పేనందీసుకున్న పాల్తేరు సినఎంకటి

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

డాక్టర్ చింతకింది శ్రీనివాస రావు

 

పాల్తేరు సిన ఎంకటి పుడ్డం ఒక మనిసిగానే పుట్టేడు. కాని, సవ్వడం మటుకు రెండు ముక్కలై సచ్చిపోనాడు. అది కూడా రైలు కిందపడిపోయి. అలగని వొవులూ ఆణ్ని పొగలబండి కింద తోసీనేదు. ఆడికి ఆడే అమాంతం రైలు కిందెల్లి బుర్రెట్టీనాడు. ఆ రైలుతల్లి ఆడి తలని తరిగీసింది. మొండాన్ని ఏరుసేస్సింది. ఇదంతా ఏ రాతిరిమీద జరిగీనాదో మాకయితే తెల్దు. తెల్లారగట్ట మాతరం పట్టాలొడ్డున గడ్డిగోక్కుందావని బుంగా బొరిగ వొట్టుకెల్లిన వంతాడ సూరయమ్మ సూసింది. ఇకనది ఇలగలగ గోలెట్నేదు. ఏడుసుకుంతా ఊల్లోకి పారొచ్చీసి ఎంకటి సావుకబురు అందరికీ సెప్పీసింది. మావందరం అటేపు బయలెల్లేం.

బాబురోయ్‌. ఆ పట్టాలకాడంతా రకతమే. మా సెడ్డ గోరంగుంది. ఎంకటి తలని రైలింజీను వొక్సాసి ఇసిరీసింది. చెరీరేన్ని మరొక్కాసి తోస్సింది. ఈట్ని కలిపీసి కుట్టించీసి ఇత్తావని మా రేగుపాలెం పక్కనున్న ఎలమంచిలి రైలివే పోలీసోల్లు ఎలిపొచ్చీనారు. బారికోల్లసేత పీనిగిని మోయించుకుని పోనారు.
మావూ ఆల్తో పట్టాల మీద నడుసుకుంతానే ఎలమంచిలేపు దారితీస్సేం. మా గురించేటిగానీ, మాతోటే నడిసొచ్చిన మా వూరి కాపుదొర సింగంపిల్లి అప్పారావుగోరు మాతరమూ కల్లనీరు కుండలకొద్దీ కార్సీనారు.

నల్లికిల్లపావునాగ నజ్జుగుజ్జులు పడిపోనారు. మరి సచ్చిపోయిన ఎంకటి గాడు ఆల్ల ఇంటికాడే కదేటి కంబారిపని సేసీది.

ఒక ఎంకటిగాడేనేటి. మా మాలపేట జట్టు జట్టంతానూ అప్పారావుబాబు పొలాలమీదే దినం తీరుసుకుంతారు. ఈల్లకి తక్కువకాదు మా మాదిగపేట మనుసులు. మాలోల్లంతా అప్పారాయేపు కాస్తే, మాదిగోల్లు  రెడిపిల్లి తాతారావు దొరయేపు కాసుకుంతారు. తాతారావు మడిసెక్కల మీద సెవట్ల్లు కారుత్తా మెతుకులు తింతాఉంతారు. ఆ పెద్దగెద్దలిద్దరూ బాగానే ఉంతారు. పుటకొక్కు ల్నాగ దిని, పందికొక్కుల్నాగ బలిసుంతారు. ఈల్ల కోపానికి, తాపానికీ మా తల తక్కువ
మాలోల్లు. బుర్రలేని మాదిగోల్లే  నానా సావూ సత్తుంతారు. మా పాల్తేరు సిన ఎంకటిగాడు సచ్చిందీ ఈల్ల తగూలవల్లే కదేటి. ఆడు రైలుకింద
తలకాయదూర్సీసేడంతే ఉత్తినికే దూర్సీనాడేటి. అలగ దూర్సీడానికి మా దొరబాబులే కదేటి కార్నం, మా రేగుపాలెం పక్కా పెదకాపుల గ్రేమం. ఊల్లో బూవులన్నీ అల్లయే. ఇల్లన్నీ ఆల్లయే. నూతులు గోతులూ అల్లయే. నీతులూ బూతులూ కూడా ఆల్లయే. ఈ పెదకాపుల్నే దొర్లంతారు. అయితే అల్లు పేరుకే అగ్గరజాతిగానీ ఆల్లకేబొక్కా తెల్దు.

సొమ్ముంది కాబట్టికి ఆల్లకి సెలామనీ. వొవుల్దెగ్గిర డబ్బుంతే ఆల్లకి మెడపోత్రం మా నావుగా ఉంతాదంతారే. సరీగా మా దొరగార్లకి ఈ మాట సమానింగా
సరిపోద్ది. ఆల్ల కొవ్వంతా వొప్పుడూ మావూరి పేదనంజికొడుకులమీదే.

Kadha-Saranga-2-300x268

ఊల్లో  నాలుగు కొంపల బేమ్మలున్నారు. మరో పుంజీడు రాజుబాబుల దేవిడీలున్నాయి. ఈ ఎనిమిది కుటంబాల్నీ బగముంతుల్లా సూసుకుంతారు
దొరగోర్ల్లు. అల్ల దగ్గర తోకతిప్పరు. కుక్కిన పేనుల్లాగుంతారు. బేమ్మలూ, రాసోల్లూ కూడా మందబలం జాస్తీగున్న కాపుల్తో ఎట్టుకోరు.

పైపెచ్చు మీరూ మావూ పెద్దకులపోల్లమని కాపుల్ని పొంగబెడతారు. ఈ కాపులేమో ముందు ఎనకా సూసుకోకుండా ఆల్ల సంకనాకెత్తుంతారు.  పోనందరూ కలిసీసి ఊర్ని బాగుసేత్తారా అంతే అదేటీనేదు. మావూరి కాపులు పులుల్లాంటోల్లు. మావూరి బేమ్మలు  నక్కల్లాంటోల్లు. ఇంకా సెప్పాలంతే దొంగ వొరల్లాంటోల్లు.
పేదోల్ని ఎలా పీడిరచీయాలో కాపులికి మప్పీది ఈ గొల్లిగోల్లే.

ఇకను, మా అప్పారావు దొర, మా తాతారావు దొర పైవోల్లేటీ కాదు.   సేనా దగ్గరోల్లే. ఈడి సెల్లిని ఆడు, ఆడి సెల్లిని ఈడు కుండమారుపు సేసుకున్నారు. బావా బామ్మర్దులు. అలాంటప్పుడు దొబ్బితినీసి ఒల్లక కూకోవొచ్చు కదేటి. అబ్బే అలగసేస్తే ఇకనేవి. ఒకడిమీద ఒకడికి సెప్పనేనంత దొబ్బుదెగులు. ఈడో పార్టీ అయితే ఆడో పార్టీ. ఈడు ఊరి పెసిరెంటయితే ఆడు మండలానికి పెసిరెంటయిపోతుంతాడు. ఈల్ల మయానా ఎప్పుడూ తగూలు తంటాలే.

ఈ దొర్ల పున్నెవాని  మా మాల, మాదిగ పేట్లు రెండూను పగలు పెంచీసుకున్నాయి. కారపన్యాలకు దిగిపోనాయి. ఇప్పుడు ఆల్లకంటే ఎక్కవగా ఈ పేటోల్లు  రంది పడిపోతన్నారు. పోలీసుటేసన్ల ఉరుసుట్టూ తిరగతన్నారు.

దొర్లకి కోపం రాగానే ముందు దేనిమీద దుస్టెడతారో తవరికి తెల్సా.
ఎగస్‌పార్టీవోల్ల పొలాలమీద, తోట్లమీదానీ. ఈల్ల మద్దెన పుట్టీసిన గొడబలవల్ల మా ఊల్లో మట్టసంగా పెరిగిన ఎన్ని పంటలు ఎన్ని సుట్లు నాశినం
అయిపోనాయో సెప్పనేం. ఎకరాలికి ఎకరాల యూకలిప్టీ  మొక్కలన్నీ రాత్రిరాత్రే ఓ పాలి మాల జట్టు నరికీనాది. ఇందుకు పెతీకారెంగా జీడిమావిడి తోటల్ని
మాదిగోల్లు  నిలువునా సీరీసి పోగులేసీనారు. మరో పాలయితే, పదియేనెకరాల్లోని తాతారావు మావిడి మొక్కల్ని అప్పారావు గేంగీ మొదల్లకి
కూల్సీసింది. పగతో రగిలీసిన తాతారావు ముటా  ఊరుకుంతదేటి. సీతాఫలాలు, దానిమ్మలు, పనసలు, పంపర పనసలు బెమ్మాండమయిన అప్పారావు తోట్లో
సెట్లన్నిట్నీ నిమసాల్లో పీకీసింది. ఇలగ దొరల కచ్చలకి మావూల్లో కూలీసిన తోట్లకి నెక్కాజమా నేదు. పచ్చని సెట్లు అమాంతం ఇరిగి పడినప్పుడు మాతరమూ
మా ఇరు పంచాల ఊల్లోల్లు చాలా బాదగా ప్చ్‌..ప్చ్‌..ప్చ్‌లు కొడుతుంతారు.

మన్లో మనమాట. ముద్దుగా పెరిగిన మొక్కలేటి సేసేయి. ఆట్లికేటి తెలుసు. పగలు గిగలూను. కానీ ఈ ముస్కరముండాకొడకుల బార్ని పడి కునికీనాయి.
పదేల్లు నానా పుర్రాకులూ పడి  గరిటికట్టీసిన మొక్కతల్లి ఒక్క ఏటుకి సచ్చిపోడం గోరం కదా. ఆటి ఊసు అలగొగ్గీండి. ఆట్ని అడ్డంగా నరికీసీటప్పుడు
మా మాలమాదిగజనమంతా కూడానూ సేనా ఇది అయిపోయీవోరు. అయినాగానీ ఎలక్కాదనగల్రు. దొర్ల మాట కాదంతే ఆల్లకి నూకలేయి. ఇలాంటేలే అందరికంటే
ఎక్కవగా జిమజిమలాడిపోయీవోడు మా పాల్తేరు సిన ఎంకటి. దీనికీ మా ఎంకటకీి సంబందం ఏతంతారా. ఆడు, ఆడి  జట్టే అప్పారావు బూవుల్లో తోట్లు పెంచీది.
తాతారావు బూవుల్లో తోట్లు నరికీదీని. ఎంకటిగోడు ఇప్పటికి  ఎన్ని సెట్లు నరికినాడో, ఎన్ని కేసుల్లో ఇరికినాడో, ఎన్ని సుట్లు
బొక్కలోకెల్లొచ్చినాడో సెప్పనేం. అలా నరికి నరికి ఆడికి సార్వీసయిపోనాది. ఒంటికీ ఎనబైయ్యేల్లొచ్చీనాయి. ఈడితోపాటు దొరబాబులూ ముసిలయిపోనారు. కానీ
ఆరి పగలు మాతరం ముసిలికానేదు.

 

ఆ రోజు ఏటయిందో ఏటో తెల్దు. అప్పారావు ఇంటి కాణ్నించి ఎంకటిగాడికి సందేల కబురొచ్చీనాది. ఉన్నపలంగా దొరగారు వచ్చీమన్నారని బారికపెంటయ్య పారొచ్చీసి సేప్పీనాడు. అప్పుడే నానా సాకిరీలు దొరగారి సేలో సేసొచ్చి గంజి తాగతున్నాడు ఎంకటిగోడు. ఆడు ఒంటి మనిసయిపోయి సేనా ఎల్లయింది. దొరకి సేవ సేసి సేసి ఆడి బతుకు సివరికొచ్చీనాది. దొరసానికి సేవ సేసీ సేసీ ఆడి పెల్లాం  పరదేశమ్మ ఈ మద్దెనే నోకం వొగ్గీనాది. నేకనేక పుట్టిన  కూతుర్ని
పక్కూల్లోని మేనల్లుడికే ఇచ్చి సేస్సేడు.  గుడిసిలో ఒంటికాయనాగా సొంటికొమ్మునాగా ఉంతన్నాడు.

‘‘ఏట్రా పెంటా. ఈ టయాంలో బాబుకి ఇంత అరజంటు పనేట్రా’’ బారిక పెంటయ్యని గంజి తాగుతూనే అడిగినాడు ఎంకటి.
‘‘నాకేటి తెలుసు మాయ్యా. నువ్వూ నీదొరా తక్కువేటి. మాకేటి పలానీ పనని సెప్తారేటి. తోలీనారు. వచ్చీనాను’’ సులాగ్గా సెప్పి సుట్టముక్కకి అగ్గి
అడిగీనాడు పెంటగోడు.

‘‘ఓరేట్రా. ఏం పన్రా. సెయ్యడానికేటి జంకునేదుగానొరే. పూరవంనా కాదురా. ఓపికానేదు. మనసూ నేదురా. అయినా అదేం పన్రా. అదేటి మంచిదేట్రా. మనుసుల్ని తన్నడమూను, మొక్కల్ని నరకడమూను. ఓర్నాయిన. ఎన్నెన్ని సెట్లని నరికీనాన్రా. ఇదంతా ఆ బాబు పున్నెమే. ఆ బాబు పాప్మే.’’ అనీనాడు
ఎంకటిగోడు.

‘‘నాకెందుకెయ్‌. మీ గోస. వత్తేరా. నేపోతే దొబ్బీ. దొర సెప్మన్నాడు. సెప్పినానంతే. వత్తానుండుమీ.’’ గుప్పుగుప్పుమంతా సుట్టపొగ వదులుకుంతా
పోనాడు పెంటడు.
గబాగబా గంజినీల్లు తాగీసి, మూత్తుడిసీసుకుని, తలక్కట్టిన సింకి తుమాలు ఇప్పీసీసి, బుజానేసీసుకుని దొరింటియేపు దారీతీస్సేడు ఎంకటి.
ఆడలగ ఎల్లీసరికి అప్పారావుదొర మాంచి అగ్గిమీదనున్నాడు. తాతారావుని అమ్మలకి, అప్పలకీ తిడతన్నాడు. పక్కనే ఉన్న బారిక పెంటయ్య
గడగడలాడిపోతన్నాడు.

‘‘ఈయాల అటో ఇటో తేలిపోవాల్రా ఎంకటీ. ఆ నాకొడకడేమో నాను దొంగసారా కాత్తన్నానని పోలీసోల్లకి నిన్ననే కంప్లయింటెట్నాడ్రా. ఈ సమ్మచ్చరము ఆడి
నోటికి ఒక్కతంతే ఒక్క బొప్పాయి ముక్కా ఎల్డానికి నేదు. ఒక్క పనసతొనా తినీ యోగం అడికుండగూడదు. ఈయాల రేతిరికే మూర్తం ఎట్టండి. మనోల్లందర్నీ
తీస్కెల్ల్లు. ఎల్లీటప్పుడు కనీసం వంద మందిరి ఎల్లండి. మన రేగుపాలెం పక్కనే వలందీపేట్లో బొప్పానపల్ల తోట పదెకరాలు మొన్ననే కొనీనాడు గోసిగోడు.
దానికి అంటింపుగా బలిసిన పనసతోటా కొనీనాడు. అదో అయిదెకరాలుంతాదీ. ఈ జోడు తోటల్నీ సీకటేల సుబ్బరగ సిదివీసి ఎలిపొచ్చీండి. వొవుడైనా అడ్డొస్తే ఆడి
మెడకాయ నరికీండెహే. తోట్లు కొంటాడట తోట్లు’’ తాతారావు మీద ఒంటికాలిమీద ఇరగబడిపోనాడు అప్పారావుదొర.

ఇలాంటియి ఇనడం ఎంకటికి కొత్తగాదు. గేనవచ్చినకాణ్నించి దొరసెప్పినట్టే తాతారావుగోరి మొక్కామోడూ నరుకుతానే ఉన్నాడు. ఇంకా సెప్పాలంతే ఏసిన
పంటలకంటేను దూసిన మొక్కలే ఎంకటి బతుకులో ఎక్కవ. అందుకే, ఈ సుట్టు దొరమాటని ఎంకటి గాడు పెద్దగా నచ్యపెట్నేదేమో. నోరు తెరిసి దొర ముందర
మాటాడ్డం మొదలెట్టీనాడు.

‘‘బాబూ ఒకటీ రెండూ కాదు. ఏబైయ్యేల్లయిందేటో. తవరు సెప్పడం మాం సెట్లని సెండడం. ఇలాంటలాంటి సెట్లని సెండేవేటి. పండీడానికి సిద్దంగున్న సెట్లు
యేలకియేలు నా సేతుల్లో అమాంతం సచ్చిపోనాయి. నేరడు మొక్కలు, గులాబీజాములు, రాంబానాలు, కొబ్బరి నవుజులు, నీలగిరీలు, నారింజలు, నిమ్మలు ఒకటేటి మాసేత తాతారావు దొడ్లో ఎన్నని నరికించీనారో తవరు. మొక్కలెట్టడానికి, పెరగడానికి ఎంతటయిం అవుతాదో మీకు తెల్దేటి. అసలు మనూల్లో మీ ఇద్దరి తన్నులాట్లకీ ఒక్క మొక్కముండయినా నిలబడగలిగిందేటి. నిండుగరిబినీనాంటి పల్ల సెట్లని తొవ్వించీనారు. సీకట్లో మాసేత మీరు సేయించిన ఈ పాపం సిన్నది కాదు. ఒక్కక్క మొక్కా నరుకుతుంతే మా యన్నదమ్ముల్ని అక్కసెల్లెల్నీ సొయంగా నరికీసినట్టుంటందీ మయాన. కానీ ఏటి సేత్తాం. మీరు  తిండెడతన్నారు.
ఒల్లక్కూకున్నాను. బాబూ మనం తప్పుసెయ్యడం కాదు. పేటోల్ల సేతా సేయించీనాం. మీరేటి మావేటి అందరం తప్పుసేసినాం. ఇకనీ మొక్కల్ని సంపడం అపీండి బాబు.’’ అన్నాడు పాల్తేరోడు.

ఆ మాట్లకి అప్పారావుదొర దెయ్యిం పట్టీసినోడినాగ సిందులు తొక్కీనాడు.

10578786_10204979719078424_162694362_n
‘‘పతివ్రెత యేసాలేత్తన్నావేట్రా కసకంత్రీయెదవా. నా సొమ్ముదిని నాకు నీతులు సెప్తావేట్రా పోరంబోకెదవ. నరికినన్నాల్లూ నరికీసి ఇప్పుడు బగవదగీత
వొల్లిత్తావేట్రా బాడుకావా. నీతులు సెప్పినావంతే టుపాకీతో కాల్సి పారెత్తానెదవ’’ అంటూ ఎంకటిగాడి మీద ఇరుసుకు పడీపోనాడు. అయినా గానీ ఎంకటిగాడు దిట్టంగా మాటాడ్డం మాన్నేదు.

‘‘బాబూ ఈ మయాన్నే నా పెల్లం  సచ్చింది. దగ్గిదగ్గి జబ్బుతో సచ్చింది. దాని సెవాన్ని   సూసి నానెలగేడిసినాను. కొండలు కరిగీనాగ, బండలు పగిలీనాగా
ఏడిసినాను. తోడు పోయిందని దిక్కులు సూసుకుంతా  సూసుకుంతా ఏడిసినాను. మనిసి కాబట్టికి, దాని మొగున్ని కాబట్టికి నానేడిసినాను. మరి నా సేతుల్లో
సచ్చిన మొక్కల మాటేటి. అటికి పెనివిటీ, పిల్లలు  ఉన్నారో నేదో మనకి తెల్దు. కాబట్టికి వొవులూ ఏడిసినట్టు మనకి తెల్నేదు. మనుసులు కాదు
కాబట్టికి ఆట్ని నరికితే నెత్తురూ గిత్తురూ రానేదు. అలగని ఆటికి పేనం లేదనగల్దువేటి. ఆ మద్దినెప్పుడో నా కూతురికి ఆడబిడ్డ పుట్టీనాది. పురిట్లోనే ఆ సిన్న పిల్ల సచ్చిపోనాది.  సచ్చినబిడ్డనొట్టుకుని నా కూతురు ఎంతని దుక్కపడిపోనాదో  సెప్పనేను. మరి నాను నరికిన సిన్నసిన్న మొక్కల్ని వొట్టుకుని పెద్దమొక్కలూ అచ్చం అలగే ఏడిసినాయో ఏటో. వొవులికి తెలుసు. నానూ సిన్నోన్నీ సితకోన్నీ కాదు బావూ. రేపో మాపో పుట్టుక్కుమనీ నాగున్నాను. మరిక ఈ పాపాలు సెయ్యినేను. నానింక మొక్కాగిక్కా నరకలేన్నాయినా. అలా  ఆట్ని నరకడం కంటేను నన్ను నేను నరికీసుకోడమే సుకమేటో నాయినా. నాను సస్తే దయిద్రం వొదిలిపోద్దేటో నాయినా.’’ జెలజెల కన్నీరు తెగ్గారిసెస్తా  సెప్పీనాడు ఎంకటి.
దొరబాబుకి కోపం సర్రున పెరిగిపోనాది.

‘‘బాంచోత్‌. పెద్దకపుర్లు సెప్తావేట్రా. మొక్కలు తెగ్గొయ్యలేవుగానీ తల తెగ్గోసీసుకుంతావేట్రా. నువ్వంత దరమపెబువ్వేట్రా. నువ్వంత పత్తిత్తవేట్రా. నువ్వంత పోటుగోడివేట్రా. నువ్వంత తేగపురుసుడివేట్రా. నీకు దమ్ముంతే, ఒకమ్మా బావుకీ పుడితే, రేపీయాలకి నిన్ను నువ్వే నరికీసుకుని సవ్వాల్రా. ఎల్లుండి కాణ్నించీ నువ్వు నా కంటికి కనబడగూడదురోయ్‌. నువ్వుగానీ నిజవయిన మనిసివయితే మాటమీద నిలబడాల్రా. సచ్చి సీపించీరా.’’ కోప్మూ, ఎటకారమూ కలగలిసీసి, రౌదరంగా కసిరీసి మరీ ఇంటి ముంజూర్లోంచి  ఎంకటిని తోస్సేడు అప్పారావుదొరబాబు.

అప్పటికి పొద్దుబాగా వోలిపోయింది. సూరీడు పడవటింట్లోకి దూరతన్నాడు.
సందురూడు ఆకాసంలోకి వచ్చీటయం అయినాది. ఆ సమయంలో మరి ఎంకటిగాడు ఏటనుకున్నాడో. అవమానం జరిగిందనుకున్నాడో, నేక పెద్దోల్తో మనకి
పనేటనుకున్నాడో గానీ  దొర ఇంటికాన్నించి నిమ్మలంగా నడిసీసి పేటయేపు వచ్చీనాడు. మరి మాపటికి ఆడు ఏటి ఆలోసించుకున్నాడో మనకి తెల్దు. ఆడి
మనసులో మరేటి పుట్టీసిందో అసలు తెల్దు. అద్దరేతిరియేల గుడిసెలోనించి బయటకొచ్చీనాడు. మాసెడ్డ గేలాప్మీద రేగుపాలెం సైడున్న రైలు పట్టాలకేసి
డైరట్రగా ఎలిపోనాడు. ఏ రైలు మాతల్లిని ఏ రాతిరిమీద ఆడు ఏటి ఏడుకున్నాడో తెల్దు. మరే రైలు కింద బుర్రెట్టీనాడో తెల్దు. మర్నాడుదయం సూరయమ్మ
సెప్పీదాకా  ఆడి సావు సంగతి మాకొవులికీ తెల్దు.

ఇకను ఆనాటి సాయంకాలంయేల ఎలమంచిలి ఆసపత్రిలో డాటర్‌బాబులు ఓ పక్క మా ఎంకటి గాడి సెవాన్ని ఎడే పెడా కోత్తన్నారు.  మరోయేపు శవాలగది ముందర మా ఊరి జెనాలు జమయిపోయి ఈ కతంతాను  ఒకల్లకొకలు సెప్పీసుకుంతన్నారు. సీకటిసీకటి అవుతుండగా పేనాల్లేని ఎంకటిగోడు మా ఊరి సొసేనంలో అల్లుడు అగ్గెట్టగా కాల్డం మొదలెట్టీనాడు. మాట మీద ఆడు నిలబడిపోనాడని తల్సుకుని తల్సుకుని సొసేనంలో మావంతా  గొల్లుమన్నాం. మొక్కామోడూ  కోసమే మెడకాయ ఇచ్చీసుంతాడని గోసగోస పెట్టీనాం. రుద్దరబూవిలో సెట్టూసేవా కూడా ఆడి సెవాన్ని సూసి కన్నీరెట్టుకున్నట్టుగా మాకయితే ఆ టయింలో అనిపించీనాది. ఆ సెట్లన్నీ తలలు దించీస్కుని ఏడుత్తున్నట్టుగా నేలసూపులు సూస్తున్న ఆటి ఆకుల్ని బట్టి వొవులయినా సెప్పీవొచ్చు.
ఆకరికి ఎంకటిగోడి నోట్లో మావెట్టిన తులిసాకుల్దీ అదే తీరువా.

*

చిత్రం: వర్చస్వి

ఏడో చేప

aripiralaమా పెంచెలయ్యమామ కలిసినాడంటే ఇహ సందడే సందడి. ఓ సీసాడు సరుకు, నాలుగు చేకోడి పొట్లాలు, జంతికల చుట్టలు ఉంటే చాలు. ఇంకేమీబళ్లా. మందల చెప్పడం మొదలైందంటే ఆపేదిల్యా. చెసేది పోలీసు వుద్యోగంగదా ఇంగ కథలకు కొరతేముందా?. మొన్న పండగకని నెల్లూరు పోయున్నానా అప్పుడు ఇట్టాగే ఓ పూట కుదిరింది.

“రేయ్ నర్సిమ్మా… నీకో కత చెప్తాగానా అది నువ్వు రాసి ఏ పత్రికకైనా పంపాల్రా..” అన్నాడు.
“అట్నేలే మామా.. ముందు కథ చెప్పు” అన్నా. ప్లాస్టిక్ గ్లాసు కడాకు లేపి గుటకేసి, నాలిక బయటికి చాపి “హా..” అని ఆమేన మొదలెట్టాడు.
“అనగనగనగా హైదరాబాదు అమీర్ పేట్ లో ఓ బాయిస్ హాస్టల్ ఉండాది. రాజుగోరి ఏడు చేపల్లాగ అందులో ఏడుగ్గురు పిలకాయలు ఉండారు..”
నేను ఆమంతనే ఆపినా. “ఏంది మామా కథంటే ఇట్టానేనా మొదలెట్టేది? మరీ చిన్నపిల్లల కథలాగుందే” అనిన.

“సరే అయితే ఈ సారి తిరగేసి చెప్తాలే గానీ నువ్వు మధ్యలో ఆపబాక” అంటూ ముందరే నా నోటికి తాళం వేసి మళ్ళీ మొదలుపెట్టినాడు.

“పోయినసారి రొట్టెలపండగ టైములో హైదరాబాద్ లో వెంగళ్రావునగర్ దగ్గర ఒక ఇసిత్రం జరిగింది. ఆక్కడ్నే ఒక చిన్న సందులో, రేత్రిపూట చీకట్లో ఎవరో ఆడకూతురు పోతావుంణ్ణింది. రైయ్యి మంటా ఇద్దరు పిలకాయలు బండేసుకోని పోతా పోతా ఆయమ్మి మెళ్ళో దండ, పుస్తెలతాడు పుట్టుక్కున తెంచి నూక్కబోయారు.. ఆ యమ్మి లబోదిబోమంటా పోలీసు స్టేషన్ కి వచ్చింది. మా వోళ్ళు అవీ ఇవీ కొచ్చెన్లేసి, ఆడా ఈడ తచ్చాడి చివరికి వల్లగాదని చేతులెత్తేశారు. ఆ పొద్దుకి సరిగ్గా మూడు రోజుల పోయినాక ఇక్కడ నెల్లూరు చిన్నబజారులో ఎవుడో దొంగసరుకు అమ్మతన్నాడని నాకు తెలిసింది. పొయ్యి జూస్తే చైను, పుస్తెలతాడు. అవి అమ్మతావున్న పిలకాయల్ని తీసకపోయి స్టేషన్లో కూర్చోబెట్టి అడిగితే వెంగళ్రావునగర్లో ఆయమ్మి మెళ్ళోంచి లాక్కోబోయింది మేమేనని ఒప్పుకున్నారు.

“హైదరాబాదు అమీర్ పేట హాస్టల్లో వుండారని చెప్పానే.. ఏడు చేపల్లాగ.. ఆ ఏడు చేపల్లో ఓ చేపగాడు కూడా వున్నాడు. ఏం చదువుకున్నావురా అంటే ఇంజనీరన్నాడు. నేను బిత్తరపొయినా.

“చేపా చేపా ఇంజనీరింగు చదివి ఈ దొంగతనం ఎందుకు చేశావే? అని అడిగా. అప్పుడు వాడు భోరుమని కాలుగంట ఏడ్చి విషయం చెప్పకొచ్చినాడు.
“సార్… మూడు సంవత్సరాలు అయ్యిందిసార్… అల్లూరు నుంచి హైదరాబాద్ పొయ్యి. ఒక ఏడాది పొడవతా మా నాయన డబ్బులు పంపినాడు. ఆ తరువాత నీ బతుకేదో నువ్వే బతకరా ఎదవా అన్నాడు… రెండేళ్ళు నేను చెయ్యని పని లేదు సార్… కాల్ సెంటర్లో పనిచేశా, కోచింగ్ సెంటర్లో చెప్పా, చిన్నచిన్న పిలకాయల ఇస్కూల్లో అయ్యోరిలెక్క చదువులు కూడా చెప్పినా సార్… డబ్బులు జాలక ఈ పని చేశాను సార్..” అంటా మళ్ళా ఏడుపెత్తుకున్నాడు. సరే వాళ్ళ నాయనతో మాట్లాడదాలెమ్మనుకున్నా..

“నాయనా నాయనా… కన్న కొడుకుగదంటయ్యా? ఏమంట డబ్బులు పంపించేదానికి?” అని అడిగా
“ఎందాకని పంపించేది సామీ… నెల నెల నాలుగైదువేలంటే ఎట్టోకొట్ట తెచ్చి పోస్తిని. ఆ నా కొడుకు ఏదో పెద్ద ఉద్యోగం ఊడపెరుకుతానని చెప్పి నా ఇల్లు తనకా పెట్టి రెండు లక్షలు గుంజకపోయినాడు. అయన్నీ లెక్క అజం లేకుండా పాయ.. మళ్ళా డబ్బులంటే యాడ తెచ్చేది సామీ…” అన్నాడు.

వొరెవొరెవొరె.. ఇదేదో తిరగొట్టిన బంతిలాగా మళ్ళీ పిల్లోడి దగ్గరికే వచ్చిందే అని మళ్ళా చేప పిల్లోడి దగ్గరకే పొయినా.,.
“ఏమిరా చేపపిల్లోడా మీ నాయన దగ్గర రెండు లక్షలు గుంజకపోయినావంటనే? అయ్యన్నీ ఏం జేసినా?” అని అడిగా. ఆ పిలకాయ మళ్ళీ ఓ కాలుగంట ఏడస్తావుణ్ణేడు. ఆమేన అసలు జరిగిందేందో చెప్పకొచ్చినాడు.

“సార్ నిజమే సార్. రెండు లక్షలరూపాయలు తెచ్చింది నిజమే. ఎందుకు తెచ్చినానో తెలుసా? మాదాపూర్లో క్యూజెడ్ టెక్నాలజీస్ అని ఓ కంపెనీ వుంది. రెండు లక్షలు జమ జేస్తే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వుద్యోగం ఇస్తామన్నారు సార్. నేను మాములుగైతే నమ్మేవాణ్ణి కాదు సార్.. నాతో పాటు వున్న ఆరుగ్గురిలో నలుగురు అట్టానే వుద్యోగానికి కుదురుకున్నారు. పెద్ద బ్యాంకులో సాలరీ అకౌంట్ తెరిపించారు. నెలాఖరున ఖంగు మని మొబైల్ మోగింది. పాతికవేలు సార్.. జీతం. మా ఆరుగ్గురు చేపలకీ కంప్యూటర్ స్పెల్లింగ్ కూడా రాద్సార్. అట్టాంటి ఎండు చేపగాళ్ళకే వస్తే నాకెందుకు రాదు? ఎట్లాగైనా అదే కంపెనీలో చేరాలనుకున్నాను సార్…”
ఆ పిలగాడు ఇట్టా చెబతావుంటే మధ్యలో ఆపినాను నేను.

Kadha-Saranga-2-300x268

“ఒరే అబ్బిగాడా… ఏదైనా వుద్యోగంలో చేరే ముందు మంచి చెడ్డా, ముందు ఎనక చూసుకోబళ్ళేదా? ఎవుడో అత్తరబిత్తరగాడు కంపెనీ పెడితే వాడి ఎదాన రెండులక్షలు ఎట్టా పెట్టావు?” అన్నా. దానికి ఆ పిల్లకాయ –

“సార్.. ఎట్టాగైనా వుద్యోగం సంపాదించాలి సార్. బ్యాక్ డోర్ కూడా ట్రై చేశా. ఫేకులు పెట్టి చూశా. ఏదీ కుదర్లేదు. చివరాకరికి రెండు లక్షలు ఇచ్చైనా వుద్యోగం తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పటికీ ఆ కంపెనీ గురించి ఎంక్వైరీ చేశాను సార్. నా హాస్టల్లో నాతోపాటే వున్న ఆరుగురు చేపగాళ్ళలో నలుగురు అక్కడే పంజేస్తున్నారు కదా. హైటేక్ సిటీకి పొయ్యి మరీ ఆళ్ళ ఆఫీసు చూసొచ్చినా. ఏసీ గదులు, పట్టపగల్లా మెరిసిపోయే లైట్లు, గుండ్రంగా తిరిగే సీట్లు, ఒకటే జనం అటూ ఇటూ తిరగతా.. అబ్బో గొలగమూడి తిరణాలేసార్.. అదంతా చూసేకొద్ది నాకు అందులో ఎలాగైనా చేరాలనిపించింది. నాయన సంగతి తెలిసి కూడా వేధించి డబ్బులు తెచ్చుకున్న. ఉద్యోగంలో చేరినాక నెలనెలా డబ్బులు చేర్చిపెట్టి నాయనకి ఇద్దామనే అనుకున్నా. నాకేం తెలిసు నా లాంటి వాళ్ళని ముఫై మందిని మోసం చేసి బోర్డు తిప్పేస్తాడని.” అన్నాడు.

“బోర్డు తిప్పేశాడా?” అని ఆశ్చర్యపోయా

“అవున్సార్.. డబ్బులు తీసుకోని రసీదు కూడా ఇచ్చారు. రెండు రోజుల్లో వచ్చి ఆఫర్ లెటర్ తీసుకోమని చెప్పారు. వెళ్ళేసరికి ఎవరూ లేరు. ఏసీ గదులు, లైట్లు, సీట్లు అన్నీ వున్నాయి కానీ మనుషులే లేరు” అంటా మళ్ళీ ఓ కాలుగంట ఏడ్చాడా పిల్లకాయ.

ఇవరం కనుక్కుంటే ఆ కంపెనీ మొదలెట్టినోడు జైల్లోనే వున్నాడని తెలిసింది. ఇట్టగాదులెమ్మని నేను వాడి దగ్గరకు పొయినా – “కంపెనీ బాబు కంపెనీ బాబూ ఎందుకు బోర్డు తిప్పేశా?” అన్నా –

వాడు దిగాలుగా జైలు పైకప్పు వైపు చూసి పొడుగ్గా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టినాడు.

“సార్.. కంపెనీ పెట్టింది నిజమే. డబ్బులు తీసుకుంది కూడా నిజమే సార్. మాకు ఓ అమెరికా కంపెనీతో టైఅప్ సార్. వాళ్ళకి పని చేసిపెట్టే మనుషులు కావాల్సార్. మన దగ్గర జనాన్ని చూపిస్తే వాడికి సరిపోలా. అందుకని కొంత మంది పిల్లల్ని పోగేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దాంట్లో చేర్పించమని వాళ్ళే చెప్పారు. మన మైత్రీవనంలో ఇంకో ఆఫీస్ ఓపెన్ చేసి తూ అంటే తా రాని ప్రతివాడికి ట్రైనింగ్ ఇచ్చాము సార్. ఇన్ని చేసినా ఆ అమెరికావాడికి కావల్సినట్టు తయారు చెయ్యలేకపోయాము”
“ఒరేనాయనా.. నాకేం అర్థం కావడంల్యా… కావాల్సినట్లు తయారు చేసేదేందియా? ఇదేమన్నా రాధామాధవ్ సెంటర్లో దోసెల బండా ఎట్టా కావాల్నంటే అట్టా తయారు చేసేదానికా?” అన్నాను

“అట్టాకాదు సార్… అమెరికాలో వుండే వాళ్ళు అన్ని పనులు చేసుకోరు సార్. ముఖ్యమైన పనులన్నీ వాళ్ళు చేసుకోని, పనికిరాని పనులన్నీ పరాయిదేశాల వాళ్ళకి చేసి పెట్టమని పడేస్తారు. ఇక్కడైతే రోజు కూలీ తక్కువని అట్లా చేస్తారు. అట్టా మా ముఖాన కూడా ఓ పని పడేశారు. కోవా అని ప్రోగ్రామింగ్ చెయ్యాలి. కానీ ఆ పని చెయ్యాలంటే ఎంతో కొంత కోవా తెలిసుండాలి కదా… మన దగ్గర అది తెలిసినోళ్ళు బాగా పెద్ద పెద్ద కంపెనీలో పని చేస్తున్నారు. మా దగ్గర పని చెయ్యడానికి ఎవరూ రాలేదు. అందుకని అమీర్ పేటలో హాస్టళ్ళల్లో వుండే పిల్లల్ని పోగేసి ట్రైనింగ్ ఇచ్చి, పని నేర్పించి వాళ్ళ చేత పని చేయించుకుందాం అని అనుకున్నాను. తీరా చూస్తే ఒక్కడంటే ఒక్కడికి అక్షరం ముక్క రాదు. పేరుకేమో ఇంజనీర్లు. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అమెరికా వాడికి నచ్చలేదు. కాంట్రాక్ట్ కేన్సిల్ అన్నాడు. ఏం చేసేది సార్.. ఈ చదువురాని ఇంజనీర్లతో… ఇట్టాంటోళ్ళకి ఇంజనీరింగ్ పట్టా ఇచ్చిన కాలేజీ వాళ్ళని చంపినా పాపంలేదు..” అంటూ అక్కసంతా కక్కాడు.

fish pic

కథ కాలేజీలకి మారింది. సరే అట్టనే కానీ అని ఓ కాలేజి డైరెక్టర్ ని పట్టుకున్నా.

“డైరెక్టరా డైరెక్టరా… హైదరాబాదులో ఓ చేప చైన్ స్నాచింగ్ చేసింది. అదేమంటే ఉద్యోగం పేరుతో ఎవడో మోసజేడంట. ఆణ్ణి ఎందుకు మోసంజేశావురా అంటే ఆయబ్బి కాలేజీలలో చదువు చెప్పకపోతే నేనేం చేసేది అంటన్నాడు. ఏమబ్బా.. కాలేజీ పెట్టినాడివి చదువులు జెప్పేదానికేమి రిమ్మతెగులు?” అంటా తెగేసి అడిగినా.

ఆ డైరెక్టరు అటూ ఇటూ చూసి, బోరుమంటా ఏడ్సినాడు. టై ఎత్తి ముక్కు చీదినాడు.
“నీ పాసుగోల ఇందేందయ్యా ఇట్టాగ ఏడస్తన్నావా?” అని మళ్ళీ అడిగా. ఆయన నిదానించి చెప్పడం మొదలు పెట్టినాడు.

“అయ్యా… ఏం చెప్పేది మా ఖర్మ. “హైదరాబాద్ కి పొయ్యి గట్టిగా ఇంజనీరింగ్ కాలేజి పెట్టాలనుకుంటున్నామహో” అని అరిస్తే చాలు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. సర్లే అట్లాగే కానీ లెమ్మని కాలేజీ తెరిచాము. తీరా చూస్తే మా ఇంటెనక రెండు కాలేజీలకు, మా కాలేజి ముందు మూడు కాలేజీలకు పర్మిషన్లు వున్నాయి. ఊరు మొత్తం వైన్ షాపులు, ఇంజనీరింగ్ కాలేజీలే పుట్టగొడుగుల్లా వీధికి రెండు చొప్పున వున్నాయి. ఇట్టాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారో మేమూ అదే చేశాం..”

“ఏందది” అన్నా

“మా కాలేజీలో చేరినవారికి ఒక లేప్ టాప్ ఫ్రీ అన్నాము, ముగ్గురు చేరారు. పుస్తకాలు ఫ్రీ అన్నాం, ఇంకో ఆరుగ్గురు చేరారు. కేంపస్ ప్లేస్ మెంట్ అన్నాం ఇంకో ఇద్దరు చేరారు. ఇక లాభంలేదని మొదటి సంవత్సరం ఫ్రీ అన్నాం… అప్పుడు జనం ఓ ఇరవైమంది వచ్చారు. వాళ్ళతో కాలేజీ మొదలెట్టాము..”
“ఫ్రీగా చదువులు చెప్పావా? మా గొప్ప పని చేశావే” అన్నాను నేను.

“గొప్పా పాడా… చేరినవాడు మొదటి సంవత్సరం చదవటం ఆయిపోగానే గవర్నమెంటు ఫీజు మొత్తం తిరిగి ఇచ్చేస్తానంది. అదే ఫ్రీ..”
“ఏదో ఒకటి. మంచిదే కదా” అనబోయా.

“ఊరుకోండి సార్.. మీకేం తెలియట్లేదు. అట్టా చేరిన పిల్లలు అందరు కలిసి మాట్లాడుకున్నారు. – మనం పాస్ అయితే తప్ప కాలేజీకి డబ్బులు రావు. పైగా మనం ఫెయిల్ అయితే కాలేజీకి చెడ్డపేరు. కాబట్టి ఈ కాలేజి వాళ్ళే ఎట్లైనా మనల్ని పాస్ చేస్తారు – అని తెలుసుకున్నారు.”

“ఆమేన?”
“ఇంకేముంది? క్లాస్ మొదలవ్వగానే లేచి వెళ్ళిపోతారు. లెక్చెరర్ “ఏందిరా” అంటే “ఏందిరా” అంటం మొదలుపెట్టారు. వాళ్ళు రాకపోయినా అటెండెన్స్ వెయ్యాల్సిందే. అంటెండెన్స్ లేకపోతే పాస్ కారు. పాస్ కాకపోతే మాకు గవర్నమెంటు నుంచి డబ్బులు రావు. అందుకని వచ్చినా రాకపోయినా, చదివినా చదవక పోయినా అందరినీ పాస్ చెయ్యడమే ఒక పని అయిపోయింది. గవర్నమెంటు సంవత్సరం అయిపోయినాక ఫీజులు ఇస్తుంది. మరి సంవత్సరం అంతా మా ఖర్చుల మీదే నడపాలి.”
“అవును కదా.. అట్టా ఎట్టా గిట్టుబాటు అవతాంది మీకు?” అడిగా అమాయకంగా.
“ఏం చెప్పేది సార్. బిల్డింగ్ ఖర్చులు, కరెంట్ ఖర్చులు, లంచాల ఖర్చులు ఇట్టాటివన్నీ తగ్గేవి కావు కదా. మేము తగ్గించుకోగలిగిన ఖర్చు ఒకటే వుంది”
“ఏంటది?”
“ఫేకల్టీ ఖర్చులు”
“అంటే చదువు చెప్పేవాళ్ళ జీతాలు తగ్గిస్తాన్నారా ఎట్టా?”
“కాదండీ.. జీతం తక్కువ తీసుకునేవాళ్ళకే ఉద్యోగం ఇస్తున్నాం”
“అంటే?”
“ఏముందిసార్.. మా కాలేజిలో చదువు అయిపోయిన వాళ్ళను తరువాత సంవత్సరం మా కాలేజిలోనే ఉద్యోగం ఇస్తాం. మా దగ్గర చదువుకున్న పిల్లలే కాబట్టి కంట్రోల్ లో వుంటారు. చెప్పిన చోటల్లా సంతకం పెడతారు.”
“ఓరినీ పాసుగోల, ఇట్టాటి అయ్యోర్లను పెట్టుకుంటే పిల్లలికి చదువెట్టా వచ్చుద్ది సామీ… సరే కథ ప్రకారం నేను వాళ్ళతో గూడా మాట్లాడాలగానె ఒకసారి రమ్మనదరాదా..” అన్నాను. మొత్తం పదిగేను మంది వుండారన్నాడు. పిలిత్తే పదమూడు మందే వచ్చారు.
“మిగతా ఇద్దరు ఏరి సామీ” అన్నా.
“రేయ్.. ఆ ప్యూను సాంబయ్యగాణ్ణి, డ్రైవర్ సైదులుగాణ్ణి పిలవండ్రా” అని నా వైపు చూడలేక తల దించుకున్నాడు.
***
మామ ఇక్కడ దాకా కథ చెప్పంగనే ఇంక ఉగ్గబట్టుకోలేక ఆపేశా..
“ఏంది మామా? ఏడ మొదలెట్టావు ఏడకి పొయ్యావు? ప్యూనేంది? డ్రైవరేంది?”అన్నాను.
“ఒరే అల్లుడా, ఆపద్దని ముందేజెప్పినానా… ఇంక నేజెప్పను ఫో…” అన్నాడు.
“మామా..మామా… జెప్పుమామా… ఇంగ మాట్టాడితే ఒట్టు” అన్నా.
“సరే ఇను అయితే” అని మళ్ళీ మొదలుపెట్టాడు మామ.

***
ఏడు సేపల కథలో సివరాఖరు సీను – నేను మా వూరి ఎమ్మెల్యే, ఎడుకేషన్ మంత్రి రంగనాయకులు దగ్గరికి పొయినా. టోపీ తీసి దణ్ణమెట్టి నిలబడినా.
“ఏందిరా?” అన్నాడు

“అయ్యా చేప చైను లాగింది, అడిగితే ఉద్దోగం లేదన్నాడు, ఆడినడిగితే పిల్లలకి చదువు లేదన్నాడు, కాలీజీకి పోతే రీయంబర్సుమెంటు కత చెప్పి పనికిమాలినోళ్ళనందరినీ చూపించి అయ్యోర్లని చెప్తా వున్నాడు, అదేమిరా అంటే ఈధికో కాలేజి వుంటే ఏం జెయ్యమంటున్నాడు. అసలిట్టా ఇన్నేసి కాలేజీలు ఎందుకు తెరిచినారు తవరే సెప్పాల” అన్నాను.
మంత్రిగారు పొట్ట ఊపుకుంటా నవ్వాడు.
“నువ్వు దగ్గరోడివి కాబట్టి ఒగ రగస్యం జెపతన్నా. మా రాజకీయలోళ్ళ సంగతి తెలుసు కదా? డబ్బులొస్తాయంటే కాలేజీలు కాకపోతే కల్లు షాపులు… పర్మిట్లదేముంది. కానీ, ఇన్నేసి కాలేజీలు పెట్టేదానికి ఇంత మంది మాకు డబ్బులిచ్చి మరీ ఎందుకు ఎగబడతన్నారో తెలుసా? ఆళ్ళు పెట్టే కాలీజీల్లో చేరేదానికి కావల్సినంతమంది పిల్లలున్నారని నమ్మకం ఉండబట్టే కదా. అదట్టా ఎందుకో తెలుసా?” అని మంత్రిగారు మళ్ళీ నవ్వారు.
చీమ ఎందుకు కుట్టిందో తెలిసిపోయే సివరాఖరుకు వచ్చేశానని అర్థమయ్యి చెవులు కిక్కిరించా
“ఆశ. ఈ జనానికి ఆశరా… పెతోడు వాడి పిల్లకాయలు పెద్ద ఇంజినీర్లు అయిపోయి, అమెర్కా ఎల్లిపోయి లచ్చలు లచ్చలు అంపేయాలని ఆశ. పెజెల్లో ఇట్టాటి ఆశ పెరిగిపోయింది కాబట్టే ఇంత కతా జరిగింది” అన్జెప్పి మంత్రిగారు పెజాసేవకి ఎల్లిపోయారు.
***
కత అయిపోయినట్లు మామ ఆపేయడంతో అందరం చేతుల్లో గళాసులవైపు చూసుకున్నాం. కొసరూ అరా ఏమన్నా వుంటే అట్నే తాగేసి ఎవరింటికి వాళ్ళం ఎలబారినాం.
***

కులానికో వీ/వేడుకోలు

Kadha-Saranga-2-300x268

శ్రీ –

ఇంతకు ముందు నీకు రాసిన ప్రతి ఉత్తరంలో నిన్ను ప్రియమైన శ్రీ అనో, ప్రియాతి ప్రియమైన శ్రీ అనో పిలుచుకునే దాన్ని కదూ! ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది. అందుకే ‘ఒట్టి శ్రీ’ వి అయ్యావు.

ఏమన్నావు నువ్వు నన్ను ఇవాళ మధ్యాహ్నం…. ఆఫీస్ నుంచి వచ్చి అలిసిపోయి సోఫాలో కూర్చుని అన్నం తింటున్నానని – ‘తక్కువ కులపు అలవాట్లు ఎక్కడకు పోతాయి?’ అన్నావు. ఎలా అన్నావు శ్రీ అలా… ఇంతకు ముందు మనం సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరం తినిపించుకోలేదా? దానికే కులం పేరుతో అవమానిస్తావా? కులం, అలవాట్లూ, ఆచారాలు – వీటన్నిటి గురించీ మనం ఆలోచించామా అసలు ఎప్పుడైనా? ఏమయింది మనిద్దరి మధ్య? ఎందుకిలా నా మీద మాటల బాణాలని వదులుతూ నా నుండి దూరంగా జరిగిపోతున్నావు?

ఎంత బావుండేవి ఆ రోజులు?

ఆకాశంలోని చందమామని నా కళ్ళల్లో కొన్నాళ్ళు, గుండెల్లో కొన్నాళ్ళు దాచుకుని నీకు వెన్నెల ఉత్తరాలు రాసేదాన్ని. నింగి అంచులు వంగి పుడమితో మాట్లాడే గుసగుసల ఛాయల్ని ఉత్తరాలకి పులిమేదాన్ని. నువ్వు నక్షత్రపు కాంతిని నా కళ్ళల్లో నింపాలని ఎంత తపన పడేవాడివి? అడవి అన్నా అడవిలోని అందాలన్నా నీకెంతో ఇష్టం – నీ ఉత్తరాల నిండా పచ్చని అడవి నిటారుగా తల ఎత్తి చుక్కలతో మాట్లాడే వెలుగు భాష ఉండేది.

నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నన్ను అపురూపంగా చూసుకోవాలనే ఆరాటమే నాకు కనపడేది. ‘పెళ్ళయ్యాక మన ఇంట్లో బియ్యం పప్పు ఉప్పు ఉన్నాయా అనుకునే స్థితిలో ఉండకూడదు – ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఏ లోటూ లేకుండా ఉండాలి’ అనే వాడివి.

‘కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించి మీ ఊరు వస్తాను. సగర్వంగా అందరికీ చెప్పి నిన్ను పెళ్ళి చేసుకుంటాను – అంతవరకు నువ్వు నా కోసం ఆగుతావు కదూ?’ అని నన్ను అడిగావు. నా చేతిలో చెయ్యి వేశావు నీ చేతిలో నా చేత ఒట్టు వేయించుకున్నావు.

మా ఇళ్ళల్లో పద్దెనిమిదేళ్ళకే ‘ఎప్పుడు పిల్లకి పెళ్ళి?’ అని ముఖాన్నే అడుగుతారు ఇంట్లో ఆడపిల్లలుంటే – ‘నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి నన్ను పెళ్ళి చేసుకోకపోతే నా గతి ఏమిట’ని నేను అనుకోలేదు. అసలు నాకా ఆలోచనే రాలేదు. అందరికీ ధైర్యంగా, బాహాటంగా చెప్పాను ‘మన కులం కాని అబ్బాయిని ప్రేమించాను – అతన్నే పెళ్ళి చేసుకుంటాను’ అని.

ఇంటర్ లోనే ప్రేమ వెలగబెట్టిందా? చూడు ఎలా చెప్తుందో సిగ్గూ ఎగ్గూ రెండూ లేకుండా – వాడెవడో పెద్ద కులపోడంట మోసం చేసి పోతాడు గాని దీన్ని చేసుకోవడానికి వస్తాడా? వాడు రాకపోతే ఎవడు చేసుకుంటాడనైనా ఉండొద్దూ! కాళ్ళు విరగ్గొట్టి నోరు మూపించడానికి తండ్రి లేకపోయా పాపం ఆ తల్లి ఏం చేస్తుంది’ లాంటి మాటలు ఎన్ని పడ్డానో! – కాని నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని – నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరెన్ని మాట్లాడితే ఏంలే అనుకున్నాను.

మీ అమ్మానాన్నలని ఎలా ఒప్పించావో నువ్వెన్ని మాటలు పడ్డావో కాని ఆరేళ్ళ వియోగం తర్వాత నువ్వు నా కోసం వచ్చావు చేతిలో అప్పాయింట్ మెంట్ ఆర్డర్ పట్టుకుని.

ఆ రోజుని నేనెన్నటికీ మర్చిపోలేను శ్రీ – ‘నీ బరువంతటినీ మోయడానికి, నా హృదయాంతరాళంలో నిన్ను దాచుకోవడానికి వచ్చాన’ని అన్నావు. నిన్ను చూసి నా గురించి అంత వరకూ ఏవేవో మాట్లాడిన వాళ్ళ ముఖాల్లో అసూయ, అపనమ్మకం – కాసేపటికే ఆఁ చూద్దాంలే ఈ కాపరం ఎంత కాలమో నన్న హేళనగా మారుతుంటే ‘ఆఁ చూద్దాం’ అని నేనూ అనుకున్నాను. అంతరాంతరాల్లో నా కంత నమ్మకం నీ మీద – నీ ప్రేమ మీద.

పెళ్ళయిన తర్వాత నీకిష్టమైనట్లే మారాను. నీకిష్టమైనవే వండాను. నీకు పనికిరానివి తినడం మానుకున్నాను. నువ్వే నా ప్రపంచం, నీ మాటలే నాకు సంగీతం, నన్ను అపురూపంగా చూసుకోవడమే నీ ప్రత్యేకత, నువ్వు నాకు, నేను నీకు ప్రేమతో అర్పించుకున్నపుడు పొంగిపొర్లే మాధుర్యం జీవితాంతమూ చవి చూడటమే మన లక్ష్యం – అలా ఉన్నాం కదా మనం మొన్నమొన్నటి వరకూ.

రిజర్వేషన్ కోటాలో నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుండీ నువ్వు మారిపోయావు. పోనీ నీకు ఇష్టం లేదా అంటే అదేం కాదు. ఆ ఉద్యోగం ఇచ్చే అధికారం, తెచ్చే డబ్బూ కావాలి నీకు. ‘సంపాదిస్తున్నావులే కులం పేరు చెప్పుకుని’ అంటావు అదేమంటే.

ఆ రోజు మీ కులపు స్నేహితుల ముందు కాఫీ తేవడం ఆలశ్యమయిందని ‘మన పద్ధతులు తెలియవు… చూసి అన్నా నేర్చుకోదు’ అంటున్నావు. వాళ్ళకి తెలుసా పద్ధతులు? మనింటికొచ్చి వండింది శుభ్రంగా తింటూ ‘మీ ఇళ్ళల్లో బీరకాయ పప్పు ఎలా చేస్తారు? వెల్లుల్లి వేస్తే మేం తినలేం బాబూ’ అనడమా పద్ధతి అంటే!!?

మీరు మేము అంటూ వాళ్ళు వేరు చేసి మాట్లాడుతుంటే వాళ్ళ ముందు నువ్వు నవ్వుతూ కూర్చున్నావు. నేను లేచి తినే తినే ప్లేట్ సింక్ లో పడేసి గదిలోకి వచ్చానని వాళ్ళు వెళ్ళాక ‘మర్యాద తెలియదు’ అని నన్ననడానికి నీకు మనసెలా ఒప్పిందో అర్థం కాక విస్తుపోయాను. ఏదైనా వాదిస్తే ‘ ఇలాంటి వాదనలు వస్తాయనే జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలని పెద్దలు అంటార’ని అంటావు.

‘చేసుకుంది మహా పెళ్ళి – అంటానే ఉన్నాంగా ఇది ఎన్నాళ్ళ సంబడమో అని’ అంటూ మా వాళ్ళు ఎగతాళి చేస్తారని నీ మాటలకు ఓర్చుకుంటున్నానా? అనిపిస్తోంది ఈ మధ్య. అదే నిజమైతే మన ప్రేమకి అర్థం లేదా!? ఎవరో ఏదో అంటారని, అనుకుంటారని మనం సహజీవనం చేస్తున్నామా!!? ఈ ఆలోచన వణికించడం లేదూ!!!?

నిన్న టి వి లో ఏదో సినిమాలోనో, సీరియల్ లోనో టీనేజ్ ప్రేమ జంటని చూసి ‘ఇది ప్రేమ కాదు ఆకర్షణ’ అంటున్నావు వ్యంగ్యంగా నన్ను చూస్తూ – అంటే మనది ప్రేమ కాదు ఆకర్షణ అని చెప్తున్నావా?

శ్రీ – మన పెళ్ళయి రెండేళ్ళు కూడా కాకుండానే నా అడవి పిట్ట పాటలు పాడటం ఆపేస్తుందని, నా గుండెల్లోని చందమామ మసకబారుతుందని, నక్షత్రాలు వెలగాల్సిన నా కన్నుల్లో చీకటి చేరుతుందని నేను అస్సలు ఊహించలేదు.

నాకు తెలుసు – ఈ ఉత్తరం చదివి ‘ఏమన్నాను నిన్ను అంటావు అమాయకంగా – అదేంటో మరి మర్చిపోయే గుణాన్ని కూడా మీకే ఇచ్చాడు భగవంతుడు శారీరక బలంతో పాటు. నువ్వు పొడుస్తున్న మాటల తూట్లకి నాలోని సున్నితత్వం నశించి ఎత్తిపొడుపులూ, కన్నీళ్ళూ, అసూయాద్వేషాలతో బ్రతుకు మొద్దు బారిన నాడు కూడా నువ్వు నన్నే అంటావేమో ‘గయ్యాళి’ అని…… అలా మారడానికి కారణం నువ్వేనన్న విషయం మర్చిపోయి.

రోజులు గడిచిపోతాయి ఏ మాధుర్యమూ లేకుండా – మనం కోరుకున్న జీవితానికి విరుద్ధంగా. ఏదో ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటాం తప్పకుండా… అప్పుడనిపిస్తుంది – మన తోటలో పూచే అందమైన గులాబీ మొగ్గని మనమే సంకుచితమైపోయి నలిపేసుకున్నామని…. నిర్వేదంగా శ్రుతి తప్పి పోయిన గీతాన్ని ఆలపిస్తున్నామని…

అయ్యో అనుకుంటూ అల్పమైన ఆ జీవనయానాన్ని సరి చేసుకోవానికి ప్రయత్నిస్తామేమో కాని అప్పటికే మనలోని అమృతభాండం మాటల తూట్లతో ఒలికిపోయి ఉంటుంది. అంత దూరం రాకూడదనే ఈ ఉత్తరం….

ప్రేమతో

నీ సృజన

పి.ఎస్: చిన్న కవిత నీ కోసం.

నల్లగా మారుతున్న మేఘాలని అర్థిస్తున్నాను –
వానలో తడిసి స్వచ్ఛమైన రంగుతో వెలగమని

హోరుగాలికి నిశ్శబ్దంగా చెప్తున్నాను –
నెమ్మదిస్తేనే ఆర్థ్రత నిన్ను తాకుతుందని

నేను నువ్వుగా మారి తొలిపొద్దులోకి చూస్తున్నాను –
నులివెచ్చని వెలుగురేఖల ఆలంబన కావాలని

ఉదయకిరణాలు విచ్చుకోగానే చీకటి తొలుగుతుంది.
నీ మృదుస్పర్శ నా నుదుటిని తాకుతుంది

చల్లని, మెల్లని గొంతుకతో నువ్వు నన్ను మేల్కొలుపుతావు
మాటల బాణాలు గద్దల్ని తరుముతూ ఎగిరిపోతాయి
మధురస్మ్రతులు సీతాకోకచిలుకల్లా మారి నా వనంలోకి వస్తాయి

కదూ…

-మండువ రాధ

10530819_1465912403664592_9069952599408129952_n

చందమామని చూడని వెన్నెల

Chanda

రచయిత పరిచయం

రెండు దశాబ్దాలపాటు సామాజిక ఉద్యమాలలో పాల్గొని ఝార్ఖండ్ లోని హజారీబాగ్ లో ఉన్న కేంద్ర కారాగారం లో నాలుగేళ్ళు గడిపారు. జైలు జీవితం గురించి ఇప్పటివరకు 14 కథలు, ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలలోనూ, మహిళామార్గం లోనూ, అరుణతార లోనూ ప్రచురితమయ్యాయి. ఇతర కథలు మహిళామార్గం పత్రికలలోనూ, సంకలనాలలోనూ ప్రచురితమయ్యాయి.

~

 

“నా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా. కొద్ది మంది నా సన్నిహిత మిత్రులు నిన్ను కలవాలనుకొంటున్నారు. ఎగ్గొట్టకు.”

స్వాతి నుంచి వచ్చిన ఆహ్వానం చూసి చాలా సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. చివరికి తాను ఫోన్ చేసి నా అంగీకారంకోసం అడిగితే ఇంక సరే అన్నాను.

నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆశ్చర్యంగా చూస్తున్న నన్ను చూసి నవ్వి “పద. నీకో చిన్న సర్ ప్రైజ్” అంటూ టెర్రస్ మీదకి తీసుకువెళ్ళింది. పైన శుభ్రం చేయించి కింద చాపల మీద పరుపులు వేసి దుప్పట్లు పరిచింది. ఆనుకోడానికి వీలుగా కొన్ని దిండ్లు. దూరంగా ఒక వైపు ఒక బల్ల మీద తిండి ఏర్పాట్లు కాబోలు గిన్నెల మీద మూతలు వేసి ఉన్నాయి. కొన్ని ఖాళీ ప్లేట్లు గ్లాసులు అన్నీ పెట్టి ఉన్నాయి. ఒక మూలగా చిన్నగా వెలుగుతున్న లైట్. దానిని తాత్కాలికంగా ఇప్పుడే ఏర్పాటు చేసినట్టున్నారు. ఆ వెలుగు అంతగా రాని చోట పక్కలు వేసి ఉన్నాయి. చల్లగా కురుస్తున్న వెన్నెల. నాలుగైదు అంతస్తుల పైన కాబట్టి ట్రాఫిక్ గోల అంతగా వినబడడం లేదు.

“ఎంత ప్రయత్నం చేసినా డాబా ఇల్లు, కొబ్బరి చెట్టు ఆకుల సందుల్లోనించి చందమామని చూసే ఏర్పాటు చెయ్యలేకపోయాను. దీనితోనే అడ్జస్ట్ అయిపోవాలి” అంది. “పట్టణాల్లో కరెంటు తీగల మధ్యనుండి తప్ప కొబ్బరాకులెక్కడివిలే” అన్నారెవరో. అందరం నవ్వుకొన్నాం.

పరిచయాలయ్యాయి. అందులో కొందరు నాకు పేర్లు విని ఉన్న పరిచయం. కొందరు అస్సలు తెలియదు. కొద్ది మందిమే ఉన్నాం కాబట్టి ఆ వాతావరణాన్ని ఆనందించడానికి వీలుగానే ఉంది.

ఆ రొమాంటిక్ వాతావరణం చూస్తుంటే వేరే ఏమీ మాట్లాడాలనిపించడం లేదు. సరిగ్గా అప్పుడే స్వాతి మాట్లాడడం మొదలుపెట్టింది. మన పార్టీ లో మొదటి రౌండ్ అందరూ చందమామ మీద కానీ వెన్నెల మీద కానీ పాట పాడాలి.

“పాటలు రాని వాళ్ళు ఏం చెయ్యాలి?” అంది పావని.

“చదవాలి” అంది పద్మ.

“ఛ! ఎంత అన్ రొమాంటిక్ ఆలోచన?” ఒకేసారి స్వాతి, మాధవి అన్నారు.

“ఓకే! పాటలు రాని వాళ్ళు ఒక ప్రేమ కథ చెప్పాలి. నేనసలు దానిని సెకండ్ రౌండ్ కి అనుకొన్నా”. అని సమస్య పరిష్కారం చేసింది స్వాతి.

“మాధవితో షురూ చేద్దాం. అద్భుతంగా పాడుతుంది” అంది పావని. నిజంగానే మాధవి మొదలుపెట్టాక ఇక వంతుల విషయం మర్చిపోయి అది మీరు కోరిన పాటల రూపం తీసుకొంది. అడగడమే ఆలస్యంగా తాను అనేక పాటలు వెన్నెల మీద, చందమామ మీద పాడింది. తనకి తెలియకుండానే రాధిక తోడయ్యింది. కొన్ని పాటలు తను పాడాకా, కరుణ కొన్ని హిందీ పాటలు పాడింది. అందరం ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు ఉన్నాం.

ఇప్పుడిక ప్రేమ కథల రౌండ్ అని స్వాతి ప్రకటించింది.

“నేను మా చానల్ కి స్టోరీ కోసం ఒక సారి చాలా దూరం నడవాల్సి వచ్చింది. అప్పుడు ఇలాగే వెన్నెల. ఆ వెన్నెల చూస్తే ప్రేమ కథలు వినాలని మహా సరదా పుట్టింది. నాతో పాటు వచ్చిన కొలీగ్ ని తన ప్రేమ కథ చెప్పమని మస్తు సతాయించాను. ఎంతయినా పక్కన వాళ్ళ ప్రేమ కథలు చెప్పడం సులువు” అని తను విన్న ఆ ప్రేమ కథ చెప్పింది పావని.

తరవాత నా వంతు వచ్చింది. మరో సందర్భంలోనయితే నేను పాటలు పాడడాన్నేఎంచుకొని ఉండేదాన్ని. కానీ అప్పుడు మాత్రం నాకు కథ చెప్పాలనిపించింది.

“నేను ఒక కథ చెప్పాలనుకొంటున్నా” అన్నాను.

“మరొక జైలు కథా?” అంది చప్పున రాధిక.

నేను నవ్వి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. “నేను థీమ్ ని మార్చడం లేదు. నేను చెప్పే కథ కూడా వెన్నెల గురించే. “చందమామని చూడని వెన్నెల గురించి.”

***                                           ***                                           ***

“చందమామ రావే..

జాబిల్లి రావే….”

ఏదో ఒక భాషలో ఈ పాట తెలియని మనుషులు, బహుశా ఉండరు. బహుశా అని ఎందుకన్నానంటే చందమామ మీద పాట లేని భాష ఏదన్నా ఉందేమో మనకేం తెలుసు? కానీ చందమామని చూడని పిల్లలెవరన్నా వుంటారా? క్షణం కూడా ఆలోచించకుండా జవాబు చెప్పగల ప్రశ్న.

“ఉండరు”

నేను రాజకీయ ఖైదీగా జైలు కి వెళ్ళక పోతే బహుశా నేను అదే జవాబుని తడుముకోకుండా చెప్పేదాన్ని. మనకి తెలిసిందే సర్వం కాదు. ఇప్పటి వరకూ… మనకు తెలిసిందే “పరమ సత్యం”. విశ్వంలోని ప్రతీదీ సాపేక్షికమే అనే విషయం తెలియదా, అంటే తెలుసు. కానీ, దానిని ప్రతి ఒక్కదానికి అన్వయించుకోలేని చేతకానితనం నాదని సవినయంగా వొప్పుకొంటున్నాను. కాబట్టి ఏమో ఉండచ్చు అని ఊహించలేకపోయాను. “ఉంటారు” అనేది ఈమధ్యనే తెలిసిన కరకు వాస్తవం.

ఆ పాప పేరు చాందినీ (వెన్నెల). ఝార్ఖండ్ లోని ఒక ఆదివాసీ అమ్మకి ముసల్మాన్ నాన్నకి ప్రేమ గుర్తుగా పుట్టిన ఒక ముద్దులు మూటకట్టే పాప. వాళ్ళిద్దరూ విచారణలో వున్న ఖైదీలు.

వాళ్ళమ్మ చాందినీకి చాలా ఇష్టంగా ఆ పేరు పెట్టింది. ఆదివాసీ జీవితాల్లో ప్రకృతి ఒక భాగం. వాళ్ళ పేర్లయినా, పండగలయినా రోజువారీ జీవితమయినా అంతా ప్రకృతి తోనే ముడిపడి ఉంటుంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి పాటల పోటీల్లో ఒకబ్బాయి వెన్నెల మీద పాడిన పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అతను చాలా అద్భుతంగా పాడాడు. కానీ ఆ పాట ఏమిటో తెలుసా? “కాని చోట కాసావే వెన్నెలా? కారడవుల కాసావే వెన్నెలా!” దానిభావంలోని అసంబద్దత గురించి అర్థం అయ్యే వయసు కాదది. అది అర్థం కావడానికి మరో దశాబ్దం పట్టింది నాకు. అడవుల్లోనూ మనుషులుంటారు. అడివిలోనే పుట్టి పెరిగి అడవినే ఇళ్లుగా చేసుకొన్నవాళ్ళు. వాళ్ళకి మనలాగా ఎలక్ట్రిక్ దీపాలు అవసరం లేదు. ఏదైనా చల్లని ఆ మసక మసక వెన్నెల లోనే. మనుషులు లేని అడవి లోనయినా ఎన్నో జీవాలు, జంతువులు వెన్నెలని ఎంత ఆస్వాదిస్తాయి! వెన్నెలలో తడిసిపోతూ మిలమిలలాడిపోయే ఆకుపచ్చని చెట్లని చూస్తే వాటికి ఎంత గర్వంగా అనిపిస్తుండొచ్చు? సమస్త భూమండలాన్ని తన వెన్నెలతో గుబులు పుట్టించి, అశాంతిని రేపి, మళ్ళీ తానే స్వాంతన కలగ చేసే చందమామ మీద హక్కు ఏ ఒక్కరిదో ఎలా అవుతుంది? బహుశా ప్రతి ఒక్కరూ తమదే అనుకొంటారు. ఎంత అన్యాయమైన పాట కదా అది. ఆ పాట రచయిత ఒక వెన్నెల రాత్రి కారడవిలో గానీ గడిపితే, ఆ పాట రాసినందుకు గుండెలు బాదుకొంటాడు. అడవి కాచిన వెన్నెల అని ఎవరన్నా సామెత వాడితే ఇప్పుడు కేవలం జాలి పడగలం అంతే.

చాందినీని కనక ముందు వాళ్ళమ్మ కూడా అలా వెన్నెల్లో ఆడుకొన్న అడవి పిల్లే. బతుకు తెరువు ఆమెని ఇళ్ళల్లో పని చేసుకొని బతకడానికి ఢిల్లీ చేర్చితే ఆమె మొదటి సారిగా వెన్నెల్లో తాజ్ మహల్ ని చూసింది. షాజహాన్ ప్రేమకథ గురించి మొదటిసారి విన్నది. తాను పని చేసే ఇంటివాళ్ళు ముంబయ్ కి బదిలీ అయితే అక్కడ అదే ఇంట్లో డ్రైవర్ గా పని చేసే జమాలుద్దీన్ ని ప్రేమించింది. నేనిప్పుడు చెప్పబోయేది వాళ్ళ ప్రేమ కథ కాదు. కానీ వాళ్ళ ప్రేమ కథ కి సాక్ష్యం మాత్రం వెన్నెలనే. అలా అడివిలో వెన్నెల దగ్గర మొదలయిన జీవితం వెన్నెల్లో తాజ్ మహల్ సమక్షంలో కొత్త జీవితానికి బాసలు చేసుకొనేవరకూ వెళ్లింది. అమాయకంగా ఒకరికి సాయపడబోయి వాళ్ళిద్దరూ జైలు పాలయ్యారు. జైలులోకి ప్రవేశించాక కానీ తాను తల్లిని కాబోతున్నానని ఆమెకు తెలీలేదు. వెన్నెలతో అల్లుకు పోయిన తన జీవితానికి కొత్త వెలుగు లాంటి ఆ పసిదానికి ప్రేమగా చాందిని అని పేరుపెట్టుకొంది. జైలులో కళ్ళు తెరిచిన ఆ చిన్నారికి చాలా అసహజమైన వాతావరణంలో జీవితం మొదలయ్యింది.

జైలులో సాయంత్రం చీకటి ఇంకా పడుతూ ఉండగానే లాకప్ చేసేస్తారు. సరిగ్గా పక్షులు గూటికి చేరేవేళ. ఆ సుందర దృశ్యాలేవీ కళ్ల నిండుగా చూడకుండానే అందరం ఎత్తైన గోడల వెనుక రాతి కట్టడంలో ఏ వైపునుండీ పొరపాటున కూడా చందమామ కనపడే అవకాశం లేని చోటులో లాకప్ అయిపోతాం. కిటికీలు వుంటాయి. కానీ దానిలోనుండి ఎప్పుడూ కనపడేది కాదు. “చందమామ దూర్ కీ…. పువ్వే పకాయే గూడ్ కీ” అని వాళ్ళమ్మ హిందీలో చాందినీకి పాటలు నేర్పుతోంది. చాందినీ ముద్దుముద్దుగా పాడుతోంది కూడా.

మేమున్న హజారీబాగ్ సెంట్రల్ జైల్లో టీవి వుంది. అయితే చాలా రాష్ట్రాల్లో జైల్లో కేవలం దూరదర్శన్ మాత్రమే వస్తుంది. ఆదివారంపూట వచ్చే హిందీ పాటల కార్యక్రమం రంగోలిని సాధారణంగా మిస్ అయ్యేవాళ్ళం కాదు. పిల్లలైతే చెప్పనక్కర్లేదు. వాళ్ళు ముందు వరసలో కూర్చుని కళ్ళు ఆర్పకుండా చూసేస్తుంటారు. ఖైదీల పిల్లలు 5 యేళ్ళ వయసు వచ్చేవరకు తల్లులతో పాటు ఉండవచ్చు. కాబట్టి ఎప్పుడూ జైల్లో 20-25 మంది పిల్లలు ఉంటూనే వుంటారు. వాళ్ళందరికీ రింగ్ లీడర్ డాలో. చాందినీ వాళ్ళమ్మ, డాలో వాళ్ళమ్మ స్నేహితులు. కాబట్టి డాలో ఎప్పుడూ చాందినీ ని ఎత్తుకొని తిరుగుతూ వుండేది. చాందినీని ఎత్తుకోవడానికీ అందరూ పోటీలు పడేవారు. ఆమె ఎప్పుడు ఎవర్ని కరుణిస్తే వాళ్ళు ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. అలా డాలో చాందినీని వొళ్ళో కూర్చుపెట్టుకొని టీవి చూస్తుండగా ఒక చందమామ పాట వచ్చింది. చూడు చూడమని పిల్లలందరూ పోటీలుపడి మరీ చందమామని చూపించారు. అప్పటికి తనకి వివిధ వస్తువులు చూపించి మాటలు నేర్పిస్తావున్నారు. ఫేనేది? బల్బేది? పిల్లేది? అంటే కిలకిలా నవ్వుతూ చూపించేది. చందమామేది? అంటే టీవి కేసి చూపేది. అందరూ నవ్వేవాళ్ళం. వాళ్ళమ్మ కూడా నవ్వేది. కానీ అప్పుడప్పుడు నవ్వుతో పాటు కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేవి.

చాందినీకి రెండేళ్ల వయసు వచ్చేసింది. అనేకసార్లు చందమామని టీవీ లో చూడగానే గుర్తు పట్టి చప్పట్లు కొట్టి నవ్వి మరీ చెప్తోంది. కానీ ఆకాశంలో మాత్రం చూడనే లేదు. అలాంటి సందర్భంలో హోలీ పండగ వచ్చింది. జార్ఖండ్ లో హోలీ ని చాలా ధూంధాం గా జరుపుకొంటారు. జైల్లో కూడా! ఆ సందర్భంగా ఖైదీలకు ఒక రోజు మీట్ కూడా ఇస్తారు. ఆసారి ఏదో కారణం వల్ల కూర వండడం ఆలస్యం అయ్యింది. పైగా ప్రతి ఒక్కరికీ 100గ్రాముల చొప్పున తూచి ఇస్తారు. కాబట్టి లాకప్ చేసి ఇవ్వడం కుదరదు కనక మహిళా వార్డు లోని మూడు బ్యారక్ లు తెరిచే వున్నాయి. వార్డు ఎప్పుడూ మూసే వుంటుంది. లోపల బ్యారక్లు మాత్రమే తెరిచి వుంచుతారు. ఆరోజు ఎప్పటిలా 5.30 కి కాకుండా 7 గంటల వరకూ పంపకాలు పూర్తికాక కిందా మీదా అవుతున్నారు. అలాంటి సమయంలో అంత అరుదుగా దొరికిన అవకాశంలో కూర కోసం లైన్లో నిలబడడం ఏంటని! చాలా మందిమి ఖుషీగా వెన్నెల్లో చేతులు పట్టుకొని ఒకటే ఎగిరాం. అదిగో అప్పుడు చూసింది చాందినీ. అదీ ‘పున్నమి’ చంద్రుడిని. ఆ రోజు సాయంత్రం “స్వేచ్ఛ” గా ఆవరణలో తిరుగుతుంటే లేత నారింజరంగులోంచి మెల్లగా లేత పసుపులోకి….మారుతూ పైకి ఎగుస్తూ ఆకాశంలోకి ఎగబాకుతున్న చందమామని అందరికన్నా ముందు గుర్తుపట్టింది చాందినీనే! అప్పటినుండి ఎప్పుడడిగినా ఆకాశం వైపు చూపించి విస్మయంగా కళ్ళు పెద్దవి చేసి, చిట్టి చిట్టి చేతులు అందంగా తిప్పుతూ “గాయెబ్” (మాయమయిపోయాడు) అనేది. అదొక్కటే సారి తను చందమామని చూడడం. కానీ ఆ తరవాత ఎప్పుడూ మళ్ళీ తను చందమామ ఏదని అడిగితే టీవీ కేసి చూపలేదు.

చాలా తొందరగా చాందినీకి మాటలు వచ్చాయి. ఏదంటే అది తిప్పి అనేసేది. తనని ఒకటే వాగించి మేము నవ్వినవ్వి వినోదించేవాళ్ళం. ఒక రోజు నేను కమానీ ఘర్ లో కూర్చుని కాగితాలు వెలిగించి ఆ మంట మీద మేగీ చేస్తున్నా. చాందినీ నేను కమాని ఘర్లోకి వెళ్ళడం చూసి నా వెనకాలే వచ్చింది. మూడు రాళ్ళ పొయ్యి వెలిగించగానే పరిగెత్తి గిన్నె తెచ్చుకొంది. “దేనా”…(ఇవ్వా?)అంటూ ముద్దుగా అడుగుతుంటే ఏడిపించబుద్దయ్యి…”నేను ఇవ్వను ఫో!” అన్నాను.

అప్పుడు చాందినీ… “ఉఠాకే ఫేక్ దెంగే తో చందమామా కె పాస్ చల్ జాయెగీ” (ఎత్తి విసిరేశానంటేనా చందమామ దగ్గరికెళ్లి పడతావ్!) అంది.

ఇంత అందంగా ఇప్పటివరకూ నన్నెవ్వరూ తిట్టలేదు. చందమామ అలా అంత బుజ్జి బుజ్జి మనసులని కూడా ఎలా దోచేస్తాడో అని నివ్వెరపోతూ చాందినీని ముద్దుల్లో ముంచెత్తాను.

పుచ్చపువ్వులాంటి వెన్నెల్లో మౌనంగా కథ విన్న అందరి మనసుల్లోనూ ఇప్పుడు వెన్నెల స్థానంలో “చాందినీ”

నిండిపోయిందని వేరే చెప్పనక్కర్లేదు కదా.                                                                       ***

 

-బి.అనూరాధ

కథా చిత్రం: మహీ పల్లవ్

 

ఆ కళ్ళలో హరివిల్లు

Kadha-Saranga-2-300x268

రెండు రోజుల నుంచీ ఈ లూప్ తెగట్లేదు. ఎక్కడో లాజికల్ మిస్టేక్ ఉంది. డీబగ్గింగ్ లో వేరియబుల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎండ్ రిసల్ట్ తప్పొస్తుంది. అబ్బా…..భలే విసుగ్గా ఉంది.

ఇంతలో ఫోన్ రింగయ్యింది. ఇప్పుడెవరా అని విసుక్కుంటూ మొబైల్ అందుకున్నాను. రిమైండర్ రింగ్. ఈ రోజు ఆంటీ బర్త్ డే. ఈ పని టెన్షన్లో పడి ఈ రోజు డేట్ కూడా చూసుకోలేదు. మార్నింగ్ సునీల్ చెప్పనన్నా చెప్పలేదు. మర్చిపోయి ఉంటాడేమో! మొన్న ఊరెల్లోచ్చిన కోపం ఇంకా పోలేదు. ముభావంగా ఉంటున్నాడు. బహుశా అందుకే నాతో చెప్పలేదేమో! వెంటనే సునీల్ కి రింగ్ చేసాను.

“ఏంటో తొందరగా చెప్పు,” భూప్రపంచంలో ఇతనొక్కడే బిజీ అన్నట్టు ఫోసులు.

“ఈ రోజు ఆంటీ పుట్టిన రోజు. నీకు గుర్తుందో లేదోనని”

“ఓ అమ్మ పుట్టిన రోజా, ఇప్పుడు అర్జెంటు పనిలో ఉన్నాను. కాసేపయ్యాక ఫోన్ చేస్తాను”, అన్నాడు.

ఆంటీకి రింగ్ చేసి శుభాకాంక్షలు చెప్పాను.

“నీకు గుర్తుందా!!”, ఆంటీ గొంతులో ఆశ్చర్యం.

“నా మొబైల్ గుర్తుచేసింది. అందుకే మొబైల్ ద్వారా విషెస్ చెపుతున్నాను,” నవ్వేసాను.

“విష్ చేసావు. అంతే చాలు,” ఆంటీ గొంతులో ఆనందం.

“ఈ రోజు స్పెషల్స్ ఏమిటి? అంకుల్ మీరు గుడికి వెళ్ళారా?,” అడిగాను.

“స్పెషల్ ఏముంటుంది! మామూలే అన్ని రోజుల్లోలా”

“కొత్త చీర కొనుక్కోలేదా ఆంటీ?”

“నాకెందుకమ్మా ఇప్పుడు కొత్త చీర”

“అదేమిటి అలా అంటారు? అంకుల్ బర్త్ డే కి స్పెషల్ వండారు. గుడికి వెళ్లి అర్చన చేపించారు. పోనీ, లంచ్ కి మీరిద్దరూ హోటల్ కు వెళ్ళండి”

“మీ అంకుల్ కదలొద్దూ! వంట చేసేసాను, పప్పు దోసకాయ వండాను”

ఇంకో నాలుగు మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసాను.

ప్రాబ్లం లూప్ లో కాదు, ఒక పాయింటర్ అడ్రస్ మిస్ అయిందని తెలుసుకోగానే యురేకా అని అరవాలనిపించింది. అరవటం ఆపి ఆ పాయింటర్ దేన్ని అడ్రస్ చెయ్యాలో కనుక్కోమంది బుర్ర. ఆలోచనేమో ఆంటీ మాటల చుట్టూ తిరుగుతుంది. ఈ పాయింటర్ మొదట లోకల్ వేరియబుల్ ని రీడ్ చేసి ఆ తర్వాత ఔటర్ లూప్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఆడ్ చేసుకోవాలి. ఏ ప్రోగ్రామర్ రాసాడో ముందుగా ఈ ప్రోగ్రాంని! లోకల్ వేరియబుల్ని ఇగ్నోర్ చేసి గ్లోబల్ని లూప్లో infinite గా తిప్పాడు.

ఎండ్ యూసర్ టెస్టింగ్ లేకుండా ఎన్ని లూప్స్ మనపై రుద్దేసారో. కుటుంబం, సమాజం నడుమన బొంగరంలా తిరుగుతూ తమని తాము మర్చిపోతున్నారా? అలా మర్చిపోకపోతే స్వార్ధమనే ముద్ర వేసేయ్యటం. ముద్రల సంగతి దేవుడెరుగు, నేను మాత్రం అలా ఉండను. నావారికి నేను ఇచ్చే విలువలో నేనూ ఉండేలా చూసుకుంటాను. హమ్మయ్య ఈ బగ్ ఫిక్స్ అయింది. వేళ్ళను విరుచుకుంటూ సీటులో వెనక్కి వాలాను.

అమ్మ కూడా అంతే, తనని తాను పట్టించుకోదు. నాదేముంది, మీ ఇష్టం అనేస్తుంది ఏ మాటకైనా.

నాకా రోజు బాగా గుర్తు. నేను డిగ్రీలో ఉండగా జరిగింది. ఆరోజు అమ్మ పుట్టిన రోజు. నాన్నకు గుర్తు లేకపోవటం చాలా సాధారణమైన విషయం. అమ్మ పుట్టిన రోజని పాయసం వండటం, మేమందరం గుడికి వెళ్ళటం ఎప్పుడు జరగలేదు. నేను, తమ్ముడు విష్ చేసే వాళ్ళం.

నాన్నకు ఇష్టమైన పూర్ణాలు, నాకిష్టమైన కీమా రోల్స్, తమ్ముడి కోసం గులాబ్ జాం….మా పుట్టిన రోజున మాకు ఇష్టమైనవి తప్పకుండా వండేది అమ్మ. అమ్మకి ఇష్టమైన వంటకం ఏంటో మాకు తెలీదు. తనకు ఇష్టమని పలానాది వండుకుని తిన్నది ఏనాడు లేదు.

నేను, తమ్ముడు ఆరోజు అమ్మను surprise చేద్దామనుకున్నాం. కాలేజీ అయ్యాక నేను బేకరీకి వెళ్లి కేక్ కొన్నాను, తమ్ముడు గ్రీటింగ్ కార్డు కొన్నాడు. నాన్నను డబ్బులు అడిగితే ఏమనేవారో తెలీదు కానీ మేము దాచుకున్న పాకెట్ మనీ సరిపోయింది.

మేమిద్దరం ఇంటికి వెళ్లేసరికి యధావిధిగా అమ్మ నలిగిపోయిన కాటన్ చీరలో ఉంది. మేము వచ్చేసరికి ఎదో ఒక స్నాక్ వండటం అమ్మకు అలవాటు. పకోడీలు చేస్తోంది. వంటింట్లోకి వెళ్లి పొయ్యి కట్టేసి చీర మార్చుకోమన్నాను. అమ్మ వింటే కదా!

నాన్న రాగానే కేక్ బయటకు తీసాం. అదిగో ఆ క్షణం అమ్మ కళ్ళలో తళుక్కున మెరిసిన మెరుపు నేను జీవితంలో మర్చిపోలేను. తమ్ముడు ఫోటోలు తీసాడు. కంటితో మేము చూడలేకపోయిన అమ్మ కళ్ళలో దాక్కున్న చిన్నపాటి చెమ్మ ఆ ఫోటోలలో మాకు కనిపించింది.

ఆ రాత్రి అమ్మ మా గదిలోనికి వచ్చి నన్ను, తమ్ముడ్ని దగ్గరకు తీసుకుని….ఉదయం మీరెవరూ విష్ చెయ్యకపోయేసరికి, నా పిల్లలు కూడా మర్చిపోయారే అనుకున్నాను. కొంచెం బాధేసిందమ్మా అంది. మా నుదిటిపై ముద్దిచ్చి వెళ్ళింది.

జ్ఞాపకాలలో నుంచీ బయటపడి, బగ్ ఫిక్స్ అయిందని మెయిల్ చేసి సునీల్ కి మళ్ళీ కాల్ చేసాను.

“ఈవెనింగ్ తొందరగా రా. మీ ఇంటికి వెళ్దాం,” అన్నాను.

“ఆర్ యు క్రేజీ? మాధాపూర్ నుంచీ అమీర్పేట్ కు వర్కింగ్ డే ట్రాఫిక్లో వెళ్తావా? వీక్ ఎండ్లో వెళ్దాం,” అన్నాడు.

“అడగట్లేదు బాస్, వెళ్దామని చెపుతున్నాను. ఈరోజు మీ అమ్మ బర్త్ డే”, అన్నాను.

మొన్న ఊరెల్లినప్పటి కోపం నాకూ ఉంది. పెళ్ళవగానే పెళ్ళాం జీ హుజూర్ అనుకుంటూ మొగుడేనక ఉంటారనుకుంటారో ఏమిటో?!

తొందరగా వెళ్ళటానికి పర్మిషన్ తీసుకుని ఇన్ ఆర్బిట్ మాల్ కి వెళ్లాను. ఆంటీకి ఏదన్నా గిఫ్ట్ కొనాలి. ఏం కొనాలో తెలియట్లేదు. కళానికేతన్ లో వెంకటగిరి, గద్వాల్ చీరలు చూసాను. నాకు పెద్దవారి చీరల గురించి అంతగా తెలీదు. వంగపండు రంగుకి సన్నటి జరీ బోర్డర్ పుట్టాడ పట్టు చీర బాగుందనిపించింది. సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. కానీ తృప్తిగా లేదు. వాచెస్, హ్యాండ్ బాగ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్ చూసాను. బంగారం, బట్టలు ఇవి కాదు, ఇంకా ఎదో కావాలి. ఆంటీ అభిరుచికి నచ్చే గిఫ్ట్ కావాలి.

ఆంటీకి పాత సినిమాలంటే ఇష్టం. అంకుల్ చేతిలో రిమోట్ లేకపోతే పాత సినిమా వస్తుందేమోనని అన్ని చానెల్స్ మారుస్తారు. మ్యూజిక్ వరల్డ్ లో పాత సినిమా సిడిల ప్యాక్ కొన్నాను. సిడి పెట్టుకుని ఆంటీ ఒక్కరే చూసేలా portable సిడి ప్లేయర్ కూడా తీసుకున్నాను. రెండూ అందంగా గిఫ్ట్ వ్రాప్ చేపించి సునీల్ కి కాల్ చేసి నన్ను మాల్ దగ్గర పిక్ చేసుకోమని చెప్పాను.

“ఏంటి విశేషం, అత్తగారిని కాకాపడుతున్నావ్,” కళ్ళేగరేసాడు.

“హలో మిస్టర్ పతి దేవ్…..గ్రో అప్…..గ్రో అప్…..గ్రో అప్ లైక్ అ రేమాండ్ కంప్లీట్ మాన్,” నేనూ కళ్ళేగరేసాను.

ఓ క్షణం అర్థం కాలేదు తనకి. అర్థం అయ్యాక నవ్వాలో లేక నా వైపు కోపంగా చూడాలో అర్థం కానట్టు పెట్టాడు మొహం. నా పెదవులపై సన్నటి నవ్వు అతని చూపుని దాటిపోలేదు.

“మొన్న ఊర్లో పెద్ద ఫోసులు కొట్టావ్,” కయ్యానికి కాలుదువ్వుతున్నాడు.

“నేనేం ఫోసులు కొట్టలేదు. నాకు ఇష్టం లేని పని నేను చెయ్యలేదు..అంతే,” నేనూ స్థిరంగా చెప్పాను.

“పెద్దవారిని గౌరవించాలని నేర్చుకోలేదా”

“గౌరవించాలని నేర్చుకున్నాను. పెద్ద చిన్న అని కాదు మంచి వారిని గౌరవించాలని గ్రహించుకున్నాను. అయినా నాకు అర్థంకాదు, నీతో పెళ్ళవగానే నీ వాళ్ళందరూ నాకు నచ్చెయ్యాలని, అందరికీ నేను విధేయురాలినై ఉండాలని ఎలా అనుకున్నావ్? అయినా ఇప్పుడేంటి వాదన? ”

కారు ట్రాఫిక్ లో స్లో గా వెళ్తుంది.

“నాకు మీ పెద్దమ్మ నచ్చలేదు. కూపీలు లాగినట్టు ఆవిడ అడిగే ప్రశ్నలు, నిలువునా చీల్చుతున్నట్టు చూసే చూపులు, కోడలిపై మాటమాటకి ఫిర్యాదులు, కూతుర్నేమో ఆకాశానికి ఎత్తడాలు, కూతురి అత్తగారిని తిట్టటం……పైగా నాకు నీతి బోధలు. సంవత్సరం క్రితం జరిగిన మన పెళ్ళిలో మీకు మర్యాదలు సరిగ్గా జరగలేదంట. ఇవన్నీ ఒకెత్తు, ఆ మామగారిని ఎలా విసుక్కుంటుందో చూసావా? ముసలావిడ, అత్తగారు అని కూడా లేకుండా”

“ఏదోలే పెద్దాళ్ళ చాదస్తం”

“ఏదోలే మాఆవిడకు ఇష్టం లేదు అని ఎందుకు అనుకోలేవ్? పెద్ద కామిడి ఏమిటంటే, నువ్వు బాగుండాలని నేను వ్రతాలు పూజలు చెయ్యాలంట. నేను బాగుంటే ఆటోమేటిగ్గా మీ అబ్బాయి బాగుంటాడులే అన్నాను, అబ్బో ఆవిడకు ఎంత కోపం వచ్చిందనుకున్నావ్,” నాకు నవ్వొచ్చింది.

“పెద్దమ్మ నీకు బొట్టు పెట్టి, జాకిట్టు ముక్క పెడుతున్నప్పుడు నువ్వు ఆవిడ కాళ్ళకు దణ్ణం పెడతావనుకుంది. కనీసం వచ్చేటప్పుడైనా ఆవిడ కాళ్ళకు దణ్ణం పెడితే నీకేం పోతుంది”

“ఇది మరీ బాగుంది. నువ్వు మా చుట్టాలింటికి వచ్చినప్పుడేమో నీకు సకల మర్యాదలా! అయినా నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను. ఇంక ఈ వాదన ఇక్కడితో ఆపేయ్”

సునీల్ పెదాలు ఎదో పదాన్ని ఉచ్చరించాయి. నాకు వినిపించకపోయినా అదేమిటో నాకు తెలుసు..పొగరు అంటాడు. అనుకోనీ. అతను నన్ను అర్థం చేసుకోవాల్సిందే.

మొన్నీ మధ్య కూడా ఇంతే, నేను ఆంటీకి ఎదురు చెప్పాను అంటాడు. నేను నా అభిప్రాయం చెప్పాను, అది ఎదురు చెప్పటం కాదంటే వినిపించుకోడే! నా అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పటం అంటీకి కూడా నచ్చలేదని నాకు తెలుసు. ఆ మూస పాత్రల్లో నుంచీ, దోరణల్లోనుంచీ బయట పడదామని కూడా అనుకోరు. ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరయినట్టు ఉంటుంది.

మొదట్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా సునీల్ పై కోపం వచ్చేసేది. ఆ తర్వాత ఆలోచించుకుంటే, ఇందులో తప్పంతా సునీల్ ది కాదనిపించింది. అత్త కోడల్ల సంభందం ఎన్ని వంకరలు తిరిగిందో చుట్టూ చూస్తూనే ఉన్నాను. భార్యంటే ఇలాగే ఉండి తీరాలనే అంచనాలు, భ్రమలు మరెన్నోమనలో. చిన్నప్పటి నుంచీ మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న సమాజం, పరిస్తితులు మనల్ని ముద్రల్లా తయారు చేసేస్తాయి. ఇప్పుడు కోపం పోయి నా కర్తవ్యం తెలిసింది.  విమర్శిస్తూ కూర్చోవటం వళ్ళన ఉపయోగం లేదు, అర్థం చేసుకునే అవసరం, ఎదిగే అవకాసం ఇవ్వాలి నేను.

