బరువు???

 

 

Mamata K.

మమత కొడిదెల 

 

కాళ్ళకు చక్రాలు తొడుక్కున్నట్లు బాల్కనీలో అటూ ఇటూ పచార్లు చేస్తోంది ప్రీతి. ఆమె నడక చూసి చెప్పొచ్చు తన మనఃస్థితి ఎలా వుందో.

బాల్కనీలో ఒక పక్కగా పేము కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తోంది కరుణ. అరగంట ఓర్చుకుని అంది, “అబ్బబ్బా, ఇక చాల్లే. నీ నడక చూస్తుంటే నాకు తల తిరుగుతోంది. కూర్చో ఇక. లేకపోతే ఒక దగ్గర నిలబడి నీ ఇష్టం వచ్చినంత కోప్పడుకో.”

“అంత కష్టంగా వుంటే నావైపు చిద్విలాసంగా చూస్తూ కూర్చోక ఆ పుస్తకం చదువుకోరాదూ.” గయ్యిమంది ప్రీతి.

“అనుకుంటూనే వున్నా. అత్త మీద కోపం దుత్త మీద పడుతుందని.”నవ్వింది కరుణ, “సరే, ఇంకో ఐదు నిమిషాలు అలాగే నడుస్తుండు. మాంచి మసాలా టీ పట్టుకొస్తా.”

**

ప్రీతి, కరుణ జిగ్రీ దోస్తులు. చదువుకోవడానికి అమెరికా వచ్చిన కొద్దిరోజుల్లోనే పరిచయమయ్యి, భావాలు, మనస్తత్వాలు కలవడం వల్ల ప్రాణ స్నేహితులైపొయ్యారు. ఉద్యోగం వచ్చిన కొన్ని నెలల్లోనే తన ఆఫీసులోనే పరిచయమైన రాహుల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కరుణ. పెళ్లయిన కొత్తజంటను డిస్టర్బ్ చెయ్యొద్దనుకుని కాస్త దూరం జరిగింది ప్రీతి. ప్రీతి వేరే స్టేట్ లో ఉద్యోగం చూసుకోడంతో వారిమధ్య రాకపోకలు కూడా బాగా తగ్గిపొయ్యాయి. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లు.

పెళ్లయిన ఏడాదికే కుటుంబ సమస్యలు మొదలై వాటిని స్నేహితురాలికి పంచకూడదనుకుని ఇంకా దూరం జరిగింది కరుణ. కరుణకు పాప పుట్టిన తరువాత  కుటుంబ సమస్యలు మరీ ఎక్కువయ్యాయి వాటి ప్రభావం పాప మీద పడడం ఇష్టం లేక ఏడాది క్రితమే భర్తతో విడాకులు తీసుకుంది.

కరుణ విడాకులు తీసుకున్న రెండో నెలలో ప్రీతి నుంచి హఠాత్తుగా ఫోన్. కరుణ వున్న ఊర్లోనే ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ప్రీతికి తన విడాకుల విషయం అప్పుడు చెప్పింది కరుణ. అంత పెద్ద సంగతి తనకు చెప్పలేదన్నదానికంటే స్నేహితురాలు తనలోకి తాను ఎంతలా ముడుచుకుపొయ్యిందో గ్రహించి ఎక్కువ బాధ పడ్డది ప్రీతి. తొందర్లోనే కరుణ వుంటున్న ఇంటి దగ్గరలోనే అపార్ట్మెంట్ కొనుక్కుంది.

తనకు సరైన జోడీ దొరకక ఇంకా పెళ్లి చేసుకోలేదు ప్రీతి.

కరుణ కాస్త కుదుట పడేదాకా తోడు వుందామని, పాప కాస్త పెద్దదయ్యేదాకా సహాయం చేద్దామని వచ్చారు ఆమె తల్లిదండ్రులు. ఆఫీసు పని తరువాత, పాప పనులు పూర్తయిన తరువాత రెండుమూడు రోజులకొకసారి ప్రీతి దగ్గర గడుపుతుంటుంది కరుణ.

 

**

ఈరోజు ప్రీతిలో ఎప్పుడో గాని బయటకు రాని అసహనాన్ని గమనించింది కరుణ. టీ చేస్తూ అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పింది.

