పాంచాలి పెరటి సాగు!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ఒకసారి మహాభారతంలోకి వెళ్లవలసిన అవసరం కనిపిస్తోంది. అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలోని ఈ ఘట్టం చూడండి…

పాండవులు రాజ్యం కోల్పోయి, ద్రౌపదిని వెంటబెట్టుకుని అరణ్యవాసానికి బయలుదేరాడు. వారి వెంట కొంతదూరం పౌరులు కూడా వెళ్లారు. వారిని వెనక్కి పంపించివేసిన తర్వాత గంగాతీరానికి వెళ్ళి, ఒక పెద్ద మర్రిచెట్టుకింద ఆగి, గంగలో స్నానం చేసి, ఒక పగలూ, రాత్రీ  పాండవులు అక్కడే గడిపారు. అంతలో వారిని అభిమానించే బ్రాహ్మణులు అగ్నిహోత్రాలను, బంధువులను, శిష్యులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు. మేము కూడా మీతో వనవాసం చేయడానికి నిర్ణయించుకున్నామని వారు ధర్మరాజుతో అన్నారు.

“ఘోరారణ్యంలో కందమూలాలు తింటూ గడపడం మాకు ఎలాగూ తప్పదు. మీ కెందుకీ కష్టం? క్రూరమృగాల మధ్య వనవాసం మీకు తగదు. దయచేసి  మీ ఇళ్లకు తిరిగివెళ్ళండి” అని ధర్మరాజు వారితో అన్నాడు.

అప్పుడు బ్రాహ్మణులు దుఃఖిస్తూ, “మీలాంటి ధార్మికులను విడిచి ఎలా వెడతాం? మేము మీకు ఆశ్రితులం, భక్తులం. మా పోషణ గురించి ఆలోచించవద్దు. మా కందమూలాలు మేమే సంపాదించుకుంటాం. జపాలు, హోమాలు మొదలైన పుణ్యకార్యాలు చేస్తూ మీ శ్రేయస్సుకు పాటుపడతాం. అంతే తప్ప మీకు అపకారం చేసిన ఆ ధార్తరాష్ట్రుల రాజ్యంలో మేము ఉండలేం” అన్నారు.

వారి ఇష్టాన్ని ధర్మరాజు కాదనలేకపోయాడు. అయితే, వీరు కందమూలాలు తింటుంటే తను ఎలా చూడగలననుకుని బాధపడ్డాడు. ఈ అడవిలో వీరికి ఆహారం సమకూర్చే మార్గం చెప్పమని పురోహితుడైన ధౌమ్యుని కోరాడు. అప్పుడు ధౌమ్యుడు,

“పూర్వం జీవులన్నీ పుట్టిన తర్వాత అవి ఆకలితో బాధపడుతుండడం చూసి సూర్యుడికి జాలి కలిగింది. తను ఉత్తరాయణంలో ఉన్నప్పుడు భూమిలోని రసాన్ని స్వీకరించి దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఆ రసాన్ని మేఘాలలో నింపి, దాని ద్వారా ఓషధులను(ఆహారాన్ని ఇచ్చే మొక్కలను) పొందాడు. రాత్రి పూట చంద్ర కిరణాలనే అమృతంతో వాటిని పెరిగేలా చూసి వాటినుంచి అన్నం పుట్టించి జీవుల ప్రాణం నిలిపాడు. కనుక అన్నం నిండా ఉన్నది సూర్యుడే. భీముడు, వైన్యుడు, కార్తవీర్యుడు, నహుషుడు మొదలైన పూర్వ రాజులందరూ సూర్యుని ఆరాధించి, అన్నాన్ని సంపాదించి దానితో ప్రజలను పోషించారు. కనుక నువ్వు కూడా సూర్యుణ్ణి ప్రార్ధించు” అన్నాడు.

