గురి

jagadish_

Mallipuram Jagadish

  కొండాకోనల్లోని బతుకుల గురించి, గుండె లోతుల గురించి రాసే ఆకుపచ్చకథకుడు మల్లిపురం జగదీశ్. నవంబర్14, 1973 లో విజయనగరం జిల్లాలోని పి. ఆమిటి గ్రామంలో పుట్టారు. తొలికథ “అరణ్య రోదన” 2000 వ సంవత్సరంలో ప్రజాసాహితి లో ప్రచురితమైంది. ఇప్పటి వరకు 20 కథలు రాసారు. 15 కథలతో ఇటీవల ఆయన వేసిన పుస్తకం “శిలకోల” అనేక పురస్కారాలు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. “ఏది రాయాలి అనేదాని కన్నా.. ఎలా రాయాలి అనేదే నాకింకా అంతుపట్టడం లేదు” అంటాడు ఈ నిరాడంబర కథకుడు. మంచి ప్రామిసింగ్ రైటర్ గా ఎదుగుతున్న మల్లిపురం జగదీశ్ సంధించిన సరికొత్త కథ “గురి”. – వేంపల్లె షరీఫ్

 

ఎండిపోయిన మాని మొజ్జు మీద లక్ష్యం రెక్కలల్లాడిస్తోంది. విలుకాడు విల్లుని సంధించాడు. నారిని మరింత బలంగా తన వైపుకి లాగి లక్ష్య దూరాన్ని అంచనా వేసేడు. దగ్గర్లోనే ఉంది.
మబ్బు పట్టిన ఆకాశం. స్తంబించిన గాలి.. ఊపిరాడనట్టు ఉక్కపోత. శిలావిరగ్రహాల్లా చెట్లు. గుబురులో ఒకే ఒక ఆకు మాత్రం అదే పనిగా రెపరెపలాడుతుంది. పిచ్చిపట్టినట్టు.
విలుకాడి నుదుటి మీది చెమట బొట్టు ఎడమ కన్ను ప్రక్కగా చెంప మీదికి జారింది. అతని వెనుక చెట్టుకొమ్మ ఉయ్యాల్లోని పాప తల బయటికి పెట్టి విలుకాడి చేతుల మీంచి లక్ష్యం వైపు చూస్తోంది.

నిశ్శబ్ధాన్ని నిండుకుండలో మోస్తున్నట్టు…. అడవి.

విలుకాడి చేతిలోంచి శిలకోల దూసుకుపోయింది. లక్ష్యం ఎగిరిపోయింది. శిలకోల ‘జువ్వ్‌వ్’   మని శబ్దం చేస్తూ మాని మొజ్జు మొదలుకి గుచ్చుకొంది. పిచ్చిపట్టిన ఆకు ఆగిపోయింది. వెక్కిరిస్తున్నట్టు.

విలుకాడు నిర్ఘాంతపోయేడు. ఎగిరిపోతున్న లక్ష్యం వైపు బేలగా చూస్తూ…

తప్పకూడని గురి .. తప్పింది.

‘విల్లు సంధించడానికీ, లక్ష్యం ఎగిరిపోవడానికి నడుమ ఏదో జరిగింది. ఏమిటదీ?

సమాధానంగా… విలుకాడి మొలలోంచి ‘పంచదారా కొమ్మా కొమ్మా.. పట్టుకోవద్దనకమ్మా..’ సెల్ మోగుతోంది.

విలుకాడి కంటే ముందే ప్రమాదాన్ని పసిగట్టిందేమో .. లక్ష్యం తప్పించుకుంది.

“డాడీ.. ఫోన్” అనడంతో ఈ లోకంలోకి వచ్చేడు సత్యం. జేబులో ఫోన్ రింగవుతోంది. ‘అంటే ఇంతదాకా మోగింది తన జేబులోంచా? మరి..

ఓహ్… కలా?

నిజమే.. గురి తప్పిన విలుకాడు.

“ఎక్కడున్నారు? పాపేమైనా అల్లరి చేస్తోందా??” శ్రీమతి అడుగుతోంది.

“లేదు.. లేదు.. ఇంకా అరగంట దూరంలో ఉన్నాం” సత్యం ఫోన్ పెట్టేసాడు.

బస్ వేగంగా కదులుతోంది. ఒక్కసారిగా గాలి తీవ్రత పెరిగింది. తేడా గమనించేడు సత్యం. కురుపాం దాటాక గాలి చల్లబడిపోతుంది. అంటే ఏజెన్సీలోకి ప్రవేశించామన్నమాటే. అంతదాకా కనపడని చెట్లూ.. కొమ్మలు.. తుప్పా.. డొంకా.. కొండా.. కోనా .. అన్నీ ఎదురై పలకరిస్తాయి. రోడ్డు సన్నబడిపోతుంది.  కిటికీలోంచి కొమ్మలు, రెమ్మలు ముఖానికి తగులుతూ …” నీ కోసమే… ఎదురుచూస్తున్నా’మన్నట్టుంటాయి.

ఆ గాలి.. పాతదే…

ఆ చలి .. పరిచయమైనదే.

కొత్తగా స్పృశిస్తూ.. చెట్లూ, కొండలూ… వెనక్కి కదులుతున్నాయి. వేగంగా.. వెనక్కి.. వెనక్కి.. వెనక్కి.. కళ్ళముందే కన్నతండ్రి కన్ను మూసినప్పటికీ..

 ***

“ఒరే మంగులూ.. రేపు తెల్లార గట్ల లెగాల.. బండి పుయ్యాల.” ఇంటి మెట్లెక్కుతూ చెప్పేడు  షావుకారి.

“అలగేన్లే” అన్నట్టు తలవూపి వెనుదిరిగాడు మంగులు.

మంగులు షావుకారికి కంబారి, ఐదేళ్ల దాకా. అది ఎందుకంటే.. ఓ రోజు… షావుకారి పొలంలోంచి వరి ఎన్నులు దొంగతనం చేస్తూ దొరికిపోయేడు.

పంచాయితీ పెట్టించేరు.

ఊరి పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. అందరి మధ్యలో తల వంచుకుని నిలబడ్డాడు మంగులు. వరి ఎన్నుల పేరుతో దోషిగా నిలబెట్టి తన ఇంట్లో మరి కొన్ని బంగారు వస్తువులు కూడా పోయాయని నింద మోపేడు షావుకారి.

నిజానికి మంగులు ఎన్నులు తెంచిన పొలం మంగులుదే. కానీ అప్పుడెప్పుడో మంగులు తండ్రికి యాభై  రూపాయలు అప్పు ఇచ్చి తీర్చలేకపోయాడని ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నాడు షావుకారి.

తీర్పు చెప్పండి చెప్పండంటూనే తీర్పు చెప్పేడు షావుకారి.  ఐదు సంవత్సరాల కంబారితనం తన ఇంట్లో చెయ్యాలని. ఆ తీర్పుకి మంగులు ఒప్పుకోలేదు. కళ్ళెర్రగించి చూసేడు. ‘మేకలపై పులుల తీర్పు చెల్లదన్నట్టున్నా’యతని చూపులు. షావుకారికి ఆ చూపులు నచ్చలేదు. ఐతే పోలీసు కేసు పెడతానన్నాడు. ఆ మాటకి వూరు గజగజలాడింది. మంగులు తండ్రైతే షావుకారి కాళ్లు పట్టుకొని వదల్లేదు. వూరంతా బ్రతిమాలింది. మంగులినీ బ్రతిమాలింది కంబారితనానికి ఒప్పుకోమని. మంగులు తలదించేడు.. ఊరు కోసం.

 ***

వూరికి దూరంగా.. గెడ్డ ప్రక్కన .. ముంత మామిడి చెట్టు క్రింద.. పాక. పాక ప్రక్కనే అరెకరా గుడ్డి. గుడ్డినానుకుని నాయుడి పొలాలు ఆ పొలాల కాపలా కాస్తున్న కిత్తన్న.

“ఏట్రా బేగి పారొచ్చినావు?” చీకట్లో నడిచొచ్చిన కొడుకుని అడిగేడు కిత్తన్న.

“తెల్లారగట్ల బండి పుయ్యాల… అందకే బేగొదిల్నాడు” ముంజూరు కింద అరుగు మీద రాటకు చేరబడ్డాడు మంగులు.

ఆ రాట ఎప్పటిలా లేదు. అరుగులో ఏదో మార్పు. ఎప్పుడు అక్కడ కూర్చున్నా మేక పిండ్రికిలు అంటుకునేవి. వాటిని దులుపుకుంటూ ఆ రాటకే కట్టిన మేకని ప్రేమగా  తిట్టుకుంటూ, ఒక్క చరుపు చరిచి అదల్చడం అలవాటు మంగులుకి.

ఇప్పుడా అరుగు శుభ్రంగా  ఎవరో తుడిచినట్టు, రెండు మూడు రోజులుగా ఆ రాట చుట్టు మేక తిరిగిన ఆనవాళ్ళేవీ లేవు. అప్పుడు గమనించేడు… ఎక్కడో దూరంగా మేక అదేపనిగా అరుస్తోంది. ఆ అరుపులో ఏదో తేడా వుంది.

“ఏటైందే?” అడిగేడు మంగులు.

పెణక కింద పొయ్యి పూచడంలో నిమగ్నమైయున్నాడు కిత్తన్న.మళ్ళీ అడిగేడు. సమాధానం రాలేదు.కాసేపు నిశ్శబ్దం తర్వాత రహస్యం చెప్తున్నట్టు అన్నాడు. “పారిపోయింది రా” అని గొంతులో విషాదాన్ని పసిగట్టేడు మంగులు “మేకపిల్లా?” అడిగేడు.

“కాదు. మీ యమ్మరా!”

“ఏటి?” ఆశ్చర్యపోయేడు. అప్పుడు గమనించేడు మంగులు ఇంట్లో అమ్మ లేదు.

“మేకపిల్ల బయంకే మీయమ్మ పారిపోయింది” గొంతులో భయమూ,  విషాదమూ పోలేదు.

“మేకపిల్ల  బయమా?” గొణిగేడు మంగులు.

అది నాయిడోల మేక. దాని మేపుకి సంవత్సరానికి ఐదు కుంచాల ధాన్యంకి నాయిడోలతో ఒప్పానం అమ్మకి. అది ఈ మద్దినే రెండు పిల్లల్ని యీనింది.

“ఐతేటయింది?” మంగులు.

“ఒక మేక పిల్లకి సిందవెత్తికెలిపోయింది”

“సిందవా.. ఎప్పుడు?”

“నిన్న”

“మరి అమ్మో?”

“పొద్దు ఏలమీద బయలెల్లి పోయింది” గుసగుసలాడినట్టుంది గొంతు.

“ఇంతకేటైంది?”

“మేకపిల్లకి సిందవ తిలనీసిందని నాయుడికి తెలిసిపోయింది”

“అయితే?”

“ఇంటికి పిలిపించాడు”

“…?”

“పంచాయితీ పెట్టించినాడు”

“ఆ..?”

“అక్కడేటవుతాదో నీకు తెలీదేటి?”

“ఏటన్నారు?”

“మేకపిల్లకి సిందవ తినక పోయుంతే.. అది పెద్దదైయుంతే.. మూడొందలు సేసునట”

“మూడొందలా?” కళ్ళు పెద్దవి చేస్తూ..

“మరేటి! మూడొందలు. ఒప్పానం పెకారం మేక పిల్ల సూబెట్టాల. నేకపోతే మూడొందలేనా కట్టాల”

“కట్టకపోతే?”

“పోలీస్ కేస్. అదీ కాకపోతే ఐదు సమచ్చరాలు కంబారికం”

మేకపిల్ల అదే పనిగా అరుస్తోంది.. హృదయ విదారకంగా.

సిందవ బారిన పడ్డ పిల్ల మేక కోసమో!

ప్రేమగా గడ్డి పరకలందించే అమ్మ కోసమో!!

దాని రోదన అక్కడ చీకటిని కరిగించలేకపోయింది. ఆ పాకకి వెలుగివ్వలేకపోయింది.

ఆ సీకట్లోంచే .. రహస్యంగా ఓ కబురొచ్చింది.  సంగమ్మీటింగుంది. రమ్మని. ఆ కబురు వెంటే అడుగులేసాడు మంగులు. ఆ అడుగుల వెంట వెలుగు పయనిస్తుందని ఆశ. ఆ వెలుతురులో కొండ, కొండా వరుసలు కట్టి ధింసా నృత్యమవుతుందని నమ్మకం.

ఈ లోగానే .. కోడి కూసేసింది. గతుక్కుమన్నాడు మంగులు. పరుగూ నడక.. పరుగూ నడకన షావుకారింటికి చేరేడు మంగులు. అప్పటికే లెగిసిపోయిన షావుకారి గుడ్డి దీపంలో డబ్బులు లెక్కెడుతూ కనిపించేడు.

“ఏట్రా.. ఇప్పుడు తెల్లారిందేటి?” కోపమైపోతాడనుకున్న షావుకారి ప్రశాంతంగా  వున్నాడు చిత్రంగా.

“రేతర నిద్దర్లేదు షాకారి” సంజాయిషీ ఇచ్చేడు మంగులు.
“ఏమి?” ఏమీ ఎరగనట్టు అడిగేడు మంగులుకి తెలుసు షావుకారి లేకుండా వూరి పంచాయితీ జరగదని. అయినా చెప్పేడు “నాయుడోల మేకపిల్లకి సిందవ తినీసింది షాకారీ”

“అయితే! సిందవ కి నెనకడానికెల్లేవేట్రా?” నవ్వేడు వెటకారంగా.

మంగులు ముఖం ఎర్రబడింది. ఆ ఎరుపు చీకట్లో కనపడకుండా పోయింది.

“అంతేనా, రాతిరిపూట సంగమ్మీటింగులకెల్లేవా?” షావుకారి మరింత దగ్గిరకొచ్చి అడిగే సరికి.. గతుక్కుమని వెనక్కి జరిగేడు మంగులు.

“ఎల్లు.. కారొర్సకెల్లి కయ్యన్న గడపలున్న సరుకెక్కించుకొచ్చి రేపు పెదషావుకారికి పంపాల. నీను టౌనెల్లాల.”

మంగులు నవ్వుకున్నాడు. ఆ బండి తిరిగి రాదని. ఆ సరుకులు జనాలకి పంచేస్తారని. చీకటింకా విచ్చుకోనే లేదు. తూరుపు కొండ మీద ఆకాశం తెల్లబడుతోంది. ఈ లొగా బండి గెడ్ట చేరింది. ఒడ్డునున్న చింత మాను క్రింద బండి ఆపేడు. కడుపులో గుడగుడలాడింది. బండి దిగి తుప్పల వైపు పరుగు తీసేడు. కడుపు భారం ఇలాగ దిగిందో లేదో.. “అమ్మో! సచ్చిపోయేన్రో దేవుడో !!” అంటూ గావు కేక వినపడింది. గతుక్కుమన్నాడు మంగులు. తుప్పలనుంచి బయకొస్తూ ఎదురుగా వున్న చెట్టుక్రింది దృశ్యం వణుకు పుట్టించింది.

షావుకారి చిన్న కొడుకు హర్నాదు.. చెట్టుకి కట్టీసున్నాడు. అతని చుట్టూ సాయుధులైన మనుషులు అర్ధచంద్రాకారంలో నిలబడి వున్నారు. ఆయుధాలు ఆకలితో వున్నట్టున్నాయి. హర్నాదు నోట్లో గుడ్డలు కుక్కీసున్నాయి. ముందు కొట్టేరు. ఏవో నినాదాలిచ్చేరు. ఒకరి చేతిలోని గొడ్డలి పైకి లేచింది. ముందు కుడిచేయి. ఆ తర్వాత కాళ్ళు.

ఆ చెట్టు మొదలు.. ఎర్రబడుతోంది.

పరిస్థితి అర్ధమైపోయింది మంగులుకి. పరుగందుకున్నాడు.

పరుగు.. పరుగు.. పరుగు.

తుప్పా. డొంకా.. ముళ్ళూ.. మళ్లూ.. అడవి.. గెడ్డా. అన్నీ దాటి. గొడ్డలమ్మ కురికి … ప్రతీయేడూ తుడుముడప్పులతో .. కందికొత్తల పండుగ జరిపించుకొని .. ఊరి పూజలందుకొన్న .. గొడ్డలమ్మని తనలో దాచుకున్నట్టే. తననీ దాచిపెట్టింది.

ఒకరాత్రి.. ఒక పగలు.. తిండీ తిప్పలు లేక.. కళ్ళముందు తెగిపడిన కాళ్ళూ చేతుల దృశ్యాలతో. ఊరికి దూరంగా దూరపు చుట్టాలింటి వైపు అడుగులేసాడు. అనుకున్నదొకటి, జరిగిందొకటి. తనకు తెలిసిన మేరకి సరుకులు అప్పజెప్పడమే. మరి ఈ సంఘటనేమిటి? అసహ్యంగా .. భయంకరంగా.. అంటే కొన్ని నిర్ణయాలు తనకు తెలీవన్నమాట.

కొన్ని నెలల తర్వాత ఊరు చేరితే.. వూరు మామూలుగానే వుంది. మంచం పట్టిన ముసిలోలు ఇద్దరు చనిపోవడం తప్పా ఊర్లో ఏ మార్పూ లేదు. కానీ ఏదో సందేహం. ఏదో మార్పు. షావుకారు పిలవనూ లేదు. తనూ వెళ్ళలేదు. కంబారితనానికి. వూర్లో వాళ్ళూ తనవైపుకి అనుమానంగానే చూస్తున్నారు. వీటికి సమాధానం కొన్ని రోజుల్లోనే తెలిసిపోయింది మంగులుకి.

ఓ రోజు సాయంత్రం చివరిదీ కుంబిర్కీ. ముసిలోడు మంచమెక్కేడు. ఊష్ణం. మంచం కింద ఎన్ని కుంపట్లు  పెట్టినా గజగజా వొణికి పోతున్నాడు. ఎజ్జోడి చేత ఎంత మందు రాయించినా లాభం లేకపోయింది. అప్పుడొచ్చేడు షావుకారి. “ఏటైందిరా” అని. అందరూ అతనివైపు చూసేరు. “జొర్రం షాకారీ. వొగ్గుండదూ. తగ్గుండదూ..” అని చెప్పేరు… “ఎలగ తగ్గుతాదిగా..

ఇది మామూలు జొరమైతే తగ్గును..” అని అనుమానాస్పదంగా మూల్గేడు. అందరూ ఆలోచనలో పడ్డారు. “మొన్నామద్దిన మంగులు గాడు, గెడ్డోడ్డు వొలకాల కాంచి తచ్చాడ్డం నీను సూసేన్రా!!” అని అక్కడినుండి వెళ్ళిపోయేడు.

మరో రోజు గెడ్డలో స్నానం చేస్తున్నాడు ఒంటరిగా. ఏటిలో నడిచొచ్చి తననెవరో వెనుకనుంచి కొట్టినట్టైంది. స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసే సరికి వీధి మధ్యలో పడివున్నాడు. కాళ్ళూ చేతులు నులక తాళ్లతో బంధించబడి వున్నాయి. ఒళ్ళంతా గాయాలతో.. భరించలేని నొప్పితో.. షావుకారి మాటలు ఒక్కటొక్కటిగా వినపడుతున్నాయి.

“ఈడుంటే.  వూరు వొల్లకాడై పోద్ది. ఎవరు చేరదీసి గంజి పోస్తారో .. ఆల్నే తినేస్తాడు. ఊరిల ఈడున్నన్నాళూ చావులు తప్పవు.. ఆ తర్వాత మీ ఇష్టం..”

స్పృహ కోల్పోతూనే… క్రమక్రమంగా  అర్ధమైపోయింది మంగులుకి. గెడ్డ ప్రక్కనే కాగు పుల్ల విరిచి నోట్లో వేసుకుని నములుతున్నపుడె అనుమానం. అది స్మశానమని. తన వెనుక వచ్చింది షావుకారి కొత్త కంబారి మాసడని.

“మనూర్ల  చావులకి కారణమెవరనుకుంటున్నారు? ఈడే. ఊరినుంచి బయటపడ్డాడు ఇద్దరు ముసిలోలు సఫా. ఈడున్నన్నాళూ వూరికి పట్టిన పీడ వదలదు. ఆ తర్వాత మీ ఇష్టం”

షావుకారి మాటలు స్పష్టాస్పష్టంగా వినపడుతూనే వున్నాయి మంగులుకి. అతని కళ్లు మూతలు పడుతుండగా.. వీధి చివర గడపలో బిడ్డని గుండెలకు హత్తుకుని కన్నీళ్లు కారుస్తున్న భార్య కనపడింది.

తలి ఒడిలోని పదకొండేళ్ల సత్యం ఏదో అడుగుతున్నాడు… ఏడుస్తూ..

“అమ్మా! నాన కేటైందే!!”

“నాననెందుకు కొడ్తున్నారే!”

“సంపెస్తారా?”

అన్ని ప్రశ్నలకీ ఏడుపే సమాధానమయ్యింది.

“ఎందుకే ?  ఎందుకే?” సత్యం పట్టు వీడలేదు. అమ్మ జుత్తు లాగి లాగి అడుగుతున్నాడు. ఏడుస్తూ..

“మీ నాన్న పి..ల్లిం.. గో.. డ..ట..రా..” భోరున ఏడుస్తూ నెత్తి బాదుకుంటూ.

ఆ కేక కొండల్లో ప్రతిద్వనించింది. మంగులు కనురెప్పలు మూతపడ్డాయి. ఊపిరాగిపోయింది. మంగులు భార్య మంచం పట్టింది. కొన్నాళ్లకి ఆమె కూడా కన్ను మూసింది.

“సార్.. ఎక్కడ దిగుతారు?” కండక్టర్ పిలుపుతో కళ్ళు తెరిచేడు సత్యం. బస్ దిగేడు. శిధిలమైపోయిన బస్ స్టాపు. ఆప్పటిదే. దాని ఎదురుగా కొత్తది. మిలమిల మెరిసే నీలి అక్షరాలను మోస్తూ.

“డాడీ! ఇంకెంత దూరం?” గీత అడుగుతోంది.

“దగ్గరేనమ్మా.. ఇదిగో ఇలా నడిస్తే, అలా చేరిపోతాం” అంటూ నడక మొదలెట్టేరు.

గీత ఎన్నో సందేహాలు అడుగుతోంది. అన్నిటికీ ఓపికతో సమధానాలు చెప్తున్నాడు సత్యం. గీతకు ఈ వూరు కొత్త. ఈ నేల కొత్త. ఆమె ఇక్కడ పుట్టలేదు. నగరంలోనే పుట్టి పెరిగింది. ‘ఇది తాత నడిచిన దారమ్మా. నేను పెరిగిన నేలమ్మా.. మనని పెంచిన కొండమ్మా’ అని చెప్పాలని. అన్నీ కూతురికి తెలియాలని సొంత వూరికి ప్రయాణమయ్యేడు సత్యం. చిన్ననాటి గురుతులన్నీ ఒక్కొక్కటిగా. కథలు కథలుగా చెప్తూ వచ్చేడు.

“ఇది ఒకప్పుడు చిన్న బండి గోర్జిరా.. కొన్నాల్లకి మట్టి రోడ్డైంది. ఆ తర్వాత్తర్వాత ఇద ఇలగ తార్రోడ్డైంది.. మా చిన్నప్పుడు ఈ దారంట ఒంటరిగా నడ్డమంటే భయం..”

ఆ మాట పూర్తవకుండానే పెద్ద శబ్దం చేసుకుంటూ  ఆటో వచ్చి ఆగింది ప్రక్కనే.

“వస్తారేటి?”  డ్రైవర్ తల బయటకు పెట్టి అడగ్గానే ఇద్దరూ ఎక్కేసారు.

కొండ చుట్టూ తార్రోడ్డూ. వేగంగా వెనక్కి పరిగెడుతోంది కొండ. కొండ అప్పటిలా లేదు. కొండ చుట్టూ ఎన్ని మార్పులో!!!

వూరు వూరంతా మారిపోయింది. వీధులు విశాలమయ్యాయి. ఇళ్లు  ఎత్తు పెరిగేయి. సిమెంట్ పై కప్పులతో. ప్రతి ఇంటి మీదా డిష్ యాంటెన్నాలు, గడపలు, గజాల దొడ్లతోనూ, అడుగడుగునా సెల్‌ఫోన్ మ్రోతలతోనూ.

మొదట పోల్చలేకపోయినా. గుర్తుపట్టేక ఆశ్చర్యపోయేరు ఊరంతా. కుశల ప్రశ్నలడిగి చేరదీసేరు. మామా, బావా, అన్నా, చిన్నాన్నా అని పలకరించి మాట్లాడేరు.

“ఇన్నాళూ ఎక్కడున్నవైతే?” అడిగేడు చిన్ననాటి మిత్రుడు ఫకీరు.

“ఇక్కడినుంది పారిపోయాక పార్వతీపురంలో రైలెక్కీసేను. విజయవాడ రైల్వే స్టేషన్లోనే చాలా సంవత్సరాలు గడిపేను. ఆ తర్వాత అనాధ శరణాలయం. ఓ కంపెనీలో ఉద్యోగం. అలా గడిచిపోయిందిలే..”

“మరి పెళ్లి?”

“కంపెనీలోనే పరిచయమైంది. దానికీ ఎవరూ లేరు. అదిగో ఒక్కతే కూతురు.. గీత.. ఇక్కడే ఇల్లు కడితే బాగుంటాది గదా అని…”

“ఇక్కడా?” ఆశ్చర్యపోయేడు ఫకీరు.

“ఏమి.. కట్టకూడదా?”

“ఇక్కడోళ్లందరూ సైట్‌లు కొనేసి టౌనెల్లిపోతుంటే.. నువ్వేటీ, అట్నుండిటు?”

“ఇన్నాళ్ళు టౌనులున్నాయి కదా…” అని “సరే గాని, ఊర్లో సంగతులేంటి?”

“ఊరుకేమి.. పైన పటారం.. లోన లొటారం”

“ఏమి?”

“సూడ్డానికి డాబాలు…. సిమెంట్ రోడ్లు, ఇంటిల మాత్రం తిండిగింజలుండవు”

“అంటే.. వూరు బాగులేదా?”

“బాగులేకేమి  … సూపరు. గుంటలందరూ టిప్పుటాపు మీదున్నారు సూసుండవా? ఏ గుంటా, గుంటడైనా ఒక్క తీరుగున్నారా సెప్మి? ఒకడి మాట ఇంకొకడినడు. సిన్నా పెద్దా.. మంచీ మర్యాదా… వున్నాయా ఎవులికైనా? ఖైనీ, గుట్కా, గుడుంబా, సిగిరెట్టు, మందూ.. ఏ అలవాటూ లేనోడెవడూ లేదు..” చెప్పుకు పోతూనే వున్నాడు.

“మామా.. ఏది ఏమైనా జీడితోటలు, ఉపాది పనులొచ్చి జనాల్ని సెడగొట్టేయి…” అంటూ ట్రాక్ సూట్‌లో వున్న వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.

“మీరూ?” అనుమానంగా అన్నాడు సత్యం.. “కృష్ణని బావా! మీ జోగులు మామ కొడుకుని” అని పరిచయం చేసుకుంటూ ప్రక్కనే కూర్చున్నాడు. “సారీ బావా.. గుర్తు పట్టలేకపోయాను. ఇప్పుడేం చేస్తున్నావు?”

“మనూర్లోనే.. డ్రిల్లు మేస్టు” అని చెప్ప్పేడు ఫకీరు. “మరేమైతే.. మీ మేనగోడలికి నీ దగ్గరే చేర్పించేస్తాను” “ఇలాంటి బడిలో మీ పిల్ల చదువుతాడా?” అన్నాడు నిష్టూరంగా. “ఎందుకు చదవదు గానీ, జీడి తోటలు జనాల్ని ఎలాగ సెడగొట్టేయి?”  మునుపటి చర్చని కొనసాగించేడు.

“సెడగొట్టవేటి?.. పని చెయ్యక్కర్లేదు. డబ్బు మానాన డబ్బు సేతికందిందంటే మనోల్ని ఆపగలమేమిటి? నీకొక తెలుసునా… యవసాయం సేసినోడికంటే కొండమీద జీడిమొక్కలేసుకున్నోడు బాగున్నాడు.”

“అంటే.?” అడిగాడు సత్యం. “ఎవసాయం బాగులేదని”ఖచ్చితంగా ముగింపు ఇచ్చినట్టు చెప్పేడు ఫకీరు. “నిజమే, వ్యవసాయానికి రోజులెప్పుడో చెల్లిపోయేయి” గొణుక్కున్నాడు సత్యం.

“బాగున్నారండీ!” ఎర్రగా, ఎత్తుగా వున్న అందమైన యువకుడు అడిగితే “మీరూ” అన్నాడు సత్యం.

“నేను శ్రీను నండి. కృష్ణమూర్తి షావుకారి గారి మనవడిని” అంటూ మంచం వేసేడు కూర్చోమన్నట్టు.

నిజమే. షావుకారి కూతురు కొడుకు. పోలికలు గుర్తొచ్చేయి. ఇల్లు కాస్త మారింది. సిమెంటు బెంచీల మీద సామాన్లు అడ్డదిడ్డంగా పడివున్నాయి. గడపకెదురుగా చిన్న బడ్డీ.  ప్రక్కనే కాయిన్ బాక్సు, చిల్లర సామాన్ల నుంచి చీప్ లిక్కర్ దాకా వున్నాయక్కడ. “వ్యాపారమెలా వుంది?” అడిగేడు సత్యం. “ఏమి వ్యాపారమండి.. ఆ రోజుల్లో ఐతే తిరుగుండీది కాదు. ఈ రోజు అలగ లేదండి”

“ఏమి?”

“మొన్నే.. గూడ నుండి ఒక ముసిలోడి పది చీపుర్లు తెచ్చేడండీ. నా కిచ్చీరా అన్నాను. ‘ఎంతా’ అన్నాడు. రేటుంది గదా అని ‘ముప్పై ఐదు’ అన్నాను. కాదు ఏభై అన్నాడు. అయితే ఒద్దులేరా అనీస్తే. అలాగ మోసుకెలిపోతున్నోడు. కరువులు మేష్టుకెదురయ్యేడు. ఆలమ్మాయి టౌనులుంది గదా.. అవుసరం అని ఏభై ఇచ్చీసి తీసుకున్నాడూ.”

“ముసిలోడికి మంచి రేటోచ్చినట్టే కదా” అన్నాడు సత్యం.

“ఇలగైతే మా వ్యాపారమేటైపోవాలండి?” అని “ముసిలోడికి మంచి జరిగిందన్నారు గదా.. అదే ముసిలోడు మరొక రోజు పాతిక చీపుర్లు మోసుకొచ్చేడు. నేనే మల్లా అడిగేను. “ఏభై’కి తగ్గను” అన్నాడు. ఆ రోజు.. కరువులు మేష్ట్రైతే ఉజ్జోగస్తుడూ, అవుసరమున్నోడూ.. ఎంతకైనా కొంటాడూ.. నీను కొనాలంతే మార్కెట్‌ల ఆ రేటుండాల గదరా” అన్నాను. ఆ మాటకి ముసిలోడు ఏటీ సేశేడు తెలుసండీ.. మొల్లోంచి సెల్ తీసి పెదషావుకారికి ఫోన్ చేసేడండీ. నా మీద నమ్మకం లేక..”

“ఔనా?” ఆశ్చర్యపోయేడు సత్యం.

“ఔనండి.. ఇప్పుడంతా ఆన్‌లైనే”

“అయితే ఏమైందీ?”
“ఏటవడమేంటండి? ‘నలభై ఇస్తాను తెచ్చీ’ అన్నాడు పెద షావుకారి. తీరా కష్టపడి మోసుకెల్తే. పాతిక లెక్కన యిచ్చీసి పంపించీసేడు”

“అదేంటీ?” మరింత ఆశ్చర్యపోయేడు సత్యం.

“ఇద ఇప్పుడే ఫోనొచ్చిందీ. రేటు తగ్గిపోయిందీ” అని పెదషావుకారి జేబులోని ఫోను తీసి సూపెట్టేడు. అలగని ఆ ఫోను  నిజమని అనుకుంటున్నారా? ఫోను మాట్లాడినంత మాత్రాన రేటు పసిగట్టినట్టా? ఆ సీపుర్లు తిరిగి తేగల్డా? యీదీదికి తిప్పి అమ్మగల్డా? సచ్చినట్టు ఆ రేటికిచ్చీసి తిరిగొచ్చీసేడు ముసిలోడు..” అని ముగించేడు శ్రీను ఏది చేసినా మేమే చేయ్యాలన్నట్టు.

ఇన్నేళ్ళలో .. ఆధునిక సౌకర్యాల అందుబాటు ఎవరికి లాభం చేకూర్చింది? మధ్యవర్తులు ఏమౌతూ వచ్చేరు? లాభాలు ఎక్కడికి చేరుతున్నాయి?

“ఏది ఏమైనా.. జనం తైల్వి మీరిపోయేరండీ” అన్నాడు శ్రీను.

“కాదు.. కాదు. తెలివి జనానిది కాదు.” గొణిగినట్టే అనుకున్నాడు సత్యం.

“జనానికి కట్టల కట్టలు చేతికందీయాల” ఫకీరు యదాలాపంగా అన్నాడు.

“అందెస్తుంది కదేటీమద్దిన..” అని నసిగేడు కృషణ.

“కట్టలేటీ? అందీడమేటీ? అనుమానంగా ఆడిగేడు సత్యం.

“ఏట్లేదూ…” అనన్నాడు గానీ “దీన్నంతటీకి అసలు కారణం మరొకటుంది..” అని అర్ధాంతరంగా ఆపేడు కృష్ణ.

“ఏటి బావా.. అది?” కుతూహలంగా కళ్ళు చిన్నవి చేసేడు సత్యం.

“ప్రోజెక్టుల పవరండి” అన్నాడు ప్ హకీరు.

“పవరా..  పవర్ ప్రాజెక్టా?”

“రెండూ.. ” అనినర్మగర్భంగా తలవూపేడు కృష్ణ.

“ఎలాగ?”

“అవన్నీ ఇప్పుడెందుకు లెండి” అంటూ లేచేడు.

నడుస్తున్నారు ముగ్గురూ.

