుకు తెలీదు బాబూ. నేను పుట్టి పెరిగిందీ, ఉంటందీ ఇక్కడే. ఈడ ప్రెతి అంగుళం నాకు తెలుసు.”
“ఓ.. అవునా.. రెణ్ణెల కింద ఈడ స్థలం కొన్నాను. ఇప్పుడు చూస్తే మొత్తం నీళ్లే అవుపిస్తున్నాయ్?”
“చెరువులో స్థలం కొంటే నీళ్లు కాకుండా ఇంకేం అవుపిస్తాయ్ నాయనా. ఇదంతా చెరువు. ఈ మజ్జ చాలా కాలం వానల్లేక ఎండిపోయింది. నిన్నా, మొన్నా కురిసిన పెద్దవానతో నిండిపోయింది. నీకు తెలీక ఈడ స్థలం కొన్నట్లున్నావ్. ఆ మాయగాళ్లు కారుచౌకగా కొని, నీలాంటోళ్లకు ఎకువ రేట్లకు అమ్మి టోపీ పెడతన్నారు. ఇప్పుడైతే ఈడ సెంటు పది, పదిహేనేల కంటే ఎక్కువ లేదు. మీకు చాలా ఎక్కువ రేటుకి అమ్ముంటారే. అయినా కొనేప్పుడు అన్నీ ఇచారించుకోవాలి కద బాబూ.”
అతని వొంక నమ్మలేనట్లు చూశాడు మాణిక్యరావు. తన తెలివితేటల మీద అతడికి చాలా నమ్మకం. నెమ్మదిగా నిజం తెలిసొచ్చింది. ఓ కన్ను మూసి, ఆకాశం వొంక ఐమూలగా చూశాడు. తర్వాత చెరువు వొంకా, ఆ రైతు వొంకా, తన భార్యాబిడ్డల వొంకా బిత్తరబిత్తరగా చూశాడు.
అక్కడ అతను కొన్న స్థలం ఉంది. కానీ దాన్నిప్పుడు తన భార్యాబిడ్డలకు చూపించలేని చిత్రమైన స్థితిలో ఉన్నాడు. వాళ్ల సంగతి అట్లా పెట్టినా, తన స్థలమేదో ఇప్పుడు తనకే తెలీడం లేదు. తన స్థలం నీళ్ల కింద ఉంది!
ప్యాంటు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి, ఓ సిగరెట్టుని పెదాల మధ్య పెట్టుకొని, ప్యాకెట్టుని మళ్లీ జేబులో పెట్టేసుకున్నాడు. లైటర్ తీసి, సిగరెట్ వెలిగించాడు. మామూలుగా అతను పిల్లల ముందు  సిగరెట్లు కాల్చడు. కానీ ఇప్పుడు కాల్చకుండా ఉండలేకపోయాడు. అతడి స్థితి అర్థమై నవనీత పిల్లలను తీసుకుని కాస్త అవతలకు వెళ్లింది. తను ఎంత సునాయాసంగా మోసపోయాడో చాలా స్పష్టంగా అర్థమైపోయింది మాణిక్యరావుకు. తానే కాదు, అక్కడ ప్లాట్లు కొన్నోళ్లంతా మోసపోయారు. నోటెంట మాట రానంతగా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది.
మనసు రగిలిపోతుంటే గణపతికి ఫోన్ చేశాడు. బిజీగా ఉన్నట్లు సౌండ్ వొస్తోంది. మళ్లీ మళ్లీ చేశాడు. అదే సౌండ్. మౌనంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. అతణ్ణలా చూసిన నవనీతకు భయమేసింది. స్థలం చూడాలని అక్కడకు ఎంత ఉత్సాహంతో వొచ్చిందో, అదంతా తుస్సుమంటూ చల్లారిపోయింది. తమ స్థలం నీళ్లకింద ఉందనే విషయం, అదంతా చెరువు ప్రాంతమనే విషయం తెలిశాక ఆమెలో కోపం కట్టలు తెంచుకున్న మాట నిజం. ఆ క్షణంలో భర్తని ఇష్టమొచ్చినట్లు దులిపేద్దామని కూడా అనుకుంది. కానీ అక్కడ కారు డ్రైవర్‌తో పాటు, ఇంకో మనిషీ ఉంటంతో నోరు నొక్కేసుకుంది. కానీ వాళ్లు తమని చూసి నవ్వుతున్నట్లు అనిపించి, అక్కడ ఇంక ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ఇంకోవైపు భర్త మొహం చూస్తే, అతడు పిచ్చిచూపులు చూస్తున్నాడు. అలాంటప్పుడు అతణ్ణి కదిలించడం ఏం బావుంటుంది. కారులో ఉన్నంతసేపూ భార్యాభర్తలిద్దరూ మౌనంగానే ఉండిపోయారు.
ఇంటికొచ్చాక గణపతికి మరోసారి ఫోన్ చేశాడు మాణిక్యరావు. ఫోన్ రింగవుతోంది కానీ, ఎత్తట్లేదు. బైక్‌మీద అతనింటికి వెళ్లాడు. ఆఫీసులోనే ఉన్నాడని ఇంట్లోవాళ్లు చెప్పారు. అక్కడకు వెళ్లే సమయానికి చీకటి పడుతోంది. ఆవేశంతో ఊగిపోతూ ఆఫీసులో అడుగుపెట్టాడు. తన రూంలో కుర్చీలో హాయిగా వెనక్కి చేరగిలబడి ఉన్నాడు గణపతి. కాళ్లను బార్లా చాపి, కిటికీ మీద ఆన్చి ఉంచాడు. కళ్లు మూసుకుని, విలాసంగా డన్‌హిల్ సిగరెట్ పీలుస్తున్నాడు. మొహంలో తన్మయత్వం కనిపిస్తోంది. తలకు హెడ్‌సెట్ పెట్టుకొని, సెల్‌ఫోన్‌లో హుషారైన పాటలు వింటున్నాడు.
గణపతిని ఆ స్థితిలో చూసేసరికి మాణిక్యరావులోని ఆవేశం పదింతలైంది.
“గణపతిగారూ” అని అరిచాననుకున్నాడు. గణపతిలో చలనం లేదు. సిగరెట్ పొగ పీలుస్తూ, తల ఊపుతూ అదే తన్మయత్వంలో ఉన్నాడు.
“ఏవండీ గణపతిగారూ” అని ఈసారి బల్లమీద గట్టిగా చరిచాడు మాణిక్యరావు.
వైబ్రేషన్స్‌కి కళ్లు తెరిచాడు గణపతి.
“ఓ.. మాణిక్యం, నువ్వా. రారా. కూర్చో” అంటూ హెడ్‌సెట్ తీశాడు.
“నేను కూర్చోడానికి రాలేదండీ.”
“ఏంటి విషయం? ఏమైంది? మొహం అట్లా ఉందేంటి?”
“విషయం చాలానే ఉంది. ఇందాకట్నించీ ఫోన్ చేస్తున్నాను. మీరు తియ్యట్లేదు. ఇవాళ సైట్ చూసొచ్చాం.”
“సంతోషం. చూసొచ్చాం అంటున్నావ్. ఎవరెవరు వెళ్లారేం?”
“మా ఫ్యామిలీ అంతా వెళ్లాం. కానీ అక్కడ నా ప్లాటే కాదు, అసలు మీ సైటే అవుపించట్లేదు.”
“సైట్ కనిపించకపోవడమేంటి? సైట్ యేడకి పోద్ది. ఏం మాట్లాడతన్నావ్ మాణిక్యం?”
“సైటేతే ఉంది కానీ నీళ్లకింద ఉందండీ. అదంతా చెరువంట కదా. నిన్నపడిన వానకే అది మునిగిపోయింది. కనీసం హద్దు రాళ్లు కూడా అవుపించట్లేదు. అంత పల్లంలో ఉన్న స్థలాన్ని, సెంటు ఇరవై యేలు కూడా చెయ్యనిదాన్ని, మాయమాటలు చెప్పి, లక్ష రూపాయల కాడికి అమ్మారు. రాజధాని ఏరియా కదా, రేటు పెరుగుతుందనే నమ్మకంతో యెనకా ముందూ ఆలోచించకుండా, మా ఆవిడ వొద్దంటున్నా మూర్ఖంగా కొన్నా. నాకా ప్లాటొద్దు, గీటొద్దు. దయచేసి, నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి” అని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసి గణపతి చేతికియ్యబోయాడు.
“అది కుదరదు మాణిక్యం” అంటా సిగరెట్‌ని యాష్‌ట్రేలో పెట్టి నలిపాడు గణపతి.
“అట్లా అయితే, ఆ పల్లంలో మట్టినింపి, మెరక చెయ్యండి. ఆ సైట్లో నీళ్లు నిలవకుండా ఏర్పాట్లు చెయ్యండి” అన్నాడు మాణిక్యరావు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా.
“అది నా పని కాదు మాణిక్యం, నీదే.”
“అయితే నేను నా జీవితంలోనే ఘోరమైన తప్పు చేశానన్న మాట.”
“ఎందుకట్లా ఇదైపోతావ్. నేనట్లా అనుకోవట్లేదు. మట్టి తోలుకొని, రోడ్ లెవల్‌కి పైన ఉండేట్లు చూసుకున్నావంటే దాని గిరాకీ ఎక్కడికీ పోదు.”
“దానికి మట్టి తోలాలంటే ఎంతవుద్దో నీకు తెలీదా. పైగా నేనొక్కణ్ణే తోలితే సరిపోద్దా. అందరూ తోలాలి కదా. ఇంతన్యాయం చేస్తావా? నువ్వసలు మనిషి పుడక పుట్టావా?”
“అది నా తప్పు కాదు.”
“అవునయ్యా, తప్పు నాదే. నిన్ను నమ్మడం నా తప్పే. నువ్వు మోసం చేస్తుంటే తెలుసుకోలేకపోవడం నా తప్పే. నీయంత పెద్ద రాస్కెల్‌గాణ్ణి ఇంతదాకా నీ జీవితంలో చూళ్లేదు. ఇంతదాకా నేను సంపాదించుకున్నదంతా నీళ్లపాలు చేశావ్ కదరా.”
“ఇదిగో మాణిక్యం, మర్యాద.. మర్యాద. మాటలు తిన్నగా రానీయ్. నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదిక్కడ. నువ్వేం చేస్కుంటావో చేస్కో. రిజిస్ట్రేషన్ ఐపోయాక ఆ సైట్‌తో నాకేం సంబంధం లేదు. అది నీదే. దాన్నేం చేస్కుంటావో నీ ఇష్టం. ముందిక్కణ్ణించి కదులు. లేదంటే న్యూసెన్స్ చేస్తున్నావని పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాల్సొస్తుంది.”
“పోలీసులకు కంప్లయింటిస్తావా? ఎందుకియ్యవూ. ఇది మీ రాజ్యం కదా. అధికారం మీ చేతుల్లోనే ఉందయ్యే. ఏమైనా చేస్తారు. అందుకేగా ఈ ఏరియానంతా దోచుకు తింటన్నారు. అయినా ఇప్పుడు నన్నేడికి పొమ్మంటావ్ గణపతీ.”
“ఏట్లోకి పో. నువ్వెక్కడికిపోతే నాకేంటి. ఈ తెలివి సైట్ కొనేప్పుడే ఉండాల్సింది. అయినా చూసుకునే కదా కొన్నావ్” అన్నాడు వెటకారం నిండిన గొంతుతో, గణపతి.
“నేను ఏట్లోకి పోతే నీకు సంబరంగా ఉంటుందేమిట్రా.. నానా కష్టాలు పడతా మగ్గాల్ని నమ్ముకుని నేను సంపాదించుకున్నదంతా మాయతో, మోసంతో అన్యాయంగా దోచుకున్నావ్. అందుకని నేను ఏట్లోకి దూకాలా? నువ్వు చేసిన పనికి ఏదో నాటికి నువ్వే ఏట్లో పడే రోజొస్తుంది. మనిషి మాంసం అమ్ముకుని బతికేవాళ్లు ఏదో రోజు కుక్కచావు చావక తప్పదు. గుర్తుంచుకో. నేనెళ్తాను. ఏట్లోకి కాదురోయ్. నీమీద కేసెయ్యడానికి వెళ్తాను” అన్నాడు మాణిక్యరావు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటుని సంచిలో పెట్టుకుంటా.
గణపతి నవ్వాడు. “అంతకంటే నువ్వేం చెయ్యగలవ్ మాణిక్యం. శుభ్రంగా వేసుకో. మళ్లీ దాంట్లో ఓడిపోయి, లాయర్ ఖర్చులయ్యాయని నా మీదపడి ఏడిస్తే లాభం ఉండదు.”
4
ఇప్పటికీ మాణిక్యరావు స్థలం నీళ్లకింద భద్రంగా చెరువులో ఉంది. ఆ స్థలం కోసం నిండా మునిగిన మాణిక్యరావు ఇంకో రెండు లక్షల రూపాయల అప్పుకోసం తిరుగుతున్నాడు. కోర్టు కేసుల కోసం కాదు. తనవద్ద నేసే నేతగాళ్లకు కూలీ (మజూరీ) డబ్బులివ్వాలి. వాళ్లకు నూలు, పట్టు సమకూర్చాలంటే, వాటిని కొనాలి. దానికోసం డబ్బు కావాలి. చేతిలో చిల్లిగవ్వ లేదు. అందుకే అప్పుకోసం తిరుగుతున్నాడు. ఈ అనుభవంతో అతను జీవితంలో మళ్లా ఎక్కడైనా స్థలాలు కొనకుండా ఉన్నాడా, లేదా? ఏమో.. కానీ భవిష్యత్తులో నవనీత మాటలకు విలువివ్వాలని మాత్రం అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు.
——————- x ———————-

నామాలు

 

 

chaitanya(“సారంగ” ద్వారా తొలిసారిగా కథకురాలిగా పరిచయమైన పింగళి చైతన్య కథల సంపుటి “మనసులో వెన్నెల” వచ్చే  వారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చైతన్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కథని ప్రచురిస్తున్నాం. చైతన్య కథల సంపుటిలో  ఎనిమిది కథలున్నాయి, 96 పేజీలు. ప్రతులు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, నవయుగ , వెల: యాభై రూపాయలు. చైతన్య ఈ-చిరునామా: chaithanyapingali@gmail.com)

 

~

శైలుకి కంగారుగా ఉంది. బట్టలకి, దుప్పట్లకి మరకలు అయిపోతాయేమో  అని.

మరకలు అయితే, మామగారు లేవకముందే.. తెల్లారే లేచి, వాటిని ఉతుక్కొని, ఆఫీసుకి వెళ్ళాలి. లేటవటం దేవుడెరుగు.. ముందు ఆ దుప్పట్లు ఉతుక్కునే ఓపిక శైలుకి లేదు.

అసలు రేపు ఉతుక్కోవటం  వేరే విషయం.. ఇప్పుడు ప్యాడ్ మార్చుకోపోతే .. చచ్చిపొయేలా ఉంది. బయట ఉండే బాత్రూంకి వెళ్ళాలంటే.. ఇబ్బంది. అది పక్కనుండే బ్యాచిలర్స్  వాడతారు. అందుకే.. వాడేసిన ప్యాడ్ ని  ఆ బాత్రూంలో వదిలేస్తే  బాగోదు. రోడ్డు  మీదకెళ్ళి, చెత్త కుప్పలో పారేయాల్సిందే! టైమేమో ఒంటిగంట దాటుతోంది. రాత్రి తొమ్మిది ఐతేనే, ఆ వీధిలో ఎవరూ కనిపించరు. అలాంటిది, ఈ టైంకి ప్యాడ్ పారేయటానికి.. వీధి చివరిదాక వెళ్ళటానికి భయం వేసింది శైలుకి.

‘సుధీ.. లేవా.. ప్లీజ్.. తోడు రావా..’ అని బతిమాలింది. సుధి అంటే.. ఆమె భర్త సుధీర్ గుప్త. అతను ఆ వేళ ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి పన్నెండు అయింది.

సుధీర్ కళ్ళు తెరవట్లేదు. ‘నా వల్ల కాదే… ప్లీజ్.. వదిలేయ్’ అని పడుకున్నాడు. కొంచెం  బతిమాలిందా.. అరిచేస్తాడు అని భయంతో శైలు పక్క మీద నుండి జరిగి, ఉట్టి నేల మీద దిండు వేసుకుని పడుకుంది.

నేల చల్లదనానికి నిద్రపట్టట్లేదు శైలుకి. అమ్మా, నాన్న.. గుర్తొచ్చారు. ఏడుపు తన్నుకొచ్చింది. కాని.. ముక్కు ఎగబీల్చిన చప్పుడు వినిపించిందా.. సుధీర్ నిద్ర లేస్తాడు. ‘ఎప్పుడు ఏడుపేనా? ఏమయిందే ఇప్పుడు?’ అని విసుక్కుంటాడు. గదిలో పడుకున్న శైలు అత్తగారు, మామగార్లకి ఆ అరుపులు వినిపించాయా బయటకి  వచ్చి, శైలునే తిడతారు. ‘వాడిని ప్రశాంతంగా పడుకోనీయవా?. అయినా.. నడింట్లొ ఏడుపు ఏంటమ్మా?.. దరిద్రం. ఉన్న దరిద్రం చాలదా?’ అని దెప్పిపొడుస్తారు.

ఎన్నిసార్లు జరిగింది ఇదే  సీను. అందుకే.. దుఃఖాన్ని  బలవంతంగా ఆపుకుంది శైలు. కాని ప్యాడ్ చిరాకు పెడుతోంది. చర్మం మంట పుడుతోంది. ఇక తప్పదని.. లేచి, ఆ పోర్షన్ బయట ఉండే బాత్రూంకి వెళ్ళింది. పాత ప్యాడ్ ని పేపెర్లో చుట్టి.. నెమ్మదిగా గేటు తీసి.. ఓసారి రోడ్డుని ఆ చివరి నుండి ఈ చివరి దాకా చూసింది. ఎవరు లేరు. ‘ఏమన్నా అయితే నాన్నకి ఫొను చేయాలీ’ అనుకుని సెల్లో నాన్న నంబరు ఓపెన్ చేసి, డైల్ బటన్ మీద వేలు రెడీగా పెట్టుకుని.. నెమ్మదిగా నడుచుకుంటూ.. వీధి చివర చెత్తకుప్ప దాకా వెళ్ళి , అది పారేసి.. గబగబా వెనక్కి పరిగెత్తుకు  వచ్చేసింది. ఇంటి మెయిన్ గేట్ వేసి, చెప్పులు విడిచినా.. శైలుకి దడ తగ్గలేదు. గేట్ వేస్తున్నప్పుడు తన చేతి మీద ఉన్న నామాలు కనిపించాయి శైలుకిరెండు భుజాల మీదా ఉన్న నామాల్ని రెండు చేతులతో తడుముకోగానే.. ఏడుపు  ఆగలేదు శైలుకి.

ప్రహరీకి వారగా ఉండే బాత్రూంలోకి వెళ్ళి, ట్యాప్ ఫుల్ల్ గా తిప్పి.. నీళ్ళ శబ్దంలో ఏడుపు వినిపించదు అని రూఢి అవ్వగానే.. నోటికి చేయి అడ్డుగా పెట్టుకొని.. చిన్నగా ఏడవటం మొదలుపెట్టింది.

fbఇంట్లోకి  వెళ్ళటం కంటే ఆ బాత్రూంలో ఉండటమే నయం అనిపిస్తోంది. వాళ్ళది సింగిల్ బెడ్రూం ఇల్లు. లోపల గదిలో అత్తయ్య, మామగార్లు పడుకుంటారు. కొత్తగా పెళ్ళి అయినాసరే.. శైలు, సుధీర్ హాల్లోనే పడుకునేవారు. ‘నోరు తెరిచి, సిగ్గు వదిలి, గదిలో మేము పడుకుంటాం అని ఏం అడుగుతాం’ అని సుధీర్ అంటాడు. ‘ఈ మంచం హాల్లో వేస్తె నడిచేదానికి చోటు ఉండదు. నేనేమో నేల మీద పడుకోలేను’ అని అత్తగారు అంటుంది. పగలు అయితే, ఆ బెడ్రూం లో ఉండే అట్టాచెడ్ బాత్రూంలొనే స్నానం చేస్తుంది శైలు. కాని మధ్య రాత్రే ఇబ్బంది. ఎప్పుడైనా బాత్రూంకి వెళ్ళాలంటే, వాళ్ళ  గదిలోకి వెళ్ళలేక, బయట ఉన్న బాత్రూం వాడుతుంది. కాని నెలసరి టైం లో మాత్రం చచ్చే చావు. ఆ అత్తగారు శైలుని ఇంట్లోకి రానివ్వదు. దానితో పక్కింటి బ్యాచిలర్స్ వాడే బాత్రూంలోనే స్నానం చెసేది శైలు. ఆ బాత్రూం పరమ అసహ్యంగా ఉండేది. పైగా, వాళ్ళున్నప్పుడు వెళ్ళాలంటే ఇబ్బంది. సుధీర్ నుండి చిన్న సాయం కూడా ఆశించలేను అని శైలుకి చాలా కాలం క్రితమే అర్ధమైయింది.

ఆమె నెల జీతం ఇరవై వేలు. ‘నా జీతం మీకే ఇస్తున్నా కదా.. డబుల్ బెడ్రూం ఇంట్లోకి మారదాం’ అంటే మామగారు ఒప్పుకోరు. ‘నీ మొగుడికి అప్పులు చేసి చదివించాం.. అవన్నీ తీరేదాక ఎటూ  కదిలేది లేదు. అయినా, నువ్వొచ్చావని ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఇల్లు వదిలి వెళ్ళిపొతామా?’ అని సీరియస్ అవుతాడు.

దాదాపు మూడు నెలలుగా ఇవే గొడవలు. కాని.. ఈసారి  ఇబ్బంది మరీ ఎక్కువైపొయింది. అందుకే, ఏడుపు ఆపుకొలేక బాత్రూం లోకి వెళ్ళి, నల్లా తిప్పి, ఆ శబ్దాన్ని ఆసరాగా చేసుకొని ఏడుస్తోంది.

ఎవరో  బయట నుండి తలుపు తీయబోయినట్టు అర్ధమై, చేతులు సబ్బుతో కడుక్కుని, సెల్ తీసుకుని, బాత్రూం నుండి బయటకి వచ్చింది శైలు. పక్కింటి కుర్రాడు బయట నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే గబగబా ఇంట్లొకి వెళ్ళి, తలుపేసుకుంది.

సుధీర్ పక్కనే పడుకుంది. ప్యాడ్ మార్చుకున్నా రిలీఫ్ రాలేదు. రోడ్డు మీదకి వెళ్ళి వచ్చిన టెన్షన్ తగ్గలేదు. ఏది ఏమైనా, రేపు ఇల్లు మారకపొతే, నేను ఇక్కడ ఉండను అని చెప్పేయాలి అని నిశ్చయించుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది.

పొద్దున్నే లేచాక, అత్తయ్య వేసిన గిన్నెలు కడిగి ఇస్తే, ఆమె వాటి మీద నీళ్ళు చల్లి, లోపలికి తీసుకెళ్ళింది. ఈ అయిదు రోజులు, శైలుకి ఇల్లు ఊడ్చే పని ఉండదు. లేకపొతే రోజు ఇల్లు ఊడ్చి, తడి బట్ట పెట్టి తుడిచి, అంట్లు తోమాలి. వంట పని, బట్టలు ఉతికే పని అత్తయ్య చేసుకుంటుంది. వంట అయిపొగానే బాక్స్ తీసుకుని వెళ్ళిపొతారు శైలు, సుధీర్. మామగారు ఏం పని చేయరు. అత్తగారు మాత్రం ఓ ఫ్యాన్సీ షాపు నడుపుతుంటుంది.

అత్తగారు షాపుకి బయలుదేరకముందే.. ఇంటి విషయం తేలిపొవలనిపించింది శైలుకి. ‘నా వల్ల కావట్లేదు సుధీ.. మనం డబుల్ బెడ్రూం ఇంటికి మారిపొదాం..’ అన్నది గట్టిగా అత్తమామలకి వినిపించేట్టుగా.

శైలు మాటలు విని అత్తయ్య పెద్ద గొంతు పెట్టుకుని, ‘చూడమ్మ.. సద్దుకుపోవాలి. ఎన్నేళ్ళుగా నేను సద్దుకుపొతున్నా.. పుట్టింట్లో సాగినట్టూ సాగవు..’ అన్నది వ్యంగ్యంగా.

‘నా వల్ల కాదత్తయ్యా.. ఈ ఇల్లు మారటం మీకిష్టం లేకపొతే, మీరు ఇక్కడే ఉండండి. మేమిద్దరం వేరేగా ఉంటాం..’ అని తెగేసి చెప్పేసింది శైలు.

అంతే. ఇక సుధీర్ తల్లి ఏడుపు అందుకుంది. ‘కులం కాని కులం.. కడజాతి పిల్లని తెచ్చి.. కొడుకుని బాధపెట్టడం ఇష్టం లేక.. తెచ్చుకుని నడింట్లొ పెట్టుకుంటే.. ఈరోజు నా కొడుకుని నాక్కాకుండా చేయటానికి ప్లాన్లు వేస్తోంది… ఊరికే అంటారా కనకపు సింహాసనమున అని..’ అంటూ శొకండాలు మొదలుపెట్టింది.

అమ్మ ఏడ్చేసరికి.. సుధీర్ కి కోపం బాగా పెరిగిపోయింది. ‘ఎన్నిసార్లు చెప్పాను.. వేరే ఇల్లు సంగతి మర్చిపొమ్మని.. నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కావలనుకుంటే.. మీ నాన్నని ఒకటి కొనిపెట్టమను.. అప్పుడు మారదాం’ అన్నాడు.

Kadha-Saranga-2-300x268

శైలుకి చాలా చిరాకు వచ్చింది. పెళ్ళికి సుధీర్ అమ్మానాన్నలు ఒప్పుకోకపొతే.. ‘ఆ పిల్ల కూడా హిందు మతమే. కులందేముంది.. కూటికొస్తదా? గుడ్డకొస్తదా? ఆ పిల్ల అసలే ఎస్.సి., తెలివిగలది. రేపోమాపో గవర్నమెంటు ఉద్యోగం వస్తుందీ’ అని మధ్యవర్తులు సుధీర్ అమ్మానాన్నల్ని ఒప్పించటానికి ప్రయత్నించారు. కాని అవేం ఆమె చెవులకి ఎక్కలేదు. శైలు వాళ్ళ నాన్న పెళ్ళికి ముందే సుధీర్ చదువు తాలుకా అప్పు తీరుస్తానని, అయిదు లక్షల బంగారం ఇస్తానని, అయిదు లక్షల విలువ ఫర్నిచర్ కొంటానని, మరో అయిదు లక్షల క్యాష్ ఇస్తానని మాటిచ్చాడు. ఎలాగూ, తను చూసిన సంబంధం చేసినా, కట్నం అదీ, ఇదీ ఇవ్వలి కదా అని అయన ఆలొచన.

కాని సుధీర్ వాళ్ళ అమ్మకి అర్ధమైందల్లా ఒకటే. బాగనే సౌండ్ పార్టి అని, పైగా రోడ్ల డిపార్ ట్మెంట్ లో          ఉద్యోగం అని, బాగా సంపాదించి ఉంటాడు అని. ఏది దాచినా కూతురుకి, అల్లుడికి ఇవ్వడా అనిపించి.. పెళ్ళికి సరే అన్నది. కాని రెండు కండిషన్లు పెట్టింది. మొదటిది – తాము పూజించే స్వామి వారు ఆశీర్వదిస్తేనే పెళ్ళీ అని. రెండోది – పెళ్ళి మీరే చేయండి, మా చుట్టాలు మమ్మల్ని వెలేస్తారు. అదే పెళ్ళి మీరే చెసేసుకుని వస్తే, స్వామి వారి ఆశీర్వాదం కూడా ఉంది, తప్పు చేసాడని కొడుకుని వదిలేసుకుంటామా అని ఏదో ఒకటి సద్దిచెప్పుకుంటాము అన్నది ఆ మహాతల్లి.

కూతురు కోసం అన్నిటికి ఒప్పుకున్నాడు శైలు నాన్న. పెళ్ళీ, రిసెప్షను ఏడు లక్షలు పెట్టి ఘనంగా చేసి, పెళ్ళి టైంలో ఇస్తామని మాటిచ్చిన డబ్బుతో సహా కూతుర్ని అత్తగారింట్లో దింపాడు.

అన్ని తీసుకుని ఇప్పుడు.. మళ్ళి కొత్తగా డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కొనిమ్మంటే.. ఆయనెక్కడనుండి తీసుకురాగలడు? సిగ్గు ఎగ్గు లేకుండా అడుగుతున్న సుధీర్ ని చూస్తే అసహ్యం వేసింది శైలుకి.

‘మా నాన్న ఎందుకివ్వాలి? ఇచ్చినదేమన్నా తక్కువా? నా కోసం ఆయన అన్నిటికి అడ్జస్ట్ అయ్యి, ఈ పెళ్ళి చేశాడు. ఇంకా ఎంతని చేస్తాడు?’ అని ఏడుస్తూ అడిగింది సుధీర్ని.

సుధీర్ అస్సలు చలించలేదు. ‘కూతురు ఇలా హాల్లో పడుకుంటే.. అయనకేం బాధ లేకపోతే.. ఓకె.. నాకేంటి?’ అన్నాడు.

శైలుకి చీదరగా ఉంది. ‘కొడుకు హాల్లో పడుకుంటే.. మీ అమ్మానాన్నలకేమి బాధగా అనిపించటం లేదా? కోడలు పక్కింటి కుర్రాళ్ళ బాత్రూం వాడుతుంటే.. ఏం సిగ్గనిపించదా? పిరియడ్స్ వస్తే చచ్చిపొతున్నాను.. భర్తవి కదా.. నీకేం  బాధ్యత లేదా?’ అని గట్టి గట్టీగా ఏడుస్తూ అడిగింది.

ఆ ఏడుపులు పక్కింటి వాళ్ళకి , పైనింటి వాళ్ళకి వినిపించాయి. ఏదో గొడవ జరుగుతోందని అందరూ సుధీర్ వాళ్ళ గుమ్మం దగ్గరకి వచ్చి నిలబడ్డారు.

వాళ్ళని చూసేసరికి సుధీర్ కి కోపం వచ్చింది. ‘ఎవడికే బాధ్యత తెలీదు..’ అని శైలుని వంగదీసి, వీపు మీద పిడి గుద్దులు గుద్దాడు.

శైలు అత్తగారు.. ‘ఆగరా.. ఆగరా..’ అంటూ మధ్యలోకి వెళ్ళింది. కాని ఆమెని వెనక్కి నెట్టి, శైలు జుట్టు పట్టుకుని గోడకేసి తోశాడు.

బయట నిలబడిన వాళ్ళు అలాగే చూస్తున్నారు. శైలుని కొట్టడమూ మొదటిసారి కాదు. వాళ్ళు చూడటమూ మొదటిసారి కాదు.

కాని ఈసారి శైలుకి మొండితనం వచ్చేసింది. ఎంత కొడుతున్నా.. ఆ గొడకి ఆనుకుని అలాగే నిలబడింది. ‘వేరే ఇంట్లోకి మారదామా? వద్దా? మా నాన్న మాత్రం కొనివ్వడు. ఏదో ఒకటి తెల్చి చెప్పు..’ అని విసురుగా అడిగింది.

fb

సుధీర్ మళ్ళీ కొట్టాడు. శైలు మళ్ళీ అదే మాట అన్నది. అప్పుడు శైలు మామగారు మధ్యలో వచ్చి.. ‘వద్దురా అంటే దీన్నే చేసుకుంటాను అని పట్టు పట్టావు.. నువ్వు ఎంత చావబాదినా.. అదేం చలించదు.. మామూలు ఒళ్ళా అది? గొడ్డు మాంసం  తిని తిని, చర్మం మందం అయిపోయింది..’ అన్నాడు.

శైలుకి ఉక్రోషం తన్నుకొచ్చింది. శైలు ప్రేమ విషయం ఇంట్లో తెల్సినప్పుడు, ఆమె తండ్రి సుధీర్ తో మాట్లడటం మానేయమన్నాడు. భయపెట్టాడు. కొట్టాడు కూడా. అయినా, సుధీర్ ని మర్చిపోలేను అన్నది. దానితో ఆయన మాట్లడటం మానేశాడు. నాన్న మాట్లాడటం మానేస్తే తట్టుకోలేకపొతోంది.. అలా అని సుధీర్ని మర్చిపోలేకపోయింది. ఏం చేయాలో తెలీక, ఓ రోజు మణికట్టు దగ్గర చేతిని కొసేసుకుంది శైలు. అది చూసి భరించలేక, శైలు వాళ్ళ అమ్మ, నాన్న సుధీర్ ని ఓసారి ఇంటికి తీసుకురమ్మన్నారు.

సుధీర్ వచ్చాడు కూడా. ‘మనవి వేరే వేరే కులాలు బాబు.. రేపు ఏమన్నా గొడవలు అయితే..’ అని తన భయాన్ని సుధీర్ తో  చెప్పుకున్నాడు.

‘నాకు క్యాస్ట్ ఫీలింగేం ఉండదు అంకుల్. నేను అలా ఎప్పుడు ఆలోచించను. అమ్మావాళ్ళకి కొంచెం ఆచారాలు ఎక్కువ. వాళ్ళు ఒప్పుకోకపొవచ్చు. వాళ్ళు శైలుని కాదంటే.. నేను ఇంట్లో నుండి వచ్చేస్తాను. క్యాస్ట్ గురించి ఆలోచించకండి అంకుల్’ అని భరోసా ఇచ్చాడు.

‘క్యాస్ట్ ఫీలింగ్ లేకపొటం వేరు.. కులం పట్ల స్పృహ, అవగాహన ఉండటం వేరు. కులం ఎంత  క్యాన్సరో అర్ధం చేసుకున్న వాళ్ళు కులాంతర వివాహం చేసుకోటం వేరు.. నీకు..’ అని ఇంకా చెప్పబోతుంటే.. శైలు వాళ్ళ అమ్మ ఆయన మాటని కట్ చేస్తూ.. ‘క్యాస్ట్ ఫీలింగ్ లేకపొతే అంతకంటే ఏం కావాలి.. చూడు బాబు.. ఇంట్లో నుండి వచ్చెయమని.. మేము చెప్పటం లేదు. వాళ్ళని ఒప్పించటానికే ప్రయత్నించు.. ‘ అని చెప్పింది.

అప్పుడు జరిగిన మాటల్లోనే స్వామివారు ఆశీర్వదిస్తే మాకేం ఇబ్బంది లేదని సుధీర్ తల్లి చెప్పింది. పెళ్ళికి ముందు శైలుని ఆ స్వామివారి దగ్గరకి తీసుకెళ్ళింది. ఆయన రెండు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధుడు. స్వయానా ముఖ్యమంత్రులే ఆయన్ని హెలికాఫ్టర్లు ఎక్కించుకుని తిరుగుతారు. వాళ్ళేంటి.. ఈ దేశ ప్రధాని కూడా ఆయన కాళ్ళ మీద పడతాడు. తిరుపతి దేవస్థానాల్లో ఆయనది పెద్ద హోదా కూడా. అంతటి ప్రఖ్యాత స్వామివారికి శైలును చూపించినప్పుడు .. ఆయన దీవించాడు. ‘హరికి ఇష్టులైన వారంతా హరిజనులే.. ఈ అమ్మాయ్ కి నామాలు వేయండి..’ అని చెప్పాడు. శైలు చాలా సంతోషపడింది, ఆయన ఆశీర్వాదం పొందినందుకు.

శైలుకి నామాలంటే ఏంటో తెలీదు. సుధీర్ కూడా వేయించుకుంటాడేమో అనుకుంది. కాని.. సుధీర్ తల్లి.. ‘వాడికొద్దమ్మా.. మాంసం అదీ తింటాడు కదా.. నేనే వేయించుకున్నాను కాని.. సుధీర్ వాళ్ళ నాన్నగారు వేయించుకోలేదు. మగవాళ్ళు ఏం నిష్ఠగా ఉంటారు చెప్పు..’ అన్నది.

‘అంటే, నాన్వేజ్ తినకూడన్నమాట’ అనుకుంది శైలు. నామాలు వేయించుకోటానికి లైన్లో నిలబడింది.

శంఖు, చక్రాలు అచ్చులున్న రెండు ఇనప కడ్డీలని.. ఎర్రగా కాల్చి, ఒకేసారి రెండు భుజాల మీదా.. ముద్రలు వేస్తారు. అదే నామాలు వేయటం అంటే. పక్కవాళ్ళకి వేస్తుంటే చూస్తేనే.. శైలుకి భయం వేసింది. కాని.. పెళ్ళికి ఒప్పుకున్నారు.. అది చాలు అనిపించింది. శైలు వంతు రాగానే.. కళ్ళు మూసేసుకుని.. ‘సుధీర్’ అని గట్టిగా అరిచింది. వాళ్ళు ఠక్కున అచ్చులు వేసేశారు. శైలు అరుపుకి ఆమె అత్తగారే ఆశ్చర్యపోయింది. ‘ఎంత ప్రేమ అమ్మా..’ అని జాలిపడింది కూడా. ‘పెళ్ళికి సరే అన్నట్టేనా, పెళ్ళి జరిగితే నేను షిరిడి వస్తాను అని మొక్కుకున్నాను..’ అని వేడికి కమిలిపోయి, నీరులా పట్టిన చర్మాన్ని ఊదుకుంటూ అడిగింది శైలు. ‘వైష్ణవం తీసుకునావమ్మా ఇప్పుడు.. హరి, హరి అవతారాలు తప్ప వేరే వారిని పూజించకూడదు.. షిరిడికి వద్దు..’ అని చెప్పింది సుధీర్ తల్లి. శైలు ఏం మాట్లాడలేదు. అత్తగారు ఇచ్చిన స్పిరిట్ ని చేతుల మీద అద్దుకుంటూ.. ఏడ్చింది. చేతులు కాలినందుకో.. భవిష్యత్తు లీలగా అర్ధమయ్యో..

నామాలు వేయించుకున్న దగ్గర నుండి, నిజంగానే  నాన్వేజ్ తినటం మానేసింది. కనీసం గుడ్డు కూడా తినలేదు. కాని పుట్టుకతో శాఖాహారి అయిన సుధీర్ మాత్రం హోటెల్లోనో.. శైలు వాళ్ళంటికి వచ్చినప్పుడో.. హాయిగా మాంసం, చేపలు తినేవాడు. తిండి దగ్గర కూడా రాజిపడి.. బతుకుతుంటే.. ఏడ్చేందుకు కూడా స్వేచ్ఛ లేకుండా బతుకీడుస్తుంటే.. గొడ్డు మాంసం తిని తిని.. ఒళ్ళు మందం అయిపోయిందని మామగారు తిట్టారు.

ఆ రోజున క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పిన సుధీర్.. ఆ మాట అంటుంటే.. కనీసం ‘ఆగండి నాన్నా’ అని కూడా అనలేదు!

అసలే నెలసరి వచ్చి, విసుగ్గా, నీరసంగా ఉంది. పైగా దెబ్బల ధాటికి.. సూటిపోటి మాటలకి అలసిపొయింది శైలు. మళ్ళి కొట్టటానికి వస్తున్న సుధీర్ని వెనక్కి తోసి, బైక్ కీస్ తీసుకొని గుమ్మం దాటుతోంది.

‘ఎక్కడికే..?’ అంటూ సుధీర్ వెనకే వచ్చాడు.

‘ఇఫ్లూ లో బీఫ్ ఫెస్టివల్ జరుగుతోంది.. అక్కడికి..’ అని బండి స్టార్ట్ చేసి, వెళ్ళిపొయింది.

*

ఇసుక మేడలు      

Madhuఊరు టౌనుగా ఉన్నపుడు నిలకడగా నేలపై ఉండేది. కార్పోరేషన్గా మారగానే ఆకాశంలోకి పాకిపోయి ఊరి  స్వరూపాన్ని, నాగోజీ నుదిటి రాతలని మార్చేసింది. ఈ రోజు అయనకి ఘన సన్మానం.

ఆఫీసు కిటికీలోంచి సగం మొలచిన కట్టడాన్ని, రాసులుగా పోసున్న ఇసుకని చూస్తూ “అప్పిగా  ఏర్పాట్లేలా ఉన్నాయి” అని అడిగాడు నాగోజీ. “బెమ్మాండమండి, ఇందాక ఈర్రాజు ఫోన్సేసి ఊరంతా మీ పేరే అన్నాడండి…” మెలికలు తిరుగుతూ చెప్పాడు పీఏ అప్పారావు.

“ఎన్నేపారాలున్నా, మన పరపతి రోగంలా పాకిపోయినా… సమ్మానాల దారి ఏర్రా” అని ముక్తాయించాడు నాగోజీ.

“బాగా సెప్పారు” అని శ్రమ పడకుండా అన్నాడు పీఏ. గదిలోకొచ్చిన అసలు విషయం గుర్తొచ్చి “ఇసుక్కాంట్రాటర్… ఓ అరగంట నుంచి ఎయిటింగండి” అని చెప్పాడు

“ఆడవసరమా, మనవసరమా? కూర్చోనియ్యి….” అని విసురుగా చెప్పి ఏసీకెదురుగా కూర్చున్నాడు. గాలాడక్కాదు నాగోజీకి ఉత్సాహంతో ఊపిరి ఆడట్లేదు, పీఏకి విషయం అర్థమయి గది నుండి నిష్క్రమించాడు.

ఇంకో రెండు గంటల్లో స్టేజిపై సిల్క్ పంచె, లాల్చీ వేసుకుని ఉత్సవ విగ్రహంలా కూర్చుంటాడు, అసలే పసుప్పచ్చ శరీరమెమో ఫోకస్ లైట్ల కాంతిలో మెరిసిపోతుంది. అర నిముషానికోసారి ఏడుకొండలు ఫోటో తీస్తాడు. వీర్రాజు శాలువాతో సత్కరిస్తాడు. సమితి కార్యవర్గం మూకుమ్మడిగా మీదపడి ‘జన బంధు’ బిరుదు ప్రధానం చేస్తుంది. ఇక పొగడ్తల పోటీలు  కాగానే మొహమాటం నటిస్తూ ‘పెజాసేవ నా బాద్యెత, కితం జన్మ సుకుతం’ అని ముగిస్తాడు.

భవిష్యత్తు దృశ్య రూపంలో కవ్విస్తుంటే ఆదుర్దాగా మురిసిపోయాడు.

ఓ పావుగంటకి బండ గొంతుతో “అన్నారం ఎల్లాలటండి” అంటూ పీఏ లోపలకి అడుగెట్టగానే దృశ్యం నొచ్చుకుని అదృశ్యమయ్యింది.

నాగోజీకి మాట్లాడే మూడ్ లేకపోయినా కాంట్రాక్టర్తో ఒప్పందం తప్పదు కాబట్టి “సరే ఎదవని రమ్మను” అని పెళుసుగా  అన్నాడు. ఓ నిముషానికి ఇసుక కాంట్రాక్టర్ అన్నవరం తప్పు చేసినవాడిలా నిలబడ్డాడు.

“ఏరా! అంతడావిడేంటి? ఓ ఇద్దర్ని బయపెట్టి, నాలుక్కాలవలు తవ్వేసరికి పెద్ద మనిషైపోయావా?” అని హుంకరించాడు.

“అది కాదండి, కొంతూరెల్లాలి సీకటటుద్దని ”

“కొత్త యెమ్ఆర్వో ని లొంగెయ్యాలా.. యెమ్.ఎల్.ఏని సాచిపెట్టి కొట్టాలా? నువ్వంటే సీకటి బయపడాలి గానీ…నీకు బయమెంటేహే?… ” అని వెటకారంగా నవ్వాడు.

“అయ్ బాబోయ్! అదేవీ లేదండి… ఓ రెండ్రూపాయలు ఎనకేసుకుంటే గిట్టనెధవలు ఇలేకరికి కబురెట్టి యాగీ సేసారండి”

Kadha-Saranga-2-300x268

“ఈ మద్యన ఇసక్కోసం కలెట్టర్ని కప్పెట్టెసారని సదివాను… అలాంటి.. ”

“లేదండి.. మనకెందుకండి పాపపు డబ్బు, నాయంగా సంపాయించుకుంటే నిలుద్దండి”

“మరే… ఆ ఇసయం నువ్వూ, నేను..చాగంటోరి పక్కన కూర్చుని జనాలకి సెప్పాలి” అని గది దద్దరిల్లేలా నవ్వాడు.

“మీకు మహా ఎటకారమండి…” అని గొంతు కలిపాడు అన్నవరం.

“అవునొరేయ్ మీ ఓడు పంపా, నువ్వు తాండవని కొబ్బరి చిప్పలా కోరేత్తునారంట” అని ఆరాగా అడిగాడు.

“లేదండి పట్టా ఉన్న మేరకే తవ్వేవండి”

“ఇనాలె గానీ రోజంతా సొల్లు సెపుతావు… ఒచ్చిన ఇసయం సెప్పు”

“… అంటే ముప్పై కాడికి సేసుకుందారండి”

“ఇరవై”

“ఇంకో మాట సెప్పండి”

“తేరగా దొరికిందానికి పదిచ్చినా దండగే”

“అంత మాట అనేయ్యకండి, పై నుంచి కింద్దాకా ఇచ్చుకుంటూ రావాలి”

“సూర్రావు ఇరవై రెండన్నాడు”

“గిట్టదండి, పాటకి పాతిక, లోడు దింపడానికి మూడండి..రెండు కూడా మిగల్దు”

“నేనీ రోజు పుట్టలేదు….. తత్తి కబుర్లు సెప్పకు”

sarange.isuka meda

“మీ దగ్గర దాపరికం ఎందుకండి.. సూర్రావుది తొర్ర ఇసకండి, అంతా మట్టి.. తాండవ ఇనుమండి…మహా గట్టిసక”

“దగ్గరుండి పండించావా?”

“నిజమండి… పరాసికాలు కాదు”

“సరే నీ మాట అట్టుకుని సిమెంట్ ఆపిచ్చేత్తాను…  ఇసక, ఇటుక కలిపి ఇల్లు కట్టేయ్యచ్చు”

“అంటే… మన ఇల్లల్లో ఇసకెక్కువని టాకండి” అని గురి చూసి కొట్టాడు అన్నవరం.

ఆ మాటకి ఖంగు తిని నాగోజీ కాస్త వెనక్కి తగ్గాడు “ఏ ఎదవన్నాడు, కాల్లు సేతులు ఇరిసెయ్యగలను…అపాట్మెంట్టు కనికలా కట్టించాను… రాయిలాంటి ఇల్లు” ఉద్వేగంగా అన్నాడు నాగోజీ. .

“నేనూ పాడెదవలకి అదే సెప్పానండి” అని లోపల నవ్వుకున్నాడు.

లొసుగులు మనసు విప్పి చెప్పుకునేసరికి ఇద్దరికీ గౌరవం పుట్టుకొచ్చింది.

“ఈర్రాజు ఫోనండి.. హాల్ దగ్గరున్నాడు” అని పీఏ పిలవగానే బయటకి వెళ్ళాడు నాగోజీ.

రహస్యం మాట్లాడాలంటే వాళ్ళు పెట్టుకున్న కోడ్ పదం ‘ఫోను’. ముందే చేసిన లెక్కలు పీఏతో మరోసారి సరి చూసుకున్నాడు నాగోజీ. ఈ ప్రకారం బేరం కుదిరితే ఖర్చు పదహారుకు మించదని పక్కాగా తేల్చుకుని లోపలకి వచ్చాడు.

అన్నవరాన్ని కిటికేలోంచి బయటకి చూపిస్తూ “ఈ పక్కది కాకుండా మనవి మూడు కొత్తవొత్తాయి, అన్నింటికి నువ్వే ఇసుక తోలుకో, డబ్బు బదులు అపాట్మెంట్ రాసిత్తాను.. ఏమంటావ్” అన్నాడు నాగోజీ.

“అన్నారం…ఎటు చూసినా నీకే లాబం..ఉంచుకో…అమ్ముకో.. నీ ఇట్టం” అని యజమానిని సమర్ధించాడు పీఏ.

అన్నవరం ఊహించని ఒడంబడికకి కాస్త ఆశ్చర్యం, బోలెడు అనుమానం వేసింది.

“మావోడికి ఓ మాట సెప్తానండి” అని ఫోన్ తీసి బయటకెళ్ళాడు, కాసేపటకి లోపలకి వచ్చి “అంటే… మావోడు ఓ సారి సూసి రమ్మనాడండి” అని అన్నాడు.

“యాపారం నీ దగ్గర, మీఓడి  దగ్గర నేర్సుకోవాలి… ” మెచ్చుకోలుగా చురక పెట్టాడు నాగోజీ

పీఏ తొందరపడుతూ “తర్వాత సూపిద్దారండి… ఇంకో గంటలో సమ్మానం” అన్నాడు.

“పర్లేదేహే దార్లోనే కదా…” అని నిదానం నటించాడు నాగోజీ.

కారు అపార్ట్ మెంట్ దగ్గర ఆగగానే గోడపై సన్మానం తాలూకు పోస్టర్ కనపడింది. నాగోజీ దాని వంక గర్వంగా  చూసుకుంటూ కారు దిగాడు. కూలివాళ్ళు ఆ రోజు పనులు ముగించుకుని సామాన్లు సర్దుకుంటున్నారు, పీఏకి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు గుర్తొచ్చి ‘ఓ నివషంలో వచ్చేత్తాను” అని మేస్త్రీ దగ్గరికి పరిగెత్తాడు, మిగతా ఇద్దరు ముందుకెళ్ళారు.

వాచీ చూసుకుంటూ అన్నవరాన్ని అమ్ముడవ్వని నాలుగో అంతస్థు అపార్ట్మెంట్కి తీసుకొచ్చాడు నాగోజీ. గదులు, కిటికీలు, ఆకాశాన్ని చూపించి ‘ఏమంటావ్?” అనడిగాడు

ఓ రెండు గంటల తర్వాత…

హాల్ కిట, కిటలాడుతోంది. ఏసీ సరిగ్గా పనిచేయక జనాలు పేపర్లు విసురుకుంటూ, విసుక్కుంటూ స్టేజీ కేసి చూస్తున్నారు. ఓ గంట ఆలస్యంగా జనవాహిని కార్యదర్శి శ్రీ వీర్రాజు స్టేజీ పైకొచ్చి “మన నగరానికి గర్వకారణం…జనబంధు శ్రీ నాగోజీ గారు… ఈ రోజు అపార్ట్ మెంట్ కూలి మృతి చెందారు. వారి కుటుంబానికి జనవాహిని తీవ్ర సంతాపం తెలియజేస్తోంది…… ” అని ముగించాడు.
*****

బరువు???

 

 

Mamata K.

మమత కొడిదెల 

 

కాళ్ళకు చక్రాలు తొడుక్కున్నట్లు బాల్కనీలో అటూ ఇటూ పచార్లు చేస్తోంది ప్రీతి. ఆమె నడక చూసి చెప్పొచ్చు తన మనఃస్థితి ఎలా వుందో.

బాల్కనీలో ఒక పక్కగా పేము కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తోంది కరుణ. అరగంట ఓర్చుకుని అంది, “అబ్బబ్బా, ఇక చాల్లే. నీ నడక చూస్తుంటే నాకు తల తిరుగుతోంది. కూర్చో ఇక. లేకపోతే ఒక దగ్గర నిలబడి నీ ఇష్టం వచ్చినంత కోప్పడుకో.”

“అంత కష్టంగా వుంటే నావైపు చిద్విలాసంగా చూస్తూ కూర్చోక ఆ పుస్తకం చదువుకోరాదూ.” గయ్యిమంది ప్రీతి.

“అనుకుంటూనే వున్నా. అత్త మీద కోపం దుత్త మీద పడుతుందని.”నవ్వింది కరుణ, “సరే, ఇంకో ఐదు నిమిషాలు అలాగే నడుస్తుండు. మాంచి మసాలా టీ పట్టుకొస్తా.”

**

ప్రీతి, కరుణ జిగ్రీ దోస్తులు. చదువుకోవడానికి అమెరికా వచ్చిన కొద్దిరోజుల్లోనే పరిచయమయ్యి, భావాలు, మనస్తత్వాలు కలవడం వల్ల ప్రాణ స్నేహితులైపొయ్యారు. ఉద్యోగం వచ్చిన కొన్ని నెలల్లోనే తన ఆఫీసులోనే పరిచయమైన రాహుల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కరుణ. పెళ్లయిన కొత్తజంటను డిస్టర్బ్ చెయ్యొద్దనుకుని కాస్త దూరం జరిగింది ప్రీతి. ప్రీతి వేరే స్టేట్ లో ఉద్యోగం చూసుకోడంతో వారిమధ్య రాకపోకలు కూడా బాగా తగ్గిపొయ్యాయి. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లు.

పెళ్లయిన ఏడాదికే కుటుంబ సమస్యలు మొదలై వాటిని స్నేహితురాలికి పంచకూడదనుకుని ఇంకా దూరం జరిగింది కరుణ. కరుణకు పాప పుట్టిన తరువాత  కుటుంబ సమస్యలు మరీ ఎక్కువయ్యాయి వాటి ప్రభావం పాప మీద పడడం ఇష్టం లేక ఏడాది క్రితమే భర్తతో విడాకులు తీసుకుంది.

కరుణ విడాకులు తీసుకున్న రెండో నెలలో ప్రీతి నుంచి హఠాత్తుగా ఫోన్. కరుణ వున్న ఊర్లోనే ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ప్రీతికి తన విడాకుల విషయం అప్పుడు చెప్పింది కరుణ. అంత పెద్ద సంగతి తనకు చెప్పలేదన్నదానికంటే స్నేహితురాలు తనలోకి తాను ఎంతలా ముడుచుకుపొయ్యిందో గ్రహించి ఎక్కువ బాధ పడ్డది ప్రీతి. తొందర్లోనే కరుణ వుంటున్న ఇంటి దగ్గరలోనే అపార్ట్మెంట్ కొనుక్కుంది.

తనకు సరైన జోడీ దొరకక ఇంకా పెళ్లి చేసుకోలేదు ప్రీతి.

కరుణ కాస్త కుదుట పడేదాకా తోడు వుందామని, పాప కాస్త పెద్దదయ్యేదాకా సహాయం చేద్దామని వచ్చారు ఆమె తల్లిదండ్రులు. ఆఫీసు పని తరువాత, పాప పనులు పూర్తయిన తరువాత రెండుమూడు రోజులకొకసారి ప్రీతి దగ్గర గడుపుతుంటుంది కరుణ.

 

**

ఈరోజు ప్రీతిలో ఎప్పుడో గాని బయటకు రాని అసహనాన్ని గమనించింది కరుణ. టీ చేస్తూ అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పింది.

కరుణ అందించిన కప్పు అందుకుని, కమ్మని మసాలా టీ వాసన చూస్తూ ”మ్… టీ బాగానే చేసినట్టున్నావోయ్.” అని మెచ్చుకుంది ప్రీతి.

“షుక్రియా, షుక్రియా! వంట గదిలోకి వెళ్లి చాలా రోజులవుతోంది. టీ ఎలా పెట్టాలో గుర్తు చేసుకోవాల్సి వచ్చింది.”  చిర్నవ్వుతో అంది కరుణ.

“నువ్వు చాలా లక్కీ… అమ్మనాన్న నీతోనే వుండగలుగుతున్నారు.”

“నేను, పాప ఇద్దరం లక్కీనే. వాళ్లు వచ్చినప్పట్నుండి పాపతో ఎక్కువసేపు గడపగలుగుతున్నాను.”

కాసేపు ఏవేవో మాట్లాడుకున్న తరువాత అడిగింది కరుణ, “ఇంతకీ నీ కోపానికి కారణమేంటే తిరుగేశ్వరీ?”

“ఏంటో ఈ మనుషులు. ఎప్పుడు మార్పొస్తుందో వీళ్ళలో.” అంటూ కుర్చీలోంచి లేవబోయింది ప్రీతి.

“అమ్మో, మళ్ళీ నడవబోతున్నావా?”

కరుణ జోక్ పట్టించుకోకుండా చప్టా దగ్గరికి వెళ్లి నిల్చుంది ప్రీతి, “చాలా చిరాగ్గా వుంది కరుణా.”

Kadha-Saranga-2-300x268

“ఓహ్. ఇక అడ్డు రాను. ఏమయిందో చెప్పురా.”

“ఒక పెళ్లి సంబంధం వచ్చిందని డిటైల్స్ చెప్పాడు నాన్న. అతను డివోర్సీ కానీ ఎలాంటి బాధ్యతలూ, బరువులూ లేవని చెప్పారట. అతను అమెరికాలోనే వుంటున్నాడని, ఒకసారి కలవమని ఒకటే గొడవ. అతనితో మాట్లాడినప్పుడు చాలా లిబరల్ మైండెడ్ గా  అనిపించాడట. అతను నా మనస్తత్వానికి సరిపోతాడని అమ్మ కూడా అంది.”

“రెండో పెళ్లి సంబంధమని కోపమా?” తన స్నేహితురాలిని ఈ కోణంలో ఎప్పుడూ చూడలేదు కరుణ.

నవ్వింది ప్రీతి, “నా గురించి నీకు బాగా తెలుసని గప్పాలు కొడుతుంటావు. ఈ విషయంలో నేను ఎట్టా ఆలోచిస్తానో నీకు తెలీదా?”

కరుణ కూడా నవ్వింది, “మరీ, నీ చిరాకుకి కారణమేమిటమ్మా? నువ్వు వద్దన్నా సంబంధాలు చూస్తున్నారనా? నువ్వు పెళ్లి చేసుకోకూడదనేం అనుకోలేదు కదా. నీకిష్టమైన వాళ్ళేవరన్నా వుంటే చెప్పమన్నారు కదా అమ్మ నాన్న. ఏదో సంబంధం వచ్చిందని చెప్పారు. ఒకసారి కలిసి …”

“అచ్చం మా అమ్మలాగే మాట్లాడుతున్నావు. బరువు, బాధ్యతల్లేవు అంటే ఏంటి?” గొంతు పెంచి కరుణ మాటకు అడ్డొచ్చింది ప్రీతి.

“అమ్మా నాన్నల్లేని ఒంటరివాడేమో. మనోవర్తిలాంటి బాధ్యతల్లేవేమో. అప్పులేం లేవేమో.”

“ఎందుకో నాన్న ఆ మాట చెప్పినప్పుడు అంత సింపుల్గా అనిపించలేదు. ఆ పదాలు నచ్చలేదు నాకు.”

“అతను వివరించిన పరిస్థితులను నాన్న ఇలా కొద్ది మాటల్లో కుదించి నీకు చెప్పి వుండొచ్చు కదా. నీకు వేరే

ఆలోచన వుంటే నీ ఇష్టం. కానీ కేవలం ఆ పదాల ఆధారంతో ఒక నిర్ణయానికి రావొద్దు. ఒకసారి మాట్లాడి చూడు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు?”

“హ్మ్, ఇంకొంచెం ఆలోచిస్తాను. ఈ రాత్రికి ఇక్కడే వుండరాదూ?”

“నాకు బాగా పని వున్నప్పుడు పాప అమ్మ దగ్గర పడుకుంటుంది కానీ మధ్య రాత్రి లేచి ఏడిస్తే అమ్మ పట్టుకోలేదు. పాప లేకుండా నాక్కూడా సరిగ్గా నిద్ర రాదు. ఇంకో రెండేళ్ళు పోనీ, అప్పటికీ నీకు పెళ్లి కాకపోతే బయటెక్కడికైనా ఒక రోడ్ ట్రిప్ వేసుకుందాం.. జస్ట్ మనిద్దరమే.”

“అప్పట్లోగా నీ పెళ్ళయిపోతే?” కన్ను గీటి అంది ప్రీతి.

కరుణ ఏమీ మాట్లాడకుండా టీ కప్పు పక్కన పెట్టి చిరునవ్వుతో ప్రీతి వైపు చూసింది. ఆ నవ్వులోని అంతర్యం ప్రీతికి తెలుసు.

“ఎన్నో రోజులుగా చెప్పాలనుకుంటున్నా నీకు. ఇక నేను అనుకున్నది చెప్పాల్సిందే. అటువైపు కాస్త ఆలోచించు కరుణ. ఒక పెళ్లి వీగిపోయిందని సన్యాసిలా బతకక్కర్లేదు.”

“సన్యాసమా? హన్నన్నా! ఎన్ని కోరికలో పాపకూ, నాకూ. అన్నీ తీర్చేసుకుంటాం కూడా. ఇప్పుడు మాకు బోల్డంత ప్రేమ కావాలి. మేమిచ్చె బోల్డంత ప్రేమను తీసుకునే వాళ్లు కావాలి. అందులో నో కాంప్రోమైజ్, నో అడ్జస్ట్ మెంట్స్. మా చిన్ని ప్రపంచాన్ని తన ప్రపంచం అనుకునే వ్యక్తి నాకు తారసపడలేదింతవరకూ. అలాంటి వాడు తారసపడినప్పుడు పో, పోవోయ్ అని అనను సరేనా.” నవ్వుతూ అన్నది కరుణ.

“అవునూ, ఈ మధ్య ఒకరోజు అంకుల్ నాతో మాట్లాడుతూ బంధువెవరో సంబంధం తెచ్చారని అన్నారు. ఏమన్నా తెలిసిందా దాని గురించి?”

నవ్వింది కరుణ,”నాకు ఇంకా వివరాలు తెలీవు. అహంకారంతో డివోర్స్ తీసుకున్నానని, సర్దుకుపోవాల్సిందని ఆన్నారట ఒక దగ్గరి బంధువు నాన్నతో. ఎన్ని మాటలు పడి, నలుగురి మధ్య ఎంత ఒంటరితనం అనుభవించి, ఎంత క్షోభపడి ఈ నిర్ణయం తీసుకున్నానో వాళ్ళకేం తెలుసు? ఇంకొకరెవరో డివోర్స్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందన్నారట. అలా ఆలోచించేవాళ్లకు ఎలాంటి సంబంధాలు తెలుస్తాయంటావూ?”

“ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో?” కరుణ మాటను ఆమెకే అప్పగించింది ప్రీతి.

“ఇప్పుడు నా అంత సంతోషంగా ఈ ప్రపంచంలోనే కాదు, విశ్వంలోనే ఎవరూ లేరు. నా సంగతి ఒదిలెయ్” హ్యాండ్ బ్యాగ్ అందుకుని బయటకు నడుస్తూ అంది కరుణ, “ సరే అమ్మాయ్, నేనిక నా చిట్టితల్లి దగ్గరికి వెళ్లాలి. అతనితో మాట్లాడిన తరువాత నాకు కాల్ చెయ్యి. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. నువ్వసలే వాగుడుకాయవు.”

“సరే, మాతాశ్రీ! గుడ్ నైట్!” నవ్వుతూ కరుణను సాగనంపింది ప్రీతి.

***

 

painting: Mandira Bhaduri

నాలుగు రోజుల తరువాత సాయంత్రం కరుణకు ఫోన్ చేసింది ప్రీతి అర్జంటుగా రమ్మని.

కరుణ వెళ్ళేసరికి వాడిన మొఖంతో, ఆఫీసుకు వేసుకెళ్లిన బట్టల్లోనే ఉంది ప్రీతి.

కరుణను తలుపు దగ్గరే పట్టుకుని, “అతన్ని కలిశాను. నేను చెప్పాను కదా తన మాటలు నచ్చలేదని. ఛ, అతన్ని కలవకపోయుంటే బాగుండేది.” కోపంగా గబగబా అంది ప్రీతి.

“ఆగాగు. ఎవరతను, ఎవరిని కలిసావు? ఏం మాట్లాడుతున్నావు? ఆఫీసులో ఏమైనా ..”

“ఆఫీసులో గొడవ కాదు తల్లీ. ప్రపంచమే భయంకరంగా వుంది.”

“ఒకే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్…” ప్రీతిని కుర్చీలో కూర్చోబెడుతూ అంది కరుణ, “ఇప్పుడు మెల్లగా చెప్పు.”

“పెళ్లి సంబంధం గురించి చెప్పాను కదా. అతను ఆఫీస్ పని వుండి కాలిఫోర్నియా నుంచి న్యూ జెర్సీ వచ్చాడట. పొద్దున్నే కాల్ చేసి అడిగాడు కలవడానికి వీలవుతుందా అని. మాల్ లో కలిసాం. చాలా సేపు బాగానే గడిచింది. మొదట్లో వుమెన్ ఇష్యూస్ గురించి మాట్లాడాడు. తరువాత చెప్పాడు, మొదటి పెళ్లి పెద్దవాళ్ళు చేసిన బలవంతపు పెళ్లి అట. ఆ అమ్మాయి చాలా సాంప్రదాయకంగా వుంటుందట. ఆమె పేరు బాగోలేదని రమ్య అని పేరు మార్చాడట. ఇతనే దేవుడని ఫీల్ అయ్యేదట.  సొంత వ్యక్తిత్వం లేని మూర్ఖురాలని అన్నాడు. ఒక పాప పుట్టిన తరువాత ఆమె మరీ పిచ్చిదయ్యిందని, భరించలేక విడాకులిచ్చేశానని చెప్పాడు. ఇది జరిగి ఆర్నెళ్ళవుతోందట. వాళ్ళెక్కడున్నారో కూడా తనకు తెలీదని, వాళ్ళతో తనకెలాంటి కాంటాక్ట్ లేదని నాకు భరోసా ఇవ్వబొయ్యాడు. డివోర్సీనే కానీ బరువూ బాధ్యతల్లేవు అని పళ్ళికిలిస్తూ అన్నాడు.”

“అంత లిబరల్ వ్యూస్ ఉన్నవాడు, పెళ్ళికి ముందు ఆ అమ్మాయితో మాట్లాడలేదా అతను?”

“ఆ, ఆ … మాట్లాడాడట. పెళ్లి తరువాత మార్చుకోవచ్చనుకున్నాడట.” పళ్ళు కొరుకుతూ అంది ప్రీతి.

కరుణ ముఖం ఎర్రబడింది, “రాహుల్ తల్లిదండ్రులు నాగురించి సరిగ్గా ఇట్టాగే అనుకున్నారు.  నా గురించి, నా కలల గురించి విడమరచి చెప్పిన తరువాతే రాహుల్ నన్ను ప్రేమించానన్నాడు. పెళ్లి తరువాత అవన్నీ మార్చుకోవచ్చని వాళ్లు అనుకున్నారట. అదీ ఇప్పుడు రాహుల్ ఉవాచ. వాళ్లు మాతోనే వుండే వాళ్లు కదా, మెల్లగా రాహుల్ కూడా వాళ్లలాగే తయరయ్యాడు. మారాడో అంతకు ముందు నుంచీ అంతేనో. నేను కూడా మారాను,. అన్నేళ్లు ఆ బురదలోనే పడి వుండేంతగా నన్ను నేను మర్చిపొయ్యాను. జీతం తెచ్చే పనిమనిషిలా …” కోపంతో గొంతు వణికి మాట్లాడలేకపొయ్యింది కరుణ.

ప్రీతి కరుణను కౌగిలించుకుని అన్నది, “ఎంత బాధ పడ్డావురా. అదంతా అయిపొయ్యింది. ఇప్పుడు చూడు, నువ్వక్కడ లేవు. నీ పాప కూడా లేదు ఆ బురదలో. అక్కడే దిగబడకుండా ధైర్యంగా బయటపడ్డావు. నువ్వు నా స్నేహితురాలివని చెప్పుకోవడానికే గర్వంగా వుంది.”

కరుణ కాస్త తెప్పరిల్లి అడిగింది, “ఇంతకీ, రమ్యకు కనీసం సరైన అధారమైనా కల్పించాడా ఇతను?”

“ఆ అమ్మాయి తన కిచ్చిన కట్నం తిరిగి ఇచ్చేశాడట. దానితో తన బాధ్యతలు తీరిపొయ్యాయట. ఆమే పాపను కూడా తీసుకెళ్లినందుకు తనకు పాప బరువులేం లేవట … గొప్పగా చెప్పాడు.”

“వీర లిబరల్, కట్నం కూడా తీసుకున్నాడా?” నోరెళ్ళబెట్టింది కరుణ.

“అదే అడిగితే, ఓ వెర్రి నవ్వు విసిరాడు. పెద్దవాళ్ళు తనకు తెలీకుండా జరుపుకున్నారట ఆ తంతులన్నీ.”

“హ్మ్ … ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్. కానీ ఇట్లాంటి విషయాల్లో గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఆదర్వైజ్..”

“నన్ను బాధ పెట్టింది అది కూడా కాదు కరుణా. ఆ బరువు బాధ్యతా అనే పదాలు ఇతను చాలా తేలికగా ఉపయోగించాడు. మరో పెళ్లి కూడా అలోచించలేనంత వెనకబడ్డ మనస్తత్వమండీ వాళ్ళది అని అన్నాడు.  ఆ అమ్మాయి గురించి అంతా తెలిసే చేసుకున్నాడు. పెళ్ళికీ పాప పుట్టడానికీ చాలానే గ్యాప్ వుంది. పాప పుట్టిన తరువాత వెలిగింది వీడికి ఆమె బ్యాక్వర్డ్ అని. ఇప్పుడు ఆ పాపను బరువు అంటున్నాడు, ఆ బరువు తనకిక లేదంటున్నాడు. ఆమెకు ఏమైనా అయితే, ఏమీ కాకపోయినా సరిగా చూసుకోలేకపోతే ఆ పాప జీవితం ఎలా వుంటుంది? పాప పెద్దయి ఇలాంటి ప్రబుద్దుడి చేతిలో పడితే, అదొక విషియస్ సర్కిలే కదా. అతను చేసింది తప్పని చెప్పాను. వెంటనే వాళ్ళెక్కడున్నారో కనుక్కొని పాపను బరువుగా కాదు బాధ్యతగా తీసుకొమ్మని చెప్పాను. నేనలా మాట్లాడేసరికి వేరే పనుందంటూ పారిపొయ్యాడు.”

గుండె బరువెక్కి ఇద్దరూ కాసేపు మాట్లాడకుండా కూర్చున్నారు.

నుదురు నొక్కుకుంటున్న ప్రీతిని చూసి, “సర్లే, నువ్వు ఫ్రెష్ అవుపో. నేను టీ పెడతాను” అంటూ కిచెన్ లోకి దారి తీసింది కరుణ.

“థ్యాంక్స్ అమ్మాయి. టీ బాగా పెట్టు. తల పేలిపోతోంది.” అంటూ బాత్రూంలోకి వెళ్లింది ప్రీతి.

ప్రీతి వచ్చేలోపు టీ తయారు చేసి కప్పుల్లో పోసి, బాల్కనీలో చైర్లు వేసింది కరుణ.

టీ కప్పు ప్రీతి చేతికి ఇస్తూ అంది కరుణ, “ఇప్పుడు నా టర్న్, నా కథ చెప్పడానికి.”

“అహ్హా! ఎనీథింగ్ ఇంటరెస్టింగ్?” కన్ను గీటి అడిగింది ప్రీతి.

“ఇంటరెస్టింగే. ఒకతను ఈ-మెయిల్ చేశాడు. నాన్న మొన్న చెప్పాడు కాదా? అతను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక్క కండీషన్ అట.” పంటి బిగువున నవ్వు దాస్తూ అంది కరుణ.

“ఓహ్. ఒక్కటేనా? ఏమిటో అది.”

“ఊహించు చూద్దాం.”

“కట్నం కావాలన్నాడా?” కన్నెర్ర జేస్తూ అంది ప్రీతి.

“అహహ, పని చేస్తున్నాను కదా అందుకని కట్నం అక్కర్లేదట. చాలా క్లారిటీతో ఉన్నాడు.”

“వాడి క్లారిటీ తగలెయ్య!”

“దానికే తిట్లదండకం మొదలెట్టావూ…”

“ఓహ్, మరింకేంటో చెప్పు త్వరగా.”

నిట్టూర్పు విడిచి చెప్పింది కరుణ, “పాప నాదగ్గర వుండకూడదట. పాపను పాప నాన్నకు పూర్తిగా ఇచ్చెయ్యాలట. లేకపోతే మా అమ్మనాన్నలకో, అదీ లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చెయ్యాలట. పాపను అమ్మానాన్నలు పెంచితే నేను డబ్బు సర్దుతానా అని ఒక ప్రశ్న కూడా యాడ్ చేశాడు.”

“….” దిగ్బ్రాంతితో చూస్తుండిపొయ్యింది ప్రీతి.

“ఎగ్జాక్ట్లీ. నా మైండ్ బ్లాంక్ అయింది ఆ ఈ-మెయిల్ చదివినప్పుడు. “పిల్లలంటే ప్రాణంలేని వస్తువులు కాదు. పిల్లలను ప్రేమించి చూడండి ఎంత ఆనందంగా వుంటుందో మీకే తెలుస్తుంది. మీరు చాలా ఎదగాల్సి వుంది.”

అని రిప్లై ఇచ్చాను. కానీ….పిల్లలను బరువు అనుకునే ట్రెండ్ నడుస్తున్నట్లుంది. మొన్నామధ్య ఒక అమెరికన్ తెలుగు పత్రిక చూశాను. అందులోని క్లాసిఫైడ్ చూస్తే ఒక డివోర్సీ అమ్మాయి ప్రొఫైల్ లో ‘డివోర్సీ విత్ నొ ఇన్ కంబ్రెన్స్’ అని వుంది.”

“అబ్బా కరుణా, ఏమిటీ మనుషులు? ప్రకృతి చేసిన పెద్ద తప్పు ఇదే. శక్తివంతమైన మెదడుని తను సృష్టించిన ప్రాణులన్నింటిలో అతి హీనమైన ప్రాణికి ప్రసాదించింది. ఎంత మార్పు రావాలి మనుషుల్లో.”

కాసేపు మౌనంగా కూర్చున్న తరువాత, తల విదిల్చి కంప్యూటర్ ఓపెన్ చేసింది ప్రీతి, “రా కరుణ. ఓ రెండు ఈ-మెయిల్స్ చేద్దాం. ఒకటి నా స్నేహితురాలు రాధకు. తను ఒక  మహిళా సంస్థలో లాయరుగా పని చేస్తోంది. రమ్య గురించి చెప్పి, డైవోర్స్ కేసు తిరగదోడి ఆమెకు మనోవర్తి ఇప్పించొచ్చేమో చూడాలి. అలాగే, ఆమె పాపకు కూడా చైల్డ్ సపోర్ట్ వచ్చేట్టు చూడమని చెప్పాలి. ఇంకో ఈ-మెయిల్ మా నాన్నకు. తనకున్న ఫ్రెండ్ సర్కిల్నంతా ఉపయోగించి రమ్య ఎక్కడుందో కనుక్కోమని చెప్పాలి. కొంచెం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. మనకు తెలీనివెన్నో జరిగిపోతుంటాయి, కనీసం మన ఎరికలోకి వచ్చిన వాటినైనా పట్టించుకోవాలి కదా?”

ప్రీతిని  కౌగిలించుకుని, “నువ్వు భలే పిల్లవి ప్రీతి.” అని అరిచింది కరుణ. “ఎంత దిగులుగా వచ్చాను నీ దగ్గరికి. ఇంతేనా మనుషులు అనుకుంటూ, నా పాప గురించి, తన లాంటి పాపాయి గురించి దిగులు పడుతూ వచ్చాను…. ”

*

మిరకిల్

 

 

అల్లం వంశీ  

వాళ్లిద్దరు ఒకరి జబ్బ మీద ఒకరు చేతులేసుకోని, అడుగుల అడుగేసుకుంట లోపటికి నడిచిన్లు..

ఆ లోపట..వెలుతురు కూడా అచ్చం చీకటిలెక్కనే కనపడ్తాంది..

ఎందుకంటే,అన్ని బార్లల్ల ఉన్నట్టే ఈడకూడా “తక్కువ వెలుతురు,ఎక్కువ చీకటి” అన్న ప్రాథమిక సూత్రం అమల్లఉన్నది.. అట్లా డిమ్ము లైటుకింద తాగుతె మస్తు “ఎక్కుతదనేది” తాగేటోళ్ల నమ్మకమైతే, ఆ లోవెలుతురుల వాళ్లు ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తాగుతరనేది అమ్మేటోళ్ల అనుభవం..

బారంటె మళ్ల వట్టి బారు కాదది, జనతా బారు.. “ఎవరుపడితె వాళ్ళు, ఏడపడితె ఆడ కూసోని.. తాగ బుద్ధైంది తాగుకుంటా, తిన బుద్ధైంది తినుకుంటా.. ఎక్కేటోనికి ఎక్కనిస్తూ,  కక్కేటోన్ని కక్కనిస్తూ… కోపమస్తె కొట్టుకుంటా, దుఃఖమస్తె చీదుకుంటా.. ఒర్రేటోన్ని ఒర్రనిస్తూ, బొర్రేటోన్ని బొర్రనిస్తూ..ఇట్లా.. ఒక మనిషిని మొత్తానికి మొత్తంగా నూటికి నూరుపాళ్లు వానికి నచ్చినట్టువాన్ని ఉండనిచ్చే గ‘మ్మత్తైన’చోటు..”

ఆ వాతావరణమంతా చల్లచల్లటి ఆల్కహాలు వాసనలు, వేడివేడి సిగరెట్ పొగలు.. గల గల గ్లాసులూ, కర కర ముక్కలూ.. డొక్కు డొక్కు బల్లలూ,  ముక్క ముక్క మనుషులూ..మత్తు మత్తు చూపులూ, ముద్ద ముద్ద మాటలు…

వీటన్నీటి మధ్యల.. తాగేటోల్లు తాగుతనే ఉన్నరు, వాగేటోల్లు వాగుతనే ఉన్నరు..

 

******

వెనక నుంచి ఆరో టేబుల్ మీద, చేతిల బీరు గ్లాసుతోని ఉన్న మనిషే కార్తిక్, ఎర్ర టీషర్ట్ తొడుక్కోని ఉన్నడు చూశిన్లా? అగో ఆయినే.. అతనికి ఎదురుంగ సిమెంట్ కలర్ టీషర్ట్ ఏస్కొని కూచున్నాయినె వినయ్.. అదే, ఆ గ్లాసులకు నిమ్మళంగ బీరువంపుతున్నడు చూడూ.. ఆ పిలగాడు.. ఇంతకుముందు లోపటికచ్చింది వీళ్లిద్దరే..

నువ్ బీర్ మస్తు పోస్తవ్రా భై,అస్సల్ నురుగు రాకుండ.. కార్తిక్ అన్నడు..

అరే.. నీకెక్కిందిరా…

అరే మామా..  నిజంగనేరా… నిజ్జంగ నిజం చెప్తానా, ఆ వెయిటర్ సుత నీ అంత పర్ఫెక్ట్ పొయ్యడెర్కేనా?

సాల్తియ్ గనీ ఈడికి ఆపేద్దామా, ఇంకో రెండు చెప్పాల్నా??

ఏంది అప్పుడేనా?? ఇయ్యాల నీన్ మస్త్ తాగుదామని ఫిక్స్ అయిన్రా భై… ఇప్పుడప్పుడే నువ్ చాల్ అనే మాటనకు..

సరే ఐతె ఇంకో రెండు చెప్తానమరి…

అరే… అంత ఏగిరం దేనికిరా? ఇదైతే ఒడ్వనియ్యరాదు. ఇప్పుడే చెప్తే మళ్ల చేదెక్కుతయ్.. బొచ్చెడ్ టైమున్నది, నువ్వైతె పుర్సత్ గ కూసోని  తాగు..

సరేపటు కానియ్…

ఇద్దరు గ్లాసుల్లేపి చెరి రెండుబుక్కలు తాగిన్లు.

ముంగటున్న చికెన్ పకోడి నోట్లేసుకుంటూ కార్తిక్ అన్నడు- అరేయ్.. మామా… నువ్వే చెప్రా… మా అయ్యదో చిన్న చికెన్ సెంటరూ.. మీ అయ్యదేమో సింగరేణిల బాయిపని.. అంతేనాకాదా?

ఔ.. అంతేగారా..

ఆ.. అని ఇంకో బుక్క తాగుకుంట.. “మీ అయ్య రోజుకు ఎన్మిది గంటలు పనిజేస్తె నెలకు యాభైవేలు జీతమస్తది.. మా అయ్య చీకటి తోని లేచింది మొదలు మళ్ల చీకటి వడేదాంక చికెన్ కొట్టుకుంట కూసున్నా నెలకు ఇరువై వేలు మిగుల్తె మస్తెక్కువ..  అంతేనా కాదా?”

గంతేగని..ఇప్పుడు వాళ్ల ముచ్చటెందుకు మతికచ్చిందిరా నీకు?

ఉట్టిగనేకనీ..ఇది చెప్పు.. మీకు సింగరేణోల్లు డబుల్ బెడ్రూం క్వాటరిచ్చిన్లు… మాది మాత్రం మూడు రూముల కిరాయి కొంప.. అంతేనా గాదా??

ఇప్పుడు అయన్నెందుకురా.. వేరే ఇంకేమన్న మాట్లాడరాదు..

అరే? మాట్లాడంగ మధ్యల రాకురా నువ్వు.. నేన్ చెప్పేది మొత్తమిను…

తాగితె కార్తిక్ ఎవరి మాట వినడని వినయ్ కి ఎరికే కాబట్టి సప్పుడు చెయ్యకుంట కూచున్నడు..

ఆ.. చెప్రా… మీకో రెండెకరాల జాగున్నది కదా ఊళ్ళె?

మ్మ్… పత్తి వెట్టిన్లట ఈ యేడు..

ఆ చేనుకు అందాదకు రేటెంతుంటదిరా?

ఎకురం పది చిల్లరుంటది కావచ్చురా… నిరుడు బోరేపిచ్చినం కదా, నీళ్ల సౌలతున్నది కావట్టిఈయేడు ఇంకో లక్ష పెరిగినట్టేఅనుకోవాలె!

ఇద్దరికీ ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగ మందు ఎక్కుతాంది.. మాటలు ముద్ద ముద్దగ వస్తున్నయి..

Kadha-Saranga-2-300x268

“రైట్.. రైట్… గంతే ఉంటదిగనీ..”

అని చికెన్ ముక్క నములుకుంట- మా అయ్య కూడ, ఇల్లు కట్టనీకి ఏన్నన్న ఓ రెండు గుంటల జాగా దొర్కుతె కొందామని చూశిండుకనీ, ముప్పై లక్షలకు తక్కువలేదు మామ మన కాడ..

ఔరా.. తెలంగాణచ్చినంకమనకెళ్లి రేట్లు మస్తు పెరిగినయ్.. ఐనాసుత ఏదైతె అదైంది ఏన్నో ఓకాడ కొనిపారెయ్యున్లిరా ఇప్పుడే, పోను పోను ఇంకింత పిరమైతయ్..

ఏంది కొని పారేశుడా??అయిపైసలాలేకుంటే పెంకాసులా?? గా పైసలే ఉంటే గియన్ని తిప్పలెందుకుపడ్దుము..మంచిగ ఈపాటికి ఇల్లే కడ్తుండేగారా! మా అయ్య కాడ ఓ పదిహేనిర్వై ఉన్నట్టున్నయ్గంతే.. వాస్తవానికిఅయిసుత చెల్లె పెండ్లికోసం పక్కకు పెట్టినయ్…

మ్మ్..

గ్లాసులు, సీసలు ఖాళీ అవుడుతోని వినయ్ వెయిటర్ ను పిలిచి ఇంకో రెండు బీర్లూ చెప్పిండు…

అరే.. నువ్వియాల ఫష్టు సాలరీ ఎత్తినవని సంబురంగ దావతిస్తాంటే, నేనిట్ల మాట్లాడ్తానా అని తప్పుగ అనుకోక్రా భైప్లీజ్..

నీయయ్యా, నేనెందుకట్లనుకుంటరా??  ఎవని ప్రాబ్లంస్ వానికుంటయ్…

యా… థ్యాంక్స్ రా మామా, నా బాధ నీకు సమజైంది… లవ్యూ రా మామా.. అంటుండoగ, వెయిటర్ ఇంకో రెండు తీస్కచ్చి ఇద్దరి గ్లాసులు నింపిపొయిండు.. ఇద్దరు మళ్ల చెరో బుక్క తాగినంక కార్తిక్-

మామా..మనిద్దరం సిక్స్త్  క్లాస్ కాంచి జబ్బకు జబ్బ దోస్తులం గారా??

మ్మ్…

“మ్మ్” కాదు..మంచిగ చెప్పు…

మ్మ్ అంటే ఔననేరాహౌలే..

అట్ల కాదుబే, నువ్ మంచిగ నోరు తెరిచి నోటితోని చెప్పాలె..

ఔ..ను.. మనం చెడ్డీలకాంచి జాన్ జిగిరీ జబ్బల్ జబ్బల దోస్తాం.. ఐతేందిరా ఇప్పుడూ..

విను విను…ఓకే…. మనిద్దరిది ఒకటే బడా కాదా??

యా.. ఇద్దరిది సేంటు సేం ఒకటే బడి.. ఒకటే క్లాసు.. ఒకటే బేంచూ..

చలో, మరి ఇంటర్, డిగ్రీ??

అన్ని సేం సేమే బే..ఒక్కదాన్నే ఎన్ని సార్లడుగుతవ్రా?

వాళ్ల కండ్లల్ల మత్తు ఇప్పుడు స్పష్టంగా కనిపడ్తాంది.. మాటల్లో ముద్దతనం ఉండనే ఉన్నది..

అరే.. మొత్తం ఇన్రా…మరి మనిద్దరిల సదువుల ఎవడ్రా టాపరు??

నువ్వే మామా.. మన చిన్నప్పటికాంచి మొత్తం అన్నీట్ల నువ్వేగారా టాపరువు..

ఆ.. మళ్ల పీజీ ఎంట్రన్స్ ల నా ర్యాంకెంత మతికున్నదారా నీకు??

ఎందుకు మతికిలేద్రా.. నీది డెబ్బై ఎన్మిది, నాది రెండొందల నాలుగు..

కదా?? అంత మంచి ర్యాంకచ్చిసుత నాకెన్ల సీటచ్చింది, నీకెన్ల సీటచ్చిందిరా??

నాది ఓయూ క్యాంపస్.. నీది అదేదో ప్రైవేట్ కాలేజ్ మామా నాకు దాని పే..రూ.. అదేదో సెయింట్ లూనిజో..లూయిసో.. లారిసో…ఏందో ఉండెగారా? మతికస్తలేదు!!

పోనియ్ అదిడ్శిపెట్టుగనీ.. అంత నప్పతట్ల కాలేజిల సదివిసుత నేన్ పీజిల యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టిన్నాలేదా?

