కంపనవడ్డ కాళ్ళు   

rafi1

Art: Rafi Haque

           -జూపాక సుభద్ర

~

“ సావు ముండా సావే నువు సచ్చినాపాపంలేదే……

కుంటి ముండ నీకు కాల్లేలేవాయెప్రేమ గావాల్సొచ్చిందానె…..తెచ్చి పెడ్తాంటె మదమెక్కి కాని పంజేసి కడుపు దెచ్చుకుంటివి” అని బిడ్డ ప్రశాంతను యేసన్న తిట్టుకుంట, గుద్దుతండు ఎక్కడ బడితె అక్కడ తంతండు. తల్లి మల్లక్క’ వో అయ్యా బిడ్డె జత్తది కొట్టకు బాంచెనని’ అడ్డంబొయింది అయినా ఆగకుంట దీన్ని నరికినా పాపంలేదే దీన్ని సంపి జేలుకు బోత’ అని మల్లా వురికి ప్రశాంత ఎంటికలు బట్టి గొర్ర గొర్ర గుంజుకొట్టి గోడగ్గొడ్తాంటే….ప్రశాంత ఓ….ఓ…..అని మొంద్తుకుంటాంటె తల్లి మల్లక్క “ దానుసురు దాక్తది కాల్లులేని కబోది పచ్చసోంటీది. దాన్ని ఎంత గొడ్తె ఎమత్తది సెప్పు…..ఎంతగనమని కొడ్తవు వూపిరి లేంది పానంబోతది నీ దండంబెడ్త “ అని అమాంతం బిడ్డ ప్రశాంతను బట్టుకొని మొగని సేతులున్నఎంటికల్ని యిడిపిచ్చింది యేడ్సుకుంట.

“ అసే లంజే నువ్విచ్చిన లాగంతోనే నీ బిడ్డకు యీ యేషమైందే…. అద్దు పద్దు లేకుంట కడుపు దెచ్చుకున్నదే” అని బార్య మల్లక్క మీదికెగబడి యేసన్న తల్లిమీద పిల్లను, పిల్లమీద తల్లిని పడేసి కొడ్తుంటె పిల్లలు బయంతోని మూలల కూసోని ఏడుస్తుండ్రు. యిల్లంత తిట్లతోని, ఏడుపులతోని దద్దరిల్లుతంది.

కోపందీరెదనుక కొట్టి బైటికొచ్చి కూసుండు యేసన్న అల్సిపోయి’ దీంతల్లి మండమొయ్య, వుండెకాడుండక లేని పోని నామర్దజేత్తివి. యియ్యాల రేపు కాల్జేతులు సక్కంగున్న ఆడిపోరగాండ్లనే గంగల గల్పుతుండ్రు నిన్నెవడడిగిండే కుంటి ముండా, నన్ను పజితజేత్తివి ‘ అని నెత్తి గొట్టు కుంట తిడ్తుండు.

ప్రశాంత యింట్ల ఏడ్సుకుంట తన కడుపును గుద్దుకుంటాంటె…… సేతులు వట్టుకొని ‘గిప్పుడు గుద్దుకొనేం ఫాయిదనే…. గిన్ని నెల్లు దాత్తివి దైద్రందాన మైల గాకుంటె నాకొక్క మాట జెప్పవైతివి. ఏ డాక్టర్ కాళ్లు గడుపులు వట్టుకోనన్నా తీయిద్దును. గిప్పుడు ముదిరిపొయినంక డాక్టరేమన్నడో యింటివి గద! ఒక్క నెల గాదు రొన్నెల్లు గాదు ఏన్నెల్ల కడుపు దీత్తె పెద్ద పానానికి గండమని చెప్పె. మీ నాయిన ‘సత్తెమాయె తీసెయ్యాండ్రంటె’ పోలీసు కేసుబెడ్తనని డాక్టరు బెదిరిచ్చె, ఏంజేతుము, కాల్లు లేందాని వాయె ఎంత జాగర్తగుండాలె. యిప్పుడు వాడు జాడకులేకపాయె పత్తకు లేకపాయె. కడుపు జేసి అవుతల బడ్డడు’,.. మల్లక్క బిడ్డ కండ్లపోంటి నీల్లు తుడ్సుకుంట. వూరికిబోతె ఎంత మందేమంటరో, పల్లెనిడిసి పట్నంబొయి పరువు దీస్కున్నరని యిల్లవల్లి మాటలు మాట్లాడ్తరు. ఏ మొకం బెట్టుకొని వూరికి బోదుము బగమంతా! కుంటిది గింతకత జేత్తదనుకోలె గీ కత యెట్ల గట్టెక్కాలె యేసయ్యా…..మల్లక్క సొద యెల్లబోస్కుంట బిడ్డకాన్నే కూసున్నది.

ప్రశాంత ఏసన్న మల్లక్కలకు రెండోబిడ్డ. ప్రశాంతకు చిన్నప్పుడే పోలియో వచ్చి రెండుకాల్లు సచ్చుబడ్డయి. ‘ప్రశాంత’ కుటుంబంల, చుట్టాలల్ల  నోరు దిరుగని పేరు. పశాంతా అని కొందరు పశ్శా అని కొందరు, జెర పరిగాషికంగా ‘ఓపాషాటో’ అని కొందరు బిలుస్తుంటరు. యింట్ల ప్రేమగ ముద్దుగ కుంటవ్వా, కుంటక్కా అని పిలుస్తుంటరు. “గీ కుంటి పోరికి దొర్సానసోంటి పేరు బెడ్తివికాని మల్లక్కా….ఏ మచ్చె కాల్లు లేకపాయె. దీపంతోలె యెర్రగ సూడసక్కని సుక్కోలె వుండె. బిడ్డకు దేవుడు కాల్లు లేకుంటజేసె” అని తెల్సి నోల్లు బాద పడ్తుంటరు.

ప్రశాంతకు కుంటవ్వా, కుంటీసు, కుంటా…అనే పేర్లు యిని యిని ‘నన్నట్ల బిలువద్దు’ అని పోరి…..పోరి అల్సిపోయి సివరాకరికి ఆ పేర్లకే అలువాటు పడ్డది అసహాయంగ.

ప్రశాంత తల్లి దండ్రులు యేసన్న మల్లక్క పల్లెల కూలినాలి దొర్కుతలేదని 5 గురు పిల్లలతో సహ పట్నమొచ్చి సుతారి పనిజేస్కుంట బతుకుతుండ్రు. ప్రశాంతకు పెండ్లయిన అన్న యిద్దరు చెల్లెండ్లు వొక తమ్ముడు. ప్రశాంత మూడో తరగతి దాకా యింటి పక్కనుండే గౌరుమెంటు బడిల చదువుకున్నది తర్వాత తమ్ముడు చెల్లెండ్లను చూసుకునే దానికి బడికి బోవుడు బందు వెట్టింది. ప్రశాంతకు సదువుకు బోవుడు షాన యిష్టం. తమ్ముడు చెల్లెండ్ల పుస్తకాలు రోజు సదువుకొని ‘అమ్మా వోపెన్ గ పది రాయొచ్చునంటనే ఫీజు గట్టరాదె’ అని తల్లినడిగితే ‘ కాల్లు రెక్కలున్నోల్లకే సదువు సక్కంగత్తలేదాయె నీకేడత్తది బిడ్డా.’…అంటే “నీయవ్వ కాల్లకు తెలివికేమ్ సమందమే…..కాలు కుంటిదైతె తెలివి కుంటిదైతదానె’ అనే ప్రశాంత మాటల్ని యెవ్వరు పట్టి పర్వజెయ్యలే ఆమె చదువు  గట్టుకు మొరిగిన కుక్క తీరే అయింది.

పనుల కాడ మాత్రం కాల్లు లేవు గదా పనులేంజేస్తదనేది లేదు యింటోల్లకు. యింట్ల సకులం పనులు ప్రశాంతనే జెయ్యాలె కూసోనే వూడుస్తది, గిన్నెలు తోముతది, బట్టలుత్కుతది తమ్ముడు సెల్లెండ్లకు తానాలుజేయించి తయారు జేసి తినబెట్టి బడికి తోల్తది. అన్నవదినెలకు అమ్మనాయినలకు టిపిండ్లు కట్టిచ్చుడు, యింటికొచ్చేటాలకు అన్నంగిన్నె నోటికందిచ్చే పనులన్ని ప్రశాంతనే కూసొని జేస్తది. సుట్టు పక్కల బస్తోల్లు అవ్వా! కాల్లున్నోల్లేంపని కొత్తరు, కాల్లులేకున్నా యింటితోనింటెడు పంజేత్తంది మల్లక్కా….. బంగారి బిడ్డెను గన్నవని మెచ్చుకుంటే…..ఆ…యెంతజేసినా ఏమున్నది, నా బిడ్డెకు కాల్లు యియ్యకపాయె దేవుడు. ఎంతజేసినా కుంటిదే అంటది లోకం పాడువడని దుక్కపడేది.

Kadha-Saranga-2-300x268

యిట్లా గడియపుర్సత్ లేని దమ్మిడాదాయంలేని ప్రశాంతోల్లయింటికి అన్నబామ్మరిది రమేషు కొలువు యెతుక్కోనీకొచ్చిండు. తల్లిదండ్రులు, అన్నవదినలు సుతారి పనికిబోతే, సెల్లెండ్లు తమ్ముడు బడికిబోతే ప్రశాంత వొక్కతే యింట్లుండేది. యిదర్తమై రమేషు పొద్దున లేవంగనే పొయి యింట్ల అందరు ఎటోల్లటు యెల్లిపోయినంక యింటికొచ్చేటోడు. ప్రశాంత పనులుజేస్కుంటాంటె…..సాయంజేస్కుంట మాటల మాటకలిపిండు.

గీ మసిగిన్నెలు తోమి బంగారమసోంటి సేతులు నల్లగైనయి, నువ్వు గీ యింట్ల పుట్టవల్సిందానివి గాదురా బంగారం, నువ్వు దేవకన్నెవురా! అని ప్రశాంతను పొగుడి ఆకాశం జూయించిండు, కాల్లులేక పోతేంది మెరుపు తీగెవురా. నువ్వు వూ………..అంటే నా కండ్లల్ల బెట్టుకోని సూస్కంట నువ్వు నా యింట్ల వుత్తగ్గూసున్నా సాలు లైటేసే పనుండది. నిన్ను పెండ్లిజేస్కుంటె నేను లక్ష్మిదేవిని జేస్కున్నట్లే. నీ నవ్వుసాలురా దీపమోలె యెలిగే ఆ మొకంజాలురా కన్నా………. ఒక్కజెన్మగాదు యెన్ని జెన్మలైనా ఇట్లా సూస్కంట బత్కుతరా అని ప్రశాంతను మైకంల బెట్టి మాయజేసిండు, యెన్నెల్లు పూయించిండు. కుంటిదానా, కుంటిది అని యింట్ల బైట యినీ యినీ సెదలుబట్టిన ప్రశాంత సెవులు, రమేష్ ప్రేమ మాటలకు తేనె గూల్లయినయి.

యింట్ల తల్లిదండ్రి దగ్గెర కూసుండబెట్టుకొని బిడ్డె మంచిసెడ్డలడిగే దానికి, మాట్లాడనీకి వాల్లకు పుర్సతేవుండది తన తోటోల్లు ఎవ్వరొచ్చి స్నేహంజెయ్యరు, తమ్ముడు చెల్లెండ్లతోని అల్లరితో ఎగిరే దునికే ఆటలు ఆడుకోలేదు ప్రశాంత. తన సంబురాలు, దుక్కాలు కోపాలు సెప్పుకొనే దగ్గెరి మనిషే లేదు. రమేష్ మాటలకు ప్రశాంత నిద్రబోలే…..ఆమె మనసు చెమ్మ చెక్కలాడింది, ఎగిరి దునికి దొమ్మరి గడ్డేసింది అట్లా రమేష్ ప్రేమలో వున్న ప్రశాంత ఓ నాడు “నాకు నెలొస్తలేదు” అని రమేష్ నెత్తి పునుక్కుంటన్నది. ఆ మాటినంగనే రమేష్ కండ్లు పచ్చబడ్డయి ‘ ఎండ్రోజులాయె’ అని వులిక్కి పడి కడుపు మీద చెయ్యేసి చూసిండు మామూలుకంటె ఎత్తుగున్నట్లు అర్తమైంది.

ప్రశాంత ‘ చానరోజులైంది నెలరాక ‘ అని చెప్పినాగూడ ఏమెరుగనట్లు ఏంగాదులే అని చెప్పి………ఆ రాత్రే మెల్లెగ జారుకుండు రమేష్.

ప్రశాంతకు జెరంవచ్చుడు, ఏందిన్నా ఓకారిచ్చుకుంటాంటె జెరంవల్లనేమో అనుకున్నరు గానీ అది నెలదప్పిన ఓకారమని కనిపెట్టలేక పోయిండ్రు. లేవ కుండా ఎప్పటికి కూసొనే వున్నందుకు ఎవ్వరు కడుపు గుర్తువట్టలేదు. ఓనాడు మల్లక్క,, బిడ్డ కూసోని కదలనీకి అవుస్త పడ్తాంటె తేరిపారజూసి పసి గట్టింది. యిగ ఆ కాన్నుంచి ప్రశాంతను తిట్టుడు, కోట్టుడు యింట్లంత లొల్లిలోల్లి. డాక్టరు దగ్గెరికి తీస్కపోతే పిండమ్ముదిరిందని వల్లగాదని చెప్పేటాలకు……..ఏంజెయ్యాల్నో తెలువక ప్రశాంతను యింటికి దీసుకొచ్చి,.,. అన్న, తండ్రి సావసావ గొట్టిండ్రు. ఎవడు ఏందని ఆరాలు దీసి  తర్వాత రమేషని తెల్సుకుండ్రు.

ప్రశాంత సొద యెవరింటరు? కండ్లల్లదుక్కం కడుపుల బిడ్డె ఒక చిన్నప్రేమ మాటకోసం, ఓదార్పుకోసం, తియ్యటి పిలుపుకోసం యెనుకముందేవి ఆలోసించుకోలేక అది మోసమని యెర్కలేని యెడ్డితనంతోని బొందల వడ్డది.

కడుపు తీయించుడు వల్లగాదని డాక్టరన్నంక ప్రశాంత తండ్రి, అన్న పారిపోయిన రమేష్ ని యెతికి యెతికి పట్టుకొని, రమేష్ వూల్లెనే కుల పంచాయితి పెట్టిచ్చిండ్రు.

“యింట్లున్న కుంటిపోరిని యేన్నుంచో నా యింట్ల జొరబడి నా బిడ్డెబతుకాగమ్ జేసి గిప్పుడు తప్పిచ్చుక తిరుగుతుండు నా బిడ్డెకు నాయం జెయ్యాండ్రయ్యా అని ప్రశాంత తండ్రి యేసన్న, పంచాయితి పెద్దకు దండంబెట్టిండు. పంచాయితి పెద్ద నివద్దే యింట్లున్న కుంటి పిల్లకు కడుపుజేసి పోతివి, ఆపాపం నీదే గద పెండ్లి జేసుకో! ఎవలు జేసిన కర్మ వాల్లనుబవించాలె గద’’ “ ఎందీ పెండ్లా!”…………గా కుంటి దాన్నెట్ల జేస్కుంటరు రమేష్ కోపంతోని మరాపిల్లను తల్లింజేసినపుడు కుంటి తనం కనబల్లేదా! ఆ పిల్ల జోలికెందుకు బొయినట్టు ! ఆ పిల్లేమన్న కాల్లున్నదా నీ యెన్కబడనీకి, యింట్లున్న పిల్లను తల్లింజేసి,కుంటిదాన్ని నేనెందుకు జేస్కుంటంటే ఎట్ల! “అని పెద్ద మనిషి కోపానికొచ్చిండు.

ప్రశాంత తల్లిదండ్రులు కోపాన్నంత అనుసుకొని వున్నరు. ఏమంటె ఏంతప్పులవడ్తమో బండకింద సెయ్యున్నదని ఎక్కువ తక్కువ ఏమ్మాట్లాడ్త లేరు

“అయ్యో కాల్లులేందని మాగ మాట్లాడ్తండ్రుగానీ, కాల్లులేంది కాల్లులేని జాగల వుండాలె…..అది సక్కంగుంటే గిదంతెందుకు జరుగు, మీ పిల్లను అద్దుల వెట్టుకోకుంట మా పిలగానికి, గా కాల్లు లేందాన్నంట గట్టి ఆని బత్కునాగం జేత్తరా” రమేష్ తల్లి

“ఏహే అంటగడితె వూకుంటమా ఎట్లెట్లంటగడ్తరు? గిదెవడన్న మెచ్చే కతేనా’ అని రమేష్ తండ్రి అడుగు తాంటె రమేష్ యిగో మీరేంజేసినా, ఎక్కడికి బొయినా కేసులు బెట్టినా….జేల్లనన్న వడ్తగని గా కుంటిదాన్ని జేస్కునేది లేదని ఖరాఖండిగ తెగేసిండు.

పంచాది పెద్దమనుషులు గూడ కుంటి మెడకోడమ్ ను ఎట్లాజేస్కుంటడు అనే అంటన్నారు  గానీ ఒక అమాయక ఆడపిల్ల బత్కును మోసకారితనంగ అగాయిత్యంజేసి బుగ్గి జేసిన సెడ్డతనాల మీద ప్రశాంత తల్లిదండ్రులు మాట్లాడే న్యాయాలను బేఖాతరు జేస్తుండ్రు. పంచాది పిలగాని తరపున్నేవున్నదని అర్తమైనంక, మల్లక్క,యేసోబు కూడ బలుక్కున్నరు. మల్లక్క,. యేసోబు కోపంగ మాట్లాడితె ఎటుబొయి యెటత్తదోనని మల్లక్కనే కోపమంత దిగమింగుకొని “అయ్యా బాంచెన్ మీకందరికి ఆడిపిల్లలున్నరు యియ్యాల నా బిడ్డైంది రేపు మీ బడ్డెలక్కావచ్చు, గిట్ల నాయింట్ల కచ్చి నా పిల్లను బద్నాం జేసుడు మంచి రీతేనా ! పలానోల్ల బిడ్డె పెండ్లిగాకుంట కడుపైందాటనే మాట నలుగుట్లె తలెత్తుకునేటట్లుంటదా! మాకింక యిద్దరాడ పోరగాండ్లున్నరు, రేపు గాల్ల పెండ్లీలెట్లగావాలె! మీరే సెప్పుండ్రి దండంబెడ్తమ్. మీ బాంచన్, మీ కాల్లు మొక్కుత వాయ్యలార.,! కాల్లేని పచ్చి అన్యాలం జెయ్యకుండ్రి, రేపది ఎట్ల బత్కాలె మీరే జెప్పుండ్రి దానికి పుట్టిన బిడ్డకు తండ్రెవలంటే ఎవల పేరు జెప్పుదుము. నెత్తిమాద యిత్తులు బడ్డదారి వేరేవుంటది” అని మల్లక్క మాట పురంగ యినకుంటనే

“అరే మల్లా నెత్తి మీద యిత్తుల సంగతి మాట్లాడ్తవేందే, లేదంటె పాడుమంటన్నవ్” అని వురిమినట్లు రమేష్ తల్లి మాట్లాడంగనే…….అరే ఏందమ్మా ఆడిపిల్ల అండ్ల కాల్లులేని పిల్ల తల్లి ఏంజెప్తదో సొద యిననియ్యరాదు అని అదులాయించంగనే,. మల్లక్క “పెండ్లి పేరంటం లేకుంట కడుపొచ్చుడు కనుడు కులానిగ్గూడ బర్కద్దక్కువే, దానిగోస, ఏడుపు పిల్లపిల్ల తరాలకు తాకుతది వూకెనే పోదు ఆపాపం ఏమన్న జెప్పుండ్రయ్యా, ఏమన్నజెయ్యుండ్రి ఎటుదిరిగి దానికి పెండ్లిజెయ్యాలె బాంచెన్, లేకుంటె నా బిడ్డెబత్కది మేంబత్కము,” అని నిక్కచ్చిగ గుంజ బాతినట్లు మాట్లాడింది మల్లక్క.

ముందుగాల”గా కుంటిముండనేంజేస్కోను,మెడకేసుకొని తిరుగనా,” అస్సలే వద్దన్న రమేషును పెద్దమనుషులు “వాల్లుకేసులకు బోతె శాన తిప్పలవడ్తవు, జేలుకు బోతవు. వాల్లు మేదుగులయే పట్కె నువ్వు బచాయించినవు, నువు సొక్కంగున్నట్లు మీదికి బోతెట్ల తప్పు నీది జెర తగ్గుండ్రి” అని రమేషుని వాల్ల తల్లిదండ్రులను భయపెట్టిండ్రు.

చాలాసేపు ప్రశాంత తల్లిదండ్రులు ‘పెండ్లంటే’,., రమేష్ వాల్లు ‘చేస్కోము’ బైసు నడ్సినంక పెద్దమనుషులు ఒక తీర్మానాని కొచ్చిండ్రు. ‘మీయిద్దరి తరుపున పంచాది పెద్దమనుషులు ఒక నిర్ణయాని కొచ్చినమ్ యినుండ్రి’. “యిగో పిల్లగా ఆ పిల్లను యింట్లున్న దాన్ని బైటేసి బద్నామ్ జెసి తప్పుల వడ్డవు ఆ తప్పుకు నువ్వు ఆ పిల్లను పెండ్లిజేస్కోవాల్సిందే,…..ఎందుకంటె పెండ్లి లేకుంట పిల్లను కనుడు కుటింబానికి కులానిగ్గూడ అపకీర్తే… యిగ పెండ్లయినంక సంసారానికి తెచ్చుకుంటవా లేదా అనేది మీ యిష్టం పెండ్లయితె సేస్కునుడు సేసుకునుడే… యిగ పెండ్లిగాకుంట ఆ పిల్లను ఆగం జేసినందుకు దండుగ 50 వేల రూపాలియ్యాలె, యిగ దీని మీద ఎవ్వలు మాట్లాడద్దు యిటోల్లటోల్లు అని… యిగ తిరుగు లేదన్నట్లుగ పంచాది తీర్మానంజెయ్యంగనే……

ప్రశాంత తల్లిదండ్రులు సంసారం సంగతెట్లున్నా పెండ్లయితంది గదా! అని జెర సల్లబడ్డరు. రమేష్ వాల్లు ఏదో పెండ్లియిందనికండ్లు మూసుకుంటె అదటు మనమిటు, అది గుదిబండోలెయింట్ల వుండది గదా! ఏదో! జరిగిన తప్పుకు యాబై వేలేసిండ్రు అడిగినప్పుడు సూద్దాంలే అని….. అటోల్లు యిటోల్లు రాజి పడ్డరు. పిల్లకు పొద్దులంటండ్రు కతజెల్దిగానియ్యాలె, యీ వారంల ఫలానా తేది బెట్టుకోండ్రి పెండ్లి. ఆ రోజు కల్లా పిల్లందీసుకొని రాండ్రి పెండ్లిజేద్దామని రెండు కుటుంబాల్ని సమదుజేసి సాగనంపిండ్రు పంచాది పెద్దలు. బిడ్డె మీద నింద లేకుంట నలుగుట్లె పెండ్లయిందనిపిచ్చుకుంటెసాలు మనం బత్కినన్నాల్లు, మనతోటి కలో గంజో కాగిబత్తది. కూల్నాలి జేసుకొని బత్కెటోల్లము. నా బిడ్డెను సంసారానికి తోల్కపొమ్మని ఆల్లింటి సుట్టు పంచాదులు పెడావులు జేస్కుంట యాడ దిరుగుతము, నా పిల్లనాగంజేసిన రమేష్ గాడు మాగజత్తడు పురుగులవడి. అని ఒక్కసిత్తం జేస్కొని ప్రశాంత తల్లిదండ్రులు యింటికొచ్చిండ్రు.

పంచాది తీర్మానంయిన్నకాన్నుంచి ప్రశాంతకు కడుపంత సలసలమరుగుతుంది పెండ్లి లేకుంటేది అసోంటి అవుమానంపెండ్లి అయితేంది కాకుంటేంది వాని కాల్లకింద యీగినట్టు వాన్నిపెండ్లిజేసుకొని సంసారానికి పోకుంట వుండేటట్లు ఆ పెద్దమనుషులెట్ల పంచాజ్జేసిండ్రు? నా అసోంటి బిడ్డె వాల్లకు లేదా! వాడు జేసిన మోసానికి వాని మొకంజూడొద్దు. మోసంజేసింది వాడైతె శిక్ష నేను మొయ్యాల్నా! దొంగ బాడ్కావ్ ఎంత బెల్లమ్మాటలు సెక్కర మాటలు మాట్లాడిండు? నన్ను నడింట్ల బొండిగ్గోసి పొయిండు. ఏంజేద్దు దేవుడా గీ బతుక్కంటె బాయిల దునికి సచ్చింది మేలు “ఓ అమ్మా, ఓ,నాయినా నన్నిట్లనే సంపుండ్రే నాకీ పెండ్లద్దే——ఆ లుచ్చబాడ్కావుకు నేందండెయ్యనే, యీ కడుప్పాడుగాను అని యిల్లంత బొబ్బవెట్టి, బోండ్రిల్లాలనే’’ దేవిపోతున్నది———కాని అట్లజేత్తె తప్పంత నాదని నాకు మదమచ్చి కడుపుదెచ్చుకున్ననని నా మాదికే యెగవడ్తరు. అవన్ని యిని యిని సెవులు పుండ్లయినయి ప్రశాంతకు.

కాల్లతో పాటు మనసుగూడ సచ్చుబడితె బాగుండను కున్నది దరిలేదు దాపులేదు, దిక్కులేదు దెశ లేదు ఎటుజూసినా యీ సావు పెండ్లి నాపే ఆసరకన బడ్తలేదు ప్రశాంతకు. సావనన్న జత్తగాని యీపెండ్లి మాత్రం జేసుకోను, ఏంజెయ్యా లెనని వల పోస్కుంటనే వున్నది.

ప్రశాంతకు పొద్దులు నిండి కుండంత బొత్త కూసుంటె నేల మీదనేవుంటంది. యించు మందంగూడ కదులుడు కష్టమైతంది. పన్నెది పన్నట్లే వుంటంది. నీల్లు తాగితే, అన్నందింటె బాత్రూమ్ లకుపోవాల్సి వస్తదని అవి గూడ ఎక్కువ తాగుతలేదు తింటలేదు తల్లే ఎత్కపోయి మల్లా మంచాల పండుకో బెడ్తంది. గింత పస్తున్నా నాకు సావస్తలేదాయె, సద్దామంటె గూడ సచ్చేదారుల్లేవాయె యీ గోస యెట్లతెల్లారాలె దేవుడా! అని రాత్రులు గూడా గుండెలు పిండి పిండయే దుక్కం యెగబోస్కుoటంది.

పెండ్లి రేపనంగ మల్లక్క, ఏసన్న ప్రశాంతను తీస్కొని కుటింబంతోని పయనమైండ్రు. ప్రశాంత అల్లకల్లోలమైన అశాంతితోని, ఆందోళనతో కడుపుల పిండం గూడ ఆరగోలు బారగోలయి డాక్టరమ్మ యిచ్చిన తేది కన్నా పదిరోజుల ముందే బసుల్నే నీల్లాడింది ప్రశాంతి. పిలగాడు బుట్టిండు. యీ దుక్కాలల్ల నీల్లాడే నొప్పులు గూడ దిగ దుడుపైనయి.

“ఓ బగమంతా! గీ బిడ్డె మీద నీకెందుకు గింత పగ. ఎందుకు నా బిడ్డెను గింత సెరబెట్ట వడితివి. గీ కుంటిపోరి ఎవ్వలకేమన్యాలం జేసిందని దానికింత గోస! గీ బాలెంతం దీసుకొని యెట్లబోదుము పెండ్లని” మల్లక్క శోకాలు దీత్తాంటె……

“సోకాలెందుకే.. సోకాలు బందువెట్టు అని బార్యనదిలిచ్చి, ప్రశాంతంజూస్కుంట ఏసన్న “దీంతండ్రి పెండ్లమ్ముండమొయ్య, లోకంలున్న దైద్రమంత దీన్నెత్తి మీన్నేవున్నదేంజేద్దామ్, యెన్కకు బోతే, పంచాది మల్లా…యెన్కకత్తది, కతమొదటి కత్తది. ఏమన్నగానీ, యెట్లన్నబోనీ…. పెండ్లయిందని పిచ్చుకోనద్దాంపా ! అని బార్యకు సగ జెప్పిండు. అదే పచ్చిబాలెంత తోని, పసిగుడ్డుతోని పయనమైండ్రు.

పెండ్లి రమేష్ వూరిల చర్చిముందట.పెద్ద మనుసులు చెప్పినట్లు టెంటు కుర్చీలేయించిండ్రు. అదే వూల్లె సుట్టాలింట్ల దిగిండ్రు ప్రశాంత కుటింబమంత. అవ్వా! బాలెంతకు పెండ్లా…. బల్లె పిలగాన్ని బెట్టుకొని పెండ్లా! అని వూరోల్లు, బందువులు ముక్కిరిసిండ్రు మూతిరిసిండ్రు. కొందరు అయ్యో!బిడ్డా ఏం రాతరాసుకచ్చుకున్నవే…. గిసోంటి కష్టం ఎవ్వలకు రావొద్దే అని జాలి పడ్డరు.

ప్రశాంతకు సెవు నిండ దూదులుబెట్టి కడుపుసుట్టునడికట్టేసి మీదికెలి కొత్తబట్టలు గట్టిచ్చిండ్రు పచ్చి తల్కాయని దువ్వెన బెట్టక ఎంటికలు సరిజేసి జెడేసిండ్రు పెండ్లంటే….సందడిగ, లొల్లి లొల్లిగ సుట్టాలతోని బందువుల తోని బ్యాండుసప్పుల్ల తోని సంబురంగ వుంటరు. అట్లాంటి సంబురాలు, సంతోషాలు లేవు ప్రశాంత పెండ్లిల. ఎవరో సచ్చిపోయినట్లు,అందరు దిగాలుగ, దిగులుగున్నరు పెండ్లికచ్చినట్లు లేరు సావుకొచ్చినట్టేవున్నరు.ప్రశాంత తల్లిదండ్రులు,అన్న,యివన్నేంబట్టిచ్చుకుంటలేరు. పెండ్లయిందని పిచ్చుకుంటెసాలు అన్నట్లున్నరు. కానీ ప్రశాంతకు యివన్ని అవుమానంగనే వున్నయి, కడుపును కత్తికోత బెడ్తున్నయి.

చర్చిల అడుగెత్తు గద్దెమీద రెండుకుర్చీలేసిండ్రు చర్చిల పంచాది పెద్దలు అటుబందువులు యిటు బందువులోల్లు కూసుండ్రు కాల్లులేని ప్రశాంతను తండ్రి ఎత్తుకోనొచ్చికుర్చిల కూసుండబెట్టిండు. తర్వాత రమేష్ వచ్చికూసునేటాలకు ప్రశాంత పచ్చిపెయి నరాలన్ని పొంగినయి ‘నన్నుబొంకిచ్చి బోర్లిచ్చి, నన్ను నలుగురు నవ్వే బత్కును జేత్తివి గదరా! అని కడుపంత సలసల మసిలింది. ప్రశాంతకు ఎదురుగ కూసున్న రమేష్ని బూడిది సేసేటట్టు చూసింది.

చెర్చిపాస్టరు ఏందేందో పెండ్లివాక్యాలు జెప్తుంటె అవి సావు వాక్యాలోలె యినబడ్తన్నయి ప్రశాంతకు. .వాక్యాలన్ని అయి పోయినంక పాస్టరు, పిల్ల పిల్లగాని తల్లి దండ్రుల్ని గద్దెమీనికి బిలిసిండు. దండలు, తాలిపుస్తె, పల్లెంబట్టుకొని ప్రశాంత తల్లిదండ్రులు గద్దెక్కి పిల్ల పిలగాని ముందటున్నసిన్న బల్లమీన బెట్టిండ్రు.’ ‘పరిశుద్ధాత్ముడైన దేవుని సన్నిధిలో యీ బిడ్డలు భార్యా భర్తలు కాబోతున్నరు వీరినాశీర్వదించుము ప్రభువా’ అని పాస్టరు దండలు మార్చుకొండని చెప్పి రమేష్కి దండ అందిచ్చిండు రమేష్ దర్జాగ దండవట్టు కొని బింకంగా నిలుసొని ప్రశాంత మెడల దండెయ్యబోతుండంగనే…….ప్రశాంతకు యేన్నుంచి వచ్చిందో ఏమో ఏనుగంత బలము, యిన్నిరోజులు మూసుకొని, దాసుకున్నదుక్కం వొక్కసారే మరుగుతున్న నిప్పుల వుప్పెనోలె ఎగదన్నింది. పచ్చిపెయంత యీనినావోలె రెచ్చిపొయింది. దండ గుంజుకొని రమేష్ మొక్కమ్మీన గొట్టింది సిప్ప సప్ప ‘’అరేయ్….నువ్వు బత్కద్దురా సావురా….. నాబత్కును బండల్జేత్తివి గదరా! యింట్లున్నదాన్ని బజార్లేసి నలుగుట్లె నవ్వుల పాల్జేసినవురా, అని అంగిబట్టుకొని గుంజి అప్పుడు కనబల్లేదుర నేను కుంటిదాన్నని, దబ్బ దిబ్బ దంచి అంగిసింపి పక్కన పల్లెంలున్న దండ, తాలిపుస్తె దీసి నేలగ్గొట్టింది కాల్లులేనోల్లంటె గింత లోకువార! బాడ్కావు! నీతోని పుస్తె గట్టిచ్చుకొని నీ పెండ్లాన్ననే పేరు జెప్పుకోని నేంబత్క నాకీ పెండ్లే వద్దు.. యీ అడ్డమైన పెండ్లినాకద్దు. గింత లుచ్చ పెండ్లి నాకద్దు,గింత లఫంగి పెండ్లి లత్తకోరు పెండ్లి నాకద్దు………..అని చర్చంత దద్దరిల్లేటట్లు బొబ్బ బెట్టుకుంట ‘’ఓ అమ్మా నన్ను సంపుండ్రే…. నేను సావనన్న సత్తగాని, నాకీ సావుపెండ్లి జెయ్యకుండ్రే గీ బట్టెబాజిగాని పేరు నేను మొయ్యనే నాయినా అని కడుపులున్న దుక్కం, బాద కోపం, కసి, అవుమానమంతా కాండ్రికిచ్చి థూ…… అని తుపుక్కున రమేష్ మొకం నిండ వూంచింది.

యింత అధాటుగ యిట్ల జరుగంగనే చెర్చిల అందరు బీరిపొయి సూత్తాంటె….. సల్ల సేముటలు బెట్టి వణుకుతున్నప్రశాంతను మల్లక్క ఏసన్నలు ఎత్తుకొని బైటికెల్లి పోయిండ్రు. కాల్లు కంపన వడితేంది మొకమ్మిద మంచిగ దన్నిందనుకుండ్రు చెర్చిల కొందరు.

*

అరె!

చిత్రం: రాజశేఖర్

చిత్రం: రాజశేఖర్

 

-ఆర్.దమయంతి

~

 

అతని కోసం ఎదురుచూస్తున్న ఆమనికి విసుగొచ్చింది.  ఆ తర్వాత  – అది అసహనంగా  మారే అవకాశాన్ని రానీకుండా పుస్తకం తీసుకుంది చేతిలోకి. రెండు పేజీలైనా పూర్తి చేయకుండానే అర్ధమైపోయింది ఆ నవలా ఇతివృత్తం.

తనతో కాపురం చేయనంటున్న భర్త మీద తిరుగుబాటు చేసిన ఒక స్త్రీ కథ.

ఆమని కి ఒళ్ళు మంట ఇలాటి కథలన్నా, టీవి ల్లో చూపించే దృశ్యాలన్నా.

కట్టుకున్న వాడు ‘నువొద్దు మొర్రో ఫో’అని తరిమి కొడుతుంటే..  స్పర్శ రహిత శరీరంతో ఆమె మాత్రం.. అతనింట్లోనే పడుంటానండం, అతనితోనే కాపురం చేసి తీరతాననడం..ఎంత హాస్యాస్పదం!  ఎంత వ్యక్తిత్వంలేని తనం? పై పెచ్చు వాదన ఏమిటంటే, – తన హక్కు కోసం పోరాడుతున్నట్టు చెబుతుంది?

నిజమైన మొగుడూ పెళ్ళాల మధ్య హక్కులేమిటీ? శాసనాలేమిటీ? ఆ ఇంటిముందు మూగిన జనాలు,  స్త్రీ వాద సంఘాలు, మరో పక్క విలేకరులు,  కెమెరాలు, పోలీసులు… పెద్దమనుషులు… వీళ్ళంతా కలసి ఆమెని ఆ ఇంట్లోకి నెట్టి పోవచ్చు. కానీ ఆ తర్వాత గదిలో వాళ్ళు స్వచ్చమైన మనసుతో  ఎలా కాపురం చేస్తారని?

ఒక సారి  భార్య పట్ల ఇంత హేయం గా ప్రవర్తించిన వాడు, జనం బుధ్ధి చెప్పడంతో అమాంతం మంచివాడైపోతాడా? భయంతోనో, బెదిరింపులతోనో, కత్తి చూపించో, కక్ష కొద్దో చేసేదీ –  ఒక కాపురమే?!పండంటి కాపురమే?

ఎవరి మనసుని వారు ప్రశ్నించుకోవాలి. పైకి బాగానే వున్నా మేడి పండు చందం లా, ఎవరి ఆత్మ ఘోష ఎంతో ఆ జీవులకే తెలియాలి.

తననెప్పటికీ ఒక  గొప్ప సందేహం వెంటాడుతూ వుంటుంది.

ఎంత తాళి కడితే మాత్రం?! ..అసలంత పచ్చి శత్రువుతో ఆ పెళ్ళాం ఎలా పడుకుంటుంది?

‘నోర్ముయ్. అలాటి పిచ్చిమాటలు మాట్లాడకూడదు. సంసార పక్షమైన ఆలోచన్లు చేయి” – తల్లి కంఠం కంచులా మోగింది. ఆవిడ అక్కడ లేకపోయినా!

నవ్వొచ్చింది ఆమనికి.

అమ్మ ఏవడిగింది? తను – పుట్టింటికి తిరిగొచ్చినప్పుడు?

గదిలోకొచ్చి, తలుపులు మూసి, దగ్గరగా, చెవిలో రహస్యంగా అడగలేదూ? – ‘ఒక మాట అడుగుతాను చెప్పు. మీ ఆయన నీతో ‘కాపురం చేస్తున్నాడా?” ముఖమంతా  ఆందోళన నింపుకున్న  – ఆవిడ్నీ, ఆ అడిగే తీరు నీ చూసి  తను ఫక్కున  నవ్వింది.

ఆవిడకి కోపమొచ్చింది. “పరాచికాలకిది సమయం కాదు. అవతల నీ జీవితం నాశనమైపోతోంది నీకర్ధమౌతోందా ఆ సంగతి? ఇప్పటికైనా నిజం చెప్పు. ఎందుకంటే- నీ కాపురాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నాకుంది.” అంది గంభీరమైన గొంతుతో.

ఆవిడ దృష్టిలో ‘కాపురం’ అంటే సెక్స్.  తామిద్దరూ  కలసి సఖ్యం గా  ‘కాపురం’చేసుకునే కార్యంలో  – ఈవిడ బాధ్యతాయుతమైన పాత్ర పోషించడమేమిటో అర్ధం కాక మళ్ళీ తను నవ్వింది. గట్టిగా,  మరింత గట్టిగా నవ్వేసింది.

‘అడుగు తుంటే సమాధనం చెప్పకుండా ఏమిటా వెర్రి నవ్వూ, నువ్వూను?’ అంటూ అక్కడ్నించి విస్సురుగా  వెళ్ళిపోయింది.

Kadha-Saranga-2-300x268

తల్లి అమాయకత్వం మీద జాలేసింది. ‘భార్యా భర్తల మధ్య శారీరక సంబంధం కొనసాగుతూ వుంటే, ఇక ఆ సంసారానికి ఢోకా వుండదు.’ – అనేది ఆవిడ అభిప్రాయం కావొచ్చు. లేదా, గట్టి నమ్మకవూ కావొచ్చు.

కానీ, పగలు జరిగే యుధ్ధాలను కానీ, లేదా ఇద్దరి మధ్య రగిలే ఘోర విభేదాలను గానీ –  ఈ సెక్స్యుయల్ బంధమేదీ లేవీ అడ్డుకోలేదన్న  సంగతి ఆవిడకి తెలీదు. చెప్పినా అర్ధం కాదు.

ఎందుకంటే – సర్దుకుపోవడానికి, సహనం నశించిపోవడానికి మధ్య వున్న దూరం  చాలా పెద్దదన్న నిజం ఆమె ఒప్పుకోదు.

అది – ఇన్నోసెన్సో, ఇగ్నోరెన్సో ఏదైతే ఏంలే, కొందరి స్త్రీల అమాయకత్వాలే కొంతమంది భర్తలకి శ్రీరామ రక్షలు.

ఇలాటి జంటే ఒకటుంది తనకి తెలిసి.

వాడు పట్టుబడ్డాడు.సాక్షాత్తు భార్యే పట్టిచ్చింది. పేపర్లో కూడా వచ్చింది ఆ వార్త. చుట్టాలందరూ ఏమౌతుందా కథా అని చెవులు కొరుక్కున్నారు. పరుల బాధలు –  మంకి వినోదాలు కదా. అయితే, చివరికి ఏమీ కాలేదు. ఆమె  ఇల్లొదిలి ఎక్కడికీ పోనూ లేదు. అతను తన అలవాట్లను  మానుకోనూ లేదు.

ఇప్పటికీ అతనితోనే..’కాపురం’ చేస్తోంది. పెళ్ళిళ్ళకీ  పేరంటాలకీ   నవ్వుముఖమేసుకుని కనిపిస్తూనే  వుంది. పాపిట్లో ఇంత సిందూరం  పులుముకుని. మొన్ననే  దంపత్ సమేతం గా పీటల మీద కూర్చుని –  సత్యనారాయణ వ్రతం చేసుకుని లేచారు.

ఇలాటి వాళ్ళని చూసి తనెన్ని సార్లు బుర్ర బద్దలు కుంటుందో! ఈ మోసగాడితో, ఎలా ‘కాపురం’ చేస్తోందీ ఈమె అని?

‘చేయక?, మరెక్కడికి పోతుంది పాపం!’అనుకోడానికి ఆమేమైనా చదువూ డబ్బూ లేనిదా అంటే అదీ కాదు.

మరి? – అర్ధం కారంతే. వదిలేద్దాం.

స్త్రీలు ధనం తో కాదు. – వ్యక్తిత్వంతో బ్రతకగలిన రోజే అసలైన స్త్రీ స్వేచ్చకి అర్ధం.

తనకీ సమస్య వొచ్చింది. మొదట్లో – విడాకుల వరకూ వెళ్ళకూడదనుకుంది. రాను రాను  భరించడం కష్టమై, వొద్దనుకుంది. శాశ్వతంగా వొద్దనుకుంది.

లోపమేమిటో చెప్పాలన్నారు.  ఎందుకు చెప్పాలనేది తన పాయింట్.

ఒక మగాడికి దురలవాట్లేమీ లేనంత మాత్రాన, అతగాడు గ్లోబల్ లేబుల్డ్ మొగుడైపోతాడా?

ఆ మాటకొస్తే భర్తలో భార్యకి కనిపించిన వీక్నెస్సులు ప్రపంచంలో మరెవరికీ కనిపించవు.

ఇంట్లో కాసేపు కూర్చుని వెళ్ళిపోయే మనిషినైతే ముక్కు మూసుకుని ఎంతైనా భరించొచ్చు. కానీ, కాలమంతా కలసి బ్రతకాల్సొచ్చినప్పుడే – ఆ లోపం మరింత భయంకరం గా కనిపిస్తుంది. ముఖ్యంగా గదిలో..ఒకే మంచాన్ని పంచుకోవాల్సొచ్చినప్పుడు.. ఉహు. ఇక భరించడం తన వల్ల కాదంటుంది మనసు.

అప్పటి అ పరిస్థితిలో – తననెవరూ  అర్ధం చేసుకోవడం లేదనే చింత మానుకుంది. నిరాశనిస్పృహలనించి – ధైర్యంగా సమస్యనెదుర్కుని ఒడ్డుకొచ్చిపడింది.

నిజమా! నిజంగా  తను ఆ సుడిలోంచి బయటపడిందా? – అవును., కాదు.! దేనికి ఎక్కువ మార్కులేయాలో తెలీడం లేదు.

సెల్ మోతకి ఉలిక్కిపడి, ఆశగా అందుకుంది. అతనేమోనని.  స్క్రీన్ మీద ‘అక్క’ పేరు చూసి నిట్టూర్చింది. నిరాశగా.

“హలో అక్కా..”

“ఏమిటే , అలా వస్తోంది మాట నీరసంగా”

పట్టెసింది తనని. ఎంతైనా అక్క తెలివిగలది. ‘నువ్వెంత చదివి ఏం లాభం? అక్కలా కాపురం చేసుకునే తెలివితేటలు లేనప్పుడు?” తల్లి వేసిన దొబ్బులు చెవిలో మోగాయి.

“లేదక్కా, బాగానే వున్న. చెప్పు. ఏమిటి సంగతులు? ‘ బావగారితో నీ ‘కాపురం’ఎలా సాగుతోంది?”

అడిగింది నవ్వుతూ.

“ఆ. నన్నే అడిగావ్? ఎప్పుడూ వున్న ఖర్మే. నా రాతెప్పుడు మారేను?”

“యాగీ చేసొచ్చానన్నావు కదా? ఏమైంది?”

“దాన్నొదిలేశాడు. కానీ ఇప్పుడు కొత్త రోగం పట్టుకుంది. అది మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తున్నాడు వెధవ.”

“అయ్యో. అలానా! ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడా?” ఆందోళన గా అడిగింది.

చిత్రం: రాజశేఖర్

“కొట్టడమెక్కడా? మాటలే లేవు.” ఎంత నిస్పృహ! బూతులు తిడుతూ, వీర బాదుడు బాదే మొగుడి దురాగతాలకి అలవాటుపడిపోయిన భార్యలకి నిలువెత్తు నిదర్శనం లా..కాదు కాదు ఆదర్శిని లా  కనిపిస్తోంది అక్క – ఆ క్షణంలో.  “పైగా చెప్పా పెట్టకుండా ఎటో పోతాడు. ఎప్పుడో గానీ, ఇంటికి తగలడడు. వున్నాడనుకోనా? పోయాడనుకోనా? పోయినా ఫీడా పొదును. పోనన్నా పోడు.” వింటున్న ఆమని కి ఆశ్చర్యమేసింది. మొగుణ్ణి ‘ఏమండీ ఏమండీ’ అంటూ పిలిచే అక్కేనా ‘వాడూ వీడూ’ అని చీదరిస్తోంది? ఈ విడిగారే గా చారుమతి అవతారమెత్తి  శ్రావణ శుక్రవార నోము నోచుకుని, ఆ తాగుబోతు పాదాలను లాక్కుని మరీ దణ్ణాలు పెట్టింది?! ఔర!

మొగుణ్ణి  వెనక తిట్టుకోవడం లో పెద్ద  తప్పు లేదని అక్క గాఢాభిప్రాయం. హు. ఇదీ –  గౌరవ దంపతుల సిధ్ధాంతం.  ఇంకా వింటోంది అక్క మాటల్ని. “వీడి వల్ల పుట్టిన పిల్లలు లేకపోతే నేనూ..ఎవడోకణ్ణి పట్టుకు పోయేదాన్ని. నీ..లా..గ…   హాయిగా..”

‘ నీ…లా…గ…నీ లా..గా..’ -అక్క మాటలు చెంప మీద చాచి కొట్టినట్టనిపించింది ఆమనికి.

అసలీమెకేం మాట్లాడాలో తెలీదు. ఇంతకు ముందు ఇలానే పరామర్శ పేరుతో నొచ్చుకునేలా మాట్లాడితే కాల్ కట్ చేసింది. కానీ మళ్ళా ఆమే,  పదే పదే ఫోన్ చేయడంతో, క్షమించింది. సర్లే. ఈ మాత్రమైనా తనని పలకరించే వాళ్ళెవరున్నారనిపించి, మాట్లాడుతోంది.

“ఏమనుకోకే ఆమని, నేను నిజం చెబుతున్నా..నువ్వు చేసిన పనే కరెక్ఠ్ అనిపిస్తోంది నాకిప్పుడు. మొగుడికి నీతి నిజాయితీ లేనప్పుడు ..పెళ్లానికి మాత్రం ఎందుకుండాలే? పెళ్ళాన్ని పెళ్ళాం గా చూడని ముండమోపులతో కాపురాలేవిటే చెల్లీ? నాకు మనసు రగిలిపోతోందే!..ఈ శరీరాన్ని డబ్బాడు కిరసనాయిలు పోసి తగలబెట్టాలనుందే..” అక్క ఆవేశం దుఃఖంలోకి మారిపోతుంటే, ఆ నిస్సహాయ స్థితికి జాలేసింది ఆమనికి.

“బాధ పడకు అక్కా. పోనీ నా దగ్గరకొచ్చి వుంటావా,  ఓ నాలుగు రోజులపాటు?” మనస్ఫూర్తిగా పిలిచింది.

రెండు సెకన్ల తర్వాత మాట్లాడింది అక్క. చెంగుతో  కళ్ళు తుడుచుకున్నట్టుంది. “వొద్దులేవే ఆమని! నేనక్కడకొచ్చినప్పుడు ఈయనిక్కడికొస్తే..పెద్ద గోలౌతుంది. మా అత్త పక్షి వుంది గా. అది లేనిపోనివన్నీ వాడికెక్కిస్తుంది. మొగుడు ఊళ్ళో లేనప్పుడు, చెప్పకుండా రహస్యం గా వెళ్ళానని  లేని ‘..తనాలు’ అంట కట్టినా అంటకడ్తుంది. కట్టుకున్నవాడు సవ్యమైనవాడైతే గా, నమ్మకపోడానికి? –  విన్న వాళ్ళు కూడా నిజమనుకుంటారు. అది నే భరించలేను. ఆ తర్వాత బ్రతికేం లాభం చెప్పు? ఇప్పుడొద్దు.  తర్వాతెప్పుడైనా వస్తాలే..”

అక్క మాటలకి, ఆమె ఆలోచనా విధానానికి గాఢం గా  నిట్టూర్చింది ఆమని.

“అవునే ఆమనీ? ఇప్పుడితను నిన్ను బాగానే చూస్తున్నాడా? ..” ఆ కంఠం లో ఆర్ద్రత కంటెనూ, ఆరా తనమే కొట్టొస్తూ వినిపించింది.

“ఆ! బాగానే వుంటున్నాం అక్కా” అని జవాబిస్తూనే లోపల్లోపల అనుకుంది. ‘ఇక మొదలు. ప్రశ్నల దాడి.’

“పోన్లే. వ్రతం చెడ్డా ఫలం దక్కా లంటారు అందుకే! నువ్వు సుఖం గా వుంటే అంతే చాలే నాకు. కానీ విను.  నీ తోబుట్టువుగా నీ మేలు కోరి  చెబుతున్నా విను. మగాణ్ని నమ్మేందుకు లేదు. ఇవాళున్నట్టు రేపుండాలని రూలేం లేదు. వాడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మన చేతుల్లోంచి జారిపోతాడో చెప్పడం కష్టం. ఇరవై నాలుగ్గంటలూ ఏం కాపలా కాస్తావ్ కానీ, మెల్లగా ఈ మాటా ఆ మాటా చెప్పీ ఆ మూడు ముళ్ళు వేయించుకో. ఏ గుళ్ళోనో పూలదండలు మార్చుకుని, ఒక ఫోటో తీయించుకుని ఇంట్లో పెట్టుకో.. ఎటొచ్చెటు పోయినా పడుంటుంది ఒక ఋజువుగా!..  ఏమిటీ? వింటున్నావా?”

అక్క గారి మాటలకీ, సూచనలకీ – ఆమని మది చెదిరింది.

శ్రేయోభిలాషి పాత్ర పోషిస్తున్న అక్క – ‘ ఏమిటీ మాట్లాడుతోంది? ‘  అనుకుంటూ  విస్తుబోయింది.

కట్నమిచ్చి, పెద్ద మనుషుల మధ్య, నిండు పందిట్లో పెళ్ళి చేసుకుంది కదా! మరి ఇప్పుడెవరొస్తున్నారు ఆమె కాపురాన్ని సరిదిద్దడానికి? రెండు వరసల బంగారు నాంతాడు, వాటికి వ్రేలాడుతూ రెండు సూత్రాలు, నల్లపూసల గొలుసు, కాళ్ళకి మెట్టెలు..హు. మరి ఇవేవీ మొగుడి చేత  ‘కాపురం’చేయించలేకపోతున్నాయి ఎందుక ని?

అతను పరాయి చోట్లకి పారిపోకుండా ఏ కొంగు ముళ్ళూ కట్టి పడేయలేకపోతున్నాయెందుకనీ?  నడిచిన ఏడడుగులు అతన్ని కళ్ళాలేసి కట్టడి చేయలేకపోతున్నాయెందుకనీ?  ఒక మూర దారంతో, నాలుగు పసుపు అక్షింతలతో పవిత్రమై పోయిందనుకున్న వివాహ బంధాలకు గారంటీ కార్డ్ ఏదీ? ఎక్కడుందీ? ఎవరిస్తారు?

అక్కని సూటిగా ప్రశ్నించాలనుకుంది. కాదు. నిలదీయాలనుకుంది. కానీ,  అడగలేదు. ఎందుకంటే, కాలం ఖర్చైపోవడం తప్ప పెద్ద ఉపయోగకరమైన జవాబేమీ రాదు.

సగటు ఇల్లాళ్ళకు –  కష్టాలు చెప్పుకుని సానుభూతి పొందడం లో వున్నంత సుఖం, పరిష్కారాన్ని కనుగొనడం లో వుండదు. వీళ్ళు  – మనశ్శాంతిని పారేసుకున్నంత సులువుగా మనస్తాపానికి కారకుడైన మొగుణ్ని  పారేయలేరు. కట్టుకున్న వాడెలాటి వాడైనా సరే,  వాడితోనే ‘కాపురం’ చేసుకోవడం అలవాటై పోయాక, అదే ప్రాతివ్రత్యమని రూఢీ  చేసుకున్నాక, .. ఇక ఇప్పుడు తను అక్క గారికి కొత్త గా చెప్పాల్సిన సూక్తులు కానీ సందేశాలు కానీ ఏవీ లేవు.  ఆవిడ చెప్పింది విని ‘పాపం’ అని అంటే చాలు. ఆవిడ ఆనందం తో పండిపోతుంది. తను సతీ సుమతికి అచ్చమైన వారసురాల్నని  గట్టిగా ఊపిరి తీసుకుని, రాని మొగుణ్ణి తిట్టుకుంటూ నిద్రపోతుంది.  హు!

‘ఆమనీ! మాట్లాడవేమిటే?” – అక్క మాటలకి ఈ లోకంలోకొచ్చింది.  -“ఆ! అక్కా! వింటున్నా చెప్పు…సరే సరే. అలానే చేస్తాలే.  ఇవాళే  మాట్లాడతా అతనితో!..ఏమంటాడో చూస్తా..” అక్క సంతృప్తి కోసం  చెప్పింది.

“ముందు నువ్వాపనిలో వుండు. సరేనా? జాగ్రత్త. వుంటా మరి…”

సెల్ మూసేసి, సోఫాలో జారగిలబడి దీర్ఘాలోచన్లో మునిగిపోయింది. ఎంత వొద్దనుకున్నా, అక్క మాటలు   ఆమని బుర్రని తొలిచేస్తున్నాయి

గతమంతా ఒక్క సారి కళ్ళ ముందు రీలు చుట్టుకుంది. తను తీసుకున్న నిర్ణయం సరైనదే అని మరోసారి తీర్పునిచ్చుకుంది. ముఖ్యంగా ఇతనితో.. కలసి బ్రతకడం గురించి!

“అదేం, చీకట్లో కూర్చున్నావ్?”  లైట్ స్విచాన్ చేస్తూ  అడుగుతున్నాడు. – అతను.

చీకటి..చీకటి..తను గమనించనే లేదు!  ..చీకటి… నల్లటి చీకటి..తెరలుతెరలు గా..దట్టమైన చీకటి.. బలమైన అలలు వలయాలు గా  చుట్టుకుంటూ ముంచేసినా తెలీని చీకటి.  తననుకుంటోంది..వెలుగులోకొచ్చానని..తెలివిగా ఆలోచిస్తోందని ..కాలానికి తగిన మార్పులు చేర్పులతో సుఖం గా బ్రతుకుని నిర్దేశించుకుంటోందనీ..మోడర్న్ లేడీ అనీ.కానీ, కాదనుకుంటా? ఒకవేళ అయితే, అప్పుడు ఇప్పుడూ తన దిగులు పరిస్థితి ఒకలానే ఎలా వుంటుంది. ..ఎదురు చూడటం…నమ్ముకున్న అతను నిజమైన వాడేనా? జీవితానికి అతికించుకున్న బంధం – వమ్ము ఔతుందేమోననే అభద్రతా భావం..కాదు అశాంతి సంద్రం ఎందుకనీ?

అటు అక్కది, ఇటు తనదీ అదే పరిస్థితి..ఎందుకనీ? ఇంతటి అనిశ్చిత – తమకు  మాత్రమే ఎందుకనీ?..

చిత్రం: రాజశేఖర్

అతనొచ్చి ఆమె పక్కన కుర్చున్నాడు. రెండు చేతుల్తో భుజాలు చుట్టి దగ్గరకి తీసుకుని, ఆమె పెదవుల మీద బలం గా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత..అతని చేతులు అలవాటుగా ఆమె భుజాల మీంచి కిందకి జారుతుంటే , సున్నితంగా నెట్టేస్తూ, పక్కకి జరిగి, అతని ముఖంలోకి సూటిగా చూసింది. ఎలాటి టెన్షనూ కనిపించలేదు.

ఆమె చూపుల్ని మరోలా అర్ధం అయ్యాయి అతనికి. “నీకు తెలుసు కదా ఆమని, నా పరిస్థితి..? ” అన్నాడు. ‘సారీ’ అనే అర్ధం స్ఫురించేలా!

ఆమేం మాట్లాడ్లేదు.

“అవునూ, నేనిక రాననుకున్నావా, అంత దిగాలుగా కూర్చున్నావ్?-ఏమిటీ?,కొంపదీసి  వొదిలేశాననుకోలేదుగా?'” అంటూ నవ్వాడు, ఫెళ్ళున.  పెద్ద జోక్ పేల్చినట్టు.

ఆమని వెంటనే – అతని ముఖంలోకి లోతుగా పరీక్షగా చూసింది – అభావంగా. అతనికేమీ అర్ధం కాలేదు.

కొన్ని సెకన్ల తర్వాత – హఠాత్తుగా – వున్నమనిషి వున్నట్టు ఫక్కున నవ్వింది.

తన జోక్ పేలిందనుకున్నాడతను.

కానీ ఆమె నవ్వు ఆగలేదు. ఇంకా బిగ్గరగా తెరలు తెరలుగా నవ్వడంతో..అతని ముఖం లో నవ్వు వెలిసిపోయింది. తెల్లగా.

“ఎందుకు అంతలా నవ్వుతున్నావ్?” – ఆ పిచ్చి నవ్వుకి బెదిరిపోతూ అడిగాడు.

“నవ్వొ..స్తోం..ది. ఎం..దు..కం..టే.. నీ మాటలకి.  ‘ భయపడ్డావా వదిలేసానని ?’ అని నువ్వంటుంటే.. నవ్వు..నవ్వొస్తోంది..”

“..అవును. తప్పేముంది?” ముఖం చిట్లించుకున్నాడు.

ఒక్కసారిగా మనిషంతా గంభీరమైపోతూ ఒక్కో అక్షరం వొత్తి పలుకుతూ అంది. “మరి నీకు భయమేయలేదా? ఇంటికి రాకుండా పోతే, నేనిన్ను వొదిలేస్తానని? ఆ?.”

అనుకోని ప్రశ్నకి.. విద్యుద్ఘాతం తగిలిన వాడిలా చూస్తుండిపోయాడు. అహం దెబ్బ తిన్న అతన్లోనిమగాడి కేక ఆమెకు మాత్రమే వినిపించింది.

మళ్ళీ నవ్వొచ్చింది. ఇంకా నవ్వుతోంది..తెరలు తెరలు గా..పడీ పడీ నవ్వుతోంది.. మెళ్ళో మంగళ సూత్రాలు లేని గొలుసు కదిలిపోయేలా…అలా  న..వ్వు..తూ..నే వుంది.

******

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

రాక్షస గీతం

 

 

-అనిల్ ఎస్. రాయల్

~

 

“Reality is merely an illusion, albeit a very persistent one.” – Albert Einstein

 

—-

చెవులు చిల్లులు పడే శబ్దం. దాన్ననుసరిస్తూ, కాలం నివ్వెరపోయినట్లు క్షణమాత్రపు నిశ్శబ్దం. మరుక్షణం మిన్నంటిన రోదనలు.

దట్టంగా పొగ. చెదురుమదురుగా మంటలు. చిందరవందరైన పరిసరాలు. ఛిద్రమైన శరీరాలు. వాటినుండి రక్తపు చుక్కలు పైకెగరసాగాయి. ఒకటి, రెండు, పది, వంద. చూస్తూండగానే చిక్కబడ్డాయవి. నేలమీంచి నింగిలోకి కుండపోతగా రుధిరవర్షం కురవసాగింది. ఆకాశాన్ని చీలుస్తూ నల్లటి మెరుపొకటి మెరిసింది. సమీపంలో పిడుగు పడింది. దిక్కులు పిక్కటిల్లిన చప్పుడుతో –

దిగ్గున మెలకువొచ్చింది.

ఎప్పుడూ వచ్చేదే. అయినా అలవాటవని కల. పదే పదే అదే దృశ్యం. మానవత్వం మాయమైన మారణహోమం. రక్తంతో రాసిన రాక్షసగీతం.

అది నా ఉనికి దేనికో విప్పి చెప్పిన విస్ఫోటనం.

నిశ్చలంగా పైకప్పుని చూస్తూ పడుకుండిపోయాను – అది కలో, మెలకువో తెలీని అయోమయంలో.

మేలుకోవటమంటే – వాస్తవంలోకి వళ్లు విరుచుకోవటమా, లేక ఒక కలలోంచి మరో కలలోకి కళ్లు తెరుచుకోవటమా?

ఇదీ కలే ఐతే మరి ఏది నిజం?

“నువ్వేది నమ్మితే నీకదే నిజం,” అన్నాడెవరో మేధావి.

నిజమేనేమో. సత్యం సైతం సాపేక్షం! అందుకే లోకమంతా ఈ అరాచకత్వం. ఎవడికి నచ్చింది వాడు నిజంగా నమ్మేసి ఎదుటోడి నెత్తిన రుద్దేసే నైజం. అందులోంచి పుట్టేది ముందుగా పిడివాదం. ఆ తర్వాత అతివాదం. అది ముదిరితే ఉన్మాదం. అదీ ముదిరితే –

ఉగ్రవాదం.

ఆలోచనల్ని బలవంతంగా అవతలకి నెడుతూ మెల్లిగా లేచాను.

 

మరో రోజు మొదలయింది.

 

* * * * * * * *

 

“అవకాశం దొరకాలే కానీ … వాణ్ని అడ్డంగా నరికేసి ఆమెని సొంతం చేసుకుంటా,” అనుకున్నాడు వాడు పెదాలు చప్పరిస్తూ.

ఇరవైలోపే వాడి వయసు. ఇంజనీరింగ్ విద్యార్ధి వాలకం. చిరిగిన జీన్స్, చింపిరి జుత్తు, ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో కాఫీ కప్, వీపున బ్యాక్‌పాక్. నిర్లక్షానికి నిలువెత్తు రూపం. యమహా మీద ఠీవిగా తిష్ఠవేసి నల్ల కళ్లద్దాల మాటునుండి నిష్ఠగా అటే చూస్తున్నాడు.

నేనూ అటు చూశాను. నాలుగు టేబుల్స్ అవతలొక పడుచు జంట. భార్యాభర్తల్లా ఉన్నారు. ఎదురెదురుగా మౌనంగా కూర్చుని ఒకే కప్పులో కాఫీ పంచుకు తాగుతున్నారు. ఆ యువతి సౌందర్యానికి నిర్వచనం. ఆమె భర్త పోతురాజు ప్రతిరూపం.

చింపిరిజుత్తు వైపు చూపు తిప్పాను. వాడింకా పెదాలు చప్పరిస్తూనే మర్డర్ ఎలా చెయ్యాలో, ఆ తర్వాత ఆమెతో ఏం చెయ్యాలో ఆలోచిస్తూన్నాడు. ఆమె వాడికన్నా ఆరేడేళ్లు పెద్దదయ్యుంటుంది. కానీ అది వాడి ఆలోచనలకి అడ్డురాని వివరం. ఈ రకం తరచూ తారసపడేదే. ఊహల్లో చెలరేగటమే తప్ప వాటి అమలుకి తెగించే రకం కాదు. ప్రమాదరహితం.

వాడినొదిలేసి ఆ పక్కనే ఉన్న టేబుల్‌వైపు చూశాను. అక్కడో ముగ్గురు అమ్మాయిలు. ఇవీ కాలేజ్ స్టూడెంట్స్ వాలకాలే. కాఫీకోసం‌ నిరీక్షీస్తూ మొబైల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. అలవాటుగా వాళ్ల బుర్రల్లోకి చూశాను. నిమిషంలోపే అర్ధమైపోయింది. పోసుకోలు కబుర్లు. ఎదురు బొదురుగా కూర్చుని ఒకరితో ఒకరు వాట్సాప్‌లో చాట్ చేస్తున్న నవతరం ప్రతినిధులు. హార్మ్‌లెస్ క్రీచర్స్.

వాళ్లమీంచి దృష్టి అటుగా వెళుతున్న యువకుడి మీదకి మళ్లింది. ముప్పయ్యేళ్లుంటాయేమో. వడివడిగా నడుస్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతడి కవళికలు అనుమానాస్పదంగా తోచాయి. ఏమన్నా విశేషమా? వెంటనే అతడిని స్కాన్ చేశాను. ఫ్యామిలీ మాటర్. పట్టించుకోనవసరం లేదు. మరొకరి మీదకి దృష్టి మరల్చబోతూండగా అతను చటుక్కున ఆగిపోయాడు. నేనూ ఆగిపోయాను. ఆ పక్కనే దట్టంగా విరిసిన పూల మొక్క. అందులో ఒక పువ్వునుండి తేనె గ్రోలుతూ నీలిరంగు బుల్లిపిట్ట. నగరాల్లో అరుదైన దృశ్యం. అంత హడావిడిలోనూ అది చూసి ఆగిపోయాడంటే వీడెవడో భావుకుడిలా ఉన్నాడు. ఆటవిడుపుగా అతడిని గమనించాను. నాకూ కాసేపు కాలక్షేపం కావాలిగా.

అతను ఫోన్ మాట్లాడటం ఆపేసి, అదే ఫోన్‌తో ఆ పిట్టని ఫోటో తీసుకుని, తిరిగి ఫోన్‌లో మాట్లాడుతూ వడి నడక ప్రారంభించాడు. ప్రస్తుతాన్ని చిత్రాల్లో చెరపట్టి ఆస్వాదన భావికి వాయిదావేసే ఆధునిక భావుకుడు!

కాలక్షేపం కట్టిపెట్టి, అతన్నొదిలేసి చుట్టూ పరికించాను – ఆ పరిసరాల్లో అలల్లా తేలుతున్న ఆలోచనల్ని అలవాటుగా పరిశీలిస్తూ, ప్రమాదకరమైనవేమన్నా ఉన్నాయేమోనని అలవోకగా పరీక్షిస్తూ. నగరంలో నలుగురూ చేరే ప్రముఖ ప్రదేశాల్లో స్కానింగ్ చెయ్యటం నా బాధ్యత. సిటీ నడిబొడ్డునున్న పార్కులో, సదా రద్దీగా ఉండే కాఫీ షాపు ముందు అదే పనిలో ఉన్నానిప్పుడు. షాపు ముందు పచ్చటి పచ్చిక బయలు. దాని మీద పాతిక దాకా టేబుళ్లు. వాటి చుట్టూ ముసిరిన జనం. వాళ్ల నీడలు సాయంత్రపు నీరెండలో సాగిపోయి నాట్యమాడుతున్నాయి. వాతావరణం వందలాది ఆలోచనల్తో, వాటినుండి విడుదలైన భావాలతో కంగాళీగా ఉంది. ఆవేశం, ఆక్రోశం, అవమానం, అనుమానం, అసూయ, అపనమ్మకం మొదలైన ప్రతికూల భావనలదే మెజారిటీ. అదేంటోగానీ, మనుషులకి ఆనందం పొందటానికంటే ఆవేదన చెందటానికి, అసంతృప్తిగా ఉండటానికే ఎక్కువ కారణాలు దొరుకుతాయి! అదిగదిగో, అక్కడో అమాయకత్వం, ఇక్కడో అల్పానందం కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. ఇవి కాదు నాక్కావలసింది, ఇంతకన్నా ముఖ్యమైనవి – అమానుషమైనవి. అదేంటక్కడ … ఆత్మహత్య తలపు? పట్టించుకోనవసరం లేదు. ఆ మధ్య టేబుల్ దగ్గరున్నోడి తలని అపరాధపుటాలోచనేదో తొలిచేస్తోంది. అదేంటో చూద్దాం. ఇంకాసేపట్లో భార్యని హత్య చెయ్యటానికి కిరాయి హంతకుడిని పురమాయించి ఎలిబీ కోసం ఇక్కడొచ్చి కూర్చున్న అనుమానపు మొగుడి తలపు. అది వాడి వ్యక్తిగత వ్యవహారం. నాకు సంబంధించింది కాదు. ఇలాంటివాటిలో కలగజేసుకుని జరగబోయే నేరాన్ని ఆపాలనే ఉంటుంది. కానీ ఏజెన్సీ ఒప్పుకోదు.

పావుగంట పైగా స్కాన్ చేసినా కలవరపెట్టే ఆలోచనలేవీ కనబడలేదు. అక్కడ రకరకాల మనుషులున్నారు. దాదాపు అందరూ మొబైల్ ఫోన్లలోనూ, టాబ్లెట్లలోనూ ముఖాలు దూర్చేసి ఉన్నారు. పొరుగింటి మనుషుల్ని పలకరించే ఆసక్తి లేకున్నా ముఖపరిచయం లేని మిత్రుల రోజువారీ ముచ్చట్లు మాత్రం క్రమం తప్పక తెలుసుకునేవాళ్లు. అన్ని సమయాల్లోనూ అన్ని విషయాలతోనూ కనెక్టెడ్‌గా ఉండే తహతహతో చుట్టూ ఉన్న ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయిపోయినోళ్లు. ఇ-మెయిళ్లు, ఎస్సెమ్మెస్‌లు, పోస్ట్‌లు, లైక్‌లు, పోక్‌లు, ఫోటోలు, వీడియోలు, ట్వీట్‌లు, ట్యాగ్‌లు, డౌన్‌లోడ్‌లు, అప్‌లోడ్‌లు, యాప్స్, గేమ్స్, ఫీడ్స్ … కిందటి తరం వినైనా ఎరగని విశేషాల్లో, విషాల్లో నిండా మునిగిన జనం. వాస్తవలోకాన్నొదిలేసి ‌సైబర్ వాస్తవంలో ముసుగులు కప్పుకు సంచరించే వెర్రితనం.

 

ముసుగులు. లేనిదెక్కడ?

ఇంటర్నెట్‌లోనే కాదు, ఈ లోకం నిండా ఉందీ ముసుగు మనుషులే. అందరు మనుషులకీ అవతలి వ్యక్తి ముసుగు తొలగించి, వాడి మదిలో మెదిలే వికృతాలోచనల్ని చదివే శక్తి ఉంటే? అప్పుడిక ప్రపంచంలో రహస్యాలుండవు. మోసాలుండవు. ఇన్ని నేరాలుండవు. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు. మాటతో పనుండదు. పిల్లల మనసెరగని తల్లిదండ్రులుండరు. తలలో పుట్టే తలపులకి మరుగన్నది లేనినాడు భయంతోనో, సిగ్గుతోనో వాటిని నియంత్రించటం మనుషులు నేర్చుకుంటారు. మెరుగుపడతారు. ప్రపంచానికిక నాలాంటివారితో పనుండదు. నా శక్తికేం ప్రత్యేకతుండదు.

శక్తి.

ఈ శక్తి నాకెందుకొచ్చిందో తెలీదు. ఎప్పుడొచ్చిందో మాత్రం లీలగా గుర్తుంది.

 

మొట్టమొదటిసారి నేను చదివింది అమ్మ ఆలోచనల్ని. అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. ఆలోచనల్ని చదవటం అనేదొక అద్భుతమైన విషయమని తెలీని వయసు. యథాలాపంగా అమ్మ మనసులో ఏముందో చదివేసి బయటకు చెప్పేయటం, దానికామె ఆశ్చర్యపడిపోవటం, మళ్లీ చదవమనటం, నేను మరోమారామెని ఆశ్చర్యపరచటం, ఆ సాయంత్రం అంతా ఇద్దరం అదే పనిలో ఉండటం … ఇంతే గుర్తుంది. ఆ వయసులో నాకదొక ఆటలా మాత్రమే తోచింది. తర్వాత మరి కొన్నిసార్లూ అమ్మ ఆలోచనలు చదివి చెప్పాను. అయితే, ఆమె మొదట్లో చూపించిన ఆసక్తి తర్వాత చూపకపోగా చిరాకుపడింది. నేను చిన్నబుచ్చుకున్నాను. ఎందుకో బోధపడకపోయినా, ఆమె ఆలోచనలు నేనలా చదివేయటం అమ్మకి ఇష్టంలేదని అర్థమయింది. దాంతో ఆమె దగ్గర నా శక్తి ప్రదర్శించటం మానేశాను. మొదట్లో అనుమానించినా, మెల్లమెల్లగా ఆమె కూడా నాకా శక్తి ఎంత చిత్రంగా వచ్చిందో అంత చిత్రంగానూ మాయమైపోయిందనుకుని కాలక్రమంలో ఆ విషయం మర్చిపోయింది.

అమ్మకి తెలీని సంగతేంటంటే – నా శక్తి రోజు రోజుకీ పెరిగిపోసాగింది. మొదట్లో ఆమెని మాత్రమే చదవగలిగిన నేను, కాలం గడిచే కొద్దీ ఇతరులనీ చదివేయసాగాను. అతి సమీపంలో ఉన్నవారి నుండి రెండు వందల మీటర్ల రేడియస్‌లో ఉన్న ప్రతి మనిషినీ చదవగలిగేవరకూ నా పరిధి విస్తరించింది. అందరిని చదవటం వల్లనో ఏమో, నాకు వయసుకి మించిన పరిపక్వత అబ్బింది. ఏడేళ్లొచ్చేటప్పటికే ఓ విషయం అర్థమైపోయింది: పరాయి వ్యక్తి తన మస్తిష్కంలోకి చొరబడి అందులో ఏముందో కనిపెట్టేయటం ఏ మనిషీ ఇష్టపడడు. మరి నాకీ శక్తున్న విషయం అందరికీ తెలిసిపోతే? ఇక నన్నెవరూ మనిషిలా చూడరు. నేనంటే భయమే తప్ప ఇష్టం, ప్రేమ ఎవరికీ ఉండవు. ఆ ఆలోచన భరించలేకపోయేవాడిని. అందువల్ల నా వింత శక్తి సంగతి ఎవరికీ తెలియకుండా దాచాలని నిర్ణయించుకున్నాను. దానికోసం చాలా కష్టపడాల్సొచ్చింది. నలుగురిలోకీ వెళ్లటం ఆలస్యం – అన్ని దిక్కులనుండీ ఆలోచనలు కమ్ముకునేవి. కళ్లు మూసుకుంటే లోకాన్ని చూడకుండా ఉండొచ్చుగానీ దాన్ని వినకుండా ఉండలేం. నా వరకూ పరుల ఆలోచనలూ అంతే. వద్దన్నా వచ్చేసి మనోఫలకంపై వాలతాయి. వాటిని ఆపటం నా చేతిలో లేదు. వేలాది జోరీగలు చుట్టుముట్టినట్లు ఒకటే రొద. తల దిమ్మెక్కిపోయేది. తప్పించుకోటానికి ఒకే దారి కనపడింది. ఆ జోరీగల్లో ఒకదాన్నెంచుకుని దాని మీదనే ఫోకస్ చేసేవాడిని. తక్కినవి నేపథ్యంలోకెళ్లి రొదపెట్టేవి. గుడ్డిలో మెల్లగా ఉండేది.

అలా, టీనేజ్‌కొచ్చేసరికి వేల మనసులు చదివేశాను. ఆ క్రమంలో‌ నాకో గొప్ప సత్యం బోధపడింది. కనిపించేదంతా మిథ్య. కనిపించనిదే నిజం. అది ఎవరికీ నచ్చదు. అందుకే ఈ నాటకాలు, బూటకాలు. కని పెంచిన ప్రేమలో ఉండేదీ ‘నా’ అనే స్వార్థమే. స్వచ్ఛమైన ప్రేమ లేనే లేదు. అదుంటే కవిత్వంతో పనుండేది కాదు. పైకి మామూలుగా కనపడే ప్రతి వ్యక్తి లోపలా పూర్తి భిన్నమైన మరో వ్యక్తి దాగుంటాడు. వాడి ఆలోచనలు అనంతం. చేతలు అనూహ్యం. ఆ పుర్రెలో ఎప్పుడు ఏ బుద్ధి ఎందుకు పుడుతుందో వివరించటం అసాధ్యం. మనిషి కళ్లకి కనిపించే విశ్వం – పొడవు, వెడల్పు, లోతు, కాలాలనే పరిధుల మధ్య గిరిగీసి బంధించబడ్డ మరుగుజ్జు లోకమైతే, ఆ పరిధులకవతలుంది మరోప్రపంచం. అది మంచికీ చెడుకీ మధ్య, నలుపుకీ తెలుపుకీ నడుమ, మానవ మస్తిష్కంలో కొలువైన అవధుల్లేని ఊహాలోకం. దాని లోతు కొలవటానికి కాంతి సంవత్సరాలు చాలవు. ఆ చీకటి లోకాల్లోకి నేను తొంగి చూశాను. పువ్వుల్లా విచ్చుకు నవ్వే వదనాల వెనక నక్కిన గాజు ముళ్లు. ఎంత తరచి చూస్తే అంత లోతుగా చీరేసేవి. ఆ బాధ పైకి కనపడకుండా తొక్కిపట్టటమో నరకం. అదో నిరంతర సంఘర్షణ. దాని ధాటికి స్థితిభ్రాంతికి లోనయ్యేవాడిని. చిన్న చిన్న విషయాలు మర్చిపోయేవాడిని. వేర్వేరు సంఘటనల్ని కలగలిపేసి గందరగోళపడిపోయేవాడిని.

అయితే వాటిని మించిన సమస్య వేరే ఉంది. తండ్రి లేకుండా పెరగటాన, అమ్మకి నేనొక్కడినే కావటాన, ఒంటరి నడకలో అలుపెంతో నాకు తెలుసు. ‘నా వాళ్లు’ అనే మాట విలువెంతో మరింత బాగా తెలుసు. కానీ నా శక్తి పుణ్యాన, నా వాళ్లనుకునేవాళ్లంతా లోలోపల నన్నేమనుకుంటున్నారో గ్రహించాక వాళ్లతో అంతకు ముందులా ఉండలేకపోయేవాడిని. ఈ లోకంలో నేనో ఏకాకిగా మిగిలిపోతానేమోననే భయం వెంటాడేది. దానికి విరుగుడుగా – నా వాళ్ల ఆలోచనలు పొరపాటున కూడా చదవకూడదనే నిర్ణయం పుట్టింది. వద్దనుకున్నవారి ఆలోచనల్ని వదిలేయగలిగే నిగ్రహం సాధించటానికి కిందామీదా పడ్డాను. కానీ చివరికి సాధించాను. నా వైట్ లిస్ట్‌లో అతి కొద్ది పేర్లే ఉండేవి.

 

వాటిలో ఒకటి షాహిదా.

తను ఇంజనీరింగ్‌లో నా సహచరి. చూపులు కలిసిన తొలిసారే మా మధ్య ఆకర్షణేదో మొగ్గతొడిగింది. ఆమె ఆలోచనలు చదవకూడదన్న స్థిర నిశ్చయానికి ఆ క్షణమే వచ్చేశాను. పరిచయం ప్రేమగా మారటానికి ఎక్కువరోజులు పట్టలేదు. చదువు పూర్తయ్యాక అమ్మని ఒప్పించి షాహిదాని పెళ్లాడటానికి కాస్త కష్టపడాల్సొచ్చింది. మొదట్లో ఇద్దరి మతాలూ వేరని అమ్మ బెట్టుచేసినా, తర్వాత తనే మెట్టు దిగింది. పెళ్లయ్యాక, అప్పుడప్పుడూ షాహిదా మనసులో ఏముందో చదివి తెలుసుకోవాలన్న కోరిక తలెత్తినా, దాన్ని తొక్కిపట్టేసేవాడిని.

అదెంత పెద్ద తప్పో తర్వాతెప్పటికో తెలిసింది. అప్పటికే ఆలస్యమయింది.

తల విదిలిస్తూ, స్కానింగ్ కొనసాగించాను. చుట్టూ జనాలు ఎవరి ఆలోచనల్లో వాళ్లు మునిగున్నారు. ఆశలు, అసూయలు, కోరికలు, కోపాలు, వల్గారిటీస్, పెర్వర్షన్స్ అన్నీ వాళ్ల తలపుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. అవన్నీ నేను వింటున్నానని తెలిస్తే? అప్పుడా ఆలోచనలకి కళ్లాలేస్తారా? నో. నా మీద దాడికొస్తారు. తమ ప్రైవసీ హక్కుకి భంగం కలిగించానంటూ రాద్ధాంతం చేస్తారు. ఈ కారణంగానే ఏజెన్సీ అజ్ఞాతంలో ఉండిపోయింది.

anil

ఇందాకెప్పుడో తెచ్చుకున్న కాఫీ చల్లారిపోయింది. మరో కాఫీ కోసం లేచెళ్లి కౌంటర్లో ఆర్డరిచ్చి, అదొచ్చేలోపు ఎదురుగా గోడకున్న టీవీలో స్క్రోలింగ్ న్యూస్ చదవసాగాను. “ప్రత్యేక హోదా సాధించి తీరతాం – చంద్రబాబు”. “విదేశాల నుండి నల్ల ధనం వెనక్కి రప్పిస్తాం – నరేంద్రమోదీ”. “త్వరలోనే మెగాస్టార్ నూట యాభయ్యో సినిమా ప్రకటన – రామ్ చరణ్”. “ఈ దేశంలో పుట్టినోళ్లందరూ జై శ్రీరామ్ అనాల్సిందే – సాధు మహరాజ్”. రెండేళ్ల నుండీ రోజు మార్చి రోజు ఇదే బ్రేకింగ్ న్యూస్! కానీ సామూహిక అత్యాచారాలు, సంఘవిద్రోహ చర్యల వార్తల కన్నా ఇవే మెరుగు.

కాఫీ వచ్చింది. తీసుకుని వెనక్కొచ్చి ఇందాకటి టేబుల్ వద్దే కూర్చుని తాగబోతోండగా … తలలో చిన్న మెరుపు మెరిసింది. లిప్తపాటు మెదడు మొద్దుబారింది.

 

సందేశాలు రాబోతున్న సూచన. ఏజెన్సీ నుండి.

కాఫీ కప్పు కిందపెట్టి కళ్లు మూసుకున్నాను, అంతఃచక్షువులకి అల్ల్లంత దూరంలో కనబడుతున్న సూక్ష్మబిందువు మీదకి ఫోకస్ లాక్ చేయటానికి ప్రయత్నిస్తూ. కొత్తలో ఈ పని చేయటానికి రెండు నిమిషాల పైగా పట్టేది. ఇప్పుడు రెండే సెకన్లు.

ఫోకస్ లాక్ అవగానే సందేశాలు డౌన్‌లోడ్ కావటం మొదలయింది. మొదటగా ఎవరిదో ఫోటో వచ్చింది. అంత స్పష్టంగా లేదు. పురుషాకారం అని మాత్రం తెలుస్తోంది. నాతో సహా ఎవడైనా కావచ్చు. టెలీపతీ ద్వారా శబ్ద సంకేతాలొచ్చినంత స్పష్టంగా చిత్రాలు రావు. ఇంత అస్పష్టమైన ఫోటోలతో ఉపయోగం ఉండదు, కానీ టార్గెట్ ఎలా ఉంటుందో అసలుకే తెలీకపోవటం కన్నా ఇది మెరుగని ఏజెన్సీ వాదన.

ఫోటోని పక్కకి నెట్టేసి, తక్కిన సందేశాలని జాగ్రత్తగా విన్నాను. ఏదో రామదండు అట. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను సిద్ధాంతంతో కొత్తగా పుట్టుకొచ్చిన మతోన్మాద మూక! మక్కా మసీదులో పేలుళ్ల పథకం. ముహూర్తం రేపే. దాని సూత్రధారుల పని మిగిలిన ఏజెంట్స్ చూసుకుంటారు. ప్రధాన పాత్రధారి పని మాత్రం నేను పట్టాలి. అందుకు అనువైన స్థలం కూడా సూచించబడింది. ‌ఆ ప్రాంతం నాకు చిరపరిచితమైనదే. అయినా కూడా ఓ సారి ఫోన్‌లో ఆ ప్రాంతానికి సంబంధించిన తాజా మాప్ తెరిచి పరిశీలించాను. నేను చివరిసారిగా అటువైపు వెళ్లి చాన్నాళ్లయింది. ఈ మధ్యకాలంలో అక్కడ ఏమేం మార్పులొచ్చాయో తెలుసుకోవటం అత్యావశ్యకం.

 

మాప్ పని పూర్తయ్యాక మళ్లీ కళ్లు మూసుకుని మిగిలిన వివరాలు విన్నాను. ఆఖర్లో వినపడింది వాడి పేరు.

చిరంజీవి.

 

* * * * * * * *

అరగంటగా అక్కడ కాపుకాస్తున్నాను. తమ అమానుష పథకాన్ని అమలుచేసే క్రమంలో- అర్ధరాత్రి దాటాక చిరంజీవి నగరంలో అడుగుపెడతాడని, ఇదే దారిగుండా తన షెల్టర్‌కి వెళతాడని ఏజెన్సీ పంపిన సందేశం. కచ్చితంగా ఏ వేళకొస్తాడో తెలీదు. ఎంతసేపు నిరీక్షించాలో?

అది నగరానికి దూరంగా విసిరేసినట్లున్న పారిశ్రామికవాడ. పగలు హడావిడిగా ఉండే ఆ ప్రాంతం అర్ధరాత్రయ్యేసరికి నిర్మానుష్యంగా మారిపోతుంది. అక్కడక్కడా భవనాలు. వాటి మధ్యగా ఓ డొంకదారి. దాని పక్కనున్న తుప్పలూ పొదలే తప్ప చెట్లూ చేమలూ పెద్దగా లేవు. కొన్ని భవనాల్లో విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. నేనున్న ప్రాంతం మాత్రం చీకట్లో మునిగుంది – మతం చీకటి కమ్మేసిన మనుషుల్ని గుర్తుచేస్తూ.

ఏదో ద్విచక్ర వాహనం ఇటుగా వస్తోంది. డుగుడుగు శబ్దం. ఎన్‌ఫీల్డ్. దాని మీద ఒక్కడే ఉన్నాడు. చిరంజీవి?

డొంకదారి పక్కనున్న పొదల వెనక నక్కి కూర్చుని స్కానింగ్ మొదలు పెట్టాను. ఊఁహు. చిరంజీవి కాదు. శృంగారతార సినిమా సెకండ్ షోకెళ్లి వస్తున్న రసిక ప్రేక్షకుడు. వాడి ఆలోచనలు అమానుషంగా లేవు. అసహ్యంగా ఉన్నాయి. వాటితో ఎవరికీ ప్రమాదం లేదు. ఉంటేగింటే వాడికే. అది కూడా, వాడి బుర్రలో ప్రస్తుతం ఏముందో చదవగలిగే శక్తి వాడి పెళ్లానికుంటేనే.

 

నన్నెప్పుడూ ఓ సందేహం తొలిచేది. ఈ శక్తి నాకొక్కడికే ఉందా, లేక నా వంటివాళ్లు ఇంకా ఉన్నారా?ఉంటే, వాళ్ల మనసులతో సంభాషించటం సాధ్యమవుతుందా? ఆ ప్రశ్న నన్ను ఎన్నో రోజులు వెంటాడింది. చివరికో రోజు సమాధానం దొరికింది. దానికి నెలముందో దారుణం జరిగింది.

ఆ రోజు – అన్నిరోజుల్లాగే నగరమంతటా – నాన్నలు ఆఫీసులకెళ్లారు. అమ్మలు షాపింగ్‌కెళ్లారు. ‌భార్యాభర్తలు సినిమాలకెళ్లారు. పిల్లలు ప్లేగ్రౌండ్స్‌కెళ్లారు. ప్రేమికులు పార్కులకెళ్లారు.

వాళ్లలో చాలామంది తిరిగి ఇంటికి రాలేదు.

అమ్మ కూడా.

 

ఆ సాయంత్రం ఆమె మందులకోసం మెడికల్ షాపుకెళ్లింది, నాకు కుదరకపోవటంతో.

దారిలోనే నకుల్ చాట్ హౌస్. దాన్ని దాటుతూ ఉండగా ఆమె పక్కనే మొదటి బాంబు పేలింది. ఆ తర్వాత పది నిమిషాల వ్యవధిలో నగరంలో వరుసగా మరిన్ని పేలుళ్లు. వందల్లో మృతులు.

ఏం పాపం చేశారు వాళ్లు? లోపాలపుట్టలే కావచ్చు. కానీ మనుషులు వాళ్లు. నాలాంటి మనుషులు. బతకటం వాళ్ల హక్కు. దాన్ని లాక్కునేవాళ్లు మనుషులు కారు. నరరూప రాక్షసులు. నరికేయాలి వాళ్లని.

ఆవేదనలోంచి ఆవేశం. అందులోంచి ఆలోచన. నా శక్తితో ఏదన్నా చెయ్యలేనా? ఇలాంటివి జరగకుండా ఆపలేనా? బహుశా, నేనిలా ఉండటానికో కారణముందేమో. అది, ఇదేనేమో!

ఆ రాత్రి పిచ్చివాడిలా నగరమంతా తిరిగాను. బాంబు పేలిన ప్రతిచోటికీ వెళ్లాను. అన్ని చోట్లా రాక్షస గీతాలాపన. ఏదో చెయ్యాలి. ఈ ఘోరం మళ్లీ జరక్కుండా నా శక్తిని అడ్డేయాలి. కానీ ఎలా?

సమాధానం నెల తర్వాత వెదుక్కుంటూ వచ్చింది – ఏజెన్సీ నుండి.

ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే టెలీపతిక్స్ సభ్యులుగా, ప్రభుత్వాల ప్రమేయం లేకుండా నడిచే అజ్ఞాత సంస్థ – ఏజెన్సీ. మైండ్ రీడింగ్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాల ఆచూకీ పట్టేసి వాటిని నిరోధించటం దాని పని. చాలా రోజులుగా నా మనసుపై నిఘా ఉంచి, నా శక్తిని మంచికోసం వాడాలన్న తపన చూసి, తమలో ఒకరు కమ్మనే ఆహ్వానం పంపింది ఏజెన్సీ. అంగీకరించటానికి అరక్షణం కన్నా ఆలోచించలేదు.

 

ఆనందం.

నేను ఒంటరిని కాను. ఉత్పరివర్తనాన్నో, ప్రకృతి వైపరీత్యాన్నో కాను. నాలాంటి వారు మరిందరూ ఉన్నారన్న ఆనందం.

అది నాలుగు నిమిషాలే.

సభ్యత్వానికి సమ్మతం తెలిపిన వెంటనే ఏజెన్సీ నుండొచ్చిన రెండో సందేశం నన్ను కలవరపరచింది: “నీ భార్య మనసు చదువు”.

ఎందుకో అర్ధం కాలేదు. అన్యమనస్కంగా, అయిష్టంగా ఆ పని చేశాను.

 

దిగ్భ్రమ!

షాహిదాని వైట్ లిస్ట్ చేసి ఎంత తప్పు చేశానో వెంటనే అర్ధమయింది.

ఆలస్యం చెయ్యకుండా ఆ తప్పుకి పరిహారం చెల్లించాను.

నాటి నుండీ, ఎదురైన ప్రతి వ్యక్తి ఆలోచనలూ చదవసాగాను. ఉగ్రవాద కుట్రల్ని పసిగట్టటం, వాటిని ఏజెన్సీతో పంచుకోవటం, కుదిరితే కుట్రదారుల్ని మట్టుపెట్టటం – ఇదే నా పని. ఆ జాబితాలో ఇప్పటికే ఐదురుగున్నారు.

చిరంజీవి ఆరోవాడు.

వచ్చేది వాడేనా?

రోడ్డు మీద దూరంగా ఏదో ఆకారం, వేగంగా ఇటే నడిచొస్తూ.

పొదలమాటున సర్దుక్కూర్చుని స్కానింగ్ మొదలు పెట్టాను. పదే క్షణాల్లో తెలిసిపోయింది.

వాడే.

వాడి మనసులో – రేపు సాయంత్రం – మక్కా మసీదు – సూసైడ్ బాంబింగ్.

నేనుండగా ఆ పథకం అమలయ్యే ప్రసక్తే లేదు.

 

పొదల వెనక పొజిషన్ తీసుకుని సిద్ధంగా ఉన్నాను. వాడు నన్ను దాటి రెండడుగులు వెయ్యగానే వెనకనుండి లంఘించి మీదకి దూకాను. వాడు నేలమీద బోర్లాపడ్డాడు. ఊహించని దాడికి విస్తుపోతూ వెనక్కితిరిగాడు. అంత దగ్గరనుండి మసక వెలుగులోనూ వాడి ముఖం స్పష్టంగా కనబడింది. గెడ్డం పెంచి, మీసాలు తీసేసి, మహమ్మదీయుడిలా అగుపిస్తున్నాడు.

మసీదు ముంగిట ఎవరికీ అనుమానం రాకుండా బాగానే వేశావురా మారువేషం!

అంతలోనే వాడు నోరు తెరిచాడు. అయోమయం నటిస్తూ అడిగాడు. “కోన్ హే తూ? ఏం కావాలి?”.

హైదరబాదీ యాస కూడా బాగానే పలికిస్తున్నావురా. కానీ నన్ను ఏమార్చలేవు.

“నీ ప్రాణం,” అంటూ ఒకచేత్తో వాడిని నేలకేసి తొక్కిపడుతూ రెండో చేత్తో ఆయుధం బయటకి లాగాను. వాడి కళ్లలో అయోమయం స్థానంలో భయం చోటుచేసుకుంది. కీచుగొంతుతో అరుస్తూ నన్ను నెట్టేయబోయాడు. కానీ నా బలం ముందు వాడి శక్తి చాల్లేదు.

“దొరికిపోయావు చిరంజీవీ. నీ పథకం పారదిక,” అంటూ ఆయుధం పైకెత్తాను.

“యే చిరంజీవీ కోన్? నేను రియాజ్ అహ్మద్. ఛోడ్ దే ముజే,” అని దీనంగా చూశాడు గింజుకుంటూ. ఒక్క క్షణం ఆగిపోయి వాడి మనసులోకి చూశాను.

“నా అబద్ధం నమ్మాడో లేదో. ఇప్పుడేమన్నా తేడావస్తే ప్లానంతా అప్‌సెట్ అవుద్ది,” అనుకుంటున్నాడు. ముఖంలో మాత్రం కొట్టొచ్చిన దైన్యం.

మృత్యుముఖంలోనూ ఏం నటిస్తున్నావురా! నీ ముందు ఐదుగురిదీ ఇదే తీరు.

షాహిదాతో సహా.

 

ఏడాది తర్వాత కూడా ఆమె మాటలు నా జ్ఞాపకాల్లో తాజాగానే ఉన్నాయి.

“పోయిన్నెల నకుల్ చాట్ పేలుడులో మీ అమ్మ పోవటమేంటి? ఆ కుట్రలో నా హస్తం ఉండటమేంటి? మన పెళ్లయ్యేనాటికే అత్తయ్య కదల్లేని స్థితిలో మంచాన పడుందని, అదే మంచంలో ఏడాది కిందట పోయిందని  … కైసే భూల్ గయే ఆప్? ఆమె పోయినప్పట్నించీ అదోలా ఉంటే దిగులు పెట్టుకున్నావేమోలే, మెల్లిగా నువ్వే బయట పడతావనుకుని సరిపెట్టుకున్నా. చూడబోతే నీకేదో పిచ్చెక్కినట్టుంది. ఏదేదో ఊహించేసుకుంటున్నావు. నేను జిహాదీనేంటి నాన్సెన్స్! ఐదేళ్లు కలిసి కాపురం చేసినదాన్ని …  మైగాడ్. ఆ కత్తెక్కడిది? ఏం చేస్తున్నావ్ … స్టాపిట్ … యా అల్లా… ”

 

అదే తన ఆఖరి సంభాషణ. మహానటి. చచ్చేముందూ నిజం ఒప్పుకు చావదే! పైగా నేను పిచ్చివాడినని నన్నే నమ్మించబోయింది.

ఈ ఉగ్రవాదులందరికీ ఇదో ఉమ్మడి రోగం. తమ పిచ్చి తామే ఎరగని ఉన్మాదం. బ్లడీ సైకోపాత్స్. వీళ్ల పిచ్చికి ఒకటే మందు.

ఎత్తి పట్టుకున్న కత్తి కసిగా కిందకి దిగింది. సూటిగా, లోతుగా చిరంజీవి గుండెలోకి.

 

వాడి కళ్లలో కొడిగడుతున్న వెలుగుని తృప్తిగా చూస్తూండగా ఎందుకో మేధావి మాటలు గుర్తొచ్చాయి.

“నువ్వేది నమ్మితే నీకదే నిజం”.

 

*

గమనిక: ఈ కథ ముగింపులోని అస్పష్టతపై వ్యాఖ్యలకి, విమర్శలకి ఆహ్వానం. అదే సమయంలో, ముగింపు బయట పెట్టేయకుండా సంయమనం వహించమని మనవి.

——–

 

బిస్కెట్

 

 

Padmaja-నాగ పద్మజ

~

(ఇది నాగపద్మజ తొలి కథ. ఆమె   గుంటూరు లో ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ గా చేస్తున్నారు. )

*

“నేను కొత్త కొత్త మెథొడ్స్ నేర్చుకుని పిల్లలకు ఇంకా బాగా చెప్పాలి అని ఈ కోర్స్ లో చేరాను ” చెప్పి తన సీట్ లో కూర్చుంది మాధవి.

“నాది గవర్నమెంట్ జాబ్ , బి ఎడ్ కంప్లీట్ అయితే ఎస్ జీ టీ గా ప్రొమోషన్ వస్తుంది హై స్కూల్ కి టీచ్ చెయ్యచ్చు.. అందుకే జాయిన్ అయ్యాను “, అన్నది స్వాతి

” నేను ఇదివరకు జర్నలిస్ట్ ని, డిల్లీ లో ఉరుకుల పరుగుల జీవితం తో అలిసిపోయి, పిల్లలతో అసోసియేట్ అవుదామని రెండేళ్ళ క్రితం ఈ జనారణ్యానికి దూరంగా వున్న ఒక బోర్డింగ్ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా చేరాను.   జర్నలిజం  స్కిల్స్  తో  మాత్రమే అయితే క్లాసు రూమ్ లో పిల్లలకు న్యాయం చెయ్యలేనేమో అనిపించింది. అందుకే ఈ ఫార్మల్ ట్రైనింగ్ ఆప్ట్ చేశాను ” ఇంగ్లిష్ లో చెప్పింది దేవిక నాయర్.

” మాది మిషనరీ స్కూల్, బి ఎడ్ చేస్తే ప్రాస్పెక్ట్స్  బాగుంటాయని సిస్టర్ సలహా ఇచ్చారు.. అందుకని ..” సిన్సియర్గా చెప్పింది సూసన్.

” నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం, ఇలాంటి ఒక మంచి ప్రొఫెషనల్ ట్రైనింగ్ వల్ల నా స్టూడెంట్స్ కి ఎంతో లాభం ఉంటుందని అనిపించింది, నేను కూడా ఇంకా స్మార్ట్ గా పని చేయగలుగుతాను..” లోకల్ స్కూల్ లో సైన్సు చెప్పే నందన.

…..

వివిధ జిల్లాల నించి డిస్టెన్స్ కోర్స్ క్లాసెస్ కోసం అక్కడ జమయిన ముప్పై మంది ఇన్-సర్వీస్ టీచర్ లు తమని తాము పరిచయం చేసుకున్నారు.

” వెరీ గుడ్, మీ అందరి ఆశయాలు వింటుంటే నాకు గర్వంగా వుంది…  ముప్పై వేలు పడేస్తే డిగ్రీ చేతికోచ్చే ఈ కాలం లో మీరంతా ఇంత కఠినమయిన ఎంట్రన్స్ పరీక్ష నెగ్గి ఎంతెంతో దూరాల నించి వచ్చి మా డిస్టెన్స్ కోర్స్ లో జాయిన్ అవడం చిన్న విషయంగా నేను అనుకోవడం లేదు …  ఇక మనం కోర్స్ గురించీ, వచ్చే రెండు వారాల వర్క్ షాప్ గురించీ వివరంగా తెలుసుకుందాం ..” ఫాకల్టీ చెప్పుకుపోయింది.

*   *   *

లంచ్ టైం. అందరూ కబుర్లూ కూరలూ పంచుకుంటూ భోజనం చేస్తున్నారు. మాధవి ఫోన్ రింగయింది.

” చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే .. నేను అప్పుడే చెప్పాను ..టార్గెట్స్ ఫినిష్ చేసుకుని వెకేషన్ కి వెళ్ళమని… ” ఫోన్ లో సరాసరి విజయవాడకే వినపెడేటట్టుగా అరుస్తోంది మాధవి.

“.. సర్లే చూస్తాలే” ఫోన్ పెట్టేసి తలెత్తే సరికి అంతా తననే చూస్తున్నారు .

“ఎనీ థింగ్ సీరియస్?” దేవిక అడిగింది.

“ఏం లేదు. నా ఫ్రెండ్, నాతో పాటే పని చేస్తుంది హిందీ చెప్తుంది ప్రైమరీ పిల్లలకు. టార్గెట్స్ మీట్ అవలేదట .. నా దగ్గరేమయినా కాంటాక్ట్స్ వుంటే చెప్పమంటోoది.  అది కాదు నా బాధ … కావలిస్తే డబ్బులిస్తానంటోంది” ఆవేశంగా వివరించింది మాధవి.

“టార్గెట్సా? ఏం టార్గెట్స్??”

“అదేనండి, ఈ ఇయర్ మాకు పది అడ్మిషన్స్ టార్గెట్ పెట్టారు, ఇలాంటి సమస్య వస్తుందనే నేను మార్చ్ నుంచే ఒక్క నిముషం కూడా వేస్ట్ చెయ్యకుండా ఎక్కే గడపా దిగే గడపా అని చూడకుండా కష్టపడ్డాను. సరిగ్గా నిన్నటితో నా పది అడ్మిషన్స్ పూర్తి చూసుకుని ఇవ్వాళ ఇలా  రాగలిగాను. కష్టపడకుండానే అన్నీ కావాలంటారు”

“మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కొంచం చెప్తారా?” అసహనంగా అడిగింది దేవికా నాయర్.

అంతా అనుమానంగా దేవిక వైపు చూసారు. ఈవిడ నటిస్తోందా లేక నిజంగానే అర్ధం కాలేదా?

“ప్రతి టీచర్ కి కొన్ని అడ్మిషన్స్ తీసుకురావాలి అన్న ఒక టార్గెట్ వుంటుంది ఇక్కడ… ” సుసాన్ వివరించబోయింది

“తీసుకురాలేకపోతే .. ”  గాభరాగా అడ్డుపడింది దేవిక.

” ఉద్యోగం ఊష్టింగే ” కక్షగా అంది మాధవి.

“కొన్ని స్కూళ్ళలో మూడు నెలలు జీతం ఇవ్వరు… పొమ్మనక పొగ పెట్టడం అన్నమాట” నందన పూరించింది.

“ఆc .. టీచర్లా సేల్స్ గరల్సా !!”

“ఈ రెండు నెలలు మాకు  తప్పదు”

“మీ స్కూల్ లో పిల్లలెంత మంది ?” దేవికకి ఇంకా మింగుడు పడలేదు

“ఒక పదహైదు వందల మంది వుంటారు”

“మై గుడ్నెస్! అంత మంది వుంటే మరి మీకీ తిప్పలెందుకు?”

“వెళ్ళే వాళ్ళు కూడా వుంటారు కదా దేవికా!”

“ఎందుకుంటారు ?”

“అవతల వేరే స్కూళ్ళు కూడా ఇలాగే కాంపైన్ చేస్తుంటారు కదా మేడం, వాళ్ళూ ఎదో బిస్కెట్ వేస్తారు కదా”

“మీరిక్కడ పది మందితో మాట్లాడుతుంటే అక్కడ మీ పది మందిని వేరే వాళ్ళు బుట్టలో వేస్తుంటారన్న మాట ..  ”

“అంతే కదా..”

“ఈ మాత్రం దానికి ఇటు మీరు అటు వాళ్ళూ రోడ్ల మీద పడటం దేనికి” దేవిక కన్విన్స్ కాలేదు

“మీరు చెప్పేది మరీ బాగుంది.. అట్లా వదిలేస్తే స్కూల్ ఖాళీ అవుతుంది కొన్నాళ్ళకి. ”

“ఎందుకవుతుంది .. ఇదే యత్నం  చదువు చెప్పడం లో పెడితే వాళ్ళే వుంటారు. అసలు మీరీ గొడవ లో పడి పిల్లల చదువు మీద ఎంత మాత్రం దృష్టి పెట్టగలుగుతారు .. ఈ రకంగా మీకు టీచింగ్ స్కిల్స్ కంటే మార్కెటింగ్ స్కిల్సే ఎక్కువ అవసరంలా కనిపిస్తోంది”

“మేమేదో ఇదంతా ఇష్ట పడి చేస్తున్నట్టు మీరనుకుంటున్నట్లుందే.. మేనేజ్ మెంట్ చెప్పినట్లు చెయ్యడమే మా పని” మాధవి నిష్టూరపడింది.

“కాంటీన్ లో కాఫీ దొరుకుతుందేమో చూద్దాం వస్తారా”, చర్చ వేడెక్కుతుండంతో నందన దేవికని మరల్చింది.

*  * *

ఇద్దరూ లంచ్ బాగ్స్ కట్టిపెట్టి కాంటీన్ కి బయలుదేరారు. సంభాషణ ఇంగ్లిష్ లో సాగింది.

దేవిక తన అనుమానం బయట పెట్టింది. “మాధవి చెప్పేది నిజమే నంటారా ?”

“మాధవి చెప్పింది కేవలం సముద్రం లో నీటి బొట్టంతే, ఇంకా చాలా వుంది. మీకు మా రాష్ట్రం సంగతీ ఈ జిల్లాల సంగతీ బొత్తిగా తెలియక ఆశ్చర్య పోతున్నారు కాని ఈ విషయం ఇక్కడ చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు. అందునా ఇవి పేరు మోసిన చదువుల నిలయాలు. మార్కెటింగ్ ఎబిలిటీ వున్న వాళ్ళనే టీచర్స్ గా తీసుకుంటారు ఇక్కడ స్కూల్స్ లో. దాని వల్ల  పిల్లల చదువు దెబ్బతిన్నా పెద్దగా పట్టిచ్చుకోరు, ఎందుకంటే పిల్లల రిపోర్ట్ కార్డ్స్ మీద అందంగా మార్కులూ గ్రేడ్లూ చూపించడం చేతిలో పని. పేరెంట్స్ నించి సమస్య రాకుండా అట్నించి కమ్ముకొస్తారన్న మాట. పైగా సిలబస్ అంతా అయినట్లు చూపడం కోసం పిల్లలతో పుంఖాను పుంఖాలుగా నోట్సులు రాయిస్తారు.”

” నాకంతా అయోమయంగా వుంది, ఇలాంటి మోసాన్ని తల్లిదండ్రులు ఎలా సహిస్తున్నారు?”

*   *    *

” మీకీ టార్గెట్ల బాధలుండవు కదా” దేవిక స్వాతి తో అంది టీ బ్రేక్లో .

“మా బాధలు వేరు. మిడ్-డే మీల్ తో సహా నాదే బాధ్యత. మా హెడ్ మాస్టర్ స్కూల్ కి వచ్చేదే తక్కువ.  వచ్చినా ఫుల్ లోడ్ లో వస్తాడు.”

“ఊర్లో ఎవరూ కంప్లెయిన్ చెయ్యరా ?”

” వార్నింగ్ లు ఇచ్చారు, కాకపోతే రిటన్  కంప్లయంట్ ఇచ్చి వాడి “పొట్ట కొట్టటం” ఎందుకులే అని ఊరుకున్నారు”

“ఎంత మంది మీ బడిలో ?”

“ఇరవయ్ ఆరు మంది, అయిదో తరగతి వరకే” చెప్పింది స్వాతి.

“పిల్లలు తక్కువే, అయినా వేరు వేరు క్లాసుల్లో వుంటారు కదా, సిలబస్ ఎట్లా పూర్తి చేస్తారు?” జర్నలిస్ట్ బుద్ధి పోనిచ్చుకోలేదు దేవిక.

“సిలబసా పత్తికట్టా, 3R’s నేర్పిస్తాం, రీడింగ్ రైటింగ్ ఇంకా అరిత్మెటిక్. అన్ని ప్రశ్నలు మీరే అడుగుతున్నారు. మీ బోర్డింగ్ స్కూల్ సంగతేంటి.”

” హ హ.. ప్రశ్నించడం అలవాటయి పోయింది. ప్రొఫెషనల్ హజార్డ్. ”

*  *  *

నందన ఇంటికి వెళ్తూ ఆలోచిస్తోంది, స్వాతీ దేవిక ల సంభాషణ గురించి. అప్పుడప్పుడు తన బడికి వచ్చే జోనాథన్ సర్ గుర్తుకు వచ్చాడు. ఆయన పల్లెటూరిలో గవర్నమెంట్ స్కూల్ లో టీచర్.  వాళ్ళ బడిలో పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడానికి మా దగ్గర కొత్త పద్ధతులేమయినా వుంటాయేమో అని చర్చించడానికి వస్తుంటాడు. వచ్చినప్పుడు తను ట్రైనింగ్ వర్క్ షాప్ లో నేర్చుకున్న కొత్త విషయాలు కూడా మాతో పంచుకుని వెళ్తుంటాడు. తనని వాళ్ళ బడికి ఒకసారి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు కూడా, కుదరనే లేదు. వెళ్ళాలి, ఆ పిల్లలెలా వున్నారో చూసి రావాలి. ఏమో.. ఒక ఆలోచన కూడా వుంది.

తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో చేరిపిస్తే ఎట్లా వుంటుంది. నిజంగా చిన్న పిల్లలకు కావాల్సినవి 3R’s..ఇంకా బోలెడు స్వేచ్ఛ. లైఫ్ స్కిల్స్ లైఫ్ నించి నేర్చుకోవాలి గాని తను పని చేసే బడిలో మాదిరిగా క్లాసు రూమ్ లో చెప్పగలమా? కానీ ఇక్కడ నా పిల్లలకు స్వాతి లాంటి, జోనాథన్ సర్ టీచర్ దొరకుతారా? ఒకవేళ దొరికినా ఈ కాంపిటీటివ్ ప్రపంచం లో నెగ్గడానికి ఆ చదువు సరిపోతుందా?

స్కూళ్ళ పరిస్థితి ఇలా వుంటే మరి నేటి చురుకయిన యవత అంతా ఎక్కడి నించి వస్తున్నట్టు? వీళ్ళు చదువుకుని పైకోస్తున్నవారా లేక ఈ చదువుల్ని తట్టుకుని, వ్యవస్థని జయించి నిలుస్తున్నవారా?  బిస్కెట్ కోసం పెరిగెత్తి పరమాన్నం కోల్పోతున్నదెవరు?

ఎన్నెలో యెన్నెలా… !

 

 

-అట్టాడ అప్పల్నాయుడు

~

 

 

ఆ ఇంట్లో టీ.వీ అతని మరణాన్ని ప్రసారం చేస్తోంది. మరణం వెనక కారణాలను విశ్లేషిస్తోంది. రోజులో యింకేవీ వార్తలు లేనప్పుడూ, అడ్వర్టయిజ్ మెంట్ల తర్వాతా మూడు రోజులుగా టీ.వీ ఛానళ్లన్నీ అతని గురించి చెపుతూనే వున్నాయి. న్యూస్ ఏంకర్లు వారి రిపోర్టర్లను యెప్పటికప్పుడు అప్ డేట్సుని అడుగుతూ, వాట్ని ప్రసారం చేస్తూ, కొన్ని విజువల్స్ వేస్తూ, యిటువంటి వార్తలను ప్రసారం చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు కనబడుతున్నారు. అప్పటికి అతను చనిపోయి నాలుగోరోజు.

అతను చనిపోలేదు, హత్యచేసారంటారు అతని మిత్రులూ, సహచరులూ.  అతన్నెవరూ హత్యచేయలేదు, అతనికతనే ఉరి వేసుకుచనిపోయేడు. బతకడం ఇష్టంలేక తనే చనిపోతున్నాని, బతుక్కంటే చావు హాయిగా వుందని ఉత్తరం రాసి చనిపోతే హత్యంటారేమిటీ అసహనంగా ప్రశ్నించేరు కొందరు. ఆ కొందరే అతని మరణానికి కారణమని యింకొందరూ ! ఇన్నోసెంట్ ఛైల్డ్ , టేక్ హిజ్ లైఫ్ ఫర్ నో కాజ్.. అని వాపోయిందొకామె. అంతేకాక- ఆ చావుకి తమను బాధ్యుల్ని చేసి మాటాడిన ప్రతికక్షుల్ని… ఉతికి ఆరేసింది. రాజకీయాలు శవాలతో చేయకండి. ఊపర్ భగవాన్ హై.. పాపోంకో ఓ నహీ ఛోఢేగీ… అని నిప్పుకళ్లతో హుంకరించింది. భగవాన్ కూడా ఆ క్షణాన ఆమెను చూస్తే హడలిఛస్తాడు.

భగవాన్ ఆప్ జైసే మహిళా నహీ… భగవాన్ పురుష్ హో, నహీ ఛోడీగీ నహీ, నహీఛోఢేగా భోలో అని ఇంకొందరు అభ్యంతరం చెప్పేరు. ఆమె ధీమాగా – ఓటర్ తమ పక్కనున్నారన్నట్టు.. భగవాన్ హమారే సాధ్ హై… అనన్నది ! ప్రతికక్షులవేపు నిసాకారంగా చూసి – ఇన్నోసెంట్ ఛైల్డ్ టేక్ హిజ్ లైఫ్.. అని రుద్ద కంఠంతో పలికి… భగవాన్ నహీ ఛోడేగీ అనన్నది మళ్లీ !

” .. చూసేవమ్మా, నువ్వెప్పుడూ అల్లరి పిల్లడివని తిట్టేదానవి. ఆమె నన్నెపుడూ చూడనేలేదు. నా శవాన్నిగూడా చూడలేదు. అయినా ( ఇన్నోసెంట్ ఛైల్డ్ ) తెలివిలేని పిల్లడని బాధపడింది. నువ్వూ వున్నావెందుకూ ? నన్నాడిపోసుకోడానికి ? అని బుంగమూతి పెట్టేడు అతను ! టీ.వీ చూస్తోన్న తల్లి బదులివ్వలేదు. అతని ఒడలంతటినీ స్పర్శించింది. కౌగిలించుకుంది. జుత్తులోకి వేళ్లు జొనిపి, జుత్తు గట్టిగా పీకింది. అతను హాయిగా నవ్వి ఆమె కౌగిలిలో ఇమిడిపోయేడు.

