Archives for April 2015

ప్యారీ.. పారీ.. పారిస్!

సత్యం మందపాటి

satyam mandapati ప్రపంచమంతటా అందరూ ఏనాటికైనా చూడాలి అనుకునే నగరం పారిస్! (Bucket List అన్నమాట)

ప్రతిరోజూ కొన్ని లక్షలమంది ఎక్కడెక్కడినించో వచ్చి, విహరించే నగరం పారీ.. అదే పారిస్!

పారీ అని ఎందుకు అన్నానో, ఒక చిన్న కథ చెబుతాను.

నేను రెండు సార్లు బిజినెస్ పని మీద, ఒకసారి శ్రీమతితో కలిసి విహారయాత్రకి పారిస్ వెళ్ళాను. చాలాసార్లు పారిస్ చార్లెస్ డిగాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వెళ్ళాను కానీ, మిగతా అంతర్జాతీయ విమానాశ్రయాలు  ఎన్నో చూసిన నాకు, ఏమాత్రం నచ్చని విమానాశ్రయాల్లో అదొకటి!

ఇక్ష్వాకుల కాలంలో మొట్టమొదటిసారిగా పారిస్ వెళ్ళినప్పుడు, ఒక చిన్న డిక్షనరీ కొన్నాను. ఇంగ్లీషు నించీ ఫ్రెంచిలోకి, ప్రయాణానికి కావలసిన చిన్న చిన్న వాక్యాలకి ఇంగ్లీషు అనువాదాలు. అంటే హలో బాగున్నారా, రెస్ట్ రూము ఎక్కడ, ఫలానా చోటుకి పోవాలి ఎలా వెళ్ళాలి, రైలు టిక్కెట్లు ఎక్కడ ఎలా కొనాలి… లాటి చిన్న చిన్న వాక్యాలు చెప్పటానికి సులువుగా వుంటుందని. నేను చైనా, జపాన్.. ఇలాటి భాష రాని ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఇలా డిక్షనరీలు కొనటం అలవాటయిపోయింది మరి. ఆ విషయమే స్నేహితుడు మూర్తిగారికి చెబితే, ఆయన పెద్దగా నవ్వాడు.

“ఫ్రెంచ్ భాష మాట్లాడటం అంత సులభం కాదు. వాళ్ళు వ్రాసిన సగం అక్షరాలు పలకరు. అదీకాక, ఆ యాస కూడా మీకు రెండు రోజుల్లో రావటం కష్టం. మన ఇండియన్ ఇంగ్లీషు యాస వాళ్లకి అసలు అర్ధం కాదు. అంతేకాదు మీ కొలీగ్ ఫ్రాంక్ కూడా మీతో వస్తున్నాడా?” అని అడిగాడు.

నేనూ, ఫ్రాంక్ ఒక ఇండియా రెస్టారెంటుకి వెళ్ళినప్పుడు, అక్కడికి వచ్చిన మూర్తికి పరిచయం చేశాను      అతన్ని ఒకసారి. అందుకే మూర్తికి అతను బాగా తెలుసు. అవును ఇద్దరం కలిసే వెడుతున్నామన్నాను.

పెద్దగా నవ్వుతూ అన్నాడు మూర్తి, “ఫ్రాంక్ అమెరికాలో వుంటున్నా, గట్టి బ్రిటీష్ యాసతో ఇంగ్లీష్ మాట్లాడతాడు. వాళ్లకి బ్రిటిష్ వాళ్ళంటే నచ్చదు. అందుకని మీరే మాట్లాడండి. ఇంగ్లీషులో కాదు. తెలుగులో.     కాస్త సంజ్ఞలు చేస్తూ, మాట్లాడితే వాళ్ళు అర్ధం చేసుకుంటారు”

అతను ఆ మాటలు సరదాగానే అన్నా, అక్కడ చాల చోట్ల అది నిజమేనని అనిపించిన సందర్భాలు కూడా వున్నాయి.

ఉదాహరణకి మా వూళ్ళో ఒకప్పుడు టీవీలో వార్తలు చదివే ఒకాయన పేరు బాబ్ బుడ్రో. బుడ్రో అనేది ఫ్రెంచి పేరు. దాన్ని ఇంగ్లీషులో ఇలా వ్రాస్తారు, Budreaux అని. ‘బు’ బాగానే వుంది కానీ, ఆ స్పెల్లింగులో ‘డ్రో’ ఎలా వచ్చిందో అర్ధం కాదు. ఆ అక్షరాలు అన్నీ పలికితే ఎవరికీ అర్ధం కాదు. అలాగే పారిస్ నగరాన్ని కూడా ఫ్రెంచి భాషలో పారీ అంటారు. వాళ్ళ భాష, వాళ్ళ ఇష్టం!

ఇలాగే కొన్ని మాటలు, మన తెలుగులోలాగా అన్ని అక్షరాలూ ఫ్రెంచిలో పలుకుతూ మాట్లాడుతుంటే, వాళ్ళు అర్ధంకాక మధ్యలోనే వెళ్ళిపోయేవారు!

పారిస్ గురించి రెండు మాటలు. ఈ నగరాన్ని, క్రీస్తు పూర్వం మూడవ దశాబ్దంలో, కెల్టిక్ ప్రజలు ‘పారిసై’ అనే పేరుతో స్థాపించారని, వల విసిరితే అంతర్జాలంలో చెప్పారు. క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం వచ్చేసరికీ పారిస్ యూరప్లోనే అతి పెద్ద నగరంగానూ, గొప్ప వ్యాపార కేంద్రంగానూ తయారయింది. పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగాక, ఆధునికతతో పారిస్ ఎన్నో రంగాల్లో బాగా ఎదిగిపోయింది. ఈనాటికి పారిస్ నలభై ఒక్క చదరపు మైళ్ళ వైశాల్యంతో, ఇరవై మూడు లక్షల జనాభాతో, యూరప్లోనే ఒక పెద్ద నగరం. అంతేకాదు, ప్రపంచంలో గొప్ప విహారయాత్రా స్థలం అయిపోయి, సంవత్సరానికి దాదాపు ముఫై మిలియన్ల యాత్రీకులని ఆకర్షిస్తున్నది!

మేము లండన్ నించీ, ఇంగ్లీష్ ఛానల్ నీళ్ళ క్రింద నించీ వేసిన ట్యూబ్ రైల్లో పారిస్ చేరాం. అక్కడ మూడు రాత్రులు, అంటే మూడు నిద్రలు చేయాలని ముందే నేనూ, శ్రీమతీ ప్లాన్ చేసుకున్నాం

మేము మొట్టమొదటగా పారిస్లో చూసింది, అవును – మీరు అనుకున్నది రైటే, ఐఫిల్ టవర్. టిక్కెట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళాక, ‘టవర్ పైకి వెళ్ళటానికి, లిఫ్ట్ తీసుకోవచ్చు, మెట్లు ఎక్కవచ్చు, ఇక మీ ఇష్టం’ అందంగా అన్నది అక్కడ అందంగా నుంచుని వున్న అందమైన ఫ్రెంచి సుందరి.

సరే, ఏదో చక్కటి పిల్ల ఇంకా చక్కగా చెప్పింది కదా అనుకుని, ఇంచక్కా మెట్లు ఎక్కి వెడితేనే, అన్నీ చూసుకుంటూ తీరిగ్గా వెళ్ళవచ్చు అని కూడా అనుకుని, మా కాళ్ళకి పని చెప్పాం.

paris1

 

ఈ ఐఫిల్ టవర్ 1887వ సంవత్సరంలో మొదలు పెట్టి, 1889లో పూర్తిచేశారు. అక్కడ అప్పుడు జరిగిన వరల్డ్ ట్రేడ్ ఫైర్ చూడటానికి వచ్చిన వారికి అదొక పెద్ద ఆకర్షణ అయింది. దీని మీద మనం వెళ్ళగలిగిన ఎత్తు 896 అడుగులు. దానిపైన ఇంకా కొంత నిటారుగా వున్న కట్టడంతో కూడా కలుపుకుంటే, దీని ఎత్తు 986 అడుగులు. దీన్ని కట్టిన కంపెనీ, “Compagnie des Etablissements Eiffel” అనే పేరు మీద దీనికి ఐఫిల్ టవర్ అనే పేరు వచ్చింది.

ఈ టవర్ కట్టడంలో ఉద్దేశ్యం, ఒకటి రేడియో ప్రసారం కోసం, రెండు దీనిని ఒక నగర వీక్షణ ఆకర్షణగా చేయటం.

దీనిలో మూడు పెద్ద అంతస్తులు వున్నాయి. మూడు చోట్లా టవర్ చుట్టూతా నగర వీక్షణకు ఒక డెక్ లాగా కట్టారు. ఈ మూడు అంతస్తులకీ వెళ్ళటానికి, తొమ్మిది లిఫ్టులు వున్నాయి. మేము పైదాకా వెళ్లి, పారిస్ నగరాన్ని అన్ని కోణాల్లోనూ చూసాం. ఎంతో అందమైన నగరం పారిస్ అని ఇంకోసారి అనుకున్నాం.

పారిస్లో తప్పకుండా చూడవలసిన ఇంకొకటి “ది లూవ్”. ‘లూవ్’ మ్యూసియం. లూవ్ స్పెల్లింగ్ కూడా ‘Louvre’ అని వ్రాస్తారు. ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగులు, శిల్పాలు ఎన్నో వున్నాయి. మైకలాంజిలో,  రాఫయేల్,  డ వించి, రెంబ్రాంట్, పుస్సీన్, వాన్ డైక్.. ఇలా ఎందరో మహానుభావుల కళా వైదుష్యం ఇక్కడ చూడవచ్చు.

‘డ వించి’ చిత్రించిన ప్రముఖ చిత్రం “మోనా లిసా” ఇక్కడే వుంది.

ఆరున్నర మిలియన్ల చదరపు అడుగుల భవంతులలో, ఎంతో ప్రాచీన కాలంనించీ ఇప్పటి దాకా వేసిన చిత్రాలూ, చెక్కిన శిల్పాలూ దాదాపు ముఫై ఐదు వేల కళాఖండాలున్నాయి. అన్నీ పూర్తిగా చూసి ఆనందించాలంటే, ఒకరోజు చాలదు.

paris2

 

 

ఇక్కడి చిత్రాలకీ, శిల్పాలకీ ఫోటోలు తీయవచ్చు. కానీ “మోనా లీసా” చిత్రాన్ని రెండు అద్దాల  కేసులో బిగించటం వల్ల, ఆ అద్దాల్లో ప్రతిబింబం రాకుండా ఫోటోలు తీయటం కుదరలేదు. అదీకాక ఆ చిత్రపటం దగ్గర వున్నంత క్యూ ఇంకెక్కడా లేదు. తీరిగ్గా లైటు చూసుకుంటూ ఫోటో తీసే సమయమూ దొరకలేదు.

ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ప్రపంచంలో రకరకాల జాతి మనుష్యులు, ఎవరి మతం వాళ్ళు సృష్టించుకుని, ఎవరి కథలు వాళ్ళు వ్రాసుకున్నాక, ఎన్నో పురాణగాథలు ఎక్కడినించీ ఎక్కడికి వెళ్ళాయో కానీ, ఇక్కడి చిత్రాలూ, శిల్పాలూ, వాటి వెనుక ఊహాగానం చూస్తుంటే అవి దాదాపు ఒకటిగానే కనపడ్డాయి నాకు.

ఉదాహరణకు కృష్ణుడు, ఏసుక్రీస్తు ఇద్దరూ గొల్లవారే. కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదుకుంటూ గోవులు కాచుకుంటుంటే, క్రీస్తు పిల్లనగ్రోవి ఊదుకుంటూ గొర్రెలు కాచుకునేవాడు. మోసెస్ వెడుతున్నప్పుడు రెడ్ సీ విచ్చుకుని అతనికి దారి ఇస్తే, వసుదేవుడు వెడుతున్నప్పుడు యమునా నది విచ్చుకుని దారి ఇచ్చింది. కన్యగా వున్న మేరీమాత సూర్యుడి అంశతో క్రీస్తుకి జన్మనిస్తే, కన్యగా వున్న కుంతీదేవి సూర్యుడి అంశతో కర్ణుడికి జన్మనిచ్చింది. ఇక్కడి చిత్రాలు చూస్తుంటే, ఇలాటివి ఎన్నో వింతలు  కనపడ్డాయి. తర్వాత కొంతమంది మిత్రులని, ఇవి ఎక్కడి నించీ ఎక్కడికి వచ్చాయి అని అడిగితే, వారి వారి మతాల నించే ఇతర మతాలకి వెళ్లాయని ఆధారాలతో సహా బల్లగుద్ది మరీ చెప్పారు. అందుకని ఈ వ్యాసంలో ఈ విషయాన్ని ఊహామాత్రంగానే చూసి, ఈ విషయం మీద పరిశీలనో, పరిశోధనో  చేసుకునే వాళ్లకి ఈ వాదన వదిలేద్దాం!

ఇంకా పారిస్ వెళ్ళే వాళ్ళు చూడవలసిన వాటిల్లో ముఖ్యమైనది, నోటర్ డామ్ కేథడ్రల్. 1163లో కట్టటం మొదలు పెడితే, 1345లో పూర్తిచేసిన చర్చి ఇది. అంటే నూట ఎనభై ఏళ్ల పైన తీసుకుంది. దీని మీద ప్రముఖ ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో ఒక నవల కూడా వ్రాశాడు. మంచి అందమైన కట్టడం. 387 మెట్లు ఎక్కగలిగితే, పైదాకా వెళ్లి చూడవచ్చు.

paris3

 

పారిస్లో చెప్పుకోదగ్గ ఇంకో కట్టడం, చాంప్ ఎలీస్. ఇది అక్కడ రోడ్డుకి అడ్డంగా కట్టిన కట్టడం. దీని చుట్టూతా  కార్లు, బస్సులు వెడుతుంటాయి. ఇక్కడ మంచి షాపింగ్ కూడా వుంది.

 

 

పారిస్లో ఇంకా ఎన్నో అందమైన కట్టడాలు వున్నాయి. వాటి గురించి వ్రాసే కన్నా, ఫోటోలు పెడితే చూడటానికి మీకు బాగుంటుంది కానీ, ఈ వ్యాసంలో పేజీలు పెరిగిపోతాయి.

మీకు వీలున్నా, లేకపోయినా తప్పకుండా వెళ్ళవలసింది వెర్సాలీ (Versailles). ఇది పారిస్ నగరానికి పడమటి దిశగా పదిహేడు కిలోమీటర్ల దూరంలో వుంది. ముందే బుక్ చేసుకుంటే టూరిస్టు బస్సులు చాల వున్నాయి.

paris5

 

లూయి-14 మహారాజు కట్టిన ఈ కట్టడం, ఆయనకీ తర్వాత వచ్చిన రాజులు లూయి-15,  లూయి-16 లకు నివాసమయింది. తర్వాత వచ్చింది ఫ్రెంచి రివల్యూషన్. తర్వాత నెపోలియన్ ఇక్కడ ఒకే ఒకరోజు వుండి, వెళ్లిపోయాడుట.

ఇప్పుడిక్కడ ఎన్నో చిత్ర పటాలూ, శిల్పాలే కాక, అద్దాలతో అలంకరించిన గదులు, ఎంతో ఖరీదయిన సోఫాలు, డైనింగ్ టేబుల్సు, బంగారం పొదిగిన సామాన్లు, రంగురంగుల వేలాడే దీపాలు, పొడుగాటి కర్టెన్లు, ఒకటేమిటి ఎన్నో వున్నాయి. ఇవన్నీ ఆనాడు రాజులు ప్రజల సొమ్ముతో ఎంత దర్పంగా బ్రతికేవారో తెలుస్తుంది.

ఇక్కడ కూడా కనీసం ఒక రోజు గడపటానికి సమయం చేసుకుంటే బాగుంటుంది.

పారిస్ అందాల కట్టడాలకీ, దీర్ఘమైన చరిత్రకే కాక, ఫ్రెంచి భోజనానికీ (French Delicacies), ఫాషన్లకీ, అందమైన మనుష్యులకీ, వైన్ తదితర మధ్యపానాలకీ కూడా ఎంతో ప్రసిద్ధి. ప్రతివారూ కనీసం ఒక్కసారయినా చూడవలసిన నగరం.

౦                           ౦                           ౦

వారిజ 

 వసంత లక్ష్మి. పి 

10841540_4894601898522_2018196557_nశివరావు అడుగులు నిరుత్సాహం గా పడుతున్నాయి  రూము కి వెళ్ళి చేసేది ఏం ఉంది ? ఈ రూమ్మేట్స్ ముగ్గురూ ఒక్కసారే ట్రైనింగ్ అని బెంగులూరు వెళ్ళడం ఏమిటి ? తను ఒక్కడూ ఒంటి కాయ శొంఠి కొమ్ము లా ఊరేగడమేమిటి ? ఇదంతా అన్యాయం.. తన విషయం లో యే ఒక్కటి న్యాయంగా జరుగుతున్నట్టు లేదు . ఉద్యోగంలో ప్రమోషనూ లేదు , కనీసం జీతం కూడా రెండేళ్ళ నుంచి పెరగ లేదు .. పేరుకి ఐ టి ఉద్యోగం. చ చ జీవితం ఎందుకింత దరిద్రంగా ఉంది ? అని మధనపడిపోతూ ఆ బస్ స్టాప్ కి వచ్చాడు .

శివరావు కి తెలియదు పాపం , అతని  జీవితం ఒక మలుపు తిరుగుతుంది అని  . ఎవరూ లేరు బస్ స్టాప్ లో అవును ఎందుకుంటారు ? అందరూ బైకుల మీద ఝాం అని పరుగులు పెడతారు నా లాగా కాదు  లక్షో సారో ఏమో , బట్టల కొట్టు లో గుమాస్తా తండ్రి ని తన ముందు పుట్టిన ఇద్దరి అక్కలని  తలుచుకుని ఉస్సురు మనడం ,తన పైనే ఆశలు పెట్టుకుని ఎవరు బ్రతక మన్నారు ? ఇదేం న్యాయం?మగవాడి నై ఎందుకు పుట్టానా ? అని ఎన్నిసార్లు ఏడ్చాడో , ఎవరికైనా తెలుసా ?

ఈ భాగ్య నగరంలో చలి కాలం ఎంత త్వరగా చీకట్లు కమ్ముకుంటాయి ?

ఏదో మెరుపు మెరిసినట్టు అనిపించింది  . తెల్లని చీరలో దేవ కన్య లా ఒకామె బస్ స్టాప్ లోకి నడిచి వచ్చి , ఏమండీ , ఫలానా నంబరు బస్సు అదే నండీ ఆరు గంటలకి ఉంది కూకుటపల్లి వెళ్ళేది , అది వెళ్ళిందా ? మీరు ఎప్పటినుంచి ఉన్నారు ? అంటూ మాటలు కలిపింది .

ఉలికి పడి , తన నేనా ? అడిగింది అని ఓ క్షణం సందేహించి  , ఏమో అని నత్తిగా వణికింది గొంతు , ఆడవాళ్ళ తో మాట్లాడ్డం అంటే శివరావు కి ముచ్చెమటలు పోస్తాయి , అంత చలి కాలంలోనూ , అర చేతులు తడిసి పోయాయి , ” నేనూ ఇప్పుడే వచ్చాను , ఇంకా యే బస్సూ రాలేదు ” అని అస్పష్టంగా పలికాడు .

సరే ఏం చేస్తాం? ఎదురు చూద్దాం? అని వెనక ఉన్న గట్టు మీదకూర్చుంది , చేతిలో పెద్ద హాండ్ బాగ్  , ఉద్యోగిని లాగే ఉంది , చాలా సామన్యంగా ఉంది కానీ ఆరోగ్యంగా ఉంది ఈవిడ అనుకున్నాడు శివరావు  స్వచ్చంగా మెరుస్తున్న ఆమె బుగ్గలు చూస్తూ  కళ్ళు చిన్నవే కానీ తీక్షణంగా ఉన్నాయి , బాబోయ్ నాకెందుకు ? ఈ వర్ణనలు అవీ మా నాన్న ఏదో సంబంధం కుదిర్చే వరకు ఆడ పిల్లల జోలికి వెళ్ళనని అమ్మకి ప్రమాణం చేసా కదా అని గుర్తు తెచ్చుకున్నాడు శివరావు .

మనం ఒకే బస్ షెల్టర్ లో ప్రయాణికులమే కానిండి “నా పేరు నిర్మల”అని చేయి చాపింది  శివరావు కి కళ్ళు తిరిగినంత పని అయింది , మళ్ళీ నత్తి  ,  శి శివరావు నా పేరు ..

ఏదో వాహనం వస్తున్న చప్పుడు అయింది  షేర్ ఆటో  ఆపుతాడా ?ఆపడో అనుకుంటే అగింది  ఒక్కరికే జాగా ఉంది అంటే నిర్మలఆలోచించకుండా  నాక్కొంచం పని ఉంది ఏం అనుకోకండీ ,  మీ బస్ త్వరగా రావాలని కోరుకుంటా , అంటూ ఆటో ఎక్కి మాయం అయిపోయింది .

బస్ స్టాప్ లో ఒక్కసారి చీకట్లు కమ్ముకున్నట్టు అనిపించింది  ఒకమనిషి ఇంత వెలుగు నిస్తుందా ? అని విస్తుపోయాడు శివరావు .

వారం అయింది . మళ్ళీ అదే రోజు  ఇవాళ కూడా కనిపిస్తుందా ? అని ఆలోచిస్తూ బస్ స్టాప్ కి ఉత్సాహంగా నడిచాడు .

పది నిముషాలు కూడా గడవక ముందే ఆమె  , గులాబీ రంగు చీరలో గులాబీ బాల లా వచ్చింది  ఈ సారి శివరావు కి వెలుతురు తో పాటూ ఏదో గులాబీ పరిమళం కూడా వీచినట్టు అనిపించింది  ఎంత మాయ ?

నిర్మల చిరునవ్వుతో పలకరించేసరికి  మీ బస్సు ఇంకా రాలేదు అండీ అనేసాడు శివరావు, ధైర్యం గా .

గుడ్  ఇవాళ నాకంత ముఖ్యమైన పనులేవీ లేవు లెండి ఆటో వస్తే ముందు మీరు వెళ్ళండి  అనేసరికి  అయ్యో ! నాకూ అంత ముఖ్యమైనపనులేం ఉంటాయి ? ఇంటికి వెళ్ళి భోజనం చేయడం పడుకోడమే కదా .

మాటల్లో నే ఖాళీ ఆటో వచ్చింది  ఆటో అని కేక వేసి నిర్మల ఆటో మాట్లాడింది  కూకుట్ పల్లి కి  ఈ బస్ రాక  ప్రాణం పోకడ అని మార్చాలి సామెత  మీరు అటే ఐతే ఎక్కండి అంది .

 

ఎంత ధైర్యం ఈమె కి ? ఒక పక్క అత్యాచారాలు అవీ అంటూ భయపెడుతున్నారు  ఎవరీ నిర్మల ? ఎందుకెక్కాను ఈ ఆటో ? నాకేమైనా ఆపద కలిగిస్తుందా ? కేసుల లో ఇరికించి , శివరావు లోలోపల వణికి పోతూ బయటకి మటుకు మేక పోతు గాంభీర్యం నటిస్తున్నాడు .

అందమైన అపార్ట్ మెంట్స్  ముందు  ఆపించింది ఆటో  ఇదే మా ఇల్లు ఇదిగో నా షేర్ అంటూ ఆటో వాడికిచ్చేసి   మీరు మీ షేర్ ఇచ్చేయండి అని చేయి ఊపి లోపలకి వెల్ళీపోయింది .

మతి పోయింది శివరావుకి  ఎవరీమె ? తన ఇంటి ముందు ఆపింది ఆటో అందరూ పేరు చెప్పడానికే ఇష్టపడరు అలాంటిది ? చాలా గమ్మత్తు గా ఉందీ అనుభవం.. రూంమేట్స్ ఉండి ఉంటే ఎన్ని కథలు గా చెప్పేవాడో ఈమె గురించి , తప్పిపోయింది అవకాశం.

Kadha-Saranga-2-300x268నెల రోజుల లో కనీసం నాలుగు సార్లు ఇలా బస్ స్టాప్ లో కలుసుకోవడం ఎంత కాకతాళీయం? శివరావు మనసు కోతి గెంతులు వేయడం మొదలు పెట్టింది ,  నిర్మల తనంటే ఇష్ట పడుతోందా ? మరి తను ?

ఆ ఊహ కే ఒళ్ళు పులకరించింది  అమ్మ కిచ్చిన మాట ? అడుగునపడిపోయింది ఈ పులకరింత ల మాయ లో .

ఓ సాయంత్రం ఎప్పటిలాగే ఆటో లో ఇంటికి వెళుతూ ఉండగా నిర్మల

” ఇవాళ మా ఇంటికి రండి శివరావు .. కాఫీ నేను బాగా కలుపుతాను “అంటూ ఆహ్వానించేసరికి శివరావు ఉబ్బితబ్బిబై ,  సరే మీరు పిలుస్తే కాదనగలనా ? అని మొహమాటంగానే బదులు ఇచ్చాడు .

నిర్మల తాళం తీసి  , గది లోకి ప్రవేశించి  కిటికీ తలుపులు తెరిచి  రండి మా ఇంట్లో కి , గుమ్మంలో ఆగిఫొయిన శివరావు ని మరో సారి చిరు నవ్వుతో ఆహ్వానించి  కూర్చుని రెలాక్స్ అవండి నేను ఐదు నిముషాలలో మీకు మంచి కాఫీ తెస్తాను .

ఆమె వంటింట్లో కి వెళ్ళాక కొంచం ఊపిరి గట్టిగా పీల్చుకుని  ఎంతహాయిగా ఉందో ఈ ఇల్లు ? మా మగవాళ్ళ రూంస్ లో ఇలాంటి హాయి ఏదో కొరవడుతుంది , నీలి రంగు సోఫా సెట్టూ  నీలి గోడలు నీలి తెరలూ ఆకాశంలో విహరిస్తున్న అనుభూతి .

ఒక మూల టీవీ  పక్కనే  ఓ చిన్న బల్ల పైన కొంచం వాడి పోయి గాజు సీసాలో పూల గుత్తి ,  గది మధ్యలో బల్ల పై పాల రాయి బుద్ధ విగ్రహం  ఇల్లంతా ప్రశాంతం గా నిర్మలం గా ఉంది ఆమె లాగే శివరావు కి ఇదంతా కలా నిజమా ? అని చెయ్యి మీద గిల్లుకుని అబ్బా కాఫీ ఘుమఘుమలు తగిలాయి  తనెంత అదృష్టవంతుడు అని మురిసిపోయాడు .

మడిచి పెట్టిన వార్త పత్రిక  , పైన కథల పుస్తకం సోఫా పక్కనే చిన్న బల్ల పై   చేతికి అందిన పుస్తకం తెరిచి చూసాడు  వారిజ అని పేరు రాసి ఉంది  స్నేహితురాలు కాబోలు అనుకుని , నవలలు కథలు చదవడం అలవాటు లేదని మొదటిసారి చింతించాడు .

సారీ బోర్ కొడుతొందా అంటూ నిర్మల ఓ ప్లేట్ లో పకోడీ , ఇంకో చిన్న గిన్నె లో సేమ్యా పాయసం  తెచ్చి పెట్టింది, తను కూడా తెచ్చుకుని తింటూ , మీ గురించి చెప్పండి  అనేసరికి శివరావు ఆశ్చర్యం తో తల మునకలై పోయి  ఇంత ఆప్యాయం గా తన గురించి ఇలా పట్టించుకునే వారొకరు ఉన్నారు అని మహా ఆనందంతో తన కుటుంబం, చదువు  స్నేహితులు లేని ఒంటరితనం చెపుతూ  రాత్రి తొమ్మిది కి ఇంక తప్పదని బయలుదేరాడు .

నిర్మలా! అని పిలుస్తూ చనువుగా ఆమె ఇంటికి వచ్చే అతిథి గా స్నేహితుడు గా శివరావు కొత్త అవతారం ఎత్తాడు ..

మూడో నెల లో నిర్మల ఓ సాయంత్రం , శివరావు కి మరో గట్టి షాక్ ఇచ్చింది .

మా ఇంటికి మారిపోతారా ? అంటే లివింగ్ టుగెథెర్ అంటూ నానుస్తూ ఉంటే ,నాకభ్యంతరం లేదు ,మీ ఇష్టం అని చెపుతున్నాను .

శివరావు కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు , పెళ్ళీ కట్నం అమ్మా నాన్న అన్ని   గుర్తు వచ్చాయి చూద్దాం ఆడపిల్ల ఇంత ధైర్యం గా పిలుస్తే ఎగిరి గెంతేయకుండా ఇంకా ఇలా ఆలోచించే అమాయకుడు  కాదు .శివరావు మకాం నిర్మల ఇంటికి మారింది .

ఆమె అతని గది లో సద్దుకోమని చెప్పి  వంటిల్లు లో ఏవి ఎక్కడ ఉంటాయో అన్నీ వివరం గా చెప్పి  అతని కి ఒక తాళం చెవి ఇచ్చింది .

తన ఆఫీసు సమయాలు , భోజన సదుపాయాలు అన్నీ వివరంగా మాట్లాడి , తన బట్టలు వాషింగ్ మెషీన్‌  లో ఎలా వేసుకోవాలో కూడా వివరించి శివరావు ని ఓ ఇంటివాడిని చేసింది .

Sketch290215932బాధ్యతల బరువు పడినట్టు ఉక్కిరిబిక్కిరి అయినా శివరావు  నిర్మల సాహచర్యం లో కొద్ది కాలం లోనే అలవాటు పడిపోయాడు ఆ ఇంట్లో ఒక సభ్యుడు గా .

ఏనాడూ వివాహం , ప్రేమ లాంటి మాటలు ఏమీ అనలేదు నిర్మల  శివరావు కి ఐతే ఏదో దేవత ని చూస్తున్నంత అబ్బురం గా ఉంది ..

ఓ సాయంత్రం సరుకులు కొనుక్కుని వద్దాం అని షాప్ కి తీసుకువెళ్ళి , మన కి నెల కి కావలిసిన సరుకులు కొంటూ ఉంటారా ఇప్పుడే వస్తాను అంటూ బయటకి వెళ్ళీంది , ఇంటికి కావల్సిన సరుకులా ? నాకెలా తెలుస్తుంది ? అని కంగారు పడిన శివరావు చేతిలో ఓ లిస్ట్ పెట్టింది , కంచం లో వడ్డించింది తినడం తప్ప మరేమీ తెలియని తన అజ్ఞానం  మొట్ట మొదటిసారి శివరావు కి అవగతమయింది.

నిర్మల తో జీవితం గమ్మత్తు గా సాగిపోతొంది , ప్రతి రోజూ లేవగానే కలా నిజమా ? అని చెయ్యి గిల్లుకోవడం శివరావు కి పరిపాటి అయింది ..

నాలుగు నెల లు గడిచాయి .