సన్నగా చినుకులు మొదలయ్యాయి. కారు అద్దాలపై పడిన చినుకులు గాలికి పైపైకి వెళ్ళటం చూడటం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆశికి పాటలు ఆన్ చేసాను. తుంబి హో, అబ్ తుంబి హో, జిందగీ అబ్ తుంబి హో పాట కారంతా పరుచుకుంది.

మమ్ముల్ని చూడగానే ఆశ్చర్యం, ఆనందంతో విచ్చుకున్న ఆంటీ మొహం చూస్తుంటే అనిపించింది — మన అమ్మలకు వాళ్లకు వాళ్ళు ప్రాముఖ్యం ఇచ్చుకోవటం తెలీదు. ఇంట్లో అందరికీ అన్నీ సమకూరుస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ చేసుకోరు. మనం కూడా అమ్మను taken for granted గా తీసుకుంటాం. అలా ఉండటం అమ్మలకు ఆనందాన్ని ఇస్తుందా? ఏ మాత్రం గుర్తింపు కోరుకోని మనుష్యులు నిజంగా ఉంటారా?

ఆఫీసులో ఆన్యువల్ రివ్యూస్ అప్పుడు జరిగే రభస గుర్తొచ్చింది. ఇక్కడ నచ్చకపోతే ఇంకో కొలువనుకుని వెళ్ళిపోయే పనిలో సరైన గుర్తింపు రాకపోతేనే తెగ బాధ పడిపోతామే, జీవితమే కుటుంబం అనుకుని బతికే అమ్మకు కొద్దిపాటి గుర్తిపును కూడా ఇవ్వకపోవటం ఎంత దారుణం. ఏమన్నా అంటే, త్యాగాల్లాంటి ఒట్టి మాటలు, బరువైన మూటలు నెత్తిన పెట్టేస్తారు. ఆ బరువులో కాస్త భాగం మీరు మోయ్యండి అంటే ఆడవారికి మాత్రమే వర్తించే నీతులు సూక్తులు వల్లెవేస్తారు. బాబోయ్……. హిపోక్రసీ!

నాకెందుకమ్మా ఇవన్నీ అంటూ మొహమాట పడుతూనే కేకు కట్ చేసారు ఆంటీ. హ్యాపీ బర్త్ డే టు యు….క్లాప్స్ కొడుతూ పాటను నేను మొదలుపెట్టాను – సునీల్, అంకుల్ అందుకున్నారు. ఆంటీ సిగ్గుపడ్డారు. చిటికెలో వంట చేసేస్తానన్నారు. ఈ రోజు మీరు సెలెబ్రిటి, పనేం చెయ్యకూడదు అంటూ ఫుడ్ ఆర్డర్ చేశాం.

“ఆంటీ కోసం కొన్నాను. నువ్వు ఇవ్వు“, గిఫ్ట్ ప్యాకెట్ సునీల్ కు అందించాను.

“ఏంటిది?,” అడిగాడు.

“ఆంటీ అభురుచికి నచ్చే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. I am sure she will love it.”

“ఓహ్!”, సునీల్ ఆశ్చర్యార్ధకం.

“మై డియర్ అబ్బాయ్,మన వారిని ప్రేమించటం, గౌరవించటం, గుర్తించటం అంటే ఇది. కాళ్ళకు దణ్ణాలు పెట్టడం కాదు. ఈ సారి నీ బర్త్ డే కి రేమండ్ సూట్ కొనిస్తాలే”, కళ్ళేగరేస్తూ నవ్వేసాను.

“ఈ రేమండ్ మాన్ ఎక్కడ తగులుకున్నాడు, నా ప్రాణం తీస్తున్నావ్”, సునీల్ హాయిగా నవ్వేసాడు.

సునీల్ గిఫ్ట్ ప్యాక్ ఆంటీకి ఇస్తుంటే ఆవిడ కళ్ళలో మెరుపు. కొన్నేళ్ళ క్రితం అమ్మ కళ్ళలో చూసిన అదే మెరుపు. ఆ మెరుపు సునీల్ హృదయాన్నిసూటిగా తాకింది. నన్ను,ఆంటీని కౌగలించుకుంటూ గర్వంగా, కృతజ్ఞతగా నవ్వాడు.

అంకుల్ మోములో దోబూచులాడిన గుర్తింపు ఆ సాయంత్రానికే నిండుదనాన్ని తెచ్చింది.

“మన విలువను తెలియచెప్పటం కూడా మన బాధ్యతే ఆంటీ”, వెళ్తూ వెళ్తూ చిన్నగా అన్నాను. ఓ వాన చినుకు ఆంటీ కళ్ళలో కురిసి హరివిల్లై మెరిసింది.

   -ప్రవీణ కొల్లి

DSC_0005

 

లెమనేడ్

Kadha-Saranga-2-300x268

పదకొండు గంటలవేళప్పుడు నేను ఇంటిబయట నిమ్మకాయల బండి దగ్గర్నించి లోపలి కెళ్ళబోతుంటే వీధిమలుపు దగ్గర కనిపించింది మా అక్కయ్య.

“అయ్యో, వెళ్ళిపోయాడే! నేను కూడా తీసుకునేదాన్ని నిమ్మకాయలు” అంది దగ్గరికి రాగానే. నేనేం మాట్లాడకుండా అక్క చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళాను.

“ష్ష్…” అంటూ ఆయాసపడుతూ కుర్చీలో కూర్చుంది అక్క. “దగ్గర్లోనే ఉంటున్నా వారానికోసారైనా కలవడానికి కుదరట్లేదు. ఇవాళ మీ బావ ఎవరిదో పెళ్ళని వెళ్ళారు. ఇంట్లో ఒక్కదాన్నేకదాని ఇట్లా వచ్చాను” అంది.

మంచినీళ్ళు తెచ్చిచ్చి “కాఫీ పెట్టనా?” అని అడిగాను.

“అబ్బ! ఏం ఎండలే తల్లీ! ‘నాలుగు వీధులు దాటడమేకదా! అంతమాత్రమైనా నడవకపోతే ఎట్లా?’ అనుకుని రిక్షా ఎక్కలేదు. నోరెండిపోయి నాలుక పిడచకట్టుకుపోతోంది. కాఫీ వద్దుగానీ చల్లగా కాసిని నిమ్మకాయనీళ్ళు కలిపివ్వు” అంది అక్క.

“ఇంట్లో నిమ్మకాయలు లేవే” ఇబ్బందిగా చెప్పాను.

“అదేమిటే, నేను వచ్చేటప్పటికి నిమ్మకాయలబండి దగ్గరే ఉన్నావు?” ఆశ్చర్యంగా అడిగింది అక్క.

“ఎక్కడ కొన్నాను? బేరం కుదరందే” అన్న నా సమాధానానికి ప్రశ్నార్థకంగా నావైపు చూసింది అక్క.

“ఆకురాపిడి మచ్చల్తో కసుగాయల్లా ఉన్నాయి, ఒక్కోటి మూడురూపాయలు చెప్పాడు. ఎక్కువ తీసుకుంటే రేటు కాస్త తగ్గిస్తాడేమోనని’ డజనెంతకిస్తావు?’ అనడిగాను. ‘ముప్ఫైయారు ‘ అన్నాడు నిర్లక్ష్యంగా. ‘ముప్ఫై కిస్తావా?’ అన్ననంతే, నావైపు చూడనుకూడా చూడకుండా బండి నెట్టుకుని వెళ్ళిపోయాడు” ఉక్రోషంగా చెప్పాను.

“హ్హు…!”  అంటూ దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలింది అక్క. “ఎండవేళప్పుడు చల్లగా తాగొచ్చు, ఎవరైనా ఇంటికొస్తే ఇవ్వడానికి కూడా బాగుంటుంది, నిమ్మకాయ షర్బతు చేసి పెట్టుకుందామని బుద్ధి పుట్టింది మొన్న. నిమ్మకాయలు కొనుక్కొద్దామని బజారు కెళ్ళాను. రోడ్డుపక్కన గంపలో పెట్టుకుని అమ్ముతున్నాడు గోళీక్కాయలంత నిమ్మకాయలు. వాణ్ణేదో ఉద్ధరిస్తున్నా ననుకుంటూ ‘యాభైకాయలు తీసుకుంటాను. కరెక్టు రేటు చెప్పు’ అన్నాను. వాడు నన్నో అడవిమృగాన్ని చూసినట్టు చూశాడు. ‘యాభైకాయలు నువ్వు తీసుకుంటే వాళ్ళందరికీ ఏమమ్మాలి?’ అన్నాడు చుట్టూ నిలబడి ఉన్నవాళ్ళను చూపిస్తూ. వాడి మాటలు అర్థంకాక నేను వెర్రి చూపులు చూస్తుంటే ‘మనిషికి పదికాయలు మించి ఇచ్చేది లేదు ‘ అన్నాడు. నేను ఆ షాకులోంచి బయటపడి ‘పోనీ, ఆ పదికాయలే తీసుకుందాం’ అనుకునేటప్పటికీ వాడు గంప ఖాళీ చేసుకుని వెళ్ళిపోయాడు. ‘ఎట్లాంటి రోజులొచ్చాయి?’ అనుకున్నాను. ఇక్కడికి వస్తుంటే ఎదురుగా నిమ్మకాయలబండి కనిపించగానే ప్రాణం లేచొచ్చింది. కానీ… ఏం చేస్తాం? ప్రాప్తం లేదు” అంది అక్క ఇంకా దీక్ఘమైన మరో నిట్టూర్పు వదిలి.

అక్క మాటలకి బిత్తరపోయిన నేను అసంకల్పితంగా టీవీ పెట్టాను.

ఏదో సినిమా పాట వస్తోంది. హీరో, హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి పచ్చికబయల్లో కింద పడుకున్నారు. పైనెక్కడో లారీల్తో గుమ్మరించినట్టు నిమ్మపళ్ళు దొర్లుకుంటూ వచ్చి వాళ్ళ చుట్టూ చేరిపోయాయి. లాంగ్షాట్లో అప్పటిదాకా ఆకుపచ్చని బ్యాక్గ్రౌండ్ మీద ఇద్దరు మనుషుల ఆకారాలున్నట్టు కనిపిస్తున్న సీనల్లా పసుపుపచ్చని బ్యాక్గ్రౌండ్ మీదికి మారిపోయింది.

చిరాగ్గా ఏదో గొణుక్కుంటూ అక్క నా చేతిలోంచి రిమోట్ లాక్కుని ఛానల్ మార్చింది.

అక్కడ వ్యాపార ప్రకటనలు వస్తున్నాయి. నల్లగా నిగనిగలాడుతున్న ఒకమ్మాయి సబ్బంతా అరగదీసి ఒళ్ళు రుద్దీ రుద్దీ స్నానం చేసి మిలమిలా మెరిసిపోతూ బయటికొచ్చి అందాలరాణి కిరీటం గెలుచుకుంది. కిరీటం ఆ అమ్మాయి శిరస్సు నలంకరించగానే నిమ్మకాయల వాన కురిసింది. ‘శ్రేష్ఠమైన నిమ్మకాయల రసంతో మీ చర్మసౌందర్యంకోసం ప్రత్యేకంగా తయారుచేసిన మా సబ్బునే వాడండి’ అనే బ్యాక్గ్రౌండ్ ఎనౌన్స్మెంట్తో ప్రకటన ముగిసింది.

అక్క మొహంలో చిరాకు ఇంకా ఎక్కువైంది. మళ్ళీ ఛానల్ మార్చింది. అక్కడా ప్రకటనలే వస్తున్నాయి.

పనిమనిషి అంట్లు తోముతూ సబ్బుని విసిరికొట్టింది. యజమానురాలు పనిమనిషిమీద చెయ్యెత్తింది. పనిమనిషి యజమానురాలిని దూరంగా నెట్టేసి బొడ్లోంచి ఇంకో సబ్బు తీసి దాంతో అంట్లు తోమి తళతళా మెరిపించింది. యజమానురాలు నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తుంటే పనిమనిషి “ఒక్కో సబ్బులో పది నిమ్మకాయల రసముంటుంది అమ్మగారూ! ఎంత జిడ్డుపట్టిన గిన్నెలైనా, మాడిపోయిన అంట్లైనా దీని దెబ్బకి లొంగాల్సిందే” అంది. ఇద్దరూ కలిసి నిమ్మకాయలు ఎగరేసుకుంటూ డాన్సు చెయ్యడం మొదలుపెట్టారు.

అక్క మొహం చూస్తే రిమోట్ని టీవీమీదికి విసిరేస్తుందేమోనని భయమేసి, రిమోట్ అక్క చేతిలోంచి పీక్కుని, ఛానల్ మార్చి, రిమోట్ దూరంగా పెట్టి వంటింట్లో కెళ్ళాను.

నేను కుక్కరు పెట్టి బయటికి రాగానే “ముందా టీవీ ఆపు” అని అరిచింది అక్క. నేను బెదిరిపోయి గబుక్కున టీవీ ఆపేశాను.

“పళ్ళు తోముకునే పేస్టులో నిమ్మకాయట, లెట్రిన్ కడుక్కునే లిక్విడ్లో నిమ్మకాయట, నాలుగురోజులు పోతే ‘మీరు బూట్లకి వేసుకునే పాలిష్లో నిమ్మకాయ ఉందా? కళ్ళకు పెట్టుకునే కాటుకలో నిమ్మకాయ ఉందా?’ అని కూడా అడుగుతారు. వాళ్ళకి పిచ్చో, మనకి పిచ్చో అర్థం కావట్లేదు” కోపంతో బుసలు కొడుతోంది అక్క.

‘అక్కని చల్లబరచడం ఎట్లాగా’ అని ఆలోచిస్తూ లోపలికెళ్ళి, అట్నించి ఎకాఎకిని బయటికి గెంతి, కాసేపట్లో అదే వేగంతో ఇంటికొచ్చాను.

“ఏమిటే ఆ పరుగులు?” కంగారుగా అడిగింది అక్క.

“ఉండు, ఇప్పుడే వస్తా” అంటూ వంటింట్లోకి దూరాను.

పదినిముషాల తర్వాత వంటింట్లోంచి ఇవతలికి వచ్చిన నన్ను “ఇప్పుడే వస్తానని ఇంతసేపు చేశావేంటి?” అయోమయగా అడిగింది అక్క.

మాట్లాడకుండా నా చేతిలోని గ్లాసు అక్క చేతిలో పెట్టి ఎదురుగా కూర్చున్నాను.

“ఏమిటీ…ఇది?” అంది అక్క గ్లాసు తీసుకుంటూ.

“రస్నా! లెమన్ ఫ్లేవర్” అన్నాను.

“మనకింక ఈ ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ డ్రింకులే గతి” అంది అక్క ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీ చేసేసి.

Jyothiపాలపర్తి జ్యోతిష్మతి

సాయం

radhamanduva1

 

ఫెళ ఫెళ ఉరుములూ, మెరుపులతో పెద్ద వర్షం. ఆకాశం అంతా నల్లని కాటుకగా మారి నా చుట్టూ ఉన్న చెట్లనీ, నా ఒడ్డున ఉన్న ఇళ్ళనీ అంధకారం లోకి నెట్టేసింది. రివ్వున వీస్తున్న చలిగాలికో మరి అక్కడ నుండి కదలడం ఇష్టం లేకో నాలోని ప్రతి నీటి అణువూ వణికిపోతూ ముడుక్కుని కూర్చున్నట్లు నిశ్చలంగా ఉంది.

 

‘రత్తో! అన్నం తింటివా?’ అనో, ‘నరిసీ పనిలోకి బోలా?’ అనో, ‘ఒరేయ్! ఆడకూతురికి సాయం చెయ్యకుండా అట్లా చూస్తా నిలబడినావేందిరా – ఇట్ల పట్టియ్ ఆ కోడిని!?’ అనో గోలగోలగా ఏవేవో మాట్లాడుకునే జనం నా గట్టు మీద ఒక్కళ్ళు లేరు. వానకి దడిసి అందరూ ఇళ్ళల్లో దూరి కూర్చున్నారు. చెట్లల్లో నుండి నా అంచుల్లోకి దుమికి దుమికి ఆడుకునే జీవాలు కూడా ఎక్కడివక్కడ దాక్కున్నాయి.

రంగమ్మవ్వ రాత్రి ఆమెని సముదాయించి ఆమెనీ, ఆమె కూతురునీ తనింట్లోకి తీసికెళ్ళినప్పుడు విముక్తమైనట్లుగా ఉరిమిన ఆకాశం సన్నని తుంపర్లను విదిలించింది. నాలుగో ఝాము నుంచీ మరీ క్షణం తీరిక లేకుండా బిందెలతో పోసినట్లుగా కుమ్మరిస్తూ నా ప్రయాణానికి సన్నాహాలు చేస్తుంది. చెట్లు, పుట్టలు, దార్లు అన్నీ నీళ్ళమయమై నాలోకి చేరుతున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా నీటి బిందువులు మిరుమిట్లు గొలుపుతున్నాయి.

ఎన్నో చోట్లలో నాకు ఆనుకుని ఉన్న చెట్లనీ, దుబ్బులనీ, రాళ్ళనీ, రప్పలనీ తాకుతూ చెంగుచెంగున పరిగెత్తాలనే నా కోరిక ఇంకాసేపట్లో తీరబోతోంది. దీని కోసం నాలుగేళ్ళ నుండీ ఎదురు చూస్తున్నాను. నిజమే – కాని నాకు ప్రస్తుతం ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు.

పుట్టినప్పటి నుండీ సంతోషంగా పరుగులు తీస్తూ ఆడుకున్నాను. ఎప్పుడూ గలగలా నవ్వుతూ ఉండేదాన్ని. నా ప్రక్కనున్న చెట్లనీ చేమలనీ అడిగి వాటి రంగురంగుల ఆకులతో, పువ్వులతో రోజుకో రకంగా అలంకరించుకునేదాన్ని.   ఒడ్డునున్న రాళ్ళని కావాలని తాకి నవ్వేదాన్ని. అవి నేను పెట్టే గిలిగింతలకి నాతో పాటు నవ్వి నవ్వి అలిసి అరిగిపోయేవి.

ఎంత బావుండేవి ఆ రోజులు!? వర్షం ఎక్కడికెళ్ళిందో మరి ఐదేళ్ళనుండీ…. నాకు కనపడకుండా పోయింది. నాలోకి చేరవలసిన నీరు సంగతి అలా ఉంచి, ఉన్న నీరే సూర్యుని దాహానికి సరిపోవడం లేదు. అందరినీ, అన్నింటినీ పలకరిస్తూ పారుతూ పోవలసిన నేను నాలుగేళ్ళుగా ఇక్కడే ఆగిపోయాను. శుష్కించిన శరీరంతో మడుగులాగా పడి ఉన్నాను.

ఆశాదృక్పథంతో జీవితాన్ని సాగించాలనుకునే నేను ఇక్కడ కొచ్చిన కొత్తల్లో పెద్దగా బాధ పడేదాన్ని కాదు. నిజానికి ఈ కొత్త రకమైన నిశ్చలతకి సంతోషంగా ఉండేది.   నా చుట్టూ ఉన్న వాటిని పరిశీలించడం మంచి అలవాటుగా అలవడింది.

నేను ఇక్కడ ఆగాకే నా ఎదురుగ్గా ఇందిరమ్మ ఇళ్ళు లేచాయి. నా ఒడ్డు పై నుంచి మెట్లు ఏర్పరచుకోని ఆడవాళ్ళు బిందెలతో నా దగ్గర కొచ్చి నవ్వుతూ, తుళ్ళుతూ నా నీళ్ళని తీసికెళుతుంటే భలే ఆనందపడేదాన్ని.

తరవాత్తర్వాతే నాలో ఓ రకమైన నిర్లిప్తత ఏర్పడింది. ఏమీ చేయలేని నిస్సహాయత, నిస్పృహలతో బాధపడేదాన్ని.

రెండేళ్ల క్రితం – ఆ రోజు …. నాకు బాగా గుర్తుంది. పడమటింట్లో విశ్రాంతి కోసం సూర్యుడు వేగిరపడుతున్నాడు. ఆర్ర్తత లేశమాత్రమైనా లేని నన్ను గమనిస్తున్న నింగి మందంగా మేఘాలను కదిలిస్తుంది. నేను దిగులుగా ఆకాశాన్ని చూస్తున్నాను. బహుశా ప్రార్థిస్తున్నానేమో!

ఆ సమయంలో నా ఒడ్డు పైన మెత్తని పాదాల చప్పుడు వినిపించింది. తల తిప్పి చూశాను.

అడుగులో అడుగేస్తూ నడుస్తున్న ఆమెకి 24 ఏళ్ళుంటాయి – పుష్టిగా, బొద్దుగా ఉంది. నల్లని నీల మేఘ ఛాయ మేని. పసుపులో అద్దిన తెల్లని పెళ్ళి చీర, మెడలో పసుపుతాడు. దానికి వేళ్ళాడుతూ ఆమె గుండెలని తడుముతున్న మంగళ సూత్రాలు. గోరింటాకుతో ఎర్రగా పండిన చేతులు. కుడి చేతి చిటికెన వ్రేలిని భర్త ఎడమ చేతిలో ఉంచి పారాణి ఆరని పాదాలతో సన్నని అడుగులు వేస్తూ దించిన కళ్ళని మరింత దించి నా వైపు చూసింది.   నా కళ్ళు ఆమె కళ్ళతో కలిసి ఒక్కసారిగా జిగేలుమన్నాయి. చిత్రమైన అనుభూతి నాలో గాఢంగా.

సాయంకాలపు ఎండ కెంజాయ రంగు ఆమె బుగ్గలను తాకి నా నీళ్ళల్లో ప్రతిఫలించింది. చల్లని మలయ మారుతం ఆమె తలలోని మలె్లల పరిమళాన్ని నింపుకొని నా మీదకి వాలింది.   నా వైపు అలాగే చూస్తూ నడిచి తూర్పు దిక్కున నేను ఆగిన చోట ఆగి ఎదురుగ్గా ఉన్న ఇంట్లోకి వెళ్ళింది.

సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. పనుల నుండి జనం ఇళ్ళకి చేరారు. “మ్మే సుజాతా! మన సూరి గాడు పెళ్ళాన్ని పిలచకొచ్చినాడంట సూసేసొద్దాం దా” అంది రత్తి.

“అవునంట. మూడు నిద్దర్లన్నా చేయించకుండా అట్లెట్లా పంపిచ్చేసినారక్కా! సవితి తల్లి వదిలిచ్చేసుకుందనుకో కన్నతండ్రి అన్నా చెప్పగూడదా?” అంది సుజాత కోపంగా.

“ఆఁ! సరేలే పా! వాడొక తండ్రా? తల్లి చచ్చిపోతే సాకాల్సొస్తుందని చిన్నప్పుడే హాస్టల్లో చేర్పించినాడు. పది గూడా చదువుకోనీకుండా ఆ పాప తావున సంపాదిచ్చల్లని మిల్లులోకి కుట్టు పనికి అంపించినాడు. కూతురికి పెండ్లి చేయకపోతే నలుగురూ మొకానూస్తారని చేసినాడు…. ఆ పాప సంపాదించిండే డబ్బుతో తాళిబొట్లు కొని. – తల్లిలేని పిల్ల పాపం, ఈ తాగుబోతు సూరెదవేం బాదలు పెడతాడో? – తొందరగా పోయొద్దాం పద. తెల్లవారి చేసిండే కూర రొంతే ఉంది. ఈ పూట రసం పెట్టాల్ల” అంది రత్తి.

వింటున్న నాకు నా గుండె గొంతుకలో కొట్టాడినట్లయింది.   కళ్ళ నిండా కలలు నింపుకుని సిగ్గుపడుతూ అతని ప్రక్కన సున్నితంగా నడిచి వెళ్ళిన ఆ అమ్మాయిని తల్చుకుని ‘పాపం’ అనుకున్నాను.

అప్పటినుండీ ఆమెనే గమనిస్తున్న నాకు సమయం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. ఆమె నవ్వినప్పుడు నేను నవ్వుతూ, ఆమె దిగులుగా ఉన్నప్పుడు ఏమయిందో అని ఆశ్చర్యపోతూ ఆమెలో ఒక భాగమయ్యాను.

నీళ్ళకి అమ్మలక్కలతో వస్తే ఆమె గురించిన విషయాలు తెలుస్తాయనుకుంటే ఎప్పుడూ ఒక్కతే అందరూ పనులకి పోయాక ఏ మధ్యాహ్నమో వస్తుంది. అది నాకు విశ్రాంతి సమయం. నేను పడుకుని ఉంటే నా ప్రక్కనే కూర్చుని నా వైపే కన్నార్పకుండా చూసేది. అప్పుడప్పుడూ సన్నగా నవ్వేది.

2010-10-18

ఆమెని అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. మరీ ఆమె పక్కింట్లో ఉండే రంగమ్మవ్వ ఆమెని తన సొంత కూతురు లాగా చూసుకుంటుంది. కొడుకు కోడలు పనికి పోయాక రంగమ్మవ్వకి ఆమెతోనే కాలక్షేపం.

ఒకరోజు రంగమ్మవ్వ ఆమె పొట్ట వైపు చూస్తూ “పాపా! ఎన్నో నెల?” అంటుంటే నాకు చాలా సంతోషం కలిగింది.

రోజులు గడిచేకొద్దీ నిండుగా మారుతున్న ఆమెని చూస్తూ ఆందోళన పడ్డాను. పిల్ల పుట్టింది. ఆ పిల్ల పుడుతున్నపుడు ఆమె పెట్టిన కేకలకి నేను ఎంతగా వణికిపోయానో!   ఇక ఆ రోజు నుంచీ ఆమె తప్పేమీ లేకుండానే ఆమె జీవితంలోకి చీకటి, దు:ఖం నిర్దాక్షిణ్యంగా అడుగుపెట్టాయి.

“ఆడపిల్లని కనడం నేరమా అవ్వా!” అని బిడ్డని ఒళ్ళో పెట్టుకొని ఆమె అవ్వని అడుగుతుంటే ఇటు నేను అటు రంగమ్మవ్వ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం.

“నీ కర్మ పాపా! ఈ తాగుబోతోడి సంగతి మాకు ముందే తెలుసు. ఆడపిల్లని కాదు పాడు కాదు, ఏదో ఒకటి వంక పైకి దూకి కొట్టడానికి. లోపలికి పద – తుంపర్లు పడతాండాయి – బిడ్డ తడిసిపోతంది” అంది అవ్వ.

నేను గలగలలు మర్చిపోయి ఇక్కడ ఆగిపోయినప్పుడు నాకు కలిగిన దు:ఖం ఆమెలో చూశాను. చీకటి పడుతుందంటే ఇప్పుడు భయంగా ఉంటోంది . మత్తుని తాగి తూలిపోతూ వచ్చే అతను ఇంట్లోకి వెళ్ళిన కాసేపటికే దబదబ ఆమెని కొడుతున్న చప్పుడు, పసిపాప రోదన హృదయ విదారకంగా. ఆ ఏడుపుని వినీ వినీ నా గుండెలు ఎండిపోతున్నాయి. రోజు రోజుకీ క్షీణించిపోతున్నాను. తూర్పు వైపు నుండి పడమర వైపుకి – ఆమె ఇంటి నుంచి దూరంగా – ఇవతలకి జరిగిపోతున్నాను.

ఈమధ్య అతను ఇంటికి సరిగ్గా రావడం లేదు. అతను రాని రోజు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అతను ఇంటికి కావలసినవి కూడా ఏమీ తేవడం లేదులా ఉంది. రోజు రోజుకీ ఆమె నాలాగే కృశించి పోతోంది. మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకొని బరువెక్కిన ముఖంతో నా ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చునేది. నాతో ఆమె బాధలన్నీ చెప్పుకొని సాంత్వన పొందేదేమో లేచి లోపలకి వెళ్ళేప్పుడు నన్ను చూసి మెల్లిగా నిర్లిప్తంగా నవ్వేది.   నాకు ఆమె ఏమైపోతుందోనన్న ఆందోళన కలగసాగింది.

నింగిని వేడుకొని వేడుకొని వేసారి పోయి నేను నిష్టూరాలకి దిగిన ఆ రోజుల్లో ఆమె ముఖంలో ఏదో నిర్ణయం తాలూకు ఆలోచనలు కదలాడటం గమనించాను. నాలోని విచారం మాయమై ఆసక్తి చోటు చేసుకుంది.   ఆమెకి మంచి రోజులొచ్చాయన్న భావం నాలో కలిగి ఉప్పొంగిపోయాను.

ఆరు నెలల క్రితం అనుకుంటా పొద్దున్నే ఆమె పాపని రంగమ్మవ్వకి ఒప్పచెప్పి ఎక్కడికో వెళ్ళింది. సాయంకాలం వచ్చేప్పుడు చేతిలో సంచులు. “అవ్వా! పని దొరికింది. ఇంతకు ముందు నా చేత చీరలు కుట్టించుకున్నోళ్ళంతా తలా ఒక చీరిచ్చినారు కుట్టమని” అంది. ఆమెలో, ఆమె మాటల్లో మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసం నాకు కనపడింది. గర్వపడ్డాను. ఆరోజు ఆకాశం నన్ను సన్నని జల్లులతో తడిపింది. పోయిన ప్రాణం వచ్చినట్లయింది.

ఆమె ముఖంలో ఈ మధ్య ఓ తృప్తిని చూస్తున్నాను.   రెండు నెలల క్రితం పెద్ద బంకు తెచ్చి ఆమె ఇంటికి ఆన్చి షాపులాగా పెట్టుకుంది. కారుల్లో పెద్ద పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు వచ్చి ఆమెకి చీరలు ఇచ్చి పోతున్నారు. రకరకాల పూసలతో, ముత్యాలతో, దారాలతో ఆమె ఆ చీరలని అందంగా అలంకరిస్తుంటే నేను చెట్ల ఆకులతో, పువ్వులతో అలంకరించుకునే రోజులు గుర్తొచ్చి ఆనందం కలుగుతోంది.

పగలంతా అంత పని చేస్తూ కూడా వెలిగి పోయే ఆమె ముఖం చీకటి పడుతుందంటే చాలు నల్లబడిపోయేది. ప్రతిరోజూ అతని చేతిలో ఆమె తన్నులు తినవలసిందే. ఎప్పుడూ వర్షం కురవాలని ప్రార్థించే నేను ఇప్పుడు ఆ సంగతే మర్చిపోయి ఆమె ఏడవకుండా ఉండాలని ప్రార్థించసాగాను.

రోజులు గడుస్తున్నాయి. నాకేదో సంతోషం కలిగించాలని అప్పుడప్పుడూ చిన్న చిన్న జల్లులు తప్ప ఆకాశం నా ఏ కోరికా తీర్చడం లేదు.

ఆ రోజు మొదటి ఝాము వరకూ వెన్నెలని కురిపించిన పౌర్ణమి చంద్రుడు క్రమంగా మందగిస్తున్నాడు. నీడలు పొడుగ్గా పడుకుని విశ్రమిస్తున్నాయి. ఆ సమయంలో అతను తూలుతూ వచ్చాడు. రోజూ అతన్ని చూసి అసహ్యంతో కనులు ముడుచుకునే నేను ఆ రోజు ఏదో అగాధమైన మానసిక స్థితిలోకి నెట్టబడినట్లుగా అభావంతో చూస్తుండిపోయాను.

ఆమె వాకిట్లో కూర్చుని దీపపు వెలుగులో చీర కుట్టుకుంటోంది. ఆమెని అలా చూస్తున్న నాలో ఏదో చైతన్యం లోపల లోలోపల అంతరాంతరాలలో మొదలై మెల్లమెల్లగా నా హృదయాన్ని శాంతిమయం చేస్తోంది. కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఏం జరగబోతుందో వినడానికి ఆయత్తపడుతున్నాను.

ఒక్కసారిగా భగ్గుమంటూ వెలుగు, వెనువెంటనే ఆమె ఆక్రందన. అతనంతగా ఆమెని హింసిస్తున్నా ఎప్పుడూ కూడా అలాంటి అరుపు ఆమె నోటి వెంట రాలేదు.   దిగ్భ్రాంతితో కూడిన అదురుతో అదాటున కళ్ళు తెరిచి చూశాను. ఆమె అరుస్తూ తన కాళ్ళ దగ్గర మండుతున్న చీరని వంగి చేతులతో ఆర్పుతుంది.

అప్పటికే ఆమె కేక విన్న ప్రక్క ఇళ్ళ వాళ్ళూ, నా ఒడ్డున ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న వాళ్ళూ లేచి పరిగెత్తుతున్నారు.   ఏం జరిగిందో అర్థం కాక ఉద్వేగంతో నా ప్రాణం పోతున్నట్లయింది. ఉన్నట్లుండి హోరుగా చలిగాలి వీచసాగింది – చెట్ల వేళ్ళని కదిలించేంత బలంగా. నేను ఆమెకేమయ్యిందో తెలుసుకోవాలని గాలి సాయంతో ఊపు తెచ్చుకొని ఆమె ఇంటి వైపుకి జరిగాను.

ఆమె ఇంటి ముందు జనం గుంపుగా చేరి గందరగోళంగా అరుచుకుంటున్నారు. గుంపులోంచి దారి చేసుకోని రంగమ్మవ్వ, ఒక చేతిలో లాంతరు మరో చేతిలో ఆమె రెక్కా పట్టుకొని నడిపించుకుంటూ నా దగ్గర కొచ్చింది. వాళ్ళ వెనకే నలుగురైదుగు ఆడవాళ్ళు. అవ్వ లాంతర్నికింద పెట్టింది. గాలికి లాంతరు రెపరెపలాడుతోంది. రంగమ్మవ్వ నా మీదకి వంగి నా అంచునున్న బురద మట్టిని తీసి ఆమె అరచేతులకి పూసింది. కాలి బొబ్బలెక్కిపోయి ఉన్నాయి ఆమె చేతులు.

“అవ్వా! చీర కాలిపోయింది.   మేడమ్ కి ఏం సమాదానం చెప్పాల్ల? ఇట్లని తెలిస్తే ఇంకెవురూ పనియ్యరవ్వా!” ఆమె కదిలి కదిలి ఏడుస్తోంది పేగులు కదిలిపోయేట్లుగా.

“ఏం జరిగింది పాపా అసలు?” అంది రంగమ్మవ్వ.

“కరెంటు పోయిందిగా అవ్వా. రేపు మద్దేనానికంతా చీర ఇచ్చెయ్యాల్లని చెప్పింది మేడమ్. గుడ్డి దీపంలో కనిపిచ్చకపోతే ఎన్నెల ఎలుతురుండాదని వాకిలి తీసి చీర కుట్టుకుంటున్నా. ‘వాకిలి తీసి పెట్టి ఎవుడికి గేలమేస్తన్నావే’ అంటా నా మీద కొచ్చాడు కొట్టడానికి. తూలి దీపం బుడ్డి మీద పడ్డాడు. దీపం చీర మీద పడి మంటలు లేచినాయి. ఆర్పినాను గాని ఆపాటికే చీర పైట కొంగంతా కాలిపోయింది. బయమేస్తాందవ్వా! ఆ మేడమ్ కేం చేప్పేది? ఏమంటాదో?” అంది. ఆమె గొంతులో నిస్సహాయతని విన్న నా హృదయం ద్రవించిపోయింది.

వెనగ్గా వస్తున్నోళ్ళు కూడా గబగబా ఆమె చుట్టూ చేరారు.

“అందురూ మొకానూసినా సిగ్గులేకుండా ఎద్దులాగా పడి నిద్రపోతాన్నాడు ఎదవ సచ్చినోడు” అంది రత్తి.   రత్తి చేతిలో ఆమె బిడ్డ ఉంది.

“నీకేం కర్మమొచ్చిందే ఈ మొగుడితో పడి ఏడవడానికి. చీరలు కుట్టుకోని సంపాదిచ్చుకుంటాండావు. వాడికి నువ్వు కూడేస్తండావు గాని నీకు వాడు కూడేస్తాండాడా? నేనైతే లెయ్యరా నా బట్టా! నీతో నాకేం పని? అని అనుండేదాన్ని. నువ్వు గాబట్టి వానితో యాగతావుండావు” అంది నరిసి.

“తాగినోడి తావున తన్నులు తినే దాన్ని నిన్నే చూసినా. వాన్నీడ్చి పాడేయలేనిదానివి నువ్వేమి ఆడదానివమ్మే? చేతిలో కట్టె పట్టుకో రేపటినిండి – పైకి దూకితే ఎయ్యి సచ్చినోడిని కాళ్ళిరిగేట్టు” అంది రత్తి కసిగా.

“ఊరుకోండమ్మే కొట్టుకుంటా ఉంటే సంసారాలేం బాగుపడతాయి? రేపు వాడిని పంచాయితీకి లాగి బయం పెట్టిచ్చాల్ల ఇంకోసారి పాప ఒంటి మీద సెయ్యి ఎయ్యకుండా వార్నింగిప్పిచ్చాల్ల” అంది రంగమ్మవ్వ.

ఆ మాటలు విన్న ఆమె ఏడవడం ఒక్కసారిగా మర్చిపోయి తల ఎత్తి వాళ్ళ వైపు చూసింది. వేదనతో కమిలిన ఆమె బుగ్గల మీద నుండి అప్పటి వరకూ ధారాపాతంగా కారిన కన్నీళ్ళు ఆగిపోయాయి.

“మీరందురూ నా తావున నిలబడుంటే నాకు బయం పోయిందవ్వా! మా అమ్మకి గూడా అప్పుడు పక్కిళ్ళోళ్ళు ఇట్లా దైర్యం చెప్పిండింటే మందు తాగి చచ్చిపోయుండేది కాదేమో అవ్వా! ” అంటూ భుజంతో కన్నీళ్ళని తుడుచుకుంది.   తల్లిని తలుచుకోవడం వల్ల అయుంటుంది ఆమె తుడుచుకుంటున్నా కూడా ఆగకుండా కన్నీళ్ళు కారిపోతున్నాయి.

“ఏడవగాకమ్మే మేమంతా ఉళ్ళా” అంది రత్తి ఆమెకి దగ్గరగా వచ్చి.

“రత్తక్కా! చీర నువ్వు పని చేసి పెట్టే మేడమ్ దే” అంది ఆమె.

“చీరని గూర్చి గూడా దిగులొద్దులే పాపా! రేపు పంచాయితీ అయినాక బజారుకి పోయి అలాంటి చీరే ఒకటి కొని కుట్టిద్దువుగాన్లే. దొరక్కపోతే దాని కరీదు కడుదువుగాని” అంది రంగమ్మవ్వ.

“చాలా కరీదుంటదవ్వా! అంతేడదెచ్చేది?” రత్తి దగ్గరున్న బిడ్డని తీసుకొని భుజాన వేసుకొంటూ అంది ఆమె.

“ఎట్లోకొట్లా చేద్దాం లేమ్మే!” అంది సుజాత. ఆ ఏరియాలో సుజాతే కాస్త కలిగినది.

“నేను గూడా చెబుతాలే మేడమ్ కి, ఆయమ్మ మంచిది” అంది రత్తి

‘ఇవుళ్ళా’ అన్నట్లు బిడ్డ ఆమె మెళ్ళో ఉన్న పసుపుతాడుని పట్టుకుంది నిద్రలో. మంగళ సూత్రాలు తన అరచేతిలోకి తీసుకుని వాటి వైపే తదేకంగా చూసి తల ఎత్తి రంగమ్మవ్వ వైపు చూసింది. ఆ చూపుని, ఆ చూపులోని నిశ్చయాన్ని గుర్తించిన ఆ ఆడవాళ్ళ ముఖాలు తెరిపిన పడ్డట్లయ్యాయి.

నేను గిర్రున సుళ్ళు తిరుగుతూ ఆనందబాష్పాలతో ఆకాశాన్ని చూశాను.

ఫెళ ఫెళ మంటూ ఆకాశం ఉరిమింది. ‘వర్షం వచ్చేట్లుంది పదండి పదండం’టూ జనం గబగబా అక్కడ నుండి కదిలారు. రంగమ్మవ్వ ఆమెని ఆమె బిడ్డతో సహా తనింట్లోకి నడిపించుకు వెళ్ళింది.   సన్నని జల్లుగా మొదలైన ఆ వర్షం తెల్లవారేప్పటికి బలపడి ఏకధారగా కురుస్తోంది.

సంతోషంగా ప్రయాణించవలసిన నేను ఆమె జీవిత పయనాన్ని కళ్ళారా చూడాలని కదలకుండా ముడుక్కున్నట్లుగా కూర్చుని ఉన్నాను. అంతా అర్థం అయ్యి కూడా అర్థం లేకుండా ఆతృత పడుతున్న నన్ను చూసి ఆకాశం మెరుపు ముఖమేసుకుని ఆప్యాయంగా నవ్వుతోంది.

ఆ నవ్వు చూసిన నా మనసు నెమ్మదించి నిండుగా మారింది.   ఆమెని, ఆమె చుట్టూ ఆమెకి రక్షణగా ఉన్న స్రీ్తలని తల్చుకుంటూ నేను నిదానంగా, గంభీరంగా అక్కడ నుండి సాగిపోయాను.

ఎంత దూరము..అది …ఎంత దూరము ?

Kadha-Saranga-2-300x268

ఆ గడపతో ఆమెకెంత అనుబంధమున్నా, ఆ క్షణంలో మాత్రం తను పూర్తిగా పరాయిదనట్టు, అపరిచితునింటికొచ్చినట్టు.. కొత్త గా, బెరుకుగా, చెప్పలేనంత జంకుతో అలానే నిలబడిపోయింది – మూసిన ఆ తలుపు బయట.
కాలింగ్ బెల్ నొక్కబోయిన చేతిని అప్పటికి రెండు సార్లు వెనక్కి లాక్కుని, మరో సారి ప్రయత్నించనా వద్దా? – అనే సందిగ్ధంలో ఆగింది.
ఎవరింటికైనా, మనం ఇష్టముంటే వెళ్తాం. లేకుంటే మాన్తాం. కానీ పెళ్ళైన ఆడపిల్ల పరిస్థితి మాత్రం అలా కాదు. ఇష్టమున్నా, లేకున్నా, మొగుడింటికి వెళ్ళాల్సిందే. వెళ్ళి తీరాల్సిందే. అదొక సోషల్ లా! సామాజిక చట్టం. ఫామిలీ రూల్. దాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. అంతే. అదంతే.
ఇప్పుడు దీప్తి కూడా అదే సిట్యుయేషన్ లో వుంది. కాదు. ఇరుక్కుంది.
ఆమె వెనకే నుంచుని, – కూతురు పడుతున్న అవస్థనంతా గమనిస్తున్న ఆ తండ్రి హృదయం ఒక్కసారి గా నీరైపోయింది. ఆ కన్న తండ్రి గుండె కలుక్కుమంది. గారం గా పెంచుకున్న కన్నబిడ్డనా స్థితిలో చూడటం భరించలేనంత బాధగావుంది. చూస్తూ వూరుకోడం అమానుషం అని పిస్తుంది. ఒక్కసారిగా ఉద్వేగం పెల్లుబుకింది. ‘వొద్దురా దీపూ. నీకిష్టం లేని పని చేయొద్దు. నువ్వు నాకు భారమౌతావా. కాదు. ముమ్మాటికీ కాదు. పద. మనింటికి పోదాం’ అని అనాలనుకున్న మాటలు పెదవి దాకా వచ్చి, తిరిగి గొంతులోకెళ్ళి, ఆగిపోయాయి. కాదు. ఆపబడ్డాయి. భార్య మాటలు గుర్తుకు రాడంతో. “ అక్కడ మీకు అవమానం జరిగిందనో, తల కొట్టేసినట్టైందనో, ఇంకోటనో, మరొకటనో…కూతుర్ని వెంట పెట్టుకు రాకండి. మీరు వెళ్తోంది దాన్ని, దాని మొగుడింట్లో దింపి రావడానికి. దాని కాపురాన్నది సరిదిద్దుకోడానికి అన్న సంగతి అస్సలు మర్చిపోకండి. ఏమిటీ, వింటున్నారా?” ..ఆయనేం మాట్లాడ్లేదు. సరే అన్నట్టు తలూపూడు. కళ్ళముందింత జరుగుతున్నా, భార్య మాటకు కట్టుబడ్డ వాడిలా, అందుకే – మౌనంగా వుండిపోయాడు. దీపూ వైపు అసహాయంగా చూస్తూ.
ఇక అదే చివరిసారనట్టు, కళ్ళు మూసుకుని ధైర్యం తెచ్చుకుంటూ, ఎలా ఐతేనేం! కాలింగ్ బెల్ నొక్కింది.
కోయిల కూత కమ్మగా కూ..కూ..అంటూ మోగింది. ఈ ట్యూన్ ని తనే సెలెక్ట్ చేసింది. శ్రీకాంత్ కి ఇష్టమని తెలిసి.
కోయిల పాట ఆగిపోయింది. ఆమె లో కంగారు మొదలైంది.
ఇప్పుడు తలుపులు తెరుచుకుంటాయి. తనని చూస్తాడు. ఊ… చూసి? ఏమంటాడు?
నవ్వుతాడు. కాదు. దానికంటె ముందు ఆశ్చర్యపోతాడు. పట్టలేని ఆనందంతో అతని కళ్ళింతింతలై పోతాయి, వెన్నెల కాంతితో విచ్చుకుంటాయి.
తననిన్నాళ్ళూ మిస్సైనందుకు ఏమంటాడు? అతని మొదటి మాట ఎలా వుంటుంది? వినాల్నుంది.
అసలు మనిషెలా వున్నాడూ? దేవదాసు లా కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నీరసంగా కనిపిస్తాడా? లేక, మజ్ఞూ లా మాసిన బట్టల్తో అగుపిస్తాడా?
ఆమె ఆత్రానికి, ఊహలకీ ఫుల్ స్టాప్ పెడుతూ..’యెస్..కమింగ్..’ అంటూ లోపలనించి, అతని స్వరం వినిపించింది. ఆ తర్వాత ఆ తలుపు తెరుచుకోడమూ జరిగిపోయింది.
ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.
ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోందని, అర చేతులు చల్లబడుతున్నాయన్న సంగతి కూడా ఆమెకి తెలీడం లేదు.
ఆమె నవ్వ బోయింది. అది చూసి అతని మొహం అప్రసన్నంగా మారిపోయింది. మరు క్షణంలో విపరీతంగా గంభీరమై పోతూ ఆమె మొహం లోకి లోతుగా చూసాడు.
ఎందుకొచ్చావ్? అని అడిగినట్టనిపించిందామెకి. వెంటనే ప్రాణం చచ్చినట్టైంది.
భరించలేనంత అవమానంతో కళ్ళు దించేసుకుంది.
మొగుడనేవాడు చూపుల్తోనే ఇంత కఠినంగా అవమానించగలడన్న సంగతి ఆమెకిప్పుడే తెలుస్తోంది. ఆమె అమాయకత్వం కానీ, అసలు త్రేతా యుగం నాట్నించీ కూడా మొగుడి తీరు ఇంతే. ఆ రాముని అవమానపు చూపులు భరించలేక కాదూ?, ఆ సీతమ్మ తల్లి నిప్పుల్లో దూకింది?! హు.
అయినా, మొగుడు అన్ని చోట్లా మొగుడు కాదట. అనుభవజ్లులైన ఇల్లాళ్ళ మాటలు కాదని కొట్టేయలేం. ఇవన్నీ తనకూ తెలిసి రావాలంటే దీప్తికింకా టైం పడుతుంది. అవును, పాపం! ఎన్నాళ్ళైందనీ పెళ్ళై? సరిగ్గా యేడాది కూడా కాలేదు మరి.
ఇంతలోనే ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. కారణం – ఆమె దృష్టిలో పెద్దదే. అందుకే ఇల్లొదిలి వెళ్ళిపోయింది. తన కోపం తీర్చి, కాళ్ళు పట్టుకుని బ్రతిమాల్తాడనుకుంది..కానీ ఆ పప్పులేం వుడకనట్టున్నాయి.
రోజులు, వారాలు, గడచి, నెలలు దాటినా మొగుడి జాడ లేదు. అయితే ఇక రాడా? వొదిలేసినట్టేనా? దిగాలు పడిపోయింది. కళ తప్పిన కూతురి మొహం చూసి తల్లే నెమ్మదిగా అన్నీ అడిగి తెలుసుకుంది. మంచి మాటలు చెప్పి, కూతుర్ని దింపి రమ్మని చెప్పింది వాళ్ళాయనకి.
అదీ జరిగిన సంగతి.
ఇలా వెనక్కి రావడం దీప్తికస్సలిష్టం లేదు.

ఇన్నాళ్ళ సాహచర్యం చేసిన కృతజ్ఞతైనా లేని ఈ మనిషి – రమ్మని పిలవకుండా, కనీసం ఫోనైనా చేయకుండా..తనంతట తానై రావడం మనసుకి నచ్చట్లేదు. పైగానామోషీ గా కూడా వుంది.
అయినా, ‘పోన్లే పాపం మొగుడుం గారే కదా’అని తిరిగొస్తే…ఇలానా ఆహ్వానించడం?
‘ఛ’ అనుకుంటూ తల దించేసుకుంది.
అతనికిదేం పట్టనట్టు లోపలకెళ్ళిపోయాడు. తను ఆఫీస్ కెళ్లే హడావుడి లో వున్నాడన్న సంగతి ఆ ఇద్దరికీ అర్ధమయ్యేలా ..గబ గబా షూస్ వేసుకుని, ఆ లేసులకి ఓ రెండు ముళ్లు బిగించాడు. మెడకేసుకున్న టై కు ఓ ముడేసి, క్షణంలో లాప్టాప్ ని బాగ్ లో తోసి, కారు కీస్ తీసుకుని పెద్ద పెద్ద అడుగులతో గడప దాటుకుంటూ… లిఫ్ట్ వైపు వేళ్ళిపోయాడు దురుసుగా.
అతని ప్రవర్తనకి ఆ ఇద్దరూ ఖిన్నులైపోయారు. చిన్నబోయారు. ఆమె – చలనం లేనిదైపోయింది. అయితే ముందుగా తేరుకున్న ఆ తండ్రి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే తనేం చేయాలో అర్ధమైన వాడిలా, చేతిలోని సూట్ కే ని లోపలకి తోసేసి, “అల్లుడు గారూ! వుండండి..నేనూ వస్తున్నా..అక్కడ దాకా డ్రాప్ చేద్దురుకానీ..” అంటూ అల్లుడికి వినిపించేలా ఓ కేకేసి, అంతే వేగంగా ఇటువైపు తిరిగి అన్నాడు. “ వస్తానురా తల్లీ. జాగ్రత్త! అవసరమైతే వెంటనే కాల్ చేయ్.” అంటూనే, ‘ నీకేం ఫర్వాలేదు నేనున్నా..’ అని భరోసోగా సైగ చేసి పరుగులాటి నడకతో వెళ్ళిపోయాడాయన.
నిజానికి కూతుర్ని కొత్తగా కాపురానికి పంపుతున్నప్పుడు కంటేనూ, ఆడపిల్లనిలా బలవంతంగా అత్తారింట్లో దింపి, వెళ్లిపోవాల్సి రావడమే ఏ తండ్రికైనా దుఃఖం తో గుండె చెరువౌతుంది. గుండె భారమౌతుంది. రంగనాధానికి కూడా అలానే వుంది. కానీ భార్య అలా అనుకోకూడదనీ, ఆ ఆలోచన్లతో మనసుని బాధపెట్టుకోకూడదనీ, సర్ది చెప్పింది. అందుకు తగిన కారణాన్ని కూడా ఎంతో సహనంగా వివరించడం తో ఆయన ఆగుతున్నాడు.
ఏ కారణాలెలా వున్నా, అవేవీ దీప్తి ని ఓదార్చలేకపోతున్నాయా క్షణం లో.
ఆమె ఒంటరిగా అక్కడే నిలబడి పోయింది, మాట రానిదానిలా, అసలేమీ అర్ధం కాని దానిలా అయిపోయింది పరిస్థితి.

10411164_610855999030323_8810754119747777955_n

Painting: Rajendra Jadeza

మన వివాహ వ్యవస్థే అంత. సమస్త అస్తవ్యస్తాల మయం. అశాంతి నిలయం. మనసులు కలవని స్త్రీ పురుషులు కేవలం పెళ్ళి కారణంగా కలుసుండటం ఎంత దారుణం?- ఎవరికోసం?ఎందుకోసం? దేని కోసం? ఏ గమ్యం కోసం? ఈ కలసి బ్రతకడం అనిపిస్తుంది. అన్నీ ప్రశ్నలే. తెలీని పజిల్సే.
ఎందుకెళ్ళాలి తను లోపలకి? అసలెందుకు రావాలి తను వెనక్కి? ‘అవును. నిన్నెవరు రమ్మనేడ్చారిక్కడా? ’ అని తనని మొహమ్మీదే అడిగినట్టు లేదూ?, అతనూను, అతగాని ప్రవర్తనాను..?
“అలా అనుకోకు. నీ ఇంట్లో నీకవమానమేవిటీ, వింత కాకుంటే? ఊ?.. చూడు దీపూ! అదే నీ ఇల్లు. నీ ఇంటికి నువ్వెళ్తున్నావ్. ఎవరో వచ్చి నిన్ను బొట్టు పెట్టి పిలవాలని ఎందుకనుకుంటావ్? వెళ్ళు. నా మాటవిని వెళ్ళు. ” తల్లి మాటలు గుర్తుకొచ్చాయి.
“అవును. ఇది తన ఇల్లు. చట్ట ప్రకారం అతను తన భర్త. అతని మీదే కాదు, ఈ ఇంటిపై కూడా తనకు సర్వ హక్కులూ, అధికారాలూ వుంటాయి. వుండి తీర్తాయి. అసలా మాటకొస్తే, తనెప్పుడైనా రావొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కాదని ఎవరంటారో తనూ చూస్తుంది. ఏమనుకుంటున్నాడు తనని? హు.!” ఉక్రోషం తో ముక్కుపుటాలదిరాయి.
“అయినా, నువ్విప్పుడింతగా అప్సెట్ అయ్యేందుకేముంది చెప్పు! నీ మొగుడు నిన్ను పన్నెత్తి పలకరించలేదన్న మాటే కానీ, నీ మొహం మీద తలుపులు మూసి పోలేదు గా పొమ్మని. అంటె పరోక్షంగా, లోపలకి రమ్మనే గా దానర్ధం? పద. లోపలకి పద. గడపలోకి ముందు గా కుడికాలు పెట్టు. ..” అంటూ ఆమెకి ధైర్యాన్నిస్తూ, ముందుకు తోసింది అంతరాత్మ.
గట్టిగా నిట్టూర్చి, లోపలకడుగేసింది దీప్తి. కొత్తపెళ్లికూతురు గృహప్రవేశం చేసినట్టు. ఒక్కసారి నలువైపులా కలయచూసింది.
ముందు హాలంతా గజిబిజిగా వుంది. న్యూస్ పేపర్లు గుట్టలు గుట్టలు గా పడున్నాయి. టీవీ స్క్రీన్ మీద దుమ్ము పేరుకు పోయుంది. షూ రాక్ లో చెప్పులు, షూస్ ఎడా పెడా బోర్లా పడున్నాయ్. టేబుల్ కాలెండర్ ల్ పేజ్ మార్చనే లేదు.
ఐ తను వెళ్ళిన నెలనే చూపిస్తోంది. అంటే – మారలేదు. శ్రీ కూడా మారలేదు. తన గురించి ఆలోచిస్తూ..అలానే విరక్తిగా వుండిపోయాడా!?
ఆ ఒక్క చిన్ని తలపే..మనసులోని భారాన్నంతా దించేసింది.
స్త్రీ హృదయం-
పాషాణం కాదు. నవనీతం మరి.
మనల్ని ప్రేమించే వారి ప్రేమ, ఎంత శాతమనే విషయం మనం దగ్గరున్నప్పుడు కంటేను దూరమైనప్పుడే తెలుస్తుంది. నా అనుకున్న వారి అసలైన ప్రేమ మన ఆబ్సెన్స్ లో నే తెలియాలి.
శ్రీని చూస్తూనే అనుకుంది. చిక్కిపోయాడని. ఇప్పుడీ ఇల్లు చూస్తుంటే మరీ జాలేసిపోతోందామెకి.
‘నీ కోసమే మేమంతా ఎదురుచూస్తున్నాం..ఎన్నళ్ళైపోయింది నువ్వు మా అతీ గతీ పట్టించుకోక? ఏమైపోయావు మిత్రమా? అని తనని దీనంగా అడుగుతున్నట్టు తోచింది.
ఆ ఇల్లాలి గుండె కరిగిపోయింది. అవును. ఏ ఇల్లాలైనా మొగుడి తర్వాత అమితంగా ప్రేమించేది తన ఇంటినే ! నా ఇల్లు, నా సంసారం అనే ప్రేమతో కూడిన కమిట్మెంటే కనక లేకుంటె ఏ ఇల్లాలికైనా, ఈ ఇళ్ళన్నీ ఏమైపోయెండేవి? ఎంత చెత్త కుండీలైపోయేవీ కావూ?
హాల్ దాటుకుని ఇటుగా, వంటింట్లోకొచ్చి చూసింది. కిచెన్ ప్లాట్ ఫాం అంతా యెడా పెడా డబ్బాలతో, స్టీల్ గ్లాసులతో, విరిగిపోయిన గాజు కప్పుల తో నిండిపోయుంది. సింక్ నిండా చెత్తా చెదారము, అన్వాష్డ్ డిషెస్ తో నానా బీభత్సంగా కనిపించింది.
పనమ్మాయి సంగీత రావడం లేదా పనికి? ఫోన్ చేయాలి.
శ్రీకాంత్ కి వంటిల్లు ఎలా వుండాలంటె, స్పిక్ అండ్ స్పాన్ లా వుండాలి. ఏ ఒక్క వస్తువు బయటకి కనిపించకూడదంటాడు. మరి ఇప్పుడీ వాతావరణాన్నెలా ఎలా భరిస్తున్నాడూ? – ‘నువ్వు లేవన్న విషాదంలే..” మనసు చెప్పింది. ఎంత ఆనందమేసిందో అంతర్వాణి మాటలకు.
వేళకేం తింటున్నాడో ఏవిటో అని గ్రోసరీ షెల్ఫ్ తెరిచి, ఆరాగా చూసింది. వస్తువులన్నీ అలానే వున్నాయి. డస్ట్ బిన్ నిండా బయట్నించి తెచ్చుకున్న ఫుడ్ పాక్స్ కనిపించాయి. అంటే, వంట చేసుకోడం లేదన్నమాట. ఈ మూణ్నెల్లన్నించీ హోటళ్ల కూడే తింటున్నాడా? అయ్యో! శ్రీ కాంత్ కి అస్సలు బైట తిండంటేనే – ఎలర్జీ కదూ?
‘పాపం! మరేం చేస్తాడే?, వండి వార్చి పెట్టే ఇల్లాలు హఠాత్తుగా ఇల్లొదిలి పోతే?- నీ చేతి వంటంటే ఎంత ఇష్టమూ? ఎన్నిసార్లు చెప్పాడు నీకాసంగతి? మర్చిపోయావా? “
“ఊహు. మర్చిపోలేదు. “
“మరెందుకెళ్లినట్టు..ఆ పిచ్చాణ్ణి వొదిలి?”
“ఎందుకంటె, ఎం..దుకం..టే.. ఇప్పుడు కాదులే తర్వాత చెబుతాలే..నా మనసా, చేయక రభస, అవతలికి ఫో..” నవ్వుకుంటూ తనలో తను, పడగ్గదిలో కి తొంగి చూసింది.
నల్ల టేకు, నగిషీ చెక్కిన డబల్ కాట్ మంచం. రాత్రి రంగుల స్వప్నం.
ఇదేమిటీ, ఇలా? మంచానికి అడ్డంగా ఆ తలగడలు?
అది కాదు, మంచం మీద పరచివుండాల్సిన బెడ్షీట్ జారిపోయి, బ్లాంకెట్ కార్పెట్మీద కూలిపోయి పడుంది. క్లాజెట్ డోర్స్ సగానికి జరిపి, వదిలేసున్నాయి. లోపల హాంగర్కి ఒక్క చొక్కా వ్రేలాడి లేదు. బట్టలన్నీ ఒకదాని పైనొకటి ఇష్టమొచ్చినట్టు జారిపడి కుప్పపోసుకునున్నాయి. చూడం గానే, కంపరం పుట్టుకొచ్చింది ఆమెకి.
పాపం, శ్రీకాంత్! తను లేనని, ఇక రానని నిరాశతో, బెంగతో…హూ!
ఇలా నిట్టూరుస్తారు కానీ, చాలామంది ఇల్లాళ్ళకు అదే ఓ గొప్ప బలాన్నిచ్చే అంశం. ‘మా ఆయన నేను లేకుండా బ్రతకలేరు. కనీసం కాఫీ అయినా పెట్టుకుని తాగలేరు..అంటూ గర్వంగా చెప్పుకోడం ఇష్టం. అదొక హోదా. పెళ్లానికి మొగుడు చేయించకుండానే అమిరే ధగధగల నగ.
ప్రస్తుతం ఆ సంబరం లోనే వుంది మన దీపూ కూడా.
హూ! పిచ్చివాడు!చెలి లేని చిరుగాలులెందుకు? …నా దేవి లేని ఈ గుడి ఎందుకు? అని అనుకున్నాడేమో! మరి ఆ సంగతి తనతో చెప్పలేదెందుకనీ?
“ పెళ్ళాలయ్యాక – ప్రేమికులు ప్రేమించుకోడం మానేస్తారట. నీకా భయం వుండదు. ఎందుకంటే నీది ప్రేమ వివాహం కాదు కాబట్టి. నువ్వు ఇష్టపడి శ్రీకాంత్ ని పెళ్ళి చేసుకుంటోంది.. అతన్ని జీవితాంతం ప్రేమిచడానికే. తెలుసా?”
తల్లి – తన చెవిలో రహస్యం గా చెప్పిన మాటలు తలపుకొచ్చాయి.
ఎంత బాగా చెప్పింది అమ్మ! తను వినదు కానీ, అమ్మ చెప్పే ప్రతి మాటా ఎంతో విలువైనది! నిజానికి అమ్మ చెబితేనే గా, తను వెనక్కి వచ్చేసింది ఇలా!
“అలా అమ్మ మీద కంతా నెట్టేయకు. నీకు మాత్రం మనసులో రావాలని లేదా, ఏమిట్లే.” మనసు టీజ్ చేసింది. .
అప్పటి దాకా మొగుడి మీదున్న అనుకొండ లాటి కోపం పోయి, ఆ స్థానే, అనురాగ గంగ వెల్లువై పుట్టుకొచ్చింది.
తల్లి మాటలు గుర్తుకొచ్చాయి గుప్ఫున. “ ప్రతి భర్తకీ తన భార్య అవసరం ఎంతో వుంటుందన్న సంగతి తెలుసు. కానీ, ఎటొచ్చీ ఇంత అని చెప్పడం మాత్రమే తెలీదు. అంత మాత్రాన, అతను నిన్ను ప్రేమించడం లేదని అపోహపడటం సమంజసం కాదు సుమా. భర్త కోపంలో వున్నప్పుడే భార్య అతన్ని అర్ధం చేసుకోవాలి. అప్పుడే అర్ధాంగి అనే పదానికి అసలైన అర్ధం లా నిలుస్తుంది ఇల్లాలు.”
“నిజం చెప్పావమ్మా! ..ఇదిగో ఈ ఇంటినిలా సంత లా చూస్తుంటే, ఈ ఇంటికి నా అవసరం ఎంతుందో, ఈ మనిషికి నా ఆవశ్యకత ఏ రేంజ్ లో వుందో ఇట్టే తెల్సిపోతోంది. థాంక్స్ అమ్మా, థాంక్యు!” -మనసులోనే తల్లికి థాంక్స్ చెప్పుకుంది సంతోషంగా.
భర్త మీద పట్టలేనంత కోపమొచ్చినప్పుడు, మనస్పర్ధలు మితి మీరినప్పుడు . ఆ ఆగ్రహంలో ఏ స్త్రీ అయినా డిసైడైపోతుంది. ఇక ఇతనితో కలసి కాపురంచేయడం కంటే, విడిపోయి ఒంటరిగా బ్రతకడమొకటే సుఖమని. కానీ, అదే భర్త – తను దూరమైతే బ్రతకలేడన్న సంగతి తెలుసుకున్నప్పుడు మాత్రం – తన తప్పుడు ఆలోచనకి పశ్చాత్తపం చెందుతుంది. అందుకు నిదర్శనమే ఈమె!- దీప్తి.
సాయంత్రం ఆయనగారు ఆఫీస్ నించి ఇంటికొచ్చేలోపు ఈ కూలబడ్డ సామ్రాజ్యాన్ని పునః నిర్మించి, యువరాజా వారి పాలెస్ లా మార్చేయాలని గట్ఠిగా నిర్ణయించుకుంది.
ఉత్త ఇల్లేనా? లేక అతనికమిత ప్రియమైన బెడ్రూం కూడా అలంకరిస్తావా?”
-‘ ఫోవోయ్, నా ఇల్లు, నా మొగుడు – నా ఇష్టం. నేనేమైనా చేసుకుంటా. మధ్యన నీకుందుకు చెప్పాలి? బిడియ పడిపోయింది.
‘గుడ్ దీపూ. గుడ్. అదీ స్పిరిట్ అంటే. నువ్వెదుగుతున్నావ్’ అమ్మ నవ్వుతూ వెన్ను తట్టినట్టైంది.
ఇంటిని ఒక పట్టు పట్టాలంటే..ముందు ఓ కప్ – ఫిల్టర్ కాఫీ కావాలి తనకు. అర్జెంట్ గా!
నడుం చుట్టూ, చీర కొంగు బిగించి కుచ్చెళ్ళు పైకి దోపి, వంటింట్లో కెళ్ళి, స్టవ్ వెలిగించింది.
డికాషన్ కని, నీళ్ల గిన్నె వుంచుతూ..అల్లరిగా ఓ అడ్వర్టైజ్మెంట్ ని ఇమిటేట్ చేసింది. “ టింగ్ టింగ్..మొగుడితో పోట్లాడి పుట్టింటికెళ్ళి, తిరిగొచ్చారా?
ఇల్లంతా యుధ్ధం తర్వాతి వాతావరణం కనిపిస్తోందా? అయితే వినండి. మొండి మొగుణ్నీ, ఇంటి చెత్తనీ ఒక కొలిక్కి తేవాలంటే మీకు వెంఠనే కావాలి ఈ దీప్తి చేతి కాఫీ ! ..చిక్కనైన రుచి గలది, చక్కని చురుకుదనాన్ని కలిగించేది..దీప్తి చేతి కాఫీనే తాగండి. తాగించండి. క్షణాల్లో కోపం మాయం. ఇంటి పని శుభ్రం. ఇంక ఆలస్యమెందుకు. పదండి అసలైన సిసలైన కాఫీని ఆస్వాదిద్దాం. టింగ్ టింగ్..’ తన ప్రకటనలకి తనే లిరిక్ కట్టి పాడుకుంటూ, ..ఘుమఘుమలాడే కాఫీ తయారుచేసుకుంది. ఆ కేరళా కాఫీ ఫ్లేవర్ ఘుమాయింపుల ఆఘ్రాణింపులో.. ఆహాహా..! ఎక్కడ్లేని ఉత్సాహం పొంగుకొచ్చేసింది. ఆ వెనకే, ఉల్లాసంగా..పనిలోకి దూకింది.
రేడియో ఎఫెం హిందీ సాంగ్స్ వింటూ, హమ్మింగ్స్ తో..హాహా రాగాలతో.. హోరుగా, హుషారుగా డస్టింగ్, వాషింగ్, క్లీనింగ్ పనుల్లో మునిగి తేలింది. అప్పుడప్పుడు మెడొనాని గుర్తుచేసుకుంటో, బూజు కర్రలు పట్టుకుని షకీర లా నడుం ని రింగులు తిప్పుతూ.. ఈల వేసుకుంటూ, గోల చేసుకుంటూ… చకచకా ఇంటి పనంతా ఫినిష్ చేసేసింది.
అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. “దీపూ! కాలాన్ని సంతోషంతో నింపుకుంటూ, క్షణక్షణాన్ని అనుభూతించడానికే మనకీ జన్మ సరిపోదు. అలాటిది సమస్యలను కొనితెచ్చుకోడానికి నీకు టైమెక్కడుంటుంది చెప్పు? ఊ?”
‘ అబ్బ. కరెక్ట్ గా చెప్పావు మమ్మీ..అద్భుతం నీ మాటలు.” మనసులోనే తల్లిని ప్రశంసించింది.
మనం కష్టంలో వున్నప్పుడు, ఊరడించే వారి మాటలే మనకెక్కువగా గుర్తుకొస్తుంటాయి. అవి జీవితానుభవాల తో కూడి వుంటం వల్ల వెన్నెంటే వస్తుంటాయి. అందుకే దీప్తికి తల్లి మాటలు అడుగడుగునా, పదే పదే తలపుకొస్తున్నాయి.
*******
పగలైపోయింది. సాయంత్రం చీకట్లు చుట్టుకునే దాకా ఆమెకి టైమే తెలీలేదు.
బూజు రాలగొట్టడంతో – గోడలు, దుమ్ము వదిలించడంతో గ్లాస్ అద్దాలు, తళతళమంటున్నాయి. పాలరాతి ఫ్లోరింగ్ – అద్దం లా మెరిసిపోతోంది.
కిటికీలకి, తలుపులకీ కొత్త కెర్టెన్స్ మార్చింది. సోఫా దిళ్ళకి మిర్రర్ వర్క్చేసిన కవర్లు తొడిగింది.
బాల్కనీ లో పూల కుండీలన్నిటికీ నీళ్ళు పెట్టి, వాట్నొక క్రమంలో అమర్చింది.
చివరగా, ఫ్లవర్ వాజ్ లో తాజా పూలు సర్ది, స్ప్రే జల్లింది. గుప్పుమనే గుభాళింపులతో నిండిపోయింది ఆ ప్రదేశమంతా.
తన టాలెంటంతా ఉపయోగించి మరీ ప్రత్యేక శ్రధ్ధతో ఇంటిని అలంకరించింది. ఆమె – ఇంటీరియర్ డెకరేషన్ లో స్పెషల్ డిప్లొమా చేసింది. కొన్నాళ్ళయ్యాక, కన్సల్టెన్సీ స్టార్ట్ చేయాలనే ఆలోచన కూడా వుంది.
శ్రీకాంత్ ఇంటినిలా చూస్తూ చూస్తూనే..అతనికి తన మీదున్న కోపమంతా పోవాలి. అలకలన్నీఅటకెక్కి, తామిద్దరూ కలిసి మునపటిలా..హాయిగా నవ్వుకోవాలి.
అమ్మేం చెప్పింది?
“మాటల్లో సైతం గతంలోకెళ్లకుండా జాగ్రత్తపడాలి. తెలిసిందా? ఎందుకంటే, అన్ని యుధ్ద్ధాలకి మూలకారణాలు -మాటలే! భార్యాభర్తలు మాట్లాడుకోడం వల్ల – కాపురంలో శాంతి కలగాలి కానీ, చిచ్చు రగలకూడదు. గుర్తుపెట్టుకో. సరేనా దీపూ?”
“అలాగే అమ్మా! ప్రామిస్. అసలేమీ అనను. అతన్ని మాటల్తో సాధించను సరా?”
అవును. ఇకనించి అన్నీ అమ్మ చెప్పినట్టే వింటుంది తను.
అతనికిష్టమైన వంటకాలు చేసి, డైనింగ్ టేబుల్ మీద నీట్ గా సర్దేసి..ఒక్కసారి ఇంటినంతా పరికించి చూసింది.
ఇంద్ర భవనం లా కనిపించింది. ఇంటిని ప్రేమించడమంటే…దేవుణ్ని ప్రేమించడమే. అందుకే ఇల్లాలు దేవత అని అంటారు కామోసు!
******
మూణ్నెల్ల తర్వాత భర్త తో గడపబోతున్న మధుర క్షణాలు మదినూరిస్తుంటే..కళ్ల ముందు ఇంద్ర ధనస్సొచ్చి వాలుతుతున్నంత సంబరం గా వుందామెకి. వుండదు మరి!
భార్యా భర్తల మధ్య నిజమైన రొమాంటిక్ క్షణాలెప్పుడుంటాయంటే, ఎప్పుడూ అన్యోన్యంగా వుంటం వల్ల కాదు.
ఇద్దరి మధ్య ఒక ఘోర యుద్ధం జరిగాక, కుదిరిన సమన్వయం తర్వాతనే.
అతను మాధవుడో కాదో కానీ, ఈమె మాత్రం అచ్చు రాధికలా ..ఆ పాత్రలో లీనమైపోతోంది.
మొన్న కాదనుకున్న కాపురం, వొద్దేవొద్దనుకున్నభర్త ..నేడు కావాలనుకుంటూ విరహించడం ఎంత వింత కదూ? కానదే చిత్రం. స్త్రీ మనస్తత్వం.
ఎందుకు ప్రేమిస్తుందో
ఎందుకు కలహిస్తుందో..
ఎందుకు నిశ్శబ్దమౌతుందో
మరెందుకు నీరౌతుందో
కన్నీరౌతుందో
నీ – రవమౌతుందో!
ఎలా తెలుస్తుంది? అవును. ఎలా తెలుస్తుంది. ఆమెని అర్ధం చేసుకోగల హృదయం అతనికి లేకపోతేను?
పొద్దుట్నించీ, నడుం విరిగే లా పనిచేసీ చేసీ ..అలసిన శరీరానికిప్పుడు స్నానం ఒకటే గొప్ప రిలాక్సేషన్!
వొళ్ళు విరుచుకుంటూ, బాత్ రూం వైపు నడిచింది. షవర్ బాత్ కోసం.
ఈ షవర్ స్నానాన్ని ఎవరుకనుక్కున్నాడో కానీ, ఒకసారి దీని ప్రేమలో పడితే టైమే తెలీనీదు. జలపాతాలని తలపిస్తూ, కాదు కాదు, చిరు వర్షపు జల్లుల తడుపుతూ… పూల నక్షత్రాలు విసురుతూ, వొళ్లంతా ఎక్కడా సూది మొనంత చోటైనా వదలక, జడిజల్లుల, తడిపెదవుల చుంబనాలతో ముంచేస్తుంది. ..వహ్వా..ఎంత అద్భుతమైన భావాలని ఇచ్చిపోతుంది షవర్ బాత్!
బాత్ టబ్ ఒక సరస్సు అయింది. అందులో ఆమె ఒక జలకన్య లా మారింది.
బృందావనమెందుకో, యమునాతటమెందుకో..నా ముందర నువ్వుంటే నందనవనమెందుకో?..
మునకలన్నీ మంచి గంధాల లేపనాలు గా ..నీ మధుర జ్ఞాపకాలేవో..మరి మరి మరులు గొలుపుతూ..
మధురోహల తేలుతూ..అలా అలా..అలుపు తీరేదాకా స్నానిస్తూనే వుంది.
తలుపు చప్పుడైతే…గబగబా టవల్ చుట్టుకునొచ్చి చూసింది. ఎవరూ లేరు.
నిరాశ అనిపించినా, తన సింగారం పూర్తి కాకుండా అతను రాకపోడమే మంచిదని సంతోషించింది.
****
ఏడు దాటిపోయింది.
అతను రాలేదు.
ప్లాస్క్ లో సిధ్ధం గా వుంచిన టీ ని తనే రెండు సార్లుగా సేవించింది.
అతని కిష్టమని కట్టుకున్న పాల నురుగు షిఫాన్ జరీ చీర వైపు, వేసుకున్న చేతి గాజుల వైపు మార్చి మార్చి చూసుకుంది.
జడలో జాజి పూల దండ సాయంత్రం కన్నా, ఇప్పుడు మరికాస్త రెక్కలిప్పుకుని, యవ్వనాన్నొలకబోస్తోంది.
ఎనిమిది దాటింది.
తొమ్మిదైంది.
పదిలోకి మారింది.
నిట్టూర్చింది, గోడ గడియారం వైపు చూస్తూ.
కాసేపు టీవీ సీరియల్ చూసింది. బోర్. మరి కాసేపు కర్ణాటక సంగీతం వినబోయింది. కర్ణ కఠోరంగా వినిపించింది. ఎం టీవి మ్యూజిక్ – చెవిలో హోరుగా వుంది. న్యూస్ చూడబోయింది. తలనొప్పొచ్చేసింది. టీవీ కట్టేసి, అలా డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూలబడి పోయింది.
ఇల్లంతా నిశ్శబ్దం..నిశ్శ..బ్దం. గుబులుగుబులు గా చీకటి . తెరలుతెరలుగా గుండె లోతుల్లోంచి ఏదో బాధ పొగలు చిమ్ముకుంటోంది. బయట బాల్కనీ లోంచి రాత్రిచీకటంతా ఇంట్లోకి ప్రవహిస్తూ..కాదు తన వొంట్లోకి ఇంకిపోతూ..
ఒక్కసారిగా ఒంటరి తనం – నల్ల తాచు పాములా.. ఆమెని నిలువునా చుట్టేసుకోడంతో ఎక్క డ్లేని దిగులొచ్చింది. దుఖాన్నాపుకోలేనిదైంది. గభాల్న రెండు చేతుల్లో ముఖం దాచుకుంది..
ఏమిటీ? అసలు తను ఏం చేస్తున్న పనేమిటీ? తన పొరబాట్లను లెక్కోసుకుంటోంది. ఇలా –
సిగ్గు లేకుండా, అతను రమ్మనకుండానే రావడం తను చేసిన మొదటి తప్పు. వచ్చాక, కనీసం అతను పలకరించనైనా పలకరించకుండా వెళ్లిపోయినా, ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం రెండో తప్పు.
పొద్దుట్నించీ కనీసం ఒక్క ఫోన్ కాలైనా చేయని ఈ కసాయి కోసం..తనిలా ఎదురుచూడటం..నిజమైన తప్పు.
అసలే కాలం లో వుంది తను? ..అమ్మ లా, అమ్ముమ్మలా ఇలా మొగుడి కరుణా కటాక్షాలకోసం, కంటి చూపుల కోసం పాకులాడటమేమిటీ, పడిగాపులు కాయడమేంటీ? అదీ – తనేమిటీ, తన వ్యక్తిత్వమేవిటీ? తన మనస్తత్వానికీ విరుధ్ధం గా తను చేస్తోందేమిటీ?
అదలా వుంచు. ఇదేమిటీ, ఇలా, శొభనపు పెళ్ళికూతురిలా తయారై కూర్చోవడమేమిటీ, రాని వాని కోసం ఈ నిరీక్షణలేమిటీ? నిట్టూర్పుల సెగలేమిటీ? పరమ అస్సహ్యంగా! …ఇదంతా దేనికోసమూ..అని ఆలోచిస్తే ఆమెకి తన మీద తనకే పట్టలేనంతా ఆగ్రహమేసింది.
చివ్వున లేచి, జడలో జాజిపూల చెండు తీసి, మూలకిసిరేసింది. తెల్లచీరలోంచి వెంటనే నైటీ లోకి మారింది. అతనితో కలసి గుడికెళ్దామనుకుంది. కానీ, ఇప్పుడు ఆ ఆలోచన చేసినందుకు తనని తాను నిందించుకుంటోంది.
విస్సురుగా గదిలొకెళ్లి, అంతకంటే విసురుగా మంచం మీద బోర్లా పడి, దిండులో ముఖం దాచుకుంది.
పొద్దుట్నించి తిండీ తిప్పలు లేకున్నా దగ్గరకి రాని నీరసం…ఇప్పుడు అతని నిరాదరణకి నిస్సత్తువెత్తుకొచ్చింది.
జీవిత భాగస్వామ్యుల మధ్య అవగాహన కంటే ముందు మర్యాద వుండాలి. దాన్నిచ్చిపుచ్చుకునే విధానం వుండాలి. ఆత్మ గౌరవానికీ, ఆత్మాభిమానాలకి భంగం కలగకుండా నడచుకునే ఓ గట్టి నిర్దేశికత కలిగి వుండాలి. ఇవేవీ..లేనప్పుడు, ఇక శూన్యమనుకున్నప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు తను ఎదుర్కుంటున్న పరిస్థితే గనక ఏ ఆడపిల్లకైనా ఎదురైతే ఏం చేయాలి?
శుభ్రంగా అతగాణ్ణి నాలుగు కడిగి, నీ ఏడ్పు నువ్వేడు. నాకు నీలాటి పనికిమాలిన వాడితో కాపురం చేయాల్సిన అగత్యం కానీ, అవసరం కానీ లేదని చెప్పి, వెళ్ళిపోవాలి. ఇతనొక శాడిస్ట్ అని కోర్ట్ లో నిలబెట్టి, విడాకులు ఇప్పించుకోవాలి. ‘పో రా! ఫో.’ అంటూ చెంపలు వాయించి పంపాలి.
కరెక్ట్. యు ఆర్ రైట్ దీపూ, రైట్.
అలా చేయడమే న్యాయం.
కోర్ట్ ల నిండా విడాకుల కేసులే అంటూ వాపోతున్నారు కానీ, ఇలా కానరాకుండా భార్యల్ని కాల్చుకుతినే మగాళ్ళ మోసకారితనాలు మాత్రం బయటకు తెలీవు. తనకి మాత్రం తెలిసిందా, తననింత మానసికంగా హింసించే మొగుడని వీడు? తన దాకా వస్తే కానీ తెలీదంటారు అందుకే.
‘అబ్బా తల పేలిపోతోంది. నడుం నొప్పి నమిలేస్తోంది. కళ్ళల్లోంచి ఈ జలపాతాలేమిటి? ..తను బేలయిపోతోందేవిటీ, ఇలా?- అందరాడపిల్లల్లా..కాదు. తను కాదు. తను ధైర్యవంతురాలు. సాహసవంతురాలు. తను ఓడిపోదు. ఎందులోనూ ఓడిపోదు.
ఎంత టైమై వుంటుంది. పదీ? పదకొండు? పన్నెండు? ..ఏమో అర్ధ రాత్రి దాటిపోయిందేమో.
అదిగో బయట్నించి తలుపు లాక్ తీస్తున్న చప్పుడు.
చెవులు రిక్కించి వింది.
శ్రీకాంత్ లోపలకొచ్చాడు.
మళ్లీ తలుపు మూసిన చప్పుడైంది. ఆ తర్వాత ..ఐదు నిముషాలు ఎలాటి అలికిడి లేదు.
ఆమె వింటోంది. బాత్ రూంలొంచి..నీళ్ళ శబ్దాన్ని. చాలా సేపు తర్వాత గదిలోకొచ్చాడు. లైటేసాడు. ఆమె కదలకుండా కళ్ళుమూసుకుని పడుకుంది.
ఏం చేస్తాడా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని. నైట్ డ్రెస్ తీసుకున్నాడు. మరో నిమిషం తర్వాత మంచం దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. ఆమె గుండె వేగం గా కొట్టుకుంది. కాని, అంతలోనే అంత వేగం గానూ, మంచం మీంచి పిల్లో లాక్కుని, విస్సురుగా వెళ్లిపోయాడు.
కళ్లు మూసుకున్నా ఇదంతా కళ్ళక్కట్టినట్టు కనిపిస్తోనే వుందామెకి.
ఎవరన్నారు, హృదయానికి కళ్ళుండవని. నిజమే, ప్రేమ గుడ్డిదైతే కదా!
షేమ్ షేమ్ దీపూ.. షేమ్ షేమ్ ! నీ కలలిక కట్టిపెట్టు. నీ మొగుడు నిన్ను తాకడం మాటలా వుంచు, కనీసం కన్నెత్తి చూడటానికి కూడా ఇష్ట పడటం లేదని గ్రహించు. లేకుంటె, నీకే ప్రమాదం.
ఆమెకొక్కసారిగా ఏడ్పొచ్చేసింది..పొంగుకుంటూ. ఎంత వద్దనుకున్నా, ఆగకుండా, ముంపెత్తిన గోదారిలా.
ఇంతగా శిక్షించడానికి, అసలు తను చేసిన తప్పేమిటనీ? ..అతనే కదా చెప్పాడు..తన క్లాస్ మేటు నీతా తనని ప్రేమించిందని..వెంటపడేదనీ..పెళ్ళి చేసుకోమని ప్రాధేయపడిందనీ..అదడిగిందనీ..ఇలా చేయి పట్టుకుందనీ.. తను ప్రేమించకుంటే బ్రతకనందని కూడా చెప్పలేదూ?
మరి ఇప్పుడేమవసరమొచ్చిందనీ? ఆవిడగార్ని ఫేస్ బుక్ ఫ్రెండ్ చేసుకోవాలి? అదే అడిగింది.
జవాబు చెప్పలేదు. పైగా మేధావిలా ఓ వెధవ నవ్వొకటి నవ్వూరుకున్నాడు.
తను అనుమానిస్తున్నట్టె అయింది. ఇద్దరూ కలసి రెస్టారెంట్ కీ వెళ్ళారు. తనకి మాట మాత్రం గా నైనా చెప్పలేదు. ఆ రోజున, అతను బాత్ రూం లో దూరినప్పుడు సెల్ ఫోన్ లో చూసింది. మెసేజ్ లో ఆమె ఎంజాయి చేసినట్టు, అందుకు థాంక్స్ అని చెప్పడాన్ని కళ్ళారా చదివి తెలుసుకుందా నిజాన్ని.
తెలిసాక, ఏ పెళ్ళామైనా మరి అడగదా? అడిగింది. దులిపింది. తనకు జవాబు కావాలంది.
ఏమన్నాడు? చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ఐతే నాకూ నీతో వుండాల్సిన అవసరం లేదంది.
‘నీ ఇష్టం’ అంటూ చుర చురా చూసుకుంటూ వెళ్ళి పోయాడు. తనూ రోషం కొద్దీ అమ్మగారింటికెళ్ళింది. అతనితో చెప్పాల్సిన అవసరం కూడా కనిపించలేదామెకా క్షణంలో.
జరిగిందాంట్లో తన తప్పేముందనీ? తప్పో ఒప్పో, తెలుసుకుని తనంతట తానే గా తిరిగొచ్చింది?
ఇక మాటలనవసరం. ఇతనితో కాపురం – తనకిక కుదిరే వ్యవహారం కాదు. ముమ్మాటికీ కాదు. రేపొద్దునే తనెళ్ళిపోవాలి ఇక్కణ్నించి. ఈ మనిషి నించి శాస్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి. ఈ పెళ్ళీ, ఈ మొగుడు అంతా ఓ పీడ కలగా మర్చిపోవాలి.
ఏం? మొగుడు లేకుండా బ్రతికే వాళ్ళు లేరా? మొగుణ్నొదిలేసిన ఆడవాళ్ళు జీవించడం లేదా? చస్తున్నారా? పక్కింటి శకుంతల సంగతేమైందీ? మొగుడొదిలేస్తే, పుట్టింటికొచ్చి మిషన్ కుట్టుకుని బ్రతకడం లా? విరజ కూడా అంతే. మొగుడు ఆమెని మంచం మీంచి తోసేసేవాడట. వొద్దని. ఇలాగే కాపురానికి తోలే వాళ్ళు ఆమెని మళ్ళా మళ్ళా. కానేం చేస్తుంది?వాడు వొద్దు బాబోయి అంటే మరి? విడాకులు తీసుకుంది. మళ్ళీ పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. మరి తను? చస్తే మళ్ళీ పెళ్ళి చేసుకోదు. వీడి తో వచ్చిన బుధ్ధి చాలు. తనింకా చదువుకుంటుంది. కెరీర్ మీద చాన్సెంట్రేట్ చేస్తుంది. అమెరికాలో అక్కా బావల సాయం తో ఓ ఉద్యోగం సంపాదించుకుని, అక్కడే సెటిలైపోతుంది. అంతే. అంతే. అదే తన నిర్ణయం. చివరినిర్ణయం. తిరుగులేని నిర్ణయం.
ఆలోచిస్తూ ఆలోచిస్తూ..నిద్రలోకెళ్ళిపోయిందామె.
***
శ్రీకాంత్ హాల్లోని సోఫాలో ఒరిగి పేపర్ అందుకున్నాడు.
ఒక్క అక్షరమూ కనిపించడం లేదు. అసలు చూపక్కడ నిలిస్తే కదా! మనిషి ఉడికిపోతున్నాడు.
ఎంత మాటంది తనని వెళ్తూ వెళ్తూ. నేను నీతా తో రోజూ..తిరిగుతున్నానా? పైగా మా ఇద్దరి మధ్య ..అది వుందని అంటుందా? వినంగానే ఎంత విలవిలమంది మనసు?
అసలీ ఆడవాళ్ళు ఏమనుకుంటారు? శీలం, దాని పవిత్రత పేటెంట్ హక్కులన్ని వాళ్లకేనా సొంతం? మగాడికీ కారెక్టర్ వుంటుందనీ, దాన్ని శంకిస్తే వాడికీ రగుల్తుందని తెలీదా? అదే మాట తను అంటే ఆమెని? వూరుకుంటుందా? అయినా అలాటి అనైతిక సంబంధాల్లోకి ఎలా ఈడుస్తుంది తనని? అందులో తనని ..తనని అంత మాటనా అనడమా? మొగుడన్న గౌరవం వుండొద్దూ? నోటికెంతొస్తే అంత అ నడమే? ఎంత పెళ్ళామైతె మాత్రం, కాస్త హద్దుండొద్దాంటా? ఇదేమైనా సినిమానా? అలా పెట్టెలు సర్దుకుని ఇంట్లోంచి పారిపోడానికీ? అదీ తనతో చెప్పనైనా చెప్పకుండా ఇంటికి తాళమేసి పోడమే? ఊహూ? – ఇదేనా ఇల్లాలి లక్షణం? – తనలో తనే వాదించుకుంటున్నాడు. తనే కరెక్టే అని ఓదార్చుకుంటున్నాడు.
పోని ఆ విషయం వదిలేద్దాం. ఇంటికొచ్చింది కదా, ఒక్కసారి ఆఫీస్ కి ఫోన్ చేసి, ఎలా వున్నావని అడగొచ్చు కదా? ఏదో తెలీక వాగి, బాధపెట్టాను సారీ అని చెబ్తే ఈవిడ గారి సొమ్మేం పోయిందో కదా?..ఎంత గా ఎదురుచూసాడు, ఫోన్ చేస్తుందనీ? ఎన్ని సార్లు ఉలిక్కిపడ్డాడు, సెల్ మోగినప్పుడల్లా ఆమెనే అనీ! హు. మొండిది. పెంకి పెళ్ళాం. పెంకి పెళ్ళామని.
అందుకే ఆమెకీ శిక్ష. ఎన్నాళ్ళైనా కానీయి, ఎన్నేళ్ళైనా కానీయి..తనకి సారీ చెప్పాకే, ఆమెతో కాపురం చేసేది. లేదంటే లేదంతే. ఇంతే. ఇలా సోఫాలో నే పడుకుంటాడంతే. – డిసైడైపోయాడు.
నిద్ర పోదామని, లైట్లు ఆర్పేసుకున్నాడు. కాని కళ్ళు మూత పడటం లేదు.
అబ్బబ్బా..ఎప్పుడూ లేంది, ఈ సోఫా ఏమిటీ ఇలా గుచ్చుకుంటోంది? ఆ?
తనకి బెడ్రూం లో, ఆ బెడ్ మీదే నిద్ర పడుతుంది. ఇలా ఎక్కడపడితే అక్కడ నిద్ర వచ్చి చావదు.
మహా తల్లి. మంచమంతా పరుచుకుని పడుకుందిగా, మహా రాణిలా.
ఆ మంచం లో నిజానికి తనకీ సగం జాగా వుంటుంది కదా? అవును. భలే పాయింట్ దొరికింది. ఇక లాభం లేదు. తనెళ్ళి, తన భాగం లో తనూ పడుకుంటాడు.
కోపంగా పైకి లేచి, చేతిలోకి దిండు తీసుకుని గదిలోకొచ్చాడు. చప్పుడు చేయకుండా మంచం మీద చోటు చేసుకున్నాడు.
మరి కొన్ని క్షణాల తర్వాత, ఇటు వాడు కాస్త అటు తిరిగాడు.
రెండు కనుమల మధ్య వాగులా..ఒక నిశ్శబ్ద వెన్నెల ప్రవాహం లా ఆమె! మల్లె దండని, ముగ్ధ మనోహరిని గుండెలకి హత్తుకోలేని మగ జన్మా ఒకజన్మే?
గాలి జోరుకి పూల కొమ్మ వూగినట్టు…మబ్బువెనకే మెరుపు మెరిసినట్టు..గ్రీష్మానికి మాడిన మట్టి -ఒక్క వాన చుక్క కోసం ..తపిస్తున్నట్టు..అతని పరిస్థితీ అలానే వుంది. దాహందాహంగా..
ఒక్కసారి తాకితే ఏమౌతుందనీ? కయ్యి మంటేనో? ఆ, అనన్నీ, నిద్దట్లో చూడ్లేదని అబధ్ధమాడేయొచ్చులే. తప్పేముంది?
చొరవచేసాడు.
వులిక్కిపడి, మేల్కొంది. పక్కన మనిషున్న ఆనవాలు. అది కూడా కాదు, నడుం మీద అతని చేతి వేళ్ళ కదలికలు..
ముందు నమ్మలేనిదైంది. ఆ తర్వాత ..కడుపులోంచి దుఖం..గొంతు దాటి, .కళ్ళలోంచి..పొంగి ప్రవహిస్తూ..
ఈ చేయినే కదూ నమ్మి తను ఇతగాని వెంట నడిచింది…ఈ చేతిలో నే కదూ..తన చేయుంచి..పెళ్ళి ప్రమాణాలు చేయించింది..ఈ చేతి చిటికెన వేలు ఒక్కటి చాలని కాదూ..తన మీద సర్వ హక్కుల్నీ ఇతనికి రాసిచ్చింది..ఈ చేయే కదూ..తన శిరస్సున తాకిన మొదటి స్పర్శ… ఈ చేతికి తెలీందేముందని? తనేమిటో, తన మనసేమిటో?
మరి ఎందుకనీ ఇంత దూరంగా వుంచి, తనకింత నరకాన్ని చూపింది..
ఈ చేయి తనని తాకలేదనే కదా తనిప్పటిదాకా కుమిలిపోయిందీ?..
ఉధృతమైన ఉద్వేగం భారాన్ని తట్టుకోలేని ఆ చిన్నది బిగ్గరగా ఏడ్చేసింది.
అతనూహించని సీన్ కావడంతో కలవరపడిపోతూ “దీ..ప్స్..” అని పిలిచాడు కంగారుకంగారుగా.
ఆమె మాత్రం అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని…వెక్కెక్కిపడుతూ చెప్పింది. “శ్రీ..ఇంకెప్పుడూ..నన్నింతగా పనిష్ చేయొద్దు..నే భరించ..లేను..చచ్చి పో..తా..ను..” అతను గబుక్కున ఆమె నోటి మీద చేయుంచాడు.
రెండు చేతులతో ఆమె భుజాలను చుట్టుకుని, దగ్గరకి తీసుకున్నాడు. అంతే, అమాంతం అతని గుండెల్లో ముఖం దాచుకుని చిన్నపిల్లలా ఏడ్చేసింది. అలా..చాలా సేపు..చాలా చాలాసేపు.
భార్యలో వున్నదంతా అహం అని అపోహపడ్డాడే కానీ, ఆమె లోని పసి హృదయాన్ని తెలుసుకోలేకపోయాడు. ఛ. ఎంత కఠినం గా మారాడు!…ఇంకెప్పుడూ దీప్స్ పట్ల ఇలా ప్రవర్తించకూడదని ఒట్టేసుకున్నాడు.
ప్రాయశ్చిత్తంగా ఓ వేయి ముద్దుగులాబీలను అర్పించుకుని, ఆ ముగ్ధ్రాల్ని, బాధనించి విముక్తిరాలిని చేసాడు. పాపం!
*******
కూతురు మళ్ళీ తిరిగిరావడం ఖాయం అనుకున్న రంగనాధం, ఆ జంట హనీమూన్ కోసం సింగపూర్ కెళ్ళిందని తెలిసి చాలా ఆనందపడిపోయాడు. ఆ క్రెడిట్ అంతా భార్యకే ఇచ్చేసాడు.
“అద్సరేనోయ్ పెళ్ళాం! కోపమొచ్చి కొమ్మెక్కి కూర్చున్న అల్లుడి దగ్గరికి పిల్లనెలా పంపావోయ్? వాళ్ళిద్దరూ కలుస్తారని ఎలా గెస్ చేసావ్? నేనైతే ఆశలొదిలేసుకున్నా సుమా! ఇంకా చెప్పాలీ అంటే, అల్లుడి ప్రవర్తన మీద భలే కోపమొచ్చేసిందనుకో నాకు..”
“అబ్బా! అలానేం? మనకు పెళ్ళైన కొత్తల్లో..మరి మీ ప్రవర్తనకి మా నాన్నకెంత కోపమొచ్చుండాలి స్వామీ, మీ మీద?” నవ్వుతూ, నవ్వుతూనే మొగుడి మీద బాణం వేసి నవ్వింది సుజాత. నవ్వాక మళ్ళీ చెప్పింది. “ మనకి రోజులో దుర్ముహుర్తాలు, రాహు కాలాలు వున్నట్టె, శుభ ముహుర్తాలు, అమృత ఘడియలూ వుంటాయి. అలానే, కాపురం లో కూడా కలతలు, కలహాలతో బాటు అమృత పాన క్షణాలూ,అనురాగ బంధా లూ వుంటాయి. వివాహానికి అసలైన భాష్యాన్ని వివరించే అతి విలువైన ఘడీయలవి. ఆ విలువంటూ ఒక్కసారి తెలిస్తే.. ఎన్ని ఆటంకాలు రానీ, పోనీ.. భార్యాభర్తలు ఒకర్నించి మరొకరు విడిపోలేరు. జీవితాంతమూ అన్యోన్యంగా కలిసే వుంటారు.
తొందరపాటు లో విడిపోవాలనుకునే జంటలను తిరిగి కలిపే – ఈ చిన్ని మలుపు ఎంత దూరమో..అది అంత చేరువ కూడా.
అందుకే, ఆ అమృత ఘడియ వచ్చే వరకూ అమ్మాయి అక్కడే వుండాలని చెప్పా..మీకు.
“అవునూ..ఈ టెక్నికులన్నీ నీకెలా తెలిసాయబ్బా?”
“అనుభవం సార్..స్వానుభవం..” అంటూ ఫక్కున నవ్వింది.
అర్ధం కాకున్నా, ఆయనా నవ్వేశాడు భార్యతో కలసి.