“ఈ కొండవతల పవర్ ప్రాజెక్టొకటి కడతారంట కదా మామా! భూములన్నీ కూడబెడుతున్నారు. మీరొగ్గీసిన బూమికి ఆల్రడీ మన పాత ప్రెసిడెంటు డబ్బుల్దొబ్బేడని ఊర్లందరూ అనుకుంతన్నారు తెలుసునా?” సవరించబోయేడు కృష్ణ.

“అదొక పెద్ద కతరా  దద్దా!” అని పకీరు.

“చెప్పు.. చెప్పు..” అని సత్యం.

“గవర్మెంటు కట్టాలంతది… మనోలు వొద్దంతారు..” రెండు ముక్కల్లో తెంపీసేడూ పకీరు.

“గవర్మెంట్‌ని ఎదిరించాలంతే ఎవుడి తరమూ? అధికార్లు, పోలీసులు, బలమూ, బలగమూ.. అంతా అటే”

“ఎదిరించాలి తప్పదు.” మళ్లీ గొణిగినట్టే అన్నాడు సత్యం.

“ఎదిరించాల.. నిజిమేగాని మనిసాక్కాసి లాగుతుంటే .. ఎదిరించగలమా?” సందేహం వెలిబుచ్చేడు మరొకడు.

“అదే.. అందుకే.. ఒక నాయకుడు కావాలి.” గొణిగేడు సత్యం.

” ఈ మద్దిన వూరంతా గందరగోళంగుంది మామా”

“ఏమి?”

“ఎవుడెటుకాసి మాట్లాడుతాడో అర్ధమవకుంటది”

“ఏమైందీ?” అడిగేడు సత్యం.

“ఒకార్నెల్లు క్రితం కలెక్టరుగారు మీటింగు పెడతారట అందరు రావాల అని దండోరా ఏయించేరు, ప్రెజాబిప్రాయమని. మాంచి పనులు టైములోన ఎవుడెల్తాడు? అయినా కమీనిష్టు పార్టీ వోలు పున్యమా అని ఒకలిద్దరైనా వొచ్చేరు. ఆలేటంతారో.. ఈలేతంటారో ఎవుడికీ అర్ధంగాలేదు. ఎవుడో ఒక మాటన్నాడు. మరొకడెవుడో ఒక రాయిసిరేడు. అదే అదుననుకొని పోలీసులు రెచ్చిపోయేరు. సభ వాయిదా పడింది. మల్లా ఈ మద్దిన ఎడతారని బోగట్టా “ పకీరు ముగించేడు.

“అయితే  ఈ మద్దిన ఒక పుకారొచ్చింది” ఫకీరు వంగి చెప్పేడూ.

“ఏమని?” సత్యం

“పేక్టరీవోలు ఒకడికి తెలీకుండా మరొకడికి రాత్రి పూట ఒంటరిగా పిలిపిస్తున్నారని”

“పిలిపించీ?”

“నోట్ల కట్టలు పంచుతున్నారని. అదంతా సీనుగాడి ద్వారా జరుగుతుందని నా అనుమానం..” అర్ధాంతరంగా ఆపేడు కృష్ణ.

“ఎలాగ?”

“ఈడు సిన్నింటోడనుకుంతున్నవా? సూడ్డానికి సిన్న గుంటడిలాగ, సిన్న బడ్డీ ఎట్టుకొని బతుకుతున్నోడిలాగ కనపడుతున్నాడు గానీ ఈడు సేసిన  యేపారం సిన్నది కాదు”

“ఏమిటది?”

“మార్గదర్శిలు, సిట్‌ఫండు, రియలెస్టేట్లు, ఆర్డీలు, ఇన్సూరెన్సులు..  ఒకటేమిటీ? అలసంటోడు.. ఈ మద్దిన పవర్ ప్రాజెక్టోలతో చేతులు కలిపినాడని. పుకార్లు సికార్లు సేస్తన్నాయి.”

“కలిసేం చేస్తాడు?”

“చెయ్యాల్సిందంతా చేస్తున్నాడు.” అందుకున్నాడు కృష్ణ.

“ఏమిటది?”

“జనాన్ని కూడబెట్టడం, ఫేక్టరీ వోలకి జనం కావాల.. జైకొట్టే జనం కావాలి.. ప్రజాభిప్రాయ సేకరణలో ‘వూ’ కొట్టే జనం కావాలి. అందుకు ఎవుడొప్పుకొంటాడు? ఒప్పుకున్నా ఒట్టిగొప్పుకోడూ గదా! డబ్బు ఎర జూపాల! అందుకు ఒక మనిసి కావాల.. నమ్మకమైనోడు. సల్లగా పని  చెయ్యగలిగినోడూ కావాల. అప్పుడు దొరికేడీ సీనుగాడు”

“గానీ. అది నిజమో , అబద్ధమో తెలీకుంటుంది మామా, ఎవుడినడిగినా “ఔనటా” అని మొకము తిప్పీసి ఎలిపోతున్నారు గానీ, ఎవుడూ వులకడూ, పలకడూ….”

“లేదు. లేదు. అందులో నిజం లేకపోలేదు”

“అంటే! ఇదంతా ఆడే సేస్తున్నాడంతావా?”

“అవ్వొచ్చు. అలాంటి అవసరం మనూర్లో ఇంకొకడికి లేదు”

పకీరు ముఖంలో  పొద్దు ములిగిపోతున్న దృశ్యం.. కృష్ణ కళ్ళలో ఊరుని కమ్ముకుంటున్న చీకటి దృశ్యం.

***

సత్యం ఇంటికి పునాది రాళ్ళేసాడు. ఊర్లో అతని స్థానం గట్టిపడింది అందరికీ దగ్గరివాడయ్యేడు. ప్రతీ రోజూ ప్రతీ ఇంటికీ వెళ్ళేడు. అందరితోనూ కలగలిసి పోయేడు. పండుగలోనూ, పబ్బంలోనూ, కష్టంలోనూ, సుఖంలోనూ. అంతా తానైనట్టు.

ఓ వెన్నెల రాత్రి..

వూరందరికీ ఇంటికి రమ్మని ఆహ్వానించేడు.

“ఏట్రోయ్ బావా? మా కోడలు గానీ అలికిడి సేసిందేటి?” అంటూ వచ్చి కూర్చున్నారు . కృష్ణ తదితర బృందం.

నవ్వుతూ అందరినీ పలకరించేడు.

“ఇది నవ్వుకోవాల్సిన సమయం కాదు బావా!”

ఆ స్వరంలోని గంభీరతకి అందరూ నిశ్శబ్దమై పోయేరు.

“ఏటైంది బావా!!” అని దగ్గరకొచ్చేరు మిత్రులు.

“ఊరు బావ. ఊరుకి పీడ పట్టింది బావా.. తేరుకోకపోతే నాశీవమైపోద్ది బావా”

“ఏటి దద్దా? సరిగ్గా సెప్పురా నాయినా” అంటూ అసహనాన్ని ప్రదర్శించేరు కొందరు.

“మనూరు ఎప్పుడు కట్టేరో తెలుసునా?” కలలో అడిగినట్లు అడిగాడు సత్యం

“కట్టడమా? అదెవులికి తెలుస్తాదిరా మనవడా.. మా తాత ముత్తాతల కాసి ఈ వూరిక్కడే వున్నాదా మరేటి? అయినా ఆ వూసెందుకు రా ఇప్పుడూ?” నోట్లో చుట్ట తీసి బయటకి వుమ్ముతూ అన్నాడు జన్ని తాత.

“ఎందుకా? మరొక్క ఐదేళ్ళు పోతే ఈ వూరు ఇక్కడ, ఇలాగ వుండదు,” అన్నాడు సత్యం.

నిశ్శబ్దం.

“ఊరుండక పోవడమేట్రా నాయినా!” జీన్స్ పేంట్ యువకుడు లేచేడు అసహనంగా.

“ఉండకపోవడమేంటీ. ఉంటాది. గానిలక్కుండదు.”

“అంటే?”

“తినడానికి తిండుండదు. తాగడానికి నీళ్లుండవు.”

“ఇంకా నయం.. బతకడానికి మనముండమన్నావు గాదు” అంటూ ఓ యువకుడు సెటైరేసేడు.

“ఔను. అదే నిజం” అన్నాడు సత్యం స్థిరంగా.

“ఏట్రా బాబు.. సెప్పిందేదో తిన్నగా సెప్పొచ్చుగదా?” ఓ మధ్యవయస్కుడడిగాడు.

“అదీ చెప్తాను. ముందివి చూడంది” అని కొన్ని ఫోటోలని అందించేడు.

ఎడారి ప్రాంతంలో బ్రతికున్న శవాలలాంటి మనుషుల చిత్రాలవి. ఎండిపోయి, బక్కచిక్కిన ఆలమందలు, బొగ్గు పూసినట్లుండే ఇంటి పై కప్పులు..

“ఏటీ ఫోటోలు? ఇవన్నీ మాకేలా?” అనుమానం  వ్యక్తం చేసేడు మరో నడివయస్కుడు.

“కొన్నాళు పోతే మనూరు కూడా ఇలాగే తయారవుద్ది” అన్నాడు సత్యం సాలోచనగా..

“ఎందుకూ?” అందరి అనుమానాల్ని ఒకడడిగాడు.

“పవర్ ఫేక్టరీ పెడీతే అంతే మరి..”

“నిజమా…?” అందరి కళ్లలో భవిష్యత్ చిత్రం!!

“ఈ ఫోటోలు అబద్ధం చెప్పవు. ఇవి ఇప్పటికే ఫేక్టరీ చుట్టూ వున్న గ్రామాలవి. చుట్టూ పది పదిహేను కిలోమీటర్ల మేర బొగ్గు కమ్మేస్తుంది. పీల్చుకోవడానికి గాలి. తాగడానికి నీరు.. తినడానికి తిండి అంతా బొగ్గు.. బొగ్గు.మనుషులు.. పశువులు.. మొక్కా మోడూ అంతా బొగ్గు బొగ్గై బతుకులన్నీ బుగ్గైపోతాయిరా. నాకు తెలుసు. నీనిన్నాళ్లూ పని చేసింది ఇలాంటి ఫేక్టరీలోనేన్రా. నీను పడ్డాన్రా ఆ బాధలన్నీ. మీకు తెలీదురా.. నాకు తెలుసురా… నాకు తెలుసును” కలవరిస్తున్నట్టు చెప్పాడు.

“మరి మా భూముల సంగతేంట్రా? రేటు బాగా వొచ్చిందని అప్పుడిచ్చీస్సినాము. అవి ఫేక్టరీ  కోసమని ఇప్పుడూ తెల్సింది. మనమొద్దంటే మాత్రం ఆ బూములు తిరిగొస్తాయా.. ఫేక్టరీ కట్టడమాపేస్తారా?” అప్పటికే ఎకరా భూమిచ్చీసిన  బిడ్డికోడు దీనంగా అన్నాడు.

“అదీ నిజమే కానీ సమయం ఇంకా దాటిపోలేదు.” సాలోచనగా అన్నాడు సత్యం.

“ఎలాగ?” అందరి తరఫున అన్నట్టు ఒకడడిగేడు.

“మళ్లీ మీటింగు పెడతారు. ప్రజాభిప్రాయ సేకరణ” అని ముగించేడు సత్యం.

***

శ్రీను బడ్డీ ముందు ఒక మోటార్ బైక్ ఆగింది. ఇద్దరు వ్యక్తులు దిగి ఇంటిలోకి నడిచి వెళ్ళేరు. వెనుక శ్రీను కూడా వేళ్లేడు. “ఏమిటి విషయం?”” మంచం మీద కూర్చుంటూ అడిగాడు కొత్త వ్యక్తి.” నిన్న మొన్నటివరకు బాగనే వుంది. కానీ ‘సత్యం’ వొచ్చిన తర్వాత వూర్లో ఏదో మార్పొచ్చినట్టు అనుమానం..” అర్ధాంతరంగా ఆపేడు శ్రీను.

“ఎవరతను?” అడిగాడు మరో వ్యక్తి .

“అతను” అని ఆగేడు శ్రీను.

“టక్.. టక్… టక్..” ఎవరో తలుపు కొట్టిన చప్పుడైతే బయటికొచ్చేడు సత్యం. ఎదిరుగా ఓ అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా.

‘ఎవరూ?” అని అడిగేంతలోనే .. “సత్యం అంటే మీరేనా?” అన్నాడు.

“ఔను.. ఏమి?”

“మీరొకసారి స్టేషనుకు రావాలి.  ఎస్సైగారి కబురు.”

ఒళ్ళంతా గాయాలతో సత్యం. చుట్టూ వూరి జనం. ప్రక్కనే అమ్మ చుట్టూ పెనవేసుకొని ఎన్నో ప్రశ్నలతో  గీత.

“అమ్మా! డాడీకేమైంది?”

“డాడీనెక్కడికి తీసికెళ్ళేరు?”

“ఎందుకు లేవలేకపోతున్నారు?”
“అందరూ ఎందుకు ఏడుస్తున్నారు?” గీత అడుగుతోంది గుక్క తిప్పుకోకుండా. కళ్లలో విషాదాన్ని కక్కుతున్న సత్యం భార్య అరిచింది. “మీ నాన్న .. ఐ..న్.. ఫా..ర్మ..ర..టే.. తల్లీ…”

   ***

“డాడీ.. నాకూ నేర్పించూ..” ఒకటే అల్లరి చేస్తోంది గీత.

“తప్పకుండానమ్మా” అని గీతను కృష్ణ ముందు నిలబెట్టేడు సత్యం. ఆమె చేటికి “బౌ” ని “యారో”ని అందించేడు కృష్ణ.

గీత విల్లు ఎక్కు పెట్టింది.  నారిని తనవైపుకి లాగింది బలంగా. బాణం మొన  చివరినుండి చూపు సారించింది.

“డాడీ! దేన్ని కొట్టాలి?” అడుగుతోంది గీత.

సత్యం ఆమె కళ్ళలోకి చూసేడు. లక్ష్యం ఆమె ఎంచుకోగలదు. ఆతనికి తెలుసు. గీత గురి తప్పదు.

                            ***

గుర్రాలు

LR SWamy

  ఎల్.ఆర్. స్వామి కేరళలో పుట్టారు. ఉద్యోగరీత్య విశాఖ వచ్చి స్థిరపడ్డారు. మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు మీద మక్కువతో ఆ భాషను నేర్చుకుని రచనలు చేస్తున్నారు. అనువాదకులుగా, కథారచయితలుగా తనదైన ముద్ర కనబరిచారు. ఇప్పటిదాక ఐదు కథాసంపుటాలు ప్రచురించారు. మలయాళం నుంచి తెలుగులోకి తొమ్మిది పుస్తకాలను అనువదించారు. అంతేకాదు ఇక్కడి నుంచి కూడా తొమ్మిది పుస్తకాలను మలయాళం లోకి అనువాదం చేశారు. మలయాళంలోకి అనువాదం చేసిన వాటిలో గురజాడ, శ్రీశ్రీ, శివారెడ్డి, డా.ఎన్ గోపి, కేతువిశ్వనాథరెడ్డి మొదలైన వారి రచనలు ఉన్నాయి. మరోవైపు తమిళం నుంచి తెలుగులోకి ఒక పుస్తకాన్ని అనువదించారు. ఇటీవలే ఆయన సరికొత్త కథల పుస్తకం కథాకాశం విడుదలైంది. ఇది పాలపిట్ట పబ్లికేషన్స్ వారు వేశారు. అధ్యయంతోనే మంచి కథ రాయడం సాధ్యమంటారు ఎల్ ఆర్ స్వామి. – వేంపల్లె షరీఫ్ 

గుర్రాలు పరిగెడుతున్నాయి. మెడ తిప్పకుండా, అట్టూ ఇట్టూ చూడకుండా, పక్క ట్రాకులో పరిగెత్తే గురాలను పట్టించుకోకుండా పరిగెడుతోంది ప్రతి గుర్రం. తన లక్ష్యం చేరటమే  జీవిత పరమావధిగా తన ట్రాకులోనే పరిగెడుతోంది.గుర్రాలను పోషించేవారు, గుర్రాలమీద డబ్బు పెట్టుబడిగా పెట్టినవారు దూరదర్శిని ద్వారా తమ గుర్రాలను వీక్షిస్తూ,అవి ముందుకు దూకుతే ఆనందంతో కేరింతలు కొడుతూ, ఈల వేస్తూ, గెంతుతూ ప్రోత్సాహం అందిస్తున్నారు. ఒకటే గోల!

ఆ గోల భరించలేక పోయాను. చిననాటినుండి అలవాటైనదే ఆ గోల. ఆ గోలలోనే కళ్ళు తెరిచాను, పెరిగాను, బ్రతిగాను. కానీ, ఈ మధ్యఎందుకో ఆ గోల అసహ్యంగా అనిపిస్తోంది, భరించలేక పోతున్నాను .

మంచం మీద లేచి కూర్చున్నాను, మెల్లగా మంచం అంచుకు జరిగి అక్కడ ఉంచిన చేతికర్ర అందుకున్నాను. చేతికర్ర సహాయంతో బలవంతంగా లేచి నిలబడ్డానికి ప్రయత్నించాను. మోకాళ్ళు వణికాయి. అయినా, శక్తి కూడపెట్టుకుని, నీరు దిగిన పాదాలు ఈడ్చుకుండూ ముందుకు సాగి, రేస్కోర్సు వైపువున్న కిటికీ గట్టిగా మూసివేశాను.

గోల కొద్దిగా తగ్గినటు అనిపించింది. కొంత హాయిగా తోచింది.

కిటికీ బిగించి గదిలో కుదించుకుపోవటం నాకు ఇష్టంఉండదు. బాహ్యప్రపంచపు వెలుగు తగలనివాడు బ్రతికేవున్నా శవమేనని నా అభిప్రాయం. అయినా ఎందుకో నేటి పరుగు పందెం చూడలేకపోతున్నాను.  ఇతరులను – వాళ్ళు బంధువులైనా మిత్రులైనా సరే – ఓడించడంకోసం పరుగెత్తటం, అన్యాయంగానైనా ఓడించాలనే తపన పెంచుకోవటం, గెలిచిన పిదప ఓడిపోయినవాడ్ని కించపరిచటం, అందువల్ల గొడవలు తలయెత్తటం – ఇవి చూస్తున్నప్పుడు ఏదో కంగారు, తల తిరుగుతున్నటు, నాలుక ఎండిపోతున్నటు, ఒక చుక్క నీరు తాగుతే బాగుండు. మంచం వద్ద ఉన్న నీళ్ళ కూజా అందుకున్నాను. కూజా ఖాళీగా ఉంది!

నీరు నిండిన పాదాలు ఈడ్చుకుంటూ ముందుకి సాగాను. ఫ్రీడ్జ్ వద్దకు చేరి  తలుపు తీసాను. అది ఎప్పుడో తుదిశ్వాస విడిచేసింది కదా! ఆ మాట గుర్తురాని నా మతిమరుపుని మనసులో తిట్టుకున్నాను. అవును మరీ! ఈ మద్య ఏది గుర్తుండటం లేదు.

నా యవ్వనంలో నా చేతులతో తెచ్చుకున్న ఫ్రీడ్జ్కు కూడా నాతోపాటు ముసలితనం రాదూ…నాలా జబ్బు చేయదూ! డాక్టరులాంటి మెకానికుల అవసరం రాదూ…! ఇంకా ఊపిరి పీల్చే నన్నే పట్టించుకోని అయినవాళ్ళు నా ఫ్రీడ్జ్ గురించేం పట్టించుకుంటారు…?

గట్టిగా నిట్టూర్చాను. కాళ్ళు ఈడ్చుకుంటూ మళ్ళీ మంచంవద్దకి వస్తుంటే రోడ్డు కనబడింది.

ఒక ఇరుకైన రేస్కోర్సులా ఉంది రోడ్డు. చాలా రద్దీగా ఉంది. నియమ నిబంధనలు పాటించకుండా పరిగెడుతున్నాయి గుర్రాలు. రంగురంగుల గుర్రాలు…తమ గురించి మాత్రమే పట్టించుకునే గుర్రాలు…రంగురంగుల బొట్టుల మచ్చలతో కూడిన గుర్రాలు…నుదుటిమీద నామాలువుండే గుర్రాలు…మేడకి ఇరువైపుల వేలాడే జూలుతో కూడిన గుర్రాలు…వీపు మీద బరువు మోసే పిల్ల గుర్రాలు…

గొంతు తడియారిపోయింది. తల తిరుగుతున్నటు, మైకం లోకి జారిపోతున్నట్టు…

ఈ మధ్య తరచూ ఇలా జరుగుతోంది. డాక్టరుని కలవాలని అనుకుంటాను. కానీ తెసుకెళ్ళేవారెవ్వరు?

డాక్టరు వద్దకు వెళ్లాలంటే అబ్బాయి అరుస్తాడు. వారం రోజులక్రితం అదే జరిగింది.

”నీకు ఇప్పుడు డాక్టరు కావలసి వచ్చాడా…?” అబ్బాయి కేకలు వేసాడు.”ఒంటిలో బాగోలేకపోతే కళ్ళు మూసుకొని పడుకో.ఒంటిలో బాగుంటే మాత్రం నువ్వు చేసేదేముంది?”

నిజమే! నేను చేసేదేముంది…తిని పడుకోవటం తప్ప…!

”అది కాదురా —-” అయినా ఏదో చెప్పబోయాను.

”నువ్వు ఏమి చెప్పక, నోరు మూస్కోని పడుకో. నిన్ను,నేను డాక్టర్ల చూటూ తిప్పలేను.ఆ ఖర్చు కూడా నేను భరించలేను. ఇప్పటి నీ ఖర్చులే తట్టుకోలేకపోతున్నా.”

ఏం చెప్పగలను! నేనేమైనా పరిగెత్తే గుర్రమా…పరిగెత్తే గుర్రాలకైతే, ఒంటిలో ఏ మాత్రం బాగోలేకపోయినా డాక్టర్లను తీసుకొస్తారు. వైద్య పరీక్షలు చేయిస్తారు. అవసరం ఉన్నా లేకపోయినా బలం మాత్రలు ఇప్పిస్తారు. వాటిమీద ఖర్చు చేస్తే లాభం రావచ్చు. ఆదాయం తేలేని గుర్రాలకోసం, ముసలి గుర్రాల కోసం ఖర్చు చేస్తే ప్రయోజనం ఏమిటీ! వాటికి పెట్టె గుగ్గిళ్లూ నీరు కూడా దండుగని అనుకుంటూ వుంటే వైద్యం చేయించటం కూడానా…తుపాకీలోని ఒక తూటా ఖర్చు చేస్తే గుగ్గిళ్లూ,  నీరు కూడా మిగులు కదా!

తుపాకి గుర్తుకు రాగానే నా దృష్టి గోడ మీదకి మళ్ళింది.  ఉంది!  తుపాకి ఇంకా అక్కడే ఉంది!  నైస్సాం నాటి తుపాకి అది.  ఆ తుపాకిని పురావస్తుశాఖావారికి అప్పగించాలని గొడవ పెడుతున్నాడు అబ్బాయి.  ఒకటి రెండు సార్లు కలయబడి లాగేసుకోబోయాడు కూడా.  నేను వదులుతానా…!

గోడకి దగ్గరగా జరిగి తుపాకిని ఆప్యాయంగా తడిమాను.  నా తుపాకి!  నాకు ప్రియమైన తుపాకి!   నాకు తిండిపెట్టి బ్రతుకునిచ్చిన తుపాకి!   ఆ తుపాకితో ఎన్నెన్ని ముసలిగుర్రాల బాధను తుడిచేయలేదు!  ఒక తూటా సరిపోయేది.  గురి తప్పేది కాదు!   కాని ఇప్పుడు…

తుపాకి చేతులోఉంది.   తూటా కూడా ఉంది.   అయినా, బాధలతో సతమతమయ్యే  ఎన్నో ప్రాణాలకు విముక్తి ప్రసాదించిన చేతులు సొంత బాధలను తొలిగించుకోలేక పోతున్నాయి .
అయినా మనిషీ,  గుర్రామూ ఒకటేనా?  ఏమో!  ఈ రోజుల్లో గుర్రానికి మనిషికి తేడా ఏముంది! పరుగు పందెం కోసమే పుట్టిన జీవులు!

డాక్టరుని కలవాలి.  కలిస్తే…

డాక్టరు మాత్రం ఏం చెబుతాడు కొత్తగా అప్పుడెప్పుడో చెప్పిన మాటలే మళ్ళీ చెబుతాడేమో…

‘’ఏం చెప్పను రావుగారు” డాక్టరు అప్పుడు అన్నాడు “అలా, అలా, గడుపుకోవటమే.  ఇంచుమించు పుచ్చిపోయిన చెట్టుకి మళ్ళీ చిగురు పుట్టించగలమా…?’’

‘’నిజమే డాక్టరుగారు. నా బాధ కూడా అదే.  పుచ్చిపోయిన శరీరంతో పని చేయని మనసుతో,  మత్తిమరుపుతో,  లక్ష్యం లేకుండా,  అయినవాళ్ళకు సమాజానికి బరువుగా ఇంకా బ్రతకటం ఎందుకు,డాక్టరుగారు?  తనవారికీ, సమాజానికీ ప్రయోజనం లేని బ్రతుకుకు ముగింపు పలుకుతే…?’’

‘’ఏం చేస్తాం రావుగారు? అయినా ఆయువు ఉన్నంత కాలం  బ్రతగాలి కదా.”

‘’అది అలనాటి మాట.  ఇప్పుడు చావు మనిషి చేతిలోనే ఉంది కదా. ఊపిరి పీలుస్తున్నాను  కనుక నేను బ్రతికే ఉన్నానని మీరంటున్నారు, కానీ నేనెప్పుడో చనిపోయాను డాక్టరుగారు.  నన్ను ఒక అంటురోగిలా,  కాళ్ళు విరిగిన కుర్చీలా, మా అబ్బాయి ఇక్కడ పడేసినప్పుడే నేను చనిపోయాను, సర్ .’’ నా కళ్లనుంచి జాలువారిన కన్నీరు రాతినేల మీద పడి చెదిరాయి. “ఇప్పుడు నాఆలోచన ఒకటే. ఎలా నిష్క్రమించటం?‘’

“తప్పు, రావుగారూ, తప్పు, అలా ఆలోచించకూడదు. ఆత్మహత్య నేరం, పాపం కూడానూ.”

“కావచ్చు కాని అది మా లాంటి ముసలి గుర్రాలకు వర్తించదేమో! అడుగు తీసి అడుగు వేయలేని మేం సామాజిక వనురులు మింగుతూ క్రియాత్మక సేవలు చేయక, బ్రతకటమే  మహాపాపం. అసలే అయినవారి అప్యాయతలకు దూరమై ఇంకా…”

“ఆప్యాయత,” డాక్టరు గట్టిగా నవ్వాడు. “అది వుత్త బూటకపు మాట రావుగారూ. అలనాటి మనుషులని నడిపించింది అది. ఇప్పుడు మనిషిని నడిపేది స్వప్రయోజనం. మీ బ్రతుకు మీది. ఎవ్వరూ వేరెవ్వరు గురించి బ్రతకటం లేదు. మీరు ఈ ఆలోచనకి రావాలి. లేకపోతే నేటి బ్రతుకు నరకమే. మొత్తం బ్రతుకు  గుర్రశాలలోనే గడిపారు మీరు. తమ పిల్లలు పట్టించుకోవటం లేదని అవి బాధ పడుతున్నాయా? ఈ రోజుల్లో మనిషి బ్రతుకు గుర్రాల బ్రతుకేనండి.’’

నేనేమీ అనలేదు మగత నిద్రలోకి జారిపోయాను.

ఏదో పెద్ద శబ్దం విని ఉలిక్కిపడి లేచాను. ఒళ్ళు చెమటతో తడిసి ఉంది. ఆస్బెస్టాస్  వేసిన ఇంటి పైకప్పునుంచి వేడి దిగుతోంది. మంచం వద్ద ఉన్న ఫాన్ స్విచ్ నొక్కాను. ఫాన్ తిరగలేదు.

బాగా దాహం వేసింది—ఆకలి కూడా –గది తలుపు వైపు చూశాను.

సాధారణంగా గది తలుపు కొద్దిగా తెరిచి అన్నమూ నీరూ లోపలకు నెట్టేస్తారు. గదిలోకి ఎవ్వరూ రారు.

ఆశగా మళ్ళీ చూశాను. లేదు, లేదు, అన్నమూ నీరూ లేదు!

బహుశా నేటి పరుగుల తొందరలో మరిచిపోయిఉంటారు! పరిగెత్తలేని గుర్రాలకు గుగ్గిళ్లూ నీరూ పెట్టకపోతే మాత్రం అడిగేదెవ్వరు?

నాలుక తడియారింది . కళ్ళు మళ్ళీ మూతలు పడ్డాయి.

మెలుకువ వచ్చినప్పుడు కొంత చల్లగా ఉన్నటు తోచింది.

టైం తెలుసుకోవాలని గోడ గడియారం వైపు చూశాను. గడియారంలోని ముళ్ళు కదలటం లేదు!

మెల్లగా కదలి కిటికీ రెక్కలు తీశాను.చల్లని గాలి ముఖాన్ని తాకింది.

పరిగెత్తి అలసిపోయిన సూర్యుని గుర్రాలు కక్కిన నురుగు, నెత్తురు పచ్చిమాన పడివుంది.

ఆ నాటి రేసు ముగిసినట్టుంది. గెలిచిన గుర్రాలు యాజమాన్యం వారి మన్నెనలు పొందినందువల్ల, వెలిగే ముఖాలతో తిరుగుతున్నాయి. గెలవని గుర్రాలు వేలాడే పాలిపోయిన ముఖాలతో, అక్కడక్కడ తచ్చాడుతున్నాయి. భవిష్యత్తులోని పరుగుల పందెం గురించి తెలియని పసిగుర్రాలు గంతులు వేసి ఆడుకుంటున్నాయి. ముసలి గుర్రాల బ్రతుకుకి స్వస్తి పలకటానికి, తుపాకి సిద్దం చేసుకుంటున్నాడు గుర్రాల ప్రదర్శనకి బాధ్యత వహించేవాడు.

అప్రయత్నంగా నా చేతులు గోడ మీద ఉన్న తుపాకి  మీదకి వెళ్లింది. తుపాకి తీసి ఒడిలో పెట్టుకుని దాన్ని ఆప్యాయంగా తడిమాను. ట్రిగర్ నొక్కి చూశాను,పని చేస్తోంది! ఈ తుపాకిని లాగేసుకోవటానికి ఎంత ప్రయత్నం చేశాడు అబ్బాయి! నేను దీన్ని వదులుతానా!

మరోసారి తలుపు వైపు చూశాను…అన్నమూ నీరు కనబడలేదు. తుపాకిని ఒడిలో పెట్టుకొని కూర్చున్నాను.

మెల్లగా తలుపు తెరిచినటైంది. పిల్లిలా అడుగులు వేసి లోపలకు వచ్చాడు అబ్బాయి. నా వద్దకి వచ్చి తుపాకి మీద చేయి వేసాడుతుపాకి లాగేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను వదులుతానా, కలియబడ్డాను. తుపాకి పేలింది.

ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అబ్బాయి కనబడలేదు. గది తలుపు వేసే ఉంది! గదినిండా వెన్నెల! ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంది. రేపటి పరుగు కోసం తయారయ్యే  గుర్రాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ముసలి గుర్రాలు, నాలా మగత నిద్రలోనుంచి లేచి మూలుగుతున్నాయి. ప్రాణవిముక్తి కలిగించే తూటా కోసం ఎదురు చూస్తున్నాయి.

ఆశగా తలుపు వైపు చూశాను. తలుపు తెరిచినట్టు లేదు.

రేస్కోర్స్  చూస్తూ కూర్చున్నాను. రేస్కోర్స్ లో తుపాకి పేలిన శబ్దం. గుర్రాల రోదనలు.

నా చేతులు అప్రయత్నంగానే తుపాకి అందుకుంది  ట్రిగర్ నొక్కాను. తుపాకి పేలలేదు. అప్పుడు గుర్తువచ్చింది, అబ్బాయి తుపాకీలోని తూటా తీసి పారేశాడనేది!

విసుగుగా తుపాకిని విసిరిపారేశాను . మంచం మీద వాలి ఒకవైపు తిరిగి పడుకున్నాను. అప్పుడు కనబడింది,గో డ మీద మా మనవుడు ఫోటో.  వాడు నన్ను చూసి ఆప్యాయంగా నవ్వుతున్నాడు! వాడి ఆ నవ్వుని కాపాడాలి! వాడినైనా ఈ రేస్కోర్సుకు దూరంగా ఉంచాలి!

అవును! నా పని ఇంకా ఉంది.

 

 Front Image: Mahy Bezawada 

మొలకలు

వంశీ ఇప్పుడు కరీంనగర్‌ జిల్లా మంథని నుంచి వినిపిస్తున్న కొత్త గొంతుక. చెట్టంత కొడుకుల చెంత కాసింత నీడ దొరక్కపోతే .. ఆ తల్లిదండ్రులు తమ ఆప్యాయతల్ని ఎందులో వెతుక్కున్నారో ఎంతో ఆర్ద్రతతో చిత్రించిన కథ ఇది. అల్లం కృష్ణ వంశీ ఫిబ్రవరి 16, 1986లో పుట్టారు. ఎంఫార్మసీ చేశారు. సినిమా రంగం మీద ఆసక్తితో ప్రస్తుతం అక్కడ స్క్రిప్టు రైటర్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇది వంశీ రాసిన మూడో కథ.
                                                                                                                                                                             వేంపల్లెషరీఫ్‌

ఏందీ? పదిహేనురూపాలకొక్కటా? మరీగంత పిరంజెప్తున్నవేందయ్యా..

పిరమెక్కడిదమ్మా పదిహేనంటే చానఅగ్గువ..

ఒక్కటికాదు పిలగా,  మొత్తం మూడుకొంటా. ఎంతకిస్తవో ఆఖరుమాట  చెప్పు. .

గదే ఆఖరమ్మా. పదిహేను రూపాలకొక్కటి. మీరు మూడు కొన్నా, ముప్పై కొన్నా గదే రేటు.  గంతే..

అబ్బా ఊకే ఒకటే మాట చెప్తున్నవేందయా, ఇచ్చేమాట చెప్పరాదు, ముప్పైరూపాలకు మూడియ్యిగ.