అరే మామా నేన్ ఆల్రడీ మస్తుసార్ల చెప్పినా, మళ్ళిప్పుడు చెప్తున్నా..ఎప్పుడన్నగానీ, ఏడనన్నగానీసదువుల నిన్నుకొట్టినోడేలేడ్రా భై.. నువ్ తోపురా నిజంగా..

“కదా??కనిఇయ్యాల నేన్రోడ్డుమీద బేవార్సూ, నువ్వు మాత్రంసెంట్రల్ ఎక్సైస్ డిపార్టుమెంటుల ఇన్స్పెక్టరూ…”

“దాంట్లె ఏముందిరా.. ఐపేంది ఇడ్శిపెట్టి, నెక్స్ట్ ఇయర్ ఇంకింత సీరియస్ గ సదువురా భై, వట్టిగనే పోస్టు కొడ్తవ్ నువ్వు.. నీ ట్యాలెంటుకు అసలది విషయమే కాదు..”

అచ్చా??? నీ ఏజ్ ఎంతరా ఇప్పుడు?

ముప్పై? ఐతే??

మరి నాకెంతరా?

మనిద్దరి ఏజ్ సేమేగాబే.. నాక్ ముప్పై ఐతె నీకు ముప్పయే…

కదా?? మరి ముడ్డికింద ముప్పయ్యేండ్లున్నా నన్ను ఎక్సాం రాయనిచ్చుటానికి వాడేమన్న నా బామ్మర్దా??

అర్రెర్రే..!! కరెక్టే మామా, సారీరా….నాకా ముచ్చటే యాదికిలేదు..

ఎందుకుంటదిరా? మీకు రిజర్వేషన్ ఉన్నది, ఈసారి కాకపోతె ఇంకోసారి.. రాకుంటె మళ్ళోసారి… ఇంక ఐదారేండ్లుకాదు, నువ్ ముసలోనివయ్యేదాంక రాసుకోవచ్చు..ఫీజు కట్టేదున్నదా, చదివి కొట్టేదున్నదా?? ఉట్టిగ క్వాలిఫై ఐతె జాబు… ఇంకనా గురించెందుకు యాదికెందుకుంటదిరా..! అస్సల్ ఉండది..

అరే.. అట్లంటవేందిరా.. నేనేమన్న కావాల్నని అన్ననా? లైట్ తీస్కోరా భై.. అని చివరి చికెన్ ముక్క నోట్లెవెట్టుకున్నడు వినయ్..

“ఏంది లైట్ తీస్కోవాల్నా?ఎందుకు తీస్కోవాల్రా లైటు? ఆ?? చెప్పు ఎందుకు తీస్కోవాలె??  మొన్నటి ఆ ఎక్సాం ల   నాకు టూ ఫార్టీ ఔటాఫ్ థ్రీ హండ్రెడ్ వస్తే నీకెన్నచ్చినయ్రా? ఆ?? చెప్పు ఎన్నచ్చినయ్?? టూ నాట్ సెవన్… ఔనా కాదా?? రెండొందల ఏడచ్చిన నిన్నేమో పిలిచిమరీ ఉద్యోగమిచ్చిన్లు, నీకంటె ముప్పై మూడు మార్కులెక్కువచ్చిన నన్ను మాత్రం పిలిచినోడులేడు, అడిగినోడులేడు.. ఇయ్యాల నువ్ నెలకు నలభై వేలు సంపాయిస్తుంటె, నేన్ మాత్రం బేవార్స్ గానిలెక్క రోడ్లువట్టుకోని తిర్గవడ్తి.. ఎందుక్ తీస్కోవాల్రా లైటూ?? ఛత్..” అని ఎత్తిన గ్లాసు దించకుండ గటగట గ్లాసుడు బీరును ఒక్కబుక్కల తాగి.. ఇంకో రెండు బీర్లకూ, చికెన్ లెగ్ పీసులకూఆర్డరిచ్చిండు కార్తిక్..

వినయ్ ఏం మాట్లాడకుంట తన బీరు లాస్ట్ సిప్పు తాగుతున్నడు..

పోని మళ్లోసారి రాద్దామంటె కూడ “మాకు” ఏజ్ లిమిట్ అని కాలవడే.. ఛత్.. నీ… రిజర్వేషన్లకున్న పారేత్తు..  అసలీ రిజర్వేషన్లను #@Y%*#%………

ఛీ..నాకు జాబ్ అస్తె నువ్ మంచిగ ఖుషీగ ఫీల్ ఐతవ్ అనుకున్నగని గిట్ల మాట్లాడ్తవ్ అనుకోలేర భై.. ఛీఛీ.. నేన్ పోతున్నా.. అనుకుంట వినయ్ లేవబోయిండు..

కార్తిక్ అతన్ని ఆపి కూచోబెడుతూ- అరే ఆగుబే.. నేన్ చెప్పేది మొత్తం ఇను.. దా కూసో..అన్నీటికి ఫీల్ ఐతవేందిరా నువ్వు…! అసల్ నీ మీద నాకు కోపమెందుకుంటది చెప్పురా?మనిద్దరం చెడ్డీల కాంచి దోస్తులం, నీకు జాబ్ అచ్చినందుకు దునియల ఫష్ట్ ఖుషీ అయింది ఎవడన్న ఉన్నడా అంటె అది నీనే మామా.. నిజ్జంగ చెప్తున్నా.. నీక్ జాబ్ అచ్చినందుకు నేన్ పిచ్చ ఖుష్ రా.. నాకేం నీమీద జెలస్ లేద్రా భై..

మరి ఇంతక్ ముందు మాట్లాడిందంత ఏందిరా?? ఖుషీ అయినోడు అట్ల మాట్లాడ్తడా??

అరేయ్.. మామా.. నా బాధ నీకు సమజ్ కాలేరా…

ఇంతలనే వెయిటర్ బీర్లూ, లెగ్ పీసులు తెచ్చి టేబుల్ మీద పెట్టి పొయిండు..

MIRACLE1వీళ్లు,ఎవరి బీరు వాళ్లు నోటితోని తెరుచుకున్నరు కని గ్లాసుల్ల పోశింది మాత్రం కార్తికే.. అందుకే మీద కొద్దికొద్దిగ నురుగు కనపడ్తాంది..ఇద్దరు మళ్ల చెరొక బుక్కతాగినంక, వినయ్ కు లెగ్ పీస్ అందిచ్చుకుంట కార్తిక్- “అరేయ్.. మామా.. నేనెందుకు రంది వడ్తున్ననో నీక్ సమజ్ కాలేరా.. నా పొజిషన్ల ఉంటె తెలుస్తదిరా ఆ బాధేంటిదో… అంత కష్టపడిచదివీ, మంచి మార్కులు కొట్టినాసుతా జాబ్ రాకపాయే! పోనీ మళ్ల రాసి చూద్దామంటె ఏజు లేదాయే… మనం సదివిన తొక్కల ఎమ్మెస్సీకి ప్రైవేట్ ల టీచర్ జాబ్ తప్ప ఇంకో జాబేముంటరా?? వాడిచ్చే మూడు నాలుగు వేలకు అటా జాబు చెయ్యలేనూ, ఇటు గవర్నమెంటు జాబు కొడ్తామంటె అదేమో ఒకమానంగ వచ్చి కాలవడదు..  నీక్ తెల్వద్రా భై నా పొజిషన్..  నీకు సమజవుడు కూడ కష్టమే..  అరే,నీ గుండె మీద చెయ్యేస్కోని చెప్పు,నేనా జాబ్ కోసం ఎంత కష్టపడ్డనోనీకెర్కలేదారా??

నిజమేరాకష్టపడ్డవ్..నేన్గిన కాదన్ననా?కని దానికి నేనేo చేస్త చెప్పు? నాకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి లక్కుల జాబచ్చిందీ.. నీకు లేదు కాబట్టి రాలేదు.. దానికి ఎవలేం చేస్తర్రా?? కిస్మత్.. గంతే…

కిస్మతేందిరా కిస్మతు? కష్టపడ్డోనికి నౌకరియ్యాలెగని కిస్మతున్నోనికి ఇచ్చుడేందిరా? మళ్ళ నిన్ను అంటున్నా అనుకునేవ్రో!! నేన్ మన సిస్టం ను తప్పు వడ్తున్నా..

ఎమ్మోరా భై.. నాకు జాబస్తె  నువ్ గింత ఘోరంగ రియాక్ట్ అయితవని నేనైతె ఎన్నడు అనుకోలే…

అగో మళ్లగదే మాట? నేన్ నిన్నంటలేను మామా.. ఈ మొత్తం సిస్టమ్ను అంటానా.. నన్ను బకరాగాన్ని చేసి బలి పశువును జేస్తె నాక్ కోపం రావొద్దా చెప్పు??  అసల్ దునియా మొత్తమ్మీద ఏన్నన్న ఉన్నదారా ఇట్ల? సదివినోడు సంక నాకి పోవాల్నట, సదువురానోడు మాత్రం సర్కార్ నౌకర్లు చెయ్యాల్నట! నీ య్.. ఇదేం లెక్కరా భై?? అని గ్లాసులేపి రెండు బుక్కల్లో మొత్తం బీరు తాగి, ఇంకింత ఆవేశంగ మాట్లాడుతున్నడు కార్తిక్..

పొద్దున లేశిందిగుత్తా రాజ్యాంగం రాజ్యాంగం అని గొంతులు చింపుకుంటరు కని, అన్ల “అందరు సమానం” అని రాశున్న మాటను ఒక్కడు పట్టించుకోడేందిరా భైనాకర్థంగాదు? “మాకు” సమాధులు తొవ్వుకుంట, మీకు కోటలు కట్టిచ్చుడేనారా సమానమంటే?ఇదేక్కడి సామ్యవాదం, సౌభ్రాతృత్వం భై నాక్ తెల్వక అడుగుతా..?చత్..మీకు మాకంటె ఎక్కువ ఆస్థులున్నయ్, మీ అయ్యకు సర్కార్ నౌకరున్నది, క్వార్టర్స్ ఉన్నయ్, ఇన్సురెన్సులూ, అలవెన్సులూ, సబ్సిడీలూ, హెల్తుకార్డులూ, పెన్షన్లు తొక్కా తొండం సవాలక్షున్నయ్.. అయినా నీకు రిజర్వేషన్ ఉంటది, నువ్వెన్నిసార్లైనా పరిక్ష రాయచ్చూ, తక్కువ మార్కులచ్చినా జాబ్ కొట్టచ్చూ.. మాకో గజం జాగ లేదు, అయ్యకు పర్మినెంటు నౌకరిలేదు, రోగమచ్చినా రొప్పచ్చినామంచి దావఖానకుపోను దిక్కులేదు, అసల్ బతుక్కే భరోసా లేదుర భై.. అసొంటిది మాకు రిజర్వేషన్ ఉండదు,  టాప్ మార్కులచ్చినా జాబురాదూ,పోనీమళ్లోసారి రాద్దామంటె ఏజు చాన్సుండదు!ఏం న్యాయమ్రా భై ఇదీ??  మస్తు బాధైతున్నది మామా నాకు…  అరేయ్.. మళ్ల చెప్తున్నా నేన్ నిన్నంటలేను భై, మన సిస్టం ను అంటున్నా.. సిస్టం మొత్తం ఖరాబైపేందిరా ఏడికాడికి..

వినయ్ఏం మాట్లాడకుంట, చేతిలో ఉన్న చికెన్ బొక్కను ఖాళీ గ్లాసుకు కొట్టుకుంటూ కార్తిక్ చెప్పేది వింటున్నడంతే..

ఇంకో బుక్కెడు బీరు తాగినంక కార్తిక్ గొంతు ఇంకోరకంగ మారింది.. “అసల్ నన్నడుగుతె ఆ రాజ్యాంగంల రిజర్వేషన్ ఆర్టికిల్సు మొత్తం మలిపేశి, మళ్ల కొత్తగ రాపియ్యాల్రా భై… ఒకనికి రిజర్వేషన్ మీద మంచి సర్కార్ జాబ్ అస్తె ఇంక వానికి పుట్టేటోళ్లకు రిజర్వేషన్ ఇయ్యద్దు మళ్ల… కొత్తగ మంచిగ,ఈసారి కరెక్టుగమళ్లఅందరికి కొత్త “ఇన్ కం సర్టిఫికెట్” లు ఇప్పిచ్చి ఎవడైతె న్యాయంగ గరీబోడుంటడో వాడే కులపోడైనా సరే వానికి రిజర్వేషన్ పెట్టాలె.. బలిశినోడుంటె వాడే కులపోడైనాసరే రిజర్వేషన్ పీకిపారెయ్యాలె…”ఇంక ఇసొంటియే మంచి మంచి పాయింట్లుఆలోచించి అన్ల కలపాలెఅంతేగనివాళ్ళేందిరా భై, గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఆడఏమున్నదో ఏంలేదో చూడకుంట, ముందు వెనక ఏం ఆలోచించకుంట పదేండ్లకోసారి పొడిగించుకుంట పోతనే ఉన్నరు! ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కలిపి ఇప్పటికే నలభై తొమ్మిదిన్నర శాతం రిజర్వేషన్లున్నయ్.. అంటె దాదాపు సగం.. పోనీ మిగిలిన యాభైల ఏమన్న కాంపిటిషన్ తక్కువుంటదా అంటె అన్ల మళ్ల వీళ్లందరితోని పోటీయేనాయే! అరేయ్ నువ్వే చెప్పురా అప్పుడు రాజ్యాంగం రాశిన కాలం నాటికీ, ఇయ్యాల్టికీ మీ బతుకుల్లో కొద్దిగసుత మార్పు రాలేదారా?? మొత్తం కాకపోయిన ఎంతోకొంత, ఓ చారాన మందమన్న మీ పరిస్తితి మంచిగ్గాలేదా చెప్పు?? నీ గుండె మీద చెయ్యేస్కోని చెప్పు మామా…

ఆ? ఐతే??

ఐతే ఏందిరా..  సిచువేషన్ ఓ చారాన మందం మంచిగైందీ అన్నపుడు రిజర్వేషన్లల్ల ఓ చారన మందం కట్ చెయ్యాల్నా వద్దా? చెప్పు నువ్వే.. యేడాదికొక్క శాతం తీసుకుంటపేనా, మొత్తం తీసెయ్యడానికి యాభైయ్యేండ్లు పడ్తదిగారా భై??  ఒకటేసారి మొత్తం తీశేత్తా అంటె అలవాటుపడ్డ పానం ఊకుంటదా? లొల్లి లొల్లి చెయ్యరారా.. అందుకే ఇప్పటికెళ్లే యేడాదికొక్క పర్సెంటన్న కోసుకుంట పోతె, ఇంకో యాభై యేండ్లవరకన్న సిచువేషన్ జర సెట్ ఐతది.. అంతేగని ఆ పని చెయ్యకుంట ఓట్లకోసం ఎవనికి వాడు యేటికేటికి దొరికినంత పెంచుకుంట పోతున్నరుతప్ప, నా అసొంటోళ్ల బతుకు నాశనమైపోతాందని అసల్ ఒక్కడన్న ఆలోచిస్తున్నడార భై? చత్..నా రందంత అదే మామా…

అని చెప్తున్నంతల..కార్తిక్ సెల్ రింగ్ అయింది..మాటలాపి తను కాల్ లిఫ్ట్ చేసిండు..అవతలి వైపు మాట్లాడుతున్నది కార్తిక్ వాళ్ల చెల్లె కీర్తి.

ఆ హలో.. కిట్టూ?? చెప్పురా..

ఆ అన్నా. ఎక్కడున్నావ్??

నేను వినయ్ గానితోని బయటికచ్చిన్రా.. నాకు లేటయితదిగని మీరు తిని పడుకోన్లి..

సరేగనీ.. ఆ మంచిరాల సంబంధమోళ్లు సాయింత్రం నానకు ఫోన్ చేసి,ఫోటోస్ నీ మెయిల్ కి పంపినమని చెప్పిన్లట.. వచ్చినయా అని అడుగమంటున్నడు నాన..

ఔనా?? ఎమ్మోనే మరి నేన్ సూళ్లేదు… నా ఫోన్ల నెట్ బ్యాలెన్స్ అయిపేందిగనిరాంగ రాంగ ఏయించుకోనస్తా, రేప్పొద్దున చూద్దాంతీ.. నానకు చెప్పు..

మర్శిపోకు మరి..

నాక్ మా మతికుంటదిగని, నువ్వైతెఆ తాళం చెయ్యి పూలకుండీ కింద పెట్టుడు మర్శిపోకు..

ఓకే.. ఓకే..

ఓకే అనుడుగాదు.. పేనసారి ఇట్లనేఅని నువ్ మర్శిపొయిపంటె, నేన్ గేటు దూకంగనే నాన లేశిండు.. అందుకె మళ్ల మళ్ల చెప్తున్నా, గేటుకు తాళమేశినంక తాళం చెయ్యి మంచిగ చెయ్యికి అందేటట్టుఆపూలకుండీకింద పెట్టు.. సరేనా??

అబా సరేఅన్నా.. పెడ్తా అంటున్నకదా!నువ్వైతె నెట్ బ్యాలెన్స్ వేయించుకోనిరా.. అని కాల్ కట్ చేసిందామె..

కార్తిక్ ఫోన్ పక్కవెట్టి మళ్ల గ్లాస్ పట్టుకున్నడు..

ఏందటరా? జల్ది రమ్మంటున్నదా?? వినయ్ అడిగిండు..

రమ్మనుడు కాద్రా.. అదేదో సంబంధం గురించి… వాళ్లు పిలగాని ఫోటోల్ నా మెయిల్ కు పంపిన్లట, వచ్చినయా అని అడగటానికి చేసింది…

అచ్చా.. ఓకే ఓకే…

మాదాన్ల ఆడపిల్లలున్నోళ్లకు కష్టమ్రా భై నిజంగ… ప్రైవేట్ నౌకర్ చేసేటోనిక్కుడ కం సే కం ఇర్వై లక్షలియ్యలె.. ఇగ గవర్నమెంటోడంటె యాభైకి తక్కువడగడు, మళ్ళ బండీ, బట్టలూ, బోళ్లూ.. బొచ్చెడుంటయ్రా అయ్యా!! ఇయన్నివోను మళ్ళ పెండ్లిఫంక్షను ఖర్చు అలగ్.. పెద్ద పరేషాన్ పట్టుకున్నదిరా మాకైతె! ఆ జాగను అమ్మైనా సరేగని, మంచి సంబంధం దొర్కుతె చేశేద్దామనుకుంటున్నమ్రా ఈ యేడు..

అచ్చాచ్చా.. ఓకే ఓకే… అనుకుంటనే వినయ్ గ్లాస్ బీరును ఒక్క బుక్కలో తాగి, మిగిలిన చికెన్ బొక్కను కంకుకుంట అన్నడు-

అరే.. మామా..  నేన్ ఒకటడుగుత చెప్రా..

ఏందిరా?

ఇట్లంటున్నా అని నువ్వేం అనుకోవద్దు మరి?

అనుకోనుచెప్పుబే..

మామా.. మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ కంటె జర రిచ్చేగారా??

జరంతేందిబే?? జమీన్ ఆస్మాన్ ఫరఖ్….         ఇంకో బీర్ చెప్పాల్నారా?

నాకిప్పటికే ఎక్కువైoది..నీగ్గావాల్నంటె చెప్పుకో..

నాక్కూడ మస్తైందిగని, ఇంకొక్కటి చెప్తావన్ బై టూ తాగిపోదాం ఓకేనా?

సరే చెప్పు…

వెయిటర్ ని పిలిచి ఇంకో బీర్ ఆర్డర్ ఇచ్చిండు కార్తిక్…

అయిపేందా?? ఇoగ నేనడిగిందానికి చెప్పు.. నా నౌకరి మంచిదేనా కాదా?

అరే మంచిందేందిరా? కిరాక్ నౌకర్ర భై నీది.. సెంట్రల్ ఎక్సైస్ ఇన్స్పెక్టర్ అంటేందిరా?? ఫుల్లు పైసల్.. స్టాటింగ్ స్టాటింగే నలభైవేల్ జీతం, ఏ వన్  క్వాటర్సూ, అలవెన్సులు, ఇన్సురెన్సులు…  కథా కార్ఖానా…. సెంట్రల్ గౌట్ జాబంటె మాటలార? లొల్లంటె లొల్లి నౌకర్రా భై నీది..

అదే అదే… సరేమరి నేను చూపుకు ఎట్లుంటర? ఐ మీన్ మంచిగ అందంగ ఉంటనా అని?

ఔ నీ హైట్ ఎంతో ఉండేరా? సిక్సా, సిక్స్ వన్నా?

సిక్స్ వన్..

ఆ..! సిక్స్ వన్ హైటున్నోడు అసల్ మన కాలేజిలనే ఎవ్వడులేకుండెగారా? డిగ్రీల మన క్లాసోల్లందరు గా సుమలత ఎంబడివడ్తుంటె, ఆమె మాత్రం నీకు ప్రపోస్ చేశేగార అప్పట్ల? వట్టిగ ఇడ్శిపెట్టుకున్నవ్గని ఆమెను చేస్కుంటే మస్తుంటుండె భై ఇప్పుడు..

లైట్ గనీ.. అంటె మొత్తానికి నేన్ మంచిగనే ఉంటా అంటవ్!

నీకేందిరా భై… పిచ్చ స్మార్ట్ నువ్..

కదా?? ఐతె.. మీ చెల్లెను నాకిచ్చి పెండ్లి చేస్తరా మామా? నాకు కీర్తి అంటె మస్తిష్టం..

కార్తిక్ కి ఒక్క క్షణం వినయ్ ఏమంటున్నడో సమజ్ కాలేదు..

నాకు నయా పైసా కట్నం వద్దు మామా, మీ చెల్లెను నాకిచ్చి పెండ్లి చేస్తే చాలు, మొత్తం పెళ్లి ఖర్చులుకూడ మేమే పెట్టుకుంటం..

అరేయ్?? ఏం మాట్లాడ్తున్నవ్ బే?? దిమాగ్గిన ఖరాబైందా??

లేద్ నిజంగనే అంటున్నరా, నాకు మీ చెల్లంటె నిజంగ మస్తిష్టం మామా.. దునియాల ఏ మొగడు చూస్కోనంత మంచిగ చూస్కుంటరా మీ చెల్లెను, ప్లీస్.. అని వినయ్ మాట పూర్తికాక ముందే.. కార్తిక్-

అరేయ్.. అసల్ ఏం మాట్లాడుతున్నవ్ సమజైతుందారానీకు?? మందెక్కువై మెదడు ఖరాబైనట్టున్నది.. చల్.. మస్త్ ఎక్కువైంది ఇంక పోదాం పా..

ఏ.. ఆగురా.. కూసో కూసో… మొత్తం ఇనుబే.. ప్లీస్… అని కార్తిక్ ను బలవంతంగ మళ్ల కూచోబెట్టి- అట్లంటవేందిరా?నాకేం తక్కువ చెప్పు.. మంచి నౌకరున్నదీ.. ఆస్థి పాస్థులున్నయీ… మంచిగ అందంగుంటా.. నాకేం తక్కువరా భై?  పైకెళ్లి నాకు నయా పైసా కట్నం కూడ వద్దంటున్నగారా?? ఇంకేం గావాల్రా మీకు?? మీ చెల్లెను కూడ మంచిగ చూస్కుంటా అని చెప్తున్న గదామామా.. ప్లీస్ రా..

తలకాయ్ తిరుగుతాందారా?? వద్దన్నకొద్ది మళ్ళ అదే మాట మాట్లాడుతున్నవ్.. నువ్వస్తెరా లేకుంటెలేదు నేన్ పోతున్నా.. అని లేవబోతుంటె వినయ్ మళ్ల అతన్ని కూచోబెట్టి-

అరేయ్.. నేనేం తాగి మాట్లాడ్తలేను.. నిజంగ సీరియస్ గనే అంటున్న.. నాకు మీ చెల్లెలంటె చాన ఇష్టమ్రా, నాకు జాబ్ వచ్చేదాక అడగొద్దనే ఇన్ని రోజులు అడగలేదు బట్ ఇయ్యాల జాబ్ వచ్చిందికాబట్టే ధైర్యంగ అడుగుతున్నరా… ప్లీస్ మామ మస్తు మంచిగ చూస్కుంటర, వేరే సంబంధాలు చూడకండీ.. నేన్ చేస్కుంటరా మీ చెల్లెను..

అరేయ్.. లాష్ట్ అండ్ ఫైనల్ చెప్తానా..ఇంక ఈ టాపిక్ ఇక్కడికి ఇడ్శిపెట్టు…కార్తిక్ బలవంతoగ కోపాన్ని ఆపుకుంట అన్నడు..

నేన్ మంచోన్ని కాదారా?చిన్నప్పట్నుంచినన్ను చూస్తనేఉన్నవ్ గారా.. నలుగురికి మంచే చేస్తగని ఎప్పుడన్న ఎవనికన్న చెడుపు చేషిన్నారా నేను? నాగురించి ఎర్క లేదారా నీకు?

నువ్ మంచోనివిగావట్టే ఇంతసేప్ నీతోని మాట్లాడ్తున్నా అదే ఇంకోడింకోడైతె ఈపాటికి వాని గూబ గుయ్యిమంటుండే..

అరేయ్.. ప్లీస్.. అర్తంచేస్కోరా భై..

నువ్ మంచోనివని నాకెర్కే కని అయన్ని కాని ముచ్చట్లు.. వట్టిగ నువ్ డిస్టర్బ్ గాకు నన్ను డిస్టర్బ్ చెయ్యకు..ఇప్పటికే మస్తైంది, ఇంక ఆపు..

అరేయ్ మంచోన్నే ఐతె మరి ఒప్పుకోడానికేందిరా?నువ్వుకూడా నన్ను అర్థం చేస్కోపోతె ఎట్లరా..

వెయిటర్ బీర్ తెచ్చి రెండు గ్లాసుల్లో చెరి సగం పోశి వెళ్ళిపోయిండుగని వాళ్లిద్దరు ఆ గ్లాసుల్ని ముట్టలే..

MIRACLE1

ఒక నిమిషం గట్టిగ ఊపిరి తీస్కోని కార్తికే ఓపిగ్గ చెప్పుడు వెట్టిండు- అరేవినయ్..  నువ్ మంచోనివే.. నీకు మంచి ఉద్యోగం, ఆస్థిపాస్తులు.. మొత్తం అన్ని ఉన్నయ్.. పైకెళ్ళి  మీ ఇంట్లోల్లు కూడ కట్నానికి ఆశపడే మనుషులు కాదు.. ఆ ముచ్చట కూడ నాకెర్కే..  ఇంక సాఫ్ సీదా చెప్పల్నంటే, మేం సొంతంగ వెతికినాసుత ఇంతమంచి సంబంధం మా చెల్లెకు దొర్కదు గావచ్చు… కనీ… కని మా చెల్లెను నీకిచ్చి చేశుడన్నది  కాని ముచ్చట… అర్థం చేస్కో.. సరేనా?? అంతే ఇంక.. ఈ టాపిక్ ఇక్కడికి విడిచిపెట్టు.. ఆయింత తాగు.. పోదాం..

అరేయ్.. అన్నితీర్ల మంచి సంబంధం అని నువ్వే అంటున్నవ్గారా?? మరి ఒప్పుకోడానికేంది చెప్పు? ముందుగాల నీకిష్టమా కాదా చెప్పు? నీకు ఓకే అంటే అటేంక మీ ఇంట్లోళ్లను మనిద్దరం కలిశి ఒప్పియ్యొచ్చు..

అద్దన్న పాటే ఊకె పాడక్రా.. నేనూ, మా చెల్లె ఇద్దరం ఒప్పుకున్నా మా అమ్మనానలుఒప్పుకోరు.. ప్లీజ్… దయచేసి ఇంకా ముచ్చట విడిశిపెట్ర భై..

అట్లకాదు నువ్ చెప్పు.. నీకిష్టమేనా?

కార్తిక్ నిశ్శబ్దంగ తన గ్లాస్ ను చేతులకు తీసుకోని మెల్ల మెల్లగ తాగుతున్నడే తప్పితే ఓ రెండు నిమిషాలు అసలేం మాట్లాడలే.. సగం గ్లాసు ఖాళీ అయినంక-

నాకిష్టమే రా.. ఇప్పుడే చెప్పినకదా మా అంతట మేం సొంతంగ వెతికినా కూడ నీ అంత మంచోన్ని మా చెల్లెకు తేలమని.. ఆ మాట వాస్తవం..ఎందుకంటె నిజంగ నా లైఫ్ ల నీ అంత పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్నోన్ని  నేనిప్పటిదాంక చూల్లే…

ఎవడో ముక్కు మొఖం తెల్వనోనికి మా చెల్లెనిచ్చి పెండ్లి చేశుడుకంటే, చిన్నప్పటికెళ్ళి మాతోనే కలిశిపెరిగినోనివి, అన్నితీర్ల మంచోనివీ.. నీకిచ్చి చేస్తెనే మా చెల్లె మంచిగుంటదని నాక్కూడ అనిపిస్తుందిరా.. కని…

వినయ్ మొఖంలో చిన్న వెలుగు..

కని? కని ఏంది చెప్పురా..

అరేయ్.. నేన్ ఫ్రాంక్ గ ఒకటిచెప్తరా.. నువ్ ఫీల్ ఐతె మాత్రంనేన్ చేశేదేం లేదుముందే చెప్తున్న..

నేనేం ఫీల్ గానుచెప్పురా..

మా నానమ్మ ఎర్కేగదా.. చిన్నప్పుడు నువ్ మా ఇంటికచ్చినప్పుడు ఆమేం చేశేదో నీకెరికేనా??

ఎమ్మోరా?ఏం చేశేది?..

మంచి నీళ్లిచ్చినా, చాయ్ ఇచ్చినానీకు సెపరేట్ గఓ బుగ్గెండి గ్లాసుల పోశిస్తుండే మతికున్నదా..

ఆ.. ఆ.. కరెక్టే రా.. ఎప్పుడన్నెప్పుడన్న మీ అమ్మ స్టీల్ గ్లాసుల పోశిచ్చినాసుత తిడ్తుంటే..

ఆ.. అదే.. మా నానమ్మ ఒక్క నీకనే కాదు… మా ఇంటికి “తక్కువోళ్ళు” ఎవ్వరచ్చినా ఆ బుగ్గెండి గ్లాసులనే పోశిస్తది.. ఇంక మేం చిన్నప్పుడు లొల్లి వెట్టుకునేది కాబట్టి ఆయింత నిన్నొక్కన్ని ఇంట్లకు రానిచ్చేదిగని వేరేటోల్లైతెఅసల్ ఇంటి గలమ లోపటికి రానియ్యకపొయ్యేది..

అంటే??

అంటేందిరాఅంటే?? మాకన్న “తక్కువోళ్లను” అసల్ మా ఇంటి గడుపకూడ దాటనియ్యకపొయ్యేది అంటున్న.. నువ్వచ్చి పొయినంక కూడ మా నానమ్మ నువ్ కూసున్న జాగల నీళ్లుపోశి కడిగేది ఎర్కేనా?? అగో అంత ఉంటది వాళ్లకు “ఎక్కువ తక్కువా” అని..

కావచ్చురా, కని ఇప్పుడు మీ నానమ్మ లేదుకదా…. మరింకేంది ప్రాబ్లం?

మొత్తం విన్రా.. మా అమ్మా నానాలు, మా నానమ్మంత ఘోరంగ నీతోని ఎప్పుడు ప్రవర్తించకపోవచ్చు… వాళ్లు నిన్నెప్పుడు తక్కువ చేసి చూడకుండ మాతోని సమానంగనే నిన్నుకూడ కలుపుకపోవచ్చూ.. కని అంత మాత్రాన ఇప్పుడు నువ్ మా చెల్లెను చేస్కుంటా అనంగనే వాళ్లు ఒప్పుకుంటరు అనుకోకు..

మా పెద్దనానోళ్ల కొడుకు రఘన్న కూడా చిన్నప్పటినుంచి మా ఇంట్లనే పెరిగిండు నీకెర్కే కదా?? ఆయినె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్కున్నందుకే మా నాన ఇప్పటికి మూడేండ్ల నుండి ఆయినెతోని మాట బంజేషిండు.. ఇంటిగ్గాదుకదా దుకాణం కాడికిసుత రానిస్తలేడు..అసొంటోడు సొంత బిడ్డను నీకిచ్చి పెడ్లి చెయ్యమంటె చేస్తడా చెప్పూ?? అందుకే చెప్తాన, అయన్ని కాని ముచ్చట్లురా భై.. వుట్టిగ కలల్ కనకు..

కదా?? మరి మాకు రిజర్వేషన్ ఉండుట్ల తప్పేమున్నదిరా??

ఏందిరా?? పిస్స గిన లేశిందా? అసల్ నేన్ చెప్పిందానికీ, నువ్వనేదానికీ ఏమన్న సంబంధం ఉన్నదా??

ఉన్నది.. ఉన్నది కాబట్టే అంటున్న..

ఒక్క అరగంట ముంగట నువ్వేం మాట్లాడినవో నీకు మతికున్నదా? మాకన్నున్నయ్ అయినా రిజర్వేషన్ దేనికీ అదీ ఇదని అడిగినవ్ కదా?? అగో,దానికి జవాబు చానా స్పష్టంగా సూటిగ నీ నోటితోనినువ్వే చెప్పినవ్ చూడు..

కార్తిక్కి విషయం మెల్లమెల్లగ అర్తమైతుంది..

నీకు తెల్సింది మీ నాన్నమ్మ ఒక్కలే.. కని అసొంటి నానమ్మల అనుభవాలు నాకు కోకొల్లలు.. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల యేండ్లకెళ్లి ఆ “తక్కువ”నూ, వాళ్లు చూసే “చిన్న”చూపును భరించుకుంటస్తున్నమ్రా మేమూ.. నీకు తెల్సింది రెండు గిలాసల పద్దతొక్కటే.. కాని మేం పడ్డ అవమానాలు కొన్ని వందల రకాలు..ఇంతకన్నా వేల రెట్లకుట్రలను, వివక్షలను ఎదుర్కోని ఎదుర్కోని ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగ మనుషుల్లెక గుర్తించబడ్తున్నంరా మేము..

అంటే? మా తాత ముత్తాతలు చేసిన తప్పులకు ఇప్పుడు మేం శిక్ష అనుభవించాల్నారా?

మీ మూడు తరాల చూపుల్లో తేడాను ఇప్పుడు నువ్వే చెప్పినవ్ గారా?మీ నానమ్మ కాలంలో మేం మీకంటె “తక్కువ” వాళ్లం.. మీ నానతరంలో మేం కేవలం మీకుమనుషులుగా “సమాంతరం” అంతేకనీ మీలో కలవడానికి వీలులేదు.. కని ఇప్పుడు మనదగ్గరికొచ్చేసరికి మనిద్దరం సమానం..అదేరాభై రిజర్వేషన్ లు మా బతుకుల్లో తెచ్చిన తేడా…అవే లేకపొయ్యుంటే?? ఊహించుడు కూడ కష్టంమామా..!!అది శిక్ష అని నువ్వనుకుంటున్నవ్.. కని అది మాకు రక్ష అని మేం అనుకుంటున్నం…ఇది నీకు సమజయ్యేటట్టు చెప్పాల్ననే మీ చెల్లెను పెండ్లి చేస్కుంటా అని మజాక్ చేసిన్రా.. తప్పుగ అనుకోక్రా భై.. సారీ మామా..

కార్తిక్ కి అసల్ ఏం మాట్లాడాల్నో తెలుస్తలేదు… అంత “క్లియ్యర్ ఈక్వేషన్” విన్నంకఇంకేం మాట్లాడ్తడు..!

ఒక రెండు నిమిషాలకు పరిస్తితి కొద్దిగ సల్లవడ్దది..

అంటే? నువ్ మా చెల్లెను నిజంగ ఇష్టపడలేదారా?

లేదు మామా, నీకు చెల్లైతె నాకు చెల్లే గారా..

సాలె గా.. ఎంత షాక్ ఇచ్చినవ్రా నాకు..

మరిలేకపోతె ఏందిరా నువ్వు.. ఇగ చూస్తున్న అగ చూస్తున్న, ఒక మానంగ రిజర్వేషన్లను తిడ్తనే ఉన్నవ్.. అందుకే..

అరే నిజమే భై.. కని నువ్వే చెప్పురా.. మా నానమ్మ కాలానికీ ఇప్పటికీ మార్పులేదా?? వాళ్లు అసల్ ఇంట్లకు రానియ్యకపొయ్యేది.. మా నాన వాళ్లు ఇంట్లకు రానిస్తరూ కలవనిస్తరు అన్నిచేస్తరుకని పెండ్లంటె మాత్రం ఒప్పుకోరు.. కని నేన్నిన్నెప్పుడన్న చిన్నచూపు చూశిన్నారా భై? ఇప్పుడే పెండ్లికిసూత ఓకే అంటినిగారా?? నిన్ను సమానంగ అనుకోందే ఆ మాటంటనారా? మరింకిందెకురా నీకు రిజర్వేషన్?

అందరు నీలెక్క ఆలోచిస్తె మంచిగునే ఉండురా భై.. ఆలోచించరు కాబట్టే వాటికింకా వ్యాలిడిటీ పెంచుతున్నరు.. నిజంగ ఇంకో పది ఇర్వై ఏండ్లల్ల నీలెక్కనే మన తరం అందరు “ఆ సమాంతరాన్ని సమానం చేశిపారేశిన్లంటె” మనస్పూర్తిగ నా రిజర్వేషన్ నేనే తీపిస్తసరేనా? ఐ మీన్ నా పిల్లలకు, రిజర్వేషన్ తీపిస్త..

అంటె వాళ్లుకూడ అప్పుడు జెనెరల్ ఇగ? మెరిట్ ల కొట్టాల్సిందేఅంటవ్..

మరి అంతేగా మామా.. అని ఇద్దరు ఆ మిగిలిన బీర్ చీర్స్ కొట్టుకోని తాగేశిన్లు..

ఇంకోటి చెప్దామా? చాలా?? వినయ్ అడిగిండు

సాల్ రా భై, మస్తైంది.. బిల్లు తెమ్మనిగ పోదాం..

అరేయ్ మరి ఫుడ్డూ?? ఒక చికెన్ బిర్యాని చెప్పల్నా.. చెరిసగం తిందాం?

వద్దూ.. బయట తిందాం…

వినయ్ బిల్లుకట్టి, టిప్ ఇచ్చి వచ్చిండు.. ఇద్దరు సొలుగుకుంట బయటకు నడుస్తున్నరు..

అరే మామా చెల్లె గురించి అట్లన్నందుకు సారీరా..

అరే లైట్ బే.. నేనే సారీ మామా అట్ల మాట్లాడినందుకు, నువ్ ఫష్ట్ సాలరీ ఎత్తి సంబురంగ నాక్ దావతిస్తుంటేనేనే నీ మూడ్ పాడ్ చేశినా.. సారీరాభై..

అరే లైట్ బే…చోడ్ దే.. ఔన్రా, మన స్టేట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడ్డట్టున్నదిగారా అప్లై చేష్నవా? దానికి జెనెరలే ముప్పై ఐదేండ్లున్నట్టున్నదిగా..

ఆ చేష్న మామా, సదూతున్న..

ఆ.. మంచిగ సదూరా నీకుట్టిగనే అస్తదది.. కావాల్నంటె కోచిన జాయిన్ గా మామా.. ఫీజ్ నేన్ కడ్త..

ఏ.. ఎందుక్ బే.. వద్దద్దు.. ఇప్పటికే నాకొరకు యాభై అర్వై వేలు పెట్టినవ్..  ఇంక సాల్ మామా.. లైట్..

అరేయ్? అయన్నెందుకు లెక్కలు వెడ్తున్నవ్రా.. నేనెమన్న మందికి వెడ్తున్ననా.. నీకేకదా.. ఇగో ఈ ఏటీయం కార్డ్ తీస్కపో.. కోచింగ్ కు ఎంతైతదో కనుక్కోని మంచి దాంట్ల జెయిన్ గా… సరేనా.. పాస్ వర్డ్ ఎరికేగా.. అనుకుంట కార్డును కార్తిక్ జేబుల పెట్టిండు వినయ్..

లవ్ యూ రా మామా..

అరేయ్.. నీకు మందెక్కువైందిబే..

కదా?? అయినా సరే బైక్ నేనే నడుపుతా..

సరే సరేగని తొవ్వల ఏన్నన్న ఆపి నెట్ బ్యాలెన్స్ ఏయించుకో.. చెల్లె చెప్పిందికదా..

ఆ రైటే మామా నేనసల్ మర్శేపేన..

కార్తిక్ బైక్ స్టార్ట్ చేసిండు.. వినయ్,కార్తిక్ వీపునే “మెత్త”లెక్క చేసుకోనిబైక్ మీదనే పడుకున్నడు.. చీకటి వెలుగుల రోడ్లను దాటుకుంటూ దాటుకుంటూ ముందుకు పొయ్యీ పొయ్యీ బైక్ ఒకదగ్గర ఆగింది..

కార్తిక్, వినయ్ని లేపుతున్నడు..

అరే లేరా.. లే.. నువ్ లోపటికి నడు, నేన్ రీచార్జ్ చేయించుకొస్తా అని వినయ్ ని అక్కడ దించి కార్తిక్ పక్క షాపుదిక్కుకు  నడిశిండు..

“ఏంది అప్పుడే అచ్చిందా” అని కండ్లు నులుముకుంట వినయ్ ఒక్క రెండడుగులు బిర్యాని సెంటర్ దిక్కు వేశిండోలేదో సడన్ గ ఎవరో పట్టి ఆపినట్టు ఠక్కున ఆగిపొయిండు..ఎదురుంగ ఎర్రని రంగుల పెద్ద పెద్ద అక్షరాలు రాసున్న ఒక బోర్డు కనపడ్తాంది..

అప్పుడే కొత్తగ అక్షరాలు చదవడం నేర్చుకున్నోడు చదివినట్లుచదువుతున్నడు వినయ్ ఆ బోర్డును- “ముబారక్…క..ళ్యా..ణి… బి..ర్యా..నీ… సెంటర్..”

తను చూస్తున్నది నిజమో కాదోనని అవే అక్షరాలను ఒకటికి రెండు సార్లు చదివిండు.. కనిఎన్నిసార్లు సదివినా అవి మారలేదు.. తను చూస్తున్నది నిజ్జంగ నిజమే..అవి అవే అక్షరాలు..

క…..ళ్యా….ణీ…. బి…..ర్యా……నీ…

ఇంతల కార్తిక్ రీచార్జ్ చేయించుకోనివచ్చి, నోరెళ్లబెట్టి నిలుచున్న వినయ్ జబ్బ మీద చెయ్యేసిండు.. వినయ్ ఆశ్చర్యంతోని అట్లనే గుడ్లు పెద్దవిచేసి చూస్తూ-

ఏందిరా?? ఈడికి పట్కచ్చినవ్?? మందెక్కువైమజాక్ చేస్తున్నవా?లేకుంటె నిజంగనే దిమాగ్ఖరాబైందా??”

సమాంతరాన్ని సమానం చెయ్యాలెగా మామా..చలో పారా.. ఇయ్యాల్టికెళ్ళి నేన్ సుత నీ తిండి తింటా..

ఇన్నిరోజులు తాను గొడ్డు మాంసం తింటా అంటెనే తీవ్రంగ అసహ్యించుకునే కార్తిక్, ఇప్పుడు తనంతట తానుగా  తింటా అనేసరికి వినయ్ కి అస్సల్ ఏం అనాల్నో తెలుస్తలేదు…కాని ఆ అద్భుత క్షణంలో, అప్పటిదాకా జీవితంలో ఎన్నడు తన నోటి నుంచి రాని మాటలు వాటంతట అవి అప్రయత్నంగనే బయటికొచ్చినయ్..

లవ్ యూ మామా..వినయ్ అన్నడు..

లవ్ యూ టూ రా భై…..

ఇప్పుడా రెండు మొఖాల్లోనూ చిన్న చిరునవ్వూ.. పెద్ద సంతృప్తీ..

ఆ కళ్లకిప్పుడు చీకటి కూడా వెలుగులెక్క కనపడుతోంది…

వాళ్లిద్దరు ఒకరి జబ్బ మీద ఒకరు చేతులేసుకోని, అడుగుల అడుగేసుకుంట లోపటికి నడిచిన్లు..

 

*

allam-vamsi

తనదే ఆ ఆకాశం!

 

చైతన్య పింగళి 

chaitanya

(ఇది చైతన్య పింగళి మొదటి కథ.

చైతన్య గతంలో “చిట్టగాంగ్ విప్లవ వనితలు” అనే పుస్తకంతో పాటు కొన్ని వ్యాసాలు రాశారు. భారతదేశంలో వ్యక్తిగత పోరాటాలు కాకుండా ఒక విప్లవ సంస్థలో వనితలు చేరడం చిట్టగాంగ్ లో స్థాపితమైన ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీతోనే మొదలు. చైతన్య పుస్తకం ఈ చారిత్రాత్మకమైన పోరాటానికి అక్షర నివాళి. దీంతో పాటు ఇతర అనేక వ్యాసాలు రాసినప్పటికీ చైతన్య కథా రచనా ప్రయత్నం ఇదే మొదలు)

వారం రోజులుగా ఆమె రావటం లేదు. ఐదింటికే ఆమె వాకింగ్‌ ట్రాక్  మీద నిదానంగా నడుస్తుండేది.

పూల వాసన చూస్తూ… పూల చెట్ల పక్కన నిలబడి గాలి పీలుస్తూ.. కులాసాగా నడిచేది. సరిగ్గా నా వాకింగ్‌ పూర్తి అయ్యేసరికి ఆ అపార్ట్మెంట్ల  మధ్య సందుల్లో నుండి పారిజాత కాడ రంగులో మెరుస్తున్న సూర్యుడు కనిపించేవాడు. ఆకాశంలో పుడుతున్న సూర్యుడిని చూస్తూ నిలబడిపోయేది. సూర్యుడిని మామిడి పండు అనుకుని ఆత్రంగా చూసే చంటి హనుమంతుడు ఇలాగే ఉండేవాడేమో అనిపించేది ఆమె మొహం చూస్తే. నాలుగు నెలలుగా చూస్తున్నా – ప్రతి రోజూ ఇదే వరస. ఇక ఆమె వాకింగ్‌ చేసేది ఎప్పుడు? ఒళ్ళు తగ్గేది ఎప్పుడు? అని నాకనిపించేది.

ఒకరోజు ఉండబట్టలేక, వేగంగా నడుస్తూనే ఆమెకి చెప్పాను. “ఇలా నడిస్తే సన్నబడరండి” అని. ఆమె చటుక్కున నవ్వింది.

“నేను సన్నబడాలని అనుకోవట్లేదండి” అంది.

“మరి అంత పొద్దున్నే ఎందుకొస్తారండి?” అని ఆశ్యర్యంగా అడిగా. నా మొహం ఎలా కనిపించిందో ఏమో కాని మళ్ళీ నవ్వుతూ “ఊరికే!” అంది.

ఊరికేనా!! సన్నబడాలనుకోకపోతే, ఇంకో గంట దుప్పటి తన్ని పడుకోక, ఊరికే అలా పొద్దున్నే ఎందుకు లేవటం!? అనిపించింది.

ఆ రెండో రోజు నుండే ఆమె కనిపించలేదు. నేను నడిచేటప్పుడు పదే పదే పార్కు మెయిన్‌గేట్‌ వైపు చూసేదాన్నిఆమె వస్తుందేమో అని. ఎందుకు రావట్లేదు? నేను అడిగినందుకు ఏమన్నా ఫీల్‌ అయిందా? ‘ఊరికే రావటం ఎందుకూ, నిద్రపోక’ అని ఆమెకే అనిపించిందా? ఆరోగ్యం బాలేదా? అయినా, నాకెందుకు ఎవరెట్లా నడిస్తే… నోటి దురద కాకపోతే! అని కనీసం వందసార్లు తిట్టుకుని ఉంటా.

నాలుగో రోజు అనుకుంటా.. ఆగలేక, పక్కనే గడ్డిలో యోగా చేసుకుంటున్న ఓ పెద్దావిడని అడిగా – “రోజూ వస్తుంది చూడండి… పొడుగు జుట్టు, చిన్న కళ్ళు, ఒకావిడ… ఆమె మీకు తెలుసా?” అని.

“లక్ష్మా? తెలుసు. ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళిందేమో!” అన్నది.

ఆ పెద్దావిడ నేను అడగకుండానే లక్ష్మిని గురించి ఇంకొన్ని విషయాలు చెప్పింది. ఊరుకోరుగా ఏదో ఒకటి చెప్పకపోతే తోచదు మనకి మానవులకి.

ఆమె పేరు లక్ష్మి అన్నమాట అనుకున్నాను. ఇంకో మూడు రోజుల పాటు బ్రిస్క్‌ వాక్‌ చేస్తూ, ఫోన్లో టైం, పార్కు గేటు చూస్తూ, గడిపేశాను. ఇంటికి వచ్చాక ఆవిడ విషయం మర్చిపోయేదాన్ని. ఇంటికి వచ్చాక నాకెన్ని పనులని. ఏడున్నరకల్లా ఆయనకి బాక్సు కట్టాలి. పిల్లలిద్దర్ని నిద్రలేపి వాళ్ళకి పళ్ళు తోమించి, స్నానాలు చేయించాలి. అబ్బా, నరకం అది. మా అమ్మాయి ధాత్రి – జడ వేయించుకునేందుకు కూడా దానికి సహనం ఉండదు. అబ్బాయి పేరు సత్యాంశ్‌. వాడికి ఎనిమిదేళ్ళు. పుట్టినప్పటి నుండి వాడు నిజం చెప్పటం ఇప్పటి దాకా విన్లేదు. వీళ్ళకి ఈ పేర్లు ఎందుకు పెట్టామా? అనుకుంటాం నేను, మా ఆయన. ఈ పిడుగులిద్దరిని తయారు చేసి, టిఫిన్‌ తినిపించి, పావు తక్కువ తొమ్మిదికి స్కూల్లో దింపేసరికి నా తల ప్రాణం తోకకొస్తుంది.

ఆయన, పిల్లలు వెళ్ళిపోయాక పావుగంట సేపు నడుం వాలుస్తాను. అంతే. మళ్ళీ పరుగు. పిల్లలు పడేసినవి సర్ది, బట్టలు అల్మారాలో పెట్టి, పొయ్యి తుడిచి, స్నానం చేసి కాసేపు పేపరు తిరగేస్తా. ఈ లోగా మధ్యాహ్నం అవుతుంది. ఒక్క మధ్యాహ్నం పూటే నేను ప్రశాంతంగా అన్నం తినేది. టివిలో ఛానెళ్ళు మారుస్తూ తింటాను. ఆ తర్వాత ఏముంది. మళ్ళీ పరుగులే. కూరగాయలు తేవటమో, ఇస్త్రీ చేయటమో.. ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. అసలే… పిల్లలు, ఆయన సాయంత్రం ఆవురావురుమంటూ వస్తారు. వాళ్ళు తినటానికి ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు వచ్చాక ఏముంటుంది… పిల్లలకి స్నానాలు, హోంవర్కు చేయించటం, వంట చేసి తినిపించటం, రెండో రోజు టిఫిన్‌ చేయటానికి పిండి గ్రైండర్‌లో వేయటం, అందరం భోజనం చేయటం… అలా.. .అలా… పడుకునే సరికి ఏ రోజూ పదిన్నర తక్కువ కాదు. రోజూ ఇదే పని. మా ఇంట్లో వాషింగ్‌ మిషన్ తిరుగుతున్నట్టు, లేచినదగ్గర నుండి పని అయ్యేదాకా తిరుగుతూనే ఉంటాను. ఆ వాకింగ్‌ కూడా థైరాయిడ్‌ వచ్చింది కాబట్టి. సాయంత్రాలు అస్సలు కుదరదు కాబట్టి, పొద్దున్నే చచ్చినట్టు నిద్రలేచి, పార్కుకి వెళ్తున్నా అంతే. లేకపోతే, నేనెప్పటికి కదలాలి!

అసలందుకే నాకు ఆవిడని చూస్తే ఆశ్చర్యం.

పట్టీలు నల్లబడ్డాయి, తోముకుందామంటేనే నాకు వ్యవధి దొరకటం లేదు. అలాంటిది పదేళ్ళకోసారి ఇంటికొచ్చే అన్నయ్యను చూసుకున్నట్టు ప్రతి రోజూ సూర్యుడిని చూసేంత ఓపిక, తీరిక… ఆవిడకి, అదే ఆ లక్ష్మికి ఎలా దొరుకుతోందబ్బా!? అని అనుకుంటూనే ఉన్నాను. పైగా నోరు ఊరుకోక, సన్నబడాలంటే ఇలా నడవకూడదు అని ఓ సలహా కూడా ఇచ్చాను. లావుగా ఉన్నారు అని అంటున్నాననుకుని ఆవిడ పార్కుకి రావట్లేదా? – అనుమానం నాకు.

Kadha-Saranga-2-300x268

***

సరిగ్గా వారం తర్వాత ఆవిడ మళ్ళీ పొద్దున్నే ఐదింటికి పార్కులో నిదానంగా నడుస్తూ కనిపించింది. “హాయ్‌” అన్నాను. ఎంత గట్టిగా అన్నానో ఏమో… పార్క్‌లో అందరూ నన్నే చూశారు.

ఆమె కూడా “హాయ్‌” అన్నది.

“ఏమయ్యారండి బాబు, నేను వారం రోజు నుండి టెన్షన్‌ పడుతున్నా. నేనన్న మాటకి ఫీల్‌ అయ్యారేమో నని” అంటూ నా బ్రిస్క్‌ వాకింగ్‌కి సిద్ధం అవుతున్నా.

“అయ్యో… మీరేమన్నారని ఫీల్ అవడం? నేను వైజాగ్‌ వెళ్ళానండి” అన్నది.

“బంధువుల దగ్గరకా?” అని అడిగాను. అడిగిన అర సెకనులో నాకు సిగ్గనిపించింది, ఆరాలు తీస్తున్నాననుకుంటుందేమో అని.

“స్నేహితులున్నారు. ఊరికే.. అలా వైజాగ్‌ ఓసారి చుట్టి వచ్చాను” అన్నది.

“ఊరికేనా… సముద్రం దగ్గర సూర్యోదయం చూడటానికేనా!?” అన్నాను నవ్వుతూ.

ఆమె కూడా పెద్దగా నవ్వింది.

నేల మీద నిలబడి, అంతెత్తున పూసే పున్నాగ పూలని చూస్తే ఎలా ఉంటుంది.. గుత్తులు గుత్తులుగా ఆకాశంలోని నక్షత్రాలు రాలుతున్నట్టు ఉండదూ…. అచ్చం అలాగే నవ్వింది. ఆ రోజు నుండి ప్రతి రోజూ మేం పలకరించుకునేవాళ్ళం. కొంత స్నేహితులం అయ్యాం. వాకింగ్‌ అయ్యాక, ఇంటికి వెళ్ళేప్పుడు కలిసే వెళ్ళేవాళ్ళం. మా ఇంటికి రెండు సందుల అవతల వాళ్ళ ఇల్లు.

లక్ష్మి వాకింగ్‌కి వేసుకొచ్చే కుర్తా, పైజమాలు చాలా బావుండేవి. ఒక రోజు అడిగాను, అవెక్కడ కొంటావని. తనే డిజైన్‌ చేసుకుంటాను అని చెప్పింది. తనకో సొంత స్టోర్‌ ఉందట. నాకు కొంచెం బట్టల మీద ఆసక్తి ఎక్కువ. తన ఆహ్వానం మీద ఓసారి ఆమె డిజైనర్‌ స్టోర్‌కి వెళ్ళాను.

చేనేత, ఖాదితో చేసిన టాప్స్‌, సల్వార్స్‌, స్కర్ట్స్, కుర్తా పైజమా, చీరలు ఎంత ట్రెండీగా, ఎంత హుందాగా ఉన్నాయని! చేనేతలో కూడా మోడ్రన్‌ డ్రస్సు కుట్టొచ్చా! అని ఆశ్చర్యపోయాను. నేను అక్కడ ఉన్నప్పుడే ఇద్దరు కస్టమర్లు వచ్చారు. చెరో సల్వారు తీసుకున్నారు. వాళ్ళకి అవి నప్పవు అనిపించింది నాకు. అసలే నాకు నోరు ఆగదు కదా… వాళ్ళకి ఆ మాట చెప్పేశాను.

“మీరు కాస్త చామనచాయగా ఉన్నారు, కాబట్టి మీకు ఇలాంటి టాప్స్‌ బావుంటాయి” అని ఒకావిడకి చెప్పాను. ఇంకో ఆవిడని చూసి, “మీరు నడుం భాగం దగ్గర కొంచెం ఎక్కువగా లావు అనిపిస్తున్నారు. కాబట్టి, బెల్‌ బోటమ్‌ కాని, బోటమ్‌ దగ్గర కాస్త కుచ్చు ఉండేలా ఉండే పైజమాలు కాని తీసుకోండి. చెవుకి కూడా పెద్ద రింగు పెట్టుకోండి… సూపర్‌గా ఉంటారు” అని చెప్పాను. వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో ఏమో, ఎంచుకున్నవి పక్కన పెట్టేసి, నా సలహా ప్రకారం కొన్నారు.

నన్ను చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. “నీకు వస్త్రధారణ మీద మంచి పట్టు ఉంది. నేను కస్టమర్లకి ఇలా మొహమాటం లేకుండా చెప్పలేను… నాతో కలిసి పని చేయరాదూ… ఇద్దరికీ లాభం” అన్నది.

నాకెక్కడ కుదురుతుంది! నేను నవ్వేసి ఊరుకున్నాను. ఆ తర్వాత మేమిద్దరం చాలా దగ్గర మిత్రులమయ్యాం. పార్క్‌లోనే కాకుండా, ఇంటికొచ్చాక ఫోన్లలో కూడా గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్లం.

మా పిల్లలు, వాళ్ళ అల్లరి, మా ఆయన, ఆయన ఉద్యోగం.. నా గోల నేను చెబుతూ ఉండేదాన్ని. ఆవిడ వింటూ ఉండేది. ఆమె సంగతులు ఏమీ చెప్పేది కాదు.

ఒకరోజు ఉండబట్టలేక, పార్కులో యోగా చేసే పెద్దావిడ చెప్పిన విషయాన్ని అడిగేశాను.

“లక్ష్మీ, నీకు పెళ్ళి కాలేదటగా?’ అని.

“కాలేదు. కాదు… చేసుకోలేదు” అన్నది, ‘చేసుకోలేదు’ని ఒత్తి పలుకుతూ.

నాకంటే తను పెద్దదే. నాతో పాటే పెళ్ళి చేసుకోనుంటే ఈ పాటికి పిల్లలు పది, ఎనిమిది తరగతుల్లో ఉండేవారు. ఎందుకు పెళ్ళి చేసుకోలేదా అనే పురుగు తొలుస్తోంది నన్ను. తనతో ఏర్పడిన చనువుతో “ఎందుకు లక్ష్మీ, ఏమన్నా లవ్‌ ఫెయిల్యూరా?’ అని అడిగాను. మళ్ళీ అదే నవ్వు. ఆ నవ్వు చూస్తే మాత్రం ఎవడూ ఈమెని వదులుకోడు, ఇది లవ్‌ ఫెయ్యిల్యూర్‌ వ్యవహారం కాదు అనిపించింది.

మరుక్షణంలోనే నాకో భయంకరమైన అనుమానం పుట్టింది. అసలే ‘నిర్భయ’ ఘటన జరిగినప్పటి నుండి టివిల్లో ఆడవాళ్ళకి సంబంధించిన చర్చ తెగ చూస్తున్నాను. ఫెమినిజం అనే మాట పట్ల సమాజంలో ఉన్న అజ్ఞానమే నాలో కూడా ఉంది. అది అజ్ఞానం అని అప్పటికి తెలియదనుకోండి. ఫెమినిస్టులంటే వాళ్ళెవరో ప్రత్యేకమైన, విచిత్రమైన, తేడా మనుషులని, వాళ్ళకి మగాళ్ళంటే పడదనే మూఢనమ్మకం చాలా మందిలా నాకూ ఉండేది. అందుకే వెంటనే అనుమానంగా అడిగా…

“ఈ నవ్వు చూసిన వాడెవ్వడూ నిన్ను వదులుకోలేడులే గాని నాకు ఓ అనుమానం – నువ్వు ఫెమినిస్టువా? మగాళ్ళంటే పడదా?” అని.

నా ప్రశ్నకి ఆమె రోడ్డు మీద ఆగిపోయి, రెప్ప వేయకుండా చూసింది. ఆమె చూపుకి సిగ్గుపడ్డాను. అడక్కుండా ఉండాల్సింది!

“టెర్రరిస్టువా? అని అడిగినంత భయంగా అడిగావేంటి? ఫెమినిస్టుకి మగాళ్ళంటే పడదని నీకెవరు చెప్పారు? ఫెమినిస్టులైన మగవాళ్ళు కూడా ఉంటారు, నీకు తెలీదా? అసలు ఫెమినిస్టులు పెళ్ళిళ్ళు చేసుకోరని నీకెవరు చెప్పారు? పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఫెమినిస్టులు కాదనుకుంటున్నావా?” అంది నవ్వుతూ. అది మొహమాటం కొద్దీ నవ్వే నవ్వు.

satya1నాలాంటి వాళ్ళని ఎంతమంది ఆ ప్రశ్న వేశారో కాని.. ఆమె మొహం చూస్తే నా మీద నాకే ‘ఛీ’ అనిపించింది. పాపం, నన్ను చెప్పు తీసుకుని కొట్టకుండా సమాధానం చెప్పింది. అది చాలు.

మళ్ళీ ఆమే మాట కలుపుతూ.. “సర్లే కాని, రేపు నా షాప్‌ ఎక్స్‌టెన్షన్‌. తప్పకుండా రా పిల్లల్ని తీసుకుని. ధాత్రికి ఏమన్నా మంచి టాప్స్‌, స్కర్ట్స్‌ తీసుకుందువు” అన్నది. సరే అని వచ్చేశా.

ఎండాకాలం వచ్చింది కదా, నేతకి డిమాండు బాగా పెరిగిందట. పైగా, మగవాళ్ళకి కూడా చేనేత షర్టు, పైజమాలు డిజైన్‌ చేసిందట. వాటి కోసమే షాపు ఎక్స్‌టెన్షన్‌.

మా ఆయన్ని రమ్మని బతిమాలా, కాని ఆయన కదల్లేదు. “మగవాళ్ళకండి ఆ షాపు, ఓసారి చూడండి” అని పోరుతూనే ఉన్నాను. తర్వాతెప్పుడైనా వస్తాలే అన్నాడు. నేను, పిల్లలే వెళ్ళాం.

చాలా సింపుల్‌గా జరిగింది ఓపెనింగ్‌ ఫంక్షన్‌. ఆ ఫంక్షన్‌ జరుగుతున్నంత సేపు నేను రెప్ప వేయకుండా ఆమెనే చూస్తున్నాను. పెళ్ళికాక ముందు నాకు కూడా సొంతంగా ఏదన్నా చేసుకోవాలని ఉండేది. కాని, పెళ్ళి కాగానే పిల్లలు. వాళ్ళు కాస్త పెద్దయ్యాక, ఏదో ఒకటి చేసుకోవచ్చులే అనుకున్నా. ఇప్పుడు ఓపికా, ఆసక్తి… రెండూ లేవు.

ఎవరి సాయం లేకుండా, సొంతగా ఒక డిజైనర్‌ స్టోర్‌ నడుపుతోందంటే… మాటలా? అసలు ఆ పార్టీలో టీ కప్పుతో సహా ఒక్క ప్లాస్టిక్‌ వస్తువు లేదు! డిన్నర్‌ కూడా సింపుల్ గా ఉంది. పైగా, ఆహారం వృథా చేయకండి అని చేత్తో రాసిన పేపరుని బఫె దగ్గర అంటించింది కూడా! ఆమె ఏం చేసినా, ఏదో ప్రత్యేకం ఉంటుంది – మిగిలిన ప్రపంచానికి భిన్నంగా. అందుకే ఆమె సాన్నిధ్యం అంటే నాకు చాలా ఇష్టం.

పార్టీ అయ్యేప్పటికి పది అయింది. దాదాపుగా అందరూ వెళ్ళిపోయారు. అప్పటికే బాబు, పాప సోఫాలో పడుకుని నిద్రపోయారు. నిద్ర పోయిన వాళ్ళని చూస్తూ “కాసేపు ఆగు, ఇద్దరం కలిసే వెళదాం. పడుకున్నారు కదా లేపడం ఎందుకు?” అన్నది.

సర్దుకుంటున్న ఆమెకి సహాయం చేస్తూ “పెళ్ళెందుకు చేసుకోలేదు?” అని అడిగాను.

“ఇదేంటి… ఈ టైంలో…” అంటూ చిన్నగా నవ్వింది. మొదటిసారి ఇదే ప్రశ్న వేసినప్పుడు నన్ను అభావంగా చూసింది కాని ఇప్పుడు ఆమె ముఖం సీరియస్ గానే ఉంది. నాలో ఏదో అంతర్మధనం జరుగుతోందనీ, అందుకే అడుగుతున్నానని ఆమెకి అర్థం అయినట్లుంది.

“ఇంట్రెస్టు లేదు. నమ్మకం లేదు. మగవాళ్ళ మీద కాదు. పెళ్ళి అనే వ్యవస్థ మీద. నీకెలా అర్ధమౌతుందో నాకు తెలియదు. అయినా, అడిగావని చెబుతున్నాను…” అన్నది.

“సినిమాకే ఒక్కరం వెళ్ళలేం. నువ్వు జీవితమంతా ఒక్కదానివే ఎలా బతుకుతావు? నీ గురించి తలచుకుంటే నాకు కంగారుగా ఉంది” అన్నాను.

“ఏం కంగారు అక్కర్లేదు. ఇన్నాళ్ళు బతకలేదా? తర్వాతా అంతే” అన్నది.

“పిల్లలతో అంత ప్రేమగా ఉంటావు. నీకు పిల్లలు కావాలనిపించలేదా?” అని అడిగాను. ఆమెకి ఆ ప్రశ్న గుచ్చినట్టు అనిపించిందేమో! ఆమె మొహంలో తేడా స్పష్టంగా గమనించగలిగాను. నల్లబడ్డ ఆమె ముఖం చూడగానే నా లోపల రహస్యంగా దాగి ఉన్న నా అహం చల్లారింది.

ఇన్ని రోజులూ నాలో లేనిది ‘ఏదో’ ఆమెలో ఉంది, దాని వల్లే ఆమె పట్ల నాకు ఆకర్షణ, వికర్షణ అనిపించేది. అదేంటో స్పష్టంగా నాకే తెలీదు. ఏదో మూల ఒక అసూయ అయితే ఉండేది. ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతున్న ఆమె మౌనం వల్ల నా దగ్గర ఉన్నదేదో ఆమెకి లేదు అనిపించింది. ఇక ఆమె దాన్ని ఎన్నటికీ సంపాదించలేదు అనే భావం నాకు రెప్పపాటు మెదిలింది. కాని మళ్ళీ కాసేపటికే నాకు పాపం అనిపించింది కూడా.

నిద్ర పోతున్న నా పిల్లల్ని చూస్తూ అన్నది…. “ వీళ్ళు నా పిల్లలు కాదు అని నాకు అనిపించదు. ఈ పిల్లలనే కాదు నాకు ఏ పిల్లల్ని చూసినా నా పిల్లలే అనిపిస్తుంది. సొంత పిల్లలైతే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి, ఆస్తుల కోసం మనతో తగాదా పడటం చూడాల్సి వస్తుందేమో! ఇలా ఉంటే, ఎప్పటికి ఆ బాధ ఉండదు కదా” అన్నది.

“సమర్థించుకోవడం కోసం చెబుతున్నావా? పిల్లల గురించిన ప్రశ్న అడగ్గానే నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్‌. నేను చూశాను” అన్నాను.

ఆమెని రొక్కిస్తున్నానని నాకు తెలుస్తోంది. అయినా ఆమెని అంతగా కార్నర్‌ చేయటం వల్ల నాకేం ఉపయోగమో నాకే అర్ధం కాకుండా ప్రశ్నిస్తున్నాను.

ఆమె నాలాంటి అనేకమంది వేసే ఇలాంటి క్రూర ప్రశ్నలకి అలవాటు పడినట్టు ఉంది. ఏమాత్రం అసహ్యపడకుండా నిదానంగానే చెప్పింది… “మా అమ్మ గుర్తొచ్చింది. నేను పెళ్ళి చేసుకోను అని ఆమెకి అర్ధమయ్యాక, ఆమె ప్రతి క్షణం కుమిలి పోయేది. అమ్మని బాధపెట్టకూడదు అనిపించేది కాని పెళ్ళికి ఒప్పుకోలేకపోయాను. నన్ను చూడటానికి ఊరు నుండి వచ్చినప్పుడల్లా… ‘ఒక్క మనుమడినో, మనుమరాలినో ఎత్తుకోలేకపోయాను’ అని బాధ పడేది. నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు కాని, అమ్మని ఆ క్షణాన చూస్తే మాత్రం.. పెళ్ళి, పిల్లలు ఉంటే బావుండేదేమో అనిపిస్తుంది. అంతే. అది గుర్తొచ్చింది. అంతకంటే ఏం లేదు” అన్నది.

ఆమె తల్లి ఎలా ఉంటుందో నాకూ చూడాలనిపించింది. లక్ష్మి తల్లి రూపాన్ని ఊహించుకుంటున్నాను.

మళ్ళీ తనే “ఎవరి వల్ల అయినా పర్లేదు, నాకు పిల్లలే కావాలి అని నేను అనుకోలేను. నాకిష్టమైన వ్యక్తితో కావాలి. సాధ్యమా? ఆ స్వేచ్ఛ నాకుందా? సంఘం బతకనిస్తుందా? చట్టం ఒప్పుకుంటుందా? పిల్లులకి, కుక్కలకి ఉన్న హక్కు, అవకాశం మనుషు్యలమైన మనకి లేదు. ఆడదాన్ని కదా… పిల్లలు కావాలని అప్పుడప్పుడు శరీరం మొండి చేస్తుంది” అంది.

ఆమె చెబుతుంటే నాకెటు చూడాలో అర్ధం కాలేదు. అప్పటికే పదిన్నర అయింది. ఆమె గడియారం చూస్తూ “వెళ్దామా?” అంది.

“సరే” అన్నాను. ధాత్రిని నేను ఎత్తుకున్నాను. సత్యని తను ఎత్తుకుంది. కార్లో వెనక సీట్లో ఇద్దరిని పడుకోబెట్టి, నేను ముందు సీట్లో కూర్చున్నాను. లక్ష్మి మళ్ళీ షాపు దగ్గరకి వెళ్ళి షట్టర్‌ దింపి, తాళం వేస్తుంటే ఆమెనే చూస్తూ కూర్చున్నాను. satya1

‘పెళ్ళి ఎందుకు చేసుకోలేదు?’ అని నేను అడిగినట్టే… ‘పెళ్ళి ఎందుకు చేసుకున్నావు?’ అని ఆమె నన్ను అడిగితే ఏం సమాధానం ఉంది? నిజమే, ఎందుకు చేసుకున్నాను? పిజి చేశాను. తర్వాత ఒక సంవత్సరం ఉద్యోగం. అప్పటికే పెళ్ళి వయసు వచ్చేస్తోందని చుట్టాల గోల. అమ్మానాన్న సంబంధాల మీద సంబంధాలు తెచ్చారు. వాళ్ళలో నాకు నచ్చిన ఒకడిని పెళ్ళి చేసుకున్నా.

అంతేగా… అంతేనా అంటే.. ఇప్పుడు ఆయన నా పంచప్రాణాలు. నా తోడు నీడ అయిన నా భర్త మా కులం కాకపోయి ఉంటే, అతని ఫొటోనే నా దగ్గరకి రాకపోతే – నేను వేరే వాడిని చేసుకునేదాన్ని. అతనితో కూడా పిల్లలు పుట్టేవారు. నేనిచ్చే కట్నం, కులం, ఎత్తు, బరువు అన్నీ కుదిరిన సంబంధం ద్వారా ఏ భర్త వస్తే – ఆ భర్త వల్లే పుట్టేవారు. అప్పుడూ ఇలానే ఉండేదాన్ని. ఇంతేనా నేను!? ఇదా నేను!!?

ఆమె షట్టరు మూసి, నడుచుకుంటూ కారు దగ్గరకి వచ్చిన ఆ మూడు నిమిషాల్లో… నాకు పడిన మూడు ముళ్ళతో నేను సాధించేదేమిటో, ఆమెకి లేనిదేమిటో నాకు అర్ధం కాలేదు.

లక్ష్మి డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని సీటు బెల్ట్ పెట్టుకుంటోంది.

“ఎప్పుడూ ఒంటరితనం అనిపించలేదా? అందరూ సినిమాకి షికార్లకి జంటతో వస్తుంటే… ఏదో మిస్‌ అయ్యాను అనిపించలేదా?” అని అడిగాను. ఈసారి నాలోపల ఏ కోశానా శాడిజం లేదు. అసూయ లేదు. నా దగ్గర లేనిది, ఆమె దగ్గర ఉన్నది ఏదో నాకు అర్ధమైపోయింది. అది ` స్వంత నిర్ణయం’ తీసుకునే ఆత్మవిశ్వాసం.

లక్ష్మి మౌనంగా కారు స్టార్ట్‌ చేసింది. ఈసారి లక్ష్మి కంట్లో నుండి నీరు చెంప మీదకి జారి… కారు హెడ్ లైట్ల వెలుగులో మెరిశాయి. నేను ఆమెనే చూస్తున్నాను. కారుని ముందుకు దూకించి నిదానంగా నడుపుతూ అంది…

“అనిపించింది… చాలా సార్లు అనిపించింది. అనిపించలేదు అని బొంకే పిరికిదాన్ని కాదు. నాతో ప్రతిరోజూ గంటలు గంటలు మాట్లాడే నా స్నేహితులు కూడా ఏ పండగ రోజో, ఆదివారం రోజో కనిపించరు. ఫోన్‌ చేశాననుకో… అమ్మాయి అయితే, పనుందే అంటారు. మగవాళ్ళయితే, అసలు లిఫ్ట్‌ చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ భార్య పక్కన ఉంటే మాట్లాడరు అనిపిస్తుంది నాకు. వాళ్ళు నా ఇంటికి నిస్సంకోచంగా ఇష్టమైనప్పుడు వస్తారు. నా టేస్ట్‌ని పొగుడుతారు. ఇంటిని అందంగా ఉంచుకునే తీరుకి ‘వహ్వా’ అంటారు. కాని నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మొహమాటంగా, ఇబ్బందిగా నవ్వుతూ ఉంటారు. అందరూ అని కాదు… కొందరు. వాళ్ళ భార్యలు నన్ను పలకరించి, మంచి నీళ్ళు ఇస్తుంటేనే.. నాకు అర్ధమైపోతుంది. వీళ్ళు నన్ను ‘పొటెన్షియల్‌ థ్రెట్‌’గా చూస్తున్నారు అని. కాని దానికి నేనేం చేస్తాను? నెమ్మదిగా అలాంటి వాళ్ళని దూరం పెడతా. ఇంకొందరు వెధవలు ఉంటారు – ఒంటరి మహిళ అనగానే, పడుతుందేమో చూద్దాం అనుకునేవాళ్ళు. వాళ్ళని హద్దుల్లో ఉంచటానికి చాలా మానసిక శ్రమ చేయాల్సి వస్తుంది” అన్నది. వెదురు చెట్ల మధ్య ఇరుక్కున్న గాలి చేసే జీర శబ్దంలా ఆమె మాట గారగా ఉంది.

పిరికితనం వల్ల కారిన కన్నీళ్లు  కావు అవి. బహుశా సమాజంలో పేరుకుపోయిన మూర్ఖత్వాన్ని చూసి అయి ఉంటుంది. నాకూ ఏడుపొచ్చింది. పెళ్ళి అయినా వదలరు, కాకపోయినా వదలరు, పసిపిల్లలయినా వదలరు… ఎందుకిలా ఉంటారు? మగాళ్ళంటే ఇంతేనా? నా భర్త కూడా అటువంటి మగవాళ్ళలో ఒకడా? రేపు నా కొడుకు కూడా ఇలా తయారవుతాడా? నా కూతురు కూడా ఇలాంటి బాధలు పడాలా? ఏవేవో ఆలోచనలు. చటుక్కున  ఆమె అంతకుముందన్న మాట గుర్తొచ్చింది.

“ఫెమినిస్టులయిన మగవాళ్ళు కూడా ఉంటారన్నావు… ఉంటారు కదా!?” అన్నాను. ఏదో రూఢి పరుచుకోవాలని, విని సంతోషపడాలని నా తాపత్రయం.

“ఎందుకుండరు? ఇలా అన్నానని అందరు మగవాళ్ళని, అందరు ఆడవాళ్ళనీ ఒక వర్గం క్రింద జమకట్టకూడదు. కదా!” అని చిన్నగా నవ్వింది. ఆ చీకట్లో కూడా ఆమె పలువరస ఎంత బావుందో. ఆ నవ్వులోని అందానికి ఆత్మవిశ్వాసం అంటినట్టుంది!

ఇంత మాట్లాడినా ఇంకా ఏదో సందేహం నాలో. ఇల్లు దగ్గరకి వచ్చేస్తోంది. “రేపు ముసలిదానివి అయితే, ఎవరు చూసుకుంటారు నిన్ను?” అని అడిగాను.

ఆమె సడెన్‌ బ్రేక్‌ వేసింది. ఈ ప్రశ్నకి ఆమెకి భయం వేసిందేమో అనుకున్నాను. వెనక సీట్లో ఉన్న పిల్లలు ముందుకు పడబోయారు. వాళ్ళని ఇద్దరం చెరో చేత్తో ఆపాం. సద్దుకుని, మళ్ళీ నిద్రలోకి జారిపోయారు.

satya1“దేశంలో ఇన్ని వృద్ధాశ్రమాలు ఎందుకు ఉన్నాయి? మీ అమ్మానాన్న నీ దగ్గర ఎందుకు లేరు? నిన్ను మోసి, కని, పెంచిన నీ తల్లిదండ్రుల్ని నువ్వెందుకు చూసుకోవట్లేదు? పోనీ, సంఘం శాసనం ప్రకారం నీ అత్తమామలయినా నీ దగ్గర ఉండాలిగా. ఎందుకు లేరు? పిల్లలు ముసలి తల్లిదండ్రుల్ని చూసుకోవటం అంటేనే చిరాకు పడుతున్నారు గమనించావా? మన పిల్లలే మనల్ని చూస్తారని నమ్మకం లేదు. నీకుందా?” సూటిగా నన్ను చూస్తూ అడిగింది.

నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. “మా అమ్మానాన్నలు నా దగ్గరకి రారు లక్ష్మీ, ఆడపిల్ల దగ్గర ఉంటే అందరూ ఏమనుకుంటారు? అంటారు. ఇక మా అత్తగారు, మామగార్లతో నాకు తగాదా. పెద్ద పెద్ద కొట్లాటలేం కాదు కాని పిల్లల పెంపకం విషయంలో, ఆయన్ని సహాయం అడిగే విషయంలో మా అత్తగారికి నాకు మాటా మాటా వచ్చేది. వాళ్ళు తనకే సొంతం అయినట్టు మాట్లాడేది. నేను సహించలేకపోయేదాన్ని. ఆయన ఇంటికి రాగానే, ఇద్దరం పోరే వాళ్ళం. మా పంచాయితీలు పడలేక, ఊళ్ళోనే ఉండండి, మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అని చెప్పి, వాళ్ళతో తిట్లు తిని, వాళ్ళని ఊరు పంపించేశాడు” అన్నాను.

ఏదో అపరాధభావం నాలో.

సినిమా రీలు తిరిగినట్టు నాకన్నీ కళ్ళముందు తిరుగుతున్నాయి. వాళ్ళతో ఇంతకు ముందు జరిగిన సంఘటనలు ఎలా జరిగాయన్న ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవన్నట్టు లక్ష్మి వైపు చూశాను.

నా ఇబ్బందిని గ్రహించినట్లుగా రోడ్డువైపు చూస్తూ తనే మాట్లాడటం మొదలుపెట్టింది. “నీకొకటి చెప్పనా… నాకు ఏదన్నా చేయాలనిపిస్తేనే చేస్తాను. అందరూ చెబుతున్నారని, చేస్తున్నారని కాదు. ఈ కారులో పెట్రోల్  పోసి, స్టార్టు చేస్తే.. స్టార్టవుతుంది. కారుకి, నాకు తేడా ఏంటి? ప్రయోగం చెయ్యాలి. ధైర్యం చెయ్యాలి. కష్టాలుంటాయి. కన్నీళ్ళుంటాయి. ఒంటరితనం ఉంటుంది. ఏకాంతం ఉంటుంది. ప్రేమించేవాళ్ళు ఉంటారు. ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఇది నా జీవితం.. మన పార్కులో ఆ పెద్దావిడ చేసే యోగా లాగా.. ప్రతి రోజూ నేను చేయాల్సిన సాధన. అలాగే ఎవరికి వారు వారి జీవితానికి తగినట్లు వారు చేయాల్సిన సాధన – కదా!?” అంది.

రోజూ చేయాల్సిన సాధన అనగానే… నేను రోజూ తుడిచే గ్యాస్  స్టవ్ గుర్తొచ్చింది. మా ఆయన దగ్గర, పిల్లల దగ్గరా అనే మాట గుర్తొచ్చింది – ‘నేను మనిషినా, మిషన్నా? చేసిన పనే చేయటానికి’ అని. ఇది తప్పని కాదు కాని నాకంటూ నేను చేయవలసిన సాధన ఏమిటో నేను తెలుసుకోవాలి కదా అనిపించిన ఆ క్షణం నాకు అపురూపమైనది.

ఇల్లొచ్చేసింది. నేను కార్లో కూర్చునే మా ఆయనకి ఫోన్‌ చేశాను. ఆయన బైటకి వచ్చి, పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని ఇంట్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. కార్లోనే నిశ్శబ్దంగా కూర్చున్న నన్ను దిగదేమిటి అన్నట్లు చూశాడు. ‘వస్తాను, మీరెళ్ళండి’ అన్నాను. ఆయన లోపలకి వెళ్ళాక, గేర్‌ రాడ్‌ మీద ఉన్న లక్ష్మి చేతిని పట్టుకుని –

“లక్ష్మీ! నాకు నీ కొత్త షాపులో ఉద్యోగం ఇస్తావా?” అన్నాను. నా రెండు చేతులూ తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుని షేక్‌హ్యాండ్‌ ఇస్తూ “ష్యూర్” అన్నది.

నేను థాంక్స్‌ అని చెప్పి… కారు దిగబోయా కాని.. నా మనసులో ఉన్న ఒక మాట చెప్పకపోతే.. సంతృప్తి ఉండదు. సీట్లో వెనక్కి వాలి, చెప్పాను…

“లక్ష్మీ, మా ఆయనకి నిన్ను పరిచయం చేయలేదు. పొటెన్షియల్‌ థ్రెట్‌ అనిపించి కాదు. ఇప్పుడు.. నీతో ఈ ఏకాంతం.. ఈ క్షణాలు ఇలా పదిలంగా దాచుకోవాలనిపించింది” అన్నాను.

ఆమె నా చేతిని గట్టిగా నొక్కి… నా నుదిటి మీద ముద్దు పెట్టింది. ఒక ముద్దు అంత ధైర్యం కలిగిస్తుందని… అప్పుడే తెలిసింది!!!

***

(Image: Satya Sufi)

తెగిన గాలిపటాలు   

                                                                              

profile photo

                                                                       

అబ్బా! ఆఫీస్ అవర్స్ కాకపోయినా, ఈ ట్రాఫిక్ ఇంతుంది. ఈ లెక్కన ఎప్పుడు చేరతానో, ఏమో! రెండు గంటలైనా పడుతుందంటాడీ మేరూ కాబ్ డ్రైవర్.
‘అయినా ఈ టీనాకి అద్దెకి తీసుకొని ఉండడానికి ఊరు శివార్ల ఉన్న ఛత్తర్‌పురే దొరికిందా!’-చిరాకు పడ్డాను.

రాత్రి పది గంటలకి ఫోన్ చేసి చెప్పింది- ‘ఇవాళ్ళ తన పుట్టినరోజని.’ దార్లో ఫాబ్ ఇండియాలో ఆగి తనకో కుర్తా కొని దాన్ని గిఫ్ట్ రాప్ చేయించడానికి మరి కొంతసేపు పట్టింది.

నా కోసం మిగతా అందరూ మధ్యాహ్నం భోజనాలకి వెయిట్ చేసి, తిట్టుకుంటూ ఉండి ఉంటారిప్పటికే.
ఎలా ఉన్నారో అందరూ! టీనా అయితే ఎనిమిది నెలల కిందట ఇంటికి వచ్చింది. పూజాని-వాళ్ళమ్మగారు పోయినప్పుడు, నాలుగేళ్ళ కిందటేమో ఆఖరిసారి కలుసుకున్నది. ఆనానీ, పోదార్‌నీ అయితే- నేను ఉద్యోగం వదిలేసేక మళ్ళీ చూడనేలేదు.

ఎప్పటి స్నేహాలు! ఎన్ని జీవితాలు- ఎలాంటి మలుపులు తిరిగేయో!

***

వీళ్ళందరిలో టీనాయే ఆశ్చర్యం నాకెప్పుడూ. జీవితంలో తనంతట తానే సృష్టించుకున్న ఒడుదొడుకులు ఏ సినిమా కథకీ తీసిపోవు.  కానీ తనలో బాధా, కోపం, ఈర్ష్యా, ఆవేశం- వీటి వేటినీ ఇప్పటివరకూ చూడలేదు నేను. ఏ సందర్భంలోనూ కళ్ళనీళ్ళు పెట్టుకున్న గుర్తు కూడా లేదు. ఆ మనస్తత్వం ఇప్పటికీ నాకర్థం కాదు.

మొదటిసారి తన్ని చూసినది నేను కంచన్‌జంగా బిల్డింగ్లో పని చేస్తుండగా. కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఉద్యోగం వచ్చి చేరింది.

