Archives for April 2015

ఒక హెచ్చరికని జారీ చేసిన కథ…

  ఆర్.దమయంతి

 నిన్ననే చదివాను. ఒక స్త్రీ వైవాహిక విషాద గాధ.

పెళ్ళై, ఐదేళ్ళౌతున్నా, తనకీ, తన భర్తకీ మధ్య ఎలాటి శారీరక సంభంధమూ లేదని చెప్పింది. అంతే కాదు అతనొక గే   (స్వలింగ సంపర్కులు) అని తెలుసుకుని కుమిలిపోయానని, అయినా, ఆశ చంపుకోలేక మార్చుకునే ప్రయత్నం కూడా చేసానని..చివరికి వైఫల్యాన్ని భరించలేక మరణిస్తున్నానని …రాసి వెళ్ళిపోయింది. ఈ లోకం నించి శాశ్వతం గా శలవు తీసుకుని వెళ్ళిపోయింది.

ఆత్మహత్య ఎంత భయంకరమైన నరకమో. అయినా.. వెరవడం లేదు- స్త్రీలు. ఎందుకంటే అంత కన్నా మహానరకం ఇంట్లోనే అనుభవిస్తున్నప్పుడు, … మొగుడు యముడై పీక్కు తింటున్నప్పుడు ..చావొక లెక్కలో పని కాదనుకొనే గట్టి నిర్ణయానికొచ్చేస్తున్నారు.

బ్రతుకొక పీడ గా మారినప్పుడు, క్షణం..క్షణం  అభద్రతా భావాలు ప్రాణాలను నొక్కేస్తున్నప్పుడు ..ఒక్కసారిగా ఊపిరి ఆపేసుకు పోవడమే సరైన చర్య గా డిసైడైపోతున్నారు.

ఒక డాక్టర్..ఒక ఇంజినీర్, ఒక సైంటిస్ట్, ఒక పోలీస్ అధికారి, ఒక అయ్యేఎస్, ఒక లాయర్, ఒక ఫేషన్ డిజైనర్, ఒక టాప్ మోడల్..ఇలా – ఏ స్త్రీ ఆత్మహత్య కథ చూసినా – వెనక దాగిన మూల పురుషుడు ఒక్కడే. వాడు – సహచరుడో, లేదా తాళి కట్టిన సొంత మొగుడో! -అతని మూలం గానే చస్తోంది.

మా ఆడవాళ్ళే అంటారు, అంత చదువుకుని అదేం రోగం?, చావడం? అని గభాల్న అనేస్తారు . అఫ్ కోర్స్! ..ప్రేమ కొద్దీ!

కానీ, చదువు వల్ల మెదడు పెరుగుతుంది కానీ, హృదయాన్ని రాయి చేస్తుందా ఎక్కడైనా!

మోసపోయిన స్త్రీ హృదయ గాయాలకు మందింకా కనిపెట్టలేదు- ఈ ప్రపంచంలో! లేకపోతే ఇన్ని మరణాలెందుకు సంభవిస్తున్నాయీ?

స్త్రీకి ప్రేమించడమొకటే కదూ, తెలిసింది.  మోసగిస్తే, ఆ వంచకుణ్ణి  చంపేయాలని ఆలోచన కూడా రాదు.  తాను మరణించడమే సమంజసమనుకుంటోంది. ఎంత పిచ్చిది?! ఇంత అమాయకత్వమా?

ఎందుకనీ?- ఇంతకంటే మరో మార్గం లేదా? వుంటే, ఎక్కడా?

ఒక సారి పెళ్ళై కాపురానికెళ్ళిన ఆడదాని భవిష్యత్తంతా కట్టుకున్న వాడిచేతిలోకెళ్ళి పడుతోంది. ఒక వేళ ప్రేమ వివాహమే అయినా, పెళ్ళి తర్వాత అతనిలో ఎలాటి మార్పులు చోటు చేసుకుంటాయో, అవి ఎలాటి విపత్కరాలకు దారి తీస్తాయో  ఊహాతీతం. రేపు ఏమౌతుందో అంచనా వేయడం ఎవరి తరమూ కావడం లేదు.

సాయిపద్మ కథ చదివాను. కులాంతర వివాహం చేసుకున్న ఆమె జీవితం అత్తవారింట్లో ఎంత దుర్భర ప్రాయమైందనీ!..  తక్కువ కులపు స్త్రీ అని ఆమెని మాటలతో పొడిచి పొడిచి పెడ్తారు.  ఆమె ఎన్నో సార్లు గర్భస్రావాలు చేయించుకుంటుంది. భర్త శాసనంతో. గృహ హింసలలో ఇదొక విభిన్నమైన పార్శ్వాన్ని చూస్తాం.

Sketch290215932

మొన్ననే కదూ చూసాం టీవిలో. –  ఆడపిల్లను కన్నదనే నెపంతో ఆ ఇల్లాల్ని  ఇంట్లోకి రానీక, గెంటేసాడు ఆ మొగుడు. (అందుకు కారణం తనే అని తెలిసి కూడా..)  ఆమె ఎటుపోవాలో అర్ధం కాక,  అత్తవారింటిముందే  బిడ్డను వొళ్ళో పెట్టుకుని బైఠాయించేసింది.

కట్నం తక్కువైందనో, గర్భం దాల్చడం లేదనో, మగ పిల్లాణ్ణి కన్లేదనో, పక్కింటి వాడితోనో, పాలవాడితోనో మాట్లాడిందనో, సంపాదించడం లేదనో, తనని ‘సుఖపెట్టడం’ రావడం లేదనో..ఏదో ఒక మిష తో- అన్ని యుగాల్లోనూ.. స్త్రీని హిసిస్తునే వున్నాడు మగాడు. ప్రియుడో, సహచరుడో, మొగుడో..ఎవరైనా, స్థాయీ భేదాలే తప్ప, శాడిజం లో  అందరూ సమ ఉజ్జీలే. పెద్ద  తేడా ఏమీ వుండబోవడం లేదు.

హుష్!..రోసి పోతున్నారు స్త్రీలు. సొమ్మసిల్లిపోతున్నారు – ఇలాటి సంఘటనలకు.

చిన్న జీవితం. కోరి కోరి ఇంత పెద్ద నరకం కొని తెచ్చుకోవాలా? అసలు తనకు ఇలాటి పెళ్ళి అవసరమా? మొగుడితో  కలసి కాపురం అనే ముసుగు లో ఇంత తన్నులాట తప్పదా?

ఇలాటి జైలు జీవిత బారిన పడకుండా ఆకాశమే హద్దు గా సంతోషం గా బ్రతకలేదా? ఆంక్షా రహితమైన కాంక్షా పూరిత జీవనాన్ని సాగించడానికి ఎవరికో అభ్యంతరాలుంటే అందుకు తనెందుకు తలొంచాలి?

చలం ప్రశ్నే, మరొకసారి తిరిగి సూటిగా అడిగింది. కాదు నిలదీసింది. ఆమె పేరు – వారిజ.

స్త్రీ  ఎంత విద్యాధికురాలైనా, మరెంత ఆర్ధికంగా ఎదిగినా, హృదయాన్ని పెంచుకోలేని, పెంచుకోనీని ..డామినేషన్ జాతి తో వేగలేక వీగిపోతున్న స్త్రీల కన్నీళ్ళని  చదివిందో, లేక చవి చూసిందో!

అగ్నిలో దగ్ధమౌతున్నప్పటి ఆ అబలల ఆర్తనాదలు విని ఘోషించిందో, శొకించిందో..

వారిజ – తీసుకున్న ఈ నిర్ణయం నన్ను చాలా ఆలోచింపచేసింది .

వివాహ ప్రసక్తి కి సున్నా చుట్టి, ఆమె అమ్మ గా మారేందుకు సిధ్ధమైంది. ఒక పరిపూర్ణ స్త్రీ గా మారే దశ మాతృత్వం. పెళ్లి కి భయపడో, మొగుడికి తలొంచో తన ఉన్నత స్థానాన్ని ఎందుకు వదులుకోవాలనుకుందో ఏమో!… ఆమె పెళ్ళి కాని తల్లి కావాలనుకుంది. అయింది. దట్సాల్. ఆమె లైఫ్. ఆమె చాయిస్.

షాక్ అయ్యే వాళ్ళు  అవుతారు.

వాళ్ళు –

స్త్రీని ఇలా వాడుకుని అలా పారేసే వాళ్ళు, పెళ్ళాన్ని పూచిక పుల్ల లా తీసిపడేసే మగాళ్ళు, కించ పరిచడమే ధ్యేయంగా బ్రతికే భర్తలు, నేను లేకపోతే నీ బ్రతుకు అధ్వాన్నమైపోతుందంటూ ..తమని తాము ఆకాశానికెత్తుకునే ఉత్తుత్తి ధీరులు…’ఆ ఆఫ్ట్రాల్ ఆడది. ఎక్కడికి పోతుందీ? నా వల్ల గర్భం కూడా దాల్చాక అంటూ విర్రవీగే మా రాజులకి మహ చెడ్డ రోజులు వచ్చి పడే రోజులున్నాయంటూ ఒక హెచ్చరిక చేసిన ధీశాలి. కాదు. ఢీశాలి. – వారిజ.

మార్టిన్ అంటాడు. రచయితలు రెండు రకాల వారుంటారట. ఒకరు ఆర్కెటెక్ట్స్. మరొకరు గార్డెనర్స్ అని.

వసంత మొదటి కోవకు చెందిన వారనిపిస్తుంది నాకు.

ఇదే కథాంశంతో కూడిన కథ ఏ ఇతర భాషలోనూ వస్తే …చాలా కలాలు తెలుగులో తర్జుమా చేసి ఇంగ్లీష్ లో రెవ్యూలు రాద్దురేమో!…

సారంగ పత్రిక వారు సాహసించకపోతే, ఈ మెరుపునిక్కడ చూసె అవకాశం వుండేది కాదేమో.

రచయిత్రి  లక్ష్మీ వసంత .పి. రాసిన వారిజ కథ చదవంగానే నాకనిపించింది, ఈమె స్త్రీ ని స్త్రీ హృదయాన్ని విరివిగా చదివి, విస్తృత స్థాయిలో పరిశీలన చేస్తోందని..

నేటి తరం స్త్రీ తీసుకోవాలనుకుంటున్న ఒక కొత్త నిర్ణయానికి నాందిగా వారిజ సృష్టి జరిగిందనీ..ఈ ఆధునిక మహిళ  చేత ఒక ముందడుగు వేయించారనిపిస్తుంది. డైనమిక్ లేడీ!

మీరూ ఆమె బాటలో నడవండంటూ రచయిత్రి ఎవరికీ సందేశాలివ్వలేదు.

మగాళ్లంతా చెడ్డ వాళ్ళంటూ …ముద్ర వేయనూలేదు.

కానీ..ఆడది సాహసిస్తే..ఇంత పనీ చేయగలదు…బ్రతుకంతా మగ పోరు, మగని పీడ లేకుండా హాయిగా గడిపేయగలదూ..అదీ..తన సంతానంతో కలసి కాపురం పెట్టేయగలదు, జాగ్రత్త! అని ఒక హెచ్చరిక అయితే చేసింది.

కొన్ని గుండెలు దడ దడ లాడేలా..!

దటీజ్ వారిజ.

వారిజ 

వారెంట్ లేకుండా  మెదడ్ని అరెస్ట్ చేసిన పాత్ర.

అభినందనలు వసంత! అభినందనలు.

ఒక నూతన కథాంశం తో కూడిన రచనన ను పాఠకులకందించిన సారంగ పత్రికా సంపాదకులకు, సంపాదక వర్గానికి కూడా నా అభినందనలు తెలియచేసుకుంటూ..

damayanthi

*

 

 

 

 

 

 

 

 

 

అనామకుల ఆయుధం!

నారాయణస్వామి వెంకటయోగి 

swamy1“కళ అబద్దం . అది నిజాన్ని చెప్తుంది” – పికాసో

“ఎడ్యుయార్డోను ప్రచురించడం అంటే శత్రువుని ప్రచురించడమే ! అబద్దాలకూ, ఉదాసీనతకూ, అలక్ష్యతకూ అన్నింటికంటే మించి మతిమరపుకు శత్రువు! మన నేరాలు గుర్తు పెట్టుకోబడతాయి. అతని సౌకుమార్యం విధ్వంసకారకం, అతని నిజాయితీ ప్రచండమైనది” – జాన్ బెర్గర్

~

 ప్రపంచ ప్రఖ్యాత లాటిన్ అమెరికా రచయిత, ఉరుగ్వే దేశానికి చెందిన జర్నలిస్టు, నవలా రచయితా కవీ ఎడ్యుయార్డొ గాలియానో,  74 యేండ్ల వయసులో కాన్సర్ తో పోరాడుతూ ఏప్రిల్ 13, 2015  న మరణించారు. గాలియానో ప్రముఖ రచన ‘ఓపెన్ వేన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా – ఫైవ్ సెంచరీస్ ఆఫ్ ద పిలేజ్ ఆఫ్ ఎ కాంటినెంట్’ (చిట్లిన రక్తనాళాల లాటిన్ అమెరికా – ఐదు శతాబ్దాలుగా కొల్లగొట్టబడిన ఒక ఖండపు గాథ) ను వెనీజువెలా అధ్యక్షుడు హుగో షావేజ్ అమెరికా అధ్యక్షుడు ఒబామా కు బహుమతిగా ఇవ్వడం అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది.

ఆ పుస్తకం 1971 లో మొదటిసారిగా ప్రచురించబడినప్పటినుండీ కొన్ని లక్షల కాపీల్లో అమ్ముడై రికార్డు సృష్టించింది. చీలీ, ఉరుగ్వే, అర్జెంటీనా దేశాల్లో మిలిటరీ నియంతృత్వ ప్రభుత్వాలు ఆ పుస్తకాన్నినిషేధించాయి. తన స్వదేశమైన ఉరుగ్వే లో 1973 లో మిలిటరీ హుంటా అధికారాన్ని చేజికించుకున్నాక, ప్రవాసానికి వెళ్ళిపోయిన గాలియానో ‘’మెమరీ ఆఫ్ ఫైర్” (అగ్నిస్మృతి) అనే ప్రముఖ రచన చేసారు. దానిలో గాలియానో ఐదు శతాబ్దాలా అమెరికా ఖండాల చరిత్ర తిరిగి రాసారు. “సాకర్ ఇన్ సన్ అండ్ షాడో” (ఎండా నీడలలో సాకర్ ), “అప్ సైడ్ డౌన్” (తలకిందులుగా ),” వాయిసెస్ ఆఫ్ టైమ్  “ (కాల స్వరాలు), “మిర్రర్స్ “ (అద్దాలు), “వి సే నో” (మేము కాదంటున్నాము) – అతని ప్రముఖ రచనలల్లో మరికొన్ని. గాలియానో కు సాంస్కృతిక స్వేఛ్చ కిచ్చే లన్నాన్ అవార్డు,ఇంకా తదితర అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చినయి.

గాలియానో మరణం, కేవలం లాటిన్ అమెరికా లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం, సత్యానికి జయం కోసం పోరాడుతున్న కోట్లాది ప్రజానీకానికి తీరని లోటు. అందరినీ కలుపుకుని పోయే, న్యాయమైన, సమైక్య లాటిన్ అమెరికా కోసం పోరాడే వారందరికీ గాలియానో మరణం తీవ్రమైన నష్టం. లాటిన్ అమెరికా లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నోరులేని నిరుపేద అనామక ప్రజానీకానికి గొంతునిచ్చి వారి దైన్యాన్ని,  ఆగ్రహాన్ని తన రచనల్లో అత్యంత శక్తివంతంగా పలికిన గాలియానో అమరులు. చిరస్మరణీయులు, ఆయన రచనలు అనామకుల చేతుల్లో ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధాలు.

“సామ్రాజ్యవాదులు, దోపిడీ శక్తులు అనుక్షణం మనందరిలో మతిమరపును కలిగిస్తూ ఉంటాయి – వారి దుర్మార్గాలను మైమరపింపజేసే మతిమరపు. మన రచనలు సాహిత్యం ప్రజల్లో గ్నాపక శక్తిని పెంపొందించాలె” అంటారు గాలియానో. సాంప్రదాయిక విద్యనేదీ పాఠశాలకు పోయి నేర్చుకోని గాలియానో, ఉరుగ్వే రాజధాని మాంటేవీడియో లోని కాఫీ హోటళ్ళలో చదువు నేర్చుకున్నాడు. కథలు చెప్పే కళలు నేర్చుకున్నాడు. అక్కడ్నుండే,  గడచిన ఐదు శతాబ్దాల కథలన్నీ యిప్పుడే జరుగుతున్నట్టుగా భమింప జేసే అద్భుత మాయాజాలాన్ని సృష్టిస్తూ రచనలు చేసాడు. మరచిపోయిన గతాన్ని వర్తమానం లో యిప్పుడే జరుగుతున్నట్టుగా  ఆవిష్కరించి, సామ్రాజ్యవాదులు తన అందమైన లాటిన్ అమెరికా ఖండాన్నెలా దోపిడీ చేసి కొల్లగొట్టారో కళ్లకు గట్టేలా చిత్రించారు గాలియానో.

“మన గ్నాపకాలను ముక్కల కింద కోసేసారు. నేను చేసిందల్లా మన నిజమైన గ్నాపకాలను పునర్నిర్మించడమే. మానవజాతి గ్నాపకాలు మానవ ఇంద్ర ధనుస్సు లాంటిది . అది నిజమైన ఇంద్ర ధనుస్సుకన్న అందమైనది. కానీ మానవ ఇంద్రధనుస్సు పురుషాహంకారం, జాత్యహంకారం, మిలిటరీ నియంతృత్వం లాంటి అనేక దుర్మార్గాల చేత చిన్నాభిన్నమైంది. ధ్వంసం చేయబడ్డది. అనేక దుర్మార్గాలు మానవ జాతి గొప్పతనాన్ని, మనకు మాత్రమే సాధ్యమయ్యే ఔన్నత్యాన్ని, సౌందర్యాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నయి. ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడి వాటిచేత అణచివేయబడుతున్న అనామకులకు గొంతునివ్వడమే రచయితల నిజమైన కర్తవ్యం. అట్లాంటి రచనే నిజమైన గొప్ప రచన”  అన్నారు గాలియానో. తాను నమ్మిన దాని కోసం  జీవితం లో చివరి క్షణం దాకా  నిలబడ్డ మహోన్నత వ్యక్తిత్వం గల రచయిత గాలియానో.

“We shall miss him dearly”.

అనామకులు

ఈగలు తమకోసం ఒక కుక్కపిల్లను కొనుక్కోవాలని కలగంటాయి. అనామకులు దరిద్రం నుండి బయటపడాలని కలగంటారు. యేదో ఒక అద్భుత దినాన హఠాత్తుగా బకెట్ల కొద్దీ అదృష్టం తమ మీద వర్షిస్తుందని – కానీ అదెప్పుడూ జరగదు, నిన్న, యివాళ్ళ,  రేపు యెప్పటికీ జరగదు – అదృష్టం కనీసం తుంపరలెక్కన్న కూడా రాదు అనామకులు  దాన్నెంత గట్టిగా పిలిచినా సరే  – వాళ్ళ కుడి కన్ను యెంత అదిరినా సరే, ప్రతి రోజూ ఠంచను గా కుడికాలు ముందుపెట్టి పనులు మొదలుపెట్టినా సరే, ప్రతీ కొత్త సంవత్సరం ఒక కొత్త చీపురుతో మొదలు పెట్టినా సరే …

అనామకులు: అనామకుల పిల్లలు, దేనికీ యజమానులు కారు. అనామకులు, యెవరూ కాని వారు,  యెవరికీ కాని వారు, ప్రతి క్షణం ప్రాణభయంతో ఉరుకుతూ, ప్రతి క్షణం చచ్చిపోతూ, అన్ని రకాలుగా వోడిపోతూ, వోడించబడుతూ …

యెవరైతే లేరో,  కానీ వుండవచ్చో
యెవరికైతే  భాషలు రావు, కానీ మాండలికాలు మాట్లాడతారో
యెవరికైతే మతాలుండవు,  కానీ మూఢనమ్మకాలుంటయో
యెవరికైతే కళలు కాదు,  కానీ హస్తకళలు తెలుసో

యెవరికైతే సంస్కృతుండదు, కానీ జానపదముంటుందో
యెవరైతే మనుషులు కాదు,  కానీ మానవ వనరులో
యెవరికైతే ముఖాలుండవు  కానీ చేతులున్నాయో

యెవరికైతే పేర్లుండవు,  కానీ అంకెలు గా మాత్రమే తెలుసో
యెవరైతే స్థానిక వార్తా పత్రికల పోలీసు వార్తల్లోనే  కానీ,
ప్రపంచ చరిత్రలో యెక్కడా కనబడరో…
అనామకులు –
వాళ్లని కాల్చిపారేసిన బులెట్ విలువ కూడా లేని వాళ్ళు.

 

*

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – రెండో అధ్యాయం

   మాథ్యూ కుత్ బర్ట్, అతని ఎర్ర గుర్రమూ పెద్దగా శ్రమ పడకుండానే ఎనిమిది మైళ్ళూ దాటి బ్రైట్ రివర్ కి వెళ్ళారు. ఆ దారి చాలా బావుంటుంది , కుదురుగా పొలాల మధ్యన ఇమిడిన ఇళ్ళతో. అక్కడక్కడా  బాల్సం వుడ్ చెట్లు…ప్లం చెట్లకి విరగకాసిన పళ్ళు. ఆపిల్ తోటల మీంచి వచ్చే గాలి సువాసన వేస్తోంది. మైదాన పు వాలు,   వంగిన ఆకాశం లోకి కలిసే చోట మంచుముత్యాలు ఊదారంగు లో మెరుస్తున్నాయి. ప్రతి రోజూ వసంతమే ఐనట్లు కొమ్మల్లో పిట్టలు పాడుతున్నాయి.

మాథ్యూ కి హాయిగానే ఉంది, తెలియని ఆడవాళ్ళెవరైనా ఎదురుపడ్డప్పుడు తప్ప… ఖచ్చితంగా వాళ్ళని తలఊపి పలకరించాలి మరి.

మాథ్యూ కి మెరిల్లా, మిసెస్ లిండ్ లు తప్పించి ఇంకే ఆడవాళ్ళన్నా వెర్రి బెదురు. వాళ్ళేదో తనని చూసి నవ్వుకుంటున్నట్లే ఉంటుంది అతనికి. అందులో నిజమూ ఉందేమో…అతను వింతగానే కనిపిస్తాడు చూసేవాళ్ళకి.వంగిపోయి ఉండే   బుజాల దాకా పెరిగిన జుట్టు, పొడుగ్గా ఒత్తుగా గడ్డం. ఆ గడ్డం అతనికి ఇరవై ఏళ్ళ వయసు నుంచీ అలాగే ఉంది…నిజానికి తల నెరిసిపోవటం తప్ప ఇరవై లోనూ అరవై లోనూ అతను ఒకలాగే ఉన్నాడు.

అతను స్టేషన్ చేరేసరికి అక్కడ రైలు ఉన్న ఛాయలేవీ లేవు…బాగా ముందే వచ్చేశానా అనుకున్నాడు. పొడుగాటి ప్లాట్ ఫాం మీద ఎవ్వరూ లేరు…ఆ చివార్న , చెక్కపెట్టెల  మీద కూర్చుని ఒక చిన్న పిల్ల తప్ప. ఆ వైపు తలతిప్పి కూడా చూడకుండా మాథ్యూ వెతుకుతూ ఉన్నాడు పిల్లాడి కోసం . చూసి ఉంటే –  ఆమె  బిక్కు బిక్కుమంటూ ఎవరికోసమో ఎదురు చూస్తుండటం అర్థమైపోయేదే.

గదికి తాళం పెట్టేసి  భోజనానికి పోబోతున్న  స్టేషన్  మాస్టర్ ని నిలబెట్టి అడిగాడు- అయిదున్నర బండి రావటానికి ఇంకా ఆలస్యం ఉందా అని.  ” వచ్చి వెళ్ళిపోయి అర్థ గంట దాటింది ” –  చెప్పాడాయన.  ” ఒక్క చిన్నపిల్ల మాత్రం దిగింది అందులోంచి..ఎవరో రావాలట ఆమె కోసం . లేడీస్ వెయిటింగ్  రూం లో కూర్చోమన్నాను , అక్కడే ప్లాట్ ఫాం మీదే ఉంటానంది . కొంచెం తమాషా  పిల్లలా ఉందేమిటో ”

మాథ్యూ – ” అమ్మాయి కోసం కాదండీ నేనొచ్చిందీ, అబ్బాయి ఒకడు దిగాలి ఈ రైల్లోంచి. మిసెస్ అలెక్జాండర్ స్పెన్సర్  అబ్బాయిని కాదూ పంపుతానందీ ? ”

స్టేషన్ మాస్టర్ అర్థమైనట్లు  ఈల వేసి అన్నాడు – ” ఏదో పొరబాటు జరిగినట్లుంది. మిసెస్ స్పెన్సర్ అయితే రైల్లోంచి దిగింది, ఈ పిల్లని నాకు అప్పజెప్పింది కూడా. నువూ మీ చెల్లెలూ నోవా స్కోటియా అనాథాశ్రమం నుంచి ఈ పిల్లనే తెచ్చుకుని పెంచుకోబోతున్నారని చెప్పింది నాకు. అబ్బాయెవరూ లేడు ఇక్కడ, నేనేమైనా దాచిపెట్టాననుకుంటున్నావా ? ”

మాథ్యూ కి  మెరిల్లా ఉండి ఉంటే బాగుండేదనిపించింది…అయోమయంగా అన్నాడు – ” నాకేమీ అర్థం కావట్లేదే ”

 

” అదేదో ఆ పిల్లనే అడిగి చూడు.అన్ని కబుర్లూ చెప్పేదాని లాగే ఉంది. మీరు అడిగిన రకం అబ్బాయిలు అనాథాశ్రమం లో అయిపోయారో ఏమో ” – నిర్లక్ష్యంగా అనేసి వెళ్ళిపోయాడు, అప్పటికే బాగా ఆకలేస్తోంది ఆయనకి.

మాథ్యూ ఒక్కడే పిల్లతో మిగిలిపోయాడు. అతనికి  అసలే ఆడపిల్లలంటే మొహమాటమూ  పిచ్చి భయమూ. ..నువ్వు అబ్బాయివి ఎందుకు అయావు కావూ అని ఆ పిల్లని పట్టుకుని ఏమని అడగటం ?

MythiliScaled

 

ఆ పిల్ల మాథ్యూ స్టేషన్ లోకి వచ్చినప్పటినుంచీ అతన్నే కళ్ళప్పగించి చూస్తోంది. పది పదకొండేళ్ళుంటాయేమో, బాగా పొట్టిగా బిగుతుగా ఐపోయిన బూడిద రంగు గౌను వేసుకుని ఉంది, అది బాగా వెలిసిపోయింది కూడా. మట్టి రంగు టోపీ కిందినుంచి రెండు లావుపాటి ఎర్రటి జడలు వేలాడుతున్నాయి .  పీక్కుపోయిన తెల్లటి మొహమూ, అక్కడక్కడా  చిన్న ముదురు జేగురు రంగు మచ్చలు [freckles ] 1….ఒకసారి ఆకుపచ్చగా, ఇంకొకసారి బూడిదరంగులో కనిపించే పెద్ద పెద్ద కళ్ళూ వెడల్పాటి నోరూ. మామూలుగా చూస్తే ఇంతే.

లోతుగా చూడగలిగేవాళ్ళకి ఆ గడ్డం కొనదేలి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.   కళ్ళ నిండా చెప్పలేనంత ఉత్సాహం, జీవ శక్తి చిందులు తొక్కుతాయి. పెదవులు భావోద్వేగాన్నీ  మధురమైన స్వభావాన్నీ సూచిస్తాయి. మొత్తం మీద ఆ ఆకారం లోపల ఉన్నది అసాధారణమైన ఆత్మ.

మాథ్యూ భయపడినట్లు అతనే ముందు పలకరించే అవసరం రాలేదు. తన కోసమే అతను వస్తున్నాడనిపిస్తూనే ఆ పిల్ల దిగ్గున లేచి నిలబడి, ఒక చేత్తో తన సంచీ పట్టుకునే ఉంది కనుక రెండో చేతిని అతని వైపుకు చాచింది –  హాండ్ షేక్ ఇచ్చేందుకు.

వింతైన తియ్యటి గొంతుతో మాట్లాడేసింది – ” మీరే కదూ, మాథ్యూ కుత్ బర్ట్ ?  అమ్మయ్య. మీరింకా ఎందుకు రాలేదా అనుకుంటున్నా. ఎందుకు వచ్చి ఉండరా అని ఆలోచిస్తున్నా.  ఈ రైలు కట్ట దిగి ఆ మలుపు దాటితే అక్కడ పెద్ద చెర్రీ చెట్టు ఉంది చూశారా ?  ఒకవేళ మీరిప్పుడు రాకపోతే ఆ చెట్టెక్కేసి రాత్రంతా ఉండిపోదామనుకున్నా. నాకేం భయం వెయ్యదండీ…వెన్నెట్లో తెల్లటి చెర్రీ పూల మధ్యన కొమ్మల్లో  నిద్ర పోతే చల్లటి పాలరాయి కొండల్లో పడుకున్నట్లుండదూ ? మీరెలాగూ పొద్దునే వచ్చేస్తారుగా ! ”

మాథ్యూ ఆ చిన్న చెయ్యి అందుకుని ఊపాడు. అప్పటికప్పుడే అతనొక నిర్ణయానికి వచ్చాడు –  ఇదంతా పొరబాటనీ మాకు అమ్మాయి అక్కర్లేదనీ  ఆ మెరిసిపోయే కళ్ళ వైపు చూస్తూ తను చెప్పలేడుగాక చెప్పలేడు. ఇక్కడ స్టేషన్ లో వదల్లేడు గా ఏమైనా, ఇంటికి తీసుకుపోతాడు,  ఆ చెప్పే దేదో మెరిల్లా నే చెప్పుకోనీ. ఇప్పుడే  ప్రశ్నలూ సంజాయిషీలూ తన వల్ల కావు.

ఆమెతో అన్నాడు – ” ఆలస్యమైంది. ఏమనుకోకు. ఆ సంచీ ఇలా ఇవ్వు. బయట గుర్రపు బండి ఉంది ”

” వద్దండీ, ఏం బరువు లేదుగా, నేను మొయ్యగలను ” – పిల్ల బోలెడు సంతోషం గా ఏమిటేమిటో చెప్పుకుపోయింది ” నా సామానంతా ఇందులోనే ఉందనుకోండి, ఐనా బరువుండదు. పైగా , దీన్నొకలాగా మటుకే పట్టుకోవాలి, లేకపోతే హాండిల్ ఊడిపోతుంది..పాత సంచీ కదండీ . చెర్రీ చెట్టులో నిద్రపోవటం బాగానే ఉండేదిగానీ మీరు వచ్చేయటం ఇంకా బావుంది. మనం చాలా దూరం వెళ్ళాలి కదా, మిసెస్ స్పెన్సర్ చెప్పారు, ఎనిమిది మైళ్ళని. నాకు అలా ప్రయాణం చేయటం గొప్పసరదా. మీ ఇంట్లో మీతోబాటు ఉండిపోవచ్చంటే ఎంత సంతోషంగా ఉందో ! నాకెప్పుడూ ఎవరూ లేనే లేరు. అనాథాశ్రమం లో ఐతే మరీ ఘోరం. నేను అక్కడున్నది నాలుగు నెలలే అనుకోండి…ఐనా సరే. మీరెప్పుడూ అలాంటి చోట ఉండి ఉండరేమో..అసలు ఊహించుకోలేరు అక్కడ ఎలా ఉంటుందో . మిసెస్ స్పెన్సర్ నేను అలా అనకూడదని అన్నారు…చెడ్డ పిల్లలకి మాత్రమే అలా అనిపిస్తుందట.  ఆవిడ అక్కడ ఉండి చూశారా చెప్పండి, ఉంటేనే గదా తెలిసేది ? పాపం అనాథాశ్రమం వాళ్ళు మంచి వాళ్ళే…కాని అస్సలు ఊహ లేదు వాళ్ళకి. పిల్లలకి మటుకు బోలెడు ఊహలు. నా పక్కన ఉండే పిల్ల తను ఒక జమీందారుల పిల్లననీ, చిన్నప్పుడే ఆయా కోపం వచ్చి మార్చేసిందనీ, ఎవరికైనా తెలిసేలోపు ఆవిడ చచ్చిపోయిందనీ అనుకుంటుండేది. నాకూ అలా అనుకోవాలని ఉండేది..రాత్రంతా ఊహించుకునేదాన్ని…పగలు ఖాళీ ఉండదుగా మరి ! అలా నిద్రపోకనో ఏమో , ఇలా చిక్కిపోయాను. బాగా సన్నగా ఉన్నాను కదండి ? బొద్దుగా చక్కగా ఉంటే ఎంత బావుంటుందో ….”

అప్పటికింక చెప్పటం ఆపింది, గుక్క తిప్పుకుందుకు. ఈ లోపు గుర్రం బండి వరకూ వచ్చారు. ఎక్కి కూర్చుని కొంచెం దూరం వెళ్ళే దాకా ఏమీ మాట్లాడలే. కొండవాలు లోంచి  బాగా లోతుగా వెళ్తోంది బాట.  బండి లో వాళ్ళ తలల పైగా ఎంతో ఎత్తున  …విరగబూసిన తెల్లటి పూలతో ,  సన్నని చెర్రీ చెట్ల  కొమ్మలు . పిల్ల ఒక చిన్న పూల కొమ్మ తుంచుకుని ఇష్టంగా బుగ్గ మీద రాసుకుంది.

” ఎంత బావుందో …ఆ  పూలు తెల్లటి లేస్ లా లేవూ ? ఆ చెట్టు  చూస్తే మీకేమనిపిస్తోంది ? ” అడిగింది మాథ్యూ ని.

”  మ్మ్. ఏమో మరి ” – మాథ్యూ.

anne2 (1)

” పెళ్ళి కూతురిలా ఉంది కదండీ, తెల్లటి మేలి ముసుగు వేసుకున్నట్లు..పెళ్ళికూతుర్ని నేనెప్పుడూ చూడలేదు, విన్నా అంతే. నాకెప్పుడూ పెళ్ళి అవదనే అనుకుంటా, నేనంత బాగోను కదా ? ” మాథ్యూ ఉలిక్కిపడ్డాడు . అదేం పట్టించుకోకుండా పిల్ల కొనసాగించింది – ” కాని ఎప్పుడైనా అలాంటి తెల్ల గౌను, పొడుగాటిది వేసుకోవాలనిపిస్తుంటుంది.  వేరే దేశాలకి వెళ్ళే  మిషనరీ లు ఎవరైనా నన్ను పెళ్ళి చేసుకోవచ్చేమో…వాళ్ళకి అందం గురించి పట్టింపులు ఉండకూడదుగా. ఇవాళ పొద్దున్నే ఈ గౌను వేసుకుని బయల్దేరానా,  …మరి ఇదేం బాగాలేదు కదా..రైల్లో అందరికీ  నన్ను చూసి జాలేస్తోందేమో అనిపించింది, నీలి రంగు సిల్క్ గౌన్ లాగా దీన్ని ఊహించుకున్నా.  అనాథాశ్రమం లో పిల్లలందరూ ఇలాంటి బూడిదరంగు గౌన్లే వేసుకోవాలి..ఎందుకంటే ఎవరో గొప్పాయన మూడొందల గజాల బట్ట దానం చేశారట..దాంతో కుట్టించారు. ఆయన అది అమ్ముకోలేక ఇచ్చేశాడని కొందరు అనుకున్నారుగాని నేనైతే పాపం ఆయన మంచాయన అనే అనుకున్నా. బోట్ లో వస్తుంటే కొంచెం కూడా కడుపులో తిప్పలేదు నాకు , సిల్క్ గౌన్ తో బాటు మంచి బూట్లూ, గ్లవ్స్ వేసుకున్నట్లూ పూలు వేలాడే టోపీ పెట్టుకున్నట్లూ నాకొక బంగారు వాచ్ కూడా ఉన్నట్లూ ఊహించుకున్నా..హాయిగా ఉండింది. మిసెస్ స్పెన్సర్ కి కూడా కడుపులో  తిప్పదుట, చెప్పారు. నేనేమో అటూ ఇటూ తెగ తిరుగుతున్నాననీ నన్ను నీళ్ళలో పడిపోకుండా  కనిపెట్టుకుంటూ ఉంటే వికారం పెట్టేందుకు తీరిక  ఎక్కడుందనీ కూడా అన్నారావిడ.  అదీ ఒకందుకు మంచిదే కదండీ  ? బోట్ లో చూడాల్సినవన్నీ ఒకేసారి చూసెయ్యాలి గదా నేను, మళ్ళీ ఎప్పుడైనా ఎక్కుతానో లేదో ?

 

అబ్బ ! ఎన్ని పూలచెట్లో !!!! ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవి ప్రపంచం లోకెల్లా అందమైందని విన్నా..ఇక్కడ ఉండిపోయినట్లు ఊహించుకునేదాన్ని..నిజంగా ఉంటానని అనుకోనేలేదు ! ఈ రోడ్ లు భలే ఎర్రగా ఉన్నాయి కదా ? మేం రైల్లో వస్తూంటే కూడా కనిపించాయి, మాతోబాటు పరిగెత్తుతూ. అవి ఎందుకు ఎర్రగా ఉన్నాయని మిసెస్ స్పెన్సర్ ని అడిగాను. ఆవిడ అప్పటికే నేనొక వెయ్యి ప్రశ్నలు వేసి ఉంటాననీ, ఇంక అడగద్దనీ అన్నారు. ప్రశ్నలు అడక్కపోతే సంగతులెలా తెలుస్తాయి చెప్పండి ? ఇంతకీ ఈ రోడ్ లు ఎర్రగా ఎందుకున్నాయీ ? ”

మాథ్యూ ” ఏమో  మరి …”

పిల్ల- ” సర్లెండి. ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకుందుకు అన్ని సంగతులున్నాయి కదా అనుకుంటే భలే సరదాగా ఉంటుంది కదా ? అన్నీ తెలిసిపోతే ఏం బావుంటుందీ…ఊహించుకుందుకు ఏమీ ఉండదాయె.

నే నే మన్నా ఎక్కువగా మాట్లాడుతున్నానాండీ ? అందరూ అదే అంటుంటారు …మీరూ అదే అంటే మాట్లాడటం ఆపేస్తా…నేనైనా అనుకుంటే చెయ్యగలను, కొంచెం ఇబ్బందే కానీ…”

మాథ్యూ తనకే ఆశ్చర్యం వేసేలా ఆనందిస్తున్నాడు. ఎక్కువ మాట్లాడని చాలా మందికి లాగే అతనికీ ఎవరైనా మాట్లాడుతుంటే ఇష్టమే…తననేమీ పెద్దగా అడక్కుండా ఉంటే. కాని ఒక చిన్న ఆడపిల్ల నుంచి తనకి  ఆహ్లాదం వస్తుందని అతనెప్పుడూ అనుకోలేదు. ఆడవాళ్ళే చిరాకు పుట్టిస్తారనుకుంటే ఆడపిల్లలు మరీ దరిద్రం. ఏమిటో బెరుకు బెరుగ్గా ఓర చూపులు చూసుకుంటూ పక్కనుంచే వెళ్ళి పోతుంటారు , వాళ్ళని అమాంతం మింగెయ్యాలనిపించేంత కోపం వచ్చేది. అవోన్లియా లో అందరు ఆడపిల్లలూ అంతే. మాథ్యూ స్వతహాగా మేధకుడు. పాదరసం లా ఉన్న ఈ పిల్ల బుర్ర ని తను అందుకోలేకపోయినా, ఈ పిల్ల ఏదో చాలా వేరుగా ఉందనీ ఈ బుల్లి  మంత్రగత్తె వాగుడు తనకి బాగానే ఉందనీ అతనికి అనిపించింది.

కొంచెం బిడియంగా చెప్పాడు

” ఏం పర్వాలేదు..నీ ఇష్టమొచ్చినంత మాట్లాడచ్చు. ”

పిల్ల – ” అమ్మయ్య. బతికించారు. మనిద్దరికీ సరిపడేలాగే ఉంది. మాట్లాడాలనిపించినప్పుడల్లా  మాట్లాడటం ఎంతో బావుంటుంది. అదేమిటో..పిల్లలు కనబడాలి గానీ వినబడకూడదని నాకిప్పటికి  లక్షసార్లు చెప్పి ఉంటారు అందరూ. ఇంకానేమో..నేను పెద్ద పెద్ద మాటలు వాడితే అంతా నవ్వుతారు కూడానూ…మరి పెద్ద పెద్ద విషయాలు చెప్పాలంటే పెద్ద మాటలే వాడాలి కదండి ? ”

” అవునవును, నిజమే ” మాథ్యూ ఒప్పుకున్నాడు.

పిల్ల- ” నా నాలుక్కి నరం లేదని మిసెస్ స్పెన్సర్ అన్నారు..అంటే ఏమిటో ? నాకు తెలిసి నాదీ మామూలు నాలుకే  …అవునూ మీ ఇంటి పేరు గ్రీన్ గేబుల్స్ అట కదా ? అక్కడ బోలెడు చెట్లున్నాయని మిసెస్ స్పెన్సర్ చెప్పారు..నాకు చెట్లంటే ఎంతిష్టమో ! అనాథాశ్రమం లో ఎక్కువ ఉండేవే కావు..ఉన్న కాసినీ పాపం దిగులు మొహాలేసుకుని ఉండేవి, చుట్టూ కటకటాలు..అవీ అనాథల్లాగే ఉంటాయి. వాటిని చూస్తేనే ఏడుపొచ్చేది. నేను వాటితో అనేదాన్నీ…” మీరే కనుక ఏ పెద్ద అడవిలోనో ఉండి ఉంటే ఎంత ఎత్తుగా ఎదిగేవారో ! మీ చుట్టూ ఇంకా చాలా చెట్లుండేవి తోడుగా. మీ కొమ్మల్లో పిట్టలు పాడేవి, మీ వేళ్ళ మీద నాచు మొక్కలూ  జూన్ బెల్సూ పెరిగేవి…పక్కనే ఒక సెలయేరు కూడా ఉండేది..కదా  !  పాపం..

ఇక్కడ మీకెలా ఉంటుందో నాకు తెలుసు  ” అని. ఇవాళ వాటిని వదిలేసి రావాలంటే చాలా బాధేసింది నాకు. గ్రీన్ గేబుల్స్ ఇంటి దగ్గర సెలయేరు ఉందాండీ ? మిసెస్ స్పెన్సర్ ని అడగటం మర్చిపోయాను ”

మాథ్యూ – ” ఇంటి పక్కనే ఉందిగా ”

” అరే..భలే ఉందే. ఒక సెలయేరు పక్కనే ఉండాలన్నది నా కల్లో ఒకటి, ఉంటానని అనుకోలేదు ఎప్పుడూ. కలలు నిజం కావుగా , ఐతే బావుంటుంది గానీ…! ఇవాళ ఇంచుమించు పూర్తి సంతోషంగా ఉన్నా నేను, పూర్తి పూర్తి సంతోషంగా ఎందుకు లేనంటే… చెప్తా ఉండండి, ఇదేమిటీ, ఈ రంగుని ఏమంటారు ? ” పిల్ల తన జడనొకదాన్ని ఎత్తి పట్టుకుని మాథ్యూ కి చూపించింది.

మాథ్యూ – ” ఇది ఎరుపు కదా ? ” అన్నాడు.

ఏళ్ళ తరబడి గొప్ప  దుఃఖాన్ని మోస్తున్నదానిలాగా పిల్ల అతి గాఢంగా నిట్టూర్చింది. జడని కిందికి వదిలేసింది.

” అవును, ఎరుపు. ఎర్రటి జుట్టున్న ఎవరైనా పూర్తి సంతోషంగా ఉండగలరా చెప్పండి ? నేను బక్కగా ఉంటాను, నా కళ్ళు ఆకు పచ్చగా ఉంటాయి, మొహం మీద ఈ మచ్చలున్నాయి…ఇవేవీ లేనట్లు – నేను పుష్టిగా , గులాబి రంగులో ఉన్నట్లూ నా కళ్ళు వయొలెట్ రంగులో మెరుస్తున్నట్లూ ఊహించుకోగలను. నా జుట్టు గురించి మాత్రం అలా అస్సలు వీలవదు…నల్లగా తుమ్మెద రెక్కల్లాగా ఉందనో బంగారు రంగులో మిలమిలలాడుతోందనో ,  ఊహించుకోనే లేను. ఇది నాకు ఆజన్మ శోకం. ఒక నవల్లో ఒక అమ్మాయికి ఇలాగే ఆజన్మ శోకం ఉంటుంది, ఆమె జుట్టు ఎర్రగా లేదు మరి, బంగారు రంగులో ఉందట ..ఆమె నుదురు చంద్రకాంత శిల లాగ ఉందట…చంద్రకాంత శిలంటే ఏమిటండీ ? ”

” నాకు తెలీదనుకుంటా ” బెదురుగా అన్నాడు మాథ్యూ. చిన్నప్పుడెప్పుడో తోటి కుర్రాడొకడు తనని రంగులరాట్నం ఎక్కిస్తే కళ్ళు తిరగటం గుర్తొచ్చింది.

” అదేదో చక్కటి వస్తువే అయి ఉంటుంది..ఆ అమ్మాయి అతిలోక సౌందర్యరాశి మరి. అతిలోక సౌందర్యం ఉంటేఎలా ఉంటుందో మీకేమైనా తెలుసాండీ ? ” పిల్ల అడిగింది.

” లేదు, తెలీదు ” మాథ్యూ చెప్పాడు.

పిల్ల అడిగింది- ” అవునండీ, మీరు ఏది కోరుకుంటారు …అతిలోక సౌందర్యం గా ఉండటమా ? అద్భుతమైన తెలివి తో ఉండటమా ? లేకపోతే దేవుడంత మంచిగా ఉండటమా ? ”

” సరిగ్గా తెలీదు ” మాథ్యూ చెప్పుకున్నాడు.

” నాకూ తెలీదు, ఎప్పటికీ తేల్చుకోలేను. ఎలా ఐనా మాత్రం ఉండబోయానా  ఏమిటిలెండి నేను. దేవుడంత మంచిగా ఐతే ఎప్పటికీ అవనను.  మిసెస్ స్పెన్సర్ అన్నారు కదా………మిస్టర్ కుత్ బర్ట్ ! మిస్టర్ కుత్ బర్ట్ !   మిస్టర్ కుత్ బర్ట్ ! ” మిసెస్ స్పెన్సర్  అలా ఏమీ అనలేదు , పిల్ల బండి లోంచి కిందికి దొర్లలేదు, మాథ్యూ విడ్డూరపు పనేమీ చేయలేదు …పిల్ల అరిచింది వీటిలో దేనికీ కాదు. దారి వంపు తిరిగి వాళ్ళు ‘ అవెన్యూ ‘ లోకి ప్రవేశించారు అంతే.

ఈ అవెన్యూ నాలుగైదు వంద ల గజాలు పొడవున, అటూ ఇటూ పెద్ద పెద్ద ఆపిల్ చెట్ల తో ఉంటుంది. వాటిని అక్కడ ఏనాడో ఎవరో పనిగట్టుకుని పెంచారు. విరబూసిఉన్న రెండు వైపుల చెట్లూ కలుసుకుని పైన  పరిమళించే  మంచు చాందినీ పరిచినట్లుంది. ఊదారంగు సంజవెలుగు గాలిలో నిండిపోయి ఉంది.  కాస్త దూరంగా సంధ్యాకాశం  వర్ణ చిత్రం లాగా కనిపిస్తోంది… గులాబిరంగు గాజుతో చేసిన బ్రహ్మాండమైన చర్చ్ కిటికీ లాగా. ఆ సౌందర్యానికి లోనై పిల్లకి మాటలు రాలేదు. చేతులతో తనని తాను చుట్టుకుని వెనక్కి వాలి ఆ వైభవానికి తలెత్తి చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి బండి దూరం వెళ్ళాక కూడా ఆమె పలకలేదు, ఆ పడమటి దిక్కు కేసి, సూర్యాస్తమయం కేసి, ఆనందం నిండిన ముఖం తో చూస్తూనే ఉండిపోయింది. ఆ వెలుగుల నేపథ్యం మీద ఏ సుందర దృశ్యాల కవాతు కనిపిస్తోందో ! న్యూ బ్రిడ్జ్  ఊళ్ళోంచి –  కుక్కలు అరుస్తూన్న వీధుల్లోంచి,  కుతూహలంగా కేకలు పెడుతూ మూగే చిన్న కుర్రాళ్ళ మధ్యలోంచి , బండి వెళ్తున్నప్పుడు   కూడా,  ఆమె మౌనం గానే ఉంది . మూడు మైళ్ళు దాటేశారు. మాట్లాడినంత శక్తితోనూ ఆమె నిశ్శబ్దంగా ఉండగలదిలా ఉంది.

” బాగా అలిసిపోయావు కదూ ? ఆకలేస్తోందా ? ” మాథ్యూ అడిగాడు, ఆమె మాట్లాడకపోవటానికి అవే కారణాలనుకుని. ” ఇంకెంతో దూరం లేదులే, వచ్చేశాం. ఒక మైలు ఉంటుంది ” ధైర్యం చెప్పాడు.

ఆమె  ట్రాన్స్ లోంచి బయటికొచ్చి నిట్టూర్చింది. నక్షత్రాల వెంట ఎంతెంత దూరాలకో వెళ్ళి వచ్చినట్లుంది ముఖం, స్వప్నా ల్లో తేలుతున్నట్లు.

”ఆ. మిస్టర్ కుత్ బర్ట్ ! మనం దాటి వచ్చామే, ఆ తెల్లటి చోటు, అదేమిటి ? ”

” దాన్ని అవెన్యూ అంటాం ” మాథ్యూ కొద్ది క్షణాలు ఆలోచించి అన్నాడు – ” అందమైన చోటు అది ”

” అందమా…ఆ మాట ఎంత దూరం వెళ్తుంది గనుక, చాలదు అలా అంటే. అది అద్భుతం. ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా  ఊహించుకోలేనిది ఇప్పటి వరకూ నాకు కనిపించలేదు, ఇదే మొదలు. ఇక్కడ తృప్తిగా ఉంది ” గుండె మీద చెయ్యి పెట్టుకుని చూపిస్తూ అంది పిల్ల, ” ఏదో నొప్పిగా ఉంది, ఆ నొప్పికూడా సుఖంగానే ఉంది. ఇలాంటి నొప్పి మీకెప్పుడైనా వచ్చిందా మిస్టర్ కుత్ బర్ట్ ? ”

” లేదు, నాకు గుర్తున్నంతవరకూ లేదు ” మాథ్యూ అన్నాడు.

” చాలా సార్లు వస్తుంది నాకు , చాలా గొప్పగా ఉన్నదాన్ని చూస్తే.  ‘ అవెన్యూ ‘ అదేం పేరు…దానికి సరిపోదు అసలు. ‘ ఆహ్లాద శ్వేత మార్గం ‘ అంటేనో ? బావుందా ? ఉన్న పేరుతో దేన్నైనా పిలవటం పెద్ద నచ్చదు నాకు. అనాథాశ్రమం లో హెప్జిబా జెంకిన్స్ అని ఒక అమ్మాయి ఉండేది, తనని ఎప్పుడూ నేను రొసాలియా డెవేరే అని ఊహించుకునేదాన్ని. అందరూ ఆ చోటుని అవెన్యూ అన్నా నేను మాత్రం ఆహ్లాద శ్వేత మార్గం అనే అంటాను. అయితే దగ్గరికి వచ్చేశామా ? సంతోషంగా ఉంది, బాధ గానూ ఉంది. ప్రయాణం చాలా బావుండింది కదా, అయిపోతోందని బాధ. మంచి విషయాలు కూడా అయిపోతుంటాయి, బాధేస్తుంది. తర్వాత ఇంకా మంచివి జరగచ్చనుకోండి, కాని అలా అని నమ్మకం లేదు కదా. నా అనుభవం ఐతే జరగవు అనే.  ఇంటికి వెళ్తున్నామంటే సంతోషంగా ఉంది, నాకెప్పుడూ ఇల్లే ఉన్నట్లు గుర్తు లేదు గా మరి ! ఇందాక చెప్పానే , అలాంటి హాయైన నొప్పి మళ్ళీ వస్తోంది, ఇల్లు తలుచుకుంటే. ”

ఒక చిన్న కొండ పైకి ఎక్కుతోంది బండి. కిందికి చూస్తే పెద్ద చెరువు. పొడుగ్గా, మెలికలు తిరుగుతూ, ఇంచుమించు నది లాగా ఉంది. మధ్యలోంచి ఒక వంతెన. జేగురు రంగులో ఉన్న ఇసుక గుట్టల వెనక నుంచి  సముద్రం కనిపిస్తోంది. ఆ నీరు వింత వింతగా వెలుగుతోంది … నీలంగా , ఆకుపచ్చగా, గులాబి రంగుగా, ఇంకేవేవో పేరు తెలీని రంగులుగా. అవేవో ఈ లోకానికి చెందిన వెలుగుల్లాగా లేవు. వంతెన కి అవతల చెరువు ఒడ్డు న దట్టంగా ఫర్ చెట్లూ, మేపుల్ చెట్లూ…చిక్కగా పాకే వాటి నీడలు. అక్కడక్కడా ఒక ప్లం చెట్టు చెరువు మీదికి వంగి ఉంది, తెల్లటి దుస్తులు వేసుకుని అద్దం లో చూసుకోబోయే అమ్మాయికి మల్లే. చెరువు అంచున బురదలో గొంతు విప్పి పాడుకుంటున్న కప్పలు. ఆపిల్ తోట లోంచి చిన్న బూడిదరంగు ఇల్లు తొంగి చూస్తోంది, ఇంకా పూర్తిగా చీకటి పడకపోయినా  ఇంటి కిటికీలో దీపం వెలుగుతోంది.