పౌరాణిక శైలిలో చెప్పిన ఈ మాటలు మనకు బాగా తెలిసిన ఒక భౌతికధర్మాన్ని చెబుతున్నాయి. ఉత్తరాయణంలో వచ్చే వేసవి కాలంలో సముద్రాలు, నదులలోని నీరు ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. దక్షిణాయనంలో వచ్చే వర్షాకాలంలో ఆ మేఘాలు వర్షించి ఆహారపు పంటలను ఇస్తాయి. పైన చెప్పిన పూర్వపు రాజులందరూ సూర్యుని ఆరాధించి అన్నం సంపాదించి ప్రజలను పోషించారంటే అర్థం– వ్యవసాయం  ద్వారా ఆహారోత్పాదన చేశారనే. ఈవిధంగా ధౌమ్యుడి మాటల్ని మనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేసుకుంటే, అవి వ్యవసాయం గురించి చెబుతున్నాయి. సూర్యుణ్ణి ప్రార్థిస్తే ఆహారం లభిస్తుందనడం; సూర్యగమనంతో ముడిపడిన ఒక భౌతికధర్మంపైనా, వ్యవసాయమనే భౌతికచర్యపైనా పురుషభావారోపణ చేయడమే.  ఏతావతా ధౌమ్యుడు అంటున్నది ధర్మరాజును వ్యవసాయం చేయమనే!

అదలా ఉండగా, ధౌమ్యుడి మాటల్లో మనకు ప్రస్తుత విషయానికి అవసరమైన అదనపు వివరం, మేఘాల ద్వారా తను పొందిన ఓషధులను సూర్యుడు రాత్రిపూట చంద్రకిరణాలనే అమృతంతో తడిపి వాటిని పెరిగేలా చూశాడన్నది!

పురోహితుడు చెప్పినట్టే ధర్మరాజు సూర్యుని పువ్వులతో పూజించి, ఆ రోజు ఉపవాసముండి, భాగీరథీ జలాలలో నిలబడి ఇంద్రియాలను అదుపు చేసుకుని వివిధ సూర్యనామాలతో జపం చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. “(అరణ్యవాసం చేసే) ఈ పన్నెండేళ్లూ నీ వంటశాలలో ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు అక్షయాలై, నాలుగు రకాల ఆహారాలు అవుతా”యన్నాడు.

పురాకాలంలో లౌకిక కర్మ, మత కర్మ అనే తేడాలు లేవనీ; ప్రతి లౌకిక కర్మా విధిగా మతపరమైన తంతుతో మొదలు కావలసినదేననీ గతంలో అనుకున్నాం. ఆ దృష్ట్యా చూసినప్పుడు, పురోహితుని సారథ్యంలో ధర్మరాజు మతపరమైన  తంతు జరిపి వ్యవసాయం ద్వారా ఆహార సంపాదనకు పూనుకున్నాడన్న ఒక సాధారణ విషయాన్నే పై ఘట్టం సూచిస్తోంది. కాకపొతే పౌరాణిక శైలికి అనుగుణంగా దానికి కొంత మాంత్రికతను జోడించి కథకుడు చెబుతున్నాడు. ఆ మాంత్రికతను మరింత ముందుకు తీసుకువెళ్లి, ధర్మరాజుకు సూర్యుడు ‘అక్షయపాత్ర’ను ఇచ్చాడనీ, దాని ప్రభావంతో ద్రౌపది అన్ని రకాల ఆహార పదార్థాలను సృష్టించి పూటపూటా ఎంతమందికైనా షడ్రసోపేతమైన భోజనం పెట్టేదనే ఊహకు రెక్కలు తొడిగారు.