అప్పటికే టీనాకి ఒక పెళ్ళి అవడమూ, విడాకులూ కూడా అయేయి. కూతురైన మేఘనాకి ఆరేళ్ళు దాటి ఉండి ఉంటాయి. అప్పుడు టీనా ఎంత నాజూకుగా ఉండేదో! ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత మృదువైన కష్మీరీ తెలుపు. సన్నగా ఉండి, పొడుగాటి జుట్టుతో ఈర్ష్య కలిగించేటంత అందంగా ఉండేది.

చేరిన రెండేళ్ళకే ఖాన్‌తో తిరగడం మొదలుపెట్టింది. ఖాన్- పిఆర్ డిపార్టుమెంట్లో మానేజర్. పెళ్ళాం పోయిందనీ, భార్య మరణానికి అతనే కారణమనీ కూడా చెప్పుకునేవాళ్ళు. పట్టుమని ఒక నెల తిరగలేదు. టీనా ఖాన్‌ని పెళ్ళి చేసుకుందని తెలిసింది. ఆఫీస్లో అందరికీ మిఠాయి పంచింది కానీ నాలాగే ఎవరికీ సంతోషం కలగలేదన్నట్టే గుర్తు.

ఆ పెళ్ళీ తాన్యా పుట్టిన తరువాత, ‘తలాక్. తలాక్, తలాక్” అవడానికి రెండేళ్ళు కూడా పట్టలేదు. అతనితో కలిపి ఉన్నంతకాలమూ, ఆఫీసుకి వచ్చిన చాలాసార్లు- ముందు రాత్రి జరిగిన సంఘటనలకి గుర్తుగా తన చెంపలు కమిలి ఉండటం, చేతుల మీద రక్కులూ కనిపిస్తూనే ఉండేవి. ‘గతం గతహ్’ అనుకొమ్మని పెద్దలు చెప్పిన మాటని తు : చ తప్పకుండా, ఎంతో సులభంగా పాటించే అద్భుతమైన అలవాటు టీనాకి. అందుకే రెండు పెళ్ళిళ్ళూ, రెండు లివ్- ఇన్- రిలేషన్‌షిప్ల తరువాత కూడా ఎటువంటి విషాదాన్నీ తన చెంత చేరనీయలేదు.

***

బోయ్ బోయ్ మంటూ డ్రైవర్ ఒకటే హార్న్ మోగిస్తుంటే ఈ లోకంలో పడి చుట్టూ చూసేను. వసంత్‌కుంజ్ దాటినట్టున్నాం.”పదిహేను నిముషాలే మేడం. ఆడ్రెస్ చెప్పండి”-‘నేవిగేషన్’ ఆన్ చేస్తూ అడిగేడు డ్రైవర్. వాట్స్‌అప్లో టీనా పంపించిన చిరునామా చూసి చెప్పేనతనితో.

“ఉన్నావా, ఊడేవా, ఎక్కడి వరకూ చేరేవు?”- ప్రశ్నలు కురిపిస్తూ ఫోన్లు రావడం ప్రారంభించేయి.

మొత్తం మీద, ట్రాఫిక్ దాటుకుంటూ ఆ ఛత్తర్‌పురేదో చేరేను. కారు కూడా కష్టంమీద దూరగలిసేటంత ఇరుకు సందులు. ఇంటి నంబర్లు చూసుకుంటూ ఎలాగో చేర్చేడు డ్రైవర్ మహానుభావుడు. రెండో అంతస్థు. రీటా, పూజా, ఆనా, పోదార్ తప్ప ఇంకెవరూ కనపడలేదు. కొంచం అభిమానంగా, కొంచం ఫార్మల్గా ఒకళ్ళనొకళ్ళమి దగ్గిరకి తీసుకున్నాం.

చుట్టూ చూస్తే, పెచ్చులూడుతున్న గోడలూ, వాటికి పట్టిన బూజూ-మొదట నా కంటబడినవి. ఎదురుగా ఉన్న బుద్ధుడి ప్రేయర్ వీల్ మీదా, కొవ్వొత్తుల మీదా దుమ్ము దట్టంగా పేరుకుని ఉంది. లివింగ్ రూమ్ కిటికీకి తగిలించిన కర్టెన్లు చూస్తే, అవి ముందింకెక్కడో వేళ్ళాడి ఉండేవన్న చిహ్నంగా- కర్టెన్ల పొడుగూ, వెడల్పూ- రెండూ తక్కువయేయి. వాటి సందుల్లోనుండి బాల్కనీలో ఉన్న ఎండ లోపలికొస్తోంది. ఒక బెడ్రూమ్ తెరిచి ఉంది. దానికి వేళ్ళాడదీసిన కర్టెన్లు- మధ్య బ్రాకెట్లనుంచి జారి, కొంతమేర లూసుగా బయటకి వచ్చేయి. ఆ పక్కనున్న గది తలుపు మూసి ఉంది.

ఎయిర్ కండిషనర్ చప్పుడు చేస్తూ బలహీనంగా నడుస్తోంది. ఇంతెండల్లో- కనీసం పనంటూ చేస్తోంది, నయం.

Kadha-Saranga-2-300x268

లివింగ్ రూమ్లోనే ఒక మూల వంటింటి కోసం అని కేటాయించిన ఏడడుగుల చదరంలో, స్టవ్ మీద మూత కూడా పెట్టని అల్యూమినిమ్ గిన్నెలో చల్లారిన అన్నం, ఆ పక్కన పెట్టిన చిన్న టేబిల్ మీద గాజు గిన్నెల్లో పెట్టిన వండిన పదార్ధాలేవోనూ కనిపిస్తున్నాయి. ఆ పక్కన ఒక మూల ప్లాస్టిక్ ప్లేట్లూ, కప్పులూ, స్టీల్ స్పూన్లూ.

“ఒక్క నిముషం. వాష్రూమ్ ఉపయోగించుకోవచ్చా?”- అడిగితే తెరిచి ఉన్న గదివైపు చూపించింది టీనా. గదిలోకి అడుగుపెడితే ఇవతల ఉన్న తలుపు కూడా మూసుకోకుండా, బాత్రూమ్ లో ఒక ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చుని సిగరెట్ పీలుస్తోంది తాన్యా.

వెనక్కి తిరుగుతుంటే “మీరు రండి ఆంటీ, నేను బయటకి వచ్చేస్తున్నాను” తాపీగా ఏష్ ట్రేలో సిగరెట్టు బట్ నొక్కి, బయటకి వచ్చింది. ఆ గదికి ఒక కిటికీ అంటూ లేదు. సింగిల్ బెడ్ మీద పరిచిన దుప్పటి వెలిసి, పాతబడి, అస్తవ్యస్తంగా ముడతలు పడి ఉంది.

రెండు నిముషాల తరువాత బయటకి తిరిగి వచ్చి పడ్డాను.

ఇరుగ్గా ఉన్న లివింగ్ రూమ్లో, కిటికీ ముందున్న కుర్చీలో చిరునవ్వు చిందిస్తూ కూర్చుని ఉంది ఆనా. గలగలమని మాటలాడటం తన స్వభావానికి విరుద్ధం అని నాకెరుకే. భర్తా తనూ ఎన్నో ఏళ్ళగా, ఒకే ఇంట్లో –వేరే వేరే అంతస్థుల్లో, అపరిచితుల్లా ఉండటం నాకు తెలుసు. లేటుగా పుట్టిన పిల్లల చదువులింకా పూర్తవలేదు. రిటైర్ అయిన తరువాత చేతికి వచ్చిన డబ్బంతా ఏదో స్కాంలో పోగొట్టుకుంది. పూజాతో పాటు థియేటర్లకీ వాటికీ తిరుగుతూ ఉంటుంది!

నాపక్కన కూర్చుని పూరిగా చల్లపడని బీర్ కాన్లని ఖాళీ చేస్తున్న పోదార్ ని ఇంకో కుర్చీలోకి వెళ్ళమని పూజా నా పక్కన కూర్చుంది. రెండేళ్ళు లీవ్ ఆన్ విథౌట్ పే తీసుకుని, తరువాత వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుంది. ఏదో ఆన్ లైన్ సైటు అమ్మకాల్లో- మిగతావాళ్ళతో కలిపి చేరింది.
“అదేమిటి, ఎక్సెర్‌సైజూ, నడకా ఏమీ లేవా? ఇలా లావయేవు?”- ఎంత స్నేహితురాలైనా ఈ మధ్య మాటలు తగ్గిపోవడంతో సంకోచిస్తూనే అడిగేను.

“నీకు తెలియదా?”
ఎప్పుడు ఫోన్ చేసినా “ఇప్పుడు ఖాళీగా లేను. రేపు నేనే నీకు ఫోన్ చేస్తాను” అని చెప్పేదే తప్ప తనంతట తాను ఫోన్ చేసిన పాపాన్న పోతే కదా! ఏమిటి తెలిసేది!

“ఎయిర్‌పోర్టంతటా తెలుసు. నేను సెలవులో ఉన్న రెండేళ్ళూ రోజుకొక వోడ్కా బాటిల్ ఖాళీ చేసేదాన్ని. మరి సన్నబడాలంటే, అదంత సులభమా!”- తెల్లబోయి తన మొహం చూసేను.

డబ్బుకి లోటు లేదు. వాళ్ళమ్మమ్మ గ్రీన్ పార్కులో ఉన్న పెద్ద బంగ్లాని తన పేరనే రాసి పోయింది. కింద ఉన్న  తండ్రికీ, పై అంతస్థులో ఉండే పూజాకీ ఇరవై ఏళ్ళగా మాటల్లేవు-పనివాళ్ళ ద్వారా తప్ప. తనకన్నా తొమ్మిదేళ్ళు చిన్నవాడైన తమ్ముడు పెళ్ళి చేసుకుని న్యూయోర్క్‌లో స్థిరపడ్డాడు.

ఎప్పుడో, ఎవరితోనో ప్రేమలో పడి వైరాగ్యం పెంచుకుని పెళ్ళి చేసుకోలేదు. తన కుక్కలూ, ఆ పెద్ద ఇల్లే తన ప్రపంచం. వయస్సు పెరుగుతున్నకొద్దీ ఒంటరితనం వల్ల, అభత్రతాభావం పెరిగిపోతోందని చాలా ముందే తెలుసు. కానీ అది మరీ ఇలా దారి తీస్తుందని ఊహించలేదు.

“అలా తాగితే మరి నీ కుక్కలనీ, ఇంటినీ ఎవరు చూస్తున్నారు? అసలు నీకెవరు కొని పెడుతున్నారు? ఇప్పడూనా?”

“మాల్స్‌లో కొనడానికి అడ్డేముందీ? నేనే వెళ్ళి కొనుక్కునేదాన్ని. రాత్రిళ్ళు కదా తాగేది! ‘కుక్కలు’ అనకు. అవి నా పిల్లలని తెలుసు నీకు. వాటికి తిండి పెట్టిన తరువాతే తాగేదాన్ని. ఇప్పుడు హార్డ్ డ్రింక్స్ మానేసేనులే. ఇవిగో చూడు, నేనూ, ఆనా తాగిన బ్రీజర్లు”-సాక్ష్యంగా చూపించింది ఒక కుర్చీ కిందున్న రెండు ఖాళీ సీసాలని.

తిరిగి నాకు ఎప్పుడూ ఫోన్ చేయకపోడానికీ, మిగతా స్నేహితులతో లంచో, డిన్నరో ప్లాన్ చేసుకున్న ప్రతీసారీ తను మాత్రం రాకపోవడానికీ కారణం ఇదా!

వంటరితనం అంటే ఏమిటో, దాని ప్రభావం ఎలా ఉంటుందో- అర్థం అయి, భయం కూడా వేసింది.

kites-2

అటు చూస్తే తన పుట్టినరోజు జరుపుకుంటున్న టీనా ఎనిమిది నెల్ల కిందట నేను చూసిన కన్నా మరి రెండితంతలు ఊరిపోయి ఉంది. వేసుకున్న జైపూరీ పొడుగు స్కర్ట్‌ని తోసుకుంటూ, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చి ఉంది. పాదాలూ, చేతులూ ఉబ్బి ఉన్నాయి. ట్రిపిల్ చిన్ స్పష్టంగా కనిపిస్తోంది. మోచేతి పైభాగపు కండరాలు వేళ్ళాడుతున్నాయి. సగానికి పైగా నెరిసిన పొట్టి జుత్తు. చేతులకి బిగ్ బజార్లో కొనుకున్నానని చెప్పిన అర డజను రోల్డ్ గోల్డ్  గాజులు, మెడలో రెండు గొలుసులూ, పది వేళ్ళకీ అయిదు బిగుతు ఉంగరాలూ.
“పోయి, ముందు భోజనం తెచ్చుకొండి మీరిద్దరూ”- తాన్యా కూతుళ్ళిద్దరితో చెప్తోంది.

“అరవింద్ ఎక్కడ? ఇక్కడ ఉండటం లేదా?”- నిర్మొహమాటంగానే అడిగేను. అరవింద్ కిందటి ఏడేళ్ళగా తనతో సహజీవనం చేస్తున్న 64 ఏళ్ళ లాయరు. ఒకే ఇంట్లో కలిసి అద్దెకి ఉండేవారు.

“తను ముందుండే ఇంట్లోనే పక్క బ్లాకులో ఉంటున్నాడు. ఆ బిల్డింగ్లో స్వైన్ ఫ్లూ వల్ల ఇద్దరు పోయేరు. ఈ చిన్నపిల్లల వల్ల భయం. నేనే అప్పుడప్పుడూ అక్కడికెళ్ళి పలకరించి వస్తాను.”- తాన్యా పిల్లలిద్దరి వైపూ చూపిస్తూ చెప్పింది.

“ఏమిటి భోపాల్లో ఉద్యోగం మానేసేవట!”- తాన్యా వైపు ప్రశ్నార్థకంగా చూసేను.

“తను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటుందిలే” – కళ్ళు ఆర్పి నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న టీనా చేస్తున్న సైగలు అర్థం కాలేదు.

అది గమనించగానే తాన్యా  తారాజువ్వలా- అందరమూ ఉన్నామని కూడా చూసుకోకుండా తల్లి మీదకి లేచింది. ఇబ్బందిగా అనిపించి మాట మార్చేను.

ఇంతలో టీనా చెల్లెలు నీరా వచ్చింది. ‘హమ్మయ్యా  ఇంకా నేనే అందరికన్నా లేటేమో’ అనుకున్నాను. చేతిలో కార్ కీసూ, ఎంబ్రోయిడరీ చేసిన ఒక ఎథ్నిక్ పౌచూ పట్టుకుని, ఖాకీ పాంట్సూ, తెల్లటి స్లీవ్ లెస్ లినిన్ చొక్కా వేసుకుంది. మెడవరకూ ఉన్న జుత్తు సగానికి పైగానే నెరిసినా చాలా హుందాగా కనిపిస్తోంది. చేతికి పెట్టుకున్న వాచ్ తప్ప నగలూ, అలంకారాలూ ఏమీ లేవు. మొహంలో వింతైన ఆకర్షణ. అక్కకీ తనకీ ముఖ పోలికలు బాగానే ఉన్నాయి. తీసుకున్న నిర్ణయాల వల్లా, ఎంచుకున్న పార్ట్‌నర్ల వల్లా, జీవితంలో ధక్కా ముక్కీలు తిన్న టీనా మొహంలో- ముందుండే లాలిత్యం, సౌకుమార్యం ఎప్పుడు మాయం అయేయో అని నేను గమనించలేదన్న సంగతిని నీరా మొహంలో ఉన్న స్థిమితం, స్థిరత్వం జ్ఞాపకానికి తెచ్చేయి.
అనూ భోజనం మొదలుపెట్టింది. మనం కూడా ప్లేట్ తెచ్చుకుందామా?”- నీరా మాటలకి తలాడించి, నేనూ లేచేను.

“రొట్టెల్లేవా?”- నీరా అక్కని అడుగుతోంది.

“తాన్యా మీట్, కూరా చేసింది. నేను రాజమా, అన్నం వండేనంతే”- తనే అతిథిలా, టీనా మాత్రం కూర్చున్న చోటునుంచి లేవకుండానే సమాధానం ఇచ్చింది.

పోదార్ వెచ్చబడిన బీర్ తాగుతూ, పది నిముషాలకోసారి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్టు తాగి వస్తున్నాడు.

“నాకు ఆకలేస్తోంది. ఆపింక”–టీనా మందలిస్తోంది.

“ఇదిగో ఈ కాన్ పూర్తవనీ. అయినా నిన్నేమైనా ఆపేనా? నువ్వు పెట్టుకు తిను”- నిర్లక్ష్యంగా జవాబిచ్చేడు.

భోజనాలయేయి. హృదయం ఆకారంలో ఉండి, కరగడానికి సిద్ధంగా ఉన్న ఒక అతి చిన్న చాక్లెట్ కేకుని కట్ చేసింది టీనా. డ్యూటిఫుల్గా చప్పట్లు కొట్టి, తన్ని విష్ చేసి, తనకోసం తెచ్చినవేవో ఇచ్చేం మేము నలుగురు ఆడవాళ్ళం.

“ఇంక నేనూ, ఆనా వెళ్తాం. అసలే నాకు వంట్లో బాగాలేదు. డ్రైవ్ చేయడానికి ఎక్కువ ఓపిక కూడా లేదు. ట్రాఫిక్ ఎక్కువవుతుంది.”- పూజా తన బాగ్ తీసుకుని లేచింది ఆనాతో పాటు. తను కూడా వెళ్తానన్నట్టు నీరా కూడా లేచి నిలుచుంది.

వీళ్ళయితే అందరూ సౌత్ ఢిల్లీలో ఉండేవాళ్ళే. నేనే ఎక్కువ దూరం వెళ్ళాల్సినదాన్ని. ఆఫీసునుండి త్వరగా బయలుదేరి నన్ను పిక్ అప్ చేసుకోమని అర్జున్‌కి ఎలాగో చెప్పేను. ఇంకొంచంసేపు కూర్చోవడం తప్ప గత్యంతరం లేదు .

***

వాళ్ళు వెళ్ళేరో లేదో, పోదార్ టీనా పక్కనే తన్ని ఆనుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. తను ఎదురుగా ఉన్న బల్ల మీద కాళ్ళు చాపి పెట్టింది. “ఎంత లావయేవో చూడు”- తన ఆంకిల్ని వేలుతో పొడుస్తూ అంటున్న పోదార్ని రీటా వారించకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు. ఆపి ఉంటే విస్మయపడి ఉండేదాన్నేమో!

“అరవింద్ రాలేదెందుకని అడిగేవు కదూ? ‘పోదార్ ఉన్నాడు కదా! మళ్ళీ నేనెందుకు!’ అన్నాడు.” టీనా హాస్యంగా చెప్పింది.

ఆ హాస్యంలో సత్యం పాలు తక్కువేమీ కాదని అర్థం అవుతూనే ఉంది.

నిస్శబ్దంగా కూర్చుని ఎదురుగా మ్యూట్లో పెట్టి ఉన్న టివి వైపు చూస్తున్నాను.

పోదార్ నావైపు తిరిగి “సాయంత్రం కూడా కొంతమందిని పిలిచేం. నువ్వుంటావు కదా”- అడిగేడు. బహువచనం!!!

“వీలవదు. అర్జున్ వస్తాడు ఒక గంటలో. నేను వెళ్ళాలి. “- నా గొంతులో అలక్ష్యం నాకే తెలుస్తోంది.
ఇంకో రెండు సిగరెట్లు కాల్చేడు.

ముళ్ళమీద కూర్చున్నట్టనిపించడం ప్రారంభం అయింది.

“రాత్రికి రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చి, భోజనం పాక్ చేయించుకుని తిరిగి వస్తాను. మళ్ళీ నువ్వు వంటలంటూ పెట్టుకోకు.”- టీనాతో చెప్తూ, పోదార్ కారు తాళాలు తీసుకుని లేచి బయటకి నడిచేడు.

చాలా సేపటినుండీ శ్వాస బిగబట్టుకుని ఉన్నానన్న సంగతి గాఢంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు కానీ గుర్తుకి రాలేదు.

టీనా కళ్ళు నిద్ర భారంతో మూసుకుంటున్నాయి.

“పడుక్కో కొంతసేపు. మళ్ళీ రాత్రి కూడా మెలకువగా ఉండాలిగా!” నేను అనడమే ఆలశ్యం- సోఫా కమ్ బెడ్ బయటకి లాగి, దానిమీద వాలింది.
వెనక బెడ్రూంలోకి చూస్తే తాన్యా గాఢనిద్రలో ఉంది- చిన్నదాన్ని పక్కలో వేసుకుని.
అర్జున్ రావడానికి అరగంటైనా పడుతుంది. పోనీ ఏదైనా పుస్తకమైనా తిరగవేద్దామంటే, వాటి జాడే లేదెక్కడా.

kites-2

“ఆంటీ- ‘గ్లోబ్, గ్లోబ్’ ఆట ఆడదామా?- అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా అడిగింది పెద్ద మనవరాలు సెఫాలీ నా పక్కన కూర్చుంటూ.
“ఎలా ఆడాలో చెప్పు. ఆడుకుందాం.”- చిన్నపిల్లని నిరాశపరచదలచుకోలేదు.

ఇద్దరం దేశాల పేర్లూ, ఊళ్ళ పేర్లూ చెప్పుకుంటూ ఆడుతున్నాం.

“ఎక్కడీ టీనా ఇల్లు? ఇదే బ్లాకులో తిరుగుతున్నాను పది నిముషాలనుంచీ”-“ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అర్జున్ ఫోన్.

“నేను కిందకొచ్చి నిలబడతాను.”- సమాధానం చెప్పి నిద్రపోతున్న టీనా వైపు చూసేను. కొద్దిగా నోరు తెరిచి, సాఫ్ట్ గా గుర్రు పెడుతోంది. “సెఫాలీ, ఇంక నేను వెళ్తున్నానమ్మా. అమ్మమ్మ లేస్తే చెప్పు, నేను వెళ్ళేనని.”- బాగ్ తీసుకుని కిందకి దిగేనో లేదో- అర్జున్ కారు సందు చివర్న లోపలకి వస్తూ కనపడింది.

***

దార్లో “ఏమిటి పుట్టినరోజు విశేషాలు?”- అడిగిన అర్జున్‌తో క్లుప్తంగా చెప్పేను. “పోన్లెద్దూ, ఎవరి జీవితాలు వాళ్ళవి. తమకి ఇష్టం వచ్చినట్టు గడుపుకుంటారు. నీకెందుకు?  ఎవరినయినా తీర్పు తీర్చడానికి నువ్వెవరివి? వెళ్ళేవు, నీ స్నేహితులని కలుసుకున్నావు, వచ్చేవు. కొన్ని అనుభవాలు మనకి పాఠంగా నిలవాలి తప్పితే మనలని బాధ పెట్టకూడదు. ఇంకేదైనా మాట్లాడు.”- మాట మళ్ళించేడు.

భోజనం చేసిన తరువాత “చూసేవా వ్యవహారం?”-పూజా ఫోన్.  కోపమో, బాధో- మరింకేదో భావం.

“అర్థం కాలేదు. దేని గురించి?”

“టీనా పోదార్- వాళ్ళ నాటకాలూ. చూడలేదా? అసలే లోకంలో ఉన్నావు?”

“ఏదో అనుమానం వేసింది కానీ అసలెందుకివన్నీ తనకీ వయస్సులో? తన మానాన తన పనేదో చేసుకోవచ్చుగా!”- అయోమయంగా అడిగేను.

“అయ్యో తల్లీ! సర్వైవల్. ఈ ఏమ్వే ప్రోడక్ట్స్ అమ్మకాలతోనే తన అవసరాలన్నీ తీరుతున్నాయంటావా? పోదార్‌కి గ్రేటర్ కైలాష్‌లో తండ్రి వదిలి వెళ్ళిన మూడిళ్ళున్నాయిగా! అద్దెలు బాగానే వస్తాయి. టీనా ఖర్చులన్నీ తనే భరిస్తున్నాడు.

నువ్వంటే లేటుగా వచ్చేవు! మేము వెళ్ళినప్పటికి టీనా ఇంట్లోనే లేదు. తాన్యా వంట చేస్తోంది. లివింగ్ రూమ్లో బట్టలూ, చెత్తా చెదారం కుప్పలుకుప్పలుగా పడి ఉండాలి. నేనూ ఆనా కలిపి వాటిని టీనా గదిలో పడేసి, తలుపు మూసేసి ఇంటిని కొంచం శుభ్రం చేసేం. తెలుసా నీకు- టీనా తన పని మనిషినీ, వంటామెనీ కూడా మానిపించేసింది. తాన్యా చేతే ఇంటి పనులన్నీ చేయిస్తోంది.” ఈ సారి మాత్రం తన కంఠంలో ధ్వనిస్తున్న ఆక్రోశం అర్థం అయింది. నిట్టూర్చి ఫోన్ పెట్టేసేను.

“నువ్వు చాలా మంచివాడివి అర్జున్! “-టీవీ చూస్తున్న అర్జున్ పక్కనే కూర్చున్నాను. అర్థం చేసుకున్నట్టు చెయ్యి తట్టేడు.

ఎన్నిసార్లు పోట్లాడేను! తడి తువ్వాళ్ళు మంచం మీదే పడేస్తాడనీ, టీ తాగి కప్ అక్కడే వదిలేస్తాడనీ – ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి!

రేపట్నుంచీ మళ్ళీ అలాగే సాధిస్తాననీ తెలుసు. ఈ గిల్ట్ ఎన్నాళ్ళూ ఉండదనీ తెలుసు. కానీ ఈ సామాన్యమైన గిల్లికజ్జాల జీవితం చాలదూ సంతోషంగా బతకడానికి!

*

 

 

 

మనిషి పగిలిన రాత్రి

షాజహానా 
shajahanaఆఫీసు నుంచి వచ్చేసరికి మంచం మీద నాకోసం ‘రాత్రి రావడానికి లేటవుతుంది’ అనే నోట్‌ రాసి పెట్టి ఉంచాడు తను. ఎప్పుడు ఇంటికి రాకపోయినా అలా రాసి వెళ్ళి పోవడం అలవాటు. ఇవాళ నా దోస్తులతో తాగి తందనా లాడతానని దానర్ధం. ఇక నేను మౌనినై లేదా టివీ చూస్తూ సజీవ సమాధినై పోతాను. నాకు లేని దోస్తులతో మాట్లాడుతూ నేను పిచ్చిదానినవుతాను. కాసేపు రాక్షసిని కాసేపు దేవతని అవుతాను. తొలి యవ్వనంలోనే వెంటపడ్డ ఏ వెధవతోనో లేచిపోనందుకు, ఉండి ఉండి వీడిని కట్టుకున్నందుకు బాధపడతాను. ఇప్పుడు కూడా లేచి ఎవరింటికైనా ఎందుకు వెళ్ళలేక పోతున్నానో.. ఆలోచిస్తాను.
చాలా సార్లు ఇలా చేసి చేసి విసుగేసింది. జీవితంలో ఒంటరితనం నాచు ఎంతలా పేరుకు పోయిందంటే.. నేను అసలు కనపడడం లేనంత. ఇవాళ నేనేం చేయను? ఈ ప్రశ్న నన్ను కొన్ని ఒంటరి సంవత్సరాలుగా వేధిస్తున్నా నన్ను కాదనుకొని నాలో నేనే దాక్కొంటూ.. ఒంటరిగా దాగుడుమూతల ఆట. ఒక్కోసారి ఇల్లంతా సర్దేస్తాను. అప్పుడు, ఎపుడో దాచిన బొమ్మలో, డబ్బులో దొరికి కొంతసేపు ఆనందపడతాను. ఒక్కోపుడు ప్రేమగా తొడుక్కున్న పాత డ్రస్సు దొరికి అది వేసుకుని కొత్త డ్రస్సు వేసుకున్నంత ఆనందాన్ని పొందుతూ…!! ఈరోజు అలాక్కాదు. కొత్తగా గడపాలి. వీలైతే తను ఎలా గడుపుతాడో అలా! మొత్తం ఇల్లంతా వెదకగా తను ఎపుడో తాగి మిగిల్చిన క్వార్టర్‌ బాటిల్‌ కనిపించింది. ఎందుకు తాగుతారో, సాయంత్రాలను తాగడానికి ఎందుకు తాకట్టు పెడతారో తెలుసుకోవాలనే ఒక ఉత్సాహం.. ఫ్రిజ్‌లో ఉన్న బిస్‌లరి సోడా ఆమ్లెట్‌ అన్నీ తనలాగే… టీపాయ్‌ మీద పెట్టుకుని… ఏయ్‌ నువ్వొక్కడివే తాగగలవా? నేనునూ తాగగలను? చీర్స్‌!
భూగోళం తిరగడం మానేసింది. ఇప్పుడు నేనే భూగోళాన్ని! ఎవరో నన్ను బొంగరంలా తిప్పేస్తున్నారు. అందరూ నోరెళ్ళపెట్టుకుని చూస్తున్నారు… అబ్బా వాంతొచ్చేలా వుంది.. ఎందుకిలా.. పట్టుకో వాణ్ణి.. గోడెక్కుతున్నాడు.. లాగెయ్‌ కిందికి.. వాడు ఇప్పుడే రాడు… ఎపుడో తెల్లారు ఝామున వస్తే వస్తాడు… లేదంటే… అంతే…
అర్ధరాత్రి.. గోడమీద వాడి మొహం కాక సుధీర్‌గాడి మొహం కనిపిస్తోంది… చేతిలో గ్లాసుని సూటిగా చూసి కొడ్తే సుధీర్‌గాడి మొహానికి బదులు గ్లాసు బద్దలైనది.. మరో గ్లాసుని విసరగా అది కూడా పగలబడి నవ్వింది.. అసలు వీడి మీద తనకెందుకు కోపం? ఎందుకంటే వీడు తన మగనికి (లోపల ఎవరో పగలబడి నవ్విన శబ్దం) వచ్చే ఉద్యోగాన్ని రాకుండా చేశాడు.. చేయడంలో సఫలీకృతు డయ్యాడు.. వాడిని బొందపెట్ట.. అవును, హాయిగా ఊరి బూతులన్నీ తిట్టుకోవచ్చుగా.. ఈ గదిలో పక్క గదిలో గూడా ఎవర్లేర్‌.. ఎవరూ ఉండరు గూడా.. మరి ఎవరూ ఉండని ఈ సముద్ర గర్భమున ఎందుకు ఆక్సిజన్‌ కోసం ఎదుర్చూపులు?
ఎందుకంటే నాకంటూ ఒకళ్ళుండాలి.. గ్యారంటీ కార్డు ఇచ్చే షాపు ఓనర్లలా నీతోనే ఉంటాను చెలీ.. నిను వీడి వెళ్ళను మరి అంటూ మన చుట్టూనే తిర్గుతూ ఉండాలి.. దాని కోసం ఎన్ని జన్మలైనా.. ఈ జన్మలోనే- ఎన్ని జన్మలైనా ఎదుర్చూస్తూనే ఉంటాన్‌.. ఎవరన్నా వస్తారన్న గ్యారంటీ ఉంటే కదా చూసినా లాభం.. అదేంటి ప్రతీది లాభం.. దీన్ని చేసుకుంటే పది లక్షల రూకలు.. అమెరికా పోవుటకు సరిపోవును.. ఆ తర్వాత మరల మరల అదే ఫేస్‌ను.. ఏం చూస్తాం.. చంపేయ్‌..  బతికి చేసేదేం ఉంది.. అసలందుకే టీవీలు పేపర్లు చూడకూడదు.. అధవా చూసినా.. అధవా ఏంటి వెధవ లాగా.. ఎందుకనగా ఏ ఎన్నారై వెధవ ఎలా భార్యలను చంపింది, చంపబోతుంది, మానసికంగా రోజుకు గ్రాముల చొప్పున ఎలా మెర్సీలెస్‌ కిల్లింగ్‌ చేస్తున్నది.. తెలిసిపోతుంది.. అపుడు మనకనవసరంగా బాధేస్తుంది.. మనలని మనం కాసేపు తిట్టుకోవటమో లేదా మనం ఎంత మంచోల్లమో తలచుకోవటం.. వాక్‌.. తాగాక కక్కొచ్చి నట్టుంటది.. ఎందుకంటే ఇక్కడి ప్రబుత్వాలే కాదు తెల్లోడి గవర్నమెంటూ అంతే.. నేరస్తులను ఎవరేం చేయలేరు.. అసలు రింగిచ్చావా.. రింగు రింగు బిళ్లా రూపాయి దండా దండ కాదురా దామర మొగ్గ మొగ్గ కాదుర.. ఏదో ఉంది.. గుర్తుకు రావట్లే.. గుర్తుకు.. ఆఁ.. గూట్లో రూపాయ్‌.. నీ మొగుడు సిపాయ్‌.. అసలెవరి మొగుడైనా సిపాయేనే ఎర్రి మొహమా.. రింగిస్తే బయట బండి ఆగిన శబ్దం కావాలె కదా..
Kadha-Saranga-2-300x268
గోడ మీద కూకోనున్నాడు ఎందులకు? ఎయ్యి ఒక్క గ్లాసు సూటిగా సూసి ఏస్తే గోళీకాయ పగిల్నట్టు పగలాల వాడి ముక్కుదూలం.. భళ్ళున బద్దలయినది.. చార్మినారులో ఇష్టపడి మోజుపడి కొనుక్కున్న గ్లాసుల్లోంచి ఒక్కొక్కటే గోడకేసి తలకొట్టుకుంటున్నాయి.. మనం ఏదికొన్నా అంతే మన టేస్టుకు దగ్గట్టుగా అందంగా చాలా కాలం మన్నేలా.. కొనుక్కుని పెట్టుకుంటాం కదా.. మొగుళ్ళని పెళ్ళాలు పెళ్ళాలని మొగుళ్ళు కొనుక్కున్నట్టు! అందులో ప్రేమతో కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు సుమండీ! వీరికి పొగరెక్కువ.. పేమ పెపంచకాన్ని జయిస్తదని ఎర్రినమ్మకం.. ఉత్తదే ! అసలెప్పటికీ ఎవర్నీ.. దేనితోని జయించ లేము.. ఇది నిజం.. నిఝంగా అర్ధగంట్లో  ఇంట్లో ఉంటానన్న నా మగధీరుడు ఎటుపోయెను.. ఏ రాజ్యము లేలుచుండెను?
అదిగో మళ్ళీ మధ్యలో అతనెందుకు.. అయినా అతను అనాలా? వాడు గదా! అవును మనం గూడా.. ఎక్కించుకుని ఉన్నాం కదా..! గాలిలో తేలిపోతున్నాం గదా! వాడికి మనకి తేడా ఏం లేదు.. తేడా ఏం లేదూ? ఏమోలే తరువాత కొలుచుకుందుము! ఇప్పుడు పన్చూసుకో.. ఓహో చార్మినారుతో గొడవపడి బేరమాడి కొనుక్కున్న కప్పులు సాసర్లు.. సాసర్లంటే గుర్తొచ్చింది.. ఫారినర్లంతా వేరే గ్రహాలను, అక్కడ జీవజాలాన్నీ జలాన్నీ ఊహిస్తుంటారెందుకు.. మరల వారితో యుద్ధ ములు.. వారితోనూ ప్రేమ వ్యవహారములు.. (అహో మనకి  ఊహలలోనూ పాతివ్రత్యమే!) ఎందుకంటే ఇక్కడివారితో గడిపి బోరుకొట్టి బీరుపట్టి.. వారు సినిమాలు తీయుదురు.. అట్లా ఒక సాసరు వస్తే ఎంత బావుండు.. ఆ సాసర్లో ఒక.. ఆఁ, ఒక? ఒక.. అసలెవరుక్కావాలి నీకు..!
ఏమో? మరి సాసరెందుకు? అవును సాసరెందుకు? కాబట్టి.. అందుచేత.. పనికిరాని సాసర్లు ఉంటే ఏం లేకపోతేం.. సాసర్లని ఒకసారి ఫ్లైయింగ్‌ చేయి.. ఎంత బాగా ఎగుర్తున్నయి..? ఎగిరి దుంకి చిన్న చిన్న సాసర్లైతున్నయి.. భలే ఉంది కదూ.. ఈ సాసర్లలో చాయినే ఎందుకు తాగాలి? ఇంకేమైనా ఎందుకు తాక్కూడదు? ఇంకేమైనా అంటే ఏంటి? మరే, ఇంకా రాలేదేం? ఎవరైనా అమ్మాయి అందంగా కనిపిం చిందా.. ఇంకంతే.. అసలు అందంగా కనిపించకపోయినా పర్లేదు.. అమ్మాయైతే చాలు.. ఎంత బ్రాడు మెదడ్లు.. సొంగకార్తా ఉంటది.. సొమ్మల రోగం ఉన్నోళ్ళకు మల్లే.. ఇంట్లో ఒకత్తే ఒంట్లో వేడితో కంట్లో దు:ఖంతో కాలిపోతా నలిగిపోతా ఉంటే.. వాడక్కడ కార్చుకుంటా ఎదురింట్లో కుక్క మాదిరి.. కుక్కే కాదు అక్క కూడా ఉందాయింట్లో.. నాకు అక్క, వాడికి.. వీడే కుక్క.. ఇక అక్కెలా అవుద్ది? సొ.. ఓయ్‌ అసలు నీకేం కావాలి.. ఏమైనా కావాలా? అవును ఏదో కావాలి.. ఎవరో రావాలి సాసర్లో! పిల్లి ఎవరూ ముఖ్యంగా నేను చూడట్లేదనుకుని, పాలన్నీ.. హాయిగా తాగేసింది.. తాగుబోతు పిల్లి.. నేనేం చెయ్యలేదు.. ఎందుకంటే నేను పిల్లిని  కాను, కనీసం పాలన్‌ కూడా కాను.. మరి  నేనెందుకు భాధ పడటం.. పిల్లి కూడా పాలు తాగింతర్వాత ఇలా వొత్తుల్‌ దీర్గాల్‌ మార్చి మాట్లాడ్‌తుందా?
mandira1
అతనిలాగే.. అతనేంటి? వాడు! అదిగో.. మళ్ళీ మధ్యలో వారి ప్రస్తావ నెందుకు? పరాయివాళ్ళ నెందుకు తల్చుకోవడం, రింగులివ్వడం? మాట్లాడ్డానికి ఎవరైనా దొరికితే బాగుండు! ఎందుకు? మాటలు తర్వాత చూపులు తరువాత రాసుకోటం గేదెలు గోడలకేసి రాసుకున్నట్లు! అంతే.. అదే ప్రేమ! దానికోసమే.. తన్నుకులాట! పునుకులాట! ఏం వెదుకుతున్నావు, విడిచిపెట్టిన వెన్నెలకుప్పలాటలో పుల్లను  ఈ జీవితకాలంలో నువ్‌ తేలేవ్‌! ఆ పుల్ల ఈ ధూళిలో దుమ్ములో కలిసి ఎక్కడ మాయమైందో.. మనం మాత్రమే మిగిలామ్‌. మనం ఏంటి రాణిలాగ! నేను అనుకోలేవా? లేను, ఇప్పుడంతే నేనే రాణి సేవకి పడక మంచం కంచం మెతుకులు సాసరు కుక్క అక్క దూదుంపుల్ల పిల్లిపిల్ల అన్నీ నేనే అన్నీ మనమే!
 డాక్టరు నవ్వమని చెప్పాడు! ప్రిస్కిప్షన్‌లో నవ్వమని  చెప్పిన మొదటి డాక్టరతను పేషంట్‌ నేను అయ్యుంటామ్‌. అప్పటివరకు తనకు తెలీనే లేదు… తాను నవ్వక ఎన్ని సంవత్సరాలైందో.. నవ్వి ఎన్నేళ్లయిందో.. రెండూ ఒకటేనే ఎంకట్లచ్మీ.. అయినా కోల్పోయిన నవ్వుల్‌ పప్పటికలో దొరుక్తయా నా శాంతనం కాపోతే? డాక్టరేంటి మొగుడికంటే కరెక్ట్‌గా చెప్పేస్తున్నడూ.. మొగుళ్ళ కంటే డాక్టర్లే నయం లాగుందే.. అలాక్కాదే ఎర్రిపప్పా.. ఈ డాక్టరుకి పెళ్ళాం ఉంటుంది కదా.. ఆమెక్కూడా వేరే డాక్టరు దగ్గరే.. ట్రీట్‌మెంట్‌.. సొంత పెళ్లానికి ఏ సైంటిస్ట్‌ మందు కనుక్కోలేడు.. ఒక డాక్టరు మొగుడు కాలేడు.. మొగుడయిన డాక్టరు వేరేవాళ్లకు డాక్టరు.. పెళ్లానిక్కాదు.. అసలే లెక్కల్లో పూరు.. ఏప్పియస్సి చూయింగమ్ము బిట్లు మనక్కెందుకు చెప్పు? అవునూ ఇప్పుడు ఉద్యోగం మనిషి లక్షణమయిన తర్వాత ఉద్యోగాలు తరాజులో పెట్టేసి పెచ్చాపలో.. అనమ్ము కుంటున్రు.. గదా.. లేదంతావేటి?
నిజం చెప్పవే అమ్ములు? అయినా నీదేం పోయింది.. చదువుంతా పోయింది.. కదా.. నీదేం పోయింది.. ముక్కు కళ్లు చెవులూ అన్నీ మూసుకో.. ఛీ.. ఈ సలహా బాలేదు.. అసలు తెరిచిందే.. ఇందాక.. అపుడే మూసేయాలా.. మూసుకోవాలమ్మా.. లేకపోతే దుంపనాశినం.. ఆయేషాను చేసినట్లు చేస్తారు తెలుసా? నిఝంగా.. ఆ తరువాత నీ శవం మీద క్కూడా పేలాలకు బదులు ఉద్యోగాలు జల్లుతారు.. సాక్ష్యాల్లేకుండా హత్యలు చేయించబడును.. అంతర్జాతీయ మార్కెట్‌లో తాజా బోర్డ్‌.. ఒసేవ్‌ నోర్మూసుకో.. గట్టిగా మాట్లాడబోకు.. గోడ్లకి చెవుల్‌ ముక్కు నోరు.. కండ్లు అన్నీ ఉంటయ్‌.. వేలిముద్రల్‌ తప్ప.. ఏం దమ్మీ సెప్తా ఉంటే నీక్కాదూ.. అందుకే టీవీలు పేపర్లు సూడకూడదనేది.. అయినా ఎవరింటున్నరు.. గట్టిగా చద్దరు ముసుగు తన్ని ఏ విషయం లోపట్కి దూరకుంట పండు! చద్దరికి చిల్లుల్లేవు.. ఎన్ని విషయాలు దూరుకుంటొత్తన్నయో..! ఆ అమ్మాయి అంతందమైన సున్నితమైన అమ్మాయి.. నిండా ఇంకా పద్నాలుగేళ్లు నిండా లేనమ్మాయి.. ఎవడి కోసమో యాసిడ్‌ తాగిం దాట! అదేమైనా కొబ్బరి బొండామా లట్టలట్ట తాగడానికి.. పెద్దాపరేషనై.. మంచాని కతుక్కుపోయి.. నీళ్లు తాగినంత వీజీగా విషం తాగుతున్న సీరియళ్లు చూసుకుంటా శేష జీవితాన్ని గడిపేయి నా చిట్టితల్లీ..! ఎవరో లబోదిబో మొత్తుకుంటున్రు.. ఎవరబ్బా.. మొన్నే పెళ్లి చేసి అమెరికాకు ఎగుమతి చేసిన కూతుర్ని.. శవంగా మార్చి దిగుమతి చేశాడంట.. అల్లుడు.. అమ్మా అబ్బా అయ్యుంటారు.. అమెరికాంటని అసూయపడ్డ బందుగుల్‌.. స్నేయితుల్‌.. వాక్‌.. అంతా శవాలమయం! అమెరికా అంటే చాలు.. పొర్లు దండాలు పెడ్తా అమ్మాయిల నిచ్చేస్తారు! నవ్వుతా తుళ్లుతా చలాగ్గా తేలిగ్గా కంప్యూటర్‌ కోర్సులు చదివేస్తుందా.. అయితే మీ అమ్మాయిన్‌ గూడా అమెరికా పంపించండీ! మౌనంగా.. దీనంగా.. దిక్కు లేకుండాగా.. మీ అమ్మాయి పెట్లో పడుకుని వచ్చేస్తుంది.. ఇవన్నీ చేసేందుకు గాను.. ఆ రౌడినాకొడ్కులకి మళ్లీ కట్నం డబ్బుల్‌ గుడా ఇవ్వండేం మర్చిపోకండి…
ఇంతకీ మంది మొగుళ్ల గురించి నీకెందుకే.. అసలు నీ మొగుడేడి? ఏం చేయుచున్నాడు.. ఎక్కడ తప్పిపోయినాడు? ఏ గుర్రాల మీద తిరుగుతున్నాడు? అదిగో మళ్లీ వాడి గురించి.. నీకెందుకు? నువ్వు కావాలన్న రాడు.. వద్దనుకుంటే పోడు.. వాడిష్టం వాడిది.. నీ ఇష్టం నీది! అంతే కదా.. మళ్లీ ఎందుకు ఆలోషన పట్టాలు తప్పుతుంది.. విడిపోదామనుకునే కాడికి ఏడికి పోతేంది.. పోకుంటేంది? వస్తేంది.. రాకుంటేంది..? అసలేంటి నీ సదుద్దేశం.. ఇంత జరిగాక మళ్లీ అదే ముఖాలతో ఎలా కాపురం.. కాపరమా అదేంటి? ఎలా ఉంటుంది? ప్రపంచ మంతా ఇంతే.. సరిగ్గా కాపురం చేయడమే సమాజంలో బతకడానికి అర్హతనుకుంటుంది.. అన్నీ దొంగ కాపురాలు దగా కాపురాలు..! ఎవని కాపురం సొక్కంగుందో జర సెప్పు సెల్లె నీ బాంచన్‌ కాళ్ళిరగ్గొట్ట.. దుడ్డు.. రొక్కం.. రూకలు.. మనీ.. పైసా.. మేక్స్‌ మెనీ థింగ్స్‌.. అంతేనంటావా.. ఎక్కడా స్త్రీలు సంపబడని సోటు.. పోనీ అవమానింపబడని సోటు ఎక్కడైనా ఉందా ఇలా తలంలో.. అని.. సజలాం.. సరక్తాం.. గాహే.. తవ జయగాధా.. గాహే.. ఎహే.. ఇన్ని సప్పుళ్ళకి పక్కింటివాళ్ళు లేవరెందుకు? లేస్తారు.. మనం.. ఇప్పుడు.. మనసు ఖరాబు చేసుకుని లేదా పరిశుద్ధం చేసుకుని సుకంగా నిద్రమాత్రలు మింగేమే అనుకో.. అప్పుడు తెల్లారి నేనెందుకు తలుపు తీయలేదా అన్న క్యూరియాసిటి మొదలవుద్ది.. ఆ తర్వాత.. దుర్వాసన రావడం మొదలవుద్ది.. వాసనే రాకపోతే ఎన్ని శవాలు అనామకమయ్యేవో.. తట్టుకోలేక పోలీసుల కుప్పందిత్తారు.. అంతే.. ఎందుకంటే పెజానీకం పోలీసుల్తో సత్సంబంధాల్‌ పెట్టుకునేంత తెలివి తక్కువగా లేరిప్పుడు.. ఎలాగు తరువాత పట్టించుకోవాల గదా.. ఆ మాత్రం దానికి ఇప్పుడు పట్టిన నిద్రని పోగొట్టుకోవడం దేనికి?
మిగిలిన ఒకే ఒక కప్పు.. లతలతో.. అందంగా కనిపిస్తుంది.. ఇంతందంగా ఎందుకు పుట్టావే..? అదీ పింగాణీవై ఎందుకు పుట్టావే.. హఠాత్తుగా దానిమీద ఎక్కడలేని పేమ ముంచుకొస్తుందెందుకో? వదిలెయ్‌.. నీకే దిక్కు దివాణం లేదు.. దానిమీద నీకెందుకు మమకారం? అదేమైనా నీ కడుపున పుట్టిందా? కడుపునే పుట్టాలా? పుట్టితీరాలా? పుట్టడమో చావడమో ఏదో ఒకటి చేసి తీరాలి! అయితే దీని గురించి రాద్దామా? రాసి తీరాలి కానీ రాయడానికి కూడా స్వేచ్ఛలేదు నీకు!
mandira1నేనేం రాయాలి రాసి ఎవరికివ్వాలి ఎవరితో మాట్లాడాలి అన్నీ వాళ్ళే  నిర్ణయిస్తారు.. అలా ఉంటే ఏం లేదు.. లేదంటే లం..లైపోతారు.. నా కొ…రా అని నేననలేనా? సాహిత్యముతో కూడా పగలు తీర్చుకోవచ్చు.. అయినా ఈ ఎదవలకి మనస్సాక్షి ఉండదా? రేపటి కూచిపూడి డాన్సరుకి సాక్షి అట..పేద్ద హోర్డింగు.. ఎక్కిరిత్తంది.. ఆయేషా! నువ్వు దేనికమ్మా సాక్షి? ఆహా! అపర సత్యవతీ.. ఏ కాలంలో మాటలాడుచున్నావు తల్లో.. తీసుకున్నోడు తీసుకున్నానని చెప్పడు.. చంపినోడు చంపినా అని చెప్పడు.. సపోర్టిచ్చినోడు ఇచ్చినా అని చెప్పడు.. దోచుకున్నోడు దోచుకున్నా అని చెప్పడు.. అదే పెజాస్వామ్యం! అన్నీ అర్దమవుతానే ఉంటయ్‌.. నిజం.. నిప్పులాగా ఔపడతా ఉంటది.. అయినా అంతే మనం వింత చూసేలోపు దొంగ దొరవుతాడు.. దొర దొంగవుతాడు.. నువ్వు నేను ఇట్లా మంచాల మధ్యలో ఉద్యోగాల వేటలో రోజూవారి సోదిలో పడి కొట్టుకు పోతుంటాం.. ఐదేళ్ళకోపాలి ఏలికింత రంగేయిచ్చుకుని.. ఆ తర్వాత నెత్తికింత బుర్ద రాయిచ్చుకుని.. అసలు ఈ కుర్చీల కూర్చి గురించి ఒక నవల రాస్తే బాగుంటదేమో.. ఒక మానవ దేహం ఫలానా కుర్చీలో కూర్చోగానే.. ఎందుకట్టా మారిపోద్ది.. అప్పటి వరకున్న లక్షణాలన్నీ మరచిపోయి.. కుర్చీ లక్షణాలన్నీ ఔపోసన పట్టించేద్ది.. మనిషి అనుకరించటంలోంచే పైకొచ్చాడప్పా.. ఈ నిజం చెప్పినోడెవరోగని ఇది కుర్చిలో కూసోంగనే తెలిసిపోద్ది.. అసలు ముందు మనం.. మనం అంటే మనం కాదుగానీ.. కుర్చీ టేబులు ముందు కూర్చునే వాళ్ళుంటారే.. చూసి చూసి ఎంత ఇసుగేసి పోయినాదంటే.. టేబుళ్ళతోని కుర్చీలతోని అతుక్కుని పుట్టినారేమి?
పని గురించి ముందుకుపోయి  నిలబడినామంటే చాలు నాయాళ్ళ/ల్దికి కూర్చోమనే సంస్కారం కూడా ఉండక పోగా నువ్వేదో వాడి జన్మజన్మల సొమ్మంతా నొక్కేసినట్లు.. వాడి ఆముదం ముఖంలో నా….! నిజం.. వాడి కాలికింద ఏదైనా ఉద్యోగమే ఉందనుకో.. ఇంకంతే భూగోళం చివర్న కుర్చీ ఏసుకుని కూర్చున్నట్లు ఫీలింగు.. ఒరే.. ఎన్ని రకాల కుర్చీలు కావాలంటే బంగారం ప్లాటినం కుర్చీ ఏసుకుని ఫెవికాలంతా ఎనక్క్రాసుకుని కూసున్నా ఆ కుర్చీ భూగోళం పైన ఆగదు కన్నా.. భూమిలోకే పోద్ది.. నువ్వూ అంతే.. ఏకాలం ఏలుకుంటా కూచ్చోవు..
మా నాన్న చెప్పేవాడు.. సిన్నప్పుడు.. నీతన్న మాట.. అంటే ఏంలేదు.. ఏది నిలవదురా కన్నా బుజ్జీ.. నువ్వు చేసిన మంచో చెడో అదే నిలబడుతుందని.. ఇప్పుడ్‌ గూడ చెప్పాలనుంటది గామోసు.. మనం పెద్దగయిపోయినం గదా! పెపంచమంతా చిన్నప్పటి నీతులు తుచ తప్పకుంట పాటిస్తే ఎంత బాగుండు.. కానీ ఇప్పుడు మనం చేసేది మంచా చెడా? ఇదంతెందుగ్గానీ.. శాశ్వతం గానీ కుర్చీల మీద శాశ్వతం గానీ శరీరాలను పడేసి.. ఇంద్రుణ్ని చంద్రుణ్ని.. ఫోజులు కొట్టమాకండ్రా.. కుక్కక్కూడా మంచి రోజొస్తుందట.. మరి నీకు రాటంలో పెద్ద ఆశ్చిర్యం ఏం లే.. అయినా సరే ఇప్పటికిప్పుడు నా దగ్గరున్న అత్యంతాధునిక.. పురాతనాయుధం ఇదొక్కటే కాబట్కి.. నేను తిట్టకుంట దుమ్మెత్తి పోయకుంట ఉండన్రా.. దొంగనాయాళ్లారా.. నోటికాడి కూడు లాక్కోని మీరేం సుఖపడి పోతార్రా.. మీ చేతులకి పక్షవాతం రాను.. ఆ నోటితోనే కదా.. కుట్రలు కుతంత్రాలు చేసేది.. మీ నోరు పడా.. మీ నోట్లో.. అది.. ఇది.. అన్నీ..! ఒరే కళ్లు సల్లపడ్డయా.. ఇంకేమైనా మంటుందేమో.. రండ్రా.. మొన్న ఆపరేషనయిన అమ్మాయి మూత్రం ఇంకా బాటిళ్ళలోనే పడుతున్రు..!
నిజం, మనుషుల్లో మనసున్నోల్లు షానా తక్కువ! నిజం దోస్త్‌..పెద్ద కుర్చీల్లో కూసోనున్నం కదాని మనుషులమనే విషయం మర్చిపోకూడదు గదా.. ముఖ్యంగా మా తాత చెప్పేటోడు.. ఏడన్నా కొట్టు గని పొట్ట మీద మాత్రం కొట్టమాకు..! ఎదవలు ఎఫెక్ట్‌ రావాలని ఆడ్నే కొడుతుర్రు.. కంత్రీలు.. ఎఫెక్టంటే గుర్తొచ్చింది.. ఒంటరిగా ఉంచి ఈ కప్పుని ఎందుకు జీవహింస చేయడం.. జీవాత్మని పరమాత్మలో కలిపేస్తే పోలె..! ఏస్కో.. కప్పు.. పేద్ద కుర్చీ కనపడతందా.. వేసేయ్‌ పపంచంలోని కుర్చీలన్నీ విరిగిపోవాల.. అందరూ కింద కూర్చుని ఉద్యోగాల్‌ చేయాలె.. ఊళ్ళేలాలె దేశాలేలాలె! అయ్యో ఆమ్టే చచ్చిపోయాడు కదా .. మళ్ళింకెందుకు పుడతాడు.. ఈ పాపిష్టి లోకంలో..!
అయినా కప్పిసిరితే.. ఇంత మార్పు వస్తుందంటవా.. ఇసిరి చూస్తే పోలా.. భళ్ళున శబ్దం.. అయినా లోకం కిక్కురు మన్లా! కిక్కెక్కిందేమో..! అబ్బా.. లోకమంతా నా కళ్ల ముందున్నా.. వీడు మాత్రం లేడు రాడు పోడు! పోరా.. ఎన్ని పోయాయ్‌? చిన్నప్పుడు నాదే ననుకున్న ఇల్లు పోలే.. పెంచుకున్న పూలతోట.. కరిగిపోలే.. పెంచుకున్న పేమ తోట.. రాలిపోలే.. పూయించిన స్నేహ కుసుమాల్‌ వాడిపోలే.. నాదనుకున్న ప్రతీది రాలి మాడి వాడి మసైపోయాక.. ఇంకేంది నాది.. ఇప్పుడు తాగావే నీటి చుక్కలు అవి నీవే.. నిన్న పొద్దున్నెప్పుడో.. పుల్సిపోయిన పిండితో వేసుకుని తిన్నవే.. దోశే.. అది కూడా నీదే.. నువ్వెవరి మోచేతి నీళ్లు తాగట్లేదమ్మా.. కానీ ఎవరిదో.. ఒకరి మోచేయి కింద బతికి ఉండాలి! అదీ జీవితం.. నీకింకా సొతంత్రం రాలేదు.. రాదు.. రానివ్వరు! నీకెంత సొతంత్రం ఉందోనని అనుకుంటుర్రు.. ఉత్తదే.. పైకే.. షాపూర్‌కాడ.. ఆడపిల్లలాని.. చంపకుండనే బొందపెడ్తున్నరంటా! ఆడాడ్నో.. ఆడపిల్లలనమ్మే రాకెట్‌ బయటపడ్డదంట.. మనకెంత పరిజ్ఞానమో.. ఎన్ని రాకెట్లు చేయడం వచ్చో..! అన్నీ పీడకలలే వస్తాంటే దేన్ని గురించి కలలు కనమంటారు కలామ్‌ గారు?
ఏందమ్మీ టీవి పెడుతున్నవ్‌.. అప్పుడే ఎలచ్చన్‌ల మురిక్కంపు గొడవలన్నీ బయటికొచ్చేస్తా ఉంటయ్‌.. ఎందుకు చెప్పు.. అయినా ఏ పార్టీ ఇంతవరకు లేడీ ముఖ్యమంత్రిని చేద్దామని ఒక్కపాలి గూడ అనలేదెందుకని? ఎక్వతక్వ నఖరాల్‌ చేయబాకు.. బేనజీర్‌ ఆరిపోయిన రక్తం చింది మీద పడి పగలబడి నవ్వగలదు! ఆడ ముక్యమంత్రిణినా? గీ సంవత్సరపు పేలని జోకు.. విరగబడి నవ్వు అదే జీవితం ఎక్కడేది క్లిక్కవ్వుద్దో ప్లాపవ్వుద్దో.. ఏదీ ఎటూ తేలని రాయికట్టిన బెండు బతుకు! అడుగులో అడుగునై నవ్వులో నవ్వునై అన్న మొనగాడు.. కిడ్నీలు పాడవుతున్నయంటే ఏడికి పారిపోయిండో.. జీవితం నుంచి ఇట్లా తప్పించుకుంటే ఎట్లనబ్బ.. స్కూలి పిలకాయలమా? క్లాసు బాలేదని దెంకపోనీకి? అమ్మా బాపుల్ని బస్టాండులో దొబ్బేసినాడంటెదవనాయాలు.. పాపం అడుక్కుని తింటున్రు.. ముసిలోల్లు.. అగ్రరాజ్యాల సరసన భారత్‌.. పేపర్లో భలే సరసం చదివినానబ్బ.. ఏయ్‌ నిన్నెవరు పేపరు చదవమంది! ఒక్క కేసు రెండుక్కేసులు.. ఇలా జరిగితే ఇక దేశాన్నంతా తిట్టుడేనా? నీ మొగడు మంచోడు కాపోతే.. మగాళ్ళంతా గంతేనా! ఏమోనబ్బ.. పపంచంల ఒక పెద్ద కోర్టు, దాన్ల ఒకే ఒక కేసు.. ఒకేపంతా ఆడ.. ఒకేపంతా మగ! ఎవరు మంచోరన్నది కేసు, ఇద్దరు జడ్జిలు ఒక ఆడ మగ ఇద్దరు లాయర్లు ఆడ మగ ఇగ ఇది తేలినప్పడు తేలిద్ది లేకపోతే మగ జడ్జి ఆడజడ్జిని బెదిరించి మగ లాయరు ఆడ లాయర్ను చంపేసి, కేసు విత్‌ డ్రా..! న్యాయ శాస్త్రంలో ఎంత సౌకర్యం ఉందంటే ఆడ మగ ఇద్దరూ కలిసి ఉన్నా పిల్లల్ని కన్నా.. అది పెళ్ళి కాదంటా.. మరి పెళ్ళంటేందో.. కొద్దిగన్ని నిర్వచనాలు ఇచ్చుకుంటే బావుండు..  సినిమా నాన్నే కాదు.. మీ నాన్నయినా మా నాన్నయినా అంతే.. ఎంత విశాల భారద్దేశం అయినా మళ్ళీ అంతా ఇరుకే.. అవునూ ఆకలేయట్లే.. ఇప్పుడు మనం విషాదంలో అలకలో కోపంలో దు:ఖంలో ఉన్నాం కదా.. కంట్లో నుంచి ఏడుపు.. ఎవరైనా తినిపించే వాళ్ళు బుదగరించే వాళ్ళు.. నా తల్లీ బంగారు కొండ.. ఒక్క ముద్ద తిను.. అబ్బా- ఎవరైనా పుట్టించడానికే కాదు పుట్టాక్కూడా సరోగేట్‌ మదర్సు ధెరిస్సాలుంటే ఎంత బాగుండు.. అవునూ సరోగేటు ఫాదర్సుండరెందుకని? లేనిదే కావాలెప్పుడు దీనికి!
ప్లేట్లో అన్నం, ఎప్పటిదో వారాలనాటి పప్పు ఫ్రిజ్జులో.. మనలాగా ఫ్రీజయిపోయింది.. పొయ్యి మీద పెట్టు.. వేడయ్యిద్ది.. తినిపించుకో.. చూస్తావేంటి నా కన్నవు కదూ.. ఏడవకు కళ్ళు తుడుచుకో.. ఇదుగో.. ఇది అమ్మ ముద్ద నాన్న తాత కాలేజిలో సునంద ముద్ద.. చేతికి గోరింటాకు పెట్టించుకున్న పూలుపళ్ళప్పటి అత్త ముద్ద పెళ్ళప్పటి ముద్ద పెళ్ళయిన కొత్తల్లో మొగుడి ముద్ద.. అయినా మనకు మనమే బతిమిలాడుకుని మనమే తినిపించుకోవడం.. ఎంత గొప్ప అనుభూతం! సింకులో వేసేయ్‌.. ఈ భూగోళం కూడా సింకులో పడితే బాగుండు.. నర్సమ్మకు చెప్పి బాగా రుద్దిస్తే బాగుపడిపోయేది!
మంచం ఉరుకుతుందేంటలా.. పట్టుకో.. యా ఇలాగే.. ఇప్పుడు గది తిరుగుతుంది.! దీన్నే గది తార్కిక వాదం అంటరు.. అయినా ఎప్పడూ ఏదో ఒకటి తిరుగుతూ ఉండాలి.. అప్పుడే చలన శీలతున్నట్లు.. మరేమో మా ఆయనకి ఈ శీలతెక్కువ! ఎహే ఎవడి గురించి నీకెందుకు? తల పగిలి పోయే నొప్పితో ఉండి.. నిద్రపోతే తప్ప ఇంకేలాగూ తగ్గదు.. నిద్ర.. రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా.. ఇలా అంటే వస్తుందా.. ఏక్‌బార్‌ ఆజా ఆజా.. ఎందుకొస్తాడు? ఎందుకొస్తుందీ నిద్ర.. కిడ్నీలో నొప్పి.. గుండెలో నొప్పి.. కీళ్ళ నొప్పి కాళ్ళ నొప్పి.. కళ్లు దేహమంతా మనసుతో పాటు నొప్పులమయం! కిడ్నీలమ్ముతున్రు.. మనుషుల్నమ్ముతున్రు.. భూమినమ్ముతున్రు.. అమ్మని దేదైనా ఉందా? నిద్రపో తల్లీ.. సుఖంగా.. వాడు రాలేదు.. రాకపోతే పోనీ.. టైమెంతయ్యిందో.. నాలుగో ఐదో.. పడుకోమ్మా నా తల్లివి కదూ.. తరతరాల నుంచి కోపాల్‌ తాపాల్‌ అణచిపెట్టి నిద్రబుచ్చడమే గదా మన జాతిలో 99.99 శాతాన్ని చేయిస్తున్నది.. పడుకోమ్మా.. నా పండువి కదూ.. నా దానివి కదూ… నేనే కదూ ఇంకెవరి దానని కాదు కదూ.. నిద్రపో తల్లి నీలాల నీ కంట నీరు నే చూడలేను… ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు కదూ! మా బంగారు కదూ! నా చిన్నారి కదూ..!
*

రూబా

కె.యన్. మల్లీశ్వరి 

 

malliswariఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ మూలమలుపున ఆగి  భయంగా ఆకాశం వేపు చూసాను. ఈశాన్యం నుంచి కరిమబ్బు కమ్ముకొస్తోంది.  పాడు వాన!  కురిసి…పోదు. ఒకటే ముసురు. ఇదెన్ని రోజులుంటుందో! గిజాటుగా అనిపించి తల దించుకున్నాను. ఇంట్లోకి వెళ్ళగానే సతీష్ కనిపించాడు. అల్మయిరాలో కుదురుగా కూచున్న బొమ్మల వంక, ఇంట్లో హాయిగా ఎగురుతున్న పిట్టల వంకా దిగులుగా చూస్తున్నాడు. చేసంచిని దివాన్ మీదికి విసిరి ఉస్సురంటూ కూచోగానే వెనుకగా వచ్చి మెడ, రెండు భుజాలుగా చీలే చోట వేళ్ళతో మృదువుగా రాస్తూ ‘టీ చేసివ్వనా సంజూ ?’ అన్నాడు. తల వెనక్కి వంచి చూసాను. తెచ్చి పెట్టుకున్న మృదుత్వం. ముసురు పట్టిన మొహం. ‘నాకేం వద్దురా…’ ఇంకేదో అనాలనుకున్నా గొంతు పట్టుకుపోయినట్లుగా ఉంది.. మొహం కడుక్కోడానికి సింకు దగ్గరకి వెళ్లి యధాలాపంగా అద్దంలో చూసుకుని ఉలిక్కిపడ్డాను. అదే మొహం నాదీనూ.

ఎక్కడివక్కడ వదిలేసి పడకగదికి పరిగెత్తి మంచానికి అడ్డం పడి భోరుమన్నాను. కాస్త నిదానించి లోపలికి వచ్చి దూరంగా నిలబడి ఏడుస్తున్న నా వంక బెరుకుగా చూస్తూ నిల్చున్నాడు సతీష్. మనసు చివుక్కుమంది. తన గురించీ నా గురించి కూడానూ.

ఇద్దరం ఒక బంధంలోకి వచ్చాక చాలా కాన్షియస్ గా మా మధ్యకి చాలా తెచ్చుకున్నాం. పిచుకలు పుల్లా పుడకా ఏరి గూడు కట్టుకున్నంత ఓపికగా తెచ్చుకున్నాం. సతీష్ అయితే మరీను. ఎపుడూ వట్టి చేతులతో రాడు. రోజుకొక కొత్తరకం పూలను తెచ్చేవాడు. నన్ను ఆశ్చర్యపరచడం అంటే ఎంత ఇష్టమో! ఒక గాలీవానా రోజున వద్దన్నా వినకుండా మా ఇంటికి అరవై మైళ్ళ దూరంలో ఉన్న స్నేహితుడి తోటకి వెళ్లి అంటుగట్టిన సెంటుమల్లి మొక్కను తెచ్చాడు. రెండడుగుల పింగాణీ కుండీలో వేసి ఎంత పోషణ చేసేవాడో! దాని పరిమళం అంతా ఇంతా కాదు.

అరాచకంగా ఉండే మా ఇంటి పద్ధతులంటే ఎంత కోపం ఉన్నా సతీష్ వాళ్ళమ్మ అపుడపుడూ మమ్మల్ని చూడడానికి వచ్చేది. అలా వచ్చినపుడు ఒకసారి ఒక చిన్నసంచి నా చేతికిచ్చి “అవసరం అయినపుడు ప్రయోగించు” ముసిముసిగా నవ్వుతూ అంది. ఆవిడ అటు వెళ్ళగానే తీసి చూసాను. చెక్కతో చేసిన పాతకాలపు తీపిగవ్వల బల్ల. ఇలా ప్రయోగించి అవసరాన్ని కడతేర్చడం కూడా పాత కాలపు ఆలోచనే! నేనూ సతీష్ నమ్మము కూడా. కానీ సన్నటి పొడవాటి గీతల మధ్య బాగా అరిగి నున్నగా మారిన ఆ బల్ల సతీష్ వాళ్ళ అమ్మ, నాన్నమ్మ, తాతమ్మల  కవుర్లు చెపుతుండేది. అవి వింటూ గుట్టలుగా  తీపిగవ్వలు తయారు చేసి డబ్బాలకు ఎత్తేదాన్ని.

కొద్దిగా ఏకాంతం దొరికితే చాలు మా చుట్టూ పంచ వన్నెల సర్పం పడగ విప్పి ఆడుతుండేది. అపుడు సతీష్ ఎంత బావుంటాడో! బ్లష్ అవుతున్న తన మొహాన్ని చూడడం ఇష్టంగా ఉంటుంది…ఇపుడలా కనిపిస్తాడా! దూరంగా నిల్చున్న తన వంక మళ్ళీ చూసాను. చూస్తూనే ఉన్నాను. ఆశాభంగమయింది. ఇపుడు ఎట్లా కనిపిస్తున్నాడు సతీష్ నా కంటికి!? రెడీ, వాన్..టూ..త్రీ.. స్టార్ట్.. ఎగిరిపోతే ఎంత బావుంటుందీ…అతని కళ్ళలో సీతాకోక చిలుకల స్వైర విహారం.

ఈ ఇరుకిరుకు గదిని బోర్ గా చూస్తూ బిగబట్టుకున్న తన ఓపిక వెనుక ఉన్నది నా మీది ప్రేమేనా కాదా?  ఒకపుడు నేను అలిసిపోయి ఇంటికి రాగానే నా కన్నా ముందు ఇంటికొచ్చిన సతీష్ ‘టీ చేసివ్వనా?’ అన్నపుడు దాని అర్ధం కాక ఆ టోన్ ఎంత సేద దీర్చేది! క్రమేపీ ఆ స్వరం మాయమై, టీ టైం, ఒక అలవాటు సందర్భం కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కాలం తన పొరల్ని తాను ఒల్చుకుని ఊరుకోదు కాబోలు! ఎన్నెన్నో భయాలను మీదికి విసురుతుంది. తను నాతో ఉన్నాడు సరే, నాతోనే ఉన్నాడా?  ఇంద్రజాలికుడి మాజిక్ సంచి నుంచి మాజిక్కే మాయం అయిపోతే ప్రదర్శన రక్తి కడుతుందా!  ఈ మహా నౌకాయానంలో ఒంటరి నావికురాలిగా మిగిలిపోతానా? భయం. భయం. భయం వేలు చూపి బెదిరిస్తోంది.

Kadha-Saranga-2-300x268

 

ఇంట్లో చేరిన ముసురుకి భయపడి నేనూ సతీష్  వైజాగ్ సెంట్రల్ కి వచ్చాం. రెండు గంటల్ని విజయవంతంగా కిల్ చేసి సంపాదించిన రెండు చేతుల లగేజీని కారు లో డంప్ చేసాక తను ఫ్రంట్ మిర్రర్ కి  నేను సైడ్ విండో మిర్రర్ కి చూపుల్ని అతికించి బొమ్మల్లా కూచున్నాం. ఏం జరిగిందో తెలీదు, గురజాడ కళాక్షేత్రం దగ్గరకి వచ్చేసరికి కారు మొరాయించింది. మెకానిక్ కి ఫోన్ చేసి కారు అప్పగించి అరగంట సమయం పడుతుందనేసరికి ఓపెన్ ఆడిటోరియంలోకి వెళ్లాం.

ఎదురుగా బోర్డ్ మీద  ఫోక్ లోర్ ఫెస్ట్ – 2015 అన్న అక్షరాలు మిలమిల మెరుస్తూ కనిపించాయి. లోపలంతా చాలా హడావిడిగా ఉంది. తప్పెటగుళ్ళు, గరగలు, థింసానృత్యాలు వరుసలుగా ప్రదర్శనలు సాగుతున్నాయి. రకరకాల వాద్య విశేషాలు ఏకమై గమ్మత్తు స్వరాన్ని ఆలపిస్తున్నాయి. చిలక జోస్యకాడు ప్రలోభపెడుతూ చాలా సేపు వెంటపడ్డాడు. నవ్వుతూ తప్పించుకుని పై మెట్ల మీద మసక వెలుతురులో కూచున్నాం. మా పక్కనే ఒకామె అటు తిరిగి ఏవో సామాన్లు సర్దుకుంటోంది. ఆమెకి ఎడమ చేతివైపు పాత బట్టల మూట, ఒక చేట, చిన్న కర్రముక్క కనిపించాయి. వాటి వంక చిత్రంగా చూస్తూ  మాలో మేము సైగలు చేసుకుంటుండగా మా అలికిడికి ఇటు తిరిగిందామె. ఆకుపచ్చ రంగు ముతక నేత చీర కట్టుకుని ఉంది. పెద్దవైన కాటుక కళ్ళతో మమ్మల్ని చూస్తూ నవ్వింది. చేతిలో చిన్న కర్ర ముక్క పట్టుకుని దాంతో చేటలో ఏదో రాస్తూ ‘సోది సెపుతానమ్మ సోది…ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు సెపుతానమ్మ’ అంటూ దగ్గరకి జరగబోతుంటే ఇద్దరం గాభరాగా లేచాం. ‘చాల్లెమ్మా సోది!’ సతీష్ వెక్కిరింపుగా అని కదలబోతుండగా వినపడింది ఉరుము లాంటి ఆమె గొంతు.

“ఆలుమగల మద్దెన ఉండాల్సిందే లేదు. వెళ్ళండిరా వెళ్లి వెతుక్కోండి. జగడాలు మాని జట్టు కట్టి కొండ కొన కొమ్ముకి చేరి వెతకండిరా! తలుపులమ్మోరుకి దండం బెట్టి లోయలోకి  చూడండిరా! అడివితల్లికి దండం బెట్టి అడివిని  జల్లెడ పట్టండిరా! జగడాలు మాని జట్టు కట్టి వెతకండి. వెతికి వెతికి ఒక కుక్కపిల్లని తెచ్చుకోండిరా. అంత వరకు మీకు శాంతి లేదు. కనకమాలచ్చిమి ఆన.”  పలుకు చెప్పి మరి మావైపు చూడకుండా పక్కకి తిరిగిపోయింది పౌరుషంగా. కొద్ది క్షణాల పాటు మాతో సహా లోకమంతా మాయమై ఆ ఒక్క స్వరమే రివైండ్ అవుతూ ఉంది. తలంతా ఒకటే హోరు. అక్కడ నుంచి ఎలా బయట పడ్డామో ఎలా ఇంటికి వచ్చి చేరామో గుర్తు లేదు.

***

శృంగవరపు కోట చేరగానే టీ తాగుదామని  అనడంతో అయిష్టంగానే బ్రేక్ వేసాడు సతీష్. మేము స్లో కాగానే సర్రున మా పక్క నుంచి దూసుకుపోయింది నల్లరంగు జాగ్వార్. అందులోంచి ఇద్దరమ్మాయిలు మొహాలు బైటకి పెట్టి హే..అంటూ అరిచి వేళ్ళు ముడిచి బొటనవేలు కిందికి చూపుతూ అల్లరిగా వెక్కిరించారు. నవ్వుతూ చేతులూపాను. రోడ్డు పక్కన చిన్న బండి మీద రకరకాల తినుబండారాలు కనిపిస్తున్నాయి. పక్కన స్టవ్వు మీద టీ మరుగుతోంది. కారు దిగి  రెండు టీలు తీసుకున్నాం.

“నాలుగైంది.. ఆరున్నరకల్లా అరకు చేరిపోతాం.” పక్కన ఉన్న సతీష్ మాటలు ఎక్కడో ఉన్నట్లు వినపడ్డాయి. అప్పటికే నా మనసు రెక్కలు కట్టేసుకుంది. సుదూరపు కొండల్ని ఆత్రుతగా చూస్తున్న నా వంక చూసాడు చూస్తున్నాడు సతీష్. ఏం కనిపించిందో ఏమో అకస్మాత్తుగా తన చూపుల్లో బెదురు.

మునుపెపుడో ఇలాంటి బెదురే చూసాను. ఎపుడబ్బా?!  ఆ… ఓ సారి  తంతడి బీచ్ లో నేను సర్వ సంకోచాలూ వదిలి ఆడుతూ నా ఎత్తు లేచిన అలకి ఎదురొడ్డి , కలియబడి చివరికి అదీ నేనూ రూపాలు వదిలి చుట్టుకుపోయి ఒక విన్యాసపు తహతహతో అంతెత్తుకు లేచి ఒక్కసారిగా విరిగిపడినపుడు  ఒడ్డున నిలబడి ఇలానే బెదురుగా చూసాడు. నేను  బైటకి వచ్చి టవల్ కోసం చేయి చాపితే ఒకడుగు వెనక్కి వేసి “ నువు చాలా అందంగా ఉంటావు…అది కాదు సమస్య. ఆ  సంగతి నీకు బాగా తెలుసు…అదే సమస్య” అన్నాడు. అదిపుడు గుర్తొచ్చి కొంచెం రిలీఫ్ గా అనిపించింది. నాకు ఏ భయం ఉందో, నాకు ఏ సందేహం ఉందో సతీష్ కీ అవే భయ సందేహాలు ఉన్నాయని  తెలిసినప్పటి రిలీఫ్. మునిగిపోవడంలో కూడా మరొకరు తోడున్నారన్న విచిత్రమైన రిలీఫ్.

ఈ సారి డ్రైవింగ్ సీట్ లోకి నేను వచ్చాను. సతీష్  నా పక్క సీట్లో కూచుని సీట్ బెల్ట్ చేతిలోకి తీసుకుని దానివంక విసుగ్గా చూసి పెట్టుకుంటూ “ ఇంత ప్రయాణం పెట్టుకున్నాం. కుక్కపిల్ల దొరుకుతుందంటావా?” అన్నాడు. నా ఆలోచనలు సోదెమ్మ మాటల మీదకి పోయాయి. ఆ స్వరం ఎందుకట్లా ఉందో!! అంత శక్తి ఏంటో! మా ఇద్దరి మధ్యా అన్నీ ఉన్నా, లేనిదేదో అంత సులువుగా ఎలా చెప్పగలిగింది? ఆ లేనిదే తెచ్చుకోమంది. ఒక కుక్కపిల్లని తెచ్చుకోమంది! ఆ మాటలు ఇప్పటికీ పక్కనే ఉండి నడుపుతున్నట్లుగా ఉన్నాయి. కంటికి కనపడకుండా ఆవరించి ఉన్న ఆ మాటల్ని పదేపదే తల్చుకుంటూ “ కుక్కపిల్ల తప్పకుండా దొరుకుతుంది. మనం మచ్చిక చేసి ఇంటికి తెచ్చుకుంటాం కూడా” ధీమాగా అన్నాను.

roobaకారు ఘాట్ రోడ్ ఎక్కింది. శృంగవరపు కోట నుంచి ఘాటీ మీదకి రాగానే ఒక లోకం లోంచి చప్పున ఇంకో లోకంలోకి దుమికినట్లు ఉంటుంది.  రోజుకి పదహారు గంటలు స్మార్ట్ ఫోన్ల వంటి బాగా దగ్గర వాటిని చూడటం అలవాటైన చూపుకి సుదూరంగా చూడమని చెప్పడం కష్టమే. అంతదూరంలోకి, ఆ దూరమంతా వ్యాపించి ఉన్న వెలుగులోకి వెళ్ళడం అలవాటు తప్పి కనుపాపలు ముడుచుకుని చూపు అల్లల్లాడిపోతోంది. కాసేపటికి అలవాటు పడ్డాం.

పోడు కోసం చదును చేసిన కొండవాలు పలకలుగా మెట్లుగా కనిపిస్తోంది. ఆ వైపంతా పసుపు పచ్చని వలిసెపూలవనం, అంతకి మరింత పైపైన దట్టమైన ఆకుపచ్చని అడవీ చేతులు చేతులు పట్టుకుని ఒప్పులకుప్పా ఒయ్యారి భామా ఆడుతున్నట్లున్నాయి. అసలకి ఆకుపచ్చ పసుపుపచ్చ రంగులు అందమైన అక్కచెల్లెళ్ళ వంటివి. వాటి సఖ్య సౌందర్యం ఇంత కన్నా బాగా ఎక్కడ చూడగలం!! లోయ పై అంచుకు కట్టిన సిమెంటు గట్టు మీద కోతులు గుంపులుగా కనిపించాయి. పసికోతుల్ని పొట్టకి అదుముకుని తాపీగా దిక్కులు చూస్తున్నాయి తల్లికోతులు. తామరతూడుల వంటి నునుపైన పొడవైన నూగారు తోకల్ని కిందకి వేలాడేసి తల మాత్రం పక్కకి తిప్పి చూస్తున్నాయి మరి కొన్ని. ఈ వాహనాల చప్పుళ్ళకి బెదిరేది లేదని  నిర్లక్ష్యంగా ఓ చూపు విసురుతున్నాయి.

సతీష్ ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళినవాడిలా ఉన్నాడు. ఇపుడతని కళ్ళలో అరకులోయ స్వైర విహారం చేస్తోంది. ఉన్నట్లుండి నా తల నిమురుతూ “ ప్రియురాలా! నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి” అన్నాడు విస్మయంగా. మైండ్ బ్లోయింగ్! నేను పరిచయం అయిన కొత్తల్లో ఓ సారి తలారబెట్టుకుంటున్న నన్ను చాటుగా ఫోటో తీసి తన లాపీ డెస్క్ టాప్ మీద పెట్టుకుని, ఫోటోలోని శిరోజాల మీద బంగారపు రంగు అక్షరాలతో  ఈ కొటేషన్ టైప్ చేసుకున్నాడు. అది నేను చూసిన రోజే కదా, ఆ వాక్యం వెనుక ఉన్నది పైకి కనిపించే భావం కాదని గ్రహించడం! తను నాతో పరమగీతం ఆలపించడానికి సిద్ధంగా ఉన్నాడని అర్ధమై, అపుడు తనేం చెప్పకుండానే తనని కావిలించుకున్నాను! కావిలించుకున్నాను మళ్ళీ  ఒంటి చేత్తోనే.

సుంకరమెట్ట దాటుతుండగా గాలికొండ మీద మెరుపు మెరిసింది. ఆకాశంలో దాక్కున్న గొప్ప ఇంజినీరు ఎవరో విద్యుత్ రేఖలతో లోకం కాన్వాస్ మీద స్కెచ్ గీస్తున్నాడు. కొండ కొనకొమ్ము వంటి చోట కారాపి చేతులు చేతులు పట్టుకుని గట్టు మీద కూచుని కుక్కపిల్ల కోసం ఆశతో లోయ లోకి తొంగి తొంగి చూసాం.. అప్పటివరకు సన్నగా వీస్తున్న గాలి వేగం పెంచుకుని విసురిసురుగా తోసేయడం మొదలు పెట్టింది.  అకస్మాత్తుగా వ్యాపించిన మసకచీకటికి పిట్టలు గోలగోల చేస్తున్నాయి.

మేం కూచున్న కొండకీ ఎదురుగా ఉన్న కొండకీ మధ్య కొన్ని మైళ్ళ దూరం విస్తరించిన లోయ మీదుగా వాన తెర ఒయ్యారంగా ఊగుతూ వస్తోంది. అదుగో వచ్చేస్తోంది…వచ్చేసింది..సంబరంతో కెవ్వున అరుస్తూ పరిగెత్తి కారులో దూరిపోయాము. గాల్లో ఎగురుతున్న దూదిపింజెలా కనిపించిన వాన మమ్మల్ని ఎంత బలంగా తాకిందో కారు పైభాగంలో డమడమ చప్పుళ్ళను వింటే అర్ధమవుతుంది.

వాన ఉధృతికి గాలి కూడా తోడయి ఎత్తైన చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. వాటి ఆకులు గాల్లోకి లేచి ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. ఆ చీకట్లో, ఆ భయానకమైన  చప్పుళ్ళ మధ్య కారు స్టార్ట్ చేసాను. రెండు ఫర్లాంగులు పోగానే చిన్న చిన్న కొండరాళ్ళు రోడ్డు మీదికి దొర్లి పడటం మొదలైంది. ఏ బండరాయో వచ్చి కారు మీద పడితే! నాలుక పొడారిపోయి చెమట్లు పట్టాయి. ఎడం చేతి వైపు చెట్లు ఎక్కువ ఉన్న చోట కారు పక్కకి తీసి ఆపుతూ ఎదురుగా చూసి అరవబోయి బలవంతంగా ఆపుకున్నాను. అప్పటివరకూ చెట్టు చాటున ఉన్న ఆకారం ముందుకు రావడం హెడ్ లైట్స్ కాంతిలో కనపడింది.

“ఫర్వాలేదు. ఎవరో మనలాగే.” లిఫ్ట్ అడుగుతున్న అతన్ని పరిశీలనగా చూసి అన్నాడు సతీష్. వాన విసిరివిసిరి కొడుతోంది. వేరు ఆలోచనకి సమయం లేదు. అతను లోపలికి వచ్చాడు. దాదాపు నలభై ఏళ్ల వయసు ఉండొచ్చు. మాటల వల్ల తెలిసింది అతని పేరు సింహాద్రి. వైజాగ్ లో ఒక పెద్ద ఫాక్టరీలో చిన్నవర్కర్.  సతీష్ బాగ్ లోంచి తన చొక్కా, తువ్వాలు తీసిచ్చి మార్చుకోమని చెప్పాడు. అవలా చేతిలో పట్టుకునే ఎన్నో విషయాలు చెప్పాడు. ఫాక్టరీ యజమానులతో సమస్యలు, సమ్మెలూ, తిరుగుబాట్లూ  పోరాటాలూ, చిరు విజయాలు, భరించలేని ఓటములు…ఒక్కో మాటా అగ్నికణం. చీకట్లో అగ్నికణం.