” అది బారీ చెరువు ” మాథ్యూ చెప్పాడు.

” ఊహూ, ఈ పేరూ బాగోలేదు. దీన్నేమని పిలవనూ … ‘ ప్రకాశమాన   సరోవరం ‘ . సరైన పేరు. పేరు సరైందైతే  తెలిసిపోతుంది నాకు, నా గుండె ఒకలాగ గుబుక్కుమంటుంది అప్పుడు. మీకెప్పుడైనా అలా అంటుందా ? ”

యథాప్రకారం మాథ్యూ ఆలోచించాడు ..” దోసపాదుకి చీడ పడితే దాన్ని చూసినప్పుడు  నా గుండె గుబుక్కుమంటుంది ” సూచించాడు.

” అదీ ఇలాంటిదేనంటారా ? ఏమో మరి. కాదేమో, చీడకీ వెలిగే నీళ్ళకీ సంబంధం ఉందంటారా ? అవునూ, దాన్ని బారీ చెరువని ఎందుకంటారు ? ”

” ఆ ఇల్లు మిస్టర్ బారీ ది కదా, అందుకేనేమో. ఆ ఇంటి పేరు ‘ తోట వాలు ‘ . అదిగో, ఆ చెట్ల గుబురు అడ్డం లేకపోతే ఇక్కడ్నుంచి గ్రీన్ గేబుల్స్ కనిపిస్తుంది. మనం ఇలా చుట్టు తిరిగి ఇంకో అరమైలు వెళ్ళాలి ”

” మిస్టర్ బారీ కి చిన్న అమ్మాయిలెవరైనా ఉన్నారా ? చిన్నంటే మరీ చిన్న కాదు, నా అంత వాళ్ళు ”

” ఒకమ్మాయి ఉంది. ఆమె పేరు డయానా ”

” ఓ.. ” పిల్ల గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది – ” ఎంత చక్కటి పేరు ! ”

మాథ్యూ- ” ఏమో. నాకైతే అంత పద్ధతైన పేరులా ఉండదు. 2 జేన్ అనో, మేరీ అనో, అలాంటి శుభ్రమైన పేరేదైనా పెట్టాల్సింది. డయానా పుట్టినప్పుడు ఇక్కడొక స్కూల్ మాస్టర్ ఉండేవాడు, ఆయన్ని పేరు పెట్టమంటే ఈ పేరు పెట్టాడు. ” నిరసనగా అన్నాడు.

పిల్ల- ” నేను పుట్టినప్పుడూ అలాంటి మాస్టరెవరైనా ఉండి ఉంటే బావుండేది. ఇదిగో, వంతెన. కళ్ళు గట్టిగా మూసుకుంటానేం, నాకెప్పుడూ వంతెనల మీంచి వెళ్ళటమంటే చాలా భయం. గబుక్కున మధ్యలో అది కూలిపోతేనో ? మధ్యలోకొచ్చాక కళ్ళు తెరుస్తా. ఒక వేళ వంతెన కూలిపోతుంటే అదంతా  చూడాలిగా మరి ?  పెద్ద చప్పుడవుతుంది కదూ అప్పుడు , నాకిష్టం. ఇష్టపడేందుకు ఎన్నెన్ని విష యాలో ప్రపంచం లో ! ఆ..ఆ..దాటేశాం…ఇప్పుడు వెనక్కి చూస్తా. గుడ్ నైట్ ప్రకాశమాన సరోవరమా ! నాకు ఇష్టమైన వాటన్నిటికీ గుడ్ నైట్ చెప్తుంటాను, వాటికీ అలా చెప్పటం నచ్చుతుంది. ఆ నీళ్ళు నన్ను చూసి నవ్వుతున్నాయేమో ”

కొండ దాటి మలుపు తిరుగుతుంటే మాథ్యూ అన్నాడు….” ఆ.ఇదిగో. వచ్చేసినట్లే .అదే గ్రీన్ గేబుల్స్ ”

” ఆగండి.చెప్పెయ్యకండి..నన్ను ఊహించుకోనియ్యండి , సరిగ్గా ఊహిస్తానో లేదో ” అతను చూపించబోయే చెయ్యి పట్టుకుని ఆపి,  తన చేత్తో కళ్ళు గట్టిగా మూసుకుంది. కాసేపటికి కళ్ళు విప్పి చుట్టూ చూసింది. సూర్యుడు అస్తమించి కాసేపవుతోంది… కానీ ,పండిన  వెలుగు అంతా పరచుకునే ఉంది. బంతిపువ్వు రంగు ఆ కాశం మీద దూరం నుంచి చర్చ్ గోపురం కనిపిస్తోంది. కిందన పొడుగ్గా లోయ, నాజూగ్గా కనిపించే  ఎత్తు పల్లాల మధ్య లోంచి పొలాలూ వాటిలో రైతుల ఇళ్ళూ. పిల్ల కళ్ళు ఒకవైపునుంచి ఇంకోవైపుకి ఆత్రంగా , ఆర్తిగా వెతికాయి.  దారికి బాగా ఎడంగా , ఎడమ వైపుకి తిరిగి ఆమె చూపు ఆఖర్న ఆగింది. మీగడ రంగు  కట్టడం  , చుట్టూ పూసిన చెట్ల తో, ఆ మునిమాపు వెలుతురు లో చిట్టడవి మధ్యలోంచి. ఆ పైన, నైఋతి దిక్కున , మచ్చ లేని ఆకాశం లో స్ఫటికం లాగా మెరుస్తున్న పెద్ద నక్షత్రం …దారిదివ్వె లాగా , అభయమిస్తున్నట్లుగా.

చూపిస్తూ అంది ఆమె – ” అదిగో, అదే- కదూ ? ”

మాథ్యూ ఉల్లాసంగా గుర్రం వీపుని కళ్ళెం తో తట్టాడు ..” కనిపెట్టేశావే ! మిసెస్ స్పెన్సర్ చెప్పిందా ? ”

” లేదు. నిజంగా ! అసలు చెప్పలేదు. చూడగానే అదే  ఇల్లని అర్థమైపోయింది. నేను కలలు కన్నట్లే ఉంది. తెలుసాండీ, నా చెయ్యి మొత్తం కమిలిపోయింది ఇవాళ. ఇది నిజమే అని తెలిసేందుకు ఎన్నిసార్లు గిల్లుకున్నానో నన్ను. అస్తమానం ఇదంతా కలేమో, అయిపోతుందేమో- అనిపిస్తూనే ఉండింది. చివరికి ఇంత మంచి కల ,  కలే అయితేలెమ్మని గిల్లుకోవటం ఆపేశాను. కాని నిజం ఇది, ఇంటికి వచ్చాం ”

anne3 (1)

 

ఆనందంగా నిట్టూర్చి నిశ్శబ్దం లోకి జారింది.

మాథ్యూ ఇబ్బందిగా కదిలాడు. తను  అనుకునేటట్లు అది తన ఇల్లు కాబోవటం లేదని పిల్లకి చెప్పాల్సింది అతను కాకుండా  మెరిల్లా అయినందుకు అతనికి కాస్త ఊరటగా అనిపించింది. మిసెస్ లిండ్ ఇల్లు  దాటారు. చీకటి పడింది, కాని రాచెల్ లిండ్ కిటికీ పక్కన కూర్చుని వాళ్ళని గమనించలేనంత చీకటి ఐతే కాదు. ఈ పిల్ల పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోబోవటం తలుచుకుని మాథ్యూకి పెద్ద దిగులు వచ్చింది. ఆ కళ్ళలో వెలుతురు గుప్పున ఆరిపోతుందా ? అతనికి ఏదో హత్య చేయబోతున్నట్లుంది.

పెరడంతా బాగా చీకటిగా ఉంది. పొప్లార్ చెట్ల ఆకులు గలగలమంటున్నాయి.

పిల్లని బండిలోంచి కిందికి దించుతుంటే ,  అంది..” చూడండి..చెట్లు నిద్రలో మాట్లాడుతు న్నా యి…ఎంత మంచి కలలొస్తున్నాయో వాటికి ! ”

‘ తనకున్న సామానంతా ‘  దాచిన సంచీని గట్టిగా పట్టుకుని అతని వెంట ఆమె ఇంట్లో అడుగు పెట్టింది.

                                                                      [ఇంకా ఉంది ]

  1. చలి దేశాలలో చర్మం మీద ఏర్పడే ముదురు జేగురు రంగు మచ్చలు. చాలా సార్లు యుక్తవయసు వచ్చేసరికి అవి తగ్గిపోతాయి.
  2. డయానా  ఒక గ్రీక్ దేవత. ఆ పేరు క్రైస్తవానికి విరుద్ధంగా ఉందని మాథ్యూ అభిప్రాయం.

 

 

 

 

 

 

 

 

 

ఒక్క మాటకి నాలుగు అర్థాలా? అమ్మో!!

సుధా శ్రీనాథ్ 

 

sudha“April rains bring May flowers!  అనుకొంటూ ఖుషీ పడాలంతే. లేక పోతే ఈ నెల పూర్తి వర్షాలు, బురదలతో రాజీలు తప్పవు కదూ?” 

 “ఔను, మళ్ళీ సాయంత్రం ఉగాది కార్యక్రమం రిహర్సల్‍కని పిల్లల్ని తీసుకెళ్ళాలి ఈ వర్షంలో.  ఇంట్లో కూర్చొని బయటి వర్షం చూస్తూ సంతోషించగలనే కానీ వర్షంలో డ్రైవ్చేయాలంటే నాకస్సలు ఇష్టం కాదు. చాలా కష్టమనిపిస్తుంది కూడా. అదీ ఈ టెక్సస్‌లో వర్షాలంటే కుండపోతలే. అందుకే కాబోలు వాటిని ఇక్కడి వాళ్ళు వానలనరు; thunder storms అని అంటారు. ఈ సారి తెలుగు సంఘం ఉగాది కార్యక్రమం కోసం పిల్లలు ‘వాన వాన వల్లప్ప’ అంటూ వాన గురించి డాన్స్ నేర్చుకొంటున్నారు.”  మాట్లాడుతూ తేనెతెలుగు క్లాస్‌లోనికొచ్చారు కొందరు పోషకులు పిల్లలతో. చుట్టూ ఉన్న రంగు రంగుల పూల చెట్లు ఈదురు గాలితో కూడిన వర్షం వల్ల సగానికి సగం పూలు రాలిపోయి బాధలోఉన్నట్టు కనపడుతున్నాయి. ఇవే చెట్లు వాన వెలసి ఎండ పడుతున్నట్టే కళ కళలాడుతాయి. ఎండ, వాన రెండూ ఉంటేనే నిండు జీవితం.

శాంతి మంత్ర పఠనం, ఒక నిమిషం పాటు ధ్యానం తర్వాత పిల్లలు తెలుగు పదాలు రాయడం, చదవడం మొదలయ్యింది. హోంవర్క్ విషయాలు కూడా మధ్యలో మాట్లాడుతూ,హోంవర్క్ చేసుకొచ్చిన పిల్లల్ని అభినందించారు టీచర్. అది కబుర్లు మొదలు పెట్టే సమయం. అంతలోనే ‘టిక్ టిక్’ తలుపు తట్టి లోపలికడుగు పెట్టారు పట్టు చీరతో, ముడిలోమల్లెపూల ఘమ ఘమలతో కొత్త పెళ్ళి కూతురిలా అగు పడుతున్న కల్పనగారు.  “ఈ రోజు మా పెళ్ళి రోజండి. ఈ రోజుకి మా పెళ్ళయి సరిగ్గా కాలు శతమానం అయింది.అందుకే యజ్ఞశాలలో విశేషంగా శ్రీనివాస కల్యాణం కార్యక్రమం ఉంచుకొన్నాం. మీరందరూ పాఠాలు ముగించుకొని పిల్లలందరితో నేరుగా అక్కడికొచ్చేయండి.  ప్రసాదంతో పాటుపెళ్ళి విందు కూడా ఉంటుంది. అందరూ తప్పకుండా రావాలి.” అచ్చతెలుగులో అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించారు.

“ఓహో! అదీ విశేషం! No wonder, you are looking like a beautiful bride today. Many happy returns of this special day! మీ కుటుంబ జీవితం ఎల్లప్పుడూఆనందంగా కొనసాగాలి” టీచర్‌తో పాటు పోషకులు కూడా కల్పనగారికి శుభాశయాలను తెలిపారు. అందరి మొహాల్లోనూ సంతోషం పొంగి పొర్లింది. క్లాస్ ముగించుకొని అందరూతప్పకుండా వచ్చి విందారగించాలని మళ్ళీ చెబుతూ సెలవు తీసుకొన్నారావిడ.

“ఆంటీ, కాలు శతమానం అంటే ఏంటి?” కల్పన గారు వెళ్తున్నట్టే ఓ చిన్ని బాబు నుంచి టీచర్ వైపుకు దూసుకొచ్చిందీ ప్రశ్న. పిల్లలందరూ మా క్లాసులో టీచర్ని ఆంటీ అనిపిలవడమే అలవాటు.

“శతమానం అంటే నూరు సంవత్సరాలు. శతాబ్ధమన్నా కూడా అదే అర్థం. కాలు శతమానమంటే ఇరవై అయిదేళ్ళు. Today is the 25th anniversary of their marriage. So, they are celebrating the silver jubilee of their wedding with special prayers.” టీచర్ ఇచ్చిన వివరణ వల్ల తనకి సమాధానమైనట్టు కనపడ లేదు.

“కాలు means leg కదూ?” తనకర్థం కానిది అడిగి తెలుసుకోవాలనే పట్టుదల కనిపించిందతని కళ్ళలో. పిల్లల ఇట్లాంటి ప్రశ్నలే మా కబుర్లకు జీవనాడి.

“అవును. అలాగే కాలు అంటే నాలుగింట ఒక భాగం, one fourth అనే అర్థం కూడా ఉంది.” ఓహో! ఇక్కడ కాలు పదాన్ని ఆ అర్థంతో వాడారన్న మాట. అర్థమయ్యిందన్నట్టుబాబు చిరునవ్వే చెప్పింది. పిల్లల మొహంలో చిరునవ్వుల సిరిమల్లెల ముగ్ధ సంతోషం చూడ బలు సొగసు.

‘కాలు’ పదం గుట్టు చప్పుడు లేకుండా మా కబుర్లలోనికి కాలు పెట్టినట్టయింది. ఈ రోజు కాలు గురించే కబుర్లన్నారు టీచర్. మా తేనె తెలుగు క్లాస్ పిల్లలతో పాటు తల్లిదండ్రులూఈ కబుర్లలో పాల్గొనేవారే. అందరూ తమ తమ అనుభవాలను, ఆలోచనలను పరస్పరం పంచుకొనేందుకు ఇదొక చక్కటి వేదిక. పిల్లలకు తెలుగు భాష నేర్పేందుకు తాము కూడాతోడ్పడాలనేదే అందరి ఆశయం. పెద్దలు వీలయినంత తెలుగులోనే చెప్పినా మధ్యలో ఎంతైనా ఇంగ్లిష్ చేర్చేందుకు అవకాశం ఉండేది. అందువల్ల పిల్లలు కూడా తెంగ్లిష్‌లో తమకితోచింది చెప్పేందుకు ముందుకొచ్చేవారు. కాలు పదం గురించి మా కబుర్లు ముందుకు నడవసాగాయి.

“For socks మా తాతయ్య కాల్సంచిలంటారు. ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా నవ్వాను. ఇప్పుడు విని అలవాటయ్యింది.” ముసి ముసి నవ్వులాపుకొంటూ చెప్పిందో చిన్నారి. తనకళ్ళలో కూడా ఇంకా నవ్వుండింది.

“అవును, ‘కాలు’ అంటే పాదమనే అర్థం కూడా ఉంది. Depending on the context, one has to choose its meaning.”

“అంటే కాలు అనే పదానికి leg, foot, one fourth and to burn అని నాలుగర్థాలా?” అన్నింటినీ రాసుకొంటూ అడిగాడొకబ్బాయి. అతను నిశితంగా ఆలోచించి అడిగినట్టుచెప్పిన ఆ విషయం టీచర్‌కు ఆనందాన్నిచ్చింది. లిస్ట్‌కి తాను చెప్పని ఇంకో అర్థాన్ని కూడా చేర్చింది కాలోచితమని అభినందించారతన్ని. పిల్లలు తమ తోటి పిల్లలు చెప్పినదాన్నిచాలా బాగా గుర్తుంచుకొంటారు. కాబట్టి పిల్లలేదైనా కొత్త విషయం తామై చెప్పినప్పుడు టీచర్‌కు ఎనలేని ఆనందం. పిల్లల విషయ పరిజ్ఞానం పెరిగేందుకిది అతి సులభమైన దారి.

“వర్షంలో తడుస్తానంటూ షూస్ విప్పి వెళ్ళాడు. కాలు జారి పడ్డాడు కూడా. బురదని కడుక్కొని వచ్చేందుకు ఆలస్యమయింది.” క్షమించండంటూ కొడుకు విజయ్‌తో వచ్చారువాళ్ళమ్మ.

“బురదలో కాలు పెడితే కాలికి బురదే కదా అంటుకొంటుంది. అందుకే ‘బురదలో కాలు పెట్టినట్టు’ అనే ఉక్తి వాడుకలో ఉంది.” అన్నారొకాయన. చెడ్డ సహవాసం వల్ల చెడ్డఅభ్యాసలవుతాయని చెప్పాల్సినప్పుడు దాన్ని వాడుతారని కూడా తెలిపారు.

“ఆ వయస్సులో మనం కూడా వానలో, నీళ్ళలో మన్ను, బురద అని చూడకుండా బాగా ఆటాడేవాళ్ళం కదూ? నేనైతే పేపర్ పడవల్ని చేసి వాన నీళ్ళలో వదిలి వాటి వెనకాలేపరుగెత్తేదాన్ని. ఇప్పుడు వర్షాకాలంలో నీళ్ళు, బురద అని ఒకటే ఆక్షేపిస్తాం. సిమెంటు కాలుదారిలో మాత్రమే నడుస్తాం. By the way,  కాలుదారి లేక కాలిదారి అంటే footpath or side walk అని అర్థం. దాన్ని కాలిబాట అని కూడా అంటారు.”

‘అడుసు తొక్కనేల, కాలు కడగనేల’ అని కూడా ఒక సామెతుందని గుర్తు చేశారింకొకరు. కాలు పదమున్న ఉక్తులు, సామెతలూ ఏవైనా గుర్తు చేసుకోవాలంటూ ఆలోచించి ‘అందితేజుట్టు అందక పోతే కాలు’, ‘పప్పులో కాలేయడం’ మరియు ‘కాలు గాలిన పిల్లిలా’ అనే వాటిని గురించి కూడ పిల్లలకు వివరించి చెప్పారొక పెద్దాయన.

ఉగాది తర్వాత ఇదే మొదటి క్లాస్ కాబట్టి టీచర్ అందరికీ మరో సారి కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపారు. “ఈ కొత్త సంవత్సరంలో మీ కార్యాలన్నింటిలోనూ విజయందొరకాలి. May you all put your best foot forward in this New year.”

“కొత్త ఇంటికెళ్ళినప్పుడు శుభమస్తు అని మొదలు కుడి కాలుంచి లోనికెళ్తారు కదూ. అదే best foot అనాలా? కుడి కాలుకెందుకంత ప్రాముఖ్యత?”

“కొత్త కోడలొచ్చినప్పుడు కూడా అలాగే. ఆరతులెత్తి ముందు కుడికాలే లోపలుంచి రమ్మంటారెందుకూ?”

పిల్లలకీ సందర్భాలను వివరించాలనుకొన్నారు టీచర్. “Right is right.” చిన్నారియొక్కతె తక్షణమే చేసిన సందర్భోచిత  pun అడ్డొచ్చినా అది అందరికీ నచ్చింది.

“అయితే ఒక విషయం నాకు నచ్చదు. కోడలు కుడి కాలు ముందు మోపి ఇంట్లోకడుగు పెట్టిన తర్వాత, అంటే ఇంటికి కోడలొచ్చిన తర్వాత ఇంట్లో ఎవరికైనా, ఏదైనా చెడు జరిగితేకోడలింటికొచ్చిన సమయం, తన కాల్గుణమని తనపై నింద మోపుతారు. అది సరి కాదు. కోడలొచ్చిన తర్వాత తనకి సంబంధించని సమస్యలకు కూడా తనని బాధ్యురాలు చేసిదూషించడం తప్పు.” అందరూ అవునవునన్నారు.

“మంచి జరిగితే కాల్గుణమంటూ పొగిడేది కూడా ఉంది. But why associate the two? As it is she is adjusting to her new life in a new place.” అందరూ ఒప్పాల్సినమాటే అది.

“I told my mom that I have got some seeds for seedless grapes. She asked me to plant them in our backyard.” నందన్ అల్లరి నవ్వులతో చెప్పసాగాడు.“I pretended to plant them and shouted ‘అమ్మా! నాగు పాము! నా కాలిపైకొచ్చింది’ అని.  అమ్మ కంగారు పడి పరుగెత్తుకొచ్చిన తర్వాతే తెలిసింది ఏప్రిల్ ఫూల్అయ్యానని.  While ‘seeds for seedless’ was my way of fooling her, the other part was dad’s plan because there are no cobras in the USA.” తను,నాన్న కలిసి అమ్మను ఫూల్ చేశామని చిన్ని నందన్‌కు ఒకటే సంతోషం. నందన్ మాటల వల్ల గంభీరంగా నడుస్తున్న కొత్త కోడళ్ళ విషయం నుంచి హాస్యం వైపుకు తిరిగాయి మాకబుర్లు. వాతావరణాన్ని కొద్దిగా తేలిక చేశాయి నందన్ నవ్వులు.

“ఈ రోజు ప్రొద్దున మా అబ్బాయి నా చెప్పులు తొడుక్కొన్నాడు. వాడి కాళ్ళకు నా చెప్పులు చాలా పెద్దవి లెండి. అయితే చిన్న పిల్లలకి అదో సరదా కదూ. మా వైపు ఒక పద్ధతివాడుకలో ఉంది. ఎప్పుడయితే తండ్రి చెప్పులు కొడుకు కాళ్ళకు సరి పోతాయో, అప్పటి నుంచి తండ్రి కొడుకుని స్నేహితుడిలా చూడాలని. అంటే కొడుకు అభిప్రాయాలను కూడాసమానంగా గౌరవించాలని.” నందన్ నాన్నగారు చెప్పిన ఈ విషయం అందరికీ కొత్తగా అనిపించింది. అయితే సారాంశం భలే నచ్చింది. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నసంప్రదాయాలు కూడా మనకు అంతగా తెలిసుండవు కదూ!

“కొత్త సంవత్సరంలోనికి కాలు పెట్టాం. Happy New Year to you all!” టీచర్ క్లాస్ ముగిస్తూ ఇంకోసారి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

“మనం కొత్త సంవత్సరంలోనికి కాలు పెట్టామా లేక కొత్త సంవత్సరం మన జీవితంలోనికి కాలు పెట్టిందా?” టీచర్‌ని ఎద్దేవా చేశారొకరు. “మీ కాలు లాగే ప్రయత్నమంతేనండి”తక్షణమే నవ్వేశారు.“కాలు లాగడం is the same thing as pulling someone’s leg.” వివరణ విని అందరికీ నవ్వులు.

“కీళ్ళ నొప్పి వల్ల నేను కాళ్ళు లాగి నడిచేదాన్ని. అమేరికాకొచ్చిన తర్వాత నడవడమే తక్కువైపోయింది. ఎక్కడికెళ్ళాలన్నా కారెక్కాలి. అందుకే కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి మాలాంటివాళ్ళకి.” అంటూ వాపోయారొక పెద్దావిడ. రోజూ సాయంత్రం ఇంటి దగ్గరున్న పార్క్‌లో నడవడం వల్ల నొప్పులు తక్కువవుతున్నాయని కూడా చెప్పారు. వ్యాయామమే అన్నిఆరోగ్య సూత్రాలలోనూ ప్రముఖమైన అంశం కదూ.

 ఈదురు గాలితో కూడిన జోరు వర్షం తగ్గినా కూడా ఇంకా సన్న చినుకులతో వాన పడుతూనే ఉండింది. అందరూ వివాహ భోజనానికని యజ్ఞశాల వైపుకు బయలుదేరాం. అక్కడస్నేహితులందరూ కల్సి పాడుతున్న ‘వివాహ భోజనంబు’ పాట మాయాబజారులోని ఘటోద్గజుడు విందారగించడం గుర్తుకు తెచ్చి మా విందుకు చక్కటి సంభ్రమాన్ని చేకూర్చింది.

*

 

పొద్దు

కొండముది సాయికిరణ్

కొత్తగా కనిపించే
పాత సందర్భాలలో
ఇంద్రధనుసు
కొత్తరంగులు పూసినట్లు
కనిపిస్తుంది.
తడారుతున్న ఆకుల మధ్య
ప్రపంచం
పరవశిస్తున్నట్లు వినిపిస్తుంది

సుదూర తీరాల నుంచి
నేలపై వాలిన చినుకులో
పుష్పాన్నై
నిశ్శబ్దంగా రెక్కలు తొడిగిన
పరిమళపు ప్రవాహాన్నై
రెప్పలు మూసుకున్న
ప్రపంచానికి
అసలు రంగులు అద్దాలనుకునేలోపే
తెరలు కట్టుకుంటున్న చీకటి
ఉన్మాద గీతమై నిలువరిస్తుంది.

~

saikiran

శ్మశానం రంగస్థలం…కాటికాపరి, శవవాహకులు ముఖ్యపాత్రలు

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

అన్యులు సృజించని అంశాలపై రచనలు చేసే రచయితలు తెలుగులో చాలా తక్కువ. సమాజంలో హీనమైన పనులుగా ముద్రబడ్డ చర్యల ఇతివృత్తాలతో సాహితీసృజన చేసి మెప్పించడం అందరికీ సాధ్యం కాదు. సాహిత్యంలో జనన మరణాల సంఘటనలెన్నో ఉంటాయి. కానీ శ్మశానం రంగస్థలంగా, కాటికాపరి, శవవాహకులు ముఖ్యపాత్రలుగా చేసిన రచనలు చాలా అరుదు.

మృత్యువంటే చాలా మందికి జడుపు. కొందరికి ఆసక్తి.. ఎందరికో రోత… జీవమున్నంత కాలం గౌరవించి, ఆదరించిన వ్యక్తులను సైతం, మరణించగానే వీలైనంత త్వరగా అంత్యక్రియలు ముగించడానికి తొందరపడతారు జనాలు. చావంటే మనుషులకున్న భయం అలాంటిది. ఇక శ్మశానం, రుద్రభూమి, వల్లకాడు లాంటి పదాలను ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు ఎందరో ఉన్నారు.

అయితే అంత్యక్రియలపై ఆధారపడే జీవనం గడుపుకునే వారెందరో ఉన్నారు. కాటికాపరి, శవవాహకులు, శ్రాద్ధ కర్మలు చేయించే బ్రాహ్మలు… ఇలా మాములు మనుష్యులు ఏనాడు పట్టించుకోని ఓ సమూహాం గురించి, వారి జీవితాల గురించి తెలిపే నవల “పితృవనం“. పితృవనం అంటే శ్మశానం. శీర్షికలోనే ఇతివృత్తం ఏమిటో అర్థమయ్యే ఈ నవలని శ్రీ కాటూరి విజయసారథి  వ్రాసారు.

పేదరికం తాండవిస్తూ, నిలకడైన సంపాదన లేని మధ్యతరగతి కుటుంబాలలో ఓ మనిషి చనిపోతే, అంత్యక్రియలకీ, కర్మకాండకీ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చనిపోయినవారి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అంటే… చనిపోయిన వ్యక్తుల ఆఖరి కోరిక  అంత్యక్రియలు సక్రమంగా చేయించమనే అయ్యుంటుంది. ఎందుకంటే…. కర్మకాండలు సరిగ్గా జరగకపోతే… ఏదో అయిపోతుందనే భయం… తదుపరి జన్మ మంచిది లభిస్తుందో లేదో అనే అనుమానం.

అయితే కర్మకాండ నిర్వహించవలసినవారి ఆర్ధిక స్థితిగతులను గూర్చి ఎవరూ పట్టించుకోరు. తరతరాలుగా వస్తున్న ఆచారాలు కొనసాగించవలసిందే అంటారు. ఇదే అంశంతో ప్రారంభమవుతుంది నవల. ఒకప్పటి వాల్తేరు ఈ నవలకి కార్యరంగం. శవాలను మోసే సూరిగాడిని వెతుక్కుంటూ వస్తాడో కుర్రాడు. అతని తండ్రి చనిపోయాడు. చాలా తక్కువ డబ్బులుంటాయి. ఎలాగొలా శవసంస్కారాలు కానివ్వమని సూరిని బ్రతిమాలుకుంటాడు. మొదట కటువుగా మాట్లాడినా, ఓ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి ధన సహాయం చేయిస్తాడు. మిగతా శవవాహకులను, మంత్రం చెప్పే బ్రాహ్మడు సుబ్బావధానినీ, పాడె కోసం మేదరవాళ్ళకీ పురమాయిస్తాడు.

చివరికి శవం లేస్తుంది. ఊరికే లేచిందా? వందలు చేత్తో పట్టుకుంటే లేచింది. ముష్టెత్తినా, ఎత్తుకొచ్చినా వందలు చేత్తో పట్టుకోకపోతే ఏ శవమూ గుమ్మం ముందు నుంచీ లేవదు. చివరికి శవదహనం పూర్తవుతుంది. ఆ కుర్రాడి పేరు ఆనంద్ అనీ అతని భార్య పేరు శాంత అని తెలుస్తుంది. ఇంటర్ చదివి, టైప్ రైటింగ్ పాసయిన ఆనంద్ జీవిక కోసం ఇద్దరు లాయర్ల దగ్గర పనిచేస్తూంటాడు. వారిచ్చే కొద్దిపాటి డబ్బుతో రోజులు నెట్టుకొస్తుంటాడు. మొత్తం ఖర్చెంతయ్యిందో లెక్కలు వేయించి, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వారికి ఆనంద్ చేత ఇప్పిస్తాడు సూరి. తన వాటా మాత్రం తీసుకోకుండా ఊరుకుంటాడు. ఆనంద్ ఇంటికి వెళ్ళిపోయాక, కాటికాపరి వీరబాహుడు అడుగుతాడు ఎందుకింత తక్కువ ఇప్పించావని, సూరి ఎందుకు డబ్బులు తీసుకోలేదని. ఇంకో శవమేదయినా వస్తే అప్పుడు సరిగానే ఇస్తాలే… అని చెప్పి విశ్రాంతి కోసం కాసేపు కునుకు తీస్తాడు సూరి. నిద్రలేచే సరికి ఇంకో శవం కాలుతూ కనబడుతుంది. ఆనంద్‌ని జ్ఞాపకం చేసుకుని ఈ జనారణ్యంలో ఏ ఒక్క మృగమూ అతని గోడు ఆలకించనందుకు బాధ పడతాడు.

సూరిలో అంతర్మథనం జరుగుతూంటుంది. ఎన్నెన్నో ప్రశ్నలు. సమాజం తీరు పట్ల కలత. ఆలోచనల నుంచి తేరుకుని వీరబాహుడితో కబుర్లలో పడతాడు. ఊసులయ్యాక, ఆ కాలుతున్న శవం ఎవరిదో వాకబు చేస్తాడు. ఆ శవం పీర్ల కోనేరు సందు మొదట్లో టీ కొట్టు నడిపే నాయర్‌‌దని తెలుసుకుంటాడు. ఆ చీకట్లో ఎవరో పడుకుని ఉండడం చూసి ఎవరో మరో శవాన్ని అక్కడ వదిలేసి పోయారేమోననుకుంటారు సూరి, వీరబాహుడు. అయితే ఆ వ్యక్తి ఇంకా చావలేదనీ, బ్రతికే ఉందనీ గ్రహిస్తారు. ఆమె నాయర్ కొట్లో పనిచేసేదని తెలుస్తుంది. వేరే ఆధారం లేకపోయేసరికి తన ఇంటికే తీసుకువెడతాడు సూరి. ఆమె పేరు జయ అని తెలుసుకుంటాడు. ఆమెకో ఆధారం దొరికే వరకు తనకు వంట చేసి పెడుతూ తన ఇంట్లోనే ఉండమని చెబుతాడు.

సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన సూరి అసలు పేరు సూర్యనారాయణ మూర్తి. చిన్నప్పుడు బడిలో హెడ్మాస్టర్ అకారణంగా దండించడంతో చదువు మానేస్తాడు. చదువు అబ్బకపోవడం వల్ల ఏ ఉద్యోగం దొరక్క తన ఈ వృత్తి చేపట్టాల్సివచ్చిందని బాధపడతాడు. చనిపోయిన నాయర్ టీ కొట్టు సామన్లను అమ్మేస్తున్నారని తెలిసి, వాటి యజమానితో మాట్లాడి వాటిని తను కొనుక్కుంటానని ఎవరికీ ఇచ్చేయద్దని చెబుతాడు. ఇంతలో ఓ బేరం వస్తుంది. చనిపోయినది డబ్బున్న ఆసామి వాళ్ళ నాన్న. ఆ ఆసామి గీరగా మాట్లాడితే తగిన సమాధానం చెప్పి అతని పొగరు దించుతాడు సూరి.  ఈ శవదహనమూ అయ్యాకా ఇల్లు చేరుతాడు. జయ గతం తెలుసుకుంటాడు.. సొంత మనుషులే ఆమెని దుబాయ్ షేకులకి అమ్మేస్తారు. వారి బారినుంచి తప్పించుకుని, ఎన్నో కష్టాలు పడి నాయర్ పంచన చేరుతుంది. నాయర్ దగ్గరనుంచి తమ వాటా డబ్బులు పట్టుకుపోతుంటారు ఆమె బంధువులు. నాయర్ ఆదరణతో మాములు మనిషైన జయ భవిష్యత్తు… నాయర్ చావుతో అగమ్యగోచరమయింది.

PithruvanamFrontCover

నాయర్ అస్థిసంచయనం చేసొచ్చాక సూరిని కలుస్తాడు ఆనంద్. లాయర్ల దగ్గర పనిమానేసి టీ కొట్టు నడుపుకోమని ఆనంద్‌కి సలహా ఇస్తాడు సూరి. తాను హామీగా ఉండి ఆ కొట్టుని ఆనంద్‌కి ఇప్పిస్తాడు. టీ పాటు టిఫిన్లు కూడా అమ్మేలా శాంతను, జయను కుదురుస్తాడు.

తన స్నేహితుడు రాజుకి ఉద్యోగం రావడం కోసం ఓ అధికారితో వాదన వేసుకుంటాడు. కాలు జారినా, తన తప్పు తెలుసుకొని కొత్త జీవితం గడపాలనుకునే ఓ అమ్మాయికి దారి చూపిస్తాడు. నాయర్ చనిపోయాడని తెలిసిన జయ బంధువులు ఆమెని బలవంతంగా ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తే, తన తోటివారందరితోనూ కలసి అడ్డుకుని ఆమెను కాపాడుతాడు. జయని పెళ్ళి చేసుకుంటాడు.

సూరి, వీరబాహుడు జానకిరామయ్య తాత, అరుణ, జయ, నాయర్.. ఒక్కొక్కళ్లది ఒక్కో కథ. అందరినీ అంతఃసూత్రంగా కలిపేది పేదరికం, అవసరం… అంతకుమించి మానవత్వం.

రిజర్వేషన్ల వ్యవస్థపైనా, కులమతాల మీద, ఆచార వ్యవహారాల మీద మనుషుల నీతి నిజాయితీల మీద ఎన్నెన్నో ప్రశ్నలున్నాయి, మనసుని కదిలించే వ్యాఖ్యానాలున్నయి ఈ నవలలో.

శ్రామికులూ, కార్మికులు ఒకటికారా? కాదనే అంటుందీ నవల. శ్రామికులందరూ కార్మికులు కారు. కర్మాగారాలలో పనిచేసే కార్మికులకు చట్టపరమైన హక్కులుంటాయి. సంఘటితమైన శ్రామికులను కార్మికులు అనచ్చేమో. అసంఘటితంగా ఉన్న శ్రామికులను తోటి కార్మికులు కూడా పట్టించుకోరని ఈ నవలలో ఓ ఉదంతం తెలుపుతుంది. కార్మికులవలె, తమకు కూడా కనీస సదుపాయలను కల్పించాని, సాంఘిక భద్రత కల్పించాలని అపరకర్మలు చేసే శ్రామికులు కోరితే… వాళ్ళసలు కార్మికుల విభాగంలోకి రానే రారని, చట్టపరమైన నిబంధనలను వారికి వర్తింపజేయనక్కర్లేదని వాదిస్తారు కార్మికులు, వారి నేతలు. అన్ని రకాలుగా నిస్సహాయులైన శవవాహకులు కృంగిపోతారు.

కాలక్రమంలో వచ్చిన ఓ మార్పు మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని సూరి అంటాడు. ఓ మనిషి విగతజీవుడయ్యాక, అంతిమ సంస్కారానికి శవాన్ని మోయడానికి కూడా వెనుకాడుతున్నారని, అదే ఇతర మతాలలో శవాన్ని మోయడం ఓ గౌరవంగా భావిస్తారని.. వాపోతాడు.

KaturiViajayaSarathi

కాటూరి విజయసారధి

 

పేదలూ మనుషులేనని, అవకాశాలు లేక, మరింత పేదలుగా మారుతున్నారని, ఒకరికొకరు సాయం చేసుకుంటే, కొందరైనా ఎదిగి మిగతావారి ఎదుగుదలకి తోడ్పడవచ్చనేది సూరి దృక్పథం. మాట కటువు మనసు వెన్న.. అనే నానుడి సరిగ్గా సరిపోయే మనిషి సూరి. ఇదే అర్థం వచ్చేలా ఓ సందర్భంలో తాత “పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము – నవ్యనవనీత సమానము నిండు మనమ్ము” అని మహాభారతంలోని పద్యాన్ని అన్వయిస్తాడు  సూరికి.

తాను చేసే వృత్తి పాడుదని తాను అనుకోవడం లేదని, అందరూ అలా అనుకుంటున్నందుకే తాను బాధ పడుతున్నానని అంటాడు సూరి. తనకి వీలయినయింత మేర తోటివారికి సాయం చేసి వాళ్ళు జీవనసాగరాన్ని ఈదేలా చూస్తాడు సూరి.

“డబ్బు మీద నమ్మకం పెరిగిన కొద్దీ మనుషుల మీద నమ్మకం తగ్గిపోతుంది మరి.” అంటాడు సూరి ఓ సందర్భంలో. ఈ ఒక్క వాక్యాన్ని ఎన్ని ఇజాలకి అన్వయించుకోవచ్చో!

ఈ నవల చదువుతున్నంత సేపూ సమాజం పట్ల ఓ రకమైన ఏవగింపు కలుగుతుంది. శ్మశాన వైరాగ్యం వల్లకాడులోంచి బయటకొచ్చాక పోతుంది, మరి సమాజ వైరాగ్యం ఎలా పోతుంది? భద్రజనులు, బాధసర్పద్రష్టులు పరస్పర ఘర్షణ లేకుండా జీవనం గడపగలరా? జీవితాలలోని విలువలని పునర్నిర్వచించుకోవాలని అన్యాపదేశంగా సూచించే నవల “పితృవనం”.

1989 దీపావళి సందర్భంగా ఆంధ్రప్రభ వారపత్రిక వారు నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న నవల ఇది.  1992లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ నవలగా వార్షిక పురస్కారం పొందిన నవల “పితృవనం”.

గోకుల్ చంద్ర & రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం వారు ప్రచురించిన ఈ నవల అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ, జేష్ఠ లిటరరీ ట్రస్ట్ వారి వద్ద, ఇంకా ప్రచురణకర్తల వద్ద దొరుకుతుంది. 141 పేజీల ఈ పుస్తకం వెల రూ.100/-.  కినిగెలోనూ ప్రింట్ బుక్ లభ్యం.

ప్రచురణకర్తల చిరునామా

గోకుల్ చంద్ర & రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్

c/o. విజయ్ నిర్మాణ్ కంపెనీ

 సిరిపురం జంక్షణ్, విశాఖపట్నం – 530003.

ఫోన్: +91 891 2575755

 

తాంత్రికం

 

రంజకం .. వేశ్య

నళిని…వేశ్య

~
నళిని:    రంజకం, బోయగూడెంలో తాంత్రికం తెలిసిన మంత్రగత్తెలుంటారట. నీకెవరన్నా తెలిస్తే చెప్పవే! నా ప్రియుడు నరహరి ఆ ముండ చంపకమాల ముఖం మీద ఉమ్మేసి మళ్ళీ నా దగ్గరికొచ్చేలా ఏదైనా ప్రయోగం చెయ్యగలిగితే, నా ఆస్తి మొత్తం ఆ మంత్రగత్తె కిచ్చేస్తాను.

రంజకం: ఏంటే నువ్వనేది? ఐతే, ఇప్పుడా నరహరి నీతో ఉండట్లేదా? వాడు చంపకమాలనెలా మరిగాడే? నీకోసం వాళ్ళమ్మా నాన్నలతో గొడవలు పడి వాళ్ళు కుదిర్చిన పిల్లను, లక్షల రూపాయల కట్నాన్ని కూడా వదులుకున్నాడే!

నళిని:    అదంతా గతం. ఆ మనిషిని చూసి ఐదు రోజులైంది. నరహరి నన్ను దిక్కు లేని దాన్ని చేశాడు. ఆ ముండ చంపక మాలతో కలిసి తన స్నేహితుడు దివాకరుడి ఇంట్లో దుకాణం పెట్టాడట.

రంజకం: ఎంత జారిపోయావే నళినీ!? ఇది చిన్న విషయం కాదు. అసలిదంతా ఎలా జరిగింది?

నళిని:    దీని గురించి చెప్పేందుకేమీ లేదు. మొన్న వాళ్ళ నాన్నకు రావాల్సిన బాకీ వసూలు కోసం పరంధామయ్య ఇంటికి వెళ్లి వచ్చాడు. ఇంట్లోకి వస్తూండగానే నేను ఎదురెళ్ళాను. నన్నసలు పట్టించుకోలేదు. నేను మురిపెం చేస్తే విదిలించేశాడు. ‘ఇంక నా జోలికి రాకు. ఆ కంసాలి బ్రహ్మం గాడితోనే పో! నా మాట అబద్ధమైతే, రథశాల గోడల దగ్గరకు పోయి చూడు. మీ ఇద్దరి పేర్లు అక్కడెంత అందంగా చెక్కారో తెలుస్తుంది.’ అంటూ విసురుగా మాట్లాడాడు. నేను ఆశ్చర్యపోయి బ్రహ్మమెవరు? అని అడిగాను. సమాధానం చెప్పలేదు. భోజనం వడ్డిస్తే ఒక్క మెతుకు కూడా నోట బెట్టలేదు. పోయి మంచమెక్కి అటు తిరిగి పడుకున్నాడు. అతన్ని ప్రసన్నం చేసుకోడానికి నాకు తెలిసిన విద్యలన్నీ ప్రయోగించాను. కౌగిలించుకున్నాను, మీద పడుకున్నాను, వీపు మీద పైనుంచి క్రిందదాకా ముద్దులు పెట్టాను, ఆఖరికి అక్కడ చెయ్యేసి నిమిరాను. ఎన్ని చేసినా అతను అంకెకు రాలేదు. లేకపోగా, ‘ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఇప్పుడే లేచి పోతాను’ అని కటువుగా మాట్లాడాడు.

రంజకం: ఇంతకీ ఈ బ్రహ్మమెవడో నీకు తెలుసా తెలియదా?

నళిని:    వాడెవడో నాకు తెలిస్తే ఈ తిప్పలెందుకు? నరహరి మరసటి రోజు పొద్దున్నే లేచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రథశాల గోడ మీద రాతల గురించి అతను చెప్పింది గుర్తుకొచ్చి అదేంటో చూసి రమ్మని మన చిత్రను పంపాను. రథశాల ప్రవేశ ద్వారం పక్కనే గోడ మీద రెండు వాక్యాలు “నళిని బ్రహ్మాన్ని ప్రేమిస్తోంది” అని, దాని క్రింద “కంసాలి బ్రహ్మం నళినిని ప్రేమిస్తున్నాడు” అని రాసి ఉన్నాయట.

రంజకం: నాకిప్పుడర్థమైంది. నరహరికి అసూయ ఎక్కువని తెలిసిన వాళ్ళెవరో అతన్ని మంచి చేసుకోడానికి ఇలా రాసి ఉంటారు. ఒక్క మాట కూడా అడక్కుండా అతనా రాతల్ని నమ్మేశాడు. నేనొకసారి అతన్ని కలిసి మాట్లాడతాను.

నళిని:    అది నీవల్ల అయ్యే పని కాదు. ఎవరికీ అతను అందుబాటులో లేడు. ఆ చంపకమాలతో కలిసి గదిలో దూరి తలుపేసు కున్నాడు. వాళ్ళ అమ్మానాన్నలు అతనిక్కడున్నాడేమోనని చూడటానికి నా ఇంటికి వచ్చారు. లాభం లేదు, ఒక మంచి మంత్రగత్తె దొరికి సరైన ప్రయోగం చేస్తే తప్ప నా బతుకు బాగుపడదు.

రంజకం: దిగులుపడకే అమ్మాయీ! నాకో గొప్ప మంత్రగత్తె తెలుసు. ఇప్పుడీ నరహరి నిన్నొదిలేసి ఎలా వెళ్ళాడో, ఇదివరకు నా ప్రియుడు కొండ్రెడ్డి కూడా అలాగే నన్నొదిలి పోయాడు. అప్పుడీ మంత్రగత్తె చేతబడి లాంటిదేదో చేసింది. కొండ్రెడ్డి నా దగ్గరికి మళ్ళీ వస్తాడనుకోలేదు. అట్లాంటిది, దాని తంత్రం పుణ్యమా అని తిరిగి నా పక్కలోకి చేరాడు.

నళిని:    అవునా, అవునా, ఆ మంత్రగత్తె ఏం చేసిందో కాస్త చెప్పవా?

రంజకం: చెప్తా. మొత్తం చెప్తా. ఆ మంత్రగత్తెకి పెద్దగా డబ్బు కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఒక బంగారు నాణెం, ఒక వీశెడు రొట్టె ఇస్తే చాలు. కాకపోతే కాస్త ఉప్పు, ఏడు వెండి నాణాలు, గంధకం, ఒక కాగడా నువ్వు తెచ్చుకోవాలి. అవన్నీ ఆ మంత్రగత్తె తీసేసుకుంటుంది. వీటితో పాటు ఒక లోటాడు మంచి సారాయి కూడా ఇవ్వాలి. దానికి తాగుడు అలవాటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నరహరికి సంబంధించిన వస్తువేదన్నా ఇవ్వాలి. అంటే అతని బట్టలు కానీ, అతని ఒంటి మీద వెంట్రుక కానీ, అలాంటివన్న మాట.

నళిని:    నా దగ్గర అతనేసుకొనే చెప్పులున్నాయి.

రంజకం: చాలు. ఆవిడా చెప్పుల్ని ఒక మేక్కి వేలాడదీస్తుంది. దానిక్రింద గంధకాన్ని మండిస్తుంది. ఆ మంట మీద ఉప్పు చల్లుతూ నీ పేరు, నీ ప్రియుడి పేరూ అదేపనిగా ఉచ్చరిస్తుంది. తరువాత తన చన్నుల మధ్యనుంచి ఒక బొంగరాన్ని తీసి దాన్ని గిర్రున తిప్పుతుంది. ఆ బొంగరం తిరిగేటప్పుడు పెదాలతో ఒక రహస్య మంత్రాన్ని జపిస్తుంది. అదేం మంత్రమో కానీ, వినేటప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది.

ఆవిడా ప్రక్రియ చేసిన కొద్ది రోజులకే నా ప్రియుడు కొండ్రెడ్డి నన్ను వెతుక్కుంటూ వచ్చి నా పక్కలో చేరాడు. అతడి కొత్త ప్రియురాలు ఎంత బతిమలాడినా, అతని స్నేహితులు నాదగ్గరకు రానివ్వకుండా ఎంత ప్రయత్నం చేసినా అతను లొంగలేదు. మంత్రశక్తి అతని మీద అలా పనిచేసింది. నా దగ్గరకు నెట్టుకొచ్చింది.

ఆ మంత్రగత్తె మరో పని కూడా చేసింది. కొండ్రెడ్డి తన కొత్త ప్రియురాల్ని ద్వేషించేలా నాకో ఉపాయం కూడా బోధించింది. ఆమె నడిచేటప్పుడు అడుగులు ఎక్కడ వేస్తుందో చూసి, ఆమె ఎడమ పాదముద్రల మీద నా కుడి పాదంతోనూ, కుడి పాదముద్రల మీద ఎడంపాదంతోనూ తొక్కాలి. అలా తొక్కేటప్పుడు,’నేను నీపైన గెలిచాను. పైచేయి సాధించాను. పైచేయి సాధించాను. నీపైన గెలిచాను. పైచేయి సాధించాను.’ అంటూ ఉండాలి.

నేను ఆ మంత్రగత్తె చెప్పినట్టు తు.చ. తప్పకుండా చేశాను. కొండ్రెడ్డి ఇప్పుడు నా కొంగున ఉన్నాడు. ఇదివరకట్లా కాదు, ఇప్పుడు నేను నా ఒంటి మీద ఎక్కడ పెట్టమంటే అక్కడ బహు ఇష్టంగా ముద్దులు పెడుతున్నాడు.

నళిని:    ఇంక ఒక్క క్షణం కూడా ఆలస్యం వద్దు రంజకం, వెంటనే ఆ బోయగూడెం మంత్రగత్తె దగ్గరకు పోదాం పద. చిత్రా, చేతబడికి అవసరమైన వస్తువులన్నీ సిద్ధం చెయ్యి.

*

పాంచాలి పెరటి సాగు!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ఒకసారి మహాభారతంలోకి వెళ్లవలసిన అవసరం కనిపిస్తోంది. అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలోని ఈ ఘట్టం చూడండి…

పాండవులు రాజ్యం కోల్పోయి, ద్రౌపదిని వెంటబెట్టుకుని అరణ్యవాసానికి బయలుదేరాడు. వారి వెంట కొంతదూరం పౌరులు కూడా వెళ్లారు. వారిని వెనక్కి పంపించివేసిన తర్వాత గంగాతీరానికి వెళ్ళి, ఒక పెద్ద మర్రిచెట్టుకింద ఆగి, గంగలో స్నానం చేసి, ఒక పగలూ, రాత్రీ  పాండవులు అక్కడే గడిపారు. అంతలో వారిని అభిమానించే బ్రాహ్మణులు అగ్నిహోత్రాలను, బంధువులను, శిష్యులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు. మేము కూడా మీతో వనవాసం చేయడానికి నిర్ణయించుకున్నామని వారు ధర్మరాజుతో అన్నారు.

“ఘోరారణ్యంలో కందమూలాలు తింటూ గడపడం మాకు ఎలాగూ తప్పదు. మీ కెందుకీ కష్టం? క్రూరమృగాల మధ్య వనవాసం మీకు తగదు. దయచేసి  మీ ఇళ్లకు తిరిగివెళ్ళండి” అని ధర్మరాజు వారితో అన్నాడు.

అప్పుడు బ్రాహ్మణులు దుఃఖిస్తూ, “మీలాంటి ధార్మికులను విడిచి ఎలా వెడతాం? మేము మీకు ఆశ్రితులం, భక్తులం. మా పోషణ గురించి ఆలోచించవద్దు. మా కందమూలాలు మేమే సంపాదించుకుంటాం. జపాలు, హోమాలు మొదలైన పుణ్యకార్యాలు చేస్తూ మీ శ్రేయస్సుకు పాటుపడతాం. అంతే తప్ప మీకు అపకారం చేసిన ఆ ధార్తరాష్ట్రుల రాజ్యంలో మేము ఉండలేం” అన్నారు.

వారి ఇష్టాన్ని ధర్మరాజు కాదనలేకపోయాడు. అయితే, వీరు కందమూలాలు తింటుంటే తను ఎలా చూడగలననుకుని బాధపడ్డాడు. ఈ అడవిలో వీరికి ఆహారం సమకూర్చే మార్గం చెప్పమని పురోహితుడైన ధౌమ్యుని కోరాడు. అప్పుడు ధౌమ్యుడు,

“పూర్వం జీవులన్నీ పుట్టిన తర్వాత అవి ఆకలితో బాధపడుతుండడం చూసి సూర్యుడికి జాలి కలిగింది. తను ఉత్తరాయణంలో ఉన్నప్పుడు భూమిలోని రసాన్ని స్వీకరించి దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఆ రసాన్ని మేఘాలలో నింపి, దాని ద్వారా ఓషధులను(ఆహారాన్ని ఇచ్చే మొక్కలను) పొందాడు. రాత్రి పూట చంద్ర కిరణాలనే అమృతంతో వాటిని పెరిగేలా చూసి వాటినుంచి అన్నం పుట్టించి జీవుల ప్రాణం నిలిపాడు. కనుక అన్నం నిండా ఉన్నది సూర్యుడే. భీముడు, వైన్యుడు, కార్తవీర్యుడు, నహుషుడు మొదలైన పూర్వ రాజులందరూ సూర్యుని ఆరాధించి, అన్నాన్ని సంపాదించి దానితో ప్రజలను పోషించారు. కనుక నువ్వు కూడా సూర్యుణ్ణి ప్రార్ధించు” అన్నాడు.

