స్లీమన్ కథ:కలలు కంటూ…కథలు వింటూ…అతని బాల్యం!

కల్లూరి భాస్కరం 

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మెక్లంబర్గ్…ఉత్తర జర్మనీలో ఒక చారిత్రక ప్రదేశం. పోలండ్ సరిహద్దులకు అది ఆట్టే దూరంలో లేదు. ఒకప్పుడు స్లావ్ లకు, ట్యూటన్లకు అక్కడో పెద్ద యుద్ధం జరిగింది. అయితే, పందొమ్మిదో శతాబ్ది ప్రారంభం నాటికి మెక్లంబర్గ్ ఎదుగూ బొదుగూ లేకుండా నిలవ నీటి తీరుగా  మిగిలిపోయింది.

మెక్లంబర్గీయుల గురించి బెర్లిన్ వాసుల్ని కదిపితే, “వాళ్ళా? శుద్ధ బుర్ర తక్కువ జనాలు” అని తీసిపారేస్తారు. కానీ అందులో వాస్తవం లేదు. ఈ ప్రాంతం కూడా చెప్పుకోదగిన కళాకారుల్ని, కవుల్ని అందించింది. అంతకన్నా ముఖ్యంగా  అన్నదాత అనిపించుకుంది. ఇక్కడి వాళ్ళలా భూమితో గాఢంగా పెనవేసుకున్న వాళ్ళు  జర్మనీ మొత్తంలోనే మరొకళ్ళు లేరు. వీరు అసలు సిసలు భూమిపుత్రులు.

ప్రధానంగా వీళ్ళు ఆలుగడ్డల్ని పండిస్తారు. పశువుల్ని పెంచుతారు. ఇక వీళ్ళ అలవాట్లకు వస్తే, విపరీతంగా తాగేస్తారు. . అట్టహాసంగా నవ్వుతారు. శీతాకాలపు దీర్ఘ సాయంత్రాలలో నెగడు చుట్టూ కూర్చుని కమ్మ కమ్మగా కథలు చెప్పుకుంటారు.

మెక్లంబర్గ్ లో న్యూ బకౌవ్ అనే ఓ కుగ్రామం. అక్కడో చర్చి. ఆ చర్చి ప్రాంగణంలోనే పాస్టర్ కుటుంబం నివసించే ఓ ఇల్లు. ఆ ఇంట్లో 1822, జనవరి 6న పుట్టాడు ఓ అబ్బాయి. అతనికి నలుగురు అక్కచెల్లెళ్ళు, ఒక అన్న. పుట్టిన ఏడాదికే అన్న చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం తమ్ముడికి అతని పేరే పెట్టారు. అతనే  హైన్ రిచ్ స్లీమన్!

హైన్ రిచ్ పుట్టిన రెండేళ్లకు అంకేర్షగన్ అనే గ్రామానికి తండ్రి పాస్టర్ గా వెళ్ళాడు. అదెంత అనామక గ్రామమంటే, మ్యాపు మీద దాని పేరు కనిపించదు. అక్కడో చిన్నపాటి చర్చి. అందులో చెర్రీ పండ్లతోట. ఆ ఊరికి గుర్తింపు లేకపోతేనేం, అక్కడి గాలి నిండా వింత వింత ఊసులూ; దెయ్యాలు, భూతాలు, గుప్తనిధుల కథలూనూ. అక్కడికి దగ్గరలోనే నిధులు పాతిపెట్టారనీ, అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయనీ చెప్పుకునేవారు. చర్చి తోటలో ఉన్న చిన్న ఇంట్లో నిమ్మచెట్టు కింద ఒక దెయ్యం ఉందట. హైన్ రిచ్ నాన్న ఎర్నెస్ట్ స్లీమన్ కు ముందు పాస్టర్ గా ఉన్న రుష్టార్బ్ దెయ్యం అది. చర్చికి ఇంకో పక్కన ఓ చెరువు. రోజూ అర్థరాత్రి వేళ ఓ అమ్మాయి చేతుల్లో వెండి పాత్ర ఉంచుకుని ఆ చెరువులోంచి పైకి వస్తుంది. అక్కడికి మైలు దూరంలో ఓ సమాధి ఉంది. చనిపోయిన ఓ శిశువును బంగారు ఊయెలలో ఉంచి పాతిపెట్టిన సమాధి అది.