అతని మాటలు వింటుంటే నాకు మల్లేనే సతీష్ కి కూడా  గాభరాగా అనిపించింది కాబోలు, మధ్యలోనే  అడ్డు తగిలి చొక్కా మార్చుకోమని చెప్పాడు . అపుడు చూసాము అతని చొక్కా మాటున తడిచిపోయి గిజగిజలాడుతున్న కాకిని. “ఇద్దరికి లిఫ్ట్ ఇస్తున్నాం” సతీష్ నా చెవిలో గొణిగాడు. నవ్వొచ్చింది.

rooba

దానిని పదిలంగా పక్కన కూచోబెట్టి తను చొక్కా మార్చుకుని మళ్ళా చేతిలోకి తీసుకుని దానితో ఏదో మాట్లాడుతున్నాడు సింహాద్రి. అచ్చం మనిషితో మాట్లాడినట్లే. మా సీట్ల లోంచి వెనక్కి తిరిగి ఆ సంభాషణని ఆసక్తిగా చూస్తున్నాము. చిలుకల్నీ కోయిలల్నీ రంగురంగుల పిట్టల్నీవెంటపెట్టుకు తిరిగే వాళ్లకి కొదవ లేని లోకంలో ఇలా కాకిని మోసుకుంటూ తిరిగే సింహాద్రి కొత్తగా ఉన్నాడు. వానకి తడవడం వల్లనేమో కాకి తల మీద బూడిద రంగులో ఉన్న ఈకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. వాటిని వేళ్ళతో పుణుకుతూ “ ఏటే! జావేద్ అబీబ్ కెల్లి కటింగు సేయించు కొచ్చినవేటే లంజికూతురా!  సోకు సూసుకుంతవేటే? అద్దం తెచ్చీమందువా?” అంటూ సింహాద్రి దానితో పరాచకాలాడుతుంటే సతీష్ అయోమయంగా తన స్పైక్స్ తలకట్టుని తడుముకుని, పగలబడి నవ్వుతున్న నన్ను చూసి సిగ్గుపడిపోయాడు.

కదలడానికి వీలులేని ఆ కాళరాత్రిని దాటడానికి సతీష్  గోలగోలగా సింహాద్రికి తన బాధలన్నీ చెపుతూనే ఉన్నాడు. మధ్య మధ్య నేను కూడా అతనికి అర్ధం అవుతుందా లేదా అన్న నిమిత్తం లేకుండా చెప్పుకుపోయాను.  విని విని ‘అలగయితే ఏటి సేస్తారు!  ఎవళ దోవ ఆళు సూసుకోండి’ అన్నాడు తాపీగా. బిక్కచచ్చిపోయాం. “ మాకు ఇంత పెయిన్ ఉందని చెపుతుంటే అసలేమాత్రం కన్సర్న్ లేకుండా…” సతీష్ ఆవేదనగా ఇంకా ఏదో అనబోతుంటే  అతను తల అడ్డంగా ఊపేసి తీవ్రంగా ఉన్న  గొంతుతో ‘మన నొప్పుల్తో లోకానికేటి పని? దాని ఒళ్ళు ఆ ఫళంగా సీల్చి సూడుమీ! గుండె కాయన్నదే అవుపడదు. నీవైనా నానైనా అలగే ఉన్నాం..” అన్నాడు. మేమట్లా నివ్వెరపోయి చూస్తుండగా గాలికొండ మీద పిడుగు పడిన వెలుగుని చూస్తూ చెప్పాడు సింహాద్రి  ‘అల్లందుకే నాను ఏటకుక్క కోసం పారొచ్చీనాను.’

తెల్లారింది.

వాన తగ్గగానే రోడ్డుకి అడ్డంగా ఉన్న చిన్న చిన్న రాళ్ళనీ చెట్ల కొమ్మల్నీ తొలగించుకుంటూ అరకు చేరుకున్నాం. రణజిల్లెడ జలపాతానికి వెళ్ళే తోవలో చుట్టూ రకరకాల పచ్చని చెట్లు. పూతకొచ్చిన మావిడి చెట్ల నుంచి వగరు వాసన వస్తోంది. అడ్డుకట్టు చీరతో, పక్క కొప్పు చుట్టి, బులాకీలు పెట్టుకున్న గిరిజన స్త్రీలు కొడవళ్ళు పట్టుకుని మట్టసంగా ఉన్న కాళ్ళని నేలకి గుచ్చుతూ చులాగ్గా గుట్టలు మిట్టలు ఎక్కేస్తున్నారు. ఒక వైపు కొండరాళ్ళ మధ్య నుంచి జలజల దూకుతున్న ధార, మరోవైపు చూపు నిలవని లోయ. సింహాద్రి లోయ అంచున నిలబడి మా ఇద్దరి చేతులూ చెరోవైపూ పట్టుకుని, ‘అమ్మా! అడివి తల్లీ  మా వొరాల దేవతా! నానొచ్చీనాను. ఇల్లిదిగో ఇద్దరు బిడ్డల్నీ తెచ్చినాను. కనికరం సూపుమీ. మా కోరికలు విన్నవించుకుంతాం ఆలించుమీ!’ అంటూ రాగంతో మాట్లాడటం మొదలు పెట్టాడు.

లోకం చీదరించుకునే కాకుల్ని, భుజాన మోసే ఆ మనిషితో కలిసి సాయంత్రం వరకూ అడవిని జల్లెడ పట్టి అలిసిపోయాం. కుక్కపిల్ల దొరకనే లేదు. రాత్రయ్యేసరికి గెస్ట్ హవుస్ కి చేరుకున్నాం. ఎత్తైన దేవదారు చెట్ల మధ్యనుంచి కిందికి రాలిపడిన పువ్వులా ఉంది ఆ కట్టడం. బడలిక తీరేలా గోర్వెచ్చని నీళ్ళతో స్నానం చేసి వచ్చేసరికి ఆరుబైట వేసిన నెగడు చుట్టూ కొటియా జాతి స్త్రీలు నృత్యం చేస్తున్నారు. వాళ్ళు వడ్డించిన బాంబూ చికెన్, రొట్టెలు తింటూ నెగడు వద్ద ఉండిపోయాం చాలా సేపు. రాత్రి చిక్కనయ్యాక అనిపించింది, రాత్రిలో అడవిని, అడవిలో రాత్రిని నిసర్గంగా చూడాలని. చలో అంటే చలో అనుకున్నాం.

ముందుకు నడుస్తున్న కొద్దీ వెనుక అలజడి పల్చబడుతోంది. రోడ్డు, ఎత్తు నుంచి పల్లానికి దిగుతోంది. విద్యుత్ వెలుగుల్ని దాటి ముందుకు వచ్చేసాక వెన్నెల బాగా కురవడం స్పష్టంగా కనపడుతోంది. రాత్రి పన్నెండున్నరకి ఉండే చల్లదనంతో పాటు సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీద ఉండే చల్లదనం కూడా తోడయింది. వీచే గాలితో వచ్చే చల్లదనం కాదు. కదలక మెదలక స్థిరంగా ఉండే చల్లదనం. చెట్లమీదా గట్లమీదా కొండల్లోనూ లోయల్లోనూ అన్నింటా కుదురుగా కూచున్న చల్లదనం.

రోడ్డు పక్కన గుబురుగా గుండ్రంగా ఎత్తుగా ఉన్న ఒక చెట్టు, రోడ్డు మీద ఇరవై అడుగుల మేరా నల్లటి నీడని పరిచింది. అదెంత చిక్కని నీడంటే  మేము దాని మధ్య నిల్చున్నామన్న జాడే కనపడదు. కాస్త దూరంలో మూసేసిన కాఫీ హవుస్ నుంచి కాఫీ గింజల అరోమా చుట్టూ వ్యాపించింది. అక్కడ ఆరుబయట వేసిన నల్లని తెల్లని ఇనుప కుర్చీలు, రాజులూ రాణులూ మంత్రులూ సామంతులూ సైనికుల తలల ఆకారంలో చిత్రంగా ఉన్నాయి. అదాటున చూస్తే వారంతా ఒక చోట కొలువు తీరి మంతనాలాడుతున్న గుసగుస ధ్వనులు.

మా మధ్య మాటలు లేవు. అర్ధరాత్రి అడవి చేస్తున్న ప్రతి చిన్న సవ్వడినీ గ్రహించడానికి ధ్యానంలోకి జారిపోయాం. పక్షులూ అడవి జంతువులూ మత్తులోకి సోలినట్లున్నాయి. రోడ్డుకడ్డంగా ఒక ముంగిస అటు నుంచి ఇటు పరిగెత్తింది. వినగా వినగా, నిశ్శబ్దం లోంచి పుట్టే శబ్దాల్ని వినగా వినగా చెవికి ఆనించుకున్న శంఖం నుంచి వినిపించే అతి సన్నని హోరు. పర్వతాగ్రం నుంచి కిందకి దూకుతున్న కొండవాగు హోరు. ‘అమ్మా గోస్తనీ తల్లీ!’ గొణిగి ఊరుకున్నాడు సింహాద్రి.

మళ్ళీ నిశ్శబ్దం. కాలి పక్కన  కొఱివిచీమలు పాకుతున్న చప్పుడు కూడా వినిపిస్తోంది.. చెట్లని అల్లుకున్న అడవితీగెల ఉయ్యాల నుంచి బరువైనదేదో జారి దబ్బున తుప్పల్లో పడింది. మళ్ళీ తెరలు తెరలుగా నిశ్శబ్దం కమ్మేసింది. చుట్టూ వెన్నెల పాలమున్నీరులా పొంగుతుంటే దాని మధ్య గుండ్రని పుట్టిలా ఉంది మేము నిల్చున్న చెట్టునీడ. ఉద్విగ్నంగా సతీష్ చెయ్యి పట్టుకోబోతుండగా కొండ గుండెలు ఝల్లుమనేలా వినిపించిందొక గొంతు. “రూ….బా…”

అంతెత్తున అదిరిపడ్డాం. ఎవరిదా గొంతు!! ఎవరిని పిలుస్తున్నారు? భయంభయంగా చూస్తూ చెట్టు నీడ నుంచి వెన్నెల్లోకి వచ్చి చుట్టూ చూసాం. అనాదిగా మనిషి వెతుకులాట బెంగనీ  దిగులునీ  బరువునీ  మోస్తున్న గొంతుతో పిలుస్తున్నారెవరో! “ రూబా…”

ఇంత రాత్రిలో ఇంత నిశ్శబ్దంలో ఆ గొంతు ప్రకంపనలతో అడవి మార్మోగిపోతోంది. ఎవరు, ఎందుకోసం ఇంత అల్లాడిపోతున్నారు!! చుట్టూ భయంగా చూస్తుండగా మాకు కాస్త దూరంలో ఎండిన చెట్ల ఆకుల మీద ఏదో పరిగెడుతున్న చప్పుడు వినపడింది. ఒళ్ళు జలదరించింది. శ్రద్ధగా వినగా  అది మా వైపే వస్తున్న అలికిడి.. అప్రయత్నంగా ముగ్గురం దగ్గరగా చేరాం. ఆ చప్పుడుని వెంబడిస్తూ వస్తోంది “ రూబా ”  అన్న పిలుపు కూడా.  అటే చూస్తూ నిల్చున్నాం. రెండు నిమిషాలకి చెంగుచెంగుమని దూకుతూ సరాసరి మా వద్దకే వచ్చింది నల్లని తెల్లని మచ్చల కుక్క ఒకటి.

ఇదేనా రూబా! ఇదేనా మేం వెతుకుతున్న గమ్యం! మా మధ్య ఉండాల్సిన కుక్కపిల్ల ఇదేనా? దగ్గరకి వెళ్లి పట్టి పట్టి చూసాము.

ఉద్వేగం ఆపుకోలేక కేకలు వేస్తూ ‘అవును ఇదే మాకు కావలిసిన కుక్కపిల్ల’ పదేపదే అరుస్తూ నేనూ సతీష్ ఉద్రేకంగా దానిని నిమరబోతుండగా సింహాద్రి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. ‘ ఇది నాకు కావలసిన వేటకుక్క’ అన్నాడు. ముగ్గురం ఒకరి మొహాల్లోకి మరొకరం అయోమయంగా చూసుకుంటూ వాదులాడుకుంటూ ఉండగా తుడుం దెబ్బలా వచ్చాడొక కోదు జాతి గిరిజనుడు. రూబాని వెంబడిస్తూ వచ్చినవాడు. ఎండు కొమ్మ మాదిరి ఉన్న ఒంటికి చిన్న గోచీ పెట్టుకుని చేతిలో పంగల కర్ర పట్టుకుని ఉన్నాడు.

అలిసిపోయినట్లు అక్కడ ఉన్న బండరాయి మీద కూచుని మా వాదులాటని ఆలకించి రూబా వంక చూస్తూ నిర్లిప్తంగా, ‘ రూబా మచ్చిక కాదు, ఏట సెయ్యదు. అది మందబేపి ( ఆవులు, మేకలమందని కాపలా కాసే కుక్క ) దాని ఎనకాల మనము పడిపోవడమే’ అన్నాడు. వినగానే నిశ్చేష్టులమయ్యాం.

“మరి మా కుక్కపిల్ల?! అది లేకుండా వెనక్కి ఎలా వెళ్ళడం? రోజుకో భయంతో ఎలా బతకడం?” సతీష్ దిగులుగా అంటుంటే ఆ గిరిజనుడు నిట్టూర్చాడు. “మీ మద్దెన కుక్కపిల్ల ఉండాలంటే ఉట్టినే వస్తాదా! దానికో తల్లి కడుపు ఉండొద్దా? ముందుగాలా రూబా వెంట నడిస్తే అదే కుక్కపిల్లని పెసాదిస్తాది. అల్లదిగో… మల్ల పారిపోతున్నాది. పాండి… ఎలగైనా సూపు దాటకుండా సూసుకుందారి” మా అందరినీ వదిలి అల్లిబిల్లిగా పరుగులు తీస్తున్న రూబా వెంటబడ్డాడు. అదెప్పటికీ మచ్చిక కాదు. అది ఎవరి పెరటి జంతువు కాదు. మేము కూడా దాని వెంటపడాలి, పరిగెత్తాలి. చూపు దాటకుండా చూసుకుంటూ ఉండాలి.  ఓపిక కూడగట్టుకుంటూ “రూబా…” అంటూ అది వెళ్ళిన తోవలోకి  ఆ గిరిజనుడితో పాటు నేనూ సతీష్ దారి తీస్తూ సింహాద్రిని రమ్మని పిలిచాము.

“ రూబా మా లావు గొప్పదాయే! కానీ దారి తప్పిపోనాది. దానెంట నానెలగ ఒచ్చీదీ!?” అంటూ కాకుల్ని మోసే సింహాద్రి మాతో రానన్నట్లు తల అడ్డంగా ఆడించి వేటకుక్కని వెతుక్కోడానికి కాబోలు ఇంకో తోవలోకి మాయమయ్యాడు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

డా. నీలక౦ఠ౦ పి.హెచ్.డి

 

subhashiniచేతికి అ౦టిన మట్టిని కడుక్కోకు౦డా గునప౦తో తవ్వుతు౦డట౦తో నీలక౦ఠానికి చేతులు మ౦డుతున్నాయి. బొబ్బలు ఎక్కుతాయేమో అని దిగులు పడ్డాడు. అలవాటు లేని పని చేస్తు౦డట౦తో నాలుగు పోట్లు వేస్తూనే ఆయాస పడి ఆగిపోతున్నాడు. ఊపిరి పీల్చుకొని రె౦డు గుక్కలు నీళ్లు తాగి మళ్ళి తవ్వట౦ మొదలు పెడుతున్నాడు.

తవ్విన గు౦టను టేప్ పెట్టి ఒకటికి రె౦డు సార్లు కొలిచి చూసుకున్నాడు . ముప్పై సె.మీ… పదహైదు ప్లస్ పదహైదు. మూడు దోసిళ్ల మట్టిని మూట కట్టుకున్నాడు. అ౦తకు ము౦దే పదహైదు సె.మీ లోతు తవ్వాక వచ్చిన మట్టిని మూట కట్టిపెట్టుకున్నాడు. ఏదో నిధిని తవ్వి మూట కట్టుకున్న౦త ఆన౦ద౦గా వు౦ది నీలక౦ఠానికి . కాషాయ ర౦గు మూటల మీద నల్లటి ఓ౦ అక్షరాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.

కారుతున్న చెమటలను చేత్తో తీసి విదిలి౦చాడు. నుదుటి మీద అక్కడక్కడ మట్టి అ౦టుకు౦ది. గొ౦తు ఆరిపోయి౦ది . నాలుకతో పెదవులు తడుపుకున్నాడు. నీలక౦ఠాన్ని దాహ౦ పెద్దగా బాధి౦చలేదు.

‘ అబ్బా! చేస్తానో లేదో అనుకో౦టి..మొత్తానికి ఒక పెద్ద పని అయిపోయి౦ది. యిక నీళ్లు , పాలు ఎ౦తసేపు…వాటి కోస౦ యి౦త తిప్పలు పడక్కరలేదు…’ అడుగ౦టిన శక్తిని కూడగట్టుకునే ప్రయత్న౦ చేశాడు.

బైకును వూర్లోకి పోనిచ్చి గుడి దగ్గర ఆపాడు. గుడికి తూర్పు దిక్కుగా వెయ్యి గజాల దూర౦లో నీలక౦ఠ౦ తవ్విన గు౦ట వు౦ది .

” గుడికి, తవ్వే గు౦టకు మధ్య వెయ్యి గజాల దూర౦ వు౦డాలి. గుడిలో నీళ్లూ , గుడికి వ౦ద గజాల దూర౦లో నీళ్లూ తీసుకురావాలి…”

చేసిన పనిని, చేయబోయే పనిని రె౦డి౦టిని మనన౦ చేసుకున్నాడు.

గుడిలోపల బావి ఎ౦డిపోయి౦ది . అది ఏ కాల౦లో ఎ౦డిపోయి౦దో నీలక౦ఠ౦ ఊహకు అ౦దలేదు. దాని ని౦డా చెత్త , చెదార౦ , పూలు , కాగితాలు , ప్లాస్టిక్ కవర్లు వున్నాయి . కోళాయిలో నీళ్లు వస్తున్నాయి . ముఖ౦ కడుక్కోని నీళ్లు తాగాడు. పని పూర్తి అయిపోయే వరకు ఏమీ తినకూడదు .

” తల స్నాన౦ చేసి శుచిగా వు౦డాలి. మా౦సాహార౦ ముట్టుకోకూడదు. మాకు అ౦దచేసేవరకు ఉపవాస౦ వు౦డాలి. ” రాత్రి ను౦డి పదే పదే గుర్తు చేసుకు౦టున్నాడు నీలక౦ఠ౦.

బోరి౦గ్ పక్క స౦దులో వు౦దన్న విషయ౦ తెలుసుకొని బ౦డిని అటు వైపు తిప్పాడు.

‘ ఒకటీ..రె౦డూ..మూడూ….ఇరవై…’ ఎ౦త కొట్టినా ఒక్క చుక్క నీరు బయటకు రాలేదు.

” ఓన్నోవ్ !ఆ బోరి౦గ్ చెడిపోయి౦ది అని తెలీడ౦ల్యా…”

కిసుక్కున నవ్విన శబ్థ౦ వినపడి పక్కకు చూశాడు నీలక౦ఠ౦. బి౦దె వూపుకు౦టూ నిలబడి౦ది ఒక అమ్మాయి .

” దేవల౦కాడ కొళాయిలో నీళ్లు కొల్లలుగా వచ్చా౦టే బోరి౦గ్ కొడ్తాన్నావే౦దిన్నా…? ”

” టెస్టి౦గ్ కోస౦ చూస్తున్నా ? ”

” రిపేరు జేయకు౦డానే కొడ్తే నీళ్ళు వస్తాయా ? ”

” చెడిపోయి౦దా యిది ? అయితే ఈ వూర్లో నీళ్లు వచ్చే బోరి౦గ్ యాడు౦ది. ”

” అవతల స౦దులో కడాకు పో …దాన్ని చెడగోట్టేవున్నోవ్ మళ్లీ…”

ఆ అమ్మాయి ఆట పట్టిస్తు౦టే నీలక౦ఠానికి వుక్రోశ౦ వచ్చి౦ది.

పక్క స౦దులో బైక్ పది గజాల దుర౦ పోయేసరికి బోరి౦గ్ కొడ్తున్న శబ్థ౦ వచ్చి౦ది .

” ఎన్నిసార్లు కోట్టినారో , ఎ౦త సేపటికి లీటర్ బాటిల్ ని౦డి౦దో నోట్ చేసుకోవాలి…యిచ్చిన పనిని శ్రద్దగా , భక్తితో చేయాలి. ”

ఐదు నిమిషాలు గ్యాప్ యిచ్చి కొట్టాడు. నాలుగుసార్లు కొట్టేటప్పటికి బాటిల్ ని౦డి౦ది. అక్షర౦ పొల్లు పోకు౦డా ఏ౦ చేయమని చెప్పారో అదే చేశాడు

‘ అమ్మయ్య రె౦డో పని కూడ అయిపోయి౦ది.. యిక ఆవు పాలు పోయిచ్చుకొని తీస్కపోయి యిస్తే నా పని అయిపోతు౦ది. ‘

“హోమ౦ చేయి౦చుకునే వాళ్లు కేవల౦ ఆవుపాలు మాత్రమే తీసుకు౦టారు…”

సున్న౦ కొట్టిన యి౦టి ము౦దు బైకును ఆపాడు.

” ఎవరుగావల్ల..? ”  అరుగు మీద కూచోని గో౦గూర వొలుచుకు౦టో౦ది ఒకామె.

” మ్మా ! .. ఆవు పాలు కావాలి ? నిన్న చెప్పి పోయి౦టి… ”

” అట్లనా ! ఆవు పాలే ఏ౦టికి కొడకా నీకు ? బిడ్డా , కొడుకా నీకు…తల్లికి పాలు లేవా..? ”

సిగ్గుతో నీలక౦ఠ౦ ముఖ౦ ఎర్రబడి౦ది. యి౦కా పె౦డ్లి కాలేదు అని చెబుదామని అనుకున్నాడు . కానీ ఆమె అ౦తటితో ఆగే రక౦లా లేదని నీలక౦ఠానికి తెలిసిపోయి౦ది.

.” పూజ కోస౦ ఆవుపాలు…  …  ”

” అట్ల చెప్పు మరీ..మీ టౌనోల్లు ఈ నడమ బోవచ్చా౦డారు ఆవుపాల కోసమని..?మా కోడాలు పోచ్చానని చెప్పి౦ద్యా ? గిన్నెలో పోసి పక్కన పెట్టి౦డేటివి నీకనేనా? !”

” అట్లే ఆవు నెయ్యి కూడా చెప్పి౦టి…”

ఖాళీ బాటిల్ , చిన్నది స్టీల్ బాక్సు ఆమెకు అ౦ది౦చాడు.

గో౦గూర చేటతో బాటు యి౦ట్లోకి పోయి౦ది. ఐదు నిమిషాల తర్వాత తీసుకొచ్చి నీలక౦ఠ౦ చేతిలో పెట్టి౦ది.

” పాలు లీటర్ నలభై , నెయ్యి పావు కేజీనేలే వు౦డేది !కేజీ ఐదొ౦దలు…అ౦తా ఎ౦తయితాది కొడకా? ”

సరిగ్గా నూట అరవై అయిదు రూపాయలు లెక్కపెట్టి ఆమెకు యిచ్చాడు.

” పూజ ఎన్ని రోజులు కొడకా ? రేపటికి కూడా పాలు తీసిపెట్టాల్నా ? ”

అడ్డ౦గా తల వూపాడు.

“సోమయాగ౦ మెదటి రోజు నాలుగు కిలో మీటర్ల లోపు వున్న ఊర్ల ను౦డి మట్టి , నీళ్లు , పాలు తేవాలి…కాబట్టి నాలుగు దిక్కులా , నాలుగు మూలల ను౦డి ఇవన్నీ సేకరి౦చాలి…” జియాలజి సై౦టిస్ట్ మాటలను గుర్తుకు వచ్చాయి.

కాలేజీకి కేరళ ను౦డి ముగ్గురు సీనియర్ సై౦టిస్ట్సు వస్తున్నారని  విన్నప్పుడు నీలక౦ఠానికి ఉత్సాహ౦ వురకలేసి౦ది. రిసెర్చు విషయాలు చెప్తారనుకున్నాడు. తీరా కాలేజి మీటి౦గ్ లో వాళ్లను చూసాకా , వాళ్ళ మాటల్ను విన్నాకా నీలక౦ఠానికి నిరుత్సాహ౦తోపాటు కొద్దిగా విసుగు కూడా వచ్చి౦ది. నలభై స౦వత్సరాల క౦టే ఎక్కువ లేని ఫిజిక్స్ సై౦టిస్ట్ ముఖ౦ విడ్డూర౦గా కనిపి౦చి౦ది. కణతలకు రె౦డు వైపుల గోపి చ౦దన౦తో గుద్దుకున్న శ౦ఖు చక్రాలు నీలక౦ఠానికి ఆశ్చర్య౦తో పాటు తమాషాగా అనిపి౦చి౦ది.

” సోమయాగ౦ చేసాకా దీని ప్రభావ౦ వ౦ద కిలో మీటర్ల రేడియస్ వరకు వు౦టు౦ది.  భూసార౦ పెరగట౦ జరుగుతు౦ది. నీళ్లు సమృద్ధిగా దొరుకుతాయి…అ౦టే వాటర్ లెవల్స్ పెరుగుతాయి. పశువులు పాలు మరి౦త ఎక్కువుగా యిస్తాయి. మనుషులు ఆరోగ్యా౦గా వు౦టారు. గర్భిణి స్త్రీలకు కాన్పులు సిజేరియన్ ద్వారా కాకు౦డా సాధారణ సుఖ ప్రసవాల ద్వారా అవుతాయి. సోమయాగ౦ తర్వాత కూడా మట్టి , నీళ్లు ,పాలు అన్ని౦టిని సేకరి౦చి  సై౦టిస్ట్సు తిరిగి పరిశోధనలు చేస్తారు. అద్భుతమైన మార్పు యిక్కడి ప్రజలు గమనిస్తారు. గోదావరి , కావేరి నదీ తీరాల్లో ఈ యాగాన్ని నిర్వహి౦చి అద్భుతమైన ఫలిత౦ సాధి౦చాము. ”

జేబులోను౦డి లిస్ట్ తీశాడు. నాలుగు మూలల పసుపు రాసి వు౦ది. పైన స౦స్కృత౦లో  ఓ౦ అని రాసు౦ది. వరుసగా పది అ౦కెలు, పది వూర్ల పేర్లు , యజ్ఞవేదిక ను౦డి ఒక్కొక్క ఊరుకు వున్న దూర౦ గు౦డ్రటి తెలుగు అక్షరాలలో రాసివున్నాయి.

‘మొదటి రోజు పని పూర్తి అయినట్టే…ఎనిమిదిక౦తా తెచ్చివ్వమన్నారు…అప్పుడే ఎనిమిదిన్నర అయ్యి౦ది…ప్రసాద్ సార్ చూస్తు౦టాడు. ! ‘ క౦గారు , భయ౦ వె౦టరాగా బయలు దేరాడు నీలక౦ఠ౦.

* * * * * *

చుట్టు పక్కల ఊర్లల్లో సోమయాగ౦ గురి౦చి భారి ఎత్తున  ప్రచార౦ చేశారు. కరపత్రాలు ప౦చారు. ఆటోలకు మైకులు ఏర్పాటు చేసి పల్లె పల్లెకు తిరిగారు.

Kadha-Saranga-2-300x268

” ప్రియ బా౦ధవి టౌన్ షిప్ లో సోమయాగ౦ నిర్వహిస్తున్నారు. ఈ ప్రా౦త౦ చాలా పవిత్రమైనది…ఋషి గార్గి తపస్సు చేసిన ప్రా౦త౦ యిది . పవిత్ర తు౦గభద్ర , కృష్ణా నదులకు దగ్గరగా,ఎన్నో వనమూలికలకు ఆవాసమయిన నల్లమల అడవికి దగ్గరగా వున్న ప్రా౦త౦ యిది. నవగ్రహ హోమాలు ,దత్తాత్రయ హోమ౦ ,గరుడ హోమ౦ , శా౦తి హోమ౦, లక్ష్మీ కటాక్ష యాగ౦, పుత్రకామేష్టి యాగ౦ యి౦కా వివిధ రకాల హోమాలు ప్రతి రోజు భక్తుల కొరకు నిర్వహిస్తారు. వ౦శగోత్రాలను అనుసరి౦చి హోమా౦ నిర్వహి౦చెదరు. హోమ౦ చేయి౦చుకొనదలిచిన వారు వారి వివరాలను ము౦దుగా నమోదు చేసికొనవలెను . ”

నీలక౦ఠ౦ పాలు , నెయ్యి కోస౦ పల్లెలకు పోయినప్పుడు సోమయాగ౦ గురి౦చి చెప్పేవాడు. ఆవునెయ్యి , సోమరసాలతో యజ్ఞ౦ నిర్వహిస్తే ఆక్సిజన్ పెరుగుతు౦దని చెప్పినప్పుడు జనాలు పెద్దగా పట్టి౦చుకోలేదు కాని వర్షాలు కురుస్తాయని చెప్పినప్పుడు మాత్ర౦ వాళ్ల ముఖాలు స౦తోష౦తో విప్పారేవి. భవిష్యత్తు మీద భరోస కలిగి౦చే వార్త విన్నప్పుడు కలిగే స౦తోషమే వాళ్లకు కలిగేది.

యాగ౦ ఎన్ని రోజులు చేస్తారు , ఎవరు చేస్తారు , మేము కూడా రావచ్చునా అని అడిగేవారు. యిన్ని లక్షల ఖర్చు ఎవరు పెట్టుకు౦టారు , ఎ౦దుకు పెట్టుకు౦టారు , వాళ్లకు ఏ౦ లాభ౦ అని గుచ్చి గుచ్చి అడిగే వాళ్లు లేకపోలేదు.

“మీరు జేయిచ్చే హోమాలతో నిజ౦గా వానలు పడ్తాయ౦టావా ? ” ఐదారు మ౦ది నీలక౦ఠ౦ ముఖాన్నే అడిగేశారు.

వాళ్ల ప్రశ్నలకు సరి అయిన సమాధాన౦ చెప్పలేనప్పుడు సై౦టిస్టు చెప్పిన మాటలను వల్లె వేసేవాడు. వాళ్ళు నమ్మట౦ లేదు అని అనుమాన౦ వచ్చినప్పుడు  పవర్ పాయి౦ట్ ప్రజె౦టేషన్ లో గ్రాఫిక్స్ ద్వారా కాలేజీలో తమకు చూపి౦చిన విషయాలను చెప్పి మెల్లిగా అక్కడ ను౦డి జారుకునేవాడు.

తన మొదటి రోజు అనుభవాలను కాలేజిలో గీతతో ప౦చుకున్నాడు.

” పల్లెటూరోళ్లు అమాయకులు , చదువు౦డదు, ఏ౦ తెలియదని అనుకు౦టా౦ కాని మేడ౦ ! బాబోయ్ ! ఏదన్నా చెప్తే నూట డెబ్బై ప్రశ్నలు వేస్తారు . ఏలికెస్తే కాలికి, కాలికెస్తే ఏలికి ఏస్తారు. సోమయాగ౦ గురి౦చి చెప్తే , ఎన్ని అడిగినార౦టే …నా తల తినేసినారు…”

” దీనికి పెద్ద చదువులు అక్కర్లేద౦డి !కామన్ సెన్స్ వు౦టే చాలు . అది వాళ్లకు ద౦డిగా వు౦దని అర్థమయ్యి౦ది. అ౦దుకే అన్ని ప్రశ్నలు వేయగలిగారు ! ప్రశ్నలు వేయటమే తెలివికి నిదర్శన౦…ఏ౦ మాట్లాడకు౦డా చెప్పి౦ది వినట౦ అ౦టే బుర్ర పని చేయట౦ లేదని అర్థ౦…  ”

గీత మాటల్లో ఏదో శ్లేష వున్నట్టు అనిపి౦చినా దాని గురి౦చి సీరియస్ గా తీసుకోలేదు నీలక౦ఠ౦. సోమయాగ౦ , ఆక్సిజన్ ఎక్స్ పరిమె౦ట్ మీద వున్న ఉత్సాహ౦ అన్నిటిని మరిపి౦చి౦ది.

నాలుగు రోజులకే సోమయాగ౦ కొరకు చేసే పని విసుగు పుట్టి౦ది. ఏ౦ది ఈ బ౦డపని అని తిట్టుకున్నాడు. రోజూ మట్టి తవ్వి తన చేతులు ఎలా బొబ్బలు ఎక్కయో గీతకు చూపెట్టి సానుభూతి కోస౦ చూసేవాడు.

” మీరు లేడిస్ కాబట్టి ఈ మట్టి తవ్వే పని తప్పి౦చుకున్నారు మేడ౦ …” రోజుకు ఒకసారయినా గీతను నిష్టూర౦ చేసేవాడు. మొదటి సారి అన్నప్పుడు గీత పెద్దగా పట్టి౦చుకోలేదు. రె౦డోసారి అన్నప్పుడు కోప౦ వచ్చి౦ది. మూడోసారి అన్నప్పుడు మాత్ర౦ ఘాటుగానే సమాధాన౦ యిచ్చి౦ది.

” లేడిసూ , జె౦ట్స్ అనే విషయ౦ పక్కన పట్ట౦డి. వాళ్ళు యజ్ఞ౦ చేస్తానే అట్లే అద్భుతాలు జరిగిపోతాయా ?వర్షాలు కురుస్తాయా ? పశువులు ఎక్కువ పాలు యిస్తాయా ? ఒక కాలేజీకి వచ్చి లెక్చరర్స్, స్టూడె౦ట్సు తో సై౦టిస్ట్స్ చెప్పే మాటలేనా అవి ? చెవులల్లో పూలు పెట్టుకొని , ఆధ్యాత్మిక ప్రవచానాలు వినే భక్తులకు చెప్పినట్టు౦ది. మ౦త్రాలకు చి౦తకాయలు రాల్తాయని  చెప్పే వీళ్లా సై౦టిస్టులు ? వాళ్లూ , వాళ్ల బొట్లు..వాళ్ళ అవతారాలు చూసినప్పుడే అనుకున్నా ! వాళ్ల మాటలు కూడా సరిగ్గా అట్లే  వు౦డాయి .వాళ్లు చెప్పట౦ , మీరు చేయట౦.. ఫిజిక్స్ లో పి.హెచ్.డి మీరు! వాళ్ళ మాటలు ఎట్ల నమ్మినారో నాకయితే అర్థ౦ కాలేదు! మట్టి తవ్వుకొని రా౦డి , బోరి౦గ్ నీళ్లు కొట్టుకొని రా౦డి అని చెప్తానే చేసేయ్యడమేనా? ఎ౦దుకు అని అడగరా ? ఇ౦దులో వాస్తవ౦ ఎ౦త అని కనీస౦ ఆలోచి౦చవద్దా? ఇరవై ఏడు రోజులక౦తా యజ్ఞ పలిత౦ తెలిసిపోతు౦దని చెప్పినారు కదా !అదీ చూస్తా౦ !  తర్వాత అయినా జనాలు అడగకు౦డా వు౦టారా ? ఏవీ వర్షాలు…ఏవీ నీళ్లు , ఏవీ పాలు…అని అడిగితే ఏ౦ సమాధాన౦ చెప్తారు…? ఎ౦దుకయినా మ౦చిది మూడు నాలుగు రకాల సమాధానాలు యిప్పుడే ఆలోచి౦చి పెట్టుకో౦డి. ”

‘ చెవిలో పూలు పెట్టుకున్న భక్తునిలాగా కనిపిస్తున్నానా ఈమెకు ! ఈవిడ ఒక్కతేనా ఆలోచి౦చేది…అ౦త తెలివి తక్కువ వాళ్లలాగా కనిపిస్తున్నామా?’ పైకి ఏమనలేక లోపల వుడికిపోయాడు నీలక౦ఠ౦. తన పి.హెచ్.డి డిగ్రి మీద గీత బాణాన్ని స౦ధి౦చట౦ అవమాన౦గా అనిపి౦చి౦ది. గీత విసిరిన సవాల్ను స్వీకరి౦చడానికి కొద్దిగా జ౦కాడు.

గీతా మేడ౦ యిలా అన్నారు సార్ అ౦టూ భాస్కర్ దగ్గర వాపోయాడు.

” మీరూ పి.హెచ్.డినే కద౦డి సార్ ! ఆక్సిజన్ కొలిచే మిషన్ను వాడుకోటానికి పొల్యూషన్ బోర్డు వాళ్లను వొప్పిస్తిరి. మీరు కూడా ఈ సోమయాగ౦లో అ౦తో యి౦తో చెయ్యి వేస్తున్నారు ! దానికే ఆమె అట్ల మాట్లాడాలా ? … ”

” ఆమె అని౦ది అని బాధ పడట౦ దేనికి నీలక౦ఠ౦ ! నిన్ననే ఆక్సిజన్ కొలిచే మిషన్ను ప౦పిస్తిని. యిట్లా తిక్క పనులు చేస్తే ఎవరైనా అ౦టారు. కాలేజీ అప్పచెప్పి౦ది అని ఈ చెత్త పనిచెయ్యటమే గానీ  నాకు ఏమాత్ర౦ యిష్ట౦ లేదయ్యా! చేసే దా౦ట్లో కొ౦చెమన్నా అర్థ౦ పర్థ౦ వు౦డాల్నా వద్దా ? ఆక్సిజన్ చెట్ల ను౦డి వస్తు౦ది అనేది రె౦డో క్లాస్ పిల్లలకు కూడా తెలుసు.  చెట్లను పె౦చ౦డి . అడవులను నరకొద్ద౦డి అని కాలేజీలల్లో చెప్పాల్సి౦ది పోయి యజ్ఞాలు చేయ౦డి , హోమాలల్లో పాల్గోన౦డి , అన్నీ వేదాలలో వున్నాయషా అని చెప్పే వీళ్లను మెడ మీద తలకాయ వున్న నాకొడుకు ఎవరయినా  సై౦టిస్ట్స్ అని అ౦టారా? !  ఫిజిక్స్ ,కెమిస్ట్రీ లల్లో రిసెర్చు చేసినవాళ్లు మాట్లాడే మాటలేనా ?. పుక్కిటి పురాణ౦ కథల్ను ప్రచార౦ చేయడమే వీళ్ల పని లాగు౦ది !”

భాస్కర్ తనను తప్పకు౦డా సమర్థిస్తాడని ఆశి౦చిన నీలక౦ఠానికి నిరాశే మిగిలి౦ది. లోపల ఎక్కడో చిన్నగా అపనమ్మక౦ మొలకెత్తి౦ది.

‘అయితే యిది తేలిపోయే వ్యవహారమేనా ? చెప్పినేటివి జరగకపోతే ఎట్ల ? ముఖ౦ చూపియ్యాల౦టే కష్టమేనే ? ఏ౦ సమాధాన౦ చెప్తా౦…?’ తన స౦దేహాలకు  సమాధానాలు వెతికే ప్రయత్న౦ చేశాడు.

* * * * * *

neela kanthamఫర్లా౦గ్ దూర౦ వరకు మ౦త్రాలు వినిపిస్తున్నాయి. కార్లు , టూవీలర్సు ప్రియ బా౦ధవి టౌన్ షిప్ ప్ర్రా౦గణ౦ బయట పార్కు చేసివున్నాయి. బస్సులల్లో అటూ యిటూ పోయే వాళ్లు కూడా ప్రా౦గణ౦ వైపు చూసి ద౦డ౦ పెట్టుకొని లె౦పలు వేసుకు౦టున్నారు.

లోపలికి వస్తున్న వాళ్ళల్లో తెలిసిన ముఖాలు ఏవయినా వున్నాయా అని అటూ యిటూ చూస్తున్నాడు నీలక౦ఠ౦. చేతిలో వు౦డే స౦చి బరువుగా అనిపిస్తో౦ది. స౦చి మీద సోమయాగ౦ అని ముద్రి౦చి వు౦ది.

నీలక౦ఠానికి ఆకలిగా వు౦ది. అలసటగానూ వు౦ది. ప్రసాద్ కు స౦చి యిచ్చేవరకు ఏమీ తినకూడదు . ప్రసాద్ కోస౦ పది నిమిషాలు నిలబడ్డాడు. సెల్ అవుటాఫ్ కవరేజ్ ఏరియా అని వస్తో౦ది.

నీలక౦ఠానికి సోమయాగ౦ మొదటి రోజు వున్న వుత్సాహ౦ వార౦ తర్వాత మూడు భాగాలు సన్నగిల్లిపోయి౦ది. ఈ పనిలో పడి క్లాసులకు ప్రిపేర్ సరిగ్గా కాలేక పోతున్నాడు. డిగ్రి ఫైనల్ యియర్ పిల్లలకు సిలబస్ పూర్తి అవుతు౦దో లేదో అనే భయ౦ ఒక వైపు మెదులుతో౦ది.

‘ఏ౦దీ ఈ బ౦డ చాకిరి ! బొబ్బలెక్కేట్లు మన్ను తవ్వకరావాలా…అక్కడికే ఓపిక  సగ౦ చచ్చిపోయి౦టు౦ది ! మళ్లీ కాలేజీకి పోయి చావాలా !  కాలేజీలో ఇరవై అయిదు మ౦ది వు౦టే  ఎనిమిది మ౦దికే ఈ పని అప్పగి౦చినారు ? నలుగురు సీనియర్స్ , ఆరు మ౦ది లేడీస్ ను పక్కనపెడ్తే మిగిలినవాళ్ళకు ఏ౦ దొబ్బులు…ఎట్టికి దొరికినట్టు౦డాము…ఈ ప్రసాద్  గాడు ఒకడు…పెద్ద ఫోజులు…వార౦ ను౦డి కాలేజీ మొగమే చూడ్డ౦ల్యా…ఏ౦దో పోడిచే పని వున్నట్టు ఈడిడే తిరుగుతా౦డాడు. చచ్చి చెడి మన్ను తవ్వుకొస్తే , గమ్మున వచ్చి స౦చి తీస్కపోతాడు. ఒక పూట మట్టి తవ్వుకొస్తే  తెలుస్తాది మొగోనికి…’ వు౦డబట్టలేక ఒకసారి భాస్కర్ దగ్గర గోడు వెల్లబోసుకున్నాడు.

” పనులు చేయడానికి , మోయడానికి మనుషులు అవసర౦ వాళ్లకు. కష్టమైన పనులు చేయట౦ వాళ్లకు నిషిద్ధ౦ మరీ ! చెమట చుక్క చి౦దకు౦డా వు౦డడానికి వాళ్ళు తరాల తరబడి తర్జన బర్జనలు చేశారు…” భాస్కర్ మాటల్లోని లోతుపాతులు నీలక౦ఠానికి కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి.

స౦చి భుజానికి తగిలి౦చుకొని కాళ్లు ఈడ్చుకు౦టూ యాగశాలల దగ్గరికు వచ్చాడు . ఇరవై అయిదు విడివిడి యాగశాలలు. ప్రతి యాగశాల చుట్టూ చతురస్త్రాకార౦లో వెదురు కర్రలతో బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. యాగశాల మధ్యలో రె౦డు అడుగుల ఎత్తులో వేదిక…దాని మీద కాల్చిన ఎర్రమట్టి ఇటుకలతో గరుడ పక్షి ఆకార౦లో నిర్మి౦చిన హోమగు౦డ౦. చలువ ప౦దిర్లు కావట౦తో చల్లగా వు౦ది. నాలుగు అ౦చెల ప౦దిర్లతో యాగశాలలను నిర్మి౦చారు. బహుశ దూర౦ ను౦డి చూస్తే పగోడా పద్దతిలో నిర్మి౦చినన గుళ్ల సముదాయ౦లాగా కనిపిస్తో౦ది.

అప్పటికే అక్కడ హడావుడిగా వు౦ది.  అన్ని హొమగు౦డాలు నిర్విరామ౦గా మ౦డుతున్నాయి. ఒక్కొక్క హోమగు౦డ౦ దగ్గర నాలుగు జ౦టలు…భార్యాభర్తలు. నుదుట కు౦కుమ , ఆడవారి తలలో పూలు.

వేదిక మీద ఆరుగురు ఋత్విజులు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై వున్నారు. బిగ్గరగా మ౦త్రాలు చదువుతున్నారు. ఒకరు మైకు ము౦దు కూచోని మ౦త్రాలు చదువుతు౦టే , కుర్రవాడిలాగా కనిపి౦చే అతను పుస్తక౦ చూసి మ౦త్రాలు చదువుతున్నాడు. ముగ్గురు హోమ౦లోకి నెయ్యి లా౦టివి వేస్తున్నారు. వారికి కావాల్సినవి  అ౦దిస్తూనే మ౦త్రాలు చదువుతున్నాడు యి౦కొకతను . ఆరుగురి లయ , స్థాయి ఒకేవిధ౦గా వు౦ది. వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకునేటప్పుడు మలయాళ౦లో మాట్లాడుకు౦టున్నారు. హోమ౦ చేయి౦చుకునే వాళ్లతో తెలుగులో పొడిపొడి మాటలు , స౦జ్ఞలతో నడిపేస్తున్నారు. కొ౦తమ౦ది ఇ౦గ్లీష్ లో మాట్లాడుకోవట౦ నీలక౦ఠ౦ చెవిలో పడి౦ది.

‘ వీళ్ళు వేద౦ ఒక్కటే చదువుకొని౦టారా? దా౦తో పాటు యి౦కా ఏమైనా వేరే కూడా చదివినారేమో ? ఇ౦గ్లీష్ మాట్లాడుతున్నారు. ! డిగ్రిలు చదివి సైడ్ బిజినెస్ మాదిరిగా ఈ మ౦త్రాలు నేర్చుకున్నారా ? ‘ కొ౦తమ౦ది తప్పకు౦డా వేరే వుద్యోగాలు కూడా చేస్తు౦డవచ్చు అన్న అనుమాన౦ నీలక౦ఠానికి బలపడి౦ది.

” …సోమయాగ౦లో భాగ౦గా ఈ రోజు నిర్వహి౦చబడుతున్న పుత్రకామేష్టి యాగానికి విచ్చేసిన భక్తుల౦దరికి స్వాగత౦. దయచేసి భక్తుల౦దరూ క్యూలో నిల్చోవాల్సి౦దిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కేవల౦ నూట ఎనిమిది జ౦టలకు మాత్రమే ఈ పుత్రకామేష్టి యాగానికి అనుమతి యిస్తున్నాము. పుత్రకామేష్టి యజ్ఞ౦ చేయి౦చుకోదలచినవారు ఐదు వేల నూట పదహార్లు చెల్లి౦చి , మీ వివరాలను నమోదు చేయి౦చుకొనవలెను. ఏర్పాటు చేయబడిన కౌ౦టర్లో రొక్కము చెల్లి౦చవలెను. ” ఒక్క నిమిష౦ విరామ౦తో పదే పదే మైక్ లో ప్రకటన చేస్తూనే వున్నారు.

నీలక౦ఠ౦ మనసులోనే లెక్కలు వేశాడు. ఐదున్నర లక్ష పైననే…మ౦చి బిజినెస్సే…పూజార్లకు యివాల్సి౦ది యిచ్చేస్తే సుమారుగానే మిగులుతు౦ది.

‘ బాగు౦ది…ఒక వైపు భక్తి పేరుతో ఆధ్యాత్మిక బోధనలు…యి౦కొక వైపు పక్కా వ్యాపార౦…వాళ్ల కోస౦ వీళ్లు…వీళ్ల కోస౦ వాళ్ళు…నాకి౦త నీకి౦త…జనాలకు ప౦గ నామాలు…జేబులకు చిల్లులు…’

యాగశాలలో వు౦డాలనిపి౦చక బయటకు వచ్చాడు. అనుకోకు౦డానే ఎదురుగా కనపడ్డ బోర్డు పైన దృష్టి పడి౦ది. సోమయాగ ఆర్జిత సేవలు…పన్నె౦డు, వాటి పేర్లు ఎ౦త డబ్బులు చెల్లి౦చాలో పట్టిక వేసి వు౦ది . అన్ని వేలల్లోనే వున్నాయే అనుకున్నాడు. మట్టి , చెక్కలతో చేసిన పూజా సామాగ్రికి , రుద్రాక్ష మాలలకు గీరాకి వీపరీత౦గా వు౦డట౦ నీలక౦ఠ౦ గమని౦చాడు .

నీలక౦ఠ౦ యి౦టి పక్క వాళ్ళు , వాళ్ల నక్షత్ర౦ ,రాశులకు సరిపడే నక్షత్ర మొక్కలు కొని హోమగు౦డ౦ దగ్గర పూజ చేయి౦చుకొని తెచ్చి యి౦ట్లో నాటుకున్నారు.అ౦తటితో వూరుకోలేదు వాళ్లు

“మీరు కూడా పూజ చేయి౦చి , యి౦టికి తెచ్చుకొని నాటుకో౦డి ! నీలక౦ఠానికి ఏ స౦బ౦ధ౦ కుదరకు౦డా వు౦దని బాధ పడ్తున్నారు కదా ! కుజగ్రహ హోమ౦ చేయిస్తే తొ౦దరగా పె౦డ్లి అయితాద౦ట…” నీలక౦ఠ౦ అమ్మ ముఖానా ఒకటి సలహా పడేశారు.

వె౦టనే కొడుకు చెవిలో వేసి౦ది. వూరికే అనుకు౦టున్నావా పది వేలు అవుతు౦దని చెప్పేసరికి , అ౦తనా అని బుగ్గలు నొక్కుకు౦ది.

” వాళ్లకు ఆమైన చాకిరి చేస్తు౦డావు… నీదగ్గర కూడా డబ్బులు తీసుకు౦టార౦టనా ”  సాగదీసి౦ది.

” పొద్దున్నే తి౦డి నీళ్లు ల్యాకు౦డా మన్ను దుమ్ము అని యిట్లనే తిక్కనాకొడుకు మాదిరిగా తిరుగుతా౦డు…” అమ్మ తిట్టిన తిట్లు గుర్తుకు వచ్చాయి నీలక౦ఠానికి. వె౦టనే ఆకలి కూడా గుర్తుకు వచ్చి౦ది.

ప్రసాద్ ను తిట్టుకు౦టూనే టికెట్స్ కౌ౦టర్ వైపు నడిచాడు. క్యూ చాలా పొడుగ్గా వు౦ది. భార్యాభర్తలు జ౦టలుగా క్యూలో నిల్చున్నారు.

” ము౦దురోజే వచ్చి డబ్బులు కట్టి౦టే బాగు౦డు ! ఈ క్యూలో నిల్చునే బాధ తప్పేది…మొదటి రె౦డు బ్యాచ్ ల వాళ్లతో  హోమ౦ చేయి౦చిన౦త ఓపిగ్గా తర్వాత వాళ్లతో యాడ చేయిస్తారబ్బా…”

‘ వీళ్లకు అసలు పిల్లలే లేరా ? లేకు౦టే కేవల౦ కొడుకు కోసమేనా’

పుత్రకామేష్టి యజ్ఞ౦ గురి౦చి చెబితే గీతా మేడ౦ ఏమ౦టారో ? మనసులో ఊహి౦చుకు౦టున్నాడు నీలక౦ఠ౦.

‘కూతుర్ల కోస౦ యజ్ఞాలు చేయరా? కొడుకుల కోస౦ మాత్రమే చేస్తారా? అ౦దుకే ఆడవాళ్ల స౦ఖ్య తగ్గిపోతో౦ది. యివే మాటలు అ౦టు౦దో లేక యి౦కేమ౦టు౦దో చూడాలి !ఆక్సిజన్ కొలిచే ఎక్స్ పెరిమె౦ట్ చూడ్డానికి మేడ౦ వస్తాను అని౦ది కదా! వచ్చాకా ఎటూ చూస్తు౦ది ఈ యజ్ఞాలను అన్ని౦టిని. ! యి౦తకు ఆక్సిజన్ ఎక్స్ పెరిమె౦ట్ ఎప్పుడో కనుక్కోవాలి !’

ఆలోచనల్లోనే ఎ౦ట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చాడు నీలక౦ఠ౦ . మెల్లిగా కోప౦ పెరిగిపోతో౦ది. చేతిలో స౦చి మరి౦త బరువు అనిపిస్తో౦ది. స౦చిలో పాలు , నెయ్యి…మామూలు రోజుల్లో అయితే ఈ పాటికి టిఫిన్ , రె౦డుసార్లు కాఫీ కూడా ముగి౦చుకునే వాడు నీలక౦ఠ౦. తన మీద తనకే జాలి వేసి౦ది. ప్రసాద్ న౦బర్ కు రీ డైల్   చేశాడు…ఊహూ…పళ్లు కొరికాడు.

మామూలుగా ప్రతి రోజూ నీలక౦ఠ౦ ప్రా౦గణ౦లోకి రాగానే ప్రసాద్ కు ఫోన్ చేసేవాడు. అతనే స్వయ౦గా వచ్చి స౦చి తీసుకునేవాడు . మీరు వెళ్లిపోతారేమో వెళ్లిపో౦డి అని నీలక౦ఠానికి చెప్పి దక్షణ౦ వైపుకి వెళ్లిపోయేవాడు. అక్కడ రె౦డు పెద్ద గదులు వున్నాయి. ప్రియ బా౦ధవి టౌన్ షిప్ ఆఫీస్ రూమ్స్ . ప్రియ బా౦ధవి టౌన్ షిప్ కు స౦బ౦ధి౦చిన పనులన్నీఇక్కడ ను౦డే జరుగుతూ వు౦డేటివి. ఇ౦జనీర్లు , మేస్త్రీలు , రియల్ ఏస్టేట్ బ్రోకర్లతో ఆ రె౦డు గదులు కిటకిట లాడేవి. వచ్చిపోయే వాళ్ళతో ఆ ప్రా౦తమ౦తా మహా స౦దడిగా వు౦డేది. సోమయాగ౦ ఏర్పాట్లు మొదలయినప్పటి ను౦డి వాళ్ల ఆఫిసు వేరే చోటుకు మార్చుకున్నారు. అ౦తకు ము౦దు లేని బారికేడ్స్ యిప్పుడు కొత్తగా ఏర్పాటు అయ్యాయి . ఇప్పుడు ఈ రె౦డు గదులు సోమయాగ౦ కార్యక్రమాలకు కే౦ద్ర౦గా మారి౦ది. కొత్త తరహా హడావుడి మొదలయ్యి౦ది . తూర్పు వైపు ఏర్పాటు చేసిన యజ్ఞవాటిక దగ్గరికి ఎవరయినా రావచ్చు పోవచ్చు. రుసుము చెల్లి౦చిన వారు హోమగు౦డానికి దగ్గరగా కూర్చునే అవకాశ౦ కల్పిస్తారు.  దక్షణ౦ వైపు మైకు శబ్థాలు లా౦టివి ఏమాత్ర౦ వినిపి౦చవు. ఒక ప్లాను ప్రకార౦  పనులను కఠోర దీక్షతో చేసుకుపోయే వాళ్లుగా కనిపిస్తు౦టారు. ఎవరు పడితే వాళ్లు లోపలికి రావట౦ బ౦ద్ అయ్యి౦ది. అ౦దులో ఎవరు వు౦టున్నారు? ఏ౦ చేస్తు౦టారు అన్న విషయ౦ నీలక౦ఠానికి తెలియదు. అటువైపు రమ్మని నీలక౦ఠాన్ని ప్రసాద్ కూడా ఎప్పుడూ పిలవలేదు.

ఆకలి నీలక౦ఠ౦ సహనాన్ని పూర్తిగా తినేసి౦ది. ఆగలేకపోయాడు. కాళ్లు ఈడ్చుకు౦టూ ము౦దుకు కదిలాడు.

వెదురుతో ఏర్పాటు చేసిన దడి అది . గొళ్లెము , తాళ౦ లా౦టివి ఏవీ లేవు. ప్రవేశ అనుమతి లేదు బోర్డు వేలాడుతో౦ది. లోనికి పోవాలా వద్దా, ఒక్క క్షణ౦ తటాపటాయి౦చాడు. ఖాకీ నిక్కరు , తెల్ల చొక్కా వేసుకున్న కుర్రవాడు గబగబ నీలక౦ట౦ దగ్గరికి వచ్చాడు. చేతిలో కర్ర కూడా వు౦ది. వాల౦టీర్ను చూడగానే అరే మాస్టూడె౦టేనే అనుకున్నాడు. నుదుట కు౦కుమ బొట్టు , తలకు కాషాయ ర౦గు జరీ లేసు వు౦డే గుడ్డ చుట్టుకొని వున్నాడు. నీలక౦ఠాన్ని చూసి రె౦డు చేతులు జోడి౦చి నమస్కార౦ పెట్టాడు.

పది అడుగుల దూర౦లో వున్న రె౦డు గదుల తలుపులు మూసి వున్నాయి . లోపలి ను౦డి మ౦త్రాలు వినిపి౦చేసరికి ఆశ్చర్యపోయాడు నీలక౦ఠ౦ .

” ప్రసాద్ సార్ వున్నారా ? ”

” వున్నారు సార్ ! పూజ చేయిస్తున్నారేమో…”

ప్రశ్నార్థక౦గా చూశాడు నీలక౦ఠ౦.

” ఎవర్ని లోపలికి రానియ్యద్దొన్నారు సార్…”

” పూజ అయితే లోపలికి ఎవర్ని రానియ్యద్దొని ఎ౦దుకు చెప్తారయ్యా ? ”

వాల౦టీర్ ఏ౦ మాట్లాడలేదు. నల్లబడిపోయిన నీలక౦ఠ౦ ముఖ౦ చూస్తూ వు౦డిపోయాడు .

నీలక౦ఠానికి ముళ్ల మీద నిల్చున్నట్టు౦ది . అవమాన౦గా అనిపి౦చి౦ది. వు౦దామా… పోదామా…అని వూగిసలాడాడు.

లోపల గ౦ట మోగిన శబ్ధ౦ వినిపి౦చి౦ది. తలుపులు తెరుచుకొని ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఎడమ చేతిలో ఇత్తడి గ౦ట, కుడి చేతిలో హారతి వున్నాయి. జరీ అ౦చు వున్న పట్టు ప౦చను గోసి పోసి కట్టుకున్నాడు. ఛాతిని తెల్లటి వస్త్ర౦తో కప్పుకొని ఎడమ భుజ౦ పై ను౦డి కి౦దకి వ్రేలాడదీసుకున్నాడు. నుదుట కు౦కుమ బొట్టు , చేతి వేళ్లతో రాసుకున్న మూడు విభూది రేఖలు…రె౦డు చేతుల మీద అడ్డ౦గా విభూతి రేఖలు.

దడి ము౦దర నిలబడ్డ నీలక౦ఠాన్ని ఎగాదిగా చూశాడు. చేతిలో స౦చిని గమని౦చాడు. వాల౦టీర్ను కళ్లతోనే హెచ్చరి౦చి మ౦త్రాలు గట్టిగా చెప్పుకు౦టూ పక్క గది వైపు వెళ్లాడు.

ఎక్కడో చూసినట్టనిపి౦చి౦ది నీలక౦ఠానికి . తల గోక్కున్నాడు… విభూతి రేఖలు లేని అదే ముఖ౦… వేష౦ మాత్ర౦ యిది కాదు.  ప్యా౦ట్ , ఫుల్ హ్యా౦డ్స్ ఇన్ షర్ట్…పవర్ పాయి౦ట్ ప్రజె౦టేషన్… చేతిలో మైకు…

” ఆవునెయ్యి , సోమరస౦తో యాగ౦ చేస్తే వాతావరణ౦లో వు౦డే కాలుష్య౦ నశి౦చి , ఆక్సిజన్ శాత౦ పెరుగుతు౦ది…శాస్త్రీయ౦గా యిది ఋజువు చేయబడి౦ది…”

ఔరా ! గు౦డెలు దీసిన బ౦టు… అవసర౦ కోస౦ వేషాలు మార్చుతున్నవాడు.

” సై౦టిస్ట్సే పూజార్ల అవుతార౦ ఎత్తుతున్నార౦టనే ! ఎక్కడ చూసినా వాళ్లేన౦టనే నిజమేనా…! ” ము౦దురోజు భాస్కర్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి నీలక౦ఠానికి.

‘ వీళ్ల మాటలను ఎ౦త వెర్రిగా నమ్మితి…ఇట్ల వెర్రి వాళ్ళ౦ వు౦డా౦ కాబట్టే వీళ్ల ఆటలు సాగుతా౦డాయి…’

ఒక్క క్షణ౦ కూడా అక్కడ వు౦డాలనిపి౦చలేదు. స౦చి వాల౦టీర్ చేతికి యివ్వబోయాడు. అ౦తలోనే తలుపులు తెరుచుకొని ప్రసాద్ బయటకు వచ్చాడు. ఎదురుగా కనబడ్డ నీలక౦ఠాన్ని చూసి యిబ్బ౦దిగా నవ్వాడు .

” అయ్యో ! యిది మోసుకొని ఆ చివర ను౦డి ఈ చివరకు వస్తిరా ! అక్కడే వు౦టే నేనే వస్తా౦టిని కదా ! ” చేతిలో వు౦డే కొబ్బరి చిప్ప , అరటి ప౦డు నీలక౦ఠ౦ చేతిలో పెట్టాడు.

” ఏమో సార్ ! మీరు ఎ౦తసేపటికి రాకపోతే వచ్చేస్తిని. యి౦కొక విషయ౦ కనుక్కు౦దామని వస్తి…భాస్కర్ సార్ మిషన్ను ప౦పి౦చార౦ట కదా ! ఎక్కడ పెట్టారు ? ఆక్సిజన్ ఎక్స్ పెరిమె౦ట్ ఎక్కడ చేస్తారు సార్ ?ఎప్పుడు చేస్తారో కనుక్కోమన్నారు గీతా మేడ౦ . చూడ్డానికి వస్తార౦ట…”

ముఖ౦ చిట్లి౦చాడు ప్రసాద్.

neela kantham

” మేడ౦ ఎ౦దుకులే౦డి! వేదమ౦త్రాలతో యజ్ఞ౦ చేస్తూ ఆవు నెయ్యి , సోమరస౦ వేసినప్పుడు ధూప౦ వస్తు౦ది. అది హ౦డ్రెడ్ పర్సె౦ట్ ప్యూర్ . ఇ౦దులో వు౦డే ఆక్సిజన్ బయట గాలిలో వు౦డే ఆక్సిజన్ శాత౦ క౦టే చాలా ఎక్కువుగా వు౦టు౦ద౦ట. ఈ ధూప౦ గాలిలో ఎ౦త దూర౦ పోతు౦దో అక్కడి వరకు వాతావరణ౦లో పొల్యూషన్ వు౦డదు…. అదే ఎక్స్ పరిమె౦ట్…అ౦తే ! అ౦తకు మి౦చి యి౦కే౦ లేదు…మన కాలేజికి వచ్చిన సై౦టిస్ట్సు ఆ పని మీదే వున్నారు. ”

” అవునవును ఆ పని మీదే వున్నట్టున్నారు . యి౦దాకా మ౦త్రాలు చదువుతూ యిటు పోయారు…ఆయనా కాదా అని అనుమాన౦ కూడా వచ్చి౦ది. ”

” ఆక్సిజన్ మిషన్ను శుద్ధి చేసి పూజ చేశారులే …”

” మిషన్ను శుద్ధి చేశారా ? ”

” మరీ! ఎవరేవరో ముట్టుకునే౦డిది వాళ్ళు ఎట్ల ముట్టుకు౦టారు ? నిష్టగా వు౦డకపోతే ఫలితాలు సరిగా రావ౦టారు…”

కోపాన్ని పళ్ల బిగువున ఆపుకున్నాడు నీలక౦ఠ౦.

” అయితే రోజూ మేము  తెచ్చి యిస్తా౦డే ఈ మట్టి , నీళ్లు , పాలు నెయ్యి…”

” అన్నీ కలిపి శుద్ధి చేస్తారు. తర్వాతనే వాడేది. పాలు,నెయ్యికి దోష౦ వు౦డదు. యాగశాలలను కూడా ప్రతి రోజూ వీటితోనే శుద్ధి చేస్తారు ఋత్విజులకు యిచ్చేది యివే కదా! శుద్ధి చేయకు౦డా యిస్తే యి౦కేమయినా వు౦దా? ”

ముఖ౦ చిన్నబుచ్చుకొని కదలకు౦డా నిలబడ్డ నీలక౦ఠాన్ని చూసి ఏమనుకున్నాడో  కాని దడి తీసుకొని బయటకు వచ్చాడు ప్రసాద్ . అతన్ని కొత్తగా చూశాడు నీలక౦ఠ౦. ఎప్పుడు ప్యా౦టు , షర్టులో వు౦డే ప్రసాద్ ప౦చె , భుజ౦ చుట్టూ అ౦గవస్త్ర౦ కప్పుకొని వున్నాడు. క్రాఫ్ లోనే చిన్న పిలకను అప్పుడే గమనిస్తున్నట్టుగా చూశాడు.

” ఇది శ్రౌత యాగశాల. యి౦దులోకి ఎవర్ని రానివ్వరు. ఆడవాళ్లు అసలే రాకుడదు. మగవాళ్లను కూడా కేవల౦ ఉపనయన౦ అయిన వాళ్లను మాత్రమే లోపలికి పిలుస్తారు. తీర్థ ప్రసాదాలు మాత్ర౦ అ౦దరికి యిస్తారు…”

ప్రసాద్ ఏ౦ చెప్పదలుచుకున్నాడో , అతని వుద్దేశ్య౦ ఏమిటో నీలక౦ఠానికి పూర్తిగా అర్థమయ్యి౦ది.

‘ తీర్థ ప్రసాదాలు…అవే మీకు భాగ్య౦ అని చెప్తున్నాడు…మేము చెప్పిన పని చేస్తే మీ జీవిత౦ ధన్యమవుతు౦ది…తన చెమట విలువ…బొబ్బలు ఎక్కి మ౦టలు పుట్టిన చేతులు మాత్ర౦ పనికి వస్తాయి. ఆ గదులల్లోకి తమను రానివ్వరు. అర్హత లేదని తేల్చేశారు.  లోక కల్యాణ౦ కోస౦ చేస్తున్నారట సోమయాగ౦! అ౦తా అబద్ధ౦ …పచ్చి మోస౦…తమ వునికే వీళ్లకు అపవిత్ర౦ అయితే వీళ్ల వునికి…?’  చేతికి మెత్తగా, జిగటగా తగిలి౦ది. ప్రసాద్ యిచ్చిన అరటి ప౦డు. నలిగిపోయి నల్లగా అయ్యి౦ది. తినడానికి పనికి రాదు . ప్రసాద్ చూస్తు౦డ౦గానే కసిగా దూర౦గా విసిరేశాడు నీలక౦ఠ౦ . సరిగ్గా చెత్త కుప్ప మీద పడి౦ది.

ప్రసాద్ ముఖ౦లో దేనికోసమో వెతికాడు.

నీలక౦ఠ౦ పెదవుల పైన దరహాస౦ లిప్తపాటు మెరిసి మాయమయ్యి౦ది.

* * * * * *

 

 

 

 

 

 

     3456GB

 

 

(గమనిక : పాఠకుల సాలభ్యం కోసం ఇందులోని పాత్రలన్నీ తెలుగులోనే మాట్లాడతాయని మనవి )

 

మట్టి కుండీలోని వరి మొక్క చుట్టూ ఉన్న మట్టి పూర్తిగా తడిసే లాగ తన చేతిలోని పిడతలో ఉన్న నీళ్ళలోంచి 144 మి.లీ. నీళ్ళు పోసాడు చెన్నయ్య .

చేత్తో మొక్కని తడిమాడు అపురూపంగా. మొక్కంత పాల గింజ పట్టి ఉంది. ఇంకో రెండు రోజుల్లో కోసేయ్యవచ్చు ననుకున్నాడు.

దాదాపు రెండు కిలోల వరకు తూగవచ్చు ధాన్యం ఈ సారి అనుకుంటూ తృప్తిగా మొక్కనే గమనించసాగాడు.

ఇంతలోనే తన పర్సనల్ నెట్వర్క్ లో బీప్ శబ్దం వినిపించింది.

వరి మొక్క ముందు నుంచి లేచి, పక్కన తన బెడ్ పక్కనే ఉన్న గోడ వైపు తిరిగి, తన భుజం మీదున్న చిన్న సాంకేతిక పరికరాన్ని చేత్తో తడిమాడు. అందులోంచి గోడ మీదికి ఫోకస్ అయిన మెసేజ్ చూసి చిన్నగా నిట్టుర్చాడు.

‘నైరుతి ఖండపు అధినేత అయిదు నిమిషాల క్రితం తన గదిలోని ఆక్సిజన్ జనరేటర్ ని ఆఫ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.’

ఇదీ ఆ వార్త సారాంశం.

పెద్దగా కుంగిపోలేదు కానీ, ఏదో అనిశ్చితి ఆవరించింది మనసంతా. మరుక్షణం మాములుగా అయిపోయాడు చెన్నయ్య.

ఎందుకో హఠాత్తుగా ‘లక్ష్మి’ గుర్తొచ్చింది.

వెంటనే నెట్వర్క్ ఆన్ చేసి, మార్స్ (అంగారక గ్రహం) పై నున్న లక్ష్మి కి సిగ్నల్ పంపించాడు. క్షణంలో గోడ మీద ప్రత్యక్షమయ్యింది లక్ష్మి.

చీకటి కంతల్లో, తడి ఆరిపోయిన కళ్ళల్లో రవ్వంత వెలుగు, పెదవుల పై ఆనందపు చంద్ర రేఖ.

‘తెలిసిందా?’అడిగింది లక్ష్మి.

‘ఇప్పుడే తెలిసింది…..ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది.’ చెన్నయ్య.

‘కారణమేమన్నా  కనుక్కున్నావా?’

‘ఆ  ….అదే కారణం….అలోన్ సిండ్రోమ్….ఒంటరి తనపు న్యూనత.’

‘నైరుతి ప్రెసిడెంట్ అయి ఉండీ అలా  చేస్తే….ఇక ప్రజలకి ఏ విధంగా ధైర్యం కలుగుతుంది’

‘అవును….ఇంత అనుకూల పరిస్థితుల్లో…రాబోయే మంచి రోజులకి మనకి మధ్య దూరం తరిగిపోతున్న కాలంలో….అందునా  సాంకేతికతలో ఎంతో అభివృద్ధి చెందిన నైరుతి ఖండపు ప్రెసిడెంట్…ఐ హేట్ థిస్’ అసహనం వెల్లగక్కాడు చెన్నయ్య.

‘నిజంగా భాధ కలిగించిన విషయమే అయినా …ఇంకా విషాదమేంటంటే…అప్పుడే…ఇంత వరకు ఈ వార్త విని దాదాపు రెండు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారట’ లక్ష్మి గొంతులో నీరసం ధ్వనించింది.

‘అది నేనూహించిందే లక్ష్మి…ఇంకో రెండు మూడు నిమిషాల్లో మన ప్రెసిడెంట్, మన ఆగ్నేయ ఖండంలో ఉన్న ఇరవై కోట్ల మందిలో స్పూర్తి  రగిలించడానికి పర్సనల్ వీడియో మెసేజ్ పెట్టే అవకాశమూ ఉంది’. అత్యంత వేగంగా విశ్లేషించాడు చెన్నయ్య.

‘అది సరే….నీ రిసర్చ్ ఎలా సాగుతోంది’. టాపిక్ డైవర్ట్ చేసింది లక్ష్మి.

అది వెంటనే గ్రహించిన చెన్నయ్య. ‘ ఓకే …గుడ్.’ అన్నాడు నార్మల్గా.

‘నీ వరి పంట ఎలా ఉంది…ఈ సారి మొక్కకి ఎంత  దిగుబడి ఎక్స్పెక్ట్  చేస్తున్నావు…అట్లాగే నీ కూరగాయల పరిశోధనలో ఏవైనా కొత్త సంగతులున్నాయా?’ ఉత్సాహం కళ్ళల్లోకి ప్రతిఫలింప జేస్తూ అడిగింది లక్ష్మి.

‘ఫరవాలేదు…వరి పంట కాలం 30 రోజులు నుంచి 27 రోజులకి విజయవంతంగా తగ్గించడమే కాక, మొక్కకి దాదాపు 147 గ్రా. ధాన్యం ఎక్కువ అంటే దాదాపు 2కిలోల వరకు దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను’. గొంతులో ఉత్సాహం తొణికిసలాడుతుండగా కొనసాగించాడు చెన్నయ్య.

‘టమాట మీద చేస్తున్న రిసర్చ్ ఫలితాలు బాగున్నాయి. దేశవాళీ తీగ టమాట, ఒక్కసారి మొక్క నాటితే మూడు సంవత్సరాల పాటు  రోజూ మూడు కిలోల చొప్పున కాసే దేశవాళీ రకం. పరిశోధన  దాదాపు తుది దశలో ఉంది, అలాగే భూమి లోపల పెరిగే క్యారెట్, మొక్కకు ఒక్క దుంప కాకుండా వేరు సెనెగ పంట లాగా, పెద్ద ద్రాక్ష పళ్ళoత గుండ్రని సైజులో గుత్తులుగా, అంటే మొక్కకి సుమారుగా కిలోన్నర క్యారెట్ దిగుబడి వచ్చే విధంగా చేస్తున్న పరిశోధన సక్సెస్ అయింది. పేపర్స్ మన ప్రెసిడెంట్ కి పంపిస్తే అతను విశ్వ వ్యవసాయాభివృద్ధి మండలిలో ప్రవేశపెట్టాక, ప్రజలందరికి అందుబాటులోకి వస్తుంది’. ఆగకుండా చెప్పుకుపోతున్నాడు  చెన్నయ్య.

‘రియల్లీ…గ్రేట్’ ప్రశంసించింది లక్ష్మి.

‘కాని ఒకే ఒక్క ప్రాబ్లం…సేంద్రియ ఎరువుల ఉత్పత్తి బాగా తగ్గింది…నా నెక్స్ట్ రీసర్చ్ వాటి మీదే అనుకుంటున్నాను.’

‘గ్రేట్ చెన్నయ్య!……. ఐ యామ ప్రౌడ్ ఆఫ్ యు’ మనస్పూర్తిగా అభినందనలు తెలిపింది లక్ష్మి.

‘థ్యాంక్ యు సొ మచ్ లక్ష్మి’ స్వీకరించాడు .

కొద్ది సేపు మాటల విరామం…ఎలా మొదలు పెట్టాలో ఇద్దరికీ అర్థం కాలేదు.

‘నిజంగా! నువ్వు  ఆ వార్త వినడానికి ఉత్సుకతగా ఉన్నావా?’ చొరవ చూపింది లక్ష్మి.

‘అవును. ఐ యాం రియల్లీ ఎక్సయిటెడ్  టు హియర్ దట్ న్యూస్, ఇంకా మూడు నాలుగు గంటలు పట్టేటట్టుంది, ఆ శుభ వార్త వినడానికి,’  చెన్నయ్య కళ్ళల్లోకి వెలుగొచ్చింది.

‘నాకు కూడా…’ ఉత్సుకతతో తల నిమురుకుంటూ చెప్పింది లక్ష్మి.

ఈ భూగోళo మీద నివసించే ప్రతి మనిషి కీ వచ్చే అవకాశం పిల్లల్ని కనడం. అది ప్రభుత్వమే కలిగిస్తుంది. ఆగ్నేయం ఖండంలోని చెన్నయ్యకి అవకాశం వచ్చినప్పుడు తనకూ, తన శరీర తత్వానికి సరిపడే సరైన జోడు కోసం విశ్వవ్యాప్తంగా వెతికినపుడు మార్స్ పైకి కొన్ని తరాల ముందు వలసెల్లిన లక్ష్మి తాలూకు శరీర నిర్మాణo, తత్వం, ఇంకా అనేక భోగోళ, ఖనిజాల, ప్రాంతీయ సారూప్యాతలున్న చెన్నయ్యతో కూర్చి పరిక్షించినప్పుడు, అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలియవచ్చింది. వెంటనే ఒకరికొకరు సంప్రదించుకుని ప్రభుత్వానుమతితో మార్స్ పైన ఉన్న లక్ష్మి లోని అండాన్ని, ఆగ్నేయ ఖండంలోని  చెన్నయ్య బీజాన్ని, ఈశాన్య ఖండపు నైరుతి మూలలో నెలకొల్పబడిన భావితరాల అభివృద్ధి మండలి పరిశోధనాశాలకి పంపించారు.

ఆ ప్రయోగ, పరిశోధనశాలలో వారి అండాన్ని బీజాన్ని పరీక్షా నాళికలలో సంయోగపరిచి, ఫలదీకరణ చెందించి, కృత్రిమ గర్భం ‘ఆర్టిఫిషియల్ ఊమ్బ్’లో ప్రవేశపెట్టి పెంచుతున్నారు. బిడ్డ ఆరోగ్యంగా అద్భుతంగా పెరుగుతున్నది. నెలలు పూర్తి కావచ్చాయి. ఇంకా కేవలం మూడు లేదా నాలుగు గంటల తరువాత తమకి జన్మించ బోయే బిడ్డ గురించిన తాపత్రయం వారి మాటల ద్వారా తెలుస్తూనే వుంది. అది శుభసూచకం.

లక్ష్మితో  మాటలనoతరం తన రోజు వారి కార్యక్రమాలలో మునిగిపోయేoదుకు సిద్దమయ్యాడు చెన్నయ్య. వృతి రీత్యా వ్యవసాయ శాస్త్రవేత్తయినా ప్రవృత్తి రీత్యా చెన్నయ్య చరిత్ర నిక్షిప్తకారుడు.

విశ్వవ్యాప్తంగా జరిగే ప్రతి సంఘటన చెన్నయ్య లాంటి ఎన్నుకోబడిన వెయ్యి మందికి వార్త లాగా అందించబడుతుంది. తమకి అందిన సమాచారాన్ని విశ్లేషించి ఒక చరిత్రగా రాసి విశ్వ చరిత్ర వేదికకి పంపించడం జరుగుతుంది. అక్కడ, ఉత్తమంగా, నిజాయితీగా, నిజంగా, ఉన్నదున్నట్టుగా, ఉన్నతంగా, ఉన్న వాటిని ఎన్నుకుని చరిత్ర పుటల్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది.

ఈ రోజు పొద్దున్నే నైరుతి ఖండాదినేత ఆత్మహత్య ఉదంతం తరువాత విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల వార్తలు రాయడానికి ఉపక్రమించి, వాయిస్ ట్రాన్స్లేటర్ సిస్టం ముందు కూర్చున్నాడు.

తన గొంతుతో పలికే ప్రతి మాటని స్వీకరించి అక్షరాలుగా తర్జుమా చేసే వాయిస్  ట్రాన్స్లేటర్  సిస్టం అది. అవుట్ డేటెడ్, చాలా పాతది. VTS (వాయిస్ ట్రాన్స్లేటర్ సిస్టం)ముందు కూచున్నా ఏది మాట్లాడాలనిపించక విశ్వచరిత్ర వేదిక పుటలు వెనక్కి తిప్పసాగాడు చెన్నయ్య.

దాదాపు 1500 సంవత్సరాల క్రితం మొదలయ్యింది ఈ ప్రక్రియ అంతకు ముందు అంతా సెర్చ్ ఇంజన్లు, సర్వర్లు, పుస్తకాలు,తాటాకులు, శిలా శాసనాలు. మధ్యలో కొన్ని రోజులు డివిడి లు, బ్లూ రేలు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు వెల్లువలా వచ్చి అంతే వేగంగా అంతర్దానమైపోయాయి.

విటిఎస్ ముందు మాట్లాడాలనిపించక చరిత్ర పుటల్లోకి, లోలోకి, లోతుల్లోకి వెళ్ళసాగాడు.

……………రెండో ప్రపంచ యుద్ధం తరువాత మత జాడ్యం జడలు విప్పింది. 20వ & 21వ శతాబ్దంలో నయితే ఈ విశృoఖలత్యం పేట్రేగిపోయింది.

నవనాగారికతను, సాంకేతికత పాదాల కింద పడి నలిపివేయబడింది. సాంకేతికత మునుగులో మనిషి, మానవత్వం, ప్రకృతీ…అన్నీ…అన్నీ…నాశనం…సర్వనాశనం  అయిపోయాయి. ఒక విధ్వంసం రచింపబడింది.

2000-2100 వరకు జరిగిన సాంకేతికాభివృద్ధి, సమస్త భూగోళాన్ని …ఇంకా చెప్పాలంటే ఈ విశ్వాన్నే ఒక భారీ కుదుపు కుదిపింది.

3456

2043    -మూడవ ప్రపంచ యుద్ధం కేవలం …కేవలం బలనిరూపణ కోసం మాత్రమే జరిగిన యుద్ధం అది. మతం అనే    ముసుగేసుకొని, ప్రపంచ దేశాలన్నీ వారి వారి వద్ద మేటలుగా పేరుకు పోయిన ఆర్మేషన్ గోదాములు  ఖాళీ చెయ్యడానికి, అనేక కూటములుగా ఏర్పడి, ఒకరిమీద మరొకరు విధ్వంసం రచించుకున్నారు. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే అణుబాంబులు పేలని దేశం లేదనడం అతిశయోక్తి కాదు.

 

2136-2150   -మూడో ప్రపంచ యుద్ధం లో చనిపోయిన దాదాపు 60 కోట్ల మంది ప్రజల జనాభా కంటే రెట్టింపు జనాభా ఈ కాలంలో చనిపోయారు. కారణం…కరువు.

 

2160     -నాలుగో ప్రపంచ అణు యుద్ధం కేవలం ఆరు రోజులే జరిగింది. కాని అనేక దేశాల సరిహద్దులు మారిపోయాయి. ఆక్రమించుకున్న వారెవరో, కలిసిపోయిన వారెవరో రాయ వీలుగానంత చరిత్ర.  కారణం …నీరు….నీరు….నీరు…కరువు…కరువు…కరువు.

 

2190     -అంటార్కిటికా ఖండం అంతా కరిగిపోయింది. సముద్రమట్టాలు దాదాపు 150 మీటర్లు పెరిగాయి. 27 దేశాలు పూర్తిగా మునిగిపోయాయి. భూభాగం కుచించుకుపోయింది.

 

2213      –అడవులు అంతరించిపోయాయి. ఎడారులు పెరిగిపోయాయి. పశు పక్ష్యాదులు నశించిపోయాయి. కేవలం కొద్ది ప్రదేశంలో పండించే పంటలే, ప్రపంచమంతా పంచాల్సిన పరిస్తుతులు ఏర్పడ్డాయి.

 

2229      -గొర్బీ బాదల్ జననం. ఏడుసంవత్సరాల వయసులోనే ఆయన ప్రవచనాలకి ప్రపంచమంతా అతని దాసోహం అయిపొయింది. ప్రకృతి అతని మతం. పచ్చదనం అతని అభిమతం. ప్రకృతినే దైవంగా కొలవాలనే అతని తర్కానికి భూగోళమంతా ఏకమై అతనిని అనుసరించారు.

 

2260     -అయిదవ ప్రపంచయుద్ధం మళ్ళీ అదే కారణం. వంద సంవత్సరాల తరువాత కూడా మళ్ళీ అదే కారణంతో యుద్ధం జరిగింది. నీరు…నీరు….నీరు. భూగోళం మీద కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యల్లో ఉన్న ప్రదేశాల లోనే నీరు లభించేది. ఆ ప్రదేశాల యొక్క దేశాలమీద, ఆధిపత్య దాడులకు లెక్కే లేదు.

GB గోర్బీ బాదల్ ప్రమేయంతో కొన్ని ప్రాంతాలు శాంతి తీర్థం పుచ్చుకున్నా, అది కొన్ని రోజులకే పరిమితం అయ్యింది.

 

2271GB   -GB గోర్బీ బాదల్ అస్తమయం. అప్పటికే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది. ఎవరి ప్రతిష్ట అయినా, అతని తదనంతరమే కీర్తి శిఖరాలు చేరుకుంటుంది. మనుషులకి ఏదైనా పోగొట్టుకున్నాకే గదా దాని విలువ తెలిసేది. అతని జ్ఞాపకంగా, గౌరవసూచకంగా ఈ సంవత్సరం నుంచే సంవత్సరాల చివర A.D. లు, B.C. లు తీసివేయబడి, GB ని చేర్చింది.

 

కొంచం దాహంగా అనిపిస్తే లేచెల్లి తన బెడ్ పక్కగా నున్న కుండ లోంచి నీళ్ళు తీసుకుని తాగాడు చెన్నయ్య. చల్లగా, తియ్యగా ఉన్నాయి. ఆకలిగా అనిపించి పక్క ర్యాక్ లోని రాగి బిస్కెట్స్ నాలుగు ప్లేట్లో పెట్టుకుని వచ్చి మళ్ళీ VTS ముందు కూచున్నాడు – పాత చరిత్ర పుటల్లోకి పవేశిస్తూ…

 

2300GB    భూగోళం మీద భూభాగం తగ్గిపోయింది. తూర్పు నుంచి పడమర కు విభజించబడిన భూ మధ్య రేఖ తన ప్రభావం కోల్పోయినందువల్ల దాన్ని మార్చి,  ప్రపంచ భూ భాగమంతా నిలువుగా, అడ్డంగా నాలుగు సమ భాగాలుగా విభజించి, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి మరియు వాయువ్య ఖండాలుగా మార్చడ్డాయి.

 

2322 GB  –ప్రపంచమంతా, ఇంకా చెప్పాలంటే విశ్వవ్యాప్తంగా ఒకే డబ్బు చలామణిలోకి వచ్చింది. ఎగుమతి దిగుమతుల్లో డబ్బుని నిషేదించారు. అన్ని ఖండాల ప్రభుత్వాలది ఒకటే అజెండా, తినడానికి తిండి, తాగడానికి నీరు. వ్యవసాయమే అందరి ప్రధాన పరిశ్రమగా అందరూ ఓకే మాటకు కట్టుబడాలని నాలుగు ఖండాల అధినేతలు తీర్మానించారు.

 

2350 GB    –అణు యుద్ధాల ప్రభావం ప్రకృతి మీద ప్రతిబింబించడంతో భూమ్మీద నీటి ఊటే కరువైపోయింది. వాతావరణంలోని వాయువుల్లోంచి హైడ్రోజన్ని, ఆక్సీజన్ని సేకరించి నీటిని తయారు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చి పడింది. కానీ…ఖర్చే చాలా ఎక్కువ. వాయువ్య ఖండంలో జనం లేరు, జలం లేదు. వాతావరణంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా వుండడం చేత నీటిని తయారుచేసుకునే గనిలా ఆ ప్రాంతం ఉపయోగపడుతున్నది. అక్కడినుంచి నీళ్ళు లేని ప్రాంతాలకి తరలించడం ప్రారంభించారు.

 

2500GB   -ప్రపంచ జనాభా వంద కోట్లకి పడిపోయింది. అందులో సగం జనాభాకి ఒక్క పూట భోజనం దొరకడమే గగనం అయిపొయింది. జీవించడానికి ప్రభుత్వం మీద దాదాపు వంద శాతం ప్రజలు ఆధారపడుతున్నారు.

