గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 10

                                                                  Anne Of Green Gables By L.M.Montgomery

 మిసెస్ రాచెల్ విషయం లో అయిన గొడవ గురించి మెరిల్లా వెంటనే మాథ్యూ కి చెప్పలేదు . క్షమాపణ చెప్పదల్చుకోకపోతే గది దాటి రావద్దని మెరిల్లా ఆజ్ఞాపించింది కనుక ఆన్ తన గదిలోనే మొండికేసుకు కూర్చుండిపోయింది . మర్నాడు పొద్దున బ్రేక్ ఫాస్ట్ కి  ఆమె ఎందుకు రాలేదో  మాథ్యూ అడిగినప్పుడు  ఇక చెప్పక తప్పలేదు …ఆన్ ప్రవర్తన ఎంత విపరీతంగా ఉందో అర్థంఅవాలని  అతి వివరంగా చెప్పుకొచ్చింది మెరిల్లా.

” మిసెస్ రాచెల్ కి బాగానే అయిందిలే , ఎక్కడ లేని సంగతులూ ఆవిడకే కావాలి ” – మాథ్యూ ఓదార్పు.

” మాథ్యూ కుత్ బర్ట్ ! ఏమిటిది ?? ఆన్ అంత ఛండాలంగా చేస్తే దాని వైపు మాట్లాడతావేం ? కొంపదీసి దాన్నేమీ  శిక్షించద్దంటావా ?”

” అబ్బే, అలా అనేమీ కాదూ ” తడబడ్డాడు మాథ్యూ. ” కొద్దిగా..దండించచ్చులే. మరీ కటువుగా ఉండకు పాపం- దానికి మంచీ చెడ్డా ఎవరు నేర్పారు గనక ? నువ్వు..నువ్వు దానికి తినటానికేమైనా ఇచ్చావా ?”

” ఆ, డొక్క మాడుస్తాను మరి ” –  కస్సుమంది మెరిల్లా – ” మూడు పూట్లా వేళ కి భోజనం పెడుతున్నాను, నేనే తీసుకెళ్ళి ఇస్తున్నాను. తప్పు ఒప్పుకుని రాచెల్ కి క్షమాపణ చెబుతాననేవరకూ మాత్రం అది కిందికి రావటానికి వీల్లేదు, అది ఖాయం ”

పొద్దున , మధ్యాహ్నం , సాయంత్రం – అన్ని భోజనాలూ నిశ్శబ్దంగా సాగాయి , ఆన్ పట్టు వదల్లేదు. పళ్ళెం నిండా అన్నీ సర్ది మెరిల్లా తూర్పు గదికి పట్టుకెళుతోంది – కొంచెం మటుకే తరిగిన భోజనాన్ని వెనక్కి తెస్తోంది. ఆ సాయంత్రం , ఎలా వెళ్ళిన పళ్ళెం అలాగే తిరిగిరావటం మాథ్యూ కళ్ళబడింది. ఆన్ ఏమీ తినటం లేదా ఏం ? అతని ప్రాణం కొట్టుకుపోయింది.

ఇంటి వెనక బీడులో మేస్తున్న ఆవులని తోలుకొచ్చేందుకు మెరిల్లా వెళ్ళింది. అదను కోసం కాచుకుని ఉన్న మాథ్యూ మెల్లగా ,  దొంగలాగా మేడమీదికి వెళ్ళాడు. రోజూ వంటింట్లో భోజనం చెయ్యటం, హాల్ కి ఆనుకుని ఉన్న తన చిన్న పడకగదిలో నిద్రపోవటం – అంతకుమించి మాథ్యూ ఇంట్లో తిరిగేది లేదు. ఎప్పుడైనా టీ తాగేందుకు పాస్టర్ వచ్చి ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ వసారాలో కాసేపు కూర్చుంటాడు  . తన సొంత ఇంటి మేడ మీదికి మాథ్యూ వెళ్ళి ఇంచుమించు నాలుగేళ్ళయిపోయింది  – అప్పుడూ తూర్పుగదికి రంగులు వేసేందుకు మెరిల్లా కి సహాయంగా వెళ్ళాడంతే.

చప్పుడు కాకుండా , మునివేళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆన్ గది ముందు కాసేపు ఆగిపోయాడు. ధైర్యం తెచ్చుకుని చిన్నగా తలుపు తట్టి , ఓరగా తెరిచి తొంగి చూశాడు.