– ఆర్.దమయంతి

damayanthi

 

 

 

 

 

“ఇండియా గేట్”

IMG_0384

దాదాపు అరగంట నుండీ అతను ఇండియా గేట్ దగ్గర ఎదురుచూస్తున్నాడు. సాధారణంగా ఈ పాటికి తనని రిసీవ్ చేసుకోడానికి ఎవరో ఒకరు రావాలి. ఎందుచేత ఆలస్యం అయ్యిందో అనుకుంటున్నాడు. అతను – పేరేదయితేనేం, మంచి శారీర ధారుఢ్యంతో పొడవుగా ఉంటాడు. రంగు మరీ తెలుపు కాకపోయినా చామనచాయ. ఉంగరాల జుట్టు. తీక్షణమైన అతని కళ్ళల్లో కాంతి తలతిప్పి అతనికేసే చూసేలా చేస్తుంది. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి చూసుకున్నాడు. బీనాకి అతను సిగరెట్లు కాలిస్తే ఇష్టం. దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు ఆ వాసన భలే మత్తుగా ఉంటుందంటుంది. అతనికి సిగరెట్టు అలవాటు లేదు. బీనా కోసం అలవాటు చేసుకున్నాడు. బ్యాక్‌పాక్ లోంచి గూచీ స్ప్రే తీసి చొక్కా మీద జల్లుకున్నాడు. బీనాకి గూచీ స్ప్రే వాసన కూడా ఇష్టమే. ఆమెను కలవాల్సినప్పుడల్లా ఆమెకిష్టమయినవన్నీ గుర్తు పెట్టుకుంటాడు. ఇంతలో సెల్ ఫోన్ మ్రోగింది. దీప్తి నుండి ఫోన్. ఆన్ చేసి హలో చెప్పాడు.

“చెప్పానుగా డిల్లీ వచ్చాను. రావడానికి వారం పట్టచ్చు. రేపూ ఎల్లుండీ ఇక్కడ ఉండి తరువాత చండీఘడ్ వెళ్ళాలి…”

అతనికి దీప్తి ఫోన్ కట్‌చెయ్యాలని ఉంది. మాంచి టెన్షన్లో ఉన్నప్పుడే కాల్ చేస్తుందనుకున్నాడు. దీప్తి చెబుతున్నది వింటూ ఊ కొడుతున్నాడు.
“ఎన్ని సార్లు చెప్పాలి? అనసూయమ్మ గారి పని మీద వచ్చాను. ఇంకెంత వారంలో వచ్చేస్తాను. పాప జాగ్రత్త. ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్యి. ఉంటాను,” అంటూ అతను ఫోన్ కట్ చేసాడు.

ఇంతలో అతను నుంచున్న చోటుకి దగ్గర్లో ఒక బి.ఎం.డ్బ్ల్యూ వేన్ వచ్చి ఆగింది. విండొ తీస్తుండగానే అతను గుర్తించాడు. నల్లటి కళ్ళద్దాలు పెట్టుకొని బీనా చెయ్యూపింది. గబగబా అతను వ్యాను ఎక్కాడు. బయట ఎండకి అతనికి ఉక్కబోతగా ఉండడంతో అతను విండో గ్లాసు తీయబోయాడు. వద్దని వారిస్తూ ఏ.సీ ఆన్ చేసింది. సీట్లో కూర్చోగానే హై ఫై ఇచ్చింది ఆమె. అతనూ నవ్వాడు. ఇద్దరూ కబుర్లలో పడ్డారు.

మధ్యలో రెండు మూడు సార్లు అతని ఫోన్ రింగయ్యింది. మొదటి రెండు సార్లూ తియ్యలేదు. మూడోసారి తీసి చూసాడు. దీప్తి పేరు స్క్రీన్ మీద కనిపించింది. అతను వేంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసేసాడు.

“ఎవరు? మాట్లాడచ్చు కదా? ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు?” బీనా ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు. ఫ్రెండని చెప్పాడు.
తనకున్న కొద్ది పరిచయంలో బీనా అతనికి కాల్ రావడం చూళ్ళేదు. సాధారణంగా బీనా ఇంటికి రాగానే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. బీనాని కలవడం అతనికది నాలుగోసారి.

ఆ వ్యాను దూసుకుంటూ పటేల్ నగర్ వైపు వెళ్ళింది.

కారు దిగీ దిగగానే అతను సిగరెట్టు వెలిగించాడు. బీనాకి కారులో సిగరెట్ త్రాగడం ఇష్టం ఉండదు. కారంతా సిగరెట్ వాసన వస్తుందని అంటుంది.
వ్యాను దిగాక సరాసరి మేడమీదకి వెళ్ళాడు. బీనా ఇల్లు చాలా పెద్దది. ఆమె ఐశ్వర్యం అంతా ఆ ఇంట్లో ప్రతీ అంగుళంలోనూ కనిపిస్తుంది.
సరాసరి అతను బెడ్ రూం వైపు వెళ్ళాడు. వేంటనే షవర్ చేసుకోవడానికి బాత్‌రూమ్ వైపు వెళ్ళాడు. షవర్ అయ్యాక లుంగీ కట్టుకొని మంచమ్మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు.

ఒక్కాసారి వెనక్కాలనుండి వచ్చి బీనా అతన్ని వాటేసుకుంది. ఆమె స్పర్శ అతనికి కొత్తకాదు. అతని చేరువ బీనాకి అంతే!
కొంతసేపయ్యాక అతను మంచమ్మీద నుండి లేచి బట్టలు మార్చుకుంటూండగా బీనా అతనికి చిన్న కవరు అందిచ్చింది. బీనా కేసి చూస్తూ నవ్వాడతను . రేపూ వస్తావా అనడగింది. సరేనన్నాడు అతను.

***

హొటలుకి తిరిగొస్తూండగా మధ్యాన్నం దీప్తి ఫోన్ చేసినట్లు గుర్తొచ్చింది. వేంటనే కాల్ చేసాడు.
“వచ్చిన పని కావడానికి ఇంకా రెండ్రోజులు పైనే పట్టచ్చు, ” ఆవతల దీప్తి ప్రశ్నలకి జవాబిస్తున్నాడు.

“నే చేప్పేది విను. అనసూయమ్మ గారు పంపితేనే వచ్చాను. వాళ్ళమ్మాయి ఐష్ మాటలు నమ్మకు. అయినా నా గురించి తెలిసీ ఆ అమ్మాయి మాటలు ఎలా నమ్మగలిగావు? అయినా నేను మొన్ననగా వచ్చాను. ఐష్‌ని కలిసే చాన్సే లేదు. నువ్వేం కంగారు పడకు. ఎవరైనా అడిగితే పని మీద సొంతూరు శ్రీకాకుళం వెళ్ళానని చెప్పు. పాప జాగ్రత్త. అవసరమయితే ఫోన్ చెయ్యి,” అని దీప్తికి సర్ది చెప్పాడు.
డిన్నర్ చేసి రాత్రికి నిద్రకి ఉపక్రమిస్తూండగా రూం బెల్ మ్రోగింది. వెళ్ళి డోర్ తీసి చూసి అవాక్కయ్యాడు.
అతని ఎదురుగా యూనిఫాంలో ఓ పోలీసాఫీసర్! అతని నోట మాట రాలేదు.

***

అతన్ని ఒక గదిలో పడేసి చచ్చేలా బాదుతున్నాడా పోలీసాఫీసర్.
“సార్! నాకు ఏమీ తెలియదు. నన్ను నమ్మండి. కిట్టని వాళ్ళెవరో నా నంబరిచ్చారు,” అంటూ హిందీలో బావురుమన్నాడు.
“నా గురించి మీకు వివరాలెవరిచ్చారో తెలీదు,” అంటూ అతను హిందీలో భోరున విలపించాడు. ఆ వచ్చిన పోలీసాఫీసరుకి తెలుగు రాదు. హైద్రాబాదులో ఆటో నడపడం వల్ల అతనికి హిందీ బానే వచ్చింది.
“ఇవాళ మధ్యాన్నం నా సెల్‌కి ఒక కాల్ వచ్చింది. ఒకమ్మాయి నీ వివరాలన్నీ చెప్పింది, నువ్వొక పెద్ద రాకెట్ నడుపుతున్నావనీ చెప్పింది,” ఆ పోలీసఫీసర్ చెప్పాడు.
అతనికి ఆ అమ్మాయెవరో అర్థమయ్యింది. అనసూయమ్మ కూతురు ఐష్ అయివుంటుంది. డిల్లీకి బయల్దేరేముందు అతనితో పిచ్చిగా ప్రవర్తించింది. అతను చీకొట్టడంతో కోపంతో ఈ పని చేసుండచ్చు. అయినా తను డిల్లీలో ఉన్న సంగతి అనసూయమ్మకి తప్ప ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. దీప్తికి అతను వెళ్ళేది డిల్లీ అని చెప్పాడంతే! దేనికో, ఎక్కడికో చెప్పలేదు. ఎప్పుడూ చెప్పే అలవాటు కూడా లేదు. అనసూయమ్మ రియల్ ఎస్టేట్ పని మీదనే ఈ టూర్లని దీప్తి నమ్మకం.

అయితే, అనసూయమ్మే చేయించిందా ఈ పని ? అతనికేమీ అర్థం కావడం లేదు.

“డోంట్ వర్రీ, నీకేమీ భయం లేదు. నువ్వు నాకు సహకరిస్తే ఈ ఈ రాకెట్ని బయట పెట్టాలి. ఈ డిల్లీలోనే మినిస్టర్ల భార్యలూ, ఆర్మీ చీఫుల పెళ్ళాలూ వీళ్ళందరూ పెద్ద రాకెట్ నడుపుతున్నారని తెలుసు. నీలాంటి యువకులు చాలామంది ఈ రాకెట్లో ఉన్నారు. దేర్ ఈజ్ సంథింగ్ ఫిష్షీ హియర్!” అని ఆలోచనలో పడ్డాడా పోలీసాఫీసర్!

ఇంతలో అతని ఫోన్ మ్రోగింది. దీప్తి అన్న పేరు సెల్ ఫోన్ మీద కనిపించింది. ఫోన్ తియ్యాలా వద్దన్నట్లు పోలీసాఫీసరు కేసి చూసాడతను. మాట్లాడమన్నట్లు తలెగరేసాడా పోలీసాఫీసరు. వెంటనే ఫోన్ అందుకున్నాడతను.

“ముందు ఏడుపు ఆపి నే చెప్పేది శ్రద్ధగా విను. అనసూయమ్మ కూతురు ఎవడితోనే పారిపోయిండచ్చు. అతనెవరూ దొరికే వరకూ అనసూయమ్మ నన్ను వాడుకుంటోంది. అందుకే మీ అందరికీ నేను లేపుకుపోయానని చెప్పుండచ్చు. ఇది తల్లీ కూతుళ్ళ నాటకం. నేనొచ్చేవరకూ నువ్వు తొందర పడద్దు, ” అంటూ చెబుతూండగానే ఫోన్ లాక్కున్నాడా పోలీసాఫీసరు. ఒక్కసారి కంగారు పడ్డాడతను.

“కౌన్ హో తుమ్? క్యా చాహియే? తుమ్హారా ఆద్మీ మేరే జాల్ మే…” అంటూ ఫోన్ కట్ చేసాడు. దీప్తికి హిందీ అంత బాగా రాదు. కానీ వేరే గొంతు వినేసరికి కంగారు పడే అవకాశం ఉందనుకొని భయపడ్డాడతను.

“ఇప్పుడు చెప్పు? నీ వెనుక ఎవరెవరున్నారు? అసలీ రాకెట్ ఏవిటి?” అంటూ ఫోన్ అడ్రసు బుక్కులో నంబరు వెతుకుతున్నాడు. ఏమీ కనిపించక పోయే సరికి చాలా చికాకు పడ్డాడు ఆ పోలీసాఫీసరు.

“ఇంతకు ముందు ఫొన్ చేసిందెవరు?” గట్టిగా లాఠీతో కాళ్ళ మీద అదిలించాడు.
ఒక్కాసారి అదిరిపడి – “నా పెళ్ళాం, సార్!” అంటూ వణికిపోయాడతను.

“సాలే! నీ బ్రతుక్కి పెళ్ళి కూడా అయ్యిందా? లేక ఎవరైనా…” అంటూ మరో సారి లాఠీ అదిలించాడు. దూరంగా కానిస్టేబుల్స్ ఇదంతా గమనిస్తూనే ఉన్నారు.
“లేదు సార్! నన్ను నమ్మండి. నాకు ఎవరి వివరాలూ తెలీవు. నేను మా ఇంటి ఓనరు అనసూయమ్మ పంపితే పని మీద వచ్చాను…” అంటూ ఏడుస్తూ చెప్పాడతను. ఆ పోలీసాఫీసర్ని చూస్తే భయమేసింది.
తనకి తెలుసున్నది చెప్పడానికి ఉపక్రమించాడతను. అతని కళ్ళ ముందు దీప్తీ, పాప మెదిలారు.

 

***

“మాది శ్రీకాకుళం దగ్గరలో వున్న ఆముదాలవలస. మా నాన్న ఒక రైసు మిల్లులో పని చేసేవాడు. నేనే ఆఖరి వాణ్ణి. నాకు ఇద్దరు అక్కలూ, ఒక అన్న. నాకు చదువంత సరిగా అబ్బలేదు. ఆముదాలవలసలో ఉంటే చెడు తిరుగుళ్ళు ఎక్కవయ్యాయని నాన్న నన్ను శ్రీకాకుళం మా అత్తయ్య ఇంట్లో పెట్టాడు. శ్రీకాకుళంలోనే కాలేజీ చదువు ప్రారంభం అయ్యింది. ఇంటరు అత్తెసరు మార్కులు వచ్చి చచ్చి పాసవ్వడంతో బీ.కాం లో జాయిన్ అయ్యాను. డిగ్రీ రెండో ఏడు చదువుతూండగా దీప్తితో పరిచయం అయ్యింది. దీప్తి వాళ్ళు ఆర్థికంగా కాస్త ఉన్నవాళ్ళు. మా పరిచయం ప్రేమగా మారింది. చాటుగా ఏడాది పాటు ప్రేమాయణం సాగించిన మేము డిగ్రీ పరీక్షల చివర్లో వాళ్ళింట్లో పట్టుబడిపోయాం. దీప్తి వాళ్ళది మావీ కులాలు వేరు. వాళ్ళ నాయనకి కులాల పట్టింపు బాగా ఉంది. పైగా డబ్బూ, పలుకుబడీ ఉన్న వాళ్ళు. మమ్మల్ని కాదన్నారు వాళ్ళు. మేం వాళ్ళని వద్దనుకున్నాం. ఎవరికీ చెప్పా పెట్టకుండా హైద్రాబాదు ఉడాయించాం. హైద్రాబాదు రాగానే జీడిమెట్లలో ఉన్న నా స్నేహితుడొకడు మాకు ఆసరా ఇచ్చాడు. కొంతకాలం వాడింట్లో ఉన్నాం. ఈలోగా నేను ఉద్యోగం వెతుక్కోడం మొదలు పెట్టాను. ఒకటి రెండు ఫాక్టరీల్లో చిన్న చిన్న పనులు చేసాను కానీ, మా ఇద్దరికీ చాలేది కాదు. సరిగ్గా అదే సమయానికి దీప్తి నెల తప్పింది. అబార్షన్ చేయించుకోమని చెప్పాను. తను మొండి కేసింది. మాకే బ్రతకడానికి చచ్చే చావులా ఉంది. ఇంకో ప్రాణాన్ని ఎలా నెట్టుకు రావడం? సరిగ్గా అదే సమయానికి నా స్నేహితుడు ఇల్లు ఖాళీ చెయ్యాల్సొచ్చింది. ఇల్లు వెతుకులాట మొదలయ్యింది. ఎక్కడా ఇంటి అద్దె భరించే స్థితిలో నేను లేను. ఉద్యోగం కూడా అంతంత మాత్రం. అనుకోకుండా మా స్నేహితుడికి తెలుసున్నాయన మా కష్టాలు విని బాలానగర్ దగ్గర్లో ఒక అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో రెండు చిన్న గదుల ఇల్లు చూపించాడు. ఆ అపార్ట్మెంట్ ఓనరు అనసూయమ్మ. ఆవిడ మాగురించి తెలుసుకొని అద్దె లేకుండా మాకు ఉండడానికి ఇల్లిచ్చింది. నాకు కారు డ్రైవింగ్ వచ్చని తెలియడంతో ఆవిడ కారు డ్రైవరుగా నన్ను పెట్టుకుంది. దీప్తి అనసూయమ్మ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేది. నిజం చెప్పద్దూ, అనన్సూయమ్మ మా పాలిట దేవతలా అనిపించింది మాకు. నాకు దగ్గరుండి బ్యాంకు లోన్ ఇప్పించి ఒక ఆటో కొనిపించింది. ఆటో వచ్చాక మాకు డబ్బు కొరత కాస్త తీరింది. రోజుకి నాకు అయిదారొందలు మిగిలేవి. చూస్తూండగా దీప్తికి నెలలు నిండాయి. మా వూరు శ్రీకాకుళం వెనక్కి వెళిపోదామా అనుకున్న క్షణాలు చాలానే ఉన్నాయి. కానీ ఇద్దరకీ అభిమానం అడ్డొచ్చింది. ప్రేమించడం కంటే బ్రతకడం కష్టం అన్నది మాకు అర్థమవ్వడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఒక పక్క రోజు గడవాలి. ఆకలి తీరాలి. మరో పక్క అహం, అభిమానం. మా కాళ్ళమీద మేం బ్రతకాలన్న పౌరుషం మమ్మల్ని ఆపేసింది. దీప్తి పురుడికి అనసూయమ్మే దగ్గరుండి సాయం చేసింది. అప్పటికి నాకు ఇరవయ్యారేళ్ళు. దీప్తికి ఇరవై నాలుగు. మాకు పాప పుట్టింది. మొదటి నెల బాగానే గడిచింది. రెండో నెల వచ్చేసరికి పాపకి జబ్బు చేసింది. డాక్టరు తల్లి పాలు మానిపించి డబ్బా పాలు పట్టమన్నాడు. చూస్తూండగా ఖర్చులు పెరిగిపోయాయి. రాత్రింబవళ్ళు ఆటో నడిపినా చాలేది కాదు. పెళ్ళయ్యాక దీప్తిని సుఖపెట్టిందంటూ లేదు. తనెప్పుడూ ఒక్కసారి కూడా ఇది కావాలని అడిగేది కాదు. తను పెరిగిన వాతావరణాన్ని కూడా ఎప్పుడూ తలుచుకునేది కాదు. కానీ నాకు తెలుసు తనెంత గొప్పగా బ్రతికిందో! దీప్తి నాకోసం ఇంతలా మారిపోవడంతో నాలో నాకు తెలీని అంతర్మధనం మొదలయ్యింది. పైకి చెప్పుకోలేని ఆత్మన్యూనతా భావం బయల్దేరింది.

సరిగా అదే సమయానికి అనసూయమ్మ డబ్బు సులభంగా సంపాదించే కొత్త మార్గం చూపించింది. అనసూయమ్మ మొట్టమొదటి సారి ఆ ప్రతిపాదన చెప్పినప్పుడు ఆమెను నరికేయాలన్నంత కోపమూ, ఆవేశమూ వచ్చాయి. మా వూళ్ళొ చాలా మంది మగాళ్ళ ఇల్లీగల్ రిలేషన్స్ చూసాను. అప్పట్లో ఆడవాళ్ళనే తప్పుబట్టిన సందర్భాలున్నాయి. శృంగారానిక్కూడా హృదయమూ, ప్రేమా ముఖ్యమని నమ్మేవాణ్ణి. ఆ క్షణం మగాడిగా పుట్టినందుకు అసహ్యించుకున్నాను. మొదట్లో జుగుప్సాకరంగా అనిపించేది. “ఆమ్మాయిలు ఇటువంటి పనికి సిగ్గు పడ్డారంటే అర్థం వుంది. నేకేం పొయ్యకాలం వచ్చిందిరా? నువ్వు మగాడివి కావా?” అంటూ అనసూయమ్మ రెచ్చగొట్టేలా మాట్లాడేది. ఏం? సిగ్గూ, లజ్జా, ఏడుపూ మగాళ్ళకుండవా? అని ఆ క్షణం అయితే అడిగాను కానీ, మెల్లగా బ్రతుకు బలహీనత ఆవరించింది. ఒక్కసారి అంత మొత్తం కళ్ళ చూసాక ఒక రకమైన జస్టిఫికేసన్ మొదలయ్యింది. నెలంతా ఆటో తిప్పితే వచ్చే సొమ్ములు ఒక్క గంటలో వచ్చేస్తున్నాయి. అదీ ఏమాత్రం శ్రమ లేకుండా. మొదట రెండు మూడు సార్లు బెరుగ్గా అనిపించినా తరువాత తరువాత అలవాటయిపోయింది.

ఆ అలవాటులో భాగంగా దీప్తికి అబద్ధాలు చెప్పడం అవసరం అయ్యేది. ఏం చేసేది? డబ్బు పాపిష్టిది. ఉండి ఉన్నవాణ్ణీ, లేక లేనివాణ్ణీ హింసిస్తూ ఉంటుంది. ఎన్నో రాత్రుళ్ళు నాలో నేనే ఏడ్చేవాణ్ణి. మగాణ్ణి కదా పైకి ఏడ్చే హక్కు లేదు నాకు. దీప్తి ముందరయితే ఏమయ్యిందని ప్రశ్నిస్తుంది. అందుకే మా పాప దగ్గరే ఏడ్చేవాణ్ణి.

చెప్పద్దూ? బ్రతకడం వేరు. భరించడం వేరు. నాలో నేను చస్తూ నన్ను నేను భరిస్తున్నాను. ఎన్నోసార్లు దీప్తికి నా గురించి చెప్పేద్దామని ప్రయత్నించాను. ఆ పాపిష్టి డబ్బు నన్ను జుట్టు పట్టుకు గుంజేసేది. తలొగ్గేసేవాణ్ణి.

జూబ్లీ హిల్స్లో ఒక ఇండస్ట్రయిలిస్ట్ భార్య నా మొట్ట మొదటి కస్టమరు. మొదట్లో తెలియలేదు కానీ అనసూయమ్మకి చాలా పొలిటికల్ కనక్షన్స్ ఉన్నాయి. నేను ఈ వ్యవహారమంతా చూసి భయపడి చచ్చాను. పైగా చెప్పలేనంత సిగ్గు నన్ను అధః పాతాళానికి తోసేసింది. “ఏంట్రా? నువ్వూ ఓ మగాడివేనా? ఆడదాన్ని చూస్తె పురుగుని చూసినట్లు అలా ముడుచుకుపోతావేంటి?” అని ఓ సారి చెంప దెబ్బ కూడా వేసింది అనసూయమ్మ.
ఈ వ్యవహారమంతా చాలా విచిత్రంగా జరుగుతుంది. చాలాసార్లు మధ్యాన్నం ఇళ్ళలోనే జరుగుతాయి. వాళ్ళు కూడా చచ్చేటన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మొదటి సారి అనసూయమ్మ కూడా వచ్చింది. వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ తీసుకెళ్ళనీయరు. చాలా సీక్రెట్గా నడిపిస్తారు. వాళ్ళ ఇష్టాయిస్టాలకి అనుగుణంగా నడుచుకోవాలి. వీళ్ళల్లో కొంతమందికి తాగడం ఇష్టం. కొంతమందికి సిగరెట్ తాగడం ఇష్టం. ప్రతీ ఒక్కళ్ళకీ ఒక్కో రకమయిన పెర్ఫ్యూమ్స్ ఇష్టం ఉంటాయి. మొదట్లో అవన్నీ వాళ్ళే ఏర్పాటు చేసేవారు. రాన్రానూ నాకు అర్థమయ్యింది. చిత్రం ఏవిటంటే ఈ వ్యవాహరమంతా ఇళ్ళల్లోనే జరుగుతాయి. ఎవరూ బయటకి రారు. ఇదంతా ఒక పకడ్బందీ వ్యవహారం. మూడో కంటికి తెలియకుండా జరిగిపోతాయి. అన్నింటికన్నా నాకు నచ్చిందేవిటంటే పని అవ్వగానే డబ్బు కవర్లో ఇచ్చేస్తారు. మొదట్లో చేసే పని చాలా బాధ కలిగించేది. మొదటిసారి ఇండస్ట్రియలిస్ట్ భార్య నన్ను తాకినప్పుడు శరీరమంతా తేళ్ళూ, జెర్రులూ పాకినట్లనిపించింది. ఒక్క అరగంటలో లక్షల సార్లు చచ్చుంటాను. మనసు ఛీత్కరించుకుంది. బుద్ది డబ్బుతో నచ్చచెప్పింది.

నరమాంసపు రుచి అలవాటయిన పులి జింకల కోసం చూడదు. అలవాటు పడ్డ రుచి దహించేస్తూ ఉంటుంది. పులికి నరమాంసంలా డబ్బు నాకు కొత్త జిహ్వనీ, జీవితాన్నీ చూపించింది.

అనసూయమ్మ రాకెట్ చాలా పెద్దదని మెల్లగా అర్థమయ్యింది. పెద్ద పెద్ద సినిమా తారలూ, సాఫ్ట్ వేరు కంపెనీ మేనేజర్లూ చాలా మందే అనసూయమ్మ కస్టమర్లు. ఎప్పుడూ ఎవరి దగ్గరా ఈ ప్రస్తావన తెచ్చేది కాదు. నా దగ్గర ఎప్పుడూ ఏవీ జరగదన్నట్లే ప్రవర్తించేది. మా ఇద్దరికీ ఒక కోడ్ సైన్ ఉండేది. నా సెల్‌కి కాల్ చేసి బజార్నుండి కోక్ పట్టుకురమ్మనమనేది. అంటే ఆరోజు నాకు డబ్బులొస్తాయి.
ఒక సారి కోక్ అంటే ఏవిటని అడిగితే నవ్వుతూ చెప్పింది – “కోకో కోలా – కోక కావాలా?” అనర్థం చెప్పింది. అది తెలిసాక కోక్ త్రాగాలంటే మనసొప్పేది కాదు. దీప్తికి కోక్ అన్నా, థమ్సప్ అన్నా ఇష్టం. ఎప్పుడయినా బయటకి వెళ్ళినప్పుడు కోక్ అంటే వద్దనే వాణ్ణి.
అనసూయ్యమ్మకి కస్టమర్లు హైద్రాబాదుకే పరిమితం కాదు, డిల్లీ, కలకత్తా, ఇలా పలునగరాల్లో ఉన్నాయి. నా పెర్సనాలిటీ, వయసూ నా రేటుని పెంచేసాయి. డిల్లీ వెళ్ళినప్పుడల్లా వారంలో లక్ష రూపాయిలు దొరికేవి.

డబ్బు వస్తోందన్నది మినహాయిస్తే మానసికంగా నాకు స్థిమితమూ, శాంతీ లేదు. దీప్తిని తాకడానిక్కూడా మనస్కరించేది కాదు. చెప్పానుగా డబ్బు నన్నొక పులిలా తయారుచేసింది. మామూలు పులి కాదు, ధనమాంసపు పులి…”

***

Kadha-Saranga-2-300x268
అతని గురించి దీప్తికి తెలిసిపోయింది. తనని జైల్లో పెట్టారనీ, నానా చిత్రవధలూ పెడుతున్నారని తెలిసి జైలుకి వచ్చింది. అతను జైలు గది లోపలున్నాడు. వెలుపల ఆమె చంకలో పిల్లనెత్తుకొని ఏడుస్తూ ఉంది.
జరిగినదంతా దీప్తికి అతను చెప్పుకొచ్చాడు. “ఎందుకు చేసావ్? ఈ పాపిష్టి పనులు? నేనెప్పుడయినా డబ్బు కావాలని అడిగానా? ” ఏడుస్తూ అతని చెంప వాయించింది.
అతను దోషిలా నిలబడ్డాడు. అతను చేసిన తప్పు పనికన్నా, ఆమె ముందు దోషిగా నిలబడడం అతన్ని కృంగతీసింది. ఏడుస్తూ మౌనంగా ఉండిపోయాడు.

“దీప్తీ! నన్ను నమ్ము! ఒక పక్క నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేని నా అసమర్థత. మరో వైపు మన అవసరాలు. డబ్బుకోసమే ఇదంతా చేసాను తప్ప…” అంటూ గోడకి తలకొట్టుకుంటూ ఏడ్చాడతను. దీప్తి వచ్చి వారించి అతన్ని దగ్గరకి తీసుకుంది.
అతను చెప్పింది దీప్తి నమ్మ లేదు. వివరం చెప్పేసరికి అవాక్కయ్యింది. “డబ్బున్న మగాళ్ళకి ఇలాంటివి విన్నాను. ఆడవాళ్ళు కూడా…?” అంటూ ఆశ్చర్యపోతే – “ఏం? ఆకలికీ, సెక్స్ కీ ఆడా, మగా తేడాలుండవు. ఇలా గిరి గీసుకోవడం మన తప్పు. నీకే కాదు, నాకు మొదట్లో నమ్మకం కలగలేదు,” అంటూ అతను జవాబిచ్చాడు.

అంతే దీప్తి ఒక్కసారి తల జైలు తలుపు ఇనుప కమ్మీలకి ఏడుస్తూ కొట్టుకుంది. “దీప్తీ!” అంటూ గట్టిగా అరిచాడతను.
ఒక్కసారి ఉలిక్కి పడి లేచి చుట్టూ చూసాడు. తన పక్కనా, ఎదుటా ఎవరూ లేదు. కల వచ్చిందని గ్రహించాడతను.
దూరంగా పోలీసాఫీరు మాటలు వినిపిస్తున్నాయి.

తల విదిలించి అటుగా చూసాడు. వడి వడిగా పోలీసాఫీసరు తన సెల్ వైపు వస్తున్నట్లు గమనించాడు.

వస్తూనే – “నీ మొబైల్‌కి రాత్రంతా ఒకటే ఫోన్లు. స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇందాకనే మా పై ఆఫీసరుతో మాట్లాడాను. నువ్వు సహకరిస్తే ఒదిలి పెట్టేయమని చెప్పారయన. కాబట్టి నువ్వు నీకు తెలుసున్న నంబర్లు చెప్పు,” గట్టిగా అన్నాడు. ఆఫీసరు రాగానే లేచి నుంచున్నాడతను.
“సార్! చెప్పానుగా! అవసరమయితే వాళ్ళే కాల్ చేస్తారు తప్ప నాకెవరి నంబర్లూ తెలీవు. పైగా ప్రతీ సారీ వాళ్ళు ఫోన్లు మార్చేస్తారు,” అన్నాడతను.
“సార్! మీకు ఫోన్ వచ్చినప్పుడు నా గురించి చెప్పిన వాళ్ళ వివరాలు ఎందుకడగలేదు సార్?” పోలీసాఫీసర్ని ప్రశ్నించాడు.
“అడిగాను. చెప్పలేదు. తరువాత ఫోన్ పెట్టేసాక ఈ హొటల్కి కాల్ చేస్తే నీ పేరూ అవీ కరక్టుగా సరిపోయాయి. నాకు ఇలాంటివి ఇక్కడ జరుగుతున్నాయని మా డిపార్ట్మెంటుకి తెలుసు. సరే చూద్దామని హొటల్కి వస్తే నువ్వు దొరికావు…”
“మీకు ఫోన్ చేసిన అమ్మాయికి తిరిగి మీరు ఫోన్ చేసి కనుక్కోలేదా?”
“చేసాను. కానీ ఆ సెల్ నంబరు సర్వీసులో లేదని మెసేజ్ వచ్చింది. అందుకే నీ దగ్గర కూపీ లాగుతున్నాను, ” అన్నాడా పోలీసాఫీసరు.
అతను భయపడ్డాడు. “అయితే మమ్మల్ని అరెస్టు…” అంటూ మధ్యలో ఆపేసాడతను.
“నో! నిన్నేం అరెస్టు చెయ్యను. నీ పేరు బయటకి రాకుండా చూస్తాగానీ, నాకు మాత్రం వివరాలు కావాలి. నిన్న నువ్వు కలిసిన ఆవిడ ఎవరు?” ఆ పోలీసాఫీసరు అతన్ని అడిగాడు.
బీనా పేరు చెప్పాలా వద్దా అని తటపటాయించాడు. అయినా ధైర్యం చేసి ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పేసాడు. అది విని అతను ఆశ్చర్యపోయాడు.
“బీనా ఎవరనుకున్నావ్? నేవీ చీఫ్ భార్య. ఇంకా ఎవరు నీ కష్టమర్లు? నువ్వు కాక ఇందులో ఇంకా ఎంత మంది యువకులున్నారు? ” అతను ప్రశ్నల శరంపర తీసాడు.
“నవనీత్ కౌర్ అని చండీఘడ్ లో ఉండే ఆవిడ తెలుసు. చెప్పానుగా, నాకు చాలా మంది పేర్లు మాత్రమే తెలుసు సార్! వాళ్ళు పనయ్యాక సెల్ ఫోన్లు మార్చేస్తారు. బానీ నంబరు ప్రతీసారీ ఒక కొత్తది ఉంటుంది. ఒట్టు సార్! నిజంగా నాకెవరున్నారన్నది తెలీదు. ప్రతీ సారీ అనసూయమ్మ ఎక్కడికెళ్ళాలో చెప్పేది. నేను కలిసిన వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు. అంతా ప్యూర్ బిజినెస్! అంతకు మించి నాకు ఏవీ తెలీదు…” అంటూ అతను అతను భోరున ఏడ్చాడు.
“నీకు తెలుసున్న వివరాలు చెప్పు చాలు…”
“తెలుసున్నవన్నీ చెప్పాను సార్! హైద్రాబాదులో అనసూయమ్మకి అన్ని డిటైల్సూ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడే నా కాంటాక్ట్స్ కుదురుస్తుంది…సార్! ఆకలి గా ఉంది….” అని దీనంగా చూసాడు.
అది విని కానిస్టేబుల్ చేత పంపిస్తానని అక్కడనుండి వెళిపోయాడు. కొంత సేపయ్యాక ఒక కానిస్టేబుల్ వచ్చాడు. బయట హొటల్లో ఏదైనా తినడానికి తీసుకెళ్ళడానికి. పారిపోవడానికి ప్రయత్నిస్తే చావేనని బెదిరించాడు.
బయటకు వస్తూండగా పోలీసాఫీసరు బయట ఒక కారు దగ్గర ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. వీళ్ళని చూసి వెనక్కి రమ్మనమని పిలిచాడు. అతను కారు సమీపించగానే కారులో ఉన్న ఒకామెను చూసాడతను. వేంటనే గుర్తు పట్టాడు. ఆమె అతన్ని గుర్తుపట్టి తల తిప్పుకుంది. ఆమె పేరు గుర్తుకు రావడం లేదు. ఫోన్లు లాగనే వీళ్ళూ పేర్లు మార్చేసుకుంటారు. వేంటనే తల తిప్పి ఆ కానిస్టేబుల్ని అనుసరించాడు.
టిఫిన్ తిన్నాక అతని ప్రాణం లేచొచ్చింది. తిరిగి వస్తూ పోలీస్టేషన్ ప్రవేశిస్తూండగా అక్కడ ఒక రూములో పోలీసాఫీసరు కనిపించాడు.
ఆయనతో మాట్లాడాలి అన్నట్లు కానిస్టేబుల్తో సైగ చేసాడతను. ఆయన రూమువైపు తీసుకెళ్ళి బయటకి వెళిపోయాడా కానిస్టేబుల్.
“సార్! మీకో విషయం చెప్పాలి. ఇందాక మీరు బయట కారులో మాట్లాడుతున్న ఆమె నాకు తెలుసు సా…ర్!” అంటూండగా ఒక్కసారి కుర్చీలోంచి లేచి సాగదీసి లెంపకాయ కొట్టాడా పోలీసాఫీసరు.
అంతే అతని నోట మాట లేదు. కానిస్టేబుల్ని గట్టిగా కేకేసాడా పోలీసాఫీసరు. అతన్ని జైలు గది వైపు లాక్కెళ్ళాడు. కసితీరా అతన్ని చావబాదాడా పోలీసాఫీసరు.

***

అంతవరకూ నానా హింసలు పెట్టినా ఆ పోలీసాఫీసరు అతను చెప్పింది విన్నకా ఏమనుకున్నాడో కారెక్కించుకొని బయటకి తీసుకెళ్ళాడు.
“సార్! మీరు ఈ డొంకతా కదిపి మీకే ముప్పు తెచ్చుకునేలా వున్నారు….” అంటూ చెప్పాడు. ఆ పోలీసాఫీసరు మొహం కందగడ్డలా మారిపోయింది.
“లేదు సార్! నేను నిజమే చెబుతున్నాను. నమ్మండి. నేను అబద్ధం చెప్పడం లేదు!”
తనొక పెద్ద ఉచ్చులో ఇరుక్కున్నానని అతనికి అప్పుడర్థమయ్యింది. పోలీసాఫీసరు సమస్య వేరు.
“ఈ క్షణం నుండి నువ్వెవరో నాకు తెలీదు. నేనెవరో నీకు పరిచయం లేదు. ఒకవేళ నోరు జారితే నువ్వూ, నీ ఫామిలీ…” అంటూ ఒక విషపు నవ్వు నవ్వాడా పోలీసాఫీసరు.
అతన్ని నేరుగా తీసుకెళ్ళి ఇండియా గేట్ వద్ద వదిలేసాడు. ఆ ఆఫీసరు వెళ్ళాక దీప్తికి కాల్ చేసాడతను.
“నాకు భయంగా ఉంది. ఆ పోలీసాఫీసరు నిన్ను పట్టుకొని జైల్లో…” అంటూ ఫోనులో గట్టిగా ఏడ్చింది.
“అతను మన జోలికి రాడు, అతనికి మినిస్ట్రీ నుండి ఫోన్ వచ్చింది. పైగా ఇంకో విషయం…” చెప్తూ ఆపేసాడు.
దీప్తి విషయం ఏమిటని మరలా రెట్టించింది.
“ఈ ఆఫీసరు …ఇహ అతను మన జోలికి రాడు,” అని దీప్తికి ధైర్యం చెప్పాడు.
“నువ్వు వేంటనే బయల్దేరి ఇంటికొచ్చేయ్! మనకున్నది చాలు. బ్రతకడానికి చాలా దార్లున్నాయి. ఈ పాపిష్టి డబ్బు మనకొద్దు. నువ్వీ పనులు చెయ్యనని ప్రామిస్…” అంటూ ఫోనులో గట్టిగా ఏడ్చింది దీప్తి. ఆమె ఫోను పెట్టేసాక మనసు మనసులో లేదు. దీప్తికి తను మోసం చేసినా ఇంకా తననే నమ్ముకుంది.
ఇండియా గేట్ డిల్లీలో అతనికి నచ్చిన ప్రదేశం. ఎన్నో సాయంత్రాలు అక్కడ గడిపాడు. ఇదే తన పికప్ పాయింట్.
అక్కడే ఒక హొటల్లో చాట్ తిని టీ తాగాడు. రాత్రి తొమ్మిది కావస్తోంది.
మనసు పరిపరి విధాల పోతోంది. ఒక పక్క తనంటే తనకి అసహ్యం, గత్యంతరం లేని బ్రతుకు. మరొక పక్క కుటుంబం. కాలే కడుపుకి ఒక రకం ఆకలి. రగిలే డబ్బుకి మరో రకం ఆకలి. పనికి మాలిన జస్టిఫికేషన్! పరిపరి విధాల ఆలోచిస్తూ అక్కడున్న పచ్చిక మైదానంలో నడుస్తున్నాడు.
దూరంగా ఒకమ్మాయి అతన్ని చూసి నవ్వుతూ చెయ్యూపింది. మెల్లగా నడుచుకుంటూ అతని వైపే వచ్చింది.
దగ్గరకొచ్చాక ఆమెను చూసాడు. పెదాలకి ఎర్రటి లిప్స్టిక్‌తో విపరీతమైన మేకప్‌తో ఉంది.
అతనికి ఆమె ఎవరో అర్థమయ్యింది. దగ్గరకి రాగానే పెర్ఫ్యూం వాసన గుప్పున కొట్టింది.
“వాంట్ టూ హావ్ సమ్ డ్రింక్ టుగెదర్?”
వద్దన్నట్లు తలూపుతూ జేబులోంచి ఒక కవరు తీసి ఆమె చేతిలో పెట్టి వెళిపోయాడు. రెండ్రోజుల క్రితం బీనా అతనికిచ్చిందది.
ఆమె ఆ కవరు విప్పి చూసినట్లుంది, అతని వెనకాలే పరిగెత్తుకొచ్చి, చేతిలో కవరు చూపించి ఏవిటన్నట్లు సైగ చేసింది.
తీసుకో అన్నట్లు తలూపి బయల్దేరాడతను.
“హూ ఆర్ యూ? ” ఆమె అతన్ని వెనక్కి లాగి అడిగింది.
మెల్లగా ముందుకి నడుస్తూ చెప్పాడతను.
“జిగొలో!”

–సాయి బ్రహ్మానందం గొర్తి

రామక్క

Kadha-Saranga-2-300x268

రాకరాక మా అల్లుడొచ్చిండే

ఓ..రామ అల్లుడొచ్చిండే

ఓ…లేడి అల్లుడొచ్చిండే

అల్లునికి నెల్లూరు సారగావాలె

ఓ..రామ అల్లుడొచ్చిండే

ఓ..లేడి అల్లుడొచ్చిండే..

పాట పక్కనే పారుతున్న పాకాల ఏటి పరుగు లెక్కుంది.పాటతోపాటు సేతులు లయబద్ధంగా కదులుతూ నాటేసుకుంట ముందుకు కదులు తున్నై.పాట ఎక్కన్నుంచొస్తుందా అని సూసెటాలకు నలభైఏండ్ల సుమారుగుండే ఒకామె ఆపాట పాడుతుంది.నాటైపోయినంక అందరు ఇండ్లకు బోయెటప్పుడు అమ్మమ్మనడిగిన ఇందాక పాటబాడినామెవరని, ఓ..గదా మన రామక్క గాదుర అన్నది అమ్మమ్మ.ఆమెజూస్తె నీకంటె సిన్నగున్నది మరి నువ్వామెను అక్క అంటున్నవేందని అడిగిన దానికి అమ్మమ్మ బదులుజెప్పలేదుగాని అందరంగలిసి పొలంకాన్నించి ఇంటికి బోయినం.

తెల్లారి పొద్దుగాల రామక్క మా అమ్మమ్మోల్ల ఇంటిముంగలకెల్లి బోతుంటె ఓ..రామక్కో… అని బిల్సి ఎమ్మటే తలుపు సాటున దాక్కున్న అంతల్నె రామక్క ఎనక్కిదిరిగి ఎవడ్రా బాడుకావ్ నన్ను పేరుబెట్టి పిలిసింది.

అనుకుంట మా ఇంట్లకొచ్చి తలుపుసాటునున్న నన్నుజూసి మైసక్క గీ పోరడెవడే నన్ను పేరుబెట్టి పిలిసిండు అని అడిగింది. మా మనవడు అని జెప్పింది అమ్మమ్మ…ఓరి నువ్వు రత్తమ్మ కొడుకువా..మయ్య సక్కదనం జూడు గిన్నెపండు లెక్కున్నడు అనుకుంట నన్ను ముద్దుబెట్టుకోని బైటికి బోతాంటె యాడికిబోతన్నవే రాములు అని అమ్మమ్మ అడిగింది.కోంటింటికి బోతన్న మైసక్క అనిజెప్పి బైటికెల్లింది రామక్క. అయ్యాల్టించి రామక్క వచ్చేప్పుడు

పొయ్యేప్పుడు గలమట్ల నిలవడి ఓ..రామక్కో అని బిల్సేది.రామక్క ఎనక్కిదిరిగిసూడంగనే గోడపొంటి దాక్కునేది.

“నీ తీటపాసునిదన్న బాడుకావ్” పిలిసినోడివి మల్ల అగపడకుంట దాక్కుంటవేమోయ్ అని నవ్వుకుంట బొయ్యేది.ఒకనాడు నాకు అనుమానమొచ్చి అమ్మమ్మ నడిగిన సిన్నోల్లు పెద్దోల్లు అందరు రామక్క అనే పిలుస్తరేందని.

ఈపాలిగూడ అమ్మమ్మ సమాధానంజెప్పలే అసలు ఆమెను అందరు ఎందుకు అట్టబిలుస్తున్నరే నాకుమాత్రం ఇప్పటికి

సమజ్ గాలె.కనాడు పొద్దుగాల రామక్క గొడ్లుదోలుకోని బోతాంటె బైండ్లోల్ల ఎంకడు,బొజ్జోల్లబిచ్చం,పల్లోల్ల ఎల్లడు

అందరు జిల్లగోనె ఆడుతున్నరు ఇంతల్నె జిల్లబోయి రామక్కకు దగిలింది.ఇగజూడు రామక్కతిట్లకి అంతులేకపాయె.

సిత్తకార్తెలబుట్టిన బాడుకావులార మీనోల్లల్లనా సాడుబొయ్య అని తిట్లపురాండంఎ త్తుకునె.ఇగ తిట్లిన్నదేమో ఏందే రాములు ఎవర్నిదిడుతున్నవే అనుకుంట అమ్మమ్మ ఇంట్లకెల్లి బైటికొచ్చింది. ఇగజూడె మైసక్క ఈగాలిబాడుకావులు

ఎట్లగొట్టిండ్రో కాసైతె పానంబోతుండె వీల్లగాలి నోల్లల నా ఏరుగుదు అని మల్ల తిట్టుడు సురుజేసింది. ఇగాగె రాములు పోరగాండ్లు ఆడుతుంటె సూడకతగిలిందేమొ వాల్లుమటికి ఏంజేస్తరు.అవ్ గాని యాడికి బోతన్న జరసేపు కూసోని పోరాదె అనెటాలకు ఆ …ఇగనాబతుక్కి కూసునుడుగూడనా ఇగో గొడ్లెమ్మటిబోతుంటె గింతల్నె గీబాడుకావులు గొట్టె అబ్బ… పానమెల్లిపాయె అనుకుంట వామ్మో….గొడ్లుబాయె ఇగనీను బొయ్యొత్త అని లేవబోతుంటె యాడికిబోవులేవె జరసేపుగూసోని ముచ్చటజెప్పరాదె అని అమ్మమ్మ అనెటాలకు ఆ… ఇగనీతోని ముచ్చట్లు జెప్పుకుంటగూసుంటె నాముడ్డిపూసలిరిగినట్టె.అసలే లంజబర్లు గుదెబండ గట్టినసుత ఆగుతలేవు పటేలు పొలంలగినబడ్డయంటె పటేల్ పానందీత్తడు.అనుకుంట గోడకానిచ్చిన కర్రదీస్కోని గొడ్లెమ్మటి ఉరికింది.రామక్కబోయినంక అమ్మమ్మనడిగిన అందరిగొడ్లెమ్మడి మొగోల్లు బోతుంటె మరి వీల్ల గొడ్లెమ్మటి రామక్క బోతుందేందని అడిగిన. ఇగ అమ్మమ్మ సెప్పుడు మొదలువెట్టె.

రామక్క టికి పెద్దది ఆమెతోడ ఇద్దరు తమ్ములు ఒక సెల్లె బుట్టిండ్రు.పెద్దమనిషిగాంగనె దెగ్గరసుట్టాలని రొండోసంబందమోడైన లచ్చయ్యకిచ్చి పెండ్లిజేసిండ్రు.యాడాది రొండేండ్లు బాగనే ఉండె పురుడుబోసుకోటానికి

ఈఊరొచ్చిన రామక్కకి పురిట్లనే పిల్ల జచ్చింది. ఇగ రామక్క మల్ల మొగనితానికి బోకుండ ఈడనే ఉండబట్టె. ఇంటికి పెద్దది గాబట్టి సాగినన్నాల్లు సాగింది ఇంతల్నె తమ్ముడు పెద్దోడైండు ఆనికి పెండ్లిజేసిండ్రు ఆనిపెండ్లంగూడ మంచిదే

ఆడిబిడ్డెను ఎన్నడన్న ఒక్కమాటనెరుగదు.రోజులన్ని ఒక్కతీరుగుండయిగద తమ్మునికి నలుగురు పిల్లలైండ్రు

ఆడు ఏరువడ్డడు అయ్యున్నన్నాల్లు బాగనే ఉండె ముసలోడుజచ్చినంక సూసెటోడు లేక మల్ల తమ్ముని పంచనజేరింది.కూకోని తింటె ఎవడుబెడతడుగందుకనే గిట్ల గొడ్లెమ్మటిబోతాందని అమ్మమ్మ జెప్పంగనే నాకు శానా బా దనిపిచ్చె.ఎంతకష్టంజేసినా రామక్కమొకం ఎప్పుడు నవ్వుతనే గనపడేది.కోపంల ఎవలనన్న ఒగమాటన్నగాని ఎవ్వలుగూడ పట్టిచ్చుకునెటోల్లుగాదు.

———0——————0————-

రోణికార్తె ఎండలు సెలెమల సుక్కనీల్లు లెవ్వు ఇగమంచినీల్లకి కోండ్రోల్ల బాయొక్కటే ఆదెరువు ఊల్లె జనాలంత ఆ బాయికాడికే మంచినీల్లకి బొయ్యెటోల్లు.కోండ్రోల్లంటె మా అమ్మమ్మ తల్లిగారన్నమాట. ఒకనాడు పోరగాల్లందరం పందెంబెట్టుకోని ఎవరు ముందుబొయ్యి నీల్లు మోసుకొత్తరోనని పందెంబెట్టుకోని ఉరుకుడు మొదలుబెట్టినం ఉరుక్కుంట మోటదార్లెకెల్లి బోతాంటె ఒకముతరాసామెకు తగిలిన.ఇంతల్నె ఆమె నాదిక్కు దిరిగి ‘’ మాదిగోల్ల పోరగాండ్ల కు కండ్లు కనబడుతలేవు మనుసులకు తగులు కుంటనే బోతండ్రు”..అని అనెటాలకు అన్న్ బాయిగడ్డమీద గూసున్న రామక్క ఈ మాటిని “మాదిగోని కాడ పన్నప్పుడు లేని సుద్ది మాదిగోడు తగలంగనే వొచ్చినాది.”అనంగనే ముతరాసామె మల్ల మారుమాటలేకుండ నీళ్ళుదోడుకోని పోయింది.   ఆమె అట్లబోంగనె ఇందాక ముతరాసామెను గట్లన్నవుగదా వాల్లు ఏమనరా అని అడిగిన. ఏంది వాల్లకు దడిసేది ఉన్న మాటేఅన్న ఊల్లె లేని మాట అన్ననా ..గీ ఊల్లె ముతరాసోల్లేంది కమ్మోల్లు., రెడ్డోల్లకుగూడ దడిసేదిలేదు.తప్పుజేసినోడు దడువాలె నేనెందుకు దడుస్త అని అంటుంటె రామక్క దైర్యానికి మాకు ఆచ్చెర్యం అయ్యింది.

అయాల అమ్మమ్మోల్ల జీతగాడు రాకపోయెటాలకు నన్ను గొడ్లకాడికి బంపిన్డ్రు.గొడ్లుదోలుకోని రామక్కోల్లెమ్మటిగొడ్లుగాయబోయిన.పైటేల్లకాడ అందరు సద్దులిప్పుకోని తిన్నంక గొడ్లని సెర్లదోలి సింతకింద గూకున్నంక పొరగాండ్లందరికి ఒక ఆలొసెనెచ్చింది ఈతగొడదామనుకున్నరు సెర్ల అయితె బరిజెనిగెలుంటై వొద్దనుకోని పక్కనున్న రెడ్డోల్ల బాయిల ఈతగొడదామని అనుకున్నరు ఇంతల్నె అనుమానమొచ్చి వామ్మో రెడ్డాయనొస్తె సావదెంగుతడని ఒకడన్నడు.ఏంగాదులే ఎవడన్నోత్తె నీనుజెప్పుతగని మీరు దుంకుర్రా అని రామక్క అనెటాలకు అందరంగల్సి అంగీలూడబీకి బాయిగడ్డమీద పారేసి పందేలుగట్టుకోని బాయిలదూకి ఈతలు మొదలుబెట్టినం జరసేపయినంక ఆన్నించి ఒక ముసలోడొత్తుంటె సూసిన పోరగాండ్లు వామ్మో..! సుంకిరెడ్డి బిచ్చమయ్య వత్తుండు అనెటాలకు యాడోడాన్నె పరార్.ఇగ రెడ్డాయన బాయికాడికొచ్చి మాదిగోండ్ల పోరగాండ్లేనా ఇప్పటిదాక ఈతగొట్టిందని సెట్టుకింద గూకున్న రామక్కనడిగిండు.రామక్క అవునన్నది .మాదిగ బాడుకావులు ఈతగొడితె సూదరోల్లు మల్ల గీనీల్లనెట్ల ముట్టుకోవాలనే అని అన్నడు.ఆయనట్ల అడుగుతాలెకు “మాదిగోల్ల అంటుబట్టకుంట మీకు వంటబట్టేదేమన్నవున్నదా పటేలా”…అనెటాలకు ముసలోనికి కోపమొచ్చింది. “నీ మాదిగ పెండ్లాల దెంగ” లంజకొడులుల్లార ఇంకోసారి బాయిదిక్కొచ్చిండ్రంటె సావదెంగి సెర్లబడేత్త అని తిట్టుకుంట ఆన్నించిబోయిండు.

చిత్రరచన: ఏలే లక్ష్మణ్

చిత్రరచన: ఏలే లక్ష్మణ్

———–౦———————౦

ఓసి వీమందని గూడెందోల , నిన్ను మాదిగోడుదెంగ అని తిట్టుకుంట గొడ్లదోలక బోతాండు గొల్లోల్ల మల్లయ్య తార మాదిగ్గూడెం కాడికొచ్చినంక ఈ మాట అనెటాలకు గీ మాటలిని ఇంట్లకెల్లి బైటికొచ్చిన రామక్క నోరులేని గొడ్లను గూడెందోలేబదులు మీ పెండ్లాలని దోలరాదురి గొడ్డుమాంసందిని బాగ బలంగున్నరు మాపోరగాండ్లు . అనెటాలకు గొల్లాయనకు రొషమొచ్చింది.ఇద్దరిమద్య పెద్ద జగడమయ్యింది.గొడ్లనిదిడితె నీకేమయ్యిందని గొల్లాయన అనెటాలకు తిడితె తిట్టుకో… నాకేంది.నా కులంపేరుబెట్టి తిట్టినవు గాబట్టి నాకు కోపమొచ్చింది ఇంకొకపాలి ఈ ఊల్లె ఎవడన్న మాదిగోని పేరుబెట్టి తిడితె మర్యాద ఉండదు అని ఆయన్ని బెదిరిచ్చింది.నిజాన్ని భయంలేకుండా మాట్లాడే రామక్కంటె ఆగూడెంల అందరికీ మక్కువే. అందుకేనేమో….! అందరూ ప్రేమగ ఆమెను రామక్కా… అని పిల్సుకుంటరు.ఒక్కొక్క సారి పరేస్కానికి ఏంరా.. మీరందరు మా అయ్యకుబుట్టినార్ర.. నన్ను అక్క అని బిలుస్తరు అని నవ్వుకుంట అంటుండేది.

బడులుదెరిసె రోజులు దగ్గరబడుతున్నకొద్ది నాకెట్లనో అయితుండేది. ఈ ఊరొదిలిపెట్టి మల్ల మాఇంటికి బోవాలంటె పానంమీదికొచ్చేది. ఈ ఏడు అసలే పదోది మంచిగ సదవాలె కొడుకా అనిజెప్పి నన్ను బండెక్కించి అమ్మమ్మ ఇంటికి బోయింది.

———-*————————-*

సంవచ్చరం పరిచ్చలు రాసినంక మా దోస్తులంత ఎవరి ఇండ్లకు వాల్లు బోతాంటె నాకుగూడ ఉండబుద్దిగాలె అమ్మమ్మోల్ల ఊరికిబోదామని టేషన్ల కొచ్చి కాజిపేట బండెక్కి పొద్దుగూకేల్లకి అమ్మమ్మోల్ల ఊరికి జేరుకున్న

 

పొడల పొడల గట్లమీద నాగుమల్లే దారిలో

పొడిసిరార సందమామ నాగుమల్లే దారిలో

నీకు మామ నాకు మామ నాగు మల్లే దారిలో

లోకమేలె సందమామ   నాగు మల్లే దారిలో

పాట బాడుకుంట వడ్లు దంచుతాంది రామక్క . రమక్క బాగున్నవా,,, అనెటాలకు పాట ఆపుజేసి నాదిక్కుదిరిగి ఏమోయ్ మనవడా … బాగున్నవా .. ఎప్పుడచ్చినవ్ అమ్మగిట్ల బాగున్నదా..? అని అందర్ని అడిగినంక దమ్చిన బియ్యమెత్తుకోని వాల్లింటికి బోయింది రామక్క… గిట్లనే రోజు రామక్క వడ్లుదంచటాని కి మా అమ్మమ్మోల్లింటికి రావటం ఆమె పాడే పాటలినుడు నాకు మంచిగనిపిస్తుండె..

ఇంతల్నె పదోతరగతి పరిచ్చల పాసుపేలు తెలిపిండ్రు. నీను పదిల పేలైన ఇగ మా ఊరు బొయ్యి సేసేడిదేముందని మావోల్లు నన్ను ఈడనే ఉంచిండ్రు ..ఇగ మా తాత్ తక్కువోడా పందిరిగుంజకుగూడ పనిజెప్పుతడు. సదువుకున్న పోరడని జూడకుంట వాల్ల జీతగాన్ని బందువెట్టి నన్ను గొడ్లెమ్మటి దోలుతుండె .గొడ్లకాడికిబోయి అక్కడ రామక్క జెప్పేటి కతలింటుంటే ఒక్కొక్కనాడు మాకు బువ్వసుద్ది గూడ ఎర్కుండేదిగాదు.

సలికాలం పొద్దు సీకటితోనె లేసి పోరగాండ్లందరు గలిసి గొడ్లకు గడ్డిగోసకరాటానికి బోయెటొల్లు .. అమ్మమ్మ నీనుగూడబోతనే అని వాల్లెమ్మటిదగిలిబోయిన. తెల్లారుతుండేలకు తీగలబోటికి బోయినం అండ్ల అడుగుబెడుతుండగనే పక్కపొంటి పొదల్నించి ఏందో గసబెడుతున్నట్లినబడ్డది..ఓ…రామక్కో…….. గీడేందో గసబెడుతుందనంగనె సప్పుడుగాకుండ చ్చి పొదలకి జూసింది.

ఇంకేముంది ఓరి పోరగాండ్లు గీ పొదల గుడ్డేలుగుంది ఎవ్వలు సప్పుడు జేయకుర్రి అని జెకముక దీసి నిప్పుజేసి పొదలకిసిరింది. ఇగజూడు నిప్పుజూడంగనె అండ్లకెల్లి బైటికెల్లి గుడ్డేలుగు ఒకటే ఉరుకుడు అప్పుడు రామక్క దైర్నం జూసి నాకు నోటమాట రాలె.

ఇంటికొచ్చినంక అమ్మమ్మకి గీముచ్చెట జెప్పుతె గిదేంజూసినవ్ బిడ్ద అది దెయ్యాలకుగూడ పనిజెప్పుతది. ఏపని జేసినగూడ మొగోనితోని సమానంగ పనిజేస్తది. వాల్లయ్య బతికున్నప్పటి ముచ్చెట

వాల్లయ్య గొడ్లనిగోసెటప్పుడు గొడ్డు కాలుబట్టుకునేది . గట్ల తొడబట్టుకున్నోల్లకు తొడమాంసం బెట్టెటోల్లు.ఇప్పుడు దాని రాతగిట్లున్నదిగాని అప్పుడు మంచిగనె ఉండేది అని అంటుంటె నాకు శాన బాదనిపిస్తుండె.

———————-*———————-*——————

పదోతరగతి పరిచ్చలు మల్లబెట్టిండ్రు ఈ తడవ మంచిగనే రాసిన కొన్నిదినాలకు పాస్ పేలు తెలిపిండ్రు నీను పాసైన కాలేజి తెర్సినంక కాలేజిల చేరిన .. మాకు తెలుగు జెప్పే “రఘురాం” సారు “కక్క” అనె పుస్తకం పేరుజెప్పి గీ పుస్తకం మీ కులపాయెనె రాసిండు మంచిగుంటది సదువుమన్నడు.. ఎట్లనో తిప్పలబడి గా పుస్తకం దొర్కబట్టుకొని సదువుతుంటె అండ్ల కత మొత్తం మా అమ్మమ్మోల్ల ఊర్లె జరిగిన సంగతుల్లెక్కనే అనిపిస్తుండె. కతసదువుతుంటె రామక్క కండ్లముందున్నట్లె అనిపిచ్చేది. ఈ సారి ఊల్లెకిబోతె ఈ కత ఎట్లనన్న రామక్కకి ఇనిపియ్యలె అనుకున్న. ఇంతల్నె దసర సెలవులు ఇచ్చిండ్రు అయ్యాల మాపటి బండ్డెక్కి సీకటిబడెయాల్లకి అమ్మమ్మోల్లింటికి చేరుకున్న.

పొద్దుగాల అందరు ఎవరి పనులకు వాల్లు బోయినంక పుస్తకం దీసుకోని వడ్లోల్ల సింతకిందికిబోయి కూకున్న ఇంతల్నె గొడ్లదోలుకోని రామక్క ఆడికొచ్చింది . రామక్కో…… నీకొక కత జెప్పనా అనెటాలకు ఏంకత జెప్పుతవొయ్ అన్నది నవ్వుకుంట. ఇగో గీ బుక్కుల మంచి కతున్నది అని చెప్పిన ..కతపేరుజెప్పు అన్నది రామక్క. కత పేరు “కక్క” అనిజెప్పెటాలకు..ఓహో… బెమ్మంగారి కక్కడా ఆ కత నాకుదెల్సులేవోయ్   నువ్వు కొత్తగజెప్పెదేంది అన్నది. కక్కడంటె గా కక్కడుగాదు మన మాదిగోల్ల పోరడె …వేముల ఎల్లన్న రాసిండు. నీ అసొంటోల్ల కత మంచిగ జెప్పిండు అని నీను జెప్పంగనె గట్లయితె జల్దిజదువు నీనుగూడ ఇంట అన్నది. కతజదువుడు మొదలుబెట్టిన బువ్వమీద రోకు లేకుండ రామక్క కత ఇన్నది ..రామక్క మొకంల దిగులు కనిపిస్తున్నది రామక్కఆలోచనలు ఎక్కన్నోదిరుగుతున్నై.. ఏంది రామక్క గట్ల దిగాలుగున్నవ్ అనెటాలకు కత మంచిగున్నది బిడ్ద కతల ఆల్ల అమ్మకు మారుమానం జీసిన కొడుకసోంటోడు నాకు ఒక్కడున్నట్లయితె నా బతుకు గిట్లుండునా బిడ్డ .రామక్క మాటలకు సూటిగా ఆమె మొకం ల సూడలేక తలకాయ పక్కకు తిప్పుకున్న.. సూర్యుడుగూడ మౌనంగ   సెర్ల మునిగిండు…..

 

 -శ్రీనివాసు గద్దపాటి

పరిచయం:

srinivasu gaddapati

నేను తెలుగు, హింది, ఆంగ్లము, సైకాలజీ ల్లో ఎమ్మే చదివాను ప్రస్తుతం గ్రేడ్ వన్ హిందీ పండిట్గా పనిచేస్తున్నాను. మూసీ ,నడుస్తున్నచరిత్ర, ఆకాశిక్, కథాంజలి మొదలైన పత్రికల్లో కవితలు వ్యాసాలు వచ్చాయి. గుమ్మం, జాగో జగావో, క్విట్ తెలంగాణ, మునుం., స్వేచ్చకోసం, మార్పుకోసం,  నల్లవసంతం,  తొలిపొద్దు, తొలివెలుగు కవిసంగమం2013 మొదలైన కవితా సంకలనాల్లో కవితలు.. “స్వేచ్చకోసం” సంకలనానికి సంపాదకత్వం వహించాను ఐదుగురు మితృలతో కలిసి “పంచమస్వరం” కవితా సంకలనంవేశాను. ప్రముఖ హిందీ దళిత కవుల కవితలు దాదాపు 50 తెలుగు అనువాదం. శివసాగర్ కవితలు కొన్ని హిందీ అనువాదం చేశాను. కథ రాయటం ఇదే మొదటి ప్రయత్నం.

 

కన్నపేగు

GNK Varma

సాయంత్రం జోరుగా వాన పడింది.చెట్ల కొమ్మల మధ్య ఆకుల మీద పడ్డ వర్షపు చినుకులు, ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వాన జోరుగా కురవడంతో వాతావరణం చల్లబడింది.

అప్పుడే ఆఫీసులో విధులు ముగించుకుని ఇంటికి చేరిన పురుషోత్తమ రావు, గేటుతీసి లోనికి అడుగుపెడుతూనే “యశోదా.. బయట బాగా చలిగా ఉందోయ్..పైగా వర్షంలో తడిసొచ్చాను. నీచేత కాస్త వేడి వేడి మిర్చీలు వేయించవోయ్..” అంటూ భార్య యశోదకు ఆర్డర్ చేసాడు.

వంటింట్లో ఉన్న యశోద నుంచి ఏ స్పందనా రాలేదు. “కనీసం నీ చేత ఏ టీ నో, కాఫీనో పెట్టివ్వవోయ్..గొంతులో పోసుకున్టే కాస్త చలైనా తగ్గుతుంది..” ఈసారి కాస్త అభ్యర్థనగా అడిగాడు. అయినా యశోదా నుంచి ఎలాంటి స్పందనా లేకపోయేసరికి, యశోద ఎందుకో తన మీద కోపంగా ఉన్నట్టు అర్థమైంది పురుషోత్తమ రావుకి.

ఏమైందో తెలుసుకునే ప్రయత్నంలో, నెమ్మదిగా కిచెన్ లోకి అడుగు పెడుతూనే..”త్వరగా రెడీ అవవోయ్.. సినిమాకెళ్దాం..” అన్నాడు పురుషోత్తం. “ఆ.. వెళ్తారు..వెళ్తారు.. ఒఠ్ఠి సిన్మాలకేంటి, మీరు ఎక్కడికైనా వెళ్తారు. మీలో ఆ ఉడుకు రక్తం కావాలసిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ పోసినట్టున్నాడు ఆ దేవుడు. అందుకే మీరిలా వేళా పాళా లేకుండా.. ఇంకా యువకుడిలాగే ఫీలవుతున్నారు.” మొదటిసారి నోరు తెరచి ఉక్రోషంగా అన్నది యశోద.

ఆ మాటలకు నవ్వుతూ దగ్గరికి రాబోయాడు పురుషోత్తం. యశోద వెంటనే గిర్రున వెనక్కి తిరిగి కిటికీలోంచి బయటకు చూస్తోంది. తనకు దగ్గరగా వచ్చిన పురుషోత్తం కూడా ఏమిటా అని కిటికీలోంచి తొంగి చూసాడు.

బయట పచ్చని చెట్టు కొమ్మల మధ్య ఒక పక్షి గూడు కట్టింది. అందులో దాని పిల్లలు కూడా ఉన్నాయి. ఆ తల్లి పక్షి దాని పిల్లల నోట్లో ఒక్కో గింజ ఎక్కన్నుంచో ఏరుకొచ్చి వేస్తోంది. చాలా ఆహ్లాదకరంగా ఉందా దృశ్యం. “ఎంత సేపు చూస్తావోయ్..? కాస్త నన్ను కూడ పట్టించుకో..” అంటూ యశోద కళ్ళ మీద వెనక నుండి చేతులు పెట్టి తనవైపుకు తిప్పుకోబోయాడు. ఆశ్చర్యంగా పురుషోత్తం చేతులు తడయ్యాయి..!!

“ఏయ్ పిచ్చి పిల్లా.. ఏడుస్తున్నావా..? అయినా నీకిప్పుడు కన్నీరు పెట్టుకోవాల్సినంత కష్టం ఏం వచ్చిందని ఏడుస్తున్నావ్..?” అనూనయిస్తూ అడిగాడు పురుషోత్తమ రావు. “ఇంకా ఏం కష్టం రావాలి..? ఇప్పుడు పడుతున్న బాధ చాలదా..??” గొంతులో దుఖం సుడులు తిరుగుతుండగా అంది యశోద. “నువ్విప్పుడు ఏం కష్టపడిపోతున్నావో కాస్త అర్థమయ్యేట్టు చెప్పు..” అన్నాడు. “ఇంకా ఎలా చెప్పాలి..? ఏం చెప్పాలి మీకు..? పిల్లల్ని కని కూడా పిల్లల్లేనట్టు గొడ్రాలులా బతుకుతున్నానని చెప్పాలా..??”

Kadha-Saranga-2-300x268“ఇంతకీ ఏం మాట్లాడుతున్నావ్ నువ్..?

“”అవునండీ.. తొమ్మిది నెలలు, వాళ్లను కడుపులో మోసి, పురిటి నొప్పుల బాధను అనుభవిస్తూ వాళ్ళని కని, అల్లారు ముద్దుగా వాళ్లను పెంచుకుంది, వాళ్ళిలా చదువుల పేరుతో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే ఇలా పిల్లలు లేని గొడ్రాలులా జీవించడానికేనా…?”

“యశోదా.. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు..? ఇన్ని రోజులూ లేని పిల్లల మీద బెంగ ఇప్పుడెందుకొచ్చింది..?”

“సాధారణంగా మనిషి హృదయం తనకు నచ్చని విషయాల పట్ల రెండు విధాలుగా స్పందిస్తుంది. మొదటిది తనకు నచ్చని విషయాన్ని ఎలాగోలా అలవాటు చేసుకోవడం లేదా రెండోది దాన్ని ప్రతిఘటించడం. ఇన్ని రోజులూ నాకు నా పిల్లలు దూరమవుతున్నారన్న నాకు నచ్చని విషయాన్ని అలవాటు చేసుకోడానికి ప్రయత్నించాను. కానీ ఇక అలవాటు చేసుకునే శక్తి, ఓపికా నాలో లేవు. అందుకే ఇలా ప్రతిఘటిస్తున్నా.. చూడండి.. ఆ పక్షి  తన పిల్లల కోసం ఎంత అందమైన గూడు కట్టిందో.. తాను సంపాదించిన ఒక్క గింజైనా సరే, తన బిడ్డ నోటికి ఎలా అందిస్తుందో..? అలా తన పిల్లలకు ప్రేమతో తినిపిస్తూ ఆ తల్లి పొందే ఆనందం మీ మగాళ్ళకు ఎన్నటికీ అర్థం కాదు. ఆ పక్షి ఒక మూగ ప్రాణి, అలాంటిది అదే తన పిల్లలపై అంతటి అవ్యాజమైన ప్రేమను చూపిస్తుంటే, మనం మనుషులమండీ.. మరి మనం మన పిల్లల మీద ఇంకెంత ప్రేమ కురిపించాలి..?” యశోద కంటి నుండి అశ్రుధార పాయలు పాయలుగా కారుతోంది.
“నువ్వే అన్నావ్ గా.. ఆ తల్లి పక్షి తన పిల్లల మీద విపరీతమైన ప్రేమను పెంచుకుదని.., రేప్పొద్దున ఆ పిల్ల పక్షికి రెక్కలొచ్చాక, ఆ తల్లి పక్షిని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగొస్తుందో రాదో కూడా తెలియదు. ఆ విషయం ఆ తల్లి పక్షికి కూడా తెలుసు.  మరి తన బిడ్డ మళ్ళీ తిరిగి రాదని తెలిసిన ఆ తల్లి పక్షి నీలాగే కంట తడి పెడుతుందా చెప్పు..?: అన్నాడు కూల్ గా పురుషోత్తం. “ఎలాగూ మళ్ళీ తిరిగి రాదని ఆ తల్లి వాటినేం వదిలేయడం లేదు కదా..?” అంది యశోద. పురుషోత్తం ఏమీ అనలేక మౌనంగా ఉన్నాడు.

అయినా మనకిప్పుడు ఏం తక్కువైందని చదువుల పేరుతో వాళ్ళనిలా ఎక్కడో దూరంగా పారేశారు..?” అడిగింది యశోద. “మనకిప్పుడు ఏం తక్కువైందని కాదోయ్.. రేప్పొద్దున వాళ్ళకేమీ తక్కువ కాకూడదని..” బదులిచ్చాడు పురుషోత్తం.
“అంటే..?”,
“అంటే ఈ రోజు మన దగ్గర పేరు, ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను సంపాదించిన దాన్ని బట్టి నాకు గౌరవమిస్తుంది ఈ సమాజం”.

“మరి మనకుంటే మన పిల్లలకున్నట్టేగా.. మన తర్వాత ఇవన్నీ వాళ్ళకు గాక ఇంకెవ్వరికి చెందుతాయ్..??” అడిగింది యశోద. “అది కాదోయ్.. మనవన్నీ మన పిల్లలవే కాదనను. కానీ తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి కదా…?”

“ఓహో సంపాదన కోసమా…?? అయితే ఇవన్నీ సంపాదించడానికి మీరు మీ వాళ్ళకు, ఎన్నేళ్ళు దూరమయ్యారు..? అసలు మీరెప్పుడైనా మీ వాళ్ళను వదిలిపెట్టి ఉన్నారా…?? మరిప్పుడు మన పిల్లల విషయంలో మాత్రం ఎందుకిలా..?” మళ్ళీ ప్రశ్నించింది యశోద.

పురుశోత్తం “యశోదా.. అప్పటి మన పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు నాలుగు ఉద్యోగాలకు ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఒక్క ఉద్యోగానికే నలభై మంది ఉంటున్నారు. ప్రపంచం మొత్తం పోటీ ప్రపంచంగా మారిపోతుంది. దేర్ ఈజ్ ఎవ్రీవేర్ ఎ హెవీ కాంపిటీషన్ నౌ…” నువ్వు కూడా చదువుకున్నావు కదా..నీకు తెలియందేముంది..??” బదులిచ్చాడు పురుషోత్తం. “మీరెన్నయినా చెప్పండి. అసలు మన పిల్లలకి మన పక్కింట్లో ఎవరుంటున్నారో, ఎదురింట్లో ఎవరున్నారో తెలుసా..? అదంతా ఎందుకు..? మీకు అయిదుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెల్లు కదా..? పోనీ వాళ్ళ పేర్లయినా తెలుసా వీళ్ళకు..? ఇదిలాగే కొనసాగితే రేప్పొద్దున మనకేదైనా ఆపదొస్తే మనకు సాయం చేయడానికి కాదు కదా.. కనీసం మనల్ని పరామర్శించడానికైనా ఎవరైనా వస్తారా..??” అడిగింది యశోద.

“అలా మనకేదయినా ఆపద వచ్చినపుడు మనం మరొకరి సాయం కోసం చేతులు చాచకుండా.. మనకు వాళ్ళూ వీళ్ళూ ఎందుకు..?? మనకు మన పిల్లలున్నారు. మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనల్ని సాకే శక్తి వాళ్ళకి ఉంటుంది.” అన్నాడు పురుషోత్తం.

“నేను బంధాలు, బాందవ్యాల గురించి మాట్లాడుతుంటే మీరు మళ్ళీ డబ్బు గురించి మాట్లాడుతున్నారు.” అరిచింది యశోద.

పురుషోత్తం చాలా కూల్ గా “ఓసి పిచ్చిదానా.. ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఈ బంధం, బాంధవ్యం, అనుబంధాలకు విలువలు లేవు. తీపి ఉన్నచోటికే చీమలు చేరుతాయి. మనం ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన పనిలేదు.”

“అంటే మనం మన పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, మానవ విలువలు నేర్పుతున్నామా లేక కేవలం డబ్బు ఎలా సంపాదించాలో నేర్పుతున్నామా..?” అడిగింది యశోద.

3429_3570562079439_642447821_n

చిత్రం: సత్యశ్రీనివాస్

“అంటే… మనం వాళ్ళకు ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి సాయం కోసం ఎదురు చూడకుండా ఎలా బతకాలో నేర్పుతున్నాం. అలా బతికితేనే సమాజం లో మనకూ, మన పిల్లలకు గౌరవ మర్యాదలు దక్కుతాయి..” చెప్పాడు పురుషోత్తం.

“మీరెన్నయినా చెప్పండి. మీ మాటలతో నేనేకీభవించను. పెద్దోన్ని మెడిసిన్ పేరుతో విజయవాడలో, చిన్నోన్ని ఇంజనీరింగ్ పేరుతో విశాఖలో పడేశారు. మనమేమో ఎక్కడో చివరాఖరున ఉన్నాం. ఏం ? ఇక్కడ వాళ్ల చదువులకు తగ్గ కాలేజీలు లేవా..?? “మళ్ళీ ప్రశ్నాస్రం సంధించింది యశోద. ఈసారి పురుషోత్తం నోరెత్తలేదు.

“నాకేమో వాళ్ళతో రోజుకి కనీసం ఒక్కసారైనా మాట్లాడాలని ఉంటుంది. కానీ అదేం దురదృష్టమో వాళ్లకు మాత్రం నాతో మాట్లాడే తీరికుండదు. పెద్దోడికి ఫోన్ చేస్తే మెడికల్ క్లాస్ లు ఉన్నాయమ్మా అంటాడు. చిన్నోడికి చేస్తే లాబ్,లేదా ప్రాజెక్ట్ వర్క్ అంటాడు. వాళ్ళకు వాళ్ళను కని, పెంచిన అమ్మకంటే వాళ్ళ క్లాసులు, లాబ్ వర్కులే ముఖ్యమా..?? వాళ్ళు కూడా మీకే ఎప్పుడూమీకే ఫోన్ చేస్తుంటారు. మీరు, మీరు అంతా మాట్లాడుకున్నాక, నాతో మాట్లాడకపోతే నేను అలిగి ఏడుస్తానేమోనని, చివరగా ఫోన్ నాకిమ్మని మీకు సిఫార్సు చేస్తారు. ఆ అల్పానందంలో నేనేదో మాట్లాడాలనుకునేలోపే, వాళ్ళు ‘అమ్మా తిన్నావా..ఆరోగ్యం జాగ్రత్తా అంటూ నాకే జాగ్రత్తలు చెప్తారు. అప్పుడనిపిస్తుంది ‘ఇంతకీ నేను వీళ్లని కన్నానా, లేక వీళ్ళే నన్ను కన్నారా..?” అని. ఈ మాటలంటున్నపుడు యశోద కళ్ళలో కన్నీటి ధార, గొంతులో జీర కనిపించాయి పురుషోత్తం కి.

పురుషోత్తం కి ఏం మాట్లాడాలో తోచక అలాగే నిల్చున్నాడు. మళ్ళీ యశోదనే “వాళ్ళు పండగ సెలవులకని పండగ ముందు రోజో, లేక పండగ రోజో ఇంటికొస్తారు. హమ్మయ్య కనీసం ఇప్పుడైనా నేను నా పిల్లలతో మనసారా మాట్లాడొచ్చు అనుకునేలోగానే వాళ్ళు లగేజ్ ఇంట్లో పడేసి, “అమ్మా ఫ్రెండ్స్ ని కలిసి చాలా రోజులైంది, వాళ్ళను ఒకసారి కలిసొస్తా..” అంటూ పెద్దాడూ, “అమ్మా ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకోడానికి వెళ్తున్నా..” అని చిన్నోడు, నేనేదో అనేలోపే వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళ పక్కన కూర్చుని, నేను చేసిన పిండి వంటలు, వాళ్ళకోసం స్పెషల్ గా చేసిన వెరైటీ వంటకాలు. వాళ్ళకు నా చేత తినిపిస్తూ, వాళ్ళు చెప్పే ముచ్చట్లన్నీ వినాలన్న ఆశ నాలో చప్పున చల్లారిపోతుంది. పోనీ రాత్రయినా వస్తారు కదా అనుకుంటే, ఏ రాత్రి తొమ్మిదింటికో పదింటికో వస్తారు. భోజనం కలిపి వాళ్ల రూం కి తీసుకెళ్తే, “సారీ మాం.. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నాం. అక్కడే తినేసి వచ్చాను. నువ్వెళ్ళి తినేసి పడుకో..: అని ఓ ఉచిత సలహా ఇస్తారు. అప్పుడిక చేసేదేం లేక బాగా అలసి పోయారు కదా.. పండగ హడావిడి అంతా అయ్యాక మాట్లాడొచ్చులే అనుకుంటే.. పండగ ఇంకా పూర్తవ్వక ముందే “అమ్మ వెళ్తున్నామంటూ” నానా హైరానా చేస్తారు. “అప్పుడేనా.. ఇంకో రెండ్రోజులుండండ్రా ” అంటే క్లాసులు మిస్సవుతాయమ్మా అంటూ దాటేస్తారు. ఇంక నేను వాళ్ళతో మనసారా మాట్లాడేదెప్పుడు..?” అంటూ యశో జవాబుల్లేని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. పురుషోత్తం మౌనంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి యశోద పిల్లల మీద బెంగతో కనీసం వాళ్ళ ఫోటోలు చూసైనా సంతృప్తి పడాలనుకుని, ఫోటో ఆల్బం తీసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోపై సుతారంగా తడిమింది.

పురుషోత్తమ రావు తన కన్న బిడ్డల్ని మర్చిపోలేక, వాళ్ళు స్కూల్లో సాధించిన బహుమతులూ, కప్పులను ఆత్మీయంగా ముద్దు పెట్టుకున్నాడు.

ఆ ఇద్దరి కళ్ళలోనూ ఎన్నటికీ ఇంకిపోని ఓ మహా సముద్రం దాగుంది.

-జి.ఎన్.కె.వర్మ

***

పరిచయం:

పూర్తి పేరు నవీన్ కుమార్ గదరి .  జన్మ స్థలం వరంగల్ జిల్లాలోని, ఓ మారు మూల గ్రామం. ఇంటర్మీడియట్ వరకు మా ఊళ్ళో, చుట్టు పక్కల ఊళ్ళలో చదువుకున్నాను. డిగ్రీ కి వచ్చేసరికి దగ్గరలోని వేరే పట్టణానికి మారాల్సి వచ్చింది. డిగ్రీ పూర్తయిన తర్వాత, ఐ సి ఐ సి ఐ బాంక్ లో ఉద్యోగ రీత్యా విశాఖలో ఒక సంవత్సర కాలం పాటు ఉన్నాను. తరువాత, మళ్ళీ పై చదువులు చదవాలని కోరిక నాలో ఇంకా చావక CA చదువు కోసమని, చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్ళీ హైదారాబాద్ కి వచ్చేసాను. ప్రస్తుతం CA చదువుతూ హైదరాబాద్ లో ఉంటున్నాను.

గ్రీష్మంలో కురిసే వాన

Kadha-Saranga-2-300x268

వాచ్ చూసుకుంది లిఖిత.

రైలు సరయిన సమయానికే బయలుదేరింది.

ఎదురు బెర్త్ లోనూ, పక్క బెర్త్ లోనూ ఇంకా ఎవరూ రాలేదు. ఈ మాత్రం ఏకాంతం దొరికి కూడా చాలా రోజులయింది మరి.

వేగం పెరిగేకొద్దీ చల్లటి గాలి మొహానికి కొడుతుంటే వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకుంది. మనసు , శరీరం రెండూ కొద్ది కొద్దిగా సేద తీరుతున్నట్టు అనిపించింది. నాలుగు నెలలు ఇంజినీరింగ్ ట్రైనీ గా శిక్షణ పేరు చెప్పి, ఎంసెట్ విద్యార్ధుల కంటే దారుణంగా పరీక్షలు పెట్టాడు. ఎంసెట్ కి కూడా ఇంత కష్టపడలేదేమో.

రైలు ఏదో పెద్ద చెరువు పైన బ్రిడ్జ్ మీదుగా పోతుంటే గాలి మరింత చల్లబడింది. అలాంటి వాతావరణంలో తీసుకునే ప్రతి శ్వాసతోనూ మనసుపై పేరుకున్న దుమ్ము తొలగి అతని రూపం మెల్ల మెల్లగా సుస్పష్టమవుతోంది. లిఖిత పెదవులపై అప్రయత్నంగానే అందమైన చిరునవ్వు.

ఎప్పటిలాగే మళ్ళా అదే ఆశ. కనీసం రైల్లో అయినా ఒక్కసారి తనతో ప్రయాణించే అవకాశం రాకూడదూ? మనసులో జాగ్రత్తగా దాచుకున్న పెట్టె తీసింది. ఆరేళ్ళ క్రిందటివైనా, పరిమళించే ఆ క్షణాలని ఆప్యాయంగా తడుముకుంది.

తామిద్దరి మధ్యా ఒక్క మాట లేదు. ఇంటర్ మొదలైన తొలి రోజుల్లో మాత్రం నోట్సు విషయంలో రెండు మూడు సార్లు మాట్లాడుకున్నారు. ఆ మాత్రానికే క్లాసులో అందరూ తామిద్దరి మధ్యా ఏదో ఉన్నట్టు కామెంట్లు చెయ్యడం గమనించింది. వాళ్ళ బుధ్ధికి చికాకుపడి ఇక ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం మానేసింది. ఆ సమయంలో తనది ఒకే లక్ష్యం ఉండేది. ఎంసెట్ లో మంచి రాంకు తెచ్చుకుని ఇంజినీరింగ్ చదవాలి. సాఫ్టు వేర్ లో ఉద్యోగం తెచ్చుకోవాలి. పగలూ, రాత్రీ ఆ లక్ష్యంతోనే చదివేది.

సరిగ్గా ఆ సమయం లోనే ఏది జరక్కూడదో అదే జరిగింది. కాలేజీ కి చేరుకుంటూనే అతను కనపడేవాడు. ఫ్రెండ్స్ తో కబుర్లాడుతూనో, ఒక్కడూ సైకిల్ మీద కూచుని ఎవరికోసమో ఎదురుచూస్తూనో. అతనూ తన వంకే చూసేవాడు. ఇద్దరి చూపులూ కలుసుకోగానే వెయ్యి తుమ్మెదలు ఒకేసారి పాట పాడినట్టు తన చెవులకి ఇంకేమీ వినిపించేవి కాదు. ఒంట్లో ఉన్న రక్తమంతా ముఖంలోకి చేరిపోయినట్టు కందిపోయేది. కనురెప్పలు బరువెక్కిపోయేవి. శరీరమంతా వీణగా మారి అన్ని తీగలూ ఒకేసారి మోగుతున్నట్టు మధురమైన ప్రకంపనలు కలిగేవి. అతని ఎదురుగా అడుగులు తడబడేవి. మాట పెగిలేది కాదు. అతన్ని దాటి క్లాసురూములోకి వెళ్ళి తన స్థలంలో తాను కూచునేవరకూ గుండె అతి వేగంగా కొట్టుకునేది.

అతను తనని ప్రత్యేకంగా చూస్తున్నాడని తెలీడానికి ఎంతో కాలం పట్టలేదు. అతని కళ్ళలోనే విద్యుత్తున్నట్టు అనిపించేది. కాలేజీ అయిపోయాక సాయంత్రం వేళ అతను ఎక్కడైనా ఎదురుపడితే, గుండె మరలా గెంతులేసేది. ఆ అవస్థ అందరూ చెప్పినట్టే అపురూపంగా ఉండేది. లోకమంతా అకస్మాత్తుగా నందనవనంలా మారిపోయినట్టు తోచేది.

అది ప్రేమో, ఆకర్షణో నిర్ధారించుకునే లోపే అందులో అపశృతి. క్లాసులో తామిద్దరి గురించీ కామెంట్లు ఎక్కువయ్యాయి. తనకది చాలా అవమానంగా అనిపించేది. తామేదో దీర్ఘకాల ప్రేమికులైనట్లు మాట్లాడుకునే వారు అందరూ. దాన్ని అతను ఏ రకంగానూ ఖండించకపోవడం, వాళ్ళు కామెంటు చేస్తుంటే అతను ఆనందించడం తన మనసుని ఎంత ముక్కలు చేసిందో. అతనిది ప్రేమా కాదు, ఆకర్షణా కాదు. ఎందుకో తనను ఏడిపించాలని చూస్తున్నాడు. ఏ శతృత్వమూ లేకుండానే తనను మాత్రమే బాధపెట్టి ఆనందిస్తున్నాడు అనిపించేది. ఇలాంటి ఆకర్షణలకి లోనయి తన భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. అంతే ఆ తరువాత కూడా అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ అతని పేరు తల్చుకుంటేనే తనలో కలిగే ఆ మధురమైన ప్రకంపనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

నాలుగు నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది లిఖితకి. ఒక ఆదివారం సాయంత్రం తను సూపర్ మార్కెట్ నుంచి బయటికి వచ్చేసరికి వర్షం మొదలయింది. వర్షాన్ని చూస్తోంది గానీ తనలో ఏదో తెలీని ఉద్వేగం. ఎప్పుడూ లేని మధురమైన భావన. ఎందుకో అతనే గుర్తొచ్చాడు. అతన్ని చుసి అయిదు సంవత్సరాలయింది. తరచూ గుర్తొచ్చి కలవరపెడతాడు కానీ ఇప్పుడిలాంటి సందర్భంలో గుర్తురావడం, గుండె కొట్టుకోవడం ఎందుకో చుట్టూ చూస్తే ఆశ్చర్యంగా అతను. కారుకి ఆనుకుని నిలబడి తననే చూస్తున్నాడు. కాసేపు తనని తాను నమ్మలేకపోయింది. సినిమాలో చెప్పినట్టు చూపులు గుచ్చుకోవడం అంటే ఏమిటో స్వయంగా తనకారోజు అనుభవమైంది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తొలిసారి గాఢంగా అనిపించింది తను అతన్ని ప్రేమిస్తోందని. ఆ తరువాత నుంచీ వర్షమొచ్చిన ప్రతిసారీ అతను మనసు ముంగిట్లోకొచ్చేస్తాడు.

ఉలిక్కిపడి కిటికీలోంచి బయటికి చూసింది లిఖిత. చిరు చీకట్లు పడుతూ ఆకాశం మొహం చాటేస్తున్నట్టుగా ఉంది. తెలీకుండానే కన్నీటి బొట్టొకటి పెదవులపైకి జారి ఉప్పగా తగిలింది.

టి.సి వచ్చాడు. అతను టికెట్ చూసి వెళ్ళాక గమనించింది. సయిడ్ లోయర్ బెర్త్ లో ఎవరో ఒకతను. తననే చూస్తున్నాడు. విసుగ్గా చూపులు తిప్పుకుంది. అతనిలా ఇప్పటివరకూ ఎవరూ తన మనసుకి దగ్గరగా రాలేదు. చదువు చెడకూడదని అతనిమీదున్నదంతా వయసుతో వచ్చిన ఆకర్షణే అని తనిన్నాళ్ళూ నచ్చ చెప్పుకోవడం తనని తాను మోసం చేసుకోవడమే కదూ. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అది ప్రేమని. ఒక మాటా మంతీ లేకుండా కలిగినది ఆకర్షణే అయితే , అది ఇన్నాళ్ళు , ఇన్నేళ్ళు ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్న తరువాత కూడా సజీవంగా ఎలా ఉంటుంది?

ఇంత సేపు తల్చుకున్నవన్నీ ఎప్పటిలా మధురంగా ఉన్నాయి. ఆ పైన తల్చుకోడానికే లిఖితకు బెరుకు. ఏ అలోచనైతే తను తల్చుకోడానికి కూడా భయపడుతుందో మరి తన ప్రేమతో ముడిపడున్న ఆ అంశమే తన జీవితాన్ని ఇప్పుడు శాసిస్తోంది.

ఉన్నట్టుండి కిటికీలోంచి విసురుగా నీళ్ళుపడ్డాయి మొహం మీద. వర్షానికి అందరూ అప్పటికే కిటికీలు దించేస్తున్నారు. లిఖిత లేచి తనూ కిటికీ మూసింది.

“ఇప్పుడే చెబుదామనుకుంటున్నానమ్మా. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావ్. వర్షాన్ని గమనించలేదా?” తనకెదురు బెర్త్ లో కూచున్న ఒక పెద్దావిడ నవ్వుతూ అడిగింది లిఖితని.

లిఖిత చిన్నగా నవ్వి ఏదో చెప్పేలోపే ఆమె సెల్ మోగింది.

లిఖిత తల్లి జయంతి.

“లిఖితా. క్రిందటి నెలలో నీ గురించి అడిగి జతకం తీసుకున్నారని చెప్పాను కదా. వాళ్ళిప్పుడే ఫోన్ చేసారమ్మా. ఆ అబ్బాయి వారాంతమని ఇంటికొస్తున్నాడుట. వాళ్ళందరూ ఆదివారం నిన్ను చూడటానికి మనింటికొస్తున్నారు. ” విషయం చెప్పి ఇంకా ఏవేవో మాట్లాడి ఫోను పెట్టేసింది జయంతి.

లిఖిత అభావంగా నల్లటి ఆకాశాన్ని చూస్తూ కూచుంది. తనకు అతనే తోడుగా కావాలని ఉంది. అతని సమక్షంలో కలిగే ఆ మధురానుభూతులతో మనసు క్షణ క్షణం కొత్తగా వికసిస్తూనే ఉండాలనుంది. అతనికీ తనంటే ఇష్టముందో లేదో తెలుసుకోవాలని ఏ మూలో గట్టిగా ఆశ పడుతోంది. కానీ ఏలా తెలుసుకుంటుంది?