ఇంతలోనర్శిం వచ్చేడు. ఒక క్షణం మౌనంగా కూచున్నాడు. ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి – నక్షత్ర చావుకి ఒకరు గాదమ్మా.. నీచే, నాచే, వరమడిగిన కుంతిచేతన్… అలాగ ఆరుగురేటి బతికున్న మనందరమూ కారకులమే అనన్నాడు. తల్లి గతుక్కుమంది. కొడుకు- సైగ చేసేడు, నాలుకను బయటకు పెట్టి నర్శిం మామ చెప్పేది నిజంకాదన్నట్టు. అతనే నక్షత్ర ! ఆమె నక్షత్రను పొదివి పట్టుకుంది.

నక్షత్ర చనిపోయేడంటే యిప్పటికీ నమ్మలేకపోతున్నాను., కాలిబూడిదయి నాల్రోజులయినా- అనన్నాడు నర్శిం. నక్షత్ర మరణ వార్తను నర్శిమ్మే తెచ్చేడు. పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని చెప్పేడు. చీకటి, చిట్టడవీ, భోరున గాలీవానా  – చిందువ యెత్తుకెళిపోయిన జింక పిల్ల తల్లిలా ఒణికిపోతూ, నిలువెల్లా నీరయి… తల్లి కూలబడిపోయింది. నర్శిం యేడుస్తూ –

నక్షత్రలాంటివాళ్లు తమ వాడలోనే కాదు, భూమ్మీదనే యెక్కువమంది పుట్టరు. చిత్రమయిన పిల్లాడు. బతుకు గురించి అందరమూ యేదో అనుకుంటాంగానీ నక్షత్ర భవిష్యత్ బతుకు గురించి మాటాడేవాడెపుడూ. రేపేంజేద్దామ్మామా అనడిగేవాడు. గడనీయిరా… ఈరోజేనేవాడు నర్శిం. కాదు, మామా ఈరోజు గడవడం రేపటికోసమే అననేవాడు. రేపటికోసమే జీవించేవాడు. ఊరుకి దూరంగానున్న స్కూలుకి నడిచివెళ్లేవాడు. పెద్ద రైతుల, ధనికుల పిల్లలు నక్షత్రను యెందుకో ఒకందుకు అవమానపరిచేవారు. తల్లీదండ్రులు కులభ్రష్టులనో, కులహీనులనో.. ! ములకోల పోట్లతో దుక్కిపశువు నాగేటిచాళ్లు పోసినట్లుగా హైస్కూల్, కాలేజీ చదువుల్ని సాగించేడు రేపటి మీద ఆశతో !

లేదు మామా, నేనింకా బతుకు ఆరంభించకముందరే ముగింపుకొచ్చేసాను. దుక్కిపశువు నాగేటిచాళ్ల మీదే ఆఖరి శ్వాస తీసింది- సూసైడ్ నోట్ లో ఈ వాక్యం లేదుగానీ, నర్శింకి లేఖ సారాంశమంతా యీ వాక్యరూపంలో అర్ధమైంది. అందుకే… బతికున్న అందరమూ  దోషులమంటున్నాడు.

ఇందిరమ్మకోలనీ కోసం, బంజరభూములకోసం, రిజర్వేషన్లకోసం, దేవాలయప్రవేశాల కోసం – నర్శిం ఆందోళనలూ, ఉద్యమాలూ ! మామా, వీటి కోసమేనా మన జన్మలు ? వాళ్లూ, మనం అంతా కూడా మనుషులమే కదా ? వాళ్ల కలలూ, మన కలలూ ఒకటే కాజాలవా అనేవాడు. నక్షత్రకు ఆశయాలున్నవిగానీ, అవెలా తీరతాయో, వాట్నెవరు అడ్డుకుంటున్నారో యెరుక లేదు. నర్శింకి కూడా వివరించే శక్తి లేదు. నక్షత్ర ఓ రోజు నర్శిం భుజమ్మీది ఎర్రతువ్వాలుని తీసేసి, నీలి రంగు తువ్వాలు కప్పేడు. ఏవేవో విషయాలు మాటాడేడు. యూనివర్షిటీలో తోటి విద్యార్ధుల ఆశలు, ఆవేదనలు, రేపటి కోసం కార్యాచరణలు… ! ఏడాదిగా యెపుడు కలిసినా యివే ఊసులు !

అపుడే – ఊరిలో ఏదో బహుళజాతి కంపెనీ ధర్మల్ విద్యుత్ కర్మాగారానికి శ్రీకారం చుట్టింది. డిపట్టా భూమలయిన తమ భూముల్ని అప్పగించమని కలెక్టర్ ఉత్తర్వులు. తాము ఉద్యమం చేయటం. కోర్టు నుంచి స్టే తేవడం ! కలకలంగా ఉంది వాడంతా !

యేమనుకున్నాడో నక్షత్ర – పండీ, యెండని భూములెందుకు మామా, వొదిలేయండి, ఉద్యోగాలిప్పించమనండన్నాడు.

నక్షత్రా – పండీ, యెండనివి కాదు. అలా చేసేరు, రైతు బతుకుని. మట్టిలోన సాముదప్పా మాకేమి తెలుసు నక్షత్రా ? మట్టిని లాక్కున్నోడు మమ్మల్ని ఉద్దరిస్తాడంటే నమ్మమంటావా అని గదా అడిగేడు నర్శిం.

నక్షత్ర చాలాసేపు మాటాడలేదు. ఒక దీర్ఘనిట్టూర్పు విడిచి – యేం చెప్పాలో బోధపడడంలేదుమామా అని ఆకాశంవేపు చూస్తూ వెళిపోయేడు ఇంటికి !

picasso_cubism

మళ్లీ యిదిగో పదిపదిహేను రోజుల కిందట ఓ రాత్రి ఫోను చేసేడు – మామా ఊళ్లల్లో  వెలిని దాటి వచ్చేంగానీ మేమిక్కడ వెలిని దాటలేకపోయేం. వెలివాడలోవున్నామని – తమ పనిష్మెంటూ, దాన్ని యెత్తివేయడానికి చేసిన పోరాటం, సహచరుల నిరాశలూ, నిస్తబ్దతలూ… ఎన్నాళ్లీ చీకట్లు మామా అనడిగేడు ! అపుడు, నర్శిం ఆకాశం వేపు చూసేడు !

నర్శింకి అన్నీ కదలాడి -ఆకాశంలో యేమి బోధపడింది నక్షత్రా ? అని కుమిలిపోసాగేడు.

కూలబడిన తల్లి  స్పృహ కోల్పోయింది. నర్శిం ఆందోళనతో ఇంట్లోకెళ్లి మంచినీళ్లు తెచ్చి, ఆమె మొహమ్మీద చల్లేడు. ఇరుగూ పొరుగూ కోసం కేకలు పెట్టేడు. ఇరుగుపొరుగూ చేరేరు. యేవేవో సపర్యలు చేస్తున్నారు. ఆ రోజే సాయాంత్రానికి యూనివర్సిటీకి చేరేరు. నక్షత్ర శవం చుట్టూ పోలీసులు దడిగట్టేరు. విద్యార్ధులెవర్నీ దరిచేరనీయటంలేదు. నర్శింనీ, తల్లినీ రానిచ్చేరు. వారితో యేమీ మాటాడకుండా నక్షత్ర శవాన్ని వేనెక్కించి స్మశానానికి తీసుకువెళ్లేరు. పోలీసులు కాటికాపరులయ్యేరు. కన్నపేగులు కాలుతున్న బాధతో కూలిపోయింది.. ఆ తల్లి ! నర్శిం తీసుకొచ్చేసాడు. గొడవలూ, ఆందోళనలూ… కన్నీళ్లూ, ఎగజిమ్మిన ఆక్రోశాలూ ! తల్లి ఇంటికొచ్చేసింది.

రెండో రోజు… నక్షత్ర తల్లి దగ్గరకు వచ్చేడు. అమ్మా అని పిలిచేడు. ఇటు చూడన్నాడు. తల్లి చూసింది. నక్షత్రమండలానికీ, భూమండలానికీ మధ్య కన్పించేడు. ఎర్రెర్రగా, నీలినీలిగా వున్నాడు. మొహం కాంతివంతంగా వుంది. ఏ కొత్త బతుకునో అందుకోబోతున్న వాడిలా వున్నాడు. నవ్వేడు. ఆ నవ్వే ఆమెకిష్టం. చిన్నప్పటి నుంచీ యెలా వచ్చిందోగానీ వాడికి ఆ నవ్వు – పున్నమిచంద్రుడిలా ముచ్చటేస్తుంది. ఆమె కూడా నవ్వింది. యేడ్వకన్నాడు. నీ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గరకు వచ్చేనంతే. కాదు, కాదు. అమ్మమ్మ దగ్గరకు యింకా చేరలేదు. పదకొండోరోజు మీరేదో క్రతువు చేస్తేగానీ ఆత్మ బయటపడదని బేమ్మర్లంటారుగదా అన్నాడు.

బ్రాహ్మణ్లను అలా బేమ్మలనీ, బాపన్లనీ పల్లెవాళ్ల పలుకు బడిలో పలుకుతాడు నక్షత్ర ! నక్షత్రకు ఓ బ్రాహ్మణ స్నేహితుడున్నాడు. అతణ్ణి మాత్రం – నువ్వు బ్రాహ్మల్లో తప్ప బుట్టేవయ్యా అంటాడు.

” … అతను కూడా యేడుస్తున్నాడమ్మా. యిపుడే అతనికి యేడ్వద్దని చెప్పొచ్చా. మరోజన్మలో నువ్వు మా కులం లోనా, నేను నీ కులంలోనా పుట్టి ఒకరి రుణం మరొకరం తీర్చేసుకుందాంలే అనన్నానమ్మా ” అని చెప్పేడు.

ఆ తల్లికంతా అయోమయంగా వుంది. నక్షత్ర మళ్లీ తల్లితో –

” … ఈ పదకొండు రోజులూ నీతోనే వుంటానమ్మా. పదకొండు జన్మలకు సరిపోయే ఊసులాడుకుందాం, పదకొండుజన్మల అనుభూతిని మూటగట్టుకుందాం… లే.. ” అన్నాడు. లేచింది తల్లి. నాల్రోజులుగా ఊసులే ఊసులు…

ఇందిరమ్మకోలనీ ట్విన్ను ఒక భాగంలో వుంటుందామె. ఇద్దరు కూతుళ్లు, మరో అబ్బాయీ సంతానం. ఉదయం పదిన్నరవేళ. ట్టిన్ను ముందరి గడపలో శీతకాలపు ఎండ పడే చోట కూచుంది. కూతుళ్లూ, కొడుకూ బయటకు వెళిపోయేరు. సెలవులకు ఇంటికొచ్చిన నక్షత్ర రాత్రి బాగా లేటుగా పడుకున్నాడేమో ఎండవేళకి లేచేడు. కళ్లు పులుముకుంటూ గడపలోకి వచ్చేడు. తల్లి ఎండపట్టున దిగాలుగా కూచోడం చూసేడు. ఆమెకు దగ్గరగా వచ్చి కూచుని –

” రాత్రి మంచి కల వచ్చిందమ్మా. అమ్మమ్మ దేవుడిని బతిమాలుకొని కిందకి వచ్చి నన్ను తీసుకెళ్లింది. దేవుడేమో నన్ను చూసి పలకరించేడు. మీ అమ్మమ్మ యెప్పుడూ నీ గురించే మాటాడుతుంటుంది. నీ ధ్యాసే ఆమెకు. నువ్వు వచ్చేయగూడదూ అమ్మమ్మ దగ్గరకూ అనన్నాడు. నేనాయన అడిగినదానికి బదులివ్వకుండా – ఇక్కడేమేమి వున్నాయీ అనడిగేను. దేవుడికి బోధపడలే. అమ్మమ్మే జవాబిచ్చింది. అన్నీ వున్నాయనీ, నక్షత్ర మండలం చూడచక్కగా వుంటాదనీ చెప్పింది. ఒకో నక్షత్రం ఒక దేశంలా వుంటాదట. మన భూమండలంలో వున్నంత మంది కాదుగానీ మోస్తరుగా వుంటారట మొత్తం నక్షత్ర మండలమంతా కలిపితే ! అందరూ బాగుంటారట. ఎవరికీ యే బాధా వుండదట. పనిచేయడం, తినడం, పాటలు పాడుకోవడం, ఆటలాడుకోవడం, నృత్యాలూ – ఒవ్వో అనంది. అందరూ ఉమ్మడిగా వుంటారట. స్వంతమనేదేదీ ఎవరికీ వుండదట, గానీ అందరికీ అన్నీ స్వంతమట…. ” అనన్నాడు. ఆ మాటలు తల్లికి అర్ధంకాలేదు. ప్రశ్నించబోయింది. కానీ నక్షత్ర తన ధోరణిలో తాను –

” … దేవుడు ఒక్కోరోజు ఒక్కో మండలంలో వుంటాడట. అమ్మమ్మ వాళ్ల మండలానికి దేవుడు  వచ్చిన నాడు పర్మిషన్ అడిగిందట, నన్ను తీసుకురాడానికి ! మళ్లీ నేను వెళ్లే రోజుకి దేవుడు వచ్చేడు. మరి ఇక్కడ చదువుకొనే స్కూల్లూ, కాలేజీలూ, యూనివర్సిటీలూ వుంటాయా అనడిగేను. నక్షత్రమండలమ్మీద పరిశోధనకి నాకు అవకాశమిస్తారా – అనడిగేను. దేవుడు యెందుకో నవ్వేడు. మా వీసీ కూడా అలాగే నవ్వుతాడు. పరిశోధనకు వచ్చేం సార్ అని భక్తిగా నమస్కరించి చెపుతామా, యిలగే నవ్వుతాడు. ఆ నవ్వు మా వెన్నుపూసల ఇల్లు కట్టేసుకొని వుండిపోయిందమ్మా.

ఎస్, ఆ రోజు యిలాగే నవ్వి, ఆ తర్వాత ప్రతీవాడూ పరిశోధకుడే. గోంగూర కంటే చవకయిపోయింది పరిశోధనన్నాడు వీ.సీ. అపుడు, గోంగూర కంటే చవకయితే మాలాంటోళ్లెంతమందో పరిశోధకులయిపోయుండాలి కదా ? అన్పించింది. ఆ మాటే అన్నాను వీసీతో. కళ్లెర్రజేసి, వేలు చూపి అక్కడికి ఫో అనన్నాడు. వెళ్లేను. అక్కడ ఒకాయన వున్నాడు. తెల్లగా వున్నాడు. షర్టూ, ఫ్యేంటూ వేసుకున్నాడు గానీ – అవి పంచే, లాల్చీల్లా వున్నాయి. మనూరి బేమ్మడిలా నుదుటన బొట్టూ, మండకి ఎర్రని దారాల కట్టా… ! నా మీదకి చూపు విసిరి, కొద్దిగా యెడంగా జరిగి చేయి చాపాడు. నా సర్టిఫికేట్ల  ఫైలిచ్చాను. చూసేడు. నోటి నిండా కిల్లీ ! సర్టిఫికేట్ లు చూడగానే ఉమ్మొచ్చిందేమో, అవతలకి నడిచి ఉమ్మేడు. చేత్తో నోరు తుడుచుకొని, ఆచేత్తో నా  ఫైలు పట్టుకున్నాడు. కిల్లీ మరక నా ఫైలుకి అంటుకుంది. అదోలా అన్పించింది.. ఆ మరక నాకే అంటినట్టు. ఫరవాలేదు, మరక పోయిందిగా అడ్వర్టయిజ్ మెంటు అప్పుడే గుర్తొచ్చి, నవ్వొచ్చింది. ఆయనకి కోపమొచ్చింది. ఇది, మీ వాడ కాదు. ఎవడు బడితే వాడు, ఎపుడుబడితే అపుడు, ఎలాబడితే అలా నవ్వీడానికి అనన్నాడు. నవ్వడానికి కూడా సమయాలూ, అర్హతలూ వుంటాయని రూల్స్ చూపించేడాయన తన కోపంతో ! అప్పుడు చుట్టూ చూస్తే  నవ్వడం తెలీని జీవుల్లాగ ఆ ప్రాంతంలో చాలామంది కుర్రాళ్లు కన్పించేరు. వెళ్లూ – అని దీర్ఘం తీసి వేలు చూపించేడా పంచెకట్టు ఫేంటాయన. ఎటు వెళ్లాలో తెలీక నిల్చుంటే  ఫైలు విసరబోయేడు, చేను మీద పడే పిట్టల మీదకి రాళ్లు విసిరేట్టు ! నేను ఎగిరిపోయేను, కాదు యెవరో కుర్రాడొచ్చి హాస్టల్ కి తీసుకుపోయేడు….

తల్లి కళ్లల్లో నీళ్లు తిరిగేయి…. కొడుకు కల చెప్తున్నాడా, తన రోజువారీ అనుభవాలు చెప్తున్నాడా ? కల చెప్పరా, నాయనా అనందామనుకుంది. కల ఆమెకు గూడా బాగుంది. దేవుడు, నక్షత్రమండలం, తన తల్లీ… వినడానికి సంతోషంగా వున్నాయి.

అంతలో ఆమెకిదంతా గతంలో నక్షత్ర చెప్పిన కల అనీ గ్యాపకమొచ్చింది. దుఖం పొంగుకు వచ్చింది.

నర్శిం అప్పటికి తేరుకున్నాడు. కాసేపు ఆమెతో యేమేమో మాటాడేడు. సంస్మరణ సభలూ, ధర్నాకార్యక్రమాలూ యేవేవో జరుగబోతున్నాయనీ… ఆమె వీటిల్లో పాల్గొనాలనీ, కొడుకు కోసమే కాదు, అలాంటి మరికొందరు కొడుకుల్లాంటి వాళ్ల బతుకుల కొరకు దుఖాన్ని దిగమింగుకోవాలనీ చెప్పేడు. ఆమె విన్నది. పక్కనే వున్న నక్షత్ర తల్లి మొహంలోకి చూసేడు – యేమనుకుంటున్నాదోనని. ఆమె మొహంలో యే భావమూ కనబడలేదు. ఇపుడే కాదు, యెపుడూ ఆమె మొహంలో యే భావమూ కనబడదు. గుండ్రటి మొహం, విశాలమయిన నుదురు, ఆవుకళ్లల్లా నల్లకళ్లూ… !

అప్పటికామె తెరిపిన పడినట్టుంది. నర్శిం కూడా వెళ్తానని లేచేడు. ప్రక్క టౌనులో అంబేద్కర్ సంఘం వారు సంస్మరణ సభ పెడతారట, రమ్మన్నారు. తయారయి వుండమనీ, అరగంటలో వస్తానని చెప్పి నర్శిం వెళిపోయేడు. ఆమె కూడా లేచింది.

అప్పుడే టీ.వీ. లో నక్షత్రఫోటో, తనగురించిన వార్తలూ వస్తున్నాయి… ఒక నాయకుడు, యేదో సభలో ఉపన్యసిస్తూ… దేశమాత ఒక బిడ్డను కోల్పోయిందనన్నాడు. నక్షత్రకు నవ్వాగలేదు. చప్పట్లు కొడుతూ, గెంతుతూ నవ్వుతూ -అమ్మా, నువ్వు కాదట, దేశమాత ఒక బిడ్డని కోల్పోయిందట ! నువ్వేమో నీ బిడ్డని కోల్పోయేవని యేడుస్తావు. అదేంటమ్మా. తప్పు, తప్పు అనన్నాడు. ఆమె టీ.వీ. వేపు చూసి, ఒక నిట్టూర్పు విడిచి స్నానానికి వెళిపోయింది.

నక్షత్ర కాసేపు తన ఇంట్లో తిరిగేడు. తండ్రి తమను వదిలేసి వెళిపోయిన తర్వాత బతకడానికి తల్లి కూలీనాలీ పనులకు వెళ్లడం, అలసి, సొలసి యింటికి చేరడం… భూమి కంపించినట్టుగా… రాత్రుళ్లు ఒకోసారి తల్లి కుమిలికుమిలి యేడ్వడం. మెలకువ వచ్చేది. తల్లిని కరచుకొని పడుకొనేవాడు. ఇక్కడే, యీ అరుగు మీదే, యీ తుంగచాప మీదనే ! కాసేపు వాలేడు దానిమీద.

ఆ తర్వాత పక్కింటి వేపు చూసేడు. అది జానేసు ఇల్లు. జానేసెపుడూ రాత్రివేళ మంచిపదాలు పాడేవాడు. అది గెడ్డా, యిది గెడ్డా – నడిమిన పడిందిరా నాయుడోరి పడ్డా అనే పాటా ; రాక రాక వచ్చేనమ్మా గోంగూరకీ… గోంగూరకీ… పాటా, యిలాటివే యేవేవో పాటలు ! జానేసు భార్య – తొంగోరాదా, రాత్రేళ యీ పాటలేటి, అని కేకేసేది. ఆ పాటలెందుకు మానేసాడో మానేసి… ఒత్తన్నాడొత్తన్నాడు, ఆ భూములున్న బుగతోడు, సూడు సూడు పోలీసులతోడు తోడు… పాటలకి మారేడు. ఆ పాటలు  పాడుతున్నాడని పోలీసులొచ్చేరు, పట్టుకుపోయేరు. తర్వాత యేమయ్యేడో తెలీదు. జానేసు భార్య నిద్రరాక యిపుడు… నీ దయలేదా యేసా, పాడతోంది.

నక్షత్రకు మళ్లీ యనివర్సిటీ కేంపస్ గుర్తొచ్చింది. నాలుగురోజులుగా ఆత్మ అక్కడా, యిక్కడా తిరుగుతోంది. విశాల భవంతులు, ఇరుకిరుకు గుండెల ఆచార్యులు. ఆచార్యులన్న పదానికి నవ్వుకున్నాడు. ద్రోణాచార్యులవారి వారసత్వమింకా దిగ్విజయంగా కొనసాగుతోంది. హుం…

బొటనవేళిని వెనక్కి మడచి, ఎర్రని గుడ్డ కట్టి… వెలివాడలో తిరుగుతున్నాడు… ధృవ. అతణ్ణి అనుసరించుతూ… అరుంధతి, భాగ్య మరో యిద్దరూ బొటనవేళికి ఎర్రనిగుడ్డ చుట్టుకున్నారు. నక్షత్రకు వాళ్ల వేళ్లను స్పర్శించాలన్పించింది. తన స్మారకస్తూపం ముందర శోకమూర్తులై… వందలాది సహచరులు… జోహార్ నక్షత్ర…. జోహార్ ; మనువాదం నశించాలి… నినాదాలు ! నక్షత్రకు నినాదమివ్వాలన్పించింది. పిడికిలి బిగించబోతే వేళ్లు మడతబడడం లేదు. నోరు పెగలడం లేదు. సహచర సమూహమంతా రంగభూమిలో వీరుల్లా కన్పిస్తుంటే – కళ్లల్లో నీళ్లు తిరిగేయి నక్షత్రకు. బతికుండాల్సిందన్పించింది… నక్షత్రకప్పుడు !

హుం… బతుకూ, చావూ కేవలం నా చేతిలో లేదు… అననుకున్నాడు నక్షత్ర ! చాలా సేపు దుఖించేడు. బతకడానికి యెన్నెన్ని కష్టాలు అనుభవించేను ? నా కంటే నా తల్లి యింకా కష్టాలు అనుభవించింది. ఇన్ని కష్టాల తర్వాత, యింత శ్రమ తర్వాత గూడా భవిష్యత్ చీకటి, చీకటిగా.. !? అమ్మా, నీ గర్భకుహరంలోకి మళ్లీ వెళ్లే అవకాశం వుంటే యెంతబాగుణ్ను ! కాదు, చనిపోతే నక్షత్రమండలం చూడొచ్చు… నక్షత్రా అని ఇందుకేనా అమ్మా నాకు పేరుపెట్టేవు ? నక్షత్ర మనసులో అనేక విషయాలొక్కసారిగా ఆకాశంలో రెక్కలుగొట్టుకు యెగిరే పిట్టల్లా యెగురుతున్నాయి.

రోజూ యెందుకో ఒకందుకు మేమే దోషులుగా వీసీకి, మిగిలిన ఆచార్యులకూ కనబడతాం. రేషన్ కట్, స్కాలర్ షిప్ కట్, క్లాస్ కట్, డిగ్రీ కట్ ! ఒరేయ్, మీ ఫ్యూచర్ కట్ రా… యూనివర్సిటీ గోడల్లో ప్రతిధ్వనిస్తుంటాయి ! ఏలికలారా, మా బతుకుల పాలకులారా… ఎన్నెన్ని ఆయుధాలున్నాయి మీదగ్గర ? మా దగ్గర పిడికిళ్లు మాత్రమే వున్నాయి. అవే మీ కళ్లకు.. ఫిరంగులో, పిడుగులో !

గురుద్రోహులని పూర్వం శిక్షించేవాళ్లు, యిపుడు రాజద్రోహులని శిక్షిస్తున్నారమ్మా – అనన్నాడు తల్లితో ! అప్పుడే ఆమె చీరకట్టుకొని, బయటకు వెళ్లటానికి సిద్ధమై వచ్చింది.

అమ్మా, కొంచెం విచారంగా వున్నట్టు కన్పించమ్మా.. అన్నాడు నక్షత్ర.. ఆశ్చర్యపోయింది తల్లి. నేనలా కన్పించటంలేదా ? నాయినా, విచారం లేని క్షణమేది నా జీవితంలో ? నీకెలా కన్పించానోగానీ, పాడుబడిన ఇల్లులా వుంటావంటారంతా నన్ను ! అనగూడదుగానీ, అందుకనే నా కోసం మగపురుగేనాడూ రాలేదు అనంది. నక్షత్ర నొచ్చుకున్నాడు. అనవసర వ్యాఖ్యతో తల్లిని బాధపెట్టేననుకున్నాడు. నిజమే, అమ్మ.. దుఖపుమూటలా వుంది.

అప్పుడే నర్శిం తిరిగొచ్చేడు – దళితసంఘాలవారు సభ అన్నారుగానీ, మళ్లీ యెందుకో రద్దు చేసుకున్నారు. ప్రెస్ మీట్ మాత్రమే పెడతన్నారట. దానికి మనమెందుకు ? అని ప్రశ్నించేడు నర్శిం. తల్లికేమి చెప్పాలో బోధపడలేదు. నక్షత్రకు ఆ వార్త యేదో సంశయాన్ని కలిగించింది. అంతలోనే.. ఛఛా అనుకున్నాడు. తానెప్పుడూ అన్నింటినీ సంశయించడం వలననే యిలా… అని ఆత్మవిమర్శ చేసుకున్నాడు.

అప్పుడు నక్షత్ర చెంప ఛెళ్లు మన్పించింది… ఆత్మ ! నేనెన్నడూ విమర్శ చేసుకోలేదు. నువ్వెవడివిరా ఆత్మవిమర్శ అనడానికని అడిగింది. నక్షత్ర చెంప తడుముకున్నాడు. ఓహో… నా కిపుడు స్వవిమర్శ చేసుకునే అవకాశంగూడా లేదన్నమాట ! జీవించినపుడు… పరవిమర్శ చేయగూడదు. మరణించేక ఆత్మవిమర్శ చేయగూడదు అననుకున్నాడు మనసులో. ఆత్మ దానికీ ఒప్పుకోలేదు. ఆత్మ విమర్శ యెపుడూ చేసుకోవచ్చు. ఎవరయినా చేసుకోవచ్చు. గానీ నీకు ఆ అవకాశం లేదు. నువ్వు చనిపోవాలనుకున్నపుడు ఆత్మను అడిగేవా ? అడక్కుండా ఉరిబోసుకు చచ్చేవు. దమ్ముంటే నిన్ను యిబ్బంది పెట్టినోడ్ని చంపవొల్సింది. నన్ను చంపావెందుకురా ? ఎవడ్రా యీ చావుకి ఆత్మహత్య అని పేరుపెట్టింది. ఆత్మను హత్య చేసిన హంతకుడివి నువ్వు… ఆత్మ రెచ్చిపోసాగింది. నక్షత్ర మరణించి కూడా దోషిగా కనబడుతున్నందుకు చింతించసాగేడు… అప్పుడే, వీ.సీ. గారి మాటలు గుర్తొచ్చేయి…

” … చదువుకోసం రాలేదండీ. హాస్టల్ భోజనం, స్కాలర్ షిప్, బేఖాతర్ తిరుగులూ… వీటి కోసం వచ్చేరు. వీళ్లింతేనండీ. ఆ కుర్రాళ్లు చూడండి, చక్కగా భరతమాత భజన చేస్తారు. రామాయణం పారాయణం చేస్తారు. గురుపూజలు చేస్తారు. ద్రోణాచార్యుల పీఠానికి మాలలు వేస్తారు. స్వామీజీలని రప్పించి సభలు పెడతారు. ముద్దొస్తారు… ముండాకొడుకులు.. ” అని మురిపెంగా వీసీ యెవరితోనో చెప్తున్నాడు.

ముద్దొచ్చినా ముండ కొడుకులేనా- నీ నోట్లో మూత్రం పొయ్యా… మనసులో అనుకున్నాడు నక్షత్ర.. కాసేపు గదిద్వారం దగ్గర నిల్చున్నాడు. ఆ మధ్య  -దళిత విద్యార్ధులూ, బహుజన విద్యార్ధులూ కలిసి ‘ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ‘ పెట్టుకున్నారు. అసోసియేషన్ వివరాలను రాసిచ్చి -ఇక నుంచీ విద్యార్ధుల సమస్యలేవేనా అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పి వద్దామని వెళ్లేరు. రిప్రజెంటేషన్ తీసుకున్నాక వీ.సీ…. ఎదురుగా వున్నాయనతో అవీ మాటలు.

మళ్లీ నిల్చున్న నక్షత్రావాళ్ల వేపు వేళ్లు చూపి, ఎదుటవ్యక్తితో –

” ..వీళ్లో… రాజకీయాలు మాటాడతారు ? రాజ్యాంగమూ, హక్కులూ అంటారండీ ! ఎందుకండీ అవన్నీ ? అసలీ ప్రశ్నలేమిటండీ ఆచార్యుల మీద శిష్యులు ? ఎక్కడేనా వుందా ? వ్రేళడిగితే వ్రేళూ, శిరసడిగితే శిరసూ యిచ్చేయలేదండీ పురాణకాలం శిష్యులు ? పోయే కాలం, పిదపబుద్ధులూ ! ” కులపతి సెలవిచ్చుతున్నారు. ఎదుటివ్యక్తి – కాదు కాదు, పిదపబుద్ధులు కావు, విదేశీబుద్ధులు ! దేశద్రోహబుద్ధులు అని సవరించేడు. నక్షత్రకు యిపుడు తను సాధారణ నేరస్తుడు కాడనీ, దేశద్రోహి నేరస్తుడనీ అర్ధమవుతోంది…..

తల్లి గడపలో ఒక మూలకు చేరబడి కూచుంది. నర్శిం – ప్రెస్ మీట్ కోసం అంత కష్టపడి వెళ్లొద్దులే ! నాకో పని వుంది, చూసుకొని సాయంత్రం వస్తాను. ఒకటి మాత్రం ఖాయం -నక్షత్ర చావుకి కారణమయిన వారిని శిక్షించాకగానీ, నక్షత్ర అస్తికల నిమజ్జనం చేయొద్దని కరాఖండిగా ఒక ప్రకటనలాగా చెప్పి వెళిపోయేడు.

తల్లి- నక్షత్రను వదిలేది లేదు, నా గర్భంలో దాచేసుకుంటానని మనసులో గట్టిగా అనుకున్నది. సరిగ్గా అప్పుడే నక్షత్ర – అమ్మా, నీ ఒడిలో బజ్జుంతా, వొక జోలపాట పాడవా అనడిగేడు. తల్లి ఒడిలో బజ్జున్నాడు. తల్లి జోకొడుతూ – జోముకుందా, జోజోముకుందా… లాలి పరమానంద… లోగొంతుకతో పాడగా, నక్షత్ర ఒడిలోంచి లేచి – ముకుందుడూ లేడు పరమానందుడూ లేడు. మన పాట పాడే తల్లీ అనన్నాడు ! రావనాసెందునాలో యెన్నెలా, రాజా నీకొందనాలో… యెన్నెలా యెత్తుకుంది తల్లి ! నక్షత్రకు మెల్లగా నిద్ర కమ్ముకుంటోంది.

కొంతసేపటికి… వీధిలో ఒక పెద్ద ఊరేగింపు – నీలిసలాం, లాల్ సలాం… నీలాల్ సలాం నినాదాల్తో వస్తోంది ! నర్శిం గొంతునరాలు బిగించి నినదిస్తున్నాడు. తల్లి గభాల్న లేచి వీధిలోకి నడచింది. తమ ఊరి యువకులూ, పొరుగూరి యువకులూ యెందరో పిడికిల్లు బిగించి నినదిస్తున్నారు… పరికించి చూడగా అందరూ నక్షత్ర లాగే కనిపిస్తున్నారు. కళ్లు పులుముకొని మళ్లీ చూసింది… నక్షత్రలే కన్పించేరు. ఆ తల్లికి వాళ్లంతా తన బిడ్డలే అన్పించి కళ్లు తుడుచుకుంది… భ్రమలోంచీ, కలలోంచీ బయటపడి, వాస్తవంలోకి వచ్చి సమూహంలో కలిసింది !

*

ఓ మై గాడ్!

 

                                                                     -బమ్మిడి జగదీశ్వరరావు

 

దక్షిణాఫ్రికాలో చర్చిలు వున్నట్టే సఫారీ పార్కులు కూడా వున్నాయి! చర్చిలో పాస్టర్లు వున్నట్టే సఫారీ పార్కులో సింహాలు కూడా వున్నాయి! జియాన్ క్రిస్టియన్ చర్చి పాస్టర్లంతా సింహాలు వుండే క్రూగర్ నేషనల్ సఫారి పార్క్ కు వెళ్ళారు! సింహాల తరుపున పాస్టర్లు దేవుణ్ణి ప్రార్థిస్తారేమోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు!

ఇటు చూస్తే పాస్టర్ల గుంపు! అటు చూస్తే సింహాల గుంపు!

పాస్టర్ అలెక్ ఎండివాన్ ను తోటి పాస్టర్లు ఆపినా ఆగకుండా సింహాలవైపు నడిచాడు! దేవుడు తనయందు వున్నాడన్నాడు! సింహాలయందు కూడా దేవుడు వుంటాడని మిగతా పాస్టర్లు చెప్పిచూసారు! నేను దేవుని ప్రతినిధిని అని ఎండివాన్ యెంతో గర్వంగా చూసాడు! దేవుడు నన్ను సింహాల నుండి రక్షిస్తాడు అనికూడా అంతే నమ్మకంగా చెప్పాడు!

పాస్టర్లంతా దేవుణ్ణి ప్రార్ధించడం మాని ఎండిమాన్ ని ప్రార్ధించారు! అవి సింహాలని.. దేవుడు చెప్పినా వినవని.. మొత్తుకున్నారు! దేవుడు చెపితే యెవరన్నా వినవలసిందే.. సింహాల్లారా! మీరయినా వినవలసిందే.. అని సింహాలకు అరిచి మరీ చెప్పాడు ఎండిమాన్! అరుపులు విన్న సింహాలు- మాంసము తినడం మాని- తోకూపుతూ ఎండిమాన్ ను చూసాయి! దేవుని వాక్యము మీరు కాదనగలరా? అని మరోమారు అరిచాడు ఎండిమాన్! సింహాలు లేచి నిలబడ్డాయి! అదీ గౌరమంటే అని మురిసిపోయాడు ఎండిమాన్! దేవుణ్ణి ప్రార్ధిస్తూ సింహాలకు యెదురెళ్ళాడు!

ఎండిమాన్ ని మిగతా పాస్టర్లు వేన్లోకి రమ్మని ప్రాధేయపడ్డారు! దేవుణ్ణి అవమానించొద్దన్నాడు ఎండిమాన్! దేవుడు గొప్పో సింహాలు గొప్పో తేలిపోతుంది అని గంతులువేసాడు! నాది దేవుని త్రోవ అన్నాడు! సింహాలు త్రోవకు దగ్గరగా వచ్చేస్తున్నాయి! దేవుని త్రోవను అనుసరించలేక తోటి పాస్టర్లు వెంటనే వెనక్కి వచ్చి వేనెక్కారు! ఎండిమాన్ కూ సింహాలకూ వున్న మధ్య దూరం క్షణాల్లో తగ్గుతోంది!

దేవుడా.. నువ్వే గనక వుంటే సింహాల గుంపు నన్నేమీ చెయ్యబోవు గాక.. అని నినదించాడు ఎండిమాన్! సింహాలు జూలుదులుపుకు పరిగెత్తుకువచ్చాయి! అంతవరకూ వున్న సింహాలు సింహాలుగా కాక, వొక్కసారిగా మీదకోస్తున్న సైతానుల్లా కనిపించాయి! అంతే-

దేవుడా.. అని ఎండిమాన్ వెనక్కి తిరిగి పరిగెత్తాడు! సింహాలు ఆగిపోలేదు.. పరిగెత్తుతూ వచ్చేసాయి! సింహాలకన్నా వేగంగా పరిగెత్తలేకపోయాడు! సింహాల పంజా దెబ్బలకు రక్తంతో అతని పిరుదులు వరదలు గట్టాయి! సమయానికి సఫారీ పార్క్  సిబ్బంది వచ్చి సింహాల బారినుండి ఎండిమాన్ ను కాపాడారు!

ఎండిమాన్ ని పరామర్శించడానికి చాలా మంది భక్తులూ తోటి పాస్టర్లు వచ్చారు!

ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎండిమాన్ ‘బహుశా.. జంతువులపై తన ఆధిపత్యాన్ని చాటిచెప్పేందుకే దేవుడు నన్ను వాడుకొని వుంటాడు’ అని తనని తాను సమర్ధించుకున్నాడు! తోటి పాస్టర్లు ఎండిమాన్ కు తలమీద కూడా దెబ్బ తగిలిందేమోనని కలవరపడి డాక్టర్లని చూడమన్నారు! అలాంటిదేమీ లేదని డాక్టర్లు చెప్పారు!

ఈ ఆందోళనలతో సంబంధం లేకుండా- సింహాల ఆధిపత్యానికి అవకాశం లేదు, వాటిని నిలువరించి తన ఆదిపత్యాన్ని దేవుడు నిరూపించుకున్నాడు, అందుకు నన్ను వాడుకోవడం నాకెంతో గర్వంగా కూడా వుంది- అని నొప్పిగా కూడా వుంది అన్నట్టు మూలిగాడు ఎండిమాన్!

అలా దేవుని నిర్ణయము మీదికి మళ్ళాయి మాటలు!

“దేవుడు వచ్చేవాడు.. కానీ ఎండిమాన్ దేవుడికోసం నిరీక్షించలేదు.. సింహాలను చూసి వెనుతిరిగిపోయారు.. దేవుని తోవన నిలువగలిగి వుంటే దేవుడు తప్పక రక్షించేవాడు..!” వణుకుతున్న స్వరంతో అన్నాడు అందర్లోకీ ముదర పాస్టరు!

ఎండిమాన్ ఆమాట విని అవాక్కయాడు! ఆలోచనలో పడ్డాడు! తనను పరామర్శించడానికి వచ్చారో విమర్శించడానికి వచ్చారో అతనికి అర్థం కాకుండా వుంది!

“అసలు ఆ దేవుడే సింహాల రూపములో వొచ్చాడని యెందుకు భావించకూడదు..?” మరో లేత పాస్టరు ప్రశ్నించాడు! “విశ్వ వ్యాప్తమైన దేవుడు సింహాలలో మాత్రం లేడని యెట్లు భావించగలం..?” అని తన మాటకు తనే మద్దతుగా మాట్లాడాడు ఆ పాస్టరు!

“కాదు.. కాదు! ‘దేవుడా.. నువ్వే గనక వుంటే సింహాల గుంపు నన్నేమీ చెయ్యబోవు గాక..’ అని ఎండిమాన్ అన్నాడు! ఆమాటను పరీక్షించి పరిశీలించండి! ‘దేవుడా నువ్వే గనుక వుంటే’ అంటే అని ప్రేయర్ చేయడం తప్పు! ‘నువ్వున్నావ్.. నన్ను తప్పక రక్షిస్తావ్..’ అనికదా ప్రార్థించాలి! ‘వుంటే’ అనడంలో ‘లేకుంటే’ అనే ధ్వని వున్నది! నాస్తిక ధ్వని వున్నది! యిది అపచారము! పైగా ‘నన్నేమీ చెయ్యబోవుగాక..!’ అని అనుటలో దైవాన్ని ఆదేశించడము అగుపించు చున్నది! పాపవాక్యం.. పరిశుద్ధమగుగాక..!” ఎండిమాన్ కు పోటీదారుగా వున్న మరో పాస్టరు యింకా మాట్లాడేవాడే-

“దేవుడు గొప్పో – సింహాలు గొప్పో తేలిపోతుంది’ అని దేవుడిని సింహాలను నీవు సమానం చేయడం దేవుడికి నచ్చలేదు..!” అని మరో నడివయసు పాస్టరు అంటే- “సింహాలకు కూడా నచ్చలేదు, అందుకే నీ పిరుదులు చీల్చాయి..!” అని మధ్య వయసు పాస్టరు మధ్యలో అన్నాడు! “దేవుడే సింహాలను ఆదేశించి ఆపని చేయించాడు..!” అన్నాడు యింకో పాస్టరు!

“అయితే సింహాలకు ఆ కార్యముతో సంబంధము లేదు.. అవి నిమిత్తమాత్రమైనవి..!” యింకో పాస్టరు అన్నాడు! ఎండిమాన్ కు శరీరం మీది గాయాల నొప్పి తగ్గింది! అంటే మనసులో నొప్పి తీవ్రమైంది! కంట నీరు పెట్టుకున్నాడు!

“నిన్ను రక్షించే అవకాశం నీవే దేవునికి యివ్వలేదు..! అక్కడే నీవు నిలిచి వున్నచో పరిగెత్తుకు వచ్చిన సింహాలు ప్రభువు చేత నిమరబడిన గొర్రిపిల్లలు అయ్యేవేమో..?! దేవుని ఆజ్ఞ లేకుండా సింహాలు నీ మీద దాడికి వచ్చునా? ఈ నిజవాక్యమును నీవు విస్మరించినావు..!” వణుకు తోనికే స్వరంతో అన్నాడు ముదర పాస్టరు!

“నీవాక్యముపట్ల నీకు నమ్మకము లేదు..! నీ నమ్మకముపై నీకు విశ్వాసము లేదు..!” ఎండిమాన్ కు పోటీదారుడైన పాస్టరు పలికాడు! “యిది మన పాస్టర్లను అవమానపరచడమే..!” అనికూడా అన్నాడు! అతని వాక్యము ఆప్తవాక్యమైనట్టు అందరూ మౌనం పాటించారు!

“అంతకంటే సింహాలకు ఆకలి తీర్చిన వాడవైతే.. నీ జీవితమూ చరితార్ధమయ్యేది..” పోటీ పాస్టరు మౌనాన్ని భగ్నం చేసాడు!

అవమానంతో తల తిప్పుకున్నాడు ఎండిమాన్! దేవుని పట్ల తన ప్రవర్తన అపచారంగా భావించి విచారంగా కన్నీళ్లు కార్చాడు ఎండిమాన్! కుమిలిపోయాడు!

కాసేపటికి తేరుకొని, కళ్ళు తుడుచుకొని “దేవుని శిక్షకు నేను అర్హుడని..!” వొప్పుకుంటున్నట్టుగా తనలో తాను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు. అని, “మరి దేవునికి అవకాశమీయక మీరెందుకు వెనక్కి పరిగెత్తుకు వెళ్ళి వేనెక్కినట్టు..?” తల యిటు తిప్పి అడిగాడు ఎండిమాన్!

అప్పటికే తోటి పాస్టర్లు అక్కడలేరు! అవతలికి నడిచి డాక్టర్లతో మాట్లాడుతున్నారు!

మధనపడ్డ ఎండిమాన్ మధించి మధించి అనుభవాన్ని శోధించాడు! సత్యాన్ని తెలుసుకున్నాడు! వొక సత్యవాక్య తీర్మానమూ చేసుకున్నాడు! “దేవుని విశ్వసించ వలెను! కాని ఆ విశ్వాసము నెగ్గుట కొరకు బరిలోకి దైవాన్ని దింపరాదు.. మనమూ దిగరాదు.. దిగినచో దేవుడు కూడా రక్షించలేడు..!” అని!

“దేవుడు దయామయుడు.. దయామయుడు అయినచో నన్ను యెందులకు రక్షించలేదు..? అలా రక్షించనిచో దేవుని వునికి యెటుల తెలియును..? దేవుని వునికి విస్తరింప జేయుటయే పాస్టర్ల ప్రాధమిక బాధ్యత కదా? ఆ బాధ్యతకు ప్రభువే ప్రతిబంధకంగా నిలుచుటలోని పరిహాసమేమి? అంతరార్దమేమి? నేను దైవం పక్షం వుండినాను, దైవము నాపక్షము యేల లేదు..? నేను రేపు దైవము అస్తిత్వాన్ని అందించిన జనులు అందుకుంటారా? మీ యెడల లేని దైవము మా యెడల యెటుల వుండును.. అని ప్రశ్నించిన యేమి కర్తవ్యము? మీ అస్తిత్వం లేకుండా నా అస్తిత్వం వుండునా? నా అస్తిత్వం లేకుండా మీ అస్తిత్వం వుండునా..?”

లెంపలేసుకున్నాడు ఎండిమాన్! దేవుని అస్తిత్వం.. తన అస్తిత్వం సమం చేసి ఆలోచిస్తున్ననా? అని మళ్ళీ భయం వేసింది! ఆలోచనలు ఆగడం లేదు.. తెగడం లేదు..

“నా మనసు పాప పంకిలమగుచున్నది.. అయినా పాపులను రక్షించుటకే కదా ప్రభువు పుట్టినాడు.. నన్ను రక్షించలేదు అంటే నేను పాపిని కాను! పరిశుద్దుడను! పరిశుద్దమే దైవము! అటులైన నేనే దైవము! దైవము వేరుగా లేదు! లేదు దైవమే లేదా?..”

మళ్ళీ లెంపలేసుకున్నాడు ఎండిమాన్! దైవాన్ని.. తన్ని సమం చేసి ఆలోచిస్తున్ననా? అని మళ్ళీ భయం వేసింది! ఆలోచనలు ఆగడం లేదు.. తెగడం లేదు..

“డాక్టర్..” పెద్దగా అరిచాడు ఎండిమాన్! భరించలేని తనం గొంతులో కనిపించింది! డాక్టర్లూ సిస్టర్లూ పాస్టర్లూ పరిగెత్తుకు వచ్చారు! ఏమయింది అన్నారు! తనని రక్షించమన్నాడు! ‘దేవుడు నిన్ను రక్షించుగాక’ పాస్టర్లు దీవించి ప్రార్ధించబోయారు! ‘దైవం నుండి రక్షించుగాక..’ అనుకున్నాడు ఎండిమాన్! ఆలోచనల్ని అదుపు చేసుకోలేకపోయాడు! పాప భయంతో మళ్ళీ లెంపలేసుకున్నాడు! భయంతో వణికాడు! ఆ భయం సింహాలు వెంటపడ్డప్పటి భయాన్ని మించిపోయింది!

ఎండిమాన్ చేష్టలన్నీ ప్రాయశ్చిత్తపు వుపసంహారంగా భావించారు పాస్టర్లు! నీవు పరిశుద్దుడవి అన్నారు! కాదన్నట్టు అడ్డంగా తలూపాడు ఎండిమాన్! దేవుడు మన్నించాడు అనుకున్నారు పాస్టర్లు! ఎండిమాన్ లో వొచ్చిన మార్పుకు మురిసిపోయారు!

విలవిలలాడిన ఎండిమాన్ యెటువంటి ఆలోచనలు రాకుండా ప్రశాంతత కోసం మత్తు యింజక్షన్ యివ్వమన్నాడు! డాక్టరు చేతుల్ని పట్టి వదల్లేదు! దైవం కన్నా ప్రశాంతత, వుపశమనం వుంటుందా? తోటి పాస్టర్లు అనేసరికి తలయెత్తి దబా దబా వెనక్కి కొట్టుకున్నాడు! డాక్టర్లూ సిస్టర్లూ ఎండిమాన్ ఆపుతూ అతని తలని గట్టిగా పట్టుకున్నారు!

దైవ ప్రార్ధనలు చేసారు చుట్టూ చేరిన పాస్టర్లు!

 

చీకటి అరలు

 

     

 -మేడి చైతన్య

~

కిటికి సందుల్లోంచి సన్నగా సూర్యకాంతి  గడిచిన నిశిరాతిరి జ్ఞాపకాల దొంతరల పొరలను చీల్చుకుంటూ నా మొహం మీద పడింది. పిడచగట్టుకుపోయిన పెదాలను నడి జామంతా నికోటిన్ తో కలహపడిన నాలుకతో హత్తుకున్నా.

ఉప్పో, వగరో వర్ణించలేని నిర్జీవ ”వాసన” లోపలికిమల్లే.

సీసాదొర్లి అడుగంటిన మందు చుక్కల ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్న కుంటిచీమోకటి నన్ను ఈ లోకంలోకి నిశ్శబ్ధంగా ఆహ్వానించింది. ఆనకట్టలు కట్టి కాపడదామనుకునే నా అభావ ఆలోచనలకు, రాజీపడని పోరాటపటిమే నా జీవితానికి పరమార్దమని అర్ధంచేసుకొలేని చిన్న వయస్సునాదని చూసే దాని చులకన చూపు, ఆ నడ్డి విరుపు నడక తట్టుకోలేక పెళుసులూడోచ్చిన బ్రష్ పట్టుకున్నా. దోమలంతా గుంపులు గుంపులుగా గొడవపడి ఎటూతేల్చుకోలేక జాలిపడి వదిలేసిన రక్తాన్నంతా వేళ్ళ కొనలలోకి లాగి కుత్తుక పిసికితే రెండు నురగలు తెల్లటి పెంటకక్కి, తల గిరాటేసింది టూత్ పేస్ట్ గొట్టం నా జీవితంతో తనకేమి ఇక సంబంధం పట్టనట్టు. తనగోడు ఆలకించమని ఫోను వైబ్రేట్ అవుతూనేఉంది. నిరాసక్తిగా ఒక చూపు చూసి, అద్దంలో మానని  గాయాలను చూస్తూ తడుముతున్నా వెలుపల, లోపల, “ఆవల.”

మాటిమాటికి  గోలచేయొద్దని పేగులను బెదిరించి, డొక్కలో కాళ్ళు మునగతీసుకొని పడుకున్నాడు వాడు. నాన్న సారా కుళ్ళు కంపు  మాటలు, అమ్మ ముక్కు  చీదడాలు, ఆకలేస్తుందని  చైతుగాడి ఆర్తనాదాలు. నాన్న మగతనానికి గుర్తుగా నల్లగా కమిలిన అమ్మ వీపు, చింకిపోయిన అమ్మ  రొమ్మువైపు ఆబగా చైతుగాడి చూపు. నిస్సత్తువుగా చొంగకార్చుతూ చైతుగాడు వాడి దగ్గరకొచ్చాడు. ఆకలి నీరసం ఆవహించకుండా ఒకరికొకరు గాడంగా హత్తుకొని పడుకొని, గుచ్చుకుంటున్న పక్కటెముకలను లెక్కబెట్టుకుంటున్నారు అన్నదమ్ములిద్దరు.

తాటాకు కప్పు కన్నాల్లోంచి కారుతున్న వానచుక్కల్లో, సంసారపు పంజరానికి చిక్కుకుని రెక్కలు విప్పుకోలేని అమ్మ దైన్యస్తితి, తడిచినకట్టెల మంటల్లో పొగచూరిన వాడి కళ్ళల్లో, తనకర్ధంకాని భావాలతో తరుముకొస్తున్న నాన్న!
ఆదరణలేని బాల్యం అడుగడుగునా అడ్డుపడుతుంది రోజులు గడిసేకొద్ది. ఓ పీడకలలాగ మస్తిష్కపు చీకటి అరలలోకి తోసేద్దామనుకున్నా, వీడని నీడలా ఎదురవుతూనే ఉంది. మరువలేని ఆ మాసినకాలం మదికొచ్చినప్పుడల్లా పరుగు, నేను వాడుకాదని మర్చిపోయేంత దూరంవరకు, మరొక కాలంలోకి! బహుశా వాడు ” నిన్ను” చూసి జాలిపడతాడేమో!

మధ్యాన్నం వరకు కాలేజి, దాని ఫీజుల కోసం రోజుకో అవతారం. టికెట్టు కౌంటర్ దగ్గరా, సెంట్రింగ్ మేస్త్రీగా, ఉదయాన్ని “మేలుకొలిపే” పేపరుబాయ్ గా. ఒక్కసారైన క్లాస్ లో వెనక్కితిరిగి చూస్తుందేమోనని “అతను” తపనబడ్డ “ఆమె”.  వెంటే నడూస్తూ ఎన్నటికైనా పక్కన నడచే సమయం రాదా? అని అతడాలోచించినా ఆమె. ఆమెగొంతు వినబడేసరికి అప్రయత్నంగా కాలుజారింది(ఆమెకు అతడి అవతారం కానరాకూడదనే ఆత్రం). గోడ గుద్దుకుని  రక్తంవస్తోంది అతడికి. మీద ఒలికిన నల్ల పెయింటింగు చూసుకుని బిగ్గరగా నవ్వాడు. మరల ఎన్నటికోఒక రోజున మరొక వేషంలో తలవాల్చి బెరుకు చూపుతో వడ్డిస్తున్న అతడి చేతికి ఇంకొక చేయితగిలితే ఖాళీపళ్ళెంలో “విషపు నవ్వొకటి మధురంగా” నవ్వుతూ ఆమె కనిపించింది. ప్రేమ కూడా కుళ్ళుకంపు కొట్టింది బాల్యానికిమల్లే అతడికి. ప్రేమ విఫలమైందనే గుర్తుగా క్యాటరింగ్ కాంట్రాక్టరికి ఆరోజు జీతం అతడు మిగిల్చివెళ్ళాడు. పరిపక్వతలేని తలంపులకు పక్కన నెట్టేసి చదువుపై మనసులగ్నం చేసిన అతడికి కూడా “నేను” దూరంగా పరుగెడుతున్నా.
ఎండిపోతున్న అతడి జీవితంలో నేల నెమ్మదిగా బీటలువార్చడం మొదలెట్టింది. గూడుకట్టుకున్న సంశయాలను చిదిమేస్తూ రూపమేదో తెలియని నిజమొకటి దరిచేరింది. ఎక్కడో దొరికితే పెంచుకున్నారట పిల్లలులేరని తన అమ్మని. తీరా పిల్లలుపుట్టేసరికి వంటిళ్ళుకి, వాకిలూడవడానికే పొద్దు తెల్లారింది అమ్మకి. భారం వదిలించుకోవడానికి బాధ్యతే తెలియని భర్తనంటగట్టింది అమ్మమ్మ. గొడ్డును బాదినట్టుబాది, గూట్లోంచి తరిమేస్తె తల్లిగా చేరదిసి “అమ్మగోరు”లాగ పనుల మీద పనులప్పగించేది. అతడి ఊహలన్నీ గుండెగోడలు చిత్రవదలుచేస్తున్నాయి. క్షణకాలం బ్రతుకుమీదనే అసహ్యం, మరుక్షణమే ఏదో కసి మనిషిగా ఎలా బ్రతకాలో అమ్మగోరు “అమ్మమ్మ”కు చూపించాలని.!

పట్టుదలగా చదివి విశ్వవిద్యాలయలంలోకి ఒపేన్ గా ఎంటరయ్యాను. భావజాల ఆవేశాల్లో పురుగుల్లా కొట్టుకోవడం, ధ్యేయం ఒక్కటైనా మన మార్గాలు వేరని వాదించడం. దేశభక్తి జబ్బొచ్చి “కాషాయాన్ని” కషాయములా తాగినోల్లకి “ఎరుపు” విరుగుడు విచికిత్స. ఎరుపులో కూడా నాది “నల్లనైన” ఎరుపని వేలెత్తిచూపెడితే ఊడలు తెగిన మ్రానులా పుడమికంటుకుంటే “నీలైన అంబరం” నన్ను తల నిమిరి గుండెలకద్దుకుంది.

తరుముకొస్తున్న నాన్నలో తక్కువకులం దాన్ని అంటగట్టారనే ఆయన అ “న్యాయ” ఆక్రంధన,
అమ్మమ్మని “అమ్మగోరు” అని పిలవడంలో “దత్తత”తీసుకోలేని కులాల ఆంతర్యం,
అనామకుడిననా లేక అన్యుడని ఆమె నన్ను వదిలేసిందా అనే వీశెడంత సందేహం పుట్టుకొచ్చింది!
ప్రేమకు కులాలంటుగడుతున్నానని తిడతారేమో!

artwork: Mandira Bhaduri

artwork: Mandira Bhaduri

 

ఒళ్ళు తెలియకుండ నిద్రపోయాననుకుంటా తెల్లని చారికలా చొంగ చెపమీద. అపరచిత స్థలంలో ఉన్నానని తెలియగానే, బద్దకంగా లేచా. ఎంతోకాలంగా నేనెరిగినట్టు నవ్వుతూ నా నుదుటిమీద చెయ్యేసి ఎలా ఉందని మెల్లగా అడిగింది “తను”. గడ్డకట్టిన రక్తాన్ని చూడగానే గత రాత్రి  క్షణాలు దృశ్యాలుగా మెదలాడాయి. కర్రలతో కాషాయి దేశభక్తి చాటుకోవడం, డొక్కలో గుద్ది భారతమాతని స్తుతించడం. తర్వాతఎవరో ఆడగగొంతు. ఏమి మాట్లాడాలో తెలియక వానపాములా మెల్లగా ప్రాకూతూ వెళ్తుంటే వెనిక్కిపిలిచింది మాత్రలేసుకొమ్మని. జమలమ్మ అంటే మీ అమ్మేనా? అని అడిగేసరికి పొరపడినట్టుగా నీళ్ళన్నీ మాత్రతో సహ బయటకు కక్కితే, నెత్తిమీద నిమురుతూ నా కాలేజి ఐడెంటి కార్డు చేతికిచ్చింది. పదినిముషాలు రుబ్బుడుబండ కింద నలిగి డబ్బులు లెక్కపెట్టుకుంటే పీలగోంతు వినపడి నా “పూల ఫ్రాక్” అనుకొని వచ్చి చూస్తే తీరా అది నువ్వు. నీ నుదుటనుండి రాలిన రక్తానికి, రుబ్బురోలు డబ్బులకు లెక్కసరిపొయింది దవాఖానాలో. ఎందుకిదంతా చేశారంటే అంటే మీ అమ్మ పేరు కారణమంది. జమలమ్మపెద్దమ్మ నన్ను అమ్మి అమ్మి అని పిలుస్తూ ఉండేది. ఒకసారి సరుకారు కంపకు నా ఫ్రాక్ పట్టుకుని చిరిగితే తనే కుట్టింది. నాన్న తనకే భయపడేవాడు. అమ్మికి  నీ  ఎంగిలి యవ్వారాలు తెలియనియ్యొద్దని నాన్నని తిడూతూ ఉండేది. ఆ పెద్దమ్మ పేరు మీ అమ్మ పేరు ఒకటే.
సరైన  దెబ్బలు కూడ తట్టుకోలేని నీ కాయానికి ఎందుకంత కష్టం కలిగిస్తావని తనడిగితే,
ఆకలి అని ఏడిస్తే పుణ్యవేదభూమిలో ప్రతిఘటించకుండా చనిపోవాలన్నారు.
కుళ్ళు సమాజం చేసిన గాయాలు చూపెడితే, ఆధ్యాత్మికంలో తేలియాడలంటా.
నేరం అని ఎలుగెత్తితే విద్రోహశక్తులని నోరు మూయిస్తారు.
న్యాయం కావాలంటే, దేశద్రోహుడిముద్రవేస్తున్నారు అని చెప్పా.
ఏమని పిలవాలో తెలియక తటపాయిస్తున్న నన్ను, రాతిరి రాతిరికి పేరు మార్చుకునేదానిని ఏ పేరు పిలిచినా పలకడం నేర్చుకున్నాఅని విషాదంగా నవ్వింది. తత్తరపాటుగా కృతజ్ఞతలుచెప్పి బయటకెల్తుంటే ఎక్కడకనే తన చూపుకి సమాధానంగా బాల్యపు “వాడికి”, యవ్వనపు “అతడికి” దూరంగా అని చెప్పేసి వచ్చేశా.
ఆదర్శాల రొచ్చులో ఆకాశంవైపే చూస్తూ, నేలమీద పాకుతున్న నిజాలను చూడలేకపోయా. వడ్డించిన విస్తరిలా కొందరి జీవితాలలో ఉద్యమాలు కాలక్షేపాలని, తమ సౌఖ్యానికి భంగం కలిగితే తాబేలు డొప్ప లోపలికి మూసుకుంటారని జ్ఞానోదయమయింది. కాలం తెచ్చిన కొత్త సంకెళ్ళతో కాళ్ళీడ్చుకుంటూ ఎన్నో ఆఫీసులకు తిరిగా, పని కోసం అన్నం పెట్టని సిద్దాంతాలనువదిలిపెట్టి. షరామాములుగా కొన్ని నెలల నిరాశయమయజీవితం.
నీళ్ళతో పొట్టనింపుకోవడమే రెండురోజుల నుండి. పెంటకుప్పలమీద ఎంగిలివిస్తరాకులు తింటున్న కుక్కకేసి అసూయగా చుస్తుంటే భుజాన్నెవరో తట్టారు. ఎండతో ఎక్కువ సహవాసం చేయడంవల్ల కళ్ళ మసకలలో తన రూపం పోల్చుకోలే. నువ్వంటనే ప్రశ్నకు చినిగిన ఫైలులో సర్టిఫికెట్లు చూపించా నా అప్రతిహత దండయాత్రలకు చిహ్నంగా. తనతో రమ్మని కళ్ళతో సైగ చేయగానే మారు మాట్లడకుండా హత్యచేయబడ్డ శవంక్రింద రక్తంలా, మెల్లగా, నిశ్శబ్దంగా వెంటవెళ్ళా. కడుపునిండా అన్నం పెట్టింది. నా అమ్మవాళ్ళు ఎక్కడని అడిగిన తన ప్రశ్నకి నా మొహంలో వచ్చిన కవలికలు కనుక్కొని తనెవరో చెప్పడం మొదలెట్టింది.
నాలుగోదికూడా ఆడబిడ్డైన నెత్తినెక్కించుకొని పెంచాడట తన నాన్న. చింకి లంగాలు, చిల్లుల గౌనుల గుడిసెల నడుమ వాడిపోని “పూలఫ్రాక్” లాంటి బాల్య జీవితం! ఎల్లిపాయకారాల సందిట్ల ఎద్దుకూరమాపటన్నెం. రంకుతనపు రొచ్చుముండల చెమట కంపు సొమ్ముసోయగాలని మా మీద అమ్మలక్కల చీదరింపులు.
నాన్నని పల్లెత్తుమాటంటే, లంగాలుదోపి “మగోళ్ళలా” మంది మీదకు దూకేవాల్లం నలుగురం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మబ్బులకంటిన ఆశలు ఒక్కసారే అఖాతంలోకి నెట్టబడ్డాయి.

ఎముకలగూళ్ళు, గుంటలపడిన కళ్ళు, సన్నని వెదురు కర్రల్లాంటికాళ్ళు, ఒకటే ఎగశోస. ”తాతేంటి” పిన్నినా లాగా నత్తినత్తిగా మాట్లడుతున్నాడంటే తల ఎత్తి చూడలేనంతగా కళ్ళలో నీళ్ళు. పెబుగుడిలో చావుకి దగ్గరపడిన సైతాను మోష. నలిగిన తన జీవితం నేర్పిన మాటేదో చెప్పాలని వణుకుతున్న బైబిలుతో నాన్న పిచ్చిమాటలు. పదాలకు అర్ధాలేమి అందకపోయినా విరిగిన నాన్న గాజుముఖంలో పశ్చాత్తాప ప్రతిబింబాలను లీలగా చూస్తున్నారు “గొర్రెలమందంతా”.

యవ్వనంలో నీరెండలో మెరిసే ముఖవర్చస్సు, నల్లని కండలు తిరిగిన దేహం. జీతమున్న కమ్మోరి పశువులకొట్టంలో దొరసాని “వేడిలో” చలికాగటం, ఆమె ఆనందానికి కానుకగా పాకలో నలుగురపిల్లల కడుపులో అంతముద్ద చల్లటన్నం. ”తప్పు” కాదు “తప్పదనిపించింది” ఆ సమయంలో.
నాగలి వరస గాడితప్పి అడ్డదిడ్డంగా సాలెరువాల్ల దుక్కి. కండకావరమెక్కి వంగిన చెట్టుకాయల్లా వలచడం, ఎన్ని పంటలు నాశనం చేశాడో ఆ మత్తులో.తురకోడి పొలంలో పరిగ ఏరడం అని చెప్పి గడ్డివామంతా తగలబెట్టాడు కదా. చివరకు తనపొలం గట్టుమీదున్న పిచ్చి బెండుతీగలను కూడా వదలలేదుకదా! నయంకాని మాయరోగం వస్తే, చెదలుపట్టిన గుండె అరుపులను  పెబుకాడ మొరపెట్టుకుంటున్నాడు నాన్న. పగుల్లిచ్చిన నాన్న సమాదిలోంచి పుట్టుకొచ్చిన చెట్టుకు నీళ్ళుబోసి, మంచంలోఉన్న అమ్మ ఏరుక్కుంటే డబ్బాకోసం గాబుకాడికి పోతే, పెళ్ళెప్పుడు చేసుకుంటావని పక్కింటి తుమ్మెద  పెడాల్న మొహమ్మీదంది.  పీతిచేతిని కడుక్కుంటూ “మురుకిగుంట ప్రవాహాన్ని” ఎగాదిగా చూశా! పెద్దక్క 12 సంవత్సరాల వీపువాతలు చూడలేక చిన్నిగాడు పొట్టలోంచి బయటకొచ్చాడుఅప్పుడే. నడిపక్క బొట్టుబిళ్ళను కబళించిన పనిచేయని లారీ బ్రేకులు. అత్తింటి కిరసనాయిల వాసన పసిగట్టలేక సగంకాలిన చిన్నక్క. లోకంచూడలేక కళ్ళుమూసుకుని కుక్కిన మంచంలో అమ్మ. నాన్న జీవీతం శాపంలా వెంటాడుతుందేమో కుటుంబాన్ని అంతా! నన్నెవరింకా పట్టించుకుంటారనే బాధేలేకుండా, చారులో చెంపలమీదనుండి కారుతున్న కన్నీళ్ళను ముంచుకొని  అన్నం తిన్నా.
ఏటిదగ్గర  వాడిపోని  నా ”పూలఫ్రాక్”  మరీచికలా వేలాడుతుంటే అన్నీ వదిలేసి వచ్చేసా. పెద్దక్క, నడిపక్క ఎవడితోనే లేచిపోయిందని మిగిలిన ఇల్లు, మంచం అమ్మ మౌనరోద సాక్షిగా పంచుకున్నారు. వాడిపోని ఆ పూల ఫ్రాక్ కోసమే ఈ ఊరొచ్చా. మనిషిలో దాగిన రంగులన్నీ చూపించింది ఈ పట్నం.
ఆకలి, మోసం, నేరం, క్షణికావేశం, కామం, క్షామం, జబ్బు, జల్సా.
చీకటి రైలుపట్టాల మాటున ఎదమీద సిగరెట్తో కాల్చిన గుర్తులు, పోలిసోడి మీసాల చాటున నలిగిన నా కాళ్ళు, బాధగా మూలిగే మంచం కిర్రు కిర్రులు. ఈ జీవితం ఇంతకంటే నాకు ఒనగూర్చినదేమిలేదు అని ముగిచ్చింది తన కథ. నిన్ను చూస్తే ఆ పెద్దమ్మకి కొడుకుంటే నీలాగే ఉండేవాడనిపించి నీతో చెప్పుకున్నా. నేను మరువలేని బాల్యంకోసం వెడుతుంటే, నువ్వేమో కోరి వస్తున్న దానిని అసహ్యించుకుంటున్నావు.
తనవైపు తదేకంగా చూస్తూ అక్కా…….అని పిలిచా.
నల్లనైన మేఘంలో చుక్క మెరసినట్టు, నింపాదిగా నవ్వింది నన్ను నుదుటిమీద ముద్దాడుతూ! తన గుండెలోతుల్లోంచి పొంగిన అల ఏదో అశ్రుబిందువై నన్ను అశనిపాతంలా తాకింది. తలుపు చప్పుడైతే తన శరీరానికి గాయమయ్యే తరుణంమొచ్చిందని చెప్పి నన్ను పంపించివేసింది.
తను, నేను  భిన్న ధృవాలం.శిధిలమైన బాల్యంవైపు తను, ఎంతకు ఘనీభవించని “వాడికి”, ఆవిరయిపోని” అతడికి” నేను దూరంగా పరుగెడుతున్నాం. “నా”లోంచి “నేను” వేరు పడాలని నేను, తన లో,లోపలికి కుచించుకుపోవాలని తను.
చాలరోజులయింది అక్క కనిపించి. ఒక రోజు నడుచూకుంటూ వెళ్తుంటే రోడ్డుకు ఆవల పూల ఫ్రాక్ అమ్మాయికి ఐసుక్రీం కొనిపెడుతూ నా వైపు చూపిస్తూ ఏదో చెప్తుంది ఆ పిల్లకు. ఎక్కడ కారిపోతుందనే ఆత్రతతో దాన్ని తింటూ వచ్చి నా చేతిలో ఒక కవరు పెట్టిందిఆ పెంకి పిల్ల.
“ఎన్నాళ్ళని నీకు నువ్వు దూరంగా పారిపోతావ్? నువ్వంటే అతడు, వాడు కూడా కదా !?.
నా “నిజానికి” దగ్గరగా నే వెళ్ళిపోతున్నా. నీలాంటి తమ్ముడికి ఉండాల్సిన అక్కని కాదు నేను. జమలమ్మ పెద్దమ్మని జాగ్రత్తగా చూస్కో. చీటితో పాటు తన చెమటతో తడిచిన కొన్ని నోట్లు కనిపించాయి ఆ కవర్లో.”
అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలికి ఆ కాగితం కొట్టుకుపోతే తను ఎటువెళ్ళిందో అని తలెత్తి చూశా. పూల ఫ్రాక్ లేదూ, తనూ లేదూ.

ఆ రోజు నుండి వెదుకుతూనే ఉన్నాం “అక్క” కోసమే కాదు,  “మా” అక్కే అని చెప్పుకోలేని అక్కలందరి కోసం నేను, వాడూ, అతడు “ముగ్గురం” కలసి.

 

ఇల్లాలి అసహనం

 

-వనజ తాతినేని

~

 

మేమెలాగూ నిద్ర పోలేదు, మిమ్మల్ని మాత్రం ప్రశాంతంగా నిద్ర పోనిస్తామా  అన్నట్టు ఊరంతా మేల్కొనేలా సినిమా పాట పాడుకుంటూ వెళ్ళే వాహనం, దాని వెనుకనే  రోడ్డు మీద దబుక్కుమన్న శబ్దం. ఉలికిపడి లేచాను.  ఇంటద్దె  ఇరవై శాతం పెంచానని ఓనరమ్మ చెప్పినప్పుడు ఉలికి పడ్డట్టుగా.  అన్యాయం!  చానల్ సాక్షిగా తాడిగడపలో ఇంతిల్లు  పదివేలే అంటున్నారన్నా ! చానల్స్ లో ఎవరూ నిజం చెప్పరని మీకు తెలియదా అంది. నిజమే కదా! అనుకున్నాను వీలైనంత ఏడుపు గొంతుని సరి చేసుకుని. అన్నీ పెరుగుతున్నాయి. ఆయుష్షు కూడా పెంచి ఇక్కడ నరకమెందుకు చూపిస్తావ్ దేవుడా !? మనసులో తిట్టుకున్నాను.

రాత్రంతా నిద్ర లేదు. కలలకి కూడా పొంతన లేదు  ఆలోచనలాగానే ఎడ్డె మంటే తెడ్డె మంటున్నాయి. కాసేపు  నాలుగు రింగుల కారు, కలర్ ఫుల్ పోలీ వీవెన్ చీరలు, కొంకణ్తీర్  డైమండ్ నగలు, ఇవే కనబడతాయి. కాసేపాగాక   ప్రకృతంతా  వసంతగానం చేస్తుంటే  ఎండలేమో తొందరపడి ముందే సచిన్ బాదినట్టు  బాదుతున్నాయి.  ఒంట్లో  నుండి చెమట చుక్క బయటకి రానీయమని కంకణం కట్టుకున్నవారు వర్సెస్  తాగడానికి చుక్క నీళ్ళ కోసం అలమటించేవారు.ఇదీ భారతం. భవతు భారతం. అక్షరాల అరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఆకలి, నిరుద్యోగం, అవినీతి, లంచగొండితనం  వగైరా వగైరా లన్నింటికి ఒకే ఒకే విశ్వసనీయమైన  మందు దేశభక్తి. అసలా ప్లేవర్ కి ఏ ప్లేవర్ పోటీ  రాదు.   అందులో పడి మునిగిపోవాలని రాసి పెట్టి ఉందని తెలుస్తూనే ఉంది. ఆకలి ఉంటే  సరిపోయిందా దేశభక్తి ఉండొద్దూ … అడుక్కుని పరువు తీయకు పో … దూరంగా పో ! లాంటి నిజాలు చెప్పే కలలు వచ్చినందుకూ  అసహనంగా ఉంది.

వాకింగ్ పేరుచెప్పుకుని  మగవాళ్ళు ప్యాంట్ జేబులో క్యారీ బేగ్  ని వేసుకొస్తున్నారు.  పరులు  పెంచుకున్న మొక్కల, చెట్ల పూలతో పూజ చేస్తే మంచిదని దేవుడు చెప్పాడు కాబోల్సు. శ్రద్దగా తెగ పాటించేస్తున్నారు. కామన్ ప్లేస్ లో కుండీలలో పెట్టిన మొక్కలకి కూడా ఒక్క పూవ్వు మిగల్లేదు. నా హృదయపుష్ఫం ఎవరూ దోచుకోలేరులే అనుకున్నా అంతకన్నా వేరే దారిలేక. ఉపన్యాస చక్రవర్తి భర్త పాదాలు  పిసికి, మొల మీద గుడ్డ ఉతికి ఆరేసి పుణ్యం తెచ్చుకోండి అని సెలవిస్తున్నాడు. అర్ధభాగంకి ఆయనెప్పుడైనా అలా చేసాడో లేదో ! అమ్మ కన్నా చేసాడో లేదో ! ఒరేయ్ ఒరేయ్ ..కాస్తైనా మారండి రా ..బాబూ!  ఈ శతాబ్దపు ఆడవాళ్ళకి ఎందుకసహనం తెప్పిస్తారు ?

బిల్డింగ్ లో ఉన్నవాళ్ళందరి పైనా పెత్తనం చెలాయించే సుధీర్  ” నా  పట్టు చొక్కా అంతా కాల్చేసావ్ ! ఇస్త్రీ చేయడం కొత్తని చెప్పొచ్చుగా. పొలాల్లో పనిచేసుకుని బతికినవాళ్ళు టౌన్ లోకి వచ్చి దోబీ అవతారమెత్తితే ఇదిగో ఇలాగే  ఉంటుంది. మూడేలు రూపాయల కొత్త షర్ట్. ఈ షర్ట్ నువ్వే ఉంచుకో ..డబ్బులు నీ జీతంలో కట్ చేసుకుంటా !  ఉదార అసహనం ఒలికిస్తున్నాడు. పాపం! కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని చిందులు తొక్కుతున్న ఆయన్ని చూస్తూ నిలుచున్నాడు కొత్తగా వచ్చిన వాచ్మెన్ నాగేశ్వరరావు.

 

పొద్దుటి నుండి ఒకటే మెసేజ్ పదిసార్లు.  ఎవరో అన్నయ్య  యు వీ ప్యాలెస్ కి వస్తున్నాడట. అందులో ప్రత్యేకత ఏముందీ ? జనాలు  వీసా లేకుండా ఎన్నో దేశాలకి వెళ్లి వస్తున్నారు . స్వదేశంలో ఎక్కడ తిరిగితే ఏమైంది? ఎవరి పనులు వారివి. దానికంత ప్రాధాన్యం ఎందుకివ్వాలి? అనుకూలంగా కొన్ని, వ్యతిరేకంగా కొన్నీ.  డబ్బులు పుచ్చుకుని మీటింగ్ కెళ్ళే వాళ్లకి అలాంటి మెసేజ్ వెళ్ళినా ఫలితం భారీగా దక్కును. నాకెందుకంటా!  పదకొండో మెసేజ్. అసహనం రాదుమరి. ఇక ఒర్చుకోవడం నావల్ల కాలేదు.ఆ నంబర్ బ్లాక్ చేసి పడేసాను.

 

హాల్లో టీవి , బెడ్ మీద లాప్ టాప్. డైనింగ్ టేబుల్ మీద ఎడమ చేతిలో మొబైల్. మనుషులు మనుషులతో మాట్లాడుకోరు.  తెరమీద మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం ఎక్కువైపోయింది.తెరల మీద చూసి చూసి ఈ మధ్య మా ఇంట్లో కూడా శాంతి సామరస్యం అస్సలు కుదిరి చావడంలేదు. ప్రతి దానికి అసహనం ప్రదర్శించడం అలవాటైపోయింది. రోజూ వంట చేసినట్టే,రోజూ ఇంటి పని చేసినట్టే రోజూ టీవి సీరియల్స్ చూసినట్టే రోజూ అసహనం ప్రదర్శించకపోతే ఏమీ బాగోలేదు.   మొన్నట్టాగే అత్తగారు చుట్టంలా వచ్చింది వచ్చినట్టు ఊరుకోకుండా..  ఎందుకా సీరియల్స్ అదే పనిగా చూస్తావ్ ! పిల్లలతో హోం వర్క్ చేయించవచ్చు కదా అంది. మా ఆయన్ని వరించినందుకు భరించక తప్పదని ఊరుకుంటున్నా కానీ  పక్కింటి వాళ్ళ కోడలు వేసినట్టు ఏ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ నో వేసేస్తే  పీడా పోద్ది  అనుకున్నాను

అమ్మ గారు డస్ట్ బిన్, అమ్మ గారు పోస్ట్, అమ్మగారు కరంట్ బిల్, అమ్మగారూ నెట్ బిల్, అమ్మాయి గారు సపోటాలు బాగున్నాయి రండి …  డజను నలబై రూపాయలే ! అయ్యని ఎవరూ పిలిచే  అలవాటులేదు, పాపం ఆర్ధిక భారం ఆయనకేమి తెలుసని జాలి కాబోలు.

పక్కింటమ్మాయికి పెళ్ళైతే నీకెందుకు  కొత్త పట్టు చీర, డిజైనర్ బ్లౌజ్ !? చంపుతున్నావ్ కదే ! ఎదురింటాయన ఆక్రోశం.  ఆ మైనా వాడి దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ నగలమ్మినట్టు చీరలు బ్లౌజ్ లు కూడా అద్దెకిచ్చే వాళ్ళుంటే  ఎంత బావుండునో ! మగాడికి అధిక సంపాదన కోసం బల్ల క్రింద చేయి పెట్టడమో,  హార్ట్ ఎటాక్ రిస్క్ రెండూ తప్పుతుంది. అరెరే ! ఇదేదో మంచి ఐడియానే ! మనమే  అలాంటి షాప్ పెట్టేసుకుంటే పోలా ఇలా ఖాళీగా కూర్చునే బదులు!

 

మేడమ్!  ఉదయం సార్  తో మాట్లాడాను హవా టెల్ లో మంచి ప్లాన్స్, ఆఫర్స్ ఉన్నాయి పోర్టబిలిటీ చేయించుకుంటానన్నారు అంది కంఠంలో బహుతీపిని ఒలకబోస్తూ ఓ పిల్ల .   ఎవరమ్మా .. ఆ సార్ !? ఏ సార్ తో మాట్లాడావో నువ్వు?  ఈ నెంబర్ గల  ఫోన్  ఎప్పుడూ నాదగ్గరే ఉంటుంది . ఇంకో విషయం తల్లీ ఈ నెంబర్ మీ హవా  టెల్ లోకి మారి రెండేళ్ళు అయింది  కదా ! అన్నాను టక్కున పెట్టేసింది.  మా ఆయన మొన్నెప్పుడో ఇలాంటి కాల్  అటెండ్ అయి   వేషాలు బాగానే వేస్తున్నారు   ఫ్యాన్సీ నెంబర్లని ఎన్నుకుని  ఇదోరకం వ్యాపారం !  సిగ్గు లేదూ..  చావండహే! అన్నది గుర్తుకొచ్చింది.

అక్కా!  అక్కా !! పక్క అపార్ట్మెంట్ అమ్మాయి పిలిచింది నన్నేనా ..? నేను అక్కనెప్పుడయ్యా నబ్బా ! పెళ్ళైన మర్నాటి నుండే అందరికీ ఆంటీ నే కదా ! అలా పిలవద్దని స్మూత్ గా చెప్పి కూడా  అందరితోనూ యాంటీ అయిపోయా ! ఓపికపోయి మూలుగుతూ కూర్చున్న నాకు ఈ  అక్కా అన్న పిలుపు కవితా కృష్ణమూర్తి భైరవి రాగంలా  తోచింది . గబుక్కున బయటకెళ్ళి ఏంటమ్మా ..సత్యా అనడిగా! ఒక కరిపాకు రెమ్ముంటే ఇవ్వక్కా ! అయ్యో ! కూరలో కరివేపాకులా మనుషులని తీసి పారేస్తున్నారని మనుషులకి కోపం వచ్చి కరివేపాకు తోటలని  పెంచడం మానేసారటమ్మా!  కావాలంటే కొత్తిమీర కట్ట ఇస్తా ! మాడిన కూరని కూడా గార్నిష్ చేసి మీ ఆయనతో లొట్టలేసుకుంటూ తినేటట్టు చేయొచ్చు అన్నాను. నవ్వి సరేనంది. ఇలాగే అక్కా అని పిలుస్తూ..  నీకేమి కావాల్సినా అడగమ్మా ! మొహమాటపడకు. పక్క పక్క బిల్డింగ్ లలో ఉన్నాం, మనం మనం  సాయం చేసుకోకపోతే ఎలా !  అంటూ కాస్త అతిగానే స్పందించాను.  మా చిన్నోడికి అర్ధమయ్యిందనుకుంటా.. ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు. పిల్లలు పెద్ద ముదుర్లు అయిపోయారు.వాళ్లకీ అన్ని విషయాలు   తెలుస్తున్నాయి.  ఆ సంగతి మొన్నెవడో కథల గ్రూప్ లలో  పోర్న్ వీడియో పోస్ట్ చేసి  మరీ చూపిచ్చాడు. ఝడుసుకుని చచ్చాను. ప్చ్ ..

raja

లోకం  తెగ పాడై పోయింది. నేను పాడవకుండా ఏదన్నా రహస్యముంటే ..చెప్పరా..  భగవంతుడా ! ఆ రహస్యాన్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటా, ఎంత కడుపు నొప్పి వచ్చినా సరే ! మాటిస్తున్నానుగా, నమ్మొచ్చు కదా !అసలు ఆడాళ్ళకి కడుపు నొప్పి ఎందుకొస్తుందో తెలుసా !  అవునులే … హ్యాపీ బ్లీడ్ సంగతి నీకేం  తెలుసు ..నీకు అమ్మున్టేగా?  అమ్మతోడు ! అవకాశం కోసం నేను మతం మార్చుకోలేదు గనుక నువ్వు  అమ్మ లేని భగవంతుడని గుర్తుకొచ్చిందంతే! నిన్నిలా తిట్టడం ఎవరైనా వింటే మా దేవుడికి అమ్మ ఉంది అని యుద్దానికొచ్చే మిత్రులున్నారు. సైలెన్స్ సైలెన్స్ .అదివరకంటే మాటలని ముంతలో పెట్టి దాపెడితే సరిపోయేది ఇప్పుడు  నోట్లో మాట నోట్లోనే దాచి  పెదవులు కుట్టేసుకోవాలని అనుభవాలు చెబుతున్నాయి.బయటకి పొక్కాయా ..బ్లాక్ చేసి పడేస్తారు.  భావ స్వేచ్ఛ జిందాబాద్ !

పెద్దోడిని స్కూల్ లో దించడానికెళ్ళా ! ఆ ఎర్ర చీర మిస్ మీ క్యాస్ట్ ఏమిటీ అనడిగిందమ్మా,  క్యాస్ట్ అంటే ఏమిటమ్మా అన్నాడు వాడు.  కడుపు రగిలిపోయింది . ఆమె పక్కనే బండి ఆపాను . గుడ్ మార్నింగ్ మేడం ! మీ బాబు సో చీట్ అంది. స్వీట్ అందా చీట్ అందా ఇంటర్నెట్ భాష జనంలోకి వరదలా వచ్చేసాక ప్రతి చోటా  కన్ప్యూజే ! ఛీ… దీనెమ్మ జీవితం అనబోయి గబుక్కున ఆపుకున్నా ! ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నా ! మీరేం కేస్ట్ మేడం అడిగింది నన్ను. కోపమొచ్చి నాలుగు పీకుదామనుకున్నా ! ఎలాగో తమాయించుకుని నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదమ్మా ! ఏదో ప్రయోజనం ఆశించి సడన్ గా నా కులమేమిటో ప్రకటించుకోడానికి. కాస్త ప్రశాంతంగా బ్రతకనీయండి తల్లీ  అంటూ దణ్ణం పెట్టా ! మీ ఫీలింగ్స్ దెబ్బతీయాలని కాదండీ  జస్ట్  తెలుసుకోవాలని అడిగానంతే! మోహంలో అసంతృప్తి దాచుకుని వెళ్ళిపోయింది.

ఈ విషయం అర్జంట్ గా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేసి కుల నిర్మూలన కోసం పోరాడాలి . ఒక నాలుగువందల లైక్ లు, ఎనబై షేర్ లు గ్యారంటీ ! లైక్ లంటే గుర్తొచ్చింది .. ఆ పెద్ద రచయిత్రి పోస్ట్ కి లైక్ కొడితే ఇంకో పెద్ద రచయిత్రికి కోపం . ఈ రచయిత్రి పోస్ట్ కి లైక్ కొడితే ఆ  రచయిత్రికి కోపం . భగవంతుడా ఈ పెద్ద పెద్ద వాళ్ళ మధ్య నన్నెందుకు ఇరికించావయ్యా ! నా మనసు చెప్పినట్టే వింటానని నీకు తెలియదూ ! నారీనారీ నడుమ మురారి నీది నాది వేరే దారి ఏఎన్నార్ డాన్స్, ఇరువురి భామల కౌగిలిలో అంటున్న  యువరత్నవేడుకోలు ఒకేసారి గుర్తొచ్చాయి మరి. స్నేహం చేద్దామంటే ఒక్క మంచి మనిషి దొరకరు. బోల్డ్ కాంటెంపరరీ  స్టైల్స్ షాప్ లలో అయితే దొరుకుతాయి కానీ మనుషుల్లో మంచి మనిషి భూతద్దం పెట్టి వెదికినా దొరకరు. అన్నీ ఆ తానులో ముక్కలే ! దొరికే దాకా వెతుకు వెతుకు .. వెతకవమ్మా . కష్టపడనిదే ఎవరికీ దొరకదని చెపుతున్నాగా! చత్!! అంతరాత్మ హిత బోధ ఎక్కువైపోయింది.

మన్ కీ బాత్.  మన్ కీ బాత్ . వినలేక చచ్చిపోతున్నా. అసలు మనసుంది ఎందరికీ ? కళ్ళముందు భగ భగ మంటలు, కస కస కోస్తున్న కత్తులు, టన్నులు కొద్దీ కన్నీరు.  ముందు  మన్ తీసేసి మాట్లాడటం నేర్చుకోవాలి.  నేర్పేందుకు ఎవరైనా ఉండారో లేదో అన్న సందేహం అసలొలదు. కోచింగ్ సెంటర్స్ కోసం కాళ్ళరిగేలా తిరిగే కష్టం కూడా వద్దు.  ఇప్పుడందరూ ఆ విద్యలో అవధానం చేసినవాళ్ళే  కదా ! ఓ చిలిపి పంజేయాలని బుద్దిపుట్టి   అనవసరంగా పృచ్ఛక  అవతారమెత్తితే అసహనానికి గురికాగలరు. జాగ్రత్తగా ఉండాలి పెద్దోళ్ళతో మాటలుకాదు మరి.

 

మధ్యాహ్నం 12:55 అయింది ప్రియా కూతేసింది కాకి అలవాటుగా గోడమీద వచ్చి కూర్చుని  కావ్ కావ్  మంటుంది . ఎదురింటి తలుపు తప్పనిసరై తెరుచుకుంది. గుప్పిట్లో తెచ్చిన ముద్దని గోడమీద పెట్టి వెళ్ళిపోయింది కాకి అత్తమామ ఆరగించడానికి రెడీ అయిపొయింది. బతికి ఉన్నప్పుడు పెట్టారో లేదో కాని కళ్ళు మెరుస్తుండగా తృప్తిగా చూసుకుంటూ వెళ్లి ఠపీమని తలుపేసుకుంది . కాకి తిన్నంత తిని నేలమీద పడ్డ మెతుకులని  వదిలేసిపోయింది.ముక్కుతో ఏరేరుకుని తినే శ్రమ ఈ కాకికి లేదు కాబట్టి  హాయిగా ఎగిరి పోయింది గానీ  పాటు నాకొచ్చి పడింది.   గేటులోకి వచ్చి పడ్డ అన్నం మెతుకులని తొక్క కూడదనే సెంటిమెంట్ ఏడ్చింది కాబట్టి చీపురు తీసుకుని బర బరా ఊడ్చి పారేసా ! ప్రక్కనే పక్కిన్టామె  పెట్టిన కుండీలో తులసి మొక్కకి  చీపురు తగిలిందేమో! పుణ్యం వాళ్లకీ  పాపం నాకు.

మధ్యాహ్నం భోజనం చేసాక టీవి తదేకంగా చూస్తూ “దొండపండు పెదవులేసుకుని ఆ కాప్రా చూడు ఎంత బావుందో … నువ్వు ఉన్నావ్ ఎందుకూ !? సిటీకొచ్చి ఆరేల్లైంది,గోరింటాకు మానేసి నెయిల్ పాలిష్ వేయించలేకపోతున్నా. ఎంతైనా ఊళ్లోళ్ళు  మారరని రుజువుచేసుకున్నావ్” అన్నాడు మా ఆయన. కడుపు మండిపోయింది. ఊళ్లోళ్ళు అని గడ్డిపరక లెక్క తీసేస్తున్నాడు. వాళ్ళు లేకపోతే తింటానికి గడ్డి కూడా దొరకదని తెలియదు.ఏంటో పెద్ద పట్నం గొప్ప? నీళ్ళు కూడా కొనుక్కుంటూ అని లోలోపలే తిట్టుకుంటుండగానే ఒక ఆలోచన పుటుక్కుమని పుట్టింది, ఆయన్ని ఏడిపించాలని.  బాగుంది కానీ…  మరీ తొమ్మిది గజాల గుడ్డ నేలపై జీరాడడమే అస్సలు బాగోలేదు అన్నా.  అది అంతర్జాతీయ  ఫ్యాషనే పిచ్చిమొహమా  అన్నారు.  వాళ్ళ ఒంటి నిండా కట్టినా డబ్బులే, కట్టకపోయినా డబ్బులే అంట,  నాక్కూడా అలాంటి అంతర్జాతీయ  ఉద్యోగమేమన్నా దొరికితే బావుండును అన్నాను అమాయకంగా. రిమోట్ విసిరి పడేసి  బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు పిచ్చి నా మొగుడు. సినిమా వాళ్ళతో పెళ్ళాన్ని పోల్చడం మొగుడికి తెలిసినట్టు పెళ్ళానికి తెలియదనే అజ్ఞానమైతే ఎట్టాగబ్బా  మరి.

 

ఇలా రాసేసాక చాలామందిని  టార్గెట్ చేసినట్టు రాసేవేమో బంగారూ అంది అంతరాత్మ.  బాబోయ్ నేనేమన్నా నల్లకళ్ళద్దాల వృద్దనారీ రచయితనా ఏమిటీ ఇప్పటిదాకా జనాల్లో ఉన్న గౌరవం పోగొట్టుకోవడానికి. ఒక అక్షరం ఎగర గొట్టేసిన  పేరుతో కథ రాసేసి విషం కక్కినట్టు ఇంక్ కక్కడానికి. రాసే ప్రతిదీ నిజమని ఏ పాఠక వెధవాయ్ నమ్మడని తెలిసినట్టు లేదు. అంత వయసొచ్చాక  కాస్త ఇంగితం ఉండాలి తల్లోయ్ !  అభిమానిస్తున్నారు కదా అని చెవుల్లో  ఇంగ్లీష్ కాలీ  ప్లవర్ పువ్వెట్టకుమాతా ! చెప్పులో రాయి గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతారు కొందరు అని చెప్పాలనుకుంటున్నా ! అయినా నా మాట వినడానికి ఆమెకి తీరిక ఉందో  లేదో !  చెవులు సరిగా పని చేస్తున్నాయో లేదో !

 

టీపాయ్ మీద పెట్టిన  మా ఆయన ఫోన్ కి ఏదో మెసేజ్ కూత.  యధాలాపంగా చూసా. బి ఎఫ్/జి ఎఫ్ కావాలా? కాంటాక్ట్ నెంబర్ పదంకెలు !ఇన్బాక్స్ లో బోలెడు ప్రేమ రుతువుల పైత్యాలు పచ్చిగా వార్మప్ చేసేవిగా ఉన్నాయి. ఇలాంటి వాటితో కాపురాలు కూలిపోమ్మంటే కూలి పోవూ ! అసహనం హద్దులు దాటింది. మా ఆయన ఫోన్ బాల్కనీ  గోడకెళ్లి టప్పున కొట్టుకుంటుంది. టీవీ,మొబైల్,ఇంటర్నెట్ ఇవన్నీ లేనప్పుడు అమ్మల కాలం ఇప్పటికన్నా కొద్దిగా బాగుండేదేమో! అప్పుడు  ఇన్ని విచ్చలవిడితనాలు లేవు. అయినా ఈ మాత్రం దానికే అంత అభద్రతాభావం ఎందుకో ? అంతరాత్మ మళ్ళీ  ఎదురుగా నిలబడి చెప్పింది  “ఎందుకంటే పెంపుడు కుక్కని నమ్మినట్టు, కొట్టంలో పశువుని నమ్మినట్టు మొగుడిని నమ్మడానికి వీలులేదే పిచ్చిదానా “అని. పోదూ …ఎల్లకాలం మోసం చెయ్యాలనుకున్న వాడికి ఎప్పుడైనా బై బై చెప్పే తెంపరితనం కూడా ఉందిలే నాలో అని సముదాయించుకున్నా.

 

కోపం తగ్గాక మొబైల్ ముక్కలేరి చెత్త కుప్పలో పోద్దామని బయటకొచ్చా.  పుస్తకాలు ముందేసుకుని కూడబలుక్కుని చదువుకుంటున్న లక్ష్మిని చూసి ముచ్చటేసింది. పగలల్లా పదిళ్ళల్లో పాచి పని, అంట్ల పని చేసుకుని, ఇల్లు సర్దుకుని పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం, చదువుకోవడం. అలా ఉండటం  అస్సలు నచ్చలేదట లక్ష్మి మొగుడికి.  ఆమె పుస్తకాల్ని  చించి  పోగులు పెడుతుంటే  లక్ష్మి రాక్షసిలా మొగుడి మీద తిరగబడింది. నీ యబ్బ ! నీకేంటిరా నచ్చాల్సింది, నా సదువు నా ఇట్టం.  నోరు మూసుకుని ఇంటో  ఉంటే ఉండు, దొబ్బితే దొబ్బు అంది . నోరు తెరచుకుని ఆశ్చర్యంగా చూస్తూ లక్స్ నా సౌందర్య రహస్యం, బికినీ వేసుకుని బీచ్ లలో పరిగెత్తడం లాంటివే  కాదమ్మా  స్వేచ్చంటే .. అచ్చమైన  స్త్రీ స్వేచ్చంటే ఇది గదా ! అనుకున్నాను. లక్ష్మీ సెహబాష్ .

లక్ష్మిలా ఇలా తనని తానూ కాపాడుకోకపోతే అసలాడవాళ్ళని బ్రతకనిచ్చేటట్టు ఉన్నారా ! పిండంగా ఉండగానే ముక్కలు ముక్కలు చేసి   డ్రైనేజీలో గుమ్మరించేయడం లేదా   వావి వరుస వయసు చూడకుండా అత్యాచారం చేయడం.  అయితే అటు కాకపొతే ఇటూ … బేటీ బచావో, ఔరత్ బచావో … గొంతు పగిలిపోతుంది ఎవరికీ చెప్పాలి, యేమని చెప్పాలి ?  వినే నాధుడే లేడాయే !  ఏమి శిక్షరా … బాబూ ! పొగిలి పొగిలి  ఏడ్వక ఏం మిగిలింది ? నెట్ న్యూస్ లో కూడా  అప్డేట్  చేసినప్పుడల్లా  ప్రపంచ దేశాలలో  ఎక్కడైనా సరే .. ఎప్పుడు., ఎలా రేప్ జరిగిందో వివరంగా చెప్పే కథనాలు ఎక్కువైపోయాయి.   మొన్నెప్పుడో కలలో రెండు కాళ్ళ మధ్య భూగోళాన్ని ప్రసవిస్తున్న స్త్రీ కనబడింది. ఏమిటో దానర్ధం? ఈ  అవాంఛితాల వార్తలు కళ్ళబడటం, వినబడటం వల్ల స్పందించే గుణం కూడా పోయింది. సున్నితత్వం కూడా పోతుంది. మెదడు మొద్దుబారిపోతుంది.

 

చీకటి పడబోతుండగా మధ్యాహ్నం నిద్ర నుండి మా ఆయన మేలుకున్నాడు.  రోడ్డు పక్కనే ఉన్న కల్యాణ మండపంలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది … చెవులు బద్దలయ్యే మేళం మోగుతుంది.  పెళ్లి కొడుకు గుర్రం మీద ఊరేగుతూ నిన్నా కుట్టేసినాది, మొన్నా కుట్టేసినాది గండు చీమ అనే పాటకి తెగ ఎంజాయ్ చేస్తూ మండపానికి వెళుతున్నాడు. అతనుకూడా యువరాజులాగానే ఉన్నాడు.పెద్దలు కుదిర్చిన పెళ్ళంట.  భారీ కట్నం,పుత్తడిబొమ్మ అమ్మాయి. మా ఆయనకి దక్కినట్టే !  అంతకి ముందు ఎన్ని చీమలు కుడితే  కంగారుగా దులిపేసుకున్నాడో అమ్మా అయ్యా   ఏడుపు ముఖాలు చూడలేక.

నా ఫోనేది … ఆయన ప్రశ్న. ఏమో నాకేం తెలుసూ … అన్నా అమాయకంగా ముఖం పెట్టి. ఆయన ముఖంలో అసహనం. నాకది చాలా సింపుల్ గా అనిపించింది.  చూస్తున్నారుగా . వేకువఝాము నుండి   నేనెన్ని అసహనాలు భరించాను. ఆయనా ఒక్క అబద్దాన్ని సహించకపొతే ఎట్టాగబ్బా!

విజాతి మనుషులు 

 

                                                                                          

                                                                    – రామా చంద్రమౌళి

 

Ramachandramouli“అసలు అందం అంటే ఏమిటి శివరావ్ “.. అంది మనోరమ ఆరోజు రాత్రి..తమ పెళ్ళై అప్పటికి ఒక పదిరోజులైందో లేదో.  అంతే.

కొత్తగా.. హైదరాబాద్లో.. కిరాయి అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టిన తొలి దినాలు. శీతాకాలం రాత్రి.. పదిగంటలు.. డిసెంబర్ నెల.. సన్నగా చలి.. కిటికీలోనుండి చూస్తే.. అప్పుడప్పుడే మంచుదుప్పటి కప్పుకుంటున్న నగరం.. దూరంగా నిప్పుల కణికల్లా కరెంట్ దీపాల కుప్పలు..మిణుకు మిణుకు.

అప్పుడు మనోరమ తను రీసర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న సిసిఎంబి నుండి ఒక గంటక్రితమే వచ్చి..వంట చేసి..ఇద్దరూ తిన్న తర్వాత..యధాలాపంగా పక్కను సర్దుతూ..దుప్పటిని సరిచేస్తూ.,

శివరావు..డాక్టరేట్ పూర్తి చేసి..ఉస్మానియా లో కొత్తగా లెక్చరర్ గా చేరి..ఒక ఏడాది.,

శివరావు..కిటికీలో నుండి బయటికి..వెన్నెలనిండిన నిర్మలాకాశంలోకి చూస్తూన్నాడు.శివరావుకు ప్రతిరోజూ కనీసం ఓ  ఐదారుసార్లన్నా ఊర్కే అలా ఆకాశంలోకి చూడ్డం అలవాటు. అతనికి ఆకాశంలోకి చూస్తున్నప్పుడల్లా సముద్రంలోకి చూస్తున్నట్టో.. తన ఆత్మలోకి తనే తొంగి చూసుకుంటున్నట్టో..మనిషికి యుగయుగాలుగా ఈనాటికీ అర్థంకాని ఏదో ఒక మహా రహస్యాన్ని చిన్నపిల్లాడిలా గమనిస్తున్నట్టో అనిపిస్తుంది.నిజానికి ఆకాశం.. అంతరిక్షం  మనిషి పుట్టిన నాటినుండీ ఇంతవరకూ ఎవరికీ అర్థంకాని ఒక ప్రశ్న.

“నువ్వు చెప్పు” అన్నాడు శివరావు.

“అందమంటే..ఒక విద్యుత్ తీగలో బయటికి కనబడకుండా ప్రవహిస్తూ మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే కరంట్ వంటిది..వెలిగిస్తుంది..కాలుస్తుంది..షాక్ ఇస్తుంది..గిలిగింతలు పెడుతుంది” అంది అలా పక్కపై వాలిపోటూ..శివరావువంక అభావంగానే చూస్తూ.

శివరావు మాట్లాడలేదు.. కొద్దిసేపు మౌనం తర్వాత కిటికీలోనుండి నిద్రకుపక్రమిస్తున్న నగరాన్ని చూస్తూనే.. వెనుకున్న మనోరమ దిక్కు చూడకుండానే అన్నాడు..” మనోరమా..అందమంటే..ఎప్పటికైనా తప్పకుండా నశించిపోయేది అని అర్థం..” అని.

మనోరమ షాక్ ఐంది. ఆమె అతని నుండి అలాంటి సమాధానాన్ని ఊహించలేదు. నిజానికి మనోరమది మగవాణ్ణి పిచ్చివాన్ని చేయగల అత్యంత ఆకర్షణీయమైన శరీర సౌందర్యం. ఆమె వెన్నెల విగ్రహంలా ఉంటుంది. ఆమెకు వీలుచిక్కినప్పుడల్లా తననుతానే అద్దంలో చూసుకుని మురిసిపోవడం అలవాటు. తన అందాన్ని తన ప్రాణకన్నా మిన్నగా.. జాగ్రత్తగా.. పదిలంగా చూచుకోవడం.. అందాన్ని దాచుకోవడం ఇష్టం.

శివరావుకూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా.. గ్రీక్ యోధునిలా ఉంటాడు. ఆరడుగులపైబడ్డ ఎత్తు అతనిది. నిజానికి మనోరమ అతని అందాన్ని చూచే పెళ్ళి చేసుకుంది. అతని అద్భుతమైన మేధా సంపత్తినిగానీ.. మానవీయ పరిమళంతో నిండిన అతని ఆదర్శ భావాలనుగానీ.. సమున్నతమైన అతని వ్యక్తిత్వాన్నిగానీ  ఆమె ఏనాడూ గమనించలేదు.

ఒకే ట్రాక్ పై పయనిస్తున్న రెండు రైళ్ళు ఒక జంక్షన్ నుండి రెండు భిన్న దిశల్లోకి మారుతున్న దృశ్యం ఎందుకో ఆమె కళ్ళలో మెరిసింది చటుక్కున.

ఇద్దరి మధ్యా భిన్నత. ఆలోచనల్లో.. అభిరుచుల్లో.. ఆకాంక్షల్లో.. లక్ష్యాల్లో.. జీవితం గురించిన భావనలో.

ఆమె ఊహించని రీతిలో శివరావన్నాడు.. “మనోరమా.. నువ్వడిగిన భౌతికమైన అందం గురించి చెప్పాను నేను.. ఆ అందం గురించయితే నేను చెప్పిందే పరమ సత్యం. కొద్దిగా వాస్తవిక దృష్టితో చూస్తే నీకే తెలుస్తుందది. ఐతే.. ఎప్పటికీ వాడిపోనిదీ.. శాశ్వతమై నిలిచేదీ.. పైగా రోజురోజుకూ ఇంకా ఇంకా భాసించే అందం ఒకటుంది..” అంటూండగానే,

ఆమె అంది ..” అది హృదయ సౌందర్యం కదా.. అంతా ట్రాష్.. ఒట్టి చెత్త.ఎంజాయ్ ద బ్యూటీ ఫరెవర్.. యవ్వనాన్నీ.. అందాన్నీ.. పరమ సుఖాలనూ అనుభవించలేనివాళ్ళు చెప్పే చెత్త మాటలివన్నీ.. ఐ హేట్ ఆల్ దిస్ నాన్సెన్స్ ” అంది ఉక్రోషంగా. అని మంచంపై అటువేపు తిరిగి పడుకుంది .. మూతి ముడుచుకుని.

“మనుషులకు అందమైన శరీరాలతోపాటు దేవుడు అందమైన మనస్సునూ బుద్దినీ ఇస్తే బాగుండేది.. కాని అలా ఉండదు  సృష్టిలో.. చాలామంది అందమైన మనుషులకు వికారమైన మనస్సుంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.. తెలుసా. మనిషికి ఏదైనా శారీరక జబ్బు చేస్తే సరిచేసుకోడానికి డాక్టర్ల దగ్గరికెళ్ళి చికిత్స చేయించుకుంటాం.ఎందుకంటే ఆ డిజార్డర్ మనకు వెంటనే తెలుస్తుంది కాబట్టి..అసౌకర్యంగా కూడా ఉంటుంది కాబట్టి.కాని మనిషి మనస్సుకు జబ్బు చేస్తే మనకు వెంటనే తెలియదు.దానికి చికిత్స చేయించుకుని మనస్సును ఆరోగ్యవంతం చేసుకోవాలనికూడా మనం అనుకోము. మానవీయ లక్షణాలతో తనను తానూ.. చుట్టూ ఉన్న సమాజ  సంక్షేమాన్నీ.. సాటి మనుషుల పట్ల సహానుభూతినీ.. కొంత త్యాగాన్నీ అలవర్చుకోని మనస్తత్వం రుజగ్రస్తమైనట్టు లెక్క.”

“ఆపండిక లెక్చర్ ఇక..నిద్రస్తోంది నాకు” దుప్పటికప్పుకుంది తలపైదాకా చిటపటలాడ్తూ..గదినిండా మల్లెపూల పరిమళం.

ఆ పరిమళాన్ని ఆస్వాదించే ఆసక్తీ.. యవ్వన జ్వలన.. అన్నీ శివరావుకు ఉన్నాయి.. వెళ్ళి మంచంపై కూర్చుంటూ .,

తర్వాత్తర్వాత.,

ఈ యేడాది కాపురంలో . . అభిరుచుల వైరుధ్యాలతో. . భిన్నతలతో..విభిన్న తత్వాలతో..ఏదో ఎక్కడో.. బీటలు వారుతున్నట్టు ..చీలిక ఏర్పడుతున్నట్టు.. రేఖలు రేఖలుగా విడిపోతున్నట్టు .. తాడుపురులువిప్పుకుపోతున్నట్టు .. తెలుస్తోంది ఇద్దరికీ.,

నిజానికి.. ఈ భిన్నత ప్రతి భార్యాభర్తల విషయంగా.. పెళ్ళైన కొత్తలో ఎవరికి వారికి అనుభవంలోకి వచ్చేదే.

పెళ్ళికి ముందు.. పెళ్ళి చూపుల హాస్యపూరిత తతంగంలో.. మనుషులు చూడగలిగేది ఏమిటి.. ఒట్టి శరీరాల ఆకృతినీ..రంగునూ.. చదువూ.. ఉద్యోగం.. ఆర్థిక నేపథ్యం.. వీటినేగదా. అసలైన మనస్సునూ.. హృదయాన్నీ.. తత్వాన్నీ అంచనా వేసే వీలు ఎక్కడ.? . . తీరా పెళ్ళి జరిగి.. కాపురం మొదలైన తర్వాత..ఆరంభమౌతుంది అసలు విషయం.. ఆమె ఆశించినదానికి భిన్నంగా  వీడు.. తాగుడు.. తిరుగుడు.. లంచాలు తీసుకునుడు.. స్నేహితులతో నానా బీభత్సమైన వ్యవహారాలు.. అవినీతి..అనైతికత..డబ్బుకోసం ఏదైనా చేయగల దుర్మార్గం..ఇవన్నీ,

ఈమె నేపథ్యానికీ..అభిరుచులకూ..ఏవైనా కళాత్మక అభిరుచులుంటే..గానమో..నృత్యమో..రచనో..సామాజిక సేవా గుణమో..ఉంటే..అంతా” నోర్ముయ్” కింద సమాధి.

అంతా రాజీ పడడాలు.. సర్దుకుపోవడాలు..పట్టు చీరలకింద.. కొన్ని నగల భారంకింద.. హూంకరింపులకింద.. అప్పుడప్పుడు.. దేహ హింసకింద.. బెదిరింపులకింద.. సమాధి ఐపోయి.,

‘ నా బతుకింతే. దేవుడు ఇంతే రాసిపెట్టాడు నా ఖర్మ.’  అని ఒక స్వయం ఓదార్పు.ఎవరికి వారూ..అటు భర్తా..ఇటు భార్యా.

ఒక్క కుదుపు కుదిపినట్టనిపించి.ఉలిక్కిపడి..కళ్ళు తెరిచి,

శివరావు ఈ లోకంలోకొచ్చాడు. తను పయనిస్తున్న రైలు ఎందుకో అకస్మాతుగా వేసిన బ్రేక్ తో కీచుమని ఆగినట్టుంది.

ఏదో స్టేషన్ ఔటర్ యార్డ్. కిటికీ ప్రక్కన కూర్చున్నవాడు తొంగి చూస్తే..చిక్కగా చీకటి.సిగ్నల్ క్లియరెన్స్ కోసం నిరీక్షణ.

ఎప్పటి జ్ఞాపకం ఇది..ఎప్పటిదో..ముప్పది ఏళ్ళనాటి ఘటన.

శివరావు మనసులో మనోరమ రూపం, జ్ఞాపకం కదిలి ఎందుకో ఒక వికారమైన అనుభూతి కలిగి.,పెళ్లయి.. రెండేళ్ళు గడిచి..ఒక పాప పుట్టిన తర్వాత..ఆమెకు తను పి హెచ్ డి చేసిన అదే సి సి ఎం బి లోపలే సైంటిస్ట్ ఉద్యోగం వచ్చి స్థిరపడిపోయింది.

ఇటు తను..తన సహజమైన ఆసక్తితో విప్లవ ఉద్యమాలు.. మానవ హక్కుల పోరాటాలు.. మారుమూల గిరిజన హక్కుల పరిరక్షణ కార్యక్రమాలు.. వీటిలో దాదాపు పూర్తి స్థాయిలో మమేకమై.,

తనకు ఉద్యోగం సెకండరీ..ఇప్పుడు ఈ దేశంలోని అనేకమంది దీనజనుల సముద్ధరణకై సకల ఐహిక సుఖాలను త్యాగం చేస్తూ దిక్కు మొక్కు లేని  జనానికి ప్రతిఘటననూ, ప్రశ్నించడాన్ని నేర్పడమే  ప్రైమరీ ఐన దశ..స్పృహ..యూనివర్సిటీకి అవసరాన్ని బట్టి చాలా సెలవులు పెడ్తూ.. జీతం కోతలతో కురుచైపోతూండగా.. దాదాపు తన జీతం ఎనభై వేలైతే ఏ ముప్పై వేలుకూడా చేతికి రాని పరిస్థితి. ఐనా ఏ ఒక్కనాడూ డబ్బు గురించీ , రాబడి గురించీ  ఆలోచించింది లేదు. డబ్బుతో తనకు అంత పెద్దగా అవసరాలూ లేవు. అతి నిరాడంబరమైన జీవితం తనది. అంతా రెండు మూదు అంగీలు..రెండు ప్యాంట్ లు..భుజానికి ఒక బట్ట సంచీ..కాళ్లకు ఒక స్లిప్పర్ల జత.

జీవితమంతా.. గణితం..చిన్నప్పుడు ప్రాథమిక గణితం..తర్వాత ఉన్నత గణితం…కాలేజ్ లో హయ్యర్ ఇంజనీరింగ్ గణితం..అటు తర్వాత అడ్వాన్స డ్  గణితం.. లాప్లాస్ ట్రాన్స్ ఫార్మేషన్స్.. ఫ్యూరియర్ సీరీస్.. టైం థియరీ.. చివరికి ప్యూర్ మాథమేటిక్స్.. శుద్ధ గణితం..విశుద్ధ గణితం..ఒకటి బై సున్నా .. సున్నా బై ఒకటి ల మీమాంస.. అంత అనంతాలగురించిన  చింతన. అనంత ఆకాశాన్నీ.. అనంతానంత అంతరిక్షాన్నీ..దిగంతాల అవతల ఉన్న శూన్యం గురించీ.. ఏమీలేనట్టే అనిపిస్తూ.. అన్నీ ఉన్న అభేద్య రహస్యాన్నీ తెలుసుకుంటూనే.. ఈ మనుషులు ఎందుకిలా జాతులు జాతులుగా.. బీదలు ధనికులుగా.. కులాలు కులాలుగా.. మతాలు మతాలుగా.. విభజింపబడి.. భాగింపబడి.. విచ్ఛిన్నపర్చబడి.,

చివరికి అన్ని గణితాలనూ పరిత్యజిస్తూ.. జీవిత గణితం గురించిన విపులాధ్యయనం.

అడవుల్లోకి పయనం.. అడవుల్లో అన్వేషణ.. అడవుల్లో అల్లాడుతున్న లక్షల మంది నిరక్షరాస్య జన దుఃఖ మూలాలను తెలుసుకునే వెదుకులాట.

గిరిజనులు సుఖంగా లేరు. వాళ్లకు కనీస సౌకర్యాలు లేవు..అని ఈ చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు చెబుతూ.. ఊదరకొడ్తూ..వాళ్ళ  ఉద్ధరణ పేరు మీద గత అనేక దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వ అధికారులు.. రాజకీయ నాయకులు.. మధ్య దళారులు.. ‘ ప్రకృతిలో లీనమై,భాగమై జీవించే మేము సుఖంగానే ఉన్నాము. మమ్మల్ని మా మానాన విడిచి పెట్టండి మహాప్రభో ‘ అని మొత్తుకుంటూంటే వినకుండా వాళ్ల జీవితాల్లోకి దుర్మార్గంగా ప్రవేశిస్తూ.. కాంట్రాక్టర్ లు.. బహుళజాతి కంపనీలూ.. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ధనిక వర్గపు ప్రయోజనాలకోసం విద్యుత్ ప్రాజెక్ట్ లు.. మైనింగ్ తవ్వకాలు.. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా ఖనిజ నిక్షేపాల  తరలింపు.. గ్రానైట్ ఎగుమతుల పేరుతో గుట్టలకు గుట్టల విధ్వంసం.. అంతా బీభత్స భయానకం.

ఇదంతా.. ఈ నగరాల.. ఈ స్మార్ట్ సిటీల  మాయజలతారు మెరుపుల అవతల అడవుల్లో మరో అనాగరిక లోకంగా ఈ దేశంలోనే వర్థిల్లుతున్న  మరో చీకటి ప్రపంచపు ఆర్తనాద ధ్వని.

లోతుగా.. ఇంకా ఇంకా లోతుగా ఈ గుప్త.. అజ్ఞాత విధ్వంసక జీవన బీభత్సాలను అధ్యయనం చేస్తున్నకొద్దీ అన్నీ గాయాలే.. రక్తాలోడే గాయాలు.