లేదమ్మా నలభైఐదురూపాలకు  ఒక్కరూపాయి సుత తక్కువ కాదు.

గిదంత కాదుగని లాష్టు ముప్పైఐదు  తీస్కోబాబు.
అర్రే..
నాకే అంత అగ్గువ పడదు గాదమ్మ. ఒక్కదాని మీద నాకు మిగిలేటియే రెండ్రూపాలు. మీరింత బొత్తిల గ్గుంజి బేరం జేస్తే ఎట్లనమ్మా.!  ఇంకోమాట చెప్పున్లి..

సరే ముప్పై ఎనిమిది తీస్కో..గంతే ఇగ.. మళ్ల ఎక్కువ చెప్పకు.

ఉన్నవాటిలోమంచిగున్నఓ మూడింటిని తీశి  ఆమె ఎదురుంగ పెట్టిండు పిలగాడు.

గిది మంచిగలేదు వేరేదియ్యి అని అండ్లనుంచి ఒకదాన్ని వాపసిచ్చిందామె.

దీనికేమైందమ్మా గింత మంచిగుంటే! అనుకుంటనే  దాన్నితీస్కోని  ఇంకోమంచిది తీశి ముంగట పెట్టిండు పిలగాడు.

ముప్పైఎనిమిది  రూపాలు అతని  చేతులపెట్టి ఆ మూడిటిని కట్టలెక్క ముడేషి పట్టుకుని ఎనుకకు తిరిగిందామె.

ఏడికి పోవాల్నమ్మా? రిక్షా అతను అడిగిండు.

వద్దు తాతా మా ఇల్లు గీణ్నే.. నడ్సుకుంటబోత..

ఓ చేతిల సామాన్లుండే, ఇంకో చేతిల ఈటిని పట్కుంటివి. ఒక్కదానివి.. ఆటిని ఇంటి దనుక ఎట్ల మోస్కపోతవమ్మా! ఓ రూపాయి తక్కువకే అస్త, ఎక్కుబిడ్డా..

వద్దు తాతా పర్వాలేదు.. ఇయ్యి అలుకగనే ఉన్నయ్.  అయినా మా ఇల్లుగీణ్నే.. నేన్నడ్సుకుంటబోత..

నిజానికి ఆణ్నుంచి వాళ్లింటికి చానా దూరమే గాని రిక్షా పైసలు మిగులుతే పిల్లలకు బిస్కిట్లు కొనుక్కపోవచ్చన్నది ఆమె ఆశ. అందుకే రిక్షాఎక్కకుంట నడుసుకుంటనే ఇంటితొవ్వ బట్టిందామె.

***

పెండ్లయిన మొదటి రెండేండ్లూ పిల్లలు పుట్టలేదామెకు. అందుకే పిల్లలు కోసమని  కనవడ్డ ప్రతి దేవునికిమొక్కులు మొక్కింది, ఎన్నో వారాలు ఒక్కపొద్దులున్నది. తర్వాతో ఆర్ణెల్లకు పెద్దోడు కడుపుల   పడ్డడు.

పిల్లల కోసమని చానరోజులు మొక్కులు మొక్కి ఉపాసాలుండుట్ల పెద్దోడు పుట్టేటప్పటికి ఆమెకు పాలు పడలేదు. అందుకే పాపం పిలగానికి డబ్బా పాలే పట్టించాల్సచ్చేది.  ఆ జమానాల అప్పటికి వీళ్లకు చిన్న సైకిలు పంచరు షాపే ఉండుట్ల దాని మీదచ్చే చారానా అఠానా పైసలు పిలగాని పాలకూ, వీళ్ల తిండికీ సాలక పొయ్యేటియి. అందుకే పిలగానికి పాలకోసం వీళ్లిద్దరు రోజుకోపూట తిండి బందుచేసుకున్నరు. పిలగానికి కడుపునిండా పాలుపడుతున్నప్పుడు నిజంగ ఆ సంబురంతో, తృప్తితోటే వీళ్ల కడుపులు నిండేటియి. కోట్లరూపాలు పెట్టిన దొరకని సంబురం.. తృప్తి.

వాడు పుట్టిన కొద్దిరోజలకు సంకల పసి పోరణ్నేసుకుని కాలినడకన్నే మొక్కుకున్న గుడులన్నీటికి పొయ్యి మొక్కులు తీర్సుకున్నదామె. ఆ తర్వాత వర్సగ ఇంకో నాలుగేండ్లల్ల చిన్నోడు, బిడ్డసుత పుట్టిన్లు.. ముద్దుగుండే ముగ్గురుపిల్లలు .. ఇద్దరు కొడుకులూ,ఒకబిడ్డ.ఆ ముగ్గురెంత ముద్దుగుంటరో మనం మాటల్ల చెప్పలేం.అయినా పిల్లలకంటే అందంగుండేది ఏముంటదీ లోకంల! ఆ మొగుడూ పెళ్లాలిద్దరికీ ఇప్పుడా పిల్లలే సర్వం, లోకం.

మొగనికొక చిన్న సైకిలు రిపేరు షాపున్నది.. ఆయినే యేడాది పొడుగూత రికామన్నమాటెర్గక పొద్దుమాపు తేడా లేకుంట గంటల గ్గంటలు రెక్కలుముక్కలుచేసుకుని కట్టపడుతనే ఉంటడు. ఆ రెక్కల కట్టంతోనే ఓ నాలుగు రిక్షాలు ఖరీదు చేశి కిరాయిల కిచ్చుకున్నడు. ఆషాపుమీద, రిక్షాల కిరాయిలమీద వచ్చే సొమ్మును పైసాపైసా కూడబెట్టి మొన్ననే ఓ చిన్న ఇల్లుసుత కట్టుకున్నరు. పెండ్లిచేస్కుని ఉత్తరెక్కల కట్టాన్ని నమ్ముకుని జీవితాన్ని షురూ చేషినవాళ్లకు సంసారాన్ని ఇట్ల ఓకొలిక్కి తీసుకురావటానికి  దగ్గెర దగ్గెర  పదేండ్లుపట్టింది.

***

తొవ్వలోదుకాణమ్ముంగటాగి పిల్లలకిట్టమైన బిస్కిట్లు కొనుక్కోని  ఇంటికిచేరుకుందామె.అమ్మచేతిలబిస్కిట్పొడలుసూడంగనేమస్తుసంబురమైందిపిల్లలకు. వాళ్లకండ్లల్లవెలుగు సూషి అంతకురెట్టింపు సంబురమైంది అమ్మకు.

అమ్మా.. అయ్యేం చెట్లే? బిస్కిట్లు తినుకుంట అడిగిన్లు పిల్లలు.

అయి కొబ్బరిచెట్ల మొలకలురా. మీరు ముగ్గురున్నరని  మూడుతెచ్చిన.

కట్టనిప్పి తలొక మొలకను “ఇదినాది-ఇదినీది”అనుకుంట  తీసుకున్నరు పిల్లలు.

ఏడ పెడుదామే వీటిని? బిడ్డఅడిగింది.

ఇంటి ముంగట ఖాలీ జాగున్నది కదనే ఆడ తొవ్వి పెడుదాం.

నేన్తవ్వుతా  అంటే నేన్తవ్వుతా అని  కట్టెపుల్లలేరు కచ్చుకునే తందుకు ఉరుకిన్లు కొడుకులిద్దరు.

అరె ఎటుర్కుతున్లురా..?? ముందుగాల మీరిటచ్చి ఆ బిస్కిట్లు తినున్లి. కట్టెపుల్లల్తోని పైనపైన తొవ్వి పెడుతె ఆగయిరా ఆ చెట్లు. నానచ్చినంక గడ్డపారతోని పెద్దగ తొవ్వుతడు, అప్పుడు మీరన్ల చెట్లు పెడ్దురుగని రాండ్లి లోపటికి. అమ్మఅన్నది.

లోపటికి నడిశిన్లు పిల్లలు.

నాన ఇంటికి రాంగనే ఎదురుపొయ్యి “నానా మా కొబ్బరిచెట్లు” “నానా మా కొబ్బరిచెట్లు”అని సంబురంగ చూపెట్టిన్లు పిల్లలు.

కొబ్బరి చెట్లెక్కడియి బేటా అనుకుంట బిడ్డను ఎత్తుకుని ముద్దుపెట్టుకున్నడు నాన..

అమ్మ తెచ్చింది నాన.

తర్వాత అతను ఇంటిముంగట మూడు బొందలు తవ్వితే పిల్లలు ఎవరి మొలకను వాళ్లు అండ్ల నాటిన్లు. అమ్మ మట్టితో బొందలు పూడ్శి మూడు చెట్లకూ నీళ్లు పోశింది.

***

రోజు పొద్దుగాల లేవంగనే చెట్లకాడి కురికి ఏమన్న పెద్ద వెరిగినయా లేదా అని చూశేటోల్లు పిల్లలు.

అమ్మా, నానా వాటికి రోజూ నీళ్లు పోషేటోల్లు. ఏదన్నొక పొద్దువాటికి కొత్త ఆకు మొగిలనుంచచ్చినప్పుడు వాళ్ల సంబురం అంతా ఇంతా కాదు. చెట్లు మంచిగ పెరుగుతున్నయి. పిల్లలూ పెరిగి పెద్దోళ్లయితున్నరు.

మన వాడకట్టు పిలగాండ్లందరికీ దోమలు కుడుతే అయేంటియో జొరాలస్తున్నయట. బాంచెన్ ఓ ఫ్యాను కొనుక్క రారాదయ్య..  మొగనికి చెప్పిందామె.

సరే సరే ఈ నెల రిక్షా కిరాయిలు రానియ్యే కొందాం. మొగడన్నడు.

అప్పటిదాంక పిల్లలకుఫ్యానంటేందో తెల్వదు కానీ, ఏదొ కొత్త వస్తువు వస్తుందని మాత్రం ఎరుకై రోజు నాన ఇంటి కచ్చేటాల్లకు హుషారుగ ఎదురురికి ఆయినె చేతులు చూస్తున్నరు.

ళ్లనెప్పుడూ నిరాశ పర్చకుంట ఇంటికి రాంగ పండ్లో, చాక్లెట్లో, బిస్కిటు పుడలోబొమ్మలో రోజూ ఏదన్నొకటి తెస్తనే ఉండేటోడు నాన.

ఒకరోజు నాన ఇంటికి వచ్చేటపుడు చేతిలో బిస్కిటు పొడలతో పాటూ కొత్తవస్తువేదో కనపడింది పిల్లలకు..

నానా ఏందిది?? సంబురంగదాన్నిముట్టుకుంట అడిగింది బిడ్డ.

టేబులుఫ్యాను బేటా.

పిల్లలు ముగ్గురికి మంచిగ గాడ్పచ్చేటట్టు పెట్టి వాళ్ల కాళ్లకట్టకు దోమలు కొట్టుకుంట పన్నరు అమ్మానాన. మొదటిసారి ఫ్యాను గాలి మొఖాలకు తగులంగనే గాల్లె ఎగురుతున్నట్టు గనిపించింది అందరికీ. దాని ముంగట కూసున్నప్పుడు గాడ్పుకు జుట్టెగిరి చెవులకూ, చెంపలకూ తాకుతుంటే చెక్కల్గులయ్యి కిలకిల నవ్వుతూ చప్పట్లు కొట్టిన్లు పిల్లలు.
వాళ్ల నవ్వులు సూశి కడుపు నిండింది అమ్మానానలకు…

***

మొలకలు పెరిగి చిన్న చిన్న చెట్లయినయ్. పిల్లలు బడీడు కచ్చిన్లు.గవర్మెంటు బల్లె ఏద్దామని నాన, లేదు ప్రవేటు బల్లెనే సదివియ్యాలని అమ్మా చాన రోజులే లొల్లివె ట్టుకున్నరు..

ముగ్గురిని ప్రవేటు బల్లేస్తే గంతగంత ఫీజులేడికెళ్లి కడుతమే?? నాన అడిగిండు.

కావాల్నంటే ఇంటి ఖర్చు తక్కువ చేస్కుందాం, ఇంక కావాల్నంటె నేన్సుత మిషిను కుడుత గంతే గని పిలగాండ్ల సదువుల కాడ మాత్రం పైసలకు సూషే ముచ్చటే లేదు. వాళ్లను మంచిగ సదివిపియ్యాలే.. తెగేషి చెప్పింది అమ్మ..

ఇంటికి దగ్గెర్లున్నమంచి ప్రవేటు బల్లేషిన్లు పిల్లల్ని. అమ్మానానల కట్టాన్ని యాదుంచుకుని వాళ్ళుసుత మంచిగ సదువుకుంటున్నరు. ముగ్గురికి ముగ్గురు ఎవల క్లాసుల వాళ్లు ఫష్టే. అంత మంచిగనే ఉన్నదిగనీ… పిల్లలు పొద్దున లేవంగనే బడికి పోవుడూ, మళ్ల సాయింత్రం ఇంటికి రాంగనే హోంవర్కూ, ట్యూషను.. రాత్రిపూట జరసేపు రికాం దొర్కుతె పక్కింట్లకురికి టీవీ చూషుడూ, ఆ తర్వాత పండుకునుడు. ఐతారాలు సుత ఇంట్లుండకుంట దొస్తులతోని ఆటలు. మొత్తంగిదే అయితుంది.. ఇట్ల రోజులు గడుస్తనే ఉన్నయ్. చెట్ల మీన మునుపున్నంత యావ పిల్లలకుఇప్పుడు లేదు. వాస్తవానికి వాటిని సూషేటంత రికాం దొర్కుతలేదు పిల్లలకు.
అమ్మా నానల యావ మాత్రం రోజు రోజుకు ఇంకింత పెరుగుతనే ఉన్నది. పెండేస్తే చెట్లు మంచిగ పెరుగుతయని రోజూఎక్కడెక్కడికో పొయ్యి తట్టలల్ల పెండ పట్కచ్చిచెట్ల మొదట్ల పొయ్యవట్టింది  అమ్మ. నాన రోజూ నీళ్లుకడ్తనే ఉన్నడు..

***

కాలం చాన జల్దిజల్ది ముంగటికి పోతనే ఉన్నది. నాన ఎప్పటిలెక్క రెక్కలు ముక్కలు చేసుకుని కట్టపడుతనే ఉన్నడు. అమ్మసుత ఉన్నదాంట్లె సదురుకుంట సంసారాన్నిసక్కగ ముందుకు నడుపుతాంది.  ఇన్నేండ్లల్ల ఆ చిన్న సైకిలు రిపేరు షాపును ఓ పదిహేను సైకిళ్లుండే పెద్ద సైకిలు టాక్సీ చేషిన్లు. నాలుగురిక్షాలు ఎనిమిదైనయ్.   చేతికిందికి ఇద్దరు పనోల్లను సుత పెట్టుకున్నడు నాన.

కానీ రాంగరాంగ సైకిలుకి  రాయలకుతీస్కునేటోల్లు,తొక్కేటోల్లూ చానవరకు తక్కువైపేన్లు. సైకిల్లకు బదాలు మొత్తం అన్నీ మోటరుసైకిల్లే అయినయ్. ఇటు రిక్షాల ముచ్చటసుత ఆ తీరంగనే ఉన్నది. కొత్తగ ఆటోరిక్షాలని అచ్చినయ్. జెప్పన పోవచ్చని, ఆరాముగుంటదని అందరు వాటిల్నేఎక్కుతున్నరు. ఇంకిన్నిరోజులకు అస్సల్రిక్షలనేటియే పురాగ లేకుంట యినయ్. ఉన్నా, రిక్షాలను తొక్కడానికీ అసల్ ఒక్క మనిషిసుత దొర్కుత లేడు. వాళ్లందరిప్పుడు ఆటోడ్రైవర్లయిన్లు.
మారుతున్న లోకంతో పోటీ పడలేకపొయిండు నాన. అప్పుచేశి ఆటోరిక్షా కొందామనుకున్నా ముగ్గురు పిల్లలు యాదికచ్చి అప్పు చెయ్యబుద్దికాలేదు. ఉన్నరిక్షాలమ్మి కొత్త ఆటో కొందామంటే ఇనుపసామాన్లోడు తప్ప ఇంకెవడు రిక్షాలను కొన అన్నరు. ఇన్నిరోజులు వాళ్లకు తిండిపెట్టి పోషించిన సైకిల్లూ, రిక్షాలుఇప్పుడు మూలకు వడ్డయ్. ఎంత ఖోశిష్ చేశినా మారడం అతని తోటి కాలేదు. పైసలకు కట్టంగనే ఉన్నాఇన్నిరోజులు పిల్లలకు ఆ ముచ్చట తెలువకుంటనే నడుపుకచ్చిన్లు అమ్మానానలు.  కానీ కాలంతో పాటూ మనమూ మారకుంటే  జీవితమనే పరీక్షల ఓడకతప్పదుగా!  ఇంతట్లనే పెద్దోడు  పదోతరగతి మంచిమార్కులతోటి ఫష్టుక్లాసులపాసైండు.

***

సంబురంగా సేమ్యా పాయిసం చేశిపెట్టిందమ్మ.

నానా.. నేను గా పెద్దకాలేజిల సైన్సుగ్రూపుల చేరుత. హుషారుగడిగిండు పెద్దోడు.

నానకు ఏమనాల్నో, ఎట్లచెప్పాల్నోసమజైతలేదు. ఇయ్యాల చెప్పద్దులే అని ఊకున్నడు.

నానా.. నేను గా పెద్ద కాలేజిల సైన్సుగ్రూపుల చేరుత. తెల్లారి మళ్లడిగిండు పెద్దోడు.

చెప్పటానికి ధైర్నం రాలే నానకు. నాకు బయట పనున్నది బేటా పొయ్యస్తా..అని బయటికి నడిశిండు.

ఏందయ్యా పిలగాడు గా కాలేజిల చేరుతా అని రెండ్రోలకెళ్ళి అడుగుతాంటే సప్పుడు చేస్తలెవ్వు. వాని దోస్తులందరు పొయి చేరుతాన్లట. వీణ్ణి సుత ఇయ్యాల ఆడికి పట్కపొయ్యి అండ్లచేర్పిచ్చుకరా.. అమ్మగట్టిగనే అడిగింది.

ఏందే..బహు రుబాబుగ మాట్టాడ్తానవ్? నాతాన పైసలేడున్నయ్ ఆ కాలేజిల సదివిచ్చేతందుకు?

అట్లంటేంటిదన్నట్టు? పొలగాని సదువాపుతవా ఏంది?

సదువాపుడు గాదు. ఇగ పని నేర్పియ్యాలె వానికి. ఒక్కన్నెంతగనమని చేసుకుంట రావాలె.  వానంతున్నప్పుడే మా నాయిన నన్ను పనికి తోలిండు. ఇయ్యాల్టికాంచి వీణ్నిసుత నా యెంబటి  షాపుకు తోల్కపోత ఇగ…  తన నిస్సహాయతను పెండ్లాన్ని తిడుతున్నట్టుగ చెప్పిండు నాన.

జెట్టమొఖపోడా ఏం మాట్లాడ్తున్నవ్. పసిపోరణ్నిపనికి తోల్కపోతావ్? బల్లె పష్టచ్చినోణ్నిసదువు బంజేపిస్తావ్? అసల్మొగోడు మాట్టాడే మాటలేనానయ ఇయ్యి? గయ్యిమని లేశింది అమ్మ.

మొగణ్నిఎంత మాటపడుతె అంత మాటంటవానే లమిడికే అని పెండ్లాం ఈపుల గిబ్బగిబ్బ నాలుగు గుద్దులు గుద్దిండు మొగడు ..

థూ.. నీ చేతులిరిషి పొయిలపెట్ట గదరా. పిలగాండ్ల ముంగట పెండ్లాన్ని తన్నుడు చాతనైతదిగని పోరణ్నిసదివిపిచ్చుడు మాత్రం చాతకాదు నీకు.

ఔమరి. నువు రాంగ ముల్లెలు పట్కచ్చినవ్ గదా నా ఇంటికి. సంపాదిత్తె ఎర్కైతది రూపాయంటేందో, కట్టమెట్లుంటదో..  పొట్టల్పిక్ల తిని ఇంట్లపంటె ఎట్లెరుకైతది నా గోసేంటిదో.

ఇన్నేండ్లు నీకు వండిపెట్టిందానికి నువు నాకేమన్న జీతం కూలిచ్చినవా? రెక్కలు ముక్కల్చేస్కుని ఇంటెడు సాకిరి చేస్కుంట ఒక్కొక్కటి సగవెట్టుకుంటత్తాంటే గుర్రబ్బేవన్లెక్కతినుకుంట..నీ కేడెర్కైతాంది నా ఇలువ. అయ్యన్ని నీకు లెక్కలకు రావా?

ఛత్.. లమిడికే నోర్తెర్వక్. మొత్తం నువ్వే సంసారం నడుపుతన్నట్టు మాట్లాడుతన్నవ్. ఔతలోళ్ల వేరం నేనేమన్న తాగుబోతునా, తిరుగుబోతునా.. పొద్దూకుల కట్టపడి పైసల్పట్కచ్చిస్తే నా మీదకే మర్లవడ్తున్నవ్.. మళ్లగిన నొరిప్పినవంటే మూతిపండ్లు రాల్తయి చెప్తాన్న.

ఆ రాల్తయి రాల్తయి. రిచ్చతొక్కేటోడుసుత పెండ్లానికి పండుగకు చీర కొనుక్కత్తడు. నువ్వెప్పుడన్నపెట్టినవా నాకు? అయినా నిన్నెప్పుడన్ననాక్చీరలు తెమ్మని, బంగారం పెట్టుమని అడిగిన్నానయా నిన్ను? ఉన్నదాంట్లె సదుర్కోని పిల్లల సదివిచ్చుకుంటత్తాంటే లంజెపొడుగు మాటలన్నిమాట్టాడుతన్నవ్..  ఏడుస్తూ అన్నదిఅమ్మ..

ఔ.. నువ్వే సదివిపిత్తన్నవ్కని. ఆన్నన్ని పైసల్కట్టుడు నాతోనైతె కాదు. కావాల్నంటే గౌర్మెంటు కాలేజిల చేరుమను. ఒక్కపూటే కాలేజుంటది, ఇంకోపూట నాతోని పనికి తోల్కపోత. సదివేటోడు ఎన్లున్నాసదువుతడు.. ఆఖరి నిర్ణయం చెప్పి బయటికి నడిశిండు నాన…

అప్పటి దాంక మూలకు నిల్సోని బీరిపొయి సూస్తున్నపిల్లలు నాన పోంగనే ఏడ్సుకుంట అమ్మకాడి కురికచ్చిన్లు. బాగ బెదిరిపొయ్యున్నరు వాళ్లు. ముగ్గుర్నీదగ్గరకు తీస్కోని గట్టిగ కావులించుకుని ఏడవద్దు నానా అన్నదమ్మ.

నొస్తుందా అమ్మా? చిన్నోడు అమ్మ వీపు నిమురుకుంట అడిగిండు..

లేదు నానా.. గదేం లేదు.

ఊకో అమ్మా ఊకో అనుకుంట చెంపలమీది కన్నీళ్లను తుడవబట్టింది బిడ్డ.

అమ్మా.. నువ్వట్ల ఏడవద్దే.. నాకసలు కాలేజేవద్దమ్మా.. రేపటికాంచి నాన తోటి నేన్ సుత షాపుకు పొయ్యి రూపాలు సంపాయించి పట్కస్తనే. మీరిద్దరిట్ల లొల్లి పెట్కోకన్లే.. పెద్దోడన్నడు.
లేదు నానా మీరు మంచిగ సదువుకోవాలె. నాన కోపమచ్చినప్పుడు అట్లనే ఒర్రుతడు. మీరయన్నిపట్టించుకోకన్లి. నేనున్నకద నానా, మంచి కాలేజిల చేర్పిస్త. మిమ్మల్ని మస్తు మంచిగ సదివిపిస్త. మీరేం  రందిపెట్కో కున్లి బిడ్డా.. అమ్మ అన్నది.

వద్దమ్మా. మీరిట్ల లొల్లిపెట్కుంటే మాకు భయమైతాందమ్మా..

లేదునానా. ఏదో కోపంల అట్లనుకున్నం, మళ్ల రేపు కలిశిపోతం..గంతే… మళ్లింకెప్పుడు లొల్లిపెట్కోం బిడ్డ. మీరియన్ని పట్టించుకోకుంట మంచిగ సదువుకోవాలె. మాలెక్క మీరు కట్టాలు పడకుంట పెద్దపెద్ద నౌకర్లు చేసుకుంట మంచిగ బతకాలె నాన.

ఆ రోజు రాత్రి పిల్లలు పడుకున్నంక పుస్తెలుతాడు తీశి మొగనికిచ్చిందామె.

ఏందే ఇది? దిమాగ్ గిన ఖరాబైందా?

దీన్నమ్మి పైసలు పట్కరావయ్య. పొలగాని సదువుకైతయ్.

నీకున్నదే గదొక్క బంగారప్పోస. గదమ్ముమంటావ్?? అద్దద్దు. లోపట పెట్కో దాన్ని.

ఇప్పుడు పోరగాండ్ల సదువులు ముక్కెం గని బంగారాందేమున్నదయ్యా. పైసలున్నప్పుడు మళ్లెప్పుడన్న కొనుక్కుందాంతీ..

అరే.. అద్దంటే మళ్ల గదే మాటంటవ్. మీ నాయిన పావురపడి చేపిచ్చిన పుస్తెల అమ్ముకుంటావ్? అద్దద్దు. నేను మాపటీలే వాని ఫీజుకని పెద్ద సేటుకాడా ఇరువైవేల్రూపాలు మాట్లాడి పెట్టిన.. నాకాడ పైసలున్నయ్కని అది ఓరకు వెట్కోపో..

తెల్లారి పెద్దోడు కాలేజిల సైన్సుగ్రూపుల చేరిండు.

ఆ తర్వాత కొద్దిరోజులకే బిడ్డ పెద్దమనిషైంది. అప్పుడు మాత్రం అమ్మపుస్తెల – ఒకగొలుసూ, ఇంకో రెండు చిన్నగాజు లెక్క మారిపేంది.

***

చానేండ్ల తర్వాత మళ్లిప్పుడు చెట్లమీదికి యావమళ్లింది పిల్లలకు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పూత పూశి చిన్న చిన్న పిందెలుపడుతున్నయ్వాటికి. పెద్దోనిదిఈ యేడు డిగ్రీ అయిపొతది. మిగిలినిద్దరూ కాలేజిలకు పోతున్నరు. ఇప్పటికీ ఎవల క్లాసుల వాళ్లు ఫష్టే. రోజూ పొద్దుగాల లేవంగనే పిందెలు ఎంత పెద్దగైనయా అని సూశుడు అలవాటయింది పిల్లలకు. పెద్ద పెరిగిన చెట్లను సూశి అమ్మానాన్నలకూ సంబురంగనే ఉంది.

ఆ మధ్యలో సారి వాటికేదో రోగమచ్చి ఎండిపొయినట్టైతుంటే ఎవరో ఎరువుల డిపోదోస్తును పట్కచ్చి సూపెట్టి పిచికారి మందులేవో కొట్టిచ్చిండు నాన. అమ్మకూడా ఇప్పటికీ రోజూఎక్కడెక్కడికో పొయ్యి తట్టలల్ల పెండేరుకచ్చి వాటికేస్తనే ఉంది.. ఇద్దరూ నీళ్లు కడ్తనే ఉన్నరు.. ఆవాడల ఒకరిద్దరిండ్లల్ల అదే రోగమచ్చి రెండు మూడు చెట్లెండి పొయ్యి సచ్చి పొయినయ్  కనీ ఈడ వీళ్ళు వాటిని పాణంలెక్క కాపాడుకుంటచ్చుట్ల అయి బతికి ఇప్పుడిట్ల కాయలు కాశేదనుక అచ్చినై..

వేన్నీల్లకు సన్నీల్ల తోడన్నట్లుగ పెద్దోడు ఓ దిక్కుకూ సదువుకుంటనే ఇంకో దిక్కు ట్యూషన్లు చెప్పుడు షురూ చేషిండు. ఇంట్లో అడుగనవసరంలేకుంట అతని ఖర్చులమందం అతను సంపాయించుకుంటుండిప్పుడు.

అన్నను సూశి తమ్ముడూ, చెల్లేసుత సదువుకుంటనే చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పుడు షురూ  చేషిన్లు. వాళ్ళు ముగ్గురూ చానా బుద్దిమంతులనీ, మంచిగ సదువుకున్నరనీ చిన్నప్పటికెళ్లి ఆవాడలోల్లందరికీ ఎరుకే గనుక అందరు వాళ్ల పిల్లల్నివీళ్లదగ్గరికే ట్యూషనుకు తోలుడు షురూ చేశిన్లు. కొద్దిరోజులకే మంచిపేరూ, కొద్దోగొప్పో పైసలూ సంపాదించుకున్నరు పిల్లలు.

కొబ్బరిచెట్లక్కూడా ఈ యేడాదినుండే కాయలు మంచిగ కాస్తున్నయ్. ఇంట్లోల్లుఎన్నికాయలుతాగినా ఇంకిన్ని కాయలు మిగిలే ఉంటున్నయ్..అందుకే ఇంట్లకు కొన్నుంచుకోని మిగిలినవాటిని అమ్ముడు పెట్టిన్లు.. వాటినుంచిసుత వెయ్యి-రెండువేలరూపాలఆదాయం వస్తున్నదిప్పుడు.

***

అంత మంచిగున్నదనుకునేటంతల ఓ రోజు అనుకోకుండ ఇంటిమీది కచ్చిపడ్డడు  పెద్ద సేటు.

ఏవమ్మో. ఎవలున్నున్నరాఇంట్లె?

ఎవలయా? ఏంది..ఏంగావాలె?

మీ నాయినున్నడానయ?

లేడు షాపుకాడికి పొయిండు.

షాప్కాడ సూషిన, ఆడ ఔపడ్తలేడనే ఈడికచ్చిన.

ఏదన్న పనుండి ఔతలికి పొయిండు కావచ్చు. ఆణ్నే కూసోకపొయిన్లు అస్తడు కదా.

వారంరోలసంది గదేపని చేస్తున్నబిడ్డా. మీ నాయిన షాపుల పోరన్ని కూసోపెట్టి మాకు దొర్కకుంట ఎటెటోతిర్గుతాండు.

ఏంది ఏమైంది సేటూ? అమ్మబయటికచ్చిఅడిగింది.

ఏం లేదమ్మా. మీ ఆయన చాన రోలసంది గిరిగిరిమిత్తుల మీద మా కాడ మస్తు పైసలు బాకిలకు తీస్కున్నడు. మునుపు బకాయిలు మంచిగనే గట్టేటోడుకని నిరుటి సంది మాత్రం తీసుకునుడే తప్పితే  నయాపైససుత వాపస్ మా చేతికస్తలేదు. ఇగిత్తడు అగిత్తడనే ఇన్నిరోలసంది ఇంటి దిక్కు రాలే. సూశి సూశి యాష్టకచ్చేఇయ్యాలిగ ఇంటికచ్చిన.

ఎన్నిరూపాలు బాకున్నడు సేటూ?

అన్నికలిపి దగ్గెర దగ్గెర లచ్చరూపాలు.

ఆమాటినుడుతోనే గుండె మీన రాయిపడ్డట్టయ్యింది ఆమెకు.

సరే ఆయినచ్చినంక నేన్మాట్లాడుతనయ్యా. ఎంత జల్ది వీలైతె అంత జల్ది మీ బాకి తీరుస్తం.

నీ మాటిని పోతున్నమమ్మా. నెలరోజుల్ల మా బాకీ తీర్వాలె. లేకుంటె మాత్రం మంచిగుండదు చెప్తున్న. అనుకుంటెల్లిపొయిండు పెద్దసేటు.

సంసారం ఇప్పుడిప్పుడే సక్కగైతుందనుకునేటాల్లకు ఇట్లయ్యేసరికి ఒక్కసారిగ మస్తు ఏడుపచ్చింది ఆమెకు.

ఊకో అమ్మా.. నాన రానీ అసలేమైందో మాట్టాడుదాం అని ధైర్నమిచ్చిన్లు పిల్లలు.

సాయింత్రం నానింటి కచ్చిండు. పొద్దుగాల పెద్దసేటచ్చిన ముచ్చట నానకు చెప్పింది బిడ్డ.

నిజంగనే మన కప్పులున్నయానయా? అమ్మఅడిగింది.

ఏం మాట్లాడలే నాన.

ఏంది నానా సప్పుడు చేస్తలెవ్? మనకట అప్పులున్నయ? పెద్దోడడిగిండు.

పైసల ముచ్చట మీకెందుకురా? అయన్ని నేన్సూస్కుంట కదా.

అప్పులోల్లు ఇంటిమీదికచ్చి మమ్మల్నడుగుతాన్లు మరి.. కొద్దిగ గట్టిగనే అన్నడు పెద్దోడు.

నేన్పొయ్యి మాట్లాడుత.. మీరిగిది మర్శిపోన్లి. సరేనా. ఇంకోసారి రారు.

అప్పులోని ముచ్చట పక్కకు వెట్టు. అసలన్ని రూపాలు అప్పెందుకు చేశినవ్ నానా? మాకది జెప్పు నువ్వు ముందుగాల.  నిలదీసినట్టుగనే అడిగిన్లు పిల్లలు.

అయ్యన్ని ముచ్చట్లు మీకెందుకురా? నేన్ మీకు లెక్కలు చెప్పాల్నా ఇప్పుడు? ఏందో మీదిమీదికి లేశి మాట్లాడుతున్నరు? సువ్వర్ కే..  మళ్లనాతాన ఇంకోసారి ఆ ముచ్చటతేకున్లి చెప్తున్నా అనుకుంటనే రుస రుస బయటికి నడిశిండు నాన.

ఇదంత సూస్కుంట అమ్మ ఏడుస్తుందేకని నోరుతెర్శి ఒక్క మాటసుత మాట్లాడలే.