కరుణ అందించిన కప్పు అందుకుని, కమ్మని మసాలా టీ వాసన చూస్తూ ”మ్… టీ బాగానే చేసినట్టున్నావోయ్.” అని మెచ్చుకుంది ప్రీతి.

“షుక్రియా, షుక్రియా! వంట గదిలోకి వెళ్లి చాలా రోజులవుతోంది. టీ ఎలా పెట్టాలో గుర్తు చేసుకోవాల్సి వచ్చింది.”  చిర్నవ్వుతో అంది కరుణ.

“నువ్వు చాలా లక్కీ… అమ్మనాన్న నీతోనే వుండగలుగుతున్నారు.”

“నేను, పాప ఇద్దరం లక్కీనే. వాళ్లు వచ్చినప్పట్నుండి పాపతో ఎక్కువసేపు గడపగలుగుతున్నాను.”

కాసేపు ఏవేవో మాట్లాడుకున్న తరువాత అడిగింది కరుణ, “ఇంతకీ నీ కోపానికి కారణమేంటే తిరుగేశ్వరీ?”

“ఏంటో ఈ మనుషులు. ఎప్పుడు మార్పొస్తుందో వీళ్ళలో.” అంటూ కుర్చీలోంచి లేవబోయింది ప్రీతి.

“అమ్మో, మళ్ళీ నడవబోతున్నావా?”

కరుణ జోక్ పట్టించుకోకుండా చప్టా దగ్గరికి వెళ్లి నిల్చుంది ప్రీతి, “చాలా చిరాగ్గా వుంది కరుణా.”

Kadha-Saranga-2-300x268

“ఓహ్. ఇక అడ్డు రాను. ఏమయిందో చెప్పురా.”

“ఒక పెళ్లి సంబంధం వచ్చిందని డిటైల్స్ చెప్పాడు నాన్న. అతను డివోర్సీ కానీ ఎలాంటి బాధ్యతలూ, బరువులూ లేవని చెప్పారట. అతను అమెరికాలోనే వుంటున్నాడని, ఒకసారి కలవమని ఒకటే గొడవ. అతనితో మాట్లాడినప్పుడు చాలా లిబరల్ మైండెడ్ గా  అనిపించాడట. అతను నా మనస్తత్వానికి సరిపోతాడని అమ్మ కూడా అంది.”

“రెండో పెళ్లి సంబంధమని కోపమా?” తన స్నేహితురాలిని ఈ కోణంలో ఎప్పుడూ చూడలేదు కరుణ.

నవ్వింది ప్రీతి, “నా గురించి నీకు బాగా తెలుసని గప్పాలు కొడుతుంటావు. ఈ విషయంలో నేను ఎట్టా ఆలోచిస్తానో నీకు తెలీదా?”

కరుణ కూడా నవ్వింది, “మరీ, నీ చిరాకుకి కారణమేమిటమ్మా? నువ్వు వద్దన్నా సంబంధాలు చూస్తున్నారనా? నువ్వు పెళ్లి చేసుకోకూడదనేం అనుకోలేదు కదా. నీకిష్టమైన వాళ్ళేవరన్నా వుంటే చెప్పమన్నారు కదా అమ్మ నాన్న. ఏదో సంబంధం వచ్చిందని చెప్పారు. ఒకసారి కలిసి …”

“అచ్చం మా అమ్మలాగే మాట్లాడుతున్నావు. బరువు, బాధ్యతల్లేవు అంటే ఏంటి?” గొంతు పెంచి కరుణ మాటకు అడ్డొచ్చింది ప్రీతి.

“అమ్మా నాన్నల్లేని ఒంటరివాడేమో. మనోవర్తిలాంటి బాధ్యతల్లేవేమో. అప్పులేం లేవేమో.”

“ఎందుకో నాన్న ఆ మాట చెప్పినప్పుడు అంత సింపుల్గా అనిపించలేదు. ఆ పదాలు నచ్చలేదు నాకు.”

“అతను వివరించిన పరిస్థితులను నాన్న ఇలా కొద్ది మాటల్లో కుదించి నీకు చెప్పి వుండొచ్చు కదా. నీకు వేరే

ఆలోచన వుంటే నీ ఇష్టం. కానీ కేవలం ఆ పదాల ఆధారంతో ఒక నిర్ణయానికి రావొద్దు. ఒకసారి మాట్లాడి చూడు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు?”