పౌరాణిక శైలిలో చెప్పిన ఈ మాటలు మనకు బాగా తెలిసిన ఒక భౌతికధర్మాన్ని చెబుతున్నాయి. ఉత్తరాయణంలో వచ్చే వేసవి కాలంలో సముద్రాలు, నదులలోని నీరు ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. దక్షిణాయనంలో వచ్చే వర్షాకాలంలో ఆ మేఘాలు వర్షించి ఆహారపు పంటలను ఇస్తాయి. పైన చెప్పిన పూర్వపు రాజులందరూ సూర్యుని ఆరాధించి అన్నం సంపాదించి ప్రజలను పోషించారంటే అర్థం– వ్యవసాయం  ద్వారా ఆహారోత్పాదన చేశారనే. ఈవిధంగా ధౌమ్యుడి మాటల్ని మనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేసుకుంటే, అవి వ్యవసాయం గురించి చెబుతున్నాయి. సూర్యుణ్ణి ప్రార్థిస్తే ఆహారం లభిస్తుందనడం; సూర్యగమనంతో ముడిపడిన ఒక భౌతికధర్మంపైనా, వ్యవసాయమనే భౌతికచర్యపైనా పురుషభావారోపణ చేయడమే.  ఏతావతా ధౌమ్యుడు అంటున్నది ధర్మరాజును వ్యవసాయం చేయమనే!

అదలా ఉండగా, ధౌమ్యుడి మాటల్లో మనకు ప్రస్తుత విషయానికి అవసరమైన అదనపు వివరం, మేఘాల ద్వారా తను పొందిన ఓషధులను సూర్యుడు రాత్రిపూట చంద్రకిరణాలనే అమృతంతో తడిపి వాటిని పెరిగేలా చూశాడన్నది!

పురోహితుడు చెప్పినట్టే ధర్మరాజు సూర్యుని పువ్వులతో పూజించి, ఆ రోజు ఉపవాసముండి, భాగీరథీ జలాలలో నిలబడి ఇంద్రియాలను అదుపు చేసుకుని వివిధ సూర్యనామాలతో జపం చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. “(అరణ్యవాసం చేసే) ఈ పన్నెండేళ్లూ నీ వంటశాలలో ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు అక్షయాలై, నాలుగు రకాల ఆహారాలు అవుతా”యన్నాడు.

పురాకాలంలో లౌకిక కర్మ, మత కర్మ అనే తేడాలు లేవనీ; ప్రతి లౌకిక కర్మా విధిగా మతపరమైన తంతుతో మొదలు కావలసినదేననీ గతంలో అనుకున్నాం. ఆ దృష్ట్యా చూసినప్పుడు, పురోహితుని సారథ్యంలో ధర్మరాజు మతపరమైన  తంతు జరిపి వ్యవసాయం ద్వారా ఆహార సంపాదనకు పూనుకున్నాడన్న ఒక సాధారణ విషయాన్నే పై ఘట్టం సూచిస్తోంది. కాకపొతే పౌరాణిక శైలికి అనుగుణంగా దానికి కొంత మాంత్రికతను జోడించి కథకుడు చెబుతున్నాడు. ఆ మాంత్రికతను మరింత ముందుకు తీసుకువెళ్లి, ధర్మరాజుకు సూర్యుడు ‘అక్షయపాత్ర’ను ఇచ్చాడనీ, దాని ప్రభావంతో ద్రౌపది అన్ని రకాల ఆహార పదార్థాలను సృష్టించి పూటపూటా ఎంతమందికైనా షడ్రసోపేతమైన భోజనం పెట్టేదనే ఊహకు రెక్కలు తొడిగారు.

గమనించండి…ధర్మరాజుకు సూర్యుడు అక్షయపాత్రను ఇచ్చినట్టు పై కథనంలో లేదు. ద్రౌపది సమకూర్చిన(‘ద్రుపదరాజపుత్రిచేత సాధితంబులై’- అని కవి ప్రయోగం) వన్యఫల మూలకాలే అక్షయాలు అవుతాయని మాత్రమే సూర్యుడు అన్నాడు. అంటే, మానవప్రయత్నంతోనే ఆహారం పండించుకోవాలని అర్థం. ఇంకా విశేషమేమిటంటే  ఇక్కడ ఆ మానవప్రయత్నం కూడా పాండవ సోదరులది కాదు; ద్రౌపదిది! వన్యఫల మూలకాలను సమకూర్చవలసింది ద్రౌపదే.

నా ఉద్దేశంలో, మహాభారతంలోని ఈ వివరం ఒక అపురూపమైన పురాచారిత్రక సత్యాన్ని చెబుతోంది. అది, వ్యవసాయం, పశుపాలన అనేవి పెద్ద ఎత్తున విస్తరించి పూర్తిగా పురుషుడి అధీనం కావడానికి ముందు స్త్రీల చేతుల్లో ఉండేవన్నది. పురుషుడు వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాక కూడా పరిమిత స్థాయి కలిగిన పెరటి సాగును, కంచె పశుపాలనను స్త్రీలే నిర్వహించేవారు. ద్రౌపది సమకూర్చిన వన్యఫలమూలకా లన డంలో అదీ మర్మం.

మహాభారత మూలకథలోని కొన్ని ముఖ్యమైన కథాంశాలు ప్రచారంలో లేకపోవడం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, పాండవులు, ద్రౌపది పన్నెండేళ్ళ అరణ్యవాసమూ ఒంటరిగా చేశారనే ఊహకు మనం అలవాటు పడిపోయాం. కానీ అది నిజం కాదు.  వారి వెంట పరివారమూ, పరిచారకులే కాక, రథాలూ, గుర్రాలూ వగైరాలు ఉన్నాయి. ఇందుకు విరాటపర్వం, ప్రథమాశ్వాసమే సాక్ష్యం.

అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి ఉపక్రమించేముందు; ధర్మరాజు తమ్ముళ్లతో కలసి ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. వాటి ప్రకారం, అజ్ఞాతవాసం ఏడాదీ తమ అగ్నిహోత్రాలను ధౌమ్యుడు సంరక్షించాలి. వంటలవారు, వారి అధిపతి(మహానసాధ్యక్షుడు), ద్రౌపది పరిచారికలు ద్రుపదపురానికి వెళ్ళాలి. ఇంద్రసేనుడు మొదలైన రథసారథులందరూ ద్వారకానగరానికి వెళ్ళాలి! ఆ సమయంలో ధర్మరాజు ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే, “మా గురించి ఎవరైనా మిమ్మల్ని సమాచారం అడిగితే, ద్వైతవనంలోనే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారనీ, ఆ తర్వాత వారి గురించి మాకు తెలియదనీ” చెప్పమంటాడు. అజ్ఞాతవాస కాలంలో తమ ఉనికిని శత్రువు కనిపెడితే,మళ్ళీ అరణ్య,అజ్ఞాతవాసాలు చేయవలసివస్తుంది.

పాండవులు ఇలా మందీ మార్బలంతో అరణ్యవాసం చేశారన్నప్పుడు, వారికి అడవే ఒక మోస్తరు రాజ్యంగానూ, వారున్న ప్రదేశమే తాత్కాలిక ‘రాజధాని’గానూ ఉండేదన్నమాట. ఇందుకు ఇప్పటికిప్పుడు గుర్తొచ్చే ఒక పోలిక, టిబెట్ బౌద్ధ మతగురువు దలైలామా. 1959లో ఆయన టిబెట్ నుంచి శరణార్థిగా మన దేశానికి చేరుకున్న తర్వాత, ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆయన ప్రవాస ప్రభుత్వా(Government in Exile)న్ని, ప్రవాస మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకున్న సంగతి మనకు తెలుసు.    

ప్రస్తుతానికి వస్తే,  ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫలమూలకాలు’  ద్రౌపది స్వయంగా పండించినవి కాకపోవచ్చు. వాటి సాగుపై ద్రౌపది అజమాయిషీ వహించి ఉండచ్చు. అలాగే,  ద్రౌపదే స్వయంగా వండి పెట్టేదనడానికీ అవకాశం లేదు. అక్కడ కూడా ఆమెది పర్యవేక్షణ బాధ్యతే.

***

‘రాత్రి పూట చంద్రకిరణాలనే అమృతంతో ఓషధులు వృద్ధి పొందేలా (సూర్యుడు)చూడడం, ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు అనే పై రెండు వివరాలను పట్టుకుని ఇప్పుడు జార్జి థాంప్సన్ ను పలకరిద్దాం:

పంటల వృద్ధికి కారణమైన తేమ చంద్రుడి నుంచే లభిస్తుందని గ్రీసులోనే కాక, ప్రతిచోటా విశ్వసిస్తారని ఆయన అంటారు. మంచు లేదా తుషారం పౌర్ణమి రోజునే ఎక్కువగా కురుస్తుందన్న ప్లూటార్క్ మాటను ఆయన ఉదహరిస్తారు. కవులు తుషారాన్ని చంద్రుని కుమార్తెగా చెబుతారు. మన సంస్కృతంలో కూడా చంద్రుడు ‘హిమ’కరుడు, ‘తుహిన’కరుడు! హిమమన్నా, తుహినమన్నా మంచే.  సిసిరో(క్రీ.పూ. 106), ప్లినీ(క్రీ.శ. 23) అనే రోమన్ పండితుల మాటలు, పైన పేర్కొన్న ధౌమ్యుడి మాటలకు ఇంకా దగ్గరగా ఉంటాయి. సిసిరో ప్రకారం, భూమిలోంచి పుట్టే ప్రతి ఒక్కటీ ఎదగడానికి అవసరమైన తేమ చంద్రుడి నుంచే ప్రవహిస్తుంది. ఇక, సూర్యుడు హరించే తేమను అంతటినీ చంద్రుడు మళ్ళీ ఉత్పత్తి చేస్తాడని ప్లినీ అంటాడు.

పైరు పంటలను వృద్ధి చెందించేవాడే కాదు, అన్ని రకాల జీవజలాలను అందించేవాడూ చంద్రుడే. ‘విత్తనాలకు, మొక్కలకు వాహకుడు’ చంద్రుడే నని భారతీయులు భావిస్తే, వృక్షజీవులన్నిటికీ అధిపతి చంద్రుడని బాబిలోనియన్లు విశ్వసించేవారని థాంప్సన్ అంటారు. భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే ఒక మొక్కకు ‘సోమ’ అని చంద్రుడి పేరు పెడితే, ఉత్తరఅమెరికావాసులు మొక్కజొన్నను చంద్రసంబంధిగా భావించేవారని కూడా ఆయన అంటారు. ‘చంద్రుడు వృద్ధి చెందుతున్న కొద్దీ మొక్కలో రస స్రావం పుంజుకుంటూ ఉంటుం’దని –రియో గ్రాండే (అమెరికాలోని కొలరాడోలో ఉన్నఒక నదీ, దాని తీరప్రాంతం) లోని స్థానిక తెగలలో వ్యాప్తిలో ఉన్న నుడికారం.

చెట్ల నుంచి వచ్చే జిగురు లాంటి పదార్థాలలో, ముఖ్యంగా ధూపం వేయడానికి ఉపయోగించే సువాసన గల వాటిలో, ఆ లక్షణాలకు కారణం చంద్రుడే. అలాగే తుమ్మచెట్టును స్త్రీ గానూ, దానినుంచి స్రవించే జిగురును గడ్డకట్టిన ఋతురక్తం గానూ కొన్ని చోట్ల భావిస్తారు. దానికి మహిమ ఉంటుందన్న నమ్మకంతో తాయెత్తుగా ధరిస్తారు.

నాట్లు వేయడానికి, మొక్కలు నాటడానికి , పెళ్లిళ్లకు యోగ్యమైన సమయం పౌర్ణమే నని గ్రీకులు భావించేవారు. అదే సూత్రాన్ని అనుసరించి పంట కోతకు, మొక్కలు, చెట్లు నరకడానికి, గొర్రెల ఉన్ని కత్తిరించడానికి, చివరికి కేశఖండనకు చంద్రుడు క్షీణదశలో ఉన్న రోజులు(కృష్ణపక్షం) మంచివని అనుకునేవారు, రోమన్ చక్రవర్తి టిబెరియస్ కేశఖండన విషయంలో ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేవాడు. మన దగ్గర కూడా సన్యాసులు, శ్రోత్రియులు కేశఖండనకు తిథి వారాలు చూసుకోవడంతో సహా ఇలాంటి నియమాలనే పాటిస్తారు. ఇక నూతన శిశువులను దాదులు ఆరుబయటకు తీసుకెళ్ళి చందమామకు చూపిస్తారని ప్లూటార్క్ అనడం ప్రత్యేకించి మనకు ఆసక్తికరం. మనదగ్గర అచ్చంగా ఇలాంటి ఆచారమే ఉందో లేదో కాని, పసిపిల్లలకు ‘చందమామరావే, జాబిల్లి రావే’ అంటూ చందమామను చూపించడం ఉంది. బహుశా పసిపిల్లలను చంద్రుడికి చూపించే ఆచారమే, పసిపిల్లలకు చంద్రుణ్ణి చూపించే అలవాటుగా మారిందేమో తెలియదు.

సంగతేమిటంటే, స్త్రీల లైంగిక జీవితంతో ముడిపడిన చంద్రుని ఆరాధననుంచే వారి సామాజిక విధులు కూడా పుట్టాయని థాంప్సన్ అంటారు. ఉదాహరణకు, నీళ్ళు తేవడం, మొక్కలను పెంచడం, మంచును, వర్షపు నీటిని సమీకరించడం ప్రధానంగా స్త్రీల బాధ్యతే. ఆవిధంగా పెరటి సాగు వారి చేతుల మీదుగానే జరిగేది. ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు’ అనే మాట ఆ పెరటి సాగునే సూచిస్తున్నాఆశ్చర్యంలేదు.

అలాగే, కంచె పశుపాలనను కూడా స్త్రీలు నిర్వహించేవారు. కంచె పశుపాలన అంటే ఇంటిదగ్గరే పశువుల పెంపకం. వేటకు వెళ్ళిన మగవాళ్ళు అక్కడ పట్టుకున్న చిన్న చిన్న జంతువులను ఇంటికి తీసుకొస్తే స్త్రీలు వాటిని పెంచేవారు. అలా కొన్ని జంతువులు మనిషికి మాలిమి అయ్యాయి. అదలా ఉంచితే, చంద్రుని ఆరాధనలో బలులు ఇవ్వడం కూడా ఉండేది. స్త్రీలు బలి ఇచ్చే జంతువులు కూడా ప్రతిచోటా చిన్నవిగానే ఉంటాయి. ఈ బలిచ్చే జంతువుల ఎంపిక ప్రతిచోటా ఒకేలా ఉండడం కొట్టొచ్చినట్టు కనిపించే విశేషమని థాంప్సన్ అంటారు.

selene-moon goddess

చంద్రునికి బలి ఇచ్చే జంతువులు ప్రధానంగా కుందేలు, మేక, పంది. నేడు క్షుద్రంగా భావించే నిన్నటి మాంత్రికచర్యలలో (witch craft) ప్రాముఖ్యం కలిగినవి ఇవే. సెమెటిక్ స్త్రీల తంతులలో పావురం కూడా ఇలాంటిదే. అలాగే, పిల్లి! పురాతన ఈజిప్టులో పిల్లిని పూజించేవారు. అది అనేక రంగుల్లో ఉండడం, రాత్రిళ్ళు  విలక్షణమైన అలవాట్లను కనబరచడం, అది పిల్లల్ని పెట్టే తీరు కూడా విలక్షణంగా ఉండడం చంద్రునికి అన్నివిధాలా సరిపోయే చిహ్నంగా దానిని చూపిస్తాయని ప్లూటార్క్ అంటాడు. అలాగే పిల్లి తన జీవిత కాలంలో మొత్తం 28 పిల్లల్ని పెడుతుంది. చాంద్రమానానికి చెందిన నెలకు కూడా 28 రోజులు. పౌర్ణమి రోజున పిల్లి కళ్ళు చాలా పెద్దవి గానూ, ప్రకాశవంతంగానూ ఉండి, చంద్రుని క్షీణదశలో చిన్నవిగానూ, కాంతిహీనంగానూ మారుతుంటాయి.

మన దగ్గర కూడా పిల్లి ఒక మార్మిక జీవిగానే కనిపిస్తుంది. దానికితోడు మనం పిల్లిని ఒక తరహా క్షుద్ర జంతువుగానే చూస్తాం. పిల్లి ఎదురవడాన్ని అపశకునంగా భావిస్తాం. మళ్ళీ, పిల్లిని చంపడం మహాపాపమన్న సెంటిమెంటూ మన దగ్గర కనిపిస్తుంది. స్త్రీ ప్రధానమైన పురాకాలపు మాంత్రిక తంత్రాలలో పిల్లికి పాత్ర ఉండడమే, దానిపట్ల మనలో అజ్ఞాతంగా గూడుకట్టుకున్న వ్యతిరేకతకు కారణమేమో తెలియదు. అదే సమయంలో పిల్లికి గల మార్మిక లక్షణం కూడా మనకు తెలియకుండానే మనపై ప్రభావం చూపి దానిని చంపడం పాపమన్న సెంటిమెంటుకు దారి తీయించి ఉండచ్చు.

మళ్ళీ చంద్రుడి విషయానికి వస్తే, చంద్రుడిలో ఉందనుకునే  పునరుజ్జీవకగుణమే రాళ్లలో, ముఖ్యంగా స్ఫటికాలలో, జాతిరాళ్లలో కూడా ఉంటుందనే విశ్వాసమూ చాలాచోట్ల ఉంది. అలాగే, మనిషి ఎముకల్లోనూ, కేశాలలోనూ కూడా. అందుకే ఆయా సంస్కారాలు జరిపేటప్పుడు పన్ను పీకించడం, జుట్టు తీయించడం చేస్తూ ఉంటారనీ, శరీరంలోని ఈ భాగాలకు స్వయం పునరుజ్జీవక లక్షణం ఉండడమే దీనికి కారణమని థాంప్సన్ అంటారు. మన దగ్గర అనేక తంతులలో కేశఖండనం జరుగుతుందన్న సంగతి తెలిసినదే.

ఇటువంటి అనేక ఆచారాలకు గల విశ్వజనీనతే ఇక్కడ ప్రధానంగా గుర్తించవలసిన అంశం.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

 

 

 

విండోస్ 2015

 కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshగ్రామీణ జీవితంలో పెరిగిన వాళ్లకు తెలిసిందే.
మళ్లీ తెలియజెప్పడం కష్టమే.
కానీ, ఒక ప్రయత్నం.బాగా చదివుకున్నాం. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం. గ్లోబల్ విలేజ్ నివాసులం.
ఉండవచ్చు. కంప్యూటర్ విండోస్ గుండా మనకొక తెరుచుకున్నగవాక్షం ఇవ్వాళ ఉండవచ్చుగాక.
కానీ, నాడే కాదు, నేటికీ ఇట్లా – ఇంట్లో పనిపాటా చేసుకునేవాళ్లకూ తలుపులున్నాయి.
తలుపుల గుండా విండోస్ ఇలా తెరిచే ఉన్నాయి. ఆదొక సిస్టమ్.

అక్కడే కూచుని, మనకంటే కులాసాగా కాళ్లు జాపుకుని హాయిగా పనిచేసిన పనిగంటలు గంటలకు గంటలు ఉన్నాయనే ఈ చిత్రం. అవును. వాళ్లట్లా కూచుని, బయటి నెట్ వర్క్ తో కనెక్ట్ అవుతూనే చకచకా  పనులు చేసుకోవడం నేటికీ ఉందనే ఈ దృశ్యాదృశ్యం. ఒక టీవీ, ఒక కంప్యూటర్ అంతానూ ఒక వీధి. అది వాళ్లకు అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. ఒకానొక సోషల్ నెట్ వర్క్ జీవితంలోని ప్రతి ఘడియలో ఉండనే ఉందన్నది సత్యం. అంతేకాదు, పూర్తిగా ఆవిష్కరించని ప్రొఫైల్ పిక్ ఒకటి మనం పెట్టుకున్నట్లే, వాళ్లూ అలా కనీకనపడకుండా అగుపించడమూ ఉందనే ఈ పిక్. ఒక ప్రొఫైల్. చిత్రమూ!అయితే, ఇంకో మాట లేదా అనుభవం.
రెండేళ్ల క్రితం ఒకతను మెసేజ్ పెట్టాడు, ‘కొన్ని చిత్రాలు నేను ఫేస్ బుక్ లోంచి కాపీ చేసుకోవచ్చా?’ అని!
‘ఒకే’ చెప్పడానికి ముందర ‘ఎందుకో కనుక్కోవచ్చా?’ అంటే అతనన్నాడు, తాను నగరంలోని దిగువ ప్రాంతంలో ఉంటానని!  అంటే తార్నాక పరిసరాల్లోనట! అక్కడ ఇంటీరియర్ కాలనీలో తానొక చోట నివసిస్తాడట!  అక్కడ్నుంచి రోజూ హైటెక్ సిటీకి వెళ్లి సాప్ట్ వేర్ నిపుణుడిగా పనిచేసి వస్తాడట. ఒక రోజట. తన టీమ్  మేనేజర్ అన్నాడట. ‘ఎందుకు అక్కడే ఉంటావు, ఇక్కడ సైబరాబాద్ ఏరియాలో వుండొచ్చు కదా’ అని! దానికతను జవాబు చెప్పలేక పోతున్నాడట. అందుకని కొన్నిఫొటోలు కావాలట!

కొన్నిమధ్య  తరగతి, దిగువ మధ్య తరగతి, ఇంకా దిగువ తరగతి పనీపాటల్లో ఉన్న జీవనచ్ఛాయలు, వారు నివసించే వీధులు, ఆ జీవన కోలాహాలం…అదంతా కాపీ చేస్కొంటాడట. వాటిని అతడికి చూపిస్తాడట.

ఒక హార్డ్ డిస్కుకు సాఫ్టువేరు ఎర!

నిజంగానే చూపాడట.
తర్వాత ఆ అధికారికి అర్థమైందట.

ఇతని విండోస్ అతడికి తెరుచుకోవడం ఒక చిత్రమే.
అప్పట్నుంచి మల్లెప్పుడూ అతడు ఇతడ్నితన నివాసాన్ని మార్చమని అనలేదట.
తననే కాదు, ఎవ్వర్నీ కూడా.

చిత్రం.
దృశ్యం ఒక అనుసంధానం.
ఒక సాప్ట్ వేర్!

గ్రామీణ జీవితంలోంచి వచ్చిన వాళ్లకు లేదా బీడీలు చుట్టిన తల్లుల బిడ్డలకు ఊరు కావాలి. పట్నంలో ఉన్నా కూడా. వాళ్లు ఎంత దూరం వెళ్లినా ఆ తలపులు వీడిపోవు. ఎంతటి ఆధునిక జీవన వ్యాపకాల్లో ఇమిడినా గతం మారిపోదు. మరెన్ని కొంగ్రత్త పనులు నేర్చినా గానీ, ఆ చేతి వేళ్ల మధ్య కత్తెర చేసే ఒక సంగీత రవళి ఒకటి, చేటలోని తంబాకు వాసన ఒకింత వాళ్లను పట్నంలోంచి సరాసరి ఇంట్లోని మల్లెసార్లకు అడుగుపెట్టేలా చేస్తది. అక్కడ్నుంచి గడప దగ్గర కూచున్న నాయినమ్మ దగ్గరకో, చిన్నమ్మ చెంతకో చేరుస్తుంది. ఆ చ్ఛాయ పదిలం. అవన్నీ ఇంకా దిగువన ఉన్నాయి. పైకి వెళ్లేకొద్దీ అవి కావాలి.

విండోస్ అందుకే.
ఈ చిత్రం చేసింది మరి ఈ ఏడే.

అందుకే అనడం లేదా చూపడం, విండోస్ 2015 వర్షన్.
*

 

‘బ్యోమ్ కేష్ బక్షీ’ ఆఫ్ దిబాకర్ బెనర్జీ…

ల.లి.త.

 

lalitha parnandiElementary …” –  Sherlock Holmes.

షెర్లాక్ హోమ్స్ అభిమానులంతా ఈ మాట పట్టుకుని మురుస్తూ ఉంటారు. నేర పరిశోధనలో ఎవరూ కనిపెట్టలేని అతి చిన్న వివరాన్ని పట్టుకుని విషయమేమిటో తేల్చటం elementary.  అసలు డికెష్టీ (బుడుగు భాషలో) వాడంటేనే  అసామాన్యుడు.  సూపర్ మాన్ లు, బాట్ మాన్ లు, ఇంకా అడ్డమైన మాన్ లూ తెలీకముందు డికెష్టీ, పోలీసువాడు, రైలింజన్ డ్రైవర్ … వీళ్ళే బుజ్జి మగపిల్లల దృష్టిలో గొప్ప హీరోలు.

సరైన డిటెక్టివ్ సాహిత్యం తలకెక్కితే మరి దిగదు. గొప్ప ఆటగాడిలా నేరస్తుడికి చెక్ చెప్పటానికి డిటెక్టివ్ వేసే   చదరంగపుటెత్తులేమిటో ఊహించేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాం. అంతటి ఘనమైన డిటెక్టివ్ సాహిత్యంలో పేరున్న బెంగాలీ డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ. బ్యోమ్ కేష్ కథతో బెంగాలీబాబు దిబాకర్ బెనర్జీ సినిమా తీస్తున్నాడంటే చాలామంది ఎదురుచూపులు… కానీ దిబాకర్ తెలివికి ఇది పెద్ద పరీక్షే. ఎందుకంటే బ్యోమ్ కేష్ అంటే నేనేనంటూ ఇప్పటికే తిష్టవేసి కూర్చున్నాడు రజత్ కపూర్. తొంభైల్లో దూరదర్శన్ లో వచ్చిన ‘బ్యోమ్ కేష్ బక్షీ’ హిందీ సీరియల్ ను జనం బాగా ఆదరించారు. పంచె కట్టి,  విశాలమైన నుదురుతో, కళ్ళను మెరిపిస్తూ, చిరునవ్వుల్తో తను కేసునెలా పరిష్కరించాడో వివరించే రజత్ కపూర్ అందరికీ తెలిసిన డిటెక్టివ్ బ్యోమ్ కేష్. ఈ పాత్రను సృష్టించినది శరదిందు బందోపాధ్యాయ. శరదిందు కథల్ని హిందీ సీరియల్ గా తీసిన బాసు చటర్జీ మరో ఘనమైన బెంగాలీ. అంతవరకూ బెంగాలీ వాళ్ళకే పరిమితమైన బ్యోమ్ కేష్ బక్షీ ని ఈ హిందీ సీరియల్ తో దేశమంతా గుర్తించింది.

గొప్ప డిటెక్టివ్ లందరికీ ఆదిగురువు షెర్లాక్ హోమ్స్. షెర్లాక్ పెద్ద మర్రి చెట్టయితే మిగతా డిటెక్టివ్ లంతా ఆ చెట్టు ఊడలే.  షెర్లాక్ కి వాట్సన్ లా బ్యోమ్ కేష్ కి కూడా రచయిత అజిత్ బాబు తోడుంటాడు.  షెర్లాక్ పాత్రను రచయిత కానన్ డాయల్ ఓసారి అంతం చేసేసినా పాఠకుల కోర్కెతో మళ్ళీ బతికించి తీసుకొచ్చాడు. రచయిత శరదిందు, బ్యోమ్ కేష్ కు కూడా పెళ్లి చేసి రిటైర్మెంట్ ఇప్పించినా, పాఠకులు ఇంకా అతన్ని ఆదరిస్తున్నారని గ్రహించి, మళ్ళీ తీసుకొచ్చి డికెష్టీ పనులు మొదలు పెట్టించాడు. ఈ పోలికలతో పాటు షెర్లాక్ లో ఎంత బ్రిటిష్ తనం ఉంటుందో, బ్యోమ్ కేష్ లో అంతగానూ బెంగాలీతనం ఉంటుంది . షెర్లాక్ నూ బ్యోమ్ కేష్ నూ కలిపేదీ ఈ లక్షణమే. వాళ్ళిద్దరినీ విడదీసి దూరంగా నిలబెట్టేదీ ఈ లక్షణమే. ఎంతగా విశ్వ సాహిత్యం తలకెక్కించుకున్నా, మన వేళ్ళు మన నేలలోనే దృఢంగా ఉండటమంటే ఇదే. ఈ ప్రత్యేకతతోనే బాసు చటర్జీ సీరియల్ బ్యోమ్ కేష్ బక్షీ కూడా అలరారింది.

 

దిబాకర్ బెనర్జీ “డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ” సినిమాలోనూ బెంగాలీతనానికి లోటు లేదు. పంచె కట్టి, దానిమీద బాటా షూ వేసి, మనుషులు పరుగెడుతూ లాగే రిక్షాల్లో, కలకత్తా ట్రాముల్లో తిరుగుతుంటాడు బ్యోమ్ కేష్. పాతకాలం పాన్ డబ్బా, అందులో మసాలాతో పాటు దాచుకున్న కొక్కోక శాస్త్రం, వింటేజ్ కార్లు, చైనా దంతవైద్యం, ఇత్తడి చెంబులు, గ్లాసులు, బక్కచిక్కిన బెంగాలీ మొహంలో పెద్ద పెద్ద కళ్ళేసుకుని పాత గెస్ట్ హౌస్ లో ఆశ్చర్యపోతూ తిరిగే వంటవాడు… వీటిమధ్య 1942 కలకత్తాలో మనని విహారం చేయిస్తాడు దిబాకర్. పీరియడ్ లుక్ కోసం ఎంత సూక్ష్మంగా వెళ్ళాడంటే, సినిమా పోస్టర్లు నలభైలనాటి సినిమా పోస్టర్లలా ఉన్నాయి. మన ‘చందమామ’ బేతాళకథలకు వేసిన బొమ్మల్లా కూడా !

ఇప్పటి మల్టీప్లెక్స్ హిందీ సినిమాల్లో హీరోలు, నటుల అసలు ముఖాలు కనిపించటం లేదు. ఆ పాత్రలే కనిపిస్తున్నాయి. హాలీవుడ్ మాదిరిగా ‘కాస్టింగ్ డైరెక్టర్స్’ ను పెట్టుకుని పాత్రకు తగ్గ మొహాలు, శరీరాలు ఉన్నవాళ్ళని నటులుగా ఎన్నుకోవటంలోనే  సినిమా కళ దాగుందని కనిపెట్టేశారు మనవాళ్ళు కూడా…  ఇలా పాత్రలకు తగ్గ మంచి నటులు ఎక్కువమంది సమకూడిన సినిమాలకు ఈమధ్య ‘best ensemble cast’ అని అవార్డులు కూడా ఇస్తున్నారు.  ఈ సినిమాలో, కనపడే పాత్రలతో పాటు కీలకమైన, మనకు అసలు కనపడని ఒక జీనియస్ వ్యక్తిత్వం-  అతనికి సంబంధించిన బట్టల పెట్టే, పాన్ డబ్బా… అతని కొడుకు చెప్పే కొన్ని మాటలూ… వీటితోనే ఎంతబాగా అర్థం అయిపోతుందంటే, కథ చదువుతూ మనం పాత్రను ఊహించుకున్నట్టే !  సినిమా ప్రక్రియను సాహిత్య ప్రక్రియ లాగా కూడా సాధించిన అరుదైన దర్శకుల పేర్లలో దిబాకర్ పేరూ చేర్చాల్సిందే.

శరదిందు కథల్లో బ్యోమ్ కేష్ కి తనను డిటెక్టివ్ అని పిలవటం కూడా ఇష్టం ఉండదు. ‘సత్యాన్వేషి’ నని చెప్పుకుంటాడు. అలాంటి సత్యాన్వేషిగా అలరించిన రజత్ కపూర్ తో పోటీకి రాగల నటుడిని బ్యోమ్ కేష్ పాత్రకు ఎంచుకోవటం కూడా కష్టమైన పనే.  ఈ సినిమాలో బ్యోమ్ కేష్ గా సుశాంత్ సింగ్ రాజపుత్ కూడా బానే ఉన్నాడు. నటించాడు.  వీళ్ళిద్దరికీ పొడుగు, చురుకు కళ్ళు, అల్లరి నవ్వు సమాన లక్షణాలు. బుద్ధికుశలత తప్ప బల ప్రదర్శనలేవీ పెద్దగా ఉండవు. సుశాంత్ సింగ్ అయితే గట్టి దెబ్బలు తిన్నాడే గానీ అవకాశమున్నా ఫైట్లు అసలు చెయ్యలేదు. ఇది దిబాకర్ బ్యోమ్ కేష్ బక్షీ పాత్రకు ఇచ్చిన గౌరవమే.

Byomkesh-Bakshi-is-Indias-answer-to-Sherlock-Homes

శరదిందు కథ ‘సత్యాన్వేషి’లో కలకత్తా చైనా టౌన్ లో మత్తుమందు అమ్మకాలు, హత్యల నేపథ్యంలో బ్యోమ్ కేష్ నేరస్తుడిని పట్టుకుంటాడు. ఆ కథనే సూత్రంగా తీసుకుని రెండో ప్రపంచయుద్ధం, మత్తుమందులు, కలకత్తా ఆక్రమణకు జపాన్ వ్యూహాలు, ఇదంతా ఒకే చేత్తో… సారీ ఒకే మెదడుతో, బ్యోమ్ కేష్ ఆపెయ్యటం… ఇలా కథను పెంచుకుంటూపోయి, బ్యోమ్ కేష్ ను సూపర్ హీరో చేసేశాడు దిబాకర్ బెనర్జీ. కథను వంద మలుపులు తిప్పి larger than life స్థాయిలో సినిమా చేశాడు. దిబాకర్ లాంటి దర్శకుడి  మీద కూడా ఈ అట్టహాసపు హాలీవుడ్ ప్రభావం తప్పదా అని దిగులు… సినిమా నిశితంగా, తీరిగ్గా మనస్తత్వాల్లోకి తడిమి చూస్తుంది.  హాలీవుడ్ సినిమాలాంటి విస్తృతితో మలుపులు తిరిగి, చూసేవాళ్ళని కొంతసేపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయినా సరే, విస్తృతినీ, నిశితత్వాన్నీ సరిగ్గా బాలన్స్ చెయ్యలేకపోయిన లోటు ఏదో మిగుల్చుతుంది.

ఇంతకు ముందు దిబాకర్ తీసిన సినిమాల్లో సూపర్ హీరోలు లేరు. ఇతని దర్శకత్వంలో వచ్చిన ‘షాంఘై’ లో నాయకుడు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి. రాజకీయ మాఫియాగాళ్ళను కూడా తెలివితోనే లొంగదీస్తాడు. ఫైట్లు, రక్త పాతాల జోలికి వెళ్ళడు.  కానీ ‘డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ’ సినిమా చాలా గ్రాఫిక్ గా ఉండే హింసతో ప్రారంభమై, గ్రాఫిక్ గా ఉండే హింసతోనే ముగుస్తుంది. మధ్యలో బ్యోమ్ కేష్ తెలివితో పోటీ పడి, అతన్ని తప్పుదారి పట్టించగల దీటైన విలన్ ఆడే ఆటలు.. బ్యోమ్ కేష్ అదంతా ఛేదించి, కలకత్తాను జపాన్ ఆక్రమణలోకి వెళ్ళిపోకుండా అడ్డుకోవటం… జరుగుతాయి. చిన్న కేసుల్లోనే పక్కాగా వ్యూహం రచించే బ్యోమ్ కేష్ బక్షీ ఈ సినిమాలో చివర్లో తీసుకునే రిస్క్ చూస్తే, అది ఆ సత్యాన్వేషి పాత్రకు తగిన వ్యూహంలా అనిపించదు.  నేరం బైటపెట్టే క్రమంలో డిటెక్టివ్ లు రిస్క్ తో కూడిన తప్పనిసరి నిర్ణయాలు తీసుకోవటం సహజమే. ఆ నిర్ణయాల ఫలితం ఏవో కొన్ని జీవితాలకో, ఒక నేరస్తుడికో పరిమితమైతే పర్వాలేదు కానీ, ప్రేమించిన అమ్మాయి అన్న కోసం భీకరమైన నేరస్తులతో ఆటాడి, కలకత్తా మొత్తాన్నే ప్రమాదంలో పెట్టే పని సరైన ఏ డిటెక్టివ్ అయినా చెయ్యగలడా అనేది ఇక్కడ ప్రశ్న. ఇలాటి ప్రశ్నలకి దారి తీయటమే ఈ సినిమా చెయ్యకూడని పని. కానీ చేసేసింది. దీనితో రావాల్సిన క్లాసిక్ లక్షణం సరిగ్గా రాకుండా పోయింది.

షెర్లాక్ కి వన్నె తేవటం కోసం మోరియార్టీలాంటి బలమైన ప్రతినాయకుడిని సృష్టించాడు కానన్ డాయల్. మోరియార్టీ మేథకు అయస్కాంత శక్తి ఉంది. Benedict Cumberbatch  షెర్లాక్ గా వస్తున్న బి.బి.సి. సీరియల్ లో కూడా మోరియార్టీని చాలా ఆకర్షణీయంగా తయారుచెయ్యకుండా ఉండలేక పోయారు.  మోరియార్టీ పాత్ర ప్రభావంతోనేమో, దిబాకర్ బెనర్జీ కూడా తన సినిమాలో ‘అనుకూల్ గుహ’ అనే పాత్రతో మైండ్ గేమ్స్ ఆడించాడు. బ్యోమ్ కేష్, గుహ లిద్దరూ ఒకరి తెలివిని ఒకరు అభినందించుకుంటారు. అనుకూల్ గుహగా నటించిన నీరజ్ కబి ని తట్టుకోవటం సుశాంత్ సింగ్ కు బాగా కష్టమై ఉంటుంది. అంత బాగా చేశాడు అతను. చివరకు “నా ప్రేమనే తట్టుకోలేక పోయావ్. నా ద్వేషాన్ని ఎలా తట్టుకుంటావో చూస్తాను” అని బ్యోమ్ కేష్ ను ఉద్దేశించి గుహ ప్రతిజ్ఞలు చెయ్యటంతో సినిమా పూర్తవుతుంది. ఈ ముగింపు చూస్తే ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన ఉన్నట్టుంది. కొన్ని లోపాలున్నా ఇలాంటి సినిమాలనూ, సీక్వెల్స్ నూ కూడా ఇష్టపడే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు.

స్నేహా కన్వల్కర్ “గాంగ్స్ అఫ్ వాసేపూర్” కు అసలైన జానపద బాణీలను వాడి ఆ సినిమాను మెరిపించింది. కానీ బ్యోమ్ కేష్ సినిమాకు తగిన సంగీతం ఇవ్వలేకపోయిందనిపించింది. డిటెక్టివ్ సినిమాల ట్యూన్స్ అంటే, అవి మనల్ని వెంటాడుతూ ఉండాల్సిందే !  అది ఈ సినిమాలో జరగలేదు. పైగా హోరుగా ఉన్న సంగీతంతో ప్రేక్షకులని ఈ కథకి ఎలా శృతి చేద్దామని అనుకున్నారో అర్థం కాలేదు. బ్యోమ్ కేష్ లాంటి పీరియడ్ ఫిల్మ్ లో ఇలాంటి సంగీతం కోసం కాలేజ్ పిల్లలు కూడా వెదుక్కోరు. లేక సినిమా ప్రమోషన్ కోసం, పాత తరం సినిమా అని ఎక్కడ రావటం మానేస్తారో అని భయపడి అందర్నీ ఆకర్షించటం కోసం, అలాంటి metal rock సంగీతపు ట్రాక్ అవసరమనుకునే ఊహ వచ్చిందేమో!

బ్యోమ్ కేష్ బక్షీ హిందీ సీరియల్ లో సాంకేతిక విలువలు అంతగా బాగుండవు. ఏవో బడ్జెట్ పరిమితులతో తీసినదది. కానీ దానికి ఆనంద్ శంకర్ ఇచ్చిన థీమ్ సంగీతం మాత్రం అద్భుతంగా ఉంటుంది.  ఆ టైటిల్ మ్యూజిక్ ఇక్కడ…

https://www.youtube.com/watch?v=zlOAN3Gb-8c

Jeremy Brett  షెర్లాక్ హోమ్స్ గా నటించిన గ్రానడా టీవీ క్లాసిక్ సీరియల్ “షెర్లాక్ హోమ్స్” టైటిల్ థీమ్ ఇక్కడ…

https://www.youtube.com/watch?v=3AoK2dqb1vs

Benedict Cumberbatch  షెర్లాక్ హోమ్స్ గా బి.బి.సి. తీస్తున్న సీరియల్ థీమ్ ఇది…

https://www.youtube.com/watch?v=gzCEIBaV1Es

షెర్లాక్ హోమ్స్ చెప్పినట్టుగా  “There is nothing so important as trifles” అన్న సూత్రానికి బాగానే కట్టుబడ్డ సినిమా “డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షీ”

కానీ,  “ప్రతిసారీ అసాధ్యమైన విషయాల్ని విడిచిపెడుతూ పోతే మిగిలేది, జరగటానికి అతి తక్కువ ఆస్కారం ఉన్నదైనా సరే, అదే సత్యం” (“Whenever you have eliminated the impossible, whatever remains, however improbable, must be the truth” – Sherlock Holmes) అనే షెర్లాక్ సత్య శోధన పధ్ధతిలో సినిమా తీసేటప్పుడు, హాలీవుడ్ బాలీవుడ్ ల భారమైన అసాధ్యపుటూహలను కూడా పక్కన పెడితేనే సత్యమైన సినిమా బైటకొస్తుంది.

That’s  “Elementary….”  My dear Dibakar!

                                                                                            *

ఒకే ఒక బలమైన ఆయుధం- ” అంబేద్కర్ “!

పి.విక్టర్ విజయ్ కుమార్

దళితులు , గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు , ప్రజాస్వామిక వాదులు – మదిలో  కొవ్వొత్తులు వెలిగించి మరో జీవన వైవిధ్యాన్ని , జీవన శైలిని నేర్పించిన మహానుభావునికి మదిలో వెల్లువెత్తిన కృతజ్ఞతతో  ఆయన జన్మ దినాన్ని స్మరించుకున్నారు…ఎప్పటిలానే.
అంబేద్కర్ ఒక వర్గానికి కులానికి సంబంధించిన మేధావి కాదు. ఆయన 1990 లలో ఒక  Parallel Thinker . ఒక సాంప్రదాయక ఆలోచనా విధానాన్ని బద్దలు కొట్టి ” సాంఘిక చైతన్యం ” అనే అంశాన్ని ప్రతి మేధావి ఆలోచనలో భాగం చేయాల్సిన పరిస్థితిని కల్పించిన మొదతి భారతీయ తాత్విక వేత్త. 1920 ల నుండి గాంధీ తో సహా ప్రతి నాయకుడికీ –  ఏ రాజకీయ వేదిక అయినా సరే – కొరకరాని కొయ్యగా నిలబడ్డాడు. ఆయన ఆర్థిక శాస్త్రం లో కొలంబియా యూనివర్సిటీ నుండి  MA, PhD,    London School of Economics  నుండి  D Sc  పట్టభద్రుడయ్యాడు. లండన్ నుండి బారిష్టర్ డిగ్రీ పొంది అకడమిక్ గా సాధించిన అద్భుత విజయాన్ని ఆ రోజుల్లో తన కుల వ్యతిరేక తపనను తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు.  ఆయన ఈ దేశం సంపాయించిన మొట్ట మొదటి ఆర్థిక వేత్త అనే విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఇదే విషయాన్ని అమర్త్య సేన్ స్వయానా అభిమానంగా చెప్పుకుంటాడు.
అంబేద్కర్ , గాంధి,  కాంగ్రెస్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అంటాడు  ” కాంగ్రెస్ హిందూ పెట్టుబడిదారులు చేరవేసిన మధ్య తరగతి హిందువుల సంస్థ. వీరి ఉద్దేశ్యం భారతీయులను స్వతంత్రులను చేయడం కాదు. బ్రిటీష్ వారి నుండి విముక్తి పరచడమే. బ్రిటీష్ వారి ఆధిక్య స్థానాన్ని వీరు ఆక్రమించుకోవడం. ఇదే స్వాతంత్ర్యం ఐతే హిందువులు తర తరాలుగా అస్పృశ్యులను ఎలా పరిగణిస్తూ వచ్చారో అదే కొనసాగుతుంది “
అంబేద్కర్ ఈ దేశం లో దళితులకే కాదు , ప్రతి మేధావికి నేర్పించింది ” వ్యక్తిత్వం ” ” స్వతంత్రత ” (  Individuality and independent thinking  )  . చెప్పదల్చుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తీకరించడం , మెజారిటీ అభిప్రాయాన్ని కాలదన్ని స్వంతంత్ర ఉద్దేశ్యాన్ని ప్రకటించడం లో అంబేద్కర్ ప్రతి మేధావికి మార్గ దర్శకుడు.
1918 లో మాంటేగ్ – ఛేంస్ఫర్డ్ సంస్కరణల ప్రక్రియలో భాగంగా ఇండియాలో ఎలక్షన్ విధానాన్ని పునర్నిర్వచించే ఉద్దేశ్యం తో  ‘ సౌత్ బరో కమిటీ ‘ ని నిర్మించారు.  అంబేద్కర్ యొక్క విద్యా ప్రఙలు  తెలుసుకున్న ప్రబుత్వం , అంబేద్కర్  యొక్క అభిప్రాయాలు తెలపమని ఆహ్వానించింది. అప్పుడు అంబేద్కర్ కు 28 సంవత్సరాలు. స్వాతంత్ర్య ఉద్యమం ఇవ్వలేని గుర్తింపు  బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చిందంటే – మన దేశం లో స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం లో పాతుకు పోయిన కుల పిచ్చి తీవ్రత ఏంటో మనకు తెలుస్తుంది. ఈ రోజు ” భారత్ మాతా కీ జై ” ” వందే మాతరం ” లాంటి స్వాతంత్ర్యా పోరాట నినాదాల్ని వల్లించే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ నినాదాల్లో కుల వ్యవస్థ ఎలా గంగ వెర్రులెత్తిందా అని.
కానీ అంబేద్కర్ 1930 లో అఖిల భారత నిమ్న వర్గాల కాంగ్రె సభలో తన ఉపన్యాసంలో ఇలా అంటాడు ” మన దేశం లో మన దురదృష్ట పరిస్థితులను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నట్టు బ్రిటిష్ చెప్పుకుంటుంది.  అది కేవలం ఈ దేశ రాజకీయ పురోగతిని అడ్డుకోవడం కోసమే అలా చేస్తుంది “
అదే ఉపన్యాసం లో ఇలా అంటాడు –
” మన దేశానికి స్వయంప్రతిపత్తి ఇవ్వడం నేను వ్యతిరేకించలేను. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం మన సమస్యను ఎప్పటికీ తీర్చలేదు. ఐతే కాంగ్రెస్ తో కలవడం వలన మనం సమస్యను ఎలా పరిష్కరించుకోగలమో నాకు అర్థం కాదు. …”
ఈ ఉపన్యాసం తర్వాత ” యూ టూ బ్రూట్ ! ”  ( You too Brutus ! )  పేరుతో తిలక్ తన ” కేసరి ‘ పత్రికలో అంబేద్కర్ ను ” దేశ ద్రోహి ” గా ” బ్రిటిష్ ఏజంట్ ” గా అభివర్ణించాడు.
అంబేద్కర్ కు ఉన్న స్పష్టత , వ్యక్తిత్వం అబ్బురమైనవి.  కులం లాంటి నికృష్ట సాఘిక సమస్య పై అవగాహన లేకున్నా  కేవలం స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందు ఉండి నడిపిస్తుందనే ఒక్క కారణం వల్ల కాంగ్రెస్ గొప్పదైపోదు అని అంబేద్కర్ అభ్రిప్రాయ పడ్డాడు.
ఇలా చూస్తే విప్లవ ఉద్యమాలు కూడా కేవలం కుల సమస్యను దాని లోతుల్లో పరిశిలించడం లో ఫెయిల్ అయ్యినప్పుడు ( తర్వాత దిద్దుబాటు కనిపించినా ) ఇదే వాదనలు వినబడ్డాయి. దళిత వాదులకు వచ్చిన ‘ కాన్ ఫిడెన్స్ ‘ ఇక్కడి నుండే. మీరు విప్లవ ఉద్యమం నడుపుతున్నారనే ఒకే కారణం వలన మేము మీతో ఉండలేము అని ఎదురు వినిపించారు. ( ఐతే ఆ దళిత వాణిలో పదును ఎక్కువ రోజులు నిల్వలేదు. అది తర్వాత చూద్దాం )
అంబేద్కర్ 1930 లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి , కాంగ్రెస్ బహిష్కరించినా, తను  హాజరౌతాడు. ( రెండొ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ అలక తీరి హాజరుతుంది ).  అంబేద్కర్ తనకు కావల్సిన విషయాన్ని సాధించడనికి  Diplomatic tactics  చాలా వాడాడు. తప్పని తెలిసిన చాలా విషయాలను ఎత్తుగడల కింద మలిచాడు.  Absolute sense of facts  ను  relative sense of facts  ను జాగర్తగా అంచనా కట్టాడు.  అలా కాక అంబేద్కర్ సాయుధ విప్లవ కారుడై ఉండి ఉంటే ఒక అద్భుతమైన అమరుడై మన పుస్తకాలలో వెలిగే వాడు కాని అదెలా ఉంటుందంటే – మృత శిశువుకు జన్మనిచ్చి చనిపోయిన తల్లిలాంటి స్థానం. ఇన్ని సంవత్సరాల సాయుధ పోరాటం ఎన్ని ఒడిదుడుకులకు లోనైందో ఊహించలేము. ఐతే అదే దళిత పక్ష పాత దృష్టితో చూస్తే – చివరకు దళితులకు ఏమి మిగిలి ఉండేది – అమరుడైన అంబేద్కర్  అద్భుతమైన చారిత్రక  గుర్తులా ?  అసలు ‘ మతమంటేనే మత్తు మందు ‘ అనే ఒక  absolute fact  ను పట్టుకుని వేలాడుతూ ఉండి ఉంటే దళితులకు ఎటువంటి మత ప్రత్యామ్నాయం చూపించకుండా ఉండి ఉంటే హిందూత్వాన్ని వెల వెల బోయేట్టు చేయగలిగే వాడు కాదు. ఈ విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోకుండా అంబేద్కర్ మతాన్ని ప్రోత్సాహించాడు అని కొంతమంది ప్రగతిశిల వాదులు అనుకోవడం అవివేకం.  
అంబేద్కర్ వికృత బ్రాహ్మణ ఛాందస శక్తుల మధ్య ఒక్కడే ఒక్కడై హిందువులను ద్వేషించి , సిగ్గు పడేట్టు చేసి – ఆర్ ఎస్ ఎస్ బలమైన స్థావరమైన నాగ్ పూర్ లో బుద్ధిజం స్వీకరించాడు. అంబేద్కర్ తెగువకు తార్కాణాలెన్నో !
అంబేద్కర్ కమ్యూనల్ అవార్డ్ విషయంలో దళితులకు ” ప్రత్యేక ఓటు పద్ధతి ” ని బలంగా ముందు తీసుకువచ్చాడు. అదే జరిగి ఉంటే ఈ రోజు దళితులు అనూహ్యంగా ఒక సమాంతర రాజ్యాన్ని సాధించగలిగే వాళ్ళు. వాళ్ళ వోటుతో వారి అభ్యర్థులను ఎన్నుకునే పద్ధతి ఒక రాజకీయ ఎత్తుగడతో కూడిన ప్రణాళిక. బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకున్నా, గాంధి హిందు వ్యవస్థ యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒప్పుకోక పోవడం వలన జరిగిన ” పూన ఒడంబడిక ” లో ” రిజర్వ్డ్ ఓటింగ్ సిస్టం ” వచ్చింది.
చరిత్ర చదివితే మనకర్థమయ్యేది – హిందూ వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వకుండా హిందూ వ్యవస్థ ప్రతిపాదించిన రాజీ ఫార్ములానే రిజర్వేషన్ లు !
అంబేద్కర్ సాంఘిక మార్పు కోరుకున్న ఒక బూర్జువా ఆలోచన కలిగిన మేధావిగా ఇప్పటికీ ఎంతో మంది విప్లవ మేధావుల్లో ఉంది. రంగనాయకమ్మ లాంటి మేధావులు – ఒక 500 పేజీల పుస్తకం కూడా విడుదల చేసారు – అంబేద్కర్ లోని తప్పులు ఎత్తి చూపిస్తూ.
అంబేద్కర్ కు సాంఘిక మార్పు ఒక దీర్ఘ కాలిక ప్రక్రియ అనే విషయం తెలీదు అనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు. అలాగే తాను ప్రతిపాదించిన పద్ధతుల వల్ల విప్లవాత్మక మార్పు వస్తుందనే నమ్మకాన్ని వెలువరించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అంబేద్కర్ దీర్ఘ కాలిక పోరాటం మృత శిశువుగా మిగలనీయ కూడదనే ప్రయత్నం లో – దళితుల చైతన్యాన్ని నిశితంగా అంచనా వేసుకుని  existing institutions  ను తన మనుష్యుల కొరకు వాడుకున్నాడు. ప్రతి ప్రజాస్వామిక మేధావిని విప్లవ కారుడుగా ఉండాల్సింది అని కోరుకునే ఒక వెర్రి అంచనా అంబేద్కర్ ను తక్కువ చేస్తుంది. రంగ నాయకమ్మ చేసిన పెద్ద పొరపాటుఇదే ! ఆమె అంబేద్కర్ తప్పులు విజయవంతంగా ఎత్తి చూపింది కాని – అంబేద్కర్ లేని దళితుల జీవితం ఎలా ఉండేదో ఒకే ఒక్క క్షణం ఊహించి ఉండి ఉంటే – ఈ కుల వ్యవస్థ ఉన్నంత కాలం అంబేద్కర్ లో తప్పులు ఎన్నడం ప్రధానం కాదు, ఆయన కృషిని , ఆయన సిద్ధాంతాలను కులవ్యవస్థలో మగ్గిపోయిన అణగారిన వర్గాలకు ప్రేరేపితంగా ఎలా ప్రెజెంట్ చేసి ఉండల్సిందో ఆలోచించడం ప్రధానమై ఉండేది. ఇంతా చేసి ” మృత శిశువు ” లాంటి ఆదర్శ రాజకీయ సొల్యూషన్ తో ముగించింది తప్ప – కాంక్రీట్ గా ఈ కుల వ్యవస్థ ఎలా నిర్మూలింపబడి ఉండొచ్చో తెలియ జేయడం చాత అవ్వలేదు.  రంగ నాయకమ్మ లాంటి మేధావులకు  ” self-goal ”  కొట్టుకోవడం లో ఉన్న ఆనందం , కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాజీ లేకుండా ఆలోచించే ఉద్దేశ్యం లో లేదు.  
అకడమిక్  మార్క్సిస్ట్ ల పరిస్థితి ఇలా ఉంటే –  Dalit fundamentalism  ఒక దృక్పథంగా ఒక మార్గంగా ముందుకొచ్చి – 1980-90 లలో వచ్చిన దళిత చైతన్యాన్ని సరిగ్గా గైడ్ చేయడం లో విఫలం అయ్యింది. ” కుల నిర్మూలన ” కు ముందు మాటగా ” డాక్టర్ అండ్ సెయింట్ ” అనే ఒక అద్భుతమైన విశ్లేషణ అరుంధతి రాయ్ వ్రాయగలిగింది కాని మన దేశం లో దళిత వాణిని ఎత్తి పట్టిన దళిత వాదులు కాదు. అంబేద్కర్ వీళ్ళకు నేర్పించిన ” ధిక్కార స్వరం ” ధిక్కారం దగ్గర , ” ఆత్మ గౌరవాన్ని ” ఆంజనేయ దండకంగా చదవడం లోనే మిగిలిపోయింది. దళిత వాదులు రాజకీయ కెరీరిస్టులుగా, ఆచరణ లేమి కలిగిన వ్యక్తులుగా మిగిలి ఒక  Group force  గా ముందుకు రాలేకపోయారు. ఆచరణ అవలంబనం లేని ధిక్కారం ఛాందస వాదంగా మిగిలిపోతుంది తప్ప బలమైన రాజకీయ వాదంగా నిలబడలేదు. దళిత వాదం స్త్రీ వాదం లాగే  Urban middle class  కు పరిమతమై సహజ మరణానికి దగ్గరగా ఉంది. ధిక్కార స్వరం వినిపించిన దళిత వాణికి ఆధిపత్య సంక్షోభం తో కొట్టుమిట్టాడుతుంది. ఏ ఒక్క నాయకత్వము కూడా దళిత వాదులను ఎక్కువ కాలం ఒకే గాటికి కట్టలేక పోవడానికి ప్రధాన కారణం ఈ  Dalit fundamentalism  ప్రధాన కారణం.
ఇక అంబేద్కర్ ను ఇప్పటి పరిస్థితుల్లో చూడాలంటే – రోజు రోజుకు ఆయన ప్రాధాన్యత పెరుగుతుందే తప్ప తరగడం ఉండడం లేదు. గుజరాత్ గొడవల వెనుక ఉన్నదెవరో బీ జే పీ కి ఓటేసిన ప్రతి హిందువుకూ తెలుసు. అయినా సరే దళిత, గిరిజన, మైనారిటీల సంక్షేమానికి వ్యతిరేకంగా పని చేసే రాజకీయ నాయకున్ని ప్రధానిగా ఎన్నుకోవడం ఈ దేశం లో పాతుకుపోయిన హిందూ ఛాందస వాదానికి ప్రతీక. ఈ హిందూ ఛాందస వాదానికి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ యొక్క ఆలోచనా విఢానాన్ని బలంగా తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. ” మైనారిటీ  ఒక పేలుడు పదార్థం లాంటిది. అది పేలిందంటే రాజ్యం యొక్క మనుగడ ఛిన్నాభిన్నం అవుతుంది ” ” హిందుత్వం ఒక మతం కాదు. ఒక వ్యాధి ” ” ఈ దేశం లో హిందువులు వ్యాధి గ్రస్థులు. వారి వ్యాధి ఈ దేశ ఆరోగ్యానికి , ఆనందానికి హాని కలిగిస్తుందనే విషయం తెలియ జేసేట్టు చేస్తే నాకు సంతృప్తి కలుగుతుంది ”  ” హిందువులకు నేను తోటలో పాము లాంటి వాడిని ” ‘ హిందువులు అత్యంతగా ద్వేషించే వ్యక్తి ఈ దేశం లో నేనే ” అని ఎంతో ధైర్యంగా చాతీ విరిచి హిందూ ఛాందస సమాజాన్ని ఎదుర్కున్న అంబేద్కర్ మన సమకాలీన పరిస్థితులకు ఎంతో అవసరం. ఈ విషయం గ్రహించిన కాషాయ సంస్థలు ముందుగానే అంబేద్కర్ ను తమ వాడిగా సృష్టించే ప్రయత్నం చేయడం కాకతాళీయం కాదు. హిందూ ఛాందస వాదం క్రిస్మస్ ను మిగేస్తుంది. ఈస్టర్ ను మింగేస్తుంది. మన జీవితం లో అనుభవించే ప్రతి చిన్న హక్కును చిదిమేస్తుంది. ఇదే ఫాసిజం గా రూపాంతరం చెందుతుంది. దానిని ఎదుర్కోగలిగిన ఒకే ఒక బలమైన ఆయుధం ” అంబేద్కర్ ” ఒకటే !!!
వినిపించని ఓ కేకలా
వినిపించినా క్షణ కాలమే కొట్టూ మిట్టాడిన ఓ ఆర్తనాదం లా
అతని భాష మిగలాలని కోరుకోలేదు
ఒక దృఢ నిశ్చయం తో బండ రాళ్ళను ఛేదించి
మేరువులా ఒక నిట్ట నిశీధిన  ఆయన వచ్చాడు
పగిలిన పిగిలిన గొంతులకొక భాష
ధారపోస్తున్నప్పుడు
ఆయన ఊహించాడు
ఒకే భాష – ఒకే మాటగా ఒక పునాదిని మిగిలిద్దామనుకుంటే
తన భాషకో ఆయుష్షు కావాలనుకున్నాడు
అర్థమయ్యే భాషను సిద్ధం చేయడానికి
తనకో ప్రాణం కావాలనుకున్నాడు
అంతే తప్ప
పిడికిలితో మెరుపులు రాజేస్తున్నప్పుడు
అగ్ని స్నానం చేస్తాడు
నిజానికి లావా ఉప్పెనల్లో  ఎన్నో సార్లు మరణించి తిరిగి లేచాడు
ఆయన ఎంచుకున్నది మృత శిశువుకు జన్మనిచ్చి
తనువు చాలించిన తల్లి పాత్ర కాదు
అమరత్వానికి వ్యర్థార్థాలు వెదికే సమయం కాదప్పుడు
ఆయన భాష నేర్చిన స్వర పేటికలు నెత్తుటి గడ్డలు
కక్కినా మరణాన్ని కాంభోజ రాగం లో ఆలాపిస్తాయి
మొదట ఒక భాష కావాలి
ఆ భాష కోసం
మృత్యు ధారియై ఆయన నిలవాలి
ఆయన నమ్మిందంతే  !
*