“అంత ఇష్టం నిజంగా ఉంటే ఇన్నాళ్ళూ మళ్ళా తనను కదిలించకుండా ఉంటాడా? ఆ అధ్యాయం ఎప్పుడో ముగిసిపోయింది. ఏదో అతనూ ఆ వయసులో ఉండే ఆకర్షణ వల్ల తననే చూడటం స్నేహితులతో చెప్పుకోవడం చేసుంటాడు. ఏ ఆధారాలతో ఇంత దూరం అలోచిస్తున్నావు? ” వివేకం వేసిన మొట్టికాయ.

ఎందుకో లిఖితకు ఈ విషయం లో వివేకం పనికిరాదనిపిస్తుంది. అతనూ తనని ప్రేమిస్తున్నాడనుకుంటేనే బావుంది.

“ఒకవేళ అతను ప్రేమించినా. ఉమ్మడి కుటుంబం. ఇంతమంది బాబాయిలనీ, తతయ్యనీ కులాంతర వివాహానికి ఒప్పించగలవా? వాళ్ళని బాధపెట్టేంత కఠినమైన మనసు నీకుందా? వేరే కులానికి చెందిన వాడిని ఇంతగా నువ్వు ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పే ధైర్యమైనా నీకుందా? ” మరో మొట్టికాయ.

నీరుకారిపోయినట్టు కిటికీకి తలానించి శూన్యం లోకి చూసింది. “లేదు. తనకు అంత ధైర్యం లేదు. ఉద్యోగం వచ్చి ఆరు నెలలయినా కాకుండానే తన భద్రత గురించి భయపడుతూ పెళ్ళి చేసెయ్యాలని చూస్తున్న తనవాళ్ళని ఎదిరించే ఊహ కూడా తనకు రాదు. ”

రైలు ఏదో స్టేషన్ లో ఆగింది. చాలా మంది ఎక్కారు. లిఖిత కిటికీ దగ్గరగా జరిగింది. కిటికీ అద్దంలో తన ప్రతిబింబం చూసి “నాతో నేను ప్రయాణించక తప్పదని ఇన్నాళ్ళకి తెలుసుకోగలిగాను” అన్న ఇస్మాయిల్ కవితలోని వాక్యాలు గుర్తొచ్చి నవ్వుకుంది.

అంతవరకు కాస్త నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు అందరూ మాట్లాడుకోవడంతో గోల గోల గా మారింది. లిఖిత మనసు పొరలు ఒక్కొక్కటే మూసుకుంటూ వాస్తవంలోకొచ్చింది.

“ఏ అదృష్టమో కలిసొచ్చేసి, అందరూ సానుకూలంగా స్పందించి తను ఇష్టపడిన వాడితోనే పెళ్ళి జరిగినా, ఆ తరువాత సంగతి? పధ్ధతులన్నీ వేరుగా ఉండే ఇంట్లో తను సర్దుకుపోగలదా? చుట్టాలందరూ తనని మెల్ల మెల్లగా పట్టించుకోవడం మానేస్తే బాబాయిలనీ, పిన్నిల్నీ, ఇంత మంది కసిన్స్ నీ కలవకుండా మిగతా జీవితమంతా గడిపేసేంత అలోచన కూడా తను చెయ్యగలదా? చిన్నప్పటినుంచీ ఎంత అనుబంధం తన వాళ్ళందరితో! వాళ్ళకీ తనంటే ఎంత ప్రేమాభిమానాలు? ఈ విషయం తెలిస్తే , ఒక్కసారిగా అందరూ తనతో మాట్లాడటం మానేస్తారు. తను తట్టుకోగలదా? ఈ ఆకర్షణంతా తనకు రాసిపెట్టి ఉన్నవాడు కలవగానే మాయమైపోతుందిలే”

నిస్సహాయత లోంచి పుట్టిన ఓదార్పేమో…

కంటికి కనపడని మనసంటే అందరికీ లోకువే. ఎవరి మనసు వాళ్ళకే ఇంత లోకువ కాబట్టే, లోకంలో ఎవరు ఎవరినైనా తేలిగ్గా బాధించగలుగుతున్నారు. మనసుకి విలువివ్వడం తప్పనిసరని ప్రతి మనిషీ తెలుసుకుంటే, లోకం ఇంకా అందంగా ఉండేదేమో…

**********

pic2

మనోజ్ తో అన్నీ కలిసాయి. సాంప్రదాయ పధ్ధతులు, జాతకాలు, ఈడూ, జోడూ, సంపాదన. మనసుతో శృతీ, గుండెతో లయా తప్ప.

ఎవరితోనూ సంబంధం లేని కాలం శరవేగంగా ప్రవహిస్తూనే ఉంది.

ఏ రోజు కా రోజు దాదాపు ఒకేలా దినచర్య రాజీలతో సాగిపోతూనే ఉంది.

పరుగున వచ్చి రైలు ఎక్కింది లిఖిత. మనోజ్ బేగ్ అందించి జాగ్రత్త చెప్పి రైలు స్టేషన్ వదలగానే ఇంటికి బయలుదేరాడు.

లిఖిత తన బెర్త్ కి వచ్చి సీటుకానుకుని కళ్ళు మూసుకుంది. రైలు అందుకోలేననే భయంతో వేగంగా పరుగెట్టుకుంటూ వచ్చిన అలసట చల్లటి గాలికి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తోంది.

పుట్టింటికి వెళ్ళి దాదాపు ఏడెనిమిది నెలలయింది. అమ్మా, నాన్నలతో, పిన్నీ, బబాయిలతో ఫోనులు కూడా బాధ్యతల నడుమ చాలా తగ్గిపోయాయి. ఇన్నాళ్ళకి సెలవులు కలిసొస్తే వెళ్ళడానికి కూడా ఎన్నో వాదోపవాదనలు. కోప తాపాలు. పుట్టింటికి వెళ్ళాలనీ, రెండు మూడు రోజులైనా తనవాళ్ళందరితో గడపాలనుకునే తన ఆశని అర్థం చేసుకునే మనిషే అక్కడ లేడు.

ఎదురుగానూ , పక్క బెర్త్ లోనూ ఇంకా ఎవరూ వచ్చినట్టు లేదు.

ఒంటరి తనం…

“సర్. అర్.ఎ.సి వచ్చింది. ఏదైనా బెర్త్ ఖాళీ ఉంటే కొంచం చూడండి ప్లీజ్ ” రైలు శబ్దాన్ని చీల్చుకుంటూ ‘అతని ‘ గొంతు. ఉలిక్కిపడింది లిఖిత. గుండె వేగం పెరిగింది. ముఖం ఎరుపెక్కింది. ఎప్పుడో మర్చిపోయిన మధుర స్పందన మళ్ళీ పలకరించింది. వెయ్యి తుమ్మెదల ఘీంకారం రైలు శబ్దాన్ని మించి హృదయ వీణ పాటకి పోటిగా వినిపిస్తోంది.

టి.సి తన ఎదురుగా ఉన్న బెర్త్ ఖాళీగా ఉందని అతనికే ఎలాట్ చేసాడు.

సంతోషంగా తన ఎయిర్ బేగ్ భుజాన వేసుకుని బెర్త్ లో కూలబడిన అతను ఎదురుగా లిఖితని చూసి రెండు నిముషాలు సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాడు.

“లిఖితా. నువ్వా. ఎన్నాళ్ళయింది చూసి. బావున్నావా? జాబ్ చేస్తున్నావని విన్నాను. పెళ్ళయిందిట కదా. ”

అతను ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. స్పృహలో లేనట్టుగా తను సమాధానాలు చెబుతున్నట్టనిపించింది లిఖితకి. అంతటి ఉద్వేగంలోనూ అతని మొహం లో దేని కోసమో వెతుకుతోంది తను. అయిదు నిముషాలకే దశాబ్దపు సంశయానికి సమాధానం దొరికిందామెకి. లేచి బాత్ రూం వైపు వెళ్ళింది.

అచ్చం అప్పటి లాగే , కాళ్ళింకా వణుకుతున్నాయి. ఇప్పుడు తనకతను పూర్తిగా పరాయివాడైపోయినా.

“సార్. మోకాళ్ళు నొప్పులు నాకు. అరవై ఏళ్ళ వాణ్ణి. నాకు అప్పర్ బెర్త్ అలాట్ అయింది చూడండి. ఇక్కడెవరూ మార్చుకోవట్లేదు. కొంచం చూడండి సార్. ” ఎవరో పెద్దాయన టి.సీ ని బ్రతిమాలుతున్నాడు.

మరో ఆలోచన లేకుండా లిఖిత ఆ పెద్దాయన దగ్గరకెళ్ళింది. “అంకుల్ . నాది ఆ పక్కన లోయర్ బెర్త్. నాది తీసుకోండి. నేను మీ అప్పర్ బెర్త్ తీసుకుంటాను. ”

కృతఙ్ఞతగా లిఖితవైపు చూశాడాయన.

లిఖిత వెంటనే తన బేగ్ తీసుకుని ఆ పెద్దాయన బెర్త్ కి మారిపోయింది.

ఎప్పటిలాగే ఏ స్పందనా లేకుండా, మాటలు కూడా ఇష్టంలేనట్టు వెళిపోతున్న లిఖిత వైపు నిరాశగా చూశాడతను.

“కొన్ని మథుర స్పందనలు ఙ్ఞాపకాలుగా మిగిలిపోతేనే కలకాలం పదిలంగా ఉంటాయనుకోవడం తప్ప ఇంకేం చెయ్యగలనురా . ” ఎవరితోనో ఫోన్లో అతను చెబుతున్న మాటలు అతను కూచున్న బెర్త్ కి వెనుకవైపున ఉన్న అప్పర్ బెర్త్ ఎక్కుతుండగా లిఖితకి స్పష్టంగా వినపడ్డాయ్.

“ఎంత పాత పరిచయమైనా, ఒక వ్యక్తిని తల్చుకున్నప్పుడల్లా మనసు జోరు వానై కురవగలగడం ఒక వరం. జీవితంలో ఎప్పుడు గ్రీష్మ ఛాయలు కనపడినా , ఇప్పుడు నేను నాలోపలొక వర్షాన్ని తేలిగ్గా ఆహ్వానించగలను. ..” అతనింకా చెప్తూనే ఉన్నాడు.

గుండె దడ కాస్త కాస్తగా తగ్గుతోంది లిఖితకి.

ఎవరి భావోద్వేగాలకూ విలువివ్వని రైలు తన తీరులో తాను పెద్దగా శబ్దం చేసుకుంటూ దూసుకుపోతోంది.

-ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

జాగీరు

Kadha-Saranga-2-300x268

ఇంజనీరింగ్‌లో చేరిన ఆదిత్య మొదటిరోజు కాలేజ్‌కెళ్లి ఇంటికొచ్చిండు.

ఆదిత్య కంటే అతని తండ్రి నారాయణరెడ్డికే ఆనందం ఎక్కువుంది. మంచికాలేజీలో సీటు దొరుకడమే అందుకుకారణం. నారాయణరెడ్డి కొడుకును చూసి మురిసిపోతున్నడు.

‘‘ఏం సార్‌ ఎలా ఉంది కాలేజ్‌?’’అని ప్రేమతోనే అడిగిండు కొడుకును.
‘‘కాలేజ్‌ మస్తున్నది డ్యాడీ . కానీ….’’అని ఆగిపోయిండు.

ఆ మాటకు నారాయణరెడ్డికి ఒకింత షాక్‌ అయింది. ‘‘ఏమైందిరా చెప్పు…, ర్యాగింగ్‌ ప్రాబ్లెమ్‌గిట్ల ఉన్నదా??’’ అని అడిగిండు.
‘‘అదికాదు డ్యాడీ…నా సెల్‌ బాగా ఓల్డ్‌ అయ్యింది. మార్కెట్‌ల చాలా మాడల్స్‌ వచ్చినై. పైగా మా కాలేజ్‌ల ఎవ్వల చేతిలో చూసిన థర్టీథౌజండ్‌ ఎబో మాడల్సే ఉన్నయి…’’అంటూ ఒకింత నారాజైతూనే చెప్పిండు.

ఆ మాటకు నారాయణరెడ్డి ఇగ వీని ఖర్చులమోత మొదటిరోజే మొదలైంది అనుకున్నడు.
‘‘సరెతియ్‌ కొందాం ఓ వారం రోజులు ఆగరాదు’’ అన్నడు
ఇంకేముంది ఆదిత్యముఖంలో ఆనందం వెల్లివిరిసింది.

దేనికీ ఒప్పుకోని తండ్రీ ఇట్లా తన కోరికను మన్నించినందుకు ఆదిత్య ఫుల్‌ హ్యాప్పీగ ఉన్నడు…కొత్తమురిపం కదా నారాయణరెడ్డి కూడా  బైక్‌, సెల్లు, కంప్యూటర్‌లే కాదు పాకెట్‌ మనీకి కూడా కాదనకుండా ఇస్తున్నడు.

వారమైంది. కొత్తఫోన్‌ ఆదిత్య పాకెట్లోకి వచ్చింది. వారం రోజుల్లోనే కొత్తకాలేజీలో ఆదిత్యకు తన క్లాస్‌మెట్స్‌లో వినయ్‌తో పరిచయం కాస్త పెరిగింది. మిగితా వాళ్లకంటే ఇద్దరి మధ్య స్నేహకుసుమాలు విరబూశాయి. ఆదిత్యకంటే వినయ్‌కి టెక్నాలజీతో పరిచయమెక్కువ. ఇంజనీరింగ్‌లో చేరడం కంటే ముందునుండే పుస్తకాల ఖర్చుల కోసం హార్డ్‌వేర్‌ నేర్చుకున్నడు. దాంతో ఎలాంటి కంప్యూటర్‌ రిపేర్‌లైనా, సెల్‌ఫోన్‌ అప్లికేషన్స్‌ అయినా క్షణాల మీద చేస్తడు వినయ్‌.
దాంతో కొత్తఫోన్‌ కొన్న ఆదిత్యకు కూడా అప్లికేషన్స్‌ డౌన్‌లోడ్‌లు, అప్‌డేట్‌లు అన్నీ నేర్పించాడు.

అట్లా వినయ్‌ ఆదిత్యవాళ్లింటికి తరుచూ వచ్చిపోతుండటంతో వినయ్‌కి ఆదిత్య వాళ్ల ఫ్యామిలీతో మరింత పరిచయాలు పెరిగిపోయాయి. మాడ్రన్‌ టెక్నాలజీతో వినయ్‌ ఆటాడుకునే తీరు నచ్చి, నారాయణరెడ్డి చాలాసార్లు సర్‌ప్రైజ్‌ అయ్యేటోడు. ఈ జనరేషన్‌కు అసలైన హీరో  వినయే అనిపించేది. తనకొడుకు కూడా అలా ఉంటే బాగుండనుకున్నడు.
అట్లా ఆదిత్యకు వినయ్‌ అన్ని విషయాల్లో మాంచి సపోర్ట్‌ అయ్యిండు.

ఇక ఆదిత్యకు తెల్లారిలేస్తే చాలు, సెల్‌ఫోనే ప్రపంచమైంది. 3జీ ఇంటర్నెట్‌, డౌన్‌లోడిరగ్స్‌, మూవీస్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లే ఆదిత్య ప్రపంచంగా మారినయి.
సబ్జక్ట్‌ కు సంబంధించిన ప్రాక్టికల్స్‌ కోసం పాత కంప్యూటర్‌ అటుకెక్కించి, కొత్త దానికి ఆర్డర్‌ చేసిండు ఆదిత్య. కొత్త కంప్యూటర్‌ కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు కూడా వినయే నీళ్లు తాగినంత ఈజీగా ఇన్‌స్టాల్‌ చేశాడు.

ఇక నారాయణ రెడ్డికి తన కొడుకు బిజీ చూస్తే ముచ్చటేస్తున్నది. ఏ అమెరికాలోనో సెటిల్‌ అయ్యే లక్షణాలన్ని ఇట్లనే ఉంటయని, కొడుకు బదులు తను ఫారిన్‌ కలలు కనడం మొదలుపెట్టిండు…

 ***

‘‘ఏం రెడ్డిసాబ్‌… నీ కొడుక్కు జబర్దస్త్‌ కాలేజీల ఇంజనీరింగ్‌ సీటు దొరికిందట కదా మరి పార్టీలేదా…?!’’ అని తను పనిచేసే బ్యాంకులో కొలిగ్స్‌ నారాయణరెడ్డిని రోజూ అడుగుతున్నరు.

దాంతో నారాయణరెడ్డి ముసిముసిగా నవ్వుకుంటూ దిల్‌ఖుష్‌ అయితున్నడు. కానీ, తనకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే రాజేశంతో తాగుడంటేనే ఇష్టం.
రాజేశ్వర్రావు తనకు గత పదిపదిహేను ఏళ్ల నుండి ‘గ్లాస్‌మేట్‌’!
ఇద్దరు ఉండేది ఒక్క ఏరియల్నే. జాబ్‌ చేసిది కూడా 60కిలోమీటర్ల దూరమే అయినా, ఇద్దరు కలిసే వెళ్తరు. కలిసే వస్తరు.
అట్లా ఇద్దరి మాటలల్ల ఎన్ని ఫుల్‌బాటిల్లు ఒడిసినయో లెక్కేలేదు. అందుకే ఈ ఆనందాన్ని కూడా తనతోనే షేర్‌ చేసుకోవాలనుకున్నడు.
అట్లా ఓసాయంకాలం కనకదుర్గ బార్‌లో రెండు రౌండ్లయిన తర్వాత రాజేశ్వర్రావు నోరిప్పిండు.
‘‘మీ బ్యాంకోల్లందరు దొంగలు…’’మొఖం మీదే అనేసిండు రాజేశం.
ఆ మాటకు నారాయణరెడ్డికి దావత్‌ ఇస్తున్న ఆనందం ఆవిరైంది.
అప్పటిదాక ఉన్న మూడ్‌ మొత్తం మారింది.

నారాయణరెడ్డికి కోపం కట్టలు తెగింది. కానీ, రాజేశ్వర్రావుతో ఉన్న సాన్నిహిత్యం, దోస్తానా ఇప్పటిది కాదు. ఇట్లా తిట్టుకునుడు ఇద్దరికీ అలవాటే!
కౌంటర్‌ ఇయ్యకుంటే మనసొప్పదు. వెంటనే నోరిప్పిండు నారాయణరెడ్డి.

‘‘అబ్బో మీ రెవెన్యూ డిపార్ట్‌మెంటోల్లు సొక్కంపూసలా…?? మొత్తం భూములన్నీ గుత్తజేసి అమ్ముకుంటున్నది మీరు కాదా,మా బ్యాంకోల్లన్నా లెక్కలు చూపియ్యాలె, మీదేమున్నది. బారా కూనీ మాఫ్‌ అన్నట్టేనాయె మీ తంతంగమంత! ఎవలకు తెలువది’’అని గట్టిగనే అన్నడు.
పెగ్గు మీద పెగ్గు పోస్తున్న కొద్ది ఇద్దరి మధ్యల మాటలయుద్ధం మరింత పదునెక్కుతున్నది.

ఇద్దరూ ఇట్లా గీసులాడుకుంటూ సర్కారు కొలువులు చేయబట్టి దగ్గరదగ్గర ఇరవయేండ్లయితంది. రాజేశం నారాయణరెడ్డికంటే ఐదారేండ్లు పెద్దోడు. అందుకే ఎన్ని మాటలన్నా తెల్లారిందంటే అన్నీ మరిచి కాకతీయప్యాసింజర్‌ల కలిసిపోయేటోల్లు.
నారాయణరెడ్డి మాటలకు రాజేశం మరింత రెచ్చిపోయిండు. తన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ తెలివి చూపించాలనుకున్నడు. తన ఆఫీసులో భూమి లేకుండా పట్టాకాగితాలు పుట్టిచ్చె తనకు ఇదేం పెద్ద లెక్కకాదనుకున్నడు.
‘‘మీ దొంగలెక్కల గురించి నాకు చెప్తానావా? లెక్కలదేమున్నది గాయిదు లెక్కలు! పైసలు పారేస్తే బచ్చెడు కాయితాలస్తయి. ఇగ మీ లెక్కల దోఖా అంతా యింతనా…’’ అని గాలిదీసినట్టే అన్నడు రాజేశం.

‘‘ఇగో రాజన్న, మర్యాదగ చెప్తున్నా నువ్‌ నా డిపార్ట్‌మెంట్‌ను అను, నన్ను అంటే మాత్రం మర్యాద దక్కది’’ జెర కోపంగనే చెప్పిండు నారాయణ రెడ్డి.
రాజేశం మాత్రం నారాయణరెడ్డి మాటలను, వార్నింగ్‌లను లెక్కే చేస్తలేడు.
గ్లాసుల పోసిన మందు ఒక్కటే ట్రిప్పుల కతం చేసి గుడాలు నోట్లేసుకొని, కాళ్లు ఊపుకుంటూ నములుకుంట నారాయణ రెడ్డిని మరింత ఇరుకుల పెట్టిండు.
‘‘ఇగో నారాయణరెడ్డి మీ రెడ్లంత ఇంతే, బడబడ మాట్లాడి అవుతలోల్లను బెదరగొడదామనుకుంటరు గానీ, రుజువులున్నయా, సాచ్చాలున్నయా అని అడుగుడు మాత్రం తెల్వది’’ రాజేషం సింపుల్‌గనే అనేసిండు.
కులం జోలి తియ్యంగనె నారాయణరెడ్డికి కోపం బుస్సున పొంగుకొచ్చింది. ఇగ ఊకునేదే లేదన్నట్టు లేసిండు.
‘‘మీ వెలుమోల్లకుండే ఎత్తులు జిత్తులు మాకేడ ఉంటయే, ఏదున్న మొఖం మీద అంటం. మా రెడ్డోల్లను ఎందుకంటవుగని, నీదగ్గర బ్యాంకులు దొంగలనెటందుకు రుజువులు ఏమున్నయో తీసుకరారాదు, నేను కూడా రెవెన్యూ డిపార్ట్‌మెంటోల్లు ఈ దేశాన్ని ఎట్లా ముంచుతున్నరో ఆధారాలతో ప్రూవ్‌ చేస్త!’’ అనుకొచ్చిండు.
వీళ్ల లల్లి మెల్లమెల్లగ ముదురుతున్నది. బార్‌ల కూసున్నోళ్లకు ఇంక జెరసేపాగితే, ఏదో పెద్దయుద్ధమే జరుగటట్టున్నదని అర్థమైనట్టున్నది. అయినా తాగుడు ముచ్చట, ఎవల బాటిల్ల మీద వాళ్ల సోయి ఉన్నది తప్ప, ఎవడెక్కడ పోతే మాకెందుకన్నట్టు తాగుడు మీద పడ్డరు.
చివరకి వెలమ, రెడ్ల కొట్లాటగా మారింది.
వీళ్ల మధ్యల మూడో మనిషి లేడు. లేకుంటే చిలికి చిలికి గాలివాన ఎటు దారితీసేదో!
ఈ సారి రాజేశం సుడిగాలిలా లేసిండు.

‘‘నా దగ్గర ఆధారాలున్నయి. లేకుంట ఎట్ల మాట్లాడుతగని, నిన్ననే మా ఆఫీసుకు ఓ ముసల్ది పట్టా కాగితం పనిమీదొచ్చింది. పట్టాకాగితానికి పదివేలు కావాలంటే మాట మీద మాట మాట్లాడుకుంట మీ బ్యాంకుల డిపాజిట్‌ చేసిన పైసలు ఆగం చేసిన్రని నెత్తినోరు మొత్తుకున్నది. నాకు ఎంటనే నువ్‌ గుర్తొచ్చినవ్‌. ఎప్పుడు చూసినా మా రెవెన్యూ డిపార్ట్‌మెంటోల్లను గురించి చెడమడ తిడ్తవ్‌ కదా, ఇప్పుడు చెప్పు ఆ ముసల్దాని పైసలు ఎవలు ఆగం చేసిన్రో’’రాజేశం ఇక నారాయణ రెడ్డి ఆటకట్టినంటే అన్నంత ధీమగ సవాల్‌ ఇసిరిండు.

నారాయణరెడ్డికి ఏం చెప్పాల్నో సమజ్‌గాలె. ‘‘ఇగో రాజన్న నీ మీదున్న రెస్పెక్ట్‌ పోగొట్టుకోకు. ఏదో ఒక్క ముసల్దానికి అట్లా జరిగిందని, మొత్తం డిపార్ట్‌మెంట్‌ను అంటే మంచిది కాదు, అయినా బ్యాంకుల అట్లెందుకైతున్నదో నీకు తెల్సా…??’’ ఇజ్జత్‌ పోవద్దని కవర్‌చేసిండు నారాయణరెడ్డి.
‘‘ఏ నువ్‌ ఎన్నైన చెప్పు బ్యాంకోల్లందరు బట్టేబాజ్‌లు’’ రాజేశం ఫైనల్‌ స్టేట్‌మెంట్‌లాగ చెప్పేసిండు.
ఇగ తప్పదన్నట్టు నారాయణ రెడ్డి ఆ మాటకు గట్టి సమాధానం చెప్పాలనుకున్నడు.
‘‘ఇగో రాజేషన్నా ఇయ్యాల బిల్లు కట్టేది నేను, నా దావత్‌కొచ్చి నన్నే మాటలనుడు నీకు భావ్యం కాదు. మూడంత ఖరాబ్‌ చేసినవ్‌…’’అన్నడు.
రాజేశం నేనేమన్న తక్కువ తిన్ననా…‘‘నీ పైసలు ఎవనికి కావాలె? నా దగ్గరకూడా మస్తు పైసలున్నయి. అని ప్యాంటు జేబులకెల్లి ఐదువందల నోట్లకట్ట తీసిండు. మీ రెడ్డోల్లు మా వెలుమల కిందనే ఉండాలె’’ అన్నడు రాజేశం.
నారాయణరెడ్డికి తలకాయ తీసేసినట్టైంది.
‘‘అరే నువ్‌ కులం జోలెందుకు తీస్తవ్‌ రాజన్న, నీకు తెల్వది మా బ్యాంకుల ఎందుకట్ల అవకతవకలు జరుగుతున్నయో నీకెరికేనా…??’’అన్నడు నారాయణరెడ్డి.
ఇగ రాజేశంకు మస్తు దిల్‌ఖుష్‌ అయింది.
‘‘అది గట్ల తొవ్వకు రా, నేను చెప్పిన కదా మీ బ్యాంకోల్లు ఎట్లా బతుకనేర్చిన్రో..’’అని మళ్లక్కసారి అన్నడు. నారాయణరెడ్డికి బీపీ పెరిగిపోయింది.
ఎంతతాగినా రాజేశం మాటలకు కిక్కు దొరుకుత లేదు.
ఇగ లాభం లేదనుకున్నడు. అసలు ముచ్చట బయటపెట్టాలనుకున్నడు.
‘‘అసలు మా బ్యాంకుల అట్ల అకౌంట్లల్ల మనీ ఎందుకు గల్లంతైతున్నదో నీకు తెల్వదు. నువ్‌ చెప్తాంటే ఇంటలేవ్‌. మా బ్రాంచి ఈ మధ్యనే కంప్యూటరైజ్డ్‌ అయ్యింది. మా స్టాఫ్‌లనేమో రిజర్వేషన్లతోటి జాబ్‌లు కొట్టిన ఎస్సీఎస్టీ కొడుకులే ఎక్కువుండే. వాళ్లకేమో సదువు రాదాయే, ఇగ కంప్యూటర్‌ ఏడికెళ్లివస్తదే. అందుకే మా బ్యాంకుకు చెడ్డపేరొస్తున్నదే. మనలాగ అక్కడ తెలివున్న అప్పర్‌ కాస్టోల్లు, ఓపెన్‌ల జాబులు కొట్టినోళ్లు ఉంటే ఇట్లా మచ్చలచ్చేదే కాదే’’అన్నడు నారాయణరెడ్డి.
‘‘అదేంది కులం జోలి వద్దన్నవ్‌ మల్లనువ్‌ గా ముచ్చటెట్ల తీస్తున్నవ్‌ నారాయణరెడ్డి…??’’ అన్నడు రాజేశం.
‘‘అరే నువ్‌ మల్ల వఖీలు ప్రశ్నలేస్తవేందే రాజన్న, మన మధ్యల కులమొద్దే! నువ్వా వెలుమ పుటుక పుట్టినవ్‌, నేను రెడ్డి పుటుక పుట్టిన. మనం దొరలం. పటేండ్లం. ఇగ కులం జోలి మన మధ్యలెందుకే. ఇంకో విషయం కూడా ఇను, మా ఆఫీసుల ఎవ్వడెవ్వడో నన్ను పార్టీ అడిగినా నేను నీతోనే ఎందుకు కూసున్న చెప్పే, కులం లేని కొడుకులు మనతో కూసోని తాగుడేందనే కదా…’’అని శాంతింప చెయ్యాలనుకున్నడు.
రాజేశంకు నారాయణరెడ్డి దిల్‌దార్‌తనం నచ్చి మల్లో కోటరుకు ఆర్డరిచ్చిండు.
రెండు గ్లాసులల్ల పోసిండు.
అయితే ‘‘మాలమాదిగ కొడుకులే అవినీతికి కారణమంటవ్‌’’ అన్నడు రాజేశం.
హమ్మయ్య రాజేశం జర దారికొచ్చిండనుకొని నారాయణరెడ్డి లోలోపల్నే సంతోషిండు. ‘‘ఔ రాజన్న నువ్వే చెప్పరాదే, అటెండర్లుగా ఉండాల్సిన కొడుకులు ఆఫీసర్లయి మన మీద పెత్తనం చేసుడేందే’’ అని టాపిక్‌ మొత్తం కులం మీదికి డైవర్ట్‌చేసిండు. రాజేశం కూడా ఒకింత వాస్తవమే అనుకున్నడు.
అసలే రాజేశ్వర్రావు తండ్రి ఎనుకట ఊళ్లె దొరగ ఉండే. కిందికులాలోల్లకు తెలివొచ్చి తిరుగబడ్డంక ఆయన హవా మొత్తం పోయింది. ఇగ రాజేశం ఈ సంగతి తెలుసుకొని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో కొలువుకు ఆ రోజుల్లోనే లంచాలు పోసి దక్కించుకున్నడు.
నారాయణరెడ్డికి, రాజేశానికి పొంతన కుదిరే పాయింట్‌ ఏదన్నా ఉందంటే అది కిందికులాల మీద దుమ్మెత్తిపోసే ముచ్చట మాత్రమే! అందుకే, ఇక చాలాసేపు తమ అనుభవాలను ఒక్కోటి తవ్వుకొని కుప్పపోసి, ఎస్సీఎస్టీబీసీలందరూ చవటదద్దమ్మలని, పొట్టచీల్చితే అక్షరం ముక్కరాని గాయిదకొడుకులని కసిదీరా తిట్టుకొని…చివరికి అగ్రవర్ణాలు జిందాబాద్‌ అనుకొని, బిల్లుకట్టేసి తూగుతూ…తూలుతూ ఇంటిదారి పట్టారు.

***

నారాయణరెడ్డి ఇంట్ల బోర్‌ మోటరు ఖరాబ్‌ అయ్యింది. తన ఇంటికి ఎలక్ట్రిషియన్‌ పనులన్ని చూసిన నరేందర్‌కు ఫోన్‌ చేస్తే ‘‘ కొత్త అపార్ట్‌మెంట్‌ ల ఎలక్ట్రిషియన్‌ వర్క్‌ మొత్తం కాంట్రాక్ట్‌ పట్టిన. ఓ రెండురోజులాగి వస్త రెడ్డి సాబ్‌, జెర ఏమనుకోకు వశపడని పని ఉన్నదిక్కడ, ఓపెనింగ్‌ డేట్‌ దగ్గరికొచ్చింది’’ అన్నడు.

రెండు రోజులైనా నరేందర్‌ రాలే, నారాయణరెడ్డి ఇంట్ల నీటికి కరువొచ్చి ఇల్లంతా కరువుదేశం లెక్క తయారైంది. శనివారం అయ్యేసరికి మధ్యాహ్నమే బ్యాంకు క్లోజయ్యింది. సాయంత్రమే ఆఫీసు నుండి ఇంటికి చేరిండు నారాయణరెడ్డి. పైగా ఇవాళ కలిసి తాగడానికి రాజేశం కూడా కనిపించలేదు. తెల్లారితే ఆదివారం కదా, రేపు ఫోన్‌చేసి కలిసి తాగొచ్చనుకొని ‘డ్రిరక్‌ హాలిడే’ ప్రకటించుకున్నడు.

ఆఫీసు నుండి నారాయణరెడ్డి ఇంటికి చేరుకునేసరికి, ఆనంద్‌, వినయ్‌లు హాల్‌లో కూర్చొని క్రికెట్‌ చూస్తున్నరు.
వినయ్‌…నారాయణ్‌రెడ్డిని చూసి, సోఫాలో నుండి లేచి…‘‘నమస్తే అంకుల్‌’’ అంటూ విష్‌ చేశాడు. నారాయణరెడ్డికి వినయ్‌ వినయం చూస్తే లోలోపలే సంతోషమేసింది. టెక్నాలజీ పరంగా ఎంత నాలెడ్జ్‌ ఉన్నా ఒదిగిఉండే వినయ్‌ తీరు చూస్తే నారాయణరెడ్డికి ఏదో సంతృప్తి.
నారాయణరెడ్డి భుజానికున్న బ్యాగు టేబుల్‌ మీద పెట్టి లోపలిగదిలోకి పోయిండు.
‘‘మోటరు బాగుచెయ్యడానికి ఆ ఎలక్ట్రిషియన్‌ నరేందర్‌గాన్ని రమ్మన్న , ఇయ్యాల వస్త అన్నడు. వచ్చిండా… మోటరు బాగుచేసిండా…’’అని అడిగిండు.

నారాయణరెడ్డి రావడంతో తగ్గిన టీవీ వ్యాల్యూమ్‌, మోటరు బాగుకాని కోపానికి మ్యూట్‌లోకి మారింది.
ఆ కోపం వీళ్ల మీదికి ఎక్కడ మళ్లుతదోనని కామెంట్రీ పీకనొక్కి, సైలెంట్‌గా ఆదిత్య వినయ్‌లు మ్యాచ్‌ చూస్తున్నరు.
‘‘ఏడొచ్చిండు వాడు రానేలేదాయే…నీళ్లు లేక హౌజులున్న నీళ్లే ముంచుకునుడాయె’’అన్నది భార్య లలిత.
ఇగ నారాయణరెడ్డికి కోపం ముంచుకొచ్చింది.
‘‘వానియమ్మ లేకి కులంల్నా చెప్పు….మాల,మాదిగ నా కొడుకులే ఇంత! నా మాటే వానికి లెక్కయితలేదు. నడుమంత్రపు సిరికి ఆగుతండా వాడు…వాడు ఇటుదిక్కు రానియ్‌ వాని సంగతి చెప్తా’’ అని చెడామడ తిట్టుడు షురూ చేసిండు.

నారాయణరెడ్డి ఇల్లుకంటుకున్నప్పటి నుండి అన్ని ఎలక్ట్రికల్‌ పనులు చేసింది ఎలక్ట్రిషియన్‌ నరేందరే! దాంతో నరేందర్‌ కులమే కాదు, పుట్టుపూర్ణమంతా తెలుసుకున్నడు. ఇప్పుడు చిన్న పని ఉన్నదంటే రానంటాడా, వాడు అపార్ట్‌మెంట్‌ పనులు చేయించేస్థాయికి ఎట్లా ఎదుగుతడు అనే ఓర్వలేనితనం కూడా ఆ కోపంలో అంతర్లీనంగా ప్రతిధ్వనిస్తోంది. అందుకే నోటికొచ్చిన బూతులన్నీ తిట్టుకుంటూ నారాయణరెడ్డి బెడ్‌రూమ్‌లో నుండి బాత్‌రూమ్‌లోకి వెళ్లి హౌజ్‌లనీళ్లతో కాళ్లు,చేతులు మొఖం కడుక్కొని టవల్‌తోతూడ్చుకుంటూ నరేందర్‌ని ఒక్కడ్నే కాదు, రాజేశంతో తాగిన ముచ్చట్లల్ల కిందికులాల గురించి మాట్లాడుకున్నదంతా యాదికొచ్చి మరింత రెచ్చిపోయి తిట్టుకుంటూ హాల్‌లోకి వచ్చిండు.
అప్పటికే వినయ్‌ వెళ్లిపోయిండు.

టీవీ బందై ఉన్నది. ఆదిత్య డల్‌గ కూర్చున్నడు. ఏమైందన్నట్టు చూసిండు నారాయణరెడ్డి.
అట్లా కులం పేరుతో ఇష్టమొచ్చినట్టుగా తిడితే ఎట్లా, వినయ్‌ విని హర్ట్‌ అయి వెళ్లిపోయాడు తెల్సా అన్నడు.
వినయ్‌ ఎందుకు వెళ్లిపోయిండు? వినయ్‌దేకులం?? అడిగిండు.
కానీ, ఆదిత్య కొంతసేపటి వరకు నోరుమెదుపలేదు.
అసలు తప్పంతా తనదే అనుకున్నాడు. ఆదిత్యతో వినయ్‌ ఇంటికొచ్చిన కొత్తలోనే వినయ్‌దే కులం అని తెలుసుకోవాలనుకున్నాడు. కానీ, వినయ్‌కి ఉన్న టెక్నాలజీ నాలెడ్జ్‌ చూసి ఖచ్చితంగా తమలాగే పైకులమే అయ్యింటదని ఇన్ని రోజులు నమ్మాడు నారాయణరెడ్డి.
ఆదిత్యమాత్రం రేపటి నుండి వినయ్‌కి ఎలా మొహం చూపించాలో తెలియడం లేదు.
నారాయణరెడ్డికి మాత్రం మనసంతా ఏదోలా ఉంది.
తెలివి ఒకరి జాగీరు(సొత్తు) కాదని తెలిసిసొచ్చింది !

Pasunoori Ravinder 1-డా.పసునూరి రవీందర్‌

మంచుకొండ

MY

 

నా పేరు రాజేష్ యాళ్ళ. ఉండేది విశాఖపట్నంలో.
ఉద్యోగం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో క్యాషియర్ గా.
అప్పుడప్పుడూ కథలు రాయడం ప్రవృత్తి. తెలుగు భాషన్నా
తెలుగు సాహిత్యమన్నా ఎనలేని ఇష్టం.

— రాజేష్ యాళ్ళ

“ఎక్కు! బెంచీ ఎక్కి నిలబడు!!” చలం మేష్టారు కేక వేసేసరికి బిత్తరపోయి గబగబా బెంచీ ఎక్కేసాడు అనిల్.
“మూడో తరగతికే ఇంత కొమ్ములొస్తే ఎలారా నీకు?!” వాడేదో అన్నాడని ఇష్టమొచ్చినట్టు పక్క వాణ్ణి చితక్కొట్టెయ్యడమే?!” మళ్ళీ కోపంగా అరిచారు చలం మేష్టారు.
జవాబు ఏమీ చెప్పకుండా మౌనంగా తల దించుకున్నాడు అనిల్. క్లాసులో పక్కన కూర్చున్న గోపిగాడు తనను పదే పదే ఏడిపిస్తుంటే తట్టుకోలేక వాడి చెంప మీద గట్టిగా ఒక్క గుద్దు గుద్దేసరికి వాడు పక్కకు తిరిగడంతో వాడి కన్ను మీదకు పోయింది దెబ్బ!! క్షణాల్లో వాడి కన్ను నుదుటివరకూ పొంగుకొచ్చి భయంకరంగా వాచిపోయింది. దాని పర్యవసానమే ఇప్పటి దాకా తన వీపు వాయించి, బెంచీ ఎక్కించిన చలం మేష్టారి ఆగ్రహానికి కారణం!
హాజరు వెయ్యడం అయ్యాక పాఠం చెప్పేందుకు తెలుగు వాచకం తెరిచి అంతలోనే క్లాసు మధ్యలో నించున్న అనిల్ గాణ్ణి చూసి పుస్తకం మూసేసారాయన. “నీ వల్ల నాకు పాఠం చెప్పాలన్న ఆసక్తి కూడా పోయిందిరా!” అని కోప్పడి, “ఈ పూటకి ఎక్కాలు చదువుకోండ్రా!” అని పిల్లలకు ఆజ్ఞను జారీ చేసారు చలం మేష్టారు.
చిన్న పల్లెటూర్లోని ఆ స్కూల్లో చలం మేష్టారికి పాఠాలు బాగా చెపుతారని ఎంత మంచి పేరుందో, కోపానికి పరాకాష్టగా కూడా అంతే పేరుంది. ఒకటినుండి అయిదు తరగతులున్న ఆ పాఠశాలలో ఎంతోకాలంగా ఆయనొక్కడే మేష్టారు. వంద మందికి పైగా ఉండే అందరు పిల్లలనూ, అన్ని తరగతులనూ తానొక్కడే నల్లేరు మీద నడకలా గత పదహారేళ్ళుగా లాక్కొస్తున్నాడు.
స్కూల్ బంట్రోతు రంగయ్య లాంగ్ బెల్ కొట్టేందుకు వెళ్ళడం గమనించిన పిల్లలు గబగబా పలకా పుస్తకాలూ సర్దేసుకున్నారు. గంట మ్రోగడమే తడవుగా కేరింతలు కొడుతూ బైటకు పరుగులు తీస్తున్నారు. బెంచీ ఎక్కి శిక్ష అనుభవిస్తోన్న అనిల్గాది వైపు కక్ష సాధించిన సంతృప్తితో వెటకారంగా నవ్వుతూ చూస్తూ బైటకు వెళుతున్నాడు గోపి. ‘నీ పని బైటకొచ్చాక చెప్తానూ అన్నట్టు చూపుడు వేలు చూపుతూ అనిల్ గాడు బెదిరించడం మేష్టారి కళ్లలో పడనే పడింది.
“నువ్వు ఇంటికి వెళ్ళరా!” అని గోపి గాడిని గావు కేక పెట్టి పంపేసారు చలం మేష్టారు.
“ఎందుకురా నీకు అంత పొగరు?! వేలు పెట్టి బెదిరిస్తున్నావ్, వాణ్ణి చంపేస్తావా?” అనిల్గాడి వీపు మళ్ళీ పేలింది.

“వాదు నన్ను వెక్కిరిస్తున్నాడు సార్!” వెక్కుతూ వెక్కుతూ చెప్పాడు అనిల్ అందీ అందని తన చేతులతో వీపు వెనుక తడుముకుంటూ.
“ఇంతకూ వాడు నిన్నేమన్నాడని వాది కంట్లో పొడిచేసావ్?!”
“నేను చెత్తకుప్పలో పుట్టానట. అస్తమానూ అలా అని నన్ను ఏడిపిస్తున్నాడు.” వాడి దు:ఖం కట్టలు తెంచుకుంది.
‘ముందే ఏమైంది’ అని అడిగి ఉండాల్సింది అనుకున్నారు చలం మేష్టారు వాడి వైపు జాలిగా చూస్తూ.

Kadha-Saranga-2-300x268

***

“వదిలెయ్యండి మేష్టారూ! ఇంక కొట్టకండి… పసి పిల్లాడు కదా” చలం మేష్టారికి అడ్డం వెళ్తూ చెప్పాదు గిరి.
“అయిదో క్లాసుకొచ్చాడు, ఇంకా చిన్నపిల్లాడేంటయ్యా గిరీ! అసలు నిన్ను అనాలి. ముప్పూటలా వాదికి తిండి పెట్టి గారాబం చేస్తూ మేపుతున్నావ్!!” చలం మేష్టారి కోపం తారాస్థాయినుండి దిగడంలేదు.
బిక్కుబిక్కుమంటూ గిరి చాటునుండి చూస్తున్నాడు అనిల్ గాడు. అప్పటికే వాడి వీపు, చెంపలు బాగా వాతలు తేలిపోయి ఉన్నాయి, మేష్టారు కొట్టిన దెబ్బలకు!
“ఇంకెంత కాలం మేష్టారూ?! అయిదుగురు పిల్లలతో మొదలు పెట్టాను. వాళ్ళంతా వెళ్ళిపోయారు. వీడొక్కడె మిగిలాడు. ఇంకా పిల్లలను తెచ్చి పోషించే ఓపిక నాకూ లేదు. నాతో ఔన్నదుకైనా వీడిని సరిగ్గా చూసుకోకపోతే ఎలా చెప్పండి? ఉన్నంతలో బాగానే చదువుతాడు కదా! మనం కాకపోతే ఎవరు చూస్తాం చెప్పండి?” అనిల్ గాడిని దగ్గరకు లాక్కుంటూ చెప్పాడు గిరి.
“కానీ వీడికి అంత పొగరెందుకు చెప్పు? తోటిపిల్లలు వెక్కిరించిన మాత్రాన వాడి చేతికి పని చెప్పేసి వాళ్ల ఎముకలు విరగ్గొట్టేసి నా ఉద్యోగానికే ఎసరు పెట్టేస్తున్నాడు వీడు. ఐదో క్లాసుకొచ్చాడు… ఆ మాత్రం బుద్ధి రాకపోతే ఎలాగయ్యా? రోజుకో కేసు! వీడితో ఎలా వేగడం చెప్పు?!” కోపంగా చెప్పారు చలం మేష్టారు.
“ఇక ముందెప్పుడూ అలా చెయ్యడులెండి మేష్టారూ… ఈసారికి వదిలెయ్యండి! ఏరా అనిల్, ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తావా?!” అడిగాడు గిరి.
చెయ్యను అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు అనిల్.
“నువ్విలా ప్రతిసారీ చెప్పడం, వాడు షరా మామూలుగా చెయ్యడం కొత్తేం కాదుగా?! వాడు మారతాడని అనుకోవడం కలలో మాట! వెళ్ళండి వెళ్ళండి!” విసుగ్గా చెప్పారు చలం మేష్టారు.
బాగా చిన్నదైన ఆ ఊళ్ళో అనాథలను చేరదీసి వాళ్ళూ వీళ్ళూ ఇచ్చిన విరాళాలతో అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు గిరి. ఇప్పటివరకూ అతను చేరదీసిన పిల్లలను ఎవరో ఒకరు దత్తత తీసుకుని టవున్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇక మిగిలింది అనిల్ ఒక్కడే! ఎక్కడో దొరికాడు అని పసికందును తెచ్చి పడేసి తొమ్మిదేళ్ళ క్రితం ఎవరో తెచ్చి తన దగ్గర పడేసిన వాడిని ఓపిగ్గా పెచుతూ వచ్చాడు గిరి. పదిహేనేళ్ళ క్రితమే అతని భార్య మరణిచింది. వంట చేసేందుకు అతనికి సాయంగా ఓ నడివయసామే ఉంటుంది.
“ఏమయిందిరా? ఎందుకురా అలా మేష్టారి చేత దెబ్బలు తింటూనే ఉంటావ్?! నేను మాత్రం ఎన్నిసార్లు ఆయంకు సర్ది చెప్పగలను చెప్పు?!” సముదాయిస్తూ అడిగాడు గిరి.
“లేదు మావయ్యా! ఈ రోజు మేష్టారు స్కాలర్ షిప్ డబ్బులు వస్తాయని అప్లికేషన్ మీద నా సంతకం తీసుకున్నారు. దాన్ని పూర్తి చేస్తుంటే అందరూ మూగి….” ఏడుపుతో వాడు మాట పూర్తి చేయ్యలేకపోయాడు.
“ఏమైంది?! మూగి ఏం చేసారు?” ఏం వినాలో అని బాధపడుతూ అడిగాడు గిరి.
“ఆ అప్లికేషన్లో అమ్మ పేరు కానీ, నాన్న పేరు కానీ లేదట. అక్కడ మేష్టారు గీత గీసి వదిలేసారు. కింద మరోచోట నీ పేరు రాసారు. అది చూసి గోపి గాడు, రాంబాబు గాడు, ఇంకా ఇద్దరు ముగ్గురు నీకు అమ్మా నాన్నా లేరోచ్…. అంటూ గోల గోల చేసి నన్ను ఏదిపించారు. నాకు ఏదుపొచ్చింది మరి. క్లాసు అవ్వగానే వాళ్ళను ఒక్కొక్కణ్ణీ పట్టుకుని… బాగా…”
“అలా నీ ఇష్టం వచ్చినట్టు అందర్నీ బాదేస్తే ఎలారా? వాళ్ళు అంతా కలిసి నిన్ను తంతే ఏం చేస్తావ్?! తప్పు కదా?!”
“వాళ్ళూ నన్ను కొట్టారు మావయ్యా! ఇంకా మేష్టారు కూడా!! కానీ వాళ్ళు అలా అంటుంటే నేనెందుకు ఊరుకొవాలి చెప్పు?!” తొమ్మిదేళ్ళ అనిల్ గాడికి ఏడుపును అదుపులో ఉంచుకోవడం మరిసాధ్యడలేదు.
దగ్గరగా హత్తుకుని వాది జుత్తులో వేళ్ళుంచి దువ్వుతూ ఉండిపోయాదు గిరి, ఎలా పందించాలో తెలియని అయోమయంతో, దిగులుతో!

***

ఆ రోజు భయం భయంగానే క్లాసులోకి అడుగు పెట్టాడు అనిల్.
“ఏరా! చాలా త్వరగా వచ్చేసావ్ ఇవాళ?” చలం మేష్టారు గర్జించారు.
అప్పటికే డజను మందికి పైగా పిల్లలు మోకాళ్ళ పైన కూర్చుని చేతులు కట్టుకుని ఉన్నారు.
‘ఈరోజు నా పని ఐపోయినట్టే’ అని మనసులో అనుకుంటూ బెదురుగా చెప్పాడు అనిల్, “వస్తుంటే దారిలో చెప్పు తెగిపోయింది సార్… అది కుట్టించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ వెనక్కి వెళ్ళి గిరి మావయ్యనడిగి డబ్బులు తీసుకుని కుట్టించుకొచ్చేసరికి ఆలస్యం అయింది.”
“కుంటిసాకులు చెప్పమంటే సవాలక్ష చెప్తార్రా మీరు!” మాట పూర్తి అయ్యేలోగానే అనిల్ గాడి వీపు మీద దభీ దభీమని నాలుగు దెబ్బలు పడిపోయాయి.
“నిజమే చెప్తున్నా సార్!” గిర్రున కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా చెప్పాడు అనిల్.
మళ్ళీ గట్టిగా పేలింది అనిల్ గాది వీపు చలం మేష్టారి హుంకరింపుతో- “నోర్ముయ్! ఎదురు చెప్పావంటే వీపు చీరేస్తాను!!
***
గిర్రుమంటూ పదిహేనేళ్ళు గడిచిపోయాయి.
“సర్! వైభవ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మీటింగ్ వచ్చే నెల పదహారో తేదీ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు.” పీ ఏ ప్రదీప్ వినయంగా చెప్పాడు.
కాస్త ఆలోచించి చెప్పాడు అనిల్, “పదహారో తేదీ అని వాళ్ళే అనేస్తే ఎలా ప్రదీప్?!” వాళ్ళ ఎకౌంట్స్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కదా. రెండురోజుల్లో చెప్తామని చెప్పు.”
“ఓకే సర్!” పీ ఏ ఫోన్లో అవతలి వాళ్ళకు చెప్పడానికి బైటకు వెళ్ళాడు.
టేబుల్ మీదున్న ఫోన్ మ్రోగింది. “సర్! అహూజా గ్రూప్ ఛైర్మన్ గారు లైన్లో ఉన్నారు. మాట్లాడతారా?!” రిసెప్షనిస్ట్ అడిగింది.
“సరే, కనెక్ట్ చెయ్” చెప్పాడు అనిల్. కంపెనీ వ్యవహారాలకు సంబంధించిన కీలక విషయాలు కావడంతో పది నిమిషాల పైనే జరిగింది ఆ సంభాషణ.
ఫోన్ పెట్టేస్తుంటే, “ఎక్స్ క్యూజ్ మీ సర్…” అంటూ లోపలకి వచ్చాడు ప్రదీప్.
“ఇవ్వాళ మనం సీ షెల్స్ కంపెనీ బోర్డ్ మీటింగ్ కి వెళ్ళాలి. మధ్యాహ్నం లంచ్ అక్కడే! సాయంత్రం అయిదు గంటలకు పోర్ట్ ఇండోర్ స్తేడియంలో జరగబోయే కంపెనీ సెక్రటరీల కాంఫరెన్సును మీరు ప్రారంభించాలి. అక్కడ చీఫ్ లెక్చర్ కూడా మీదె…” ఆరోజు దినచర్యను వల్లె వేసాడు ప్రదీప్.
“చాలా టైట్ గా ఉంది ప్రదీప్ ఇవాళ షెడ్యూల్! సరే కానీ, ఏం చేస్తాం తప్పదుగా?! బయలుదేరదామా?!” టై సరిగ్గా బిగించుకుంటూ అడిగాడు అనిల్.
అలా ఉదయం ఆఫీస్ నుండి బయలుదేరింది మొదలు రాత్రి తొమ్మిది దాకా బిజీ అయిపోయాడు అనిల్. “కంపెనీ సెక్రటరీ అంటే ఇంత ఊపిరి సలపని జీవితం అని ముందే తెలిసి ఉంటే చదివే వాణ్ణి కాదయ్యా ప్రదీప్!” ఉసూరుమని కారు సీట్లో వెనక్కి చేరగిలపడుతూ చెప్పాడు అనిల్.
“అలా అనకండి సర్! దేశంలోనే మీకెంతో పేరుప్రఖ్యాతులున్నాయి. సంపాదన కూడా తక్కువేమీ కాదు. ఇంతకంటే అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి?” ప్రదీప్ మాటల్లో అసూయ కూడా తొంగి చూసింది.
“కావచ్చు కానీ నా కోసం నేనంటూ గడిపే సమయం ఉండడంలేదు ప్రదీప్!” బాధగా చెప్పాడు అనిల్.
“వస్తుందిలెండి… ముందు పెళ్ళి చేసుకోండి సర్!” అని నవ్వాడు ప్రదీప్”నాకే టైం దొరకడంలేదు… ఏదో సామెతలా నా జీవితంలోకి మరొకరా? చూద్దాంలే!” అనిల్ కూడ నవ్వాడు.
“కాంఫరెన్స్ తర్వాత డిన్నర్ చెయ్యమని చాలా అడిగారు సర్ వాళ్ళు!”
“నన్నూ అడిగారు ప్రదీప్. కానీ మధ్యాహ్నం భోజనమే బాగా ఎక్కువైంది. అందుకే పళ్ళ రసంతో సరిపెట్టేసాను. ఇంతకూ నువ్వేమైనా తిన్నావా?!”
“తిన్నాను సర్! థ్యాంక్ యూ!” చెప్పాడు ప్రదీప్.
అంతలో అనిల్ ఫోన్ మ్రోగింది.
“బాబూ, అనిల్ నువ్వెలా ఉన్నావ్?” అవతలినుండి ప్రశ్నించిందో స్త్రీ కంఠం.
ఆ గొంతులోని తేడాను వెంటనే పసికట్టాడు అనిల్. “ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావ్?!” ఆదుర్దాగా ప్రశ్నించాడు.
“నువ్వో సారి ఇక్కడకు రాగలవా అనిల్?” గద్గద స్వరంతో అర్థింపు వినపడి వెంటనే ఫోన్ పెట్టేసిన ధ్వని. మళ్ళీ చాలాసేపు ఆ ఫోన్ నంబర్ కి డయల్ చేసాడు కానీ ప్రయోజనం లేకపోయింది. అవతలి వైపు ఎవ్వరూ ఎత్తలేదు.

“ఏమయింది సర్? ఎనీ ప్రోబ్లెం?” ఆత్రుతగా ప్రశ్నించాడు ప్రదీప్.
“అదే తెలియడంలేదు. వెంటనే నేను ఊరు బయల్దేరాలి. తెల్లారేసరికల్లా చేరుకోవాలి. ప్లీజ్, నాకో సాయం చెయ్యాలి ప్రదీప్. మరో గంటలో నేను హైదరబాద్ ఫ్లైట్ అందుకోవాలి. నాకు టికెట్ ఎయిర్ పోర్ట్ కి తెచ్చి ఇవ్వగలవా?” అర్థింపుగా అడిగాడు అనిల్.
“అయ్యో అదెంత పని సర్! దార్లో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ దగ్గర నన్ను వదిలెయ్యండి. ఈలోపుగా ఇంటికి వెళ్ళి అన్నీ సర్దుకుని ఎయిర్ పోర్టుకి రండి.” వెంటనే చెప్పాడు ప్రదీప్.
దార్లో ప్రదీప్ ను వదిలిపెట్టి తను ఇంటికి చేరుకున్నాడు. గబగబా బట్టలు బ్యాగ్ లో సర్దుకుని, స్నానం చేసి ఆ వెంటనే ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. దార్లోనే హైదరబాద్ లోని తన మిత్రునికి ఫోన్ చేసి హైదరాబాద్ నుండి ఊరికి వెళ్ళేందుకు కారు ఏర్పాటు చేసుకున్నాడు.
కారు దిగి అడుగులు వేస్తున్న అనిల్ కి పరుగులాంటి నడకతో ఎదురొచ్చాడు ప్రదీప్. అనిల్ చేతికి ఓ కవర్ అందిస్తూ చెప్పాడు, “సర్, ఈ కవర్లో టికెట్ ఉంది. మరో పావుగంటలో హైదరాబాద్ ఫ్లైట్ బయల్దేరబోతోంది. మీ పేరు ఇప్పటికే చాలాసార్లు పిలిచారు. వెళ్ళండి.” తొందరపెట్టాడు ప్రదీప్.
“థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్!” అని ఎయిర్ పోర్టు లోపలికి పరుగు పెట్టాడు అనిల్.
“హ్యాపీ జర్నీ సర్!” ప్రదీప్ మాటలు వినిపించాయి వెనుకనుండి.
వెనక్కి తిరక్కుండానే చెయ్యి ఊపి లోపలికి వెళ్ళాక సరిగ్గా మరో పావుగంటకల్లా విమానంలో కూర్చున్నాడు అనిల్. ఖచ్చితంగా బయల్దేరవలసిన సమయానికే విమానం గాల్లోకి లేచింది. నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నాడు అనిల్. అతని మనసులో ఏవేవో ఆలోచనలు! విమానం ముందుకెళుతున్నా అతని మనసు మాత్రం పదిహేనేళ్ళ వెనక్కి మళ్ళింది.
***
ఆ రోజు ఎప్పుడూ లేనంత ప్రసన్నంగా ఉంది చలం మేష్టారి ముఖం. ఆయనకు ప్రమోషన్ తో పాటూఅ టవున్లోని హై స్కూల్ కి బదిలీ కావడమే అందుకు కారణం!
హడావిడిగా పరుగు పెడుతూ వచ్చిన రంగయ్య తెచ్చిన వార్త వింటూనే ఆయన ముఖంలోని ఆనందం మటుమాయమైంది. వెంటనే ఊళ్ళోకి బయలుదేరారు చలం మేష్టారు. గుమిగూడిన జనం మధ్యలోంచి ఖాళీ చేసుకుంటూ ముందుకు వంగిన ఆయనకు అక్కడ కనిపించిన దృశ్యం – విగతజీవుడై ఉన్న గిరి, ఆ పక్కనే “మావయ్యా…. మావయ్యా….” అంటు బిగ్గరగా ఏడుస్తూ అనిల్!
ఉదయాన్నే గుండెపోటుతో మరణించాడు గిరి. మంచివాడిగా పేరు పొందడంవల్లనో ఏమో, ఊరు ఊరంతా అక్కడే ఉంది. అంతా తలా చెయ్యీ వేసి అతని అంతిమసంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
“బ్రతికితే ఇలాంటి బ్రతుకే బ్రతకాలి. తనకెవ్వరూ తోడు లేకపోయినా అమ్మానాన్నలు లేని పిల్లలకు తానే తోడై వాళ్ళదే లోకంగా బ్రతికాడు.”
“తనకు ఉన్న దాంట్లోనే ఇంకొందరికి పెట్టడం అందరి వల్లా అవుతుందా?! పుణ్యాత్ముడు!”
గిరి పట్ల సానుభూతితో, అభిమానంతో అక్కడి జనం చెప్పుకుంటున్న మాటలు వినబడ్డాయి చలం మేష్టారికి. అక్కడి హృదయవిదారక దృశ్యానికి, ఆ మాటలకు ఆయన కళ్ళలోనూ కన్నీళ్ళు సుడులు తిరిగాయి.
శవం లేచింది. “మావయ్యా….” అంటూ పెద్దగా ఏడుస్తూ వెనుకే పరుగెత్తాడు అనిల్. దహనం అవుతున్నంతసేపూ అనిల్ ను తనకు దగ్గరగా పొదవుకుని ఓదారుస్తుంటే వెక్కిళ్ళ మధ్యలో చెప్పాడు అని, “దేవుడు మంచోడు కాదు సార్! లోకంలో అందరికంటే మంచివాడైన మా మావయ్యను ఎత్తుకుపోయాడు.”
ఉబికి వస్తోన్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పారు చలం మేష్టారు, “బాధపడకు నాన్నా! గిరి మావయ్య లేకపోయినా ఇకనుండీ నీకు నేనున్నానురా!” అనిల్ చెయ్యి పట్టుకుని తన ఇంటి వైపుగా నడుస్తూ.
తన ఇద్దరు కొడుకులతో పాటు అనిల్ ను ఏ లోటూ రాకుండా విద్యాబుద్ధులు నేర్పారు చలం మేష్టారు.
***
ఆలోచనలు, కునికిపాట్ల మధ్య హైదరాబాద్ చేరుకుంది విమానం. ఎయిర్ పోర్టు బైటకు రాగానే తన కోసం సిద్ధంగా ఉన్న కార్లో ఎక్కి కూర్చున్నాడు అనిల్.
తెలతెలవారుతుండగా ఊళ్ళోకి ప్రవేశించింది కారు. ఊరి పొలిమేరల్లోనే ఉన్న బంట్రోతు రంగయ్య ఇంటి దగ్గర కారు ఆపించాడు.
“రంగయ్య తాతా!” అని పిలిచాడు ఇంటి బైట నిలబడి.
“ఎవరూ?” అంటూ బాగా కిందకి ఉన్న ఆ తాటాకింటి చూరు కిందనుండీ వంగుని వస్తూ అడిగాడు రంగయ్య.
“నేను అనిల్ ని తాతా! ఎలా ఉన్నావు?” ఆప్యాయంగా అడిగాడు.
“నువ్వా అనిల్ బాబూ, నాకేం బాగానే ఉన్నాను కానీ సెలం మేట్టారి పరిస్తితే గోరంగా ఉందయ్యా! నిన్నే ఇంట్లో పెద్ద గొడవైపోయింది.”
“ఏమయింది?”
“పిల్లలిద్దరూ ఎప్పుడునుండో ఉన్నదంతా మాకు రాసిచ్చెయ్యమని గోల పెడతన్నారు బాబూ. ఆళ్ళ గోల బరించలేక నిన్ననే పంపకాలు సేసేసి రిజిట్రేసన్ కూడా సేసేసారు.”
“మరింక సమస్యేముంది?”
“అసలు సమస్య అదే కదా బాబూ. రిజిట్రేసన్ అయిపోగానే మీరు బైటకు నడవండంటూ సామాన్లు ఇసిరేసారు కొడుకులు, కోడళ్ళు!” కళ్ళనీళ్ళతో చెప్పాడు రంగయ్య.
చివ్వుమంటూ అనిల్ కళ్ళలోనూ కన్నీళ్ళు చిప్పిల్లాయి. “మరి వాళ్ళు ఎక్కడున్నారు?”
“పెద్దలు పంచాయితీ పెట్టి చెప్పినా ఎవరి మాటా ఆళ్ళు ఇనలేదు బాబూ. మేట్టారు అనిల్ బాబుకు వాటా వత్తాదని గోలెట్టినా కానీ ఇనకుండా కాయితాల మీద ఆళ్ళే బలవంతంగా సంతకాలు ఎట్టించేసుకున్నారు. పెసిడెంటు గారు అందాకా ఆళ్ళను పంచాయితీ ఆపీస్ పైనుండె గదిలో ఉండమన్నారు బాబూ!”
అయ్యో ఎంత పనైపోయింది?! అందుకే నిన్న అమ్మ కంఠం అంత దు:ఖంతో ఉంది! గబగబా కార్లోకి వెళ్ళి కూర్చుని పంచాయతీ ఆఫీసుకు వెళ్లాడు అనిల్.
మెట్లెక్కి తలుపు తట్టి “నాన్నా, అమ్మా!” అని గట్టిగా పిలిచాడు.
తలుపు తీస్తూనే అనిల్ ను చూసిన చలం మేష్టారు, జానకమ్మ దంపతులు వాటేసుకుని ఒక్కసారిగా బావురుమన్నారు.
“వచ్చావా నాన్నా! వాళ్ళు న్యాయంగా నీకు రావల్సిన ఆస్థిని లాగేసుకున్నార్రా! ఈ చేతులతో కష్టపడి కట్టుకున్న ఇంటిని బలవంతంగా వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు.” రుద్ధకంఠంతో చెప్పారు చలం మేష్టారు.
“కట్టుబట్టలతో మమ్మల్ని తరిమేసారు బాబూ!” జానకమ్మ అశ్రువులు అనిల్ భుజాన్ని తడిపేస్తున్నాయి.
“ఊరుకో అమ్మా! మరేం పర్వాలేదు నేనొచ్చానుగా” అని జానకమ్మ కనులు తుడుస్తూ చెప్పాడు అనిల్. చలం మేష్టారిని కూడా ఓదార్చాడు, “ఊరుకోండి నాన్నా! ఆ ఆస్థి కోసం నేనెప్పుడూ ఆశ పడలేదు. అనాథగా మళ్ళీ రోడ్డున పడాల్సిన నన్ను చేరదీసి మీ కొడుకుగా చేసుకున్నారు. కోపంతో వృత్తిపరంగా మీరెన్ని దెబ్బలు కొట్టినా మంచుకొండలాంటి మీ మనసుతో నన్నింతటివాడిని చేసారు. మీ ఋణం ఎలా తీర్చుకోగలను చెప్పండి?! పదండి, వెళ్దాం!”

***

ముంబాయిలో విమానం దిగిన ముగ్గురూ కార్లో ఇంటికి చేరుకున్నారు. కారు దిగి, “ఇకనుండి ఇదే నాన్నా మీ ఇల్లు!” భరోసాగా చెప్పాడు అనిల్.
“ఎక్కడిదిరా ఈ ఇల్లు? నువ్వు అద్దె ఇంట్లో కదా ఉండేవాడివి?” ఆశ్చర్యపోతూ అడిగారు చలం మేష్టారు.
“మనదే నాన్నా! ఈ మధ్యనే కొన్నాను. ఇటు చూడండి…” అని వాళ్ళిద్దరినీ గేటు పక్కకు తీసుకెళ్లాడు అనిల్.
‘గిరినిలయం’ అన్న అక్షరాలను చదువుతూనే చలం, జానకమ్మల కనులు మరింత సంతోషంతో తడిసాయి.

***

జాపరయ్య ఒనుం

japarayya onum pic

నాకు అప్పుడు పదేండ్లుంటయ్ …మా సొంతూరు కలసపాడు లోని చర్చి కాంపౌండ్ లో ఉంటిమి…అప్పట్లో చర్చి కాంపౌండు లో పది ఇండ్లు ఉన్నెయి. స్కూలు హెడ్ మాస్టర్ కిష్టపర్ సార్ కుటుంబం …ఇంగా ఇద్దరు ముగ్గురు టీచర్ల ఇండ్లు …కుశిని పని చేసే వాళ్ళ ఇండ్లు ఒకటి ఉన్నెది. మాఇండ్లు  చర్చికి దగ్గరగా ఉన్నెది. అదే కాంపౌండులో మిషన్ హాస్పిటల్ లో పని చేసే డాక్టర్ పెద్దీటి దేవభూషణం సార్ వాళ్ళ ఇండ్లు …పాస్టర్ ఇండ్లు పక్క పక్కనే ఉన్నెయి. మా చర్చికాంపౌండు పక్కనే సగిలేరు పార్తది. ఇది పరమట పక్కఉంటది. తూర్పు పక్క పంట పొలాలు మాడి వనాలు ఉన్నెయి. కలసపాడు ఊరిలో నుండి చర్చికాంపౌండు కు వచ్చే దావలో ఎడం పక్క రెండు మాడి తోటలు వరసగా ఉన్నెయి. ఇంగో పక్క దాన్ని ఆనుకుని ఇంగోక మాడి ఒనుం ఉండేది. ఇది ఇప్పటికీ ఉంది. గాని ఆ రెండు వనాలు ఇప్పుడు లేవు.
మా శిన్నతనాన మాడికాయల సీజన్ వచ్చే పొద్దన లేచ్చానే మాడి తోటల కాడికి పోతాంటిమి..రాత్రిపూట రాలిన మామిడి కాయలు ఏరుకోవడానికి. మిషన్ కాంపౌండుకు ఆనుకుని ఉన్న ఒనుం పేరు జాపరయ్య ఒనుం. ఆ ఒనుంలో ఒకప్పుడు శీని శెట్లు…సపోటా శెట్లు ఇంగా ఏంటేంటియో ఉన్నెయంట.. నాక మతికి వచ్చారక మాత్రం టెంకాయ శెట్లు…మాడి శెట్లు  ఉన్నెయి. ఒక వరస మాడిశెట్లు ఎనిమిది ఉన్నెయి. వాటిని వేరే ఊర్లలో ఎట్ట పిలుచ్చరో తెలియదు గాని నాకు తెలిసి ఒక్కో చెట్టుకు ఒక్కో పేరు ఉంది.
మొగదాల ఉన్నె శెట్టు పేరు కొబ్బెర కాయ. ఆ శెట్టుపచ్చి కాయలు తింటే కొబ్బెర ఉన్నెట్టు ఉంటది అందుకని ఆ పేరు పెట్టింటరు అనుకుంటి.

 

దాని ఆనుకుని ఉన్నె శెట్టు పేరు దబ్బకాయ..దాని ఆనుకుని ఒక పెద్ద శెట్టు …ఉన్నెది. దాని పరవాత ఓ నాలుగైదు శెట్లు తరవాత ఒకపెద్ద మేడి శెట్టు ..దాని తరువాత వాటిలో ఒకటి పచ్చడి కాయ అని ఇంగో దానికి ఇంగోపేరు …అయితే ఆ గేరిలో శివరాకరి శెట్టు పేరు పసుపు గాయ శెట్టు.. ఆ శెట్టు కాయలు పసుపు వాసన వచ్చాంటయి..అది మాగితే మధురంగా ఉంటాన్నెది. అంద మధురం మళ్ళీ జీవితంలో ఏ మాడి పండులో గూడా సూడలేదు. దానికి ఒక్కరవ్వ దూరంగా అంటే మాడి ఒనుం మధ్యలో ఒక పక్క మహారాజులాగా బేనీసా శెట్టు ఉన్నెది. దాని ముందు ఒక పాడు పడ్డ దిగుడు బావి ఉండేది.దాంట్లో పెద్ద పెద్ద జర్రిపోతులు నీళ్ల పాములు, తాంబేళ్ళు ,, గోందురు కప్పలు ఉండేటివి. మిషను కాంపౌండును అనుకని ఉండే వరసలో రెండు మాడి శెట్లు ఉండేవి. ఒకటేమో పచ్చడి కాయ…కట్టవ నానుకుని ఒకపెద్ద శెట్టు ఉండేది. ఆ శెట్టు కాయలు మాగితే అందులో పీసు ఉండేది కాదు ఉత్త కండ ఉండేది. ఒనుమంతటికీ ఒక సపోటా శెట్టు ఉండేది. దానికి జాపరయ్య కాపలా ఉండేవాడు.
జాపరయ్య గురించి చెప్పాలంటే ఆ మనిషి ఆరుడుగులుంటాడు. తూకమైన మనిషి.

జాపరయ్య వాళ్ళన్న పోలీసు. ఆయన కర్నూలు లో ఉండేవాడు.

ఆయన  వాడిన పాత కాకి నిక్కర్లు జాపరయ్యకు పంపితే అవి ఏసుకునే వాడు. జాపరయ్యను నిక్కర్లో తప్ప సలవ గుడ్డల్లో ఎప్పుడూ సూడలేదు.

ఆ మిషన్ కాంపౌండులో చదివిన వాళ్ళకు వాళ్ళ టీచర్లు ఎంత గుర్తో జాపరయ్య కూడా అంతే… ఆడ చదివిన వాళ్ళందరూ దాదాపుగా జాపరయ్య మామిడి కాయల  దగ్గర కాతా పెట్టిన వాళ్లే . మాడి కాయలు మాగక ముందు బేనిశా,,, కొబ్బరి కాయలు రాలి పడినోటియి అమ్మేవాడు.. పండ్లయినంక వాటిని కూడా అమ్మేవాడు. అయితే ఆయన కాడ శానా  మంది అప్పు పెట్టేవాళ్ళు … వాళ్ల చదువు అయిపోయి పొయ్యేప్పుడు కొందరు అప్పు తీర్చి పొయ్యే వాళ్ళు. కొందరు ఇవ్వకుండా పోయే వాళ్ళు ..అట్ట పోయినోళ్ళు పదేండ్ల తరువాత తిరిగి వచ్చినా కూడా ఆయన వాళ్ళ పద్దు పుస్తకంలో రాసి పెట్టుకుని అడిగే వాడు. ఎప్పుటికి అప్పుడు పద్దు బుక్కు మార్చి బడి పిల్లోళ్ళతో రాయించుకునే వాడు.అట్ట కనపడినప్పుడు  కొందరు ఇచ్చే వాళ్లు కొందరు ఎగ్గొట్టే టోళ్లు . అయినా ఆయన అడిగినోళ్ళకు కాదనకుండా మాడికాయలు ఇచ్చేవాడు.
ఆయన తెల్లారతానే ఒనుం కాడికి వచ్చేవాడు. రాత్రి శీకటి పన్నెంక తిరిగి ఇంటికి పొయ్యేవాడు. ఉదయం వచ్చా వచ్చా సద్దిబువ్వ తెచ్చుకుని పైటాల కల్లా ఒనుం కాడనే తినేటోడు. మద్ధానం అయ్యార్కల్లా జాపరయ్య ఇంటికాడ నుండి ఓ బేసిన్ కు ఎర్రగుడ్డ కప్పి రాగి సంగటి వచ్చేది.మాడికాయల సీజన్ అయితే రోజూ మాడికాయ కారెమే వచ్చేది. లేకుంటే ఏదన్నా పప్పు…ఇంగేదన్నా కూర వచ్చేది. దాన్ని ఆయన ఒనుం లో ఏడబడితే ఆడ నేల మీదనే కూచ్చోని గబ  గబా తినేటోడు. ఆదోవన పల్లెలకు పొయ్యేటోళ్ళు ఎవురన్నా కాసేపుఆయన కాడ గొంతు కూకోని ఎవ్వారం జేసి పోయేటోల్లు.
ఎవురన్నా కోతి నాయళ్ళు చెట్ల మీద రాళ్ళు ఏచ్చే జాపరయ్య కు కోపం వచ్చేది.

Kadha-Saranga-2-300x268

వాళ్ళను కుత్తేగా… పప్పు చారు పడ్తది అని తిట్టేటోడు.. ఆరెండు మాటలు తురక యాసలో తెలుగులో తిట్టేవాడు…

అయి బో సోగ్గా ఉండేవి. కొందరు ఆయనకు కోపం తెప్పిచ్చి తిడతా ఉంటే తిట్టించుకున్న వాళ్ళతో సహా అందరూ నవ్వుకునే వాళ్ళు . అట్టాటి మనిషి జాపరయ్య.
ఆయన ఒనుం ఇడ్సి యాడికి పోయినట్టు నాకు గుర్తు లేదు. ఊర్లో వాళ్ళ కులమోళ్ళ పెండ్లిండ్లు జరిగినా పెద్దగా పోయేటోడు కాదు. ఏదైనా పెద్ద పండగ ఉంటేనే మజీద్ కు నమాజ్ కు పోయేటోడు. ఆయన అట్ట పోయినపుడు ఆయన భార్య బూమ్మ నెత్తికి గుడ్డ కట్టుకుని ఒనుంకు కాపలా ఉండేది. ఆమె ఒనుం కాడ కూకోని ఉంటే ఆ దావన పోయేటోళ్ళు అందరూ “ఏం బూమ్మా జాపరయ్య యాడికి పోయినాడు” అని అడిగే వాళ్ళు.
బంగళాలో ఏదైనా పండగా పబ్బం వచ్చే భూషణం సారు వాళ్ళు ఆయనకు ఇంట్లో ఒండిన బువ్వ కూరాకు పంపించే వాళ్లు ..జాపరయ్యకు ఏదైనా జరమొచ్చినా.. పుండు లేసినా భూషణమయ్య లెక్క తీసుకోకుండా మందులు ఇచ్చేవాడు. అట్ట ఆయనకే కాదు వారి కుటుంబానికి మొత్తానికి లెక్క తీసుకోకుండా చూసేవాడు. దాంతో జాపరయ్యకు భూషణమయ్య అంటే గౌరవం ఉండేది.భూషణమయ్య డైనిమా ఉన్నె హీరో సైకిల్ మీద ఆసుపత్రికి బయలు దేరి ఒనుంమీద పొయ్యేటప్పుడు జాపరయ్య కూచ్చున్నోడల్లా లేసి సలాం సార్ అనేవాడు. ఆయన అలేకుం సలాం జాపరపయ్యా అనుకుంటా పోయేటోడు.

ఆయనకు తన తోటలో కాసే మాడికాయలు, టెంకాయల ఇచ్చేవాడు. ఒకేల శెట్టుమీద మాడికాయ మాగిఉంటే అది కావాలంటే కోసిచ్చేటోడు. భూషణమయ్య పిల్లోల్లు ఒనుం లోకి పోతే ఏమనేవాడు కాదు. పురుగో పుట్టో ఉంటది బద్రంగా పోండి అని చెప్పేవాడు. మా లాంటి పిల్లనాయాల్లను పోనిచ్చే వాడు కాదు. అందుకని మాకు సందు దొరికినప్పుడల్లా దొంగతనంగా మాడికాయలు తెంచే వాళ్ళం.
మా మిషన్ కాంపౌండ్ లో మిషనరీలు కట్టిన పెద్ద బంగళా ఉండేది. కాంపౌండు నిండా చెట్లు ఉండేవి. ఎండా కాలం సెలవులు వచ్చే సాలు అక్కడ సంసారం ఉండే వాళ్ళ పిల్లోళ్ళమంతా రక రాకాల ఆటలు ఆడుకనే వాళ్ళం. మద్యానం దాకా సగిలేట్లో ఈత కొట్టి మద్యానం నుండి బంగళాలో డీండార్.. కోతికొమ్మచ్చి ఆటలు ఆడుకనే వాళ్ళం..మాకంటే పెద్దోళ్లు బంగళా వరండాలో కూకోని అచ్చన గాయలు …బారకట్టా ఆడుకునే వాళ్లు. అంతా ఒకటే జాతి అయనా అక్కడ డబ్బు ఉన్న వాళ్ళ లేనోళ్ళుతేడాఉండనే ఉండేది. సాయంకాలం వనాల కాడికి పోయే వాళ్ళం భూషణమయ్య పిల్లోళ్ళు మాత్రం ఒనుం లోపలికి పోయేటోళ్ళు మేము ఒనుం కట్టవంబడి బయట తిరిగి కంపలో రాలి పడిన కాయలు ఏరకచ్చుకునే వాళ్ళం. అట్ట రాలిన కాయలు మాగేచ్చే బో కమ్మగా ఉండేయి.
ఒక రోజు మద్యాన్నం నుండే ఆకాశం ఎర్రబడతా ఉంది. ఉక్క పోత్సాంది..ఆకు కదలడం లేదు. సగిలేట్లో ఈత కొడతా ఉంటే ఎప్పుడూ సల్లగా ఉండే నీళ్ళు ఆ రోజు ఉడుగ్గా ఉండాయి. ఒక్కో సాటయితే జౌకుల మాదిరి ఉండాయి. నేను ఎప్పుడూ ఏటికి ఆనుకుని ఉండే తుమ్మ శెట్టు కిందికి పోయి నీళ్ళలో మునిగే వాడిని .. ఆ రోజు ఎందుకో ఆడికి పోడానికి భయమేసింది. ఆడికి అందరూ పోలేరు. నేను సోమయ్యగాడు ఒకరిద్దరు తప్ప ఎందుకటే ఆడ నీళ్ళలో కంప ఉంటది. అది యాడుంటదో ఆడికి ఎట్ట బోవాల్నో మాకు తెలుసు. సోమయ్య గాడు ఒక్కడే పోయినాడు గాని శానా శేపు ఉండలేక బయటికి వచ్చినాడు. ఆ రోజు ఏట్లోనుండి బెరీన ఎనిక్కి తిరుక్కుంటిమి.

రెండు మూడు రోజులయితే శనక్కాయ కట్టె పీకుతారనంగా కయ్యలకు నీళ్ళు కడతారు. అట్ట కట్టిన శేను ఒకటి గుడి ఆనుకుని ఉంటే ఆ శేలేకి కాపలా ఉండే వాళ్ళకు కనపడకుండా కంపలో కంత ఒకటి జేచ్చిమి. దాని గుండా పొయి పెరక్కజ్జామనుకుంటే…ఆ శేనుగలోళ్లు ఆన్నే ఉండారు. దాంతో ఉసూరుమంటా బంగళా లోకి వచ్చిమి. ఆడ అచ్చనగాయలు బారకట్టా ఆడే వాళ్ళ కాడ కూకోని వాళ్ళు ఆడుకుంటా మాట్లాడుకుంటా ఉంటే సూచ్చాంటిమి.
ఎండ పలపలా కాచ్చాంది. ఒకటే ఉక్కపోత.. ఆట ఆడే వాళ్ళలో గడ్డమీద దేవరాజన్న తువ్వాలతో మెడమీద ఉన్నె శెమట తుడ్సుకుంటా..”అబ్బ ఏందిరా నాయనా ఇంత మిడ్సరంగా ఎండ కాచ్చాంది. ఊపిరి ఆడ్డంలేదు”అన్నాడు. బంగళానిండా శెట్లుఉన్నా గూడా ఆకు అల్లాడ్డంలేదు. ఉగ్గ దీసుకున్నెట్టు ఉండాయి. మేము పిల్ల నాయాళ్ళం కాబట్టి మాకు ఏమి అనిపియ్య లేదు. గేటు కాడుండే శింత శెట్టు కాడికి పోతిమి.ఆడాడ శింత బోట్లు ఉండాయి. ఈ శెట్టు కాపు లేటు అయినట్టు ఉంది శిగురు కాచ్చాన్నా ఆడాడా శింత బోట్లు ఉండాయి.

అవి కింద పడ్నాయేమో అని ఎతుకుతాంటిమి. ఇంతలో ఉన్నెట్టు ఉండి శింత శెట్టు మెల్లగా ఊగడం తిరుక్కున్నెది. ఆ ఊగడం కాసేపటికి ఎక్కువయినాది. ఆ ఊగడం ఎట్టుందంటే దెయ్యం పట్టినోళ్ళు ఊగినట్టు శింత శెట్టు ఊగడం దిరుక్కున్నెది. అట్ట గాలి లేచ్చాంటే భూషణమయ్య పిల్లోళ్ళు ఒనుంతట్టి పరిగెట్టిరి మంచి మాగిన కాయలు గాలికి పడతాయని…వాళ్ళు ఒనుం కాడికి శేరుకునారకల్లా గాలి ఇంగొక్కరవ్వ ఎక్కువయింది. మాన్లన్నీ ఎట్టుండయంటే ఎప్పుడన్నా మా నాయనకు కొపమొచ్చి మా యమ్మను కొడితే ఆ దెబ్బలకు మా యమ్మకు కోపమొచ్చి మా నాయన్ను ఏమి అనలేక కోపంతో ఎట్ట ఊగుతదో అట్ట ఊగుతాండయి.
నేను సోమయ్యగాడు శింతశెట్టు తొర్రలో ఒదుక్కోని కూకుంటిమి. ఇంతలో గోలీ కాయలంత సైజులో వడగండ్ల వాన పడ్డం దిరుక్కున్నెది. మేము శెట్టు తొర్రలో దాక్కున్న దాన మా మీద ఏమి పడ్డంలేదు.మేము తొర్రలో కూచ్చోని బితుకు బితుకు మంటా సూచ్చాంటిమి. శింతశెట్టు కొమ్మలు నేలకు తగిలేట్టు ఊగుతాండయి. ఇంతలో ఆకాశంలో మెరపులు మెరుచ్చాండయి రెండు పెద్ద బండరాళ్ళు రాసుకున్నెట్టు ఉరుము తాఉంది.

కాసేపటికి శిమ్మ శీకటి అయింది ఆకాశం కిందపడ్తదా అన్నెంత గా ఉంది పరిస్థితి. ఆకాశం నుండి ఓ మేఘంజారి కింద పడిందేమో అన్నెట్టు వాన అట్ట కురిసింది. శింత శెట్టు కింద నిండి వాన నీళ్ళు పోతాండయి. శెట్ల కింద ఉన్నె శింత శిదుగు కొట్టుకోని పోతాంది. గర గర మంటూ ఒక్కసారిగా భూమి మీద ఆకాశం ఊడి పడినట్టు పెద్ద శబ్దం జేచ్చా ఒక్క పిడుగు పడింది. అంత సేపటి వరకు ఇదల గొట్టిన వాన ఎవురో ఆపినట్టు ఆగి పోయింది. అట్ట ఆగుతానే నేను సోమయ్య గాడు శింత శెట్టు తొర్రలో నుండి బయటకు దూకితిమి..ఎండిన శింతాకు…యాపాకు…రెండూ తడిచ్చే వచ్చే వాసన వచ్చాంది. అప్పటి దాంకా పొగలు కక్కుతా ఉన్నె నేల మీద ఒక్క సారి వాన పడ్డంతో నేల లోపల బొక్కల్లో దాక్కోని ఉన్న సీమలు ..పురుగులు బయటకు వచ్చి నేల మీద పాకుతాండయి. నేలంతా తడి తడిగా ఉంది.
అప్పుడే నీళ్ళు పోసుకున్న దయ్యం మాదిరి ఉన్నె శెట్ల మీద ఆకుల మీద పడి నిలబడి పోయిన వాన శినుకులు ఒక్కొక్కటి నేల మీద పడతా ఉండాయి. నేను సోమయ్య తడిసి సన్నగా నీళ్ళు పారతా ఉన్నె నేల మీద మునిగాళ్ళ మీద నడుచ్చా జాపరయ్యా ఒనుం తట్టు దావబడ్తితిమి.

మేము ఉరుకుతా పోయ్యేప్పటికే ఆడ జనం గుమి కూడి ఉండారు . కొందరు ఆదలా బాదలా అట్టిట్ట పరిగెడ్తా ఉండారు. మాకు ఆడేం జరుగుతాందో…… ఎందుకు అందరూ అట్ట ఉరుకుతాండరో ఒక బంగిట అర్ధం కాక పాయ. ఎట్టయితే నేని గుమికూడినా జనం కాడికి పోతిమి? ఎవురు మాట్లాడం లేదు. మమ్మల్ని జూసి కుసిని పని జేసే మనిషి, ఇంటికి పాండి నాయాళ్ళారా ఎప్పుడూ శెట్లంబడే ఉంటారు. అని మమ్మల అదిలిచిన్నాడు.

ఏమైంది మామా అని అడిగితే మేడి శెట్టు ఇరిగింది. దానికింద భూషణమయ్య పెద్ద కొడుకు పడి సచ్చిపోయినాడు అని అన్నాడు. మాకు అర్ధం కాలేదు.
భూషణమయ్య పెద్ద కొడుకు పేరు దాస్ అయినప్పటికీ అందరూ శిట్టిబాబు అని పిలుచ్చాంటారు. మేము గూడా అట్టనే పిలుచ్చాంటిమి.

మా కంటే ఓ ఐదారేండ్లు పెద్దోడు అయినా కూడా బో తులవ. ఎప్పుడూ మాతో పాటు ఈతకు వచ్చాన్నడు. సగిలేట్లో ఈత కొడతా మునిగాట ఆడేవాళ్ళం ఆ ఆటలో ఎవురన్నా మునిగితే ఆ మనిషి గూడా వాళ్ళకంటే లోతులో మునిగి వళ్ళ కాళ్ళు పట్టి లాగి వాళ్ళకు కనపడకుండా పోయేవాడు.

లాగించకున్నోళ్ళు ఓ యమ్మా ఏదో దెయ్యం నీళ్ళలో నా కాళ్ళు పట్టుకోని గుంజినాది అని ఆయాస పడతా గడ్డకు చేరేవాళ్ళు శిట్టిబాబన్న మాత్రం ఏమి ఎరగనట్టు ఏమైందిరా అని అడిగే వాడు. .. కాసేపయినంక నేనే గుంజింది అని శెప్పి అందరినీ బాగా నవ్వించేవాడు. అంతే గాని ఎవురితో కొట్లాడంగా నేను సూడలేదు.
నేను ఇసయం ఇనంగానే ఉరుకుతా మా ఇంటికి పోయినాను. మా యమ్మ గాలివానకు శెదిరిపోయిన మా ఇంటి పైకప్పు బోదను సరిజేచ్చా ఉంది. నేను ఉరుకుతా పొయి గస పెడతా ఉంటే….. ఏంది నాయనా అన్నట్టు జూసింది మాయమ్మ. యమా….అంటూ ఆయాస పడతా… శిట్టిబాబన్న… జాపరయ్య తోటలో శెట్టిరిగి పడి సచ్చిపోయినాడు అని శెప్తి. అది ఇనడం… ఇనడం మా యమ్మ నా శెంపకేసి శెల్లుమని ఒక్కటి పీక్కింది. ఎంత కోతిపని చేసినా ఎప్పుడన్నా ఊరికే అట్ట గొట్టే మాయమ్మా తొట్టతొలిగ నాశెంప కేసి కోపంగా పీకింది.
నేను దెబ్బనుండి తెరుకుండార్కల్ల జాపరయ్య తోటకాన్నుండి జనం బాబు ఇంటిముందుండే గిలకరాయి నుండి శిట్టిబాబన్ను ఎత్తుకొని ఇంటికాడికి తీసకపోతాండరు. అదిజూసి మాయమ్మ పరుగులందించుకున్నెది.
నేను గూడా మాయమ్మ ఎంటంబడిపరిగెత్తి భూషణమయ్య భార్య ఏమైంది ఏమైంది అనుకుంటా ఎదురొచ్చె  ఇంతలో ఎవురో మంచమేసిరి ఇంగెవరో దప్పటి కప్పిరి. గబ గబా అందరూ అన్నీశేయ్యబట్టిరి ఆసుపత్రి కాన్నుండి ఇంటికి వచ్చిన భూషణమయ్య కొడుకు శవాన్ని జూసి గుండెల బాదికోని ఏడ్సినారు . అందరూ ఏడుచ్చాండారు మాయమ్మ గూడా ఏడుచ్చానే ఉంది.
మా ఊరోల్లే గాకూండా సుట్టుపక్కల పల్లెలోలు గూడా తిర్నాలకు వచ్చినట్టే  వచ్చిరి.
ఎట్ట జరిగిందబ్బా అని అందరూ మాట్లాడుకుంటాండిరి.
మామూలుగా అయితే ఎంతగాలి వచ్చినా మేడిశెట్టు పడదు. అట్టాటి శెట్టు అదీ గూడా శెట్ల మద్య శెట్టు ఎగిరి పన్నెది అంటా.. ఈ సావు మాములుదిగాదు.
ఈ మద్య భషణమయ్య వాళ్ళ శేనికాడ బాయి తవ్వంచినారంట… ఆ బాయి బలిగోరితే ఇయ్యలేదంట.. కనీసం మేకనో పోట్టేలినో ఇయ్యలేదంట అందుకని ఆయన పల్లొన్ని బలి తీసకున్నాది అని తేల్చిరి.
ఇంగా కొందరు ఇంగొక రకంగా చెప్పుకునిరి కాలం గిర్రునా తిరిగిపోయ కొన్నీ ఏండ్ల తరువాత నేను మా ఊరికి పోతి అక్కడ ఒనుం  లేదు.అయితే జాపరయ్యాకి గుర్తుగా ఓ టెంకాయ శెట్టు మసలిదై ఊగుతా కనిపిచ్చింది.
అదే ఈ కతను నడిపిచ్చింది.

-బత్తుల ప్రసాద్

prasad

ప్రవాహం !

 pravaaham

కొత్త ప్రాజెక్టు, కొత్త ఊరు, కొత్త అపార్టుమెంట్!

“కొత్త “ ల బారిన పడక తప్పని  పరిస్థితి !  నాలుగేళ్ల  కూతురు మహతి తో శాన్ ఫ్రాన్సిస్కో కి  దగ్గర లో ఉన్న ఓ ఊరికి  ఒచ్చారు వసుంధర దంపతులు.

దేశాలు పట్టుకు రాగా లేనిది, ఊర్లు మారటం గురించి  అంతలా ఆందోళన  పడకని  భార్గవ్   పదే పదే  చెప్పినప్పటికీ,

“రోజంతా ఆఫీసులో ఉండొచ్చే నీకు ఏం తెలుస్తుంది ?! పైగా మన వాళ్ళు తక్కువగా ఉండే ఊరిది …..“  అనే ధోరణిలో  వసుంధర….

కొంచెం కుదుట పడ్దాక, కూతురికో నేస్తాన్ని వెతికే పనిని అన్నిటి కన్నా ముందు పెట్టుకుంది. అపార్టుమెంటు మేనేజరు పక్క వాటాలోనే ఉండటంతో, ఈ విషయమై మాట కలిపింది.

వాళ్ళ కాంప్లెక్సు లోనే ఓ చిన్నపిల్ల ఉన్నదనీ, వర్కింగ్ పేరెంట్స్…  వెరీ స్వీట్ కపుల్  అని చెప్పిందామె.

ఓ రోజు ,  తలుపు తీసుకుని అల్లరి గా  బయటకు పరుగెత్తింది మహతి . ఆ పరుగుని పసిగట్టి  బయటకి వెళ్ళేటప్పటికి ,  పాటియో కి  దగ్గరగా మహతితో పాటు ఓ యువతి నిల్చొని ఉంది.

“ హియర్ ఈజ్ యువర్ ప్రిన్సెస్ మామ్ !”  అంటూ నవ్వింది.

కూతురి చెయ్యి అందుకుని, ఆమెకు ధ్యాంక్స్  చెపుతూ, తనని “వసు” గా పరిచయం చేసుకుంది.

“నా పేరు లిండా ! నాకూ మీ అమ్మాయి వయసు కూతురుంది, ఇప్పుడే  తనని  ప్రీ స్కూల్ లో దింపి  వొస్తున్నాను ,  మీ అమ్మాయి పూల్ వైపు పరుగు పెడుతుండటం  చూసి  ఆపాను, ఈ వయసే అంత, తప్పేది , తగిలేది వాళ్ళకి అర్ధం కాదు “ అంది.

ఆమె మాటలతో ఏకీభవిస్తూ, మీరు ఫలానా అపార్టుమెంటులో ఉంటారా ?! బహుశా  మీ అమ్మాయి గురించే మేనేజరు చెప్పిందని  ఉత్సాహపడిన వసుంధర , తాను కూడా మహతిని ప్రీ స్కూల్ లో  చేర్చాలనుకుంటున్నానని  చెప్పి  వివరాలు తెలుసుకుంది .

లిండాని ఇంట్లోకి  రమ్మనమని అహ్వానించినప్పటికీ , తాను ఫార్మసిస్టుగా పని  చేస్తానని , తన వర్కింగ్  అవర్సు  మరి కొద్ది సేపట్లో మొదలవుతాయి కనుక మరెప్పుడయినా   వస్తానని  చెప్పి వెళ్ళిపోయింది.

లిండా చెప్పిన  ప్రీ స్కూలుకి  కమ్యూనిటీలో మంచి పేరే ఉందని తెలుసుకున్న వసుంధర, మహతిని కూడా అక్కడే  చేర్పించింది. లిండా కూతురి పేరు ఏప్రిల్ ! భలే ముద్దుగా ఉండటంతో పాటు, స్నేహంగా కూడా ఉంటుంది.  త్వరలోనే ఏప్రిల్ , మహతిలు స్నేహితులయ్యారు!