ఆన్ పసుప్పచ్చ కుర్చీలో కూర్చుని దిగాలుగా తోట లోకి చూస్తోంది. మాథ్యూ కళ్ళకి ఆమె అర్భకం గా  ,  బెంగ పడి ఉన్నట్లుగా   కనిపించి అతని మనసు కరిగిపోయింది.  శబ్దం అవకుండా తలుపు మూసి అలాగే మునివేళ్ళ మీద ఆన్ దగ్గరికి వెళ్ళాడు.

మెరిల్లాకి వినబడిపోతుందేమోనని , రహస్యంగా పిలిచాడు – ” ఆన్ ! ఏం చేస్తున్నావమ్మా ? ”

ఆన్ నీరసంగా నవ్వింది.

anne10-2

” బాగున్నాను. చాలా చాలా ఊహించుకుంటూ ఉన్నాను, అలా రోజు గడిచిపోతోంది. ఒంటరిగానే ఉంది – నిజమే , అలవాటైపోతుందిలెండి ”

మళ్ళీ నవ్వింది- ఏళ్ళ తరబడి ఎదురవబోతున్న ‘ ఏకాంత కారాగారవాసాన్ని ‘ ధైర్యం గా ఎదుర్కొంటున్నట్లు.

తను ఏమి చెప్పాల్సి ఉందో గుర్తు తెచ్చుకున్నాడు మాథ్యూ- గబ గబా చెప్పెయ్యాలి, మెరిల్లా వచ్చేసేలోపు. ” ఆ పనేదో పూర్తి చేసెయ్యకూడదూ ? ఎప్పటికైనా తప్పదు నీకు , మెరిల్లా కి మా చెడ్డ పట్టుదల , ఊరుకోదు. ఆమె చెప్పినట్లు చేసేస్తే ఒగదెగిపోతుంది కదా ? ” గుస గుసగా అన్నాడు.

” మిసెస్ రాచెల్ కి క్షమాపణ చెప్పటం గురించేనా మీరనేది ? ”

” క్షమాపణ ..ఆ , అదే, అదే. చెప్పెయ్యకూడదా ? ”

” మీకోసం…మీరు చెప్పమంటే..చెబుతానేమో ” ఆన్ ఆలోచిస్తూ అంది – ” జరిగిందానికి బాధపడుతున్నాను అని చెప్పటం లో అబద్ధం ఉండదు, ‘ ఇప్పుడు ‘ బాధ పడుతున్నానుగా ! నిన్న రాత్రైతే అలా లేను , పిచ్చి కోపంగా ఉండింది. మూడు సార్లు మెలకువొచ్చింది, ప్రతిసారీ కోపం ఎక్కువౌతూనే ఉంది. తెల్లారేసరికి…అంతా పోయింది , ఖాళీ గా అయిపోయానేమిటో. సిగ్గు పడుతున్నాను కూడా ..కాని వెళ్ళి మిసెస్ రాచెల్ కి క్షమాపణ చెప్పటం ….చా..లా అవమానకరంగా అనిపించింది. ఇక ఇలాగే ఎప్పటికీ ఈ గదిలోనే ఉండిపోదామని నిశ్చయించేసుకున్నాను… మీ కోసం అయితే – ఏమైనా చెయ్యగలను ..మీరు నిజంగా చెయ్యమంటే….  ‘’ – నసిగింది.

” చెయ్యమనే  కదా అంటున్నాను ? నువ్వు లేకపోతే కిందని ఇల్లంతా ఏమీ బాగోలేదు. వెళ్ళు, వెళ్ళి చెప్పు మెరిల్లాకి, మంచిదానివి కదూ ? ”

” సరే అయితే ” ఆన్ లొంగిపోయింది – ” మెరిల్లా రాగానే చెప్పేస్తాను ”

” నిజంగా..!  మంచిది..చాలా బాగుంది  ” సంతోషపడిపోయాడు మాథ్యూ – ” నేను చెప్పానని మటుకు మెరిల్లాకి చెప్పకూ…అనవసరంగా కలగజేసుకున్నాననుకుంటుంది ”

” చచ్చినా చెప్పను ” హామీ ఇచ్చింది ఆన్- ” అవునూ , చచ్చాక ఎలా చెప్పగలరూ ఎవరైనా ? ”

జవాబు చెప్పటానికి మాథ్యూ అక్కడ ఉంటే కదా…తన గెలుపుకి తనే జడుసుకుని – వెళ్ళే పోయాడు . మెరిల్లా కి ఏ మాత్రం అనుమానం రాకుండా గుర్రపుసాల లో ఒక మూల దాక్కున్నాడు.  ఇంట్లోకి వచ్చిన మెరిల్లా కి-  ఏడ్చి బొంగురుపోయిన గొంతుతో   ‘ మెరిల్లా ‘ అని మేడ మీదినించిపిలవటం వినిపించింది. సంతోషం..ఆశ్చర్యం .. అయినా బింకంగా ” ఆ, ఏమిటీ ” అంది.