  పబ్బులో శ్రీకృష్ణుడు

పి. మోహన్

 

P Mohanస్నానమాడుతున్న అమ్మాయిల బట్టలను దొంగిలించిన వాడు దేవుడయ్యాడు. ఆ దృశ్యాన్ని రంగుల్లో చిత్రించి, రాళ్లపై చెక్కినవాళ్లు మహాకళాకారులయ్యారు. గోపికా వస్త్రాపహరణంలో ఒక పరమార్థముందని కవులు గానం చేశారు. ఇదంతా చరిత్ర. ఇంత ఘన చరిత్రకు వారసులమని  బోరవిడుచుకుని చెప్పుకుంటున్నవాళ్లు ఇప్పుడు ఆ వారసత్వాన్నికాలదన్నడమే విషాదం.

 మొన్న గౌహతిలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శనలోంచి రెండు బొమ్మలను తీసేశారు. ఒక దాంట్లో శ్రీ కృష్ణుడు బికినీలు వేసుకున్న యువతులతో బార్లో ఉన్నాడు. మరోదాంట్లో జాతీయ పతాకంపై మద్యం బాటిళ్లు వంటివి ఉన్నాయి. కృష్ణుడిని అవమానించారని కాషాయ సంస్థలు, దేశ పతాకాన్ని అవమానించారని దేశభక్తులు మండిపడ్డంతో వాటిని తీసేశారు. వాటిని వేసింది అక్రమ్ హుసేన్ అనే ముస్లిం. అతనిపై ఎఫ్ఐఆర్ పెట్టారు. ప్రస్తుతం అతడు అజ్ఞాతంలో ఉన్నాడు. హిందూ దేవుళ్లను అశ్లీలంగా చిత్రించి అవమానించాడని ఎంఎఫ్ హుసేన్ బొమ్మలను చించేసి, దేశం నుంచి వెళ్లగొట్టిన కళాస్వాదకుల దేశం కదా మనది. ఇప్పుడు ఈ అస్సామీ హుసేన్ కూడా ఆ బాటలోనే ఉన్నాడేమో. అక్రమ్ ముస్లిం కాకుండా హిందువో, సిక్కో అయ్యుంటే ఇంత గొడవ జరిగేదా? కృష్ణుడిని అక్రమ్ కంటే ‘అశ్లీలంగా’ చిత్రించిన బోలెడు మంది హిందూ చిత్రకారులను పద్మ అవార్డులతో గౌరవించిన దేశం కదా మనది!

relief-at-gopuram-base-krishna-stealing-gopis-clothes-nambiraja-temple-tirukkurunkudi-india-d

దేశమంటే మనిషి కాదోయ్, మట్టోయ్..! అంటూ మనిషిని మట్టి నుంచి దూరం చేస్తున్న వర్తమానంలో కనీసం జాతిపతాకంపైనైనా పట్టుదలగా ఉన్నందుకు దేశభక్తులకు శతకోటి వందనాలు. ప్రభుత్వాలు తద్దినాల్లో వాడి పారేసిన జాతీయ జెండాలను చలితో పోరాడ్డానికి తమ మురికి దేహాలకు చుట్టుకుని నిద్రిస్తూ అవమానిస్తున్న, అగౌరవిస్తున్న పేవ్మెంట్ అలగా జనంపై కేసులు పెట్టని వారి క్షమాగుణానికి జేజేలు. కృష్ణుడికి జరిగిన అవమానం ముందు ఇవన్నీ చాలా చిన్న సమస్యలు కనుక వదిలేద్దాం. జాతి మనుగడకు పెను సవాల్ విసురుతున్న ఆ బికినీభామల పరివేష్టిత గోపాలుడి చిత్రం గురించే వాదులాడుకుందాం.

Krishna Gopis Mattancherry

నగరాల్లో పబ్, డ్రగ్ సంస్కృతి పెరుగుతోంది. రాత్రి పదిగంటలకు పచారీ కొట్లను మూసేయించే పోలీసులు పబ్బులను తెల్లారేవరకూ నడిపిస్తున్నారు. సంపన్నకుటుంబాల యువతీయువకులు ఖరీదైన కార్లలో దూసుకొచ్చి, మందుకొట్టి, చిందేసి తెల్లారేటప్పుడు తూలుతూ, చెత్త ఊడ్చేవాళ్లను కార్లతో గుద్దుతూ వెళ్లిపోతుంటారు. అక్రమ్ హుసేన్ ఈ పబ్ కల్చర్ సంగతేంటో జనానికి చూపాలనుకున్నాడు. ఆర్ట్ స్టూడెంట్ కనుక స్వేచ్ఛ తీసుకున్నాడు. పబ్లో కృష్ణుడిని ప్రవేశపెట్టాడు. నీలి వ్యవహారాలు నడిచేచోటు కనుక నీలవర్ణుడిని, గ్రంథసాంగుడిని పట్టుకొచ్చాడు. మధురానగరి రాసలీలలను తను బతుకుతున్న స్థలకాలాల్లో ఆవిష్కరించాడు. అక్రమ్ కాస్త జాగ్రత్తపడినట్లే ఉంది. అదే రాముడి జోలికి పోయింటే ఆ బొమ్మ గ్యాలరీ గడప తొక్కేదే కాదేమో.

akramhussain_1428766784

ఈ చిత్రంలో అక్రమ్ కృష్ణుడినేమీ అశ్లీలంగా చిత్రించలేదు. ఓ అమ్మాయి అతని నిమిత్తం లేకుండా అతన్నికౌగిలించుకుంది. అతన్నిరేపల్లె కన్నెపిల్లల మానసచోరుడని కీర్తించేవాళ్లకు, నగ్నగోపికల, నల్లనయ్య రాసలీలల చిత్రాలను పటాలు కట్టించుకుని పూజించేవాళ్లకు, గోపీలోలుని నఖదంతక్షతాల అష్టపదులను ఉషోదయాన మైమరచి వినేవాళ్లకు ఇందులో అభ్యంతర పెట్టాల్సిందేముంది? ఆ చిత్రాల్లోని యువతులకంటే ఈ బికినీ అమ్మాయిలే కాస్త ‘శ్లీలంగా’ ఉన్నారు కదా? మరి దేవుడిని బార్లో ఉంచాడని అభ్యంతరమా? మరి వేదాల్లోని, హిందూ పురాణాల్లోని సురాపానాల సంగతి? మద్యంపై కోట్ల ఆదాయం కోసం వెంపర్లాడుతూ, కోట్ల సంసారాలను బుగ్గి చేస్తున్న ప్రభుత్వాల సంగతి? మద్యానికి మగువకూ లింకుపెట్టి తాగుడును పబ్లిగ్గా ప్రోత్సహిస్తున్నవ్యాపార ప్రకటనల సంగతి? ఇవన్నీలౌకిక ప్రశ్నలు కదా, పసలేనివి. పారలౌకికమైతే పసందుగా ఉంటాయి.

నగ్నగోపికలు కృష్ణుడిని వేడుకుంటున్నచిత్రాలను హిందూ కళాకారులు వందల సంవత్సరాలుగా వేస్తున్నారు. మొగలాయిల కాలంలో ముస్లిం చిత్రకారులు కూడా వాటిని రసభరితంగా చూపారు. కేరళలోని మట్టంచేరి ప్యాలెస్ లో ఉన్న పదిహేడో శతాబ్దినాటి కుడ్యచిత్రం కృష్ణుడి రాసలీలలను కనువిందుగా చూపుతుంది. పడచుపిల్లలు పార్కుల్లో ముచ్చట్లు చెప్పుకున్న పాపానికి గుంజీలు తీయించే నైతిక పోలీసులకు ఈ బొమ్మ హిందూజాతి గర్వించదగ్గ కళాఖండంగా కనిపిస్తుంది. అక్రమ్ బొమ్మ మాత్రం హిందూ సంస్కృతిపై దాడిలా కనిపిస్తుంది. మన ప్రాచీన కళాకారులు సౌందర్యపిసాసులు. అక్రం మాత్రం కళావిధ్వంసకుడు. వాళ్లది శృంగారం, అతనిది…!  సినిమా పాటల్లో హీరో హీరోయిన్ను తాకరానిచోట తాకితే కళ్లప్పగించి చూసే మన ఘన మర్యాదకు.. చలనంలేని బొమ్మకు గుడ్డకరవైతే మాత్రం భంగం కలుగుతుంది.

P35-Gita-Govinda 1775

కళ విషయాల్లో నైతిక పోలీసుల అజ్ఞానం, అక్కసు గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. భారతీయ కళ దేవాలయాలను అంటిపెట్టుకుని బతికింది. దేవాలయాలపైని శృంగార శిల్పాల ఉద్దేశం సౌందర్యారాధనే కాదు, కామజ్ఞాన ప్రచారం కూడా. వాత్స్యాయన కామసూత్రాలకు చిత్రశిల్పరూపాలు ఇవ్వడం ఇందులో ఒక భాగం. అవి రాజుల భోగలాలసతను కూడా చూపుతుండొచ్చు. కానీ అవి తొలుత కళకారుడి ప్రతిమలు. నైతికతతో కలుషితం కాని సృజన. గర్భగుడిలోని దేవుడి బొమ్మను చెక్కిన శిల్పులే ఈ బొమ్మలనూ చెక్కారు. దేవుడిని ఎంత శ్రద్ధగా తీర్చిదిద్దారో వీటినీ అంతే శ్రద్ధగా తయారు చేశారు. ప్రాచీన పంచలోహ విగ్రహాలను బట్టల్లేకుండా చూస్తే ప్రాచీన కళాకారులకు మానవసౌందర్య సృజనలో ఎంత అభినివేశం, కళాత్మక దృష్టీ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ మన వేడుకలు, నైతికత ఆ సౌంద్యర్యాన్ని ఉత్సవ పట్టుబట్టలతో జాగ్రత్తగా కప్పెడతాయి. అందుకే మనకు మన ప్రాచీనులు దర్శించిన అసలు సౌందర్య దర్శన భాగ్యం లేదు. అరకొరగా మిగిలిన సౌందర్యానికి మన కుహనా నైతికత సున్నం, రంగులూ కొడుతోంది. కళాస్వేచ్ఛకు మన మర్యాద ఇనుప కచ్చడాలు తొడుగుతోంది.

krishna_stealing_clothes_hc92

కళాస్వేచ్ఛ అంటే ఇతర మతాలను అవమానించడమా? అని అడుగుతున్నారు. అవమానించడానికి, కించపరచడానికి వేసింది కళ కాదు. కళ అని ప్రచారం చేసినా దానికి మనుగడ ఉండదు. ముస్లిం, క్రైస్తవ కళాకారులు హిందూ దేవుళ్లను కించపరచేందుకు,

హిందూ కళాకారులు ఏసుక్రీస్తును, మహమ్మద్ ప్రవక్తను కించపరచేందుకు బొమ్మలు వేస్తే అవి కించపరచే బొమ్మలే అవుతాయి కానీ కళ కావు. ఆయా దేవుళ్లను కళాత్మకంగా, స్వేచ్ఛాభావాలతో, చివరకు వాళ్లంటే ఆగ్రహంతో అయినా వేస్తేనే కళ అవుతుంది. పాశ్చాత్య కళలో దీనికి బోలెడు రుజువులున్నాయి. వాళ్లు ఏసుక్రీస్తు శిలువ ధ్వంసం చేస్తున్నట్లు, మేరీమాత ప్రసవిస్తున్నట్లు చిత్రాలు వేశారు. మనగడ్డపైనా దీనికి ఉదాహరణలున్నాయి. అజంతా చిత్రాల్లో, ఖజురహో శిల్పాల్లో, మారుమూల గుళ్లలో మానవదేహాన్ని అపురూపంగా సృజించారు. ఎక్కడా వ్యతిరేకత రాలేదు. బూతు చూసే చూపులో ఉంది. శిశువుకు పాలిస్తున్న తల్లిరొమ్ము వేరు, శ్రీకృష్ణుడు మర్దిస్తున్న గోపిక రొమ్ము వేరు.

            *                                                               

 

Obscenity is a function of culture – a function in the mathematical sense, I mean, its value changing with that of the variables on which it depends.  – A. P. Sabine.

Obscenity is a moral concept in the verbal arsenal of the  Establishment, which abuses the term by applying it, not to expressions of its own morality, but to those of another.    -Herbert Marcuse

Obscenity is whatever happens to shock some elderly and ignorant magistrate.    -Bertrand Russell

ఎవరు కవి?

 డా. కోగంటి విజయ బాబు

KVB photo

‘ ఉగాది ముందు రోజు విరాట్ కవి సమ్మేళనమట విన్నావా ‘ అడిగాడు మూర్తి ఆసక్తిగా.

‘ ఆ నిన్నే తెలిసింది ‘ అన్నాను కొంత చిరాగ్గా.

‘ అదేమిటి, కవిత్వమంటే చెవి కోసుకుంటావు గదా’ అన్నాడు మూర్తి.

నేనేమీ మాట్లాడలేదు. కాసేపాగి అడిగాను. ‘సరే  ఉదయమా, సాయంత్రమా ?వెళ్దామా?’  అని.

‘సాయంత్రమే! వెళ్దాం గురూ కాస్త టైం పాస్ గా ఉంటుంది’ ఉత్సాహంగా చెప్పాడు మూర్తి.

నాక్కొంచెం ఆశ్చర్యమేసింది. ఎప్పుడూకవిత్వమంటే ఆసక్తి చూపించని మూర్తి ఉన్నట్లుండి ఇలా గుర్తు చేసి మరీ అడుగుతుంటే. 20 వ తారీకు సాయంత్రం ఐదు గంటలకే ఇంటి దగ్గర తయారయ్యాడు మూర్తి. లాల్చి పైజమా భుజాన వేలాడే ఓ గుడ్డ సంచి తో సహా.

‘ ఏం మూర్తి నువ్వు కవి వేషం ధరించావ్?’ అడిగాను నవ్వుతూ.

‘ఎంతైనా కవి సమ్మేళనం కదా’ అన్నాడు. అంటూనే జేబు లోంచి ఓ డబ్బా తీసి ఒక ఆకుపచ్చని గుళిక నోట్లో వేసుకున్నాడు . ‘ఏమిటో అది.’ అడిగాను ఆసక్తిగా. ‘గొంతులొ కిచ్ కిచ్ ని దూరం చేసే కొత్తా హాల్స్ గుళికలు. ఒకటికొంటే ఒకటి ఫ్రీ’. అన్నాడు ఎడ్వర్టైజ్ మెంట్ లా.

‘ఓటి గానీ వేస్తావేమిటి?’ అంటుండగానే నేను తయారయ్యాను. ఇద్దరం కలిసి స్కూటర్ మీద బయలుదేరాం.

*        *        *

పదిహేను నిమిషాల్లో  సభాస్థలి చేరుకున్నాం. జనం బాగానే తయారయ్యారు. ‘ఈ మధ్య కవిసమ్మేళనాలకూ జనం బాగా వస్తున్నారు గురూ’ అన్నాడు మూర్తి. ‘ఇంట్లో కూర్చుని ఆ చెత్త టివి ప్రోగ్రాములు చూసేకన్న ఇది నయం కదా’. అన్నాన్నేను.  పెద్దవాళ్ళు,  మధ్య వయస్కులు,నాలాగా మూర్తి లాగా ఓ ముఫ్ఫై నలభై మంది ఉంటారేమో. స్టేజ్ పైన ‘విరాట్ కవిసమ్మేళనం’ అనే బేనర్, ఓ పదిహేను ఇరవై కుర్చీలు, ఓ పక్కగా ఇరవై మంది కవుల పేర్లు,- చాలా అట్టహాసంగా ఉంది ముస్తాబు. ‘ఇంత ఖర్చు ఈ రోజుల్లో ఎవరు భరిస్తున్నారో’ అనుకుంటూ ఉండగా, మూర్తి ఎవర్నో చూసి ఇప్పుడే వస్తానంటూ పరిగెత్తాడు.

కిర్లా కుంభేశ్వర భండారీ – కికుంభం అనుకుంటా. ప్రఖ్యాత విమర్శకుడు. వ్యాఖ్యాత. ఆయన్ను చూడగానే భుజాన వేలాడుతున్న సంచి లోంచి ఓ డైరి లాంటి దాన్ని తీసి ముందు గానే గుర్తుపెట్టుకున్న ఓ పేజి దగ్గర తీసి చదువుతున్నాడు. కికుంభం నడుం మిద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని నొసలు చిట్లిస్తూ వింటున్నాడు. ఈ లోపు మైకు దగ్గర ప్రకటన. ‘రసాస్వాదులందరికి ఆహ్వానం’ అంటూ. ‘కార్యక్రమం మొదలౌతుంది కాబట్టి అందరు తమ తమ స్థానాల్లో కూర్చోవాలి’ అని చెబుతున్నారు.

Kadha-Saranga-2-300x268

మూర్తి కొసం చూస్తే రావడం లేదు. నేనే, వీలున్నపుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బయటికి ఎప్పుడైనా వెళ్ళేలా నాకు, మూర్తికి రెందు కుర్చీలు చూసాను. మైకు దగ్గర ఎవరో పిల్లలు  చేరి పాటలకు సమాయత్తం అవుతున్నారు. నిర్వాహకులు హడావుడిగా తిరుగుతున్నారు. ఒక్కొక్కరే కవి దిగ్గజాలందరు రాష్ట్రం నలువైపులా నుండి వస్తున్నట్లున్నారు. సరస కవులు, స్వభావ కవులు, వాస్తవిక కవులు, విప్లవ కవులు, అతివాద, మితవాద, స్త్రీవాద కవులు, కవయిత్రులు అందరు మొదటి వరస లో కూర్చుంటున్నారు. లౌకిక వాతావరణం ఏర్పడేలా అన్ని సామాజిక వర్గాల కవులు ఆహ్వానిప బడ్డారు.

సభ మొదలైంది. సభా వ్యాఖ్యాత గంభీర వాచస్పతి గరుడనాథం ముందుగా కవులనందరినీ ఒక్కొక్కరిగా వేదిక మీదకు ఆహ్వానించాడు. ప్రార్ధన జ్యోతి ప్రజ్వలన లాటి కార్యక్రమాలు కాగానే ప్రారంభోపన్యాసం మొదలైంది. కవిత్వం గురించీ, కవిత్వ ప్రస్థానం గురించీ దంచి పారేస్తొంది  ఈ సభాస్థలి దాత. దాదాపు రాతి సభకు ఆధ్యాత్మికమైనా, సాహిత్యమైనా,సంస్మరణైనా ఆమె ఉండాల్సిందే. ఉన్నట్లుండి ఆమెలో ఉన్న కవయిత్రి మేల్కొంది. ‘నాకు కవిత్వం రాదు కాని కవిత పాడతానూ.కోకిల కెవరు నేర్పారూ, చేప కెవరు నేర్పారూ, నేనూ పాడగలనూ’ అంటూ రాగాలు తీస్తూ అవే వాక్యాల్ని అటూ ఇటూ మార్చి మార్చి పాడుతోంది. ఆమెను చప్ప్పట్లతో ఉత్తేజపరుస్తున్నారు. ఇంత డబ్బు విరాళంగా ఇచ్చింది గదా మరి. అనేక సభలలో పాల్గొన్న అనుభవం, శ్రుత పాండిత్యం తో కూడిన సోదాహరణ ప్రసంగం పూర్తయేసరికి మరో గంట పట్టింది. ఆమె ఉపన్యాసం కాగానే ఆమె మరొక కార్యక్రమంలో పాల్గొనాలి కాబట్టి ఆమె కు దుశ్శాలువ తో సన్మానం. నేనూ మూర్తి వైపు అసహనంగా చూసాను. కానీ మూర్తి ఈ లోకంలో ఉన్నట్లు లేడు. నోరు తెరుచుకు మరీ వింటున్నాడు. అసలు కవిసమ్మేళనం మొదలయ్యే సరికి ఎనిమిదయ్యింది. ఒక ప్రముఖ విప్లవ కవి తో మొదలైంది. ‘ఉగాదికి సిగ్గులేదు’ అంటూ. ధరలు పెరిగాయని, పేదవాడికి స్ప్రైట్ దొరకడం లేదని, ఏసీ లు కొన్న వాళ్ళని, ఎల్యీడి టివీ లు చూసేవాళ్ళను దుమ్మెత్తి పోసి కూర్చున్నాడు. కాదు సమయం దాటుతోందంటూ కూర్చోబెట్టారు. తరువాత నుదిటిన పెద్ద బొట్టుతో సాంప్రదాయ పంచకట్టుతొ  ఉన్న ఓ సాంప్రదాయ కవి సీసపద్యాల్లో ఉగాది కోయిలను ఆహ్వానిస్తున్నాడు. అవే భావనలు. ఉగాది రుచులు. చందోబద్ధ మయేసరికి భక్తిగా వింటున్నారు.

afsar.evaru kavi

తరువాత ఒక ఆధునిక మొల్ల ను ఆహ్వానించారు. నగరంలో జరిగే ప్రతికవిసమ్మేళనాలకూ ఈమె తప్పని సరిగా రావాల్సిందే! స్త్రీ వాద రచయిత కావడంతో స్వచ్చ భారత్ ను, ఉగాదిని , దుష్ట పురుషుల కవితా వస్తువులను కలిపి ‘ ఉడ్చేసే ఉగాది’ అనే కవిత ను చదివింది. నేనూ మళ్ళీ మూర్తి వైపు చూసాను. ఇంతలో ఒక ఆధునిక కవి లేచి ఎవరికీ అర్ధం కాని కవితొకటి విచిత్రవాక్యాలతో అమర్చి చదివి, ‘ ఇది తనకు సరైన వేదిక కాదనీ మీకు అర్ధం చేసుకునే శక్తీ లేదని’ అన్నట్లుగా నవ్వి కూర్చున్నాడు.

ప్రొద్దుట్నుంచీ అలసి ఉండటంతో కొంచెం కునుకు పట్టింది. మగతగా శబ్దాలు. మూర్తి కూడా రంగస్థలం మీద చోటు సంపాదించాడు.  చాలా పెద్ద కవిత. ఒక ఇరవై నిముషాలు చదివాడు. ‘గాయం ఎలా మానుతుంది?’ అనే కవిత.  అందరితో పాటు మూర్తికి సన్మానం చేస్తున్నారు. ఇంతలో బాగా తూగు రావడంతో మెలకువ వచ్చింది. ప్రక్కన చూస్తే మూర్తి , విమర్శకుడు కికుంభం. ఇద్దరు కలిసి తీవ్రంగా చర్చిస్తున్నారు. ‘ఇదంతా కలా? మూర్తి చదవడం, సన్మానం,అవున్లే ఇంతటి దిగ్గజాలు అతన్ని రానిస్తారా?’ నాలో నేనే నవ్వుకున్నాను.

 

కవి సమ్మేళనం పూర్తి కాకుండానే మూర్తి కేదో ఫోన్ కాల్. అవతలకెళ్ళి మాట్లాడుతున్నాడు . దగ్గరకొచ్చి, ‘ఇంటి కెళ్దామా? ‘ అన్నాడు గాభరాగా.

‘ ఏరా ఏమయింది?’ అనడిగాను. ‘తాను ఫోన్ చెసింది.’ నాన్న ఫోన్ చేసారట. మళ్ళి ఏదో సమస్య.’ అన్నాడు.

నలుగురు అన్నదమ్ములలో తలిదండ్రులను కనిపెట్టి ఉండేది మూర్తి ఒక్కడే. జలుబు చేసినా సరే పరుగెత్తుకెళ్ళి చూసి వస్తాడు. తమ తాతల ఇల్లంటే ప్రాణం  అంటూ తమ బాల్యాన్ని నెమరువేసుకుంటూ  పల్లెను విడిచి రాని తలిదండ్రులంటె పంచ ప్రాణాలు. నేను వెంటనే బయలుదేరాను.

స్కూటర్ మీద మూర్తి ‘నేను మా అమ్మా నాన్న ల మీద ఒక కవిత వ్రాసాను. నాకు బాగా రాయడం రాక పోయినా నా మనసులో ఉన్న భావన వ్రాశాను. ఆ కికుంభం కు వినిపిస్తే ‘ అసలు కవిత్వమంటే ఏమిటో, కాళిదాసు ఎందుకు వ్రాశాడో పద్య కవిత్వం గొప్పతనమేమిటో గురించి అనర్గళంగా మాట్లాడాడు. అసలు మనలాటి వారు కవిత్వమే వ్రాయకూదదంటాడు. తాను చిన్నప్పుడు వ్రాసిన కవిత ను వెయ్యిన్నొక్క సారి చదివాడు. నా కవితలో, భావం సరిగా ఇమడ లేదని, తగిన పదాలు పడ లేదని, ప్రతి వాడు కవిత్వం వ్రాయకుడదని ఇలా ఏవేవో చెప్పాడం’టూ వాపోయాడు. నేను వెంట నే ఇలా అన్నాను.

‘ నిజ జీవితంలో మానవత్వంలేక, ప్రేమ విలువ తెలియక, ఆచరించని సత్యాలు ఎంత అందంగా చెప్పినా ఒకటే –   అన్నీ ఆచరిస్తూ, ప్రేమ పంచిపెడుతూ నీవు నీలాగా మాట్లాడినా ఒకటే. ప్రతివాడు కవిత్వం వ్రాయాలని లేదు. నిజాయితీ ఆత్మా పరి శీలనా లేనివాడు నలుగురి మెప్పు కోసం వ్రాసినా కవి కాలేడు. నిష్కల్మషమైన మనసుతో నీవు మాట్లాడే ప్రతి మాటా కవిత్వమే మూర్తి. బాధపడకు. ముందు వెళ్లి మీ నాన్న ను చూసిరా’ అంటూ వాళ్ళ ఇంటి దగ్గర దించి బయలు దేరాను.

***

 

చీకటి నెత్తురు

ప్రసాదమూర్తి

 

రాజ్యం గోదాములో

తుపాకులకు ఉన్నట్టుండి వెక్కిళ్ళు పుట్టాయి

దాహం దాహమని అరుస్తూ

తూటాల జూలు దులిపాయి

ఆ రాత్రి అడవంతా వణికిపోయింది

 

అడవిలో చెమటబొట్లు ధారబోసి

చితుకులుఏరుకుని

బతుకులు వెలిగించుకునే

కూలీ పిట్టలు

రెక్కలు కూడగట్టుకుని

 దిక్కులకు దండాలు పెట్టాయి

 

శేషాచలం సాక్షిగా

దేవుడే దారి చూపిస్తే

అడవిలో తుపాకులు

 రాత్రిని తాగి రంకెవేశాయి

 

మనిషి రక్తం

బొట్లుబొట్లుగా కురిసీ కురిసీ

నేలరాలిపడివున్న ఆకుల మీద

భీకరంగా మెరిసింది

అదే రాత్రి నెత్తురు రంగులోకి మారిన చీకటి

రాజ్యానికీ రాజుకీ సలాం చేసింది

 

నేను మాత్రం  ఆ రాత్రంతా

నా ఇంటి చుట్టూ అనాథ అస్థి పంజరాలు

నిస్సహాయంగా నిశ్శబ్దంగా నన్నే పిలిచినట్టు

నిద్రలో ఉలిక్కిపడుతూనే వున్నాను

 

ప్రమాదాన్ని ముందే శంకించిన సూర్యుడు

కొండ అంచున జారవిడిచిన  ఎర్రటి నీడలో

పొర్లిపొర్లి వచ్చిన నా అక్షరాలు

త్వరగా లెమ్మని

కిటికీ ఊచలకు వేళ్ళాడుతూ

 చిటికెలు వేశాయి

*

prasada

 

  లోగుట్టు పతంజలికి తెలుసు!

    సి.ఎ ప్రసాదు   

 

11083897_732861206835128_3509838977011454215_nఫుస్తకాలను  ప్రేమించండి- ఆవి మీ జీవితాలను సుఖమయం చేస్తాయి. భయంకర బాధల ఉప్పెనలో వుపశమనం అందిస్తాయి. – గోర్కీ.

ఫుస్తకాలను, మనుషులను, జీవితాన్ని ప్రేమించిన వ్యక్తి  పతంజలి. పత్రికా సంపాదకుడిగా, కధకుడిగా, కాలమిస్ట్ గా, నవలా రచయితగా, వైద్యునిగా, అనేక వైవిధ్యాలతో ఆయన జీవన విధానాన్ని మనం అర్ధం చేసుకోగలిగితే స్పష్టమైన పతంజలి “చూపు” మనకు తెలుస్తుంది. కేవలం హాస్యం కోసం పతంజలి రచనలు చదివితే ఆ చూపు మనకర్ధం కాదు., సమాజంలో తనకు నచ్చని చాలా అంశాలపైన, ఉండకూడని ఆలోచనల పైన,  చెడుపైన, రాజ్య విధానాలపైనా నిర్మొహమాటంగా తన అసహనాన్ని, కోపాన్ని వ్యక్తం చేయడానికి పతంజలి ఎన్నుకున్న ఓ అద్భుతమైన పద్ధతే “వ్యంగ్య రచన”. సాహిత్యానికి, జీవితానికీ ఓ అర్ధం, ప్రయోజనం ఉండాలనేదే పతంజలి దృక్పధం/చూపు అని చెప్పాలి.

తన ప్రతి రచనలోనూ మామూలు జనం పక్కన, వాళ్ళ అమాయకత్వం పక్కనే, వాళ్ళ చేతకాని తనం పక్కనే పతంజలి నిలబడ్డాడుగానీ, పాలక వర్గాల కొమ్ము కాసిన పతంజలిని మనం చూడలేం. మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా మనం చెప్పుకుంటోన్న శాసన వ్యవస్ఠ , న్యాయ వ్యవస్ఠ, పోలిస్ వ్యవస్ఠ, పత్రికా/మీడియా వ్యవస్థల రంగాల్లో జరిగే అన్యాయాలను ఏమాత్రం సందేహించకుండా విమర్శించడం మనకు అర్ధంకావాలి. అదే పతంజలి నైజం, అదే పతంజలి చూపు. అన్ని రచనలనూ “చూడటం” ఇప్పుడు కుదరదు కాబట్టి ప్రస్తుతం నేను “పిలక తిరుగుడు పువ్వు” అనే నవలిక, అందులో రచయితగా, సామాజిక శాస్త్రకారుడిగా పతంజలిని చూసే ప్రయత్నం చేస్తాను…

అనగనగా ఈ భూప్రపంచంలో ఉన్న అనేకానేక గ్రామాల్లో ఆలమండ గ్రామమొకటి.  ఆలమండ గ్రామంలోని రాజుల్లో ఒకరికి భూమి బల్లపరుపుగా వుందనే అభిప్రాయం నచ్చింది. ఆ వూళ్ళోని వెలమలకు భూమి బల్లపరుపుగా లేదనీ, గుండ్రంగానే వుందనీ నమ్మారు.  సరే – ఈ గొడవ మామూలుగానే పెద్దదై కోర్టు వారి దగ్గరికి వెళ్లింది. మేజిస్ట్రేటు తన తీర్పులో “మన జ్ఞానానికి సార్ధకత లేదు.  మన విశ్వాసాల పైన మనకు నమ్మకం లేదు.  మన విలువల పైన మనకు గౌరవం లేదు. మన దేవుళ్ళ పైన మనకు భక్తి లేదు.  మన నాస్తికత్వం పైన మనకు విశ్వాసం లేదు.  మన మీద గానీ, తోటి వాళ్ళ మీద గానీ మనకు మమకారం  లేదు. మన ప్రజాస్వామ్యం పైన మనకు అవగాహన కానీ గురి గానీ లేదు. మన జ్ఞానానికీ – విశ్వాసానికీ పొంతన లేదు.  విశ్వాసానికీ – ఆచరణకూ పొందిక లేదు..భూమి బల్ల పరుపుగా వున్నప్పుడే ఇలాంటి జీవితం కనపడుతుంది” అని వ్యాఖ్యలు చేస్తూ ఆ కేసును కొట్టేస్తాడు.

ఈ మేజిస్ట్రేట్ గాడికి పిలక తిరుగుడు జాస్తిగా వుంది.  అందుకనే ఇలాంటి తీర్పు చెప్పాడు.  పోలీసోళ్ళు పెట్టిన కేసు కొట్టేశాడు కాబట్టి ఈ మేజిస్ట్రేట్ కు బుద్ధి చెప్పి ఆ పిలకతిరుగుడుతనం తగ్గించాలని ఆ ప్రాంతంలోని డిఎస్పీ దొరగారికి అనిపిస్తుంది.  ఆ తర్వాత జరిగిన ప్రహసనమే పిలక తిరుగుడు పువ్వు నవలిక. మేజిస్ట్రేట్ చెప్పిన తీర్పు ఆధారంగా ఆయన బుర్రతిరుగుడుతనం తగ్గించాలని ఆ పోలిస్ దొర డిఎస్పీ, సిఐ కలిసి ఓ ప్రణాళిక ప్రకారం పేపరోళ్ళనీ, ఆవూళ్ళోని పెద్దోళ్ళనీ కూచొబెట్టుకుని పేపర్లల్లో వార్తలు రాయిస్తారు. ఓ పత్రికా రిపోర్టర్ కూ ఆలమండ వూళ్ళోని పెదరాజుగోరికీ జరిగిన మాటలు ఓసారి చూడండి….

రిపోర్టర్: మీరుగాని పాతిక రూపాయలిచ్చారనుకోండి. ఇంత పిసరు సింగల్ కాలం వార్త ఏస్తానండి. హండ్రెడ్ రూపీసైతే బెత్తెడు వార్తండీ. మరో యాభై ఇస్తే మీ ఫోటో కూడా పంపిస్తానండీ. వార్తతో పాటు అది పడితే పడొచ్చండీ నేపోతే నేదండీ.” ఆ తర్వాత పెదరాజుకూ రిపోర్టరుకూ మధ్య ఒ చిన్నసైజు వాదన జరుగుతుంది.

patanjali choopu

మా దగ్గర నుంచి సంగతులు తెలుసుకోవడానికి నువ్వు వచ్చావు కాబట్టి మేం నీకెందుకు డబ్బులియ్యాలి అని పెదరాజు ప్రశ్న. అప్పుడు పత్రిక రిపోర్టర్ జవాబు చాలా గొప్పగా, గమ్మత్తుగ్గా, మన భ్రమలను పోగొట్టేదిగా వుంటుంది.  “మీరు చెప్పాలన్నా, మేం రాయాలన్నా మీరే మాకు డబ్బులియ్యాల. అట్లానే మీరు చెప్పిందే మేం రాయం. మేం మాకు బోధపడినట్లు రాస్తాం.  పేపర్ లో సబ్ ఎడిటర్లు అది చదివి ఆళ్ళకి అర్దమైంది రాస్తారు.  ఆపైన చీప్ సబ్బులుంటారు, ఆళ్ళు దాన్ని చదివి తమకు అర్ధమైనట్లు దిద్ది పంపిస్తారు. ఆపైన కంపోజింగోళ్ళు ఆళ్ళకెలాగ బోధపడితే అలాగా కంపోజింగ్ చేస్తారు.  అబ్బో, శానా తతంగం వుందండి” అని రిపోర్టర్ కుండ పగలేసినట్లు చెప్పి మనకున్న భ్రమల్ని చాలా పోగొట్టటమే పతంజలి దృక్పథం, చూపు అని చెప్పాల్నా?

ప్లీడర్ల గురించి మట్లాడుతూ ముత్యాలనాయుడుతో ఇలా అనిపించటం “ప్లీడర్ని తెమ్మంటే పీక్కుతినేవోడ్ని తెచ్చినారు. ఆడి మొగం చూస్తే దుమ్ములగొండి నాగుంది, మాట చూస్తే జలగవోటం. ఆడొచ్చింతర్వాత మూడే మూడు ముక్కలు మాటాడినాడు.  డబ్బులియ్యి అని తప్పించి ఆ పీడర్నంజికొడుకు మరేటి అన్లేదు” అని యింకా చెప్పిన వాటిని చదువుతేనే మజాగుంటది. లోకంలో జరిగే వాటిని మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పటమే పతంజలి భాష్యం అని అనుకుందామా? ఈ రకమైన రచనా విధానంలో పతంజలి స్పూర్తి రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారే.

ఆ మేజిస్ట్రేటు కోర్టుకు సిఐ వాళ్ళు కేసు తర్వాత కేసు తీసుకువచ్చి ఆయనకు చెమటలు పట్టిస్తారు. కోర్టు ధిక్కార నేరం అని, దేశద్రోహం అని, దేశాన్ని విభజించటానికి ఆలమందలోని జనం వీధి వీధినా కుట్రలు చేస్తున్నారనే పోలీసుల కేసులు చూసి, ఆ కేసులన్నింటిలో సాక్షిగా తన పేరును గమనించిన మేజిస్ట్రేట్ గంగాధరం, పోలీస్ మాయల్ని అర్ధం చేసుకున్నవాడై, ఈ కుట్ర కేసులన్నీ తన్ని అల్లరి చేయడం కోసమేననీ, పోలీసుల కంట్రోల్లో వుంచుకోవడమే వాళ్ళ ఆలోచన అనీ తెలుసుకుంటాడు. ఇంతలో ఆ కేస్ సెషన్స్ జడ్జీగారి దగ్గరికి వస్తుంది. ఆయన మేజిస్ట్రేట్ ని బోనులో నిలబెట్టి వార్నింగ్ ఇస్తాడు.  “ఒక వేళ మనం చూడాల్సొస్తే కేస్ వివరాలు చూడాలి, పోలీసోళ్ళ అభియోగాలు చూడాలి., సాక్ష్యాలు చూడాలి. వినాలి – అంతేగానీ అవన్నీ వదిలేసి, నీ పరిధులు దాటి జీవితం వైపు ఎందుకు చూశావు? జనం యెలా వున్నారో, భూమి యెలాగుందో నీకెందుకు? భూమిని జనాన్ని యెలా వున్నా పోలీసోళ్ళు సరిజేయగలరు, ఇంకెప్పుడైనా ఇట్టా పిచ్చి పిచ్చిగా పరిధులు దాటి ప్రవర్తిస్తే జాగ్రత్త.” అని చెప్పిన జడ్జీ గోరి మాటలిన్న పోలీస్ బాసులు ఆ కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టు వారికి విన్నవించుకుంటారు. “కేసులు పరిష్కరించు – జీవితాలను పరిష్కరించే బాధ్యత మనది కాదు” అని జడ్జీతో చెప్పించిన పతంజలి భావం అర్ధం చేసుకోవడమే పతంజలి చూపు.

అడుగడునా సమాజాన్నీ, జనాలనీ, పోలీసులనీ, పత్రికలనీ, పత్రికా విలేఖరులనీ, ఇంకా మరెన్నో రంగాల్లోని వైవిధ్యాలను అర్ధం చేసుకోవడానికి సాహిత్యం అనే అంకుశాన్నీ, చూపును వుపయోగించుకున్నవాడు పతంజలి. సమాజంలో జరుగుతోన్న అనేక అన్యాయాలకు మూల కారణాలు వెతుక్కునేటపుడు “తెలియనితనం, అజ్ఞానం, దాని వలన వచ్చే అహంకారాలే” నిజమైన కారణాలని గ్రహించిన ఈ సమాజ చిత్రకారుడు పతంజలి తనదైన శైలిలో విడమరచి చెప్పటమే – పతంజలి చూపు.

ఎదుటి వాళ్ళ తెలీనితనాన్ని ఆసరా చేసుకుని ప్లీడర్లు, పోలీసులు, పేపరోళ్ళు, మేజిస్ట్రేట్లు, జడ్జీలు ఎలాటి మాటలాడగలరో, ఆటలాడగలరో తన రచనల్లో కొంచెం వ్యంగ్యంగా, కొంచెం గిల్లినట్లుగా , ఇంకొంచెం గిచ్చినట్లుగా తన చదువరులకు చూపించడం పతంజలి మార్క్ చూపు అనుకుందామా? జీవితం స్వేచ్చగా వుండాలనీ, సాహిత్యానికి ఎలాటి చట్రాలూ వుండకూడదనీ తపించిన పతంజలి తన ప్రతి రచనలోనూ ప్రజల వైపునే నిలబడి అసాంఘీక శక్తులతో, ఏలుతోన్నవాళ్ళతో పోట్లాడాడు. (రచనల సాయంతో) నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా, పదునుగా సాగే పతంజలి రచనలు మనల్ని ఆలోచనల్లో పడేస్తాయి.  ప్రశ్నించడం నేర్పిస్తాయి.  సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి. పరుగెత్తించడమే కాకుండా ఎదురుగా జరిగే అన్యాయాల క్రమాలు చూడలేక మనం నిలువునా దహించుకు పోయేలా చేయటమే పతంజలి రచనల లక్షణం. వ్యక్తిగా కూడా పతంజలి చాలా స్పష్టమైన అభిప్రాయాలతో, నిక్కచ్చిగా జీవించారు. అందుకే పతంజలి తెలుగు సాహితీలోకంలో మిగిలిన వారికన్నా ప్రత్యేకం అని నా నమ్మకం.

*

 

 

వర్గీకరణ  వ్యథ 

 ఎండ్లూరి సుధాకర్ 

 

”వర్గీకరణ పేరిట

నోరెత్తితే నాలుక కోస్తాం

నామ రూపాలు లేకుండా చేస్తాం

ఏ పార్టీ అయినా

ఏ నాయకుడికైనా ఇది తప్పదు ”*

ఈ మాటలు

తూటాలు పేల్చే ఉగ్ర తాలిబాన్లవి కావు

దళితుల తలలు నరికే అగ్ర సైతాన్లవి కావు

మా వాళ్ళవే

మాలో వాళ్ళవే

‘కావడి కుండల్లా కలిసుందాం

అన్నదమ్ముల్లా విడిపోదాం’

అన్నవాళ్లవే

ఇంగిత జ్ఞానం

ఇంగ్లీషు జ్ఞానం వున్న వాళ్ళవే

‘బుద్ధి’స్టులు  పచ్చి టెర్రరిస్టుల్లా మాట్లాడుతున్నారు

దయతో న్యాయం చెప్పండి మీరైనా

నాలుగు ముద్దల్ని

నలుగురం పంచుకుందామంటాము మేము

కాదు కుండ మాకే కావాలంటారు వాళ్ళు

మేము ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం

మాకు మెరిట్ వుంది పోటీ పడమంటారు వాళ్ళు

ఈ పంతం పంతుళ్ళ ముందు ఏమైందో గానీ

 మా అంతం చూసే దాకా వదిలి పెట్టడం లేదు వాళ్ళు

ఏమడిగాం మేము  ఎ బి సి డి లే కదా

ఎవరి మానాన వాళ్ళం బతుకుదామనే కదా

ఎంగిలి మెతుకుల కోసం

ఎగబడుతుంటే ఏం చేయాలో చెప్పండి

ఈనాటిదా ఈ కథ ?

కామధేనువుని కోసుకు తిన్నప్పటినుంచి

కయ్యం కాలు దువ్వుతూనే వుంది

మెత్తని చియ్యలు వాళ్ళు తిన్నారు

ఉత్త ఎముకలు మాకు మిగిల్చారు

చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ

చెప్పకుంటే ద్రోహం మిగుల్తుంది

ఏ జాంబపురాణమో విప్పండి

జాతిపితలు నిజాలు చెప్తారు

సూటిగా అడుగుతున్నాను

 సోదరులారా! నిజం చెప్పండి

ఏనాడైనా

ఒక పాకీ మీలోకి నడిచి వచ్చాడా ?

మీతో చేతులు కలిపి

ఐక్యవేదికపై  పూలమాలై వికసించాడా ?

ఏ రోజైనా

ఒక గోసంగి గోస విన్నారా ?

ఎడారిలాంటి  కుల బిడారులో

ఒక గొడారిని కలుపుకున్నారా ?

ఏ హోదా లేని స్మశానంలో

జీవచ్చవంలాంటి  కాపరిని కన్నారా ?

ఏ ఒక్కరైనా మీ పక్కన ఉన్నారా ?

నిజమే సుమా !

‘సంచారమే ఎంతో బాగున్నది’

ఒక్క సంచార జాతి వాడైనా

మీ పంచన నిలబడ్డాడా ?

తెల్లటి బట్టలతో కనబడ్డాడా ?

ఏ రెల్లి చెల్లైనా

మీ వేదిక మీద గొంతు వినిపించిందా  ?

ఏ డక్కలి పిల్లైనా నీలిజెండాతో కనిపించిందా?

ఎక్కడ వినిపిస్తాయి సమైక్యతా రాగాలు?

ఎప్పుడు వెదజల్లుతాయి

మల్లె మాలల పరాగాలు ?

ఈ శతాబ్దపు పెద్ద అబద్ధాలు

ఒకటి సమైక్యత

రెండు ఐక్యవేదిక

కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది

మేము తలలు వంచుకుని

వేల సంవత్సరాలుగా చెప్పులు కుడుతూనే వున్నాం

ఒక్క సారి తలెత్తే సరికి

ఎక్కడికో చేరిపోయారు

ఎస్కిమోల్లాగా మేము మంచు గుహల్లో  వుంటే

ఎస్కలేటర్ల మీద

 పార్లమెంటుకు తరలిపోయారు కదా

ఏరోజైనా మాకు బోధించారా ?

మమ్మల్ని సమీకరించారా ?

పోరాటాలకు బాటలు వేశారా ?

రెప్ప పాటులోనే తెప్ప తగలేశారు కదా

చూస్తూ ఉండగానే రిజర్వేషనంత ఎత్తుకి ఎదిగి పోయారు

ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క అమృత భాండం

మా చేతుల్లో ఖాళీ కుండలు

ఒక సుదీర్ఘ నిద్ర తర్వాత

ఒక కొత్త సూర్యోదయం తర్వాత

దండోరా ధర్మ ఘంటికలు మోగిస్తే

కడుపు కాలి మాట్లాడితే

కన్నీటి నాల్కల మీద

కారం చల్లుతారా ?