అసలు ఈ స్థితికి  నిష్కృతీ .. వీళ్ళుకు చేయూతా.. ఈ సమస్యలకు పరిష్కారం. . ఏమిటి.

చదువు.. జ్ఞానం.. తమను తాము తెలుసుకోగలిగి ఎదుటి మనుషులు చేస్తున్న మోసాలను పసిగట్టగలిగే స్పృహ.. లోకంపోకడగురించిన ఎరుక.. ఇవి వాళ్ళలో పాదుకొల్పాల్సిన బీజాలు.  ఎవరు చేయాలి ఈ పనులు.. నాలాంటి వాళ్లం కాక.

మెల్ల మెల్లగా ‘మానవ చైతన్య వేదిక ‘ తో అనుసంధానమై.. అటువేపు జరుగుతున్నకొద్దీ,

ఒక రోజు.,

అప్పటికే సి సి ఎం బి నుండి ఒక ప్రత్యేకమైన డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద మూడేళ్ళ పోస్ట్ డాక్టోరల్ కోర్స్ ను పూర్తి చేసేందుకు పాప నిర్మల ను తన వెంట తీసుకుని అమెరికా వెళ్ళిన మనోరమ..అకస్మాత్తుగా తను వెళ్ళిన ఓ ఏడాది తర్వాత ఒక ఈ-మెయిల్ పెట్టింది..” శివరావ్..సారీ..ఐ యాం నో మోర్ ఇన్ లవ్ విత్ యు..నేను నీనుండి విడిపోతూ విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. బహుశా నేనిక తిరిగి ఇండియాకు రాక పోవచ్చు. శాశ్వతంగా నేను ఇక్కడే స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. పాపకూడా నాతోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ అంటూంటావు కదా.. మన అభిరుచులూ.. ఆలోచనలూ.. లక్ష్యాలూ.. తత్వాలూ ఒకటికావని. అది నిజమే.. ఎంత చేసినా ఇనుముతో  రాగీ.. ఇత్తడీ అతకవు. రెండు పదార్థాలు సమగ్రంగా కలిసిపోవాలంటే.. హోమోజినిటీ.. ఏక రూపత కావాలి. కాని అవి మన మధ్య లేవు.

నాలాంటి వాళ్లం సామాన్యులం..  అంటే అందరిలా సకల వ్యామోహాలకూ క్షణక్షణం లొంగిపోతూ.. భౌతిక వాంఛలకోసం పరితపిస్తూ.. అంతిమంగా కోటిలో ఒకరమై ఏ ప్రత్యేకతా లేకుండా అనామకంగా చచ్చిపోతాం. నువ్వలాకాదు. నీకు నీ జీవిత లక్ష్యం స్పష్టంగా తెలుసు.. నీ దారి.. గమనం.. గమ్యం.. నడక అన్నీ నువ్వు ఉద్దేశ్యించుకున్నట్టుగానే నీ ముందు పరుచుకుని ఉంటాయి. ఒకరంగా చెప్పాలంటే  నువ్వొక ఋషివి.

నువ్వు సరే అంటే ఇక్కడి ఒక లాయర్ ద్వారా మన విడాకుల పత్రం పంపుతాను కొరియర్ లో. నువ్వు సంతకం చేసి తిరిగి పంపు.

లేకుంటే కోర్ట్ ద్వారా తీసుకుందామన్నా నేను సిద్ధమే.

కాని.. నువ్వు నేను పంపదలుచుకున్న విడాకుల పత్రం పై సంతకం చేసి సహకరిస్తావనే నా అంచనా.. విశ్వాసం.

నీ విడాకుల అంగీకార పత్రం రాగానే ఇక్కడి ఒక అమెరికన్ మల్టీ బిలియనీర్ ను నేను పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను.

మన పాప నిర్మల బాగుంది. అప్పుడప్పుడు నిన్ను చాలా జ్ఞాపకం చేస్తూంటుంది.

 

– మనోరమ

 

ఆ మెయిల్ కు తను వెంటనే జవాబిస్తే.. అదే రోజు రాత్రి మనోరమ  తిరుగు మెయిల్ లో తన అడ్వకేట్ ద్వారా విడాకుల పత్రం పంపింది.. ఒకటి కొరియర్ లో కూడా.

నిట్టూర్చి.. మొత్తం తమ మూడున్నర సంవత్సరాల కాలం కాపురాన్ని ఒక్క క్షణం మననం చేసుకుని  సంతకం చేసి..కాగితాలను కొరియర్ చేసి.. తనను తాను విముక్తం చేసుకున్నాడు.. ఎందుకో ఆ క్షణం పాప నిర్మల జ్ఞాపకమొచ్చి.. ఒక కన్నీటి బొట్టు.

ఇక తను ఒంటరి. స్వేచ్ఛా జీవి. బంధాలన్నీ తెగిపోయాయి.

తర్వాత మిగిలింది .. ఉద్యోగం.. నెలకు లక్షా ఇరవై వేలొచ్చే అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు.

ఆ డబ్బుతో తనకు అవసరమే లేదు. పైగా తను అనుకున్నట్టు నిరాడంబరంగా జీవించడానికి అదొక ప్రతిబంధకం.

రిజైన్ చేశాడు.

ప్రయాణం మొదలు .. పూర్తికాల ఉద్యమకారుడిక తను. అడవిలోకి ప్రస్థానం .  తపస్సు కాదుగాని.. ఆత్మావలోకనం. ఆత్మాన్వేషణ . . భవిష్యత్ రూపకల్పన.

ఎక్కడ మనుషులు తమ గొంతును వినిపించలేరో.. అక్కడ తను వాళ్ళ గొంతుకావాలి. ఎక్కడ ప్రజలు సంఘటిలుగా లేరో.. అక్కడకు తను చేరి గడ్డిపోచలతో బలమైన తాడును పేనినట్టు సంఘటితం చేయాలి. ఎక్కడ  బలవంతులు బలహీనులను దోపిడీ చేస్తున్నారో.. అక్కడ తను ప్రత్యక్షమై ‘జనానికి ‘ ప్రతిఘటన విద్యను నేర్పాలి.. ఇదీ.

మూడే పనులు..పొద్దంతా ప్రజల్లో ఒకడిగా పర్యటన..ఎవరు ఏమి పెడితే అదే తినుట.రాత్రంతా పుస్తకాలు చదువుట.. అడవిని చిన్న నిప్పురవ్వ పూర్తిగా దహించి నిశ్శేషం చేస్తుందనే సత్యాన్ని తెలియజేసే పుస్తకాలను రాయుట.వాటిని ఆయుధాలుగా దిక్కుమొక్కు లేని జనాల చేతులకు అందించుట.

అదే జరుగుతూ వస్తోంది .. గత ఇరవై ఎనిమిది సంవత్సరాలనుండి.

శివరావు పేరు ఇప్పుడు.. ఉద్యమ మిత్రులందరికీ శివం గా పరిచయం.

శివం అంటే.. మీడియాలో ఒక చైతన్య జ్వాల. ప్రభుత్వాలకూ.. వాళ్ల తాబేదార్లకూ..శివం సింహ స్వప్నం. కలలో మృత్యువు. ప్రజలకు అతను ఋషి.

ఒక రిపోర్ట్ పంపించాడు ప్రపంచ బ్యాంక్ కు.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఎన్ని లక్షల కోట్ల రూపాయలను ఋణంగా తీసుకుంది.. ఇప్పుడు మళ్ళీ ఎన్ని లక్షల డబ్బును అప్పుగా అడుగుతోంది.. ఈ డబ్బును ఎలా నాయకులూ,ప్రభుత్వ అధికారులూ  పంచుకుని తినబోతున్నారు.. చివరికి ఈ ఋణాన్ని చెల్లించాల్సిన సామాన్య జనం పై  మనిషికి ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలఅప్పు.. ఇలా సాగింది.. మర్నాడు పత్రికల్లో.. ఈ లేఖ విడుదల. పెట్రోల్ బావి అంటుకున్నట్టు ప్రజల ప్రతిఘటన .. ప్రభుత్వ గూడుపుఠానీ బట్ట బయలు.

 

*                                                               *                                                                *

 

ఏడూ నలభై ఐదు.. కాని అప్పటికే.. రైలుఈ మొదటి స్టాప్ లోనే అరగంట లేట్.

ఈ దేశంలో ఎవడికీ  తన వృత్తిపట్ల ధర్మబద్ధమైన నిబద్దత లేదు.. పై వాడంటే భయమూ లేదు.నిర్లక్ష్యమూ.. ఉదాసీనతా.. ఉపేక్షలకు కొదువే లేదు. జనానికిప్పుడు కావాల్సింది క్రమశిక్షణతో కూడిన జవాబుదారీతనంతో నిండిన జీవన సంస్కృతి. కాని దాన్ని నేర్పే ప్రభుత్వాలు ఈ దేశంలో లేనే లేవు.

రైలు..బొంది వాగు.. రైల్వే గేట్.. క్రిష్ణా కాలనీ.. అండర్ బ్రిడ్జ్ .. వరంగల్లుచేరుతూండగా.. సిగ్నల్ లేదు. మళ్ళీ ఆపుడు రైల్ ను ఔటర్ యార్డ్ లో. ఉండీ ఉండీ చటుక్కున  కరంట్ పోయింది.. నగరమంతా చీకటి. మేఘాలు గర్జిస్తూ.. చెప్పా చేయకుండా.. గాలి దుమారం.. పెద్ద పెద్ద చినుకులతో వాన. ఒక్క క్షణంలో.. అంతా వాతావరణం తారుమారు.

పది నిముషాల తర్వాత.. మెల్లగా కొండ చిలువలా కదులుతూ.. పొడుగాటి రైలు.

వరంగల్ స్టేషన్ ప్లాట్ ఫాం  పైకి ప్రవేశిస్తూండగా.. కరెంట్ వచ్చింది భళ్ళున. జనం క్రిక్కిరిసి.. పరుగులు ఉరుకులు. అంతా హడావిడి.

శివరావు దిగాడు.. ఎస్ 10 బోగీ నుండి భుజాన సంచీతో. వరంగల్ లో రైలు నిలిచే సమయం రెండు నిముషాలే.

చూస్తూండగానే.. అనౌన్స్ మెంట్.. వర్షం ఒకవైపు కుండపోతగా.. రైలు కదుల్తోంది.. మెల్లగా,

అప్పుడు చూశాడు శివరావు.. తన ఎదురుగా ఎస్ 8 బోగీ దగ్గరనుండి ఒక చేతిలో సూట్ కేస్ తో.. మరో చేత్తో పట్టుకుని భుజంపై చిన్న పాపతో.. ఒక గర్భిణీ స్త్రీ.. పరుగెత్తుకుంటూ వస్తూండడం.. వర్షంలో.. రైలు వేగాన్ని అందుకుంటోంది.ఆమె వచ్చీ వచ్చీ.. ప్లాట్ ఫాం పై చటుక్కున బోర్లా పడింది దభేలున.. “ఆమ్మా..” అని దద్ధరిల్లేలా అరుస్తూ.ఆమె భుజం పైనున్న రెండేళ్ళ పాప ఎగిరి దూరంగా.. విరుచుకు పడింది.. కెవ్వున ఏడుస్తూ.. బోర్లా తూలిపడ్డ ఆమె తన గర్భంపై పడిపోయి.. క్షణాల్లో అపస్మారక స్థితి లోకి వెళ్తూ..శివరావు  పరుగెత్తాడు.. ఆమె  దగ్గరకు.. ఇంకొందరు సహ ప్రయాణీకులు కూడా.

“అయ్యా..ఈ ముండాకొడుకులు కోచ్ పొజిషన్ బోర్డ్ లు పెట్టరయ్యా.. రెండేండ్లయ్యింది.. ఎన్నిసార్లు చెప్పానో.. నాల్గు బోగీల అవతలినుండి  పరుగెత్తుకొస్తున్నా.. వీళ్ళ బాడ్ కౌ ఉద్యోగాలు పాడుగాను. అయ్యో నా గర్భం.. నా కొడుకు.. నా బిడ్డ”  అరుస్తూనే ఆమె  అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె నొసలు కూడా చిట్లి రక్తం కారుతోంది.

శివరావుకు అంతా అర్థమైంది .వరంగల్లంటే.. హెరిటేజ్ సిటీ.. అమృత్ సిటీ.. స్మార్ట్ సిటీ.. గ్రేటర్ వరంగల్లు హోదా.

రెండేళ్ల క్రితం రాత్రి ఇదే గోదావరిలో.. హైదరాబాద్ వెల్తూ.. తనుకూడా ప్లాట్ ఫాం పై కోచ్ పొజిషన్ డిస్ ప్లే లేక.. స్టేషన్ మాస్టర్ తో చాలా గొడవ పడ్డాడు.. వ్రాత పూర్వక కంప్లెయింట్ కూడా ఇచ్చాడు.. రెండేండ్ల కాలం గడిచినా.. ఇంకా అదే దరిద్రం. మొద్దు నిద్ర. పాలకులదీ.. అధికారులదీ.. ఛీ ఛీ.

పురమాయించి.. తోటి మనుషుల సహాయంతో.. ఆమెను స్టేషన్ మాస్టర్ గది దాకా మోసుకెళ్ళి.. చుట్టూ వందల మంది గుమికూడి.,

స్టేషన్ మాస్టర్ పరుగెత్తుకొచ్చాడు.. తాపీగా.. నత్తలా.

శివరావు.. తన మొబైల్ ఫోన్ తో.. చక చకా మాట్లాడాడు ఇద్దరితో.

” సర్.. రెండేళ్లయింది ఈ మహా నగరంలో.. ప్లాట్ ఫాంలపై.కోచ్ పొసిషన్ దిస్ ప్లే లేక. జనం ఎలా రెందు నిముషాలే ఆగే రైళ్ళ కోచ్ ను ఎలా వెదుక్కోవాలి.. పాపం ఉరికి ఉరికి ఈమె ఏమైందో చూడండి.. గర్భం  చితికి పోయింది.. ఈమె ప్రాణం ప్రమాదంలో ఉండి.. దీనికి మీరే బాధ్యులు.. ఈమే మీ కూతురైతే ఏం చేస్తారు మీరు.. మేమిప్పుదు మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం ..మూడుసార్లు వరంగల్లుకు మీ జి ఎం వచ్చాడు  ఇన్స్ పెక్ షన్ కు.. మీరు ప్రజల సొమ్ము తింటూ.. మా ప్రాణాలనే తీస్తారా.. ” శివరావు గర్జిస్తున్నాడు. ఈ లోగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది.. నలువైపుల నుండి కెమెరాలతో.. చిలికి చిలికి.. ప్లాట్ ఫాంపై.. నాల్గయిదు వందల మంది.. కేకలు.. నినాదాలు.. పడిపోయిన స్త్రీని ఆస్పత్రికి హుటాహుటిన తరలింపు.. ఒక యుద్ధ వాతావరణం.

పది నిముషాల్లోఅన్ని టి వి చానెళ్లలో.. ప్రసారం ..” వరంగల్లు రైల్వే ప్లాట్ ఫాం పై… ”

అందరూ కూర్చున్నారు నేలపై.. బైఠాయింపు.

కదలిక.. అత్యవసర కదలిక.. ఫోన్ల మీద ఫోన్లు.. ప్రజల సమీకరణ.. ప్రజా శక్తి నిర్మాణం.. బిగించిన పిడికిళ్ల నినదింపు.

వర్షం.. వర్షం.,

తెలతెల వారుతూండగా సికింద్రాబాద్ నుండి ఎ జి ఎం.. ఇతర అధికారుల హుటాహుటి ఆగమనం.

” రెండు రోజుల్లో కోచ్ పొజిషన్ డిస్ ప్లే చేయకుంటే.. ” అని లిఖిత పూర్వక హామీ.

సూర్యోదయమౌతూండగా.. స్టేషన్  బయటకు వస్తూ.. శివరావు.. వెంట వందల మంది జనం.

*                                                                        *                                                                    *

ఐదేళ్ల తర్వాత,

శంషాబాద్ ఏర్ పోర్ట్ నుండి రేడియో క్యాబ్ లో బయల్దేరి.. సి సి ఎం బి లో ఒక ముఖ్యమైన సర్టిఫికేట్  ను తీసుకుని పోయేందుకు..వీసా స్టాంపింగ్ కోసం.. రెండు రోజుల సుడిగాలి పర్యటనకు వస్తోంది మనోరమ అమెరికానుండి.

సాయంత్రం నాలుగున్నర .. మేఘాలు ఆకాశం నిండా.. వర్షం ఏ క్షణమైనా మొదలవ్వొచ్చు.

కార్ సిటీలోకి రాగానే ఒకచోట ఆపించుకుని రెండుమూడు తెలుగు పత్రికలు కొంది మనోరమ.. దిన పత్రికలు. వార పత్రికలు కూడా.ఎన్నాళ్ళయిందో తెలుగు పత్రికలను చూచి. ఈనాడు.. అంధ్రజ్యోతి.. నవ్య.,

పత్రికలను తిరగేస్తూండగా.. లోపలి అనుబంధ పేజీల్లో కనిపించింది ఒకచోట.. శివరావు ఫోటో.. ‘ఎడిటర్ తో ముఖాముఖి.’

‘దిక్కు మొక్కు లేని జనం వెంట జీవితాంతం నడుస్తూ.. వాళ్ళకు చిటికెన వ్రేలునిచ్చి నడిపిస్తూ.. బూర్జువాలకూ.. దోపిడీ దార్లకూ గుండెల్లో తుపాకి గుండై.. ఎందరో అసాంఘిక వ్యక్తులతో నిత్యం తలపడ్తూ.. పలువురిపై ప్రభుత్వాలకూ, కోర్టులకూ బహిరంగంగా పిర్యాదుచేసి.. వాళ్ళను జైలుపాలు చేసిన నిజమైన హీరో.. డాక్టర్ మెతుకు శివరావుతో ఈ రోజు ముఖాముఖి. ‘. ఒక పూర్తి పేజి ఇంటర్వ్యూ.

“సర్.. మీరు గణితంలో డాక్టరేట్ చేసి.. అందరిలా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ భార్యా పిల్లలతో సుఖంగా గడపక.. ఈ ఉద్యమాలనీ.. ప్రజా చైతన్యమనీ.. ఈ గొడవల్లో..” అని ప్రశ్న.

“మీరన్న సుఖం..నాకు ప్రజలను చైతన్య పర్చడంలోనూ..ఈ సమాజానికి హాని కలిగిస్తున్న ద్రోహులను ఏరివేయడంలోనూ ఉంది. సుఖం అన్న పదానికి ఎవరి నిర్వచనం వాళ్ళది..”

“ఇప్పటికే.. ఐదారు తిమింగలాలను లీగల్ గా తగు ఆధారాలతో జైల్లోకి తరలించారు మీరు.. మరి మీ వ్యక్తిగత భద్రత గురించి మీరు తీసుకునే జాగ్రత్తలేమిటి”

” ప్రజలకోసం పనిచేస్తున్న వ్యక్తులెప్పుడూ ప్రజలయొక్క భౌతిక సంపద. వాళ్ళ సంపదను వాళ్ళే కంటికి రెప్పలా కాపాడుకుంటారు.”

“పేద ప్రజల్లో.. గిరిజన ప్రాంతాల్లో మీకు అసంఖ్యాకమైన అనుచరులూ, అభిమానులూ ఉన్నట్టే మీరు విరోధిస్తున్న సోకాల్డ్ నియో-రిచ్ బూర్జువాలనుండి శత్రువులూ, బెదిరింపుదార్లూ ఉంటారుగదా.. మరి వాళ్లనుండి.. మీకు రక్షణ..”

“జీవితమంటేనే.. ఒక నిరంతర పోరాటం. భయపడేవాడు పోరాటాలు చేయలేడు. నేను భయాన్ని కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడే జయించాను..”

ఇలా సాగుతోంది సంభాషణ.

శివరావు గొంతులో నిఖ్ఖచ్చితనం.. స్పష్టత.. గురితప్పని విశ్వాసం.. కళ్ళనిండా విద్యుత్ బల్బ్ లోనుండి విరజిమ్మే కాంతిలా వెలుగు.

శివరావు కొన్ని దశాబ్దాలక్రితం..తనతో మనిషి అందం గురించిన చెప్పిన ‘ నిజమైన అందం’ ఈ కళ్ళలో కాంతేనేమో.

అప్రయత్నంగానే.. మనోరమ చటుక్కున తన హ్యాండ్ బ్యాగ్ లోనుండి మిర్రర్ ను బయటకు తీసుకుని తన ముఖాన్ని తానే పరిశీలనగా చూచుకుంది. ముఖంలోగానీ.. కళ్ళలోగానీ ఎటువంటి మెరుపూ.. కాంతీ..జీవమూ లేదు. ఒక అందమైన నిర్జీవ..తెల్లగా వెల్లవేసిన శుభ్రమైన గోడలా ఉంది.

ఎ బల్బ్ విత్ కరెంట్..వితౌట్ కరెంట్.

మనోరమ దీర్ఘంగా నిట్టూర్చి..తలెత్తేసరికి.,

సాయంత్రం..ఐదు గంటలు..అమీర్ పేట్ చౌరాస్తా దాటి..నింస్ దగ్గరకు రాగానే.  ‘ తప్’ మని ఏదో గన్ కాల్చిన చప్పుడు.క్షణం లో.. జనం కకావికలై.. పరుగులు రోడ్ పై.. గుంపులు గుంపులుగా.

” ఏమైంది..”

” ఏమైంది “..ప్రశ్నలు.

” ఎవరో..ఒక మనిషిని గన్ తో కాల్చి  పరారయ్యాడిప్పుడే..అంతా రక్తం.. మనిషి అక్కడికక్కడే చనిపోయాడు”

” ఎవరో పాపం”

” తెలియదండీ”

పొలీస్ వ్యాన్ చప్పుడు.. ఈలలు.. హడావిడి.. పరుగులు.. కుక్కలతోపోలీస్లహడావిడి.

మనోరమ క్యాబ్ కు పదడుగుల దూరంలోనే.. అంతా. .రక్తపు మడుగు కనబడ్తూనే ఉంది.

‘ఎవరో చూస్తే బాగుండు ‘ అని..ఉత్సుకత.

ఇంకా జనం ప్రోగౌతూనే ఉన్నారు. “మేడం..ఇటునుండి కార్ ను వెనక్కితిప్పుతాను..” అని డ్రైవర్ ఏదో అంటూనే ఉన్నాడు..మనోరమ కార్ ను దిగి ఆ గుంపులోకి నడిచింది.

దగ్గరగా వెళ్ళి..ఇంకా జనాన్ని తోసుకుంటూ..లోపలికి.,

ఎదురుగా..తడి రక్తపు మడుగులో..శివరావు.

” శివరావు చచ్చిపోయాడు..తన ఎదురుగానే.”

” కాదు..శివరావు..చంపబడ్డాడు”

వేలమంది గుండెల్లో దేవునిలా కొలువై ఉండే శివరావుకు కూడా శత్రువులుంటారా.

ప్రపంచంలో.. తనలాంటి.. అందగత్తెలూ.. బిలియనీర్లూ కోకొల్లలు.. కాని శివరావులాంటి ప్రజోపయోగ లక్ష్యం తోనే జీవించే.. చావును ప్రతినిత్యం ఎదుర్కుంటూ పోరాడే త్యాగమూర్తులు.. ఎందరు.

‘ఎప్పటికైనా తప్పకుండా నశించిపోయేది భౌతికమైన అందం. రోజులూ.. వయసూ గడుస్తున్న కొద్దీ.. ఇంకా ఇంకా సౌందర్యవంతమయ్యే అందం..మనం నిర్మల పర్చుకునే..మన మనసు..హృదయం..ఆత్మ..’

శివరావు.. తమ పెళ్ళైన కొత్తలో అన్న మాటలు జ్ఞాపకాల పొరల్లోనుండి ధ్వనిస్తూ.,

మనోరమ కళ్ళలోనుండి.. వెచ్చని కన్నీళ్ళు.. ధారలు ధారలుగా.,

కన్నీళ్ళకు హృదయముంటుందా.?

*

 

 

 

 

 

 

 

 

కొంచెం గెడ్దపునురగ, ఒక కత్తి గాటు..

 

 

-ఉణుదుర్తి సుధాకర్

~

 

Sudhakar_Marine Linkసుమారు ఏభై ఏళ్ల క్రిందటి మాట. అప్పట్లో వాటిని మంగలి షాపులనే అనేవాళ్ళు. అలా అనడం సరైన రాజకీయ పరిభాషాప్రయోగం కాదనే అవగాహన ఇంకా ఏర్పడలేదు. బార్బర్, హెయిర్ డ్రేసర్, సెలూన్, బుటీక్, పార్లర్  – ఈ మాటలు లేవు. క్షౌరశాల అని బోర్డుమీద రాయడమే గానీ పలికిన వాడు లేడు. మంగలి భూలోకం పెద్దకొడుకు వైకుంఠానికి చదువు అబ్బలేదు. స్కూలు తెరిచే కాలంలో కాసే నేరేడుపళ్ళతో మొదలుపెట్టి, రేగుపళ్ళూ, ఉసిరికాయలూ, సీతాఫలాలూ, చెరుకుగడలూ,  ఫైనల్ పరీక్షలనాటికి మామిడికాయలూ – ఇవికాక  ఏడుపెంకులాట, జురాబాలు, గోలీలాట, జీడిపిక్కలాట వీటన్నిటి మధ్య ఏర్పడ్డ దొమ్మీలో పదోతరగతి పరీక్ష చెట్టెక్కిపోయింది. చదివింది చాల్లే అని వాళ్ళ నాన్న తనకి సాయంగా దుకాణానికి రమ్మన్నాడు.

మొదట ఓ ఆరునెలలు – కత్తిరించగా కిందపడిన వెంట్రుకలు ఊడవడం, గెడ్డం చేయడానికి సరంజామా సిద్ధంచేసి ఉంచడం, మంచినీళ్ళ కూజా మోసుకురావడం, మొహాలమీద నీళ్ళు చిలకరించే సీసాలు నింపిపెడుతూండడం, తోలుపట్టీ మీద కత్తుల్ని సానపట్టడం, మధ్యమధ్య  శిల్లావెంకన్న హోటల్ కి పరుగెత్తి ఫ్లాస్కులో టీలు, విస్తరాకుల్లో కట్టిన కరకర పూరీలు, వాటికి తోడుగా బొంబాయికూర తెచ్చిపెట్టడం (ఎవరూ చూడనప్పుడు విజయలలిత, జ్యోతిలక్ష్మిల కేలెండర్ల వైపు దృష్టిసారించడం, షాపు అంతటాఉన్న అద్దాలముందు జుత్తు పరపరా దువ్వి ‘సైడుపోజులో హరనాథ్ లా ఉన్నాను’ అనుకోవడం), ఇవన్నీచేసి తండ్రి దగ్గర మన్ననలు, ఇతర బర్బరులనుండి గుర్తింపు పొందాడు.

ఇన్నాళ్ళూ అనవసరంగా స్కూలికి వెళ్ళి ఎందుకు దెబ్బలు తిన్నానా అని బాధ పడుతూనే ఆ దుర్దినాలకు శాశ్వతంగా స్వస్తి పలికినందుకు మురిసిపోయాడు. తండ్రి పర్యవేక్షణలో పదహారేళ్ళకే కత్తి చేతపట్టి  రంగంలోకి దూకాడు. ప్రయోగాత్మకంగా పేద గిరాకీల గెడ్డాలు ఎడాపెడా గీయడం మొదలుపెట్టాడు. మొదట్లో కొంత రక్తపాతం జరిగింది. స్ఫటిక వాడకం పెరిగిపోయింది. డెట్టాలు, పలాస్త్రీల అవసరం కలిగింది. షాపులో ఊదొత్తుల సువాసనలకు బదులు ఆస్పత్రివాసన పెరగడంతో తండ్రి భూలోకం ఉద్రిక్తతకు లోనయ్యాడు. అయితే మరికొద్ది వారాల్లోనే వైకుంఠానికి అహింసామార్గం దొరికిపోయింది. కాస్త పొడుగూపొట్టీ అయినా జుత్తు కత్తిరించడం కూడా పట్టుబడింది. కొడుకు ప్రయోజకుడై అందివచ్చినందుకు తండ్రి ఆనందానికి అవధులు లేవు.

అన్నయ్య వైకుంఠం తమ వృత్తిరంగంలో రోజురోజుకీ ఎదిగిపోతూ తన అనుభవాల్నీ, విజయాల్నీ వివరించినప్పుడల్లా కైలసానికి దిగులు కలగసాగింది. చదువులో ఉంచి తండ్రి తనకి తీరని అన్యాయం చేసాడని మరీమరీ అనిపించసాగింది. చిక్కల్లా ఒక్కటే. కైలాసానికి చదువు బ్రహ్మాండంగా వస్తోంది. పెద్ద ప్రయత్నం లేకుండానే మంచి మార్కులు వస్తున్నాయి. చిన్నకొడుకు గవర్నమెంటు ఆఫీసరు అవుతాడనే భూలోకం నమ్మకం ప్రతీ ఏడూ మరింత బలపడుతోంది. క్షవరం చేయించుకోవడానికి వచ్చే మాస్టార్లందరూ కైలాసాన్ని పెద్ద చదువులు చదివించమనే అంటారు. కైలాసం ఇంగ్లీషులో కాస్త వెనకబడ్డా, తెలుగు పద్యాలు చదివేడంటే మాత్రం పెద్దపంతులుగారు కూడా డంగైపోతారు. కొత్తగా వచ్చిన లెక్కలమాస్టారు మధుసూదనంగారైతే జీతం తీసుకోకుండా ప్రైవేటు చెప్పి తన సబ్జెక్టులో ఫస్టుమార్కు వచ్చేలా చేసాడు. అంతేకాక రెన్ అండ్ మార్టిన్ లోంచి ఎక్సెర్సైజులు చేయించి ఇంగ్లీషంటే భయం లేకుండాచేసాడు. ‘ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ’ అంటే గనక అది ముమ్మాటికీ  తప్పే అనిన్నీ, ‘ఐ ప్రిఫర్ కాఫీ టు టీ’ అన్నదే కరెక్ట్ అనీ కైలాసం ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆక్టివ్ వాయిస్ లో ‘రామా కిల్డ్ రావణా’ అని ఉంటే అది పాసివ్ లో ‘రావణా వాస్ కిల్డ్ బై రామా’ అవుతుందని తెలుసుకున్నాడు. మొదటే తెలుగు బాగా వచ్చి ఉండడంవల్ల ఇంగ్లీషు తొందరగా పట్టుబడింది.  ఇప్పుడు సెలవుచీటీ ఇంగ్లీషులో రాయగలడు. నిజానికి వీపీపీ ద్వారా పుస్తకాలు పంపిచమని కొంతమంది విజయవాడ పబ్లిషర్స్ కి కూడా ఇంగ్లీషులోనే రాశాడు. ఆయా పుస్తకాలు టంచన్ గా వచ్చేశాయి కూడా.

మధుసూదనం మాస్టారింటికి ట్యూషన్ కి వెళ్ళినప్పుడు ఆయన వద్దనున్న తెలుగు, ఇంగ్లీషు పుస్తకభండారాన్ని చూసి కైలాసం అదిరిపోయాడు. చాలా తెలుగు పుస్తకాలు, కొద్దిపాటి ఇంగ్లీషు పుస్తకాలు తెచ్చుకొని చదివేశాడు. కొన్ని బోధపడ్డాయి; కొన్ని పడలేదు. కాని అవి అతనికి ఒక కొత్త ప్రపంచానికి దారి చూపించాయి.  ఆగష్టు పదిహేను నాడు జరిగిన తెలుగు వ్యాసరచన పోటీలో స్కూలు మొత్తానికి మొదటి బహుమతిగా గాంధీగారి ఆత్మకథ చేతికి రావడంతో కైలాసంలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఇన్ని సాధిస్తున్నప్పటికీ అసలు మజా అంతా అన్నకే దక్కుతున్నదని అతని ఆక్రోశం మాత్రం అలాగే మిగిలిపోయింది. పోరగాపోరగా పదకొండో తరగతి సెలవరోజుల్లో దుకాణానికి వచ్చి పని నేర్చుకోవడానికి తండ్రి అయిష్టంగా అంగీకరించాడు. అయితే మరుసటేడు – అంటే పన్నెండో తరగతిలో మాత్రం చదువు తప్ప మరో వ్యాపకం ఉండరాదని షరతు పెట్టాడు. కైలాసం ఉత్సాహంగా దుకాణంలో అడుగుపెట్టాడు.

 

మొదట్లో తమ్ముడి మీద పెత్తనం చెయ్యాలని వైకుంఠం చాలా ప్రయత్నించాడుగాని అది అట్టేకాలం సాగలేదు. గెడ్డాలు చేయడంలో ఇద్దరికిద్దరూ సరిసమానం అయిపోయారు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పడింది. షాపు తమదే అన్న ధీమా తలకెక్కింది. ఖాతాదారులతో సత్సంబంధాలు పెంచుకున్నారు. వాళ్ళు మోసుకొచ్చే వార్తల్లో వాళ్లకి ఆసక్తి పెరిగిపోయింది.  క్షౌరశాల అంటే నేటి భాషలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫాం, పేస్ బుక్, ట్విట్టర్.  వినగావినగా అన్నదమ్ములిద్దరికీ ఒక కొత్త సంగతి బోధపడింది. చుట్టుపక్క ప్రాంతాల్లో నక్సలైట్లు అనబడే వాళ్ళు సంచరిస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారుగాని వాళ్ళు పట్టుబడడం లేదు. వాళ్ళు పరమ కిరాతకులని కొందరూ డబ్బున్న వాళ్ళని దోచుకొని పేదలకి పంచిపెడతారని కొందరూ అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఈ నక్సలైట్లంటే ఊళ్ళోఉన్న వ్యాపారులంతా హడిలిచస్తున్నారు. వీళ్ళకీ సంగతులు తెలుస్తున్న రోజుల్లోనే పాటలు పాడుకుంటూ ఒక ఎర్రజెండా బృందం షాపు ముందుకొచ్చి నిలబడింది. వాళ్ళేవో కేకలు వేశారు, కరపత్రాలు పంచారు, చందాలు అడిగారు. భూలోకం ఐదురూపాయిలిచ్చి పంపించేశాడు. ‘అదుగో, వాళ్ళే నక్సలైట్లు’ అన్నారెవరో. అన్నదమ్ములిద్దరూ కరపత్రం శ్రద్ధగా చదివారు.

సరిగ్గా అప్పుడే వైకుంఠం బుర్రలో ఆ ఆలోచన పుట్టింది. సెలవురోజున అంటే మంగళవారంనాడు షాపులో ఒక్కడూ కూర్చొని  కరపత్రంలోని భాషని వాడుకుంటూ, వాక్యాల్ని అటూఇటూ తిప్పి ఊరికల్లా పెద్ద కిరాణా వ్యాపారి సుంకాల కాశీనాథాన్ని సంబోధిస్తూ ఒక బెదిరింపు లేఖ తయారుచేశాడు. “ఖబడ్దార్! ప్రజా శత్రువులారా! ఎర్రసేన కదిలింది! మీ అంతు చూస్తుంది!” కరపత్రంలోని ఈ వాక్యంతో తన లేఖలోని ఆఖరి పేరాని ముగించి చివరిగా తన సొంత కవిత్వం చేర్చాడు: “మంగళవారం నాడు సాయింత్రం ఆరో గంటకల్లా జగద్ధాత్రి గుడి ఎదురుగా ఉన్న బంద పక్కన మర్రిచెట్టు మొదట్లో పదివేల రూపాయిలు ఒక బాగ్ లో పెట్టి వెళ్ళాలి”. ఎందుకేనా మంచిదని మరో వాక్యం చేర్చాడు “లేకపోతే ఎర్రసేన నిన్నూ నీ కుటుంబాన్నీ సర్వనాశనం చేస్తుంది ”. “ఇట్లు, కామ్రేడ్ జిల్లా నాయకుడు” అని ముగించాడు. పదివేలు చేతిలోపడితే మద్రాసువెళ్లి సినీమాల్లో హీరో అవ్వాలని వైకుంఠానికి మహా దురదగా ఉంది.

సుంకాల కాశీనాథం లబోదిబోమంటూ పోలీసు స్టేషన్ కి పరుగెత్తాడు. ఉత్తరం చదవగానే అది నకిలీదని పోలీసులకి అర్థం అయిపోయింది. వలవేసి వైకుంఠాన్ని పట్టుకొని నాలుగు తగల్నిచ్చి వెనకాతల ఇంకెవరూలేరని తేల్చుకున్నారు. కొడుకుని విడిపించడానికి భూలోకం కులపెద్దల సహాయం కోరితే వాళ్ళు చేతులెత్తేశారు; ఇది మామూలు తగువు కాదన్నారు. మరో మార్గంలేక సబ్ ఇన్స్పెక్టర్ సూర్యారావు కాళ్ళమీద పడ్డాడు. ‘ఊరికే వదిలేస్తామా?’ అన్నాడు సూర్యారావు. ఏమీ  ఇచ్చుకోలేనని భూలోకం మొర. ఇప్పుడంటే నక్సలైట్లని పట్టుకోలేక నానా పాట్లూ పడుతున్నాడుగాని, బుల్లెట్ మోటార్ సైకిల్ మీద బడబడమని తన రాజ్యమంతటా యదేచ్ఛగా పర్యటించే సూర్యారావంటే ఊళ్ళో అందరికీ భయమే. ‘పోలీసాఫీసరంటే అలా ఉండాలి’ అన్న వాళ్ళూ ఉన్నారు. అతని ఠీవిని చూసి మురిసిపోయే వాళ్ళల్లో ముఖ్యుడు సుంకాల కాశీనాథం. కానీ వైకుంఠంకేసులో ఇద్దరికీ కొంచెం తేడావచ్చింది. తగిన శిక్ష వెయ్యకుండా నేరస్తుడిని విడిచిపెట్టడం ధర్మవిరుద్ధం, ఇలాంటి అల్లరచిల్లరగాళ్ళే రేప్పొద్దున్న నిజం నక్సలైట్లు అవుతారు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని కాశీనాధం పట్టుబట్టాడు. ‘మీకెందుకు సార్? నేను చూసుకుంటాను, నాకొదిలెయ్యండి. పోలీసుడిపార్టుమెంటు ఉన్నదెందుకు?’ అన్నాడు ఇన్స్పెక్టర్.

అన్నట్టుగానే రేపు విదిచిపెడతారనగా ముందురోజురాత్రి రైఫిల్ బట్ తో బలంగా మోది వైకుంఠం కుడిచెయ్యి విరగ్గొట్టాడు – ‘రేప్పొద్దున్న తుపాకీ పట్టుకోవాలనుకున్నా నీవల్ల కాదురా’ అంటూ. ‘మీవాడు బాత్రూంలో జారిపడి చెయ్యి విరగ్గొట్టుకున్నాడు’ అని భూలోకానికి అప్పజేప్పేడు.  విరిగిన చెయ్యి అతుక్కుందిగాని వంకర ఉండిపోయింది. ఇప్పుడు వైకుంఠం ఫుల్ హ్యాండ్ చొక్కాలే వేసుకుంటాడు. అవిటి చేత్తో కటింగ్ చేస్తాడు గాని మునపటి జోరు లేదు. ‘హరనాథ్ లా ఉన్నాను’ అనుకోవడం మానేశాడు.

***

కొడుకులిద్దర్నీ షాపులో ఉంచి భూలోకం భోజనానికి వెళ్ళాడు. షాపంతా ఖాళీ. బయట ఎండ మండిపోతోంది. ఎదురుగుండా మెడికల్ షాపులో కూడా ఓనరుతప్ప ఎవరూ లేరు. రోడ్డుమీద అలికిడి తగ్గిపోయింది. మధుసూదనం మాస్టారి దగ్గర తీసుకొచ్చి అద్దం వెనకాతల దాచిన పుస్తకం తీసి చదవుతున్నాడు కైలాసం. కూజాలోని చల్లటి నీటిని చేతిలోకి తీసుకొని మొహమ్మీద కొట్టుకున్నాడు వైకుంఠం. సరిగ్గా అప్పుడే బుల్లెట్ బడబడ వినబడింది. శబ్దం దగ్గరవుతోంది. పుస్తకంలోంచి చటుక్కున తలెత్తి అన్నకేసి చూశాడు కైలాసం. ‘ఇక్కడికే వస్తున్నాడా?’ అన్నట్టు చూశాడు వైకుంఠం. శబ్దం బాగా దగ్గర్నించి వినిపిస్తోంది; గుమ్మం ముందుకొచ్చి ఆగిపోయింది. పెరటి గుమ్మంలోంచి వైకుంఠం జారుకున్నాడు. చదువుతున్న పుస్తకాన్ని గభాలున అద్దం వెనక పడేశాడు కైలాసం.

లోపలి వస్తూనే, “ఏరా, ఎవరూ లేరా?” అన్నాడు ఇన్స్పెక్టర్ సూర్యా రావు.

“నాన్న, అన్న భోజనానికి వెళ్ళారు”

పిస్తోలుతో ఉన్న తోలు పటకా, బులెట్ లతో ఉన్న క్రాస్ బెల్టునీ విప్పేసి ఒక ఖాళీ కుర్చీ మీద పడేశాడు.

“ఎప్పుడొచ్చినా మీ అన్న కనబడ్డు. ఏంటి సంగతి? మళ్ళా ఏమైనా వేషాలేస్తున్నాడా?”

georgia

“అలాటిది ఏమీ లేదు సార్”

“గెడ్డం చెయ్యడం చేతనవునా?” కుర్చీలో కూర్చుంటూ.

“కిందటిసారి నేనే కద సార్ చేసింది?” అని టేబిల్ ఫ్యాన్ ఆన్ చేశాడు.

నాలుగు రోజుల గెడ్డం. నక్సలైట్ల వేటలో నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నాడని సోషల్ మీడియా ద్వారా కైలాసానికి తెలుసు.

“నీకు తెలిసిందా? రాత్రి ముగ్గుర్ని లేపేశాం”

ముగ్గురు నక్సలైట్లని మొన్న పట్టుకొని నిన్న రాత్రే చంపారని, వాళ్ళల్లో ఇద్దరు నాయకులున్నారనీ అరవ వైర్లెస్ ఆపరేటర్ పొద్దున్న గెడ్డం చేయించుకోవడానికి వచ్చినప్పుడు చెప్పాడు. తెలుగు రాకపోవడం వలన అంతకు మించి చెప్పలేకపోయాడు.

పరుగెత్తుకెళ్ళి మధుసూదనం మేష్టారికి ఈ సంగతి తెలియజేస్తే ఆయన వెంటనే మార్చురీకి బయిల్దేరాడు.

“తెలీదు సార్” అంటూ గుడ్డ కప్పి బొందులు ముడేశాడు.

నీళ్ళు చిలకరించే సీసా తీసి ఇన్స్పెక్టర్ మొహంమీద నీళ్ళు కొట్టాడు. తుడిచి మళ్ళీ కొట్టాడు. సూర్యారావు రిలాక్సైపోయాడు.

బ్రష్ తో సబ్బు బాగా కలిపాడు. బాగా నురగ వచ్చాక గెడ్డానికి అద్దాడు. గెడ్డం మీద బ్రష్ ఆడుతోంది. నురగ గెడ్డం అంతటా వ్యాపిస్తోంది. సబ్బు వాసన షాపులో అలముకుంది.

“మీసం ముట్టుకోకు…. మీసం సంగతి నేను చూసుకుంటాను”. కిందటి సారీ ఇదే మాటన్నాడు.

“అలాగే సార్”

బేరాల్లేక అన్నదమ్ములిద్దరూ పొద్దుట్నించీ అదేపనిగా కత్తులకు సానపెట్టారు. అవన్నీ ఇప్పుడు మహావాడిగా మెరిసిపోతున్నాయి. అన్నిట్లోకీ వాడిగా ఉన్న కత్తిని ఎంచుకున్నాడు కైలాసం. బొటనవేలు మీద నెమ్మదిగా నొక్కి చూశాడు.

‘నా సామి రంగా, ధారు అదిరిపోయింది’ అనుకున్నాడు.

“వచ్చే నెల నుంచీ మన ఊళ్ళో కూడా స్పెషల్ పోలీస్ కేంపు పెడుతున్నారు. వీళ్ళ ఆటలు ఇంక సాగవు”.

కొత్తవిషయం తెలిసింది. ఈ సంగతిని నమోదు చేసుకున్నాడు. మేష్టారికి చెప్పాలి.

తోలు పట్టీ మీద కత్తిని ఇంకా సాన పడుతూ కొత్తలో తండ్రి భూలోకం నేర్పిన పాఠాలు గుర్తు చేసుకున్నాడు.

“ఒరేయ్, కత్తి ధారుగా ఉంటేనే అది మన మాట వింటుంది. ఎంత మొండి గెడ్డమైనా లొంగిపోతుంది. కాని గెడ్డం చేసేవాడు మూడే మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. చర్మాన్ని సాగదీసి కత్తికి దారి చూపించాలి. కత్తిని కిందకి లాగాలి. ఎగ్గొరగ కూడదు. అందుకే ‘మంగలాడెంత మంచోడైనా ఎగ్గొరిగితే మంటే’ అన్నారు. తేలిగ్గా లాగి చివర్లో తేల్చాలి. లోపలికి  నొక్క కూడదు. తేల్చు. అద్గదీ, అలా తేల్చు”.

ఎడమ బొటన వేలుతో చర్మాన్ని లాగి పట్టి, దారిచేసి, కుడి చేత్తో కత్తిని నడిపిస్తున్నాడు. తండ్రి చెప్పినట్టే కత్తి మహాసున్నితంగా తన పని చేసుకుంటూ పోతోంది.‘ఇప్పుడు గాని కత్తి కిందకి దించి గొంతుకమీద ఒక్క నొక్కు నొక్కేనంటేనా! వీడి పని అయిపోతుంది. ఇవాళ నా చేతిలో చస్తాడు’ అనుకున్నాడు.

షట్టర్ మూసిన శబ్దం. ఎదురుగుండా మెడికల్ షాపు కోమటాయన ఇం’టికి వెళ్ళిపోతున్నాడు. సాయింత్రం అయిదైతేగాని రాడు. గడియారంలో రెండవుతోంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కైలాసానికి చెమటలు పడుతున్నాయి. గుండె కొట్టుకోవడం వినిపిస్తోంది.

పెదవికింద కత్తి లాగుతున్నాడు. మీసానికి అటూ, ఇటూ. పైన కూడా.

“మీ నాన్న కన్నా నువ్వే బాగా చేస్తున్నావు రా”

“అదేం లేదు సార్”

ఫైనల్ గా ఎక్కడా గరుకు మిగలకుండా మొత్తంగా కత్తి లాగుతున్నాడు. గొంతుక దగ్గర ఒక్క క్షణం కత్తి నిలిచి పోయింది, దానంతట అదే. మళ్ళీ కదిలింది.

ఆలోచనలు ముందుకి పరుగెడుతున్నాయి. వీడ్ని చంపితే మాత్రం ఏమొస్తుంది? ఊరంతా ఈ వార్త గుప్పుమంటుంది. నెలయ్యాక అంతా మర్చిపోతారు. మరో ఇన్స్పెక్టర్ వస్తాడు. నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు.  పదేళ్లో, ఇరవై ఏళ్లో శిక్ష పడుతుంది. ఒట్టి పిరికిపంద, గెడ్డంచేస్తూ చంపేసాడు అంటారు కొందరు. విప్లవకారుల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడని కొందరనవచ్చు. మధుసూదనం మేష్టారు ఏమంటారో?

“తొందరగా కానీ, స్టేషన్ కి వెళ్ళాలి” అని ఇన్స్పెక్టర్ అనడంతో ఉలిక్కి పడి నిలుపుచేసాడు. నున్నగా మెరిసిపోతోంది గెడ్డం. ఎక్కడా ఒక్క గాటు గాని రక్తపు ఛాయలు గాని లేవు. ఈ పనితనం తండ్రి చూస్తే సంతోషించే వాడు. ఇన్స్పెక్టర్ మొహాన్ని తడిచేసి,  తువ్వాలుతో తుడిచి, పైన వేసిన గుడ్డ విప్పి తీసేసాడు. ఇప్పుడింక సబ్బు మరకలు కూడా లేవు.

పిస్తోలుబెల్టు, తూటాలపటకా తగిలించుకుంటూ, ఇన్స్పెక్టర్ అన్నాడు: “మనుషుల్ని చంపడం అంత తేలికేమీ కాదు. కసి ఒక్కటే సరిపోదు. నిర్దాక్షిణ్యంగా ఉండాలి. మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మాదగ్గర నేర్చుకుంటున్నారు. ఇంకా చాలా కాలం పడుతుంది”.

కైలాసం నిర్ఘాంతపోయాడు. గొంతుక ఆర్చుకు పోయింది. నోరు పెగల్లేదు. చెవుల్లోంచి ఆవిర్లు. పది రూపాయిలు చేతిలో పెట్టి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్.

‘మీ వాళ్ళు అన్నాడు….అంటే?… తెలిసిపోయిందా?’ కైలాసం బుర్ర పనిచెయ్యడం లేదు. మోటార్ సైకిల్ బయిల్దేరింది. పెద్ద బజారు మీదుగా చర్చి పక్కన పోలీస్ స్టేషన్ దారిలోకి మళ్లే వరకూ బడబడ వినిపిస్తూనే ఉంది.

[కొలంబియన్ రచయత హెర్నాండో తెల్లెజ్ (1908-1966) రాసిన సుప్రసిద్ధ కథ ‘Just Lather, That’s All’ అందిచ్చిన ప్రేరణతో, కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా – రచయత].

 

 

అమానత్

 

 

-పప్పు నాగరాజు 

~

 

అనగనగా అంటూ మెదలయ్యే కథలు కొన్నుంటాయి.

స్థలకాలాలతో మొదలయ్యేవి మరికొన్ని.

చెప్పుకునేవి కొన్ని,

చదువుకునేవి కొన్ని,

కోవెల ఎదురుగా, కోనేరు వారగా,  ఓ వేసవి మధ్యాహ్నం పెద్ద రావిచెట్టు చప్టా మీద పడుకునుండగా, ఉండుండి వీచే గాలివాటుకి జల జలమంటూ రావాకులు వినిపించిన కథ ఒకటుంది.

****

 

దశాశ్వమేథ్ ఘాట్ కూడా గంగలాగే కాలాన్ని ఎప్పుడూ లెక్కచెయ్యనట్టే ఉంటుంది. అక్కడి చెక్క బల్లలు, గొడుగులు, పడవలు, పూజారులు, మంగలివాళ్ళూ అనాదిగా అలానే ఉన్నారేమో అనిపిస్తుంది.  నిరంతరంగా ప్రవహించే నదీ, నిశ్చలమైన ఘాట్లూ, ఎప్పుడూ సజీవంగా ఉండే చావూ, సనాతనమైన భక్తీ  కలగలిసిన స్టిల్ ఫొటో అది.

డెబ్భైఏళ్ళ జీవితం జ్ఞాపకంగా మారగా, మిగిలింది మట్టికుండలో పట్టుకుని పడవమీద గంగ మధ్యకి పోయి, తండ్రి అస్ఠికలు గంగలో కలుపుతున్నప్పుడు మొదటిసారిగా వచ్చింది పొగిలి పొగిలి దుఃఖం – లోలోపల పొరల్లోంచీ, నరాలని తెంపుతూ, తెరలు తెరలుగా, ఒక వరదగా.

“జీ భర్ కే రో లో బేటా, తుమ్హారే ఆఁసూ గంగా మాఁ కో  బహుత్ ప్యారే  హై, యే ఆఁసూ హీ తో ఉన్ కీ  ప్యాస్ మిటాతే హై” అన్నాడు పడవ నడుపుతున్న ముసలితాత.

పదమూడోరోజు తెల్లార్నే రామ్ నగర్ దుర్గామందిరం మెట్లు ఎక్కుతుంటే, పొగమంచుతో ఆర్ద్రమైన కోవెలలోంచి, చీకటిని మాత్రం చూపించే చిట్టి దీపాల కాంతిలో కనిపించాడతను – పొడుగాటి గడ్డం, తీక్షణమైన చూపులు, చేతిలో వంకర్లు తిరిగిన పెద్ద కర్ర, అది దేహమో, ఏ అగ్నిపర్వతంలోంచో పెల్లుబికిన లావానో చెప్పడం కష్టం. ఒక్కదాటులో దగ్గరకొచ్చి, భుజంమీద కర్రతో తాటించి “మాకా ఆశీర్వాద్ హై. మగర్, తుమ్కో బహుత్ దర్ద్ సహానా పడేగా”. అంటూ, గిరుక్కున వెనక్కి తిరిగి ఎటో వెళ్లిపోయాడు.

లోతుతెలియని ఆర్తిలోకి దూకడం దుస్సాహసం. అనాటి నుండీ ఏదో తెలియని వెలితి – నిజం కోసం, స్పూర్తి కోసం, మెదడుని, మనస్సుని, ఆత్మని, దేహాన్నీ కలిపే ఏకసూత్రం కోసం.

తిరగని చోటూ లేదు, కలియని జ్ఞానీ లేడు, చదవని పుస్తకమూ లేదు.

వెతుకులాటలో నిజాయితీ ఉంటే, వెదుకుతున్న తీగ ఏదో ఒకరోజు దానంతట అదే కాలికి తగులుతుంది.

“Saying yes to this path is saying no to all imagined escapes”.

చదువుతున్న పుస్తకం చేతిలోంచి అప్రయత్నంగా జారింది. ఆ ఒక్క వాక్యం, అప్పటివరకూ బతికిన అబద్ధపు జీవితం మీద పడి  బద్ధలైన అణుబాంబు. రాత్రి గడిచేలోగా, కొన్ని వందల జీవితాలు,  కొన్ని వేల గొంతుకలు కాలి బూడిదైపోయాయి. అనాటినుండీ, ఏవో అనుభవాలూ, కొన్ని అదృష్టాలూ, అర్థంకాని ఇన్‌ట్యూషనూ బంతిని లాగే దారంలా ఎటో లాక్కుపోతుండేవి. మానవ జీవితానికి సంబంధించిన సాధారణమైన ఆనంద విషాదాలు ఏవీ అంతగా పట్టేవి కావు – అన్నిటిలోనూ ఉన్నా, అన్నీ ఉన్నా, ఏదీ తనది కానట్టుగా ఒక మైమరపు ఆవహించి ఉండేది.

అలాటి ఉన్మాదంలో, కొలొంబియాలో సాంతామార్టాకి దూరంగా అమేజాన్ అడవుల మధ్య మూడువారాలు..

ఎనిమిదో రోజు కనిపించింది ఆమె, కొండ కింద సెలయేరులోంచి, కర్ర బిందెలో నీళ్లు ఎత్తుకుంటూ.

పేరు మెండోజా.

జగన్మోహనమైన చిరునవ్వు, భక్తినీ, విశ్వాసాన్ని, పాటని ఒక బిందువుగా గుండెలో బంధించినట్టు ఏదో అలౌకికమైన సంతోషం ఆమె దేహమంతా వ్యాపించికుని ఉండేది.

ఎన్ని మాటలో, అంతకంటే ఎక్కువ మౌనం,  ఎంత సాంగత్యమో అంతకంటే ఎక్కువ ఎడబాటు.

 

“ప్రేమించావా, ఋజువేంటి?” అనేది పగలబడి నవ్వుతూ.

“ఎప్పటికీ మర్చిపోలేను, అది చాలదూ?”

మళ్లీ అదే నవ్వు, జలజలమని రావాకులు రాలుతున్నట్టే.

చుబుకం పట్టుకొని, తల ఆడిస్తూ, ఆకతాయిగా, “మరిచిపోవూ? భలే.. అది చాలా సుళువు కదూ? నిరంతరంగా జ్ఞాపకంలో ఉండాలి, నీకది సాధ్యమా?”

 

“అయితే, నాలోని నేనుని ఇకనుంచీ నీపేరుతోనే పిలుచుకుంటా, అది చాలా?”

ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో మునుపెన్నడూ లేని తీక్షణత. క్షణ క్షణానికి బరువెక్కుతున్న మౌనం ఒక అరగంట తర్వాత ఇద్దరినీ కలుపుతున్న ధ్యానంగా మారింది.

ఏదో నిర్ణయానికి వచ్చినదానిలా, దిగ్గునలేచి నిలబడి, ప్రాణాలన్నీ పెదాలలోకి లాక్కుంటూ ముద్దుపెట్టుకుంది. తన జేబులోంచి కొన్ని మష్రూములు తీసి ఇచ్చింది. “ఈ రాత్రికి వీటిని తిను. జీవితంలో మరోసారెప్పుడో తప్పకుండా కలుసుకుందాం” అని చెప్పి వడివడిగా కొండదిగి వెళ్లిపోయింది.

ఆ రాత్రి, నిద్ర గగనం – గుండెల్లో కర్పూరం వెలిగించినట్టూ,శరీరంలోని అణువణువూ మొదటిసారి మేల్కొన్నట్టూ. అంతలోనే, ఏదో విషం ఒళ్ళంతా పాకుతున్నట్టుగా  వెన్నులోంచి భయంకరమైన నొప్పి. ఇంతలో, బయట వీధిలోంచి ఎవరో పిలిచారు. బయటకి వచ్చి చూస్తే, ఇద్దరు నేటివ్ ఇండియన్లు ఉన్నారు. తమ వెంట రమ్మన్నట్టుగా సైగ చేసారు.  మౌనంగా నడుస్తూ, ఊరి చివరకి రాగానే, ఇద్దరూ చెరో వైపు నిలబడి, చేతిలో చెయ్యి పట్టుకున్నారు. అంతే, ముగ్గురూ కలిసి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి పక్షుల్లా పయనించసాగారు.

amanata

ఆండీస్ పర్వాతాలమీదనుండీ ఎంతో సేపు ఎగిరాక, ఒక చిన్న ఊరు కనిపించింది అడవుల మధ్యలో. అక్కడ దింపారు, అక్కడ ఉన్న ఒక గుడిసెలోకి తీసుకుపోయారు. అందులో కొంతమంది మనుషులు వలయాకారంగా కూర్చుని ఉన్నారు. మధ్యలో ఒక చిన్నదీపం వెలుగుతోంది.

ఒక మనిషి డప్పు వాయించటం మెదలెట్టాడు. అది ఒక చిత్రమైన లయ అందుకోగానే, గుంపు నాయకుడు అందరికీ నానక్టల్ మష్రూములు ఇచ్చాడు. అతని సైగతో ఒకామె అడవులని, ప్రకృతిని గానంచేసే పియోటే ఇండియన్ పాట పాడడం మొదలెట్టింది. ఆమె గొంతులో అడవిలోని చెట్లమధ్య వీచే గాలీ, కీచురాళ్ల రొదా, పులుల ఘాండ్రింపూ, నెమళ్ల క్రేంకారం –  అన్నీ కలగలసి అడవే మూర్తిమంతమై పాడుతున్నట్టుగా ఉంది:

హే యా నా హీ యానా నీ

హే యానా హీ యా నా నీ

హే యానా హీ యోయి నా నీ, హె యానా హా యోయి హెయ్ నీ

హే యానా హీ నీ నా డోక్ ఇగో హా కో ఒంటా

(May the Gods bless me.

Help me, and give me power and understanding)

పాట పూర్తయ్యేసరికి అడవి, నది, చుట్టూ మనుషులూ అందరితోనూ ఐక్యం అయిపోతూ, అంతకు ముందెన్నడూ ఎరగని వేరే స్పృహ.

పక్కన కూర్చున్న వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.  “నా పేరు మైకేల్, మైకేల్ బారెట్”  మామూలు మాటల్లో పరిచయం చేసుకుంటున్నట్టే,  న్యూస్ పేపర్ చదివినట్టు, మైండంతా చదివేసాడు.

“You are looking for the king – El Shah, the one who can teach you?”

“…”

చెవిలో రహస్యం చెప్పినట్టుగా అన్నాడు

“రాంచియో డి అమీగోస్, తెహువాఖాన్, మెక్సికో”

“ఓ మూడు నెలల్లో అక్కడికి రా”

“Have faith in your heart and a song in your eyes. you will find the way”.

 

తెల్లవారు ఘామున తిరిగి ఆకాశమార్గన్నే హొటల్ దగ్గర దింపేసారు ఆగంతకులిద్దరూ. కలో, నిజమో ఎప్పటికీ తెలియకపోయినా, అనుభవంగా మాత్రం అది గొంతులో దాహం లాంటి పచ్చినిజం.

****

amanata

ఎడ్వంచర్ ప్రారంభించినప్పుడు తొలకరి చినుకుల్లో తడిసినట్టు గమ్మత్తుగా,  అమాయకంగా ఉంటుంది.   హఠాత్తుగా అపనమ్మకం రూపంలో ఆందోళన ఎదురవుతుంది.  ఏదో ఆవేశంలో మెక్సికోకి విమానం ఎక్కేసినా, మెక్సికోసిటీ లో దిగగానే లక్ష అనుమానాలు – ఎవరో ఒకతని మాట పట్టుకుని, దేశం కాని దేశంలో ఎడ్రసు కూడా తెలియకుండా ఎక్కడకని వెళ్ళడం? అసలా మైక్ అనే వ్యక్తి ఉన్నాడా, అప్పుడు జరిగింది అంతా కలా? ఆ రాంచ్ ఉందా, అదో మెటాఫరా? అక్కడికి తోవ ఎలా తెలుసుకోవడం?

మెక్సికోసిటీ నుండి తెహువాఖాన్ కి ఆరుగంటల బస్సుప్రయాణం అనుమానాల చక్రాలమీద ఊగిసలాడుతూ జరిగింది. బస్టాండులో దిగేసరికి రాత్రి పదయ్యింది.

 

ఎందుకో మైక్ చెప్పిన ఆఖరి మాటలు గుర్తొచ్చాయి.

అంతలోనే, “అమీగో.. are you the one from the East?”, అంటూ వెనకనుంచీ ఎవరో భుజం చరిచారు.

“ఆ, అవును… రాంచియో అమీగోస్…” అస్పష్టమైన గొణుగుడు.

“Mike told us that you would be coming, how nice to see you..”  చిరకాల స్నేహితుడిని పలకరించినట్టు, అలవోగ్గా మాట్లాడుతూ, “నా పేరు పెట్రీషియా, చీలీ నుంచి వస్తున్నా” అని గలగలా మాట్లాడుతూనే, చెయ్యి పట్టుకుని కాంపుకి వెళ్లే బస్సువైపు లాక్కెళ్లింది.

బస్సులో లగేజీ పెడుతుంటే “అదేంటి – నువ్వు టెంట్ తెచ్చుకోలేదా, రెండు వారాలు ఎక్కడుంటావూ, చెట్టుకిందా?” అంది పగలబడి నవ్వుతూ.

సుమారుగా ఐదొందల మంది ఎన్నో దేశాలనుంచీ వచ్చిన వాళ్లంతా ఉన్నారక్కడ – గాలంతా నిండిన ఒకరకమైన కేరింత. చిన్న చిన్న గుంపులుగా గూడి ఏవో మాటలు, పాటలు, రాత్రి స్పాంటేనియస్గా స్పానిష్ గిటార్లతో పాటలు, ఆడా, మగా అనిగానీ, చిన్నా పెద్దా అనిగానీ, దేశాలు, రంగులూ గానీ ఏ తేడాలూ, ఏ అహాలు లేని చోటది.

రెండు రోజులయినా, షేక్ జాడ లేదు.

“ఆయన ఎక్కడా కనిపించలేదామిటా అని ఆశ్చర్యపోతున్నావా”? నవ్వుతూ అడిగింది కాథరీన్. షికాగోనుంచి వచ్చిందామె.

“ముందు వంట రుచి చూడు, వచ్చింది అందుకే కదా? వంటాయనతో ఏం పని?”

“…..”

“ఇంకా రాలేదు, ఇంకో నాలుగురోజుల్లో వస్తారేమో.  కానీ పైకోసారి చూడు – పైన ఎగురుతున్న గద్దని చూసావా? అది అలా గిరికీలు కొడుతూ ఉంటుంది, కింద చిన్న సూది కదిలినా అది పసిగడుతుంది. It will dive exactly at the right moment. ఆయన కూడా నీకలానే తారసపడతాడు, దాని గురించి నువ్వింక పెద్దగా ఆలోచించకు” అనేసి, సాక్సఫోను అందుకుని వాయించటం మొదలెట్టింది.

 

కాంపింగ్ స్థలానికి కాస్త దూరంగా, పెద్ద చెట్ల మధ్య ఒక ధ్యానమందిరం లాంటిది కనిపించింది. దాన్ని శ్రద్ధతో ప్రేమతో కట్టినట్టు అక్కడి వాతావరణంలోని అనుభూతి వల్ల తెలుస్తుంది. చుట్టూ గులాబీ తోట, కాలిమార్గం అంతా ఎవరో శ్రద్ధగా అమర్చిన గులకరాళ్లు. మందిరం చుట్టూ చిన్న ఫౌంటెన్లు. ఆ మందిరంలోంచి ప్రసరిస్తున్న ఒకానొక అలవికాని ఆనందాన్ని, అక్కడంతా పరచుకున్న నిశ్శబ్దం తన ఒళ్లంతా నింపుకుంటూ అక్కడనుంచీ కదలడం ఇష్టంలేక బాసింపట్టువేసుకుని కూర్చుంది.

అక్కడ ఉన్న బెంచీమీద కూర్చునుండగా, మందిరం తలుపుతీసుకుని, తెల్లటి బట్టలలో దేవకన్యలా మెరసిపోతూ వచ్చింది టుటూసు. దగ్గరకొచ్చి నవ్వుతూ పలకరించింది.

“టుటూసూ, నేను లోపలకి వెళ్ళొచ్చా?”

“Yes my friend. By all means go. Experience the baraka, and keep it in your heart” అని చెంపలమీద చిన్నగా ముద్దుపెట్టి, వెళ్లిపోయింది.

 

లోపల గడిపిన అరగంట మాటల్లో చెప్పలేని అనుభూతి.

ఉలివెచ్చని తాకిడికి

రాతిదుప్పటిలో నిద్రపోతున్న శిల్పం

బద్ధకంగా బయటపడింది

 

ధ్యానముద్రలో కాలాన్ని బిగపెట్టిన మౌనికి

మనసుతెరుచుకొని,

పెదాల జారిన చిర్నవ్వొకటి

పాటై,

గాలిగోపురం గూటికి చేరింది

 

మరుసటి రోజు వచ్చాడాయన. తెల్లటి బట్టల్లో, ఆరడుగుల పొడుగు, గద్దముక్కు, ఒళ్ళంతా ఒకరకమైన వెలుగు. ఆ కళ్ళల్లో బిగ్ బాంగ్ విస్ఫోటం ఇంకా అలాగే ఉంది. ఆయన చూపులు ఒకపక్క మొత్తం కాంపంతా పరుచుకుంటూనే, మరో పక్కనుంచీ ప్రతి వ్యక్తినీ ప్రత్యేకంగా పలకరిస్తున్నాయి. ఎవరెవరో ఆయనతో ఏదేదో మాట్లాడుతున్నారు.

ఆయన్ని చూస్తుంటే ఒక్కో క్షణం ఒక్కో అనుభూతి – ఒకసారి ఆయనో దిగుడుబావి, కాని అది దాహం తీర్చే బావి కాదు, అందులోకి దూకి ఆత్మార్పణం చేసుకోవాల్సిన బావి. మరోక్షణం ఆయనో పచ్చని లోయ, కొండ అంచులనుంచీ అందులోకి అమాంతంగా జారిపోవాలనే తపన.

ఇంతలో మైక్ కనిపించాడు.

“హౌ ఎబౌటె బీర్?”

“ష్యూర్”

మౌనంగానే మూడు బీర్లు అయాయి.

“నువ్వొక పులి గుహలోకి వచ్చావు. దానికి ఇప్పుడు నిన్ను వేటాడే తొందరేం ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు అది నిన్ను వేటాడుతుంది. అందుకని, దాని గురించి ఇక ఆలోచించకు, అంతవరకూ.. “ అని చేతులు చుట్టూ చాపి  కేరింతలు కొడుతున్న కాంప్ అంతా చూపించాడు.

 

మర్నాడు ఆయనే దగ్గరకి రమ్మని సైగచేసాడు తర్జనితో.

“That condensed tear in your heart,

that became a precious pearl – give it to me

I give you a life of suffering and everlasting joy in return”

****

 

తప్పిపోయిన చరణం

తిరిగి పద్యాన్ని చేరుకుంటుంది ఎప్పటికైనా

తెంపబడ్డ వాక్యం

ఏ దివ్య చరణ సన్నిధినైనా చేరగలదా,

ఏనాటికైనా?

 

రోజువారీ ప్రపంచంలో ఉద్యోగాలూ, పుస్తకాలూ,కంప్యూటర్లూ, డబ్బులూ, స్నేహాలూ, అనుబంధాలూ ఇవన్నీ నిస్సారంగా చప్పగా ఉండే నిజాలు, దానికి సమాంతరంగా మరో సర్రియల్ జీవితం నడిచేది. విశ్వాసానికి, అపనమ్మకానికి మధ్య వంతెనగా చీలిపోయిన జీవితం కాన్వాస్ మీద  రెండు చుక్కలుగా విడిపోయింది అస్తిత్వం — ఆ చుక్కలు కదులుతాయి, నడుస్తాయి, ఒక్కోసారి అర్థవంతంగా ఆగిపోతాయి, స్థలాలు, కాలాలు, చుట్టూ మనుషులూ వీటన్నింటి మధ్యనుంచీ ఆ చుక్కలు ఆగకుండా, ఒక్కోసారి ఎన్నో ఏళ్లు చాలాదూరంగా నడుస్తూ, తిరిగి కలుస్తూ ఏదో చిత్రాన్ని పూర్తిచెయ్యాలన్న తపనతో కలిసి విడిపోతూ ఉండేవి.

amanata

కాలం గడుస్తున్నకొద్దీ, రాత్రిపూట నడిచే సర్రియల్ ప్రపంచమే నిజం అయిపోయింది, చుట్టూ మనుషుల ఆలోచనలూ, ఆందోళనలూ, ఆత్మవంచనలూ, అహాలు, నమ్మకద్రోహాలు క్రమక్రమంగా భరించరానివిగా మారి పగళ్లన్నీ సమ్మెటపోటుల్లా ఆత్మని ఛిద్రం చేస్తుండేవి.

మాటగా మారిన ప్రతి పదమూ నిస్సారమై, కవితగా మారిన ప్రతి అనుభవమూ విఫలమై, మౌనంగా మిగిలిన కవిత్వ క్షణాలే ఊపిరిపాటకి లయని కూర్చేవి. అదీ ఎంతో కాలం మిగలలేదు. తేనెటీగలు ఖాళీచేసి, వదిలివెళ్లిపోయిన మైనం ముద్దలా మిగిలిన హృదయాన్ని ఎలా నింపుకోవాలో తెలీక, వాస్తవికత నుంచీ అధివాస్తవికతలోకి, అధివాస్తవికతనుంచీ ఒక మంత్రనగరిలోకీ జారిపోయి, కేవలం ఒక భావనా ప్రపంచం మాత్రం మిగిలింది.
నది మీద సూర్యాస్తమయాలు మాత్రం జారవిడుచుకోలేని క్షణాలు. అలాంటి ఒకనాటి సాయంత్రం, నీటిమీద తేలుతూ తామరాకులతో చేసిన ఒక చిన్న దొప్పలాంటిది తేలుకుంటూ వచ్చింది, అందులో నాలుగైదు దేవగన్నేరు పువ్వులు, ఒక పద్యం, వాటి మధ్యలో ఒక ప్రమిదలో ఉప్పగా — బహుశా కన్నీళ్లేమో.

 

ఆనాటి నుండీ ప్రతీరోజూ అదే సమయానికి ఆ దొప్ప వచ్చేది – ప్రతిరోజూ అందులో ఒక పద్యం. ఆ పద్యం నిండా గుండెలుపిండే బాధా, ఒంటరితనమూ, విరహమూ, ఏవో గాయాల మచ్చలూ, స్వేచ్ఛకోసం ఆరాటమూ, వదిలి వెళ్లిపోయిన స్నేహితుడికోసం జీరవోయిన పిలుపూ అన్నిటికీ మించి, పట్టుకుంటే కాటేసే కాంక్ష.

మరో దుస్సాహసానికి తెరచాప ఎత్తక తప్పలేదు. ఆ దొప్ప వచ్చిన దిశగా నదికి ఎదురుగా నడుస్తుంటే, ప్రతిరోజు ముందురోజుకంటే కాస్త ముందుగానే అది దొరికేది. అలా కొన్ని రోజులపాటు నడక.

ఒకచోట నది చాలా వెడల్పుగా పారుతోంది, అక్కడ రెండుగా చీలిన నది పాయల మధ్య ఒక చిన్న లంక కనిపించింది. దానిమీద ఒక దుర్భేద్యమైన కోట, చుట్టూరా దేవగన్నేరు చెట్లు, కానీ వాటికి ఒక్క ఆకుకూడా లేకుండా పూర్తిగా ఎండిపోయి, యుగాలుగా ఒక నీటిబొట్టుకోసం తపిస్తున్నట్టు జడులై ఉన్నాయి.

 

ఆ రోజు మధ్యాహ్నం ఆ మేడలోంచి ఒక స్త్రీ ఆ దొప్పని నదిలోకి విసిరింది. అశ్రుపూరితమైన ఆమె కళ్ళలోని ఎర్రటి జీరలో సూర్యాస్తమయమవుతున్న ఆకాశం గోచరమయ్యింది.

ఆ కోటలోకి పోవడానికి మార్గాలేమీ లేవు. కోట చుట్టూ ఏవో మాయలు దాన్ని రక్షిస్తున్నాయి. లోపలనుంచీ ఒక చీమకూడా బయటకు రావటానికి గానీ, బయటనుండీ ఒక ఈగ లోపలకి దూరడానికి గానీ మార్గంలేదు. అందుకేనేమో, ఆమె విడుదలకోసం, ఆ చెరనుంచీ విముక్తికోసం అంతగా తపిస్తోంది.

ఎన్నోరోజుల పడిగాపుల తర్వాత, హఠాత్తుగా ఒక తెల్లటి చేప ఈదుకుంటూ దగ్గరకి వచ్చింది, తనతో రమ్మంటున్నట్టుగా ఏదో సైగలు చేస్తూ..

మెండోజా!!!???

ఎన్ని యుగాల జ్ఞాపకాలో గుండెలోంచి ఒక్కసారిగా ఉప్పెనగా పెల్లుబికాయి – వాటి పోటు నదిలోకి విసురుగా తోసెయ్యటంతో, ఆ చేప వెనకాలే ఈదుకుంటూ వెళ్ళకతప్పలేదు. ఆశ్చర్యంగా, నీటిలోపల నుంచీ ఆ కోటలోపలకి ఒక చిన్న సొరంగ మార్గం ఉంది.

 

“వచ్చావా, ఇన్నేళ్లూ ఎందుకు రాలేదు?”

“….”

“నీపేరు?”

“అప్పుడే మరచిపోయావా … మరీచూ”

“ఈ మేడలో ఇలా ఎందుకుండిపోయావు? బయటకెందుకు రావు? రోజూ ఆ పద్యాలు ఎందుకలా నదిలోకి వదులుతావు?”

“మా నాన్న పెద్ద మాంత్రికుడు. నన్ను ఈమేడలో బంధించి, అష్టదిగ్బంధనం చేసి, బయటకు పోయాడు నా చిన్నప్పుడు. మరలా తిరిగి రాలేదు. అప్పటినుండీ ఇక్కడే బంధిగా ఉండిపోయాను. నన్ను విడిపించే నీకోసం ఎదురుచూస్తూ. నిన్ను పిలవడానికే ఆ పద్యాలు నదిలో వదులుతుంటాను.”

“నాతో వచ్చేయి మరీచూ, ఇక నీకు ఎప్పటికీ ఒంటరితనం ఉండదు, విశాలమైన ప్రపంచం అంతా మనదిగా విహరిద్దాం”

“ప్రేమించావా? నీ ప్రేమలో బంధిగా ఉండలేను, అంతకంటే ఈ మేడే నయం నాకు – నువ్వెళ్లిపో ఇక్కడనుండీ” మళ్లీ అదే కన్నీరు, ఒక్కో కన్నీటి చుక్కలో ఒక్కో తుఫాను.

అప్పుడొచ్చాడతను, ఆకాశం నుండీ ఊడిపడ్డ ఉల్కలా.. ఆకుపచ్చని అంగారఖాలో, కరిగించిన వెండిలా ఉన్న బవిరిగడ్డం, నిప్పు కణికల్లాంటి కళ్లు, అదే గద్దముక్కు..

“నీకు స్వేచ్ఛకావాలి కదూ” ఆ గొంతులో ఉరుములు

“అవును బాబా..”

 

చర చరా గోడదగ్గరకి నడుచుకుంటూ వెళ్లాడు, అక్కడ డాలు కింద ఉన్న పెద్ద కత్తిని చర్రున లాగి, ఆమె రెండు చేతులూ, నిర్దాక్షిణ్యంగా నరికేసాడు. బాధతో ఏడుస్తూ కింద పడిపోయింది ఆమె. రక్తసిక్తమైపోయిన ఆమెని, నడుంపట్టుకుని గాలిలోకి ఎత్తాడు సునాయసంగా, రెండు కాళ్లూ విసురుగా నరికేసాడు. మేడపైనుంచీ, ఆమెని నదిలోకి విసిరేసాడు అదే ఊపుతో.

 

నదిని తాకుతూనే ఆమె తెల్లటి చేపగా మారిపోయింది, ఒక్కసారి పైకి ఎగిరి వీడ్కోలు చెప్పినట్టుగా చూస్తూ నీటిలో మునిగి మాయమైపోయింది.

“ఏమిటిదంతా, ఎవరు నువ్వు?”

శరీరాన్ని చీల్చుకుంటూ తీక్షణమైన అదే చూపు

“నువ్వే కదూ, ఆరోజు కాశీలో దుర్గా మందిరం దగ్గర కనిపించిన సాధువ్వి?”

“సరిగ్గా చూడు బేటా, నన్ను నువ్వు చాలా సార్లు చూసావు, నీ తోలు కళ్లతో కాదు, నీ గుండెల్లో పొదిగిన ముత్యంతో చూడు – ఇంకా గుర్తు పట్టలేవా?”

అప్పుడు కనిపించాడు – ఎన్నో రూపాల్లో – మెండోజా, మరీచూ, మైక్, మెక్సికోలో కనిపించిన షా.. అన్నీ అతనే!!

 

అప్పుడు కూలిపోయింది ఆ కోట

వెయ్యి శకలాలుగా

దేవగన్నేరు చెట్లన్నీ

ఒక్కసారిగా పుష్పించాయి,

శతకోటి వెన్నెల రవ్వలుగా

****

చిల్లుపడ్డ గుండెకి తాపడం వేసుకోమని రావిచెట్టు రెండు ఆకులు బొట బొటమని రాల్చింది.

 

 

*

నిర్ముక్తం

 

 

– రాధ మండువ

చిత్రం: నివాస్ 

~

radhaనేను రమణమహర్షి ఆశ్రమంలో లైబ్రరీలో సేవ చేస్తుంటాను. ఆశ్రమానికి దగ్గర్లోనే ఇల్లు కొనుక్కుని తిరువణ్ణామలైలో సెటిలైపోయి పదేళ్ళు కావస్తోంది.

ఆరోజు రమణుడికి మెడిటేషన్ హాల్లో నమస్కరించుకుని మాతృభూతేశ్వరాలయంలో నవగ్రహాల దగ్గర ఊదొత్తులు వెలిగించాలని వెళ్ళాను. వెళుతుండగా ఆలయం ముందున్న హాలులో కిటికీకి దగ్గరగా ఒక విదేశీ జంట ఒకర్నొకరు హత్తుకుని నిలబడి ఉండటం కనిపించింది. ఆమె ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. పొడవుగా సన్నగా ఉన్న అతను ఆమె వీపుని తన అర చేతులతో తడుముతూ ఓదారుస్తున్నాడు. ‘నలుగురూ తిరిగే ప్రదేశాలలో, అందునా గుడిలో ఏమిటీ చర్యలూ, మరీ ఈ మధ్య చీదర పుట్టేట్లు ప్రవర్తిస్తున్నారు’ అని నేను మొదట చూడగానే అనుకున్న మాట వాస్తవం. అయితే వెంటనే అనిపించింది పాపం వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు వెళుతూ దు:ఖిస్తున్నారేమో అని.

నేను ప్రక్కనే ఉన్న రమణుడి విగ్రహానికి నమస్కరించి మళ్ళీ వాళ్ళని చూశాను. ఆమె అతన్నించి విడివడి అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఆమె చాలా పెద్దావిడ! అరె, అతను జాన్ కదూ! అతను దాదాపు సంవత్సరమున్నర నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఆవిడ వాళ్ళ అమ్మగారేమో!?

అతడు వెళుతున్న ఆమెకి చెయ్యి ఊపుతూ “బై మమ్” అన్నాడు. ఆమె వెనక్కి తిరిగి చూడకుండా కన్నీళ్ళని తన చేతిలో ఉన్న చిన్న టవల్ తో తుడుచుకుంటూ ఆఫీసులోకి వెళ్ళిపోయింది. అతను కిటికీ చువ్వలను పట్టుకుని ఆమెనే చూస్తున్నాడు. ఏడుస్తున్నాడా? తెలియట్లేదు. అతని వెనుకగా నాలుగడుగుల దూరంలో నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు మాత్రం కన్నీళ్ళు తిరిగాయి.

ఏమయిందో తెలుసుకోవాలని నేను ఆఫీసు దగ్గరకి వెళ్ళాను. ఆమె ఆఫీసులో వాళ్ళకి చెప్పి బయటకి రాగానే ఆమె నాకు పరిచయమే అన్నట్లుగా “హలో హౌ ఆర్ యు?” అన్నాను.

“ఓకే – మీరూ….” అంది.

“నా పేరు జానకి. ఆశ్రమం లైబ్రరీలో ఇంకా ఇక్కడ అఫారెస్టే్రషన్ సర్వీస్ ఎన్ జి వో సంస్థ లో వాలంటీర్ గా పని చేస్తుంటాను” అన్నాను.

“హలో, హాయ్, నా పేరు మేరీ” అంది మెహమాటంగా.

“ఇప్పుడే చూశాను మిమ్మల్ని. జాన్ మీ అబ్బాయే కదా!?” అన్నాను.

“ఔను” అంది – దు:ఖపు జీర ఆమె గొంతులో.

“మిమ్మల్ని చూస్తూ నేనూ కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఆ మధ్య చదివిన ఓ జానపద కథ గుర్తొచ్చింది నాకు” అన్నాను.

“ఫోక్ స్టోరీ!? ఏమిటది? మీకేమీ అభ్యంతరం లేకపోతే చెప్తారా?” అంది.

 

ఇంగ్లీషులో జరుగుతున్న మా సంభాషణ అర్థం అవుతుందో లేదో కాని వరండాలో కూర్చుని ఉన్న ఐదారుగురు భక్తులు మమ్మల్నే చూస్తున్నారు. “ఇక్కడ కూర్చుందాం రండి” అంటూ బుక్ స్టోర్ కి పక్కగా ఉన్న సన్నని వరండా లోకి తీసుకెళ్ళాను. ఇద్దరం గోడకి ఆనుకుని కూర్చున్నాక “కథ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కథ విన్నాక మీ పట్ల నేను ఊహించింది కరెక్ట్ కాకపోతే మీరేమీ అనుకోవద్దు సుమా! అయినా ప్రయాణమైనట్లున్నారు, సమయముందా” అన్నాను.

ఆమె నవ్వుతూ “చాలా సమయముంది. ఏమీ అనుకోను చెప్పండి, వినాలని ఆసక్తిగా ఉంది” అంది.

Kadha-Saranga-2-300x268

“మాగ్దానా అనే రాణి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. కుమారుడి మీదే ఆశలన్నీ పెట్టుకుని పెంచి పెద్ద చేసుకుంది. కాని ఆమె కొడుకు యుక్తవయస్కుడయ్యాక అమరత్వాన్ని సాధించాలని తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు. కాలదేవత దగ్గర కాలమనేదే తెలియకుండా కొన్ని వందల సంవత్సరాలు జీవించాక తల్లిని చూడాలనిపించి వాళ్ళ రాజ్యానికి వస్తాడు. వచ్చాక తెలిసింది – తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిన కొడుకుగా అతని పేరు చరిత్ర పుటల్లో లిఖించబడిందని. ‘నేను సాధించింది ఇదా?’ అని ఖిన్నుడయిపోతాడు”

కథని వింటున్న ఆమె నిట్టూరుస్తూ “సో శాడ్” అంది.

“మీ అబ్బాయి కూడా మిమ్మల్ని వదిలేసి ఆశ్రమానికి వచ్చాడా అనిపించింది మీరు అతన్ని హత్తుకుని దు:ఖిస్తుంటే” అన్నాను.

“మీరు మా గురించి ఊహించింది కరెక్టే – అయితే నేనే స్వయంగా నా చేతులతో నా బిడ్డ జాన్ ను మహర్షి దగ్గరకి పంపాను. అతనిక్కడకి వచ్చి సంవత్సరం దాటింది. కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉన్నాడా? లేడా? అనేది అర్థం కావడం లేదు” అంది.

“నాకర్థం కాలేదు. మీ అబ్బాయి ఆవేశపరుడా? అది తగ్గించుకోమని చెప్పి పంపారా ఇక్కడకి?”

“చాలా ఆవేశం, తన గర్ల్ ఫ్రెండ్ ని చంపబోయినంత పని చేశాడు”

“ఏమిటీ? గర్ల్ ఫ్రెండ్ ని చంపబోయాడా? ఎందుకు? ఆమె ఇతన్ని మోసం చేసిందా?”

“మోసం – ఈ మాటకి అర్థం ఏమిటి జానకీ – మీ పేరు జానకీయే కదా?” అని నేను తలూపాక “నీకు మోసమైంది నాకు న్యాయం అవొచ్చు కదా? మా దేశంలో నచ్చితే కలిసి ఉంటారు నచ్చకపోతే ‘నువ్వు నాకు నచ్చలేదు’ అని చెప్పేసే విడిపోతారు. ఆమె వీడిని వదిలి వేరే అతనితో వెళ్ళిపోయిందని కోపం” అంది.

“మరి ఆ అమ్మాయి ‘నేను నీతో కలిసి ఉండలేన’ని మీ అబ్బాయితో చెప్పింది కదా!?” అన్నాను.

“చెప్పింది. ఏం జరిగిందో చెప్తాను మీకు – నేను కమ్యూనిటీ కాలేజ్ లో లెక్చరర్ ని. మాగ్దానా రాణికి లాగే నా భర్త కూడా జాన్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. ఆయన బ్రతికున్నప్పుడు జాన్ ని బాగా చదివించాలని నాతో అనేవాడు. వాడి కాలేజ్ చదువు కోసం బాగా సేవ్ చేసేదాన్ని. మీకు తెలుసు కదా మాకు యూనివర్సిటీ చదువు అంటే చాలా ఖర్చు అవుతుంది. జాన్ యూనివర్సిటీలో చేరాక అతని పుస్తకాలకైనా డబ్బులు వస్తాయని సాయంత్రం ఓ నాలుగు గంటలు బర్గర్ కింగ్ లో పని చేయమని చెప్పాను. అదీ నేను చేసిన తప్పు. పనికి చేర్చకుండా ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో! అక్కడ జాన్ తో పాటు అదే షిఫ్ట్ లో పని చేసే టీనాని ఇష్టపడ్డాడు. రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా రాయకుండా ఆమెతో తిరుగుతున్నాడని తెలిసి మందలించాను. దానికే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు.

అపార్ట్ మెంట్ తీసుకుని ఆమెతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను. ‘వేరేగా ఉంటే ఉన్నావు, చదువు మాత్రం మానొద్ద’ని నచ్చ చెప్పాను. టీనా చేత కూడా చెప్పించాను. వినలేదు.

ఏడెనిమిది నెలల తర్వాత హఠాత్తుగా ఒకరోజు రాత్రి పది గంటలప్పుడు ఇంటికొచ్చాడు. తాగి ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వస్తూనే ‘మమ్, ఈరోజు టీనాని చంపేస్తాను, నిన్నొకసారి చూసి నీతో చెప్పి పోదామని వచ్చాను’ అంటూ తన గదిలోకి వెళ్ళాడు.

నిశ్చేష్టురాలినైన నా నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు కాని నా మెదడు మాత్రం చురుగ్గా పని చేసింది. జాన్ గది తలుపులు మూసేసి బయట గడి పెట్టేశాను. తలుపులు బాదుతూ ‘మమ్, తలుపులు తియ్’ అని అరవసాగాడు. ‘జాన్ కూర్చో, అక్కడే కూర్చో, తలుపులు తీస్తాను. ముందు నాతో మాట్లాడు. పెద్దగా అరిస్తే అందరికీ వినపడుతుంది. ఇక్కడేదో జరుగుతుందని పక్కింటి వాళ్ళు పోలీసులకి ఫోన్ చేస్తారు, కామ్ డవున్’ అన్నాను. లోపల నుండి ఏమీ సమాధానం లేదు.

నా సెల్ తో జాన్ సెల్ కి ఫోన్ చేశాను. లోపల ఫోన్ ఎత్తి ‘హలో మమ్, తలుపు తియ్’ అన్నాడు.

‘తీస్తాను బిడ్డా, ఏం జరిగిందో నేను వినాలి కదా! వేరొకరిని చంపేస్తాను – అనే బిడ్డకి నేను జన్మనిచ్చానా!? అని సిగ్గుపడుతున్నాను’ అని భోరున ఏడ్చాను. వాడూ ఏడ్చాడు. ‘పడుకో జాన్, రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం’ అని ఫోన్ పెట్టేశాను.

ఆవేశంతో జాన్ తనని తాను శిక్షించుకుంటాడేమోనన్న భయంతో మెయిన్ డోర్ లాక్ చేసి బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళాను. రాత్రంతా అతని గది కిటికీ లోంచి అతన్నే చూస్తూ వాకింగ్ చేశాను. తలుపు దగ్గరే కార్పెట్ మీద పడి నిద్రపోయాడు జాన్. అప్పటికప్పుడే నా ఫ్రెండ్ శైలజాకి ఫోన్ చేశాను”

“శైలజ!?” అన్నాను.

“అవును మా కాలేజీలో నా తోటి లెక్చరర్, ఇండియనే. నాకు బెస్ట్ ఫ్రెండ్. ఉదయం ఆరుకంతా మా ఇంటికి వచ్చింది. రాగానే గబగబా బ్లాక్ టీ చేసింది. ఇద్దరం టీ తాగుతూ హాలులో కూర్చుని ఉన్నాం. ఎనిమిదవుతుండగా జాన్ లేచి “మమ్!” అని పిలిచాడు తలుపు తడుతూ…

తలుపు తీసి ‘దా జాన్, శైలజ వచ్చింది’ అన్నాను. ఫ్రెషప్ అయి హాల్లోకి వచ్చాడు. శైలజని చూసి చిన్నగా నవ్వాడు. ఆ మాత్రానికే నేను చాలా సంతోషపడ్డాను. భయం పోయింది. మెల్లగా వచ్చి సోఫాలో నన్ను ఆనుకుని కూర్చున్నాడు. శైలజ లేచి జాన్ కి టీ తెచ్చి ఇచ్చింది. అతను టీ తాగిన ఐదు నిమిషాల పాటు శైలజ తన బ్యాగ్ లో నుండి మహర్షి ఫోటో తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయింది.

 

జాన్ టీ తాగి నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని శైలజనే చూడసాగాడు. నేను కూడా శైలజనే చూస్తూ జాన్ తల నిమురుతూ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. కాసేపాగాక శైలజ కళ్ళు తెరిచి జాన్ నే నిశితంగా చూస్తూ నిదానంగా ‘జాన్, ఏం జరిగింది?’ అంది.

శైలజ వేసిన ప్రశ్నకి జాన్ చేతులు ఆవేశంతో వణకడం గమనించాను. శైలజ కూడా గమనించి లేచి తన కుర్చీని మా సోఫాకి దగ్గరగా లాక్కుని జాన్ చేతిని పట్టుకుంది. ఆమె కళ్ళు….” అంటూ మేరీ చెప్పడం ఆపి నా కళ్ళల్లోకి చూసింది. “మీ కళ్ళలాగే శైలజ కళ్ళు కూడా దయని కురిపిస్తుంటాయి” అంది.

నేను మెల్లగా నవ్వి ఆమె తడి కళ్ళల్లోకి చూస్తూ ముందుకు వంగి ఆమె చేతిని పట్టుకున్నాను. దు:ఖాన్ని దిగమింగుకుంటున్నట్లుగా ఆమె గుటకలు మింగింది.

“శైలజగారికి సమాధానం చెప్పాడా?” అన్నాను.

మేరీ చెప్పాడన్నట్లుగా తల ఊపి ‘ఆ బిచ్ నన్ను మోసం చేసింది శైలజా, ఇప్పుడు టీనా బర్గర్ కింగ్ లో పని చేయడం లేదు. రెండు నెలల క్రితం విలేజ్ పాయింట్ అపార్ట్ మెంట్స్ రెంటల్ ఆఫీసులో చేరింది. అక్కడ వాళ్ళ ఆఫీసులోని తన కొలీగ్ తో రిలేషన్ షిప్ పెట్టుకుంది’ అన్నాడు జాన్. అతని గొంతు నిండా కోపం. ఆ కోపం వల్ల మాట తడబడింది.

‘నీకు చెప్పి నిన్ను వద్దన్నాకే అతనితో కలిసి ఉంటోంది కదా, అది మోసం ఎలా అవుతుంది?’ అంది శైలజ.

శైలజకి ఎలా తెలుసా? అన్నట్లుగా గభాల్న లేచి కూర్చుని ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు.

‘రాత్రి మీ అమ్మ నాకు ఫోన్ చేసి నీ పరిస్థితి చెప్పాక నేను టీనాకి ఫోన్ చేసి అన్ని విషయాలూ కనుక్కున్నాను. ఆమె తప్పేమీ లేదు, నీతో రిలేషన్ షిప్ కుదరదని చెప్పే అతని అపార్ట్ మెంట్ కి వెళ్ళిపోయింది కదా!? వెళ్ళి కూడా పది రోజులవుతోంది. ఇప్పుడేంటి నీకింత ఆవేశం – అదీ మర్డర్ చేయాలనేంతగా!? అయినా నీ వయసు ఎంతని? నీ వయసుకి తగ్గ పనులు చేస్తున్నావా నువ్వు? ఆలోచించు’ అంది.

జాన్ ఏమీ మాట్లాడలేదు. చాలా కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే శైలజని ఏమీ అనలేక ‘సారీ’ అని గొణిగాడు.

radha (1)ఇక ఆమె జాన్ ని రొక్కించకుండా అసలేమీ జరగనట్లూ, అంతా మామూలుగానే ఉందన్నట్లూ ‘గెట్ రెడీ మేరీ, కాలేజ్ కి టైమవుతుంది’ అని వంటింట్లోకి వెళ్ళి గబగబా ప్యాన్ కేక్స్ తయారు చేసింది. నేను ఫ్రెషప్ అయి వచ్చేలోపు కొత్తగా రిలీజైన సినిమాల గురించి మాట్లాడుతూ జాన్ కి ప్యాన్ కేక్స్ పెట్టింది. మేమిద్దరం కూడా తినేసి కాలేజీకి వెళ్ళిపోయాము. సాయంత్రం ఆఫీస్ అయ్యాక కౌన్సిలర్ దగ్గరకి వెళ్ళి మాట్లాడాలని, కౌన్సిలర్ దగ్గరకి జాన్ ని తీసుకెళితే మంచిదని అనుకున్నాం.

మధ్యాహ్నం రెండవుతుండగా టీనా నుండి ఫోన్ వచ్చింది.

జాన్ టీనా ఆఫీస్ కి వెళ్ళి ఆమెని కత్తితో పొడవబోయాడట. ఆమె బాయ్ ఫ్రెండ్, జాన్ ని పట్టుకుని లోపల గదిలో కూర్చోపెట్టి కదలకుండా కాపలా కాస్తున్నాడట. అతను పోలీసులకి ఫోన్ చేస్తానంటే టీనా వద్దని ఆపి నాకు ఫోన్ చేస్తున్నట్లు చెప్పింది. నేను, శైలజ ఇద్దరం హడావుడిగా అక్కడికెళ్ళాం. అదృష్టవశాత్తూ జాన్ టీనా మీదికి దూకినప్పుడు ఆమె, ఆమె బాయ్ ఫ్రెండ్ తప్ప ఆఫీసులో ఎవ్వరూ లేరు. నేను అక్కడికి వెళ్ళగానే టీనాని హత్తుకుని ఏడ్చాను. అనేక కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

శైలజ జాన్ ఉన్న లోపలి గదిలోకి వెళ్ళి అతని చేయి పట్టుకుని బయటకి తీసుకు వచ్చింది. జాన్ వంచిన తల పైకెత్త లేదు. నేను ఏడుస్తూ జాన్ ని వాటేసుకుని బయటకి నడిపించాను. శైలజ వెనుకనుండి మా ఇద్దరి భుజాల మీద చేతులు వేసి మాతో పాటు నడుస్తూ వెనక్కి తిరిగి ‘టీనా, నువ్వు ఈరోజు చేసిన సహాయానికి భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. కృతజ్ఞతలు’ అని ‘మీ పేరేమిటో నాకు తెలియదు టీనా మాట విని పోలీసులకి ఫోన్ చేయకుండా ఆగినందుకు మీకు కూడా వందనాలు’ అంది. టీనా కొత్త బాయ్ ఫ్రెండ్ తో శైలజ ఆ మాటలు అంటున్నదని నాకర్థం అయింది. మమ్మల్నిద్దరినీ తన కారులోకి ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది.

ఆ తర్వాత రోజు నుండి నెల రోజులు లాంగ్ లీవ్ తీసుకుని జాన్ కి కౌని్సలింగ్ ఇప్పించాను. ఆ రోజుల్లో శైలజ మాకు చాలా సహాయం చేసింది. రమణ మహర్షి గురించి ఇంగ్లీషులో ఉన్న దాదాపు అన్ని పుస్తకాలూ శైలజ నాకు తెచ్చి పెడితే, నేను జాన్ కి చదివి వినిపించాను.

ఆరోజు…. శైలజే అడిగింది జాన్ ని – ‘జాన్ రమణాశ్రమానికి ఇండియాకి వెళతావా?’ అని.

వెళతాను అన్నట్లుగా జాన్ తల ఊపాడు. నేను, శైలజా ఇద్దరం చాలా సంతోషపడ్డాం. శైలజ అప్పటికప్పుడే తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి అన్ని ఏర్పాట్లూ చేసింది. జాన్ కి ఆశ్రమంలో భోజన సదుపాయం మాత్రమే ఇచ్చారు. అదే చాలు అని ఆశ్రమానికి దగ్గర్లో అద్దె ఇంట్లో జాన్ ఉండేట్లు ఏర్పాట్లు చేసింది.

జాన్ ఇక్కడకి వచ్చి కూడా రెండేళ్ళవుతోంది జానకీ! నేను పోయిన సంవత్సరం వచ్చాను. ఇది రెండో విజిట్. అతనిలో మాత్రం ఏమీ మార్పు లేదు. ఆ ఆవేశం తగ్గించుకుని నా దగ్గరకి వచ్చి మళ్ళీ యూనివర్సిటీలో చేరి చదువు పూర్తి చేసుకోవాలనీ, ఉద్యోగంలో చేరి పెళ్ళి చేసుకుని హాయిగా జీవిస్తే చాలుననీ ఉంది. మహర్షి…. ఆయన బ్లెస్సింగ్స్ నా బిడ్డకి ఎప్పుడిస్తాడో!?” అంది. ఆ మాటలంటున్నప్పుడు కన్నీళ్ళు ఆమె బుగ్గల మీదుగా జారిపోయాయి.

నేను జాన్ తో మాట్లాడుతుంటాననీ, అతని క్షేమ సమాచారాలు వివరంగా మెయిల్ రాస్తానని చెప్పాను. నా మాటలకి ముఖం విప్పార్చుకుని అప్పటికప్పుడే బ్యాగ్ లోంచి తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చింది మేరీ.

 

***

 

ఆ తర్వాత సంవత్సరం పాటు జాన్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజూ జాన్ తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు జాన్ క్షేమ సమాచారాలని మేరీకి తెలియచేస్తున్నాను. శైలజగారు కూడా నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు.

జాన్ లో ఆధ్యాత్మికంగా ఏ మాత్రమూ ఎదుగుదల కనపడటం లేదు. ఉదయం 6.30 కి లేచి ఏడు గంటల బ్రేక్ ఫాస్ట్ కి వస్తాడు. తిన్నాక నేరుగా గదికి వెళ్ళి కాసేపు పడుకుంటాడు. అపార్ట్ మెంట్ సర్వీస్ బాయ్ శీనా వచ్చినప్పుడు లేస్తాడు. ఆ అబ్బాయి రూమ్ ఊడ్చి, బట్టలుతికి వెళ్ళాక స్నానం చేసి ఆశ్రమానికి వచ్చి సమాధి హాల్లో కూర్చుని పూజా కార్యక్రమం చూస్తాడు. 11.30 కి భోజనం చేసి వెళ్ళి మూడు వరకూ నిద్రపోతాడు. మూడుకి లేచి చిన్నగా ఆశ్రమానికి చేరి నాలుగు గంటలకి టీ తాగి బయట కూర్చుని కోతులని, నెమళ్ళని చూస్తూ కాలక్షేపం చేస్తాడు. ఎవరైనా పలకరిస్తే కబుర్లు చెప్తాడు లేకపోతే లేదు. మళ్ళీ హాల్లో కూర్చుని పారాయణం చేస్తుంటే విని ఏడున్నరకి డిన్నర్ చేసి గదికి వెళ్ళిపోతాడు. ఎనిమిది గంటలకి పడుకున్న అతను మళ్ళీ ఉదయం ఆరూ, ఆరున్నరకే లేచేది – ఇదే రోజూ అతని కార్యక్రమం.

ఎప్పుడైనా సాయంకాలం రమణాశ్రమం ఎదురుగ్గా ఉన్న షాపులో టీ తాగుతాడు. కావలసిన వస్తువులు సబ్బులు, పేస్ట్ లాంటివి కొనుక్కుంటాడు – అంతే. ఒక పుస్తకం చదవడమో, ధ్యానం చేసుకోవడమో ఏమీ లేదు. ఇదంతా చూస్తుంటే అతనెందుకు ఇక్కడ ఇలా సమయాన్ని వృథాగా గడుపుతున్నాడో అర్థం కాక బాధ కలుగుతోంది. ఈ విషయాన్ని మేరీకి ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు.

అతన్ని అతని దేశానికి ఎలా పంపాలా అని ఆలోచిస్తున్న నాకు రమణుడే దారి చూపించాడు. ఇలా నేను అనుకున్న తర్వాత రోజు నుంచే కుంభవర్షం. మా ఆర్గనైజేషన్ వాళ్ళు పనిలోకి దిగారు. జాన్ ని వెంటబెట్టుకుని వెళ్ళాను నేను కూడా కొండ మీదికి. పైనుంచి ఎవరో నీళ్ళని బిందెలతో పోస్తున్నట్లుగా వర్షం. ఆ వర్షంలో తడుస్తూనే చెట్లకి పాదులు తీస్తూ, ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా కాలువలను మళ్ళిస్తూ పనులు చేస్తున్న వాళ్ళని జాన్ ఆశ్చర్యంగా చూడసాగాడు.

తర్వాత రోజు కొంతమంది కొండ మీద పని చేస్తారనీ, మరి కొంతమంది ఊళ్ళో లోతట్టు ప్రాంతంలో ఉన్న దినసరి కూలీలకి, వృద్ధులకి భోజన పొట్లాలను పంచడానికి వెళుతున్నారని తెలిసి, జాన్ ని తీసుకుని కావాలనే ఊళ్ళోకి వెళ్ళాను. పొట్లాలను పంచుతున్న జాన్ తో అన్నాను – “చూశావా జాన్ ఎంతో చక్కగా చదువుకునీ, ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ, కడుపు నిండిన వీళ్ళు ఒక వర్గం – తాము ప్రశాంతంగా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నారు – సంతోషం.

ఇక ఈ అభాగ్యులని చూడు. ప్రతి రోజూ కూలి చేస్తే గాని పొట్ట నిండదు వీళ్ళకి పాపం. వీళ్ళొక వర్గం – వాళ్ళూ పని చేసుకుని వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే ఇంకో వర్గం కూడా ఉంది పనీ పాటా లేకుండా పెద్దవాళ్ళు సంపాదిస్తుంటే తిని కూర్చునే వాళ్ళు. వాళ్ళ వల్ల సమాజానికి కీడేగాని ఉపయోగం ఏముంది?” అన్నాను.

జాన్ ఔనన్నట్లుగా తల ఊపుతూ ‘యస్ జానకీ’ అన్నాడు.

వారం రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. అందరం పనులు చేస్తూనే ఉన్నాం. జాన్ లో కూడా హుషారు కనిపించింది. ఎనిమిదో రోజు జాన్ నా గదికి పరిగెత్తుకుంటూ వచ్చి “జానకీ, అమ్మ వస్తోంది ఎల్లుండి” అన్నాడు.

“తెలుసు జాన్, నాక్కూడా ఫోన్ చేసింది” అన్నాను.

 

***

మేరీ వచ్చింది. ఆశ్రమం ఆఫీసు ఎదురుగ్గా పందిరి క్రింద నన్ను హత్తుకుని బోలెడు కృతజ్ఞతలు చెప్పింది. జాన్ మా ప్రక్కనే నిలబడి మమ్మల్నే చూస్తున్నాడు. మేరీ నుండి విడివడి “జాన్, అమ్మని తీసుకుని సాయంత్రం అన్నామలై స్వామి మందిరానికి సాయంత్రం ఐదు గంటలకి రాగలవా? మీతో మాట్లాడాలి” అన్నాను.

“అన్నామలై స్వామి మందిరమా! అదెక్కడ?” అన్నాడు.

“దాదాపు రెండున్నరేళ్ళు అవుతుంది కదా నువ్వు ఇక్కడకి వచ్చి? ఆశ్రమం క్యాంపస్ లోనే ఉన్న ఆ మందిరం ఎక్కడుందో నువ్వే కనుక్కొని, వీలైతే అన్నామలైస్వామి గురించిన పుస్తకం కొనుక్కుని చదువుకుని రా” అన్నాను నవ్వుతూ. నా పెదవులు నవ్వుతున్నాయి కాని నా కళ్ళల్లోని తీక్షణతని గమనించినట్లున్నాడు – అతని ముఖం అప్రసన్నంగా మారింది. నేను పట్టించుకోకుండా మేరీకి పని ఉందని చెప్పి ఆఫీసులోకి వెళ్ళిపోయాను.

 

***

radha (1)సాయంత్రం ఐదయింది. నేను వెళ్ళేప్పటికి జాన్, మేరీ అన్నామలైస్వామి మందిరం ముందున్న వరండాలో కూర్చుని ఉన్నారు. నేను అన్నామలైస్వామి మందిరం తలుపు తీస్తూ “నిత్యకృషీవలుడు అన్నామలైస్వామి రమణుడిని సేవించి రమణుడంతటి వాడయ్యాడు మేరీ” అన్నాను. మేరీ ఆయన ఫోటోను చూస్తూ నమస్కరించింది. ఆయన సమాధి మీదున్న శివలింగానికి కూడా నమస్కరించుకున్నాక డాబా మీదకి తీసుకు వెళ్ళాను. అక్కడకి చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్న కొండని చూపిస్తూ “చూశారా మేరీ, పనే దైవం అని నమ్ముకున్న అన్నామలై స్వామిని రమణుడే కాదు సాక్షాత్తూ ఆ శివుడే దగ్గరగా వచ్చి ఆశీర్వదిస్తున్నట్లుగా లేదూ!?” అన్నాను.

మేరీ అవునన్నట్లుగా తల ఊపుతూ ఆ కొండని నిశ్శబ్దంగా చూడసాగింది.

నేను జాన్ వైపుకి తిరిగి “జాన్, అన్నామలైస్వామి గురించి చదివావా?” అన్నాను.

లేదన్నట్లు తలూపాడు. అతని ముఖంలో ఏమిటీవిడ టీచర్ లాగా ప్రశ్నలు అనుకుంటున్నట్లు అనిపించింది.

నేనదేమీ గమనించనట్లుగా “జాన్, నువ్వేమీ అనుకోనంటే నేను నీకు నీ గురించి చెప్పాలనుకుంటున్నాను” అన్నాను. నా నుండి ఊహించని ఆ సంభాషణకి విస్తుపోయినట్లుగా చూశాడు. మేరీ కూడా నా వైపు ఆశ్చర్యంగా చూసింది.

“నేను నిన్ను పరిశీలించి తెలుసుకున్నదే కాకుండా నీ గురించి ఇక్కడి వాళ్ళు – ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకుని చెప్తున్నాను. అలా అని ఇతరులు చెప్పేదే కరెక్ట్ అని కాదు” అన్నాను.

 

“చెప్పండి” అన్నాడు. ఆసక్తి కనిపించింది అతని గొంతులో.

“నేను చెప్పడం ఎందుకులే జాన్, నాలుగు రోజుల క్రితం నువ్వు అభాగ్యులకి అన్నం పొట్లాలను పంచుతున్నప్పుడు నేను చెప్పిన మూడు వర్గాలలో నువ్వు ఏ వర్గానికి చెందిన వాడివో నువ్వే తెలుసుకోలేదా?” అన్నాను.

అతను గభాల్న నా వైపు చూసి వెంటనే తల వంచుకున్నాడు. మేరీ ఏదో మాట్లాడబోయింది కాని నా కనుసైగతో ఆపేసింది.

“నువ్వు ఒట్టి సోమరివి” అని అతని రెస్పాన్స్ కోసం ఆగాను.

జాన్ వంచిన తల ఎత్తలేదు. మేరీ ఆందోళనగా నన్నే చూస్తోంది. నేను అదేమీ పట్టించుకోకుండా “కాబట్టే మీ అమ్మ చదువుకోమని బ్రతిమలాడుతున్నా చదువుకోకుండా ఏదో చిన్న పనిలో ఇరుక్కున్నావు. నీలో ఏ మాత్రమూ ఎదుగుదల ఉండదని గమనించింది కనుకనే టీనా నిన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆశ్రమంలో ప్రశాంతంగా ఉంటావనీ, మరిన్ని పుస్తకాలు చదువుకుని ‘నిన్ను నీవు’ తెలుసుకుని మీ దేశానికి తిరిగి వెళ్తావని శైలజ గారు నిన్ను ఇక్కడకి పంపారు. కాని నువ్వు ఇక్కడ మరింత సోమరివిగా మారుతున్నావు” అన్నాను.

అతనేమీ మాట్లాడలేదు. అలాగే పిట్టగోడకి ఆనుకుని కూర్చున్నాడు. మేరీ కూడా గబగబా వెళ్ళి అతన్ని ఆనుకుని పక్కనే కూర్చుంది.

“వెళ్ళిపో జాన్, ఇక్కడ నుండి మీ దేశానికి వెళ్ళిపో. మీ అమ్మని ఇంకా బాధపెట్టకు. యూనివర్సిటీలో చేరి చదువుకుని ఉద్యోగం సంపాదించి నీ మొదటి జీతంలో కొంత భాగం మహర్షికి ఇవ్వడానికి ఇక్కడకి రా, సరేనా?” అన్నాను.

కళ్ళెత్తి నన్ను చూస్తున్న అతని కళ్ళు చెమ్మగిల్లడం చూశాను.

అతనికి దగ్గరగా నడిచి “జాన్, ఇలా ఏమీ మొహమాటం లేకుండా ఈ కష్టజీవి అన్నామలై స్వామి మందిరంలో మాత్రమే నీకు చెప్పగలననిపించింది. అందుకే ఇక్కడకి రమ్మన్నాను. చెప్పగలిగాను. ఏమీ అనుకోలేదు కదా!?” అన్నాను.

అతను ఏమీ అనుకోలేదు అన్నట్లుగా తల ఊపాడు.

నేను మేరీ వైపు చూసి “మేరీ, ఇంకా ఎన్నాళ్ళు ఇలా మౌనంగా ఉంటారు? మీ బాధ మీ బిడ్డకి కాక మాలాంటి వాళ్ళకి చెప్పుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి?” అన్నాను.

మేరీ కూడా నిజమేనన్నట్లు తల ఊపింది. కాసేపు అందరం నిశ్శబ్దంగా ఉన్నాక నేనిక అక్కడ ఉండనవసరం లేదనిపించి “బై మేరీ, తర్వాత కలుద్దాం” అంటూ వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మెట్లు దిగి వచ్చేశాను.

 

***

 

 

ఆరోజు మేరీ, జాన్ లు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళేరోజు. మాతృభూతేశ్వరాలయంలో కిటికీకి దగ్గరగా మొదటిసారి జాన్ మేరీని హత్తుకుంటుండగా నేను చూసిన ప్రదేశంలో కూర్చుని ఉన్నాను.

సాయంత్రం నాలుగవుతోంది. సమాధి హాలులో వేదపఠనం కోసం సన్నాహాలు చేస్తున్నారు. చల్లని గాలి పైన తిరుగుతున్న ఫాన్ గాలితో చేరి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఎదురుగ్గా నిలువెత్తు గోడ మీద రమణుడు పులి చర్మం పైన ఆశీనుడై దయామృతం కురిపిస్తున్నాడు. వాకిలికి కుడి వైపు కొంతమంది భక్తులు – అక్కడే ఆశ్రమంలో ఉండేవారు కూర్చుని కుంకుమ, విభూతి పొట్లాలు కడుతున్నారు.

జాన్, మేరీ నన్ను వెతుక్కుంటూ అక్కడకి వచ్చారు. లేచి నిలబడ్డాను. జాన్ “బై జానకీ” అంటూ నాకు షేక్ హాండిచ్చాడు. అతని కళ్ళల్లో సంతోషం తొణికిసలాడుతోంది. లోలోపలి అతని ఉత్సాహపు మెరుపు అతని చేతి ద్వారా నన్ను తాకి అతను ఆనందామృత హృదయుడై ఉన్నాడని కనుగొనగలిగాను.

మేరీ నన్ను ఆప్యాయంగా హత్తుకుంది. కృతజ్ఞతతో ఆమె ఏడుస్తోంది. అప్పుడు జాన్ ఆమెని ఓదార్చినట్లుగా నేను ఆమె వీపుని నిమురుతూనే ఉన్నాను – టాక్సీ డ్రైవర్ వచ్చి “మేడమ్, టైమవుతోంది వెళ్ళాలి” అన్నాడు.

మేరీ విడివడి నాకు నమస్కరించి జాన్ చేయి పట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఇద్దరినీ కిటికీ చువ్వలు పట్టుకుని చూస్తూ నిలబడ్డాను. గేట్ దగ్గరకి వెళ్ళిన జాన్ టాక్సీ స్టాండ్ వైపుకి మలుపు తిరుగుతూ వెనక్కి తిరిగి నవ్వుతూ చెయ్యి ఊపాడు.

నా పెదవులు ఆనందంతో విచ్చుకోగా నేను కూడా చెయ్యి ఊపాను.

 

 

******

 

ఆడం అండ్‌ ఈవ్‌

 

-రమా సరస్వతి

~

 

ramaవెదుక్కుంటోంది… ! ఎప్పుడూ చురుగ్గా కదిలే కళ్లు.. ఇప్పుడు బెరుగ్గా.. కాస్త కలవరంగా కదులుతున్నాయి.  నాకిష్టమైన కదలిక.. నా కోసం! చూసింది.

‘హమ్మయ్య. వచ్చాడు. ముందే చెప్పినట్టు నా కన్నా ముందరే! అదే నవ్వు! మీసాల చాటునుంచి కొంటెతనం ఒలకబోసే చిలిపి నవ్వు! నాకు మాత్రమే అన్నట్టుగా ఉంటుంది! చేయి చాచాను!

‘అందుకున్నాను. కుడివైపు నాలుగో వరుసలో విండో సీట్‌ తనకు ఆఫర్‌ చేశా!

‘సీట్‌లో సర్దుకున్నా. ఆఫీస్‌ నుంచి ఇళ్లకు వెళ్లేప్పుడు సిటీబస్‌లోనూ అంతే..  కుడివైపు నాలుగో వరుస విండో సీటే వెదుకుతాడు. దానికోసం  ఎన్ని బస్‌లు మిస్సవుతాయో! ఆ సీటే ఎందుకు?’