“హ్మ్, ఇంకొంచెం ఆలోచిస్తాను. ఈ రాత్రికి ఇక్కడే వుండరాదూ?”

“నాకు బాగా పని వున్నప్పుడు పాప అమ్మ దగ్గర పడుకుంటుంది కానీ మధ్య రాత్రి లేచి ఏడిస్తే అమ్మ పట్టుకోలేదు. పాప లేకుండా నాక్కూడా సరిగ్గా నిద్ర రాదు. ఇంకో రెండేళ్ళు పోనీ, అప్పటికీ నీకు పెళ్లి కాకపోతే బయటెక్కడికైనా ఒక రోడ్ ట్రిప్ వేసుకుందాం.. జస్ట్ మనిద్దరమే.”

“అప్పట్లోగా నీ పెళ్ళయిపోతే?” కన్ను గీటి అంది ప్రీతి.

కరుణ ఏమీ మాట్లాడకుండా టీ కప్పు పక్కన పెట్టి చిరునవ్వుతో ప్రీతి వైపు చూసింది. ఆ నవ్వులోని అంతర్యం ప్రీతికి తెలుసు.

“ఎన్నో రోజులుగా చెప్పాలనుకుంటున్నా నీకు. ఇక నేను అనుకున్నది చెప్పాల్సిందే. అటువైపు కాస్త ఆలోచించు కరుణ. ఒక పెళ్లి వీగిపోయిందని సన్యాసిలా బతకక్కర్లేదు.”

“సన్యాసమా? హన్నన్నా! ఎన్ని కోరికలో పాపకూ, నాకూ. అన్నీ తీర్చేసుకుంటాం కూడా. ఇప్పుడు మాకు బోల్డంత ప్రేమ కావాలి. మేమిచ్చె బోల్డంత ప్రేమను తీసుకునే వాళ్లు కావాలి. అందులో నో కాంప్రోమైజ్, నో అడ్జస్ట్ మెంట్స్. మా చిన్ని ప్రపంచాన్ని తన ప్రపంచం అనుకునే వ్యక్తి నాకు తారసపడలేదింతవరకూ. అలాంటి వాడు తారసపడినప్పుడు పో, పోవోయ్ అని అనను సరేనా.” నవ్వుతూ అన్నది కరుణ.

“అవునూ, ఈ మధ్య ఒకరోజు అంకుల్ నాతో మాట్లాడుతూ బంధువెవరో సంబంధం తెచ్చారని అన్నారు. ఏమన్నా తెలిసిందా దాని గురించి?”

నవ్వింది కరుణ,”నాకు ఇంకా వివరాలు తెలీవు. అహంకారంతో డివోర్స్ తీసుకున్నానని, సర్దుకుపోవాల్సిందని ఆన్నారట ఒక దగ్గరి బంధువు నాన్నతో. ఎన్ని మాటలు పడి, నలుగురి మధ్య ఎంత ఒంటరితనం అనుభవించి, ఎంత క్షోభపడి ఈ నిర్ణయం తీసుకున్నానో వాళ్ళకేం తెలుసు? ఇంకొకరెవరో డివోర్స్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందన్నారట. అలా ఆలోచించేవాళ్లకు ఎలాంటి సంబంధాలు తెలుస్తాయంటావూ?”

“ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో?” కరుణ మాటను ఆమెకే అప్పగించింది ప్రీతి.

“ఇప్పుడు నా అంత సంతోషంగా ఈ ప్రపంచంలోనే కాదు, విశ్వంలోనే ఎవరూ లేరు. నా సంగతి ఒదిలెయ్” హ్యాండ్ బ్యాగ్ అందుకుని బయటకు నడుస్తూ అంది కరుణ, “ సరే అమ్మాయ్, నేనిక నా చిట్టితల్లి దగ్గరికి వెళ్లాలి. అతనితో మాట్లాడిన తరువాత నాకు కాల్ చెయ్యి. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. నువ్వసలే వాగుడుకాయవు.”

“సరే, మాతాశ్రీ! గుడ్ నైట్!” నవ్వుతూ కరుణను సాగనంపింది ప్రీతి.