ఆకలి బతుకుల మీద

మేకులు కొడతారా ?

బువ్వ తినాల్సిన వారసుల్ని

భ్రూణ  హత్యలు చేస్తారా ?

కలిసి ఉందాం

కలిసి తిందాం అంటే

కత్తులు దూస్తారా ?

నాల్కలు కోస్తారా ?

ఒక్కసారి బాబా సాహెబ్

చూపుడు వేలు వైపు చూపు సారిస్తారా !

అంబేద్కర్ సాక్షిగా

వర్గీకరణ రథాన్ని

ముందుకు తీసుకెళ్లమంటున్నాడు

మీరూ వస్తారా ఆనందంగా రండి

ఉపకులాలతో  బాధిత గళాలతో

హస్తిన వైపు రథాన్ని మళ్ళిద్దాం !

ఏదో ఒక రోజు ఎర్రకోటలో

నీలిపతాకం ఎగరక పోదు !

[ ఆంధ్ర జ్యోతి : *మార్చి 28న ఏలూరులో జరిగిన ‘మాలల సింహగర్జన’ సభలో కారెం శివాజీ వ్యాఖ్యలు ]

వార్తకి అటూఇటూ…. 

వై.వి. రమణ 

 

రమణఉదయం పదిగంటలు. అప్పుడే కాఫీ తాగి పేపర్ చదవడం మొదలెట్టాను. శేషాచలం అడవుల్లో కూలీల ఎన్‌కౌంటర్ గూర్చి వార్తా విశ్లేషణ చదువుతున్నాను. ఇంతలో నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బు హడావుడిగా వచ్చాడు. 

“హలో మిత్రమా! ఒక కప్పు కాఫీ! అర్జంట్!” వస్తూనే అన్నాడు సుబ్బు. 

“కూర్చో సుబ్బూ! బహుకాల దర్శనం, బాగున్నావా?” పలకరించాను. 

“నేను బాగానే వున్నాన్లే! అంత సీరియస్‌గా పేపర్ చదువుతున్నావ్! ఏంటి కబుర్లు?”

“పాపం! శేషాచలం అడవుల్లో ఇరవైమంది చనిపోయ్యారు సుబ్బూ! ఘోరం కదూ?” దిగాలుగా అన్నాను.

“ప్రస్తుతం మన్దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కావున – మనుషులిలా చావడం సహజం. నువ్విలాంటి సాధారణ వార్తలకి దిగులు చెందరాదు!” నవ్వుతూ అన్నాడు సుబ్బు.

ఆ నవ్వుకి వొళ్ళు మండిపొయ్యింది నాకు.

“మనుషుల ప్రాణాలంటే నీకంత చులకనగా వుందా సుబ్బూ?” మొహం చిట్లించి అన్నాను.

నా ప్రశ్నకి ఒక క్షణం ఆలోచించాడు సుబ్బు.

“నువ్వు అర్ధం చేసుకోవాల్సింది – మన దేశ ఆర్ధిక ముఖచిత్రం మారుతుంది. ఇప్పుడిక్కడ కావల్సింది ‘అభివృద్ధి’ తప్పించి మనుషుల ప్రాణాలకి రక్షణ కాదు. ఈ నేపధ్యం అర్ధం చేసుకున్నాను కాబట్టే మనుషులు చావడం, చంపబడటం ఒక సహజ పరిణామంగా నేను ఫీలవుతున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే – ‘అభివృద్ధి’ అనే ఫేక్టరీకి ఈ చావులు కాలుష్యం వంటివి. కాలుష్యం లేకుండా ఫేక్టరీ నడవదు, లాభాలు రావు. లాటిన్ అమెరికా దేశాల్లో కూడా జరుగుతుందిదే.” అన్నాడు సుబ్బు.

ఇంతలో ఫిల్టర్ కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది.

“సుబ్బూ! కొంచెం అర్ధం అయ్యేట్లు తెలుగులో చెప్పవా?” విసుగ్గా అన్నాను.

“సమాజం ఏకోన్ముఖంగా వుండదు. అడవిలో జంతువుల్లాగే అనేక రకాల వ్యక్తుల సమాహారమే సమాజం. కాకపోతే మనుషులు ఒకే రకమైన శరీర నిర్మాణం కలిగుంటారు. అందుకే ఈ శేషాచలం చావుల్ని కూడా ఎవరి తోచినట్లు వారు అర్ధం చేసుకుంటారు.” అన్నాడు సుబ్బు.

“అదెలా?” ఆసక్తిగా అడిగాను.

“నీకు పెద్దమనుషుల భాషలో చెబుతాను. ఈ భాషని ‘కన్యాశుల్కం’లో సౌజన్యారావు పంతులుతో మాట్లాడిస్తాడు గురజాడ. ఈ భాష గంభీరంగా వుంటుంది, అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం!” అన్నాడు సుబ్బు.

“ఏవిఁటో ఆ భాష?” అన్నాను.

“శాంతిభద్రతల్ని కాపాడ్డం, నేరాల్ని అరికట్టడం అనేది రాజ్యం యొక్క పవిత్రమైన బాధ్యత. ఎవరైతే నేరం చేసినట్లు రాజ్యం భావిస్తుందో, వారిపై నేరారోపణ చేస్తూ, సాక్ష్యాధారాల్తో కోర్టుకి అప్పగించడం రాజ్యం యొక్క విధి. ఇందుకు రాజ్యానికి పోలీసు వ్యవస్థ సహకరిస్తుంది. అట్లా కోర్టుకి అప్పగించిన వారిని ‘నిందితులు’ అంటారు. ఇక్కడి నుండి న్యాయవ్యవస్థ పని మొదలవుతుంది. నిందితుడికి వ్యతిరేకమైన సాక్ష్యాధారాల్ని కూలంకుషంగా విచారించి ఆ నిందితుడు నేరం చేసిందీ లేనిదీ కోర్టులు తేలుస్తాయి. నేరం చేసినట్లు ఋజువైతేనే నిందితుడు, ఆ క్షణం నుండి ‘నేరస్తుడు’ అవుతాడు.” అన్నాడు సుబ్బు.

“ఇదంతా నాకు తెలుసు.” అసహనంగా అన్నాను.

“ఈ పెద్దమనుషుల భాష ప్రకారం – మొన్నట్నుండీ సత్యం రామలింగరాజు ‘నేరస్తుడు’గా అయిపోయ్యాడు. గాలి జనార్ధనరెడ్డి ఇవ్వాళ్టిక్కూడా ‘నిందితుడు’ మాత్రమే.” అన్నాడు సుబ్బు.

“నాకు ఇదీ తెలుసు.” చికాగ్గా అన్నాను.

“మిత్రమా! ‘జీవించడం’ అనేది ఒక ప్రాధమిక హక్కు. ఈ హక్కుని పరిరక్షించడం రాజ్యం యొక్క ముఖ్యమైన బాధ్యత. చట్టం ముందు అందరూ సమానులే. నీకు లేని హక్కు ఇంకెవరికీ లేదు. ఇంకెవరికీ లేని హక్కు నీకు లేదు.” అన్నాడు సుబ్బు.

“ఏవిఁటి సుబ్బూ! మరీ చిన్నపిల్లాడికి చెప్పినట్లు.. ”

సుబ్బు నామాట వినిపించుకోలేదు.

“న్యాయ సూత్రాలని పాటిస్తూ పాలించడాన్ని ‘చట్టబద్ద పాలన’ అంటారు. దీని గూర్చి బాలగోపాల్ వందల పేజీలు రాశాడు, వందల గంటలు ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ చట్టబద్ద పాలన దేవతా వస్త్రాల్లాంటిది. ఇది అందరికీ కనపడదు. నిందితుడు, నేరస్తుడు అనే పదాల లక్జరీ కొన్ని వర్గాలకి మాత్రమే పరిమితం.” అన్నాడు సుబ్బు.

“ఎందుకని?” అడిగాను.

“సమాజం రైల్వే బోగీల్లాగా కంపార్టమెంటలైజ్ అయిపొయుంది. ఏసీ బోగీవాడికున్న ప్రివిలేజెస్ జెనరల్ బోగీవాడికి వుండవు. ఇది ఎవరూ ఒప్పుకోని ఒక అప్రకటిత సూత్రం. శేషాచలం అడవుల్లో చెట్లు నరికినవాళ్ళు జెనరల్ బోగీవాళ్ళు. వాళ్ళు సమాజ సంపదకి కలిగించిన నష్టం గాలి జనార్ధనరెడ్డి కలిగించిన నష్టం కన్నా తక్కువ. కానీ – మనకి ‘నేరస్తులైన’ కూలీల మీదే క్రోధం, అసహ్యం.” అన్నాడు సుబ్బు.

“ఎందుకు?” అడిగాను.

“ఇది స్పష్టమైన క్లాస్ బయాస్. పేపర్లు చదివేది, అభిప్రాయాలు వ్యక్తీకరించేదీ మధ్యతరగతి మేధావులు. వీళ్ళు జేబులు కొట్టేసే వాణ్ని కరెంటు స్తంభానికి కట్టేసి చావగొడితేనే గానీ దొంగలకి బుద్ధి రాదనీ వాదిస్తారు. వంద కోట్లు అవినీతి చేసిన వైట్ కాలర్ నిందితుణ్ని మాత్రం ‘చట్టబద్దంగా విచారించాలి’ అంటారు.” అన్నాడు సుబ్బు.

“నిజమే సుబ్బూ!” అన్నాను.

“ఇక్కడంతా ఆటవిక నీతి. అడవిలో పులులు జింకల్ని వేటాడేప్పుడు జింకలకి నొప్పి కలుగుతుందేమోనని ఆలోచించవు. ఆ పక్కనే వున్న పులి స్నేహితుడైన నక్క – వేటాడే పులిలో రౌద్రాన్ని కీర్తిస్తూ కవిత్వం రాస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. అలాగే – మధ్యతరగతి మేధావులు తక్కువ స్థాయి మనుషులు చంపబడితే – ‘ధర్మసంస్థాపనార్ధం అది చాలా అవసరం’ అని నమ్ముతారు. అంటే – మనం మనుషుల్ని మనుషులుగా చూడ్డం మనేశాం. వర్గాలుగానే చూస్తున్నాం. పాలక వర్గాలక్కూడా కావల్సిందిదే!” అన్నాడు సుబ్బు.

“నువ్వు చెబుతున్నది నిజమేననిపిస్తుంది సుబ్బూ!” అన్నాను.

“నీకు తెలుసుగా? సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘ఐడెంటిఫికేషన్’ అని ఒక డిఫెన్స్ మెకానిజం గూర్చి చెప్పాడు. ఒక వ్యక్తి తన వర్గానికి తెలీకుండానే మానసికంగా కనెక్ట్ అయిపోతాడు. అందుకే – ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి మంచినీళ్ళ కోసం పంపు దగ్గర బిందెలతో తోసుకునే ఆడవారిలో అలగాతనం చూస్తాడే గానీ – నీటికొరత ఎంత దుర్భరంగా వుందో ఆలోచించడు.”

“అంటే – తెలుగు వార్తా పత్రికలది కూడా ‘ఫ్రాయిడియన్ ఐడెంటిఫికేషన్’ అంటావా?”

“కొంత వరకు. పత్రికలకి వ్యాపార అవసరాలే ప్రధానం. వాళ్ళ పత్రికకి చందాదారులుగా కూలీల కన్నా మధ్యతరగతి వారే ఎక్కువమంది వుంటారు. పత్రికలు ఎవరికి వార్తలు అమ్ముతారో వారి ఆలోచనలకి తగ్గట్టుగానే రాస్తాయి. ఇవే తెలుగు పత్రికలు చెన్నై ఎడిషన్లో కూలీలకి అనుకూల విధానం తీసుకుని రాసుండొచ్చు, నాకు తెలీదు.” అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

“నిజమే! చెన్నై ఎడిషన్ వార్తలు వేరుగానే వున్నాయి.”

“ఏ వార్తైనా అనేక ముఖాలు కలిగుంటుంది. ఉదాహరణగా ఒక వార్తని పరిశీలిద్దాం. పులి ఆహారం కోసం మనిషిని వేటాడి ఆడవిలోకి లాక్కెళ్ళిపోయింది. అడవిలో పులులన్నీ కలిసి ఆ వేటని సుష్టుగా భోంచేశాయి. మనుషుల పత్రిక ‘ఒక క్రూర దుర్మార్గ దుష్ట పులి హత్యాకాండ’ అంటూ హెడ్‌లైన్స్‌తో విమర్శిస్తుంది. అదే వార్తని పులుల పత్రిక ‘దుర్భర క్షుద్బాధతో అలమటిస్తున్న సాటి జీవుల ఆకలి తీర్చిన సాహస పులికి జేజేలు’ అని హంతక పులి వీరత్వాన్ని కీర్తిస్తుంది.” అన్నాడు సుబ్బు.

“వాటేన్ ఐరనీ సుబ్బూ! ఒక పక్క గుండెల్ని మార్చడం కోసం సిటీ ట్రాఫిక్కుల్ని ఆపేస్తున్నాం. ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మనిషి ప్రాణం ఎంతో విలువైనదని ప్రవచిస్తున్నాం. ఇంకోపక్క – ప్రాణాలు పోయినందుకు ఆనందిస్తున్నాం.” దిగులుగా అన్నాను.

“మిత్రమా! మరీ అంతగా కలత చెందకు. రాబోయే కాలం కోసం నీ దుఃఖాన్ని కొద్దిగా దాచుకో” అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

*

yaramana.blogspot.in.

చేసంచి – కాళ్ళ గజ్జెలు – ఒక ఉద్యమం

రమా సుందరి 

 

రమాసుందరి

ప్రత్యామ్నాయ రాజకీయాలు మనసుకు నచ్చుతున్న కాలం అది. విశాఖలో పద్మ ఇల్లు వాటికి అడ్డాగా ఉండేది. “శ్రీకాకుళం లోన – చిందిన రక్తము/ కాల్వలై ప్రవహించే – కొండ వాగులలోన/ బండలెరుపెక్కినాయి – పోరాడ కొండలే కదిలినాయి.”  అరుణ గొంతు ఖంగుమని మోగుతుండేది ఆ ఇంట్లో. నేను వీర కళాభిమానినే కానీ కళాకారిణిని కాదు. పాటలు పాడే వాళ్ళమీద వెర్రి ఆరాధనతో ఉండేదాన్ని. పిల్లలకు పాటలు, డాన్సులు నేర్పటానికి కానూరి వెంకటేశ్వరరావు వచ్చి ఉన్నాడు. పాటలు నేర్పిస్తున్న కానూరి తాతకి ఒక చేతి సంచి మాత్రమే ఉండేది. దాంతోనే  ఆయన రాష్ట్రమంతా తిరుగుతాడని చెప్పారు. సాయకాలం నాలుగు నుండి ప్రాక్టీసు. పగలంతా ఖాళీ. మూడు వరుస గదులు ఉన్న ఇంట్లో వరండాలో వుండేవాడు. మిట్ట మధ్యాహ్నం ఎండకు ఒక దుప్పటి కప్పేవాడు. ఎండకు అనుగుణంగా దుప్పటి దశను కటకటాల మీద మార్చుకొంటూ వుండేవాడు కానీ ఎంత మంది పిలిచినా లోపలకి మాత్రం పోయే వాడు కాదు. సూర్యుడి కిరణాలు ఏటవాలుగా ముఖానికి గుచ్చుకొంటున్న ఆ మధ్యాహ్నాలు నా జీవితంలో అతి ముఖ్యమైనవి. మనసా వాచా ఒక విప్లవ కళాకారుడిగా వందేళ్ళు బ్రతికిన మనిషి అంతరంగంతో ములాఖాతు చేసిన మధ్యాన్నాలు అవి.

అది పద్మ వాళ్ళ ఇల్లు కావచ్చు, వరంగల్ జిల్లాలోని పల్లెలో ఒక చెట్టుకింద కావచ్చు, గుంటూరు చుట్టుగుంట సెంటర్ లోని మురికిపేటలో కావచ్చు, ప్రజాపంధా ఆఫీసు కావచ్చు, ప్రకాశం జిల్లా మద్దులూరు కావచ్చు, హైదరాబాదు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు … ఎక్కడ, ఎప్పుడు, ఎంత సేపు మాట్లాడానో గుర్తు లేదు కానీ ఆయన జీవితంలోని పార్శాలు నాకు సుపరిచితం అయ్యాయి. గత సంవత్సరం పీవోడబ్ల్యూ మహాసభల్లో ఆయన వందేళ్ళ పుట్టిన రోజును జరిపారు. వయసుతో బాటు ముడుచుకొని పోయిన ముఖంలో భావప్రకటన కష్టమైపోయి, వృద్దాప్యపు ఇక్కట్ల పూర్తి స్థాయిలో అనుభవిస్తున్న ముసలి ముంపున కూడా నన్ను గుర్తు పట్టి వెంటనే అడిగిన ప్రశ్న “ఎన్వీయస్ ఎలా ఉన్నాడు?” ఎన్వీయస్ కళాకారుడు కాబట్టే ఆ శ్రద్ధ.

ఎనిమిది దశాబ్ధాల రాజకీయ జీవితం. రాష్ట్రాన్నిచైతన్యవంతం చేసిన నాలుగు ఉద్యమాలలో ప్రవేశం. రాజకీయం, కళలు వేరు కాదనే దృక్పధం. “సాంఘీక ఆర్ధిక, రాజకీయాలు సమ్మిళితం చేసి ఆచరించే భౌతిక సమాజ రూపమే సంస్కృతీ”. సంస్కృతికి ఆయన ఇచ్చిన నిర్వచనం .. ఇవన్నీ ఆయన ఏ చెట్టుకు కాసిన కాయో విదితం చేస్తాయి. కళారంగానికి వర్గ దృక్పధాన్ని మేళవించిన మొదటి తరంలోని మనిషి ఆయన. ప్రజల చరిత్ర లేని ప్రజా కళలలను (జానపద కళలు) దేదీప్యమైన దారిలోకి మళ్లించిన వాడు. ‘విప్లవ కళాకారుల్లో తాతలుండరు. అన్నలు మాత్రమే ఉంటారు.” అనే విమర్శలో ‘వాళ్ళు ఎక్కువ కాలం విప్లవంలో కొనసాగలేరు. అనేక ప్రలోభాలు వాళ్ళను పక్కకు లాగుతాయి’ అనే వాస్తవం దాగి ఉంది. ప్రజానాట్యమండలి నుండి సినిమా ఫీల్డ్ కు సాగిన వలసలు ఈ విమర్శకు మొదటి స్టెప్పు. ఆ మిత్ ని బద్దలు కొట్టి చనిపోయేంత వరుకూ విప్లవ ప్రజాగాయకుడిగా, కవిగా, నృత్య శిక్షకుడిగా కొనసాగిన వ్యక్తి కానూరి. అలాగని కళాకారుడిగా తన పరిధులు ఆయన ఎప్పుడు దాటలేదు. కళారంగం రాజకీయ రంగానికి అనుబంధంగా వుండాలి కానీ అదే రాజకీయాలు నడవకూడదనే మాట చివరిదాకా పాటించాడు. చదివింది నాలుగో తరగతి అయినా తెలుగు పట్ల ఆయన మమకారం ఆయన మాటల్లోనే “తెలుగు భాషకు అన్ని ధ్వనులు పలుకగల అక్షర క్రమం వున్నది. తెలుగు సాహిత్యానికి శబ్ధ సౌందర్యం కలిగించే ఛందో రీతి ఉన్నది. తెలుగు సంగీతానికి సప్త ధ్వనులను కంట్రోల్ చేసే గుణమున్నది.”

kanoori 12

ఆయన ఏమి రాసినా అందులో పదునైన రాజకీయ విమర్శ ఉంటుంది. పదాల వాడకం కొద్దిగా మోటుగా కొట్టినట్లు ఉంటుంది. ఆయనను కదిలించిన విషయాలే ఆయన వస్తువులుగా అర్హత సంపాదించుకొంటాయి. ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీ ఉన్నప్పుడు కృష్ణా జిల్లా కాటూరు దురంతం గురించి రాసిన బుర్ర కధ కానీ, స్వతంత్ర భారతంలో బ్యూరోక్రసీని విమర్శిస్తూ రాసిన ‘ప్రగతి బాగోతం’ కానీ, శ్రీకాకుళ సాయుధ ప్రజా ప్రతిఘటన నేపధ్యంలో రాసిన ‘జనగానం’ కానీ ఆయన హృదయాంతరంగంలో బుసలు కొట్టి వెలువడ్డ తూరుపు ముక్కలే. అరుణోదయ రామారావు ఎక్కువగా పాడే కానూరి పాట  

“వీరగాధలు పాడరా… విప్లవ ధీర చరితలు పాడరా!

తూర్పు కొండల నడుమా – అరుణ కాంతుల జ్వాల

నగ్జల్ బరీలోన – నవయుగ శివలీల

 శ్రీకాకుళం గిరీ – సింహాల జయహేల

తీర గోదావరి గిరిజన శలభాల”  వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకొంటాయి. బాబ్రీ మసీదుని కూల్చాక “రాముడో దేవుడో  – నీకేదేమీ ఖర్మరో/ రాజకీయ రొంపులోకి నిన్నే దించారురో” అని ఆయన పెట్టిన గగ్గోలు ఇంకా చెవుల్లో మార్మోగుతుంది.

 

విరసంతో ఆయన అనుబంధం కూడా గొప్పదే. శ్రీశ్రీ , కొడవటిగంటి, రావి శాస్త్రి, కెవియార్ లాంటి ఉద్ధండులతో కలిసి పనిచేశాడు. కేంద్ర ప్రజా నాట్యమండలి బాధ్యుడిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య, తెలంగాణా బాధ్యుడిగా వున్న రామ నరసయ్య, నీలం రామచంద్రయ్య, జంపాల ప్రసాద్ మొదలైన వాళ్ళతో ఆయనకు ఉన్న ఉద్యమ అనుబంధం ఆత్మగతమైనది. జంపాల, రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య ఎన్ కౌంటర్లు ఆయనలో ఎంత సంక్షోభాన్ని రేపాయో, పార్టీ చీలిన ప్రతిసారి అవే తుఫాన్లు. ఒకటిన్నర సంవత్సరం ఆయన గడిపిన బళ్ళారి జైలు జీవితం ఆయన్ను అంత కంటే బాధ పెట్టి ఉండదు.

kanoori 9

చేతి సంచితో బయలుదేరి, పార్టీ ఎక్కడకు చెబితే ఆ బస్సు ఎక్కి నెలల తరబడి గ్రామాల్లో అరుణోదయ శిబిరాన్ని నిర్వహిస్తూ యువతీ యువకులతో, పసి పిల్లలతో స్నేహం చేసే ఈ  సంచారజీవి, బక్క పలచని పెద్ద మనిషి సొంత జీవితం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం నాకు ఆయన పరిచయం అయిన చాలా సంవత్సరాల తరువాత దొరికింది. ఆయనకీ ఒక ప్రేమ కధ ఉందనీ అది ఆయన సజీవ చలనానికి ఊతామిస్తూ ఉంటుందని ఆమె మరణించిన తరువాతే నాకు తెలిసింది. ఉత్తరాలు తప్ప ఫోన్లు లేని ఆ కాలంలో ఆమె మరణం పార్టీకి తెలియడానికి నెల రోజులు పట్టింది. ఆమె కోసం ఆయన రాసిన ‘ప్రణయ గీతం’ ప్రజాపంధా’లో అచ్చయింది. ప్రజాపంధాలాంటి పార్టీ అధికార పత్రికలో అచ్చయిన ఆ కవితలో కొంత భాగం.

కమ్యూనిజానికి టీకాటిప్పణి తెలియని

సాధారణ కమ్యూనిష్టు అభిమాని

ఎర్ర జెండాల కోలాహలం

 విప్లవ గీతాల బృందగానం

విని వెర్రెత్తి పోయే దరహాస రేఖ

తను నమ్మిన పార్టీ ముక్కలు చెక్కలై

మహానాయకులు పార్లమెంటరీ భక్తులై

స్వార్ధం తల బరువై స్వాతంత్ర్యం నక్కల పాలై

అమరవీరుల త్యాగాలు అంగడి సరుకై

ఓల్డు కమ్యూనిష్టు లీడర్లు

నయా కాపిటలిష్టు దళారులై

సోషలిజం అందని మ్రాని పండై

కల చెదిరి కలత చెంది

ఉస్సురని నిట్టూర్చిన హ్యూమనిష్టు

 నాటి తెలంగాణా సమర సింహాల చెల్లమ్మ

నేటి నగ్జల్ బరీ నరసింహాల అమ్మమ్మ

అర్ధ శతాభ్ధి సాంసారిక జీవితంలో లేదు విశ్రాంతి

 అలసి సొలసి ప్రకృతి ఒడిలో శాశ్వత శాంతి

ఆశించి వెళ్ళావా! దమయంతి! 

అని శోకించాడు. ఇది ప్రణయ గీతమా? కమ్యూనిష్టు ఆలాపనా? అయినా సంసార బంధనాలు లేని ఋషి అనుకొంటున్న ఈ మహానుభావుడికి ఈ బాధ ఏమిటి? ఆ దుఃఖం ఇంకో స్టాంజాలో

ప్రేమించి మనం పెళ్ళి చేసుకోలేదు

 ప్రేమోపాసన ఎట్లుంటుందో తెలీదు

 అమర ప్రేమకు అర్ధాలే తెలియవు

 ప్రపంచంలో ప్రేమ జంటలు, ఆదర్శ దంపతులు అసంఖ్యాకులు

అనగా వినడమే గాని ఆ గొడవలు అట్టే తెలియవు

అంతో ఇంతో అనురాగ సుధలు సేవించి సేద తీరిన సామాన్య ప్రేమికులం మనం.

ఈ కవిత నన్ను నిలబడనీయలేదు. ప్రేమించి తప్ప పెళ్ళి చేసుకోగూడదని పంతం పట్టిన వయసు అప్పటిది. ఇలాంటి దాంపత్యంలో ఉన్న పరమార్ధం కోసం అన్వేషిస్తూ మళ్ళీ కవిత చదవటం కొనసాగించాను. ఈ సారి దమయంతి  వైపు నుండి గొంతుక ఆయనే ఇచ్చాడు.

kaanuri tata books

అయినా నాకు తెలియక అడుగుతాను

నేనూ బుర్రున్న మనిషినే

నాకు రవ్వంత లోకజ్ఞానం ఎక్కించాలని నీకుంటేనా?

నీ కవిత్వాలు కాకరగాయలు లోకులకేనా?

అక్కడికి నీవో దేశభక్తునివి నేనో దెబ్బమ్మనా?

పెళ్ళాన్కి హోమ్ మినిష్టర్ హోదా యిచ్చేసి

కాళ్ళు కదిలే వీలు లేకుండా వంటింట్లో కుదేసి

జయ పరమేశా అని సంచి భుజాన తగిలించి

చెక్కేస్తాడయ్యా చైతన్య కళాకారుడు!

సాల్సాలు సంబడం!

ఏక్ బజా అయ్యింది

నీ బస్సుకు టయిమ్ అయింది

లేలేమ్మని వంటింట్లోకి నడిపించి

లేత వంకాయ శాకం కొసరి కొసరి తినిపించి

సంచి సాగరం నింపి

టిక్కెట్లు బద్రం

దిగే కాడ పదిలం

నీకసలే మతిమరుపు

ఒక కార్డు ముక్కన్నా రాసి పంపు

మల్లెప్పుడు రాకడ..?    

తడి అయిన కళ్ళతో ఆయన కోసం చూశాను. సర్వం పోగొట్టుకొన్నట్లు బేజారు పడ్డ ముఖంతో తల వేలాడేసుకొని కూర్చొని వున్నాడు ఒక మూల. ఈయన ఇక బ్రతుకగలడా అనిపించింది ఆ క్షణాన. కానీ నిజంగా బ్రతికి చూపించాడు తరువాత 30 సంవత్సరాలు., పార్టీ ఆఫీసుల్లో, ప్రజల మధ్యన. చివరకు పార్టీ ఆఫీసులోనే మరణించాడు. “మా కాలంలో ….” లాంటి అసంతృప్త, నిష్టూరపు వాక్యాలు ఎప్పుడూ ఆయన నోటి నుండి వచ్చేవి కావు. హృదయంలో కళాతపన కూసింత ఉంటే చాలు ఏ వయసు వారితోనైనా ఆయనకు సావాసమే. తరాలు అంటని స్నేహాలు చేసేవాడు. వంటి సుఖం గురించి ఎప్పుడూ కంప్లైంట్ ఉండదు. మజ్జిగన్నం ఉంటే చాలు. వ్యక్తి గత విషయాల ప్రస్తావన ఉండదు. స్థితప్రజ్ఞ విప్లవకారుడు ఆయన.

ఒంగోల్లో ఆయన బహిరంగ కార్యక్రమం ఉందంటే జనం ఎగబడతారు. ఆయన అభిమానులు అన్ని పార్టీలలో, రాష్ట్రమంతా ఉంటారు. తొంబ్బై ఏళ్ల వయసులోకూడా స్టేజ్ మీద  “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా! కొయ్యరా కోతలు మొనగాడా!” పాటకు నృత్యం చేసినవాడు. ఆయన అభిమానులు పట్టుపట్టి ఎనభై అయిదేళ్ళ వయసులో ఆయన కళారంగ అనుభవాలు రికార్డ్ చేసి ‘కధ కాని కధ’ పేరుతో పుస్తకం తీసుకొని వచ్చారు. జంపాల ప్రసాదు టైమ్ లో ఉస్మానియా విద్యార్ధునులు కె. లలిత, గీతల నుండి …  అరుణోదయ విమల, వంగ పద్మ, సృజన, సుధ, అరుణ, విశాఖ పద్మ ఆయన శిష్యగణంలో ఆడపిల్లల పట్ల ఆయన శ్రద్ధ వేరుగా ఉండేది. మహిళా ఉద్యమంలో పనిచేసున్న మా పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు.

3315_front_cover

సతీశ్ చందర్ అంటారు “ఉద్యమం అంటే ప్రతిసారి మూడు తుపాకులూ, ఆరు మందు పాతరలే కానక్కరలేదు. ఒక డప్పూ రెండు చిటికెన పుల్లలూ కలిసినా ఉద్యమం అవుతుంది” అని.  అవును. రెండు చిరతలు, చిన్న డోలు, కాళ్ళకు గజ్జెలు కూడా ఉద్యమం అవుతాయి. బుర్రకధలు, హరికధలు, ఒగ్గు కధలు, జనగానాలు, గొంగళి ప్రదర్శనలు కూడా ఉద్యమాలు అవుతాయి. వీటన్నిటిని ఔపాసన పట్టి ప్రజల్లోకి దూకిన కానూరి ఉద్యమ రధసారధి అవుతాడు. 15 ఏళ్ల వయసులో యాంత్రికంగా కళారంగానికి వచ్చి గొప్ప సాంస్కృతిక ఉద్యమానికి నిట్టాడిగా నిలబడ్డ కానూరి గారిని కేవలం కళాకారుడు అంటే సరిపోతుందా? శాస్త్రీయ సంగీతంలో తామే రచించి, స్వరకల్పన చేసి పాటలు పడే వారిని వాగ్గేయకారుడని అంటారు. తనకు తెలిసిన అనేక కళా రూపాల్లో ఒకదాన్ని ఎంచుకొని, దానికి రచన చేసి, బాణీ కట్టి, దానికి నృత్య రీతిని సమకూర్చి, గజ్జె కట్టి ఆడి, పాడి, తన చుట్టూవున్న వాళ్ళకు నేర్పించిన వారిని ఏమని పిలవాలో కానూరి తాతను అలాగే పిలవాలి. ఆయన పనిచేసి, నాయకత్వ బాధ్యతలు ఇచ్చిన సాంస్కృతిక, సాహితీ సంస్థలు ప్రజానాట్యమండలి కానీ, అరుణోదయ సాహితీ సమాఖ్య కానీ, విరసం కానీ, ప్రజాస్వామిక రచయితల సంఘం కానీ ఆయన రచనలపై పూర్తి భరోసాతో ఉండేవి. ఎందుకంటే ఆయనది ప్రజల పంధా. అంగుళం కూడా దానిని అతిక్రమించడనే నమ్మకం. పేదప్రజలకు, వారి ప్రతినిధి అయిన విప్లవ పార్టీకి మాత్రమే నిబద్ధుడైనాడు కడ దాకా. ఆయన వందేళ్ళ పరిపూర్ణ  విప్లవ జీవితం ప్రజలకే అంకితం.

 

ఈ మరణం అనివార్యం అని తెలుసు. ఆయన మరణం చెందక ముందుకీ, ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటి? ఖమ్మం సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమాక్రసీ ఆఫీసులో కానూరి తాతను ఎప్పుడైనా చూడచ్చు అనే ఆశ ఇక ఇప్పుడు లేదు. నాలుగు తరాల కమ్యూనిష్టు మనస్తత్వాలను అవగతం చేసుకొని ఎప్పుడూ వర్ధమానంలో బ్రతికిన సాహిత్య, సాంస్కృతిక,   సాయుధ వీరుడు భౌతికంగా అదృశ్యమై ఫోటోలోనూ, ఆయన పుస్తకాలలోనూ, ఆయన ఆదర్శాలలోనూ మాత్రమే కనిపిస్తాడు ఇక. రెండు చొక్కాలు, కాళ్ళ గజ్జలు, ఒక చేతి సంచితో ఆయన నిరాడంబర విప్లవ జీవితం తప్పక ఎక్కడో, ఎప్పుడో ఒక గుప్పెడు మందికి దారి దీపం అవుతుంది. కళ్ల నీళ్ళు తుడుచుకొని, నిండు మనసుతో ఆయనకు ప్రణమిల్లడం తప్ప చేయగలిగినది ఏముంది? మహిళా ఉద్యమం ‘కల్చరల్ కలరా’ను పారదోలుతుందన్న ఆయన నమ్మకాన్ని మోసుకొని పోవడం తప్ప.

*

దేశ భక్తులు పోలీసులు – ఎన్ కౌంటర్లే దేశ సేవ!

పి. విక్టర్ విజయ్ కుమార్ 

ఎన్ కౌంటర్ జరిగిన ప్రతి సారి – ‘ పోలీసులు తమ వృత్తి ధర్మానికి ప్రాణలొడ్డినప్పుడు రాని హక్కుల సమస్య ఒక నేరస్తున్ని ఎన్ కౌంటర్ చేసినప్పుడు రావడం ఏంటి ‘ అనో ‘ పోలీసులకు మనుష్యులు కాదా ?వాళ్ళకు హక్కులు లేవా ? ‘ అనో కొన్ని కామన్ ప్రశ్నలు మన మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటాయి.

ఒక మితృడు వాదించాడు ఇలా –

” కూలీలైతేనేం….ఏం కోట్లు విలువ చేసే ఎర్ర చందనం ఎత్తుకు పోతున్నప్పుడు వెధవలకు తెలీదా అందులో రిస్క్ ? కాల్చి పారేయాలి నాయాళ్ళను. చంద్ర బాబు అంటే మాటా ?! మజాకా ?! ”

నేను అడిగాను ” మొన్న నీవు తాగి డ్రైవ్ చేసినప్పుడు , నీకు చలాను వేసాడు కదా పోలీసు ?”

” అవును ?! ” అందులో ఏమంత వింత అన్నట్టు చూసాడు.

” చలాను ఇవ్వకుండ ‘ తాగి డ్రైవ్ చేస్తే ఎంత నష్టమో తెలుసా ‘ అని చాచి లెంప కాయ ఇస్తే ఎలా ఉండేది నీకు ” అన్నా.

“ఆ……మ్మ్.. .మ్మ్ మ్మ….రీ …తాగినందుకే లెంపలు వాయిస్తారా ? వాడి బామ్మర్దులనుకుంటారా ……. లేపొతే ……ఎవన్ని పడ్తే వాన్ని వాయించొచ్చనుకుంటారేంటి ”

* * * * *

ఇంకొక మితృడు –

” చేసేది దొంగ తనం. పోలీసులు కాల్చకుండా ఉంటారా ? ”

” అవును. కాల్చకుండా ఉంటారా ?…అసల నీ చేతిలో ఒక గన్ను ఉండి ….నీవు అక్కడ ఉండి…వాళ్ళను కాల్చేసి ఉన్నావనుకో …..పోలీసులు నీలానే ‘ చేసేది దొంగ తనం . మరి ఇలా చావరా ఏంటి ‘ అని వాళ్ళను చంపేసిన నిన్ను సత్కరిస్తారా ? లేదా అరెస్ట్ చేసి 302 సెక్షన్ బుక్ చేస్తారా ? ”

” ఆబ్వియస్లీ …కేస్ బుక్ చేస్తారు ”

” ఓహ్ ! ఈ దేశానికి నీవు మాత్రం అంటే ఎంత శీత కన్ను ? ‘
* * * * * *

ఇంకో మితృడు –

” పోలీసులు పాపం రాత్రనక, పగలనక పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ….దొంగ తనం చేస్తున్న వాళ్ళను కాల్చి చంపితే జనాలకు…చంపారనే విషయం గుర్తుంటుంది తప్ప….అయ్యో పోలీసులు ప్రాణాలను రిస్క్ చేసి …..వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు కదా …అని ఒక్క వెధవ కు అనిపించదు ‘ …..( ‘వెధవ ‘ అన్ని పలికినప్పుడు మాత్రం నా మొహాన్ని చూసి )

” మీ పక్కింట్లో కుక్క పిల్ల రాత్రులు అరిచి అరిచీ నీకు నిద్ర లేకుండా చేస్తుంది అన్నావు కదా మొన్న ? ”

” అవును ? ” ఇప్పుడు దీనికేం ఎదవ లింక్ అన్నట్టు మొహం చిట్లించాడు.

” ఆ కుక్కను చంపేస్తే ? ”

” చీ …సిగ్గు లేదూ ?! కుక్క ఓనర్ గాడికి బుద్ధి లేదు . పాపం కుక్కేం చేసిందంట మధ్యలో ? ”

” మీ వీధిలో గస్తీ తిరుగుతున్న పోలీసుకు కంప్లైన్ చేసావనుకో ‘ ఏవండీ , ఈ వెధవ కుక్క తెగ మొరుగుతుంది. దాని ఓనర్ గాడికి బానే ఉంది. మాకే నిద్ర పట్టటం లెదు ‘ అని. జస్ట్ అనుకో…పోలీసాయనుండి ‘ సార్…ఈ తల నొప్పి ఎందుకు ?’ అని గన్ తీసి కుక్కను ఒక్క సారి టపీమని కాల్చేసాడనుకో….అలా జరిగిందనుకో…..పర్లేదా ? ”

” అది పాపం కదా ? ”

” నీకు జరిగింది కూడా పాపమే కదా ? ”

” ఐతే పోలీసోళ్ళు చంపేస్తారా ? అందునా కుక్కను ? ”

” వాళ్ళు రాత్రంతా మేల్కుని మనల్ని పరిరక్షిస్తున్నారు కాబట్టి ఒక మంచి కోసం కుక్కను చంపేసినా ఒప్పేసుకోవచ్చులే !! ”

* * * * * * * *

మొదటి మితృడే మళ్ళీ ఇలా అడిగాడు –

” పోలీసులను లేండ్ మైను పెట్టి నక్సలైట్లు లేపేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాని హక్కులు ఎవర్నో దొంగ నాయాళ్ళను చంపితే గుర్తుకొస్తుందా ఈ హక్కుల వాళ్ళకు ? ”

” నీవు తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు పోలీసు చలాను ఇవ్వకుండా లాగి కొట్టి ఉంటే నీవేం చేసేవాడివి ? …జస్ట్ ఆస్కింగ్….”

” ఏం చేసేవాన్ని ……పడేవాన్ని ”

” ఏం తిరగ బడొచ్చు కదా ? ”

” ఇంకో రెండు ఎక్కువ తగిలిస్తారు. లేదంటే లోపలేసి కుమ్మేస్తారు ”

“కుమ్మించుకోడానికి నీవు రెడి అయినా …అది ఒక లెక్క కాదు అని అనుకున్నా …నీవు కూడా వాళ్ళను కుమ్మేస్తావన్న మాట ??? ”

” ఏమో ?! ”

” అంటే నీవు తిరిగి కుమ్మే రిస్క్ ఉందని తెలిసినా …వాళ్ళు నిన్ను మేన్ హేండిల్ చేసారన్నట్టు…అంతేనా ? ”

” అంతే కదా ?”

” నీకు తాగడం తెలుసు కాని తన్నడం తెలీదు కాబట్టి బతికి పోయారు పోలీసులు. అందరూ నీలానే ఉంటే ఎంత బాగుణ్ణు ? ”

“_______”

* * * * * * * *
మొన్న తీవ్ర వాదులు విచ్చల విడిగా పోలీసులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకుని ఎన్ కౌంటర్ లో చావడం నా భార్య ఫోన్ చేసి చెప్పింది ‘ ఇదుగో ఇది న్యూస్ ‘ అని. నేను అన్నా ‘ ఇంకొన్ని రోజుల్లో ఆంధ్ర తెలంగాణా లో ఎన్ కౌంటర్స్ జరుగుతాయి మళ్ళీ ‘ అని.

ఈ దేశం లో మధ్య తరగతి జనాభా 50 శాతానికి పైనే ఉంటుంది. ఈ మధ్య తరగతి కి ఉండే ఒక ధోరణి ” Excessive neutrality ‘ ని కోరుకోవడం . ఏ సమస్య అయినా ఏదీ , ఎవరికీ నష్టం జరక్కుండా జరగాలని ఆశించడం …అది కుదరకపోతే న్యాయాన్ని ‘ బ్రేక్’ చేసిన వాడిని కాక సామరస్యానికి తల ఒగ్గ్గని వాడిని ప్రశ్నించడం. ఐతే ఏదైనా – సమస్య తమ స్వంత తలలకు చుట్టుకోనంత కాలం మాత్రమే ఈ ‘obsession ‘ ఉంటుంది.

చరిత్రలో ఏ ఉద్యమం చూసినా, ఏ డెవలప్ మెంట్ చూసినా – మద్య తరగతి పాత్ర ఇదే !
మన అభివృద్ధి చెందే భారత దేశం లో ఈ ధోరణి తో మన రాజకీయాలు , రాజకీయ పార్టీలు కూడా సతమౌతూ ఉంటాయి. అదే పాశ్చాత్య దేశాల్లో చూస్తే – ఎన్ కౌంటర్ జరిగితే – అది నిజం ఎంకౌంటర్ జరిగిందా …ఫేక్ ఎంకౌంటర్ జరిగిందా అనే చర్చ దగ్గిర సాధారణంగా ఆగిపోతుంది తప్ప – అసలు ఫేక్ ఎన్ కౌంటరా కాదా అనె ప్రశ్న లేకుండా చచ్చిపోయినోడు – చావడానికి అర్హుడా కాదా అనే దగ్గర చర్చ ఆగుతుంది ఇక్కడ.

అందుకే – కొన్ని సంవత్సరాల క్రితం వై యెస్సార్ టైం లో వరంగల్ లో అమ్మాయిలపై యాసిడ్ దాడి చేసిన ముష్కరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినప్పుడు అక్కడ ఎస్. పీ హీరో అయ్యాడు. అదేంటో మరి వాళ్ళను నక్సలైట్లు చంపి ఉంటే – నక్సలైట్లను ఎన్ కౌంటర్ లో లేపేసే వాళ్ళు ! అప్పుడు ఎవరూ అయ్యో అనరు ?! బాగా ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే – ప్రజలు పుష్ప గుచ్చాలు ఇస్తుంటే ఎస్ . పీ గారు నవ్వుతూ కెమెరాకు పోజు ఇవ్వడం. ( ఏం ! మీ కూతురికో…మీ భార్యకో..అమ్మకో ఇలా జరిగి ఉంటే …మీరూ చెయ్యరా…అని ఒక personalised question ఒకటి ఎదురు చూడాలి ఇక ) . ఆయన గారు అంతటితో ఆగలేదు – ఒక గంజాయి స్మగ్లర్ను, ఒక పెద్ద నక్సలైటు లీడర్ ను ఎన్ కౌంటర్ లొ అంతం చేసాడు.

పోలీసులు మన వ్యవస్థలో చంపడానికి unconditional authorisation ఉన్న ఒకే ఒక Employee group గా ఈ దేశం లో ఉన్నట్టు అనిపిస్తుంది.

అమ్మాయి మీద యాసిడ్ పోసిన రాక్షసుడు, దేశ ధనాన్ని కొల్లగొట్టే ఎర్ర చందనం ‘కూలీ ‘ దొంగలు ….అందరూ దోషులే ! 5000 కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము, బేంకుల సొమ్ము ఎగ గొట్టిన రామలింగ రాజు కూడా ముష్కరుడే ! పోలీసులు ఆయన్ను ఎన్ కౌంటర్ చేయరు. ఒక ప్రజాస్వామిక వాదిగా ఆయన్ను ఎన్ కౌంటర్ చేసినా నేను సమర్థించలేను.

National Human Rights Commission రిలీజ్ చేసిన Manual on Human Rights for Police Officers ఎన్ కౌంటర్స్ గురిచి చెబ్తూ ఇలా అంది –

” False encounters are, at times, staged by police officers because there is pressure by the political masters to show quick results by means,fair or foul ” అని కారణం చెప్తూ ” The public, particularly the educated middle class, also donot mind if the police take the law in their own hands and become executioners, particularly with regard to the dreaded criminals ” అని ప్రస్తావిస్తుంది.

అసలు చట్ట ప్రకారం ఎవరు ఎవరినైనా ఏ కారణం చేతనైనా – పోలీసు అయినా సరే – మర్డర్ చేయడం నేరము అని చెప్తుంది. ఇలా ఎందుకు చెప్పడం ? పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం కరెక్ట్ అయినప్పుడు మనం చాట్టాన్నిల ఎందుకు రాసుకోవడం ? అలా కాక – ఫలాన నేరం చేస్తూ దొరికినప్పుడు – మొహమాటం లేకుండా పోలీసులు కాల్చేయొచ్చు అని చట్టం చేస్తే సరిపోతుంది కదా ? వాళ్ళు చంపడం – దాని మీద మనమంతా చర్చించడం ఎందుకు ? ఫలానా సెక్షన్ అండ్ సబ్ సెక్షన్ ప్రకారం పోలీసులు ఈ దిగువ చెప్పబడిన నేరాలు చేస్తే ఎవడినైనా సరే అడ్డంగా కాల్చేయొచ్చు అని చట్టం మార్చేస్తే పోలా ?

” న్యాయాన్యాయా లేంది సార్…కొడుకులను వర్సపెట్టి కాల్చేయకుండ…” అని నా కేబిన్ లోకి విసురుగా వచ్చాడు మా ఆఫీసు లొ పని చేసే క్లర్క్. ” ఏం బాబు….నీ కొడుకును ‘ ఐ పీ యెస్ చేయి నాయనా ‘ అని పోరు పెడుతంటావు కదా ….అఫీషియల్ గా మర్డర్ చేసే అవకాశం కూడా ఒకటి దొరుకుతుంది అని కూడా చెప్పి కష్టపడి చదవడానికి inspiration ఇస్తావా ఇక ? ” అన్నా.

నాతో వాదించలేకో , వాదించడం ఇష్టం లేకో వెళ్ళిపోయాడు.

ఈ దేశం లో నక్సలైట్లు రాజ్యాంగాన్ని నమ్మరు. ఈ దేశం లో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని నమ్మరు. చివరికి – ఈ దేశం లో – ప్రజలు కూడా రాజ్యాంగాన్ని నమ్మరు. ఏం దేశమయ్యా బాబు ఇది ?

అకస్మాత్తుగా మనం ఒక వ్యవస్థలో బతుకుతున్నాము అన్నది చాలా సౌకర్యదాయకంగా మన మధ్య తరగతి ప్రజలు మర్చిపోతారు. ఏదో ఇంకా ఏ గుప్త సామ్రాజ్యమో ఉన్నట్టు అకస్మాత్తు భావన వస్తుంది.

నేరాన్ని ఎలా రూపు మాపాలి ? నేరం మళ్ళీ బతక కుండా ఎలా భూస్థాపితం చేయాలి అనడానికి మన దగ్గర సమాధానాలు లేకపోతే నేరస్తులను చంపడం సమాధానంగా కనబడుతుంది. నేరస్తులను చంపడం సమాధానం ఐతే చంపే వాడు కూడా నేరస్తుడౌతాడు. ఎత్తుకు పోయి అడవిలో కణత మీద పిస్టల్ పెట్టి ట్రిగ్గర్ నొక్కే పోలీసులు మాత్రమే నేరస్తులు కారు ?!

మొన్న తెలంగాణ లో మధ్య ప్రదేశ్ నుండి పారిపోయిన టెర్రరిస్టుల ఎన్ కౌంటర్ లో సాధారణ పోలీసులు కూడా ప్రాణం కోల్పోవడం విచారకరం. ఐతే ఈ సంఘటన తో – రెండు రాష్ట్రాల పోలీసులకు ఒక నైతిక బలం చేకూరింది. తర్వాత జరిగిన రెండు ఎన్ కౌంటర్స్ కూడా Planned murers అని పెద్ద తెలివిలేనోళ్ళకైనా తెలిసిపోతుంది.

” మరి ఎందుకు అంతగా పట్టు పడుతున్నావు…పోలీసులు మర్డర్ చేసినా మన మంచికే కదా….చట్టం లో లోపాలు ఉన్నప్పుడు …మనకు అంకుశం రాజశేఖర్ లు కావాలి లే ! వదిలెయ్ ! ” ఒక మధ్య తరగతి ప్రబుద్ధుడి జడ్జ్మెంట్.

మనకెంత ఆత్మ వంచన కదా ? వేల మందిని చేతికి మట్టి అంటకుండా చంపినోడు మన దేశ సిం హాసనం మీద కూర్చున్నాడు. ఏ ‘అంకుశం’ పోలీసు ఆఫీసర్ వాడిని ఎన్ కౌంటర్ చేస్తాడు ?

SP సజ్జనార్ మర్డర్ యాసిడ్ అటాక్ ముష్కరులతో ఆగిపోలేదు. కుక్కను చంపే ముందు పిచ్చిదని చెప్తే చాలంటే – మనమందరం ఇల్లు దాటి బయట కెళ్ళకుండా కుక్కల్లా పడి ఉంటాం. ఎవడు ఎవడిని పిచ్చి కుక్క అంటాడో అని బిక్కు బిక్కు మనుకుంటూ.

ఐతే సమస్యేమీ లేదు అందులో – అందరం కుక్కల్లా బతకాలనుకున్నప్పుడు.
మనమెలా బతకాలనుకున్నామో మనకు క్లారిటీ వచ్చేంత వరకు ఈ విచిత్ర వాదనలు వినాల్సిందే !

PS : The objective of this rhetoric essay is not to demean any individual of the skewed thinking but to let reader understand, in simple terms, that the institutionalised crime is more dangerous than individualised crime and we need to address institutionalised crime on priority basis. It may look ‘ heroic’ on face of it to contain individual crime by illegal means by the Police . However, the same is nothing but ‘shortsightedness ‘ and it is the effort of ‘ State ‘ to play with middle class belief system in order to protect its systemic inability to address the core content of the problem. It is often misconstrued that the crime cannot be contained through law and law has its limitations which justifies action of police to take law into their hands at their ‘discretion’. It is actually a misnomer undermining human’s ability to develop better society and strengthen institutions for safety and security while there are set examples in other parts of the world. Pursuit for low crime rate in a society is a incessant endeavour of nation and does not confine itself only to ‘ law and order’ and hence finding solutions within the hands of police makes us feeble and desperate prompting us to romanticise the police system

రాజ్యం మెసేజ్‌-ప్రజాస్వామిక వాదులకు ఎస్‌ఓఎస్‌!

జి ఎస్‌ రామ్మోహన్‌

 

వాళ్లు చొక్కా అవసరం లేనంత పేదవాళ్లు. ఏ కులమో ఏ మతమో మనకు తెలీదు. మనలాగా పేపర్‌ చదివి, మనలాగా రాజకీయాలు చర్చించే మనుషులు కారు. మనలాగా కేరేజీ తీసుకుని స్కూటర్‌మీదో కారులోనో ఆఫీసుకు వెళ్లే మనుషులు కాదు. మనలాంటి మధ్యతరగతి మర్యాదపురుషులు కాదు. మన భాష కాదు, మన రాష్ర్టమూ కాదు. వాళ్లు వేరే. వాళ్లు మనకు ఏలియన్స్‌. అందుకేనేమో మనకు పెద్దగా పట్టింపు ఉండదు. సివిల్‌ సొసైటీలో స్పందన కష్టం. ”భలే పని చేశారు గురూ, ఈ దెబ్బకు ఇక ఇటువైపు రారు” అనేమాట ఎక్కువగా వినిపిస్తోంది.