ప్లే డేట్లు కావాలంటూ మహతి డిమాండ్ లు చేస్తూంటే, వీలు చూసుకుని, లిండాతో మాట్లాడితే బావుండుననని  వసుంధర ఎన్నో సార్లు అనుకుంది.

ఏప్రిల్ ని  స్కూల్ దగ్గర  లిండా  దింపినా ,  మధ్య్హా న్నం వేరే ఆమె ఇంటికి  తీసుకురావడం గమనించింది. అపార్టుమెంటు  పార్కింగ్ ఏరియా దగ్గర ఆ యువతిని చాలా సార్లు చూడటం కూడా జరిగింది, ఆమె వస్త్ర ధారణ వసుంధరకి ఆసక్తిగా ఉండేది…

స్ప్రింగ్  సీజన్ మొదలయ్యింది….

మూడున్నర గంటల ప్రాంతంలో  ఏప్రిల్ స్వ్హిమ్మింగ్ కి  వొస్తుంది,  అదే టైంలో మనం  కూడా వెళ్ళాలని మహిత పట్టుపట్టిందో రోజు . అప్పటికే మహతి కొంత వరకు బాగానే స్విమ్మింగ్ చేస్తుండటం, అలాగే ఆ పిల్ల  పోరు భరించలేక, జాగ్రత్తలన్నీ తీసుకుని బయలుదేరింది వసుంధర.

వాళ్ళు వెళ్ళేటప్పటికి స్విమ్మింగ్ ఫూల్ లో ఏప్రిల్ , తనని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే యువతి కూడా కనిపించారు. వాళ్లని  చూస్తూనే  మహతి  ఉత్సాహంగా  ఫూల్ లో దిగింది. మూడు అడుగుల లోతు వరకే ఉండమని కూతుర్ని  హెచ్చరించింది.

“ఇట్స్  ఓకే !  డొంట్ వర్రీ  …”  అంటూ  వసుంధరకి భరోసా  ఇచ్చింది   ఏప్రిల్ తో  ఉన్న యువతి.  పిల్లలతో సమానమైన ఉత్సాహంతో  ఆమె వాళ్ళని  ప్రోత్శ హించడంతో ,  కేరింతల్లో  మునిగిన వారి ముఖాలు వెలిగిపోయాయి.

పూల్ నుంచి  బయటికి వొచ్చిన తరువాత,

ఏప్రిల్ తో ఉన్న యువతి,

నా పేరు లిన్ , మీ అమ్మాయి గురించి ఏప్రిల్  కబుర్లు చెపుతుంది.  లిండా కూడా మిమ్మల్ని కలిసానంది.  నేను సాయంత్రం ఆరింటికి ఆఫీసుకి  వెళ్ళాలి , అందుకే ఈ టైంకి  ఏప్రిల్ ని  స్విమ్మింగ్ కి  తీసుకొస్తాను.  మీకు అభ్యంతరం లేకపోతే , వీలయితే , ఈ సమయానికి రండి, స్నేహితురాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తారు. మీరేం భయపడాల్సిన పనిలేదు, నేను పూల్ లోనే ఉంటాను. ఏప్రిల్ ని చూసుకోవడం కోసం లిండా  డే  షిఫ్టు , నేను నైట్ షిఫ్ట్  ఎడ్జస్టు  చేసుకున్నాం.  కలిసి  గడపడానికి ఇద్దరికీ  సమయం కరవవుతోంది , కానీ వర్కింగ్  పేరెంట్స్ కి  ఇలాంటివి   తప్పదు కదా !  అంటూ, ఆఫీసుకి  టైమవుతోందని చెప్పి,  ఏప్రిల్ ని తీసుకు వెళ్ళిపోయింది.

పిల్లల కేరింతలు, వెలిగిపోయిన  వాళ్ళ పసి ముఖాలు ఇంకా కదలాడుతున్నాయి!

ఇంట్లో పనులు చేసుకుంటుందే కానీ, వసుంధర తన ఆలోచనలకి ఎంత అడ్డుకట్ట వెయ్యాలని ప్రయత్నించినా అగటం లేదు…” స్వీట్  కపుల్  , ఇద్దరికీ  సమయం కరవవుతోంది …. , వర్కింగ్  పేరెంట్స్,  ‘’ …అన్నీ  కలిపితే  ఏదో   సూచిస్తున్నట్టుగా  ఉంది.  శాన్ ప్ర్హాన్ సిస్కో  చుట్టు పక్కల  కొంత లిబరల్ కమ్యూనిటీ అని , గే, లెస్బియన్ , మరితర తరహా జంటలు తారసపడటంలో  అశ్చర్యం  లేదని తెలుసు కానీ , అదేదో  తన  అనుభవంలోకే వొచ్చిందా ….ఏదో సంకోచం….. !?  మట్టి బుర్ర…. అని తనని తాను విసుక్కుంది.

ఏప్రిల్  తో స్నేహం మానెయ్యమని  మహతికి  చెప్పాలా ? ఏ ముఖం పెట్టుకు చెపుతాను  ?!  చెప్పినా అర్ధం చేసుకునే వయసా ? పేరెంట్ గా నా కర్తవ్యం ఏమిటి ? తెలిసీ తెలియని  వయసులో  ఇలాంటి  వ్యక్తుల తో  పరిచయం వల్ల పిల్లలపై పడే ప్రభావం ఏమిటి ? భవిష్యత్తులో ఏం చేసినా, ఎలా ఉన్నా  తప్పు లేదన్నట్టు తయారవుతారా?   ఇంతకీ వాళ్లతో  నాకున్న ఇబ్బంది ఏమిటి ? ఆ  పసిపిల్ల పట్ల అన్యాయంగా వ్యవహరించడం  అవదా ?! తెలిసిన వాళ్ళు , చుట్టాలు  ఇలాంటి స్నేహాలేంటి …  అంటారనా ? కూతురిని సంప్రదాయ వాతావరణంలో , పధ్ద్దతిగా పెంచడంలేదంటారనా ?!  ఇటువంటి సంబంధాలకు సమాజంలో సమ్మతి ఉండదనా ? ఏంటి నా  సమస్య ? అని వెతుకులాడింది.

pravaham-1-

కొంతసేపటికి తనే తెప్పరిల్లి … ఒక వేళ ఈ నా అంచనాయే తప్పయితే ?! లిన్ ని ఏప్రిల్ పేరు పెట్టి  పిలవడం గుర్తు చేసుకుంది…  ఒక వేళ అలా కాదేమో ! నేనే తప్పుగా అర్ధం చేసుకుంటున్నానేమో ! విషయం ఏమిటో నిర్ధారించుకుని కానీ నిర్ణయం తీసుకోకూడదనుకుంది.

తమ కాంప్లెక్సులోనే ఉండే మరో కుటుంబం ద్వారా , లిన్- లిండాలు లెస్బియన్ కపుల్  అని, సరిగ్గా వసుంధర వాళ్ల  పై ఫ్లోర్ లో ఉండే అపార్టుమెంటులో కూడా మరో  గే కపుల్ ఉంటున్నట్టు తెలుసుకుంది.  ఈ రెండు జంటలూ కూడా తోటి వారితో స్నేహంగా ఉంటారని, ఎవరి జోలికి రారు, ఇబ్బంది పడ్డ పరిస్థితులు తమకు రాలేదని ఆ కుటుంబం చెప్పడం కొంత ఉపశమనాన్నిచ్చింది.

ప్రవాసం అంటేనే ప్రవాహం! ఎన్నో కలుపుకు పోవాలి… ఎన్నిటితోనో కలిసిపోవాలి …  భిన్నంగా ఉన్నంత మాత్రాన ….వాళ్ళని సహించలేకపోవడం లోపమే కదా! మహతి స్నేహ బంధాన్ని విడగొడితే, ఆ పసితనాన్ని గాయపరుస్తానేమో అనే బాధ, అపరాధ భావనే   నన్ను సమాధాన పరుస్తోందా?  అనే ప్రశ్నలూ  వేసుకుంది.  నా పిల్లలను కూడా మా “గంప ” లోనే  పెంచేస్తాను, నా  ఇల్లే  “సరైన “ప్రపంచం…  అనే మానసిక స్థితి  నుంచి  బయటపడి, అన్ని దిక్కులూ చూడటం… ముందు తరానికి మెరుగైన  ఆలోచనలు పంచడానికి ఉపయోగపడుతుంది అనే సానుకూలతను తన ఆలోచనలకు జోడించేందుకు ప్రయత్నించింది.

మరో వైపు …

పరిపరి విధాలుగా పోతున్న తన అలోచనల గురించి భార్గవ్ కి ఏకరవు పెట్టింది.

అఫీసుల్లో కూడా రకరకాల వ్యక్తులు  తారసపడతారు,  వారితో మన సాన్నిహిత్యం ఎంత వరకు పోవాలి అనేది మనం వారిని అర్ధం  చేసుకోగలిగినంత, వారిని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడనంత మేరకు అని నా ఉద్దేశం!  పిల్లల కళ్లకి  అన్ని వేళలా గంతలు కట్టి ఉంచాలంటే సాధ్యం కాదు… వాళ్ళో మిశ్రమ సంస్కృ తి లో పెరుగుతున్నారు,  సహజమైన వాతావరణం వాళ్ళ చుట్టుపక్కల ఉంచకపోతే, పెద్దవుతున్న కొద్దీ  గందరగోళ పడతారన్నాడు.

ఏది ఏమయినా,  సున్నితమయిన  విషయం…ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, మన  జాగ్రత్తలో మనం ఉండాలి అనుకుంది.

మధ్యాన్నం మూడున్నరకి , మళ్ళీ పూల్ దగ్గర వసుంధర, మహతి రెడీ!

స్నేహితురాళ్లిద్దరూ షరా మామూలే , ప్రపంచాన్నే మరచిపోయినట్టు !

రోజులు గడుస్తున్న కొద్దీ , పిల్లలిద్దరూ పూల్ లో సురక్షి తంగా  ఈత కొట్టగలరనే నమ్మకం కుదిరిన తరువాత,  కొంతసేపు వసుంధరతో మాటలు కలపడానికి  వొచ్చి కూర్చునేది లిన్ .

సరైన అవగాహన లేక,  వాళ్ళు నొచ్చుకునేట్టు ఎమైనా అడుగుతానేమోనని వసుంధర వ్యక్తిగతమైన ప్రశ్నలు పెద్దగా వెయ్యకపోయినా ,  మాటల మధ్యల్లో లిన్ కొన్నిటిని  గుర్తుచేసుకునేది.

కొలీగ్ గా  లిండా తో పరిచయం, అప్పటికే డైవోర్సు కి అప్లయి చేసి ఉన్న లిండా  ! ఇరువురి మధ్య చిగురించిన  ప్రేమ,  కుటుంబాల వ్యతిరేకత,  వీళ్ళ విషయం  తెలిసి , లిండా  కూతురి  భవిష్యత్తు పట్ల  ఆందోళన చెందుతూ , ఆ పిల్ల తండ్రి వేసిన  ప్రశ్నలు,  చైల్డ్  కస్టడీ కోసం చేసిన యుద్దం…  అయినా ఒకరి పట్ల , మరొకరికి చెదరని ఇష్టం ! ఎటువంటి పరిస్థితినైనా కలిసి ఎదుర్కోగలమనే  గట్టి విశ్వాసం, తమ అనుబంధానికో రూపం ఇవ్వాలని డొమెస్టిక్ పార్టనర్ గా రిజిస్టర్ అవటం,  ఓ కొత్త ఆరంభం కోసం,  రెండేళ్ల క్రితం ఈ ఊరికి రావడం లాంటి వివరాలు  నెమ్మది నెమ్మదిగా తెలిసాయి .

ఈ జంట గురించి భార్గవ్ తో  మాట్లాడినప్పుడల్లా … ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి ఎంత ప్రేమ లేకపోతే ఇన్ని సమస్యలకు  సిద్దపడతారు? అనేది వసుంధర.

పార్కులో ప్లే డేట్  పెట్టుకున్నప్పుడు, సాధారణంగా లిండా వొస్తుండేది.   మీ అమ్మయి చాలా మర్యాదస్తురాలు, తన అలవాట్లు, మాట్లాడే తీరు ముచ్చటేస్తుంది , మహతిని కూడా  అలవాటు చేసుకోమని చెబుతుంటానని  అన్నప్పుడు, ఏ మాత్రం తేడాగా ఉన్నా, వీళ్ళ పేరెంట్స్ ఎంత అరాచకంగా ఉంటారో అంటూ తమ లాంటి వారి పిల్లలపై  అతి సులభంగా ఓ ముద్ర వేస్తారనే  స్ప్ఱహ  అనుక్షణం వెంటాడుతుంటుందని లిండా చెప్పడం వసుంధర మనసుని తాకింది.

లిన్ చెల్లెలు మెలిస్సా కి ఇక్కడే స్కూల్లో అడ్మిషన్ వచ్చింది. లిన్ తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు కానీ, ఆర్ధిక అవసరాల రీత్యా ఇది తప్పదని మెలిస్సా  చెప్పడంతో వాళ్ళు ఏం చెప్ప లేకపోయారు.  మెలిస్సా  రాకతో ఏప్రిల్ ని చూసుకోవడంలో కొంత  సహాయం లభించినట్టయింది లిన్ –  లిండాలకి.

రోజులు గడుస్తున్న కొద్దీ,  లిన్ – లిండాల కాపురాన్ని సాధారణంగానే తీసుకోవడం మొదలుపెట్టింది వసుంధర. ఏ పార్కు లోనో , పూల్ దగ్గరో కలవడం,  పిల్లలు ఆడుకుంటుంటే కబుర్లు చెప్పుకోవడం మామూలయిపోయింది.  ఓ సంవత్సరం గడిచిపోయింది. పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ లో జాయిన్ అయిపోయారు.
ఏప్రిల్ కి ఓ బుజ్జి తమ్ముడు పుట్టబోతున్నాడు, నేను కూడా వాడితో ఆడుకోవచ్చని ఏప్రిల్ చెప్పింది, ఓ రోజు సంబరంగా ప్రకటించింది మహిత.

పిల్లలు తెలిసీ తెలియక ఏదో మాట్లాడుకుని ఉంటారని వసుంధర అనుకుంది కానీ, లిండా – లిన్ లు కూడా ఈ శుభవార్తని వసుంధర తో పంచుకున్నారు. అన్ని కుటుంబాల లాగా …పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు లు , మనవలు, మనవరాళ్లు…ఇలా కోలాహలంగా తమ అనుబంధం సాగాలనే కల గురించి చెప్పారు.

ఇది సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో, ఆధునిక పరిఙానం సహాయం తీసుకున్నామని, ఎటువంటి డోనర్ నుంచి స్పర్మ్  కావాలో చర్చించుకుని, ఇద్దరూ ప్రయత్నించినా, లిండా గర్భవతి కావడంతో తమ ప్రయత్నం ఫలించిందనే అనందంలో మునిగితేలుతూ కనిపించారు.

వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోకుండా ఉండలేకపోయింది వసుంధర! పరిచయం పెరుగుతున్న కొద్దీ,  సున్నితంగా ఆలోచించే వాళ్ళ వ్యక్తిత్వాలు కట్టిపడేస్తున్నాయని భార్గవ్ తో చెప్పింది. కుటుంబం పట్ల వాళ్ళకున్న అభిప్రాయం భారవ్గ్ ని  కూడా ఆకట్టుకుంది.

లిండా కి “బేబీ షవర్ “ చెయ్యాలని లిన్ ముచ్చట పడుతుంటే, వసుంధర ఉత్సాహంగా సహాయం చేసింది. అలాగే డెలివరీ అపుడు   లిన్ కి సహాయంగా ఉండాలని ఏప్రిల్  బాధ్యతలు కొన్ని తీసుకుంది.

చిన్నారి  “లియం” ఇంటికి రాగానే , కుటుంబ సమేతంగా వాళ్ల ఇంటికి వెళ్ళి చూసొచ్చారు.  లిండా‌ – లిన్ ల తల్లిదండ్రులు కూడా మనవడిని చూడటానికి వొచ్చారని తెలిసి,  అసలు కంటే వడ్డీ ముద్దు అనే లాజిక్ ఇక్కడ కూడా అప్లయి  అవుతోందని అనందపడ్డారు.

“లియం కి ఇద్దరు మామ్స్ …సో కూల్ “ మహతి అన్నదో రోజు.

“డాడీ ని మిస్సవుతాడంటావా ? “ ఏం చెపుతుందో తెలుసుకోవాలని అడిగాడు భార్గవ్.

“ ఇట్ ఈజ్ ఓకె డాడీ ! సమ్ కిడ్స్ డజంట్ హావ్ మామ్స్ , సమ్ కిడ్స్ డజంట్ హావ్ డాడ్స్  … నథింగ్ టు ఫీల్ అబౌట్ ! “ తేలికగా సమాధానం చెప్పి ఆటలో పడిపోయింది మహతి.

ఓ సారి  స్కూల్ కి వెళ్ళి వాలంటీర్ గా పనిచేసి చూడు… స్నాక్ టైం లో , లంచ్ టైం లో టేబుల్ దగ్గర కూర్చొని ఈ పిల్లలు తెగ మాట్లాడుకుంటారు…. అవి విన్న తరువాత, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అడగవు అంటూ నవ్వింది వసుంధర.

మామీ లిండా – మామీ లిన్ లు  ఇంకా బిజీ  అయిపోయారు. “లియం” తో ఆడుకోవాలనే మహతి రిక్వెస్టు లూ  పెరిగిపోతున్నాయి….

కాలం పరుగెడుతోంది !

“ఈ డ్రస్ లియం కి కొందాం, ఇది వేసుకుంటే క్యూట్ గా ఉంటాడు” వసుంధర కూతురు మహతి చాలా ఉత్సాహంగా అడిగింది.

“వాడి పుట్టిన రోజుకి ఇంకా నాలుగైదు నెలల టైముందిగా? ఇప్పుడే ఎందుకు ? తన పుట్టిన రోజు దగ్గర పడినప్పుడు మళ్ళీ షాపింగ్ కి వొద్దాం  “ కూతురికి  సర్ధిచెప్పబోయాడు భార్గవ్.
“నో.. హి ఈజ్ మై బేబీ బ్రదర్ , ఐ నీడ్ టు బై దిస్ ఫర్ హిమ్ !  ప్లీజ్ …ఈ డ్రస్ కి ‘టీతర్ ( Teethar) ” కూడా ఉంది. వాడు భలే ఎంజాయ్ చేస్తాడు” తల్లిదండ్రులకి మరింత నొక్కి చెప్పింది మహతి.

లియం అంటే మహతికి చాలా ఇష్టమని తెలిసినా, వాడు నా తమ్ముడని పట్టుపట్టేంత  ప్రేమని, ఎలా అనునయించాలో తెలియక, అడిగింది కొని ఇచ్చేసారు వసుంధర, భార్గవ్ లు…. !

– హిమబిందు . ఎస్ .

చిత్రరచన: మహీ బెజవాడ

జావేద్

కొత్త మందు

Kadha-Saranga-2-300x268

”శర్మకి యా క్సిడెంటయింది  ,తెలుసా —?”ఇంటిలోకి అడుగు పెట్టగానే అంది నా శ్రీమతి.

”ఎక్కడ  –?”కంగారుగా అడిగాను.

”ఇంకెక్కడా –ఫెక్టరీలోనే —మీకు తెలియి దా ? మీ ఫెక్టరీలోనేగా అతడూ  పని చేసేది —”

నిజమే! శర్మమా ఫెక్టరీలోనే పని చేస్తాడు. — గంధకామ్లం తయారు చేసే విభాగంలో —పైగా నాకు ఆప్త మిత్రుడు. అయినా నాకు ఆ సంగతి తెలియికపోవటం ఆశ్చర్యంగా అనిపించింది.

”ఎప్పుడైంది యాక్సిడెంటు —-”

”రెండు మూడు వారాలైనట్లుంది ”

గత మూడు వారాలుగా నేను ఆఫీసు పని మీద ఉర్లు  తిరుగుతునాను. మార్కెటింగ్ మేనేజరుగా పని చేసేవాడికి ఉర్లు తిరగటం తప్పదు కదా !అయితే మాత్రం —-

”ఫోను చేసినప్పుడు చెప్పలేదేమిటీ ?”కొంత కంగారుగానూ కోపంగానూ అడిగాను.

శ్రీమతి మాట్లాడలేదు.

”ఎక్కడవున్నాడిప్పుడు ?”

”పట్నంలో —ప్రభుత్వాసుపత్రిలో —-”

విప్పే షూలేసు సు మళ్ళీ కట్టుకొని ,వెంటనే బైకెక్కి  ఇంటి గేటు దాటాను.

పశ్చిమాంబరాన ప్రమాదానికి గురైన  సూర్యుని నెత్తురికి తడిసి న మబ్బులు ఎర్రగా కనబడ్డాయి. ఎక్కడనుంచో వచ్చిన చీకటి ప్రపంచాన్ని మెల మెల్లగా తన గుప్పటిలోకి తీసుకుంటోంది. మా ఉరివాళ్ళ బ్రతుకులాంటి గతుకుల రోడ్డు మీద జాగ్రత్తగా ముందుకు సాగాను.

రోడ్డు మలుపు తిరిగి పెద్ద రోడ్డెక్కగానే ఎదురుగా కనబడింది ప్రత్యేక ఆర్ధిక మండలి. ఊరిలోవుండవలసిన వెలుగు మొత్తం అక్కడేవున్నట్లు విద్యుత్తు దీపాలతో కళకళలాడుతోంది.

నేనూ ,శర్మ ఉద్యోగం చేసే కర్మాగారం అక్కడేవుంది. మనుషుల జబ్బులకు మందు తయారుచేసే కర్మాగారం మాది. మందులు తయారు చేయడమే కాక ,కొన్ని పాత జబ్బులకు కొత్త మందులు ,కొత్త జబ్బులకు కొత్త మందులు కనిపెట్టడానికి విస్తృతంగా రీసెర్చు కూడా చేస్తువుంటారు.

కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ రోడ్డు నిండా చీకటి. ప్రత్యేక ఆర్ధిక మండలిలోని వెలుగు కార్మికుల నివాసాలదాకు చేరటం లేదు –రోడ్డుకి ఎడంవైపు ఆర్ధిక మండలిలో పని చేసేవారికోసం ఎవ్వరో నిర్మించిన అగ్గిపెట్టెలాంటి అద్దె ఇళ్ళు –వాటి చుట్టూ  మసక మసక వెలుతురు –శర్మ అక్కడే వుంటాడు. ఒకసారి అటు చూశాను –శర్మ ఇంటిలో దీపం వెలగటం లేదు.

రోడ్డుకి కుడివైపు గుడెసెలు. మండలిలో రోజువారీ కూలికి పనిచేసేవారి నివాసాలు అవి. అక్కడ హడావిడిగా ఉంది. ఆ రోజు సంపాదించిన డబ్బు ఖర్చు చేసే హడావిడి అక్కడ. డబ్బు సంపాదించడానికీ ,సంపాదించినది ఖర్చు చేయడానికీ చేసే హడావిడియేగా జీవితం !

గట్టిగా నిట్టూర్చాను. నాకు నా చిన్ననాటి ఊరు గుర్తు వచ్చింది అప్పుడు ఊరిలోని వెలుగు మొత్తం ఊరి జమీందార్ గారి ఇంటిలోనేవుండేది. ఇప్పుడూ అంతే అనిపించింది. నాడు పంట పొలాల ఆస్తి కలిగినవారు  జమీందార్లు –నేడు ఆర్ధిక మండలీలు వున్నవారు  జమీందార్లు –అంతే తేడా !

రోడ్డువైపు దృష్టి వుంచి జాగ్రత్తగా సాగాను. పాపం,శర్మ!ఏం ఇబ్బంది పడుతున్నాడో ,ఏమో ! అసలే వాడి ఆర్ధిక పరిస్థితులు అంతంతమాత్రం. ప్రమాదం ఫాక్టరీలోనే జరిగింది కనుక ఖర్చు యజమాన్యంవారే  భరించాలి. అలాంటప్పుడు కార్పోరేటు ఆసుపత్రిలో కాక ప్రభుత్వాసుపత్రిలోచేర్చారెందుకో !

నేనూ శర్మ చిన్నప్పటినుంచి కలసి చదువుకున్నాం; అడుకున్నాం; కలిసే తిరిగేవాళ్లం. శర్మ చాలా ప్రతిభావంతుడు. రాబోయే సమస్యలను ముందే పసి కట్టేవాడు. కాలానికి ముందే ఆలోచించే వాడి ప్రతిభకి సరైన గుర్తుంపు రాలేదని బాధ పడుతువుంటాను నేను. లేకపోతే వుత్త మట్టి బుర్రైన నేను —రెండు మూడు సార్లు పరీక్ష వ్రాసి పాస్ అయ్యానని అనిపించుకున్న నేను –మార్కెటింగ్ మేనేజర్ కావటమేమిటీ –ఇంజినీరింగు డిప్లొమా పాసైన శర్మ నట్టులు బొల్టులు విప్పే మెకానికుగా పని చేయడమేమిటి !

డిప్లొమా పాస్ ఆయిన తరువాత కొన్ని సంవత్సరాలు శర్మ నాకు కనబడలేదు. ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తున్నాడని విన్నాను. హటాత్తుగా ఒక రోజు మా కర్మాగారంలోని కేంటీనులో ప్రత్యక్షమయ్యాడు.

‘నువ్వేమిటి,ఇక్కడ —” ఆశ్చర్యంగా అడిగాను నేను.

”ఈ కాపెనీలో చేరానురా ”

‘అదెప్పుడు —ఏ సెక్షన్ —”

”గంధకామ్లం తయారుచేసే ప్లాంటులో –మెకానిక్కుని  –ఓ నెల అవుతోంది చేరి ”

”సరేలే –సాయంత్రం ఇంటికిరా ”భోజనం బల్ల వద్ద  మిగతా మేనేజర్లు నా  చుట్టూ  కూర్చున్నారని గుర్తిస్తు అన్నాను.

”ఏ జెమ్ ఒఫ్ ఏ వర్కర్ !”శర్మ వెళ్ళగానే నా పక్కనే కూర్చున్న జి.యం. గారన్నారు ”ఉద్యోగంలో చేరి నెల రోజులైనా కాలేదు ,అప్పుడే పని అట్లా పట్టేసాడు. హి  ఇస్ యువర్ ఫ్రంట్ –?”

”యెస్ ; చిన్ననాటి స్నేహితుడు ”

”వెరీ గుడ్ ; అతడు పని రాక్షసుడు.చేతిలోవున్న పని పూర్తి అయినంత వరకు పనినుంచి కదలడు ”

”మనకు కావాలిసింది అదే కదా  –”ఫైనాన్స్  మేనేజర్ మాట కలిపాడు.”కార్మికులు ఓ , టి. చేసినా మనం డబ్బులు ఇవ్వం కదా. అందువల్ల పని వత్తిడి వున్నప్పుడు ఓ. టి.చేయమని గడ్డంపట్టుకొని బతిమాలవలసి వస్తుందట. శర్మ లాంటివారు కొందరువుంటే లాభానికి లోటు వుండదు.

మేనేజర్లు అందరూ శర్మ పనితనం గురించి గొప్పగా మాట్లాడారు. నాకు చాలా సంతోషం కలిగింది.

” చిన్నప్పటినుంచివాడు  చాలా ప్రతిభావంతుడండి. ”అనే మాటలతో  మొదలు పెట్టి శర్మ చరిత్ర మొత్తం వివరించాను.

కాని ,ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు.ఒక సారి టూరుకి వెళ్ళి రాగానే ,వెంటనే కేబిన్ లోకి రమ్మని కబురు పెట్టారు జి. యం. గారు. భయం భయంగా వెళ్ళాను. ఎందుకంటే ఆ సారి టూరులో పెద్దగా ఆర్డర్లు సంపాదించలేక పోయాను. ఉద్యోగులు చేసిన మంచి పనులనూ ఆర్జించి పెట్టిన లాభాలనూ వెంటనే మరిచిపోతారు యజమాన్యం వారు –పైగా అది వాళ్ళ బాధ్యత అంటారు. చేయలేకపోయినవాటిని అసలు మరిచిపోరు.

టూరు విషయం ఎత్తలేదు జి. యం. గారు. అది నా అదృష్టం అని అనుకున్నాను.

‘’సీ ,మిస్టర్ రావ్ –‘ తన బల్లమీదవున్న గ్లోబుని వ్రేలుతో తిప్పుతూ అన్నారు జి.యం.’’నేను చెప్పే విషయం ప్రత్యక్షంగా మీకు సంబంధించినది కాదు అని నాకు తెలుసు. అయినా మీకు  చెబుతే మంచిదేమోనని అనిపించింది. ఎందుకంటే ఒక మంచి వర్కరుని కోల్పోవటం నాకు ఇష్టం లేదు’’

పరీక్షా హాలులో అర్ధం కాని ప్రశ్నాపత్రం అందుకున్న విద్యార్ధిలా కంగారు బడ్డాను నేను.

‘’అదే మీ  ఆప్తమిత్రుడు ఉన్నాడు కదా –అదే శర్మ –అతని గురించే —‘’

బల్లమీదవున్న ఫోను మ్రోగింది. ఫోనులో మాట్లాడిన జి. యం. ముఖం యెర్రగా కందిపోయింది. ‘’ఇస్తారయ్యా –ఇస్తారు’’

జి. యం. ఫోనులో అన్నాడు.’’పని మొదలుపెట్టమని చెప్పవయ్యా –కాగితం వచ్చినంతవరకు అంటే –నేను చెబుతానులే –కానీ –‘’

ఫోను గట్టిగా పెట్టి విసుక్కున్నారు జి. యం. ‘’తెలివి మీరిపోతునారు . ప్రతి పనికీ అడ్డుపెడుతున్నారు.—లేటు చేస్తున్నారు. ‘’కోపంగా కుర్చి వెనకు జారి అన్నారు’’ఇదిగో ,ఇదండి వరస –భద్రత గురించి వర్కర్లకు అవసరానికి మించిన అవగాహన కల్పించాడు మీ శర్మ. ఇప్పుడు వర్కర్లు పంపులకి గార్డులు పెట్టాలని,అంటునారు. పంపు మరామత్తుకి ఇచ్చే ముందు పూర్తిగా ‘’డ్రైన్ ‘’ చేసినటు సంతకం పెట్టిన కాగితం ఇమ్మని అడుగుతున్నారు  పనులు ఆలస్యమవుతున్నాయి. ఉత్పత్తి తగ్గే చోట కొద్దిగా చూసి చూడనట్లు  ఉండాలి కదా. మీ శర్మ ఇక్కడకి రాక ముందు ఇలాంటి గొడవలు లేవు ‘’

నేను మౌనం పాటించాను.

బల్లమీదవున్న పైపు అందుకున్నాడు జీ. యం. పైపులోని బూడిద దులిపి కొత్త పొగాకు నింపుకుంటూ అన్నాడు. ‘’పెళ్ళాం పిల్లలూ వున్న  వాడు కదా అని ఆలోచిస్తున్నాను. పైగా మంచి వర్కరు కూడానూ –లేకపోతేనా —‘’గట్టిగా పొగ పీల్చి అన్నారు జి. యం. ‘’మీరు ఒక సారి శర్మతో మాట్లాడండి .గోరుతో పోయేదానికి గొడ్డలిదాకా ఎందుకు ?’’

బాధగా కేబిన్ బయటికి వచ్చాను. బరువెక్కిన పాదాలతో అడుగులు వేసి వెళ్ళింది సమయం.

సాయంత్రం శర్మ ఇంటికి వెళ్ళాను.జరిగినదంతా వివరంగా చెప్పాను. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను,కూడా. కాని నా మాటలు పట్టించుకోలేదు శర్మ. పనిలో భద్రత గురించి, వర్కర్లకు పూర్తి అవగాహన కలిగించటం అవసరమన్నాడు. అందువల్ల ఉత్పత్తి పెరుగుతుందని అన్నాడు. యాజమాన్యం వారుకూడా ఆత్మార్ధంగా భద్రతకి పెద్ద పీట వేయాలని అన్నాడు.

నాకు శర్మ పట్ల జాలి కలిగింది. పనిలో ప్రతిభావంతుడైన వాడు యాజమాన్యం ఆలోచనలను పసి కట్టలేక పోతున్నాడెందుకని !

“ ఒరేయి  ‘’ నేను అన్నాను. ‘’ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయ,రా.కాని ప్రయోగిగంకా ఆలోచించాలి. ఎవ్వరు ఏం చెప్పినా ,ఎంత చెప్పినా ,భద్రత గురించి పర్యావరణం గురించి ఖర్చు చేయడానికి ఏ యాజమాన్యమైనా కొద్దిగా వెనకాడుతుందిరా .వాటి మీద ఖర్చు చేసే డబ్బుకి రిటర్న్ ఉండదు కదా . చట్ట ప్రకారం ఎంత తక్కువ చేయాలంటే అంతే’’

శర్మ తలయెత్తి నన్ను ప్రశ్నార్థకం గా   చూసాడు.నే ను మళ్ళీ అన్నాను. ‘’పైగా ఈ ఆర్ధిక మండలి అలనాటి ఈస్ట్ ఇండియ కంపెని లాంటిది. అందువల్ల నీ వేగం కొద్దిగా  తగ్గించు.నేను ఎందుకు చెబుతున్నానని  అర్ధంచేసుకో . మంచి వర్కరనే పేరుంది నీకు.  జి. యం.గారికి కూడా నీ మీద అభిమానమే. నీ తెలివి తేటలనూ మంచి పేరునీ ఉద్యోగంలో పైకి రావటం కోసం ఉపయోగించు . ఇలాంటి అనవసరమైన —–‘’

‘’ నేను అనుకోవటం లేదు అనవసరమని . ‘’శర్మ గొంతు లేచింది. ‘’పాపం కూలి కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పని చేస్తునారు  . మొన్న ఏమైందో తెలుసా –గంధకామ్లం పంపు చేసే పంపు ,పూర్తిగా డ్రైన్ చేయకుండా మరామత్తుకి ఇచ్చేసారు. హెల్పరు ,బొల్టు విప్పగానే వానలా బయటికి దూకింది ఆమ్లం –అతని అదృష్టం బాగుండటం వల్ల కళ్ళు పోలేదు అంతే. తప్పు చేసినవాడు పొరపాటు ఒప్పుకుంటాడా —అందుకే పూర్తిగా డ్రైన్ చేశారని సంతకం పెట్టి కాగితం ఇమ్మంటున్నాం. ‘’

‘’అలాంటి చోట పని చేసేటప్పుడు వేసుకోవలసిన ప్రత్యేక దుస్తులూ వాడవలసిన భద్రతాపరికరాలు ఉంటాయి కదా ‘’

‘’ఆయనే ఉంటే మంగలివాడు ఎందుకురా —‘’

శర్మలాగే కర్మాగారంలోని యంత్రాలు  కూడా నిర్విరామంగా తిరిగాయి. ఉత్పత్తిలోనూ కొత్త మందులు కనిపెట్టడంలోనూ మా సంస్ధ ముందడుగు వేసింది. కొత్తగా కనిపెట్టిన మందులు మనుషుల మీద ప్రయోగించడానికి సిద్ధమైంది  .

అప్పుడు జరిగింది ఆ సంఘటన —

పొగ గొట్టం మరామత్తు కోసం పైకి ఎక్కిన ఒక వర్కర్ క్రిందపడి చనిపోయాడు. పెద్ద గొడవకి దారి తీసింది ఆ సంఘటన. ఎత్తులో పని చేసేటప్పుడు సేఫ్టీ బెల్టు వాడటం తప్పనిసరి. అతడు బెల్టు వాడాడు. కాని అది బలంగా ఒక చోట తగిలించలేదని ,అందువల్ల పడిపోయాడని యాజమాన్యం వారు అన్నారు. పైగా అతడు మద్యం మత్తులో ఉండేవాడని కూడా ఋజువు చేసారు. కాని కార్మికులు ఒప్పుకోలేదు. వాడిన బెల్టు పాతదని అలాంటివే కర్మాగారంలో లభ్యమని ,వాటి బలాన్ని టెస్టు చేయించకపోవటం వల్లనే ప్రమాదం జరిగిందని వాదించారు. వర్కర్లను ఉసికొల్పేది శర్మే నని నమ్మింది యాజమాన్యం. సమస్య సమ్మేకి దారి తీస్తుందేమో నని భయపడిన యాజమాన్యం జి. యం. గారిని ఉద్యోగంనుంచి తొలిగించి శాంతి కుదుర్చుకున్నారు.

కొత్త జి. యం. చేరగానే కార్మికులతోనూ వర్కర్లతోనూ సమావేశమైనాడు.  జరిగిందేదో జరిగిపోయిందని ఇక మీదట అలా జరగదని హామీ ఇచ్చారు. అంతే కాదు , పనిలో భద్రత ను త్యాగం చేస్తే ఊరుకునేది లేదని నొక్కి వక్కాణించాడు. ఎవ్వరైనా  భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినా  ,ఉల్లంఘించ డానికి ప్రోత్సాహం ఇచ్చినా వెంటనే –అర్ధరాత్రీ అయినా –తనకి ఫోను చేసి మాట్లాడమని నిర్దేశించారు .అంతే కాదు శర్మని ప్రత్యేకంగా తన కేబినులోకి పిలిచి అభినందించాడు కూడా  .

‘’సీ ,మిస్టర్ శర్మా –‘’కొత్త జి.యం.అన్నారు. ’’మీరు పని చేసే ఈ కర్మాగారంలో పని చేయటం నా అదృష్టం. ప్రతి కర్మాగారంలోను మీలాంటివాడు ఒకడైనా వుంటే పరిశ్రమల్లో ప్రమాదాలకు తావుండదు. వాట్ ఏ డెడికే ట్టడ్ మాన్ యు ఆర్ !ఉత్పత్తి తగ్గితే  మరో రోజు సాధించవచ్చు –కాని ప్రమాదానికి గురైన  వాడ్ని తెచ్చుకోగలమా —‘’

శర్మతో పాటుకార్మికులు కూడా ఆ మాటకి పొంగి పోయారు.  భద్రతపట్ల అంకింత భావంగల జి. యం. వచ్చినందుకు సంతోషించారు. ఆ ఆదివారం కలిసినప్పుడు అదే మాట అన్నాడు శర్మ.

‘’నువ్వు పొరపడుతున్నావురా ‘’నేను అన్నాను ’’నువ్వు ఎంత ప్రతిభావంతుడు వైనా యాజమాన్యం వారి ధోరణి పట్టుకోలేకపోతున్నావు ‘’

“ ఏంటిరా   , అలా అనేసావు ? ’’

‘’నువ్వు ఒకటి అర్ధం చేసుకోవాలి శర్మా  –పాత జి. యం. అయినా కొత్త జి.యం.అయినా , జి.యం. జి.యం.నే . వాళ్ళ ఆలోచనలు బయట కనబడినా ,కనబడక పోయినా ఒకే లాగానే ఉంటాయి.పనికి సంబంధించిన ఆలోచనలు మనిషిని బట్టి మారవు. పదవినిబట్టి మారుతాయి. ‘’

‘’నాకు అర్ధం కాలేదురా –‘’

‘’జి.యం.ఎవ్వరైనాసరే , ఆలోచనా ధోరణిలో మార్పువుండదు. నీకు ఒకటి తెలుసా – జి. యం.ఉద్యోగాల మార్పిడి కుండ మార్పుల పెళ్ళిలాంటిది. ‘’

‘’అంటే —‘’

‘’ఆ  జి.యం. ఎక్కడకి వెళ్లారనినీకు  తెలుసా —మన కొత్త జి.యం.ఖాళీ చేసి వచ్చిన పోస్టుకి—మన యజమాన్యంవారే సర్దుబాటు చేసారట. ‘’

‘’సార్ ,ఇక్కడే  —‘’ఎవ్వరో కేక వేసి పిలవటం విని బైకు అపాను. ప్రభుత్వాసుపత్రి గేటు వద్దవున్నాను నేను. మా కర్మాగారంలో పనిచేసే ఇద్దరు ముగ్గురు నా  చుట్టూ  చేరారు.

‘’ఎలావుంది శర్మకి —‘’బైకు పార్కు చేసి  అడిగాను.

‘’ఎలావుంది అంటే —-‘’

‘’ఏమైందని  చెప్పరేం —?’’నా మనసు కీడు శంకించింది .

‘’ఏం చెప్పను ,సార్ ,’’ ఒకడు కళ్ళు వత్తుకొని అన్నాడు.

‘’పోనీ ,ఆ రోజు ప్రమాదం ఎలా జరిగింది ?’’

‘’ఆ రోజు రాత్రి —మరిగించిన గంధకం పంపు చేసే  పంపు పని చేయటం మానేసింది  సార్. ఎంత ప్రయత్నించినా స్టార్టు కాలేదు. జి.యం.గారు శర్మని తీసుకురమ్మంటే ఇంటికెళ్ళి తీసుకొచ్చాం. ఇంత వరకెప్పూడూ రాత్రి పూట  అతన్ని తీసుకురావలిసిన అవసరం రాలేదు. శర్మ ఎప్పుడూ పగలేగా పని చేసేది —‘’

‘’ఏమైందని చెప్పండి ‘’

‘’వస్తూనే పంపువద్దకు  పరిగెత్తాడు శర్మ. మరిగే గంధకం నిలువు చేసే టాంకు పైన వుంటుంది పంపు. దానిమీద వుండే పలక ఒకటి –పంపుదగ్గరదే  –ఎప్పుడో ఎవ్వరో తీసి వుండడం శర్మ గమనించలేదు. హడావిడిగా వెళ్తూ ఒక కాలు మరిగే గంధకంలో కి —‘’

‘’అమ్మ బాబోయి —‘’

‘’కాని గంధకం కాళ్ళకు  తగలలేదండి. వ మరిగించడానికి వాడే ‘’స్టీమ్ ‘’తగిలింది. మోకాళ్ళ దాకా కాలింది. ‘’

‘’ఏ గదిలో వున్నాడు ?’’

‘’నూరో నెంబరులో —‘’

ఒక ఉదుటున లోపలకి వెళ్ళాను. ఒక కుర్చీలో కూర్చుని బయటికి చూస్తునాడు శర్మ. ‘

“ ఒరేయి  ,శర్మా —-‘’

వాడు వెనక్కు  తిరిగి చూడలేదు. వెక్కి వెక్కి ఏడవటం వినబడింది.

‘’అన్యాయమై పోయానురా –నేను అన్యాయమై పోయానురా –‘’

‘’ఊరుకోరా –ఇప్పుడు ఏమైందని –ఒక నెల రోజుల్లో మళ్ళీ మామూలు అవుతావురా –‘’

ఒక నిమిషం మాట్లాడలేదు శర్మ. ఆ తరువాత అన్నాడు.

‘’ఒక సారి నా దగ్గరకి వచ్చి కిటికీనుంచి చూడరా –‘’

‘’ అక్కడ ఏముందిరా చూడడానికి  —‘’ నేను శర్మ దగ్గరకి వెళ్ళాను.

‘’అదిగోచూడు  ,ఆ కనబడేది బీచురోడ్డు కదూ –‘’

‘’అవును ‘’

‘’ఈ రోజు పున్నమి కాబోలు –పిచ్చెక్కిన సముద్ర కెరటాలు బీచులో నిలబడినవాళ్ళ పాదం క్రింత ఇసుకను లాగేస్తునాయి . పున్నమి వెన్నెల లో వెండి పూత పోసుకున్న సముద్రం —‘’

‘’అవునవును ‘’

‘’దూరంగా బెర్తు కోసం ఎదురు చూసే నావలు ,మన బ్రతుకులలా –అయ్యో చూడు ,ఆ చంటి పిల్ల రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతోంది. పరిగెత్తుకొచ్చే కారు క్రింద —-‘’

‘’ఏంటిరా ,ఈ పిచ్చి మాటలు —‘’

‘’నాకు అంతా బాగానే కనబడుతున్నాయి కదురా ‘’

‘’ఎవ్వరన్నారురా నీకు కనబడటం లేదని —‘’

‘’డాక్టర్ అన్నారురా నాకు రేచీకటి అని –రాత్రి పూట నాకు ఏది కనబడదని –అందుకే యాక్సిడెంటు జరిగిందని —‘’

నేను తుళ్ళి పడ్డాను.

‘’ఇది మెడికల్ కాలేజీ తాలూకు ఆసుపత్రి కదా –ఇక్కడ డాక్టర్ సర్టిఫికటు ఇచ్చేసారు రా –ఇక నాకు ఫాక్టరీ ఉద్యోగానికి అర్హత లేదట.ఇక ఫాక్తరికి రానవసరం లేదన్నారురా ‘’

నా గుండె తరుక్కుపోయింది –అంటే శర్మ ఇలా—బుర్ర పిచ్చెక్కినటైంది. గది బయటికి పరిగెత్తుకొస్తూ   అనుకున్నాను.

అవును ,మా కంపెని వారు కొత్త మందులు కనిపెడుతునారు !

***

LR-SWamy-240x300 –ఎల్. ఆర్. స్వామి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మొగుని రోగం !

పూరింట్లో తలుపుకడ్డంగా నీల్ల బాన , నవారు మంచం పెట్టేసి కుట్టుమిసను పట్టుకోని, బలంగా ఈడస్తా, యాడస్తా వుండాది  మల్లిక . ‘ముండాకొడుకు …ఆ పాడు సారాయి తాక్కుండా వుంటే ఎంత మరేదగా వుంటాడో … తాగినాడంటే అంత ఎదవై పోతాడు’ . పెండ్లైన మూడేండ్లు తాగేసొచ్చి దినామూ కొడ్తే గూడా యాపొద్దూ మల్లిక అడ్డం జెప్పలా . మత్తంతా దిగినాక మొగుడొచ్చి అడుక్కొంటే మూతి ముప్పై సొట్లు దిప్పి, నెత్తిన రెండు మొట్టి … నెత్తిన బెట్టుకునిందే గానీ, ఈదినానికి గూడా…వోన్ని ఒగ  మాట అనింది  ల్యా . సుట్టుపక్కలోల్లు మద్దెలో వొచ్చి మద్దిస్తానికి  కుచ్చుంటే గూడా మొగుడన్నేక  కొట్టడా … తిట్టడా  అని మరేదగా పొమ్మనే సిండాది  శానా తూర్లు . ఇప్పుడు యౌర్నన్నా పిల్సినా వోల్లింటి కల్లా తిరిగిమల్లి గూడా సూడరు . మీసావు మీరు సావండని తుపుక్కున మూసేసి పోతారు.

రెండ్నెల్ల నించి మొగుడ్నుంచి వొల్లు కాపాడుకోవాలంటే సచ్చేసావుగా వుండాది. ఎవురికన్నా సెప్పుకోవాలంటే మానంబోతా వుండాది. మొగుడూ పెళ్ళాలు కలిసేటప్పుడు జాగర్తగా వుండాలని పెద్ద డాకట్రు జెప్పినాడు. ఈడికేమో మందు లోపలికిబోతే వొళ్ళూ పై దెలవదు. బద్రంగా  లేకపోతే మొగుడికుండే  రోగం మల్లిగ్గూడ వొస్తుందని ఇవరంగా సెప్పినారు. అదేవన్నా సిన్నరోగమా. దుడ్డులేనోల్ల పాణం తీసేరోగం. మొగుడు కాలందీరిపోతే వుండే వొక బిడ్డిని ఎట్ట సమాలించాలో తెలీక అల్లాడిపోతా వుంది మల్లి. ఇంత మనేదలో వుంటే రాజుగాడికి ఈ వుపద్రం బట్టింది. సారాయితాక్క పోతే ఏ కబురైనా గెట్టిగా సెప్తే ఇంటాడు. తాగేస్తే ఇగ అంతే. నోరిప్పితే కొట్టనొస్తాడు.  మొగుడంటే యిష్టం లేగ్గాదు. బతుకంటే బయిం బట్టుకునింది మల్లికి. ఈపూట వోడ్ని పక్కలోకి రానీను గాక రానీనని వోట్టేసుకొని, బొళువుగా  వుండే మిసన్ని తలుపుకడ్డంగా ఈడ్సి పైటకొంగు తో కారే సెమటని తుడ్సుకుంట కింద కుచ్చోని అట్టా కన్నుమూసింది మల్లి.

 ***

సమర్తైనాక  రెండేండ్లు గూడా మల్లిక అమ్మగారింట్లో ల్యా . ఆబిడ్ని మల్లయ్య మావ కొడుక్కిచ్చి  ఉండూర్లోనే  పెండ్లి జేసేసినారు . రాజు దిట్టంగా ఉంటాడు . ముగ్గురి తిండి  వొకడే తింటాడు … ముగ్గురి పనీ వొకడే జేసేస్తాడు. కాలు కొంచెం అవుడు. కుంటోన్ని నేను జేసుకోనని మల్లి మొండికేస్తే ,  “గుడ్డి పోగోర్తాది..కుంటి రాగోర్తాది” అని బలవంతాన మల్లిని పెండ్లికి వొప్పించినారు. అవుడైతే ఆస్తులు కూడబెడ్తాడని పెండ్లైన ఆర్నెల్లు  మొగుడు మల్లిని వొదిలి పక్కకుబోలా. కడుపులో కొడుకు పడ్నాకనే మళ్ళీ రాజు పనికిబోయిండేది. ఈతూరి సేద్దిగం వొదిలేసి శానా దుడ్డు వొస్తాదని లారీ పనికిబొయ్ నాడు. వొగ తూరి  లారీ  ఎక్కితే మల్లీ రెండ్నెల్లు ఐనాంకనే పెడ్లాం బిడ్లను జూసేది.

లారీ పనికి బొయ్ నాక  మొదల్తూరి వొచ్చినప్పుడు బాగనే వుణ్ణాడు. దుడ్డు తెచ్చిచ్చి అంగిడికి  బొయ్యి ఒగ కోక దెచ్చుకో మన్నాడు . లారీ పని బాగుండా దని మల్లి గూడా సత్తెమ్మకు పొంగిలి బెట్టుకోనొచ్చి వూరంతా పెసాదం తలారొంత ఇచ్చి మొగుడుణ్ణె  పదైదు దినాలూ పండగ జేసింది . వోడు మల్లీ పనికిబోతాంటే దొక్కలోనుంచి దుక్కమోస్తాంటే గూడా యిన్ని నీల్లు బోసుకోని మింగేసి, బద్దరంగా పొయ్యిరమ్మని  లారీ యెక్కించి ఉత్త సేతుల్తో  ఇంటికొచ్చేసింది.

నిండునెల్లు  వొచ్చేటప్పిటికి మొగుని మాట వొదిలేసి సీమంతం  జేసుకొని అమ్మగారింటికి ఎలబారి పొయ్యింది. అటక మిందుండే కొయ్య వుయ్యాల దింపిచ్చింది . నూలుకోకలన్నీ జవిరి వైరుబుట్టిలో ఎత్తి పెట్టింది. పెద్దిల్లు పేడతో అలికిచ్చి, సుబ్బరంగా తెల్లసున్నం పుయిపిచ్చింది. మొగబిడ్డి పుడ్తిందో … ఆడబిడ్డి పుడ్తిందో అనుకుంటా నొప్పులకోసరం ఎదురుసూస్కుంటా కుచ్చునింది .

ఆరోజు మల్లిక్కి బాగా గెవనం వుండాది. తెల్లార్తో నుండి కొంచిం వొంట్లో నలతగా వుణ్ణిన్ది . సగించకుంటే గూడా కడుపులో బిడ్డి కోసరం కొంచిం వుప్పిండి దినేసి గడపమింద కుచ్చోని ఎగదీసుకుంటా వుణ్ణిన్ది. కడుపులో నొప్పి మొదులయ్యే టప్పిటికి  మంత్రసాన్ని తొడుకోనొచ్చింది వోళ్ళమ్మ. దీపం గూడులో కాయితం కింద ఎత్తిపెట్టిన బ్లేడు, ఉడుకు నీళ్ళు, పాత నూలుకోకలు మంత్రసానికి ఎత్తిచ్చింది. తొలి కానుపాయ…ఒగ రాత్రి ఒగ పొగులు అల్లాడిపొయ్యింది నొప్పుల్తో. ఆస్పిటల్ కి పోదారంటే మొగుడింట్లో లేకపాయె. మాలపల్లంతా ఒగచేతి మింద కానుపులు జేసిండే మంత్రసానిగ్గూడా బిడ్డి అడ్డం దిరిగి పోయిన్దేవోనని కాల్లూ సేతులూ ఆళ్లా. ధనియాల కసాయం దాపిచ్చి…కడుపుకు ఆందెం రుద్ది ఎట్టో వొగట్ట పువ్వాలుండే మొగబిడ్డిని బయటకు దీసేసింది. ‘నాబట్ట బిడ్డె …ఎంత ఏడిపిచ్చినాడు వోల్లమ్మను అనేసి ..మేయ్…ఇప్పుడే నీకొడుకు ఇట్ట ఏడిపిస్తావుండాడు …పెద్దయితే ఇంగేం జేస్తాడో’ అంటా వక్కాకు లో బెట్టిచ్చిన నూర్రూపాయలు దీసుకొని మంత్రసాని నవ్వుమొగం తో ఎలబారిపొయ్యింది.

ఇంత జరిగినా మొగునికి ఇవేమీ దెలీలా… పురిటికి గూడా రాలా.  ఇంత కస్టంలో మొగుడు పక్కన లేడని మల్లి శానా తూర్లు ఎవురికీ దెలీకుండా ఏడ్సుకునింది. పక్కలో బిడ్ను జూసుకుని మొగుని మింద కలవరాన్ని తగ్గిచ్చుకునింది. మల్లెప్పుడో ఒగనెలకు వొచ్చినాడు రాజుగాడు.  వొల్లంతా కాలిపోతా వుంది. వారం దినాల్నుంచి జొరమని జెప్పినాడు. ఏం దిన్నా వాంతులు ..బేదులు. లారీ పనికి బొయ్యేది మొదులు బెట్నాక గొంతుదాక సారాయి దాగే పని బట్నాడు. వొళ్ళు వూనమైపోతే గూడా సారాయి అంగిడికి బొయ్యేది ఇసిపెట్లా.  పక్కన పెద్ద పల్లిలో వుండే అరెమ్పీ డాకట్ర దెగ్గిరికి పొయ్యి సూదేసుకొని వొస్తే కొంచిం కుదురుకునింది వొల్లు.

అట్ట వొచ్చినోడు మూడ్నెల్లు ఇల్లు వొదల్లా.. కొడుకుతో ఆట్లాడుకుంటా వుండిపోయినాడు. మొగుడుంటే వొగపక్క సంతోసంగుంటే గూడా వోని తాగుడు జూస్తావుంటే మల్లిక్కు బయంగా వుండాది. సంపాయిచ్చుకొని వొచ్చిందంతా ఈమారి తాగేస్తా వుండాడే అని మనేద బట్టుకునింది. దాంతో బాటు రాత్రయ్యిందంటే వొల్లు బాగాలేదంటే గూడా యినకుండా పక్కకు రమ్మని ఒకటే సతాయిస్తావుండాడు. రెండో నెలకే ఈతూరి కడుపు నిలిచిపొయ్యింది. సంకలో బిడ్డి సంకలో ఉండంగానే కడుపులో ఇంగోటి. లారీ వోనరు పిలస్తావుండాడని కబురొచ్చినాక  వొదల్లేక వొదల్లేక యలబార్నాడు రాజుగోడు. బిన్నా వొస్తానని చెపేసి పొయ్ నాడు. వోడు పోతే సాలని సూసిన మల్లి కంట్లో నీల్లు రాలా ఈతూరి. మొగుడు అట్టబోగానే పక్కూర్లో వుండే ఆరెమ్పీ డాకట్రు దగ్గిరికిబొయ్యి కడుపుదీయించుకొని వొచ్చేసింది. మొగుడికివేమీ జెప్పలా.

పొయ్ నోడు …పొయ్ నోడు ఈ తూరి పదైదు దినాలు గూడా గాకనే తిరుక్కో నొచ్చేసినాడు. మళ్ళీ వొల్లు బాగలా. ఇట్ట మూడుదినాలకోసారి  పడవబడి పోయ్యేవోడి తో పనికి పంచేటని వోనరు ఇంగోసారి పనికి రావొద్దని ఇంటికొచ్చి ఎచ్చరించి  పొయినాడు. సారాయి  దాగేది నిలిపైమని ,  ఆ దరిద్దరపు తాగుడే వొల్లు పాడుజేసేస్తా ఉండాదని మల్లి రంపు బెట్టుకునింది. పనికి బొయ్యేదాని గురించి రాజుగానికిప్పుడు మనేదే లేదు. తెల్లారి లేస్తే వంక కాడుందే సారాయి అంగిడికి బొయ్యేది…తాగేసొచ్చి నోటికి ఎంత మాటొస్తే అంత మాటా అనేది… బండ మాట్లన్నీ మాట్టాడుకుంటా అరుగుమింద గుచ్చోనుండేది …మత్తు దిగిపోయినాక మల్లీ సందేళ కాడ ఇంగోతూరి సారాయంగిడికి బొయ్యొచ్చేది…వూరంతా రాజుగాడి మొకాన కారిమూస్తే గూడా వాడికి లెక్కలేకుండా వుండాది.  దీనికితోడు మూడూమూడ్రోజులకు జొరమొకటి. కొడుకుని అమ్మగారింటి దగ్గిర వొదిలేసి కూలికి బోతావుంది మల్లి.

శనారం మద్దేనం పినపెద్ద ఇచ్చిండే ఆర్నూరు రూపాయిలు దీస్కోని, మొగున్ని దొడుకోని తిరప్తి లో వుండే రుయాస్పత్రికి ఎలబారింది. వొల్లు కొంచిం కుదురుకుంటే ఎట్టోకట్ట పనిలో బెట్టేయాలని జూస్తావుంది మల్లి. ఆసుపత్రిలో రగతం పరీచ్చజేసేస్తే ఏం రోగమొచ్చిందో తెల్సిపోతుందని  డాకట్రు జెప్పినాడు. అట్నే అని రగతం ఇచ్చేసి, రెండ్రోజులు ఆసుపత్రి లోనే వుండిపోయినారు. మంగలారం కాయితాలు జూసి డాకట్రు జెప్పిన మాట ఇన్నాక మల్లికి నోట్లో మాట రాలా. అట్నే యాడస్తా కూలబడి పొయ్యింది. రాజుగాడు మాత్తరం ‘ యాడవద్దు మే … ఏం గాదులే. ఎప్పుడో ఒగప్పుడు పోవాల్సిందే గదా .. నా టయుము ఐపోయిందనుకో..పైకి లెయ్ ‘ అంటా జబ్బ బట్టుకోని మల్లిని పైకి లేపినాడు. వోల్లిచ్చిన మందులు తీసుకొని నెత్తీనోరూ కొట్టుకుంటా….నా బతుకు ఎందుకిట్టా అగ్గిబడి పోయిందాని యాడస్తా ఇంటికొచ్చింది . అందురూ… “ఆస్పత్రికి పొయ్యి వోచ్చినారు గదా? ఏవిజెప్పినార”ని అడగతా వుంటే సెప్పలేక మల్లికి బేజారుగా వుండాది.  నా మొగుడికి ఎయిడ్సని ఎట్ట జెప్పుకునేది. సెప్తే కడుపుకిన్ని నీల్లుబోస్తారా ఎవురైనా?

Mogani Rogam katha illustration

రోగం ఏందో తెలిసిపోయ్యినాక పదైద్దినాల నుంచి రాజుగాడు గొమ్మునే వుంటా వుండాడు. అప్పుడప్పుడు మల్లితో, కొడుకుతో కుచ్చోని యాడస్తా ‘నేను బోతే ఎట్ట బతకతారో!’ అంటా కుమల్తా ఉంటాడు.   మాయదారి జబ్బు రానన్నా వొచ్చింది… మనిషి మారిపొయ్యినాడులే అనుకునేలోపల వాడికి ఇంకో రోగం బట్టుకునింది. ‘నేను సచ్చిపోతే నాపెళ్ళాo ఎందుకు బతకల్ల? ఆ బిడ్డె ఇంగ ఎవుర్నన్నా పెండ్లి జేసుకునేస్తిందా? నేను లేనప్పుడు  వాల్లెందుకు వుండల్ల?’ మల్లి నీల్లు పట్టకచ్చే దానికి కొళాయి కాడికి పొయ్యినా, ‘ఎవుడితో ఏం మాట్లాడేస్తా వుందో’ అని బయిపడతా ఆబిడ్డికి కాపలా గాస్తా వుండాడు. ఎవుర్తో మాట్లాడ్నా,’ వాల్తో నీకేం పని?’ అని మల్లిని తిడ్తా కొడ్తా వుండాడు.

రోగం యాడ అంటుకునేస్తిందో అని రాత్తిరైతే దూరదూరంగా తిరగతా వుండే మల్లిని జూస్తే వాడి కోపమింకా ఎక్కువైపోతా వుండాది. మామూలుగా ఉండేప్పుడు కొడ్తే ఊరంతా వొగిటై పోతిందని బయిపడి, తాగేసొచ్చి కొడ్తా వుండాడు. ఈరోజెట్టయినా మల్లిని లొంగదీసు కోవాలని వాడుగూడా వొట్టేసుకున్నాడు.

తలుపులు కొట్టీ కొట్టీ రాజుగాడి బలం సచ్చిపోతా వుండాది. దాలముందరం కాడనే నిద్దర బొయ్యినాడు. తెల్లార్నీ … మొగుడి కతేందో జూద్దారని మల్లి గూడా నడిజాముకాడ నిద్దరబొయ్యింది.

  టయిము నాలుగైంటింది. ఈపు మింద ఎవురో కొట్టినట్టు నిద్దర మత్తు వొదిలిపోయ్యింది రాజుగాడికి. మెల్లిగా పైకి లేసి తలుపుసందులో నుంచి ఇంట్లోకి తొంగి సూసినాడు. మల్లి మంచి నిద్దర్లో ఉండాది. గెడేసేసి తలుపుకడ్డంగా సామాన్లు పెట్టేసిండాది. సిన్నంగా తలుపు పక్కన్నే ఉండే గూట్లో కాలుబెట్టి గుడిసె పైకి ఎక్కినాడు. మెల్లిగా మనిసి పట్టేంత బోద ఎత్తి పక్కన పెట్టేసి, ఇంట్లోకి దిగి మల్లిమింద పడ్నాడు. మల్లి తప్పించుకునేదానికి వోడు సందీలా. వాడ్నించి కాపాడుకోను తలుపుకడ్డంగా పెట్టిన సామాన్లన్నీ ఆరోజు మల్లి పాణం మీదికి తెచ్చినాయి. వోడ్ని కొట్టి, తిట్టి, సాపనార్తాలు బెట్టినా లొంగిపోక తప్పలా మల్లికి.

***

ఇంత జరిగిపోయ్యినాక బతికేం జెయ్యాలని గన్నేరు పప్పు తినేసి సచ్చిపోదారని జూస్తే కొడుకుని జూసన్నా దైర్నంగా ఉండమని వోల్లమ్మ పోరుబెట్టుకునింది. ఇప్పుడు రాత్తిరైతే మల్లికి బయిం లేదు.  మొగోడంటేనే కడుపుగాల్తా వుండాది. మొగుడ్నే గాదు…కొడుకుని జూస్తే గూడా. ఇట్టాంటి కొంపలో పెద్దోడై వాడెంత మంది కొంపలు కూలస్తాడో అని. మొగోడు కనిపిస్తే సాలు, దొరికిండే రాయి ఎత్తుకొని పిచ్చిదాన్లా తరుమ్కుంటా వుండాది.

ఇంగోపక్క ఆరోజు రాత్తిరి నించీ రాజుగాడికి నెత్తినుండే మూటబొళువు దిగిపోయినట్టుగా వుండాది. వొంట్లో ఉండే రోగం అప్పుటికప్పుడు మానిపోయినట్టు తేలిగ్గా వుండాది. ‘ఇప్పుడు నాపెళ్ళాం యాడికి బోతింది, ఎవుర్తో తిరిగితిందో జూస్తా…నేనెన్ని దినాలు బతికితే అన్ని దినాలు అది గూడా నాతో వుంటింది. నేను సస్తే నాతోగూడా సస్తింది. పిల్లోడిని  వోల్లవ్వ మొగోన్ని జేస్తింది’ అనుకుంటా వుండాడు. ఇన్నిదినాలూ వోడికుండే రోగాన్ని దాసిపెట్టుకొన్నోడు ఇప్పుడు పెళ్ళాం కొచ్చిన రోగం గురించి తోటి ఈడోల్లందరికీ జెప్పుకుంటా వుండాడు.

శెప్తేనే గదా పెళ్ళాం గురించి అందురికీ తెల్సేది…ఎవురూ దాని జోలికి రాకుండా వుండేది! అది సచ్చిపోయినా, పిచ్చిదై పొయ్ నా సరే… దానికి నా తర్వాత, నేను లేని బతుకక్కరలేదు.

jhansi papudesi    —ఝాన్సీ పాపుదేశి

(జర్నలిజం చదివి, తిరుపతి రిపోర్టరుగా ఆంధ్రజ్యోతి దిన పత్రికలో పనిచేస్తూ చివరిదాకా ఇదే నా వృత్తి అనుకున్న సమయంలో అనుకోకుండా  రిపోర్టరు ఉద్యోగాన్నే కాకుండా, సొంత రాష్ట్రాన్ని కూడా వొదిలి బెంగుళూరులో స్థిరపడాల్సి వచ్చింది.  వృత్తి ఏదైనా ప్రతి రచనకో ఆత్మ సంతృప్తిని పొందుతూ,  రాయడం ఆపకూడదన్న పట్టుదలతో రాస్తున్నా. బ్లాగుల్లో రాసుకుంటున్న నేను కొందరు మిత్రుల ప్రోత్సాహంతో ఇంటర్నెట్ పత్రికలకు పంపడం మొదలుపెట్టా. నా స్వస్థలం చిత్తూరు జిల్లా అరగొండ గొల్లపల్లె. మాండలికాలు మర్చిపోయి పుస్తక భాషకు మారిపోతున్న సమయంలో చిత్తూరు మాండలికంలో రాయాలన్న ఆలోచన వచ్చింది. అచ్చంగా నా వూరి భాషలో రాస్తున్నా. మహిళగా పుట్టినందుకు తోటి మహిళల జీవితాల్ని అందరితో పంచుకోవాలని అనుకున్నా. తొలి కథ “దేవుడమ్మ” సారంగ లోనే వచ్చింది.

email : papudesijc @gmail.com)

 

పిడికెడు పక్షి..విశాలాకాశం

417671_580561545289734_1052452842_n

పిడికెడు పక్షి.

తలపైకెత్తి చూచింది.యాభైరెండు ఫీట్ల ఎత్తైన దేవదారు వృక్షం పైనున్న తొర్రలోని తన గూడునుండి.విశాలమైన ఆకాశం నీలంగా..నిర్మలంగా కనబడింది.

కొత్తగా మొలచిన రెక్కలు.ఎంకా ఎగరడం తెలియని ఉత్సుకత.లోపల ఏదో తెలియని ఉద్వేగం.

చిన్ని కళ్ళతో తల్లిముఖంలోకి చూచింది.

తల్లి పక్షి కళ్ళనిండా శూన్యం.అభావం నిండిన ఒట్టి ఖాళీ.

తల్లిపక్షి కిందికి చూచింది.చాలా కింద,నేలపైన మగపక్షి సిద్ధంగా ఉంది.మెత్తని ఈకలు,పీచు,గడ్డి,ఆకులు..అన్నీ అమర్చి ఎదురుచూస్తోంది.పిల్లపక్షి ఒకవేళ ఎగరలేక కిందపడితే గాయపడకుండా ఉండడానికి.

తల్లి బిడ్డపక్షి ముక్కులోకి తన ముక్కును జొనిపి ముద్దాడింది.

రెండురకాల కిచకిచల ధ్వని.ఎడబాటు..వియోగం..బాధ..దుఃఖం..అన్నీ ఆ చిరుధ్వనిలో.

తల్లి తన స్వరసంకేతంతో కింద ఉన్న మగపక్షిని హెచ్చరించి అకస్మాత్తుగా పిల్లపక్షిని కిందికి నెట్టేసింది.

శిశుపక్షి కిందికి జారుతూ..ఉక్కిరిబిక్కిరౌతూ..పల్టీలుగొడ్తూ..అప్రయత్నంగానే అప్పటిదాకా మొలిచిన నునురెక్కలను విప్పి..చాచి..రిక్కించి.,

ఎగిరింది. మొట్టమొదటిసారిగా.

pidikedu

ఆశ్చర్యపోయిందది.తనింకా కిందికి జారిపోవడంలేదు.కాగా,పైకిలేస్తోంది.పైకి..ఇంకా పైపైకి.గాలిలో తేలిపోతూ.చెట్ల గుంపుల్లోనుండి,అడవిలోనుండి,నదులపైనుండి..విశాలనీలాకాశంలోకి.

చుట్టూ చూచింది.అన్నీ మేఘాలే.నీలిరంగు.చల్లగా.బంగారురంగు కాంతి.ఎటుచూచినా అనంతమైన నీలి.నిర్మలంగా.

పులకించిపోయింది పిడికెడంత పక్షిపిల్ల.

శిశుపక్షి సువిశాల అనంతాకాశాన్ని ఈదుకుంటూ పరుగెత్తుతోంది..మహానందంగా..పులకిస్తూ..గగనాన్ని జయిస్తూ.

తల్లిపక్షి అలా శూన్యంగా చూస్తూనేఉంది ఎగిరిపోతున్న బిడ్డ కనబడుతున్నంతసేపు.కనుమరుగయ్యేదాకా.

రెక్కలు రావడం..అందర్నీ విడిచి ఎగిరిపోవడం..జీవపరిణామంలో ఒక అతి సహజభాగంగా గుర్తిస్తూ.,

తల్లిపక్షి చెట్టు గూడులో మిగిలి.,

 

*                                                 *                                                                  *

 

తల్లిదండ్రులు లేని పిల్లలను అనాధలంటారుగదా.

అనాధలుకాని పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నదేమిటి.సంరక్షణ.ఆలనాపాలనా.ఇలా జీవించు.ఇలా ఆలోచించు.ఇవి విలువలు.ఇవి కావు.ఇది తప్పు.ఇది సరియైంది.ఇది నైతికం..ఇది కాదు.ఈ  దారిలోవెళ్తే బాగుపడ్తావు..ఈ దారిలోవెళ్తే జారిపడ్తావు.ఇవన్నీ చెప్పేవాళ్ళు తల్లిడండ్రులుగదా.పిల్లలకు ఇవేవీ చెప్పనివాళ్ళుకూడా తల్లిదండ్రులేనా.బాధ్యతారాహిత్యంతో పిల్లలను బలాదూర్ గా జన్నెకిడిచిపెట్టే తల్లిదండ్రులను సమాజం ఎలా అర్థంచేసుకోవాలి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమంటే ఒక కుటుంబానికి తల్లిదండ్రులవంటిదికదా.కుటుంబంలో పిల్లలు ఏమి చదవాలి.ఎక్కడ చదవాలి.ఎలా చదవాలి.ఏ వృత్తిలో స్థిరపడ్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది..ఇవన్నింటినీ   మార్గదర్శనం చేస్తూ తన ప్రజలను సరియైన దిశలో నడిపిస్తూ ప్రగతిపథంలో ముందుకు తీసుకుపోవలసిన గురుతర బాధ్యత ప్రభుత్వాలదేగదా.

కాని ఏం జరుగుతోందిక్కడ.

అసలు ప్రజలను పట్టించునే నాధుడున్నాడా.కనీస ప్రజావసరాలేమిటి.విద్య,వైద్య,ఉపాధి వంటి కీలక రంగాల్లోనైనా కనీస శ్రద్ద ఉందా ఏ నాయకుడికైనా.లక్షలకు లక్షలమంది యువకులు ఒట్టిగా బేవార్స్ గా రోడ్లవెంట తిరుగుతూ మెలమెల్లగా అసాంఘికశక్తులుగా మారుతూంటే చూచి పట్టించుకునే వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఉందా.అసలు ప్రజాసంక్షేమ దృష్టితో ఆలోచించి జనాన్ని కన్నబిడ్దలవలె కనీసవసతులతో అభివృద్దిచేయాలనే సంకల్పం ఉందా ఏ ఒక్కరికైనా.పూర్తిగా నీతిహీనమైపోతున్న ఈ వర్తమాన రాజకీయ వ్యనస్థను ఎవరు ఎలా సరిచేయాలి.

ప్రజలు అనాధలౌతూ,పాలకులు కోట్లకు పడగలెత్తుతూ,ఎల్లెడలా బాధ్యతారాహిత్యం విషవలయమై ఆవరించిఉన్న ఈ ప్రస్తుత సంక్లిష్ట సందర్భంలో తమతమ విధులను నిర్వర్తించవలసిన వాళ్ళు నిర్వర్తించనపుడు..ఏంచేయాలి.

pidikedu-image

     ఎవరోఒకరు..ఇపుడే ఇపుడు అని చొచ్చుకురాకుంటే ఈ అరాచక విధానం ఇలాగే కొనసాగుతుందిగదా.

ప్రతి ప్రజాప్రతినిధీ ఒక వ్యాపారి.ప్రతి అధికారీ ఎవరో ఒకరికి భృత్యుడు.ప్రతి పౌరుడూ ఒక పరాన్నభుక్కు.ఎవరికందిందివాడు ఎగబడి ఎగబడి దోచుకుతినడమే.అంతా నిస్సిగ్గు ప్రవర్తన.నిర్భయమైన విచ్చలవిడి దోపిడీ.అంతా బహిరంగ దురాక్రమణలే.అన్నీ మాఫియాలు.భూ మాఫియాలు.ఇసుక మాఫియాలు.విద్యారంగ మాఫియాలు.మీడియా మాఫియాలు.మెడికల్ మాఫియాలు.వెరసి ప్రజాజీవన రంగాలన్నీ మాఫియాలే.  ప్రజలేమో ఏది ఉచితంగా ఇస్తే దాన్ని ఎగబడి తీసుకునేందుకు సంసిద్ధులౌతూ..కలర్ టి వి లు,లాప్ టాప్ లు,గ్రైండర్లు,మిక్సీలు,ఉచిత బియ్యం.ఉచిత విద్యుత్..ఏదైనా.

ప్రజలకు ఏది అవసరమో అది చెప్పక,ఏది అవసరమో అది చేయక,ఏవి అవసరంలేదో వాటినిమాత్రం చేయిచాపితే అందేంతదూరంలో ఉంచి..చుట్టూ ఒక మాయ.ఒక ఉచ్చు.ఒక మత్తు.

ప్రతి ఇంట్లో ఒక దీర్ఘచతురస్రాకార రూపంలో ఒక ఉరిత్రాడు.అది టి.వి.జనాల్ని బానిసల్ని చేసి ముఖ్యంగా ఆడవాళ్ళ పని గంటల్ని బుగ్గిపాలు చేసేది.మనుషుల్ని పశువులవలె కోట్లక్కోట్లకు వేలంవేసి కొని ‘క్రికెట్’ పేరుతో లక్షలమంది యువజనాన్ని అనుత్పాదక శక్తులుగా మారుస్తూ ఒక నిరంతర విషక్రీడను ఈ దేశప్రజలపై రుద్దుతూ ప్రభుత్వాలే జూద వ్యసనాన్ని నల్లమందు వాడకాన్ని అలవాటు చేసినట్టు అందిస్తూ,ఏ టి వి చానెల్ ను చూసినా ఒంటిపై బట్టలతో రతిక్రీడ సలుపుతున్న నీచ భంగిమలతో..జుగుప్సాకరమైన శృంగార ప్రసారాలతో..దిక్కుమాలిన నిరంతర రాజకీయ చర్చలతో,ప్రసారాలతో..నీతిహీనమైన రాజకీయ వ్యభిచార ప్రస్తావనలతో..ప్రజలను తప్పుతోవపట్టించే తాయెత్తుల,రుద్రాక్షల,కేశాల,దేవతుల వ్యాపార ప్రకటనలతో..డబ్బిస్తేచాలు ఏ ప్రకటననైనా ప్రసారం చేస్తాం అన్న బాధ్యతలేని దుర్మార్గ చానెల్స్..ఇవన్నీ అవసరమా అసలు ఈ ఎనభైశాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన జనమున్న దేశంలో.

అన్ని రంగాల్లోనూ అతి.మనుషులకు అతి స్వేచ్ఛ..అతి ప్రవర్తన..అతి విశృంఖలత్వం..పిల్లలపై అతి గారాబం.అతి సంపాదన దాహం..అతి అధికార దాహం.అతి విజృంభణ..ఈ దేశంలో..ఎక్కడో ఏదో పట్టాలు తప్పుతున్న స్పృహ.శ్రీశ్రీ చెప్పినట్టు ‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్దులౌతున్నట్టు ‘ అనుభవాలు.పూర్తిగా మృగ్యమౌతున్న దేశ స్పృహ..దేశభక్తి..పౌర,సామాజిక బాధ్యతల చింతన.అసలు ఏ ఒక్కరిలోనూ కానరాని ‘అందరికోసం ఒక్కడు..ఒక్కరికోసం అందరు ‘భావన.ఎలా.?

ఎవరో ఒకరు ముందుకు రావాలి.ధైర్యంగా ముందుకు దూకి పరిస్థితుల్ని చక్కదిద్ది ఒక నూతన ఉజ్జ్వల నాయకత్వంతో మళ్ళీ కొత్త సమీకరణాలను రూపొందించి కొత్తదారిని వేయాలి.

అందుకే..ఈ సమావేశం.సరికొత్త ప్రయోగం.తప్పుచేస్తున్న మనిషిని నిలదీసి సమాజమే ప్రశ్నించడం ప్రారంభిస్తున్న ఒక కొత్త దిశ.

రాజరాజనరేంద్రాంధ్ర గ్రంథాలయం.కుర్చీలో నారాయణ.పద్మభూషణ్.కవి.తన కవిత్వంతో గత నలభయ్యేళ్ళుగా ప్రజలను సమీకృతం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రజాకవి.ఒకనాటి స్వాతంత్ర్య సమరయోధుడు.ప్రక్కన అటు..ఇటూ ఇంకో ఐదుగురు సచ్ఛీలతను కలిగిన నిష్కలంక రచయితలు.అందరికీ ఆదర్శనీయులు .తనకంటూ స్వంత ఆస్తి ఏదీ లేనివారు  .

ప్రజలచే ఎన్నుకోబడని శాసకుడు రచయిత..అని ప్రవచించే శుద్దమానవుడు.

వారంక్రితం ఒక ప్రజా సంఘటనను ఏర్పాటు చేశాడు  నారాయణ .పదిమంది రచయితలు..ఐదారుగురు ప్రముఖ పత్రికా విలేఖరులు..మూడు శక్తివంతమైన టి వి చానళ్ళు..ముందు విజ్ఞులైన ప్రజలు.ప్రత్యేక ఆహ్వానితులుగా కలెక్టర్.ఎస్పీ.ఇప్పుడు విచారించే సమస్య తాలూకు ప్రభుత్వ అధికారులు.ఎస్ ఇ రోడ్స్ అండ్ బిల్డింగ్స్..క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్..మొదలైనవాళ్ళు.

రెండురోజుల క్రితం చింతలపల్లి దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అకస్మాత్తుగా కుప్పకూలి అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అప్పటికప్పుడే మరణించారు.  ఆగ్రహోదగ్రులైన ప్రజలు గుమిగూడి చేతికేది అందితే దాంతో విధ్వంసం సృష్టించారు.అక్కడున్న కాంట్రాక్టర్ తాలూకు యంత్రాలన్నింటినీ నాశనం చేశారు.వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి..తర్వాత అంతా మామూలే.కాంట్రాక్టర్ తానే పోలీసులకు లొంగిపోవుట..కోర్ట్ కేసు.రిమాండ్..పత్రికల్లో సంతాప వార్తలు.లోకల్ రాజకీయ నాయకుల సందర్శనలు.ఎక్స్ గ్రేషియా హామీలు..విచార ప్రకటనలు.

ఒక వారం తర్వాత అందరూ..అంతా మరచిపోయి..ఎవరిపనుల్లో వాళ్ళు.ఎవరి పరుగుల్లో వాళ్ళు.

సద్దు మణిగినతర్వాత..కాంట్రాక్టర్ మెల్లగా కలుగులోనుండి ఎలుకవలె..బెయిల్ పై విడుదలై.,

అప్పుడందింది ప్రజాకవి నారాయణ పంపిన ‘ప్రజావేదిక ‘పిలుపు కాంట్రాక్టర్ దేవసహాయానికి.

ప్రజావేదిక..పిలుపంటే జనశాసనంగా రూపొందించాడు నారాయణ.ఎలా అంటే..పిలుస్తున్నవాళ్ళు రవ్వంతకూడా మచ్చలేని నిఖార్సయిన మనుషులు.రచయితలు.రచయితలంటే ఒట్టి ఆదర్శాలు రాసి మరిచిపోయి ఆచరణలో ఎక్కడికో పారిపోయే దుర్మార్గులుకారనీ,మానవత్వానికి ఒక నమూనాగా నిలువవలసిన ఆదర్శమానవులనీ,అక్షరసేనానులనీ నిర్వచించి కూర్చాడు నారాయణ అటువంటి వ్యక్తులను ప్రత్యేకంగా ఎంపికచేసి.వాళ్ళందరికీ వాళ్ళకున్న నైతిక వ్యక్తిత్వమే ఎనలేని బలం.వాళ్ళకు తోడుగా శక్తివంతమైన మీడియా.ప్రెస్.పిలుస్తే రాకుంటే మర్నాడు ప్రజళ్ళోకి ఈ ఉల్లంఘనను నేరంకింద పరిగణించబడి నిందితుడు దోషిగా ఋజువగుట.మీడియాద్వారా సమాజంలో ఇజ్జత్ పోవుట.పరువు పోతుందని భయం.

నారాయణకు తెలుసు మనిషిని లొంగతీసే శక్తి కేవలం భయానికే ఉందని.

సామాజిక నేరాలను చేస్తూ,కోట్లకొద్ది ప్రజా ధనాన్ని స్వాహాచేస్తూ నేరస్థులు తప్పించుకు తిరుగుతున్నారంటే దానిక్కారణం ఆ నేరస్థున్ని ప్రజలమధ్య ఋజువుల్తోసహా నిలబెట్టి పశ్చాత్తాపపడేట్టు చేయకపోవడమే.ఈ దేశంలో ఒక్క నేరస్తుణ్ణి పట్టుకుని నిలదీస్తే వానితోపాటు ఇంకో పదిమంది నేరస్థులు బయటపడ్తారు.దాన్ని ఒక్కసారి ధైర్యంగా బట్టబయలు చేయగల్గుతే పరువు భయంతో ప్రతివాడూ తన నడవడిలో మార్పుతెచ్చుకుంటాడు.అదీ నారాయణ చేయదల్చుకున్న చికిత్స.

కాగా..ప్రజావేదిక పిలిచిన తర్వాత ఏ అధికారైనా హాజరుకాలేదంటే..అతనిక్కూడా ఏదో పాత్ర ఉందని జనమనుకుంటారని భయం.వణుకు.ఆ స్థితిని సృష్టించాడు నారాయణ.

ప్రజావేదిక ఏ శిక్షా వేయదు.కేవలం నేరాన్ని అంగీకరింపజేసి తలవంచుకునేలా చేసి బుద్ది చెబుతుందంతే.ఒక్కసారి ప్రజావేదికపైకెక్కినవాడు వీపుపై ‘దోషి ‘ ముద్రను వేయించుకున్నట్టే.ఎదురుతిరిగితే పత్రికలూ,మీడియా ఏకి పారేస్తాయి.దానికితోడు ‘సమాచార హక్కు ‘చట్టం కింద సంపాదించిపెట్టుకున్న వివరాలు ప్రశ్నించబడే మనిషిని గుక్కతిప్పుకోకుండా పరేషాన్ చేసి వదుల్తాయి.మనిషిని ‘పరువు ‘అనే సున్నితమైన శిక్షతో పరివర్తింపజేయుట.

ప్రజావేదిక..స్థాపనప్పుడే చెప్పాడు నారాయణ..తమ సంస్థ లక్ష్యం ప్రజాహక్కులకూ,ప్రజాధనానికి కాపలాకుక్కలా ఉండడమేనని.

కుక్క దొంగను చూడగానే మొరుగుతుంది.కండను పట్టి  చెండాడుతుంది. అంతే.

*                       *                          *

“దేవసహాయంగారూ చెప్పండి..ఎందుకిలా..పదిహేను కోట్ల ఫ్లైఓవర్ ప్రాజెక్ట్..పూర్తికాకముందే కూలిపోవుట..ఇద్దరు వ్యక్తుల నిండు ప్రాణాలు పోవుట.తప్పు చేసినందుకు మీకేమైనా పశ్చాత్తాపముందా..మీ ప్రాజెక్ట్ తాలూకు వివరాలన్నీ సమాచార హక్కు చట్టం కింద సేకరించినవి..ఇవిగో..ఇక్కడున్నాయ్.చెప్పండి.”

దేవసహాయం మౌనంగా తలవంచుకుని నిలబడ్డాడు.

చుట్టూ మూడు టి వి చానళ్ళ కెమరాలు రికార్డ్ చేస్తున్నాయి.విలేఖర్లు రాసుకుంటున్నారు.

అప్పటికే ‘ప్రజావేదిక ‘విచారణంటే ప్రజల్లో ఒక సంచలనాత్మక ఆసక్తి స్థిరపడింది.

“సర్..నేను సహజంగా నేరస్వభావమున్న మనిషిని కాదు.ఆ మాటకొస్తే ఈ సమాజంలో ఎవరూ సహజంగా నేరస్థులు కారు.డబ్బు సంపాదించాలనే కక్కుర్తి అందరికీ ఉంటుంది.ఐతే అవకాశాలు అందరికీ రావు.సుళువైన మార్గాలు ముందు పరుచుకుని ఉన్నపుడు ఏ మనిషైనా తప్పుచేస్తాడు.నా విషయంగాకూడా అదే జరిగింది.నిజానికి నేనిప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను.నా దుఃఖాన్ని బహిరంగంగా నిజాయితీగా పంచుకోవాలనుకుంటున్నాను.దయచేసి వినండి.”

పరివర్తన..మార్పు..ఆత్మక్షాళన.రియలైజేషన్.

“నేను ఈ ప్రాజెక్ట్ ను తీసుకునేనాటికి..అలాట్మెంట్ ఖర్చులు ప్రభుత్వ సెక్రెటరీలు..మాథ్యూస్ కు పదిహేను లక్షలు.సెక్రెటరీ ఫైనాన్స్ విఠల్ కు పదిహేను లక్షలు.జాయింట్ సెక్రెటరీ అలీహుస్సేన్ కు పదిలక్షలు..ఇంకా చిన్న చిన్న సెక్షన్ ఆఫీసర్లు..అంతా కలిపి పది లక్షలు.మన జిల్లామంత్రి తన గుండాలతో నాపై దాడి చేయించినపుడు భయంతో చేసుకున్న ఒప్పందంప్రకారం ఇచ్చిన మొత్తం ఒక కోటి.మంత్రిగారిపేరు మీకు తెలుసు కోమాకుల రాజేంద్రప్రసాద్. ముగ్గురు ఎమ్మెల్యేలు..రూలింగ్ పార్టీ జయలలితకు ముప్పై లక్షలు.ఇంకో ప్రక్క నియోజకవర్గ శాసన సభ్యుడు రుద్రరాజుకు ఇరవైఐదు లక్షలు.అప్పోజిషన్ పార్టీ ఎమ్మెల్యే రవికిరణ్ కు పన్నెండు లక్షలు.ఎస్ ఈ రామసుబ్బారెడ్డికి పదిహేను లక్షలు.క్వాలిటీ కంట్రోల్ ఇన్స్ పెక్టర్ జాకబ్ కు పది లక్షలు.ఎ ఇ లు బాలక్రిష్ణ,రామలింగం,వి క్టర్..వీళ్ళకు  మనిషికి ఐదు లక్షలు.ఎమ్మెల్యే కొడుకు వాసుకు వాడు తాగివచ్చినప్పుడల్లా ఇచ్చినై పదిహేను లక్షలు.ఇట్ల మొత్తం ఐదుకోట్ల నలభై లక్షలు లంచాలకే పోతే ఇక నేను ఏ ప్రమాణాలతో కట్టగలను ఫ్లైఓవర్ ను.తక్కువ స్టీల్,ఎక్కువ ఇసుక,నాసిరకం ఫినిషింగ్.ఇంప్రాపర్ క్యూరింగ్.నేను తెచ్చిన అప్పులకు కోటి వడ్డీ.మొన్న ఫ్లైఓవర్ కూలిన తర్వాత పోలీస్ డి ఎస్ పి రామచంద్రయ్యకు ఇచ్చింది ఐదు లక్షలు.బెయిల్ గురించి జడ్జ్ పట్టాభిరామయ్యకు ఇచ్చింది పదిహేను లక్షలు.వెరసి నాకున్న అప్పులు ఇప్పుడు..పదహారు కోట్లు.ప్రతినెలా కట్టవలసిన వడ్డీలు ఎనిమిది లక్షలు.ఈ లంచగొండి దేశంలో ఊబిలోకి దిగీ దిగీ..ఇక ఆత్మహత్యే శరణ్యమయ్యే స్థితి దాపురించి..”..దేవసహాయం గొంతు గద్గదమై..ఎక్కెక్కిపడి ఏడుస్తూ..కుప్పకూలిపోయాడు.

హాలంతా నిశ్శబ్దంగా..విషాదంగా.దేవసహాయాన్ని పీల్చుకుతిన్న మనుషుల పేర్లు మంత్రితోసహా..అధికారులపేర్లు..అన్నీ బట్టబయలౌతూ.,గంభీర సానుభూతి.

తప్పులు జరుగుతున్నాయి.కుక్క నిద్రపోతోందికాబట్టి దొంగతనం జరుగుతోంది.కుక్క దొంగ పెడ్తున్న బిస్కిట్లను తినడానికి అలవాటైంది కాబట్టి..చివరికి కుక్కా,దొంగా కలిసి యజమానినే కరిచి,కండలు పీకి ,చంపి.,

నాలుగేండ్లక్రితం యువ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధి ఒక విస్తృతమైన ప్రజా అధ్యయనం చేస్తూ కనుక్కున్న ఒక పరమసత్యాన్ని ప్రకటించాడు.అదేమిటంటే..”ఈ దేశంలో అవినీతి ఎంత పెరిగిపోయిందంటే..ప్రభుత్వం పేదల అభ్యున్నతికోసం ఒక రూపాయిని అందిస్తే వివిధ మధ్యవర్తి దళారులు తినీ తినీ చివరికి కేవలం ఐదు పైసలను మాత్రమే లబ్దిదారులకు మిగులుస్తున్నారు “అని.

పద్మభూషణ్ నారాయణకు ఆ జ్ఞాపకం ఒక ములుకులా వచ్చి గుండెల్లో దిగినట్టనిపించింది.

కలెక్టర్ వికలమైన మనసుతో హాల్ నుండి బయటికొచ్చాడు.. లోపల ఉక్కపోతగా అనిపించి.

అప్పుడు..బయట దర్వాజా దగ్గర ఒక పదేళ్ళ చిన్న పిల్లాడు ఒక ప్లకార్డ్ పట్టుకుని నిలబడి ఉండడం కనిపించింది.

అట్టపై రాసిఉంది.”దయచేసి మా తరానికికూడా కొద్దిగా మిగల్చండి ప్లీజ్”అని.

ఆసక్తిగా చూస్తున్న కలెక్టర్ వైపు ఎమ్మార్వో రఫీక్ “ఈ కుర్రోడు ఆ పద్మభూషణ్ నారాయణ మనుమడు సతీష్ సర్” అంటున్నాడు.

 

*                           *                               *

సరిగ్గా అప్పుడే పిడికెడు పక్షిపిల్ల తన కొత్తగా మొలిచిన చిన్ని రెక్కలతో విశాల వినీలాకాశాన్ని ఈదుతూ..జయిస్తూ వెళ్తూనేఉంది.

పక్షికి ఒక్క గూడుతప్ప ఏ ఆస్తీ ఉండదు.

దానికి ఒక ఆకాశం..ఒక పచ్చని చెట్టు..చాలు.

 – రామాచంద్రమౌళి

 

 

గింజలు

47x37_custom_two_birds_in_a_cherry_blossom_branch_original_painting_42b066fd

అక్కా, చెల్లెలూ.

గూటిలోంచి దూకి కొమ్మ మీద వాలాయి.

ఇంకా పొద్దు పొడవలేదు.

చెట్టు చుట్టూ నిశ్శబ్దం.

తూర్పున ఎరుపుముసుగు లేస్తుంది.

ఆకలిగా ఉందక్కా అంది చెల్లెలు.

నేనెళ్ళి గింజలు వెతుక్కొస్తానంది అక్క.

ఒద్దు, పోవొద్దు, అమ్మ లేస్తే, నువ్వు లేక పోతే… అమ్మ భయపడుతుంది, అంది చెల్లులు.

తొందరగా వస్తాగా, గింజలు తెస్తాను. అమ్మకు పని తప్పుతుంది, అంది అక్క.

చిన్ని రెక్కలు విప్పుకుని ఎగిరిపోయింది.

పడమటిగా.

 

ఎండుపొలాలు దాటి,

కొండలు దాటి,

వాగులు దాటి,

పెద్ద వన భూమికి చేరింది అక్క.

అబ్బా, ఎన్ని గడ్డిమొక్కలో!

ఎన్ని గింజలో!

ఆకలి తీరా తిన్నది అక్క.

చెల్లికీ అమ్మకూ గింజలు తీసుకెళ్ళాలి.

పెద్ద కంకి నోట గరిచి కొమ్మెక్కింది.

ఇది రెండురోజులకు సరిపోతుందేమో.

మళ్ళా గింజల కోసం బతుకాట.

 

కొమ్మ మీద గూడు కట్టింది అక్క.

ఒక్కొక్క కంకి తెచ్చి గూట్లో దాచింది.

అమ్మ ఎంత గర్వ పడుతుందో నా బిడ్డ ఇన్ని కంకులు పోగుచేసిందని.

గింజలు పోగుచేస్తూ వచ్చిన కారణం మర్చిపొయింది అక్క.

 

రోజులు గడిచాయి.

అక్క ఒంటరైంది.

చుట్టూ ఎన్నో పక్షులున్నా,

వాటి పలుకు వేరు.

రూపాలు వేరు.

తమ చెట్టు పక్షి ఒక్కటీ లేదిక్కడ.

ఒంటరై పోయింది అక్క.

అయ్యో, గింజల గోల్లో పడి ఇలా అయిపోయానే అనుకుంది.

అప్పుడప్పుడూ తూర్పు వైపు చూస్తుంటుంది.

 

వెళ్ళి పోదామనుకుంది చాలా సార్లు.

కానీ, ఇన్ని గింజలు వదిలేశా? మనసొప్పలేదు.

వీటికోసమేకదా అమ్మ వెతికేది రోజూ?

మరో రోజు ఆగి పోయింది అక్క.

 

అమ్మను కనిపెట్టుకుని ఉంది చెల్లెలు.

ఒక్కో రోజు ఆకలిగానే పడుకుంటుంది.

కాని అమ్మను వదిలేసి వెళ్లలేక పోయింది.

తనుకూడా గింజలకోసం వెళ్తే?

కానీ, భయం.

పాపం ఒక్కతే అయిపోతుంది అమ్మ.

పైగా ఈ వయసులో.

అక్క తప్పకుండా వస్తుంది.

మళ్ళా అందరూ బాగుండే రోజు వస్తుంది.

ఆశగా పడమటి వైపు చూస్తూ ఉంటుంది చెల్లెలు అప్పుడప్పుడూ.

 

రోజులు గడుస్తునాయి.

అక్క ఇంకా రాలేదు.