***

 

painting: Mandira Bhaduri

నాలుగు రోజుల తరువాత సాయంత్రం కరుణకు ఫోన్ చేసింది ప్రీతి అర్జంటుగా రమ్మని.

కరుణ వెళ్ళేసరికి వాడిన మొఖంతో, ఆఫీసుకు వేసుకెళ్లిన బట్టల్లోనే ఉంది ప్రీతి.

కరుణను తలుపు దగ్గరే పట్టుకుని, “అతన్ని కలిశాను. నేను చెప్పాను కదా తన మాటలు నచ్చలేదని. ఛ, అతన్ని కలవకపోయుంటే బాగుండేది.” కోపంగా గబగబా అంది ప్రీతి.

“ఆగాగు. ఎవరతను, ఎవరిని కలిసావు? ఏం మాట్లాడుతున్నావు? ఆఫీసులో ఏమైనా ..”

“ఆఫీసులో గొడవ కాదు తల్లీ. ప్రపంచమే భయంకరంగా వుంది.”

“ఒకే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్…” ప్రీతిని కుర్చీలో కూర్చోబెడుతూ అంది కరుణ, “ఇప్పుడు మెల్లగా చెప్పు.”

“పెళ్లి సంబంధం గురించి చెప్పాను కదా. అతను ఆఫీస్ పని వుండి కాలిఫోర్నియా నుంచి న్యూ జెర్సీ వచ్చాడట. పొద్దున్నే కాల్ చేసి అడిగాడు కలవడానికి వీలవుతుందా అని. మాల్ లో కలిసాం. చాలా సేపు బాగానే గడిచింది. మొదట్లో వుమెన్ ఇష్యూస్ గురించి మాట్లాడాడు. తరువాత చెప్పాడు, మొదటి పెళ్లి పెద్దవాళ్ళు చేసిన బలవంతపు పెళ్లి అట. ఆ అమ్మాయి చాలా సాంప్రదాయకంగా వుంటుందట. ఆమె పేరు బాగోలేదని రమ్య అని పేరు మార్చాడట. ఇతనే దేవుడని ఫీల్ అయ్యేదట.  సొంత వ్యక్తిత్వం లేని మూర్ఖురాలని అన్నాడు. ఒక పాప పుట్టిన తరువాత ఆమె మరీ పిచ్చిదయ్యిందని, భరించలేక విడాకులిచ్చేశానని చెప్పాడు. ఇది జరిగి ఆర్నెళ్ళవుతోందట. వాళ్ళెక్కడున్నారో కూడా తనకు తెలీదని, వాళ్ళతో తనకెలాంటి కాంటాక్ట్ లేదని నాకు భరోసా ఇవ్వబొయ్యాడు. డివోర్సీనే కానీ బరువూ బాధ్యతల్లేవు అని పళ్ళికిలిస్తూ అన్నాడు.”

“అంత లిబరల్ వ్యూస్ ఉన్నవాడు, పెళ్ళికి ముందు ఆ అమ్మాయితో మాట్లాడలేదా అతను?”

“ఆ, ఆ … మాట్లాడాడట. పెళ్లి తరువాత మార్చుకోవచ్చనుకున్నాడట.” పళ్ళు కొరుకుతూ అంది ప్రీతి.

కరుణ ముఖం ఎర్రబడింది, “రాహుల్ తల్లిదండ్రులు నాగురించి సరిగ్గా ఇట్టాగే అనుకున్నారు.  నా గురించి, నా కలల గురించి విడమరచి చెప్పిన తరువాతే రాహుల్ నన్ను ప్రేమించానన్నాడు. పెళ్లి తరువాత అవన్నీ మార్చుకోవచ్చని వాళ్లు అనుకున్నారట. అదీ ఇప్పుడు రాహుల్ ఉవాచ. వాళ్లు మాతోనే వుండే వాళ్లు కదా, మెల్లగా రాహుల్ కూడా వాళ్లలాగే తయరయ్యాడు. మారాడో అంతకు ముందు నుంచీ అంతేనో. నేను కూడా మారాను,. అన్నేళ్లు ఆ బురదలోనే పడి వుండేంతగా నన్ను నేను మర్చిపొయ్యాను. జీతం తెచ్చే పనిమనిషిలా …” కోపంతో గొంతు వణికి మాట్లాడలేకపొయ్యింది కరుణ.

