కృష్ణమోహన్ బాబు
యువ మరాఠీ దర్శకుడు, అరుణ్ అవినాశ్ ‘కిల్లా’ (కోట) ధియేటర్ వదిలినా పదే పదే మనల్ని మర్చిపోని ఖమాజ్ రాగంలో పాడిన చక్కని కవిత్వంలాంటి సినిమా. అరుణ్ కిది మొదటి మరాఠీ సినిమా. కథ, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం అరుణే చేసి అన్ని విభాగాల్లోనూ ఆరితేరిన సీనియర్ కళాకారులను మించిన పనితనాన్ని చూపించాడు. 2015 వ సంవత్సరానికి మరాఠీ సినిమాలు ఏకంగా 5 జాతీయ అవార్డులు గెల్చుకుంటే, ‘కిల్లా’ సినిమా ఉత్తమ మరాఠీ చిత్రంగా, అందులో నటించిన బాల నటుడు, అర్చిత్ దేవ్ ధర్ ప్రశంసాత్మక నటనకి ‘స్పెషల్ మెన్షన్ ‘ గా రెండు అవార్డులు గెల్చుకుంది. ఈ సినిమా అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో కూడా ప్రశంసలని, అవార్డులని అందుకుంది.
పదకొండేళ్ళ చిన్మయ్ తల్లి పూనా మహా నగరంలో ప్రభుత్వ రెవెన్యూ డిపార్టుమెంట్ లో ఒక చిన్న ఉద్యోగిని. చిన్మయ్ తండ్రి పోయాక ప్రమోషన్ మీద ఆవిడ కొంకణ్ తీరంలో వున్న ఓ మారు మూల గ్రామానికి బదిలీ అవుతుంది. హడావిడిగా వుండే పూనా నగరం నుంచి ఏ శబ్దాలూ లేని ఓ మారు మూల పల్లెటూరుకి రావటం చిన్మయ్ ని చాలా చికాకు పరుస్తుంది.
ఇస్మాయిల్ ‘బదిలీ ‘ కవిత గుర్తుందా?
“బర బరా
ఈడ్చిన ట్రంకు పెట్టేలా
హృదయం క్షోభ పడింది.
ఇది
జరపడానికి చేసింది కాదు “
ఏ కుదుళ్ళలోనూ కుదురుకోలేని జీవితం అంతా గందరగోళం.
స్కూలులో స్కాలర్ షిప్ వచ్చిన తెలివైన కుర్రాడిగా చిన్మయ్ ని టీచర్ పరిచయం చేస్తే, అంతంత మాత్రం చదువులతో అల్లరి చిల్లరిగా వుండే ఆ వూరి కుర్రాళ్ళ కది, అదో ఆకతాయి వ్యవహారంలా వుంటుంది. ఎవరూ చిన్మయ్ తో కలవడానికి పెద్దగా ఆశక్తి చూపరు. పొద్దుటే స్కూలు దగ్గర దింపి వెళ్ళిన తల్లి, రాత్రి చీకటి పడ్డాక హడావిడిగా రావటం రోజువారీ దృశ్యం. నగరం ఇచ్చిన వయసుకు మించిన పెద్దరికం , ఒంటరితనం , పూనా తాలూకు జ్ఞాపకాలు, అక్కడి మిత్రులు ఎవారితోనూ కలవకుండా చేస్తాయి. తల్లితో నైనా విషయాలు పంచుకుందాం అంటే, ఆవిడ చికాకులు ఆవిడవి. రెవెన్యూ డిపార్టుమెంట్ అంటే మగాళ్ళ ఆధిపత్యంలో చట్టపరంగా పనులు ఎలా జరగకూడదో చూసే అవినీతి సాలెగూడు.
సాలీడుకు దొరక్కుండా ఎలా రక్షించుకోవాలో చూసుకోవాలో తప్ప, గూడు వదిలి వచ్చే దారి లేదు. తన కిష్టం లేకపోయినా తోటి ఉద్యోగుల ఒత్తిడి మీద ఓ తప్పుడు పనిలో తప్పక యిరుక్కున్న తల్లి, ఆ సమస్యని ఎలా దాటాలా? అని మథన పడ్తుంటే, ఇక చిన్మయ్ సంతోషంగా గడిపే క్షణాలు ఏముంటాయి? ఒక రోజు తోటి కుర్రాళ్ళతో సైకిలు పందెం వేసుకుని, వూరి చివర వున్న కోట దాకా వెళ్ళి యితర కుర్రాళ్ళు వెళ్ళిపోయినా, అతను కోట లోనే వుండిపోతాడు. సముద్రపు అంచున వున్న ఆ కోట, చిన్మయ్ మానసిక స్థితిని ఎత్తి చూపించిందా అన్నట్టు, దారి ఎటో తెలియని కోట లోపలి బాటలు, ఉరుములు, మెరుపులతో బయట కురుస్తున్న వర్షం, గొంతెత్తి అరచినా ఎవరికీ వినబడని పిలుపు , చివరికి ఎలాగో అలాగ కోటలో నుంచి బయట పడ్డ తనలో గూడు కట్టుక్కున్న భయాల్ని అధిగమించడానికి తల్లి మీద చిన్నగా తిరగ బడటం మొదలు పెడ్తాడు.