సాయంత్రం ఓ గంట ముందే వచ్చిన శివరావు కి షాక్ ఎదురయింది , వాచ్ మాన్‌ అమ్మాగారు ఊరు వెళ్ళారు అండీ అని ,ఇదేమిటి ?అని ఇంట్లో చూస్తే నిర్మల గది అంతా ఖాళీ గా ఉంది .

మిగిలిన సామాను అలాగే ఉంది , బుద్ధ విగ్రహం కింద ఓ కవర్ కనిపించింది ..

వణికే చేతులతో శివరావు ఉత్తరం చదివాడు .

క్షమించండి మీతో మాట మాత్రం చెప్పకుండా వెళ్ళి పోతున్నందుకు , నా ఉద్యోగం లో ఇలా ఊరులు మారుస్తూ ఉంటారు మీతో ఈ మూడు నెలలూ నాకూ చాలా సంతోషం గా గడిచింది . ఈ ఇంటికి నేను ఒక ఏడాది పాటు అద్దె చెల్లించానుఇంటి సామాను కి కూడా  నేను ఏదో మీ స్నేహానికి వెల కడుతున్నానని మీరు అన్యధా భావించక పోతే, మీ పేరు మీద బైకు కొన్నాను తాళం , పేపర్లు మీ గదిలో ఉన్నాయి మీరు ఇక్కడ ఉన్నా సరే మీ పాత రూం కి మారిపోయినా సరే మీ ఇష్టం .

మనం మరి ఎప్పుడూ కలుసుకోం , మీ పెళ్ళి కి నాకు కార్డు పంపకండి గుర్తు చేసుకోండి చాలు మీరు చాలా మంచివారు కట్నం మటుకు తీసుకోకండి ..అంటూ ఓ చిరునవ్వు గుర్తు వేసి నిర్మల అని సంతకం .

శివరావు నిశ్చేష్టుడై ,ఎంత సేపు ఉన్నాడో అలా …

 

పూనే లో చుట్టూ అందమైన పార్కులు  , స్విమ్మింగ్ పూల్ మధ్య ఒక మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ .

ఉదయం ఎనిమిది కి బెల్ మోగింది , తలుపు తీసిన అనసూయమ్మ ” అమ్మా ! వారిజా ! వచ్చావా అబ్బ ఇన్ని రోజులేమిటే ఈ టూర్లు ఏం ఉద్యోగాలో ”

“ఏమండీ అమ్మాయి వచ్చిందండీ , ఏమండీ లేచారా ? ఎంత సేపూ ఆ న్యూస్ పేపరు చదవడం కాదు , అమ్మాయి కి సంబంధాలు చూడాలి అని మీకు ఎన్ని సార్లు చెప్పాను  ఒక్కర్తే కూతురు అని నెత్తి కెక్కించున్నారు , అంతా దాని ఇష్టం అంటూ సిగ్గు లేకుండా బాధ్యత వదిలించేసుకుని  ” ఆవిడ ఎప్పుడూ వల్లించే పాటే

అమ్మా , ముందు కాఫీ ఇవ్వు నీ చేతి కాఫీ తాగి ఎన్ని రోజులయిందో .

అంటూ ఇప్పుడే స్నానం చేసి వస్తా గాని , నాన్న కి ఇంక ఆ పని లేదే  సంబంధాలు అవీ చూడాల్సిన పని లేదు .

అబ్బ ఎంత మంచి మాట చెప్పావే , అవును  “నువ్వు అమ్ముమ్మవు కాబోతున్నావు, మరో తొమ్మిది నెల లో నీకు వచ్చిన లాలి పాటలు అన్నీ నెమరు వేసుకో ”  అంటూ తన గది తలుపులు గడియ వేసుకుంది వారిజ .

ఆత్మలు అశాంతించుగాక!

    -ఆక్రోశ్

 

అమావాస్య చంద్రుళ్ల వెయ్యినాలుకలు

రంగులన్నీ నాకేశాక

మిగిలిన వట్టి తెలినలుపుల లోకం

పచ్చని అడవిలో పిచికారి కొట్టిన రక్తం

చిదిమేసిన పేరులేని కీటకాల నల్లనెత్తురు

తార్రోడ్డుపై యముని శకటం జుర్రుకున్న దేహాలు

థర్డ్ డిగ్రీ గదిలో నంజుకుతిన్న బూడిదరంగు మాంసం ముక్కలు

 

తెలినలుపుల ఆత్మరక్షణకు

వేట తిరుగులేని ఆయుధమైపోయాక

చర్యకు నిస్సిగ్గు ప్రతిచర్య చట్టబద్ధమైపోయాక

రక్తచందనం దుంగలకు వేలాడిన పీనుగులు

సంకెళ్లకు చిక్కుకున్న తుపాకీ సహిత శవాలు

 

తెలినలుపుల నాగరకతలో

హతులెప్పుడూ హంతకులూ దుర్మార్గులూ

కట్టేసిన చేతులతో ప్రాణాలు తీసేవాళ్లు

కత్తులతో తుపాకులపై గురిపెట్టేవాళ్లు

చివరకు తప్పనిసరిగా హతమైపోయేవాళ్లు

అందుకే హతులెప్పూడు అంతమొందాల్సినవాళ్లు

అంతమొందించేవాళ్లెప్పుడూ వీరాధివీరులు

 

తెలినలుపుల లోకంలో

హతుల చరిత్ర అందరికీ తెలిసిందే

ఎగుడుదిగుడు చరిత్ర దార్లలో పడుతూ లేచినవాళ్లు

ప్రాణాలు తీసినవాళ్లు, ప్రాణాలకు తెగించినవాళ్లు

ప్రాణాలు నిలుపుకోడానికి అడవులకెళ్లినవాళ్లు

నేరాల చిట్టాలను ఎక్కడా పారేసుకోకుండా

సీల్డు బీరువాల్లో భద్రపరచుకున్నవాళ్లు

 

తెలినలుపులకావల

కొన ఊపిరితో కొట్టుకుంటున్నలోకానికి

ఇక తెలియాల్సింది చంపిన వాళ్ల చరిత్ర..

అంతవరకూ హతుల ఆత్మలు అశాంతించుగాక!

~

 

మా అక్క పెళ్లి – అందరికీ మరపు రాని అనుభూతులే!

వంగూరి చిట్టెన్ రాజు 

chitten raju1961 సంవత్సరంలో.. ఆ రోజు పిబ్రవరి 5 వ తారీకు. ఆ రోజు మా ఇంట్లో పెద్దాడబడుచు అయిన మా అక్క పెళ్లి అయి యాభై ఏళ్ళు దాటినా ఆ ఐదు రోజుల పెళ్లి  హడావుడిలో ప్రతీ అంశమూ ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అప్పటికి నేను పి.ఆర్. కాలేజీ లో ప్రీ – యూనివర్శిటీ లో చేరి ఆరేడు, నెలలు అయిందేమో. అంటే నిక్కర్లు పూర్తిగా మానేసి పగలు పంట్లాలు, రాత్రుళ్ళు పైజామాలూ వేసుకునే వయస్సు అనమాట. నా కంటే మా అక్క ఐదేళ్ళు పెద్దది. మా ఇద్దరికీ మధ్యన మా మూడో అన్నయ్య డా. సుబ్రహ్మణ్యం. నేనేమో మా అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళలో సరిగా మధ్యముణ్ణి. మా అక్క సూర్యారావు పేట లో గర్ల్స్ హైస్కూల్ లో ఎస్.ఎస్. ఎల్.సి. పాస్ అయిన దగ్గర నుంచీ సంబంధాలు రావడం మొదలు పెట్టాయి. ఆదిలక్ష్మీ మాణిక్యాంబ అని మా బామ్మ గారి పేరు పెట్టుకుని ఇంటికి మొదటి ఆడ పిల్ల కాబట్టి అందరూ ఎంతో అపురూపంగా చూసుకునే మా అక్కకి వచ్చే సంబంధాలలో సహజంగానే ఎంతో మంచి స్థాయిలో ఉండే వాటినే మా అమ్మా, నాన్న గారూ పట్టించుకునే వారు. నాకు తెలిసీ మూడు, నాలుగు  సంబంధాల తాలూకు  పెళ్లి చూపుల తరువాత అందులో ఒక సంబంధం కొంచెం చిన్న సైజు డ్రామా తరువాత నిశ్చయం అయింది.  

మా అక్క మొదటి పెళ్లి చూపులు 1959 ఏప్రిల్ లో అని జ్ఞాపకం. కొండేపూడి లక్ష్మీ నారాయణ గారి ద్వారా మంత్రిప్రగడ భుజంగ రావు గారి అబ్బాయిని మా అక్కకి అడిగితే వాళ్ళు వచ్చి చూసుకున్నారు అని మాత్రమే నాకు చూచాయగా గుర్తు. ఇక  మా పెద్దన్నయ్య పెళ్ళికి కొన్ని నెలల ముందు 1960 తొలి రోజులలో ఓ సారి మాకు ఎవరో ఎక్కడో గంగల కుర్రు అనే గ్రామం లో ఉండే మా దూరపు బంధువులు వారి అమ్మాయికి మీ వంగూరి వారింట్లో ఇంట్లో పెళ్లి చేసుకుంటాం అని అడిగితే మా అమ్మా, నాన్న గారూ ఒప్పుకుని మా రేడియో సావిడి అంతా ఖాళీ చేసి, వెళ్ళు వేయించి వాళ్లకి రెండు రోజుల పాటు ఇచ్చారు. శర భూపాల పట్నం నుంచి మగ పెళ్లి వారు కూడా దిగ గానే అదే రోజు అనుకోకుండా అప్పటికప్పుడు కబురు పెట్టి గురజాడ జగన్నాధం గారు అనే ఆయన కొడుకు, కుటుంబం తో సహా వచ్చి మా అక్కని పెళ్లి చూపులు చూసుకున్నారు. ఒక పక్కన మా ఇల్లంతా ఎవరిదో పెళ్లి హడావుడి, ఇంకో పక్క అనుకోకుండా మా అక్కకి పెళ్లి చూపులూ…ఇప్పుడు తలచుకుంటే భలే తమాషాగా ఉంటుంది. ఆ సంబంధం మా అక్కకి కుదర లేదు. ఈ రెండు ఉదంతాల గురించీ నాకు ఇంకేమీ గుర్తు లేదు. ఎవరి పేర్లూ గుర్తు లేవు.

 

అదే రోజులలో హైదరాబాద్ లో సుప్రసిద్ద హై కోర్ట్  అడ్వొకేట్ అయిన నండూరి బాపిరాజు గారి పెద్ద కొడుకు, ఆయన దగ్గరే జూనియర్ అడ్వొకేట్ గా ఉండి బాగా పేరు తెచ్చుకుంటున్న “సూరి” అనబడే  వెంకట సూర్య నారాయణ మూర్తి సంబంధం మా అక్కకి వచ్చింది. బాపిరాజు గారికి అన్నీ నచ్చి, ఎవరో ఒక అనామక జ్యోతిష్కుడికి జాతకాలు చూపించగానే ఆయన వీరిద్దరి జాతకాలు అస్సలు పడవు అని తేల్చి చెప్పడంతో మా సంబంధం వాళ్ళు మానుకున్నారు. ఈ సంగతి మా నాన్న గారికీ బహుశా తెలియదు. ఆ తరువాత నాకు తెలిసీ మా అక్కకి జరిగిన మరో  పెళ్లి  చూపులు మాకు రెండు, మూడు తరాలగా కుటుంబ స్నేహితులైన లక్కరాజు శరభయ్యతో. ఆయన అప్పటికే ఎయిర్ లైన్ ఫైలట్. మా చిన్నన్నయ్య కూడా పైలట్ గా ట్రైనింగ్ పొందిన వాడే కానీ బహుశా అంత ప్రమాదకరమైన ఉద్యోగంలో ఉన్న సంబంధం మనకెందుకులే అనుకున్నారు మా వాళ్ళు. అదే రోజుల్లో రాజమండ్రి నుంచి నండూరి రామచంద్ర మూర్తి గారు అనే అడ్వొకేట్ గారి బంధువు నారాయణ రావు సంబంధం వచ్చి, వాళ్ళు వచ్చి పెళ్లి చూపులు కూడా చూసుకున్నారు మా అక్కని. తమాషా ఏమిటంటే ఈ రామచంద్ర మూర్తి గారు మా అక్కని చూసి “ ఈ అమ్మాయి మా తమ్ముడు సూరి కి సరిగ్గా ఉంటుంది. మా చిన్నాన్న బాపిరాజు గారితో మాట్లాడదాం” అని మా నాన్న గారికి చెప్పగానే “జాతకాలు పడలేదుట” అన్నారు మా నాన్న గారు. “అదేదో తప్పు చూసి ఉంటారు” అని అయన, బాపిరాజు గారిని సంప్రదించి ఈ సారి మా అక్కదీ, పెళ్లి కొడుకుదీ జాతకాలు రాజమండ్రి లో మాకూ, వాళ్ళకీ కూడా ఆస్థాన జ్యోతిష్కులైన  కె. వి. సోమయాజుల గారికి మళ్ళీ చూపించారు.  ఆయన ఆ జాతకాలు చూసి “ఈ జాతకాలు అద్భుతంగా కుదిరాయి. ఇంకేమీ ఆలోచించకండి” అని చెప్పగానే బాపిరాజు గారు “మీ అమ్మాయిని చూసుకోడానికి వస్తాం” అని కబురు చేశారు. ఆ రోజుల్లో మగ పెళ్లి వారు పెళ్లి కూతురి తల్లిదండ్రులకి ఇలా కబురు పెట్టడం కనీ , వినీ ఎరగనిది.

మొత్తానికి 1960 ఆగస్ట్ లో రెండు టాక్సీలలో పెళ్లి కొడుకు “సూరి” గారి పెద్ద నాన్న గారు (నండూరి సూర్య నారాయణ మూర్తి గారు, పెద్దాపురం అడ్వొకేట్), తండ్రి బాపి రాజు గారు, తల్లి రాజేశ్వరి గారు, వరసకి అన్నయ్య అయిన రామ చంద్ర మూర్తి గారు (రాజమండ్రి అడ్వొకేట్) & ఆయన భార్య అమ్మడు గారు, మరి కొందరూ మగ పెళ్లి వారి కుటుంబం నుంచి తరలి వచ్చి మా అక్కని పెళ్లి చూపులు చూసుకున్నారు. ఈ సంబంధం ఇంచు మించు కుదిరిపోయినట్టే కాబట్టి మా కుటుంబం నుంచి సుబ్బారావు తాతయ్య గారు (పాలతోడు), జేగురు పాడు నుంచి పెద వెంకట్రావు నాన్న, రాజమండ్రి నుంచి సూరీడు బాబయ్య గారూ, కరప నుంచి మా పెద్దన్నయ్య మామ గారు చాగంటి సుబ్బారావు మామయ్య గారూ, కొండేపూడి సూర్యనారాయణ గారూ వచ్చారు. మా ఇల్లంతా పెళ్లి చూపుల హడావుడి తో నిండి పోయింది. ఆ మర్నాడు మా నాన్న గారూ, మా అందరు బంధువులూ రాజమండ్రి రామచంద్ర మూర్తి గారి ఇంటికి వెళ్ళగానే అమ్మాయి నచ్చిందని చెప్పారు. ఆ మర్నాడు చింతలూరి సాంబశివరావు గారు, మా అద్దంకి సుబ్బారావు నాన్న కూడా కలిసి రాగా ఇరు కుటుంబాల పెద్దలూ మొత్తం యాభై మంది మధ్యలో మా అక్కకీ, బావ గారికీ నిశ్చితార్థం జరిగి, తాంబూలాలు పుచ్చుకున్నారు. వెంటనే సోమయాజుల గారి దగ్గరికే మరో ఆరు నెలలకి వెళ్లి ఉత్తరాయణం వచ్చాక ఫిబ్రవరి 5, 1961 ఉదయం  పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. నాకు తెలిసీ ఎక్కడా అసలు కట్నం ప్రసక్తే రా లేదు. వచ్చినా “కట్నం, గిట్నం అక్కర లేదు కానీ పెళ్లి మటుకు ఘనంగా చెయ్యండి” అన్నారు మగ పెళ్లి వారు. కట్నం గురించి పట్టించుకోక పోవడం  ఆ రోజుల్లో అపురూపమే! ఎంతో నాజూగ్గా ఉండే ఆ రోజుల నాటి మా అక్క ఫోటో, మా అక్కా, బావ గార్ల పెళ్లి శుభ లేఖ ఇక్కడ జతపరుస్తున్నాను.

Mani NVS Telugu1

అప్పటి నుంచీ మా ఇంట్లో ఆరు నెలల పాటు ప్రతీ రోజూ పెళ్లి హడావుడే! పైగా మగ పెళ్లి వారు కోనసీమ వారు అవడంతో, అందునా నిష్టా గరిష్టులు అవడంతో చాలా విషయాలు పకడ్బందీగా వారి ఆచార వ్యవహారాలకీ, మడి నియమాలకీ అనుగుణంగా ఏర్పాటు చెయ్యడానికి మా నాన్న గారు, మా మొత్తం కుటుంబం చాలా శ్రమ పడ్డారు. ఇక్కడ మేము చేసిన ఒక “దొంగ పని” ఒప్పుకుని తీరాలి.   ఎప్పుడూ మా వంటింట్లో అడుగు పెట్టక పోయినా మాకు స్వామి నాయుడు అనే స్నేహితుడు మా కుటుంబానికి ప్రాణ వాయువు లాటి వాడు. అలాగే మా పక్కింటి భాస్కర రావు గాడు. ఈ బాచి గాడు సుప్రసిద్ధ కవీశ్వరులు వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరయిన ఓలేటి పార్వతీశం గారి మనవాడే కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఈ స్వామి నాయుడు మటుకు మా కాకినాడ క్రౌన్ టాకీస్ యజమాని గొలగాబత్తుల వీర రాఘవుల గారి రెండో కొడుకు. ఆయనే కాకినాడలో తొలి సినిమా హాలు పేలస్ టాకీస్ కట్టి ఆ ప్రాంతాలలో మొట్టమొదటి సినిమా ప్రదర్శనలు వేసినాయన. పైగా ఉల్లిపాయల వ్యాపారం కూడా ఉండేది. ఈ నాయుడు గాడు బజారు కెళ్ళి కూరగాయలు, ఉల్లి పాయలూ పట్టుకొచ్చే వాడు. అది పరవా లేదు కానీ గాడి పొయ్యిలు వేసి బ్రాహ్మలు వంట వండుచున్న చోటికి కానీ, మగ పెళ్లి వారు భోజనాల సమయంలో కానీ మా పెద్ద వాళ్ళ మడీ, ఆచారాల ప్రకారం మాంసాహారం చేసే కులాల వాళ్ళు వాడు కనపడ కూడదు. అంచేత  ఈ నాయుడు గాడు ఎప్పుడైనా పొరపాటున భోజనాల సమయంలో కనపడతాడేమో, ఈ కోనసీమ పెళ్లి వారు లేచి వెళ్లి పోతారేమో అని భయం వేసి ఆ పెళ్లి వారం రోజులూ వాణ్ని “శర్మ” అని పిలిచే వాళ్ళం. ఇప్పటికీ అది తలచుకుంటే ఎంత నవ్వొస్తుందో!

ఇక్కడ మా అక్క మామ గారైన బాపిరాజు గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. ఆయన మొదట్లో గాంధేయ వాది. ఎంత తీవ్ర గాంధేయ వాది అంటే, కావాలని హరిజనులని వంటింట్లోకి తీసుకొచ్చి ఎంతో శ్రోత్రియురాలైన భార్య ని వాళ్ళ కి భోజనం వడ్డించమని పక్కన కూచోబెట్టుకునే వారు అని బంధువులు చెప్పుకోగా విన్నాను. ఆయన స్వాతంత్య పోరాటంలో పోలీసుల చేత ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని జైలు కి వెళ్ళారు.ఆ కొరడా, లాఠీ దెబ్బల తాలూకు చారలు వీపు నిండా కనపడేవి. రాష్ట్రానికి తొలి ఆర్ధిక మంత్రి కళా వెంకట్రావు గారికి దగ్గర స్నేహితులు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక పూర్తిగా మారిపోయిన రాజకీయ వాదులనీ, పతనమై పోయిన నైతిక, సామాజిక, మత పరమైన విలువలనీ చూసి మళ్ళీ ఆధ్యాత్మక తత్త్వం,  ఆచారాలు పాటించడం  వేపూ మళ్ళారు. ఆయనే నాకు “కోట వెంకటాచలం” గారి పుస్తకాలు ఇచ్చి “ఇవి చదవ్వోయ్ రాజా, హిందువులు ఎంత గొప్పవాళ్ళో తెలుస్తుంది” అని నేను ఎప్పుడు వెళ్ళినా ఎంతో ఆప్యాయతతో నేనంటే చాలా ఇష్టంగా ఉండే వారు.  ఆయన భోజన ప్రియులు. వారింట్లో వంటిల్లు ఒక దేవాలయం గానూ, వంట చెయ్యడం, భోజనం చెయ్యడం ఒక మహా యజ్ఞం గానూ ఉండి ఎప్పుడు వాళ్ళింటికి వెడదామా అని మా బంధుకోటి ఎదురు చూస్తూ ఉండే వాళ్ళం. ఇప్పటికీ మా బావ గారితో సహా ఆయన ఆరుగురు కొడుకులూ, ఒక అమ్మాయల అందరి ఇళ్ళల్లో కూడా అదే ఆచారం కొనసాగుతోంది.

ఇక మా అక్కా, బావ గార్ల పెళ్లి విషయానికి తిరిగి వస్తే ఆ ఐదు రోజుల పెళ్ళికీ అసలు హడావుడి అంతా జనవరి లోనే మొదలయింది. కరప నుంచి మా సుబ్బారావు మామయ్య గారు  (మా పెద్దన్నయ్య మామ గారు) మా ఇంట్లో సుమారు అర ఎకరం పందిరికి సరిపడా తాటాకులు, వాసాలు, సరుగుడు రాటలు పంపించారు. ప్రత్తిపాడు నుంచి మా రైతు గొల్లకోట రామారావు 12 వీశలు స్వచ్చమైన నెయ్యి, కందులు, పెసలు, గొల్లపోలు మిరప కాయలు వగైరా సరుకులు పంపించాడు. మా పొలం నుంచీ, ఇతర చోట్ల నుంచీ భోజనాల ధాన్యం, ఇతర దినుసులూ ఎద్దు బండ్ల మీద ప్రతీ రోజూ వచ్చేవి. ఎందు కంటే మొత్తం ఐదు రోజుల పెళ్ళికీ రోజుకి వెయ్యి విస్తరాకులు లేస్తాయని మా నాన్న గారి అంచనా. అది కాక మా ఆనవాయితీ ప్రకారం మూడు విందులు….పెళ్లి వారికి, బంధువులకీ, స్నేహితులకీ కలిపి ఒకటి, కాకినాడ లాయర్లకి ఒకటి, మా పొలం రైతులకి ఒకటి. ఇక్కడ తమాషా ఏమిటంటే ఆ రోజుల్లో వారి ఇళ్ళల్లో నెల మీద విస్తరి వేసుకుని భోజనం చేసే   మొదటి రెండు విందుల వారూ “వంగూరి వారింట్లో పెళ్లి విందుకి టేబుల్ మీల్స్ పెడతారు” అని గొప్పగా చెప్పుకునే వారు. కానీ రైతులు మటుకు టేబుల్ మీద కూచోడానికి సిగ్గు పడిపోయి నెల మీదే కూచునే వారు. ఈ రోజుల్లో నేల మీద కూచుని అసలు ఎవరైనా భోజనం చేస్తున్నారా అనేది ఒక యక్ష ప్రశ్నే!

Akka2

 

మా అక్క పెళ్లికి రాని బంధువులు లేరు. మా ఆడ పెళ్లి వారి తరఫున పెళ్లి నిర్వాహకులు ఎప్పటి లాగానే మా చిట్టెన్ రాజు బాబయ్య, జయ వదిన. ఇక బంధువులలో పెద్దాపురం నుంచి బాసు పిన్ని& సుబ్బారావు మామయ్య గారు, వాళ్ళ పిల్లలు రత్నం, పద్మ  పెద్దమ్మరుసు & వెంకటేశ్వర రావు అన్నయ్య గారు, తణుకు నుంచి లక్ష్మీపతి రావు తాత గారూ, సుదర్శనం పిన్ని & సాంబశివరావు గారు, సువర్చల, రామలక్ష్మి బామ్మ గారు, రాజ మండ్రి నుంచి సూరీడు బాబయ్య గారు & మాణిక్యం పిన్ని, చెల్లం బామ్మ గారూ, పేద బేబీ, దొంతమ్మూరు నుంచి బాసక్క, చిన్న బేబీ, అమలాపురం నుంచి పెద్ద బావ, సుందరక్క, భానుడు దొడ్డమ్మ గారు సుందర శివ రావు గారు, మా మేనగోడళ్ళు ఐదుగురు, విజయ వాడ నుంచి కాంతం బామ్మ గారు, మంగ మామయ్య, వైజాగ్ నుంచి శంకరం బాబయ్య, కాంతం అత్తయ్య, కామేశ్వరి అత్తయ్య,   సత్యవతి అత్తయ్య, హైదరాబాద్ నుంచి రామం బాబయ్య ..ఇలా అందరి పేర్లూ రాసుకుంటూ పోతే చోటు చాలదు…ఇక మా వయసు గేంగ్ లో సుబ్బన్నయ్య, అబ్బులు బావ, కరప వెంకట్రావు, నేను, మా తమ్ముడు, కరప కంచి రాజు, స్నేహితుల ముఠా డజను మంది అన్ని పనులూ పైన వేసుకుని నానా హడావుడీ చేశాం.

ఇక పెళ్లి పందిరి అలంకరణ డ్యూటీ అంతా ఎప్పటి లాగానే మా పెద్దన్నయ్యదే! సుమారు అర ఎకరం తాటాకు పందిరి కి వంద సరుగుడు రాట్లకీ చుట్టూ రంగు, రంగుల ఉలిపిరి కాగితాలూ, చెమ్కీ  రిబ్బన్లూ, నక్షత్రాలు, ప్రతీ రాటకీ ఒక్కొక్క ట్యూబ్ లైటు, మళ్ళీ వాటిల్లో కొన్నింటికి పంచ రంగుల కాగితాలు….ఇలా ఒకటేమిటీ వారం రోజులు మా పెద్దన్నయ్య పర్యవేక్షణ లో అహర్నిశలూ కష్టపడి , ఒళ్లంతా తుమ్మ జిగురు, లేదా ఉడికించిన అన్నం అంటించుకుని మహానంద పడిపోయాం. 500 బుడగలు గాలి ఊది పందిరి అంతా వేలాడదీదీశాం. నేలంతా తడిపేసి, కల్లాపి జల్లి, టార్పాలిన్ లు పరిచేశాం. మా అమ్మ వేపు చుట్టాలయిన జనార్దనం బావ 200 కుర్చీలు సప్లై చేశాడు. ఇక రాటల చుట్టూ నలు చదరపు దిమ్మలు చేసి వాటి మీద రంగు, రంగుల ముగ్గులు వేసేశాం. మగ పెళ్లి వారి మడీ, ఆచారాల కి అనుగుణంగా పందిరి చుట్టూ దుప్పట్ల తో తెరలు కట్టేసి జాగ్రత్త పడ్డాం. అన్ని రాటలకీ కొత్త కొబ్బరాకులు కడితే పందిరికి మధ్యలో ఎత్తుగా కట్టిన మందిరానికి చుట్టూ అరటి చెట్లు కట్టి, మామిడాకుల తోరణాలతో అత్యంత శోభాయమానంగా మా పెద్దన్నయ్య తీర్చి దిద్దాడు. ఆ కొత్త ఆకుల పరిమళం నాకు ఇంకా గుర్తు.

ఇక 1961 ఫిబ్రవరి ఒకటో తారీకున మా ఇంట్లో అక్కని పెళ్లి కూతుర్ని చేసిన సమయానికే అక్కడ రాజమండ్రి లో మా బావ గారిని పెళ్లి కొడుకుని చేశారు. దానికి మా చిన్నన్నయ్య వెళ్ళాడు.  పెళ్లి ముందు రోజు సాయంత్రం మగ పెళ్లి వారు రెండు టాక్సీలు, మూడు పెద్ద బస్సుల్లోనూ, ఇతర విధాలు గానూ సుమారు 200 మంది తరలి వచ్చారు. వారి విడిది కోసం మా గాంధీ నగరం లో కపిలేశ్వరపురం జమీందార్ల మేడ, రాళ్ళపల్లి వారు, కాళ్ళకూరి వారు, ఎదురింటి విఠాల వారు, పక్కింటి కీర్తి వారు, చీమలకొండ వారు, పుల్లెల వారు, దుగ్గిరాల వారు ఇలా ఇంచు మించు పదిహేను ఇళ్ళు మా అధీనం లోకి వచ్చేశాయి. ఇంటికొక ఐదుగురు టీం…పని వాళ్ళు, పనమ్మాయిలు, టిఫిన్ల సప్లయ్ కి, పేకాట సామగ్రి వగైరా అన్ని సౌకర్యాలకీ ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి నాడు పొద్దుట స్నాతకం లో మా పెద్దన్నయ్య హడావుడి అంతా, ఇంతా కాదు. పెళ్లి కొడుకు కాశీ వెళ్తున్నప్పుడు గడ్డం క్రింద మామూలు గా చిన్న ముక్క కాకుండా ఏకంగా వీశెడు బరువున్న పెద్ద బెల్లం ముక్కతో గట్టిగా కొట్టి అందరినీ భలే నవ్వించాడు. మా చిన్నన్నయ్య మాకు కుటుంబ స్నేహితులైన గిరి గారి రెండో కొడుకు స్మైల్స్ స్టూడియో ఓలేటి వెంకటేశ్వరావు చేత ఆ రోజుల్లో ఎంతో అపురూపమైన కలర్ ఫోటోలు తీయించాడు. అవన్నీ డెవెలప్ చెయ్యడానికి మొత్తం దక్షిణాది అంతటికీ మద్రాసు లో మాత్రమే ఉండే వేల్స్ స్టూడియో కి పంపించారు.