‘నవ్వు తప్ప ఆన్సర్‌లేదు నా దగ్గర. కొన్నింటికి జవాబులు ఉండవు. అదో కంఫర్ట్‌ అంతే! అలా ఓరగా వెళ్లే గాలి  ఆమె ఒంటిని తాకుతూ ఆ తాలూకు పరిమళాన్ని మోసుకుంటూ నా చెంపల్ని చేరుతుంది. గుండెలో గిలిగింతలు పెడుతుంది. మాటిమాటికీ నుదుటి మీద పడే ఆమె జుట్టుతో ఆ టైమ్‌లో గాలి ఆడే సయ్యాటలు ఇంకా ఒయ్యారంగా ఉంటాయి. ఏదో చెప్తుంటుంది. అలా చూస్తూ ఉండడం ఇష్టం!’

‘ఆ చిన్ని తేనే కళ్లలోని సమ్మోహనం..  ఆరాధన… తట్టుకోవడం కష్టం. ఏంటలా? మనమేం టీన్స్‌లో లేం. కనీసం థర్టీస్‌లో కూడా లేం’

‘ఆరాధనకు వయసేంటో స్పందించే మనసు  కావాలి కానీ..!   పెదవులు విడివడకుండా నవ్వుతూ మొహాన్ని కిటికీ వైపు తిప్పేస్తుంది!’

ఇప్పుడు ఎక్కడున్నాం…

బస్‌లో పోచంపాడ్‌ ప్రయాణమవుతూ! చలికాలం మొదలు కదా.. ఆరైనా పూర్తిగా వెలుతురు పర్చుకోలేదు. ‘బస్‌ కుదుపులకు మా భూజాలు రాసుకుంటుంటే బాగుంది.. సైడ్‌నుంచి హగ్‌ చేసుకుంటున్నట్టు’

‘అసలు ఆ హగ్‌ కోసమే కదూ ఈ ప్రయాణానికి ప్లాన్‌చేసింది?’

‘కాదు.. అంతకన్నా విలువైనదానికోసమే!

మళ్లీ కళ్లల్లో చురుకైన కదలిక.. చురకలాంటిది!’

‘ఉత్తినే చూశా! నువ్వేం ఆశిస్తున్నావో నాకు తెలుసు!’

ఈసారి కొంటెనవ్వు నాది!

——————————————–

అదృష్టం.. ఎండ లేదు! మబ్బు పట్టి వాతావరణం ఆహ్లాదంగా ఉంది..

‘ఇంత పొద్దున్నే ఎక్కడికి అని అడగలేదా  అపర్ణ?’

‘రాత్రే చెప్పాను. ఆఫీస్‌ వర్క్‌ మీద ఊరెళ్లాలి. రావడానికి రాత్రి పదకొండవచ్చు అని!’

‘పెళ్లాయ్యాక ఇది ఎన్నో అబద్ధం?’

‘ఇలాంటి అబద్ధం మొదటిదే!’ అని చెప్తున్నప్పుడు నా కళ్లలోకి సూటిగా చూసింది. తర్వాత మెత్తగా చేయి నొక్కింది. ఆ చేయి అలాగే పట్టుకొని ప్రాజెక్ట్‌ బ్రిడ్జ్‌ మీద నడుస్తున్నా…

‘చివరిది కూడా!’ ఈ సారి తను చూశాడు. కళ్లతోనే ఆన్సర్‌చేశాను అవునన్నట్టుగా! మూడ్‌ మారినట్టుంది మొహంలో దిగులు కనిపించింది ఒక్కసారిగా!

‘నేనొకటి అడగనా?’

‘ఒకటి అంటూ స్నేహం గట్టిపడ్డ ఈ మూడు నెలల్లో ఎన్నో అడిగింది. అడుగు అన్నట్టుగా చూశా!’

‘నేనంటే నిజంగా ఇష్టమేనా?’

‘పాత ప్రశ్న, అంతకన్నా పాత ఎక్స్‌ప్రెషన్‌! నిజంగా చాలా ఇష్టం కొత్తగా చెప్పడానికి ట్రై చేశా. కుదర్లేదు.’

‘మరి అపర్ణ అంటే?’

‘ఇష్టమే. అపర్ణ పెద్దవాళ్ల చాయిస్‌!  నువ్వు నా చాయిస్‌’ కన్విన్స్‌ కోసం కాదు నిజమే!

‘తన కన్నా నేను ఏరకంగా ప్రత్యేకం’ నూటొక్కసారి అడిగా!

‘ప్రత్యేకత ఉంటేనే కదా.. ఈ వయసులో నీకు ఎట్రాక్ట్‌ అయింది’ తను ఆశించిన సమాధానం ఇది కాదు.

‘కళ్లలోకి కళ్లు పెట్టి చూశా. ‘ఊ.. అవును.. నిజం’ అన్నట్టుగా తలాడించాడు ఎప్పటిలాగే. నవ్వాను. ‘నీ ఫాంటసీని ఎక్స్‌పీరియెన్స్‌ చేయడం కోసం నన్ను ఇష్టపడుతున్నావా?’

చివ్వున తలెత్తాను. ‘అపర్ణతో నాకు ఎలాంటి అసంతృప్తులు లేవు. స్టిల్‌ వి హావ్‌ దట్‌ రిలేషన్‌..’

‘సారీ.. నాకు మాత్రం ఆ ఎక్స్‌పీరియెన్స్‌  ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. ఐ మీన్‌..’ వివరించలేక ఆగిపోయా!

‘ ఐ గాట్‌ ఇట్‌! పెళ్లయి .. ఇద్దరు పిల్లల తల్లి కోరుకుంటోంది!  ఒక్కసారిగా అపర్ణ మెదిలింది. డజ్‌ షి నో దట్‌? అసలు తను ఎక్స్‌పీరియెన్స్‌ అవుతోందా? ఎప్పుడో పెళ్లయిన కొత్తలో అడిగా.. ఎలా ఉంది అని? ఏ సమాధానమూ చెప్పలేదు. ఎదురుగా తను.. ఆప్యాయంగా హత్తుకోవాలనిపించింది..

టైమ్‌ పన్నెండు

తనకేదో ఎస్‌ఎమ్‌స్‌ వచ్చినట్టుంది బీప్‌ సౌండ్‌ అలర్ట్‌ వినిపించింది.

‘వందన వాళ్లు వెళ్లిపోయారు. వాళ్ల క్వార్టర్‌కి మనం వెళ్లొచ్చు’

raja

Artwork: Raja Sekhar Gudibandi

—————————————

‘పాలకూర పప్పు, వంకాయటమాట కర్రీ చేయనా?’

నవ్వాను…

‘ఓకే. డన్‌. ఫ్రెష్‌ అయి వచ్చేయండి. ఇదిగో ఈ మ్యాగజైన్‌ తిరిగేసే లోపు వంట రెడీ’ అని చెప్తూ వంట గదిలోకి వెళ్లా.

అరగంట గచింది.

‘ఎన్నోసారి తిరగేయడం? వంటింట్లోంచే అరిచా!

‘అయిదో సారి’ సీరియస్‌గా చదువుతూనే సమాధానం ఇచ్చా

‘అయితే మూసేసి వచ్చేయ్‌.. ఘుమఘుమలు రావట్లేదా అక్కడిదాకా?

‘మ్యాగజైన్‌ మూసేసి డైనింగ్‌ హాల్లోకి వెళ్లా. ‘ఊ.. వాసన మాత్రం అదిరింది’ అన్నా ముక్కు ఎగబీలుస్తూ!

‘రుచి కూడా అదుర్స్‌ బాస్‌’ అంటూ రెండు పళ్లాల్లో వంట వడ్డించేశా.

మధ్యాహ్నం రెండు

పెరట్లో మామిడి చెట్టుకొమ్మకు కట్టిన జూలాలో నేను.. నాకు దగ్గరగా ఎదురుగ్గా మోడా మీద తను.. ‘అబ్బా.. కదలకమ్మాయ్‌!’

‘ఇదేం కోరిక బాస్‌.. నా పాదాలకు గోళ్లు తీయాలని?’

‘ఏదో పిచ్చి కోరికలే. ఊ.. ఆ పాదం ఇవ్వు’

‘నేను అడిగింది కూడా ఇవ్వాలి మరి’ అని అంటుంటే నా కుడి పాదం తీసి తన మోకాలు మీద పెట్టుకున్నాడు.

‘ఏంటీ..  నువ్వుకోరుకునే ఎక్స్‌పీరియెన్సా?’ నవ్వాను.

‘ఉడుక్కున్నాను’

‘సరదాకన్నాలే అమ్మాయ్‌’

‘ఇవ్వడమేలాగో తెలిస్తేగా’ నేనూ ఉడికించా.

‘కానీ నాకెక్కడో గుచ్చుకుంది. మళ్లీ అపర్ణ మెదిలింది. తనకూ ఆ కోరిక ఉందా? తీరుతోందా? తీరట్లేదా? నెమ్మదిగా తన పాదాన్ని కిందకు దించాను.

‘సారీ బాస్‌ హర్ట్‌ అయ్యావా? ఐ డింట్‌ మీనిట్‌’

‘ఇట్స్‌ ఓకే. ఇప్పుడు నేనొకటి అడగనా ?’

‘రివర్సా? కన్నుగీటుతూ అన్నా చిలిపిగా.

‘నో సీరియస్‌లీ’

‘హేయ్‌…’ తన భుజం నొక్కాను చిన్నగా.

‘నేను సెల్ఫిష్‌లా కనపడుతున్నానా?’ ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి సూటిగా చూస్తూ అన్నా.

‘ప్చ్‌’ తల అడ్డంగా ఊపా. ‘ఎందుకలా అడుగుతున్నావ్‌?’

‘నువ్‌ డైవోర్సి అని తెలిసీ అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నానేమో…’

నేనేం మాట్లాడలేదు. జూలాలోంచి లేచి నిలబడ్డాను.

నేనూ లేచాను.

అతనికి దగ్గరగా వెళ్లాను.

నా రెండు చేతుల్లోకి తన గుండ్రటి ముఖాన్ని నా కిష్టమైన ఆ మొహాన్ని తీసుకున్నాను.

ఆ స్పర్శ.. కళ్లలో నిండింది. బయటకెళ్లకుండా రెప్పలు మూసి దాచాను..

ఆ క్షణం మాటలొద్దు అనిపించి ఆమె పెదాలకు తాళం వేశాను నా పెదాలతో!

నా చేతులు అతని వీపుని చుట్టేశాయి.. దగ్గరి తనం.. ఇద్దరం ఒక్కటే అన్నంత దగ్గరి తనం… నాకోసం ఓ తోడు ఉంది అన్న భరోసానిచ్చిన దగ్గరి తనం… ఆర్గజాన్ని మించిన అనుభూతేమో!

ఆ భరోసాలో గాలికి కూడా భాగం ఇవ్వద్దన్న స్వార్థంతో ఆమెను నా బాహువులో బందించేశాను. గువ్వలా ఒదిగిపోయింది. ఆమె మెడ వంపులో నా పెదవుల తడి… సడి.. నా ఫాంటసీని నిజం చేశాయి!

లవ్‌ యూ  లేడీ.. లవ్‌ యు టూ మ్యాన్‌

ఈ జ్ఞాపకం చాలు కొత్తగా జీవించడానికి!

—————————-

rajaమళ్లీ ఎప్పుడు? అడిగా బస్‌ దిగి వెళ్లిపోతూ..

తెలీదు అన్నాను..

ఇంక సెలవా? బేలగా అడిగా.

సెలవు లేదు, నాందీ లేదు. అన్నిటినీ కాలానికి వదిలేద్దాం. అదెలా చెప్తే అలా చేద్దాం! అన్నా.

ఈ సారి భరోసా నాకొచ్చింది!

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వంచన

-కృష్ణ వేణి

~

 

 

 

“సుజాతా, ఇవాళ నీకు డే ఆఫ్ అనుకుంటాను. నేను వండినవి పట్టుకొస్తాను. కలిపి లంచ్ చేద్దాం.” మా అపార్ట్‌మెంట్లలోనే ఉండే కుముద ఫోన్.

“రా, రా, తొందరగా వస్తే కబుర్లు చెప్పుకోవచ్చు.“- ప్లేట్లూ, వంటకాలూ డైనింగ్ టేబిల్ మీద సర్దాను.

అరగంటలో కాసరోల్స్‌లో తను చేసినవి పట్టుకొచ్చింది. రాగానే, ‘కూర్చోడానికి ఓపిక లేదంటూ’ గెస్టు బెడ్రూమ్‌లోకి వచ్చి మంచంమీద వాలింది.

“ఈ మధ్య నల్లపూసయిపోయావే! కోడల్ని కూడా అభీ దగ్గరికి పంపించేశావు. నీ స్టూడియోలో ఏవో రిపెయిర్లు జరుగుతున్నాయని అక్కడికి కూడా వెళ్ళడం లేదని విన్నాను!”- అడిగాను.

కుముద స్కల్ప్టర్. ఢిల్లీలో ఘడీ అన్న ప్రాంతంలో ఉన్న అనేకమైన స్టూడియోల్లో ఒకదాన్లో తన ఫర్నస్ ఉంది. అక్కడ శిల్పాలు చెక్కి, వాటిని ఎక్జిబిషన్లలో మంచి ధరలకి అమ్ముతుంది. పది నెలల కిందట, సిడ్నీలో ఉండే తన కొడుకు అభిమన్యుకి దీపికతో పెళ్ళి చేసింది. అప్పుడు నాకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకి టెంపరరీ పోస్టింగ్ అయి ఉండటం వల్ల, పెళ్ళి అటెండ్ అవలేకపోయాను.

“ఇంకేం కోడలు! నీకు తెలియదా?” డగ్గుత్తికగా వచ్చాయి మాటలు.

నాకు తెలిసినదల్లా, పెళ్ళవగానే దీపిక రెండు నెలలు టూరిస్ట్ వీసాతో అభీతో పాటు సిడ్నీ వెళ్ళిందనీ, స్పౌస్ వీసా కోసం అప్లై చేయడానికి తిరిగి అత్తగారింటికి వచ్చి… అయిదో ఆరో నెల్లుందనీ, ఆ తరువాత  వీసా దొరికి, సిడ్నీ వెళ్ళిందన్నది మాత్రమే. అదీ ఇరుగూపొరుగూ చెప్పిన మాటల బట్టే.

సగం మాటలు మింగుతూ, కళ్ళనుంచి నీళ్ళు చిప్పిల్లుతుంటే ముక్కు ఎగపీలుస్తూ, టిష్యూ బాక్సుని ఖాళీ చేస్తూ చెప్పడం ప్రారంభించింది సంగతేమిటో. వింటుంటే, నా విస్మయం అంచెలంచెలుగా పెరుగుతోంది. మధ్యమధ్య నేను వ్యక్తపరుస్తున్న సందేహాలకి సమాధానాలు ఎలాగో దక్కలేదు కనుక, ఇది పూర్తిగా కుముద కథనమే.

***

పెళ్ళయిన మూడో రోజే, అభీ దీపికని తనతోపాటు తీసుకెళ్ళాడు. నెల రోజులు కాలేదు, ఫిర్యాదులు మొదలుపెట్టడానికి. “అమ్మా- నువ్వూ, పిన్నీ కలిపి షాదీకాంలో వివరాలు భూతద్దంలో చూసి మరీ పిల్లని చూడటానికి వెళ్ళేరు. అమ్మాయి ఫిసియో థెరపిస్టన్నారు. సరే, మంచిదే. ఈ అమ్మాయికి మొహమంతా జుట్టే. అది మాత్రం కనపడలేదా?“

“వీడికేదో చాదస్థం! దీపిక ఎంత వాక్సింగ్ అవీ చేయించుకున్నాకానీ ఆడవాళ్ళం తెలుసుకోలేకపోతామా ఏమిటీ!”- మనస్సులోనే విసుక్కున్నాను. బయటకనలేదు.
అక్కడ ఆ అమ్మాయి ఉన్నన్నాళ్ళూ రోజుకో ఫిర్యాదు.

“సర్లే, కొత్తగా పెళ్ళయిన జంటలకి సర్దుకుపోయేటందుకు టైమ్ పట్టడం సహజం.”- నాకు నేనే సర్దిచెప్పుకున్నాను.

ఆ తరువాత స్పౌస్ వీసా కోసమని ఇక్కడికి వచ్చిందా! ఎయిర్‌పోర్టులో తనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, ట్రాలీ తోసుకుంటూ బయటకి వస్తూ ఉన్న దీపికని చూడగానే, అభీ అతిశయోక్తులేమీ చెప్పలేదనిపించింది. కొత్తగా పెళ్ళయిన గుర్తుగా రెండు చేతులకీ ఎర్రగాజులూ, పాపిట్లో సింధూరం, మంగళసూత్రం, నల్లపూసలూ. వాటన్నిటికీ మించి, కొట్టొస్తున్నట్టు మొహం మీద కనిపిస్తున్న  వెంట్రుకలు. మరి అక్కడ ఈ అమ్మాయికి కొత్త కనుక బ్యూటీ పార్లర్లెక్కడున్నాయో తెలుసుకోలేకపోయిందో, ఏమిటో!

మర్నాడు దీపికని లేసర్ సెంటరుకి తీసుకు వెళ్ళాను పర్మనెంటు హెయిర్ రిమూవల్ కోసం. మూడు సిట్టింగులో ఏవో కావాలంది అక్కడున్న పిల్ల డాక్టర్.

తనిక్కడ ఉన్న ఆరు నెల్లూ ‘కొత్త కోడలు’ కదా అని ఏ పనీ చేయనీయలేదు. కూతుళ్ళు లేని లోటు  తీర్చిందనుకున్నాను. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరితో ఎంత కలివిడిగా ఉండేదో! కానీ ఒకటే ఆశ్చర్యం. అభీ, తనూ నా ఎదురుగా- ఫోన్లో కానీ, ఆన్లైన్లో కానీ మాట్లాడుకోగా, ఒక్కసారీ చూడలేదు.

ట్రీట్మెంటు పూర్తయింది. దీపిక మొహమూ, చెంపలూ నున్నగా అయాయి. మధ్యలో ఒక నెల పుట్టింటికి వెళ్ళొచ్చి, తిరిగి సిడ్నీ ప్రయాణానికి సిద్ధం అయింది.

వెళ్ళి అయిదు నెలలవలేదు. ఒక మధ్యాహ్నం అభీ ఫోన్. “అమ్మా, స్కైప్‌ చాటుకి రా. అర్జెంటు. మంచి నీళ్ళు కూడా పక్కన పెట్టుకో.“ అన్నాడు. మనస్సు కీడు శంకించింది.

మానిటర్ మీద కనబడిన వాడి మొహం చూస్తే భయం వేసింది. చెంపలు పీక్కుపోయి, నిద్రాహారాలు మానేసిన మనిషిలా ఉన్నాడు.

Kadha-Saranga-2-300x268

“అమ్మా, ఇన్నాళ్ళూ నీ మనసెందుకు పాడు చేయాలని ఏదో మామూలుగానే కబుర్లు చెప్తున్నాను కానీ, నీ ముద్దుల కోడలుందే! ఎవడితోనో లేచిపోయింది.” నాకు పొలమారింది.

నా మొహం చూస్తూ కొనసాగించేడు. “ఇక్కడ ఉద్యోగం దొరకాలంటే, ఫిసియోథెరపీ పరీక్షలకి తనెలాగో మళ్ళీ ఆరునెల్లు ప్రిపేర్ అవాలి కదా! అప్పటివరకూ ఇంట్లో బోర్ కొడుతోందంటే, ‘పోనీ బయటకి వెళ్ళి వస్తూంటే, తనకీ కాలక్షేపం అవుతుంది.’ అనుకుని, నాకు తెలిసిన ఒక ఇండియన్ స్టోరులో ఉద్యోగం ఇప్పించాను. అక్కడెవరితోనో పరిచయం పెంచుకుని, అతనితో సంబంధం పెట్టుకున్నట్టుంది. అనుమానం వేసి, ఇక్కడ స్థిరపడిన ఒక ఇండియన్ లాయరుంటే, అతనితో చెప్పి దీపికమీద 12 గంటల సర్వెలెన్స్ పెట్టించాను.

నల్లద్దాలున్న కారులో గంటలకొద్దీ వాళ్ళ తిరుగుళ్ళూ, వాటి గురించి ఆయన నాకు పంపించిన వీడియోలూ చూపిస్తే, నువ్వు తట్టుకోలేవు. నాకు నైట్ షిఫ్టులున్నప్పుడు, ఇద్దరూ కలిపి, నా ఇంట్లోనే చాలాసార్లు గడిపారు.

‘ఒకే చూరు కింద ఇద్దరం కలిపి ఉంటే విడాకులు దొరకడం కష్టం’ అన్న లాయరు సలహా ప్రకారం, ఆ వీడియోలు దీపికకి చూపించి, డైవొర్స్ కోసం అప్లై చేస్తున్నానని, నేను మెల్బోర్న్ వెళ్తున్నాననీ, తిరిగి వచ్చేలోపల ఇల్లు విడిచిపెట్టమని చెప్పి వెళ్ళిపోయాను.

నేను తిరిగి వచ్చేటప్పటికి నల్లపూసలూ, మంగళ సూత్రం మాత్రం మంచం మీద పడున్నాయి. తన సామానంతా తీసుకుపోయింది. స్పౌస్ వీసా రద్దు చేయమని ఎంబసీలో అప్లికేషన్ పెట్టేను. దేవుడిని ప్రార్థించు- నాకీ పీడ తప్పాలని.“ అన్నాడు.”
కాళ్ళూ చేతులూ ఆడలేదు నాకు.

***

కుముద స్వగతం పూర్తయినట్టుంది.

నాకు కొత్తేమీ కాదు ఈ తల్లీ కొడుకుల బంధం. అయిదో క్లాసులో ఉన్నప్పుడో ఎప్పుడో, ఒకసారి స్కూల్ మానేస్తానని ఒకే ఒక ముక్కన్నాడో లేదో, ఆ పూర్తి సంవత్సరం కొడుకుని ఇంట్లో కూర్చోపెట్టింది.

పిల్లలు ఆటలు ఆడుకుంటున్నప్పుడు కొడుకు ఓడిపోయినా, పిల్లలు తన్ని ఏడిపించినా కానీ కుముద మధ్యలో దూరి, అభీని వెనకేసుకు వచ్చి మిగతా పిల్లలని చెరిగేసేది. వాళ్ళ తల్లులు వచ్చి తమ పిల్లలని ఇంట్లోకి లాక్కోపోయేవారు, తన నోట్లో నోరు పెట్టడం ఇష్టం లేక.
‘ ఇవన్నీ గుర్తుకొస్తున్నాయేమిటి నాకు!’ నన్ను నేను మందలించుకున్నాను.
“పోనీలెద్దూ, అలాంటి పిల్ల మీ జీవితాల్లోంచి బయట పడటమూ ఒకందుకు మంచిదే. సంతోషించు.” ఊరడింపుగా అన్నాను- పీక్కు పోయిన మొహంతో దిండుకానుకుని కూర్చున్న తనతో.

వంటకాలు వేడిచేసి, డైనింగ్ టేబిల్ మీద పెట్టి కుముదని పిలిచాను.

***

నెలయింది. నా చిన్ననాటి స్నేహితురాలు నీరజనుంచి ఫోన్ వచ్చింది. కొడుకు పెళ్ళిట. తనకీ నాకూ కూడా క్లాస్‌మేటయిన తన భర్త రాజారాం యుఎన్ లో పని చేస్తాడు. సిడ్నీలో ఉన్న Women’s Empowerment సెల్‌కి రిలొకేట్ అయాడు. వధువు కుటుంబం చాలాకాలంగా అక్కడే స్థిరపడినది. ఈ వివరాలన్నీ చెప్పి, “పెళ్ళికి రాకపోయేవంటే చూసుకో మరి.”- బెదిరించింది.

పెళ్ళికీ, మిగతా ఫంక్షన్లకీ వేసుకునే బట్టలూ అవీ సర్ది పెట్టుకున్నాను. ఇలా వెళ్తున్నానని చెప్పి, అభీ నంబర్ అడుగుదామని కుముదకి ఫోన్ చేస్తే, ఆ అవకాశం ఇవ్వకుండానే ‘తన బాబాయి పరిస్థితి బాగాలేదనీ, తను కూడా ఆయనతోపాటు హాస్పిటల్లో ఉంది కాబట్టి మాట్లాడ్డానికి వీలవదనీ’ చెప్పింది. నేనింకా ఆఫీస్‌లో లీవ్ అప్లికేషనూ ఇవ్వలేదు, టికెట్టూ సాంక్షన్ చేయించుకోలేదు. ‘సరే, వెళ్ళిన తరువాత ఫోన్ చేసి కనుక్కుందాంలే’ అనుకుని ఊరుకున్నాను.

***

నేను చేరేప్పటికే పెళ్ళి హడావిడి మొదలయింది. నేను వెళ్ళిన మూడో రోజు- పెళ్ళి జరుగుతుండగా, హాల్ లోపలకి రాబోతూ నన్ను చూసి గభాల్న వెనక్కి తిరిగి కంగారుగా, వడివడిగా వెళ్ళిపోతున్న అభిమన్యుని చూశాను. “అభీ, ఆగు”-గొంతు పెద్దగా చేసి అరుస్తున్న నన్ను వింతగా చూస్తున్నవాళ్ళని పట్టించుకోకుండా లేచి, ఒక్కంగలో ఆ అబ్బాయిని సమీపించేను.

తన మొహంలో బెదురా! భయమా!- అర్థం అవలేదు.

“రా, లోపలికి. వెళ్ళిపోతున్నావేం? వరుడి తరఫునా? వధువు తరఫునా!” అడిగాను.

“ నా స్నేహితుడు ఇక్కడ కలుసుకుంటానంటే వచ్చానంతే ఆంటీ. అతను కనిపించలేదు. అందుకనే…”-అడిగిన ప్రశ్నకి జవాబివ్వకుండా నసుగుతున్నాడు. దించిన తల ఎత్తలేదు.

“ఇంతకీ దీపిక ఎక్కడుందిప్పుడు? ఇండియా వెళ్ళిపోయిందా?” కూపీ లాగుతున్నానా!

“ఏమో, తెలియదాంటీ. తను ఇంటిని వదిలిపెట్టేక, తన సంగతులేవీ తెలియవు.” పక్కచూపులు చూస్తున్నాడు. ఎక్కడో, ఏదో-సందేహం తొలిచివేస్తోంది నన్ను.

“సరే, నీ ఎడ్రెసివ్వు. ఫోన్ నంబర్ కూడా ఇచ్చి వెళ్ళు. కుదిరితే ఇంటికి వస్తాను. ఫోన్ మాత్రం చేస్తాను. నా లోకల్ నంబర్ సేవ్ చేసుకో.”-చెప్పాను.

“ఇల్లు మారుతున్నాను ఆంటీ.”- తన ఫోన్ నంబర్ మాత్రం ఇచ్చాడు.

story1 (1)పెళ్ళి సందడి పూర్తయింది. కొత్తగా పెళ్ళయిన జంట హనీమూన్‌కి వెళ్ళారు. నాలుగు రోజులుగా అభీ నంబర్‌కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఎవరో ఆస్సీ యాసతో “సారీ, రాంగ్ నంబర్ “ అంటూ పెట్టేస్తున్నారు.

మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు, రాజారాంకి చెప్పాను జరిగిన సంగతులన్నీ. “ఇటివ్వు ఆ నంబర్. నేను కనుక్కుంటాను”- నోట్ చేసుకుని, పక్కగదిలోకి వెళ్ళి ఎవరితోనో మాట్లాడి వచ్చాడు.

“సుజాతా, ఆ ఫోన్ నంబర్ ఇక్కడే ఎవరి పేరు మీదో రెజిస్టర్ అయి ఉంది. ముందు నువ్వు వాళ్ళమ్మతో మాట్లాడి, ఆ అబ్బాయి అసలు నంబరూ, చిరునామా కనుక్కోగలిస్తే మంచిదే. ఏదో తిరకాసుగా ఉంది ఈ వ్యవహారమంతా. వాళ్ళమ్మ మొబైలుకి ఫోన్ చేయకు. ఎక్కడినుంచి చేస్తున్నావో తెలుస్తుంది. వాళ్ళ లాండ్ లైన్ నంబరుకి కాలర్ ఐడి కానీ ఉందా? ఉంటే కనుక ఇంకేదైనా ఆలోచిద్దాం.”-హడావిడిగా ప్రశ్నలడుగుతూ, సలహాలిచ్చేస్తున్నాడు.

“ఊహూ, కాలర్ ఐడి లేదు. నాకు తెలుసు.”- గుర్తున్న ఎనిమిదంకెల నంబరూ చెప్పాను.

ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి, కుముద ఫోన్ నంబర్లిచ్చాడు. ఆస్ట్రేలియన్ ఎంబసీకీ, పోలీసులకీ ఫోన్లు చేసి మాట్లాడేడు. అభీ చిరునామా తెలియడానికి ఎక్కువసేపు పట్టలేదు. అరగంటలో ఇద్దరు పోలీసులు- ఒక మగా, ఒక ఆడా… ఆరెంజ్ రంగు చార ఉండి, ‘పోలీస్“ అన్న పెద్దక్షరాలు రాసున్న తెల్లటి కార్లో వచ్చేరు.

“నీరజా, సుజాతా, వెళ్దాం పదండి.” అని రాజారాం అనగానే, మేమిద్దరిమీ కూడా కారెక్కేం. ఆఫీస్ అవర్స్ కనుక ఆ అబ్బాయింట్లో ఉండి ఉండడు. మరక్కడికి వెళ్ళి చేసేదేమిటో అర్థం కాలేదు.

అపార్టుమెంటు రెండో అంతస్థులో ఉంది. మగ పోలీస్ పైకెక్కి డోర్ బెల్ నొక్కి, కిందకొచ్చి ‘ఎవరూ తలుపు తీయలేదని’ చెప్పాడు. పైనున్న ఒక కిటికీ వైపు వేలుపెట్టి చూపించింది ఆడ పోలీస్. దానికి అద్దానికి బదులుగా ఇనపరేకో, ఏదో బిగించి ఉంది. స్పష్టంగా కనిపించలేదు. రోడ్డువైపు కనిపిస్తున్న మిగతా రెండు కిటికీలకీ కర్టెన్లు వేళ్ళాడుతున్నాయి.

అందరం పైకెళ్ళేం. “పోలీసులమి. తలుపు తెరవండి.“ గట్టిగా అరిచారు. తన పెదాలమీద వేలు పెట్టి ‘శబ్దం చేయొద్దు’ అన్న సౌంజ్ఞ చేశాడు పోలీసు.
“మేము తలుపు బద్దలు కొడుతున్నాం” బిగ్గరగా చెప్తూ, మూడు వరకూ లెక్కపెట్టి కీహోల్ మీద పేల్చాడు.

గుండె దడదడలాడుతుంటే, దేవుడిని స్మరించుకుని నేనూ వాళ్ళ వెంట లోపలికి వెళ్ళాను. ఇల్లంతా ఖాళీ. ఒక గది తలుపు మీద మాత్రం డెడ్ బోల్ట్& లాచ్ మీద పెద్ద ఇండియన్ తాళం కప్ప వేళ్ళాడుతోంది. లోపలనుంచి లీలగా ఏదో చప్పుడు. దాన్నీ తెరిచి లోపలకి ప్రవేశించారు పోలీసులూ, వాళ్ళతోపాటుగా రాజారామూ.

వాళ్ళ వెనక ఉన్న నేను, గదిలో ఉన్న దీపికని చూసి నిశ్చేష్టురాలినయాను. తన నోటికి ప్లాస్టర్ వేసుంది. నైటీ వేసుకుని, మంచంమీద వెనక్కి వాలి కూర్చునుంది. కాళ్ళకీ, చేతులకీ ఇనుప గొలుసులు తగిలించి ఉన్నాయి. వాష్‌రూముకి వెళ్ళగలిసేటంత పొడుగు మాత్రమే ఉన్నాయవి. వినబడినది వాటి చప్పుడే అని అర్థం అయింది. అవి మంచం చుట్టూ చుట్టి ఉండి, వాటికో తాళం వేసుంది. దీపిక నుదిటిమీదా, చెంపలమీదా పెరిగి ఉన్న వెంట్రుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆడ పోలీసు అమ్మాయిని గొలుసులనుంచి విడిపించింది.
“ఈ కుర్రాడు మనిషా, రాక్షసుడా! వదలను వీడిని.”- రాజారాం పళ్ళు పటపటలాడిస్తున్నాడు.

వెతికితే, దీపిక పాస్‌పోర్ట్ వార్డ్‌రోబ్ పైనున్న సూట్‌కేసులో కనిపించింది. అది తీసుకుని, తనని నీరజ వాళ్ళింటికి తీసుకువచ్చాం. “ఇంత జరిగాక ఇంకేం జాగత్త!”- అనుకుంటూ, కుముదకి ఫోన్ చేశాను. “ఈ నంబర్ పని చేయడం లేదు” అన్న రికార్డెడ్ మెసేజి తప్ప, ఎవరూ ఫోనెత్తలేదు.

డాక్టర్ని పిలిపించింది నీరజ. డాక్టర్ వచ్చి గది తలుపులు మూసింది. కొంతసేపటి తరువాత తలుపులు తెరిచి, నీరజనీ నన్నూ లోపలికి పిలిచింది. దీపిక వేసుకుని ఉన్న బట్టలు పైకెత్తి, చూడమన్నట్టుగా జాలి నిండిన కళ్లతో సైగ చేసింది. చూస్తే సోడొమీ జరుగుతున్న సూచనలు. చూడలేక కళ్ళు పక్కకి తిప్పుకున్నాను. శారీరికంగా అయితే, దీపిక వారంలో కోలుకుంది.

***

ఇంకో వారం తరువాత, నేను వెళ్ళే ఫ్లైటుకే తనకీ టికెట్టు కొంటున్నానని రాజారాంకి చెప్తే, “తను అభీమీద కేసు పెట్టాననీ, దీపిక ఇక్కడే ఉండటం అవసరమనీ” వాదించాడు. పిచ్చి చూపులు చూస్తూ, ‘వద్దు వద్దంటూ’ భయభయంగా తల అడ్డంగా ఆడించిందా అమ్మాయి. నాతోపాటే ఫ్లైటెక్కింది.

“పెళ్ళయిన కొత్తల్లో కూడా సిడ్నీ వెళ్ళి, రెండునెల్లున్నావుగా? అభీ సెక్సువల్ ప్రెఫెరెన్స్ గురించి తెలిసీ, తిరిగి వెనక్కెందుకు వెళ్ళావు?”- తను నిమ్మళంగా ఉన్న సమయం చూసి అడిగాను.

“లేదాంటీ, అప్పుడంతా సరిగ్గానే ఉండేది. అప్పుడప్పుడూ మాత్రం తన స్నేహితుడెవరింటికో వెళ్ళి రాత్రికక్కడే ఉంటాననీ, తన కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి నిద్రపొమ్మని చెప్పేవాడు. నేను తిరిగి వచ్చే రెండ్రోజుల ముందు షాపింగ్ చేసుకోడానికి వెళ్తూ, పర్స్ తీసుకువెళ్ళడం మరచిపోయాను. వెనక్కి వెళ్తే, ఒకతనెవరో మా ఇంట్లో షార్ట్స్ వేసుకుని ఛాతీ మీదేదీ లేకుండా సోఫాలో అభీమీద ఆనుకుని కూర్చుని, అభీ వేళ్ళతో  ఆడుకుంటూ, జుత్తు చెరుపుతూ అల్లరి చేస్తున్నాడు. మురిపెంగా నవ్వుతున్న అభీ నన్ను చూసి తత్తర పడ్డాడు. సందేహంగా చూస్తే, ‘నా దగ్గిర స్నేహితుడేలే‘ అంటూ కొట్టిపారేశాడు.
అప్పుడే అర్థం అవాల్సింది నాకు.

రెండోసారి వచ్చిన మొదటి వారంలోనే, ఈ నరకం మొదలయినది.” అంది బేలగా.

ఏమనడానికీ నోరు రాలేదు నాకు.

***
టాక్సీలో దీపికని వాళ్ళమ్మ ఇంటి బయటే దించి, ఆవిడని పలకరించడానికి కూడా మొహం చెల్లక, ఇంటిదారి పట్టాను.

మా ఇంటి మెట్లెక్కకుండా, గేటువద్దే సామాను వదిలి అక్కడున్న ఇంటర్‌కామ్లోనుంచి కుముద ఇంటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తలేదు.

“కుముదకేనా? లక్నోలో పెద్ద అసైన్‌మెంటేదో దొరికిందిటగా! ట్రక్కులో సామానేసుకుని వెళ్ళి పదిరోజుల పైనయింది. తెలియదా నీకూ?” గేటు పక్కనే ఇల్లున్న శారదా ఆంటీ బయట వరాండాలో కూర్చుని, తన కీళ్ళ నొప్పులకని పనిపిల్ల చేత కాళ్ళు పట్టించుకుంటూ, దీర్ఘాలు తీసింది.

ఆశ్చర్యం ఎందుకు వేయలేదా అన్న ఆశ్చర్యం మాత్రం కలిగిందంతే.

ఎదురుగా వస్తున్న మా వంటబ్బాయికి, “ సామానింట్లోకి పట్రా”- చెప్తూ మా మెట్లెక్కేను.

*

 

 

 

 

 

 

 

 

 

 

peepal-leaves-2013

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గజ్జెల పొంగు 

 

-బ‌త్తుల ప్ర‌సాద్
~

prasadమానాయన దానంమామ పెద్ద శింత శెట్టు కింద కూకోని ఉండిరి… మా నాయన నుల‌క పేనుతా ఉంటే దానం మామ మాత్రం బీడీ ముట్టిచ్చుకోని దాని పొగ పెరుకుతా ఉండాడు. బీడి పొగను గుండె కాడికి పీకి దాన్ని అప్పుడింత ఇప్పుడింత బయటకు ఇడుచ్చా మా నాయన్ను చూసి మామా నువ్వు నుక బో పేనుతావు లేబ్బా అన్నాడు.దానికి మా నాయన ఊరుకోకుండా ఏదో శెతురు మాట వేసినాడు.

అప్పుటికే బీడి పొగ గుండెల్లోకి లాగి ఉన్నె దానం మామకు పొరపోయింది. దాంతో నవ్వడం దగ్గడం తిరుక్కున్నెడు కాసేపటికి దగ్గి దగ్గి ఊపిరి పీల్చుకోని  నీ యెక్క నీ నోట్లో నోరు పెట్టగుడ్దు మామ ….అని ఆరిపోయిన బీడీని మల్లీ ఎలిగిచ్చి ఓ రెండు దమ్ములు కొట్టి నేల‌ మీద ఎంగిలి ఊసి ఆ ఎంగిట్లో బీడీని ఆర్పినాడు.మా నాయన మాత్రం ముసి ముసి నవ్వు నవ్వుకుంటా అదే పని శేచ్చాన్నాడు.

దానం మామ మా నాయనతో  ‘కాదు మామా దీనెక్క కూరాకు తినక శానా దినాు కాలా’ అన్నాడు దానికి మా నాయన అవునోయి ఈ మధ్యన ఎవురు గాని పల్లెల్లో కోయక పోయిరి నాగ్గూడా నాలిక పీకుతాంది అన్నాడు..

ఇట్ట మాట్లాడుకుంటా ఉండగానే ఆ దావన పక్క పల్లె వాళ్ళు  ఒక జీవాన్ని తోలు కోని పోతాంటే .. దానం మామ మా నాయనతో ‘ మామా ఆ జీవం దానికే ఉన్నెట్టు ఉందే’ అన్నాడు. దానికి మా నాయన ‘అవును దాన్ని సూచ్చాంటే అట్టనే ఉంది’ అన్నాడు.. దాంతో దానం మామ ‘ఓబ్బి ఆగండ్రి’ అని వాల్ల‌ను  అనేర్కల్లా వాళ్ళు  ఆగినారు.

దానం మామ నాలుగు అంగల్లో ఆడికి చేరుకోని వారితో యవ్వారం మొదు పెట్టి నాడు. ఇంత లోపల‌ మా నాయన నుల‌క పేనడం పక్కన పెట్టి తుండు గుడ్డ ఇదిలిచ్చు కుంటా వాళ్ళ కాడికి పోయినాడు. మా నాయన పోయార్కనే దానం మామ వాల్ల‌తో  అసలు విషయం కనుక్కోని .. మాకు అమ్మి పోండి అని అడుగుతాంటే .. మేము మారు బేరం చేసే వాల్లం  కాదు .. మేము కూడా కోసుకోని తినడానికే తీసక పోతాండాము అన్నారు. మా నాయన్ను ఆ మనుషు గుర్తు పట్టి నారు .. ఏమయ్యా బాగుండావా అన్నారు.. సరే మా నాయన కూడా వాళ్ళ‌తో  మాటు కలిపినాడు.. ఇంగ అందరూ అసు విషయానికి వచ్చినారు.. జీవాన్ని ఇయ్యడానికి వాళ్ళు  ఒప్పుకున్నారు గాని లెక్క కాడనే   మధ్యన వంద రూపాయలు  వారా  వచ్చింది. అట్టిట్ట చేసి బేరం యాభై రూపాయల‌ వారాతో కుదుర్చుకున్నారు.

దాంతో జీవాన్ని తీసకచ్చి మా ఇంటి పక్కన ఉండే  గురువు (పాస్టరయ్య) ఇంటి ఎనకా ఆడోళ్ళు  కక్కసుకు పొయ్యే దారిలో ఉండే యాపమాను ఏరుకు కట్టేసినారు.

మా నాయన బకెటలో కడుగు నీళ్ళు  తీసకచ్చి పోసినాడు …దానం మామ యాడిదో ఇంత వరిగడ్డి తీసకచ్చి వేసినాడు. అది ఎప్పుడు తిన్నెదో ఏమో గాని శానా ఆత్రంగా గడ్డి తిని కడుగు నీళ్ళు  తాగింది.

మా నాయన దానం మామ ఇద్దరూ జీవం ఎనకాల‌ పక్క నిబడుకోని దాని ఎనక కాల‌ తిట్టు చూసి దాని కూరాకు ఎన్ని పడ్లు  పడతాదో లెక్క చెయ్యడం తిరుక్కుండిరి. ఆ జీవం కొన్న రేటును బట్టి అది ఎంత కూరాకు పడతదో దాన్ని బట్టి కుప్ప ఎంత రేటుకు అమ్మాలి అనేది .. ఒక రేటు పెట్టుకుంటారు. మా నాయన దానం మామ ఇద్దరూ కాసేపు అట్టిట్ట మాట్లాడు కోని ఒక రేటు అనుకుండిరి. ఇది ఎట్ట లేదన్నా కూడా యాభై పడుల‌కు పైగా అరవై పడుకు లోపల‌ పడ్తది అనుకుండిరి.

రేపు ఎవరికి ఎన్ని కువ్వలు  కావాలో అడగడానికి పట్టీ కడదాము అనుకునిరి.. పోయిన తూరి ఇట్టనే కూరాకు కోసినప్పుడు  మల్లిచ్చలే అని రెండు కువ్వలు  తీసక పొయి ఆ లెక్క కోసం శానా సార్లు తిప్పిన ఫలానా మనిషిని తప్ప అందరినీ అడుగుదామనుకునిరి.

ఆ రోజు శనివారం తెల్లార్తే ఆదివారం… మల్లారోజు పండగ సందడి …జీవం వచ్చిందాన శనివారం నుండే తిరుక్కున్నెది. కక్కసుకు పొయ్యే ఆడ్లోళ్ళు ఆ దోవన పోతా ఆడ కట్టేసి ఉన్న జీవాన్ని చూసి ఓహో రేపు తెల్లారే సరికల్లా శియ్యలు ఇండ్లకు వచ్చాయన్న మాట అనుకుంటా పోయిరి.

కాలేజీలు  సదువుకుంటా సెల‌వుకు ఇండ్లకు వచ్చిన ఎడ్మాస్టర్‌ కూతురు. గురువు కూతురు ఇద్దరూ ఆ జీవం కాడ నిబడి దాన్ని చూసి ‘అయ్యోదీన్ని కోస్తారా ’ అని ఒక్కరవ్వ ఎచ్చల‌ తనం చూపిస్తా ఉంటే …ఈ మాటలు ఇన్నె మా సంతోష శిన్నమ్మ ..‘ఏమ్మామీరు తినరా’ అని అడిగింది.. ఆ శిన్నమ్మ వాళ్ళ ఇండ్లల్లో పని శేచ్చాది కాబట్టి వీళ్ళు తినేది తినంది ఆమెకు తెలుసు.. ‘ ఆ తింటాములే’ అనిరి.. మరి తినేప్పుడు దాన్ని జూసి అట్ట అనుగుడ్దు ..దేవుడు కొన్నింటిని మన జాతి వాల్ల‌కు  తినడానికే పుట్టిచ్చినాడు…మన జాతి వాళ్ళు  తర తరాుగా వీటిని తినే బతుకుతుండాము అని వాళ్ళ‌కు  ఒక్కరవ్వ ఇవరంగా చెప్పే తలికల్లా వాల్ల‌కు  ఎచ్చులు  వదిలి పెట్టి కుచ్చల్లు  ఊపుకుంటా ఎల్లబారిరి.

అక్కడుండే మిషనరీ కాంపౌండు లో అందరూ ఒకే కులానికి చెందిన వారు ఉండటం.. ఎవరు ఎన్ని రకా కూరలు తిన్నా కూడా అందరూ ఈ కూరను మాత్రం  ఇష్టపడి తింటారు.అందుకే దీన్ని ‘కులం కూరాకు’ అని కూడా అంటారు. అక్కడ ఉండే వారుకాకుండా ఊర్లో శానా మంది ఈ కులానికి చెందిన వారు ఉంటారు.

వాళ్ళ‌లో  దాదాపు అందరూ ఈ కూరాకు తినడానికి ఇష్ట పడే వారే.. ఈ కూర ఇంటికి పోతే ఆ ఇంట్లో పండగ సందడి ఉన్నెట్టే.అందరికీ బాగా ఇష్టమైన కూరాకు ఇది. ఊర్లో ఉండే వాల్ల‌కు  ఆ చర్చి లో సభ్యులే ప్రతి ఆదివారం చర్చికి వచ్చినపుడు అందరూ కలుసుకుంటుంటారు.

మామూలుగా ఈ కూరాకు పక్కనే ఉండే పల్లె నుండి అందరి ఇండ్లకు అప్పుడప్పుడు వస్తుంది. తెల్ల‌ వారు జామున గంప కెత్తుకోని తీసకచ్చి ఇచ్చిపోతారు. ఆ పల్లెలో వాళ్ళు  తీసుకురానప్పుడు .. ఎప్పుడన్నా ఇట్టా జీవాలు  కనపన్నెప్పుడు మా నాయన దానం మామ ఇద్దరు కలిసి ఇట్ట జీవాల‌ను చర్చి కాంపౌండు లో ఎవ్వురికీ తెలియకుండా కోపిస్తుంటారు. ఇది వాల్ల‌కు  యాపారం కాదుగాని శియ్యల‌ కూరాకు మీద వారికుండే మునాస..ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి రాక పోయినా గూడా ఇట్ట చెయ్యడం మానుకోరు.

ఆ రోజు ఆ కాంపౌండు లో ఉండే చర్చి పనులు చేసే మనిషి కాడికి పోయి ‘ఎట్టా నువ్వు రేపు చర్చి టైము గురించి చెప్పడానికి అందరి ఇండ్లకు పోతావు కదా అట్ట పోయినప్పుడు ఎవురికి ఎన్ని కుప్పలు  కూరాకు కావాల్నో పట్టీ రాయించుకోని రా’ అని పురమాయించినారు. అట్ట పట్టీ రాయించుకోని వచ్చినందుకు నీకు ఏదో ఒకటి ఇచ్చాం లే అనారక ఆ మనిషి సరే రాపిచ్చుకోని వచ్చాలే అని ఒప్పుకున్నాడు..ఎందుకంటే ఆ మనిషి కి కూడా ఈ కూరాకు అంటే బో మునాస కాబట్టి.

daliచీకటి పడినాక ఆ గుడిలో పని చేసే ఆయప్ప కూరాకు పట్టీ కట్టిచ్చుకోని వచ్చినాడు.. దానం మామ మా నాయన అది చూసుకోని కూరాకు పడేంత మంది అయినారులే .. ఇంగ ఎవురన్నా ఇప్పుడు వచ్చినా కూరాకు దొరకదు…కూరాకు అంతా మిగకుండా అమ్ముడు పోతాంది లే అని ఇద్దరూ కుశా పడిరి. ఆ కుశాలో ఇద్దరూ గూకోని మందు తాగి .. జీవానికి దగ్గర్లోనే మంచం వేసుకుని పండుకున్నారు.. ఇంగొక రవ్వ పొద్దు పొయ్యారక పక్క పల్లె నుండి జీవాన్ని కోయడానికి కత్తులు ..గొడ్డేళ్ళు  తీసుకోని రెండు మూడు గంపలు  ఉత్తుకోని నల‌గరు మనుసు వచ్చినారు..వాల్ల‌కు  కూడా జీవాన్ని కట్టేసిన శెట్టు కిందనే సాపలు  గోనే సంచులు పర్సుకోని పండుకునిరి.

తొలి కోడి కూచ్చానే అందరూ లేసిరి.. కొందరు పెట్రమాక్స్‌ లైటు ఎలిగిచ్చే కొందరు రాత్రి తగ్గించి పెట్టు కోనున్న లాంతరు ఒత్తును పెంచిరి.. ఎంత పెట్రమాక్స్‌ లైట్‌ అయినా ఆ మబ్బుకు ఎలుగు సరిపోవడం లేదు. ఒక్కరవ్వ మసక మసక గానే ఉంది. ఆ పాటికే అక్కడికి చేరుకున్న కొందరు ఒగిసి ఒగిసి పిల్లోళ్ళు కంపమండలు ..శిదుగు తీసుకోని వచ్చి మంట ఎలిగిచ్చినారు. శానా రోజులు  అయింది జీవాన్ని కోసి …అందుకే శానా ఆత్రంగా…ఎవరు శెప్పకుండానే  పనులు చేస్తా ఉండారు.

 

జీవాన్ని పడేసి పని మొదలు  పెట్టినారు.కూతకాయ తెంపి అన్నిండి వచ్చాన్న నెత్తరను బేసినితో పట్టి ఒక పెద్ద డబారాలో పోసినారు. ఆ జీవం తోలు  కొన్న మనిషి ఆ తోలు ఒలుచకోవడానికి తయారు అయినాడు.తోలు  తీసేప్పుడు శానా ఒడుపుగా తీయాలి .. పొరాపాటున ఎక్కడన్నా బొక్క పడితే అది దేనికీ పనికి రాదు.. ఆ తోలు అందరికీ తీయడానికి రాదు అది తెలిసిన పనోళ్ళు  ఉంటారు.. వాల్లేవచ్చి తీస్తారు. ఆ తోలును ఏదేదో చేసి అమ్ముకుంటారు.. తోలు  తీసే మనిషి తోుకు అంటుకున్న అవయవాలు  అన్నీ ఒకదాని తరువాత ఒకటి తీసి ఇచ్చాఉంటే .. దానికి పక్కనే కింద పరిసిన తడికె మీదికి  చేరేచ్చాండారు… ఇక్కడ ఇద్దరిద్దరు మనుషులు  కూచ్చోని కూరాకు… ఎంకలు  దేనికదే వేరు శేచ్చాండారు..ఇంగిద్దరు ఎంకలు  నరుకుతాండారు.. ఎవురి పనుల్లో వాళ్ళు ఉండారు. ఇట్ట శరాపురిగా పనులు  శేచ్చాంటే మా సంతోష శిన్నమ్మ వచ్చి ఇంత జల‌బర, కొంత కొవ్వు పెట్టిచ్చుకోని పోయినాది.

ఒక అరగంటకు తోలు  మొత్తం ఒలిసినాడు.. ఆ మనిషి .. తోలు ను ఎడ‌ల్పుగా  పర్సి దాని మీద కూరాకు కుప్పలు  ఎయ్యడం తిరుక్కుండిరి.. ముందు నరిడె..ఈరిగ.. దొమ్మ.. ఉల‌వకాయ.. శిగురెంకలు  .. బర్రెంకలు ..ముడ్సులు .. పొట్ట పేగులు  అన్నీ ఒకదాని ఎనక ఒకటి కుప్ప పేరుచ్చాండారు.కుప్పలు  ఏసేటాయప్ప అడిగినాడు ఎన్ని కుప్పువేయాల్నో …వాళ్ళు  చెప్పినదాన్ని బట్టి కుప్పకు కూరాకు సర్దుతాండారు.

తోలు  మీద ఆడాడ కొంత కూరాకు అతుక్కోని ఉంటే అది చూసి దానం మామ తోలు  తీసినాయనను అడిగినాడు ‘ఏమబ్బా ఆమోసు కూరంతా తోలుకు అట్టనే ఇడ్సి పెట్టినావే’  అని… దానికాయప్ప ‘ఆ మాత్రం ఇడ్సక పోతే తోలు  బొక్క పడిందనుకో దమ్డికి పనికి రాకుండా పోతాది’ అన్నాడు.

ఇట్ట శరా పురిగా ఎవురి పనులు వాళ్ళు  చేసుకుంటా ఉంటే సంతోష శిన్నమ్మ నెత్తర పొడి చేసుకోని వచ్చినాది..ఆమె వచ్చీ రాంగానే అందరూ నోర్లలో బొగ్గులు  వేసుకోని ఉదరా బదరా పండ్లు తోముకోని .. సంతోష శిన్నమ్మ కాడికి పోయి గొంతు కూకుండిరి.. ఆ శిన్నమ్మ అందరికీ మోడపాకుల్లో ఎవురికి ఎంత కావాంటే అంత పెద్ద కూరాగ్గంటె తో ఏసిచ్చే   అందరూ పాంకుండిరి.

ఈ లోపల‌ కూరాకు పట్టీ లో తమ పేర్లు రాపిచ్చిన వాళ్ళు ఒక్కరొక్కరే ఆడికి శేరుకుంటా ఉండారు.వాళ్ళలో చాలా మంది తొందరగా తీసుకోని ఎల్ల‌బారదామ‌ని  అని వచ్చినోల్లే ఏమబ్బా ఇంగా కాలేదా ..ఇంత లేటు అయితే ఎట్ట తెల్లారితే ఇంటికి ఎత్తక పోడం కుదరదు అని గొనుగుతాంటే ..‘ఆ…ఈడ మేము ఆడుకుంటా ఉండాము.. రాత్రి అంతా నిద్దర మేలు కోని పని  శేచ్చేనే ఈడికి అయింది .. ఇంత సేపు ఇంట్లో స‌ల్ల‌గా  పడుకుని వచ్చి ఇప్పుడు వల్లో పెడుదునా దల్లో పెడుదునా అని అంటే ఎట్ట .. కాసేపు ఆగు ఎత్తుకుని పోదువు గాని’ అని ఘాటుగా సమాధానం ఇచ్చినారు. శియ్యలు కోసేవాళ్ళు  దాంతో ఏమీ మాట్లాడక పాయ ఆ ఆసామి…కొందరు మాంసం కుప్పల‌ మీద వాళ్ళు  ఎంట తెచ్చుకున్న బ్యాటరీ లైటువేసి కూర ఎట్టుంది కొవ్వు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా లేకుంటే సరిపోయేమైన ఉందా అని తొసుకుంటాండిరి.. కొందరు అయితే బాగుంది అని మెచ్చుకునిరి..

మంచోని బుద్ది మాంసం కాడ తెలుచ్చాది అన్నెట్టు ఎట్టాటి మనిషి గాని కూరాకు కాడికి వచ్చినాక వాళ్ళ  అసలు  బుద్ది బయట పడతది. మా ఊరికి పక్క ఊరిలో మత బోధకుడిగా పని చేసే ఒకాయప్ప వచ్చినాడు .. ఆ మనిషి ప్రసంగం చేసేప్పుడు  తెలుగు రాని వాడు తెలుగు  మాట్లాడితే ఎట్ట ఉంటదో అట్ట మాట్లాడుతుంటాడు…ఓ మ‌హా  ప్రభు కనికరము గ తండ్రి …మీరు ఈ బిడ్డను కాపాడండి నాయనా .. అని అదొక రకంగా మాట్లాడుతుంటాడు…. ఆ మనిషి ఆ రోజు వచ్చి తాను ఎప్పుడు ప్రసంగంలో మాట్లాడిన భాష మాట్లాడకుండా ..‘యాంది ఇట్ట కూరాకు అంతా జబర జబరగా ఉందే …కండలు  ఏంది ఇంత లూజుగా ఉండాయే..’ ఆయాలు అన్నీ ఏసినారా లేదా అని అంటాండాడు. అది ఇన్నె దానం మామ ..మేము దాన్ని తయారు చెయ్యలా కోసినాము… ఎట్టుంటే అట్ట తీసక పోవాల నచ్చకుంటే ఇడ్సిపెట్టి పోవాల‌..అయినా అందరికీ బాగా కనిపిచ్చిన కూరాకు నీకు ఒక్కడికే అట్ట కనిపిచ్చాంది ఎందుకు ప్రసంగాలు  శేచ్చాంటావు నీకు ఇదేం బుద్ది అనే సరికి ఆ మనిషి నోరు ఎత్తలేదు.

పట్టీలో రాసినట్టు వర్సగా పేర్లు పిలిచి వాళ్ళ‌కు  ముందు తోలు లో ఏసి పెట్టి ఉన్న కువ్వ ఎత్తి పడితో కండలు  కొల్స‌డం తిరుక్కుండిరి… శానా మటుకు అందరూ లెక్కిచ్చే తీసక పోతాండిరి .. కొందరు ఏ కువ్వ ఏచ్చే అదే  తీసకపోతాంటే… కొందరు అద్దో అద్దో  ఆ కువ్వ ఎయ్యమని కోరి ఏపిచ్చుకుంటాంటే ..ఇంగ కొందరు కువ్వలో ఏలు  పెట్టి అన్నీ ఆయాలు  ఉండాయా లేదా అని చూసుకోని తీసుకుంటా ఉండిరి.. ఆయాలు  అన్నీ మా హక్కు అన్నెట్టుగా ఉండాయా లేదా అని ఏరపంచుకుని చూసి మరీ తీసక పోతాండిరి.

పట్టీలో ఉన్నె అందరికీ కూరాకు ఇవ్వంగా మిగిలిన కూరాకు లో కింద వేసుకోవడానికి తడిక ఇచ్చిన వాళ్ళ‌కు  .. మాంసం కొలిచే పడి ఇచ్చిన వాళ్ళ‌కు ..ఎంకలు  కొట్టే గొడ్డేలు ను ఇచ్చిన వాళ్ళ‌కు  ..పట్టీ కట్టించుకోను వచ్చిన ఆయప్పకు తలా ఎవురి బాగం వాళ్ళ‌కు  ఇచ్చి మిగిలిన కూరాకు ఇంటికి తీసకపోయినారు మా దానం మామ మా నాయన…

అంతకు ముందు ఆయాు కోసే వాళ్ళ  కాడ నిల‌బడి ఒరే నీ పాసుగుల‌ నాకు అద్దో ఆ తోకమొట్టె అంటే ఇష్టం ఇద్దో ఈ శిగురు ఎంకంటే ఇష్టం .. అద్దొ ఆ ముద్ద ముడుసు అంటే ఇష్టం… అని ఒక పెద్ద డేక్ష నిండా కూర ఎత్తి పెడతా ఉంటే మా నాయన అది చూసి ఏంది దొరా అన్ని ఆయాలు  నీకు ఇష్టమని తీసుకుంటివి .. మేము నీ ఆయం తినాల్నా అనారక కాదు మామ అయి మనిద్దరికి అని అయి కూడా పంచినాడు ఇంటికి తీసకచ్చి మా దానం మామ.

ఆ రోజు ఆదివారం అయినా కూడా జనం గుడికి శానా ప‌ల్చ‌గా  వచ్చినారు. గురువు కూడా ఏదో గబాగబా ముగిజ్జాము అని ఉదరా బదరా ముగించినాడు.. ఎందుకంటే ఆయనకు కూడా ఈ కూరాకు మీద మునాస ఉంటది కాబట్టి .. అక్కడ కోసినందుకు గురువుకు సగం గుండెకాయ.. ఉల‌వకాయ.. నరిడె..ఇట్ట మెత్త మెత్తని కూరాకు అట్ట నోట్లో పెట్టుకుంటే కరిగి పోయే మంచి శిగురెంకలు అందు ఇచ్చారు.. పొద్దన్నే మొకం కడుక్కోని ఇన్ని కాపీ నీళ్ళు  తాగి వచ్చింటాడు .. ఇంటికి తొందరగా పోతే గోధుమ రొట్టె శియ్యల‌ కూరాకు తినచ్చు అని అనుకుని ఉంటాడేమో గాని ఇట్టాటప్పుడు శానా పెద్దగా గుడి నడపడు.

మా ఇంటి కాడ సూడాలా ఆదివారం పండగ అంతా ఆన్నే ఉంటది.. మా కుసిని లో మా దొడ్డాకిలి ని పీక్కచ్చి ఏసి దాని మీద కూరాకు పోసినారు.. మా యమ్మ మా నాయన దేనికదే ఏరపంచినారు.. తలా ఒక శెయ్యి ఏసి కత్తి పీటలు  తీసుకోని కండలు  వాలికలు  శేచ్చాంటే .. మా యమ్మ ఆ యా కూరాకు శెయ్యడానికి రెండు కండలు  ..కొన్ని శిగురు ఎంకలు  …ఆయాలు  ఒక కుండలో వేసి దాంట్లో ఒక శెంబు నీళ్ళు  పోసి దాంట్లో ఇంత పసుపు ఉప్పు కరెప్పాకు వేసి ఒక ఉల్లిగడ్డ కోసి వేసి పొయ్యిమీద పెట్టి కింద మంట ఎలిగిచ్చింది.

పక్క పొయిమీద పెంకు పెట్టి వట్టి మిరపకాయు..దనియాలు  ..జీల‌కర్ర ..గసగసాలు  వేసి ఏయించి పొయికాన్నే ఉన్నె రోట్లో దంచుతాంది .. ఇంగోపక్క తెల్ల‌బాయ‌లు  వ‌లుచ్చాఉంది.. రెండు పొయిల్లో మంట సరిగా ఉందా లేదా అని సూచ్చా ఉంది. ఇన్ని చేస్తాన్న మా యమ్మ … ఒక బంటు లాగా అనిపిస్తా ఉన్నెది.. పని జేచ్చా నోటికి పని చెప్పకుండా ఉంటదా అంటే అది లేదు .. అదట్ట చెయ్యండి ఇదిట్ట చెయ్యండి అని అందరికీ పురమాయిచ్చాఉంటాది. అట్ట మాట్లాడతానే శరా పురిగా మసాల‌ నూరి పెట్టింది.. మసాల‌ వాసన ఘమాయిచ్చాఉంది.

ఇంత లోపల‌ కూరాకు కుండలోనుండి గజ్జెల‌ పొంగు వచ్చింది. గజ్జెల‌ పొంగు అని దాన్ని ఎందుకు అంటారో మా యమ్మ నాకు చెప్పింది..కూరాకు ఇట్ట ఉడక పెట్టినప్పుడు వచ్చే తొలి పొంగులో చిన్న చిన్న బుడగలు  బుడగలు  వస్తాయి అవి గజ్జల‌ మాదిరి ఉంటాయి కాబట్టి దానికి గజ్జెల‌ పొంగు అని పేరు వచ్చింది ఈ పొంగు వచ్చిందంటే ..ఇంగ కూరాకు బెన్నా ఉడుకుతాది అని ..తొసు కోవచ్చు అని మా యమ్మ చెప్పింది.. దీనికి నువ్వు పెట్టినవా ఆ పేరు అని మా యమ్మను అడిగితే లేదు ..ఇది పూరో కాలం నుండి వచ్చాఉంది. మీ జేజి కూడా ఇదే మాట అంటాన్నెది అని చెప్పింది. గజ్జల‌ పొంగు వచ్చినప్పుడు వాసన ఘమా ఇస్తది.. ఆ వాసనకే సగం కడుపునిండి పోయినట్టు ఉంటాది. కానీ ఆకలి మాత్రం దంచి కొడతది.. ఈ మసాల‌ వాసన ఆ గజ్జెల‌ పొంగువాసన తో ఇండ్లంతా గుమాయిచ్చాంది.

శియ్యలు ముందేసుకుని వరికిల్లు  చేసి వల‌ కట్టమీద వాటిని యాలాడ తీసి మంచం పైకి లేపి ఆ మంచం కోళ్ళ‌మీద‌ ఈ వల‌ కట్టెను పేర్చి ..ఆ వరికిల్ల‌ను  కాకులు  ఎత్తక పోకుండా ఉండటానికి దాని మీద రెండు మూడు కంపమండలు  వేసి ఇంట్లో శిన్నోడిని అయినందుకు ఒక మంచం నిలువుగా పైకి ఎత్తి దానికి ఒక కట్టె ఊతం పెట్టి ఆ మంచం మీద దుప్పటి కప్పి కింద సాప పర్సి ఆ శియ్యల‌ కాడ నన్ను కాపలా పెట్టినారు.. నేను ఒక వల‌ కట్టె తీసుకోని కాకు రాకుండా అదిలిచ్చా కూకున్నాను.

వరిక్లిల్లు  కొయ్యడం అయిపొయ్యారక గజ్జెల‌ పొంగు రాడంతో మా నాయన గబగబా లేసి దొడ్లోకి పోయి నాుగు చెంబుల నీళ్ళు  పోసుకోని వచ్చి వేరే గుడ్డలు  ఏసు కోని …పొయ్యి కాడికి వచ్చి ‘ఏం గజ్జెల‌ పొంగు ఇంగా రాలేదా’ అని అడిగారక అప్పటి దాంక ఒక పక్క మసాల‌ నూరుకుంటా ఇంగో పక్క సంగటికి ఎసురు పెట్టి రెండు పొయ్యిల్లో కొరువులు ఎగదోసుకుంటా ఉన్నె మా యమ్మ మా నాయన అట్ట అడిగే తలికి ఇంత ఎత్తు ఎగిరింది   ‘పొద్దన్నుండి పనెంబడి పని శేచ్చాఉండాను నేను గమ్మునేమన్నా ఉండానా  కాసేపు ఆగలేవా పదురుతుండావే’ అని మా యమ్మ తిట్టడం  తిరుక్కున్నెది..మా యమ్మకు సందు దొరికితే చాలు  మా నాయన్నే కాకుండా వాళ్ళ‌ వంశాన్ని మొత్తం తిడ్తది …‘శియ్యల‌ కూరాకు కోసం భూములు అమ్ముకున్న జాతి’ నిన్నని ఏం లాభం లే శిన్న కొడుకు శిన్న కొడుకు అని మీ అమ్మ నిన్ను అట్ట తయారు చేసి నా ఎదాన తోసి పోయింది అని మా జేజి మీదికి లేసింది. అట్ట తిడతానే మా నాయనకు ఉప్పుతో ఉడికేసిన శియ్యలు  ఒక రెండు గంటెలు  ఏసింది.అట్ట తిడతానే మా నాయన వాళ్ళ‌మ్మ  ఇట్టనే మా నాయనకు ఏసిచ్చేది అనే విషయాన్ని కూడా మా యమ్మ  ఇవరిచ్చింది.

అది తిన్నెంక కాసేపటికి మా నాయన కాలు  కాలిన పిల్లి లాగా పొయి సుట్టే తిరుగుతాన్నెడు. మా యమ్మ సంగటి కుండకు పంగల‌ కట్ట ఆనిచ్చి దాని మీద కాలు  వేసి అది కదల‌కుండా తొక్కోని సంగటి గబ గబా గెలుకుతాంటే .. శియ్యల‌ కూరాకు లోనుండి వచ్చే వాసనకు గెలికిన రాగి సంగటి లో నుండి వచ్చే వాసనకు ఎవ్వరికైనా నోట్లో నీళ్ళు ఊరాల్సిందే …మా నాయన ఒక పక్క సాప పర్సుకోని పెద్ద చెంబుతో నీళ్ళు  పెట్టుకోని సాప మీద సక్కల బెల్లం వేసుకోని కూకోని ..ఎప్పుడెప్పుడు సంగటి వచ్చదా గుటుక్కున మింగుదామా అని ఎదురు సూచ్చాండాడు.. మా యమ్మ పొయ్యిమిందనుండి సంగటి కుండను దించి .. సంగటిలోనుండి తెడ్డు తీసి దాన్ని ఉదరా బదరా తుడిసి ఒక బేసిని లో ఒక్కరవ్వన్ని నీళ్ళు  సల్లి హస్తం గంటె తీసుకోని రెండు హస్తం గంటె నిండా సంగటి దీసి ఆ బేసినిలో వేసి ఒక చేత బేసిని పట్టుకుని మరో చేత్తో ఆ సంగటిని ముద్ద చేసి ఓ పెద్ద తెల్లెలో వేసింది. ఇంగొక కూర గిన్నె నిండా కూర వేసి రెండూ తీసకపోయి మా నాయన ముందు పెట్టి ‘కాసేపు ఉంటే కనేట్టు ఉండావు ఇంగ మింగు’ అని ఒక శెతురు మాట వేసి మల్లా పొయికాడికి పోయింది. మా నాయన కు తిరిగి మాట ఇయ్యడానికి మనసు ఒప్పినట్టులేదు పొగలు  కక్కుతాన్నె ఉడుకుడుకు రాగి సంగటి ఉన్నె తెల్లెను దగ్గరికి లాక్కోని సంగటికి ముందు ఇంత కూర ఏసుకోని .. చెంబు నీళ్ళ‌లో  చెయ్యి అద్దుకోని రాగి సంగటి మీద దాడి చేయడం తిరుక్కున్నాడు..

ఒక తుంట తుంచడం .దాన్ని కూరాకులో ఒక పక్క అద్దుకోవడం ఒక శియ్య తునక తీసుకోని నోట్లో పెట్టు కోవడం దాన్ని మింగుతానే కూరాకులో అద్దిన సంగటి నాలిక మీద రాపాడిచ్చి  గుటుక్కున మింగడం.. అట్ట మా నాయన సంగటి తునకలు  తుంచి కూరాకులో ముంచి గుటుక్కు గుటుక్కున మింగి అట్టనే తెల్లెను ఒనికిచ్చినాడు. మా నాయనకు సంగటి పెడతానే .. ఆయన తరువాత శియ్యల‌ కాడ కాపలా కాచ్చాన్నె నా కాడికి తీసుకోని వచ్చినాది మా యమ్మ పొగలు  కక్కుతాన్నె సంగటి… ఆ సంగటి ఎట్టుందంటే బడికి పోయే పిల్లోని కి తల‌ నిండా ఆందెం పూసి తకాయ దువ్వితే ఎట్టుంటదో అట్ట కనిపిచ్చినాది. అప్పుటి దాంకా ఈ వాసనతో ఎప్పుడెప్పుడు సంగటి వచ్చదా అని ఎదురు సూచ్చాన్నె నేను నీళ్ళ‌ చెంబులో చెయ్యి తడుపుకోని పొడ ఎండ మింద పడతాన్నా కూడా లెక్క చెయ్యకుండా సంగటి కూరాకు అట్టనే ఇదిలిచ్చి తెల్లెలోనే చెయ్యి కడిగి తెల్లె ఒక పక్కకు పెట్టి నిక్కరుకు శెయ్యి తుడుసుకున్నాను.

నా మాదిరే మా పక్కన ఉండే ఇండ్లలో వాళ్ళ‌/  కూడా వాల్ల వాల్ల  ఇండ్ల కాడ శియ్యల‌కు కాపలా ఉండే వాళ్ళ‌కు  కూడా ఇట్టనే బువ్వనో సంగటో తీసకచ్చి ఇచ్చినారు.. అందరం సంగటి శియ్యల‌ కూర నా మాదిరే తిని ఇంగ పాటలు  పద్యాలు  పాడ్డం తిరుక్కుఉండిరి .. అంతే కడుపు నిండితే నక్క ఊల‌ ఏసినట్లు మనిషి గూడా కడుపు నిండే దాకా ఒక రకంగా కడుపు నిండినాక ఒక రకంగా ఉంటారు..

మా నాయన సంగటి అనామొత్తు గబ గబా మింగి శివరాకర్న కూరాకులో ఇంగొక రవ్వ ఉప్పు పడింటే బాగుండు అన్నాడు..అందరు పిల్లోల్ల‌కు  సంగటి పెట్టి అందరు తిన్నాక మిగులు తగులు గిన్నెలో ఏసుకోని తింటాన్న మా యమ్మ మా నాయన మాటలు  విని ఈ కూత ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడే కూయాల్సింది. పెట్టింది పెట్టినట్టు అనా మొత్తు యారకతిని శెయ్యి కడుక్కునే తప్పుడా శెప్పేది.. అని మా యమ్మ మా వంశాన్ని తిట్టడం తిరుక్కుండార్క మా నాయన ఆకు వక్కా సున్నం కాయ తీసుకోని పొట్ట నిమురుకుంటా అరుగు మీదికి పొయినాడు.. ఈ లోపల‌ మా నాయన మాదిరే సంగటి శియ్యల‌ కూరాకు దుమ్ము లేపి వచ్చిన మా దానం మామ గూడా మా అరుగు మీదికి వచ్చినాడు …. మా నాయన శేతిలో ఉండే ఆకు జూసి నాలుగు ఆకులు  ఇయ్యిమామ ఆ బాసేలుకు ఆకు తెప్పియ్యమంటే అస్సలు  పకలేదు.. అని వాళ్ళ‌ బార్యను తిట్టడం తిరుక్కున్నాడు. మా నాయన పోనీలేవోయి నా కూతురు ను ఎందుకు తిడతావు నేను ఇచ్చాలే ఆకులు  అని కొన్ని ఆకులు  దానం మామ శేతికి ఇచ్చినాడు ఇద్దరు కలిసి తమల‌ పాకులు ఈనె తీసి సున్నం రాసుకుంటా ఆ రోజు కోసుకున్న శియ్యల‌ గురించి ఎన్ని కువ్వలు పడింది.. ఎంత బాగున్నెది శెప్పుకుని ఆకు వక్క నముకుంటా బీడిలు  ఎలిగిచ్చి బో సుకపడిరి .. అయన్నీ గ్నాపకాలుగా మిగిలి పోయినాయి మారిన కాలం లో గజ్జెల‌ పొంగు కుక్కర్ల కూత కింద పడి నలిగి పోయి కరిగి పోయింది. మా నాయ‌న జ్ఞాప‌కం మాదిరి.

*

సగం చెక్కిన శిల్పం

 

 

చూరు మీంచి వర్షం ధారగా పడుతోంది. అక్కడే నిలబడి అరచేతులతో ఆ ధారని పైకి కొడుతూ ఆడుతున్నాడు మోహన్.

“వర్షంలో ఆడకు. లోపలికి రారా మోహన్.” అరిచింది తల్లి.

“నేను వర్షంతో ఆడుకుంటున్నా. వర్షంలో కాదు” అన్నాడు మోహన్.

“చెప్పిన మాట ఎప్పుడైనా విన్నావా” అంటూ రెక్క పట్టుకుని లోపలికి లాక్కొచ్చి కంచం ముందు కూర్చోబెట్టి “తిను ..” అంది. అప్పుడే మోహన్ తండ్రి ఇంటికి వస్తూ “ఏరా జేబులో ముప్పై రూపాయలు కనిపించడం లేదు తీసావా?” అనడిగాడు. అలానే తలొంచుకొని తింటున్నాడు ఏమి ఎరగనట్టు.

“నిన్నేరా అడుగుతోంది చెప్పు, తీసావా?” అనడిగింది తల్లి.

“నాకేం తెలియదు” అన్నాడు మోహన్.

“వాడిని అలా అడిగితే ఎందుకు చెప్తాడు.” అంటూ పైన షెడ్ రేకులో ఉన్న బెత్తాన్ని లాగాడు.

“నిజంగా నాకేం తెలియదు నాన్న” అన్నాడు భయంగా.

“తెలియదా?” కోపంగా చూస్తూ అడిగాడు తండ్రి. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరినీ చూస్తున్న మోహన్ తల్లికి విషయం అర్ధమైంది. మోహన్ తల మీద ఒక మొట్టికాయ మొట్టి “ఏం చేసావ్ రా ముప్ప్పై రూపాయలు?” అనడిగింది మోహన్ని.

“వాడిని అలా అడిగితే ఎందుకు చెప్తాడే,,” అంటూ రెక్క పట్టుకుని పక్కకు లాగాడు. కాళ్ళ మీద బెత్తంతో కొడుతూ “బొమ్మలు చెక్కుతాడంత ఈడు. ఉలి కొన్నాడు. అది వంద రూపాయలు అయితే ముప్పై ఇచ్చి డెబ్బై అరువు పెట్టాడు. ఆ కొట్టు వాడు ఇంటికొస్తుంటే నన్ను అడిగాడు డెబ్బై ఇమ్మని. ఇచ్చాను. దొంగతనం చేయడం కూడా నేర్చుకున్నాడు ఈ ఎదవ ” అంటూ తట్టు తేలేలా కొట్టాడు.

“ఇంకెప్పుడు చేయను నాన్నా, కొట్టకు నాన్నా” అన్నాడు బతిమాలుతూ.

దూరంగా నెట్టేసి “ఇయాల ఈడికి అన్నం పెట్టకు. కడుపు మాడితే తెలుస్తాది ఎదవకి.” అని చెప్పి విరిగిన కర్రను విసిరేసి వెళ్ళిపోయాడు. అక్కడ కర్రతో పాటు మోహన్ మనసు కూడా విరిగిపోయింది.

 

*             *             *

ఉదయాన్నే మోహన్ అన్నయ్య మురారి వచ్చాడు. వస్తూనే “అమ్మా తమ్ముడేడి?” అడిగేడు బ్యాగ్ కింద దించుతూ. మంచి నీళ్ళు అందించి “వాడేం చేస్తున్నాడో ఏమి అర్ధం కావడం లేదురా మురారి” అంది తల్లి.

“ఏం చేసాడమ్మా?” అనడిగాడు మురారి.

“ఏం చేసాడా! దొంగతనం చేసాడు.” అన్నాడు తండ్రి టిఫిన్ తింటూ.

“ఎక్కడున్నాడు?”

“అదిగో పెరట్లో ఎక్కడో ఉంటాడు. ఏం తినడంట. కోపం వచ్చిందంట నిన్న అన్నం పెట్టకు అన్నాను. ఈరోజు ఎందుకు తెచ్చారు అని పొమ్మన్నాడు. పౌరుషానికేం తక్కువ లేదు ఎదవకి.” అన్నాడు తండ్రి టిఫిన్ తినేసి చేతులు కడుగుకుంటూ.

“ఎందుకు నాన్న వాడిని అలా చేస్తారు” అని తమ్ముడి కోసం పెరట్లోకి వెళ్ళాడు టిఫిన్ ప్లేట్ తీసుకుని.

నూతిలోకి చూస్తూ ఏడుస్తున్నాడు మోహన్. అతని కన్నీరు అందులో పడుతుంటే నీటిలో అలజడి అవుతుంటే చూస్తూ ఉన్నాడు.

“తమ్ముడూ..” పిలిచాడు. వెంటనే వెనక్కి చూసాడు. ఆనందంతో పరిగెత్తికెళ్ళి అన్నయ్యని పట్టుకుని ఏడ్చాడు. “అన్నయ్య నన్ను కొడుతున్నారన్నయ్యా.. చూడు నాన్న ఎలా కొట్టాడో అంటూ కాలు చూపించాడు. నేను ఇక్కడ ఉండను అన్నయ్య. నన్ను నీతో తీసుకెళ్ళిపో అన్నయ్యా , ప్లీజ్ అన్నయ్యా ” అని బతిమాలాడు మోహన్.

“సరే తీసుకెళ్ళిపోతాను. ముందు టిఫిన్ చేయి” అని టిఫిన్ ప్లేట్ ఇచ్చాడు. రాత్రి కూడా ఏమి తినలేదేమో ఆబగా అంతా ఆవురావురు మంటూ తినేసాడు.

కాసేపు అయ్యాక  “చెప్పు ఎందుకు తీసావ్ ముప్పై రూపాయలు?” అనడిగాడు మురారి.

“ఉలి కొన్నాను” అన్నాడు మోహన్ తలొంచుకుని.

“ఎందుకు?” అనడిగాడు మురారి చిరు నవ్వుతో.

“ఎందుకేంటి అన్నయ్యా, మొన్న మనూరి శివుడి గుడికెళ్ళాను. అక్కడ ఎవరో ఫారనర్స్ వచ్చి గుడి మీద చెక్కిన బొమ్మలు ఫొటోస్ తీసుకుంటున్నారు. మా సోషల్ సార్ కూడా వచ్చారులే అప్పుడు, ఆయన వాళ్ళకు మన దేశ శిల్ప కళ చాలా గొప్పదని చెప్తున్నారు.. అప్పుడు నేను సార్ ని అడిగాను. నాకేలాగో చెక్క మీద బొమ్మలు చేయడం వచ్చు కదా, అందుకని ఇలా రాళ్ళ మీద ఎలా చేస్తారు అని అడిగాను. ఉలితో అని చెప్పారు. ఉలి ఎలా ఉంటుంది అని అడిగాను. చెప్పారు. మన సాంబడి కొట్లో దొరుకుతుంది అన్నారు. వెంటనే కొనేయాలి అనిపించింది. నా దగ్గర డబ్బులెక్కడివి? అందుకే నాన్న జేబులో తీసాను. నాకేం తెలుసు మిగిలిన డబ్బులు వాడు నాన్నని అడుగుతాడని? నువ్వొచ్చాక నీ దగ్గర తీసుకుని ఇద్దాం అనుకున్నాను.” అని ముగించాడు.

“సరే, బాగుంది. కాని ఈసారి డబ్బులు కావాలంటే నన్ను అడుగు సరేనా. అంతేగాని ఇలా డబ్బులు తీసి తన్నులు తినకు. ” అని చెప్పాడు మురారి.

“సరే అన్నయ్యా” అని మాట ఇచ్చాడు. మురారి హైదరాబాద్ లో ఎం.బి.బి.యస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ టెన్త్ పరీక్షలు రాసి రిసల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

నాలుగు రోజులు ఉండి వెళ్ళడానికి సిద్ధ పడ్డాడు మురారి. అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అంటే మోహన్ కి అప్పుడే బెంగ పట్టుకుంది. “ఇంకో రెండు రోజులు ఉండు అన్నయ్యా” అనడిగాడు మోహన్.

“నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయిరా. వచ్చేస్తాను. వచ్చేవారం నీ రిసల్ట్ రోజు ఇక్కడే ఉంటాను. ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయు సరేనా .” అని చెప్పి బయలుదేరాడు మురారి.

 

*             *             *

 

మురారి వెళ్ళినప్పటి నుండి మోహన్ అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు. పొద్దున్నే బయటకు పోయి రాత్రికి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు మోహన్ ఎక్కడున్నాడో చూడమని మోహన్ ఫ్రెండ్ రాంబాబుకి చెప్పింది మోహన్ తల్లి. మోహన్ ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఊరవతల కొండ మీద రాయి మీద ఏదో చెక్కుతూ కనిపించాడు మోహన్.

“ఇక్కడేం చేస్తున్నావ్ రా ?” అనడిగాడు రాంబాబు ఆయాస పడుతూ.

“చూడు,” అన్నాడు మోహన్  వెలిగిపోతున్న మొహంతో.

ఆ కొండ మీద ఉన్న ఒక పెద్ద రాయి మీద ఆ ఊరు ఎలా కనిపిస్తోందో చెక్కే పనిలో ఉన్నాడు. ముందుగా సుద్దతో దాని మీద బొమ్మ గీసుకుని చెక్కుతున్నాడు. ఆశ్చర్యంగా చూసాడు రాంబాబు. “ఓడియమ్మ, భలే చెక్కావ్ రా,” అన్నాడు రాంబాబు.

అప్పుడే అక్కడికి వచ్చిన మరో ఫ్రెండ్ గిరి “ఏం చేస్తున్నార్రా ఇక్కడ?” అనడిగాడు.

“చూడరా, మనోడు ఎలా చెక్కాడో.” అని చేయి పెట్టి చూపించాడు రాంబాబు.

“బానే ఉందిరా, రేపు మన రిసల్ట్స్, తేడా వస్తే వాడికి బడిత పూజే” అని అన్నాడు గిరి. మతాబులా వెలిగిపోతున్న మోహన్ ముఖం భయంగా మారిపోయింది.

Kadha-Saranga-2-300x268

 

*             *             *

హాస్టల్ లో మురారిని అతని ఫ్రెండ్ పలకరిస్తూ “రేపే కదా టెన్త్ రిసల్ట్? అన్నట్టు మీ తమ్ముడే టెన్త్ క్లాసే కదా” అనడిగాడు.

“అవును. వాడికి చదువు అంతగా అబ్బలేదు. కాని బొమ్మలు బాగా చెక్కుతాడు. మన ల్యాబ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవకపోతే ఈరోజే వెళ్ళేవాడిని. కాని రేపు ఎగ్జామ్ అయ్యాక బయలుదేరుతాను. ఇదిగో చూడు వాడు చెక్కిన బొమ్మ” అని ఒక చెక్క బొమ్మను తీసి చూపించాడు మురారి.

“చాలా బాగా చెక్కాడు రా” అని మెచ్చుకున్నాడు అతని ఫ్రెండ్.

“ఓకే. ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను. ఎందుకైనా మంచిది, తమ్ముడిని కంగారు పడద్దని చెప్తాను.” అని చెప్పి కాల్ చేసాడు.

పెరట్లో ఉన్న మోహన్ ఫోన్ రింగ్ విని అన్నయ్యే అయి ఉంటాడని ఇంటిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతలో తండ్రి ఫోన్ ఎత్తాడు. “హలో..”

“హలో నాన్నా , నేను మురారి. రేపు సాయంత్రం బయలుదేరి వస్తాను. అదే రేపు తమ్ముడి రిసల్ట్ కదా. వాడితో చెప్దామని చేసాను. తమ్ముడు ఉన్నాడా?” అనడిగాడు మురారి.

“లేడు, బయట ఆడుకుంటున్నాడు అనుకుంట!!” మోహన్ ని చూస్తూనే చెప్పాడు.

“సరే, నేను కాల్ చేసానని చెప్పండి. ఉంటాను .” అని ఫోన్ కట్ చేసాడు. మోహన్ ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉన్నాడు.

“ఏరా రేపు నీ రిసల్ట్ అంట, చెప్పలేదే? పాస్ అవకపోతే చచ్చావన్నమాటే ” అన్నాడు తండ్రి.

“అన్నయ్య ఫోన్ చేస్తే నాకు ఎందుకు ఇవ్వలేదు ” గట్టిగా అరిచాడు మోహన్ .

“ఆడేమైనా నీలా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడా? లేక పిచ్చి బొమ్మలు చేసుకుంటున్నాడా? ఆడు డాక్టర్ ,, నా కొడకు,” గర్వంగా చెప్పుకున్నాడు తండ్రి.

“నేను నీ కొడుకునే ” రోషంగా అన్నాడు మోహన్.

“ఏంటిరా నోరు లెగుత్తాంది?” అనడిగాడు తండ్రి.

“మీరు మాట్లాడించకపోయినా పరవాలేదు. నా దగ్గర డబ్బులున్నాయి. నేనే అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతాను” అని చెప్పి ఇంట్లోంచి బయటకు పరిగెత్తాడు. తండ్రి వెనకాలే ఎంత అరిచినా పట్టించుకోకుండా గేటు దాటి వీధిలోకి దారి తీసాడు.

నాలుగు వీధుల తరువాత ఉన్న కాయిన్ బాక్స్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. కాసేపు అక్కడే ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. ఆయన అలానే మాట్లాడుతున్నాడు. షాప్ మూసేసే టైం అయిందని కొట్టు వాడు చెప్పాడు. అది విని ఆ మాట్లాడే ఆయన దగ్గరకు వెళ్లి  “సార్, ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. మా అన్నయ్యకు కాల్ చేసుకుంటాను. ఒక్క నిమిషం మాట్లాడి పెట్టేస్తాను” అని బతిమాలాడు. ఆయన మొహాన్ని పట్టించుకోలేదు. లాభం లేదు.. షాప్ వాడు వచ్చి ఫోన్ వైర్ పీకేసి ఆ పెద్దమనిషిని విసుక్కుంటూ ఫోన్ ని లోపలికి పట్టుకుపోయాడు. చేసేది లేక ఇంటికి పరిగెత్తాడు. ఇంటి దగ్గర తండ్రి “ఏరా ఎక్కడ తిరుగుతున్నావ్? వచ్చి తిను. మీ అన్నయ్య రేపు బయలుదేరి వస్తానని చెప్పమన్నాడు” అని చెప్పాడు. మోహన్ కి అన్నం తినాలనిపించలేదు. ఉదయం ఎలా అయినా అన్నయ్యతో మాట్లాడాలి అని అనుకుంటూ నిద్రపోయాడు. తొమ్మిదింటికి మెలకువ వచ్చింది. గబగబా ముఖం కడుగుకుని వీధిలోకి పరిగెత్తాడు.

 

అప్పటికే గిరి, రాంబాబులు ఇంటర్నెట్ సెంటర్ కి వచ్చేసారు. ఇంకో అరగంటలో మన జాతకాలురా అన్నాడు గిరి నవ్వుతూ. మోహన్ కి చాలా దడగా ఉంది. కంగారులో హాల్ టికెట్ నెంబర్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఒరేయ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంటికి పరిగెత్తాడు. తిరిగి వచ్చేసరికి గిరి, రాంబాబులు ఇద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి. “ఒరేయ్ మేము పాస్ రా” అన్నాడు గిరి.

“నీ నెంబర్ ఎంతరా?” అనడిగాడు రాంబాబు. ముఖం మీద ఉన్న చెమటను తుడుచుకుని జేబులోంచి నలిగి ఉన్న హాల్ టికెట్ భయంగా అందించాడు మోహన్. లోపలికి వెళ్లి వచ్చి ఒరేయ్ పది రూపాయలు అడుగుతున్నాడురా ఇంటర్నెట్ వాడు అన్నాడు గిరి. లోపలే ఉన్న రాంబాబు నెంబర్ చెక్ చేసాడు. కనిపించలేదు. మోహన్  బయటే నిలబడే లోపల ఉన్న జనాల మధ్యలోంచి రాంబాబుని చూస్తున్నాడు. రాంబాబు మోహన్ ని చూసి పెదవి విరిచాడు ఫెయిల్ అయ్యావ్ అన్నట్టుగా. అందరు మోహన్ ని చూసారు. బయటకు వచ్చి “ఒరేయ్ మోహన్, నువ్వు  ఫెయిల్ అయ్యావు రా” అని చెప్పాడు గిరి.

మోహన్ బీతావహుడు అయిపోయాడు. అన్నయ్య గుర్తొచ్చాడు. ఫోన్ చేద్దాం అనుకున్నాడు కాని జేబులో ఉన్న డబ్బులు ఇంటర్నెట్ వాడికి ఇచ్చేసాడు. ఒరేయ్ డబ్బులున్నాయా మా అన్నయ్యకు ఫోన్ చేయాలి అని అడిగాడు మోహన్.

“లేవురా, ఉంటే ఇందాక నిన్ను ఎందుకు అడుగుతానురా, నేనే ఇచ్చేవాడిని కదా” అన్నాడు గిరి.

“నా దగ్గర కూడా లేవురా, ” అన్నాడు రాంబాబు.

“ఇప్పుడెలారా? మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా?” అన్నాడు గిరి మరింత భయపెడుతూ.

 

ఇంటర్నెట్ షాప్ లోకి పరిగెత్తి రెండు కాగితాలు తీసుకున్నాడు. అక్కడే ఉన్న పెన్ తీసుకుని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొండ మీదకు చేరుకొని పెద్ద బండ రాయి నీడలో కూర్చుని ఏడ్చాడు. సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాడు. పెన్ తీసుకుని కాగితం ఏదో రాసాడు. రాసిన దాన్నే మళ్ళి మరో పేపర్ లో ఎక్కించాడు. దాన్నే హాల్ టికెట్ వెనకాల ఎక్కించాడు. హాల్ టికెట్ ని చొక్కా జేబులో పెట్టుకున్నాడు. రెండు కాగితాలను ప్యాంటు జాబుల్లో కుక్కాడు. సూర్యాస్తమయానికి సమయం అయింది. అదే సమయంలో మురారి ఉరికి బయలుదేరాడు. బస్సు లో ఉండగా ఇంటికి ఫోన్ ట్రై చేసాడు కాని సిగ్నల్ కలవలేదు. ఉదయం చేరుకుంటాం కదా అని ఊరుకున్నాడు. “ఏంటే మోహన్ ఇంకా రాలేదు” అనడిగాడు అన్నం కలుపుతూ తండ్రి భార్యతో.

“ఏమో .. చెప్పి వెళ్తున్నాడా?” అందావిడ ఇంకొంచెం కూర వడ్డించి.

 

రాంబాబు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. రొప్పుతూ నిలబడ్డాడు. అంకుల్ … మన మోహన్ గాడు రైలుకి ఎదురెళ్ళిపోయాడంట!!” అని చెప్పాడు.గబుక్కున లేచాడు. కంచం కాలికి తగిలిందన్న స్పర్శ కూడా పరిగెత్తాడు. ఆ మాట వినగానే మోహన్ తల్లి శోష వచ్చి పడిపోయింది. రాంబాబుకి కంగారు అనిపించి అక్కడి నుండి పారిపోయాడు. “కుర్రాడు కావాలనే ఇలా చేసాడట. చూసినోళ్లు ఆపాలనుకున్నారు. కాని కుదరలేదట” అని చెప్పాడు ఊరిలో పెద్దమనిషి. విడివడిన భాగాలను అతికించినట్టుగా పెట్టారు. శవాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు.  సూర్యోదయం దాదాపుగా అయింది. మురారి ఊరిలో దిగాడు. ఇంటి ముందు అంత జనం ఉండటం కొంచెం కీడు శంకించింది. కాని మనిషి కీడు అంటే ఒప్పుకోడు. ఒప్పుకోలేడు. మురారి చేతిలో బ్యాగ్ వదిలేసి ఇంటిలోకి పరిగెత్తాడు. స్థాణువైపోయాడు. “తమ్ముడూ ,,, ” అని వెర్రిగా అరిచాడు. కళ్ళల్లో కన్నీటి కెరటాలు ఎగసి పడ్డాయి. “ఎందుకిలా చేసావురా? చెప్పా కదరా, అవసరమైతే నాకు ఫోన్ చేయి అని” అంటూ రోదించాడు. రోదిస్తూ తమ్ముడి మీద పడ్డాడు. అంతే ఒక్కసారిగా వెనక్కి జరిగిపోయాడు. భయంగా వెళ్లి కప్పి ఉన్న గుడ్డ ఎత్తి చూసాడు. ఇంకా గట్టిగా రోదిస్తూ అరిచాడు. ప్యాంటు జేబులో రక్తంతో తడిసిన కాగితం కనిపించింది. ఎదురుగా కూర్చుని ఒక్కొక్క మడత విప్పాడు. అంతా నిశబ్ధం ఆవహించింది. అందరు ఆ కాగితాన్ని చూడసాగారు. అందులో ఈ విధంగా రాసి ఉంది

 

అనయ్య,

నెను పదొతరాగతి ఫయిల్ అయాను. అమ్మ, నాన నను కోడతరాని బయంతో చచ్చిపోతన. నన్ను క్షమిచు. ఇంట్లో నను నన్నుగా ఎవరు చుడటం లెదు. ఎప్పడు కొడుతూనారు. చాల నెప్పిగా ఉంటొంది అనయ్య. నువ్ బాగ చదవటం నాకు కూడ గొప్పె కాని ఆ సదువు నకు సరీగా రాలెదు అనయ్య. దానికి నెను ఏమి చయను అనయ్య . నీ మీద కొపంతో కాదన్నయ చచ్చిపోతున్నాది , నా మీద కొపంతోనే..! నీకొసం ఒక డాటర్ బొమ్మ చేక్కాను, అది నా గూట్లో ఉంది , తీసుకో.. ఫయిల్ అయి ఇంటికి ఎల్తే నను ఎలాగో అమ్మ నాన చంపెతారు. అందుకే నేనే చచ్చిపోతున్న ,, మల్లి నీకు బాగ చదివే తమ్ముడిగా పుటాలని కోరుకుంటున్న అనయ్య. నన్ను క్షమిచు. నెతో మాట్లాడదాం అనుకున్న, న దగ్గారున్న పది రూపాయలు నెట్ సెంటర్ లో కర్చు అయిపొయాయ్. . – ని తమ్ముడు మోహాన్.

 

ఉత్తరం చదివాక ఇంటి లోపలికి పరిగెత్తాడు. గూట్లో ఉన్న డాక్టర్ బొమ్మని తీసుకున్నాడు. వాకిట్లోకి వచ్చాడు నిస్తేజంగా. తండ్రి దగ్గరకి వెళ్లి నిలబడ్డాడు. ఆయన కళ్ళు కూడా ఏడ్చి అలసిపోయాయి. తలెత్తి మురారి చేతిలో ఉన్న బోమ్మ మీదుగా అతన్ని చూసాడు.

“నాన్న, ఈ బొమ్మని తమ్ముడు చెక్కాడు. జీవం లేని బొమ్మకు రూపం ఇచ్చాడు. నువ్వు చెక్కగలవా?” ప్రశ్నించాడు. మౌనం వహించాడు. తల్లి వైపు చూసి “నన్నేదో డాక్టర్ ని చేస్తున్నావని సంబరపడిపోతున్నారు గాని మా డాక్టర్స్ పోతున్న ప్రాణాలను కాపాడగలరేమో కాని పోయిన ప్రాణాలను తేలేరమ్మా” అని గద్గదమైన గొంతుతో చెప్పాడు.

కాసేపాగి కోపంతో” మీరే వాడిని చంపేశారు” అని అరిచాడు. “అవును, మీ వల్లే తమ్ముడు చనిపోయాడు. కాదు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడికి చదువు అబ్బకపోతే ఏమైంది? మీరేం చదువుకున్నారు? నేనొక పోసిషన్ కి వచ్చాక మిమ్మల్ని కూడా మీరు వాడిని నిర్లక్ష్యం చేసినట్టే చేస్తే మీరేం అయిపోతారు? అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నలభైకి పైబడిన మీకే ఇంత భయమేస్తుంటే చిన్న పిల్లాడు అమ్మా వాడు. పరిక్ష పోతే మళ్ళి రాసుకోవచ్చు, ప్రాణం పోతే.? అసలు నా చదువే వాడికి శాపం అయింది అమ్మా. ఇంట్లో ఏ ఇద్దరు ఒక్కలా చదవాలని లేదు. వాడికి వాడంటే కోపం అంట అమ్మ, అందుకే చచ్చిపోతున్నాను అని రాసాడంటే ఎంత కృంగిపోయుంటాడో కదా నాన్న? వాడు రాసిన ఉత్తరంలో ప్రతి లైన్ లో రెండు మూడు తప్పులున్నాయి. కాని ప్రతి అక్షరంలో వాడు పడ్డ  బాధ, భయం ఉన్నాయి నాన్న. పుట్టగానే ఎవడు మేధావి అవడు నాన్నా, ఎవరి ప్రతిభ ఎవరి నైపుణ్యత వారిది. నాన్న, తమ్ముడికి చదువు రాకపోవచ్చు కాని దేవుడు వాడికి ఎవరికీ రాని బొమ్మలు చెక్కే కళ ఇచ్చాడు. వాడి ఇష్టాన్ని మెచ్చుకోలేదు. అసలు పిల్లల నుండి ఏదో ఒకటి ఆశించడం తప్పు నాన్నా.. ఆశించి కనడం అనవసరం.  ఎందుకంటే కన్నాక పుట్టిన వాడుమీ ఆశలకు దూరంగా బతుకుతుంటే మీరు జీర్ణించుకోలేరు. అతని ఆశయాలకు మీలాంటి తల్లిదండ్రుల ఆశలకు మధ్య నరకం అనుభవించాలి. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఎంత ఏడ్చినా తమ్ముడు రాడు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన వచ్చిందంటే ఎంత నలిగిపోయుంటాడో కదా నాన్నా? ప్రతి పిల్లవాడికి అమ్మంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందులో చిన్న వాళ్ళకు మరీను, పాపం ఆ రైలు గుద్దినపుడు ఆ నొప్పితో వాడు అమ్మా..!! అని ఎంత గట్టిగా అరిచి ఉంటాడో కదా అమ్మ!?”  అని తమ్ముడి ముందు మోకాళ్ళపై పడి అతని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు.

 

పది రోజులు పోయాక రాంబాబు మురారిని కొండ మీదకి తీసుకెళ్ళాడు. అక్కడ రాయి మీద అత్యంత అద్భుతమైన ఊరుని చెక్కిన తీరు మురారికి కించిత్ ఆశ్చర్యం కలిగించింది  ఆ సగం చెక్కిన శిల్పాన్ని తడిమి చూసాడు. “వాడేం చేస్తాడు పాపం దేవుడు కూడా వాడిని సగమే చెక్కి పంపాడు.” అని అన్నాడు.

 

*                   *

 

 

క్వీన్    

 

               

 -నాదెళ్ళ అనూరాధ

~

nadellaపూణె నగరం అందమైనది అని ప్రత్యేకంగా చెప్పేందుకేముంది? చుట్టూ చిక్కనైన ప్రకృతి పరుచుకుని కొండల్లోకో, అడవుల్లోకో, సరస్సుల్లోకో మనలని ప్రయాణించేలా చేస్తుంది. ఆ అందాల్ని ఏ కవి మాత్రం వర్ణించగలడు? చూసే కళ్లకి, ఆస్వాదించే మనసుకీ మాటలు రావు మరి.

నగరంలో ఒకపక్క పశ్చిమదేశాల నాగరికత స్పష్టంగా కనిపిస్తూంటే , మరోపక్క మరాఠాల సంస్కృతి కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది.

జనాభాలో కొట్టొచ్చినట్టు కనిపించే విద్యార్థినీ ,విద్యార్థుల శాతం, ఐ.టి. నిపుణుల శాతం నగర సంస్కృతిని సరికొత్తగా నిర్వచిస్తున్నట్టుంది.

ఆ నగరానికి అతిథిగానైనా రావటం ఎప్పుడూ ఇష్టమే శ్యామ్ కి. ఆఫీసు పని ఒక్క పూటతో తెమిలి పోతుందని , కూతురు శ్వేతని చూసే టైము కూడా ఉండదని భార్య మాధురి ని తనతో తీసుకురాలేదు. తీరా పని పూర్తి కాలేదు.  ఆఫీసు నుండి బయటపడుతూంటే కొలీగ్ రంగన్ తమ ఇంటికి ఆ రాత్రికి అతిథిగా రమ్మని ఆహ్వానించాడు. ఆహ్వానానికి కృతజ్ఞతలు చెప్పి, రాలేననీ, కూతురు శ్వేతని కలుసుకుందుకు అనుకోకుండా దొరికిన అవకాశం అని చెప్పి భండార్కర్ రోడ్డులో తనని వదిలెయ్యమని అడిగాడు శ్యామ్.

ఇదివరకెప్పుడో కెరీర్ మొదట్లో పూణేలో ఉన్నప్పుడు తాము ఉన్న ఇంటిని, ఆ పరిసరాల్ని చూస్తూ, కాస్సేపు ఫెర్గుసన్ కాలేజీ రోడ్డులోనూ ఎవో పాత జ్ఞాపకాల్ని తలుచుకుంటూ అక్కడి పురాతన శివాలయం పాతాళేశ్వర్ లోకి నడిచాడు. ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న బాంధవ్యం అపురూపమైనది.

పెందరాడే వెళ్లినా శ్వేత ఆఫీసునుండి ఇల్లు చేరదు అని తీరిగ్గా రోడ్డు ప్రక్కల ఉన్న మహా వృక్షాల్ని చూస్తూ తనూ, మాధురి నడిచిన దారుల్ని మళ్లీ మళ్లీ మననం చేసుకుంటూ భార్యకి ఫోన్ చేసాడు.

‘పని అయిపోయిందా? బయలుదేరుతున్నారా?’ అంది ఫోన్ తీస్తూనే.

‘లేదు, ఈ పూట శ్వేతని చూసే అవకాశం దొరికింది’ అన్నాడు ఉత్సాహంగా. తను మిస్ అవుతున్నందుకు మాధురి కొంచెం నిరుత్సాహ పడింది.

‘శ్వేతకి ఫోన్ చేసి నేను వస్తున్నట్టు చెప్పకు. సర్ప్రైజ్ ఇవ్వాలి’ అని భార్యకి చెప్పాడు.

‘గుల్మొహర్ పార్క్’ అపార్ట్మెంటు కాంప్లెక్స్ ముందు టాక్సీ దిగి ఫ్లాట్ నంబరు మరోసారి మననం చేసుకుని లోపలికి వెళ్లబోతుంటే గేటు దగ్గర సెక్యూరిటీ అటకాయించాడు.వివరాలు చెప్పి, విజిటర్స్ బుక్ లో సైన్ చేసి మూడో అంతస్థులో ఉన్న శ్వేత ఇంటిముందు బెల్ నొక్కాడు.మనసంతా ఉద్విగ్నంగా ఉంది. తనను చూసి కూతురు ఎంత సంతోషిస్తుందో అనుకుంటుంటే పెదవులపైకి చిరునవ్వు పరుచుకుంది.

తలుపుతీసిన వ్యక్తి ఎవరో అపరిచితుడు. ఉత్తరాది వ్యక్తి అని తెలుస్తోంది.ముఫ్ఫై సంవత్సరాలు ఉంటాయి. అప్పుడే స్నానం చేసి వచ్చినట్టున్నాడు, తల తుడుచుకుంటూ,’ఎస్’ అన్నాడు.

ఇదేమిటి తను పొరపాటున వేరొకరి ఇంటికి వచ్చాడా? అనుకుంటూ ‘ సారీ’ చెప్పబోయేంతలో లోపలినుండి శ్వేత ‘ ఎవరొచ్చారు రాహుల్’ అంటూ ఇంగ్లీషులో ప్రశ్నిస్తూ ముందుగదిలోకి వచ్చింది.

తండ్రిని చూస్తూనే, గబుక్కున రెండు అడుగులు ముందుకు వేసి,’ హాయ్ డాడ్, ప్లెజెంట్ సర్ప్రైజ్! అమ్మని కూడా తీసుకొచ్చారా? ‘ అంటూ తండ్రిని దాటి వెనక ఎవరికోసమో వెతికింది.

‘లేదురా, ఆఫీసు పనిమీద పొద్దున్నే వచ్చాను. పని అవకపోవటంతో ఆగిపోవాల్సి వచ్చింది.’ అంటూన్న తండ్రిని ఆ యువకుడికి పరిచయం చేసి, ‘ డాడ్, ఇతను రాహుల్,నా కొలీగ్ ‘ అంటూ అతన్ని పరిచయం చేసింది.

శ్యామ్ కూతురికోసం కొన్న మాంజినిస్ కేక్స్ టేబిల్ మీద పెట్టి స్నానానికి లేచాడు.

శ్వేత , రాహుల్ వంటింటి లోంచి గిన్నెలు, పళ్లేలు తెచ్చి వడ్డన చేసారు. అతనికి ఆలోచన సాగటం లేదు. యాంత్రికంగా భోజనం చేసాడు. తను కూతురికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. కాని తనకే ఇక్కడ ఒక పెద్ద సర్ ప్రైజ్ ఎదురైంది. రాహుల్ కూడా అదే అపార్ట్ మెంటులో ఉంటున్నట్టు గ్రహించుకున్నాడు.

‘ డాడ్ , ఈ రోజు ఆఫీసు నుండి త్వరగా వచ్చేం కనుక సినిమా ప్లాన్ చేసుకున్నాం మేము. చాలా రోజులుగా చూడాలని అనుకుంటున్న సినిమా. నువ్వు కూడా రా మాతో. అలసట తీరి కాస్త రిలాక్స్ అవచ్చు.’ అంటూ తండ్రిని బయలుదేరదీసింది.

కారు వెనక సీట్లో జారగిలపడి కూర్చుని, ముందు సీట్లో కబుర్లలో మునిగిపోయిన రాహుల్ ని, శ్వేతని చూస్తూ ఆలోచనలో పడ్డాడు శ్యామ్.

దాదాపు ఆరునెలలు పైనే అయింది కూతురు తమ వూరొచ్చి. ఈలోపు ‘ చాలా రోజులైపోయింది, కూతుర్ని చూడాలని ఉంది’ అని మాధురి గోల పెడుతూనే ఉంది. మధ్యలో శ్వేత ఎనిమిది వారాల పాటు ప్రాజెక్టు పనిమీద బయటకు వెళ్లింది. వచ్చిన తర్వాత ‘ ఇంటికి వస్తున్నా’ అంటూనే ఆఫీసులో పని వత్తిడి అంటూ రాలేకపోతోంది.

క్రితం సారి శ్వేత ఇంటికి వచ్చినప్పుడు కూడా తను ఆఫీసులో ఇనస్పెక్షన్ హడావుడిలో ఉన్నాడు. ఒక్క వీకెండ్ వచ్చివెళ్లిపోయింది , అప్పుడే చెప్పింది ఆఫీసుపనిమీద కొన్నాళ్లు బయటకు వెళ్తున్నానని. అంతే మళ్లీ ఇప్పుడే చూడటం.

శ్వేత వచ్చి వెళ్లాక భార్య ముభావంగా ఉండటం గమనించాడు. తను పదేపదే రెట్టించి అడగటంతో శ్వేత పెళ్లికి సుముఖంగా లేదని, కూతురి ఆలోచనలు తనకు అందటం లేదని మాధురి చెప్పుకొచ్చింది.

అప్పుడే తన చిన్ననాటి స్నేహితురాలు , మానసిక విశ్లేషకురాలు అయిన మాలతిని కూడా కలిసి వచ్చింది. తను మాత్రం భార్య భయాలు, ఆలోచనలూ తేలిగ్గానే తీసుకున్నాడు.

కొన్ని నెలల క్రితం జరిగిన విషయాలు మరోసారి అతని మనోఫలకం మీదకొచ్చాయి.

 

**********

Kadha-Saranga-2-300x268

ఆ వారాంతంలో శ్వేత ఇంటికి రావటంతో మాధురి చిన్నపిల్లలా ఆనందంతో గెంతులు వేసింది.వరండా ముందు క్రొత్తగా పాకిన నైట్ క్వీన్ తీగని కూతురికి చూబించింది. అకస్మాత్తుగా పడిన వర్షపుజల్లుల్లో కూతురితో కలిసి తడిసింది. కూతుర్ని ఒక్క క్షణం వదలలేనట్లు రాత్రి పగలు కబుర్లూ, షాపింగ్ మధ్య గడిపేసింది శనివారమంతా. శ్యామ్ ఆఫీసు పని వలన కూతుర్ని మిస్ అవుతున్నాడని కూడా వెక్కిరించింది.

ఆదివారం ప్రొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేసి భర్త బయటకు వెళ్లిపోవటంతో , తీరిగ్గా కూతురికోసం జంతికలు చెయ్యటం మొదలు పెట్టింది మాధురి.

‘ఎందుకమ్మా, కష్టపడతావ్? అన్నీ బయట దొరుకుతూనే ఉన్నాయి. ఎప్పుడు తినాలని ఉంటే అప్పుడు కొనుక్కుంటానుగా. హాయిగా నూన్ షో చూసి, ఎక్కడైనా బయట భోజనం చేసి వచ్చే వాళ్లం కదా.’ అంటున్న కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ,

‘దొరుకుతాయిరా, ఇంట్లో చేసిపెడితే నాకు తృప్తి గా ఉంటుంది’ అంది.

తల్లీ కూతుళ్ల కబుర్లు కొంచెం సేపు శ్వేత ఆఫీసు పని గురించి, స్నేహితుల గురించీ, సినిమాల గురించీ నడిచీ, శ్వేత పెళ్లి వైపుకి మలుపు తిరిగాయి.

‘చిన్నీ, చదువయ్యాక కొన్నాళ్లు ఉద్యోగం అన్నావు. ఆ సరదా తీరింది. ఇంక బుధ్ధిగా మేము చూసిన సంబంధం చేసుకో ‘  .  మాధురి ఈ సారి ఎలాగైనా కూతుర్ని పెళ్లికి సుముఖురాల్ని చెయ్యాలని పట్టుదలగా ఉంది. ఆ ముచ్చట జరిపించటం అంటే తమ బాధ్యత తీర్చుకోవటం కూడాను అనుకుంటోంది.

మాధురి స్నేహితురాలు పద్మ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది. పద్మ, ఆమె భర్త కూడా తమ పెద్దరికాన్ని కూతురు లక్ష్యపెట్టలేదని చిన్నబుచ్చుకున్నారు.

‘మధూ, నీ కూతుర్ని పెళ్లి విషయం తేల్చమను. ఎవరినైనా ఇష్టపడిందేమో కనుక్కో. ఎటూ వాళ్ల ఇష్టాల్ని కాదనమని తెలుసు వాళ్లకి. అన్ని  విధాలా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే లోకజ్ఞానం, వయసు, ఆర్థిక స్వతంత్రం ఉన్నాయి కదా.’ అంటూ చెబుతూనే ఉంది.

‘మనలాగా మొక్కుబడి చదువులు కావు. పెళ్లి అనగానే తలొంచుకుని సరేననేందుకు మన కాలమూ కాదు.’ పద్మ కూతురి వైవాహిక జీవితం సంతృప్తికరంగానే ఉన్నా తల్లిగా తనవైపు నుండి కొన్ని అసంతృప్తులు ఆమెలో ఇంకా ఉండిపోయాయి. అందుకే ఆమె మాటల్లో కూతురి పట్ల నిష్టూరం ధ్వనిస్తూనే ఉంటుంది.

మాధురి ఆమె మాటలు విన్నప్పుడల్లా ఆలోచనలో పడుతుంది. శ్వేత తాము చెప్పిన మాట వింటుంది, చూసిన సంబంధం చేసుకుంటుంది అని గాఢంగా నమ్ముతుంది. ఎంత చక్కగా పెంచింది తను! తన కూతురు అందరిలాటి అమ్మాయి కాదు. చదువు పూర్తి అయి, ఉద్యోగరీత్యా ఇల్లు వదిలి వెళ్లే వరకూ అమ్మనాన్నలు చెప్పిందే వేదం అన్నట్టు నడుచుకునేది.

మాధురి ఆలోచనలు అకస్మాత్తుగా చెదిరాయి,

‘పెళ్లి మాట ఎత్తకమ్మా. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు నాకు. ‘ అంటున్న శ్వేతని చూసి తను ఏంవింటోందో ఒక్కసారి అర్థం కాక కూతురు తనని ఆట పట్టించటానికి అలా మాట్లాడుతోండేమో అని చూసింది. అలాటి సూచన ఏదీ కనపడకపోయేసరికి,

‘ఏమిటా పిచ్చి మాటలు?’ అంటూ కసురుకుంది.

‘పిచ్చిమాటలేముంది? నా పెళ్లి విషయం నా ఇష్టం. నాకు చేసుకోవాలని లేదు. అదే చెబుతున్నాను’ శ్వేత గట్టిగా చెప్పింది తన మనసులో మాట.

అనుకోని పిడుగుపాటులాటి ఆ మాటలకి మాధురికి కళ్లు చెమరించాయి. ఇలాటి సమాధానం ఊహించనిది. కూతురి ముందు బేలగా బయటపడకూడదని తనను తాను సర్దుకుంది.

‘ఏం, ఎందుకు చేసుకోవు? అదేదో ప్రపంచానికి కొత్త విషయంలా కొట్టిపారేస్తున్నావు. మన కుటుంబాల్లో ఎవరైనా పెళ్ళి చేసుకోకుండా మానేసేరా?’

‘అమ్మా, నువ్వు పెళ్లి చేసుకుని మూడు దశాబ్దాలు దాటింది. నువ్వు అప్పటి మనుషులు, అలవాట్లు,ఆచారాలు గురించి చూసేవు. అవన్నీ ఇప్పటి కాలానికి అనుసరించేవే అనుకుంటున్నావు. బయట ప్రపంచాన్ని చూడు. ఎన్నెన్ని మార్పులు వచ్చాయో , వస్తున్నాయో తెలుస్తుంది. నువ్వు అంటూంటావుగా, నేను చూస్తున్న ప్రపంచం నువ్వు చూసిన దానికంటే చాలా విశాలమైనది అనీ, నాకళ్లతో చూసే ప్రపంచాన్ని గురించి నీకు చెప్పమనీ. ……’

ఒక్క క్షణం ఆగింది. తల్లి ముఖం అంతలోనే వాడిపోయింది. చేస్తున్న పని పూర్తి చేసి , చేతులు కడుక్కుంటున్న తల్లి ప్రక్కనే క్షణం నిశ్శబ్దంగా నిలబడింది.