గమనించండి…ధర్మరాజుకు సూర్యుడు అక్షయపాత్రను ఇచ్చినట్టు పై కథనంలో లేదు. ద్రౌపది సమకూర్చిన(‘ద్రుపదరాజపుత్రిచేత సాధితంబులై’- అని కవి ప్రయోగం) వన్యఫల మూలకాలే అక్షయాలు అవుతాయని మాత్రమే సూర్యుడు అన్నాడు. అంటే, మానవప్రయత్నంతోనే ఆహారం పండించుకోవాలని అర్థం. ఇంకా విశేషమేమిటంటే  ఇక్కడ ఆ మానవప్రయత్నం కూడా పాండవ సోదరులది కాదు; ద్రౌపదిది! వన్యఫల మూలకాలను సమకూర్చవలసింది ద్రౌపదే.

నా ఉద్దేశంలో, మహాభారతంలోని ఈ వివరం ఒక అపురూపమైన పురాచారిత్రక సత్యాన్ని చెబుతోంది. అది, వ్యవసాయం, పశుపాలన అనేవి పెద్ద ఎత్తున విస్తరించి పూర్తిగా పురుషుడి అధీనం కావడానికి ముందు స్త్రీల చేతుల్లో ఉండేవన్నది. పురుషుడు వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాక కూడా పరిమిత స్థాయి కలిగిన పెరటి సాగును, కంచె పశుపాలనను స్త్రీలే నిర్వహించేవారు. ద్రౌపది సమకూర్చిన వన్యఫలమూలకా లన డంలో అదీ మర్మం.

మహాభారత మూలకథలోని కొన్ని ముఖ్యమైన కథాంశాలు ప్రచారంలో లేకపోవడం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, పాండవులు, ద్రౌపది పన్నెండేళ్ళ అరణ్యవాసమూ ఒంటరిగా చేశారనే ఊహకు మనం అలవాటు పడిపోయాం. కానీ అది నిజం కాదు.  వారి వెంట పరివారమూ, పరిచారకులే కాక, రథాలూ, గుర్రాలూ వగైరాలు ఉన్నాయి. ఇందుకు విరాటపర్వం, ప్రథమాశ్వాసమే సాక్ష్యం.

అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి ఉపక్రమించేముందు; ధర్మరాజు తమ్ముళ్లతో కలసి ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. వాటి ప్రకారం, అజ్ఞాతవాసం ఏడాదీ తమ అగ్నిహోత్రాలను ధౌమ్యుడు సంరక్షించాలి. వంటలవారు, వారి అధిపతి(మహానసాధ్యక్షుడు), ద్రౌపది పరిచారికలు ద్రుపదపురానికి వెళ్ళాలి. ఇంద్రసేనుడు మొదలైన రథసారథులందరూ ద్వారకానగరానికి వెళ్ళాలి! ఆ సమయంలో ధర్మరాజు ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే, “మా గురించి ఎవరైనా మిమ్మల్ని సమాచారం అడిగితే, ద్వైతవనంలోనే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారనీ, ఆ తర్వాత వారి గురించి మాకు తెలియదనీ” చెప్పమంటాడు. అజ్ఞాతవాస కాలంలో తమ ఉనికిని శత్రువు కనిపెడితే,మళ్ళీ అరణ్య,అజ్ఞాతవాసాలు చేయవలసివస్తుంది.

పాండవులు ఇలా మందీ మార్బలంతో అరణ్యవాసం చేశారన్నప్పుడు, వారికి అడవే ఒక మోస్తరు రాజ్యంగానూ, వారున్న ప్రదేశమే తాత్కాలిక ‘రాజధాని’గానూ ఉండేదన్నమాట. ఇందుకు ఇప్పటికిప్పుడు గుర్తొచ్చే ఒక పోలిక, టిబెట్ బౌద్ధ మతగురువు దలైలామా. 1959లో ఆయన టిబెట్ నుంచి శరణార్థిగా మన దేశానికి చేరుకున్న తర్వాత, ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆయన ప్రవాస ప్రభుత్వా(Government in Exile)న్ని, ప్రవాస మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకున్న సంగతి మనకు తెలుసు.    