ఆ ఊరి నడిమధ్యలో మధ్యయుగాల నాటి ఓ కోట. దాని అడుగున రహస్యమార్గాలు. ఒకప్పుడు ఆ కోట హెన్నింగ్ వాన్ హోస్టీన్ అనే ఓ బందిపోటు అధీనంలో ఉండేది. అలా ఉండగా, మెక్లంబర్గ్ డ్యూక్ అతని మీదికి యుద్ధానికి వచ్చాడు. హోస్టీన్ అతనితో సంధి రాయబారాలు జరుపుతూనే, అతన్ని చంపడానికి పథకం వేశాడు. ఓ గోవుల కాపరి దీనిని పసిగట్టి డ్యూక్ చెవిన వేశాడు. హోస్టీన్ ఆ గోవుల కాపరిని పట్టుకుని సజీవదహనం చేసి, అప్పటికీ కసి తీరక మృతదేహాన్ని ఒక్క తన్ను తన్నాడు. డ్యూక్ పెద్ద సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. తప్పించుకునే మార్గం దొరక్క హోస్టీన్ తన ఖజానా అంతటినీ ఓ శిథిల గోపురం కింద దాచి ఆత్మహత్య చేసుకున్నాడు.

చర్చి ప్రాంగణంలో పొడవైన రాళ్ళు పరచి ఉన్న చోటే అతని సమాధి. గోవుల కాపరిని తన్నిన అతని కాలు ఏటా ఒకసారి సమాధి లోంచి పొడుచు వస్తుందని, అదొక వింత పువ్వులా కనిపిస్తుందనీ చెప్పుకునేవారు. నల్లని సిల్కు తొడుగుతో ఉన్న ఆ కాలును నేనొకసారి చూశానని చర్చి పనివాడు చెప్పేవాడు. అతను తప్ప చూశామని చెప్పినవాళ్లు ఇంకెవరూ లేరు.

***

దెయ్యాలు, భూతాల కథలూ…మధ్యయుగాలనాటి కోటా…రహస్యమార్గాలలూ…గుప్తనిధులూ…!

హైన్ రిచ్ ఆసక్తులను, ఊహలను పుష్కలంగా పండించడానికి బాల్యంలోనే కావలసినంత ఎరువు.  అతనా కోటను చూశాడు. దాని ఉత్తరపు గోడ మీద, గుర్రమెక్కి యుద్ధానికి వెడుతున్న హోస్టీన్ చిత్రాన్ని చూశాడు. గోవుల కాపరిని సజీవ దహనం చేసిన ప్రదేశం చూశాడు. మెక్లంబర్గ్ డ్యూక్ ను హెచ్చరించడం కోసం గోవుల కాపరి కొండ మీద దాగి ఉన్న చోటు అతనికి తెలుసు. ఆ కోట అడుగున ఉన్న రహస్యమార్గాలను గాలించాడు. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆ రహస్యమార్గాల తలెక్కడో, తోక ఎక్కడో తనకు తెలుసు ననుకునేవాడు. ఇక అతని బుర్ర నిండా గుప్తనిధుల గురించిన కథలే.

నిజానికి అంతవరకు హైన్ రిచ్ ఆ ఊళ్ళోంచి కాలు కదిపింది లేదు. ఆ చర్చి ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టిన సందర్భాలూ తక్కువే. కిటికీకి అతుక్కుపోయి మంచుపొగలోంచి బాహ్యప్రపంచాన్ని చూస్తూ, దానిని ఓ అద్భుతంగానూ, నిగూఢమైందిగానూ ఊహించుకుంటూ ఆనందంతో పులకించిపోయేవాడు. ఆ పసితనపు ఉత్కంఠ అతని జీవితాంతమూ అలాగే ఉండిపోయింది.