‘అమ్మా, పెళ్ళి మీద నీకున్నంత నమ్మకం నాకు లేదు. ఇప్పటి తరం జీవనశైలికి అదెంత వరకూ నప్పుతుందో చెప్పలేము.అలా అని ఎవరూ పెళ్లిళ్లు చేసుకోవట్లేదా అంటే చేసుకుంటున్నారు. కాని ఎన్ని పెళ్లిళ్లు మీ తరంలోని పెళ్లిళ్లులాగా కుదురుగా, స్థిరంగా ఉంటున్నాయి? చెప్పు’

మాధురి మౌనంగా ఉండిపోయింది. మొన్న మొన్నటిదాకా ప్రతి విషయానికీ ‘అమ్మా, నాన్నా’ అంటూ తమ వెనుకే తిరిగిన పిల్లేనా ఇప్పుడు మాట్లాడుతున్నది? తనకెందుకో ఇదంతా కొత్తగా ఉంది. ఆమోదయోగ్యంగా లేదు. తనూ పుస్తకాలు చదువుతుంది, నిత్యం న్యూస్పేపర్లూ చదువుతుంది. తన స్నేహితులు వాళ్ల  పిల్లల గురించి చెబుతున్న ఎన్నో సమస్యలు, కంప్లెయింట్లు వింటూనే ఉంది. కాని పెళ్లి అనేది శ్వేత చెప్పినట్టు ఇంత నిరసించే విషయమని మాత్రం అంగీకరించలేకపోతోంది.

‘అమ్మా, ప్రపంచాన్ని నీకు అలవాటైన కోణం నుండి కాకుండా చూసేందుకు నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, ప్రీతి తెలుసుకదా నీకు. తను తిలక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరివైపూ పెద్దల ఆమోదం దొరకలేదు. వీళ్ల నిర్ణయాన్ని నిరసించనూ లేదు. అలా అని వీళ్లని దగ్గరకు తీసుకోనూలేదు. ఇద్దరూ బానే ఉన్నారు.

తిలక్ ఈ మధ్య ఉద్యోగరీత్యా తరచూ దేశం విడిచి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ప్రీతిని, పాపాయిని తీసుకుని వెళ్లటం కుదరదు. ఇక్కడ ప్రీతి ఉద్యోగం , పాపాయిని చూసుకోవటంతో సతమతమవుతోంది. మేము స్నేహితులమున్నాం. కాని భర్తకి దూరంగా ఉండటం, అమ్మ ఇంటికో, అత్తగారి ఇంటికో వెళ్దామని ఉన్నా ఇప్పటికీ వాళ్లు ఆదరించకపోవటం తనని చాలా బాధ పెడుతున్నాయి .ఊహ తెలుస్తున్న తన కూతురికి అందరూ ఉండీ  ఒంటరిగా పెరుగుతోందని అంటుంది.

ఆ మధ్య ప్రీతి కూతురికి బావులేదని హాస్పిటల్ లో చేర్చింది. మేమంతా సాయం చేసేం. మా కొలీగ్ శ్రీనాథ్ ఆమె వెంట ఉండి చాలా సహాయం చేసేడు. అది తనకి నచ్చలేదని తిలక్ అన్నాడట. శ్రీనాథ్ లో ఒక స్నేహితుణ్ణి , శ్రేయోభిలాషిని కాకుండా ఒక మగవాణ్ని మాత్రమే చూసిన తిలక్ ని ఎలా అర్థం చేసుకోవాలంటుంది ప్రీతి. దాని గురించి ఇంకా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. అది ఎంతవరకూ వెళుతుందో అర్థం కావట్లేదు ‘ శ్వేత చెప్పిన విషయం విని నిట్టూర్చింది,

‘నిజమే. తిలక్ అలా ఆలోచించకూడదు. అందుకోసం పెళ్లి వ్యవస్థే నమ్మదగ్గది కాదు అంటే నేను ఒప్పుకోను. మన బంధువుల్లో నీ వయసు పిల్లలు బోలెడు మంది ఉన్నారు . వాళ్లెవరూ నీలా పెళ్లి వద్దని కూర్చోలేదు. ఇన్నాళ్లూ కాస్త సమయం ఇమ్మని చెప్పి ఇప్పుడు నువ్వు అసలు పెళ్లే వద్దని అంటున్నావ్. శ్వేతా, నా మనసు బాధ పెట్టకు.నువ్వు ఎవరినైనా ఇష్టపడితే చెప్పు. అంతే కాని ఇలా మాట్లాడకు.’

‘ నీకెలా చెప్పాలో తెలియట్లేదు. నాకు నమ్మకం లేనిది, అవసరం అనిపించనిదీ నువ్వు చేసుకోమంటే చేసుకుంటానని అనుకోకు.’

artwork: srujan raj

‘ఒంటరిగా జీవితమంతా ఉండిపోతావా? ఒక తోడు కావాలని నీకు అనిపించట్లేదా? మాకు ఉన్నదే నువ్వు ఒక్కదానివి. నీకు పెళ్లి చేసి ఆ ముచ్చట తీర్చుకోవాలని మాకు మాత్రం ఉండదా? కని,పెంచిన మా ఇష్టాల గురించి ఆలోచించవా? అయినా నీ వయసు పిల్లలు పెళ్లిచేసుకోవాలని, ఒకతోడు కావాలని కోరుకోవటం అసహజం కాదుకదా.’

‘అమ్మా, తోడు కావాలంటే పెళ్లే చేసుకోనక్కరలేదు. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు కలిసి జీవించటం బావుంటుంది. అంతవరకే. పెళ్లి అనే సంకెళ్లు వేసుకోనక్కర్లేదు. పిల్లలకోసం తాపత్రయ పడక్కరలేదు. ఆ సహచర్యం సాగినన్నాళ్లు సాగుతుంది. ఆ తర్వాత ఎవరి జీవితాలు వాళ్లవి. దాని గురించి కూడా దిగుళ్లు పెట్టుకోనక్కర్లేదు .’

మాధురి కూతురివైపు విచిత్రంగా చూసింది. ఇదేమిటి? ఈ ఆలోచనలు తానింతవరకూ వినలేదే?!

తన చెల్లెలు రుక్మిణి కూతురి పెళ్లిచేస్తూ క్రిందటేడాది తనతో అన్న మాటలు తను మర్చిపోలేదు.

‘అక్కా, శ్వేత కంటే నా కూతురు లాస్య చిన్నది. శ్వేత పెళ్లి ఇప్పుడే వద్దంటోందని చెప్పావు నువ్వు. లాస్యకి మాకు తెలిసున్నకుటుంబం నుండి ఒక మంచి సంబంధం వచ్చింది. లాస్య కూడా అభ్యంతరం చెప్పలేదు. న్యాయంగా పెద్దపిల్ల కనుక శ్వేత పెళ్లి ముందు జరిగితే బావుంటుంది. కాని ఇప్పుడు పరిస్థితి ఇలా వచ్చింది’ అంది తానేదో అపరాధం చేస్తున్నట్టు.

తను నవ్వుతూ కొట్టిపారేసింది ‘ అలాటివేం పెట్టుకోకు ‘’ అని. ఆ పెళ్లి జరిగిపోయింది.

శ్వేత ఆలోచనలు ఎందుకిలా ఉన్నాయి? తన పెంపకంలో లోపమా? పెళ్లి, కుటుంబ వ్యవస్థ పట్ల కూతురిలో సరి అయిన అవగాహన కల్పించలేక పోయిందాతను? ఎక్కడుంది లోపం?మాధురిని ఒక న్యూనతా భావం కమ్ముకుంది. ఒక తల్లిగా తను సరైన బాధ్యత నిర్వర్తించలేదా? భర్తకి చెబితే ఏమంటాడు? కూతుర్నే సమర్ధిస్తాడా? అసలు అతను కాదూ ఇన్నేళ్లూ కూతురి మాటలకి వంత పాడుతూ ,పెళ్లి వాయిదా వేస్తూ వచ్చింది! తన దగ్గర చెప్పిన విషయాల్నే తండ్రి దగ్గర కూడా చెబుతుందా ? ఏమి చెయ్యలి తను?

శ్వేత ఆరాత్రే బయల్దేరి వెళ్లిపోయింది. తెల్లవార్లూ నిద్రపట్టక పక్కమీద మసులుతూనే ఉంది మాధురి. కిటికీ బయట చిక్కని వెన్నెల మనసుని సేదదీర్చలేకపోయింది.

*************

ప్రొద్దున్న శ్యామ్ ఆఫీసుకు బయలుదేరుతుంటే  మాలతి క్లినిక్ దగ్గర తనను దింపమని చెప్పింది భర్తతో.

మాలతి అప్పుడే వచ్చినట్టుంది. క్లినిక్ లో ఆమె ఒక్కతే ఉంది. మాధురి తన మనసులో  బాథ వెళ్లబోసుకుంది.

‘మధూ, శ్వేత చెప్పిన విషయం నాకు విస్మయాన్ని కలిగించటం లేదు. ఇప్పటి తరం ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చే పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చూస్తున్నాను కదా.

ఈ మార్పు అనివార్యమనే అనిపిస్తోంది .మన అమ్మల కాలంలో ఉమ్మడి కుటుంబాలే చాలావరకు.వాళ్లు స్వంత ఊళ్లని వదలవలసిన అవసరం రాలేదు. మనతరం  ఉద్యోగాల పేరుతో స్వంత ఊళ్లనీ, కన్నవాళ్లనీ వదిలి పరాయి ప్రాంతాలకొచ్చేసేం. ఇదంతా సహజంగానే జరిగిపోయిందని అనుకున్నాం. వెనుక మిగిలిపోయిన వాళ్ల ఆలోచనలు ఏమిటన్నది మనం అంతగా పట్టించుకోలేదు.

ఒక్కసారి మనం పెరిగిన వాతావరణం గుర్తు తెచ్చుకో. అలాటి బలమైన కుటుంబ వ్యవస్థలో అమ్మకి దీటుగా పెద్దమ్మలు, పిన్నమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ మనం పెరిగిన నేపధ్యంలో మన వెనుకే ఉన్నారు. వాళ్లంతా మన కుటుంబంలో భాగంగానే ఉండేవాళ్లు.

మారుతున్న కాలంలో మన జీవితాలు మనమిద్దరం, మనకిద్దరు లేదా ఒక్కరు తో మొదలయ్యి, కొంచెం సంకుచితం అవుతూ వచ్చేయి. మనతరంలోనే కొందరు కులమత,వర్గాల్ని ప్రక్కకి పెట్టి పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లున్నారు. వాళ్లకి సమాజం నుండి బోలెడు వ్యతిరేకత ఎదురైంది. అయినా పెళ్లిపట్ల , స్వంత నిర్ణయం పట్ల ఉన్న కమిట్మెంట్ వాళ్ల జీవితాల్ని సవ్యంగా నడిపించింది.

ఇప్పుడు ఉద్యోగాలపేరుతో పొరుగూళ్లు, పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాలు పట్టుకు తిరుగుతున్నారు. ఇద్దరు, ముగ్గురు సభ్యులున్న కుటుంబం కూడా రెండు వేరువేరు చోట్ల జీవించాల్సి వస్తోంది. భార్య,భర్తల ఉద్యోగమనో, పిల్లల చదువులనో ఈ రకంగా సంసారాలు రెండు , మూడు ముక్కలుగా బ్రతికేస్తున్నాయి…….’

మాలతి మాటలకి అడ్డం వస్తూ మాధురి అంది, ‘ఏమో మాలతీ ఇవన్నీ వింటుంటే భయమేస్తోంది. ఏమయిపోతోంది మన సమాజం? ఎవరు కారణం ఈ మార్పులకి?’

‘అలా భయపడితే ఎలానోయ్ అమ్మాయీ?! నువ్వు కుటుంబం వరకే పరిమితమై బయట ప్రపంచాన్ని, వస్తున్న మార్పుల్ని గమనించట్లేదని చెబుతాను. ఇప్పుడున్న సమాజాన్ని ఎవరో ఎందుకు మార్చేస్తారు? మనం, మన పిల్లలు ఆ మార్పు కి కారణం. ఏ తరంలో అయినా యువతరం ముఖ్య నిర్ణయాల్ని చేస్తూ తమకు అనువైన కొత్త మార్పుల్ని తీసుకొస్తుంటుంది కదా. క్రిందటి తరం వాళ్లు వాళ్లకు అనువైన మార్పుల్ని వాళ్ళు తెచ్చుకున్నారు సమాజంలో. అది అప్పటి పెద్దలకి పెను సవాళ్లనే విసిరింది. ఇప్పుడు ఆ సవాళ్లు ఎదుర్కోటం మనవంతు.

ఎక్కడికక్కడ ఎవరి జీవితాలు వారివి, ఎవరి సమస్యలు వారివి అయినప్పుడు మిగిలిన వాళ్లకోసం ఆలోచించే తీరిక ఎవరికుంది?

నీ కూతురు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. తన అభిప్రాయాన్ని అంత స్పష్టంగా చెప్పింది. తన ఆలోచనల పట్ల ఎలాటి అయోమయం లేదు తనకి.

ఇప్పటి వాళ్లు ప్రాక్టికల్ గా ఎదుర్కొంటున్న ఇబ్బందులున్నాయి. వాళ్లకి అనువుగా ,సౌకర్యంగా ఉన్న నిర్ణయాల్ని వాళ్లు తీసుకుంటున్నారు. నీకూతురికి కౌన్సిలింగ్ కావాలని అన్నావు కదూ. తనకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం లేదు. నీకు మాత్రం కొంత అవసరం.’ నవ్వుతూ తను చెప్పదలచుకున్నది చెప్పింది మాలతి.

‘మాలా, నీకు వేళాకోళం గా ఉంది నా సమస్య. కూతురికి పెళ్లి చెయ్యాలన్న ఆశ, ఆ బాధ్యత తీర్చుకోవాలన్న తపన న్యాయమైనదేకదా ’ మాధురి ముఖంలో అలక.

‘వేళాకోళం కాదు మధూ, మన చుట్టూ సమాజంలో విడాకుల రేటు పెరుగుతోందన్నది చూస్తున్నావుగా. జీవితాల్లో వచ్చిన వేగం, ఉద్యోగపు ఒత్తిళ్లు, పోటీ ప్రపంచంలో భవిత గురించిన అభద్రత ఇప్పటి తరాన్ని వేధిస్తున్నాయి. వాళ్లని వాళ్లు చూసుకోవటం,వాళ్ల పోరాటాలు ….ఇవి జీవితంలో ముఖ్య సమస్యలు అయిపోయాయి. ఇంకా పెళ్లి, పిల్లలు లాటి జంఝాటాలు వాళ్లకి సహించరానివిగా ఉన్నాయి. ఇది నువ్వు ఒప్పుకుతీరాల్సిందే.

అదీకాక కూతురి పెళ్లి చెయ్యాలన్న ఆశ, అదో బాధ్యతలా భావించటం ఈ కాలానికి నప్పవు. నీ ఆనందం కోసం పిల్లలు, అది వాళ్లు పిల్లలుగా ఉన్నంతవరకే. పెంచటం వరకే నీ బాధ్యత. ఆ తర్వాత వాళ్ల జీవితాలమీద నీకు ఎలాటి హక్కూ లేదు. ఎందుకంటే జీవితం వాళ్లది. ఆ మంచి చెడులు వాళ్లని ఆలోచించుకోనీయటమే న్యాయం. వాళ్లకి అవసరమైనప్పుడు వాళ్ల వెనుక నువ్వు ఉన్నావన్న నమ్మకం వాళ్లకి కలిగించటం వరకే నువ్వు చెయ్యవలసింది. ’

‘అయితే ఇక కుటుంబాలు, వివాహ వ్యవస్థ సమాజంలోంచి మాయమైపోతాయా? సమాజం అంటే ఒంటరి వ్యక్తుల సమూహమేనా? ’

‘ఎందుకు మాయమవుతాయి? ఈ తరం వాళ్లలో శ్వేతలాగా ఆలోచించేవాళ్లతో పాటు నీ ఆలోచనలు సమర్ధించే వాళ్లు ఉన్నారు కదా. పెళ్లిళ్లు ఉంటాయి. అయితే విడాకులు, కుటుంబాలు విచ్చిన్నమవటం,మరింత పెరుగుతాయి. ఎదుటి వ్యక్తి కోసం ఆలోచించటం, సర్దుబాటు అనేవి లేనప్పుడు ఇది తప్పదు. ఒంటరి జీవితాలు అని నువ్వు అంటూన్నావే అవి కొన్నేళ్లకి మనుషుల మధ్య కొత్త బంధాలకోసం ఆరాట పడేలా చేస్తాయేమో. ఆ తర్వాత మళ్లీ సమాజంలో ఒక స్థిరత్వం కోసం ప్రయత్నాలు మొదలవుతాయేమో! అప్పుడు మళ్లీ వివాహవ్యవస్థ కావాలని బలంగా కోరుకుంటారేమో! చూద్దాం.’…..

మాలతి మాటలు పూర్తి కాకుండానే తలుపు తోసుకుని ఎవరో రావటంతో , మాధురి మళ్లీ కలుస్తానంటు లేచింది. ఇంటికొస్తుంటే దారిపొడవునా ఆలోచనలే. ఊపిరి సలపనట్టుగా అనిపిస్తోంది మాధురికి. తనను అర్థం చేసుకుంటుందనుకున్న మాలతి కూడా తన ఆలోచనధోరణి ఈ కాలానికి చెల్లదని సూటిగా చెబుతోంది.

అమ్మవాళ్ల తరం కంటే కాస్త ముందడుగు వేసి డిగ్రీ చదువులు చదివి, అంతో ఇంతో ప్రపంచాన్ని గమనిస్తూ కూడా తను కూతురి అభిప్రాయాల్ని అర్థం చేసుకోలేని దశలో ఉందన్నది మాధురి ఒప్పుకోలేకపోతోంది . తరానికి తరానికి మధ్య ఈ అగాధాలు పూడ్చలేనివేనా?

*******************

artwork: srujan raj

సినిమా ఆసక్తి కరంగా అనిపించినా మధ్యమధ్యలో భార్య గురించిన ఆలోచన అతడిని కాస్త అస్థిమితం చేస్తూనే ఉంది.

‘ ఈ సినిమాలో హీరోయిన్ తన జీవితాన్ని తనకు కావలసినట్టు మలుచుకుంది. ముందు పిరికిగా కనిపించి , ఏడుస్తూ కూర్చున్నా బయటి ప్రపంచంలోకి వచ్చాక తనకు కావలసినదేమిటో నిర్ణయించుకునే మెట్యూరిటీ ని సంపాదించింది. సినిమా పేరుకి, ఆ నాయిక పాత్రకి  తగినట్టుగానే నిజంగా క్వీన్ లాగే తన జీవితాన్ని తను రచించుకుంది. నీకు నచ్చిందా డాడ్’ అంటూ అడుగుతోంది శ్వేత సినిమా నుండి వస్తూంటే .

శ్యామ్ కూతురి అభిప్రాయాన్ని అంగీకరించాడు. ఆ సినిమా లో పాత్ర అద్భుతంగా పోషించినందుకు  నాయిక కంగనా కి జాతీయ అవార్డ్ వచ్చిందని చెబుతోంది శ్వేత.

అవును, క్వీన్ ఈ కాలపు పిల్ల. తనకు ఏమికావాలో తను నిర్ణయించుకుంది.

శ్వేత తన జీవితం పట్ల తీసుకున్న నిర్ణయాన్ని మాధురికి అర్థం అయ్యేలా చెప్పడానికి శ్యామ్ సిధ్ధపడ్డాడు.

******************

 

 

మా అనసూర్యక్క ఓ కన్నీటి జీవనది

ARIF4

చిత్రం: సృజన్ రాజ్

-కందికొండ 

~

kandiగామధ్య మాచెల్లెకు ఆపరేషనయ్యిందంటే చూసొద్దామని నేను మా భార్య, మా పిల్లలు కలిసి వరంగల్లుకు పోయినం. మాచెల్లె అత్తగారూరు ‘‘రేకంపల్లి’’ నర్సంపేట మండలానికి పడమర దిక్కున ఓ ఏడెనిమిది కిలోమీటర్లుంటది. ఉత్తశేతుల్తోటి పోతె మంచిగుండదని పోతాంటె పోతాంటె హన్మకొండల ఓ రొండుమూడు రకాల పండ్లు తీసుకున్నం. ‘‘రేకంపల్లి’’కి పోయేసరికి పొద్దుగూకింది. మా చెల్లోల్ల ఇంటిముందుకు పోంగనే ఇంట్ల నుంచి మా అవ్వ (అమ్మ) బయిటికచ్చింది. మా అవ్వ మా చెల్లెకు ఆపరేషనయినకాన్నుంచి మంచి శెడు అర్సుకునెదానికి మా చెల్లె దగ్గెర్నె వుంటాంది. మమ్ములజూసి కాళ్ళు శేతులు కడుక్కోండ్లన్నది. మేం ‘‘గోలెం’’ కాడికిబోయి కాళ్ళు రెక్కలు కడుక్కున్నం. ఇంట్లకుబోయి మా చెల్లె పండుకున్న మంచంపక్క కుర్సీలల్ల కూసున్నం. మా చెల్లెతోని మంచిశెడు ఇసారిచ్చినం. తీసుకపోయిన పండో, ఫలమో ఇచ్చినం. ఇంతల్లకే మా అవ్వ నాలుగయిదు ‘‘గిద్దెల’’ బియ్యం ఉడుకబెట్టి ఇంత పప్పుశారు జేసింది. నపరింత సల్లబడ్డం. పప్పుశారు మస్తు రుచున్నది, అది కిరాణందుకాండ్ల కొన్న కందిపప్పుకాదు మా చెల్లోల్ల చేన్ల పండింది. పట్టిచ్చి పొట్టుతోనే వండింది. అందుకే అంత రుశున్నది.

రాత్రి పది గంట్లకు పండుకునే ముందు  ఎగిలిబారంగనే (ఎర్లిమార్నింగ్‌) లేశి మేం హైదరాబాదుకు పోతమని మా అవ్వతోని శెప్పినా. హైదరాబాదుకు వద్దు ‘‘నాగూర్లపల్లె’’కు పోదాం అందరం కలిసి ఊళ్ళె ‘‘బద్దిపోచమ్మ’’ను చేసుకుంటానం’’ అని మా అవ్వన్నది. ‘‘నాగూర్లపల్లె’’ మా ఊరు ఇది ‘‘నర్సంపేట’’ మండలానికి ఉత్తరం దిక్కున నాలుగు కిలోమీటర్ల దూరం వుంటది. ‘‘చెల్లెకు ఆపరేషనయి మీ పరేషాన్ల మీరే వుంటిరి. ఇప్పుడు ఈ ‘‘బద్దిపోచమ్మ’’ను ఎందుకు జేత్తాండ్లే’’ అన్న. అప్పుడు మా అవ్వ ‘‘మన అనసూర్యక్కకు నాలుగయిదు నెలల నుంచెల్లి పానం మంచిగుంటలేదు తిరుగని దవాఖాన లేదు, వాడని మందు లేదు. ఎంతకు నయం అయితలేదు, మనిషి మస్తు గుంజింది, రాత్రిపూట నిదురబోతలేదు, ఆయిమనంగ నాలుగు బుక్కల బువ్వ తింటలేదు, అంత భయం భయం అయితాందట, గుండె దడచ్చినట్టయితాందట, మనిషి మనకాలి వుంటలేదు, ఊకె ఏడ్తాంది. అనుమానమచ్చి దేవున్నడిగిత్తె ‘‘బద్ది పోచమ్మ’’ కొంటెతనమన్నరు. అందుకే అందరంగలిసి ఓ యాటను తెచ్చి ‘బద్దిపోచమ్మ’’కు శేత్తానం అని విషయం మొత్తం ఇగురంగ జెప్పింది.

నాకు ఎంటనే మా ‘‘అనసూర్యక్క’’ యాదికచ్చి, నా కండ్ల్ల మెరిసింది. ఆమె మా మేనత్త మా నాయిన చెల్లె. మా తాత పేరు కట్టయ్య. ఆయనకు మొత్తం అయిదుగురు సంతానం. మొదటాయినే మా నాయిన, రొండొ ఆయినే ఇంకో చిన్నాయిన. మూడో ఆమే మా ‘‘అనసూర్యక్క’’, నాలుగో ఆయినె, ఐదో ఆయినే ఇంకో ఇద్దరు చిన్నాయినున్నరు. మా మేనత్త అసలు పేరు ‘‘అనసూయ’’ కాని అందరం అనసూర్యక్క అని పిలుస్తం. మా నాయిన, మా తాత, మా నాయినమ్మ, మా నాయిన ఎనుకాయినె మా బాబాయి ఈ నలుగురే ఆమెను ‘‘అనసూర్య’’ అని పేరుబెట్టి పిలుస్తరు. మా అక్కంటె అందరికి అంత గౌరవం.

మేం పొద్దున్నే చీకటితోటి లేశి మా ఊరికి పోయినం. మా ఇంటికి తూర్పు దిక్కున మా తాత కట్టయ్య ఇల్లుంటది. రొండురూముల బెంగుళూరు పెంకుటిల్లు. దానికి ఆనిచ్చి ఇంటి ముందుకు చిన్నరేకు షెడ్డు ఏషిండ్లు. ఆ రేకు ‘‘సాయబాను’’ కింద కూసునెదానికి పొడుగుగా ఓ అరుగుంటది. నేనెప్పుడు మా ఊరికిపోయిన రోజుల ఎక్కువసేపు ఆ అరుగుమీదనే కూసుంటా. మా కట్టయ్య తాత సచ్చిపోయి మూడు సంవత్సరాలయితాంది.ఆ తరువాత సంవత్సరంనర్థానికి మా నాయినమ్మ కూడ సచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్ల మా ‘‘అనసూర్యక్క’’ ఒక్కతే వుంటాంది. ఎప్పటి లెక్కనే పోయి మా కట్టయ్య తాతోల్ల రేకు షెడ్డు కింద అరుగుమీద కూసున్న. నన్ను సూశి మా అనసూర్యక్క వచ్చి నా పక్కపొంటి కూసున్నది. ఆమెను సూడంగనే నాకు చానా బాధయ్యింది. మనిషి మొత్తం బక్కగయ్యింది. రొండుమూడు సంవత్సరాలకిప్పటికి సగమయ్యింది. ‘‘ఎప్పుడచ్చిండ్లురా బిడ్డ అంత మంచేనా’’ అన్నది. ‘‘ఆ… అంత మంచే అక్కా రాత్రొచ్చినం’’ అన్న. మంచిశెడు మాట్లాడుతానం. మాట్లాడుతాంటె, మాట్లాడుతాంటెనె ఆమె కండ్ల్ల నీళ్ళూరుతానయ్‌, నిమ్మలంగ నిమ్మలంగ ఆమె కండ్ల్లకెళ్ళి నీళ్ళు వడుత్తానయ్‌. అరె ఎందుకు ఏడుత్తానవ్‌ ఊకో అక్క… అన్న. ఆమె దు:ఖం ఆపుకోలేక బాగ ఏడుస్తాంది. కండ్ల అద్దాు తీసి పక్కన బెట్టింది, ఊకో అక్క ఊకో అని కండ్లనీళ్ళు తుడిసినా ఆమెకు దు:ఖం అసలే ఆగుతలేదు. ఆమె కండ్లపొంటి నీళ్ళు కారుతనే ఉన్నయ్‌. కారెనీళ్ళను కొంగుతోని తుడుసుకుంట ఏడుస్తాంది. ఆమె అట్ల ఏడుస్తాంటె నాక్కూడ మస్తు ఏడుపచ్చింది, ఆమెను ఎట్ల ఊకుంచాల్నో అర్దంగాక నాకండ్లకెళ్ళి గూడ వట్ట వట్ట నీళ్ళు వడుత్తాంటె నాకు అప్సోస్‌(ఆశ్చర్యం) అనిపిచ్చింది. ఎందుకంటె గుండెను కాలిసె ‘‘ఎత’’ నా లోపల వున్న కూడ నా కండ్లకు నీళ్ళురావ్‌. అసొంటి నేను గూడ ఏడిసిన. అట్ల శానాసేపు ఆమె ‘‘సొద’’ సల్లారెదాక ఏడిసింది. ‘‘కొంచెం ఏడుసుడు ఆపినంక ‘‘ఎందుకు ఏడుస్తానవ్‌ అక్క నీకేం తక్కువయ్యింది మేమంత లేమా’’ అన్న ‘‘కంటిమీద రెప్పవాల్తలేదురా బిడ్డ. తిండసలే సయించుతలేదు. పాణం మన కాలి వుంటలేదు.. ఎటోపోతాంది, కయాల్‌ తప్పుతాంది, గుండెదడత్తాంది, అంత భయంభయమయితాంది, ఒంటరి బతుకయిపోయిందిర. సచ్చిపోవాలెననిపిస్తాంది’’ అనుకుంట కొంగుతోని కండ్లనీళ్ళు తుడుసుకున్నది. అంతట్లకే మా నాయిన ఒక పాత ‘‘ఐరోండ్లకుండ’’ల సున్నం కలుపుకొని దాంట్లె ‘‘బ్రెష్‌’’ ఏసుకొని వచ్చిండు. అరుగు పక్కన ఎడమరోకు అంతకుముందు రోజే ‘‘బద్ది పోచమ్మ’’ కు ఒక చిన్న గుడి కట్టిండు, మా నాయిన సుతారి పనిశేత్తడు అందుకే ఆయినే కట్టిండు, ఆ గుడికాడ కూసోని గుడికి సున్నం ఏసుకుంట ‘‘ఊకోవే అనసూర్య. ఇగ బద్ది పోచమ్మకు గూడ శెయ్యబడితిమి కొంటెతనంబోయి అంత మంచే జరుగుతది తియ్‌ ఊకె ఏడువకు బాధపడకు’’ అన్నడు.

పొద్దుగూకుతాంది చిన్నగ మెల్లగ చీకటయితాంది. టైము ఐదారున్నరయితాన్నట్టున్నది ఇగ గొర్రెను కోద్దామని అందరు గుమిగూడిండ్లు. ఇంటిముందు యాపశెట్టుకు గొర్రెను కట్టేసి ఇంతంత పచ్చగడ్డేశిండ్లు. అది పొద్దటిసంది పచ్చగడ్డి నములుతనే వున్నది. మా చిచ్చ ‘‘నర్సింహస్వామి’’ యాటను కోశెదానికి కత్తి పట్టుకొని వచ్చిండు.  వీళ్లు మా పాలోళ్ళు.  నాకు ఆయినె చిన్నాయినయితడు. ‘‘గొర్రెను రొండు కాళ్ళసందు పెట్టుకొని గొర్రె కడుపుకింద శేతులేసి లేపి బరువు సూశిండు. ఓ పది కిలో కూర ఎల్తది కావచ్చు, బోటి, కాళ్ళు ,తలకాయ కలిపి ఓ మూడు మూడున్నర కిలోలు ఎల్తది, మొత్తం పదమూడు చిల్లరే ఎల్తది కూర అన్నడు. ఆ గొర్రె రొండు మూడు ఈతలు ఈనిందట.  ‘‘బద్దిపోచమ్మ’’కు మగ గొర్రెపోతును కొయ్యద్దట. ఆడ గొర్రెను అది ఓ రొండు మూడు ఈతు ఈనిన పిల్ల తల్లిని కొయ్యాల్నట. ఇవన్ని ఇంటాంటె గమ్మతనిపిచ్చింది. ఈ రూల్స్‌, పద్దతు ఎవ్వు పెట్టిండ్లు, ‘‘బద్దిపోచమ్మ’’ వచ్చి వీళ్ళకు శెప్పిందా అనిపిచ్చింది. గొర్రెను బద్దిపోచమ్మ గుడికాడికి  తీసుకచ్చిండ్లు, గొర్రెకు బవంతంగా కొంచెం కల్లు తాపిచ్చిండ్లు. మా అనసూర్యక్కచ్చి గొర్రె ‘‘నొసు’’(నుదురు) మీద కుంకుమ బొట్టు పెట్టి పసుపు రాసింది. గొర్రె కాళ్ళు మొక్కింది. పక్కనున్న మా చిన్నమ్మ ‘‘ఇగ అనుమానమద్దు తల్లీ మంచి జరుగుతె మళ్ళా వచ్చే ఏడు శేత్తం ‘‘జడత’’ ఇయ్యి అన్నది. ఒగలెనుక ఒగలు పోయి కుంకుమబొట్టు, పసుపుబొట్టు పెట్టి గొర్రె కాళ్ళు మొక్కిండ్లు. మా నర్సింహస్వామి చిచ్చ దాని ఈపు(వీపు) మీద నీళ్ళు సల్లి దువ్విండు యాట ‘‘జెడుత’’ ఇయ్యంగనే కోషిండ్లు, ఒక ఎనుకకాలు సప్ప(లెగ్‌) తీసి దాషిండ్లు. మిగతది వండిండ్లు అందరు తిని పండుకున్నరు.

నేను ‘‘ఎగిలిబారంగనే’’ (ఎర్లిమార్నింగ్‌) లేశి హైదరాబాదుకు రావాల్నని తయారయితాన. సాయత్రం కోశి దాశిన ఎనుకకాలు సప్ప వండెదానికి మావోళ్ళు మాల్ మసాల తయారుజేత్తాండ్లు. ‘‘మీరు కూడ ఇంత సల్లబడిపోండ్లి. హైదరాబాదుకు పొయ్యెటాలకు ఏ టైం అయితదో ఏందో’’ అన్నది మా అనసూరక్క. నేను సరేనన్నా. అన్నం తిని బయుదేరే ముందు మా భార్య నాదగ్గరికచ్చి ‘‘అనసూర్యక్కను హైదరాబాదుకు తీసుకపోదం అక్కడ ‘‘కిమ్స్‌’’ హస్పటల్ల సూపిద్దం, ఆమె పరిస్థితి మంచిగలేనట్టనిపిస్తాంది రాత్రి మూడు నాలుగు గంట్లకు మీ చెల్లె దగ్గరకచ్చి ఏడిసిందట, నేను సచ్చిపోతనంటాందట. అసలే నిదురత్తలేదట ‘‘సైక్రియాటిస్ట్‌’’ డాక్టర్‌కు సూపిద్దం’’ అన్నది. సరేనన్నా మరి వత్తదో, రాదో అడుగన్న. అడుగుతె వత్తనన్నది, హైదరాబాదుకు మాతోని తీసుకచ్చినం. తెల్లారి ‘‘కిమ్స్‌’’కు సైక్రియాటిస్ట్‌ డా॥ నాగలక్ష్మి దగ్గరికి తీసుకపోయినం. డాక్టరమ్మ మా అనసూర్యక్క తోటి శానసేపు మాట్లాడిరది. డాక్టరమ్మతోని తన బాధ శెప్పుకుంట మా అక్క ఏడిసింది. డాక్టరమ్మ పరిక్షచేసి ‘‘ఈమె చాలా డీప్‌ డిప్రెషన్‌లో వున్నది. 20 రోజులకి మెడిసన్‌ కోర్స్‌ రాస్తున్నా, 20 రోజుల తరువాత మళ్ళీరండి ఆమెను జాగ్రత్తగా చూసుకొండి. మీ దగ్గరే ఓ నెల రోజులు వుంచుకొని జాగ్రత్తగ సూసుకోండి’’ అన్నది సరేనన్నాం, మా దగ్గర మూడురోజులున్నది, నాలుగో రోజు అమ్మటాల్లకు (ఉదయం ఎనిమిది, పది గంట మధ్య) ఇగ నేను పోతర బిడ్డ అన్నది ‘‘వుండరాదక్క ఊళ్ళెకు బోయి ఏం జేత్తవ్‌’’ అన్న. ‘‘లేదుర బిడ్డా పోత’’ అన్నది మా కొడుకును ఆమెను ఊళ్ళె తోలిరమ్మని ఆమె ఎంట పంపిచ్చిన. నేను నా రాసుకునే, చదువుకునె రూముకు పోయి తలుపు మూసుకొని కూసున్న ఏందోత్తలేదు. గుడిపాటి వెంకటాచంగారి గీతాంజలి (ఠాగూర్‌ అనువాదం) మళ్ళా ముందటేసుకున్న నా పుస్తకాల ర్యాక్‌ల  శాన్నే పుస్తకాలుంటయ్‌ సదివినయి, సదువనియి. కాని నా చెయ్యి చలం పుస్తకాలకాడికే పోతది. ‘‘చలం నన్ను మింగిండు’’ చలం పుస్తకాలు సదువుతాంటె బతుకు రుచనిపిస్తది, పెద్ద పెద్ద బాధలు చిన్నగనిపిస్తయ్‌. మనుషులను ప్రేమించాలనిపిస్తది, కష్టాలను కావలిచ్చుకోబుద్దయితది, ‘‘లేకిడి’’ తనం పోయి గుండె బారిదయితది. ఎట్ల బతుకాల్నో, ఎందుకు బతుకాల్నో ఎరుకయితది. బతికే రీతిని చలం గుండెకు ‘‘ఇంజెక్ట్‌ చేస్తడు’’. గీతాంజలి సదువుకుంటపోతాన ‘‘ప్రేమ ఏకం. ఏకమైన ప్రేమ ఐక్యం కావాలనే కాంక్షలో రెండు రూపాల విభాగమై తనని తాను వ్యక్తం చేసుకుంటోంది. ఒకటే విద్యుచ్చక్తి ఆకాశాన ఈ మూల ఒక మెరుపుగా, ఆ మూల ఒక మెరుపుగా చలించి పెనవేసుకుని ఐక్యమై తేజస్సుని మించిన అంధకారంలో లీనమౌతుంది. విద్యుచ్చక్తి అంతా ఒకటే కాని పాజిటివ్‌ మరియు నెగిటివ్‌ అని విభాగమై ఇన్ని గృహాల్ని, ఉత్సవాల్ని వెలిగించి ఐక్యమై ఇన్ని చిత్రాలుగా దీపాలుగా నవ్వుతోంది.’’ ఇట్లా… దనాదన సదువుకుంటపోతానే వున్నా. పుట సంఖ్య.65

36 వ గీతం సదువుతాన

‘‘ఇదే నీకు నా ప్రార్థన, ప్రభో!

నరుకు నరుకు

నా హృదయంలోని దరిద్రాన్ని సమూలంగా నరకు.

నా సుఖదు:ఖాల్ని తేలికగా తీసుకునే బలాన్ని నాకియ్యి.

సేవలో నా ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ప్రసాదించు.

దీనుల్ని నిరాకరించే దుర్గతి నించి నన్ను తప్పించు.

మదాంధుల ముందు మోకరించనీని అభిమానాన్ని నాలో పెంపొందించు.

నిత్య జీవనంలోని అల్ప విషయాల నించి

నా మనసుని తప్పించే నేర్పునియ్యి.

ప్రేమలో నీ సంకల్పానికి

నా శక్తిని అర్పించుకునే బలాన్ని కటాక్షించు.’’

ఈ గీతం సదువుడు అయిపోంగనే మా అనసూర్యక్క గుర్తుకచ్చింది. నేను దేవున్ని నమ్మాల్నని మస్తనుకుంట కాని నమ్మ, కాని… ‘‘ఈ భూలోకాన్ని, మనిషిని, మాకును, పుట్టను, పురుగును, నిప్పును, నీటిని, గాలిని, ధూళిని నడిపించే శక్తి ఏదో వున్నదట. ఆత్మ అవినాశి, బహిర్గత సౌందర్యం కన్న ఆత్మ సౌందర్యం గొప్పది. అని నేను నా చిన్నప్పుడు ‘‘సొక్రటీస్‌’’ పుస్తకంల చదివిన ఆ మాటలు నా గుండెలకు గుసాయించి, నా దమాక్‌ల జమాయించి కూసున్నయ్‌. ఆ‘‘శక్తి’’ని లేదా ఈ లోకులు పూజించే ‘‘దేవున్ని’’ కన్నీళ్ళతోని నేను రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లెక్క ప్రార్దించిన. మా అనసూర్యక్క ఇప్పుడు పుట్టెడు దు:ఖంలున్నది. ‘‘సుఖదు:ఖాల్ని తేలికగా తీసుకునే బలాన్ని ఆమెకియ్యి. నీ సేవలో ఆమె ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ఆమెకు ప్రసాదించు. ఈ మూర్ఖపు లోకం ముందు మోకరించనీని అభిమానాన్ని ఆమెలో పెంపొందించు. నిత్యజీవనంలోని అల్పవిషయాల నించి తప్పించుకునే నేర్పుని ఆమె మనసుకియ్యి, ప్రేమలో నీ సంకల్పానికి ఆమె శక్తిని అర్పించుకునే బలాన్ని మా అనసూర్యక్కకు కటాక్షించు’’ అని దిల్‌సే ఏడిసిన.

Kadha-Saranga-2-300x268

ఆమె దు:ఖం చెప్పుకునేది కాదు. చెప్పుకుంటె తీరేదికాదు. ఆమెకు అన్నీ వున్నయ్‌… ఇల్లు, జాగ, ఎద్దు, ఎవుసం, పైసలు కాని… ఆవ్వెవీ ఆమెకు సంబురాన్నియ్యయి, సంతోషపెట్టయి. ఆమెకు అందరున్నరు. బలుగం, బంధువు, అన్నలు, తమ్ముళ్ళు, మనుమలు, మనువరాండ్లు కాని… ఎవలు ఆమె వాళ్ళు కాదు. అన్నీ వున్నట్టె అనిపిస్తయ్‌ కాని బతుకంత ఎల్తి ఎల్తి వుంటది. అందరు వున్నట్టె అనిపిస్తరు కాని ఎనుకకు తిరిగి సూసుకుంటె ఎవరుండరు. ఆమె తట్టుకోలేని ఒంటరితనం వుంటది. ఈ పరిస్థితిని ఆమె ఎవ్వలకు చెప్పుకోలేదు, ఆమె పరిస్థితి ఇదని బహిరంగంగ ఒప్పుకోలేదు. చెరువుతెగి చెర్లనీళ్ళు చెరువెనక పడ్డయ్‌. ఇప్పుడు శెప్పుకొని ఏంలాభం అని సప్పుడుజేక వూకుంటది. అప్పుడప్పుడు బాధలు, ఒంటరితనం ఆమె గుండెను ‘దబ్బుడుకం’ (గోనె సంచు కుట్టె సూది) లెక్క పొడిశినప్పుడు అవస్థను తట్టుకోలేక సాటుకో, నేటుకో, అయినోళ్ళతోని శెప్పుకొని ఏడుస్తది.

మా అనసూర్యక్కకు ఇప్పుడు దగ్గరదగ్గర ఓ యాభైఅయిదు సంవత్సరాల ఉమర్‌(వయసు) వుంటది. నాకు ఊహ తెలిసి తెలవకముందే ఓ పది పదకొండు సంవత్సరాల వయసునే ఆమెకు పెండ్లయ్యింది. పెండ్లయ్యినంక కొన్ని రోజులు అత్తగారింటికి పోయింది. తరువాత పోనని ఏడుసుడు మొదలుబెట్టి వచ్చి మా ఇంటికాన్నే వున్నది. అట్లా శానా దినాలు గడిశినయ్‌. మా అనసూర్యక్క చానా ‘‘కష్టబోతు’’. మొగోళ్ళతోని సమానంగా పనిజేత్తది. అత్తగారింటికి పోకుంట ఇంట్లనే వున్నప్పుడు, ఇంటికాడ, అన్నం, కూర వండుడు. ఇల్లు, వాకిలి ఊడుసుడు, అంట్లుతోముడు, అలుకుసల్లుడు దగ్గర్నుంచి, వ్యవసాయం పనులు ఎక్కువ చేసుడు మొదలుబెట్టింది. ఎందుకంటె మాఅక్కోళ్ళ అవ్వ, నాయిన, అరె బిడ్డ మస్తు పనిచేత్తాంది, మంచిగ ఆసరయితాందని, అత్తగారింటికి పంపియ్యరని ఆమె ఉపాయమేసింది. ఆమె ఉపాయం కరక్టే అయ్యింది. ఇంటిపని, వంటపని, వ్యవసాయం పని అన్నీ మా అక్క  ఒక్కతే ఒంటిశేతి మీద శేత్తాంటే మా తాతకు శానా ఆరామ్‌(రిలాక్సేషన్‌) దొరికింది. శానా సుఖానికి అవాటుపడ్డడు. వుంటాంటె వుంటాంటె కొంత కాలం తరువాత మా తాత పని శెయ్యాల్సిన అవసరం కనిపించకుంట పోయింది. ఓ నాలుగురోజులు కనుక ఏ పెండ్లికో, పేరంటానికో మా అనసూర్యక్క పోతే ఎక్కడి పనులు అక్కణ్ణే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వుండంగ వుండంగ మా అక్క మనసు మారింది. మనిషిలో మార్పు మాములే కదా. అత్తగారింటికి పోవాల్నని నిర్ణయించుకున్నది. మా అక్కను పెండ్లిశేసుకున్నాయినే కూడా శానా మంచి మనిషే ఈమెను బతిలాడో, బామాడో తీసుకపోయెటానికి శానాసార్ల వచ్చెటోడు. అత్తగారింటికి పోవాల్నని మా అక్క మనసు కూడా వుండేది. కాని మా తాత పంపించెటోడు కాదు. ఈమె మా అత్తగారింటికి నేను పోత అని  శెప్పలేని పరిస్థితి. మా తాత, మా అక్క భర్తను తిట్టి, బెదిరించి పంపించెటోడు. ఎందుకంటె ఈమె అత్తగారింటికి పోతే ఎక్కడ పనులు అక్కణ్ణే పంటయ్‌ అని మా తాత బాధ. కొంతకాలం తరువాత మా అక్కకు విడాకులు కూడా చేసేసిండు మా తాత. ఇంట్ల ఏ పని చెయ్యాల్నన్న, ఏ నిర్ణయం తీసుకోవల్నన్న అంతా మా తాత శేతుల్నే వుండేది.

ARIF4‘‘మా అనసూర్యకు మళ్ళా పెండ్లిశెయ్య ఎందుకంటె దానిమీద దేవుడున్నడు దాన్ని దేవునికి ఇడిసిపెడుతాన’’ అని మా తాత మా బందువులకు శెప్పిండు. మా నాయినమ్మ, మా నాయిన, బాబాయి, కోడళ్ళు అందరూ మా తాత మాటను ఎదురించలేక తలకాయూపిండ్లు. ఆ కాలంల అది మంచా, చెడా, అని ఆలోసించె తెలువులు వాళ్ళకు కూడా లేవు. పాపం మా అనసూర్యక్క పరిస్థితి గోరంగ తయారయింది. ‘‘నాకు పెండ్లి శెయ్యిండ్లి అని అడగలేని పరిస్థితి, నాయినను ఎదురించలేని స్థితి’’ ఆడోళ్ళు ఈ కాలంల్నే నాకు పెండ్లి శెయ్యిండ్లి అని అడగలేని పరిస్థితి. ఆ కాలంల ఆ స్థితే లేదు. కాని మా అనసూర్యక్కకు నాది అనే ఒక కుటుంబం వుండాల్నని, ఆమె కడుపు పుట్టిన పిల్లలు, ఓ సంసారం వుండాల్నని శానా‘‘కాయిశు’’ వుండేది. నేను పసిపోరణ్ణయిన ఆమె కండ్లల్ల  ఆ బలమైన ‘‘కాయిశు’’ను పసిగట్టిన శానాసార్ల. మా అక్కకు ఇడుపుకాయితం (విడాకులు) అయినంక కూడా మా అక్క ఆమె మెడ తాళిబొట్టు తియ్యలే….దేవుని పేరుమీద అట్లనే ఏసుకునేది. శానా రోజుల తర్వాత ఆ పసుపుతాడు రంగు ఎలిసి పోయి షీకిపోయే దశకు రాంగనే, మా ఊరుపక్క నర్సంపేటల ఆదివారం నాడు అంగడి జరుగుతది, ఆ అంగట్లకుపోయి పూసబెర్లోల్ల దగ్గర కొత్త పసుపుతాడు కొనుకచ్చుకునేది, మెడల్నుంచి పాత పసుపుతాడు తీసి దాని ముళ్ళిప్పి, సకిలముకిలం పెట్టుకొని కూసోని ఆమె ఒళ్ళె (ఒడిలో) ఆ పాత పసుపుతాడుకున్న నల్లపూసలగుండ్లు, బంగారుగుండ్లు, బంగారు చింతాకుపువ్వు, తాళిబొట్టు అన్నీ….పోసుకొని, కొనుక్కచ్చుకున్న కొత్త పసుపుతాడుకు సంటర్ల (నడుమ) తాళిబొట్టునుకట్టి నల్లపూస గుండ్లను, బంగారుగుండ్లను, చింతాకు ఆకారంల వుండే బంగారు పువ్వును, వరుసగా లెక్కతప్పకుంట ప్రేమగా, సుతారంగా కుచ్చి మళ్ళా మూడుముళ్ళేసుకొని మెడలెసుకొని పొగసూరి మసకబారిన పాత చిన్న అద్దంల మంచిగున్నదా…. లేదా… అని సూసుకునేది అప్పుడు నేను శానా చిన్న పోరగాణ్ణి.

పినిశెట్టి రామస్వామి అని మా నాయినమ్మోళ్ళ తమ్ముడు వుండెటాయినె ఆయిన మా అనసూర్యక్కకు మేనమామ.  ఓసారి నోరిడిషి మా అక్క మా రామస్వామి తాతకు చెప్పింది. ‘‘మామ నేను పెండ్లి శేసుకుంటనే నాకూ సంసారం, పిల్లో, జెల్లో, ఇల్లు, వాకిలి ఉండాలె కదనే. రేపు నాకు కాళ్ళు, రెక్కలు దగ్గరబడి పురాగ శాతగాక మంచంబడితే నన్ను ఎవ్వరు అర్సుకుంటరు. నా కడుపు పుట్టిన పిల్లలుంటె నన్ను సూసుకుంటరు. ఇట్ల ఇంటిమీద ఎన్నిరోజుండాల్నే అన్నది’’ పాపం మా రామస్వామి తాత ఆమె దు:ఖం అర్దం శేసుకొని “అనసూర్యవ్వ నేను చెప్తా ఆగు టైం వచ్చినప్పుడు” అన్నడు.

కొన్ని రోజుల తరువాత మా రామస్వామి తాత ఓ మంచి సంబంధం సూశిండు. పిలగాడు మంచి బుద్దిమంతుడు. మా కుమ్మరి పని మంచిగ శేత్తడు కాని ఎనుకముందు ఎమీ లేరు. పిలగానికి మా అనసూర్యక్క గురించి చెప్తె చేసుకుంటనన్నడు. మా అక్కకు కూడా పిలగాని గురించి చెప్తె సరే మామ చేసుకుంటనన్నది. ఓ రోజు మా కట్టయ్య తాత దగ్గరికి మా రామస్వామి తాత పోయి ‘‘అనసూర్యకు ఓ మంచి సంబంధం తెచ్చిన్నే బావ! అని పిలగాని గురించి శెప్పిండు, ఎంటనే మా కట్టయ్య తాత మస్తు సీరియస్‌ అయ్యి ‘‘ఎడమకాలు చెప్పుదీసి కొడుత బాడుకావ్‌ అని ఎడమకాలు శెప్పు దీసిండు. బామ్మర్ధివి బామ్మర్ధి లెక్కుండు. నా బిడ్డకు నువ్వు పెండ్లి సంబంధం సూశెటోనివి అయినావురా? అని అనరాని మాటనుకుంట, దానికి పెండ్లిజెయ్య ఏంజెయ్య దేవునికి ఇడిషిపెట్టిన’’ అన్నడు. ఎందుకంటే మా అక్కకు మళ్ళ పెండ్లిజేత్తె కట్నం, కానుకలు, బట్టు, బాతు, బోజనాల ఖర్సు ఎటులేదన్నా ఓ యాభైవేల రూపాలన్న ఖర్చుయితయి ఆ రోజుల్ల, మళ్ళా మా అనసూర్యక్క పెండ్లి శేసుకొని అత్తగారింటికిపోతె ఎక్కడి పనులు అక్కణ్ణే ఆగిపోతయ్‌ అని మా కట్టయ్య తాతకు మనసు వుండేది కాని….బయటికి శెప్పెటొడు కాదు. మా రామస్వామి తాత చేసేదేమి లేక జరిగిన సంగతి మా అక్కతోని చెప్పిండు. ఏం జెయ్యాల్నో అర్దంగాక మా అక్క బాగా ఏడిషింది. ఆడపిల్లకు కష్టమస్తె కన్నోళ్ళముందో, తోడబుట్టినోళ్ళముందో, అయినోళ్ళముందో వాళ్ళ కష్టం ఎల్లబోసుకుంటరు. కాని కన్న తండ్రే కన్న బిడ్డ రెక్క కష్టానికి అలవాటుపడి, బిడ్డ కాయకష్టం నుంచి పొందే సుఖానికి మరిగి, పరాణ్ణజీవి ‘అమీబా’ లెక్క మారినప్పుడు… కన్నతల్లి, అన్నదమ్ములు, వదినొ నవారుపట్టె మంచం నల్లులలెక్క నిమ్మకు నీరెత్తనట్లు సప్పుడు జేకుంట, మాటగూడ మాట్లాడకుంట ఊకుంటె పాపం ఒక ఆడిమనిషి ఏంజెయ్యగలుగుతది. కొంగునోట్లె కుక్కుకొని సప్పుడు గాకుంట సాటుకు ఏడుసుడు తప్ప. అప్పుడు మా అక్క అట్లనే ఏడిసింది. ‘‘ఈ వదిన తోని, మరుదళ్ళతోని, అన్నదమ్ములతోని, అయినోళ్ళతోని, కానోళ్ళతోని నేను మాటు పడలేను. నన్నొక అయ్య శేతుల పెట్టుండ్లి, నా బతుకేదో నేను బతుకుతా… అని సాటుంగ, నేటుంగ శానాసార్ల అడిగింది, కాని అప్పటికే మా అనసూర్యక్క మీద దేవుడున్నడు, ఆమెను దేవునికి ఒదిలేశిండ్లు అనే ముచ్చట ఆ నోటా, ఈ నోటా మా చుట్టాందరికి తెలిసింది. వుండంగ వుండంగ ఆమె పెండ్లిగురించి మాట్లాడే మనుషులే కరువయ్యిండ్లు. ఆమెకు పెండ్లి మీద ఆశ సచ్చిపోయింది. మా అక్కమీద దేవుడున్నడట. కనీసం ఆ దేవునికి కూడ మా అక్క మీద జాలి కలుగలే. ఆఖరికి మా అక్కమీద కూడా మా అక్కకే జాలిపోయింది. ఆమె కసిగా పెండ్లి అనే మాటను తన ఎడమకాలి బొటనఏలు(మే)తో  ఎర్రచీమను నలిపేసినట్టు నలిపేసింది.

ARIF4ఇప్పుడు మా అక్కకు యాభై అయిదు సంవత్సరాలపైనే వయసుంటది. కూలికో, నాలికో పోతది, ఆమెకు వున్న బుంతంత చొక, ఇంత కోతిమీర, ఇంత ఉల్లాకు, ఇంత గోగ్గూర, ఇంత సుక్కకూర, ఇంతంత పాలకూర సీజన్‌ను పట్టి చిన్నచిన్న ‘‘మడులు” అలుకుకుంటది. సాయంత్రం కోసుకస్తది. వాకిట్ల సాపపరుసుకొని కూసోని, కోసుకచ్చిన ఆకు కూరలు, చీరిన తాటాకు ఈనెతోని కట్టు కట్టుకుంటది, పెద్ద గంపల వరుసగా బతుకమ్మను పేర్సుకున్నట్టు పేర్సుకుంటది. తెల్లారి మబ్బుల లేత్తది. యాపపుల్లతోనన్న లేకపోతే బొగ్గుతోనన్న (ఎనుకటయితే ‘‘పిడిక’’ బొగ్గుతోని తోమేది ఇప్పుడు పిడికలు లేవు) పళ్ళు తోముకొని మొఖం కడుక్కుంటది. గంపనెత్తి పెట్టుకొని నర్సంపేటకు నాలుగు కిలోమీటర్లు నడుసుకుంట పోతది, అక్కడ కూరగాయల అడ్డమీద కూసోని అమ్ముకుంటది. పాణం పురాగ శాతగానినాడు మారుబేరపోళ్ళకు ఎంతకో ఒగంతకు అడ్డికి పావుశేరు గుత్తకు అమ్ముతది. వచ్చిన పైసలు బొడ్లె సచ్చిల పెట్టుకొని ఇంటికత్తది. అన్నం కూర వండుకొని తిని, అరుగుమీద కూసోని బొడ్లె సంచిల పైసలు అరుగుమీద కుమ్మరిత్తది, రూపాయి, రెండు రూపాయలు అన్నీ లెక్కేత్తది, ఒక పాత చెక్క బొట్టుపెట్టెల పైసలు దాసుకుంటది, ఓ బర్రెను కొనుక్కున్నది. దాని పాలు పిండి అమ్ముకుంటది, సగంపాలను పెరుగు తోడేత్తది, పెరుగు అమ్ముకుంటది. పైసలు అసలే ఖర్సుపెట్టది. కడుపుకు ఆయిమనంగ తినది. రాతెండి టిఫిని గిన్నెల (లంచ్‌బాక్స్‌) ఇంతంత అన్నం బెట్టుకుంటది. చిన్న స్టీలు కటోరల ఇంతంత కూర, లేకపోతే మామికాయ తొక్కో, టమాట తొక్కో పెట్టుకుంటది. ఆ కటొరను టిపిని బాక్స్‌ల పెట్టుకుంటది. ఎడ్ల బండి కట్టుకొని బాయికాడికి పోతది. ఎడ్లబండి నొగుల బట్టి ఒక్కతే లేపుతది, ఎడ్లు వచ్చి బుద్దిగా ‘‘కాణి’’ కింది మెడలు పెడుతయ్‌, సతాయించయ్‌. ఎడ్లకు కూడా మా అనసూర్యక్కంటె అంత ప్రేమ, జాలి. ఈ ప్రేమ, జాలి, పావురం మా కట్టయ్య తాతకు మా అక్కమీద వుండివుంటే మా అక్క బతుకిట్ల ఒంటరిదయ్యేదికాదు. గత యాభై సంవత్సరాలుగా మా అనసూర్యక్కది ఇదే దినచర్య. ఎసొంటి మార్పు శేర్పు లేవు. అప్పుడప్పుడు బతుకు రోటీన్‌గా, రోతగా అనిపిచ్చినప్పుడు ‘‘నా పెండ్లయినప్పుడు నేను చిన్నదాన్ని. అవ్వగారి ఇంటిమీద మనుసుగుంజి అత్తగారింటికి పోనని మంకుపట్టు బట్టిన. నాలుగు బుద్దిమాటలు జెప్పి తోలియ్యాలె, మా అత్తగారోళ్ళు వచ్చినప్పుడన్న తోలియ్యాలె గదా? ఆ సంబంధం ఇడుపుకాయితం (విడాకు) అయ్యినంకనన్నా మళ్ళా నన్నో అయ్యశేతులబెట్టాలే కదా, మా రామస్వామి మామ తెచ్చిన సంబంధాన్ని కూడా శెడగొట్టె,  పని చేసి చేసి నా బొక్కలు షీకిపోయినయ్‌. నేను బండెడు కష్టం జెత్తాంటే తిని కూసోని సుఖానికి మరిగి నాది ఇట్లా ఎటుగాని ఒంటరి బతుకుజేసిండు మా నాయిన ‘‘లంజకొడుకు’’ అని ఆమె ఎత తీరెదాకా ఏడుస్తది.

ఇప్పుడు మా అక్క అన్నదమ్ములందరు ఏరుబడ్డరు, అన్నదమ్ముల పిల్లలకు పిల్లలయిండ్రు, ఎవ్వల కుటుంబాలు వాళ్ళకున్నయ్‌, పాపం మా అనసూర్యక్కకే ఓ కుటుంబం లేకుంటయ్యింది. ఏదయిన పండుగకో, ప్రభోజనాకో మా చెల్లెండ్లు, మా తమ్ముండ్లు, మేము, మా పిలగాండ్లను తీసుకొనిపోతం, ఆ రొండు రోజులు సంబురంగనే వుంటది. ఎక్కడోళ్ళక్కడ పోంగనే బెంగట్నీట్టయితది. ‘‘సముద్రం కెరటాలు ఉవ్వెత్తున ఎగిరెగిరి పడుకుంటొచ్చి తీరాన్ని ముంచినప్పుడు, తీరానికి సంబురమయితది. బతుకు సుట్టూరంగా మస్తుతోడు భద్రతునట్టనిపిస్తది. అవే కెరటాలు ఎనుకకు మర్లిపోయినప్పుడు తీరం ఒంటరితనంతోటి ఏకాకై బెంగటిల్లి ఏడుస్తది’’ ఇప్పుడు మా అనసూర్యక్క బతుకు ఆ ఒంటరి తీరం లెక్కున్నది.

ఆమె బాల్యం, ఆమె యవ్వనం, ఆమె గుండెల పురుడుపోసుకున్న ఆశలు, కోరికలు, అమె జీవితం, అన్నీ… ‘‘వానలు బాగ కొట్టినప్పుడు మా ఊరి చెరువునిండి మత్తడి పడ్డప్పుడు రువ్వడిగ (అతి వేగంగా) ఉరికే మా ఊరి పెద్ద వాగు పడి కొట్టుకపోయినయ్‌. కాదు, కాదు, మా తాత ‘‘మాదర్‌చోద్‌’’గాడు మా అక్క బతుకును ఆ వాగు పారబోషిండు’’. ఎవ్వులు తెచ్చిత్తరు ఆమె బతుకును ఎనుకకు. ఏ నడిజామ్‌ రాత్రో ఆమెకు నిద్ర రాక జారిపోయి మట్లె గలిసిన జీవితం యాదికచ్చి, ‘‘కష్టమస్తె గుండెకు అమురుకొని ఏడిసెదానికి కడుపు పుట్టన బిడ్డలు లేరని, కండ్లనీళ్ళు తుడిసెదానికి ఓ తోడు లేదని, ఎక్కెక్కి ఏడుస్తాంటే మావోళ్ళు ఇది బద్దిపోచమ్మ కొంటెతనమంటాండ్లు మావోళ్ళు పిచ్చోళ్ళు. కాని…..మా అక్క గుండె యాభై సంవత్సరాలుగా మండుతున్న ఒక ఒంటరి బాధ సూర్యగోళం, ఆమె కండ్లు గడ్డకట్టిన కన్నీటి హిమాలయాలు. ప్రతిరోజు ఆమెకు ఆమె ఒంటరి బతుకు మీద రోతపుట్టి బాధను ‘‘బర్ధాష్‌’’ చెయ్యలేక గుండె భగ్గున మండుతాంటే ఆ మంట శెక (సెగ) ఆమె కండ్ల కన్నీటి హిమాలయాలను తాకి అవి కరిగి ఆమె కండ్లు కన్నీటి నదులై ప్రవహిస్తాంటయ్‌, పాపం మా అనసూర్యక్క ఓ కన్నీటి జీవనది.

*

 

 

ఒక వీడ్కోలు సాయింత్రం

Art: Srujan Raj

Art: Srujan Raj

ఉణుదుర్తి సుధాకర్

~

Sudhakar_Marine Linkజాన్ ఇంకా రాలేదు; చెన్నపట్నం మీదుగా స్టీమర్ లో ఇంగ్లండు తిరుగుప్రయాణానికి సర్దుకోవలసిన సామాన్లూ, చేయ్యాల్సిన ఏర్పాట్లూ ఇంకా చాలా ఉన్నాయనీ, అందుచేత ఆ రోజు సాయింత్రం ఏడుగంటలకిగానీ క్లబ్బుకి చేరుకోలేననీ ముందుగానే చెప్పాడు. ఎర్రమట్టి దిబ్బల మీద పరుచుకున్న కోరమాండల్ క్లబ్బు దొరలందరికీ స్థానిక జలాశయం. కేవలం దొరలకీ,  రాజాలకీ, జమీందార్లకే కాకుండా తగినస్థాయి కలిగిన ఇతర స్థానికులకు కూడా ప్రవేశం కల్పించవచ్చని క్లబ్బుయాజమాన్యం – తీవ్రమైన అభ్యంతరాల్ని తోసిపుచ్చి – ఇటీవలే తీర్మానించింది.

క్లబ్బులాన్స్ లో కూర్చుంటే సముద్రం స్పష్టంగా కనిపిస్తుంది; మంద్రంగా వినిపిస్తుంది. కెన్ క్లబ్బుకి చేరేటప్పటికి పడమటి ఆకాశం బాగా ఎర్రబడింది. తూర్పువైపు నుండి సముద్రపుగాలి బలంగా వీస్తోంది – చల్లగా, కాస్తంత ఉప్పగా – మధ్యాహ్నం పూట వేధించిన వేడినీ, ఉక్కనీ మృదువుగా  మరపింపజేస్తూ. క్లబ్బు ఆవరణలోని కొబ్బరి, మామిడిచెట్ల మీద బంగారు ఎండ తేనెరంగులోకి మారుతోంది. దూరంగా తీరంవెంట సరుగుడుతోటల వెనక ఇసుకతిన్నెలు ఎర్రగా మెరుస్తున్నాయి. వాటికి నేపధ్యంగా గాఢనీలంలోంచి ఊదారంగుకి మారిన సముద్రం.

‘ఇప్పుడు బాగానే ఉందిగాని చీకటి పడ్డాక దోమలబాధ తప్పదు’ అనుకుంటూ లాన్స్ లోకి నడిచాడు కెన్. తెల్లటి గుడ్డలు పరచిన గుండ్రటి టేకు మేజాలు; వాటిచుట్టూ నాలుగేసి లేతాకుపచ్చ రంగువేసిన పేము కుర్చీలు.  కుర్చీలన్నీ ఇంకా ఖాళీగా ఉన్నాయి.  కాసేపట్లో సందడి మొదలౌతుంది. పేకాటరాయుళ్ళు, పీకలదాకా తాగేవాళ్ళు భవనంలోపలే కూర్చుంటారుగనక లాన్స్ లో కాస్త ప్రశాంతంగానే ఉంటుంది.  కుర్చీలన్నీ దాటుకుంటూ వెళ్లి ఒక మూల కూర్చున్నాడు కెన్  – ‘ఇక్కడైతే చీకట్లో ఎక్కువమందికి కనిపించం’ అనుకుంటూ. ఇది జాన్ కి తను వ్యక్తిగతంగా ఇస్తూన్న వీడ్కోలువిందు. ఇంకెవర్నీ పిలవలేదు. పదింటికల్లా ముగించి బంగళాలకు బయిల్దేరాలని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు.

పాగా, ఎర్రకోటూ, నీలం కమర్బంద్ ధరించిన బేరర్ పరుగెత్తుకుంటూ వచ్చి, వంగి సాయిబుల పద్ధతిలో సలాం చేసాడు.

“సింహాచలం! కైసా హై?” ఎన్నాళ్ళయినా కెన్ కి తెలుగు పట్టుబడలేదుగాని హిందుస్తానీతో నెట్టుకుపోగలడు. నేటివ్స్ తో కాస్త సఖ్యంగా ఉంటే వాళ్ళు ప్రాణాలైనా ఇస్తారని ముప్ఫై ఏళ్ల ఇండియన్ సర్వీసు చివరి దశలో అతను గ్రహించాడు. ఈ గ్రహింపు వెనుక జాన్ ప్రభావం చాలానే ఉంది. అలాగని వాళ్ళని నెత్తికెక్కించుకోకూడదు – ఇది మాత్రం ముందే తెలుసు.

కెన్ దొరంతటి వాడు తనని పేరుపెట్టి పిలిచినందుకు సంతోషం పట్టలేక పోయాడు సింహాచలం.  “అచ్ఛా హూ, సార్. క్యా లేంగే సార్” అన్నాడు.

అందాకా తనకో బీరు, జాన్ రాగానే షాంపేన్, ఆవెంటనే విస్కీ ఆర్డరు చేసాడు. దోమలురాకుండా ధూపం వెలిగించమన్నాడు. సింహాచలం పరుగుతీసాడు.  జాన్ దొర వొస్తున్నాడంటే అతనిలో ఉత్సాహం ఉప్పొంగింది. ఎప్పుడో గాని రాడు; వొచ్చినప్పుడల్లా అర్థరూపాయికి తక్కువ కాకుండా బక్షీష్ ఇస్తాడు మరి. తెలుగు ఒక మాదిరిగానైనా మాట్లాడే దొర జాన్ ఒక్కడే.

Kadha-Saranga-2-300x268

పొగాకు దాచి మడత పెట్టిన తోలు సంచీ, పైపూ కోటుజేబులోంచి తీసి టేబుల్ మీద పరిచి పైపులో పొగాకు కూరడం మొదలు పెట్టాడు కెన్. ఇండియాలో ఉన్న ముప్ఫై ఏళ్లల్లో చాలామందికి స్వాగతాలు పలికాడు;  వీడ్కోళ్ళు చెప్పాడు. వచ్చేవాళ్ళు సవాలక్ష సందేహాలతో జంకుతూ వస్తారు. వెళ్ళేటప్పుడు ఆత్మవిశ్వాసంతో పొంగిన చాతీలతో, బరువైన డబ్బు సంచులతో వెళతారు. ఇంగ్లాండు తిరిగివెళ్ళి పోతున్నామనే ఉత్సాహం, ఇండియాను వీడిపోతున్న దిగులుని అధిగమిస్తుంది. భార్యలైతే మరీను. ఎగిరి గంతేసి వెళ్ళిపోతారు. ఇంగ్లండులో  నౌకర్లు ఉండరనేదొక్కటే వాళ్ళకు దిగులు కలిగించే విషయం.  జాన్ భార్యా, పిల్లలూ ఆరు నెలల క్రిందటే వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రయాణం కడుతున్నప్పుడు –

“ఏ విషయంలో ఇండియాని మీరు మిస్ అవుతారు?” అని కెన్ అడిగితే, జాన్ పిల్లలిద్దరూ తడుముకోకుండా – “మామిడిపళ్ళు” అని టపీమని జవాబు చెప్పారు. అప్పుడు వాళ్ళని చూస్తే కెన్ కి ముచ్చటేసింది. ఇప్పుడు తలుచుకుంటూంటే – తనకి భార్యా, పిల్లలూ లేకపోవడం గుర్తుకొచ్చి బాధ కలిగిస్తోంది. అసలు తను ఇండియా వచ్చినప్పుడే ఐదు, పదేళ్లకన్నా ఎక్కువ ఉండననుకున్నాడు. అలాటిది తనకన్నా తరవాత వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు; వెళ్ళిపోతున్నారు.

పాతికేళ్ళ సర్వీసు దాటాక ‘ఇక్కడేం తక్కువ? చిన్నజమీందారు లాగా బతుకుతున్నాను. ఇప్పుడు ఇంగ్లాండు వెళ్లి మాత్రం ఏం ఊడపొడవాలి?’  అన్న ఆలోచన బలపడింది. బంగాళా చుట్టూ పెంచిన తోటన్నా, తనని విడిచి ఉండలేని కుక్కలన్నా అమితమైన ప్రేమ ఏర్పరచుకున్నాడు. ఒక ఆంగ్లో-ఇండియన్ టీచర్ దగ్గరైంది. ఇంకేం కావాలి? కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి.  ఎంతమంది వెళ్ళిపోయినా ఏమంత అనిపించలేదు గానీ  జాన్ వెళ్ళిపోతాడంటే మనసుకి కష్టంగా ఉంది.

సింహాచలం గ్లాసులో పోసిన బీరు గుక్కెడు తాగి, గ్లాసు కిందపెట్టి  పైపు వెలిగించాడు. చీకటవుతోంది. గాస్ దీపాలు వెలిగించారు. దోమలింకా రాలేదు. ధూపం పనిచేస్తున్నట్టుంది. పాతికేళ్ళు ఇంగ్లండులోనూ, ముప్ఫైఏళ్ళు ఇండియాలోనూ గడిపాడు. ఏది తన దేశం? ఇక్కడే పోతే ఏ వాల్తేరు సెమెట్రీ లోనో పాతిపెడతారు. ఎక్కడయితేనేం? చివరికి మట్టిలో కలిసిపోవడమే కదా?…ఛ ఛ…ఎందుకిలా ఆలోచిస్తున్నాడు?

Art: Srujan Raj

తను ఇలా దిగాలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు  తన అంతులేని ఉత్సాహంతో, సునిశితమైన హాస్యంతో జాన్ తనని పైకిలాగాడు? జాన్ కి ఆసక్తిలేని విషయమేదీ లేదనిపిస్తుంది. ఎన్నో విషయాల గురించి మాట్లాడతాడు. తెగ చదువుతాడు. ఏవేవో కొత్త వార్తలు, సంగతులు చెబుతూనే ఉంటాడు. అలాగని ఎవరిగురించీ చెడ్డగా చెప్పడు.   టెన్నిస్, క్రికెట్ ఆడతాడు. మంచి కార్యదక్షుడిగా పేరుపొందాడు. అతనికింకా పదేళ్ళు సర్వీసుంది. అనుకోకుండా లండన్ లోని  ఇండియా ఆఫీసులో ఉపకార్యదర్శిగా చేరమని ఉత్తర్వు వచ్చింది. అంటే రిటైరయ్యే నాటికి చాలా పెద్ద పొజిషన్ లోకి వస్తాడు. అలాంటి అరుదైన స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు.

పైపు ఆరిపోయింది. కోటు లోపలి జేబులోంచి గొలుసు గడియారం తీసి చూసాడు. ఏడు దాటింది. కొన్ని టేబుళ్ల చుట్టూ జనం చేరారు. పకపకా నవ్వులు వినిపిస్తున్నాయి. దోమలు కుడుతున్నాయి. కెన్ కి చిరాగ్గా ఉంది. ఆరిన పైపుని టేబిల్ మీద విదిలించి కొట్టాడు. బూడిద బయటకొచ్చి తెల్లటి టేబిల్ క్లాత్ ని పాడుచేసింది. అతని చిరాకు ఇంకా ఎక్కువైంది. అటుగా వెళ్తున్న ఒక బేరర్ ని కసిరినట్టుగా పిలిచి మరో బీరు తీసుకురమ్మన్నాడు. సేవకుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై జాన్ నేర్పిన పాఠాలు రెండుగ్లాసుల బీరుతో ఎటో ఎగిరిపోయాయి.

ఈరోజు అతనికెందుకో జెన్నిఫర్ జ్ఞాపకం వస్తోంది. ఇరవై ఏళ్ల కిందటి మాట. లేక ఇంకా ఎక్కువే అయిందా? ఇప్పుడు తగ్గిపోయిందిగాని అప్పట్లో ప్రతీ ఏడూ చలికాలపు రోజుల్లో, అంటే క్రిస్టమస్ సెలవుల్లో పెళ్లికొడుకుల్ని వెతుక్కుంటూ ఇంగ్లండు నుండి యువతుల బృందాలు  తరలివచ్చేవి. వాళ్ళని ‘గేలం యువతులు’ అనే వాళ్ళు.  కలకత్తా, బొంబాయి, డిల్లీ, సిమ్లా – ఈ ప్రదేశాలన్నీ చుట్టబెట్టే వాళ్ళు. కొన్ని గేలాలకి చేపలు పడేవి; లేదంటే సరదాగా సెలవులు గడిపేసి ఎండలు ముదిరేలోగా తిరిగివెళ్ళిపోయేవారు. జెన్నిఫర్ కూడా అలాగే వచ్చింది. ఇక్కడే, ఈ క్లబ్బులోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అర్థరాత్రి వరకూ సంగీతం, డాన్సులు, నవ్వులు, కేరింతలు – అదంతా ఓ కలలా అనిపిస్తోంది. అదే రోజున ప్రపోజ్ చేద్దామనుకుంటూ ఎందుకో జంకాడు. చేసి ఉంటే ఎలా ఉండేదో? వాళ్ళిద్దరి మధ్యా ఏదో ఉందని అందరూ అనుకున్నారు.

ఆమె  జాన్ కి కజిన్. వాళ్ళింట్లోనే దిగింది. వేసవిలో తనని లండన్ రమ్మంది, ఉత్తరాలు రాస్తానంది. ఎందుకోగాని మనసు మార్చుకుంది. తను రాసిన ఉత్తరాలకి జవాబివ్వలేదు. ముడిపడుతున్న బంధాన్ని చేతులారా ఎందుకు తెంచింది? జాన్ ని అడుగుదామని చాలా సార్లు అనుకున్నాడు గాని, తీరా అడిగితే ఏ చేదునిజం చెబుతాడో అని ఊరుకున్నాడు. ఆమె నవ్వినప్పుడు బుగ్గమీద పడే సొట్ట, న్యూ ఇయర్ పార్టీ నాడు ఆమె వేసుకున్న ఎర్ర ముఖమల్ గౌను, అదే ఎరుపు లిప్ స్టిక్,  మెడలో మెరిసే ముత్యాల పేట – కళ్ళకి కట్టినట్టుగా గుర్తొస్తున్నాయి. మర్చిపోయినవి అనుకున్న సంగతులు మస్తిష్కపు మారు మూలల్లో దాగి ఉంటాయి కాబోలు; ఎప్పుడెప్పుడో ఉబికి వస్తాయి. అలా వచ్చినప్పుడల్లా కొత్తకొత్త రంగులు పులుముకొని మరీ వస్తాయి. గతానికి వర్తమానం  చేసే అలంకరణ అది. జెన్నిఫర్ ఇప్పుడెలా ఉందో? ఒకేఒక సారి మాటల సందర్భంలో జాన్  ఆమె ప్రసక్తి  తీసుకొచ్చాడు – పెళ్లి చేసుకొని గ్లాస్గోలో స్థిరపడిందని చెప్పాడు.

చీకట్లో ఎట్నుంచి ఊడిపడ్డాడోగాని, “సారీ, ఆలస్యం అయింది” అంటూ చటుక్కునవచ్చి కూర్చున్నాడు జాన్, తన ఉత్సాహభరితమైన చిరునవ్వుతో.

“ఏడుకే క్లబ్బుకి చేరాను గాని రిసెప్షన్ దగ్గర ఎప్పట్నించో కలవాలనుకుంటున్న ఒక ప్రముఖ వ్యక్తిని ఒకాయన పరిచయం చేశాడు. నాలుగు ముక్కలు మాట్లాడే సరికి ఆలస్యం అయింది”

“ఎవరా వ్యక్తి?”

“మనం ఎప్పటినుంచో వింటూన్న పేరే. సర్ ఆర్థర్”

“ఆ!? సర్ ఆర్థర్ కాటనే?!”

“ఆహా, ఆయనే!”

“ఏమంటాడు?”

“టూకీగా చెబుతాను. బ్రిటీష్ పాలనకు గుర్తుగా చిరకాలం మిగిలిపోయే ఉత్తమచిహ్నాల గురించి సంభాషణ సాగుతోంది. సీనియర్ రైల్వే అధికారి ఒకాయన – శాశ్వతంగా ఈ దేశంలో నిలిచిపోయేది భారతీయ రైల్వేవ్యవస్థ మాత్రమే అన్నాడు”.

Calcutta Club_Bearer

“అలా అంటే కాటన్ మహాశయుడు ఒప్పుకోడే?”

“అవును మరి. జవాబుగా సర్ ఆర్థర్ – రైల్వేల మీద పెడుతున్న ఖర్చులో పదోవంతు నీటి పారుదల, జలరవాణాల మీద పెడితే ఇంకా గొప్ప ప్రయోజనాలను ఈదేశస్తులు పొందిఉండేవారన్నాడు. ఈ దేశపు అపార జలసంపదని సద్వినియోగంచేసి లక్షలమందిని కరువులనుండి ఎలా శాశ్వతంగా విముక్తులను చెయ్యవచ్చో చెప్పాడు. రైల్వేలు అవసరమేగాని పంటభూములకు నీరు అందించడం పాలకుల మొదటి కర్తవ్యం అన్నాడు. భారతదేశపాలకులు ప్రాచీనకాలం నుండీ  ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూవస్తున్నారన్నాడు”.

“ఇదే అతని వాదన, ఎప్పట్నించో” అన్నాడు కెన్.

“ఈరోజున తన వాదనని హేతుబద్ధంగానే కాకుండా భావోద్వేగంతో కూడా వినిపింప జేశాడు. తక్షణ లాభనష్టాల బేరీజు కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రాణాల్ని కాపాడడం ముఖ్యం అన్నాడు. ఈ దృష్టి లేకపోతే భగవంతుడు పాలకులను క్షమించడన్నాడు. అతనికి హృదయానికి చాలా దగ్గరగా ఉండే ప్రతిపాదన – ఈ దేశపు నదుల్ని అనుసంధించే పథకం గురించి చెప్పాడు. ముసలాడి ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది”.

“పదవీ విరమణ చేసి ఇంగ్లండు వెళ్లిపోయాడని విన్నాను?”

“నిజమే. ప్రభుత్వంవారి పిలుపుమీద సలహాదారుడిగా ఈ మధ్యనే తిరిగి వచ్చాడు. కుంఫిణీ పాలన ముగిసి ప్రత్యక్ష బ్రిటీష్ ప్రభుత్వ పాలన ఏర్పడింది గనక, ఇటువంటి నిపుణుల సలహాలతో ఇకమీదట పెద్దపెద్ద పథకాలు అమలు కాబోతున్నాయనే ఆశాభావం పెరుగుతోంది”.

“ఈరోజున సర్ ఆర్థర్ వస్తున్నట్టు క్లబ్బువాళ్ళు ముందుగా చెప్పలేదే? ఒట్టి పనికిమాలిన సజ్జు” అన్నాడు కెన్ చిరాగ్గా.

“టౌన్ హాల్లో ఆయనకి సన్మానం జరిగింది. ఆ విషయం నాకూ తెలుసుగాని వెళ్ళడం కుదరలేదు. నీక్కూడా ఆహ్వానం వచ్చి ఉండాలే? డిన్నర్ కని ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నారు. నేను కలిసినప్పటికే  భోజనాలు ముగించి బయిల్దేరిపోతున్నారు”.

సర్ ఆర్థర్లాంటి మహానుభావుడిని కలుసుకొనే అవకాశం చేజారిపోయినందుకు కెన్ మనసు అసంతృప్తి తో నిండి పోయింది. అది గ్రహించిన జాన్ –

“ఇంకా కొన్నాళ్ళు ఉంటాడులే. విశాఖపట్నం పోర్టు పథకం ముందుకెళ్ళేటట్టుగా ఉంది. దానికి మరి ఈయనే ఆద్యుడు కదా. ఇరవై ఏళ్ల కిందట సర్ ఆర్థర్ ఇక్కడే యారాడ కొండమీద కుటుంబంతో సహా రెండేళ్లున్నాడు – నువ్వు వినే ఉంటావు. అప్పుడే పోర్టు నిర్మాణానికి ప్రతిపాదన చేసాడుగాని నిదులులేక కుంఫిణీ అధికారులు దాన్ని పక్కన పెట్టారు”.

“బ్రిటిష్ పాలనకు గుర్తులు అన్నావు. అంటే మనం ఇక్కడినుంచి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చునంటావా?” ఈ ఊహకందని పరిణామం కెన్ ని కంగారుపెట్టింది. తన కుక్కలూ, బంగళా, తోటా, సహచరీ గ్యాపకం వచ్చాయి – అదే క్రమంలో .

“ఇప్పట్లో కాదులే. నువ్వూనేనూ ఆ రోజు చూడం గాని ఎప్పుడో వస్తుంది. తప్పదు”.

కెన్ కాస్త ఊపిరి పీల్చుకుని, “ఇంగ్లీషు పాలనలో లేని భారతదేశం! ఊహకే అందడం లేదు” అన్నాడు.

సింహాచలం వచ్చి షాంపేన్ సీసాని కెన్ కి అందజేశాడు. పొగాకు బూడిదని తుడిచి, వైన్ గ్లాసుల్ని, వేయించిన చేప ముక్కల్నీ  టేబిల్ మీద సర్దివెళ్ళిపోయాడు. కెన్ స్వయంగా బిరడా తీసి, ఇద్దరి గ్లాసుల్లోనూ పోసాడు.

“ఛీర్స్! భారతదేశంలో నీ అద్భుత అనుభవాల్ని  గుర్తుచేసుకుంటూ, ఇంగ్లండులో మరిన్ని విజయాల్ని సాధించాలని కోరుకుంటూ –“

ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. బీరు, షాంపేన్, విస్కీ కలగలిసిపోయి కెన్ లోలోపల గందరగోళం సృష్టిస్తున్నాయి. దూరంగా సముద్రపు హోరు. ‘మనం ఇక్కడ లేకపోవడం’ అన్న ఆలోచనే అతనికి ఇబ్బందికరంగా, చిరాగ్గా ఉంది.

“మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని ఎందుకనుకుంటున్నావు, జాన్?”

“1857లో ఏమైందో చూశాం. చావుతప్పి కన్నులొట్ట పోయింది. కేవలం లాభార్జన కోసం ఏర్పడ్డ కుంఫిణీ మాదిరిగా కాకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవరించవలసిన రోజులొచ్చాయి. లేకపోతే ఇక్కడ మనం కొనసాగడానికి జనామోదం ఉండబోదు. వాళ్ళు తిరగబడితే మనం చెయ్యగలిగేది ఏమీలేదు. ఈ మధ్య ఇంగ్లీషు చదువులు, ముఖ్యంగా ఇంగ్లండువెళ్లి చదువుకొని తిరిగిరావడం ఎక్కువైంది. వాళ్ళంతా ఎక్కువగా మధ్యతరగతి, లేదా ఉన్నతవర్గ, అగ్రవర్ణ లాయర్లు, ఉపాధ్యాయులు; ఇంగ్లీషు చక్కగా మాట్లేడే వాళ్ళు, రాసే వాళ్ళూను. మనకి అత్యంత ప్రమాదకరమైన సమూహం ఇదే”.

కొంతమంది నేటివ్ లాయర్లు, ఉపాధ్యాయులు ఒక మూల గుమిగూడి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అంతమొందించేందుకు మంతనాలు చేస్తున్నారని ఊహించుకుంటే కెన్ కి నవ్వొచ్చింది. ఈ మాటన్నది జాన్ గనక నవ్వకుండా విన్నాడు.

“వీళ్ళ నాయకత్వంలోనే రాబోయే కాలపు తిరుగుబాట్లు పుట్టుకొస్తాయి. సిపాయిల్లోంచి కాదు. వీళ్ళని ఎదుర్కోవడానికి కొత్త ఎత్తుగడలు అవసరం. వాళ్ళకన్నా తొందరగా నేర్చుకుంటేతప్ప వాళ్ళని ఎదుర్కోలేం”.

“పాతిక ముప్ఫై ఏళ్లనుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ దేశాన్ని నియంత్రిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా నేర్చుకొనేదేముంది?”

Art: Srujan Raj

“ఇక్కడికి వచ్చే అధికారులకు కుంఫిణీ వారు ఇస్తూవచ్చిన తర్ఫీదు ఇంకెంతమాత్రమూ సరిపోదనన్నీ, ఇండియన్ సివిల్ సర్వీస్ అనే కొత్త విభాగాన్ని ఏర్పరచాలని 1858లో తీసుకున్న నిర్ణయాన్ని హుటాహుటిన అమలు చేస్తున్నారు.  ఈ కొత్త కాడర్ ని నిర్మించేందుకూ, మరోవైపు  గూఢచార వ్యవస్థని పటిష్టం చేసేందుకూ చాలామందిని దిల్లీలోనూ, లండన్ లోనూ కొన్ని  ప్రత్యేక విభాగాల్లో నియమిస్తున్నారు. ఇప్పుడు నాకు అప్పగించిన బాధ్యతలు కూడా ఇలాంటివే”.

ఒక్క క్షణంలో కెన్ కి మొత్తం అంతా అర్థమైపోయింది. కాని ఒక సందేహం అతన్ని పీడిస్తోంది.

“మనం లేకపోతే ఈ దేశం ముప్ఫైమూడు చెక్కలవుతుంది” అన్నాడు– కొంచెం అలకతో కూడిన స్వరంతో.

“నిజమే. మన పాలనలేకపోతే  ఈ దేశపు లోలోపలి సంఘర్షణలు, వాటితోబాటు మధ్యయుగ అవలక్షణాలు బయటపడతాయి. రైల్వేలు, టేలిగ్రఫీ, విద్యా, న్యాయవ్యవస్థలు – ఇవే దీర్ఘకాలిక ప్రగతికి మనం ఏర్పరచిన మార్గాలు.  గమ్మత్తేమిటంటే ఇవే రేప్పొద్దున్న మన పీకలకు చుట్టుకుంటాయి”.

కెన్ కిక్కు కొంచెం దిగింది. ఆసక్తిగా వింటున్నాడు. సింహాచలం ఆఖరి రౌండు విస్కీ, సలాడ్, చికెన్ బిరియానీ తీసుకొచ్చి పేర్చాడు.

“ఈ మధ్య ఒక నివేదిక చదివాను. దాంట్లో ఒక పాత్రికేయుడు – పేరు గుర్తు రావడం లేదు – 1857నాటి సంఘటనల గురించి రాస్తూ ‘తిరుగుబాటు విఫలమైందిగాని బ్రిటిష్ వారు ప్రవేశపెడుతూన్న రైల్వేలే వారి కొంపముంచుతాయి. అన్ని కులాలవాళ్ళూ రైళ్లల్లో కలసికట్టుగా ప్రయాణిస్తారు. క్రమేపీ వారిమధ్య విభేదాలు తొలగిపోతాయి’ – ఈ ధోరణిలో.  విడ్డూరంగా అనిపించినా దీంట్లో కొంత నిజం ఉంది”.

కెన్ ఇక తమాయించుకోలేక పోయాడు. “రైళ్లల్లో ప్రయాణిస్తే కుల వ్యవస్థ అంతం కావడమేమిటి? ఎవడా రాసింది?”

“ఎవరో  జర్మన్ అనుకుంటా. మొదటిసారిగా మనం ఈ దేశపు ప్రజలు, ప్రాంతాలు చేరువకాగల అవకాశాల్ని సృష్టించామన్నది మాత్రం వాస్తవం”.

“ఇదంతా సరేగాని జాన్, మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తావు?” అనడిగాడు కెన్ – సంభాషణని మరో దిశలోకి మళ్లిస్తూ.

“ఏమో? ప్రభుత్వంవారు పంపితేనే”.

“ఈ దేశం వదిలి వెళ్ళాలంటే నీకేమనిపిస్తోంది?”

“నేనిక్కడికి వచ్చినప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. బంగాళాఖాతం,  అరేబియన్ సముద్రం, హిందూమహాసముద్రం, హిమాలయా పర్వతాలు, గంగానది, వారణాసి, పాటలీపుత్రం, కపిలవస్తు, మలబార్, కోరమాండల్ – ఈ పేర్లలోనే గొప్ప చరిత్ర, సాహసకృత్యాలు, రొమాన్సు దాగి ఉన్నట్లు అనిపించేది. ఇప్పటికీ ఆ భావన అలాగే ఉంది. మా అబ్బాయి ఈ మధ్య రాసిన ఉత్తరంలో ఒక మంచి మాటన్నాడు. ఒక దేశం పేరున ఉన్న ఏకైక మహాసముద్రం  ఇండియన్ ఓషన్ అని. నిజమే కదా అనిపించింది”.

“ఇప్పుడేమనిపిస్తోంది?”

“ఇప్పుడా? భారతదేశంలో ఇన్నాళ్ళు పనిచేయడం నాకు లభించిన గొప్ప అవకాశం అనిపిస్తోంది. ఇది నా జీవితకాలపు గొప్ప అనుభవం. దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడి ప్రజలకోసం చెయ్యగలిగిన మంచిపనులేమైనా చెయ్యాలనేదే నా కోరిక. ఇవాళ అనుకోకుండా సర్ ఆర్థర్ ని కలుసుకున్నాక ఇలాగని మరీబలంగా అనిపిస్తున్నది. నేనీ క్లబ్బుకి వచ్చిన ఆఖరిరోజున ఆయన తటస్థపడడం దైవసంకల్పం కావచ్చు”.

కాసేపు మౌనంగా బిరియానీ తిన్నారు. భావోద్వేగంతో మాట్లాడడం జాన్ పద్ధతి కాదు. ఈ రోజు మాత్రం అతనిలో ఎక్కడో దాగిన ఉద్వేగ స్వరాలు వినిపించాయి కెన్ చెవులకి.

జాన్ కి కూడా అలా అనిపించిందేమో. “నేనిక బయిల్దేరాలి” అని ఏకపక్షంగా, ముక్తసరిగా ప్రకటించి లేచి నిటారుగా నిలబడ్డాడు. అర్థరాత్రి అయితేగాని కెన్ క్లబ్బు నుండి కదలడని జాన్ కి తెలుసు.  అయిష్టంగానే కెన్ కూడా లేచాడు; లేవగానే ఒకింత తూలాడు. కుర్చీని పట్టుకొని సంభాళించుకుని అడుగు ముందుకేసాడు. క్లబ్బు గేటువైపు నడుస్తున్నారు. నిండు పున్నమి వెన్నెల. పాదాలక్రింద ఎండుపుల్లలు విరుగుతున్నాయి.

సింహాచలం పరుగెత్తుకుంటూ వచ్చాడు. “దొరగారు పైపు మర్చిపోయారు” అని కెన్ కి అందజేశాడు. “గుడ్ నైట్ సార్” అన్నాడు వంగి సలాం చేస్తూ. జాన్ ఒక వెండి జడ రూపాయి – విక్టోరియా రాణి బొమ్మ ఉన్నది – సింహాచలం చేతిలో పెట్టాడు. అతను సలాంచేసి వెళ్ళిపోయాడు.

స్నేహితులిద్దరూ ముందుకి నడిచారు. కీచురాళ్ళ రొద; వాటి వెనుక తరంగ ఘోష. రెండు కెరటాల మధ్య కొద్దిక్షణాల ఉద్రిక్త నిశ్శబ్దం. ఆ తరవాత మళ్ళీ కెరటం విరిగిన సంరంభం.

“నేనొకటి అడుగుతాను, చెబుతావా?” అన్నాడు కెన్.

“అడుగు”.

“జెన్నిఫర్ ఎందుకు మనసు మార్చుకుంది? నీకేమైనా చెప్పిందా?”.

“నేనే ఆమెకు చెప్పాను. మీ ఇద్దరికీ జోడీ కుదరదని. నాకలా అనిపించింది మరి – అప్పట్లో”.

కెన్ ఇంకేమీ అనలేదు. గేటు సమీపించారు. వీళ్ళ రాకని గమనించిన జట్కాగుర్రం తలాడించి సకిలించింది. జట్కాసాయిబు ఉలిక్కిపడి నిద్రలేచాడు.

(వివరణలు: ఆర్థర్ కాటన్ 1860లో పదవీవిరమణచేసి ఇంగ్లండ్ వెళ్ళిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం కోరికపై 1863లో తిరిగివచ్చి సుమారు ఏడాదిపాటు  ఉన్నాడు గాని ఆ వ్యవధిలో మళ్ళీ విశాఖపట్నం వచ్చిన దాఖలాలు లేవు. 1863లోనే ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరే అర్హతను సాధించిన మొదటి భారతీయుడు – రవీంద్రనాథ్ టాగోర్ అన్నగారైన సత్యేంద్రనాథ్ టాగోర్. రెండవ వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రొమేష్ చంద్ర దత్. మూడవది బ్రహ్మోసమాజ్ లో చేరిన బిహారిలాల్ గుప్తా.  నాలగవ వ్యక్తి  సురేంద్రనాథ్ బెనర్జీ. బ్రిటిష్ పార్లమెంట్ లో మొదటి భారతీయ సభ్యుడు, సెకండ్ ఇంటర్నేషనల్ సభ్యుడైన దాదాభాయి నౌరోజీ భారతదేశపు అభివృద్ది విషయమై – 1899 వరకూ ఇంగ్లండులో జీవించిన కాటన్ ని  అనేకసార్లు సంప్రదించాడు, ఆయనతో సహకరించాడు. అన్నట్టు – ఈ కథలో జాన్ మర్చిపోయిన జర్మన్ పాత్రికేయుని పేరు కారల్ మార్క్స్).

*

 

తూర్పు-పడమర  

Artwork: Srujan Raj

Artwork: Srujan Raj

-జి ఎస్‌ రామ్మోహన్‌

 

rammohanవరలక్ష్మికి అప్పటికి గానీ అర్థం కాలేదు. అన్న కావాలనే అటూ ఇటూ తిరుగుతున్నాడని. తప్పించుకు తిరుగుతున్నాడని. వచ్చినపుడు దూరపోళ్లని పలకరిచ్చినట్టు పలకరిచ్చిందే! కుదురుగా మాట్లాడే అవకాశమిస్తేగా!  చూడనట్టే మొకం పక్కకు తిప్పుకుని మొబైల్‌లో మొకం దూర్చేస్తున్నాడు. అదొకటి దొరికింది మనుషులను తప్పించుకోవడానికి. ఏడాదిలోనే ఎంత మార్పు! మనిషి మునుపటంత తేటగా లేడు. కడుపు ముందుకు పొడుచుకుని వచ్చేసింది. మొకమంతా ఎవరో బాడిసెతో చెక్కినట్టు అదో రకంగా ఉంది. కళ్లకింద కండ ఉబ్బిపోయి వింతైన నునుపుతో రంగుతో మెరుస్తా ఉంది. ఆ నునుపు మెరుపు ఏం బాలేదు.

అన్న ముఖం ఎంత అందంగా ఉండేది? ఎంత చక్కని పలకరింపు? వెన్నెల ఆరబోసినట్టు ఏం నవ్వు అది? ఏమైపోయింది? డబ్బు ఇంతగా మనుషులను మారుస్తుందా! ఎందుకు మాట్లాడాలనుకుంటోందో ఏమి మాట్లాడాలనుకుంటుందో తెలిసిపోయినట్టే ఉంది. తెలీకుండా ఎట్లా ఉంటది? తడిక చాటు రాయబారాలతో పనికాకనే కదా ఆడో మొగో తేల్చుకుందామని ఇక్కడికొచ్చింది?

“ఇంకా తేల్చేదేముందే, వాళ్లు చేసుకునే రకం కాదు’

అని ఇరుగుపొరుగు అంటారు కానీ అలాంటి పాడు మాటలు వరలక్ష్మికి వినపడవు.

“ఎక్కడ ఈ సంబంధం కుదిరిపోతుందో అని వారి బాధ’ అని లోలోపల తనను తాను సమాధానపర్చుకుంటా ఇప్పటివరకూ లాక్కొచ్చింది వరలక్ష్మి. ఇపుడు వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేసరికి కాళ్లు వణుకుతున్నాయ్‌.

ఏమయితే మాత్రం, తోడపుట్టినదాన్ని ఇంత అవమానిస్తాడా! ఎంత కింది చేయి అయితే మాత్రం నాలుగు మాటలు మాట్లాడలేనంత లోకువైపోయిందా!  లోలోపల సుడులు తిరుగుతా ఉంది. అయినా వరలక్ష్మి ముక్కు చీదలేదు. వరలక్ష్మి చదువూ సంధ్యలు లేని మనిషి కాదు. మంచీ మర్యాదా తెలీని మనిషి కాదు. టెన్త్‌ పాస్‌ అయిన అమ్మాయి. ఇంటర్‌ చేరి మానేసిన అమ్మాయి. దుక్ఖాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్న మనిషి. వాళ్లూరు పెద్దమ్ములు పేరుకు పల్లెటూరేగానీ మరీ ఎక్కడెలా ఉండాలో తెలీనంత పల్లెటూరేమీ కాదు. దాచేపల్లి టౌన్‌కు పక్కనే అంతా కలిసిపోయినట్టే ఉండ్లా ఇపుడు!

“”ఆ దిక్కుపాలిన పడమటికి ఇవ్వబట్టి నా బతుకు ఇట్లా అయిపోయింది గానీ  తూరుపునే ఇచ్చి ఉంటే మెడలో గొలుసులు అవీ వేసుకుని దర్జాగా కుర్చీలో కూర్చొని బీడుపడిన పొలాల గురించి పాడైపోయిన వ్యవసాయం గురించి మాట్లాడతా ఉండేదాన్ని కాదూ.”

అని ఎన్ని సార్లు అనుకోని ఉంటదో ఈ మధ్య. ముక్కు పుటాలు అదురుతుండగా మొకంలో మారుతున్న రంగులను ఎవరైనా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది. నలుగురైదుగురి చూపు తనమీదే ఉందని అర్థమైనా ఛీఛీ అదంతా తన భ్రమ  అనేసుకుంది. ఊరికే చేతిలో మొబైల్‌ ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ తిప్పి చూపులో తడి ఎదుటోడికి కనిపించకుండా కాపాడుకుంది.

“ఓ గజ్జెల గుర్రమా, ఓ పిల్లా, ఏమే, ఎంత ఇంజనీరు మొగుడు దొరికితే మాత్రం పుట్టినూరోళ్లు కనిపించరేమే”

అని ఒక కుర్రపిల్లతో పనిగట్టుకుని పరాచికాలకు దిగింది. పక్కనున్న పెద్దావిడ చీర ఎక్కడ కొన్నదో వాకబు చేసింది.

మనింట్లో మనం ఎట్టైనా ఏడ్చుకోవచ్చు. పదిమందిలో, అందులోనూ బంధువుల పెళ్లిలో ఏడిస్తే నగుబాటు కాదూ!

Kadha-Saranga-2-300x268

పెళ్లి మంటపం కళకళగా ఉంది. గలగలగా ఉంది. ఇటీవలే కొత్త హంగులు తొడుక్కున్న మస్తానయ్య గారి ఎసి కల్యాణ మంటపం. సత్తెన పల్లి ఇదివరకటి సత్తెన పల్లికాదు, పల్నాడు ఇదివరకటి పల్నాడు కాదు అని ప్రభలు కట్టి మరీ చాటుతున్నట్టుంది. అమరావతి అంతగా కాకపోయినా తమకూ ఆ అదృష్టంలో ఎంతో కొంత వాటా వస్తుందని ఆశగా ఉంది. తమ పొలం పక్కనే పరిశ్రమలొస్తాయని భరోసాగా ఉంది. అమరావతి వాళ్లైతే ఎమ్మెల్యేల ఇల్లు తమ పొలంలోనే ఎలా వస్తాయో నలుగురికి చేతులూపుతా చెపుతా ఉన్నారు. ప్రతి పదిమందిలో ఆరేడు మంది రియల్‌ ఎస్టేట్‌ గురించే మాట్లాడుతున్నారు. కూలోళ్లు నోటికొచ్చినంత అడిగితే బక్క రైతు బరించేదెట్లా అని వినిపించే చోట, కాని కాలంలో ఆకాశంలో మబ్బు కనిపిస్తే మిర్చి తడిసిపో్తుందని ఆందోళనలు వినిపించే చోట ఇపుడు లేఅవుట్ల భాష వినిపిస్తోంది. లక్ష అంటే అపురూపంగా మాట్లాడుకునే గడ్డమీద ఇపుడు కోటి అంటే ఎంత, రెండక్షరాలేగా అనిపించేట్టు అయిపోయింది. ఎకరా అరెకరా అమ్ముకుని ఇంటినీ ఇల్లాలినీ మెరుగుపెట్టిన వాళ్ల హడావుడి ఒక రకంగా ఉంది. ఆడోళ్ల మెడలు కొత్త బంగారు లోకం అన్నట్టున్నాయి. మగాళ్ల చేతులకు కడియాలు మెరుస్తా ఉండాయి. అన్నిట్నీ మించి చేతుల్లో ఇమడలేక చారడేసి మొబైల్‌ ఫోన్లు బయటకు దూకుతా ఉన్నాయి. అమ్మేస్తే ఐసా పైసా అయిపోతాం అని వెనుకా ముందూ ఆడుతున్న జాగ్రత్త పరుల గొంతులు ఇంకో రకంగా ఉన్నాయి.

కొందరు మగవాళ్ల చూపులు తలుపు దగ్గర వరుసగా గులాల్‌  చల్లుతూ నిలబడిన మణిపురి, నేపాలీ పిల్లల మోకాళ్ల దగ్గర లంగరేసి ఉన్నాయి.  పిక్కల పైపైకి పాకుతూ ఉన్నాయి. ఇంత పెద్ద కల్యాణ మండపాలు అక్కడోళ్లకు మరీ వింతేమీ కాదు. కానీ ఇట్లా జవాన్లు వరుసగా నిలబడ్డట్టు ఆడపిల్లలు నిలబడ్డం కొత్త. అందునా తెల్లతెల్లగా పాలిపోయిన రంగున్న ఆడపిల్లలు. పిక్కలపైన గౌన్లేసుకున్న ఆడపిల్లలు.  భూమి పుట్టినప్పటినుంచి వాళ్లు అలాగే నుంచోని ఉన్నారేమో అన్నట్టు ఏమాత్రం ఆసక్తి కలిగించని నవ్వుతో రోబోల మాదిరి ఉన్నారు ఆ ఆడ పిల్లలందరూ. మొగోళ్ల వయ్యారాలు చూసి ఆడోళ్లు గొణుక్కుంటా ఉన్నారు. ఆ పిల్లల చేత గులాల్‌ చల్లించుకోవడానికి దగ్గరదగ్గరగా వాలిపోతున్న మొగుళ్లని డొక్కలో పొడుస్తున్నారు. “చూసింది చాల్లే నడువబ్బా” అని ముందుకు తోస్తున్నారు. పెళ్లి మంటపం అరేంజ్‌ మెంట్ ఆ ఊరోళ్లు నాలుగు రోజుల పాటు చర్చించుకోవడానికి వీలుగా ఉంది. మండపం పక్కనే వేదికపై కోలాటం ప్లస్‌ కథాకాలక్షేపం నడుస్తా ఉంది. యాభై యేళ్ల రాజమండ్రి ఆడపడుచు వాళ్ల బంధువల టీమ్‌తో కలిసి కథాకాలక్షేపం చేయిస్తా ఉంది. ఆ దిక్కుమాలిన రికార్డింగ్‌ డాన్సులకంటే ఈ కథ ఎంత బాగుంది ఒదినా అని మాటలు  వినిపిస్తున్నాయి. పట్టుచీరల రెపరెపల మధ్యలో రెండు మూడు లోవెయిస్ట్‌ జీన్స్ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. “ఎంత హైదరాబాద్‌లో ఉద్యోగమైతే మాత్రం పెళ్లిలో అదేం అవతారమే పోలేరమ్మలాగా” అనే సణుగుడులు గాజుల చప్పుళ్లలో కలగలసి ముసిముసిగా వినిపిస్తున్నాయి. పెళ్లి మంటపం వెనుక పై అంతస్తులో నల్లకుక్కతో ఇరవై మంది కుర్రాళ్లు కుస్తీ పడుతున్నారు. గ్లాస్ చప్పుళ్లు, జోకులు అపుడపుడు ఆగిఆగి వినిపిస్తున్నాయ్‌.

“బీరేందిరా ఆడోళ్ల మాదిరి…..డిసెంబర్లో బీరేందిబే” ..

గట్టిగట్టిగా నవ్వులు.

“హుస్‌ హుష్‌ ….మెల్లగా.. నీ యబ్బ, రెండు పెగ్గులకే వీరంగమెస్తున్నావేరా” అని అందరికీ మెల్లగా సుద్దులు చెప్పే గొంతుకలు కొంచెం గట్టిగానే వినిపిస్తున్నాయి. మొన్నమొన్నటిదాకా రాయల్‌ స్టాగ్‌ పేరే రాయల్గా వినిపించే చోట బ్లాగ్‌ డాగ్‌  మాలిమి అయిపోతా ఉంది.

 

అన్నతో అటో ఇటో తేల్చుకోవడానికి ఈ పెళ్లిని వేదికగా ఎంచుకుంది వరలక్ష్మి. పెదనాన్న మనమడి పెళ్లి. బంధుబలగమంతా చేరే పెళ్లి. ఇక్కడైతే నలుగురు పెద్దమనుషులుంటారు. అటో ఇటో తేలుస్తారు. ఏందిరా దాని సంగతి  అని అడుగుతారు. అవసరమైతే గడ్డి పెడతారు. నలుగురూ గట్టిగా అడిగితే తోడపుట్టినోడు కాదనగలడా! అటో ఇటో తేల్చకుండా తప్పుతుందా!  కొండంత అనుమానమూ గంపెడాశ కలగలిసిన ఆదుర్దాతో ఇక్కడకొచ్చింది. తీరా ఇక్కడకొస్తే సీన్‌ రివర్స్‌ గేర్‌లో తిరుగుతా ఉంది. ఇక్కడ జరుగుతున్న పంచాయితీలు తన పంచాయితీ కంటే పెద్దవిగా కనిపిస్తున్నాయి. కోర్టులు కేసులు అని ఏవేవో వినిపిస్తున్నాయి. ఇక్కడంతా పటమట తూర్పుగా విడిపోయి కనిపిస్తున్నారు. దాచేపల్లోళ్లు, అమరావతోళ్లుగా కనిపిస్తున్నారు.  సత్తెనపల్లి సెంటర్‌గా అమరావతోళ్లు, దాచేపల్లోళ్ల మధ్య సెటైర్లు నడుస్తున్నాయి. ఎక్కడ తక్కువైపోతామో అని దాచేపల్లోళ్లు సాధ్యమైనంత కష్టపడి తయారై వచ్చినా అదింకా స్పెషల్గా ఎక్కిరిస్తున్నట్టుంది కానీ అవమానాన్ని ఆపుతున్నట్టు లేదు. అంతా దగ్గరిదగ్గరోళ్లే. మొన్నమొన్నటిదాకా అంతా పంచె ఎగ్గట్టి మడిలో దిగినోళ్లే.

………………………………………..

ఎట్లాంటి అన్న. కోటప్పకొండ జాతరకు భుజాలమీదెక్కించుకుని తిప్పిన అన్న. ప్రభల ఊరేగింపు సరిగా కనిపించకపోతే నెత్తిమీద నిలబెట్టుకుని చూపించిన అన్న. మొన్నటికి మొన్న సంక్రాంతి పండక్కి పుట్టింటికి పోయినపుడు కోడలు సైకిల్‌ అడిగితే మామూలు సైకిల్‌ కాకుండా ఏడువేలు పెట్టి అదేందో గేర్ల సైకిల్‌ కొనిచ్చిన అన్న. అపుడే కదూ, అన్న ఎంత పెద్దోడయిండో తెలిసింది. మంచికి మర్యాదకు పుట్టింట్లో లోటు చేసింది లేదు. అయితే మాత్రం, ఆ దిక్కుమాలిన పడమటకిచ్చినందుకు ఒక దారి చూపించొద్దూ! బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చిన మాటైనా నిలబెట్టుకోవద్దూ!

Artwork: Srujan Raj

పెళ్లి వేదికకు దూరంగా మంత్రాల చప్పుడు మరీ ఎక్కువ కాని చోట నలుగురు పెద్దమనుషులు సీరియెస్‌గా పంచాయితీ చేస్తున్నారు. కోర్టు అనే మాట మర్యాదకాదని ఎవరికో చెపుతున్నారు. రేప్పొద్దున ఒకరికొకరు ఉండాల్సినోళ్లు అని సర్దిచెపుతున్నారు.

“కట్నం ఘనంగా ఇచ్చి తాహతుకు మించి పెళ్లి చేశాడా, లేదా! ఐదేళ్ల తర్వాత ఇపుడు భూమిలో వాటా ఉందంటే ఎట్టరా అని మీసాల పెద్దాయన చెపుతున్నాడు. అన్న ప్రేమతో ఏదైనా ఇస్తే తీసుకోవాలి. వాడు మాత్రం కాదంటడా. తాను శ్రీమంతుడైతే చెల్లెలు పేదరికంలో బతకాలని అనుకుంటడా! ఇచ్చింది తీసుకుంటే పద్ధతిగా ఉంటది, నా మాటినండి అని అనునయిస్తా ఉన్నాడు. “ఏం, అది మాత్రం వాళ్ల నాయనకు పుట్టలా! వాడొక్కడే పుట్టాడా. ఇయి పాతరోజులు కావు. ఏదో ముష్టిపడేసినట్టు పడేస్తామంటే కుదరదు. మాట ప్రకారం రెండెకరాలూ ఇవ్వాల్సిందే. ”…వెనుకనుంచి ఎవరో గొణగడానికి అడగడానికి మధ్యరకంగా మాట్లాడుతున్నారు. గట్టిగా వినిపించాలి. కానీ డిమాండ్‌ చేసినట్టు ఉండకూడదు. ఇవ్వకపోతే ఇంకో రూట్‌ తప్పదని చెప్పాలి. అదీ ఆ వాయిస్‌ సారాంశం. “ఎవడ్రా అది పెద్దోళ్లు మాట్లాడుతుంటే..” అని ఎవరో కసురుతున్నారు. వారి టోన్‌ ఇంకా స్థిరంగా ఉంది. అటూ ఇటూ స్టేక్స్‌ గట్టిగానే ఉన్నట్టున్నాయి.

 

అమరావతి నుంచి వచ్చినవాళ్లలోనే కొందరు ఇంకో చోట చేరి బెంగగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లు మొకాలు అంత ధీమాగా లేవు. వాళ్ల మొకాలు బాడిసెతో చెక్కినట్టుగా లేవు. వాళ్ల మొకాలు తుప్పు పట్టిన కొడవళ్లలాగా, కొచ్చన్‌ మార్కుల్లాగా ఉన్నాయి. ఉన్న ఎకరా, అరెకరా తీసేసుకున్నారు. రేపటినుంచి ఏం పనిచేయాలి? ఎట్లా బతకాలి? పిల్లల చదువులెట్లా? ప్రభుత్వం రాజధాని నిర్మించేదెపుడు? స్థలం ఇచ్చేదెపుడు? మబ్బు చూసి ముంత ఒలకబోసుకుంటే ముందు ముందు బతుక్కు భరోసా ఏంటి అని బెంగగా చర్చించుకుంటున్నారు.

 

అంతా కలగాపులగంగా ఉంది. వరలక్ష్మికి లోపల అంతకంటే అలజడిగా ఉంది. ఏడాదిన్నరలో అంతా మారిపోయింది. ఊర్లు మారిపోయాయి. బంధుత్వాలు మారిపోయాయి. దాచేపల్లి పక్కన పెద్దమ్ములుకు ఇచ్చి పెళ్లిచేసినపుడు ఇద్దరివీ పల్లెటూళ్లే. ఇద్దరివీ మెట్ట గ్రామాలే. ఆ మాటకొస్తే అమరావతి పక్కనున్న మహేశ్వరం కంటే పెద్దమ్ములు పెద్దగానే ఉండేది. మెట్టినిల్లు కూడా పుట్టినిల్లు కంటే పెద్దిళ్లే. రెండెకరాలు ఎక్కువుండే ఇంటికే ఇచ్చారు. అపుడంటే కథ వేరు. ఇపుడంతా మారిపోలే! అక్కడి మెట్ట ఇంకా అట్లనే ఉంది. ఇక్కడి మెట్ట కోట్లకెక్కింది. అన్న ఇన్నోవాలో తిరుగుతుంటే అందరూ మీ అన్న అంతోడు ఇంతోడు అంటుంటే పైకి సంబరంగానే ఉంటుంది కానీ లోలోపలే గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఏదో తేడా. ఏదో వెలితి.

ఒక కడుపున పుట్టినదాన్ని. తనకు తానుగా పిలిచి

“అరే వరా..ఇదిగోరా…ఇది నీది. ..తీసుకో” అంటే ఎంత బాగుండును. బిడ్డలు కడుపులో ఉన్నపుడు అనుకున్నమాటకే ఇపుడు దిక్కులేకుండా పోయిందే! అంతంత ఆశలు పెట్టుకోవచ్చా! ఆ మాటొక్కటి నిలుపుకుంటే చాలదూ!”

వరలక్ష్మికి కాలూ నిలకడగా లేదు. మనసూ నిలకడగా లేదు. ఊరికే అటూ ఇటూ తిరిగి వాళ్లనీ వీళ్లనీ అకారణంగా పలకరిచ్చి మాట్లాడతా ఉంది. ఉన్నట్టుండి మొగుడిమీద కోపం గొంతుకాడికి తన్నుకొచ్చింది.