ప్రస్తుతానికి వస్తే,  ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫలమూలకాలు’  ద్రౌపది స్వయంగా పండించినవి కాకపోవచ్చు. వాటి సాగుపై ద్రౌపది అజమాయిషీ వహించి ఉండచ్చు. అలాగే,  ద్రౌపదే స్వయంగా వండి పెట్టేదనడానికీ అవకాశం లేదు. అక్కడ కూడా ఆమెది పర్యవేక్షణ బాధ్యతే.

***

‘రాత్రి పూట చంద్రకిరణాలనే అమృతంతో ఓషధులు వృద్ధి పొందేలా (సూర్యుడు)చూడడం, ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు అనే పై రెండు వివరాలను పట్టుకుని ఇప్పుడు జార్జి థాంప్సన్ ను పలకరిద్దాం:

పంటల వృద్ధికి కారణమైన తేమ చంద్రుడి నుంచే లభిస్తుందని గ్రీసులోనే కాక, ప్రతిచోటా విశ్వసిస్తారని ఆయన అంటారు. మంచు లేదా తుషారం పౌర్ణమి రోజునే ఎక్కువగా కురుస్తుందన్న ప్లూటార్క్ మాటను ఆయన ఉదహరిస్తారు. కవులు తుషారాన్ని చంద్రుని కుమార్తెగా చెబుతారు. మన సంస్కృతంలో కూడా చంద్రుడు ‘హిమ’కరుడు, ‘తుహిన’కరుడు! హిమమన్నా, తుహినమన్నా మంచే.  సిసిరో(క్రీ.పూ. 106), ప్లినీ(క్రీ.శ. 23) అనే రోమన్ పండితుల మాటలు, పైన పేర్కొన్న ధౌమ్యుడి మాటలకు ఇంకా దగ్గరగా ఉంటాయి. సిసిరో ప్రకారం, భూమిలోంచి పుట్టే ప్రతి ఒక్కటీ ఎదగడానికి అవసరమైన తేమ చంద్రుడి నుంచే ప్రవహిస్తుంది. ఇక, సూర్యుడు హరించే తేమను అంతటినీ చంద్రుడు మళ్ళీ ఉత్పత్తి చేస్తాడని ప్లినీ అంటాడు.

పైరు పంటలను వృద్ధి చెందించేవాడే కాదు, అన్ని రకాల జీవజలాలను అందించేవాడూ చంద్రుడే. ‘విత్తనాలకు, మొక్కలకు వాహకుడు’ చంద్రుడే నని భారతీయులు భావిస్తే, వృక్షజీవులన్నిటికీ అధిపతి చంద్రుడని బాబిలోనియన్లు విశ్వసించేవారని థాంప్సన్ అంటారు. భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే ఒక మొక్కకు ‘సోమ’ అని చంద్రుడి పేరు పెడితే, ఉత్తరఅమెరికావాసులు మొక్కజొన్నను చంద్రసంబంధిగా భావించేవారని కూడా ఆయన అంటారు. ‘చంద్రుడు వృద్ధి చెందుతున్న కొద్దీ మొక్కలో రస స్రావం పుంజుకుంటూ ఉంటుం’దని –రియో గ్రాండే (అమెరికాలోని కొలరాడోలో ఉన్నఒక నదీ, దాని తీరప్రాంతం) లోని స్థానిక తెగలలో వ్యాప్తిలో ఉన్న నుడికారం.

చెట్ల నుంచి వచ్చే జిగురు లాంటి పదార్థాలలో, ముఖ్యంగా ధూపం వేయడానికి ఉపయోగించే సువాసన గల వాటిలో, ఆ లక్షణాలకు కారణం చంద్రుడే. అలాగే తుమ్మచెట్టును స్త్రీ గానూ, దానినుంచి స్రవించే జిగురును గడ్డకట్టిన ఋతురక్తం గానూ కొన్ని చోట్ల భావిస్తారు. దానికి మహిమ ఉంటుందన్న నమ్మకంతో తాయెత్తుగా ధరిస్తారు.