ఒక రోజు ఒక చేపలు పట్టే వాడితో కల్సి పడవలో మైళ్ళ దూరం సముద్రం మీద కు వెళ్ళి, తిరిగి వస్తానో రానో అనే భయం తో రాత్రి పొద్దు పోయాక ఇల్లు చేరుకున్న తర్వాత ఉద్వేగానికి గురి అవుతాడు. తన మీద తనకి వీటి నన్నిటి నుంచి కూడా బయట పడగలనని నమ్మకం కలుగుతుంది. తను వదిలేసిన తోటి కుర్రాళ్ళతో నెమ్మిదిగా స్నేహం మొదలవుతుంది. అయితే ఆఫీసులో తల్లి చేసిన తప్పు వాళ్ళ జీవితాలని మరో మలుపు తిప్పుతుంది. అయితే తల్లికీ, కొడుక్కీ యిప్పుడా సమస్య లేదు. సర్దుబాటుకి అలవాటు పడ్డారు. తప్పదు. జీవితం అంతే. పదే పదే వచ్చే సమస్యకి మొదట భయం వుంటుంది. తర్వాతర్వాత అదే అలవాటయి పోతుంది.
అరుణ్ అవినాశ్ సొంత అనుభవాలతో రాసిన ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా మందికి ఓ పాఠంలా పనికి వస్తుంది. ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్తాయి. విచిత్రం ఏమిటంటే సినిమాని ఓ డ్రామాగానో, మెలో డ్రామాగానో మలచడానికి ప్రేక్షకుల్ని కన్నీళ్ళు పెట్టించడానికి అనేక అవకాశాలు వున్నా, దర్శకుడు వాటి దరిదాపులలోకి వెళ్ళడు. ఎందువల్ల అంటే ఇది రోజువారీ జీవితం. సమస్యలు చాలా వ్యక్తిగతం అయినవి. అక్కడ డ్రామాతో పని లేదు. ఆ విషయం సరిగా అవగాహన చేసుకోవటం వల్లనే రెండో సినిమాతోనే జాతీయ స్థాయికి ఎదిగాడు.
ప్రతీ పాత్ర ఎంతో శ్రధ్ధగా, చాలా ప్రేమతోటి తీర్చి దిద్దాడు. అందుకే ఒక్క నిమిషం పాటు వచ్చే ప్రక్కింటి అమ్మమ్మ కూడా తెర మీద తన ఉనికిని చూపెట్టుకో గలుగుతుంది. అర్చిత్ దేవ్ ధర్ మహా నటుల్ని తల దన్నెలా చేశాడు. తల్లి, అమృతా సుభాష్ , తోటి స్కూలు కుర్రాడిగా భలేరావ్ భంద్యా చక్కగా నటించారనటం చిన్న మాట.
ఈ సినిమా చూసిన తర్వాత చప్పుడు లేని సుదూర సముద్రపు ఒడ్డు, ఒంటరిగా నడిచి పోయే పీత, మసక దీపాల వెలుగులో, మనుష్యులు లేని పల్లె వీధుల్లో ఒంటరి గా తల్లి కోసం చూస్తుండే కుర్రాడు, అలలు ఎంత పెకిలిద్దామని చలించక గంభీరం గా నిలిచిన కోట మన కలల్ని, ఆలోచల్ని పదే పదే తట్టి నిలబెట్టక పోతే ఆశ్చర్య పోవాలి. కొన్ని విషయాలని చిన్న చిన్న సజెషన్ ద్వారా దర్శకుడు చాలా తెలివిగా చెప్తాడు. ఎలా అంటే, తల్లి రోజూ ఇంటికి వర్షంలో చీకటి పడ్డాక గొడుగు వేసుకుని వస్తూ వుంటుంది. కాని ఆఫీసులో సమన్లు అందుకున్నప్పుడు మాత్రం వర్షంలో తడుసుకుంటూ వస్తుంది. నిర్మానుష్యమ్ గా వున్న సముద్రం ఒడ్డున చిన్మయ్ ఒంటరిగా కూర్చున్నుండగా సముద్రం నుంచి ఏ ఘోషా వినబడదు. ఒకే ఒక్క పీత మాత్రం గబగబా పాక్కుంటూ వెళ్తూ వుంటుంది. రోజువారీ సర్దుబాటే కష్టంగా వున్న పరిస్థితిలో ఒక రోజు చిన్మయ్ బడికి వెళ్ళేముందు, ఇంటి ముందు తల్లి కొన్న కొత్త సైకిలు వుంటుంది. వ్యవస్థ తో తల్లి రాజీ పడిన దన్న విషయం చాలా సున్నితంగా చెప్తాడు దర్శకుడు. ఇలా చాలా వున్నాయి. అలాగే స్కూలు లో పిల్లల మధ్య జరిగే కొన్ని విషయాలు మనల్ని చిన్నప్పటి స్కూలు రోజులకి తీసుకుపోతాయి.
గత ఆరేడు సంవత్సరాల నుంచి మరాఠీ, బెంగాలీ, మలయాళీ, తమిళ్ సినిమాల పరిశ్రమ నుంచి చాలా మంది కుర్రాళ్ళు, జాతీయంగా, అంతర్జాతీయంగా తమ సత్తాని చాటుకుంటూ అనేక మంచి సినిమాలని తీస్తున్నారు. వీళ్ళందర్నీ చూసినప్పుడు భారతీయ సినిమాకి, సంగీతానికి, సాహిత్యానికి మంచి రోజులు పోలేదని, ఈ పిల్లల చేతిలో అవి మరింత అందాలు దిద్దుకుంటున్నాయని అనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్లలో అరుణ్ అవినాశ్ ఒకడు. రాబోయే “దృశ్యం” హిందీ సినిమాకి ఇతనే ఫోటోగ్రాఫర్.
*
ఆఖరి పేరా మొదటి లైన్లో ‘తెలుగు’ అని లేకపోవడం అందరూ గమనించాలి… మంచి సినిమాను, దర్శకుడిని పరిచయం చేసినందుకు కృష్ణ మోహన్ బాబు గారికి అభినందనలు.