“మొగుడే సరీగుంటే తనకీ యాతన వచ్చి ఉండేదా! ఆయన కదా ఈ వ్వవహారాలు చూసుకోవాల్సింది. పేరుకు మగపుట్టుకే కానీ కూతుర్ని కనడానికి తప్ప మరెందుకైనా ఆ మగతనం ఉపయోగపడిందా! గొడ్డులాగా పనిచేయడమే గానీ ఒక సంతోషం ఉందా! ఒక సంబరం ఉందా! నలుగురూ ఎట్లా బతుకుతున్నారు అనే ఆలోచనలేదు. అసలు నలుగురిలో కలిసేదే లేకపోయెనే! పెళ్లికి రమ్మంటే కూడా అమ్మా కూతుళ్లు పోండి అనే మొగోడయిపాయె. తూరుపున అన్నదమ్ములూ ఆడబిడ్డలూ ఉన్నోళ్లందరూ ఎట్లా ఉరుకులాడుతున్నరు. ఈయనకేం పట్టకపాయె. బీడీ తాక్కుంటా ఆకాశం కేసి చూస్తా ఉంటే నడిచే రోజులా ఇవి. ఏ మనిషో ఏమో! ఇంట్లో పడున్న ఎద్దూ ఒకటే ఆయనా ఒకటే. ఒకర్ననుకుని ఏం కర్మ. నా కర్మ ఇట్లా కాలింది” నిస్సహాయతతో కూడిన ఆగ్రహంతో కుతకుతా ఉడికిపోతా ఉంది వరలక్ష్మి.

“ఆ.. ఈడ సీసాలో గొట్టమేసుకుని మజా తాగుతా ఉండు. ఆడ మీ బావ ఎవర్నో చేసుకుని మజా చేసుకుంటడు. బావెక్కడున్నాడో చూసి రాపోవే. పలకరచ్చిరాపాయే ఎర్రిమొకమా”

మొగుడిమీద విసురంతా కూతురుమీదకు ట్రాన్స్‌ఫర్‌ చేసి గదమాయించింది.

ఆ పిల్ల అటూ ఇటూ తిరుగుతూ వెనుక వరుసలో గోడకు జారగిలిపడి ఐఫోన్‌తో ఆటలాడుకుంటున్న కుర్రాడిని చూసింది. ఆ కుర్రాడు పలుచగా ఉన్నాడు. పంట్లాం జారిపోతుందేమో అని చూసేవాళ్లకు భయంపుట్టేంత కిందకి వేసుకున్నాడు. సృష్టి చేసిన ఏర్పాటు వల్ల మాత్రమే  పంట్లాం ఆ మాత్రం ఒంటిని అంటిపెట్టుకుని ఉన్నట్టుంది. పైన ఒక టీషర్ట్‌ యథాలాపంగా ఉంది. పెళ్లికి ప్రత్యేకంగా తయారైవచ్చినట్టుగా అనిపించలేదు. జుట్టు నిర్లక్ష్యంగా ఉన్నా గ్లామరస్‌గా ఉంది. ఆ నిర్లక్ష్యంలో కూడా పద్థతేదో ఉన్నట్టుంది. చేతులకు కడియాలు లేవు. మెడలో కంటె లాంటి మందమైన బంగారు గొలుసేమీ లేదు. సింపుల్‌గా ఉన్నాడు కానీ చూడగానే బలిసినోళ్ల పిలగాడు అని గుర్తు పట్టేట్టు ఉన్నాడు. వాళ్ల నాన్నకు కడుపు ఎంత ముందుకొచ్చిందో ఈ కుర్రాడికి అంత లోపలికి పోయి ఉంది. భుజాల కాడ ఇపుడిపుడే బైసెప్స్‌ ఉబ్బుదామా వద్దా అన్నట్టు తొంగి చూస్తున్నాయి. చూడగానే జిమ్‌బాడీ అని తెలిసిపోయేట్టు ఉంది.  కొత్తసినిమాలో కుర్రహీరోలకు నకలుగా ఉన్నాడు. ఆ పిల్లను గమనించినా గమనించనట్టుగానే పక్కకు తిరిగి ఫ్రెండ్స్‌ని పిలుస్తూ దూరంగా వెళ్లాడు. ఆ పిల్లకు ఏదో అర్థమయినట్టే కనిపిస్తోంది. పాతసినిమాలో హీరోయిన్‌లాగా జడను ముందుకు తెచ్చుకుని దాంతో ఆవేదన పంచుకుంటున్నట్టుగా నిమురుతూ తిరిగి తల్లి దగ్గరకు నడిచింది.

వాళ్లకు మూడు వరుసల్లోనే కుర్చీలో కాళ్లు ఎత్తిపెట్టుకుని  పొగాకు నలుపుకుంటూ కూర్చున్నాడు వెంకయ్య. ఆయన జుట్టు రేగిపోయి ఆకాశం వంక చూస్తా ఉంది. మీసాలు వంగిపోయి నేల చూపులు చూస్తున్నాయి. చేతిలోని పొగాకు లాగే ముఖంపైనా ముడుతలు. ఒక్క ముక్కలో నలిగిపోయిన పొగాకు కాడలాగా ఉన్నాడాయన. ఆయన పుస్తకాలు చదవలేదుకానీ మనుషులను చదవగలిగిన వాడు. ఏం జరుగుతుందో బాగా తెలిసినవాడు. మట్టి వాసన తప్ప నోట్ల వాసన అంతగా తెలిసినవాడు కాదు. ఆయన కొడుకు ఒక నెలలో బేబులోంచి తీసినన్ని సార్లు, తీసినన్ని నోట్లు ఆయన జీవితమంతా తీసి ఉండడేమో! కూతురు మనుమరాలు తిప్పలు, కొడుకు మనుమడి జాడింపులు అన్నీ చూస్తున్నాడు. ఆ పెళ్లి జరగదు అని అర్థమవుతూనే ఉంది.

”చిన్నపుడే ఆ పిల్ల పుట్టకముందే ఇచ్చినమాట. రెండేళ్ల క్రితం వరకూ పెళ్లి గ్యారంటీ అనే అనుకున్నారు. కొడుకు చాలా ఉత్సాహం చూపేవాడు. ఏమే కోడలా అని తప్ప పేరు పెట్టి పిలిచి ఎరగడు. ఇంటర్‌ అయిపోగానే దీన్నిక్కడ వదిలేయ్‌. ఇక్కడే ఉండి బెజవాడ వస్తా పోతా డిగ్రీ చదవుకుంటది, ఎట్లా ఈడుండాల్సిందేకదా అని తన చెల్లెల్ని తొందరపెట్టేవాడు. పిల్లాడి డిగ్రీ అయిపోగానే ఇద్దరికీ ముడేయాలని అనుకున్నారు. ఈ రెండేళ్లలో చాలా మారిపోయాయి. భూములు మారిపోయాయి. జీవితాలు మారిపోయాయి. పెళ్లి కాకపోతే పోయింది, అది అక్కడే ఆగుతుందా! ఇంకా ముందుకు పోతుందా! అసలే కూతుళ్లు కొడుకుల మీద కేసులు వేయడం చూస్తూ ఉన్నాడు. తలలు పగలకొట్టుకునేంత గొడవల గురించి వింటూ ఉన్నాడు.”

మనసు పరిపరివిధాలా ఆలోచిస్తా ఉంది.

“ఒకప్పుడు బంధుత్వం అంటే ఎట్టుండేది? పెద్దరికానికి ఎంత గౌరవం ఉండేది? పాడుకాలం, ఎవరికీ ఎవరూ కానికాలం”

అని లోలోపలే వర్తమానాన్ని శపిస్తూ ఉన్నాడు.

ఆస్తులు అమ్ముకుని తింటే కొండలైనా కరిగిపోతాయ్‌రా అని ఏదో చెప్పబోతే కొడుకు చూసిన చూపు గుర్తొచ్చింది. మనసు మూలిగింది

Artwork: Srujan Raj

.

పెళ్లిమంటపం కళగానే ఉంది. సడన్‌గా వచ్చిపడిన సంపద తెచ్చిపెట్టే సంబరం కనిపిస్తానే ఉంది. అది మనుషుల మధ్య తెచ్చిపెట్టే సంక్షోభం కూడా కనిపిస్తా ఉంది. తేలని పంచాయితీలు అనేకం కనిపిస్తున్నాయి. స్టేక్స్‌ ఎక్కువైనాయి. ఎవరూ ఏదీ వదులుకునేట్టు లేరు. నలుగురిలో నగుబాటు కాకూడదనుకునే వారు పెద్దమనుషుల ఎదుట పంచాయితీలు చేసి తేల్చేసుకుంటున్నారు. అట్లా సంతృప్తిపడలేని వారు వీధికెక్కుతున్నారు. కోర్టు గుమ్మాలు తొక్కుతున్నారు. వచ్చిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడమెట్లా అనేవాళ్లు కొందరు.

దూరంగా వెళ్లి ఏ వినుకొండ, కుంట ప్రాంతాల్లోనో ముందు జాగ్రత్తగా భూముల వేట చేస్తున్న వారు కొందరు. వేరే భూములు లేక ఉన్న కొద్ది మడిచెక్క పోగొట్టుకుని గోడుగోడు మంటున్నవారు ఇంకొందరు. అంతా కలగా పులగంగా గందరగోళంగా ఉంది. పెద్ద సుడిగాలి వచ్చేసి కొందరిని మేడమీదకు మరికొందరి లోయలోకి విసిరేసినట్టు ఉంది. వరలక్ష్మి అన్నకోసం తిరుగుతూనే ఉంది.

ఇంకొక్క సారి నేరుగా ఎదురుపోయి పట్టుకుందాం.  అప్పటికి తప్పించుకుంటే పెద్దమనుషుల దగ్గరకు పోవడం తప్ప దిక్కులేదు అని తీర్మానించుకుంది.  ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అన్న కోసం మళ్లీ పెళ్లి పందిరి చుట్టూ వెతుకులాట ఆరంభించింది. తూర్పుకు పడమటకు మధ్య దాగుడుమూతలాట సాగుతానే ఉంది.

*

చివరాఖరి ప్రశ్న

Art: Srujan Raj

Art: Srujan Raj

 

-కోడూరి విజయకుమార్

~

vijay

‘కొక్కొరోకో’ … మొబైల్ అలారం లెమ్మని అరుస్తోంది

నిద్ర పట్టని మహానగర రాత్రుల యాతనల నడుమ ఉదయమే లేవడమొక పెను సవాలు!

చిన్నతనంలో ఊరిలో కోడి కూతకు మేల్కొనే అలవాటు ఇంకా పోనందుకో లేక  కొట్టి మరీ నిద్ర లేపే లక్షణం వున్నందువల్లనో అతడు ఊళ్ళోని కోడికూతలా భ్రమింపజేసే ఈ విచిత్ర యంత్రశబ్దాన్ని ఎంచుకున్నాడు.

కొట్టి చెబితే కూడా మెలకువలోకి రాకుండాపోతోన్న జీవితాన్ని తల్చుకుని క్షణకాలం దిగులు పడ్డాడు.

ఇట్లా అప్పుడప్పుడూ జీవితాన్ని తలుచుకుని దిగులుపడే సున్నిత హృదయ శకలం ఒకటి ఏ మూలనో ఇంకా మిగిలి వున్నందుకు ఒకింత సంతోషించాడు కూడా !

‘సరే గానీ … దిగులు దేనికి ?’ ప్రశ్నించుకున్నాడు.

జబ్బులతో మంచాన పడిన తలిదండ్రులు జ్ఞాపకం వొచ్చారు.

‘వృద్ధాప్యం కదా … జబ్బులతో మంచాన పడడం మామూలే కదా’

సంసారంలో ఇబ్బందులు పడుతోన్న తన తోడబుట్టిన వాళ్ళు జ్ఞాపకం వొచ్చారు.

‘ఏ ఇబ్బందులూ,  గొడవలూ, మనస్పర్థలూ లేకుండా ఎవరి సంసారాలు వున్నాయి? చాలా అందంగా సాగుతున్నట్టుగా పైకి కనిపించే సంసారాలన్నీ నిజంగా అందంగానే సాగుతున్నాయా?’

సరే … సరే …. లోన లుంగలు చుట్టుకు పోతున్న ఈ దుఃఖం మాటేమిటి ?

అరచేతులనూ జుత్తు లోనికి జొనిపి,  కణతలను చిన్నగా రుద్దుకుంటూ, గట్టిగా శ్వాస పీల్చుకుని వదిలాడు.

ప్రశ్నలు …. ప్రశ్నలు …. నిన్న సాయంత్రం నుండీ ఎడ తెరిపి లేని ప్రశ్నలు …  ఏవేవో సమాధానాలు దొరుకుతున్నాయి గానీ, అసలైన ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. ఇంతా చేసి, ఆ ప్రశ్న వేసింది అప్పుడప్పుడూ ఆర్టీసీ చౌరస్తా దగ్గర తారసపడే పిచ్చివాడు.

రోజుల తరబడి స్నానం చేయక  పోగచూరినట్లు నల్లగా వుండే శరీరం … చీలికలు పేలికలుగా శరీరం పైన వున్న పొడవాటి షర్టు, పొట్ట దాకా పెరిగిన తెల్లటి గడ్డం, చింపిరి జుట్టు, గుంటలు పడి లోనకు పోయిన కళ్ళు!

‘ఎవరికీ పట్టని వాళ్ళు, ఎవరినీ పట్టించుకోని వాళ్ళు ఇట్లాగే వుంటారేమో?’ అనుకున్నాడు.

‘పిచ్చివాడు ‘ … ఆ మాట ఎందుకో ఒక క్షణం చిత్రంగా అనిపించింది!

ఫలానా విధంగా కనిపిస్తే, లేక ఫలానా విధంగా మాట్లాడితే‘పిచ్చివాడు’ అని ప్రమాణాలు నిర్ణయించింది ఎవరు?

ఒక చిన్న కారణంతో ఏళ్ల తరబడి దెబ్బలాడుకునే భార్యాభర్తలూ …. తిడితే తప్ప కింది వాళ్ళు పనిచేయరనే ఆలోచనలతో తిరిగే యజమానులూ…  అత్యంత రద్దీ సమయంలో  పొరపాటున దాష్  కొట్టిన స్కూటర్ వాడితో నడి రోడ్డు పైన పెద్ద గొడవకు దిగే కారు ఓనర్లు …. వీళ్ళందరూ ‘నార్మల్’ మనుషులేనా ?

కిటికీ పరదాని పక్కకు జరిపాడు

ఉదయం వెలుగు జొరబడి గది అంతా పరుచుకుంది.

‘గడిచిన రాత్రి నుండి బయట పడి, ఇట్లా ఈ కొత్త రోజు లోకి వచ్చాను కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే ?’ ప్రశ్నించుకున్నాడు.

‘లేకపోతే ఏముంటుంది ? ఏదీ …. ఏ …. దీ వుండదు !’ ఎవరో గట్టిగా చెప్పినట్టు అనిపించింది.

తల తిప్పి చూసాడు –  కుండీలో మందార పువ్వు నవ్వుతోంది.

`ఈ బాధలు పడడం కన్నా, ఈ పువ్వులా పుట్టి వుంటే ఎంత బాగుండేది?’ నిట్టూర్చాడు.

‘పువ్వులా పుట్టకపోయినా పువ్వులా బతకొచ్చు అని ఎప్పుడైనా అనుకున్నావా?’ కుండీ లోని పువ్వు గల గలా నవ్వినట్టు అనిపించింది.

కళ్ళు నులుముకుంటూ బెడ్ రూం లో నుండి బయటకు వచ్చాడు.

తను వంటగదిలో ఉన్నట్టుంది. పిల్లల అలికిడి లేదు.

బాబు ఉదయం నాలుగు గంటలకే ఐ ఐ టి కోచింగ్ కీ, పాప ఉదయం ఐదు గంటలకే మెడిసిన్ కోచింగ్ కీ వెళ్ళిపోతారు.

బాల్యం కోల్పోయారు … కౌమారం కోల్పోతున్నారు … రేపు యవ్వనం కూడా కోల్పోతారు …

ఇన్ని కోల్పోయిన తరువాత రేపు జీవితం కోల్పోకుండా ఉంటారా ?

కానీ, అది కోల్పోకుండా వుండడం కోసమే కదా ఈ తెల్లవారు ఝాము కోచింగులు !

ఏది కోల్పోకుండా వుండడం కోసం మరి దేనిని కోల్పోతున్నట్టు ?

Kadha-Saranga-2-300x268

స్కూలు రోజుల వరకూ అతడు చాలా పాటలు పాడేవాడు. ఎక్కడ  పాటల పోటీ జరిగినా మొదటి బహుమతి సాధించేవాడు. ఒక బాలమురళి లాగా, ఒక జేసుదాసు లాగా పాటలు పాడుకుంటూ బతికేయాలని అతడి అప్పటి కల!

శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటానని తండ్రికి చెప్పినపుడు, ‘ముందు చదువు పైన శ్రద్ధపెట్టు’ అన్న సమాధానం వెనుక డబ్బులు కట్టలేని  తండ్రి బేలతనం వుందన్న రహస్యం అతడికి కొంత ఆలస్యంగా అర్థం అయింది. కాలేజీ రోజుల లోకి వచ్చేసరికి అతడికి కుటుంబ బాధ్యతల సెగ తగిలి, క్రమ క్రమంగా ఒకప్పుడు తాను అద్భుతంగా పాటలు పాడే వాడిని అన్న సంగతినే మర్చిపోయాడు.

చదువు … పోటీ పరీక్షలు … నెల తిరిగే సరికి కుటుంబం కాస్త ప్రశాంతంగా బతికేందుకు అవసరమైన సంపాదన తెచ్చే ఒక మంచి ఉద్యోగమే లక్ష్యం!

సరే … అదంతా గతం … ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటి ?

పాప చక్కగా పాటలు పాడుతుంది … ఎంత తియ్యని గొంతు దానిది !

సంగీతం క్లాసులు మాన్పించి, మెడిసిన్ కోచింగ్ క్లాసులకు వెళ్ళమని చెప్పిన రోజున అన్నం తినకుండా అలిగి కూర్చుంది.

బుజ్జగించి, లేక, సంగీతాన్నే నమ్ముకుని ముందుకు వెళితే మిగిలే జీవితాన్ని బెదరగొట్టే రూపాలలో వర్ణించి, మొత్తంమీద పిల్లని సంగీతం నుండి దారి మళ్ళించాడు !

నేల పైన మొదలైన తన జీవితం ఇప్పుడు మేడ పైన కాస్త సౌకర్యవంతమైన స్థాయికి చేరిన దశలో అజాగ్రత్తగా వుంటే, రేపు పిల్లలు ఎక్కడ నేల పైకి జారి పడతారో అని ఒక భయానక అభద్రతా భావం … ఎవరు జొప్పించారు ఈ జీవితాల లోనికి ఇంత అభద్రతా భావాన్ని ?

‘ఎక్కడి నుండో ఇక్కడి ఈ లోకం లోకి విసిరి వేయబడి, ఇక్కడి ఈ సంచారంలో నిరంతరంగా ఒక భారాన్ని మోస్తూ, చివరన మళ్ళీ ఎక్కడికో తిరుగు ప్రయాణమై …’ తన ఊహలకు తానే నవ్వుకున్నాడు!

‘టేబుల్ పైన టిఫిన్ రెడీగా వుంది …. లంచ్ బాక్స్ అక్కడే పెట్టాను ‘ స్నానం చేసి వచ్చేసరికి, బాల్కనీలో మొక్కలకు నీళ్ళు పోస్తోన్న భార్య చెప్పింది.

‘భూమ్మీద పడి, తిరిగి వెళ్లి పోయేదాకా ఏమి తప్పినా వేళకు తిండి తినడమైతే తప్పదు గదా!’  తనలో తాను గొణుక్కున్నాడు.

‘అందమే ఆనందం …. ‘ వివిధ భారతి లో ఘంటసాల పాట తియ్యగా సాగుతోంది.

పాటలు వింటూ టిఫిన్ చేయడం అలవాటు అతడికి.

‘ఆనందమే జీవిత మకరందం’ వినడానికి ఎంత సరళంగా, ఎంత అందంగా వుంది?

ఇంత సరళమైన, ఇంత అందమైన ఈ అనుభూతి ఒక జ్ఞానం లాగ బయటే నిలబడి పోతున్నది తప్ప, గుండెలోకీ, రక్త నాళాలలోకీ, జీవితంలోకీ ఇంకడం లేదెందుకని ? పిచ్చివాడు వేసిన ప్రశ్న భయపెడుతున్నదా? … లేక, వాడికి దొరకిన జవాబు తనకు దొరకనందుకు దిగులుగా వున్నదా?

స్కూటర్ తీసుకుని ఆఫీస్ కు బయల్దేరాడు ….

గత వారం రోజులుగా ఆఫీస్ కి వెళ్ళాలంటే చాలా దిగులుగా ఉంటోంది.

మధు … ఆఫీస్ లో వున్న సన్నిహిత మిత్రులలో ఒకడు ….. వారం కిందట క్యాన్సర్ తో పోయాడు.  మనిషి మృత్యువుకు చేరువ అయ్యేటప్పటి ప్రయాణం ఎంత భారంగా వుంటుందో దగ్గరగా చూసాడు. పరీక్షలు జరిపి చెప్పారు డాక్టర్లు – ‘ క్యాన్సర్ చివరి దశలో వుంది – సమయం లేదు’.

‘ఛ …. ఇంతేనా జీవితం ….ఎన్నెన్ని ఊహించుకుంటాము …. ఎన్నెన్ని కలలు కంటాము … అన్నీ దేహం లోపలి ఒక్క కుదుపుతో దూది పింజలలా తేలిపోవలసిందేనా?’ డాక్టర్ గది నుండి బయటకు వచ్చి స్నేహితుడు దుఖించిన రోజు ఇప్పటికీ వెంటాడుతూనే వుంది.

 

వీధులు దాటి, మెయిన్ రోడ్డు మీదకు చేరుకున్నాడు. రోడ్లు ఈనినట్లుగా జనం …. బస్సుల్లో, కార్లలో, ఆటోల్లో, బైకుల పైన ….ముందు వాడిని కదలమని వెనుక వాడూ, ఆ ముందు వాడిని మరింత త్వరగా వెళ్ళమని ఈ ముందు వాడూ …  అందరూ ఆదరా బాదరాగా పరిగెత్తడానికి సిద్ధంగా వుంటారు గానీ ఎవరూ టైంకి గమ్యానికి చేరే అవకాశం వుండదు. వాడెవడో భలే చెప్పాడు …. మహానగరంలో మనుషులు కాంక్రీటు బోనులలో బంధింపబడిన జంతువులు …. బయటికి వెళ్లి బతకలేరు … లోపలి ఉక్కపోతను భరించలేరు!

వి ఎస్ టి సెంటర్ దగ్గరకు చేరున్నాడు అతడు.  అర కిలోమీటరు మేర ట్రాఫిక్ వుంది. వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. పక్కనే పోలీసుల కాపలా మధ్య ఎర్ర జెండాల నీడలో, చేతులలో ప్లకార్డులతో  ఊరేగింపు కదులుతోంది.

‘భూటకపు ఎన్ కౌంటర్లు నశించాలి’

‘హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి’

అతడి పక్కనే కదులుతోన్న ఊరేగింపులో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు –

‘ఇంజనీరింగ్ చదివే పిల్లలు … పేద ప్రజల పట్ల ఎంత కరుణా, ప్రేమా లేకపోతే బంగారం లాంటి జీవితాలని వొదులుకుని అట్లా అడవుల్లోకి వెళ్ళిపోతారు?’

అతడిని ఆ మాటలు కాసేపు సిగ్గు పడేలా చేసాయి.

తను … తన వాళ్ళు … తన బాధలు  … తన వాళ్ళ బాధలు …. ఈ కలుగు నుండి ఎప్పుడైనా బయటపడ్డాడా తను? మరి, ఆ యువకులు ? …. తమకు ఏమీ కాని పేద వాళ్ళ కోసం, గెలుస్తామన్న నమ్మకం ఇసుమంతైనా లేని యుద్ధం లోకి దూకి ప్రాణాలని తృణ ప్రాయంగా వొదిలి వేసారు.

జీవితమంటే ఇతరుల కోసం జీవించేదేనా ?

‘జీవితమంటే తెలిసిందా నీకు …. తెలిసిందా నీకు ? … హ్హ హ్హ హ్హ …. నాకు తెలిసింది …. నాకు తెలిసింది …. ఇదిగో ఈ గుప్పిట్లో దాచేసాను … హ్హ హ్హ హ్హ’

ఆర్ టి సి చౌరస్తా దగ్గర పడేసరికి, మూసిన గుప్పిలి చూపిస్తూ, నిన్న హటాత్తుగా తన స్కూటర్ కు అడ్డంగా వచ్చి ప్రశ్న వేసిన పిచ్చివాడు జ్ఞాపకం వచ్చాడు అతడికి.

ఇవాళ మళ్ళీ కనిపిస్తాడా ?

కనిపిస్తే బాగుండు …. ఆ గుప్పిట్లో ఏం దాచిపెట్టి, జీవితమంటే తెలిసిందని అంత ఆనందంగా  ప్రకటించాడు వాడు?  వాడిని కొంచెం మంచి చేసుకుని మాటల్లో పెట్టి తెలుసుకోవాలి! పిచ్చివాళ్ళు మహా మొండిగా ఉంటారని అంటారు – వాడు గుప్పిలి తెరిచి చూపిస్తాడంటావా ?

అయినా, పిచ్చి వాడి మాటలకు అర్థాలు వుంటాయా ?

ఇక్కడ జీవితాలకే అర్థం లేకుండా పోతోంది ….. అంటే, జీవితానికి అర్థం ఉంటుందా ? … ఉండాలనే నియమం ఏదైనా వుందా ?

ఆలోచనల నడుమ ఆర్ టి సి చౌరస్తా సిగ్నల్స్ దగ్గర ఆగాడు అతడు.

చుట్టూ చూసాడు – ఆ పిచ్చివాడు ఎక్కడైనా కనిపిస్తాడేమో అని. ఊహూ … కనిపించలేదు. అయినా, ఫలానా టైంకి, ఫలానా చోటులో వుండాలనే కాలనియమం పాటించడానికి వాడేమైనా మామూలు మనిషా?

‘సర్ … నిన్న సాయంత్రం ఇక్కడ ఒక పిచ్చివాడు వుండాలి ‘ మాటల్ని కూడబలుక్కుంటూ పక్కన నిలబడి వున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ని అడిగాడు అతడు.

‘ఏమైతడు నీకు? అట్ల రోడ్ల మీద వొదిలేసి పోతే ఎట్ల?’

‘అయ్యో …. అతడు నాకేం కాడు …. నాకేం కాడు’ తత్తర తత్తరగా అన్నాడు.

కానిస్టేబుల్ అతడిని తేరిపార చూసాడు.

అప్పుడే గ్రీన్ బల్బు వెలగడంతో ఇక కానిస్టేబుల్ మొహం చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు.

సుదర్శన్ టాకీస్ లో ఎవరో స్టార్ హీరో కొత్త సినిమా విడుదల ఉన్నట్టుంది. టాకీసు ముందు అభిమానుల కోలాహలం! ….అభిమాన హీరో సినిమా మొదటి రోజు, మొదటి ఆట చూడకపోతే జీవితానికి అర్థం లేదనుకునే జనం …. ఒక వేళ టికెట్ దొరక్కపోతే ఆత్మహత్య చేసుకోవడానికైనా వెనుకాడని సాహసులు!

అశోక్ నగర్ చౌరస్తా దాటి ఇందిరా పార్కు దగ్గరికి వచ్చేసరికి ఒక చోట జనం మూగి వున్నారు. గుంపు ముందర ఆర్ టీ సి బస్సు ఆగి వుంది.

ఎప్పట్లాగే, ఏమీ పట్టనట్టుగా ముందుకు సాగిపోతూ వుండగా పక్కన ఎవరిదో మాట వినిపించింది -‘ఎవరో పిచ్చివాడు …. బస్సుకు అడ్డంగా వెళ్లి, దాని కిందపడి చచ్చి పోయాడు’

స్కూటర్ సడెన్ బ్రేక్ వేసి, కొంచెం దూరంగా పార్క్ చేసి, గుంపుని చేరుకున్నాడు అతడు. గుంపులోకి దూరి, ఒకరిద్దరిని బలవంతంగా పక్కకు జరిపి రక్తం మడుగులో పడి వున్న పిచ్చివాడిని చూడగానే కొన్ని సెకన్ల పాటు అతడి ఒళ్ళు జలదరించింది.

రోడ్డు పైన నిర్జీవంగా పడి వున్న పిచ్చి వాడిని పరికించి చూసాడు.

ఏదో గొప్ప అలౌకిక ఆనంద స్థితిలో మరణించినట్లుగా వాడి పెదవుల పైన ఇంకా మెరుస్తోన్న నవ్వు! సరిగ్గా నిన్న సాయంత్రం అతడి స్కూటర్ కి అడ్డంగా వచ్చి, ‘జీవితమంటే నాకు తెలిసింది’ అని గొప్ప సంతోషంతో ప్రకటించినప్పుడు అతడి కళ్ళల్లో, పెదవుల పైన కన్పించిన మెరుపు నవ్వు లాంటి నవ్వు !

అతడు, అప్రయత్నంగా నిర్జీవంగా వెల్లకిలా పడి వున్న పిచ్చివాడి అరచేతుల వైపు చూసాడు.

అరచేతులు రెండూ తెరుచుకుని, ఆకాశం వైపు చూస్తున్నాయి.

మనసు వికలమై, అతడు గుంపులో నుండి బైటకు వచ్చాడు.

‘నారాయణగూడా సెంటర్ లో పెద్ద బట్టల దుకాణం వుండేది ఈ పిచ్చాయనకి … వ్యాపారంలో కొడుకే మోసం చేసే సరికి తట్టుకోలేక ఇట్ల అయిపోయిండు’ అక్కడ చేరిన వాళ్ళలో ఒకరు, మిగతా వాళ్లకు చెబుతున్నారు.

‘ఏముంటే మాత్రం ఏమున్నది బిడ్డా … పోయేటప్పుడు సంపాయించిన పైసలొస్తయా …. రక్తం పంచుకున్న బిడ్డలస్తరా?’  ముసలమ్మ ఒకావిడ అంటోంది!

అతడికి ఆఫీసుకి వెళ్ళాలనిపించలేదు. ఫోను చేసి చెప్పాడు రావడం లేదని.

స్కూటర్ వెనక్కి తిప్పి ఇంటి దారి పట్టాడు.

ఇంటికి చేరుకొని, గబ గబా బెడ్ రూమ్ లోకి చేరుకొని మంచం పైన వాలిపోయాడు.

‘ఏమయింది ఈ మనిషికి ఇవాళ ‘ అనుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చింది అతడి భార్య.

‘ ఆఫీస్ కు వెళ్ళ లేదా? ఏమైనా ప్రాబ్లంగా ఉందా ఒంట్లో?’

‘నో ప్రాబ్లం … ఐ యాం ఆల్ రైట్’ అంటూ తెరిచి వున్న కిటికీ వైపు చూసాడు అతడు. పొద్దున్న కన్పించిన మందార పువ్వు లేదక్కడ!

‘ఈ కుండీలో పొద్దున్న మందార పువ్వొకటి వుండాలి ‘ భార్యను అడిగాడు

‘ఓ అదా … పక్కింటి వాళ్ళ ఇంట్లో దేవుడి పూజ ఏదో వుందని కోసుకు పోయారు. హ్మ్ …. అయినా ఎప్పుడూ లేనిది ఇంట్లో కుండీలలో పూసే పూవుల గురించి అడుగుతున్నావు … ఒంట్లో బాగానే ఉందా అని అడిగితే నో ప్రాబ్లం అంటున్నావు’ కొంచెం కంగారుగా అడిగింది

.

* * * * *

 

                     

        

 

 

స్పీడ్ ఇన్ టు టైమ్!

 

sidhareddiచీకటి .

ఇది ఎప్పటికీ ఇలానే ఉండిపోతే ఎంత బావుణ్ణో! ఈ చీకటిలో ఎవరూ లేరు. నేనూ లేను! అంతా శూన్యం. ఈ శూన్యం నుంచి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఎక్కడికో వెళ్లిపోవాలనే తీవ్రమైన కోరిక. అలా వెనక్కి వెనక్కి వెళ్లిపోతూ, బిగ్‍బ్యాంగ్ కంటే ముందు కి వెళ్లిపోతే ఇంకా బావుంటుందేమో. తను, నేను, ఈ విశ్వం, భూమి – అసలేమీ లేనప్పుటి రోజులకి.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, టుడే వుయ్ ప్రౌడ్లీ ప్రెజ్ంట్ టు యూ…

వెలుగు.

ఫోకస్ లైట్ వచ్చి మీద పడింది. భరించలేని వెలుతురు. మోయలేని భారం. హాలు నిండా జనాలు. ఎవరు వీళ్లంతా? తండ్రి కి దూరమైన కొడుకు, ప్రియురాలిని పోగొట్టుకున్న ప్రియుడు, ప్రేమించడం చేతకాని అసమర్థుడు, ఓడిపోయి గెలవాలనుకునే తపనతో రగిలే యోధుడు, మోసగాడు, ఎత్తుకు పై ఎత్తు వేసేవాడు, అన్నీ పోగొట్టుకున్న పనికిరాని వాడు – జీవితంతో పోరాటానికి దిగిన సైనికుల సమూహం.
…ది ఒన్ అండ్ ఓన్లీ , రఘురామ్.

చప్పట్లు. ఫ్లాష్ లైట్లు. జనాలు.

స్టేజ్ మధ్యలోకి నడిచాను. ఫోకస్ లైట్ నన్నే ఫాలో అయింది. రెండు చేతులెత్తి ఆడియన్స్ వైపు చూశాను. ట్రేడ్‍మార్క్ విన్యాసం. రేపు హెడ్‍లైన్స్ లో ఇదే ఫోటో. రఘు రాక్స్ ది టెక్నోకాన్ఫరెన్స్.

ఆడిటోరియంలో కూర్చుని ఎదురుచూస్తున్న జనాలు.

స్టేజ్ మీద నేను. నా జీవితం ఇంకెక్కడో నాకు సంబంధం లేకుండా గడిచిపోతోంది.. ప్రపంచంలో ఏదో మూల ఎవరో ఇప్పుడే కంప్యూటర్ ముందు కూర్చుని నా కంపెనీ షేర్స్ కొందామా వద్దా అని ఆలోచిస్తుంటారు. కొంటే నా మీద మరి కొంత భారం. ఇంత భారం నేనెలా మొయ్యాలి? మోయగలనా?

ఒక క్షణం కళ్లు మూసుకున్నాను. ఒక జ్ఞాపకం ఫ్లాష్ లా మెరిసింది. హాయిగా నిద్రపోతున్నట్టుగా బెడ్ రూంలో పడుకునొందొక ఆవిడ. పక్కనే డాక్టర్లు. వాళ్లని పట్టుకుని భోరున ఏడుస్తున్న ఒక పిల్లవాడు. అతని పక్కనే నిల్చుని వాడిని పట్టుకుని ఏడుస్తోన్న ఇద్దరు ముసలివాళ్ళు. పక్కనే మరొక బెడ్ రూంలో బెడ్ పై పడుకుని ఫ్యాన్ వైపే చూస్తోన్న ఒక వ్యక్తి.

గొంతు సవరించుకున్నాను. ఆడిటోరియంలో మసగ్గా కనిపిస్తున్న ప్రేక్షకుల వైపోసారి చూశాను. ఎంతమంది జనాలు! నా పేరు రఘురామ్. అది అందరికీ తెలుసు. కానీ నేను ఎవ్వరికీ తెలియదు; చివరికి నాక్కూడా!

వీళ్లల్లో ఏ ఒక్కరికైనా నేను తెలిసుంటే ఈ వేషం తీసేస్తాను. ఈ జీవితం చాలించేస్తాను. ఎక్కిన మెట్లన్నీ దిగేసి, కాలం అద్దిన రంగులన్నీ కడిగేసి, వెనక్కి, ఇంకా వెనక్కి వెళ్లిపోతాను. బిగ్‍బ్యాంగ్ అంత వెనక్కి కాకపోయినా, యూనివర్శిటీ కారిడార్లో నా వైపు నడిచొస్తూ ఆమె చూసిన ఓర చూపులో కాలి బూడిదైపోతాను. ఆ బూడిదలోనుంచి ఏక కణ జీవిగా గా ఆవిర్భవిస్తాను. జీవితాన్ని మళ్లీ మొదట్లో ఆరంభిస్తాను.

మరి ఇన్నాళ్ల నీ కష్టం సంగతేంటి? – వెయ్యి గొంతుకలు ఒక్కసారే అడిగాయి.

పది సంవత్సరాల్లో మూడు స్టార్టప్స్. మల్టీ మిలియన్ డాలర్స్. క్లోజ్ టు బిలియన్.

సాధించింది కొండంత. కోల్పోయింది విశ్వమంత.

 

…టుడే ఇండియా హాజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఫ్రమ్ ధ్రీ ధౌజెండ్ స్టార్టప్స్ యాన్ ఇయర్ బ్యాక్, టు ఏ ప్రొజెక్టెడ్ ఫిఫ్టీన్ థౌజెండ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్… ఏ న్యూ ఎరా ఫర్ స్టార్టప్స్ హాజ్ బిగన్.

స్పీచ్. అంతా ప్రిపేర్డ్. ఎవరో రాసిచ్చింది. ఇంతకుముందు ఇంకో దగ్గర మాట్లాడిందే!

మాట్లాడ్డం మొదలుపెట్టగానే తను నడిచొచ్చింది. ఎదురుగా కూర్చుంది. అంత ఎత్తులో ఎలా కూర్చుంది? ఎదురుగా మరొక స్టేజ్ ఉందా? బ్యాగ్ లోనుంచి ఫ్లాస్క్ తీసి బయట పెట్టింది. అందులో వేడి నీళ్లు. ఇంకో పక్కన రేడెల్ శృతి బాక్స్ పెట్టుకుంది.

నాకిప్పుడు ముప్ఫై ఐదు. తనింకా అప్పట్లానే ఉంది.

ఫరెవర్ ట్వంటీ వన్. పడి పడి లేచే వయసు.

తను పాడడం మొదలుపెట్టింది.

రాగం మోహనం. తాళం ఆది. రచన పూచి శ్రీనివాస అయ్యంగార్.

నిన్ను కోరి యున్నానురా,
నిఖిల లోక నాయకా.
నన్ను పాలింప సమయము రా.

నువ్వు తాళం సరిగ్గా వేయటం లేదు. ఎన్ని సార్లు చెప్పాలి. ఇంత సింపుల్ విషయం ఎందుకు అర్థం కాదు నీకు? పేరుకి పెద్ద మ్యాథ్స్ జీనియస్. ఇంకోసారి చెప్తాను. ఇదే లాస్ట్ టైం. సంగీతానికి శృతి, లయ ప్రధానం.
ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్. అర్థమైందా? ఇది ఆది తాళం. ఏంటా తలూపడం? నీతో సమస్య ఏంటో తెలుసా? నువ్విక్కడ ఉండవు. ఉంటే గతంలో లేదా భవిష్యత్తులో. ప్లీజ్ బి విత్ మి. రైట్ హియర్. రైట్ నౌ.

ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్.

Kadha-Saranga-2-300x268

పోడియం మీద మెల్లగానే ట్యాప్ చేశాను. కానీ మైక్ క్యాచ్ చేసేసింది. చప్పట్లు కొడుతున్నారనుకున్నారో, చప్పట్లు కొట్టమని సిగ్నల్ చేస్తున్నాననుకున్నారో, ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది.

తను నన్నే చూస్తోంది. నవ్వుతోంది.

ఆ నవ్వులో ఎన్నో ప్రశ్నలు. విన్నావా? వింటున్నావా? ఈ చప్పట్లకోసమేగా నువ్వింత వేగంగా పరిగెత్తుకు వెళ్లిపోయింది? కానీ ఈ చప్పట్ల శబ్దం వెనుక ఏం వినిపిస్తోంది? ఔట్ ఆఫ్ ట్యూన్, ఔట్ ఆఫ్ పిచ్, ఔట్ ఆఫ్ రిథమ్ – అర్థమవుతోందా? అందుకే తాళం ఎలా పెట్టాలో ప్రాక్టీస్ చెయ్యమనేది. గుర్తుందా?

సంగీతానికే కాదు, జీవితానికి కూడా శృతి, లయ ఉండాలని తను నాకెందుకు చెప్పలేదో?

… రేపు లేదు. ఏదేమైనా, ఇవాళే మొదలు పెట్టండి. మీరు చెయ్యకపోతే ఇంకొకరు మీ అవకాశాన్ని దోచేస్తారు. ఎప్పుడూ లేనంత కాంపిటీటివ్ ప్రపంచం ఇది. స్టార్ట్ సమ్‍థింగ్ గుడ్. అండ్ లెట్ టుడే బి దట్ డే.

స్పీచ్ అయిపోయింది. స్టాండింగ్ ఒవేషన్.

ట్యాప్. ఒన్ టూ థ్రీ. ట్యాప్. టర్న్. ట్యాప్. టర్న్. ఆది తాళం. తను నాకు నేర్పించిన మొదటి సంగీత పాఠం.

లైట్సాగిపోయాయి. తనూ చీకట్లో మాయమైంది. తన పాట మాత్రం ఆగలేదు.

తనిక్కడ లేదని తెలుసు. కానీ ఎక్కడ చూసినా తనే ఎందుకు ఉంది?

*****
సర్ వి హావ్ టు ఫ్లై టు చెన్నై, ఫ్రమ్ దేర్ టు అబుదాబీ అండ్ దెన్ టు జోహెనెస్‍బర్గ్.

చెన్నై?

యెస్ సర్. ఇక్కడ్నుంచి బిజినెస్ క్లాస్ దొరకలేదు. సో…, ఇబ్బందిగా చెప్పాడు మిస్టర్ శివరామ్.

ఇట్సాల్‍రైట్ అన్నాను.

నిజానికి ఇట్ ఈజ్ నాట్ ఆల్రైట్. చెన్నై. ఆ ఊరి పేరు వింటేనే పాత జ్ఞాపకాలేవో అలల్లా ఎగిసిపడతాయి. ఊపిరాడకుండా చేస్తాయి. కానీ ఇప్పటికిప్పుడు ట్రావెల్ ప్లాన్ మార్చడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే సరే అన్నాను. లండన్ టు బెంగుళూర్. ఒక రెండు గంటలు హోటల్లో నిద్ర. టెక్నోకాన్ఫరెన్స్. ఆఫ్టర్ పార్టీ. మరో గంట నిద్ర. ఇంకాసేపట్లో బెంగుళూర్ టు చెన్నై ఫ్లైట్. అక్కడ్నుంచి ఇంకో రెండు ఫ్లైట్స్.

48 గంటల్లో నాలుగు ఫ్లైట్స్. జీవితం ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుందో? పగలు, రాత్రి తేడా తెలియకుండా ఉంది. క్యాబ్ లో వెనుక సీట్లో కూర్చుని కళ్లు మూసుకున్నాను.

ఒక పెద్ద సూట్‍కేస్ ని లాక్కుంటూ చెన్నై ఎయిర్‍పోర్ట్ దగ్గర త్రిశూలం రైల్వే స్టేషన్ లో దిగాడొక యువకుడు. మరో చేతిలో క్యాబిన్ బ్యాగేజ్. మోయలేని బరువు. అరకిలోమీటర్ దూరం. సబ్‍వే లో ఆ లగేజ్ లాక్కుని వచ్చేసరికి చెమటలు పట్టిపోయాయి. ఎయిర్‍పోర్ట్ లో జనాలు చాలామందే ఉన్నారు. ప్రయాణం చేసే వాళ్లకంటే వాళ్లని సాగనంపడానికి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మలు, నాన్నలు, అత్తలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నిలు, పిల్లలు, పెద్దలు – తను మాత్రం ఒంటరిగా! ఏడుపొచ్చిందతనకి.

కళ్లు తెరిచాను. బెంగుళూర్ ఎయిర్‍పోర్ట్ ఎక్స్‌ప్రెస్‍వే మీద కారు వేగంగా వెళ్తోంది.

కళ్లు మూస్తే చాలు. ఏదో ఒక పాత జ్ఞాపకం వరదలా తడిపేస్తోంది. అసహనంగా సీట్లో కదిలాను.

శివరామ్ వెనక్కి తిరిగి, ఆర్యూ కంఫర్టబుల్ సర్? అన్నాడు.
ఐ యామ్ ఆల్రైట్ అని చెప్పి సీట్లో వెనక్కి వాలాను. బెంజ్ కార్లో ఏసి వేసుకుని కూర్చున్నా ఇబ్బందిగా కదుల్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. కానీ నా గురించి ఇతనికేం తెలుసు. పాపం అనుకున్నాను.

పదిహేనేళ్ల క్రితం. జనాలతో నిండిపోయిన నెల్లూరు స్టేషన్ లో ఒంటరిగా నేను. హౌరా ఎక్స్‌ప్రెస్. ఓ కొన్ని గంటలు లేటుగా వచ్చింది. దూసుకెళ్లే అలవాటు లేదు. అంతటి దూకుడూ లేదు. అందరికంటే వెనుక. కష్టపడి ఒక చేత్తో గేట్ దగ్గర ఒక కాలు పెట్టుకునేంత స్థలం. ఒక చేతిలో చిన్న సూట్‌కేస్. మరొక చేతిలో ప్రాణాలు. ఎంతసేపు అలా నిలబడ్డానో తెలియదు. కావలి చేరుకునే లోపలే ఎక్కదో దగ్గర పడిపోయి చచ్చిపోతానేమోనంత భయం. నాన్నంటే విపరీతమైన అసహ్యం వేసింది. ట్రైన్ స్టేషన్ దాటి వెళ్లినంత సేపూ రిజర్వేషన్ కంపా‌ర్ట్‌మెంట్ లో కంఫర్టబుల్ కూర్చున్న వాళ్లు, తమని సాగనంపడానికి వచ్చిన వాళ్లకి టాటా చెప్తూనే ఉన్నారు.

రిజర్వేషన్ చేపించడానికి డబ్బులు లేవు. అమ్మని హాస్పిటల్ లో చూపించడానికి డబ్బులు లేవు. ఇంట్లో టీవి కొనడానికి డబ్బులు లేవు. నాకు సైకిల్ కొనడానికి డబ్బులు లేవు. ఎందుకో, నాన్న దగ్గర దేనికీ డబ్బులుండవు?

నీతో సమస్య ఏంటో తెలుసా?

నేనేదో చెప్దామనుకునే లోపలే తనే మళ్లీ మొదలుపెట్టింది. ఎందుకిలా కష్టపడి వేళ్లాడ్డం. చేతిలోని ఆ బరువు ని పడేసెయ్. కొంచెం ఈజీగా ఉంటుంది – అంది.

నాకున్నవి ఇవే బట్టలు. ఎలా పడెయ్యగలను?

భారమైనప్పుడు దేన్నైనా వదిలెయ్యడమే!

ట్రైన్ వేగంగా వెళ్తోంది.

నీకేం. ఎన్నైనా చెప్తావు. అసలు నువ్వు ఎలా గాల్లో ఎగరగలుగుతున్నావు?

బికాజ్ ఐ యామ్ ఫ్రీ.

తను ఎగిరిపోయింది. నేనింకా అక్కడే ఉన్నాను. పదిహేను సంవత్సరాల క్రిత్రం నేను పట్టుకుని వేలాడిన ట్రైన్ రాడ్ ఇంకా చేతిలోనే ఉంది. భుజాలు లాగేసే నొప్పి ఇప్పటికీ తెలుస్తుంది. చెమటలు పట్టి చెయ్యి జారిపోయి చచ్చిపోతానేమోనన్న భయం వెంటాడుతూనే ఉంది. ఎలాంటి సందర్భంలోనైనా జీవితం కంఫర్టబుల్ ఉండగలిగేంత డబ్బు సంపాదించాలన్న కసి ఇంకా రగులుతూనే ఉంది.

SpeedIntoTime (1)ఎక్స్‌ప్రెస్ వే మీద కారు ఆగింది. ముందెక్కడో యాక్సిడెంట్ అయినట్టుంది. ట్రాఫిక్ జామ్. ఉదయం మూడు దాటింది. కారు కిటికీ అద్దాలను మంచు మసగ్గా కప్పేసింది. కారులో హోటల్ కాలిఫోర్నియా పాట ప్లే అవుతోంది.

Up ahead in the distance, I saw a shimmering light
My head grew heavy and my sight grew dim
I had to stop for the night
There she stood in the doorway;

ఆమె రోడ్ పక్కన నిలబడి ఉంది.

ఒక చేతిలో క్యాండిల్ లైట్. మా కారు దగ్గరకి నడిచొచ్చింది. ముందు సీట్లో క్యాండిల్ లైట్ వెలుతురులో ఎవరికోసమో చూసింది. ఆ వెలుగులో తనెవరో అర్థమైంది. మసక వెలుతురులోనూ ఆమె సన్నటి ముక్కు, పొడవాటి మొహాన్ని గుర్తుపట్టాను. నాకు మాత్రమే తెలిసిన తను, వెనక కిటికీ దగ్గరకొచ్చి ఆగింది. అద్దం పైకెత్తి ఆమెను చూడాలనిపించింది. కానీ ఆమె నా కళ్లల్లోకి చూడగానే బిగుసుకుపోయాను. ఆమె తన వేలితో కిటికీ అద్దం పై కప్పిన మంచులో వేలితో మెల్లగా ఏదో రాసింది. తన మరో చేతిలో ఉన్న క్యాండిల్ ని ఎత్తి ఆ అక్షరాలకు వెలుగు చూపించింది.
మైత్రేయి
*****
ఆమె చూపు, ఆమె జ్ఞాపకం చుట్టూ నా జీవితమంతా ఘనీభవించుకుపోయిందని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.

చెన్నై విజయ హాస్పిటల్ లో కారిడార్లో నిల్చుని ఉంది తను. వీసా పేపర్స్ పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాను. లాస్ట్ మినిట్ వరకూ ఏమీ తేలలేదు. రాత్రి ఫ్లైట్ కి బయల్దేరి వచ్చెయ్యమని లండన్ నుంచి ఆర్డర్స్.
ఇప్పుడెలా? అంది.

నేను వెళ్లాలి.

అంకుల్ ని ఈ పరిస్థుతుల్లో వదిలేసి?

నన్నేం చెయ్యమంటావు మైత్రేయి? ఎప్పుడూ ఇంతేనా! నా జీవితంలో అడుగడుగునా అడ్డంకులేనా. నన్ను ముందుకెళ్ళకుండా కాళ్లకు వేసుకున్న గుదిబండ నాన్న. ఎగరనీయకుండా రెక్కలు విరిచిన రాక్షసుడు నాన్న.

ఫర్ గాడ్ సేక్. హి హాడ్ ఏన్ హార్ట్ ఎటాక్. యూ కాన్ట్ స్పీక్ లైక్ దట్. హి ఈజ్ యువర్ ఫాదర్.

అద్దాల కిటికీలోనుంచి సాయంకాలపు ఎండ నా కళ్లల్లో పడుతోంది. ఏంటీ బంధాలు? వీటిని వదిలించుకోలేమా? కళ్లు మూసుకున్నాను. ఈ చీకటి నయం. ఇక్కడ ఎవరూ ఉండరు. రెండేళ్లు, పగలూ రాత్రి కష్టపడితే వచ్చిన ఆన్‍సైట్ ఆఫర్. నా కలల ప్రపంచంలోకి మొదటి మెట్టు. కానీ ఇదే ఆఖరి మెట్టు కాబోతోందా? భరించలేని బాధ. ఒక్కసారిగా గట్టిగా అరిచేశాను. కష్టపడడం, బాధపడడం తప్ప నాకింకేమీ తెలియదు. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఏంటీ శాపం?

మా బంధువులంతా నన్నే చూస్తున్నారు. తను నన్ను దగ్గరకు తీసుకుంది. ఏంటి రఘు, చిన్న పిల్లాడిలా. నువ్వు బయల్దేరు. అంకుల్ ని నేను చూసుకుంటాను, అంది. థాంక్స్ చెప్పాలో, సారీ చెప్పాలో కూడా తెలియని దయనీయ స్థితి నాది. ఆమె కళ్ళల్లోకి చూశాను. ఆమె చూపుకి అర్థం తెలియదు. ఐసియూ లో ఉన్న నాన్న మొహం కూడా చూడకుండా బయల్దేరాను. వెనక్కి తిరిగితే, వెనకడుగు వేస్తాననే భయం. పరుగులాంటి నడకతో హాస్పిటల్ నుంచి భయటపడ్డాను.

వీటన్నింటిని మర్చిపోవడానికి ఇంకెన్ని జన్మలు పడుతుందో! కాలంలోకి వేగంగా వెళ్లిపోతే దూరం పెరిగి ఈ జ్ఞాపకం కనుమరుగవుతుందనుకున్నాను. కానీ ఒక రాత్రి లండన్ లో అది ఎంత అబద్ధమో తెలిసి వచ్చింది.
*****
అమ్మకి ఒకటే కోరిక ఉండేది. మీ నాన్నను ఎప్పటికైనా ఒక్కసారి ఫ్లైట్ ఎక్కించరా అని అడిగేది. ఏం నువ్వు ఎక్కవా? అని అడిగితే, అమ్మో నాకు భయం అనేది. అమ్మ అందరికంటే ముందే ఎగిరిపోయింది.
నా చిన్నప్పుడు, ఇందిరాగాంధీ, ఎలక్షన్ క్యాంపైన్ కి హెలికాప్టర్ లో నెల్లూరు వస్తుందని తెలిసి, నన్ను కూడా తీసుకెళ్లాడు నాన్న. అందరూ ఇందిరాగాంధీ ని చూడ్డానికి వెళ్తే నాన్న మాత్రం గ్రౌండ్ దగ్గర నిల్చుని, నన్ను భుజం మీద ఎక్కించుకుని చాలా సేపు నాకు హెలికాప్టర్ నే చూపించాడని చెప్పేది అమ్మ.

మరి ఎందుకు నాన్నా? ఎగిరిపోవాలనే నా ప్రతి ప్రయత్నానికీ అడ్డు తగిలావ్?

నాన్న నాకు ఎప్పటికీ అర్థం కాడు. బహుశా నేను కూడా నాన్నకు ఎప్పటికీ అర్థం కానేమో! టైం చూసుకున్నాను. ఐదున్నరైంది. ఫ్లైట్ చెన్నై చేరడానికి ఇంకో పదిహేను నిమిషాలు పడ్తుందేమో! ఎన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ చెన్నై లో అడుగుపెట్టడం? ఆ రోజు విజయ హాస్పిటల్ నుంచి బయల్దేరింది, మళ్లీ వెనక్కి తిరిగి చూసింది లేదు. ఇండియాకి చాలా సార్లే వచ్చాను. కానీ చెన్నై కి రావాలంటేనే ఏదో భయం.

నా భయం వృధా పోలేదు. చెన్నై లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై ఎయిర్‍పోర్ట్ రన్ వే మొత్తం నీటితో నిండిపోయింది. అతి కష్టం మీద ల్యాండింగ్ అయింది. వర్షంలో తడుస్తూనే అందరం ఎయిర్‍పోర్ట్ లౌంజ్ లోకి చేరుకున్నాం.

అన్ని ఫ్లైట్స్ లేట్ గా నడుస్తున్నాయని ప్రకటించారు. కొన్ని గంటల తర్వాత కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు. బిజినెస్ క్లాస్ కాబట్టి మహారాజా లౌంజ్ లో మమ్మల్ని కూర్చోబెట్టారు. మెల్లిగా ఎయిర్‍పోర్ట్ లోపలకి కూడా నీళ్లు రావడం మొదలయింది. అప్పటివరకూ మమ్మల్ని సౌకర్యవంతంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్న స్టాఫ్ కూడా కాసేపట్లో మొదటి ఫ్లోర్ లోకి చేరుకున్నారు. మమ్మల్నీ అక్కడికే వెళ్లమని సలహా ఇచ్చారు. కాసేపట్లో ఎయిర్‍పోర్ట్ లోని జనాలంతా ఒకే దగ్గరకు చేరుకున్నారు.

చాలా సేపటి వరకూ, వర్షమే కదా; సునామీ కాదు అనుకున్నాం అంతా! చిన్నప్పుడు కాగితం పడవలు నడిపించిన వర్షం, కాలేజ్ రోజుల్లో తడిసి ముద్దవుతూ కూడా గంతులేసిన వర్షం. వర్షం కూడా ఇంత విధ్వంసకరంగా ఉంటుందని చాలా రోజులకి గుర్తు చేసింది. గత వందేళ్లల్లో లేనంత వర్షం.

చెన్నై పరిసర ప్రాంతాలన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. అందరూ లౌంజ్ లో ఉన్న టివి ముందు కూర్చుని కళ్లార్పకుండా చూస్తున్నారు. అందరి మొహాల్లో టెన్షన్. నాకు మాత్రం నవ్వొచ్చింది. ఇంకో కొన్ని గంటల్లో నేను జోహెనెస్‍బర్గ్ లో లేకపోతే ఒక పెద్ద ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. జీవితంలో నాకు ఏదీ ఈజీగా దొరకదేమో! ప్రతి దాని కోసం ఇలా తీవ్రమైన పోరాటం తప్పదేమో!

జీవితం నాతో ఆటలాడుతూనే ఉంది. నేను ఆడి గెలుస్తూనే ఉన్నాను.

కానీ మనుషులతో, మనసులతో పోరాడొచ్చు. ప్రకృతితో పోరాడడమెలా?

ఆమె పోరాడుతోంది. వరదలో చిక్కుకుపోయిన లక్షలమందిని కాపాడడానికి వేలమంది యువతీ యువకులు స్వచ్ఛంధంగా బయటకొచ్చారు. ఎవరికి తోచిన రీతిలో వారు సాయం చేస్తూనే ఉన్నారు. వాలంటీర్స్ లో ఒకరిగా టివిలో కనిపించింది మైత్రేయి.

పధ్నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆమెను చూడ్డానికి ఇన్ని దేశాలు తిరగాలా? ఇన్ని మిలియన్ డాలర్లు సంపాదించాలా? ఇన్ని కష్టనష్టాలకోర్చాలా? చివరికి టివిలో వార్తల్లో ఆమెను చూడాలా?

తను ఇప్పటికీ అలానే ఉంది. ఫరెవర్ యంగ్. ఫరెవర్ మైత్రేయి.

నేనే! ఎన్ని రంగులు మార్చాను. ఎన్ని డీల్స్ క్లోజ్ చేశాను.

లండన్ వెళ్లిన చాలా రోజుల వరకూ మైత్రేయి తో ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేవాడిని. ఏదో ఒక రోజు తను కూడా నా దగ్గరకు వచ్చేస్తుందనే ధైర్యం. చాలా రోజుల వరకూ వస్తాననే చెప్పింది కూడా!

తనకి ఇష్టమని నేను ఉన్న ప్రతి ఇంట్లోనూ బెడ్ రూం కిటికీ తూర్పు దిక్కుగా ఉండేలా చూసుకున్నాను. ఆమె వస్తుందని, నన్ను హత్తుకుని పడుకుంటుందని, ఉదయాన్నే సూర్యుడి కిరణాలు ఆమె మొహం పై పడి అల్లరి చేస్తుంటే, నా చేతిని అడ్డు పెట్టి ఆపాలని…

ఆ రోజు ఎప్పటికైనా వస్తుందా?

*****
ఎక్స్‌క్యూజ్ మీ. హలో, ఎక్స్‌క్యూజ్ మీ, అంటూ నా భుజం తట్టాడతను.

చాలా సేపట్నుంచే నన్ను పిలుస్తున్నట్టున్నాడు. మీరేం అనుకోకపోతే కొంచెం సేపు నా ఫోన్ ఛార్జ్ చేసుకుంటానని అడిగాడు.

ప్లగ్ లోనుంచి నా ఛార్జర్ తీసి, ప్లీజ్ అన్నాను. అతను నా పక్కనే కూర్చున్నాడు. హై. ఐయామ్ క్రిస్ పుల్లిస్ అని చెయ్యందించాడు. నేను హలో అని హ్యాండ్ షేక్ చేశాను.

ఫోన్ స్విచాన్ చేశాను. ఫోన్ లో యాభై కి పైగా నోటిఫికేషన్స్. వాట్సాప్, మిస్డ్ కాల్స్, మెసెజేస్, మైల్స్, ఫేస్ బుక్.

దాదాపు చాలా వరకూ థియోదోరా నుంచే!

ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? జోహెనెస్‍బర్గ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చెప్పాలి వాళ్లకి? – అన్నీ ప్రశ్నలే. నా దగ్గర సమాధానం లేని ప్రశ్నలు. చెన్నై ఎయిర్‍పోర్ట్ లో ఇరుక్కుపోయున్నానని మెసేజ్ పంపిద్దామనుకున్నాను. ఆ విషయం కూడా తెలిసిపోయినట్టుంది. వాట్ ఈజ్ ది స్టేటస్ ఇన్ చెన్నై? అని మెసేజ్.

థియోదోరా. ముద్దుగా థియో. రొమేనియన్ అమ్మాయి. మై లివిన్ పార్టనర్ ఇన్ లండన్. నన్ను తట్టిలేపిన థియో!

*****

SpeedIntoTime (1)

లండన్ లో ఒక వారం క్రితం. థియో ఇంట్లో పార్టీ. చాలా రాత్రయిపోయింది. ఒక్కొక్కరూ వెళ్లిపోయాక ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం మిగిలారు. వాళ్లకి నన్ను పరిచయం చేసింది.

మీట్ మిస్టర్ రఘు. ఎవ్రీధింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఫర్ హిమ్. బట్ హి ఈజ్ కైండ్ ఆఫ్ శ్యాడ్.

నాకర్థం కాలేదు. థియోకెలా తెలుసు? నేను ఆనందంగా లేనని నీకెలా తెలుసు, అని అడిగాను.

తెలుసు. నువ్వు నాకు ఏడేళ్లుగా పరిచయం. ఈ ఏడేళ్లలో నువ్వొక కన్నీటి బొట్టు రాల్చిందీ లేదు. మొహంలో ఏ ఒక్కసారైనా విషాదపు ఛాయలు తొణికిన ఆనవాళ్ళూ లేవు.
దట్స్ బీకాజ్ ఐ యామ్ హ్యాపీ.

నో. దట్స్ బికాజ్ యూ యార్ క్యారీయింగ్ ఏన్ ఓషన్ ఆఫ్ టియర్స్ ఇన్ యువర్ హార్ట్.

నిజమే. పాతవన్నీ ఉపేక్షిస్తూ వేగంగా ముందుకెళ్తుంటే, కాలం తనలో కలిపేసుకుని, వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుందనుకున్నాను. భవిష్యత్తుకేసి మొహం పెట్టి గతాన్ని కాలగర్భంలో కలిసిపోనీ అని ముందుకు సాగాను. బట్ ఐ యామ్ రాంగ్. ఇటీజ్ ఆల్ హియర్. రైట్ హియర్.

ఆ రాత్రి. బహుశా, జీవితంలో అంత ఏడ్చింది ఎప్పుడూ లేదు. హఠాత్తుగా అమ్మ పోయినప్పుడు కూడా నేనంత ఏడవలేదు. నాన్నతో గొడవ పెట్టుకున్నప్పుడు కూడా నేనంత ఏడవలేదు. మైత్రేయి ని హాస్పిటల్ లో నాన్న దగ్గర వదిలి వెళ్లిపోయినప్పుడు కూడా అంత ఏడవలేదు. బహుశా చాలా ఏళ్ల తర్వాత ఇండియా వస్తున్నందుకో, లేక థియో అచేతనంగా ఉన్న నా చైతన్యమనే బావిలో రాయి విసిరి జ్ఞాపకాలను తరంగాలుగా రేకెత్తించినందుకో – ఏమో, ఎప్పుడో తెగిన తీగలేవో తిరిగి నన్ను చుట్టుముట్టి, ఉక్కిరిబిక్కిరి చేసి కన్నీళ్లగా ఉబికివచ్చినట్టున్నాయి.

దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయాక థియో నన్ను దగ్గరకు తీసుకుంది. ఓదార్చింది. చూడు రఘు, తనని మర్చిపోమని నేను చెప్పటం లేదు. నన్ను గుర్తించు అని వేడుకుంటున్నాను అంది.

నా కోసం తెలుగు కూడా నేర్చుకుని, నాకు తెలుగులో కవితలు రాసే ఓ థియో! ఓ నా ఐరోపా సుందరీ! ఏడు సముద్రాలు దాటినా, ఓ కన్నీటి సముద్రాన్నే గుండెల్లో దాచుకున్నానని ఎందుకు గుర్తు చేశావు? తనకు చాలా చెప్పాలనుంది. గుండె లోపల అగ్ని పర్వతం బద్దలవుతోంది. లావా పొంగబోతోంది. కానీ ఏమీ మాట్లాడలేదు.

ఏం చెప్పగలను. ఎన్నని చెప్పగలను. నా మీద ప్రేమ పెంచుకున్నందుకు ఆమె సాన్నిహిత్యంలో కన్నీళ్లు మనసారా ప్రవహింపజేయగలను. కానీ యెదలోని ఈ రోదన ఆమెకు విప్పిజెప్పగలనా?

చిన్నివెన్నెల మూటను మరిచివచ్చితినేనాడో, నా తప్పటడుగులు తిరిగి నన్నచటికే గొనిపోయెనేడు. నేనేమి చెయ్యను థియో.
ప్రతి రోజూ ఆరుబయట పచ్చికలో నడవాల్సిన నా జీవితంలో, తను లేకుండా ప్రతి రోజూ అఫీస్ క్యాబిన్స్ లో గడిచిపోతుందని; ఏ దేశంలో ఏ కెఫెలో కాఫీ తాగుతున్నా, తను లేకుండా తాగిన ప్రతి కాఫీ రుచి ఎంత చేదుగా ఉంటుందోనని; ఎన్ని మిలియన్ డాలర్లు సంపాదించినా, తను లేకుండా ఖర్చు పెట్టిన ఏ ఒక్క రూపాయికి కూడా విలువలేదని; ఎక్కడో ఆల్ప్స్ పర్వతాల్లో విహరిస్తున్నా, తను లేకుండా గాలి సైతం అలకబూనిందని; పున్నమి వెలుగులో చల్లని వాతావరణంలో కూర్చున్నా, తను లేదని వెన్నెలమ్మ కినుక బూని నిప్పులు చెరిగిస్తుందని- ఇవన్నీ చెప్పగలనా? తనే లేకపోతే నేను లేనని ఎలా చెప్పను. ఇంత ప్రేమ సాధ్యమా అని అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నా కన్నీటి జడి వానలు, ఆ సెలయేట జారిన నా కలలూ – ఎవరికీ కనిపించవు. మూసుకుపోయిన నా హృదయ ద్వారాల లోపల ప్రతిధ్వనించే ఆర్తనాదాలూ, రోదన ధ్వనులూ ఎవరికీ వినిపించవు. తనులేకుండా భగ్నమైన కలలు నావి; తను లేకుండా ఆగిపోయిన కలం నాది. థియో, నువ్వు మళ్లీ గడ్డి పూలను కూర్చి, కలము చేసి, చేతికిచ్చి, జోల పాడి, నిద్ర పుచ్చి – మళ్లీ తనని గుర్తుకు తెచ్చి…

…మాటల్లోనూ చెప్పలేను. కవితల ముసుగుల్లోనూ కప్పలేను. నీ నుంచీ దాచలేను! నేను ఆమెని తప్ప వేరొకరని ప్రేమించలేను. తను లేకుండా నాకు పగలు లేదు, వెలుగు లేదు. రాత్రి లేదు, చీకటి లేదు. సముద్రం లేదు. అలలూ లేవు. శృతి లేదు, లయ లేదు.

నేను ఇండియా కి బయల్దేరుతుంటే ఎయిర్‍పోర్ట్ కి వచ్చింది థియో.

మళ్లీ తిరిగి వస్తావా? అని అడిగింది.

పిచ్చి ప్రశ్న అది. నా జీవితమంతా ఇక్కడే ఉంది. నా జీవితాన్ని పూర్తిగా ఇక్కడే నిర్మించుకున్నాను. ఇవన్నీ అంత సులభంగా వదిలేసుకోలేను. తప్పకుండా తిరిగివస్తానన్నాను.

థియోకిచ్చిన మాటను నిలబెట్టుకోగలనా?
*****
మిస్టర్ రఘు, హలో మిస్టర్ రఘు!

క్రిస్ మళ్లీ భుజం తట్టి నన్ను జ్ఞాపకాల్లోంచి బయటకు తీసుకొచ్చాడు. యూ కెన్ యూజ్ యువర్ ఛార్జర్ నౌ, అన్నాడు.
థ్యాంక్యూ అన్నాను.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి. కానీ మీరు చాలా ప్రీ ఆక్యుపైడ్ గా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమా? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? అడిగాడు క్రిస్.

ఏం చెప్పాలి? పాపం అతనేం చేస్తాడు? నా మొహం చూస్తే చాలు, బాధలో ఉన్నానని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. కనీసం మాట సాయమైనా చేద్దామనుకుంటున్నాడు అతను. ఐ యామ్ ఆల్రైట్ అని చెప్దామనుకున్నాను. కానీ అతను నమ్మడు. అందుకే, జ్ఞాపకాల వరదలో తడిసి ముద్దవుతున్నానని చెప్పాను.

అవునా? కానీ అది చాలా ప్రమాదకరం కదా, అన్నాడు.

నాకర్థం కాలేదన్నట్టు తలూపాను.

కాఫీ తాగుతారా? అడిగాడు.

ఫర్వాలేదన్నాను.

కాఫీ డే కి వెళ్లి రెండు లాటే తీసుకొచ్చి, ఒకటి నా చేతిలో పెట్టాడు. థాంక్ గాడ్! ఫ్లైట్స్ లేకపోయినా కనీసం కాఫీ అయినా దొరుకుతోంది. మాటలు కలిపే ప్రయత్నం. నేను అడ్డు చెప్పలేదు. కానీ కాఫీ కోసం వెళ్లకముందు అతనన్న మాట నా చెవిలో మ్రోగుతూనే ఉంది. అందుకే అడిగాను – ఎందుకు జ్ఞాపకాలు ప్రమాదకరమన్నారు?

ఎందుకంటే, జ్ఞాపకాలు ప్రమాదకరమైన ఉచ్చులు, వాటిలో చిక్కుకుంటే అంతే!

నిజమే! ఇది ఇంకొకరు చెప్పక్కర్లేదు. నాకు ప్రత్యక్షంగానే అనుభవమవుతోంది.

కాఫీ తాగుతూ మాట్లాడ్డం మొదలుపెట్టాడు క్రిస్. అయిష్టంగానే నేనూ అతను చెప్పేది వినడం మొదలుపెట్టాను. నిజానికి నాకూ వేరే పని లేదు. ఎయిర్‍పోర్ట్ లో ఉన్న వాళ్లకి సాయం అందడానికి మరో ఇరవై నాలుగు గంటలు పైనే పట్టవచ్చని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
నేను ఫ్రాన్స్ నుంచి రెండేళ్ల క్రితం ఇండియా వచ్చాను. దాదాపుగా ఈ రెండేళ్లు అండమాన్స్ లో గడిపాను. మీకు తెలుసా? నేను ఎన్నో ఏళ్ల నుంచి, జ్ఞాపకాల యొక్క నిర్మాణాత్మక స్వభావం గురించి పరిశోధన చేస్తున్నాను. అందుకు సరైన శాంపిల్ కోసం నేను ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాలు పర్యటించాను. కానీ అండమాన్ దీవుల్లోని తెగలకంటే సరైన నమూనా నాకెక్కడా దొరకలేదు. అందుకే గత రెండేళ్లుగా అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు క్రిస్‍మస్ హాలిడేస్ కోసం ఫ్రాన్స్ బయల్దేరాను – చెప్పుకొచ్చాడు క్రిస్.

జ్ఞాపకాల గురించి అతని పరిశోధన కోసం అండమాన్ వరకూ రావడమేంటో నాకర్థం కాలేదు. అదే విషయం అతన్ని అడిగాను. సర్ ఫ్రెడెరిక్ ఛార్ల్స్ బార్ట్లెట్ అని ఒక బ్రిటీష్ మానసిక శాస్త్రవేత్త గురించి చెప్పాడు క్రిస్. అతను చెప్పింది చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది.

మెమురీస్ ఆర్ డేంజరస్ బీయింగ్స్. దే హావ్ ఏ లైఫ్ ఆఫ్ దైర్ ఓన్. మనం ఏదైనా విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతి సారీ అది ఒక్కో రూపం సంతరించుకుంటుంది. మన గత జీవిత అనుభవాలు, పెంపొందించుకున్న జ్ఞానం, భవిష్యత్తు పట్ల అంచనాలు – వీటన్నింటి బట్టి ఆ జ్ఞాపకం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. అందుకే జన జీవన స్రవంతికి దూరంగా – మనకంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ మరియు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న అండమాన్ ఆదిమవాసులతో సహజీవనం చేస్తూ – ది కన్స్‌ట్రక్టివ్ నేచర్ ఆఫ్ మెమరీ గురించి క్రిస్ పరిశోధనలు చేస్తున్నాడని చెప్తే ఆశ్చర్యం వేసింది.

జీవితం ఎవరిని ఎక్కడెక్కడికి తీసుకెళ్తుందో కదా అనిపించింది.

మెమురీస్ కి కన్స్‌ట్రక్టివ్ నేచర్ ఉన్నట్టు, డిస్ట్రక్టివ్ నేచర్ కూడా ఉంటుందా? ఈ సారి నిజంగానే ఆసక్తిగా అడిగాను.

నిజం చెప్పాలంటే – జ్ఞాపకాలకు నిర్మాణాత్మక, విధ్వంసక స్వభావాలు ఉన్నాయనడంకంటే, పునర్నిర్మాణ స్వభావం ఉందని చెప్పడం కరెక్ట్, అన్నాడతను.

అతనితో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు. మధ్యాహ్నం అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చారు. అందరూ తిని మెల్లగా కుర్చీల్లో నడుం వాల్చారు. ఏ మూడింటికో నాకూ నిద్రపట్టింది.
*****
ఒక జ్ఞాపకం.

అదే ఇల్లు. ఒక బెడ్ రూం ఖాళీగా ఉంది. ఇప్పుడక్కడ డాక్టర్లు లేరు. వాళ్లని పట్టుకుని భోరున ఏడ్చిన పిల్లవాడు హాల్లో కూర్చుని ఆటలాడుకుంటున్నాడు. అతని పక్కనే కూర్చుని టివి చూస్తున్నారు ఇద్దరు ముసలివాళ్ళు. పక్కనే మరొక బెడ్ రూంలో, బెడ్ మీద పడుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడొక వ్యక్తి. హాల్లో కూర్చున్న పిల్లవాడికి ఆ ఏడుపు వినిపించింది. మెల్లగా బెడ్ రూంలోకి నడిచాడు. ఆ వ్యక్తి పక్కనే కూర్చున్నాడు. అతని తలపై చెయ్యి వేశాడు. పక్కనే కూర్చున్న తన కొడుకుని చూసుకున్నాడా వ్యక్తి. ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకున్నాడు.

మరొక జ్ఞాపకం.

ఒక యువకుడు వేగంగా విజయా హాస్పిటల్ మిట్లు దిగి నడుస్తున్నాడు. అతనికి వెనక్కి తిరగాలనే ఉంది. కానీ చూడాలంటే ఏదో తెలియని భయం. ఇంకో రెండడగులు వేస్తే రోడ్డు మలుపు తిరుగుతుంది; హాస్పిటల్ కనుమరుగవుతుంది. ఒక అడుగు ముందుకు వేశాడు. ఇంకో అడుగు ముందుకు వెయ్యబోతూ వెనక్కి తిరిగి చూశాడు. మూడో అంతస్థులో కిటికీలోనుంచి, అతనివైపే చూస్తూ, దుమ్ము పట్టిన కిటికీ అద్దం మీద పెద్ద లవ్ సింబల్ గీసిందొక అమ్మాయి.

ఇంకొక జ్ఞాపకం.

హౌరా ఎక్స్‌ప్రెస్ నెల్లూరు స్టేషన్ దాటి, పెన్నా నది బ్రిడ్జి మీద మెల్లగా సాగిపోతోంది. జనరల్ కంపార్ట్‌మెంట్ గేట్ దగ్గర ఒక చేత్తో రాడ్ పట్టుకుని వేలాడుతున్నాడొక యువకుడు. బాబూ, ఏం ఇంత కష్టపడి వేలాడకపోతే. ఎవరైనా ఈ సూట్‌కేస్ తీసుకోండి పాపం. లోపల్నుంచి ఎవరో సూట్ కేస్ తీసుకున్నారు. మరొకరు చెయ్యందించి కష్టపడి లోపలకి లాగారు. టాయిలెట్స్ పక్కనే న్యూస్ పేపర్ పరుచుకుని కూర్చున్న ఒకతను, రా బాబూ కూర్చో అని కొంచెం చోటిచ్చాడు.

మరింకొక జ్ఞాపకం.

ఒక యువకుడు చెమటలు కక్కుతూ, చెన్నై ఎయిర్‍పోర్ట్ లోకి పెద్ద సూట్‍కేస్ లాక్కుంటూ వచ్చాడు. దూరంగా ఒక ట్రావెల్ బ్యాగ్ మాత్రమే భుజానికి తగిలించుకున్న ఒక మధ్య వయస్కుడు, కొంచెం దూరంగా ఉన్న ట్రాలీ ని లాక్కొచ్చి లగేజ్ దాని మీద సర్దాడు. ఈజిట్ యువర్ ఫస్ట్ టైం అన్నాడు. సిగ్గుగా తలూపాడా యువకుడు. దేర్ ఈజ్ ఏ ఫస్ట్ టైం టు ఎవ్రీథింగ్ అన్నాడాయన. కమ్ లెట్స్ గో అని ఎయిర్‍పోర్ట్ లోపలకి తీసుకెళ్లాడు.

ఒకదాని వెనుక ఒకటి జ్ఞాపకాలు కొత్త రంగులద్దుకుంటున్నాయి.

*****

ఫోన్ మోగింది. నిద్ర లేచాను. టైం చూస్తే రాత్రి రెండయింది.

ఎయిర్ పోర్ట్ లో చాలా భాగం వరకూ చీకటి. పవర్ సప్లై కట్ అయిపోయిందన్నారు.

ఫోన్లో థియో.

జోహెనెస్‍బర్గ్ లో కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయిందని, వచ్చే నెలలో తిరిగి ఏర్పాటు చేస్తారనీ చెప్పింది. ఇప్పుడు వాటన్నింటి గురించి నాకు ధ్యాస లేదు. ఈ ముప్ఫై ఆరు గంటలు నాలో నేను, నాతో నేను గడిపిన క్షణాలు – గత పదేళ్లల్లో నాతో నేను ఇంత ఆప్యాయంగా గడిపిన క్షణాలు ఇవేనేమో! ఎన్నో గీతలు, ఎన్నో వ్యత్యాసాలు తొలిగిపోయి – ఏదో జీవిత సత్యం కనుగొన్న అనుభవం. ఒక్కోసారి మనిషి విచ్చలవిడి తనాన్ని అదుపులో పెట్టడానికే ప్రకృతి ఇలా మనపై తిరగపడుతుందేమో! కొత్త పాఠాలు నేర్పిస్తుందేమో!

థియో మాటలేవీ నాకు వినిపించడం లేదు.

చీకటి లోనుంచి మైత్రేయి నావైపే నడిచొస్తోంది.

నువ్విక్కడికెలా వచ్చావు?

దూరం తొలిగిపోయింది.

నాకర్థం కాలేదు.
మిస్టర్ జీనియస్. ప్రస్తుతం నువ్వు జీరో స్పీడ్ లో వెళ్తున్నావు. ఇండియాలో గడిపిన ఈ నలభై ఎనిమిది గంటలు, అందులో ఇక్కడ ఎయిర్‍పోర్ట్ లో గడిపిన ఇరవై నాలుగు గంటలు -దటీజ్ యువర్ టైం. చిన్నప్పుడు ఫిప్త్ క్లాస్ లో చదువుకోలేదా? స్పీడ్ ఇన్‍టూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అని. ది డిస్టెన్స్ ఈజ్ జీరో నౌ. నువ్వు మళ్లీ బయల్దేరిన చోటికే చేరుకున్నావు. పద వెళ్దాం అంది.

*****
మేము తిరువాన్నమళై లో బస్ దిగాం. ఇదే అరుణగిరినాథర్ గుడి అని చూపించింది. అది చూసే లోపలే వేగంగా ముందుకు కదిలింది. కొంచెం దూరం వెళ్లగానే ఇదే రమణ మహర్షి ఆశ్రమం అని చూపించింది. లోపలకి తొంగిచూడబోయాను. చలం చివరి రోజుల్లో గడిపిన ప్రదేశం. లోపల చాలామందే ఉన్నారు.

ఆగి చూద్దామంటే, తను నాకంటే కొంచెం ముందు నడుస్తోంది. నేను ఎప్పుడూ ఇంతే. చాలా వేగంగా ముందుకు వెళ్లిపోదామనే అనుకుంటాను, కానీ ఎప్పుడూ వెనకపడిపోతుంటాను . తను వెనక్కి తిరిగి చూసి, ఓ క్షణం పాటు ఆగి రమ్మన్నట్టు చెయ్యి అందించింది. ఇద్దరం అలా చాలా సేపు మౌనంగానే నడుస్తున్నాం. ఇది ఫలానా వాళ్ళు నడిపే స్కూల్, అది ఫలానా వాళ్లు పండించే పళ్లతోట – చూపిస్తూ ఆగకుండా వెళ్తూనే ఉంది.

కాసేపటికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ మాయమయ్యాయి. చుట్టూ పల్లెటూరిలా ఉంది. రోడ్ కి కొంచెం దూరంలో ఒక తోటలా ఉంది. తోట బయట ఒక ముసలి జంట చిక్కుడు కాయలు తెంపుతున్నారు. అంకుల్ ఈ తోటలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ లో హెల్ప్ చేస్తుంటారు అని అంది. లోపలకి వెళ్లి నాన్నను చూడాలనిపించింది. కానీ తను ఆగటం లేదు.

కొంచెం దూరం వెళ్లగానే ఒక దగ్గర పిల్లలు కొంతమంది వీధిలో ఆడుకుంటున్నారు. పక్కనే ఒక చిన్న బిల్డింగ్ ఉంది. ఈ స్కూల్ లోనే నేను సంగీతం నేర్పిస్తుంటాను అని ఆ బిల్డింగ్ వైపు చూపించింది. లోపలకి వెళ్దామా? అడిగాను. ఇప్పుడు కాదని చెప్పింది.

ఏం, అన్నాను? మళ్లీ వచ్చినపుడు అంది.

పిల్లలు కొంతమంది రోడ్ పక్కనే ఉన్న ఒక పంపు కింద నీళ్లు తాగుతున్నారు. నేను కూడా అక్కడికెళ్లి నీళ్లు తాగాను. తను నన్నే చూస్తోంది. ఆమె దగ్గరకు నడిచాను. మైత్రేయి, నీకో విషయం చెప్పాలి. చెప్పమని కళ్లతోనే సైగ చేసింది. ఇప్పుడు ఇక్కడ నీ చెయ్యి పట్టుకుని నిలబడి ఉంటే నాకేమనిపించిందో తెలుసా? అనంతమైన ఈ విశ్వంలో దుమ్ము ధూళి కి ఉన్న ప్రాముఖ్యత కూడా లేని నా జన్మకు సార్థకం కలిగింది నీ వల్లనే!

తను ఏమీ మాట్లాడలేదు. వెళ్దామా అన్నట్టు చెయ్యందించింది. నేనామె చెయ్యిపట్టుకుని ముందుకి నడుస్తున్నాను. నన్ను వెనక్కి తీసుకొచ్చి చెన్నై వెళ్లే బస్ ఎక్కించింది . నాకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పాని. నేనిక్కడే ఉండిపోతానని ప్రాథేయపడ్డాను .

బస్సు వెళ్లిపోతోంది.

The Sun had not yet risen. The doors are not yet open.

SpeedIntoTime (1)గుండె మీద చెయ్యి పెట్టి, యూ కెన్ కమ్ హియర్ వెన్ యూ ఆర్ రెడీ అంది.

హలో మిస్టర్ డ్రీమర్. మనమింక బయల్దేరవచ్చు. నిద్రలేపి చెప్పాడు క్రిస్.

నాకు తేరుకోడానికి ఒక్క నిమిషం పట్టింది. నేనింకా ఎయిర్‍పోర్ట్ లో లౌంజ్ లో కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాను.

ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చాయి. అర్జెంట్ గా వెళ్లాల్సిన వాళ్లని బెంగుళూరు కి ఎయిర్‍లిఫ్ట్ చేస్తున్నారు. మీరు కూడా వస్తున్నారా? అడిగాడు క్రిస్.

ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. గత పదేళ్లల్లో నాకు ఎప్పుడూ ఇలాంటి ప్రశ్న ఎదురవ్వలేదు. వెన్ రఘు ఈజ్ హియర్ ఎవ్రీధింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. హి ఈజ్ ఏ ఫైర్ ఫైటర్. కానీ ఇప్పుడు ఏదీ నా కంట్రోల్ లో లేదు. వెళ్లిపోవచ్చు. వెళ్లాలి కూడా. లేకపోతే సౌత్‍ఆఫ్రికా డీల్ క్యాన్సిల్ అవుతుంది. ఐదువందల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ అది ఇంకొకరికి ఇచ్చేసి ఉండొచ్చు. డీల్ క్యాన్సిల్ అయిందని న్యూస్ బయటకు వచ్చేసి ఉండొచ్చు. అల్రెడీ కంపెనీ షేర్ వాల్యూ పడిపోయి ఉండొచ్చు. ఏమైనా జరగొచ్చు.

ది పాజిబిలిటీస్ ఆర్ ఎండ్‍లెస్.
కానీ, ఒకటి మాత్రం నిజం. నేనిక్కడ్నుంచి బయటకు అడుగుపెడ్తే ఇంకే రోజూ ఈ కల మళ్లీ రాదు. అయినా ఆ కళ్లు దాని కోసం వెతుకుతూనే ఉంటాయి. అదే కలను తెచ్చే రాత్రికోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. కానీ నాకిప్పుడు కావాల్సింది కల కాదు. ఆ కలలను తెచ్చే రాత్రి కాదు. నిజం కావాలి. ఆ నిజాన్ని తీసుకొచ్చే వెలుగు కావాలి; నా మైత్రేయి నాకు కావాలి.

ఆర్యూ కమింగ్, అడిగాడు క్రిస్.

ఐ థింక్, ఐ విల్ వెయిట్, అన్నాను.

ఫర్ వాట్ అన్నాడు.

ఫర్ ది సన్ టు షైన్ అండ్ ది డోర్స్ టు ఓపెన్ అన్నాను.

ఏమనుకున్నాడో, ఏమో అతను తన బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు.

బయట వర్షం ఆగింది. ఆకాశంలో సూర్యుడు జాడ తెలుస్తోంది. ఒక్కొక్కరూ ఎయిర్‍పోర్ట్ లోనుంచి వెళ్లిపోతున్నారు. నేను మాత్రం అక్కడే కూర్చున్నాను – ఆమె రాక కోసం ఎదురుచూస్తూ!

*

కలలో మనుషులు

 

-అల్లం వంశీ

~

 

allam-vamsi“మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!”  ఆరో తరగతి చదివే కొడుక్కు అన్నం తినిపించుకుంట అన్నడు రాజన్న..

ఏంది బాపూ, ఎప్పుడేదడిగిన గిట్లనే అంటవ్..!! మూతి చిన్నగ చేస్కోని అన్నడు సతీషు..

నాకు తెలుస్తె చెప్పనారా? నిజంగనే నాకెర్కలేదు నాయినా..

ఏ పో బాపూ.. ఊకె గిట్లనే అంటవ్.. ఇంకోసారి నిన్నేదడగద్దు..

అరే.. అన్నీటికి గట్ల అలుగుతె ఎట్లరా??  ఇంగో ఈ బుక్క తిను.. బడికి ఆలిశమైతాంది, మళ్ల బస్సెళ్లిపోతది..

సతీష్ బుక్క నోట్ల పెట్టుకోకుండ “వద్దన్నట్టు” తలకాయి అడ్డం తిప్పిండు..

రాజన్న “ఇగ ఏదన్నొకటి చెప్పకపోతె వాడు తిండి తినడని” తనకు తోచిందేదో చెప్తాండు-

గాందీతాత అంటె…. గాంధీతాత అప్పట్ల, ఎనుకట ఉండేటోడు.. అప్పటికింక మీం పుట్టలే కావచ్చు!

ఇగో ఈ బుక్క తిను… చెప్తానగారా.. తినుకుంట ఇను.. ఇగో.. ఆ.. ఆ… అని సతీషు నోట్లోబుక్కపెట్టి-

అప్పట్ల మనకాడ తెల్లోల్లుంటుండేనట..

తెల్లోల్లంటే?

తెల్లోలంటె తెల్లోల్లేరా.. గీ.. మనా… గీళ్లను సూళ్ళేదా.. టీవీ ల అప్పుడప్పుడత్తరు సూశినవా?? గిట్ల ఇంగిలీషుల మాట్లాడుతరు సూడు.. గాళ్లు.. ఇంగో.. బుక్క వెట్టుకో..

ఆ..

రాజన్న ఇంకో బుక్క వెట్టి-

ఆ.. ఆళ్లున్నప్పుడు మరి ఈనె మనకు మంత్రో.. మరోటో ఉంటుండే గావచ్చురా..

ఎవలు.. గాంధితాతా?

ఆ.. ప్రెదాన మంత్రో.. ముక్యమంత్రో… మొత్తానికైతే ఏదో ఓటి ఉంటుండెనట…

ఆ..

అప్పుడు సొతత్రం అదీ ఇదని పెద్ద లొల్లుంటుండెనట.. ఇంగో బుక్కవెట్టుకో..

సొతంత్రం అంటే??

సొంతంత్రం అంటె…

సొతంత్రం అంటే సొతంత్రమే ఇగ.. మొన్నటిదాంక తెలంగాణ లడాయి లేకుండెనా?

ఆ..

అట్లనే అప్పుడు దేశం కోసం సొతంత్రం లడాయుండెనన్నట్టు.. ఇoగో ఈంత బుక్క వెట్టుకో…

ఆ.. లడాయైతుంటె??

అయినా, అయన్ని మనకెట్ల తెలుత్తయిరా.. ఇప్పటివేరం అప్పుడేమన్న పేపర్లా? టీవీలా?? అసలప్పుడు మనూరు మొత్తం కలిపి రెండిండ్లే ఎరికేనా??

మీ చిన్నప్పుడు టీవీల్లెవ్వా బాపూ??

టీవీలా?? టీవీలు కాదు నాయినా.. మాకసలు సైకిలంటెనే ఎర్కలేకుండే… అప్పుడు గియన్నెక్కడియిరా…..  అనుకుంట ఇంకో బుక్క పెట్టబోతే సతీష్ “కడుపు నిండిందన్నట్టు” అంగీలేపి బొత్త సూయించిండు… మిగిలిన రెండు బుక్కలూ రాజన్న నోట్లేసుకోని ఖాళీ కంచం బాయికాడ బోర్లేశిండు…

ఇంతలనే సతీషు జబ్బకు సంచేసుకోని బడికి తయారైండు… వాళ్లమ్మ పాత స్ప్రైట్ సీసను మంచిగ కడిగి నీళ్లు పోశిచ్చింది.. ఆమెకు టాటా చెప్పి తండ్రికొడుకులిద్దరు సైకిల్ మీద మొండయ్య హోటల్ కాడికి బయలెల్లిన్లు..

తొవ్వపొంటి రికామనేదే లేకుంట కొన్ని వందల ప్రశ్నలు అడుగుతనే ఉన్నడు సతీషు..

హోటలుకాడికి పొయ్యేపోవుడుతోనే “పల్లె వెలుగు” బస్సు రానే వచ్చింది…  అది మండల్ హెడ్ క్వార్టరుకు పొయ్యే బస్సు.. ఇక్కడికి పది కిలో మీటర్లు దూరం.. సతీష్ తోని పాటే ఇంకో నలుగురైదుగురు పిల్లలు బస్సెక్కిన్లు….

వాళ్లందరు సదివేది ఒక్క బల్లెనే.. సర్కార్ బడి.. ఆ హెడ్ క్వార్టర్లనే ఉంటదది..  వీళ్ల లెక్కనే చుట్టుపక్కల ఉన్న ఓ పది పన్నెండు ఊళ్లకేంచి చానమంది పిల్లలు ఇట్లనే రోజు బస్సులెక్కో, సైకిల్లు తొక్కో అదే బడికి వస్తుంటరు…

లోకలోల్లకూ,  ప్రైవేటు స్కూలు పిల్లలకు ఈ బాదుండదు, మంచిగ పొద్దుపొద్దుగాల్నే స్కూల్ బస్ ఇంటి గల్మలకే అచ్చి ఎక్కించుకుంటది, మళ్ళ పొద్దూకంగ అదే గల్మల పడగొట్టిపోతది… సతీషులాంటోళ్లకు అసొంటి బడికి పోవుడనేది ఎడారిల “ఒయాసిస్సే”… అదటుంచుతే సర్కార్ బల్లె అయితే ‘మాపటీలి తిండి’ ఉంటదికదా…!!!

******

అరేయ్… గాంధీతాత గురించి నేర్సుకచ్చుకొమ్మన్నగారా.. నేర్సుకచ్చుకున్నరా?? సార్ అడిగిండు..

ఈ సార్ మొన్న మొన్ననే జిల్లా హెడ్ క్వార్టరు కాంచెళ్లి ఈ బడికి ట్రాన్స్ ఫర్ అయి అచ్చిండు..

ఏందిరా?? ఎవ్వలు సప్పుడు చేస్తలేరు?? నేర్సుకచ్చుకున్నరా లేదా??

“నేర్సుకచ్చుకున్నం సార్” అని కొందరు.. “నేర్సుకచ్చుకోలేద్ సార్” కొందరు అంటున్నరు..

ఏందిరా?? నపరొక మాటoటాన్లు?  అసల్ నేర్సుకచ్చుకున్నారా లేదా?? గొంతు పెంచి అడిగిండు సారు..

గుంపుల గోవిందలెక్క ఈసారి అందరు గట్టిగ “నేర్సుకచ్చుకున్నం సార్” అన్నరు తలకాయలూపుకుంట.. అనుడైతె అన్నరుకని “నన్నెక్కడ లేపి అడుగుతడో” అని ప్రతి ఒక్కరికి లోపట లోపట గజ్జుమంటాంది.

“మందల గొర్ల వేరం అందరు తలకాయలూపుడు కాదురా,  ఒక్కొక్కన్ని లేపి అడుగుతె అప్పుడు బయట్వడ్తయ్  మీ యవ్వారాలన్ని..”  అనుకుంట క్లాసు రూం మొత్తం కలె చూస్తూ బేంచిల మద్యలనుంచెళ్లి లాష్టుబేంచిల దిక్కు నడిశిండు  సారు..

ఆ మాట వినంగనే అప్పటిదాంక మంచిగ సాఫ్ సీదా ఉన్న పిల్లల నడుములు ఒక్కసారిగ వంగి, గూని అయినయ్!

అట్ల వంగి కూసుంటే సార్ కు కనిపియ్యమని వాళ్ల నమ్మకం.. తలకాయలుకూడ నేల చూపులు చూస్తున్నయి… ఎవలకువాళ్లు మనసుల- “సార్ నన్ను లేపద్దు.. సార్ నన్ను లేపద్దు” అనుకుంటాన్లు…

అరే.. నారిగా.. లే రా…

లాస్టు బేంచిల అటునుంచి ఫష్టుకు కూసున్న నరేషు భయం భయంగ లేశినిలుసున్నడు..

చెప్పురా.. గాంధితాత ఎవరూ? ఆయినె దేశానికేం చేశిండు??

సార్.. అంటే.. అదీ.. సార్.. అని మాటలు నములుతాండు తప్పితే నోట్లెకేంచి కూతెల్తలేదు నరేషుకు..

ఏందిరా?? నేర్సుకచ్చుకోలే?? మీరు పుస్తకాలెట్లా తియ్యరు.. కనీసం ఇంట్లోల్లను అడిగన్న తెల్సుకచ్చుకొమ్మని చెప్పిన గారా.. అని సట్ట సట్ట రెండు మొట్టికాయలు కొట్టిండు సారు..

అబా… అద్దు సార్ అద్దుసార్.. నిన్న ఆణ్నే బొడుసులేశింది సార్.. అద్దు సార్.. అద్దుసార్ అని నెత్తి రుద్దుకుంటూ బతిమాలిండు నరేషు…

అరే రాజుగా నువ్వు చెప్పురా…

సార్.. అదీ.. సార్.. నిన్న మా అవ్వ పత్తేరవొయ్యింది సార్… ఇంటికి రాంగనే ఈ ముచ్చట్నే అడుగుదామనుకున్న సార్.. కని అచ్చేవరకే బాగ నెరివండుండే సార్.. అందుకే….

అందుకే అడగలేదంటవ్?? సాప్ మట్టల్ సాప్..

“ఫాట్”.. “ఫాట్”… సదువు రాదుకని సాకులు మాత్రం అచ్చు.. దినాం కొత్త సాకు.. సాపు..

“ఫాట్”.. “ఫాట్”…

ష్ష్ .. అబ్బా.. అద్దు సార్ అద్దు సార్ అనుకుంట మట్టలను జాడించిండు రాజు…

మీ లాష్ట్ బేంచి బతుకులెప్పుడు గింతేరా.. గిట్లనే గంగల కలుత్తయ్ మీ బతుకులు…. అని పక్కకున్న ఇంకిద్దరిని కూడ తలో నాలుగు దెబ్బలు సరిశి ముందుకు అచ్చుడచ్చుడే-

అరే సత్తీ… లేరా… చెప్పూ.. గాంధి తాత ఎవరూ? ఆయినేం జేశిండు??

గట్టిగ చెప్పు.. అందరికినవడాలే..

ఫస్ట్ బేంచిల కూసున్నవాళ్ళకు అన్నీ తెలుస్తయని సారు నమ్మకం.. నమ్మకానికి తగ్గట్టే, సతీష్ సుత ఏ మాత్రం భయపడకుండ ఠక్కున లేశి చేతులు కట్టుకోని చెప్పుడు వెట్టిండు..

సార్.. గాంధి తాతా.. అప్పట్ల… తెల్లోల్లున్నప్పుడు… మన మంత్రి ఉండేటోడు…

ఏందీ???

మంత్రి సార్.. మినిష్టర్..

ఏం మినిష్టర్ రా???

సార్ మాటల వ్యంగ్యం సతీష్ కు అర్థంకాక ఇంకింత ఉత్సాహంగ-

ప్రధాన మంత్రో, ముఖ్య మంత్రో ఉంటుండే సార్.. ఏదో తెల్వదు కని ఈ రెండీట్ల ఏదో ఓటుంటుండె సార్..

సార్ మొఖం ఎర్రగ అయింది…

“గాంధి తాతా మంత్రారా?? ఆయినె ముఖ్యమంత్రని నీకు మీ నాయిన చెప్పిండారా?” అనుకుంట  గిబ్బ గిబ్బ రెండు గుద్దులు గుద్దిండు సారు….

కాద్సార్ కాద్సార్.. ప్రెధాన మంత్రి సార్.. ప్రెధానమంత్రి సార్..

“మీ నాయినే చేశిండట్నారా ప్రధానమంత్రిని? ఆ??”                        వెన్నుబొక్క మీద ఇంకో రెండు గుద్దులు..

మా బాపు చెప్పింది చెప్పినట్టే అప్పచెప్పినా సుత సార్ కొడ్తుండేందని సతీషుకు మస్తు దుఃఖమస్తాంది కని ఆపుకుంటాండు.. ఎంత ఆపుకున్నాగని గుడ్లెంబడి నీళ్లు రానే అచ్చినయ్..

ఇంకో ఇద్దరు ముగ్గురు ఫష్టు బేంచోళ్ళను లేపి అడుగుతెసుత అసొంటి జవాబులే వచ్చినయ్.. గాంధి తాత గరీబోడూ, బట్టలుసుత లేకుండెనట అని ఒకరు చెప్తే, గాంధితాత ఉన్నోడేగని, ఉన్నది మొత్తం గరీబోల్లకు దానమిచ్చి అట్లయిండని ఇంకోడు చెప్పిండు.. ఇవన్ని వింటున్న సారుకు బీపీ పెరిగింది..

వాళ్ళ వేల్ల మధ్యలో చాక్ పీసు పెట్టి వొత్తిండు..

వాళ్లు “వావ్వో.. వావ్వో అద్దుసార్ అద్దుసార్” అని మొత్తుకుంటున్నా సార్ కు వినపడ్తలేదూ , విడిచిపెట్టబుద్ధైతలేదు.!

“థూ.. ఏం పోరగాన్లురా మీరు?? దునియాల గాంధి తాత గురించి ఎర్కలేనోడు ఉంటడారా?? ఓడు మినిష్టరంటడు, ఓడు గరీబోడంటడు, ఓడు అదంటడు ఇంకోడు ఇదంటడు..!! ఏడికెల్లి దాపురించిన్లురా ఇసంటి సంతంత!!! తినున్లిరా అంటె గిద్దెడు తింటరు ఒక్కొక్కడు.. సదువు మాత్రం సున్నా.. ఎందుకస్తర్రా ఇసొంటి గాడిదికొడుకులు మా పానం తినడానికి?  థూ..” నాలుక కొస్సకు ఇంక చాన మాటలున్నయి.. కని ఆపుతున్నడు..

పిల్లలందరూ తప్పు చేసినట్టు తలలు కిందికి వేస్కున్నరు..

మీకు తెల్వకపోతె తెల్వదు.. కనీసం మీ ఇంట్లోల్లనన్న అడిగి తెల్సుకోని రావద్దారా? ఆ? మీ నాయిన్నో, అవ్వనో.. ఎవరో ఒకల్ని అడిగి నేర్సుకోని రావద్దా??

నీన్ అడిగిన సార్..  సతీషు మెల్లగ అన్నడు..

మాద్దండి అడుగుడడిగినవ్ పో.. అదే చెప్పిండార మీ నాయిన?? గాంది తాత.. రాష్ట్రపతి, ముఖ్యమంత్రని??

ఔన్ సార్..

“ఎవడ్రా మీ అయ్యకు సదువుచెప్పినోడు? గాంధీజీ మన ముఖ్య మంత్రా?? ఆ?? చెప్పూ.. ముఖ్యమంత్రా??” చెవు మెలివెట్టిండు సారు..

ఆ.. ఆ.. ఎమ్మో సార్.. కాద్సార్.. కాద్సార్..

మీ అయ్య ఊళ్లె ఉంటాండా?? అడివిల ఉంటాండారా?? ఆ?? గాంధితాత ఎర్కలేదారా మీ అయ్యకు??

అని మళ్ళ క్లాస్ అంత కలెతిరిగి చూస్తూ- సరే వీళ్ల నాయినకు ఎరుకలేదట.. మరి మీ అందరి సంగతేందిరా??

మావోళ్లుసుత ఎర్కలేదన్నరు సార్.. అందరు మళ్ల గుంపుగ జవాబిచ్చిన్లు..

ఎవడన్న వింటె ముడ్డితోని నవ్విపోతడు ఎర్కేనా? మీ వొళ్లంత ఊళ్ళె ఉంటాన్లా జంగిల్ల జంతువుల్తోటి ఉంటాన్లా? గాంధి తాత గురించి తెల్వదనుడేందిరా? మీ నకరాలు గాపోతె…. ఇట్ల కాదుకని ఇయ్యాల మీ సంగతి చూశినంకనే ఇంకో పని..

ఒక్కొక్కడు లేశి మీ నాయినలేం జేత్తరో చెప్పున్లిరా… మీ ఈపులు మొత్తం సాఫ్ చేశే పోత ఇయ్యాల…  చెప్పుర సంతు మీ నాయినేం జేత్తడ్రా…

సార్… మా బాపు.. మా బాపు చాపల వడ్తడు సార్..

ఏందీ?

ఔ సార్.. మా బాపు చాపల వడ్తడు.. మా బాపు గాలమేత్తె కం సె కం కిలకు తక్కువ చాప వడదు సార్.. ఇగ వలేత్తెనైతె వశపడదు సార్..

సార్.. మా బాపు ఉట్టి చేతుల్తోటిసుత చాపలు పడ్తడు సర్..

ఆ..!!

మా బాపు నీళ్లల్లకు దిగిండంటే  చాపలే ఆయినకు ఎదురత్తయంటరు సార్ మా ఊరోళ్ళు..

ఇంకా??

Kadha-Saranga-2-300x268

“మా బాపు ఎవుసాయం జేత్తడు సార్… నారు వోశిన కాంచి అడ్లు కొలిశేదాక మొత్తం అన్ని చేత్తడు సార్ మా బాపు..” ఓదెలు అందుకున్నడు.

ఆ..

అడ్లను ఒక్కచేత్తోనే గుప్పిట్ల ఇట్ల వట్టుకోని ఆటిని నలిపి బియ్యం తీత్తడు సార్ మా నాన.. బియ్యం నలుపుతె పిండి పిండి అయితసార్ నిజంగా…

అచ్చా.. ఇంకా..

మా నాయిన పడువ తోల్తడు సార్.. మనూరోల్లు శివారానికి, ఏలాలకు పోవాల్నన్నా, ఆ ఊళ్ళోల్లు మనూళ్ళెకు రావాల్నన్నా మా నాయిన పడువొక్కటే సార్…

అచ్చా!!

నిరుడు హోళి అప్పుడు ముగ్గురు పోరగాన్లు కయ్యలల్ల వడి మునుగుతాంటె ఆళ్లను మీదికిగ్గింది మా నాయినే సార్.. ఇప్పటిదాంక అట్ల బొచ్చెడుమందిని బచాయించిండుసార్ మా నాయిన..

ఆ..!!

సార్.. మన జిల్లా మొత్తమ్మీన ఆనా కాలం, గంగ ఇటొడ్డు కాంచి అటొడ్డుకు ఈత కొట్టే మొగోడు మా నాయినొక్కడే అట సార్.. మా కాక చెప్తడు..

ఇంకా..??

సారు విసుగుతో, వ్యంగ్యంతో అంటున్న “ఇంకా” అనే మాట ఆ పిల్లల కు చాన పాజిటివ్ గ అనిపించింది… మా సార్ మా నాయినలు గురించి తెల్సుకోవాల్నని అడుగుతున్నడు అనుకోని ఇంకింత ఉత్సాహంతో తమ తమ తండ్రుల గురించి చెప్పుడు షురూ చేశిన్లు ఒక్కొక్కరు..

మా అయ్య అమాలి పనికి పోతడు సార్… మొత్తం లారెడు లోడు ఒక్కన్ని ఎక్కియ్యమన్నా ఎక్కిత్తడు సార్, మళ్ల దించుమంటె సుత అప్పటికప్పుడు దించుతడు సార్ మా అయ్యా..  రవి చెప్తున్నడు..

ఆ..

పేనేడాది గా బుచ్చన్నోళ్లు, కచ్చరమ్మీద అడ్ల బస్తాలు చేరగొడ్తాంటే జొడెడ్లల్ల ఒక ఎద్దు తొవ్వల్నే సచ్చిపేంది సార్.. అప్పటికే ఆయిటిపూని ఎప్పుడు వానకొట్టేది ఎర్కలేకుంటున్నది.. కచ్చరంల పదిహేను కింటాల్ల అడ్లున్నయట సార్, కప్పుటానికి బర్కాల్ సుత లెవ్వు.. సరిగ్గ అదే టయానికి మా అయ్య అటుకేంచి పోతాంటె సమ్మన్నా జర సాయం పట్టరాదే అన్నరట సార్.. గంతే.. కనీ వట్టుకోని కచ్చురాన్ని అమాంతం లేపి జబ్బ మీదికెత్తుకున్నడట సార్.. కనీకి ఓ దిక్కు ఎద్దు ఇంకో దిక్కు మా నాయిన… అట్ల ఆరు కిలమీటర్లు ఇగ్గుకచ్చి అడ్లు ఇంటికి చేరగొట్టిండు సార్… మా బుచ్చన్నమామ ఇప్పటికి చెప్తడు…

ఆహా..! ఇంకా?

సార్… మా నాయిన కోళ్లు పెంచి అమ్ముతడుగని ఆయినెకు పామ్మంత్రం, తేలు మంత్రం ఎరికెసార్… షరీఫు లేశి అన్నడు.

ఆ..

నా అంతున్నప్పుడే మా నాయిన నాగుంబాములు ఉట్టి చేత్తోటి వట్టిండట సార్.. నాగుంబాం కుట్టినా, కట్లపాం గుట్టినా, చిడుగువడ్డా.. మా నాయినకాడ మొత్తం అన్నీటికి మందున్నది సార్… అసల్ ఇప్పటిదాంక ఒక్కర్నిసుత సచ్చిపోనియ్యలేసార్ మా నాయిన..

“ఇదెక్కడి లొల్లిరా బాబు..” సార్ మనసులోనే అనుకుంటాండు..

సార్ మా బాపు కల్లు గీత్తడు సార్.. తాళ్లుంటయి గద సార్.. పొద్దుగాల పదింటికి దాని నీడ ఏడి దాక వడ్తదో ఎర్కెగద సార్??  అగో.. ఆ నీడ మీద మనం ఇటుకేంచి అటు నడిశి, మళ్ల అటుకేంచి ఇటూ ఎనుకకు మర్రచ్చేంతల మా బాపు ఆ తాడెక్కి లొట్లుసుత వట్టుకోని దిగుతడు సార్.. గంత జెప్పన ఇంకెవలెక్కర్ సార్.. పవన్ చాతి ఉబ్బించి మరీ చెప్పిండు.

మాట మాటకు సారుకు విసుగు పెరిగిపోతాంది…

సార్..  మా నాన బట్టల్ కుడ్తడు సార్… అంగీలు, లాగులు, ప్యాంట్లు, బనీన్లు మొత్తం అన్ని కుడ్తడు సార్… అసల్ చేతుల టేపు వట్టకుండ, కొల్తలు తియ్యకుంట ఉట్టిగ మనిషిని చూత్తె సాల్ సార్, బరాబ్బర్ ఎవలి సైజుల వాళ్ళకు బట్టలు కుట్టిత్తడు సార్ మా నాన… చెప్పిండు రమేషు..

సార్ మా నాయిన సాకలోడు సార్.. సార్ మా బాపు పాలమ్ముతడు.. మా బాపు మంగలాయినె సార్… మా నాయిన కట్టెలమ్ముతడు.. మేస్త్రి పని చేత్తడూ..  చాయి బండి.. సాలె మగ్గం.. కుమ్మరి కుండలు.. ఇస్తిరి డబ్బా… పాతినుపసామాన్… అని ఒక్కొక్కరు మస్తు సంబురంగ సార్ సార్ అనుకుంట తమ తండ్రుల గురించి చెపుతున్నరు.. క్లాస్ అంతా పిల్లల ఉత్సాహంతోని నిండిపోయి.. మంచి ఆహ్లాదకరంగా మారిపోయింది..

కాని ఇంతలనే “నీ యావ్… ఇగ సాలు ఆపున్లిరా…” అన్న మాట ఆ గదిల ప్రతిధ్వనించింది..

పులిని చూశి భయపడ్డట్టు పిల్లలందరు ఒక్కసారి గజ్జున వణికిన్లు సార్ కోపం చూసి..

చెప్పుమన్నకదా అని ఒక్కొక్కడు మా అయ్య మినిస్టరు, మా అయ్య కలెక్టరు అన్న లెవల్ల చెప్తాన్లేందిరా??

అసలొక్కటన్న మంచి పని ఉన్నదార మీరు చెప్పిన దాంట్ల?? నాన్ సెన్స్ అని… నాన్ సెన్స్..

పిల్లల మొఖాలు మాడిపొయినయ్..

ఓడు పాలమ్ముతడట.. ఓడు చాపల్ వడ్తడట.. గివ్వారా పనులంటే? ఆ?? గివ్వేనా??

పిల్లల పానం సల్లవడుతాంది, సారుకు మాత్రం ఒళ్లంత మంట వెట్టినట్టయితాంది..

మూటలు మోశుడూ, బర్ల ముడ్లుకడుగుడూ ఇయ్యారా పనులు? ఆ??

నాన్ సెన్స్ అని… నాన్ సెన్స్..  ఊరోళ్లూ.. ఊరి కథలు… నీ.. యవ్.. మిమ్ముల గాదుర నన్నీడికి ట్రాన్స్ ఫర్ చేశినోన్ని అనాలె ముందుగాల.. థూ.. ఇసొంటి మనుషుల్ని నీనేడ సూల్లేదవ్వా… ఓ సదువులేదు ఓ తెలివి లేదు..

గాంధీజి ముఖ్యమంత్రట.. చత్.. మరీ గింత అనాగరికంగ ఎట్లుంటర్రా మనుషులు?? ఎసొంటోల్లత్తర్రా మా పానాల మీదికి?? అని ఇంకేదో అంటున్నంతలనే అన్నం బెల్లు కొట్టిన్లు..

పొట్ట చీరుతె అక్షరం ముక్క రాదుగని, టైముకు తిండి మాత్రం పెట్టాలె మీకు!! నాన్ సెన్స్ అని నాన్ సెన్స్.. చత్… ఏం రాజా బతుకురా మీది!!  అనుకుంటూ తొవ్వలున్న కుర్చీని కోపంగ పక్కకు నూకి బయటికి నడిచిండు సారు…

మాములుగ బెల్లుకాంగనే “మధ్యానం భోజనానికి” కంచాలువట్టుకోని గ్రౌండుకాడికి ఉరికే పిల్లలు ఇయ్యాల మాత్రం కూసున్న కాంచెల్లి లేవలే..

ఇన్ని రోజులు వాళ్ళు తమ తండ్రులు చేసే పనులు మహ మహా అద్భుతాలనుకున్నరు.. కని సార్ మాత్రం ఇంకో తీరంగ అంటున్నడు.. ఎందుకట్లన్నడనేదే వాళ్లకు సమజైతలేదు..

ఎవ్వరికి అన్నానికి లేవ బుద్దైతలేదుకని ఆ రోజు ఉడ్కవెట్టిన కోడిగుడ్డు ఇచ్చే రోజు.. వారానికి ఇచ్చేదే రెండ్లు గుడ్లు..  అందుకే గుడ్డు మీద ఆశకొద్ది పాపం అందరు కంచాలు వట్టుకోని బయటికి నడిశిన్లు…

******

సాయంత్రం ఏడింటికి..

“సార్” వాళ్ళింట్ల టీవీ చూస్కుంట ఫోన్ మాట్లాడుతున్నడు..

“ఎక్కడ బావా!! రూపాయి దొర్కుతె ఒట్టు…  మాదేమన్న మీలెక్క రెవెన్యూ డిపార్టుమెంటా చెప్పు? మీరు కుక్కను తంతె పైసల్ రాల్తయ్.. మా ముచ్చట అట్లకాదుకదా.. అందుకేగదా ఇయన్ని యవ్వారాలు..”

అవతలి మనిషి ఏదో అన్నడు..

vamshi

వంశీ కథాసంపుటి ఆవిష్కరణ సందర్భంగా…

అయన్ని కాదు కని బావా నువు కొంటానవా లేదా ఒకటే ముచ్చట చెప్పు.. బయటోళ్లకైతె నాలుగ్గుంటలు పదికిత్తా అంటున్నరు, నువ్వు మనోనివి కాబట్టి నీకు ఆరుకు ఇప్పిస్త.. సరేనా?? నా కమిషన్ టెన్ పర్సెంట్ లెక్క అలగ్ మల్ల…

డ్యాడ్….. “సార్” కొడుకు వరుణ్, తండ్రిని పిలిచిండు..

“డ్యాడ్” కొడుకును పట్టించుకోకుండ ఫోన్ ల మాట్లాడుతనే ఉన్నడు..

ట్రాన్స్ ఫర్ అంటే ఉట్టిగనే అయితదా బావా? ఎన్ని చేతులు తడుపాల్నో నీకెర్కలేదా! అందుకేగా ఇన్ని తిప్పలు.. ఫైవ్ పర్సెంట్ అంటె కాదుగని ఎనిమిది చేస్కో బావా నువ్ కాబట్టి లాష్ట్ ఇంక…

డ్యా…..డీ…. ‘కుర్ కురే’ నములుకుంటూ కొంచం గట్టిగ పిలిచిండు కొడుకు.

వాట్ బేటా??

ఐ హ్యావ్ అ డౌట్ డ్యాడ్…

యా??

వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ “పండిత పుత్ర పరమశుంఠా”??

అతనికి తన కొడుకేమంటుండో ఒక్క నిమిషం అర్థంకాలేదు..