కోన సీమ మగ పెళ్లి వారు ఎక్కడ వంకలు పెడతారో అని మేం అందరం ఎంత భయపడుతూనే ఉన్నా, మా ఏర్పాట్లు బావుండండంతో అన్ని రోజులూ సంతోషంగానే ఉన్నారు. ..ఆఖరి రోజున తప్ప… ఆ రోజున మగ పెళ్లి వారందరూ క్రింద టార్పాలిన్ల మీద కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా పెద్దన్నయ్య మా నాన్న గారి పక్కనే కుర్చీలో కూచుని మాట్లాడుతున్నాడు. అది చూసి మగ పెళ్లి వాళ్ళలో ఒక పెద్దాయనకి కోపం వచ్చి “మేం అందరం క్రింద కూచుంటే మీ పెద్దబ్బాయి సిల్క్ లాల్చీ, సిల్కు పైజామా , చేతికి రిస్ట్ వాచీ పెట్టుకుని, సెంటు పూసుకుని ట్రిమ్ గా సినిమా హీరో లా షోకు చేస్తున్నాడు. ఆడ పెళ్లి వారం అని అప్పుడే మర్చి పోయాడా?” అని మా నాన్న గారిని హేళన గా మాట్లాడారు. మా నాన్న గారికి కోపం వచ్చి, మా పెద్దన్నయ్య దగ్గరకి వెళ్లి, జట్టు చెరిపేసి పరువు తీసేశావు అని కోప్పడ్డారు. వెంటనే మా అన్నయ్య లోపలి వెళ్లి పోయి బట్టలన్నీ విప్పేసి, మాసిన బట్టలు తొడుక్కుని, ఉంగరాలు, వాచీ విసిరేసి చింపిరి జుట్టు తో బయటకు వచ్చాడు. ఆ రాత్రి వధూవరులని పూర్తి బేండ్ మేళంతో, వెనకాల జెనరేటర్ తో రక రకాల లైట్లతో అలకరించిన కారులో, ఎందుకైనా మంచిదని పెట్రోమేక్స్ లైట్లతోటీ మొత్తం గాంధీ నగరం, రామారావు పేట ఊరేగించినప్పుడు మా పెద్దన్నయ్య రాలేదు. ఆ ఊరేగింపు తరువాత తాడేపల్లి గూడెం నుంచి పోణంగి సిస్టర్స్ బుర్ర కథ పెట్టించారు. సాయంత్రం అలక పాన్పు మీద మా బావ గారికి మద్రాసు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఒమేగా రిస్ట్ వాచీ ని మా చిన్నన్నయ్య బహుకరించాడు. ఆ రోజుల్లో అది ఏకంగా 300 రూపాయల అత్యంత ఖరీదైన ప్రతిష్టాత్మకమైన రిస్ట్ వాచీ. అప్పగింతల సమయంలో మళ్ళీ మా పెద్దన్నయ్య గట్టిగా పోలోమని పెద్ద ఏడుపు నటించి వాతావరణాన్ని తేలిక చేశాడు.

పెళ్లి తంతులు పూర్తి అయ్యాక జరిగిన రెండు డిన్నర్లకీ..అంటే పెళ్లి వారు, స్నేహితులు, బంధువర్గానికి ఒక రాత్రి, లాయర్లందరికీ మరో రాత్రీ….గుమ్మ దగ్గర నుంచుని అతిధులని సాదరంగా ఆహ్వానించడం డ్యూటీ నాదీ, మా తమ్ముడిదీనూ. అందులో మొదటి రోజు అతిధులు ఏడింటికల్లా రావడం మొదలుపెడతారు కాబట్టి నేను ఆరూ నలభై ఐదుకి నా జన్మలో మొదటి సారిగా మా అక్క పెళ్లి కోసం ప్రత్యేకంగా కుట్టించిన సిల్క్ పజామా, లాల్చీ వేసుకుని అద్దం ముందు నుంచుని షోకు చూసుకుంటూ ఉంటే మా చిన్నన్నయ్య దూసుకుంటూ వచ్చి “ఏరా, వెధవా..ఇంకా ఇక్కడే ఉన్నావా. వెధవ షోకు చాలు కానీ గుమ్మ దగ్గరకి తగలడు. అందరూ వచ్చే వేళయింది” అని కొట్టేటంత పని చేశాడు. నిజంగా కొట్టాడేమో మటుకు అంతగా గుర్తు లేదు. కానీ ఆ సంఘటన మటుకు ఇప్పటికీ మర్చి పోలేదు.

AKKA BAAVA

ఇక మా బావ గారి విషయానికి వస్తే,  అప్పుడు   హైకోర్ట్ మద్రాసులో ఉండేది కాబట్టి చిన్నప్పుడు ఆయన మద్రాసులో కేసరి హై స్కూల్ లో చదువుకున్నారు. అప్పుడు బాపు –రమణ ఆయన సహాద్యాయులు. అక్కడే లా డిగ్రీ చదువుతున్నప్పుడు, మా చిన్నన్నయ్య కూడా అదే మద్రాసు లా కాలేజీ లోనే చదివే వాడు. ఆ విధంగా కాస్తో, కూస్తో వారిద్దరికీ ప్రత్యక్ష పరిచయం అప్పుడే ఉంది.  హైదరాబాద్ లో హై కోర్ట్ లాయర్ గా దుర్గాబాయ్ దేశ్ ముఖ్  గారి మహిళా కళాశాల లాయర్ గా తొలి రోజులలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ముళ్ళపూడి రమణ గారు ఒక ప్రముఖ నటుడి చేతిలో మోస పోయి ఒక మార్వాడీకి అప్పు తీర్చడం కోసం  ఇల్లూ, వాకిలీ అమ్మేసుకున్నప్పుడు మా బావ గారినే కన్సల్ట్ చేశారు కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అలాగే జలగం వెంగళ రావు కమిషన్ లోనూ, అప్పటి పెట్రోలియం మంత్రి  శివ శంకర్ గారితోటీ,  ఎన్టీ ఆర్ హయాంలో నూ ప్రతిష్టాత్మకమైన లాయర్ గా పని చేసి ఇప్పుడు సీనియర్ ఎడ్వోకేట్ గా విశ్రాంతి తీసుకుంటున్నారు. మా బావ గారి తమ్ముళ్ళు అచ్యుత రాం, బాపన్న, రాం చంద్, కామరాజు (మరో తమ్ముడు, నా వయసు వాడైన రత్నం కొన్నేళ్ళ క్రితం పోయాడు), చెల్లెలు కల్పకం అందరూ ఎంతో సన్నిహితులం, స్నేహితుల్లగా ఉంటాం. మా కుటుంబానికి  మా అక్కా, బావ గార్లే  పెద్దలు. వారికి చెప్పనిదే, వాళ్ళ ఆశీర్వచనాలు ముందు తీసుకోనిదే ఏ పనీ చెయ్యం.

ఇప్పుడు అలాంటి తాటాకుల పెళ్లి పందిరి సినిమాలలో కూడా చూడలేం. మొన్నే మధ్య ఆత్మీయుడు కూచిభొట్ల ఆనంద్ బందరు లో వాళ్ళమ్మాయి పెళ్లికి తాటాకుల పందిరి వేయించాడని చెప్తే భలే సంతోషం వేసింది. నేను ఈ మధ్య ఇండియా వెళ్లి నప్పుడు ఎవరింట్లోనో పెళ్లి కి వెళ్లి, ఆ ప్లాస్టిక్ పువ్వుల మధ్య, షామియానా లోనూ “నీరజ్ వెడ్స్ నీరజా” అని వెలిగీ , ఆరిపోయే లైట్లతో బోర్డు వెనకాలా ఎక్కడ వెతికినా మామిడాకుల తోరణమే కనపడ లేదు. ఆఖరికి పురోహితుడి దగ్గర పంచ పాత్ర అనే చెంబులో ఒకే ఒక్క మామిడాకు కన పడి గ్లోబలైజేషన్ అనే అమెరికనైజేషన్ కి చెయ్యెత్తి నమస్కారం చేసుకున్నాను. ఎవరి సంగతో ఎందుకూ, రెండేళ్ళ క్రితం మా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు ఏకంగా ఆరు ఆకులున్న మామిడి తోరణాన్ని మద్రాసు నుంచి డాలర్ పెట్టి కొనుక్కుని యాభై డాలర్లు రవాణా ఖర్చు పెట్టి తెప్పించుకున్నాను. ఆ మాట కొస్తే గత అరవై ఏళ్ళగా నేను ఎవరి పెళ్ళికి వెళ్ళినా…ఆఖరికి నా పెళ్లి తో సహా….మా అక్క పెళ్ళే మనసులో మెదులుతూ ఉంటుంది. అందుకే అలనాటి ఆ ముచ్చట గురించి ఇంత విపులంగా వ్రాసుకుని అక్షరబద్ధం చేసుకుంటున్నాను. అలనాటి వారి పెళ్లి ఫోటో, ఈ నాడు హుందాగా ఉన్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

 *

గురి తప్పని ప్రయోగం…ఖాకీవనం!

నీరజ అమరవాది 

 

470086_126563650840971_1578940197_oపతంజలి గారి  ‘ సాహిత్యం’ సమాజాన్ని అద్దంలో చూపించినంత స్పష్టంగా ఉంటుంది. ఆయన ఎంచుకున్న వస్తువు కూడా భేషజాలు లేకుండా ఆలోచింపజేసి, హృదయాన్ని కదిలిస్తుంది.

 వ్యంగ్యాన్ని కొందరు ‘హాస్యాన్ని’  పండించడానికి వాడుకుంటే, మరి కొందరు ‘తమ బాధ, అక్కసును’ వెళ్లగక్కడానికి వాడుకుంటారు. అయితే పతంజలి గారి వ్యంగ్యం  “ సమాజంలో మేక వన్నె పులుల లాగా బయట హుందాగా తిరుగుతూ, లోపల పందికొక్కులలాగా వ్యవస్థలను భ్రష్టుపట్టించిన నాయకరౌడీల” మీద ఎక్కుపెట్టినది. ఆయన నవలలు, కథలు, కవితలు అన్నీ ‘సాహిత్యవిలువలతో’ పాటు, భాషా పరిమళాలని వెదజల్లుతాయి. ఉత్తరాంధ్రమాండలికానికి ‘పేటెంట్‘ లాగా పనికివస్తుంది. ఆయన సాహిత్యం ఎన్నో నూతన పదాలను, పదబంధాలను  పరిచయం చేసింది. ఒక రకంగా భాష, భావం, వ్యక్తీకరణ  ‘ముప్పేటగా’ కలిసి తెలుగు సాహిత్యానికి సొబగులద్దాయి .

“వజ్రానికి సాన పెట్టిన కొద్దీ  దాని విలువ, మెరుపు పెరిగినట్లు” గా   పతంజలిగారి కథ / నవల / కవిత ఏదైనా సరే మొదటిసారి చదివినప్పుడు ఆలోచింపజేస్తాయి. అదే రెండోసారి చదివితే మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. మరొక్కసారి చదివితే నిఘంటువులలో కెక్కని పదాలు, పదబంధాలు కనబడతాయి. అలా ఆయన కలంలోంచి ఎన్నో ఆణిముత్యాలు రాలినా నన్ను బాగా కదిలించినది  “ఖాకీ వనం“.

‘వనం’ అనగానే పూల మొక్కలు, సుకుమారమైన వన్యప్రాణులు స్ఫురణకు వస్తాయి. ఆ పదం ముందు  ‘ఖాకీ’ చేరగానే వనప్రాణులను ( సామాన్య జనం ) రక్షక భటులు ఎలా భక్షిస్తున్నారో అన్నది చెప్పకనే చెప్పినట్లైంది.

పోలీసు వ్యవస్థలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్న అధికారులు అమాయక, సామాన్య, బడుగు జీవితాలపై అధికార జులుంని ఎలా చూపుతున్నారో, పవిత్రమైన లాఠీని, గన్ లను తమ స్వార్థానికి ఎలా ఉపయోగించుకుంటున్నారో, దానికి ఖద్దరు వ్యవస్థ మద్దతుగా నిలుస్తున్న నిజాన్ని ‘మాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ‘ తో చూపించి నట్లుగా  ‘ఖాకీవనం’ మనకి చూపిస్తుంది. ఈ నవల  వెలువడి సుమారు ముఫ్పై ఐదు సంవత్సరాలు దాటుతున్నా ఆ వ్యవస్థలో మార్పు రాలేదు. ఖాకీ వనం out date కాలేదు.

 

 

నవల ఆరంభంలోనే   ‘ఎస్. పి పార్థసారథి’  పెంచుకుందామని ఇంటికి కుక్కని తీసుకుని వస్తే వాళ్ల అమ్మాయి  “ఇంటికి కాపలాకి మీ జవాన్లింత మందుండగా, మనకీ మళ్లీ ఈ వెధవకుక్కెందుకు డాడీ” అంటుంది. ఈ వాక్యం ఒక్కటే చాలు.  పోలీసు వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగుల స్థితిగతులను తెలియజేయడానికి.

“మెడకు బెల్టుంటే కుక్కట, నడుముకు బల్టుంటే పోలీసు” అన్న వ్యాఖ్యానం  వ్యంగ్య హాస్యానికి తల మానికంగా చెప్పుకోవచ్చు.

భూగర్భంలో లోతుకు పోయిన కొద్దీ అపురూప ఖనిజసంపద దొరికినట్లుగా ‘ఖాకీవనం’ చదువుతూ ఉంటే కొత్త కొత్త సాహిత్యాంశాలు బయటపడతాయి. ముఖ్యంగ పదచిత్రాలు . . . .

“కాకీ క్రోటన్ మొక్కలాగ నిల్చుని ఉన్న జవాన్లు”

“మూగ రిక్షా మూలగకుండా కదిలింది.”

“రిజర్వు పోలీసులు ఖాకీ కంచె కట్టారు.”

“సగం చచ్చిన వెల్తురు బెడ్ రూం దీపం నుంచి బూడిద లాగా రాల్తోంది.”

ఇలా ఎన్నో_ _ _

ఖాకీవనం లోని స్త్రీ పాత్రలు గౌరి, కమలి. వీరిద్దరు భిన్న నేపథ్యాల నుండి నచ్చారు. గౌరి బీదరికంతో, అవిద్య, తండ్రి అనారోగ్యాలే సంపదగా కలిగింది. దేవుడిచ్చిన అందం, వయసులను  ‘సి.ఐ. కాశీపతి’  సొంతం చేసుకున్నాడు. రక్షకభటులు బీదవాడిని భక్షించే నైజం మరోసారి నిరూపించబడింది. నిస్సహాయురాలైన గౌరికి కూడా ఆత్మాభిమానాన్ని ప్రకటించింది. “నాకు బలం వుంటే నేనే ఆయన్ని కత్తెట్టి పొడిచి సంపేద్దును“ అంటూ కాశీపతిపై  గల అసహ్యాన్ని బయటపెట్టింది.

అవసరం, పరిస్థితులే మనిషి నీతి, నిజాయితీలను నిర్ణయిస్తాయి .

“అన్నం మీద ఆకలితో మేం వున్నాం

ఆడదాని మీద ఆకలితో ఆడున్నడు

ఆడి సేతుల్లో తుపాకీ ఉంది

మా అయ్య గుండెల్నిండా దగ్గు రోగం ఉంది.”

అన్న ‘గౌరి చిన్నాయన’  మాటలు ‘గౌరి’ పై జాలిని చూపించి, పాఠకులను కూడా ఆ కోణంలో ఆలోచించేటట్లు చేశాడు.

కమలి విద్యావంతురాలు. మనసుకి నచ్చిన వ్యక్తి, కాబోయే భర్త భాస్కర్ తో ఏకాంతాన్ని కోరుకుని లాడ్జికి వస్తే, మాటలతో, చేతలతో కాశిపతి  కమలిని  అవమానపరచాడు.  “పెళ్లి చేసుకుంటేగాని మంచ మెక్కకు” అంటూ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడినట్లు హేళనగా మాట్లాడాడు. ఈ సందర్భంలో కమలి కన్నీటి వర్ణన అలతి పదాలతో పాఠకులకు కూడా కన్నీటిని తెప్పించక మానదు .

“ఆమె కనుపాపలలోని చావులూ

భయంగా కదిలే అందలి నీరూ

అక్కడి బాధ

అప్పటి యాతనా

కటిక చీకటి

కమలి కళ్లు”

వాటిని చూసి చలించిన ‘భాస్కర్’   “ద్రౌపదిని చేపట్టాలనుకున్న కీచకుడిని వధించిన వలలుడి” లాగా  దొంగచాటుగా కాశీపతిని పొడిచేశాడు. ఆనాడే కమలి చేత స్త్రీలందరి దగ్గరా  ‘మిషన్ గన్స్’ ఉండాలని చెప్పించారు.

పతంజలి

ఏ యుగంలోనైనా  ఆడదానిని అవమానిస్తే నాశనం తప్పదని, చదువుకున్న వారు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి ఎటువంటి పరిస్థితులలో తీసుకుని, నేరస్తులుగా తయారవుతున్నారో అనే వాస్తవానికి ప్రతిరూపంగా ఈ సంఘటన నిలువుటద్దంలా నిలుస్తుంది. నవలలో నాటకీయతను పండించారు.

నేటికీ పారిశుద్ధ్య పనివారిని అంటరానివారుగానే సమాజంలో చాలామంది పరిగణిస్తుంటారు. వారు రాని రోజు మన బ్రతుకులు కూడా దుర్గంధం పాలే. వారికీ గౌరవమర్యాదలివ్వాలని  “ఒరే గిరే అంటే, పాకీవాడు, పీతోడు  అంటే మర్యాదక్కదు. జాగర్తకుండు మిమ్మల్ని అనావొద్దు, మా చేత తినావొద్దు”  అంటూ మనందరికీ సమతాబోధ చేశారు.

ఒక దృశ్యాన్ని ఫొటోలో చూసినప్పుడు అందంగా కనిపించవచ్చు. అదే వాస్తవంలో అంత గొప్పగా ఉండకపోవచ్చు. అలాంటిదే పోలీసు ఉద్యోగమంటూ ఎస్. పి నోట పలికించిన మాటలు …….

“తుపాకీ ఇస్తారు

వెన్నెముక లాంటి లాఠీ ఇస్తారు

ఉండటానికి గొడ్ల  పాకలిస్తారు

తింటానికి మాత్రం సరిపడా ఇవ్వరు

గుండెల మీద చెయి వేసుకొని పడుకోనివ్వరు

తిన్నది వంటబట్టే విశ్రాంతి ఇవ్వరు”

ఈ మాటలు  హృదయాన్ని తట్టి, వ్యవస్థ మార్పు కోసం ముందుకు దూకేట్టు చేస్తాయి.

భాషావేత్తలచే కూడా బహు బాగు అనిపించే  “చీకటి సౌఖ్యాలు, వేట కుక్కల దీక్ష, భయం వాసన, రోగిష్టి సిల్వర్ గిన్నెలు” లాంటి నూతన ప్రయోగాలకి కొదవలేదు ఈ ఖాకీ వనంలో.

మొత్తం మీద వ్యవస్థలో అన్యాయం, దుర్మార్గం, వ్యభిచారం, పేదరికం ప్రబలటానికి కారణం “చిన్న చేప పెద్ద చేపను మింగినట్లుగా “ అన్ని వ్యవస్థల అవినీతి హస్తం ఉందని  ‘ఖాకీ వనం’ ద్వారా పతంజలి గారు భాష్యం చెప్పారు.

***

 (ఫోటో సేకరణ : కూర్మనాధ్)

మై ఛాయిస్ – ఎందుకోసం?

 వినోద్ అనంతోజు

 

vinodదీపికా పదుకునే నటించిన ఒక వీడియో మీద గత కొన్ని రోజులుగా చాలా చర్చ జరుగుతోంది. “My Choice – Deepika on Women Empowerment” అనే పేరు ఉన్న ఆ వీడియో లో దీపికా చెప్పిన అభిప్రాయాలకి చాలా గట్టి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లింక్ లో ఆ వీడియో చూడొచ్చు.

https://youtu.be/KtPv7IEhWRA

ఇది విడుదలైన వెంటనే అన్ని వైపుల నుంచీ దాడి మొదలయ్యింది. రెండో రోజుకల్లా దానికి సమాధానంగా “Male Versions of My Choice” వీడియోలు తయారు చేసి అప్ లోడ్ చేసారు. సాధారణ జనం దీన్ని మగవాళ్ళని కించపరిచినట్టుగా అర్థం చేసుకుని వెంటనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇది కేవలం ఆడా, మగ లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.

ఇక్కడ ఒక విషయం లోతుగా ఆలోచించాలి. Vogue లాంటి ఒక మల్టీ నేషనల్, ఫాషన్ బ్రాండ్ ఈ వీడియోని ఎందుకు నిర్మించింది? ఏ లాభం లేకుండా Women Empowerment కోసమే చేసారు అనే భ్రమలు ఉంటే వదిలించుకోవాలి. దీని వెనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది వ్యాపార లాభం.

vogue3

ఉదాహరణ కి, ఇండియాలో సెక్స్ గురించి లేదా స్త్రీల ఋతుస్రావం గురించి మాములు స్థాయి గొంతుతో మాట్లాడడానికి కూడా జనం ఆలోచిస్తారు. అలాంటి ఒక rigid culture ఉన్న దేశంలో Sanitary Napkins లాభసాటిగా ఎలా అమ్మాలి? ముందు ఇక్కడి కల్చర్ లో ఆ విషయం పట్ల “అది ఒక సాధారణమైన విషయమే” అనే అభిప్రాయ మార్పు తీసుకురావాలి. ఈ ప్రచారం కోసం T.V. రేడియో, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు లాంటి వాటిని ఉపయోగించుకుంటారు. ఈ మధ్య T.V. లో ప్రసారమయ్యే advertisements లో చాలా ఎక్కువ మోతాదులో Whisper, Carefree యాడ్స్ ప్రసారం అవుతుండడం మనం గమనించవచ్చు. రోడ్ల పక్కన అంతంత పెద్ద హోర్డింగుల మీద ఇంతింత చిన్న చెడ్డీలు వేసుకుని అమ్మాయిలూ, అబ్బాయిలు “Jockey or Nothing” అని చెప్పే పోస్టర్లు కనపడతాయి. అది కూడా ఇందుకే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యాడ్స్ లక్ష్యం ఒక్కటే. జనం ఆ Napkins / Underwears  గురించి మాట్లాడుకొనేటప్పుడు ఉండే ఇబ్బందికరమైన భావం పోవాలి. ఇది వాళ్ళ సేల్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది.

అలాగే Vogue Magazine సేల్స్ ఇండియాలో పెరగాలంటే దానికి అనుగుణమైన Fashions, Lifestyle నీ ఇక్కడి వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా ప్రచారం జరగాలి. ఈ వీడియో మహిళా సాధికారికత అనే ముసుగులో చాలా బలంగా వాటినే ప్రచారం చేస్తోంది.

ఇందులో పొట్ట నింపుకోవడం కోసం వ్యభిచారం చెయ్యాల్సిన దౌర్భాగ్యంలో ఉన్న మహిళల గురించి లేదు, ఒక వైపు సైన్సు పరుగులు పెడుతున్నా సతీసహగమనాల వల్ల ఆహుతైపోతున్న మహిళల గురించి లేదు. చదువుకీ, ఉద్యోగాలకీ దూరంగా వంటిళ్ళలో ఉడుకుతున్న ఆడవాళ్ళ గురించి లేదు. మగవాళ్ళతో సమానంగా పని చేస్తూ కూడా పేదరికంతో అల్లాడుతున్న స్త్రీల గురించిలేదు, అత్యాచారాల గురించి లేదు, వివక్ష గురించి లేదు. మరి ఏముంది ఈ వీడియోలో?

Vogue1

స్త్రీల Sexuality గురించీ, వాళ్ళు వేసుకునే బట్టల విషయంలో వారి కుండే స్వేచ్ఛ గురించీ తప్ప ఏమీ లేదు. ఈ రెండేనా మహిళా సాధికారికత – Women Empowerment – అంటే? కాదు. మరి ఈ విషయం ఆ వీడియో నిర్మించిన వాళ్లకి తెలియదంటారా? తెలియదనుకోవడం అమాయకత్వమే! తెలిసే చేసారు. ఎందుకంటే Vogue ఆ రెండు విషయాలకే సంబంధించిన మ్యాగజైన్ కనుక ! అలాంటి మ్యాగజైనులు కొని చదివే వర్గాలకి (విలాసాల కోసం డబ్బు ఖర్చు చెయ్యగలిగే వాళ్లకి) ఇలాంటి మహిళా సాధికారికతే వినడానికి రుచికరంగా ఉంటుంది కనుక !

మరి మిగతా వాళ్ళు? (చదువురాని వారు / పేదలు)

మిగతావాళ్ళు గంగలో కలిసిపోయినా మాకనవసరం !

దీనినే “బూర్జువా ఫెమినిజం” అంటారని ఈ మధ్యే తెలిసింది.

అసలు ఈ “Fashion & Lifestyle” Magazines లో ఏముంటుందో అని నాలుగైదు మ్యాగాజైనులు తిరగేశాను – Vogue, Femina, GQ, Elle, Cosmopolitan – లాంటివి. Sex, Fashion, Food, Beauty తప్ప ఇంకో ముక్క ఉంటే ఒట్టు. వాటిలో ఉన్న శీర్షికలు చాలా వరకు ఇలా ఉన్నాయి…

“అందమైన ఆకారం కోసం ఏం తినాలి?” (ఆరోగ్యం కోసం కాదు తినడం!!)

పార్టీలో “హాట్” గా కనపడాలంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి? (ఎందుకు కనపడాలి హాట్ గా?)

“మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం క్రీం పూసుకోవాలి?

“సన్నగా ఉండడం వల్ల సెక్స్ సుఖాలు !!”

ఇవి కేవలం కవర్ పేజీలు మాత్రమే. లోపలున్న దుర్మార్గాలన్నీ చెప్పడం కష్టం. ఆడవాళ్ళని వాళ్ళ కొలతలని బట్టి, వాళ్ళ శరీర ఛాయ ని బట్టి కొలతలు వేసే ఈ Vogue మ్యాగజైన్ Women Empowerment గురించి మాట్లాడుతోంది !! ఈ సదరు బూర్జువా ఫెమినిస్టులు మగవాడు ఆడవాళ్ళని Objectify చేసి చూడడాన్ని వ్యతిరేకిస్తూ, ఆడవాళ్ళు తమని తాము  “అందమైన” objects గా ప్రదర్శించుకోవడాన్ని ప్రోత్సహిస్తారు. దీపిక పదుకొనే నటించిన ఈ వీడియో నే ఇందుకు ఉదాహరణ. ఈ వీడియోలో సన్నగా తెల్లగా Well-Polished గా ఉన్న ఆడవాళ్ళనే చూపించడం గమనించవచ్చు. ఒకరిద్దరు మామూలు స్త్రీలని చూపించినప్పటికీ అది తప్పక తీసుకొచ్చి అతికించినట్టు తెలిసిపోతోంది. వీరికి ఆ కొలతలు పాటించని మామూలు స్త్రీలు, ఫాషన్ లకి దూరం గా బతికే స్త్రీలు స్త్రీలుగా కనపడరు.

maxresdefault (1)

దీపిక “Its My Choice”  అని చెప్తూ బ్రా హుక్ తీయడాన్ని చూస్తే మహిళా సాధికారికత కంటే, మహిళా సాధికారికత పేరుతో చేస్తున్న మోసం ఎక్కువ కనిపించింది.

ఈ Fashion / Cosmetic కంపెనీల వ్యాపారాలన్నీ మనుషులకు “అందం” అనే దాని మీద ఉన్న భ్రమల చుట్టూనే జరుగుతాయి. “అందం” మీద భ్రమలన్నీ వదిలిపోయి మహిళలు నిజం గా సాధికారికత వైపు నడిస్తే, అది వీళ్ళ లాభాలకి దెబ్బ. అలాగని పెరిగిపోతున్న మహిళా చైతన్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం కుదరదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కార్పొరేట్ కంపెనీ లు కనిపెట్టిన మార్గం – అసలైన ఫెమినిజాన్ని హైజాక్ చేసి పక్కదారి పట్టించడం. “అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని” హైజాక్ చేసి “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” గా మార్చేసారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆ రోజున ఫాషన్ షో లు జరుగుతున్నాయి. రాను రాను “మహిళా సాధికారికత” అనే పదానికి అర్థం “చదువుకున్న మహిళల సాధికారికత” గా మార్చేశారు.

vogue5

ఈ సందర్భంగా నాకు బొలివియా దేశపు గని కార్మికురాలు దొమితిలా చుంగారా మెక్సికో అంతర్జాతీయ మహిళా సభలో చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.

ఆ సభలలో ఎక్కువ భాగం ఉపన్యాసాలు ఇలా సాగాయి “మగవాళ్ళకి/మొగుళ్ళకి ఉండే సౌకర్యాలన్నీ ఆడవాళ్ళకీ ఉండాలి. మగవాళ్లు తిరుగుతారు, తాగుతారు. మనమూ తాగాలి, తిరగాలి. వాళ్ళు ఎంతమంది ప్రియురాళ్ళతో సంబంధం పెట్టుకుంటారో మనకీ అంతమందితో సంబంధం పెట్టుకునే హక్కు కావాలి….”

ఇవన్నీ వింటున్న దొమితిలా ఇలా చెప్పబోయింది. “మా పోరాటం మా భర్తల మీద మాత్రమే కాదు. మిమ్మల్ని పేదలు గా చేసిన ప్రభుత్వం మీద, పోలీసుల మీద, వ్యవస్థ మీద.”

Vogue2అక్కడ ఉన్నవాళ్లు “ఈ సభలో కేవలం ఆడవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడాలి. పోలీసులు, పేదరికం లాంటివి కాదు!!” అని అడ్డు తగిలారు.

అప్పుడు దొమితిలా అక్కడకి వక్తలు గా విచ్చేసిన ధనవంతులైన మహిళామణులని ఉద్దేశించి ఈ విధంగా చెప్పింది. “సరే ఆడవాళ్ళ గురించి మాత్రమే చెబుతాను. నాకూ నా పిల్లలకూ ఒంటి నిండా బట్టలు కూడా ఉండవు. మీరు తళ తళ మెరిసే బట్టలతో, నగలతో ఉన్నారు. మా కుటుంబమంతా ఒక చిన్న అద్దె గదిలో ఉంటాము. మీ ఇళ్ళలో పది గదులు ఉంటాయి. రోజుకి 16 గంటలు పని చేస్తాము. మాకు కడుపు నిండా తిండి లేదు. నీళ్ళు లేవు. స్నానాల గదులు లేవు. మా పిల్లలకు చదువులు లేవు. మీరు కార్ల లో తిరుగుతారు. ఏ పని కైనా నౌకర్లు, డ్రైవర్లు ఉంటారు. మనిద్దరం ఆడవాళ్లమే మరి మీకూ మాకూ సమానత్వం ఎక్కడుంది? మా సమస్యలు మీకు ఎక్కడున్నాయి? మా భర్తలు కూడా పెత్తనం చేస్తారు. మేమూ పోట్లాడతాము. అయినా దానికంటే కూడా మా పేదరికమే మా అసలైన సమస్య. మీరూ మేమూ ఆడవాళ్లమే. కానీ అందరు ఆడవాళ్ళు ఒక్కటి కాదు.”

మహిళలలోనే ఉన్న భిన్న వర్గాలనీ, వాటి మధ్య ఉన్న  అంతరాలనీ, వైరుధ్యాలనీ విస్మరించి, అందరు మహిళలని ఒకే గాటన కట్టి చూసే ఫెమినిజం పెద్ద బూటకం.