అతను ప్రతిచోటా దెయ్యాలు ఉన్న్తట్టు ఊహించుకునేవాడు. ప్రతి సందు మలుపులో ఏదో భయోత్పాతం కాచుకుని ఉన్నట్టు అనుకునేవాడు. రాత్రిపూట విచిత్రమైన గుసగుసలు వినిపిస్తున్నట్టు, తోటలో దీపాలు కదిలి వెడుతున్నట్టు, హోస్టీన్ భూతం కోటలోంచి కిందికి దిగి వస్తున్నట్టు భావించుకునేవాడు. చెట్ల మీదా, బెంచీల మీదా, కిటికీ రెక్కల మీదా, చర్చి గోడల మీదా తన పేరు రాసి, ఉనికిని చాటుకునే అలవాటు అతనికి ఉండేది. యాభై ఏళ్ల తర్వాత అతను ఆ ఊరు వెళ్లినప్పుడు, చిన్నతనంలో చర్చి తోటలోని నిమ్మచెట్టు మీద తను చెక్కిన పేరు ఉందా లేదా అని చూసుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పేరు అలాగే ఉంది!

తన నలుగురు అక్కచెల్లెళ్లలోనూ డొరోతియా, విల్హెమైన్ లకు అతను ఎక్కువ మాలిమిగా ఉండేవాడు. వాళ్ళమ్మ ఓ మెజిస్ట్రేట్ కూతురు. చాలా నెమ్మదస్తురాలు. పెళ్లయేనాటికి ఆమెకు పదహారేళ్లు. భర్త ఎర్నెస్ట్ కన్నా పదమూడేళ్లు చిన్న. ఆమె దాంపత్యజీవితాన్ని ఏనాడూ ఆనందించలేదు. భర్త ఆమెను పురుగులా చూసేవాడు. పెత్తనం చేసేవాడు. పిల్లలకు మాత్రం తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమె అల్లికలు, కుట్లు చేసేది. పియానో వాయించేది. డాబుసరి మనిషిగా ఊహించుకుని గ్రామస్తులు కూడా ఆమెపట్ల అయిష్టంగా ఉండేవారు. పెత్తందారీకి తోడు భర్త వంట మనుషులతో అక్రమసంబంధాలు పెట్టుకోవడంతో ఆమె మరింత కుంగిపోయింది.

తొంభయ్యేళ్లు జీవించిన ఎర్నెస్ట్  స్త్రీలోలుడిగా అపకీర్తినే మూటగట్టుకున్నాడు. పాస్టర్ కావడానికి ముందు అతను స్కూలు టీచర్ గా పనిచేశాడు. బోధన లో అతనికి మంచి నేర్పు ఉండేది. పిల్లలచేత తనే అక్షరాలు దిద్దించాడు. తన పుస్తకాలలోని చక్కని బొమ్మల్ని పిల్లలకు చూపించి ఆనందించేవాడు. ఓ రోజు అతను తమ పేదరికం మీద మండిపడ్డాడు. అప్పుడు, “ ఓ వెండి గిన్నెనో, బంగారు ఊయెలనో తవ్వి తీయచ్చుగా” అన్నాడు హైన్ రిచ్ అమాయకంగా. ఆ మాటకు తండ్రి నవ్వేశాడు.

ఎర్నెస్ట్ కళాకళల మనిషి. ఒక్కోసారి చాలా ఉదారంగా ఉండేవాడు. ఒక్కోసారి పిసినారిలా వ్యవహరించేవాడు. హఠాత్తుగా కాఠిన్యం తెచ్చుకునేవాడు. అది ఎదుటి వాళ్ళకు వింతగానూ, వినోదంగానూ ఉండేది. కథలు మాత్రం మహా రంజుగా చెప్పేవాడు. పిల్లల్ని ఊరి వెంట, పొలాల  వెంట షికారుకు తీసుకెళ్ళడం అతనికి ఎంతో ఇష్టమైన వ్యాపకం. దారిలో ఎదురయ్యే ప్రదేశాలు, పొలాలు, కట్టడాల చరిత్రను వాళ్ళకు ఎంతో ఆసక్తిగా చెబుతూ ఉండేవాడు. ఆ చెప్పడంలో కూడా అప్పటికప్పుడు కథలు అల్లేవాడు.  ఆ అల్లిక రాను రాను హాస్యాస్పదంగా పరిణమించేది. అయినాసరే, పిల్లలకు అది నమ్మశక్యంగానే అనిపించేది. వారు ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టుకుని వింటుంటే ఉన్నట్టుండి పెద్ద పెట్టున నవ్వేసేవాడు. శీతాకాలపు సాయంత్రాలలో పిల్లలు అల్లరి చేయకుండా హోమర్ నుంచి కథలు చెప్పేవాడు. ఆ చిన్నపాటి చర్చి కాస్తా ట్రోజన్ యుద్ధారావాలతో కంపించిపోయేవరకూ ఆ కథనం సాగుతూ ఉండేది.