” ఏమీ లేదూ..అదే..మరీ..నేను మిసెస్ రాచెల్ తో అలా మాట్లాడేశాను కదా, దానిగురించి సిగ్గుపడుతున్నాను- వెళ్ళి క్షమాపణ అడగమంటావా ? ”

మెరిల్లా ‘ అమ్మయ్య ‘ అనుకుంది, కాని పైకి తేలలేదు –  ఆన్ దారికి రాకపోతే ఏం చెయ్యాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉన్నా కూడా. ” సరే. పాలు తియ్యటం అయాక నిన్ను కిందికి తీసుకొస్తాలే ” అని మాత్రం చెప్పింది.

ఆ ప్రకారంగా- పాలు పితకటం ముగిశాక, మెరిల్లా  విజయగర్వం తో నిటారుగా మేడ దిగుతోంది.  ఆ వెనక ఆన్ కుంగిపోతూ వస్తోంది .  అయితే సగం మెట్లు దిగగానే  ఆ దిగులు మంత్రం వేసినట్లు మాయమైంది . తలెత్తి కిటికీ లోంచి సూర్యాస్తమయాన్ని చూస్తూ , అణుచుకుంటున్న ఉత్సాహం కనబడిపోతుండగా తేలు తూ కిందికి వచ్చింది . ఈ పరిణామం మెరిల్లాకి పెద్దగా నచ్చలేదు ..పశ్చాతాపం తో కుమిలిపోతూ క్షమాపణ అడగబోయే శాల్తీ అలాగేనా ఉండేది ?

” ఏమిటి ఆలోచిస్తున్నావు ఆన్ ? ” పదునుగా అడిగింది.

” మిసెస్ రాచెల్ తో ఏం చెప్పాలో ఊహించుకుంటున్నాను ” ఆన్ ఎప్పట్లాగా కలలు కంటూన్న గొంతుతో జవాబిచ్చింది.

ఆ మాటలు మెరిల్లాకి తృప్తి కలిగించాలి నిజానికి, కాని ఎందుకో అనుమానం తగిలింది. తను వేయబోతున్న ‘ శిక్ష ‘ బెసకబోతోందా ఏమిటి ? లేకపోతే ఆన్ కి ఆ  ఆనంద పారవశ్యం ఎందుకూ ?

మిసెస్ రాచెల్ ఇంటికి వెళ్ళే వరకూ ఆన్ అలాగే ఉంది గానీ లోపలికి వెళుతూనే ఒక్కసారిగా మారిపోయింది. మొహం లో అణువణువునా పశ్చాతాపం పొంగిపోతుండగా మిసెస్ రాచెల్ ముందు మోకాళ్ళ మీద కూలబడి ప్రార్థిస్తున్నట్లు  చేతులు చాచింది – ఆవిడ  విస్తుపోయింది.

” మిసెస్ రాచెల్ ! జరిగినదానికి నేనెన్..తో చింతిస్తున్నాను. ఎంతగా అంటే , చెప్పేందుకు ఒక నిఘంటువు మొత్తం అయినా సరిపోనంతగా..మీరే ఊహించుకోగలరు ! మీ పట్ల నేను ఘోరంగా ప్రవర్తించాను, నా ఆత్మీయులైన మాథ్యూ మెరిల్లాలకి తలవంపులు తెచ్చాను. నేను అబ్బాయిని కాకపోయినా కూడా నన్ను వాళ్ళతో ఉండనిచ్చినా కూడా ,  నేను ఇంత చెత్తగా చేశాను,కృతఘ్నురాలిని –  నన్ను మర్యాదస్తులందరికీ దూరంగా పంపివేయాలి.  మీరు నిజమే చెప్పారు, నా జుట్టు ఎర్రగానే ఉంటుంది, నా మొహం మీద మచ్చలున్నాయి..నేను పీలగా అనాకారిగానే ఉన్నాను – అయినా నాకు విపరీతంగా కోపం వచ్చింది, అలా రాకూడదు, తప్పు.