నాట్లు వేయడానికి, మొక్కలు నాటడానికి , పెళ్లిళ్లకు యోగ్యమైన సమయం పౌర్ణమే నని గ్రీకులు భావించేవారు. అదే సూత్రాన్ని అనుసరించి పంట కోతకు, మొక్కలు, చెట్లు నరకడానికి, గొర్రెల ఉన్ని కత్తిరించడానికి, చివరికి కేశఖండనకు చంద్రుడు క్షీణదశలో ఉన్న రోజులు(కృష్ణపక్షం) మంచివని అనుకునేవారు, రోమన్ చక్రవర్తి టిబెరియస్ కేశఖండన విషయంలో ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేవాడు. మన దగ్గర కూడా సన్యాసులు, శ్రోత్రియులు కేశఖండనకు తిథి వారాలు చూసుకోవడంతో సహా ఇలాంటి నియమాలనే పాటిస్తారు. ఇక నూతన శిశువులను దాదులు ఆరుబయటకు తీసుకెళ్ళి చందమామకు చూపిస్తారని ప్లూటార్క్ అనడం ప్రత్యేకించి మనకు ఆసక్తికరం. మనదగ్గర అచ్చంగా ఇలాంటి ఆచారమే ఉందో లేదో కాని, పసిపిల్లలకు ‘చందమామరావే, జాబిల్లి రావే’ అంటూ చందమామను చూపించడం ఉంది. బహుశా పసిపిల్లలను చంద్రుడికి చూపించే ఆచారమే, పసిపిల్లలకు చంద్రుణ్ణి చూపించే అలవాటుగా మారిందేమో తెలియదు.

సంగతేమిటంటే, స్త్రీల లైంగిక జీవితంతో ముడిపడిన చంద్రుని ఆరాధననుంచే వారి సామాజిక విధులు కూడా పుట్టాయని థాంప్సన్ అంటారు. ఉదాహరణకు, నీళ్ళు తేవడం, మొక్కలను పెంచడం, మంచును, వర్షపు నీటిని సమీకరించడం ప్రధానంగా స్త్రీల బాధ్యతే. ఆవిధంగా పెరటి సాగు వారి చేతుల మీదుగానే జరిగేది. ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు’ అనే మాట ఆ పెరటి సాగునే సూచిస్తున్నాఆశ్చర్యంలేదు.

అలాగే, కంచె పశుపాలనను కూడా స్త్రీలు నిర్వహించేవారు. కంచె పశుపాలన అంటే ఇంటిదగ్గరే పశువుల పెంపకం. వేటకు వెళ్ళిన మగవాళ్ళు అక్కడ పట్టుకున్న చిన్న చిన్న జంతువులను ఇంటికి తీసుకొస్తే స్త్రీలు వాటిని పెంచేవారు. అలా కొన్ని జంతువులు మనిషికి మాలిమి అయ్యాయి. అదలా ఉంచితే, చంద్రుని ఆరాధనలో బలులు ఇవ్వడం కూడా ఉండేది. స్త్రీలు బలి ఇచ్చే జంతువులు కూడా ప్రతిచోటా చిన్నవిగానే ఉంటాయి. ఈ బలిచ్చే జంతువుల ఎంపిక ప్రతిచోటా ఒకేలా ఉండడం కొట్టొచ్చినట్టు కనిపించే విశేషమని థాంప్సన్ అంటారు.