అతనికి గ్రీకు తెలియదు. హోమర్ రచనల మూలాన్ని ఎప్పుడూ చదవలేదు. అయినాసరే, ఇలియద్, ఒడిస్సేలపై అతని ఆసక్తికి అవి అడ్డురాలేదు. జర్మన్లు అందరికీ హోమర్ బాగా తెలుసు. గథే, షిల్లర్ లాంటి ఎందరో జర్మన్ కవులు హోమర్ ను అనుకరించారు, ఆరాధించారు, కవిగా ఆయనను ఆకాశానికి ఎత్తారు. హోమర్ రచనలకు జర్మన్ లో అద్భుతమైన అనువాదాలు వచ్చాయి. వాటన్నింటిలోనూ ప్రసిద్ధమైనది జె. హెచ్, వాస్ అనువాదం. విశేషమేమిటంటే, వాస్ యువకుడిగా ఉన్నప్పుడు, హోస్టీన్ ఆ గోవుల కాపరిని సజీవదహనం చేసిన కోటలోనే  కొన్ని మాసాలపాటు ట్యూటర్ గా గడిపాడు.

ఆవిధంగా హోమర్ హీరోలను పిల్లలు సొంత ఆస్తిగా భావించుకునేవారు. అచియన్లకు, ట్రోజన్లకు మధ్య జరిగిన యుద్ధాల కథలను ఊపిరి బిగబెట్టి వింటుండేవారు. వాళ్ళ ఊహలో అంకెర్షగన్ కోటకు చెందిన శిథిలమైన బురుజులు, యుద్ధప్రదేశాలలోనే ట్రోజన్ యుద్ధం జరిగిపోతూ ఉండేది. అంకెర్షగనే  వాళ్ళ ట్రాయ్ నగరం. అలాగే ట్రాయ్ హీరోల జీవితాలు, వాళ్ళ జీవితాలు ఒకటిగా కలసిపోయేవి.

1829 క్రిస్టమస్ రోజున హైన్ రిచ్ కు వాళ్ళ నాన్న లుడ్విగ్ జెర్రర్ రాసిన సచిత్ర ప్రపంచ చరిత్ర(Illustrated History of the World)ను కానుకగా ఇచ్చాడు. అప్పటికి హైన్ రిచ్ కు ఏడేళ్లు. వెంటనే పేజీలు తిరగేస్తుంటే, ట్రాయ్ నగరం దగ్ధమైపోతున్న దృశ్యం కనిపించింది. తురాయితో ఉన్న శిరస్త్రాణాన్ని, కవచాన్ని ధరించిన ఇనియెస్; తండ్రి ఎంకైసిస్ ను వీపున మోస్తూ, కొడుకు అస్కేనియెస్ చేయి పట్టుకుని ఆ పొగలోంచీ, మంటల్లోంచీ ముందుకు నడుస్తూ ఉంటాడు. ఆ చిత్రం హైన్ రిచ్ ను ఎంతో ఆకట్టుకుంది. అందులోని ప్రతి వివరం అంకెర్షగన్ నే ట్రాయ్ గా ఊహించుకోడానికి అతనికి సాయపడింది. గుండ్రని బురుజులు, ఎత్తైన కోట గోడలు,  అతిపెద్ద సింహద్వారం-అన్నీ అంకెర్షగన్ లో ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇంతకు ముందున్న పాస్టర్ కు, ఇనియెస్ కు మధ్య పోలికలు కొట్టొచ్చినట్టు కనిపించడం. ఎత్తైన నుదురు, విశాలమైన కళ్ళు, బండ ముక్కుతో ఇద్దరూ సరిగ్గా ఒకేలా ఉన్నారు. ఇనియెస్ తగలబడుతున్న ట్రాయ్ నుంచి భయంతో పారిపోతున్నవాడిలా లేడు. నెమ్మదిగా, ప్రశాంతంగా, వెనుదిరిగి చూడకుండా పొగ లోంచి బయటికి వస్తున్నవాడిలా ఉన్నాడు.