నేను మిమ్మల్ని అన్నవన్నీ కూడా నిజమే, కానీ నేను అలా అనిఉండకూడదు , తప్పు.

దయచేసి నన్ను క్షమించండి మిసెస్ రాచెల్ ! ” ఆన్ పెద్దగా శోకం పెట్టింది ..” మీరు క్షమించకపోతే, నన్ను తిరస్కరిస్తే- ఒక అనాథ కు జీవితాంతమూ దుఃఖం కలిగించినవారవుతారు , ఆమె చాలా కోపిష్టి అనాథ పిల్లే అయినా కూడా ”

ఆన్ చేతులు జోడించి , తల దించుకుని, తీర్పు కోసం ఎదురుచూస్తున్న భంగిమలో ఉండిపోయింది.

ఆమె నిజాయితీని శకించేందుకు వీల్లేదు , అది ఆమె గొంతులో ఉట్టిపడుతూ ఉంది…మిసెస్ రాచెల్, మెరిల్లా ఇద్దరికీ ఆ సంగతి అర్థమైంది. అయితే  ఆ సందర్భాన్ని ఆన్ అమితంగా ఆస్వాదించేస్తోందని మెరిల్లాకి అర్థమై గతుక్కుమంది .  తన  ‘పతనాన్ని ‘ పరిపూర్ణంగా  , నాటకీయం గా  మలచుకుని  ఆన్ సరదాగా అభినయిస్తోంది . ఇంకెక్కడి శిక్ష ?

పాపం, మిసెస్ రాచెల్ ఊహ అంత దూరం పోలేదు ..ఆన్ అంత పద్ధతిగా  క్షమాపణ చెప్పినందుకు ఆవిడ ఆగ్రహం మొత్తం శాంతించింది. ఏమాటకామాటే చెప్పాలి, కాస్త అధికప్రసంగే గానీ ఆవిడ మనసు మెత్తనిది.

” లేదు లేమ్మా, లే. పర్వాలేదు లే ” మనస్ఫూర్తిగా అంది – ” ఎందుకు క్షమించనూ, క్షమిస్తున్నాను నిన్ను . నేనైనా కొంచెం  కఠినంగానే  మాట్లాడానులే నీ గురించి. నాకు ఉన్నది ఉన్నట్లు చెప్పెయ్యటం అలవాటు మరి…అన్నట్లు నాకొక అమ్మాయి తెలుసు , దాని జుట్టు నీ జుట్టు కన్నా ఎర్ర..గా ఉండేది . పెరిగి పెద్దయ్యాక అది చక్కగా ముక్కుపొడి  రంగు[auburn ] లోకి మారిపోయింది. నీ జుట్టూ అలాగే అవుతుందేమో, ఎవరికి తెలుసు ? అయినా నాకేం ఆశ్చర్యం లేదు … ”

anne10-1

ఆన్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ లేచి నిల్చుంది – ” మిసెస్ రాచెల్ ! నాకు ఆశ కల్పించారండీ మీరు..మీ మేలు మర్చిపోను ! జుట్టు బాగుంటే మంచిగా నడుచుకోవటం ఎంతో సులువండీ ! నేను అలా మీ తోట లోకి వెళ్ళి ఆపిల్ చెట్టు కింద బెంచీ మీద కూర్చోవచ్చా ? మీరిద్దరూ మాట్లాడుకుంటారు కదా, అక్కడ కూర్చుంటే ఊహించుకోవటానికి బోలెడంత వీలుగా ఉండేలా ఉంది ”

ఆన్ వెళ్ళాక మిసెస్ రాచెల్ లేచి దీపం వెలిగించింది.

” ఇలా ఈ కుర్చీ లో కూర్చో మెరిల్లా, ఇంకొంచెం హాయిగా ఉంటుంది నీకు. ఆ..మొత్తానికి విడ్డూరపు  పిల్ల !  కాని దీనిలో ఆకట్టుకునే లక్షణమేదో ఉంది, అందుకే మీరు అట్టే పెట్టుకున్నారు… నాకు తెలిసింది.  మీ మీద జాలి పడేందుకేమీ లేదులే , బాగానే తయారయేలా ఉంది. కాకపోతే కొంచెం దూకుడెక్కువలా ఉంది, మీ దగ్గర ఉంటూ ఉంటే నెమ్మదిగా అదీ సర్దుకుంటుందిలే. కాస్త ప్రథమ కోపం ఉన్నట్లుంది- నిజానికి అలాంటివాళ్ళ కోపం ఊరికే చల్లబడిపోతుంది. పైకేమీ  మాట్లాడకుండా వెనకాల గోతులు తీసే నంగనాచులకన్నా ఇలాంటివాళ్ళు చాలా నయం …మొత్తానికి పిల్ల నాకు