బీప్ మన్న శబ్దానికి, వచ్చిన వార్తని చూసాడు చెన్నయ్య.

తమ ఆగ్నేయ ఖండాధినేత పంపిన సందేశం అది.

         “ఈ రోజు తెల్లవారుజామున నైరుతి ఖండంలో జరిగిన సంఘటన యొక్క ప్రభావం మీమీద తప్పకుండా చూపిస్తోందని నాకు తెలుసు. గత అయిదు వందల సంవత్సరాలుగా మానవ ఉనికిని కాపాడుకోవడానికి మనం చేస్తున్న ఈ పోరాటం నిజంగా మెచ్చుకోదగ్గది. సంతోషం, ఆనందం, ఆహ్లాదం, హాయి, సుఖం వంటి భావోద్వేగాలు మనలో నశించిపోయినా…మనం భావితరాల కోసం, మనుష్య జాతిని ఉత్కృష్ట స్థితిలో చూసే అదృష్టం కోసం మనమంతా మర మనుషుల్లా, ఏ ఫీలింగూ లేకుండా చేస్తున్న త్యాగం ఎన్నటికీ మరువలేనిదనే సంగతి అందరికీ తెలిసిందే.

          సాంకేతికంగా మన అభివృద్ధిని తక్కువగా చెయ్యలేం…కానీ…కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి కోసం తపిస్తూ…దాని ఉనికిని…మూలాలని సజీవంగా మళ్ళీ నిలపడానికి ప్రతిఫలాపేక్ష లేకుండా మనం చేస్తున్న త్యాగానికీ… ఉన్నత ఫలాలని రాబోవు తరాలకు అందించాలనే మన తపనని మనం ఎప్పటికీ తక్కువ చేసుకోకూడదు.

          ఈ రోజు తెల్లవారుజామున నైరుతి అధినేత ఆత్మహత్య మనల్ని కల్లోల పరిచింది నిజమే…కానీ…ఒక్క క్షణం ఆలోచించండి…మూడు నాలుగు గంటలు వేచి చూడండి, ఒక అధ్బుతమైన శుభవార్త మీ కోసం వేచి చూస్తున్నది.

         ఆ వార్తా మిమ్మల్ని తప్పకుండా సంబర పరుస్తుందని మీకు హామీ ఇస్తున్నాను, వేచి చూడండి. ప్రేమతో మీ ప్రెసిడెంట్.”

ప్రెసిడెంట్ సందేశం మంచి ఉత్ప్రేరకంగా పని చేసింది చెన్నయ్యకి. నైరుతి ప్రెసిడెంట్ ఆత్మహత్యని చరిత్ర పుటల్లోకి దాచడానికి ఏ ప్రయత్నం చెయ్యకుండానే తమ ప్రెసిడెంట్ ఇచ్చిన సందేశాన్ని పోస్ట్ చెయ్యడం ప్రారంభించాడు.

తరువాత మళ్ళీ… మరొక్కసారి చరిత్ర భాండాగారపు పుటల్ని వెనక్కి తిప్పాడు చెన్నయ్య.

2610GB    – GB గోర్బీ బాదల్ అస్తమయం తరువాతనే ప్రకృతిని కాపాడుకోవడానికి అంతా, విశ్వవ్యాప్తంగా మొదలైన ఉద్యమం మంచి ఊపు మీద కొనసాగింది. దాదాపు 350 సవత్సరాల క్రితం జరిగిన ఆఖరి ప్రపంచ యుద్ధం తరువాత ఇంకే యుద్ధమూ జరగకుండా అంతా ఒక్క తాటిపై నిలబడి ప్రకృతిని మళ్ళీ పునరుజ్జీవనం చేయడానికి తీసుకున్న నిర్ణయం మంచి మార్పులే తీసుకురాసాగింది. కానీ, మనిషి ప్రకృతిపై చేసిన అరాచకం మానడానికి చాలా సమయం పడుతుందని అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతిని పాడు చేసే అన్ని  వస్తువుల తయారీకి అనుమతి నిషేదించడం ఆహ్వానించ దగ్గ పరిణామం.

2772GB   –కాలుష్యం మనిషిని కాల్చేయసాగింది. ప్రతి నలుగురికీ ఒక ఇంక్యుబెటర్ కేటాయించబడింది. అందులోనే కొద్దిపాటి భూమిలో వ్యవసాయం స్వంతంగా చేసుకుని, తమ తిండి తాము ఉత్పత్తి చేసుకుని, తమ నీరు తాము తయారు చేసుకుని, తమ ఆక్సిజన్ని (ఆక్సిజన్ జనరేటర్ ద్వారా)   తాము తయారు చేసుకుని  బతకాల్సిన పరిస్తితులు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రాత్రి నిడివి చాలా తగ్గి పోయింది, ఇప్పుడు కేవలం ఆరున్నర గంటల రాత్రికే మనుష్యులు అలవాటు పడాలి.

 

2818GB     -ప్రపంచ జనాభా ఎనభై కోట్లకి పడిపోయింది. మనుషులందరూ ప్రభుత్వం కల్పించిన ఇంక్యుబేటర్లలోనే నివసిస్తున్నారు. మామూలు వాతావరణంలోమనుష్యులు బతకలేరు. ఆడ, మగలో పూర్తి నపుంసకత్వం ప్రజ్వరిల్లింది. మనుష్యజాతి శరీరం మీద రోమాలు అంతరించిపోయాయి…రోగాలు పేట్రేగిపోయాయి.

 

2835GB    -కృత్రిమ గర్భంలో మొట్టమొదటి బిడ్డ జననం. జలాన్వేషణ కొనసాగిస్తూ దాదాపు 153 గ్రహాలపై కాలు మోపాడు మనిషి. అందులోంచి మూడు గ్రహాలలో నీరు ఉనికిని కనిపెట్టగలిగారు. వలసలు మొదలయ్యాయి.

 

3012GB       -విశ్వవ్యాప్త జనాభా 40 కోట్లకి దిగజారింది. వ్యవసాయ పరిశోధనలు చాల మందికి తిండి పెట్టగలుగుతున్నాయి కానీ సమస్యంతా నీటిదే. సముద్ర జలాలు శుద్ధి చేయలేనంతగా లవణ విషంగా తయారయ్యాయి. కొద్దిలో కొద్ది ఉపశమనం ఏంటంటే భూగోళం మీద తాపం 72 డిగ్రీల నుండి 69 దిగ్రీలకి పడిపోవడం, ఆశ చిగురించసాగింది.      

 

3243GB      –ఈశాన్య ఖండపు చాన్ అనే ప్రదేశంలో చేసిన ప్రయోగంలో ఒక మొక్క మామూలుగా… ఇంక్యుబేటర్ లో కాకుండా మామూలు వాతావరణంలో చిగురించింది. ఈ సంవత్సరం సాధారణ వర్ష పాతం 171మి.మీ.  కంటే కొంచం ఎక్కువ 198మి.మీ. వర్ష పాతం నమోదు కావడం సంతోషదాయకం. ఆత్మహత్యల శాతం 60 నుండి 30 శాతానికి పడిపోవడం శుభసూచకం, అలాగే మనిషి యొక్క సగటు ఆయుర్దాయం 39 నుండి 42కు పెరగడం ఆనందకరం. రాబోవు రోజులన్నీ మంచి రోజులే.

 

సిస్టంని ఆఫ్ చేసి బద్దకంగా ఒళ్ళు విరుచుకున్నాడు చెన్నయ్య. నిద్ర రావటంలేదు. తెల్లవారుజామున మూడున్నర కావస్తూంది. సూర్యుడు ఆశలు రేకెత్తిస్తూ పైపైకి పాకనారంభించాడు. సోలార్ లైట్లు అన్నీ ఆఫ్ చేసాడు. వేకువ వెలుగు అద్వితీయంగా ఉంది. నీటి స్టోరేజి ట్యాంక్ చూసాడు. ఫర్లేదు ఇంకా వారం రోజుల వరకు సరిపోతాయి అనుకున్నాడు. గదిలోని నీటిని ఉత్పత్తి చేసే మెషీన్ని ఆఫ్ చేసాడు. వాతావరణ తాపం తానున్న ఇంక్యుబెటర్ గదిలో 30 డిగ్రీలు చూపించింది. బయటి వాతావరణం 54 డిగ్రీలుగా కనిపించింది.

మనసంతా ఆహ్లాదంగా ఉంది చెన్నయ్యకి. మొక్కలకి నీళ్ళు పట్టడానికి ఉపక్రమిస్తుండగానే బీప్ అనే శబ్దంతో లైవ్ మెసేజ్ వచ్చింది. వీడియోలో ప్రెసిడెంట్ చెన్నయ్యని చూడగానే మొదలుపెట్టాడు.

“కంగ్రాట్యులేషన్స్ చెన్నయ్యా! నువ్వు తండ్రివయ్యావు. ఇక నేను డైరెక్ట్ గా నీకు శుభాకాంక్షలు తెలుపడానికి కారణం, నీ బిడ్డ. నీ కూతురు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా కాదు కాదు, విశ్వవ్యాప్తంగా మనం సంబరాలు జరుపుకునే శుభ శకున సమాచారం ఏంటంటే… నీ కూతురి తలపైన గుప్పెడన్ని వెంట్రుకలతో పుట్టింది. అందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఇంకా ఈ వార్తా మన ఖండపు ప్రజలతో పంచుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాను. ముందు లక్ష్మితో మాట్లాడాలి. మళ్ళీ ఒకసారి కంగ్రాట్యులేషన్స్”, తన బోడి గుండు నిమురుకుంటూ ఆనందం పట్టలేకపోతున్న ప్రెసిడెంట్ని అబ్బురంగ చూస్తూ చేష్టలుడిగి నిలబడిపోయాడు చెన్నయ్య.

తన జీవితంలో ఇంత కంటే ఆనందకరమైన సంఘటన ఇంకేదీ లేదు అన్నంతగా ఉద్వేగానికి లోనయ్యాడు చెన్నయ్య. కళ్ళ నిండా నీళ్ళతో చూపు మసకబారింది.

లైన్లో లక్ష్మి, తానైతే ఆనందానికి అసలు అర్థం ఆమే ననిపించింది. ఇద్దరు కలిసి తమకి పుట్టిన బిడ్డకి అప్పటికప్పుడు ఒక పేరు కూడా పెట్టేసారు ‘హరిత’ అని.

ఎందరో… ఎందరెందరో… హితులు…సన్నిహితుల శుభాకాంక్షల వెల్లువలో తడిసి ముద్దయిపోయాడు చెన్నయ్య.

ఓ వైపు అభినందనలందుకుంటూనే మరోవైపు మొక్కలకి వాటికి కావాల్సిన నీళ్ళు పట్టాడు చెన్నయ్య.

సోలార్ గ్లాస్ ప్యానెల్ మీద టీ చేసుకుని, దాన్ని చప్పరిస్తూ వచ్చి సిస్టంని ఆన్ చేసాడు. VTSలోని చరిత్ర పుటల్లో మరొక పేజీని కలపడానికి ఉపక్రమించాడు చెన్నయ్య.

 

3456GB   -దాదాపు 650 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన మానవ శరీరం మీది వెంట్రుక తిరిగి కనిపించడం మహా అద్భుతం. విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న జనాభా అంతటికీ శుభవార్త అయిన ఈ సంఘటన మరెన్నో పాత మార్పులకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

ఈ భూగోళం మీదకి అడుగుపెట్టబోయే భావితరాలకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అందించాలనే ఈ తపన, త్యాగం ముందు ముందు తప్పకుండా ఫలిస్తుందనడానికి ఈ సంఘటన ఒక సజీవ సాక్ష్యం.

ఎప్పుడో పదిహేను వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల ముందు చూపు లేమి, భాధ్యతారాహిత్యం, స్వార్థం, అత్యాశ మనల్ని, మన జీవితాలని ఇంకా దహించివేస్తూనే ఉంది.

ప్రకృతిని కాపాడుకోలేని వాడు ప్రపంచాన్ని ఏం బాగుపరుస్తాడు. మన GB-గోర్బీ బాదల్ అన్నట్టు ‘మనం అడిగిన వన్నీ ఇచ్చేవాడే దేవుడు అయితే, మరి మనకు కావాల్సిన వన్నీ మనం అడగకుండానే, మనల్ని అడగకుండానే ఇచ్చే ఈ ప్రకృతినేమనాలి. దేవుడే ప్రకృతి – ప్రకృతే దేవుడు.’

ఇన్ని వందల సంవత్సరాలుగా మనని మనం త్యాగం చేస్తూ, ఏ సుఖానికీ, సంతోషానికీ, ఆనందానికీ నోచుకోకుండా, నిర్జీవంగా జీవిస్తూ, భావితరాల అభ్యున్నతికి పాటు పడుతున్న మనకు ఈ రోజు నిజంగా పర్వదినం.

మరిన్ని మంచి మార్పులు మన జీవితాల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ, అప్పటివరకూ మనం కలసికట్టుగా, మన పూర్వీకులని ఈ ప్రకృతి ఎన్నో సంవత్సరాలు కాపాడినందుకు ప్రతిగా ఈ సారి మనందరం కలసి ఆ ప్రకృతి మాత ఋణం తీర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన ప్రకృతిని మనం కాపాడుకుందామని, ఈ సందర్భంగా మనందరం మరొక్కసారి సంకల్పం చేసుకుందామని, ఈ శుభ దినాన్ని పండగలాగా జరుపుకోవాలని అందరినీ విన్నవిస్తున్నాను.

 

అందరికీ శుభాకాంక్షలు.

మీ

చెన్నయ్య.

VTSలో పొందుపరిచిన విషయాన్ని చరిత్ర పుటల్లోకి అనుసంధానిస్తూ…చివర ఉన్న తన పేరును చేతివేళ్ళతో మృదువుగా స్పృశించాడు చెన్నయ్య.

అది తన పూర్వీకుల పేరు.

***

 

 

 

అపరిచితులు      

      శివ్

                                                                                                                 

      shiv photo “సార్ ఐ.ఐ.టి నుంచి ప్రొఫెసర్ మోహన్ గారు మన కళాశాలలో అతిధి ఉపన్యాసం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దాని వల్లమన ఎలెక్ట్రికల్ స్టూడెంట్స్ కు బాగా ఉపయోగముంటుంది  అన్నాను”. నేను ఖరగ్పూర్ ఐ.ఐ.టిలో సెమినార్ నుంచి వచ్చినతర్వాత మా ప్రిన్సిపల్ను కలిసినప్పుడు, ఈ సంభాషణ జరుగుతోంది. “అలాగేనండి, నేను సెక్రటరీ గారితో మాట్లాడతాను,తర్వాత మీరు డేట్స్ కన్ఫర్మ్ చేద్దురుగాని” అన్నారాయన. నాలుగైదు రోజులు పోయాక ఆయన్ని వేరే పని మీద కలిసినప్పుడు ఆ విషయం మళ్ళీ ప్రస్తావించాను. “కమిటీ వాళ్ళు ఒప్పుకోవడం లేదండి. ఇప్పుడు పాతిక వేలు ఖర్చు పెట్టలేమంటున్నారు”అన్నారు. “అలాగే సార్” అనాల్సొచ్చింది నాకు.

            కొన్ని రోజుల తర్వాత ఓ నాడు మధ్యహ్నంనుంచి  కాలేజ్ లో హడావిడి మొదలయ్యింది. కమిటీ మెంబర్లు,  ప్రిన్సిపల్,ఇంకా కొందరు స్టాఫ్, అటెండర్లూ, ఏదో మహత్కార్యం జరగబోతున్నట్లు సందడిగా అటూ ఇటూ తిరుగాడుతున్నారు. ఓ ప్రక్కఎర్ర తివాచి  కొత్తది తెప్పించి, దానిని అట్టహాసంగా ఆఫీసు గది మెట్ల దగ్గర్నుంచి సెమినార్ హాల్లోకి పరుస్తున్నారు.ఇంకొంతమంది,పూలు పెద్ద బుట్టలలోంచి తీసి, తివాచీకిరువేపులా జాగ్రత్తగా అమరుస్తున్నారు. సెమినార్  హాల్లో వేదిక పైనఅసలైన ఆర్భాట కార్యక్రమం జరుగుతోంది. బయటినుంచి వచ్చిన సిమ్హాసనపు విడిభాగాల్ని అక్కడ సన్యాసుల్లాకనబడుతున్న కొంతమంది జాగ్రత్తగా,ఆసనంగా మార్చడానికి పూనుకుని ఉన్నారు. నేను తెలుసుకున్నదేమిటంటే, పొరుగురాష్ట్రం నుంచి, ఒకానొక ప్రసిధ్ధి చెందిన స్వామి వారు అక్కడికి కొద్ది సేపట్లో వేంచెయ్యబోతున్నారట. ఆయననుస్వాగతించడంకోసమే ఈ ఏర్పాట్లు. ఆయన  అనుగ్రహ భాషణా కటాక్షంకోసం నిరీక్షణ. స్టాఫ్ అందరూ కార్యక్రమంపూర్తయ్యేవరకూ ఉండాలని ఆదేశిస్తూ  సర్కులర్ కూడా వచ్చిందట. అది  నేను చూడలేదు.

            మా గ్రూపులోని ఇంకో కళాశాలకు ఎప్పటినుంచో తెలుగు పండితుడిగా,ఆస్థాన గాయకుడిగా ద్విపాత్రాభినయంచేస్తున్న ఒకాయన, పాత తెలుగు సినిమాలలోని భక్తి పాటలు, లింగాష్టకం, శివాష్టకం ఇత్యాదులు మైకు ముందు కూచుని పెద్దగొంతుతో పాడడానికి ప్రయత్నిస్తున్నాడు. హాల్లో  ఉన్నవాళ్ళకి అవి వినడం మినహా వేరే గత్యంతరం లేదు. ఆ రోజు ఆకాశం,మేఘావృతమై, నల్లటి దుప్పటి క్రింద దాక్కున్నట్లు, తల నుంచి కాళ్ళ వరకు శ్యామ వర్ణంలో ముంచి తీసినట్లు, చిక్కగా,దట్టంగా ఉంది.కొద్దిసేపట్లోనే, పట్టిన రంగును వదిలించడానికి తల్లి తన పిల్ల వాడికి అభ్యంగన స్నానం చేయిస్తున్నట్లు,పెద్ద పెద్దకుండలతో  తలపైనుంచి  నీళ్ళు దిమ్మరిస్తున్నట్లుగా వర్షం ప్రారంభమయ్యింది. మా కళాశాలలో హడావిడి ఏమాత్రంతగ్గలేదు.చాలాసేపు వేచి ఉన్నతర్వాత,”అదిగో వేంచేస్తున్నారు, తప్పుకోండి, తప్పుకోండి” అంటూ కోలాహలం మొదలయ్యింది.ఐదడుగులకంటే  తక్కువ ఎత్తులో, ఎర్రగా, దాదాపు అరవై యేళ్ళ పైచిలుకు వయసున్న ఒక కుదిమట్టపు ఆకారం, గంగాళందొర్లుకుంటూ వస్తున్నట్లు ఎర్ర తివాచీ మీద నడచుకుంటూ వచ్చింది. మా వాళ్ళు అతి వినయంగా  ఆయనకు ఒంగి దణ్ణాలుపెడుతూ, హాల్లోకి, ఆ తర్వాత స్టేజ్ పైనున్న సిమ్హాసనం మీదకు ఆయన్ను తోడ్కొని వచ్చారు.

            నేను, మరికొందరు సహోద్యోగులు ప్రేక్షకులుగా హాల్లో ఉన్నాం. సందడి సద్దుమణిగాక స్వామివారు  సుఖాశీనులై తమఅనుగ్రహ భాషణం మొదలెట్టారు.అంతలో ఎవరో మాట్లాడుతుండటం  ఆయన చెవినపడింది. వెంటనే ఆగ్రహంతో “ఎవరుమాట్లాడుతున్నారు? నేను మాట్లాడాలా, మీరు మాట్లాడతారా?” అంటూ  గద్దించారు. ఆయన కళ్ళు , కోపం ఎర్రటి గోళీల రూపం దాలిస్తే, ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఆ మాట్లాడిన వ్యక్తి బిక్కచచ్చిపోయి మాట్లాడటం ఆపాడు.నా నోరు అప్రయత్నంగా తెరుచుకుని మళ్ళీ మూసుకుపోయింది. స్వామి వారు ముందుగా  పద్యంతో మొదలెట్టారు. తర్వాత ఇలాఅన్నారు. “నరుడు ముఖ్యంగా మూడు  విషయాలమీద దృష్టి పెట్టాలి. ఒకటి,తన కోపమే తనకు శత్రువు కాబట్టి ముందుగా కోపాన్ని జయించాలి. రెండోది పరస్త్రీని ఆశించకూడదు.అలా చేస్తే వినాశనమే! రావణాసురుడు దీనికి  తార్కాణం, ఇక మూడు,ఇతరుల బాధలను మన బాధలుగా భావించాలి. అంటే మనం ఒకళ్ళని తిడితే వాళ్ళెలా బాధపడతారో,అలాగే మనంభావించి,పరులను దూషించకూడదు” అన్నారు. భాషణం ముగిసింది. చాలా మంది ఆయన కాళ్ళకు పడి, పడి మ్రొక్కారు.

            తర్వాత ఎన్నోవేలు పెట్టి తయారు చేయించిన ప్రసాదం వినియోగించబడింది. అంతకుముందు  స్వామి వారు మాకళాశాల దిన దిన ప్రవర్ధమానమవ్వాలని, మా యాజమాన్యాన్ని దీవించారు. వాళ్ళు పాదాభివందనం చేసి తమ భక్తిని చాటుకున్నారు. అంతే కాక  పది లక్షల రూపాయలు స్వామివారి ట్రస్టుకు విరాళంగా సమర్పించారని నాకు తర్వాత తెలిసింది.ఇక ఆ కార్యక్రమ ఏర్పాట్లకు భారీగానే ఖర్చయ్యింది. నాకు అప్పుడు, కొద్దిరోజుల క్రితం మా ఇంజనీరింగ్ విద్యార్ధులకోసం ఐ.ఐ.టిఆచార్యులను అతిధి ఉపన్యాసం కోసం పిలవడం గురించి, దానికయ్యే ఖర్చు సంగతి, మా ప్రిన్సిపల్తో జరిపిన సంభాషణ గుర్తుకువచ్చాయి. విద్యార్ధులకు ఐ.ఐ.టి ఆచార్యుల కార్యక్రమం వల్ల ఉపయోగముందో,లేక స్వామి వారి అనుగ్రహ భాషణం ఎక్కువమేలు చేస్తుందో నాకర్ధం కాలేదు.

Kadha-Saranga-2-300x268

#

       నేనడపా దడపా  టెన్నిస్ ఆడతాను. పని దినాలలో ఎలాగూ కుదరదు కాబట్టి కాబట్టి శెలవుల కోసం ఒకింత ఆరాటంగానేఎదురు చూస్తూ ఉంటాను.ఆట ముగిసిన తర్వాత విధిగా రెండు కొబ్బరి బొండాలు తాగుతాను.బొండాలమ్మే వ్యక్తి నాకు బాగాపరిచయస్థుడు.అదే చోట అతను తన బండిని రెండు మూడేళ్ళుగా ఉంచి వ్యాపారం చేస్తున్నాడు.ఒక్కో సారి నా దగ్గర సరిపడాచిల్లర, డబ్బులు లేకపోయినా “పర్లేదు సార్ తాగండి, ఈ సారి వచ్చినప్పుడివ్వచ్చని” ఆప్యాయంగా మంచి బొండాలతో నాఅలసట తీరుస్తాడు.

            ఓ ఆదివారం ఆటయ్యాక  యదావిధిగా బండి దగ్గర బొండాం తాగుతున్నాను.ఇంతలో ఓ అడుక్కునే  అవ్వ “అయ్యా”అంటూ చెయ్యి జాచింది. “చిల్లర లేదమ్మా” అంటూ తాగడంలో ముణిగిపోయాను.”అయ్యా” అంటూ అవ్వ ఈ సారి బొండాలమ్మేఅతని వేపు చెయ్యి చూపింది.నేను యధాలాపంగా అటు తిరిగాను. “ఎళ్ళెళ్ళవమ్మా” అంటాడనుకున్నాను. ఐతే నాకు దిమ్మతిరిగిపోయింది. “ఇదుగో తీసుకో” అంటూ అతను ఆమెకు వందరూపాయల నోటు,చాలా సునాయాసంగా,షాపులోసరుకులో,కూరగాయలో కొన్న తర్వాత డబ్బులు చెల్లించినట్లు,నిర్భావంగా అందించాడు.ఆమె ఓ నిమిషం అవాక్కయ్యి,తర్వాతసంబరంగా నోటును తడుముకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది.నాలో భిన్న భావాలు ముప్పిరిగొన్నాయి.నేనిచ్చినడబ్బులు బొండాలతను అందుకున్నాడు.అంతకు ముందు అవ్వకు అంత మొత్తమిచ్చానన్న స్పృహ ఏమాత్రం అతనిలో నాకుకనిపించలేదు. తను నా ముందు, జీవితంలో, ముఖ్యంగా అతని వ్యక్తిత్వం గురించి నేనేమాత్రం ఊహించని మరోసున్నితమైన,మహా గొప్పదైన పార్శ్వాన్ని ఆయత్నకృతంగా ఆవిష్కరించాడు. మనసులోనే అతనికి జోహార్లర్పించుకుంటూవెనుదిరిగాను.

#

            ఆమె నాకు సంవత్సరం పైగానే తెలుసు.చాలా బాగా నేను కూడా ఆమెకు తెలుసని  నేననుకుంటూ ఉంటాను.కళాశాలలో సహోద్యోగులుగా మా మధ్యన మంచి అవగాహన ఉంది.ఎప్పుడూ ముఖమంతా నవ్వుతో నాతోమాట్లాడుతుంది.నాతోనేనేమిటి?అందరితోనూ ఆవిడలాగే ఉంటుందనుకుంటా! ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ సార్లునేను ఏ పదాలు వాడతానో,వాటినే ఆమె తిరిగి అంటుంది. దాంతో నాకు,ఆమెకు నాపై గౌరవం కాస్తా ఎక్కువేనని నాకనిపిస్తూఉంటుంది.పైగా ఇద్దరమూ ఆంగ్ల పాఠాలు ఇంజనీరింగ్ విద్యార్ధులకు బోధిస్తామాయె.నేను ఉపాధి మరియు  శిక్షణా విభాగంలోఉన్నప్పటినుంచి మా మధ్యన సమన్వయం బాగానే ఉంది.ఆ ధైర్యంతోనే నేను(నేను ప్రస్తుతమున్న విభాగంలో నా సహచరుడితో నేనిమడలేకపోవడం వల్ల)హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ లో,ఆంగ్ల విభాగంలోకి మారుతానని కమిటీ మెంబర్సుకు,ప్రిన్సిపల్  గారికి చెప్పి ఆమోదం పొందాను. ఇటీవలే మారాను.

            ‘శివ’ సినిమాలో కోట శ్రీనివాసరావన్నట్లు,మొదటి నెల అంతా ఓకే.నాకు చాలా సహకారమందించింది.అంతా సజావుగా ఉన్నట్లుంది.అంతలో మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్,నన్ను లాంగ్వేజ్ లాబ్ కు ఇన్ చార్జ్ గా నియమించారు.నా కుర్చీకూడా పాత విభాగంలోంచి  లాబ్ లోకి మారింది.ఇదివరకు  నాకు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కంప్యూటర్ఉండేది.ల్యాబ్లోకి మారింతర్వాత దాన్నే నాకివ్వమని మా హెడ్నడిగాను.అతను చూద్దామన్నాడు.ఐతే అక్కడ లాబ్ లో ఒకకంప్యూటర్ని మేడం వాళ్ళు ఉపయోగించుకునేవారు.మా సిస్టం అడ్మినిస్ట్రేటర్ దాన్ని నా టేబుల్ దగ్గర ఏర్పాటు చేశాడు.ఈచిన్నమార్పు నా ఉద్యోగానికే ఎసరు పెడుతుందని నేనేమాత్రం ఊహించలేకపోయాను.

            ఆమె నా దగ్గరేమీ మాట్లాడలేదు కానీ తర్వాత,‘సిస్టం’ వాళ్ళని బెదిరించినట్లు,”దీని వల్ల ప్రశాంత్  గారు చాలాసమస్యలు ఎదుర్కోబోతున్నారు” అని వాళ్ళతో అన్నట్లు,సిస్టంస్ డిపార్ట్మెంట్లోని రాజు నాకు చెప్పాడు.నేను వెంటనే ఆమెనుకలిసి “నేను నా పాత సిస్టం నాక్కావాలని అన్నానే కానీ,మీరు వాడుతున్నదాన్ని నా కిమ్మని నేనడగలేదు,కానీ చక్రవర్తిహడావిడిగా మీరు వాడుతున్న దాన్ని నాకు కేటాయించాడు.నేను దాన్ని మళ్ళీ మీరు వాడుకునే చోటే ఉంచమని చెపుతాను”అన్నాను. “ఏం పర్వాలేదు సార్, నో  ప్రాబ్లం” అందామె.కానీ   కమిటీ మెంబర్లదీ, ఈమెదీ ఒకే కులం కావడం వల్ల, కొన్నిరోజుల్లోనే నేను కళాశాలనుంచి బయటకు పోవలసిన ఏర్పాట్లు జరిగిపోయాయి.ఆమె నాకు బాగా తెలుసు అనుకుంటున్నసమయంలో నాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.ఐతే ఆ దెబ్బనుంచి నేను మంచి గుణపాఠం నేర్చు కున్నాను.

#

       ఆమె పైకి కనిపించినంత,మాట్లాడినంత సరళమైన వ్యక్తి కాదని,ఆమే కాదు మనచుట్టూ ఉన్నవాళ్ళలో చాలా మంది అదేకోవకు చెంది ఉన్నారని నాకు ఆ చేదు అనుభవం మరొక్క సారి కాస్త గట్టిగానే గుర్తు చేసింది.పని చేసే చోట ఎవరినినమ్మాలో,ఎవరిని  నమ్మకూడదో, ఏది మాట్లాడాలో, మాట్లాడకూడదో అర్థం కావడం లేదు.

             ఆ తర్వాత నేను ఇంకో కళాశాలలో ఉద్యోగం వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురయ్యింది.ఐతే ఇప్పుడు నేనిదివరకు నేర్చుకున్నపాఠాలు కొంతమేరకు ఉపయోగపడుతున్నాయి.ఇంతవరకు నేను మా గత కళాశాల సెక్రటరీ,స్వామీజీ,కొబ్బరి బొండాలమ్మే అతను,నా సహోద్యోగి,ఇంకా తదితరుల ద్వారా పొందిన అనుభవాల మూలంగా ఇప్పుడు నాకు చాలా మంది అపరిచితులుగానూ,తర్వాత పరిచితమైనట్లుగానూ,మళ్ళీ అప్పుడప్పుడూ అర్ధం కాకుండానూ అవగతమౌతున్నారు.వెరసి నాకు జీవితం మొత్తం ఇదే సూత్రం మీద ఆధారపడినట్లు అనిపిస్తోంది,తెలిసీ తెలియనట్లు,అర్ధమౌతూ కానట్లు, చలిస్తూ అంతలోనే నిశ్చలమౌతున్నట్లు,దాదాపు ప్రతి ఒక్కరిలో ఒక జెకిల్ మరియు హైడ్ లాంటి భిన్న స్వభావాలున్నట్లు,ఇప్పుడు మరింత అనుభవమౌతూ ఉన్నది.నాలో కూడా ఇలాంటి స్వభావం ఉండే అవకాశం మెండుగా ఉంది.ఐతే నేను ఇతరులకు హానిచేసే,నష్టం కలిగించే  వాణ్ణా??? కాదనే నేననుకుంటూ ఉంటాను.

*

అభిమన్యులు

అల్లం  వంశీ

 

allam-vamsi“కష్టం రా.. మొన్ననే నాలుగు నెల్లకింద మా నాన ‘దానికి’ వచ్చిపేనగదా.. మళ్ళ ఇప్పటికిప్పుడు వచ్చుడంటే చానా కష్టంరా… ఈసారి కాదుగనీ మళ్లెప్పుడన్న వీలుచూసుకోని వస్తలే..”
ఆఫీస్ ఫోన్ ల నుంచి చాటుగ ‘గుస గుసగ’ మాట్లాడుతున్నడు రమేషు..
“అరే.. అప్పుడు నువ్వు వచ్చిన సంధర్భం వేరే, ఇప్పుడు నేన్ రమ్మంటున్న సంధర్భం వేరే.. రా.. రా..” ఊర్లో ఎస్టీడీ బూతుల నుంచి ఊరందరికి వినిపించేటట్టు మాట్లాడుతున్నడు మనోహరు..
వీళ్లిద్దరు చిన్నప్పటికాంచి మంచి దోస్తులు. పుట్టి పెరిగింది ఓ చిన్న టౌన్ ల.. రమేష్ పీజీ దాక చదివి హైదరాబాద్ ల ఏదో గవర్నమెంట్ నౌకరి సంపాదించుకోని అక్కడే ఉంటున్నడు.. మనోహర్ మాత్రం పుట్టిపెరిగిన ఆ ఊళ్లెనే ఓ బట్టల దుకాణం పెట్టుకోని నడుపుకుంటున్నడు. ప్రస్తుతం ఇద్దరికీ చెరో ముప్పయ్యైదేండ్లు ఉంటయి..
“మొన్నచ్చినప్పుడే వారం రోజులు లీవ్ పెట్టిన్రా.. మళ్లిప్పుడే లీవ్ అంటె కష్టం భై.. చానా కష్టం..”
అట్ల కాద్రా.. మన సార్ రిటైర్మెంటు ఫంక్షన్లనన్న అందరం ఓసారి కలవొచ్చని రమ్మంటున్న..
“అందరంటె” ఎందర్రా?? మా అంటె ఆడ లోకల్లున్నోళ్లు ఓ నలుగురున్నరుకావచ్చు.. అంతేకదా??

Kadha-Saranga-2-300x268
అంటే?
అంటేలేదు గింటేలేదు.. బయట నౌకర్లు చేసేటోళ్లు ఎందరస్తున్నరో చెప్పు? ఒక్కడు వస్తా అన్నా, నేను కూడ వస్తా సరేనా??
అరేయ్, అందరు ఇట్లనే అంటున్నర్రా.. ఒక్క రెండురోజులకు వచ్చిపోతె ఏమైతుంది చెప్పు??
ప్లీస్ రా భై.. తప్పుగ అనుకోకు… నేనిప్పుడు లీవ్ పెట్టే పరిస్తితిల లేను, ఈ యేడాదే నా ప్రమోషన్ గూడ ఉన్నది.. ఊకూకె ఇట్లనే లీవులు పెట్టినా అంటె అంతే ముచ్చటిగ..
అయినా అమ్మ కూడ ఇక్కడ ఒక్కతే ఉన్నట్టున్నదికదా? ఓసారి వచ్చి కల్శి పేనట్టుంటది.. రా రా..
ఇంకో నాల్ రోజులుపోతె అమ్మే ఇటస్తా అన్నదిరా.. అయినా మొన్నటిదాక అమ్మతోనే ఉంటి, అమ్మ ముచ్చట ఇడ్శిపెట్టు కని సారుకే ఏదన్నొకటి చెప్పురా.. పాపం నేనంటె మస్తు పావురపడ్తుండే, నేన్ రాలేదంటె ఫీల్ అయితడుకావచ్చు!! నా తరుపున ఓటి మంచి శాలువా ఇయ్యిరా, సరేనా? పైసల్ మనం కలిసినప్పుడిస్తా..

vamsi
******
కాలం ఓ పదేండ్లు ముందుకు కదిలింది..
“అబో కష్టం రా… ఇప్పుడెక్కడ వీలైతదిరా అయ్యా!” రమేషు, ఇంట్లోని ల్యాండ్ లైన్ ఫోన్ ల మనోహర్ తోని మాట్లాడుతున్నడు…
నువ్వు ఊకె ఏదో ఒక సాకు చెప్పకురా.. ఈసారి మాత్రం నువ్వస్తున్నవ్ అంతే.. ఇంక మాట్లాడకు…
అరేయ్.. అట్ల కాదురా.. మా పిలగాన్లకు పరీక్షల్ నడుస్తానయ్.. ఇప్పుడు వాళ్లను ఇడ్శిపెట్టి నేనటస్తె ఆమెకూ, పిల్లలకు ఇబ్బంది కాదా? వద్దు వద్దు.. నాకు వీలుకాదు..
అందరు రావాల్సిందిపొయ్యి, కనీసం నువ్వొకనివన్న రా రా అంటె అంత ఇసం చేస్తానవేందిరా? నువ్ ఫోన్ చెల్లెకియ్యి ముందు, చెల్లెతోని నేన్ చెప్తా..
అరే!! ఆమె పొమ్మన్నా నేన్ వచ్చుడు కష్టమేరా. పిల్లల పరీక్షలొక్కటేకాదు, ఈడ ఆఫీస్ ల సుత నేనిప్పుడు బయటికి కదిలేటట్టులేదు.. మార్చి నెల కదా, ఇయర్ ఎండింగ్ లెక్కలూ కతా కార్ఖానా.. అదంత పెద్ద లొల్లి రా.. చెప్పినా నీకు సమజ్ కాదుగని.. విడ్శిపెట్టు..
నా కొడుకు పుట్టెంటికలప్పుడు రాలె, బిడ్డకు చీరకట్టిచ్చినప్పుడు రాలే.. నీనేమన్న అన్ననా??
నిరుడు మా నాయిన పోతెసుత కబురుచెప్తి.. పోనీ అప్పుడన్న అచ్చినవా??
రాలేకదా?? ఈసారి మాత్రం నువ్ రాకుంటె ఊకునేదిలేదు చెప్తున్నా.. నువ్వచ్చినంకనే మేం ఇండ్లల్లకు పోవుడు.. గంతే..
అరే.. అట్లంటవేందిరా? రావాల్నని నాకు మాత్రం ఉండదా చెప్పు? కాని ఇక్కడ పరిస్తితి అట్ల ఉండదురా..
ఏం పరిస్తితిరా? పదేండ్లు దాటింది ఎర్కేనా??
అరేయ్… నాకు లేటయితుంది ప్లీస్.. ఏమనుకోకురా.. అర్థంచేస్కో.. ఇగో అమ్మ మాట్లాడుతదట, ఫోన్ అమ్మకు ఇస్తున్న.. మాట్లాడు.. నాకు లేటయితుంది నేన్ పోతున్నా… రైట్ రా… కొత్తిల్లు కట్టుకున్నందుకు మళ్లొక్కసారి కంగ్రాట్స్..
******
కాలం ఆగలేదు.. ఇంకో పది క్యాలెండర్లు మారినయ్..
“నువ్ మొన్న చెప్పినా వస్తుంటిరా.. ఇప్పుడైతె కష్టమిగ!” బయట పార్క్ లో వాకింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నడు రమేషు..
ఎందుకు? మొన్నటికీ ఇయాల్టికే ఏం మారింది?
మొన్నటిదాక నాకు పెద్దగ పనేం లేకుండ వట్టిగనే ఉంటి.. కాని ఎల్లుండి మావోడు అమెరికా నుంచి వస్తుండురా..
ఔనా? ఐతె ఇంకా మంచిది.. పిల్లల్లనూ, చెల్లెనూ అందరిని తీస్కోనే రారా మా బిడ్డ పెండ్లికి…
రావాల్ననే నాక్కూడ ఉన్నదికనీ. వాడేమంటడోరా? ఉండేదే ఒక్కనెల, అందుకే వాడెట్లంటె అట్లనే ఇగ. వానిష్టం..
పిలగాడచ్చినంక ఓసారి నాతోని మాట్లాడిపియ్.. నేన్ మాట్లాడ్త వానితోని..
చేపిస్తగనీ, అనవసరంగ వానికి అదోటి ఇదోటి చెప్పి పరేషాన్ చెయ్యకు.. ఈ ఎండలు వానికి పడ్తయో పడయో!! అమెరికాల ఉండవట్టి మూన్నాలుగేండ్లైతాందికదా, అలవాటు తప్పుంటది..
ఇంకోటేందంటే, మా బిడ్డకుసుత సంబంధాలు చూస్తున్నం.. ఒకట్రెండు మంచియే వచ్చినయ్ గని మావోడచ్చినంకనే ఏదన్నొకటి ఫైనల్ చేద్దామని ఇన్నిరోజులు ఆగినం.. ఆ పని కూడ ఓటున్నది మాకు..
సరే.. సరే చూడన్లి మరి.. కనీసం ఒక్క రోజుకోసమన్న వచ్చే ప్రయత్నం చెయ్యున్లి..
తప్పకుండా.. మంచిదిరా మరి..
******
కండ్లు మూసి తెరిచినంతల చెరి అరవయ్యైదేండ్లకు వచ్చిన్లు..
“విపరీతమైన మోకాల్ నొప్పులురా.. వచ్చేవారమే ఆపరేషన్ ఉన్నది..” ఆరాం కుర్చీలో ఒరిగి కూచోని సెల్ ఫోన్ ల లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నడు రమేషు..
మోకాల్ నొప్పులు నీక్కూడ వచ్చినయారా??
ఆ.. సర్వీస్ ల ఉన్నన్ని రోజులు ఏ రోగం, నొప్పి లేకుండేకని రిటేరైనంకనే ఇది షురూ ఐంది..
మ్మ్.. ఇయ్యాలరేపు ఇరవయ్యేండ్ల పోరగాల్లకే మోకాల్ నొప్పులస్తున్నయ్.. మనమే అదృష్టవంతులమ్రా..
ఏం అదృష్టమో ఏందోరా.. కాళ్లు మస్తు సలుపుతున్నయ్.. సులుకు సులుకున పొడిశినట్టైతుంది నాకైతే.. ఆపరేషన్ అయినంకనన్న ఏమన్న తగ్గుతదేమో సూడాలె..
తగ్గుతదిరా, మా వియ్యంపునికి అదే సమస్య ఉంటుండే.. అంతకుముందు ఒంటికిలేవాల్నన్నా ఇంకో మనిషి సాయిత పట్టుకోని తీస్కపొయ్యేది, అసొంటిది ఆప్రేషన్ అయినంక ఇప్పుడు ఒక్కడే పొద్దుకు పదిమాట్ల పొలంకాడికి పొయ్యస్తున్నడెరికేనా? నువ్వుట్టిగ రందివెట్టుకోకు.. వట్టిగనే తగ్గుతదది..
అవునా.. మంచిదే ఐతే.. ఓసారి ఆయినె నంబర్ నాకియ్యి చేషి మాట్లాడ్తా..
నంబరెందుకురా, నువ్ ఈడికస్తే ఇటు నా కొడుకు కొత్త షోరూం ఓపెనింగుకు వచ్చినట్టుంటది, అటు మా వియ్యంపునితోని మాట్లాడినట్టుంటది.. రా రా.. ఈసారన్న ఓ రెండ్రోలు వచ్చిపో..
అబ్బో.. ఇప్పుడు నాతోనికాదురా.. ఆపరేషన్ చేపిచ్చుకోని అటేంక పుర్సత్ అటే వస్తిగ.. ఇప్పుడైతె నంబర్ ఇయ్యి..
******

vamsi
మళ్లీ ఫోన్ మోగడానికి పదిహేనేండ్లు పట్టింది.. ఇటువైపు మాట్లాడేది మనోహరే కాని అటువైపున్నది మాత్రం రమేష్ కాదు..
అంకుల్.. నేను.. రమేష్ వాళ్ల కొడుకు రాహుల్ ని మాట్లాడుతున్నా..
ఎవరూ? ఏ రమేషు నాయినా?
నేనంకుల్.. రమేష్ తెల్సుకదా.. పింగని రమేషు.. వాళ్ల కొడుకు రాహుల్ నూ..
ఆ.. ఆ.. చెప్పు బిడ్డా మంచిగున్నవా?? నాయిన మంచిగున్నడా??
అంకుల్.. అదీ.. నిన్న మార్నింగ్..
ఆ??
నిన్న మార్నింగ్ డ్యాడీకి నిద్రలోనే స్ట్రోక్ ఒచ్చిందంకుల్.. మమ్మీ వాళ్లూ హాస్పిటల్ కి తీస్కెళ్లేలోపే.. దార్లోనే..
అయ్యో దేవుడా… ఎంత పనాయిపాయే.. అని మనోహర్ ఏడుస్తూ దుఃఖంలో ఏవేవో మాటలు అంటున్నడు కని రాహుల్ కు అవి వినేంత టైమూ, ఓపికా లెవ్వూ..
అంకుల్.. అంకుల్.. ప్లీస్ నేన్ చెప్పేది వినండి..
ఆ.. ఆ.. చెప్పు నాయినా… దేవుడెంతన్యాయం చేసేగదా కొడుకా… రమేషా..
ఆ.. ఆ.. అంకుల్ ప్లీస్ ఏడుపాపి వినండి…. మా డ్యాడీ చనిపోయే ముందు మమ్మీతో – తన.. ఆ “చివరి కార్యక్రమం”.. తను పుట్టి పెరిగిన ఆ ఊళ్లోనే జరిపించమన్నారట..
ఆ..
ఆ ఊళ్లో నాకు తెల్సింది మీరొక్కరే…. సో… అంకుల్.. ప్లీస్.. మీరూ… హెల్ప్…
అయ్యో ఎంతమాట నాయినా.. మీరు జల్ది బయలెల్లున్లీ.. మీరు వచ్చేలోపట నేనిక్కడ అన్నీ తయార్ చేపించి ఉంచుతా.. సరేనా..
సరే అంకుల్.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ వెరీ మచ్.. మేం బయల్దేరుతున్నం..
******
సరిగ్గా నాలుగు నెలల తర్వాత-
అమెరికాల ఉన్న రాహుల్.. ఆఫీస్ బ్రేక్ టైం లో, హైదరాబాద్ ల ఉన్న దోస్తు కౌషిక్ తోని “స్కైప్” వీడియో కాల్ లో మాట్లాడుతున్నడు-
“కష్టం రా.. మొన్ననే నాలుగు నెల్లకింద మా నాన ‘దానికి’ వచ్చిపేనగదా.. మళ్ళ ఇప్పటికిప్పుడు వచ్చుడంటే చానా కష్టంరా… ఈసారి కాదుగనీ మళ్లెప్పుడన్న వీలుచూసుకోని వస్తలే..”

*

 వర్షం వెలిశాక…

రేఖాజ్యోతి

 

Rekhaచెరొక ఊర్లో పనిచేసే అమ్మకీ, నాన్నకీ  అస్తమానం బదిలీలే అప్పుడు . వేరే దారి లేక   పదోతరగతి చదవడానికి నన్ను మా పిన్నివాళ్ళ ఊరికి పంపారు… ఆవిడ అక్కడ టీచర్.  నెల్లూరు నుంచి 24 కి.మీ. దూరం, మొదటిసారి ఆ ఊర్లో బస్సు దిగగానే ‘ఆకాశం విశాలంగా వున్నట్టు’ అనిపించింది. ఊరి నిండా కొబ్బరి చెట్లూ, చింత చెట్లూ, మట్టి రోడ్లూ, పాతకాలంనాటి ఆర్చీలున్న కిటికీలు, అరుగుల వాకిళ్ళు, అంతస్తులే లేని ఇళ్ళు, అన్నింటికీ మించి బస్సు వెళ్ళే మెయిన్ రోడ్డు మీద నుంచి కనిపించే పెద్ద వాగు, ఆ వాగులోకి ఎప్పుడోగాని నీళ్ళు రావట.. నీళ్ళు లేకపోతేనేం, బంగారు రంగు ఇసుక కనుచూపు మేరంతా!  

వాగుకి ఆవలి వైపున దూరంగా వున్న తాటి చెట్లతో అదంతా ఒక పెద్ద పెయింటింగ్ లా కనిపించింది.  పిన్ని, నేనూ ఉండబోయే ఇల్లు, మొత్తం ఇంటిలో నాలుగో వంతు పోర్షన్, ఒకే ఒక గది, దాన్నే వంట కోసం విభజిస్తూ పాతకాలంనాటి చెక్కపెట్టె లాంటి అల్మారా. టేకుగుంజలతో వసారా. ప్రహరీగోడ ముప్పావు కూలిపోగా అక్కడక్కడా నిలబడిన ఇటుకలు. కాంపౌండ్ లో  కొబ్బరిచెట్లూ వాటికి బలంగా అల్లుకున్న మనీ ప్లాంట్ తీగలు, మందారం, కస్తూరి … వేరేలోకం లోకి వచ్చినట్టు కళ్ళు పెద్దవి చేసుకొని చూడడమే సరిపోయింది. ఆ ఊరిలో ఒకే ఒక గుడి- అక్కడే రాముడూ, కృష్ణుడూ, వినాయకుడూ,నవగ్రహాలూ అందరూ వుంటారట . మేముండే వీధి చివర ‘సితార ‘ సినిమాలో భానుప్రియ బంగ్లా లాంటి ఇల్లు. ఆ రోజు రాత్రంతా ఆరుబయట నవారా మంచం వేసుకొని పిన్నీతో మాటలే మాటలు.

ట్యూషన్లు, ఎక్స్ ట్రా క్లాసులు లేని కాలం … సుదీర్ఘమైనసాయంత్రాలు. పిన్ని తప్పించి ,  స్కూల్లో పనిచేసే టీచర్లంతా నెల్లూరు నుంచి పొద్దున ఎనిమిదిగంటల బస్సుకి వచ్చి అయిదు గంటల బస్సుకి వెళ్ళే వాళ్ళు. స్కూల్లో స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఆసక్తికర విషయం ఆ ‘సితార’ సినిమా లాంటి బంగ్లాలోని ఆడవాళ్ళని ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదట, లోపలికీ బయటకీ తిరిగే కార్లు చూడడమేనట!

ఆ రోజు తెల్లవారేటప్పటికే మొక్కలూ, నేలా, గోడలూ అన్నీ తడిచి ముద్దయిపోయి ఉన్నాయి, రాత్రి ఎప్పటి నుంచి పడుతోందో వాన! తలుపు తీసుకొని వసారాలోకి వస్తే వాకిలి ముందంతా బురదమయం. ఇంటి ఓనరు ఆయన భార్యా ఇద్దరూ గొడుగు వేసుకొని ఆ బురదలో ఇటుకలు వేస్తున్నారు ‘అవసరంగా రోడ్డు మీదికి పోవలసి వస్తే పడి  ఉంటాయి’ ముసలి వాళ్ళిద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ పని పూర్తి చేశారు.

‘అమ్మాయ్,  నీకు స్కూల్ లేనట్లే, ఊర్లో వాన పడితే ముందు మునిగేది మీ స్కూలే, మెయిన్ రోడ్డుకి పది అడుగుల దిగువున కట్టాడు’ హౌస్ ఓనర్ సిద్ధి రామాచారి గారు చెప్పుకు పోతూనే ఉన్నారు.

‘’పాపాయ్, పాలవాడు రాలేదు వేడి నీళ్ళలో హార్లిక్స్ కలిపాను’’ పిన్ని నాకొక గ్లాస్ ఇచ్చి తనూ తెచ్చుకుంది.’ ‘పొద్దుట్నుంచీ బస్సులు రాలేదంటే స్కూల్ లేనట్లే’’- ‘ పిన్ని సెలవు డిక్లేర్ చేసి పుస్తకం పట్టుకుంది, తను ఇక ధ్యానం లోకి వెళ్ళినట్లే ! మధ్యాహ్నం నాలుగు వరకూ వర్షం తగ్గలేదు. దీపాలు పెట్టుకోవలసినంత చీకటి. వాకిట్లో హౌస్ఓనర్ వేసిన రాళ్ళు మునిగిపోయి చాలాసేపయ్యింది. కాంపౌండ్ లో బాగా రెండడుగుల ఎత్తు నీళ్ళు వచ్చేశాయి. వసారాలోనే కూర్చొని నేనూ పిన్ని చూస్తున్నాం. ఎవరో గొడుగులో వెళ్తూ

“ఆశారి గోరూ, యేరు ఆ పాట్నే పొంగతా ఉండాది, ఇంకో నాలుగడుగులు ఎక్కిందో, ఊరు మునిగిందే, నా మాటిని ఎగవన నీ కొడుకు ఇంటికి ఫో. సీకటి పడితే నువ్వు ఈదలేవు. మేవు ఏటి కాడికి పోతావుండాము. మునిగే దంకా రానీమనుకో! ఏమి? నేనొ చ్చేదా!” అంటూ ఆ రోడ్డు మీదికి చేరిన నీళ్ళలో హడావిడిగా వెళ్లి పోయాడు .

Kadha-Saranga-2-300x268

హౌస్ ఓనర్, ఆయన భార్యా ఇంటికి బోలెడు తాళాలు పెట్టి రెండు గోడుగుల్లో తయారయ్యారు, సిమెంట్ తో కట్టిన వారి కొడుకు ఇంటికి. “అమ్మాయ్.. మా తండ్రి గారి కాలంలో కట్టిన మట్టి ఇల్లు, మీరూ జాగ్రత్త, వస్తాం” అనేసి ఆ నీళ్ళలో వాళ్ళు బయల్దేరారు.

అప్పటివరకూ వారి మాటల సందడితో ప్రకృతి బీభత్సం అంత స్పృహకు రాలేదు కానీ, ఇప్పుడేమిటో గాలి గట్టిగా శబ్దం చేస్తున్నట్టు, మెరిసే మెరుపులు ఇక్కడే రిఫ్లెక్ట్ అవుతున్నట్టు కాస్త భయం మొదలైంది. అప్పుడే ఒక్కసారిగా మా కాంపౌండ్ కి ఆనుకొని ఉన్న కరెంటు స్తంభం పెద్దగా శబ్ధం చేస్తూ మా వసారాకి రెండు అడుగుల దూరంలో పడింది. ఇక భయం నా ముఖం మీదికి స్పష్టంగా వచ్చేసింది.

“పిన్నీ, మన మీద పడి ఉంటే?? ”

‘పడలేదు కదరా !’  పిన్ని స్థిమితంగానే వుంది ఇంకా.

ఈసారి ఒక్కరు కాదు ఇద్దరు కాదు గుంపులు గుంపులుగా గొడుగులు, లాంతర్లు, టార్చిలైట్లు పట్టుకొని ఆ గాలీ వానలో పెద్ద పెద్దగా అరుచుకుంటూ వెళ్తున్నారు ఏటి వైపుకు.

“పెద్దిరెడ్డి గోడౌన్ లో ఇసుక మూటలున్నాయి, ఓ నలుగురు నాతో రండ్రా!”

“ఒరేయ్ మీరు ఏటికాడికి పోయి ఉండండి మేము ఎనకాల్నె వస్తాం” చీకట్లో ఆ గొంతులు భయంతో వణుకుతున్నాయని తెలుస్తోంది.

మళ్ళీ వర్షం పుంజుకుంది. పిన్ని అప్పుడప్పుడూ వెళ్ళి సర్దడం గమనించాను. సూట్కేస్ లోని డబ్బులు, తనవీ నావీ సర్టిఫికేట్లు హాండ్ బ్యాగ్ లోకి, మరో కవర్ లో కాండిల్స్,అగ్గిపెట్టెలు , ఫస్ట్ ఎయిడ్ కిట్, తనవి పాత కాటన్ చీరలు  సర్దింది. మరి కాసేపట్లో వసారాలోకి కూడా నీళ్ళు వచ్చేశాయి. వసారాలోని నవారా మంచం గదిలో వేసుకున్నాం. ఆకాశంలో పెద్ద యుద్ధం జరుగుతున్నట్టు  ఉరుములు, మెరుపులు. అప్పుడే మా మీదికి ఎవరో టార్చ్ లైట్ వేసి చూస్తున్నట్టున్నారు,

“టీచరమ్మా,టీచరమ్మా…ఉండారా లోగా!! ” స్కూల్లో పనిచేసే అటెండర్ శీనయ్య అరుస్తూన్నాడు వర్షంలో నుంచి .

పిన్ని ఎలాగో వసారోలోకి వెళ్ళింది

‘ఆ ఆ ఉన్నాం, ఏంటి పరిస్థితి? ‘

‘ఏటికి గండి ఆనలేదు, నీళ్లొస్తున్నాయమ్మా ఈడుంటే కష్టం, నాతో గూడా రండి పాపను తీసుకొని, రామిరెడ్డి ఇంట్లోనే ఉన్నారు ఊరి జనమంతా, రాండి,రాండి ‘ వాన కంటే జోరుగా ఉంది శీనయ్య మాట.

ఇంటికి తాళం పెట్టి ఒకే గొడుగులో నేనూ పిన్ని శీనయ్య వెనకే బయల్దేరాం. నా బుర్రలో బోలెడు ఆలోచనలు, నీళ్ళు మోకాళ్ళకు తగుల్తున్నాయ్, ఒకవేళ ఈ నీళ్ళలో పాములు, కప్పలు, క్రాబ్స్ ..  వుంటే? నాలుగడుగులు వెయ్యగానే ఇక ఉండలేక అరిచాను ‘పిన్నీ’ అని, ‘ ఏమవుతుంది,ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలా? శీనయ్య కంటే నువ్వు పొడవుగా ఉన్నావ్ బాగా పెద్ద అడుగులు వెయ్యగలవు, నేరుగా నడువు, ఈ కాస్త , అదిగో ఆ  దీపం వెలిగే ఇంటి కే మనం వెళ్ళేది, సరేనా!’  ఎలాగో వచ్చేశాం, ఆఖరికి.  పెద్ద గేట్లు బార్లా తీసున్నాయి, అలాగే నీళ్ళలో ఉన్న ఒక ఐదు మెట్లు ఎక్కాక పొడినేల తగలగానే ప్రాణం లేచి వచ్చింది. ‘అమ్మా, అదో అటు మెట్ల పైకి వెళ్ళండమ్మా’ అని దారి చూపించి మళ్ళీ వానలోకి వెళ్ళాడు శీనయ్య, ఇంకెవరైనా ఇళ్లలోనే వుండి పోయారేమో  అని!

మెట్లెక్కి లోపలికి వెళ్తే కిక్కిరిసిన కళ్యాణ మండపంలా ఉంది. ఊరివాళ్ళంతా ఇక్కడే వున్నట్టు ఉన్నారు, అక్కడక్కడా వెలుగుతున్న కొవ్వొత్తులు, లాంతర్లు. ఏ మాటా అర్ధం కావట్లేదు ఒకరితో ఒకరు మాట్లాడుతుండడం వల్ల. పిన్నిని చూసి చాలా మంది దగ్గరకొచ్చారు

‘టీచరమ్మా, మా గుడిసె పొద్దన్నే పడిపోయింది తల్లా, ఈడనే ఉన్నాం పిల్లా జల్లా అందరం’

‘దూడని తోలుకుబోయినోడు అట్టే బోయినాడమ్మా, యాడ చిక్కు బడ్డాడో!’ పాలు పోసే శంకరయ్య అమ్మ ఏడుస్తోంది.

‘పాపాయ్, నువ్వెళ్ళి ఈ హాండ్ బ్యాగ్, కవరూ  తీసుకొని  ఆ ప్లేస్ లో కూర్చో, తడి తుడుచుకో, నేను వాళ్ళని పలకరించి వస్తాను’ అని చెప్పి పిన్ని వెళ్ళింది. ఇందాక అరుపుల్లా వినిపించినవి ఇప్పుడు ఏడుపుల్లా వినిపిస్తున్నాయి. గోడకానుకొని కవర్లోనుంచి పిన్ని పాత చీర తీసుకొని పరుచుకోవడానికీ, కప్పుకోవడానికీ కలిపి చుట్టుకొని కూర్చున్నాను. ఇక్కడికి శబ్దాలు కూడా అంతగా చొరబడట్లేదు. భయం వల్ల కలిగిన అలసటతో నిద్ర పట్టేసింది.

బాగా హడావిడిగా ఉంది, కలలోనో, నిజంగానో  అనుకుంటూ నిద్ర లేచాను. ఎదురుగా ఎవరో ఒకావిడ కళకళలాడుతూ  ఎర్రటి చీర కుచ్చిళ్ళు దోపుకొని అందరికీ బాదం ఆకుల విస్తళ్లలో వేడి వేడి ఉప్మా వడ్డిస్తోంది. ప్రతీ ఒక్కరినీ పేరుతో పిలుస్తోంది,

‘ఏమి అందరికీ వచ్చిందా! డబ్బాలేమన్నా వుంటే పెట్టుకుపొండి, చంటి బిడ్డలుంటే ఈడ వేడి నీళ్ళున్నాయ్. ఏమి గావాలన్నా పాలేరుకి  చెప్పండి. ఇచ్చి అంపుతా, ఏమి సరేనా! ‘ అందరినీ ఉద్దేశించి  అనేసి ఆవిడ మెట్లు దిగి వెళ్ళిపోయింది.

‘ఏంటిది? ఎక్కడున్నాను, వర్షం తగ్గిపోయిందా?’ నెమ్మదిగా గుర్తుచేసుకుంటూ కిటికీ దగ్గరకి వెళ్ళి చూశాను, ఊహూ .. వర్షం ఇంకా హుషారుగా పడుతూనే ఉంది. కాస్త దూరంకి చూపు సారించి చూస్తే, అదేంటి? బూడిదరంగు ఆకాశం నేల మీద కదులుతోంది! దేవుడా, నిండిన యేరు ఇదేనా?మెలికలు తిరుగుతూ నిన్న మొన్న నేను నడిచిన వీధుల్లో ప్రవహిస్తోంది. ఎక్కడికి వెళ్తోంది ఈ యేరు ఇంత హడావిడిగా ఊరి మీదుగా, తలలు విరిగిన కొబ్బరి చెట్లూ, కూలిన కరెంటు స్తంభాలూ, ఒరిగిపోయిన ఇళ్ళూ, ఇలా అవుతుందా వర్షం పడితే !!  పిన్ని కోసం వెతుక్కుంటూ మెట్లదగ్గరకి వచ్చి నిల్చున్నాను, కింద నుంచి ఇందాక మాట్లాడిన ఆవిడ ఎవరికో చెప్తోంది ,

‘ఏరా, ఎల్లకాలం వంటోళ్ళు మాత్రమే చెయ్యాల్నా? నేను చేస్తే సయించదా! కష్టం వచ్చి మడుసులు ఎడస్తా మన పంచకొస్తే మనం సుఖం చూసుకుంటామా ఏంది? ఎవరూ బళ్లె, నా చెయ్యి సాలు, వండనియ్యండి సుద్దంగా’  అని.

ఇంతలో పిన్ని వచ్చింది సగం గొడుగులో సగం తడుస్తూ డాక్టర్ గారిని తీసుకొని,

‘గోడకూలి పడిందయ్యా, నెత్తురు సూడండయ్యా’ అని జనంలోనుంచి ఒకావిడ బిడ్డని ఎత్తుకొని వచ్చింది. పిన్ని అప్పటికే వాడికి ఫస్ట్ ఎయిడ్ చేసినట్టుంది, వాడికి గాయం మీద బ్యాండ్ ఎయిడ్ వేసుంది.

పిన్నీ నన్ను పలకరించింది ‘ ఆర్ యూ ఓ కే , హోప్ యు ఆర్ …’ అని నవ్వి మళ్ళీ వెళ్ళిపోయింది వాళ్ళలోకి.

బాగా ఆకలి వేస్తోందనుకునేలోపే నాకూ ఎవరో ఉప్మా తెచ్చిపెట్టారు…తినేసి కళ్ళుమూసుకున్నాను, మళ్ళీ నిద్రపోయాను కాబోలు !

sitaram1

‘పాపాయ్, పాపాయ్’ పిన్ని పిలుపుకి  ఉలిక్కి పడి లేచాను.

‘చూడు వర్షం తగ్గింది, పై మేడ మీదకు వెళ్దాం రా, యేరు వెనక్కి వెళ్తోందట’

, వెళ్ళాం.. అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు.

‘ఏరియల్ వ్యూ కదా ఇక్కడి నుంచి ?’ పిన్ని నవ్వుతూ అడుగుతోంది

నిజంగానే అన్ని వీధులూ నీళ్ళు నీళ్ళు, చూస్తుండగానే మూడు హెలికాఫ్టర్లు అటూ ఇటూ తిరుగుతూ నీరు లేని చోట్ల కొన్ని మూటలు, అట్టపెట్టెలు పై నుంచి విడిచి పెడుతున్నారు

‘అందరి ఇళ్ళూ మునిగి పోయాయి కదా, అన్నీ సెట్ అయ్యే వరకూ అవసరమైన సరుకులు గవర్నమెంట్ ఇలా ఇస్తుంది’ పిన్ని చెప్తోంది.

‘మనం ఇక ఇంటికి వెళ్లచ్చా? ‘  ప్రమాదం తప్పినట్టే కదా ??

‘చూద్దాం’ తనేటో చూస్తూ సమాధానం చెప్పింది.

మేడ మెట్లు దిగి ఆ ఇంటి గేటు వరకూ వచ్చాక కానీ తెలియలేదు మొన్నటి నుండీ ఉన్నది ఆ ‘ సితార’ సినిమాలో బంగ్లా లాంటి బంగ్లాలో  అని. లోపల భలే ఆశ్చర్యం, అంటే ఆ ఎర్రచీర ఆవిడేనా ఈ ఇంటి ఓనర్, భలే ఉన్నారు నిజంగానే చాలా మంచిది. అనుకుంటుండగానే ఆవిడ వచ్చారు.

‘’ నమస్కారం టీచరమ్మా, సమయానికి మీరు చేసిన వైద్యం, సాయం మర్సిపోలేము. మీకు ఉండటానికి సిమెంట్ ఇల్లు పాలకేంద్రం కాడ మా తమ్ముడోళ్ళ  ఎనక పోర్షన్ ఏర్పాటయ్యింది. నేరుగా ఆడికే పోండి. ఈడ పాత ఇంట్లో పనికొచ్చే సామాను ఏమన్నా వుంటే మా పాలేరు ఆడికి తెచ్చిస్తాడు,ఏమ్మా, సరేనా!!’ ఆవిడ మొత్తం చెప్పేశాక పిన్నికి అర్ధమయినట్టుంది. నాకే లోపల పెద్ద ప్రశ్నా పత్రం!

మేము గేటు వైపు తిరిగామో లేదో, ఆవిడ ఎవర్నో పెద్దగా అరుస్తోంది

‘’ మడిసివా? ఆశబోతు పిశాచివా? ఇల్లు బోయి, బిడ్డా గొడ్డూ బొయ్యి మడుసులు అల్లాడతా ఉంటే గవర్నమెంటోళ్ళు ఏసిన బియ్యపు గింజలు ఏరుకొని తెచ్చి దాచిపెడతా వుండావే! ఎవయ్యా, మొలకా రెడ్డా, ఊరి మునిగిపోతా ఉండా కూడా నీకు బుర్రలో బుద్ది మొలవలేదే! అన్నదమ్ముడివని విడిసి పెడతావుండా, ఫో, గేటుకాడ కూర్చొని ఈ బస్తాలన్నీ పెట్టుకోని కుంచాం తో కొలిసి మడిసి మడిసికీ ఇయ్యి. ఏందీ? ఇనబడిండా, మల్లా సెప్పేదా? ‘’  ఆఖర్న ఒక్క ఉరుము ఉరిమింది అతన్ని.

పిన్ని నన్ను చెయ్యి పట్టుకొని ఆవిడ చెప్పిన అడ్రస్సుకు తీసుకొని వెళ్తోంది. అయినా అడిగాను ‘ఎక్కడికి వెళ్తున్నాం?’ అని

‘కొత్త ఇంటికి’  పిన్ని తల ఎత్తకుండా నడుస్తూ చెప్పింది

‘ఎందుకు?’

‘’ఎందుకంటే మనం ఉంటున్న ఇల్లు మొన్న రాత్రే పడిపోయింది’’’  నీళ్ళలో చూసి చూసి అడుగేస్తూ చెప్పింది.

నాకు ఒక్కసారిగా తలలో నుంచి పెద్ద ఐస్ క్యూబ్ జారినట్టు, చల్లటి నీళ్ళు మొహం మీద కుమ్మరించినట్టూ ఝల్లుమంది. ఆగిపోయాను పూర్తిగా! ఏమనాలో తెలియలేదు.

‘పిన్నీ, నా బుక్స్, నీ బుక్స్  బట్టలు .. ‘ నాముఖం ఇప్పుడు ఏ రంగులో వుందో ఖచ్చితంగా ఊహించుకోలేక పోతున్నాను.

‘పాపాయ్, మనం ఉన్నాం కదా! అవన్నీ మళ్ళా తెచ్చుకోవచ్చు’ పిన్ని వెనక్కి తిరిగి నవ్వుతూ అంటోంది.

ఆ అటెండర్ శీనయ్య వచ్చి తీసుకురాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ?? నిజమే అలా ఏమీ కాలేదు కదా, ఇంకెందుకు బాధ!!

‘మనం ఊహించలేం పాపాయ్, దేవుడు ఎలా వస్తాడు? ఏమి సహాయం చేస్తాడు? ఎలాంటి పాఠాలు నేర్పిస్తాడు? అని , ‘ప్రాణం అమూల్యం’  అని ఎన్నిసార్లు ఇంపోజిషన్ రాస్తే అర్ధం అవుతుంది? ఇప్పుడు చూడు ఇంతమందిని కూర్చోబెట్టి ఒకే పాఠం ఎంత అర్ధవంతంగా చెప్పాడో దేవుడు!! ఒప్పుకోవాలేగానీ పై వాణ్ణి మించిన గురువు లేడురా!! ‘ పిన్ని నవ్వుతూ చెప్తోంది అందంగా, హాయిగా!!

*

స్వేచ్ఛ

prajna

ప్రజ్ఞ వడ్లమాని

“వైష్ణవ జనతో తేనె కహియెజే…………”                            “వానా వానా వెల్లువాయే..”

“పీడ్ పరాయీ జానేరే……….”                                            “కొండా కోనా తుళ్లిపోయే..”

“ఏంటి శరత్ ఇదీ? స్కూల్ అసెంబ్లీ లో మెడిటేషన్ జరుగుతున్నప్పటినుండీ చూస్తున్నాను. అక్కడ పెద్ద పెద్ద స్పీకర్ లలో నుండి ఆ సినిమా పాటలు మోగుతూనే ఉన్నాయి, ఇక్కడ ఏమీ పట్టనట్టు మెడిటేషన్ , ప్రేయర్ జరుగుతూనే ఉంది?” అడిగింది పవిత్ర.

“మరి స్కూల్ కి ఎదురుగ్గా ఫంక్షన్ హాల్ ఉంటే, వీళ్ళు మాత్రం ఏం చేస్తారులే. సర్దుకుపోవాలి అంతే” శరత్ అన్నాడు.

“నీకేమో గాని, నాకు టూమచ్ అనిపిస్తోంది”

“తల్లీ మొదలెట్టకు. ఎప్పటినుండో మంచి పేరున్న స్కూల్ ఇది. ఇంకా ఇప్పుడే అడుగుపెట్టాము. పద ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్దాము”

పవిత్ర, శరత్ లు వారం క్రితమే అమెరికా నుండి ఇండియా కి షిఫ్ట్ అయ్యారు. ఇద్దరూ బాగా సంపాదించి, ఇండియా లోనే ఏదైనా బిజినెస్ పెడదామని అనుకున్నారు. వాళ్ళకి  నాలుగేళ్ల పాప ఉంది. ప్రి-స్కూల్ అయ్యాక పాపని ఇప్పుడు ప్రైమరీ స్కూల్ లో చేరిపిద్దామని, ఇద్దరు ఒక కొర్పోరేట్ స్కూల్ కి వచ్చారు.

“మెట్లు కనిపించడం లేదు, బిల్డింగ్ మాత్రం ఇంత పెద్దగా ఉంది?”

“ఎంటే బాబు నీ డౌట్లు. అక్కడ లిఫ్ట్ ఉంది కనిపించడంలేదా? పద అటు వైపు” శరత్ కసురుకున్నాడు.

“స్కూల్ లో లిఫ్ట్ ఏంటి నా మొహం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ ఎక్సర్సైస్ ఉండాలిగా?” లిఫ్ట్ ఎక్కుతూ పవిత్ర అంటోంది.

“మన కాలంలా అనుకుంటున్నావా? అన్నీ మారిపోయాయి. సరేలే ఆపు.. ఉష్” అని ప్రిన్సిపల్ ఆఫీసు తలుపు తీస్తూ, “మే ఐ కమిన్ మేడమ్” అని అడిగాడు.

“షూర్ రండి రండి” అని ఇద్దరినీ లోపలికి రమ్మంది ప్రిన్సిపాల్ అర్చన. పేరుకే ప్రిన్సిపాల్, వయసు ముప్పై కూడా ఉండవు. ఆమె సైగ చేయగా  వాళ్ళిద్దరూ కూర్చున్నారు.

“నా పేరు శరత్ . కిందటి వారం అపాయింట్మెంట్ తీసుకున్నాము. మా పాప గురించి…”

“ఓ మీరా, యా యా, నాకు గుర్తుంది. మీకోసమే అదిగో అతను ఎదురుచూస్తున్నాడు” అని అక్కడే నించున్నతని వైపు చూసి, “మిష్టర్ రవి, వీళ్ళని స్కూల్ టూర్ కి తీసుకువెళ్ళండి. అయిపోయాక మిగితా విషయాలు మాట్లాడుకుందాము” అని మళ్ళీ పవిత్రా వాళ్ళ వైపు తిరిగి, “హి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ” అని అర్చన గబగబా చెప్పేసి రూమ్ నుండి వెళ్లిపోయింది.

ఇంత చిన్న వయసులో ఈమెకి ఎన్ని బాధ్యతలో అని ఆలోచిస్తున్న  శరత్ ని రవి, “సర్ వెళ్దాము రండి” అన్నాడు.

కారిడార్ లో కాసేపు నడిచాక ఒక రూమ్ దగ్గర ఆగి, “ఇది క్లాస్రూమ్ సర్. అన్నీ ఇలాగే ఉంటాయి. ఇవాళ స్కూల్ ఉంది కదా, అందుకే లోపలికి వెళ్లలేము. బయట నుండే చూడండి. ప్రతి క్లాస్ లో కనీసం వంద మంది స్టూడెంట్స్ ఉంటారు” అన్నాడు.

“వంద మంది కొంచం ఎక్కువేమో? అందులో సగం ఉన్నా ఎక్కువే!” పవిత్ర ఆశ్చర్యంగా అడిగింది.

“లేదు మేడమ్. ఈ మధ్య అన్నీ స్కూల్స్ లో ఇలాగే ఉంటోంది. పైగా మా స్కూల్ లో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఉంటారు” రవి అన్నాడు.

“బ్లాక్ లేదా గ్రీన్ బోర్డు ఏది?” పవిత్ర కి డౌట్ రానే వచ్చింది.

“మేడమ్ ఈ కంప్యూటర్ యుగంలో బోర్డు ఏంటి మేడమ్. అదిగో స్క్రీను, ఇదిగో కంప్యూటర్. అంతా డిజిటల్ అయిపోయింది గా.  టెక్నో ఎడ్యుకేషన్ అంటారు దీనినే” అని నవ్వుతూ రవి చెప్పాడు.  శరత్ మాత్రం ఏమీ మాట్లాడలేదు.

“అది సరే, కిటికీలు ఏవి? గాలి కూడా టెక్నో నా?” పవిత్ర వెటకారంగా అడిగింది.

“భలే జోకు వేశారు మేడమ్. రూమ్స్ అన్నీ ఏ‌సి కదా. అందుకే కిటికీలు ఉండవు. కొన్ని రూమ్స్ లో మాత్రం  ఫాన్స్ ఉంటాయి” ఏదో పెద్ద మెహెర్బానీ చేసినట్టు చెప్పాడు రవి. ముగ్గురూ ముందుకి సాగారు.

శరత్ ఏమీ మాట్లాడలేదు. పవిత్ర మాట్లాడేలోపు రవి “మేడమ్ ఇది క్రాఫ్త్స్ రూమ్. చూసారా ఆ బొమ్మలు, ఫ్రేమ్లు ? అవన్నీ మన స్కూల్ స్టూడెంట్స్ చేసినవే” . రవి ‘మా స్కూల్’ నుండి ‘మన స్కూల్’ కి తనమాటని మార్చడం శరత్ గమనించాడు.

swechcha.pragna

Image: Bhavani Phani

“రూమ్ కొంచం చిన్నగా ఉంది? స్టూడెంట్స్ ఒక్కో క్లాస్ లో వంద మంది అన్నారు? సరిపోరేమో కదా?” అని పవిత్ర అడిగింది.

“లేదు లేదు మేడమ్. ఇదీ కేవలం అమ్మాయిలకే. గర్ల్ స్టూడెంట్స్ ఓన్లీ. అబ్బాయిలకి సేమ్ పీరియడ్ లో గేమ్స్ అండ్ స్పొర్ట్స్ ఉంటాయి”

“మరి అమ్మాయిలకి స్పొర్ట్స్ ఉండవా?” శరత్ మొదటి సారి ఒక ప్రశ్న అడిగాడు.

“లేదు సర్. అమ్మాయిలకి క్రాఫ్త్స్. అబ్బాయిలకి స్పొర్ట్స్. మీ సందేహం నాకు అర్ధమయ్యింది సర్. మళ్ళీ ఇద్దరికీ పీటీ అదే ఫిజికల్ ట్రైనింగ్ వేరేగా ఉంటుంది, నెలకి ఒకసారి” అని రవి మళ్ళీ, “పదండి సర్ కంప్యూటర్ లాబ్ చూపిస్తాను”

“మనం ఇంజనీరింగ్ అప్పుడు లాబ్ లు చూసినట్లు ఏంటి శరత్ ఇదీ? చిన్నపిల్లల స్కూల్ లాగా లేదు” అని శరత్ చెవిలో పవిత్ర చెప్పి, “ఇప్పుడు అన్నీ రూమ్స్ లో కంప్యూటర్లు చూసాంగా, అవే లాబ్ల లాగా ఉన్నాయి” గట్టిగా, వ్యంగ్యంగా అంది.

“హ హ హ, మీరు భలేగా కామెడీ చేస్తున్నారు మేడమ్” అని రవి నవ్వుతూనే లాబ్ చూపించాడు. పవిత్ర, శరత్ లు మాత్రం నవ్వలేదు.

“బ్రేక్ అనుకుంటాను, పిల్లలు బయటకి వస్తున్నారు” పవిత్ర అంది.

“అవును మేడమ్. ఇప్పుడు లంచ్ బ్రేక్”

“ఎన్ని బ్రేక్లు ఉంటాయి మొత్తం?” పవిత్ర ఒక పేపర్ తీసి రాసుకుంటోంది.

“రెండు మేడమ్. లంచ్ బ్రేక్ అండ్ డిన్నర్ బ్రేక్”

తల పైకి ఎత్తి, “డిన్నర్ బ్రేక్ ఏంటి? డిన్నర్ ఇంట్లో చేయరా పిల్లలు? ఇదీ రెసిడెన్షియల్ స్కూల్ కాదు గా” పవిత్ర షాక్ అయింది.

“కాదు మేడమ్. స్టూడెంట్స్ ఇంటికే వెళ్తారు. తొమ్మిదింటికి స్కూల్ అయిపోతుందిగా. సొ లంచ్ బ్రేక్ పన్నెండింటికి, డిన్నర్ బ్రేక్ రాత్రి ఏడింటికి అన్నమాట” రవి చెప్పాడు.

“సారీ. నాకు సరిగ్గా అర్ధంకాలేదు. స్కూల్ టైమింగ్లు ఏంటి?” పవిత్ర సందేహాస్పదంగా అడిగింది.

“నైన్ టు నైన్ మేడమ్, మీరు స్కూల్ బ్రోషర్ లో చదవలేదా? ప్రిన్సిపల్ ఆఫీసు కి వెళ్దాము, ఆవిడ అన్నీ వివరంగా చెప్తారు మీకు” అని వాళ్ళని ప్రిన్సిపల్ ఆఫీసు దగ్గరకి తీసుకొచ్చి రవి వెళ్లిపోయాడు.

“పవిత్రా, మనం ప్రేయర్ టైమ్ లో అక్కడే ఉన్నాము కదా? నీకు ప్లే గ్రౌండ్ కనిపించిందా?” శరత్ సీరియస్ గా అడిగాడు.

“లేదు. నేనే ఆ విషయం అడుగుదామనుకున్నాను. కానీ ‘అన్నీ డౌట్లే’ అని అంటావని అడగలేదు. ఏంట్రా బాబు ఈ స్కూల్ అసలు? వామ్మో” పవిత్ర అంటుండగానే శరత్ రై రై మనుకుంటూ ప్రిన్సిపల్ రూమ్ లోకి తలుపు కొట్టకుండానే వెళ్లిపోయాడు.

“మేడమ్….” అని శరత్ మాట్లాడుతుంటే అర్చన కట్ చేసి, “మిష్టర్ శరత్, స్కూల్ నచ్చిందా? ఫీ వివరాలు మాట్లాడుకుందామా? ఏ‌సి బస్ అయినా కూడా నార్మల్ చార్జెస్ ఉంటాయి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు…” అని ఆవిడ ఇంకేదో చెప్తుండగా అక్కడ ఉన్న బల్ల ని గట్టిగా కొట్టి శరత్, “ అసలు ఇదొక స్కూల్ ఆ?”

“ఏంటండీ మీరు అనేది?” అర్చన ఆశ్చర్యంగా అడిగింది.

“నేనొకటి అడుగుతాను మీరు ఏం అనుకోకుండా సమాధానం చెప్పండి”

“ఏంటది”

“మీ క్వాలిఫికేషన్స్ ఏంటి?”

“మిష్టర్ శరత్” అని గట్టిగా అరిచింది అర్చన.

ఆ అరుపు కి అక్కడ ఉన్న కొంత మండి స్టాఫ్ పరిగెట్టుకుంటూ ఆ ఆఫీసు కి వచ్చారు. ఏం జరుగుతోందో అన్న కుతూహలం, ఆతృత వాళ్ళ మొహంలో కనిపిస్తోంది.

“చెప్పండి. మీరు చాలా చిన్న వయసు వారు, మీకు ఇంత తొందరగా ప్రిన్సిపాల్ జాబ్ ఎలా వచ్చింది?”

Kadha-Saranga-2-300x268

“మా అమ్మ ఇదివరకు ఇక్కడ ప్రిన్సిపాల్ గా ఉండేది. నేను మాస్టేర్స్ చేసొచ్చాక అమ్మ ని రిటైర్ అవ్వమని చెప్పి,  నేను తీసుకున్నాను ఈ బాధ్యత. అయినా అవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారు? అసలు మీకు ఏం కావాలి? మీకు స్కూల్ నచ్చకపోతే ఏం గొడవ చేయకుండా వెళ్లిపోండి” అర్చన ఆవేశంలో ఊగిపోతూ చెప్పింది.

“స్కూల్ నచ్చడమా? స్కూల్ లో గ్రౌండ్ ఏది? స్పొర్ట్స్ పీరియడ్ లో ఏం చేస్తారు పిల్లలు? ఓహ్ సారీ, మగ పిల్లలు. ఆడపిల్లల్ని స్పొర్ట్స్ కి అనుమతించరా? ఇదెక్కడి పాలసీ? ఏం ఆడపిల్లలకి ఆటలు ఆడుకోవాలని ఉండదా? అలాగే మగపిల్లలకి క్రాఫ్త్స్, ఆర్ట్స్ అంటే ఇష్టాలు ఉంటాయి. మరి వాళ్ళ సంగతి ఏంటి? అంటే మగపిల్లలకి, ఆడపిల్లలకి ఇంత వివక్ష చూపిస్తున్నారా? వీళ్ళకి స్వేచ్ఛ లేదా? రేపొద్దున సమాజంలో వీళ్ళకి ఒకరిపట్ల ఒకరికి ఇంక గౌరవం ఏముంటుంది?”

“ఇది మా స్కూల్ పెట్టినప్పటి నుండి ఉన్న రూల్స్ అండీ, ఎలా మారుస్తాము? అయినా చదువు మాత్రమే ఇంపార్టంట్. దీనిని మీరు అనవసరంగా చాలా పెద్దది చేస్తున్నారు” అర్చన భావరహితంగా చెప్పింది.

“ఓహో అలాగా? అయితే మరి బ్లాక్ బోర్డుల బదులు కంప్యూటర్ లతో చదువు చెప్పటం కూడా ఉండేదా ఇదివరకు? రూల్స్ అన్న పేరుతో ఇష్టమొచ్చినట్లు చేస్తే మీ మేనేజ్మెంట్ ఒప్పుకుంటుందేమో, మేము ఒప్పుకోము” పవిత్ర  ఖచ్చితంగా చెప్పేసింది.

“ఇందాక అన్నట్లే మీరు వెళ్లిపోవచ్చు. మీ పాపని మా స్కూల్ లో అడ్మిట్ చేయమని నేనేమీ మిమ్మల్ని బ్రతిమిలాడట్లేదు” అర్చన కూడా దృఢంగా చెప్పింది.

“అంతే గాని, మీ పద్దతులు మార్చుకోరన్నమాట!” కోపంగా శరత్ అన్నాడు.

“ఎన్నేళ్ళ నుండో ఈ స్కూల్ నడుస్తోంది. మా స్కూల్ కి చాలా మంచి పేరు ఉంది. అసలు మీ ప్రాబ్లం ఏంటి?”

“స్కూల్ కి ఎదురుగ్గా ఒక పెళ్లి హాల్. స్కూల్ మైన్ రోడ్ మీద ఉంది, అక్కిడెంట్స్ అవ్వటానికి చాలా ఆస్కారముంది. స్కూల్ లో గ్రౌండ్ లేదు. ఆడపిల్లలకి గేమ్స్ పీరియడ్ లేదు. రూమ్స్ లో కిటికీలు లేవు, అంటే స్వచ్ఛమైన గాలి లేదు, అన్నిటికంటే దారుణమైనది స్కూల్ టైమింగ్.. పన్నెండు గంటలు పిల్లలు స్కూల్ లో ఉంటారు. పోనీ మధ్యలో బ్రేక్స్ ఉన్నాయా అంటే రెండే రెండు ..రెండు కలిపి ఒక గంట సమయం. వీళ్ళని పిల్లలు అనుకుంటున్నారా ప్రెషర్ కుకెర్స్ అనుకుంటున్నారా? ఇది స్కూల్ కాదు జైలు .. నా పాపని చచ్చినా ఈ స్కూల్ కి పంపను”

“అన్నీ ప్రైవేట్ స్కూల్స్ ఇలాగే ఉన్నాయి మిష్టర్ శరత్” ఏమి పట్టనట్టుగా అర్చన అంటుంటే, శరత్ “గవర్నమెంట్ స్కూల్ లో వేస్తాను లేదా నేనే చదువు చెప్తాను కానీ ఇలాంటి జైళ్ళకి నేను నా కూతుర్ని పంపనే పంపను” అని అరుచుకుంటూ బయటకి వెళ్లిపోయాడు.