నానెప్పుడన్న వాళ్లను తిడుతాంటె వెంటనే ఆయినె మాటల కడ్డంపడి లొల్లిని మొత్తం ఆమె దిక్కుకు తిప్పుకుని పిలగాండ్ల మీద ఒక్క మాటసుతపడనియ్యకుంట సూస్కునేది అమ్మ. అసొంటి అమ్మ ఇయ్యాల నోరు మెదపకపోవుడుతోటి వాళ్లకు జరంత పరేషాన్ అనిపించినా అప్పు ముచ్చట నాననే న్సూస్కుంట, మీరిది మర్శిపోన్లి అన్నందుకు ధైర్నంగసుత ఉంది.
వాళ్ల సదువుల కోసం, కాలేజీ ఫీజుల కోసమే అతను అప్పు చేస్కుంటచ్చిండని ఆమెకు సమజైందికనీ పిల్లలకు సమజ్ కాలే. వాళ్లతోటి ఆ మాటంటే పిల్లలు బాధపడుతరని ఆ ముచ్చట ఎన్నటికీ చెప్పకుంట తమ కడుపులనే దాస్కున్నరు అమ్మా నాన.

అతనికి పనచ్చుకాబట్టి ఇంకేన్నైనా పనిచేసుకుని మంచిగనే బతకచ్చనే ధైర్యంతో ఉన్న షాపును, రిక్షాలను మొత్తం అమ్మి బాకీ అంత తేర్పిండు నాన. ఆ తర్వాత కొద్దిరోలకు ముందుగాల అనుకున్నట్టుగనే నామోషీ అనుకోకుంట ఓ పెద్ద సైకిలు షోరూముకు పొయి పనికి కుదిరిండాయినె. ఈ ముచ్చట్లెవ్వీ పిల్లలకు తెలువనియ్యలేకనీ ఒక్క బాకి తీరిందన్న ముచ్చట మాత్రమే వాళ్లకు చెప్పిండు.

హమ్మయ్యా. ఇగ మనకే అప్పులూ లెవ్వని హాయిగ ఊపిరిపీల్సుకున్నరు పిల్లలు. పిల్లల మొఖాల్లో సంబురంసూశే కడుపునిండింది అమ్మా నానలకు..

***

నిరుటికంటే ఈ యేడు చెట్లు ఇంకింత మంచిగ కాశినయ్. బిడ్డ పీజీల చేరింది. మగపిల్లలిద్దరి సదువులూ ఐపొయ్నౌకర్లు జెత్తాన్లు. పెద్దోడు అదే ఊళ్ల ఓ కాలేజిల లెక్చరర్లెక్కచేర్తె,  చిన్నోడు పట్నంల అదేదో కంపెన్ల ఇంజనీరు లెక్కచేరిండు.

నాన సైకిలు షోరూముల పనిచేసుకుంటనే పక్కకు చిన్నగ ఆయిలు బిజినెసుసుత నడిపిచ్చుకుంటాండు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయినింకా ఎక్కువ కట్టపడుతనే ఉండు. అమ్మింకా ఎక్కడెక్కడికో పొయ్యి చెట్లకు పెండతీస్కచ్చేత్తనే ఉంది. నాన నీళ్ళు కడుతనే ఉన్నడు.

బిడ్డకు పెండ్లి సంబంధాలు సూషుడు షురూ చేషిన్లు. పిల్లందంగనే ఉన్నాసుత కట్నాలెక్కువిచ్చుకోలేరని సంబంధాలు అచ్చినట్టే అచ్చి ఎనుకకు పోవట్టినయ్.

ఇంతల చిన్నోనికి నౌకరు మీద వేరే దేశానికి పొయ్యి పని చేశే ఔకాశమచ్చింది.

అటుబోతె ఈడికంటె ఎక్కువ జీతమస్తదమ్మా.

జీతానిదేముంది బిడ్డా, నువు కండ్ల ముంగటుంటెనే మాకుతృప్తి కొడుకా. ఇక్కన్నే ఉండరాదురా అడిగింది అమ్మ.

లేదే. కంపెన్ల వందల మందిల ఒక్కనికచ్చే ఛాన్సు నాకిప్పుడచ్చింది. ఒక్కసారి ఇసొంటి ఛాన్సు మిస్సైందంటే మళ్లిగ దొర్కదమ్మా. కాదనకే..

నువు బాగుపడితె నాకు సంబురమే కొడుకా. కని ఈడుంటె వారానికోసారన్నఅచ్చిపొతవాయె.  అటుపోతె మళ్లెప్పుడస్తవో ఏందో బిడ్డా.. నాకదేరందున్నదిరా..

ఎహే.. ఆడికి పొయ్యి ఆణ్నేఉంటమానే ఇగ? పొయ్యి ఒక రెండు మూడేండ్లు ఆడ నౌఖర్చేశినమంటే సాలు ఈడికచ్చి జిందగీబర్కూసోని తినేటంత కమాయించచ్చు. ఇంకెన్నడు పైసలకు ఇబ్బందిపడాల్శిన ఔసరమేరాదు మనకు. ఒప్పుకోవే ప్లీజ్..  గార్వంగ అడిగిండు చిన్నోడు.

సరేబిడ్డా. పయిలంగ పొయిరారా.. యాళ్లకు మంచిగ తిను కొడుకా.. అందరు కలిసి చిన్నోణ్ని సాగనంపిన్లు.

వాడు నాటిన చెట్టు మాత్రం ఇంటికాణ్నేఉన్నది. అదే వాని యాది క్కసూస్కుంటున్నరు అమ్మానాన..

***

ఇంకో యేడాదికి పెద్దోనికిసుత పట్నంల మాంచి పెద్ద కాలేజిల నౌకరచ్చింది.

చిన్నోడెట్లాగో బయటికిపొయిండు కదరా..కనీసం నువ్వన్నఇంటికాడుండరాదు బిడ్డా. బతిమాలినట్టుగనే అడిగిన్లు అమ్మనానలు.

పెద్ద కార్పోరేటు కాలేజిల ఉద్యోగమమ్మా. అది ఇక్కడి వేరం గాదే, ఎంట్రన్సు పరీచ్చలకు కోచింగిచ్చేకాలేజిల నౌకరంటే ఆషామాషీ కాదే. జీతం సుత ఈడికంటె పదివేలు ఎక్కువుంటదమ్మా..

ఇన్నేండ్లల్ల మిమ్ముల్ని డిశిపెట్టి ఎప్పుడులేం నానా. చిన్నోడొక్కడు లేకపోతెనే మస్తు బెంగవట్కున్నది. ఇప్పుడు నువ్వుసుత ఇల్లిడిశిపోతే మాకు కాల్రెక్కలిరిశినట్టైతది కొడుకా..
అరే నేనేడికివోతున్ననే? ఓరెండేండ్లు ఆడ పనిచేషొస్తేగాఎక్స్పీరెన్స్తోని ఈడ మంచి జీతానికితీస్కుంటరే. మళ్ల తప్పకుంట ఇటే అచ్చి సెటిల్ ఐత నేను.. మీరేం ఫిఖర్జెయ్యకున్లి. అయినా వారానికోసారి అచ్చిపోతనే ఉంటకద ఇంటికి. ఇంకెందుకే రందివడుడు.. ఒప్పుకోవే ప్లీజ్..  బతిమాలిండు పెద్దోడు.

సరే బిడ్డా. పయిలంగ పొయిరారా.. యాళ్లకు మంచిగ తిను కొడుకా..

పెద్దోడు చెప్పినట్టుగనే పాత కాలేజిల కంటే ఈడ ఎక్కువ జీతం. కాపోతే ఎత్తుకునే జీతానికి తగ్గట్టుగనే ఎక్కువ పని సుత ఉంటాంది. అందుకే వారానికోసారింటికత్తనన్నకొడుక్కు నెలకోసారి వచ్చెతందుకుసుత టైము దొర్కుతలేదు. పండుగలగో పబ్బాలకో కాలేజికి సెలువులిత్తే అప్పుడే ఇంటికి పెద్దోని రాకటా.. పోకటా..

వాడు నాటిన చెట్టు మాత్రం ఇంటికాణ్నేఉన్నది. అదే వాని యాది లెక్క సూస్కుంటున్నరు అమ్మానాన..

***

ఈ యేడు కొబ్బరి కాయలు నిరుటికంటే ఇంకా మంచిగ కాషినయ్. బిడ్డది పీజీ ఐపొయింది. పెద్దోడు, చిన్నోడు ఇద్దరు చెల్లె పెండ్లి కోసమని తలో ఇంత ఇంటికి పంపుతనే ఉన్నరు. అమ్మా నానలు కుడా పైసా పైసా కూడేశి, చిట్టీలు కట్టుకుంట, ఇన్నన్ని పైసలు జమచేశిన్లు. మొత్తం అందరి పైసలుకూడి సూత్తే ఇదివరకటికంటే పెద్దమొత్తమే అయినట్టనిపించింది అమ్మానాన్నలకు. మళ్ల సంబంధాలు సూశుడు మొదలు పెట్టిన్లు. యేటికేటికీ అన్ని వస్తువుల మీన రేట్లు పెరిగుతానట్టుగనే కట్నాల రేట్లుసుత బాగ పెరిగినయ్.

అయినా ఎట్లచేశి ఈ యేడు బిడ్డ పెండ్లి చెయ్యాల్శిందేనని తెలిసిన సుట్టాలకూ, దోస్తులకూ చానమందికే చెప్పి సంబంధాలెతకబట్టిన్లు అమ్మానాన. ఎందుకో తెలువదుకని యేడాదెతికినా మంచి సంబంధాలు దొర్కలే, దొర్కినవాటికి అంతంత కట్నాలు వీళ్లు ఇచ్చుకునేతట్టులేరు. ఇగ బిడ్డ పెండ్లి గురించి రందివట్కున్నది అమ్మా నానలకు..

ఆ రందిలుండగనే తెలిసిన సుట్టమొకామె అమ్మకు ఓ అయ్యగారి గురించి చెప్పింది. ఆయినె ఆ జిల్లా మొత్తానికే చాన ఖతర్నాక్ అయ్యగారట. ఎవలింటికన్న ఒక్కసారచ్చి సూశిండంటే వాళ్ల జాతకం మొత్తం చిటికెల చెప్పి, దోశాలు గీషాలు రెండు నిమిషాల్ల దొర్కవడుతడట. మనక్కావాల్నంటే శాంతి సుత చేశిపోతడత. ఇయ్యన్ని చేశినందుకు ఒక్క ఐదువేల్ రూపాల్ మాత్రం తీస్కుంటడట.  గంతే..

వామ్మో. ఇంటికచ్చి సూశినందుకు ఐదు వేల్ రూపాల? గా పైసల్తోని ఇద్దరు అయ్యగార్లచ్చి పెండ్లికే మంత్రాలు సదివిపోతరు గాదొదినె. అమ్మ జర యెనకకు తగ్గింది.
మరి బిడ్డ పెండ్లంటే ఉత్తగనే ఐతదా ఒదినె. ఇంట్లేదన్న దోషమో గీషమో ఉంటే అయ్యగారికి తెలుత్తదిగనీ మనకెర్కైతదా చెప్పు నువ్వే. మీరిన్నేండ్లెన్ని కట్టాలువడ్డరో నాకెర్కలేదా ఒదినే. బరాబ్బర్ ఈడ ఏదన్నొక దోషం ఉండే ఉంటది. నా ఎర్కల ఇప్పుడు పిల్ల పెండ్లికిసుత అదే అడ్డం వడ్తానట్టుంది. నా మాటిని గా ఐదువేలకు సూడక అయ్యగార్నిపిల్శి ఓసారి ఇల్లు సూపెట్టొదినే. ఏదన్న కీడుంటే సూశి శాంతి చేషిపోతడు. కీడేదన్నుంటె పొయ్యి అన్నా, నువ్వూ, పిలగాండ్లందరు సల్లంగుండాలనే చెప్తున్న ఒదినే. చెప్పాలనుకున్నదంత గుక్కతిప్పుకోకుంట చెప్పింది సుట్టం.

సుట్టమెల్లిపొయినంక మాపటీలి ఇదే ముచ్చట ఉన్నదున్నట్టుగ మొగనికి చెప్పిందామె.

దానియన్ని ఉత్తముచ్చట్లే. అయన్నీటిని నువ్వు పట్టించుకోకు. నేన్ మనకు ఎర్కున్నోళ్లకందరికీ చెప్పిపెట్టిన. అందరు ఎతుకుతనే ఉన్నరు. పెండ్లంటే ఇయ్యాలనుకుంటే రేపయ్యేటిదిగాదుకదా. మంచి చెడ్డలన్నీ ఇచారం చేసుకోవాల్నా వద్దా. అందుకే జరంత ఆలిశమైతది, అప్పటిదాంక ఓపికవట్టాలెగని ఇట్ల ఏగిరపడితె ఐతదా?

అది కాదయ్యా ఇప్పటికే ఆలిశం.. అనుకుంట ఏదో చెప్పబొయ్యింది ఆమె..

అరే.. ఏదెప్పుడు చెయ్యాల్నో నాకు తెల్సు.. నువు ఉత్తగ పరెషాన్ గాకు. నన్ను పరేషాన్ చెయ్యకు. కసురుకున్నడు మొగడు.

ఆ రోజంతా ఇదే ఆలోచించుకుంటున్నదామె. ఎంత యాదికి తెచ్చుకోవద్దనుకున్నా పొద్దుగాల ఒదినె చెప్పిన “దోషం-కీడు” అన్న రెండు మాటలే మాటి మాటికి మతికస్తున్నయ్.
తెల్లారింది.

పొద్దున లేశుడుతోనే దోషం-కీడు ఈ రెండు మాటలే మతికచ్చినయ్. వాకిలూడుస్తున్నా, అలుకు సల్లుతున్నా, బోళ్లు తోముతున్నా, చెట్లకు నీళ్లుపడుతున్నా, వంట చేస్తున్నా, బట్టలుతుకుతున్నా, తింటున్నా, పడుకున్నా, కూసున్నా, లేస్తున్నా.. ఏ పని చేస్తున్నా చెవుల్లో “దోషం-కీడు”, “దోషం-కీడు” అనే చిన్నగ సప్పుడినస్తుంది. అసల్ మనసు మనసుల లేకుంటయ్యింది.

పైసల్ పోతె పొయినయ్ గని అయ్యగార్నిపిలిపిచ్చి సూపిద్దామనుకునేదనుక మనసు నిమ్మళం గాలే ఆమె పాణానికి.

తెల్లరి సుట్టానికి చెప్పిపంపితే పొయి అయ్యగార్ని తోలుకచ్చింది.

జిల్లాలనే ఖతర్నాక్  అయ్యగారు ఇప్పుడు వీళ్లింటికచ్చి సూస్తుండంటెనే ఆమెకు పాణం తేలికపడి పిల్లకు పెండ్లి కుదిరినంత సంబురంగావట్టింది.

ఓ పావుగంట ఇంటిలోపటా, బయటా మొత్తం కలె తిరిగి సూశి లెక్కలుకట్టిండు అయ్యగారు.

ఇన్నేండ్ల సంసారంలో మీరు చానా కష్టాలను దాటుకుంటూ వచ్చారు కదా తల్లీ?

ఔనయ్యగారు.

మొత్తం ఎంతమంది పిల్లలమ్మా?

ముగ్గురన్లి.. ఇద్దరు కొడుకులూ, ఓ బిడ్డా.

ఆహా. మీ పిల్లలెవ్వరికీ ఇంకా పెండ్లిల్లు కాలేదు కదమ్మా?

ఉహు. కాలేదయ్యగారు.

సంబంధాలు కూడా దగ్గరిదాకావచ్చినట్టే వచ్చి కాకుండా పోతున్నాయి కద తల్లీ?

ఆ ఔనయ్యగారు. దండంబెడ్తున్నట్టుగా చేతులు జోడించి చెప్పిందామె. (అయ్యగారు మొత్తం కండ్లముంగట జరుగుతున్నది సూశినట్టే చెప్తున్నరనీ, ఆయినె చానా గొప్పోడని అప్పటికే మనసుల గట్టిగ ఖాయం చేస్కున్నదామె)

అదే..అదే! సమస్య నాకర్థమయ్యింది. ఇక్కడ ఇట్లనే ఉంటే మీరెన్నేండ్లు ఎన్నెన్ని సంబంధాలు సూశినా అవి కుదరవమ్మా. ఎప్పుడైనా కుదిరినట్టనిపించినా చివరి ఘడియలో కూడ వెనక్కు పోతయి సంబంధాలు.

ఇంట్లేదన్న దోషమున్నదా అయ్యగారు?

లేదమ్మా. ఇంట్లో ఏ దోషమూలేకుంట చక్కగున్నది. కాని ఆ బయట దక్షిణం వైపుకున్న మూడు కొబ్బరిచెట్లతోనే మీకిన్ని సమస్యలు.

ఆ చెట్లా? నమ్మలేనట్టుగ అడిగిందామె.

ఔనమ్మా. ఆ చెట్లతోనే మీకిన్ని కష్టాలు. అవే మీ పిల్లలకు సంబంధాలు రాకుంట అడ్డుపడుతున్నయ్.

మరి దోషమో, కీడో పోవాల్నంటే ఏంచెయ్యాలె అయ్యగారు? భయం భయంగ అడిగిందామె.

ఏమీలేదమ్మ. నేనొక మంచిరోజు చెప్తా. ఆ రోజు ఆ మూడుచెట్లను నరికివెయ్యాలి. అప్పుడు మీ దోషం పొయి పిల్లలకు మంచి సంబంధాలు కుదిరి పెళ్లిల్లు అవుతాయి. కష్టాలన్ని తీరి సుఖంగ బతుకుతరు.

ఆ మాటతోని నిట్ట నిలువునా కూలిపొయినట్టయ్యిందామె. ఏమన్న మాట్లాడుదామన్నా చానసేపు నోటికెంచి మాటరాలే.

ఆ చెట్లని మా బిడ్డల్లెక్కన పెంచుకున్నమయ్యా.. వాటిని నరుకకుంట దోషం పొయ్యేతట్టు ఇంకేదన్న పూజో, శాంతో చేశి మంత్రమేదన్నేశి పోన్లయ్యగారు, బాంచెన్.. మీకు పుణ్నెముంటది.. గుడ్లనిండ నీళ్ళుగారంగ కండ్లొత్తుకుంట అడిగిందామె.

ఆ చెట్లతోని మీకెంత అనుబంధముందో నాకర్థమయితుందమ్మా. కని మంచి సంబంధాలు రావాల్నంటె, పెండ్లిల్లు జరుగాల్నంటే మాత్రం గుండె ధైర్యం చేస్కోని చెట్లు నరకాల్సిందే తప్ప  ఇంకో దారిలేదు..

అయ్యో భగమంతుడా.. పెద్దగ ఏడ్సుడుపెట్టింది ఆమె.

చెట్లు నరికిచ్చేనాడు ఎవలితోటన్న చెప్పంపుతే పొద్దున్నేవచ్చి చిన్నగ శాంతి పూజ చేస్తా అని చెప్పి ఐదువేలు పట్కోని పొయ్యిండు అయ్యగారు.

మొగడొచ్చినంక అయ్యగారు చెప్పిందంత చెప్పి ఘొల్లుమని ఏడిశింది ఆమె.

ఇసంటి నప్పతట్ల ముచ్చట్లెవ్వో చెప్పి భయపెట్టిచ్చి పైసలుపట్టిత్తరనే నేను ఇయన్ని అద్దని చెప్పిన.  అయ్యగార్లను పిలుసుడెందుకూ, మళ్లిప్పుడిట్ల బాధపడుడెందుకు? కోపానికచ్చిండు మొగడు..

పోరగాళ్లకు పెండ్లిల్లయి పిల్లపాపల్తోని మంచిగుండాల్ననేగదనయా.. దోషాలేమన్నుంటె పోగొడ్తడనే అయ్యగార్ని పిలిషినగని ఇట్లం టడని  నాకెర్కనా. ఇంకా ఏడుస్తనే ఉన్నదామె..
ఊకో.. ఊకో.. దోషం లేదు గీషం లేదు. ఆటిని మనం పాణం లెక్కపెంచుకున్నది కొట్టేస్కునేతందుకానే? ఆ ముచ్చటే లేదు. సంబంధాల కొరకు నేన్ అన్ని తీర్ల కోశిష్ చేస్తనే ఉన్నా. దోస్తులకూ, సుట్టాలకూ అందరికి చెప్పి పెట్టిన అని ఇదివరకే చెప్పినగానే. అందరదే పని పెట్టుకోని సంబంధాలెతుకుతనే ఉన్నరు. వారం పదిరోలల్ల ఏదన్నొకటి మంచిది దొర్కుతదిలే.. పిల్ల పెండ్లి ధూం ధాముగ చేద్దాం. నువ్వేం ఫిఖర్ పెట్కోకిగ.. ఇనవడ్తాందా..  ఏడువకూకో.. ఓదార్చిండు మొగడు.

మొగని మాటలింటుంటే మంచి సంబంధం జెప్పన్నే ఖాయమైతదనే నమ్మకమచ్చి కొండంత ధైర్నమచ్చిందామెకు. అంతే, ఇగ ఏడుపాపి బయటికి పొయి చెట్లను చానసేపు తనివితీరా తడిమి తడిమి సూస్కున్నది..

***

వారం…. పది రోలు… ఇరువై రోలు… సూస్తుండంగనే మెల్ల మెల్లగ నెల గడిశిందిగనీ ఇంతవరకు ఒక్క సంబంధమూ దొరకలే. కండ్లు మూశి తెరిశినంతల ఇంకో రెణ్నెల్లు గడిశినయ్. ఈ రెణ్నెల్లల్ల ఒకటిరెండు దొర్కినట్టే దొరికినయ్కనీ జాతకాలు కలవకనో కట్నాలకాడ లెక్కలు కుదురకుంటనో అవిసుత ఎనుకకు మర్లిపెయినయ్.

మొన్నటిదాక ధైర్నంగనే ఉన్నా, మళ్లిప్పుడు చిన్నగ రంది మొదలైందామెకు. బయటకి కనపడనిస్తలేడుగని మొగనికిసుత అదే రందున్నది మనసుల..

ఇంతల ఓనాడు పొద్దున్నే సుట్టపామె అచ్చిందింటికి.

గా చెట్లకోసమని పొలగాండ్ల బతుకాగం చేసుకుంటవా ఏంది? ఇప్పటికే పిల్లకు ఇరువైఐదేండ్లు వడ్డయ్, ఇంకాలిశంచేస్తే వచ్చే సంబంధాలు సుత రావొదినే. ఇయ్యాల్టిదాంక ఆ అయ్యగారు చెప్పిందేదీ తప్పుకాలే. మంచిగ ఆయినె చెప్పినట్టిని గుండె ధైర్నంచేస్కోని చెట్లు కొట్టేయ్యున్లి, దోషం మొత్తం పొయ్యి సక్కని సంబంధాలు ఎతుక్కుంటస్తయొదినే. నా మాటిను ఈ ఒక్కసారికి. పిలగాండ్లూ, అన్న, నువ్వూ అందరు సల్లంగుండాలనే చెప్తున్నొదినా… చెప్పలనుకున్నది చెప్పి ఎళ్లిపొయ్యింది సుట్టపామె.

ఏంచేద్దామయ్యా? పక్క రూముల్నే చాయ్ తాగుకుంట టీవీజూస్తూ ఈ ముచ్చటంత ఇంటున్న మొగణ్ని అడిగింది.

నీ ఇట్టం.

నా ఒక్క దానిట్టమేందయా? ఏదన్నుంటే ఇద్దరికిట్టంకావాలెగని.

చెట్లు కొట్టకుంట ఇంకేదన్న శాంతి చేశుడో, పూజ చేషుడో కుదురుతదేమో అడుగపేనవోసారి. మనసులున్న మాట బయటవెట్టిండు మొగడు.

అయన్ని ఆ రోజే అడిగిన కని ఇంకేం చేసేతందుకు లేదట. మంచి రోజు సూశి చెట్లుకొట్టేత్తెనే దోషం పోతదన్నడు అయ్యగారు.

పచ్చటి చెట్లు కొట్టెషేతందుకు మంచి రోజు సూడాల్నటనా ఆయినెకు?? థూ..

కానీ నీ ఇట్టం మరి.

ఇంక ఆలిశం చెయ్యకుండ ఆమె అయ్యగారి దగ్గెరకురికితే రేపే మంచి మంచి రోజన్నడాయినె.

ఆ రోజంతా గడెకోసారి ఇంటిముంగటికచ్చి చెట్లను సూస్కోవట్టిన్లు మొగడు పెళ్లాలు.  పెండ్లానికి దుఃఖం  ఆగుతలేదు. పొద్దటికాంచి ఏడ్సుకుంటనే ఉంది. మొగడు ఏడువకుంట గంభీరంగ అట్లసూస్కుంట కూసున్నడంతే. అతను మనసులో ఏం ఆలోచిస్తున్నడో పెండ్లానికెరికే. ఎట్లైతేందీ పిల్లలు మంచిగుంటే అదే సాలని గుండె రాయి చేసుకున్నరు.  ఆ రాత్రి నిద్రపోలే వాళ్లిద్దరూ..

***

తెల్లారింది.

చెట్లకు మంచిగా నీళ్లుపోశి బిడ్డతోనిసుత పోపిచ్చి దండం బెట్కోమన్నరు.

అయ్యగారచ్చి చెట్లకు కుంకుంబొట్టువెట్టి మొక్కి ఎవ్వో మంత్రాలు సదివిండొక పదినిమిషాలు, సదువుడైపొయినంక ఆయినె సుత రాగి చెంబుతోటి నీళ్లుపోశిండు మూడుచెట్లకు.
ఇంట్లోల్లందరినీ మళ్లోక్కసారి చెట్లకు చివరిసారిగ దండంబెట్టుకోమన్నడు అయ్యగారు.

అంతే.. అప్పటిదనుక ఆపుకున్న దుఃఖం ఒక్కసారిగ కట్టలుతెంచుకున్నది.. చిన్న పిలగాన్నెత్తుకుని కావులించుకున్నట్టే చెట్టును కావులించుకున్నదామె.. మొగడు ఆపలే..
“ఇన్నేండ్లు మిమ్ముల మా పిల్లలే అనుకున్నం. మీ మూడు చెట్లూ మా ముగ్గురు పిలగాండ్లతో సమానంగనే సూస్కున్నం. వాళ్లను పావుర పడ్డట్టే మిమ్ములా పావురపడ్డం. మా చేతుల్తోని పెంచిన మిమ్ముల్ని మేమే తీసెయ్యాల్నంటే మాతోటైతలేదమ్మా, కనీ పిలగాండ్ల పెండ్లిల్లయి వాళ్లు పిల్ల పాపల్తోని సల్లంగుండాల్నంటే మిమ్ముల తీసెయ్యక తప్పదని అయ్యగారు చెప్పిండు. ఇన్నిరోలు అద్దంటె అద్దనే ఊకున్నంగనీ ఇప్పుడిగ తీసెయ్యకుంట తప్పేతట్టులేదు తల్లీ.. కడుపునిండ దుఃఖమున్నా తప్పనిసరై ఇంత పని చేస్తున్నం, తప్పుంటే మన్నించున్లి తల్లుల్లారా”… ఏడ్సుకుంటనే మనసుల దండంబెట్టుకోని క్షమించమని బతిమాలుకున్నరు మొగడు పెండ్లాలిద్దరూ..

గొడ్డలి మొదటిదెబ్బ ఇంటి యజమానులిద్దరు కలిసి కొట్టాలన్నడు అయ్యగారు.

అయ్యో భగవంతా… ఎన్ని పరీచ్చలు పెట్టవడ్తివి మాకు, ఆమె దుఃఖం పెరుగుతనే ఉంది. నేన్ అంతపని చెయ్యలేనయ్యగారు.  కండ్లొత్తుకుంట చెప్పిందామె..

మీ భర్త కొడ్తరుగనీ, మీరుత్తగ ఆయినె చేతికి మీ చేతిని ఆనించి ఉంచండమ్మా చాలు.

టాప్…                      టాప్…                      టాప్..
మూడు చెట్ల మీద మూడు దెబ్బలుకొట్టిన్లిద్దరు కలిసి. పుట్టెడు శోకం తప్ప ఇంకేది మిగులలేదక్కడ.

***

చెట్లు లేకపొయ్యేసరికి ఇల్లంతా కళ తప్పినట్టయ్యింది. అసలా ఇల్లు మాదేనాకాదా అనిపియ్యవట్టింది వాళ్లకు..  దోషం పొయినంక పెండ్లి సంబంధాల వేట ఇంకింత యేగిరం చేశిండు నాన. మళ్ళొక్కసారి దోస్తులకూ, సుట్టాలకు అందరికీ యాది చేశిండు. ఈసారందరికీ దోషం పొయిన ముచ్చటసుత కలిపి చెప్పిండు. కులపోల్లు చానామందికే ముచ్చట చెప్పి పెట్టింది అమ్మ. అన్నలిద్దరుసుత వాళ్ల దోస్తులందరికీచెప్పి చెల్లెకు సంబంధాలెతుకుడువెట్టిన్లు.

రావాల్సిన టైము రానే అచ్చింది. ఓ పదిహేను రోలల్లనే పిల్లకు మంచి సంబంధం ఖాయమైంది. పిలగాడు సక్కగున్నడు, మంచోడూ, మంచి నౌకరీ, మంచి కుటుంబం, వాళ్లందరికీ పిల్ల నచ్చింది, అందుకే కట్నంసుత ఎక్కువడగలే.  ఇంకేంది.. ముహుర్తాలు సూస్కోని అదే అయ్యగారి చేతుల మీదికెళ్లి రెణ్నెళ్ల తర్వాత ధూం ధాముగ బిడ్డ పెండ్లి చేషిన్లు.
ఆ తర్వాత కొద్దిరోలకే పెద్దోనికీ ఈ ఊళ్లెనె కొత్తగవడ్డ పేద్ద కార్పోరేటు కాలేజిల ఎక్కువ జీతంతోని మాంచి నౌకరచ్చింది. ఇప్పుడు పట్నంల చేస్తున్న కాలేజిలకంటే ఇక్కణ్నే ఎక్కువ జీతం. అందుకే తను మళ్లిక్కడికే అచ్చిండు.

చిన్నోనికిసుత ఆ దేశంల నౌకరి పర్మినెంటయ్యి జీతం పెరిగింది. ఈ మద్యనే కొత్త కార్ సుత కొనుక్కున్నడాయినె. ఎప్పటికి అక్కణ్నే ఉండేటందుకు పర్మిషనేదో అచ్చి అతనక్కడ మంచిగ సెటిలయిపెయిండు.

మంచి సంబంధాలు సూశి యేడాదివరకు పెద్దోనికీ, చిణ్నోనికి సుత పెండ్లిల్లు చేషి కోడన్లను తీసుకచ్చుకున్నరు అమ్మానాన. అప్పుడే బిడ్డసుత కడుపుతోని ఇంటికచ్చింది.
ఇల్లంత పచ్చని చెట్టోలిగె కళకళ్లాడుతుందిప్పుడు. ఎటుచూశినా సంబురమే, అన్ని దిక్కుల్ల ఆనందమే.

అంతమంచిగనే ఉన్నదిగని ఆ చెట్లుసుతుంటే ఎంతమంచిగుండేదో అని ప్రతిదినాము వాటిని యాదికి చేసుకుంటనే ఉన్నరు మొగడూ పెండ్లాలు. అవి మతికచ్చినప్పుడల్ల గుడ్లల్లకు నీళ్ళస్తనే ఉన్నయి.

***

సెలువులైపొయినయని చిన్నోడు పెండ్లాన్ని తీసుకుని తిరిగి బయలెల్లటానికి తయారైండు..

రెండేండ్ల తరువాత మళ్ళీడికే అచ్చి ఉంటా అంటివిగద బిడ్డా! ఈణ్నే ఏదన్న నౌకరుచూసుకుని ఉండిపోరాదురా. మంచిగందరం కలిశుండచ్చు.. ఆశగ అడిగింది అమ్మ.

నిజమేగని. అక్కడ ఇప్పుడిప్పుడే జర మంచిగ సెటిలైతున్నమమ్మా. వీసా సుత పర్మినెంటైంది. ఇగ ఈ టైములిటెట్లరమ్మంటవమ్మా. ఇంకో రెండుమూడేండ్లు ఆడుంటే ఇగ జిందగీ భర్ కూసుని తిన్నా సరిపోయేటంత సంపాయించుకరావచ్చు. కాదనకే ప్లీజ్..  గార్వంగడిగిండు చిన్నకొడుకు..

నాక్కుడా అక్కడ సెటిలవుడు ఇష్టంలేదత్తమ్మా.. ఆయినె చెప్పినట్టు ఓ రెండుమూడేండ్లు ఆడుండి మళ్లీడికే వాపసస్తం. మీరేం రంది పడకున్లి.. ధైర్నం చెప్పింది చిన్నకోడలు.

సరే బిడ్డా. పయిలంగ పొయిరాన్లిరా… యాళ్లకు మంచిగ తినున్లి బిడ్డా..  అందరుకలిసి చిన్నోణ్ని, కోడల్ని సాగనంపిన్లు.

ఇంకొన్ని రోలకు బిడ్డకు కొడుకుపుట్టిండు.  మళ్ల ఇల్లంత పసిపిలగాని నవ్వులు పూశి కళవడ్డది. కాని బిడ్డ ఏ నాటికన్న అత్తగారింటికి పోవల్సిందేకద! ఆ రోజూ రానే వచ్చింది.

అల్లుడచ్చి బిడ్డను తీసుకపొయిండు. పెళ్లి అంపకాలప్పుడు ఎంతేడ్శిన్లో మళ్లంతకంటే ఎక్కువ దుఃఖంతోటి సాగనంపిన్లు మనువన్నీ, బిడ్డా అల్లుల్లను..

ఇంకొన్ని నెల్లకు పెద్దకోడలు కడుపుతోని పుట్టింటికి పొయింది. సొంత బిడ్డలెక్క సూస్కున్న కోడలెల్లిపొయ్యేసరికి కాల్ రెక్కలాడలేదు ఆమెకు. పురుడైనంక పండంటి బిడ్డతోని మళ్ళింట్లకచ్చింది పెద్ద కోడలు. పసిపిలగాని నవ్వుల్తోని ఇల్లు మళ్ల పూలతోటే అయింది.

కొద్దిరోజులు గడిశినయ్. మనవడు పెరిగి పెద్దగైతాండు.