నచ్చింది  ”

కాసేపాగి మెరిల్లా, ఆన్ – ఇంటికి బయల్దేరారు. మిసెస్ రాచెల్   ఇచ్చిన  తెల్లటి నార్సిసస్ పూల సువాసనని పీల్చుకుంటూ ఆన్ అడిగింది – ” బాగా చెప్పాను కదూ క్షమాపణ ? ఎలాగూ చెబుతున్నాను కదా అని పద్ధ..తి గా చెప్పాను ”

” అవునవును. బాగా చెప్పావులే ” అంది మెరిల్లా… నవ్వు రాబోయినందుకు   తనని తను తిట్టుకుంది.   మరీ అంత పద్ధతిగా చెప్పినందుకు ఆన్ ని మందలించాలేమో అనుకుంది గానీ అదెలా కుదురుతుంది ? ” ఇలా క్షమాపణ చెప్పే పరిస్థితులు ఎక్కువ తెచ్చుకోకు ” అని మాత్రం అనగలిగి సమాధానపడింది.

” నా ఆకారం గురించి ఎవరూ మాట్లాడకపోతే నేను బుద్ధిగానే ఉంటాను ”   భరోసా ఇచ్చింది ఆన్ – ” వేరే సంగతులేమీ పట్టించుకోనుగాని నా జుట్టు గురించి మాట్లాడితే…నాకు మండిపోతుంది ! అవునూ నా జుట్టు కూడా పెద్దయ్యాక  ‘ చక్కటి ముక్కుపొడిరంగు ‘  లోకి మారుతుందా ? ”

” నువ్వెలా ఉంటావూ అనేదాని గురించి అంత ఎక్కువ ఆలోచించకూడదు నువ్వు, అది మంచిది కాదు ”

” నేను సాదాగా ఉంటానని తెలిసి కూడా ఎలా చెప్పు ? ” ఆన్ ప్రతిఘటించింది – ” అందమైనవి అంటే నాకెంతో ఇష్టం..అందంగా లేని నన్ను అద్దం లో చూసుకుంటే దిగులు పుడుతుంది, నా మీద నాకు జాలేస్తుంది ”

” అందం కన్నా స్వభావమూ  ప్రవర్తనా ముఖ్యం ”  [Handsome is as handsome does ] మెరిల్లా చెప్పింది.

” చాలా సార్లు విన్నాను ఈ మాటలు, నాకంతగా నమ్మకం లేదు. ఈ పూలెంత మంచి వాసనేస్తున్నాయో , వాటిని మిసెస్ రాచెల్ నాకు ఇవ్వటం ఎంతో బావుంది కూడా. నాకు ఆవిడ మీద కోపం లేదు ఇప్పుడు. తప్పు చేశానని ఒప్పుకోవటం , క్షమించబడటం చాలా సుఖంగా ఉంటాయి నిజంగా. ఈ రాత్రి నక్షత్రాలు భలే వెలుగుతున్నాయి కదా ? నక్షత్రం లో ఉండేందుకు వీలుంటే ఎందులో ఉంటావు మెరిల్లా నువ్వు ? నేనైతే –  అదిగో, ఆ కొండ మీద పెద్ద నక్షత్రం వెలుగుతోంది చూడు….అందులో ఉంటాను ”

” కాసేపు నోరు మూసుకుంటావా ? ” మెరిల్లా విసుక్కుంది. ఆన్ ఆలోచనల వెనకాల పరిగెత్తలేక అలిసిపోయి ఉంది ఆమె.

వాళ్ళ వీధి లోకి వచ్చేవరకూ ఆన్ ఇంకేం మాట్లాడలేదు. షికారు బయల్దేరిన  గాలి పిల్ల ఒకటి వాళ్ళకి ఎదురొచ్చింది అక్కడ … మంచుకి తడిసిన ఫెర్న్ చెట్ల ఘాటైన పరిమళాన్ని పూసుకుని. చీకట్లో  దూరంగా చెట్ల మధ్యలోంచి  సంతోషం నిండిన వెలుతురు…గ్రీన్ గేబుల్స్ వంటింటి దీపం అది. ఆన్ ఉన్నట్లుండి మెరిల్లాకి దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుంది.