అమ్మేమో రేపో మాపో అంటుంది.

చుట్టుపక్కల పక్షులు వచ్చిపోతున్నాయి అమ్మను చూట్టానికి.

తల్లికి గింజలు సంపాయించి పెట్టలేని పనికిమాలిన దానివి అంటున్నాయి కొన్ని పక్షులు.

దద్దమ్మను చూసినట్లు చూస్తున్నాయి.

పెద్ద కూతురే ఉంటేనా… ఆమెకీ కష్టాలొచ్చేయి కాదు, అందొక పక్షి.

 

ఇప్పటికీ ఏదో ఒక బంధువు పక్షి ఆమాటలు అంటూనే ఉంటుంది.

విన్నప్పుడల్లా చెల్లి చూపుల్లో ఓ నవ్వు తళుక్కు మంటుంది.

కానీ నవ్వులా ఉండదు.

అది సంతోషమో,

విషాదమో,

అసూయో,

ఉన్మాదమో

ఎవరికి తెలుసూ?

కొమ్మ మీద కూర్చుని దూరంగా చూస్తూ ఉంటుంది చెల్లెలు.

 

-ఆరి సీతారామయ్య

photo

 

 

 

 ఆరి సీతారామయ్య గారు వృత్తిరీత్యా బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్. కథకుడిగా తెలుగు సాహిత్యజీవులకు బాగా తెలిసిన పేరు. పదేళ్ళ కిందట ఆయన రాసిన కథలు “గట్టు తెగిన చెరువు” శీర్షికగా ప్రచురితమయ్యాయి. త్వరలో మరో కొత్త కథ సంపుటి రాబోతోంది.

ఘోష!

Kadha-Saranga-2-300x268
కూతురు చేసొచ్చిన నిర్వాకం తెలుసుకుని, అంజని నిర్ఘాంత పోయింది.
“నీకు మతి కాని పోయిందా ఏమిటే, సింధూ?” ఎంత మెత్త గా మందలిద్దామనుకున్నా, పట్టలేని ఆవేశం ఆమె మాటల్లో పొంగుకు రానే పొంగుకొచ్చింది.
ఆగ్రహపు రొప్పు వల్ల, ఆమె యెద ఎగసెగసి పడటాన్ని, గమనిస్తూనే వుంది సింధు.
ఆవిడే కాదు, తన తల్లి స్థానం లో ఏ స్త్రీ వున్నా, అంతే  ఉద్రేక ప డుతుందన్న  సంగతి ఆమెకు తెలుసు.
ఎందుకంటే, కూతురి కాపురం పట్ల ఒక తల్లి పడే ఆవేదన అది. తన వైవాహిక జీవితం చిద్రమై పోతుందన్న

ఆందోళన. ఈ నిజం బయట పొక్కాక, సమాజం తననొక  సిగ్గు లేని దానిగా చూస్తుందన్న  భయం. అన్నీ కలసి  ఆవిణ్ణి వొణికించేస్తున్నాయనీ అమెకి తెలుసు. .
అయినా,  సింధు చలించ లేదు.
“అసలీ బుధ్ధి నీకు పుట్టిందేనా?, లేక ఎవరైన నూరి పోసారా? ఆ?.  హవ్వ! కాపురం  ఏవౌతుందన్న జ్ఞానమైనా లేకుండా, కట్టుకున్న మొగుడి మీద  కాసింత గౌ రవ మైనా వుంచకుండా.. ఇంత అఘాయిత్యపు పని చేసొస్తావ్?
కన్న వాళ్ళం, మేమింకా ‘ బ్రతికి చచ్ఛే’  వున్నామన్న సంగతయినా నీకు గుర్తుకు రాలేదుటే సింధూ, ఇంత పరువు తక్కువ పని చేసేటప్పుడు?”
మొహం వాచేలా తల్లి పెడుతున్న  చివాట్లన్నీ తలొంచుకుని మౌనంగా వింటూండిపోయింది   సింధు- నిర్లిప్తంగా!
తను చెప్పింది వినగానే, తల్లి – తనని  యెదకి హత్తుకుని, ‘ నా తల్లే, నీకెంత కష్ట మొచ్చిందే సింధూ?” అంటూ కన్నీరు మున్నీరు అవుతుందని ఆమె ఆశించ లేదు.
ఎందుకంటే, తల్లి గురించి సింధూ కి బాగా తెలుసు. నిజంగా చెప్పాలంటే, ఆవిడ గురించి ఆవిడ కి కంటే, తనకే బాగా తెలుసు. ఆమె జస్ట్ ఒక సగటు మనిషి. మావూలు  స్త్రీ. సాధారణ గృహిణి. అందరి లాటి సామాన్య ఇల్లాలు. సమాజానికి భయపడి,  రోజుకో సారైనా ఆ నాలుగు గోడల మధ్య సమాధి అయిపోతూ,  నోరు విప్పకుండా లోలోన  కుమిలిపోవడం వల్లే కుటుంబ పరువుప్రతిష్టలన్నీ మిగులుతాయని  ఆవిడ ప్రగాఢ విశ్వాసం. గట్టి నమ్మకం.
తన ఊహ తెలిసినప్పట్నుంచి, తల్లిని   చదువుతూనే వుంది. ఏ ఆడపిల్లకైనా,  తల్లి మొదటి గురువు అని అంటారు. కానీ తనకి మాత్రం తల్లి – మొట్టమొదటి జీవిత పాఠం. ఎంత చదివినా అర్ధం కాని పుస్తకం.  నిజం.  ఆవిడ తనకెప్పుడూ అర్ధం కాలేదు. ఇంకా చెప్పాలీ అంటే, రాను రాను ఆమె తనకొక పరిశీలనా గ్రంధమై పోయింది. అన్వేషణాంశంగా మారిపోయింది.
తరచి తరచి పరిశోధిస్తున్న కొద్దీ – ఎన్నో ప్రశ్నలు..మరెన్నెన్నో సందేహాలు..కలిగేవి. తనెంత ప్రయత్నించినా, ఒక్క దానికీ  సరైన జవాబు దొరకలేదు.
ఎప్పుడడిగినా, ” నీ మొహం. నువ్వు అలాంటి ప్రశ్నలేయ కూడదు.’ అనో, ” ఏమిటే, ఇంతున్నావో లేదో..అప్పుడే  నీ విపరీతపు ఆలోచనలూ, నువ్వునూ? ఊ?” అంటూ మందలిస్తూనో..తన నెక్కువ గా మాట్లాడకుండా నోరు మూయించేసేది అమ్మ.
ఆవిడ లోకం ఆవిడది.  ఇల్లు, మొగుడు, పిల్లలు.
పిల్లల్ని  ఒకింటి వాళ్ళ ని చేసేస్తే..స్త్రీ గా పుట్టినందుకు తన జన్మ కి అర్ధం పరమార్ధం   చేకూరినట్టే ననేది  ఆవిడ జీవన సూత్రం.
నిజానికి, అమ్మ మంచిది. నాన్నకి మంచి  భార్య. తమకు  మంచి తల్లి. కాదనే ప్రశ్నే లేదు.
కాని, నాన్న? చెడ్డ భర్త. చాలా చెడ్డ భర్త.
అమ్మంత  నిజాయితీ పరుడు కాడు. తన సంపాదన గురించి కానీ, చేస్తున్న ఖర్చులు గురించి కానీ, ఇంట్లో పెళ్ళాం తో చెప్పడు. ఆడదాని చేతికి నీ జుట్టు అయినా ఇవ్వు కానీ, జీతం డబ్బు మాత్రం ఇవ్వకు.నీ బ్రతుకు పులుసులో ముక్కయి పోతుంది.  అనేది ఆయన  పాలసీ.
‘నాకేం కావాలో, ఇంటికి ఏమేం తేవాలో అన్నీ ఆయనకి తెలిసినప్పుడు ఇక నా కెందుకే ఆయన జీతం వివరాలు. తప్పు. ఆయన్ని అడగ కూడదు.’ ఇదీ, అమ్మ జవాబు. కాదు కప్పిపుచ్చే ధోరణి.
ఆ విషయాన్ని పక్కన పెడ్దాం.
ఆఫీస్ అయిపోగానే,  నేరుగా  ఇంటి కొస్తాడా అంటే,  రాడు.
క్లబ్ కెళ్తాడు. పేకాటాడ్తాడు. ఫుల్ల్ గా మందు కొట్టి అర్ధ రాత్రి  ఇల్లు చేరతాడు. తనొక సారి –  వూరి చివరుంటున్న  స్నేహితురాలింటికెళ్ళి వస్తుంటే..నాన్న కారు కనిపించింది.  ఆయన పక్కన,  సరసా లాడుతున్న  స్త్రీని చూసింది. ఆయన చనువుగా ఆమె మీదకి వొరగడం, ఇద్దరూ పకపకా నవ్వుకోవడం..చూడంగానే తనకి నచ్చలేదు. దుఖం తన్నుకొచ్చింది.
ఇంటికి రాగానే అమ్మకి చెప్పింది రోష పడుతూ.
అమ్మ ఏమంది? కంగారు పడింది. తొట్రుపడుతూ..”ఈ సంగతి ఇంకెవరికీ చెప్పకే?,  నా బంగారు తల్లి వి కదూ?” అంటూ తన గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది.
కథ అంతటితో కాలేదు.
ఆ అర్ధ  రాత్రి – అమ్మ గది లోంచి మాటలు వినిపించాయి.ఆయన అరుపులు   బిగ్గరగానే వినొచ్చాయి.  తిడుతున్నాడు. అమ్మని బండ బూతులు తిడుతున్నాడు. చెవులకు ఘోరంగా వినొస్తున్నాయి.
ఎప్పుడూ లేనిది, అమ్మ ఆయన్ని నిలదీస్తోంది. ఆయన అహం దెబ్బ తింది. చేయి లేచింది. అమ్మ మీద పిడి గుద్దులు పడుతున్నాయి..అవి తన వీపుకి తాకాయి. బలంగా. కెవ్వుమంది బాధగా.
ఆమ్మ  ఏడుస్తోంది..-  వింటుంటె ..తన కళ్ళు వరదలయ్యాయి.
వున్నపళాన వెళ్ళి, ఆ కిరాతకుని చేతుల్లోంచి అమ్మని విడిపించుకొచ్చేయాలనిపించేది. తెచ్చుకుని తన వొడిలో బజ్జో పెట్టుకుని లాలి పాడాలనిపించేది.
అమ్మా, నా దగ్గరకి రా!  నీ గాయాలకు చంద నాలు పూసి, నా కన్న తల్లి వైన నీకు అమ్మనై జోల పాడి నిద్ర బుచ్చుతాను. రా, అమ్మా’ అని అమ్మని పిలవాలనిపించేది. చెప్పాలనిపించేది. వోదార్చాలనిపించేది.
కానీ అమ్మకి అర్ధమౌతుందా తన భాష? తను పడుతున్న బాధ?
చాలా సేపు రాధ్ధాంతం జరిగి, ఆగి  పోయాక, ఆయన గురక వినిపించేది. అమ్మ వెక్కిళ్ళు మాత్రం ఆగేవి కావు.
తెల్ల వార్లూ..ఆ గదిలో  లైట్ అలా వెలుగుతూ వుం డేది.
వెంటిలైటర్ వైపు  చూస్తూ..గుబులు గుబులు గుబులుగా ఎప్పుడో నిద్ర పో యేది తను.
మర్నాడు పొద్దున అమ్మ నిద్ర లేస్తునే, చీపురు పట్టుకుని వాకిలి చిమ్మి,  పెరట్లో – కట్టెల పొ య్యి  వెలిగించి నీళ్ళ కాగు పడేసేది.  వంటింటి వసారాలో రెండు కుంపట్లు రాజేసి, ఫిల్టర్ లో కాఫీ డికాషన్ వేసి,  కత్తి పీట ముందు కూర్చుని చక చకా అల్లం,  పచ్చి మిరపకాలు,  ఉల్లి పాయలు తరిగి పెట్టుకునేది ఉప్మా చేయడం కోసం.
అరటి చెట్ల గుంత  దగ్గర పళ్ళు తోముకుంటూ   గమనిస్తూనే వుండేది అమ్మని.
ప్రతిరోజులా నవ్వుతూ, ఆనందం గా కనిపించేది కాదు. చెప్పలేనంత బాధ తో  ముఖం mlaaనమై వుండేది.  కళ్ళు వాచి, ముఖం ఉబ్బి,  చెంపల మీద తేలిన వాతలతో కమిలిపోయిన పద్మం లా, అవమానం తో, ‘ గాయడిన  హృదయం అంటే ఈమెనా’ అన్నట్టు గుండెని కదిలించేసేది – ఆ రూపం.
అమ్మని ఒక్క సారి దగ్గరికి తీసుకుని, ” అమ్మా! అంత జరిగాక కూడా నువు  రాత్రం తా  ఆ గదిలో ఎలా పడుకున్నావమ్మా?”  అని అడగాలనిపించేది. చాలా నిజాయితీ గా అడగాలనిపించేది .
కానీ అడగకూడదు. తప్పు. అమ్మ కోప్పడుతుంది.
ఇంతలో నాన్న లేచి, మొహం కడుక్కుని, పెళ్ళాం   ఇచ్చిన కాఫీ తాగి, పెళ్ళాం – చేతికం దించిన ఉప్మా తిని, ఆఫీస్ కెళ్ళి పోయే వాడు.
ఇదంతా చాలా నిశ్శబ్దం గా జరిగిపో యేది. ఇల్లంతా, మనసంతా తనకి  భరించలేనంత కటిక నిశ్శబ్దంగా తోచేది. పెరట్లో బాదం చెట్టు కదలకుండా అట్టానే నిలబడి చూస్తున్నటుండేది. ఒక్క పత్రమూ నోరు విప్పక, జాలి పడుతున్నట్టు తోచేది.

Sa12
ఆయన వెళ్ళాక, అమ్మ వంట చేస్తూ, అలా ధారగా ఏడుస్తూ..మధ్య మధ్య లో  చీర చెంగుతో  కళ్ళు తుడుచుకుంటూ కనిపించేది.
మొగుడికి అక్రమ సంబంధం వుందన్న సంగతి  తెలిసిన ఏ ఇల్లాలికైనా ఆ బాధ ఎలా వుంటుందంటే – నిప్పుల మీద కాల్చిన కత్తిని గుండెల మీద ఆnchiనంత బాధ గా వుంటుంది. స్త్రీలు అనుభవించే  ఎన్ని మానసిక  గాయాలకూ  మందుంది కానీ, ఈ నరక బాధ కు  మాత్రం మందులుండవు. కన్నీళ్ళే వుంటాయి. ఈ కన్నీళ్ళు ఎద మంటలను ఆర్పగలవా?
ఆవిడ దుఖానికి గల మూల కారణం ఏవిటో తనకి మాత్రమే  బాగ తెలుసు. అందుకే,  ఆయన చేసిన తప్పుకి ఎలాటి శిక్ష వేయొచ్చో తను చెప్పగలదు. కానీ, అమ్మ వినదు. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది  కోపంగా.   ‘చిన్న పిల్లవి. నువ్వు చూడకు. నీకేం తెలీదు. అవతలకు ఫో.’ అని అంటుంది.

అమ్మ నిప్పు లాంటిది.  కాబట్టి, ఆయన చేస్తున్న అన్యాయానికి ఆవిడ కాలిపోవడం కాకుండా, ఆయన  పాపాన్ని నిలువునా కాల్చొచ్చు.
నిజానికి మనం నిజాయితీ గా వుండేది ఎదుటివాని అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోడానికే కదా! ఆయన చేసిన ఆ తప్పుడు పనిని, అదే కనక వాళ్ళావిడ చేస్తే అమ్మలా ఊరుకునేవాడా?   ఊహు. చస్తే ఊరుకునే వాడు కాదు. ఈ  ఉత్త నరసిం హం  కాస్తా ఉగ్ర  అయిపోయేవాడు. అమ్మని వాయిట్లోకి ఈడ్చి, పదిమందిలో తూర్పారబెట్టే వాడు. రామాయణం లో పాపం సీత, ఏ తప్పు చేయకుండానే అంతగా  అవమానింపబడినప్పుడు, తప్పు చేసిన పెళ్ళాన్ని ఈ నరసిం హం  క్షమిస్తాడని ఎలా ఊహించగలం? ఈ నిజం చెబితే, అమ్మ ముక్క చివాట్లేస్తుంది.  అలాటి పాపపు మాటలు మాట్లాడ కూడదంటూ కేకలేస్తుంది.
నిజానికి, అమ్మ నీతిమంతు రాలు.  కాబట్టి, నీతి తప్పిన మొగుణ్ణి పది మంది లో నిలబెట్టి కడిగేయొచ్చు. సిగ్గొచ్చేలా బుధ్ది చెప్పొచ్చు.
అమ్మ – దేవత.  కాబట్టి దుర్మార్గుణ్ని శిక్షించొచ్చు.
ఇన్ని అర్హతలు వుండి..ఏమి లేని దానిలా..అసలేమీ చేత కాని దానిలా..ప్ర తి ఘటించకుండా..ఎదురాడకుండా.. అమ్మ ఎలా వూరుకుండి పోతుంది? నిస్సహాయు రాలిలా ఎందుకని  విలపిస్తుంది?
సమాధా నం దొరికేది కాదు.
మరో చిత్రం ఏమిటంటే –  నాన్న వింత ప్రవర్తన! ఆయన హఠాత్తుగా మంచి బాలుడైపోవడం.
తలమునకలైపోయేంత ఆశ్చర్యకరమైన విషయం.
అసలాయన ఎలాటి వాడంటె..
తన సంతోషాల కోసం, విలాసం కోసం ఎన్ని హద్దులైనా దాటేస్తాడు. ఎలాటి తప్పు చేయడానికీ  వెరవడు. ఐతే, ఆయన  ‘తప్పు’ చేసినప్పటి కంటే, అది పెళ్ళానికి తెలిసి నప్పుడు మాత్రం భలే రంగులు మార్చేసే వాడు. అసలు రూపానికి ముసుగు తొడిగేసేవాడు కొన్నాళ్ళు. ఆయన ప్రవర్తనలో ఆ తేడా – ఎంత గా కొట్టొచ్చినట్టు కనిపించేదంటే –   అలాటి  సంఘటనలు జరిగిన – ఆ తర్వాతి  నాలుగు రోజులూ… ఆయన ఆఫీస్ నించి నేరుగా తలొంచుకుని ఇంటికొచ్చేసే వాడు.
సాయం కాలాలు వస్తూ వస్తూ మల్లెపూల దండలు,  జిలేబీ పొట్లాలు, మొక్కజొన్న కండెలు.. చేతుల్లో మోసుకొస్తూ..పెందళానే ఇంటికొచ్చేసేవాడు.
అదేమిటో! ఆయన్నలా చూసే సరికి అమ్మ ముఖం ట్యూబ్ లైట్ లా వెలిగి పోయేది.  ఎంత ఆనంద పడి పోయేదనీ!
ఆయన “ఏమేవ్” అని పిలిచేవాడు. ఈవిడ ఇంతై పోయేది..
“కాస్త తల పడ్తావ్?” గోముగా అడిగే వాడు.  అమ్మ పొంగి పొర్లి పోయేది.
ఆ తర్వాత మాటలు కలిపే వాడు. సరసాలాడే వాడు. అమ్మ  గల గలామనేది.
ఆ మర్నాడు, మందు సీసాలు తెచ్చుకునే వాడు. అందులో కి నంజుకోను పకోడీలు చేయమనే వాడు. చేసేది. కోడి కూర వండమనే వాడు. వండేది. అదే తన భాగ్యమన్నట్టు సేవ చేసేది.
తనకి అమ్మ ఏ మాత్రం అర్ధమయ్యేది కా కున్నా, ఆవిడ ముఖం లో ఆనందం చూసి ఆయన్ని క్షమించేసేది. అంతా మరచి పోయినట్టు నటించేది.
కాని, నాన్న లోని మగాడు మాత్రం స్పష్టం గా.. ఎక్కడా సందేహమనేది లేకుండా, మిగల కుండా,  పరిపూర్తిగా అర్ధమై పోయే వాడు. ఆయన లోని పురుషహంకారానికి   నిలువెత్తు అద్దం పట్టి చూపించేది –  తన మనసు.
అలా..ఆయన  మంచి భర్త గా ఎంతో కాలం నటించలేడన్న సంగతి అమ్మ కంటే తనకే  తెల్సి రావడం బహుశా తన  దురదృష్తమేమో!
రెండు రోజులు కాగానే, ఆయన ధోరణి మళ్ళీ మొదటి కొచ్చేది. నూటికి నూరు పాళ్ళు ఆయనొక అవ కాశ వాది. జల్సా పురుషుడు.
ఆయన దృష్టి లో – క్లబ్బు, పేకాట, రేసులు, సిగరెట్టు, మందు.. ఇవన్నీ మగాడికి వుండే  సహజ లక్షణాలు, వాటిని చెడిపోవడంగా ఎవరన్నాఅంటే వూరుకోడు. ఆ దేవుడు అడ్డొ చ్చినా  సరే సహించడు. పర స్త్రీ వ్యామోహం  కూడా తప్పు కాదు కాబట్టే, స్వేచ్చగా తిరిగొస్తాడు.
ఆడ స్నేహాలు ఎన్నుంటే ఏం?, ఆలి మాత్రం ఒకత్తే కాబట్టీ, తనూ శ్రీ రాముడ్నేనని, ఆ జమ లోకే చేరతానని  వాదిస్తాడు. అవకాశాలు లేక, రాక, లేక చేతకాక కొంతమంది మగాళ్ళు మంచి వాళ్లు గ చలామణి ఔతారని చెబుతాడాయన.
అలా, ఆయన తన సిధ్ధాంతానుసరణా విధాన ప్రకారం ఆ  తప్పు చేయ డానికి ఏ మత్రం వెరచే వాడు కాడు.
కాకుంటే, ఆ విషయం  ఈ నోటా , ఆ నోటా  తల్లికి తెలిసినప్పుడు ఇంట్లో తుఫాను రేగేది.  అందులో అమ్మతో బాటు తనూ  చిక్కుకుపో తూ వుండేది. దారి  తెలియ క ఆవిడా, తెలిసినా చెప్పలేక తనూ..
తను పెరిగి పెద్దౌతున్న కొద్దీ..అమ్మ తన కి ఇంకా బాగా అర్ధ మౌతూ వచ్చేది. అర్ధ మౌతున్న కొద్దీ..అమ్మ- త న  జీవితం లో ఏం కోల్పోతోందో అవగతమౌతున్న కొద్దీ.. ..గుండెంతా ఆమె మీద జాలి తో నిండిపోయేది.
సరిగ్గా ఈ భావన్ని ఆమెకి చెప్పాలనిపించినా..అమ్మ చెప్పనిచ్చేదా?
” నీ మొహం. నీకేం తెలుసు? నాన్న గారి గురించీ? ఏదో అప్పుడప్పుడు అలా చేసినా..నాకు ఏ లోటూ రానీయరు.  కోపమొచ్చినప్పుడు నాలుగు తిట్టినా, కొట్టినా…బయట వాళ్ళెవరైనా నన్నొక్క  మాటంటే వూరుకుంటారనుకుంటు న్నావా? ఎన్ననుకున్నా మొగుడూ పెళ్ళాలం  తప్పదు. తప్పు లేదు. కలసి వుండాల్సిందే. లేకపోతే, ఈ ఇల్లు, సంసారం, పిల్లలు ఆగమై పోరూ..ఇంకెప్పుడూ  నాన్న కి ఎదురు తిరగమని నాకు చెప్పకు.
తెలిసిందా?” అంటూ తనకి చివరి హెచ్చరిక జారీ చేసేది.
అలాంటి అమ్మ తను చేసిన ఈ  పని ని సమర్ధిస్తుందని కానీ, తనని అర్ధం చేసుకుని  అక్కున చేర్చుకుంటుందని కానీ తను అనుకో గలదా? ఆశించ గలదా?
అందుకే, మౌనంగా వుండిపోయింది సింధు, గతాన్నంతా  గుర్తు చేసుకుంటూ!
కూతురు తప్పు చేసొచ్చినందుకే,  తలొంచుకుని, కూర్చుందని భావించిన అంజని  తన వాక్ర్పవాహాన్ని తిరిగి కొన సాగించింది.
“లోకం లో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.   టీవీలలో, పేపర్లలో..ఎంతమంది ఆడ పిల్లల జీవితాలు –  ఎలా నాశనమౌతున్నాయో  చూస్తున్నాను. చదువుతున్నాను.
వాళ్ళ కష్టాలకీ, కన్నీళ్ళకి  బలమైన కారణం వుంది.
కట్న పిశాచమో, అనుమాన భూతమో, బ్రతికుండం గానే మొగుడు మరో పెళ్ళి చేసుకున్నాడనో, పిల్లలు పుట్టడం లేదనో, ఆడపిల్లని కన్నదనో..మగాడు పెట్టే హింసలని వాళ్ళు కళ్ళకి కట్టినట్టు చెబుతున్నారు. సా క్ష్యాధారాలు చూపిస్తున్నారు. జనం –‘పాపం’ అంటున్నారు.
ఎవరొచ్చి ఏ న్యాయం  చేసినా చేయకపోయినా,  ఆ అబలల మీద లోకులకు  జాలి కలుగుతుంది. సానుభూతి మిగులుతుంది.
కానీ, నువ్వు చెబుతున్న కారణాన్ని నేనెక్కడా విన్నే  లేదు. పైగా, పెద్ద ఆరిందాలా,  పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా పడేసి  వస్తావూ? రేపు ఈ సంగతి నలుగురికీ తెలిస్తే,?
“తెలియాలనే ఇచ్చానమ్మా కంప్లైంట్” – చివ్వున తలెత్తి,  జవాబిచ్చింది సింధు.
“ఆ?” ఆవిడ కళ్ళు మరింత పెద్దవి చేసుకుని చూసింది. “అంటే నలుగురూ ఏమైనా అనుకుంటారని సిగ్గైనా లేక పోయిం దా నీకు?”
“నాకెందుకమ్మా సిగ్గు? వుంటే అతనికి వుండాలి” స్థిరం గా అంది.
“ఈ విషయం నీ మొగుడికి తెలిస్తే?”
“తెలియనీ, మనిషైతే సరిదిద్దుకుంటాడు. కాని వాడితో నేనెలానూ కలసి వుండలేను  కదమ్మా!”
“అంటే, ఒక భార్య గా నువ్వు చేయాల్సిన పనే అనుకుంటున్నావా?”
“భర్త గా ఆయన చేయకూడని పని ఇది అని  మాత్రం ఖచ్చితం గా అనుకుంటున్నాను.”
“ఏమిటే చేయ కూడని పని? ఆ? అయినా, మాన మర్యాదలు  లేకుండా పడకింటి సంగతుల్ని ఇలా బట్ట బయలు చేసుకుని, బ్రతుకు ని బజారు కీడ్చుకుంటామా ఎవరమైనా? విని  లోకం నవ్వి పోతుందని కానీ, ఆ తర్వాత నలుగురిలో తలెత్తుకుని తిరగలేమని కానీ, నీకేమైనా తెలుస్తోందా?
“తెలుస్తోందమ్మా. ఇప్పుడిప్పుడే అంతా తెలుస్తోంది.
మనమిలా నలుగురి  కోసం భయపడతామని, మనకు జరిగే అన్యాయాలని చెప్పుకుంటే, లోకం లో మరింత చులకనైపోతామని,  ఆ పైన అపహాస్య పాలై పోతామన్న నిజం మనకంటే మనల్ని మోసం చేసే మగాళ్ళకే బాగా  తెలుసని తెలుస్తోందమ్మా!
అందుకే,  ఈ ఒక్క మన బలహీనతని ఆయుధం గా చేసుకుని మొగుడి స్థానం లో మగాడు సయితం యముడుగా మారుతున్నాడమ్మా!  నువ్వంటున్నావ్ చూడు..పడకింటి గుట్టు అనీ..
నిజమే నమ్మా, నేనూ గుట్టు గానే కాపురం చేసుకోవాలనుకున్నా.
తాళి కట్టిన వాడికి మాత్రమే నా వొంటి మీద చేయి వేసే హక్కునిచ్చాను. జీవితమతా ఈ శరీరం మీద అతనికి సర్వాధికారాలు రాసిచ్చాను.  అందుకు ప్రేమ పేరుతో ఎక్కడ మోసపోతానో అని,  నువ్ చూసిన సంబంధమే చేసుకున్నా. అగ్నిసాక్షి గా వివాహమాడిన వాడు  భద్రత ని నమ్మమన్నావు. నమ్మాను.
అతనితో గడప బొయే కొన్ని అపురూప క్షణాల గురించి కలలు కన్నాను. దాంపత్య జీవితం. గురించి కొన్ని అందమైన కలలు కన్నాను కానీ, నా భర్త కి నా ఆశలతో సంబంధం లేదు.
పుష్ప సౌగంధాన్ని ఆస్వాదించడం కంటేనూ, పూల రేకులని తుంచేయడమంటేనే అతనికిష్టం.
కేవలం తాళి కట్టిన పాపానికి, మొగుడేం చెబితే అది చేయాలా అమ్మా, పడక గదిలో?
కానీ చేసాను.
ఎందుకంటే, ఎదురు తిరిగి తే, నీ మాటల్లో చెప్పాలంటే..’కాపురం చెడి పోతుందని.’
అయినా తృప్తి లేదా మనిషికి.
రాత్రిళ్ళు తాగి, నా పక్కనే,  బుసలు కొడుతూ పడుకున్నప్పుడు..
ఆ మందు వాసన కడుపులో తిప్పుతూ వుంటే..ఏ ఝాము నాడో మత్తు పోయి, కామపు మైకం  కమ్ముకుంటే,  వొళ్ళు తెలీని పశుత్వంతో నా శరీరం గాయమౌతూంటే..
నువ్వన్నట్టు..కేవలం భర్త అనే,  ఆ సలపరింతల జ్వరాలు భరించాను.
సొగసుగా ముడుచుకోవాల్సిన శరీరాన్ని..మసక చీకటిలో ముచ్చట్లు పోవాల్సిన శృంగార చేష్టల్ని..సొమ్మసిల్లి సేద తీర్చుకోవాల్సిన కౌగిళ్లనీ.. అన్నిట్నీ వదిలేసుకున్నాను.
భార్యా భర్తల మధ్య సెక్స్ – అనురాగానికి గుర్తు గా కాకుండా…పశువాంఛకి ఒక సాధనమనే పచ్చి నిజాన్ని తెలుసుకున్నాను.
సెక్స్ అంటే ఇంత హింసాత్మకం గా వుంటుందని, ఈ హింసని రోజూ తట్టుకోవాల్సి వుంటందని నాకు తెలీదమ్మా. తెలిసాక, ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలీక నాలో నేనే కుమిలిపోయాను.
కానీ.
ఆ రోజు నీలి చిత్రాలు చూడమని నన్ను బలవంతం చేశాడు.
నేర్చుకోవాలన్నాడు. అలా ప్రవర్తిస్తేనే పెళ్ళాన్నౌతా నన్నాడు.
అసహ్యం..చీదర..జుగుప్స..అన్నీ కలిసి,  ఆవేశం ఆపుకోలేక..ఎదిరించాను. ఛీ కొట్టాను. గదిలోంచి బయటకు పారిపోయే ప్రయత్నం చేసాను.
అప్పుడేం జరిగిందో తెలుసా అమ్మా, ఆ తాగుబోతు నన్ను బలంగా మంచం మీదకు తోసి..నా ఇష్టానికి వ్యతిరేకంగా..” ఆమె పూర్తి చేయలేక పోయింది.
రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది సింధు.
అంజని నిర్ఘాంత పోయింది. నోట మాట రాని దానిలా బిగుసుకుపోయింది. అచేతునురాలైపోయింది.
తన అనుభవం గుప్పున గుర్తుకొచ్చింది.  మొగుడి అక్రమ సంబంధాలు తెలిసినప్పుడు ..ఆ మనిషి ని చూస్తేనే అశుద్దం చూసినంత రోత పుట్టేది.
ఆ శ్వాసలోంచి కుమ్ముకొచ్చే విస్కీ, బ్రాంది కంపులు భరించలేక అటు తిరిగి పడుకునేది.
అతనితో సంపర్కం, అంతరంగానికి నచ్చేది కాదు. మంచం మీంచి తోసి పడేయాలనిపించేది. ఈ నర పిశాచం నించి ఎటైనా పారిపోవాలనిపించేది.
ఏదీ చేయలేక ఆత్మ వంచన చేసుకుంటు..మానసిక నరకాన్ని అనుభవిస్తూ…ఆ కాసేపు శవమౌతూ..జీవచ్చమౌతూ..గడిపేది.
కారణం.. పైకి చెప్పుకోకూడదని. తను బయట పడితే, రేపు పిల్ల జీవితాల మీద అది చెడు  ప్రభావం చూపుతుందని, భయపడేది. తన కారణంగా తన కూతురి భవిష్యత్తు పాడవకూడదని తలచేది. ఓర్పు వహించేది.
కానేం జరిగింది?  సింధూ కూడా తనలానే..అదే నరకాన్నికాదుకాదు అంతకుమించిన నరకాన్ని అనుభవించిందన్న సంగతి ఇప్పుడే..ఇప్పుడే..తెలుస్తోంది.
కూతురి వైపు కరుణ గా చూసింది. మొట్ట  మొదటి సారిగా ఆ  తల్లి – ఒక సాటి  స్త్రీలా కరిగింది. తల్లడిల్లింది.
మెల్లగా సింధు దగ్గరకెళ్ళి, ప్రేమగా దగ్గరికి తీసుకుని,  తల మీద చేయి వేసింది, ఓదార్పుగా.
ఆ స్పర్శ కి ఉలిక్కి పడిన సింధు –  తల్లి మొహం లోకి చూసి,  చటుక్కున తల్లి  గుండెల్లో  ముఖం దాచుకుని వెక్కెక్కి ఏడ్వసాగింది సింధు.
“ఊరుకో నానా, ఊరుకో. నువ్వు మంచి పనే చేశావ్. నా లాంటి పిరికి  ఇల్లాళ్ళు  చేయలేని పని నువ్ ధైర్యంగా చేశావు. నువ్వనుభవించిన ఈ హింస ఈ లోకం లో ఒకరికి కాదు, నలుగురికి కాదు..ఈ ప్రపంచానికి మొత్తం తెలియాల్సిన అవసరం వుంది. నిన్ను అర్ధం చేసుకోవాల్సింది పోయి,  మాటలతో నిన్ను బాధ పెట్టానా తల్లీ? ఇంకెప్పుడూ, ఈ బంగారు తల్లిని ఏమీ అనను సరేనా..” అంటూ, మరింత గా హత్తుకుంది, పసి బిడ్డను హత్తుకున్నట్టు.
తల్లి లాలనలో సింధు ధుఖం  తుఫాను లా మారి పోయింది.
తను ఎప్పుడు ఎరగని  అమ్మ..ఆ క్షణం లో ఒక దేవతా స్వరూపిణిలా అగుపించింది.
ఎప్పటికైనా, ఎన్నటికైనా ఒక స్త్రీ రోదనని, గాయపడిన హృదయాన్నీ కేవలం మరో స్త్రీ మాత్రమే సంపూర్ణం గా అర్ధం చేసుకో గలదేమో!

****

“సింధు వున్నారాండి?”
లోపలకొస్తున్న ఆ అపరిచిత స్త్రీలని  ని పరికించి చూస్తూ..”మీరెవరు” అడిగింది అంజని. కూతురి కోసం వచ్చిన వీళ్లెవరా  అని!
వాళ్ళ చేతుల్లో ఆ రోజు వార్తా పత్రికలు వున్నాయి.
“మేమందరం, ఆమెని అభినందించడం కోసం వచ్చిన అభిమానులమండి.
ఒక భార్య ధైర్యం గా ముందుకొచ్చి, తన భర్త తనని రేప్ చేశాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఎంతో సాహసం తో కూడిన విషయం.
ఎంత మంది ఇల్లాళ్ళో  పైకి చెప్పుకోలేని లోని బాధని ఆమె నిర్భయంగా  బహిర్గతం చేసి, చాలా మంది బాధితుల కన్నీళ్ళకి గొంతునిచ్చారు.  మన సమాజంలో ఇలాటి మగ పిశాచులు  మొగుడి రూపంలో నూ వుంటారు. తస్మాత్ జాగ్రత్త అంటూ  లోకం కళ్ళు తెరిపించారు.
లైంగిక సుఖం కోసం భార్య నైనా  సరే,బలవంతం చేసి కోర్కే తీర్చుకోవడం కూడా  రేప్ లాంటిదే. – అని తెలియ చెప్పిన ధైర్య వంతు రాలు సింధు.
‘నాలుగు గోడల మధ్య , చట్ట రీత్య వివాహమైన భార్య భర్తల మధ్యజరిగే  ఈ బలవంతపు కార్యాన్ని ‘రేప్’ అని అనలేం..’ అని ఎంత మంది మేధావులు ఘోషించినా..
ఈ సంఘటన ఎందరి సామాన్యులనో  ఆలోచింప చేస్తుంది. పరిష్కారం వెదకమంటుంది. భద్రతనిచ్చే కొత్త చట్టాన్ని తెచ్చిస్తుంది. సింధు ఇచ్చిన ఈ కంప్లైంట్ వల్ల  బాధితులకు ఉపశమనం కలుగుతుంది.  ఆత్మస్థైర్యాన్నిస్తుంది. భార్య లపై సెక్స్యువల్ దాడులు, హింసలు తాగ్గుతాయి.
ఒక మంచి మార్పు కి  అవకాశాన్ని కల్పిస్తూ..స్త్రీ చైతన్యానికి శ్రీకారం చుట్టిన సింధు ని..మేము చూడాలి. అభినందించాలి. ఎక్కడ సింధు?” – అంటూ ఆశ గా, ఆత్రం గా చూస్తున్న  వాళ్ళ మాటలకు పొంగిపోతూ ఉద్వేగ భరితురాలైంది అంజని
–  అక్కడి సందడి అర్ధం కాక ” ఎవరమ్మా ?” అంటూ అప్పుడే అక్కడికొచ్చిన కూతురి  వైపు – పట్టలేని ఆనంద నయనాలతో చూస్తు.. “మీరు చూడాలనుకుంటున్న సింధు..ఇదిగో ఈమే. నా కూతురు.” అంటూ చెప్పింది అంజని వాళ్ళతో.
అలా, చెబుతూ  తన వైపు గర్వంగా చూస్తున్న తల్లి చూపులకి సింధు కళ్ళు ఆనందంతో మెరిసాయి.
స్త్రీలపై జరుగుతున్న అనేక  రకాల అఘాయిత్యాలకు,  అత్యాచారాలకు –   సంపూర్ణ న్యాయం జరగక పోవచ్చు. లేదా  కఠిన చర్యలు తీసుకునే చట్టాలుగా రూపొందడానికి కొంత సమయమూ  పట్టొచ్చు.
కాని, పైకి తేలకుండా నిశ్శబ్దంగా కొరికేసే ఎన్నో  అన్యాయాలను నోరు విప్పి చెప్పడం వల్ల స్త్రీ లు తమ అస్తిత్వాన్ని కాపాడుకున్న వా రౌతారు.
తమ గౌరవాన్ని తాము నిలబెట్టుకున్న వారౌతారు.
అందుకు ప్రతీకగా, ప్రత్యక్ష సాక్షి గా నిలుస్తుంది – సింధు.

   *****

        – ఆర్.దమయంతి

(నా గురించి:
పుట్టిందీ, పెరిగిందీ – మచిలీపట్నం.
స్థిరపడింది –హైద్రాబాద్ లో.

కొన్నాళ్ళు వివిధ దిన, వార, మాస పత్రికలలో పనిచేసాను.
అప్పుడప్పుడు కొన్ని కథలు అచ్చు అయినా, సీరియస్ గా రాస్తోంది మాత్రం ఈమధ్యే. అంటే 2011 నించి. మొదట్లో పోటీలకు మాత్రమే రాసేదాన్ని. ఇప్పుడు ఎక్కువగా ఈ మాగజైన్స్ కి రాస్తున్నాను. ఇప్పటి దాకా సుమారు 150 కవితలు 75 కథలు రాసాను.

అభిరుచులు:
ఇప్పటికి, రాయడం కంటెనూ, చదవడమంటేనే  ఇష్టం. ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడం.చిన్న పిల్లలతో మాట్లాడటం.,
నాకెప్పటికీ గుర్తుండిపోయే కవి, ఆరాధ్య రచయిత ఇద్దరూ ఒక్కరే.- తిలక్.

కృతజ్ఞతలు:
నన్నెంతగానో ప్రోత్స్చహిస్తూ, ఆదరిస్తూ, గౌరవిస్తున్న ఈ మాగజైన్స్ సంపాదకులందరకీ ఈ సందర్భంగా అనేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నా.
సారంగ లో ఇంతకు ముందు వచ్చిన hypothesis  అనే కథకు అందుకున్న పాఠకుల స్పందన కానీ, లభించిన ఆదరణ కానీ  నే మరువ లేనిది.
ఎందరో మహాను భావులు..అందరకీ వందనాలిడుతూ..
వినమ్రతతో..}

టైలర్ శీను

tailor srinu katha

 

ఎంత పెద్ద ఆకాశాన్నయినా ఇట్టే కత్తిరించేస్తాడు. ఎంత విస్తారమైన సముద్రాన్నయినా చిటికెలో మడతపెట్టేస్తాడు. దటీజ్ శీను. టైలర్ శీను. నా మీద కవిత్వం రాయవా అని ఆరోజుల్లో శీను తెగ బతిమలాడేవాడు. అప్పుడు ఈ రెండు లైన్లూ చెప్పి ఊరించేవాడిని.

మా వూళ్ళో టైలర్ శీను అంటే  ఒకప్పుడు..ఎప్పుడంటే  మా యవ్వనకాలపు జెండాలు పట్టుకుని పగలూ రాత్రి అదేపనిగా పిచ్చిగా తిరుగుతున్నప్పుడన్నమాట. అప్పుడు శీను మిషన్ కుట్టే చిన్న గదే మా సమావేశ స్థలం. ఒక కవితాగోష్ఠి. ఒక రహస్య కరపత్రాల ముద్రణాలయం. మేం పార్టీ వ్యవహారాలు, యువజన సంఘాల తీర్మానాలు, గరంగరం చర్చలు శీను గదిలోనే సాగించేవాళ్ళం. కళ్ళకీ కాళ్ళకీ చేతులకీ మిషన్ పని అప్పగించి చెవుల్ని మాత్రం మా మథ్యలో వదిలేసేవాడు శీను. శీను ఇల్లు రోడ్డు మీద వుండేది కాబట్టి బస్సుల్లో,బైకుల్లో, సైకిళ్ళ మీద వచ్చీపోయే మా బోటి వాళ్ళకు అదే రియల్ స్టాప్.

ఇప్పుడు శీను ఊళ్ళో లేడు. శీను శరీరాన్ని ఒక యంత్రంలా అదేపనిగా చాన్నాళ్ళు తిప్పితిప్పిన  కుట్టుమిషను  మాత్రం అదే వూళ్ళో  అతను అప్పులు చేసిన వాళ్ళింట్లో  ఏ పనీలేకుండా ఏ చప్పుడూ చేయకుండా ఒక మూలన పడివుంది.  శీను  కట్టుబట్టలతో కొడుకును బాగా చదివించుకోవాలని హైదరాబాద్ వచ్చేశాడు. తను చాన్నాళ్ళు కుట్టిన మిషన్ వదిలేసి వస్తున్నప్పుడు మాత్రం దాని చక్రాన్ని ఒకసారి తిప్పాడు.  అందులో తన రక్తమే గిర్రున తిరుగుతున్నట్టనిపించింది. కాళ్లతో మిషన్ తొక్కి చూశాడు. తన కండల  కదలికల నుంచి పుట్టిన సంగీతం ఏదో వినిపించింది.  అప్పుడే పదిహేనేళ్ళు దాటింది. కొడుకు బి.టెక్ లో చేరాడు. భార్య చిన్నపాటి ఉద్యోగంలో చేరింది. తను మాత్రం ఒకపెద్ద టైలరింగ్ షాపులో నెలజీతగానిగా కుదిరాడు.

శీనుకు మిషనంటే ఎంత ప్రాణమో మిషన్ పనంటే కూడా అంతే ప్రాణం. అంతకు మించి తన వూళ్ళో తన  కుట్టు మిషను బతుకు చుట్టూ అల్లుకున్న స్నేహితుల జ్ఞాపకాలంటే ఇంకా ఇష్టం. బట్టలు కుడుతూ కుడుతూనే ఎటో జ్ఞాపకాల్లోకి జారుకుంటాడు. అంత పరధ్యానంలో కూడా తన పనిలో ఇసుమంత పొరపాటు జరగనీయడు. అందుకే అతనికున్న ఇష్టాలతో సంబంధం లేకుండానే ఆ షాపు యజమాని శీనంటే ఇష్టపడతాడు.

ఇదంతా సరే. అసలు శీను హైదరాబాద్ వచ్చినా తన జ్ఞాపకాల ఊపిరితోనే ఎలా గడుపుతున్నాడో తెలుసుకోవడమే ఇప్పుడు మనం చేయబోతున్న పని. ఆ జ్ఞాపకాల కలబోత ఏ పర్యవసానాలకు దారితీసిందో కూడా చూడాలి.

శీను ఎప్పుడైనా  ఒకరోజు లాల్చీ కుట్టడానికి ఒక సిల్కు బట్టను కత్తిరిస్తున్నాడనుకుందాం.  అదిగో అప్పుడే   వూళ్ళో మగ్గం తాత గుర్తుకొస్తాడు. ఆ తాతతో శీను అనుబంధం ఒరిజినల్  తాతామనవలకంటె ఆత్మీయమైంది. ఇంకో కారణం ఏంటంటే     ఆ తాత అందరికీ ఇష్టమైన జరీపంచెలు,కండువాలు,చీరలూ బతుకంతా నేసిచ్చినా..ఒంటిమీద కప్పుకోడానికి నిండా బనీను కూడా వుండేది కాదు. ఎప్పుడైనా ఏ పంచెలసాపులోనో మిగిలిన గుడ్డ తెచ్చి ‘ బనీను కుట్టు మనవడా ‘ అని అడిగితే శీను ఆ బట్టముక్కను తీసుకుని అటు కొలిచీ ఇటు కొలిచీ అటు తిప్పీ ఇటు తిప్పీ చూస్తుంటే తాత కూడా అటూఇటూ  గుడ్లు తిప్పుతూ తెగ టెన్షన్ గా చూసేవాడు.

“ గోచీగుడ్డ తెచ్చి బనీను కుట్టమంటావేంటి తాతోయ్?” అని శీను గుచ్చి చూస్తే

“ ఓసోస్ నీకోసం ఏడుగజాల దర్మోరం సిల్కు పంచె తేవాలేంటి?”  ఇలా  తాత గదమాయించేవాడు. శీను నవ్వుకుని మరెవరికో కొలతలు ఎక్కువ చెప్పి ఎక్కువ బట్ట తెప్పించి తాతకు బనీను రెడీ చేసేవాడు. ఆ బనీను తీసుకు వెళ్ళేప్పుడు “మనవడా గుడ్డేమన్నా మిగుల్చుకున్నావా” అని తాతకు అనుమానంగా చూడ్డం అలవాటే.

“ ఆ మిగుల్చుకున్న బట్ట ధర్మవరం అమ్మకానికి పంపాను” అని శీనుకి  వేళాకోళం చేయడమూ పరిపాటే.  తాత గుర్తుకొస్తే తాత కొడుకు, తన ఫ్రెండ్.. చాలా చలాకీ కుర్రాడు అప్పారావు గుర్తుకొస్తాడు. నేత పని లాభం లేదని వూరొదిలి హైదరాబాద్ లో ఎక్కడో భార్య, ఇద్దరు పిల్లలతో వాచ్ మేన్ పనిచేసుకుంటున్నాడు.

బట్టలు కుట్టకుండా శీను బతకలేడేమో.  కాళ్ళు, కళ్ళూ, చేతులూ వాటంతట అవే ఒక లయబద్దంగా క్రమబద్ధంగా కదులుతుంటే మిషన్ మీద బట్టతో పాటు మనసు మిషన్ పై జ్ఞాపకాల వస్త్రాన్ని కూడా కుడుతాడు. అందుకే శీనుకి కుట్టుమిషనంటే అంత ఇష్టం.  లాల్చీలు కుట్టడంలో శీను దిట్ట. ఎన్ని లాల్చీలు కుట్టినా శీనుకి ఎప్పటికప్పుడు ఓ కొత్త అనుభవమే.   రక్తంలోంచి నరాల్లోంచికండల్లోంచి దేహంలోంచి కరిగికరిగి మరిగిమరిగి పుష్పించినట్టు ప్రతిసారీ తాను కుట్టిన   సిల్కు లాల్చీని మడతలు పెట్టి ముచ్చటగా చూసుకుంటాడు శీను. తాను కుట్టిన లాల్చీని చూస్తూ చూస్తూండగానే వూళ్ళో అత్తరు సాయిబు గుర్తుకొచ్చేస్తాడు. గుర్తుకు రాకపోతేనే చెప్పుకోవాలి.

అత్తరు సాయిబా రారా అందాల మారాజా రారా అని ఎంత ఉడికించినా నాలుగు అత్తరు చుక్కలు చిలకరించి వెళ్ళిపోయేవాడు బాషా. కానీ అందరికీ అతను అత్తరు సాయిబే. ఊళ్ళో ఎవరు కొత్తబట్టలు కుట్టించుకుని శీను దగ్గర నుంచి తీసుకువెళ్ళినా వారికి ఓ అత్తరు బుడ్డి బహూకరించాల్సిందే. డబ్బులకోసం చూసే వాడు కాదు. ఎవరైనా పెద్దాసామి తక్కువిస్తే మాత్రం అరబ్బు దేశాల నుంచి సీదా మనూరికే తెప్పించాను మరి అని దబాయించేవాడు. బాషా గుర్తుకొచ్చి ఏదో బుల్లి అత్తరు సీసా మూత వూడి జేబులో ఒలికినట్టు తడిమి చూసుకుంటాడు శీను. అంతే తనను  గుప్పుమంటూ బాషా జ్ఞాపకాలు చట్టుముడతాయి. ముచ్చటగా మడతపెట్టిన లాల్చీని మురిపెంగా మళ్లీమళ్లీ వాసన చూస్తాడు. బాషా కూడా హైదరాబాద్ పాతబస్తీలో ఎవరో దూరపు చుట్టాల దగ్గరకు చేరాడు. చాలాకాలమైంది బాషాను పలకరించి అనుకున్నాడు.

అందంగా కుట్టి అపురూపంగా మడతపెట్టిన లాల్చీని దాని యజమాని కోసం  ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టినప్పుడు శీను చుట్టూ మరికొన్ని జ్ఞాపకాలు  ముసురుకుంటాయి. ఇప్పుడింత నిగారిస్తోంది కాని ఒకసారి చాకిరేవుకు పోతే ఈ మెరుపుంటుందా అనుకోవడం అతనికి అలవాటుగా మారింది. అనుకున్నదే తడవుగా వూళ్ళో తన దోస్త్ చాకలి సత్యన్నారాయణ గుర్తుకొస్తాడు.  బతుక్కోసం బట్టలు కుట్టడం ఎంత ఇష్టమో తన యవ్వనకాలపు జ్ఞాపకాలను కూడా పోగేసి వెరైటీ దుస్తుల్ని కుట్టడం కూడా అంతే ఇష్టం కదా శీనుకి. అందుకే అంతా తటాలున గుర్తుకొచ్చేస్తుంటారు. సత్యన్నారాయణంటే అన్నవరం సత్యన్నారాయణ కన్నా ఇష్టం మన శీనుకి. సొంతూళ్ళో ఉన్నప్పుడు  వీళ్ళద్దరి పోటీ విచిత్రంగా ఉండేది.

ఎంత కొత్తగా తాను కుట్టినప్పుడు తళతళమంటాయో చాకిరేవుకొచ్చినప్పుడు అంత బావురుమంటాయని శీను వెటకారం చేసేవాడు. అయితే సత్యం ఊరుకునేవాడా? శీనుకి పోటీగా బట్టలు ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి గర్వంగా వూళ్ళో అందరికీ అందజేసేవాడు. చూస్కోరా నీ కొత్తబట్టల కంటే నా ఇస్త్రీ బట్టలే మెరిసిపోతున్నాయని ఒకటే మురిసిపోయేవాడు. ఊళ్లో అందరి బట్టలూ ఉతికి ఉతికి సాపుచేసి ఫెళఫెళా వెండిపళ్ళాల్లా మెరిపించిన సత్యం తన బతుకులో మాత్రం ఎలాంటి మెరుపులూ  నింపుకోలేకపోయాడు. పెళ్ళలుపెళ్ళలుగా బాధల మురికి, కష్టాల మురికి, కన్నీటి మురికి పేరుకుపోయిన బతుకు మూటను మోసుకుంటూ సత్యం కూడా ఒకరోజు హైదరాబాద్ చేరుకున్నాడు. ఒక పెద్ద అపార్ట్ మెంట్ లో సెల్లార్ లో ఇచ్చిన చిన్న ఇరుకు గదిలో ఉంటూ ఇస్త్రీ చేసుకుని బతుకుతున్నాడు. పెళ్ళాం అదే అపార్ట్ మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ లో పనికి కుదిరింది. పిల్లలు ఏవో మామూలు  బడుల్లోనే చదువుకుంటున్నారు.

శీను ఇలా కొత్త వస్త్రాన్ని కుట్టినప్పుడల్లా తన చిన్ననాటి దోస్తుల్ని తల్చుకోవడం ఓ ఆదివారం వాళ్ళని కలుసుకోడం రొటీన్ గా మార్చుకున్నాడు. యథాప్రకారం  ఓసారి అందరూ ఒకచోట కలిసి ఒకసారి వూరెళ్ళి అక్కడ జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసి రావాలని నిశ్చయించుకున్నారు. రాష్ట్రం విడిపోతే తమకు, నగరంలో తమ జీవితాలకూ ఏమైనా నష్టం వాటిల్లుతుందా అన్నదే వీరందరిలో ఇటీవల జరుగుతున్న ఘర్షణ. అందర్నీ తరిమేస్తారా!మళ్ళీ వూరికే మకాం కట్టాలా.. ! అక్కడేముందిప్పుడు ? కనీసం ఈ మాత్రం దర్జాగానైనా బతుకుతున్నామంటే ఈ నగరం పుణ్యమేకదా..!ఇవే ఆలోచనలు.

మొత్తానికి ఒకరోజు శీను,అప్పారావు, సత్యం వూరికి బయలుదేరారు. ఊళ్లో శీను ఒకప్పుడు టైలర్ పనిచేసుకునే రోజుల్లో యువజన కార్యకలాపాలంటూ ఊపుగా తిరిగిన వాళ్ళలో కొందరు ఇప్పుడు కొన్ని ఘరానా పార్టీల్లో కీలక నాయకులుగా ఎదిగిపోయారు. అందులో ఒక నాయకుణ్ణి కలిసి తమ భవిష్యత్తు ఏంటో కనుక్కుందామని ముగ్గురూ ఆ నాయకుని ఇంటికే సరాసరి వెళ్ళారు. గంటల తరబడి వసారాలో కూర్చున్న తర్వాత సదరు నాయకులుంగారు బయటొకొచ్చి శీనును వాటేసుకుని ఆనాటి ముచ్చట్లు ఏకరవుపెట్టి భోంచేసి వెళ్ళండని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకొచ్చారు..ఏమిటి అని ఆరా తీయలేదు.

కాని పి.ఎ. మాత్రం అన్ని ఆరాలు తీసి లోపలికెళ్ళి మళ్ళీ వచ్చి “ అయ్యగారేదో మీటింగుకెల్తన్నారు.   మిమ్మల్ని భోంచేసి వెళ్ళమన్నారు. ఏం భయపడొద్దని చెప్పారు. అంతా సర్దుకుంటుందంట. అసలేం కాదంట.  ఆందోళనేం పడొద్దని  అయ్యగారు  చెప్పారు.” పియ్యేగారు ఇలా  వివరించుకున్నారు. అయితే అంతటితో ఆగక ఆఖరున ఒక్క విషయం అడిగాడు.

“ఇంతకీ మీకు ఓట్లు ఎక్కడున్నాయ్?”

“ హైదరాబాద్ లోనే.”  ముగ్గురూ ముక్తకంఠంతో చెప్పారు

ఒకసారి భృకుటి ముడిచి..కళ్ళు అటూ ఇటూ తిప్పి..తల పైకీకిందకీ ఆడించి రెండడుగులు ముందుకీ ఆరడుగులు వెనక్కీ వేసి  వేగంగా సదరు పియ్యేగారు సరాసరి లోపలికెళ్ళాడు. లోపల నాయకులవారికి ఏం చెప్పాడో ఏమో..ఆ నాయకుడు  బయటకు వెళుతూ వీళ్ళను కనీసం చూడను కూడా చూడకుండా కారెక్కి తుర్రుమన్నాడు.

ఏం జరిగిందో తెలియక బుర్రలు గోక్కుంటూ ముగ్గురూ వూళ్ళో తెలిసిన వాళ్ళనీ చుట్టాలనీ పలకరించిపోవాలని బయటకు నడిచారు. వెనక నుంచి కొన్ని నవ్వులు వెంటబడ్డాయి.

“ ఓట్లున్న వాళ్ళకే దిక్కూ దివానం లేదు. తెయ్యమంటా పరిగెత్తుకొచ్చేరు.”

నవ్వులతో కలగలిసిన మాటలు వారిని వెనక నుండి పొడిస్తే ముందుకి పడిపోతూ తట్టుకుని నిలబడుతూ మరో తెలిసిన నాయకుణ్ణి కలిశారు. అంతకుముందే వీరు తమ ప్రత్యర్థిని కలిసినట్టు ఆ లీడర్ దొరగారికి తెలిసిపోయింది. కస్సుమన్నాడు. బుస్సుమన్నాడు.

“అసలు రాష్ట్రానికి ఇంత దరిద్రం దాపురించడానికి మీరు  ఇంతకుముందు కలిసిన పార్టీనాయకులే కారణం” అని పళ్ళు పటపటా కొరికి పొడుగు చేతుల చొక్కాని టపటపా పైకి లాగాడు. శీను, సత్యం, అప్పారావు ఖంగు తిన్నారు. అయితే చివరికి

“ ఏం పర్వాలేదు. మీకు ఓట్లు లేకపోయినా పర్వాలేదు. మీవాళ్ళకి మాత్రం చెప్పండి. మన పార్టీనే నమ్ముకోని ఉండమనండి. అక్కడున్న మీకు, ఇక్కడున్న మీవాళ్ళకీ అండగా వుంటాన్లే” అని ఓ సానుభూతి వీళ్ళ మొహాల మీద పారేసి చిరాగ్గా ఎక్కడో ధర్నాకు వెళ్ళిపోయాడా నాయకుడు.

ఏంటో ఎవరి మాటా ఏమీ అర్థం కాక  ..వూరినీ వూళ్ళో వాళ్ళనీ ఒకసారి చూసి రాత్రికి తిరుగుబస్సెక్కేద్దామని నిర్ణయించుకున్నారు. ఊరంతా ఖాళీఖాళీగా ఉన్నట్టు అనిపించింది. శీనుగాడు,అప్పిగాడు, సత్తిగాడు వచ్చాడని వాళ్ళవాళ్ల కులాల పేర్లు ముందు తగిలించి కొంచెం మమకారం కూడా అతికించి జనం పలకరించారు. అయిన వాళ్ళు ఆప్యాయంగా భోజనాలు పెట్టారు. ఏదో వెలితి మాత్రం కూడా తెచ్చుకున్న సంచుల్లో భారీగా నింపుకుని తిరిగి బస్సెక్కి ఉదయమే నగరానికి చేరుకున్నారు. మనుషులంటే ఓట్లు తప్ప నాయకులకు మరింకేమీ కనిపించటం లేదన్న విషయం ఆ ముగ్గురిలో ఎవరికి ఏ విధంగా అర్థమైందో ఏమో. రాత్రంతా బస్సులో పడుకొని తెల్లారాక నగరంలో ఎవరి పనుల్లో వారు పడిపోయారు. హైదరాబాద్ నుండి తరుముతారో లేదో కాని..ఇంకా కొన్ని రోజులు వూళ్ళోనే ఉంటే ఖచ్చితంగా తరిమికొట్టేసే వారేమో అని కలిసినప్పుడు నవ్వుకుంటూ అనుకోవడం వారికి పరిపాటిగా మారింది.

శీను యథాప్రకారం తన మిషన్ పని తాను చేసుకుంటూనే ఉన్నాడు. బట్టలతో పాటు జ్ఞాపకాలనీ కుడుతూనే వున్నాడు. అందరూ కలుసుకుంటూనే ఉన్నారు. ఏ నాయకుడి  మాటలు నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక  గందరగోళపడుతూనే ఉన్నారు. నేనుగాని  కలిస్తే నామీద  కవిత పూర్తిచేశావా అని అడగడం మాత్రం మానడు. పైకి చెప్పలేదు కాని ఇలా అనుకున్నాను.   ఎంత పెద్దనాయకుడైనా  మా శీను దగ్గర నిలబడాలంటే సిగ్గుపడాలి మరి.   కత్తిరించడమే కాదురా.. కలిపి కుట్టడం కూడా  నేర్చుకోండని శీను తన శరీరాన్ని మిషన్ చక్రంలా తిప్పుతూ చెప్పేస్తాడు.

 

 

                                                                                               – ప్రసాదమూర్తి

చూపులు కలవని వేళ!

srikanth kantekar

శ్రీకాంత్ కాంటేకర్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో 1987లో పుట్టారు. చదువు ఎంఏ ఇంగ్లిష్. ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూల్ లో పాత్రికేయ పాఠాలు నేర్చుకొని.. ఆ తర్వాత సాక్షిలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం నమస్తే తెలంగాణ సెంట్రల్ డెస్క్ లో సబ్ ఎడిటర్ గా కొనసాగుతున్నారు. గతంలో రెండు, మూడు కథలు రాసినా.. ప్రచురితమవుతున్న తొలి కథ ఇది. కవిత్వం పట్ల కూడా అభిరుచి ఉంది.

 *

ఎటూ చూసిన సందడి! రాకపోకల హడావిడి! కొత్త బట్టల్లో కళకళలాడుతూ ఆనందంగా తుళ్లిపడుతూ ఆడవాళ్లు, పిల్లలు! పెళ్లి ప్రాంగణం! ఫంక్షన్ హాల్ ఎదుట నూతన వధూవరులతో కటౌట్!!

 

లోపలెక్కడో అన్ ఈజీ ఉన్నట్టు అనిపించింది.. ఫంక్షన్ హాల్ కు వచ్చాక అది స్పష్టంగా కనిపించింది. ఏదో దూరపు చుట్టాల పెళ్లికి రావడం వల్లా, అపరిచిత ముఖాలను చూడటం వల్లా..  వచ్చిన బెరుకు కాదు అది! అసలు చెప్పాలంటే నేను వచ్చింది పెళ్లి చూడటానికి కాదు! ఇంకా చెప్పాలంటే కొంచెం బలవంతపు రాకే! మనసు చివుక్కుమంది!! కొంచెం ఆసక్తి కూడా ఉందిలే ఇక్కడిదాక రావడం వెనుక.. కానీ ఇక్కడికి వచ్చాక మొదలైంది ఒక రకం అన్ఈజీ! పెళ్లిలకు వెళ్లాలన్నా.. నలుగురిలో కలువాలన్నా నాకు ఇబ్బందేమీ లేదు కానీ! ఇక్కడ అందరి చూపు నా మీదే ఉన్నట్టు.. ఒక బరువైన ఫీలింగేదో వెంటాడుతోంది! ఈ పెళ్లికిలా పిలువని పేరంటంలా రావడం వెనుక…

 

వీకాప్ ఉండటంతో మొన్నామధ్య ఇంటికి వెళ్లాను. ఆరు రోజులు ఆఫీసులో ఎలాగోలా నెట్టుకొచ్చి మమ అనిపించే నేను బేసిక్ గా వీకాప్ రోజు సిటీలోనే ఉండాలనుకుంటా! ఓ సినిమాకో, షికారుకో వెళ్లేందుకు వీలుంటుంది. లేదా ఫ్రెండ్స్ ను కలువొచ్చు. పుస్తకాలు కొని చదవొచ్చు! అలాగనీ ఇంటికి వస్తే ఏమంతా బాగుంటుండదని, ఇబ్బంది అని కాదు. నిజానికి ఇంటికొస్తేనే అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు అందరూ మనపై ఎంత కేర్ తీసుకుంటున్నారో తెలుస్తోంది. దోస్తులు కలుస్తారు. ఊరికెళితే దొరికే ఊరటే వేరు. అలా మొన్న ఇంటికొచ్చినప్పుడు హఠాత్ గా ప్రత్యక్షమైంది మా వదిన. అంటే మా పెద్ద మేనమామ బిడ్డ! ఆమెకు పెళ్లయింది! ఇద్దరు పిల్లలు! మా ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ మా వదినంటే ఇష్టమే. ఆమె రాక గురించి చెప్తూ మా చెల్లే కొంచెం ముసిముసి నవ్వులు నవ్వింది! కొంచెం డౌటనిపించింది. ఇక మధ్యాహ్నం వదిన, నేను, నాయన, అమ్మ అంతా కలిసే భోజనాలకు కూర్చున్నాం. తింటున్నప్పుడు మెల్లగా మా వదిన ప్రస్తావన తెచ్చింది.

 

“మా రెండో తోడి కోడలు నీకు తెలుసు కదా శీను.. వాళ్ల అమ్మవాళ్లు పోసారంలో ఉంటారు. మనకు తెలిసినవాళ్లే. మొన్నామధ్య ఇక్కడ దావత్కు కూడా వచ్చారు. నువ్ చూసి ఉండవు. వాళ్ల రెండో బిడ్డ ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. మంచి కుటుంబం. ఆస్తి కూడా ఉంది. నేనే మాటల మధ్య చెప్పాను. ఆ అత్తమ్మ కొడుకు! హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. నెలకు 15 వేలకుపైనే వస్తాయి. ఊరిలో భూమి, సొంత ఇళ్లు ఉంది అని! నీక్కూడా ఇష్టమొతే ఓసారి ఇంటికొచ్చి చూసిపోతామన్నారు’.. అని తన మనసులో ఉన్నది గబగబా చెప్పేసి కుదటపడింది మా వదిన. ఆమె చెప్పే తీరును బట్టి కొన్ని మాటలకే అర్థమైంది పెళ్లిచూపుల ముచ్చట మోసుకొచ్చిందని..

 

నిజానికైతే నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అందుకు కారణం లైఫ్ లో సెటిలైన భావన ఇంకా రాలేదు. జాబ్ సెఫ్టీ ఉందని కచ్చితంగా చెప్పలేను. ఇప్పటికైతే బ్యాచిలర్ గానే సుఖంగా ఉందనిపిస్తోంది. పైగా పెళ్లయినవారి బదరాబాందీలు, పెళ్లయిన ఏడాది, రెండేళ్లకే ఫేసులు మాడిపోయిన మిత్రులను చూశాక.. పెళ్లంటే ఒక రకమైన అయిష్టత, వ్యతిరేకత కూడా కలుగుతోంది. అడపాదడపా ఇంట్లో ప్రస్తావన వచ్చినా.. గట్టిగా నా వాయిస్ వినిపిస్తున్నా. ఇప్పుడే వద్దు. చెల్లి పెళ్లి కానీ. నేనేదన్న గవర్నమెంట్ జాబ్ కు ట్రై చేస్తాను వంటి కారణాలతో బాగానే నెట్టుకొస్తాను. కానీ ఇలా బయటినుంచే వచ్చిన మ్యారెజ్ ప్రపోజల్సే కొద్దిగా పరేశాన్ చేస్తున్నాయి. గట్టిగా ముఖం మీద కాదని చెప్పలేం. నొప్పించకుండా, తానొవ్వకుండా ముందుకెళ్లాల్సి ఉంటుంది!

 

కొంచెం ఆలోచనలో పడిన నన్ను ” ఏం శీను ఏం చెప్పవేంది. ఇంకా పెళ్లిచేసుకోవా? నీకు పెళ్లి జేస్తే ఇద్దరు పిల్లల తండ్రివైతోనివి’ అంది వదిన. అంతలోనే అమ్మ అందుకొని “అట్లాంటవేందమ్మ. నా కొడుక్కి పెద్ద వయసేమొచ్చింది? వాని ఈడెంత’ అంది.. “నీ కొడుకు ఇంకా పాలు తాగే పిలగాడేనా.. ఆయన కన్నా చిన్నవాళ్లకు పెళ్లవుతుంది. ఇంకా ఎన్ని రోజులుంచుతావ్ ఇట్లా’ అంది వదిన హాస్యంగా. నువ్ చెప్పవేందిరా అని అడిగాడు నాన్న. “నా కొంచెం టైం కావాలి’ ఆలోచించడానికి అని చెప్పి.. గబగబా తినడం పూర్తిచేశా..

 srikanth story ilustratino

 

ఈలోగా మా వదిన మా అమ్మ, నాన్న చెవులు కుట్టాల్సినంత కుట్టేసింది. పిల్ల అదీ, ఇదీ అని.. వాళ్ల కుటుంబం ఇంకా అదీ అని చెప్పింది. పైగా ఆమె పెద్దగా మా ఇంటికి రాదు. లేకలేక వచ్చిన ఆమె.. మంచి సంబంధం ముచ్చట తీసుకురావడంతో మా అమ్మ, నాయన కాదనలేకపోయారు. నాయన నేరుగా నా దగ్గరికొచ్చి.. “మీ వదిన అంతదూరం నుంచి ఖర్చు పెట్టుకొని మన ఇంటికి వచ్చింది. ఫోన్లో కూడా చెప్పొచ్చు. మనం ఆమె మాట కాదనమని ఇంతదూరం వచ్చింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఆలోచించి చెప్పు. ఇంకా ఎన్ని రోజులని ఇట్లా ఉంటావు. నీకు కూడా పెళ్లి చేయాలి కదా. అక్క పెళ్లయి చాలా రోజులవుతోంది. ఇంట్లో ఓ శుభకార్యం చేసినట్టు ఉంది. వదిన మాటను కాదనకుండా వెళ్లి అమ్మాయిని చూసి రా” అని చెప్పాడు. సాయంత్రం టీ చూస్తూ టీ తాగుతున్నప్పుడు వదిన తాను వచ్చిన కారణానికి, తన తెచ్చిన సంబంధానికి ఉన్న బలమైన మంచి విషయాలన్ని వివరించింది. “చూడు శీను సిటీలో ఉంటున్నవు. బ్యాచ్ లర్ గా ఉండటం ఇబ్బందిగా ఉందని నువ్వే అత్తమ్మతో చెప్పినవంట. పెళ్లి చేసుకుంటే సెటిలైనట్టు ఉంటుంది. బాధ్యతలు తెలుస్తాయ్. ఇప్పటివరకు ఉద్యోగం చేసినవ్. ఏమన్నా పొదుపు చేశావా.

నీ వయసు వాళ్లకు చాలామందికి ఈపాటికే పెళ్లయింది. సెటిలైపోయారు(!). నువ్ కూడా ఆలోచించాలి’ అని చెప్పుకుంటూ పోయింది. నేను అడ్డు తగల్లేదు కానీ “నా క్కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి’ అని చెప్పాను. “అదే చెప్తున్న శీను! ఇప్పుడు ఆలోచించు. అమ్మాయిగా చాలా మంచిగ ఉంటుంది. నువ్వొక్కసారి చూస్తే.. అమ్మాయిని ఒప్పుకుంటావు. మంచి కుటుంబం. మంచి సంబంధం! గడపదాక వచ్చిన సంబంధం కాదంటే మల్లామల్లా ఇలాంటి సంబంధాలు రావు’ అని తన పాయింట్ ను బలంగా వివరించింది. ఇంక నేను కాదనడానికిగానీ, ఆమె మొఖం మీదే నాకిప్పుడు పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని కానీ చెప్పడానికి వీలు కుదర్లేదు. పైగా అంత ప్రేమతో మన ఇంటికి వచ్చి.. ఇంత ఇదిగా మంచి సంబంధమని చెప్తున్నప్పుడు ఎందుకో ఓసారి చూసొద్దామనిపించింది. పైగా నాయన చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి. “వాళ్లు మన ఇంటికి రావడం కాదు. నేను ముందు అమ్మాయిని చూడాలి’ అని కరాఖండిగా చెప్పాను. అదే శీను నేను అదే చెప్తున్నా.. వచ్చేనెలలో మా చుట్టాలొకరిది పెళ్లి ఉంది. నువ్ అక్కడికి వచ్చేయ్. నేను దగ్గరుండి పిల్లను చూపిస్తాను. పెళ్లి కాబట్టి పెద్ద మేకప్ కూడా ఏముండదు కాబట్టి.. అమ్మాయిని నువ్వు న్యాచురల్గా చూసినట్టు ఉంటుంది’ అని చెప్పింది. “అమ్మా..వదిన ముందే ప్లాన్డ్ గా వచ్చావన్నమాట. నన్ను బుక్ చేయడానికి” అనుకున్న మనసులో. పైకి మాత్రం ఓకే చెప్పేశా!

 

ఎందుకోగానీ సాధారణంగా పెళ్లిలకు వెళ్లినప్పుడు కన్నా కొంచెం ఎక్కువగానే తయారయ్యాను. ఇంట్లో కూడా కొన్ని ప్రత్యేక శ్రద్ధలు చెప్పి.. సిద్ధం చేసి మరీ పంపించారు.

ఇక్కడికొచ్చాక నన్ను  పట్టించుకునేవాళ్లు పెద్దగా ఎవరూ లేకపోయినా.. అందరూ నన్నే చూస్తున్నట్టు ఏదో ఫీలింగ్ వెంటాడింది. రాగానే మా వదనకి, అన్నకు ఫోన్ చేశా. వాళ్లు ఇప్పుడే ఏదో పనిమీద బయటకెళ్లారట! నన్ను ఫంక్షన్ హాల్లో కూర్చొమన్నారు. ఫంక్షన్ హాల్లో ఓ మూలకు సీటు ఖాళీగా ఉన్నా అక్కడ కూర్చుంటే మూడీగా బాగుండదు కాబట్టి.. ముందు వరుసలో జనాలున్న చోటకెళ్లి కూర్చున్నా.

 

స్వతహాగా మనం పెళ్లికొస్తే.. ఒక చోట కుదురుగా కూర్చోం. పెద్దగా పనులేమీ లేకపోయినా పెళ్లివారికి మల్లే మనం కూడా హడావిడి చేస్తుంటాం. పెళ్లి ప్రాంగణమంతా తిరిగి.. తెలిసినవాళ్లందరినీ పలుకరించి..వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడటం.. ఎప్పుడోసారి పెళ్లిలోనే ఎక్కువగా కలుస్తాం కాబట్టి. చుట్టాలు, తెలిసినవాళ్లతో మాట్లాడుకోడానికి చాలా విషయాలుంటాయ్. పెళ్లి చూడటమనే నెపమేగానీ.. పట్టిక్యులర్ గా తాళి కట్టడానికి ముందే వెళ్లాలనీ, పెళ్లి తంతు చూసి తీరాలనీ ఆలోచనా, కట్టుబాటు కానీ ఎప్పుడూ లేవు. ఇక ఫ్రెండ్స్ తో పెళ్లికి వెళితే వేరేరకంగా ఉంటుంది. నిజానికి మా ఫ్రెండ్ ఒకడు చెప్తాడు.. అమ్మాయిలను చూడటానికే పెళ్లిలకు వెళ్లాలని.. అతని వాదనలో కొంత నిజం లేకపోవచ్చు. లగ్గానికి సిద్ధపడిన అమ్మాయిలంతా కాస్తా సోగ్గా, నాజుకుగా పెళ్లికి తయారై వస్తారు. పెళ్లికొచ్చిన అబ్బాయిల వంక చూసీచూడనట్టు ఓ చూపు విసురుతారు. చాలా మంది పెళ్లిలు కుదిరేది.. చాలామంది నిబ్బరంగా ఉన్నవాళ్లు బుక్కయ్యేది పెళ్లిల్లోనే..

 

అలా ఆలోచనల్లో తేలిపోతూనే ఫంక్షన్ హాల్ మొత్తం ఓసారి పరికించా. కళకళలాడుతోంది. కొత్త బట్టల్లో మెరిసిపోతున్న మగువలు.. కళ్లలో మెరుపులు! ఇక అమ్మాయిలైతే మల్లెతీగలే! ఒకరిద్దరు అలా నడిచిపోతూ కరెంటు తీగల్లా షాక్ కూడా ఇచ్చారనాలి. కానీ వచ్చింది పెళ్లికి వాళ్లని వీళ్లని చూడటానికి కాదు. చూపులకు! మా వదిన ఎవరినీ చూపిస్తే వాళ్లను బుద్ధిగా చూడాలి. అంతకుమించి స్వేచ్ఛ లేదు.. అనుకొని.. అమ్మాయిల వంక చూపులు వాల్చకుండా కుదురుగా కూర్చోవడానికి ప్రయత్నించా!

 

ఇంతలోనే మా వదిన వచ్చింది. హుందాతనం ఉట్టిపడే పట్టుచీర. మేడలో ధగధగ మెరిసిపోతున్న నెక్లెస్! కొంచెం సన్నగా ఒద్దికగా ఉండే మా వదినలో సహజమైన అందం! మొఖంలో నిండైన నవ్వు. ఆమెను చూడగానే మనసు కొంచెం తేలికగా అనిపించింది. “ఏం శీను బోర్ కొట్టిందా? ఒక్కడివే ఇక్కడెందుకు కూర్చున్నవ్. లోపల మనవాళ్లు ఉన్నరు కదా! మేం ఇప్పుడు చిన్నికి గాజులు లేకుంటే తీసుకోడానికి వెళ్లాం’ అని చెప్పింది. కొంచెం నవ్వి.. ఆమె వెంట వెళ్లా. ఇక వదిన అక్కడ నన్ను సూపర్ మ్యాన్ లాగా అందరితో పరిచయం చేయడం మొదలెట్టింది. మొదట్లో ఆనందమనిపించినా.. పోతున్నకొద్ది నా కామన్ మ్యాన్ లక్షణాలు నాకే గుర్తొచ్చి నాకే చికాకేసింది. అయినా పెదవిపై తొణకని చిరునవ్వుతో ఓపికగ్గా అందరినీ పలుకరించా!

 

ఈలోగా మా అన్న (వాళ్ల ఆయన) కూడా వచ్చారు. ఈ మాట, ఆ మాట మాట్లాడుకొనేలోగా పెళ్లి బాజా మోగింది. మాంగళ్యం తంతునామేనా అని పూజారి అనేశాడు. పెళ్లి కొడుకు తాళి కట్టేశాడు. వచ్చినవారు ఆదరబాదరాగా వెళ్లి అక్షంతలు చల్లి.. పెళ్లికొచ్చిన కార్యాన్ని మమ అనిపించారు. ఇక భోజనాలకు వెళుతుంటే మా వదిన అడిగింది “అమ్మాయిని చూశావా” అని.. “నాకేమీ అర్థం కాలేదు. పెళ్లిలో చాలామంది అమ్మాయిలను చూశాను. చూపులు చూడాల్సిన పిల్ల ఎవరో తెలియదు కదా’ అని మనసులో అనుకున్నా. నవ్వుతూ అడ్డంగా తలూపా. “నాకు తెలుసులే. చూడాలని నువ్ ఆత్రంగా ఉందా’ అంది వదిన. “పిలిచిందే చూడటానికి కదా! లేకపోతే నాకేం పని ఈ పెళ్లిలో’ అడిగేసా.. “అమ్మో శీను అంటే ఏమో అనుకున్నా..’ అంది వదిన. నాకు పెద్దగా లాజిక్ లేదనిపించింది సంభాషణలో.. మౌనంగా నడుచుకుంటూ వెళ్లా..

 

అప్పటికే రౌండ్ గా ఏర్పాటుచేసిన కూర్చిలలో కూర్చొన్న వారి మధ్య నన్ను ప్రవేశపెట్టింది మా వదిన. అక్కడే ఉన్న మా అన్న పిలిచి తన పక్కన సీటులో కూర్చొబెట్టుకున్నాడు. పెళ్లిలో చూపులనుకుంటే ఏదో దూరంకెళ్లి అదిగో ఆ అమ్మాయి అని చూపిస్తుంది కదా మా వదిన అనుకున్నా. కానీ ఇక్కడ ఆమె పెద్ద సెట్టింగ్, బ్యాక్ గ్రౌండ్ సిద్ధంచేసింది. దీనికన్నా ఇంట్లో పెళ్లిచూపులు నయం కదా! ఇంతకన్నా కూల్ గా జరిగిపోయే ఉండేది అనిపించింది. పిల్లవాళ్లు ఒక్కొక్కరు పరిచయం చేసుకున్నారు. మళ్లీ మా వదిన నా తరఫున వకాల్తా తీసుకొని.. నా సూపర్ మ్యాన్ లక్షణాలన్నీ చెప్పుతూపోయింది. “మా మేనత్త కొడుకు అని చెప్పడం కాదు కానీ. ఒక్క చెడ్డ అలవాటు లేదు. తాగడు. సిగరేట్ ముట్టడు. సిటీలా జాబ్ చేస్తున్నా.. అందరితో వినయంగా ఉంటాడు’ ఇలా చెప్తూపోతుంటే నాకే రోటిన్ అనిపించింది. ఇలాంటి సందర్భంలో సమర్థించుకోవడానికైనా జెంటిల్మెన్ గా ఉండాలేమో అనిపించింది.

 

పరిచయాలు, నవ్వులు, ఆ మాటా, ఈ మాటా అయిపోయాక అమ్మాయిని ప్రవేశపెట్టారు. డిగ్రీ సెకండియర్ అని చెప్పారు. వయసుకు తగ్గట్టే నాజుగ్గా, సుకుమారంగా ఉంది. మా వదిన న్యాచురల్ గా చూపించే అవకాశం అన్నది కానీ, ఆమెకు చీరను చుట్టి.. ఓ రేంజ్ లోనే తయారుచేయించుకొచ్చారు. కోమలమైన కోలముఖం. అంత తెల్లగా లేకపోయిన స్వభావికమైన కళ ఉన్నట్టు అనిపించింది. పెద్దగా ఎత్తు కాకపోయినా కొంచెం బక్కగా, సన్నగా ఉంది. “నీకు ఈడు-జోడు’ అన్న వదిన మాట గుర్తొచ్చింది. నాలాగా బక్కగా ఉందన్న ఒకే ఒకే కారణంతో “ఈడు-జోడు’ కలిపేశావా వదినా!!.. అమ్మాయి  రెండుసార్లే అనుకుంట తలెత్తి చూసింది. నేను కూడా పెద్దగా చూడలేకపోయినా. సిగ్గు, మొహమాటం లాంటిదేదో అడ్డుపడింది. పక్కన కూర్చున్న మా అన్న అప్పుడప్పుడు భుజం తాకిస్తూ.. చూడుమన్నట్టు సైగలు చేశాడు. ఇక మా వదిన ఆనందంగా నా దిక్కు చూసింది. పర్లేదు అన్న నవ్వు సందేశం పంపాను ఆమెకు నారాజ్ కాకుండా!

 

నిజానికి ఈ మధ్యకాలంలో పెళ్లిల విషయంలో కొన్ని మార్పులొచ్చాయేమో అనిపించింది. భారీగా కట్నాలిచ్చే పెళ్లిలు చేసే మా క్యాస్ట్ లోనూ సంప్రదాయాలంటూ మడి కట్టుకోకుండా ఇలా ఓపెన్ పెళ్లిచూపులు ఆరెంజ్ చేసినందుకు.. పర్లేదు కొంచెం అభ్యుదయ భావాలు అబ్బాయని మురిసిపోయాను. ఇక నా విషయానికొస్తే క్యాస్ట్ పరిధిలో కట్నం తీసుకొని పెళ్లి చేసుకునే నీకు అభ్యుదయాలెంట్రా అని ఈసడించుకోవచ్చు. కానీ కొన్నింటినీ తప్పించుకోలేం. రెండు, మూడు ప్రేమలు సక్సెస్ కానప్పుడు, ఆదర్శ వివాహాలకు అవకాశం లేనప్పుడు.. సైలెంట్ గా సంప్రదాయాలకు ఫిక్స్ పోవడం ఒక్కటే మనం చేయగలిగంది. జీవితం రాను రాను సర్దుకుపోవడమే కదా! అనిపించింది. మాటాముచ్చట అయిపోయి.. భోజనాలు ముగిశాక మా వదిన అడిగింది అమ్మాయి ఎలా ఉందని.. “పర్లేదు”  అని మనసులో అనుకొని, “ఓకే” అని పైకి చెప్పేశా. కానీ కనీసం ఏడాది, ఆరునెలలైనా ఆగాల్సి ఉంటుంది పెళ్లికి అని చెప్పా. వాళ్లు కూడా ఆరునెలలు ఆగాలనే అనుకుంటున్నారని చెప్పింది వదిన. ఇక అక్కడినుంచి వచ్చేశా!

 

ఆ తర్వాత 15, 20 రోజులనుకుంటా.. ఆ అమ్మాయి ఫోన్ నంబర్ ఇచ్చింది మా వదిన. వాళ్లు మా ఇంటికి వచ్చి చూసి కూడా వెళ్లారు. రెండు, మూడు నెలలోనే పెళ్లి ఫిక్స్ చేద్దామనుకున్నారు కూడా. మొదట్లో ఫోన్లో మాట్లాడటానికి ఇబ్బంది పడిన అమ్మాయి.. ఆ తర్వాత ఒకరోజు మాత్రం గట్టిగా చెప్పింది. తనకు డిగ్రీ అయిపోయేవరకు పెళ్లి చేసుకునే ఇష్టం లేదట. ఇంకా చదువుకోవాలనుకుంటుందట. పెళ్లి ఆపమని నన్నే అడిగింది. నాకు కూడా క్యాంపస్ లో సీటు రావడంతో.. నాక్కూడ పెళ్లి మనసు అంగీకరించలేదు. రెండో పీజీ కంప్లీట్ అయ్యేవరకు పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని నేను కూడా ఇంట్లో తేల్చిచెప్పా. దీంతో ఇంట్లో నానా తిట్లు, ఆగ్రహావేషాలు చవిచూసి.. పెట్టేబెడ సర్దుకొని క్యాంపస్ వెళ్లిపోయా.

 

తిరిగిచూస్తే నాలుగేళ్లు గడిచిపోయాయి. వదినకు నా మీద పీకల మీద దాక కోపం కలిగిందని తెలిసింది. కొన్ని ఫంక్షన్లకు నేను వెళ్లినా ఆమె మాట్లాడలేదు. ఇక ఆ అమ్మాయి అ మధ్య ఫోన్ లో బానే మాట్లాడింది. ఆ తర్వాత పెద్ద కారణాలు లేకుండానే మా ఫోన్ సంభాషణ ఆగిపోయింది. తొలిచూపులోనే నాకు నచ్చినట్టు అనిపించినా మా మధ్య సహజమైన దగ్గరి భావనేదో ఏర్పడలేదు. ఇంట్లో కొన్ని పెళ్లి ప్రయత్నాలు చేసినా అవి ముడిపడలేదు. ఇక మొన్నామధ్య ప్రస్తావన వస్తే తెలిసింది.. ఆ అమ్మాయికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారని.. మనం మాత్రం హాయిగా ఇంకా బ్యాచిలర్ గానే ఉండిపోయాం!

­

 – శ్రీకాంత్ కాంటేకర్

 చిత్రం: శ్రీ వెంకటేష్

 

 

 

 

 

 

 

 

 

 

నాకు చెప్పరె వలపు నలుపో తెలుపో

arun1

  అరుణ ప‌ప్పు శ్రీకాకుళం జిల్లా పాలకొండ‌లో 1979లో పుట్టింది. గణితంలో ఎం. ఎస్‌సీ. చేసినా తెలుగు చదవాలనీ రాయాలనీ వున్న అభిలాష వల్ల చేపట్టిన వృత్తి పాత్రికేయం. మొదట ఈనాడులో ఐదేళ్ళు చేసి, గత ఏడేళ్లుగా ఆంధ్రజ్యోతి దిన‌ప‌త్రిక‌లో పని చేస్తున్నారు. రచనా వ్యాసంగం శైశవదశలోనే ఉన్నా ఇప్పటికే మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆమె క‌థ‌ల సంపుటి చంద‌న‌పుబొమ్మను క‌డ‌ప జిల్లా నంద‌లూరులోని రాష్ట్ర క‌థానిల‌యం వారు కింద‌టేడు ప్ర‌చురించారు. చక్కటి ఆలోచనా, ఆ ఆలోచనలకు తగిన వచనం, ఆ రెండింటికి అమిరేటట్లు హాయిగా చదివింప చేసే శైలి ఆమె కథల ప్రత్యేకత.
వీరి బ్లాగ్‌సైట్ అరుణిమ‌ .arunapappu.wordpress.com
కినిగెలో ఈ పుస్త‌కం దొరుకుతుంది.  

 

‘పెళ్లి తర్వాత సమస్యలేవీ రావని నమ్మకం ఏమిటి?’ సూటిగా అడిగింది నీల.
‘సమస్యలు బయటి నుంచి రావు. అవి మనలోనే ఉంటాయి…’ అన్నాడు శరత్ అంతే స్పష్టంగా.
అతనన్నది ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు.
అర్థం కాకపోవడాన్నుంచి ఒక కోపపు ఛాయ పుట్టింది.
‘అంటే… అన్నీ నేనే ఊహించుకుంటానని.. దాన్నుంచే సమస్యలని… అంతేగా నువ్వంటున్నది…?’ అందామె మాటలు ముక్కలుముక్కలుగా మనిషి విసురుగా.
‘వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడే జబ్బులు చుట్టుముడతాయి. మనం గట్టిగా లేకపోతేనే సమస్యలు భయపెడతాయి…. అదీ నేనంటున్నది. నెమ్మదిగా ఆలోచిస్తే నీకే విషయం స్పష్టంగా తెలుస్తుంది… రెండు రోజులు ఓపిక పట్టు. నీ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి…’ అని బల్ల దగ్గర్నుంచి లేచి వెళ్లిపోయి టీవీ దగ్గర సెటిలయ్యాడు శరత్.
నీలకేమీ తోచలేదు.
అకస్మాత్తుగా పెళ్లి ప్రస్తావన ఎందుకు తెచ్చాడు శరత్? ఇప్పటిదాకా మంచి స్నేహితుల్లాగా కలిసి ఉన్నారు కదా? ప్రేమ… ప్రేమకేమీ తక్కువ లేదు. మూడేళ్లుగా చూస్తోంది తను.. ఎప్పుడూ అతనిలో ఎంచడానికేమీ కనిపించదు. అలాంటప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన తననెందుకు భయపెడుతోంది?
స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో… తనను చూస్తూనే ప్రశ్నార్థకాలయ్యే మొహాలను ప్రతిభతో ఎదుర్కొని నెగ్గుకొచ్చింది తను. మరి పెళ్లి దగ్గరకొచ్చేసరికి భయపడుతోంది ఎందుకు?
అంటే పెళ్లికి మనిషిలోని ప్రతిభ, ఇద్దరి మధ్య అనురాగం – ఇవి చాలవనుకుంటోందా? పెళ్లి దగ్గరకొచ్చేసరికి మనుషుల గుణగణాలు కాకుండా, అందచందాలే ముఖ్యమని అందరిలాగానే తనూ అనుకుంటోందా? తన వయసు అమ్మాయిలు పెళ్లంటే ఎంత సంబరపడతారు? మనసైనవాడు, మంచివాడు శరత్ అడుగుతున్నా సరే, తనలో ఎందుకీ సంకోచం?
నీలకేమీ దిక్కుతోచలేదు. తన ఆలోచనల్లో స్పష్టత లేదని తెలిసిపోయింది. హోటల్ గదికున్న కిటికీ లోంచి చూస్తే రాత్రి పూట సముద్రం నల్లగా ఎగసిపడుతూ కనిపించింది. అలలు మాత్రం తెల్లగా….
రాత్రి నలుపు… వెన్నెల తెలుపు…
చూస్తున్న కళ్లు తెలుపు, కనుపాపలు నలుపు…
ప్రపంచమంతా నలుపుతెలుపుల కలయికే…
కదిలే కారుమబ్బులా, కాటుక పిట్టలా ఉంటుంది నీలోత్పల.
ఎక్కడికెళ్లినా ఒకసారి చూసినవారు మరోసారి ఆశ్చర్యంగా చూడకమానరు. అంత నలుపు.
‘కలకత్తా కాళి..’ అంటూ కామెంట్ చేసేవారు కాలేజీలో. అంత భయంకరంగానూ నిప్పులు కక్కుతూ చూసేదామె వాళ్లవైపు. ఆ చూపులకే కాదు, తీక్షణమైన ఆమె ప్రతిభకు కూడా భయపడేవాళ్లందరూ.
ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడూ అంతే. నీలను చూసి ఆశ్చర్యపోయిన బోర్డు సభ్యులు, ఆమె సాధించిన బంగారు పతకాలను చూసి నోళ్లు వెళ్లబెట్టారు.
‘మీ పని మీరు కాన్ఫిడెంట్‌గా చెయ్యండి. చేస్తారని నాకు నమ్మకం కలిగింది… ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి..’ అన్నారు ఎమ్‌డీ.
‘థేంక్యూ సర్…’ అని చెప్పి వచ్చేసింది.
సహోద్యోగిగా పరిచయమయ్యాడు శరత్‌చంద్ర. అబ్బాయిల్లో అరుదైన బంగారు రంగు అతనిది.
తనను చూసి అతనాశ్చర్యపోలేదు. పని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వివరంగా చెప్పాడు. తమ విభాగంలోని ఉద్యోగులను పేరుపేరునా పరిచయం చేశాడు.
పరిచయాల తర్వాత తన సీటు చూపించి కూర్చున్నాక, ‘మీ పేరెంత బాగుందో… పేరుకు తగిన మనిషి మీరు..’ అన్నాడు.
అతని మాటల్లో, చూపులో ఏదైనా వెక్కిరింత ఉందేమోనని చూసింది తను. అటువంటిదేమీ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం తన వంతయింది. అది మొదలు, అతని స్నేహంలో నీలకు అన్నీ ఆశ్చర్యాలే. ఎప్పుడూ తన రంగురూపుల ప్రస్తావనే తీసుకురాకుండా అన్నేసి గంటలు ఎలా మాట్లాడగలడో ఆమెకు అర్థం కాలేదు.
శరత్ తన ప్రేమను ప్రతిపాదించినప్పుడు అయితే ఆశ్చర్య సముద్రంలో ఆమె పూర్తిగా తడిసిపోయింది.
‘నన్నా, ప్రేమిస్తున్నావా? ఏం జోక్ చేస్తున్నావా?’ అని తెరలుతెరలుగా నవ్వింది.
‘ఇందులో అంత నవ్వడానికేం లేదు. నీకు నేను నచ్చితే.. మనిద్దరం కలిసి సంతోషంగా జీవితాన్ని గడపగలమన్న భరోసా నీకుంటే చెప్పు చాలు..’ అన్నాడు శరత్.
‘నీకసలు కళ్లు కనపడుతున్నట్టు లేవు. ఎందుకైనా మంచిది ఓసారి పరీక్ష చేయించుకో. నన్ను చూసే అడుగుతున్నావా.. రేప్పొద్దున ఈ నల్లమేకను ఎక్కణ్నుంచి తెచ్చావని అందరూ అడిగితే పూర్వం కథలోని బ్రాహ్మడిలా వదిలేసిపోతావేమో… ‘ అని నవ్వుతూ భుజాలెగరేసింది నీల.
‘నా కళ్లు బానే ఉన్నాయి. నీ ఆలోచనే బాలేదు. స్కూల్లో, కాలేజీలో ఎవరైనా నలుపంటే కొట్టబోయేదాన్ని అన్నావుగా… మరిప్పుడు నిన్ను నువ్వే వెక్కిరించుకుంటున్నావేం? చిన్నప్పుడు కాకరకాయ అని పెద్దయ్యాక కీకరకాయ అన్నాట్ట నీలాంటివాడెవడో. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తుంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందా అమ్మగారికి?’ అన్నాడు.
‘వానాకాలం మొత్తం నలుపే… కాకి రెక్కల్లో కారు నలుపే… కన్నె కాటుక కళ్లు నలుపే.. నీలాంబరాల కుంతల నలుపే..’ అంటూ శ్రావ్యంగా పాటెత్తుకున్నాడు శరత్.
అప్పటిదాకా నవ్విన నీల కంట్లో నీళ్లు తిరిగాయి. మనసులో అన్నేళ్లుగా నానుతున్న విత్తనం నుంచి ప్రేమ మొక్క పుట్టింది. రెండేళ్లలో అది మారాకులు వేస్తూ పెరిగింది.