ఈ చిత్రాన్ని చూడడం తన జీవితంలో ఒక మలుపు అంటాడు, పెద్దైన తర్వాత హైన్ రిచ్. భూమిలో కప్పడిపోయిన  ట్రాయ్ నగరాన్ని ఎప్పటికైనా తవ్వి తీయాలని, ఆ చిత్రాన్ని చూసిన క్షణంలోనే  అతను నిర్ణయించుకున్నాడు. నగరం తగలబడిపోయినా కోట గోడలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని వాళ్ళ నాన్నతో అన్నాడు. బహుశా జెర్రర్ ఆ నగరాన్ని చూసి ఉంటాడని కూడా అన్నాడు.

“లేదు, లేదు. మొత్తం ట్రాయ్ అంతా తగలబడి బూడిదైపోయింది. నువ్వు చూసింది వట్టి ఊహాచిత్రం” అన్నాడు ఎర్నెస్ట్.

“కానీ ట్రాయ్ లో ఆ బొమ్మలో చూపిన గోడల్లాంటివే ఉండి ఉంటాయి” అన్నాడు అబ్బాయి.

“అవును”

“అంత పెద్ద పెద్ద గోడల్ని మంటలేం చేస్తాయి? వాటిలో కొన్నైనా మిగిలే ఉంటాయి”

“లేదు, మిగిలే అవకాశమే లే”దని తండ్రి ఖండితంగా అన్నాడు. కానీ అబ్బాయి మాత్రం తన అభిప్రాయానికే కట్టుబడి ఉండిపోయాడు. ఏదో ఒక రోజున తను ట్రాయ్ కి వెళ్ళి జెర్రర్ తన పుస్తకంలో కళ్ళకు కట్టేలా వర్ణించిన గోడల్ని, బురుజుల్ని కనిపెట్టి తీరతానని అనుకున్నాడు.

యాభై ఏళ్ల తర్వాత ముక్క ముక్కలుగా తను రాసుకున్న ఆత్మకథలో హైన్ రిచ్ ఈ బాల్యస్మృతులను నెమరువేసుకున్నప్పుడు పండితులు కనుబొమలు ఎగరేశారు. తన ఏడో ఏట తండ్రితో జరిగినట్టు చెబుతున్న ఆ సంభాషణ ఆయనకు అంతగా గుర్తుండడం నమ్మశక్యంగా లేదన్నారు. ట్రాయ్ ని తవ్వి తీయడం గురించి తను కలలు కనని క్షణం, ఆలోచించని రోజు తన జీవితం మొత్తంలోనే లేవనీ; ఎత్తైన ట్రోజన్ గోడలపై విజయగర్వంతో నిలబడే రోజు కోసమే తన శక్తియుక్తులన్నీ వెచ్చించాననీ హైన్ రిచ్ సమాధానం చెప్పినప్పుడు కూడా పండితులు ఆయనను అనుమానంగా చూశారు. కానీ బాల్యం నుంచీ ఆయన ఆసక్తులను, జీవన గమనాన్ని పట్టి చూస్తే ఆయన మాటలు అతిశయోక్తులనిపించవు.

ఆ అబ్బాయి అలా కలలు కంటూనే స్కూలుకు వెళ్ళి వస్తున్నాడు. ఇంకా విచిత్రంగా తన ఏడో ఏటే అతను ప్రేమలో కూడా పడ్డాడు. ఆ అమ్మాయి పేరు మిన్నా మెయింక్. సరిగ్గా అతని వయసే. ఓ రైతు కూతురు. పసుపు రంగు జుట్టు, నీలి కళ్ళు-ఓ అందమైన బొమ్మలా ఉంటుంది. ఓ రోజు ఇద్దరూ డ్యాన్సింగ్ క్లాసులో కలసుకున్నారు. అప్పటినుంచీ విడదీయలేని జంటగా మారిపోయారు. హైన్ రిచ్ చెప్పే కథల్ని ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. ఓ రోజు మెయింక్ కుటుంబం అంతా చర్చికి వచ్చారు. దూరం నుంచి వాళ్ళను చూస్తూనే హైన్ రిచ్ అక్కడినుంచి మాయమైపోయాడు. సాధారణంగా చింపిరి జుట్టుతో ఉండేవాడు కాస్తా, సబ్బుతో నిగనిగలాడేలా మొహం తోముకుని, చక్కగా తల దువ్వుకుని, ఉన్నంతలో మంచి సూటు వేసుకుని పెళ్లికొడుకులా వాళ్ళ ముందుకు వచ్చాడు. ఇంట్లో వాళ్ళు అతన్ని వింతగా గుడ్లప్పగించి చూశారు. ఆ అమ్మాయిని మెప్పించడం కోసమే ఇంత వేషం కట్టాడని ఆ తర్వాత కానీ వాళ్ళకు తట్టలేదు.