ప్రీతి కరుణను కౌగిలించుకుని అన్నది, “ఎంత బాధ పడ్డావురా. అదంతా అయిపొయ్యింది. ఇప్పుడు చూడు, నువ్వక్కడ లేవు. నీ పాప కూడా లేదు ఆ బురదలో. అక్కడే దిగబడకుండా ధైర్యంగా బయటపడ్డావు. నువ్వు నా స్నేహితురాలివని చెప్పుకోవడానికే గర్వంగా వుంది.”

కరుణ కాస్త తెప్పరిల్లి అడిగింది, “ఇంతకీ, రమ్యకు కనీసం సరైన అధారమైనా కల్పించాడా ఇతను?”

“ఆ అమ్మాయి తన కిచ్చిన కట్నం తిరిగి ఇచ్చేశాడట. దానితో తన బాధ్యతలు తీరిపొయ్యాయట. ఆమే పాపను కూడా తీసుకెళ్లినందుకు తనకు పాప బరువులేం లేవట … గొప్పగా చెప్పాడు.”

“వీర లిబరల్, కట్నం కూడా తీసుకున్నాడా?” నోరెళ్ళబెట్టింది కరుణ.

“అదే అడిగితే, ఓ వెర్రి నవ్వు విసిరాడు. పెద్దవాళ్ళు తనకు తెలీకుండా జరుపుకున్నారట ఆ తంతులన్నీ.”

“హ్మ్ … ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్. కానీ ఇట్లాంటి విషయాల్లో గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఆదర్వైజ్..”

“నన్ను బాధ పెట్టింది అది కూడా కాదు కరుణా. ఆ బరువు బాధ్యతా అనే పదాలు ఇతను చాలా తేలికగా ఉపయోగించాడు. మరో పెళ్లి కూడా అలోచించలేనంత వెనకబడ్డ మనస్తత్వమండీ వాళ్ళది అని అన్నాడు.  ఆ అమ్మాయి గురించి అంతా తెలిసే చేసుకున్నాడు. పెళ్ళికీ పాప పుట్టడానికీ చాలానే గ్యాప్ వుంది. పాప పుట్టిన తరువాత వెలిగింది వీడికి ఆమె బ్యాక్వర్డ్ అని. ఇప్పుడు ఆ పాపను బరువు అంటున్నాడు, ఆ బరువు తనకిక లేదంటున్నాడు. ఆమెకు ఏమైనా అయితే, ఏమీ కాకపోయినా సరిగా చూసుకోలేకపోతే ఆ పాప జీవితం ఎలా వుంటుంది? పాప పెద్దయి ఇలాంటి ప్రబుద్దుడి చేతిలో పడితే, అదొక విషియస్ సర్కిలే కదా. అతను చేసింది తప్పని చెప్పాను. వెంటనే వాళ్ళెక్కడున్నారో కనుక్కొని పాపను బరువుగా కాదు బాధ్యతగా తీసుకొమ్మని చెప్పాను. నేనలా మాట్లాడేసరికి వేరే పనుందంటూ పారిపొయ్యాడు.”

గుండె బరువెక్కి ఇద్దరూ కాసేపు మాట్లాడకుండా కూర్చున్నారు.

నుదురు నొక్కుకుంటున్న ప్రీతిని చూసి, “సర్లే, నువ్వు ఫ్రెష్ అవుపో. నేను టీ పెడతాను” అంటూ కిచెన్ లోకి దారి తీసింది కరుణ.

“థ్యాంక్స్ అమ్మాయి. టీ బాగా పెట్టు. తల పేలిపోతోంది.” అంటూ బాత్రూంలోకి వెళ్లింది ప్రీతి.

ప్రీతి వచ్చేలోపు టీ తయారు చేసి కప్పుల్లో పోసి, బాల్కనీలో చైర్లు వేసింది కరుణ.

టీ కప్పు ప్రీతి చేతికి ఇస్తూ అంది కరుణ, “ఇప్పుడు నా టర్న్, నా కథ చెప్పడానికి.”

“అహ్హా! ఎనీథింగ్ ఇంటరెస్టింగ్?” కన్ను గీటి అడిగింది ప్రీతి.