మనందరి ఆస్తిని ఎవరో కొట్టేసుకుపోతూ ఉంటే పోలీసులు వారికి గట్టి బుద్ధి చెప్పినట్టుగా ఉంది. చెట్లు కొట్టేయడం మనుషులను కాల్చిచంపదగిన నేరంగా ఎప్పుడు మారింది అని అడిగీ లాభం లేదు. రాళ్లు విసిరితే తుపాకులతో కాల్చేయడం ఏ విధమైన ఆత్మరక్షణ లాజిక్‌ అని అడిగి లాభం లేదు. ఆ శవాల పక్కనబెట్టిన దుంగలు ఎప్పటివో లాగున్నాయి, కొన్నింటిమీద పెయింట్‌ కూడా కనిపిస్తోంది అని ప్రశ్నించీ లాభం లేదు. ఇది ఎన్‌కౌంటరే అని నమ్మకం కలిగించాల్సిన అవసరం అంతగా లేదని, దానికోసం కష్టపడనక్కర్లేదని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ర్టాల్లో పోలీసులకు తమ సివిల్‌ సొసైటీ మీదా, నాయకుల మీదా, న్యాయవ్యవస్థమీదా నమ్మకం అంతగా పెరిగిపోయింది. ప్రజాస్వామ్య శక్తులు అంతగా బలాన్ని కోల్పోయాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడుతామని మనసావాచా కర్మణా ప్రమాణం చేసితిరి కదయ్యా అని పాలకులను ప్రశ్నించీ లాభం లేదు. అలాంటి ప్రశ్నలు వినపడే దూరంలో వారు లేరు. ముద్దు మాటలు వినలేదా! బొజ్జల వారి వివరణ చూడలేదా! అంతకుమించి అడవిలో కూలీలకేం పని అన్న వెంకయ్య నాయుడు ప్రశ్న చెవుల్లో రింగురుమనడం లేదా?
అడవిలో కూలీలకేం పని అనడంలో ఆధునిక ఆధిపత్య వ్యాపార శాస్ర్తముంది. నేటి ప్రభుత్వాలకు అడవి ఆస్తి. వనరుల గని. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ప్రభుత్వానికైతే ఎర్రచందనం మరీ కల్పతరువులాగా కనిపిస్తున్న ఆస్తి. ఒక్క ప్రభుత్వానికే కాదు. రాజకీయనాయకుల్లో చాలామందికి ఇవాళ అడవి వేలకోట్ల డబ్బుల మూట. సారాయి వేలంపాటలు, రియల్‌ ఎస్టేట్లు, ప్రాజెక్టుల్లో కమిషన్ల మీదుగా ఎదిగిన రాజకీయ నాయకత్వం చూపంతా అడవులమీదా గుట్టలమీదే ఉంది. ఇది ఆస్తి కోణం. మైదాన ప్రాంతపు ఆధునిక వృత్తులు, పనులు తెలీని ఆదివాసీల్లో చాలామందికి అడవి ఉపాధి. తునికాకో మరో ఆకో అలుమో కాయో పండో ఇచ్చే జీవన వనరు.

samvedana logo copy(1)

 

వాలులో నాలుగు గింజలు వేసుకుంటే నాలుగొందల గింజలిచ్చి పొట్టనింపే ఉపాధి. అడవి వారి జీవనాధారం. జీవనాధారం చేసుకోవడంలో ఇపుడు చనిపోయిన 20 మంది చట్టాలను పట్టించుకోకపోయి ఉండొచ్చు. వారి జీవనాధారంలో నేరకోణం ఉండొచ్చు. కానీ ఆస్తి కోణం ఉన్నవారు అందుకోసమే వేల ఎకరాల్లో ఆ చెట్లను పెంచి నరికి అమ్ముకుంటామని ఇంతకు ముందు ప్రకటించారని గుర్తుంచుకోవాలి. అదేదో వాతావరణం సహకరించదని తర్వాత ఇడియా ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఏమిటి? ఇక్కడ సమస్య చెట్లను కొట్టడం కాదు. ఎవరు కొట్టాలి? ఎవరి ఆస్తి? ఎవరు తరలించుకుపోతారు అనేదే సమస్య.

అక్రమ కొట్టివేతా-సక్రమ కొట్టివేతా తప్ప కొట్టివేత అనేది దానికది నేరమనే భావన ఇక్కడ లేదు. ఆ మాటకొస్తే నల్లమల కొండలకు ఆనుకుని ఉన్న కడప, ప్రకాశం జిల్లాల్లోని మైదానప్రాంతాల్లో చాలా ఇళ్లలో దూలాలు దంతెలు ఎర్రగాకనిపిస్తాయి. బండి గాండ్లు, ఇతరత్రా పరికరాలు ఎర్రచందనమే. ఎక్కువగా దొరికే నాణ్యమైన కర్రగా మాత్రమే వారికి తెలుసు. వారికి ఇపుడిపుడే దాని విలువ తెలుస్తున్నది. అది కర్రకాదు, బంగారం అని అర్థమవుతున్నది. తమ తాతలు తండ్రులు అన్నలు ఊ అంటే అడవిలోకి వెళ్లి నాలుగు కర్రలు నరుక్కొచ్చి ఇంటి పనికి ఉపయోగించేవారని వారు రాజ్యం చంపదగిన నేరాలు చేశారని వారికి ఇపుడిపుడే అర్థమవుతోంది. అది అంతపెద్ద నేరమెప్పుడైందో తెలిసే అవకాశం లేదు. వస్తువు ఖరీదు పెరిగితే అది నేరమవుతుంది, ఆస్తి విలువ కొద్దీ నేర స్వభావం పెరిగిపోతుంది అనే లాజిక్‌ ఇపుడిపుడే అందరికీ అర్థం చేయిస్తోంది ప్రభుత్వం. ఆ రకమైన మెసేజ్‌ని పంపించాలని భావించింది ప్రభుత్వం. మెసేజ్‌ని జనంలోకి పంపించాలనుకున్నపుడు డిమాన్‌స్ర్టేషన్‌ ఎఫెక్ట్‌ యాడ్‌ చేయగలిగితే అంతకు మించిన శక్తిమంతమైన సాధనం ఉండదు. 20 మంది శవాలతో డిమాన్‌స్ర్టేషన్‌ చేశాక ఇంకెవరైనా గొడ్డలి పట్టుకుని అడవిలోకి అడుగుపెడతారా!

20 మంది ఎవరో, ఎవరు కన్నబిడ్డల్లో ఎవరు కట్టుకున్న భర్తలో, ఎవరైతే మనకేంటి? వాళ్లెవరో పరాయివాళ్లు. ఈ మనమూ వాళ్లు అనేదాన్ని ప్రాంతం, కులం, మతం, వస్ర్తధారణ వంటివి నిర్వచిస్తాయి అనే మాట నిజమే కానీ అంతకుమించి నిజంగా నిర్వచించగలిగేది ఆస్తి. వాళ్లు ఆస్తి లేని వాళ్లు. ఆస్తే ఉంటే ఆ పనికి ఎగబడరు, అంతమందిని రాజ్యం చంపే మాటా ఉండదు. ఇక్కడ మైదాన ప్రాంతంలో గొంతుండి పత్రికల్లోటీవీల్లో మాట్లాడగలిగే రాయగలిగే, వినగలిగే, చదవగలిగే మనబోటోళ్లం ఎంతో కొంత భద్రలోకులం. కాబట్టి వారు పరాయివారే. ఆడవి ఆస్తిగా మారాక అడవుల మీద రాజ్యానికి రాజ్యంలో రక్షణ బాధ్యతలు చూసేవారికి గతంలో ఎప్పటికంటే అడవి పూర్తిగా మాదే అన్న సొంత భావన పెరిగిపోయింది. రివర్స్‌ లాజిక్‌లో ఆదివాసీలకు అడవితో ఏం పని అనే రోజులొచ్చాయి.

sheshashalam
నిజమే. వాళ్లు రాజ్యానికి చెందిన ఆస్తి అయినటువంటి చెట్లను నరికేశారు. వాళ్లు బండవాళ్లు, మొరటు వాళ్లు. నిజమే. ఆయా ప్రాంతాల్లో తిరిగి వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడానికి ప్రయత్నించిన వారితో కూడా మొరటుగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నమాట నిజమే. ఒకనాడు మన రాష్ర్టంలో స్టువర్ట్‌ పురంలా పేరుబడిన సోకాల్డ్‌ ‘నోటిఫైడ్‌’ ప్రాంతాల వారు అయిన మాట వాస్తవమే. అందరమూ అక్కడినుంచి వచ్చినవారమే. మనిషి పుట్టుకతోనే బ్రాండెడ్‌ షర్టుతోనూ బ్రాండెడ్‌ ఉద్యోగంతోనూ పుట్టలేదు. అందరమూ అడవులనుంచి ఆదిమ దశనుంచి వచ్చినవారమే. దాటి వచ్చిన దశ పట్ల అంత వ్యతిరేకత ప్రదర్శించడం మన సమాజంలోని అప్రజాస్వామిక లక్షణాల్లో ఒకటి. అడవుల అందం పట్ల అంతులేని గ్లామర్ అక్కడి ప్రజల పట్ల అంతులేని చిన్నచూపూ ప్రదర్శించుకునే వాళ్ సంఖ్య పెరిగిపోతున్నది. అడవి అనే ఆస్తి కావాలి. అడవి బిడ్డలు వద్దు. వాళ్లు ప్రజాధనాన్ని దోచుకోవాలనుకున్నారు కాబట్టి కాల్చేశామంటున్నారు కదా!

అంతకంటే దారుణంగా కమిషన్ల రూపంలో లంచాల రూపంలో ప్రజాధనాన్ని టేబుల్‌ కిందినుంచో పైనుంచో చేతులు చాచేవాళ్లను ఇలాగే కాల్చేస్తే సివిల్‌ సొసైటీ ఇలాగే మౌనం వహిస్తుందా, భలే పని చేశారు గురూ అనగలుగుతుందా అని వాదనకోసమైనా అనలేం. రకరకాల రూపాల్లో ప్రభుత్వానికి రావాల్సి పన్నులనునొక్కేసే తెల్లచొక్కాయి మనుషులను ఇలాగే పట్టుకుని కాల్చిచంపేయగలరా అని అడగలేం. వాళ్లంతా భద్రజీవితంలో ఉన్నవాళ్లు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఆఫీసర్‌ ప్రత్యక్షంగా దోపిడీ చేస్తూ పట్టుబడినా నేరం రుజువు కాకముందే నేరస్తుడెట్లా అంటారు అని వైట్‌ కాలరెగరేసి మాట్లాడగలడు. నాకు భారత న్యాయవ్యవస్థమీద నమ్మకం ఉంది గంభీరంగా మైకుల ముందు చెప్పగలడు. ఇపుడు చనిపోయిన 20 మంది ఉన్నారే వాళ్లు అలా చెప్పలేరు. వాళ్లకు మన వ్యవస్థ మీద అంత నమ్మకము ఉండదు. నమ్మకం ఎలా ఉంటుంది?

పోలీసులు తప్ప మరో శాఖ ఆ తండాలను గ్రామాలను సందర్శించకుండా ఉన్నపుడు బూతులు బెదిరింపులు తప్ప మరో మంచి మాట చెవి సోకనపుడు వారికి ఏ వ్యవస్థమీదైనా నమ్మకం ఎలా కలుగుతుంది? ఆయా ప్రాంతాలు దోపిడీదొంగల ప్రాంతాలని, వీరప్పన్‌ ప్రభావిత ప్రాంతాలని గట్టిగట్టిగా ప్రచారం చేయడం వల్ల వాళ్లు వేరే వాళ్లు వేరే అనే పరాయిభావనను అదే పనిగా జనంలోకి పంపించడం ఎత్తుగడ. ఈ ఎత్తుగడ కేవలం రాజ్యానిది మాత్రమే కాదు. ఆస్తిపరులందరిదీ. రాజ్యం కేటలిస్ట్‌ మాత్రమే. కశ్మీర్‌ను ఎలాగైతే ఆస్తిగా చూసి అక్కడ తిరగబడే వారిని ఎంతమందిని కాల్చితే అంత సంతోషపడే స్వభావాన్ని పెంచుకున్నారో ఇపుడలాగే శేషాచలం అడవులను ఆస్తిగా చూపి ఆ ఆస్తిపై కన్నేసినా చేయేసినా చంపేయొచ్చనే భావనను మధ్యతరగతిలో పెంచగలుగుతున్నది.
మన దేశంలో ప్రజాస్వామ్యం చిత్రమైనది. ఇది అవసరమైనపుడు నాలుగు పడగలు, పది తలలు తొడుక్కోగలదు. అది ఒకవైపు అమెరికాను ఆదర్శంగా చూపుతూ అక్కడ చూడండి రూల్‌ అంటే రూలే అనగలదు. ఏం కోర్టులండీ, కాల్చేస్తే గానీ బుద్ధిరాదు అని అదే నోటితో తాలిబన్ల లాజిక్‌ కూడా వినిపించగలదు. అక్కడ ఆధునిక బూర్జువా రాజ్యం ఆదర్శం కాదు. ఎక్కడ ఏది అవసరమైతే అది అనే ప్రాతిపదికన ఈ రాజ్యం నడుస్తుంది. తమకు అవసరమైనపుడు చట్టం ఒకటుంది కదండీ అనగలదు. అవసరం లేదు అనుకుంటే అన్నింటికీ చట్టాలంటే కుదరదండీ, పది మందిని వేసేస్తే గానీ పదకొండో మనిషికి తెలివిరాదు అనగలదు. రాజ్యాంగం రాసేటప్పుడు సూత్రబద్ధవైఖరుల కోసం నాటి మేధావులు అనేకానేక రాజ్యాంగాల మీద ఆధారపడ్డారు. వివిధ దేశాల్లో కాలక్రమేణా ముందుకు వచ్చిన విలువలు, నాగరికత తీసుకునే ప్రయత్నం చేశారు. ఇవాల్టి నేతలు తమ అవసరాల కోసం తమ క్రూరత్వాన్ని సమర్థించుకోవడం కోసం ఎక్కడెక్కడి అనాగరిక పద్ధతులను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

కానీ సమస్యలను తుపాకీతో పరిష్కరించాలనుకునే దేశాలు ఏమయ్యాయో ఈ దేశపు పాలకులు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది. తుపాకీ తాత్కాలికంగా గ్లామరస్‌గా కనిపించొచ్చు, తక్షణ పరిష్కారంగా కనిపించొచ్చుగానీ అది పాలకులకు ఈ వ్యవస్థకే ప్రమాదకరం అని గుర్తించాలి. ఆస్తి ప్రాతిపదికన మనుషులను శిక్షించదగినవారు- శిక్షించకూడని వారు, అందులోనూ చంపదగినవారు చంపకూడని వారు అని విభజించే ఈ విచిత్రన్యాయం ప్రమాదకరమైనది. ఈ దేశపు పేదలు ఇవాళ తెలుగువారు తమిళనాడు వారుగానో ఆదివాసీలు, మైదానప్రాంతం వారుగానో చీలిపోయి ఉండొచ్చును. ఆర్థిక అంతరాల వల్ల పేదలు కూడా తమకింద ఇంకా దరిద్రులున్నారనే భావనలో ఆధిక్యభావనలో ఉండొచ్చు. భద్రలోక భావజాలం అవసరమైన వారికంటే ఎక్కువమందిలో మాయలాగా కమ్మి ఉండొచ్చు. వారికి ఉమ్మడిగా గొంతునిచ్చే శక్తులు బలహీనంగా ఉండొచ్చును. కానీ ఏ బలహీనతా శాశ్వతం కాదు.
*

ఎందుకీ సంభాషణ?!

 

ప్రపంచంలోని అన్ని వృత్తులలోకీ పురాతనమైనది వేశ్యావృత్తి. మనుషుల్లోనే కాదు, దేవతల్లోనూ వేశ్యలున్నారని మన పురాణాలు చెప్తున్నాయి. రంభాది అప్సరసలు అందుకు ఉదాహరణగా కన్పిస్తున్నారు. దేవేంద్రుడు తన సింహాసనాన్ని కాపాడు కోవడానికి వేశ్యల సేవల్ని పొందినట్టుగా పురాణాలు వివరిస్తున్నాయి. వేశ్యల్ని సమాజం ఎలా ఉపయోగించు కొన్నదో, రాజులు ఎలా ఉపయోగించు కొన్నారో అనేక చోట్ల రికార్డైంది. వాళ్ళ జీవితాలు ఎంత దయనీయంగా గడుస్తాయో వర్ణించే రచనలు కొల్ల. కానీ, వేశ్యల ఆలోచనలు, వాళ్ళు అభ్యసించే విద్యలూ, వాళ్ళ వృత్తిలో ఎదురయ్యే సమస్యలు, విటుల్ని ఆకర్షించేందుకు వాళ్ళు పన్నే ఎత్తుగడలూ… వీటిని గురించి సాహిత్యం తక్కువగానే మాట్లాడింది.

ఏదో వెతుకుతుంటే మరేదో దొరికినట్టు లూషియన్ రాసిన మైమ్స్ ఆఫ్ ది కోర్ట్జాన్స్ అనే పుస్తకం కళ్ళ బడింది. క్రీస్తు శకం ఒకటో శతాబ్దిలో రాసినట్టుగా చెప్తున్న ఈ గ్రంధం ఆ కాలంలోని వేశ్యల జీవితాలను, వాళ్ళ ఆలోచనలను, ఆ వృత్తిలో ఉండే సాదక బాధకాలనూ చక్కగా వివరిస్తుంది. ఆనాటి సమాజ స్వరూపం కూడా పరోక్షంగా మనకు కన్పిస్తూనే ఉంటుంది. ఒక్కొక్క సంభాషణ ఒకటి రెండు పేజీలకు మించకుండా అశ్లీలానికి పెద్దగా తావివ్వకుండా రచనా నిర్వహణలో లూషియన్ చూపిన నైపుణ్యం అబ్బుర పరుస్తుంది. ఈ పుస్తకం చదివాక ఇలాంటి రచనలు భారతీయ భాషల్లో ఉన్నాయా అని వెదికాను. నేను చూసినంతలో దొరకలేదు.

fmimg4928766720090356427

ఐతే, సంస్కృతంలో భాణం అనే ప్రక్రియలో రాయబడిన రచనల్లో ఈ బాపతు ఉన్నాయని విన్నాను. దశవిధ రూపకాల్లో ఒకటైన భాణం అనేది ఏకాంకిక రూపంలో ఉంటుందనీ, భాణంలో వస్తువు ధూర్తచరితం అయ్యుండాలనీ, నాయకుడు విటుడై ఉండాలనీ విన్నాను. నాకు సంస్కృతం రాకపోవడం వల్లా, తెలుగులో భాణాలకు అనువాదాలు లభించకపోవడం వల్లా, వాటిని పరిశీలించే అవకాశం కుదరలేదు.
ఒకటికి రెండుసార్లు ఈ సంభాషణలు చదివిన తర్వాత తెలుగులో సుప్రసిద్ధమైన కన్యాశుల్కం, చింతామణి, మధుసేవ వంటి నాటకాలలోని కొన్ని సంభాషణలు వస్తువులో లూషియన్ రచనను పోలి ఉన్నాయని అనిపించింది. అలాగే, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గార్ల కథల్లోని కొన్ని సంభాషణలు కూడా! క్రీడాభిరామం లోని ఒకటి రెండు సన్నివేశాలను సంభాషణ రూపంలోకి మారిస్తే ఇలాంటి రచనలోకి ఒదుగుతాయని అనిపించింది.
title వెంటనే వీటన్నిటినీ ఒకచోట సంకలనంగా కూర్చి ఒకటికి నాలుగు సార్లు చదివాను. తెలుగులోని ఆయా నాటకాల్లోనుంచి అతి స్వల్ప మార్పులతో ఈ సన్నివేశాలను వేరుచేసి లూషియన్ సంభాషణలతో కలిపి చదివినప్పుడు ఆయా సన్నివేశాలు కొత్త రూపాన్నీ, కొత్త భావాన్నీ సంతరించుకోవడం గమనించాను. మొత్తమ్మీద వీటిని చదవడం ఒక విలక్షణమైన అనుభవంగా భావించాను.
ఉత్సాహంకొద్దీ చూపించగా, ఈ కూర్పు మొత్తాన్నీ చదివిన మిత్రులు పెద్ది రామారావు దీన్ని పుస్తకంగా తెస్తే బాగుంటుందని అన్నారు. అక్కడి నుంచి పుస్తకంగా తేవడం గురించి ఆలోచించాను. ఏమిటి ప్రయోజనం? ఎందుకు తేవాలి? ఈ ప్రశ్నలకు నాకు సంతృప్తి కలిగించిన సమాధానాలు రెండు. ఒకటి, ఇలాంటి పుస్తకం తెలుగులో లేదు కాబట్టి. రెండు, పుస్తకంలోని వస్తువు ఆసక్తికరమైనది కాబట్టి కొందరైనా చదువుతారు. నాకీ జ్ఞానం కలగటం వల్ల బహుశా ఈ సంభాషణలు పుస్తక రూపంలో రావొచ్చు.

(ఈ సంభాషణలు వచ్చే వారం నుంచి వరసగా…)

 *

 

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ [Anne of Green Gables ]

 – లూసీ మాడ్ మాంట్ గోమరీ    [ L.M. Montgomery ]

[ లూసీ మాడ్ మాంట్ గోమరీ[ 1874-1942 ]  ప్రసిద్ధ కెనడియన్ రచయిత్రి. తర్వాతి కాలం లో  9 నుంచి పన్నెండేళ్ళ పిల్లల సాహిత్యంగా గుర్తించబడినా ఆమె రచనలు వయోభేదానికి అతీతంగా అందరూ చదవదగినవి…అందమైన మానవసంబంధాలు , వ్యక్తిగతమైన ఎదుగుదల, ప్రకృతితోనూ  పరిసరాలతోనూ లయ కల్పించుకోవటం – ఆమె కథా వస్తువులు. ఆమె స్వయం గా పుట్టి పెరిగిన Prince Edward Island  చాలా రచనలకు నేపథ్యం .

  Anne of Green Gables 1908 లో రాయబడింది, ఎప్పుడూ out of print  కాలేదు. 20 భాషలలోకి అనువాదమైంది, 50 మిలియన్ లకు పైబడిన కాపీలు అమ్ముడు పోయింది. ప్రపంచమంతా సాహిత్యాధ్యయనం లో భాగమైంది. సినిమాలుగా టివి సీరీస్ లు గా సంగీత రూపకాలుగా ఈ నవల, దాని తరువాయి భాగాలు తయారవుతూనే ఉంటాయి.]

anne1

అవోన్లియా పల్లెటూళ్ళో  ఆ  వీధి మిసెస్ లిండ్ఇంటి  మీదుగా   కాస్త పల్లానికి దిగి   వెళుతుంది.    ఆ పక్కా ఈ పక్కా ఆల్డర్ పూల చెట్లూ ఫ్యూషియా మొక్కలూ . కొండలమీది అడవుల్లో పుట్టిన సెలయేరు ఒకటి  ఆ పక్కగా వస్తుంటుంది.  అంతకుముందరేమైనా  అల్లరిగా  గంతులేసినా   మిసెస్ లిండ్ ఇంటి దగ్గరికి వచ్చెసరికి సెలయేరు కూడా  నెమ్మదిగా, మర్యాదగా ఉండాల్సిందే…కిటికీ పక్కనే కూర్చుని ఆవిడ వచ్చేపోయే వాళ్ళందరి మీదా ఒక కన్ను వేసే ఉంచుతుంది మరి ! ఏది ఏమాత్రం తేడా గా కనిపించినా దాని సంగతంతా మొదలంటా కనుక్కోనిదే ఆవిడ ఊరుకోదు.

ఆ ఊళ్ళో – వాళ్ళ పనులు మానేసుకుని అయినా పక్కవాళ్ళ గొడవలు పట్టించుకోగలవాళ్ళు చాలా మందే ఉన్నారు. మిసెస్ లిండ్ అలా కాదు- ఆవిడ ఎంతో పద్ధతైన ఇల్లాలు , ఏ వంకా లేకుండా పనులు చక్కబెట్టుకుంటుంది. ఆ పైన  కుట్టు తరగతులూ పిల్లలకి ఆదివారం బడీ  చర్చ్ తరపున చేసే దానధర్మాలూ ప్రచారాలూ – ఏవీ ఆవిడ లేకుండా జరగవు.  ఇంత చేసీ వంటింటి కిటికీలో బొంత కుట్టుకుంటూ కూర్చుని ఊరి మంచీ చెడ్డా కనిపెట్టేందుకు ఆవిడకి చాలా  తీరుబడి ఉంటుంది. [  అప్పటికి పదహారు బొంతలు అటువంటివి కుట్టిందనీ ఆ చుట్టుపక్కల ఆ విషయం లో సాటి ఎవరూ లేరనీ చెప్పుకుంటారు  ] . అవోన్లియా  కి రెండు వైపులా సముద్రం , ఒక వైపు కొండ.  ఊరు ఇంచుమించు ముక్కోణపు ఆకారం లో ఉంటుంది.

ఒక జూన్ నెల మధ్యాహ్నం మిసెస్ లిండ్ ఎప్పట్లాగే వంటింటి కిటికీ పక్కన కూర్చుని ఉంది. సూర్యుడు వెచ్చగా వెలుగుతున్నాడు. కొండవాలు మీది తోటలో పువ్వులు లేత గులాబి రంగులో విచ్చుకున్నాయి , తే నెటీగలు  రొద పెడుతున్నాయి.  పొట్టిగా , మెతకగా ఉండే   థామస్ లిండ్ [మిసెస్ లిండ్ భర్త ] పొలం లో టర్నిప్ గింజలు పాతుతున్నాడు. ఆ చివరన గ్రీన్ గేబుల్స్ దగ్గర మాథ్యూ కుత్ బర్ట్  కూడా ఆ పనే చేయాల్సి ఉంది,ఎవరో అడిగితే పొద్దున చెప్పాడటకూడా [ అడగనిదే ఎవరితోనూ ఏమీ చెప్పడు ]…కాని మాథ్యూ  అప్పుడు పొలం లో లేడు. మధ్యాహ్నం మూడున్నరకి , మంచి పనివేళన- మంచి సూట్ వేసుకుని తయారై నిదానం గా గుర్రపు బండి లో బయల్దేరాడు- ఎక్కడికి ? ఎందుకు ?

అది ఇంకెవరైనా అయిఉంటే , మిసెస్ లిండ్ చిలవలూ పలవలూ అల్లి ఉండేది. కాని మాథ్యూ చాలా సిగ్గరి, ఇంట్లోంచి బయటికే వెళ్ళడు. కొత్తవాళ్ళని పలకరించాలంటే ఆమడ దూరం లో ఉంటాడు. అలాంటి మనిషి ఏమిటిలా…మిసెస్ లిండ్ కి బుర్ర తోచలేదు, చేతిలో పని సాగలేదు. ” గ్రీన్ గేబుల్స్ కి వెళ్ళి మెరిల్లా ని అడిగితే సరి. టర్నిప్ గింజల కోసం అయితే ఇలా ముస్తాబు చేసుకుని వెళ్ళడు కదా ? ఏ డాక్టర్ దగ్గరికో అయితే ఇంత నింపాదిగా కదలడు కదా ? ఏదో అయింది, ఏదో జరిగింది- ” …బయల్దేరింది. వీళ్ళ ఇంటికీ గ్రీన్ గేబుల్స్ కీ అర మైలు దూరం కూడా లేదు. గ్రీన్ గేబుల్స్ బాగా పెద్ద ఇల్లు.చుట్టూ పెద్ద తోట. ఆ ఇల్లు  మాథ్యూ నాన్న కట్టినది. ఆయనా కొడుకు లాగే సిగ్గరి. మరీ అడవిలో ఉండలేడు కనుక అందరికీ వీలైనంత దూరంగా , పొలానికి ఆ చివర్న ఇల్లు కట్టుకున్నాడు. చెట్ల చాటునుంచి అది ఒక పట్టాన ఎవరికీ కనబడేలా ఉండదు.

గడ్డి ఒత్తుగా పెరిగిన బాటకి అటూ ఇటూ అడవి గులాబి పొదలు విరబూసి ఉన్నాయి. ఆ ఇల్లు దగ్గర పడే కొద్దీ చడీ చప్పుడూ మాయమవుతాయి . మిసెస్ లిండ్ అనుకుంది – ” ఏమిటో ఈ ఇల్లు..ఎన్ని చెట్లుంటే మాత్రం, అవేమన్నా కబుర్లు చెబుతాయా ? ఎలా ఉంటారో అన్నా చెల్లెలూ ఇక్కడ ! ఏదో సామెత చెప్పినట్లు, దేనికైనా అలవాటు పడిపోవచ్చటలే … నా వల్లయితే కాదబ్బా ! ” పెరటి గుమ్మం లోంచి లోపలికి వెళ్ళింది. అద్దంలా తీర్చిదిద్దినట్లు,  పచ్చగా కళకళలాడుతోంది  పెరడు.  ఒక వైపున భారీగా ఎదిగిన విల్లో వృక్షాలూ ఇంకో వైపున మట్టసం గా లోంబార్డీ చెట్లూ. మెరిల్లా ఇల్లు చిమ్మినంత శ్రద్ధగా చిమ్ముతుందేమో పెరడంతా, నేల  మీద వడ్డించుకుని భోజనం చేసేంత శుభ్రంగా  ఉంటుంది.

తలుపు కొట్టి లోపలికి, వంటింట్లోకి  అడుగు పెట్టింది మిసెస్ లిండ్.   పడమటి  వైపు కిటికీ లోంచి మెత్తటి సూర్యకాంతి కురుస్తోంది. తూర్పు వైపు కిటికీకి ఆకుపసుపు తీగలు అల్లిబిల్లిగా అల్లుకున్నాయి..వాటిలోంచి  లోంచి పూత పట్టిన చెర్రీ చెట్టు ఊగుతూంది, బర్చ్ చెట్లు నాజూగ్గా తలలూపుతున్నాయి. మెరిల్లా కుత్ బర్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుంటుంది [ ఖాళీ గా ఉండటమంటూ ఉంటే ] . అప్పుడూ కూర్చుని ఉంది, పెద్దమనిషి తరహాగా, ఊలు అల్లుకుంటూ. సూర్యకిరణాలు బాధ్యత లేకుండా అలా చిందులేయచ్చా అనుకోగల మనిషి ఆమె,  అంత కట్టుదిట్టమైనది.

మిసెస్ లిండ్ వస్తూనే అంతా గమనించింది. ..ఎదురుగా బల్ల మీద ముగ్గురి కోసం భోజనం వడ్డించి ఉంది.ఎవరో అతిథులు వస్తారు కాబోలు, కాని ప్రత్యేకంగా చేసిన పదార్థాలేవీ లేవు, రోజువారీవే, ఒక్క క్రాబ్ ఆపిల్ కేక్ తప్పించి. మరయితే ఆ మాథ్యూ హడావిడి ఎందుకోసం ? మిసెస్ లిండ్ ప్రాణానికి అదొక గొప్ప రహస్యమనిపించింది.

మిసెస్ లిండ్ ని ఆహ్వానించింది మెరిల్లా  – ” గుడ్ ఈవెనింగ్  రాచెల్. రా, కూర్చో. ఎలా ఉన్నారు అందరూ ? ”

మెరిల్లా కుత్ బర్ట్ కీ రాచెల్ లిండ్ కీ మధ్య ఉన్నదాన్ని స్నేహం అనచ్చో లేదో కాని ఇద్దరూ దగ్గరివాళ్ళు మాత్రం అవును.

మెరిల్లా సన్నగా పొడుగ్గా బద్దలాగా ఉంటుంది. అక్కడక్కడా తెల్లబడ్డ జుట్టుని వెనక్కి లాగి ముడి పెట్టింది. పొడుచుకొచ్చే రెండు చెంప పిన్నులు అటూ ఇటూ దూర్చింది. ఎక్కువ ప్రపంచాన్ని చూడని మనిషి లాగా, పాతకాలం గా , కనిపిస్తుంది. ఆమె పెదవులలో మాత్రం ఎక్కడో లీలగా హాస్య ప్రియత్వం తెలుస్తుంటుంది.

మిసెస్ లిండ్ అంది – ” అందరం బా గా నే ఉన్నాంలే..మీ సంగతేమిటి ? మాథ్యూ అలా వెళ్తున్నాడేమిటీ ? కొంపదీసి డాక్టర్ కోసమైతే కాదుగదా ? ”

మెరిల్లా పెదవులు కొంచెం విచ్చుకున్నాయి. రాచెల్ లిండ్ ఇహనో ఇప్పుడో వచ్చేస్తుందని ఆమె అనుకుంటూనే ఉంది, అంత కుతూహలాన్ని ఆవిడ తట్టుకోలేదని మెరిల్లాకి తెలుసు.

anne3

” అదేమీ లేదు రాచెల్. కాస్త తలనొప్పిగా ఉందిగాని నేను బాగానే ఉన్నాను. నోవా స్కోటియా లో అనాథాశ్రమం ఉంది కదా, అక్కడినుంచి ఒక చిన్న పిల్లాడు   ఇవాళ సాయంత్రం రైల్లో వస్తాడు . పెంచుకుందామని తెచ్చుకుంటున్నాం ” – చెప్పేసింది.

ఆస్ట్రేలియానుంచి వచ్చే ఒక కంగారూని మాథ్యూ కలుసుకునేందుకు వెళ్ళాడని విన్నా రాచెల్ లిండ్ అంత ఆశ్చర్యపడిఉండదు.ఐదారు క్షణాలపాటు మాట కూడా పెగల్లేదు.  మెరిల్లా వేళాకోళం చేసే మనిషి కాదు, కాని అలాగే ఉంది చూడబోతే.

కాస్త తేరుకుని అంది – ” నిజమేనా మెరిల్లా ? ”

” ఆ.నిజమే ” యథాలాపంగా అంది మెరిల్లా… గిరిగీసుకున్నట్లుండే  అవోన్లియా లో అనాథాశ్రమాల్లోంచి అబ్బాయిలని పెంచుకుందుకు తెచ్చుకోవటం చాలా మామూలైన విషయం అన్నట్లు.

మిసెస్ లిండ్ పెద్ద కుదుపు తగిలినదానిలా అయింది. అనాథ పిల్లాడా  ? మెరిల్లా , మాథ్యూలు పెంచుకుంటారా ? ఇదేం విపరీతం ?? ఇహ  మీదట ఎలాంటి  వార్త విన్నా వింత ఉండదని అనుకుంది ఆవిడ.

” మీకసలు అలా ఎందుకనిపించింది మెరిల్లా ? ” నిరసనగా అడిగింది . మిసెస్ లిండ్ సలహా తీసుకుని ఆ పని తలపెట్టలేదు కనుక నిరసన ప్రకటించి తీరాలి ఆవిడ.

” ఒక్కసారిగా కాదులే, చాలా రోజులనుంచీ అనుకుంటున్నాం. మొన్న క్రిస్మస్ కి  మిసెస్ అలెక్జాండర్ స్పెన్సర్ వచ్చింది చూడు, తను చెప్పింది- హోప్ లో అనాథాశ్రమం నుంచి ఒక అమ్మాయిని తెచ్చి పెంచుకుంటున్నానని, ఈ పాటికి తెచ్చుకునే ఉంటుంది. అప్పుడనుకున్నాం, ఒక అబ్బాయిని పెంచుకోవాలని. మాథ్యూ కూడా పెద్దవాడైపోతున్నాడు, అరవై నిండాయి. ఇదివరకట్లా పనిచేయలేకపోతున్నాడు పాపం. కాస్త సాయం చేసి పెట్టేందుకు సరైన మనుషులే దొరకట్లేదు. ఎవరో దొరికి వాళ్ళకి కాస్త పని నేర్పించే లోపు  పట్నాల కి వెళ్ళిపోతున్నారాయె. మిసెస్ స్పెన్సర్ ని , ఆమె వెళ్ళినప్పుడు మాకూ ఒక పది పదకొండేళ్ళ అబ్బాయిని వెతికి పెట్టమన్నాం, కాస్త చురుకైన వాణ్ణి. ఆ వయసైతే కాస్త పని అందుకోగలరు, చెబితే వింటారు. ఇంట్లో పెట్టుకుని , రోజూ బడికి పంపించి చదివిస్తాం వాడిని. మిసెస్ స్పెన్సర్ ఇచ్చిన టెలిగ్రాం నిన్న వచ్చింది, ఇవాళ సాయంత్రం అయిదున్నర కి పిల్లాడిని ఇక్కడ బ్రైట్ రివర్  స్టేషన్ లో దిగబెడుతున్నట్లు ‘’-మెరిల్లా చెప్పుకొచ్చింది.

తనెప్పుడూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలనని మిసెస్ లిండ్ కి నమ్మకం. కాస్త నిభాయించుకుని తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటించింది .

” అది కాదు మెరిల్లా, ఇదెంత పిచ్చి పనో తెలుస్తోందా మీకు ? సాహసం కూడానూ…ఎవరో దారేపోయేవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా చెప్పు ? వాడెవరో ఏమిటో, వాడి అమ్మా నాన్నా ఎలాంటివాళ్ళో, రాను రాను ఎలా తయారవుతాడో ? నిన్నగాక మొన్న పేపర్ లో చూశాను, ఒక భార్యా భర్తా ఇలాగే ఎవర్నో తెచ్చి పెంచుకుంటుంటే ఆ దరిద్రుడు  అర్థరాత్రి కొంపకి నిప్పెట్టాడట, కావాలనే పెట్టాడు తెలుసా ? ఇద్దరూ మంటల్లో కాలి బుగ్గయిపోయారు పాపం. అంత కాకపోయినా,  ఇంకొక చోట ఇలాంటివాడే దొంగతనాలు మరిగాడట, వాణ్ణి వదిలించుకోలేక పెంచుకునేవాళ్ళకి తల ప్రాణం తోకకొస్తోంది.  నాకొక్క మాటైనా చెప్పలేదు మీరు…తప్పకుండా వద్దని ఉండేదాన్ని ”

ఈ హితబోధ మెరిల్లా మీద ఏమీ పని చేసినట్లు లేదు, ఆమె శాంతంగా ఊలు అల్లుకుంటూ జవాబిచ్చింది.

” నువ్వనేదాంట్లో నిజం ఉందిలే రాచెల్, నాకూ కొంచెం భయం గానే ఉండింది- కాని మాథ్యూ బాగా పట్టుపట్టాడు. నీకు తెలుసుగా, మామూలుగా ఏదీ గట్టిగా అడగడు – అందుకు ఒప్పుకున్నాను. అపాయాలంటావా, ఎక్కడ లేవు చెప్పు ? సొంత పిల్లలైతే మటుకు పెద్దయాక వెధవలు  కారని ఏముంది ? నోవా స్కోటియా మనకి దగ్గరే- ఇంగ్లాండో, అమెరికానో కాదుగా.. వాడూ మనలాంటి వాడే అయిఉంటాడు కదా ? ”

మిసెస్ లిండ్  కొనసాగించింది – ” సరేలే, ఏదో ఒకటి. అంతా బావుంటుందనే అనుకుందాం. వాడు రేపేదైనా అఘాయిత్యం  చేస్తే – నేను చెప్పలేదని మాత్రం అనుకోకు…ఇంటికి నిప్పు పెట్టటమో, బావిలో విషం కలపటమో- అలాంటిదేదో. అక్కడెక్కడో ఇలాగే ఇంటిల్లిపాదీ ఆ నీళ్ళు తాగి మెలికలు తిరిగి చచ్చారట…పెంచుకుంటున్న ఆడ పిల్ల చేసింది ఆ పని. ”

మెరిల్లా అంది ” మేము పెంచుకునేది ఆడపిల్లని కాదు గా ” అని, ఆ బావిలో విషం కలపటమనే పని ఆడపిల్లలే చేస్తారు, మగపిల్లలు చెయ్యలేరన్నట్లు. మళ్ళీ అంది – ” ఆ మిసెస్ స్పెన్సర్ ఆడపిల్లని ఎందుకు పెంచుకుంటోందో నాకు చచ్చినా అర్థం కాదు , విడ్డూరపు మనిషి ”

మాథ్యూ ఆ పిల్లాడిని వెంటబెట్టుకొచ్చే వరకూ ఉందామనే మిసెస్ లిండ్ అనుకుంది, కాని అందుకు కనీసం ఇంకొక రెండు గంటలు పడుతుంది. ఈ లోపు అలా బయటికి వెళ్ళి ఎవరో ఒకరి చెవిలో ఈ మాట వేయచ్చు, మంచి హడావిడయిపోతుంది. అటువంటి అలజళ్ళు సృష్టించటమంటే మిసెస్ లిండ్ కి ఎంతో ప్రీతి…మెల్లిగా జారుకుంది. మెరిల్లా ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది..మి సెస్ లిండ్ ఉన్నంతసేపూ మెరిల్లా  భయాలూ అనుమానాలూ ఎక్కువైపోతూనే ఉన్నాయి.

దారి వెంట పోతూ మిసెస్ లిండ్ పైకే అనేసుకుంది – ” ఏమన్నా నమ్మేటట్లుందా  ఇది ?   ఆ పిల్లాడెవరో గానీ , వాడి పనైపోతుంది ఇంక – మెరిల్లాకీ మాథ్యూ కీ పిల్లల్ని పెంచటం ఒక్క రవ్వైనా తెలుసా అని ! ఆ చిన్న వెధవ , వాడి తాతయ్య అంత కుదురుగా తెలివిగా ఉండాలనుకుంటారు వీళ్ళు – పాపం వాడికసలు తాతయ్య ఉన్నాడో లేదో. అసలా గ్రీన్ గేబుల్స్ లో చిన్న పిల్లాడిని ఊహించుకుందుకే కష్టంగా ఉంది. ఆ ఇల్లు కట్టే నాటికే మాథ్యూ మెరిల్లా ఎదిగిపోయారు. వాళ్ళ మొహాలు చూస్తే అసలొకనాడు వాళ్ళూ పిల్లలేనని అనిపించదు కదా . ఆ పిల్లాడెలా నెగ్గుకొస్తాడో ఏమిటో ”

బ్రైట్ రివర్ స్టేషన్ లో దిగి మాథ్యూ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్న ఆ చిన్న శాల్తీని గాని మిసెస్ లిండ్ అప్పుడు చూసి ఉంటే ఇంకెంత జాలిపడేదో !!!

                                           [ఇంకా ఉంది]

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇంకా తెలియని చందమామ కథలెన్నో!

                                                                                        కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పురా ప్రపంచపు లోలోపలికి వెడుతున్నకొద్దీ ఆ ప్రపంచమూ, నేడు మనం జీవిస్తున్న ప్రపంచమూ  రెండు వేర్వేరు గ్రహాలనిపిస్తాయి.  ఆవిధంగా ఈ వ్యాసాలలో నేను చేస్తున్నది గ్రహాంతరయానమే.

పురాప్రపంచం, భౌతికవాస్తవికతను మాంత్రికవాస్తవికత కప్పేసిన ప్రపంచం.  రెండూ ఒకదానితో ఒకటి తాదాత్మ్యం చెందిన ప్రపంచం. నేటి మన ప్రపంచం వేరు. ఇది పురాప్రపంచంతో నేటికీ వదులు వదులుగా నైనా అనుసంధానం కలిగిన ప్రపంచమే కానీ, ఆ సంగతి తెలియని అజ్ఞానం దానిది. అలాగే నేటి ప్రపంచం తనకు మాంత్రిక వాస్తవికత ఏమిటో, భౌతికవాస్తవికత ఏమిటో తెలుసుననుకుంటూ ఉంటుంది. అయితే రెండూ పాలూ, నీళ్లలా వేర్వేరు అనుకుంటుందే తప్ప; పాలూనీళ్లలా అవి కలసిపోయి ఉన్న పురాప్రపంచాన్ని అది పోల్చుకోలేదు….

ఇంతకుముందు అనేకసార్లు చెప్పుకున్నట్టు;  పురాకాలపు మాంత్రిక ప్రపంచం, దాదాపు ప్రపంచమంతా ఒకేలా పంచుకున్న ప్రపంచం!

ఈ సందర్భంలో పద్దెనిమిదేళ్ళ క్రితం వచ్చిన ‘నాగమండల’ అనే సినిమా గుర్తొస్తోంది.  మూడుసార్లైనా దానిని చూసి ఉంటాను. గుర్తొచ్చినప్పుడల్లా అందులోని కథా, చిత్రీకరణా, సన్నివేశాలూ, పాటలూ ఆవిష్కరించిన అద్భుత మాంత్రిక ప్రపంచం నా కళ్ళముందు ఇప్పటికీ పచ్చ పచ్చగా కదలాడుతూ ఉంటుంది. ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ అదే పేరుతో రాసిన కన్నడ నాటకానికి ఇది చిత్రానువాదం.

అప్పన్న ఒక మొరటోడు. అతనికో ఉంపుడుగత్తె. చనిపోయిన అతని తల్లి మీద అభిమానం కలిగిన ఒక ముసలామె అతనికి పెళ్లి చేయాలనుకుంటుంది. పొరుగూరికి వెళ్ళి ఒక సంబంధం ఖాయం చేసుకుని, అప్పన్నను ఒప్పించి పెళ్లి జరిపిస్తుంది. ముగ్ధత్వం, అమాయకత్వం, భయం నిండిన బాల్య కౌమార దశలను దాటి పూర్తిగా యవ్వనంలోకి రాని రాణి కాపురానికి వస్తుంది. ఇంట్లో తనూ, భర్తే. తొలిరేయి అప్పన్న భార్యతో మొరటుగా ప్రవర్తించేసరికి భయపడిపోయి అతన్ని నెట్టేస్తుంది. దాంతో కోపం వచ్చిన అప్పన్న అప్పటికప్పుడు ఇంటికి తాళం వేసి ఉంపుడుగత్తె దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పటినుంచి రోజూ అదే వరస.

ముసలామెకు ఇది తెలిసి ఒక మూలికను తెచ్చి రాణికి ఇచ్చి, దానితో కషాయం చేసి పాలల్లో కలిపి నీ మొగుడిచేత తాగిస్తే నీకు అతను లొంగుతాడని చెప్పింది. తీరా దానిని సిద్ధం చేసినా మొగుడికి ఇవ్వడానికి భయపడి రాణి ఒక పాము పుట్ట మీద పోస్తుంది. అందులోని పాము దానిని తాగి రాణిపై మరులుగొంటుంది. రోజూలా భర్త రాత్రి కాగానే ఇంటికి తాళం వేసి ఉంపుడుగత్తె ఇంటికి వెళ్ళగానే, ఆ పాము కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించి అప్పన్న రూపంలోకి మారిపోయి రాణితో సంభోగిస్తుంది.

olymias

కొంతకాలం తర్వాత రాణి గర్భవతి అవుతుంది. అప్పన్నకు అదెలా సాధ్యమో అర్థంకాలేదు. భార్య శీలాన్ని శంకించి పంచాయితీ పెడతాడు. “నా భర్తను, ఈ పామును తప్ప”  నేను మరో మగాణ్ణి తాకి ఎరగను అంటూ పాముపుట్టలోకి చేయి పెట్టి పామును తీసి పట్టుకుని రాణి ప్రమాణం చేస్తుంది. పాము ఆమెను ఏమీ చేయదు. ఆమె నిర్దోషి అని, అప్పన్నే అనవసరంగా భార్యమీద నిందవేస్తున్నాడని పంచాయితీ పెద్దలు నిర్ణయిస్తారు. చివరికి అతని ఉంపుడుగత్తెకు కూడా రాణిపై గౌరవం ఏర్పడి, అప్పన్నే అబద్ధమాడుతున్నాడని భావించి అతన్ని దూరంగా ఉంచుతుంది. అప్పటికీ సమాధానపడని అప్పన్న ఒకరోజు రాత్రి మాటువేసి, పాము తమ పడకగదిలోకి వెళ్ళడం, తన రూపంలోకి మారిపోవడం చూస్తాడు. పాము మీద పగ పెంచుకుని చివరికి దానిని సజీవదహనం చేస్తాడు. ఆ తర్వాత అతను రాజీపడి పామువల్ల భార్యకు కలిగిన కొడుకును తన కొడుకుగా గుర్తించడం, భార్యను ఏలుకోవడం ఈ కథకు ముగింపు.

ఈ సినిమాను చూసిన ప్రతిసారీ, ప్రతిక్షణం ఒక మాంత్రిక ప్రపంచంలో విహరిస్తున్నట్టు… ఒకే అనుభూతి! పరిసరాలు, సన్నివేశాల కల్పన, పాత్రల చిత్రణ, సంగీతం, పాటలలోని సాహిత్యంతో సహా అన్నింటిలోనూ మాంత్రికవాస్తవికత ఉట్టిపడేలా చేయడంలో దర్శకుడు (టి.ఎస్. నాగాభరణ)చూపిన స్పృహ, ప్రతిభ ఆశ్చర్యచకితం చేస్తాయి. అలాగే ఫోటోగ్రఫీ! అది భౌతిక ప్రపంచంపై పలచని తెర కప్పి మనల్ని పగలూ, రాత్రీ కానీ ఒక సంధిలో వేలాడదీస్తూ మన ముందు పూర్తిగా ఒక స్వాప్నిక, మార్మిక జగత్తును ఉంచుతుంది.

ప్రకృతీ, మనిషీ ఒక్కచోట ఒదిగిపోయి సహజీవనం చేయడాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఇందులోని ముసలామె ప్రకృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టే కాక, ఒక మంత్రగత్తెలా రూపుకడుతుంది. ఆమె ప్రకృతిలోని సౌకుమార్య, ముగ్ధత్వాలకూ; పురుషుడిలోని మొరటుదనంతో కూడిన లైంగికవిజృంభణకూ పెళ్లి చేయాలనుకుంటుంది.  ఆ రెండు విరుద్ధ లక్షణాల మధ్య జరిగే నిరంతర సంఘర్షణలోంచే పునరుత్పత్తి రూపంలో ప్రకృతి తనను తాను పొడిగించుకుంటూ ఉంటుంది.  ఆ మొరటోడి తల్లి మీద ఉన్న అభిమానంతో  అతని మీదా, పెళ్లీడు వచ్చిన ఆ అమ్మాయి మీదా కలిగిన ప్రేమవల్ల ముసలామె వాళ్ళిద్దరికీ ముడిపడేలా చూస్తుంది. ఒక జంటను కూర్చడమంటే తద్వారా జరిగే సృష్టికార్యాన్నీ, పునరుత్పత్తినీ ప్రకృతి ఉత్సవీకరించుకోవడమే. అతణ్ణి వశపరచుకునే ఉపాయాన్ని అమ్మాయికి ముసలామె ప్రకృతినుంచే అందిస్తుంది. ఆమెకు బిడ్డ కలగడంలో కూడా పాము రూపంలో ప్రకృతి భాగస్వామి అవుతుంది. అనివార్యమైన ప్రకృతిలోని పునరుత్పత్తి ధర్మానికి ఇది సూచన.

నేనిక్కడ నేల విడిచి ఏదో తాత్వికమైన సాము చేస్తున్నానని అనుకోవద్దు. ఆదిమ పౌరాణికతలో మనిషి జీవితం ప్రకృతితో, అందులోని భయబీభత్సాలతో సహా, ఎలా మమేకంగా అల్లుకుందో మరోసారి సూచించడమే ఉద్దేశం.

***

పాముతో ముడిపడిన జానపదవిశ్వాసం నుంచి పలుకుతున్న ఈ కథ మూలాలు మన దేశాన్ని దాటి ప్రపంచ పురాచరిత్రలోకి ఎలా విస్తరిస్తున్నాయో చూడండి…

ప్రాచీన గ్రీకు సమాజం గురించి రాస్తున్న జార్జి థాంప్సన్.  స్త్రీతో పాము సంభోగించడం అనేది చాలా తరచుగా ఎదురయ్యే ఇతివృత్తం అంటారు. గ్రీసులో ఎపిడారస్ అనే చోట సర్పవీరుడైన అస్క్లేపియస్ ఆలయం ఉంది. అందులో కొన్ని శాసనాలు ఉన్నాయి. ఒక శాసనంలోని ఇతివృత్తం ప్రకారం, సంతానం కలగని ఒక స్త్రీ  అప్పటి నమ్మకాన్ని బట్టి ఆ ఆలయానికి వెళ్ళి, ఒక రాత్రి అక్కడ గడిపింది. దేవుడు ఒక పామును తీసుకుని తన దగ్గరకు వచ్చినట్టు ఆమె కలగంది. ఆ పాము ఆమెతో సంభోగించింది. తొమ్మిది నెలల తర్వాత ఆమెకు మగ కవలలు కలిగారు. పాము పాత చర్మం విడిచి కొత్త చర్మం ధరించడం ద్వారా ఎప్పటికప్పుడు జీవితాన్ని, యవ్వనాన్ని పొడిగించుకుంటూ ఉండడమే దానికి ఇటువంటి మహిమను ఆపాదించడానికి మూలం.

పశ్చిమ ఆఫ్రికాలో పోంగ్వే స్త్రీలు రహస్య సమాజంగా ఏర్పడి పాముతో ముడిపడిన సౌభాగ్య తంత్రాలు జరుపుతూ ఉంటారు. అందుకోసం వాళ్ళు అడవిలో బాగా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ తంతులు ఎంత రహస్యంగా జరుగుతాయంటే, ‘అమ్మ’(Mother) అని పిలిచే ఒక నాయకురాలు వారికి ఉంటుంది కానీ, ఆమె ఎవరో వాళ్ళకే తెలియదు. ప్రతి మహిళా మడఅడవి (mangrove) చెట్ల మూలంలో ఉండే చిన్న పామును పట్టుకోవాలి. ఆ తర్వాత వారు నగ్నంగా మారి పామును చేతిలో ఉంచుకుని అలసిపోయే వరకూ రాత్రంతా కాముకత్వం నిండిన పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ గడుపుతారు.

గ్రీసు ఉత్తరభాగంలోని మేసెడోనియాలో కూడా మహిళలు ఇలాంటి తంతులే జరుపుతూ ఉండేవారు. అలెగ్జాండర్ ది గ్రేట్ మేసెడోనియాకు చెందినవాడే. ఈ ప్రాంతానికి రాజుగా ఉన్న రెండవ ఫిలిప్స్(క్రీ.పూ. 359-336)కు నాలుగవ భార్య ఒలింపియస్. ఆమె కొడుకే అలెగ్జాండర్.