ఈ వీడియో తీసినందుకు కేవలం దీపికాను తిట్టినంత మాత్రాన, ఆడవాళ్ళనీ, ఫెమినిజాన్నీ విమర్శించినంత మాత్రాన ఏ ఉపయోగమూ ఉండదు. ఇలాంటి వీడియోలు, పుస్తకాలు, అభిప్రాయాలు ఇంకా చాలానే వస్తాయి. వీటన్నిటి వెనక ఉన్న మోసాన్ని గ్రహించకపోతే మహిళా సాధికారిక ఉద్యమం చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

 ~

‘జంట గొడ్డలి’ చెప్పే జగజ్జనని తత్వం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

 నరుడే కదా ఈ పురాణ, ఇతిహాసకథలన్నీ చెబుతున్నది?! అలాంటిది తననుంచి తనను విడదీసుకుని, దేవతలు, రాక్షసులు, సిద్ధులు,సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు, సర్పాలు వగైరాల మధ్య తనను ఎందుకు ఇరికించుకుంటున్నాడు?

ఇంతకీ విషయమేమిటంటే; దేవతలు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు,సర్పాలు వగైరాల మధ్య నరుడు ఒకడుగా ఉన్నది –ఆదిమ పౌరాణికతకు చెందిన భిన్న ప్రపంచం. ఈ వ్యాసపరంపర ప్రారంభంలో ఒకసారి ఈ ప్రశ్నను లేవనెత్తాను. కొన్ని వ్యాసాల క్రితం మరోసారి ముందుకు తెచ్చాను. ఇలా వెంటాడుతున్న ఈ ప్రశ్న, ఇప్పుడు సమాధానానికి ఏ కొంచెమైనా దగ్గరవుతుందేమో చూద్దాం.

అసలు ఈ ప్రశ్న తలెత్తడమే అపూర్వం అద్భుతం. ఇంత ముఖ్యమైన ప్రశ్న మన పురాణ, ఇతిహాస పండితులలో ఎందుకు పుట్టలేదో ఆశ్చర్యం. ఈ నరుడనే వాడికి పురాణ, ఇతిహాసాలలో గౌరవం లేదనీ, చులకనభావం ఉందనీ కూడా చెప్పుకున్నాం. మహాభారతంలోని ఈ  విచిత్రాన్నే చూడండి….’ఇతడు కేవల మర్త్యుడే’ అనడం చాలా చోట్ల వస్తుంటుంది.  ఉదాహరణకు, కర్ణుని గురించి దుర్యోధనుడు ఆ మాట అంటాడు. ధర్మరాజు గురించి అర్జునుడు అంటాడు. ఇక ద్రౌపది మానవమాత్రురాలు కాదు, అయోనిజ…

ఇదే సమయంలో ఇదే మహాభారతం, అర్జునుడికి ‘నరు’డనే నామాంతరాన్ని సృష్టిస్తోంది. అంతేకాదు, అతన్ని ‘నరవీరు’ణ్ణి చేస్తోంది. అప్పటికీ నరుడికి అంత ప్రాధాన్యం ఇవ్వడం మహాభారతకర్తకు ఇష్టం లేదు. కనుక అర్జునుని ‘నరు’డనే ఆదిముని అవతారంగా చిత్రిస్తున్నాడు. ఆపైన నారాయణుడనే దేవునితో అతణ్ణి కలిపి చెబుతున్నాడు. మహాభారతంలో నాయకుడంటూ ఒకరిని గుర్తించవలసివస్తే అది నరుడైన అర్జునుడే  అవుతాడు. అతడు నారాయణుడనే దేవుడి సాయంతో కురుక్షేత్రయుద్ధంలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నరుని వారసుడైన అభిమన్యుని కొడుకు పరీక్షిత్తే హస్తినాపురరాజ్యానికి ఉత్తరాధికారి అయ్యాడు.

హోమర్ ‘ఒడిస్సీ’ లోని ఓడిసస్ లానే, మహాభారత నరుడు  స్త్రీ సూత్రాన్ని ఎలా జయించాడో చూడండి… కురుక్షేత్రయుద్దం సమీపిస్తున్న సమయంలో  పులోమ, కాలక అనే రాక్షసస్త్రీల కొడుకులైన పౌలోములను, కాలకేయులను చంపాడు. శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని, దేవలోకం వెళ్ళి ఇంద్రునినుంచి మరికొన్ని దివ్యాస్త్రాలను  పొందిన తర్వాత; ఊర్వశి అనే అప్సరస పన్నిన మోహపు ఉచ్చులో పడకుండా తప్పించుకున్నాడు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడానికి ఇదీ అతను రచించుకున్న పూర్వరంగం! ఆ వెంటనే మరో ‘నరు’డైన నలుని చరిత్ర ప్రారంభమవుతుంది. ఈ క్రమం, నరుని ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడానికి కథకుడు కల్పించున్న ప్రణాళికను సూచిస్తూ ఉండచ్చు.

ఇంతకీ విషయమేమిటంటే; దేవతలు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, పశువులు, పక్షులు, సర్పాలు వగైరాల మధ్య నరుడు ఒక అల్పజీవిగా ఇరుక్కుని ఉన్నది –ఆదిమ పౌరాణికతకు చెందిన భిన్న ప్రపంచం. క్రమంగా నరుడు వీరుడిగా మారి ఆ ప్రపంచంలోంచి తనను తాను విముక్తం చేసుకుని విశ్వరూపం ధరిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఆదిమ పౌరాణికతకు భిన్నమైన తాత్వికతను, తాత్విక ప్రతీకలను సృష్టించాడు.  ఈ పరిణామం తరతమ భేదాలతో దాదాపు ప్రపంచమంతటా జరిగింది. మెసపొటేమియా, భారతదేశం, గ్రీసు మొదలైన చోట్ల ఇది ఐతిహాసిక యుగాన్ని స్థాపించింది. గిల్గమేశ్, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, అర్జునుడు, సారగాన్, హమ్మురాబి, అచెలూయెస్(ఇలియద్), ఓడిసస్ మొదలైన వీరులను సృష్టించింది. వీరిలో పలువురు ఇతిహాస నాయకులయ్యారు.  గిల్గమేశ ఇతిహాసం (ఎపిక్ ఆఫ్ గిల్గమేశ్), రామాయణం, మహాభారతం, ఇలియద్, ఒడిస్సే మొదలైనవి వీరిని కీర్తించాయి.

ఇక ఇప్పుడు ఆదిమ పౌరాణికత, నూతన పౌరాణికతల మధ్యనున్న తాత్విక భేదాలలోకి వెడదాం:

‘యెహోవా కూడా కాళియ మర్దనుడే’ అనే వ్యాసంలో పాములే శిరోజాలుగా ఉన్న మెడూసా అనే దేవత గురించి ప్రస్తావించుకున్నాం. ఆ దేవత చూపులే మగవారిని దహించివేస్తాయి. పెర్సియస్ అనే దేవుడు ఆమె తలను నరుకుతాడు. ఎథెనా అనే దేవత ఆదేశం పై అస్లేపియస్ అనే దేవవైద్యుడు మెడూసా కుడి, ఎడమ నరాల నుంచి రక్తం సంగ్రహిస్తాడు. కుడి నుంచి తీసిన రక్తాన్ని ప్రాణం పోయడానికి, ఎడమ నుంచి తీసిన రక్తాన్ని ప్రాణం తీయడానికి వినియోగిస్తాడు. అంటే ప్రాణం పోయడం, తీయడం అనే రెండు శక్తులూ ఈ దేవతలో సహజీవనం చేస్తున్నాయన్న మాట.

kali

ఇటువంటి మెడూసాను క్యాంప్ బెల్ మన కాళికాదేవితో పోలుస్తారు. కాళిక తన కుడి చేత్తో వరాలు ఇస్తుంది, ఎడమ చేతిలో కరవాలాన్ని ధరించి ఉంటుంది. కాళి విశ్వంలోని అన్ని జీవులకూ జన్మనిచ్చే జగజ్జనని, అమ్మల గన్న యమ్మ. అయినాసరే, రక్తదాహాన్ని చాటుతున్నట్టుగా ఆమె ఎర్రని నాలుక చాస్తుంది. కపాలాలనే  హారంగా ధరిస్తుంది. తెగిన చేతులు, కాళ్లనే వస్త్రంగా చుట్టుకుంటుంది.  కాళి అనే పేరు నలుపును, కాలాన్నీ కూడా సూచిస్తుంది. జనన మరణాలు అనేవి కాలంలోనే సంభవిస్తుంటాయి. అందుకే యముణ్ణి కాలుడు అన్నారు.  జీవుల జనన, మరణాలను శాసించే దేవత కాళి. విశ్వానికి గర్భమూ, సమాధీ కూడా ఆమెయే. ఆమె అద్వితీయమైన(ఇంకొకటి లేని)ఆదిమశక్తి. ప్రకృతి యొక్క చరమసత్యం. దేవుళ్ళు అందరూ ఆమె ఆదేశాలను పాటించవలసిన ఆమె ప్రతినిధులు మాత్రమే.

మన ‘దేవీ భాగవతం’ ఈ జగజ్జనని అద్వితీయతను, ఆధిక్యాన్ని చెబుతుంది. మన పురాణాలు సృష్టి, స్థితి, లయం అనే మూడు మాటల్ని తరచూ ప్రస్తావిస్తూ ఉంటాయి. ఇవి మూడు రకాల కార్యాలను సూచిస్తాయి. విడివిడిగా చెప్పుకుంటే; సృష్టి అంటే విశ్వాన్ని సృష్టించడం-ఇది బ్రహ్మదేవుడి పని. స్థితి అంటే విశ్వం సక్రమంగా నడిచేలా చూస్తూ దానిని పోషించడం-ఇది విష్ణువు పని. లయమంటే సృష్టిని అంతమొందించడం-ఇది శివుడు చేసే పని. కానీ ఆదిమ పౌరాణికతలో ఈ మూడింటినీ ఒక్క జగజ్జననే చేస్తుంది. ఈ శక్తులన్నీ ఆమెలోనే ఇమిడి ఉంటాయి. పైన చెప్పిన త్రిమూర్తులు కూడా ఆమె సంతానమే.

మన పురాణాలలో అత్రి మహాముని భార్య అనసూయ ఉదంతం పరోక్షంగా దీనినే చెబుతుంది. ఒకసారి త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలనుకున్నారు. ముగ్గురూ అతిథులుగా అత్రి ఆశ్రమానికి వెళ్లి, నువ్వు నగ్నంగా మాకు భోజనం వడ్డిస్తేనే ఆతిథ్యాన్ని స్వీకరిస్తామని అనసూయతో అన్నారు. ఆమె సరే నని  ముగ్గురినీ పసిపిల్లలను చేసి, తను నగ్నంగా మారి, వారి ముందు విస్తళ్ళు వేసి వడ్డించి, తను తిరిగి చీరకట్టుకుని వచ్చి వారిని పెద్దవాళ్ళుగా మార్చింది. ఆ తర్వాత వారిని మరోసారి పసిపిల్లలను చేసి తన దగ్గరే ఉంచుకుందని, అప్పుడు వారి భార్యలు వెతుక్కుంటూ వచ్చారని కథ.

మృత్యు, పునరుజ్జీవనాలు రెండింటికీ చెందిన దేవతారూపమూ, ఆ దేవతకు సంబంధించిన పురాణ కథలూ లెవంట్ (సైప్రస్, ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, లెబనాన్, టర్కీలను లెవంట్ అంటారు) అంతటా నూతన శిలా యుగం నుంచి, దాని అనంతర యుగంవరకూ కొన్ని వేల సంవత్సరాలపాటు సుపరిచితాలు. క్రీ .పూ. 5,500కు చెందిన సమీపప్రాచ్యంతో మొదలుపెట్టి, క్రీ.శ. 1531కి చెందిన గౌదలూపే(Gaudalupe: స్పెయిన్, అమెరికా, బొలీవియా, పెరూ, కొలంబియా, మెక్సికో సహా స్పానిష్ భాష మాట్లాడే దేశాలలో కనిపించే ఒక ప్రాదేశిక నామం) వరకు ఈ దేవతామూర్తులు, ఆమెకు సంబంధించిన పురాణకథలలో ఒక అవిచ్ఛిన్నత కనిపిస్తుంది.  ఆసియా మైనర్, నైలు, గ్రీసు, సింధు లోయ సహా పురాతన ప్రపంచం అంతటా వివిధ వైఖరులకు చెందిన నగ్నస్త్రీ మూర్తులు విస్తారంగా కనిపించాయి. సృష్టిస్థితి లయాలతో సహా అన్నింటినీ సంకేతించే ఈ దేవతకు చెందిన ఒక రూపం తన రెండు చేతులతో స్తనద్వయాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇంకో రూపం ఎడమ చేతితో జననేంద్రియాన్ని, కుడి చేతితో స్తనాన్ని చూపిస్తుంది. ఇంకొక రూపం మగశిశువుకు పాలిస్తూ కనిపిస్తుంది. వేరొక రూపం రెండు చేతులూ చాపి, వాటిలో పంటకు సంబంధించిన కంకులను, పువ్వులను, సర్పాలను, పావురాలను, ఇతర చిహ్నాలను పట్టుకుని పశువుల మధ్య నిలబడి కనిపిస్తుంది.

The Goddess of the Mountain

యూరప్ కు సంబంధించినంతవరకు అభివృద్ధి చెందిన తొలినాటి కంచుయుగ రూపాలు క్రీటుద్వీపంలో కనిపించాయి. ఈ ద్వీపంపై లెవంట్ ప్రభావం పడింది. క్రీ.పూ. 25౦౦-క్రీ.పూ. 12౦౦ ల మధ్యకాలంలో క్రీటు నాగరికత (మినోవన్ నాగరికత) ఉచ్ఛదశను చవిచూసింది. మన దేశంలో సింధు నాగరికతకు చెందిన హరప్పా-మొహెంజదారోల కాలం కూడా ఇదే.  క్రీటునగరం నోసోస్ లోని ప్రాసాదం శిథిలాలలో క్రీ.పూ. 1500 కు చెందిన ఒక సీలు దొరికింది. ఆ సీలు మీద ఒక దేవత బొమ్మ ఉంది. ఆమె జగత్ పర్వత దేవత(The Goddess of the World Mountain). ఆమె ఒక దండం లాంటిది పట్టుకుని కొండ మీద నిలబడి ఉంటుంది. రెండువైపులా రెండు సింహాలు ఉన్నాయి. ఆమె వెనకాల క్రీటు ఆలయరీతిని ప్రతిబింబించే ఒక భవనం ఉంది. ఆమె ఎదురుగా భక్తిని చాటే భంగిమలో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతడు బహుశా చావు-పుట్టుకలను సూచించే ఆమె కొడుకు-భర్త; లేదా క్రీటు యువరాజు, లేదా ఒక భక్తుడు కావచ్చునని క్యాంప్ బెల్ అంటారు. ఒకవేళ అతను రాజే అయినప్పుడు, ఫ్రేజర్ చెప్పినదే నిజమైతే, ఎనిమిదేళ్ళ కోసారి శుక్ర-సూర్య ఆవృత్తి(Venus-solar cycle) పూర్తి అయినప్పుడల్లా రాజును నిజంగానో, ప్రతీకాత్మకంగానో బలి ఇచ్చేవారని కూడా ఆయన అంటారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్ధారణగా చెప్పలేకపోయినా, చావు-పునర్జన్మలను సంకేతించే యువకుని దేవతకు కొడుకుగా-భర్తగా స్పష్టంగా సూచించే దేవత చిత్రాలు అనేకం ఉన్నాయి. అలాగే రాజును బలి ఇవ్వడం గురించి చెప్పే చిత్రాలు, ఉదంతాలు కూడా.

వాటిని అలా ఉంచితే,  ఈమె పర్వతదేవత కావడం మన పురాణాలలోని పార్వతినీ; ఈమెకు రెండువైపులా సింహాలు ఉండడం –పార్వతికి మరో రూపమైన సింహవాహిని దుర్గను గుర్తుచేస్తాయి. పై దేవత పశువుల అధిదేవత(Lord of the Beasts)ను పోలి ఉందని పురావస్తు నిపుణులు అనడం గమనిస్తే, పశుపతి అయిన శివుడు వెంటనే గుర్తుకొస్తాడు. మొదట అమ్మవారి పాలనలో ఉన్న పశువులు, తర్వాత అయ్యవారి పాలనలోకి వెళ్ళాయన్నమాట.

The Goddess of the Double Axగ్రీసులోని క్రి.పూ. 2వ సహస్రాబ్దికి చెందిన పురాతన నాగరికతా ప్రాంతమైన మైసీనియాలో లభించిన ఒక గుండ్రని సీలు మీద ఒక చిత్రం ఉంది. ఆ చిత్రంలో ఉన్నది ‘జంట గొడ్డలి దేవత’(Goddess of the Double Ax). చిత్రంలో పైన సూర్యుడు, చంద్రవంక ఉన్నారు. చంద్రుడు క్షీణదశలో ఉండగా, సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చంద్రుడి వెనకాల ఎడమ చేతిలో ఒక దండం పుచ్చుకుని చిన్న స్త్రీమూర్తి నిలబడి ఉంది. ఒక మైసీనియా డాలు ఆమెను కప్పుతోంది. మన మహిషాసురమర్దనిలా ఈ జంట గొడ్డలి దేవత యోధదేవత అనడానికి ఇది సూచన. అలాగే, దేవతకు చెందిన సంహార, లేదా మృత్యుదేవతా లక్షణానికి కూడా ఇది సూచన.(తాత్వికంగా చెబితే, ఈ సంహార కార్యాన్ని దుష్టశిక్షణ, శిష్టరక్షణగా అన్వయించడం తర్వాతి కాలంలో వచ్చింది. ఈ చిత్రం ప్రాతినిధ్యం వహించే ఆదిమ పౌరాణికకాలంలో ఆ అర్థం లేదు). ఈ చిన్న స్త్రీమూర్తి, బలి ఇచ్చిన ఆరు పశువుల శిరస్సులను తన కుడి చేతితో చూపుతోంది. దానికి సరిగ్గా అభిముఖంగా పుష్కలంగా పండిన పండ్లతో ఒక చెట్టు ఉంది. అది జీవవృక్షం(Tree of Life). ఒక చిన్న పిల్ల ఎగిరి పండ్లు కోసుకుంటోంది.

చిత్రం మధ్యలో కనిపిస్తున్నది, క్రీటుకు చెందిన జంట గొడ్డలి. దాని ఒక అంచు బలిని సూచిస్తోంది. రెండవ అంచు జీవవృక్షాన్ని సూచిస్తోంది. చెట్టు కింద కూర్చుని ఉన్నదే జంట గొడ్డలి దేవత. ఆమె ప్రసన్నవదనంతో ఉంది. ఆమె ఎదురుగా ఇద్దరు భక్తులు ఉన్నారు. ఆమె కుడి చేతితో ఒక పంట తాలూకు మూడు కంకులు వారికి ఇస్తూ, ఎడమ చేతితో తన స్తనం ఒకదానిని ఎత్తిచూపుతోంది. ఆమె పాదాల దగ్గర ఒక చిన్నపిల్ల ఉంది. కాళ్ళు లేని ఆ పిల్ల భూమిలోంచి పైకి వస్తున్నట్టు ఉంది. ఆ అమ్మాయి ఎడమచేతిలో చిన్న జంట గొడ్డలి, కుడి చేతిలో చెట్టుకొమ్మ ఉన్నాయి.

చిత్రంలో ఈ చివర, డాలుతో కప్పిన స్త్రీమూర్తి కిందికి దిగుతున్న భంగిమలో ఉండడం, ఆ చివర ఒక బాలిక పైకి ఎగిరి పండ్లు కోసుకుంటున్న భంగిమలో ఉండడం ఇందులోని తాత్విక సారాంశాన్ని వెల్లడిస్తాయి. కిందికి దిగుతున్నట్టు ఉన్న స్త్రీమూర్తి మృత్యువుకు, ఎగిరి జీవవృక్షం పండ్లు కోసుకుంటున్న బాలిక పునర్జన్మకు సంకేతాలు. అంటే చావు, పుట్టుకలు రెండింటికీ ఈ జంట గొడ్డలి జగజ్జననే అధిదేవత. జంట గొడ్డలి సంకేతించేది కూడా దానినే. ఒక్కోసారి చావు, పుట్టుకలను వేర్వేరు దేవతలతో సంకేతించినా వారు ఈ దేవత అంశలు మాత్రమే. పితృస్వామిక పురాణాలకు ముందు పౌరాణిక ఉద్యానవనమూ(Mythic Garden), స్వర్గమూ(Paradise) కూడా ఈ దేవతే. ఈమె కొడుకు దుముజి చంద్రుని క్షీణ, వృద్ధి దశలను సంకేతిస్తూ చావు-పుట్టుకల చక్రభ్రమణం సాగిస్తూ ఉంటాడు.

The Minoan Double Ax

పైన పేర్కొన్న జగత్ పర్వత దేవత చిత్రంలోని సింహాలు కూడా ఒకవైపు మృత్యుభయాన్ని, ఇంకోవైపు పునర్జన్మను లేదా అమరత్వాన్ని సూచిస్తాయి. అంటే భక్షణ, రక్షణ -రెండింటికీ ఇవి ప్రతీకలు. గ్రీకుదేవత మెడూసా, మన కాళికాదేవి సంకేతించేది కూడా సరిగ్గా ఇదే. అంటే జగజ్జనని ప్రపంచంలో చావు-పుట్టుక, భయమూ-నిర్భయమూ అనే ద్వంద్వాలు లేవు. ప్రకృతి నియతికి ప్రతిరూపంగా సాగే ఆ జీవనంలో మంచి-చెడు; వెలుగు-చీకటి, ధర్మమూ-అధర్మమూ అనేవి నేడు మనం భావించుకునే సరళిలో ఉండకపోవచ్చు. ద్వంద్వాలు అన్నీ ఒకదానిలో ఒకటి కలసిపోతున్న, ఒకదాని వెంట ఒకటిగా చక్రభ్రమణం సాగిస్తున్న ఒక అద్వితీయ ప్రపంచం అది. ప్రకృతిలో కూడా జరిగేది అదే. మొక్క మరణించి తన విత్తనంలోంచి తనే పునర్జన్మ ఎత్తుతూ ఉంటుంది. శిశిరంలో మోడువారిన చెట్టు వసంతం రాగానే చిగురిస్తుంది.  ప్రకృతికి ప్రతిబింబమే జగజ్జనని తాత్వికత కూడా.

ఈ ప్రకృతిలోని చెట్లు, పుట్టలు, గుట్టలు, తోపులు, పక్షులు, పశువులు, సర్పాలు, చంద్రుడు, తారలతో సహా సమస్తమూ జగజ్జనని పరివారమే. వీటిలో మళ్ళీ కొన్ని ద్వంద్వాలకు తావులేని జగజ్జనని తాత్వికతకు అద్దంపట్టే ముఖ్యమైన ప్రతీకలు కూడా అయ్యాయి. వాటి గురించి కొంత ఇప్పటికే చెప్పుకున్నాం. మరికొన్ని విశేషాలు తర్వాత…

 ~

ప్రేమే జీవితం కాదు!

 

విజయ్ గజం 

 

vijays pictureనిద్రమత్తు ఇంకా వీడలేదు. బెడ్ మీద దొర్లుతుంటే నురగలు కక్కే కాఫీ తీసుకొచ్చింది నా అర్ధాంగి.అదే చెత్తో పేపర్ తీసుకొచ్చి మెయిన్ ఎడిషన్ తను తీసుకొని సిటీ ఎడిషన్ నా కు ఇచ్చింది. ఇద్దరం అలా కాఫీ తాగుతూ బీచ్ అందాలను చూస్తూ బాల్కనిలో కూర్చొని పేపర్ చదవడం, కబుర్లు చెప్పుకోవడం మా దినచర్యలో భాగం.

రోజూ లాగానే పేపర్ ఎదురుగా కూర్చున్న మాకు ఆ పేపర్ వార్తలను చూడగానే చిరాకు వేసింది. ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని గొంతు కోసి చంపిన వార్త కలవర పెట్టింది. ఆ వార్త చూడగానే మనసంతా అదోలా తయ్యారయింది. కాసేపు పాత పాటలు అయినా విందామని టీవీ పెట్టగానే అందులోనూ ప్రేమ పేరుతో చేసే వేధింపులు తాళలేక 15 సంవత్సరాల బాలిక కిరోసిన్ పోసుకుని అత్మహత్య చేసుకుందని బ్రేకింగ్స్ చూడగానే తాగుతున్న కాఫీ ఛేదుగా అనిపించింది.

ప్రేమను ఒప్పుకోకపోతే చంపేయ్యాలా ?, ప్రేమ బ్రతుకును, ప్రేమించిన వ్యక్తి సంతోషాన్ని కదా కోరాల్సింది. కాని ఇప్పుడు జరుగుతుంది ఏమిటీ? ప్రేమించక పోతే చంపేస్తారా? ఒక జీవితాన్ని అర్ధాంతరంగా చిదిమేస్తారా? ఇదే లోచనలతో ఆఫీసుకి బయలుదేరాను. డ్రైవింగ్ చేస్తున్నా అలోచనలు మాత్రం అవే, ఇదే సమయంలో నా ఆలోచనలను భగ్నం చేస్తూ  మోగింది నా  సెల్‌ఫోన్‌,  నెంబర్ మాత్రం బాగా తెలిసిన నెంబర్ లాగా ఉంది,

ఫోన్ లిఫ్ట్ చేసి  అవతల వ్యక్తి ఏం మాట్లాడేదీ వినకుండా డ్రైవింగ్‌లో ఉన్నా మళ్లీ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాను. మళ్లీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది.. బైక్‌ పక్కన ఆపి విసుగ్గా కాల్‌ లిఫ్‌ చేశాను, విశ్వం ఎలా ఉన్నావురా అనే మాట వినిపించడంతో  బాగా తెలిసిన వారు అని అనిపించి 10 నిమిషాల తరువాత ఫోన్ చేస్తానని చెప్పి మళ్లీ బైక్‌ స్టార్ట్ చేశాను. ఆఫీసు దగ్గరకు రాగానే నా మోబైల్‌కు వచ్చిన నెంబర్‌కు కాల్ చేస్తే ఎంగేజ్ వచ్చింది. తరువాత వాళ్లే చేశారు, బాగా తెలిసిన గొంతు విశ్వం ఎలా ఉన్నావురా అనే పలకరింపు.  ఆ వాయిస్. దానిలోని మార్ధవం వెంటనే గుర్తుకు వచ్చింది కోదాడ అత్తయ్య.

నన్ను విశ్వం అని చనువుగా పిల్చే అతి కొద్ది మంది వ్యక్తులలో కోదాడ అత్తయ్య ఒకరు.  బాగున్నాను ఇంతకు మీరు ఎలా ఉన్నారమ్మా అన్నాను ముక్తసరిగా.ఏంటీ విశ్వం కొత్తగా గారూ గీరు అంటూ దూరం పెట్టేస్తున్నావు అని నిష్టూరమాడింది కోదాడ అత్తయ్య. మాట్లాడటం ఇష్టం లేక పనిలో ఉన్నాను త్వరగా చెప్పమ్మా అన్నాను అదే విసుగ్గా.ఏమనుకుందో ఏమిటో. కాంతికి పెళ్లీ కుదిరింది, మీ కుటుంబం తప్పకుండా రండీ చెప్పి ఫోన్ పెట్టేసింది.

కాంతి ఈ పేరు వినగానే బాగా ఇష్టమైన పుస్తకాన్ని మళ్లీ చదివిన అనుభవం.నా జీవితంలో కాంతులు నింపుతుంది అనుకున్న కాంతి ఓ హైఓల్టేజ్  మెరుపులా నా జీవితంలోకి వచ్చి ఎనర్జీ నింపి, అంతే వేగంగా దూరమైంది. కృష్ణా జిల్లాలోని ఓ చివర టౌను మాది. ఫస్ట్ నుంచి అన్నింటికీ పోరాడీ పోరాడీ చదువు సాగించాను. నాకిష్టమైన జర్నలిజంలో పీజీ చదవడానికి ఓ యుద్ధమే చేశాను.

అమ్మమ్మని ఎదిరించి మరీ పీజీలో నాకు నచ్చిన జర్నలిజం జాయిన్ అయ్యాను.దీంతో మూడు నెలలు అమ్మమ్మ మాటలు బంద్.విశాఖలో ఉండగా ఓ రోజు కోదాడ అత్తయ్య ఫోన్ ఎలా ఉన్నావు రా. ఒక్క సారి రా రాదూ చాన్నాళ్లు అయింది నిన్ను చూసి అని అందీ.కోదాడ అత్తయ్యకు నేనంటే మంచి అభిప్రాయం. జీవితంలో స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయనీ, చెప్పదలుచుకున్న విషయాన్ని మోహమాటానికి పోకుండా స్పష్టంగా చెబుతానని అంటూ ఉండేది.తన పిల్లలతో సమానంగా చూసేది నన్ను కూడా.వాళ్ల పిల్లలతో కలిసి నేను తెగ గోల చేసే వాడిని.వాళ్లకి తినిపించినట్లే నాకు కూడా అన్నం గోరు ముద్దలు తినిపించేది.

పీజీ చదవడానికి విశాఖ వచ్చిన తరువాత కోదాడ వెళ్లడమే మానేశాను. పైగా యదార్ధవాది లోక విరోధీ అన్నట్లు బంధువులతో నాకు ఎప్పుడు గొడవలే అవుతూ ఉండేవి. దీంతో సాధారణంగా బంధువుల ఎవరి ఇంటికి వెళ్లని నేనూ నన్ను అభిమానించే కోదాడ అత్తయ్య వాళ్లింటికి మాత్రం అప్పుడప్పుడూ వెళ్లేవాడిని. కోదాడ అత్తయ్య అమ్మాయే కాంతి. కొద్ది రోజులకు ఓ పేపర్ లో ఇంటర్వ్యూ కోసం  హైద్రాబాద్ వచ్చాను.అత్మాభిమానాన్ని చంపుకొని దేనిలోని ఇమడలేని వ్యక్తిత్వం కావడంతో ఫైనల్ ఇంటర్వ్యూలో నుంచి లేచి వచ్చేశాను.

ఎందుకో అత్తయ్యే ఫోన్ చేసింది.హైద్రాబాద్ వచ్చాను అంటే  సరే ఇంటికి రారా అంది. చాన్నాళ్లయిందిగా వెళ్దామని కోదాడ వెళ్లాను. ఎప్పుడూ నాతో మాట్లాడనీ మరదలు కాంతీ మాత్రం ఏదో స్పెషల్‌ ఇంట్రస్ట్ చూపిస్తుంది. తను డిగ్రీ సెకండియర్ అప్పుడు. అక్కడ రెండు రోజులున్న తరువాత తిరిగి విశాఖ వచ్చాను.  వైజాగ్‌లో ఓ పేపర్‌లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం  ప్రయత్నిస్తున్నాను. కోదాడ నుంచి వచ్చిన వారం తరువాత ఉదయాన్నే కొత్త నెంబర్ నుంచి ఫోన్. పొద్దున్నే నిద్ర పాడు చేసేది అని విసుక్కుంటానే ఫోన్ ఎత్తాను. ఎలా ఉన్నావు అనీ.