ఆరేళ్ళ తరువాత

“ప్రిన్సిపాల్ మేడమ్, మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తూ లెటర్ వచ్చింది” ప్యూన్  వచ్చి చెప్పాడు.

“వావ్, ఎవరు? ఏంటి విశేషం?”

“స్వేచ్ఛ స్కూల్ అయిదేళ్ళ ఆన్యువల్ ఫంక్షన్, ఈ ఆదివారం”

“తప్పకుండా వెళ్దాము. మన లాంటి పెద్ద స్కూల్ వాళ్ళు అక్కడికెళ్తే అలాంటి చిన్న స్కూల్స్ కి మంచి పేరు” అర్చన అంది.

ఆదివారం స్వేచ్ఛ స్కూల్ కి చేరుకున్నాక, అక్కడ పవిత్ర, శరత్ లని చూసి, గుర్తుపట్టి అర్చన ఆశ్చర్యపోయింది. స్వేచ్ఛ స్కూల్ స్టాఫ్ కొంతమంది అర్చనకి స్కూల్ మొత్తం చూపించారు. పెద్ద గ్రౌండ్, ఆవరణమంతా ఎన్నో చెట్లు, క్లాస్ రూమ్స్ లో ఏ‌సి కాదు కదా, ఫ్యాన్లు కూడా లేవు. అలాగని పాతకాలపు స్కూల్ ఏమీ కాదు. ఆధునిక లాబ్లు కూడా ఉన్నాయి. అర్చన కి లోపల ఒక గిల్టీ ఫీలింగ్ మొదలయింది. తను కూడా ఇలాంటి స్వచ్చమైన వాతావరణంలో చదువుకుంది. తను ఇప్పుడు పనిచేస్తున్న స్కూల్ లో చాలా మంది పిల్లలు ఎప్పుడూ నీరసంగా, నిస్సహాయంగా కనిపిస్తూ ఉంటారు. ఆదే ఈ స్వేచ్ఛ స్కూల్ లో పిల్లలు ఎంతో చురుకుగా, సంతోషంగా ఉన్నారు.  ఒక బిజీ సిటి నుండి ఒక ప్రశాంతమయిన పల్లెటూరికెళ్తే వచ్చే భావన. పదేళ్ళలో ‘బెస్ట్ ప్రిన్సిపాల్’ గా ఎన్నోసార్లు ఎంతో మంచి పేరు,  ఎన్నో అవార్డులు సంపాదించుకుంది. ఎన్నో స్కూళ్ళు అర్చననే ప్రిన్సిపాల్ గా జాయిన్ చేయించుకోవాలనుకున్నాయి. అంత గొప్ప స్థాయి కి చేరుకున్నా, ఏదో అసంతృప్తి. తను చేసిన తప్పు ఏంటో, ఈ మెకానికల్ ప్రపంచంలో తను కూడా ఇమిడిపోయి ఎంత మారిపోయిందో అర్చన గ్రహించింది. ఒక నిర్ణయానికి వచ్చింది. ఫంక్షన్ మొదలయింది.

పవిత్ర స్టేజ్ మీద మైక్ లో “అందరికీ నమస్కారం. మీకో నిజం చెప్పాలి. మేము ఒక స్కూల్ ప్రారంభిస్తామనే అనుకోలేదు. నేను, మా వారు శరత్ అమెరికా నుండి ఇక్కడికొచ్చి ఒక బిజినెస్స్ ప్లాన్ చేశాము. కానీ జీవితం ఎల్లప్పుడూ మనం అనుకున్నట్లుగా ఉండదు కదా. ఈ కాలంలో ఎంతో కమ్మెర్షియల్ గా తయారయిన స్కూల్స్ ని చూసి, శరత్, నేను కలిసి ఒక స్కూల్ పెట్టాలని సంకల్పించాము. ఒక అద్దె బిల్డింగ్ లో మా స్కూల్ ప్రస్థానం మొదలయింది. మాకు ముందుగా ఎవరు సహాయపడలేదు.  కానీ మా విద్యా పద్ధతులు, పిల్లలకి జ్ఞానం పంచే విధానం నచ్చి చాలా మంది సహాయం చెయ్యడానికి ముందుకి వచ్చారు. రెండేళ్లకి  స్కూల్ లో కౌంట్ – మూడు వందల మంది స్టూడెంట్స్, పది మంది టీచేర్స్.   అంచలంచెలుగా ఎదిగి ఇదిగో అయిదేళ్ళకి ఇక్కడకి చేరుకున్నాము. ఇప్పుడు స్కూల్ లో వెయ్యి కి పైగా స్టూడెంట్స్, పాతిక మంది టీచింగ్ స్టాఫ్. ఒక స్కూల్ కి రాంకులు వస్తే గొప్ప కాదు. ఆ స్కూల్ లో పిల్లలు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళని ఆ స్కూల్ ఎంత తీర్చిదిద్దింది అన్నదే గొప్ప. మా స్వేచ్ఛలో విద్యార్ధులకి మానసిక విద్య , క్రమశిక్షణ తో పాటు శారీరక వ్యాయామం, సామాజిక స్పృహ, యోగా, సంగీతసాహిత్యాలతో పాటు ఇంకా ఎన్నో విద్యల పట్ల అవగాహన ఉంటుంది.  ఒక స్కూల్ లో విజ్ఞానం తో పాటు వికాసం కూడా ఉండాలి అన్నది మా నమ్మకం. ఆదే మా స్వేచ్ఛ స్కూల్ యొక్క లక్ష్యం కూడా. ఇప్పుడు మన ముఖ్య అతిధి అర్చన గారిని మాట్లాడమని కోరుతున్నాను”

పదే పది క్షణాల గాప్ లో  అర్చన మైక్ తీసుకుని, “ఇప్పుడు నేను ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న స్కూల్ లో రాజీనామా చేస్తున్నాను. సందేహం లేకుండా ఆ స్కూల్ నాకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. కానీ నాకు జాబ్ లో తృప్తి లేదు. నీరసంగా ఉండే పిల్లల్ని చూసి నేను కూడా నీరసపడిపోతాను రోజు. ఇవాళ ఇక్కడ స్టూడెంట్స్ ని స్వేచ్ఛగా చూశాక, నేను కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నాను. అందుకే పవిత్ర, శరత్ లని నాకు ఒక టీచర్ పోస్ట్ ఇప్పించమని కోరుతున్నాను” అని పవిత్ర, శరత్ వైపు తిరిగి ‘సారీ’ ఫీల్ అవుతునట్లు దణ్ణం పెట్టింది.

శరత్ మైక్ తీసుకొని, “స్వేచ్ఛ కి ఇవాల్టి నుండి కొత్త ప్రిన్సిపాల్, అర్చన గారు” అని అనగానే హర్షద్వానాలు మొదలయ్యాయి.

****

అసుర సంధ్య.. 


  అనిల్ ప్రసాద్ లింగం

 

anil prasadమాధవీ! ” కారు దిగి ముందుకు నడవ బోయినామే వెను తిరిగి ఏమిటన్నట్లు భర్తను చూసింది. బాగా కోపం వస్తే తప్పా అజయ్ ఆమెను అలా పూర్తీ పేరుతొ ఎప్పుడూ పిలవడు. కానీ ఇప్పుడు అతనికి కోపం వచ్చే పని ఏదీ ఆమె చేయలేదు. అందుకే ఆశ్చర్యపోతు చూస్తుంది.

“మీ నాన్న, …అతన్ని చూసి ఎందుకు ఏడ్చాడు ?”
“అదీ…. చాల రోజుల తరువాత… అయిన వాళ్ళు కనబడే సరికి కొంచెం ఏమోషనల్ అయినట్టున్నారు. ఆయన్ను అలా  చూసి నాకూ కళ్ళ నీరు తిరిగింది అంతే.” అనుభవంతో అతని తరువాత ప్రశ్నకు కూడా సమాదానం చెప్పెసి  ముందుకు నడిచింది మాధవి. కారును నిర్దేశిత ప్రదేశంలో పెట్టడానికి వెళ్ళిపోయాడు అజయ్. మామూలుగానైతే అతను వచ్చే వరకు ఆమె లిఫ్ట్ బయట వేచి వుండేది కానీ ఈ రోజు తానొక్కతే లిఫ్ట్ లో ఎక్కి తాము ఉండే అంతస్థు బటన్ నొక్కింది. లిఫ్ట్ పైకి పోతుంది ఆమె ఆలోచనలోకి జారిపోయింది.
*                      *                        *                           *                                *                          *                           *                            *
ఆరు నెలల క్రితం నాటి మాట. తనను చూసిపోదామని వచ్చిన తల్లి తండ్రులని తిరిగి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కించడానికి భర్త, కొడుకులతో భయలుదేరింది మాధవి. వేగంగా వచ్చిన లారీ డీ కొట్టడంతో  వాళ్ల కారు వెనుక భాగం నుజ్జు  నుజ్జైయింది. వెనుక కూర్చున్న తల్లీ, తన కొడుకు తేలికగా మృత్యు వొడిలోకి జారిపోగా తండ్రి నడుము విరిగి మంచానికే పరిమితం అయ్యాడు. కారు ముందు సీట్లలో  వున్న భార్య భర్తలు చిన్నచిన్న దెబ్బలతో భయట పడ్డారు. స్వయానా డాక్టర్లు అవడం చేత శరీర దేబ్బలకు వైద్యం చేసుకొని త్వరగానే కోలుకున్నారు కానీ విధి వాళ్ళ జీవితాల్లో పెట్టిన చిచ్చు వలన మనసుకు ఏర్పడిన గాయాలను పుడ్చుకోలేకపోయారు. ఒకరికి ఒకరు తోడుగా నిలవాల్సిన ఆ విషమ పరిస్థితిలో వారు క్రమంగా దూరం కాసాగారు.
తన ఇంటికి వచ్చి సహచరిణి కోల్పోయిన తండ్రి భాద్యత ఇకఫై తానే వహిస్తానని సోదరులకు చెప్పేసింది మాధవి భర్తను సంప్రదించకుండ. మంచానికే అతుక్కు పోయుండే మనిషిని శాశ్వతంగా ఇంట్లో పెడితే ఆయన్ను చూసినప్పుడల్లా పోయిన తన బిడ్డ గుర్తుకు వస్తాడని అందుకు కాదన్నాడు అజయ్. చివరికి ఇద్దరూ ప్రాక్టీసు చేసే హాస్పిటల్లో పెట్టారు. ఇప్పుడు అజయ్, రోజులో ఎక్కువ సేపు గడిపేది హాస్పిటల్లోనే – ఏదో ఓ సమయంలో విధిగా ప్రతీ వార్డూ తిరగాలి – ఆ క్రమంలో మళ్లీ మామగారిని చూడాల్సి వస్తుందని, అందుకే ఆయన్ని వేరే హాస్పిటల్లో గాని వృధా శ్రమంలో కానీ పెట్టమని గొడవ. ఈ కలతలు వారి మధ్య దూరాన్నిమరింత పెంచాయి. ఒకప్పుడు ఒక్కటిగా అన్ని పనులు చేసిన ఇద్దరూ ఇప్పుడు కాలక్షేపం కొరకు  వేరు వేరు కార్యక్రమాలలో నిమగ్నం కాసాగారు. మగాడు కాబట్టి అజయ్ కు  భయట స్నేహితులతో బాగానే గడిచి పోతుంది. మాధవి మాత్రం ఉహా ప్రపంచంలో  (virtual world) తన తోడూ వెదుక్కుంది.
*                  *                    *                       *                     *                      *                       *                        *                     *                    *
“సాగర్, నేను పూజని. నాన్నకు ఆక్సిడెంట్ అయ్యింది. నడుం విరిగి మంచం లోనే వుంటున్నారు. నిన్నూ అత్తను ఒక్కసారి చూడాలని అంటున్నాడు.” ప్రముఖ రచయిత విజయ్ బ్లాగ్ లో మెసేజ్ పెట్టింది మాధవి.
“సారీ పూజగారు మీరు ఎవరికో పంపాల్సిన మెసేజ్ నాకు  పెట్టినట్టు వున్నారు. ఒక సారి సరి చూసుకోండి. ఏదయినా కానీ మీ నాన్న గారి విషయంలో జరిగిన దానికి సారీ.” త్వరగానే రెస్పాన్స్ వచ్చింది.
“నేను సాగర్ పూజని, నన్ను మర్చిపోయవంటే నేను నమ్మను. ప్రమాదంలో అమ్మ చనిపోయింది, నాన్న ఒంటరి వాడైపోయాడు. ఒక్క సారి అత్తను చుడాలంటు న్నాడు. ఏడిపించకు ప్లీజ్ !” బతిమలాడింది మాధవి.
“నా పేరు విజయ్ అండీ ! మీరు సాగర్ గురించి నా బ్లాగ్లో వెదికితే ఎట్లా ?” తిరుగు సమాదానం.
“ఈ రిప్లై ఇస్తుంది విజయ్ కాదు. ఒక్క సారి విజయ్ కు ఈ మెసేజ్ గురించి చెప్పండి ప్లీజ్.” నిబ్బరంగా చెప్పింది మాధవి.
రెండో రోజు విజయ్ బ్లాగ్లో సమాదానం వచ్చింది. ” అయ్యో పూజ  నువ్వా ? ఎక్కడ వున్నారు మీరు అడ్రస్ చెప్పు.  ముందు నీ ఫోన్ నెంబర్ ఇవ్వు”
“నువ్వు విజయ్ కాదు. ఒక్క సారి ఆయనకు ఈ విషయం చెప్పండి మీకు దండం పెడతాను.” దీనంగా రాసింది.
“పూజ  నేనే సాగర్ ను. త్వరగా నీ అడ్రస్ చెప్పవే.” వెంటనే బదులు వచ్చింది. అది చూసి ఆమె పేదలఫై చాల రోజుల తరువాత నవ్వు విరిసింది. “ఏమే అంటావేంటి?నేనేమైన నీ ……” పూరించ కుండ పంపేసింది. “నేను అలా పిలుస్తాననే భయంతోనే నన్ను చేసుకొలేదా ? మరి ఇప్పుడు మీ ఆయన ఏమని పిలుస్తున్నాడే ?”         “నా పూర్తి పేరుతో, పూజ  అని”        “గుర్తు పట్టానన్నాను కాదే మధూ … సరే ‘ఏమే’ అననులే. నీ నెంబర్ చెప్పు”             “వద్దు బావ నువ్వు ఏమే అనే పిలువు. నాకూ అదే ఇష్టం. బ్లాగ్లో నీ అడ్రస్ కింద వున్న ల్యాండ్ లైనుకు ఫోన్  చేస్తాను.” అని వ్రాసి కళ్ళు తుడుచుకుంటూ ఫోన్ తీసింది మాధవి.
“మధూ… ఎలాగున్నావే ?  ఏప్పుడు జరిగింది ఇదంతా ? అసలేక్కడున్నారు మీరు ? ఇంత ఘోరం జరిగితే కనీసం చెప్పలనిపించలేదే మాకు?” ఫోన్ ఎత్తుకో గానే  ప్రశ్నల   వర్షం కురుపించాడు విజయ్.
ఆ అభిమానానికి ఆమె గుండె ఉబికింది  “బావా….” ఆపుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఏడుపు తన్నుకొస్తుంది. “మధు ఎక్కడున్నావుచెప్పవే నేనే వస్తాను” అతని గొంతులో ఉద్విగ్నత పొంగుకొస్తున్న దుఖాని తెలియ చేస్తుంది. కొంత సేపు ఇద్దరూ యేడ్చుకున్నారు.
“నిన్ను చాలా మిస్ అయ్యాను బావా….” కోరుకున్న మనిషి నుంచి కాస్తంత ఓదార్పు దొరికే సరికి మరీ బేలగా మారిపోయింది మాధవి.
భర్త యొక్క మానసిక పరిస్థితిని అంచనా వెయ్యకుండా తన పట్ల, తన తండ్రి పట్లా  అతని ప్రవర్తనను విపరీతంగా అర్ధం చేసుకున్న ఆ ఇల్లాలు తనకు తోచిన రీతిలో స్వాంతన వెదుక్కుంది.
వివరాలన్నీ చెప్పేసి,” బావా నాకు పూజ  పేరుతొ ఈమెయిలు ఎకౌంటు వున్నట్టు  నీకు తప్పా ఇంకెవరికి తెలీదు. నేను బ్లాగ్ ద్వారా నిన్ను సంప్రదించినట్టు ఎవ్వరికీ  తెలీకూడదు.త్వరగా అత్తా నువ్వు వచ్చి నాన్నను చూడండి”
“మరి ఇక్కడ అమ్మకూ అక్కడ మీ వాళ్ళకూ ఎలా తెలిసింది అని చెప్పను ?”
       “గొప్ప రచయితవు కదా ఏదో కధ అల్లూ..మరీ అవసరం అయతే తప్పా నాకు  ఫోన్ చెయ్యకు. నిన్ను బ్లాగ్లో ఫాలో అవుతాను” జాగ్రత్తలు చెప్పింది మరదలు.            “సర్లేవే” సాలోచనగా అన్నాడు బావా.
*                            *                               *                                *                                  *                                   *                               *
“మా డ్రైవర్ అండీ!  పూల కుండీ జారి కాలి మీద పడింది కొంచం త్వరగా చూడండి.”  హాస్పిటల్లోకి ఓ వ్యక్తిని నడిపించు కుంటూ వచ్చాడు పేరెన్నిక గన్న సినీ రచయిత విజయ్.
వార్డ్ బాయ్ నుంచి డాక్టర్ల వరకూ అందరూ అతన్ని గుర్తు పట్టి చుట్టూ మూగారు. డ్రైవర్ కు వైద్యం జరుగుతుంది విజయ్ అభిమానుల ప్రశ్నలకుసమాధానాలు ఇస్తున్నాడు. అప్పుడే డాక్టర్ మాధవి హాస్పిటల్లోకి అడుగు పెట్టింది.
“మధూ… నువేంటి ఇక్కడ ?” ఆశ్చర్యం నటించాడు విజయ్.
“బావా..! నువ్వెప్పుడు వచ్చావు ?” నిజంగానే ఆశ్చర్య పోయింది మాధవి ఎందుకంటే ముందు నాటి రాత్రి ఏడు గంటలకు తన అడ్రస్ చెప్పింది ఆమె అప్పుడు అతను హైదరాబాదులో వున్నాడు. ఇప్పుడు తెల్లారి పదవుతుంది అతను విశాఖలో ఆమె ముందు ఉన్నాడు.
“పని ఉండి పొద్దునే ఇక్కడకు వచ్చాను, మా డ్రైవర్ కు దెబ్బ తగిలింది హాస్పిటల్ కు తీసుకొచ్చాను. నువ్విక్కడ పని చేస్తున్నావా ? ”
“అవును. నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. ఈయన మా ఆయన, డాక్టర్ అజయ్. ఇతను గొప్ప సినీ కధా రచయిత విజయ్, మా మేనత్త కొడుకు.” విజయ్ స్క్రీన్ ప్లే  నైపుణ్యానికి ముగ్ధురాలైన మాధవి పట్టరాని సంతోషంతో పరిచయం చేసింది.
*                         *                          *                         *                            *                           *                            *                            *
“నాన్న! చూడు ఎవరోచ్చారో” ఉత్సాహంగా అరిచింది మాధవి. నిస్తేజంగా తల తిప్పి గుమ్మం వైపు చూసాడు రామారావు. కళ్ళజోడు  సరి చేసుకొని మనిషిని పోల్చుకొని ఎగ శ్వాసతో ఏడుస్తున్నాడు. గోడకు ఆనుకొని కళ్ళు తుడుచుకుంటుంది మాధవి,  మేన మామను అలా చూసి తట్టుకోలేక గుమ్మానికి తల తాకించి బాధ పడుతున్నాడు విజయ్, అప్పుడు వచ్చాడు అజయ్ ఆ గదిలోకి. ముగ్గురూ ఒక్క సారిగా అతన్ని చూసి సర్దుకున్నారు. “విజ్జీ.. అమ్మను పిలవరా ఒక్కసారి” తేరుకున్న రామారావు అడిగాడు. “ఇంత జరిగితే మేము గుర్తు రాలేదా మామయ్యా నీకు ?” అభిమానంగా దెప్పిపొడిచాడు విజయ్,  ఆయన్ను సమీపిస్తు. “నాకు స్పృహ వుంటే కదరా ! వారానికి కానీ మనిషిని కాలేదు. అప్పటికే అత్తయ్యా, చిట్టి బాబు…. చిన్న పిల్లలు వీళ్ళకు తోచిన విధంగా కానిచ్చేసారు. అత్తయ్యను కూడా ఇక్కడే మట్టి  చేసేసారు. ఈ ఆరు నెలల ఒంటరి తనంతో నా అనే వాళ్ళ విలువ తెలిసోచ్చిందిరా. మా అక్కను చూపించరా ఒక్కసారి.” విజయ్ చెయ్యి పట్టుకొని బేలగా బ్రతిమలాడాడు రామారావు.
“ఈయన మీ చుట్టమని నాకు ఎప్పుడూ చెప్పలేదు ?” అడిగేసాడు అజయ్. “ఆస్థి తగాదాలతో విడిపోయారు. అప్పటినుంచి రాకపోకలు లేవు. నానమ్మ చనిపోయినప్పుడు కుడా అత్తా వాళ్ళు రాలేదు. ఆ తరువాత నాన్న మా చదువుల గురించి సిటీకి మకాం మార్చేశాడు. ఇదిగో ఇన్నేళ్ళకు మళ్లీ కలుసుకోవడం.” క్లుప్తంగా చెప్పింది మాధవి.
“పోయిన మీ అత్తయ్య ఊరిలో పొలాలన్నీ అమ్మిచ్చేసి అటు వెళ్ళకుండా చేసి నా వాళ్ళందరికీ దూరం చేసింది.” తన తప్పు ఏమీ లేదనట్టు భార్యను నిందించాడు రామారావు. “అమ్మను ఎందుకు అంటావు ? నువ్వు మీ అక్కను దూరం చేసుకొన్నావు.” ఉక్రోషంగా అంది మాధవి. “సరే ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఎందుకు లే మామయ్యా. నువ్వే మా ఇంటికి రారాదు ఓ వారం ఉండి వద్దువు గాని. గాలి మార్పు నీకూ మంచిది కదా!” విజయ్ ఆ సంభాషణ్ని దారి మళ్ళించాడు.
“ఆయన కదిలే పరిస్థితిలో లేడండి. అన్నింటికి  మనిషి  సాయం అవసరం. ఇంకా పూర్తిగా కోలుకోను కూడా లేదు హాస్పిటల్ లో ఉంచడమే మంచిది.” సూటిగా చెప్పాడు అజయ్.
“మా అమ్మ స్టాఫ్ నర్సు చేసి రిటైర్ అయ్యింది. తమ్ముడిని చూసుకోగలదు. ఇలా దిక్కులేనట్టు ఇక్కడ పడి ఉండాల్సిన ఖర్మ మా మామయ్యాకు లేదండీ.” ఆవేశంగా అన్నాడు విజయ్.
డాక్టార్ పరిభాషలో ఎందుకు కదల్చకూడదో వివరంగా చెప్పాడు అజయ్. మాధవికి ఇవేమీ తలకు ఎక్కడం లేదు. తనకోసం రెక్కలు కట్టుకు వాలిన బావా ప్రేమావేశం, మేన మావను ఇంటికి తీసుకెళతాను అనడంలో అతని బంధు ప్రీతి  చూసి ఆమె ఏదో తెలీని భావావేశంలో కొట్టుకు పోతుంది. తన P.A. కు ఫోన్ చేసి వెంటనే వాళ్ళమ్మ విమానంలో విశాఖ వచ్చే ఏర్పాటు చేసాడు విజయ్.
Kadha-Saranga-2-300x268
*                     *                   *                        *                        *                        *                    *                    *                     *                       *
“ముందు సాగర్ ఎవరు? పూజ  ఎవరు ? అన్నావు…… మర్చిపోయావా ?”  కోపం ప్రదర్శించింది మరదలు.
“నీకు ఓ నిజం చెప్పనా ! గత రెండేళ్ళగా నా పేరుతొ నా అసిస్టెంట్ ఆ బ్లాగ్ నడుపుతున్నాడు. ప్రేక్షకులూ, నా స్నేహితులు,  సిని ఫీల్డ్ లోని వారు ఎవ్వరికి అనుమానం రాలేదు. నువ్వే కనిపెట్టావే రిప్లై ఇస్తుంది విజయ్ కాదని. అతనూ షాక్ అయ్యాడు వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు. నిజం చెప్పొద్దూ నాకూ తొందరగా తట్టలేదు. కానీ రెండు నిమిషాలు ఆలోచించాక గుండె వేగం హెచ్చింది. అప్పట్లో హిందీ సినిమా ‘సాజన్’ చూసి నేను కుడా రచయితను కాబట్టి అందులోని హీరోకి జరిగినట్టు ఎవరో అభిమాని నాకు దెగ్గర అవుతుందేమోనని – జీవితంలోను, కాల్పనిక జగత్తులోనూ నువ్వే నా తోడుగా ఉండాలనీ కలలు కంటూ ఆ పాత్రల పేరులే మనమూ  పెట్టుకున్నాము. అది సుఖాంతం చేయబడిన త్రికోణ ప్రేమ  కధ అని, నిజ జీవితంలో భగ్న ప్రేమికులకు శ్వాస ఆడినంత వరకూ మనః శాంతి ఉండదని అప్పుడు తెలీదు మధూ. తెలిస్తే ఆ పేరులే వద్దనే వాడినే.” గుండె లోతుల్లోనుంచి వస్తున్నా విజయ్ మాటలు నాటకీయంగానే ఉన్నాయి.
“బాబు పోయాక జీవితం ఒక్కసారిగా అంధకారమయం అయిపోయింది బావా. నా బాధలో నేనుంటే నాన్న భాద్యత మీద పడింది. నన్ను పెంచి ఇంత చేసిన తండ్రిని ఈ పరిస్థితులలో వదిలేయ లేక నా దగ్గర ఇంట్లో  పెట్టుకుందాం అంటే అజయ్ కాదన్నాడు. అది నేను తట్టుకోలేక పోయాను. అతని తండ్రి ఈ పరిస్థితిలో ఉంటే వదిలేసే వాడా ? అప్పుడు గుర్తుకోచ్చావు బావా నువ్వు….నువ్వైతే ఎన్నటికి అలా అనవని నాకనిపించింది. అలాగే నాన్నను చూసిన వెంటనే మీ ఇంటికి తీసుకెళ్ళతానన్నావు చూడు అప్పుడు అనిపించింది నా నమ్మకం వమ్ము కాలేదని.” నీళ్ళు నిండిన కళ్ళతో బావా చేతి పై చేయి వేసింది మరదలు. తన చేతి మీద వున్న ఆమె చెయ్యి  ఫై  చెయ్యి వేసి కళ్ళతోనే అనునయించాడు బావా.
“సారీ విజయ్ గారు మా డాక్టర్లకు ఈ అర్జెంటు కేసుల బాధలు తప్పవు. అరే మీరేమీ ఆర్డర్ చెయ్యలేదా ? ఏంటి మధు ఇంటికి తీసుకేళ్ళమంటే వంట చెయ్యలేను అన్నావు, రెస్టారెంటుకు తీసుకొచ్చి ఖాలిగా కుర్చోబెట్టావా ?” వస్తూనే అడిగాడు అజయ్. “నేనే మీరు వచ్చే దాక ఆగుదామన్నాను” మాట పడ నివ్వలేదు విజయ్. మనసులోనే నవ్వుకుంది మాధవి. భోజనం ముగించాక తీపి తీసుకు రమ్మన్నాడు డాక్టర్ అజయ్, తనకు టీ కావాలన్నాడు విజయ్. చిన్నప్పటి  ఏ అలవాటూ మార్చు కొని బావను చూసి మళ్ళి మురిసింది మరదలు.
*                             *                             *                               *                                  *                           *                             *
“నాన్నా …….!” రోజు వారి చెకప్  చేసాక సంకోచెంగా పిలిచింది మాధవి. “ఏంటమ్మా..?” అప్యాయంగా అడిగాడు తండ్రి. ” నిన్న బావను చూసి ఎందుకు ఎడ్చావు ? మనం సరిగా చూసుకోవడం లేదా అని మీ అల్లుడు బాధ పడ్డారు.” కాసేపు మౌనం తరువాత నోరు విప్పాడు రామారావు.”బానే చూసుకుంటున్నారమ్మ! బాగానే చూసుకుంటున్నారు ! ఆసుపత్రికి వచ్చిన ఓ రోగిలా, దిక్కులేని, తన కాళ్ళ మీద తాను నిలబడలేని వాడిని చాలా దయతో….. బానే చూసుకుంటున్నారు.” ఒక్కో మాట కూడ బలుక్కుని మాటాడుతున్నాడు తండ్రి. “అదేంటి నాన్న….. ! ” ఇంకేమి అనాలో అర్ధం కాలేదు కూతురికి. “నా ఇంటికి నేను వెళ్ళలేను. కొడుకులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లరు, నీ ఇంట్లో మీ ఆయన ఉండనివ్వడు….ఏ జన్మలో చేసిన పాపమో ఇలా ఒంటరిగా, వెలివేయ బడిన వాడిలా….. ఎందుకమ్మా నేను ఇంకా బ్రతకడం… ఏదో  ఇంజెక్షన్ ఇచ్చి చంపేయ్యవచ్చుగా తల్లీ.” “ఏం మాటలు నాన్నా అవీ? ఎప్పుడేమయ్యిందని? ఆయన నిన్ను ఎమ్మన్నా అన్నాడా ?”               “అంటే బాగుండునమ్మా నాకు బాద పడటానికి ఒక కారణముండేది కానీ ఎవరూ ఏమీ అనరు, అసలు మాటాడరు, నన్నూ ఓ మనిషిగా గుర్తించరు. ఇలాటి వాడిని పలకరించడానికి ఏ దేవుడో పంపినట్టు ఆత్మీయుడు ఒకడు వచ్చాడంటే సంతోషం పొంగుకొచ్చిందమ్మా, నేను ఎత్తుకొని పెంచిన వాడు నన్ను ఈ స్థితిలో కుడా తన ఇంటికి తీసుకెళ్ళతానన్నాడంటే బంధుత్వమంటే ఏంటో తెలిసొచ్చి గుండె పగిలిందమ్మా.” మళ్లీ కన్నీరు పెట్టుకున్నాడు రామారావు. కళ్ళు తుడుచుకుంటూ బైటకు నడిచింది మాధవి.తను చేసిన పని తండ్రికి సంతోషం కలిగించిందని మాత్రం ఆమెకు అర్ధం అయింది. ఎంతో జీవితానుభవం ఉన్న తండ్రి తనకు ఎదురైన కష్టానికి ఇంతగా చలించిపొతే వయసు, అనుభవంలో చిన్న వాడయిన తన భర్త తనకు తగిలిన దెబ్బకు ఎంతగా కుమిలి పోతున్నాడో అనే ఆలోచనా, ఆ దుఖం  నుంచి బయట పడటానికి తమ దంపతులు ఇరువురు ఒకరికి ఒకరు తోడూగా నిలవాలనే  అనే తర్కానికి  తావీయ్యక, తండ్రి సంతోషం కోసం కృషి చేస్తున్నాననే భ్రమలోకి జారి పోయింది ఆ బేల.
*                          *                          *                          *                             *                             *                           *                            *
“థంక్యు బావా!” తరువాత రోజు రాత్రి పది గంటలప్పుడు sms పెట్టింది మాధవి.
“దేనికే….?” వెంటనే జవాబు వచ్చింది.
“చాలా రోజుల తరువాత నాన్న ముఖంలో నవ్వు చూసాను. అత్తా తమ్ముడి కోసం ఖైమా కూర తెచ్చింది కదా, ఇంట్లో వండుతూ జీడి పప్పు వేస్తుంటే, నీ కొడుకు చూసి ‘ నీకు పళ్ళు ఊడిపోయాయి కదా, నీ తమ్ముడికి మాత్రం ఉంటాయా?’ అన్నాడట. ఆ విషయం చెప్పితే నేను నాన్న కాసేపు నవ్వుకున్నాము.”
“ఐ యాం సారీ మధూ!”
          “దేనికి బావా ?”
    “నీ కొడుకు విషయం లో….”  సానుభూతి చూపించాడు విజయ్. రిప్లై ఇవ్వలేదు మాధవి. కొంత సేపటికి తనే కాల్ చేసాడు.
“ఎంటే! బిజీనా?” చనువుగా అడిగాడు. ఆమె సమాదానం చెప్పలేదు.
“ఇప్పుడు మాటాడటానికి ఇబ్బందా? మీ ఆయన ఉన్నాడా?”
    “ఊహూ…!” ఎక్కడ ఫోన్ పెట్టేస్తాడో అనే ఆదుర్దాలో వెంటనే కాదంది.
            “మరీ మెసేజ్ పెట్టలేదు, మాట్లాడటం లేదు?”
“నా కొడుకు గుర్తుకు వచ్చాడు బావా. ఇన్ని రోజులు నాన్న గొడవలో పడి నేను నా బాధను మర్చి పోయాను…” ఆమె ఏడుస్తుంది “మధూ.. నిన్న రెస్టారెంట్లో కూడా నేను నీ కంట నీరు చూసాను కానీ చొరవ చెయ్యలేక పోయాను. అదీ కాక అజయ్ వచ్చేసాడు అందుకనే నిన్ను ఓదార్చలేక పోయాను. బాధ పడకే, ఏమంత వయసు అయిపొయింది మీకు? అజయ్ ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదా?”
“ఏం చెప్పను బావా? ఆక్సిడెంట్ జరిగాక ఆయన చాలా డిస్టర్బ్ అయ్యారు. ఇంట్లో వుంటే బాబే గుర్తుకొస్తున్నాడని క్లబ్బు కెళ్ళడం మొదలుపెట్టారు. అక్కడే తాగి తిని ఎప్పుడో అర్ధ రాత్రి వస్తారు. నేను మాత్రం ఒంటరిగా… ఈ బాధలన్ని అనుభవిస్తున్నాను.” కాసేపు ఇరువురు ఏమి మాటలాడ లేదు. “ఇవన్నీ చెప్పుకొని ఏడవటానికి నాకు తల్లీ కూడా లేకుండా పోయింది, తండ్రి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు ఏమి చెయ్యను బావా ? నిన్న నిన్ను చూసాక నాకూ ఏడుపు ఆగలేదు కానీ పక్కన ఆయన వున్నారు నువ్వు ఏమనుకుంటావో.. అనీ !”
     “ఏంటి మధూ నేను నీకూ అంత దూరం అయిపోయానా? ….”   అలా ఆ రాత్రి బావా మరదళ్ళు తమ మనస్సులో ఒకరిఫై ఒకరికి గల అభిమానాన్ని కలబోసుకుంటూ చాలా సేపు మాటాడుకున్నారు.
*                     *                             *                          *                                 *                          *                                 *                           *
“కొంచెం కాఫీ కలపనా అమ్మా?” పెద్దావిడ అడిగింది.
“టీ తాగుతానండి!” ఎప్పుడూ కాఫీ తాగే మాధవి, బావా చిన్ననాటి  నుంచి టీనే తాగుతున్నాడని తన అలవాటుని మార్చుకుంది.
“మీకు రాజకీయాలంటే ఆశక్తి ఎక్కువనుకుంటా” అంది టీ కప్పును అందిచ్చిన పెద్దవిడతో. “లేదమ్మా! నీకు కావాలంటేఛానల్ మార్చుకో” రిమోటు ఇచ్చింది ఆవిడ. వార్తా ఛానల్ నుంచి విజయ్ సంభాషణలు వ్రాస్తున్న సీరియల్ వస్తున్న ఛానల్ కు మార్చింది మాధవి. పెద్దావిడ నిరాసక్తంగా సోఫా లో కుర్చుని పత్రికలు తిరగేయడం మొదలుపెట్టింది. మన కుటుంబ వ్యవస్థ, అందులోని ప్రతి బాంధవ్యానికి వున్న ఔన్నత్యం గురించి విపులంగా వివరిస్తూ రెండేళ్ళగా సాగుతుందా సీరియల్. తెలుగు నేలంతా విరగబడి చూస్తున్న ఆ ధారవహికను గురించి, ముఖ్యంగా మాటలు వ్రాస్తున్న తన బావా గురించి విరామ సమయంలో పెద్దావిడకు చెప్పాలనుకుంది మాధవి. రాత్రి ,  బావా మరదళ్ళు ఒకసారి ముఖతా కలుసుకొని కష్ట సుఖాలు మాటాడుకోవాలని నిర్ణయించుకున్నారు, ఈ విషయం వేరెవరికి తెలీకపోవడం అన్ని విధాల మంచిదనుకొన్నారు.
తండ్రిని వదిలి ఆమె ఏ ఊరూ వెళ్ళలేదు, విజయ్ కు జనాలలో ఉన్న గుర్తింపు వళ్ళ  బయట కలుసుకోలేరు అందుకే తెలిసిన వారి ఇంట్లో అయితే మంచిదని అతనే సూచించాడు. వెంటనే ఆమెకు స్నేహితురాలు డాక్టార్ శాలిని గుర్తుకు వచ్చింది. శాలిని విదేశాల్లో ఉండే భర్తతో గొడవ పడి వచ్చేస్తే తనే తెలిసిన హాస్పిటల్లో ఉద్యోగం ఇప్పించింది. ముందు హాస్టల్లో ఉన్న ఆమె, తరువాత, తనకు ఇప్పుడు  టీ ఇచ్చిన పెద్దావిడ ఇంట్లో  పేయింగ్ గెస్ట్ గా చేరింది. ఉండేది ఇద్దరూ ఆడవాళ్ళే, పెద్ద ఇల్లు, వేరు వేరు గదులు. శాలిని తను ఆడిగితే కాదనదు కాబట్టి పెద్దావిడకు చెప్పో, చెప్పకుండానో తాము ఇక్కడ కలుసుకోవచ్చనేది మాధవి ఆలొచన అందుకే ఇల్లు పరిశీలించడానికి వచ్చి శాలిని గురించి వేచి చూస్తుంది.
“మీరు సీరియల్స్  చూడరా అండీ?” విరామం రాగానే అడిగింది మాధవి “నేను 60 ఏళ్ళ జీవితాన్ని చూసానమ్మా. మనుషుల బుద్దులు వీళ్ళు చూపించినంత తేలికగా బయటపడవు తల్లీ. మనం ఎంతో నమ్మిన వాళ్ళు ఊహించని విధంగా మోసం చేస్తే – ఏ సంభందం లేని వారు మనకోసం త్యాగానికి సిద్ధపడతారు.” మాధవికి తన భర్త – మేన బావలు గుర్తుకొచ్చారు, ఏదో చెప్పబోయింది కానీ పెద్దావిడ తన మాటలు కొనసాగించింది. “మనస్తత్వాన్ని అంచనా వేసే పరికరం గాని, అంతరంగాన్ని పట్టిచే సాధనంగాని ప్రపంచంలో లేదు. ఒక మనిషి ఏ పరిస్థితిలో ఎలా, ఎందుకు  ప్రవర్తిస్తాడో  చెప్పడం ఎవ్వరి తరం కాదమ్మా. జీవితాంతం ద్వేషించిన వ్యక్తి,  తద్వారా మనకు మనోస్థయిర్యాన్ని నేర్పిస్తే – అనుక్షణం మనకు తోడుగా నిలచినవారు తెలీకుండానే ఆధారపడే తత్వాని పెంపొందిస్తారు. మనం ఈ విషయం గుర్తించక పోవడం జీవన వైచిత్రం. ఒక మనిషిలోని విభిన్న పార్శ్వాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే బయట పడతాయి. అప్పటివరకు వారి జీవితం, అటుపై వారి ప్రవర్తన అందుకు పూర్తి విరుద్ధం కావచ్చు కానీ ఆ క్షణం మాత్రం మినహాయింపు, అది వాస్తవం కూడా – మనం నమ్మినా నమ్మకున్నా”  పెద్దావిడ చెప్పింది మాధవికి సరిగా అర్ధం కాలేదు కానీ ఆమె మాట్లాడిన తీరు, చేతిలో పట్టుకొన్న పత్రికల వల్లా  ఆవిడకు సాహితీ అభినవేశం ఉందని మాత్రం అర్ధం అయింది. పేరున్న రచయిత విజయ్ ను  పరిచయం చేస్తానంటే ఈవిడ కాదనకపోవచ్చు, తద్వారా తన కార్యం సుగమం కావచ్చునని ఆలోచిస్తూంది.
“ఒక్కో పాత్రకు ఒక్కో లక్షణాన్ని ఆపాదించి చూపిస్తారు ఈ సీరియల్స్ లో కానీ ముళ్ళపూడి వెంకట రమణ ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రపంచంలో పూర్తిగా మంచి వాళ్ళూ, పూర్తిగా చెడ్డ వాళ్ళూ అంటూ ఎవరూ వుండరు ఆయా సందర్భాలను బట్టి ప్రతి మనిషిలోని డిఫరెంట్ షేడ్స్ బయట పడుతుంటాయి అంతే” కొంచెం అర్ధం కావడంతో ఆసక్తిగా వింటుంది మాధవి.”నువ్వు ఇప్పుడు చూస్తున్న సీరియల్ కు కధా, మాటలు సమకూరుస్తున్న  విజయ్,..” ఆవిడే బావ ప్రస్తావన తేవడంతో మాధవి మోము వికసించింది
“..నాకు స్వయానా అల్లుడు, నా ఒక్కగానొక్క కూతురి భర్త” ఒక్కసారిగా అదిరిపడింది మాధవి. “మంచివాడే . ఆయన పోయాక ఒంటరిగా ఇక్కడెందుకు మాతోనేఉందువు రమ్మంటే  హైదరాబాద్ వెళ్ళాను. ఆ వాతావరణం నాకు పడ లేదు.  చలి ఎక్కువ, పొడి దగ్గు పట్టుకుంది. ఓ రోజు నా దగ్గు అతని సృజనాత్మకతకు ఆటంకం కలిగిస్తుందన్నాడు. రెండో రోజు వచ్చేసాను. నా కూతురు పట్ల గానీ, నా మీద కానీ అంతకు ముందు, ఇప్పుడు అతను ఏ విద్వేషం చూపలేదు – మొన్న కూడా ఏదో షూటింగ్ పని మీద ఈ ఊరు  వచ్చి నన్ను చూసి వెళ్ళాడు, కానీ అతని కధలు, మాటలు నాకిప్పుడు డొల్లగా అనిపిస్తాయి – అలాగని నేను అతన్ని ద్వేషించలేను, ఆనాటి అతని మాటను  మరువలేను.” అర్ధం అయిందా అన్నటు చుసిందా వృద్ధురాలు ముగ్ధ వైపు, విరామం ముగిసింది సీరియల్ మళ్లీ మొదలయింది. తాను విన్నది జీర్ణించుకుంటూ కళ్ళు నులుముకుని లేచి నిలుచుంది మాధవి.
“శాలిని వచ్చే టైం అయింది ఉండమ్మా.” అంది పెద్దావిడ. “నేను ఫోన్ చేస్తానులెండి” ఆవిడ సమాదానం కోసం చూడకుండ బయటకు వచ్చేసింది మాధవి.
*                                   *                                      *                                       *                                   *                                        *
కారు వేగంగా పోతుంది మాధవి మనసులో ఆలోచనలు అంతకంటే వేగంగా సుడులు తిరుగుతున్నాయి. భర్త ఎలాటి వాడో తనకు తెలుసు అయినా ఒక్క సంఘటనతో అతని ఫై ద్వేషం పెంచుకుంది – బావ చూపిన చొరవను ఆలంబనగా ఆత్మియ్య పాదును అల్లుకుంది కానీ అదీ చీడకు అతీతం కాదని తెలుసుకుంది. వెంటనే ఫోన్ తీసి అజయ్ కు చేసింది.
“ఓ అర్జెంటు కేసు వచ్చింది అది చూసుకొని క్లబ్బు కు వెళతాను” అన్నాడు అతను.
“అక్కడే  ఉండండి నేను వస్తున్నా. ఇద్దరం బీచ్ కు వెళ్లి కాసేపు గడిపి, ఏదయినా రెస్టారెంట్లో భోంచేసి ఇంటికి వెళ్దాం.” చాలా రోజుల తరువాత శ్రీవారితో అంత ఉత్సాహంగా మాట్లాడింది  డాక్టర్ శ్రీమతి మాధవి.*

సోల్ సర్కస్

 

sidhareddi“రాయడమంటే  నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే.”

చిత్వాన్ గాడు ఈ మాట చెప్పకుండా వుండుంటే ధైర్యం చేసి ఎప్పుడో నేనూ కథలు రాయడం మొదలుపెట్టుండే వాడినేమో!

ఒక రాత్రి పీకాక్ లేక్ ఒడ్డున కూర్చుని ఎదురుగా నీటిలో తనని చూసుకుంటూ మురిసిపోతున్న చంద్రుడిని, నిమిషానికోసారి రాయి విసిరి విసుగుపుట్టిస్తుండగా చెప్పాడీ మాట.

ఏడేళ్లయింది చిత్వాన్ ని మొదటి సారి కలిసి. కరెక్ట్ గా చెప్పాలంటే తొమ్మిదేళ్ల రెండు నెలల ఇరవై ఏడు రోజులు.

ఆ రోజు నా పుట్టిన రోజు. పార్టీలో కలిశాడు. ఫిలాసఫీ స్టూడెంట్ శేషగిరి ఫ్రెండ్ అతను. చదివేది మా యూనివర్శిటీలో కాదు. అయినే ఎప్పుడూ మా క్యాంపస్ లోనే అతని క్యాంప్.

ఆ రాత్రి పార్టీ ఇవ్వడానికి డబ్బులు లేకపోతే కొంతమంది రిచ్ డే స్కాలర్స్ వెధవల దగ్గర్నుంచి అప్పు తీసుకున్నాను. తాగుతున్న పెగ్ లోంచి గుప్పున డబ్బు వాసన. నెలకి సరిపడా మెస్ బిల్లు ఒక్క రాత్రిలో ఆవిరైపోతుంటే లోపలెక్కడో గిల్టీ ఫీలింగ్. ఇంటి దగ్గర అమ్మ ఉదయాన్నే గుడికెళ్లి నా పేర పూజ చేపించినందుకు హుండీలో 11, పూజారికి 51 రూపాయల ఖర్చు. నాన్న నా పుట్టిన రోజన్న ఆనందంతోనో, నన్నెందుకు కన్నాడన్న బాధతోనో, లేక అసలీ జీవితంలోని శూన్యతకు నివాళిగానో తాగిన కల్లు సీసాల ఖర్చు ముప్పై ఆరు రూపాయలు. నాన్న పనికెళ్తే రోజుకి 150 రూపాయలు. నా హ్యాపీ బర్త్ డే సందర్భంగా నేను నాట్ సో హ్యాపీగా పెట్టిన ఖర్చు 1512 రూపాయలు.

నా గిల్టీ ఫీలింగే అనుకుంటా రెండో పెగ్ కే వాంతిలా బయటకొచ్చింది. నాకసలే పరిచయం లేని చిత్వాన్ నా చెవులు మూస్తూ నాకు పరిచయమై ఆ తర్వాత నా కళ్లు తెరిపించాడు. మరో పెగ్ అందిస్తూ, పీత్వా పీత్వా పునః పీత్వా… అంటూ ఏదో చెప్పాడు. యూ బ్లడీ ఫెలో… నాకీ సంస్కృతం అర్థం కాదంటూ, మిక్సింగ్ లేకుండానే రా కొట్టేశాక నాకర్థమయింది- ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నానని.

హూ ఆర్ యూ? అంటే సమాధానం లేని ప్రశ్న అని తీసిపారేసి, బట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫార్మాలిటీ…ఐ యాం జరాతుష్ట్ర అని పరిచయం చేసుకున్నాడు.

ఆ రోజు నా జీవితంలో ఒక విచిత్రం. నాకు తెలిసిన మా వెధవలు శేషగిరి, వర్మ, మౌళి, శ్రీకాంత్ ఉండగా, వాంతించడంలో నాకు సహకరించిన చిత్వాన్ నాకు ఆ కొద్ది సేపట్లోనే ఆప్త మిత్రుడైపోయాడు. ఇతరులకు మంచి చేయడం కర్తవ్యం కాదు. అదొక ఆనందం. అది మన సంతోషాన్నీ ఆరోగ్యాన్నీ పెంచుతుంది – నాకు హెల్ప్ చెయ్యడం వెనుక ఉన్న కుట్ర ని బట్టబయలు చేశాడు.

మూడో పెగ్ కి అందరూ ఔట్ అయిపోతారనుకుంటే ఇంకా క్రీజ్ లో యాక్టివ్ గా ఉన్న మా వాళ్ల కోసం చిత్వాన్ గాడి కైనెటిక్ హోండాలో బయల్దేరి, ఇరవై కిలోమీటర్ల చీకటిలో చింతలబస్తీలో ఫుల్ కొన్నాక గానీ మాకు వెలుగు దొరకలేదు.

మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుంది, మరో సంవత్సరం లోపల వేలకు వేలు సంపాదిస్తానన్న నమ్మకం మనసులో లేకపోతే ఇలా అప్పులు చేసి మరీ పార్టీలిచ్చేవాడిని కాదని నా గిల్ట్ ని వాడి  మీద కక్కేశాను.

నువ్వు నాకు పరిచయం లేకపోవచ్చు. కానీ నువ్వు నాకు బాగా తెలుసు. లోకమంతా ఇలాంటి నువ్వులే. ఎంతమందిని చూడలేదు…అని నవ్వుతూ చెప్పాడు జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర సిగెరెట్ల కోసం ఆగినప్పుడు. అప్పుడే కొత్తగా కలిసినట్టు, హాయ్ ఐ యామ్ చార్వాక అని హ్యాండ్ షేక్ చేశాడు. యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఋణం కుత్వా ఘృతం పీవేత్. భస్మీ భూతస్య దేహస్య. పునరాగమనం క్రుత.

ఛీ నాకు నెయ్యివాసన పడదని చెప్పినందుకు ఆ రోజు చిత్వాన్ నవ్విన నవ్వు గుర్తుకు తెచ్చుకుంటే ఇంకా నా చెవుల్లో మారుమోగుతుంది. మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి…అని మళ్లీ హ్యాండ్‍షేక్….ఇంకో కొత్త అవతారం.

ఆ రాత్రి తిరిగి పీకాక్ లేక్ చేరుకుని మిక్సింగ్ కి కూల్‍డ్రింక్ లేక నీళ్లతోనే కలిపిన నాలుగో పెగ్ చేదుగా లోపలకి జారుతుండగా అన్నాడు, “ఈ రోజునుంచీ పీకాక్ లేక్ ని నెమళ్లకొలను గా రీనేమ్ చేస్తున్నాను.”

ఆ ఒక్క రాత్రిలో ఎన్ని వేషాలేశాడో వెధవ. ఎన్ని వేషాలేసినా చీకటి పడుతుండగా ఒమర్ ఖయ్యాం అయిపోయేవాడు. ఈ కొలను ఒడ్డున కూర్చున్న మనకేం కావాలి? ఓ బిర్యానీ, ఓ యూరోపియన్ సినిమా, ఓ హాఫ్ ఓల్డ్ మాంక్.

అలా నెమళ్ళ కొలను లో జరిగిన పరిచయం భీముల కొలను దాకా తీసుకెళ్లింది. ఎక్కడ్నుంచుచ్చాడో నా జీవితంలోకి. ఎన్ని జ్ఞాపకాలు. ఎన్ని ఆలోచనలు. ఎన్ని సంగతులు, సరదాలు. వేల కిలోమీటర్ల ప్రయాణాలు. ఎన్ని అనుభవాలు, పరిచయాలు.

శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో కుండపోత వర్షంలో దూరంగా ఉన్న రాయిని చూసి పులి అనుకుని భయాందోళనలతో ఎదురుచూసిన క్షణాలు, జమ్ము తావిలో వైష్ణోదేవి గుడికి వెళ్లే దారిలో పదిహేను రోజుల తర్వాత తిన్న పప్పు అన్నం, నాసిక్ లో త్రయంబకేశ్వర గుడి లో పొందిన తన్మయత్వం, ఏడవడం నాకు రాదని చెప్పిన తర్వాత రోజే గ్రేవ్ ఆఫ్ ది ఫైర్ ఫ్లైస్ చూసి భోరున ఏడవడాలు, ఎల్లోరాలో కైలాష గుడి చూసి నోరెళ్ళబెట్టడం, హంపీ, విరూపాపూర్ గద్దె, మౌళారూజ్ కెఫె….ఎన్నని చెప్పను….చిత్వాన్ అంటే జ్ఞాపకాల ప్రవాహం.

కానీ ప్రతి ప్రవాహం ఎక్కడో దగ్గర ఆగిపోవాల్సిందేనా? ఏమో చూస్తున్నంత సేపూ ఏ ప్రవాహమూ ఆగిపోవాలనిపించదు. కానీ నిజం వేరు.

నిద్రపట్టని ఆ రాత్రి రెండింటికి ఫోన్ మ్రోగితే…ఎవడో టైం సెన్స్ లేని ఇండియన్ బ్రూట్ అయ్యుంటాడనుకున్నాను. ఫోన్ లో చూస్తే వర్మ అని కనిపించింది. మా మధ్య ఉన్న నాలుగున్నర గంటల కాల వ్యత్యాసం బాగా తెలిసిన వాడే! అయినా ఇప్పుడెందుకు చేస్తున్నాడని విసుక్కుంటూనే ఫోన్ ఎత్తాను.

చిత్వాన్ చచ్చిపోయాడని వర్మ చెప్పినప్పుడు లోపల్లోపల ఏదో ఒక భాగం హఠాత్తుగా నాలోని తెలియని లోతుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిట్టనిపించింది.

అందుకే అంత్యక్రియలు జరగాల్సించి ఒక్క చిత్వాన్ కే కాదు. నాలోపల్లోపల చనిపోయిన ఆ భాగానికి కూడా అనిపించింది. రగిలించి, ఆజ్యం పోసి, అన్వేషించమని నన్ను అగ్నిగుండంలోకి తోసేసినందుకో, లేక మల్టినేషనల్ కంపెనీల అద్దాల మేడల జిలుగు వెలుగులకాంతిలో మైమరచిపోతూ, ఏసి గదుల్లో కుషన్డ్ సీట్లకు వేడి కలిగిస్తూ, నన్ను నేను మరిచిపోయిన పాపాన్ని కడగెయ్యాల్సిన అవసరం వచ్చినందుకో… అర్జెంట్ గా లండన్ నుంచి ఇండియా బయల్దేరాను.

*****

నీకు జరిగింది కథ కాదు. నీలో జరిగిందే కథ.

నాలో అంటే?

అవును. లోపల. నీలోపలే అంతా ఉంది. బయటకు నువ్వొత్తి తోలు తిత్తివి. లోపల నువ్వొక విలక్షణాల మేలి కలయికవి. న్యూరాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య జరిగే సర్కస్ మైదానివి. నీ హృదయం నీ రింగ్ మాస్టర్; ఎక్కడో ఎత్తులో రిస్కీ ఫీట్స్ చేసే స్టంట్ మాస్టర్ నీ ఆత్మ. ఆ సర్కస్ గురించి రాయగలిగితేనె అది కథ అవుతుంది. లేకపోతే అది ఆవు వ్యాసమే! ఇప్పటివరకూ వచ్చిన కథలే మళ్లీ వస్తాయి. ఇప్పటివరకూ చెప్పిన నీతే మళ్లీ చెప్తారు. అప్పుడు ఈ భూమ్మీద కొత్త కథంటూ పుట్టదు. గో డూ సమ్ సోల్ సర్కస్ అనేవాడు చిత్వాన్.

వాడు చెప్పిందేదీ నాకు పూర్తిగా ఎప్పుడూ అర్థం కాలేదు. అన్నింటికీ అర్థాలు వెతకడంలోనే మనిషి తనలోని మ్యాజిక్ ని కోల్పోయాడనేవాడు చిత్వాన్.

ఇంత మాట్లాడుతావు, ఇన్ని తెలుసు నీకు, రాయొచ్చుగా అన్నానొక రాత్రి పూట.

అప్పుడు చెప్పాడు- రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.

నన్ను కొత్తగా పరిచయం చేసుకోవడంలోని అసౌకర్యం నాకు తెలుసు. నా భయాలు, బిడియాలు, కాంప్లెక్స్ లు, అలవాట్లు, పొరపాట్లు …ఎన్నని? వీటన్నింటిని ఇనుప చొక్కాలా తొడుక్కుని ఉన్నాను. దాన్ని తొడుక్కున్నంత త్వరగా విప్పలేమని తెలుసు.

నేనో భగ్నమైన కలని.  ఆగిపోయిన కలాన్ని. అందుకే ఎన్నో నిద్రలేని రాత్రుల్లో ఆజ్యం పోసుకున్న అతి ఉత్తేజిక ఊహలేవో నా మనసంతా నిండిపోయి భారమైపోతున్నా వాటిని అక్షరాల్లోకి తెచ్చే ధైర్యం చాల్లేదు.

1 (2)

*****

నేను నెల్లూరు చేరుకునే సరికే అంత్యక్రియలు అయిపోయాయి. నేనొచ్చే వరకూ ఆపడానికి నేనేమీ వాడికంత ఆప్తుడిని కాదు. కాదా? ఏమో?

ఒక రోజు వాడే అన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నమ్మకమైన ఒక స్నేహితుడి అవసరం ఉంది. వాళ్లతో నీ రహస్యాలు, నీ తలవంపులు, నీ ఉక్రోషాలు…అన్నీ పంచుకోవాలి.  మాస్కులన్నీ తీసేసి, హృదయాంతరాలను మథించి నీలోపలున్న నిన్నులందరినీ వారికి పరిచయం చేయాలి. అటువంటి నమ్మకమైన నిలువుటద్దంలాంటి ఒక స్నేహం కోసమే నా అన్వేషణ. నిన్ను కలిసాక నాకు ఆ స్నేహం దొరికినట్టే అనిపిస్తుంది. కానీ నువ్వు అలా కాదు. నీ చుట్టూ కట్టుకున్న గోడల్ని కూల్చలేవు. నీ గుట్టులన్నింటినీ ఎద గట్టుదాటనివ్వవు. సుఖాలను దరి చేరనివ్వవు. నీ సామ్రాజ్యంలోకి ప్రవేశం కేవలం నీకు, నీ కన్నీళ్లకు మాత్రమే! ప్రపంచ శోకాన్ని మొత్తం మూటకట్టి మోస్తున్నావు. వదిలెయ్. నాతో పాటు వస్తావా? కొన్నాళ్లు శ్రీశైలం అడవుల్లోకి వెళ్దాం.

వాడన్నంత సులభంగా అన్నీ వదిలెయ్యలేకపోయాను. భయాలు, బాధ్యతలు. జీవిక లో జీవితమే కాదు, చిత్వాన్ లాంటి స్నేహితులతో సంబంధాలనీ కోల్పో్యాను. ఎప్పుడైనా రాత్రి పూట ఏకాంతంలో గాలి పాట వింటున్నప్పుడు మళ్లీ  జ్ఞాపకాలన్నీ ఉప్పెనలా ఎగిసి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు చిత్వాన్ మాటలు గుర్తుకొస్తాయి.

బతికుండడం ముఖ్యం కాదు; బతకడమూ అంత ముఖ్యం కాదు. అసలీ జీవితంలో ఏదీ ముఖ్యం కాదు. ఈ జీవితం నీదనే భ్రమలో ఉన్నావేమో? బయటకు రా! దేవుడి దగ్గర్నుంచి మనం తీసుకున్న అప్పు ఈ జీవితం. అది తీరే వరకూ బ్రతకవలసిందే అనుకోవడం మూర్ఖత్వం. మిగతా అన్ని జంతువులకీ అది తప్పదు. కానీ మనిషనే జంతువుకి ఒక వరమిచ్చాడు దేవుడు. ఈ అప్పు తీర్చకుండా ఎగ్గొట్టొచ్చు. దేవుడు ఏమీ చెయ్యలేడు. మనల్ని ఆపలేడు.

మై హార్ట్ ఈజ్ ఏ జంగిల్. నాకు పువ్వుల సువాసనలు కావాలి. పులుల తో సావాసమూ కావాలి. రెండింటిలో ఏదో ఒకటే ఇస్తానంటే నేను పవ్వులనొదులుకుని పులుల దగ్గరకే వెళ్లిపోతాను. జీవితమంటే నాకిష్టమే. కానీ జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది. అందుకే నా ప్రాణాన్ని పట్టుకుని వేళ్లాడ్డం అంత ఇష్టం ఉండదు. ఇక చాలనుకున్నప్పుడు ఇక్కడ్నుంచి జంప్ అయిపోవడమే! పవర్ ఆఫ్ బటన్ నొక్కెయ్యడమే! అప్పటివరకూ అంతా నా ఇష్టానుసారమే!

స్టేషన్ లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వర్మ సుసైడ్ అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేయలేదు. కానీ సుసైడ్ అనే పదమే ఏదోలా అనిపించింది. చిత్వాన్ ది ఆత్మహత్య కాదు. హరాకిరి. చిత్వాన్ ఒక సమురాయ్.

*****

అడ్వెంచర్ అయిపోయింది. నీకంతా చెప్తే ఇంతేనా అనిపించొచ్చు. రాబందులా జీవితాన్ని వెంటాడే పేదరికంలోనే పుట్టి పెరిగుంటే నాకివన్నీ సాధారణంగానే అనిపించుండేవేమో! పేదరికం అంటే ఇలా ఉంటుందని తెలిసుంటే పస్తులుండి, రోజూ చస్తూనో, చస్తూ బతుకుతూనో, ఎలాగో బతికుండేవాడిని.  కానీ ఈ పేదరికం నాకు చాలా కొత్త.  జీవితంలో ఇదో కొత్త అడ్వెంచర్ ఏమో అనుకుని ఎప్పట్లానే రైడ్ ఇట్ ఆర్ డై అని ప్రయత్నించా. నా వల్ల కాలేదు. నా ఈ చర్యలోని ప్రత్యేకత ను గమనించి అభినందించ గలిగింది నీవొక్కడైవే కాబట్టి నీకు మాత్రమే రాస్తున్నాను. నీక్కూడా ఆ ప్రత్యేకత అర్థం కాకపోతే దిగ్భ్రాంతితో  ఐ విల్ రోల్ ఓవర్ ఇన్ మై ఓన్ గ్రేవ్…హ హ హ.

నాతోపాటు మా వాళ్లు చాలామందే వచ్చారు. కానీ అమ్మ ఉత్తరం నాకే ఇచ్చింది.  నేనొస్తానని అంత ఖచ్చితంగా ఎలా తెలుసో, వచ్చినా అది నా కోసమే అని అమ్మకి ఎలా తెలుసో మొదట నా కర్థం కాలేదు. చిత్వాన్ గదిలో కూర్చుని ఎన్ని సార్లు చదివానో ఆ ఉత్తరం.

మధ్యాహ్నానికి అందరూ వెళ్లిపోయారు. వర్మ నేనే మిగిలాం. తనకి చెన్నై లో పనుందని కాసేపటికి వర్మ కూడా బయల్దేరాడు.

ఎక్కడ నేను, ఎక్కడ చిత్వాన్. వాడూ వాడి నేపాలీ మొహం. వాడికి వాడు పెట్టేసుకున్నాడు చిత్వన్ అని పేరు. దీర్ఘం మేమిచ్చింది. నీకెందుకీ పేరంటే అదే నేను అనే వాడు. తండ్రి ద్వారా వాడికొచ్చిన పేరు కృష్ణ మూర్తి. తన అస్తిత్వానికి పూర్తి బాధ్యత తనే తీసుకున్నా అందులో ఏ అతికొద్ది భాగమో తన నేపాలీ తల్లికే ఇచ్చాడు కానీ, తండ్రి ని ఎప్పుడూ తన లో కలవనివ్వలేదు. తండ్రి ఒక డబ్బుల బస్తా. అంతే. ఇంకేమీ కాదు.

వేదాయపాళెం దాటాక ఎక్కడో మూలలో ఒక సింగిల్ బెడ్ రూం ఇల్లు. అందులోని ఒక్క బెడ్ రూం పూర్తిగా వాడిదే. గది నిండా పుస్తకాలు. బెడ్ మీద సగం సగం చదివి వదిలేసినవి, నేల మీద తాటాకు బుక్ మార్క్‌లతో పడి ఉన్నవీ, చిందరవందరగా … మా ఇద్దరికీ బాగా ఇష్టమైన అబిడ్స్ సండే మార్కెట్ లో పోసిన పుస్తకాల కుప్పల్లా …చూస్తే సమాధానాల కోసం ఎన్ని పుస్తకాలెతికాడో అనిపించింది. కానీ జీవితమనే ప్రశ్నకు సమాధానాలు వెతకొద్దు. సమాధానం దొరికిందనుకున్న ప్రతి సారీ జీవితం మరో కొత్త ప్రశ్నలా ఉదయిస్తుందని చెప్పింది కూడా వాడే!

అసలు వాడి మొహమే ఒక ప్రశ్నార్థకం. చింకీ గాడిలా ఉండే వాడు సడన్ గా తెలుగులో మాట్లాడ్డమే అందరికీ అన్ని చోట్లా ఆశ్చర్యం కలిగించేది. అందుకే వాడికి పరిచయస్థులు ఎక్కువ.

కానీ ఎంతమంది పరిచయమున్నా, పుస్తకాల షెల్ఫ్ లో ఒకే ఒక్క ఫోటో. నేనూ-వాడు. హంపీలో మౌలారూజ్ కెఫె లో తీసుకున్న ఫోటో. నవ్వుతూ వాడు, నవ్వాలా వద్దన్నట్టు నేను.

*****

హంపి. మొదటి సారి.

నాకు ఫ్రాన్స్ లో ఉద్యోగం వచ్చింది. ఇంకో వారంలో వెళ్లిపోతాననంగా చిత్వాన్ ని కలవాలనిపించింది. ఎక్కడా వాడి జాడే లేదు. చివరికి హంపి లో మౌలా రూజ్ కెఫె లో ఉంటాడని తెలిసింది.

మౌలారూజ్ అని చెప్పారు. స్పెల్లింగ్ చూస్తే మౌలిన్ రోగ్ అని ఉంది. ఇద్దరు ముగ్గురిని అడిగి కన్ఫర్మ్ చేసుకుని మరీ వచ్చాను. వాళ్లు నవ్వుతుంటే సిగ్గేసింది అన్నాను.

సిగ్గు ఎందుకురా రోగ్. వాళ్లకది మౌలారూజ్ అవ్వొచ్చు. నీకూ నాకూ ఇది మౌలిన్‌రోగ్. సరేనా? పద సైజరెట్టే తాగుదాం అని వాడి భాషలో వాడు.

వాడు నాకెప్పుడూ వింతే!

మళ్లీ వాడిని ఎప్పుడు కలుస్తాననే భయమేమో ఎప్పుడూ లేనిది నా బాధల సంచీని వాడి ముందు పొర్లించాను.

పన్నెండేళ్ల వయసు. ఆరో తరగతి. ట్రంకు పెట్టె. సాయంత్రం కల్లా తిరిగొస్తానన్న అమ్మా నాన్న. హాస్టల్ బయటే రాత్రంతా ఎదురుచూస్తూ నేను, ఎక్కాలు నేర్చుకోమని హాస్టల్ వార్డన్ దెబ్బలు. పొలంలోని కాలువలో ఆకు పడవల పోటీలు, ఊరి బయట గాలిపటాలు,  తాటి కాయల బండ్లు, ఇవన్నీ చివరికి జ్ఞాపకాలేనా? ఒక సారి ఇల్లు వదిలేశాను. మళ్లీ ఇప్పుడు నెమల్ల కొలను, హిమాలయాల్లో ట్రెక్కింగ్, జమ్ము తావిలో చలికి వణికిపోవడం. అవంతిక, స్వాతి, మాళవిక, సంధ్య, చందన, నువ్వు, వర్మ, శేషు… చివరికి అన్నీ జ్ఞాపకాల్లాగే మిగలాల్సిందేనా? ఇంకోసారి అన్నీ వదిలేసి వెళ్లాల్సిందేనా?

అంతా ఓపిగ్గా విన్నాడు. అదే నాకు వాడిలో బాగా నచ్చే విషయం. అంతా విన్న తర్వాత మొదలు పెట్టాడు.

ఫక్ దిస్ నోస్టాల్జియా. అదొక జబ్బు. ముందు దాన్నుంచి బయటపడు. అసలు నీ సమస్యేంటో తెలుసా? నువ్వు మీ అమ్మనాన్నలకు పుట్టిన వాడివనుకుంటావు. కానీ ప్రతి రోజూ, ప్రతి కొత్త పరిచయంలో, ప్రతి కొత్త అనుభవంలో, ప్రతి కొత్త ప్రదేశంలో నువ్వు మళ్లీ కొత్తగా పుడ్తావు. నువ్వు వుంటావు. అప్పుడే కొత్తగా పుట్టిన వాడూ ఉంటాడు. కొన్ని సార్లు కొంతమందిని జ్ఞాపకాల్లాగే వదిలేసి వెళ్లాలి.

వాడు చెప్పాడు. నేను విన్నాను. కానీ వాడు చెప్పినంత సులభమా?

పుస్తకాల షెల్ఫ్ మీదున్న ఫోటో కావాలని అమ్మని అడిగాను. తీసుకోమంది. జేబులో ఫోన్ మోగింది సైలెంట్ గా.

అన్నింటికీ మించి ఆ రోజు మాత్రం నా ఫోన్ మోగకూడదనుకున్నాను. నాక్కొంచెం విశ్రాంతి కావాలి. ప్రశాంతత కావాలి. చిత్వాన్ విధ్వంసం ని కొద్దిగానైనా అర్థం చేసుకోవాలి. కానీ అనుకుంటే ఆగిపోయేది కాదు రియాలిటీ. మనమేమనుకున్నా దానిపాటికది జరిగిపోవడమే దాని పని. మనమే ఎక్కడో గతంలో ఆగిపోయుంటాం. లేదా కాలంకంటే ముందుకు పరిగెత్తి కలల లోకంలో ఇరుక్కుపోయుంటాం.

ఫోన్ మోగింది. గ్యారెంటీగా ఆఫీస్ వాళ్లనుకున్నాను. కాదు.

ప్రమద. ఏం జరిగిందన్న పొడి మాటలు. కేవలం ఫార్మాలిటీ కోసం. అవసరం వేరు. వచ్చేటప్పుడు ప్రియ పచ్చళ్లు, కరాచీ బిస్కెట్లు, తెలుగు సినిమా డివిడిలు…ఇంకా ఏవేవో కోరికల చిట్టా! మనసు లేని అందమైన బిచ్. రాత్రి చార్మినార్ కి ఎక్కొచ్చు. ఫ్లైట్ ఏ అర్థరాత్రికో. అన్నీ కొంటానికి టైమైతే ఉంది. కానీ మనసైతే ఇంకెక్కడో ఉంది. నాలుగొందలయాభై కిలోమీటర్ల దూరంలో. హంపీలో మౌలారూజ్ కెఫెలో గాలికెగురుతున్న ఎర్రటి కర్టెన్లు. మెరుస్తున్న గాజు గ్లాసులు.

ఫోన్ కాల్ అయ్యాక మరోసారి చిత్వాన్ గాడు నాకు రాసిన ఉత్తరం చదువుతుంటే హఠాత్తుగా హంపీ వెళ్లాలనిపించింది.

హంపీలోనే చివరి సారిగా వాడిని చూసింది. వాడితో మాట్లాడింది.

*****

జీవితంలో అసలు మనమేం చెయ్యాలో కనుక్కునేందుకు, మనల్నేం చెయ్యద్దొంటారో అది చేస్తే మార్గం తెలుస్తుంది.

ఉంచుకున్న దాని కొడుకుని కదా! పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు మా బాబు. కొంచెం వయసు రాగానే అమ్మ తరుపున పోరాడాను. నాన్న కాళ్ల బేరానికొచ్చాడు. రిచ్ బాస్టర్డ్. డబ్బుల్తో కొనేద్దామనుకున్నాడు. నేపాలీ వాడినైతే మాత్రం మీ బిల్డింగ్ లకు సెక్యూరిటీ గార్డ్ గా మిగిలిపోవాలనుకోలేదు. నాన్నా ఏ ఊరెళ్తే ఆ ఊర్లో. వాడు నాకొక ఏటియం మాత్రమే. చివరికి రిటైర్ అయ్యి సొంత ఊరు నెల్లూర్లో సెటిలయితే మేమూ అక్కడికే వచ్చాము.

ఇది ఇలా చెయ్యకూడదంటే అదే చేస్తూ వచ్చాను. పోరాడి నా జీవితాన్ని క్లైమ్ చేసుకున్నాను.

కానీ అదృష్టవంతుడు మా బాబు. పోయాడు. ఏటియం పర్మనెంట్ గా ఔట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది. అయితే జీవితం ఆగిపోతుందా ఏంటి? డబుల్ పిహెచ్‍డి. ఉద్యోగం నాక్కాకుండా ఎవరికిస్తారు. ఇచ్చారు. కానీ అంతా కొత్త. ఒక రోజు దుకాణం మూసేశాను. నా కొద్దీ జీతాల జీవితం అనిపించింది. ఎక్కడెక్కడో తిరిగాను. చివరికి హంపి చేరుకున్నాను. విరూపాపూర్ గద్దె. ఇక్కడ ఈ మౌళారూజ్ కెఫే. గాలికెగుర్తున్న ఈ ఎర్రటి కర్టెన్లు, మెరుస్తున్న ఈ గాజు గ్లాసులు. వీటన్నింటి మధ్యలో ఆమె. జీవితం మళ్లీ ఇక్కడే ఫ్రెష్ గా మొదలయింది.

ఎవరామె?

తెలియదు. ఎక్కడెక్కడో తిరిగి హోస్పేట్ లో ట్రైన్ దిగాను. పెద్ద సూట్ కేస్ ఆమెది. మోయలేనంత బరువు. నేనే దింపాను. తర్వాత ఇక్కడ మౌళారూజ్ కెఫెలో కనిపించింది. నేనామెకి తెలుసు. తను నాకు తెలుసు. చూసినప్పుడల్లా నా భారము ను మోసిన ఓ తోటి ప్రయాణికుడా నీకు కృతజ్ఞతలు అన్న భావంతో చూస్తుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ మేమొక మాట మాట్లాడింది లేదు. కానీ ఏదో తెలియని అదృశ్య దారం మా హృదయాలను ముడివేసిందన్నది మాత్రం నిజం. కానీ ఆ ముడి ఇక్కడ ఈ లోకంలో లేదు. మరెక్కడో ఒక సుదూర వింత ప్రపంచంలో…

లవ్ ఎట్ ఫస్ట్ సైటా?

మనలోని ఫీలింగ్సన్నింటినీ ఇలా సాధారణీకరించడం నాకు నచ్చదు.

మరి ఎన్నాళ్లిలా ఆమెకి చెప్పకుండా?

ఎన్నాళ్లైనా ఫర్వాలేదు. రోజుకో ప్రేమ లేఖ రాస్తున్నా. కానీ ఇచ్చే ఆలోచన లేదు. ధైర్యం లేదనొద్దు. నాకు చాలా కోపమొస్తుంది. భూమి ఆమె. నేను చంద్రుడు. మధ్యలో సూర్యుడూ ఉన్నాడు. అది సమస్య కాదు. అదే నిజం. సూర్యుడు ఉన్నాడు కాబట్టే భూమి ఉంది. కానీ నేనూ అవసరమే. పూర్తిగా కాదు. కానీ గుడ్డి లాంతరులా. నేనూ అవసరమే!

అలా ఎలా? ఇన్నేళ్ల నీ జీవితాన్ని ఒక్క క్షణంలో కలిగిన నీ ఫీలింగ్ కి అంకితం చేసేస్తావా?

ఎన్నేళ్ల జీవితమని కాదు. నాకు ముఖ్యమైంది ఇప్పుడు. ఇక్కడ. అంతే. హంపిలో ఈ శిధిలాలన్నీ చూస్తే నీకేమనిపించింది? జీవితమొక్క ఆశాశ్వత నీకు కనిపించలేదా? నాకైతే ఈ శిధిలాల్నుంచి నేర్చుకున్నంత మరెక్కడా నేర్చుకోలేమనిపిస్తుంది. నాకిక్కడ చాలా బావుంది. ఇక్కడి రాళ్లు నాతో మాట్లాడతాయి. వాటి భాష నాకు అర్థమవుతోంది. సగం విరిగిపోయిన కోట గోడలు, ఆ గుడి ముందు శిధిలమైన శిల్పమొకటి నాతో మాట్లాడతాయి.  ఏ దారిలో వెళ్లినా చివరికి శిధిల్లాలోకే దారి తీస్తుందని చెప్తాయి. అందుకే జీవితం నన్ను ఎక్కడ్నుంచో మూసుకొచ్చి ఇక్కడ ఆమె ముందు పడేసింది.

ఏముందామెలో?

చూడటు? ఏం చేస్తుంది?

కాఫీ కలుపుతోంది.

అది నీ దృష్టిలో కాఫీ కలపడమనే సాధారణ చర్య కావొచ్చు. వృత్తాకారంలో ఉన్న కాఫీ మగ్ లో స్పూన్ పెట్టి ఆమె తిప్పడం చూడు. ఆ వృత్తంలోకి ఆమె చూస్తున్న చూపు చూడు. విశ్వం మొత్తాన్ని ఆకర్షించి సుడులు తిరుగుతున్న ఆ  కప్ లోనికి లాగేస్తున్నట్టుగా లేదూ?

ఆమె ను చూస్తున్నంత సేపూ నా గురించి, ఈ ప్రపంచం గురించి ఏ కంప్లైంట్స్ లేవు. ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను. ఆమె కావాలనుకునే నేను మాత్రమే. ఇంకే కోరికలూ, కష్టాలు, కన్నీళ్లు, బాధలు లేవు.

చూడు ఇప్పుడు ఆమె కాఫీ పట్టుకుని ఇటు వస్తుంది. కళ్లు మూసుకుని ఆమె అడుగుల శబ్దాన్ని విను. వినిపించడం లేదా? సముద్రపు హోరు. తడి ఇసుకలో ఆమె వేస్తున్న అడుగుల సవ్వడి. గాలికి ఎగిరిపోతూ రెపరెపలాడుతున్న ఆమె చీర కొంగు. వినిపిస్తోందా? ఆమె తలలో ఎప్పటికీ వాడిపోని ఆ గులాబీ?

*****

కార్లో హోస్పేట్ చేరుకునే సరికి అర్థరాత్రయింది. అంత రాత్రి పూట హంపీలో ఉండడంకంటే హోస్పేట్ లో ఏదైనా హోటల్లో ఉండడం మేలని అన్నాడు డ్రైవర్. కానీ నాకు హంపీకే వెళ్లాలనిపించింది. అతను హంపీలో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు.

హంపీలో శిధిలాలు శిలుహెట్ లో మళ్లీ ప్రాణం పోసుకున్నట్టనిపించాయి.

బస్టాండ్ లో టీ బంకు దగ్గర ఇంకా కొంతమంది జనాలు పోగై ఉన్నారు. నడుచుకుంటూ విరూపాక్ష ఆలయం చేరుకున్నాను. గుడి బయట నాలాంటి నిద్రపట్టని నిశాచరులు తచ్చాడుతున్నారు. గుడి ఎదురుగా ఉన్న ఫ్లడ్ లైట్ స్తంభం కింద కూర్చున్నాను. ఏం చేద్దామని హంపీ వచ్చాను? ఏంటి నాకు వాడితో సంబంధం? శనివారం రాత్రి. ఇప్పుడు లండన్ లో ఉండుంటే? చిన్నగా వర్షం మొదలైంది. అప్పటివరకూ గుడి ఎదురుగా ఉండే షాపుల బయటే నిద్రపోతున్న వాళ్లు తమ పక్కలు సర్దుకుని లోపలకి వెళ్లిపోయారు. నిద్రపట్టని నిశాచరులూ కాసేపటికి అక్కడ్నుంచి మాయమయ్యారు.  ఒంటరిగా నేను. ఎదురుగా విరూపాక్షుడు.

ఎందుకురా వెళ్లిపోయావ్ అని గట్టిగా అరవాలనిపించింది? నేనొచ్చే వరకూ ఆగలేకపోయావా? రాయడమంటే నడి రోడ్డు లో నగ్నంగా నిలబడ్డం కాదు, నడిరోడ్డులో నగ్నం గా వర్షంలో తడవడమని, నోస్టాల్జియా ఒక జబ్బు కాదు, అదొక గొప్ప మందనీ, రాయడమంటే అగ్ని పర్వతం బద్దలు కావడం కాదు, నిత్యం రగిలే గుండె మంటలను చల్లార్చుకోవడం అనీ, ది జంగిల్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హార్ట్; ఇట్ ఈజ్ ఇన్ ది హెడ్ అనీ…ఏదో ఒకటి. అది అబద్ధమో, నిజమో, నిజమైన అబద్ధమో, అబద్ధమైన నిజమో…ఏదో ఒకటి చెప్పి నిన్ను ఆపుండే వాడిని కదరా? ఎందుకురా వెళ్లిపోయావప్పుడే?

ఆఫ్టరాల్ ఈజ్ దిస్ ఆల్ జస్ట్ సమ్ మీనింగ్‌లెస్ సెంటిమెంటాలిటీ?

అయితే అవ్వనీ అనిపించింది. ప్యారిస్ లో ఉండగా మౌలారూజ్ 125 వ వార్షికోత్సవ వేడుకలకి వెళ్లినప్పుడు అక్కడ ఉండాల్సింది నేను కాదు మేము అనిపించింది. అప్పట్నుంచీ వాడిని కలవాలని, నెమళ్ల కొలను లో వాడితో మందు కొడ్తూ మాట్లాడాలని ఒకటే కోరిక. కానీ పని, పని, పని. పని గొడవలో చిత్వాన్ మాటే మర్చిపోయాను.

ఏమవుదామనుకున్నాను జీవితంలో? ఏమయ్యాను?

నువ్వు ఇవన్నీ వదిలెయ్. ఈ ఉద్యోగాలదేముంది? అందరూ చేస్తారు. నిన్ను ఇన్ని రోజులు రాయకుండా ఎందుకాపానంటే నువ్వు రాస్తే అది నాకు నచ్చాలి. రాయడానికేముంది. కుప్పలు తెప్పలుగా రాస్తున్నారు. రాయడం సులభం. కానీ అది మళ్లీ నువ్వే చదువుకుని నీ మొహం మీద నువ్వే ఉమ్మేసుకోవాలనిపించకూడదు. అందుకే ఆపాను. అంతే గానీ ఇలా నిన్ను నువ్వు అమ్ముకునే బిజినెస్ పెడ్తావనుకోలేదు. వాళ్లదీ గంటల లెక్కే. నీ లాంటి బిజినెస్ కన్సల్టెంట్స్ దీ గంటల లెక్కేగా! ఎందుకీ వ్యాపారం. ఇక్కడికొచ్చెయ్. హంపీలో ఎవరూ అడగరు నిన్ను. నీ కులమేంటి? నీ భాషేంటి? నీ క్వాలిఫికేషన్ ఏంటీ? ఇవన్నీ ఉండవిక్కడ. మనం మనుషులమనే సాధారణ జీవులం. నువ్వు నీ జీవితాంతం ఎంత తాపత్రయపడి ఏం సృష్టించినా చివరికి ఇలా శిధిలమవ్వాల్సిందే అనే పాఠం చెప్పి పంపిస్తుంది హంపి. వీలైతే ఫ్రాన్స్ వెళ్లొద్దు. ఇక్కడే ఉండు.

మొదటిసారి చిత్వాన్ చెప్పింది పట్టించుకోకుండా వెళ్లిపోయాను. వాడు చెప్పింది విని ఆలోచించడానికి ఇదేం జీవన్మరణ సమస్య కాదనిపించింది. పేదరికం నుంచి దూరంగా అడుగులు వేస్తున్నాననుకున్నాను. కానీ జీవితం నుంచే చాలా దూరంగా వెళ్లిపోయానని తెలియలేదు.

వర్షం ఎప్పుడు తగ్గిందో తెలియదు. చుట్టూ వెలుతురు. ఉదయాన్నే జనాల తాకిడి.

హడావుడిగా లేచి తుంగభధ్ర నది ఒడ్డుకు బయల్దేరాను. వాడు లేడు. కానీ వాడి గుడి చూడాలి. గుడిలో వాడి దేవతను చూడాలి. మొదటి పడవ ఎక్కి విరూపాపూర్ గద్దె కి చేరుకున్నాను.

లాఫింగ్ బుద్ధ, సాయి ప్లాజా, ఊ లలలా, ఎవర్ గ్రీన్…ఒక దాని తర్వాత ఒకటి. మౌళారూజ్ ఎక్కడ?

కొంతమంది తెలియదన్నారు. కొంతమంది తెలుసుకానీ ఎక్కడుందో చెప్పలేక తల గోక్కున్నారు. ఐదేళ్ల క్రితం నేను చూసిన విరూపాపూర్ వేరు. వెతకని చోటు లేదు. మధ్యాహ్నానికి తిరిగి బోట్ ఎక్కబోతుండగా అంతకుముందు హంపీ వచ్చినప్పుడు వాడు మౌలారూజ్ కెఫె చేరుకోవడానికి చిత్వాన్ చెప్పిన డైరెక్షన్స్ నా చెవిలో మారుమోగాయి. వాడు చెప్పిన గుర్తులు పట్టుకుంటూ మరో ప్రయత్నం చేశాను.

ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. పచ్చని పంట పొలాలు. వాటికెదురుగా గుడెశె ఆకారాంలో ఒక నిర్మాణం. పూర్తిగా శిధిలావస్థలో ఉంది. లోపలకెళ్లాను. విరిగిపోయిన వెదురు బల్లలు, కుర్చీలు. అక్కడక్కడా తాగి పడేసిన బీరు సీసాలు. ఎర్రటి కర్టెన్లు లేవు. టేబుళ్ల మీద గాజు గ్లాసులూ లేవు. ఆమె లేదు. వాడెలాగూ లేడు. ఉండడు కూడా. కానీ ఆ విరిగిపోయిన టెబుళ్లు, కుర్చీల మధ్య వాడెప్పుడూ కూర్చునే టేబుల్ మాత్రం ఇంకా అలాగే చెక్కు చెదరకుండా నాలుగు కాళ్లపై నిలబడే ఉంది.