థాంప్సన్ ఉటంకించిన ప్లూటార్క్ కథనం ప్రకారం, అతి పురాతనకాలం నుంచీ మేసెడోనియా మహిళలు ఆర్ఫిక్, డయోనిసస్ లకు చెందిన సామూహిక లైంగిక సర్ప తంత్రాలలో పాల్గొంటూ ఉండేవారు. ఇతరులను మించి ఒలింపియస్ అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఈ తంతులను మరింత ఆటవికంగానూ, భయంగొలిపేలానూ మార్చింది. ఆమె నాయకత్వంలో మహిళలు  పెద్ద పెద్ద పెంపుడు సర్పాలను చేతిలో ఉంచుకుని నృత్యం చేసేవారు. వాళ్ళ చేతిలోని మంత్ర దండాలకు, వారి కిరీటాలకు భారీ సర్పాలు చుట్టుకుని ఉండేవి. అలెగ్జాండర్ పుట్టుకకు ముందు ఒలింపియస్ తన పక్కలో ఒక పామును ఉంచుకుని నిద్రపోతూ ఫిలిప్స్ కు కనిపించిందట. ఈ కథనాలలో అతిశయోక్తులు ఉండచ్చు కానీ, ఇక్కడ గమనించాల్సింది పాములతో కూడిన తంతుల విషయంలో వివిధ ప్రాంతాల మధ్య ఉన్న పోలిక.  ఒలింపియస్, ఫిలిప్స్ లది కలతల కాపురం కావడం; ఫిలిప్స్ హత్యకు గురైనప్పుడు అందుకు బాధ్యురాలిగా ఒలింపియస్ ను అనుమానించడం వగైరాలు వేరే కథ.

asklepios

***

సర్పం తర్వాత, బహుశా సర్పం కన్నా ఎక్కువగా స్త్రీలతో ముడిపడిన ఆరాధనా రూపం చంద్రుడు. సర్పానికి ఉన్నట్టే, చంద్రుడికి కూడా పునరుజ్జీవన లక్షణం ఉందని చెప్పుకున్నాం. సర్పం విషయంలో ఉన్నట్టే, చంద్రుని విషయంలోనూ ఆయా ప్రాంతాల పురాణకథలు, విశ్వాసాల మధ్య ఆశ్చర్యకరమైన పోలికలను కొన్నింటిని ఇప్పటికే గుర్తించాం. ఇప్పుడు మరికొన్ని విశేషాలు చూద్దాం:

స్త్రీలోని పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించేది చంద్రుడేనని ప్రపంచమంతటా అనాదిగా ఉన్న విశ్వాసం. ఋతుస్రావానికి, చంద్రుడికి సంబంధం ఉందన్న ఆదిమ విశ్వాసం నుంచే చంద్రుడితో ముడిపడిన తంతులు పుట్టాయి. ఈ ఆదిమ కాలపు తంతులు మనిషి చైతన్యంపై ఎంత గాఢంగా ముద్రవేసుకున్నాయంటే, చంద్రుని ఆరాధనకు కాలదోషం పట్టినా ఇప్పటికీ జానపదుల స్థాయిలో, మూఢనమ్మకాల రూపంలో ఇవి చాలావరకూ మిగిలి ఉన్నాయని థాంప్సన్ అంటారు.

మాంత్రికత సూర్యుని కన్నా ప్రధానంగా చంద్రునే అల్లుకుని ఉంటుంది. ప్రపంచమంతటా కాలానికి తొలి కాపలాదారు చంద్రుడే. కేలెండర్ లో మొట్టమొదట ఏర్పడిన విభాగం, మాసం.  చంద్రుడి వల్లనే అది ఏర్పడింది. చంద్రుని ఆధారంగా జరిగే కాలగణనాన్ని చాంద్రమానమనీ, సూర్యుని ఆధారంగా జరిగేదాన్ని సౌరమానమనీ అన్నారు. చాంద్రమానంలో నెలకు 28 రోజులు. పదిహేను రోజులకు ఒకసారి వచ్చే పౌర్ణమి, అమావాస్యలనుబట్టి నెలను మళ్ళీ శుక్లపక్షమనీ, కృష్ణపక్షమనీ రెండు భాగాలు చేశారు. చంద్రుడు వృద్ధిని పొందే రోజులు శుక్లపక్షమైతే, క్షీణతను పొందే రోజులు కృష్ణపక్షం. చివరగా నెలను నాలుగు భాగాలు చేసి వారాలను ప్రవేశపెట్టింది బాబిలోనియన్లు. ఈ చాంద్ర, సౌర మానాలకు సంబంధించిన ఇతర అనేక వివరాలలోకి ఇప్పుడు వెళ్లలేం.

స్త్రీలలో ఋతుస్రావా(menstruation)నికి చంద్రుడే కారణమనుకున్నాం. చంద్రుడు ఒక యువకుడనీ, అతడు స్త్రీలపై లైంగిక చర్యకు పాల్పడి ఋతుస్రావానికి కారణమవుతాడనీ ముర్రే దీవుల్లోని ప్రజలు భావిస్తారు. ఋతురక్తం నుంచే పిండం రూపొందుతుందని విశ్వాసం కనుక, ఋతుస్రావాన్ని ఒకవిధమైన గర్భస్రావంగానూ భావిస్తారు. దానినుంచే ‘moon-calf’ అనే మాట పుట్టింది. అది అంగవైకల్యాన్ని సూచిస్తుంది, ఇలా చూసినప్పుడు స్త్రీ గర్భం ధరించడానికి కారణమూ చంద్రుడే. ఈవిధంగా ‘స్త్రీకి చంద్రుడే భర్త’ అన్న ఆదిమ విశ్వాసం పుట్టింది. మావోరీ తెగవారు స్త్రీకి చంద్రుడే అసలు భర్త అని నమ్ముతారు. స్త్రీ గర్భానికి పురుషుడు కారణమనే భావన, పితృత్వం సాంఘిక ప్రతిపత్తిని సంపాదించుకున్న తర్వాతే మొదలైందని థాంప్సన్ అంటారు. అంతవరకూ స్త్రీ గర్భానికి కారణం చంద్రుడే.

వ్యవస్థ మారినంత త్వరగా విశ్వాసమూ, చైతన్యమూ మారవు. కనుక ఆదిమ విశ్వాసాలు వివిధ రూపాలలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు, అనేక ఆదిమభాషలలోని పదాలు ఇప్పటికీ చంద్రుని పురుషుడిగానూ, స్త్రీలకు భర్తగానూ చెబుతాయి. గతంలో కెల్టిక్, గ్రీక్, లాటిన్ భాషల్లోనూ; నేటికీ స్లావోనిక్, జెర్మానిక్ భాషల్లోనూ చంద్రశబ్దం పురుషవాచకమే. చంద్రుని Men అనే పేరుతో పురుషునిగా పేర్కొంటూ వచ్చిన గ్రీకులు, ఆ తర్వాత స్త్రీని చేసి ‘సెలెనే’(selene) అన్నారు. men నుంచి పుట్టిన స్త్రీ వాచకం’mene’ కు selene పర్యాయపదం అయింది. ఈ mene అనే మాట monthకు పర్యాయపదంగా ఇప్పటికీ మిగిలింది.

మన దగ్గర సంస్కృతంలోనూ, తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లోనూ ఇప్పటికీ చంద్రుడు పురుషుడే. అంతేకాదు, స్త్రీకి చంద్రుడే అసలు భర్త, లేదా తొలి భర్త అన్న ఆదిమవిశ్వాసం ఇప్పటికీ మన వైదిక వివాహమంత్రాలలో మిగిలి ఉంది. ఉదాహరణకు, కన్యాదాత వధువును వరునికి అప్పగిస్తూ ‘సోమః ప్రథమో వివిదే గంధర్వో వివిద ఉత్తరః తృతీయో అగ్నిష్టే పతిస్తురీయస్తే మనుష్యజాః’’అంటాడు. ఈమె తొలి భర్త సోము(చంద్రు)డనీ, రెండో భర్త గంధర్వుడనీ, మూడవ భర్త అగ్ని అనీ, నాలుగవ భర్త మనుష్యుడనీ దీనికి అర్థం. సోమలతను నలగ్గొట్టి రసం పిండి, వడగొట్టి, కొయ్యతొట్టెల్లో నిల్వ చేసేపని కన్యాశాలల్లోనే జరిగేదనీ, ఈ పనిని చేసేవారినీ సోములు అనే వారనీ, “సోమః ప్రథమో వివిదే” అనే మాట వీరిని ఉద్దేశించినదే నని రాంభట్లగారు (జనకథ) అన్నప్పటికీ, చంద్రుడే స్త్రీకి అసలు భర్త అన్న ఆదిమ విశ్వాసాన్నీ ఇది సూచిస్తూ ఉండచ్చు.

చంద్రునివల్లనే స్త్రీ గర్భవతి అవుతుందన్న ఊహ నుంచే స్త్రీని చంద్రుడు ఆవహిస్తాడనీ, లేదా పూనతాడనే ఊహ పుట్టింది. అందుకే పూనకం, మూర్ఛ, మహిమలను ఆపాదించే ఇతర రుగ్మతలను చంద్రుడితో ముడిపెట్టడం సాంప్రదాయికంగా వస్తోంది. lunacy (ఉన్మాదం)కి, lunar (చంద్ర సంబంధమైన)కి ఉన్న సంబంధం స్పష్టమే.

ఈజిప్షియన్లు చంద్రదేవతను ‘నిట్’ అంటారు. వారి విశ్వాసం ప్రకారం మగ్గాన్ని ప్రవేశపెట్టింది ఈ దేవతే. యూరప్ జానపదాలలో ఇప్పటికీ నూలు వడికేది చంద్రుడే. ఇక్కడ ఆసక్తికరం ఏమిటంటే, చంద్రుడిలో ఒక ముసలమ్మ కూర్చుని నూలు వడుకుతూ ఉంటుందన్న కల్పన మన దగ్గర కూడా ఉంది. నూలు వడకడం ఒకప్పుడు స్త్రీల పని. అనేక ఆదిమ సంప్రదాయాలలో పిండి విసరడం, కుండలు చేయడం, వంట చేయడం మొదలైనవి చంద్రుడే చేస్తాడు.

అలాగే ఒకప్పుడు మంత్రవిద్య(మాంత్రికత) స్త్రీల చేతుల్లోనే ఉండేది. లైంగికక్రీడపై అది అత్యంత సమ్మోహనకరమైన ప్రభావాన్ని చూపుతూ ఉండేది. అయితే మంత్రవిద్య పురుషుడి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత స్త్రీల తంతులు చేతబడి వంటి క్షుద్రవిద్యలుగా తిరస్కృతికి గురవుతూ వచ్చాయని థాంప్సన్ అంటారు.

మరిన్ని విశేషాలు తర్వాత….

 

 

 

 

 

 

చరిత్ర మనలోనే ఉంది!

నిశీధి

చరిత్రలంటూ ఏమి ఉండవు , అప్పుడెప్పుడో జరిగింది అంటూ మనల్ని మనం మభ్యపెట్టుకోవటం తప్ప చరిత్రలు మనతోనే మన నీడల్లా నడుస్తూనే ఉంటాయి , ప్రపంచంలో ఎదో ఒక మూల ఎదో ఒక రకపు ఇన్ జస్టిస్ జరిగినంతకాలం మన చరిత్రలు చెప్పుకొని రాబోయే తరాలు ” అలా కూడా ఉండేవారట ” అని విస్తూపోయేంత అసహ్యంగా మనలో ఇంకిపోయి .

ఎంత నిజం కదా ఈ రోజుకి కూడా ఎవరు ఏమి తినాలి, ఆవుని తినాలా లేదా ఆవులు తినే గడ్డి మనం కూడా తిని బ్రతకాలా , ఎవరు ఏమి కట్టుకోవాలి ఉల్లిపోరలాంటి చీరల్లో సెక్సీ గా కనిపిస్తే ఎక్కువ వైకల్యం పుడుతుంది కాని వొళ్ళు కనిపించే బట్టలు వేస్తే వచ్చే మూడ్ పోతుంది చస్ వీల్లేదు చీరలు కట్టాల్సిందే అంటూ రూల్స్ , అలాగే ఎవరికి శరీరం మీద ఎవరికి హక్కులు ఉండాలి , లేదా మొత్తం ఆడ జాతిని శారిరకంగానో మానసికంగానో అమ్మి కొనుక్కొనే వ్యాపారాలు చేయటానికి గుత్తహక్కులు ఎవరికి ఉండాలి లాంటి చెవుల్లో రక్తం తెప్పిస్తున్న స్టేట్మెంట్లు విని విని మనుష్యులు అంటేనే విరక్తి కలిగి ఓదార్పు కోసం అలైస్ ని చదువుతుంటే ఇదుగో సరిగ్గా ఈ వాక్యాలు , నిజమే కదా ఎవరి హక్కులు వాళ్ళకి లేకుండా చేయటమే నయా మానవత్వపు రూల్ అయినప్పుడు చరిత్ర మనలోనే ఉంది, పూర్తి మనమై ఉంది .

పై వాక్యాల్లో అలైస్ (Alice Malsenior Walker :born February 9, 1944) నడిచే నిజంలా అనిపిస్తే అది మన తప్పేమీ కాదు నిజాయితీగా ఎలాంటి అనవసరపు ఊహాత్మకత లేకుండా ఖచ్చితంగా తను చెప్పాలనుకున్న విషయం చెప్పగలిగే ధైర్యం చూపే తన రచనలది . రేసిజపు దాష్టికంలో మునిగి తేలే జాతులలో మగవారికంటే ఆడవారి పరిస్థితి ఇంకా ఎంత దారుణమో ( వీళ్ళు అటు రేసిజం ఇటు మేల్ చావనిజం రెండు భరించాలిగా ) చెప్పే అలైస్ వాకర్ వాక్యాలు చదవటం నిజంగా గొప్ప అనుభవం , చదివినంత సేపు అదో లోకం , మన జీవితాలు తన పదాల్లో చదువుకుంటున్న అనుభూతి వెరసి కొన్ని క్షణాలు వేదన ఎదో ఘోస్ట్ రూపంలో పట్టి మనసుని అల్లకల్లోలం చేస్తూన్నంత బాధ . నిజ జీవితంలో అలాంటి మనుష్యులే కనబడుతుంటే ఏమి చేయలేని నిస్సహాయత ఎదో బలంగా మనల్ని పూనుకొని తను రాసిన పుస్తకాల్లో కొన్ని క్యారెక్టర్స్ ని గొంతు పిసికి చంపేయాలన్నంత ఉద్రేకం , అనుభవిస్తే కాని అర్ధం కాని భావన అది . శవాల మధ్య బ్రతికుండే క్వాలిఫీకేషన్ మనకేమి ఉందో చెప్పగలిగే , ప్రశ్నించే Be nobody’s darling; Be an outcast.Qualified to live Among your dead స్థైర్యం అది .

alice6

ఎలాగు టాపిక్ వచ్చేసింది కాబట్టి అదే కవితలో వాక్యాలు కొన్ని ఇలా ” జీవితం ఎప్పుడు వైరుధ్యాల వెల్లువే , పిచ్చి జనం చేతిలో రాళ్ళ నుండి తప్పించుకోవడానికి దాన్నే చుట్టుకొని బ్రతకాలి ” ” వంటరి నడకని గర్వంగా ఆస్వాదించు లేకపోతే కటినమయిన మనసున్న ఫూల్స్ తో నువ్వెంతో ఇష్టపడే ఇసుక తిన్నెలు పంచుకోవాలి ( ఓహ్ హౌ ఐ లవ్ దిస్ లైన్ ) అంటూ

Be nobody’s darling;
Be an outcast.
Take the contradictions
Of your life
And wrap around
You like a shawl,
To parry stones
To keep you warm.
Watch the people succumb
To madness
With ample cheer;
Let them look askance at you
And you askance reply.
Be an outcast;
Be pleased to walk alone
(Uncool)
Or line the crowded
River beds
With other impetuous
Fools.

Make a merry gathering
On the bank
Where thousands perished
For brave hurt words
They said.

But be nobody’s darling;
Be an outcast.
Qualified to live
Among your dead.

ఇదొక్కటే కాదు Expect Nothing పోయెమ్ లో అయితే ఏకంగా నిరాశలు నీ తలుపులు తట్టిన క్షణానికి నీ జీవితం అంటే నీకు పూర్తి సంతోషం కలిగి ఉండాలి , నిరాశే నిరాశ పడేంత సంతోషం అంటూ చెప్తారు , అందులోనే ఇంకో చోట “ ఒకసారి బ్రతకటం అంటూ మొదలు పెట్టాక నీ చిన్న బుర్ర బోలెడు అపనమ్మకాలు భయాల మధ్య ఇరుక్కుపోయి బెంగగా ఉంటుంది , ఆ భయాలు వదిలించుకున్న క్షణం జీవితం నుండి ఇహ ఎక్స్పెక్ట్ చేసేది ఏమి ఉండదు అని ఎంత క్లియర్ గా చెప్తారో చూడండి.

Expect Nothing
Expect nothing. Live frugally
On surprise.
become a stranger
To need of pity
Or, if compassion be freely
Given out
Take only enough
Stop short of urge to plead
Then purge away the need.

Wish for nothing larger
Than your own small heart
Or greater than a star;
Tame wild disappointment
With caress unmoved and cold
Make of it a parka
For your soul.

Discover the reason why
So tiny human midget
Exists at all
So scared unwise
But expect nothing. Live frugally
On surprise.

Alice Walker :

ఎంత చదువుకున్నా తరగని తాత్వికత , ఎంత నేర్చుకున్నా సరిపోని జ్ఞానం తన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ప్రపంచం ఆమెకి, ఆమె జీవితాన్నే అక్షర రూపంగా దిద్దిన ది కలర్ పర్పుల్ నవలకి గుర్తింపుగా సాహిత్యంలో ఒక పులిట్జర్ ప్రైజ్ సమర్పించుకుంది .

alice7

 

ఈ వ్యాసం మొదలు పెట్టడం సమకాలిన భారతదేశంలో పరిస్థితులు కంపేర్ చేయటం తో మొదలు అయింది కాబట్టి ఇంకా ఒక్క మాట చెప్పి ముగిస్తాను , యుగాల క్రితమే గొప్ప తాత్వికత సాధించేసిన దేశం ఇక్కడ స్త్రీలు పూజింపబడతారు అని గొప్పలు పోయే మన దేశంలో ఈ రోజు ఆడవారి జీవితానికి చీకటి ఖండంగా దేశ జాతీయులు అని చెప్పుకొనే అలైస్ అపుడేప్పుడో ది కలర్ పర్పుల్ లో రాసిన స్త్రీల జీవితాన్ని కంపేర్ చేస్తే పెద్ద తేడాలు ఏమి ఉండవు రంగుల్లో తప్ప అనేందుకో ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ మధ్య .

~

రంగుల భోజనం…గొంతులో వీణలు!

సేకరణ, పరిచయం: పి.మోహన్

 

P Mohanచెన్నపట్టణం రైల్వే స్టేషన్.. 1898 తొలకరిలో ఓ రోజు. విశాఖపట్టణం నుంచి వచ్చిన రైల్లో నూనూగు మీసాల యువకుడొకడు దిగాడు. బస వాకబు చేస్తూ తంబుచెట్టి వీధి బాటపట్టాడు. ఓ పుస్తకాల కొట్టుముందు జనం బిలబిల మూగి ఉన్నారు. యువకుడు కూడా ఆసక్తితో వాళ్లలో కలసిపోయాడు. అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు. కొట్టు గుమస్తా అప్పుడే బొంబాయి మెయిల్లోంచి వచ్చిన పెట్టె విప్పి ఒక్కో పోస్టర్ ను టేబుల్ పైన పరుస్తున్నాడు. జనం కళ్లార్పకుండా చూస్తున్నారు. మూరెడుకుపైగా పొడవున్న రంగురంగుల రవివర్మ చిత్రాల పోస్టర్లు ఇంధ్రధనుస్సులా పరచుకున్నాయి. మెరుస్తున్న రంగుల వాసన ముక్కుపుటాలకు మైకంలా సోకుతోంది.  

‘ఎంత బావున్నాయ్! అన్నీ కొత్తవే. నాకు ఆ మేనకావిశ్వామిత్రుల బొమ్మ ఇవ్వండి’

‘నాకు లక్ష్మీసరస్వతులు కావాలి. పటం కట్టించుకుంటా’

‘నాకు మాత్రం అదిగో ఆ పైటజారిన రంభ బొమ్మ కావాలి’

‘నాకు ఆ మలయాళ కన్నెపిల్ల బొమ్మ’

జనం ఎగబడ్డారు. గుమస్తా అణాలు, బేడలు పుచ్చుకుని బొమ్మలు ఇచ్చాడు. కాసేపటికి సందడి తగ్గింది. విశాఖ యువకుడు బొమ్మలను కళ్లార్పకుండా చూస్తూ ఉన్నాడు.

‘ఏమి తంబి, అట్లా సూస్తా ఉండావు, నీకు ఏమి కావాలి?’ గుమస్తా యువకుడిని అడిగాడు.

యువకుడు తేరుకున్నాడు.

‘అన్నీ.. ఇవన్నీ కావాలి..’

గుమాస్తా తుళ్లిపడ్డాడు. ఎగాదిగా చూశాడు.

‘ఇవన్నీ కావాలి. ఖరీదు పుచ్చుకుని చిల్లర ఇవ్వండి’ యువకుడు మూడు రూపాయల బిళ్లలను బల్లపైన ఉంచాడు.

గుమాస్తా ముప్పై బొమ్మలను చుట్టచుట్టి యువకుడికి అందించాడు.

యువకుడు బలిజ సంఘం సత్రంలో గది తీసుకున్నాడు. రంగుల భోజనంలో పడిపోయి అసలు భోజనం సంగతి మరచిపోయాడు. బొమ్మలన్నింటిని నేలపై పరచి గంటలతరబడి అలాగే చూస్తుండిపోయాడు. గొంతులో వీణలు మోగాయి. రాగాలు రేగాయి. పద్యాలు పలికాయి.

***

2 (2)

3 (2)యువకుడి పేరు సెట్టి లక్ష్మీనరసింహం(1879-1938). మనకు అపరిచితుడిలా అనిపిస్తాడు కానీ అతని సమకాలికులకు మాత్రం సుపరిచితుడే. కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు రాశాడు. నాటకాల్లో వేషాలు కట్టాడు. యవ్వనంలో గిడుగు, గురజాడల బాటలో నడిచాడు. గ్రాంధికవాదులతో తలపడ్డాడు. వయసుపైబడ్డాక మాత్రం ప్లేటు ఫిరాయించి గ్రాంధికంలో పడ్డాడు. అతడానాడు ఏం చేసినా ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు, రవివర్మ బొమ్మలపై ‘చిత్రమాలికలు’ పేరుతో రాసిన పద్యాలు తప్ప. ఇవి తొలుత ’కృష్ణా’ దినపత్రికలో వచ్చాయి. తర్వాత సెట్టి మరికొన్ని రాసి మొత్తం 54 మాలికలతో 1935లో పుస్తక రూపంలో తెచ్చి, తన ప్రభువైన జయపురం మహారాజుకు అంకితమిచ్చాడు. ఆ మాలికల్లోకి వెళ్లబోయే ముందు సెట్టి గురించి కాసిని ముచ్చట్లు. సెట్టి చిత్రమాలికల ముందుమాట, అతని ఇతర పుస్తకాలు, ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’, తెలుగు సాహిత్య కోశం వంటి పుస్తకాలు, పత్రికల్లోంచి ఈ వివరాలు..

సెట్టి విశాఖపట్నంలో పుట్టాడు. తల్లిదండ్రులు వెంకయ్యమ్మ, అప్పలస్వామి. సెట్టి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఆరు నెలలు కొక్కొండ వెంకటరత్నానికి, ఆరు నెలలు కందుకూరి వీరేశలింగానికి శిష్యుడు. 1900లో బీ.ఏ. పాసై విశాఖ వచ్చి మిసెస్ ఏవీఎన్ కాలేజీ అనుబంధ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. మహాకవి శ్రీశ్రీ తండ్రి వెంకట రమణయ్య, సెట్టి సహోద్యోగులు. సెట్టిని ‘సెట్టి మాస్టార’ని, రమణయ్యను ‘రమణయ్య మాస్టార’ని పిలిచేవాళ్లు. శ్రీశ్రీకి సెట్టి వద్ద తండ్రివద్ద ఉన్నంత చనువు ఉండేది. ఆ వివరాల్లోకి తర్వాత.

సెట్టి దాదాపు ఇరవయ్యేళ్లు(1901-19) ఏవీఎన్ పాఠశాల, కళాశాలల్లో పనిచేశాడు. హెడ్మాస్టర్ గా, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు. వ్యావహారికభాషావాదులైన కాలేజీ ప్రిన్సిపాల్ పీటీ శ్రీనివాస అయ్యంగారు ప్రోత్సాహంతో ఆంగ్లంలోంచి ‘గ్రీకుపురాణ కథల’ను అనువదించాడు. ‘సంధులు మొత్తంగా విసర్జించిన శైలి’లో రాసిన ఈ పుస్తకం పాఠ్యపుస్తకమైంది. దీని గురించి గురజాడ తన డైరీలో, ‘కథలలో గొప్ప లక్షణాలు, సాహిత్య మెలకువలు ఉన్నాయి. తెలుగు సారస్వతంలో నూతన పోకడలను ఇవి ప్రవేశపెడుతున్నాయి.. ఈయన అనువాదం చక్కగా ఉంది. సంధిని పరిత్యజించడంలో ఒక నిమయాన్ననుసరించారు. ఇది గ్రాంథికంలో వ్రాసిన గ్రంథమే’ అని రాసుకున్నాడు. అయినా ఈ  పుస్తకంపై గ్రాంథిక భాషావాదులు మండిపడ్డారు. సెట్టి కూడా తగ్గలేదు. తాపీ ధర్మరావు ఓ చంపకమాలలో గ్రాంధికాన్ని సమర్థించగా, సెట్టి దానికి బదులుగా 116 పాదాల శార్దూలం రాసి దానికి ‘నూటాపదహార్లు’ అని పేరుపెట్టాడు.

కవిభూషణ బిరుదాంకితుడైన సెట్టి కొన్ని కొక్కిరాయి పనులూ చేశాడు. ‘రసికాభిలాషం’ రాసి, దాన్ని శ్రీనాథుడికి ఆపాదిస్తూ ప్రకటించాడు. అది కవిసార్వభౌముడిది కాదని చిలకమర్తి లక్ష్మీనరసింహం తేల్చాడు. దాన్ని సెట్టి తనముందే రాశాడని విశాఖ వాసి బొడ్డు రామయ్య చిలకమర్తికి చెప్పాడు. సెట్టి ‘మరీచీ పరిణయం’ రాసి దాన్ని శ్రీ కృష్ణదేవరాయల కూతురు మోహనాంగికి అంటగట్టాడు. సెట్టి చనిపోయాక చాలా ఏళ్లకు అది అచ్చయింది. అది మోహనాంగిది కాదని ఆరుద్ర తేల్చడం మరో ముచ్చట.

సెట్టి విరివిగా రాసేవాడు. ప్రభాసశాపవిమోచనం(కావ్యం), శ్రీకృష్ణరాయబారం, లుబ్ధాగ్రేసర చక్రవర్తి(మోలియర్ రాసిన మైజర్ నాటకానికి అనువాదం), మాలినీ విజయం, చిత్రహరిశ్చంద్రీయం(నాటకం), అహల్య(నాటకం), వసంతసేన(నవల, గురజాడకు అంకితం), పన్నా, బప్పడు(రాజస్థానీ కథాకావ్యాలు), గంగికథ(నవల), దొంగ(కథ), కొన్నిశతకాలు, ఆంధ్రపత్రిక, భారతి వంటి పత్రికల్లో ఉగాది పద్యాలు, బైరన్, షెల్లీ, వర్డ్స్ వర్త్ ల పద్యాలకు అనువాదాలు.. ఇవన్నీ అతని సాహిత్య కృషి.

సెట్టి అక్కయ్య సీరం సుభద్రమ్మ(1876-47) కూడా కవయిత్రి, నవలా రచయిత్రి. రెండువేల పద్యాల్లో ‘సుభద్రాపరిణయం’ రాసింది. కానన్ డయల్ రాసిన షెర్లాక్ హోమ్స్ అపరాధ పరిశోధక నవలావళిలోని ‘ద హౌండ్ ఆఫ్ ద బాస్కర్విలీస్’ను తెలుగులో ‘జాగిలం’ పేరుతో చక్కగా అనువదించింది. ఇది మద్రాస్ వర్సిటీ పాఠ్యపుస్తకమైంది.

సెట్టి స్కూలుకు రాజీనామా చేశాక లా చదివి ఫస్ట్ గ్రేడ్లో పాసయ్యాడు. జయపురం మహారాజు, రచయిత, దాత విక్రమదేవవర్మ(1869-51)కు 1930లో ఆంతరంగిక కార్యదర్శిగా చేరాడు. జయపురం(ఒడిశా) ఆస్థానప్రభావంతో గ్రాంధికంలోకి మళ్లాడు. ‘చిత్రమాలికల’తోపాటు చాలా కావ్యాలను రాజుకే అంకితమిచ్చాడు. వర్మ ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఏటా లక్ష చొప్పున ఇరవయ్యేళ్లు విరాళాలు ఇచ్చాడు. శతాధిక గ్రంథకర్త, శతాధిక కృతిభర్త. గిడుగు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి ప్రసిద్ధ రచయితలు తమ రచనలను వర్మకు అంకితమిచ్చారు. తెలుగులో తొలి కార్టూనిస్టు, చిత్రకారుడు, కళావిమర్శకుడు తలిసెట్టి రామారావు వర్మకు దివాన్ గా పనిచేశాడు.

1 (1)

సెట్టితో శ్రీశ్రీ అనుంబంధం గురించి. వయసులో ముప్పయ్యేళ్ల తేడా ఉన్నఈ ఇద్దరూ కవితాసమితి సభ్యులు. సెట్టి చాలావరకు ఏది ఎత్తుకున్నామాలికల్లోనే ఎత్తుకునేవాడు. శ్రీశ్రీ తొలి పద్యరచన ‘విశ్వరూప సందర్శనం’ కూడా మాలికే, సెట్టి ప్రభావమే. ‘మనుచరిత్రకన్నా వసుచరిత్ర గొప్పదని బహుశా సెట్టి మాస్టారు శ్రీశ్రీకి చెప్పారు’(ఆరుద్ర). జగన్మిత్ర నాటక సమాజంలో సెట్టి శ్రీశ్రీతో కుశుడు వంటి బాల పాత్రలనేకం వేయించేవాడు. అవధాని చెళ్లపిళ్ల వెంకట శాస్త్రికి సెట్టి వీరాభిమాని. ఓ సారి చెళ్లపిళ్ల విశాఖకు వచ్చి తన శిష్యుడు పింగళి లక్ష్మీకాంతం ఇంట్లో ఉన్నప్పుడు, జయపురంలో అవధానానికి రావాలని విక్రమదేవవర్మ తరపున ఆహ్వానించడానికి వెళ్లాడు సెట్టి, కూడా శ్రీశ్రీని వెంటబెట్టుకుని. శ్రీశ్రీకి చెళ్లపిళ్లను చూడ్డం అదే తొలిసారి. సెట్టి మాత్రాఛందస్సులో గురజాడను గుర్తుకు తెచ్చేలా రాసిన ‘బప్పడు’ లోని కొన్ని పద్యాల ప్రభావం శ్రీశ్రీ ‘శైశవగీతి’ లో కనిపిస్తుంది. బప్పడులోని పిల్లల ఆటపాటల వర్ణన ఇలా సాగుతుంది..

‘పది పండ్రెండేడుల ఈడును గల

సిగ్గును తెలియని చిన్న బాలికలు…

కన్నుల నిండా కాటుక రేఖలు..

చిన్ని చప్పట్లు చెరచేవారూ

గడ్డిపువ్వులను కోసేవారూ..

ఎచ్చటను చూచినా తామే ఐ

వచ్చిన చోటికె వచ్చుచు తిరిగీ

పోయిన చోటికే పోవుచు మరియూ..’

 

శ్రీశ్రీ ‘శైవశగీతి’ ఇలా సాగుతుంది…

‘అయిదారేడుల పాపల్లారా..

అచ్చటికిచ్చటి కనుకోకుండా

ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే..’

 

తాపీ ధర్మారావు గ్రాంధిక చంపకమాలకు ప్రతిగా సెట్టి రాసిన శార్దూల మాలికలోంచి

శ్రీశ్రీ కొన్ని పాదాలను ఉటంకించేవాడని అంటాడు ఆరుద్ర.

ఆ పాదాలు..

‘…కేవాస్తే ఇస్తరఫ్, ఇస్లియే, మగరుమా ఫక్ భేష్ చమక్కంచు హిం

దుస్తానీ పదసంచయంబె కృతులన్ దూరుస్తురో లేక నో

యెస్తేంక్స్, మిస్టరు, మైడియర్, మొదలుగా ఇంగ్లీషు శబ్దాలనే

వేస్తారో తమ చిత్తమండి.. బస్తీమే సవాల్..’

 

శ్రీశ్రీ తొలినాళ్ల పద్యాలపై సెట్టి ప్రభావం గురించి ఎవరూ విశ్లేషించినట్లు లేదు. ఆ పనిచేస్తే తొలినాళ్ల శ్రీశ్రీని మరింత బాగా అంచనా వేయొచ్చేమో!

ఇక ‘చిత్రమాలికల’ సంగతి. దీనికో ప్రత్యేకత ఉంది. భారతీయ భాషల్లోనే కాదు, బహుశా ప్రపంచంలోని ఏ భాషలోనూ ఇలాంటి పుస్తకం లేదనొచ్చు. వర్ణచిత్రాలపై కవితలు ఆంగ్లం, ఫ్రెంచి తదితర భాషల్లో మధ్యయుగాలనుంచే నుంచే ఉన్నాయి. జపాన్ చిత్రకారులైతే చిత్రాల పక్కనే పద్యాలు రాసేవాళ్లు. లియోనార్డో డావిన్సీ వేసిన మిలాన్ రాజు ప్రేయసి ‘చిచీలియా గల్లెరని’ చిత్రంపైన డావిన్సీ మిత్రుడు బెర్నార్దో బెలీంచియోని శృంగారభరిత పద్యాలు రాశాడు. ‘మోనాలిసా’ చిత్రంపై తెలుగులో చాలా కవితలు వచ్చాయి. అయితే ఒక చిత్రకారుడు వేసిన చిత్రాలపై పనిగట్టుకుని యాబైకిపైగా పద్యాలు రాసింది, అచ్చేసింది మాత్రం సెట్టినే. ఇది సాముగరిడీలా ఉన్నా వ్యర్థవిన్యాసంగా మాత్రం మారిపోలేదు. సెట్టివి పద్యాలే అయినా నారికేళపాకాలు కావు. తెలుగు పలుకుబళ్లతో, సహజ సంభాషణలతో, సరళంగా, ప్రవాహసదృశంగా సాగుతాయి. చిత్రంలోని సారాంశాన్ని కవిచూపుతో కొత్తగా పరిచయం చేస్తాయి. చిత్రమాలికలు ‘కృష్ణా’ పత్రికలో వస్తున్నప్పుడు అన్నీకాకపోయినా కొన్నయినా పాఠకులను ఆకట్టుకున్నాయి. ‘గంగావతరణం’, ‘హంస దమయంతి’, ‘బాలకృష్ణుడు’ వంటివి సెట్టి కవితాప్రతిభకు అద్దంపడతాయి.

సెట్టికి రవివర్మ చిత్రాలు తొలుత విశాఖలో లితోగ్రాఫుల రూపంలో పరిచయం. చిత్రమాలికల ముందుమాటలో తాను చెన్నపట్టణంలో ఇరవై, ముప్పై రవివర్మ చిత్రాలను కొన్నానని సెట్టి రాసుకుంది లితోగ్రాఫుల గురించే. తొలి యవ్వనంలో పరిచయమైన ఆ చిత్రాలు సెట్టిని తుదకంటా వెంటాడాయి. ఆ సంగతులన్నీ చిత్రమాలికల ముందుమాటలో ఉన్నాయి. సెట్టికి కేరళ రంగరి బొమ్మలపై ఎంత ప్రేమంటే, సందర్భశుద్ధి లేకపోయినా పొడిగేంత. ‘ఆంధ్రపత్రిక’ 1930 ఉగాది సంచికలో సెట్టి ‘ఉగాది కానుకలు’ కథ ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కనకగిరి రాకుమార్తె అన్నపూర్ణాదేవిని పెళ్లాడ్డం, అన్నపూర్ణ తన తండ్రి కుట్రబారి నుంచి భర్తను కాపాడుకోవడం ఇందులోని విషయం. ఇక్కడ రవివర్మ చిత్రాల ప్రసక్తి శుద్ధ అనవసరం. అయినా సెట్టి వదల్లేదు. అన్నపూర్ణాదేవి అందాన్ని వర్ణించడానికి రవివర్మ చిత్రాలను అరువు తెచ్చుకున్నాడు. ఆ వర్ణన.. ‘రవివర్మ చిత్రపటములు సుప్రసిద్ధములు. ఆ చిత్తరువులందలి నాయికలందఱు నొక్కవిధమైన యాకారము గలవారు. భేదములు వయస్సులనుబట్టి, వ్యవస్థలను బట్టి, వలువలను బట్టి వచ్చినవి. ఇంచుక పొడుగుపాటి శరీరములు, కొంచెము కోలవాటు ముఖములు, వంగిన కనుబొమ్మలు నిడుదఱెప్పలతోడి వెడఁద కన్నులు, రవంత సూదిగానున్న ముక్కులు, నిండైన క్రిందిపెదవులు, ఉగ్గులుదేఱి నిగ్గులు వాఱిన పెన్నెఱులు: ఇవి యా యాకారమునకు లక్షణములు. స్త్రీసౌందర్యము పరిపూర్ణత్వమున నట్లుండునని యారాజ చిత్రకారుఁడూహించి యుండనోపును. అతని మేనక మేనిసొంపు, మోహిని ముఖకళ, రాధరామణీయకత, కలిసి యన్నపూర్ణాంబ రూపము తేలును…’

రవివర్మ బొమ్మలను ఇంతలోతుల్లోకి వెళ్లి చూసిన సెట్టి ఆ చిత్రకారుడు వేసిన అసలు తైలవర్ణ చిత్రాలను కొన్నింటినైనా చూసే ఉంటాడు. మద్రాస్, విశాఖ, రాజమండ్రి, కాకినాడ ధనికులు, జమీందార్లు రవివర్మతో బొమ్మలు వేయించుకున్నారు. సెట్టికి వాళ్లలో కొందరితోనైనా పరిచయాలు ఉండుంటాయి.

6

సెట్టి చిత్రమాలికలకు ప్రేరణ అతని సహాధ్యాయి మారేపల్లి రామచంద్రశాస్త్రి(1873-1943). ఆ వివరాలు సెట్టి ముందుమాటలో ఉన్నాయి కనుక ప్రస్తావించడం లేదు. సెట్టి చిత్రమాలికలను రవివర్మ చిత్రాలతో సచిత్రంగా ముద్రించాలనుకున్నాడు. అయితే ఆనాడు చిత్రాల ముద్రణ వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం కనుక సాధ్యం కాలేదు. చివరకు బొమ్మల్లేకుండానే అచ్చువేశాడు.

చిత్రమాలికలను పాఠకులు చదవబోతున్నారు కనుక వాటి గుణగణాల్లోకి పూర్తిగా వెళ్లడం లేదు. మచ్చుకు సెట్టి విసిరిన చమక్కులు కొన్ని..

విష్ణువు శ్రీదేవి, భూదేవిలను గద్దపై ఎక్కించుకుని వలపు పారవశ్యంలో

‘ఆ కలుకుల్ పరాకుమెయి నచ్చట నుండక జాఱిపోదురే, మో కద యంచు వారి నడుముల్ తన చేతుల బిగ్గఁ బట్టి.. మేన్ పులకితంబగుచుండగఁ…’ వెళ్తున్నాడని వర్ణిస్తాడు సెట్టి మాస్టారు ‘శ్రీమహావిష్ణువు’ మాలికలో.

‘గంగావతరణం’ మాలికలో ఆ నది దివి నుంచి భువికి..

‘రంగత్తుంగతరంగసంఘములు తోరంబై చెలంగం గడుబొంగం బాఱుచు, జాఱుచున్, దొరలుచుం, బొర్లాడుచున్, వేనవేల్ పంగల్ పెంచుచున్, జెంగలించుచును, బైపై లేచుచుం, దేఱుకొంచుం.. భ్రమించుచున్.. నురుఁగుతోఁ జూపట్టుచున్.. హోరుమంచుం..’ దూకిందంటాడు.

దమయంతి వనవిహారంలో ఉండగా, ‘గుప్పగఁ బడ్డ దూది తెఱఁగుం గల హంసము కానిపించె’ నంటాడు ఓ మాలికలో. మరో మాలికలో.. కారడవిలో తన చీరను చించుకుని నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లిన భర్తను తలచుకుంటున్నదమయంతితో ఇలా అనిపిస్తాడు.. ‘నీదు హక్కౌటచే, మేనఁ జీరను జించుకొంచరిగితే? మేనో, శిరస్సో తెగంగా నీ చేతను ద్రుంచిపోవునెడ, నిక్కష్టంబు లేకుండు?’

వనంలో వయ్యారంగా మేనువాల్చి దుష్యంతునికి తామరాకుపై లేఖరాస్తూ, వలపు తలపుల్లో మునిగిపోయి ‘లేఖలో బంతులు నొండు రెండయిన బాలిక వ్రాయఁగ నేర,దంతయున్ సాంతము చేసి సంతకము సల్పుటకెంతటి సేపు పట్టునో?’ అని సంశయిస్తాడు ‘శకుంతలాపత్రలేఖనం’లో.

‘బాలకృష్ణుఁడు’ మాలికలో.. వెన్నెల వెదజల్లే నవ్వుతో కళ్లను చల్లగ చేసే తన బిడ్డను చూసి యశోద, ‘నా ముల్లె, మదీయ గర్భలత పూచిన మల్లె’ అని మురిసిపోతుంది. దాపున కూర్చున్న రాధతో  ‘నోసి రాధ, మేనల్లుని సంబరంపడుచు నారయుటే యనుకొంటివేమొ? నేఁడెల్లి కొమార్త నోర్తు కని యీ వలెన్ సుమీ ’ అని మేలమాడుతుంది. అందుకు రాధ, ‘యేమిరా యల్లుఁడ!  ‘యత్త, యత్త,’ యని యందువు నత్తిగ: నిందుకోసమా?’ అంటూ చిట్టి మేనల్లుని పాదము ముడుతుంది నవ్వుతూ.

‘మృద్భక్షణము’ మాలికలో.. మన్నుతిన్న కృష్ణుడిని తల్లి మందలిస్తూ ‘చిన్నతనంబునన్ విషము చేరిచి పూతన నీదు నోటికిం, జన్నొసఁగంగఁ గ్రుక్కుకొని చప్పునఁ జప్పునఁ జప్పరించినా,వన్నియు నిట్టి పాడు రుచులబ్బినవేమిర?’ అని అంటుంది.

‘నికుంజరాధ’, ‘మాలినీ కీచకులు’, ‘ఉషానిరుద్ధులు’ వంటి మాలికలూ భావయుక్తంగా సాగుతాయి. ‘చిత్రమాలికలు’ ఒకరకంగా చిత్రాలకు అనువాదం లాంటివి. ఓపక్క రవివర్మ రంగరించిన సౌందర్యాన్ని అక్షరాల్లోకి తోడాలి. మరోపక్క మక్కికి మక్కీ చెప్పినట్లు కాకుండా, భావశబలతతో తెలుగు సొబగులు చెడకుండా చిత్రికపట్టాలి. సెట్టి ఈ పని బాగానే చేశాడు. చేయలేదని అనడానికి వేరొకరు ఆ పని చేసి ఉంటే కదా!

***

 

4

శ్రీ చిత్రమాలికలు

పీఠిక

నా యీ చిత్రమాలికల రచనకుఁ ప్రారంభము 1897 సంవత్సరమున: అప్పటికి నాకుఁ బదునెనిమిది యేఁడుల యీడు;  విశాఖపట్టణమున ఎఫ్.ఏ. తరగతిలోఁ జదువుచుంటిని. ఇటీవలఁ గవిగారని సార్థకనామము గాంచిన బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు నా సహపాఠి. తత్పూర్వమే యాయన రవివర్మ చిత్రించిన మేనకావిశ్వామిత్రచిత్రముఁ గూర్చి యొక మాలిక రచించియుండెను. అది వినుట వలనఁ గలిగిన కుతూహలము, తరువాతి కథను దెలుపు శకుంతలాజననచిత్రముఁ గూర్చి యొక మాలిక వ్రాయ నన్ను బురికొల్పినది. రామచంద్రశాస్త్రిగారు హూణవిద్య చాలించుటయు, మఱొక యేఁడాదికి బి.ఏ. చదువు నిమిత్తము నేను చెన్నపట్టణము వెళ్లుటయు, మా చిత్రమాలికా రచనము మూలఁబడుటకు హేతువులైనవి. నాఁటికిని నేఁటికిని వారు వ్రాసిన చిత్రమాలిక యది యొక్కటియే. అది వారు కేవలము మఱచియే పోయిరి. నాకు ముఖస్థమై యుండెను. శృంగారకంఠాభరణమునకుఁ బంపితిని. అందలి కాలవలాహకాంతరేతి పద్యమదియే.

చెన్నపట్టణమునకు నేను వెళ్లిన సరికి రవివర్మ చిత్రములమీఁద జనాదరము ముమ్మరమై యుండెను: అవి యమ్మకమునకుఁ జూపని యంగడి లేదు; అలంకరింపని గృహము లేదు; యభినందింపని జనులు లేరు. ఇరువది ముప్పది చిత్రములు నేనును గొంటిని. అందలి రంభాశుక, మదాలసాఋతుధ్వజు, చిత్రములు రెండింటిని మాత్రమే వర్ణించి మాలికలు వ్రాసితిని. అప్పటికింకను జిత్రమాలికలను విశేషముగా వ్రాయవలయునన్న సంకల్పము నామనసున నంకురింప లేదనుట నిశ్చయము.

1900 సంll రము జనవరిలో నేను బి. ఏ. పరీక్షయందుఁ దేలితిని. పిమ్మట బహుకాలము గడచినది. విశాఖపట్టణమున మిస్సెస్. ఏ. వీ. ఎన్. కాలేజీలో నేనుపాధ్యాయుఁడనుగా నుంటిని. 1915వ సంవత్సర ప్రాంతమని జ్ఞాపకము: బ్రహ్మపురనివాసులును, మ. రా. రా. దేవళరాజు వేంకటసుబ్బరావుపంతులుగారు నాయొద్దఁ గల మూడు మాలికలు విని, తమ వేగుఁజుక్క కథావళియందుఁ సచిత్రముగాఁ బ్రకటించు నభిలాషమును దెలిపిరి. శకుంతలాజననమాలికలోఁ దత్పూర్వమున్న స్త్రీజనసామాన్యవర్ణనము బాలెంతరాలి వర్ణనముగా మార్చి ఇచ్చితిని; వారు ప్రకటించిరి. తూఁగక వేగుఁజుక్క కథావళి వారాఁప వలసి వచ్చినది. ఒక్క దానితో నా మాలికలు నాఁగ వలసి వచ్చినవి.

మఱికొంత కాలమునకుఁ, దత్పద్యమునే కృష్ణాపత్రికకుఁ బంపితిని. అది 1916వ సంll రము అక్టోబరు 21 వ తేదీ పత్రికలోఁ బ్రకటితమైనది. నాఁటి నుండి వారము వారము నేనొక మాలిక పంపుటయు, అది ప్రకటితమగుటయు, 1918 వ సంll రము ఏప్రిలు 13 వ తేదీ వరకు జరిగినది. అలాగున నేను బంపినవి 33 మాలికలు. నేను వ్రాసిన మాలికల వరుసను విషయసూచికయందలి కుడి ప్రక్కను గల యంకెలు తెలుపఁ గలవు. అమూల్యమైన తమ పత్రికలో నా మాలికలకుఁ దావిచ్చి, తద్రచనకుఁ బ్రోత్సాహము కలిగించిన కృష్ణాపత్రికాధిపతులకు నేను గృతజ్ఞుఁడను.

కారణాంతరమున హఠాత్తుగా నిలిచిన మాలికలు 1922 వ సంll రము తుదిని మరలఁ బ్రారంభమైనవి: ఈ మాఱు, పునరుద్ధారణము గన్న వేగుఁజుక్క కథావళియందు. అట్లు ప్రకటితమైనవి యాఱు మాత్రమే. గత సంవత్సరమున ‘అహల్య’ యను నాటకము రచించి, దానికొఱకు రెండు మాలికలు వ్రాసితిని; శృంగారకంఠాభరణము కొఱకు నికుంజరాధ, యమునాతటరాధ, యని మఱి రెండు. అక్కడకు మొత్తము నలుబదిమూడు.

మొదటి మాలికలు 22 పంక్తులును, దురువాతివి కొన్ని 23 పంక్తులును, గలవిగా వ్రాసినను ఇప్పుడన్నియు 24 పంక్తుల వానిఁగా జేసితిని. వాడిన ప్రాసము మరల వాడలేదు. త్రివర్ణచిత్రములను జూచి మొదటిలో మాలికలు వ్రాసితిని గాని, యిటీవల మాత్రము చిత్రశాలాముద్రాక్షరశాలవారు పుస్తకరూపముగా వెలువరించిన చిత్రములను జూచియే వ్రాసితిని. అస్పష్టమైన ముద్రణమగుటచేత, స్థితులతో నేనెచ్చట నైనను బొరపడి యుండ వచ్చును. మన్నింపఁ బ్రార్థన.

మనోరమ మనుచరిత్రలోని స్వరోచి భార్యగా నేను వర్ణించితిని. తత్కథ యాంధ్రకవితాపితామహుని నేర్పు కతముఁ దెలుగు దేశమున సుప్రసిద్ధము. అది మార్కండేయపురాణమందలి కథయే యైనను, రవివర్మ యది యుద్దేశించెనా యన్నది సందేహకరము.

సచిత్రముగా మాలికలను ముద్రింపుమని పలువురు మిత్రులు నాతోఁ బలుసారులు చెప్పుచు వచ్చిరి. 64 మాలికలైనను గాకుండ ముద్రించు నుద్దేశము నాకు లేకుండెను. 1932 వ సంవత్సరముఁ గల్యాణీశృంగారగ్రంథమాలాధిపతులు బ్రహ్మశ్రీ గంటిసూర్యనారాయణశాస్త్రిగారు నన్నందు విషయమై తొందరపెట్టిరి. అందుచేతఁ దొందరతొందరగా మఱి పదునొకండు పద్యములు వ్రాసి ముగించితిని. దీని యచ్చు బాధ్యతను బూనుకొని, శాస్త్రిగారు చిరకాలము గ్రంథముంచుకొని, తిరిగి పంపిరి. చిత్రములను గూర్చిన ప్రయత్నములన్నియు విఫలములయినందున సచిత్రముగాఁ బ్రకటింప లేకుంటిని.

అడిగినంతనే యంకితమొందుటకనుగ్రహబుద్ధితో నంగీకరించిన మత్ర్పభువర్యులు, శ్రీజయపురరాజ్యధుర్యులు, శ్రీశ్రీశ్రీ శ్రీవిక్రమదేవవర్మమహారాజు గారికి నేనీవిధముగానేయన్న మాట యేమి, యన్ని విధములను గృతజ్ఞుఁడను: వారు నాకన్ని విధములను వంద్యులు.

 

విశాఖపట్టణము

1-10-1935                                                                                                                                                                                                  సెట్టి లక్ష్మీనరసింహము

 

 

అంకితము.

శ్రీకరముగా సలకసృష్టిచిత్రముల వి-

చిత్రలీలఁ జిత్రించి, తచ్చిత్రసముద-

యావలోకనమునఁ బలుభావములొద-

వించి, చిత్రకారులకుఁ గవిప్రతతికి

హేతువౌ భగవంతుండు కృష్ణచంద్ర-

దేవపుత్రు, శ్రీవిక్రమదేవవర్మ-

ధారుణీకళత్రు, మహితోదారు,  జ్ఞాన-

సారు, సుగుణనిస్తంద్రు, శ్రీజయపురనృప-

చంద్రు, నాయురారోగ్య విస్తారసౌఖ్య-

యుతునిగాఁ జేసి, రక్షించుచుండు గాక!

ఆ మహారాజు మామక స్వామి యనుచుఁ,

గవివతంసంబంనుచుఁ, బండితవరుఁడనుచుఁ,

సారము గ్రహింపఁ జాలు రసజ్ఞుఁడనుచుఁ,

దప్పులొప్పులఁ జేయు నుదారుఁడనుచు,

ఆంధ్రవిశ్వవిద్యాలయంబధికవృద్ధి

నొంద వత్సరలక్షల నొసఁగిన నెఱ

దాత యనుచు, జ్ఞాని యనుచు, ధర్మమూర్తి

యంచు, నర్హుండనుచు, నే రచించినట్టి

చిత్రమాలికాకృతిని దచ్చిత్తవృత్తి

యెఱిఁగి, తదనుజ్ఞఁ బడసి, ప్రహృష్టుఁడనయి,

ప్రభువరునకు నభ్యుదయపరంపరాభి-

వృద్ధి, వంశవృద్ధియుఁ గార్యసిద్ధియుఁ నిర-

తమును గల్గింప దేవు ప్రార్థనమొనర్చి,

యంకితంబిచ్చువాఁడఁ బ్రియముతోడ.

_

 

కవి విషయము.