selene-moon goddess

చంద్రునికి బలి ఇచ్చే జంతువులు ప్రధానంగా కుందేలు, మేక, పంది. నేడు క్షుద్రంగా భావించే నిన్నటి మాంత్రికచర్యలలో (witch craft) ప్రాముఖ్యం కలిగినవి ఇవే. సెమెటిక్ స్త్రీల తంతులలో పావురం కూడా ఇలాంటిదే. అలాగే, పిల్లి! పురాతన ఈజిప్టులో పిల్లిని పూజించేవారు. అది అనేక రంగుల్లో ఉండడం, రాత్రిళ్ళు  విలక్షణమైన అలవాట్లను కనబరచడం, అది పిల్లల్ని పెట్టే తీరు కూడా విలక్షణంగా ఉండడం చంద్రునికి అన్నివిధాలా సరిపోయే చిహ్నంగా దానిని చూపిస్తాయని ప్లూటార్క్ అంటాడు. అలాగే పిల్లి తన జీవిత కాలంలో మొత్తం 28 పిల్లల్ని పెడుతుంది. చాంద్రమానానికి చెందిన నెలకు కూడా 28 రోజులు. పౌర్ణమి రోజున పిల్లి కళ్ళు చాలా పెద్దవి గానూ, ప్రకాశవంతంగానూ ఉండి, చంద్రుని క్షీణదశలో చిన్నవిగానూ, కాంతిహీనంగానూ మారుతుంటాయి.

మన దగ్గర కూడా పిల్లి ఒక మార్మిక జీవిగానే కనిపిస్తుంది. దానికితోడు మనం పిల్లిని ఒక తరహా క్షుద్ర జంతువుగానే చూస్తాం. పిల్లి ఎదురవడాన్ని అపశకునంగా భావిస్తాం. మళ్ళీ, పిల్లిని చంపడం మహాపాపమన్న సెంటిమెంటూ మన దగ్గర కనిపిస్తుంది. స్త్రీ ప్రధానమైన పురాకాలపు మాంత్రిక తంత్రాలలో పిల్లికి పాత్ర ఉండడమే, దానిపట్ల మనలో అజ్ఞాతంగా గూడుకట్టుకున్న వ్యతిరేకతకు కారణమేమో తెలియదు. అదే సమయంలో పిల్లికి గల మార్మిక లక్షణం కూడా మనకు తెలియకుండానే మనపై ప్రభావం చూపి దానిని చంపడం పాపమన్న సెంటిమెంటుకు దారి తీయించి ఉండచ్చు.

మళ్ళీ చంద్రుడి విషయానికి వస్తే, చంద్రుడిలో ఉందనుకునే  పునరుజ్జీవకగుణమే రాళ్లలో, ముఖ్యంగా స్ఫటికాలలో, జాతిరాళ్లలో కూడా ఉంటుందనే విశ్వాసమూ చాలాచోట్ల ఉంది. అలాగే, మనిషి ఎముకల్లోనూ, కేశాలలోనూ కూడా. అందుకే ఆయా సంస్కారాలు జరిపేటప్పుడు పన్ను పీకించడం, జుట్టు తీయించడం చేస్తూ ఉంటారనీ, శరీరంలోని ఈ భాగాలకు స్వయం పునరుజ్జీవక లక్షణం ఉండడమే దీనికి కారణమని థాంప్సన్ అంటారు. మన దగ్గర అనేక తంతులలో కేశఖండనం జరుగుతుందన్న సంగతి తెలిసినదే.

ఇటువంటి అనేక ఆచారాలకు గల విశ్వజనీనతే ఇక్కడ ప్రధానంగా గుర్తించవలసిన అంశం.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. V.V.Satyanarayana Settymail.com says:

    పా శ్చాత్య పు రా ణా ల లో నో వా స్ ఆ ర్క్ ఉం ది. హిం దూ పు రా ణా ల లో కూ డా స త్య వ్ర తు డ నే రా జు ఒక ప డ వ లో స ప్త ఋ షు ల ను , వి త్త నా ల ను ,….చే ర్చి నా డ ని ఉం ది . వీ టి వ ల్ల ప్ర ళ యం ని జం గా జ రి గిం డా ?
    శా స్త్రీ యం గా వి వ రిం చ గ ల రు.