వ్వాట్?? వ్వాట్ బేటా??

వాట్…. ఈస్…. ద…. మీనింగ్…. ఆఫ్…. “పండిత పుత్ర పరమశుంట??”..

అప్పటిదాక పక్కకుపెట్టి పట్టుకున్న ఫోన్ లో “నీన్ మళ్లీ ఫోన్ చేస్త బావ..” అని చెప్పి కాల్ కట్ చేసి.. కొడుకును దగ్గరికి రమ్మన్నడు ” డ్యాడ్”..

కొడుకు కుర్ కురే ముక్కను నోట్లె సిగరెట్ ముక్కలెక్క పెట్టుకోని తండ్రిని ఇమిటేట్ చేస్కుంట చాన క్యాజువల్ గా వచ్చి “డ్యాడ్” పక్కన కూచున్నడు..

నౌ, టెల్ మీ వాట్ హ్యాపెండ్??  అసల్ ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా నీకు??

నథింగ్ డ్యాడ్.. మా సర్ ఇవ్వాల నన్నామాట అన్నడు..

ఎందుకు?? ఎందుకట్లన్నడు??

వాడు వట్టి వేస్ట్ ఫెలో డ్యాడ్…

వరుణ్.. టెల్ మి అంటున్న కదా..

అదంత పెద్ద స్టోరీ డ్యాడ్.. లైట్ తీస్కో.. దానికి మీనింగ్ చెప్పు చాలు…

రేయ్.. మంచిగ అడుగుతున్నకదా.. చెప్పు.. అసల్ ఆ మాటెందుకన్నడు వాడు?

అరే.. ఈసీ డ్యాడ్.. ఇవ్వాల లంచ్ అవర్ లో బాక్స్ ఓపెన్ చేస్తే అందులో మళ్లీ బాయిల్డ్ ఎగ్గ్ కర్రీనే ఉండే.. మమ్మీ కి పొద్దున్నే ఫ్రై కర్రి చెయ్యమని చెప్పినాకుడ వినకుండా మళ్లీ అదే బోరింగ్ బాయిల్డ్ ఎగ్స్, టొమాటో కరీ వేసి పెట్టింది డ్యాడ్.. అందుకే మమ్మీ మీద కోపమొచ్చి బాక్స్ విసిరి కొట్టిన… బట్ అన్ ఫార్చునేట్లీ ఎగ్సాక్ట్  అదే టైం కి మా మ్యాక్స్ సర్ గాడు అక్కడికొచ్చిండు..

ఆ?? వస్తే??

వొచ్చి.. ఈ బాక్స్ ఎవరిది అన్నడు… ఐ సెడ్ ఇట్స్ మైన్… బట్ వాడు “ఎందుకు విసిరికొట్టినవ్..” అదీ ఇదీ అని పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసాడు డ్యాడ్…

అంటే?? నువ్ ఇవ్వాల కూడ లంచ్ చెయ్యలేదా వరుణ్? పక్కనే టీవీ చూస్తున్న వాళ్ల మమ్మీ అడిగింది..

గీతా.. ప్లీస్ డోంట్ చేంజ్ ద టాపిక్.. చెప్పు వరుణ్ తర్వాతేమైంది??

నతింగ్ డ్యాడ్.. నా లంచ్ నా ఇష్టం అని నేన్ కూడా ఫుల్ ఆర్గ్యూ చేసిన….

ఆ??

ఆ వేస్ట్ గాడు అక్కడో పెద్ద సీన్ చేసి నాకు క్లాస్ పీకాడు..

ఆ?

అప్పుడు  ఫైనల్ గా వాడొకటన్నాడు డ్యాడ్.. “అన్నం విలువ తెలిస్తె నువ్విట్ల చెయ్యవ్ వరుణ్” అని.. నాకు ఫుల్ కోపమొచ్చింది.. నాకు తెల్సు అన్న.. కని వాడు ఇంక ఎక్స్ట్రా చేస్తూ “అసల్ నువ్ తినే అన్నానికి బియ్యం ఎక్కన్నుంచి వొస్తాయో చెప్పు” అన్నడు..

నేన్ బియ్యం- “బియ్యం చెట్లకు” కాస్తయని చెప్పిన…

అంతే డ్యాడ్, ఆ వేస్ట్ గాడు నాతో ఇంక ఆర్గ్యూ చెయ్యలేక “పండిత పుత్రా పరమ శుంఠా” అని సాన్స్ క్రిట్ లో ఏదో అనుకుంటూ అక్కణ్నించి ఎస్కేప్ అయిండు… అసల్ ఆ సెంటెన్స్ కి మీనింగ్ ఏంది డ్యాడ్??

“దానికి మీనింగ్ కాదురా.. అసల్ ఆ మాటన్న సార్ గాడెవడో చెప్పు.. వాని తోలు ఒలిచి పారేస్తా..

వానికెంత బలుపుంటె ఆ మాటంటడు వాడు నా కొడుకును? ఆఫ్ట్రాల్ ప్రైవేట్ టీచర్ గానికి గంతగనం మోరనా?? వాని…  లక్షల్ లక్షల్ ఫీజులు కట్టేది గిందుకోసమేనా? లంజొడుకు… నోటికి ఏదస్తె అదనుడేనా సాలెగాడు!!అసల్ ఏం అనుకుంటాండ్రా వాడు??  రేపైతె తెల్లారని.. వాన్ని డిస్మిస్ చేయించి పారేస్త స్కూల్లకెల్లి.. … …. నాన్సెన్స్ అని నాన్సెన్స్..”

******

రాత్రి ఎనిమిదయితుంది..

సతీషు అన్నం తింటలేడని వాళ్ల బాపు బతిమాలుతాండు..

“తిను నాయినా.. దా.. ఒక్క బుక్క.. దా దా.. మా సత్తి మంచోడుగదా.. దా.. ఒక్క బుక్క తిను రా నాయినా.. దా..” అనుకుంట అన్నం బుక్క నోటిముంగటే పెట్టినా సతీషు మాత్రం నోరు తెరుస్తలేడు..

“నా బంగారం కదా.. దా బిడ్డా.. ఒక్క బుక్క.. ఒక్కటంటె ఒక్కటే బుక్క.. దా నాయినా… నెరివడ్తవ్ రా రా..” అమ్మసుత మస్తు బతిమాలుతాంది కని సతిషు మాత్రం నోరు తెరుస్తలేడు..

అసల్ ఎందుకలిగినవ్ రా? ఏవలన్న ఏమన్న అన్నరా??

సత్తి మాట్లాడలేదు..

చెప్పు కొడుకా.. ఏమైందిరా??  బిస్కిటు పొడ తేవాల్నా, “ఛా”ల ముంచుకోని తినేవు??

ఉహూ..

పోని చాకిలేట్లు తేవాల్నా??

సత్తి వద్దన్నట్టు తల అడ్డంగ ఊపిండు..

మరేంగావాల్నో చెప్పురా?? ఉట్టిగనే అట్ల మా మీద అలుగుతె ఎట్లరా మరి…  దా… మా బుజ్జి కదా.. ఒక్క బుక్క తిను.. దా నాయినా..

“నాకద్దు పో.. నీన్ తినా అని చెప్పిన కదా… ఊకె ఎందుకట్ల సతాయిస్తున్లు.. నాకద్దు.. నీన్ తిన..”

సత్తి గొంతుల కోపం కన్నా దుఃఖం ఎక్కువున్నదని ఆ తల్లిదండ్రులకు ఉట్టిగనే అర్థమైంది..

ఏమైందిరా?? ఏవలన్న ఏమన్న అన్నరా??

బల్లె సారు గిట్ల కొట్టిండారా??

సత్తి కండ్లల్ల ఒక్కసారిగా నీళ్ళు ఊరుకచ్చినయ్.. ఠక్కున అమ్మ ఒడిల వాలి పొయ్యి చీర కొంగును మొఖం మీదికెళ్లి ఏసుకున్నడు..

వాడి కన్నీళ్ల వెచ్చదనం ఆ తల్లిదండ్రుల మనసుకు తెలుస్తనే ఉంది…

ఊకో నాయినా.. ఊకో రా.. దా దా దా.. అనుకుంట చేతులున్న కంచం పక్కకువెట్టి కొడుకును ఎత్తుకున్నడు బాపు..

ఎవల్రా?? మీ సారు కొట్టిండా??

మ్మ్… సత్తి ముక్కు చీదుకుంట అన్నడు..

అమ్మ ఊకో బిడ్డా ఊకో అనుకుంట కొంగుతోని కండ్లు తుడుస్తాంది..

అరెరే.. అందుకు అలిగినవా కొడుకా?? ఊకో.. ఊకో..  బాగ కొట్టిండారా సారు??

మ్మ్..  మస్తు కొట్టిండు బాపూ.. ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు.. అనుకుంట బనీను లేపి చూపించిండు..

అమ్మ కండ్లల్ల నిళ్ళచ్చినయ్ కని కొడుక్కు కనపడకుండ వెనకనే నిలుచుని అతని వెన్నును చేత్తో రుద్దుతోంది… సత్తికిసుత మళ్ల కండ్లల్ల నీళ్లస్తున్నయ్..

అరే.. ఊకో నాయినా.. నీను అటెప్పుడన్నచ్చినపుడు “మావోన్ని కొట్టద్దని” మీ సారుకు చెప్త సరేనా?? ఆ.. ఇంగో..

నోరు తెరువు… ఇగో.. ఆ.. ఆ.. ఈ బుక్క తిను… రేపు బడికిపోంగ నీకు ఉప్పు బిస్కిటుపొడ కొనిస్త సరేనా?? అనుకుంట  నోట్లో బుక్క పెట్టిండు బాపు..

సతీషు బుక్క నములుతూ- నీను రేపటి కాంచి బడికి పోను బాపూ.. మా సార్ ఉట్టుట్టిగనే మస్తు కొడ్తాండు.. మా దోస్తులుసుత బడి బంజేత్తా అంటున్లు..

లె ల్లే.. తప్పు కొడుకా అట్లనద్దు.. మీకు సదువు మంచిగ రావల్ననేగారా మీ సార్లు కొట్టేది..  గాయింత దానికే సారుమీద అలుగుతరా చెప్పు..

అట్లకాదు బాపూ.. ఆయినే మాదండోడు..

సదువు చెప్పే సారును అట్లనద్దురా.. తప్పు నాయినా.. ఇంగో బుక్క వెట్టుకో..

మీరందరు మంచిగ సదువుకోని రేప్పొద్దుగాల మంచి మంచి నౌకర్లు చేత్తె ఆ సారుకు ఏమన్నత్తదా చెప్పు?? మీ బతుకే మంచిగైతది కదా?? సార్లు ఓ మాటన్నా, ఓ దెబ్బ కొట్టినా అదంత మీరు మంచిగుండాల్ననేకని మిమ్ముల కొట్టుడు వాళ్లకేమన్న ఖాయిషా కొడుకా??  ఇంగో బుక్క తిను…  ఇంకెప్పుడు సదువు చెప్పే సార్లను అట్లనకు సరేనా..

సరే..

చెంపలేస్కో..

చెంపలు వేస్కుంటూ… “చిన్న చిన్న బుక్కలు వెట్టు బాపు” అన్నడు సత్తి..

నాయిన బుక్కను సగంచేసి పెట్టిండు.. అది నములుకుంటూ సత్తి అన్నడు- “అయినా.. ఇయ్యాల నువ్వు చెయ్యవట్టికే మా సార్ నన్ను కొట్టిండు బాపూ..”

నీన్ చెయ్యవట్టా?? నీనేం చేశిన్రా??

పొద్దుగాల “గాంధితాత గురించి అడుగుతె నువ్వు సక్కగ చెప్పలేగదా.. అదే ముచ్చట మా సారుకు చెప్తే ‘గిది సుత తెల్వదారా మీ అయ్యలకు’ అనుకుంట ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు బాపూ..”

******

తండ్రికొడుకులిద్దరు రాత్రి కల్లం కాడికి కావలిపొయ్యి, చిన్నపాటి గడంచెల నడుం వాల్శిన్లు.. సత్తి, బాపు చెయ్యిమీద తల పెట్టుకోని…. బొత్త మీద కాలూ-చెయ్యి ఏశి గట్టిగ పట్టుకోని పడుకున్నడు..

“బాపు” కండ్లు మూసుకున్నడు కని నిద్రపడ్తలేదు… కొడుకన్న మాటలే చెవులల్ల మళ్ల మళ్ల వినపడుతున్నయ్..

“గాంధితాత గురించి అడుగుతె నువ్వు సక్కగ చెప్పలేగదా.. అదే ముచ్చట మా సారుకు చెప్తే ‘గిది సుత తెల్వదారా మీ అయ్యలకు’ అనుకుంట ఎన్నుల గిబ్బ గిబ్బ గుద్దిండు బాపూ..”

“పాపం..  నీన్ చెయ్యవట్టే నా బిడ్డ దెబ్బలు తిన్నడియ్యాల.. పాపం.. కొడుకు…” అనుకుంట కొడుకు తలను, ఎన్నునూ ప్రేమగ నిమిరిండు బాపు.. అతని కండ్లల్ల కన్నీళ్ళు..

పిలగానికి ‘జో’ కొడుతూ కొడుతూ ఏ రాత్రో తనూ నిద్రలకు జారుకున్నడు..

చిమ్మ చీకటి…

చిక్కటి నిశ్శబ్దం…

పైన చుక్కలూ..

కింద చుట్టూ.. చెట్లూ చేమల మధ్యల…  చల్లటి గాలి జోలపాటకు, కన్నంటుకోవల్సిన ఆ “అనాగరికులు”..

కలత నిద్రలో…

ఒకే కలవరింపు…

“మా తాత గురించడుగుతె చెప్తగని, గాంధి తాత గురించి నాకేమెర్క..!!”

*

అన్వీక్షణ

 

 

-బి. హరిత

చిత్రం: సృజన్ రాజ్ 

~

 

Picture (1)పరిచయం:

హైదరాబాద్  సెంట్రల్   యూనివర్సిటీలో  ఎం.ఫిల్. చేస్తున్నాను. 
పుట్టింది విజయనగరం, ఇప్పుడు ఉంటున్నది హైదరాబాదు.
సాహిత్య ప్రవేశం అంటే, టూకీగా చెప్పాలంటే, సాంకేతిక విద్యలో డిగ్రీ అయ్యాక, తెలుగు మీద మమకారంతో ఎమ్మే చేశాను, ఆ ఇష్టంతో ఇప్పుడు పరిశోధనలోకి అడుగుపెట్టాను.
 
*

“ఎవరు నువ్వు?”

“నన్నే ఎరుగవా? నువ్వు నిరంతరం ఎవరి గురించి ధ్యానిస్తున్నావో అవ్వారిని నేనే!”

“అంటే నువ్వు.. నువ్వు దేవుడివా?”

“సందేహమా?”

“నేనేం నీ గురించి ధ్యానించటం లేదే!”

“లేదా? నువ్వు గత కొన్ని రోజులుగా రాత్రింబవళ్ళు నాగురించే ఆలోచిస్తున్నట్టు తోస్తేను, ఏదో నిన్ను పలకరించి పోదామని వచ్చాను. పోనిలే! వెళతాను”

“ఆగాగు! దొరక్క దొరక్క దొరికావు. నిన్నంత తేలిగ్గా పోనిస్తానా? నిన్ను చాలా చాలా అడగాలి. నా బుర్రంతా సందేహాలతో వేడెక్కిపోతోంది”

“అందుకేగా వచ్చాను. ఇక నీదే ఆలస్యం! అడుగు మరి”

“ఈ ప్రపంచానికంతటికీ నువ్వొక్కడివే దేవుడివా? నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?”

“నేనే వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటాను”

“ఎందుకలా? నువ్వు ఉన్నవాడివి ఉన్నట్టుగా కనిపిస్తే తీరిపోదా? అన్ని రూపాల్లో కనిపిస్తూ జనాలను తికమక పెట్టి వాళ్ళ మధ్య తగువులు సృష్టించి తమాషా చూడడం నీకు సరదానా?”

“మీ ఇంట్లో ఎంతమంది?”

“నేనే మడిగాను? నువ్వేం మాట్లాడుతున్నావు? అయినా మా ఇంట్లో ఎంత మంది ఉన్నారో నీకు తెలియదా?”

“తెలియకేం! నీ నోట విందామని..”

“నలుగురం – నేను, చెల్లి, అమ్మ, నాన్న”

“నీకే కూర ఇష్టం?”

“వంకాయ”

“మీ చెల్లికి?”

“బెండకాయ”

“అమ్మా నాన్నలకు?”

“అబ్బబ్బ! విసిగిస్తున్నావు!”

“చెబుదూ”

“అమ్మకు ఏదీ ప్రత్యేకంగా ఇష్టం ఉన్నట్టు కనపడదు. అన్నీ ఒకేలా తింటుంది. నాన్న బీరకాయను ఎక్కువగా ఇష్టపడతారు”srujan1

“ఒక కుటుంబంలో ఉన్న నలుగురు మనుష్యులకే, ఇప్పుడు తింటే మరి కాసేపట్లో అరిగిపోయే తిండి విషయంలోనే ఇన్ని ఇష్టాలున్నాయే, మరి ఈ విశాల ప్రపంచంలో ఉండే కోటానుకోట్ల మనుషుల అభిరుచులలో తేడాలుండవా? ఏ ప్రాంతం వారి అభిరుచులకు తగ్గట్టు వారికి కనిపిస్తాను.  ఇక వారి మధ్య గొడవలంటావా? అవి నేను పెట్టినవి కావు. నీకు వంకాయ ఇష్టమని మీ చెల్లిని కూడా అదే ఇష్టపడమనడంలో అర్థముందా? ‘De gustibus non est disputandum’ అని లాటిన్ లో ఒక సామెతుంది. అంటే..”

“తెలుసు! అభిరుచుల విషయంలో వాదోపవాదాలకు తావు లేదని. నీకు లాటిన్ కూడా తెలుసా?”

“అదేం ప్రశ్న! మీకు తెలిసినవన్నీ నాకూ తెలుసు. మీకు తెలియనిదేదీ నాకూ తెలియదు. ముందు చెప్పింది విను. ఎవరి ఇష్టం వారిదని పక్కవాడి ఇష్టాలను గౌరవిస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఎపుడైతే మన ఇష్టాలను పక్కవాడి మీద రుద్దాలని ప్రయత్నిస్తామో అప్పుడే ఘర్షణ మొదలవుతుంది. అది మీరు గ్రహించిననాడు మీ ప్రపంచం శాంతిమయం అవుతుంది”

“అయితే ఈ విషయంలో నీ తప్పేమీ లేదంటావు!?”

“సరే! నీ కర్థమయ్యేలా చిన్న ఉదాహరణ చెబుతాను. మీ నాన్న నిన్ను, మీ చెల్లినీ చిన్నప్పటి నుండీ ఒకేలా చూశాడు. ఒకే సౌకర్యాలు కల్పించాడు. ఒకే స్కూల్లో చేర్పించాడు. అవునా?”

“ఔను!”

“మరి నువ్వు బాగా చదివి ఫస్టు మార్కులు తెచ్చుకున్నావు. కాని మీ చెల్లి చదువెప్పుడూ అంతంతమాత్రమే! దీనికి కారణం మీ చెల్లా? లేక మీ నాన్నా?”

“మా నాన్నెలా అవుతాడు. మా చెల్లే! అదెప్పుడూ టీ.వీ. ముందు కూర్చుంటే మార్కులెలా వస్తాయి?”

“కదా! మరి నేనూ మీ అందరికీ బుద్ధినిచ్చాను. అది వాడి బాగుపడమన్నాను. మరి మీలో కొందరు రవీంద్రులు, నరేంద్రులు అవుతున్నారు. విశ్వశాంతిని బోధిస్తున్నారు. మరికొందరు మతం పేరిట మారణహోమం సృష్టిస్తున్నారు. ఇది మీ తప్పా? నా తప్పా? మీకు నేను బుద్ధిని, తార్కిక శక్తిని ఇచ్చానంటే ఉపయోగించుకోమనే కదా! ఉపయోగించి ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే బాధ్యత మీదే!”

“మరి నీ పేరుతో చెలామణీ అయ్యే ఆచారాలు? వ్యవహారాలు?”

“నువ్వాలోచించి చెప్పు, చూద్దాం!”

“హ్మ్!!….అవి ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో ఉన్న బుద్ధి జీవులు అక్కడి ప్రజల మంచి కోసం, సమాజంలో ఒక కట్టడి కోసం, నీ పేరిట ఏర్పరిచిన నియమాలు. అంతేనా?”

“శభాష్! నువ్వన్నట్టు ఒకప్పటి కాలంలో ప్రజలకు అవి అవసరమని జ్ఞానులు అవి ఏర్పరిచారు. అన్నీ కాదు కాని వాటిలో కొన్ని కాలపరీక్షకు నిలబడలేవు. అటువంటి వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ పోవాలి. కాని ఆచారం పేరిట మీరు వాటినే పట్టుకు వేలాడుతున్నారు”

“నిజం!  రాత్రి పూట ఇల్లు ఊడిచినా చెత్త ఎత్తి ఆవల పడెయ్యకూడదంటుంది అమ్మ. ఎందుకో అమ్మకూ తెలియదు. అమ్మమ్మ చెప్పిందంటుంది. ఆలోచించగా నాకు ఒక్కటే తోచింది. ఇంతకు ముందైతే గుడ్డి దీపాల వెలుతురులోనే రాత్రుళ్ళు పని చేసే వాళ్ళు. పొరపాటున విలువైనదేదో పడిపోతే చీకటిలో అవతలికి పడేస్తారేమోనని ఆ నియమం పెట్టి ఉంటారు. ఇప్పటి విద్యుద్దీపాల వెలుగులో కూడా దాన్నే పాటించడం తెలివితక్కువతనం. అలాగే సత్యన్నారాయణ స్వామి వ్రత కథ. వ్రతం చేసిన ఆవిడ, చనిపోయాడనుకున్న భర్త తిరిగి వచ్చిన ఆనందంలో, ప్రసాదం తినడం మరిచిపోయి భర్తను చూడడానికి పరిగెడితే, ఆమె భర్త ఉన్న ఓడను అక్కడికక్కడే సముద్రంలో ముంచేశావట. నువ్వింత శాడిస్టువా అని అప్పట్లో ఎంత తిట్టుకున్నానో!”

“బాగుంది! ఈ వ్రతకథలూ అవీ రాసేది మీరు. చెడ్డపేరు మాత్రం నాకా?”

“మరి నువ్వు నేరుగా కనిపించి ఈ విషయాలన్నిటిగురించి మాకు చెప్పొచ్చు కదా!”

“నన్ను చూడాలని బలంగా కోరుకునేవారికి తప్ప అందరికీ నేను కనిపించను. అయినా నేను చెప్పకపోతే ఏం? ఎప్పటికప్పుడు జ్ఞానుల చేత చెప్పిస్తూనే ఉన్నాను. అయినా మీరు వింటేగా? వోల్టేర్ అని మీ వాడే ఒకడు చెప్పాడులే, ‘It is difficult to free fools from the chains they revere’ అని”

“సరే కానీ, ఇంకొక పెద్ద సందేహం ఎప్పటినుండో ఉండిపోయింది. నిన్ను అడిగి తేల్చుకోవాలి. మా అమ్మ సీతమ్మను అడవిలో వదిలెయ్యడంలో ఏమైనా న్యాయముందా? నీకు సీతమ్మ కంటే రాజ్యమే ఎక్కువైపోయిందా? అది అధికారదాహం కాదా?”

“ఆబ్బో! ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయే! సరే! సమాధానం చెబుతాను. సావధానంగా విను. మొదటిగా సీతమ్మను వదిలేసింది నేను కాదు. రాముడు!”

“అదేమిటి? నువ్వే రాముడిగా అవతారం దాల్చలేదా? రాముడూ నువ్వూ వేరు వేరా?”

“వేరు కాదు! రాముడు నా అంశే! రాముడే కాదు మీరందరూ నా అంశలే! నా అవతారాలే! కాని రాముడు, కృష్ణుడు, బుద్ధుడు వంటి కొందరు మాత్రం తమ బుద్ధిని అత్యున్నత స్థాయిలో వికసింపజేసుకుని, ధర్మమార్గంలో నడిచి, తమలోని దైవాంశను ఆవిష్కరింపజేసుకున్నారు. మహనీయులయ్యారు. మీ అందరికీ ఆరాధనీయులయ్యారు. ఆ విధంగా రాముడు నా అభిమాన అవతారం.
ఇక రెండవది అతడిపై నీ ఆరోపణ! దానికి జవాబు చెప్పే ముందుగా నీ జీవితంగా జరిగిన సంఘటనొకదాన్నిగురించి నేను ప్రస్తావిస్తాను. నువ్వు డిగ్రీ చదివే రోజుల్లో నువ్వు, ఉపాస్య అనే నీ స్నేహితురాలు ఒకరినొకరు ఇష్టపడ్డారు; బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించి పెళ్ళి చేసుకోవాలని కలలు కన్నారు. అవునా? మరిప్పు డేమయింది? జీవితాంతం కలిసి ఉంటామని ఒట్లు పెట్టుకున్న మీరెందుకు విడిపోయారు? నువ్వెందుకామెను వదిలేశావు?”

“నేనేం ఆమెను వదిలెయ్యలేదు! మేం..మేం పరస్పర అంగీకారంతో విడిపోయాము. మేం ప్రేమించుకుంటున్న రోజుల్లో పదవ తరగతి చదువుతున్న నా చెల్లి చదువూ సంధ్య లేని ఒక పనికిమాలిన వెధవతో తిరగడం చూసి ఆమెను ప్రశ్నించాను. ‘నువ్వు ప్రేమించగా లేనిది నేను ప్రేమిస్తే తప్పా’ అని అడిగింది. తనది తెలిసీ తెలియని వయసని నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. వినలేదు. ‘నువ్వు నీ ప్రేమను వదులుకుంటే నేను నా ప్రేమను వదులుకుంటా. లేదంటే నా విషయంలో మాట్లాడకు’ అంది. గత్యంతరం లేని పరిస్థితిలో తన క్షేమం కోరి, తన భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించి, ఉపాస్యతో చర్చించి, రాసిపెట్టి ఉంటే మళ్ళీ కలుద్దామనుకొని, అప్పటికి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఏం తప్పా?”

srujan1“కానే కాదు! ఎంతో చక్కటి నిర్ణయం తీసుకున్నావు. నీ చెల్లెలిది పరిపక్వత లేని వయస్సు. బాధ్యత కల అన్నగా నీ కర్తవ్యాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించావు. మరి నీ చెల్లిని నువ్వు ఎంత ప్రేమించావో, అంతకంటే ఎక్కువగా రాముడు తన ప్రజలను ప్రేమించాడు. అతని ప్రజలూ బుద్ధిహీనులే! నువ్వు నీ చెల్లికోసం నీ ప్రేమను త్యాగం చేస్తే, రాముడు తన ప్రజలకోసం ప్రాణంతో సమానమైన తన భార్యను త్యాగం చేశాడు. మీ నాన్న నీ త్యాగానికి ఎంతగా సంతోషపడ్డాడో నేను రాముడి త్యాగానికి అంతగానూ గర్వపడ్డాను.”

“కాని రాముడు రాజ్యాన్ని తన తమ్ములకు వదిలి సీతతో అడవులకు వెళ్ళి ఉండవచ్చు కదా?”

“రాముడు చేసిన మొదటి ఆలోచన అదే! కాని అతని తమ్ములు రాజ్యభారాన్ని వహించడానికి సిద్ధపడలేదు. అరాచకమైన రాజ్యంలో ధర్మం నశిస్తుంది. ప్రజలంతా భ్రష్టుపట్టిపోతారు. ఇద్దరు వ్యక్తుల సుఖంకోసం సమాజాన్ని బలి పెట్టడం సరి కాదనుకున్నాడు రాముడు. తన అర్థాంగిని – తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. సీత అడవిలో ఉంది. రాముడు రాజభవనంలో ఉన్నాడు. కాని సీత లేని ఇంద్రభవనం కూడా రాముడికి అంధకార కూపమే. సీతకూ అంతే! రాముడు లేనిది ఏ చోటైనా ఆమెకు ఒకటే! అయితే నువ్వు చేసినట్లే రాముడు కూడా సీతతో చెప్పి పంపాల్సింది. ఆమె ఆనందంగా ఒప్పుకునేది. కాని దారుణ నరకబాధను అనుభవించడానికి సిద్ధపడ్డ రాముడు తను ప్రాణంగా ప్రేమిస్తున్న భార్యను పిలిచి, ‘నిన్ను విడిచిపెడుతున్నాను’ అని చెప్పే ధైర్యం చేయలేకపోయాడు”

“హ్మ్!…..”

“మరి నేను వెళ్ళనా?”

“ఉండుండు! మరొక్క ప్రశ్న! పూజలూ, వ్రతాలు, ఉపవాసాలు చేసి నిరంతరం నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు కొందరు. అసలు నువ్వున్నావో లేవో అని డోలాయమానంలో ఉండేవారు ఇంకొందరు. నిన్నస్సలు పట్టించుకోని వారు మరికొందరు.  వీరందరిపట్ల నీ దృక్పథం ఎలా ఉంటుంది?”

“మీ నమ్మకమే నా ఊపిరి. నమ్మినవారికి ఉన్నాను. నమ్మని వారికి లేను. అందరూ నాకు సమానులే!”

“అసలిదంతా..మన మధ్య జరుగుతున్న ఈ సంభాషణంతా నిజమా? నా భ్రమా?”

“యద్భావం తద్భవతి! నువ్వు నమ్మినదే నిజం!”

“కానీ..”

“చెప్పవలసిందంతా చెప్పాను. ఇక నీ మెదడుకు పదును పెట్టి ప్రశ్నలకు జవాబులు అన్వేషించవలసింది నీవే. ఇక వెళ్ళొస్తా! మరొక భక్తుడికి నాతో పని పడింది”

*

త్రిశంకు స్వప్నం

 

srujan1

Image: Srujan

               

– ఎమ్వీ రామిరెడ్డి

~

ASR_0357పదిహేనేళ్ల క్రితం… నవంబరు నెల…

మా ఊళ్లో బస్సు దిగాను. నాలుగు రోడ్లు కలిసే ఆ కూడలిలో ఓ పక్క చిన్న బడ్డీకొట్టు, మరోపక్క టీ దుకాణం. అప్పుడే తెల్లవారుతోంది. బడ్డీకొట్టు దగ్గర నిలబడి ఉన్న కూసం మధు ”ఇదేనా రావడం?” అని ప్రశ్నించాడు నవ్వుతూ.

అవునన్నట్లు తలూపాను.

”అంతా కుశలమేనా! ఉద్యోగం ఎలా ఉంది?” మళ్లీ అడిగాడు. ఆయన అదునెరిగి వ్యవసాయం చేస్తాడు. కష్టజీవి.

”బాగుంది. అంతా హ్యాపీ బాబాయ్‌” బదులిస్తూ ముందుకు సాగాను.

మావయ్య గారింట్లో అడుగు పెట్టగానే, రాగిచెంబు నిండా మంచినీళ్లు తెచ్చిచ్చింది అత్తయ్య.

”మావయ్యేడీ?” మంచినీళ్లు తాగి, చెంబు తిరిగిస్తూ అడిగాను.

”మేత కోసుకు రాబొయ్యాడు” చెప్పింది అత్తయ్య.

నేను గడ్డం చేసుకుని, స్నానం చేసేసరికి అత్తయ్య టిఫిన్‌ రెడీ చేసింది. వేడివేడి గుంటపునుగులు నెయ్యి వేసిన కారప్పొడిలో నంజుకు తింటుంటే నాలుక మీది గ్రంథులు నాట్యం చేశాయి. స్కూల్లో చదువుకునే రోజుల్లో పొగపొయ్యి కింద పత్తిమోళ్లు ఎగదోస్తూ, నల్లటి పెనం మీద అమ్మ అట్లు పోసిపెట్టేది. అయిదారు తిన్నా కడుపు నిండినట్లు అనిపించేది కాదు.

హైదరాబాదులో ఉద్యోగంలో చేరాక, నేనీ ఊరికి రావడం ఇది రెండోసారి.

బయటికి బయల్దేరబోతుంటే, సైకిలు మీద జొన్నమోపుతో వచ్చాడు మావయ్య. అంత పెద్ద మోపును ఎలా బ్యాలెన్స్‌ చేస్తాడో నాకెప్పటికీ ప్రహేళికే. డెబ్భై అయిదు కిలోల వడ్లబస్తాను కూడా అలాగే సైకిలు క్యారేజీ మీద మిల్లుకు తీసుకెళ్లేవాడు. పైగా దారిలో ఎవరైనా ఎదురైతే, బ్రేకులు వేసి, ఓ కాలు నేలపై ఆనించి, తాపీగా కబుర్లు చెప్పి మరీ కదిలేవాడు.

ఆయనతో కాసేపు మాట్లాడి, ఎనిమిది కావస్తుండగా బజాట్లోకి వచ్చాను. ఊరికి పడమటి పక్కనున్న చెరువు నుంచి కొందరు కావిళ్లతో, మరికొందరు సైకిళ్ల మీద మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. జీవనది మాకు పది కిలోమీటర్లలోపే ఉన్నా దశాబ్దాల తరబడి మా ఊరు మంచినీటి సదుపాయానికి నోచుకోలేదు. చిన్నప్పుడు నేను ఓ బిందె నెత్తిన పెట్టికొని తెచ్చేవాణ్ని.

పెదనాన్న గారింటికి వెళ్లాను. నేను నాలుగో తరగతి చదివేటప్పుడు ఓ ప్రమాదంలో నాన్న మరణించినప్పటి నుంచీ ఆయనే మా మార్గదర్శి. నవారు మంచంమీద కూచుని ఆయనతో పిచ్చాపాటి మాట్లాడుతుండగా, పెద్దమ్మ పాలు తెచ్చిచ్చింది.

”బాబూ బాగున్నావా?” వెంకాయమ్మ, నాగరత్నం ఒకే గొంతుతో అడిగారు. వాళ్లిద్దరూ అప్పచెల్లెళ్లు. పెదనాన్న గారింటి పక్క ఇల్లు. వెంకాయమ్మ కలవారింటి కోడలయింది. తెనాలిలో కాపురం. భర్త ఇల్లరికం రావడంతో నాగరత్నానికి పుట్టిల్లే మెట్టినిల్లయింది. కట్నం కింద వెంకాయమ్మకు ఇచ్చిన రెండెకరాలు కూడా భర్తతో కలిసి నాగరత్నమే సాగు చేస్తుంది. చెల్లెలి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏనాడూ కౌలు కూడా తీసుకునేది కాదు వెంకాయమ్మ. ఆమె భర్త కూడా ”ఆ పొలం మహా అయితే లక్షో రెండు లక్షలో చేస్తుంది. మీ చెల్లినే ఉంచుకోమను” అనేవాడు.

”మీరెప్పుడొచ్చారత్తా?” వెంకాయమ్మను అడిగాను, ఊళ్లో చాలామందిని ఏదో ఒక వరసతో పిలవడం చిన్నప్పట్నుంచీ అలవాటు.

”నిన్ననే వచ్చా. ఇప్పుడు బయల్దేరుతున్నా. బాబాయికి చెప్పి వెళ్దామని వచ్చా” చెప్పిందామె.

పెదనాన్నతో కాసేపు మాట్లాడి, వేణు ఇంటికి బయల్దేరాను. నాకంటే రెండేళ్లు పెద్దవాడైనా, మున్నంగి వేణుతో మంచి స్నేహం ఉండేది. ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లం. స్కూలుకు సెలవులు వస్తే, తనతోపాటు పొలం పనులకు తీసుకెళ్లేవాడు. కలుపు తియ్యటం, పత్తి తియ్యటం, జొన్న కొయ్యటం, పత్తిమోళ్లు పీకటం వంటి పనులన్నీ తనే నేర్పించాడు.

నేను వెళ్లేసరికి, వేణు అన్నం తింటున్నాడు. వాళ్ల తమ్ముడు హర్ష, నన్ను చూడగానే ఎదురొచ్చి కరచాలనం చేశాడు. అతను నా కన్నా చిన్నవాడు. మా ఊరినుంచి ఐఐటీ చదివిన మొదటి వ్యక్తి.

”ఎప్పుడొచ్చావు హర్షా?” నవ్వుతూ పలకరించాను.

”మూడు రోజులవుతుంది. సాయంత్రం బయల్దేరుతున్నాను” అతను ముంబైలో ఇంజినీరుగా పని చేస్తున్నాడు.

వాళ్ల నాన్న పాతికెకరాల రైతు. ఒక్కడే చూసుకోవడం కష్టమైపోవటంతో వేణును పదో తరగతితో చదువు మాన్పించేసి, తనకు చేదోడుగా పొలం తీసుకెళ్లాడు. హర్షను మాత్రం బాగా చదివించాడు. తమ్ముడి కోసం వేణు చాలానే త్యాగం చేయాల్సి వచ్చినా తను ఏనాడూ అలా భావించేవాడు కాదు. హర్ష కూడా అన్న పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు.

కాసేపటి తర్వాత ”చేనికెళ్లి పత్తిగోతాలు తీసుకురావాలి ట్రాక్టరు మీద. రాగలవా?” ఇప్పుడు నేను ఫ్యాను కింద       ఉద్యోగంలో ఉన్నందున ఎండంటే భయపడతానేమోనని వేణు అనుమానం.

”ఇంకా సుఖానికి అలవాటు పడలేదులే బావా. పద, వెళ్దాం” అంటూ లేచాను.

బొమ్మలు దాటాక, తూర్పువైపున ఉన్న ఓ కట్ట ఎక్కి దిగుతుంటే నాకు భయం వేసింది. వేణు మాత్రం తనకు బాగా అలవాటైనట్లు అలవోకగా నడిపాడు ట్రాక్టర్ని. సరాసరి చేలోకి తీసుకెళ్లి ఆపాడు. నేను ట్రాక్టరు మీంచి కిందికి దూకాను.

 

చాలాకాలం తర్వాత విశాలమైన నేలతల్లి ఒడిలో అడుగు పెట్టిన ఆనందం నాలో పొంగులు వారుతోంది. విత్తనాలు వెదబెడుతూ, కలుపులు తీస్తూ, కళ్లాలు చేస్తూ… ఏవేవో జ్ఞాపకాలు పక్షుల్లా ఎగిరొచ్చి, గుండెల మీద వాలుతున్నాయి.

నాలుగెకరాల చేలో పత్తిగుబ్బలు బాగా పగిలి, చేనంతా తెల్లటి వస్త్రం పరిచినట్లు కనిపిస్తోంది. పదిహేను మంది కూలీలు వంచెలు కట్టుకుని పత్తి తీస్తున్నారు. గట్టుకు రాగానే వంచెల్లోని పత్తిని గోతాల్లో నింపుతున్నారు.

ట్రక్కును పత్తిచేను పక్కనే ఉన్న జొన్నచేలో ఆపి, కొడవలితో జొన్న కొయ్యటం మొదలుపెట్టాడు వేణు. నేను సరదాగా ఓ మునుం పట్టి, పత్తి తియ్యటంలోని అనుభవాన్ని నెమరు వేసుకుంటున్నాను. కూలీలు చిత్రంగా చూస్తున్నారు.

ఆ చేనుకు ఉత్తరంగా ఉండేది మా రెండెకరాల పొలం. అక్క పెళ్లికోసం ఎకరం పద్దెనిమిది వేలకు అమ్మేశాం.

గంట తర్వాత వేణు, ట్రాక్టర్ని తీసుకొచ్చి, పత్తిగోతాల దగ్గర ఆపాడు. ఇద్దరు కూలీలు వెళ్లి పత్తిగోతాల్ని ట్రక్కులోకి ఎక్కిస్తుంటే, వేణు వాటిని జొన్నగడ్డి మీద సర్దుతున్నాడు. నేను గట్టుమీద నిలబడి పచ్చటి ప్రపంచాన్ని చూస్తున్నాను.

వేణు ఇంజిన్‌ స్టార్ట్‌ చేయగానే, నేనూ ట్రాక్టరెక్కి, అతని పక్కనే కూచున్నాను. నల్లటి మట్టిని నమిలి ఊస్తున్నట్లుగా టైర్లు భారంగా ముందుకు తిరుగుతున్నాయి. ట్ట్రారు కట్ట దగ్గరకు చేరుకోగానే, గేరు మార్చి, ఎక్స్‌లేటర్‌ను తొక్కి పట్టాడు.  ముందు టైర్లు రెండూ గభాల్నపైకిలేచి, మళ్లీ నేలమీద వాలాయి. కట్టను ఎక్కుతుండగా, ట్రక్కు కొద్దిగా ఊగి, అమాంతం బోల్తా పడింది. వేణు, నేను కిందికి దూకాం. ట్రక్కులోని పత్తిగోతాలు, జొన్నగడ్డి చెల్లాచెదురుగా చేలోకి పడిపోయాయి.

Kadha-Saranga-2-300x268

దూరం నుంచి చూస్తున్న కూలీలు పరుగున చేరుకున్నారు. ట్రాక్టరు నుంచి ట్రక్కును విడదీశారు.

పత్తిగోతాలు, జొన్నగడ్డి మళ్లీ ట్రక్కులోకి ఎత్తేసరికి ఒంటిగంట అయింది.

కూలీలు పట్టుబట్టడంతో వేణు, నేను జమ్మిచెట్టు కిందికి చేరుకున్నాం. అందరూ వచ్చి సద్దిమూటలు విప్పారు. ఒకామె సత్తు టిపినీలోనే అన్నంలో పప్పు, బీరకాయ పచ్చడి కలిపి, తలా ఒక ముద్ద పెట్టింది. నా దోసిట్లో ఉన్న పచ్చడిముద్ద నుంచి కమ్మటి వాసన విడుదలైంది. నోట్లో పెట్టుకుంటే, వెన్నలా కరిగిపోయింది. ఆమె అలా పెడుతూనే ఉంది. పెరుగన్నం తినటం పూర్తయ్యాక, చేతులు కడుక్కున్నాం. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్న భావన.

ఈసారి వేణు చాలా జాగ్రత్తగా కట్టను దాటించి, రోడ్డు మీదికి ఎక్కించాడు.

మూడు దాటుతుండగా ఇంటికి చేరుకున్నాం. వేణుకు చెప్పి, అక్కడి నుంచి కదిలాను.

నడిచి వెళ్తుంటే ఆ రోడ్డు పొడవునా ఎన్నో జ్ఞాపకాలు. కర్ర-బిళ్ల, నేల-బండ, వంగుడుదూకుళ్లు, చిత్తుపేకలు, బచ్చాలాట, గోళీకాయలు, చెడుగుడు, కోతికొమ్మచ్చి… ఎండను సైతం లెక్క చెయ్యకుండా ఎన్ని రకాల ఆటలు ఆడేవాళ్లమో!

మావయ్య గారింటికి చేరుకున్నాక మొలకు కండువా కట్టుకుని పెరట్లోకి వెళ్లాను. బావిలోంచి కడవతో నీళ్లు తోడుకుని, నెత్తిమీద పోసుకుంటే, హాయిగా అనిపించింది. తల తుడుచుకుంటూ, వెనకవైపు చూస్తే, ఓ మిద్దె కనిపిస్తోంది. తొలి ఏకాదశి పండక్కి పిల్లలందరం నోటినిండా పేలపిండి పోసుకుని, ఆ మిద్దె మీదికెక్కి గాలికి అభిముఖంగా నిలబడి ”పు..సు..లూ..రు..” అని అరిచేవాళ్లం. నోట్లోని పిండి అంతా జల్లులా బయటకు పడిపోతుంటే, పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవాళ్లం.

అయిదున్నరకు వేణు వచ్చాడు. ఇద్దరం మేం చదువుకున్న సెయింట్‌ మేరీస్‌ హైస్కూలుకు వెళ్లాం. పేదపిల్లల విద్యాభివృద్ధి కోసం ఒక ట్రస్టు ప్రారంభించాలనుకుంటున్న విషయమై ఫాదర్‌తో చర్చించాం. ఆయన పొంగిపోయాడు. మా పేర్లతో ప్రార్థన చేసి, ఆశీర్వదించాడు.

రాత్రి ఏడుగంటలకు వినాయకుడి గుడికి చేరుకున్నాం. అక్కడ గుడితోపాటు కళామందిరం ఉంటుంది. ఆ వేదిక మీదే నేను ఎన్నో నాటికలూ నాటకాలూ చూశాను. గుడి ఎదుట గల ఖాళీస్థలంలో యాభై మందికి పైగా యువకులు వృత్తాకారంలో నిలబడి, చెక్కభజన చేస్తున్నారు. రామాలయంలో ఏటా సప్తాహం చేసేవారు. రాత్రిపూట హరికథలు, బుర్రకథలు చెప్పేవాళ్లు. ఆ కళారూపాల ద్వారా బాల్యంలో విన్న విషయాలు ఇప్పటికీ నా గుండెల్లో చెక్కు చెదరలేదు.

”అరే, వెంకట్‌, ఎప్పుడు రావటం?” ఎక్కడినుంచి చూశాడో, పరిగెత్తుకుంటూ వచ్చి, కౌగిలించుకున్నాడు అయూబ్‌ఖాన్‌. వాడు, నేను పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం.

పిచ్చాపాటి అయ్యాక ”చలో, మా ఇంటికి డిన్నర్‌కు వెళ్దాం” ఆహ్వానించాడు అయూబ్‌. నేను మరోసారి వస్తానన్నా వాడు వినలేదు. ఆరోజు తన కొడుకు జన్మదినం కావడంతో రావాల్సిందేనని పట్టుబట్టాడు.

వేణుతో కలిసి వెళ్లాను. మటన్‌ బిర్యానీ అంటే నాకున్న అయిష్టం ఆరోజుతో తుడిచిపెట్టుకు పోయింది. సేమ్యాతో చేసిన స్వీటు కూడా అద్భుతం.

భోజనం పూర్తిచేసి, అయూబ్‌ఖాన్‌ కొడుకుని ముద్దాడి, వాడి చేతుల్లో వంద రూపాయలుంచి, వీడ్కోలు తీసుకున్నాను.

ఆ రాత్రి కంటినిండా నిద్రపోయాను. ఉదయం ఏడింటికిగానీ మెలకువ రాలేదు. రాత్రంతా జోరుగా కురిసిన వర్షం ఇంకా సన్నటి జల్లు రూపంలో ఉనికిని చాటుకుంటూనే ఉంది.

ఎనిమిది కావస్తుండగా వేణు వచ్చాడు, గొడుగు వేసుకుని. ఇడ్లీ తిని, కబుర్లు చెప్పుకొంటుండగా… ఓ కుర్రాడు యూరియా గోతాన్ని గొంగళిలా కప్పుకొని, పరిగెత్తుతూ వచ్చాడు.

”వేణు పెదనాన్నా… నాన్న యెండ్రిన్‌ తాగాడు. రాజు డాక్టరు దగ్గరికి తీసుకొచ్చాం. అమ్మ నిన్నర్జెంటుగా రమ్మంటంది” గస పెడుతూ చెప్పేసి, వేణు సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయాడా కుర్రాడు.

”ఎవరు?” అడిగాను.

”ఛత్‌… వాడే… అక్కల కిట్టయ్యగాడు…” విసుగ్గా చెప్పాడు వేణు. కిట్టయ్య ఆరో తరగతి వరకూ నా క్లాస్‌మేట్‌. చదువు మానేసి, తల్లికి అండగా వ్యవసాయంలోకి దిగాడు.

వేణుతోపాటు నేనూ బయల్దేరాను. ఇద్దరం గొడుగు సాయంతో ఆరెంపీ డాక్టరు గారింటికి చేరుకున్నాం.

కిట్టయ్యను బల్ల మీద పడుకోబెట్టి, కడుపులోకి గొట్టం వేసి, కక్కిస్తున్నారు. ఓ చేతికి సెలైన్‌ ఎక్కిస్తున్నారు.

 

ఇద్దరం ఓ పక్కగా నిలబడ్డాం. చూస్తుండగానే జనం పోగయ్యారు. తలా ఒక రకంగా చర్చించుకుంటున్నారు. కిట్టయ్య భార్య గుండెలవిసేలా ఏడుస్తోంది.

”అసలేం జరిగింది?” వేణుకు కారణం తెలిసే ఉంటుందని అడిగా.

”ఏముంది, వరసగా మూడోయేడు పచ్చపురుగు పత్తిని కాటేసింది… అది ఈణ్ని కాటేసింది…”

ఎనభైల తర్వాత మా ఊళ్లోకి పత్తి ప్రవేశించింది. శివాలెత్తినట్లు రైతులందరూ తెల్లబంగారం కోసం అర్రులు చాచారు. మొదట్లో బాగానే పండింది. ప్రతి ఇంట్లో ఒక పత్తిమండె వెలిసింది. రైతులు నాలుగు డబ్బులు కళ్లజూశారు. రాన్రాను రకరకాల తెగుళ్లు, పచ్చపురుగుల బెడద అధికమైంది. పెట్టుబడులు పెరిగిపోయాయి. క్రిమిసంహారక మందుల వాడకం యథేచ్ఛగా పెరిగింది. వానలు వెనకంజ వేశాయి. నష్టాలు మొదలయ్యాయి. ఆ దశకంలోనే మొదటిసారిగా మా ఊళ్లో పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్నుంచీ ఆ చావులు సర్వసాధారణమయ్యాయి, రకరకాల కారణాలతో.

అరగంట తర్వాత ఆరెంపీ డాక్టరు పెదవి విరిచాడు. అర్జెంటుగా గుంటూరు తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు.

అప్పటికప్పుడు కిట్టయ్యను నులకమంచం మీద పడుకోబెట్టుకుని, నలుగురు మోసుకుంటూ బస్‌స్టాండుకు తీసుకెళ్లారు. పది నిమిషాల తర్వాత బస్సు వచ్చింది. కండక్టరును బతిమాలి, కిట్టయ్యను మెల్లగా బస్సులోకి చేర్చి, ఓ సీటులో పడుకోబెట్టారు. వేణు, కిట్టయ్య భార్య, మరో ఇద్దరు వెంట వెళ్లారు.

నేను భారమైన మనసుతో అక్కణ్నుంచి కదిలాను.

++++++++++++

srujan1పది రోజుల క్రితం… ఆగస్టు నెల… మధ్యాహ్నం మూడు దాటుతోంది…

ఖరీదైన నా కారులో మా ఊరికి చేరుకున్నాను. సెంటర్‌ చాలా హడావుడిగా ఉంది. మంగళగిరి వెళ్లే రోడ్డులో రెండు హోటళ్లు, అమరావతి వెళ్లే వైపు ఫ్యాన్సీ షాపులు, తుళ్లూరు వెళ్లే దారిపక్క రెండు వైన్‌ షాపులు, తాడికొండ వైపు ఐరన్‌, సిమెంటు రిటైల్‌, హోల్‌సేల్‌ షాపులు… సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఈ హడావుడేమీ లేదు.

పది మీటర్లు కూడా పోకముందే, కూసం మధు కారాపాడు.

”ఇప్పుడేనా రాటం… నువ్వు ముందు కారు దిగు, ఇయ్యాల నాతో కలిసి కాఫీ తాగాల్సిందే” బలవంతం చేశాడు.

కారు దిగక తప్పింది కాదు. హోటల్‌ బయటే నుంచున్నాం. ఆయన కాఫీ ఆర్డరిచ్చాడు. మా చుట్టుపక్కల పదీ పదిహేను మంది టీలూ కాఫీలూ తాగుతూ కబుర్లు తింటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్‌ ఫోన్లున్నాయి.

”రేయ్‌, నిన్న తొట్టికాడ రామయ్య పొలాన్ని ఒకటీ ఇరవైకి అడిగారంట. ఈయనేమో ఒకటిన్నరకు తగ్గనన్నాడంట…”

”యాడుందిరా అంత రేటు? సుబ్బరంగా ఇచ్చెయ్యాల్సింది…”

”ఇయ్యాల నాకో పార్టీ వస్తంది వైజాగ్‌ నించి, దాసిరెడ్డి గారి నాలుగెకరాల బిట్టు చూట్టానికి! ఒకటీ అరవై చెబుతున్నాం. ఇదిగానీ ఓకే అయితే నా పంట పండినట్టే…”

”ఆశకి అంతుండాల్రా. ప్రత్యేక హోదా గురించి అతీగతీ లేదు. ఖజానా ఖాళీ అయి రాష్ట్ర ప్రభుత్వం లబోదిబోమంటంది. అసలు డెవలప్‌మెంటు మీద జనాలకి అనుమానాలు మొదలయ్యాయి…”

”అదేం లేదు. రేపు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చెయ్యనీ, రేట్లు మళ్లీ రయ్యిన లెగుస్తాయి…”

”అవున్రా, బుర్రముక్కు రాజారావుగాడు అడ్వాన్సు తీసుకుని కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చెయ్యనంటున్నాడంటగా… పాపం ఆ పార్టీ నిన్న మా అన్న దగ్గరికొచ్చి, ఒకటే మయాన మొత్తుకుంటంది…”

నేను కాఫీ తాగినంతసేపూ మరో అంశం చర్చకు రాలేదు. మధ్యమధ్య సెల్‌ఫోన్లు మోగుతున్నాయి. ఫోన్లో కూడా బేరసారాల సంభాషణలే.

రోడ్డుకవతల ఫ్యాన్సీ షాపు పక్కనే ”శివప్రియ రియల్‌ ఎస్టేట్స్‌” అనే బోర్డును గమనించాను.

”ఏమిటి బాబాయ్‌, మనూళ్లో రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసా?” ఆశ్చర్యంగా అడిగాను.

”అయ్యో, ఇదేం జూశావ్‌! ఇలాంటివి ఊళ్లో ఇరవై దాకా వెలిశాయి” నా ఆశ్చర్యానికి అడ్డుకట్ట వేశాడు.

కాఫీ తాగాక, కారెక్కి మావయ్య గారింటికి చేరుకున్నాను.

”ఇప్పుడేనా రాటం” ఫ్రిజ్‌లోంచి తీసిన వాటర్‌బాటిల్‌ చేతికందిస్తూ అడిగింది అత్తయ్య.

”అవునత్తయ్యా, మావయ్యేడీ?”

”నిన్న మాటెపూట జొన్నలగడ్డ పొయ్యాడు. రేట్లొచ్చినయ్యిగా, నాకిచ్చిన పొలం అమ్మాలని సూత్తన్నాం”.

మొహం కడుక్కోవడానికి వాష్‌రూముకు వెళ్లాను. ట్యాప్‌ తిప్పితే, నీళ్లు పచ్చగా వచ్చాయి. ఈ మధ్యే ఓ స్వచ్ఛందసంస్ధలో పనిజేసే ఫ్రెండొకడు ఈ నీళ్లను ల్యాబ్‌కు పంపి టెస్ట్‌ చేయించాడు. తాగడం సంగతి అటుంచి, కనీసం వాడుకోవడానిక్కూడా వీల్లేనంతగా బ్యాక్టీరియా పేరుకుపోయి ఉందట. ఈ విషయాన్ని నేను గ్రామ సర్పంచికి ఫోన్జేసి చెబితే, ఆయన ”ఏళ్ల తరబడి నేనియ్యే పోసుకుంటన్నా. నాకేం కాలేదే” అన్నాడు, పరిష్కారం గురించి పల్లెత్తు మాట అనకుండా.

అత్తయ్య పెట్టిన స్నాక్స్‌ తిని, వేణు సెల్‌కు ఫోన్జేశాను.

”కొంచెం ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఓ గంట తర్వాత కలుస్తా”నన్నాడు.

కారు ఇంటిదగ్గరే వదిలేసి, కాలినడకన బయల్దేరాను. రోడ్డు మీద ఓ కుళాయి దగ్గర జనం ఎగబడి మంచినీళ్లు పట్టుకోవడం కనిపించింది. మా ఊరి మీదగా పైపులైను వేసుకుని మరీ తాడికొండకు నీళ్లు తీసుకెళ్లగలిగారు. అధికారులు దయదలచి, ఆ లైనుకు రెండుచోట్ల ట్యాపులు బిగించారు. ఊరు మొత్తానికీ ఆ కుళాయిలే ఆధారం.

 

పెదనాన్న గారింటికి వెళ్లేసరికి ఆయన వరండాలోనే ఎవరితోనో సీరియస్‌గా ఫోన్లో మాట్లాడుతున్నాడు.

నేను లోపలి గదిలోకి వెళ్లాను. పెద్దమ్మ వచ్చి, ఏసీ ఆన్‌ చేసి, ఓ గాజుగ్లాసులో కోకోకోలా తెచ్చిచ్చింది. తాగుతుండగా, పెదనాన్న లోపలికొచ్చి, సోఫాలో కూచున్నారు.

”మాట్టాడారా బాబాయ్‌…” ఆత్రంగా అడిగింది నాగరత్నం. ఆమె ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లనిపించింది.

”ఆఆ… తన బాధ తనది…” పెదనాన్న చెప్పింది ఆమెకు అర్థమైనట్లుంది.

”ఏం బాద బాబాయ్‌? తనకేం తక్కువ జేశామని? ఆమె సొమ్మేదో మేం అప్పనంగా అనబగించినట్టు మాట్టాడతంది… ఉప్పు, పప్పు, బియ్యం, మిరపగాయలు… ఎన్ని పంపేవాళ్లం? సన్నాసి పొలం మనకెందుకు అని మా బావ గూడా ఇన్నిసార్లు అన్నాడు. ఆ మాటకొత్తే అయినింటి సమ్మందమని దానికి ఎకరా ఎక్కువిచ్చారు. ఉప్పుడు నేనూ అడుగుతా అందులో వాటా… ఇత్తారా…” ఆక్రోశంగా అడిగిందామె.

”నువ్వు ఎక్కువగా ఆలోచించమాకు. రేపొస్తానంది. నేను మాట్లాడతాగా. ఏది న్యాయమైతే అట్లా పోదాం” సర్దిచెప్పారు పెదనాన్న. నాగరత్నం విసవిసా వెళ్లిపోయింది.

నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించాక, ఆ ఊరికి అయిదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరిలో రాత్రికి రాత్రి ఇన్ని పరిణామాలు నేను కలలో కూడా ఊహించనివి.

”మనూరి పొలానికి బాగా రేట్లొచ్చినట్లున్నాయి…” పెదనాన్నతో అన్నాను.

”బాగా ఏంటి, ఎందుకూ పనికిరాని పొలం కూడా ఎకరం కోటి పలుకుతోంది” చెప్పారాయన.

”ఈ మజ్జెనే మేం గూడా ఓ ఎకరం కోటీ నలభైకి అమ్మాం బాబూ. అప్పుడు అమ్ముకోడమే శానా మంచిదైంది. ఇప్పుడది కోటికి పడిపోయింది” పెద్దమ్మ చెప్పింది సంతోషంగా.

వేణు వాళ్లింటికి బయల్దేరాను. రోడ్డుమీద నడుస్తుండగా హఠాత్తుగా నా పక్కన ‘డస్టర్‌’ కారు వచ్చి ఆగింది. ఊళ్లో చాలామంది ఖరీదైన కార్లు వాడటం గమనించాను. అద్దం కిందికి దించి తల బయటకు పెట్టాడు అక్కల కిట్టయ్య.

”ఏరా, బానే సంపాయించావంటగా. ఓ ఎకరం కొనరాదూ, చాలా తక్కువలో వస్తంది” అన్నాడు. నేను వద్దన్నట్లు తలూపాను. మారుమాట్లాడకుండా ముందుకెళ్లిపోయాడు. బస్టాండ్‌ సెంటర్‌లో తెరిచిన రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసు కిట్టయ్యదే. మృత్యుముఖం నుంచి బయటపడి, ఇప్పుడు కమీషన్ల రూపంలో దండిగా సంపాదిస్తున్నాడని మధు బాబాయ్‌ చెప్పాడు.

సిమెంటురోడ్డు వంతెన మీద దాసరి పిచ్చయ్య దిగులుగా కూచొని ఉన్నాడు. పలకరిస్తే, బావురుమన్నాడు.

”దిగులు పడక ఏంజెయ్యమంటావు బాబూ! ఉన్న ఎకరంన్నర పొలం ల్యాండు పూలింగులో పొయ్యింది. ఆ కాస్త నేల ఆధారంతోనే పిల్లల్ని చదివించాను. ఇప్పుడు పిల్ల పెళ్లికుంది. యాడదెచ్చి జెయ్యాలి?”

”బదులుగా ఇంటిప్లాటు, కమర్షియల్‌ ప్లాటు ఇస్తుందటగా ప్రభుత్వం?”

”నా తలకాయ. అది ఎప్పుడిస్తదో, ఎక్కడిస్తదో ఎవరికెరుక? ఇచ్చినా అది మా సేతికొచ్చేదెప్పుడు, మేం తినేదెప్పుడు?” పిచ్చయ్యలో నిర్వేదం తారస్థాయిలో కనిపించింది.

నేను భుజం తట్టి, అక్కణ్నుంచి వేణు వాళ్లింటికి వెళ్లాను.

ఆ ఇంటి వాతావరణం నాకు వింతగా తోచింది. అప్పటిదాకా ఏదో యుద్ధం జరిగినట్లు, తుపాను వచ్చి వెలిసినట్లు అనిపించింది. వేణు, హర్ష చెరో కుర్చీలో; వాళ్ల నాన్న దివాన్‌ కాట్‌ మీద యమా సీరియస్‌గా కూచొని ఉన్నారు. వేణు భార్య, వాళ్లమ్మ వంటగది దర్వాజాకు చెరోపక్కా నిలబడి ఉన్నారు. నన్ను చూసి, ఏ ఒక్కరూ కనీసం పలకరింపుగానైనా నవ్వలేదు.

వేణు విసురుగా లేచి, ”మనం బయటికెళ్లి మాట్లాడుకుందాం రా” అంటూ నన్ను గేటులోంచే వెనక్కి మలిపాడు.

ఇద్దరం మెయిన్‌ రోడ్డు మీదకొచ్చి హోటల్‌ పక్కనే నిలబడ్డాం.

”ఏం జరిగింది వేణూ?” మెల్లగా అడిగాను.

”ఛత్‌, మరీ అధ్వానంగా తయారయ్యారు. వాడంటే మూర్ఖుడు. మొదట్నుంచీ అంతే. ఈయనకి ముడ్డి కిందికి డెబ్భై ఏళ్లొచ్చాయి. ఈయన బుద్ధేమైంది?” అసహనంగా అన్నాడు.

”అసలేం జరిగింది?”

”వాడి కోసం చదువు మానుకున్నా. గొడ్డులా చాకిరీ చేశా. ముంబైలో ఉద్యోగంలో చేరాకైనా ఏనాడూ పైసా పంపిన పాపాన పోలేదు. పైగా వాడి పొలం మందం రూపాయి తక్కువ కాకుండా నా దగ్గర్నుంచీ కౌళ్లు వసూలు చేసేవాడు. బదులుగా, నా భాగంలో రెండెకరాలు ఎక్కువ వచ్చేట్టు లక్షసార్లు అనుకున్నాం. ఇవ్వాళొచ్చి, సమానభాగం కావాలని నోరేస్కుని అరుస్తున్నాడు, ఎదవ…” వేణులో అంత కోపం నేనెప్పుడూ చూళ్లేదు.

”పోన్లే వేణు, నువ్వు బతకలేని స్థితిలో లేవుగదా. రెండెకరాలదేముంది, వదిలేసెయ్‌” అనునయించాను.

”వదిలెయ్యక, కట్టుకుపోతానా. రెండెకరాల గురించి కాదు బాధ. మాట మారుస్తున్నందుకు…” కొద్దిగా శాంతించాడు.

నేను బస్టాండు వైపు చూశాను. పాతికపైగా కార్లు వరసగా ఆగి ఉన్నాయి.

”ఇదేమిటి వేణు, ఇన్ని కార్లా!” అది మా ఊరి సెంటరేనన్న విషయం నాకో పట్టాన నమ్మబుద్ధి కావడం లేదు.

”బేరగాళ్లు. హైదరాబాదు, వైజాగ్‌, నెల్లూరు, తిరుపతి, మద్రాసు, బెంగుళూరు… అన్ని ప్రాంతాల నుంచీ వస్తున్నారు.  ఇక్కడేం జూశావ్‌? పొలాల దగ్గరకెళ్తే, నీకు కళ్లు తిరుగుతయ్‌. ఈ రెణ్నెల్ల నుంచీ తాకిడి తగ్గింది. రాజధాని నిర్మాణం నిజంగా మొదలైతేగానీ అసలు సినిమా కనబడదు” తాపీగా చెప్పాడు.

”బాప్‌రే. పోన్లే, మన ట్రస్టు పొలం దాకా వెళ్లొద్దామా” అడిగాను. తను సరేనన్నాడు. కాలినడకనే బయల్దేరాం.

srujan1

సెంటర్‌లో ఆగిన కార్లను, గుంపులవారీ జనాల కబుర్లను దాటుకుంటూ మంగళగిరి రోడ్డులోకి చేరుకున్నాం. ఆ రోడ్డులో ఎడమపక్కన ఉన్న కాలనీ దాటగానే ఓ ఎకరం పొలాన్ని రెండేళ్ల క్రితం పదిహేడు లక్షలకు కొన్నాను. ట్రస్టు తరఫున వృద్ధాశ్రమం నిర్మించాలని నా కల. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను.

ఊరింకా దాటనే లేదు. ఇళ్లింకా కనుమరుగు కాలేదు. రోడ్డుకు ఇరువైపులా బహిరంగ మలవిసర్జన కారణంగా దుర్వాసన ముక్కుపుటాలను అదరగొడుతోంది. ఊరు దాటగానే మెయిన్‌రోడ్డు నుంచి మా పొలంలోకి దిగుతుంటే ”జాగ్రత్త, నిప్పులుంటాయ్‌. చూసి దిగు” అన్నాడు వేణు పెద్దగా నవ్వుతూ.

”ఇదేంటి వేణు, కాలనీలో ఇంతమందికి మరుగుదొడ్లు లేవా?” ఆశ్చర్యంగా అడిగాను.

”హహ్హహ్హా… మా గ్రామసీమను అలా అవమానించకు. ప్రపంచం ముక్కున వేలేసుకునే స్థాయిలో నిర్మితం కాబోతున్న రాజధానిలో ఈ ఊరు అంతర్భాగం కాబోతోంది” అన్నాడు నాటకీయంగా.

ఆ ఎకరం స్థలంలో యాభై ట్రక్కుల ఇసుక, కొన్ని రాళ్లు పడి ఉన్నాయి.

”పర్మిషన్‌కు ఇంకెన్నాళ్లు పడుతుంది?” అడిగాడు వేణు, ఇసుక మీద కూచుంటూ.

”ఫైల్‌ మూవ్‌ అయిందట. ఈ నెలలోనే రావచ్చు” చెప్పాను నేను కూడా వేణు పక్కన చతికిలబడుతూ.

”అవును వేణూ, మన స్కూలెలా ఉంది?” అడిగాను దూరంగా కనిపిస్తున్న పత్తిచేను వైపు చూస్తూ.

”ఏం స్కూల్లే, తిప్పితిప్పి కొడితే వంద మంది లేరు. ఊళ్లో ఆరు ఇంగ్లిషు మీడియం స్కూళ్లు వెలిశాయి” వేణు చెప్పాడు బాధగా. గతంలో ఆ స్కూల్లో అయిదారు వందల మంది విద్యార్థులుండేవారు.

కాసేపు కూచొని, మళ్లీ రోడ్డెక్కాం. నీరుకొండ పొలం నుంచి వస్తున్నట్లున్నాడు, భాష్యం రాము నాకు దగ్గరగా వచ్చి ”అరే, నీ మంచి కోరి చెబుతున్నాను. ఇప్పుడీ ఎకరం రెండు కోట్లు పలుకుద్ది. హాయిగా అమ్మేసుకుని, దూరంగా ఎక్కడైనా కట్టుకో నీ ఆశ్రమం” అన్నాడు. ఊళ్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచీ ఇప్పటికి పాతిక ముప్ఫై మంది ఇదే సలహా ఇచ్చారు నాకు.

నేను నవ్వి ఊరుకున్నాను.

వేణు, నేను బస్టాండ్‌ సెంటరుకు చేరుకున్నాం. తుళ్లూరు రోడ్డులో ఉన్న మద్యం షాపుల ముందు జనం కిక్కిరిసి ఉన్నారు. ఎట్నుంచి వచ్చాడో, నన్ను వాటేసుకుని ఏడవటం మొదలు పెట్టాడు అయూబ్‌ఖాన్‌.

”అరే వెంకట్‌, ఇద్దరాడ పిల్లలకీ పెళ్లిళ్లు చెయ్యడానికి ఉన్న రెండెకరాలూ అమ్మేశాను. నాలుగేళ్ల నించి కూలీపనులు చేసుకు బతుకుతున్నా. ఇప్పుడిదంతా కాంక్రీటు జంగిల్‌ అయితదంట. రేపట్నుంచీ ఆ కూలీ కూడా దొరికేట్టు లేదు” వాడి నోటినుంచి మద్యం వాసన గుప్పుమంటోంది. నాకు తెలిసి అంతకుముందు అయూబ్‌కు తాగుడు అలవాటు లేదు.

వాడికేదో నచ్చజెప్పి, ఇంకొంచెం ముందుకు నడిచాం.

సైరన్‌ మోగించుకుంటూ రెండు పోలీసుజీపులు వినాయకుడి గుడి వైపు దూసుకెళ్లాయి.

 

ఉన్నట్టుండీ ఒక్కసారిగా ఊరి వాతావరణంలో ఏదో మార్పు. జరగరానిదేదో జరిగిపోయినట్టు, జనం గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. గుడివైపు నుంచి నడిచివస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని ‘ఏం జరిగింది’ అని అడిగాడు వేణు.

”అదేరా, ఆస్తుల గురించి కోర్టుకెక్కి కొట్టుకుంటున్నారే కృష్ణమూర్తి కొడుకులు… వాళ్లిద్దరూ గొడవ పడ్డారు. మాటామాటా పెరిగింది. ఆవేశంలో గొడ్డలి తీసుకుని తమ్ముణ్ని నరికి చంపాడు అన్న…”

నా ఒళ్లు జలదరించింది. తల దించుకుని, కాళ్లకింద మట్టిని తీక్షణంగా చూస్తూండిపోయాను.

మట్టి… మనుషుల్ని నమిలి ఊస్తున్నట్లుగా ఉంది.

అక్కడక్కడా సిగరెట్‌ పీకలు, బీరుసీసాల మూతలు…

ముందు చక్రాలు గాల్లోకి లేచి, ట్రక్కు తిరగబడుతున్నట్లు… ఏదో భయం!

ఈసారి పక్కకు దూకగలమో.. లేదో…

సేద తీరడానికి చెట్టునీడ ఉంటుందో… లేదో…

కూలితల్లి తెరిచే సత్తు టిపినీలో సద్దన్నం, బీరపచ్చడి ఆనవాళ్లు మిగులుతాయో… లేదో…

———–

 

దిగడానికి కూడా మెట్లు కావాలి!

 

రామా చంద్రమౌళి

~

Ramachandramouliరాత్రి పదీ నలభై నిముషాలు.

డిల్లీ రైల్వే ప్లాట్ ఫాం నంబర్ పన్నెండు.అటు చివర.ఎప్పటిదో.పాతది.దొడ్డు సిమెంట్ మొగురాలతో.సిమెంట్ పలకతో చేసిన బోర్డ్.పైన పసుపు పచ్చని పెయింట్ మీద నల్లని అక్షరాలు.’నయీ ఢిల్లీ ‘.పైన గుడ్డి వెలుగు.కొంచెం చీకటికూడా.వెలుతురు నీటిజలలా  జారుతుందా. కారుతుందా. చిట్లుతుందా. ప్రవహిస్తుందా. వెలుతురుపై. కురుస్తూ. వెలుతురును కౌగలించుకుంటూ.. సన్నగా.మంచుతెర.పైగా పల్చగా చీకటి పొరొకటి.అంతా స్పష్టాస్పష్టత.కనబడీ కనబడనట్టు.కొంత చీకటి..గుడ్డి గుడ్డిగా.కొంత వెలుతురు మసక మసగ్గా.తన జీవితం వలె.చీకటి ఒక లోయ.వెలుతురు ఒక శిఖరమా.లోయ ప్రక్కనే శిఖరం.చీకటి ప్రక్కనే.తోడుగా చీకటి.జతలు.జతులు.ద్వంద్వాలు.వైవిధ్యాలు.వైరుధ్యాలు.

డిసెంబర్ నెల. ఇరవై ఆరు. చలి. గాఢంగా . . అప్పుడప్పుడు వణికిస్తూ. అప్పుడప్పుడు . మృదువుగా స్పర్శిస్తూ. కప్పుకున్న శాలువాకింద శరీరం .  నులువెచ్చగా . భాషకందని గిలిగింత . కళ్ళుమూసుకుంటే..గుండెల్లో భైరవీ రాగంలో ఏదో.. ప్రళయభీకర గీతం.

మేఘాలు చిట్లిపోతూ . . ఆకాశం  పగిలిపోతూ . . ఇసుక తుఫానులతో ఎడారులు ప్రళయిస్తూ.శబ్దం విస్ఫోటిస్తూ.అంతిమంగా.శబ్దాలూ.రాగాలూ.గీతాలూ.అన్నీ.ఒక అతి నిశ్శబ్ద బిందువులోకి అదృశ్యమైపోతూ.చివరికి. ఒట్టి..శాంత మౌన ఏకాంతం.జీవితం ఇది.అంతా ఉండీ.చివరికి ఏమీ లేని.ఏమీ లేక అంతిమంగా అన్నీ ఉన్నట్టనిపించే ఒక సుదీర్ఘ భ్రాంతిగా మిగిలి.,

“జిన్ హే హం భూల్ నా చాహే..ఓ అక్సర్ యాద్ ఆతీహై “..అతి విషాద స్వరంతో ముఖేష్..దుఃఖం గడ్డకడుతున్నట్టు..యుగయుగాల పరితపన కన్నీరై ప్రవహిస్తున్నట్టు.,

ఉష..నలభై ఆరేళ్ళ ఉష.శరీరాన్ని.దళసరి ఉన్ని శాలువాలో దాచుకుని.అటు చీకట్లోకి చూస్తోంది. నిశ్శబ్దం లోకి  .ఆమెకు బయట అటు దూరంగా వందలమంది ప్రయాణీకులు . గోలగోలగా ఉన్నా లోపల తనొక్కతే . అంతా నిర్వాణ నిశ్శబ్దం.నిర్గమ నిశ్శబ్దం. నిరామయ నిశ్శబ్దం.

ఒక ఎలక్ట్రిక్ లోకో ఇంజన్ ఏదో అతి వికారంగా అరుస్తూ ప్రక్కనున్న ట్రాక్ పైనుండి మెల్లగా కదుల్తూ..అటు దూరంగా నిష్క్రమిస్తూ,వెలుతురులోనుండి చీకట్లోకి.పైన అన్నీ ఎలక్ట్రిక్ కేబుల్స్.చిక్కు చిక్కుగా.,

చిక్కు.చిక్కు పడ్డ దారం ఉండ జీవితం.ముళ్ళుపడి.అల్లుకుపోయి.కొస దొరుకక.వెదుకులాట.కొస కోసం.ఒక దరి కోసం.దారికోసం.వెదుకులాట.చిన్ననాటినుండి.ఈ క్షణందాకా.ఒకటే నిరంతరమైన అనంత అన్వేషణ.,

ఇంతవరకు వేల పాటలు. వందల సభలు.లక్షలమంది శ్రోతలు.కోట్ల చప్పట్లు.పట్టణాలు.నగరాలు.దేశాలు.ఖండ ఖండాంతరాలు.అంతర్జాతీయ వేదికలు.సన్మానాలు.సత్కారాలు.జ్ఞాపికలు.శాలువాలు.పర్స్ లు.పైవ్ స్టార్ హోటళ్ళు.బెంజ్ కార్లలో ప్రయాణాలు.ఆకాశంలో మేఘాలను చీల్చుకుంటూ..విమానాల్లో.మళ్ళీ శూన్యంలోకి..అన్నీ ఉండి..ఏదీలేని..ఒక ఖాళీలోకి.

ఇంటిగ్రేట్ .  జీవితాన్ని సమాకలించుకోవాలి .  లోయర్ లిమిట్ నుండి   అప్పర్ లిమిట్ వరకు. అవధులు..అవధులు.కిందినుండి పైకి.పుట్టుక నుండి మృత్యువుదాకా.మృత్యువునుండి..మళ్ళీ జన్మదాకా.

‘ మేడ  లోన  అల పైడి బొమ్మా

నీడనే చిలకమ్మా

కొండలే రగిలే వడగాలీ

నీ సిగలో పువ్వేలోయ్ ‘

..చందమామ మసకేసిపోతుందా.?

ఉష..మసక లోకి..మసక వెలుతురులోకి.మసక చీకట్లోకి.చూస్తోంది.

 2          

digadaaniki-picture వర్షం కురుస్తూనే ఉంది.రెండు రోజులుగా.ఎడతెరిపిలేకుండా.

విజయవాడ..హోటల్ మనోరమ వెనుక గల్లీ..అంబికా వైన్స్.

రాత్రి తొమ్మిదిన్నర.రజియాబేగం కు చాలా అలసటగా..చాలా చికాగ్గా..చాలా దుఃఖంగా,జీవితంపట్ల చాలా విసుగ్గా,రోతగా కూడా ఉంది.

‘ఈ జీవితాన్ని జీవించి జీవించి అలసిపోయాన్నేను’..అని ఏ ఐదు వందలవసారో అనుకుందామె.అనుకుని చాలా నిస్సహాయంగా ఆ వర్షం కురుస్తున్న రాత్రి తనచుట్టు తానే చూచుకుంది.

అంతా నీటి తేమ వాసన.వెలసిన గోడలతో నిలబడ్డ అంబికా వైన్స్..షాప్ ముందు.తోపుడుబండి.ఒక కొసకు వ్రేలాడ్తూ.పెట్రోమాక్స్ లైట్.మసిపట్టిన గాజు ఎక్క.మసక వెలుతురు.. ‘ సుయ్ ‘..మని వొక వింత చప్పుడు..పెట్రోమాక్స్ దీ..ఆమె ఎదుట మూకుడులో నూనెలో వేగుతున్న చికెన్ కాళ్ళ దీ..లోపల గుండెల్లో బయటికి వినబడని యుగయుగాల దుఃఖానిది.ప్రక్కనే వాననీళ్ళు కారుతున్న చూరుకింద నిలబడి కస్టమర్ల ఎదురు చూపు.ఇద్దరుముగ్గురున్నారు.ఒకడికి చికెన్ కాళ్ళు రెండు.మరొకడికి బాయిల్డ్ ఎగ్స్.ఇంకొకడికి.రెండు బొచ్చె చేప వేపుడు ముక్కలు.

రెండ్రోజులుగా ముసురుగా కురుస్తున్న వర్షానికి..నగరంలోని వ్యాపారాలన్నీ మందగించాయి..కాని ఈ వైన్ షాప్ లు మాత్రం పుంజుకున్నాయి.తాగుబోతులకు వర్షాలు కురిసినా..శీతాకాలం మంచు కమ్ముకున్నా..ఎండాకాలం ధుమధుమలాడ్తూ సెగలు చిమ్మినా తాగుడుదిక్కే మనసు పోతుంది..అప్పుడు బ్రాండీ విస్కీలు..తర్వాత చల్లని బీర్లు.కాబట్టి వైన్ షాప్ లన్నీ..ఋతువుల్తో సంబంధంలేకుండా  సర్వవేళల్లో  కళకళలాడ్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాయి.అందుకే అవి ప్రభుత్వాలనూ..కొందరు బలిసిన మోతుబరులనూ పోషించే కామధేనువులు.అసలు ఈ భూమ్మీద మద్యాన్ని అమ్మేవాల్లదీ..తాగేవాళ్ళదీ ఒక ప్రత్యేక జాతిగా రజియా ఏనాడో గుర్తించింది.ఈ రెండు  జాతుల మనుషులతో  ఆమెకు పది సంవత్సరాల అనుబంధం.ఆ వైన్ షాప్ ముందు తోపుడు బండి మీద ‘ తిండి ‘ని అమ్ముతూ ఆమె అక్కడ ఒక శాశ్వత అడ్డా మనిషిగా మారిపోయింది.ఆ పది పదిహేనేళ్లలో షాప్ ఓనర్స్ మారిపోయారుగాని రజియా మాత్రం పర్మనెంటైపోయింది.రజియా చేతి ఐటంస్ రుచి అలాంటిది.ఒక్కతే బండిని చూచుకుంటుంది.సాయంత్రం ఏడునుండి.ఏ రాత్రి పదకొండుదాకానో.

తోపుడుబండికి.ఒక మూలకున్న గుంజకు ఒక పాత గొడుగును సుతిలి తాళ్లతో గట్టిగా కట్టుకుంది రజియా.పైన చత్రీ అక్కడక్కడ రంధ్రాలుపడి..కొద్దికొద్దిగా నీటి తడి కారుడు.కస్టమర్లు వేచిఉండడంవల్ల వడివడిగా పనికానిస్తూ,ప్రక్కనున్న వెదురు బుట్టలోని నాల్గయిదు చేపముక్కలను బేసిన్ గిన్నెలోని కలిపిన శనగపిండిలో వేసి కలుపుతూ..అనుకుంది..’చికెన్ ముక్కలూ,చేప ముక్కలూ ఐపోవస్తున్నాయి. లక్ష్మణ్. ఇంకా రాలేదు ఇంటినుండి సరుకు  తీసుకుని..ఒకవేళ లక్ష్మణ్ లారీ దిగి ఇంకా డ్యూటీ నుండి రాకుంటే అప్పల్రాజన్నా రావాలిగదా.వాడూ పత్తాలేడు.ఇక్కడ గిరాకేమో మస్తుగా ఉంది..ఇప్పుడెలా ‘..అనుకుంటూనే..చకచకా.. ఉడికిన కోడిగ్రుడ్ల పొట్టుతీస్తోంది.చుట్టూ అంతా మసాలా..కాగిన నూనె  కలెగలిసి..అదోరకమైన ముక్క వాసన.

రజియా మనసులో లక్ష్మణ్ కదిలాడు.

లక్ష్మణ్  చిన్ననాడు తమ ఇంటిప్రక్కనే ఉండే పుష్ప అత్తమ్మ కొడుకు.పుష్ప అత్తకు ఒక చిన్న చాయ్ హోటల్ ఉండె.ఆమె భర్త జట్కా నడిపించేటోడు.పుష్ప అత్తమ్మ చాయ్ అంటే చుట్టుపక్కల చాలా ఫేమస్.రోజుకు కనీసం రెండువందల చాయ్ లమ్మేది.లక్ష్మణ్ కూడా తల్లితో కలిసి గారెలు చేసుడు,సమోసాలు చేసుడు,రోటీ చికెన్,రోటీ కీమా తయారుచేసుడు.చాలా బిజీగా ఉండేటోడు.తర్వాత్త ర్వాత పుష్పత్త భర్త ఒక ప్రైవేట్ ఇసుక లారీకి డ్రైవర్ గా కుదిరి అప్పుడప్పుడు లక్ష్మణ్ ను తన వెంట క్లీనర్ గా తీసుకెళ్ళేవాడు.లక్ష్మణ్ ది చాలా శ్రావ్యమైన గొంతు.తల్లి హోటల్ లో రాత్రింబవళ్ళు మోగే రేడియోలోని పాటలను విని వెంటనే ఏ పాటనైనా రెండు నిముషాల్లో అచ్చం అలాగే మళ్ళీ పాడేవాడు.అందరూ ఆశ్చర్యపోయేవారు లక్ష్మణ్ ప్రతిభను చూచి.ఇంటిపక్క హోటలే కాబట్టి..చిన్నప్పటినుండి లక్ష్మణ్ తో ఉన్న దోస్తీ వల్లా దాదాపు ప్రతిరోజూ ఒక్క గంటన్నా ఆ హోటల్లో గడిపేది తను  . ఒకసారి ఎవరో ఒక పెద్దాయన పుష్పత్త చాయ్ పేరు విని తాగడానికొచ్చి లక్ష్మణ్ పాట విని..మెచ్చుకుంటూ “వీడు ఏకసంతాగ్రాహి”అని చెప్పాడు. అంటే ఏమిటిసార్..అని తాను ఆశ్చర్యంగా అడిగితే..వీనికి దేన్నైనా ఒక్కసారి వింటేనే దాన్ని యథాతథంగా ధారణ చేసుకుని పునరుత్పత్తి చేయగల సామర్థ్యముంది.అది భగవదత్తమైన ఒక వరం.అదే వీడు ఏ గొప్ప ఇంట్లోనో పుడితే కొన్ని కళల్లో శిక్షణ పొంది..గొప్ప కళాకారుడయ్యేవాడు.కాని..అని ఆగిపొయ్యాడు.ఆ క్షణం లక్ష్మణ్ నిస్సహాయంగా ఆ పెద్దాయన  ముఖంలోకి చూచిన చూపు తనకింకా జ్ఞాపకమే.

లక్ష్మణ్ లోని ఆ గొప్పతనం తనను ఆశ్చర్యపరిచింది. ప్రతిరోజూ..వీలు చిక్కినప్పుడల్లా ప్రక్కనే ఉన్న బుగ్గోల్ల తోటలోకి ఇద్దరమూ కాస్సేపు పారిపోయి..పాటలను వినేది.తను..అడిగేది..”గిట్ల ఎట్ల జ్ఞాపకముంటై నీకు” అని.కాని లక్ష్మణ్ నుండి ఏ జవాబూ వచ్చేదికాది..

Kadha-Saranga-2-300x268

ఊర్కే నవ్వేవాడు.నవ్వి “అంతే..దేవుని దయ అంతా..”అనే వాడు.లక్ష్మణ్ ముఖంలో ఏదో ఒక వింతకాంతి కనిపించేది  దీపం వత్తిలో వెలుగులా.తర్వాత్తర్వాత..మెలమెల్లగా లక్ష్మణ్ తన తండ్రి వెంట ఉండి తనూ డ్రైవర్ గా మారి,ఒక పర్ఫెక్ట్ లారీ డ్రైవర్ గా పేరు  తెచ్చుకున్నాడు.ఆ క్రమంలో ఏవేవో ఊళ్ళు తిరుగుతూ..ట్రిప్ ల కని..దూర దూర ప్రాంతాలకు ఎక్కువసార్లు వెళ్తూ..దూరమౌతున్న సందర్భంగా..అర్థమైంది తనకు..లక్ష్మణ్ పట్ల ఆ సహించలేని..భరించలేని ఎడబాటునే ‘ప్రేమ ‘ అంటారని.అప్పుడు తను ఒకరోజు లక్ష్మణ్ తో కలిసి అతని అశోక్ లేల్యాండ్ లారీలో కూడా ఎవరికీ చెప్పకుండా తీరుబడిగా మాట్లాడాలని భీమవరం వెళ్ళింది.ఒకరు హిందూ..ఒకరు ముస్లిం..తమ ముందు నిలబడ్డ బలమైన కలిసి బతకాలనే కాంక్ష.అప్పటికి తను ఎనిమిదవ తరగతి చదివింది.లక్ష్మణ్ ఇంటర్ ఫేల్.యౌవ్వనం..లక్ష్మణ్ స్పష్టంగానే నిర్ణయం తీసుకుని అన్నవరం సత్యనారాయణ సమక్షంలో..పెళ్ళడాడు ధైర్యంగా.అన్నాడు..’ రజియా..రెండు చేతులకు తోడు మరో రెండు చేతుల..కలిసి నడుద్దాం ‘ అని. ఆ రాత్రి ..వెన్నెల్లో ఎన్నో పాటలు పాడి వినిపించాడు.

విజయవాడ రైల్వే పట్టాలప్రక్కనున్న..మార్క్స్ కాలనీలో కాపురం..జీవితమంతా రాత్రింబవళ్ళు రైళ్ళ శబ్దాలతోనే సహవాసం.నిత్య  యుద్ధం.బతుకే ఒక సవాల్.లక్ష్మణ్ లారీ పై డ్యూటీలు..తను రోజువారీ సంపాదనకోసం వెదుకులాట.కూరగాయల బేరం..నాలుగిండ్లలో పాచిపని..చిన్న చిన్న హోటల్లలో వంటపని..లక్ష్మణ్ కు దేవుడిచ్చిన  స్వరంలాగనే తనకు..రుచికరంగా వంటలను చేయగల నైపుణ్యం అబ్బి.చివరికి.. హోటల్ మనోరమ కిచెన్ డ్యూటీనుండి..ఒక హోటల్ బాయ్ సహకారంతో..ఈ వైన్ షాప్ దగ్గర దొరికిన ఈ అడ్డా.

ఈ లోగా ఇద్దరు పిల్లలు..ముందు ఉష..తర్వాత షకీల్.

జీవితమంతా పోరాటమే.కమ్యూనిస్ట్ నాయకుల మధ్య విభేదాలతో తాముంటున్న గుడిసెవాసుల పై పోలీసుల దాడి అప్పుడప్పుడు.ఇళ్ళను కూలగొట్టుట.కాల్చివేయుట.పోలీస్ కేస్ లు.కోర్ట్ లు.నేలపై.బురద కుంటల ప్రక్కన నివాసం..ముక్కులు పగిలిపోయే బకింగ్ హాం కెనాల్  ఒడ్డుపై కొన్నాళ్ళు..’ సందులలో గొందులలో..బురదలలో పందులవలె’..చీకట్లో చీకిపోయిన బతుకు.,

తర్వాత..లక్ష్మణ్ లో ఒక మహమ్మారి అలవాటు ప్రవేశించి.తాగుడు.తాగి లారీ నడుపుడు.భగవంతుడిచ్చిన గొంతు నశించి.. మనిషి ముఖం నిండా ఒట్టి దైన్యం.బేలతనం.జాలి కల్గించే ఒట్టి శూన్యం.ఎక్కడికో వెళ్ళి పుస్తకాలు చదివేవాడు.గంటలకు గంటలు లైబ్రరీలో కూర్చుని..బుక్స్ తెచ్చుకునే వాడు ఇంటికి.చదువుతూ చదువుతూ అలాగే పడుకుని..ఏవేవో తనలో తానే తత్వాలను పాడుకుంటూ..సారాయి తాగుతూ,

ఇటు పిల్లలు పెరిగి పెద్దగౌతూ.,

ఎక్కడో పిడుగుపడ్డట్టు అకస్మాత్తుగా ఓ ఉరుము ఉరిమి..రజియా చేయి కొద్దిగా వణికి..ముందున్న నూనె మూకుడు పైనున్న గరిటె కొద్దిగా జారి.,

రెండుమూడు వేడి నూనె రవ్వలు చిట్లి..ఆమె చేతిపైబడి..ఉలిక్కి పడింది.

“జాగ్రత్తమ్మా..నూనె పైబడ్తుంది..”అన్నాడు ఆ ప్రక్క గోడనానుకుని నిలబడ్డ గిరాకీ.

అప్పటికే..చేపలను వేయించడం..చికెన్ లెగ్స్ ప్యాక్ చేయడం..నాల్గు బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం..చేస్తూ,

జ్ఞాపకాలు చటుక్కున తెగిపోయేయి..చూరునీళ్ళ ధారవలె.

షాప్ లోపల ఇంకా ఫుల్ గా జనం.ఒకటే రద్దీ.

తన దగ్గర స్టాక్ ఐపోతోంది..లక్ష్మణ్ రాడు..అప్పల్రావూ రాడు.ఇప్పుడెలా.

రజియాలో ఆందోళన.గిరాకీ ఉన్నప్పుడే నాల్గు రూపాయలు సంపాదించుకోవాలి.ఎలా..ఎలా.

సరిగ్గా అప్పుడు ప్రత్యక్షమైంది ఎదుట ఉష..పూర్తిగా తడిచి..నీళ్ళలో ముంచి తీసిన కోడివలె.తలపైనుంది నీళ్ళు కారుతూ..నెత్తిపై, భుజాలపై.ఏదో ఒక పాలిథిన్ కాగితం చుట్టుకుని.

ఉష అప్పుడు ఎనిమిదవ క్లాస్..పొద్దంతా తన తోపుడు బండికి కావలసిన ఉల్లి గడ్డలు కోసుకోవడం..చికెన్ షాప్ లనుండి రెండవరకం మెటీరియల్ ను తెప్పించుకుని..దాన్ని శనగపిండిలో..కారం..మసాలాలలో కలుపుకుని నాన్చడం..కోడి గుడ్లను ఉడి         కించుకోవడం..ఈ పనిలో సహాయం చేసేది.షకీల్ గాడు ఒట్టి వెధవ.ఎప్పుడూ అక్కలా పనిలో సహాయం చేయడు.మళ్ళీ రైల్వే పట్టాలప్రక్కన మార్క్స్ కాలనీకి దగ్గరలో..బోస్ నగర్ కు మారినప్పటినుండి వాడికి అంతా స్నేహితులే.నిరంతరం పోరగాండ్లతో రైల్ పట్టాలపై ఆటలు..కూలిన గోడల్లో  సిగరెట్లు తాగుడు. తండ్రి వలెనే అప్పుడప్పుడు మందు.

“తల్లిదండ్రుల లక్షణాలు తప్పక పిల్లలకొస్తాయా.”అని తననుతాను ప్రశ్నించుకుంటే..’తప్పకుండా..వస్తాయనే ‘అనిపిస్తుంది తనకు.

లక్ష్మణ్ లో ఉన్న ఆ స్వరం..అమృతమయమైన గొంతు..ఉష పాడితే అద్భుతమైన మాధుర్యం..అవన్నీ వచ్చాయి బిడ్డకు..తండ్రి నుండి.

కాని షకీలే..ఒట్టి అవారా ఔతున్నాడు రోజురోజుకు. బడికి పోడు..చిల్లర దొంగతనాలు..పోలీస్ కేసులు.విడిపించుకు రావడాలు.తాగి ఎక్కడెక్కడో పడిపోవడాలు..ఏవేవో సినిమా హీరోల అభిమాన సంఘాలంటాడు. రాజకీయ నాయకుల కనుసన్నలలో.. ఊరేగింపులు. దౌర్జన్యాల్లో పాలుపంచుకోవడాలు.అన్నీ చిల్లర  అల్లరిమూకల  చేష్టలు.

ఆ రాత్రి..ఉష వర్షంలో పూర్తిగా తడుస్తూ..అమ్మ మీద..అమ్మయొక్క జీవనోపాధి ఐన చిన్న వ్యాపారంపైన గౌరవంతో చేయూతగా రావడం..రజియాకు పట్టరాని ఆనందాన్నిచ్చింది.

” క్యా హువా..లక్ష్మణ్ నహీ హై” అంది అప్రయత్నంగానే.

” రాలేదింకా.. బాగా తాగి..హోష్ లేకుండా ఎక్కడున్నాడో.అప్పల్రాజు కూతురుకు యాక్సిడెంటై దవాఖానకెళ్ళాడు.” అని తన చేతిలోని మెటీరియల్ ను అందించింది తల్లికి.

అప్పటికే కావలసిన  తిండి సరుకు లేదని చిన్నబుచ్చుకున్న వైన్ షాప్ కస్టమర్లు..బిలబిలా బండి దగ్గరికి పరుగెత్తుకొచ్చి..” రెండు చేప..పావుకిలో చికెన్ మంచూరియా..మూడు బాయిల్డ్ ఎగ్స్..” ఆర్డర్స్ కురిపిస్తూ.,

మూకుమ్మడి దాడిలో రజియాకు ఉషతో మాట్లాడే తీరికే లేదు.పనిలో మునిగిపోయింది.కాస్సేపాగి..”మరి నే వెళ్ళొస్తానమ్మా..నువ్వు..”అంది ఉష..వర్షంలో తడుస్తూనే.రజియా..తలెత్తి బిడ్డదిక్కు నిస్సహాయంగా చూచి.,

అనివార్యత..అనివార్యత.

” సరే బిడ్డా..నువ్వెళ్ళు..నేనొస్తా..షాప్ మూసుకుని”

‘ సంపాదన..ఒక తాగుబోతు తండ్రిని పోషిస్తూ..ఒక తిరుగుబోతు కొడుకును సాకుతూ..ఒక ఇంటర్ పాసై..గడప దగ్గర నిలబడ్డ బిడ్డకు దన్నుగా ఉంటూ..ఒక తల్లి..రాత్రి పదకొండు గంటలకు..వర్షంలో..తడుస్తూ..నిజాయితీతో కూడిన సంపాదనలో..ఈ దేశాన్ని అవినీతితో దోచుకుంటున్న అనేకమంది వైట్ కాలర్డ్ దొంగలకన్న నిర్మలంగా..తన తల్లి..తన అమ్మ..తన మా. ‘

ఉష తిరిగొచ్చింది  ఇంటికి.

వచ్చేసరికి..ఇంట్లో ఎవరూ లేరు.లక్ష్మణ్ యధావిధిగానే ఎక్కడో తాగుతూ..తమ్ముడు షకీల్ ఏ ఫ్రెండ్స్ తోనో.,

కాని..తమ ప్రక్కనే ఉన్న రేకుల షెడ్ లో ఉండే శరత్ మాత్రం ఎదురుచూస్తూ ఉన్నాడు ఉషకోసం.దాన్ని ప్రేమ అంటాడు శరత్.అది వట్టి బూటకం అని తెలుసు ఉషకు.

ఈ ఏ పూటకాపూట కుటుంబాల్లో..ఇంటి పరిస్థితులు మనుషులకు తప్పులు చేయడానికి చాలా అవకాశాలను కల్పిస్తాయి..ముఖ్యంగా ఒంటరితనాలను..స్వేచ్ఛను..యూజ్ అండ్ త్రో టైప్ సందర్భాలను..బలహీనతలను ఆసరా చేసుకుని.

శరీరం ఒక అగ్ని బాంఢం..వాంఛ ఒక పెట్రోల్ బావి.అగ్గి తారసపడ్తే భగ్గున మండి భస్మం చేస్తుంది.

ఇదివరకు ఉష ..ఒక ముసురుపట్టిన రాత్రి  ఒంటరిగా శరత్ కు ప్రక్కనే తారసపడ్తే.,

ఒక వెకిలి వవ్వుతో..ఒక చూపుతో గుచ్చి గుచ్చి చంపి..ఒక కవ్వింత..లోపల ఒక తీవ్ర జ్వలన.

‘ ఏదేమైనా తెగించి ఒక్కసారి సెక్స్  కార్యం జరిపితే..తీవ్రమైన కోరిక నెరవేరుతుంది..అగ్ని చల్లారుతుంది..ఒక కొత్త అనుభవం గురించిన రుచి తెలుస్తుంది.’అన్న ఉత్సుకత. తహతహ.

ఉష మౌనాన్ని అంగీకారంగా వ్యక్తపరిస్తే..శరత్ తెలుగు సినిమాల్లో దిక్కుమాలిన హీరోలా రెచ్చిపోయి,

ఆ స్వేచ్ఛాయుతమైన రాత్రి..ఓ నాల్గైదుసార్లు తృప్తి.

ఇది తప్పు ..ఇది శీలం పోవుట..ఎవరో ఎవర్నో లొంగదీసుకొనుట..అంతా ట్రాష్ అనుకుంది ఉష .ఉష కించిత్తుకూడా బాధపడలేదు..తనుకూడా  కావాలనుకుంది..చేసింది.సింపుల్ గా చెప్పాలంటే..’అంతే.’

ఒకసారి జరిగిన క్రియను..తప్పును..మళ్ళీ..మళ్ళీ పదే పదే చేసినా..పెద్ద తేడా పడేదేముండదన్న తెగింపు.

చాలాసార్లే జరిగి.,

అప్పుడు..ఆ రాత్రి..ఆ వెన్నెల రాత్రి అన్నాడు శరత్..”నువ్వు చాలా చాలా బాగా పాడుతావు ఉషా..ఒక్కసారి ఆ పాటను పాడవా ప్లీజ్” అని.

ఉష వెంటనే పాడింది..శరత్ పాడమన్నందుకు కాదు.పదే పదే తను నిజంగానే మంచి సింగర్ నేనా..అని నిర్ధారించుకునేందుకు.

ఆ రాత్రి ఉష..దేవుడు తనకిచ్చిన ఈ “ఏక సంతాగ్రాహి” లక్షణాన్ని ఏ రకంగా జీవితంలో శక్తివంతంగా ఉపయోచుకోవాలా అని మొట్టమొదటిసారిగా..కొత్తగా ఆలోచించింది.

ప్రేమలు.శీలాలు.త్యాగాలు.దేన్నో కోల్పోయినట్టు  రోదించడాలు..అన్నీ మరిచి..ఉష తన  కళ్ళముందున్న తెరలనూ,ముసుగులనూ తొలగించుకుంది తెలతెలవారుతూండగా.శరీరాన్ని ఆయుధంలా ఎక్కుపెట్టి..ఒళ్ళు విరుచుకుని..ఆవులించి..కళ్ళు తెరిచింది ఉద్యుక్త ఔతూ.

3

digadaaniki-picture ఉష జీవితంలోకి అవినాశ్ ప్రవేశం ఒక పెద్ద మలుపు.లైబ్రరీలో పరిచయమై ఒకరోజు ఒక పుస్తకమిచ్చాడు అతడు. అది”మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి”.

ఆ వర్షం కురుస్తున్న రాత్రే ఆ పుస్తకాన్నంతా చదివింది తను.

SWOT . . అనాలిసిస్ . . S . . అంటే స్ట్రెంగ్త్. . నీ బలాలు..W ..అంటే వీక్నెసెస్..బలహీనతలు.. O అంటే..ఆపర్చునిటీస్..అవకాశాలు.. T   అంటే థ్రెట్స్.. అవరోధాలు.

ఎప్పుడైనా  ఒక కాగితం తీసుకుని నీ ఆలోచనలనన్నింటినీ   దానిపై రాయమని చెప్పాడు మేనేజ్ మెంట్ పితామహుడు..ఎఫ్. డబ్ల్యు. టేలర్.

రాసింది తను.మూడు పేజీలు నిండాయి..క్రోడీకరిస్తే.. తన బలం.. ఒక్కటే అని తేలింది.అది .. ఒక్కసారి వింటే చాలు..ఆ ధ్వనిని మళ్ళీ సరిగ్గా అలాగే పునరుత్పత్తి చేయగల తన దైవదత్తమైన సామర్థ్యం . .తన బలహీనత.. తన బీదరికం.

చాలా మంది  తను ఎదగడానికి తమ బీదరికం..తగు స్థాయిలో డబ్బు లేకపోవడమే కారణమని అనుకుంటారు.. కాని అది పూర్తిగా తప్పు అని  సెల్ఫ్ మేనేజ్ మెంట్ సిద్ధాంతకర్త  స్మిత్ ఎప్పుడో చెప్పాడు.దేన్నైనా సాధించడానిక్కావలసింది..స్పష్టమైన లక్ష్యం..దాన్ని చేరి అనుకున్నది సాధించాలన్న సంకల్పం..పట్టుదల..ప్రతిభ.

ఊష అనే తను ఇక..’ తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి ‘ అని బయలుదేరింది ఒక రోజు..హైదరాబాద్ కు.హైదరాబాదే  తన కార్యరంగమని తెలుసుకుందామె.

తన ఆయుధం పాట.

పాటకు ప్రాచుర్యమివ్వగలిగింది సినిమా ఒక్కటే.

తను ఒక ప్రసిద్ధ గాయని ఐ ఒక వెలుగు వెలిగి పోవాలి..అందుకు కావల్సింది ‘అవకాశం.’

.       ‘ మనిషికి దేనికైనా ఒక అవకాశం రావాలి.వచ్చినప్పుడు తెలివిగా దాన్ని గుర్తించి ఉపయోగించుకోవాలి.అవకాశం రానపుడు ఆ అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి.’

తనకు అవకాశాలు వచ్చే అవకాశం అస్సలే లేదు..కాబట్టి అవకాశాన్ని తనే సృష్టించుకోవాలి.

ఎలా..ఎలా..ఎలా..అన్వేషణ.సరియైన రీతిలో చేయినందించి నడిపించగల వ్యక్తికోసం..సమర్థునికోసం..అన్వేషణ.

మార్కెట్ స్టడీ..ప్రస్తుత మ్యూజిక్ రంగంలో..ఉన్నతుడూ..మార్కెట్ ఉన్నవాడు  ఎవరు..ఎవరు..ఎవరు.?

ఉష అనే తనకు..ఒక నిర్దుష్ట దృష్టితో..శాస్త్రీయంగా..దూసుకుపోతున్నకొద్దీ..మన దగ్గర ప్రతిభ ఉంటే..తనపై తనకు విశ్వాసముంటే..గమ్యాన్ని చేరడం సుళువే అని తొందరగానే అర్థమైంది.వెదికి వెదికి..పట్టుకుంది  ఓ మనిషిని..అతని పేరు..గణేశ్ శాస్త్రి.

గుర్రపు పందెంలో గెలవాలంటే తనకెంత సామర్థ్యమున్నా సరియైన గుర్రాన్ని ఎంచుకోవడం ఒక అత్యంత ప్రధానమైన మెలకువ.ఆ పందెపు గుర్రం ఇప్పుడు గణేష్ శాస్త్రి.

ఒక మనిషికి చేరువై..అతనితో మనం అనుకున్న పనిని సాధించేందుకు ముందు అతని అత్యంత వ్యక్తిగతమైన జీవితాన్ని అధ్యయనం చేయాలి. కొందరికి తిండి బలహీనత. కొందరికి డబ్బు.కొందరికి స్త్రీ.ఇంకొందరికి స్తుతి.కొందరికి కానుకలు.కొందరికి అధికార హోదాలు..ఏదో ఒక మత్తు.వ్యామోహం.ఇవన్నీ బలహీనతలే.యుక్తిపరుడు ఇవన్నీ గ్రహించి..ఒంటరిగానే  కావలసిన వ్యక్తికి చేరువై..కార్యరంగంలోకి దూసుకుపోయి అంతిమంగా  లక్ష్యాన్ని సాధిస్తాడు.

గణేశ్ శాస్త్రి బలహీనతలను పసిగట్టి సరియైన దిశలోనే కలిసింది తను..చాలా మంది పురుషుల్లో ఉన్న బలహీనతే అతనిక్కూడా ఉంది.మందు..మగువ.మందుకు కొదువలేదతనికి.తను తాగగలడు..వేరే వాళ్ళెవరైనా ప్రతిరోజూ అతను తాగగలిగినంత తాగించగలరు.ఐతే తాగుబోతులకు..వేరేవాడెవడైనా తాగిస్తే బాగుండుననే దుగ్ధ ఒకటుంటుంది.అదే ఉంది శాస్త్రిగారిక్కూడా.శాస్త్రి గారికి మ్యూజిక్ చేయవలసిన సినిమాలు కనీసం ఓ పదుంటాయి చేతిలో ఎప్పుడూ..వివిధ భాషల్లో.

ఒక రాత్రి..ఒక సంగీత విభావరి తర్వాత కలిసింది తను ఒక ఫైవ్ స్టార్ హోటెల్లో శాస్త్రిగారిని..కొన్ని సుమబాణాల్లాంటి చూపులనూ..కొన్ని తళుకులీనే శరీర కదలికలనూ ధరించి..తప్పించుకోలేని  మధుర ధరహాస చంద్రికలనూ వలలా వేసింది.

జీవితమంటేనే వ్యాపారమనీ..వ్యాపారమే జీవితమనీ..కదా ఎం బి ఎ లో పాఠం చెప్పేది.

శాస్త్రిగారికీ..తనకూ రోజురోజుకూ దూరం తగ్గుతూ..సాన్నిహిత్యం పెరుగుతూ..పరస్పరం అర్థంకావడం మొదలై.,

కొన్నింటిని అడిగితేగాని ఇవ్వొద్దు..మరి కొన్నింటిని అడుగకముందే ఇచ్చి పిచ్చెక్కించి పరవశింపజేయాలి.ఇంకొన్నింటిని..మరీ మరీ అడిగించుకుని..బ్రతిమాలించుకుని మాత్రమే ఇవ్వాలి.

‘ నేను పాట పాడుతా..నువ్విను ‘ అంటే వినడువాడు.వాడే ‘ ప్లీజ్..ఒక్కసారి ఒక పాటపాడవా.’ అని బతిమిలాడినప్పుడు పాడుతే బహుబాగా వింటాడు..ప్రశంసిస్తాడు.

మంచి మేనేజర్..తననుకున్న జవాబును ఎదుటివాడు వానంతట వాడే చెప్పేట్టు చేసుకుంటాడు.

శాస్త్రిగారు..ప్రక్కమీదున్నపుడు..కొన్నిసార్లు బతిలాడగా బతిలాడగా ఒక పాటను అద్భుతంగా పాడి వినిపించి గిలిగింతలు పెట్టింది తను.ఫ్లాటయ్యాడు ముసలోడు.ముఖ్యంగా ఒక్కసారే విని తను ధారణ చేసి మళ్ళీ వెన్వెంటనే వినిపించే తన ప్రతిభకు షాక్ అయ్యాడు.ఒకానొక తన్మయ స్థితిలో ” ఉషా..రేపే నీ పాట రికార్డింగ్ “అన్నాడు.అని ఆగకుండా..” చూస్తూండు నువ్వు..నిన్ను భారతదేశ అత్యుత్తమ  లేడీ సింగర్ ను చేస్తా రెండేళ్ళలో.నీది ఒక విలక్షణమైన మధుర స్వరం” అన్నాడు. శాస్త్రి గారు తనకు లొంగిన మాట సత్యమే కాని..నిజానికి ఆయన ఒక అత్యున్నత స్థాయి సంగీతకారుడు.

ఒక రోజన్నాడు శాస్త్రిగారు..” నిజానికి కళలన్నీ మనిషికి  దైవదత్తంగా సంక్రమించేవే..కె ఎల్ సైగల్ కు శాస్త్రీయ సంగీతమే రాదు.కాని అద్భుతమైన శాశ్వతమైన జీవవంతమైన గీతాలను అందించాడుగదా.శాస్త్రాలేవైనా మనిషి అనుభవాలనుండీ..అధ్యయనాలనుండే పుట్టాయిగాని..అనుభవాలు శాస్త్రాలనుండి పుట్టలేదు.నువ్వు ఒక సహజ గాయనివి ఉషా” అని.

నిజానికి ఆయన తనను కావాలని పట్టుపట్టి ఒక ప్రపంచస్థాయి గాయకురాలిని చేశాడు.ఈ పన్నెండేళ్లలో  శాస్త్రిగారు పెట్టిన భిక్షే ఈ తన  వైభవ  ప్రాప్తి . ఆయనను వెదికి పట్టుకోవడం తన తెలివి.

ఐతే..గాయనిగా ..ఒక విలక్షణమైన గొంతు ఉన్న దానిగా పొందిన గౌరవాలు,అనేకానేక సత్కారాలు,విజృంభించి అధిరోహించిన అత్యున్నత శిఖరాలు..అన్నీ ఇప్పుడు..ఒక మాయవలె..విడిపోతున్న మంచు తెరలవలె..ఒక దీర్ఘ భ్రాంతివలె,

ప్రశ్నలు..జీవితంలో..ఆ తర్వాత.. అటు  తర్వాత..ఆ ఆ తర్వాత..అని..ప్రశ్నలు.

ప్రశ్నలు..రాలుతున్న ఎండుటాకులవలె..ప్రశ్నలు..కూలిపోతున్న సౌదాలవలె..ప్రశ్నలు చెదిరి విరిగిపోతున్న నీడలవలె.

పెరుగుతున్నకొద్దీ..లోపల విశాలమైపోయిన ఎడారి..ఎక్కడా..సుదూర ప్రాంతమంతా..మనుషుల జాడలే కానరాని ఎడారి. తత్వవేత్తలన్నట్టు..ఎప్పుడైనా మనిషి కొంత పొందుతున్నాడూ..అంటే కొంత కోల్పోతున్నట్టే లెఖ్ఖనా.?

4

 

అమ్మ..రజియా జ్ఞాపకమొచ్చింది ఉషకు. అమ్మ జ్ఞాపకంతోపాటే ఆపుకోలేని దుఃఖం.

తను ఎదుగుతూ..ఇంకా ఇంకా ఎదుగుతూ పైకి వెళ్తున్నకొద్దీ..” అమ్మా..రా నా దగ్గరకు..నాతో..నాతోపాటే ఉండిపోవమ్మా..అమ్మా రజియా..నా దేవత అమ్మా..రా వచ్చి నా తలను నీ ఒడిలోకి తీసుకుని..నన్నొక్కసారి నీ పరిష్వంగంలో..నీ అమృతహస్తాలతో,”

కాని అమ్మ రాలేదు.చనిపోయిన తమ్ముడు షకీల్ జ్ఞాపకాల్లో కనలిపోతూ, చావక ఇంకా మిగిలి ఉన్న నాన్న లక్ష్మణ్  తో ..అదే తోపుడు బండి.అదే జీవితం.అమ్మది.

అసలు జీవితం ఏమిటి.?

బిగ్గరగా రైలు కేక.భయంకరంగా.వికృతంగా.

అసలు తనిక్కడిలా కూర్చున్నట్టు ఎవరికీ తెలియదు.తెలిస్తే.క్షణాల్లో ఇసుకపోస్తే రాలనంతమంది అభిమానులు చొచ్చుకొస్తారు.

ఒక అంతర్జాతీయ స్థాయి గాయనిప్పుడు..ఉష.

కాని..కాని,

లేచి..ఉష శాలువాను శరీరం చుట్టూ  సవరించుకుని,

ఎ-వన్..కంపార్ట్ మెంట్..తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్..లో..ముప్పది రెండో  నంబర్.

కిటికీలోనుండి బయటకు చూస్తూండగానే రైలు మెల్లగా కదుల్తూ..బయటంతా చీకటి.నల్లగా.

కొద్ది నిముషాల్లోనే ఢిల్లీ మహానగరం కనుమరుగౌతూ,

‘ విజయవాడలో దిగగానే..పరుగు పరుగున అమ్మ దగ్గరికి పరుగెత్తి..చుట్టుకుపోయి…అమ్మ..అమ్మ..రజియా..అమ్మ.,’

ఎందుకో చటుక్కున ఉష చేయి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ముఖేశ్ పాటను వింటానికి టచ్ ఫోన్ తెరను తడిమింది.

” జుబాపే దర్ద్ బరీ దాస్ తా  చలీ ఆయీ

బహార్ ఆనేసే పహలే  ఖిజా చలీ ఆయీ..” స్వర ఝరి అది..గాలిలో తేలుతూ.

ఒక మహాద్భుత  విషాద గీతంలో ఎక్కడని వెదుక్కుంటావు..పోగొట్టుకున్న హృదయాన్ని.?

రైలు వేగాన్ని పుంజుకుంటోంది చీకట్లో.                                                                                                             *

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

బుక్కెడు బువ్వ

మహాలక్ష్మి

-రాజ్యలక్ష్మి

~

 

rajyalakshmi“ఈ ఏడాదైనా పిల్ల పెళ్లి చేస్తారా లేదా?  అమ్మమ్మకి కాస్త ఓపిక ఉండగానే ఆ శుభకార్యం కాస్తా అయిందనిపిస్తే బావుంటుంది కదే.  చూసి సంతోషిస్తుంది.  అయినా అదేమైనా చిన్నపిల్లా? ఇరవైనాలుగోయేడు రాలా?” మా అమ్మ నన్ను అడుగుతోంది.   సాయంకాలం వాకిట్లో కూర్చుని సన్నజాజి పూలు మాల కడుతూ మాట్లాడుకుంటున్నాము.  మా అమ్మమ్మ వైపు చూసాను.  “నా కోసం ఎమీ చేయనక్కరలేదు.  చూసి సంతోషిస్తాననుకో. కానీ అది కాదు ముఖ్యం.  పెళ్లంటే హడవుడి పడకుండా మంచీ చెడూ అన్నీ విచారించాలి” అంది మా అమ్మమ్మ.    అదేమిటో మా అమ్మమ్మ ఎప్పుడూ ప్రపంచానికి విరుద్ధంగానే మాట్లాడుతుంది.  ఎవరైనా పెద్దవాళ్లు, వాళ్లు కాస్త ఓపికగా ఉన్నప్పుడే మనవళ్ల, మనవరాళ్ల పెళ్లిళ్లు చూడాలనుకుంటారు.  మా అమ్మమ్మేమో ఇలా!

మా మామయ్య, అత్తయ్య తీర్థయాత్రలకి వెళ్తూ అమ్మమ్మని మా ఇంట్లో దింపారు.  ఎలానూ అమ్మమ్మ ఉన్నన్ని రోజులు సెలవు పెట్టాను కదా అని అమ్మని కూడా వచ్చి ఉండమన్నాను, ఈ పదిరోజులు.  వచ్చిన రెండోరోజే మా అమ్మ మొదలు పెట్టింది, మా అమ్మాయి పెళ్లి గురించి.