ఇంట్లున్నయి మూడు రూములే. రూములెంత పెద్దగున్నాసుత రెండు సంసారాలకు ఆ మూడు రూములు సాలక ఇల్లు ఇరుకుటమయినట్టనిపియ్యవట్టింది పెద్దోనికి. అదే ముచ్చట అమ్మతోనన్నడు అతడు.

ఇల్లు ఇరుకుటమెందుకైతుందిరా? మనం ఐదుగురుం ఇన్లనే ఉంటిమికద బిడ్డా. అమ్మ అడిగింది.

అప్పుడు మీరు ఐదుగురున్నా అదంత ఒకటే సంసారమత్తమ్మా, కని ఇప్పుడు ఇన్ల రెండు సంసారాలు నడవాలెకదా.. అందుకే ఇరుకుటంగున్నది.. పెద్ద కోడలన్నది.

ఇంకేదన్న పెద్దిల్లు కిరాయకు తీసుకోని అందరం అన్లకు మారుదామా? అమ్మ అడిగింది.

ఏం మాట్లాడుతున్నవ్. సొంతిల్లుంచుకోని కిరాయింట్లకు పోతావ్? అమ్మమీదికి కోపంచేశిండు నాన.

అంత పెద్దిల్లు తీసుకోవాల్నంటే కం సే కం పదివేల కిరాయుంటదే. గంత గంత కిరాయిలు మనతోటేడెల్తయే? అదంత కాని ముచ్చట. అందుకే మేమేదన్న రెండు మూడురూములున్న ఇల్లు కిరాయకు తీసుకోని అన్లకు పోతం. మీరీడ మంచిగ మనింట్లనే ఉండున్లే. పెద్దోడన్నడు.

ఒక్కూళ్లె ఉండుకుంట వేరుకాపురం పెట్టుడేంది కొడుకా? నా మాటిని అందరం ఒక్కకాణ్నే ఉందాం బిడ్డా.. కొడుకు, కోడల్లను బతిమాలినట్టడిగింది అమ్మ.

నిజమేకని. ఇల్లు సాలకుంటే మనమేం చేస్తమత్తమ్మా. రేపు మరిది వాళ్లో, మరదలు వాళ్లో వచ్చినప్పుడైనా పిల్లలతోని కలిసి ఇంతమంది ఈ ఇంట్లనే ఉంటే ఇరుకుటమిరుకుటమై మొసమర్రకుంటుండదా? అప్పుడగ్గనగల్ల ఏడికన్నురికి ఇల్లు సూస్కునే తట్టుంటదా అత్తమ్మా? మీరే చెప్పున్లి. కోడలన్నది.

కనీ మీరుసుత లేకుంటబోతే బెంగటిల్లుతం బిడ్డా. ఇంతింట్ల ఇద్దరమే ఉండాల్నంటే మాతోనైతదార?. ఎవల్లేకపోతె పురాగ మూలకు పడ్డట్టయితది కావచ్చు. పోను పోను పెద్దమడుసులైతాంటే ఆపతికో సోపతికో సూశేతందుకన్న దగ్గెరెవలన్న ఉండాలెకద బిడ్డా. ఈణ్నే ఉండిపోరాదున్లమ్మా బాంచెన్.. అడిగింది అమ్మ..

అరే నేనేడికివోతున్ననే? ఇదే ఊళ్లె ఉంటున్నకదా. ఊకె అచ్చుకుంట పోవుకుంటనే ఉంటం అందరం. మీకు ఎప్పుడు రాబుద్ధైతే అప్పుడచ్చి మాతానుండిపోన్లి. వేరే ఊళ్లుంటె కట్టంకని అందరం ఇదే ఊళ్ళుంటె ఇంక రాకట పోకటకు కట్టమేముందే. మీరేం ఫిఖర్ జెయ్యకున్లి. మేమూకె అచ్చికలుస్తనే ఉంటం. నువ్వేం రంది వెట్కోకు నేన్ చెప్తున్నగదా…. ఒప్పుకోవే ప్లీజ్..  బతిమాలిండు పెద్దోడు.

సరే బిడ్డా. పయిలంగ పొయిరాన్లిరా… యాళ్లకు మంచిగ తినున్లి బిడ్డా..  మనవన్నీ, కొడుకూ కోడల్నీ సాగతోలిన్లు అమ్మానాన..

పనిచేశే కాలేజికి దగ్గెరుంటదని ఇంటికి దూరంగ కొత్తిల్లు కిరాయికి తీసుకున్నడు పెద్దోడు.  ఇక్కడసుత పనెక్కువుండుట్ల అసలు రికాం దొర్కకుంటయింది అతనికి. అందుకే ఒక్కూళ్లె ఉన్నాసుత పండుగలకో పబ్బాలకో తప్పుతె ఇంటికి వచ్చిపోవుటానికి అస్సలు వీలు దొర్కుతలేదు వాళ్లకు.

***

పిల్లల్లేని ఇల్లు మొత్తానికే కళతప్పి సందడనేటిదే లేకుంట కూలిపోయిన చెట్టోలిగె ఐపొయింది.  మొగడూ పెండ్లాలిద్దరుకలిసి బతుకెక్కడైతే షురూ చేషిన్లో తిరిగితిరిగి మళ్లాడికే వచ్చినట్టనిపియ్యవట్టింది వాళ్లకు.. పొద్దుగాల లేశి బయటికి రాంగనే చెట్లుండే దిక్కుకు చూషినపుడు మిగిలిపొయిన చెట్ల మొదల్లు- “సమాధుల మీద నిలవెట్టిన పలకల”  వేరం అనిపియ్యవట్టినయ్. ఇంటిముంగటి జాగంతా బొండలగడ్డోలిగె అనిపియ్యవట్టింది.

కాలమెవరికోసమూ ఆగదు కదా.. చూస్తుండంగనే ఇంకిన్ని నెల్లు గడిశిపొయినయ్.. పిల్లలు యాదికిరాని క్షణమూ లేదు. వాళ్లను మరిశిపోయే క్షణమూ రాదు.
కొడుకులు నెల నెలా పైసలు పంపుతున్నరు, ఇప్పుడు చేతినిండా పైసలున్నయి. పిల్లలున్నప్పుడయితే చేతిల పైసలుంటే వాళ్లకు అదికొనియ్యాలే, ఇది కొనియ్యాలే అనుండేటిది కని ఇప్పుడు ఎవలకోసం ఆ పైసల్ ఖర్చుపెట్టాల్నో తెలుస్తలేదు. ఆమెకు చీరలు, నగల మీద ధ్యాసలేదు. అతనికి తాగాలె తిరగాలె జల్సాచెయ్యల్నన్న యావలేదు.

రోజులు గడుస్తున్నకొద్దీ ఇద్దరికీ చాతకాకుంట ఐతున్నది. దానికితోడు మోకాళ్లనొప్పులూ షురూ అయినయ్. ఆ నొప్పుల్తోని పావుగంట నడుశుడే గగనమైతాంది. తిండీ తినబుద్దైతలేదు. రోజుకోపూట వంటచేసుకుని పొద్దు మాపు అదే తిని ఊకుంటున్నరు మొగడూపెళ్లాలు. ఒక్కోనాడు అదిసుత వండుకునే ఓపికలేక ఉత్త తొక్కేసుకునే తింటున్నరు. పెద్దమడుసులైతున్నకొద్దీ పిల్లల మీద యావ ఇంతకింతకు పెరుగుతనే ఉంది. తట్టుకోలేక వాళ్లకు ఫోన్ చేశి ఓ వారం పదిరోలుండటానికి రమ్మంటే అటు కొడుకులకూ, ఇటు అల్లునికీ లీవు దొరుకుడు కట్టమనే సమాధానం..

పిల్లలను యాదికితెచ్చుకోని నిద్రపోని రాత్రులెన్నో.. తెల్లరగట్లెప్పుడో నిద్రపట్టినా నిద్రలసుత వాళ్లగురించే కలవరించుకుంట కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. ఒకరోజిట్లనే నిద్రవట్టకుంటే మబ్బుల్నే లేషి వాకిట్లకచ్చి కూసున్నరు మొగడూపెళ్లాలు. కండ్లెదురుంగ పురాగ ఎండిపోయిన కొబ్బరిచెట్ల మొదల్లు కనవడ్తున్నయి. చానసేపు వాటినట్ల సూస్కుంటనే కూసున్నరిద్దరూ.. కొద్దిగసుత సప్పుడనేటిదేలేకుంట కొన్ని గంటల నిశ్శబ్దం.. చీకటి పరదాల మడుతల్లనే వెలుగుకిరణాల జాడలున్నట్లు.. రాతిరి కొస్సకు ఉదయం పూశినట్టు… ఆ నిశ్శబ్దపు చెక్కట్లనుంచెళ్ళి మెరుపోలిగె ఒక ఆలోచన కదిలింది..

ఆమె లేశి చెప్పులేసుకుని బయటికి నడిశింది.

ఎటు పోతున్నవే అని అడగలేదాయినె.

***

ఏందీ? నూటయాభై రూపాలకొక్కటా? మరీ గంత పిరంజెప్తున్నవేందయ్యా..

పిరమెక్కడిదమ్మా నూటయాభయంటే చాన అగ్గువ..

ఒక్కటికాదు బాబు,  మొత్తం మూడుకొంటా. ఎంతకిస్తవో ఆఖరు మాట  చెప్పు. .
గదే ఆఖరమ్మా. నూటయాభై  రూపాలకొక్కటి. మీరు మూడు కొన్నా, ముప్పై కొన్నా గదే రేటు.  గంతే..

అబ్బా ఊకే ఒకటే మాట చెప్తున్నవేంది నాయినా, ఇచ్చే మాట చెప్పరాదు, మూడొందలకు మూడియ్యిగ.

లేదమ్మా నాలుగొందలయాభైకి ఒక్కరూపాయిసుత తక్కువ కాదు.

గిదంతకాదుగని లాష్టు మూడొందల యాభై తీస్కో కొడుకా.

అర్రే.. నాకే అంత అగ్గువపడదు గాదమ్మ. ఒక్కదానిమీద నాకు మిగిలేటియే ఇరువై రూపాలు. మీరింత బొత్తిలగ్గుంజి బేరంజేస్తే ఎట్లనమ్మా.! ఇంకో మాట చెప్పున్లి..

సరే మూడొందలెనుభై తీస్కో ఇగ గంతే.  ఇంగ మళ్ల ఎక్కువచెప్పకు.

ఉన్నవాటిలో మంచిగున్న ఓ మూడింటిని తీశి  ఆమె ఎదురుంగ పెట్టిండు పిలగాడు.

గిది మంచిగలేదు వేరేదియ్యి అని అండ్లనుంచి ఒకదాన్ని వాపసిచ్చిందామె.

దీనికేమైందమ్మా గింత మంచిగుంటే! అనుకుంటనే  దాన్నితీస్కోని  ఇంకో మంచిది తీశి ముంగట పెట్టిండాయినె.

నవ్వుకుంట నాలుగొందల రూపాలు అతని చేతులపెట్టి ఆ మూడిటిని కట్టలెక్క ముడేషి పట్టుకుని ఎనుకకు తిరిగిందామె.

ఏడికి పోవాల్నమ్మా? ఆటో అతను అడిగిండు.

గీన్నే రాం నగరుకు పోవాలె అని చెప్పి రేటడుగకుంటనే ఆటో ఎక్కి కూసున్నదామె.

ఆటోదిగి లోపటికచ్చేసరికి కొత్త మొలకలు నాటువెట్టుడుకోసం బొందలు తవ్విపెట్టుంచిండు మొగడు.

మొగన్ని సూశి నవ్విందామె. అతనుకూడా నవ్విండు..
పిలగాండ్లతో పచ్చగ కళకళ్లాడే పాత జీవితం మళ్ల షురూ ఐతదనే ఆశతో కొత్తమొలకలు నాటేశిన్లిద్దరుకలిసి….

***

 

(ఈ కథ ఊహించి రాశింది కాదు. ఇండ్లున్న పాత్రల్ల కల్పితమైంది ఒక్కటిసుత లేదు. ఉన్నయన్ని మనందరికీ ఎరుకున్నయే. ఇది అటు పేద్ద పట్టణాల్లోనూ, ఇటు చిన్న పల్లెటూల్లలోనూ కాకుంట “మధ్యరకపుఊళ్లల్ల” బతికే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబపు కథ. కథంత మనకిదివరకే ఎరుక. కాపోతే కథెక్కడ ముగుస్తుందన్నదే చాన మంది ప్రశ్న. బహుషా వాళ్లకు ఇదంత సదివినంక సమాధానం దొర్కుతదేమో! ఇది రాయటానికి స్పూర్తినిచ్చిన మా పెద్దమ్మ గోపతి కరుణ కు నిజంగ చాన ధన్యవాదాలు.)

దేవస్మిత

samanya1resize22/10/2004

ఇవాళ నా శరీరం పై పడిన దెబ్బలు ఎన్నో సారివో లెక్క తేలటం లేదు .  ఐదేళ్ళ   కాపురంలో నా వెదుకులాట దేనికో, అతని గింజులాట ఎందుకో. అనుకునే ఇవంతా జరుగుతున్నాయా?  చికాకుగా వుంది. చచ్చిపోవాలనిపిస్తోంది. దేవస్మితా చచ్చిపోతావా?మరి పిల్లల్నేం చేస్తావ్? నాకు నేనే వేసుకునే ఈ ప్రశ్నకు నాకు నేను ఏమని సమాధానం ఇచ్చుకోను?

10/12/2004

ఇవాళ అత్తమ్మ మాటల్లో మాటగా భోగం బుద్ధులు ఎక్కడికి పోతాయి అన్నది. విపరీతంగా కోపమొచ్చింది. చేతిలో ఉన్న మొబైల్ ని ఆవిడ మీదకి విసిరికొట్టాను. ఆవిడ దెబ్బని తప్పించుకున్నది. కానీ శశిధర్ చేతిలో నాకు దెబ్బలు తప్పి పోలేదు. నాలుగు గోడల మధ్యలో వున్నదాన్ని దెబ్బలెలా  తప్పించుకోగలను?

అమ్మా ఎంత గుర్తొస్తున్నావ్, నీమీద చాలా కోపమొస్తోంది. నీ నీడ నా  మీద పడనీయొద్దు అనుకున్నావ్ కదా? పాపం పిచ్చి అమ్మా ! నువ్వు నీడలా, నా వొంటి పైన పుట్టుమచ్చలా నన్ను వదలటమే లేదమ్మా…వేశ్యవి అమ్మా నాకు కథలు రాయడం రాదమ్మా, చెప్పడం కూడా రాదమ్మా లేదంటే నీకథ వింటే బండరాయి మా అత్త కూడా కరగాలేమో. కానీ అంతా ఉత్తిదే, బండరాళ్ళు ఎప్పటికీ కరగవు. అమ్మా!  నువ్వారోజు మీ పేద ఇంటి నుండి, మీ సంప్రదాయాల నుండి లేచిపోయి రాకుంటే నేనివాళ మంచి కుటుంబపు స్త్రీని అయి వుండేదాన్ని కదా, పోనీ నాకు జన్మనిచ్చిన మగాడు నిన్ను వదిలేయకుండా వుండి వుంటే, భాష తెలియని నగరంలో, దిక్కుతోచని దీనత్వంలో, ఆకలికి ఏడ్చే పసిబిడ్డ కోసమనో, మరే త్వరిత మార్గమూ లేకనో నువ్వు నీ శరీరాన్ని అమ్ముకోక పోయి వుంటే భోగంతనం నా ఇంటిపేరు కాకపోయేది కదా అమ్మా!

ఇవాళ మా మిషనరీ స్కూల్, హాస్టల్ బాగా గుర్తొస్తోంది.అది గుర్తొస్తే భయమేస్తుంది. అమ్మ ఎందుకు ఎప్పుడో ఏడాదికొకసారి మాత్రమే వస్తుంది? సెలవలలో వెళ్ళడానికి నాకో ఇల్లెందుకు లేదు? అమ్మ వున్నా నేను అనాధని ఎందుకవుతాను? ఇట్లా ఎన్ని ప్రశ్నలో. పాపం అమ్మ ఎంత బాధపడేదో. నా వత్తిడి భరించలేక తనుండే  వేశ్యా వాడకి తీసుకెళ్ళింది అమ్మ. ఆ వాడలో అమ్మ ఉంటున్న చిన్న గదిలో పరుపుపైన దగ్గరగా కూర్చోపెట్టుకుని  తన కథ చెప్పినప్పుడు అమ్మ వాడిపోయిన కళ్ళ నిండుగా ఊరిన కన్నీళ్ళు.  ప్చ్! ఆ కన్నీళ్ళు గుర్తొస్తే ఎంత బాధేస్తుందో. అమ్మ గది పరిశుభ్రంగా ఉండింది. గదిలో ఒక మూల అందమైన చెక్కడపు పూజామందిరం, ఆ మందిరంలో పతిత పావనుడు సీతా సమేత రాముడు. అక్కడున్న అందరూ అమ్మలా చీర కట్టుకుని లేరు, చాలా మంది చిన్న చడ్డీలతో, బ్ర్రాతో స్వేచ్చగా తిరుగుతున్నారు, చుట్టూ అంతటా మురికి, వచ్చిపోయే కస్టమర్లు. ఇంకా స్నానమైనా చేయని ఆ మురికి ఆడవాళ్ళతో యెట్లా రమిస్తారు? స్త్రీని కామించడానికి మగవాడికి ఏమీ అక్కర్లేదేమో, ఒక జననాంగమే చాలేమో!

అంతే ఆనాడు ఆ వాడలో కలిగిన భయం… ఆ రాత్రి అమ్మ పరుపుపైన ముడుచుకుని ముడుచుకుని, జుగుప్సతో, కలలో కలత నిద్రలో వొందల స్థనాలు పాములై సాగి సాగి, నన్ను చుట్టుముట్టి, నలిమి నుజ్జుచేసి, నా కన్నీళ్ళై…  ప్రభువా! జీసస్! నాయనా నాకొద్దీ కష్మలం, కల్మషం, వేలాంగాల వీర్యాలతో తడిసిన జననాoగాల వాడా సంచారం నాకొద్దు. జీసస్! జీసస్! రక్షించు. నేనే వారై, వారే నేనై … అంగమే అన్నమై కడుపులోకెళ్ళే స్త్రీలు నాకొద్దు జీసస్. జీసస్! కురిసే వాన చినుకులలో ఆకుల గొడుగు క్రింద అటుఇటు చంచలించే రంగు రంగు పిట్టలతో అందంగా, పరిశుభ్రంగా భద్రంగా వుండే ప్రపంచం కావాలి నాకు. పైన పరిగెడుతున్న మేఘాల్లా, ఆకాశం అంచున మిలమిలలాడే వెన్నెల్లా పరిశుభ్రత కావాలి. నన్ను పాపలా హత్తుకుని ప్రేమించే నీ లాటి భద్రమైన చేతులు కావాలి. అమ్మ వద్ద నుండి పారిపోవాలి పారిపోవాలి…. శశిధర్ నుండి అతని కుటుంబం చేసే అవమానాల నుండి పారిపోకపోవడానికి ఆరోజు నాలో కలిగిన ఆ భయమే కారణమేమో. లేదంటే మనిషిని మనిషి పశువులా కొట్టే హింసని తనేనాడైనా ఊహించిందా? పక్షినీ,పశువునీ, మనిషినీ సమంగా ప్రేమించే ధర్మం కదా తను నేర్చుకుంది.

కష్టపడి చదివి ఎయిర్ హోస్టెస్ వుద్యోగం సంపాదించి, అమ్మా రామ్మా నా వద్దకు రామ్మా అంటే అమ్మ ఏమన్నదీ, ”వద్దు బంగారూ నువ్వు మంచిగా పెళ్లి చేసుకోవాలి, సుఖంగా ఉండాలి, నేనొకదాన్ని ఉన్నానని మరిచిపో, ఎవరడిగినా అనాధనని చెప్పు.  పొరపాటుగా కూడా నా గురించి చెప్పకు,” అని. అలా చెప్పిందా తను శశిధర్ కి , లేక జీవితంలో నిజాయతీ ముఖ్యమనుకుందా?  శశిధర్ ఎంత మంచివాడు, ఎంత సున్నిత మనస్కుడు. శశిధర్ కి నిజమే చెప్పాలి తనని అంతగా ప్రేమిస్తున్నాడు కదా, వేశ్య కూతురినైనంత మాత్రాన వదులుకుంటాడా? అసలు వదులుకోడు! ప్చ్! ఎంత నమ్మకం. ఎంత నిజాయితీగా శశిధర్ కి ఆ సంధ్య వేళ ఏర్పోర్ట్ వెలుపలి కాఫీడే కేన్ కుర్చీల్లో ఒక మూలగా కూర్చుని వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది. అంతకంటే ఆత్మీయులు ఎవరున్నారు జీవితంలో, అందుకే పొంగి పొంగి వచ్చింది ఏడ్పు ఎంత ఆపినా ఆగిందా? కానీ దేవస్మితా నీతి, నిజాయతీ అనేవి అమాయకత్వానికి అక్కచెల్లెళ్ళు. అమ్మ అట్లాగే అమాయకంగా మోసపోయి కదా లేచొచ్చింది. అమ్మ కూతుర్ని నేను తెలివైన దాన్ని కాగలనా? ఏం చేసాడు శశిధర్. అతను చెప్పిన ప్రేమ, జీవితకాలపు బంధం అంతా వట్టి మాటలే. నా శరీర నగ్నత్వాన్ని, నా హృదయ నగ్నత్వాన్ని అనుభవించి పారిపోవాలనుకున్నాడు. మా అమ్మ నాన్నలు నాకు ఎదురు చెప్పరు అన్న నోటితోనే, వాళ్ళు వొప్పుకోవటం లేదు అనేశాడు. ఎందుకని? వేశ్య కూతురిననే కదా? అమ్మ పుడుతూనే వేశ్యగా పుట్టిందా? అనాధనంటే ఎందుకు ఇష్టపడ్డాడు. ఏ వేశ్యో కని  అనాధగా వదిలేసి ఉండకూడదా? అమ్మ బ్రతికి ఉండటమే అతని అభ్యంతరమా? వత్తిడి భరించలేక, చెప్పుకునే తోడు లేక అమ్మకి చెప్తే అమ్మ ఏం చేసింది. తన అడ్డు లేకుండా చేసింది. నిజంగా అనాధను చేసేసింది. అన్నేళ్ల కష్టాలను భరిస్తూ వచ్చి ఈ కష్టాన్ని భరించలేకపోయింది. ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య నారక్తంలో ఉందేమో లేకుంటే ఎందుకు ఊరికే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది నాకు? కుటుంబం వద్దనుకుంటే ఒక్క నిమిషంలో వదిలిపోయే హింస ఇదంతా,  కానీ ఎలా వదులుకోను?

03/03/2006

చిన్నీని, పాపని స్కూల్ నుండి తీసుకొస్తున్నాను. చిన్ని మధ్యలో పిజా తిని వెళ్దామన్నాడు. చేతిలో ఎప్పుడైనా డబ్బు ఉంటుందా! లేదు నాన్నా ఇంటికెళ్ళి నానమ్మనడిగి మనీ తీసుకుని తరువాత  వెళ్దామంటే వాడు ఊరుకున్నాడా ఒకటే ఏడుపు. చిరాకు పుట్టింది. తొడ పాశం పెట్టేసాను. వాడి ఏడుపు చూసి ఒకటే ఏడుపొచ్చింది. ఎన్నిసార్లడిగింది తను శశీని కొంత మనీ ఇవ్వు నాకు అన్నింటికీ మీ అమ్మనడగలేకున్నాను అని. అతను నా  పట్ల ఎందుకంత కఠినంగా  ఉంటాడు. ఔననో కాదనో చెప్పొచ్చు కదా. “అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన దానివి, నీకు పెద్ద వాళ్ళ విలువ ఎలా తెలుస్తుందిలే. కానీ అట్లా నీకు పర్సనల్ మనీ ఇవ్వడం కుదరదు ఏదైనా అమ్మనడిగి తీసుకోవాల్సిందే,” అన్నాడు. అతను అదే తరహాలో మాట్లాడతాడని తెలిసినా మనసు మళ్ళీ మళ్ళీ చిన్నబుచ్చుకుంటుంది ఎందుకనో, పోనీ వుద్యోగం చేయనీయోచ్చు కదా అంటే పిల్లల్నెవరు చూస్తారు? అతని తల్లినెవరు కనిపెడతారు.ఆడపిల్ల అంటే ఇంకో అర్ధం అడ్జెస్ట్ మెంట్ అనేమో. ఎంతకని సర్దుకుపోను? చాలా ఫ్రస్ట్రెటింగ్ గా అనిపిస్తుంది.

08/12/2007

అత్తమ్మ కూతురి దగ్గరకు వెళ్ళిపోయినప్పటి నుండి ఏవిటో ఒకటే దిగులు. ఎప్పుడు ఇంటినిండా మనుషులు ఉండాలనిపిస్తోంది. ఒంటరి బ్రతుకు కావడం చేతేమో ఇల్లంతా బోసిగా అనిపిస్తోంది. ఆవిడకి నేనంటే ఎంత ద్వేషమైనా ఆవిడ మీద కోపం రాదు. ప్చ్ అందరం ఆఫ్ట్రాల్ వొందేళ్ళు బ్రతికి చచ్చే మనుషులమే కదా. శశిధర్ మీద వున్న కోపం కూడా ఆవిడ మీద కలగదు నాకు. ఎందుకో బాగా ఒంటరిగా అనిపిస్తోంది.నిజమే నేను అనాథని.

10 /01/2008

ఇవాళ చాలా పెద్ద గొడవ జరిగింది.’జిన్నూ’ మాజీ ఎం ఎల్ ఎ  కొడుకుని కరిచింది. పసిబిడ్డ వాడిని కరవడం నిజంగా బాధే. కానీ వాడు దాన్ని ఎందుకు కొట్టాలి. వాళ్ళమ్మ  గొడవకు వచ్చింది. ఎంతచెప్పినా వినిపించుకోదే. చివరికి విసిగి ఇంట్లోకొచ్చి తలుపు వేసేయ్యగానే ఆవిడకి ఇగో దెబ్బతిన్నట్లుంది. కొడుకు చేతిలో కర్ర తీసుకుని సిటవుట్లో ఉన్న నిలువెత్తు యాక్వేరియంలు రెంటినీ పగలకొట్టేసింది. నేను తలుపు తీసుకుని వచ్చేలోపు వెళిపోయింది. నాకు గిర్రున తల తిరిగింది. ఎంత అహంకారం. తిని తిరగడం తప్పించి ఇంకోపని ఉండదు ఆవిడకి. డబ్బుందనే కదా ఆ అహంకారం. ఈవిడే కాదు ఈ లొకాలిటీలో ఉండే వాళ్ళంతా డబ్బుండే వాళ్ళే. వాళ్ళతో కలవడం కూడా అసహ్యం నాకు. కిట్టీ పార్టీలని వీళ్ళు కలిసి మాట్లాడేదంతా బూతులే. ఎవరు ఎవరితో పడుకున్నారు, ఎవత్తె  ఎవడితో వుంది ఇదే. ఐ హేట్ దిస్ లొకాలిటీ. శశిధర్ నాకు ఆత్మనూన్యత అంటాడు. నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నన్ను వాళ్ళతో కలవనీయటం లేదంటాడు. నేనెందుకు ఇన్ఫీరియర్ గా ఫీలవుతాను వాళ్లకి తెలియనన్ని, ఎప్పుడు వినను కూడా వినని పుస్తకాలు నేను చదివాను, సంగీతం తెలిసినదాన్ని, దేశాలను చూశాను, మనుషులని కలిసాను.  మొద్దు  మొఖాలు వాళ్ళతో నాకు పోలికేంటి. ట్రూలీ ఐ హేట్ శశిధర్. చేపలన్నీ కిందపడి గిలగిలలాడుతుంటే ఏడుపు ఆగలేదు.  గబగబ పరిగెత్తి బకెట్లో నీళ్ళు తెచ్చి అన్నింటినీ తీసి బకెట్లో వేసినా చిన్ని చిన్ని చేపలు నాలుగు  చచ్చిపోయాయి.  కోపం గిర్రుమని వచ్చి తల తిరిగింది. వాళ్ళింటికి వెళ్లి ఆవిడని బయటకి పిలిచి పాప టెన్నిస్ బాట్ తో యాక్వేరియం పగలకొట్టిన చేతిమీద ఒక్కటిచ్చాను. అందరూ గొడవకొచ్చేరు. ఇంటికొచ్చి తలుపేసుకున్నాను. శశిధర్ రాగానే కంప్లైంట్ చేశారు. చెయ్యి విరగకొట్టానని నా మీద కేసు పెడతామన్నారు. శశిధర్ నా ముఖం మీద వుమ్మేసి  తన ఖర్మ కొద్దీ దొరికానన్నాడు.

03/03/2008

ఈ రోజొక తమాషా జరిగింది. కోర్టుకి వెళ్ళానా, కోర్టులో ఒకతను కనిపించాడు. చాలా అందగాడు. మగవాళ్ళ అందాన్ని నేనెప్పుడూ గమనించలేదు. అలా గమనించాల్సిన అవసరం లేకుండానే అతను అందగాడని తెలిసిపోతోంది. కోర్టులో ఎవరికో దారి ఇవ్వడానికి వెనక్కి జరిగానా,  వెనకే వున్న అతనికి గుద్దుకున్నాను. బేలన్స్ చేసుకోలేకపోతున్న నన్ను రెండు చేతులతో పట్టుకున్నాడు. సారీ చెప్పి వెనక్కు జరిగాను. అలా జరిగేప్పుడు చూసుకున్నాను నేనతనికి సరిగా భుజాల వరకు వున్నాను. చాలా పొడవుగా ఉన్నాడు. నేనే జండా కొయ్యలా ఉంటానని అంటాడు కదా శశిధర్, బహుశా అతను ఆరుంపావు అడుగులు ఉంటాడేమో. అక్కడ ఉన్నంత సేపు అప్పుడప్పుడు అతన్నే చూస్తూ ఉన్నాను.

08/05/2008

ఇవాళ లాయరాఫీసులో మళ్ళీ అతను కనిపించాడు. పలకరింపుగా నవ్వాను . చేతులు కట్టుకుని నిల్చున్నవాడు ఆ చేతులు విప్పకుండానే ‘హాయ్’అని చేతివేళ్లు కదిలించాడు. ఏదో టెన్షన్ లా వుంది. నేను వెళ్లి అక్కడున్న సోఫాలో కూర్చున్నాను. కాసేపటికి అతను కూడా వచ్చి కూర్చుని అక్కడున్న మేగజైన్ చదవటం మొదలు పెట్టాడు. ఎందుకనో అతన్ని చాలా సార్లు చూశానని అనిపించింది.  అతనితో అదే విషయం చెప్తే, తనో కాలమిస్టునని, ఫలానా ఇంగ్లీష్ మంత్లీ లో  తన ఫోటో చూసి ఉండొచ్చునని చెప్పాడు. అప్పుడు జ్ఞాపకమొచ్చింది.  తన రీసెంట్ రైటింగ్ పైన నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అదే చెప్పాను, అతను శ్రద్దగా విన్నాడు. చివరిగా వచ్చేస్తూ ఏదో అడ్వర్టైజ్ మెంట్ లో చూపించినట్లు నా మొబైల్ కనిపించట్లేదు ఒకసారి రింగ్ చేస్తారా అనాలేమో. కానీ నాకు అబద్ధం చేతకాదు. ఎందుకో మిమ్మల్ని చూస్తే మీతో మాట్లాడాలనిపిస్తూ వుంది. మీరు చాలా అందంగా వున్నారు అందుకని అన్నాను. అప్పుడతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూసాను. కొంచమన్నా మార్పులేదు, సర్ ప్రైజ్. చాలా కేజువల్ గా చేయిచాచి కమల్ అగర్వాల్ అన్నాడు. నేను చేయి కలిపి దేవస్మిత అని నవ్వాను. మీ పేరు బాగుంది లైక్ యువర్ స్మైల్ అన్నాడు, అని మీ మొబైల్ కి రింగ్ చేసేదా అన్నాడు. ఇంటికొస్తున్న దారిలో నాకు నేనే నా ఆశ్చర్యం నుండి తేరుకోలేక పోయాను. యెందుకలా  ప్రవర్తించాను? అయినా నేను ఈ కాలపు అమ్మాయిని. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడటం తప్పేంటి? ఇదేం తప్పు కాదు నిజమే. కానీ, ఇంతకు ముందు నేనలా లేను కదా మరి.  మే బీ అయాం  ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ డెస్పరేషన్. ఫ్రాయిడ్ ని వెతకాలి.

16/08/2008

కమల్ తో బాగా స్నేహం కలిసింది. మాట్లాడేందుకు బోలెడు విషయాలు. కానీ అతను పైకి కనిపించినంత స్టేబుల్ కాదు. చాలా ఎమోషనల్. మార్వాడీ తండ్రికీ హిందూ తల్లికీ జన్మించాట్ట. అక్రమ సంతానం. మనువు ప్రకారం ఇతను ఏ చండాల కులంలోకి వస్తాడో.  విధిలేని పరిస్థితుల్లో తండ్రి అతన్ని అంగీకరించాట్ట అయినా తండ్రితో దాదాపుగా లేడు. సగం చదువు విదేశాలలో. తల్లీ, అతను. నేనో వేశ్య కూతుర్నని చెప్పాలనుకున్నాను. ఇష్టమనిపించలేదు. నా జీవితంలో ఇంకో మగాడ్ని నమ్మడమా? సమస్యే లేదు!