ప్రచురయశుండు తత్ర్పభుని ప్రాపును గాంచిన చిత్రమాలికల్

రచనమొనర్చినట్టి కవి, ప్రాజ్ఞులకెల్లను గేలుదోయి మో-

డ్చి చెలఁగు సెట్టిలక్ష్మినరసింహము: సెట్టి కులాంబురాశిలో-

ని చలువఱేఁడనన్ ధర జనించిన యప్పలసామినాయుఁడున్

సుచరిత వేంకయాంబయు మనోరథసిద్ధిగఁ గన్న పుత్రుఁ; డా-

స చెడక స్వీయమౌ బలిజె జాతి కనుంగొన, వాసి గన్న వాఁ-

డు; చదువునన్ గురుల్ తనుఁ గడుం గరుణింప బి.యే. పరీక్ష బు-

ద్ధిచతురతన్ సమున్నతిగఁ దేలి, విశాఖపురంబునందు లో-

క చరిత మిస్సె. సే.వి.యెను కాలేజిలోపలి బోధనంబు చే-

యుచు, మఱి యెల్.టి.యై, యచట నొజ్జగ నిర్వదియేఁడులుండి, శి-

ష్యచయము సెట్టి మాస్టరన సన్నుతి గన్న యతండు; ఫస్టు గ్రే-

డు చదివి, ఫస్టెయై, తగునటుల్ పది యేఁడులు న్యాయవాదిగా

నచటనె యున్నవాఁడు; తెనుఁగందొక యించుక పూర్వవాసనన్

రుచి గని, పూర్వసత్కవులు త్రొక్కిన త్రోవఁ గవిత్వఫక్కి నే-

రుచుకొని, తప్పులున్న చదురుల్ సరిదిద్దుదురంచుఁ బద్దెముల్

వచనములున్న గ్రంథములు వ్రాసి, సుధీతతి వల్ల మెప్పు నొం-

దుచుఁ గవిభూషణాఖ్యఁ గృపతో నృపుఁడీయఁగఁ గన్న వాఁడు; మం-

చి చనవు గల్గునట్టులుగ శ్రీయుతవిక్రమదేవవర్మరాట్

శచిపతి యంతరంగము నొసంగుచుఁ దద్విధకార్యదర్శిగా,

సచివునిగాఁగఁ బెట్టుకొన, స్వామి హితంబునె కోరి యున్న వాఁ;

డచలపతిత్వమున్ను హరియందు, మహేశ్వరునందు, భక్తిఁ దా-

ల్చుచుఁ దమితో నిజప్రథమసూనుని వేంకటశబ్ధమాది ని-

ల్పుచు రమణుండటంచుఁ, బెఱ పుత్రుని దా శివరావటంచుఁ బి-

ల్చుచు, నిటులిష్టదైవముల సూక్ష్మముగాఁగను గొల్చునాతఁడున్.

_

 

 

కృతజ్ఞత.

ఆదికావ్యమగు రామాణయంబు రచించి-

నట్టి వాల్మీకిం, బురాణభార-

తగ్రంథకర్త వేదవ్యాసు, నాటక-

కావ్యముల్ వ్రాసిన కవులఁ గాళి-

దాసు, శ్రీహర్షు, శూద్రకు, భవభూతిని,

నుతియించి కొల్చి, సంస్కృతమునందు

నవ్వారు రచించినట్టి పురాణేతి-

హాస కావ్యాదుల నాంధ్రభాష

విరచించినట్టి కవిత్రయంబునకుఁ బో-

తనకు, భాస్కరునకుఁ దక్కినట్టి

వారికిన్ మ్రొక్కి, గీర్వాణపురాణాదు-

లందున్న కథల రమ్యమగు భంగి

వర్ణించి, చిత్రించి, వానిని గన్నుల

యెదుటికిం గొనితెచ్చి, హృదయములను

నవరసంబులు సముద్భవమొందఁ జేసిన

చిత్రకారవరుండు, క్షత్రియుఁడయి

రాజవంశంబునం బ్రభవించియును శ్రద్ధ

కలిగి విద్యను సమగ్రముగ నేర్చు-

కొని ప్రసిద్ధుండైన ఘనుఁడు, భారతదేశ

మునఁ జిత్రకళ కలదనుచు నితర

ఖండములను వాసి కలుగఁ జేసిన మేటి,

గృహవితతి నలంకరించిన హితుఁ,-

డని కృతజ్ఞబుద్ధి నౌచు రాజారవి

వర్మకేనొనర్తు వందనములు.

_

 

శ్రీమహావిష్ణువు.

శ్రీకలశాబ్ధిపుత్రియు, ధరిత్రియు భూషితగాత్రులై పవి-

త్రాకృతులొప్పఁ బార్శ్వములయందు వసించుచు, మేను మేనులన్

సోఁక గగుర్చుచున్, సొలపుఁజూపుటళుల్ తన మోముతామరం

బైకొన నిర్నమేషలయి బాళిని జూచుచుఁ జామరంబులం

జేకొనియుం గదల్చుటకుఁ జేతులు రాని యవస్థ నుంటచే,

ఆ కలుకుల్ పరాకుమెయి నచ్చట నుండక జాఱిపోదురే-

మో కద యంచు వారి నడుముల్ తన చేతుల బిగ్గఁ బట్టి, యా

తాఁకుడుచేత మేన్ పులకితంబగుచుండఁగ, నేత్రముల్ సుఖో-

ద్రేకముఁ దెల్పుచుండ, నునుతేటనిగారపు నవ్వు మోవిపైఁ

బ్రాఁకుచునుండ, మూర్ధమున రత్నకిరీటమునున్ ధరించి, లే-

దో కలదో యనం దిలకమూర్ధ్వముగా నొసటన్ ఘటించి, వ్రేఁ-

గై కదలాడు కుండలములందపు వీనులఁ బూని, సుప్రభా-

శ్రీకరవైన కౌస్తుభము సిస్తు దలిర్ప నుంబు మీఁద శో-

భాకమనీయహారముల ప్రాపునఁ దాలిచి, వైజయంతిఁ దా-

నా కెలనన్ గదించి, యదిరా! మది రాగమటన్నదెన్నఁడున్

లేక చరించు యోగులఁ జలింపఁగఁ జేసెడి మోహనాకృతిం

గైకొని, -గోళ్లతోడ గజకచ్ఛపభారము మోసినట్టి య-

స్తోకబలాఢ్యుఁడౌ గరుడు తోరపు వీఁపునఁ గూరుచుండి, తన్

నాకనివాసులెల్లరు ననాకులభక్తి మెయిన్ భజింపఁగా,

ఆకసముందు మెల్లగ విహారమొనర్చుచు, మింటినుండి భూ-

లోకము వారి మీఁద నెదలోఁ గల దివ్యదయామృతంబు నా-

లోకనజాలమార్గమున లోపము చేయక క్రుమ్మరించు ప్రే-

మైకవరస్వభావుని, ధృతాఖిలజీవుని, విష్ణుదేవునిన్,

నా కరముల్ మొగిడ్చి వృజినంబులు పో భజనంబొనర్చెదన్.

_

 

 

శ్రీమహాలక్ష్మి.

తామరసంబుఁ దా మృదుపదంబుల మెట్టుట, కిట్టకుంటనో?

ధామమటంచునో? పువుల దండను దాలిచినట్టి తొండమున్

సామజమెత్తు, టర్చననొనర్చుటొ? మరాళతతుల్ తన పజ్జ నుంట, య-

త్తామరసోద్భవుం గనిన తల్లి యటంచునొ? యానవైఖరిం

దాము సమభ్యసించెడి విధంబొ? యన గల యట్టి సంశయ-

స్తోమము నంతరంగములఁ జూపఱకుం గలిగించుచున్, సర-

స్సీమ సరోజమధ్యమునఁ జేతులఁ దమ్ములఁ బూని, హస్తికిన్

సామమెలర్పఁగా నభయసంజ్ఞను జేతను జేసి, యంచలం

బ్రేమను జేతితోఁ బలుకరించి, కరంబులు నాలుగున్ శ్రిత-

క్షేమనిమిత్తమే యనుచుఁ జెప్పక చెప్పెడి యీమె లక్ష్మియే!

సోముని చెల్లెలీమె యనుచుం బలుకం దగినట్టి మోముతోఁ,

గాముని కన్నతల్లి యనఁగాఁ దగు మిక్కుటమైన గోముతో,

శ్రీమహిళామతల్లి యని చెప్పెడి మైసిరితోడ, ముద్దు నె-

మ్మోమొక యద్దమై యచటఁ బూసిన పాదరసంబుఁ బోలె ని-

ద్దామెఱుఁగున్ ఘటించెడి మితమ్మయినట్టి స్మితమ్ముతోడఁ, బ్రే-

మామృతముబ్బి వెల్లువగునట్లు వెలార్చెడి కన్నుదోయితో,

లేమల లోన నీమె యెన లేని విలాసిని యయ్యెఁ; గాననే

యా మరునయ్య తా మరులు నందుచుఁ; బాల్కడలిన్ జనించు రం-

భాముఖులైన  యచ్చరలపై మనసుంచక, యొక్క యీమెకే

కాముకుఁడయ్యె: లోకపితకామిని కావున, లోకమాతయై

యీమె తనర్చె; శ్రీ గనుక, నిచ్చు సిరుల్ శరణన్న వారికిం;

గామితకల్పవల్లియు, జగంబుల తల్లియుఁ, గాన వేమఱున్

నా మనమందుఁ గొల్తుఁ గరుణారసమందిర యైన యిందిరన్.

_

 

After a break up

నందకిశోర్

 

సమయం= పన్నెండు
గడియారం=గుండెలో అటూ ఇటూ ఊగుతోన్న పదునైన కత్తి
క్యాలెండర్= గుండెకి వేలాడదీసిన భూగోళం
ఫ్యాన్= గుండెని లయబద్దంగా కోసుకుపోతున్న మూడు ఇనుపరేకులు
లైట్= గుండెలోకి కసిగా దిగబడుతున్న వెలుతురు
విండో= గుండెలోకి నిట్టనిలువుగా పాతబడిన కొన్ని ఇనుపచువ్వలు
బుక్‌షెల్ఫ్= గుండెని క్రూరంగా చూసీ చూసీ అలసిపోయిన కాగితాలు
నేను = ఏడుపు; అద్దం=పిశాచి; కవిత్వం=రక్తం;
తడబాటు=పగిలిపోతున్న రక్తపు కణికల నిశ్శబ్దం;
*
గడియారం పగిలి ముక్కలైన
వేల నిమిషాల వేల సెకండ్లకి

నిద్ర-నిద్ర= పిచ్చి
నిద్ర+నిద్ర= భయం
నిద్ర+కలలు= రాత్రి
నిద్ర+ఆకలి=మెలకువ
నిద్ర+ అనిశ్చితి= జీవితం
***

సమయం= పన్నెండు
క్యాలెండర్+ బుక్‌షెల్ఫ్+ మిర్రర్+లైట్= చిరిగిన కాగితాలు + గదినిండా విసిరి కొట్టిన పుస్తకాలు +చెదిరిపోయిన గాజు ముక్కలు..
ఫ్యాన్= నాపై వీస్తున్న గాలి
బెడ్‌షీట్= నేను నిద్రపోయిన సమాధి
సెల్‌ఫోన్= మొహం పగిలిన చీలికల అద్దం
విండో= పొద్దెక్కిన లేవని సూర్యుడు
కవిత్వం= కొవ్వొత్తితో కాల్చబడిన రెండు అర చేతులు, కొన్ని మసి కాగితాలు, ఒక జీవితం..
నేను= ?

nandakishore

తాదాత్మ్యత…. దిల్ సే….

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఈ నడుమే. వేసవి ఉదయాన్నే అబ్బురపడి చేసిన చిత్రం ఇది.
ఐదారు రోజులుగా ఎపుడెపుడు మీకు చూపాలా అని ఎంతో ఇదిగా ఎదురు చూస్తున్నాను.

దీన్ని తీసింది మా వీధిలోనే.
ఇదొక దృష్టాంతం. an exemplary image.
జనసామాన్యం తాలూకు జీవకళను అలవోకగా ఒడిసిపట్టుకున్నప్పటి ఒక దృశ్యాంతం.

రెండు విషయాలకు. అవును.
ఒకటి తమ వ్యాపారం సజావుగా, దిష్టి కొట్టకుండా సాగాలన్న ఆకాంక్షా..
అదే సమయంలో ఒక Display…అందంగా ఆకర్షించి కట్టి పడేయడం, మనల్ని అక్కడికి లాక్కోవడమూ!
ఈ రెంటిలోనూ ఒకానొక తాదాత్మ్యత దాగున్నదన్న భావన ఎట్లా చెప్పడం అని మనసు కొట్టుకుంటూ ఉంటే ఇలా ఈ దృశ్యం కనిపించింది. Physical, Metaphysical, అంతిమంగా Spiritual..అన్నీకలగలసిన  People’s aesthetics గా ఈ మామిడి దృశ్యాదృశ్యం ఒక పండుగ!

+++

మీరు చాలామందినే చూస్తూ ఉంటారు.
తోపుడు బండిమీద వ్యాపారం చేసుకునే వాళ్లను ఎందరినో చూస్తూనే ఉంటారు.
లేదా రెక్కల కష్టం మీద ఆధారపడే వాళ్లు, కాయాకష్టంతో జీవనం గడిపేవారు, బక్కజీవులు – వీళ్లందరి జీవితంలో ఎదురీతను తప్పక గమనిస్తూనే ఉంటారు.
కానీ, వాళ్ల aesthetics?
వాటిని గమనించడంలో ఒక దివ్యమైన అనుభవం ఉందని మీరు గమనించారా అంట!
ఈ చిత్రం అటువంటి ఒక అనుదిన జీవకళ అనే ఈ చ్ఛాయ.

మంచిగనిపించే విషయం ఏమిటంటే, ఆ తోపుడు బండ్ల వాళ్లలో ఒక అనుకువ ఉంటుంది. తమకే ప్రత్యేకమైన ఒకానొక అందమైన అనుసరణా ఉంటుంది. common sense తాలూకు లాక్షాణికత ఒకటి subtleగా వాళ్లలో అంతర్లీనంగా, దృశ్యాదృశ్యంగా compose అయే ఉంటుంది. నిజం. వాళ్లకంటూ నియమమూ, నిష్టా ఉంది.  ఉదర పోషణార్థం చేసే ఎంత చిన్న పనైనా సరే, దానిపట్ల వాళ్లకొక అవ్యాజ్యమైన అనురాగం ఉంది. తమ పనిని ఆకర్షణీయంగా ప్రదర్శిస్తూ, వాళ్లట్లా తమ జీవితాన్ని ఉల్లాసంగా నెట్టుకురావడంలో ఎంతో శ్రద్ధా, అభిమానమూ, ఆత్మాభిమానమూ నిండుగ ఉంది. అది రమణీయం అనీ ఈ చిత్రం.

+++

నిజానికి జీవన వ్యాపారంలో సౌందర్యంతో ఆకర్షించడం అన్నది ఒక కళ. అది వ్యాపార కళ కూడా.
దానికి కావలసింది ఒక ఇగురం. ఉదాహరణకు తాళాలు రిపేరు చేసే వాళ్ల డబ్బాలు చూడండి. అవి ముదురు రంగులతో ఇట్టే ఆకర్షిస్తాయి. ఎందుకూ అంటే – ‘ఆ రంగులతో మిమ్మల్ని మా దగ్గరకు గుంజుతాం సర్’ అంటాడు ఒకతను. నిజమే. వాళ్లకంటూ ఒక సౌందర్యశాస్త్రం ఒకటుంటుంది. అది మోటుగానే కాదు, ఒక్కోసారి ఎంతో సుకుమారంగా, సుతారంగా మనల్ని లోబర్చుకుంటుంది.

మా దగ్గరే. నగరంలోని పార్సీగుట్టలో చాలామంది వలస జీవులున్నారు. కానీ వాళ్ల కళ చూడాలి. అది తమదైన ఉన్నతస్థాయిలో ఉంటుంది. సైకిళ్ల మీద ఒక చిన్నపాటి పెట్టెలు పెట్టుకుని మామిడితాండ్ర అమ్మే వాళ్లను గమనిస్తే వారి డబ్బాలు టేకుతో తయారై ఉంటాయి. ఒకసారి ముట్టుకోవాలనిపించేలా ఆకర్షిస్తాయి. వాటిలో బంగారంలా మెరిసిపోతూ మామిడి తాండ్ర -తీయగా – తెరతీయగా- అన్నట్టు లాగుతూ ఉంటుంది.

పిల్లల్ని ఆకర్షించడానికి వాళ్ల పద్ధతులు వాళ్లకున్నాయి మరి! అయితే, వాళ్లంతా ఉదయాన్నే సైకిళ్లు తీసుకుని ఒక్కొక్కరూ పట్నంలోని ఒక వీధిలో తిరుగుతారు. వెళ్లేముందు నల్లపోచమ్మ గుడివద్దకు చేరుకుంటారు. ఆ తల్లికి మొక్కి, గర్భగుడి వద్దనుంచి ఇంత కుంకుమ తీసుకుని పెట్టెలకు దిద్దడమూ ఉంటుంది? అదేమిటి?
అంతేకాదు, వాళ్ల వద్ద బాట్లు ఉంటాయి. ఆ కుంకుమను వాటిపై చల్లడమూ ఉంటుంది. వాటి సంగతేమిటి? భయమా, భక్తా? తాదాత్మ్యతా?ఇలా – జనసామాన్యం అంతానూ- ఒక కార్యంలో నిమగ్నమయ్యేవాళ్లందరికీనూ – తమదైన జీవన వ్యాపారం ఉంది. ఆ వ్యాపార చింతనలో జనించే ఒకానొక సౌందర్యాత్మక తాదాత్మ్యత అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని చెప్పడంలో ఆ వేలాడే మామిడికాయ ఒక లీల అనీ, అదొక్కటి చాలు, వాళ్లందరి గురించిన ఒక దివ్యమైన దృష్టాంతాన్ని ఉల్లాసంగా చూపడానికీ అనీ -ఇదంతానూ, దృశ్యాదృశ్యంగా పరుచుకుంటూ పోవడం!ఇంకా చాలా కనబడతాయి.  ఎండాకాలం పుచ్చకాయలు అమ్మేవాళ్లను చూడండి. వాళ్లు ఒక పుచ్చకాయను అందంగా కత్తిరించి విచ్చుకున్న తామరలా నిలపడం చూస్తాం.జామకాయల్ని అమ్మేవాళ్లను చూడండి. వాళ్లూ ఒక భాగాన్ని కోసి ఉంచుతారు.
అదట్లే ఉంటుంది, దినమంతా, వ్యాపారం అయ్యేంత దాకా. దాంతో పాటు ఆకులనూ వాటితో వుంచుతారు, సహజ తోరణాల్లా.

టీ బంకులూ అంతే. తెరవగానే మొదట ఆ షాపు యజమాని ఈడ్నుంచి ఆడికి ఒక ఛాయను గ్లాసుతో పోయడమూ ఒక ఛాయ. ఒక ritual. కొందరు ఒక టీని గ్లాసులో పోసి దేవుడి ఫొటో ముందు అగర్బత్తీలు వెలిగించి అట్లా ఉంచేస్తారు. అంతే.

ఈదుళ్లకు పోయినప్పుడు  గౌడు కల్లుబొట్టు వొంపేప్పుడు ఒక రెండు మూడు చుక్కల్ని నేలరాల్చడం లేదా అలా బొట్లు బొట్లుగా భూదేవికి అర్పించమా? ఇట్లా…అర్పించడంలోనూ ఎన్నో అంశాలున్నాయి. ఆరోగ్యం ఉంది. ఆనందం ఉంది. తృప్తీ ఉంది. దిష్టి తీయడమూ ఉంది.

అంతెందుకు? ఇంట్లోనే. ఒక రకంగా అన్నం తినేముందు ఒక ముద్దను మనం దేవుడికి వదిలినట్లు వీళ్లంతా ఏదో ఒక దాన్ని ప్రకృతికి నివేదించడమూ ఉందే, అది ఒక కాయే. మనల్ని హత్తుకుంటుంది. ఆకర్షిస్తుంటుంది, మామిడిలా!

-ఇట్లా కొన్ని కార్యాలు సుందరంగా మనల్ని కట్టి పడేస్తాయి. కొన్నేమో భక్తినే కాదు, భయాన్నీ కలిగిస్తాయి. అయితే, ఈ చిత్రం మాత్రం రసన.  ఇది మా ఇంటిపక్కనే ఉండే ఒక ముస్లిం చిరు వ్యాపారి display…దిల్ సే.

inside photo (1)+++తాను సీజనల్ వ్యాపారి.
అతడికి ఒకే ఒక తోపుడు బండి ఉంది.
బళ్లు తెరిస్తే అతడు దగ్గర్లోని ఇస్కూల్ కు వెళతాడు. జామకాయలు అమ్ముతాడు. తాటి గేగులు అమ్ముతాడు. రేగుపండ్లు అమ్ముతాడు. అట్లే అంగూర్లూ అమ్ముతాడు. ఇప్పుడు మాత్రం మామిడిపండ్లు అమ్ముతున్నాడు.ఒకానొక ఉదయం …ఆయన బండి తయారుగా ఉండగా… పైన మామిడి పండు వేలాడుతుండగా… కింద అగర్ బత్తీ వెలుగుతూ ఉండగా…ఆత్మా పరమాత్మలా వాటిని చూస్తే మనసు నిండిపోయింది.
ఒక నయనానందం..పరిమళభరిత రాగం…ఎంతో పవిత్రంగా అనిపించింది.
మోకాళ్లు వంచి వినమ్రంగా తొలి ఫొటో తీశాను. తర్వాత అడ్డంగా( హారిజాంటల్) కొన్ని…అటు తర్వాత నిలువుగా (వర్టికల్) మరికొన్ని చిత్రాలు చేశాను.

వేలాడే ఆ పండు, పైన నీడకోసం వేసిన అచ్చాదన, కింద ఆ కోత మామిడి కాయ తాలూకు ముక్కలు, రూపాయికి రెండు…వాటిపై చల్లడానికి వుంచిన ఉప్పూ కారం కలిపిన డబ్బా, ఇంకా గల్లపెట్టే – అన్నీనూ చూశాను. విడివిడిగా తీశాను.

మొత్తం ఒక పది చిత్రాలు. అందులో రెండింటిని మీకు  పంచడం ఒక సూత్రం కోసం.
అవును. సామాన్యుల జీవితానికీ ఒక సున్నితపు త్రాసు ఉంది.
అది జీవకళను, జీవన వ్యాపారాన్ని రెడింటినీ సహజంగా కలుపుతుంది.
దృశ్యాదృశ్యం అంటే అదే!

తాదాత్మ్యత. దిల్ సే.
మా పొరుగింటి తోపుడుబండి యజమానికి సలాములతో…

~  

నీళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు

భగవంతం

 

ఆడుకుంటూ ఆడుకుంటూ
భూగోళం మీది నుండి
ఒక్క గెంతు గెంతితే
చందమామ తగలాల్సిన పసివేళ్ళకు
తగిలించబడ్డ గుదిబండల వెనుక
కనిపించని తడి. . .

పువ్వులకింది నీడలు పొందే
పరమ సుఖాన్ని –
మబ్బుల వెనక చీకటి పొందే
మహా మోక్షాన్ని
పురుషుడికి ప్రాప్తింప జేయగలిగిన స్త్రీకి –
కట్టలేకపోయిన గుడిమీద
కురుస్తోన్న కుండపోత . . .

శీతవేళ రాత్రుల్లో
ముడుతలుపడ్డ చేతులు వెలిగించిన
స్మృతుల చలిమంట చెంత
చెవులు కాచుకోలేకపోతున్న
లోకం చుట్టూ
ఘనీభవిస్తోన్న గుండ్రని సరస్సు . . .

అంతరిక్ష రహస్యాల
అంతరంగమేదో తెలిసినట్లై
ఎగిరెగిరి వచ్చి
సరాసరి నీమీదే వాలాలని అరాటపడ్డ
సీతాకోక రెక్కల నుండి
రాలిపోతోన్న అరణ్యాల వెనక
నాలుక పిడచకట్టుకుపోయిన జలపాతం . . .

ఆమెను అందుకోలేకపోవడానికి
అడ్డుగా నిలబడ్డ
అన్ని గోడల్ని కూల్చడానికి
అనాదినుండి అతడు చేస్తోన్న ప్రయత్నాలు చూసి
ఏ అర్థరాత్రో
కొందరి చేతివేళ్ళను కౌగలించుకొని
రోదించిన రంగులూ. . . సిరా చుక్కలూ

~

మా అన్నయ్యకి పురుగు ముట్టె !!

     మేము ఇల్లు కొనుక్కొంటిమి అని ముందే సెప్పితి గదా! అది శానా పాతది. దాని వాకిళ్లు రాజుల కాలములో కోటలకి ఉన్నట్లుండె. వాట్ని మూసేకి ఒగరి శాత అయితా వుండ్లేదు. గోడ నాలుగడుగుల ఎలుపు. అంటే అది 1800 సగాల్లో (ప్రాంతంలో) కట్టిండొచ్చు. ముందు  కాలంలో ఆ ఇంట్లోనే కూలి బడి నడుస్తా ఉన్నంట.(మా ఊరి కథ చెప్పే తప్పుడు వివరంగా చెప్ప బడుతుంది)
 
     దాన్ని కొన్న మా నాయిన నూరో ఇన్నూరో రూపాయిలు తక్కువిచ్చినంట.అందుకే నీలకంఠాశారి అయ్యివారు ఇంటి మీదుండే మాడీ (మేడ), దానికి పర్సిండే పలుకులు పీక్కు పాయి నంట. దాన్ని రిపేరి సేయల్ల అని రెండు మూడు నెల్లు మేము ఆ ఇంటికి పోనే లేదు.
    ఒగదినం వాకిలి తీస్తే రామ రామా అది ఇల్లు గాదు శవాల్ని పూడిసేకి గుంతలు తీసిన మశానం మాదిరీ అయిపొయ్యింది!!
    ఆ ఇంటి ఆశార్లు ఊర్లో అందరికన్నా షావుకార్లంట!! వాళ్లు సెప్పిన మాటకి ఎదురు ఉండ్లేదంట. అవుసరాలకి రెడ్లకి ఎండి రూపాయలు అప్పులిస్తా వుండ్రంట. ఆ కాలంలో దుడ్లు  దాసి పెట్టుకొనేకి బ్యాంకులు,బీరువాలూ అట్లావి వుండ్లేదంట. అందుకే దొంగల భయానికి, కుండల్లో పోసి రూపాయల్ని ఇంట్లో గుంతలు తీసి బూమిలో పాతి పెడతా వుండ్రంట. ఆరకంగా ఆ ఇంట్లో దండిగా దనముంది. పూడిసి పెట్టిన కుండ్లు ఒగొగ సారి యజమానికి సిక్కకుండా తావలు గూడా మారుస్తాయి అనే నమ్మకాలతో రాతిరి పొద్దు కొందరు ఆశపోతు  జనాలు లోపలికి దూరి పెద్ద పెద్ద సప్పిడీల్ని (బండల్ని) గడార్ల(గడ్డపార)తో లేవదీసి గోడలకి నిలబెట్టి అయిదారడుగులు లోతు గుంతలు సేసిండారు.
     మా నాయన దాన్ని సూసి తల తలే కొట్టు కోని సదును సేసి బండ్లు పరిపిచ్చె. తిరగ రొన్నాళ్లకి ఆ ఇంట్లో సేరితిమి.
    ఒగ దినం పొద్దున్నే నేనింకా నిద్దర లేయనే లేదు. మా యమ్మ గట్టిగా అబ్బరిచ్చి ఏడుస్తా వుంది. ఊర్లో వుండే జనాలంతా మా పడమర వాకిల్లో దూరి తూరుపు వాకిలి దిక్క పారి పారి పోతా వుండారు. దుప్పటి కప్పుకోని పడసాల్లో పడుకో నుండే నేను దిడుగ్గున (ఉన్న ఫళంగా) లేస్తి. ఏమీ అర్తం కాక నేనుకూడా ఏడ్స బట్తి. అపుడు ఎవురో ఒగాయమ్మ(ఉప్పుర గంగప్ప పెండ్లాము కావొచ్చు) నా దగ్గరికొచ్చి, నా ముకమ్మింద అడ్డం పడిండే యంటికిలు సరి జేసి, దారం తీసుకోని జుట్టు మాదిరీ కట్టి తూరుపు వాకిలి దగ్గరికి పిల్సుకు పాయ.
IMG_0078
     ముందే సెప్పితి గదా అది లంకంత కొంప అని!! అంత పెద్ద ఇండ్లయినా మా ఊర్లో యా ఇంటికి గూడా ఇంటి లోపల బచ్చలి ఉండ్లేదు!! బయట తడకలు అడ్డం ఏసుకోనో, రాతి కూసాలు గోడ మాదిరీ పాతుకోనో, సెట్లు మరుగు సేసుకోనో బచ్చలి మాదిరీ వాడుకొంటా ఉండ్రి.
   ఇంటి ముందర తూరుపుకి బెంగులూరు మెయిను రోడ్డు. ఇంట్లో నుంచి బయటికి  అడుగు పెడుతూనే యడం పక్క పెద్ద సీమ జాలి మాను (సీమ తుమ్మ) దానికీ రాతి గోడకీ నడి మద్య ఎండి పోయిండే మిరప సెట్లు (వంట చెరుగ్గా వాడ్డానికి) ఎత్తుగా వామి మాదిరీ ఏసిండారు. అదే మాకి బచ్చలి.
    నిద్దర లేస్తూనే మా నాలుగో అన్నయ్య సదాశివ రెడ్డి కాళ్లు మడిసేకి (ఒంటికి పోసేకి) బచ్చల్లేకి పాయనంట. అట్ల యడం పక్కకి తిరుగుతా వున్నట్లే గోడ రాళ్ల సందులో నుంచి పామొచ్చి కర్సి సరుక్కున ఆ సందులోనే దూరుకొన్నంట!!
   “యనా నా కాలికి పాము కరిశ” అని అన్నయ్య గాట్టిగా అర్సి నంట. గప్పన లోపల్నుంచి మా యమ్మ,నాయిన,అన్నయ్య,అక్కయ్య అందురూ పారొచ్చిరంట!!
    యడమ కాలు పిక్కకి కాట్లు పడిండి వంట. రగతము దిగ్గారి పోతా వుందంట.
   దాన్ని సూసి మా నాయిన “అది పాము కాదురా ఏడిదో పురుగ ముట్టింది. ఏమీ కాదు వూరుకో” అంజెప్పి దాని ఇసం పైనికి ఎక్కకుండా పెద్ద రాయిని ఎత్తిచ్చుకోని పాముల మంత్రం  ఏసే ఆయప్పతాకి ఇందూపురానికి పిల్సుకు పోయిండాడు.
  ఇంటి ముందర గుంపులు సేరి జనాలు ఎవరికి నోటి కొచ్చింది వాళ్లు మాట్లాడ్తా వుండారు. “ఈ పిల్ల గాళ్లు సెప్పితే ఇనరు.ఎనుము గొడ్లు మేపేకి ఏటి గడ్డకు తోలుకు పోతారు. ఆకలయితే ఏడిదో కాయో కసురో తిని ఆడుకోరు. కాల్సుకు తినేకని అడివెలకల బక్కలు తవ్వుతారు. అవిట్లో నుండి పాములు బయటికొస్తాయి. ఈళ్లు రాల్లతో, సన్న సన్న బర్రల్తో సంపేకి సూస్తారు. కానుగ సెట్ల సీదార మద్య అవి తప్పించు కొంటాయి. నాగుబాము పగ నలబై ఏండ్లు అన్నట్లు, ఇట్ల పగబట్టి సంపుతాయి. అని ఒగరు. “మన గ్రాచారం బాగ లేకుంటే తాడే పామై పీకు తుంది ” అని ఒగరు. అనుకొంటా రోడ్లో నిలబడి ఎదురు సూస్తా వుండారు. అప్పిటికే మా ఊర్లో ఒగటి రెండు సైకిల్లుండె.” సైకిలేసుకోని ఎదురు పోండ్రా ఎవరన్నాను ” అని కొందరు ఎవర్నో పురమా ఇస్తా వుండ్రి.
    అంత సేపటికి పెద్ద సిత మాన్ల దగ్గర మా నాయిన వొస్తా వున్నట్ల కనబడె. బుజం మింద అన్నయ్య వుండాడు.
  మా అన్నయ్యకి పది పదకొండేండ్లు ఉండొచ్చు. సూసేకి యర్రగ పల్సగా కుర్ర పెయ్య మాదిరీ వుంటాడు. ఆ పొద్దు పోలీ సోల్లు ఏసుకోనే రకంగా వుండే కాకీ అంగీ నిక్కరు తొడుక్కోని సిపాయి సిన్నోని మాదిరీ వుండాడు. అట్లా ఆయప్పని సూసేకి అందరు ఆత్రమాత్రముగా ఎదురు పొయ్యిరి. ఆ జనాల మద్య నేను గూడా పోతి. ఆయప్ప తలకాయి నాయిన బుజం మీద నుండి యనక్కి యాలాడతా వుంది. కండ్లు మూతలు పడిండివి. నోట్లో తెల్లగ నురగ కారి పోతా వుంది.
   నాయిన బరువుగా అడుగులేసుకోని ఒస్తా వుండాడు.
   “అన్నా! అనుమంతన్నా! ఇట్లియ్యన్నా పిల్లోన్ని ఎత్తుకొంటాను” అని ఎవరో అడుగుతా వుండారు. మా నాయిన మొకం సూసేకి కాకుండా వుంది.గొంతు ఆరుకు పొయ్యి, ఏమీ మాట్లాడ కుండా బలంతంగా ఏడుపు బిగ బట్టి నట్లుండాడు. కాళ్లీడ్సు కొంటా వొచ్చి ఇంటి  ముందర పండేశ. ఎవరో పారొచ్చి ఆ యప్ప కిందకి శిరి సాప ఏసిరి.
    యల్లెలికిల పండుకోనుండే అన్నయ్యని సూసి అందరూ గొళో అని ఏడ్స బట్రి.” అయ్యో సివంగట్లా కొడుకు పొద్దున్నే కాపీ గూడా తాక్కుండా కాలమయ్యి పాయ గదమ్మా” అని తల  తలే కొట్టు కోని మా యమ్మ ఏడుస్తా వుంది. సుట్టూ పక్కల ఇండ్లొల్ల మాట్లు ఇనే కొద్దీ   అందరి కండ్లల్లో నీళ్లు కార బాట్టె.  ” అప్పయ్యా కాసంత సింత సిగర కావల్ల అంటే ఎదురు సెప్పుకుండా సెట్తెక్కి పీక్కోనొస్తా వుండె. శాత గాదంటే బాయిలో నీల్లు సేది పోస్తా వుండె. బంగారట్లా పిల్లోనికి ఇంత బిరీన నూరేండ్లు నిండిపాయనే!!అని ఏడుస్తా వుండ్రి.
    అంత సేపటికి జొమ్మాని పల్లి నరసిమ్మప్ప అని మాకి మామ వరసవుతాడు. ఆ యప్ప వొచ్చె.
   “పిల్లోనికి ఏమీ కాదు రవ్వంత సేపట్కి బతుకు తాడు. నేను సెప్పినట్ల మీరంతా యినండి” అని సుట్టూ ముసురుకోనుండే జనాల్నంతా దూరం జరిపె.
  “ఎవరూ సేతులు కట్టి నిలబడొద్దు.తలకి రుమాలు సుట్టుకో వద్దు. వక్కాకు నమిలే వొల్లు ఉమిసేసి నోరు కడుక్కొంది. బీడీలు, సిగరట్లు తాగొద్దు.” అని అందర్నీ అదుపు సేశ.
   మా ఇంటికి ఈశాన్యం మూలకి రెండు మైళ్ల దూరం లో రైలు స్టేషనుంది. అట్ల తలెత్తి పార జూస్తే కనిపిస్తుంది. దాంట్లో ఆవులప్ప (కన్నడం లో హావు అంటే పాము అని  అర్థం)అనే ఆయప్ప పంజేస్తాడంట. యట్లా పాము కర్సినా మత్రమేసి ఎక్కిన ఇసం ఎనక్కి తీస్తాడంట. ఒగొగు సారి కర్సిన పామే తిరిగొచ్చి కాటేసిన తావే నోరుపెట్టి ఇసం అంతా తాగేస్తుందంట. అట్ల శానా మందిని బతికిచ్చి నాడని సెప్పి నరసిమ్మప్ప మామ  సైకిలులెక్కి స్టేషనుకి పాయ.
   రవ్వంత సేపటికి తిరిగొచ్చె.
   పాం మంత్రగాడు ఆవులప్పకి ఆపొద్దు డూటీ బెంగులూరు లోనంట. స్టేషన్లో నుంచే ఫోన్ సేసి సదాశివ రెడ్ది పేరు, అమ్మా నాయిన పేరు, వయస్సు అన్నీ సెప్పిండాడంట. ఫోన్లోనే మంత్రాలు సదివి రెండు గంటల లోపల బతికిస్తానని మాట ఇచ్చిండాడంట. ఇదంతా మామ సెప్పుతూనే శానా మందికి నమ్మకం కుదిరినట్లుంది. ఏడ్సకుండ గప్చిప్ అయిపాయిరి.
    టయిమయి పోతా వుంది. ఒంటి గంటాయ. బెంగళూరు నుంఛి నందీ మోటారు గూడా వొచ్చె.( అప్పుడు హిందూపురం నుండి బెంగలూర్ కి యన్.యం.యస్. మరొకటి సి.పి.సి.అని రేండే బస్సులు. ఇప్పుడు ప్రతి పది నిముషాలకూ ఒక బస్సు. జతకు రైల్లు,కార్లు,టూ వీలర్లు,లారీలు చెప్పలేని రద్దీ) ఆ బస్సులోనే మేము కర్నాటకము లోని మేన మామగారి ఊరు కల్యాకన పల్లి కి  వొచ్చి పోతావుంటాము. ఆ బస్సొల్లంతా మాకి వాడికి. ఇంటిముందర జనాల్ని సూసి వాల్లు గూడా దిగొచ్చి “అయ్యో పాపము యంత పని జరిగింది” అని అంగలార్సి పొయ్యిరి.
   కడాకి ఎవరో వొచ్చి “మీకి బుద్ది వుందో లేదో. ఇసం ఒల్లంతా ఎక్కి ఎర్రగా వున్న పిల్లోడు నల్లగ కమురుకు పొయ్యిండాడు. నిప్పుల మిందేసిన పూల తీగిమాదిరీ మాడి కండ్లతో సూసేకి కాకుండా అయ్యిండాదు.ఇంకా బతుకు తాడనే ఆశ యాల పెట్టుకొంటారు?” అని బుద్ది మాట్లు సెప్పితే రెండు గంటలకి ఎత్తుకు పొయ్యి ఒలుకుల్లో పూడ్సి పెట్రి.
   ఆ కాలం లో మా ఊరిదగ్గరికి పాములు పట్టే దానికి అరవోల్లు వస్తా వుండ్రి.వాళ్లు బతికిన పామునే పట్టుకోని శర్మం వొల్సుకోని అమ్ము కొంటా వుండ్రి.వాల్లు సేన్ల దగ్గర  కరెంటు రూముల్లో ఉంటా వుండ్రి.
   వాళ్లకి ఎవురో సెప్పినట్లుడారు. మా ఇంటి దగ్గరికొచ్చి– పామును మేము పట్టేస్తాము  రెడ్డీ– అని సెప్పి శలాకాల్తో గోడని ఒగ పక్క నుంచి పీక బట్రి. యంత సేపు వాళ్లు అవస్త బడినా పాము కనబడ్లేదు. మబ్బయి పాయ. వాళ్లు ఎల్లి పాయిరి.
     ఇంగ రాతిర్లో ఇంట్లో పండుకొనే దేట్లా?? దాని జతకి సలుము పట్టిండే పాములు ఇంకా యందర్ని సంపుతాయో?? అనే బయము. అపుడు గడ్డం పెంచుకో నుండే ఒగ స్వామి ఒచ్చె.
   ఆ స్వామి అంతకు ముందే ఒగ సారి మా ఊర్లో తేలు మంత్రం ఏసి పొయ్యిండె. ఒగరిద్దరు తేలు కర్సి సచ్చి పొయ్యిరంట. అది తెలిసి ఆ గడ్డం స్వామి అందరి ఇండ్లలోనా దూలాలు,దంతెల మిందా శాకు పీసుతో “ఆస్తిక మహర్షి” అని రాసి పొయ్యిండె. యంత రాసినా మా ఇంట్లో యా మూల్లో జూసినా తేల్లు జర్రిలే!!
   ఆ స్వామి ” మీకేమీ బయ్య లేదు” అని సెప్పి రాగులు తెప్పిచ్చి కండ్లు మూసుకోని  మంత్రమేసి ఇచ్చె. అందర్నీ నైరుతీ  మూల్లో వుండే సిన్నిట్లో( రూములో) పడుకోని,కడప మాను మింద రాగులు ఏసుకొమ్మనె. అట్లే రెండు మూడు దినాలు సేస్తిమి.
   ఒగ దినము మా నాయిన తూరుపు వాకిలి పక్కలో బాతిండే రాయి మింద కూకో నుండాడు.  యాముల పల్లి నుంచి, ఒగాయప్పొచ్చి ” ఏమన్నా! పిల్లోడు కాలమయ్యి పాయ అని ఎవరో సెప్పిరి యంత పని జరిగిందన్నా” అని ఆ మాటా ఈ మాటా మాట్లాడుకొంటా నిలబడె.
   “ఏమి జేస్తామన్నా! ఎది గొచ్చిన కొడుకు కండ్లు ముందరే నా సేతుల్లోనే పానా లిడిసె.నాది శానా దురాద్రుస్టం బతుకన్నా. యంత మరుస్తాము అన్నా మరుపుకు రాదు..” అని అంగలార్సు కొంటా కూకోనివుండే బండ మిందనించి కిందకి దిగె.
   “ఇంట్లో నుంచి బయటికొచ్చి బచ్చల్లోకి ఇట్ల తిరిగిండాడు  అంత సేపుకు ఈ రాళ్ల సందులో నుంచి ఒచ్చినంట” అని ఆయప్పకి సూపిస్తా వుండాడు.
    ఆ మాట్లు ముగీ కున్నట్లే గోదుమ నాగు పాము నాలుకులు జవురు కొంటా బుస్సు అని బయటికొచ్చె. నేను కమసల దాస గాడూ ఆడే ఆడుతా వుంటిమి. దాన్ని సూసి మా నాయిన “ఒరే పాము ఈడే ఉందిరా!! ఇంగా యందర్ని సంపేకి కాసుకో నుందో ఈ దీనమ్మ ఈ పొద్దు దీన్ని సంపి పారేస్తాము రాండిరో ” అని గట్టిగా కేకలేసె.
    ఊర్లో అందరూ గడార్లూ, శలాకులూ,బర్జీలు(పాముల్ని పడిచేవి),కట్టెలూ తీసుకోని గుంపులు గుంపులు వొచ్చిరి.పొద్దుబడి నాలుగ్గంటలు నుండి ఒగ పక్కనుండి గోడ పీక బట్రి. అంకనం ఎలుపు ఇంటినంతా పడగొట్టినా పాము కని పించలేదు. మబ్బయితా వుంది.సీమ నూనె లాంతర్లు,సాకలోల్లు ఇలాటి కట్లు( కాగడాలు) తెచ్చిరి. కడాకి తొమ్మిది గంటల టయానికి  అడుగు వరుసలో ఒగ బండ కింద సుట్టుకోని పండుకోని వుండె. దాన్ని బర్జీ తో పొడ్సి బయటికి యల్ల బీకిరి.
    నడి మద్యకి దిగగుచ్చి పైకెత్తి, జనాలకి దాన్ని సూపిస్తా వుంటే అది నోరు తెర్సి పడగనిప్పి బుస్స్ బుస్స్ అని మెలికలు తిరుగుతా వుంది.
    మా అప్పప్ప(చిన్నాయన) కోపము తట్టుకో లేక సేత్తో పట్టుకొనే దానికి పాయ. ఎవరో ఆయప్పని తబ్బుల కర్సు కొన్రి. ఆ రాచ్చాసి పాముని రాళ్ల సందు నుండి తెస్తా  వుంటే రాళ్ల తోను,సెప్పులు తోను, కట్తెల తోను,ఆడోల్లు పరకల తోను వాంచ బట్టిరి. “రత్న మట్లా బిడ్డని యద మీద ఏసుకు పోతివి గదా లంజా” అని కోపాలు ఆరే దంకా తిట్ట బట్రి.
    దాని నోట్లో రూపాయి బిల్ల పెట్టి ఆ పక్కలో వుండే ఎండు మిరప సెట్లేసి నున్నగా  కాల్సి పారేసిరి. బొగ్గు మాదిరీ కాలినంక ఊరిముందరి సేనుల్లోకి మాదిగ నారాయణప్ప  గుడిశె ముందరికి ఇసిరి పారేసిరి.
(నాకు ఈ పాములతో అతి భయంకర మైన అనుభవాలున్నాయి. ఆ యా సంధర్భాలను  బట్టి  కానీ, అన్నీ ఒకే సారి కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను)

మయూఖ

 సెలవు

 

బాల్కనీ తలుపు తెరిచాను, చల్లని గాలి లోపలికి ఆహ్వానించడానికి.
మనస్సు ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ ఉంది. మెదడు అన్నింటిని గుర్తు చేస్తూనే ఉంది. ఇంతలో ఎప్పుడొచ్చిందో తెలీదు. స్నేహితురాలు మాయ రానే వచ్చింది. ఎప్పటిలాగే ఉద్యోగం ముగించుకుని అలసిపోయి వచ్చి పరుపు మీద కాసేపు వాలింది. కొంచెం సేపయ్యాక లేచింది.
“ఎప్పుడొచ్చావే?” అని అడిగాను.
“నువ్వు బాల్కనీలో కూర్చుని ఆ గులాబి పువ్వులను పలకరిస్తూ ఏదో ఆలోచిస్తున్నప్పుడే వచ్చాను. ఏం ఆలోచిస్తున్నావే?’ అడిగింది మాయ.
“ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. నువ్వు ఎప్పుడొచ్చింది కూడా తెలియలేదు” అన్నాను. అంటూ, మళ్లీ బాల్కని దగ్గరకు వచ్చి నిలుచున్నాను.
ఉరుములు…మెరుపులు…చల్లనిగాలి…
ఆ గాలికి నేనే కాక నా కురులు కూడా పులకితులై నాట్యమాడుతున్నాయి.
“క్యాండిల్ ఎక్కడుందే?” అనే మాయ మాటతో మళ్లీ కొత్తగా గదిలోకి అడుగుపెట్టాను.
అసలు నేను ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలియదు. నా కళ్ల ముందు ఏం జరిగినా నా మెదడు స్పందించదు. ఈ గాలి స్పర్శకి మళ్లీ నా లోకంలోకి వెళ్లి వస్తున్నట్టున్నది. నేను పెయింటింగ్ వేస్తున్నప్పుడు కూడా ఈ లోకంలో ఉండను. అప్పుడప్పుడు ‘నేను కూడా నా పెయింటింగులో ఉన్నానా’ అని అనుకుంటుంటాను. ఏదో ఆలోచనలతో నా మనస్సంతా నిండి ఉంటుంది. పచ్చని పంట పొలాల్లో తిరుగుతూ ఉంటే ఎంతో హాయిగా మా అమ్మ వొళ్లో ఉన్నట్టనిపించేది. అసలు ప్రకృతి అందాలు వర్ణితమైనవి కావు. అందరూ నేను ఎవరి గురించో ఆలోచిస్తున్నాను అనుకుంటారు. కానీ నేను ఎప్పుడూ ప్రకృతి అందానికి ముగ్దురాలినై వాటిని మనస్సులో తలచుకుంటూ ఉంటాను. ఇది చెబితే తెలిసేది ఎంత మాత్రం కాదు.
“ఏమైందే. క్యాండిల్ ఎక్కడుంది?” అనే మాటతో మళ్లీ మనస్సుతో మాట్లాడటం ఆపాను.
ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మళ్లీ ఎప్పటిలాగా మాట్లాడుకుంటాము – నేను, నా మనస్సు.  “ఏంటే? నేను మాట్లాడుతూ ఉంటాను నువ్వేమీ బదులు పలకవు. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు” అంటూ వుంటుంది మాయ.
“మనుషులతో మాట్లాడి ప్రయోజనం లేనప్పుడు మనస్సుతో మాట్లాడు” అంటాను నేను.
ఈ లోకంలో ఎన్నో పక్షులు.. ఎన్నెన్నో రకాల జంతువులు. అవన్నీ ఒక దగ్గరగా ఉంటూనే హాయిగా జీవితం సాగిస్తున్నప్పుడు ఇన్ని తెలివితేటలున్న మనం ఎందుకు ప్రతి దానికీ తగాదా పడతాం. చంపడం, చావడం…ఇవే ఎందుకుంటాయి లోకంలో. ఇలాంటివి లేకుండా ఉండలేమా? అర్థం కాదు నాకు.
కనిపించని గాలి మనని బ్రతికిస్తున్నప్పుడు కనిపించే ఈ ప్రకృతి మనకు జీవం పోస్తుంది. ఈ పచ్చటి చెట్లు నా చెవిలో మ్రోగే పాట, ఈ చల్లని గాలి, దాని పులకరింపు, అందమైన పక్షులు… అహా! ఇవి కదా నన్ను బతికిస్తున్నవి. వీటిని చూడటానికి కదా ఈ జన్మ నాకు లభించింది అన్న భావనతో మనస్సు నాట్యం ఆడుతూ ఉంటుంది. ఈ గాలి ప్రతిసారీ నాకొక కొత్త అనుభూతిని మోసుకొస్తూనే ఉంటుంది. అహ్.. గులాబి ముళ్లు… అవి నన్ను ముద్దుపెట్టుకోవడంతో నా గదిలోకి ప్రవేశించాను.

+++

selavu

“చూసుకోవే. గులాబీ ముళ్లు గుచ్చుకుంటాయని చెప్పాను కదా. అయినా వింటావా నా మాట” అంది మాయ.
“అదేం కాదే. ఏదో ఆలోచిస్తూ…’ అని బదులిచ్చాను.
మళ్లీ ఎన్నో రకాల పువ్వులు, చెట్ల మధ్య మెల్లగా నడుస్తున్నాను. వెనకాల ఎవరో వస్తున్నారనిపించి చూస్తే, నలుగురు అబ్బాయిలు కత్తులు పట్టుకుని నా వైపే నడుస్తున్నారు.
నేను కళ్లు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చి గాలి నాకు ఏం చెయ్యమని చెబుతుందా అని వింటున్నాను.
నా శరీరాన్ని తేలిక చేసుకున్నాను. ఆ నలుగురినే తప్పించుకుని ఉరుకుతూ కొంచెం దూరం దాకా వచ్చాను. మళ్లీ ఒక గాఢ శ్వాస తీసుకుని నా నడక మొదలెట్టాను.
పై నుంచి మంచు. అసలు ఆ ప్రాంతానికి ఎలా చేరుకున్నానో తెలీదు. కొంత దూరం వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు కన్పించింది. అక్కడినుంచి నా దారి ఆగిపోయింది. ఎటూ వెళ్లలేను. చుట్టూ చెట్లు. దారేదీ కనిపించటం లేదు. కళ్లు మూసుకుని నా మనస్సును  ప్రశ్నించడం మొదలెట్టాను. అదంటుంది…”నీ విశ్వాసము, నీ ధైర్యమే నీకు తోడు. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. మనస్సులో భయాన్ని ఏ నాడు నింపుకోకు. నీకు  కనిపించేదంతా నిజమని ఏనాడూ అనుకోకు. నేను చెప్పే మాట విను. వెళ్లు. నీ ప్రయాణానికి ఏ ఆటంకమూ కలగదు. వెళ్లు” అంది.

విన్నాను. విని, నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే నా మనస్సులాగే చెట్టు కూడా దారిచ్చింది.
ఆ చెట్ల అందము, పువ్వుల పరిమళం నన్ను ముగ్దురాలిని చేసాయి. ఆలోచిస్తున్నాను. ఎందుకు నేను పువ్వులా, చెట్టులా, పక్షిలా పుట్టలేదు! ఎంత అందమైన జీవితం వాటికి! అహా…వాటిని చూస్తుంటే నా మనస్సు ఆనందంతో పులకిస్తోంది. ఈ అర్థం లేని ఆనందం, పసిపిల్లలా గెంతులేస్తున్న ఈ మనస్సు, నా వశంలో లేని శరీరం అప్పుడే మొదలైన వర్షంలా తడుస్తున్నాయి. ఈ హాయి నేను ఎప్పటికీ మరచిపోలేను.

ఇంతలో “మయూకా” అన్న అమ్మ పిలుపుతో నిజ జీవితంలోకి ప్రవేశించాను.

+++

“మయూఖా” అన్న మా అమ్మ పిలుపును మూట గట్టుకొచ్చిన ఆ గాలి, నన్ను, నా  ఇంటిని గుర్తు చేస్తూ ఉండగా “అబ్బా…ఎక్కడుందో చెప్పవే క్యాండిల్’ అంటూ నా స్పేహితురాలు మాయ నా గదిలోకి ప్రవేశించింది. నా తనువు  “ఆ. వస్తున్నా…” అంటూ నా మనస్సులోని ఆలోచనల తలుపు మూస్తూ బాల్కనీలో నుంచి వస్తున్న గాలిని ఆహ్వానిస్తూ నేల తల్లికి పాదాలతో ముద్దులు పెడుతూ ముందుకు కదిలింది.