నిద్ర పాడు చేశావు ఇంతకూ ఎవరమ్మా నువ్వు అంటే. కాంతీ అందీ, కన్ఫ్యూజన్‌లో ఉండగానే కోదాడ అత్తయ్య వాళ్ల అమ్మాయినీ అని క్లారిటీ ఇచ్చింది. సరే చెప్పు ఏంటీ విషయం అనే సరికీ సరదాగా కాల్ చేశాను  అంది.. ఎలా చదువుతున్నావు అంతా బాగున్నారు కదా.. నేను బాగానే చదువుతున్నాను నీ ఉద్యోగ దండయాత్రలు ఎంత వరకు వచ్చాయి అందీ. దండయాత్రలు సాగుతున్నాయి కానీ, గెలుపే రావడం లేదు అన్నాను.. నీ కంటే ముందు జీవితంలో నేనే స్థిరపడతాను చూడు అందీ. తను అలా అనే పాటికి నా అహం దెబ్బతిన్నట్లయింది.

మా మధ్య సరదాగా మొదలైన మాటలు వెంటనే సీరియస్ విషయం మీదకు మళ్లింది. సరే కాంతి నీ డిగ్రీ, పీజీ కంప్లీట్ అయ్యేపాటికి ఇంకా  మూడున్నర సంవత్సరాలు  పడుతుంది, ఆ టైంకి నా కింద కనీసం 10 మంది సబార్డినేటర్స్ ఉంటారు చూడు  అన్నాను. సరే పందెం అంది. నువ్వు గెలిస్తే నువ్వు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను చూడూ అంది. సరే ఉద్యోగం వచ్చాకే కలుద్దాం అని  ఫోన్ పెట్టేశాను. నా క్లాస్‌మెట్స్ లో చాలా మందికి ఉద్యోగాలు వచ్చేశాయి. నేను మాత్రమే కాళీగా ఉంటున్నాను.

నా శ్రేయోభిలాషులు కూడా చాలా మంది నువ్వు విశాఖ కంటే  హైద్రాబాద్ వెళితే అనేక ఆఫర్స్ ఉంటాయి, అక్కడ ప్రయత్నించూ అని సలహా ఇచ్చారు.గెలవాలన్న పంతం. పైగా పోటీ అమ్మాయితో. కాని హైద్రాబాద్ ఎలా వెళ్లాలి. అమ్మమ్మను డబ్బులు అడగలేను. ఎలాగా అని ఆలోచిస్తున్న నాకు గతంలో నేనే  పనిచేసిన పత్రిక వారు నా జీతం బకాయి ఇచ్చారు. మరొక మిత్రుడు మరో రెండు వేలు సర్ధారు. అమ్మమ్మ దీవెన తీసుకొని ఉద్యోగం వస్తేనే వస్తాను అని చెప్పి హైదరాబాద్ బయలు దేరాను.

హైద్రాబాద్ వస్తే కానీ అర్ధం కాలేదు ఉద్యోగం రావడం అంత తేలిక కాదని. ఎన్నోప్రయత్నాలు, మరెన్నో ఛీత్కారాలు. ఒకే సంస్థలో మూడు పోస్ట్‌ల కోసం అప్లై చేసి సాయంత్రం వరకూ ఆఫీసు ముందు పడిగాపులు. ఇవ్వన్ని ఒక ఎత్తయితే ఆకలి పోరాటం ఒక వైపు. డబ్బులు లేక కిలోమీటర్ల కొద్ది నడక. ఒక పార్సిల్ భోజనంను రెండు రోజులు తిన్న సందర్భాలు బోలెడు. మొత్తం మీద నెల రోజులలో దాదాపు 40 ఇంటర్వ్యూలు . అందరూ బాగా చేశామనే వారే కాని ఉద్యోగాలు ఇస్తామనే సంస్థలు కనిపించలేదు.

ఈ క్రమంలోనే  విశాఖ తిరిగి  వెళ్లిపోదామని అనుకున్నాను. అదే సమయానికి అత్తయ్య ఫోన్ ఒక్క సారి రా రాదూ అని. దిగులు పడకు నీలా కష్టపడే వాడికి ఉద్యోగం వస్తుంది అధైర్య పడకూ అనేది. మా మాస్టారు మాత్రం ఇన్ని రోజులు ఆగావు ఇంకొన్ని రోజులు ఆగరాదు నాకెందుకో నీకు ఉద్యోగం తప్పక వస్తుంది అనిపిస్తుంది అని ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో ఓ ప్రముఖ చానల్ నుంచి ఇంటర్వ్యూకు రమ్మని సందేశం వచ్చింది.ఈ ఇంటర్వ్యూ కూడా అన్ని సాధారణ ఇంటర్వ్యూ అనుకొనే బయలుదేరాను .

ఇంటర్వ్యూ పూర్తి చేసిన తరువాత ఆ సంస్థ వారు కూడా రెండు రోజులలో చెబుతాము అనే సరికి నిస్సత్తువ ఆవరించింది. బస్సు ఎక్కడానికి డబ్బులేక నడుస్తుంటే ఫోన్‌ మోగింది. మీకు ఉద్యోగం వచ్చింది. ఫలానా రోజు వచ్చి జాయిన్ అవ్వండీ అని చెప్పే పాటికి కలో నిజమో అర్ధం కాలేదు. వెంటనే అమ్మమ్మకు ఫోన్ చేసి ఉద్యోగం వచ్చిందని చెప్పాను. సరే నాన్న ఇంటికి రారా అందీ.

 

ఇక విషయం కాంతికి చెప్పాలి. తొలి గెలుపు నాదే అని గర్వంగా చెప్పాలి. ఎలాగో ఇంటికి వెళ్లే దారిలోనే వాళ్ల ఊరుకూడా కావడంతో  అక్కడ దిగి ఆ తరువాత ఇంటికి వెళ్దాం అనుకున్నాను. నేను  వాళ్లింటికి వెళ్లే సమయానికి తను లేదు,  కాలేజీకి వెళ్లింది.సాయంత్రం తను వచ్చే దాకా వాళ్లింట్లో కూడా ఎవరికీ విషయం చెప్పలేదు.తను వచ్చిన తరువాత తనూ ఒక్కతే ఉన్న సమయంలో చెప్పాను ఉద్యోగం వచ్చిందని. తన సంతోషం  అంతా ఇంతా కాదు. ఇల్లంతా సెడన్‌గా పండగలా తయారు చేసింది.అక్కడ నుంచి ఇంటికి వెళ్లాను.

గతంలో నేను  ఇంటర్వ్యూలకు హాజరైన మరో రెండు చానల్స్ వారు కూడా మీరు సెలక్ట్ అయ్యారు అని ఫోన్ చేశారు. అమ్మమ్మ మాత్రం మొదట నీకు దేనిలో అవకాశం వచ్చిందో దాన్లోనే జాయిన్ అవ్వురా అంది. కొత్త ఉద్యోగం, ఫ్రెండ్స్‌తోనే హైదరాబాద్‌లో రూం. పగలంతా ఆఫీసు పని, రాత్రి అయితే గానా.భజానా.ప్రపంచంలోని అన్ని అంశాలపై నా మిత్రులతో చర్చలు సాగేవీ. కాని ఉద్యోగాన్ని మాత్రం ఏనాడు నిర్లక్ష్యం చెయ్యలేదు.నేర్చుకోవాలి అన్న తపన. కెరియర్‌లో గెలవాలి. ముఖ్యంగా కాంతితో పందెం ఎట్టి పరిస్థితులలోనూ గెలవాలి. పైగా ఇష్టపడ్డ ఉద్యోగం ఎంత కష్టంగా ఉన్నా చెయ్యాలని ప్రయత్నిస్తుండటంతో త్వరలోనే విశ్వనాధ్ బాగా పనిచేస్తాడూ అనే గుర్తింపు ఆఫీసులో వచ్చింది . ఇలా కాలం జరిగిపోతుంది అనుకునే సమయంలో ఓ రాత్రి 11.30 సమయంలో మంచి పార్టీ మూడ్‌లో ఉండగా కోదాడ అత్తయ్య నెంబరు నుంచి కాల్ వచ్చింది..

రాత్రి సమయంలో ఏదో ప్రెస్‌ అయి వచ్చి ఉంటుందిలే అని లైట్ తీసుకున్నాను. కాని పదే పదే ఫోన్ మోగుతుండటంతో  ఫోన్ లిఫ్ట్ చేశాను. నేనూ కాంతిని .ఏం చేస్తున్నావ్ అనే ప్రశ్న.  టైం ఎంత అయిందో చూశావా. ఈ టైంలో నువ్వు ఫోన్ చేయడం మంచిది కాదు. ఏదైన ఉంటే ఉదయం మాట్లాడదాం అన్నాను. నాకు నీతో మాట్లాడాలని ఉందీ అంది. ఇంతకీ  ఏం చేస్తున్నావు అనే ప్రశ్న. నేను పార్టీలో ఉన్నాను తరువాత చేస్తాను అన్నాను. ట్యూబ్ లైట్  ఆడపిల్ల అర్ధరాత్రి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని అంటుందంటే తరువాత కాల్ చేస్తానంటావేరా ఫూల్ అంది. అప్పుడు కాని అర్ధం కాలేదు తను నన్ను ఇష్టపడుతుందని.

అలా మొదలైన మాటల ప్రవాహం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతుంది. త్వరగా జీవితంలో స్థిరపడు బాబు అనే మాటే ఎప్పుడూ చెప్పేది. నేను నీకిచ్చే గిఫ్టే అదే అనేది. తనని గెలవాలి.తనని గెలిస్తే నా కెరియర్‌లో నేను అనుకున్న లక్ష్యాలను మరింత త్వరగా గెలుస్తాను. అలాగే నేను స్టార్ట్ చేద్దామనుకున్న ఎన్జీవో లాంటి విషయాలు గురించి ఎప్పుడూ మాట్లాడే వాళ్లము. తన కోసం..తనను దక్కించుకోవడం కోసం, మరింత కష్టపడటం ప్రారంభించాను.నాకు నువ్వంటే ఇష్టమే, కానీ నా ఉద్యోగం అంటే నీకంటే ఎక్కువ ఇష్టం అని ఎప్పుడూ చెప్పేవాడిని.

ఇలాంటి సమయంలోనే కోలుకోని దెబ్బ తగిలింది. నాకు ఉన్న ఒకే ఒక్క తోడు మా అమ్మమ్మ సడెన్‌గా కాలంచేసింది. ఏం చేయలో అర్ధం కాలేదు.ఏం జరిగినా నేనున్నాను అనే ధైర్యం. నా మనవడు తప్పు చేయడూ అనే భరోసా రెండు లేకుండా పోయాయి. పసిగుడ్డు నుంచి నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా నా వ్యక్తిత్వాన్ని రూపొందించిన అమ్మమ్మ శాశ్వతంగా దూరమైంది. ఒక్కసారిగా ఒంటరిని అయ్యానే అనే ఫీలింగ్. అమ్మమ్మ చనిపోయినప్పుడు ఎందుకో నా కంటి నుంచి నీరు రాలేదు.

కానీ మూడు రోజుల తరువాత బయట నుంచి వచ్చి మామ్మ ఆకలవుతుంది అన్నం పెట్టూ అనే సందర్భంలో ఖాళీగా ఉన్న ఇల్లు. అమ్మమ్మ ఫొటో ముందు వెలుగుతున్న దీపం కనిపించింది. అమ్మమ్మ నాకు లేదు కదా అని బాగా ఏడ్చాను. అదే రోజు రాత్రి ఫోన్ చేసింది కాంతి. విశ్వం ఏం కాదు నేనున్నాను నీకు అధైర్యపడకూ అని అమ్మమ్మలా ఓదార్చింది. అప్పుడే అనుకున్నాను జీవితంలో తనను మాత్రం మిస్ కాకూడదని.

కానీ మనం అనుకున్నవి అన్ని జరిగితే జీవితం ఎందుకు అవుతుంది. మా విషయం వాళ్లింట్లో తెలిసింది. విశ్వానికి ముందు వెనుకా ఎవ్వరూ లేరూ అలాంటి వాడికి మా  అమ్మాయిని ఎలా ఇస్తాం అని అన్నారట వాళ్లింట్లో వాళ్లు. తను కూడా ఆ సమయంలో తను అక్కడే ఉన్నా ఏమీ మాట్లాడలేదు. వారం పాటు నేను ఫోన్ చెయ్యలేదు తను చేసినా ఎత్తలేదు. డైరెర్ట్‌గా అడిగేసింది ఎందుకు నన్ను ఎవైడ్‌ చేస్తున్నావు. నేను అనాధను నాకు ఎవ్వరూ లేరు కదా, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అన్నాను సీరియస్ గా.. నేనుండగా నువ్వు అనాధవు ఎందుకు అవుతావు విశ్వం అప్పుడు పరిస్థితి వేరు అని సర్ధి చెప్పింది. మళ్లీ మా మాటల శికార్లు జోరందుకున్నాయి. మా విషయం అందరికి తెలుస్తుంది. వాళ్లింట్లో నేనంటే కోప్పడే వారి సంఖ్య పెరుగుతుంది. కాంతికి వాళ్ల నాన్నంటే చాలా ఇష్టం.నా విషయం తెలిసే సరికి ఆయన తనతో మాట్లాడటం మానేశాడు.

పైగా ఇంట్లో అందరూ తననో దోషిగా చూడటం స్టార్ట్ చేశారు. ఎందుకు ఇంట్లో ఎవరూ నాతో మాట్లాడటం లేదని వాళ్ల నాన్ననే అడిగింది కాంతి. నువ్వు పెద్ద దానివి అయిపోయావు  నీ స్నేహాలు అన్ని మాకు తెలుసూ అని. ఇదే సమయంలో తను నాతో మా ఇంటికి వచ్చింది..ఈ విషయం కూడా తెలియడంతో గొడవ బాగా ముదిరింది. కొంత మంది చెప్పుడు మాటలు చెప్పే వారు నా మీద మరి కొన్ని చెప్పడంతో దాదాపు రెండు నెలలు తనతో వాళ్ల నాన్న మాట్లాడలేదు. ఏం కాదు కాంతి అన్ని సర్ధుకుంటాయి అని నేను సర్థి చెప్పేవాడిని. కానీ వాళ్లింట్లో పరిస్థితి మరీ చేజారింది. కనీసం తను చెప్పేదీ వినకుండా చెయ్యి కూడా చేసుకొని, నేను కావాలా వాడు కావాలా తేల్చుకో అన్నారు వాల్లింట్లో వాళ్లు. ఈ గొడవ పెద్దది అయింది. తనపై నిఘా. వాళ్లింట్లో మాట్లాడే వాళ్లే లేకుండా పోయారు తనకు. ఆ ఒత్తిడి తనూ భరించ లేకుండా పోయింది.

నాకు ఫోన్ చేసి నా జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావు అని ఇష్టం వచ్చినట్లు తిట్టింది. నాకు రావాల్సిన ప్రమోషన్ క్యాన్సిల్ అయిందన్న కోపంలో నేనూ అంతే సీరియస్‌గా రెస్పాండ్ అయ్యాను. జీవితాలతో ఆడుకోవాల్సిన అగత్యం నాకు లేదు.  నీకు ఇష్టం ఉంటే మాట్లాడూ లేకపోతే మాట్లాడటం మానెయ్.  ప్రతి సారి ఏదో ఒకటి అనడం ఆ తరువాత సారీ చెప్పడం నీకు అలవాటు అయింది. నీ అంతట నువ్వు ఫోన్ చెసే దాకా ఫోన్ చెయ్యను అన్నాను. ఒక వైపు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నోటి నుంచి ఏ మాటలు వినకూడదని అనుకున్నానో అదే మాటలు  విన్నాను. ఏ కెరియర్‌లో అయితే గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నానో దానిలో ఎదురు దెబ్బ. మరింత కసి పెరిగింది. బంధువులు, బంధాలు వాటన్నింటిని వదిలేశాను. తన ఆలోచనలు దూరం చేసుకోవడానికి  దాదాపు 18 గంటలు ఆఫీసులో గడిపేవాడిని. ఇదే సమయంలో ఆఫీసులో మాత్రం మరీ పని రాక్షసుడిగా మారావు కాస్త అరోగ్యం గురించి పట్టించుకో అని ప్రేమ పూర్వక సలహాలు ఇచ్చేవారు నా అత్మీయులు. ఇలా సంవత్సరం గడిచింది.

తెలంగాణ  ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులలో నాకు ఉస్మానియా యూనివర్సిటీలో డ్యూటీ. రూంలో నుంచి డ్యూటీకి వెళ్లే ఎప్పుడు వస్తానో తెలీదు. రాత్రి బాగా లేటైన బడలిక ఉదయం 10.00 దాకా నిద్ర పొతూనే ఉన్నాను. నిద్రా భంగం చెస్తూ  కాంతీ కాల్ చేసింది. విషయం చెప్పు అన్నాను సీరియస్‌గా. నీకో గుడ్ న్యూస్ చెబుతాను అంది. అదే టైంకి మా చానల్ సీఈవో దగ్గర నుంచి కాల్ వస్తుంది .కాంతీ ఫోన్ కట్ చేశాను. సార్ డైరెక్ట్‌గా చెప్పారు. నీ సేవలను కంపెనీ యాజమాన్యం గుర్తించింది.  నిన్ను రాజమండ్రి ఇన్‌ఛార్జిగా ప్రమోషన్  ఇచ్చి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లుగా చెప్పారు.  ఇమ్మిడియట్‌గా అక్కడ జాయిన్ అవ్వాలి అన్నది కూడా చెప్పారు.

కాంతి మళ్లీకాల్ చేసింది. ఏటా గుడ్ న్యూస్ అన్నాను. నాకు ఎంబీఏ సీటు హైదరాబాద్‌లో వచ్చింది అంది, ఇకపై నిన్ను విడవనూ అంది. నాకు నీ మీద రెండో గెలుపు వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పాను. తనే అడిగింది ఎక్కడకు ట్రాన్స్ ఫర్ అని రాజమండ్రి అని చెప్పాను. కావాలని నా నుంచి దూరంగా వెళ్తున్నావు కదా అంది, కాదు గెలవడానికి దూరంగా వెళ్తున్నాను అన్నాను. ఏమనుకుందో కాని ఫోన్ కట్ చేసింది తను. రాజమండ్రి వెళ్లడానికి ఆఫీసులో 3 రోజుల టైం ఇచ్చారు. ఈలోగా అత్తయ్యే ఫోన్ చేసింది. విశ్వం మావయ్యకు జర్నలిస్ట్ ఉద్యోగం అంటే ఇష్టం లేదు. పైగా నువ్వు సమాజ సేవా, ఎన్జీవో అంటూ ఉంటావు వాటినీ అన్ని వదిలేసీ, నువ్వు జాబ్ మార్చుకునే ప్రయత్నం చేస్తే ఎలా గైనా మావయ్యను ఒప్పిద్దాంరా అంది . ప్రాణంలా ప్రేమించే ఉద్యోగం. జీవితంలో గెలవాలనే  ప్రేరణ ఇచ్చిన అమ్మాయి. నా ఓటు మాత్రం నా కెరియర్‌కే వేశాను.

కోదాడ అత్తయ్యతో క్లియర్‌గా చెప్పాను ఎవ్వరి కోసం నా పద్ధతులు నేను మార్చుకోను, నా చిన్నప్పటి కలా జర్నలిస్ట్ అవ్వడం దానికోసం నేను ఎవ్వరినైనా ఒదులు కుంటాను అన్నాను. అత్తయ్య ఈ విషయం కాంతికి చెప్పిందంటా. తనూ ఇంకా సీరియన్ అయింది. నీ ఉద్యోగం చేసే విలువ నేను చెయ్యనా అందీ. గెలుస్తున్నాని విర్రవీగూ. అందరినీ వదిలేసి నేను గెలిచాను అని వెనక్కు తిరిగి చూసే సమయానికి నీ గెలుపు తప్ప నీ వాళ్లు ఎవ్వరూ నీ వెనుక ఉండరూ అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది.

 

ఇక రాజమండ్రి నా ప్రయాణం ప్రారంభమైంది. మార్గమధ్య ప్రయాణంలో ఫోన్ చేసింది. నేను కలుస్తాను నిన్ను అని. బస్టాండ్‌లో ఆగుతాను. వస్తే కలుస్తాను అన్నాను. గంట సేపు కోదాడ బస్టాండ్‌లో వెయిటింగ్,  తను రాలేదు. నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న బస్సులో ఎక్కేశాను. దూరంగా వస్తూ కనిపించింది. నేను బస్సు దిగలేదు. చివరి అవకాశం తెంపుకున్నానో, తెగిందో తెలియదు కాని తన నుంచి దూరంగా బయలుదేరాను. ఆ తరువాత కాంతి ఫోన్ చేయలేదు. నేనూ ఫోన్ చేయడానికి ప్రయత్నించలేదు.

కాని మా కామన్  బంధువులు కాని, స్నేహితులు కాని మమ్మల్ని కలపడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రదేశం. కొత్త బాధ్యతలు.  గెలవాలి. కొత్త ప్రదేశాలు చూడాలి. బైక్ తీసుకున్నాను. ప్రయాణాలు చెయ్యాలనే నా ఇష్టానికి..చెస్తున్న ఉద్యోగం సహకరించడంతో ఒకటే తిరుగుడూ. చెయ్యాలనే తపన రాజమండ్రిలో దూసుకెళ్లేలా చేసింది. ఓ రోజు సైట్ సీయింగ్‌కు వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. చావు తప్పింది కాని ఒకటే దెబ్బలు. మా కామన్ ఫ్రెండ్ నాకు యాక్సిడెంట్ అయిన విషయం తనకు ఫోన్‌లో చెప్పింది. అదే కాల్‌లో నేను కాన్ఫరెన్స్‌లో ఉన్నాను. నిజంగా విశ్వంకు యాక్సిడెంట్ జరిగిందా లేక డ్రామా నా. నువ్వే  అతడితో మాట్లాడించడానికి కావాలని ఇలా చెబుతున్నావు కదా. నా జీవితంలో అతడితో మాట్లాడనూ అని అందీ. యాక్సిడెంట్ జరిగిన పెయిన్ కంటే తను అన్న మాటలు ఇంకా బాధనిపించాయి.

ఉన్న ఒక్కగానొక్క ఆశ పోయింది. నా జీవన ప్రయాణంలో నాకు దక్కిన అద్భుత సాంగత్యం కాంతి, తన మజిలీ వచ్చింది దిగిపోయింది. నా ప్రయాణం కొనసాగించాలి అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. మరో వైపు వాడిని అలా వదిలేస్తే మరింత అరాచకంగా మారతాడు. పెళ్లి చేసుకో అని మిత్రులు, బంధువుల వద్ద నుంచి విపరీతమైన ఒత్తిడి పెరిగింది.  తన దగ్గర నుంచి స్పందన ఎలాగో లేదు. నువ్వు ఎందుకు ఒంటరివి అవుతున్నావు అనే ప్రశ్నలే..  దీంతో  ఫ్రెండ్స్, బంధువులకు కూడా ఫోన్  చేయడం మానేశాను. ఇదే క్రమంగా గతంలో మానేసిన క్రికెట్ ఆడటం,  కవితలు రాయడం, పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలను తిరగడం ఇలాంటి నా హాబీలను మరింత పదును పెట్టుకుంటున్నాను. ఏది ఆగినా కాలం ఆగదూ కదా. మరో సంవత్సరం గడిచింది.

 

నా ప్రాణమిత్రుడు లవ్ మ్యారేజీ చెయ్యాలి, మతాంతర వివాహం..అవతలి వాళ్లు మాకోసం గట్టిగానే వెతుకుతున్నారు, ఆ క్రమంలో తిరుపతి ప్రయాణం. నా మిత్రుడిని వాడి ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వెళ్లా, అప్పుడే మళ్లీ తన కాల్ . ఏం జరిగినా ఈ సారీ నిన్ను విడవనూ విశ్వం అందీ.మళ్లీ మాటల ప్రవాహం సాగుతుంది. సెడన్‌గా మా మేనత్త నీకో సంబంధం చూశాను నువ్వు రావాలి అంది.

అదే విషయం కాంతితో చెప్పాను. ఏం చెద్దాం..నేను నీ కోసం ఎంత కాలం అయిన వెయిట్ చెస్తాను అప్పటికైన నన్నే పెళ్లీ చెసుకుంటాను అనే గ్యారెంటీ ఇస్తావా. మీ నాన్నతో మన గురించి మాట్లాడతావా. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని తనకే  నిర్ణయం వదిలిపెట్టాను. వారం గడిచింది, రెండు వారాలు గడిచాయి తన దగ్గర నుంచి సమాధానం రావడం లేదు.

నేనే కాల్ చేశాను. నీతో మాట్లాడలేనూ విశ్వం. నన్ను వదిలేయ్ అని ఎస్ఎంఎస్. అలా కాదూ కనీసం నీ సమస్య చెప్పు అంటే. నిన్ను చేసుకుంటే ఇంట్లో చచ్చిపొతామంటున్నారు, మా నాన్నకు నువ్వు ఇష్టం లేదు, అయన్ను కాదని నేను ఏమీ చెయ్యలేను అంది. మన ఇద్దరం  కూర్చొని మీ నాన్నకు నచ్చజెబుదాం అసలు ప్రయత్నించకుండా ఓటమిని ఎలా ఒప్పుకుంటావు నువ్వు అన్నా. ఎంత సర్ధిచెప్పడానికి ప్రయత్నించినా నేను మా నాన్నతో ఈ విషయం మాట్లాడలేనూ, మా నాన్న ఎవరిని చూపిస్తే వారితోనే నా పెళ్లి అని తేల్చింది. పోనీ నేను మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడనా అంటే వద్దూ అంది. నా ఆశల సౌధం కూలిపోయింది.

తొలిసారి నా ప్రమేయం లేకుండా నేను చేస్తున్న పోరాటంలో ఓడిపోయాను. నా బలం అనుకున్న వ్యక్తే నా ఓటమికి కారణం అయ్యింది. నా కమిట్‌మెంట్స్ నావి, తన అనుబంధాలు తనవి. సరే నీ ఇష్టం ఎక్కడికి వెళ్లాలో నీకు తెలిసినప్పుడు ఎలా వెళ్లాలో నేను ఎలా చెబుతాను. నీ జీవితానికి ఏదీ మంచిది అనుకుంటే అదే నిర్ణయం తీసుకో. ఎవ్వరికోసమో నీ నిర్ణయాలను మార్చుకోకు. నీ జీవితం నీది అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

తను లేని ఆలోచనలకు దూరంగా వెళ్లడానికి విశ్వప్రయత్నం చేశాను. ఇదే క్రమంలో విశాఖ ప్రమోషన్ మీద పంపారు ఆఫీసు వారు. అక్కడే పెళ్లయింది. నా పెళ్లికి కాంతి వాళ్ల కుటుంబ సభ్యులు అంతా వచ్చారు. ఆ తరువాత కాంతీతోనే కాదు వారి కుటుంబ సభ్యులతోనూ 4 సంవత్సరాలుగా పలకరింపులు లేవు. ఏదైనా ఫంక్షన్లలో కలిస్తే మొహమాటానికి పలకరించడం తప్ప మాట్లాడింది లేదు. బంధువులు కొందరు కనీసం వాళ్లతో మాట్లాడొచ్చు కదా అన్నా నేను వినలేదు.

 

మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లినప్పుడు నా  భార్యకు మీ కోదాడ పెద్దమ్మ ఫోన్ చేసింది. కాంతికి పెళ్లంటా అని చెప్పాను. అర్జంట్ పని ఉండి నేను వెళ్లిపోయాను. రాత్రి నా  అర్ధాంగి అడిగింది వెళ్తున్నారా  పెళ్లికి అని, మరో ఆలోచన లేకుండానే లేదు అన్నాను. అప్పుడు నా అర్ధాంగి అంది, మీకు ప్రేమ పేరుతో చంపేసే వాడికి పెద్ద తేడా ఏముంది చెప్పు అనీ. అదేమిటీ అలా అన్నావు అంటే అప్పుడు చెప్పడం ప్రారంభించింది.

వాడేవడో ప్రేమించడం లేదని చంపేశాడు. కాని నువ్వు నిన్ను ప్రేమించిన వారి అనుబంధాన్ని చంపేశావు. నువ్వే చాలా సందర్భాలలో చెప్పావు పెద్దమ్మ నిన్ను సొంత కొడుకులాగా చూసుకుంటుంది అంది. వాళ్లందరూ నిన్ను సొంత మనిషిగా చూసుకుంటారు, కానీ నువ్వు నీ పెళ్లి అయిన దగ్గర నుంచి వారితో సంబంధాలు కట్ చేసుకున్నావు. వాళ్ల ఫీలింగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్లను కావాలని దూరం పెట్టావు. నీ చెల్లి పెళ్లిలోనూ కనీసం ఏదో మొహమాటానికి మాట్లాడావు, కానీ ఇదివరకులాగా మాట్లాడలేదు. వాళ్ల అనుభందాన్ని ఇన్నాళ్లు చంపేశావు కదా అన్నది.

ఎప్పుడు సైలెంట్‌గా. నా అభిప్రాయాలకు ఏ మాత్రం ఎదురు చెప్పని నా భార్య, ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను. మళ్లీ నా  ఉషానే అందీ, నువ్వో ఎన్జీవోను నడుపుతున్నావు, జర్నలిస్ట్‌గా మంచి చెప్పగలిగిన ఉద్యోగంలో ఉన్నావు. ఎన్నో ఆదర్శాలు పాటిస్తావు. కాని కోదాడ పెద్దమ్మ విషయంలో ఎందుకు అలాగా ప్రవర్తిస్తున్నావు. గతంలో నీ చుట్టూ అందరూ బంధువులు ఉండే వారు, వారందరినీ వదిలేసి విశాఖ వచ్చేశావు. కనీసం ఫోన్ కూడా చెయ్యడం లేదు. వాళ్లు ఎంత బాధపడతారు. నిన్నటి దాకా తమలో ఒకడిగా ఉన్న నీవు, కారణం లేకుండా  శిక్ష వేస్తున్నావు అందీ. కేవలం నా అభిప్రాయం చెప్పాను. నీకు అంతా తెలుసు నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పి దుప్పటి ముసిగేసింది. నాలో అంతర్మధనం ప్రారంభమైంది. నా పంతం కోసం ఇన్నాళ్లు నా అనుకున్న వాళ్లను చాలా బాధ పెట్టాను అనుకున్నాను. తనని మర్చిపోయాను అని చెప్పను కానీ నా జీవితంలో ఎదగాలనే కసిని రగిల్చింది మాత్రం తనే. గెలవానే స్ఫూర్తి నింపింది తనే.ఇప్పటికీ అదే చెబుతాను తను ఆ రోజు నాతో పందెం కట్టకుండా ఉంటే నేను ఎక్కడ ఉండే వాడినో.!

ప్రేమ మనం ప్రేమించిన వ్యక్తి బాగు కోరుకోవాలి కాని, మనల్ని ప్రేమించే వారు బాధపడటం కాదు కదా మనకు కావాల్సింది అనుకున్నాను. ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఉదయమే అర్జంట్ పని ఉందని వెళ్లిన నేను రాత్రి దాకా రాలేదు. రాగానే రెండు టికెట్లు తన చేతిలో పెట్టాను కోదాడ పెళ్లికి వెళ్లోచ్చేయ్ అన్నాను..అదోలా చూసి నువ్వు మారవు..సైకోవి అని వాళ్ల పుట్టిల్లు కూడా కోదాడే కావడంతో పెళ్లీ వంకతో వెల్లడానికి బట్టలు సర్ధుకుంది.