15/10 /2008

కమల్ ఇవాళ ఇంటికొచ్చాడు. నా పుస్తకాలు చూసి ఆశ్చర్యపడ్డాడు. అతని పుస్తక పరిజ్ఞానం నన్ను ఆశ్చర్య పరిచింది. ఆకర్షణా కలిగింది. ఇతన్ని చూపించి శశీతో చెప్పాలి. చూశావా అతనెంత చదువుతాడో అని. నువ్వేం చదవవు. ఎదుగూ బొదుగూ లేకుండా అక్కడే వున్నావు. నాకు ఏ ఆకర్షణ లేదు నీ పై అని. అప్పుడేం అంటాడు శశిధర. నవ్వొస్తుంది. ఏముంది బూతుల  మేళం మొదలెడతాడు.  కమల్ వచ్చేసరికి నా సంగీత సాధన జరుగుతోంది. అందుకని పాడమంటున్నాడేమో  అనుకున్నాను. కానీ కాదు.  అతనికి సంగీతమంటే పిచ్చి. హిందుస్తానీ, వెస్ట్రన్ బాగా తెలుసు. అందుకని త్యాగరాజ  కీర్తన ”రామ నీ సమానమెవరు రఘు వంశోద్ధారక/ భామ మరువంపు మొలక భక్తియను పంజరపు చిలుక /పలుకు పలుకులకు తేనెలొలుకు మాటలాడు…”పాడాను. పాడి ముగించగానే కళ్ళు విప్పార్చుకుని నన్ను చూస్తూ ఆ పాట అర్ధమేమిటో చెప్తావా అన్నాడు. యేమని చెప్పను, అన్యమెరుగని ప్రేమని భక్తి అంటారని చెప్పాను, ఇంకా యేవో చెప్పాను. అర్ధం చెప్పగానే లేచి నా రెండు భుజాలు పట్టుకుని గొంతుపైన ముద్దుపెట్టాడు. విదిలించి కొట్టి గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. అతనిపై నా భావమేంటి? నా పై అతని భావమేంటి? అతను అందంగా కనిపించడమంటే కామించానని అర్ధమా, విషయాన్ని ప్రేమించడమంటే ఆ సంబంధిత వ్యక్తిని ప్రేమించినట్లా, ఎందుకనో ఏడుపొచ్చింది. కాసేపాగి వచ్చి చూసేసరికి అతను లేడు.

22/10 /2008

కమల్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేసాను. మనసుకేం కావాలో ఏం వద్దో క్లారిటీ లేదు. తను మెసేజ్ పెట్టాడు ”దేవీ నేను చేసింది తప్పని నీకు తోచి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా చెప్పమంటావా ఐ నీడ్ యు వెరీ బాడ్లీ . అమ్మాయిలేం నాకు కొత్త కాదు. కానీ నువ్వు మాత్రం చాలా కొత్త. మనం ఇప్పుడు కావాలంటే విడిపోదాం, ఒక పదేళ్ళకి కలుద్దాం. అప్పుడు కూడా నా అభిప్రాయంలో మార్పు రాదు. నాకు నువ్వు కావాలి. ఇద్దరు పిల్లల తల్లిని ఇలా అడగడం న్యాయం కాదు కానీ అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా, పిల్లల్తో సహా నాతో వచ్చేయగలవా,” అని. మెసేజ్ చదవగానే తలతిరిగింది. ఓటిదో మోటుదో ఒక కుటుంబం వుంది కదా నాకు. దాన్ని వదిలేయమని ఎలా అంటాడు ఇతను. చిరాకేసింది.

28/10/2008

కమల్ నుండి చిన్న పలకరింపు కూడా లేదు. ఏమిటో ఒక చెడ్డ నిశ్శబ్దం. హృదయంలోనూ, భౌతికంగానూ. నేనెందుకీ వత్తిడి భరించాలి. అతనితో మాట్లాడి మందలించేయాలి. అమ్మాయిలు మగవాళ్ళతో  స్వేచ్చగానో, కొంచెం చనువుగానో  ఉండకూడదా.  ఛీ! అయినా నేనేంటి మరీ టిపికల్ విమెన్ లాగా ఇలాంటి డైలాగ్స్ చెప్పుకుంటున్నాను. తనకీ నాకూ మధ్య ఒక కెమిస్ట్రీ డెవలప్ అవుతుందని తెలియనంత చిన్న పిల్లనా? యేరు దాటాక, తుంగ బుర్రలా నాకటువంటి ఉద్దేశం లేదు  అని చెప్పాలా? అది ఆత్మ వంచన కాదా? ఛీ! చిరాగ్గా వుంది ఏవిటో. శశి రేపు వెళిపోతాడు కదా, అప్పుడు పిలవనా. అయినా నేనెందుకు పిలవాలి.

10/11/2008

పిల్లల్ని స్కూల్ లో  వదిలి వస్తుంటే ఎదురుగా వున్నషాపింగ్ మాల్ నుండి వస్తున్నాడు కమల్ . ఒక క్షణం నన్ను చూసి వెళ్ళిపోయాడు. ప్రేమ అన్నాడు కదా ఇదేనన్నమాట ప్రేమ. కోపమొచ్చింది. అతనికి ఫోన్ చేసాను. కానీ ఏం మాట్లాడాలో తోచలేదు, కట్ చేసి ఇంటికెళ్ళేసరికి ఇంటిముందు తన కారు.

17/02/2009

దేవస్మిత చెడిపోయింది. మామూలుగా చెడిపోతే పర్లేదు కానీ మనసా వాచా కర్మణా చెడిపోయింది. యెట్లా? రోజు రోజుకీ పెరిగిపోతున్న కాంక్ష.  ఎప్పుడూ తనతోనే వుండాలని, అతనితోనే చచ్చిపోవాలని, ప్రతిసారీ అతనంటాడు నాతో వచ్చేయవా అని. ముందూ వెనుకా ఎవరూ లేని దాన్ని వెళ్ళిపోతేనేం. కానీబాధేస్తుంది. పిల్లల్ని నాలానే చేయాలా? జీవితాంతం వాళ్ళమ్మని తల్చుకుని బాధపడాలా?

22/12/2009

ఇవాళ కమల్ ని శశిధర్ చూశాడు. ఊరికే చూడటం కాదు. నన్ను కమల్ ముందే దారుణంగా కొట్టడం మొదలు పెట్టాడు. కమల్ అడ్డమొచ్చాడు, కమల్ నీ కొట్టడం మొదలెట్టాడు. నాకు ఏడుపొచ్చింది కమల్ ని బయటకి నెట్టి  తలుపేసాను. శశిధర్ ముఖం పాలిపోయింది. నాకు  కొంచమన్నా సిగ్గుగానో వెరపుగానో అనిపించలేదు. పైపెచ్చు ఏదో సాధించినట్టు మనసుకి హాయిగా అనిపించింది. గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. పిల్లలొచ్చారని తలుపు తీశాను. అతను లేడు.

01/01/2010

శశిధర్ ఒక వారంగా ఇంటికి రాలేదు. ఇవాళే  వచ్చాడు అతను రాలేదని నాకు దిగులు కూడా అనిపించలేదు. కమల్ ప్రతి రోజు ఫోన్ చేస్తున్నాడు వచ్చేయమని. ఈ ఘర్షణ  క్రుంగదీస్తోంది వెళ్ళాలా వద్దా అని. పాప మెడ చుట్టూ చేతులేసి ఎంత మంచి అమ్మ మా అమ్మ అన్నపుడు ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది. మరి ఎలా వెళ్ళను?

ఈరోజు శశిని చూడగానే చిరాకేసింది. పిల్లలు నిద్రపోయాక నా పక్కన చేరాడు. ఏం నేను చాలలేదా? అమ్మ బుద్ధులు తలెత్తాయా? అంటూ ఏమిటేమిటో అన్నాడు. మీద పడ్డాడు. అది కామమా? ఇంకో మగాడిని ఇష్టపడుతున్నానని తెలిసీ అతనికి నా మీద కామమెలా సాధ్యమయింది? నెట్టినా గిల్లినా కొట్టినా వదలలేదు. ఆశ్చర్యమేసింది. వళ్ళు శుభ్రంగా కడుక్కుని వచ్చి,”నీకో విషయం చెప్పాలి శసి ఐ స్లెప్ట్ విత్ హిమ్ సో మెనీ టైమ్స్. మన మధ్య ఇక కాపురం అసాధ్యం,” అన్నాను. నిజానికి నాట్ మెనీ  టైమ్స్, కానీ అట్లా చెప్పాలనిపించింది. కమల్ తాకిన శరీరాన్ని ఇతను తాకకూడదనా? ఏమో!  ఏమైనా నేను డ్యుయల్ సిం కార్డ్ మొబైల్ ని కాదు. కర్మ చాలక వేశ్య అయిన అమ్మ కూతురినే కానీ వేశ్యని కాదు. అయినా ఈ లోకంలో వేశ్యలు లేరు. విటులు మాత్రమే వున్నారు. వాళ్ళు కొంతమంది ఆడాళ్ళని ఉపయోగించుకుని వేశ్యలని పేరు పెడతారు. అంతే. ఐ హేట్ మెన్. అతను తలకింద చేతులుంచుకుని అలాగే నగ్నంగా పడుకున్నాడు. అతని నగ్నత్వం జుగుప్స కలిగించింది. అతనేం సమాధానం ఇవ్వలేదు. వెళ్లి హాల్లో పడుకున్నాను. తెల్లారేసరికి అతనులేడు.

26/01/2010

రెండో తేదీ కమల్ ని పిలిచాను. విషయం వినగానే అతని ముఖంలో రంగులు మారాయి. రంగులు మారిన అతని ముఖాన్ని చూడగానే నాకు మనసులో నవ్వొచ్చింది. నేను ఇంకా కూడా శశీ భార్యనే. నన్ను తాకడానికి సర్వ హక్కులూ వున్నవాడు అతను. అట్లా కాదు నన్ను తాకనివ్వను అని నేనితనికి చెప్పానా? ఏవిటో చిరాగ్గా వుంది. ”మనం ఫారిన్ కి వెళ్దాం. నాకు జాబ్ ఈజీగా వస్తుంది, నేను లింగ్విస్ట్ ఎక్సపర్ట్ ని. గ్రీన్ కార్డ్ హోల్డర్ని,” అన్నాడు. నేను మాట్లాడలేదు. అతన్ని కౌగిలించుకుని కూర్చున్నాను అప్పుడొచ్చాడు శశిధర్. మళ్ళీ గొడవ. నాకు విపరీతంగా దెబ్బలు తగిలాయి. కమల్ నన్ను బయటకి తీసుకొచ్చాడు. నేను కమల్ తో వెళ్ళలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ ఊరెళ్ళే బస్సెక్కించమని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను. నేను కమల్ తో వెళ్లలేదని ఎలా తెలుసుకున్నాడో శశి జయంతికి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. జయంతికి అన్నీ తెలుసు పదిరోజులకు నన్ను తీసుకుని ఇంటికి బయల్దేరింది. నాకసులు క్లారిటీ రావటంలేదు. పిల్లలు ఒకటే గుర్తుకొస్తున్నారు. కమల్ గుర్తుకొస్తున్నాడు. ఊర్లో దిగగానే హోటల్ రూం తీసుకుని కమల్ ని పిలిచాను.జయంతి తో  కలిసి డిన్నర్ కి వెళ్లాం అర్దరాత్రి దాటింది. వస్తూ వున్న దారిలో చీకటి  పూసినట్ట్లున్న చెట్టుకింద కమల్ హట్టాత్తుగా నన్ను ముద్దు పెట్టుకున్నాడు. జయంతి పక్కనే వుంది.  అయినా అన్ని రోజుల ఎడబాటు నన్నతనికి అల్లుకునేట్లు చేసింది. కార్లో జయంతి ముభావంగా కూర్చుంది. మరుసటి రోజు ఇంటికెళ్లాం. శశి, జయంతిని చూడగానే ముఖం దుఃఖంగా పెట్టాడు. పెట్టడమే కాదు అతని కళ్ళలో నీళ్ళొచ్చాయి. జయంతి అతనితో, ”జరిగిందేదో జరిగి పోయింది రెండు  చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. స్మిత నాకు ఎప్పటి నుండో  తెలుసు. తను అలాటిది కాదు. మీరు  కూడా అది అనాధ అని అలుసు తీసుకుని , ఏం చేసినా అడిగే వాళ్ళెవరూ లేరని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. తను జీవితం లో చాలా సఫరయింది ఇంకా ఎంతకని బాధ పడగలదు.  ఇకనైనా బాగుంటే  మంచిది. మీరు ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు,” అంది. నేను  అక్కడినుండి లేచి వచ్చేసాను. ఏడుపొచ్చింది. చక్కటి కుటుంబాన్ని గురించి ఎన్ని కలలు  కన్నది తను. జయంతి చెప్పినా ఎవరు చెప్పినా గతం పునరావృతం కాగలదా? శనివారం జయంతి వెళిపోయింది.

8/4/2010

ఇప్పుడు శశి ఇంతకు ముందటిలా కాదు. ఎక్కడికెళ్ళినా పదే పదే ఫోన్ చేస్తాడు. అప్పుడు ఎన్ని సార్లడిగేదో తన, ఫోన్ చెయ్యవా రోజుకోసారన్నా అని. నీకులాగా నాకు పని లేదనుకున్నావా అనేవాడు. ఒక ఎయిర్ హోస్టెస్ గా ఒక పైలెట్ కి ఎంత పని ఉంటుందో తనకి తెలియదా? ఇప్పుడెట్లా సమయం దొరికింది? వెళ్తూ వెళ్తూ వేలకి వేలు టేబుల్ మీద పెట్టి వెళ్తాడు. కమల్ ప్రస్తావన అసలు రానీయడు. ఇది ప్రేమా? ఏమో నాలో ప్రేమ చచ్చిన తరువాత ఇతనిలో ప్రేమ మొదలయినట్లుంది పాపం. కానీ శశీ నీకోసం ఈ మనసు ఎంత తపన పడేదో. కలలొ నువ్వు తాకినా శరీరం పులకరించేది. నువ్వు విమానమెక్కిన ప్రతి సారీ నీకేమయినా అయితేనో అని వణుకొచ్చేది. అట్లా అయితే   గుండాగి చచ్చిపోతానేమో అనుకునేదాన్ని. ఒక వేళ  అట్లా కాకుంటే నీతో పాటూ ఆత్మ హత్య చేసుకుంటాను కానీ నిన్ను వదిలి బ్రతక గలనా అనిపించేది. నిన్ను  పిచ్చిగా ప్రేమించిన దేవస్మితని ఎంత పతనం చేసావు కదా? నా ప్రేమని పిచ్చి పురుగులా కాలికింద వేసి నలిపేసావ్. మళ్ళీ నువ్వు చెప్పినట్లు విని ఇంతకు మునుపులా నీ జీవితంలో ఉండడానికి నేను నువ్వు నడిపే విమానాన్నా శశీ?

24/05/2010

ఇక తనతో వచ్చేయాల్సిందే అన్నాడు కమల్. వెళ్లాలని నాకూ వుంది. శశిధర్ ని ఏం చెయ్యను? అన్నేళ్ళూ అతను నన్ను పెట్టిన హింసంతా ఏమయింది? ఇప్పుడింత సాత్వికంగా ఎలా వుండగలుగుతున్నాడు. అతని నిజ స్వభావం ఏది. ప్చ్! విసుగ్గా వుంది.

12/06/2010

ఈ రోజు కమల్ తో వుండగా అనుకోకుండా శశి వచ్చాడు. మళ్ళీ ఘర్షణ జరుగుతుందేమోనని చిరాకేసింది.  మీ ఇద్దరితో మాట్లాడాలి కూర్చోండి అన్నాను. ఆ క్షణం ఆలోచించేందుకు అవకాశముండి, ఆలోచించి  మాట్లాడి వుంటే ఏం మాట్లాడి ఉండేదాన్నో తెలీదు కానీ అప్పుడు మాత్రం చాలా మామూలుగామ, ”శశీ నాకు మీ ఇద్దరు కావాలి. పిల్లల కోసం, కుటుంబంగా నువ్వు కావాలి. ఎందుకంటె నా పిల్లలు నాలా బాధపడకూడదు. అట్లాగే  నా హృదయంలో హృదయం గా కమల్ కావాలి. నువ్వు లేకున్నా నేను బ్రతకగలను.కమల్ లేకుండా బ్రతకలేను. నేను కావాలని నీకు గాఢం గా  ఉంది కాబట్టి ఒకపని చేద్దాం, నేను ఇద్దరితోనూ ఉంటాను. మీ పెదనాన్నకి వున్న ఇద్దరు భార్యలు సర్దుకుపోయినట్లు మీ ఇద్దరు సర్దుకుపొండి, లేదా నేను కమల్ తో వున్నట్లు నీకు తెలియకపోతే ఎలా వుండేవాడివో అలా తెలియనట్లు వుండిపో. కానీ ఇకపై నన్ను కొట్టడం, తిట్టడం కుదరదు. అలాగే కమల్, నేను శశిధర్ తో వున్నా కూడా నువ్వు నాతో వుంటున్నావ్ కదా, అలానే ఇక మీదట కూడా ఉండు. ఒక ఇల్లు తీసుకో, నేను వస్తూ పోతూ ఉంటాను. ఇకపై నువ్వీ ఇంటికి రాకు. కానీ నువ్వు ఇంకొకర్ని పెళ్లి చేసుకోకూడదు. నాకోసమే ఉండిపోవాలి,” అన్నాను. నా మాట వినగానే కమల్ లేచి నా వైపు కూడా చూడకుండా వెళిపోయాడు. శశిధర్ సరేననో,  కాదనో చెప్పకుండా గదిలోకి వెళ్లిపోయాడు. నేనొక్కదాన్నే గదిలో మిగిలిపోయాను.

2/8/2012

నాలుగు దిక్కులూ
నేనే అయిన ఏకాంతంలో
నీ జ్ఞాపకాల బురదలో
దిగులు కమలం పూస్తుంది.
ఒక నాలో ఇంకో నేను
నా రహస్య దుఃఖాన్ని ఓదార్చుకుంటాను
దుఃఖాన్నీ నేనే
ఓదార్పునీ నేనే అయిన
దిగులు దారుల ప్రయాణంలో
జీవితం
తిరిగి తిరిగీ చిగురించే
వసంతం కానందుకు ఆనందం వేస్తుంది.
ఎంత దూరం నడిచినా
దారీ తెన్నూ దొరకనీయని
నిశ్చయ నిష్ఫల స్వప్నం
నీవు .
అయినా ఎదురుచూపును
వదులుకోదు మనసు, ఎందుకనో!
నువ్వు నాకోసం
దుఃఖాన్ని మాత్రమే కేటాయించావని
తెలిసి పోయాక
సందేహం కలుగుతుంది.
ప్రియ పురుషుడా!
నేను దేన్ని ప్రేమిస్తున్నాను
నిన్నా??? దుఃఖాన్నా????

వింతశిశువు / వేంపల్లె షరీఫ్

vintasisuvu

టిఆర్‌పి రేటింగ్స్‌లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న టీవీ చానల్స్‌లో మురళీ పనిచేస్తున్న వార్తా చానల్ కూడా ఒకటి. ఆవేళ పొద్దుటి డ్యూటీలో ఉన్నాడు. వార్తా విభాగంలో అతని ఉద్యోగం. ఆ షిఫ్ట్‌కి మురళీ ఇన్‌చార్జ్‌. ఆ షిఫ్ట్‌లో వచ్చే వార్తల ప్రాధాన్యతను నిర్ణయించి ప్రసారం చేయాల్సిన బాధ్యత అతనిదే. సమయం తొమ్మిది గంటలవుతోంది. కంప్యూటర్ ముందు కూర్చోని ఉన్నాడు. ఎదురుగా గోడకు టీవీ దుకాణంలో తగిలించినట్టు వరుసగా పది టీవీలున్నాయి.

కుడినుంచి ఎడమకు లెక్కేసుకుంటే మొదటి టీవీలో మురళీ పనిచేసే చానల్ ‘టీవీ `ఎక్స్’ వస్తోంది. చివరి టీవీలో ‘టీవీ`7’ వస్తోంది. ఇక మధ్యలో ఉన్న టీవీల్లో కూడా రకరకాల పోటీ చానల్స్ వస్తున్నాయి. ఒకసారి వాటివైపు చూశాడు మురళీ. ఉద్యోగంలో భాగంగా అప్పుడప్పుడు పోటీ చానల్స్‌లో ఏయే వార్తలు వస్తున్నాయో గమనిస్తుండాలి. నిజానికి గోడమీద అన్ని టీవీలు ఉంచిందే అందుకు. టీవీ7లో బ్రేకింగ్ వస్తోంది. ‘‘పశ్చిమగోదావరిజిల్లాలో వింత, తోకతో ఉన్న శిశువు జననం, వింత చూడ్డానికి ఎగబడుతున్న జనం’’

ఎర్రెర్రటి గ్రాఫిక్ ప్లేట్లతో తాటికాయంత తెల్లటి అక్షరాలతో టీవీ7లో వార్త నడుస్తోంది. ఓవైపు రిపోర్టర్ ఫోన్‌లో విశ్లేషణ ఇస్తున్నాడు. మరోవైపు బాక్సులో శిశువు దృశ్యాలు వేస్తున్నారు. శిశువు ఎర్రగా, సాయంత్రపు ఎండలో మెరిసే పూమొగ్గలా ఉన్నాడు. ఎవరివో రెండు చేతులు అతన్ని ఎత్తుకుని అతని వెనుక భాగాన్ని కెమెరాకు చూపిస్తున్నారు. పిర్రల దగ్గర కొద్దిగా, గోరంత చర్మం ముందుకొచ్చినట్టు కనబడుతోంది. ‘‘దీన్నే తోకంటూ కనిపెట్టాడు కాబోలు టీవీ7 వాడు..’’ గొణుక్కున్నాడు మురళీ. వెంటనే సీట్లోంచి లేచెళ్లి టీవీ ముందు నిలబడి కొంచెం వాల్యుమ్ పెంచాడు. ‘జన్యుపరమైన సమస్య వల్ల శిశువు అలా పుట్టాడని, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని, ఆపరేషన్ చేసి తీసేయొచ్చని, ఇదేం పెద్ద విషయం కాదని’ వైద్యులు చెబుతున్నట్టు రిపోర్టర్ తన విశ్లేషణలో వివరిస్తున్నాడు.

అయినా ఆ చానల్ వాళ్లకు అదేం పెద్ద పట్టడం లేదు. వాళ్ల శ్రద్ధంతా దాన్ని ఒక ఎనిమిదో ప్రపంచ వింత లాగ చూపడంపైనే ఉంది. మనసు చివుక్కుమంది అతనికి. ‘‘ఇంకాసేపుంటే ఆ శిశువు సాక్షాత్తు ఆంజనేయ స్వామి అవతారమన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు…’’  వచ్చి మళ్లీ కుర్చీలో కూలబడ్డాడు.

నిజానికి ఆ వార్త తన దగ్గర కూడా ఉంది. కానీ అతనే ప్రసారం చేయకుండా ఆపాడు. అలా ఆపడం పై బాసులకు తప్పుగా తోస్తుందని అతనికి తెలుసు. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని కూడా తెలుసు. అయినా అతనికెందుకో ఆ వార్తలో జనాసక్తి తప్ప జనానికి ఉపయోగపడే విషయం ఏమీ లేదనిపిస్తోంది. అందుకే ఎవడొచ్చి అడిగినా ఆ వార్తను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ మొన్న మధ్యాహ్నం షిఫ్ట్‌లో జరిగిన అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి అతనికి గుర్తుకొచ్చింది.

ఆ వేళ మురళీకి ` సబ్‌ఎడిటర్ రమాదేవికి పెద్ద గొడవ. వింతలూ ` విశేషాలు, ఆసక్తికరమైన వార్తలు రాసి టిఆర్‌పి పెంచే సబ్ ఎడిటర్‌గా రమాదేవికి మంచి పేరుంది. ఆ చొరవతోనే ఆమె ` ఇన్‌చార్జ్ అయిన మురళీక్కూడా చెప్పకుండా రిపోర్టర్ దగ్గరి నుంచి వార్త రాగానే దానికి కావాల్సిన హంగులూ, పొంగులూ, మసాలాలు అన్నీ దట్టించి టిఆర్‌పి యుద్ధానికి సిద్ధం చేసి ఉంచింది. అంతేకాదు ఆవార్త చాలా ప్రముఖమైందని హెడ్‌లైన్ పెట్టి ప్రసారం చేయాల్సిందిగా మురళీకి సూచించింది.

అసలే ఆదివారం. వార్తలు కూడా పెద్దగా లేకపోవడంతో రమాదేవి చెప్పిన తీరును బట్టి ఆ వార్త మీద ఆసక్తి కలిగి కంప్యూటర్‌లోనే ఫైల్ ఓపెన్ చేసి చూశాడు మురళీ.

‘‘ఇదీ కనీవినీ ఎరుగని వింత. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే జరుగుతోంది. అనంతపురం జిల్లా సోమందేపల్లికి చెందిన ఓ మహిళకు వరాహం  పుట్టింది. స్థానిక లక్ష్మీదేవి అనే మహిళ గత రాత్రి ప్రసవించింది. శిశువు వరాహం అవతారంలో ఉన్నాడన్న విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు దావానలంలా వ్యాపించింది. దీంతో జనం ఆ వింతను చూడ్డానికి బారులు తీరుతున్నారు…’’ ఇలా కొనసాగుతోందావార్త. మురళీకి చిరాకేసింది. మధ్యలోనే చదవడం ఆపేశాడు. ఈ జనానికి పెద్ద పనేమి ఉండదు. వింత అనే పదం వినపడితే చాలు బారులు తీరేస్తారు. ‘బొప్పాయిలో వినాయకుడని, కొబ్బరికాయలో అల్లా..’ అని రకరకాల నమ్మకాలు. వాటికి మీడియాలో ప్రచారం. ‘ఎందుకీ వార్తను పంపార’ని రిపోర్టర్‌ని అడిగితే ‘జనాసక్తి గల విషయం కాబట్టి పంపామ’ని బుకాయింపు. ‘‘అసలు ఆ ఆసక్తిని కలిగిస్తోంది ఎవరు? లేని ఆసక్తి రగిలించి జనాన్ని రెచ్చగొడుతోంది ఎవరు?’’ అని అడగాలనిపిస్తుంది అతనికి.

కానీ అడగలేడు. టీవీ మీడియాలో చేరినప్పటినుంచి అంటే సుమారు గత ఆరేళ్లుగా అతను ఇదే క్షోభను అనుభవిస్తున్నాడు. అంతకుముందు వివిధ పత్రికల్లో పనిచేశాడు. ఆయా పత్రికలకు కూడా కొన్ని సొంత ఎజెండాలున్నాయి. కడుపాత్రం కాబట్టి ఆయా ఎజెండాలకు తగ్గట్టు వార్తలు రాశాడు. పెద్ద బాధనిపించలేదు. కానీ టీవీ మీడియాలో చేరాక సామాజిక బాధ్యత ఉన్న వార్తల పట్ల కూడా ఆత్మవంచన చేసుకోవాల్సి వస్తున్నందుకు తెగ ఇబ్బంది పడుతున్నాడు. అలా అని ఉద్యోగం వదిలేయలేడు. పెరిగిన ఖర్చులు, సంసార భారం దృష్ట్యా తిరిగి పత్రికలో చేరి తక్కువ జీతానికి పనిచేయనూ లేడు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఇలాంటి రకరకాల వార్తలు వచ్చి అతనికినరకం చూపిస్తున్నాయి.

ఒక మహిళై ఉండికూడా ఈ వార్త పట్ల ఇంత ఆసక్తి చూపిన రమాదేవి మీద ఒకరకమైన అసహనం కలిగింది మురళీకి. కానీ ఆమేం చేస్తుంది? టీవీ మీడియా ఆమెను అలా మార్చేసింది. టీవీ మీడియాను మార్కెట్ శాసిస్తోంది. సొంత ప్రయోజనాలు శాసిస్తున్నాయి. రకరకాల ఎజెండాలకు లోబడి ఇక్కడ పనిచేయాలి. లేకపోతే మనుగడ ఉండదు. అందుకే మనుషులు అప్పుడప్పుడు తాము మనుషులమనే సంగతిని మర్చిపోతుంటారు. ఒకసారి రమాదేవి కూర్చునే కంప్యూటర్ వైపు చూశాడు మురళీ. ఆమె ఇంకా ఆ వార్తకు సంబంధించిన గ్రాఫిక్స్ ఏవో తయారు చేస్తోంది. రమాదేవి ఆ వార్త రాసేముందే ఒకసారి చూపించి ఉంటే అప్పుడే వద్దని చెప్పేవాడు మురళీ. కానీ ఇప్పుడు ఆ వార్తను దిద్ది అన్ని రకాల మసాలాలు దట్టించి సిద్ధం చేసిన తర్వాత వద్దంటే ఆమెకు కోపమొచ్చే అవకాశమే ఎక్కువ.

అందుకే ‘‘ఎలా ఈ ప్రమాదాన్ని నివారించాలా..?’’అని ఆలోచనలో పడ్డాడు. ఎందుకైనా మంచిదని ఒకసారి దృశ్యాలు చూడ్డానికి పక్కనే ఉన్న ఎడిటింగ్ విభాగానికి వెళ్లాడు. వరాహావతారంలో శిశువు పుట్టిందని వచ్చిన వార్త తాలూకు దృశ్యాలు చూపించమని అడిగాడు. వాళ్లు కంప్యూటర్‌లో ప్లే చేశారు. కళ్లముందు దృశ్యాలు కదులుతున్నాయి. అది ఇల్లో..గుడిసో.. చెప్పడం కష్టం. ఇంటి లోపలి వాతావరణం దిగులుగా, చీకటిగా ఉంది. కేవలం కెమెరా వెలుతురులో మాత్రమే ఆ దృశ్యాలను తీసినట్టు తెలుస్తోంది. ఒక పక్కగా శిశువు తల్లి . ఆమె తల్లి వయసున్న ఆడమనిషి మీద తలపెట్టి కూలబడింది. పక్కనే చాప మీద తెల్లటి వస్త్రం పరిచి పడుకోబెట్టారు ఒక చిన్నటి, నల్లటి ఆకారాన్ని. వస్త్రంపై ఆ ఆకారం మెల్లగా పురుగులాగ కదులుతోంది. కాసేపటికి పోల్చుకున్నాడు మురళీ ఆ ఆకారమే శిశువు అని. నిజమే శిశువు అందవికారంగా ఉంది. ఏది ముక్కో ఏది నోరో పోల్చుకోలేని పరిస్థితిలో ఉంది. కానీ వరాహం  మాత్రం కాదు.

‘‘వరాహావతారం అనేది కేవలం మీడియా, మీడియాలాంటి మనుషుల సృష్టి మాత్రమే. కడుపులో బిడ్డ పెరిగేటప్పుడే ఏదో తేడా జరిగింది. అసలే చదువులేని మనుషులు. ఎప్పటికప్పుడు డాక్టరు దగ్గరికెళ్లి ఏ నెలకానెల కడపులో బిడ్డ ఆరోగ్యం,పెరుగుదల గురించి తెలుసుకోవాలని తెలియనివాళ్లు. తెలిసినా చూపించుకోవడానికి డబ్బు లేనివాళ్లు.’’ అతనికి బాధేసింది. ‘‘పాపం ఆ తల్లి ఎంత క్షోభ అనుభవిస్తోందో?’’ అనుకున్నాడు. అంతలో శిశువు ఆకారంపై ఉన్న కెమెరా మెల్లగా కదిలి ఆ మాతృమూర్తి ఉన్న వైపుకు తిరిగి జూమ్ అయ్యింది.

ఇందాక పక్కనున్న మనిషిమీద తలపెట్టి కూలబడ్డ తల్లి ఇప్పుడు ఏడుస్తోంది. ‘‘ల్యాక ల్యాక పుట్టిండెనే సామి ఈ బిడ్డ. ఇట్ట పుట్టించినావేమిట్రా దేవుడా. నేనేం తప్పు చేసినాను సోమి. అడిగినోళ్లందరికీ పెట్టినదాన్నేనే. ఇప్పుడేం జెయ్యాల. ఇట్ట జరిగిండేదానికేనా ఇన్ని అగసాట్లు పడింది? ఇన్నినొప్పులు బరించింది? నా రాతెందుకు ఇట్టుండాది రా నాయనా.. ! ఏం చేయాల్ల ఈ పిల్లను? ఆడకూతురే. ఎట్ట పెద్ద చేయాల్రా దేవుడా..?’’ దీర్ఘాలు తీస్తోంది. కడుపు మీద దబాదబా గుద్దుకుంటోంది. ఇక ఆ దృశ్యాలను చూడలేకపోయాడు మురళీ. వాటిని తీసిన రిపోర్టర్ మీద, కెమెరా మెన్ మీద కోపమొచ్చింది. ‘‘అయినా వాళ్లదేం తప్పు? ఆ వార్తను తీసుకురాకపోతే వాళ్ల ఉద్యోగం పోతుంది. వాళ్ల బాధ్యతను వాళ్లు నిర్వర్తించారు. ఇలాంటి వార్తల్ని ప్రముఖంగా ప్రసారం చేసి వారితో ఇలాంటివాటిని తెప్పిస్తున్న మార్కెట్ మాయాజాలానిది తప్పు?’’ మౌనంగా వచ్చి అతని స్థానంలో కూర్చున్నాడు. మనసంతా దు:ఖంగా ఉంది.

ఓ నిమిషం పోయాక తేరుకుని ‘‘రమాదేవీ, తల్లి మాట్లాడింది విన్నావా?’’ అన్నాడు అటువైపు తిరిగి కూర్చోనున్న ఆమెతో.  ‘‘విన్నాను.. బ్రహ్మాండంగా మాట్లాడింది కదా..’’ అంది రమాదేవి. మురళీకి ఏం చెప్పాలో తెలీలేదు. అంతటి విషాదంలో కూడా ఓ నవ్వు మొహం పెట్టాడు. అలా నవ్వాలి. అదే నాగరికత. అవతలివాడిని దవడ పగిలేలా కొట్టాలనిపించినా కొట్టకుండా పళ్లు ఇకిలించాలి. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ‘నాయకత్వ లక్షణాల’ పేరుతో ‘వ్యక్తిత్వ వికాస’ కోర్సుల్లో చేరి, నేడు యువత నేర్చుకుంటోంది ఇదే. ఆ విద్యే అతనూ నేర్చుకున్నాడు. కానీ ఎంత నేర్చుకున్నా మొహానున్న నవ్వుకి జీవం మాత్రం తీసుకురాలేక పోతున్నాడు. ఇక తప్పదనుకుని కొంచెం కఠినంగానే ‘‘ఆవార్త ప్రసారం చేస్తే బాగోదు. హెడ్‌లైన్ వద్దు. వార్త కూడా వద్దు,’’ అన్నాడు. మురళీ అనుకున్నట్టుగానే రమాదేవికి మండిరది. ‘‘వేరే ఇన్‌చార్జ్ ఉంటే చక్కగా నేను రాసిన వార్తలు పెట్టుకుంటాడు. నువ్వేంటి ఎప్పుడూ ఏది రాసినా ఇది అవసరం లేదు..అది అవసరం లేదు అని లాజిక్కులు మాట్లాడతావ్..’’ అంటూ అరిచిందా పిల్ల.