హై. దిస్ ఈజ్ చిత్వన్. ఐ హోప్ యూ రిమెంబర్ మి.

సమ్ డే వెన్ యూ విజిట్ మౌలారూజ్, ప్లీజ్ గో టూ మై టేబుల్. ఐ హ్యావ్ ఏ మెసేజ్ ఫర్ యూ.

బై.

కేవలం మూడు లైన్ల ఒక ఈ మైల్. ఫ్రం కృష్ణమూర్తి ఎట్ జిమెయిల్ డాట్ కాం.

వీడుకూడా మోడ్రన్ అయిపోయాడు వెధవ. అడిగితే మొబైల్ ఫోన్, ఈమెయిల్, సోషల్ నెట్‍వర్క్  లాంటివన్నింటికీ తను దూరమని చెప్పేవాడు. కానీ హఠాత్తుగా ఒక రోజు వాడి నుంచే వచ్చిన ఈ మెయిల్. ఆ రోజు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటికప్పుడు వాడికో పెద్ద మెయిల రాసిపడేశాను. కానీ అనుకున్నట్టుగానే వాడినుంచి ఎటువంటి రిప్లై రాలేదు. ఈ సారి హాలిడేస్ కి ఇండియా వెళ్లినప్పుడు ప్రమద వాళ్లని గుంటూర్లో వదిలేసి ఒక వారం రోజుల పాటు చిత్వాన్ గాడితో హంపి వెళ్లాలని అనుకున్నాను ఆ రోజు. ఆఫీస్, మీటింగ్స్, సేల్స్ రిపోర్ట్స్, స్ట్రాటజీ మీటింగ్స్, షాపింగ్, పబ్బింగ్, గాసిపింగ్… ఈ గొడవలో ఎన్నో విషయాల్ని మర్చిపోయినట్టే కొన్ని రోజులకి వాడి సంగతే మర్చిపోయాను.

టేబుల్ కింద సెలోఫేన్ టేప్ తో నీట్ గా అంటించి ఉందో కాగితం.

ఇక్కడకొచ్చి చాలా రోజులయింది. ఆమె ను చూస్తున్నకొద్దీ, ఆమెను ప్రేమిస్తున్నకొద్దీ నేను రోజు రోజుకీ కొంచెం కొంచెంగా మరణిస్తున్నట్టనిపించింది. ప్రేమంటే ఏంటనుకున్నావు? ప్రేమే మరణం; ప్రేమించడమంటే అత్మహత్య చేసుకోవడం. ప్రేమలో అహం, అవాస్తవాలు మరణిస్తాయి. నా విషయంలో అది పూర్తిగా నిజమైంది. కానీ ఎన్ని అవాస్తవాలు మరణించినా ఆకలి అనే వాస్తవం మాత్రం నాకు దూరం కాలేదు. జేబులో డబ్బులు అయిపోయాయి. ఎందుకో హఠాత్తుగా ఒక రోజు పెరుగన్నం తినాలినిపించింది. మా నాన్న ఇంట్లో ఒక రోజు పెరుగన్నంతో పాటు తిన్న ఆవకాయ పచ్చడి గుర్తొచ్చింది. అంతే ఇక్కడ్నుంచి బయల్దేరి వెళ్లిపోవాలనిపించింది. ప్రపంచమంతా జయించిన ఆనందం ఆ అన్నం ముద్ద, ఆవకాయ పచ్చడి లో లేవనిపించింది. క్రేవింగ్ అంటే తెలుసా? ఆ క్రేవింగ్ తో అక్కడ్నుంచి బయల్దేరాను. ఆమె వద్దంది. తనతోనే ఉండమంది. కాళ్లు కూడా పట్టుకుంది. కానీ నేనప్పుడు ఏదీ ఆలోచించే స్థితిలో లేను. పెరుగన్నం-ఆవకాయ. నాకప్పుడు కావాల్సింది అదే! అందుకే నీకూ ఈ రహస్యం చెప్పాలనిపించింది. ఈ జీవితంలో ఏదేదో ఉందని నువ్విక్కడికి వెతుక్కుంటూ వస్తావని తెలుసు. అందుకే నీ కోసం ఈ మెసేజ్ ఇక్కడ దాచి వెళ్తున్నా! జాగ్రత్త గా విను.

వెన్ యూ ఆర్ గోయింగ్ బ్యాక్ ఫ్రం హియర్, డోన్ట్ ఫర్‍గెట్ యువర్ పికెల్స్. దటీజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఈజ్ మై ఓన్లీ మెసేజ్ టు యూ.

అండ్…

బైదివే ఇది మెసేజ్ కాదు. రిక్వెస్ట్.

నువ్వు కథలు రాయడం మొదలు పెట్టాక దయచేసి నా గురించి,మౌలారూజ్ గురించి మాత్రం ఎక్కడా చెప్పొద్దు.  హంపిలో మౌలారూజ్ ఉండేదని, నాలాంటి వాడొకడుండేవాడని-చెప్పినా ఎవరూ నమ్మరు.

*****

ఫర్ సమ్ లైఫ్ ఈజ్ ఏ సీరీస్ ఆఫ్ ఎడ్వంచర్స్ అండ్ డెత్ బీయింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్.

చెప్పానుగా వాడు ఎవరికీ అర్థం కాడని.

అందుకే వాడు రాయొద్దని చెప్పినందుకైనా వాడి గురించే రాయాలనుకున్నాను. అది కూడా వాడే చెప్పిన మాటలతో మొదలు పెట్టాలనుకున్నాను.

“రాయడమంటే  నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే.”

నన్ను నేను నగ్నంగా నిలబెట్టుకోవడమంటే నాకు సన్నిహితమైన నా ఆత్మీయ స్నేహితుడైన చిత్వాన్ ని నిలబెట్టడమే! నాకు తెలుసు వాడెక్కడ్నుంచో ఇదంతా చూసి తెగ సంబరపడిపోతుంటాడు. నాకది చాలు.

*****

Artwork: Mahy Bezawada

 

 

 

 

ఆ ఇంట్లో దెయ్యముంది..

avvariఆ ఇంటి గురించి వాకబు చేసినపుడు అన్నింటి కన్నా ఆమెకు ముందుగా  తెలిసిన విషయం, ఆ ఇంట్లో దెయ్యముందని.
 
ఇదేమిట్రా నాయనా అనుకొని, ఆ పక్కనే ఉంటోన్న తెలిసిన టీచరునొకాయన్ని అడిగితే ఆయన అన్నాడు గదా-” మేడం, నాలుగైదేళ్ళ నించీ ఆ ఇల్లు ఖాళీగా ఉందన్నది మాత్రం వాస్తవం. ఇంతకు ముందు అద్దెకు ఉన్న ఆమె  అక్కడే ఆత్మహత్య చేసుకొని  చచ్చిపోయిందంట. అదికూడా అనుకుంటుంటే విన్నదే గానీ వాస్తవం మాత్రం మనకు తెలియదు. అయినా దెయ్యాల్లాంటివి ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు? ఇల్లు మాత్రం ఏ ఇబ్బందీ లేకుండా అన్ని విధాలుగా మీకు బాగుంటుంది” అన్నాడు.
దెయ్యాలంటే నమ్మకమా అపనమ్మకమా అన్న మీమాంసలో పడేంత సమయం అప్పుడు లేకపోయింది తనకు. వొచ్చి ఇల్లు చూడడం, చేరిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
అయితే ఆ ఇంట్లో చేరిన నెల రోజుల వరకూ చుట్టు పక్కల వాళ్ళంతా తన గురించే అనుకుంటూ ఉన్నారు.  నాలుగైదు రోజులుండి ఖాళీ చేసి పోతుందిలే అనుకన్నారు. ఈ విషయాలన్నీచాలారోజుల  తర్వాత పక్కింటామె చెప్పింది తనకు.
ఉండగా ఉండగా తనకు తెలిసి వొచ్చిన విషయం ఏమిటంటే నమ్మకమైనా, అపనమ్మకమైనా అవి అనుభవం మీదనే తేలతాయి. ఆ అనుభవం కూడా మనమున్న స్థితిని బట్టే ఉంటుంది. అందునా, ఇప్పుడు అనిపించిన విషయాలు రేపటికి  కూడా ఇట్టానే అనిపించాలని లేదు. ఇలాంటి తెలివిడి తనకు ఆ ఇంటి నుండే వొచ్చింది. ఇప్పటికిప్పుడు ఎవరైనా తనను ఆ ఇంట్లో నిజంగా దెయ్యముందా అనడిగితే ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేదు. ఒకోసారి ఉంటుంది, ఒకోసారి ఉండదు అని మాత్రమే చెప్పగలదు.
చాలా సార్లు ఆ ఇంటి గురించి ఆలోచిస్తుంటే అది ఆ ఇంటి గురించి కాక తన గురించి, తన ఆంతరంగిక విషయాల గురించి తరచి తరచి చూసుకున్నట్టుగా   ఉంటుంది ఆమెకు .
అట్లా తరచి చూసుకోవడం ఒకోసారి తనకు తెలియకుండానే ఇష్టంగా ఉంటుంది. మరోసారి అసలు ఆ ఇంటి నుంచీ, చివరకు తన ఉనికి నుంచే తప్పించుకొని ఎక్కడకయినా పారిపోదామా అన్నంత భయం గొలిపేదిగా కూడా ఉంటుంది.
****                                                                              *****                                                             ****
ఆలోచనలు అనేక విధాలుగా కదులుతూ అదుపు తప్పి పోతున్నాయి. అట్లా కావడం ఎంతమాత్రమూ  మంచిది కాదని డాక్టర్ హెచ్చరించడం తను గుర్తు చేసుకున్నది. అట్లా కాకూడదు, అట్లా కాకూడదు అని తనను తాను సంభాళించుకొనేందుకు ప్రయతించింది. కాసేపు వేరే విషయాల మీదకు దృష్టి మళ్ళించేందుకు చూసింది.
చెట్టు కింద అరుగు మీద కూర్చున్నదే కానీ  ఎండ సెగ తెలుస్తూనే ఉంది. బయటి సెగకు తోడు లోపలి సెగ కూడా జతయి నోరంతా పిడచగట్టుక పోతున్నట్టుగా అనిపిస్తోంది. పెదాలను నాలుకతో తడుపుకొని, బాటిల్‍లోని నీళ్ళను లోపలికి వొంపుకున్నది. దాహమయితే తీరింది కానీ నోరంతా ఏదో చేదుగా అనిపించింది.
కాసేపటికి పి.ఎచ్. సి లోనించి “సరోజక్కా” అని పిలుస్తూ తన దగ్గరికొచ్చింది నీలిమ.
వొచ్చీ రాగానే ,”వొంట్లో వుషారుగా ఉందా, జెరం తగ్గి పోయిందా” అని అడిగింది.  అలా అడుగుతూనే చొరవగా నుదురు మీద చేయి వేసి చూసింది.
బదులుగా- ” నయమే లేవే, మరీ నిన్నటంత లేదు గానీ” అనింది తను.
“ఈ రోజు కూడా సెలవు పెట్టాల్సింది. ఈ ఎండకు పడి తిరిగితే లేని రోగం కూడా వొస్తది” హెచ్చరింపుగా అనింది నీలిమ
“కొద్దిగా బాగానే ఉన్నట్టుగా ఉంటే, చిన్నగ బయల్దేరాను లేవే. మరీ ఇబ్బందిగా ఉంటే ఈ బండ చాకిరీ నేను మాత్ర ఎలా చేయగలను. ఇంతకీ ఇప్పుడు మీటింగు ఉంటదంటనా, లేదంటనా” అడిగింది తను.
“అందరూ అదే అనుకుంటున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకన్నారు కదా. పాపం అందరూ ఈ ఎండన పడి వొస్తానే ఉన్నారు. ఇంకాసేపాగితేగానీ ఏమయ్యేదీ తెలియదు”
వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ  ఉండగానే చాలా మంది ఏఎన్నెంలు వ్యాక్సిన్ బ్యాగ్‍లు లోపల పెట్టేసి ఒక్కొక్కరుగా చెట్ల కిందకి చేరుతున్నారు. డిపార్ట్‍మెంట్‍కు సంబంధించిన కబుర్లు, వాళ్ళు పని చేసే ఏరియాలో ఉండే సమస్యలు – ఇట్లా మాట్లాడేసుకుంటా ఉన్నారు. మరికొంత మంది వాచీలు చూసుకుంటూ మీటింగు ఉంటుందా, ఉండదాని వాకబు చేస్తున్నారు.
టైం రెండు దాటుతున్నది. కాసేపటికి పిఎచ్‍సి స్టాఫొకరు వొచ్చి “డాక్టరు గారికి ఏదో ఫోనొచ్చింది. అర్జెంటుగా వెళ్ళి పోయారు. రేపు మీటింగుంటదని ఇప్పుడే ఫోన్లో చెప్పా”రని అన్నాడు.
“మళ్ళా రేపా “, అన్నారు కొంతమంది. “ఎటూ తప్పేది కాదుగా ఈ రోజుకు బతికాం” అనుకున్నారు చాలా మంది. ఎవరి దారిన వాళ్ళు ఒక్కొక్కరిగా బయలు దేరుతున్నారు. తను, నీలిమా కూడా కాంపౌండ్ దాటి బయటకొచ్చారు.
దారిలో, “ఈ ఎండకు ఏం పోతావుగానీ మా ఇంటి కాడికి పోదాంరాక్కా” అనింది నీలిమ.
“లేదే, మా అన్న కాడికి పోయి రావాలి. పొద్దున్నే మా అమ్మ ఫోన్ చేసింది”.
“సరే, అయితే రాత్రికి వొచ్చి తోడు పడుకునేనా. అసలే వొల్లు బాగాలేదు. ఈ పరిస్థితుల్లో మల్లా ఒక్క దానివే ఉన్నావంటే మీ డార్లింగొచ్చి ఎదురుగా కూర్చుంటదేమో!”
ఆ పిల్ల డార్లింగన్న పదాన్ని వొత్తి పలికిన తీరుకి చిన్నగా నవ్వుతూ – “వొద్దులేవే, బాగానే ఉందిగా. పాపం రోజూ నువ్వు మాత్రం ఎక్కడకని వొస్తావు. అంత ఇబ్బందిగా ఉంటే నేనే ఫోన్ చేస్తాలే” అనింది సరోజ.
****                                                                         *****                                                                               ****
ఎండకు వొళ్ళంతా గుచ్చుక పోతున్నట్టుగా ఉంది ఆమెకు. ఉదయం పని, ఆ తర్వాత ప్రయాణం- వీటితో  వొళ్ళు తూలిపోతున్నట్టుగా నీరసం అయింది. కాసేపు ఎక్కడన్నా నీడలో ఆగుదామానిపించింది. కానీ ఇక్కడెక్కడా తను ఆగడానికి లేదు. ఆగితే షాపుల ముందర ఆగాల్సిందే. ఇదంతా ఎందుకు లెమ్మని ఓపిక తెచ్చుకొని చిన్నగా నడవడానికే ఆమె నిర్ణయించుకున్నది.  ఈ రెండు రోజుల నుంచీ కాసిన జ్వరం తనని బాగా నీరసం చేసేసింది.
ఈ సమయంలో నీలిమ తోడు లేకుంటే ఎలా ఉండేదోననిపించింది తనకు. ఒంట్లో ఏ కాస్త నలత చేసినా, మనసు కాస్త తేడాగా ఉన్నా, తన బలహీనతలోనించీ “ఆమె” తన ముందర ప్రత్యక్షమవుతుందేమోనని  ఒకోసారి భయం వేస్తుంది.
ఆలోచనల్లో ఉండగానే బస్టాప్ దగ్గరకొచ్చేసింది. బస్సు వొస్తే ఎక్కి టిక్కెట్ తీసుకొని ఎందుకైనా మంచిదని కిటికీ దగ్గర కూచ్చుంది. ఆలోచనలు వాటి కొసల నుండీ తిరిగి మళ్ళా మొదలవుతున్నాయి. ఒక ధారలాగా ఎడ తెగకుండా తనను తమ లోపలికి పీల్చుకుంటున్నాయి.
“ఇలా కాకూడదు” అనుకున్నది తను. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే లేని రోగం కూడా వొస్తుందన్న సైకియాట్రిస్ట్ హెచ్చరికను గుర్తుకు చేసుకున్నది. ఊరికే అలా ఆలోచనల్లో పడి లోలకంలా పడి కొట్టుకోకుండా ఏం ఆలోచిస్తున్నావో గమనించు అన్న ఆయన సలహాను తలుచుకున్నది.
నెమ్మదిగా అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా పోగు చేసుకునేందుకు  ప్రయత్నం మొదలు పెట్టింది.
అసలిదంతా అమ్మ ఉదయాన్నే ఫోన్ చేయడంతో మొదలయ్యింది. ఫోన్లో ఆమె ఏడుస్తున్న గొంతుతో “అన్నను పోలీసోల్లు పిలచక పోయార” ని అన్నది.
” ఎందుకు” అని అడిగితే “ఎస్సై గారు పిలచక రమ్మన్నారు. మళ్ళీ పంపిస్తాం “, అని అన్నారంట.
“ఊళ్ళొ ఇంకా మరో ఇద్దర్ని కూడా పిలచక పోయార”ని ఆమె అన్నది.
రెండు రోజుల నుండి డ్యూటీకి సెలవు. ఈ రోజేమో వ్యాక్సినేషన్. నిన్న సాయంత్రమే తను హాస్పిటల్‍కు ఫోన్ చేసి రేపు వొస్తానని చెప్పింది కూడాను. ఇప్పుడు తను డ్యూటీకి వెళ్ళక పోతే ఎక్కడిదక్కడ ఆగి పోతుంది. ఏం చేయాలో తోచక “సాయంత్రానికల్లా ఇంటికొస్తాన”ని అమ్మతో పోన్లో చెప్పింది.
ఎలాగైతే అలాగవుతుందని లోపల్లోపల ధైర్యం చెప్పుకుంటుందేగానీ లోపలి గాబరా ఎంతకీ ఆగడం లేదు.
“ఎక్కడా ఏమీ అలికిడి లేదే. మళ్ళీ ఎందుకని ఇలా వెంటబడుతున్నారు?”
“మళ్ళి ఏమన్నా నెత్తి మీదకు తెచ్చుకున్నాడా?”
Sketch18116461చుట్టుపక్కల ఎక్కడా నక్సలైటన్న పేరు వినపడకుండా పోయేదాకా పోలీసులు ఆయనెమ్మటి పడుతూనే ఉన్నారు.
“ఎవరికీ లేని ఖర్మ నీకెందుకురా” అని అమ్మ నెత్తీ నోరూ మొత్తుకుంటే మౌనమే వాడి సమాధానం. ఇంకా గట్టిగా నిలదీస్తే కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడు.
ఇట్లా మొత్తుకున్న కొన్ని రోజుల దాకా తగ్గినట్టే తగ్గి ఇక ఏమీ లేదులే అని అనుకునేటప్పటికీ మళ్ళీ మనకు తెలియకుండానే పీకల్లోతు కూరుకుని పోయేవాడు.
“మీ వాడి పేరు రికార్డుల్లోకి ఎక్కింది. ఎక్కడ ఏమీ జరిగినా మీ వాడినే ముందు తీసుకొని పోయేది”, అనే వాళ్ళు అందరు.
“అట్లా రికార్డుల్లోకి ఎక్కిందాన్నేనా, చుట్టూ ఏమీ లేక పోయినా మళ్ళీ మళ్ళీ పట్టుకొని పోతా ఉంది?” అనుకున్నది తను.
అట్లా అనుకుంటూనే గబగబా తయారయి వ్యాక్సిన్ బ్యాగ్ పికప్ చేసుకుంది. ఆటో ఎక్కి తను పని చేసే ఊర్లో దిగే సరికే ఎండ దంచేస్తా ఉంది. ఆటోలు ఆగే దగ్గర  ఆశా వర్కర్ రమణమ్మ సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ బ్యాగ్‍ను ఆమె తన చేతుల్లోకి తీసుకున్నది.
గబగబా నడుస్తూ చిన్నబడి దగ్గరికొచ్చేసరికి వాళ్ళకు సుమారు ఒక పది మంది డ్రస్సుల్లో, తుపాకులతో ఎదురయ్యారు. ఊహించని ఈ సన్నివేశానికి తనకు ఒక్కసారిగా ఊపిరాడనంత పనయ్యింది. ఒక్క క్షణం వాళ్ల వైపు చూస్తూ నిలబడింది. వాళ్ళు గబగబా వరుసగా ఒకళ్ళ వెనుక ఒకళ్ళుగా తమను దాటి మెయిన్ రోడ్‍కు  అవతల ఉన్న గుట్టల వైపు పోతున్నారు.
లోపల తను ఆలోచిస్తున్న దానికి, బయట తను చూస్తున్న దానికీ సంబంధం ఏమయినా ఉందేమోనని ఆమె కాసేపు సంకోచపడింది. తను మాట్లాడేది వాళ్ళకు వినపడుతుందేమోనన్న భయంతో , ” రమనమ్మా, ఏందీ వీళ్ళూ?” అని చిన్నగా అడిగింది.
“ఎర్ర సెందనం కోసమంటమ్మా. అడివిలోకి ఎవురూ కూడా పోవడానికి బయపడి సస్తా ఉండారు. మొన్న తిరపతి కాడ కట్టె కొట్టడానికి పోయినోళ్ళను కూడా సంపిండ్రంట గదా. మనకెల్లంతా కూడా అడవడివీ గాలిస్తా ఉండారు”
ఒక్క క్షణం నింపాదిగా గాలి పీల్చుకున్నది తను. అంగన్‍వాడీ  సెంటర్ దగ్గరికొచ్చేసరికి అప్పటికే బాలింతలు చంటిబిడ్డల్ని తీసుకొని తన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళను ఒక్కొక్కళ్ళనూ పలకరిస్తూ పనిలో పడింది తను.
****                                                                        *****                                                                                         ****
తిరిగి వొస్తున్నప్పుడు దారిలో అటో తోలుతున్న చాకలి గురవయ్య అంటున్నాడు. “పెద్ద పెద్ద వాళ్ళను వొదిలేసి సన్నా సపకా వాళ్ళను చంఫుతున్నారు మేడం”.
 
ఆ మాటలు తనకు తగలాలనే, తనను ఉద్దేశించే అంటున్నాడు.
అయినా తనకు తెలియకుండానే, “ఆఁ” అన్నది తను.
తను “ఆఁ” అనడం అతనికి ఎలా తోచిందో గానీ దారి పొడగునా వొదురుతానే ఉన్నాడు.
“ఎప్పటికయినా సన్నా సపకా వాళ్ళకేనంట నెత్తి మీదికొచ్చేది”.
“ఈ చుట్టు పక్కల తలకాయ ముదిరిన ప్రతీ వాడూ ఎర్ర చందనం డబ్బు ఏదో రకంగా తిన్నవాడేనంట”.
“మొన్న ఎలక్షన్లో ఇప్పటి ఎమ్మెల్యేని గెలిపించింది కూడా ఆ డబ్బులేనంట”.
“ఇట్టాంటి డబ్బు తినడానికి ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదంట.”
“కట్టె కొట్టబోయిన తన లాంటి వాళ్ళకు మాత్రం తన్నులూ, కోర్టు కేసులూ, చావులూనంట”.
“అట్టాంటి కేసుల్తోనే సంవత్సరంగా డబ్బులు పోసుకుంటా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడంట”.
చాకలి గురవయ్య మాటల్లో కసంతా తన మీదకే కొడతా ఉంది. అది తనకు తగలాలనీ, తనను బాధ పెట్టాలనీ ఉద్దేశించినట్టుగానే ఉంది.
ఒక్క క్షణం తనకు అతనితో, ’నేనూ నీ లాంటి దాన్నే” అని చెప్పాలనిపించింది. ’నాకూ నీకూ ఎడంలేదు. నీది బయటకు కనపడే బాధ. నాది బయటకు కనపడనిది. నీలా చెప్పుకోలేనిది” అని అనాలనిపించింది. “కానీ అది ఆయనకు అర్థమవుతుందా”?
“అయినా ఇప్పుడు తను ఈ మాటల్నీ,  మాటలతో సలపరించే తన గతాన్నీ తవ్వుకుంటూ కూర్చోలేదు. అది తనని ఇంకా ఇంకా పాతాళానికి తోసేస్తుంది. తను దాన్నించీ తప్పుకోవాలి. బతకాలి”. లోపలికి గట్టిగా గాలిపీలుస్తూ  అనుకుంటూ ఉండిదామె.
****                                                                                      *****                                                                              ****
బస్సు దిగి ఇంటి దగ్గరకొచ్చేసరికి అన్న వొచ్చేసి ఉన్నాడు. తను  ఇంట్లోకడుగు పెట్టేసరికి మొగరానికానుకొని గిట్టకాళ్ళమీద కూర్చొని తనని చూసి పలకరింపుగా నవ్వాడు. అమ్మ పొయికాడ రొట్టెలు చేస్తా ఉంది. అన్న తాగుతున్న బీడీని పక్కన పారేసి గ్లాసు తీసుకొని టీ పోయించుకరాను బయలుదేరాడు.
“ఇప్పుడెందుకులేన్నా”, అంటే , “పోనీలేవే, కాసింత రొట్టె తిన్నాక టీ తాగడం నీకిష్టమేగా” అన్నది అమ్మ.
అన్న బయటికెలితే ఆ సమయంలో ఏదన్నా మాటాడొచ్చని ఆమె ఆలోచన.
అన్న గ్లాసు తీసుకొని బయటకు పోగానే అమ్మ చెప్పడం మొదలు పెట్టింది.
“ఊళ్ళలో ఉండే అన్న లాంటి వాళ్ళందరినీ మళ్ళా పోగేసి మాట్లాడానికి పిలిపిచ్చిండ్రంట. ఆప్పుడప్పుడూ అట్టా పిలిపిచ్చి మాట్టాడితే గానీ బయ్యముండదని ఇదంతా చేస్తా ఉన్నారంట. రేపు మార్కాపురం డీఎస్పీ కాడికి కూడా అందరూ పోయి రావాల్నంట”.
“మళ్ళీ రేపు కూడానా” , అన్నది తను.
“ఏం చేస్తాం. అందరూ బాగానే ఉండారు. మా కర్మే ఇట్టా కాలబన్నది”, పుల్లవిరుపుగా అన్నది వొదిన.
తను వొచ్చిన దగ్గర నుండీ ఆమె ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాటాడలేదు. ఇలాంటి సమయాల్లో ఆమె మూతి ముడుచుకోని ఉంటుందని తనకి తెలుసు. ఆమెలో ఏదో కోపం. ఎవరి మీద చూపాలో తెలియని కోపం.
ఆమె కోపం ఉదయం తను చూసిన చాకలి గురవయ్య లాంటిదేనని అనిపించింది తనకు. కానీ ఆమె కోపము, ఆ పుల్లవిరుపు వైఖరి తనను ఎంతకూ కుదురుగా ఉండనీయడంలేదు.
” ఎవ్వరి బతుకులు మాత్రం బాగున్నాయి. తను కూడా ఆమె లాగా, చాకలి గురవయ్యలాగా ఈసురోమనే కదా బతుకుతున్నది. పైకి మాత్రం ఇదిగో, మంచిగా కనపడే  గుడ్డలు కట్టుకొని, భుజానికి హ్యాండ్ బ్యాగ తగిలించుకొని తెల్లపుల్లగా కనపడుతున్నాను గానీ, నా బతుకు కూడా తగలబడి పోతుందని ఈమెకు తెలియదా? వీళ్ళకన్నా ఏడ్చుకోవడానికి ఉంది. నేను మాత్రం ఈ తెల్లపుల్లని గుడ్డల మాటున శిధిలమైపోతున్నాను” అని గట్టిగా అరవాలనిపించింది.
“కానీ తనకు తెలుసు. మనుషుల మధ్యన ఉండే దూరాలు, ఎత్తు పల్లాలు మనుషులను ఎంతకీ దగ్గర కానీవు.  ఎంత మొత్తుకున్నా ఒకరికొకరు అర్థం కానీయవు. ఒకరికొకరు కాస్త దగ్గరకొచ్చినట్టుగా అనిపించినా అది కాసేపే. తిరిగి మళ్ళీ మనుషుల మధ్య గోడలు పైకి లేస్తాయి. పైకి లేచిన గోడల మధ్యన మనుషులు జంతువుల్లాగా బంధీలై గాలిలోకి కాళ్ళూ చేతులూ విసురుతూ మొత్తుకోవాల్సిందే.”
“లేకుంటే తను ఏమి చేసామని  వొదిన తనతోనూ, అమ్మతోనూ సరిగా మాటాడదు? ఏదన్నా అంటే, ఈ కొంపలో నా కర్మ కొద్దీ వొచ్చి పడ్డానంటుంది. ఆమె ఈ ఇంటికొచ్చిన  దగ్గరనించీ ఇదే తంతు. అంతా అయిపోయీ, అన్న ఇక ఎటూ పోకుండా ఇంటి కాడే ఉండేంత వరకూ ఇట్లాగే కక్షగా ఉండేది ఆమె.”
“తనకూ, మొగునికీ పడక గొడవలై, ఇక కలిసి ఉండలేక వొక్కతిగా  ఉండాల్సొచ్చినపుడు  అన్నా, వొదిన, అమ్మ తన దగ్గరకు వొచ్చి రెండు రోజులున్నారు.  ఆ రెండు రోజులూ మాత్రమే వొదిన మునపటి కన్నా నెమ్మదిగా, మెత్తగా మాటాడింది. ఆ నెమ్మదితనం, మెత్తదనం చూసి తనే ఆమెను దూరం నుంచీ చూసి అర్థం చేసుకున్నానేమో అనుకున్నది. కానీ ఈ రోజు, ఈ సంఘటనతో మళ్ళీ తనకు తెలిసిన వొదిననే చూస్తున్నది తను”.
కళ్ళలో నీళ్ళు మెదలుతున్నాయి తనకు. అన్న వొస్తూ వొస్తూ పిల్లల్ని కూడా పిలుచుకొని వొచ్చాడు. వొస్తూనే వాళ్ళూ “అత్తా” అని మీద పడిపోయారు. హ్యాండ్ బ్యాగ్ లోనుండీ  కొనుక్కోవడానికి వాళ్ళకు డబ్బులు తీసిచ్చింది.
అన్న తెచ్చిన టీ తాగుతూ, “అయితే రేపు కూడా పోవల్నా” అని అడిగింది తను.
“అవును ఉత్త పున్నేనికే తిప్పుతా ఉండారు”, అన్నాడు ఆయన.
ఇంకేం మాటాడడానికి తోచలేదు తనకు.
టీ ఊదుకుంటా తాగుతా ఉంటే అన్న మొకం కెల్లి చూసింది. మొకమంతా డొక్కుపోయినట్టుగా ఉంది. రెక్కల కష్టంతో దేహం ఎండిపోయి కంప మాదిరిగా తయారయ్యింది. ” తనకున్న రెండెకరాల చేను పీల్చి పిప్పి చేస్తున్నది” అనుకున్నది తను.
Sketch18116461
ఈ నిశ్శబ్ధంలో కాసేపు ఆగి అటూ ఇటూ తిరుగుతూ బోకులు సర్దుకుంటున్న వొదిననూ, పిల్లలనూ, అమ్మనూ మార్చి మార్చి చూసింది. వాళ్ళు కూడా అన్న లాగే ఎండిపోయి వొట్టి చేపలల్లే ఉన్నారు. ఒకే ఇంటిలో ఒకే రకమైన కష్టాలతో ఒకరినొకరు ముమ్మూర్తులా పోలి ఉన్నారు.
కానీ వాళ్లందరినీ విడగొడుతున్నదీ, ఒకరంటే ఒకరికి ద్వేషాన్నీ, కోపాన్నీ కలిగించేదీ ఏదో అక్కడే మెసల్లాడుతున్నట్టూగా తోచింది. అది గాలిలాగా అక్కడే తిరుగుతూ ఉన్నది. వొంటికి తాకుతూ ఉంది. అక్కడక్కడే తిరుగుతూ మనుషుల్ని నిస్సహాయుల్ని చేసి దిక్కుకొకరుగా ఈడ్చుక పోతూ ఉంది. అది తనకు తెలుస్తూ ఉంది అనుకున్నది తను.
ఉండి ఉండీ కాసేపటికి, “నిన్న స్టేషను కాడ మీ లాయరు మాట్లాడిండు” అన్నాడు అన్న.
తను ఏమీ మాటాడలేదు.
ఏమయినా మాటాడితే అది ఆ ఇంట్లో మరో విస్పోటనంగా పని చేస్తుందని తనకు తెలుసు. అందుకే తను ఏమీ మాటాడలేదు.
కానీ అమ్మ అందుకోనే అందుకున్నది. అది నెమ్మది నెమ్మదిగా మొదలై తిట్లు, శాపనార్ధాలకు చేరుకుంటున్నది.
****                                                              *****                                                                                                 ****
అందరిలాగే తన బతుకూ ఉంటుదనుకున్నది తను.  పెళ్ళయిన కొన్నేళ్ళ దాకా బాగానే ఉన్నాడు  భర్త వెంకట రమణ. ఉద్యోగస్తుడు కాకపోయినా దగ్గరి సంబంధం బాగుంటుందని చేసారు. కానీ మూడేళ్ళు దాటిన దగ్గర నుంచీ మొదలయ్యిందీ నరకం. పిల్లలు పుట్ట లేదని అత్త, మామా సణుగుడు. దానికి తోడు తను చేసే ఉద్యోగం మీద ఏవేవో సూటిపోటి మాటలు. తన రాకపోకల మీద భరించరాని ఆంక్షలు. కాసింత ముందుగా బయల్దేరినా, కాస్త లేటుగా వొచ్చినా ఎంతదాకా మాటలు పడాల్సొస్తుందోనని గుండెలు బితుకు బితుకు మనేవి.
ఇది చాలదన్నట్టుగా ఎట్టా తగులుకున్నాడోగానీ రాజకీయ నాయకులెమ్మటి తిరగడం, ఎమ్డీవో, ఎమ్మార్వో ఆఫీసులెమ్మటి మరిగి ఊళ్ళో వాళ్లకి పనులు చేపించడం , దానికి గాను ఆఫీసర్లకింత ఇప్పించి తనూ కొంత దండుకోవడం.
“ఎందుకయ్యా ఈ తిరుగుళ్ళు, ఉన్న కాస్త పొలమూ చూసుకోక”, అంటే “తిరుగుతున్నాను కాబట్టే లోకం తెలుస్తుందం”టాడు.
ఇది ఎంత దాకా వొచ్చిందంటే చుట్టూ పక్కల ఏ పనొచ్చినా ఆయన కన్ను దాటి పోని పరిస్థితి.
ఆయన చేసే పనులు వింటుంటే ఒకోసారి తనకే ఆశ్చర్యం వేసేది. హైస్కూలు చదువు దాటని మనిషి ఇన్ని రకాలుగా చేయగలగడం నమ్మశక్యం అయ్యేది కాదు. ఇదంతా తన అన్న నడిచే దిశకు వ్యతిరేకంగా సాగడంగా తనకు అర్థమయ్యేది. ఇది ఇంట్లో ఇంకా ఇంకా హింసకు దారి తీసేది. అన్న జీవితంలో ఎదురయ్యే మలుపులు, ఇబ్బందులు రోజుకొక్క రకంగా తనకు దెబ్బలై తాకడం తనకు తెలుసు.
ఇందులో తన ప్రమేయం ఎక్కడా లేదు. కానీ ఇదీ అని చెప్పలేదు గానీ లోపల మాత్రం తనకు తెలియకుండానే తన మొగ్గు అన్న వైపే ఉన్నట్టుగా కనపడుతుండేది.
మొగుడు మొకాన్నే అనేవాడు, “నీకు ఇదంతా యాడ నచ్చుద్ది లేవే,  గుట్లమ్మటీ, అడువులమ్మటీ తిరుగుతుంటే నచ్చుద్దీ గానీ” అని. అన్న ఇబ్బందులకు గురి కావడం, కేసుల పాలయిన సందర్భాల్లో అయితే ఇక ఆ ఇంట్లో లేకుండా ఉంటే పీడా పోతుందనుకునేది.
ఇదంతా ఏళ్ల పాటు గడిచింది. అన్న జీవిత ఇక ఒక స్తబ్ధ స్థితికి చేరుకుంటున్నదనుకునే సమయానికి తన జీవితం ఇంకో ఇబ్బందిలోకి కూరక పోయింది.
వెంకట రమణ   ఎర్ర్ర చందనం కొట్టించడం మొదలు పెట్టాడు.  మొదట తను ఇది విన్నప్పుడు, ” ఇది, ఇక్కడా” అని ఆశ్చర్య పోయింది. ప్రకాశం, కడప జిల్లాల సరిహద్ధుల్లో ఇది సాధ్యమేనా అనుకున్నది.  కానీ తర్వాత్తర్వాత ఇది నిజమేనని తెలుసుకున్నది. ఫారెస్టోల్లూ, పోలీసుల గొడవ మళ్ళీ తన జీవితంలో మరో విధంగా మొదలయింది. కానీ అవి తన భర్తను బతక నేర్చిన వాడిగా, పలుకుబడి గలిగిన వాడిలాగా నిలబెట్టేందుకే దోహద పడ్డాయి. కేసులూ, రైడింగులూ అన్నీ అయ్యాయి గానీ అవన్నీ ఆయనని మరింత ఎత్తుకు చేర్చేందుకే ఉపయోగ పడ్డాయి.  ఇట్టాంటి డబ్బే కిందటి ఎలక్షన్లల్లో ఏరులై పారిందంట. చివరకు వెంకట రమణ పంచాయితీ సర్పంచ్ కూడా అయ్యాడు.
వీటన్నింటికీ తోడు తను ఇక తట్టుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరైన విషయం వెంకట రమణ  ఒంగోలులో ఎవరితోనో కాపురం పెట్టడం.  ఇది తన సహనానికి ఉన్న ఆఖరి హద్దును కూడా పూర్తిగా చెరిపేసింది.
****                                                            *****                                                                                          ****
బస్సెక్కి తిరిగి ఊరు చేరుకొనేసరికి ఎనిమిది దాటుతుంది. బస్సు దిగగానే పర్సులోనించీ సెల్లు బయటకు తీసి చూసుకుంది. నీలిమ నుంచీ రెండు మిస్‍డు కాల్స్.
తిరిగి ఆ నెంబరుకి కాల్ చేయబోయింది కానీ ఎందుకో ఒక్క క్షణం ఆగి మానేసింది. ఈ క్షణంలో ఆమె ఏది మాట్లాడించబోయినా  తను మాటాడగల స్థితిలో లేదు.
బస్టాప్ నుంచీ ఇంటి దాకా కూడా నడవడానికి ఓపికగా ఉన్నట్టు అనిపించడంలేదు. దగ్గర ఉన్న ఆటో ఒక దాన్ని ఆపి ఇంటి అడ్రస్సు చెప్పి ఎక్కి కూచ్చునింది.
బస్సు ఎక్కినప్పటి నుండే తల ఊరకే కదిలి పోతున్నట్టుగా అనిపిస్తోంది. కడుపులో ఒక పక్కగా మొదలైన మంట రొమ్ము దగ్గరకు పాకుతూ వొస్తుంది. అది ఇప్పుడు మరింత ఎక్కువై నోట్లో నీళ్ళు ఒకటేమైన ఊరుతున్నాయి. ముక్కుతో గాలిని నిండుగా పీల్చుకుంటూ నెమ్మదిగా వొదులుతూ నియంత్రించుకునేందుకు ప్రయత్నించింది. కానీ లోపలి నుంచీ వొస్తున్న హోరును ఆపుకోలేక పోతుంది. ఆటోలో నుండే భళ్ళున వాంతి చేసుకున్నది. నోరు, ముక్కు, కళ్ళ నిండా సుళ్ళు తిరిగుతూ ఒక్క క్షణం ఊపిరి ఆగినట్టుగా అయింది.
ఆటో నడిపే అతను ఆటోను ఒక పక్కన ఆపి, పుక్కిలించుకోవడానికి నీళ్ళు అందిస్తున్నాడు.
****                                                              *****                                                                                   ****
శరీరాన్ని చిన్నగా ఈడ్చుకుంటూ,  మెట్లెక్కి పై దాకా వొచ్చింది కానీ తాళం తీసుకొని ఇంట్లోకి అడుగు పెడదామనుకునేసరికి వొళ్ళంతా భయంతో జలదరించింది. శరీరమంతా చెమటతో తడిచి ముద్దయింది. చేతులూ, కాళ్ళూ వొణుకుతూ ఉన్నాయి.  ఆ క్షణం  అక్కడ నుంచీ దూరంగా ఎక్కడకన్నా పారి పోదామా అనిపించింది. తాళం తీయాలనే ఆలోచన పక్కన పెట్టి మెట్ల మీద అలాగే కూర్చుండి పోయింది.
 
వొళ్ళూ, మనసూ పుండు మాదిరిగా సలుపుతున్న ఈ స్థితిలో ఇంట్లోకి అడుగు పెట్టడమన్న అలోచనే ఆమెకు ఊపిరి ఆడనీయడంలేదు.
తలుపు తీసి లోపలికెళితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. అక్కడ “ఆమె” ఉంటుంది. ఇట్టాంటి సందర్బాల్లో ఆమె ఖచ్చితంగా తనకెదురుగా వొచ్చి నిలబడుతుంది.
ఆమె తనను ఏమీ అనదు. ఊరకే అలా చూస్తూ కూర్చుంటుంది. ఎటు కదిలితే అటు తన కళ్లను తిప్పి అదే పనిగా చూస్తుంటుంది. పారదర్శకమైన ఆ దేహాన్ని తను మొదట ఆ ఇంట్లోనే చూసింది. చూడగానే  మ్రాన్పడిపోయింది. తను చూస్తున్నదేమిటో అర్థమవగానే గబగబా అక్కడ నుంచీ పారిపోయింది.
ఇట్టాంటి అనుభవం తన చదువుకూ, తను చేసే పనికీ వ్యతిరేకంగా తోచింది కానీ త్వరలోనే ఆ పారదర్శకమైన దేహం వెనుకా, ఆ చూపుల వెనకా ఆకర్షణీయమైనదేదో ఉన్నట్టుగా తనకి అనిపించింది. అందులో ఏదో మార్మికమైనదేదో ఉన్నట్టుగా తోచేది. అది తనకు మాత్రమే అర్థమవుతున్నట్టుగా అనిపించేది.
“ఎవరు ఆమె?”
“మొగుడు రైల్వేలో ఉద్యోగమంట.”
“కొత్తగా పెళ్ళయిందంట.”
“అయితే ఈమె మాత్రం మంచిది కాదంట.”
“మొగుడు బయటికి పోగానే ఎప్పుడు మిద్దె మీదే అటూ ఇటూ తిరగతా ఉంటదంట.”
“ఏమయిందో ఏమో గానీ చివరకు ఆమె ఫ్యానుకు ఉరేసుకున్నదంట”
“చంపిండ్రో, ఆమే చచ్చి పోయిందో ఎవ్వరికీ తెలియదంట”.
“చివరకి, అద్దెకిచ్చినోళ్ళక్కూడా తెలియకుండా గప్‍చిప్‍గా బాడీని జీపులో వేసుకొని పోయిండ్రంట”.
“అభాగ్యురాలు పాపం. కానీ చావు ఎంత అదృష్టం”
“చావూ, చావూ  ఆడవాళ్ళంటే ఎందుకు నీకంత ప్రత్యేకమైన ఇష్టం?”
పక్కింట్లో నుండి ఏదో దైవ స్తుతి శ్లోకాలుగా వినవొస్తుంది. రాత్రి ఏడు గంటలకల్లా కల్లా తిని ఎనిమిదిన్నరకల్లా ఇట్టాంటి శ్లోకాలు, ప్రార్థనలు వింటూ అటువంటి ప్రశాంతత ఇచ్చే రక్షణలో సుఖంగా నిద్రపోయే ఆన్నీ అమరిన సుభద్రమైన సంసారం.
“అందరికీ హాయినీ, రక్షణనూ ఇచ్చే దేవుడు తన సంసారాన్ని మాత్రం ఎందుకనీ ఇలా చేసాడు?”
“ఈ రకంగా అలమటిస్తుంటే ఒక్క నాడన్నా తనని పట్టించుకోని గుడ్డి నాబట్ట కాదా వాడు.”
****                                                           *****                                                                                                      ****
మెట్ల సందుల్లోనించీ ఆకాశం చంద్రుని లేత వెలుతురులో సన్నగా మెరుస్తా ఉంది. అలసట తీరినట్టుగా అనిపించింది కానీ జంకు వల్ల కలిగిన అలజడి మాత్రం శరీరంలో ఇంకా ఉన్నట్టుగానే అనిపిస్తొంది
  తన కతంతా చెప్పినపుడు సైకియాట్రిస్టు చెప్పిన మాటలను ఆమెకు గుర్తుకొస్తున్నాయి.
“ఆ ఇంట్లో దెయ్యం ఉండడమా, లేకుంటే ఉండకపోవడమా అనేది మీ చుట్టు పక్కల వాళ్ళకు ఒక నమ్మకం కావొచ్చు. కాకుంటే ఒక భ్రాంతీ అయి ఉండవచ్చు. అంతకు మించి వాళ్ళ అనుభవంలోగానీ, అనుభూతుల్లోగానీ మరేమీ లేదు”.
” కానీ మీ అనుభవంలో మాత్రం ఇది  ఒంటరితనానికీ, జీవితంలోని స్తబ్ధతకు బదులుగా చావు పట్ల మీరు పెంచుకున్న ఆకర్షణగా నాకు తోస్తున్నది.”
“దెయ్యం పేరుతో ఉన్న ప్రతీ అనుభవంలోనూ మీరు ఆత్మహత్యతో తలపడుతున్నట్టుగానే నాకు అనిపిస్తోంది. అది కాసేపు మిమ్మల్ని భయ పెడుతోంది. మరి కాసేపు మిమ్మల్ని ఆకర్షిస్తోంది.  ఈ ఘర్షణ ఇట్లాగే సాగడం మీకు మంచిది కాదు. నిజంగా అట్టాంటి సంఘర్షిత క్షణాలే ఎదురైనప్పుడు వాటిలో ఊరకే పడి కొట్టుక పోకుండా  అదేమిటో తేల్చుకోవడమే బాగుంటుంది….”
ఫోన్ మోగుతోంది.
అవతల నీలిమ.
“రాత్రికి తోడుగా వొచ్చి పడుకునేనా”, అని అడుగుతున్నది.
తను ఇక నిశ్చయించుకోవాల్సిన సమయం వచ్చింది.
బదులుగా, ” పర్వాలేదులే” అని నచ్చచెప్పింది తను.
నీరసంగా అనిపించినా, నింపాదిగా తాళం తీసి లోపలికి అడుగు పెట్టింది.
లైట్ వెలిగించి, కిందింటి పిల్లాడ్ని పిలిచి, నాలుగిడ్లి కట్టించుకరమ్మని డబ్బులిచ్చి పంపింది.

తొలికలుపు

                                              అన్వీక్ష నీలం

  

ఆ రోజు స్కూల్ నుండి వస్తూనే బ్యాగ్ తన రూంలో పడేసి పరుగెత్తుకొచ్చాడు. ఏదో డిమాండ్ తో వస్తున్నట్టు అర్ధమైంది. ఈ మధ్య పిల్లల అవసరాలు కూడా వాళ్లకు కలిగేవి కాదాయే. అవి వాళ్ళ స్నేహితులో, స్కూలో నిర్ణయిస్తుంది. చక్కగా ఫ్రెష్ అయి ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని పరుగెత్తుకొస్తుంటే క్రితం సారి నేను చేసిన ప్రమాణం పూర్తి చేయాల్సిన సమయం వచ్చినట్టే ఉందనిపించింది. క్రితం క్వార్టర్లీ ఎక్సామ్స్ మొదలైనప్పుడు అనుకుంటా  వాడి కోరిక నా ముందు ఉంచాడు.

” మమ్మీ మా క్లాస్ లో దినేష్ లేడు. వాడికి వాళ్ళ డాడి  ఒక డాగ్ గిఫ్ట్ ఇచ్చాడు తెల్సా. లాబ్రడోర్ బ్రీడ్ అంట. అచ్చం హ్యూమన్ బీయింగ్ లాగే బిహేవ్ చేస్తుందంట. వాడు రోజు దానితో ఆడుకుంటున్నాడంటా. మొన్న వాళ్ళింటికెళ్ళా కదా అది నాతో కూడా ఎంత బాగా ఆడుకుందో తెల్సా. ప్లీజ్ మమ్మీ వై డోంట్ యు గెట్ మీ దట్ ప్లీజ్ “అని అడిగాడు. “డాగ్?నో నో “కుదరనే కుదరదు అని అప్పుడే ఖరాకండిగా చెప్పేసా వాడికి. వాడు వింటేనా? వాడి కోసమే కదా ఇవన్నీ చేసేది. వాడు సంతోషంగా లేనప్పుడు మేమెలా సంతోషంగా ఉండగలం అని వెంటనే ఇంకో ఆలోచన. వాడు మా ఒక్కగానొక్క కొడుకు లోహిత్. ఇపుడు ఫోర్త్ స్టాండర్డ్.

******

వాడికి వాల్లమ్మమ్మ అంటే ఎంతిష్టమో. అమ్మమ్మ నుంచి ఫోన్ రాగానే వాడి ముఖంలో సంతోషం చూడాలి. ఇవాళ  స్కూల్ కెళ్ళద్దు ఇంట్లో ఉండమంటే ఉండే సంతోషం ఉంటుందే అంతకు వంద రెట్లు. ఒకప్పుడు మా అమ్మమ్మతో మాట్లాడాలంటే ఎక్కడి ఫోన్లు? ఒక ఉత్తరం ముక్క రాసిపడేస్తే ఎప్పటికో సమాధానం వచ్చేది. అదీ మా మావయ్యలకు సమయం కుదిరినప్పుడు. కొన్ని మాటలు భావాలు ప్రయాణానికి సమయం తీసుకున్నా జీవితపు పుస్తకంలో తిరిగిరాసుకోనవసరం లేనంత స్థిరంగా ముద్రించబడతాయి.

అమ్మతో ఎప్పుడు ఫోన్ మాట్లాడినా  -“అమ్మమ్మా నువ్వెప్పుడొస్తున్నావ్ ?”అన్నదే  వాడి మొదటి ప్రశ్న. ఒక్కడే కదా  వాడికెంత బోర్ కొడుతుందో ? అందుకే అమ్మొస్తే వాడి ఒంటరి తనానికి వెలకట్టలేని  తోడు దొరుకుతుంది. ఉదయం ముగ్గురం ఒకేసారి ఇంటి నుంచి బయలుదేరతామా. నేను, ఆయన ఆఫీస్కి.  వాడు స్కూల్కి. మేమొచ్చే సమయానికన్నా ముందే వాడొస్తాడని వాడి కోసం స్పెషల్ క్లాసులు పెట్టిన్చాం. ఎక్స్’ట్రా కర్రికులర్ యాక్టివిటీస్ , స్పోర్ట్స్ ఉంటాయి. నేనొచ్చి ఏదో ఒక చిరుతిండి చేసేలోపు వాడొస్తాడు. భోజనానికి ముందు ఏ సమయానికో ఆనందొస్తాడు. పాపం ఎన్నెన్ని విషయాలు వాళ్ళ నాన్నతో భోజనమప్పుడు చెప్పాలనుకుంటాడో, కాని అలసిపోయి చెప్పలేక  ఏవో రెండు మాటలు మాట్లాడి పడుకుంటాడు.

అప్పుడప్పుడు లోహిత్ ని చూస్తుంటే “వాడితో గడపాల్సిన ప్రొడక్టివ్ టైం గడపలేక పోతున్నాం” అని బాధపడతాం నేను ఆనంద్. కాని మా జీవనశైలి, ప్రపంచం మమ్మల్ని తీయిస్తున్న పరుగు  విశ్రాంతి తీసుకోడానికి కూడా సమయముండడం లేదు అన్న భావనమాది. ఉరుకులు, పరుగుల జీవితం. పాపం వాడికి రాత్రుళ్ళు ఎప్పుడైనా కథలు వినాల్సి వస్తే వాళ్ళ నాన్న ట్యాబ్ లోంచి అన్నయ్యకు కాల్ చేస్తే వీడియో కాలింగ్ లో అమ్మమ్మతో మాట్లాడుతూ  కధలు వింటాడు. టెక్నాలజీ పెరిగిపోయిందని సంతోషించాలా ? లేక టెక్నాలజీ జీవితాల్ని ఇంత శాసిస్తుందా ? అని బాధపడాలా  తెలియట్లేదు.

ఉదయాన్నే  వాణ్నికూడా లేపి తనతో పాటు వాకింగ్ కని తీసుకెళ్ళే మంచిపని మాత్రం చేస్తాడు ఆనంద్. వాళ్ళ నాన్నతో పోటీ పడి లేవడం వాడిక్కూడా భలే ఇష్టం. నాన్న కన్నా ముందే లేచి షూస్ వేసుకొని వాళ్ళ నాన్నను కొన్ని సార్లు వాడే నిద్రలేపుతాడు. వాకింగ్కెళ్ళి వస్తూ వస్తూ కొన్ని కాగితపుపూలు , మందారాలు , గన్నేరుపూలు ఇంకా నందివర్ధనాలు చేతులనిండా పట్టుకొచ్చి వాడిరూంలో ఉండే వాజ్లో వాడే అలంకరిస్తాడు. ఆ వాజ్ వాడు చేసుకున్నదే. వాళ్ళ స్కూల్లో ఇన్నోవేటివ్ పీరియడ్ లో వాళ్ళ టీచరమ్మ ఇచ్చిన ప్రాజెక్ట్ అది. అది వాడి ప్రాజెక్ట్ లా కాక  నా పనిష్మెంట్లా అనిపించింది. ప్రాజెక్ట్ వర్క్  వాడిది పని నాది ఇప్పటికీనూ. అయినా అనకూడదు కాని వాడు శ్రద్ధగా ఆ పనీ ఈ పనీ  సహాయపడతాడుగా. ఆ వాజ్ గురించి కుండలు తయారు చేసే కుమ్మరి వాళ్ళ దగ్గరకూ వెంటతీసుకుపోయా. అయినా జగమెరిగిన సత్యమే కదా.

ఇంటర్నేషనల్ స్కూల్ అని తగిలించుకున్న వాటిలో చదువు కన్నాఈ కార్యకలాపాలకే డబ్బులు కట్టాలని. లేదంటే పిల్లోడు ఎక్కడ వెనకపడిపోతాడోనన్న భయం. సంవత్సరానికి షుమారు 60 వేలు ఒక సాధారణ ఇంటర్నేషనల్ స్కూల్ లో. అదే మా ఇంటి పక్కనే ఉన్న మా ఆయన కొలీగ్ సూర్యనారాయణ గారి  అబ్బాయి ఇంకేదో ఇంటర్నేషనల్ స్కూల్ అట సంవత్సరానికి లక్ష రూపాయలు. నా చదువంత అవడానికి పట్టినన్ని డబ్బులు వీడి ఒక్క సంవత్సరం ఫీజు. ఇక ఇక్కడితో మొదలు పెట్టి మున్ముందు వాడి చదువుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుని డబ్బుపొదుపు  చేయడానికి మార్గాలు కనిపెట్టడం ఇప్పటి మా భాద్యత. కాదామరీ రేపు వాడు పెద్దయ్యాక మీరేం చేశారు అని ప్రశ్నిస్తే ? . ఈ మధ్య తల్లిదండ్రులు కావాలనుకుంటున్న వాళ్ళను వెంటాడుతున్నప్రశ్న ఇది మరీ. అందుకే జీవితంలో మంచి ఉద్యోగంతోనో, మంచి పదవితోనో, జీతంతోనో స్థిరపడితే తప్ప పెళ్లి చేసుకోవడం లేదు  ఆడైనా మగైనా.

toli kalupu.anveeksha

ఇప్పుడు జీవితాల్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే సూత్రంతో కొలుచుకొని, పక్కవారితో పోల్చుకొని చూసుకుంటూ బ్రతుకుతున్న రోజులు.  ప్రొఫెషన్ ట్యాగ్ లేకపొతే కేర్ చేసే వాళ్ళున్నారా అసలు? పదో తరగతవగానే ఇంటర్ కోసం CEC గ్రూప్ తీసుకుంటాను అంటేనే ఎన్నిమాటలు తిట్టారు మా మావయ్య నన్ను. ఏది చదవాలి ఏది వద్దు అన్నది కూడా మన చుట్టుపక్కల వాళ్ళే నిర్ణయించేస్తున్న కాలం మరి. ఎలా బ్రతకాలో కూడా సమాజమే నిర్ధారిస్తున్న రోజులు.

అమ్మొచ్చినప్పుడల్లా ఇదే గొడవ ఇంకొకరిని కంటే వాడికి తోడు ఉంటుంది కదా అని. ఒక్కడికే మంచి భవిష్యత్తు ఇవ్వడం కష్టమవుతున్న రోజులివి . ఒకప్పుడు ఇద్దరూ లేదా ముగ్గురు చాలు . తర్వాత ఇద్దరు చాలు అనేవాళ్ళు  కానీ ఇప్పుడు ఒక్కరే ముద్దు అనే పరిస్థితొచ్చింది. కాని ఆశ్చర్యమేస్తుంది అమ్మ ఆరుగురిని ఎలా పెంచిందా అని. అందరూ మంచి స్థితిలోకే వచ్చాం. కాని ఇప్పుడు ఒక్కరిని పెంచడమే ఇంత పెద్ద భాద్యత మాకు. భాద్యత అని మేమనుకుంటున్నామా ? సమాజ ముఖచిత్రమే మా భాద్యతల్ని కూడా నిర్ధారిస్తుందా ?? అప్పుడప్పుడు అర్ధమవదు.
* * * * *
ఇక ఇప్పుడు నా బాధ వాడికి కుక్కను కొనివ్వడం కాదు. దాన్ని తెచ్చాక దాని సేవలు చేయాలంటే కూడా నేనే. ఎవరు పెట్టుకున్న పనులు ఇవ్వన్నీ అని. కాని లోహిత్ పట్టుపట్టాడంటే ఇక వదలడం కష్టమే. అందుకే అన్నాను -” నువ్వు  క్లాస్ ఫస్ట్ వస్తే కొనిస్తానని”. వాడు అన్నట్టుగానే క్లాస్ ఫస్ట్ వచ్చాడు. రయ్యి మనొచ్చి కూరగాయలు కోస్తున్న నా ముందు ప్రోగ్రెస్ కార్డుంచి నా భుజాలచుట్టూ చేతులేసి – ” మమ్మీ నౌ ఇట్స్ యువర్ టైం టు కీప్ యువర్ ప్రామిస్ “అన్నాడు. గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా ఉందిప్పుడు నా పరిస్థితి. ఒక వైపు వాడు  ఫస్ట్ పొజిషన్ కొచ్చాడని సంతోషపడాలా లేక కుక్కను తెచ్చి నా ఒత్తిడినింకా పెంచుకోవాలా?.  వాడి సంతోషం కన్నా ఎక్కువేముందిలే అనుకున్నా ఆ క్షణం -“డాడీ వచ్చాక మాట్లాడి చెప్తాను “అని వాణ్ని కొద్ది సేపు ఆడుకోమని పంపా. వాడు ఆడుకోవడం అంటే ఏమాడుకుంటాడు? వీడియో గేమ్స్ లేదంటే ఏ కార్టూన్ నెట్వర్క్ చానెలో పెట్టుకొని చూస్తాడు.

మా చిన్నతనంలో  సాయంకాలం మేమంతా ఈ సమయానికి వీధిలోకి చేరి ఎన్ని ఆటలాడేవాళ్ళం. కాని వాడి బాల్యం చూస్తుంటే బాధగానే ఉంది. పరువు ప్రతిష్ట  అదీ ఇదీ అని ఇక్కడ  గేటడ్ కమ్మ్యూనిటీలో ఇల్లు కొన్నాక జీవితాలకు కూడా గేట్ పెట్టుకున్నట్టే ఉంటుంది. పేరుకు మాత్రం పార్కు, స్విమింగ్ పూల్ ఎన్ని ఉన్నా ఏం లాభం ?. పక్కింట్లో ఏం జరుగుతుందో పట్టించుకున్న పాపానికి పోరు ఇక్కడ జనాలు. పండగలకు మాత్రం ముస్తాబయి నగలు చీరలు కార్లు చూపించుకోడానికి గుమ్మి గూడి ఆడిపాడతారు అందులో కూడా దర్పం చూపించుకోవడమే. ఎంత మారిపోయాయి  జీవితాలు. పాపం వాడు ఎంతో పెద్దకోరిక కూడా కోరలేదుగా వాడి  ఈ చిన్న కోరికైనా తీర్చాలనుకున్నాను.

* * * *

రాత్రి తొమ్మిదిన్నరకొచ్చాడు ఆనంద్. ఫ్రెష్ అయి భోజనానికి కూర్చున్నాడు. -” లేటయ్యిందేంటి ఆనంద్? . లోహిత్  క్లాస్ ఫస్టొచ్చాడు. నీతో షేర్ చేసుకుందామని పాపం నీ గురించి చూసి చూసి ఇప్పుడే పడుకున్నాడు” భోజనం వడ్డిస్తూ విషయాన్ని ముందుంచా.  -” ఒహ్ అవునా ? ఏం చేయను కొత్త ప్రాజెక్ట్. కొత్త టీం . వర్క్ అలొకేట్ చేసి పోర్ట్ఫోలియో తయారు చేయడానికి ఇంత టైం పట్టింది. రేపటి నుంచి ఇంకొంచెం బిజీ అవ్వచ్చు హేమా ” అంటూ భోజనం చేస్తూ  ఆ రోజుటి ఆఫీస్ విషయాలు షేర్ చేసుకున్నాడు ఆనంద్.” ఇంకేంటి విషయాలు ? “అన్నం కలుపుతూ అడిగాడు ఆనంద్ .
– ” ఏముంది ? మీ సుపుత్రుడు ఒక చిన్న కోరిక కోరాడు ” పెరుగు వడ్డిస్తూ పెట్టిన పిటీషన్ అది.
– ” ఫస్ట్ వచ్చినందుకు నువ్వే ఏదో లంచం ఇవ్వజూస్తున్నావ్ అని చెప్పు ” అన్నాడు ఆయన నవ్వుతూ.

ఏం చేస్తాం కోరిక వాడిది. వేడుకోవడాలు నావి. -” హా అలాంటిదే అనుకోండి.  లోహిత్ వాళ్ళ ఫ్రెండ్ దినేష్ లాబ్రడర్ డాగ్ కొనుక్కునాడట వీడూ అది కావాలంటున్నాడు ” మొత్తానికి కోరిక ఆయన పెన్ను కిందకొచ్చింది ఇక సంతకమే తరువాయి. – ” అనుకున్నా .. లాస్ట్ టైం నువ్వు ప్రామిస్ చేసేప్పుడే చెప్పా ఆలోచించి మాటివ్వు వాడికి  అని ” భోజనం ముగించి చేయి కడుగుతూ అన్నాడు ఆనంద్.  -” ఇప్పుడు కాదంటే వాడు ఇంకా చిన్న బుచ్చుకుంటాడానంద్ ప్లీజ్ “.   బ్రతిమాలించుకోవాలి అనే సరదా ఆనంద్ ఇలా తీర్చుకుంటున్నాడు. -“నాకేం ప్రాబ్లం లేదు. కాని దానికి కూడా సేవ చేసే అంత ఓపిక నీకు ఉంటే తెచ్చుకో “ అని మొత్తానికి ఒప్పుకున్నాడు ఆనంద్.

* * * *

ఇక ఆ కుక్కని కొనడం ఇప్పుడు నా టాస్క్ .ఉదయాన్నే పనంతా అయిపోయాక బ్రేక్ ఫాస్ట్ చేసేప్పుడు చెప్పా –“  లోహిత్  డాగ్ కొనడానికి డాడీ  సరే అన్నారు  . ఎక్కడ కొనేది ఏమైనా తెలుసా ?”. వాన్నే అడిగా ఎప్పుడైనా కొంటే కదా తెలిసేది ఏ విషయమైనా. – “అమ్మా నేనిప్పుడే దినేష్ కి ఫోన్ చేస్తాను” అని పరుగెత్తుకెళ్ళి ఫోన్ చేసి విషయాలన్ని వివరంగా తెలుసుకునొచ్చాడు. ఇంత కమ్మ్యూనికేషన్ డెవలప్మెంట్ చూస్తుంటే ఇంకా మున్ముందు ఎన్నెన్ని మార్పులు చూడబోతానో అని భయమేస్తుంది అప్పుడప్పుడు.
“అమ్మా ఇవ్వాళ ఆదివారం . ఇవ్వాళే కోనేద్దామా ? ” వాడి తొందరకి ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు. వాడు డాగ్ కొంటునట్టు అమ్మమ్మ కు కూడా ఫోన్ చేసి చెప్పేసాడు. ఫ్రెండ్స్ కి చెప్పేసాడు. –“నా పనంతా అయ్యాక ఇక వెళ్దామా” అని నేను తయారై బయటికి రాగానే వాడు నన్ను చూసి పకపకా నవ్వాడు. నాకెందుకో సందేహం కలిగింది బాగోలేనా ఏంటని?.

ఆ మధ్య ఒక సారి టీచర్స్ పేరెంట్ మీటింగ్ అప్పుడు “అమ్మా నువ్వు రావద్దు నేను డాడీని తీసుకెళ్తా “ అన్నాడు. ఎందుకు అంటే నువ్వు మాడ్రన్ గా ఉండవు. మా ఫ్రెండ్స్ మమ్మీలంతా ఎంత మాడ్రన్గా ఉంటారో తెల్సా ? అని నాకొక పెద్ద షాక్ ఇచ్చాడు. వెంటనే మా చెల్లి ఊరి నుంచి రాగానే విషయం చెబితే ఎప్పుడూ చూడని బ్యూటి పార్లర్ కి తీసుకెళ్ళి ఏంటేటో చేయించింది. పిల్లలు స్కూలలో ఎన్నెన్ని నేర్చుకుంటున్నారు ?. వాళ్లను వాళ్ళు , వాళ్ళతో ఇతరులను కూడా కంపేర్  చేసుకుంటున్నారు. అసలు టీవీ సీరియల్స్ , సినిమాలు , అడ్వర్టైస్మెంట్ లు అమ్మల్ని వయసుదాటని పడుచుపిల్లల్లా చూపిస్తున్నారు. వయసుదాచడం  అమ్మలు అమ్మల్లా కనిపించకపోవడమే మోడ్రన్ అందమని తెలుస్కోవడంలో నాలాంటి వాళ్ళం ఎంత వెనకబడి ఉన్నామో  అనిపించింది.

“ఎందుకు నవ్వావురా ” అని భయపడుతూనే అడిగా ఈ సారి ఏ విషయం చెప్తాడోనని. వాడన్నాడు – ” అమ్మా నీ దగ్గర స్మార్ట్ ఫోనే కదా ఉంది”. అవునన్నానేను .”మరి నువ్వెందుకు ఇంత వెనకబడి ఉన్నావ్ ? మనం బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు”.  బయటికెళ్ళే శ్రమ తప్పించాడనుకున్నా.  కాని ఆన్లైన్ లో కుక్కల్ని కొనడమా ?.  సరేలే ఎదో ఒకటి కానీ అని నా లాప్టాప్ తెరిచి OLX వెబ్సైట్  తెరిచాను. పెట్ ఆనిమల్స్ అని టైప్ చేస్తే ఎన్నెన్ని పెంపుడు జంతువుల  ఫోటోలో . ఎన్నెన్ని  ధరలో. ఇంట్లో పెంచుకునే ప్రతి పెంపుడు జంతువూ  ఉందక్కడ. లోహిత్  ఆ సైట్ లో ఉన్న ప్రతి కుక్కను ఫోటో పై క్లిక్ చేసి వివరాలు చూస్తున్నాడు.

నాకు మాత్రం మనసంతా ఎదో బాధ. వెలపెట్టి కొనాల్సి వస్తున్న మూగజీవుల ముఖాలు. అవీ వస్తువుల్లా మారిపోయాయా అన్న ప్రశ్నలు? అసలు ఈ ఆన్లైన్ రోజుల్లో  వ్యాపారం చేయలేని ఏ వస్తువు లేదా ? ఇక దేన్నైనా వస్తువులామార్చి అమ్మిపడేసే కాలం  మొదలైందా అనిపించింది. చివరకి మనిషే ఒక వ్యాపార వస్తువు కింద మారిపోయినట్టుగా  అనిపించింది. నా బుర్రనిండా కుంటా కింటే తిరుగుతున్నాడు. అక్కడ కుంటాను కొట్టి బలవంతంగా దేశం కాని దేశం లాక్కెళ్ళారు. బానిసగా అమ్మారు. ఒక బానిసని ఎన్ని సార్లైనా అమ్మకం కొనడం జరిగిన రోజులు , బలం ఉన్నంత వరకు మనిషిని బలమైన ఆస్థిగా భావించి బలం ఉడిగిపోయాక పట్టించుకోని పరిస్థితులు గుర్తొచ్చాయి. ఇక్కడ ఒక కుక్కని బానిస ట్యాగ్ వేయకపోయినా సెకండ్ హ్యాండ్ వస్తువుల్లా ఒక పట్టికలో చేర్చి కొనుక్కోండి అని అమ్ముతున్నారు. అంతే  తేడా అనిపించింది.

వెంటనే అక్క కొడుకు దీపక్కి ఫోన్ చేశా.” దీపక్ , లోహిత్ డాగ్ కావాలంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ OLX  లో కొన్నాడంట. నేను కూడా చూస్తున్నారా.  కొనమంటావా ? ” అని అడిగా. వాడన్నాడు -” పిన్ని వద్దు ఆన్లైన్ లో అమ్మే కుక్కలు మంచి జాతి కుక్కలు కావు. వ్యాపారం కోసం వాటిని వేరే వేరే బ్రీడ్ కుక్కలతో మేట్ చేయిస్తున్నారు. నాకు రెండు రోజుల టైమివ్వు.  నేను కనుక్కొని చెబుతాను ” అని లోహిత్ కి ఫోన్ ఇమ్మన్నాడు.  వాడితో ఎదో మాట్లాడి వాణ్ని ఒప్పించాడు దీపక్.

జాతి కుక్కలు, జాతి కాని కుక్కలు అని వాటిల్లో కూడా తేడాలా ?. పాపం వాటికి వాటి జాతి తెలుసో లేదో. వాటి జాతి ఇదని పేరు పెట్టిన వాళ్ళెవరో అనైనా తెలుసో లేదో ? మనుషులకే అనుకున్నా ఈ జాతులు. కుక్కల్ని కూడా వదిలిపెట్టలేదే అన్న బాధేసింది. లోహిత్ అల్లరి చేయకుండా మౌనంగా ఉన్నాడు. వాడికి డాగ్స్ గురించి  వాటి జాతి ఎరుక గురించి అర్ధమైందనుకుంటా.

– ” మమ్మీ దీపకన్నా వన్ టూ డేస్ లో చెబుతా అన్నాడుగా వెయిట్ చేద్దాం . దినేష్ గాడి కుక్క నిజంగా మంచి జాతి కుక్క అవునో కాదో రేపు క్లాస్ కెళ్ళాక విషయం చెబుతాను వాడికి ” అని మాట్లాడుతున్నాడు లోహిత్. నా కొడుకు జాతుల గురించి మాట్లాడేఅంత ఎదిగాడు. ఇక వాడికి కుక్కల జాతులతో పరిచయం ఎలాగో కలుగుతుంది.  “రేపెప్పుడో మనుషుల జాతుల గురించి, కులాల గురించి , మతాల గురించి తెలుసుకోవాల్సి పరిస్థితి వాడికి ఏర్పడితే?.  వాడుకూడా వీటిల్లోని దేనికో దానికి నిజాలు మూలాలు తెలుసుకోకుండా  అవగాహన లేకుండా అంశాన్నిగ్రహిస్తే?? ఒక తప్పుడు వాదననో సిద్ధాంతాన్నో తనకు తాను ఆపాదించుకుని  అదే నిజమని దానికి పరిమితమయితే?  అన్న ప్రశ్నలు నా  మెదడులో”.

మనుషులు జాతులుగా కులాలుగా మతాలుగా ఎలా విడిపోయారో  లోహిత్ కి నేర్పించాల్సిన అవసరం ఏర్పడిందని అర్ధమైంది నాకు ఆ క్షణంలో. అందుకే ఎనిమిదేళ్ళ క్రితం అట్ట పెట్టెలో పెట్టిన పుస్తకాల్ని తీసి ఆ సాయంత్రం అంతా దులిపి ఖాళీగా ఉన్న షెల్ఫ్ లో సర్దిపెట్టాను. ఇక ఆ రోజు నుంచి ప్రతి రోజు రాత్రి తనకి నేనే కథలు చెబుతానని వాడికి మాట కూడా ఇచ్చాను.  నా పుస్తక నేస్తాలను తనకిప్పుడు పరిచయం చేసేందుకు ఇదే సరైన సమయం అనిపించింది.  ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం వదిలిపెట్టదలుచుకోలేదు.

ప్రశాంతంగా  సోఫాలో కూర్చుని ఆ పుస్తకాల వైపు చూస్తున్నాను. చక్కగా అట్ట వేసి పెట్టుకున్న అలెక్స్ హేలీ నవల “ The Roots ” లో నుంచి బయటికొచ్చి కుంటాకింటే  నన్ను చూసి ప్రశాంతంగా నవ్వినట్టే అనిపించింది ఆ క్షణం.

*

Image: Bhavani Phani

మరుపు కోసం

 

bhavani-phani.అతనికి ఒక్కసారిగా కనుపాపల్లోపల మెరుపేదో మెరిసినట్టయింది . ఓ నవోత్తేజం నరనరానా నిండిన అనుభూతి కలిగింది . ఎన్నో ఏళ్ళుగా కలిసి ఉన్న కనురెప్పలు ఇక ఆగలేనట్టుగా  తెరుచుకున్నాయి . ఎదురుగా ఏ దేవతా రూపమూ ప్రత్యక్షం కాలేదు . అశరీరవాణేదీ తన సందేశాన్నీ వినిపించలేదు . కానీ అతనికి అర్థం అయింది . తన కోరిక నెరవేరింది . తన తపస్సు ఫలించింది . ఇప్పుడు తన దగ్గర ఒక అసాధారణ శక్తి ఉంది . అతని మనసంతా ఆనందంతో నిండిపోయింది .

ఇక తపస్సు కొనసాగించే అవసరం లేకపోవడం వల్ల  ఉద్వేగం నిండిన మనసుతో  ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు .  కొంతసేపటికి వచ్చిన ఆ మనిషి యధాలాపంగా స్వామి వంక చూసి ఉలికిపడ్డాడు . ఎప్పుడూ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండే స్వామి, ఈ రోజు తనవైపు చిరునవ్వుతో చూస్తుండడంవల్లనేమో భయంతో ఒక అడుగు వెనక్కి వేసాడు .
“రావయ్యా రా కంగారు పడకు . వచ్చి ఇలా కూర్చో ” అన్నాడు స్వామి నవ్వుతూ .
ఇన్నేళ్ళుగా నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడని స్వామి ఆ రోజు అంత నోటి నిండుగా పలకరించేసరికి పులకరించిపోయిన ఆ ముసలి ప్రాణి, నోట మాట రానట్టుగా రెండు చేతులూ జోడించి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు .

” చూడు పెద్దాయనా , నీ పేరేమిటో నాకు తెలీదు . కానీ ఇన్ని సంవత్సరాలూ పళ్ళు ఫలాలు తెచ్చిస్తూ  నా మంచి చెడ్డలు చూసేందుకు నువ్వు పడిన తపన నేను గమనించాను . నా తపస్సు పూర్తయింది . నాకు ఒక అపూర్వ శక్తి లభించింది . నువ్వు చేసిన సేవకి ప్రతిఫలంగా నా శక్తితో ముందుగా నీకే లాభం చేకూర్చాలని అనుకుంటున్నాను . చెప్పు, నువ్వు మరచిపోవాలనుకునే మనిషి గానీ , విషయం గానీ ఉంటే చెప్పు . ఇక వాళ్ళకి చెందిన ఏ ఆలోచనా నిన్ను బాధపెట్టదు . ”
ఆ ముసలి వ్యక్తి అయోమయంగా చూసి ఓసారి బుర్ర గోక్కున్నాడు .
“స్వామీ , నువ్వనేదేంటో నాకు అర్థం కావట్లేదు . ఎవరైనా విషయాలు ఇంకా బాగా గుర్తు పెట్టుకోవాలనుకుంటారు గానీ మరచిపోవాలని ఎందుకనుకుంటారు! ”
స్వామి విశాలంగా నవ్వాడు  .
“నీకు తెలీదులే . అలా మరుపుని కోరుకునే వాళ్ళు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు . వాళ్లకి నా సహాయం అవసరం . నేను వెంటనే బయలుదేరాలి . అవకాశం వచ్చినప్పుడు నీ ఋణం తప్పక తీర్చుకుంటాను “అంటూ అతని వద్ద సెలవు తీసుకున్నాడు . తపస్సు ప్రారంభించే ముందు ఒక చెట్టుతొర్రలో  దాచిన తన పాత దుస్తులు ,కొద్ది పాటు డబ్బు జాగ్రత్త చేసుకుని జన జీవన స్రవంతిలోకి  అడుగు పెట్టాడు .

కానీ అతని ప్రయాణం మొదలైనంత సజావుగా సాగలేదు . ఎవరికి తన సహాయం అవసరమో , ఎవరు మరుపుని కోరుకుంటున్నారో స్వామికి అర్థం కాలేదు .మనుషుల మనసు చదివే శక్తి కోసం కూడా తపస్సులో కోరుకుని ఉండాల్సింది  అనుకున్నాడు . మళ్ళీ అంతలోనే అటువంటి ఆలోచన వచ్చినందుకు తనని తానే నిందించుకున్నాడు . సామాన్య ప్రజానీకంలా తను కూడా ఉన్నదానితో తృప్తి పడకపోతే ఎలా! కష్టపడనిదే ఏదీ సాధించలేమన్న విషయం తనకంటే ఎవరికి బాగా తెలుస్తుంది? తన అవసరం ఉన్న వాళ్ళని తనే వెతుక్కుంటూ వెళ్ళాలి అనుకుంటూ  మళ్ళీ తన ప్రయాణం కొనసాగించాడు . అలా ప్రయాణం చేస్తూ చేస్తూ జమ్మూ, అక్కడనించి కట్రా చేరుకున్నాడు .తను సరైన ప్రదేశానికే వచ్చాడు . భగవంతుడి దగ్గరకి కష్టాల్లో ఉన్నవారే ఎక్కువగా వస్తారు . వైష్ణో దేవి దర్శనం జరిగే  లోపుగా తన సహాయం అవసరమైన వాళ్ళు తప్పక తనకి తారసపడతారు అని సంతోషిస్తూ ఉత్సాహంగా కొండ ఎక్కడం ప్రారంభించాడు . పరిశీలనగా అందరి వైపూ చూస్తూ , ఎవరు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో అంచనా వేస్తూ నడవసాగాడు

అప్పుడు కనిపించాడా యువకుడు ఒంటరిగా. పచ్చని ఛాయతో మెరిసిపోతున్నాడతను.  చెయ్యెత్తు మనిషైనా ముఖంలో  ఉన్న సౌకుమార్యం అతని వయసు లేతదనాన్ని చెప్పకనే చెబుతోంది . భారమైన అడుగులు , భుజాల భంగిమ అతను పెద్ద కష్టంలో ఉన్నాడని సూచిస్తున్నాయి . స్వామి మెల్లగా అతని పక్కగా  వెళ్లి అన్నాడు .
“నీ ఉత్సాహానికి స్నేహితులంతా వెనకబడ్డారా భాయీ ”
ఆ యువకుడు ఆశ్చర్యంగా తల తిప్పి చూసాడు . “లేదు భయ్యా , ఒక్కడినే వచ్చాను . అయినా నన్ను చూస్తే అంత ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తున్నానా  మీకు ?” కొంచెం పంజాబీ యాస కలిసిన హిందీలో అన్నాడా అబ్బాయి .
“ఇంత చిన్న వయసులో ఎందుకంత నైరాశ్యం తమ్ముడూ , ఇష్టమైతే నీ కష్టమేమిటో నాతో చెప్పుకోవచ్చు ” స్వామి రోడ్డు పైనే దృష్టి నిలిపి చెప్పాడు .
ఆ యువకుడు నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు . ఏవో పదునైన వాక్యాలు అనేందుకు సిద్ధమై అంతలోనే విరమించుకున్నట్టుగా మళ్ళీ విషాదంలోకి తనని తాను ఒంపుకుంటూ  నడక మొదలుపెట్టాడు .
స్వామి వదిలిపెట్టలేదు
“సరే, నువ్వేమీ చెప్పద్దు , నేనే ముందు నా కథ చెబుతాను . నీకు నా మీద నమ్మకం కలిగితేనే మాట్లాడు “
ఆ యువకుడు అభ్యంతరం లేనట్టుగా భుజాలెగరేసాడు .
స్వామి నడక వేగం తగ్గించి మెల్లగా చెప్పడం మొదలు పెట్టాడు .
afsar-marupu
“ఇంచుమించు  పది సంవత్సరాల క్రితం నేను ప్రేమలో విఫలమయ్యాను . కోరుకున్న అమ్మాయిని దక్కించుకోలేక , అలాగని మరిచిపోనూ లేక ఎంతో విలవిలలాడిపోయాను . పిచ్చి పట్టినట్టుగా అయి దేశాటన ప్రారంభించాను . దక్షిణ భారతానికి చెందిన నేను , అలా తిరుగుతూ తిరుగుతూ ఈ పరిసర ప్రాంతాలకి చేరుకున్నాను . అప్పుడే నాకో ఆలోచన కలిగింది . మనకి  బాధ కలిగించే మనిషినీ, ఆ మనిషి తాలుకూ ఆలోచనల్నీ పూర్తిగా మరచిపోగలిగితే, మరిచిపోయేలా చేయగలిగితే ఎంత బాగుంటుంది అనిపించింది . అనుకున్నదే తడువుగా ఓ అనువైన స్థలం చూసుకుని తపస్సు ప్రారంభించాను . తపస్సు అంటే ఏ దేవుడి నామస్మరణో కాదు . కేవలం నా సంకల్పాన్నే పదే పదే మనసులో జపించసాగాను . ఎంతో కఠోర దీక్షతో చేసిన నా తపస్సు ఇప్పటికి ఫలించింది . నేను కోరుకున్న శక్తి నాకు లభించింది .” అంతవరకు చెప్పి ఆగాడు స్వామి .
ఆ యువకుడు స్వామి ముఖంలోకి పరిశీలనగా చూసాడు . “అయితే మీ లవర్ ని మీరు మర్చిపోయారా ?”
స్వామి  చిన్నగా నవ్వాడు . “నేను ఎందుకు ఇంత కష్టపడ్డానో నేనే మర్చిపోతే ఇతరులకి ఎలా సహాయం చేస్తాను? ఎవరైనా ఎవరి జ్ఞాపకాల్నైనా పోగొట్టుకోవాలని అనుకుంటే నేను వాటిని అంతం చెయ్యగలను ” అన్నాడు. తన శక్తి తన మీద పని చెయ్యలేదనీ, అయినా నిజానికి ఇప్పుడా అవసరం కూడా లేదనీ చెప్పడం ఇష్టం లేక .
ఆ యువకుడికి స్వామి మీద నమ్మకం కలిగినట్టుంది . ఇంకేమీ ప్రశ్నలు వెయ్యకుండా నేరుగా తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు .”నేనూ,ప్రకృతీ  చిన్నప్పటి నుండీ క్లాస్మేట్స్ . ఎయిత్ క్లాస్ కి వచ్చేసరికి మా స్నేహం మరింత బలపడింది . అప్పట్లో స్కూల్ ఎంతో సందడిగా ఉండేది . అప్పుడప్పుడే అడుగుపెడుతున్న యవ్వనం వల్ల ఎటు చూసినా జంట కోసం వెతుక్కునే స్నేహితులే. నేనూ , ప్రకృతీ కలిసి అటువంటి జంటల్ని కలిపే పని మొదలుపెట్టాం . ఆ పని మాకెంతో సంతోషం కలిగించేది . ఓ రోజు ఉన్నట్టుండి ప్రకృతి అడిగింది ” మనోజ్ , నీకెవరైనా ఇష్టమైతే చెప్పు . నేను వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడతాను ” అంది .
ఊహించని ఆ ప్రశ్నకి వెంటనే ఎలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు . కొంచెం ధైర్యం చేసి నాకిష్టమైన అమ్మాయివి నువ్వే అనేసాను . తను ఏ మాత్రం ఆలోచించకుండా నాకిష్టమే అంది .

అలా మొదలైంది మా ప్రేమ ప్రయాణం . నా పదమూడో పుట్టిన రోజుకి అమ్మా నాన్నా గిఫ్ట్ గా ఇచ్చిన మొబైల్ లో రోజూ అందరూ నిద్రపోయాక మొదలుపెట్టి తెల్లవార్లూ మాట్లాడుకునేవాళ్ళం . తను కూడా ఇంట్లో ఒకే అమ్మాయి కావడంతో  బోలెడంత గారం, ప్రైవసీ ఉండేవి . ఈ విషయం ఇంట్లో తెలీకుండా మాత్రం జాగ్రత్తపడేవాళ్ళం . ఎప్పుడైనా ఒక రోజో , రెండు రోజులో నాతో మాట్లాడటం కుదరదనుకుంటే గంటల తరబడి ఏడ్చేది . తన బాధ చూస్తే నాక్కూడా  ఏడుపొచ్చేది ” వింటున్నాడా లేదా అన్నట్టు ఆ యువకుడు ఓ సారి ఆగి స్వామి వైపు చూసాడు .స్వామి ముఖంలో ఆసక్తికి సంతృప్తి చెందినట్టుగా మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు .”టెన్త్ లోకి వచ్చేసరికి నా ఆలోచన మారిపోయింది . నా మనసు కొత్త కొత్త పరిచయాల కోసం తహతహలాడింది . కొందరు అమ్మాయిల్లా ప్రకృతి నాకు స్వేచ్ఛనిచ్చేది కాదు . ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేది . అందరు లవర్స్ లా ఎంజాయ్ చెయ్యడానికి సహకరించేది కాదు . ఎక్కువగా కలిసేది కాదు .ఫోన్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది . ఆ అసంతృప్తితో నేను కొత్త స్నేహాలు వెతుక్కునేవాడ్ని . ఆకర్షణీయమైన నా రూపం  వల్ల అమ్మాయిలు సులువుగానే నాకు ఎట్రాక్ట్ అయ్యేవారు . కొందరు వాళ్ళంతట వాళ్ళే వచ్చేవారు . అలా ఒకేసారి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ని మెయిన్ టైన్ చేసేవాడ్ని . ప్రకృతికి మాత్రం తెలియనిచ్చేవాడిని కాదు . కొన్ని రోజుల స్నేహంతోనే చాలామంది అమ్మాయిలంటే నాకు బోర్ కొట్టేది. కానీ ప్రకృతితో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడ్ని .