ఆ ఏడేళ్ళ వయసులోనే మిన్నాపై అతనికి ఎంత అచంచలమైన ప్రేమంటే, ఎప్పుడూ ఆ అమ్మాయి పక్కనే ఉండేవాడు. స్కూలులో పక్కనే కూర్చునేవాడు.  కలసి డ్యాన్సింగ్ క్లాసుకు వెళ్ళేవాడు. ఇద్దరూ పుట్టలు, గుట్టలవెంట కలసి తిరిగేవారు. కోట దగ్గర, శ్మశానం దగ్గర వేళ్లాడుతూ ఉండేవారు. హెన్నింగ్ వన్ హోస్టీన్ కాలు రాళ్లనుంచి పొడుచుకొచ్చిన చోటు కూడా వాళ్ళు చూశారు. గోవుల కాపరిని సజీవదహనం చేసిన ప్రదేశాన్ని, రహస్యమార్గాలను జంటగా పరిశీలించారు. ఆ కోటలో హోస్టీన్ అనే బందిపోటు నిజంగా ఉండేవాడా అని కనిపించిన వాళ్ళ నందరినీ అడిగారు. ఏటా ఒకసారి అతని కాలు కనిపించేదనీ, ఈ మధ్యనే ఎవరో చెట్ల పండ్లు రాల్చడం కోసం దానిని ఊడబెరికాడనీ చర్చి పనివాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటల్ని వాళ్ళిద్దరూ నమ్మేశారు. ఆ ఊళ్ళో పీటర్ హప్పర్ట్ అనే దర్జీ ఉండేవాడు. అతనికి ఒకే కన్ను, ఒకే కాలు. దాంతో అతని నడక గెంతీనట్టుగా ఉండేది. అందరూ అతన్ని ‘గెంతుల పీటర్’ అనేవారు. మళ్ళీ కథలు చెప్పడంలో అంతటి మొనగాడు లేడు. దానికితోడు అతనిది అధ్బుతమైన జ్ఞాపకశక్తి. చాలామంది నిరక్షరాస్యుల్లానే అతను కూడా విన్నది ప్రతిదీ గుర్తుపెట్టుకునేవాడు. గడిచిన ఆదివారం పాస్టర్ స్లీమన్ చేసిన మొత్తం ప్రబోధాన్ని ఉన్నదున్నట్టు అప్పజెప్పేవాడు.

అతనో రోజున ఓ ముచ్చట చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఊళ్లో వేసవిలో కనిపించే గూడకొంగలు శీతాకాలంలో ఎక్కడికి వెడతాయన్న సందేహం అతనికి కలిగిందట. చర్చి పనివాడి సాయంతో ఓ కొంగను పట్టుకున్నాడు. “వేసవిలో ఈ కొంగ షివేరిన్-మెక్లంబర్గ్ లోని అంకెర్షగన్ లో గూడుకట్టుకుంది. దీనిని చూసినవారు శీతాకాలంలో ఇది ఎక్కడ గడిపిందో దయచేసి తెలియజేయగలరు” అని ఒక తోలు కాగితం మీద రాసి, కొంగ కాలికి కట్టాడు. మరుసటి వేసవికి ఆ కొంగ తిరిగివచ్చింది. దాని కాలికి ఒక చర్మపత్రం కట్టి ఉంది. దాని మీద,  “మాకు షివేరిన్-మెక్లంబర్గ్ ఎక్కడుందో తెలియదు. ఈ కొంగ కనిపించిన ప్రదేశాన్ని సెయింట్ జాన్స్ లాండ్ అంటారు” అని చిత్రలిపిలో రాసిన వాక్యాలు ఉన్నాయి.