అందరిముందు అలా అరవడం మురళీకి కొంచెం అవమానంగా అనిపించినా నిబాయించుకున్నాడు.

‘‘ఒకసారి నువ్వే ఆలోచించు. అసలే ఇలాంటి బిడ్డ పుట్టిందేంటా.. అని ఆ తల్లి బాధలో ఉంటే మనం ఆ వార్త వేసి ప్రచారం చేస్తామా? టీవీలో వార్త చూసి ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్లంతా ఆమె ఇంటి ముందు క్యూ కడతారు. అది అవమానంగా భావించి ఆమె ఏమైనా చేసుకుంటే? అసలు ఆ వార్త ఇవ్వడం వల్ల ఎవరికిప్రయోజనం? అందులో ఆ పుట్టిన పాప వికారంగా ఉందేమో కానీ వరాహంలా లేదు. ఉత్తినే ఆమె కడుపున ‘పంది’ పుట్టిందని ఎలా వేస్తాం. అలా వేస్తే ఆ తల్లికి ఎంత నరకం?’’ ఇంకా ఏదో చెప్పబోయాడు మురళీ. ‘‘మరి టిఆర్‌పిలు.. టిఆర్‌పిలు అని మా ప్రాణాలు తీస్తారెందుకు?’’ అంది రమాదేవి అడ్డుకుని కఠినంగా. ‘‘నిజమే. పై వాళ్లు అలాగే ప్రాణాలు తీస్తారు. మనమే కొంచెం విచక్షణ ఉపయోగించాలి. మన పరిధిలో ఉన్నంతవరకైనా ఇలాంటి వార్తలు ఆపుదాం,’’ అన్నాడతను నచ్చచెబుతున్నట్టుగా.

ఏమనుకుందో ఏమో తర్వాత ఏం మాట్లాడలేదు రమాదేవి. కానీ ఎక్కడో అతనిలో ఓ చిన్న అనుమానం.

‘‘ఒకవేళ రమాదేవి ఈ విషయాన్ని పై వాళ్లతో(బాసులతో) చర్చించి పెద్దది చేస్తే ఏం చేయాలి?’’ అని. అందుకే మంచో చెడో..దానికి తగ్గ సమాధానం కూడా ఒకటి సిద్ధం చేసి ఉంచుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఈ వార్త మీద తర్వాత ఎలాంటి చర్చ జరలేదు. ఆరోజు గండం అలా గడిచిందనుకుంటే మళ్లీ ఇవ్వాళ టీవీ7 వాడి రూపంలో మరో గండం వచ్చి పడింది. అది అసలే నెంబర్ వన్ చానల్‌. అది ఆ వింత వార్తను పట్టుకుని అలా గింజుతుంటే మిగతా వాళ్లుకూడా అదే బాట పడతారు. అసలే టీవీ మీడియా ‘గొర్రెల మంద’ లాంటిదంటారు. ఒకరు ఒక వార్తను పట్టుకుని హడావిడి చేస్తే మిగతావాళ్లు కూడా దాన్నే పట్టుకుని లాగుతారు. అందులోని మంచి చెడుల గురించి ఆలోచించరు. అందరూ హడావిడి చేస్తే ఇక తనక్కూడ ఆ వార్తను ప్రసారం చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అందుకే అతనికి గుండెల్లో గుబులు గుబులుగా ఉంది. మనసంతా కీడు శంకిస్తోంది. అన్నట్టే కాసేపటికి డెస్కులో అగ్గి రాజుకుంది.

‘‘వార్త మనకొచ్చి అరగంటైనా మనవాళ్లు బ్రేకింగ్ వేయలేదు. టీవీ 7 వాడు ఆడుకుంటున్నాడు’’ అని లేసింది ఓ గొంతు.

వెనక్కి తిరిగి చూస్తే శ్రవణ్‌. అతను న్యూస్ కో ఆర్డినేటర్‌. ఏదైనా వార్త చానల్‌కి రాకపోతే అతనే దగ్గరుండి తెప్పిస్తాడు. ఒకవేళ వచ్చి కూడా ప్రసారం కాకపోతే ఇలాగే అరుస్తాడు. అతన్ని చూడగానే మురళీకి గుండె గుభేలుమంది. మొన్న వైజాగ్ బీచ్‌లో ముగ్గురు పిల్లలు కొట్టుకుపోయారు. వాళ్ల శరీరాలు దొరికాయి. ఆ దృశ్యాలు అందరికన్నా ముందుగా తెప్పించాడు శ్రవణ్‌. కానీ కాస్త అటు ఇటుగా ఇతర చానల్స్‌కి కూడా ఆ దృశ్యాలు వస్తాయి. దొరకని, దొరకడానికి వీల్లేని దృశ్యాలైతే కాదు. కానీ శ్రవణ్ ఒకటే హడావిడి. దేశంలోనే ఒక పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టినట్టు.. గోల. ఆ శవాల దృశ్యాల మీద ‘ఎక్స్‌క్లూజివ్‌..మార్కు’ వేయమని ఒత్తిడి.

‘‘బిడ్డలు నీటిలో మునిగి చచ్చిపోయి ఆ తల్లులు పుట్టెడు దు:ఖంతో ఉంటే మనకోసమే చచ్చిపోయినట్టు ఆ దృశ్యాల మీద ఎక్స్ క్లూజివ్ వేయడం నైతికం కాదు,’’ అన్నాడు మురళీ కటువుగా. అనడమే కాదు ‘ఎక్స్ క్లూజివ్ మార్కు’ వేయకుండానే ఆ దృశ్యాలను ప్రసారం చేశాడు. అది మనసులో ఉంచుకున్నాడు శ్రవణ్. దానికి తోడు ఇప్పుడు మళ్లీ ఆజ్యం పోస్తే భగ్గుమంటాడు.

అందుకే `‘‘శ్రవణ్ అది అస్సలు వార్తేనంటావా?’’ వీలైనంత ప్రశాంతంగా అడిగే ప్రయత్నం చేశాడు మురళీ . ‘‘వార్తో…కాదో ముందు టిఆర్‌పి. టీవీ7 వాడు అంతలా ఆడుకుంటుంటే నేనేదో గాడిదలు కాస్తున్నాను ఆఫీసులో అనుకుంటారు అందరూ. వెంటనే వార్తను ఎక్కించు. ‘ఎక్స్‌క్లూజివ్’ అని వేయ్., ‘ఫస్ట్ అన్ `టీవీఎక్స్’ అని వేయ్. ‘వాటర్ మార్కు’ వాడు. ‘ఫుల్ ప్లేట్‌్ బ్రేకింగ్’ కొట్టు.’’ `తనకు తెలిసిన విద్యలన్నీ చెప్పి గగ్గోలు పెట్టాడతను. మురళీకి చిరాకేసింది. కానీ అంతలోనే అతని మీద జాలి కూడా కలిగింది. ఆ వార్తను ప్రసారం చేయకపోతే తెప్పించలేదనుకుని శ్రవణ్‌ని మేనేజ్‌మెంట్ తప్పుగా అనుకునే అవకాశం ఉంది. అది అతని ఉద్యోగానికే ప్రమాదం. శ్రవణ్ హడావిడిలోనూ అర్థముంది. ఆలోచించాడు మురళీ. మెల్లగా శ్రవణ్‌కు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

‘‘సరే శ్రవణ్.., ఆ వార్తను నేనే ప్రసారం చేయకుండా ఆపాను. ఎవరైనా నిన్ను అడిగితే నా పేరు చెప్పు? నీ మీద వేసుకోవద్దు,’’ అన్నాడు.

శ్రవణ్ అప్పటికి ప్రశాంతంగా ఉన్నట్టే అనిపించినా పక్కకెళ్లి ఫిర్యాదు చేశాడని మురళీకి ఈజీగానే అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు అతని ల్యాండ్ లైన్ ఫోన్ అదే పనిగా మోగుతోంది. మురళీకి తెలుసు ఆఫోన్ తన బాసుల దగ్గర్నుంచే అని. మురళీకి తెలుసు ఆ ఫోన్ శ్రవణ్ ఫిర్యాదు ప్రభావమే అని. మురళీకి తెలుసు ఆ ఫోన్ ఎత్తితే ఆ వార్త ప్రసారం చేయక తప్పదని. ఒకసారి టీవీ7 వైపు చూశాడు. వింత శిశువు..వార్త ఇంతింత అక్షరాలతో ఇంకా ఇంకా వస్తూనే ఉంది. మురళీకి పిచ్చెక్కింది. గట్టిగా అరిచాడు. ‘‘తోకతో పుట్టిన వింతశిశువు ఆ పిల్లాడు కాదురా.. మీర్రా..మీరు..’’

 Front Image: Anwar

ఊదారంగు తులిప్ పూలు

kunaparaju (కూనపరాజు కుమార్ కథల సంపుటి ‘న్యూయార్క్ కథలు’

మార్చి 16, హైదరాబాద్ లోఆవిష్కరణ )

ఊదారంగు అంటే ఎలా చెప్పాలి? వైలెట్ రంగులో కొంచెం తెలుపు కలిపితే ఊదా రంగు వస్తుంది. బహుశా తూటి పూలరంగులా ఉంటుంది. వంకాయ రంగుని కొంచెం డార్క్ చేస్తే నేరేడు పళ్ల రంగు వస్తుంది. తూటి పూలు, నేరేడు పళ్ళూ.. మా వూరి నిండా అవే.

మాది కొల్లేరు సరస్సుకు ఆనుకొని ఉన్న గ్రామం. పూర్వం వర్షాకాలంలో కొల్లేరు ఉబికి పైకి వస్తే ఊరి చివరి పొలాలు మునిగిపోయేవి. అక్కడ వేసవి కాలం ముందు ఒకసారి వరి వేసేవారు. మార్చిలో దాళ్వా వరి వ్యవసాయం పూర్తి అయిన తరువాత ఏప్రియల్, మే నెలల్లో ఎండాకాలం ఆ పొలాలన్నీ ఖాళీగా వుండేవి. అక్కడ పిల్లలు అందరం చేరి క్రికెట్ ఆడేవాళ్ళం.

ఆటకు ఊరి చివరకు వెళ్ళేటప్పుడు ఎండిపోయిన కాలువ వారమ్మటా, మురికికోడులో తడిగా ఉన్నచోట్ల ఈ తూటికాడలు విపరీతంగా పెరిగేవి. ఆ కాలంలో వాటి నిండా తూటిపూలే. ఊళ్ళో గుడి చెరువు దగ్గర సంగలో అక్కడక్కడా  పెద్ద నేరేడు పళ్ళు వుండేవి. వేసవి సెలవల్లో మా ఆటలన్నీ వాటి నీడల్లోనే. కానీ వాటికీ ఈ తులిప్ పూలకు కొంచెం తేడా వుంది.

తులిప్ పూలు చాలా సినిమాలలో చూశాను. “దేఖా ఏక్ క్వాబ్ తో యే సిల్‌సిలే హువే … “అనే పాటలో అమితాబ్, రేఖల ప్రణయం తులిప్ వనాలలోనే. అవి చాలా రంగుల్లో భలే వుండేవి. కానీ మొదటిసారి అమెరికా వెళ్ళేటప్పుడు కె.ఎల్.ఎం. విమానం ఆమ్‌స్టర్‌డామ్‌లో  ఆగింది. లింక్ ఫ్లైట్  లేట్ అయినందువల్ల నగరం చూసే అవకాశం కలిగింది. ఎక్కడ చూసినా తులిప్ పూలే. నగరం చివరం కనుచూపు మేర పరుచుకొని వుండే తులిప్ వనాల తుళ్ళింతని తనివి తీరా చూసి తీరాలి.

కానీ ఇక్కడ న్యూయార్క్‌లో ఈ తులిప్ పూలు ఇంకా అందంగా విచిత్రంగా వున్నాయి. వీటిని మన్‌హటన్‌లో సెంట్రల్ పార్క్‌లో కూడా చూడలేదు. ఇవి నేరేడు పళ్ళ రంగుతో నిగనిగలాడుతూ వుండి, రేకుల అంచులు తూటిపూల రంగులో మెరుస్తున్నాయి. ఇవి నాజూకుగా, చిత్రంగా, అందంగా వున్నాయి. ఆ రోడ్డుపై నడుస్తూ ‘గ్రౌండ్ జీరో ట్విన్ టవర్స్ పడిపోయిన’ చోట రైలింగ్ పక్కన పెట్టిన ఈ తులిప్ పూలగుత్తి  మమ్మల్ని ఆకర్షించింది. దగ్గరగా వెళ్ళి చూసాం. అక్కడో కొవ్వొత్తి వెలుగుతోంది.

కొంచెం వెనక్కి తగ్గి చూసేసరికి అవి ఎవరికో నివాళిగా పెట్టిన పూలు అని తెలిసింది. ఆ పక్కనే తలవంచుకొని ఓ అమ్మాయి కూర్చుని వుంది. రఘువీర్‌ని చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాను. ఇద్దరం నాలుగు అడుగులు వెనక్కి వచ్చాకా “బహుశా నైన్ ఎలెవన్ మృతులలో ఒకరి బంధువై వుండవచ్చు” అన్నాను.

రఘువీర్‌కు ఆశ్చర్యంగా వుంది. కళ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు.

రఘువీర్ నా హైస్కూల్ మిత్రుడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజే కలిసాం. అతను అమెరికా వచ్చి రెండు సంవత్సరాలు అయినా, న్యూయార్క్ రావడానికి ఇంత సమయం పట్టింది. ఫోన్‌లో టచ్‌లోనే వున్నాడు. చలికాలం పోయి వసంతకాలం విరబూస్తున్నప్పుడు వస్తే న్యూయార్క్ బాగుంటుందని చెప్పాను. అందుకే ఇప్పుడు వచ్చాడు. రఘు కాలేజీలో అతివాద భావాలు గల విద్యార్థి సంఘంలో పని చేసేవాడు. ఎప్పుడూ అమెరికాను విమర్శించడమే వాళ్ల పని. ఎక్కడెక్కడో తిరిగి, ఆఖరికి ఇలా స్థిరపడ్డాడు.

“ఏమోయ్! ఫ్లేటు ఫిరాయించావా?” అన్నాను.

“మరి తప్పలేదు.. వేరే మార్గం కూడా లేదు.కుటుంబం కోసం.” అన్నాడు.

“అనుకున్నంత చెడ్డగా లేరు ఇక్కడి ప్రజలు” అన్నాడు.

“అందుకే విన్న దానికి, చూసిన దానికీ అంత తేడా” అన్నాను.

“కానీ కొన్ని విషయాల్లో రాజీ పడ్లేను. ఈ ప్రభుత్వం కొన్ని చెడ్డ పనులు చేస్తోంది. అందుకే ఈ సెప్టెంబర్ 11 దాడులు” అన్నాడు.

ఈరోజు న్యూ‌యార్క్ రాగానే ‘సెంట్రల్ పార్క్’ వెళ్ళాం.

వసంతం విరబూసింది. ఎక్కడ చూసినా పూలే, పూల సముద్రంలా వుంది. జనం ఈ శోభను చూడటానికి విపరీతంగా వచ్చారు.

“ఇన్ని  బిల్డింగ్‌ల మధ్యలో ఈ పార్క్‌ని ఎంత బాగా మెయింటేన్ చేస్తున్నారు!” అన్నాడు రఘు.

తరువాత “టైమ్ స్క్వేర్”, మళ్ళీ సబ్‌వేలో ప్రయాణం.. వాల్‌స్ట్రీట్.. ఇపుడు, ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాంతం.

ఇప్పటికి ఆరు సంవత్సరాలయ్యింది. 9/11 విషాద సంఘటన జరిగి, మళ్లీ నన్ను నిస్పృహ ఆవరించింది. ఏదో పెద్ద సమాధి కట్టడం కోసం చేస్తున్న పనిలా వుంది ఇక్కడ ‘వర్క్ ప్లేస్’. మళ్లీ కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. “ట్విన్ టవర్స్”తో అనుబంధం గుర్తుకు వచ్చింది.

ఆ రోజుల్లో ‘బ్యాటరీ పార్క్‌లో స్టీమర్ ఎక్కి లిబర్టీ విగ్రహం వైపు వెళుతూ వెనక్కి తిరిగి చూస్తే నీటిలో నుంచి మొలుచుకు వచ్చిన ఆధునిక శిల్ప సముదాయంలా వుంది ‘మన్‌హటన్ దీవి’. వీటి మధ్యలో ఠీవిగా గుమ్మం ముందు నిలబడ్డ నవదంపతులవలె వుండేవి “ట్విన్ టవర్స్.”

చాలా సార్లు  క్వీన్స్ నుండి న్యూజెర్సీ వెళ్ళేటప్పుడు ఈ భవనాల కింద వున్న ‘సబ్‌వే’ స్టేషన్‌లలోనే ట్రైన్ మారేవాళ్లం. అక్కడ వున్న ఓ కిళ్ళీ షాపులో  ‘న్యూయార్క్ పోస్ట్’  పేపర్ కొనేటప్పుడు ఆ షాపు యజమాని సర్దార్జీ హాయిగా పలకరించేవాడు.

“ఎంత కాలం అయ్యింది బాస్ ఇక్కడకు వచ్చి” అని అడిగాను.

“25 సంవత్సరాలు” అన్నాడు

పంజాబ్‌లో లూధియానా దగ్గర ఓ గ్రామంలో వ్యవసాయం చేసేవాడట. ట్రాక్టర్ కూడా వుండేది. ఎప్పుడో అమెరికా వచ్చిన ఇతని బంధువులు ఇతని ఫ్యామిలీని స్పాన్సర్ చేసారు.

“ఎలా వుంది ఇక్కడి జీవితం?” అంటే

“చల్తా.. చల్తా” అనేవాడు. అప్పుడప్పుడు అతనితో మాట్లాడటం సరదాగా అనిపించేది. షాపు లోపల స్టూలు వేసి కూర్చోమనేవాడు.

ఇంటికి వచ్చిన చుట్టాలను, మిత్రులను ఈ ట్విన్ టవర్స్ పైకి తీసుకొని పోయి “అదిగో అది హడ్సన్ నది, అది సముద్రంలో కలిసే చోటు వున్న ఆ చిన్న దీవి పైనే ‘లిబర్టీ స్టాట్యూ’ వుంది. ఎడమ పక్క ‘క్వీన్స్’, లాంగ్ ఐలెండ్, నదికి ఇటువైపున  న్యూజెర్సీ రాష్ట్రం వున్నాయి” అని వారికి చూపించేవాడిని.

ఇక్కడకు వచ్చినందుకు గుర్తుగా ట్విన్ టవర్స్ బొమ్మలున్న కీ్‌చైన్‌లు వాళ్లకు బహుమతులుగా ఇచ్చేవాళ్లం. ఈ బొమ్మలమ్మే నల్ల అబ్బాయి నన్ను గుర్తుపట్టేవాడు. నేను రాగానే చిన్న చిన్న గిఫ్ట్‌లు చూపించేవాడు. రెండు డాలర్లు టిప్‌గా ఇస్తే వాడి మొహం వెలిగిపోయేది. అక్కడే వున్న బైనాక్యులర్స్‌తో అన్ని పక్కలా చూసేవాళ్లం. హడ్సన్ నదిలో తిరుగుతున్న స్టీమర్లను పరిశీలించే వాళ్లం. ఈ భవనంలో పని చేసేవారు, పలకరించే వారు, నవ్వులు చిందించేవారు ఏమయ్యారు.?  కొన్ని క్షణాలలో జరిగిన సంఘటన వల్ల భూమి గర్భంలో సమాధి అయిపోయారు. వారి కలలూ, ఆశలూ గాలిలో కలిసిపోయాయి. వారి స్మృతులను మనకు మిగిల్చి చీకటి చరిత్రలో లీనమైపోయారు.

“ఏమిటి ఆలోచిస్తున్నావ్?” అన్నాడు రఘువీర్.

“ట్విన్ టవర్స్ గుర్తుకు వస్తున్నాయ్” అన్నాను.

“భవనాల మీద కూడా ప్రేమేనా! అంత విశాలహృదయమా తమరిది!” అన్నాడు వ్యంగ్యంగా.

“అనుబంధం వున్న దేనిపైన అయినా సరే ప్రేమ పుడుతుంది. సొంత ఇల్లు, ఊళ్ళో పొలాలు, ఎంతో కాలం వాడిన పాత డొక్కు సైకిల్, ఇవన్నీ నిర్జీవాలే అయినా వీటిని ఇష్టపడతామా,  లేదా?” అని అడిగాను.

“కాని ఈ విషయంలో అంత బాధ పడాల్సిన అవసరం లేదు. ఇది స్వయంకృతం ” అన్నాడు

“కారణాలు వెతకను కాని ఈ ఘటనలో ఎంతో విషాదం వుంది. వేల సంఖ్యలో సామాన్య ప్రజలు చనిపోయారు. ఆఖరికి డ్యూటీలో వున్న వందలాది ఫైర్ ఫైటర్స్ కూడా చనిపోయారు” అన్నాను.

రఘుకు కొంత భిన్న అభిప్రాయం వున్నా ఈ సమయంలో ఎక్కువగా వాదించదల్చుకోలేదు . మౌనంగా వుండిపోయాడు.

***

“ఇదిగో రఘు, ఆ అమ్మాయి మన రెస్టారెంటు వైపు వస్తోంది, పలకరిద్దామా!?” అన్నాను.

“ఇప్పుడెందుకు ఆ అమ్మాయిని మరోసారి బాధపెట్టడం?” అన్నాడు రఘు.

“లేదు ఆ అమ్మాయి కథ విందాం, అలాగే ఆ అమ్మాయి కూడా మనతో బాధ పంచుకొని కొంత రిలీఫ్ పొందుతుంది” అన్నాను.

“సరే నీ ఊరు,  నీ యిష్టం” అన్నాడు రఘు.

నెమ్మదిగా ఆ అమ్మాయి కూర్చున్న మూల టేబుల్ దగ్గరకు వెళ్ళి “మీరు ఏమీ అనుకోకపోతే ఇక్కడ కూర్చోవచ్చా?” అన్నాను.

ఆ అమ్మాయి తలపైకి ఎత్తి “ఎందుకు కూర్చోకూడదు?” అంది.

“థాంక్యూ!” అంటూ కూర్చొని మెల్లగా ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాను.

‘జూలీ’ కరేబియన్ ఐలెండ్స్ నుంచి వచ్చిన స్పానిష్ అమ్మాయి. స్కూల్ టైంలోనే వాళ్ల తల్లి తండ్రులు వచ్చి ఇక్కడ ‘జెర్సీ సిటీ’లో సెటిల్ అయ్యారు. ఫైన్ ఆర్ట్స్‌లో వుద్యోగం చేయాలని కోరిక. తక్కువ జీతాలతో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి విసిగిపోయింది. అప్పుడు పరిచయమయ్యాడు ‘వినోద్’. తను ‘కొలంబియా’ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ పొందాడు. తను దగ్గిర వుండి కంప్యూటర్ నేర్పించాడు. తానే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేర్పించాడు. 2001 ఆగస్టు నెలలోనే వినోద్ చేస్తున్న కంపెనీలో  తన టీంలో చేర్చుకొన్నాడు. దీనికి మూడు నెలల క్రితమే ఆ కంపెనీ ట్విన్ టవర్స్ లోనికి మారింది.

తన కథ చెబుతున్న జూలీ తెల్లని ముఖం ఎర్రగా మారింది. కళ్లలోని తెల్లని గుడ్లు గులాబీ రంగులోకి మారిపోయాయి. కనురెప్పల అంచుల్లో నల్లటి రేఖలు.. మేం కొంచెం సేపు మౌనంగా కూర్చున్నాం.

నెమ్మదిగా మళ్ళీ అంది. “వినోద్ ఇండియనే, చాలా మంచివాడు. రెండు మూడు సంవత్సరాలు నాకు ఓపికగా కంప్యూటర్ నేర్పించాడు. ఆర్ధికంగా ఆదుకొన్నాడు. అమ్మా నాన్న పోయినప్పుడు నన్ను ఎంతో ఆదరంగా చూసుకొన్నాడు.” అని ఆగిపోయింది.

కళ్ళవెంట నీరు ఉబికి వచ్చింది. “సారీ” అంటూ పేపర్ నాప్‌కిన్‌తో కన్నీరు తుడుచుకుంది.

“ఆ రోజే వినోద్‌తో పెళ్ళి చేసుకుందామని ప్రపోజ్ చేద్దామనుకున్నాను. ఏడు గంటలకి ఫోను చేసాను. అప్పటికే తను ఆఫీసులో వున్నాడు. నేను ఈ రోజు త్వరగా వచ్చేస్తున్నా అన్నాను. ఏమిటి విశేషం అని అడిగాడు. నీకు సర్‌ప్రైజ్ చేస్తూ ఓ విషయం చెప్పాలి అన్నాను. ‘యూ ఆర్ వెల్‌కమ్’ , ‘బట్ నాకు తెలుసు’ అన్నాడు. ‘ఎలా!’ అని అడిగాను. ‘నిన్నటి నుంచీ నీ వాలకం వల్లనే కనిపెట్టాను. బట్ ఐయాం లక్కీ’ అన్నాడు. మరి నేనైతే ఇంకా అదృష్టవంతురాలిని. నేను ఆనందంలో తేలియాడుతూ ఆఫీసుకి బయలుదేరాను.

“సబ్‌వే ట్రైన్‌లో ‘వాల్‌స్ట్రీట్’ స్టేషన్‌లో దిగి ఇలా పైకి వచ్చానో లేదో జనాలు పరుగులు తీస్తున్నారు. కారు  హారన్‌ల  హోరు.. ఎక్కడ చూసినా బూడిద, కాగితాలు వీధుల్లో ఎగురుతున్నాయి. ట్విన్ టవర్స్ లోని  ఓ టవర్‌ని ఏదో టూరిస్ట్ విమానం ఢీకొట్టిందంట. టవర్స్ వైపు పరిగెత్తాను. పైనుంచి నిప్పురవ్వలు రాలుతున్నాయి. కానీ మా ఆఫీసు రెండో టవర్‌లో వుంది. ఆ టవర్ దగ్గరకు ఎవ్వరినీ వెళ్లనీయడం లేదు. పరిస్థితి ఘోరంగా వుంది. ఎవరో అరుస్తున్నారు ఇది టెర్రరిస్ట్ ఎటాక్ అని. భయంతో వినోద్‌కు కాల్ చేద్దామని ఫోన్ తీసాను. అప్పటికే చాలా మిస్డ్ కాల్స్ . వినోద్‌కు కాల్ చేసాను. చాలా భయంతో, ఆందోళనతో వున్నాడు. లిఫ్ట్‌లు పని చేయడం లేదట. మెట్లు జామ్ అయ్యాయి, దిగడం చాలా కష్టంగా వుంది అన్నాడు వినోద్.. “మైడియర్, మనం తప్పక కలుస్తాం, భగవంతుడు మన ప్రేమను పండిస్తాడు. నీ కోసం ఎదురు చూస్తూ వుంటా..” అంటూ ఏడుస్తూ ఏదేదో అంటున్నాడు.

ఇంతలో చెవులు బద్ధలయ్యే పెద్ద శబ్దం వచ్చింది. ఆకాశం వైపు చూశా.. మరో విమానం మా టవర్ పై అంతస్థుని ఢీకొట్టింది. ఆకాశంలోంచి అగ్ని వర్షం కురిసింది. దుమ్ము,మేఘాలు, కాగితాలు, చెత్త ఈ మన్‌హటన్ నగరం అంతా నరకంలోనికి కుంగిపోతున్నట్లు అయిపోయింది. మంటలు చెలరేగుతున్నాయి. ‘ఓ మైగాడ్.. వినోద్.. ప్రియతమా అంటూ పిచ్చి ఎక్కినట్లు పరుగులు తీస్తున్నాను. ఇంతలో పెద్ద శబ్దం, ఏవో కూలిపోతున్నట్లు, భూమి కుంగిపోతున్నట్లు .. నేను స్పృహ తప్పాను. జీవితం అంతా ఓ క్షణంలో బూడిద ఐపోయింది” ఆమె తలవంచుకునే వుంది. ఆమె కళ్ల నుంచి కన్నీటి వాన కురుస్తోంది.

చాలా సేపు మౌనంగా వుండిపోయాం. నేను సంకోచిస్తూ ఆమె చెయ్యిపై చెయ్యి వేశాను. ఓదార్పుగా, చల్లగా వుంది. చిన్నగా వణకుతోంది. “క్షమించండి మిమ్మల్ని చాలా ఇబ్బంది  పెట్టాం: అన్నాను.

కొద్ది సేపు నిశ్శబ్దం.

వినోద్ చాలా మంచివాడు. వాళ్ళ తల్లితండ్రులు కూడా లేరు. పది సంవత్సరాల క్రితమే అమెరికా వచ్చాడు. అక్కడి వారితో సంబంధాలు  లేవు. దయచేసి వారికి ఈ విషయం తెలియచేయండి. ఇదిగో వినోద్ నాకు ఇచ్చిన ఈ వుంగరం అతని బంధువులకు ఇవ్వండి. ఈ సంఘటన జరిగిన ఆరు సంవత్సరాలలో నన్ను ఎవరూ  పలకరించలేదు. నా కథ వినలేదు. నా ప్రేమను మీరు అర్ధం చేసుకున్నారు. నాకు అదే చాలు. ఇప్పుడు నాకు తృప్తిగా వుంది. నా మనస్సు శాంతించింది. ఇక వెళతాను” అని చెప్పి రెస్టారెంట్ బయటికి వెళ్ళి చీకటిలో కలిసిపోయింది… జూలి.

కొద్ది సేపటికి ‘సబ్‌వే’ ఎక్కి  ‘క్వీన్స్’ బయలుదేరాం. ఇద్దరికీ కొంచెం ఇబ్బందిగానే వుంది. హఠాత్తుగా రఘు అన్నాడు. “అతని పూర్తి పేరు వినోద్ కుమార్ కదూ!”

“అవును ఉస్మానియాలో 89th బ్యాచ్” అన్నాను.

“యస్! అతను ‘వినూ’ యూనివర్సిటీ టాపర్. రాజకీయాలు పట్టించుకునేవాడు కాదు. మేం కూడా అతనిని  పట్టించుకునే వాళ్లం కాదు.

కొద్దిసేపు ఆగి “అయ్యో అతనికి ఇలా అయ్యిందా!” అని తెగ బాధపడిపోయాడు.

179 స్ట్రీట్‌లో సబ్‌వే నుంచి బయటకు వచ్చి, రూమ్ వైపు నడుస్తున్నాం. బయట వాతావరణం చల్లగా వుంది. అప్పుడే చందమామ ఆకాశంలో ప్రశాంతంగా ప్రకాశిస్తున్నాడు.

“ఈ ఎటాక్‌లో తొంభై దేశాలకు చెందిన మూడు వేలమంది చనిపోయారు తెలుసా!”

“ఎవరైతేనేం రెండు పక్కలా అమాయకులే బలౌతున్నారు” అన్నాను.

రఘు కొద్ది సేపు ఆగి “ఒక మనిషి చనిపోతే వారి ఆత్మీయుల జీవితాలు ఎంత చిన్నాభిన్నం అయిపోతాయి?…నేను సమాధాన పడలేక పోతున్నా” అన్నాడు.

రఘు వెళ్ళి చాలా రోజులయ్యింది. ఓ రోజు హఠాత్తుగా “జూలీ” గుర్తుకు వచ్చింది. ఏం చేస్తోందో పిచ్చి పిల్ల అనుకున్నాను. ఫోన్ ట్రై చేసాను. అసలు ఆ ఫోను నంబరే లేదు. ఈమెయిల్ వెళ్ళింది. రెస్పాన్స్ లేదు. జూలీ ని  మేం కలిసి సంవత్సరం అయ్యింది. బహుశా ఆ రోజు వినోద్ పుట్టిన రోజు అనుకుంటా! ఆ రోజు నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. కొత్త భవనాలు పైకి లేస్తున్నాయి. అవి ఎంతో బాగా వున్నా నాకు అందంగా కన్పించలేదు. ఆ రెయిలింగ్ వార కొన్ని ఫోటోలు, పూలగుచ్చాలూ, వెలుగుతున్న కొవ్వొత్తులు కనిపించాయి. అన్నీ జాగ్రత్తగా చూసాను. వినోద్ ఫోటో కనిపించలేదు. ఓ రోజు మధ్యాహ్నం  ఆఫీసు ముగించుకొని, వాల్‌స్ట్రీట్ మీదుగా నడిచి వస్తుంటే జూలీ గుర్తుకు వచ్చి, పోలీస్ ఇన్ఫర్‌మేషన్ కౌంటర్ దగ్గర, 9/11 మృతుల సమాచారం కోసం ప్రయత్నం చేశా. వాళ్లు వేరే ఆఫీసుకు పేర్లు చెప్పారు. ఆ శోధనలో చివరిగా ఓ చోట ఆగాను. ఆ ఆఫీసర్ వాళ్ల పేర్లు ఇచ్చాడు.

“వాళ్ళూ మీకు ఏమౌతారు?” అని అడిగాడు.

“వాళ్ళు నాకు కొంచెం తెలుసు. వారి బంధువులకు ఈ విషయం తెలుసో లేదో అని అనుమానం. కొంచెం సహాయం చేద్దామనే ఉద్దేశ్యంతో..” అని అన్నాను.

” ఓ పది నిమిషాలు ఆగండి” అన్నాడూ. తన పని ముగించుకొని నా కళ్ళలోనికి చూస్తూ అన్నాడు. “వాళ్ళిద్దరూ ప్రేమికులు అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఆ రోజే చనిపోయారు” అన్నాడు.

నాకు ఆశ్చర్యం, భయం.. కొద్ది రోజుల క్రితం జూలీతో జరిగిన సంభాషణలు చెప్పాను. ముందు ఆశ్చర్యపోయాడు. తరువాత చెప్పడం ప్రారంభించాదు.