PAPPUARUNA
ఎప్పుడు నిద్రపోయిందో తెలీలేదుగాని మర్నాడుదయమే లేచి జగన్నాథుడి దర్శనానికి వెళ్లారు ఇద్దరూ.
భక్తుల రద్దీ మరీ అంత ఎక్కువగా లేదు.
ఎత్తయిన గోపురం మీద ఎగురుతున్న కాషాయవర్ణపు పతాకాన్ని తదేకంగా చూసింది నీల.
‘దీన్ని ప్రతిరోజూ మారుస్తారు తెలుసా? ఏ యంత్రాల సాయమూ లేకుండా ఒక మనిషి అంత పైకెక్కి పతాకాన్ని మార్చే దృశ్యం చూడటానికి సాయంత్రం భక్తులు పోగవుతారు ఇక్కడ…’ అన్నాడు శరత్.
‘మనిషి తల్చుకుంటే ఏమైనా చెయ్యగలడు… అంటావు. అంతేగా…’ అంది నీల.
‘తన మీద తనకు నమ్మకం ఒక్కటే కాదు నీలోత్పలా. చేస్తున్న పని మీద కూడా అంతే నమ్మకం ఉండాలంటాను… పద లోపలికి’ అని నవ్వుతూ అడుగులేశాడు..
భారీ వేదిక మీద భారీ విగ్రహాలు… సుభద్ర బలభద్రులతో కలిసి నల్లటి జగన్నాథుడు… నల్లటి ముఖంలో తీర్చిదిద్దిన విశాల నేత్రాలు… ముక్కు, చెవులు, కాళ్లు చేతులు.. ఏవీ పూర్తి కాని సగం సగం ప్రతిమలు.. అయినా ఎంత ఆకర్షణ… కౌగిలి కోసం ముందుకు చాపినట్టున్న మొండిచేతులు… నవ్వుతున్నట్టు నోరు…
అసంపూర్ణత్వంలో ఇంత సౌందర్యమా? ఏం సందేశమిస్తున్నాయి ఈ విగ్రహాలు?
ఒక్క క్షణం నీల ఒళ్లు పులకరించింది. భక్తిని మించిన భావమేదో అల్లుకుంటే… తన్మయత్వంతో కళ్లు మూతలుపడ్డాయి. అప్రయత్నంగా చేతులు జోడించింది వినమ్రంగా.
పండాల గోలను దాటుకుని బయటకొచ్చేసరికి స్వర్గంలోంచి బజార్లోకి పడ్డట్టయిపోయింది.
సందుగొందుల్లోంచి నడిపించుకుంటూ తీసుకెళ్లాడు శరత్. ఆషాఢమాసపు బురద.. ఈగలు..
ఒక ఇరుకింటి ముందు ఆగి ‘అవ్వా.. అవ్వా…’ అని పిలిచాడు.
‘శరత్ బాబూ, నువ్వేగా… లోపలికి రా నాయనా’ అంటూ పలకరింపు వినిపించింది.
లోపలికి అడుగుపెడుతూనే నీలకు ఆమెను పరిచయం చేశాడు. ‘ఈవిడ పేరు శశిమణీదేవి. గర్భాలయంలో నువ్వు చూసిన జగన్నాథుడి భార్య…’ అని.
నీల ఆశ్చర్యపోయింది.
దాన్ని గుర్తించినట్టు ఆమె నవ్వింది. ‘ఎందుకలా బెదరగొడతావా పిల్లను. ఇలా కూర్చో తల్లీ…’ అంటూ అరుగు చూపెట్టి మంచినీళ్లిచ్చింది శశిమణీదేవి. ఆమెకు డెబ్బయ్యేళ్ల వయసుండొచ్చు.
‘నీలోత్పలా, నీకు దేవదాసి సంప్రదాయం కొంచెమైనా తెలుసా…’ అని శరత్ ఎత్తుకున్నాడు.
‘ఈ గుడిలో ఎనిమిది వందల సంవత్సరాల నుంచీ ఉన్న ఆచారమిది. దేశంలో మిగిలినచోట్లలా కాదు, ఇక్కడ దేవదాసీలకు చాలా గౌరవం ఇస్తారు. ఊహ తెలియని వయసులో దేవదేవుడికి అంకితమైన దేవదాసి అంటే ఆయనకు అచ్చంగా భార్యే… ఒకప్పుడున్న సంగీతనాట్య సేవలు ఇప్పుడు చెయ్యడం లేదనుకో. కాని ఈవిడ ఆయన కోసం ఉపవాసాలు కూడా చేస్తుంది…’ అంటూ శరత్ చెబుతుంటే నీలకు సంభ్రమం కలిగింది. గుళ్లో దేవుడేమిటి, ఈ మనిషి ఆయన భార్య ఏమిటి… ఆమె ఊహలు రకరకాలుగా తొణికాయి.
‘నాకు ఐదేళ్ల వయసులో నా తల్లిదండ్రులు ఇక్కడ దిగవిడిచి వెళ్లారని గుర్తు. మాదే ఊరో, అంతకుముందు నాదే పేరో కూడా గుర్తు లేదు. అప్పట్నుంచీ ఇక్కడ సూర్యప్రభ అనే మనిషి నాకు సంగీతనాట్యాలు నేర్పించింది. ఆమె నాకు తల్లి కన్నా ఎక్కువ. నేను పెద్దయ్యాక మంచి ముహూర్తంలో నాకు జగన్నాథుడితో పెళ్లయ్యింది. ఇప్పుడ ంటే అన్నీ రద్దయిపోయాయిగాని అప్పట్లో నేను పాడితేనే స్వామికి సుప్రభాతం. నా పాటతోనే పవళింపు సేవ…’ చెబుతూ శశిమణీదేవి సుదూర స్వప్నాల్లోకి జారుకున్నట్టయిపోయింది.
నీల ఆమెనే చూస్తూ ఉండిపోయింది.
పసుపు రాసుకున్న కాళ్లకు పారాణి, వెండి కడియాలు, చేతుల నిండా గాజులు, ముఖాన కుంకుమ బొట్టు, నుదుట సింధూరంతో ఆమెలో వింత వెలుగేదో కనిపిస్తోంది. వంకాయ రంగు చీర చుట్టబెట్టిన ఆమె వృద్ధ శరీరం ముడతలు పడినా, మానసిక దృఢత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది నీలకు.
‘ఇవాళ సావిత్రి వ్రతం కదా, భర్త దీర్ఘాయుష్షును కోరుతూ మహిళలు ఉపవాసముంటారు. నేను కూడా ఉపవాసమే. మీరు తినండి…’ అంటూ ఫలహారాలేవో పెట్టింది ఆవిడ. తినేసి శరత్ పెరట్లోకి నడిచాడు.
‘ఇదంతా సాధ్యమా…’ అప్పటికి నోరు పెగల్చుకుని అడిగింది నీల.
చిన్నగా నవ్వింది శశిమణీదేవి.
‘నీకివన్నీ ఆశ్చర్యంగా ఉండొచ్చు. కాని ఒకటి చెప్తాను విను. దేవుడున్నాడనుకుంటే ఉన్నాడు. లేడంటే లేడు. ఉన్నాడనుకుంటే మా బంధమూ ఉన్నట్టే కదా.. పోనీ ఇదంతా కేవలం పిచ్చి ఊహే అనుకుందాం. అయినా ఆ ఊహలోని అనురాగం ఏ లోటూ లేకుండా నాకు జీవితాన్నంతా నడిపే బలాన్నిచ్చింది కదా… ఉలకనిపలకని దేవుడంటావు నువ్వు, అన్నిటిలోనూ అండగా ఉంటాడనుకుంటాను నేను. ఏదైనా అనుకోవడంలోనే కదా ఉన్నది?’ అందావిడ నింపాదిగా.
‘నీ లోపల భయాలన్నిటినీ తీసెయ్యి నీలా. శరత్ అన్నీ ఆలోచించే పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. మా జగన్నాథుడు నల్లగా లేడా తల్లీ? ఆ మాటకొస్తే ఏ దేవాలయంలోనైనా దేవతామూర్తులు నల్లని శిల్పాలే కదా… మరి వాటిని చూసి మనుషులు భక్తితో దండాలు పెడతారు కదా… అప్పుడెందుకు వాళ్లకు రంగు గుర్తు రాదు? ఎందుకంటే దైవమంటే కరుణ, అభయం, ప్రేమ… ఆ లక్షణాలు మీ బంధంలో ఉన్నప్పుడు నువ్వు దేనికి వెనకాడాలి చెప్పు?’ అన్నది శశిమణీదేవి అనునయంగా.
‘లేనిపోని అనుమానాలతో నీ దగ్గరకు వస్తున్న వసంతాన్ని కాదనకు… నీ సంతోషంలో అతని జీవితానందం ఉంది. ఏవేవో ఊహించుకుని నువ్వు దూరం జరిగిపోకు…’ అన్నది బొట్టుపెట్టి కొత్త చీరనందిస్తూ…
ఆకాశంలోకి చంద్రుడొచ్చినట్టు నీల ముఖంలోకి ఒక సంతోష తరంగం వచ్చింది. లోపలికి వచ్చిన శరత్ ముఖంలో వెన్నెల విరిసింది.

–అరుణా పప్పు

కథనానికి బొమ్మ : పినిశెట్టి

కొత్త పరుగు

 

సి.ఎస్. రాంబాబు

సి.ఎస్. రాంబాబు

            కొద్ది రోజులుగా శంకర్రావు ‘చదువుకున్నంత కాలం సమస్యలే. జీవితంలో స్థిర పడ్డాక కూడా సమస్యలేనా’ అని వలపోస్తున్నాడు. పొద్దున్నే లక్ష్మి చదివిన లిస్టు గుర్తుకు వచ్చింది.  పెద్దవాడికి ఎమ్.టెక్ సీటుకు ఏర్పాట్లు చేయాలి.  చిన్నవాడి బి.టెక్ రెండో సంవత్సరం డబ్బులు సిద్ధం చేయాలి.  అత్తగారి కేటరాక్టుకు కాసులు సమకూర్చాలి.  ఇదీ ఆ లిస్టు. ఇద్దరం వుద్యోగం చేస్తున్నాం.   అయినా ఏం లాభం అని  ఆలోచిస్తున్నాడు.  అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ వాచ్ మెన్ యాదయ్య వేదన మర్చిపోవడం మరీ కష్టంగా వుంది.  ఇద్దరు పిల్లలు యాదయ్యకి.  ఇద్దరూ చిన్నవాళ్ళే. కాస్త కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు.  అదీ సమస్య.  ఆ స్కూలు ఫీజు సంవత్సరం, సంవత్సరమూ తిరుమల భక్తుల క్యూలా పెరిగిపోతోంది.  గవర్నమెంట్ స్కూల్లో వేయవయ్యా అంటే మన వూరి బయట అపార్ట్ మెంట్ల దగ్గర గవర్నమెంట్ బడి యాడుంది సార్ ! అంటాడు. 

 

తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి శంకర్రావుకి. తండ్రి చిన్నతనంలో పోతే, తల్లి తనని చదివించటానికి ఎంత కష్టపడిందో తను మర్చిపోలేడు. బట్టలు కుట్టింది. అప్పడాలు, విస్తళ్ళు చేసి అమ్మింది.  తన ఫీజులు కట్టడానికి సహాయ పడ్డ వాళ్ళు గుర్తొచ్చారు శంకర్రావుకి.  అప్పట్లో అన్నీ గవర్నమెంట్ విద్యాసంస్థలే కాబట్టి ఇంత ఫీజులు లేవు.  ఇన్ని ఇబ్బందుల్లేవు.  తను నడిచి వచ్చిన దారిని మర్చిపోకూదడనే అనాధ పిల్లల్ని చేరదీసే సంస్థలకు గుట్టు చప్పుడు కాకుండా తను ఇవ్వగలిగింది ఇస్తున్నాడు.  ఇప్పుడు తన పిల్లల చదువు బరువునీ తట్టుకోవడమే కష్టమయిపోతోంది.  అప్పటికి యాదయ్య పిల్లలకి పుస్తకాలు కొనటంలోనూ, ఫీ కన్సెషన్ ఇప్పించడంలోనూ సహాయపడ్డాడు.  అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ ని కనిపెట్టుకునుండే యాదయ్యకు ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఎందుకు సహాయం చేయకూడదన్న ఆలోచన అతని బుర్రని తొలిచేస్తోంది. ఆ మాత్రం మానవత్వం లేదేమిటి అనిపిస్తోంది.  అప్పటికీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాదరావుతో కదిపి చూశాడు, కాస్త యాదయ్యకు సహాయం చేద్దాం సార్ అని.  ఆయనేమో ఇంతెత్తున లేచాడు.  ఇదేమన్నా ఛారిటీ సంస్థేమిటండీ, అంతగా ఇవ్వాలి అన్పిస్తే మీరు పర్సనల్ గా ఇచ్చుకోండి అంటూ. లాభం లేదు, రాత్రికి లక్ష్మితో మాట్లాడి యాదయ్య సమస్యకో పరిష్కారాన్ని వెతకాలి. ఆలోచనల మేఘాల్ని చీలుస్తూ బయటకు వచ్చాడు.  కొలీగ్ తో కలిసి ‘టీ’ కి బయలుదేరాడు.

***

 సెల్లార్ లో మోటార్ సైకిల్ పార్క్ చేస్తున్నాడో లేదో యాదయ్య ఎదురొచ్చాడు శంకర్రావుకి.

“సార్, మన సార్లని అడిగిండ్రా ఇస్కూల్ తెరుస్తాన్రు సార్” యాదయ్య జోరీగలా రొద పెడుతున్నాడు.

“ఒక్క రెండు రోజులు టైమివ్వు యాదయ్యా, ఆ ప్రయత్నంలోనే వున్నాను” యాదయ్యని తప్పించుకుని లిఫ్ట్ లో ఎక్కాడు.

 Kadha-Saranga-2-300x268

:: 2 ::

“ఏమయింది, మీ జి.పి.యఫ్. లోను శాంక్షన్ అయ్యిందా, మీ ఎకౌంటులో డబ్బులు పడ్డాయా” శంకర్రావు ఇంట్లోకి అడుగుపెట్టాడో లేదో, టీ కప్పు అందిస్తూనే ప్రశ్నల వర్షాన్ని సిద్ధం చేయసాగింది లక్ష్మి.

“ఇంకో రెండు రోజులు పడుతుంది.  దాంతో పాటు సొసైటీ లోను కూడా పెట్టాను.  కానీ అందులో రావడం కష్టం అని చెబుతున్నారు.  మన సమస్యలు సరే, ఆ యాదయ్యని చూస్తే బాధగా వుంది.  పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో అయితేనే చదివించగలడు.  అలాంటి స్కూలు ఈ చుట్టుపక్కల లేదు.  ఉన్న ప్రైవేటు స్కూలు వాడు దోచేస్తున్నాడు.  అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా వాడికొచ్చే నెల జీతం వాడి కుటుంబానికి రెండు పూటలా భోజనం పెట్టడానికి సరిపోదు.  ఏదో రకంగా అపార్ట్ మెంట్ వాళ్ళందరూ కాస్తో, కూస్తో పనులు చేయించుకుని డబ్బులిస్తున్నారు కాబట్టి బతకగలుగుతున్నాడు .   పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించొద్దు అని మనం చెప్పలేం కదా.  లక్ష్మీ, అందరూ సహాయం చేయబట్టే నేను ఏదో రకంగా చదువుకోగలిగాను.  నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను.  ఆ సంగతి నీకూ తెలుసు.  ఇంచుమించుగా యాదయ్యది అదే పరిస్థితి.  కానీ యాదయ్య ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాడు.  మన పిల్లల కన్నా నాకు యాదయ్య పిల్లల చదువే పెద్ద సమస్యగా అన్పిస్తోంది.  యాదయ్యకు సహాయం చేద్దామంటే అపార్ట్మెంటు అసోసియేషన్ వాళ్ళేమో ఖరాఖండిగా కుదరదని చెబుతున్నారు.”  భార్య ముందు తన బాధంతా వెళ్ళగక్కాడు శంకర్రావు.  లక్ష్మి ఏదో రకంగా ఈ చిక్కుముడిని విప్పగలదన్న నమ్మకమేదో వుందతనిలో.  “రేపటి వరకు ఆగండి” భరోసాగా అంది లక్ష్మి.

 

       ***

ఉదయాన్నే వాకింగ్ కు వెళ్ళొచ్చిన శంకర్రావుకు ఇంట్లో అంత పొద్దున్నే ఎవరో కొత్త మనిషి కన్పించటం ఆశ్చర్యం కలిగించింది. లక్ష్మీ వంక చూశాడు ఎవరీ వ్యక్తి అన్నట్లు.

“నందిత గారూ ….. వీరే మా వారు ఏ.జి. ఆఫీసులో పనిచేస్తున్నారు”.

“ఏమండీ …. ఈవిడ నందిత గారని మన పై ఫ్లోర్ లో ఉంటారు.  ఈ మధ్యే వచ్చారు.  ‘వన్ టి.వి. ఛానల్’ లో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.  ఆవిడ ఎప్పుడూ బిజీగా ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ చూడలేదు.  ఇప్పుడు ఆవిడ రావటానికి కారణం, రాత్రి మీరు యాదయ్య పిల్లల్ని చదివించడం ఎలా అని మధనపడుతున్నారు కదా, దానికి నందిత గారు పరిష్కారం చెబుతున్నారు. మీరొచ్చారు.”

“నమస్కారమండీ. లక్ష్మి గారు ఆ పిల్లల చదువు గురించి ఇంతకు ముందే చెప్పారు.  మీ అపార్ట్ మెంట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు కాస్త కూడా సహాయం చేయటానికి ముందుకు రావటం లేదన్నారుట కదా ! నేను మా ఛానల్ హెడ్ తో మాట్లాడాను.  ఆయనక్కూడా నా కాన్సెప్ట్ నచ్చింది”.

:: 3 ::

 “కాన్సెప్టా, ఇదేం ప్రోగ్రాం కాదు కదా, పిల్లల చదువండీ” తికమకపడుతూ అన్నాడు శంకరం .

“సారీ, మా లాంగ్వేజ్ లో చెప్పేస్తున్నాను. ‘చదువులమ్మకు వందనం’ పేరుతో కొన్ని అపార్ట్ మెంట్లని సర్వే చెయ్యబోతున్నాం.  ఏ అపార్ట్ మెంట్ వాళ్ళు తమ ఖర్చుతో తమ వాచ్ మెన్ పిల్లల్ని, లేకపోతే అనాధ పిల్లల్ని చదివించడానికి ముందుకు వస్తారో వాళ్ళతో రియాల్టీ షో చేస్తాం.  వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది.  అదిచూసి ఇంకొన్ని అపార్ట్ మెంట్ల అసోసియేషన్లు ముందుకొస్తాయి.  కార్పొరేట్ల నుంచి అపార్ట్ మెంట్ల వరకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా విస్తరిస్తోందో వెతికి చూపిన వన్ టి.వి. అని పనిలో పనిగా మా రేటింగ్స్ పెరుగుతాయి.  ఇదంతా చెయిన్ రియాక్షన్ లాంటి దంకుల్.  ఒకళ్ళని చూసి మరొకళ్ళు ముందుకొస్తారు. ప్రెసిడెంట్ ప్రసాదరావు గారితో నేను డీల్ చేస్తాను.  మీరు నిశ్చింతగా వుండండి”.  ఆ అమ్మాయిలోని కాన్ఫిడెన్సు లెవెల్స్ కు బిత్తర పోయాడు శంకర్రావు. యాదయ్య పిల్లల చదువు టి.వి. కాన్సెప్ట్ గా మారిపోతున్నందుకు ఒకింత చింతించాడు కూడా.

***

 ఆ రోజు సాయంత్రం శంకర్రావు ఇంటికొచ్చే సరికి అప్పటికే ప్రెసిడెంట్ ప్రసాదరావు కాంప్లెక్స్ ఆఫీసులో శంకర్రావు కోసం ఎదురు చూస్తూ కన్పించాడు ఉపోద్ఘాతం లేకుండా సబ్జెక్టులోకి వచ్చేశాడు.

“మీరు చెప్పిన ఐడియా బావుంది శంకర్రావు గారూ.  యాదయ్య పిల్లల్ని మనమెందుకు చదివించకూడదు అని నాక్కూడా అనిపించింది.  మన కాంప్లెక్స్ లో వుంటున్న  వన్ టి.వి. రిపోర్టర్ నందితక్కూడా ఇదే విషయం చెప్పాను.  మేం చదివిస్తామమ్మా యాదయ్య పిల్లల్ని,  కానీ మాలాగా మిగిలిన అపార్ట్ మెంట్ల వాళ్ళు ముందుకొచ్చేలా కొంత పబ్లిసిటీ మాకివ్వాలని చెప్పాను.  ఆ అమ్మాయి కూడా సరేనంది.  అప్పుడు ఇలాంటి ప్రపోజల్ తో సిటీలో ముందుకొచ్చిన అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ ‘విబ్ జియార్’ కాంప్లెక్స్ అని మన కాంప్లెక్స్ ని  టి.వి. ఛాన్నళ్ళన్నీ పంచ రంగులతో, న్యూస్ పేపర్లన్నీ రంగుల అక్షరాల్లో చూపిస్తాయి.  ఎక్కడ చూసినా మన అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ గురించే చర్చలు”. ప్రసాద రావు కలల్లో తేలిపోతున్నాడని అర్ధమయ్యింది శంకర్రావుకి. థాంక్స్ చెప్పి లేచాడు.

“ఏమిటి ప్రసాద రావు గారు మీతో మాట్లాడారా” ఆసక్తిగా అడిగింది లక్ష్మి ఇంట్లో ప్రవేశించిన మొగుణ్ణి.

“అదేమిటి అదేదో ఆయన ఐడియాలా చెబ్తున్నాడు” అడిగాడు శంకర్రావు.

ఈ తరహా ప్రయోగం మన అపార్ట్ మెంట్స్ కాంప్లెక్స్ లోనే స్టార్టు చేస్తున్నాం అన్న నందిత మాటలకు పడిపోయాడాయన.  ఈ వార్త అప్పుడే పక్క కాంప్లెక్స్ లకి పాకింది అందరూ ప్రసాద రావును అభినందిస్తున్నారు.  పోన్లెండి యాదయ్య పిల్లల చదువుకి, ఆ పిల్లల చదువెలా అన్న మీ ఆందోళనకు ఒక పరిష్కారం ‘చదువులమ్మకు వందనం’ ప్రోగ్రాం చూపిస్తోంది కదా !

:: 4 ::

 

“నేనడిగినప్పుడు నన్ను విదిల్చి కొట్టినవాడు. ఇవ్వాళ అదేదో తన కాన్సెప్ట్ లా ఫోజులు కొడుతున్నాడు.  అది సరే టి.వి. షో అయిపోగానే యాదయ్య పిల్లల చదువుకు మాకు సంబంధం లేదనడు కదా !” అనుమానం వ్యక్తం చేశాడు శంకర్రావు.

“అలాంటి ఛాన్సే లేదు.  వాళ్ళిద్దరి పిల్లల చదువు సంవత్సరం ఫీజు చెక్కు రూపంలో ఆ స్కూలు వాళ్లకు ఇస్తారు.  ఆ స్కూలు వాళ్ళు కూడా వాళ్ళవంతు సాయంగా ఆ పిల్లలకు నోటు బుక్కులు, టెక్ష్ట్  బుక్కులు ఫ్రీగా ఇస్తున్నారు.  ఇదంతా నందిని వాళ్ళ ‘వన్ టి.వి.’ చాలా జాగ్రత్తగా వర్కవుట్ చేసింది”.

“సరే, ప్రెసిడెంటుకు పబ్లిసిటీ వస్తుంది, మన అపార్ట్ మెంట్స్ పేరు మార్మోగుతుంది.  ఆ ఛానల్ కు ఏమిటి లాభం” సందేహంగా అడిగాడు శంకర్రావు.

“ఏ కాలంలో వున్నారండి మీరింకా.  మీరు చదువుకునే  రోజుల దగ్గరే ఆగిపోయారు.  సామాజిక బాధ్యత అనేది ఇప్పుడు అందరి నోళ్ళలో నానే మాట.  అయితే దానితో బాటు పబ్లిసిటీ మైలేజ్ ఎంతొస్తుందో కూడా లెక్కేసుకుంటున్నారు.  ఎవరి స్థాయిలో వాళ్ళు ఏదో ఒక సెలబ్రిటీ అయిపోవాలి” లక్ష్మి విశ్లేషణకు శంకర్రావుకు కళ్ళు విచ్చుకున్నాయి.

“ఇలాంటి దాన్ని మనం సపోర్టు చేయటం కరక్టేనా !” ప్రశ్న తనను తాను  వేసుకున్నట్లు అడిగాడు.

“చిన్న నుంచి పెద్ద వరకు అందరూ తాము చేసిన చిన్న చిన్న పన్లకు కూడా పూసగుచ్చినట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెడుతున్న కాలమిది.  ఇప్పుడు మీరేం చేస్తున్నారు అన్న దానికన్నా చేసిన పనిని అందరూ గమనించారా లేదా అని ప్రతివాళ్ళు జాగ్రత్త పడుతున్న కాలం.  మీ వరకు యాదయ్య పిల్లలు అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ తరపున చదువుకోగలుగుతున్నారా లేదా అన్నది ముఖ్యం.  మీ ప్రెసిడెంట్ గారికి అందరిలోనూ ఆయన పేరు విన్పడాలి మొహం టి.వి.లో వెలిగిపోవాలి.  నందిని వాళ్ళ ప్రోగ్రాం హెడ్ కు ఇలాంటి కార్యక్రమాలతో వాళ్ళ ఛానల్ దూసుకుపోవాలి.  ఎవరి ప్రియారిటీస్ వాళ్ళవి నెరవేరుతున్నాయా లేదా అన్నది పాయింట్” శంకర్రావు ఏదో చెప్పేలోగా యాదయ్య హడావిడిగా వచ్చాడు.

“నా పిల్లల్ని కాపాడిన్రు సార్. మీరు, అమ్మా చెప్పబట్టే ఆ నందితమ్మ ప్రయత్నం చేసింది. ప్రెసిడెంట్ సాబ్ ని ఒప్పించింది.  ఆదివారం పొద్దుగాల పదికొట్టంగ అందరొస్తున్రు సార్.  ఆ ఛానల్ సార్ కూడా అస్తుండంట.  అప్పుడే నన్ను, మా పిల్లల్ని అందరికి చూపుతరట.  మమ్మల్ని అంగట్లో బొమ్మలెక్క జూపినా ఏమనుకోం సార్.  మా పోరగాళ్ళు  సదువుకో గలుగుతాన్రు. గది సాలు” ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు యాదయ్య.

“చూశారా, యాదయ్యక్కూడా తెలుసు.  దీన్నో తమాషాగా చూపుతున్నారని.  కానీ తన పిల్లల చదువు ముఖ్య మనుకున్నాడు.  మిగిలినవి అనవసరమనుకున్నాడు.  మీలాగా సెంటిమెంటల్ గా ఆలోచించడం లేదు”.

 :: 5 ::

 శంకర్రావుకు పొద్దున్నే కొలీగ్ చెప్పిన ‘విన్.విన్’ థియరీ గుర్తొచ్చింది.  ఇక్కడ అందరూ విజేతలే.  ఎవరికి వాళ్ళు విజయంలో తమ షేరెంతో లెక్కేసుకుంటున్నారు.

“ఈ మొత్తం ఎపిసోడ్ లో నా షేరెంతని లెక్కేసుకుంటున్నారా ఏమిటి” తన మైండును చదివేసినట్లుగా లక్ష్మి అడిగిన ప్రశ్నకు ఈ పరుగు పందెంలో తనెప్పుడూ పాల్గొనలేడని మాత్రం అర్ధమయి, అతని పెదాల మీద చిర్నవ్వు మెరిసింది ఆ క్షణాన.

***

 

 

 

 

 

ఆమె

Katha ku Bomma (1)

రాత్రి  ఎనిమిదింటప్పుడు రావడంరావడంతోనే తన గదిలోకి వెళ్లిపోయి..
‘డామిట్‌.. ఐ కాంట్‌’ కసిగా అంటూ స్టడీ  వస్తువులన్నీ విసిరేయసాగాడు పద్దెనిమిదేళ్ల ప్రణవ్‌!
ప్రణవ్‌.. వాట్‌ ద హెల్‌ ఆర్‌ j­ డూయింగ్‌! స్టాపిట్‌!’ అంటూ కొడుకుని ఆపే ప్రయత్నం చేస్తోంది వసుధ.
‘నో..’ అరుస్తూ తల్లిని తోసేయసాగాడు. వాడిబలాన్ని నియంతించలేక అక్కడేఉన్న కుర్చీలో చతికిలబడింది. పిచ్చిపట్టినవాడిలా చేతికందిన వస్తువునల్లా విసిరేస్తున్న కొడుకుని చూసి భయపడిపోయింది. వాడిని ఆపడం తన ఒక్కదానివల్ల కాక ‘అస్త్రా…’ అని ఇరవైళ్ల కూతురిని కేకేసింది సాయం కోసం.
‘అమ్మా…’ అంటూ కంగారుగా పరిగెత్తుకొచ్చింది తల్లిపిలుపు వినిపించిన గదిలోకి. అల్లకల్లోలంగా ఉన్న ఆ చోటుని చూసి బిత్తరపోయింది అస్త్ర. వెర్రివాడిలా పవర్తిస్తున్న తమ్ముడ్ని  పట్టలేక తల్లిపడుతున్న అవస్థ చూసింది. వెళ్లి తమ్ముడిని  లాగి చెంపమీదొక్కట్టిచ్చింది. ఆ దెబ్బకు ఈ లోకంలోకొచ్చాడు ప్రణవ్‌.
‘ఆర్‌ యు మ్యాడ్‌? ఏంటిదంతా?’ బెదిరించింది తమ్ముడిని.
‘సాయంతం మాల్‌లో ఆమె కనిపించిందీ….!’ మళ్లీ అరిచాడు.
‘ఎవరు?’ ఏదో అనుమానం వసుధ పశ్నలో.
ప్రణవ్‌ ఏదో చెప్పబోతున్నంతలో ఆ మాటకు అడ్డుతగులుతూ ‘ఆ కనిపిస్తే.. ఇంటికొచ్చి నువ్విలా హంగామా చేస్తావా? బీ గ్రోనప్‌! నువ్వేం చిన్నపిల్లాడివి కాదు. కిందపడేసినవన్నీ తీసి ఎక్కడివక్కడ నీట్‌గా సర్దెయ్‌!’ అని తమ్ముడిని ఆజ్ఞాపించి ‘నువ్‌ రా అమ్మా..!’ అంటూ తల్లి భుజం చుట్టూ చెయ్యివేసి ఆమెను హాల్లోకి తీసుకెళ్లింది. తల్లిని సోఫాలో కూర్చోబెట్టి  ఫ్రిజ్ లోంచి వాటర్‌ బాటిల్‌ తీసుకొని మళ్లీ తమ్ముడి  గదిలోకి వెళ్లింది అస్త్ర. లోపలికెళుతూనే గది తలుపేసి వాటర్‌ బాటిల్‌ ప్రణవ్ కందించింది. బాటిల్‌ ఎత్తి గటగటా నీళ్లు తాగి భుజంతో మూతి  తుడుచుకుంటుండగా అంది అస్త్ర..‘రేయ్‌.. నీకెన్నిసార్లు చెప్పానా అంత ఎమోషనల్  అవొద్దని!  ఎంత సీరియస్‌ విషయాలనైనా మాములుగా  చూడ్డం నేర్చుకోరా…! దట్‌ టూ నువ్‌ ఆవేశపడిపోతున్నదంత సీరియస్‌ థింగ్‌ కాదు!’ వాడి తలనిమురుతూ  అనునయిస్తున్నట్టుగా!
అస్త్ర చేయిని విసురుగా తోసేశాడు. ‘నీకు సీరియస్‌ కాకపోవచ్చు… నాకు సీరియసే! అమ్మ ఎన్ని రోజులు బాధపడిందో నువ్వు మర్చిపోయావేమో … బట్‌ ఐ డోంట్‌!’ అన్నాడు నోరు పెంచి!
‘ష్‌… నెమ్మదిగా!’ అంది గాభరాగా.. హాల్లో ఉన్న తల్లికి వాడి మాటలు  వినపడతాయేమో  అని!
‘మన హ్యాపీనెస్‌ను దూరంచేసి ఆవిడ మాత్రం  నవ్వుతూ తెగహ్యాపీగా తిరుగుతోంది. నాకసలూ…!’ అంటూ ముక్కు పుటాలెగరేస్తూ పిడికిలి బిగించాడు ప్రణవ్‌!
‘సర్లే.. ముందు  కిందపడ్డవన్నీ తియ్‌!’ అంది వాడి సీరియస్‌నెస్‌ను చెదరగొడుతూ! ప్రణవ్‌ చేతిలో ఉన్న బాటిల్‌ తీసుకొని గదిలోంచి హాల్లోకొచ్చింది అస్త్ర. అక్కడ సోఫాలో తల్లికనిపించలేదు. బాటిల్‌ డైనింగ్‌  మీద పెడుతూ హాల్లోని బాల్కనీలోకి చూసింది. తల్లి కనిపించింది. నెమ్మదిగా వెళ్లి వెనకనుంచి వాటేసుకుంది ‘అమ్మా..!’ అంటూ ఆమె మూడ్ ని  తేలికచేయాలని.
అస్త్ర చేతుల్లోంచి తనను విడిపించుకుంటూ అలాగే కూతురు రెండు చేతులను పట్టుకొని తనకెదురుగా నిల్చోబెట్టుకుంది..‘వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?’ అంది కూతురు కళ్లల్లోకి సూటిగా చూస్తూ!
విషయాన్ని దాచడం అనవసరం అని గ్రహించిన అస్త్ర ‘అపర్ణ ఆంటీ గురించి’ అంది అంతే స్పష్టంగా!
దీర్ఘంగా నిట్టూర్చిన వసుధ అలాగే నిలబడిపోయింది.

‘శ్రీరామ్  … ఈవినింగ్‌ షాపింగ్‌మాల్లో ప్రణవ్‌ కనిపించాడు!’ బెడ్‌రూమ్ లోకి వస్తూ చెప్పింది అపర్ణ.
‘ఊ….!’ విన్నాడు శ్రీరామ్ ల్యాప్‌లోంచి తలెత్తకుండానే!
‘వాడేంటో నన్ను శతువును చూసినట్టు చూస్తాడు!’ అంది మంచమ్మీద అవతలివైపు కూర్చుంటూ!
శ్రీరామ్ ఏకాగ్రత చెదిరింది. దాన్ని అపర్ణ గుర్తించకుండా ఉండేందుకు ల్యాప్‌టాప్‌ కీ బోర్డ్‌ మీద వేళ్లు కదిపాడు నటించడానికి.
‘అస్త్ర బాగానే మాట్లాడుతుంది… ప్రణవే ఎందుకలా ఉంటాడు?’ అంది శ్రీరాం జవాబును ఆశిస్తున్నట్టుగా!
‘లైట్‌ తీస్కో అపర్ణా!’ జవాబైతే చెప్పాడు కాని అపర్ణకు అది సంతృప్తినివ్వదని అతనికి తెలుసు.
‘ఎంతకాలమని? అయినా.. నేనెప్పుడైనా వాడిని తక్కువ చూశానా? ఎంత కలుపుకుపోవాలని ట్రై చేసినా.. వాడి బిహేవియర్‌తో ఇన్‌సల్ట్‌ చేస్తుంటాడు!’  ఆ విషయమ్మీద ఎలాగైనా డిస్కషన్‌ పెట్టాలనే ఉద్దేశంలో అపర్ణ.
సీన్‌ అర్థమైంది శ్రీరామ్ కి. ఇంకెంతోసేపు నటించడం కుదరదు అనుకొని ల్యాప్‌టాప్‌ షట్‌డౌన్‌ చేసి ఒళ్లోంచి తీసి మంచమ్మీద పెట్టాడు.
‘నీ బాధేంటి?’ ఇప్పుడు చెప్పు విషయమేంటి అన్నట్టుగా శ్రీరామ్!
‘ఈ విషయంలో నేనోసారి వసుధతో మాట్లాడాలనుకుంటున్నాను!’ స్థిరంగా చెప్పింది అపర్ణ.
‘అంటే వసుధే ప్రణవ్‌తో అలా చేయిస్తోం…!’ శ్రీరామ్ మాటపూర్తికాకముందే అడ్డుపడిరది అపర్ణ ‘ఛఛ…!’ అని.
‘ప్రణవ్‌కి నామీదున్న మిస్‌అండర్‌స్టాండింగ్ను దూరంచేయడానికి!’ తేల్చింది అపర్ణ!
జవాబేమీ ఇవ్వకుండా మంచం పక్కనే ఉన్న టీపాయ్‌ మీది మ్యాగజైన్‌తీసుకుని  అందులో తలదూర్చాడు శ్రీరామ్.

‘నన్నెందుకు రమ్మన్నారు?’ రెస్టారెంట్లో శ్రీరామ్ కెదురుగా ఇబ్బందిగా కూర్చున్న ప్రణవ్‌ సూటిగా అడిగిన మాట!
‘ఏం తీసుకుంటావ్‌?’ ఇబ్బందిని అనుకూలంగా మార్చేప్రయత్నంలో శ్రీరామ్.
‘నన్నెందుకు పిలిచారో చెప్పండి డాడ్‌!’ అదే ప్రశ్న ఇంకొంచెం తీవ్రంగా ప్రణవ్  నుంచి.
బేరర్‌ని పిలిచి రెండు ఫ్రూట్‌పంచ్‌లు ఆర్డరిచ్చి సంభాషణ మొదలెట్టడానికి గొంతు సవరించుకున్నాడు శ్రీరామ్.
‘చిన్నా…’ అంటూ ప్రణవ్‌ చేయినొక్కాడు సున్నితంగా శ్రీరామ్ తను మాట్లాడబోయేమాటలకు నాందిగా..
‘చెప్పండి’ అంటూ మెల్లగా తన చేయిని వెనక్కి లాక్కున్నాడు ప్రణవ్‌!
‘రేయ్‌.. నేను ఇదివరకే నీతో మాట్లాడాల్సింది!’ శ్రీరామ్
‘దేనిగురించి డాడీ…!’ అప్పుడే బేరర్‌ తెచ్చిన ఫ్రూట్‌పంచ్‌ గ్లాస్‌ను తనవైపు లాక్కుంటూ అన్నాడు ప్రణవ్‌.
‘అపర్ణ గురించి!’ కొంచెం ఇబ్బంది ధ్వనించిన గొంతుతో శ్రీరామ్.
ప్రణవ్‌ సైలెంట్‌గా ఫ్రూట్‌పంచ్‌లోని స్టాను గమనిస్తూ ఉండిపోయాడు.
‘నువ్విప్పుడు అన్ని విషయాలూ ఆలోచించే ఏజ్‌కొచ్చావ్‌. ఐ మీన్‌ నౌ ఆర్ యూ  మెచ్యూర్డ్‌ గై! అపర్ణను, ఆమె నా లైఫ్‌లోకొచ్చిన సిట్యుయేషన్‌నూ నువ్‌ అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నాను..’ అని ప్రణవ్‌ వంక చూశాడు శ్రీరామ్!
ఎలాంటి ఫీలింగ్‌ లేకుండా అలాగే స్టాతో ఆడుకుంటున్నాడు ప్రణవ్‌!
‘ప్రణవ్‌.. ఆర్‌ యు ­ లిజనింగ్‌ టు మి?’ కొంచెం గట్టిగా శ్రీరామ్.
తలపైకెత్తి కళ్లతోనే ‘యెస్‌’ అన్నట్టు సైగ చేశాడు ప్రణవ్‌.
‘అపర్ణ నా లైఫ్‌లోకి రావడం.. ఇట్స్‌ యాన్‌ యాక్సిడెంటల్‌ థింగ్‌!’ అసహనంగా అన్నాడు శ్రీరామ్.
‘యాక్సిడెంటల్‌ అయినా… వాటెండ్‌ అయినా  అమ్మ ఫేస్‌ చేసిన బాధ,  నేను, అక్క మిమ్మల్ని మిస్‌ అయిన మూమెంట్స్‌ అయితే నిజమే కదా!’ నిర్లక్ష్యంగా అన్నాడు ప్రణవ్‌.
‘అఫ్‌కోర్స్‌రా… కాదనడంలేదు. కాని మీ అమ్మ నా సిట్యుయేషన్‌ అర్థంచేసుకుంది… మీరు నన్నెంత మిస్‌ అవుతున్నారో..నేనూ మిమ్మల్ని అంతే మిస్‌ అవుతున్నా..! అయినా నేనేం మిమ్మల్ని కాదని.. మీకు అందకుండా వెళ్లిపోలేదు కదా… మీతో ఉండకపోయినా… కలుస్తూనే ఉన్నా.. మీ అవసరాలు తీరుస్తూనే ఉన్నా!’ సమర్థించుకునే ప్రయత్నంగా శ్రీరామ్!
‘అకేషన్స్‌కి బట్టలు కొనిపెట్టి, వీకెండ్స్‌ మాతో గడిపితే మాకు దగ్గరగా ఉన్నట్టా డాడీ…! ఆవిడే లేకపోతే మిమ్మల్నిలా  వీకెండ్స్‌కి కల్సుకోవాల్సిన అవసరమేంటి మాకు?’  మీద పిడికిలితో చిన్నగా గుద్దుతూ అన్నాడు ప్రణవ్‌!
‘డాడీ… మీరంటే నాకు కోపంలేదు.. ఆవిడంటే కోపం… మిమ్మల్ని మానుంచి తీసుకెళ్లిపోయినందుకు కోపం.. అమ్మ ఎన్ని రోజులు ఏడ్చిందో నాకు తెలుసు. ఐ నెవర్‌ ఫర్‌గెట్‌ దోస్‌ డేస్‌! దానికి రీజన్‌ ఆమే…ఆమే.. ఆమే..!’ దాదాపుగా అరిచేస్తూ ప్రణవ్‌!
బిత్తరపోయాడు శ్రీరామ్. కాసేపటిదాకా నోటమాటరాలేదు అతనికి.
‘నో.. చిన్నా! ఇందులో అపర్ణ తప్పులేదు. ఆమె నాలైఫ్‌లోకి తనంతట తాను రాలేదు నేను ఇన్వైట్‌ చేశాను.  ఆమెను ఇష్టపడ్డాను. నీకు పదేళ్ల వయసప్పుడు.. కంపెనీ అసైన్‌మెంట్‌ మీద సింగపూర్‌ వెళ్లాను. సెవెన్‌మంత్స్‌ ఉన్నానక్కడ. ఆ టైం లో  అపర్ణతో ఫెండ్‌షిప్‌ అయింది. ఆమె లవ్‌చేశాను. తనతో నా లైఫ్‌ షేర్‌ చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం మీ అమ్మకు చెప్పి డైవోర్స్‌ తీసుకున్నాకే తనని పెళ్లిచేసుకున్నాను. నువ్వనుకున్నట్టు తప్పు ఆమెది కాదురా.. నాది. నన్ను వదిలి తననెందుకు ఓ ఎనిమీలా చూస్తావ్‌! మిస్టేక్‌ వజ్‌ మైన్‌!’ శ్రీరామ్ ఆవేశంగానే చెప్పాడు. అంతలోకే స్వరం తగ్గించి
‘చిన్నా… అపర్ణను మీ అమ్మలా చూడమని చెప్పట్లేదు. బట్‌ ఓ ఉమన్‌గా j­ హావ్‌ టు రెస్పెక్ట్‌ హర్‌! ఐ కెన్‌ అండర్‌స్టాండ్‌ యు­వర్‌ ఎగోని. కాని నేను మీ పట్లెప్పుడూ ఇర్రెస్‌పాన్స్‌బుల్‌గా లేను నాన్నా…! నాకు మీరు కావాలి, అపర్ణా కావాలి! అమ్మను చాలా బాధపెట్టాను.. ఒప్పుకుంటా! ఒకవేళ అమ్మ ఇట్లాంటి పనిచేస్తే నేను క్షమించేవాడిని కాదేమో … కాని అమ్మ నన్ను ఫర్‌గివ్‌ చేసింది! అపర్ణను ఓ ఫ్రెండ్ లా  రిసీవ్‌ చేసుకుంది. రెస్పెక్ట్‌ ఇస్తోంది.  ఈవిషయంలో వసుధ హుందాతనాన్ని చూసి సిగ్గుతో చితికిపోయిన రోజులు నాకూ ఉన్నాయ్‌రా! మీ అమ్మనెంత క్షోభపెట్టానో అని కుమిలిపోయిన రాత్రుళ్లు  ఎన్నో!  తనని ఒంటిరిని చేశానే అని చిత్రవధ  అనుభవించిన సందర్భాలు బోలెడు! ఆ తప్పులన్నీ నావిరా! అపర్ణవి కావు! షి ఈజ్‌ ఇన్నోసెంట్‌ ఇన్‌ దిస్‌ మ్యాటర్స్‌! షి నీడ్స్‌ ది సేం రెస్పెక్ట్‌  ఫ్రం యు రా చిన్నా…!’ అంటూ ప్రణవ్‌ చేయి పట్టుకున్నాడు.
తండి కళ్లల్లోని సన్నని నీటి పొర కొడుకు దృష్టినుంచి తప్పించుకోలేకపోయింది!

‘ప్రణవ్‌… యోయో హానీసింగ్‌ షోకి పాస్‌లు వచ్చాయ్‌రా!’ అప్పుడే వచ్చి గదిలోకి దూరి తలుపేసుకున్న కొడుకు వినేలా గట్టిగా చెప్పింది వసుధ.
కొన్ని క్షణాలకు డోర్‌ తీసుకొని టవల్‌తో మొహం తుడుచుకుంటూ  బయటకు వచ్చిన ప్రణవ్‌ ‘హౌ కం?’ అని అడిగాడు.
‘అ..ప..ర్ణ.. ఆంటీ.. తెచ్చిచ్చింది!’ కొంచెం నసుగుతూ చెప్పింది వసుధ.
‘నాకు హానీసింగ్‌ అంటే ఇష్టమని ఆమెకెవరు చెప్పారు?’ డైనింగ్‌  డబ్బాలో ఉన్న బిస్కట్స్‌ తీసుకుంటూ ప్రణవ్‌.
‘అక్క చెప్పి ఉంటదిలే! ఎవరు చెప్తే ఏంరా.. షోకి పాసెస్‌ దొరికాయ్‌ మీ ఫ్రెండ్స్‌తో వెళ్లు!’ ఫ్రిజ్‌మీదున్న పుస్తకంలోంచి పాస్‌లు తీసిస్తూ అన్నది వసుధ.
వాటివైపు చూడకుండా మౌనంగా బిస్కట్స్‌ తింటున్న కొడుకు దగ్గరకి ఇంకో చైర్‌ జరుపుకొని కూర్చుంటూ ‘అపర్ణ ఆంటీ! ఆమె, ఈమె కాదు! పెద్దవాళ్లకు రెస్పెక్ట్‌ ఇవ్వడం నేర్చుకో!’ చిన్నగా మందలిస్తున్నట్టుగా అంది వసుధ.
అలాగే నేల చూపులు చూశాడు కాని స్పందించలేదు ప్రణవ్‌.
‘డాడీ.. కలిశాడా?’ అడిగింది.
‘అపర్ణాం..’ అని నాలుక్కర్చుకున్నట్టుగా వెంటనే ‘ఆమె నిన్ను కలిసిందా?’ అన్నాడు వసుధ మొహంలోకి చూస్తూ!
‘ప్రశ్నకుపశ్న సమాధానం కాదు!’ కటువుగా వసుధ.
‘కలిశాడు!’ తలవంచుకుని చెప్పాడు.
ప్రణవ్‌ జుట్టును ఆప్యాయంగా చెదురుస్తూ ‘అపర్ణ అంటే నాకెప్పుడూ కోపంలేదు. అపర్ణ విషయం మీడాడీ నాతో చెప్పినప్పుడు కోపమొచ్చింది, పోట్లాడాను, చెంపచెళ్లుమనిపించాను.. నీ మొహం చూపించకుపో అని ఇంట్లోంచి గెంటేశాను. తర్వాత మీ కోసం ఆ కోపాన్నీ అణచుకున్నాను. అర్థంచేసుకోవడం స్టార్ట్‌చేశాను. అప్పుడు మీ డాడీపట్ల జాలేయడం మొదలైంది. జరిగింది మర్చిపోలేనురా… అలాగని రాచిరంపానా పెట్టలేను. అపర్ణను మన ఫ్యామిలీలోకి ఇన్వైట్‌ చేయడానికి రీజనైన మీ డాడీనే జాలిపడి ఎక్స్‌క్యూజ్‌ చేసినప్పుడు ఎవరో తెలియని అపర్ణని సాధించి ఏంచేయగలను? మన లైవ్స్‌ని హెల్‌లోకి తోసుకోవడం తప్ప! నా ఫ్రెండ్స్‌ సౌజన్యాంటీ, జయాంటీ, కరుణాంటీని ఎలాగో అపర్ణ కూడా అలాగే అనుకో! ఇగ్నోర్‌ చేయలేని ఇంపార్టెంట్‌ పర్సన్‌! ఆమెకు డాడీ ఎంతో మనమూ  అంతే! షి ఈజ్‌ నాట్‌ అవర్‌ ఎనిమీ! షి ఈజ్‌ అవర్‌ ఫ్రెండ్‌! గౌరవించడం నేర్చుకో… అలవాటు చేసుకో! మీ డాడీ వల్ల నేను ఇబ్బంది పడ్డం నీకెంత బాధనిపించిందో.. నీ వల్ల ఆమె ఇబ్బంది పడ్డం నాకూ అంతే బాధగా ఉంటుంది! ఐ థింక్‌ యు­ గాట్‌ వాట్‌ ఐ సెడ్‌!’ అంటూ  అక్కడి నుంచి వెళ్లిపోయింది వసుధ!
మీదున్న పాస్‌లను తీసుకొని వాళ్లమ్మ ఫోన్‌లోంచి అపర్ణకు కాల్‌ కలిపాడు.
‘హలో ఆంటీ దిస్‌ ఈజ్‌ ప్రణవ్‌! థాంక్యూ ఫర్‌ పాసెస్‌!’ చెప్పాడు!

రమా సరస్వతి

రమా సరస్వతి

–రమా సరస్వతి

 

అమ్మాయిలూ ఆలోచించండి !

“శైలా! ఓ శైలా! మీ ఎంకమ్మత్త నిన్ను రమ్మంటంది”  ప్రహరీ గోడకి ఆనుకుని ఉన్న అరుగుమీదకెక్కి కేకలు వేస్తూ నన్ను  పిలిచి చెప్పింది నాగరత్నమ్మ.

“ఎందుకంటా? సిగ్గూ, ఎగ్గూ లేకుండా అది నా కూతురిని పిలవమంటే నువ్వెట్టా పిలుస్తున్నావు?  పైగా అరిచి చెప్తుంది చూడు నలుగురూ వినలేదని”  అంది మా అమ్మ ఈసడింపుగా.

 “నాకెందుకులే తల్లా మీ మద్దెన.  ‘పాలు పిండుకు రావడానికి కొట్టం సాయ పోతున్నావు గదా!  అట్టా మా శైలజని  రమ్మని చెప్పు నాగరత్తమ్మా’  అంటే వచ్చా.  ఏందో అమెరికా దేశం నుండి కోడలు వచ్చిందంటే చూడాలని ఉండదా?  చిన్నప్పుడు ఎత్తుకుని పెంచిన మురిపం ఎక్కడకు పోద్దీ”  అనుకుంటా అరుగు దిగి వెళ్ళిపోయింది నాగరత్నమ్మ.

“మురిపం అంటా మురిపం.  లేచిపోయింది పోయినట్లుండక ఆస్తి కోసం  పుట్టింటి పైనే కేసు వేసింది.  మొగుడ్ని వదిలేసి లేచిపోయిన దానికి ఆస్తి ఎట్టా వచ్చిద్దని కోర్టు బాగా బుద్ధి చెప్పింది.  అయినా దరిద్రం వదల్లా.  కూతురు సక్కరంగా కాపరం చేసిద్దని ఊళ్ళో ఇల్లు కట్టి పోయిందిగా ఆ మహాతల్లి.  ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ ఇంటికి చేరింది.  తూరుప్పక్క బజారుకి పోదామంటే సిగ్గేత్తంది దీని మొకం చూడలేక”  అంది అమ్మ మజ్జిగ చిలుక్కుంటూ.

 అమ్మ మాటలకి నాకు బాధ కలిగింది.  అమ్మ ఆవేదనలో కూడా అర్థం ఉంది.  మామని వద్దని లేచిపోయిన ఎంకమ్మత్త ఎవరి ప్రోద్బలంతో మా మీద కేసు వేసిందో, ఎందుకు వేసిందో నాకు అర్థం కాని ప్రశ్న.  తాతని ఫోన్లో అడిగాను కాని ‘నువ్వు ఇండియాకి వచ్చినపుడు మాట్లాడుకుందాంలే తల్లీ’ అన్నాడు.  అత్తని కలిసినపుడు తప్పకుండా అడగాలి.  ‘అమ్మకి తెలియకుండా అత్త దగ్గరకి వెళ్ళాలి ఈరోజు’ అని  అనుకున్నాను. 

అత్త జ్ఞాపకాలు నా మనస్సు నిండా…

                 Kadha-Saranga-2-300x268                         

  ***

మోకాళ్ళ పైదాకా బుట్టబొమ్మ లాంటి గౌనులు కుట్టేది నాకు అత్త.  అవి వేసుకుని స్టీలు పెట్టెలో పుస్తకాలు, పలక పెట్టుకుని స్కూలుకి వెళ్ళే నన్ను చూసి ‘నువ్వెవరి పిల్లవే’ అని అడిగే వారు నాకు మామ వరస అయ్యే వారు.  ‘ఎంకమ్మత్త కోడలిని’  అనేదాన్ని.  ఎప్పుడూ కూడా మా నాన్న పేరో, అమ్మ పేరో చెప్పేదాన్ని కాదు. ‘బాగా చదువుకుని పెద్ద డాక్టర్ వి అవ్వాలి బంగారూ! అమెరికాకి వెళ్ళి పై చదువులు చదవాలి‘ అనేది అత్త.

 అత్త భలే బాగుండేది.  సినిమాల్లోని భానుమతి లాగా.  మోచేతి దాకా ఉండే జాకెట్టూ,  ఆ జాకెట్టుకి మెడ చుట్టూ అంచూ, పూసలూ వేసి కుట్ట్టుకునేది.  ఒంటిపొర పైట వేసుకుని పిన్ను పెట్టుకునేది.  అంత అందమైన అత్తని పన్నెండేళ్ళప్పుడే తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడైన మామకిచ్చి పెళ్ళి చేశారు.  అత్తేమో రాణి లాగా పొడవు,  పొడవుకి తగ్గ అందమూ.  మామేమో పొట్టి.  బుడ్డోడులాగా ఉండేవాడు.  అయినా నాయనమ్మకి మనసు ఎట్లా ఒప్పిందో అంత అందమైన కూతురిని అనాకారి తమ్ముడికిచ్చి కట్టపెట్టడానికి?  తన పుట్టింటి ఆస్తిని కూడా తనింట్లోనే కలుపుకోవచ్చనో, కూతుర్ని తన దగ్గరే ఉంచుకోవచ్చు అనో చేసి ఉంటుంది.  రోజుకో రకంగా అలంకరించుకుని పొగాకు గ్రేడింగ్ కి పోయేది అత్త.  అక్కడ ఒక పొగాకు బయ్యర్ తో స్నేహం చేసింది.  నాన్నకి, తాతకి తెలిసి, కట్టడి చేసి ఇంట్లో కూర్చో పెట్టారు.  కొన్నాళ్ళు బాగానే ఉన్నట్లు నటించి తన నగలన్నీ తీసుకుని ఆ పొగాకు బయ్యర్ తో లేచి పోయింది. 

 అతడైనా సరైన వాడా అంటే అదీ లేదు.  అతనికి అప్పటికే పెళ్ళాం, కూతురు ఉన్నారు.  ఊళ్ళో అందరూ తాత నాయనమ్మల ముఖం ఎదుటే తుపుక్కు తుపుక్కు మని ఊశారు.  నాన్న అయితే చాలా రోజులు బయటికి రాలేకపోయాడు.  మామకివేమీ పట్టలేదు.  ఆయనకి మొదటినుండీ కూడా పొలమే పెళ్ళాం, గొడ్లే బిడ్డలు. 

 చాన్నాళ్ళ తర్వాత నేను ఏడో తరగతిలో ఉండగా స్కూలు నుండి వస్తున్న నన్ను దారిలో జువ్వి చెట్టు కింద కలుసుకుంది మా నాయనమ్మ. “మీ అత్తొచ్చిందే.  దానికి నిన్ను చూడాలని ఉందంట దా”  అని నన్ను చెరువు కట్ట దగ్గరకి తీసుకెళ్ళింది.  అబ్బో! ఎంకమ్మత్త ఎంత బాగుందో.  అచ్చం పట్నం దొరసాని లాగా ఉంది.  మిన్నాగు చర్మం లా ఆమె చర్మం  ఆ సాయంత్రపు ఎండలో మిల మిలా మెరుస్తుంది.  అత్తని చూస్తే అప్పుడు నాకు భలే గర్వం కలిగింది.  అత్త తన హాండ్ బ్యాగ్ లో నుండి బంగారు కాగితపు అట్టలో పెట్టిన హల్వా, చేగోడీలు ఇచ్చింది.  నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని కన్నీళ్ళు కారుస్తూ వెళ్ళిపోయింది.  ఇంటికి వచ్చేప్పుడు నాయనమ్మ “ఎవరికీ చెప్పొద్దేయ్. మీ అమ్మకి అస్సలు చెప్పబాక తిట్టిద్ది”  అంది.  చెప్పనని అడ్డంగా తలూపాను.

 నేను ఏడునుంచి పదో తరగతికి వచ్చిందాకా అప్పుడప్పుడూ నాయనమ్మతో వెళ్ళి అత్తని కలుస్తూనే ఉన్నాను.  అత్త ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్లు నాకు తెలుస్తోంది.  నాయనమ్మ అత్త వచ్చినప్పుడంతా చక్రాలో, పులిబొంగరాలో, అరెసెలో చేసి నీళ్ళ బిందెలో పెట్టుకుని  తెచ్చి కూతురికి పెట్టేది.  అమ్మకి నాన్నకి తెలిసినా తెలియనట్లు ఉండేవారు.  తాత కూడా మాతో వచ్చి చెరువు కట్టకింద అత్తని కలుసుకునేవాడు.  ఆ రోజుల్లో అతని గురించో లేక మరేం బాధలో తెలియదు కాని తాతకి,  నాయనమ్మకి ఏదో చెప్పి అత్త  ఏడుస్తూ ఉండేది.  ఒకసారి అత్త ఒక రెండు జళ్ళ పిల్లని వెంటబెట్టుకుని వచ్చింది.  అతని కూతురట. పది పన్నెండేళ్ళుంటాయేమో.  ఎంత బాగుందో ఆ పిల్ల.  మూతి బిగించుకుని మా వైపు చూస్తున్న ఆ పిల్ల చాలా తెలివైనదని అనిపించింది నాకు.  అక్కడ ఉన్న కొద్దిసేపులో ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  ‘రోజా! వదినతో ఆడుకో‘ అంది అత్త నావైపు చూపిస్తూ. ఆ పిల్ల నా వైపు కూడా చూడకుండా కింద పడ్డ చింతకాయలను ఏరుతుంది.  వెళ్ళేటప్పుడు మాత్రం అత్త ‘టాటా చెప్పు‘ అంటే యాంత్రికంగా చెయ్యి ఊపింది.  అంతే ఆ తర్వాత నేను అత్తని చూడలేదు.  

 నా పదవ తరగతి తర్వాత అత్త ఇక మా ఊరికి రాలేదు.  నాయనమ్మ కూతురి మీద బాగా దిగులేసుకుంది. పొగాకు నారుకి వెళ్ళేవారో, మా ఊరి బయ్యర్లో అత్తని ఒకసారి రాజమండ్రిలో చూశామని, మరోసారి కాకినాడలో చూశామని చెప్పేవారు.  చనిపోయే ముందు రాదని తెలిసీ నాయనమ్మ కూతురిని చూసుకోవాలని ఆఖరి నిమిషంలో కూడా ఎదురు చూసింది.

 కాలప్రవాహం  అత్తని గురించి పూర్తిగా మరిచేట్లు చేసింది.  నేను ఎం. ఏ ఫైనల్ లో ఉండగా మాకు అత్త నుండి లాయర్ నోటీసు వచ్చింది.  ఇంట్లో ఆ రోజు తాత మీద, నాన్న మీద అమ్మ అరిచిన అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయి.  పుట్ట్టింటి ఆస్తిలో తనకూ హక్కు ఉందనీ, తన భర్త ఆస్తి కూడా తనకే రావాలనీ ఆ నోటీసు సారాంశం.   భర్తతో కాపురం చేయకుండా లేచిపోయిందని చెప్పడానికి బోలెడంత మంది సాక్షులు బయలుదేరారు అత్త నోటీసు అయితే ఇచ్చింది కాని వాయిదాలకి రానే లేదుట.  కోర్టు ఆమెకి ఆస్తిలో హక్కు లేదని తీర్పు ఇచ్చింది.    

 నాకు పెళ్ళి సంబంధం వచ్చింది.  అత్తకు రావలసిన ఎనిమిదెకరాలూ నాకు కట్నంగా ఇచ్చి నా పెళ్ళి చేశారు. నేను డాక్టర్ ని అవ్వాలనే అత్త కోరిక  తీర్చలేకపోయినా నాకు అమెరికాలో పనిచేసే డాక్టర్ మొగుడే దొరికాడు.  పెళ్ళయ్యాక నేను అమెరికాకి వెళ్ళిపోయాను.  రెండేళ్ళ క్రితం తాతకి ఫోన్ చేసినపుడు “అత్త మనూరికి వచ్చిందమ్మా!”  అని చెప్పాడు.  నాకు చెప్పాలని నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడని ఆయన కంఠంలోని ఆతృత వల్ల అర్థం చేసుకున్నాను.  “అత్తకి కట్టించిన ఇంట్లో ఉంటుంది.  అత్త పరిస్తితి ఏమీ బాగా లేదు.  వ్యవసాయం చేసేటప్పుడు నా చేతుల్లో డబ్బు ఆడేది.  పొలం కౌలుకి ఇచ్చాం గా అమ్మా!  దాన్ని డాక్టరుకి చూపిద్దామన్నా నా దగ్గర డబ్బు లేదు.  తినడానికి మాత్రం బియ్యం మీ అమ్మకి తెలియకుండా ఇస్తున్నా”  అన్నాడు.  కళ్ళ నీళ్ళు తిరిగాయి.  వెంటనే గుంటూరులో ఉండే నా స్నేహితురాలు విజ్జికి ఫోన్ చేసి దాని ద్వారా తాతకి బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేయించి డబ్బు పంపాను.  చాలానే పంపాను ఆయన ఏ బాధా పడకుండా.  ఈ రెండేళ్ళలో అత్త ఆరోగ్యం బాగయింది.  సరియైన తిండి లేకనో, దిగులుతోనో శుష్కించిపోయిన ఆమె తేరుకుంది. 

 ఊళ్ళో అందరూ అమ్మతో సహా అత్తని లేవదీసుకుపోయినతను  అత్తకి బాగా డబ్బు మిగిల్చి చనిపోయాడని అనుకుంటున్నారనీ,  అత్త చేతిలో నాలుగు డబ్బులున్నాయని తెలియడంతో పలకరించే వాళ్ళు ఎక్కువయారనీ తాత సంతోషంగా చెప్పాడు.   తాత కూడా ఎవరికీ భయపడకుండా కూతురికీ మంచీ చెడ్డా చూసుకుంటున్నాడంట.  మామ మాత్రం తన మేనకోడలి మీద ప్రేమతో అత్త ఎదురైతే పలకరిస్తాడంట.

     ***                 

  పది గంటలప్పుడు అమ్మ పొలం వెళ్ళాక తాత,  నేను అత్త దగ్గరకి వెళ్ళాం.  అత్త నన్ను వాటేసుకుని ఏడ్చింది.  నాకు ఆమె ఎవరో అనిపించింది.  ఈమె మా అత్తేనా అనిపించేట్లుగా మారిపోయింది.  నేను ఆమెకి కొత్తగా అనిపించకపోవడానికి కారణం – ఆమె నా ఫొటో చూసి ఉంటుంది.  కాని నాకు మా అత్తని చూస్తే చెప్పలేని ఏదో భావం.  తెల్లజుట్టుని పీట ముడేసుకుని ఉంది.  ఏమయింది ఆ భానుమతి అంత అందం?  అందం ఇంత అశాశ్వతమా అనిపించింది.

“ఏంటత్తా! ఇలా అయిపోయావు? ” అన్నాను.  అత్త నిర్లిప్తంగా నవ్వింది. 

“డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళకూడదా తాతా”  అన్నాను. 

“రాకపోతే నేనేం చేసేది?  ఎందుకులే బాగానే ఉన్నాను అంటుంది ఎన్ని సార్లు రమ్మన్నా” అనుకుంటా బయటికి వెళ్ళిపోయాడు తాత.  నేను అత్త జీవితాన్ని గురించి అడుగుతానని ఊహించి మమ్మల్నిద్దరినీ అలా వదిలేసి వెళ్ళిపోయాడని అత్త, నేను గ్రహించాము.

“ఎట్టుండేదానివి ఎట్లా అయిపోయావత్తా”  అన్నాను. 

అత్త కళ్ళల్లో ఆగకుండా కన్నీరు.  “ఊరుకో అత్తా! ” అన్నాను.

ఏడుపు ఆపుకుని పైటతో కళ్ళు తుడుచుకుంటూ “మీ ఆయన బాగున్నారా? నీతో రాలేదే? చాలా మంచి వాడంటగా అమ్మా – తాత చెప్పాడు“  అంది.

“ఔనత్తా! బాగా చూసుకుంటాడు నన్ను.  చాలా బిజీ.  అమెరికాలో డాక్టరు గదా మరి. నేను నిన్ను చూడాలని  ఒక్కదాన్నే వచ్చానత్తా”  అన్నాను.  నా మాటలకి అత్త కళ్ళల్లో అమిత సంతోషం కదలాడింది.  తనకంటూ ఎవరూ ఉండరని భావం కొంత, ఆత్మ న్యూనతా భావం కొంతా ఉన్న వాళ్ళల్లో ‘తన కోసం ఒకరున్నారని తెలిస్తే కలిగే సంతోషమా అది అనిపించింది.  ఏమో!?  అత్త గురించి నాకు  తెలిస్తే నా మాటలకి ఆమెకెందుకంత సంతోషం కలిగిందో చెప్పగలనేమో!

“పిల్లల గురించి ఏమీ ఆలోచించలేదా? ” అంది.

“పెళ్ళయి మూడేళ్ళేగా అత్తా.  వచ్చే సంవత్సరం చూద్దాంలే.  నాకు అమ్మాయి పుడితే చిన్నప్పుడు నాకు కుట్టిచ్చినట్లు బుట్ట బొమ్మ గౌన్లు కుట్టియ్యాలత్తా నువ్వూ!” అన్నాను.

“నేను నిన్ను మర్చిపోయానురా బంగారూ!  కాని నువ్వు నన్ను మర్చిపోలేదు.  నీ మీద ఉండే ప్రేమ నంతా రోజా మీద చూపించాలనుకున్నాను.  ‘నువ్వొద్దు – నీ ప్రేమా వద్దూ‘  అంటూ అది నన్ను అసహ్యంచుకునేది.  అది అసహ్యించుకునే కొద్దీ నాకు దాని ప్రేమను సంపాదించుకోవాలని పట్టుదల కలిగేది.  ఆఖరికి అది నన్ను బానిసను చేసి ఆడించినా ఏమీ అనలేని స్థితిలో పడ్డాను.  బహుశా దాని తండ్రిని తల్లిని విడదీశానన్న బాధ దానికన్నా నాకు ఎక్కువగా ఉండటం వల్లనే నేను అది ఆడించినట్లుగా ఆడానేమో!“

 అత్త ఇంకా ఏదో చెప్పబోతుంది కాని ‘రోజా ఎవరా‘ అని ఆలోచిస్తున్న నాకు అత్త చెప్పిన చివరి వాక్యం వినగానే రెండు జళ్ళ క్లవర్ గర్ల్ రోజా గుర్తొచ్చి “ఇప్పుడెక్కడుందత్తా ఆ అమ్మాయి?“  అన్నాను ఆతృతగా – అరె! ఇన్ని రోజులూ ఆ అమ్మాయి అస్సలు గుర్తుకు రాలేదే అనుకుంటూ.  వేటగాడి బాణం గుండెల్లో గుచ్చుకున్నప్పుడు పక్షి కళ్ళల్లో కనపడే వేదన – కాదు నిస్సహాయత – కాదు కాదు నేను వర్ణించలేను నాకు మాటలు రావు – అలాంటి చూపుతో అత్త నన్ను నిశ్చేష్టపరిచింది.  నేను గొంతు పెగుల్చుకుని మాట్లాడబోయేంతలో అత్త లేచి వెళ్ళి మంచం క్రింద నుండి సూట్ కేస్ బయటకి లాగింది.  లోపల జిప్ లో నుండి ఒక కవర్ తీసి  “చదువు.  నీకు అన్ని విషయాలూ తెలుస్తాయి”  అంది ఏడుస్తూ.  ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది.  ఆతృతగా కవర్ లో నుండి కాగితాలు బయటకి లాగాను.

 

                                   ***

 ఎంకీ –

ఎలా ఉన్నావు? నిజానికి నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలని లేదు నాకు.  నువ్వు అంటే నాకు అసహ్యం.  ఇన్నాళ్ళ తర్వాత కూడా,  నా జీవితం  నాశనం అవడానికి కారణం నువ్వు కాదు – నేనే – కేవలం నేనే – అని తెలిసే వయసు, అనుభవం వచ్చాక కూడా నువ్వంటే నాకు అసహ్యం తగ్గకపోగా పెరిగింది.  మా నాన్న నన్ను, అమ్మని వదిలి వెళ్ళే నాటికి నాకు ఏడేళ్ళు.  నాకు పన్నెండేళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది.  ఈ ఐదేళ్ళలో మా అమ్మ ఏడవని రోజు లేదు అంటే నమ్ముతావా?  దానికి కారణం అయిన నీ దగ్గరకి నాన్న నన్ను తీసుకొచ్చాడు.  నిన్ను ‘అమ్మా! ‘ అని పిలవాలట. నిన్ను ప్రేమగా మాట్లాడాలని నాన్న కట్టడి చేశాడు.  నీ వల్ల మా అమ్మ చనిపోయిందని తెలిసిన దాన్ని నేను నిన్ను అమ్మా అని పిలవడమా? ప్రేమించడమా? ఛీ! ఛీ –  నేను అసహ్యించుకుంటున్నానని తెలిసీ నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూశావు.  మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించావేమో కూడా. కాని  నాకు మీ దగ్గరున్నంత కాలం జైల్లో ఉన్నట్లుగా ఉండేది.  బయటికి వెళ్ళలేని వయసు.  ఏం చేయాలో తెలియని  నిస్సహాయత.  ఆ కసి నాన్న లేనప్పుడు నీ మీద చూపించేదాన్ని. మీ దగ్గర నుండి స్వేచ్ఛగా  ఎగిరిపోవడానికి త్వరగా పెద్ద దాన్ని అవాలని కోరుకునే దాన్ని.  నా కోరిక తీరింది ఎంకీ.  చాలా పెద్ద దాన్నయిపోయాను.  త్వరలో ఈ లోకం నుండే శాశ్వతంగా వదిలి పోయేంతగా.

మీ గురించి హీనంగా మాట్లాడి స్నేహితుల దగ్గ్గర అభిమానం సంపాదించాను అనుకున్నాను కాని నా జీవితాన్ని గోప్యత లేకుండా ఆరబోసుకుంటున్నానని గ్రహించలేకపోయాను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా చుట్టూ  భ్రమా వలయాలు ఏర్పరుచుకున్న నన్ను వంచించడానికి శరత్ కి ఎక్కువ సమయం పట్టలేదు. వాడికి దుబాయ్ వెళ్ళాలని కోరిక.  ప్రేమించానని, పెళ్ళి చేసుకుంటానని, నన్ను కూడా తనతో మీకు దూరంగా దుబాయ్ కి తీసుకెళతానని నన్ను నమ్మించాడు.  నమ్మాను ఎంకీ.  జంతువులు అమ్మే అంగడి నుండి ఒక పిల్లవాడు వచ్చి పక్షిని కొనుక్కుపోతుంటే ఆ పక్షికెంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది నాకు.  పక్షి మళ్ళీ మరో పంజరంలోకి వెళ్ళబోతుందని ఊహించదు కదా!

 నన్ను వాడి మోహం తీరేవరకు అనుభవించి ఈ కంపెనీ వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అయితే వీడు మా నాన్న కంటే చాలా నయం ఎంకీ.  వీడికి పెళ్ళాం లేదు.  నా లాంటి కూతురూ లేదు.  నన్నే మోసం చేశాడు.  నా పట్ల కూడా నాకు జాలి కలగడం లేదు. ఎందుకంటే నీలా నేను మరో ఆడదాని జీవితాన్ని, మరో చిన్నపిల్ల జీవితాన్ని నాశనం చేయలేదు.  దానికి నేను భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

 ఎంకీ నా ఒళ్ళు హూనం అయింది.  జబ్బు ముదిరిపోయి ఆఖరి దశకు చేరుకున్నాక నేడో రేపో కుప్పతొట్టి దగ్గరకు విసిరివేయబడతాను.  ఇప్పుడు ఈ ఉత్తరం రాయడానికి కారణం నన్ను మీ దగ్గరకి తీసికెళ్ళమని చెప్పడానికి రాయడం లేదు.  నువ్వు నాకేమీ చేయక్కర్లేదు.  మనిద్దరి జీవితాల గురించి పదిమందికీ తెలియచెయ్యి.  ‘పెద్దలు తప్పులు చేసినా మనం మన జీవితాన్ని సరియైన విధంగా మలుచుకోవాలి కాని వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని అదే తప్పు మనం చేయడం, మన జీవితాలని నాశనం చేసుకోవడం  సబబా‘ అని ఈ అమ్మాయిలను ఆలోచించుకోమంటున్నానని చెప్పు.  ‘మీరు ఇప్పుడు చేసే పనుల  వల్ల రేపు మీ పిల్లల జీవితాలు ఏమవుతాయో తెలుసుకోమని‘  నువ్వూ నీ జీవితాన్ని విప్పి చెప్పు. 

 అంతే ఎంకీ,  నాలా మరో ఆడపిల్ల జీవితం నాశనం అవకూడదనే ఆవేదనతో ఈ ఉత్తరం రాశా.  నిన్ను క్షమించి మాత్రం కాదు.  నిన్ను అసహ్యించుకుంటూనే మరణిస్తా.

 మరణించాక కూడా నిన్ను క్షమించలేని

నీ రోజా.

ఉత్తరం పట్టుకుని దాని వైపే చూస్తూ మంచంలో కూలబడ్డాను నిస్సత్తువగా.  ఎందుకింత అమాయకంగా ఉన్నారు ఈ అమ్మాయిలు.  ప్రేమిస్తున్నాను,  పెళ్ళిచేసుకుంటాను అని అంటే నమ్మవచ్చు.   అంతకంటే మంచి వాళ్ళు దొరకరు అని అనుకుంటే పెళ్ళి చేసుకోవచ్చు. తప్పులేదు.  ఎందుకంటే పెళ్ళి తర్వాత ఎక్కువ శాతం మందిలో ప్రేమ కలుగుతుందని, బంధం ఏర్పడుతుందనీ నమ్ముతాం కనుక. కాని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని నమ్మి ఎలా వెళ్ళిపోతున్నారు?  సమాజంలో సాటి స్త్రీలకి జరుగుతున్న అన్యాయాలని చూసి కూడా స్త్రీ మళ్ళీ మళ్ళీ ఎలా మోసపోతుంది?  అయినా మనల్ని ఇంతగా నమ్మి వచ్చిన స్త్రీని మోసం చేయడానికి, వంచించడానికి మగవాడికి మనసెలా ఒప్పుతుందో!!?

 ఉత్తరం వల్లో, జెట్ లాగ్ వల్లో తెలియలేదు కడుపుని ఎవరో కెలికినట్లుగా వాంతి.  దొడ్లోకి పరిగెత్తి వాంతి చేసుకున్నాను.  దొడ్డి వాకిట్లో వీరడి సహాయంతో తాళ్ళు పేనుతున్న తాత, ఇంట్లో నుండి అత్త ఇద్దరూ నా దగ్గరకి పరిగెత్తారు.  “ఏమయింది తల్లీ!” అన్నాడు తాత ఆందోళనగా.  అత్తకి ఏడ్చీ ఏడ్చీ  మాట పెగలడంలేదు.  “వీరడిని పంపి ఫకీరు షాపులో కాఫీ తెప్పించు తాతా!  తలనొప్పిగా ఉంది.  అమెరికా నుండి వస్తే వారం రోజులు ఇలాగే ఉంటుందని నీకు తెలుసుగా.  కంగారేం లేదు”  అన్నాను.  వీరడు నీళ్ళు తెచ్చి ఇచ్చాడు.  శుభ్రం చేసుకుని అత్త, నేను లోపలకి వెళ్ళాం.  ఉత్తరం అత్త చేతికిస్తూ తర్వాతేమయింది అన్నట్లుగా ఆమె వైపు చూశాను.

“ఉత్తరం వచ్చాక పోస్టల్ అడ్రస్ పట్టుకుని  రోజాని అతి కష్టం మీద ఇంటికి తీసుకొచ్చాం.  చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.  అది ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే వాళ్ళ నాన్న గుండె ఆగిపోయింది దాన్ని  గురించిన ఆలోచనలతో.  దాన్నైనా బ్రతికించుకోవాలని డబ్బు కోసం తాతకి, మీ నాన్నకి చాలా ఉత్తరాలు రాశాను.  ఆఖరికి సిగ్గు విడిచి మీ అమ్మకి కూడా రాశాను.  సమాధానం లేకపోతే నేను నేరుగా మన ఇంటికి రావలసింది.  అది చేయకుండా ఆవేశంతో –  అది చచ్చిపోతుందన్న భయంతో –  లాయరు నోటీసు ఇస్తే డబ్బు పంపుతారని నోటీసు పంపాను.  మళ్ళీ మరో తప్పు చేశాను.  నా పుట్టింటి వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు నన్ను మొదటిసారి కంటే ఎక్కువగా అసహ్యించుకున్నారు.  ‘ఎంకీ!  నాకు బ్రతకాలనుంది‘  అని అది అంటుంటే ఏమీ చేయలేక తల బాదుకుని ఏడ్చాను.  వాళ్ళ నాన్న పోయిన కొన్ని రోజులకే అది – నన్ను ఎక్కువ బాధించకుండానే – రోజా చనిపోయింది.

 బంగారూ! అది కోరిన కోరిక నేను తీర్చలేను.  నాకు ఆ శక్తి లేదు.  నువ్వే మా ఇద్దరి జీవితాలని గురించి స్త్రీ జాతికి తెలియచేయి.  మరో ఆడది మాలా బాధ పడకూడదనే నేను నిన్ను ఈ పని చేయమంటున్నానురా బంగారూ!”  అంది అత్త.

అత్త మాట్లాడుతుండగానే ఏం చేయాలా అనే నా ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి.  “తప్పకుండా తెలియచేస్తానత్తా.  కాని అదేంటో మరి  కథలు చదివీ,  ఇంకొకరి జీవిత అనుభవాలు తెలిసీ కూడా స్త్రీ మోసపోతూనే ఉంది.  వంచింపబడుతూనే ఉంది.  తెలియచేయడం సంగతి కన్నా ముఖ్యంగా మనం కొంత మందికైనా మన పరిథిలో సహాయం చేద్దామత్తా.  నీ పొలానికి చాలా విలువ వచ్చింది.  పొలాన్ని అమ్మి తక్కువ ధర ఉన్న చోట స్థలం కొని స్త్రీ సదనం కడదాం.   అభాగ్యులని చేరదీసి నీ జీవితాన్ని సార్థకత చేసుకుందువుగాని”  అన్నాను.

 మెరుస్తున్న కళ్ళతో అత్త నన్ను వాటేసుకుని కిందకు నా కాళ్ళ మీదకు జారింది.  “తప్పు అత్తా! పెద్దవాళ్ళు పిల్లల కాళ్ళు పట్టుకోకూడదు”  అంటూ అత్తని లేవదీశాను.

  మా అమ్మకీ,  మా ఊరి వాళ్ళకీ నా పొలాన్ని అత్తకి ఎక్కువ ధరకి అమ్మినట్లుగా చెప్పాను.  అత్త ఇప్పుడు స్త్రీ సదనంలోని వారందరికీ తల్లి.  ఇప్పుడు అమ్మ కూడా అత్తని బాగా పలకరిస్తుందట.  అత్త నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆమె గొంతులోని సంతోషం వల్ల ఆమె అణువణువులో వెలుగుతున్న మెరుపుని చూడగలుగుతున్నాను.

 మా అత్త ఎప్పుడూ మెరుస్తూనే ఉండాలి.  నాకు గర్వాన్ని కలిగించాలి –   ఇది నా కోరిక.

 

              ***

 

radhamanduva1—-మండువ రాధ

నేనూ అమ్మనవుతా !

vnl photo

వారణాసి నాగలక్ష్మి

      

  పుట్టింది పెరిగిందీ నూజివీడు దగ్గర ప్లీడర్ గారి తోటలో. ఆలంబన కథా సంపుటి 2005 లోనూ , ఆసరా కథా సంపుటి 2010 లోనూ వెలువడ్డాయి .రచయిత్రిగా లేఖిని నించి ‘కథ’ పురస్కారం, స్వర్గీయ యమ్వీయాల్ సాహితీ సత్కారం వంటి కొన్ని ప్రోత్సాహకాలు లభించాయి. కారా మాస్టారు , ఛాయా దేవి గారు , మునిపల్లె రాజు గారు వంటి సాహితీ ప్రముఖుల నుంచి అందిన ప్రశంస, పురస్కారాల కన్నా ఎక్కువ సంతోషాన్ని , ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి.  కారా మాస్టారు చెప్పినట్టు ప్రముఖుల ప్రశంస , రచయితని గొప్ప కథలు మాత్రమే  రాయాల్సిన పరిస్థితిలోకి నెట్ట కూడదని నమ్ముతాను . మామూలు కథలు కూడా హాయిగా రాసుకోగలిగే  స్వేచ్చని రచయిత కాపాడుకోవాలని, పాఠకులు  expectations  లేకుండా రచయితని స్వీకరించాలనీ నా అభిప్రాయం, నా ఆకాంక్ష  !– వారణాసి నాగలక్ష్మి 

***

హాల్లో ఫోను మోగుతోంది.రోజూలా ఆయన తీస్తారేమో అని ఆగకుండా గబా గబా వెళ్లి రిసీవర్ తీశా. విజయ్ నించీ నీలిమ  నించీ ఇంకా ఫోను రాలేదు. వాళ్ళ నించే అనుకుంటూ హలో అన్నా. అటునించి నవీన పలికింది.

” ఏం తల్లీ? “అన్నా మళ్ళీ చేసిందేమిటా  అనుకుంటూ.

” అమ్మా ! ఎలా గడిపావు ఈ రోజు ?”అంది.

” చెప్పారు గదమ్మా నాన్న. ఐస్ క్రీం తెచ్చారు మధ్యాహ్నం .ఇవాల్టికి షుగరు మాట మర్చిపోయి తినేశా. అన్నం లోకి నాన్నకిష్టమని కొబ్బరి పచ్చడీ, నాకిష్టమని పులిహారా చేశా…” ఇంకా నా మాటలు పూర్తి కాకుండానే

“ఊ .. అంతే మీరు !  పుట్టినరోజు పూటా వండుకుంటూ కూర్చున్నావా? ఇన్నాళ్ళూ మా చడువులనీ, పరీక్షలనీ, నాన్నకి ఆఫీసులో కుదరకా, చుట్టా లొచ్చారనీ  ఏదో ఒక కారణం తో ఇంట్లోనే గడిపేదానివి. ఇప్పుడైనా హాయిగా ఎంజాయ్ చెయ్యచ్చు కదా ” కోప్పడుతూ అంది నవీన.

” ఇప్పుడేం కష్ట పడుతున్నా తల్లీ? హోటలు భోజనం నిండా ఉప్పు కారాలూ ,నూనెలూ ఎక్కువ. దాని బదులు ఇంట్లో సింపుల్ గా చేసుకుని ఇలా ఐస్ క్రీమో, స్వీటో తెచ్చుకుంటే నయం కదా!” అన్నా .

” సర్లే  ..ఏదో ఒకటి చెప్తావు. సాయంత్రం అయినా ఎటైనా వెళ్తున్నారా?” అంది నిష్ఠూరంగా  .

దాని బుంగమూతి ఊహించుకుంటూ ” ఊ.. కాలనీ గుడిలో ఏదో పురాణ కాలక్షేపం ఉంది. ఇద్దరం వెళ్తున్నాం ” అన్నాను .

“నీకింకా అరవై కూడా రాలేదే బాబూ!  చక్కగా ఆదివారం నాడొచ్చింది  పుట్టినరోజు! కాస్త ఓ సరదా సినిమాకో, పార్కుకో వెళ్లకూడదూ ? నాన్న కివ్వు ఫోను ” అంది విసుక్కుంటూ.

“నాన్న భోంచేసి  పడుకున్నారమ్మా. నువ్విలా అన్నావని చెప్తాలే.. అలాగే వెళతాంలే.. .  సినిమాకి కాదుగాని ఏదైనా పాట కచేరీ ఉంటే వెళ్తాం ” అన్నా.

“నాన్నకి నీ ఇష్టాయిష్టాలేవీ పట్టవు. నేనక్కడ జాబ్ చేసినన్నాళ్ళూ ఎలా వెళ్ళేవాళ్ళం మనిద్దరం?..అలా గుర్తొచ్చినపుడల్లా వెనక్కి వచ్చెయ్యాలనిపిస్తుంది…. కానీ ఇక్కడి జీవితం అలవాటు పడ్డాక అలా వెనక్కి రాలేం..” అంది.

నవీన మాటలకి నా మనసు పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అప్పట్లో విజయ్ అమెరికా లో ఎమ్మెస్ చేస్తుండేవాడు . నవీన చదువై ఉద్యోగంలో చేరింది. రెండేళ్ళ పాటు దాదాపు ప్రతీ సాయంత్రం సరదాగా ఏదో ఒక ప్రోగ్రాంకి వెళ్ళేవాళ్ళం. దానికి పెయింటింగ్  అంటే ఇష్టం. నాకు సంగీతం ప్రాణం. ఇద్దరం కలిసి ఆర్ట్ ఎగ్జిబిషన్ కో, సంగీత కచేరీకో నవీన స్కూటీ మీద వెళ్ళిపోయేవాళ్ళం.

అప్పట్లో ఆయన ఇంటికొచ్చేసరికి దాదాపు ఎనిమిదయ్యేది. మేమూ సాధారణంగా ఆ సమయానికి ఇల్లు చేరేవాళ్ళం. ఎప్పుడైనా కచేరీ చాలా బావుంటే ఇంకా లేటయ్యేది. అప్పటికాయన స్నానం చేసి టీవీ చూస్తూ ఉండేవారు. ముందుగానే వంట పూర్తి చేసి భోజనాల బల్ల మీద పెట్టి వెళ్ళేవాళ్ళం గనక రాగానే కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేసేవాళ్ళం. నా జీవితంలో ఆ రెండేళ్ళూ చాలా  స్పెషల్ !

నవీన పెళ్లి చేసి పంపాక నాకు చాలా కాలం పట్టింది తేరుకోడానికి. ఆయనకి లలిత కళల మీద అభిరుచి లేదు. అలిసిపోయి ఇల్లు చేరేవారేమో నాతో మళ్ళీ బయటికి  రావడానికి ఆయనకి ఇష్టం ఉండేది కాదు.మిత భాషి కావడంతో మా ఇల్లు ఎక్కువ సేపు నిశ్శబ్దం గానే ఉంటుంది. పిల్లలతోపాటు పరుగులు పెట్టే రోజులు ఎలా గడిచాయోగాని ఇప్పుడు మాత్రం తరచుగా విసుగనిపిస్తోంది జీవితం. ఆయన  రిటైరయినా పెద్ద  తేడా  ఉండక పోవచ్చు. ఈ యాంత్రికజీవనం లో  విజయ్ నించీ, నవీన నుంచీ వచ్చే ఫోన్ కాల్స్ , వాళ్ళు పంపించే ఫోటోలు, ఈ మెయిల్స్ , ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి వాళ్ళ రాక …ఇవే నా జీవితంలో మెరుపు తునకలు !

ఇవాళ నా పుట్టిన రోజు. చాలా మందికి లాగే నాకూ పుట్టిన రోజు నాడు నా ఆప్తులు కొద్దిమందీ నన్ను పలకరించాలనీ, నా పట్ల వారి ప్రేమ వ్యక్తమయ్యేలా ఏవో చిట్టి పొట్టి బహుమతులో, శుభాకాంక్షలో అందించాలనీ ఎదురు చూడడం అలవాటు. పిల్లలకి  జ్ఞానం  రాక ముందు, ఆయనకి గుర్తుకూడా ఉండక, నా పుట్టినరోజులన్నీ చప్పగా గడిచి పోయేవి. పిల్లలకీ, మా ఆయనకీ  వాళ్ళ పుట్టినరోజులన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ళ కిష్టమైన పిండివంటలు చేసి, కొత్తబట్టలు కుట్టించి పండుగలా సెలబ్రేట్ చేసినా, నా పుట్టినరోజు ఎవరికీ గుర్తుండక ఉక్రోషం వచ్చేది.  నవీన కొంచెం  పెద్దదైనప్పటి నుంచీ అమ్మ పుట్టినరోజు అంటూ గుర్తు పెట్టుకుని ఆ రోజు అన్న తో కలిసి రహస్యంగా చర్చించి ఏవో సర్ప్రైజులు ఏర్పాటు చెయ్యడం , ఇంట్లో అన్ని పనుల్లో సాయం చెయ్యడం మొదలు పెట్టింది….అవన్నీ మధుర స్మృతులు !

ఇద్దరినీ ఒకలాగే పెంచినా విజయ్ కి ప్రేమ ప్రకటన చేతకాదు. వాడి భార్య నీలిమ  కూడా మంచి అమ్మాయే. కానీ పెళ్లవుతూనే విజయ్ తో  కలిసి విదేశాలకి వెళ్లిపోవడంతో నాతో పెద్దగా అనుబంధం ఏర్పడలేదు. ఎప్పుడైనా  వాడు ఫోన్ చేసి నాతో మాట్లాడమని ఇస్తే మాట్లాడుతుంది. ఈ విషయంలో నాకెంతో బాధగా ఉంటుంది. నవీన మాత్రం దాదాపు రోజూ ఫోన్ చేసి పలకరిస్తుంది. తరచూ ఈ మెయిల్స్ కి పిల్లల ఫోటోలు జతచేసి పంపుతుంది. పుట్టినరోజు పెళ్లిరోజులకి ఏవో బహుమతులు పంపిస్తుంది . ఒక్కోసారి డబ్బు పంపి ” ఆ డబ్బు దాచిపెట్టి మళ్ళీ నాకే ఏదో ఒకటి కొంటావు..అలా చెయ్యకు. ఏదైనా మంచి చీర కొనుక్కో. పని మనిషి ఎక్కువ డబ్బిచ్చి పనులన్నీ చేయించుకో ” అంటూ తాపత్రయ పడుతుంది . పనితో ఎంత సతమతమౌతూ  ఉన్నా పిల్లలచేత మాట్లాడిస్తుంది. వాళ్ళు’ అమ్మమ్మా తాతా’ అంటూ చిలక పలుకులు పలుకుతారు. నా జీవితంలో నవీన పంచే ఆనందం వర్ణన కందనిది.

Kadha-Saranga-2-300x268

కిందటి వారం విజయ్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇప్పుడు బహుశః వెనక్కి కాలిఫోర్నియా ప్రయాణంలో ఉండుంటాడు. ప్రయాణం హడావిడిలో మెయిల్స్ చెక్ చేసుకుని ఉండడు. నవీన వాడికి గుర్తు చేసే వుంటుంది !!

పిల్లలు మరీ చిన్న వాళ్లవడంతో ప్రస్తుతం నీలిమ  ఉద్యోగం చెయ్యడం లేదు. ఒక్కసారి ఫోన్ చేసి  మాట్లాడకూడదూ? చివుక్కుమనిపించింది. మా అత్తగారిని నేనెంత  బాగా చూసుకునే దాన్ని! పెద్ద కోడలిగా ఎన్ని బాధ్యతలు నెరవేర్చాను! మరుదులూ, ఆడపడుచులూ అందరి పెళ్ళిళ్ళూ,చదువులూ అన్ని విషయాల్లోనూ అందిపుచ్చుకుని ఎలా నిభాయించాను? అందులో పావు వంతైనా తన నించి ఆశిస్తే తప్పు కాదు కదా! మనసు చిన్నబోయింది.

మళ్ళీ ఫోను మోగింది. ఈ సారి తప్పకుండా విజయ్ నించో, నీలిమ నించో అనుకుంటూ రిసీవర్ తీశాను. అబ్బే.. ఆయన కోసం ఆఫీసు వాళ్ళెవరో చేసారు. లేచారో లేదో చూసి కార్డ్లెస్ ఫోనందించి వంటింట్లోకి నడిచా కాస్త టీ పెడదామని. జీవితం చప్పగా ఉంది పోనీ టీ లోనైనా కాస్త మసాలా వేద్దామనిపించింది. యాలకులా ,దాసించెక్కా, సోంపా అని అలోచించి చివరికి అల్లం దంచి వేశా. రెండు కప్పుల్లో వేడి టీ పోసి పది చదరపు అడుగుల బాల్కనీ లోకి తెచ్చేసరికి ఆయన కూడా లేచి వచ్చారు, పొద్దుటి పేపరు చేతిలో పట్టుకుని.

టీ తాగుతూ అమ్మాయి ఫోన్ చేసిన విషయం చెప్పి ,”చూశారా విజయ్ గాని, నీలిమ గాని ఫోనే చెయ్యలేదు.వాళ్ళకసలు నా పుట్టిన్రోజన్న విషయమే గుర్తులేదు!” అన్నాను ఉక్రోషంగా .

తలాడించారు మౌనంగా.

” నేనెంత చేసేదాన్ని అత్తయ్య కోసం ?ఆవిడ కనుసన్నల్లో తిరుగుతూ,ఆవిడ చెప్పినట్టుగా నడుచుకుంటూ , ఇంటి బాధ్యతలన్నీ ఎంత పట్టించుకున్నాను? ఆఖరి వరకూ ఆవిడ అవసరాల్లో ఎంత వెన్నంటి ఉన్నాను? ” అన్నాను బెంగగా.