near ankershagen castle

“మేము పీటర్ మాటల్ని నమ్మాం . సెయింట్ జాన్స్ లాండ్ అనే ఆ మార్మిక ప్రదేశం ఎక్కడుందో కనిపెట్టడానికి మా జీవితకాలం మొత్తాన్ని ధారపోసి ఉండేవాళ్లం” అని ఆ తర్వాతి కాలంలో ఆ అబ్బాయి రాసుకున్నాడు. బహుశా అది ట్రాయ్ కి మరో పేరు అయుంటుంది!

ఇక చర్చికి తిరిగొస్తే అక్కడా వింతలు, విశేషాలకు లోటులేదు. ఎప్పుడో చనిపోయినవారి పేర్లను నమోదు చేసిన పురాతన, భారీ రిజిస్టర్లు అందులో ఉన్నాయి. అవి బరువైన గోతిక్ రాతలో ఉన్నాయి. 1709-1799 మధ్యకాలంలో 90 ఏళ్లపాటు పాస్టర్లుగా ఉన్న జొహాన్ క్రిస్టియన్ వాన్ ష్రోడర్, అతని కొడుకు గాట్ ఫ్రైడ్ రిచ్ స్వహస్తాలతో రాసిన రిజిస్టర్లు అవి. పిల్లలు అప్పుడప్పుడు ఆ పేజీలు తిరగేసేవారు. వాటి సంరక్షణ హక్కు తనకు ఉన్నట్టు హైన్ రిచ్ కు అనిపించేది. గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురు 84 ఏళ్ల వయసులో అప్పటికింకా జీవించే ఉంది. పుట్టుకలు, పెళ్లిళ్లు, చావుల నమోదుతో అంతూపొంతూ లేకుండా సాగే ఆ రిజిస్టర్లను తిరగేసి అలసిపోయిన తర్వాత గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురింటికి వెళ్ళేవారు. ఆమెకు ఆ ఊరి గురించి, గ్రామస్తుల గురించి తెలియని దంటూ లేదు. పిల్లలకు తన పూర్వీకుల చిత్రపటాలు చూపిస్తూ ఉండేది. ప్రత్యేకించి వాళ్ళ అమ్మ ఓల్గార్తా క్రిస్టైన్ వాన్ ష్రోడర్ చిత్రం హైన్ రిచ్ కు ఎంతగానో నచ్చేసింది. ఆమె అచ్చం మిన్నా లానే ఉంది.

అలా హైన్ రిచ్, మిన్నాలు రెండేళ్లపాటు చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. ఒకరి రహస్యాలు ఒకరు చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలసి ఉండాలనుకున్నారు. అది కూడా అంకెర్షగన్ లోనే. అక్కడి ఎత్తైన చర్చి గోపురం, తోట, శ్మశానం, కొండ మీద పెద్ద కోట—ఇవే వాళ్ళకు తెలిసిన ఏకైక ప్రపంచం. తమ కలల్లో ఇంకొకరి జోక్యానికి ఒప్పుకోకూడదని కూడా ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు.

కానీ వారి కలలకు హఠాత్తుగా అంతరాయం కలిగింది. ఉన్నట్టుండి తమ చుట్టూ ఉన్న ప్రపంచం ఓ బూడిద కుప్పగా వారికి తోచింది…

  (సశేషం)

 

 

మీ మాటలు

  1. Dr.Vijaya Babu Koganti says:

    మీరో మాటల మాంత్రికులు. నాలుగు సార్లు చదివాను. భలేగా ఉంది. అభినందనలు.

  2. Dr.Vijaya Babu Koganti says:

    మీరో మాటల మాంత్రికులు. నాలుగు సార్లు చదివాను. భలేగా ఉంది. అభినందనలు. చిత్రం స్లీమన్ దేనా?

  3. కల్లూరి భాస్కరం says:

    థాంక్స్ విజయబాబు గారూ…ఆ చిత్రం హైన్ రిచ్ స్లీమన్ ప్రేయసి మిన్నా మెయింక్ ది.

మీ మాటలు

*