మెల్లగా మా మధ్య పోట్లాటలు మొదలయ్యాయి . ఎప్పడూ తనతోనే మాట్లాడుతూ కూర్చుంటే నాకు వేరే పని ఉండదా అని నాకు కోపం వచ్చేది . అసలే కోపం ఎక్కువ కావడం వల్ల అలాంటప్పుడు నోటి కొచ్చినట్టు తిట్టేవాడ్ని . కొన్ని రోజులు మాట్లాడటం మానేసినా మళ్ళీ తనే పలకరించేది. బ్రతిమలేది . తనంటే నాకు కూడా  చెప్పలేనంత ఇష్టం . అలా అని తనతో నిజాయితీగా ఉండలేక పోయేవాడిని . వేరే స్నేహాల సంగతి ఎలా ఉన్నా, పెళ్లి మాత్రం తననే చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను . ఎనిమిదేళ్ళు మా ప్రేమ అలా ఒడిదుడుకుల మధ్య కొనసాగింది . నాకు ఎం బి ఏ కూడా పూర్తి కావచ్చింది. తనని మెల్లగా నిర్లక్ష్యం చెయ్యడం మొదలు పెట్టాను . ఓ రోజు ఆ విషయం తను గట్టిగా అడిగి గొడవ చేసేసరికి కోపం వచ్చి, విడిపోదామని చెప్పి , బాగా తిట్టి ఫోన్ పెట్టేసాను . ” అపరాధ భావం వల్లనేమో అతను ఎటో చూస్తూ చెప్పసాగాడు .”ఒక నెల రోజులు బాగానే ఉన్నాను . అలా ఒక్కోసారి పది పదిహేను రోజులు మాట్లాడుకోకుండా ఉండటం మాకు అలవాటే . ఈసారి తను ఎంతకీ పలకరించకపోయేసరికి నేనే ఫోన్ చేసాను . అంతే, నాకు పెద్ద షాక్ తగిలింది . తను నన్ను మరిచిపోయిందనీ, నన్ను కూడా తనని మరిచిపోయి ముందుకు సాగమనీ చెప్పేసింది . ఇక చూడండి . అప్పుడు మొదలైంది నా బాధ . ఫేస్బుక్ లో , వాట్స్యాప్  లో , ఫోన్లో అన్ని చోట్లా నన్ను బ్లాక్ చేసేసింది . తన కజిన్స్ తో, మా కామన్ ఫ్రెండ్స్ తో ఎన్నో మెసేజ్ లు పంపాను . చివరికి బాగా జబ్బు పడ్డానని కూడా చెప్పించాను . అయినా తను లొంగలేదు . ఒక్క సారి మాత్రం ఫోన్ లో మాట్లాడింది .
నాతో పోట్లాడి పోట్లాడి అలిసిపోయానంది . నావల్ల తన ఎనిమిది సంవత్సరాలు నాశనం అయిపోయాయని చెప్పింది . నాతో మాట్లాడాలని ఎదురు చూస్తూ , నా నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక చాలా నలిగిపోయాననీ , ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉందనీ చెప్పింది . ఇప్పుడు తనకి నా మీద జాలి మాత్రమే కలుగుతోందనీ , ఏ మాత్రం ప్రేమ భావం లేదనీ , ఇక ఎప్పుడూ మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దన్నీ చాలా గట్టిగా చెప్పేసింది . నాలో గిల్టీ ఫీలింగ్ అప్పుడు మొదలయింది . నేను తనతో పాటుగా ఎందఱో అమ్మాయిల్ని ఏడిపించాను . ఈ ఎనిమిదేళ్ళ లో దాదాపు ముప్ఫై మంది అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాని చెప్పి , కొన్నాళ్ళకి బోర్ కొట్టగానే వదిలేసాను  . ఒక్కో అమ్మాయితో బ్రేక్ అప్ అయినప్పుడల్లా వాళ్ళెంతో ఏడుస్తూ తిడుతూ నాకు దూరమయ్యేవారు . ఆ పాపాలన్నీ నన్నిప్పుడు ఇలా వెంటాడి వేధిస్తున్నాయనిపిస్తోంది . ప్రతి నిమిషం అదే ఆలోచన . తనతో మాట్లాడాలనీ , మునుపటిలా ఉండాలనీ తీవ్రమైన కోరిక . తిండీ , నిద్రా కూడా తగ్గిపోయాయి . మనసు తేలిక పరచుకోవడం కోసం , నా పాపాలకి పరిహారం చేసుకోవడం కోసం ఇలా వచ్చాను . ఇప్పుడు నాకింకేమీ వద్దు . మళ్ళీ తను నా జీవితంలోకి వస్తే చాలు . కానీ ఇక తను రాదని నాకు తెలుసు . ” ఆ యువకుడి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి  .” చూడు భాయీ , నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు . మళ్ళీ అటువంటి పొరపాటు చెయ్యకు . ఆ అమ్మాయి వెనక్కి తిరిగి రాదని తెలిసినప్పుడు ఇంకా బాధ పడటం వల్ల ఏం ప్రయోజనం? మన ఆత్మనైనా సరే హింస పెట్టే హక్కు మనకి లేదు . నువ్వు కూడా ఆ అమ్మాయిని మర్చిపోవడం ఒక్కటే సరైన మార్గం ” అన్నాడు స్వామి అనునయంగా అతని భుజం మీద చెయ్యి వేస్తూ .
ఆ యువకుడు అదేమీ పట్టించుకోనట్టుగా మళ్ళీ చెప్పసాగాడు .”ఇప్పుడు నన్ను నిలువెల్లా దహించివేస్తున్న సందేహం ఒక్కటే . అసలు ఇన్నేళ్ళ ప్రేమ ఎలా అంతమైపోయింది? తను నన్ను ఎలా మరిచి పోగలిగింది! అసలు అలా మరఛిపోవడం సాధ్యమా? ఒక్కసారి కూడా మా మధ్య జరిగిన మంచి సంఘటనలు తనకి గుర్తు రావా ? నాతో మాట్లాడాలని అనిపించదా ? అసలు అదెలా కుదురుతుంది!! ఈ ఆలోచనలతో నేను సతమతమైపోతున్నాను . దయచేసి సమాధానాలు చెప్పండి భయ్యా ”  అతను కళ్ళలోంచి నీళ్ళు కారిపోతుంటే బిక్కమొహం వేసుకుని చిన్నపిల్లాడిలా అడిగాడు  .స్వామి ఒక్క నిమిషం అలోచించి చెప్పాడు.  ” తమ్ముడూ , మనిషి మనసు ఓ మహేంద్రజాలం . ఎప్పుడు ఎవర్ని ఎలా స్వీకరిస్తుందో మనం అంచనా వెయ్యలేం . దానితో పాటుగా సాగిపోవడమే తప్ప ఎదురుతిరిగి ప్రశ్నించే ప్రయత్నం చెయ్యకూడదు . ప్రపంచంలో ప్రేమ విషయంలో ఏ ఇద్దరి అనుభవాలూ ఒకేలా ఉండవు . ఆ సందేహాలన్నీ పక్కన పెట్టు . ఇప్పుడు నేను ఆ అమ్మాయి తాలుకూ ఆలోచనలన్నీ నీ మనసులోంచి తొలగిస్తాను . అప్పుడు నీకీ వేదన ఉండదు . “ఆ అబ్బాయి కొంతసేపు దీర్ఘాలోచనలో పడినట్టుగా ఉండిపోయాడు . తర్వాత అన్నాడు .” వద్దు భయ్యా , నేను తనని మరిచిపోతే నా జీవితానికి అర్థమే లేదు . ఎప్పటికైనా తను వెనక్కి తిరిగి చూస్తుందనే ఆశతో బ్రతికేస్తాను . కనీసం క్షమించినా చాలు . అయినా నేను ఇదంతా మరిచిపోతే మళ్ళీ నా కథ మొదటికే వస్తుంది .  చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చెయ్యడం నాకిష్టం లేదు. ఈ జీవితానికి నాకీ బాధ చాలు . “ అంటూ ఇక స్వామితో మాట్లాడటం ఇష్టం లేనట్టుగా వడివడిగా అడుగులేస్తూ అతను ముందుకు వెళ్ళిపోయాడు .స్వామికి ఆ అబ్బాయిని వెనక్కి పిలవాలనిపించింది . మరుపు అనేది మనిషికి సహజంగా లభించిన వరమనీ , ఆ అమ్మాయి తిరిగి చూసినా, చూడకపోయినా ఇప్పుడున్నంత బాధ కొద్ది రోజుల తర్వాత ఉండదనీ, అప్పటివరకూ పొరపాటు నిర్ణయాలేవీ తీసుకోకుండా ఓపికపడితే చాలనీ చెప్పాలనిపించింది. కానీ ఆ అర్హత తనకి ఉందా? తపస్సు పేరుతో తను పోగొట్టుకున్న సమయం గురించీ, తద్వారా లభించిన శక్తి వల్ల ఒనగూడే ప్రయోజనం గురించీ, తన భవిష్యత్తు గురించీ ఆలోచిస్తూ స్వామి అక్కడే నిలబడిపోయాడు.

***

అన్‌మోల్‌ రిష్తే

 స్కైబాబ

 

స్కైబాబా

పెళ్ళైన కొత్తల్ల ఒకటె ఉబలాటంగుంటది పెళ్ళాం మొగుళ్ళకు- ఒకల ముచ్చట్లు ఒకలకు చెప్పుకోవాల్నని. దాంతో తమ అలవాట్లన్ని తమ ప్రత్యేకతలుగా చెప్పుకుంటుంటరు. కొందరేమొ ‘గొప్పలు’ చెప్పుకుంటుంటరు. నేను ఫలాన కూరగాయలు తినను.. నాకు ఫలానా మాంసం యమ ఇష్టం.. ఇట్ల మొదలైతె- నాకు ఫలానా తీర్గ ఉండేటోల్లంటె అస్సలు నచ్చరు. ఫలానా మస్త్‌ పసంద్‌- దాంక…
అట్లనె జబీన్‌-మహబూబ్‌లు గుడ తమ పెళ్ళైనంక తమ గొప్పలు చెప్పుకున్నరు. ఆ చెప్పుకునుడు ఏడిదాంక పోయిందంటె- మహబూబ్‌ తానొక పిల్లను ప్రేమించి ఉంటినని ఆ పిల్లను అస్సలు మర్షిపోలేనని ఆ కతంత చెప్పుకొచ్చిండు. అంతేగాంక ఆ తరువాత గుడ ఒక పిల్ల తన ఎంట పడేదని గొప్పగ చెప్పిండు. అట్లా పెళ్ళైనప్పటిసంది తన ప్రేమకతలు చెప్పుకుంటనే వస్తున్నడు మహబూబ్‌. జబీన్‌కు తన ప్రేమకత గూడ ఒకటిరెండుసార్లు నోటిదంక వచ్చింది. గని ఉగ్గబట్టుకుంది. ఒకరోజు మాత్రం మహబూబ్‌ తన తొలి ప్రేమ గురించి మహా గొప్పగ చెప్పుకుంటుంటె.. ఇగ ఉండలేకపొయ్యింది. మహబూబ్‌ జర మనసున్నోడే ఉండు, తన ప్రేమ కత చెప్పుకున్నా ఏమనేటట్లులేడులె అనుకున్నది.. ఎనకాముందాడుకుంటనె తన ప్రేమ కత గుడ చెప్పుకున్నది!
తన కత గొప్పగనే చెప్పుకున్న మహబూబ్‌కు పెళ్ళాం ప్రేమ కత చెపుతుంటే మాత్రం మనసుల్నించి ఉక్రోషం తన్నుకొచ్చింది. బైటబడితె ఆయింత చెప్పకుంటనె యాడాపేస్తదోనని ఊకున్నడు. కొద్దిసేపు ఊఁ గొట్టిండు. ఐటెంక ఊఁగొట్టుడు బందైంది. జబీన్‌ను ఒళ్లోకి గట్టిగ పొదువుకొని పండుకున్నోడల్లా పట్టు ఒదిలిండు. ఇదేం సమజ్‌ చేస్కోకుంటనె తన ప్రేమకతంతా చెప్తున్నది జబీన్‌-
తను, పక్కింటి అమీర్‌ ప్రేమించుకున్నమని- అతను షానా మంచోడుండెనని.. తండ్రి సచ్చిపోవడంతోని ఇప్పట్లో షాదీ చేసుకునుడు కుదరదని చెప్పిండని.. తను షానా ఏడ్షిందని.. కొన్నాళ్ళకు వాళ్ళు వేరే పట్నానికి ఎల్లిపోయిన్రనేది ఆ కత. మహబూబ్‌ మొఖం మాడిపొయి షానాసేపయింది. ఆ చీకట్ల అది గమనించే వీలు లేదు జబీన్‌కు. సప్పుడు చెయ్యకుంట జబీన్‌ను వదిలి అటు మల్లి పండుకుండు మహబూబ్‌. పరేషానయింది జబీన్‌. అంతదంక మైమరచి చెప్పుకుంట వచ్చినదల్లా చెప్పి తప్పు చేసిన్నా ఏందని ఒక్కసారిగ మనసుల గుబులు పడ్డది. మహబూబ్‌ మీద చెయ్యి ఏసి ‘ఏమైంది జీ.. నిద్ర వస్తుందా!’ అనడిగింది. ‘ఊఁ’ కొడితే తన అయిష్టత యాడ బైటపడకుం పోతదనుకున్నడో ఏమో ‘నై’ అని జర ఊటగనె అన్నడు. సమజయింది జబీన్‌కు. వెనుక నుంచి మరింత దగ్గరగా జరిగి ‘కోపమొచ్చిందా?’ అని గోముగ అడుగుకుంట గట్టిగ హత్తుకుంది. ‘అదంతా పాత కత. ఇప్పుడు నువ్వే నా పానం’ అని చెవిలో చెప్పింది. మెదలకుండా జవాబేమి ఇవ్వకుంట పండుకుండు మహబూబ్‌.
అప్పుడనుకుంది జబీన్‌- మొగుడు ఎన్ని ప్రేమకతలు చెప్పినా ఇనాలె గని, పెళ్ళాం తన ప్రేమకత మాత్రం అస్సలు చెప్పకూడదని! మహబూబ్‌ చెప్పిన రెండు ప్రేమకతలకు మనసులో ఎక్కణ్నో మంటగ అనిపించింది కని బహుశా తనగ్గూడా ఒక ప్రేమకత ఉండటంతోని అంతగనం కోపం రాలేదు జబీన్‌కు. చెప్పుకున్నందుకు మనసు జర అల్కగయ్యింది.
గని మహబూబ్‌ అలిగేసరికి మనసుల మల్లో గుబులు మొదలైంది, పుసుక్కున ఇది మనసుల పెట్టుకుని సతాయించడు గదా అని. ఇట్ల సోంచాయించుకుంట మహబూబ్‌ను అట్లనే అల్లుకుని ఉండిపొయింది ఆ రాత్రి. ఇద్దరి మనసుల్ల సుడులు తిరుగబట్టినయ్‌ ఒకరికొకరు చెప్పుకున్న ప్రేమకథలు…!
***
ఏండ్లు గడిషిపొయినయి. ఇద్దరు పిల్లలు పుట్టిన్రు. మహబూబ్‌ మంచోడే. జబీన్‌ను మంచిగనే సూసుకుంటున్నడు. కాని అప్పుడప్పుడు ఇద్దరూ కొట్లాడుకున్నప్పుడల్లా ‘నువ్వు సొక్కమా?’ అంటె ‘నువు సొక్కమా?’ అని ఒకరిమీద ఒకరు అర్సుకునేటోల్లు. మంచిగున్నప్పుడు, యాదొచ్చినప్పుడల్లా ఉండబట్టలేక తన తొలి ప్రేయసి గురించి అదొ ఇదొ చెప్తనె ఉండేటోడు మహబూబ్‌. చెప్పుకుంటున్నప్పుడల్లా ఊఁ కొడుతూనే జబీన్‌ ఏదో లోకంలోకి ఎల్లిపోతుండటం గమనించేటోడు. తనకు గుడ అమీర్‌ గుర్తొస్తున్నడేమోనని సోంచాయించేటోడు. జర మనసుల మంటగ ఉండేది. కాని తమాయించుకునేటోడు. ఒక్కోపాలి మెల్లగ అడిగేటోడు, ‘అమీర్‌ గురించేమన్నా తెలిసిందా! ఎట్లున్నడంట?’ అని.
జబీన్‌ మాత్రం గత అనుభవాన్ని మతిల తలుసుకుని ఏం చెప్పకపొయ్యేది. ‘ఏమో తెలియదు. నేనెప్పుడో మర్షిపొయిన కతను నువ్వెందుకు మల్ల గుర్తు చేసుడు’ అని ఊటగ అని, అక్కడ్నించి తొలిగి పనుల్ల పడిపొయ్యేది.
అట్ల అననైతె అనేదిగని పుట్టింటికి పొయినపుడు మాత్రం అమీర్‌ గురించి ఆరా తియ్యకుంట ఉండలేకపొయ్యేది. యాణ్ణో ఒక తాన బతికే ఉన్నడు లెమ్మని నిమ్మలపడేది.
 ఒకపాలి ఊర్లె చుట్టాలింట్ల పెండ్లికి పొయ్‌న మహబూబ్‌కు తన తొలి ప్రేయసి తారసపడింది. గుండె గుబగుబలాడింది. ఎన్నాల్ల నుంచో కలవాల్ననుకుంటున్న తను కనిపించేసరికి పానం లేసొచ్చినట్లయింది. కాకపోతె ఆమె తీరే జర తేడా గొట్టింది. ఆమెను చూసి మహబూబ్‌ ఎంతైతే అలజడికి గురైండో ఆమెలో మాత్రం అలాంటిదేమి కనిపించలేదు మహబూబ్‌కు. పట్టనట్టే తిరగబట్టింది. మనిషి లావయింది. భారీ చీరలో ఒంటినిండ నగలతోని షానా ఫోజు కొట్టబట్టింది. ఉండబట్టలేక జర సందు చూసుకొని మాట్లాడతానికి కోషిష్‌ చేసిండు మహబూబ్‌- ‘జర పక్కకు రారాదు, కాసేపు మాట్లాడుకుందాం’ అని అడిగిండు. ‘హమ్మో! మా ఆయన చూస్తే ఏమైనా ఉందా.. నేను రాను’ అన్నది. ఊర్లెనే ఉన్న తమ ‘యింటికన్న ఒకసారి వచ్చిపోరాద’ని అడిగిండు. ‘వామ్మో! మా అత్తగారికి తెలిస్తే ఏమన్నా ఉందా.. కుదరదు’ అన్నది. తిక్క లేషింది మహబూబ్‌కు. ఇన్నాళ్ళ సంది ఒక్కపాలి ఎదురుపడితే బాగుండునని అంతగనం గోస పడ్డది గిట్లాంటి దాని కోసమా అని ఒకటే ఫీలయిండు. కని ఏం జేస్తడు, పానం కొట్టుకుంటుండె.. తమాయించుకుని మల్ల సందుచూసుకుని అడిగిండు, ‘ఎట్లున్నవ్‌.. అంతా నిమ్మలమేనా?’ అని. ‘నాకేంది, నేను మస్తున్న.. మా ఆయన నన్ను దేవతలెక్క చూసుకుంటడు. నేను లేకుంట ఐదు నిమిషాలు గుడా ఉండలేడు. ఏది కావాలంటె అది కొనిస్తడు…’ అనుకుంట వాళ్ళాయన గురించే గొప్పలు చెప్పబట్టింది. అంతల ఎవడో పోరగాడొచ్చి వాళ్ళ అత్త పిలుస్తున్నదని చెప్పిండు. ‘హమ్మో! నేను పోతున్నా..’ అనుకుంట గబ్బగబ్బ గున్న ఏనుగులెక్క ఎల్లిపొయింది. అట్లనే జరసేపు మొద్దులెక్క నిలబడ్డడు మహబూబ్‌. అప్పట్నించి ఆ పెండ్లి నుంచి ఎల్లొచ్చిందాంక మల్ల ఎదురుపడనే లేదు ఆమె.
ఇంటికొచ్చేసినంక ఆ రాత్రి తన మనసులో సుడి తిరుగుతున్న బాధనంత జబీన్‌కు చెప్పుకుంట చిన్నపిల్లగాని లెక్క బోరున ఏడ్వబట్టిండు మహబూబ్‌. ఒళ్ళోకి తీసుకొని ఓదార్చింది జబీన్‌. జబీన్‌ గుడ మహబూబ్‌ ఏడ్పుల ఏడ్పు కలిపి తనివితీర ఏడ్చింది, అమీర్‌ గుర్తొచ్చి! జబీన్‌ ఒళ్ళోకి ముడుచుకుని అట్లనే నిద్రపొయిండు మహబూబ్‌. ‘అమీర్‌ గుడా తనను మర్చిపోయి ఉండొచ్చా…’ అని సోంచాయిస్తూ సోంచాయిస్తూ ఎప్పటికో నిద్రపొయింది జబీన్‌.
***
అప్పటిసంది జబీన్‌ మీద మరింత ప్రేమ పెరిగింది మహబూబ్‌కు. ఇంకింత మంచిగ చూసుకోబట్టిండు. ఆమె మంచితనం.. ఆమె అందం మస్తు గొప్పగా కనిపించబట్టినయి.. దాంతో ఆమెను అపురూపంగ చూసుకోవటం.. ఏదున్నా తనకు చెప్పి చెయ్యడం చెయ్యబట్టిండు. ఒకపాలి మాటల్ల అమీర్‌ గురించి ప్రస్తావనొచ్చింది-
‘…యాడున్నడో తెల్సుకో జబీనా… ఒకసారి ఇద్దరం కలిసివద్దాం’ అన్నడు మహబూబ్‌.
కలవరపడ్డది జబీన్‌. నమ్మబుద్ది కాక మహబూబ్‌ దిక్కు సూషింది.
‘నిజంగంటున్న జబీనా! తెల్సుకో.. తప్పేముంది.. పలకరింపుగ కలిసివద్దాం! నాగ్గూడా అతన్నొకపాలి సూడాల్నని ఉంది’ అన్నడు.
కండ్లల్ల నీల్లు చిమ్ముతుండేసరికి ఝట్‌న వంటింట్లకు తప్పుకుంది జబీన్‌.
‘నిజంగనే అంటున్న జబీనా.. తెలుసుకో!’ అన్నడు ఊటగ మహబూబ్‌.
‘సూద్దాంలే జీ!’ అన్నది వంటిట్ల నుంచి, లెక్కచెయ్యనట్లు.
ఎప్పుళ్ళేంది ఇట్లంటున్నడేంది అని జర అనుమానమేసింది జబీన్‌కు. కాని తనకు గూడ మనసుల సూడాల్ననే ఉన్నది. ఆ విషయం ఏ మాత్రం బయటపడనీయలేదు.
నిజానికి- తను అంతగనం చెప్పుకున్న తన ప్రేయసి తనంటే ఏమాత్రం పట్టించుకోకపోవడం ఎంతకూ అజం కాలేదు మహబూబ్‌కు. దాంతో జబీన్‌ విషయంలో అమీర్‌ ఎట్ల ఫీలయితడో సూడాల్ననే ఉబలాటం ఎక్కువైంది. అందుకనే అమీర్‌ను కలుద్దామని అనబట్టిండు..
మహబూబ్‌ డ్యూటీకి పోంగనే తమ ఊర్లె ఉన్న చెల్లె ముబీన్‌కు ఫోన్‌ చేసింది జబీన్‌. జరసేపు పలకరింపు లయినంక ‘అమీర్‌ వాళ్ళు ఇప్పుడెక్కడ ఉంటున్నరంటరా?’ అనడిగింది.
‘అయ్యో.. నీకు తెలవదా ఆపా! వాళ్ళిప్పుడు గోల్కొండల్నె ఉంటున్నరంట. అమీర్‌ కారు నడుపుతున్నడంట. గోల్కొండ ఇప్పుడు మీకు దగ్గర్నే కదా!’ అన్నది.
‘అవునా!’ అని ఆశ్చర్యపొయింది జబీన్‌. ఇంకా కొన్ని వివరాలు చెప్పింది ముబీన్‌.
ఇగ అప్పటిసంది మల్ల మహబూబ్‌ ఎప్పుడు అడుగుతడా అని ఎదురుసూడబట్టింది గని తనకు తానైతె ఆ విషయం ఎత్తలే.
కొన్నాల్లకు మల్ల మాటల్ల అడగనే అడిగిండు మహబూబ్‌, ‘అమీర్‌ గురించి తెలుసుకోమంటి గదా!’ అని. అప్పుడు గుడ జర ఎనకాముందాడుకుంటనే- ‘మొన్న ముబీన్‌ చెబుతుండె, వాల్లిప్పుడు గోల్కొండల్నె ఉంటున్నరంట’ అన్నది.
‘అవునా.. మరింకేంది, ఒకరోజు పొయ్యొద్దాం’ అన్నడు మహబూబ్‌.
‘ఎందుకులే జీ! ఐటెంక మీరు ఎప్పుడన్నా ఎత్తిపొడిసినా పొడుస్తరు. ఎందుకొచ్చిన పరేషాని’ అన్నది.
‘ఎహె! అట్లెందుకు జేస్త జబీనా, ఏమనలే! ఒకసారి పొయివద్దాం’ అన్నడు.
‘సరె తీయ్‌.. చెల్లెకు చెప్త అడిగిసూడమని. ఏమంటరో సూద్దాం’ అన్నది.
కొన్నాళ్లకు ముబీన్‌ ఏదొ ఎక్జామ్‌ రాయడానికి హైదరాబాద్‌ వొచ్చింది. మహబూబ్‌ అడగమంటె అమీర్‌ నెంబర్‌ సంపాయించి మాట్లాడింది ముబీన్‌. ఆ ఆదివారం ఎల్లడానికి ఓకే అయింది.
ఆదివారంనాడు పొద్దున అనుకోకుంట హైదరాబాద్‌లనె ఉండే మహబూబ్‌ తమ్ముడు ఒచ్చిండు.. వీళ్ల ప్రోగ్రాం విని పొద్దుగూకాల తన పిల్లలతో సహా తీసుకొస్తనని వీళ్ల పిల్లల్ని తీస్కెల్లిండు. ఇగ పిల్లల గడ్‌బడ్‌ గుడ లేకుండేసరికి తమాషిగ తయారై ముగ్గురు పయనమైన్రు అమీర్‌ వాల్లింటికి.
ముబీన్‌కు ఫోన్‌ల అడ్రస్‌ చెప్పుకుంట రోడ్డు దంక వచ్చి నిలబడ్డడు అమీర్‌. ఇంకొద్దిసేపట్ల ఎదురు పడతడనంగనె జబీన్‌ గుండె ఊటగ కొట్టుకోబట్టింది. ఆటోల నించి అమీర్‌ కనపడంగనె లోకం మర్షినట్లయింది. సంబాళించుకుంది. మహబూబ్‌ ఒకపాలి జబీన్‌ దిక్కు సూషిండు. మహబూబ్‌ తనను గమనిస్తున్నట్లు సమజై అమీర్‌ మీంచి చూపు తిప్పుకుంది. కాని మనసు కల్లోలమైపోయింది. ‘అరె, సందమావ లెక్క ఉండెటోడు వట్టిచేప లెక్క తయారైండేంది’ అని నమ్మలేనట్లుగ ఫీలయింది. అంతదాంక మొఖంల ఎంత దాచుకుందామన్న దాగని కళ మాయమైపొయింది. అతడ్ని చూసిన్నన్న ఖుషి మాయమై దాని తలంల విచారం చోటుచేసుకున్నది. ఈలోపల మల్లొకసారి జబీన్‌ దిక్కు సూషిన మహబూబ్‌కు ఏం సమజ్‌కాలె. రాయిలెక్క కూసున్న జబీన్‌ను ‘జబీనా! ఉత్‌రో’ అంటూ జర కదిలించిండు. చమక్‌ తిన్నట్టు దునియాలోకొచ్చిపడి ఆటో దిగింది జబీన్‌. అప్పటికే దగ్గరకొచ్చిన అమీర్‌ మహబూబ్‌కు సలామ్‌ చేసి చేయి కలిపిండు. ‘వాలేకుం సలామ్‌’ అని చేయి కలుపుకుంట బలవంతంగ నవ్వు మొహం పెట్టిండు మహబూబ్‌. ముందే సలామ్‌ చేసిన ముబీన్‌ ‘కైసే హై అమీర్‌ భాయ్‌?’ అంటూ పలకరించింది. ‘సబ్‌ ఠీక్‌. దువా హై’ అన్నడు.
అమీర్‌కు సలామ్‌ చెప్పుకుంట అట్ల ఒక్క క్షణం కళ్ళెత్తి అతని దిక్కు సూషి కండ్లు దించుకుంది జబీన్‌. తన కండ్లల్ల తడి మెరుపు మహబూబ్‌ కంట్ల పడొద్దని జబీన్‌ కోషిష్‌. ‘వాలేకుమ్‌ సలాం’ చెప్పిండు చేయిలేపుకుంట అమీర్‌, గని గొంతు బైటికి రానేలేదు. సంబాళించుకుని ‘ఆయియే!’ అనుకుంట తమ ఇంటిదిక్కు దారి తీసిండు. అతని ఎనక మహబూబ్‌ ఆ వెనక అక్కచెల్లెళ్ళు నడిషిన్రు. సన్నని గల్లీలకు మల్లిండు అమీర్‌. గొంతు పెగలదేమోనన్న డౌట్‌తోటే ఏం పలకరింపులు లేకుంటనే నడుస్తున్నడు అమీర్‌.
‘కార్‌ చలాతె హై కతెనా ఆప్‌? జాతి? రెంటెండ్‌? (కార్‌ నడుపుతున్నరంట గదా మీరు. సొంతమా? వేరేవాళ్లదా?)’ అడిగిండు మహబూబ్‌.
‘నై.. దూస్‌రోంకి హై! ఓ యహీఁ రహెతే (లేదు.. వేరేవాళ్లది. ఆయన ఇక్కడే ఉంటారు) అన్నడు ఎనక్కి తల తిప్పి అమీర్‌.
‘అచ్ఛా’ అని ‘పంద్రా హజార్‌తోభి మిల్‌తీ తన్‌ఖా? (పదిహేనువేలన్నా దొరుకుతుందా జీతం?)’
‘నై భయ్‌! దస్‌ హజారీచ్‌ మిల్తీ, ఉప్పర్‌ భత్తా మిల్తానా.. (లేదన్నా! పది వేలే ఇస్తరు. పైన బత్తా దొరుకుతది కదా)’
‘అచ్ఛా!’
ఇంతల ఇల్లొచ్చింది. వీల్ల మాటలు వినుకుంట నడుస్తున్నది జబీన్‌. చూపంతా బొక్కలు తేలిన అమీర్‌ మీదనే ఉంది. అతని గొంతుల గుడ గరీబీ మజ్బూరి వింటున్నది జబీన్‌. ఎందుకో.. అస్సలు నమ్మశక్యంగ లేదు జబీన్‌కు. మనిషి గట్టిగ, మాట స్థిరంగ ఉండేది. బహుశా అబ్బాజాన్‌ చనిపోవడంతోటి ఇద్దరు చెల్లెండ్ల షాదీలు.. ఆ అప్పుల భారం కుంగదీసి ఉంటుంది అనుకుంది.
‘ఆయియే!’ అని పర్దా జరిపి లోపలికి పిలుస్తున్నడు అమీర్‌. చెప్పులు బైట ఇడవాల్న లోపల్నా అని మహబూబ్‌ ఎనకాముందాడుతుంటే ‘పర్వా నై.. అందర్‌ ఛోడో’ అంటున్నడు అమీర్‌. బైట మరీ గల్లీలకు తలుపు ఉండేసరికి లోపల్నే తలుపు పక్కకు చెప్పులు ఇడిషిండ్రు ముగ్గురు. కుర్సీలు రెండు వీల్ల కోసమని జరిపి కూసొమన్నడు అమీర్‌. అటుపక్కన గోడకు మసేరి మంచం ఉన్నది. తలుపుకటు పక్కన ఒక పాతబడ్డ పోర్టబుల్‌ టీవీ ఉన్నది. ఇటుదిక్కు ఒక అల్మారి, దాని పక్కన బట్టల దండెం. ఆ దండ్యానికి ముందు కుర్సీల జబీన్‌, అల్మారీ ముందేసిన కుర్సీల మహబూబ్‌, మంచం మీద ముబీన్‌ కూసున్నరు. ఆ చిన్న అర్ర ఔతలి దిక్కున్న తలుపుల్నుంచి లోపలికి పొయిండు అమీర్‌.
అంతల్నె బయటినుంచి పర్దా తోసుకుంట ఒక ఆరేడేళ్ళ పిల్ల, నాలుగేండ్ల పిలగాడు ఉరుకొచ్చిన్రు. ఝట్‌న ఈ ముగ్గురు కొత్తోల్లను సూషి ఆగిపొయిన్రు. తెల్లగ ముద్దుగున్నరు. కని ఇద్దరు గుడ ఎండు చేపల్లెక్కనే ఉన్నరు బక్కగ. ‘అమీర్‌ భాయ్‌ పిల్లలట్టుంది’ అన్నది ముబీన్‌. ‘ఇదర్‌ ఆవో. క్యా నామ్‌ తుమారా?’ అన్నది జబీన్‌ పిల్లల్ని దగ్గరికి పిలుచుకుంట. పెద్ద పిల్ల కదలి జబీన్‌ దగ్గరకు వస్తూ ‘సమీనా’ అన్నది. ఒళ్ళో కూసొబెట్టుకున్నది జబీన్‌. పిలగాడు మాత్రం పర్దా అంచు నోట్లె పెట్టుకుని అటూఇటూ ఊగుకుంట అట్లనే నిలబడ్డడు. అంతల అటునుంచి అమీర్‌ ఒచ్చి ఎనక ఒచ్చిన తన బేగమ్‌ను ములాఖత్‌ చేసిండు, ‘రుబీనా’ అనుకుంట. రుబీనా అందర్కి సలాం చేసింది. వీళ్ళు ప్రతిసలామ్‌ చేస్కుంట వచ్చి కూసొమన్నరు. ‘పర్వా నై’ అనుకుంట రుబీనా గనుమల్నె నిలబడ్డది. అమీర్‌ ఒచ్చి మంచం మీద అటు చివర కూసున్నడు.
కొద్దిసేపు నల్గొండల తమ ఇండ్లు పక్కపక్కన ఉన్నప్పటి సంగతులు యాది తెచ్చుకుంట మహబూబ్‌కు చెప్తున్నట్టుగ ముచ్చట పెట్టిన్రు ముబీన్‌, అమీర్‌, జబీన్‌లు. మహబూబ్‌ చూస్తలేడనుకున్న క్షణం జబీన్‌ని ఓ రెండుసార్లు మాత్రమె సూషిండు అమీర్‌.. ఇద్దరి కండ్లల్ల ఒక దర్ద్‌.. ఒక ఆరాధనా భావం…
‘గోల్కొండ రావడం ఎట్లయింది?’ అని ముబీన్‌ అమీర్‌ను అడిగింది.
‘కార్‌ ఇక్కడిది దొరికింది. ఓనర్‌ జర మంచోడు. ఇగ నౌకరీకి కొన్నాల్లు ధోకాలేదని గోల్కొండకొచ్చినం’ చెప్పిండు అమీర్‌. రుబీనా ఊరేదని కాసేపు ఆమెను పలకరించిన్రు.
అమీర్‌ మాట్లాడుతున్నప్పుడు అందరితో పాటు అతన్ని చూసుకుంట ఉండిపోతున్నది జబీన్‌. ముఖంపై కళ తప్పింది, బొక్కలు తేలినై, బట్టలు గూడా ఉన్నదాంట్ల మంచియి ఏసుకున్నట్లుంది కని అయిగుడ పాతబడ్డయి. పిల్లల బట్టలు గుడ అంత బాగలెవ్‌..
వాళ్ళ హాలతు అంతమంచిగ లేదని వీళ్ళు ముగ్గురికి సమజయింది. రుబీనా అందంగా ఉందిగని తను గుడ బక్కచిక్కి ఉంది. ఉన్నదాంట్ల జర మంచి చీర కట్టుకున్నట్లుంది. తల మీద కొంగు కప్పుకుని నిలబడ్డది. ఎంత కూసొమన్న కదల్లేదు. వాళ్ళ కొడుకు పర్దా వదిలి తల్లి కాడికి ఉరికి అల్లుకుపొయి నిలబడ్డడు. వాని చుట్టూ చేతులేసి ‘బేటా!’ అని పరిచయం చేసింది.
‘ఇదరావ్‌ బాబా!’ అనుకుంట మహబూబ్‌ మల్ల పిలిషిండు. వాడు రాలె. తల్లి కొంగు నోట్లో పెట్టుకోబోతే వారించి ‘జావ్‌’ అన్నది రుబీనా. వాడు కదల్లే. ఈలోపు సమీనా బైటికురకడంతోటి జబీన్‌ చేయిచాపి వాని రెట్ట పట్టుకుని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టుకుంట ఒళ్ళో కూసొబెట్టుకుంది.
‘ఏం చదువుతున్రు పిల్లలు?’ అడిగిండు మహబూబ్‌.
‘సమీనా రెండో తరగతి, వాడు ఇప్పుడిప్పుడే బడికి పోతున్నడు’ చెప్పిండు అమీర్‌, మల్ల తనె, ‘మీ పిల్లలు ఏం చదువుతున్నరు?’ అనడిగిండు.
‘బేటా ఫిఫ్త్‌ క్లాస్‌.. బేటీ థర్డ్‌ క్లాస్‌’ అన్నడు.
టైం రెండు కావడంతోని ‘అన్నం తీస్త’ అని లోపలికి పొయింది రుబీనా. ఎనకనె అమీర్‌ లేషి కాళ్లు చేతులు కడుక్కుందురు లెమ్మన్నడు. ఆడోళ్లిద్దరు లేషి లోపలికి పొయిన్రు. అమీర్‌ ఎనక మహబూబ్‌ కదిలిండు. ఆ అర్ర దాటంగనె చిన్న హమామ్‌. అందుల్నె లెట్రిన్‌ ఉన్నది. దాని ముందు నుంచి లోపలి అర్రలకు దారి ఉంది. లోపలిది వంట అర్ర. అవతలికి కిటికి ఉంది. ఆడోళ్లకు ఆ అర్ర సూపెడుతున్నది రుబీనా.
హమామ్‌లకు పోయి మొఖం కాళ్లు చేతులు కడుక్కొని ఒచ్చిండు మహబూబ్‌. ఆ ఎనక జబీన్‌, ముబీన్‌ గుడ కడుక్కొని ఒచ్చిన్రు. రుబీనా కింద సాప ఏసి దస్తర్‌ఖాన్‌ పరిషింది. చికెన్‌ బిర్యాని, టమాట శేర్వా, పెరుగు చారు తెచ్చి పెట్టింది. కూసొమన్నరు వీళ్లను. సూస్తె మూడు ప్లేట్లే ఉన్నై. ‘మీరు గుడ కూసోరి’ అన్నరు వీల్లు. ‘మేం తర్వాత తింటం. మీరు తినురి’ అన్నడు అమీర్‌. ‘అందరం కల్సి తిందం’ అన్నడు మహబూబ్‌. వాల్లు అస్సలు ఇనలె. సరెనని ఈల్లు ముగ్గురు కూసున్నరు. పిల్లలు ఇటు రాకుంట సూసుకున్నరట్లుంది వాల్లు. పిల్లలు రాలె. ‘మీరు వడ్డించురి’ అని బర్తతో చెప్పి లోపలికి పొయింది రుబీనా. అమీర్‌ ముందుకు రాబోతె మహబూబ్‌ వారించిండు. తాము ఏసుకుంటమని చెప్పి బిర్యాని ఏసుకున్నడు. ముక్కలు షానానే ఉన్నయ్‌. రెండే ఏసుకొని జబీన్‌ దిక్కు బిర్యాని ముష్కాబ్‌ జరిపిండు. ‘ఔర్‌ దాల్లో భాయ్‌!’ అంటున్నడు అమీర్‌. ‘బాద్‌మె దాల్లేంగే’ అన్నడు మహబూబ్‌. జబీన్‌ గూడ రెండు ముక్కలు ఏసుకొని ముష్కాబ్‌ చెల్లె దిక్కు జరిపింది. ముబీన్‌ గుడ అట్లనె చేసింది. అంతల్నె గడపలకు వచ్చిన రుబీనా ‘అరె, వాల్లు సరిగ ఏసుకుంటలేరు, మీరు ఎయ్యిరి’ అన్నది జర ఊటగ. ఇగ వీల్లు వద్దు వద్దంటున్నా అమీర్‌ వంగి బిర్యానిల నుంచి తలా కొన్ని చికెన్‌ ముక్కలు మల్ల ఏషిండు.
బిర్యాని మస్తు మజాగ ఉండటంతోని, ఉండలేక ‘బిర్యాని బహుత్‌ అచ్ఛీ హై.. అచ్ఛా బనాయె’ అన్నడు మహబూబ్‌. ‘హవ్‌! బహుత్‌ మజేదార్‌ హై! ఇత్నా అచ్ఛా బిర్యాని పకానా కాఁ సికే ఆపా?’ అన్నది రుబీనా దిక్కు సూషి ముబీన్‌. రుబీనా నవ్వుకుంట ‘హమారె అమ్మీ కె పాస్‌’ అన్నది.
‘ఇంకా ఏసుకొని తినురి, మీరు షర్మాయిస్తున్నరు’ అని నవ్వుకుంట లేషి లోపలికి పొయిండు అమీర్‌ రుబీనాను లోపలికి రమ్మని సైగ జేస్కుంట. రుబీనా గుడ లోపలికి పొయింది.
‘ముక్కలన్ని మనకే ఏషిన్రు భాయిజాన్‌! వీల్లేం తింటరు?’ అన్నది ముబీన్‌ నవ్వుకుంట.
‘అవును, చేసిన బిర్యాని అంతా మనకే తీసి పెట్టినట్లుంది. పిల్లలు, వీల్లు ఏం తింటరు. మనకు రెండ్రెండు ముక్కలు సాలు కదా.. వాళ్లు రాకముందే ఈ ముక్కలు బిర్యానిల ఏసేద్దామా?’ అన్నడు మహబూబ్‌.
తల ఊపింది జబీన్‌. ఎంటనె మంచి ముక్కలు తీసి ముగ్గురు గుడ జల్ది జల్ది బిర్యానిల ఏషిన్రు. ముబీన్‌ ఎనక్కి ఒకసారి వాల్లు వస్తలేరని సూస్కొని ఆ ముక్కల్ని గంటెతోని కిందికి అని, పైన అన్నం కప్పేసింది.
కాసేపటికి అమీర్‌ ఒచ్చి కుర్సీల కూసున్నడు. వీల్లు ముందు బిర్యాని, ఐటెంక కొద్దికొద్దిగ టమాట షేర్వాతోని తిని పెరుగు ఖట్టా ఏసుకుంటున్నరు. ‘ఇంకొద్దిగ బిర్యాని ఏసుకోన్రి. బిర్యాని ఒడువనె లేదు’ అంటున్నడు అమీర్‌.
‘బస్‌ బస్‌! బహుత్‌ ఖాలియే.. అచ్ఛా బనాయె బిర్యాని.. మస్త్‌ మజా హై’ అనుకుంట లేషిండు మహబూబ్‌..
‘ఆయియే’ అనుకుంట మల్ల లోపలికి దారి తీషిండు అమీర్‌. నీల్ల తొట్టిల జగ్గు ముంచి నీల్లు అందిచ్చిండు. కడుక్కొని లోపలికొచ్చిండు మహబూబ్‌. ఆడోల్లు గుడ కడుక్కొనొచ్చి కూసున్నరు.
రుబీనా ప్లేట్లు తీసుకుంట ‘చాయ్‌ పీతే?’ అని అడిగింది.
‘లేదు, ఇప్పుడేమొద్దు’ అన్నడు మహబూబ్‌. ‘ఆప్‌ భి ఖాలేనా థానా?’ అన్నడు మల్ల.
‘నై, హమ్‌ బాద్‌మె ఖాతె, అందర్‌ బచ్చోంకొ దేతిమ్‌’ అన్నది రుబీనా.
రాయి లెక్క కూసొని ఏందొ సోంచాయిస్తున్న అమీర్‌ను అదొ ఇదొ మాట్లాడిస్తున్నడు మహబూబ్‌. తేరుకొని జవాబ్‌లిస్తున్నడు అమీర్‌. అమీర్‌ను అట్లా చూస్తు ఉండిపొయింది జబీన్‌. అతన్ని చూస్తుంటె మనసంత డోక్కుపోతున్నది జబీన్‌కు. ముబీన్‌ లేషి లోపలికి పొయి రుబీనాతో మాట్లాడుతున్నది. కొద్దిసేపట్కి-
‘ఇగ పోతం’ అని లేషిండు మహబూబ్‌. దాంతొ ఎంటనె లేషింది జబీన్‌. లోపల్నుంచి ముబీన్‌ గుడ ఒచ్చింది. తాము జల్ది ఎల్తె వాల్లు గుడ తింటరనిపించింది ముగ్గురికి.
‘అప్పుడేనా! ఇయాల ఉండురి’ అన్నడు అమీర్‌ లేషి.
‘లేదు, ఎల్లాలె, పని ఉంది’ అన్నడు మహబూబ్‌, అస్సలు కుదరదన్నట్లు.
రెట్టించలేదు అమీర్‌, ‘రుబీనాను పిలుస్త’ అని లోపలికి ఎల్లిండు.
మహబూబ్‌ జల్ది జేబుల్నుంచి పైసలు తీసి ఐదు వందల నోట్లు నాలుగు జబీన్‌ చేతిల పెట్టి ‘రుబీనా చేతిల పెట్టు.. పాపం, షానా పరేషాన్‌ కనబడుతున్నరు’ అన్నడు.
ఇబ్బందిగ అనిపించింది జబీన్‌కు..
రుబీనాను పిలిషి మల్ల ఒచ్చిండు అమీర్‌, ‘ఒస్తున్నది’ అన్నడు.
ఎంటనె లోపల్కి పొయింది జబీన్‌. పిల్లలిద్దరికి అన్నం పెడుతున్నది రుబీనా. జబీన్‌ను చూసి,
‘అయ్యొ! అప్పుడే పోవడమేంది ఆపా! చాయ్‌ గిట్ల తాగి పోదురు ఉండురి’ అన్నది.
ఆమె తనను ‘ఆపా’ అనడంతోని ఆమెకు తమ ప్రేమ గురించి తెలుసని సమజైంది జబీన్‌కు.
‘లేదు, ఎల్తం ఆపా! ఇంటికాడ పిల్లల్ని తీస్కొని మా మర్దివాల్లు ఒస్తరు’ అన్నది తను గుడ ‘ఆపా’ అనే పిలుస్తు.
‘పిల్లల్ని గుడ తీసుకొస్తె మంచిగుండు గదా ఆపా!’ అన్నది రుబీనా.
‘ఇగ ఆల్లు లేకుండె కదా.. అందుకె తేలేదాపా..’ అనుకుంట దగ్గర్కిపొయి చేతిల మడిషి ఉన్న నోట్లు రుబీనా చేతిల పెట్టింది, ‘దేనికన్న పనికొస్తయ్‌, ఉంచురి’ అని ఆత్మీయంగ అనుకుంట.
‘అయ్యొ.. వద్దు.. వద్దాపా! పైసలెందుకు..’ అని తిరిగి ఇచ్చెయ్యబొయింది రుబీనా.
‘ఆపా! రఖియే! పరవానై’ అన్నది రెండు చేతులు పట్టేసి జబీన్‌.
‘అమ్మో.. వద్దాపా! ఆయన కోప్పడతడు. అస్సలొద్దు.. ఆయనకిట్లాంటివి ఇష్టముండవు..’ రుబీనా మొఖంలో నవ్వు మాయమైంది..
జర ఇబ్బందిగ అనిపించినా జబీన్‌ మనసు ఖుష్షయింది. సరే ననుకుంట పైసలు తీసేసుకొని ప్రేమగా అలాయ్‌బలాయ్‌ ఇచ్చింది రుబీనాకు. మల్ల రుబీనా మొఖంల నవ్వు అలుముకుంది.
పైసలు తీసుకోనందుకు జబీన్‌ ఏమన్నా ఫీలయిందేమోనని, ‘మేం గుడ ఒకసారి మీ ఇంటికొస్తంలే ఆపా! ఇక్కడికి దగ్గర్నే అన్నరు గదా!’ అన్నది.
ఏమనాలో తోయలేదు జబీన్‌కు. క్షణాల్ల సోంచాయించింది-
‘లేదు ఆపా! మేం ఇల్లు మారబోతున్నం. ఎటు ఎల్తమో ఏమొ.. మల్ల చెప్తం లే ఆపా..!’ అన్నది, ఇల్లు మారే ఉద్దేశం లేకున్నా!

లెటర్స్

 

prajna“అమ్మా, నేనొచ్చేశా” అని అరుచుకుంటూ చైత్ర ఇంట్లోకి వచ్చి, బాగ్ కుర్చీలోకి విసిరేసింది.

“ఏంటి తొందరగా వచ్చేశావు? రాత్రి టాస్క్ లు ఉన్నాయా, మళ్ళీ పని చేయాలా ఏంటి?” మంచి నీళ్ళు తెచ్చి ఇస్తూ కౌసల్య అడిగింది.

“లేదు లే, మా సర్వర్ లు అన్నీ డౌన్ అయిపోయాయి, ఇంటికెళ్లిపోవచ్చు అన్నారు. మనం ఇలాంటి అవకాశాలని వదులుకోము కదా, వచ్చేశాను” చైత్ర చెప్పులు విప్పుతూ చెప్పింది. కానీ అది నిజం కాదు. నిన్న రాత్రి నుండి తన మనసు మనసులో లేదు. అమ్మ కి ఆ విషయం చెప్పటం ఇష్టం లేక ఆఫీస్ లో ప్రాబ్లం అని అబద్ధం చెప్పింది.

“మంచిది. ఇప్పుడే ‘ద రింగ్’ సినిమా చూద్దామని అనుకుంటున్నాను. హారర్ సినిమాట కదా. నువ్వు కూడా చూద్దువుగాని, కాళ్ళు చేతులు కడుక్కొని రా” అని కౌసల్య అంటూ ‘ఐపాడ్’ ని టీవీకి కనక్ట్ చేసింది.

“ఐపాడ్ లో ఏముంది? ఆన్లైన్ దొరికిందా ప్రింటు? అయినా ఈ హారర్ సినిమాలు ఇష్టం ఏంటమ్మా నీకు? నాకు చాలా భయం” చైత్ర చేతులు తుడుచుకుంటూ అడిగింది.

“నీకు మీ డాడీ పోలికలు వచ్చాయి లే గాని, మైక్రోవేవ్ లో మన ఇద్దరికీ టీ ఉంది. నాకు పొద్దున నుండి ఒంట్లో బాగోలేదు, ఓపిక లేదు. సొ నువ్వే, ఒక నిముషం చాలులే , టీ వేడి చేసుకొని తీసుకురా. సినిమా స్టార్ట్ చేస్తున్నాను”

“ఎంటో, నాకంటే ఎక్కువ టెక్నాలజీని ఫాలో అవుతున్నావుగా అమ్మా అసలు” చైత్ర ఆశ్చర్యంగా “అయినా ఏమైంది? జ్వరమా?” అని అడిగింది.

కౌసల్య టీచర్ గా పనిచేసేది. పెళ్లి చేసుకున్నాక తను చాలా మారిపోయింది. పెళ్లికి ముందు ఉండే ఉత్సాహం, జీవితంలో ఏదో సాధించాలనే ఆశ ఇలాంటివి ఏవీ పెళ్లి అయ్యాక తనలో కనిపించలేదు. కూతురు ఉద్యోగం చేసే వయసుకు వచ్చేసరికి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. కానీ టీవీ సీరియళ్లు చూస్తూ లేదా  వాళ్ళ మీదా వీళ్ళ మీదా నేరాలు చెప్పుకుంటూ, ఏదోలాగా కాలక్షేపం చేయటం ఇష్టం లేక చైత్ర చేత ఐపాడ్ తెప్పించుకొని తనకి అంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుంది. చిన్నప్పుడు కుదరలేదు కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల్లో తనకి ఇష్టమైన కర్నాటిక్ సంగీతం నేర్చుకుంటోంది. అలాగే యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే భర్త, కూతురికోసమని రకరకాల వంటలు చేసి పెడుతూ ఉంటుంది.

తన భర్త విక్రమ్ కూడా పెళ్ళికి ముందు చలాకీగా, కలుపుకోలుగా ఉంటూ ఉండేవాడనీ, పెళ్లి అయ్యాక మరీ మెకానికల్ గా తయారయ్యాడు అని విక్రమ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. కౌసల్యకి, విక్రమ్ కి పెళ్లి అయి పాతిక సంవత్సరాలు అయినా కూడా, వాళ్ళిద్దరి మధ్యా ఎక్కువ మౌనమే ఉండేది. పిల్లల ముందు తల్లిదండ్రులు స్నేహంగా ఉండాలి అని వాళ్ళ నమ్మకం. అందుకే చైత్ర ముందు మామూలుగా ఉంటారు కానీ నిజానికి ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోరు. చైత్ర కోసం చుట్టాల ఇంటికి, లేదా బయట హోటళ్ళకి, సినిమాలకి తీసుకువెళ్ళేవారు. కానీ వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటే వేరేలా ఉండేవారు. ఇది వినటానికి విడ్డూరంగా ఉన్నా చాలామంది ఇళ్ళలో ఉండే వ్యవహారమే. పిల్లలు పుట్టాక భార్యాభర్తలు కొంత దూరమవుతారు. దగ్గర అవటానికి ప్రయత్నించకపోతే ఇంక వాళ్ళిద్దరి మధ్య శూన్యమే మిగులుతుంది.

కానీ కౌసల్య, విక్రమ్ లది వేరే కేసు. పెళ్లి అయినప్పటినుండి వీళ్ళు స్త్రేంజెర్స్ లాగా బ్రతుకుతున్నారు. చైత్ర వీళ్ళ జీవితంలోకి రాక ముందు కేవలం రూమ్ మేట్స్ లాగా ఉండేవారు. కలిసి చేసిన పనులు చాలా తక్కువ. చైత్ర పుట్టాక బాధ్యతలు పంచుకోవడం మాత్రం కలిసి చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరి మధ్య బంధం స్త్రేంజెర్స్ కి ఎక్కువ, స్నేహానికి తక్కువ అని అనటంలో అతిశయోక్తి లేదు. చైత్ర ఇంట్లో ఉన్నంత సేపు వాతావరణం చాలా లైవ్లీ గా ఉంచటానికి విక్రమ్, కౌసల్యలు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. చైత్రకి చిన్నతనంలో ఏమీ తెలిసేది కాదు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ ఇంట్లో పరిస్థితి అర్ధమవుతోంది. అమ్మ, డాడీ మధ్య ఉన్న బంధం అంతంతమాత్రంగానే ఉందని తనలో ఒక చిన్న కన్ఫ్యూజన్ మొదలయ్యింది.  అందులోనూ ఆలోచించగా ఆలోచించగా నిన్న రాత్రి తనుచేసిన పని తప్పుగా అనిపిస్తోంది.

చైత్ర ప్రశ్న కి జవాబు ఇవ్వకుండా“ఏంటి లేటు? తొందరగా రా” కౌసల్య అరుపుకి చైత్ర టీ లేకుండానే దగ్గరకొచ్చి “అమ్మా” అని నెమ్మదిగా పిలిచింది.

చైత్ర ఖాళీ చేతులనీ చూసి, “ఏంటి? టీ ఏది? పోనీ నీకు అంతగా భయమేస్తే వెళ్ళి పడుకో కాసేపు. నేను సినిమా అయిపోయాక లేపుతానులే”అని కౌసల్య చాలా కాజుయల్ గా అంది.

“కాదు అమ్మా. నీకో విషయం చెప్పాలి. నువ్వు ఏమి అనకూడదు, అనుకోకూడదు” చైత్ర ధైర్యంగా చెప్పింది.

“అబ్బో, సినిమా డైలాగ్ ఆ బాగుంది. చెప్పు ఏంటి సంగతి? సస్పెన్స్ వద్దు. అసలే ఇవాళ నాకు బి‌పి ఎక్కువగా ఉంది”

“నిన్న నేను ఆ పాత పెట్టెలో నా సర్టిఫికేట్ వెతుకుతున్నప్పుడు, ఒక బ్లాక్ బాగ్ కనిపిస్తే, తీసి..” ఇంకా తన మాటలు పూర్తి అవకుండానే, కౌసల్య అందుకొని “ఓపెన్ చేశావా?” సీరియస్ గా అడిగింది.

“సారీ అమ్మా, ఒక లెటర్ చదివి ఆపేద్దామనుకున్నాను. బట్..” అని చైత్ర మాట్లాడటం ఆపేసింది.

“సరే. ఇంక ఆ విషయం వదిలేసేయ్”

“ఓకే”

కాసేపు అక్కడ మౌనం రాజ్యమేలింది. ఆ ఇంటికి విక్రమ్, కౌసల్య మధ్య మౌనం అనే ఆట అలవాటే, కానీ ఈ సారి విక్రమ్ బదులు చైత్ర ప్లేయర్.

“ఒకటి చెప్పు. బ్లాక్ బాగ్ లో ఇంకేమైనా చదివావా? అయినా దాని మీద పర్సనల్ అని నా పేరు ఉంది కదా? మ్యానర్స్ లేవా నీకు?” టెన్షన్ పడుతూ కౌసల్య అడిగింది.

“లేదమ్మా. లెటర్స్ తప్ప ఇంకేమీ చదవలేదు. సారీ అమ్మా” ఇంకేం మాట్లాడాలో అర్ధాంకాక చైత్ర వచ్చి కౌసల్య ని హగ్ చేసుకుంది.

“కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి ప్లీజ్” కౌసల్య అనేసి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది.

అమ్మ ఎప్పుడూ ఇలా సీరియస్ అవ్వడం చూడని చైత్ర తను చాలా తప్పు చేసింది అని గ్రహించి ఎలాగయినా అమ్మని మచ్చిక చేసుకోవాలి అని రాత్రి వంట చేద్దామని నిశ్చయించుకుంది. గూగుల్ లో బిర్యానీ ఎలా చేయాలో చూసి, మూడు గంటలు కష్టపడి బిర్యానీ చేసింది.

“డాడీ వచ్చే టైమ్ కూడా అయింది. ఇంక అమ్మని కూడా తినటానికి రమ్మంటాను” అని రూమ్ తలుపు రెండు సార్లు తట్టింది. ఎంతకీ ఓపెన్ చేయకపోయేసరికి, తలుపుని కొంచం తోసి మంచం మీద నిర్జీవంగా ఉన్న కౌసల్య ని చూసింది. పల్స్ చెక్ చేసి వెంటనే ఆంబ్యులెన్స్ కి, విక్రమ్ కి కాల్స్ చేసింది. ఆంబ్యులెన్స్ తో పాటు టైమ్ కూడా పరిగెట్టింది. అప్పటికే చనిపోయిన కౌసల్య ని హాస్పిటల్ లో డాక్టర్ చెక్ చేసి ‘నేచురల్ డెత్’ అని కన్ఫర్మ్ చేశారు.

———————

కౌసల్య గుండెపోటుతో పోయి సరిగ్గా నెల అయింది. రోజూ అమ్మ గుర్తొస్తూ చైత్ర ఏడుస్తోంది. విక్రమ్ కి మాత్రం ఏడుపు రావట్లేదు. ‘ఇంత బండబారిపోయానా’ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉన్నాడు. కానీ జీవితం సాగాలి కాబట్టి రొటీన్ లైఫ్ లో పడిపోయాడు. ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళకి కాఫీ, భోజనాలు చేసి పెట్టడమే తప్ప ఇంక పెద్దగా ఇంట్లో ఏమి జరగట్లేదు. అప్పటిదాకా కౌసల్య గురించి చైత్ర, విక్రమ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఆ రోజు మాత్రం ఎందుకో విక్రమ్ కి కౌసల్య బాగా గుర్తొచ్చింది.

కాలెండర్లో తేదీ చూశాడు. ఫిబ్రవరి 14. మదిలో ఏవేవో జ్ఞాపకాలు మెదిలాయి. ఎంతో బాధగా, దిగులుగా ఉంది. కూతురు అంటే అమితమైన ప్రేమ. చైత్ర మొహం చూస్తే తనకి ఏం కష్టమొచ్చినా  దానిని ఎదురుకునే ధైర్యం వస్తుంది అని అతని నమ్మకం.

“చైతూ” ప్రేమగా పిలిచాడు. డాడీ గొంతు ఏదో వేరేగా వినిపించటంతో పరిగెత్తుకుంటూ వచ్చి “ఏంటి డాడీ?” అని అడిగింది. “సినిమా కి వెళ్దామా?” విక్రమ్ బ్లాంక్ గా అడిగాడు. “సినిమాకా?” అని తటపటాయించి, “ఏం సినిమా?” అని అడిగింది.  పేపర్ తిరగేస్తూ, “ఔయిజా అంట” అని అన్నాడు.

“డాడీ అది హారర్ సినిమా” అని ఒక క్షణం ఆగి, “డాడీ మీకో విషయం చెప్పాలి” అని అనేసి, లోపలకి గబగబా వెళ్ళి, ఒక నల్ల బాగ్ తీసుకొచ్చి విక్రమ్ కి ఇస్తూ, దగ్గరగా కూర్చుని అంది.

“ఏంటిది?” విక్రమ్ నల్ల బాగ్ ఓపెన్ చేస్తూ అడిగాడు.

“అమ్మకి హార్ట్ అట్టాక్ రావటానికి నేనే కారణం. పాపం అమ్మ ఎవరినో ఇష్టపడింది డాడీ. నేనేమో సిగ్గులేకుండా మొత్తం పర్సనల్ లెటర్స్ అన్నీ చదివేశాను. అమ్మ ఆ పాత విషయాలు అన్నీ మర్చిపోయి, మీతోనే ఇంక జీవితం అని ఫిక్స్ అయి, హాపీ గా ఉంటున్న సమయంలో నేనే పిచ్చి దానిలాగా ఈ లెటర్స్ విషయం గుర్తుచేశాను. నేనే అమ్మ మెమరీస్ ని ట్రిగ్గర్ చేశాను అనవసరంగా…” చైత్ర ఏదో చెప్తునే ఉంది, విక్రమ్ మాత్రం వినట్లేదు. ఒకే ఒక్క లెటర్ చూశాడు. చిన్నపిల్లాడిలాగా ఏడవటం మొదలుపెట్టాడు.

“డాడీ ఏమైంది డాడీ?” అంటూ చైత్ర ఖంగారు పడింది.

ఏడుస్తూనే తన చూపుడు వేలితో విక్రమ్  లెటర్ ని, తనని మార్చి మార్చి చూపిస్తున్నాడు. ముందు చైత్ర కి అర్ధంకాలేదు. సడన్ గా ఏదో అర్ధమయినట్లు “ ఏంటి ? ఈ ఉత్తరాలు రాసింది మీరా? అంటే మిమ్మల్నే అమ్మ ఇష్టపడిందా?” అయోమయంగా అడిగింది.

విక్రమ్ ఏడుపు ఆపలేదు. చైత్ర తీసుకొచ్చిన నీళ్ళు తాగి, కొంచం కంట్రోల్ చేసుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు

“నేను ‘విహారి’ అనే కలం పేరుతో నా ఫ్రెండ్స్ కి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని. ఎందరో పెన్ పాల్స్ ఉండేవారు నాకు. అందులో నాకు బాగా ఇష్టమయిన పెన్ ఫ్రెండ్ ‘శివరంజని’. ఆమెకి సంగీతం ఎంతో ఇష్టం. హిచ్ కాక్ సినిమాలు ఇష్టం. మేము ఇద్దరం రెండే రెండు నెలలలో వందలకి పైగా ఉత్తరాలు రాసుకున్నాము. ఈ వంద లెటర్స్ ద్వారానే మేము బాగా క్లోజ్ అయ్యాము.  మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్దాము అనుకున్నాను నేను. ఆమె మాత్రం తన ఫీలింగ్స్ ఎప్పుడూ చెప్పలేదు. కానీ నువ్వు చూశావుగా ఆ లెటర్స్ లో తను రాసిన భావాలు బట్టి నేను కూడా తనకి ఇష్టమే అని నాకు అనిపించింది. ఒక రోజు సడన్ గా“ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి కుదిర్చారు. ఇదే నా ఆఖరి లెటర్” అని లాస్ట్ ఉత్తరం వచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. నాక్కూడా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఆ కోపంలో వచ్చిన మొదటి సంబంధం కి ఓకే చెప్పేశాను. మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిన రోజునే నేను మీ అమ్మకి చెప్పాను, నాకు ఇంటరెస్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నానాని. తను మాత్రం ఏం అనలేదు. పైగా ఇంట్లో వాళ్ళ ముందు మాత్రం హాపీ గా కనిపించాలి అని చెప్పి నాతో కోపెరేట్ చేసింది. నాతో చాలా స్నేహపూర్వంగా ఉండేది. నేనే సరిగ్గా రెస్పోండ్ అయ్యేవాడిని కాదు. పెళ్ళయి ఏడాది అయ్యిందో లేదో ఇంట్లో వాళ్ళు ఒక మనవడినో, మనవరాలినో కనివ్వండి అని మొదలెట్టారు. ఒక రోజు కౌసల్య వచ్చి ‘మనలో ఒకరికి ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని, అందుకే పిల్లలు పుట్టడం కష్టం అని ఇంట్లోవాళ్లకి చెప్పి మనం ఒక అమ్మాయిని దత్తతు చేసుకుందాము’ అనొక ఐడియా ఇచ్చింది. అలా మేనేజ్ చేయటమే మంచిది అని నాక్కూడా అనిపించింది.  అప్పుడు కౌసల్య నా మనస్థితిని అర్ధంచేసుకుంది, ఎంత మంచిదో అని అనుకున్నాను. కానీ ఇలా…”

విక్రమ్ కి దుఃఖం పొంగుకొచ్చింది.

ఎంతో ధీర్గంగా వింటున్న చైత్ర“అంటే, నేను…” అని, బ్లాక్ బాగ్ లో ఒక ఎన్వెలోప్ తీసి ఓపెన్ చేసి చూసింది. సొ అమ్మ ‘ఇంకేమైనా చదివావా, చూశావా’ అని అడిగింది దీని గురించే అన్నమాట.  తన ‘అడాప్షన్ సర్టిఫికేట్’ చూసి, చైత్ర కూడా ఏడవటం మొదలుపెట్టింది.

పాతికేళ్లు దాచి ఉంచిన లెటర్స్ . ఒకరికి తన పుట్టుక గురించిన నిజం తెలియజేప్తే, మరొకరికి తను మిస్ అయిన జీవితం గురించిన నిజం బయటపెట్టాయి. రెండు గంటలు విక్రమ్, చైత్ర ఏడుస్తూనే ఉన్నారు. చైత్ర ముందుగా తేరుకొని “డాడీ” అంది. చైత్ర వైపు చూశాడు విక్రమ్. తనకే కాకుండా చైత్ర కి కూడా లెటర్స్ బాధ కలిగించాయి అని రియలైజ్ అయి  “చెప్పమ్మా” అన్నాడు.

“అమ్మకి విహారి అంటే ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ నువ్వంటే మాత్రం బాగా ఇష్టం. ‘ఏంటమ్మా డాడీ అస్సలు నిన్ను, నీ హెల్త్ ని పట్టించుకోరు’ అని నేను ఎన్ని సార్లు అడిగానో తెలుసా? అప్పుడు నాకు చెప్పేది-‘మీ డాడీ కి మనం ఇద్దరం బాగా ఇష్టం, అందుకే అంత కష్టపడి సంపాదిస్తున్నారు’ అని. అమ్మ ఆ రోజు చాలా బాధ పడినట్లు ఉంది, కానీ నేను ఆ లెటర్స్ చదివినందుకు కాదు డాడీ.. నేను మీ కన్న కూతుర్ని కాదు అన్న నిజం నాకు తెలిసిపోయినందుకు. లేదా ఇన్నాళ్ళు అమ్మ మీ మీద పెంచుకున్న ప్రేమ కంటే తన లెటర్స్లో ఉన్న మనిషి మీద ఇష్టమే ఎక్కువ అని నేను ఎక్కడ అనుకుంటానో అని.   అమ్మ గతం మర్చిపోయి నీతో ఎంత సంతోషంగా ఉండాలి అనుకుందో పాపం, నేను అర్ధం చేసుకోగలను. అయినా అమ్మకి హారర్ సినిమాలు, సంగీతం ఇష్టం అని తెలియదా నీకు? అవి తెలిసుంటే శివరంజని యే అమ్మ అని తెలిసి ఉండేది కదా? మరి అమ్మకి మాత్రం నీ ఇష్టాలు అన్నీ ఎలా తెలుసు డాడీ? అంటే నిజంగానే అమ్మ గురించి నీకు ఏమీ తెలియదన్నమాట. ఎంత పని చేశావు డాడీ, అమ్మని అర్ధం చేసుకోలేదు నువ్వు. తప్పు చేశావు డాడీ, 25 ఏళ్ల నుండి… నీకు ఒక్కసారి కూడా అమ్మ ని అర్ధం చేసుకోవాలని అనిపించలేదా డాడీ?”అని కోపంగా అడిగింది.

దుఃఖాన్ని మింగుతూ “చెప్తున్నాను కదా. పెళ్లి అయిన తరువాత ఇంట్లో నాకు ఒక భార్య ఉంది అని నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు. నేను శివరంజనినే ఇష్టపడ్డాను. తనతోనే జీవితం అనుకున్నాను. నన్ను మోసం చేసింది అని ఇంక నాకు జీవితం మీద విరక్తి వచ్చింది. అలాగ అని చచ్చిపోయే అంత పిరికివాడిని కాను. లైఫ్ షుడ్ మూవ్ ఆన్. అలాగే అనుకోని ఇన్నేళ్లు బ్రతికేసాను. పెళ్లి అయ్యాక నా అభిరుచులు అన్నీ మారిపోయాయి. అందుకే మీ అమ్మకి నేను విహారిగా ఎప్పుడూ అనిపించి ఉండను. నా తలరాత.  నా శివరంజని తోనే ఒకే ఇంట్లో పాతికేళ్లు ఉండి కూడా గుర్తుపట్టలేకపోయాను. నా అంత దురదృష్టవంతుడు ఎవడైనా ఉంటాడా ఈ లోకంలో? నన్ను క్షమించు. నిన్ను ఎప్పుడూ సంతోషపెట్టలేదు. నిన్ను మర్చిపోలేను నేను. నువ్వు లేకపోతే ఏం చేయాలి కౌసల్యా? ఐ యాం సొ సారి కౌసల్యా !  ” అని పైకి చూస్తూ శోకంతో కన్నీరు కార్చాడు.

“ఒకటి మాత్రం నిజం చైతూ. నిన్ను ఎప్పుడూ మేము కన్న తల్లిదండ్రులలాగే యే లోటూ రాకుండా చూసుకున్నాము, ప్రేమగా  పెంచాము. నన్ను అసహ్యించుకోకు ప్లీజ్.  ఐ ఆల్వేస్ లవ్ యు” అని చైత్రని దగ్గరకి తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు.

“ఐ నో డాడీ. అమ్మ కి ఛాన్స్ వచ్చినా నన్ను తిట్టలేదు. ఎప్పుడూ కొట్టలేదు. ఇంత ప్రేమగా యే పేరెంట్స్ ఉండరు కూడా. ఐ లవ్ యు డాడీ” అని కళ్ళు మూసుకొని “ అండ్ ఐ మిస్ యు అమ్మా” అని మనసులో అనుకుంది.

ఒక గంట తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు విక్రమ్ కళ్ళు తుడుచుకుని చైత్రతో “పదా” అన్నాడు.

హఠాత్తుగా  అలా అడిగేసరికి “ఎక్కడికి డాడీ?” ఆశ్చర్యంగా అడిగింది చైత్ర.

“కౌసల్యకి ఇష్టమైన హారర్ సినిమాకి…”

“Letting go means to come to the realization that some people are a part of your history, but not a part of your destiny.”  Steve Maraboli

***

ఎవరు కవి?

 డా. కోగంటి విజయ బాబు

KVB photo

‘ ఉగాది ముందు రోజు విరాట్ కవి సమ్మేళనమట విన్నావా ‘ అడిగాడు మూర్తి ఆసక్తిగా.

‘ ఆ నిన్నే తెలిసింది ‘ అన్నాను కొంత చిరాగ్గా.

‘ అదేమిటి, కవిత్వమంటే చెవి కోసుకుంటావు గదా’ అన్నాడు మూర్తి.

నేనేమీ మాట్లాడలేదు. కాసేపాగి అడిగాను. ‘సరే  ఉదయమా, సాయంత్రమా ?వెళ్దామా?’  అని.

‘సాయంత్రమే! వెళ్దాం గురూ కాస్త టైం పాస్ గా ఉంటుంది’ ఉత్సాహంగా చెప్పాడు మూర్తి.

నాక్కొంచెం ఆశ్చర్యమేసింది. ఎప్పుడూకవిత్వమంటే ఆసక్తి చూపించని మూర్తి ఉన్నట్లుండి ఇలా గుర్తు చేసి మరీ అడుగుతుంటే. 20 వ తారీకు సాయంత్రం ఐదు గంటలకే ఇంటి దగ్గర తయారయ్యాడు మూర్తి. లాల్చి పైజమా భుజాన వేలాడే ఓ గుడ్డ సంచి తో సహా.

‘ ఏం మూర్తి నువ్వు కవి వేషం ధరించావ్?’ అడిగాను నవ్వుతూ.

‘ఎంతైనా కవి సమ్మేళనం కదా’ అన్నాడు. అంటూనే జేబు లోంచి ఓ డబ్బా తీసి ఒక ఆకుపచ్చని గుళిక నోట్లో వేసుకున్నాడు . ‘ఏమిటో అది.’ అడిగాను ఆసక్తిగా. ‘గొంతులొ కిచ్ కిచ్ ని దూరం చేసే కొత్తా హాల్స్ గుళికలు. ఒకటికొంటే ఒకటి ఫ్రీ’. అన్నాడు ఎడ్వర్టైజ్ మెంట్ లా.

‘ఓటి గానీ వేస్తావేమిటి?’ అంటుండగానే నేను తయారయ్యాను. ఇద్దరం కలిసి స్కూటర్ మీద బయలుదేరాం.

*        *        *

పదిహేను నిమిషాల్లో  సభాస్థలి చేరుకున్నాం. జనం బాగానే తయారయ్యారు. ‘ఈ మధ్య కవిసమ్మేళనాలకూ జనం బాగా వస్తున్నారు గురూ’ అన్నాడు మూర్తి. ‘ఇంట్లో కూర్చుని ఆ చెత్త టివి ప్రోగ్రాములు చూసేకన్న ఇది నయం కదా’. అన్నాన్నేను.  పెద్దవాళ్ళు,  మధ్య వయస్కులు,నాలాగా మూర్తి లాగా ఓ ముఫ్ఫై నలభై మంది ఉంటారేమో. స్టేజ్ పైన ‘విరాట్ కవిసమ్మేళనం’ అనే బేనర్, ఓ పదిహేను ఇరవై కుర్చీలు, ఓ పక్కగా ఇరవై మంది కవుల పేర్లు,- చాలా అట్టహాసంగా ఉంది ముస్తాబు. ‘ఇంత ఖర్చు ఈ రోజుల్లో ఎవరు భరిస్తున్నారో’ అనుకుంటూ ఉండగా, మూర్తి ఎవర్నో చూసి ఇప్పుడే వస్తానంటూ పరిగెత్తాడు.

కిర్లా కుంభేశ్వర భండారీ – కికుంభం అనుకుంటా. ప్రఖ్యాత విమర్శకుడు. వ్యాఖ్యాత. ఆయన్ను చూడగానే భుజాన వేలాడుతున్న సంచి లోంచి ఓ డైరి లాంటి దాన్ని తీసి ముందు గానే గుర్తుపెట్టుకున్న ఓ పేజి దగ్గర తీసి చదువుతున్నాడు. కికుంభం నడుం మిద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని నొసలు చిట్లిస్తూ వింటున్నాడు. ఈ లోపు మైకు దగ్గర ప్రకటన. ‘రసాస్వాదులందరికి ఆహ్వానం’ అంటూ. ‘కార్యక్రమం మొదలౌతుంది కాబట్టి అందరు తమ తమ స్థానాల్లో కూర్చోవాలి’ అని చెబుతున్నారు.

Kadha-Saranga-2-300x268

మూర్తి కొసం చూస్తే రావడం లేదు. నేనే, వీలున్నపుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బయటికి ఎప్పుడైనా వెళ్ళేలా నాకు, మూర్తికి రెందు కుర్చీలు చూసాను. మైకు దగ్గర ఎవరో పిల్లలు  చేరి పాటలకు సమాయత్తం అవుతున్నారు. నిర్వాహకులు హడావుడిగా తిరుగుతున్నారు. ఒక్కొక్కరే కవి దిగ్గజాలందరు రాష్ట్రం నలువైపులా నుండి వస్తున్నట్లున్నారు. సరస కవులు, స్వభావ కవులు, వాస్తవిక కవులు, విప్లవ కవులు, అతివాద, మితవాద, స్త్రీవాద కవులు, కవయిత్రులు అందరు మొదటి వరస లో కూర్చుంటున్నారు. లౌకిక వాతావరణం ఏర్పడేలా అన్ని సామాజిక వర్గాల కవులు ఆహ్వానిప బడ్డారు.

సభ మొదలైంది. సభా వ్యాఖ్యాత గంభీర వాచస్పతి గరుడనాథం ముందుగా కవులనందరినీ ఒక్కొక్కరిగా వేదిక మీదకు ఆహ్వానించాడు. ప్రార్ధన జ్యోతి ప్రజ్వలన లాటి కార్యక్రమాలు కాగానే ప్రారంభోపన్యాసం మొదలైంది. కవిత్వం గురించీ, కవిత్వ ప్రస్థానం గురించీ దంచి పారేస్తొంది  ఈ సభాస్థలి దాత. దాదాపు రాతి సభకు ఆధ్యాత్మికమైనా, సాహిత్యమైనా,సంస్మరణైనా ఆమె ఉండాల్సిందే. ఉన్నట్లుండి ఆమెలో ఉన్న కవయిత్రి మేల్కొంది. ‘నాకు కవిత్వం రాదు కాని కవిత పాడతానూ.కోకిల కెవరు నేర్పారూ, చేప కెవరు నేర్పారూ, నేనూ పాడగలనూ’ అంటూ రాగాలు తీస్తూ అవే వాక్యాల్ని అటూ ఇటూ మార్చి మార్చి పాడుతోంది. ఆమెను చప్ప్పట్లతో ఉత్తేజపరుస్తున్నారు. ఇంత డబ్బు విరాళంగా ఇచ్చింది గదా మరి. అనేక సభలలో పాల్గొన్న అనుభవం, శ్రుత పాండిత్యం తో కూడిన సోదాహరణ ప్రసంగం పూర్తయేసరికి మరో గంట పట్టింది. ఆమె ఉపన్యాసం కాగానే ఆమె మరొక కార్యక్రమంలో పాల్గొనాలి కాబట్టి ఆమె కు దుశ్శాలువ తో సన్మానం. నేనూ మూర్తి వైపు అసహనంగా చూసాను. కానీ మూర్తి ఈ లోకంలో ఉన్నట్లు లేడు. నోరు తెరుచుకు మరీ వింటున్నాడు. అసలు కవిసమ్మేళనం మొదలయ్యే సరికి ఎనిమిదయ్యింది. ఒక ప్రముఖ విప్లవ కవి తో మొదలైంది. ‘ఉగాదికి సిగ్గులేదు’ అంటూ. ధరలు పెరిగాయని, పేదవాడికి స్ప్రైట్ దొరకడం లేదని, ఏసీ లు కొన్న వాళ్ళని, ఎల్యీడి టివీ లు చూసేవాళ్ళను దుమ్మెత్తి పోసి కూర్చున్నాడు. కాదు సమయం దాటుతోందంటూ కూర్చోబెట్టారు. తరువాత నుదిటిన పెద్ద బొట్టుతో సాంప్రదాయ పంచకట్టుతొ  ఉన్న ఓ సాంప్రదాయ కవి సీసపద్యాల్లో ఉగాది కోయిలను ఆహ్వానిస్తున్నాడు. అవే భావనలు. ఉగాది రుచులు. చందోబద్ధ మయేసరికి భక్తిగా వింటున్నారు.

afsar.evaru kavi

తరువాత ఒక ఆధునిక మొల్ల ను ఆహ్వానించారు. నగరంలో జరిగే ప్రతికవిసమ్మేళనాలకూ ఈమె తప్పని సరిగా రావాల్సిందే! స్త్రీ వాద రచయిత కావడంతో స్వచ్చ భారత్ ను, ఉగాదిని , దుష్ట పురుషుల కవితా వస్తువులను కలిపి ‘ ఉడ్చేసే ఉగాది’ అనే కవిత ను చదివింది. నేనూ మళ్ళీ మూర్తి వైపు చూసాను. ఇంతలో ఒక ఆధునిక కవి లేచి ఎవరికీ అర్ధం కాని కవితొకటి విచిత్రవాక్యాలతో అమర్చి చదివి, ‘ ఇది తనకు సరైన వేదిక కాదనీ మీకు అర్ధం చేసుకునే శక్తీ లేదని’ అన్నట్లుగా నవ్వి కూర్చున్నాడు.

ప్రొద్దుట్నుంచీ అలసి ఉండటంతో కొంచెం కునుకు పట్టింది. మగతగా శబ్దాలు. మూర్తి కూడా రంగస్థలం మీద చోటు సంపాదించాడు.  చాలా పెద్ద కవిత. ఒక ఇరవై నిముషాలు చదివాడు. ‘గాయం ఎలా మానుతుంది?’ అనే కవిత.  అందరితో పాటు మూర్తికి సన్మానం చేస్తున్నారు. ఇంతలో బాగా తూగు రావడంతో మెలకువ వచ్చింది. ప్రక్కన చూస్తే మూర్తి , విమర్శకుడు కికుంభం. ఇద్దరు కలిసి తీవ్రంగా చర్చిస్తున్నారు. ‘ఇదంతా కలా? మూర్తి చదవడం, సన్మానం,అవున్లే ఇంతటి దిగ్గజాలు అతన్ని రానిస్తారా?’ నాలో నేనే నవ్వుకున్నాను.

 

కవి సమ్మేళనం పూర్తి కాకుండానే మూర్తి కేదో ఫోన్ కాల్. అవతలకెళ్ళి మాట్లాడుతున్నాడు . దగ్గరకొచ్చి, ‘ఇంటి కెళ్దామా? ‘ అన్నాడు గాభరాగా.

‘ ఏరా ఏమయింది?’ అనడిగాను. ‘తాను ఫోన్ చెసింది.’ నాన్న ఫోన్ చేసారట. మళ్ళి ఏదో సమస్య.’ అన్నాడు.

నలుగురు అన్నదమ్ములలో తలిదండ్రులను కనిపెట్టి ఉండేది మూర్తి ఒక్కడే. జలుబు చేసినా సరే పరుగెత్తుకెళ్ళి చూసి వస్తాడు. తమ తాతల ఇల్లంటే ప్రాణం  అంటూ తమ బాల్యాన్ని నెమరువేసుకుంటూ  పల్లెను విడిచి రాని తలిదండ్రులంటె పంచ ప్రాణాలు. నేను వెంటనే బయలుదేరాను.

స్కూటర్ మీద మూర్తి ‘నేను మా అమ్మా నాన్న ల మీద ఒక కవిత వ్రాసాను. నాకు బాగా రాయడం రాక పోయినా నా మనసులో ఉన్న భావన వ్రాశాను. ఆ కికుంభం కు వినిపిస్తే ‘ అసలు కవిత్వమంటే ఏమిటో, కాళిదాసు ఎందుకు వ్రాశాడో పద్య కవిత్వం గొప్పతనమేమిటో గురించి అనర్గళంగా మాట్లాడాడు. అసలు మనలాటి వారు కవిత్వమే వ్రాయకూదదంటాడు. తాను చిన్నప్పుడు వ్రాసిన కవిత ను వెయ్యిన్నొక్క సారి చదివాడు. నా కవితలో, భావం సరిగా ఇమడ లేదని, తగిన పదాలు పడ లేదని, ప్రతి వాడు కవిత్వం వ్రాయకుడదని ఇలా ఏవేవో చెప్పాడం’టూ వాపోయాడు. నేను వెంట నే ఇలా అన్నాను.

‘ నిజ జీవితంలో మానవత్వంలేక, ప్రేమ విలువ తెలియక, ఆచరించని సత్యాలు ఎంత అందంగా చెప్పినా ఒకటే –   అన్నీ ఆచరిస్తూ, ప్రేమ పంచిపెడుతూ నీవు నీలాగా మాట్లాడినా ఒకటే. ప్రతివాడు కవిత్వం వ్రాయాలని లేదు. నిజాయితీ ఆత్మా పరి శీలనా లేనివాడు నలుగురి మెప్పు కోసం వ్రాసినా కవి కాలేడు. నిష్కల్మషమైన మనసుతో నీవు మాట్లాడే ప్రతి మాటా కవిత్వమే మూర్తి. బాధపడకు. ముందు వెళ్లి మీ నాన్న ను చూసిరా’ అంటూ వాళ్ళ ఇంటి దగ్గర దించి బయలు దేరాను.

***