ఇంతలో మా అమ్మాయి వచ్చింది.  ఎవరో ఫ్రెండ్ కారులో డ్రాప్ చేసి వెళ్లాడు.  “ఎవరే ఆ వచ్చింది?  ఐనా నీ బండి ఏమైంది?” మా అమ్మ అడిగింది అనుమానంగా.  “ఫ్రెండ్ అమ్మమ్మా, వెహికల్ ప్రోబ్లం ఇస్తే సర్వీసింగ్‌కి ఇచ్చాను” అంది మా అమ్మాయి లోపలికి వెళ్తూ.

ఆడపిల్లల్లు, మగపిల్లలు తేడా లేకుండా దాని ఫ్రెండ్సు ఇంటికి రావడం అలవాటే.  ఎప్పుడైనా అవసరమైంతే, ఎవరైనా ఇలా డ్రాప్ చేయడమూ అలవాటే. కానీ దాని మొహంలో వెలుగు, పెదవులమీద చిరునవ్వు చూస్తుంటే అంతకన్నా ఎక్కువే అనిపించింది. “ఇదివరకు ఎప్పుడూ చూడలేదే?” అన్నాను దానికి కాఫీ ఇస్తూ.  నాలోని అమ్మ ప్రోబింగ్  మొదలుపెట్టింది.

అది కూడా ఈ అవకాశం కోసమే చూస్తున్నట్టుంది, ఎక్కువ బెట్టు చేయకుండా “అభిరాం అమ్మా.  చార్టెడ్ ఎకౌంటెంట్, ఓన్ ఫర్మ్ ఉంది.  వాళ్ల నాన్నగారు కూడా చార్టెడ్ ఎకౌంటెంటే” అంది తలవంచుకుని.  అర్థమైపోయింది. ఆడపిల్ల అంతకన్నా ఏం చెప్తుంది?  ఎంత చదువుకున్నా ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా పెళ్లి అనేటప్పటికి ఈ డెలికసి తప్పదేమో!

“మనవాళ్లేనా” అంది మా అమ్మ ఆత్రంగా.  “ఆ, మనవాళ్లే.  ఐనా కాకపోతే పనికిరారా? ఏం తాతమ్మా?” అడిగింది మా అమ్మాయి.  మా అమ్మ మొహంలో పెద్ద రిలీఫ్!  నాక్కూడా!

అబ్బాయి బాగానే ఉన్నాడు.  చదువు, ఫామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా బావుంది. కారు కూడా మెయిన్‌టైన్ చేస్తున్నట్టున్నాడు.  పైగా మనవాళ్లే!  అమ్మలోని మరో కోణం కాలిక్యులేట్  చేస్తోంది.

“ఎందుకు పనికిరారూ! ఈ రోజుల్లో అందరూ పనికి వస్తారు. మీకేమైనా సంధ్యావందనాలా? దేవతార్చనలా?  మంచివాళ్లైతే చాలు”  అంది మా అమ్మమ్మ.   తొంభైయేళ్ల మా అమ్మమ్మంత  మోడ్రన్‌గా నేనెప్పుడు ఆలోచించగలుగుతానో!  ఆలోచనలు ఇలా ఉంటాయి, మళ్లీ కాసాపోసి చీర కట్టుకుంటుంది.  రెండు పూట్లా మడితోనే భోజనం చేస్తుంది.

“నువ్వు డాక్టరువి కదే, నీకెట్లా పరిచయం?” అడిగాను.  మళ్లీ ప్రోబింగ్.

“రెండేళ్లక్రితం నేను హౌస్‌సర్జన్ చేసే రోజుల్లో అభిరాం చెల్లెలు శ్రావణి మీద ఆసిడ్ అటాక్ జరిగింది.  మా హాస్పిటల్‌లోనే ట్రేట్‌మెంట్ జరిగింది. అప్పుడు అభిరాం ఆ సిట్యుయేషన్‌ని హాండిల్ చేసిన విధానం నాకు నచ్చింది. అలా పరిచయం.”  ఒక్కసారి ఒళ్లు జలదరించింది.  ఈమధ్య ఆడపిల్లల మీద అత్యాచారాలు మరీ ఎక్కువ అయిపోయాయి. బయటకి వెళ్తే తిరిగి వచ్చేవరకూ భయమే.  సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం, …  ఇప్పుడు ఈ అత్యాచారాలు!  భగవంతుడా! ఆడపిల్లలను రక్షించు తండ్రీ!

“మీ ఆసుపత్రిలో ఎందుకు చేరింది?” మా అమ్మమ్మకి అర్థమైనట్లులేదు, అడుగుతోంది.  “అది కాదు తాతమ్మా,  శ్రావణిని వాళ్ల కాలేజిలో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు.  తను ఒప్పుకోలేదు.  అప్పటికే శ్రావణికి యు.యస్.లో ఎం.యస్.కి అడ్మిషన్ వచ్చింది.  ఎంగేజ్‌మెంట్ కూడా అయింది.  పెళ్లికొడుకుకి కూడా యు.యస్. లోనే జాబ్.  ఇది తెలిసి ఆ రోగ్ శ్రావణి మీద ఆసిడ్ పోసాడు”  ఆవేశపడిపోయింది.

“శ్రీరామరామ! వాడికిదేం పోయేకాలమే!  రావణాసురుడు కూడా అలా చేయలేదు కదే!” అంది మా అమ్మమ్మ బాధగా.  మనసంతా వికలమైంది.  కాసెపటివరకూ ఎవ్వరం మాట్లాడలేదు.

“ఇప్పుడు ఎలా ఉంది? రికవర్ అయిందా?” అడిగాను నెమ్మదిగా.  “మొహంలో ఒక వైపు చాలా భాగం కాలిపోయింది. నాలుగు సర్జరీలు అయ్యాయి.  ఇంకా చేయాలి, కానీ ఇదివరకటిలాగా రావడం కష్టం.  ఈమధ్యనే జాబ్ లో జాయిన్ అయింది ఈ ఊళ్లోనే” అంది.

“మరి పెళ్లి, అమెరికా?”  మా అమ్మ మనసులో అనుమానం.  “పెళ్లికొడుకు వాళ్లు ఎంగేజ్‌మెంట్ బ్రేక్ చేసారు.  అభిరాం, వాళ్ల పేరెంట్స్ ఈ టైంలో శ్రావణిని ఒక్కదాన్ని యు.యస్.కి పంపడానికి ఇష్టపడలేదు” అంది.

“మంచిపని చేసారు.  కాస్త కుదుటపడేవరకూ అమ్మాయిని ఒక్కదాన్నే వదిలిపెట్టకూడదమ్మా.  వేయి కళ్లతో కనిపెట్టుకుని ఉండాలి.”  అంది మా అమ్మమ్మ.  కనీసం కళ్లతోనైనా చూడని మనిషి గురించి ఎంత కన్సర్న్!

“అయితే ఇక్కడే ఉంటుందన్నమాట” అంది మా అమ్మ.  అలాంటి ఆడపడుచు ఇంట్లో ఉంటే మనవరాలి కాపురం ఎలా ఉంటుందో అని భయం.  “ఇంకెక్కడ ఉంటుంది?” మా అమ్మాయి విసుక్కుంది.

“ఆ ఆసిడ్ పోసిన వాడినేం చేసారు?” అడిగాను.  “అరెస్ట్ చేసారు.  కేస్ నడుస్తోంది.  వాడు ఒక రిచ్‌కిడ్.  పెళ్లి కాన్సిల్ అయిందని తెలిసి కేస్ విత్‌డ్రా చేసుకుంటే శ్రావణిని పెళ్లి చేసుకుంటానని బేరం పెట్టాడు – రాస్కెల్!  కానీ అభిరాం వాళ్లు ఒప్పుకోలేదు.”  మళ్లీ ఆవేశపడింది.

“ఆ త్రాష్ఠుడికి పిల్లనిస్తాముటే!  పెళ్లికాకపోతే పీడాపాయె!  వాడిని జైల్లో పెట్టించాల్సిందే – వదలకూడదు”  అంది మా అమ్మమ్మ కూడా ఆవేశపడిపోతూ.  ఈవిడ ఏ ఫెమినిస్ట్ కి తీసిపోతుంది?

“ఇంతకీ అభిరాంకి ఏం చెప్పావు?”  ఈ డిస్టర్బెన్స్‌తో అడగకూడదనుకుంటూనే అడిగాను.  “మీతో మాట్లాడి చెప్తానన్నాను” అంటూ ఖాళీ కప్పు లోపల పెట్టడానికి వెళ్లింది.   ఇలా చెప్తోంది కానీ, దీని ఉద్దేశ్యం తెలుస్తూనే ఉంది.  లేకపోతే అతని కారులో ఎందుకు వస్తుంది?  పైగా రెండేళ్ల పరిచయం!

“దీనికి మీ అమ్మమ్మ పోలిక వచ్చిందేమిటే?  ఆ పిల్లకి పెళ్లి అవుతుందా? అలాంటి పిల్ల ఇంట్లో ఉంటే ఇదేమి సుఖపడుతుంది?”  మా అమ్మ మాటలకి నాకేమి చెప్పాలో తెలియలేదు.  అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే – ఈ అపశ్రుతి!  మా అమ్మమ్మ వైపు చూసాను.  ఆవిడ ఏమీ మాట్లాడలేదు.

“ఏమిటి అమ్మమ్మా! పోలిక అంటున్నావు” మా అమ్మాయి వస్తూ అడిగింది. “అదికాదమ్మా! ఆ పిల్లకి పెళ్లి కావడం కష్టం.  అలాంటి పిల్ల ఇంట్లో ఉంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? చిన్నపిల్లవు. అలా ఇంట్లో ఇద్దరు ఆడపడుచులతో మీ తాతమ్మ ఎన్ని కష్టాలు పడిందో నీకు తెలీదు”  అంది మా అమ్మ.

“అవునా తాతమ్మా? నాకు తెలీదే! చెప్పవూ!” అడిగింది మా అమ్మాయి.  “ఏముందే!  చెప్పడానికీ,  వినడానికీ!  ఇదేమన్నా రమాయణమా?  భారతమా?” అంది అమ్మమ్మ.  “పోనీలే తాతమ్మా, చెప్పు.  వింటాను.”  మా అమ్మాయి బలవంతం చేస్తే “సరే” అని అమ్మమ్మ చెప్పడం మొదలుపెట్టింది.

. . .

 

నాకు ఎనిమిదో ఏట పెళ్ళైంది.  పద్నాలుగో ఏట కాపరానికి వచ్చాను.  నాకు ఇద్దరు ఆడపడుచులు.  పెద్దావిడ సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ అనేవాళ్లు. నాకన్నా పదేళ్లు పెద్ద.  నలుగురు పిల్లలు.  చిన్నావిడ మహాలక్ష్మి.  నా ఈడుదే.  ఇంకా కాపురానికి వెళ్లలేదు.  ఇంట్లో ఆయన, నేను, అత్తగారు, మామగారు, మహాలక్ష్మి – అంతే.

నాకు, మహాలక్ష్మికి తొందరగానే స్నేహం కుదిరింది. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ, చలాకీగా ఉండేది. చివరిపిల్ల అవడంతో గారాబం కూడా ఎక్కువే.  రోజూ పొద్దున్నే వాకిలి, దొడ్డి చిమ్మి ముగ్గులు పెట్టేవాళ్లం.  ఎవరు పెద్ద ముగ్గు వేస్తారా అని ఇద్దరికీ పొటీ.  స్నానం చెసిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేసి సుబ్రహ్మణ్యాష్టకం, లక్ష్మీఅష్టోత్తరం, కృష్ణాష్టకం, అన్నపూర్ణాష్టకం, మీనాక్షీపంచరత్నం పారాయణ చేసేవాళ్లం.

వంట మడితో మా అత్తగారు చేసేవారు.  మగవాళ్లిద్దరి భోజనాలు అయినతర్వాత ఆడవాళ్లం భొంచేసేవాళ్లం.  మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత చింతపిక్కలో, అష్టాచెమ్మానో ఆడుకునేవాళ్లం. లేకపోతే ఏవైనా పద్యాలో, పాటలో పాడునేవాళ్లం.  నాకు కుమారీశతకం, సుమతీశతకం, రుక్మిణీకళ్యాణం మాత్రమే వచ్చుకానీ, మహాలక్ష్మికి దాశరథీశతకం, నరసింహశతకం, గజేంద్రమోక్షం,  ప్రహ్లాదచరిత్ర , వామనచరిత్ర కూడా వచ్చు.  ఎన్ని పాటలు పాడేదో –  మేలుకొలుపు పాటలు, ఊర్మిళదేవి నిద్ర, లక్ష్మణస్వామి నవ్వు, పద్మవ్యూహం, శివకళ్యాణం, నౌకాచరితం, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, తరంగాలు – ఎన్నో!   సౌందర్యలహరి ఎంత బాగా పాడేదనీ!  కౌసల్యకల, కృష్ణజననం పాడితే ఆనందమో, దుఃఖమో తెలియని పారవశ్యంతో కళ్లంబట నీళ్లుకారేవి.  తన గొంతులో ఏపాటైనా ఎంతో బాగుండేది.

పెద్ద దొడ్డి.  అందులో అరటి, జామ, బాదంలాంటి చెట్లు;  కాయకూరల, ఆకుకూరల మళ్లు;  పారిజాతం, మందార, గన్నేరు,  సన్నజాజి, కనకాంబరం, మల్లె, చేమంతిలాంటి పూలమొక్కలు ఉండేవి.  రోజూ సాయంకాలం పూలు కోసి పెద్ద పెద్ద మాలలు కట్టుకుని జడలో పెట్టుకునేవాళ్లం.  ఏపనైనా ఇద్దరం కలిసే చేసేవాళ్లం.  గుడికి, పేరంటానికి – ఎక్కడికెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం.  ఇంక మా కబుర్లకి అంతే ఉండేది కాదు.  అదేమిటో బావిలో నీళ్లలాగా ఊరుతూనే ఉండేవి.  ఎప్పుడూ నవ్వుకుంటూ, సన్నగొంతుకతో  మాట్లాడుకుంటూనే ఉండేవాళ్లం.  మా అత్తగారు “ఏముంటాయే అన్ని కబుర్లు!” అనేవారు నవ్వుతూ.  మేము ఒకళ్ల మొహం ఒకళ్లు చూసుకుని మళ్ళీ నవ్వుకునేవాళ్లం.

నేను కాపురానికొచ్చిన రెండేళ్లకి సుబ్బమ్మవదిన భర్త జ్వరంవచ్చి పోయారు.  పదోరోజు ఆవిడని చూస్తే ఏడుపొచ్చింది.  మూడునిద్రలకి ఆయనతో పాటు వచ్చినప్పుడు ఎలా ఉండేది!  ఎర్రంచు ఆకుపచ్చ పట్టుచీర, తలలో కనకంబరాలు, ఎర్రటి కుంకుమ బొట్టు, ఎర్రరాయి ముక్కుపుడక, చేతినిండా గాజులు –  పూసిన తంగేడులా!   ఇప్పుడు ఈ తెల్లని సైనుపంచె, తలమీద ముసుగు, బోసి మొహం, మెడ,  చేతులు –  ఆ సుబ్బమ్మవదినేనా అనిపించింది.   మూడో నెలలో సుబ్బమ్మవదినని, పిల్లలని మా ఇంటికి తీసుకొచ్చేసారు.  పిల్లల్ని ఇక్కడే బళ్లో చేర్పించారు.

నాకు నెల తప్పింది.  మహాలక్ష్మికి పదహారో ఏడు వచ్చింది.  ముహూర్తం చూసి మహాలక్ష్మిని కాపురానికి పంపించాము.  వెళ్లేటప్పుడు ఇద్దరం ఒకరిని ఒకరు కావలించుకుని ఒకటే ఏడుపు.  మా మామగారి అక్కయ్య “శుభమా అని పిల్ల కాపురానికి వెళ్తుంటే ఏమిటే మీ ఏడుపులు” అంటూ కోప్పడ్డారు.   మహాలక్ష్మి వెళ్లిపోయాక దాదాపు నెలరోజులపాటు ఎమీ తోచలేదు నాకు.  ఒక్కోసారి భోజనానికి మాతోబాటు మహాలక్ష్మికి కూడా విస్తరి వేసేదాన్ని.   మా అత్తగారు “ఏమిటే నీ పరధ్యానం” అని నవ్వేవారు.

పిల్లలతో కాస్త కాలక్షేపం అయ్యేది కాని, సుబ్బమ్మవదిన ఎక్కువ మాట్లాడేది కాదు.  పైగా ఆవిడకి ఈమధ్య కోపం, విసుగు ఎక్కువయ్యాయి.  ఎప్పుడూ ఎదో విషయం మీద విసుక్కుంటూనే ఉండేది, నన్నే కాదు అందరినీ!  నేను మాత్రం తిరిగి సమాధానం చెప్పేదాన్ని కాదు.  నాకన్న బాగా పెద్దది, పైగా కష్టంలో ఉంది!  మా అత్తగారు “ఏదో పిల్లలతో లక్షణంగా కాపురం చేసుకుంటోందనుకుంటే, ఆ భగవంతుడు చిన్న చూపు చూసాడు. ఈ యోగం పట్టింది.  దీని బతుకిలా బండలైంది.  ముప్ఫైయ్యేళ్లన్నా లేవు, ఎప్పటికి వెళ్లేను దీని జీవితం” అని బాధపడేవారు.

దసరా పండక్కి రెండు రోజుల ముందే వెళ్లి మా మామగారు మహాలక్ష్మిని తీసుకువచ్చారు.  లోపలికి వస్తూనే నన్ను కావలించుకుని “నీకోసం ఏం తెచ్చానో చూడు” అంటూ, సంపంగి పూలమాల తీసి తలలో పెట్టింది.  “అదేంటి మొత్తం నాకే పెట్టావు, నీకు లేకుండా” అన్నాను.   “మా ఇంట్లో పెద్దచెట్టు ఉంది.  నేను రోజూ పెట్టుకుంటూనే ఉన్నానులే” అంది.  “అప్పుడే అది మీ ఇల్లయిపోయిందా?” అని వేళాకోళం చేసాను.   ఆ రోజు మా కబుర్లకి అంతే లేదు.  మా అత్తగారు “పొద్దుపోయింది ఇంక పడుకో”మని కోప్పడేదాకా మా కబుర్లు సాగుతూనే ఉన్నాయి.  “ఆడపడుచు వస్తే నన్నిక పట్టించుకోవా ఏమిటి” అని ఆయన వెక్కిరించారు.  మహాలక్ష్మి ఉండగానే మా అమ్మ వచ్చి సీమంతం చేసి నన్ను పురిటికి తీసుకెళ్లింది.

నాకు మగపిల్లవాడు పుట్టాడు.  మూడోరోజు పథ్యం పెట్టిన తర్వాత మా నాన్నగారు మా మామగారికి మనవడు పుట్టాడని ఉత్తరం రాసారు.  పిల్లవాడిని చూడడానికి ఆయన కానీ, మా అత్తగారు కానీ రాలేదు.  ఎందుకో అర్థం కాలేదు.  పెద్ద దూరభారం కూడా కాదు.  మూడునాలుగు గంటల ప్రయాణం, అంతే!  మా అమ్మతో అంటే “కుదరద్దూ!” అంది.   కానీ పిల్లవాడిని చూసుకుంటే నాకెందుకో చాల గర్వంగా, ప్రపంచంలో ఎవరూ చేయలేని పని నేను చేసినట్లు, అందరూ నన్ను అభినందించాలని, అపురూపంగా చూడాలని అనిపించేది.

మూడో నెల వచ్చింది.  బారసాల నాటికి వచ్చారు ఆయన, ఒక్కరే!  మనిషి బాగా డస్సిపోయి, నల్లకప్పేసినట్లు ఉన్నారు.  మొహంలో కళే లేదు.  పిల్లవాడిని చూసిన సంతోషం ఎక్కడా కనపడలేదు.  చాలా ముభావంగా ఉన్నారు.  మా అత్తగారు, మహాలక్ష్మి వస్తారనుకున్నాను, రాలేదు.  మహాలక్ష్మి ఎందుకు రాలేదో! పురుడు వచ్చిన తర్వాత వాళ్ల అత్తగారింటికి ఉత్తరం రాయించాను కూడా!  అడుగుదామంటే  ఆయనతో ఏకాంతంగా మాట్లాడడానికి వీలు కాలేదు.  పిల్లవాడికి కనీసం ఒక గొలుసు కానీ, మురుగులు కానీ తేలేదు!  మొత్తానికి బారసాల అయిపోయింది.  ‘రామం’ అని పేరు పెట్టాము.  మంచిరోజు చూసి నన్ను, పిల్లవాడిని పంపించమని చెప్పి భోజనాలు అవుతూనే ఆయన బయలుదేరి వెళ్లిపోయారు.  అదే సంగతి మా అమ్మతో అంటే, “గొలుసు, మురుగులు చేయించటానికి డబ్బు సర్దుబాటు అవ్వద్దూ!  అంతమంది ప్రయాణం అంటే ఎంత ఖర్చు!  ఒంటిరెక్క మీద అంత సంసారం లాగడమంటే మాటలా!  అందులోనూ ఇప్పుడు సంసారం మీద సంసారం వచ్చి పడిందాయె!” అంది.  ఏమైనా, నా అనందాన్ని పంచుకోవడానికి మహాలక్ష్మి పక్కన లేకపోవడం నాకు వెలితిగానే ఉంది.

మంచిరోజు చూసి మా అమ్మ నన్ను, పిల్లవాడినీ మా అత్తగారింట్లో దింపింది.  నాకు, పిల్లవాడికి గుమ్మంలో దిస్టి తీసి మా అత్తగారు నా చేతిలోంచి పిల్లవాడిని అందుకుని లోపలికి తీసుకెళ్లారు.  లోపలి గదిలో మహాలక్ష్మి కనిపించింది తెల్ల సైనుపంచెలో!  తలమీద ముసుగుతో!  అక్కడే నిలబడిపోయాను.  నాకు పురుడు వచ్చిన పదోరోజు మహాలక్ష్మి భర్త పాము కరిచి చనిపోయాడుట!  మా అత్తగారు కళ్లుతుడుచుకుంటూ ఎమిటేమిటో చెప్తున్నారుగానీ నాకేమీ వినపడ్డంలేదు.  మా అమ్మ కూడా అయోమయంగా చూస్తోంది.  పట్టుకుచ్చులా నిగనిగలాడుతూ ఇంత బారుజడ, గలగల్లాడుతూ చేతిగాజులు, గల్లుగల్లుమంటూ కాళ్లపట్టీలు – ఏమైనాయి?  ఎన్నిరకాల జడలు వేసుకునేది!  ఎన్ని పూలు పెట్టుకునేది!  ఎన్నెన్ని రంగుల చీరెలు కట్టుకునేది!   కళకళ్లాడుతుండే మొహం, వెలుగులు చిమ్మే కళ్లు, చిరునవ్వు చిందే పెదవులు – ఏవీ?  అసలు అక్కడ ఉన్నది మహాలక్ష్మేనా?  ఈ ప్రపంచంలోని ఆనందమంతా తన స్వంతమైనట్లు ఉత్సాహంగా తుళ్ళుతూ ఉండే మహాలక్ష్మి ఇప్పుడు చైతన్యం లేకుండా తలవంచుకుని ఈ గదిలో ఒక మూల కూర్చుని ఉంది!

నేను, మహాలక్ష్మి ఒకళ్లని ఒకళ్లు పట్టుకుని ఏడుస్తూ ఎంతసేపు ఉండిపోయామో తెలీదు. మా అత్తగారు “ఇలా నువ్వు హైరాన పడతావనే నీకు కబురుచేయలేదు.  తమాయించుకో.  అసలే బాలింతరాలివి.   పిల్లవాడు ఏడుస్తున్నాడు చూడు.  లేచి పాలు పట్టు” అని నన్ను బలవంతంగా అక్కడినుంచి తీసుకెళ్లారు.

పెద్దమ్మాయి విషయంలో తట్టుకోగలిగిన మా అత్తగారు చిన్నమ్మాయి విషయంలో తట్టుకోలేకపోయారు.  ఆ దిగులుతోనే ఆర్నెల్లు తిరక్కుండా పోయారు.  మా అత్తగారు పోయినప్పుడు వచ్చిన మా అమ్మ వెళ్తూ “మీ అత్తగారు కూడా లేదు, నిన్ను కడుపులో పెట్టుకు చూసుకోవడానికి.  మీ ఆడపడుచులకు వచ్చిన కష్టం సామాన్యమైనది కాదు.  ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది.  ముఖ్యంగా మహాలక్ష్మికి.  దాన్ని ఎవ్వరు తీర్చలేరు.  ఆ బాధలో వాళ్లు ఏదైనా పరుషంగా మాట్లాడినా, నువ్వు మటుకు మాట తూలకు.  నీకు నీ పిల్లలెంతో సుబ్బమ్మ పిల్లలంతే. ఆ తేడా ఏనాడూ కలలోకి కూడా రానీయకు.  మీ మామగారు పెద్దవారు, కనిపెట్టుకుని చూసుకో తల్లీ!” అన్నది.  అది ఒక తారకమంత్రంలాగా ఎప్పటికీ నా మనసులో నిలిచిపోయింది.

సుబ్బమ్మవదినకి పగలంతా పిల్లల పనితో సరిపోయేది.  సాయంకాలాలు ఏదైనా హరికథకి కానీ, పురాణానికి కానీ ఏ పిల్లనో వెంటపెట్టుకుని వెళ్లేది.  మహాలక్ష్మి మాత్రం ఇంట్లోంచి బయటకి వచ్చేదే కాదు. ఎప్పుడూ అశాంతితో రగిలిపోతున్నట్టు ఉండేది. అంతులేని దుఃఖంతో దహించుకుపోతూ ఉండేది.  మా అత్తగారు పోయిన తర్వాత ఈ దుఃఖం మరీ ఎక్కువైంది.  నవ్వడం ఏనాడో మర్చిపోయింది.  ఎప్పుడూ పద్యాలో, పాటలో పాడుతుండే ఆ గొంతు మూగబోయింది.  రాత్రిపూట ఏడుస్తూ కూర్చునేది.  తెల్లవార్లూ తనతో పాటే కూర్చునేవాళ్లం – సుబ్బమ్మవదినకానీ, నేనుకానీ.  అద్దం చూసుకుని ఒక్కోసారి ఏడుస్తూ ఉండేది.  తనకున్న రంగురంగుల చీరలన్నీ తగలబెట్టేసింది.   తన నగలన్నీ బావిలో పడేయబోతే అడ్డుకుని, దాచేసాము.

అదివరకు ఇద్దరం ఒకే ప్రాణంలా ఉండేవాళ్లమా! ఇప్పుడు నన్ను చూస్తే అసలు గిట్టదు.  కాల్చేసే చూపులతో నావైపు చూసేది. ఎంతో ప్రేమతో చూసే ఆ కళ్లల్లో ఇప్పుడు ద్వేషం, అసహ్యం!  “నాకు చిన్నది చాలు వదినా” అని తను చిన్నపూలమాల పెట్టుకుని, పెద్దమాల నా జడలో పెట్టే మహాలక్ష్మి – ఇప్పుడు నేను పూలమాల కట్టుకుంటే పూలన్నీ తుంపి పోస్తుంది!  “ఈ రంగు నీకు బావుంటుంది వదినా” అని నాకోసం చీరలు ఏరే మహాలక్ష్మి – ఇప్పుడు నేను కొత్తచీర కట్టుకుంటే, దానికి కాటుక మరకో, సిరా మరకో పూస్తుంది!  ఎప్పుడైనా కొఱ్ఱుపట్టిన చీర కట్టుకుంటే అది మార్చుకునేవరకూ గొడవచేసే మహాలక్ష్మి – ఇప్పుడు నా చీరలన్నిటికీ చిల్లులు పెట్టింది!  “మనిద్దరం ఇలా పొద్దుపోయేవరకూ కబుర్లు చెప్పుకుంటూంటే అన్నయ్య తిట్టుకుంటాడు వదినా” అని వేళాకోళం చేసే మహాలక్ష్మి – ఇప్పుడు రాత్రిపూట మా పడకగది కిటికీలోంచి తొంగి చూస్తుంది!  నా సీమంతానికి పూలజడ వేసి, సీతమ్మవారి సీమంతం పాట పాడిన మహాలక్ష్మి – ఇప్పుడు రామాన్ని చూసి మొహం తిప్పుకుంటుంది; దగ్గరకు వెళ్తే తోసేస్తుంది!  తనని చూస్తే  “కమలములు నీట బాసిన … ” [*] పద్యం గుర్తు వచ్చేది.

ఒకరోజు సుబ్బమ్మవదిన కూతురు జయ, తెలిసినవాళ్ల దొడ్లోంచి సంపంగిపూలు తెచ్చుకుంది.  మాల కడదామని వచ్చి చూద్దును కదా, మహాలక్ష్మి రేకులని ఒక్కక్కటిగా తుంపి నేలపై పోస్తోంది.  పసిపిల్ల తెచ్చుకున్న పూలు పాడుచేసిందని కోపంగా “ఏం పని ఇది వదినా!” అని అనబోయి, తన మొహం చూసి ఆగిపోయాను.  ఆ కళ్లల్లో అనంతమైన దుఃఖం!  ఆ దుఃఖం  పోగొట్టడానికి ప్రాణాలైనా ఇవ్వాలనిపించింది ఆ క్షణంలో.  మా అమ్మ అన్నట్టు ఆ దుఃఖం ఏనాటికైనా తీరేదా? ఎవరైనా తీర్చగలిగేదా?

జయ పెళ్లి కుదిరింది.  పెళ్లి హడావిడి ఉన్నన్ని రోజులు మహాలక్ష్మి మాత్రం ఇవతలికి రాలేదు. మా పెళ్లిలో ఎన్నో పాటలు పాడింది.  స్నాతకం పాటలు, తలంబ్రాల పాటలు, సదస్యం పాటలు, వియ్యాలవారి  పాటలు, మంగళహారతులు, పన్నీరు పాటలు, బంతులాట పాటలు, పేరుచెప్పే పాటలు, ఆఖరికి అప్పగింతల పాట కూడా మహలక్ష్మే పాడింది ఆ ఐదు రోజుల పెళ్లిలో.  ఎప్పుడూ నావెంటే ఉండేది కబుర్లు చెప్తూ.  అప్పుడు పెళ్లిపందిట్లో సందడంతా తనదే!  ఇప్పుడు కనీసం పెళ్లికొడుకునన్నా చూడలేదు!

పెళ్లి హడవిడి అయిపోయింది.  పెళ్లివారు, బంధువులు వెళ్లిపోయారు.  అందరం బాగా అలసిపోయి నిద్రపోతున్నాము.  ఒక రాత్రివేళ బావి గిలక శబ్దానికి మెలకువ వచ్చింది.  “ఆత్మహత్య మహాపాతకమని కానీ, లేదంటే ఏనాడో బావిలో దూకేదాన్ని” అన్న మహాలక్ష్మి మాటలు గుర్తుకు వచ్చి, ఉలిక్కిపడి బయటకి పరిగెత్తాను.  మహాలక్ష్మి బావిలోంచి నీళ్లు తోడుకుని చన్నీళ్ల స్నానం చేస్తోంది!  అక్కడే దొడ్డిగుమ్మంలో నిలుచుని అలా చూస్తూ ఉన్నాను.  ఎన్ని చేదలు తోడి పోసుకుందో!  ఎన్ని బావులలో నీళ్లు పోసుకుంటే ఆ హృదయంలోని మంట చల్లారుతుంది?   అంతలో వీధి వసారాలో పడుకున్న మా మామగారు లేచి వచ్చారు. నేను చటుక్కున పక్కకి తప్పుకున్నాను.  ఆయన నన్ను చూసారేమో తెలీదు.  మహాలక్ష్మి లోపలికి వచ్చింది, తలవంచుకుని.  ఎవ్వరం ఎమీ మాట్లాడలేదు.

మర్నాడు  మా మామగారు వాళ్లబ్బాయితో “నేను చిన్నమ్మాయిని తీసుకుని కొంతకాలం కాశీలో ఉందామనుకుంటున్నాను. ఏర్పాట్లు చూడు” అన్నారు.  పదిరోజుల్లో మా మామగారు, మహాలక్ష్మి కాశీకి బయలుదేరి వెళ్లిపోయారు.  కనీసం కాశీలో అన్నా మహాలక్ష్మికి మనశ్శాంతి దొరికితే బావుండునని ఆ విశ్వేశ్వరుడికి దణ్ణం పెట్టుకున్నాను.

అలా వెళ్లిన వాళ్లు ఏడాది తర్వాత తిరిగి వచ్చారు.  మహాలక్ష్మి “నీకోసం తెచ్చాను వదినా” అని పెట్టెలోంచి బెనారసు చీర, “దారిలో కనబడ్డాయి, నీకిష్టం కదా” అంటూ సంపంగిపూల పొట్లం నా చేతిలో పెట్టింది.  సంతోషంతో కావలించుకున్నాను.   నేను మడి కట్టుకుని వంట చేస్తుంటే సన్నగా పాడుతున్నట్టు మహాలక్ష్మి గొంతు వినిపించింది.  రామాన్ని ఒళ్లో కూర్చోపెట్టుకుని రామాయణం శ్లోకాలు చదువుతోంది.  నన్ను చూడగానే “నాన్న నాకు రామాయణం పాఠం చెప్తున్నారు వదినా.  అయోధ్యకాండ వరకూ అయింది” అన్నది.  ఆ కళ్లల్లో తేజస్సుకి, మొహంలో ప్రశాంతతకి అర్థం తెలిసింది.

. . .

అమ్మమ్మ చెప్పడం పూర్తి చేసింది.  అందరి మనసులూ భారమయ్యాయి.  చీకటిపడుతూంటే  లేచి లైట్ వేసాను.  “తర్వాతేమైంది?” మా అమ్మాయి అడిగింది. ” ఏముంది!  మీ అమ్మమ్మ పుట్టింది. అందరి చదువులు, పెళ్లిళ్లు అయ్యాయి. సుబ్బమ్మవదిన పిల్లల దగ్గరకు వెళ్లింది.  మా మామగారు, సుబ్బమ్మవదిన, మహాలక్ష్మి, మీ ముత్తాత – అందరూ వరసగా వెళ్లిపోయారు.  నేనొక్కదాన్నే మిగిలాను, నీ పెళ్లి చూడడం కోసం” అంటూ మునిమనవరాలిని దగ్గరకు తీసుకుని మా అమ్మమ్మ నవ్వింది.

“అందుకే చెప్తున్నాను.  విన్నావుగా! తాతమ్మ ఎన్ని కష్టాలు పడిందో! నీకింతకంటే రాజాలాంటి సంబంధం వస్తుంది. ఈ సంగతి మర్చిపో.”  మనవరాలిని కన్విన్స్ చేయటానికి యథాశక్తి ప్రయత్నిస్తోంది మా అమ్మ.

“అదే పరిస్థితి నాకొస్తే ఏం చేస్తారు అమ్మమ్మా?”  విసురుగా అంది మా అమ్మాయి.  “అపభ్రంశపు మాటలు మాట్లాడకు” అంటూ అరిచింది మా అమ్మ.

“అదలా మొండిగా మాట్లాడుతుంటే నువ్వలా చూస్తూ ఊరుకుంటావేమిటే?  ఇదిలాగే వాళ్ల నాన్న కూడా దగ్గర వాగుతుందేమో?  అసలే ఇది తాన అంటే ఆయన తందానా అంటాడు” అంటూ నా వైపు చూసింది అమ్మ.

నిజమే!  దానికి నాకన్నా వాళ్ల నాన్న దగ్గర చనువు ఎక్కువ.  దీని మాటలు చూస్తుంటే ఇది ఆ కుటుంబంతో చాలా అటాచ్‌మెంట్ పెంచుకున్నట్టుంది.  పోనీ, ఇన్‌ఫాచ్యుయేషన్ అనుకుందామా అంటే ఇదేమీ టీనేజ్‌లో లేదు, ఇరవైనాలుగేళ్ల పిల్ల, పైగా ఎం.డి. చేస్తోంది.  నేనెటూ తేల్చుకోలేకుండా ఉన్నాను.  అంత ఇష్టంగానూ లేదు, అలా అని దాని అభిప్రాయానికి విరుధ్ధంగా వెళ్లాలనీ లేదు.  డెసిషన్ దానికీ, వాళ్ల నాన్నకీ వదిలిపెట్టాలనుకున్నాను.

ఇంక తట్టుకోలేక మా అమ్మ “నువ్వన్నా చెప్పమ్మా! నువ్వు పడ్డ కష్టాలన్నీ అది కూడా పడాలా?” అంది మా అమ్మమ్మతో.

“నేనేం కష్టాలు పడ్డానే?  కష్టాలు, బాధలు అన్నీ సుబ్బమ్మవదినవీ, మహాలక్ష్మివీ!  నావి చిన్న చిన్న ఇబ్బందులే.  అయినా వాళ్లేమన్నా పరాయివాళ్లా?”  అంది అమ్మమ్మ.  మా అమ్మమ్మ ఎప్పటికైనా నా అలోచనలకి అందుతుందా!

న్యూక్లియర్ ఫామిలీస్ వచ్చాక కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అన్న ఆలోచనకి అలవాటుపడిపోయింది మా తరం.   అటు పుట్టింటివాళ్లనీ, ఇటు అత్తగారింటివాళ్లనీ కూడా తన కుటుంబంలో భాగంగా చూసి, వాళ్ల కష్ట సుఖాలని తనవిగా భావించే మా అమ్మమ్మ తరంలోని సంస్కారం తిరిగి మా అమ్మాయి తరంలో ప్రవేశిస్తోందా!

“మీ నాన్నని ఊరునించి రానీయమ్మా మాట్లాడుదాము.  అన్నీ కుదరాలి కదా!” అంటోంది మా అమ్మమ్మ.  “థాంక్స్ తాతమ్మా!” అంటూ మా అమ్మాయి వాళ్ల తాతమ్మని కావలించుకుంది.

***

 

[*]  – కమలములు నీట బాసిన,  కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్,  దమ దమ నెలవులు తప్పిన,  దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

వాన

artwork: srujan raj

artwork: srujan raj

-శైలజా చందు 
~
 sailaja  వినత వస్తానన్నది. ఆ కబురు అతనిలో ఆనందాన్నినింపింది.  ఆమె మెయిల్ అందుకున్న రోజంతా  ఉండి ఉండి పెదవులమీదకు చిరునవ్వొస్తూ ఉంది. ఆపుకోలేనంత సంతోషంగుండెలనిండా నిండి, అది పెదవులవరకూ పాకుతోంది.
దాదాపు రెండేళ్ళవుతోంది తనని చూసి.   మొట్టమొదటి సారి కలుసుకోబోతున్నట్లు అనిపిస్తోంది . దేవ్ కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు. మధ్యాహ్నం నాలుగింటికేచీకటిపడుతున్నట్లనిపిస్తే ,  ఆకాశం వంక చూశాడు  వాన వచ్చేట్టు మబ్బు పట్టి ఉంది. కాసేపట్లో జడివాన కురుస్తుందని తెలుస్తోంది . కిటికీ బయట చెట్టు చినుకు కోసం ఎదురుచూస్తున్నట్టు ఆనందంగా ఊగిపోతోంది.
 ఇల్లంతా సర్ది ఉంచాడు. చికెన్ కూర వండాడు. అందులో ఆలూ ముక్కలు వినతకు ఇష్టం.
“దేవ్ , హాస్టల్ లో కుక్ కు  నువ్వు చేసినట్టు కుదరదు. బాగా మెత్తగా అయినా అయిపోతాయి. లేకపోతే గట్టిగా అయినా ఉంటాయి.”  అనేది కిచెన్ లో ప్లాట్ ఫాం మీద కూర్చుని.
ఆలూ ముక్కల్ని సంతృప్తిగా కదిపాడు.
భోజనం హాట్ బాక్స్ లో సర్దాడు.
హాల్లోకి వచ్చి కిటికీ దగ్గర నుంచున్నాడు.   కిటికీ బయట చెట్టు ,వర్షంలో తడుస్తూ పులకరించి పోతోంది. ఆమె కూడా, రావడం లో తుఫానుకు తక్కువేం కాదు.
 ఆమెకు ఎంతో మంది స్నేహితులు. ఎప్పుడూ అతను నిద్రపోయిన తర్వాతే ఇంటికి చేరుకునేది.  డూప్లికేట్ కీ తో తలుపు తీసి, మెల్లగా లోపలికి వచ్చి, సోఫాలో నిద్రపోతున్న అతన్ని సర్ప్రైజ్ చేసేది. ఆ బరువు, ఆ తియ్యని నారింజతొనల పరిమళం,  రుచి … ఊపిరాడడం లేదని చెప్పాలనిపించినా , వదలలేనంత ఇష్టంగా, సుఖంగా ఉండేవి. రాత్రి మూడో ,నాలుగోఅయ్యాక , అలసిపోయి సోఫాలో నిద్రపోయేది. అతను కాసేపు తన రీసెర్చ్ పని చేసుకుని ,ఇంటిపనులు కూడా పూర్తి చేసేవాడు. ఆమె లేచేసరికి పక్కనే టేబుల్ మీద  ఒక చీటీ ఉండేది.ఆమెకోసం వండిన వంట వివరాలు.
ఆమె వెళ్ళిపోయిన తర్వాత అతనెప్పుడూ ఆ సోఫాలో నిద్రపోలేదు. అదంటే గౌరవం, అదంటే ప్రేమ. ఆ సోఫాలో ఇద్దరూ మౌనంగా చెప్పుకున్న కబుర్లు, పంచుకున్న రుచులు.  వాటినిచెదరగొట్టడం ఇష్టం లేక. వాన విసురుగా వచ్చి అతన్ని తడిపెయ్యాలని గ్లాస్ విండోను తాకుతోంది. ఏవేవో జ్ఞాపకాలు మాత్రం జడివానలా తడిపేస్తున్నాయి.
******
యూనివర్సిటీలో అతను మెరిట్ విద్యార్థి. ప్రతి సబ్జెక్ట్ లోనూ గోల్డ్ మెడల్స్. అమ్మాయిలంతా అందమైన వాడని , అందుకే ఎవరివంకా చూడడనీ అనుకునేవాళ్ళు . వినత దగ్గరయేవరకూఅతనికి ఆడపిల్లలతో స్నేహం తెలియదు.
వినత తనంతట తనే వచ్చి పరిచయం పెంచుకుంది.
ఎన్నో కబుర్లు చెప్పేది.  అతని రూం లోనే పడినిద్రపోయేది. ఆమెకు ఇష్టమైన వంట చేసిపెట్టేవాడు.
“అందగాడివనీ యూనివర్సిటీలో అమ్మాయిలందరికీ నువ్వంటే క్రేజ్ తెలుసా? “
“నీతో పరిచయం చేసుకోవడం ఎంత కష్టమో అన్నారు మా హాస్టల్ గర్ల్స్. “
“పందెం కట్టాము. చివరకు నేనే గెలిచాను.”
“నీతో స్నేహం చేస్తున్నానని ఒకటే కుళ్ళుపడుతున్నారు.”
 అన్నీ చిరునవ్వుతో విన్నాడు.
“ నీ ఫ్లాట్ కు వచ్చాననీ, నువ్వు చికెన్ వండితే తిన్నానని చెప్తే నమ్మడం లేదు.”
“వచ్చే ఆదివారం వాళ్ళను కూడా పిలువు.”
ఆమాటకు అలిగి కూర్చుంది. అతను తనొక్కడికే దక్కాలంది. ఎర్రెర్రని బుగ్గలవెంట  కారిపోతున్న కన్నీళ్ళు చూడలేక చేత్తో తుడవబోయాడు. ఆ చేయి అలాగే పట్టుకుంది. దగ్గరైంది. పెళ్ళిచేసుకుందామంది.
వృత్తి  లోనే ఎక్కువ సంతోషం ఉంటుందని  చెప్పాడు.
తెలుసంది.
ఆమెతో ఎక్కువ సమయం గడపలేనేమోనన్నాడు.
ఫర్వాలేదంది.
కుదరదని ఆమెతో చెప్పలేక టైం కావాలన్నాడు.
 రీసెర్చ్ పనిలో అతని పగలూ రాత్రీ తెలిసేదికాదు.   డిపార్ట్ మెంట్ చీఫ్ గా అతనికి అవకాశం వచ్చినా వద్దన్నాడు. డిపార్ట్ మెంట్ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెడితే, తన రీసెర్చ్కు అడ్డొస్తుందని.  రీసెర్చ్ సైంటిస్ట్ గానే ఉండిపోతానన్నాడు. అందరూ అతన్ని పిచ్చివాడన్నారు.  అనుభవం తక్కువైనా సరే, అతని స్నేహితుడు హెడ్ గా ప్రమోట్ చెయ్యబడ్డాడు.
అతని మంచిచెడ్డలు చూసేది కూడా ఆ స్నేహితుడే. ఓ రోజు అతనొచ్చాడు.
“దేవ్, నీతో ఒక విషయం మాట్లాడాలి.”
“నీ మీద అందరికీ  ఒక మంచి అభిప్రాయం ఉంది.”  కాసేపాగి, “ఆమె నీ ఫ్లాట్ కు రావడం, ఉండిపోవడం….  అది ..కొంచం..బాగా… లేదు. కానీ, ఇది నా అభిప్రాయం కాదు దేవ్” ఎలాచెప్పాలో తెలియక మిత్రుడు తడబడ్డాడు.
స్నేహితుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో..  అతనికి అర్థమైంది.
“రావద్దని ఎలా చెప్పను.”
“పోనీ రమ్మనే చెప్పు.. దేవ్”
 అర్థం కానట్టు చూశాడు.
“దేవ్…నీ జీవితం లోకి రమ్మను. ఎన్నాళ్ళుంటావిలా.” అన్నాడు మిత్రుడు చిరునవ్వుతో.
ఆ తర్వాత మూడువారాలకు అతని మిత్రుడైన చీఫ్ చేతులమీదగా పెళ్ళి అయింది.
ఆ మర్నాడు , అతని చేతుల్లో ఒదిగిపోతూ ‘కనిపించినంత బుద్ధిమంతుడివి కాదని’ చెప్పింది సిగ్గుపడుతూ.
ఆ మాట చెప్తూ ఆమె చూసిన చూపుకు, అతనికి తెలియని మత్తు కమ్మేసింది. అంతకు మునుపెన్నడూ ఎరగని గర్వమేదో తలకెక్కింది.  ఏ గోల్డ్ మెడల్ ఇవ్వలేనంత గర్వం.
ప్రతిసారీ, ఆమెను ఓడించి సంతోషపెట్టేవాడు. ఇంటిపనులేం రావు ఆమెకు. నిద్రపోయిందంటే పిడుగులు పడినా లేవని పసితనపు నిద్ర. ఆమె నిద్ర చెడగొట్టకుండా ఇంటిపనంతా చేసేవాడు.

 

       అతను పనిచేసే యూనివర్సిటీ చుట్టుపక్కల ,  ఎక్కువగా పశువుల మీద ఆధారపడి బతికే గ్రామాలున్నాయి. కొంతకాలం నుండీ పశువులకు జబ్బు వచ్చి త్వరత్వరగాచనిపోతుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది.  పరీక్షల కోసం రక్తపు శాంపిల్స్ వేరే ఊరికి పంపి  ఆ ఫలితాలకోసం ఎదురుచూసే సమయానికి జబ్బు బారిన పడ్డ పశువులుచనిపోతుండేవి.  పోనీ అన్ని పశువులకూ ఇవ్వాలంటే,  మందు చాలా ఖరీదెక్కువ. ఆ వ్యాధి విషయం లో పరిశోధన  కోసమని ప్రభుత్వం అతన్ని ప్రత్యేకంగా నియమించింది.
  అదే సమయంలో  ఆమెకు వేరే దేశంలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడి ఉద్యోగం వదిలి తనతో రమ్మంది. అక్కడకు వెళ్ళాక అతను కూడా పని వెతుక్కోవచ్చని చెప్పింది. అతనురాలేనన్నాడు. కోపంతో వెళ్ళింది.  కొన్నాళ్ళవరకు ఫోన్లో కోపంతోనే మాట్లాడేది. కొన్నాళ్ళ తర్వాత ఆమె కోపం తెలిసేదికాదు.  ఎందుకంటే ఫోన్ కు జవాబివ్వడం మానేసింది.
అతను తన పరిశోధనల్లో మునిగిపోయాడు.
కొన్ని నెలల  తర్వాత ,  పది నిముషాల్లోనే  వ్యాధి నిర్థారణ చెయ్యగల పరీక్ష కనుకున్నాడు అది కూడా అతి తక్కువ ఖర్చులో. ఆ పరిశోధన వలన ఎన్నో పశువులు రక్షింపబడ్డాయి.ఎంతో ఖర్చు తగ్గింది. అతను చేసిన పరిశోధనకు ఆ సంవత్సరం ఉత్తమ పరిశోధనగా ప్రభుత్వం అవార్డ్ ప్రకటించింది.
ఆ  తర్వాత రోజు యూనివర్సిటీ తరఫునుండి అతనికి సన్మానం జరగనుంది. ఆమెకు మెయిల్ లో తెలియపరచి , వీలైతే రమ్మన్నాడు.
విషయం విన్న తర్వాత అభినందనలు చెప్తూ , తను వస్తున్నట్టు అతనికి జవాబిచ్చింది.
Kadha-Saranga-2-300x268
*********
మెసేజ్ వచ్చిన శబ్దంతో ఫోన్ తీసి చూశాడు.
ఫ్లైట్ రావడం లేటైందనీ, తను ఎయిర్ పోర్ట్ నుండి డైరెక్ట్ గా యూనివర్సిటీకు వస్తానని, తనకోసం చూడకుండా అతన్ని ఫంక్షన్ కు వెళ్ళమని మెసేజ్ ఇచ్చింది.
స్టేజ్ మీద కూర్చున్న తర్వాత ఆమెకోసమే వెతుకుతున్నాడు. ఎవరెవరో వచ్చి అతని గురించి ఏవేవో మంచిమాటలు చెప్తున్నాడు. మనసులో గుబులు , అలజడి తుఫానులా కమ్ముకున్నాయి.  ఆమెను కలుసుకోబోయే క్షణాలు అందరిమధ్యా కాకుండా వంటరిగా అయితే బాగుండనిపించింది. ఎప్పటికో గులాబిరంగు చీరలో ఆమె కనిపించింది. గుండెల్లో ముసురుకమ్మిన గుబులంతటినీ తుడిచేసింది, ఆమె చిరునవ్వు.
ఆమె వైపు చూసిన చూపులో తన ప్రేమనంతా నింపాడు.  ఆమెకు మాత్రమే అర్థమయేట్లు ఆ నిశ్శబ్ద సంభాషణలో గుండెలోని ప్రేమంతా తెలియజేశాడు.  తెలియజేసిన తర్వాత గుండె బరువు తగ్గుతుందని అనుకున్నాడు కానీ,  ఆమె పట్ల రెట్టింపు ప్రేమతో మరింత బరువెక్కింది.
ఇద్దరూ ఇంటికి వెళ్ళే టైం కు బాగా రాత్రయింది. యూనివర్సిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన విందులో ఇద్దరూ ఏమీ తినలేకపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇష్టమైనవి తినిపించాడు.  ఆమె నోటికందించే ప్రతి ముద్దలోనూ, ప్రేమ కలిపి ముద్దు చేశాడు.
ఎన్నో రోజుల తర్వాత సోఫా కు బరువు తెలిసింది.
**********
ఆ తర్వాతిరోజు యూనివర్సిటీ కు సెలవు. అతను ఇంట్లోనే ఉన్నాడు.  ఎక్కువ రోజులుండడం కుదరదనీ , ఒక విషయం లో అతన్ని అభ్యర్థించడానికి వచ్చానని , అతను సరే అంటే త్వరగా వెళ్ళిపోవాలని చెప్పింది ఆమె.
ఆమెకేం కావాలో అడగమన్నాడు.
“మరి నేనేం అడిగినా ఇచ్చేయాలి.”  గారాంగా
తలవంచి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, చెంప మీద చిన్న గా తట్టాడు. డన్ అన్నట్టు.
“తర్వాత కాదనకూడదు.”

కళ్ళతోనే  భరోసా ఇచ్చాడు.artwork: srujan raj

“దేవ్…నువ్వు మంచివాడివే. నాకే కష్టమూ కలిగించవు. ఏదడిగినా తీరుస్తావు.”  అతని వళ్ళో కూర్చుని చెప్తూ …చెప్తూ లేచి, సోఫా అంచున కూర్చుంది. “ఒట్టి ప్రొఫెషన్ తప్ప నీకింకోలోకం తెలియదు. పార్టీలకు రావు. ఎవరితోనూ కలవలేవు. నాప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళలేను. నీ లోకం లోకి అడుగుపెట్టలేను.”
“………”
“నీ దగ్గర నేను సుఖంగా లేనని చెప్పలేను. కానీ ఎన్నాళ్ళుండగలవు. రేపు ఇద్దరికీ వయసైపోతుంది. అప్పుడు ఎంత బోర్ కొడుతుంది? నువ్వెప్పుడూ నీ ఉద్యోగం లో గడిపెయ్యగలవు.నాకో..ఎలా గడపాలి నేను?”
అతను  మాట్లాడకుండా ఆమె వంకే చూస్తున్నాడు.
“నాకు తెలుసు నువ్వెంత మంచోడివో..ఏం చెయ్యను చెప్పు . జీవితమంతా స్వీట్లే తిని బతకలేంకదా..వెగటనిపిస్తుంది.  లైఫంతా బోర్ గా గడపలేను కదా?”
 అతనికి అర్థమయ్యేందుకు చెప్పుకు పోతోంది.
“ఏం కావాలో చెప్పు?” అడిగాడు.
“ఒకవేళ నేనడిగేది నీకిష్టం లేకపోతే?”
“నా ఇష్టం తో పనిలేదు. నాకు వీలైనదేదైనా సరే చేస్తాను.”
“డివోర్స్ ఇవ్వు దేవ్.”
ఆమె అడిగింది, అతను ఊహించాననుకున్నాడో, తన ఊహకే అందనిదో అతనికి వెంటనే అర్థం కాలేదు.
“నువ్వంటే ఇష్టం లేక అడగడం లేదు దేవ్. అదొక్కటే అర్థం చేసుకో” అంది.
అతను మౌనంగా ఉండడం చూసి “ఒట్టేశావు. కాదనన్నావు.”
“ఇప్పుడుమాత్రం కాదన్నానా? “ చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించాడు.
గుండె తొణకలేదు. కానీ పెదవి వణికింది. చిరునవ్వుతో కప్పేశాడు.
ఆ సాయంత్రం ఆమె వెళ్ళిపోయింది. వర్షం కురుస్తూనే ఉంది.
ఆ రాత్రి హాల్లో పడుకోలేకపోయాడు. ఆ సోఫా నిండా ఎన్నో జ్ఞాపకాలు. లోపల అంతా ఖాళీగా ఉంది. నింపడానికేం లేదు. ఎన్నో సువాసనలు, మరచిపోలేని గత జన్మల వాసనలు. అవన్నీచుట్టుముట్టి దాడి చేస్తున్నాయి.  బెడ్ రూం లో కెళ్ళి మునగదీసుకుని పడుకున్నాడు. ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.   పెడచెవిన పెట్టాడు. పక్కనే ఉన్న మంచినీళ్ళు తాగాడు.
“బాధగా ఉందా?” లోపల్నుండి ఎవరో అడిగారు. సమాధానం చెప్పలేదు. నిద్రపోదామన్న ఆలోచనకూడా లేదు. కళ్ళుమూసుకున్నాడు. ఎప్పుడో ఒక రాత్రివేళ నిద్రపట్టింది. మరోఅరగంటకే నిజం చెళ్ళుమన్నట్టు లేపేసింది.  సగం నిద్ర , సగం మెలకువతో  నాలుగింటికి వరకు గడిపాడు.  తెల్లవారాక లేచి, స్నానం చేసి ఎప్పట్లా కాలేజికి రెడీ అయ్యాడు.
బయటికి వెళ్తూ వెళ్తూ, సోఫా వంక చూశాడు. గుండె బరువు మరింత పెరిగింది. కాలివేళ్ళలో ఒక వేలు ఇంకాలోపల ఉండగానే డోర్ లాగాడు.
తాళం లోపలే ఉందేమో తెలియదు.
 మెట్లు దిగి వెళ్తుంటే ఎదురు ఫ్లాట్ లో  ఉండే  ఆస్మా ఎదురుపడి “ ఎలా ఉన్నారు?” అంటూ పలకరించింది.
అతను మాట్లాడకుండా వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసింది. మెట్లమీద చితికిన వేలినుండి రక్తపు మరకలు. “ఆగండి భాయి సాబ్, కట్టుకడతాను” అంటూ లోపలికి వెళ్ళింది. బయటికి వచ్చిచూస్తే అతను దూరంగా వెళ్ళిపోతున్నాడు.
కాంపస్ లో  గుబురుగా ఉన్న పసుపు పూల చెట్ల మధ్య దారిలో నడుస్తున్నాడు. దారినిండా రాలిన పూలు, ఆకులు. తడి తడిగా ఉన్న సిమెంట్ కాలిబాట. తలొంచుకుని నడిచాడు.  ఛీఫ్గదిలోకి వెళ్ళాడు.
కొన్ని రోజులు సెలవు కావాలన్నాడు.
రెండేళ్ళ తర్వాత, ఆమె వచ్చిందని  ఛీఫ్ కి తెలుసు . స్నేహితుణ్ణి ఆట పట్టించేలా ఏదో కొంటె జోక్ వెయ్యబోయి ,
అతని వాలకం చూసి ఆగాడు.
“నువ్వు  మామూలుగానే ఉన్నావా దేవ్? ఆరోగ్యం బాగానే ఉందికదా” అన్నాడు.
బాగానే ఉందన్నట్టు తలూపాడు.
“నీకు కావలసినన్ని రోజులు తీసుకో..ఫర్వాలేదు.”
 బయటకు వెళ్ళేప్పుడు చూశాడు  అతని కాలికి చెప్పులు లేవని.
కార్ పార్క్ లో ఉన్న కార్ తీశాడు. కొండవేపు పోనిచ్చాడు. వాగుకు కొద్ది దూరంలో ఆపి , నడుచుకుంటూ వాగు దగ్గరకు నడిచాడు. ఫ్లాట్ నుండి చూస్తే  చిన్నగా ఉండే వాగు, దగ్గరగాచూస్తే చాలా పెద్దదిగా ఉంది.
కొద్ది దూరంలో తెల్లని గులకరాళ్ళు. శుభ్రమైన గులకరాళ్ళు. వాటిమీద కూర్చున్నాడు.
గుండెనిండా నల్లని మేఘాలు .
మేఘం వర్షించేట్లున్నాయి
 ఎక్కడినుండో ఒక చినుకు.
 వానచినుకు రాలి అతనిమీద పడింది.
అగ్నిలాంటి అశ్రుకణమొకటి జారింది. ఘనీభవించిన గుండెకరిగింది.  చినుకులు పెద్దవై వాగులో కలిసిపోతున్నాయి. .
వాగు విపరీతమైన వేగంగా పారుతోంది.  ఆలోచనలు ఎప్పుడూ లేనంత వేగంగా పరిగెడుతున్నాయి. వ్యర్థమైన పరుగు. ఎక్కడికో తెలియని పరుగు. లక్ష్యం లేని ఆలోచనలు. తన జీవితంఎటువెళ్ళాలి.  ఆమెను కోల్పోయిన తర్వాత ఒక బలమైన కోరిక కలిగింది . ఆమెను సుడిగాలిలా చుట్టుకోవాలనీ, మనసులో ప్రేమంతటితో ఆమెను కప్పేయాలనీ.
మెల్లగా వాగు పెద్దదవుతోంది. నీళ్ళు అతనికిందకు వస్తున్నాయి. అతని కారు తాళం , విప్పి పక్కన పెట్టిన కోటు నీళ్ళకు రెండూ కొట్టుకు పోతున్నాయి. అతనికి లేవాలనిపించలేదు.
స్నేహితుడు సమయానికి రాకపోతే అతనుకూడా ప్రవాహంలో భాగమై ఉండేవాడు.
కాసేపటికి  వర్షం తగ్గింది. నీళ్ళు తేటపడ్డాయి. వాగు ప్రవహిస్తూనే ఉంది.   దూరంగా పశువులు తిరుగుతూ పచ్చిక మేస్తున్నాయి. ఆకాశం నీలంగా ప్రకాశంగా ఉంది.
*****
“దేవ్, నీతో ఒక విషయం చెప్పాలి.”
…….

వినత నిన్న మెయిల్ ఇచ్చింది.

artwork: srujan raj

artwork: srujan raj

పేరు వినగానే  గుండె బరువెక్కి కళ్ళలోకి దూకబోయింది.
తమాయించుకుని  ఏమిటన్నట్టు చూశాడు.
“ఈ సంవత్సరపు రీసెర్చ్ అవార్డ్ కోసమని వచ్చిన అప్లై చేసిన వాళ్ళలో వాళ్ళబ్బాయి కూడా ఉన్నాడట. నేనొక్కణ్ణే ఇచ్చేది కాదుగదా, నువ్వూ సంతకం పెట్టాలని చెప్పాను. సో…నీకోసారి చెప్పమంది.”
పేరు , వివరాలు ఉన్న పేపర్ అతని ముందుంచాడు.
“ఆ అవార్డ్ ఎవరికివ్వాలో ఇదివరకే నిర్ణయమైపోయింది కదా?”
“నువ్వు తప్పకుండా హెల్ప్ చేస్తావనే ఉద్దేశంతో ఉంది వినత ఈ పని తప్పకుండా అయిపోతుందనే అనుకుంటోంది.  పేరు మార్చడానికి నాకైతే ఏ  అభ్యంతరం లేదు దేవ్. నువ్వుకూడాఎప్రూవ్ చేస్తే….”
“అలా ఎలా?  నచ్చిన వాళ్ళకివ్వడానికి, ఇదేమీ మన స్వంతం కాదు “
“వినత నిన్ను కాదన్నదని పగ తీర్చుకుంటున్నావా దేవ్?”
స్నేహితుడివంక మౌనంగా చూశాడు.
ఒక్కోసారి మాటలు పలకలేనంత పరుషంగా మౌనం మాట్లాడుతుంది.
“సారీ దేవ్.  సరే తనతో నీ నిర్ణయం చెప్తాను.”
*****
రెండు రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసింది.
“దేవ్. ఇన్నాళ్ళూ చెప్పకూడదని అనుకున్నాను.  నీకు సంబంధం లేకుండా పెంచాలని అనుకున్నాను. ఈ చిన్నపని చేసిపెట్టు.”
చాలా సేపు మౌనంగా ఉన్న తర్వాత , కష్టం మీద పలికింది ఆమె గొంతు.
“నువ్వేం పరాయివాళ్ళకు చెయ్యడం లేదు. వాడు నీ బిడ్డే…”
ఎప్పుడో మరచిపోయిన గుండె బరువు మళ్ళీ తెలిసింది. నొప్పిగా అనిపించింది.
ఎంతోసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు.
చప్పుడు వినిపిస్తే బయటకు చూశాడు. జడివాన మొదలైంది. తెరిచి ఉన్న  కిటికీనుండి లోపలికి జల్లు పడుతోంది. టేబిల్ మీదున్న ముఖ్యమైన కాగితాలు తడుస్తాయని లేచి కిటికీ తలుపులు మూసేశాడు.
అప్పటికింకా ఆఫీసులోనే  ఉన్నాడతను. ఆమె చెప్పిన పేరు మీద ఉన్న అప్లికేషన్ మీద క్లిక్ చేసి  ఫోటో చూశాడు.
మసకబారిన  పెళ్ళినాటి ఫోటో గుర్తుకొచ్చింది.  అలాగే చూస్తూ ఉంటే మరింత మసకబారింది.
“ వాడెంతో కష్టపడ్డాడు. ఎన్నో ఆశలు  పెట్టుకున్నాడు .”
“అర్హత కలిగిన వారు వేరే ఉన్నారు. వారికి అన్యాయం చెయ్యలేను.”
“ అవార్డ్ రాకపోతే చాలా  బాధపడతాడు. నామీద కోపంతో… ”
 ఆమెను ఆపేశాడు.
“నాకు నీపట్ల కోపం లేదు, ప్రేమ తప్ప.”
“ ఉంటే,  ఈ చిన్న విషయానికి నో చెప్తావా? ”
“ఇది చేస్తేనే ప్రేమ. లేకపోతే కాదు.. ఇలా ఈక్వేషన్స్ లో ఇమిడేదాన్ని ప్రేమంటారా?”
“పోనీ నువ్వే చెప్పు, ఏమంటారో?”
“తనకు నేనెవరినో తెలుసా?”
“తండ్రి ఉన్నాడని తెలుసు కానీ, అది నువ్వని తెలియదు.”
“చెప్తావా?”
“ఏమని చెప్పను. మాకోసం చిన్న పని కూడా చెయ్యలేకపోయావని చెప్పనా?”
“చేసే పనిలో ఏదీ కలపలేక ,అన్నీ పోగొట్టుకున్నానని  చెప్పు. అతనికి అర్థం అవుతుంది.”
“ఇన్నాళ్ళూ నీగురించి, వాడికి చెప్పకపోవడం తప్పనిపించేది. ఇప్పుడా ఫీలింగ్ పోయింది. థాంక్స్.”
వర్షం పడుతూనే ఉంది. బయట చెట్లు తడుస్తూ ఉన్నాయి. అతనికి ఇంటికివెళ్ళే ఉద్దేశం లేదు. అయినా బయటకు వెళ్ళి వర్షం లో నుంచున్నాడు.
********
తర్వాత రోజు యూనివర్సిటీ కు సెలవిచ్చారు. తుఫాను కారణంగా, ఆవరణలో పడిపోయిన చెట్లను కూడా తొలిగించారు.

*

కాక్ అండ్ బుల్ స్టోరీ

sidhareddi

 

చీకట్లో ఏందో మెరస్తా ఉండాది. ఏందదని నేను చూస్తా ఉండంగానే అది కొంచెం కొంచెం పెద్దదవతా దగ్గిరికి వస్తా ఉండాది. ఏందో మంటలాగుంది. మంటే. మంట పెద్దదవతా ఉండాది. ఎవురో గట్టిగా అరస్తా ఉండారు. నేను దగ్గిరికిపోతా ఉన్నాను. మంట గూడా దగ్గిరికి వస్తా ఉండాది. భోగిమంట లా ఉంది. బరికె ని అంచులో పట్టుకుని తాటాకు ని కాలస్తా ఉండాడు ఒకాయన. తాటాకు బగ్గున మండింది. మంట పదడుగులు లేసింది. చుట్టూ కూచున్న పిలకాయలు దూరంగా జరిగారు. ఎవురో పరిగెత్తుకోని వస్తా ఉండాడు.

నిప్పుల మీద పరిగెత్తుకుంటా ఎళ్ళిపోయాడు. ఇంకా చానా మంది వస్తున్నారు. నిప్పుల్ని లెక్కజేయకుండా పోతానే ఉన్నారు. నేనాడకి దూరంగా నిలబడి చూస్తా ఉండాను. మా పిల్లోడు బోగిమంటకి తాటాకులు కావాలని నన్ను అడగతా ఉన్నాడు. పీర్లు పట్టుకోని సాయిబులోళ్లు గుండాం తొక్కతా పోతున్నారు. నాకా పూసలు తెచ్చీ. చీరక్కుట్టుకుంటా అని అడగతా ఉంది మా ఆడోల్లు. చాకలోళ్ళ పిల్లోడు గొంతులో కత్తి గుచ్చుకోని అడతా ఉండాడు. విజియుడు పులేషం ఏసుకుని డ్యాన్సాడతుండాడు. గంగిరెద్దులోళ్లు ఎద్దుని పులి సుట్టూ తిప్పతా ఉండాడు. ఆడోళ్లంతా మిద్దెల మీద నిలబడి నవ్వతా చూస్తుండారు. నేను మా పిల్లోన్ని భుజం మీద ఎక్కించికోని పెద్ద బాయి చుట్టూ తిరగతా ఉండాను. మంట పెద్దదవతా ఉంది. ఎవురూ చూట్టంలే. జనాలు కాలిపోతుండారు. మంట మంట అని నేనరస్తా ఉండాను. ఎవురికీ నా మాటలు ఇనిపీటంలే. నా కాడికి పోయి భుజం తట్టి పిల్లోడ్ని తీసుకుని ఇంటికి పో అన్నా. నేను ఎనక్కి తిరిగి నా సాయి చూసుకుంటే మొహం కాలిపోయి నల్లంగా ఉంది. భయమేసి గట్టిగా కేకేసి లేచినా.
ఒకసారి లేస్తే నాకింక నిద్రపట్టదు. పండగ నెల. భలే చలి పెడ్తా ఉనింది. మేము పిలకాయలిగా ఉన్నప్పుడైతే, చేలకాడ సలిమంట యేసుకుని రాత్రంతా కుశాలుగా మాట్టాడుకుండా ఉండేవాళ్లం. మేం నిద్దరపోతే అడివి పందులొచ్చి చేలల్లో పడిపొయ్యేవి. ఇప్పుడు చేను లేదు. చేలల్లో పందులూ లేవు. పెద్ద పండగనే గానీ ఊళ్లో పండగనేదే లేదు. మా పిల్లోడు ఐదరాబాద్ లో ఏడో ఉజ్జోగం జేస్తుండాడు. పండక్కి రారా అని పోన్జేస్తే, రానూ పోనూ కర్చులెందుకన్నాడు.

నాకు నిద్దర పట్టక పీర్లచావిటి కాడికొచ్చి కూకున్నాను. అరుగు మీద పడుకోని ఆకుల్లోనుంచి సుక్కల్ని జూస్తుంటే పీర్ల పండగ గుర్తుకొచ్చింది. ఏందో ఈ ఊళ్లో పండగలనే లేకుండా పొయినై. మబ్బుల్లో సుక్కలు పీర్లకి కట్టే పూసల్లా మెరిసిపోతుండాయి. చుక్కలన్నీ పక్కపక్కన చేరి పీరుకి అంచున కుట్టే తలుకుల్లా మిలమిల్లాడతుండాయి. ఆ సుక్కలకాడ దేవుడుంటాడని చెప్పేది మాయమ్మ. ఇంకా దేవుడాడే ఉండాడో ఏడికన్నా ఎళ్లిపోయుండో? నా చిన్నప్పట్నుంచి చూస్తా ఉండా. ఆకాశం అట్టే మెరిసిపోతా ఉండాది. ఊరు మాత్రం గొడ్డుపోయింది. వానల్లేక చెరువు ఎండిపోయింది. వానలు పడుంటే ఇంకో నెల్లో కుప్పలేసుండేవాళ్లం.

నిద్రపట్టక ఇట్టా ఆలోచిస్తా ఆకాశంలోకి చూస్తా ఉన్నానా, ఎవురో గట్టిగా అరస్తా ఉన్నట్టనిపిచ్చి లేసి కూర్చున్నా. బేట్రీ లైట్ ఏసి చూశా. ఎవురూ లేరు. ఏందోలే అనుకుని పడుకున్నా. కొంచెం సేపిటికి కుమ్మరోళ్ల పిల్లోడు అటు పోతా, ఏమనా ఈడ పొడుకున్నావు? అని అడిగాడు. ఊరికే నిద్రపట్టక అన్జెప్పి, నువ్వేడికి ఈ జామున అని అడిగా. పంచాయితీ ఆఫీస్ కాడ గలభాగా ఉంటే పోతున్నా అన్నాడు. ఆ పిల్లోడు పిలవకుంటే అసలా యవ్వారం అంతా నాకు తెలియకపోను. ఊర్లో పిలకాయలకి ఏం పనిలేదు, ఏందో ఈ కొత్త గలభా అనుకున్నా. ఆడికి పొయ్యి చూస్తే గలభా పిలకాయలది కాదు- యానాది రెడ్డి ది.

అబ్బుసాయబు కొడుకు పళ్ల భాషా, యానాది రెడ్డి ని గట్టింగా పట్టుకోనుండాడు. ఏందిరా గోల అంటా నేనాడకి రాంగానే, చూడు మామా నా పాటికి నేను పొద్దున్నే దొడ్డికి పోతా వుంటే నన్ను పట్టుకోని దొంగంటున్నారా అని యానాది రెడ్డి మొదలుపెట్టిండు. రెడ్డీ ఈయన మాటల నమ్మబాకు. ఈ పెద్ద మనిషి నా కోడిపుంజుని దెంకపోతుంటే పట్టుకున్నా అన్నాడు పళ్ల భాషా.

నాకసలేం అర్థం కాలా. టైము చూస్తే రేత్రి రెండైంది. కొత్త గవర్మెంట్ వచ్చినాక గుడ్డిగా ఎలిగే ఈది లైట్లు కూడా పోయినై. అంతా చీకటిగా ఉంది. పొంగళ్లప్పుడు పిలకాయలు కొట్టుకోబొయ్యి పోలీసుల దాకా పోయింది. ఆ గొడవ లోడుకోని మళ్లీ ఎవురన్నా కొట్టుకుంటుడారేమోనని అదరా బదరా నేనాడికి పోతే – ఆడ ఇంకేందో జరగతా ఉండాది.
నేను లేచొచ్చినట్టే పరమటీది నుంచి, పాతర్ల మిట్ట కాడ్నుంచి ఒక్కొక్కరూ బ్యేట్రీ లైట్లేసుకుని వస్తా ఉండారు. వచ్చినోళ్లకళ్లా మళ్లా మళ్లా జరిగింది చెప్పలేక అరస్తా ఉండాడు పళ్ల భాషా. అసలు భాషా గాబట్టి యానాది రెడ్డి ని అంత సేపు పట్టుకున్నాడు గానీ, ఇంకోడైతేనా!

ఏందయ్యా ఈ దౌర్జన్యమా? సందకాడ ఏం తిన్నానో ఏమో ఒకటే కడుపుబ్బరగా ఉంటే, ఆపుకోలేక వంకకాడికి వచ్చి పోతుంటే ఈ భాషా నా మీద పడి దొంగా దొంగా అని అరస్తా పట్టుకునే. ఉరే, నేనేం జేసాన్రా అని గంటనుంచి అడగతా ఉంటే – కోడి కోడి అని అరస్తా ఉండాడు. ఏందీ అన్యాయం. సుబ్బాడ్డే, నువ్వన్నా చెప్పబ్బా అన్నాడు యానాది రెడ్డి.
రెడ్డా, అబద్ధాలు చెప్పబాకు. ఇంట్లో లెటిన్ కట్టుకుళ్లా. ఆడ పోకుండా వంక కాడ ఏం పని నీకు?
చీకట్లో ఎవురో అడిగారు.

నిజిమే. గవర్మెంట్ డబ్బులు కూడా ఇచ్చుళ్లా. ఇంకా వంక కాడికి ఎవురుపోతుండారు?
వానలు బడి నాలుగేళ్లయితే, అసలు వంకలో నీళ్లేడేడుండాయని?
యానాది రెడ్డి ఏం చెప్పలా.
అడగతా ఉంటే చెప్పవేందబ్బా? అసలు ఈ రేత్రి నీకు వంక దాక వచ్చే పనేముందని? – అడిగారెవరో.

యో! ఏంది మీరంతా. భలే పెద్ద మనుషుల్లా ఉన్నారే! అందరు నామీదే డౌట్ పడతుండారు? అని గట్టిగా అరస్తా భాషా ని ఇదిలించి బయట పడ్డాడు యానాది రెడ్డి. యాడికి నువ్వు పోయేది అంటా మళ్లీ యానాది రెడ్డి ని కతక్కన పట్టుకోబోయాడు భాషా. ఏడికి పోతాడు. నువ్వుండు భాషా అన్నాను.
అప్పుటికి చానా మంది పంచాయితీ ఆఫీస్ కాడికి జేరి తమాషా జూస్తుండారు. నైటాల్ట్ బస్ లో గురక పెడ్తా నిద్రపోతున్న కండక్టర్ గూడా ఈ గోలకి నిద్ర లేచి, ఏం ఊరబ్బా మీది. గంట సేపన్నా నిద్రపోనీరా? అంటా బస్ దిగాడు. మా ఊళ్లో ఇయన్నీ టైమ్ పాస్ లే సుధాకరా, నువ్వు పొడుకో – అన్నా యినకుండా వచ్చి, దుప్పటి కప్పుకుని కూచుని, ఏంది మందల అన్నాడు.
కండక్టర్ కి ఇదంతా పల్లెటూరి ఏళాకోళంగా ఉంది. ఈ టైంలో మస్తానమ్మ బంకు తెరిసుంటే టీ తాగతా చూస్తా ఉంటే భలే తమాషగా ఉంటది కదా సుబ్బాడ్డీ? అన్నాడు. ఈడ ఇంత రచ్చరచ్చవుతుంటే ఈ కండక్టర్ కి టీ గావాల్సొచ్చిందా? వీడి పాసుగాల అనుకున్నాను.

ఈ లోపల ఏందబ్బా గోల అంటా కామేశ్వరయ్య వచ్చాడు. భాషా వచ్చి చెప్పడం మొదలు పెట్టాడు.
తెల్లారితే కనుమ కదా. ఊర్లో అందరికీ కొయ్యడానికి కోళ్లు కాబళ్లే. టౌన్ కి పొయ్యి బుట్టనిండా ఫారమ్ కోళ్లను తెచ్చానా? కోళ్లకు మేతేసి సందకాడే పడుకున్నానా.మాంచి నిద్రపోతుండా. కోళ్లు కొక్కొక్కొ అని అరస్తుంటే ఏందని చూశా. ఎవురో ముసుగు కప్పుకోని, బుట్టెత్తి కోళ్లు దెంకోపోతున్నారు. ఎవుర్రా అది అని వెనకనే పరిగెత్తా. చేలల్లో పడి పరిగెడ్తా పరిగెడ్తా ఉంటే లాస్ట్ కి దొరికాడు. లైటేసి చూస్తే ఇదిగో ఈయన. యానాది రెడ్డి వైపు చూపించాడు.
ఒరేయ్ భాషా. కొట్టానంటే నీ మూతి పళ్లు రాలతాయి. నేను కోడినెత్తుకుపోతే ఆ కోడేది? ఉత్త మాటలు చెప్పబాక. నాకు మండద్ది.
నిజిమే కదా! అసలు కోడేది? చీకట్లో ఎవరో అడిగారు.
భాషా ఏం చెప్పలా.

Kadha-Saranga-2-300x268

యానాది రెడ్డి కోడి కోసమొస్తే, కోడుండాలి గదా చేతిలో. భాషా నువ్వే ఏదో కావాలని చేస్తుండావబ్బా అన్నాడు కామేశ్వరయ్య.
యో! అసలు నిన్ను పంచాయితీ చెయ్యమని ఎవురడిగింది? నేను పొద్దున్నే ఎస్సై కి ఫోన్ జేస్తా. ఆయనే వచ్చి చూసుకుంటాడు అన్నాడు భాషా.
ఏందిరే నువ్వు ఫోన్ చేసేది? నా మొబైల్ లో ఇప్పుడే ఫోన్ జేస్తా ఎస్సై కి. రానీ ఏదో ఒకటి తేల్చుకుందాం అన్నాడు యానాది రెడ్డి
పోలీసుల్దాకా ఎందుకులేబ్బా! మొన్నే వార్నింగ్ ఇచ్చి పోయిళ్లా. మళ్లీ పిలిచి దెంగుల్తినాలా? ఏదో అయిపోయింది. ఈడకి వదిలైండిలేబ్బా అని ఇద్దరి మీద పెత్తనం చెయ్యబొయ్యాడు కామేశ్వరయ్య.
జీన్స్ ప్యాంట్, పైన ఖద్దరూ ఏసుకుని ఉన్న కామేశ్వరయ్య ని చూస్తా, బస్సులో పిలకాయల్నేసుకుని తిరుగుతుంటాడు. ఎవురబ్బా ఈ పిల్లోడు? అడిగాడు కండక్టర్ సుధాకర్. ఈ ఊరోడే. రాజకీయం పిచ్చిలే. ఎమ్మెల్యే మనిషి అని చెప్పాను.

పెద్ద పెద్ద తలకాయలంతా ఈడుంటే ఈ పిల్లోడి పెత్తనం ఏంది? అన్నాడు కండక్టర్.
ఉడుకు రకతమబ్బా. ఊర్లో చదువుకున్న పిలకాయలంతా ఏడో ఉండే. ఇప్పుడీ ఊర్లో ఉన్న పిలకాయలదే రాజ్జెం.
ఎవురిది రాజ్యమైతే ఏముంది లేబ్బా. ఇరవై ఏళ్ల నుంచి వస్తా ఉండా ఈ ఊరికి? ఇప్పుటికీ తార్రోడ్డు ఏపిచ్చుకోలేకపోయేరే!
మీ ఆర్టీసీ వోళ్లు బస్సే క్యాన్సిల్ చేస్తామని చూస్తుంటే ఇప్పుడు రోడ్ ఎవరికి కావాలా? మా ఊరోళ్లకి ఏమీ వద్దబ్బా. ఇట్టా కొట్టుకుంటా చతుర్లాడుకుంటా ఉంటే చాలు.అజ్జూడు ఏమి మునిగిపోయిందని ఇంత మంది కట్టకట్టుకుని వస్తుండ్రో? అదే మొన్న వానలు పడేలా ఉంది. చెర్లో నీళ్లన్నీ పోకుండా తూము రిపేర్ చేసుకుందా పాండ్రా అని అడిగితే వచ్చిన్నా కొడుకు లేడు.
మేమిట్టా చెడీ బొడీ మాట్టాడుకుంటా ఉండాం. టైమ్ నాలుగయిపోయింది. కాలేషా భార్య వచ్చి టీ బొంకు తెరిచింది. తలా ఒక టీ తాగి అందరూ ఇంటికి పోయిండ్రు.అసలు భాషా కోడి నిజంగానే పోయిందా? పోతే అది యానాది రెడ్డే కొట్టేసిండా? కొట్టేస్తే అది ఏడ దాచి పెట్టిండు? ఈ ఇషయాలు మాత్రం ఎవురికీ అర్థం కాలా!

*****

పండగ పోయి వారమైంది. పండక్కి మా పిల్లోడు హైదరాబాద్ నుంచి అనవసరం ఖర్చని రాలా. కూతురు వైజాగ్లో అల్లుడుతో ఉండే. వద్దే అన్జెప్పినా ఇనకుండా దేవుడింటినిండా నిప్పట్లు పేర్చింది మా ఆడది. ఎవుడయ్యి తినేది? నాకేమో డాక్టర్ అట్టాంటి చెడీ బొడీ తినొద్దని చెప్పే. పక్కింటి రామిరెడ్డి పిలకాయలు కూడా పండక్కి రాలా. వాడి కొడుకులిద్దరూ మధ్యప్రదేశ్ లో ఏందో కాంట్రాక్ట్ లు చేస్తుంటారు. పిలకాయలు రాకపోతే ఏమే, నిప్పట్లు, కొబ్బిరొడలు, మనుబూలు, ఉప్పుచెక్కలు బస్ లో పెడదామని నెల్లూరికి బయల్దేరిండ్రు మా ఆడోళ్లు.

టిఫిన్ జేసి పేపర్లన్నీ ముందేసుకుని కూసుని ఉన్నానా, అయ్యోరోళ్ళ పిల్లోడు పేపర్ చదవడానికి వచ్చిండు. ఏందయ్యోరా, చాన్రోజులకి అవపడ్డావే అని అడిగా.
పండక్కి అత్తగారింటికి పొయ్యాలే. ఈ ఊళ్లో ఉన్నా ఏం లాభం, అప్పచ్చులు ఇచ్చేవాళ్లు కూడా లేకుండా పొయ్యే అన్నాడు.
అట్టనబాకు. నీకెన్ని నిప్పట్లు గావాలో చెప్పు. మా ఇంట్లో చానా ఉండాయి.
ఇప్పుడు అప్పచ్చులు ఎందుకులేగానీ, పేటలో దిగి ఒక ఆఫ్ ఎత్తుకొచ్చా. చెరువుకాడికి పోదాం పా రెడ్డా, అన్నాడు అయ్యోరోళ్ల పిల్లోడు.

అయ్యోరు నా కంటే చానా చిన్నోడు. అయినా చానా ఇషయాలు తెలిసినోడు. మందు తాగితే భలే సంగతులు చెప్తాడు. అందుకే నాకేం పెద్ద అలవాటు లేకున్నా అప్పుడప్పుడు ఆ పిల్లోడితో కూకోని మందు తాగతుంటా. మా ఆడోళ్లకి తెలిస్తే చీపరకట్ట తీసద్ది. అందుకే వాళ్లట్ట ఊళ్లోంచి పోంగానే మేము బండి స్టార్ట్ చేస్తాం.
ఇద్దరం చెరువుకట్టకాడ చెట్టుకింద కూసున్నాం. నేను లేనప్పుడు భలే గొడవలు జరిగినయంట. బస్ దిగి కొంచెం సేపు బంకు కాలేషా కాడ కూచున్నా. మొత్తం చెప్పిండు, అని చెప్తా గ్లాసుల్లో మందు పోసిండు.

ఈ అయ్యోరితో వచ్చిన గొడవేందంటే మనల్నేం మాట్టాడనీడు. అంతా వోడే. అది తెల్సిన ఇసయమే కాబట్టి నేను గమ్ముగా ఇంటా కూసున్నా.
కాలేషా చెప్పిననక నేను యానాది రెడ్డి కాడికి పొయినా. తర్వాత భాషా కాడిక్కూడా పోయినా. ఎవురి కథ వాళ్ళు చెప్పిండ్రు.యానాది రెడ్డి నాకేం తెలియదంటాడు. భాషా ఏమో నల్లపుంజు పొయింది మాత్రం నిజిమే అంటాడు. కానీ అసలు కథ వేరే. అది నేను చెప్తా ఇప్పుడు. ఇది నీకు తెలియందేం గాదు. అయినా కూడా ఇను, అని మొదులుపెట్టాడు.

అసలు భాషా ఎవురు? యానాది రెడ్డి కాడ ఒకప్పుడు ట్రాక్టర్ డ్రైవర్. ఆడ ఈడా చేను దున్నతా ఇద్దరూ ఒద్దిగ్గా బాగా డబ్బులు సంపాదిస్తా ఉంటిరి. మధ్యలో యానాది రెడ్డి కొడకు మల్లయ్య వచ్చిండు. నాయనా ట్రాక్టర్ అమ్మిపారినూకి నాకొక లారీ కొనీమని పట్టు పట్టాడా? సరే లేబ్బా చానా మంది ఓబులాపురం నుంచి నెల్లూరుకి లారీలు తిప్పతా దండిగా సంపాదిస్తున్నారని యానాది రెడ్డి కొడుక్కి ఒక లారీ కొనిచ్చాడు. సంవత్సరం రోజులు డబ్బులు గుల్లగుల్లగా రాలేటప్పటికి భాషా కి ట్రాక్టర్ చీప్ గా అమ్మేసి, పెంకుటిల్లు పీకి మిద్దె గట్టి ఎచ్చులుకి పొయ్యాడు యానాది రెడ్డి్. ఈ లోపల ఓబులాపురం సంకనాకిపోయే! లారీ అమ్మితే సగం డబ్బులు కూడా రాకపొయ్యే. ఇప్పుడు మల్లయ్య వచ్చి నా ట్రాక్టర్ నాగ్గావలని భాషా ని పోరుపెట్టిండు. ఒరే అది మీ నాయన నాకమ్మిండని చెప్పినా ఇనకుండా మల్లయ్య రెటమతంగా పోతుంటే భాషా పొయ్యి పేట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

cock1కరెస్టే అయ్యోరా. కానీ ఇదంతా ఎప్పుడిదో గోల గదా? ఆ కేసు కొట్టేసి తీర్మానం కూడా జరిగిపోయుళ్లా! ఇప్పుడు దానికీ దీనికీ ఏం సంబంధం.
ఉంది రెడ్డా. ఆడికే వస్తున్నా. అసలీ భాషా ది ఏ ఊరు? పక్కనున్న రంతాబాద్. యానాది రెడ్డి ట్రాక్టర్ కి డ్రైవర్ కావాలంటే ఆడ చికెన్ కొట్టు మూసి మన ఊరికొచ్చిండు. ఎవురో పక్కూరోడొచ్చి, సల్లంగా ట్రాక్టర్ కొట్టేసి సుఖంగా ఉన్నాడని యానాది రెడ్డి కి కడుపుమంట. అందుకే ఈ గొడవంతా. భాషా ని ఎట్టైనా ఇరకాటంలో పెట్టాలా అని యానాది రెడ్డి ప్లాన్.
అదేమో గానీ, భాషా అంటే ఊర్లో వాళ్లకి చాలామందికి కోపమేబ్బా! అప్పుడొకసారి నేను గడ్డి తోలుకోని రావాలా, బుచ్చి దాకా పోదాం రాబ్బా అంటే నేను రానన్నాడు. సరేలే అని వొదిలేశా. మొన్న ఏదో తెగులొచ్చిన కోళ్లు తెచ్చి ఊర్లో చికెన్ అమ్ముతున్నాడు తెలుసా నీకు? సరేబ్బా. భాషా ఎట్టాంటోడైనా గానీ, అసలు మనూరోళ్లకే దిక్కులేకుంటే ఏడో పక్కూరోడొచ్చి మనమీద పడి తింటుంటే ఎవురికైనా కోపం వస్తదా రాదా? అని అడిగాను.

ఎందుకు రావాలి రెడ్డా కోపం? అసలు ఈ ఊరు ఏమన్నా నీ సొంతమా? మీ నాయన రమణాడ్డి ది ఏ ఊరు? సరే ఈడే పుట్టిండు కాబట్టి ఈ ఊరే అనుకుందాం. మీ తాత రెడ్డయ్యది? ఈ ఊరా? సంగం దగ్గర కోలగట్ల గదా ఆయన పుట్టింది. వేర్లు పొయిన తర్వాత ఈ ఊరికి కాపరమొచ్చా. అప్పుడు ఈ ఊరు మీదెట్టవుద్ది. అయితే గియితే మీది కోలగట్ల అవ్వాలా. అసలు మాదే ఊరు? గంగారం. మా నాయన కి ఏం పనిలేక ఈ ఊరొచ్చాడు. మమ్మల్ని సంకనాకిపిచ్చాడు. అట్టే భాషా కూడా ఏ ఏడ్నుంచో ఈ ఊరికొచ్చా. ఇప్పుడు ఈడే బతకతుల్లా. అప్పుడు మనకి ఈ ఊరు మీద ఎంత హక్కుందో భాషా కి కూడా అంతే ఉంటుళ్లా?

ఆఖరి పెగ్ పోసిండు. ముందే చెప్పుళ్లా! మందుకొడ్తే మాట్టాడేదంతా మా అయ్యోరే అని. సరే ఏదో వాగతుండాడులే అని ఇంటా ఉండా. అయ్యోరు ఈ సారి కొంచెం డోస్ ఎక్కువేశాడు.
అసలు మనిషి చేస్తున్న తప్పేందో తెల్సా? మనోళ్ళు-పరాయోళ్లు అని చూడ్డం.హిట్లర్ అని ఒకాయనున్నాడు తెలుసా నీకు? ఏం చేసిండా ముండనాయాలు. మనోళ్లు కానోళ్లని కాల్చిపారేయమన్నాడు. సరే లక్షల మందిని సంపి పారినూకారు. ఇప్పుడు అక్కడ సమస్యలే లేవా? అసలు మనోళ్ళు ఎవురు? పరాయోళ్లు ఎవురు? సరే మీ కులపోళ్ళంతా ఒక పక్కనేమన్నా ఉన్నారా? సర్పంచ్ ఎలక్షన్లకి మీరూ మీరు తలకాయలు పగలగొట్టుకుంటిరి. మీలో మీకే పడదు. సరే మీ ఇంట్లో వాళ్లతో మీకు పడుద్దా? ఏడుగురు అన్నాదమ్ముళ్ళు వేర్లు పొయ్యిననక కూడా ఇంకా కొట్టుకుంటా ఉంటిరి. సరే. మీ ఆడోళ్లతో కూడా రోజూ గొడవే కదా నీకు? నీ కొడుకు నీ మాట ఇనకుండా ఏడో ఉండే. అన్నీ వదిలెయ్యబ్బా. కనీసం నీతో నీకన్నా పడుద్దా చెప్పు? ఎలక్షన్లో మీ ఎమ్మెల్యే క్యాండేట్ ఓడీపోయినాక ఏం ఆలోచిచ్చావు? ఒరే ఆ గెలిచిన క్యాండేట్ కి సపోర్ట్ చేసున్నా ఏదో ఒక కాంట్రాక్ట్ వచ్చుండేదని బాధపడుతున్నావా? లేదా? నేను చెప్పేదేంటంటే. – మనతో మనకే పడనప్పుడు ముందు మనది మనం కడుక్కుని గెటాన్ అయిపోవాల- అని గుక్క తిప్పుకోకుండా చెప్పి నీళ్లు కూడా కలపుకోకుండా మిగిలిన మందు అట్టే తాగేసిండు అయ్యోరు.
ఈడమ్మ బొడవ. ఎవురిదో గొడవ నామీదకొచ్చిందా? సరేలే అయ్యోరికి మందెక్కువైతే ఏం మాట్టాడుతాడో తెలియదు. ఇదేం చూశాం లే. అసలు ఫుల్ బాటిల్ ఏస్తే దేవుడి తోనే వాదిస్తాడు. తెచ్చిన ఆఫ్ బాటిల్ అయిపోయింది. మేము చిన్నంగా ఇంటికి వచ్చాం. నిద్రపోతుంటే నాకేమనిపించిందంటే అయ్యోరు చెప్పిందాంట్లో నిజిమైతే ఉంది. యానాది రెడ్డి పాపం భాషా ని అనవసరంగా గెలుకుతున్నాడు. ఈ సారి కనిపిస్తే ఆ భాషా ని ఇబ్బంది పెట్టబాకులే అని యానాది రెడ్డి కి చెప్దాం లే అనుకున్నా.

*****

అప్పుడే సెప్టెంబర్ బొయ్యి అక్టోబర్ కూడా వచ్చింది. వానలు పడినట్టే పడి ఆగిపోయ్యే. మళ్ళీ చుక్క పడలా. ఈ సారన్నా ఒక తడి నీళ్లొస్తే ఎమ్మెల్లే తో మాట్లాడి చెర్లోకి సోమశిల నీళ్లన్నా తెప్పించుకుందామంటే అది కూడా జరిగేతట్టు లేదు. మా కొడుకేమో ఇంకా ఆ ఊర్లో ఏంపనని? అంతా అమ్మిపారినూకు ఐద్రాబాద్ కి రాండి అంటాడు. పండినా పండకపోయినా చేలు ఎట్టా అమ్మేది? అమ్మినా ఇప్పుడెవురు కొనేది? ఎట్టో నాలుగు బర్రెలుంటే పాలన్నా తీసి అమ్ముకుంటా బతకతా ఉంటిమి. నెల్లూరు పొయ్యి ఏమడక్కనూకను? నువ్వు ముందు ఉజ్జోగం చేసి డబ్బులు సంపాదీ. నీకు పెళ్లి చేస్తే మేము గూడా వచ్చి నీతోనే ఉంటం అని వాడికి సమాధానం జెప్తే మాత్రం ఏం మాట్లాడడు. వాడు నాలుగేళ్లు ఇంజినీరింగని సరిగ్గా చదివకుండా ఎందుకు గాలి తిరుగుళ్లు తిరిగిండో, నాలుగేళ్ల నుంచి మాఊళ్లో ఎందుకు వానలు పట్టంలేదో – ఈ ఇసయాలు మాత్రం నాకస్సలు అర్థం కావు.

గంగమ్మ పొంగళ్ళు పెడితే వానలు పడతాయని ఎవురో పెద్దమనిషి చెబ్తే అది కూడా చేస్తిరి. ఆడ కూడా ఈ ఊరోళ్లు ఒక మాట మీదున్నారా అంటే అదీ లేదు. ఆడ కూడా తలలు పగలకొట్టుకునే దాకా తెచ్చిండ్రు. అసలు గంగమ్మ పొంగళ్లు సరిగ్గా పెట్టుంటే వానలు పడుండేయేమో! ఏమో, ఇదంతా పైన కూచుని చూస్తుండే దేవుడికే తెలియాల. ఊళ్లో వాళ్ళకి మాత్రం ఎవురికీ పనిలేక పెంచలయ్య అంగడి కాడో, బైసానోళ్ల అరుగుమీదో, సర్పంచి ఆఫీస్ కాడో, ఇయన్నీ కాకపోతే పీర్ల చావిటి కాడ కూసుని ఉత్తమాటలు చెప్పుకుంటా ఉండారు. సరే, కనీసం ఈ మజ్జెన ఏం తకరాదులు లేవు, ఊరన్నా ప్రశాంతంగా ఉందిలే అనుకున్నానా, అంతే ఆ రాత్రికి స్టార్ట్ చేసిపారినూకిండ్రు.

*****

ఎమ్మారో ఆఫీస్ లో పన్జూసుకుని, ఆరుగంటల బస్ లో సుధాకర్ తో మాట్లాడతా ఉంటే, వాక్కాడ కాలనీ దగ్గిర బస్ ఆపిందాక టైమే తెలియలా. రేప్పొద్దున్నే మళ్లీ రావాల్లేబ్బా. పని గాలేదింకా అని సుధాకర్ కి చెప్పి బస్ దిగా. దిగంగానే నాకు భలే భయమేసింది. మాలకొండ కత్తి పట్టుకుని నా కాడికే వస్తుండాడు. ఈడి కాష్టం కాలా, ఈడు నామీదకొస్తున్నాడేందని నేను కొంచెం బెదిరా. రెడ్డా ఏడికి పొయినువా? ఫోన్ జేస్తే సిచాఫ్ వస్తుంది, అన్నాడు.

అది బ్యాటరీ పొయిందిలే గానీ, ఈ రేతిరిలో ఆ కత్తేంది? ఎవుర్ని పొడవడానికి?
ఆ భాషా గాడిని.
మా ఊరి ముండనాయాళ్ళు మళ్లీ ఏందో కొత్తది లొడబెడ్తున్నారని నేననుకుంటానే ఉన్నా. అట్టే జరిగింది.
అసలేంది మందల?
చెప్తాలే గానీ నువ్వురా ముందాడికి, అని నన్ను బరబరా లాక్కోని పొయ్యాడు మాలకొండ.
ఆడకి పొయ్యేసరికి అంతా చిందరబందర చేసేసున్నారు. భాషా చికెన్ షాప్ పీకి తుక్కు చేసేశారు.

భాషా నీకు ఎప్పుట్నుంచో చెప్తావుండా. నువ్వు ఇట్టే రెటమతంగా ఉంటే ఇది చాందూరం పోద్ది. నా మాటిని షాపు తీసెయ్, అని చెప్తున్నాడు కామేశ్వరయ్య. ఆ పిల్లోడితో ఎప్పుడూ పడని మా రెడ్డి గారి పిలకాయలు తిరపతరెడ్డి, నారప రెడ్డి కూడా ఇదే మాట చెప్తుండారు. భాషా కి వాళ్ల సాయిబులోళ్ళ పిలకాయలంతా సపోర్టింగ్ గా నిలబడి ఉండారు.
మీరేందయ్యా చెప్పేది? ఎవురు అసలు ఈ రూల్ పెట్టింది? నేను అమ్మతా మీరేం చేస్తారో చేసుకోండి, అని భాషా అరస్తుండాడు.
ఏందిరా మీరు. రోజు ఏదో ఒక తకరాదు లేకుండా వగదెగదా మీకు? టైంపాస్ కాకపోతే అట్టపొయ్యి ఏమన్నా పనికొచ్చే పని చెయ్యండి. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? అని కోపంగా అడిగా.
అబ్బా రెడ్డొచ్చిండు. మళ్లీ మొదులుపెట్టండి, చీకట్లో ఎవురో అన్నారు.

cock1అదన్నది యానాది రెడ్డని నాకు ఖచ్చితంగా తెలుసు. అయినా నేను గమ్ముగున్నా. మనది మనం కడుక్కుంటే చాలని అయ్యోరు చెప్పినకాడ్నుంచి ఎవురి ఇసయాల్లో ఏలు బెట్టకుండా ఉన్నా. ఈడ ఎవురిగోల వాడిది. మజ్జెలో నాకెందుకులే అని పోబోతుంటే, నా, మీ పిలకాయలకి చెప్పనా. లేకపోతే ఈ రాత్రికి ఈ ఊర్లో ఎవురికీ మెడకాయల మీద తలకాయలుండవ్ అని సున్నేసాయిబు నా దగ్గరకొచ్చాడు.

అయన్నీ ఎందుకుగానీ, తకరాదు జరగతాఉందని పోలీసులకి తెలిస్తే వచ్చి అందర్నీ జైలుకి లాక్కోపోయి గుద్దమీద తంతారు. అందరు మూసుకోని ఇంటికి పోండి, అని చెప్పి నేనాడనుంచి సక్కా పోతావున్నా. వాళ్లంత వీజీగా వదిలిపెడ్తారా నన్ను? కూసోబెట్టి బారతమంతా చెప్పారు.
మాల్యాద్రి ఇంట్లో ఎద్దుకి కుడితినీళ్లు పోసే వాళ్లు కూడా లేరు. మాల్యాద్రి టౌన్ లో పళ్లంగడి పెట్టిండు. ఎప్పుడో వారినికొకసారి గానీ రాడు. వాళ్ల నాయన శంకరయ్య మంచంలో పడుండే. అప్పుడప్పుడు పక్కింటి రామిరెడ్డి కొంచెం ఎండు గెడ్డేసి దాన్ని సాకతా ఉన్నాడు. రామిరెడ్డి పిలకాయల దగ్గరకి పోయినకాడ్నుంచి పట్టించుకునే వాళ్ళు లేక ఎద్దు నీలక్కపోయింది. అది ఇంక చసద్ది అని తెలిసిపోయింది మాల్యాద్రికి. అందుకని కాలనీ కాడికి పోయి అంకయ్య ని రమ్మంటే అది మాకేం బళ్లే అని చెప్పిండు. ఏం జెయ్యాలబ్బా అని కాలనీ కాడ్నుంచి నడుచుకోనస్తుంటే భాషా కనిపించిండు.పొద్దు పొద్దున్నే ఏడికో పొయ్యుస్తుండావే మాల్య్రాది? అని భాషా అడిగితే విషయం చెప్పాడు. సరేలే ఇప్పుడది చస్తే పీనిగ తీయడానిక్కూడా ఎవురు రారు. నేను ట్రాక్టర్ ఏసుకొస్తా, దాన్ని తొట్లో ఏస్తే నేనే దాన్ని తీసుకుపొయ్యి ఏదో ఒకటి చేస్తాలే, అని భాషా అంటే, సరేనని ఒప్పుకున్నాడు మాల్యాద్రి. కానీ భాషా ఆ ఎద్దుని తోలుకొచ్చి, హలాల్ చేసి చికెన్ షాప్ లో కేజీల లెక్కన మాంసంగా అమ్మతాడని అనుకోలేదు. అక్కడ నుంచి గొడవ పెద్దదై, ఊర్లో పిలకాయలందరూ భాషా చికెన్ కొట్టుని పగలగొట్టే దాకా వచ్చింది. ఇద్తెలిసి సాయిబులోల్ళ పిలకాయలు కూడా ఎదురుతిరుక్కున్నారు.

అంతా ఇని, ఏందో ఈ జనాలు అనుకున్నా. ఈళ్లకి కొట్టుకోడానికి రోజుకొక కారణం దొరుకుద్ది గానీ గమ్ముగా ఉండడానికి అసలు కారణమే కనిపిచ్చదా, అనుకున్నాను. అసలీ గొడవ తేల్చాలంటే ఎవురి చేతా కాదని నాకనిపిచ్చింది.
చంపతా, పొడుస్తా అని ఒకరి మీదికి ఒకరు పోతానే ఉండారు. ఎవురో పోలీసులకి ఫోన్ జేసినట్టున్నారు. పోలీసుల్ని చూడగానే మా పిలకాయలంతా ఉచ్చపోసుకుంటా ఎళ్ళబారారు. పోలీసోళ్ళు ఒక్కొక్కడిని పట్టుకోని జీబ్ లో ఎక్కించి ఆత్మకూరు జైల్లో ఏశారు. ఆ తర్వాత రోజు నేనే ఎమ్మెల్లే దగ్గరకు పొయ్యి, వకీల్ తో మాట్లాడి మా పిలకాయల్ని ఇడిపిచ్చి తీసుకొస్తుంటే బస్ లో అయ్యోరు కనిపిచ్చాడు. ఏంది రెడ్డీ కొత్త కేసంట అన్నాడు. అసలు ఈ ఊరికేదో శని పట్టింది అన్నాను.
అదేం కాదులే. జనాలకి ఈ మధ్య కోపాలు ఎక్కువైపొయినయి. ఈ జీవితం చానా చిన్నది రా నాయినా అని తెలుసుకుంటే ఇయన్నీ ఉండవు. ఈళ్ళకి ఇదెందుకు అర్థం కాదో నాకు తెలియదు. పక్కనోడినతో కలిసుండడం ఎందుకంత కష్టం? ఒక రోజు కోడి కోసం కొట్టుకునే. ఇంకో రోజు గొడ్డు కోసం కొట్టుకునే. కొట్టుకోడానికి కారణాలు గావాలా? కొట్టుకోవాలనే ఉంటే ఎందుకైనా కొట్టుకోవొచ్చు.
అయ్యోరా, అన్నీ తెలిసినోడివి. నాకీ ఇసయం చెప్పు. అసలు గొడ్డు మాంసం గురించి నువ్వు సదువుకున్న పుస్తకాల్లో ఏమి రాసున్నారు?
ఏడా ఎవురూ ఇదీ అని రాయలేదబ్బా. ఒకేళ రాసున్నా అది అప్పుటి రోజులకి సరిపోద్ది. అప్పుడూ ఇప్పుడూ ఒకేగా ఉన్నామా ఏంది మనం? మా నాయన రోజుకి ఒక్క పూటే తింటా, యాభై ఏళ్లు దేవుడికి పూజ చేసి క్యాన్సరొచ్చి కుక్క చావు చచ్చాడు. మా నాయన చావడం చూసి నాకు జీవితం మీద విరక్తొచ్చి ఏడికో పోతే, నన్ను ఎతుక్కోని వచ్చి మరీ ఈ ఊర్లో పూజారిని చేసుళ్లా మీరు? నేనేమన్నా మా నాయన లాగున్నానా? నేను మాంసం తింటున్నా. మందు తాగుతున్నా. అయినా ఎందుకు నాతో ఏగతున్నారు? మీ ఊళ్లో గుళ్లో దీపం బెట్టే పూజారి లేక. నన్నేమన్నా అంటే నేను అలిగిపోతానని గుద్ద మూసుకోనుళ్లా మీరంతా. అట్టే ఎవురిపాటికి వాళ్లని వదిలెయ్యండి. వాళ్లేమన్నా మిమ్మల్ని తినమని బలవంతం జేస్తున్నారా ఏంది?
నేనే ఆపుకోలేక అడిగా. అది కాదు అయ్యోరా. గవర్మెంట్ కూడా గొడ్డు మాంసం బ్యాన్ చేసుళ్లా, అన్నాను.

గవర్మెంట్ ఏందయ్యా బ్యాన్ చేసేది? మనకి బుద్ధుండబళ్లే! బంగారం లాంటి ఎద్దుని చంపకతినిందేమో మాల్యాద్రి. దాన్ని భాషా కోసి తింటే మాత్రం తప్పయిపోయిందే! మనూర్లో ఒక శెట్టి గారు రోజూ పంది మాంసం తింటుళ్లా. సరే డాక్టర్ చెప్పిండు, తింటే బాగా ఊపిరాడద్దని చెప్తే మందులా తింటున్నాడు. వాళ్లని ఎవురన్నా ఏమన్నా అన్నారా? అట్టే మానూరి సాయిబులు వాళ్లకిష్టమొచ్చింది తింటారు. మజ్జెలో మీకేంది? ఇట్టే పోతే, కొన్ని రోజులకి ఈ కోళ్లు, బర్రెలు గాదు. ఇట్ట కొట్టుకోని మిమ్మల్ని మీరే చంపుకోని పీక్కు తింటారు.
మరి గొడ్డుని చంపడం తప్పు కాదా? అడిగాను.

ఎవురు చెప్పారబ్బా ఇది తప్పు. ఇది కాదు అని. ఆ దేవుడా? అసలు దేవుడే మనిషి ని పుట్టిచ్చాడో లేదో ఎవురికి తెలుసు? కానీ దేవుణ్ణి మాత్రం మనమే పుట్టిచ్చాం. ఈ విషయం నాకెవురు చెప్పారని అడగబాకండి. నిన్న రాత్రి దేవుడితో మాట్టాడతుంటే చెప్పాడని చెప్పినా నువ్వు నమ్మవు. నమ్మినా నమ్మకపోయినా ఈ మాట మాత్రం నీకు చెప్పాల. దేవుడేమన్నాడంటే, నీ పని నువ్వు చూసుకో. పక్కనోడిని గెలకబాకు. ఇది తెలుసుకుంటే చాలు మనం.

అదేదో వేదాల్లో రాసున్నారు కదా! ఆవు దేవుడని, ఏదో చెప్పబోతుంటే ఆపాడు ఆయ్యోరు.
వినాయకుడి వాహనం ఏంది? ఎలుక. దాన్ని చంపటంలే? సుబ్రమణ్యస్వామి వాహనం ఏంది? నెమలి. దాన్ని చంపి తినటం లే? విష్ణుమూర్తి వాహనం ఏంది? పాము. దాన్ని చంపటంలే? ఇయన్నీ పురాణాల్లో అప్పుడెందుకు రాశారో ఏమో? వాటిల్లో ఏదో నిజముండే ఉంటది. కానీ వాటిల్ని అప్పుట్లాగే చూడ్డం తప్పు. అసలంతెందుకు? నేను చిన్నప్పుడు మన శిద్దాడ్డోళ్లింట్లో యాభై ఆవులుండేయి.వాటిల్ని సాకలేక అమ్మేస్తిరి. మీకంత ముఖ్యమైతే మీరే సాక్కోకూడదా? ఎందుకమ్మేయడం? – అని కోప్పడ్డాడు.

అయ్యోరు చెప్పిందైతే పాయింటే. ఇది అందరికి తెలిసిన ఇసయమే. అయినా ఏందీ గొడవలు?
రెండ్రోజులుకి సాయిబులోళ్ల పిలకాయలు కూడా బయటకొచ్చిండ్రు. మళ్లీ ఏం గలభా చేస్తారో అని, నాయకులంతా అందర్నీ పంచాయితీ బోర్డ్ కాడికి పిలిపిచ్చాం. ఇంక ఈ ఊర్లో గొడవలు పెట్టుకోకుండా సక్కంగా ఉండమని నేను చెప్తున్నానా, మధ్యలో యానాది రెడ్డి పుల్లేశాడు.

అంటే ఏంది సుబ్బాడ్డే నువ్వు చెప్పేది? అయినా నువ్వేంది ఎప్పుడూ వాళ్లకే సపోర్ట్ వస్తుండావు? అడిగాడు యానాది రెడ్డి.
యానాది రెడ్డి, ఏందంటే అది మాట్టాడబాకు. నేను చెప్పిందాంట్లో తప్పేంది? అన్నాను.
అంటే ఏదయ్యా మీరు చెప్పేది? పెద్ద మనుషులని పోనీలే అనుకుంటే అన్యాయంగా మాట్లాడుతున్నారే. ఈ ఊర్లో గొడ్డు మాంసం తింటానికి లేదు, అని కోపంగా అన్నాడు తిరపతరెడ్డి.
మేం తింటాం, ఎవురాపేది మమ్మల్ని. రాండి చూసుకుందాం, అని కాలేషా ఇంకా కొంతమంది ముందుకు దూకారు.

మీ పోసుగాల. ఉండండ్రా, అని నేనోళ్లని ఆపాను. భాషా నా మాటిని నువ్వొక పన్జెయ్యి. ఆ చికెన్ షాప్ లో బీఫ్ అమ్మబాకు. దానికి పక్కనేడన్నా ఇంకొక అంగడి పెట్టుకో. ఎవురికీ ఇబ్బంది లేకుండా ఉంటది అని సర్ది చెప్పబోతుంటే- అసలు ఈ ఊర్లో గొడ్డు మాంసం అమ్మడానికి లేదు అని మాల్యాద్రి ముందుకొచ్చి అరిచాడు.
ఒరేయ్ సిగ్గు లజ్జా ఉందా నీకు? గొడ్డు చస్తా ఉంటే కనీసం చెంబుడు నీళ్ళయినా పోసినా? వాళ్ళ కొట్టాం లో ఉంటుందని రామి రెడ్డి చూడకపోతే అదెప్పుడో చచ్చుండును. ఎద్దు పోతే దాని మాంసం అమ్ముతుండాడు భాషా. అసలు దాన్ని చంపిందెవురు? నువ్వు కాదా? అప్పుడు నిన్నేం చెయ్యాలా? నువ్వు మూసుకోనుండు, అని నేను కోపంగా మాల్యాద్రి మీదకు పొయ్యా.
యో, ముసిలాయనా! ఏందో పెద్ద మనిషవని చూస్తావుంటే రెచ్చిపోతుండావే! నువ్వు మూసుకోని ఆడ కూర్చో అని గదిమాడు. అట్ట చెప్పు ఆయనకి ఏందో పెద్ద నీలగతా ఉన్నాడు, అని యెటకారంగా అన్నాడు యానాది రెడ్డి. అట్ట ఎవురికిష్టమొచ్చినట్టు వాళ్ళు మాట్లాడతా, సందకాడ మొదలైంది రేత్రంతా పోతానే ఉంది. ఈ రోజు ఎట్టైనా ఏదో ఒకటి తేల్చందే నిద్రపొయ్యేలా లేరు జనాలు. ఏదో నా మాట ఎట్టా ఇనకపోయే. మజ్జెలో నాకెందుకులే అని పీర్లచావిటి కాడికొచ్చి కూసున్నా.

మొన్న బస్సులో అయ్యోరు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినయి.
చూడు సుబ్బాడ్డీ. ఈ ఊరు ఇట్టా ఎందుకు ఉందని కదా నీ బాధ? ఈడ చెరువుల్తో పాటు మనుసుల గుండెలు కూడా ఎండిపోయాయబ్బా. పక్కనోడి బాధ మన బాధ అయితే మనకీ కన్నీళ్లొస్తాయి. గుండెల్లో వాన కురుసుద్ది. గుండెల్లో పైరు మొలుసుద్ది. అప్పుడు మనిషీ పచ్చగా ఉంటాడు. ఊరూ పచ్చంగా ఉంటది. సర్వే జనా: సుఖినోభవంతు! సమస్త సన్ మంగళాని భవంతు! ఓం శాంతి !శాంతి! శ్శాంతి!
శాంతి? ఏడుందది? ఇప్పుడందరికీ కోపాలే!

గొడవ ఆపలేకపోయినందుకునాక్కూడా కోపమొస్తా ఉంది. గమ్ముగా అరుగు మీద పొడుకున్నా. గాలే లేదు. ఉక్క బోస్తా ఉంది.

ఆకాశంలో సుక్కలు కనిపీటంలే. చీకట్లో ఏందో మెరస్తా ఉండాది. ఏందదని నేను చూస్తా ఉండంగానే అది కొంచెం కొంచెం పెద్దదవతా దగ్గిరికి వస్తా ఉండాది. ఏందో మంటలాగుంది. మంటే. మంట పెద్దదవతా వచ్చి కాష్టాల మిట్ట కాడ ఆగింది. మంట పెద్దదయింది. భోగిమంట అంత పెద్ద మంట. మంట కింద నిప్పులు పీర్లపండక్కేసే గుండాంలా మెరిసిపోతుండాయి. మంట ఇంకా ఇంకా పెద్దదవతా ఉండాది. నేను దగ్గరకి పోతా ఉండాను. పొగ పైకి లేచి ఆకాశాన్ని కమ్ముకుంది. ఆకాశంలో సుక్కలు కూడా మాయమైపోతుండాయి.
ఊళ్లో వాళ్లంతా ఒకొరకరిగా మంటల్లోకి దూకతుండారు.

చూళ్ళేక కళ్ళు మూసుకున్నా. ఏందో తెలియలా. చాన్రోజులకి కళ్లల్లో నీళ్లు అట్టే కారిపోతా ఉండాయి.

*