“ఇంటరెస్టింగే. ఒకతను ఈ-మెయిల్ చేశాడు. నాన్న మొన్న చెప్పాడు కాదా? అతను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక్క కండీషన్ అట.” పంటి బిగువున నవ్వు దాస్తూ అంది కరుణ.

“ఓహ్. ఒక్కటేనా? ఏమిటో అది.”

“ఊహించు చూద్దాం.”

“కట్నం కావాలన్నాడా?” కన్నెర్ర జేస్తూ అంది ప్రీతి.

“అహహ, పని చేస్తున్నాను కదా అందుకని కట్నం అక్కర్లేదట. చాలా క్లారిటీతో ఉన్నాడు.”

“వాడి క్లారిటీ తగలెయ్య!”

“దానికే తిట్లదండకం మొదలెట్టావూ…”

“ఓహ్, మరింకేంటో చెప్పు త్వరగా.”

నిట్టూర్పు విడిచి చెప్పింది కరుణ, “పాప నాదగ్గర వుండకూడదట. పాపను పాప నాన్నకు పూర్తిగా ఇచ్చెయ్యాలట. లేకపోతే మా అమ్మనాన్నలకో, అదీ లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చెయ్యాలట. పాపను అమ్మానాన్నలు పెంచితే నేను డబ్బు సర్దుతానా అని ఒక ప్రశ్న కూడా యాడ్ చేశాడు.”

“….” దిగ్బ్రాంతితో చూస్తుండిపొయ్యింది ప్రీతి.

“ఎగ్జాక్ట్లీ. నా మైండ్ బ్లాంక్ అయింది ఆ ఈ-మెయిల్ చదివినప్పుడు. “పిల్లలంటే ప్రాణంలేని వస్తువులు కాదు. పిల్లలను ప్రేమించి చూడండి ఎంత ఆనందంగా వుంటుందో మీకే తెలుస్తుంది. మీరు చాలా ఎదగాల్సి వుంది.”

అని రిప్లై ఇచ్చాను. కానీ….పిల్లలను బరువు అనుకునే ట్రెండ్ నడుస్తున్నట్లుంది. మొన్నామధ్య ఒక అమెరికన్ తెలుగు పత్రిక చూశాను. అందులోని క్లాసిఫైడ్ చూస్తే ఒక డివోర్సీ అమ్మాయి ప్రొఫైల్ లో ‘డివోర్సీ విత్ నొ ఇన్ కంబ్రెన్స్’ అని వుంది.”

“అబ్బా కరుణా, ఏమిటీ మనుషులు? ప్రకృతి చేసిన పెద్ద తప్పు ఇదే. శక్తివంతమైన మెదడుని తను సృష్టించిన ప్రాణులన్నింటిలో అతి హీనమైన ప్రాణికి ప్రసాదించింది. ఎంత మార్పు రావాలి మనుషుల్లో.”

కాసేపు మౌనంగా కూర్చున్న తరువాత, తల విదిల్చి కంప్యూటర్ ఓపెన్ చేసింది ప్రీతి, “రా కరుణ. ఓ రెండు ఈ-మెయిల్స్ చేద్దాం. ఒకటి నా స్నేహితురాలు రాధకు. తను ఒక  మహిళా సంస్థలో లాయరుగా పని చేస్తోంది. రమ్య గురించి చెప్పి, డైవోర్స్ కేసు తిరగదోడి ఆమెకు మనోవర్తి ఇప్పించొచ్చేమో చూడాలి. అలాగే, ఆమె పాపకు కూడా చైల్డ్ సపోర్ట్ వచ్చేట్టు చూడమని చెప్పాలి. ఇంకో ఈ-మెయిల్ మా నాన్నకు. తనకున్న ఫ్రెండ్ సర్కిల్నంతా ఉపయోగించి రమ్య ఎక్కడుందో కనుక్కోమని చెప్పాలి. కొంచెం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. మనకు తెలీనివెన్నో జరిగిపోతుంటాయి, కనీసం మన ఎరికలోకి వచ్చిన వాటినైనా పట్టించుకోవాలి కదా?”