“నేను స్వయంగా పోస్ట్‌మార్టంలో పాల్గొన్నాను. వారి రికార్డు నేనే చూస్తున్నాను. ఆ రోజు జూలీ రెండో భవనం కూలిపోతున్నప్పుడు అటువైపు పరుగు పెట్టింది. ఇంతలో ఆ భవనం కూలిపోయింది.

విచిత్రంగా ఇద్దరి దేహాలూ ఓ చోటే దొరికాయి. ఇది ఒక మిరకిల్. వారి డైరీలు, వాలెట్లు చూసి వాళ్లని గుర్తుపట్టాం. కానీ వీరిద్దరి బంధువులెవరూ క్లైమ్ చేయలేదు. మీరైనా ఒక ప్రయత్నం చేయండి” అన్నాడు.

ఏదో పొరపాటు జరిగి వుంటుంది. జూలీ బ్రతికే వుంది. మేం చూసాంగా అనుకొన్నాను. కానీ జూలీ తన గురించి చెప్పిన విషయాలు, ఆఫీసర్ చెప్పిన విషయాలు ఒకే రకంగా వున్నాయి. నేను పూర్తిగా అయోమయంలో పడ్డాను.

మళ్ళీ ఆఫీసర్‌ని కలిసినప్పుడు వారి ఫోటోలు తీసుకున్నాను. వాటిని ఆ రెయిలింగ్ వద్ద పెట్టి కొవ్వొత్తులు వెలిగించాను. అక్కడ ఊదారంగు తులిప్ పూలగుత్తులు ఉంచాను. వారి ఆత్మలు శాంతించాలని మనస్సులో ప్రార్ధించాను.

రఘు ఇండియా వెళ్ళినప్పుడు వినోద్ బంధువుల కోసం గాలించాడు. దూరపు బంధువులు దొరికారు. కానీ వారు పట్టించుకోలేదు. పైగా వినోద్ అమెరికాలో వుండి, తమకు ఏ సహాయం చెయ్యలేదని ఆరోపణలు చేసారు. రఘు చాలా నొచ్చుకున్నాడు.

ఇంతకీ ‘జూలీ’ బ్రతికి వుందా చనిపోయిందా? నేను నిర్ధారణ చేసుకోలేకపోయాను. ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ప్రతీ సంవత్సరం అదే రోజు జూలీ కోసం నా కళ్ళు అన్నివైపులా వెతుకుతుండేవి. వినోద్ జూలీకి ఇచ్చిన ఆ రింగ్ నా పర్స్‌లో భద్రంగా వుంది.

ఈ ప్రేమ కానుక ఎక్కడికి చేర్చాలి??

 ***

Front Image: Mohan

సగలమ్మ పలికింది

sagalamma illustration(రమణజీవి కథాసంపుటి ‘సింహాల వేట’ ఈనెల 9 న హైదరబాద్ లో ఆవిష్కరణ)

క్రితం రాత్రి సరిగా నిద్రే లేదు వరాలుకి. మరునాడు బలి కాబోతున్న తన కోడిని తల్చుకుని!

తెల్లారింది.

చల్లటి నీళ్లు మొహం మీద పడేసరికి రెండు చేతుల్తో మొహాన్ని కప్పుకుంటూ అటువేపు తిరిగి పడుకుంది వరాలు.

వాళ్లమ్మ చెంగమ్మ పోతూ పోతూ ఇన్ని నీళ్లు చల్లి పోయింది వరాలు మీద.

‘‘ఒమ్మే! వొరాలు… సగలమ్మ కాడికి బోవాల గదా’’ అంది అవ్వ సుబ్బమ్మ కుండెడు నీళ్లల్లో పేడ కలుపుతూ.

మామూలుగా అయితే అంత తొందరగా ఎప్పుడూ లేవని వరాలు ‘సగలమ్మ’ అనేసరికి మెరుపులా లేచి కూర్చుని అరుగు మీదినించి కిందికి చూసింది.

కోడిపుంజు మంచానికి కట్టేసి వుంది. ఠీవిగా నిలబడి తలను అటూ ఇటూ కదుపుతుంటే నెత్తి మీద ఎర్రటి కిరీటం రాజసంతో కదులుతోంది. ముదురు పసుపురంగులో వున్న కంటి మధ్య గుండ్రటి నల్లగుడ్డు నిర్భీతితో మెరుస్తోంది. రానున్న ఆపదను ఏమాత్రం పసిగట్టలేనంత అమాయకత్వంతో కూడుకున్న నిర్భీతి. ఒళ్లంతా నలుపు, ఎరుపు ఈకల కలనేత మెరుపులు.

గబ గబా అరుగుదిగి కోడి దగ్గరకు వెళ్లింది వరాలు. కోడి భయంతో క్రో…క్రో… అంటూ కాలికి కట్టిన తాడును లాక్కు పోవాలని ప్రయత్నించింది.

చెంగమ్మ కూతురు వేపు మురిపెంగా చూస్తూ ‘‘మ్మె! పోమ్మే!! నీళ్లు దేపోమ్మే…’’ అని తన తల్లి వేపు తిరిగి ‘‘కోణ్ణి కూరొండినాక జాచ్చి చీలు దినేదిదే బలే మిడిమేలపు ముండగని’’ అంది. సుబ్బమ్మ సన్నసన్న పుల్లలు విరుస్తూ నవ్వింది.

‘‘హూ!’’ అని తల విదిలించుకుంటూ లేచి గూట్లోంచి ఓ బొగ్గు తీసి నోట్లో వేసుకుని కరకర నమిలి చూపుడు వేలుతో పళ్లు రుద్దుకోడం ప్రారంభించింది వరాలు.

గోడ దగ్గరికి వెళ్లి గోడమీద తుపుక్కుమని వుమ్మేసింది. శిథిలమై సున్నపు పెచ్చులు వూడి లోపలి బంక మట్టి, రాళ్లూ కనిపిస్తున్న గోడ మీద నల్లటి ఎంగిలి పడింది.

‘‘మెడ్తో గొడ్తా! లం…ముండ’’ అని చివాలున లేచిన చెంగమ్మకు దొరక్కుండా బయటికి పరుగెత్తింది వరాలు.

‘‘ఏమి దీనికి బొయ్యేకాలం. కండ్ల గావరం’’ అంది సుబ్బమ్మ.

సుబ్బమ్మకు ఆ ఇల్లంత అపురూపమైంది ఇంకోటి లేదు. ఆ ఇంటిని స్వంత చేతుల్తో కట్టింది.

అప్పటికి చెంగమ్మ వరాలంత పిల్ల. బంక మట్టిని పిసికింది. రాళ్లు పేర్చింది. వాసాలు కూర్చింది. కొండ మీది బోద కోసుకొచ్చి ఇంటిని కప్పింది. ఇప్పుడు ఆ బోదంతా ఏళ్లతరబడీ ఎండల్నీ వానల్నీ ఎదుర్కొనీ ఎదుర్కొనీ నీరసించి పోయింది. ముట్టుకుంటే నుసి నుసయి పోతోంది.

ఇంటికప్పు అడుగునున్న వాసాలు, దూలాలూ కూడా పొగ తాకిడికి కాటుక రంగుకి తిరిగాయి.

ఆ ఇంటికి చుట్టూ మనిషెత్తు ప్రహరీ గోడ. ప్రహరీగోడకు ఇంటికి వున్న ఖాళీ స్థలంలో ఎప్పుడో పోసిన మట్టి చీపురు కట్ట వూడ్పులకెగిరిపోయి అడుగున గులక రాళ్లు పొడుచుకుని వచ్చి నేలంతా ఎగుడు దిగుడుగా తయారయ్యింది. అయినా సరే ఆ నేల మీదే పేడ చల్లడం … ముగ్గులు పెట్టడం… ఆ గోడలకే సంవత్సరం సంవత్సరం సున్నం పూయడం… ఎరమట్టి గీతలు గీయడం…

ఆయితే వరాలుకివ్వేమీ పట్టవు. ఎంతసేపూ ఏదో ఒకటి పాడుచేసి తిట్లు తినడం సరదా.

సుబ్బమ్మ చెంగమ్మను పొయ్యి వెలిగించమని చెప్పి సగలమ్మ మొక్కుకు కావల్సిన ఏర్పాట్లలో మునిగిపోయింది.

ఇంటి తలుపుకు ఇటూ అటూ వున్న రెండు పెద్ద పెద్ద అరుగులకు చిక్కటి పేడ నీళ్లు పులుముతోంది. మధ్యలో వేసిన గోనెపట్టతో ఆడుకుంటున్న రెండు బూడిదరంగు పిల్లి పిల్లలు కాళ్లకు మాటిమాటికి అడ్డుపడుతూంటే చేత్తో అవతలికి తోసి ‘చేయ్‌’ అని అరిచింది సుబ్బమ్మ.

ఆ రెండు పిల్లి పిల్లలు కింద ఓ దొర్లు దొర్లి లేచి నిలబడి విస్మయంగా సుబ్బమ్మ కేసి చూసి గబగబా ఇంట్లోకెళ్లాయి. మళ్లీ అంతలోనే వొకదాన్నొకటి తరుముకుంటూ వచ్చి ఆగి సుబ్బమ్మను చూడబోయిన వాటి దృష్టిలో అప్పుడే నేల మీద వాలిన ఓ ఈగ పడింది.

చెవులు రిక్కించి శత్రువు మీదికి పొంచి రహస్యంగా దాడి చేసే వాటిల్లా శరీరాన్ని వెనక్కి లాగి ముందు కాళ్లతో మెల్లి మెల్లిగా ఈగను సమీపించిన పిల్లి పిల్లలు దూలం చాటునించి వాళ్లమ్మ అరుపు విని చప్పున ఆగిపోయి తోకల్ని నిటారుగా ఎత్తి నడుమును తల క్రిందులైన అర్ధ చంద్రుడి ఆకారంలోకి మార్చి గొప్ప ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ బొమ్మల్లా నిల్చుండి పోయాయి.

‘‘వొసే నా సయితీ… వొరాలూ…నీళ్లు తీసకరాయే… మళ్లా ఫవరు తగ్గి పోతాది’’ అని కేకేసింది చెంగమ్మ. చుట్టుపక్కల ఎక్కడున్నా వరాలుకు వినపడేలా వుంది ఆ కేక. పొగవల్ల మండుతున్న కళ్లని కొంగుతో తుడుచుకుంది.

బయట గులక రాళ్ల దారి మీద రాత్రి కురిసిన వాన నీళ్లకు ఎడం కాలి బొటనవేలుతో కాలవలు తీస్తూ నిలబడి వుంది వరాలు. యాంత్రికంగా పళ్లను తోముతోంది, చూపుడు వేలుతో.

వరాలు మనసులో ఆ రోజు సగలమ్మకు బలి కాబోయే తన కోడి పుంజు మెదులుతోంది. గుడ్డులో నుంచి బయటపడినప్పట్నించి తెలుసు తనకది. చిన్నప్పుడు దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకుంటే అది తన చిట్టి చిట్టి గోళ్లతో మెడ మీదకి దిగి గిలిగింతలు పుట్టించిన దృశ్యం కళ్ల ముందు పదేపదే మెదులుతోంది. దూదిలాంటి మెత్తటి పిల్ల…. ఎంతగా ఎదిగింది తన చేతుల్లో!… ఈ రోజుతో ఆఖరా!

చెంగమ్మ కుడి చేతిలో వూదురు గొట్టం, ఎడం చేతిలో బిందెతో బయటికి వచ్చింది కళ్లు నులుముకుంటూ.

‘‘మెట్టుతో పదారేట్లు గొడతా యెంచి లం…’’ అని అరిచింది.

వరాలు వులిక్కి పడి వాళ్లమ్మకు అందకుండా కొంచెం దూరం పరిగెత్తి దూరంగా నిలబడి ‘‘ఆడబెట్టు బిందె’’ అంది నేలవేపు చూపిస్తూ.

వాళ్లమ్మ బిందెను అక్కడ బెట్టి ‘‘ఇంట్లోకి రాయే వుండాది నీ కత’’ అని లోపలికి వెళ్లి పోయింది.

వరాలు బిందెను చేత్తో నిర్లక్ష్యంగా పట్టుకుని జవహర్‌ రోజ్‌గార్‌ నీళ్లకోసం వెళ్తుంటే మట్టి గొట్టుకు పోయిన జానెడుజడ గంజి పెట్టినట్టు బిరుసుగా వుంది.

ఇంట్లోంచి రాయుడు వొళ్లు విరుచుకుంటూ లేచి వచ్చాడు. అతడు చెంగమ్మ రెండో కొడుకు. అతడి వుంగరాల జుట్టు రాత్రి పడుకోబోయేముందు ఎలా వుందో ఇప్పుడూ అలాగే వుంది.

నెల రోజుల్నించీ గడ్డం పెంచుకుంటున్నాడు తిరుపతి పోవాలని.

‘‘ఏంబ్బీ! లేచినావా. రా. నాయినా, నువ్వు ముందు బోసుకుంటే నీళ్లు… మళ్ల నేను వరాలు బోసుకుంటాం’’ అంది సుబ్బమ్మ.

రాయుడు బ్రష్‌ మీద పేస్ట్‌ వేసుకుని పళ్లు తోముకుంటూ తుమ్మచెట్టు ఇవతల ‘జాలారి’ దగ్గరికి వచ్చాడు. జాలారి అంటే కింద పరచబడిన నాలుగు బండలు. ఓ బండ మీద పెద్ద నీళ్ల మట్టి తొట్టె. అక్కడ వాడిన నీళ్లు పక్కనే వున్న ముద్దబంతి, మల్లె, సన్నజాజి, బొప్పాయి పాదుల్లోకి పోతాయి.

రాయుడు టవలుతో వొళ్లు తుడుచుకొని వచ్చి మంచం మీద వొక పక్కకి వొరిగి పడుకుని కోడిపుంజు వేపు చేయి సాచాడు. అది ఎగరాలని ప్రయత్నించి బోళ్లా పడిరది, కెక్కిరిస్తూ.

‘‘కేజీ వుంటాదా ఇది’’ అడిగాడు రాయుడు కోడిపుంజు వేపు చూస్తూ.

‘‘కేజీ యేం కేజీరా! వొకటిన్నర పైనుండాదయితే’’ అంది చెంగమ్మ.

‘‘మేయ్‌! ఈ వరాలుముండ యాడికి బోతే ఆడ్నే. అబ్బికి నాస్టా అన్నా తెచ్చాదనుకుంటే’’ అంది బయటికి చూస్తూ. తలుపులోంచి వరాలు చంకలో బిందె పెట్టుకుని గబగబా వచ్చింది. బిందెకున్న చిల్లులోంచి సన్నటి ధార వేగంగా వస్తూంటే వుచ్చ…వుచ్చ… చూడండి అని నవ్వుతున్న వరాలు హాస్యాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయినా అది ఒకళ్ల కోసం సృష్టించబడిన హాస్యం కాదని వరాలు మొహంలో ఆనందం చెబుతూనే వుంది.

‘‘మ్మేయ్‌! వరాలూ నువ్వు బొయ్యి కొండయ్యింటి కాడ అన్నకంట దోసె తేమ్మే’’ అంది సుబ్బమ్మ కొంగు విప్పుతూ.

‘‘వుప్మా జేస్తే బొయ్యేది గదుమ్మా అందురూ దినేవాళ్లము’’ అంది పొయ్యి మీద బానలో రాయుడు పోసుకోగా ఏర్పడిన వెలితిని చల్లనీళ్లతో నింపుతూ.

‘‘అబ్బి తిండు లేమ్మే. నువ్‌ బోమ్మే వరాలు’’ అంది సుబ్బమ్మ, అయిదు రూపాయల నోటు వరాలు చేతిలో కుక్కి.

‘‘ఇదో వరాలూ! లోపల నా చొక్కా జేబీలో వుండాది గాని లెక్క… తీసుగోని పో’’ అన్నాడు రాయుడు.

‘‘వొద్దులేన్నా’’ అని అరుస్తూ బయటకి పరిగెత్తింది వరాలు.

రాయుడు మనసులో నవ్వుకున్నాడు.

‘ఈ మర్యాదలు ఎంత కాలం! నాలుగేళ్లయింది తను ఇంట్లోంచి పారిపోయి. నిన్ననే వచ్చింది.

అందుకే ఈ దోసెలూ… ఈ కోళ్లు కోసి వండటాలూ… ఇంక నాల్రోజులు పోతే మళ్లీ మాములే. నా బట్టా… నా కొడకా… ఇంత సద్ది కూడు మొహానేసి…’ ఓ నవ్వు అతడి పెదాల మీద అలా వచ్చి వెళ్లిపోయింది.

అంతలో చెంగమ్మ భర్త శంకరయ్య చేతిసంచీతో లోపలికి వచ్చాడు. బట్టతల మీద మెరుస్తున్న చెమట బిందువుల్ని భుజం మీది టవలుతో తుడుచుకున్నాడు. కళ్లు నిలకడ లేకుండా అటూఇటూ కదులుతున్నాయి. సన్నగా రివటలా వున్న శంకరయ్య మల్లెపువ్వులాంటి తెల్ల చొక్కా, పంచ కట్టులో వున్నాడు. చాలా అరుదుగా చేసే స్నానాన్ని ఆ రోజు చాలా పెందలాడే కానిచ్చాడు.

‘‘ఏమి బ్బే! నాస్టా జేసినావా?’’ అన్నాడు రాయుడి వేపు చూస్తూ. ఎవరో తరుముతున్నట్టు తత్తరబిత్తరగా వుంటుంది అతడి ధోరణి.

‘‘ఓయ్యా! నాయినా! ఇప్పుటికయి పొయ్యిందా నీ బజారు…’’ అడిగింది చెంగమ్మ భర్తను బియ్యంలో రాళ్లేరుతూనే.

శంకరయ్య మాట్లాడకుండా సంచీలోంచి శనగపిండిపొట్లం, తమలపాకులు, వక్కలు, కుంకుమ, పసుపు, మల్లెపూలు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, జేబులోంచి చిన్న కర్పూరం పొట్లం తీసి అరుగు మీద పెట్టాడు.

చెంగమ్మ కళ్లు ఇంతవి చేసి కొబ్బరికాయను చేతికి తీసుకుంది.

‘‘ఓయ్యో! ఇదేంది టెంకాయా? ఇంత వులకంగా వుండాది… దీంట్లో కొబ్బిరుంటాదా?’’

శంకరయ్యకు చిర్రెత్తి పోయింది ‘‘ఇంగ్‌… ఇంగేముంటాది…’’

‘‘ఓయ్యా! నాయనా! ఏదో ఒకట్లేకానీ’’ అంది సుబ్బమ్మ గుడ్డలో బెల్లం పెట్టి గుండ్రాయితో నలగ్గొడుతూ, మొగుడూ పెళ్లాలు గొడవల్లోకి దిగకుండా వారిస్తూ.

చెంగమ్మ నాలుగు బియ్యం గింజల్ని నోట్లో వేసుకుని`

‘‘నిన్న దెచ్చిన చెనిగిపిండి ఎవురి దెగ్గిర దెచ్చినావు. పిండి తక్కువగని. ఈ పొద్దు తూంచితే తెలుచ్చుంది వాడి రంగం… నీ రంగం…’’ అంది తాపీగా.

శంకరయ్య కోపంతో వొణికిపోయాడు.

‘‘నా రంగమేం తెలుచ్చాది లేయే. లచ్చుమయ్య వోటలు కాడ దెలీలా నీ రంగం…’’

‘‘ఇంగ బోనీమ్మే తల్లీ… నా తల్లి’’ అంది సుబ్బమ్మ పొడిచేసిన బెల్లం పక్కన బెట్టి విడి మల్లెపూలూ, దారం చెండూ చేతికి తీసుకుని.

వరాలు టిఫిన్‌ తెచ్చి రాయుడికి ఇచ్చి చిన్న మట్టిగిన్నెలో నీళ్లు తెచ్చి కోడి ముందు పెట్టి చూస్తూ కూచుంది.

ఇంతలో ఓ కాకి మట్టిగోడ మీద కూచుని వకటే అరవడం మొదలెట్టింది.

‘‘వరాలూ… తోలుమ్మే… బందుగులేమన్నా దిగుతారో ఏం శనిద్రమో…’’ అంది చెంగమ్మ.

‘‘దిగనీలే ఏమయితాది’’ అంది వరాలు కోడి తలను పట్టుకుని నీళ్ల గిన్నెలో ముంచుతూ.

‘‘నీకు ముదిగారం చానా జాచ్చయుండాది. దించుతా లం…’’ అని చేతిలో వున్న మట్టి బెడ్డను కాకి మీదికి విసిరింది ‘‘షూ’’ అని అరుస్తూ.

బంధువులంటే చెంగమ్మ కంగారుపడడంలో పెద్ద విశేషమేమీ లేదు. చెంగమ్మ చేసిన బోండాల్ని శంకరయ్య సాయంత్రం దాకా బస్టాండులో వచ్చేపొయ్యే బస్సుల దగ్గర తిరిగి అమ్మితే రోజుకు పదిహేను రూపాయలదాకా మిగులుతాయి. యావత్తు కుటుంబానికీ అదే ఆధారం.

అంతలో పిల్లిపిల్లలు అరుస్తూ చెంగమ్మ చుట్టూ తిరగసాగాయి. వాటికి తెల్సు ఎవరి చుట్టూ తిరగాలో.

‘‘మ్మేయ్‌ వరాలూ నా తల్లీ ఈ అద్దురుపాయికి పాలు దెచ్చి ఈటికి పొయ్యే. అలమటిస్తాండాయి’’ అంది చెంగమ్మ బొడ్లోంచి చిల్లర తీస్తూ. అయితే వరాలుకి కోడిని వదిలిపోవాలని లేదు. పాలంటే అరమైలు దూరం పోయి రావాలి.

‘‘ఆ కోణ్ణేం జూచ్చావ్‌ పోమ్మా! సగలమ్మ తల్లి వుండాది అన్నిటికీ పైన. నీకు మంచి మొగుడొస్చాడు. ఆ తల్లి సలవుంటే కోయేట్నించి మీ పెద్దన్న దండిగా లెక్క పంపిస్చాడు లేమ్మా! ఫో నా తల్లీ’’ అని వరాలు గడ్డం పట్టుకుంది. వరాలు అయిష్టంగా లేచింది.

వరాలు పాలు తీసుకొచ్చేటప్పటికి-

ప్రకాశంగా వెలుగుతున్న ఆకాశం కింద సగలమ్మ మొక్కుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

పెద్దగంపకు పేడ అలికి ఎర్రమట్టి చారలు పూశారు. నల్లటి నూలుదారం గంప చుట్టూ చుట్టి మధ్యమధ్య వేప మండలు వేలాడదీశారు. కడిగిన బియ్యపు సిల్వర్‌ గిన్నెనూ, నీళ్ల బిందెనూ ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రిని సర్దేశారు.

రెండు కాళ్లూ కట్టేసిన కోడిని శంకరయ్య చంకలో పెట్టుకున్నాడు. చెంగమ్మ గంపను నెత్తి మీదికి ఎత్తుకుంటుంటే సుబ్బమ్మ సాయం చేసింది.

‘‘ఓమ్మో! సూరుకత్తి… సూరుకత్తి యాడ దీసుకున్నాం’’ అరిచింది చెంగమ్మ.

సుబ్బమ్మ గబగబా ఇంట్లోకి పోయి ఓ కత్తిని తెచ్చి గంపలో వొక వైపుకు దోపింది, వరాలు రెప్పవేయకుండా ఆ కత్తి వేపు చూస్తూండగా.

అందరూ బయలుదేరారు.

శంకరయ్య, రాయుడూ కొంచెం ముందూ… చెంగమ్మ, సుబ్బమ్మ, వరాలు కొంచెం వెనక. వరాలు చూపంతా శంకరయ్య చంకలో వున్న కోడి మీదే వుంది.

చెరువు కట్ట చేరుకున్నారు. అక్కణ్ణించి ఇంకా రెండు ఫర్లాంగులుంటుంది సగలమ్మమాను. దూరంగా కనిపిస్తోంది. తన కోడిని కబళించబోతున్న సగలమ్మంటే చాలా కోపంగా వుంది వరాలుకి.

‘‘అమ్మా! సగలమ్మంటే ఎవురే’’ అడిగింది వరాలు.

చెంగమ్మ నెత్తి మీది గంపను కొద్దిగా ఇంకోవైపుకు తల మీద సర్దుకుంది.

‘‘సగలమ్మ ఎవురంటే ఏం చెప్తామే పిలా?! కాపోళ్లామె. వాళ్ల నాయిన ఆచ్చీపాచ్చీ అన్నీ అమ్ముకోని చెరువు కట్ట కట్టించినాడంట. ఎన్ని మాట్లు గట్టినా కట్ట నిల్చడం లేదంట. రోజూ వొడ్డోళ్లను దీసకపొయ్యి కట్ట కట్టించేదీ… మళ్లా పొద్దున్నే చూస్తే కట్టుండేది కాదంట.

‘‘ఇంగాయన అన్నం దినకుండా, నీళ్లు దాక్కుండా పండుకోనుంటే ఈ సగలమ్మ తల్లి బొయ్యి ‘ఏం నాయనా అట్ట బండుకోనుండావు’ అంటే ‘ఈ మాదిరి అయిపోయుండాదమ్మా పరిచ్చితి’ అన్నేడు. అంటే అప్పుడు సగలమ్మ ‘నువ్వు లెయ్యి నాయినా. నీకేంటికి నేనుండా పా’ అని తానం చేసి పెండ్లి కూతురు మాదిరిగా తయారయ్యి గడ్డపార బుజానేసి నాయిన్ను ఎంట దీసుకోని – సెరువెంబడి బయలుదేరిందంట.

‘‘అంతే – వాళ్ల నాయిన చూచ్చావుండంగానే ఆ తల్లి పామయి ఆడెత్తిన పడగ దించకండా…’’ అని ఆపి చెంగమ్మ తల్లి వేపు చూసింది. ‘‘ఏమ్మా! పామయిపొయిండ్లా’’ అడిగింది సందేహంగా.

అక్కణ్ణించి సుబ్బమ్మ చెప్పడం ప్రారంభించింది.

‘‘ఆ! గాలా పాము? నాయినా ఈ మాదిరి నేను పామయి పోతాండాను. నా యెంబడి సెరువు కట్ట ఏసుకుంటా రా…! కొనా మొదులుకు’ అనిందంట…’’

‘‘ఆ ఆడమనిషి పామయిపోయిందావ్వా’’ అడిగింది వరాలు కళ్లు పెద్దవి చేసి. వరాలు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.

‘‘పాము గాదుమ్మే… పాము అవుతారమైబోయింది. ఇంగాపాట్న కట్టట్నే నిలబడిపొయ్యింది. ఇంగాణ్ణించి సగలమ్మ దేవతైపొయ్యింది. ఎవురన్నా పెండ్లిండ్లకు బోతా ‘ఓ సగలమ్మ తల్లీ! పెండ్లికి గావాల నీ సొమ్ములిస్తావా’ అంటే సొమ్ములిచ్చేది. పెండ్లయి బొయినాక సగలమ్మ సొమ్ములు సగలమ్మకిచ్చే వోళ్లు ఎనిక్కి.

‘‘గానీ వొగరోజు వొగ గొల్లోడు కొండ మీద జీవాల్ని మేపుకుంటా – వాడి కూతురు పేరూ సగలమ్మే – ‘సగలమ్మా నీ అంకవలు బడిపోనూ… పలకవేమే’ అని కూతుర్ని తిట్నాడంట. ఆమయిన సగలమ్మ తల్లికి కోపమొచ్చి ‘నా అంకవలు పడిపొయ్యేది నిజమే. నువ్వు నా యెనక కుంటి యాపమానై నిలబడేది నిజమే. నీ జీవాలు నల్ల రాళ్లయి పొయ్యేదీ నిజమే’ అననిందంట.

‘‘ఇంగప్పట్నించి ఎవురు బిల్చినా పలికేది లే. సొమ్ములిచ్చేది లే’’ అని ముగించింది సుబ్బమ్మ. వరాలు మనసులో సగలమ్మంటే భయమూ భక్తీ కలిసిన ఒకలాంటి భావం స్థిరపడ్డం ప్రారంభించింది.

ముందుకెళ్లి శంకరయ్య చంకలోని కోడిని చేతుల్లోకి తీసుకుంది. దానికేదో చెప్పడానికి ప్రయత్నించింది.

అందరూ సగలమ్మ కట్ట చేరుకున్నారు.

గాలి హోరుమంటూ వీస్తోంది. ఆడవాళ్లకి ఎగిరిపోతున్న చీరల్ని పట్టు కోవడమే సరిపోయింది. గట్టిగా అరిస్తే గానీ వొకరిమాటలొకరికి వినిపించే పరిస్థితి లేదు.

సగలమ్మ మీదున్న పెద్ద వేపచెట్టు గాలికి విరుగుతుందా అన్నట్టు వూగుతోంది. సగలమ్మకు అటు మూడు ఇటు మూడు పెనవేసుకున్న పాముల్ని చెక్కివున్న నల్లరాతి పలకలున్నాయి. ముందు విశాలంగా నల్ల బండల్తో కట్టలా కట్టి చుట్టూ మోకాలెత్తు ఇనుప ఫెన్సింగ్‌ వేశారు. ఫెన్సింగ్‌కు ఓ చిన్న తలుపు లోపలికి వెళ్లడానికి.

కోడిని ఆ ఫెన్సింగ్‌ లోపల పడేశారు. రెండు కాళ్లు కట్టెయ్యడం వల్ల వొక వైపుకు వొరిగిపోయి కళ్లు మూస్తూ తెరుస్తోంది. భయం వల్ల అక్కడి నేలనంతా పాడు చేసేసింది. వరాలు వొంగి ఫెన్సింగ్‌ లోపలి కోడి వేపే చూస్తోంది.

సుబ్బమ్మ విగ్రహాల్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టింది. చెట్టు కింద కొంచెం దూరంలో అప్పటికే సిద్ధంగా వున్న మూడు రాళ్ల మీద బియ్యం గిన్నెను పెట్టి ‘‘మ్మేయ్‌ వొరాలూ… ఎండుపుల్లలు ఏరకరాయే బెరీన’’ అంది చెంగమ్మ.

వరాలు ఎండు పుల్లల కోసం చెరువు కట్టెంబడి పోతూంటే చెరువు కోళ్లు ఒక్కసారిగా నల్లటి మబ్బుల గుంపుల్లోకి ఎగిరాయి టపటపా శబ్దం చేస్తూ. ఆ దృశ్యం వరాల్లో ఎంత సంతోషం కలిగించిందంటే తాను కూడా ఓ చెరువు కోడి అయిపోయినంత సంతోషం కలిగి ఓసారి తన వేపు చూసుకుంది ఆ గాలిహోరులో.

పుల్లలు తల్లి ముందు పడేసి ‘‘బలపం బట్టి బేమ్మ వొళ్లో… అ… ఆ… ఇ… ఈ…’’ అని బిగ్గరగా పాడింది కులుకుతూ.

అందరూ నవ్వేరు. అప్పుడు వాతావరణం ఎంత వుత్తేజపూరితంగా వుందంటే ఎప్పుడూ చిటచిటలాడే శంకరయ్యకు కూడా లేచి గెంతాలనిపించింది.

పుల్లలతో నానాతిప్పలు పడి పొయ్యి వెలిగించారు.

అన్నం పూర్తిగా వుడకక ముందే వరాలు గబగబా బెల్లం పొట్లం తెచ్చి చెంగమ్మ వారిస్తున్నా వినకుండా అన్నం గిన్నెలోకి బెల్లాన్ని వొంపేసి కాగితానికి అంటిన బెల్లాన్ని పళ్లతో గీక్కుంటూ నిలబడింది.

మూడు రావిఆకుల్ని తెచ్చి వొక్కొక్క దాంట్లో కొద్దికొద్దిగా బెల్లపన్నమూ, వొక్కొక్క అరటిపండూ సగలమ్మకు నైవేద్యంగా పెట్టారు. విగ్రహం కిందుగా వున్న త్రికోణాకారపు గూట్లో చాలా కష్టపడి ప్రమిదను వెలిగించారు. అగరుబత్తీలు అంటించి ఓ సిమెంటు పగులులో గుచ్చి, కర్పూరం వెలిగించింది సుబ్బమ్మ. వెంటవెంటనే రెండు కొబ్బరికాయలు కొట్టి శంకరయ్య వేపు తిరిగి-

‘‘కొయ్‌! కోణ్ణి కొయ్‌. కర్పూరం ఆరిపోతుంది. అయ్యో నాయినా కోడికి గుది గాళ్లు దీలా… ఏం దీలా…’’ అని అరిచింది.

శంకరయ్య వుత్సాహంగా కోడి కాళ్లకు కట్టిన తాడును కోసేస్తూంటే, అంతవరకూ కొబ్బరిచిప్పల కేసి చూస్తున్న వరాలు గబగబా కోడి దగ్గరికి పరిగెత్తు కొచ్చింది. సుబ్బమ్మ విదిలించుకుంటున్న కోడి శరీరాన్ని పట్టుకుంది రెండు చేతుల్తో గట్టిగా. శంకరయ్య ఎడం చేత్తో కోడితలను పట్టుకుని కుడిచేతిలోని కత్తిని కోడి గొంతు మీద పెట్టాడు.

వరాలు కాళ్లు దబదబా అదిరాయి. చెమటలు పడుతున్న అరిచేతుల్తో లంగాని గట్టిగా పట్టుకుంది.

శంకరయ్య కోడి మొండేన్ని సర్కారు కంపల్లోకి విసిరి తలని చెంగమ్మకు అందించాడు.

చెంగమ్మ కోడితలని సగలమ్మ ముందు పెట్టింది. చెంబులోని నీళ్లు కుడిచేతిలో వొంపుకుని విసురుగా దాని తల మీద చల్లుతూ-

‘‘పలుకు తల్లీ! పలుకు… సగలమ్మ తల్లీ పలుకు!’’ అని అరిచింది.

కోడి తల రెండుసార్లు నోరు తెరిచి మూసింది.

‘‘అదో తల్లి పలికిందే. ఎర్రిముండా ఏడుస్తాండాయేమే. సగలమ్మ తల్లి పలికితే’’ అంది వరాలు వేపు చూస్తూ.

కళ్లలో నీళ్లు ఇంకి పోకముందే వరాలూ వుత్సాహంగా నవ్వింది.