~

 

ఆ కురులు…ఆనందాల రెపరెపలు!

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshకొందరిని చూస్తే పూల మొక్కలు గుర్తొస్తాయి.
మొక్కలు, శాఖలు, ఆకులు, రెమ్మలు, పిందెలు, పూలు.
తర్వాత పండ్లు.

కానీ, చూశారా కేశాలు? వెంట్రుకలను?
అవి చిత్రాలను అద్వితీయం చేస్తాయి, పలుమార్లు!

పిల్లలైనా పెద్దలైనా, వారి కురులను చూస్తే, ఆ కురుల్లో తురిమిన పూవులను చూస్తే పూల మొక్కలు గుర్తొస్తాయి. ఉదాహరణకు ఈ పిల్లనే చూడండి.
గులాబీ బాల.

ఈ పాప అందం ఆ నవ్వు, ఆ పువ్వు వల్లనా?
కాదనే ఈ దృశ్యాదృశ్యం.

నిజం.
చాయాచిత్రాల్లో కురులు నిజంగానే ఒక విశేషం.
వాటిని విడమర్చి చెప్పడం బహుకష్టం.
నిజానికి ఛాయా చిత్రాల్లో వాటిని అలవోకగా పట్టుకోవడమూ అంత తేలిక కాదు.
ఇక. వాటిని వెలుగునీడల్లో సహజంగా బంధించి చూపడం ఇంకా కష్టం. కానీ, అందమైన ఎన్నో చిత్రాలను చూస్తుంటాం. కానీ, వాటిల్లో కురుల పాత్ర అదృశ్యంగా ఉంటుందంటే నమ్ముతారా?
నమ్మాలనే ఈ చిత్రం.

+++

ఛాయా చిత్రం పరిభాషలో గ్రేన్స్ అని వాడుతూనే ఉంటాం.
బ్లాక్ అండ్ వైట్…నలుపు తెలుపు గ్రేన్స్ అంటారు. అట్లే రంగులు.
కానీ, మనిషికి అనువణువూ ఒక ఛాయ.
సూక్ష్మంగా చూస్తే స్వేదగ్రంథులూ, రోమాలూ అన్నీ ఉంటై – కలగలసి ఉంటై.
కానీ, మనసును హత్తుకునే చిత్రాల్లో కొన్నిసార్లు కేశ సంపదా అద్వితీయ పాత్ర పోషిస్తుంది!
ఉదాహరణకు ఈ పాప. ఛాయ.

ఇందులోని అందమంతా ఆ పాప జుత్తే.
తర్వాత ఆ పుష్పమే లేదా చిరునవ్వే.
నవ్వే అలా పుష్పించిందా అనిపించేంత అందం ఈ చిత్రం.
కానీ, ఒక చెట్టు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ చిత్రానికి వేర్లు ఆ పాప జుత్తే అని నా భావన.

కానీ, అమ్మాయిలు, నడి వయసు స్త్రీలు, తల్లులు… ఏ వయసు వాళ్లయినా సరే, చిత్రంలో కురులదే మహత్తర పాత్ర.  కొందరికి ఒత్తయిన జుత్తు… మందార పువ్వువలే. మరికొందరికి నెరిసిన జుత్తు…కలువల్లా.
కానీ, ఎవరైనా తలంటుపోసుకున్నాక గుడిలోని దీపంలా,  తీర్థంలా, దివ్యంగా అలౌకికంగా కనిపిస్తారు.
నవ్వితే ఆత్మలు శాంతించేంత బావుంటారు.

అలా వారిని చిత్రాలు తీయడం ఒక దివ్యానుభవం. అదొక పవిత్రం.
పొరబాటుగా వాళ్ల బాహ్య సౌందర్యానికే మీరు తలొగ్గి తీశారా?
తీస్తే తీశారు గానీ ఆ తర్వాత వాటిని ఫొటోషాప్ లోకి వెళ్లి కొంచెం లెవల్స్ పెంచారా?
ఇంకేమైనా కరెక్షన్స్ చేస్తూ పోయారా? లాభం లేదు. ఆ ఫొటో కాస్త ఇంప్రూవ్ కావచ్చును. కానీ, ఆ కురులు పంచే అనురాగం, దయ, కరుణా, లాలస, మాయ, అమాయ- మటుమాయమైపోతుంది. క్షణంలో ఆ కురుల మెరుపు అదృశ్యమైపోతుంది. తర్వాత నవ్వూ, పువ్వూ మిగులుతుంది.

వెంట్రుక వాసి తేడాతో ఆ వెంట్రుకలన్నీ గాఢ నీలిమలోకో లేదా నలుపులోకో దాగిపోయి ఇల్లంతా చీకటైనట్టు తల మాడిపోతుంది. అట్లా ఆ కురులు తమ ఆధ్యాత్మక శోభనుంచి వైదొలగి- చిత్రంలో తెలిసిందే చూస్తూ ఉంటాం. చూసిందే చూస్తూ ఉంటాం కూడా.  అదొక వైచిత్రి.
అందుకే సహజ చిత్రం విలువ సహజంగానే అధికం.

మళ్లీ పాప.
దాని కురులు చూడండి. ముంగురులూ చూడండి.
రెపరెపలు పోయే ఆనందంలా ఉన్న ఆ బాలిక జుత్తు చూడండి.
ఇది ఇంకా ఫలించలేదుగానీ, వెంట్రుక పోగులన్నీ లెక్కబెట్టగలిగేలా తీయడం నిజమైన చిత్రం.

+++

ఇంకా చెప్పాలి.
కురులంటే బొమ్మలు కూడా.
అవును.
మనకు కళ్లుంటాయి. అందరికీ తెలుసు.
కానీ, కళ్లపై కనుబొమ్మలుంటాయి. చూశారా? మీరెప్పుడైనా?
ఫలానా వాళ్ల ‘బొమ్మలు’ బావున్నాయని అన్నారా ఎప్పుడైనా? పోనీ ఎవరైనా అనగా విన్నారా?

బొమ్మలు!
అవును. ఒక బొమ్మకు ఆ వంపులు తిరిగిన ఇంద్రధనుస్సు అర్ధభాగాలు రెండు బొమ్మలు.
కలిపితే ఈ బాల. పూబాల.
అవీ కేశాలే కదా. వాటితో కూడిందే కదా ముఖం. చ్ఛాయ. జీవకళ!
అదీ నా పాయింట్.

బొమ్మల కింద కనులే కాదు, కనురెప్పలే కాదు, ఆ రెప్పలపై విప్పారిన నవ్వులా ఆ రోమాలు. వాటినేమంటారు? ఆ ‘ఐ లాషెస్’ కూడా చిత్రంలో ముఖ్యభాగం అని ఎవరైనా గుర్తిస్తారా? అవీ నవ్వుతూ ఉంటాయి, పాపతోపాటు.
అంతేకాదు, బుగ్గ మీసం – సైడ్ లాక్స్ – వాటికీ ముంగురులూ ఉంటై.
అట్లే కొందరికి పుట్టమచ్చ మీద రోమం ఉంటుంది.
అదీ మాట్లాడుతుంది. కవ్విస్తుంది. ఇంకా చాలా.

+++

ఓపికా, శ్రద్ధా.
కుంకుడు కాయలు – షాంపూలు.
కొబ్బరి నూనెలు – సుగంధ ద్యవ్యాలూ – ఇంకా ఎన్నో.
ఎన్నో డొమెస్టిక్ ఈస్తటిక్ సరంజామా. వాటన్నిటితోనూ ఎదిగిన ప్రపంచం, ఈ సిరులు.
దృశ్యాదృశ్యం ప్రతి చిత్రం, జీవకళా.

-ఇట్లా చాలా. అందుకే చిత్రంలో అన్నీ కూడుతాయంటాను, ముఖ్యంగా కురులు చిత్రనిర్మాణంలో్ అవిభాజ్యమైన గ్రేన్స్ అంటాను. వాటితో ఛాయాచిత్రంలో జీవకళ శోభిస్తూ ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనించండి.

ముఖ్యంగా స్త్రీలను ఛాయాచిత్రాల్లో చేసేప్పుడు, వాళ్లను సహజంగా చిత్రించేటప్పుడు, ఏ టచింగ్ లేకుండా బొమ్మను చూస్తే అందులో అచ్చెరువొందించే అందమంతా కురులతో కూడిందే అని నా భావన. ఈ చిత్రమే కాదు, స్త్రీల చిత్రాలు ఏవైనా సరే…వారి కట్టూబొట్టూ ఎలాంటిదైనా కేశసౌందర్యం ఒక మోహం. దాహం. అది అణువణువునూ సౌందర్యవంతం చేస్తుంటుంది. అది నిజమైన చ్ఛాయకు బలిమి అనే నా అభిప్రాయం.

కొన్నిసార్లు మహిళల సౌందర్యం తాలూకు అందం అంతానూ వారి ఉంగరాల జుట్టు లేదా నుదుటిపై పడే ముంగురుల నుంచి విరబూస్తుందని అనుకుంటాం. కానీ, విరబోసుకున్న జుత్తు లేదా అల్లుకున్నజడలు, కొప్పులు, చేత్తో వేళ్ల వెనుక భాగంతో.. జడపాయలను నిదానంగా సాపు చేస్తూ చిక్కులు తీయడం…ఇదంతానూ ఒక దృశ్యాదృశ్యం. ఒక్కోసారి శిఖముడి లేదా ఆ ముడి విప్పినప్పుడు పడే జలపాత సోయగం…అంతానూ ఒక వింతైన ఛాయాంజలి.

నిజానికి ఒక్కమాటలో కురులు ఒక గ్రంథం అయితే ముంగురులు, జడకొప్పులు ఇవన్నీనూ అందలి అధ్యాయాలు. తురిమిన ఒక పుష్ఫం ఒక కూర్పు. శీర్షిక.

నీలాంటి చీకటి

శ్రీకాంత్




ఒక సమాధిని తవ్వుతున్నట్టు ఉంది
     పగటి నిప్పులు పడ్డ కళ్లల్లో రాత్రి చినుకులు ఏవైనా రాలి చల్లబడతాయేమోనని
     ఒక్కడినే ఇక్కడ ఈ బాల్కనీలో కూర్చుంటే -

ఈ సమాధి ఎవరికి అని అడగకు.
     చీకట్లో కూర్చుని చేతివేళ్ళు విరుచుకునే ధ్వనుల్లోంచి వెళ్ళిపోయింది ఎవరు
     అని అడగకు. వొంగిపోయిన శిరస్సు కింది వొణికే నీడలు
     వెతుకులాడేది ఎవరినీ అని అడగకు. గాలి - ఉండీ లేని

ఈ గాలి - ఆగీ ఆగని ఈ గాలి - ఉగ్గబట్టి అక్కడక్కడే తిరుగాడేది
     ఎవరి కోసమో అని అడగకు. ఎక్కడిదో ఒక నీటి స్మృతీ, మట్టి వాసనా, చుక్కల కింద
     స్థబ్ధుగా నిలబడిన చెట్లూ, చెట్ల కొమ్మల్లోని నిశ్శబ్ధం, మరి

నిశ్శభ్ధాన్ని చెల్లాచెదురు చేసి
     కొమ్మల్లోంచి ఆకస్మికంగా ఎగిరిపోయే ఒక పక్షీ గుర్తుకు తెచ్చేది
     ఎవరినీ అని కూడా అడగకు. సృజనా ఊరకే చదువు-

నిశ్చలమైన సరస్సులో బిందువొకటి రాలి
     వలయాలు వలయాలుగా విస్తరించుకున్న ప్రకంపనల్లో, ఎవరో తమ ప్రతిబింబాన్ని
     క్షణకాలం చూసుకుని, చిన్నగా వేలితో తాకి వెళ్ళిపోయిన సవ్వడి-
     కనుల కింది ఏర్పడ్డ రాత్రి వలయాల్లో ఎవరో కదిలిన సవ్వడి

ఇష్టమైన ముఖాన్ని ఆఖరిసారిగా చూసుకుని
     అరచేతులతో సమాధిలోకి మట్టి వొంపిన సవ్వడి. రెక్కలు విరిగిన సవ్వడి. సన్నగా
     కోసుకుపోతున్న సవ్వడి. లీలగా, ఎవరో ఏడుస్తున్న సవ్వడి. లోపలంతా
      ఇక - మిగలబోయే - బావురుమనే ఒక ఖాళీ సవ్వడి
నువ్వు అనే సవ్వడి

సృజనా - అవును.

నిజంగా ఇక్కడ ఏమీ లేదు. బ్రతికి ఉండగానే మనుషులని నింపాదిగా కొరుక్కుతినే
నీలాంటి చీకటి తప్ప –

                                          - srikanth

నొప్పిస్తూ తానొవ్వక…

  జొన్నలగడ్డ రామలక్ష్మి

 

తమదంతా ఒప్పూ, ఎదుటివాళ్లదంతా తప్పూ అనడమే రాజకీయంగా మారిపోయిన రోజులివి. నిజానికిప్పుడు ప్రజలే రాజులు కదా- మరి రాజకీయాన్ని ప్రజాకీయం అనాలేమో!

ప్రజలంటే- ఉన్నవాళ్లూ లేనివాళ్లూ, మేధావులూ అమాయకులూ, త్యాగమూర్తులూ స్వార్థపరులూ, దోచేవాళ్లూ దోచబడేవాళ్లూ, ఎన్నారైలూ కానివాళ్లూ- వగైరా వగైరా ఎన్నో రకాలు అనుకునే చాలామందిలో నేనూ ఉన్నాను చాలాకాలం. ఐతే ప్రజాస్వామ్యంలో ప్రజాకీయాన్ని శాసించే మెజారిటీ ప్రజలంతా ఒక్కటే అనడానికి ఒకరా ఇద్దరా- రాజుల్లాంటి ప్రజలు ఎందరో!

మచ్చుకి సాధారణ గృహిణి మా ఉమనే తీసుకోండి. తనకి తను, అస్మదీయులు ఏంచేసినా రైటే. తస్మదీయులు తనకి నచ్చే పనిచేస్తే అది తప్పైనా ఒప్పే. తనకి నచ్చని పనిచేస్తే అది ఒప్పైనా తప్పే.

ఉమతో నాది చిన్నప్పటి స్నేహమేమీ కాదు. ఇద్దరూ తెలుగువాళ్ళం. పదిహేనేళ్లుగా కెనడాలో పక్కపక్కనే ఉంటున్నాం. ఉమకి కాస్త వాగుడెక్కువ. ఆ వాగుడులో తన గురించి అన్నీ చెబుతూంటుంది.

ఆమధ్య కూతురి పెళ్లికని ఇండియా వెళ్లొచ్చింది ఉమ. రాగానే, ”ఎలా జరిగింది పెళ్ళి?” అనడిగాను.

”చాలా గ్రాండ్‌గా జరిగింది. కావడానికి నేను చాలా సింపుల్‌ అనుకో. కానీ- మన సంప్రదాయంలో పెళ్ళనేది జీవితంలో ఒకసారే కదా! అందుకే పది లక్షలు ఖర్చు పెట్టాం. ఒకోటి పాతికవేల చొప్పున మూడు పట్టుచీరలు కొన్నాం మా అమ్మాయికి” అంది ఉమ ఉత్సాహంగా.

”జీవితం మొత్తంలో ఆ పట్టుచీరలు ఎన్ని సార్లు కట్టుకుంటుంది?” అని మనసులో గుండెలు బాదుకుని, ”సరేలే కానీ, పెళ్లికి అన్ని వైపుల్నించీ చుట్టాలు బాగా వచ్చారా? విశేషాలేమిటి?” అంటూ మాట మార్చాను.

”ఆఁ- అంతా వచ్చారు కానీ మా ఆడపడుచు గౌరి మాత్రం రాలేదు. కావాలనే మానేసింది. అదే ఈ పెళ్లిలో ముఖ్య విశేషం” అంది ఉమ నిష్ఠూరంగా.

నాలో ఆశ్చర్యం, అపనమ్మకం. తన ఆడపడుచు చాలా మంచిదనేది ఉమ. తన పెళ్లప్పుడు పెద్ద గొడవై పెళ్ల్లాగిపోవాల్సిందిట. అప్పుడామె స్వంతవాళ్ళని కూడా కాదని ఉమవైపు అండగా నిలబడిందని ఓసారి ఉమే నాకు చెప్పింది. అది గుర్తు చేసి, ”కావాలని ఈ పెళ్లికి రావడం మానేసింది ఆ గౌరేనా?” అన్నాను.

”అవును. ఆ గౌరే. తను మాకెంత సాయం చేసినా, ఆ తర్వాత అంతకంతా తనకి మేమూ చేశాం. తన కూతురి పెళ్ళికి నెల్లాళ్లు మా బావగారింట్లోనే ఉంది. మేమంతా పూనుకుని పెళ్లి పనులన్నీ చేశాం, తెలుసుగా”

”గుర్తుంది. ఆ నెల్లాళ్ళలో మీకూ, వాళ్లకీ- దినవెచ్చాలకీ, కరెంటుకీ అయిన ఖర్చంతా తనే పెట్టుకుందనీ, వెళ్లేటప్పుడు అపరాలన్నీ మీకే వదిలేసిందనీ, ఇంకా మీకు చిన్న చిన్న కానుకలు కూడా ఇచ్చిందనీ చెప్పావు”

”అది వేరులే. అయినా పప్పులూ అవీ వదిలేయక- కూడా మోసుకెడుతుందా?” అంది ఉమ చిరాగ్గా.

”కావాలంటే వెనక్కిచ్చేయొచ్చన్నాడు దుకాణంవాడు, కానీ తనే ఇవ్వలేదన్నావు అప్పుడు” గుర్తు చేశాను.

”దానికీ ఏదో కారణం ఉండే ఉంటుందిలే కానీ- ఇప్పుడదంతా ఎందుకు? ఇప్పుడు నా కూతురి పెళ్లికి తను రాలేదు. అదీ సంగతి!” అంది ఉమ. విషయం మొదటికి రావడంతో నేనూ మొదటికొచ్చి, ”ఔనూ- వాళ్లమ్మాయి పెళ్లప్పుడు నువ్వెక్కడుండేదానివి?” అన్నాను. అప్పుడు తనూ ఆ ఊళ్లోనే ఉండేదని నాకు తెలుసు.

ఉమకి అర్థమైంది. మాట తప్పిస్తూ, ”ఎక్కడుంటే ఏమిటి- ఆపేక్షలు ముఖ్యం. మరి మా మేనకోడలు పెళ్లికే కాదు, పురిటికీ ఎంత సాయం చేసానో నీకు తెలుసుగా?” అంది.

”గుర్తుంది. అప్పుడు గౌరి నీకు చాలా మంచి కానుక ఇచ్చిందన్నావు కూడా”

”ఇచ్చిందనే కదా- నీక్కూడా చెప్పుకుని సంతోషించాను. అలా ఇచ్చి దానితో ఋణం తీరిపోతుందనుకుంటేనే బాధనిపిస్తుంది?” అంది ఉమ.

”సాయం దారి సాయానిదే, ఋణం దారి ఋణానిదే! ఆవిడలాగనడం చాలా తప్పు” అన్నాను ఏమీ ఎరగనట్లు.

”పాపం మాటలెందుకూ- ఆవిడ అలా అన్నట్టు నాకు తెలియదు. కానీ కానుకతో ఋణం తీరిపోయిందనేగా మరి ఈ పెళ్ళికి రాలేదు” అంది ఉమ.

ఈ తర్కం నాకు దుర్భరమనిపించి, ”ఔను. నీ ఉక్రోషంలో న్యాయముంది. పెళ్లికైతే ఊళ్లోనే ఉన్నావు కాబట్టి వెళ్లావనుకోవచ్చు. కానీ పురిటికి కూడా ఎక్కణ్ణించో సాయానికెళ్లావ్‌ నువ్వు” అన్నాను. అప్పుడూ తనక్కడే ఉందని నాకు తెలుసు.

ఉమ ముఖం మాడ్చుకుని, ”పురుడప్పుడు కూడా నేనక్కడే ఉన్నానులే” అంది.

నేను వదలదల్చుకోలేదు. తెలియనట్లు నటిస్తూ నిలదీయాల్సినవి చాలా ఉన్నాయి, ”సరే- ఒక పురుడైతే అనుకోవచ్చు. మరి రెండో పురిటికి అక్కడ లేవుగా?” అన్నాను. ఉమ అదోలా ముఖంపెట్టి, ”లేననుకో. ఆ పురిటికి నేను వెళ్ళలేదు కూడా. ఇంతదూరంనుంచి కష్టం కదా!” అంది.

”నిజమే- దగ్గిరున్నావు కాబట్టి మేనకోడలి మొదటి పురిటికి చాలా సాయం చేశావ్‌! ఆ తర్వాత కెనడా వచ్చేశావ్‌ కాబట్టి- ఆ అమ్మాయి రెండో పురిటికి ఇంత దూరంనుంచి వెళ్లి సాయం చెయ్యలేకపోయావ్‌. ఏదో వడుగు, పెళ్లి లాంటి విశేషాలైతే అది వేరు. దూరమైనా తప్పదు మరి. అవునూ- మరి నీ మేనల్లుడి వడుగు విశేషాలు నీనుంచి విన్న గుర్తు లేదు” అంటూ మరో బాణం వేశాను.

”ఉండేది పక్కపక్క ఊళ్లే ఐనా- పెళ్లికి వెళ్లడానికే ఒకటికి పదిమార్లు ఆలోచిస్తున్న రోజులివి. కెనడానుంచి ఇండియా వెడతామా- అదీ వడుక్కి!” చిరాగ్గా అంది ఉమ.

”అంటే నువ్వు నీ మేనల్లుడి పెళ్ళికే కానీ వడుక్కి వెళ్లలేదన్నమాట?” బాణంమీద మరోబాణం.

”అన్నీ తెలిసీ తెలియనట్లు ఎక్కదీస్తావేం? ప్రపంచం చిన్నదైపోతోందన్నమాట నిజమే కానీ- ఆ వడుగప్పటికీ ఆ తర్వాత పెళ్లినాటికీ- కెనడాకీ ఇండియాకీ దూరం అంతే ఉంది మరి” అంది ఉమ అసహనంగా.

”ఐతే నీ మేనల్లుడి పెళ్లికి కూడా వెళ్లలేదంటావ్‌! పోనీ ఆ తర్వాత గౌరీ వాళ్లూ కొత్తిల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకున్నారు కదా- వాటికి వెళ్లే ఉంటావ్‌! ఆ విశేషాలూ చెప్పలేదు నాకు”

”ఏం వెటకారం తల్లీ! గృహప్రవేశానిక్కాకపోయినా ఆ తర్వాత మూడేళ్లకి జరిగిన వాళ్ల షష్టిపూర్తికి వెళ్ళాన్లే”

”అంటే, అప్పటికి తగ్గిందన్నమాట దూరం! దూరం తగ్గినా టికెట్‌ తగ్గదుకదా- మీ ఇంటిల్లపాదీ వెళ్లడానికి బాగా తడిసి మోపెడయుంటుంది?” అన్నాను. నాకు తెలుసు- తనొక్కతే వెళ్లిందని.

”మర్చిపోయావా- వెళ్లింది నేనొకత్తినే. చీటికీమాటికీ ఇంతింత టికెట్‌ పెట్టుకుని అంతంత దూరాలు వెళ్లడం మాటలా? ఐనా మా అమ్మకి వంట్లో బాగాలేక చూడ్డానికెెళ్లాను చూడు- అప్పుడే జరిగిందా వేడుక”

”అంటే- ప్రయాణం ఛార్జీలు కలిసొచ్చాయ్‌. ఇంకేం- వాళ్ల షష్టిపూర్తికి మంచి గిఫ్టే ఇచ్చుంటావ్‌?” అర్జునుడు ద్రోణుడిపై ప్రయోగించినవి ఆయనకి తెలిసిన అస్త్రాలే కదా- నేనూ అదే చేస్తున్నాను.

”ఊఁ మావారి అన్నదమ్ముల మూడు కుటుంబాలు కలిసి- మా ఆడపడుచుకో సిల్కు చీరా, వాళ్లాయనకో పాంటూ షర్టూ పెట్టాం”

”అలాగా- మరి దానికావిడ- ‘కెనడాలో ఉన్నారు, ఇంత సంపాదించుకుంటున్నారు. అంతా కలిసి ఇచ్చేది ఉత్త బట్టలేనా’ అని నిష్ఠూరమాడలేదా? అందులోనూ షష్టిపూర్తి జీవితంలో ఒకేసారి వచ్చేది కూడాను” అన్నాను.

”ఏమో, తనేం అనలేదు, నేనూ పట్టించుకోలేదు. అయినా షష్టిపూర్తయితే జీవితానికోసారి కానీ- వాళ్ల పెళ్లై ఇన్నేళ్లయిందా? మావారి అన్నదమ్ములంతా కలిసి తనకి బిళ్లగొడుగుల్లా ఏటా అయిదొందలు పంపిస్తున్నారు. తెలుసు కదా!” అంది ఉమ గొప్పగా.

అన్నీ తెలుసు నాకు, ఐనా ”ఇన్నేళ్లంటే ఎన్నేళ్లేమిటి?” అన్నాను.

”ముప్పై ఏళ్లకి పైనే అనుకో. ఇది మా మామయ్య మొదలెట్టారు. ఆయన పోయినా కంటిన్యూ చేయాలని మా అత్తగారి పట్టు. కాదనలేక అన్నదమ్ములంతా కలిసి ఏటా పాటిస్తున్నారు. తప్పుతుందా మరి”

”తప్పదు సరేకానీ- గుడ్డిలో మెల్ల- దీనికి ఇన్‌ఫ్లేషనూ అవీ జోడించి పెంచకుండా, ఇప్పటికీ అదే ఎమౌంటుతో సరిపెట్టారు మీ అత్తగారు”

ఉమ అయిష్టంగా, ”ఊఁ” అని, ”ఐనా- ఏం సంప్రదాయాలో ఇవి. ఆడవాళ్లం, చదువుకున్నవాళ్లం- వీటిని మనమేనా వ్యతిరేకించకపోతే ఎలా అనిపిస్తూంటుంది నాకు. కానీ ఆడపడుచు విషయంలో అంటేే ఇంకోలా అనుకుంటారని- ఈ వ్యవహారంలో వేలెట్టడం లేదు”

”అదీ నిజమే మరి. ముందు నువ్వు నీ  పుట్టింటివాళ్లేమిచ్చినా కాదంటే సరి. చెప్పుచ్చుకు కొట్టినట్లౌతుంది నీ ఆడపడుచుకి” ఉపాయం చెప్పాను.

”భలేదానివే- లేనివాళ్లని వేధించకూడదు కానీ ఆడపిల్లకి పుట్టింటాశ తప్పు కాదు. మా వదినైతే ఏమంటుందో తెలుసా- అది చీర కానీ మరోటికానీ, అన్నయ్యలు పెట్టారూ అంటే అది వాళ్ల స్టేటస్‌కి తగ్గట్లు ఉండాలిట” గొప్పగా అంది ఉమ.

”ఔన్లే, మీ స్టేటస్‌కి తగ్గట్లు మీరు చేస్తున్నారు. ఐనా ఏటా ఐదొందలివ్వడంతో అయిపోదు కదా! ఇంటికొస్తే పెట్టుపోతలూ అవీ మళ్లీ వేరే” అని ఆగి, ”ఔనూ- గౌరి మీ ఇంటికి ఏడాదికెన్ని సార్లొచ్చేదేమిటి? ఇప్పుడు కాదు, ఇండియాలో ఉన్నప్పుడు”

”అక్కడుండగా, మా పెళ్లయ్యాక ఓ రెందుసార్లొచ్చిందిలే. రెండుసార్లూ చీరెట్టి పంపాను”

”ఔన్లే- ఎంత కలిగినవాళ్లమైనా చీర కాకపోతే బంగారం పెడతామేమిటి?” అని, ”ఇంతకీ మీ ఆడపడుచు మీ అమ్మాయి పెళ్ళికి రాకపోవడానికి కారణమేమైనా చెప్పిందా?” అనడిగాను.

”ఏం చెబుతుంది- కావాలనే రానప్పుడు?”

”పక్కనే ఉండి రానప్పుడు, కుంటిదైనా ఏదో సాకు చెప్పాలిగా”

”అంత పక్కనేం లేదులే- ఉంటే రాకేం చేస్తుంది?”

”పక్కనే లేకపోతేనేం- అయినవాళ్లింట్లో పెళ్లికి వెళ్లకపోతే- సాకు చెప్పడం కనీస మర్యాద కదా!”

”చెప్పిందిలే సాకు. మనవడుట్టాడు. చూడాలన్న ఉబలాటమొకటి. కొడుకూ, కోడలూ ఇద్దరికీ ఉద్యోగాలు. దేశం కాని దేశంలో తన సాయం లేకుండా కుదరదట”

”అదేమిటీ- ఆ మనుమడేమైనా సడెన్‌గా పుట్టాడా? పుడితే మాత్రం పెళ్లి ముహూర్తం తెలిసి కూడా ఆగకుండా వెళ్లిపోయిందా?”

”అదేంకాదులే- మా అమ్మాయి పెళ్లే సడెన్‌గా కుదిరింది. అప్పటికి మా ఆడపడుచు అమెరికాకి టికెట్‌ కొనేసుకుంది. రెండు నెలల్లో తన ప్రయాణముంది. ఈలోగా ముహూర్తం పెడితే పెళ్లికుండి వెడతానంది. మాకేమో మరో రెండు నెలలక్కానీ ముహూర్తం కుదర్లేదు. ఎవరికోసమో తనెందుకాగాలి అన్నట్లు- అంతకాలం తనుండనని పేలేసి చెప్పింది”

”నేనెళ్లలేదు కానీ మీ ఆడపడుచన్న ఆ టైంలో మా బంధువులవి చాలా పెళ్లిళ్లయ్యాయ్‌. మరి మీకు తను ఇండియాలో ఉండగా ముహూర్తాలే దొరకలేదా?”

”ఇది చాలా బాగుంది. ఆడపిల్ల పెళ్ళి. కెనడానుంచొచ్చి ఇండియాలో చెయ్యాలి. మా ఇబ్బందులు మాకుంటాయి. ఐనా మా వీలు మేం చూసుకుంటాం కానీ ఎవరికోసమో ముహూర్తాలు పెట్టుకోం కదా!”

”పేలేసి బాగా చెప్పావు- అచ్చం వాళ్లకిలాగే” విసిరాను.

ఉమ అడ్డంగా తలూపింది, ”అదీ ఇదీ ఒకటి కాదు. తను అమెరికాలో ఉంటేనేం- మేము మా ఖర్చుతో రానూపోనూ టికెట్‌ కొంటామని బ్రతిమాలాం. ఐనా ససేమిరా  అంది తెలుసా?”

”మీరలాంటి ఆఫరిచ్చినప్పుడు- రాననడం దారుణం- అదీ తనకి గ్రీన్‌ కార్డుండీ!”