ప్రీతిని  కౌగిలించుకుని, “నువ్వు భలే పిల్లవి ప్రీతి.” అని అరిచింది కరుణ. “ఎంత దిగులుగా వచ్చాను నీ దగ్గరికి. ఇంతేనా మనుషులు అనుకుంటూ, నా పాప గురించి, తన లాంటి పాపాయి గురించి దిగులు పడుతూ వచ్చాను…. ”

*

మీ మాటలు

  1. ఈ కథలోలా రాస్తూ పోతే ఎన్ని ఇరుకు మనసులు పోగుపడతాయో!

    • ప్రసాద్ గారు, మీరన్నది నిజం. అయినా ఆశ – స్పందించి, మార్పు కోసం ప్రయత్నించేవాళ్లూ వుంటారని…

  2. bhasker koorapati says:

    చాలా మంచి కథ!
    హృదయాంతరాల్ని తన్నుకు వచ్చిన కథ!
    ప్రీతి, కరుణల నిర్ణయాలు అభినందనీయం.
    గుడ్, మమతా..!
    మరిన్ని ఇలాంటి మంచి కథల్ని నీనుండి ఆశిస్తూ…
    –భాస్కర్ కూరపాటి.

  3. వనజ తాతినేని says:

    “పిల్లలంటే ప్రాణంలేని వస్తువులు కాదు. పిల్లలను ప్రేమించి చూడండి ఎంత ఆనందంగా వుంటుందో మీకే తెలుస్తుంది. మీరు చాలా ఎదగాల్సి వుంది.”

    విడాకుల పర్వంలో అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది . బావుందండీ !

    • అవును వనజ గారు, పిల్లల గురించి అడుగడుగునా ఆలోచించాల్సిందే. దురదృష్టమేమిటంటే ఒక్కోసారి పిల్లల బాగుకోసమే విడాకులు తీసుకోవాల్సి రావచ్చు.

  4. N Venugopal says:

    మమతా,

    బాగుందనలేను. జీవితంలా ఉంది. కన్నీళ్లు పెట్టించింది. ఇద్దరు స్వతంత్ర యువతుల మనసులను మెలిపెట్టిన పురుషవిషపురుగుల మీద కోపం తెప్పించింది. ఇటువంటి దుర్భర అనుభవాల గురించి నువ్వు ఇంకా ఇంకా రాయాలి. పాపా కరుణా ఇచ్చే బోల్డంత ప్రేమను తీసుకుని బోల్డంత ప్రేమను ఎదురు ఇచ్చే మనిషి కరుణకు తారసపడే ఆశావహ కథల కోసం కూడ చూస్తున్నా…. అయినా సామెత చెప్పినట్టు ఉన్నవన్నీ పుట్టలే అయినప్పుడు పుట్టల్లో పాములు కాక పావురాలుంటాయా?

  5. Delhi Subrahmanyam says:

    .చాలా గొప్పగారసారండి. వేణు రాసినాదానితో నేను పూర్తిగా యెకీభవిస్తున్నాను. మీరు ఇలాగే రాస్తూండాలి.

  6. Mythili Abbaraju says:

    మంచి టైటిల్ …మంచి పాయింట్ …..అభినందనలు మమత గారూ.

    మనసుల తలుపులు ఇంకొంచెం తెరుచుకుంటే ఎంత సుఖమో మీరు ఇంకా ఇంకా చెప్పాలని ఆశిస్తున్నాను.

  7. బ్రెయిన్ డెడ్ says:

    భార్య భర్త విడాకులు తీసుకోవచ్చు కాని అమ్మా నాన్న విడాకులకనర్హులు ఒక పాయింటు . అయితే బంధాల్లో ఇరుక్కోక ముందే వ్యక్తిత్వాలు ఏర్పడతాయి బంధాలు వాటి ప్రవాహ గమ్యాన్ని స్తిరపరచలేవు అనేది ఇంకో పాయింటు . ఈ అంశం మీద ఎపుడు కధలు చదివినా , నిజ జీవితంలో చూసినా ఆలోచనల దాడి . మంచి తేనే తుట్టెని మళ్ళీ కదిపారు . కుడోస్

  8. థ్యాంక్యూ బ్రెయిన్ డెడ్.

  9. bhaskar g says:

    కథ చాలా బాగుందండి. ఇలాంటి సంఘటనలు మనము విన్నా కూడా, వట్టినే పెదవి విరిచి ఊరుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అని కూడా సలహా ఇచ్చారు. అభినందనలు.

మీ మాటలు

*