ఆయన నా కళ్ళలోకి చూసారు.

నా బాధ తనకి అర్ధమైనట్టే అనిపించింది.

చెయ్యి చాచి నా చేతిని నొక్కుతూ “నవీన మళ్ళీ ఫోన్ చేసిందన్నావ్?”అన్నారు.

నా కళ్ళు మెరిసి ఉండాలి. దాని ఫోను వివరాలు చెప్పాను.

ఆయన కొంత సేపు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయారు .

తర్వాత గొంతు సవరించుకుని “చూశావా భానూ! నీ కూతురు నీకు చేస్తున్న దానిలో పావు వంతైనా మీ అమ్మ గారికి నువ్వు చేసావా? ఆవిడకి డెబ్భై దాటినా ఇప్పటికీ పుట్టింటికెళ్ళి అంతో ఇంతో చేయించుకుని వస్తావు! ఈ నాటికీ వాళ్ళనించి పెట్టుపోతలు అందుకుంటూనే ఉన్నావు. అదే మరి నవీన పుట్టింటికి వచ్చినపుడల్లా నీకు పనికొచ్చేవీ, నచ్చేవీ ఏవేవో తెస్తూనే ఉంటుంది. దాని డెలివరీలకి మీ అమ్మ గారు నీకు చేసిన దాంట్లో పావువంతు కూడా నువ్వు దానికి చెయ్యలేదు. అక్కడికి మనని తీసుకెళ్ళి అమెరికా అంతా తిప్పి చూపించింది. ఇప్పటికీ మన పుట్టినరోజులకీ, పెళ్లిరోజులకీ ఏవేవో బహుమతులూ, చెక్కులూ పంపుతుంది. అటువైపు ఆలోచించావా?”అన్నారు మృదువుగా.

ఒక్కసారిగా నాకు కళ్ళు తెరుచుకున్నట్టయింది. నిజమే .. మా అమ్మ కు ఇంతవరకూ  నేను చేసిన సేవ ఏమీ లేనట్టే! పాపం ఇవాల్టికీ మేం వెళితే పక్కన కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తుంది. వద్దన్నా వినదు. వంటకి వంట మనిషీ, పనికి పని మనిషీ ఉన్నా , ఏవో పచ్చళ్ళూ, పొడులూ ,చేసి ‘నీకిష్టమని చేసానే’ అంటుంది. ‘ వంకాయ కారంపెట్టి చేస్తే అతనికిష్టం కదే! ..కొబ్బరి పచ్చడి చేస్తే మళ్ళీ వేయించుకుంటాడు’ అంటుంది!

నేనూ ‘ఆవిడకి అలానే తృప్తి ‘ అని హాయిగా అనుభవించి ఊరుకుంటాను. రాత్రి పడుకునే ముందు జండూ బామ్  వాసన వస్తుంది. అమ్మ రాసుకుంది కాబోలు అని నిట్టూరుస్తాను. రెండు రోజులుండి మళ్ళీ మా ఊరు చేరుకుంటాను. అమ్మ మా ఇంటికి వస్తే ఆవిడకిష్టమని ఎక్కడికీ తీసుకెళ్ళిన జ్ఞాపకం లేదు. ఏదో పెళ్లి ళ్ల కీ, పేరంటాలకీ ,తప్పనిసరి అయిన చోట్లకీ తప్ప. అదే నవీన మాకోసం ఎంత ప్లాన్ చేస్తుందో. ఎంత ఆలోచిస్తుందో!

ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ శ్రీవారి మాటలు వినిపించాయి…

“అప్పటి కోడళ్ళకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు కావడంతో అనుబంధం గాఢంగా  ఏర్పడేది. ఎదిగే చెట్టు మట్టిలో వెళ్ళు విస్తరించుకున్నట్టు కనపడకుండా అత్తింటితో బంధం బలపడేది.. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలున్నా కష్ట సమయాల్లో, అనారోగ్యాల్లో, పిల్లల పెంపకంలో అత్తా కోడళ్ళు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నడవడంతో ఒకరి లోపాలొకరు అర్ధం చేసుకుని తేలిగ్గా తీసుకోగలిగేవారు. ఒకరి మీదొకరు మానసికంగా ఆధారపడేవారు! ఇప్పుడు పెళ్లవుతూనే విదేశాలకి  వెళ్లిపోవడంతో పెద్దగా అనుబంధం ఏర్పడక పోవడం, ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో టైము దొరక్క పోవడం, అయిన వాళ్ళు లేని చోట భార్యా భర్తలిద్దరే కష్ట సుఖాలన్నీ ఎదుర్కోవడంతో అత్త మామలతో అంత ఇంటరాక్షన్ లేకుండా పోతోంది.” అన్నారు.

నిజమే ! కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో నేనూ అత్తగారి సహకారం , మాట సాయం  పొందాను. అనేక సందర్భాలలో ఆవిడ ప్రేమాభిమానాలు, ప్రశంసలూ పొందాను. చిన్న తనం నించీ ఆవిడ దగ్గరే  ఉండడంతో ఆవిడతో ఎంతో అనుబంధం ఏర్పడింది. తరవాత్తరవాత ఈయన ఉద్యోగ రీత్యా  వేరే రాష్ట్రాలలో ఉన్నప్పుడు కూడా  ఆవిడా వస్తూ ఉండేవారు, అవసరాలకి  నేనూ పిల్లలతో వచ్చి ఆవిడ దగ్గరుంటూండే దాన్ని. ఆయనొకరే ఎలాగో మానేజ్ చేసుకునేవారు………

ఆలోచనల్నించి బయట పడుతూ ” సరే లెండి… ఇప్పటి తరం తమకు సమ్మత మయిందే చేస్తారు గాని ఇతరులేమనుకుంటారో అనో , ఇతరులు ఆశిస్తారనో  ఏదీ చెయ్యరుగా !” అన్నాను నవ్వుతూ.

“అవును సరిగ్గా చెప్పావు! ఇంకో విషయం చెప్పనా ? ఇప్పటి పిల్లలకి,  చాలా కాలం…. అంటే దాదాపు పాతికేళ్ళ పాటు  చిన్న  కుటుంబంలో తల్లీ తండ్రీ, ఒక తోబుట్టువూ మధ్య పెరగడం, బాగా చదువుకుని ఉద్యోగం లో చేరి, కొన్నాళ్ళు సంపాదించాక పెళ్లిళ్లు జరగుతున్నాయి. వాళ్ల ఉన్నతిలో తల్లిదండ్రుల పాత్ర అర్ధమై, వాళ్లతో అనుబంధం గాఢమై,  అదే వాళ్ళ మనసులో నిలిచిపోతోంది. వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలనే తాపత్రయం కలుగుతోంది ! దానికి  తోడు సొంత సంపాదన ! ఏమంటావు?”అన్నారు.

ఏమంటాను? నిజమే..

మళ్ళీ ఆయనే ” పెళ్ళైన వెంటనే దూర దేశానికి వెళ్ళడం, అన్ని కష్ట సమయాల్లోనూ ఇరుగు పొరుగుల సహకారం అవసరమై, వాళ్ళతోనే  అనుబంధం ఏర్పడడం ! దూరంగా ఉన్న అత్త మామలు బాధ్యతలుగానే గాని, తీయని బంధాలుగా అనిపించే ఆవకాశం ఏదీ?

“నీలిమ విషయంలో  తను చెయ్యక పోయినా నువ్వే చెయ్యి. … ఆశించకుండా అందిస్తూ పోతే ఎప్పుడో ఒకప్పుడు నువ్వూ తల్లిలా కనిపిస్తావేమో!!” అన్నారు నవ్వుతూ.

అన్నీ వింటూ ‘ అవును .. నీలిమకి నేనూ అమ్మనవాలి ‘ అనుకున్నా.

 

***

 –  వారణాసి నాగలక్ష్మి

అంటు

‘హలో యూసుఫన్నా! నేను రాజుని… మీ మామయ్య బిడ్డ రేష్మా లేదన్నా.. ఆమె మా మాదిగ ఇద్దయ్య కొడుకు సురేష్‌తోటి సిటీ కొచ్చేసిందన్నా.. యూనివర్సిటీల ఉంది. మీ మామలకు తెలిస్తే ఇద్దర్ని సంపేస్తరే.. జర నువ్వు సమ్జాయించి చెప్పు.. వచ్చి ఆ పిల్లను తీస్కెల్లిపొమ్మను అన్నా!’ అన్నడు రాజు మా ఊరి నుంచి.
సెల్‌ఫోన్ ఆగకుంట మల్ల మల్ల మోగుతుండేతలికి రోడ్డు పక్కన బండి ఆపి ఫోనెత్తి ఉంటి. అతని మాటలు విని కాసేపు ఏం మాట్లాడలేక పొయ్‌న. కొద్దిసేపట్ల సంభాలించుకొని, ‘అది కాదు రాజు, ఎప్పుడు జరిగిందిది? ఇప్పుడెక్కడ ఉన్నరు? మన ఊర్లో వాళ్లకు తెలిసిందా?’ అన్నా పరేశాన్‌గ.
‘రాత్రి ఒచ్చిన్రటన్నా. లేడీస్ హాస్టల్లో పిల్ల నుంచిన్రంట. పిలగాడు బాయ్స్ హాస్టల్ల ఉండు. ఊర్లె ఇంక తెలియదన్నా..’
‘పిలగాడు ఏం చేస్తడు?’

‘సదువుకుంటుండన్నా! వాళ్ల నాయన లేడు. వాళ్లమ్మ, వాడే ఉంటరు. షానా బీదోల్లన్నా. నేనే ఆనికి సదువుకు పైసలిస్తున్న. ఆడి సదువు ఖరాబైతదన్నా. మీ మామలు గుడ ఊకోరు. కొట్లాటలైతయ్.. వచ్చి పిల్లను తీస్కపొమ్మనన్నా..’

నా మైండ్ బ్లాంక్ అయిపొయింది. ఏం చెప్పాల్నో ఏం చెయ్యాల్నొ సమజ్ కాలె. సుతరాయించుకొని ‘రాజు! నేను రోడ్డు మీదున్న, జరసేపాగి ఫోన్ చేస్త’ అన్న. ‘సరె అన్న, మీ మామలకు ఎవరికన్నా చెప్పన్నా, మల్ల ఫోన్ చెయ్యి’ అని కట్ చేసిండు రాజు.

ఫోన్ జేబుల పెట్టుకొని బండి స్టార్ట్ చేసి ఇంటి దిక్కు పోనిస్తున్న. షానా గజిబిజిగ అనిపిస్తున్నది. మనసంత ఏదొ అయిపొయినట్లున్నది. ఇంటికి పొయి కుర్సీల కూలబడ్డ. ఏమైంది అన్నది మా ఆమె.

‘మా నడిపి మామ బిడ్డ రేష్మ, ఎవరో మాదిగ పిలగానితోటి సిటీ కొచ్చేసిందంట!’ అన్న.

‘అవునా.. ఎవరు చెప్పిన్రు?’ అన్నది పరేశాన్‌గ మా ఆమె.
విషయమంత చెప్పిన. కొద్దిసేపు ఆమెతో చర్చించిన. రాజుకు ఫోన్ చేసిన.

‘…పిల్ల, పిలగాడు ఒకర్నొకరు బలంగ ఇష్టపడుతున్నరా.. ఏమంటున్నరు రాజు?’

‘నేను వాళ్లతోని మాట్లాడలేదన్న. వాళ్ల వయసుకు ఇప్పుడేడ సమజైతదన్నా? పిలగాడు చెప్తె ఇంటడన్న. మీ మామలకు చెప్తె ఆల్లే వచ్చి పిల్లను ఎట్లన్న ఒప్పిచ్చుకొని తీస్కపోతరు’ అన్నడు రాజు.

‘…మా మామోల్లకు నువ్వే ఫోన్ చెయ్ రాజు. నాకు చెప్పిందే వాళ్లకు చెప్పు. వొచ్చి పిల్లను తీస్కపొమ్మని నేనెట్ల చెప్త? లవ్ మ్యారేజ్‌లను నేను సపోర్ట్ చేస్త గదా.. నాది గుడ లవ్ మ్యారేజేనాయె!’ అన్న.

‘అట్ల కాదే.. మీ మామలు వాన్ని బతకనియ్యరన్నా.. వాళ్ల బిడ్డ మాదిగోల్ల పిలగానితోని లేషిపొయిందన్న పేరొస్తె ఊకుంటరా అన్నా?! పిలగాని వాల్లమ్మ బయపడి రాత్రే ఎటో ఎల్లిపొయిందంట! నువ్వే ఎవర్తోనన్న మీ మామోల్లకు చెప్పిస్తె ఆల్లే వొచ్చి ఎట్లన్న జేసి తోల్కపోతరు..’

‘నువ్వు చెప్తె ఏమైతది రాజు!’ అన్న ఓపిగ్గ.

‘నేను చెప్పలేనన్నా.. అసలు ఈ విషయం నాకు తెల్సని, నేను చెప్పిన్నని గుడ ఆల్లకు చెప్పొద్దన్నా.. మల్ల నాకు పరేశానైతది..’ అన్నడు రాజు.

‘..సరె, నేను ట్రై చేస్త.. నువ్వు పిల్ల, పిలగాని సంగతి తెల్సుకో.. మల్ల ఫోన్ చేస్త’ అని ఫోన్ పెట్టేసిన.

‘ఏందంట?’ మా ఆమె.

సంగతి చెప్పిన. కాలుగాలిన పిల్లిలెక్క అటు ఇటు తిరుగుతున్న. ఏం తోస్తలేదు నాకు. కొద్దిసేపు నా వాలకం జూసి.. ‘ఇట్ల కుర్సీల కూసొ నువ్వు.. నిమ్మలంగ ఏం జెయ్యాల్నొ ఆలోచించు..’ అన్నది మా ఆమె.

కూసున్న. ఒక్కసారిగ ఎన్నో ఆలోచనలు నా మీద దాడిచెయ్యబట్టినయ్..

ఈ విషయం తెలిస్తె మా మామ తట్టుకోగలుగుతడా? బి.పి, షుగర్ ఉండె.. పెద్ద పిల్ల మెంటల్లీ రిటార్టెడ్. ఇంకో చిన్న పిల్ల ఉండె. ఇగ మిగతా ఇద్దరు మామల పరిస్థితి ఎట్లుంటదో.. ఎట్ల చెప్తం ఆల్లకు. అసలు ఆల్లకు చెప్పకుంటనె, ఈ పిల్లతోటి ఒక్కసారి మాట్లాడి సూస్తె బాగుండు. ఏం చెయ్యాలె…

మల్ల రాజుకు ఫోన్ చేసిన, ‘రాజు! యూనివర్సిటీల ఎవరు ఈల్లకు తోడున్నరు? ఆల్లతోటి ఒకసారి నేను మాట్లాడాలె’ అన్న.

‘లెనిన్, భరత్‌లు ఈల్లతోటి మాట్లాడుతున్నరన్న. వాళ్లతోటి నువ్వొకసారి మాట్లాడు..’ అన్నడు.
ముందుగాల భరత్‌కు ఫోన్ చేసిన.

‘హలో అన్నా! ఏం సంగతే?’ అన్నడు భరత్.

‘భరత్! మీ మాదిగోల్ల పిలగానితోటి వొచ్చిన పిల్ల కాస మా మామ బిడ్డనే’ అన్న.

‘అవునా అన్నా..! సొంతం మావ నా?!’ అన్నడు.

‘అవునే.. నేను చిన్నప్పుడు ఆల్లకాడనె పెరిగిన. ఏంది వాల్ల సంగతి?
‘రాత్రి ఒచ్చిన్రంటన్న.. వాళ్లు ఆగెటట్టు లేరు..!’
‘కాదన్న.. పిలగాడు ఎమ్మెస్సీ ఫస్టియరే సదువుతున్నడంట గదా.. ఎనకా ముందు ఏం లేదంట. ఈ పిల్ల గుడ కాలేజ్ బంద్ జేసె. మరెట్ల బతుకుతరే?!’ అన్న.
‘మేం అన్ని రకాలుగ చెప్పి జూసినమన్నా. పిల్లే ఇంటలేదన్న. ‘మీవల్ల అయితె పెండ్లి చెయ్‌రి. లేదంటే ఎల్లిపోతం’ అంటున్నదే. మమ్మల్నె నమ్ముతలేదె పిల్ల’ అన్నడు భరత్.
‘మరి పిలగానికి గుడ అంతే ఇష్టం ఉన్నదా భరత్?’ అన్న.
‘ఏమో అన్న! ఆడు భయపడుతున్నడు’ భరత్.
‘మరేం చెయ్యబోతున్నరు మీరు?’
‘మాదేముందన్నా.. అన్ని విధాల చెప్పి సూషినం. ఇగ ఆల్ల ఇష్టం’ అన్నడు.
‘నేను మల్ల మాట్లాడత’ అని పెట్టేసిన.
అప్పటికె రాజువి 4 మిస్‌డ్ కాల్స్ ఉన్నై.
ఏం చేస్తె బాగుంటదో సమజైతలేదు నాకు.
కొద్దిసేపు పక్క మీద పండుకుండిపొయ్‌న.. మల్ల ఆలోచనలు ముసురుకున్నయ్.
మా ముగ్గురు మామలకు ఒక తమ్ముని లెక్క వాల్ల దగ్గర్నె పెరిగినోన్ని నేను. కాని ఆల్ల లోకం వేరు. నా చైతన్యం వేరు. ఈ విషయాన్ని నేను చూసే తీరు వేరు. వాల్లు తీసుకునే తీరు వేరు. వాల్లు నిజంగనె ఊర్లె ఇజ్జత్ పొయ్‌నట్లు ఫీలయితరు. అందరికున్నట్లే మాదిగోల్లంటె వీల్లక్కూడ చిన్నచూపు మామూలె. తమ బిడ్డ ‘మాదిగోడితో లేషిపొయిందట’ అన్న మాట వాల్లు తట్టుకునే విషయమేం కాదు. మరి వాల్లను ఎట్ల సమ్‌జాయించాలె? ఎట్ల అర్దం చేయించాలె.. మొదలు విషయం చెప్పుడెట్ల..??
అసలు పరిస్తితేందో తెలుసుకుందామని ముందుగాల మా తమ్మునికి ఫోన్ చేసిన. ‘ఏంరా.. ఏంది సంగతులు. ఊర్లె ఏమన్న జరిగిందా? అన్న. ‘ఏం జరగలేదే.. ఏంది విషయం?’ అన్నడాడు.
‘నడిపి మామ బిడ్డ సంగతేంది?’ అన్న.
‘ఏమొ మరి, రాత్ర పదింటప్పుడు మామ నా కాడికొచ్చి జర తోడు రమ్మని తీస్కెళ్లిండే. ‘రేష్మ ఇంటికి రాలేదు. ఏమైందో తెలియద’న్నడు. ఊరి ఎనక రైలు పట్టాలెంట ఆడ్నించి ఈడిదాంక సూషి ఒచ్చినం. పరేశాన్ ఉన్నడు మామ’ అన్నడు.
‘ఆ పిల్ల సురేష్ అనే మాదిగోల్ల పిలగానితోటి సిటీకొచ్చి యూనివర్సిటీల ఉందంట. పెండ్లి చెయ్యమని స్టూడెంట్ లీడర్స్‌ని ఒత్తిడి చేస్తున్నదంటరా..’ అన్న.
‘అవునా…!’ అని పరేశానై, తర్వాత ‘మామ వాళ్లకు చెప్దామా మరి?’ అన్నడాడు సందిగ్ధంగా.
‘చెప్పేద్దాం.. తెలిసి గుడ చెప్పకుంటె బాగుండదు గదా.. నడిపి మామకు డైరెక్టుగ ఈ విషయం చెప్తే తట్టుకోగలుగుతడా?!’ అన్న.
‘మొత్తానికి ఇసొంటిదేదో జరిగి ఉంటదని ఆయనకు తెలిసే ఉన్నట్లున్నదన్న. ఆయన మాటల్ని బట్టి నాకట్ల సమజైంది’ అన్నడాడు.
‘ముందుగాల చిన్నమామకు ఈ విషయం చెప్పు. నడిపి మామ యాడ ఉన్నడో తెలుసుకొని ఆయన కాడికి పొయ్యి జర నిమ్మలంగ విషయం చెప్పమని చెప్పు’ అన్న.
‘సరె’
ఇంతల రాజు ఫోన్..
ఎత్తిన. ‘అన్నా! ఈవినింగే వాళ్ల పెండ్లి చేస్తానికి చూస్తున్నరంటనె.. జల్ది మీ మావోల్లను సిటీకి బయల్దేరి పొమ్మనన్నా’ ఆదుర్దాగా ఉంది రాజు గొంతు.
నాగ్గూడ కొద్దిగ షాకింగా అనిపించింది. ఏం చెయ్యాల్నొ అర్దం గాలె.
‘ఇప్పుడె మా మామోల్లకు చెప్పమని తమ్మునికి చెప్పిన రాజు. వాళ్లేమంటరో సూద్దాం.’
‘సూద్దామంటె ఎట్లన్న. అసలు నువ్వు యూనివర్సిటీ లీడర్స్‌తోటి గట్టిగ మాట్లాడన్నా. తొందరపడి పెండ్లి చెయ్యొద్దని చెప్పన్నా. పిల్ల వాళ్ల నాయనలు ఏమంటరో సూద్దాం, జర ఆగమనన్నా.’
‘అట్ల నేనెట్ల చెప్త రాజు? నువ్వే ఏమన్న చెప్పి ఆపితె ఆపు’ అన్న.
రాజు నారాజై ఫోన్ కట్ చేసిండు. నాగ్గూడ టెన్షన్‌గ అనిపించింది. రేష్మ తొందరపడుతున్నదేమొ.. ఐటెంక ఇబ్బందులు పడతదేమో.. అది ప్రేమ కాకుండా ఆకర్షణే అయితే మాత్రం కష్టమే.. ఏం చెయ్యాల్నో తోచక అటు ఇటు తిరుగుతున్న.
గంటకు- నడిపి మామ ఫోన్. మాట్లాడాలంటె ఎట్లనో అనిపించింది. కని తప్పదు. ఎత్తిన.
‘మామా! సలామలేకుమ్’ అన్న.
‘వాలేకుమ్ సలామ్. ఏం చేద్దాం యూసుఫ్ మరీ?’ అన్నడు.
‘నాక్కూడా ఏం సమజైతలేదు మామా! యూనివర్సిటీ స్టూడెంట్స్ రకరకాలుగ చెప్తున్నరు. ఈ సాయంత్రమే పెళ్లి చేసెయ్యాలని చూస్తున్నరని కూడా అంటున్నరు. మరి ఎట్లంటవ్?’ అన్న.
‘అట్లెట్ల?! మేం ఇప్పుడు బయలుదేరి వస్తం. ఆపమను’ అన్నడు కాస్త కటువుగ.
‘అట్ల మనం చెప్పలేం మామా! రేష్మానే వత్తిడి చేస్తుందని చెప్తున్నరు.’
‘లేదు యూసుఫ్, నేను ఒక్కసారి రేష్మతోని మాట్లాడాలె. దాని మనసుల ఏమున్నదొ నాకు తెల్వాలె గదా.. అంతవరకన్న ఆగాలె కదా..’ అన్నడు.
‘నిజమే కాని.. మనకు ఎట్ల తెలుస్తది మామా! మనకు చెప్పకుంట కూడ చేసెయ్యొచ్చు.’
‘అది కాదు యూసుఫ్, జర నువ్వు పొయ్ రావొచ్చు గదా.. పొయి వాళ్లతోని మాట్లాడితె వింటరేమో’
‘లేదు మామా! నేను వెళ్లలేను. నేను వెళ్లి మీరొచ్చేదాంక పెండ్లి ఆపమన్నా నేను మీ వైపు నుంచి వచ్చినట్లు యూనివర్సిటీ అంతా నన్ను బద్నాం చేస్తరు. నేను అందరికీ తెలుసు కదా..’
‘మరెట్లా! మేం వెళ్లిందాకనన్నా ఆగాలె కదా..’
‘మీరు వస్తున్నరు, వచ్చిందాక ఆగమంటున్నరని చెప్పించమంటె చెప్పిస్త మామా’ అన్న.
‘సరె, అట్లనన్న చెయ్. మేం బయలుదేరుతం’ అన్నడు.
‘సరె మామా!’
మామ గొంతు పలికిన రకరకాల ధ్వనులకు నా మనసు గిలగిలలాడింది. అయ్‌నా ఏం చేయగలను..!
***
antu
ఇదంత అయ్యేసరికి మద్యాహ్నం దాటింది. నేను ఆఫీస్‌కు వెళ్లిపోయిన. రాజు మద్య మద్య హెచ్చరిస్తనె ఉండు. రాజును వాళ్లతోపాటు వెళ్లమని చెప్పిన. సరేనన్నడు. మా నడిపి మామ, వాళ్ల జిగ్రీ దోస్తు శ్రీను, మా చిన్న మామ, మా తమ్ముడు కారు మాట్లాడుకొని బయల్దేరిన్రు. రాజు చివరి నిమిషంలో తాను ఆల్రెడీ బస్‌లో బయలుదేరినట్లు చెప్పిండంట. ఒట్టిదే.. అతను రాడని సమజైపొయింది..
పొద్దుగూకింది..
భరత్‌కు ఫోన్ చేసిన. ‘పరిస్తితేంది భరత్?’ అన్న.
‘ఏముందన్న, వాళ్లకు పెండ్లయిపోయిందే!’ అన్నడు.
నేను పరేశానై, ‘అంటె.. మీరు చేసిన్రా?’ అన్న.
‘వాళ్లే చేసుకున్నరన్న. ఆ పిల్ల మమ్మల్నే నమ్ముతలేదు. మరి మీ నాయ్న వాళ్లు వస్తున్నరంట కదా.. వచ్చిందాంక ఆగమన్నం. దాంతోటి ఆ పిల్ల మరింత పరేశాన్ చేసింది. మీరు చేస్తె చెయ్‌రి. లేకపోతే ఎటన్న వెళ్లిపోతం అన్నది. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర్కి వస్తె మీరేంది ఇట్ల చేస్తున్నరని అరిచింది.. పోరగాన్ని సమ్జాయించబోతె వాన్తోని గుడ ‘నువ్వు గన్క వాళ్ల మాటలు విని ఆగుతనంటె నేను ఇక్కడ్నె ఆత్మహత్య చేసుకుంట’నని గడ్‌బడ్ చేసిందన్న.. ‘అరె, జర ఆగమ్మా.. ఆన్ని గుడ ఆలోచించుకోనీ’ అన్నమన్నా.. ‘ఇద్దరం అనుకున్నంకనే కదా, మావోల్ల నందర్ని వొదిలేసి, ఇంట్ల నుంచి వొచ్చేసిన. మా నాయనలొస్తె పెండ్లి కానిస్తరా? ఇప్పుడు పెండ్లి చెయ్యకపోతె నేన్ సచ్చిపోత’ నని బెదిరించిందన్న’ అన్నడు భరత్.
‘అవునా..! మరి, ఎట్ల చేసిన్రు పెండ్లి?’ అన్న.
‘ఏముందన్న, ఆర్ట్స్ కాలేజ్ పక్కన గుడి ఉంది కదా.. అక్కడ దండలు మార్పిచ్చినమ్. తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేస్కుంటరంట’ అన్నడు.
‘సరె గని, భరత్! మా మామలు వస్తున్నరు. మరి వాళ్లతోని మారేజ్ అయినట్లు చెప్పొద్దు. వాళ్లు వెంటనె తట్టుకోలేరు. వాళ్లు ఏమంటరో వినురి’ అన్న.
‘అది కాదే.. ఇప్పుడెందుకు వాళ్లు ఇక్కడికి? ఇప్పుడొద్దని చెప్పన్నా.. రెండ్రోజులాగి రమ్మంటె మంచిది.. కొద్దిగ కోపం తగ్గుతది..’
‘వాళ్లు బయల్దేరిన్రు భరత్! నేను ఆగమంటె ఆగుతరా?’
‘ఇప్పుడొచ్చి ఏం చేస్తరన్న. అనవసరంగ ఆవేశపడ్డరనుకో.. ఇక్కడ పోరగాళ్లు ఊకోరు. బాగుండదన్నా..’
‘నేను చెప్త భరత్, వాళ్లతోని. గొడవ చెయ్యొద్దని. వాళ్లతోని మా తమ్ముడున్నడు. వాడికి కూడా చెప్త. జర ఓపిగ్గా వాళ్లతోని మాట్లాడి పంపించురి.’
ఫోన్ పెట్టేసినంక మా చిన్నమామకు ఫోన్ చేసిన- ‘మామా! అది యూనివర్సిటీ కాబట్టి స్టూడెంట్స్ చాలామంది ఉంటరు కదా.. ఎవరు ఎట్లుంటరో చెప్పలేం. పిల్లలు ఇప్పుడు వాళ్ల హేండోవర్‌లో ఉన్నరు. గొడవ చేసేటట్టు గాని, కోపంగ గాని మాట్లాడితె గడ్‌బడైపోతది..’ అంటూ అన్ని విషయాలు వివరించిన.. మా తమ్మునికి గుడ జాగ్రతలు చెప్పిన.
ఐటెంక- ఆఫీసుల ఉన్ననన్న మాటేగనీ ఇదే మనాది.. ఏం జరుగుతదో ఏమోనని.
8 గం.లకు మల్ల తమ్మునికి ఫోన్ చేసిన.
‘ఇక్కడ అంబేద్కర్ హాస్టల్ కాడికొచ్చినం. నడిపి మామను కార్‌లనే కూసుండబెట్టి మేం ముగ్గురం భరత్ రూంకొచ్చినం. షానాసేపయ్యింది. స్టూడెంట్స్ షానామందే ఉన్నరు. అన్ని విషయాలు మంచిగనె మాట్లాడుతున్నరు.. చిన్నమామ, శ్రీను పిల్లను కలిషిపోతమని షానా రకాలుగ అడిగి సూషిన్రు.. కలవడం కుదరదని వాళ్లు చెప్తున్నరు. నన్ను పక్కకు తీస్కపొయి చెప్పిండు లెనిన్, ‘యూసుఫన్న మామలని ఇంతసేపు సమ్జాయిస్తున్నమే.. లేకుంటె ఇక్కడికి ఇప్పుడు వద్దనే ఖచ్చితంగా చెప్దుము’ అని. వీళ్లేమో ఇంకా కోషిష్ చేస్తనె ఉన్రు.’
‘సరె, బయల్దేరేటప్పుడు ఏ విషయమైంది నాకు చెప్పు. ఇంటికొచ్చి పోరి, మందు తెచ్చి పెడత’ అన్న.
రాత్రి 11కు ఫోన్ చేసిండు తమ్ముడు. ‘భాయ్! నల్గొండ కెల్లిపోతున్నం’ అని.
‘అరె, అదేందిర.. నేను ఇంటికొచ్చి ఎదురుచూస్తున్న కద.. మీల్స్, మందు రెడీ చేసి..’ అన్న.
‘ఇగ ఇప్పటికె లేటయ్యింది, పోదమన్నరు.’
‘అట్లనా.. ఇంతకు ఆఖరికేమయ్యిందిరా?’ అడిగిన.
‘రెండ్రోజులాగి రారి, మాట్లాడుకుందాం.. ఇప్పుడైతె కలవడం కుదరదన్నరు. నడిపి మామ కొద్దిసేపు అట్లెట్ల అని వాదించిండు. వాళ్లు నిమ్మలంగనె మామను సమ్జాయించిన్రు’
‘సరె, జాగ్రత్తగ పోరి’
***
తెల్లారి తమ్ముడు చెప్పిండు, రాత్రి ఊరు చేరుకునేసరికి మూడు దాటిందని. మద్యలో ఆపి మామకు జర మందు పోయించిన్రంట. బాగ ఏడ్చిండంట మామ.
పెద్ద మామ ఏమన్నడంట అని అడిగి తెలుసుకున్న- ఇజ్జత్ తీసిందని, నేనైతె నరికేద్దును అని అరిషిండంట.. నడిపి మామ మా అత్తను బాగ కొట్టిండంట..
ఇటు మా అమ్మ వాళ్లూ, అటు మా అమ్మమ్మ అంతా పరేశాన్ ఉన్రు.. అందరు నాకు ఫోన్ చేసి నన్నేదైన చెయ్యమంటున్నరు..
మద్యాహ్నం మా నడిపి మామ ఫోన్.. ఎట్లన్న చేసి రేష్మాను తనతోటి మాట్లాడించమని స్టూడెంట్ లీడర్స్‌తో మాట్లాడమన్నడు. రేష్మాతో ఒక్కసారి మాట్లాడితె సాలు అంటున్నడు.
‘నువు చెబితె రేష్మ ఇంటదని నీకు నమ్మకముందా మామా?’ అనడిగిన.
‘అడిగైతె సూద్దాం యూసుఫ్. కని.. అది ఇనదు.. మొండిది..! అదేమనుకుంటదో అదే చేస్తది. దాని మనస్తత్వం నాకు తెల్సు.. అయ్‌నా, ఇంతపని చేస్తదని అనుకోలేదు యూసుఫ్. పెద్ద పిల్ల సూస్తె అట్ల ఉండె. ఇప్పుడు ఇదిట్ల చేస్తే చిన్నదాని పెండ్లెట్లయితది చెప్పూ…’ మామ గొంతు పూడుకుపొయింది.
‘మనసు గట్టి చేసుకోవాలె మామా! అయిందేదో అయింది, ఇప్పుడేం చేస్తే బాగుంటదో ఆలోచించాలె’ అన్న.
‘ఏం ఆలోచించాలె చెప్పూ.. ఊర్లె ఇజ్జత్ లేకుంట చేసింది. అప్పుడె ఊర్లె పోరగాళ్ల సూపు మారె.. అది ఇంత పని చేస్తదని కలల గుడ అనుకోలె..’ మామ ఏడుస్తున్నడు.
‘మామా! ఊరుకో మామా..! అన్నీ తెలిసినోడివి, నువ్వే ఇట్ల దైర్యం చెడితె ఎట్ల.. ఊరుకో..’ అంటుంటె నాకు కూడా గొంతు పూడుకుపొయింది.
మామకు దుఃఖం ఆగుతలేదు.. గొంతు పెగుల్త లేదు, ‘నేను మల్ల మాట్లాడత’ అని ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పక్కన పడేసి నేను గుడ కొద్దిసేపు ఏడ్షిన. ఇంతదాంక మామ ఏడ్షిండని విని గుడ ఎరుగను.. ఏం చెయ్యాల్నో తోచక తల్లడమల్లడమైన.
ఆఖరుకి- పొద్దుగూకాల మామకు ఫోన్ చేసిన- ‘మామా! ఒక్కటే మార్గం, మన రేష్మానె వినేటట్లు లేదు కాబట్టి ఆ పిలగాడిని ఒప్పించి ఏదొ ఒక మజీదులో నిఖా చదివించేస్తే, వాళ్ల బతుకు వాళ్లు బతుకుతరు. మీకు గుడ గౌరవంగ ఉంటది. చిన్న పిల్ల షాదీకి ఇబ్బంది ఉండదు.. సోంచాయించురి’ అన్న.
‘నాతోని గుడ మనోళ్లు ఇదే అంటున్నరు.. మరె అట్ల ఒప్పుకుంటడా పిలగాడు..’ అనుమానంగ అన్నడు మామ.
‘మీకు ఇష్టమేనా? ఇష్టమైతె అడుగుదాం’ అన్న.
‘ఇగ మన పిల్లే ఇననప్పుడు ఏం జేస్తం. గని, మరె మిగతా మామలు ఏమంటరో..’ అన్నడు.
‘మామా! మిగతావాళ్ల అభిప్రాయాలు తర్వాత సంగతి మామా! వాళ్లు రకరకాలుగ చెప్తుంటరు. రేష్మా నీ బిడ్డ! మీరంతా ఎక్కువ టైట్ చేస్తె ఆ పిల్ల ఏమన్న చేసుకుంటె ఏం చేస్తరు? నీ బిడ్డ మీద నీ ప్రేమ వేరు. మిగతా వాళ్ల ప్రేమ వేరు. కాబట్టి నీ నిర్ణయం ముఖ్యం మామా! నీకు ఓకే అయితే అందరు ఊకోక ఏం జేస్తరు?!’ అన్న కొంచెం టోన్ పెంచి.
కొద్దిసేపు సైలెంట్‌గ ఉండిపొయ్‌న మా మామ, ‘సరె, సూద్దాం యూసుఫ్! ముందు నేనొకసారి రేష్మాతోటి మాట్లాడాలె. రేష్మా నాతోని గుడ ఆ పిలగాన్నే చేసుకుంట అంటె ఇగ నువ్వన్నట్లె చేద్దాం’ అన్నడు.
***
మర్నాడు-
మా నడిపి మామ, ఆయన బామ్మర్దులు-దోస్తులు, మా చినమామ యూనివర్సిటీకొచ్చిన్రు. నేను గుడ పొయ్‌న. స్టూడెంట్ లీడర్స్ మా మామోళ్లను అంబేద్కర్ హాస్టల్ వెనక గ్రౌండ్‌లో దూరంగా చెట్టుకింద కూసోబెట్టిన్రు. పిల్ల, పిలగాన్ని హాస్టల్‌లోని ఒక రూంకు రప్పించిన్రు. మా నడిపి మామ ఎక్కడ బరస్ట్ అవుతడోనని, మా చిన్నమామను, నన్ను, శ్రీనును ముందు పిల్సుకపోయి వాళ్లతోటి కలిపిన్రు.
రేష్మ నన్ను, చిన్నమామను సూడంగనె లేషి నిలబడి సలాం చేసింది. సెల్వార్ ఖమీజ్‌లనె ఉన్నది. తన చామన ఛాయ మొఖం గుంజుకుపొయ్ ఉన్నది. కండ్లు పీక్కుపొయ్‌నయ్. పక్కన పిలగాడు లేషి నిలబడ్డడు. బక్కగున్నడు. నలుపే. అతని మొఖం గుడ పీక్కుపొయింది. మేం ఎదురుంగ కుర్సీల్ల కూసున్నం. వాళ్లు మంచం మీద కూసున్నరు. రేష్మ తల వొంచుకొని కుడి కాలి బొటనవేలితోటి నేలను రాస్తున్నది. కాలి ఏళ్లకు మెట్టెలు తొడిగిన్రు. చేతుల నిండా గాజులు. మెడల వెతికిన. పసుపుతాడో, నల్లపూసలో ఉన్నట్లుంది గనీ వోనీతోటి కప్పేసింది…
శ్రీను గుచ్చి గుచ్చి కొన్ని ప్రశ్నలు వేసిండు- ‘మీరిట్ల వొచ్చేస్తే మరి మీ వోల్లు ఎట్ల ఊకుంటరనుకున్నరు? ఎన్ని కష్టాలెదురైనా ఎదుర్కుంటరా? ఎప్పటికీ కలిసి ఉంటరా? మద్యల మోజు తీరిపోతె ఏం జేస్తరు?’ అని.
మొత్తానికి ఇద్దరూ షానా గుండె నిబ్బరంతోటే జవాబులిచ్చిన్రు. ఎక్కడా తొట్రుపాటు లేదు. కలిసే బతుకుతం.. కలిసే చస్తం! అన్నరు.
మా చిన్నమామ రేష్మా నుద్దేశించి- ‘మరి, నీ అక్క సూస్తె ఎడ్డిది.. ఆ పిల్ల నిన్ను విడిచి ఉండలేదు కదా.. నువ్వు కనబడక ఒకటె గొడవ చేస్తున్నది, ఏడుస్తున్నది. అట్ల చేస్తదని నీకు తెల్సు కదా!’ అన్నడు. ఆ మాటలకు మాత్రం రేష్మా కండ్ల నిండ నీళ్లు తిరిగినయ్. కండ్లు తుడుసుకున్నది. మల్ల మా మామ- ‘నువ్విట్ల చేస్తె మీ చెల్లె పెండ్లి ఎట్లయితదనుకున్నవ్? ఇగ ఆ పిల్లను ఎవరు చేసుకుంటరు?’ అన్నడు. దానికి వంచిన తల ఎత్తలేదు రేష్మా.
నేను పిలగాన్ని ఉద్దేశించి- ‘రేపు నీకు ఉద్యోగం వచ్చినంక కట్నం గిట్నం బాగొస్తదని ఈ పిల్లను వొదిలెయ్యవని గ్యారంటీ ఏంది?’ అనడిగిన. అట్లేం చెయ్యనన్నడు.
శ్రీను అందుకొని-‘సరె, అయిందేదొ అయింది. మరి మీరు మంచిగుండాలె. మీవాళ్లు గుడ మంచిగుండాలె. వాళ్ల పద్ధతి ప్రకారం పెండ్లి చేసుకుంటె, వాళ్లకు గుడ గౌరవంగ ఉంటది. మీకు గుడ ఏ ఇబ్బంది ఉండదు. అట్ల చేసుకుంటవా పిలగా?’ అడిగిండు.
అప్పటికె ఆ టాపిక్ వాళ్లదాక చేరి ఉండడంతోటి ఆ ప్రశ్నకు రెడీగ ఉన్నట్లె ఆ పిలగాడు ‘పెండ్లి వరకు వాళ్ల ప్రకారం చేసుకుంట’ అన్నడు. మంచిదె అనుకున్న నేను.
‘అయితె ఒక చిన్న పని చెయ్యాల్సొస్తది. మా ఇండ్లల్ల ఒట్టిగ మజీదుల నిఖా చదివించడానికైనా ముస్లిం పేరు పెట్టుకోవాలె. అట్లనె నిఖాకు ముందే సున్తీ చేయించుకోవాల్సి ఉంటది’ అన్నడు మా చిన మామ.
పిలగాడు తకబిక అయ్యిండు ఆ మాటతోని. అతని దోస్తుల దిక్కు, స్టూడెంట్ లీడర్స్‌దిక్కు సూషిండు. ఆలోచించుకొని చెప్పు, బలవంతం ఏమీ లేదని ఎవరో అన్నరు. దాంతోని మేం కాసేపు మాట్లాడుకొని చెప్తం అన్నడు పిలగాని దోస్తు. దాంతో మా మామ, శ్రీను బైటికి నడుస్తుంటె, నేను పిలగాన్ని పక్కకు పిలిషి ‘ఇయాల్రేపు సున్తీ అనేది మామూలు విషయం. ఆరోగ్యానికి మంచిదని, డాక్టర్లు గుడ ఎంతోమందికి సున్తీ చేయించుకొమ్మని సజెస్ట్ చేస్తుంటరు. ఆ విషయంల నువ్వేం భయపడకు’ అని ‘దైర్యం చెప్పి బైటికొచ్చిన.
కొద్దిసేపటికి మల్ల వాళ్లు మమ్మల్ని లోపలికి పిలిషిన్రు. పిలగాడు రెండ్రోజులు టైమ్ కావాలన్నడు, తమ వాళ్లను అర్సుకొని చెప్తనన్నడు. సరె, అట్లనె కానివ్వమని అన్నరు వీళ్లు. బైటికొచ్చినంక నాకొక మీటింగ్ ఉండడంతోని నేను వొచ్చేసిన.
వీళ్లు పొయి మా నడిపి మామకు విషయం చెప్పిన్రంట. ఆయన అయితెమాయె గని పిల్లను నేను గుడ సూషి మాట్లాడత అన్నడంట. దానికి రేష్మ- ‘వొద్దు, నేను మా నాయన ముందు నిలబడలేను. వద్దే వద్దు’ అన్నదంట. అట్లెట్ల అని మా మామ, తానేమీ అననని, పలకరింపుగా చూస్తనని అన్నడంట. వద్దులెమ్మని స్టూడెంట్ లీడర్స్ అంటె వాళ్లతో కాస్త వాదం పెట్టుకున్నడంట. నా బిడ్డను నాకు సూపెట్టకపోతె ఎట్ల అని నిలదీసిండంట. దాంతో వాళ్లు రేష్మాను ఒప్పించి ఇద్దర్ని కలిపిన్రంట. తండ్రిని సూడంగనె కాళ్లమీద పడి బోరున ఏడ్సుకుంట నన్ను మాఫ్ చెయ్యమని వేడుకున్నదంట రేష్మా. రేష్మాను ఎత్తి గుండెలకు హత్తుకొని తాను గుడ ఏడ్షిండంట మామ. ఐటెంక ‘ఆ పిలగాడు రెండ్రోజులు టైమడిగిండు కదా.. నువ్వు మాతోటి వచ్చెయ్యి.. మల్ల రెండ్రోజుల తర్వాత వద్దాం’ అన్నడంట. దానికి రేష్మా, స్టూడెంట్ లీడర్స్ ఎవరూ ఒప్పుకోకపొయ్యేసరికి చేసేదేం లేక వీళ్లు వెనుదిరిగిన్రంట.
***
ఆ వెంటనె రాజు నాకు ఫోన్ చేసిండు- ‘ఏం జరిగిందన్నా..’ అన్నడు. విషయం చెప్పబొయ్‌న. అతను వ్యంగ్యంగా- ‘అంటె వానికి సున్తీ చేయించి వాన్ని ముస్లింగ మారుస్తరా? అంటే రేపు వాన్ని అందరూ తీవ్రవాదిగా సూస్తానికా?’ అన్నడు.
నేను ఆశ్చర్యపోయి- ‘అంటే నీకు ముస్లింలందరూ తీవ్రవాదుల్లెక్క కనిపిస్తున్నరా?’ అడిగిన విసురుగ.
అతను కూడ విసురుగ- ‘వానికి సున్తీ చేయించి వాని ఎస్.సి. రిజర్వేషన్ పోగొట్టాలనుకుంటున్నరా?’ అని మల్లొక బాంబు వేసిండు.
‘అరె, ఏం మాట్లాడుతున్నవ్ రాజు నువ్వు? అంటె వాళ్లను బలవంతంగ విడగొట్టాలనా నీ ఉద్దేశం?!’ అన్న.
‘మీరు అనుకున్నదే చేద్దామనుకుంటున్నరు కదా..! వాని జీవితాన్ని చెడగొడదామనుకుంటున్నరేమో- కానియ్‌రి.. సూద్దాం!’ అని కట్ చేసిండు ఫోన్.
నాకు చికాకేసింది. అతనికి వీళ్ల ప్రేమ వివాహం ఇష్టం లేదని ముందునుంచే అతనిపై ఉన్న డౌటు నిజమైంది. కాని ఇంతగనం వ్యతిరేకత ఉందని మాత్రం నేను అనుకోలే. అణగారిన కులం నుంచి వొచ్చి లెక్చరర్‌గ పనిచేస్తున్నవాడే ఇట్లంటె ఇగ మామూలు ‘హిందువుల’ సంగతేంది? అనుకున్న.
రెండు రోజులు గడిచినయ్-
రేష్మ రెండు మూడు మాట్లు మా మామకు ఫోన్ చేసి మాట్లాడిందంట- సున్తీ చేయించుకోవడానికి భయపడుతున్నడని ఒకసారి.. అతని దోస్తులు రకరకాలుగా భయపెడుతున్నరని ఒకసారి.. ఎస్.సి. రిజర్వేషన్ పోతదని భయపడుతున్నడని మల్లోసారి.. సున్తీ హైదరాబాద్‌లనే చేయించుకుంటనంటున్నడని మరొకసారి మాట్లాడిందంట. నల్గొండలోనైతే తాము తోడుంటమని మా మామ అన్నడంట. నల్గొండకు వస్తానికి భయపడుతున్నడని అన్నదంట. అయితె హైదరాబాద్‌లనే చేయిద్దాం, ఎప్పుడు చేయించుకుంటడో చెప్పమని మా మామ అన్నడంట.
ఆ తర్వాత నించి ఫోన్‌లు బందైనయంట. భరత్, లెనిన్‌లు గుడా ఫోన్‌లు ఎత్తుత లేరంట!
నాలుగు రోజులు చూసి మా మామ నాకు ఫోన్ చేసి ఏం సంగతో కనుక్కోమన్నడు. ప్రేమ పెళ్ళిళ్లకు రిజర్వేషన్ కూడా సమస్యే అయిందేందా అని జరసేపు సోంచాయించుకుంట ఉండిపొయి, ఇబ్బందిగనే భరత్‌కు ఫోన్ చేసిన.
‘ఏమో అన్న! వాళ్లు మాకు గుడ కాంటాక్టుల లేరే..! ఎటు పొయిన్రో సమజైతలేదు’ అన్నడు.
‘అదేందే! ఏం జరిగిందసలు?’ అనడిగిన.
‘ఆ సున్తీ గురించే వాడు భయపడుతున్నడన్నా..’ అన్నడు.
‘అరె! ఆ పిల్ల ఆ పిలగాని కోసం అందర్ని వొదులుకొని వచ్చినప్పుడు వాడా పిల్ల కోసం ఆ మాత్రం చెయ్యలేడానె? సున్తీ చేసుకున్నంత మాత్రాన ఏమైతది!’ అని అడిగిన నేను.
‘అట్లనె మేం గుడ అడిగినమన్నా.. ఇట్ల ఎటూ తేల్చుకోలేకపోతె కష్టమని, ఏదో ఒకటి చెప్పమని గట్టిగనె అడిగినం.. దాంతోటి వాడిక మమ్మల్ని గుడ కలుస్తలేడే! ఏమైందని తెల్సుకుంటె అసలు వాళ్లిద్దరు ఇక్కడ్నుంచి ఇంకెక్కడికో ఎల్లిపొయిన్రని తెలిసిందే.. యాడికి పొయిన్రో తెలుస్తలేదే..!’ అన్నడు భరత్.
ఎందుకో.. భరత్ మాటలు నమ్మబుద్ధి కాలేదు నాకు.
మా మామకేం చెప్పాల్నో ఎంతకూ సమజ్ కాలేదు.
సోంచాయించుకుంట కుర్సీల కూలబడ్డ-
పిలగాడు అట్లా భయపడడం సహజమే కానీ.. రేష్మ మనసెంత తల్లడిల్లుతుంటదో కదా..! తన దిక్కు నుంచి ఈల్లెవరు ఎందుకు ఆలోచించరు..!?
*
స్కైబాబా

స్కైబాబా

–స్కైబాబ

సుబ్బక్క సుప్రభాతం

  నన్ను నేను పరిచయం చేసుకోవడం ఇబ్బంది. అది తేల్చుకోలేకే పదేళ్లుగా నానా తిప్పలు పడుతున్నాను.  రాజకీయ, సాహిత్య విద్యార్థిగా నన్ను నేను భావిస్తాను.కార్యకర్తనని కూడా అనుకుంటాను.నాకు గుర్తున్నంత వరకూ ఇది నా ఏడోకథ. ఆంధ్రజ్యోతిలో వచ్చిన  పులిజూదం కథను మధురాంతకం నరేంద్రవారి కథావార్షికలోనూ, రైతు కథల్లోనూ తిరిగి అచ్చువేశారు. నాకు దోస్తవిస్కీ ఇష్టం. రావిశాస్ర్తి, పతంజలి, నామిని ఇష్టం.  –జి. ఎస్.రామ్మోహన్

***

“నా బట్టల్లారా..నా సవుతుల్లారా

మీ ముక్కులో నా సాడు బొయ్య

మీ చేతిలో జెట్ట బుట్ట

మీకు గత్తర తగల

మీ తలపండు పగల

మీ వొంశం మీద మన్ను బొయ్య…….”

సుబ్బక్క సుప్రభాతంతో పల్లె రెక్కలిప్పుకుంది.

చేతుల్తో మట్టి ఎత్తెత్తి బోస్తా శాపనార్థాలు పెడతా ఉంది. రామాలయం మైకులోంచి ఎంఎస్‌ సుబ్బలక్ష్మి గొంతు మంద్రంగా వినిపిస్తా ఉంది. దాన్ని డామినేట్‌ చేయడానికా అన్నట్టు సుబ్బక్క అరిచి అరిచి గసపెడతా ఉంది. కళ్లాపి ఇసురిసురుగా చల్లతా ఉంది.

“ఏందే పొద్దు పొద్దునే బిగిన్‌చేసినావ్‌….ఊళ్లో అందరికి సావొస్తా ఉంది. నీకు రావడం లేదే…”

చెంబు తీసుకుని బయలుకు బోతావున్న ఎంగట్రాముడు నడక తగ్గిచ్చి పెద్దరికం చూపిచ్చినాడు.

“తిన్నదరక్క సొయ్యం బట్టి కొట్టుకుంటా ఉంటి నాయనా…ఊరోళ్ల ముల్లెంతా మూటగట్టుకుని మిద్దెలు, మాడీలు కడ్తినాయనా…అందుకే సావొస్త లేదు”…

మాంచి రెస్పాన్స్‌ ఇచ్చి మళ్లీ తిట్ల పనిలో పడింది సుబ్బక్క.

“నీ నోట్లో నోరుబెట్టి బతికిందెవడే” అనేసి ఎంగట్రాముడు నడకలో వేగం పెంచేసినాడు.

సుబ్బక్కకు ఐదుగజాల దూరంలోనే తలకాయొంచుకుని ముగ్గేస్తున్న సుజాత అంతా జాగర్తగా గమనిస్తా ఉంది. ఎదిరింటి వాకిట్లో యాప్పుల్ల నములుతా సుబ్బారాయుడు జరగబోయే వినోదం కోసం ఎదురుచూస్తా ఉన్నాడు. ఆయన భార్య రాములమ్మ పేడకాళ్లు తీస్తా ఉంది గానీ మనసంతా ఇక్కడే ఉంది.  తలకాయొంచుకున్న సుజాతనే మద్దెమద్దెలో తలతిప్పి జూస్తా ఉంది.

“యా పూటన్నా ఒకరింటికాడ చేయి జాపితినా..ఒకరి సంగిటిముద్దకు ఆశపడితినా…పెతి నాబట్టకు నా యవ్వారమే, పెతి లంజెకి నా ఇంటిమీద కన్నే…మీ కుదురు నాశనం కాను”….

సుబ్బక్క డోస్‌ పెంచేసింది.

“ఏందే బాసిలా…పిల్లోళ్లు ఎవరో ఆడుకోడానికి పిడికెడు సిమెంట్‌ తీసకబోతే ఇంత గత్తర జేయాల్నా లేకిముండా”..తగులుకొనింది సుజాత. లంజె అనే పదం ఇనిపిచ్చేసరికల్లా ఆ ఆడబిడ్డకు రోసం వచ్చేసింది. అదే సుబ్బక్క కోరుకునేది. అజ్ఞాతంలో ఉన్న ప్రత్యర్థిని జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకురావడంలో సుబ్బక్క దిట్ట.

“అది పిడికెడా..ఎవురే లేకిది…పొరుగింటి సొమ్ముకు ఆశపడేది ఎవురే”…సిమెంట్‌బస్తాను అరుగుమీంచి లాగిలాగి చూపిస్తా ఉంది సుబ్బక్క.

“ఒరే సుబ్బరాయుడా!..నువ్వు జూడ్రా..ఇది పిల్లోళ్లు తీసకపోయినట్టు ఉండాదిరా..మాటనేదానికి ఇంగితం ఉండాల….నా సవితి, ఇపుడు తేలాల…నా సిమెంట్‌ దెంకపోయిందెవరో తేలాల…ఆ లంజెవరో లంజెకొడుకెవరో తేలాల”…

అనవసరంగా ఇరుక్కుంటి గదరా అనుకున్న సుబ్బారాయుడు “నాకెందుకులేత్తా!..మీ ఆడోళ్ల యవ్వారాలు” అని నోరుకడుక్కోవడానికి బోరింగ్‌ దగ్గరకు బోయినాడు.

“లేస్తే లంజె అంటాండావు, ఎవురే లంజె, నువ్వే లంజె, నీ ఆరికట్ల వంశమే లంజె వొంశం” అని సుజాత కొంగుబిగిచ్చి ముందుకు దూకింది. వీధి వీధంతా తమాస జూడ్డానికి తయారైపోయింది. జాలాడి బండకాడ పెచ్చులూడిపోతే రాత్రి సిమెంట్‌ తీసుకునిపోయిన సుజాత మొగుడు శ్రీనివాసులు ఇంట్లోంచి తల బయటకు పెట్టింది ల్యా.

తాగిన మత్తులో సిమెంట్‌ అవసరమైన దానికన్నా నాలుగు పిరికిళ్లు ఎక్కువ తీసుకుని దారిలో పోసి ఇపుడు సుజాతను బోనులో నిలబెట్టిన పాపానికి మంచంలోనే అటూ ఇటూ దొర్లుతూ ఇంట్లోంచే ఈదిరామాయణం చూస్తా ఉన్నాడు.

ఊరోళ్లకు సుబ్బక్క యవ్వారం కొత్తదేమీ కాదు గానీ దగ్గరిళ్లోళ్లకు మాత్రం నాలుగైదు రోజుల్నించి ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. ‘కొడుకు దగ్గరకు పోయొచ్చినాల్మించి మళ్లీ దీనికి రోగం తిరగబెట్టిందేమే’ అని పక్కింట్లో ఎంగటేసులు ఒగటే ఆశ్చర్యపోతా ఉన్నాడు.  ‘మొన్న మొన్నటి దాకా నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది, నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది అని తప్పెటేసుకుంటా తిరిగిన ముండకి ఇపుడేమైంది’ అనేది అర్తం కాకపాయె.  ‘పెళ్లికి అందర్నీ హైదరాబాద్‌ తీసుకుపోయి రయిక గుడ్డలు గూడక పెడితిరి..ఇపుడేమాయె దీనికి’ అని బీడితాగతా పొగలు పొగలుగా ఆలోచిస్తా ఉన్నాడు.

హైదరాబాద్‌లో కొడుక్కి ఉద్యోగమొచ్చినాల్మించి సుబ్బక్క నెమ్మదిచ్చిన మాట వాస్తవమే. ఇల్లు బాగు చేయిచ్చుకోవడం, బేల్దారిని పిలిపిచ్చుకోవడం, రంగులేయిచ్చుకోవడం…బో కుశాలగా ఉండింది. మొగుడు పోయినాక సుబ్బక్కలో అంత నెమ్మది చూడడం అదే తొలిసారి. అవసరమున్నా లేకపోయినా ఇరుగింటికి పొరుగింటికి పోయి పనుల్లో చెయ్యేసేది. కొడుక్కి వచ్చిన బ్యాంకి ఉద్యోగం గురించి అడిగినోళ్లకు అడగనోళ్లకు వర్ణించి వర్ణించి చెప్పేది. ఊరోళ్లంతా ముసిల్దానా నువ్వు ఆడిదానివి కాదే, మొగరాయుడివే అంటుంటే పొంగిపోయేది. ఎవురైనా పొగుడుతుంటే బో సిగ్గుపడేది. సుబ్బక్క సిగ్గు పడగలదని ఊరోళ్లకి తెలిసిందపుడే. సర్కారీ నౌకరంటే సామాన్యమా!  లంచమివ్వకుండా ఏ ఎమ్మెల్యేతో చెప్పిచ్చుకోకుండా సుబ్బక్క కొడుక్కి ఉద్యోగం రావడమనేది ఊరోళ్లకి ఎంత బుర్ర చించుకున్నా అర్తమయ్యే విషయం కాదు.  సుబ్బక్క ఆ అద్భుతాన్ని సాధించింది.

‘నువ్వేమన్నా చెయ్యి నాయనా….నువ్వు సర్కారీ నౌకరి కొట్టాల..మనల్ని చిన్నతనంగా చూసినోళ్ల ముందు మొగోడివై మీసం తిప్పాల’. అని ఒగటే తారకమంత్రం బోధించింది. అతను కూడా అర్జునుడు పక్షి కన్నునే చూసినట్టు రేయింబవళ్లు ఉద్యోగాన్నే కలవరచ్చి కోచింగులు అవీ తీసుకుని పరీక్షలు అవీ రాసి కొట్టేసినాడు. సర్కారీ నౌకరయిపోయినాడు. ఊరిలో మొనగాళ్ల జాబితాలో చేరిపోయినాడు. అంతటితో ఆగిందా! ఆడు ఆడ్నే ఎవర్నో ఆడపిల్లను చూసుకున్నాడని తెలిసి ఏడెనిమిది లక్షలు పోయెగదరా బగమంతుడా! అని నాలుగైదు రోజులు బో బాధ పడింది సుబ్బక్క. ఉత్సాహమంతా నీరుగారిపోయి ఇరుగూ పొరుగుకు మొకం చూపిచ్చలేక యమ యాతన పడింది.  మామకు ఒగతే కూతురని, కొడుకుల్లేరని తెలిసి నిదానిచ్చింది. “కులమింటి కోతినే చేసుకుంటున్నాడమ్మో..ఏమో అనుకునేరు” అని ఇల్లిల్లూ తిరిగి వివరణ ఇచ్చింది.

బంధుబలగం అంతా పోయిం తర్వాత ఆ సింగిల్‌బెడ్‌రూం ఇంటి యవ్వారం చూసి కొత్త జంటకు అడ్డుగా ఉండడం మర్యాద కాదని వచ్చేసింది. రెండు నెలలు ఉగ్గబట్టినాక కజ్జికాయలు, బూందీ లడ్లు చేసుకుని ఎగురుకుంటూ పోయింది.

***

gs story copy

కజ్జికాయలు, బూందీలడ్లు చూసి కోడలు మొకం చిట్లిచ్చుకున్నా సుబ్బక్క పెద్దగా ఏమీ అనుకోలే. పట్నమోళ్లు ఇంగేమైనా నైసుగా జేసుకుంటారేమోలే అనేసుకుంది.

“మా ఊళ్లో అందరూ పామాయిల్‌తో చేసుకుంటారు.  నేనియ్యన్నీ సెనగనూనెతోనే చేసినానమ్మ!. మంచి బలం. తినాల. పెళ్లయిన కొత్తలో ఇట్టాంటియన్నీ తినాల!”….

ఏవో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కోడలికి అవేవీ వినడం ఇష్టం లేదని అర్థమై సైలెంటయిపోయింది. సుబ్బక్క గడబిడగా ఏదో మాట్లాడాలని అనుకుంటా ఉంటది. కోడలు పెద్దగా మాట్లాడదు. అన్నీ మొకం చూసి అర్తం చేసుకోవాల్సిందే.

“ఈడ నీళ్లు బాగున్నాయమ్మాయ్‌..మా వూర్లో అన్నీ సవ్వ నీళ్లు” అని ఇక్కడున్న సానుకూల అంశాన్ని ముందుకు నెట్టి మరోసారి మాట కలపాలని ప్రయత్నించింది సుబ్బక్క.

“మంజీర గదా, బానే ఉంటయ్‌”…అనేసి పక్కకు తిరిగి పనిమనిషికి ఏదో పురమాయిస్తూ బిజీ అయిపోయింది కోడలు. ఆ మాట తీరు కానీ హఠాత్తుగా బిజీగా మారిపోయిన తీరుగానీ ఇంకొక మాటకు అవకాశం లేకుండా చేశాయి. సుబ్బక్కకు సుర్రుమంది. కానీ తమాయించుకుంది.

ఆరోజు మద్యాన్నం సుబ్బక్క అలవాటు చొప్పున రొంటినున్న మూటలోంచి ఆకొక్క తీసి నమిలేసి రెండు పెదాలపై రెండు వేళ్లు పెట్టి గేట్‌మీదుగా వీధిలోకి ఉమ్మింది. ఖండాంతర క్షిపణి కంటే వేగంగా ప్రయాణించే పదార్థమది! ఆ సౌండ్‌ ప్రత్యేకం. కోడలు ఒక్కసారిగా తలతిప్పి చూసింది. అసహ్యం రంగరించిన చూపు.

‘ఏందిమే! నేనేమన్న లంజెతనం జేసిన్నా..దొంగతనం జేసిన్నా…ఏందీ బాసిలి ఈ మంతున జూస్తది’ అనుకుంది సుబ్బక్క. ఊరికే అనుకోవడమే గాకుండా ఆ మాటల్ని బయటకే అందామనుకుని నోరు తెరవబోయింది. కోడలు ఈ లోపు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి దడేల్‌మని తలువేసుకుంది. అత్త ఎంత వేగంగా ఆకొక్క ఊసేయగలదో కోడలు అంత వేగంగా తలుపు వేసేయగలదు.

రోజూ వచ్చే దానికంటే ఒక అరగంట ముందే వచ్చినాడు కొడుకు. మంటలనార్పే ఫైరింజన్‌లాగా వచ్చినాడు.

“అట్లా బజార్లోకి ఊస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారమ్మా…ఇదేమైనా మనూరనుకున్నావా….అంతగా నమలాలనిపిస్తే ఇంట్లో వాష్‌బేసిన్‌ఉంది కదా..అందులో ఉమ్మేయ్‌”..అని సలహా ఇచ్చేసినాడు…ఇబ్బందికరంగా మసులుతూ కోడలివైపు అపాలజిటిక్‌గా చూస్తూ. ఆ చివరి వాక్యాలు కోడలికి నచ్చలేదని ఆ పిల్ల మొకం చూస్తే అనిపిస్తా ఉంది. దానికంటే కూడా కొడుకు కోడలికేసి అట్లా చూడడం సుబ్బక్కకు అర్థం కాలా. ఏ మొగుడైనా పెళ్లాందిక్కు అట్లా చూడడం ఆమె చూసి ఎరగదు.

మర్నాడు పొద్దున్నే పళ్లుగూడా తోముకోకుండా కోడలు కాఫీ తాగుతుంటే సుబ్బక్క కాసేపు గిజగిజలాడింది.

“స్నానం చేసి పూజ చేసి నోట్లో ఏదైనా ఏసుకోవాలమ్మా…పాసినోటితో తాగడం మంచిది కాదమ్మా”.. అనునయంగా  పెద్దరికం చూపిచ్చింది.

“చూడండి అత్తయ్యా!..ఎవరి అలవాట్లు వారివి. మీ అలవాట్లు మీవి. మా అలవాట్లు మావి. మిమ్మల్ని మారమంటే మారతారా”…

కోపంగా చెప్పినట్టు లేదు. గయ్యాలి తనం అస్సలే లేదు. అలాగని సౌమ్యంలేదు. వినయం మాటెత్తడానికే లేదు. స్థిరంగా ఉంది. కరుగ్గా ఉంది. మారుమాట మాట్లాడేందుకు వీలులేకుండా ఉంది. ఇక చాలు, ఊరుకుంటే నీకు మర్యాదగా ఉంటుంది అని చెప్పినట్టుగా ఉంది. మెత్తని చెప్పుతో కొట్టినట్టుగా ఉంది. ఈ రకం గొంతు సుబ్బక్కకు తెలీనిది. ఈ పట్నపు నీళ్లలో ఏదో తేడా ఉంది అనుకుంది సుబ్బక్క.

‘చిన్నప్పటినుంచి మాటలు పడుడే. ఆ మొగుడు నాబట్ట  కాలితో చేత్తో  ఊర్కూర్కినే తన్నేది. మొగుడు పోయినాల్మించి ఊరోళ్లంతా ఏడిపిచ్చి చంపేది. చిన్నప్పటినుంచి ఒకరి మాట తాను వినడమే. తనమాట ఒకరు వినడం ఎరగదు. ఇంత కాలానికి ఒక కోడలు పిల్ల వచ్చింది. నాలుగు మాటలు చెప్పొచ్చు. కొంచెం పెద్దరికం చూపొచ్చు’ అనుకుని ఆశపడింది. “ఓసే ఎడ్డిదానా ఆడికి పోయి ఏం మాట్లాడతావో ఏమో” అని అందరూ అంటా ఉంటే అదమ్మాయ్‌..ఇదమ్మాయ్ లాంటి నైస్‌ మాటలు కూడా నేర్చుకోని వచ్చింది. ఈడ యవ్వారం చూస్తే తేడాగా ఉంది.

సుబ్బక్కకు కుడి కన్ను అదిరినట్టుగా అనిపిచ్చింది. ఆకొక్క తోనే యవ్వారం తెలిసొచ్చినా ఏదో ఒక ఆశతో ఉండింది. ఇపుడదీ పోయింది. ‘ఇది తన పెద్దరికానికి తలొగ్గే రకం కాదు. ఊర్లో తెలిస్తే ఎంత నామర్దా. పరువు తుట్టాగా పోదూ!’

“ఊపుకుంటా పోయింది ముసిల్ది. కోడలి చేత ముడ్డిమీద తన్నిచ్చుకుని ముంగిమాదిరి వొచ్చింది”…ఇరుగు పొరుగు అనబోయే మాటలు ఇపుడే వినిపిస్తా ఉన్నాయి సుబ్బక్కకు.

మర్నాడు మరో ఎపిసోడ్‌. సాయంత్రం వక్క అయిపోతే వాచ్‌మన్‌పెళ్లాం దగ్గర అడిగి తీసుకుని అక్కడే ముచ్చట్లలోకి దిగింది సుబ్బక్క. కోడలికి  తల కొట్టేసినట్టయ్యింది. ఎదురింటి ఫ్లాట్‌ ఆవిడ తన అత్తగార్ని ఆ స్థితిలో చూసిందని తెలిసి కోడలికి మరీ మరీ మండుతా ఉంది. మర్నాడు పొద్దునే అత్తను తీసికెళ్లి చందన బ్రదర్స్‌లో రెండు మాంచి కోకలు కొనిచ్చి ఈడున్నన్ని రోజులు అవే కట్టుకోవాలని చెప్పేసింది. “ఏందో అనుకున్నా గానీ కొంచెం మంచిపిల్లే” అనుకునింది సుబ్బక్క. ఇంటికి చేరాక వాచ్‌మెన్‌క్వార్టర్‌ దగ్గరకు వెళ్లకూడదని, వెళ్లినా వారితో సమానంగా కూచ్చొని కబుర్లు చెప్పకూడదని కోడలు మెత్తగా చెప్పేసింది. అపుడు అర్తమైంది కోడలు కొత్త కోకలెందుకు కొనిచ్చిందో!

దేవాలయానికి పోయొచ్చేసరికి స్టవ్‌మీద ఏదో సుర్రుమంటా ఉంది. ఏందా అని చూడబోతే కొడుకు ఉల్లిపాయలు తరిగి తాలింపు వేస్తా ఉన్నాడు. “ఏందిరా ఈడు ఆడంగి పనులు చేసేది” అని మనసు గింజుకుంది. కోడలు స్నానానికి పోయింది అని అర్తమైపోయింది.

“నీ పెళ్లాం జలకాలాడతా ఉంటే నువ్వు వంట చేస్తా ఉండావా, నువ్వు లే..నాయినా..నేజేస్తా గానీ, మొగోడివి నువ్వు చెయి కాల్చుకోవాల్నా……అది నీళ్లు పోసుకొనొచ్చి వంట చేస్తే కందిపోతాదా…ఇంత సదువుకుని ఏం పనిరా ఇది” అని చేతిలో గంటె లాగేసుకుంది.

“నువ్వుండమ్మా…చిన్నచిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎట్లా…క్యారేజ్‌ రెడీ కాకపోతే ఆఫీసుకు లేటయిపోదూ”…

“ఏందిరా ప్రతిదానికీ దాన్ని ఎనకేసుకురావడమేనా… అప్పుడే పెళ్లాం బెల్లం అయిపోయిందా నాయనా”

కొడుకు పని అటూ ఇటూ గాకుండా తయారైంది. భార్య ఎక్కడ ఈ మాటలు వింటుందో, ఎక్కడ అత్తా కోడళ్ల యుద్ధం బద్దలవుతుందో అని భయం. పైగా కోడలికి కచ్చితంగా వినపడాలనే తల్లి గొంతు పెంచి మాట్లాడుతున్నట్టు అర్తమవుతూనే ఉంది. అతనసలే బహు జాగ్రత్తపరుడు. సాయిబాబా భక్తుడు. ఎప్పుడూ ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు.

కోడలికి సుబ్బక్క మాటలు వినపడ్డాయో లేదో తెలీదు. ఆమె అనుమతి లేకుండా ఆమె మొకంలో ఏ భావమూ పలకదు. వచ్చేసి వంటలో మునిగిపోయింది గంభీరంగా.

సుబ్బక్కకేమీ అర్తం కాలా. ఎదుటి మనిషి గొంతు పెంచి గొడవపడితే తడాఖా చూపించొచ్చు. కానీ ఇట్లా ఉంటే ఏం చేయాలో ఆమెకు తెలీదు. కానీ అంతకంటే కూడా ఆమెకు కొడుకు యవ్వారమే అంతుపట్టకుండా ఉంది. కోడలి కేసి కొడుకు కేసి మార్చి మార్చి చూసింది. కొడుకు చూపులు నేలమీదకు దించేసుకోని వంటగదిలోంచి బయటకు పోయినాడు.

‘ఎట్టాంటోడికి ఎట్టాంటోడు పుట్టినాడు! ఆ నాబట్ట ఎపుడన్నా ఇటున్న చెంబు అటు పెట్టినోడా…సుట్టకాల్చుకోవడానికి అగ్గిపెట్టె అడిగితే ఆడ్నే ఉంది అని చెప్పిన పాపానికి “ఏం తీసిస్తే అరిగిపోతావే లంజె” అని యీదంతా తిప్పితిప్పి కొట్టలా”….చచ్చిపోయిన భర్త గుర్తొచ్చి లోలోపల మెలిపెట్టింది. గతం తవ్వుకున్న కొద్దీ ఏడుపొస్తా ఉంది. కోడలిమీద యాడలేని కోపం తన్నుకొస్తా ఉంది.

తొలిరోజే కోడలు పిల్ల రెండు సార్లు అన్నం వండాల్సి వచ్చింది. మనుషులు అంత అన్నం తింటారని కోడలికి తెలీదు. సుబ్బక్క అన్నాన్ని గురుగులాగా చేసుకుని పైన ఇంత పప్పేసుకుని ఇంతింత ముద్దలు కళ్లకద్దుకుని లాగిస్తా ఉంటే చూస్తా ఉండేది. ఆ ఆశ్చర్యానికి అంతే ఉండేది కాదు. మూడో రోజూ కోడలు కళ్లలో అదే ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం సుబ్బక్క కంట పడకుండా ఉండాలనే పట్టింపు కోడలికేమీ లేదు.

వాళ్లు తినే తిండి కూడా సుబ్బక్కకు ఆశ్చర్యమే. రెండు పిరికిళ్ల అన్నం. అంతే సైజులో రెండు మూడు రకాల కూరలు. ఆ కొంచెం తిని మనుషులు ఎట్లా బతుకుతారో ఆమెకు అర్తం కాని విషయం. మౌనంగా ఉండడానికి ఆమె కోడలు పిల్లలాంటిది కాదు.

” ఇట్ట తింటే ఎట్ట!…తినాల నాయనా.. రాళ్లు తిని రాళ్లు అరిగించుకునే వయసు. బాగా తినాల.” అని ప్రేమ చూపిచ్చబోయింది.

“మీ లాగా తినాలంటే కష్టమండి. మేం చేసే పనికి అదే ఎక్కువ” అంది కోడలు పిల్ల.

“అంత కొంచెం కూరేసుకుని అంతంత అన్నం తినేయకూడదమ్మా. కూరగాయలు బాగా తినాల. అన్నం ఎంత తింటామో కూర అంత తినాల. నిజానికి కూరే ఎక్కువ తినాలంట. డాక్టర్లు అదే చెప్పేది”. రివర్స్‌ జ్ఞానబోధలోకి దిగాడు కొడుకు.

‘నోరు లేవాల్సినపుడు లేవదు గానీ ఇపుడు దాని మాటకు తాళమేయడానికి మాత్రం తయారైపోయినాడు’ లోలోపల కాలిపోతోంది సుబ్బక్క.

“ఏమోలే నాయన! ఇంత సంగటిమీద ఊరుమిడి ఏసుకుని తినిన ప్రాణం. ఇపుడు మారాలంటే యాడ మారేది!” ….మొకం అదోలా పెట్టి మాటల్ని ఈటెలు చేసి విసిరింది.

పేరుకు నాయనా అన్నా ఆ విసురు కోడలిమీదే అని తెలుస్తానే ఉంది.

“చిన్నప్పటినుంచీ కుదార్తంగా కూచ్చొని తిన్నది లేదు. ఇపుడు తిందామంటే కుదరకపాయె. అది తింటే బిపి. ఇది తింటే సుగర్. ఆ డాక్టర్ నాబట్టదగ్గరకు పోయొచ్చినాల్మించి సప్పిడి బతుకయిపోయె. కోడలు పిల్ల మరీ అన్యాయం. ఉప్పు లేదు,కారం లేదు..నోరు సప్పగా చచ్చిపోయింది.  రుచీ పచీ లేకుండా ఇదేం తిండో అర్తమే కాదు”….తనలో తాను మాట్లాడుకోవడం నేర్చేసుకుంది సుబ్బక్క.

ఊళ్లో ఆ ఇబ్బంది ల్యా. తల తిప్పితే ఎవురో ఒకరు. ఎవురితో మాట్లాడాల్సినయి వాళ్లతో. ఈడ ఎవురికెవురు!

ఎవురితో మాట్లాడడానికి లేదు. ఎవురితో మాట్లాడకుండా ఉంటే నోరు పూర్తిగా చచ్చిపోయి మూగిదాన్నైపోతానేమో అన్నంత భయమొచ్చేసింది సుబ్బక్కకు. వాచ్‌మెన్‌భార్యతో ముచ్చట్లొద్దని కోడలి ఆర్డర్‌. ఇంకెవురితో మాట్లాడేది! అదేందో, అందరూ తలుపులేసుకునే ఉంటారు జైల్లోమాదిరి! ఇది ఏమి బతుకురా బగమంతుడా! అని సుబ్బక్క ఎన్ని సార్లు అనుకునిందో చెప్పలేం.

బేస్తవారం సందేళకాడ కొడుకు, కోడలు ఇద్దరూ తయారైపోయినారు.

“అమ్మొక్కతే ఏం చేస్తాది,  తీసుకుపోదాం” అన్నాడు కొడుకు.

కోడలు నోరు తెరిచింది లేదు. కొడుకు దాన్నే అంగీకారంగా అన్వయించేసుకుని అమ్మా “నువ్వు కూడా తయారవు” అనేసినాడు. కోడలిది అనాంగీకారంగా అర్తమైన సుబ్బక్క “ఎందుకులే నాయినా…ముసల్దాన్ని యాడికొచ్చేది, మీరు పోయిరాండి” అనేసింది. ఇట్లన్నా రిమోట్‌కంట్రోల్‌ చేతికొస్తుందేమో,ఈ పూటన్నా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌ చూడొచ్చేమో అని లోలోపల ఆశపడింది.

“లేదమ్మా..పోయేది గుడికే. సాయిబాబా దేవలానికి ..రా..చాలా బాగుంటది, చూద్దువుకానీ” చిన్నపిల్లలకు తాయిలం ఇస్తున్నట్టు ఊరించే గొంతుతో చెప్పినాడు కొడుకు.

గుడి అనేసరికల్లా సుబ్బక్క మనసు మారిపోక తప్పలే. ముసిలోళ్లుగా ఉండి దేవలానికి రమ్మంటే రాకుండా ఉంటే ఏమైనా ఉంటదా! సరేలే నాయనా అని బయలు దేరింది.

Kadha-Saranga-2-300x268

“ఎంత బెమ్మాండంగా కట్టినారురా…అబ్బో అబ్బో” అని సుబ్బక్క అదే పనిగా ఆశ్చర్యపోతానే ఉంది. మురికి కాళ్లు అడుగు పెట్టదగిన ఆలయంలాగా లేదది. అక్కడికొచ్చిన వాళ్లందరిలో తనలాంటి మనిషి తానొక్కతే ఉన్నానని అర్థమైపోయిందామెకు. “ఇది సదువుకున్నోళ్లు, పెద్దపెద్దోళ్లు వచ్చే దేవలం. తన లాంటోళ్లది కాదు” అని అర్తమైపోయింది.

గుళ్లోంచి బయటకు వచ్చింతర్వాత మొగుడూ పెళ్లాం గునా గునా మాట్లాడుకోవడం, ఇట్నించి ఇటే ఎక్కడన్నా బయట తినేసి ఇంటికిపోదాం అని కొడుకు ఎనౌన్స్‌మెంట్ ఇచ్చి చట్నీస్‌కి తీసుకుపోవడం అన్నీ ఒక పథకం ప్రకారం జరిగిపోయినాయి. ఈ దండగమారి హోటల్‌ప్లాన్‌ తన కోడలిదే అయ్యుంటాదని సుబ్బక్క అనుకునేసింది. ఆ చట్నీస్‌ అనే హోటల్‌లో కూడా తన లాంటి మనిషి తనొక్కతే ఉన్న విషయం, ఆ విషయాన్ని తనకు గుర్తు చేస్తున్నట్టున్న కోడలి చూపులు అన్నీ సుబ్బక్కకు అర్తమవుతానే ఉన్నాయి. కోడలు ఇడ్లీ దోసెతో సరిపెట్టేసుకుంది. సుబ్బక్క, సుబ్బక్క కొడుకు భోజనం కానిచ్చేసినారు. భోజనం తెచ్చిచ్చినోడు ఒక పుస్తకం లాంటిది పెట్టేసి దూరంగా చూస్తూ నిలబడినాడు. అందులో కొడుకు  రెండు అయిదొందల రూపాయల నోట్లు పెట్టినాడు. హోటల్‌వాడు మళ్లీ పుస్తకం తెచ్చిస్తే కొడుకు అందులోంచి ఒక్క వంద రూపాయల నోటు మాత్రం తీసుకుని మిగిలింది ఉంచేసినాడు. అన్నింటినీ సుబ్బక్క ఇచ్చిత్రంగా చూస్తా ఉంది.

“ఎంతయినాదిరా” అని అడిగింది గేట్లోంచి బయటపడగానే.

అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉంది. అడక్కపోతే పొట్ట పగిలిపోయేట్టు ఉంది. కొడుకు ఏదో మాట్లాడబోయేంతలో….

“ఎంతయితే ఏమిట్లెండి” అని అడ్డుపడింది కోడలు పిల్ల.

“అన్నింటికి నువ్వు అడ్డమొస్తావేందిమే…మొగోడు మాట్లాడుతుంటే మద్దెలో మాట్లాడొచ్చునా…ఇదేం పద్దతమ్మాయ్‌..నీకు నీవాళ్లు పద్దతి సరిగా నేర్పిచ్చినట్టు లేరు”…సుబ్బక్క అసలు అవతారంలోకి వెళ్లిపోయింది. కొడుక్కి విషయం అర్తమైపోయింది.

“నేనేం చెప్పాను, మీరేం మాట్లాడుతున్నారు. పెద్దవాళ్లు కదా అని గౌరవమిచ్చి మాట్లాడితే మావాళ్లగురించి మాట్లాడతరేంటి…..అయినా మీకెందుకివ్వన్నీ”….పక్కనున్న మనుషులకు వినపడకుండా లోగొంతుకతో అయినా గట్టిగానే ఇచ్చింది కోడలు. ప్రపంచంలోని చిరాకు అసహ్యం అంతా రూపమెత్తినట్టు ఉంది ఆమె ముఖం.

హోటల్‌ బయట ఎక్కడ సీన్‌ క్రియేట్‌అవుతుందో అని కొడుకు గడగడలాడుతూ ఉన్నాడు. అతనసలే గొడవలంటే ఇష్టపడని మనిషి. దేనిమీదైనా ఒక వైఖరి తీసుకోడమంటే అతనికి మా చెడ్డ చిరాకు. సిగరెట్‌తాగని, మందు కొట్టని తనలాంటి మంచి మనిషికి ఇలాంటి కష్టం ఆ సాయినాధుడు ఎందుకు తెచ్చిపెడతాడా అని అతను ఆలోచిస్తా ఉన్నాడు. మౌనంగానే అంతా ఇల్లు చేరుకున్నారు. అక్కడ కొడుకు మొకం చూసి ఇబ్బందిని అర్త చేసుకుని మర్యాద కాపాడడానికి తమాయించుకుంది సుబ్బక్క. రగిలే బడబాగ్నిని దాచుకున్న అగ్ని పర్వతం ఇంటికి రాగానే లావా చిమ్మడం మొదలెట్టింది.

“అయినా ఏందిరా నీ పెళ్లాం! నేను దాన్నేమయినా అంటినా..నిన్ను కదా అడిగితి. మద్దెలో అడ్డమెందుకు రావాల. అయినా మగోడు మాట్లాడుతుంటే ఆడది మద్దెలో వచ్చేదేందిరా…అయినా నేనేమంటి… ఎంతయిందిరా అని అడిగితి” గాలి పీల్చుకోవడానికన్నట్టు ఓ క్షణం ఆగి కోడలి వైపు చూస్తూ అంది…..

“అదే తొమ్మిదొందలు పెడితే నాకు నెల గడిచిపోతుంది గదరా ఊళ్లో”

“మీ ఊరువేరు, ఇది వేరండి. ఎక్కడి పద్ధతులక్కడ ఉంటాయి. మమ్మల్ని కూడా మీలాగే బతకమంటారా”..

కోడలి గొంతు ఎపుడూ లేనంత ఆవేశంగా ఉంది. శరీరం వశం తప్పుతున్నట్టు ఉంది. పెదాలు అదురుతున్నాయ్‌.

“మా లాగా మీరెట్ట బతుకుతరమ్మా….నువ్వు మహారాణివైపోతివి…నీ మొగుడొక మహారాజైపోయె. నీ మొగుడిలాగా నా మొగుడు ఉద్యోగస్తుడు కాదే. మట్టి పిసుక్కునేటోడు. కడుపు మాడ్చుకుని తినీతినక ఎంత జాగ్రత్తగా ఒక్కో రూపాయిని కూడబెడితే  నాయనా..నువ్వు డిగ్రీ చేసి ఉద్యోగం సంపాదిచ్చింది? రూపాయి వచ్చినపుడు దాచిపెట్టుకోవాల నాయనా! ఈ బాసిలి కేమీ డూండాంగా తిరగాలంటాది. .మీరొండుకునే రెండు బొచ్చెలు తోమడానికి పనిమనిషి అవసరమా నాయనా! ఏం, నీ పెళ్లాం చేతులు బొబ్బలెక్కుతాయా…. దొరల కుటుంబంలో పుడితిమా నాయనా! అంతంత కర్చుపెట్టి కోకలు కడితేనే కట్టినట్టా నాయనా! అంతంత పెట్టి అట్టాంటి హోటల్లో తింటేనే తిన్నట్టా నాయినా! తొమ్మిదొందలంటే ఎంత కష్టపడితే నాయనా వచ్చేది. ఇద్దరు మడుసులకు నాలుగిత్తులు ఉడకేసుకోవడం కష్టమా నాయనా! ఉద్యోగం రావడం తోనే మొగోడివై పోవు …రూపాయి రూపాయి దాచిపెట్టుకుంటేనే రేపు నువ్వు మొగోడనిపిచ్చుకునేది. ఊర్లో మీసం మెలేసి, బాంచత్! పలానోడి కొడుకు ఈడు అని తిరగాలంటే ఇట్టయితే అయితదా నాయనా! ఇంట్లో ఆడిబిడ్డ అంటే ఎట్టుండాలా?.. మొగోడు దుబారా అయినా అది జాగ్రత్త చేసి పైసా పైసా కూడెయ్యాల. ఇట్టయితే అయితదా నాయనా! సంసారం ఈదుకొచ్చే ఆడిదేనా ఇది! ఇట్లాంటి ఐసాపైసా దాంతో ఉన్నది ఊడ్చేసుకుని పోవడమే కదా నాయనా!”..

కాసేపు గస పోసుకోవడానికి ఆగింది. ముక్కు చీదుకుంది. కళ్లలో నీళ్లు పెట్టుకుంది.

ఇంటిదగ్గర నేర్చుకుని వచ్చిన అమ్మాయ్‌..లాంటి నైసు మాటలు మాయమై ఒరిజినల్‌ పూర్తిగా బయటికొచ్చేసింది.

కొడుకు ఒక్కమాట కూడా మాట్లాడకుండా నేలచూపులు చూస్తున్నాడు. మధ్యమధ్యలో కొద్దిగా తలపైకెత్తి కోడలి ముఖం వైపు ఇబ్బందిగా చూస్తున్నాడు. కొడుకు యవ్వారంతో సుబ్బక్కకు మరీ మంటెత్తింది.

“ఆడంగి నా కొడుకు పుట్టినావు కదరా…ఆయన ఎట్టుండేటోడు”. భర్తను గర్వంగా గుర్తు చేసుకుంది.

“నోరెత్తనిచ్చేటోడా…నోరెత్తితే ఎగిచ్చి ఎగిచ్చి తన్నేటోడు కాదు!”….

“మొగోడ్ని నేను మాట్లాడుతుంటే మధ్యలో నోరెత్తుతావే ముండా”….భర్త ఉగ్రస్వరూపం గుర్తొచ్చి బొటాబొటానీళ్లు కార్చేసింది సుబ్బక్క.

“మొగోడంటే అట్టుండాల. అయినా ఆడదాన్ని నోరెత్తనీయొచ్చునా! మొగోడంటే ఎట్టుండాల…పౌరుషముండొద్దూ. ఆడదాన్ని మాట్లాడనిస్తే మొగోడికి గౌరవముంటదా!”

కొడుకుతో మాట్లాడుతుందో, తనలో తానే మాట్లాడుతుందో తెలీనట్టుగా మాట్లాడేస్తూ ఉంది సుబ్బక్క.

స్టాచ్యూ అన్నట్టు నిలబడి పోయి చూస్తా ఉంది కోడలు పిల్ల. అత్తగారి ప్రవాహం చూశాక ఆపడానికి తన శక్తి సరిపోదని అర్థమైపోయింది. మధ్యలో ఆవేశం తెచ్చుకొని ఏదో మాట్లాడబోతే కళ్లతోనే వారించాడు కొడుకు. ఉడికిపోతా ఉంది. తట్టుకోలేకపోయింది.

“చీ..ఎదవగొడవ…ఎదవ మొకాలు” అనేసి విసురుగా లోపలకుపోయి దడాల్న తలుపేసుకుంది.

“ఏం మాటలయి..ఏం మాట్లాడుతున్నావ్‌ నువ్వు” …కొడుకు తలుపు వైపు తిరిగి అరిచినట్టుగా గొణుగుతున్నాడు.

“ఎవురే, ఎదవ మొకాలు”. ….ముక్కు చీదడం ఎక్కువ చేసింది సుబ్బక్క.

“నువ్వు జమీందారీ బిడ్డవి అయిపోతివి. ఉద్యోగస్తుడైన నాబిడ్డ, నేను ఎదవ మొకాలమైపోతిమి. ….ఏం మొగోడివిరా నువ్వు. అదట్లా నోరేసుకుని మాట్లాడుతుంటే”…ఆ రూట్లో నరుక్కొచ్చే ప్రయత్నం చేసింది సుబ్బక్క.

ఎవురు నోరేసుకుని మాట్లాడుతున్నారో అర్థం కానట్టు నిలబడి…”ఎందుకిమ్మా చిన్నదానికి ఇంతగొడవ” అని ఏవో సణుగుతూ నుంచున్నాడు కొడుకు. అతనసలే గొడవలంటే పడని మనిషి.

“కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకున్నాడే  నా కొడుకు నిన్ను! పది పదిహేను లచ్చలొచ్చేయి నా చిన్నాయన మనుమరాలిని చేసుకొనుంటే! ఎట్లుండేది అది! ఎంత మర్యాదగా ఉంటదది! నీలెక్కన పోలేరమ్మలాగుంటదా! ఎంత మర్యాద, ఎంత మన్నన! ఈడు నా మాటిని దాన్ని చేసుకునుంటే నాబతుకిట్టయ్యేదా!”

“ఆ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఖర్చే ఐదులక్షలయ్యింది మా డాడీకి. ఊరికే వస్తుంది కదాని బస్సేసుకుని ఒక మందని దింపారు ఇక్కడ. పెళ్లిని జాతర జేశారు”.. కోడలు తలుపు వెనకనుంచే అరుస్తోంది..

యవ్వారం ఎట్నుంచి ఎటుపోతోందో అర్థం చేసుకున్న కుమారరత్నం “అమ్మా..అవన్నీ తవ్విపోయకు. చిన్నదానికి రాద్దాంతం చేసేస్తున్నావు. ఇపుడేమైందని, ప్రశాంతంగా ఇంత తిని ఉండొచ్చు కదా, ఎందుకియ్యన్నీ నీకు” అని అసహనంగా అనునయించాడు.

“పెద్దామె ఏదో అంటే నువ్వు మళ్లీ మాట్లాడాల్నా…కాసేపు ఊరుకుంటే ఏమవుతుంది!”..తలుపు వైపు తిరిగి అటువైపు చెప్పాల్సింది అక్కడ చెప్పేసాననుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

“ఊళ్లో తిండిలేకనే నీదగ్గరకొస్తి నాయనా. తిని ఉన్నీకి. అంతేలే నాయనా. పెళ్లాం బెల్లం, తల్లి అల్లం. ఉరే, నానా గడ్డి తిని పైసా పైసా కూడబెట్టి చదివిచ్చినానురా..నిన్ను. ఇంత చేసి ఉద్యోగస్తుడ్ని చేసి దీని ఎదాన పడేస్తి కదరా నిన్ను” ముక్కు చీదుకుంటా ఘోరంగా ఏడుస్తోంది సుబ్బక్క.

తలుపు వెనుకనుంచి కోపంతో నిస్సహాయతతో బుసలు కొడుతోంది కోడలు. “లేబర్‌ మనుషులు, లేబర్‌ బుద్ధులు” అని ఏవోవో గొణుక్కుంటా ఉంది.

కొడుకు చూపులు మరింత నేలబారుగా దిగిపోయాయి. ఏం చేయాలో తెలీదు. ఎలా అనునయించాలో తెలీదు. ఎవర్ని అనునయించాలో తెలీదు. ఏ ఆక్రోశం ఏగొడవకు దారితీస్తుందో ఏది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో ఆలోచించాలంటేనే అసహనం. కారణాలు తెలీవని అనలేం. కానీ తెలుసుకునే కొద్దీ చిరాకు. ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడడమే  అతనికి మా చెడ్డ చిరాకు.

అతనసలే గొడవలంటే పడని మనిషి. సాయినాధుడి సన్నిధిలో ప్రశాంతంగా గడపాలనుకునే మనిషి.

***

“అవునే, నువ్వు దొజస్తంభం లేపిన పెతివ్రొతవి. మాదే లంజె వొంశం”…..సుజాత గొంతు పీలగా పలుకుతా ఉంది.

“కాకపోతే ఒకరి కూడికి ఆశపడితిరే లేకిముండా….నా కష్టం నేను పడుకుంటా నా బతుకేదో నేను బతుకుతా ఉంటే అందరికీ నామీదే కన్నేమే సొట్టముండా…. వయ్యారంగా తిప్పుకుంటా తిరగడం కాదే, కష్టపడితే తెలుస్తాదే…కష్టపడి బతకాల. మొగోళ్లా బతకాల. బాంచత్‌ అని ఒకడి మొకం మీద కొట్టినట్టు బతకాల. ముడ్డి తిప్పుకుంటా మాటలు చెప్పుకుంటా తిరగడం కాదు….”

గసపెడతా తిడతా ఉంది సుబ్బక్క.  గుండెలు ఎగిసేట్టు ఏడుస్తా తిడతా ఉంది.

సుజాతకు ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. ఇంతకుముందుకూడా ఇది నోరేసుకుని బతికిందే కానీ ఇట్టా ఎదుటోళ్లని తిట్టేటపుడు ఏడవడం ఏనాడూ చూడల్యా.

సుబ్బక్క సుజాతనే తిడుతోందో..ఇంకెవర్నయినా తిడుతోందో అర్థంకాక  జుట్టు పీక్కుంటా ఉన్నాడు పక్కింటి ఎంగటేశులు. సిమెంట్‌ తీసకపోయినదానికి ఇంత ఏడుపు దేనికో అతనికి ఎంత ఆలోచించినా అర్తం కావడం ల్యా.

 

జి ఎస్‌ రామ్మోహన్‌

కథకు బొమ్మ గీసిన వారు : అక్బర్