ఉమ ముఖం మాడ్చుకుని, ”వాళ్లకి గ్రీన్‌కార్డ్‌ లేదులే. టెెనియర్స్‌ మల్టిపుల్‌ ఎంట్రీ వీసామీద రెండేళ్లకీ మూడేళ్లకీ వెడుతూవస్తూంటారు” అంది.

”అలా చెప్పు మరి. ఆ వీసాతో- అమెరికానుంచి మన ఇష్టమొచ్చినట్లు రావడం, పోవడం అన్నివేళలా కుదరకపోవచ్చని నీకూ తెలుసుగా”

”ఔననుకో- కానీ వాళ్లబ్బాయే హామీ ఇచ్చాడు మాకు- అమ్మానాన్నా ఈ పెళ్లయ్యాకే రావచ్చనీ, అంతవరకూ తాము అడ్జస్ట్‌ అవుతామనీ”

”నువ్విలాగంటే గుర్తుకొస్తోంది- నీ పురుళ్ళకి మీ అమ్మ దగ్గర నువ్వెన్నాళ్ళున్నావు?”

”పురిటికి ముందు మూడునెలలు, తరువాత అయిదు నెలలు. రెండో పురిటికైతే- నన్ను పంపేటప్పుడు- అమ్మ కూడా నాతోపాటు వచ్చి నా దగ్గిర మూడు నెలలుంది. ఇంకా ఉండేదే- తనకి చాలా ఇబ్బందౌతోందని నాన్న ఫోన్లమీద ఫోన్లు చెయ్యకపోతే”

”ఏమిటో- మన సుఖంకోసం పెద్దవాళ్లనిబ్బంది పెట్టడం అవసరమంటావా?”

 

”సుఖమా, పాడా? చంటిపిల్లల చాకిరీ ఎంత కష్టం? నేనెంత చేసినా- ఉడతాభక్తే కదమ్మా- అనేది అమ్మ. తెలుసా?”

”తెలుసు కానీ నేనంటున్నది వేరు. నువ్వుద్యోగం చెయ్యకపోయినా చంటిపిల్లలతో చేసుకోలేవనుకుంది మీ అమ్మ. మీ నాన్నకిబ్బందని తెలిసి కూడా- నీకు సాయానికొచ్చింది. మరి గౌరి కొడుకూ కోడలూ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మానాన్నా ఆలస్యంగా వచ్చినా ఫర్వాలేదనడం- నీ మేనల్లుడి మర్యాద. అన్నీ తెలుసు కాబట్టి- ‘పెళ్లికి రాకపోతేనేం- ముఖ్యావసరం మీది’ అనడం మన మర్యాద. ఇక గౌరి సంగతంటావా- ఆవిడకి మనవణ్ణి చూసుకోవాలని తొందరుండడం సహజం. మీ అమ్మ మీ నాన్న ఇబ్బందిని పట్టించుకోనట్లే, ఆవిడ మీ ఇంట్లో పెళ్లిని పట్టించుకోలేదనుకోవచ్చుగా. ఇక మీ టికెట్‌ ఆఫర్‌ విషయానికొస్తే- వడుక్కి, పెళ్లికి, గృహప్రవేశానికి, షష్ఠిపూర్తికి- స్వంతానికి దారి ఖర్చులకి వెనకాడినవాళ్లు- తనకిప్పుడు దారిఖర్చులు పెట్టుకుంటామంటే తనకి మనసొప్పలేదేమో ఆలోచించావా?” అన్నాను ఆగలేక.

ఉమకి కోపం వచ్చింది, ”చాలా బాగుంది- నువ్వు నా ఫ్రెండువా, గౌరి ఫ్రెండువా అని అనుమానంగా ఉందిప్పుడు. మరి నా సంగతే తీసుకో- మా అమ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు చూడ్డానికి ఇక్కణ్ణించి వెళ్లానా- ఎలాగోఅలా వీలు చేసుకుని అంత దూరాన్నుంచొచ్చానని సంబరపడింది. కానీ తనకి బైపాస్‌ చేసినప్పుడు సాయానికేమిటి, చూడ్డానికే వెళ్ళలేకపోయాను. అమ్మ అభిమానంతో అర్ధం చేసుకుందే తప్ప- ‘అప్పుడు పెట్టిన ఖర్చిప్పుడు పెట్టలేవా?’ అని నిలదియ్యలేదు. ఆ తర్వాత నా వీలునుబట్టి ఇంటియా వెళ్లినప్పుడు అది మనసులో పెట్టుకుని మతలబుగా మాట్లాడలేదు. అభిమానం, ఆప్యాయత ఉన్నచోటే నమ్మకమూ ఉంటుంది. అది లేనప్పుడే నువ్వన్నట్లు మనసొప్పకపోవడాలు”

ఉమ తన్ను తాను విమర్శించుకుందో, నాకు సంజాయిషీ ఇచ్చిందో అర్థం కాలేదు. నేను మాత్రం నా ధోరణి కొనసాగించాను, ”నీ ఫ్రెండుని కాబట్టే సంకోచం లేకుండా డౌట్స్‌ క్లియర్‌ చేసుకుంటున్నా. ఇంకా నా డౌట్స్‌ ఐపోలేదు. గౌరి అభిమానం, ఆప్యాయతల గురించి చాలాసార్లు నా దగ్గిర మెచ్చుకున్నావు కాబట్టి అడుగుతున్నాను. మీరు వాళ్ళింట్లో చాలా ఫంక్షన్సుకే వెళ్ళలేదు. ఆ విషయం తను మనసులో పెట్టుకుంది అనుకునేందుకు ఆధారాలేమైనా ఉన్నాయా? అంటే తనెప్పుడైనా ఎవరి దగ్గిరైనా మిమ్మల్ని ఆడిపోసుకుందా?”

”తనలా తేలే రకం కాదు. మా ఎదురుగా ఎప్పుడూ ఏమీ అనలేదు. చాటుగా అందేమో తెలియదు. మా సంగతంటావా- మాకైతే మనసులో ఏమీ లేదు. ఇంత జరిగినా వీలు చూసుకుని అమెరికా వెళ్లి తన కొడుకూ, కోడల్నీ చూసొస్తూంటాం తెలుసా? అఫ్‌కోర్స్‌- ఆ ట్రిప్పుతో సైట్‌ సీియింగ్‌ కూడా కలుపుతామనుకో”

”మరి నీ మేనల్లుడూ వాళ్లూ ఎప్పుడూ మిమ్మల్ని చూడ్డానికి రాలేదా?”

”రాకేం- సైట్‌సీయింగ్‌కొచ్చి ఆచేత్తో మమ్మల్నీ చూడ్డానికొచ్చారు”

ఆ ప్రజాకీయానికి వివశనై కాసేపు అవాక్కయ్యాను. తేరుకున్నాక చివరి ప్రయత్నంగా, ”ఇంతకీ పెళ్ళికొడుకు మీ పిన్నత్తగారి మనవడే కదా! మీ పిన్నత్తగారి కూతురు మంచిదికాదనీ, మీ పెళ్ళిలో గొడవ పెట్టిందనీ, ఆ తర్వాత మీ చేత బాగా చాకిరీ చేయించుకుని నీచంగా చూసిందనీ, ఆవిడ కొడుకు కూడా….”

నేనింకా ఏదో అనబోతూండగా మధ్యలో ఆపి, ”అబ్బా- పెళ్లైపోయిందిగా- ఆ పాత సంగతులన్నీ ఇప్పుడెందుకూ? పెళ్ళి చాలా చాలా బాగా జరిగింది. అన్ని వేడుకల్లోనూ మగ పెళ్లివారు కూడా మాతో కలిసిపోయారనుకో. అంత సరదాగా జరిగిన పెళ్లిలో మా ఆడపడుచు పాలు పంచుకోలేదన్న ఆత్మీయతాభావమే నా ఈ ఉక్రోషానికి కారణం. అర్థమైందా?” అంది ఉమ.

”నాకు తెలుసు, నీకు నీ ఆడపడుచంటే చెప్పలేనంత ఇష్టం. ఆవిడ పక్కనుంటే నీకు అదో తృప్తి. పెళ్ళి పనుల్లో శ్రమ కూడా తెలిసేది కాదేమో?”

”అంత శ్రమేముందిలే- ఐనా నేను పెళ్లికి మూడు నెలలు ముందునుంచీ ఇండియాలోనే ఉన్నానుగా”

”అంత ముందా? ఓహో- కాబోయే అల్లుడి వడుక్కి కూడా వెళ్లినట్లుంటుందనా?” అన్నాను. ఆ వడుక్కి తను వెళ్లలేదని నాకు గుర్తుంది.

”అబ్బే- నేనెళ్లడానికి రెండు నెల్ల ముందే మా అల్లుడి వడుగైపోయింది. మేమొచ్చాక పెట్టమన్నాం కానీ వాళ్లకి ముహుర్తం కుదరలేదు. పెళ్లికైనా ఫర్వాలేదు కానీ వడుగు ముహూర్తానికి పట్టింపు ఎక్కువ కదా! పోనీ వడుక్కి వెళ్లి మళ్లీ వెనక్కొచ్చి మళ్లీ పెళ్లికి వెడదామంటే- అన్నేసి ప్రయాణాలకి ఇదేమైనా దగ్గరా దాపా? అందుకే ఆ వడుక్కి వెళ్ళలేదు. అలాగని వాళ్లకేం లోటు చెయ్యలేదు- వియ్యపురాలికిి కంచి పట్టుచీరా, వియ్యంకుడికి పట్టుపంచా, అల్లుడికి తులం బంగారం ఉంగరం అందేలా ఏర్పాటు చేశాంలే”

ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నాయి. కానీ టైమ్స్ నౌలో అర్నాబ్‌ గోస్వామిలా ఈ సంవాదాన్ని ఎక్కడో ఒకచోట ఆపేయాలిగా! ఈ ప్రజాకీయంలో మంచిచెడుల అన్వేషణ అసాధ్యమని అప్పటికి ధ్రువపడింది నాకు. అస్మదీయుల్నీ తస్మదీయుల్నీ వేరు చేసే ఆమె అవగాహన, ఆలోచన- సమకాలీనంగా మన సమిష్టి కుటుంబాల్నీ, సమాజాన్నీ, వ్యవస్థనీ ప్రభావితం చేస్తున్నవా- అన్న భావం నాకు కలిగింది.

మీడియాలో మన నేతల ధోరణి చూసినప్పుడు- వాళ్లలో మీకు ఉమ కనిపించొచ్చు. కానీ ఉమలో మీకు- మీరు, అస్మదీయులు కనిపిస్తే ఈ రచనకి సార్ధకత లభించినట్లే!

—0—

పదాల ప్రేమలో…

    వాణి కొరటమద్ది

దు:ఖాన్ని  వీడలేక మనసంతా
తుఫాను నాటి కడలిలా అల్లకల్లోలమే
భావాలకై తడుముకుంటూ
మనసంత శోధిస్తూ
లోతుల్ని  తవ్వుకుంటూ
     అక్షరాల ప్రపంచాన్ని హత్తుకుంటాను
మిళిత బిందువువులెన్నో
అక్షరాలుగా మారిపోయాయి
తడిసిన కనులు అలసిపోయి
బాధను ప్రకటిస్తుంటాయి
నీటిని ఆర్పుకుంటూ
కాగితం సొట్టలతో ఉబ్బిపోతుంది
తల్లడిల్లే మనసులానే
సహజత్వాన్ని కోల్పోతుంది
ముడుచుకున్న కాగితంలో
ఇంకిన కన్నీళ్ళు కనిపిస్తూ
మనసులోని  అశ్రువులన్నీ
ఆవిరైనట్లు అనిపిస్తూ
అక్షరాలనే హత్తుకుంటాను
పదాల ప్రేమలో
విహంగమై విహరిస్తుంటాను
అక్షరాల స్నేహంతో
చెలిమి విలువ తెలిసింది
భావాలే ప్రకటిస్తూ అనుక్షణం
            ~
vani

పునరపి రణం

 

తన చుట్టు తాను చుట్టుకుంటూ ఇపుడున్నదంతా దుఃఖమే
కలలను కూడా కలుషితం చేస్తూ కొన్ని తడి లేని అశ్రువులు
అశ్రువుల మీద ఎవరో సంధించి వదిలిన ఒక అస్త్రాన్ని నేను
దుఃఖం మీద ఎవరో ఎగరేసిన తిరుగుబాటు బావుటానూ నేనే

నేనంటే ఏ నేనైనా, ఎన్ని నేనులైనా

ఈ తోలు చేతులు కత్తులై, ప్రతి వ్రేలి కొసనా నేనొక కొవ్వొత్తినై;
ఏదీ వుండనప్పుడు; విరిగిన రథ చక్రం, ఇంటి దూలం ముక్క ఏదీ
వుండనప్పుడు నెత్తురోడే శిరస్సును గదాయుధం చేసుకునేది నేనే
చివరి వూర్పు కూడా మంటను మరి కాస్త ఎగదోసి వదుల్తుంది;
హతమవుతుంది గాని ఈలోగా శరీరమే నా ఆయుధం, దీన్నే
నేనిప్పుడు జమ్మి చెట్టు మీది నుంచి జాగర్తగా దింపుకుంటున్నా

మళ్లీ మరొక ఆఖరి యుద్దానికి

                                                                                                      -హెచ్చార్కె

hrk

భూమి గుండ్రమో, బల్లపరుపో…!

వరవరరావు

vv.karaభూమి గుండ్రంగా తిరుగుతుందని చెప్పిన శాస్త్రజ్ఞుని సత్యాన్వేషణదారిలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది విద్యార్థులు, అధ్యాపకులు భూమి తదితర ప్రకృతి సంపదలు, గనులు, కార్ఖానాలు, ప్రజలు ` పరస్పర సంబంధాల గురించి అధ్యయనం చేసి – ప్రకృతి –  ప్రజల పరంగా చూసినపుడు ఇపుడు జరుగుతున్నదంతా విధ్వంసక అభివృద్ధి అనే నిర్ధారణకు వచ్చారు. వాళ్ల అధ్యయనం తెలుగులో పుస్తకరూపంలో వచ్చినపుడు ముందుమాట రాస్తూ నేనూ పతంజలి వ్యంగ్యాన్ని ఆశ్రయించాను. ‘పతంజలి నవలల్లో చర్చ ముగిసి భూమి గుండ్రంగా కాక బల్లపరుపుగా ఉంటే బహుశా ఈ ప్రజాసమూహాలు చీమలవలె ఈ భూగోళం మీంచి కృత్రిమ జలప్రళయంలో, ఖనిజ భూకంపంలో విస్థాపన, విధ్వంసం అయి వుండేవారు కారేమో’ అని.

‘గోపాత్రుడు’ (1992)లో చర్చ ఇరుపక్షాల దొమ్మీలో ముగిసింది. మెజిస్ట్రేట్‌ భూమి బల్లపరుపుగానే వున్నదని తీర్పు ఇచ్చాడు. అయితే ఆయన భూమి గుండ్రంగా ఉందని సత్యజ్ఞానంతోనే వున్నాడుగానీ ఈ భూమిమీద వ్యవస్థ సత్యజ్ఞానంతో లేదుగనుక ఆ నిర్ణయానికి వచ్చాడు.

‘‘మన జ్ఞానానికి సార్థకత లేదు. మన విశ్వాసాలమీద మనకు విశ్వాసం లేదు. మన విలువలమీద మనకు గౌరవం లేదు. మన దేవుడిమీద మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మనమీద మనకు గౌరవం లేదు. మనతోటి వాళ్లమీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహనగానీ, గురిగానీ లేదు. మన జ్ఞానానికీ, విశ్వాసానికీ పొంతనలేదు. విశ్వాసానికీ, ఆచరణకీ పొందిక లేదు. భూమి బల్లపరుపుగా ఉన్నపుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్లబడుతుంది. మన భూమి బల్లపరుపుగా వున్నదిగనుకనే మన సమాజం ఇలావుంది.’’

ఈ విషయాన్ని ఆయన పుస్తకాల్లో చదివి తెలుసుకోలేదు. జీవితాన్ని పరిశీలించి నిర్ధారించుకున్నాడు.

మరి గోపాత్రుడు తండ్రికి భూమి బల్లపరుపుగా ఉందని ఎందుకనిపించింది? అతడు అటువంటి బతుకు బతికాడుగనుక. అతడు వైద్యుడుగా చెలామణీ అయ్యాడు. వైద్యమంటే ఏమిటో తెలియకుండానే మహావైద్యుడనిపించుకున్నాడు. జడ్డీపెట్టెలో తాటాకు పుస్తకాలు ఉన్నాయి. కాని అందులో ఏవుందో నరమానవుడికి ఎవరికీ తెలియదు. అది రాసిన అతని తాతయ్యకే తెలియదు…  ‘అందులో ఏవో ఉన్నాయని వూరందరూ అనుకున్నంత కాలమే నువ్వు సెలామణి అవుతావు అది గుర్తుపెట్టుకో. నోటు రాయని బాకీలు ఎగ్గొట్టీ…. నోటురాసిన బాకీలు వొచ్చేజన్మలో మానాయనే తీరుస్తాడని చెప్పు… నేను చచ్చి, దయ్యాన్నై నీకు చేదోడు వాదోడుగా ఉంటాన’ని హితబోధ చేసిన సందర్భంలో ‘మరో సంగతి భూమి గుండ్రంగా వుందిన ఎవరైనా సెప్పితే నమ్మొద్దు. భూమి బల్లపరుపుగా… నేను పడుకున్న మంచంలాగుంటుంది. మరిసిపోవద్దు.’ అని చెప్పాడు. ఇది సత్యశోధనలో వచ్చిన జ్ఞానం కాదు.

‘ఈ సంగతి మా నాయిన పోయేముందు నా సెవులో చెప్పి మరీ పోయాడు. మా తాత యీ రహస్యం మా నాయిన చెవిలో చెప్పి చచ్చిపోయాడట – నువ్వు కూడ నీ కొడుక్కు ఈ రహస్యం చెప్పాల….’ ఇది సత్యాన్వేషణలో పొందిన జ్ఞానం కాదు. వారసత్వ సంచిత స్వార్థ ప్రయోజనజ్ఞానం. కనుకనే రహస్యంగా వారసత్వంగానే అందించబడుతుంది.

ఇంక అక్కడినుంచీ ఇరుపక్షాలకూ స్వార్థప్రయోజనమే  రెండుపార్టీలుగా చీలడానికి కారణం తప్ప భూమి గుండ్రంగా వున్నదని అంటున్నవాళ్లంతా వెనుకటికి  మేజిలెన్ వలె పరిశోధనచేసి తేల్చుకున్నవాళ్లు కాదు. ఇపుడు పార్లమెంటులో భూఆక్రమణ బిల్లు మీద రెండు పార్టీలు తమ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు చీలి ప్రతిష్ఠంభన ఏర్పడుతుందో, అధికారంలో వున్న పార్టీ పడిపోతుందో అనిపించి – చివరకు అంతా ఒకటైపోయినట్లు.

అట్లా ఒకటి కాకపోతే పోలీసోడు అందరినీ బొక్కలో తోసి ఒకటి చేస్తాడు. ఇప్పుడు పోలీసంటే ప్రపంచ పోలీసు  అమెరికా.

‘భూమి గుండ్రంగా లేదు. భూమి బల్లపరుపుగా కూడ లేదు. భూమి నా టోపీలాగుంటది. భూమి పోలీసోడి  లాఠీ లాగుంటాది తెలిసిందా?’ అని అడిగి తెలీకపోతే మళ్లా ఒకసారి గదిలోకొచ్చి తెలిసేట్లు చేస్తానంటాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌.

అయితే ఇన్‌స్పెక్టర్‌కున్న విశ్వాసాన్ని కూడ తాత్కాలికంగా మెజిస్ట్రేట్‌ వమ్ముచేసాడు.

‘ఇదేం న్యాయం, నల్లగౌనేసుకున్నోడి నమ్మకం తీర్పయిపోయి, మిగిల్నోల్ల నమ్మకాలు విలువలేకుండా ఎలాపోతాయి?’… ఇందులో ఏదో మత్లబు ఉన్నది.

అది డిఎస్పీ సిఐకి అర్థం చేయించాడు. సిఐ కుట్రకేసుల మీద కుట్రకేసులు బనాయించి అందులో మెజిస్ట్రేట్‌నే సాక్షిని చేసి ఇరికించాడు. సెషన్స్‌జడ్జి ‘‘ఒకవేళ కుట్రకేసంటూ పెడితే నీమీదే పెట్టాలని నాకు అనిపిస్తున్నదయ్యా’’ అన్నాడు. ఎందుకంటే మెజిస్ట్రేట్‌ తన పరిధి దాటి జీవితంవైపు తొంగిచూసాడు. ‘‘ప్రజాజీవితం పోలీసువారి చేతుల్లో సుఖంగా, శాంతంగా, చల్లగా ఉందని, భూమి ఒకవేళ బల్లపరుపుగా ఉన్నాకూడ పోలీసువారు దాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పిండిలాగ కలిపి, గుండ్రంగా చేయగలరని నేను నమ్ముతాను… మున్సఫ్‌ మేజిస్ట్రేట్‌గా నీ నమ్మకంకన్నా సెషన్స్‌జడ్జిగా నా నమ్మకానికి ఎక్కువ విలువుంటుంది గదా. అప్పుడేమంటావు?’’

‘‘కేసులు పరిష్కరించు. అదే నీ పని. జీవితాన్ని పరిష్కరించే బాధ్యత మనది కాదు’’ అని మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌కు హితబోధ చేసి సెషన్స్‌జడ్జి గారు కుట్రకేసుల కట్ట అందుకున్నారు.

హితబోధలో పోలీసుల శక్తి సామర్థ్యాలు ఏపాటివో ఆ సంగతి మేజిస్ట్రేట్‌కే కాకుండా పోలీసులకు కూడ జడ్జిగారు గుర్తుచేసారు గనుక సి.ఐ. తటాలున లేచి కుట్రకేసులన్నీ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు.

అయితే 92లో పతంజలి ఈ నవల రాసేనాటికే పోలీసోడి పవరూ, మెజిస్ట్రేటు పవరూ – ఆ మాటకొస్తే పిలకతిరుగుడు పువ్వు (95)లో సెషన్స్‌జడ్జి పవరూ, శాసనసభ, ప్రభుత్వపాలన, న్యాయవ్యవస్థ, మీడియా అన్నిటి పవరునూ శాసించే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మన దేశంలో నూతన ఆర్థికవిధానాల రూపంలో వచ్చింది. మీడియాకు సంబంధించిన పవరును ‘పిలకతిరుగుడుపువ్వు’లో కొంత, ‘పెంపుడు జంతువులు’లో వివరంగా పతంజలి చెప్పే ఉన్నారు.

‘పిలకతిరుగుడుపువ్వు’ 1995 ఇండియాటుడే సాహిత్య ప్రత్యేకసంచికలో అచ్చయింది. అప్పటికి సాధారణ ప్రజలు పోలీసుగా గుర్తించే రాజ్యాంగయంత్రం కూడ ప్రపంచబ్యాంకు ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే స్థితి మనదేశంలో వచ్చింది.

ఇరవయ్యేళ్లు గడిచిపోయాయి. పతంజలి నవలల్లోని ఫ్యూడల్‌ భూస్వామ్యం, పోలీసు వ్యవస్థగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రాజ్యాంగయంత్రం, సాపేక్ష స్వాతంత్య్రం కలిగి ఉంటుందనుకునే న్యాయవ్యవస్థ,  ప్రజాస్వామ్యానికి నాలుగోస్తంభమనుకునే మీడియా అన్నీ కార్పోరేటు ప్రయోజనాలు నెరవేర్చే దళారీలుగా మారిపోయాయి. ఇప్పుడు భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా లేదు. పోలీసుటోపీ లాగ లేదు. లాఠీలాగ లేదు.

సరుకుగా ఉన్నది. మార్కెటు సరుకుగా ఉన్నది. ఇప్పుడది ఆలమండ దొమ్మీకేసులోని సమస్యగా లేదు. ఇది మామూలు దొమ్మీకేసుగా కాక ప్రత్యేక దొమ్మీకేసుగా మున్సిఫ్‌మెజిస్ట్రేట్‌ గుర్తించినట్లుగానే ఇరవయ్యేళ్లు పోయాక మనం దీనిని పార్లమెంటు ముందు ఉన్న భూఆక్రమణబిల్లుగా గుర్తించాల్సి ఉన్నది. అదీ పతంజలి దూరదృష్టి, ముందుచూపు.

భూమి పోలీసుటోపీ లాగ ఉన్నదనుకున్నపుడు అధికారబలం, అది కూడ లాఠీలాగ ఉన్నదనుకున్నపుడు కండబలం – అందువల్ల వచ్చిన అధికారబలం అనుకునే సామాన్యజ్ఞానం (స్వతంత్రం వస్తే హెడ్డ్‌ బదిలీ అయిపోతాడా అనే ‘కన్యాశుల్కం’లోని జట్కావాని సమస్య వంటిదే) నుంచి వ్యవస్థగా చూసినపుడు మనం ఒక సంక్లిష్టజ్ఞానంలోకి కళ్లు తెరవాల్సి ఉంటుంది. అది వేమన చెప్పిన ఎవరైనాసరే ‘పసిడిగల్లవాని బానిసకొడుకులు’. ఆ పసిడి ఇవ్వాళ భూమి. గర్భంలో పసిడిమాత్రమే కాక సమస్త విలువైన ఖనిజాలు ఉన్నందువల్ల, మార్కెట్లో సరుకయినందువల్ల అది భూమితో సంబంధమున్న ప్రజల చేతినుంచి భూస్వామి చేతినుంచి ఇపుడు కంపెనీల చేతిలోకి వెళ్లిపోయింది. వెళ్లిపోతున్నది. కనుక భూమి గుండ్రంగా ఉన్నదో బల్లపరుపుగా ఉన్నదో కంపెనీవాడు నిర్ణయించేదే సత్యం. అందాకా ప్రజలు గుండ్రంగా ఉన్న భూమిమీద చీమలవలె పడిలేస్తూ పోరాడుతూ ఉండాల్సిందే.

~

 

 

అమ్ములు

ఆర్. దమయంతి

 

 

damayanthi

 

 

 

 

 

‘రూపం లేని ప్రేమకి

ఆయుష్షు మాత్రమే వుంటుంది.

అందుకే అది

మనిషి పోయినా మిగిలుంటుంది.’

*****

 

“ఈ ఏడాది అమ్ములు కి పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాన్రా తమ్ముడూ!” – చల్ల గా మాట చెవినేసింది చంద్రమతి.

శ్రీకాంత్ ఉలిక్కిపడ్డాడు. కనుబొమలు ముడిచి, అడిగాడు. “ఏమిటీ! అమ్ములుకి పెళ్ళా?!”

“అవును. పెళ్ళే. ఏం, అదేమైనా  చిన్న పిల్లనుకుంటున్నావా?”

“కాక? నువ్వు తొందరపడి పెళ్ళి చేసేంత పెద్దదయి పోయిందా అప్పుడే?”

“చాల్లేరా నువ్వూ నీ అభిమానమూను.  నీ కళ్ళకి అదెప్పుడూ చిన్నదిగానే కానొస్తుంది. వచ్చే ఏడాది కల్లా డిగ్రీ అయిపోతోంది తెల్సా?” అంది.

“ఆ తర్వాత  అదింకా చదవాల్సిందీ వుంది. అది నీకు తెలుసా?  అయినా, ఏవో కొంపలంటుకుపోతున్నట్టు ఇంతర్జంటుగా  అమ్ములుకి పెళ్ళి చేసేయడమేవిటీ? అర్ధం లేకుండా!” అతని మనసులో చికాకంతా మాటల్లో తెలిసిపోతున్నా, అదేం   పట్టించుకోని దాన్లా తన ధోరణిలో తానుంది  చంద్రమతి. – ” అద్సరే కానీ, ఇంతకీ అమ్ములు పెళ్ళి ఎవరితో అని అడిగావు కాదు?” అంటూ నర్మగర్భంగా నవ్వి, మరి కాస్త నెయ్యి ఒంపింది పప్పన్నంలోకి.

“అదీ నువ్వే చెబుతావ్ గా. అందుకే  అడగలేదు” అన్నాడు రుస రుస గా.

అతని భావమేమిటొ  తనకు బాగా తెలుసన్నట్టు  గుంభనగా నవ్వుకుంటూ అసలు సంగతి చెప్పింది. – “ఇంకెవరనుకుంటున్నావ్? నువ్వే! నీతోనే పెళ్ళి జరిపిద్దామని నిర్ణయించుకున్నా. ఏమంటావురా తమ్ముడూ? అంటూ  అతని  ముఖం లోకి చూసింది.

ఆమె మాటలు వింటూనే షాకయ్యాడు.   నోట్లో పెట్టుకున్న ముద్ద –  గొంతు దిగక, పొలమారడంతో గబుక్కున మంచి నీళ్ళ గ్లాసెత్తి ఇన్ని నీళ్ళు తాగాడు  గడగడా.

ఏ…మి..టీ?..అమ్ములుకి తనతో పెళ్ళా? ఏమంటోంది అక్క? మతి కానీ భ్రమించలేదు కదా? మాట రాని వాడైపోయాడు.

తను అడంగగానే ఎగిరి గంతేస్తాడనుకున్న తమ్ముడు అంత గంభీరం గా మారిపోడానికి కారణం తెలీక, – “ఏరా, నా కూతురు నీకు  నచ్చలేదా?”  అంటూ తమ్ముడి భుజం మీద చేయి వేసి  అడిగింది.

అది కాదన్నట్టు తలూపాడు.

Kadha-Saranga-2-300x268

“మరి?” …ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే స్ఫురించినదాన్లా.. “ఓ, అదా! ఆ పోయింది  తిరిగొస్తుందని  భయ పడుతున్నావా!”

అక్క మాటలకి, చివ్వుమంటూ చూసాడు. గాలికి నివురు  ఎగిరిపోయిన నిప్పు కణికలా ఆమె ప్రశ్నకి అతనికి గతం గుర్తొచ్చింది. మళ్ళీ మంట రాజుకున్నట్టు …జరిగిన ఆ సంఘటన కళ్ళముందు కదిలింది.

అనారోగ్యంతో మంచాన పడ్డ  తల్లి కోరిక మేర,    పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళైతే అయింది  కానీ, ‘అమ్మాయి బలహీనం గా వుంది. కాస్త నాలుగు దినాల తర్వాత కాపురానికి పంపుతాం ..దయచేసి కాదనకండి ‘ అని   భార్య తరఫు వారు కోరితే ,  సరే అని  వూరుకున్నారు.

నెల దాటినా   ఏ మాటా లేదు.  ఫ్రెండ్స్ వేళా కోళాలడటం మొదలుపెట్టారు. ‘ఏంట్రా,  మగాడివి గందా,  నువ్వైనా  ఓ సూపు చూసి రావద్దూ  ?’ అంటూ.

అతనికీ మనసు లేకపోలేదు వెళ్ళి రావాలని.  కానీ,  అట్నించి ఏ పిలుపూ లేకుండా ఎలా వెళ్ళడం అనే వెనకా ముందులాడాడు.