” ఇంటికి రావటం, అది ఇల్లని తెలియటం ఎంత బావుంటుంది ! గ్రీన్ గేబుల్స్ ని ఎంత ప్రేమిస్తున్నానో నేను..ఇదివరకెప్పుడు దేన్ని చూసినా ఇలా లేదు..ఇంకేదీ నాకు ఇల్లనిపించలేదు. మెరిల్లా ! ఎంత ఆనందంగా ఉందో నాకు, ఇప్పటికిప్పుడు ప్రార్థన చెయ్యమన్నా చేసెయ్యగలను , ఏమీ కష్టం లేకుండా ”

తన అరచేతిలో ఇమిడిన ఆ చిన్న అరచేయి మెరిల్లా మనసులోకి సున్నితమైన ఆహ్లాదాన్ని దేన్నో తెచ్చింది , అది ఆమె  పొందలేకపోయిన మాతృత్వానికి సంబంధించిందేమో .  అలవాటులేని ఆ తీయదనానికి మెరిల్లా కళవళపడి మామూలుగా అయే ప్రయత్నానికి ఒక నీతి వాక్యాన్ని ఊతగా తెచ్చుకుంది.

” నువ్వు మంచిపిల్లవిగా ఉంటే ఎప్పుడూ ఆనందంగానే ఉండగలవు. ప్రార్థన చెయ్యటం నీకు ఎప్పుడూ కష్టంగా అనిపించకూడదు ”

 

” ప్రార్థన లో వాక్యాలు వల్లించటమూ ప్రార్థించటమూ ఒకటి కావు ” ఆన్ ధ్యానిస్తూన్నట్లు అంది – ” ఆ చెట్ల  కొమ్మల్లోంచి వీచే గాలిగా నన్ను ఊహించుకుంటాను..అక్కడ చాలనిపిస్తే , ఇదిగో ఈ ఫెర్న్ చెట్ల మీదినుంచి మెల్లగా ఊగుతాను. ఆ తర్వాత మిసెస్ లిండ్ వాళ్ళ తోటలోకి ఎగిరిపోతాను, అక్కడి పూలన్నిటినీ గంతులు వేయిస్తాను … అప్పుడు తటాలున  ఆ గడ్డి మైదానం దాటి వెళతాను…ప్రకాశమానసరోవరం లో-  మెరిసిపోయే  చిట్టి అలలని రేపుతాను … ఓహ్ ! గాలిలాగా ఊహించుకుందుకు ఎంతెంత ఉందో… ఇప్పుడింకేమీ మాట్లాడను మెరిల్లా ”

” బతికించావు ” – మెరిల్లా ఉపశమించింది.

      [ ఇంకా ఉంది ]

 

 

 

 

మీ మాటలు

  1. “తప్పు చేశానని ఒప్పుకోవటం , క్షమించబడటం చాలా సుఖంగా ఉంటాయి నిజంగా. ఈ రాత్రి నక్షత్రాలు భలే వెలుగుతున్నాయి కదా ? నక్షత్రం లో ఉండేందుకు వీలుంటే ఎందులో ఉంటావు మెరిల్లా నువ్వు ? నేనైతే – అదిగో, ఆ కొండ మీద పెద్ద నక్షత్రం వెలుగుతోంది చూడు….అందులో ఉంటాను ”
    ఎంత బావున్నాయో కదా ఈ వాక్యాలు!

  2. రెండువారాలు ఎదురుచూసినందుకు, ఎంత మంచి వాక్యాలు బహూకరించారో మాకు! చదువుతున్నంతసేపూ ఎండా లేదు వానా లేదు, వాతావరణంలో అంతా ఒక సుగంధపు ఆర్ద్రత తప్ప ! ఆఖరి పారాగ్రాఫ్ మరీ – విడిచిపెట్టనూ లేక దగ్గరకు తీసుకోనూ లేక ‘ మేరిల్లా ‘ ను భలే చూపించారు Mam , TQQQQ

  3. Mythili Abbaraju says:

    Most welcome and thank you Rekha

  4. ” జుట్టు బాగుంటే మంచిగా నడుచుకోవటం ఎంతో సులువండీ !” హ హ.

మీ మాటలు

*