    • కల్లూరి భాస్కరం says:

      “ప్ర ళ యం ని జం గా జ రి గిం దా?”
      -దీనిని నేనింకా పూర్తిగా పరిశీలించలేదండీ. కాకపోతే జలప్రళయగాథ ప్రాచీన ప్రపంచ పురాణ కథలు అన్నింట్లోనూ ఉంది. బహుశా అది ఒకప్పటి వాస్తవిక ఘటననే చెబుతూ ఉండచ్చు. ఒక ప్రాంతానికి చెందిన ఆ ఘటనకు సంబంధించిన కథనాలు మిగిలిన ప్రాంతాలకు వ్యాపించి ఉండచ్చు. అలా ఎన్నో కథనాలు వ్యాపించిన ఉదాహరణలు కనిపిస్తాయి.

  2. chintalapudi venkateswarlu says:

    భాస్కరం గారూ !
    ఈ వాంగ్మయ ప్రవాహం అనేక చేర్పులు కూర్పులతో లిపి అనే ఆనకట్ట పడేవరకు నిరాఘాటంగా సాగింది. లిపి తరువాత కూడా మార్పులు తప్పలేదు. నేడు సినిమాలలో కూడా దర్శకుని బట్టి కథలు మారుతూనే వున్నై. వాగ్మయ కాలంలో అంత సుదీర్ఘ సమయం నాటి కథల్ని ఆమాత్రంగానైనా నిలబెట్టి మనకందించిన మన పౌరాణికుల్ని (గాధికుల్ని) పొగడకుండా ఉండలేకపోతున్నాను. చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేవాళ్ళం. పిల్లలందరినీ పదిమంది చొప్పున నాలుగు వరసల్లో దూరదూరంగా కూర్చోబెట్టి మొదటి వారికి రెండు వాక్యాల కథ చెప్పేవారు. వాళ్ళు వాళ్ళ తరువాత వారికి, వాళ్ళు వాళ్ళ తరువాతవారికి అలా చెప్పుకుపోవాలి. చివరివాళ్ళు ఆ కథ అందరికీ చెప్పాలి. అప్పుదాకథలు విచిత్రంగా ఉండేవి. నలుగురూ నాలుగు విధాలుగా చెప్పేవారు. ఇక ఆ సుదీర్ఘ కాలంలో అప్పటి కథలు ఎంతగా మారి ఉండవచ్చు! వ్యాసుని శిష్యులు నలుగురూ నాలుగు విధాలుగా భారతం చెప్పారుగా! వ్యాస భారతం వేరు, జైమిని భారతం వేరు. కాబట్టి పౌరాణిక పరంపరలో వారి వారి స్వభావాలను బట్టి రకరకాల కల్పనలు చోటుచేసుకొని ఉండవచ్చు. అక్షయ పాత్రల వంటివి అనేకం ప్రవేశించి ఉండవచ్చు. హంస నీటిని విడిచి పాలను గ్రహించినట్లు మీరు పురాణాలనుండి చరిత్రను వేరుచేస్తున్నారు. మీ కృషికి ధన్యవాదాలు. పదండి ముందుకు-

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారూ…మీ స్పందన ఎంతో ఉత్సాహకరం.

  3. Vijay Koganti says:

    మన పురాణాలలోని చాలావిషయాలు ఇలా మాంత్రికంగా ఉన్నవే. వాటి వర్ణన లోని ఆంతర్యాన్ని మరచి మూఢత్వాన్ని ఆపాదించిందీ మనమే. మీ రచన చాలా లాజికల్ గా ఆలోచింపచేసేలా ఉంది భాస్కరం గారూ. ఇప్పటి తరానికి మీ రచన చాలామార్గదర్శకం.అబినందనలు.

    • కల్లూరి భాస్కరం says:

      .మీ అభినందన ఎంతో ఉత్సాహకరం విజయ్ గారూ…ధన్యవాదాలు

  4. తేనె విషయంలో కూడా తేనెటీగలు పున్నమికి పూజిస్తాయని, అమావాస్యకు ఆరగిస్తాయని ఒక నమ్మకం ఇప్పటికీ ఉంది.

మీ మాటలు

*