‘ఇంట్లో మిఠాయి పొట్లం వుంటే తినకుండా వుండగలమా? కొత్త పెళ్ళామైనా అంతే. తాక కుండా వుండలేం. అదీ అసలైన మగ లక్షణం’కుర్రోళ్ళ  హిత బోధలతో ఉత్సాహంగా బయల్దేరాడు.

వూరు చేరేసరికి, పొద్దు గుంకింది.  ఓ పక్కన  చలి గాలి రివ్వురివ్వుమంటూ కొడుతోంది. మరో పక్క, నిశ్శబ్దం లో కీచు కీచు మంటూ చప్పుళ్ళు. కొన్ని వాతావరణాలకు సైగ భాషేదో వుంటుందనుకుంటా.  జరగరానిదేదో జరగుతుందని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తూ వుంటుంది.  అదే సిక్స్త్ సెన్స్. ఏదో జరగబోతున్నట్టు అతనికి అర్ధమౌతోంది.

పొలం గట్టెంట ముందుకు నడుస్తున్న వాడు కాస్త ఠక్కున ఆగాడు. … కొంచెం దూరం లో వున్న  గడ్డి వాము పక్కనించి   గొణ గొణ మంటూ మాటలు వినిపించడంతో  ఆగాడు. ఆగి, చెవి రిక్కించి వినసాగాడు.

“ఎన్నాల్లు నానుస్తావ్? అవతల అత్తోరు పిల్లనెప్పుడు పంపుతారంటూ రోజూ ఫోన్లు చేస్తున్నారు. ఇవాళా రేపు అంటూ రోగం నటిస్తూ వస్తున్నా.   ఇంట్లో వాళ్ళు గెంటి అయినా పంపేలా వున్నారు.”

“అయితే వెళ్ళు..” అంటూ కిసుక్కున నవ్విన మగ గొంతు.

“సిగ్గు లేదూ? –  నాకిప్పుడు   మూడో నెల.  ఇహ దాచడం నా వల్ల కాదు. నువ్వు తీసుకుపోతావా సరే. లేదంటావా చెప్పు, కడుపు కడిగేసుకుని ఆ శ్రీకాంత్ తో  కాపురానికి పోతా… ఏ విషయమూ ఇవాళ తేలాల్సిందే..”

ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు. తన పేరు వినిపించడంతో..తన అనుమానం నిజమే అనుకుంటుంటే.. వెన్ను జలదరించింది. అయినా, నిర్ధారణ చేసుకోవాలని నిశ్చయించుకున్న  వాడిలా నిశ్శబ్దం గా కదిలి, గడ్డి వాము వెనక్కి వెళ్ళాడు.

ఎంతో జాగ్రత్త గా చూస్తే తప్ప అక్కడ ఇద్దరు మనుషులున్న జాడే తెలియదెవరికీ.

అతని కళ్ళు టార్చ్ లైట్లుగా మారాయి.

అలికిడికి ఆ ఇద్దరూ విడివడ్డారు. “ఎవరది..ఎవరది..” అంటూ ఆమె కంగారుగా లేచి ముందుకొచ్చింది. జారిన పైట   గుండెల మీద కప్పుకుంటూ!

అతను గుర్తుపట్టాడు. ఆమే ఈమె అని. ఆ మరుక్షణం లో నిలువునా రౌద్రం కమ్మింది.   కళ్ళు –  నిప్పులు కురుస్తున్నాయి. ఉక్కు మనిషి లా కదిలి  ముందుకొస్తుంటే …ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి.

తన పాపమంతా కళ్ళారా చూసి, ప్రాణం తీయడానికొస్తున్న యముడిలా కనిపిస్తున్నాడు.

పక్కనున్న వాడు ఎప్పుడోనే పలాయించేశాడు.

అతని చేతిలో చావు ఖాయమనుకున్నదో ఏమో, గభాల్న అతని కాళ్ళ మీద పడిపోయింది.   “దయచేసి నన్నేం చేయకండి..మిమ్మల్ని మోసం చేసిన మాట నిజం.. కానీ..నేనిక మీ జోలికి రాను.. నిజం.  సత్తె ప్రమాణం గా చెబుతున్నా…ఈ వూరిడిచి  పోతున్నా… ఈ జన్మలో  నా మొహం చూపించను. ..నన్నొదిలేయండి..నన్నొదిలేయండి..” అంటూ విలవిల్లాడింది.

తప్పు చేస్తూ పట్టుబడ్డ ఏ నేరస్థుడైనా అంతే.  ప్రాణం దక్కితే చాలనుకుంటాడు. నిజం ముందు అబద్ధం  లొంగిపోవడం అంటె ఇదేనేమో.

ఆమెని చూస్తే నే అసహ్యమేసిందతనికి.  ఇంత నీచపు మనిషి మెడలోనా తను తాళి కట్టింది?  “ఛీ”  అంటూ  కాండ్రించి ఉమ్మేసాడు.  అ ఒక్క అక్షరం చాలు.  ఎదుటి వాడు మనిషైతే, అమాంతం ఛావడానికి.

జీవితం లో జరిగే కొన్ని అనూహ్యమైన సంఘటనలు మనసు మీద ఎంత తీవ్ర ప్రభావం చూపుతాయీ అంటె ..కొన్ని సార్లు ఇరవై లొనే అరవై వచ్చేసిందన్నంత అనుభవాన్నిచ్చిపోతాయి. నిండా వైరాగ్యా న్నీ, నిర్లిప్తతని మిగిల్చిపోతాయి.

ఆ రాత్రి ఇంటికెలా  వచ్చాడో  తెలీదు.

“ఏరా, ఇంత వేళప్పుడొచ్చావ్?.. రాత్రికి వుండమని అన్లేదా మరదలు?” అంటూ నవ్వబోయిన చంద్రమతి, వెయ్యిలంఖణాలు పడ్డ తమ్ముడి మొహం చూసి కంగారు పడింది. వెంటనే భుజం మీద   చేయి వేసి,  “ఏ..మైం..ది..రా తమ్ముడూ.. అలా వున్నావు? అంది.

ఆ చిన్ని పలకరింపుకే  అతనొక్క సారి గా కదిలి కదిలి తుఫాను గా మారిపోయాడు.

మోసపోయాక కలిగే దుఖానికి  ఆడ మగా తేడా లుండవు. హృదయం వుండటం లేకపోవటమొకటే వుంటుంది.

సంగతి తెలుసుకున్న చంద్రమతి, తమ్ముణ్ని పసివాడిలా ఒళ్ళోకి తీసుకుంది.

జరిగిన సంఘటనని కొట్టిపారేసింది.  ఏం జరిగినా మంచనుకోమంది. విలువ తక్కువ మనుషులునించి మంచివాళ్ళని  ఆ భగవంతుడే ఇలా వేరు చేసి, వెలుగు మార్గం చూపుతాడని మంచి మాటలతో అతన్ని ఓదార్చింది.

అతను అంత బాధలోనూ –  చంద్రమతి  ధీరత్వానికి ఆశ్చర్యపోయాడు.

ఆడది అబల అంటారు కానీ, కాదు. కీలక సమస్యలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు పురుషుని కంటె కూడా తెలివిగా ఆలోచిస్తుంది.   బలం గా ఢీ కొంటుంది.

తమ్ముణ్ణి అక్కున చేర్చుకుని, అతను చెబుతోంది వింటునే..మరో పక్క తన కర్తవ్య నిర్వహణ గురించి ఆలోచిస్తోంది.  ముందు తను తమ్ముణ్ణి దక్కించుకోవాలి. వాడి గుండెలో గుచ్చుకున్న ముల్లు పెరికిపడేస్తే, అసలు  గాయమైందన్న సంగతే మర్చిపోతాడు. అదొక్కటే ముఖ్యమనుకుంది.

తల్లిలా లాలించి, స్నేహితురాలిలా హితవు పలికి, అతని వెన్నంటే నీడలా నిలిచింది.

ఒక్కోసారి, అతనికి ఈ లోకం అర్ధమయ్యేది కాదు.   తన చుట్టూ వుండే మనుషులూ,  వాళ్ళ మాటలూ – ఏ నిఘంటువు కి   చెందిన అర్ధాలు.. ? అని వెత చెందే వాడు.   కుశలం అడగడానికొచ్చి, కుళ్ళ బెట్టి  పోయేవాళ్ళు. “ ఏరా..బావున్నావా? సంగతి విన్నాను. అట్టెట్టా పెళ్లి చేసుకున్నావు రా? ‘ అంటూ అడిగే వాళ్ళు. aa  మచ్చ ని గుర్తుచేసేవారు.

లోకం అంతే. నువ్వేదైతే మరచిపోవాలనుకుంటున్నావో అదే గుర్తుపెట్టుకుంటుంది.  అలాటి వాళ్ళని నిలువునా దులిపిపారేసేది చంద్రమతి. మళ్ళా నోరెత్తకుండా మాటల్తోనే వాతలు పెట్టి పంపేది.

అక్క  తన మీద చూపే ప్రేమకి కన్నీళ్ళొచ్చేవి.

సముద్రం లో ఈదేవాడికి – ఈత మాత్రమే వస్తే సరిపోదు.  లోతూ తెలిసి వుండాలి. ఈ ప్రపంచంలో మనిషి బ్రతకాలంటే  విద్య ఒక్కటుంటే చాలదు. లోక రీతీ తెలిసి వుండాలి.

త్వరలోనే అతను మామూలు మనిషయ్యాడు.

మనసుకయ్యే గాయాలకు మందు – కాలం అని  అంటారు కాని, అది అబద్ధం. oka మనిషి చేసిన గాయాలను కేవలం మరో మనిషి మాత్రమే మాయం చేయగలడు.. అది ప్రేమ వల్లే సాధ్యమౌతుంది.

ఈ రోజు ఈ వూళ్ళో ఇంత పరువుగా, గౌరవంగా, ఒక ఉన్న త స్థాయిలో వున్నాడూ అంటే అదంతా అక్క చలువే. ఆమె ఇచ్చిన  స్థైర్యమే.

‘అక్క నిజంగా తన పాలిట దేవతే. కాదన్లేని నిజం. కానీ, అందుకు కృతజ్ఞత గా అమ్ముల్ని పెళ్ళి చేసుకోవడం మాత్రం పచ్చి అన్యాయం. కూడని ధర్మం.

మరి ఆమెకెందుకు తట్టడం లేదు ఈ విషయం? ‘ ఆవేదనగా అనుకున్నాడు.

“నా ప్రశ్నకి జవాబు చెప్పావు కాదూ?” అక్క మాటలకి ఉలిక్కిపడి చూశాడు. “అదే, ఆ పోయింది వచ్చి గలాటా చేస్తుందని వెనకాడుతున్నావా, అమ్ముల్ని చేసుకోడానికి?”

అక్క వైపు నిశితం గా చూస్తూ, కాదన్నట్టు తలూపాడు.

“మరి? నీకభ్యంతరమేమిటీ?” నిలదీసింది.

అతనికి ఒళ్ళు మండింది. తింటున్న కంచంలో చేయి కడిగేసుకుని, విస్సురుగా లేచి బయట వరండాలోకొచ్చి నిలబడ్డాడు.

మధ్యాహ్నపు  ఆకాశం నల్ల మబ్బులేసుకుంటూ వుంది. చెట్లన్నీ చలన రహితం గా నిలబడున్నాయి.  ఒక్క ఆకూ  కదలడం లేదు. ఎక్కడా గాలి సడి లేదు.  పొడి పొడి గా..వాతావరణం కూడా అతని మనసు లా ఉక్కబోతగా వుంది.

తమ్ముడి ప్రవర్తన ఏ మాత్రం బొధపడటం లేదు చంద్రమతికి. అయినా, పట్టు వదలని దాన్లా  అతని వెనకే వచ్చి నిలబడింది. చిన్నగా గొంతు సవరించుకుని మాట్లాడ సాగింది.

“తమ్ముడూ…నీకు నా గురించి తెలీందేముందిరా?  పెళ్లైన కాడ్నించి   నేనే మాత్రం సుఖపడ్డానంటావ్, చెప్పు.” అంది తాను చెప్పదలచుకున్న విష యానికి  ఉపోద్ఘాతం లా.

ఆమె మాటలు అక్షర నిజాలు.    గొప్పింటి వాడని, పిల్ల సుఖపడుతుందని చక్రపాణి కిచ్చి పెళ్ళి చేసారు.    కానీ మోసపోయారు. పట్నంలో బిజినెసు, కాలేజి చదువు అన్నీ అబధ్ధాలు. గొప్పలకు పోవడం. అప్పులు చేయడం. జల్సాగా తిరగడం అతని నైజం.  కాదంటే తిడతాడు. కొడతాడు. చివరికి  తేలిన నిజాలివి.

మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది. విలువైనది.  పవిత్రమైనది.  అందుకే చావైనా, రేవైనా అక్కడే. తేల్చుకోవాలంటుంది. తప్పదు. తప్పేదీ లేదు. అయినా, ఆడపిల్ల అత్తారింట్లో బలవంతపు చావు చస్తే కన్నవారికి కలిగే శోకం ..మొగుణ్ని వదిలి పుట్టింట్లో వుంటానన్నపుడు  రాదు. ఫలితం గా ఏ ఆడపిల్లకైనా –  పెళ్ళంటే నూరేళ్ళ పంట కాదు మంట గా మారుతుంది.

సరిగ్గా చంద్రమతి పరిస్థితీ అంతే.

అప్పటికే అమ్ములు కడుపులో పడింది. బిడ్డ పుట్టాకైనా అతను బాధ్యత తెలుసుకుంటాడని ఆశపడ్డారు. మారక పోగా, మరిన్ని వ్యసనాలొచ్చి చేరాయి.    చీడ పురుగు ఒక్క చెట్టుని మాత్రమే పట్టి వదిలేయ దు.  వనమంతా చెరుస్తుందట. చెడ్డలవాటైనా అంతే. ఒకటంటించుకుంటే పది  ఉచితంగా అంటుకుంటాయి.

ఇదంతా శ్రీకాంత్ కి తెలిసిన సంగతే. మళ్ళా గుర్తుచేస్తోంది.

“వున్నదంతా చీట్ల పేకలో తగలేశాడు. తగులూమిగులూ తాగితే తాగనీ అని సరిపెట్టుకున్నా…  చూస్తున్నావ్ కదా! బాగోతం.  చివరి వీధిలో ఎవత్తినో వుంచుకుని.. తందనాలాడుతున్న ..”  ఆమె గొంతు జీరబోయింది.

అతను వింటూండిపోయాడు.

” నాన్న ఇచ్చిన ఈ ఇల్లూ,  నీ చేతిలో పొలం, నాకింకా మిగిలున్నాయీ అంటే అది  నీ బావ   చూపు పడక కాదు. నీ నీడలో నేనుండటబట్టీ అవి ఆగాయి. నువ్వంటే భయం వల్ల నిలిచాయి.

తమ్ముడూ!

కట్టుకున్నోడు  చస్తేనే ఆడది ఒంటరి దవ్వదు. ఇలాటి ఎదవ మొగుళ్ళు  బ్రతికి చచ్చినా ,  ఆమె ఒంటరి పక్షే అవుతుంది. దిక్కులేని అనాధ గా బ్రతుకీడుస్తుంది. ఈ నిరాశ భరించలేక ఎన్నో సార్లు చచ్చిపోవాలని ప్రయత్నించా.   కానీ నీ మీద ప్రేమ, నువ్వు అమ్ములు మీద చూపే ఆప్యాయతకి  నేను బందీ అయి బ్రతికాను రా!..అవును!  మీ ఇద్దర్ని రెండు కళ్ళు గా చూసుకుని బ్రతికాను.” ఆమెకి కన్నీళ్ళాగలేదు.

రాతి బండలో  నీళ్ళుంటాయట. రాయిలా కనిపించినంత మాత్రాన మనిషి లో కన్నీళ్ళెక్కడికి పోతాయి?

అతని మనసు మూల్గింది.

“ఇప్పుడు నాకున్న ఆశా దీపం అమ్ములొక్కటే. నీ పిలుపులో అది బంగారం. అంత బంగారాన్ని ముక్కూ మొహం తెలీని వాడి చేతికెలా అప్పచెప్పమంటావ్?   దాని తండ్రి ఏమంత ఘనుడని పరువు గలవాడొస్తాడంటావ్?

తమ్ముడూ! నీకు ఆస్తి వుందని అడగడం లేదు రా . నీ గుండెలో అమ్ములుందని అడుగుతున్నా. తన కూతుర్నికంటికి రెప్పలా కాచే వాడు  అల్లుడుగా రావాలని  ప్రతి ఆడపిల్లతల్లీ  కోరుకున్నట్టే…నేనూ నిన్ను అల్లుడిగా చేసుకోవాలని ఆశ పడుతున్నాను.  నీ చిటికిన వేలి సాయంతో అమ్ములు జీవితాంతమూ సుఖ శాంతులతో బ్రతుకుతుందనే గొప్ప నమ్మకంతో అడుగుతున్నాను. తమ్ముడూ!  అమ్ముల్నిపెళ్ళి చేసుకోవూ?”  –  ఆర్ద్రం గా అడిగింది.

అదిగో! మళ్ళీ అదే మాట?.. చివ్వున ఇటు తిరిగి, అక్క కళ్ళల్లోకి  చూస్తూ, బాధ గా చెప్పాడు.

“లేదక్కా, చేసుకోను.”

“చేసుకోవూ? ” రెట్టించింది.

“ఊహు. చేసుకోను. అసలు ఈ మాట అడ గడానికి నీకు నోరెలా వచ్చింది అక్కా?” ఆవేశపడుతున్న తమ్ముడి వైపు ప్రశ్నార్ధకం గా చూస్తోంది చంద్రమతి.

మళ్ళీ అతనే అన్నాడు.  ” అమ్ములు బంగారు తల్లి.  నా ప్రాణం. నా ప్రా..ణం కంటే కూడా ఎక్కువ .‘  పట్టలేని ప్రేమోద్వేగం  పొంగి, పొర్లి   గొంతు లో మాటను అడ్డుకుంది. కళ్ళల్లో కన్నీరై ఉబికింది.

ఎంత ప్రేమ! అదే.. సరిగ్గా అతన్లోని ఆ ప్రేమే తన బిడ్డకి సొంతం కావాలని, చంద్రమతి  ఆశపడుతోంది.  తన కూతురికి ఆ సిరి దక్కాలనే ఇంతగా ఆత్రపడిపోతోంది.

మనమనుకుంటాం, రోజులు మారాయి..మారాయని.   కానీ, కాలం ఎంత మారినా, యుగాలు ఎన్నొచ్చినా.. ఎప్పటికీ  స్త్రీ   సౌభాగ్యం maatram-  పెనిమిటే. అతని ప్రేమే ఇల్లాలికి సుఖ సౌధం. స్వర్గ తుల్యం. ఆ విలువేమిటో, ఆ వరమేమిటో  దొరికిన వాళ్ళ కంటేనూ, దక్కని  అభాగ్యులకే  బాగా అర్ధమౌతుంది.

అందుకే చంద్రమతి తొందరపడుతోంది. ఎలాగైనా తమ్ముణ్ని ఈ పెళ్ళికి ఒప్పించాలని. కానీ, చేసుకోనంటున్నాడు. ఎందుకూ?

“పోనీ నీ అభ్యంతరమేమిటో చెప్పు.” సీరియస్ గా అడుగుతున్న అక్క వైపు కోపం గా చూస్తూ…”నిజంగా నీకు తెలీదా?” అన్నాడు మరింత కోపంగా.

“నిజంగా ఏం ఖర్మ. అబధ్ధం గా కూడా తెలీదు. నువ్వు చెప్పు.” అంది వింతపోతూ.

“అక్కా, ఇది పరిహాసాలకి సమయం కాదు. నాకూ, అమ్ములుకి మధ్య ఎంత వయసు తేడా వుందో నీకు తెలీదా? ఒకటి కాదు రెండు కాదు.” ముఖమంతా ఎర్ర గా చేసుకుంటున్న తమ్ముడి వాలకం చూసి  ఫక్కుమంటూ బిగ్గరగా  నవ్వింది. – ఓస్..ఇదా నీ మనసులో వున్నదీ అనే అర్ధం ధ్వనించేలా నవ్వింది.

నీ మొహం. అమాయకుడ్లా మాట్లాడకు. వయసు తేడానా?  ఏమంత తేడా అనీ? నాకూ మీ బావకీ పదేళ్ళ  తేడా లేదూ?”

“హు. అందుకేగా మీ ఇద్దరి ఆంతర్యాల మధ్య అంత దూరం!’  బాధగా తలపట్టుకున్నాడు.

“అసలు అమ్మకీ నాన్నకి మధ్య ఎంత తేడా వుందో తెలుసా?”

‘తెలుసు. ఇరవై యేళ్ళ తేడా..ఆవిడకి ఊహ వచ్చేసరికి ఈయన వూరు  దాటుకు పోయాడు. తనని కట్టుకుంటే రేపు అమ్ములు జీవితం కూడా అంతె కాదూ?’ వీల్లేదు..వీల్లేదు..ఊహలో సైతం ఊహించడానికి అతని మనసొప్పుకోవడం లేదు. ఇక నిజ జీవితం లోకి అమ్ముల్నెలా  ఆహ్వానిస్తాడని?

“అంత వరకెందుకు, మన సుబ్బులు ..” చెప్పబోతున్న అక్క మాటలకి బ్రేక్ వేస్తూ ‘ఇక ఆపు’ అంటూ చేత్తో సైగ చేసాడు.  – “నువ్వెన్ని చెప్పు. నేను అమ్ముల్ని చేసుకునే ప్రశ్నే లేదు. ఇక ఇక్కడితో ఈ విషయాన్ని ఆపేద్దాం.” అంటూ మరో మాటకి తావీకుండా, తేల్చి చెప్పేశాడు.

తమ్ముడు అంత ఖచ్చితం గా ఖరా ఖండిగా వొద్దనేస్తాడని ఏ మాత్రం ఊహించని చంద్రమతి కి ముందు అవమానమేసింది. ఆ తర్వాత కోపం ముంచుకొచ్చింది. అది ఆగ్రహం  గా మారింది. ఇదంతా ఒక్క క్షణం లోనే! మరు క్షణం లో  ఆమె కాళికావతారమెత్తిపోయింది.  ఉఛ్వాస నిశ్వాసలు పాము బుసల్ని తలపిస్తున్నాయి.

“నాకు తెలుసురా. నీ మనసులో ఏముందో   నన్నడుగు చెబుతా.  నేనింత గా ప్రాధేయ పడుతున్నా నువ్వొద్దంటున్నావంటే నేను నీకు   సొంత  తోబుట్టువుని  కాదు కాబట్టే గా?   హు. ఎప్పటికైనా సవితి తమ్ముడు సవితి తమ్ముడే అని నిరూపించావ్…మా మీద ప్రేమ నటించి..ఈ రోజు మనసులోని విషం కక్కావ్. బుధ్ధొచ్చింది. నిన్ను నా రక్త సంబంధం అనుకున్నాను చూడు..అది..అదే నేను చేసిన పాపం. ”

అక్క మాటలు తూటాల్లా పేల్తున్నాయి.   గురి పెట్టి వదిలిన తుపాకీ గుండు సూటిగా  గుండెల్లోకి దిగబడిపోయినట్టు… ప్రాణాలు విలవిలా కొట్టుకుంటున్నాయి.   ‘ఎంత మాటంది అక్క? అసలు తనకు గుర్తు అయినా లేదే..ఆమె తన సొంత అక్క కాదని.. తండ్రి మొదటి భార్య  సంతానమని, ఆమ్మ కూతురని ఎప్పుడైనా..అనుకున్నాడా? అసలు  తన నీడైనా తలచిందా ఆ మాట?

“అలా మాట్లాడకు అక్కా..ప్లీజ్…” అతనికి   దుఃఖం మేస్తోంది. ప్రాధేయపూర్వకంగా ఆమె చేతులు పట్టుకోబోయాడు.

విసిరి కొట్టింది.  ఎర్రబడ్డ కళ్ళతో మనిషి మొత్తం – పోటెత్తిన సముద్రం లా ఊగిపోతోంది.

“ఒరేయి..నువ్వొద్దన్నంత మాత్రాన అమ్ములు పెళ్ళి ఆగిపోతుందనుకోకు.  చూడూ! అమ్ములు పెళ్ళి నేను చేస్తా. నీ కళ్ళముందే, నీ కంటె గొప్పోణ్ణి తీసుకొచ్చి చేస్తా. వారం లో.. ఒక్క వారం లో దాని పెళ్ళి చేసి,  అత్తారింటికి పంపక పోతె లేదూ? నేను చంద్రమతినే కాదు. “ అంటూ చిటికేసి చాలెంజ్ చేసింది. పక్కనున్న  కుర్చీ ఎత్తి, నేలమీద విసిరేసింది. ఆ వెనకే  పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ, గడప దాటింది. ఏదో గుర్తుకొచ్చిన దాన్లా వెనక్కి తిరిగి అరిచింది. ‘ఒరేయి, శ్రీకాంతూ!  ఇక ఈ జన్మలో నీ మొహం చూడను. నే బ్రతికుండంగా నీ గుమ్మం తొక్కను.  నువూ అంతే. నా వైపు చూసినా, నా బిడ్డతో   మాట్లాడినా.. అమ్ములు చచ్చినంత ఒట్టు. అంతే. నీకు నాకు ఈ క్షణంతో  సంబంధం  తె..గి..పో..యిం..ది. అంతే. అంతే “ అంటూ వేగంగా  వెళ్ళిపోయింది.

స్థాణువైపోయాడు. మెదడు మొద్దుబారిన మనిషిలా..  వున్నవాడు వున్నచోట్నే కూలబడి పోయాడు.

తమ శరీరాలు రెండు. ఆత్మ ఒక్కటే అనుకున్న అక్క …ఇదేవిటీ, ఇట్టా… అతను తెల్ల బోతున్నాడు.

ఒకరికొకరం అంతా అర్ధమైపోయామనుకోడం చాలా పొరబాటుతనం. మన సొంత వారి మనసులో- మన మేమిటో మన స్థానమేమిటో తెలియాలంటే వాళ్ళు ఆత్మీయం గా వున్నప్పుడు కాదు, ఆగ్రహం వచ్చినప్పుడు తెలుస్తుంది. కడుపులో దాచిన అసలు నిజాల్ని కక్కేస్తూ మాట్లాడే మాటల్లో మనల్ని మనం చూస్తాం. అసల్ది  తెలుసుకుంటాం.

అక్క తనని అర్ధం చేసుకుంది ఇంతేనా!.. అతన్ని చంపేయడానికి ఆమె కత్తి తీసుకున్నా అంత గా ఖిన్నుడయ్యేవాడు కాదేమో!

సోదరి  వ్యక్తిత్వం ఏమిటో అతనికి బాగా తెలుసు. ఆమె ఎంత మంచిదో అంత చెడ్డ తిక్కది. పరమ కోపిష్టిది. మాటంటే మాటే. దిగి రాదు గాక రాదు.  తను ప్రస్తుతం అక్క  శాపానికి గురైనాడని తెలుసు. ప్రేమకి మారుపేరయిన అక్కకి తను దూరమైపోయాడనీ తెలుస్తోంది. అయినా సరే. అతడు తన నిర్ణయాన్ని మార్చుకోదల్చుకోలేదు. అమ్ముల్ని పెళ్ళి చేసుకోవడం అంటే…తెలిసీ తెలిసీ ఆ అమాయకురాలికి అన్యాయం చేయడమే అవుతుంది.  అంత ద్రోహం తను చేయలేడు.

కానీ, అక్క వైపు చూడకుండా, ప్రాణానికి ప్రాణమైన  అమ్ముల్తో  మాట్లాడకుండా ఎలా వుండటం?

ఏమో! ఏమీ తోచనట్టు గా వుందతనికి.  దిక్కు తోచని వాడిలా చూస్తుండిపోయాడు.

*****

అనుకున్నట్టు గానే చంద్రమతి – అమ్ములు కి  పెళ్ళి సంబంధం ఖాయం చేసేసింది. ఈ శుభ వార్త వూరంతా గుప్పుమంది.

కనీసం మాట మాత్రం గా నైనా చెప్పలేదతనికి.

ఇరవై నాలుగ్గంటలూ ‘మావయ్యా మావయ్యా’ అంటూ వెనకెనకే  తిరిగే అమ్ములు కంటికి కనిపించనైనా కనిపించడం మానేసింది.  ఇద్దరిళ్ళకీ మధ్య వున్న ఆ చిన్న పిట్ట గోడ ఇప్పుడు ఇనప కోటగా మారడం విధి విచిత్రం. ఎంతైనా విషాదం.    ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకీ ..ఈ గడపలోంచి ఆ గడపలోకి చీమల్లా వెళ్ళొస్తుండే మనుషులు ఇప్పుడు బందీలైన ఖైదీలకు మల్లే అయిపోయారు.

మనిషికీ మనిషికీ మధ్య మనసు లేనప్పుడు..ఒకరి పట్ల మరొకరికి అభిమానాలు  అంతరించిపోయినప్పుడు ఈ జీవులు  – ఎవరికి ఎవరైనా ఏమౌతారని? – ఉత్తి శిలలు  కాకుంటే?

అమ్ముల్ని పెళ్ళి కూతుర్ని చేసారు. హోరున పెళ్ళి మేళాలు మోగుతున్నాయి.

ఇంట్లో కూర్చున్న అతన్ని  ‘మేన మామవి, పెళ్ళి బుట్ట పట్టాలి రా!’అంటూ లాక్కొచ్చారు బంధువులు.   చంద్రమతి తమ్ముడి వైపు  వైపు చూడ్నైనా  చూళ్ళేదు.   అమ్ములు   – వంచిన తల ఎత్తనూ లేదు.

కానీ…పెళ్ళి కూతురి అలంకరణ లో కుందనం బొమ్మలా మెరిసిపోతోంది.  అతని ముఖం వెలిగిపోయింది. అంతలోనే ఆరిపోయింది. ‘మనసు  చీకటౌతోందెందుకనీ?..అమ్ములు –  పెళ్లై వెళ్లిపోతున్నందుకేమో!’ కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి.

పీటల దగ్గర  – తెర కవతల  కూర్చున్న వాని  వైపు చూడబుధ్ధైనా కాలేదతనికి.

విరక్తిగా  వెనక్కొచ్చి ..తలుపులు బిగించి సోఫాలో కూలబడిపోయాడు.

అమ్ములు పెళ్ళై వెళ్ళిపోతోందా?..ఇంక ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోతోందా?

‘ఈ చేతుల్లో  పెరిగిన అమ్ములు..గుండెల మీద నిద్రపోయిన అమ్ములు…ఈ ఇల్లంతా తనదే అన్నట్టు తిరగాడిన అమ్ములు..పెళ్ళై వెళ్ళిపోతోందా?

నిన్న జరిగింది గుర్తుకొస్తోందతనకి.

..తల్లికి తెలీకుండా   చాటుగా వచ్చింది. చూసి ఉలిక్కిపడ్డాడు. కాదు. సంబర పడ్డాడు. నిలువెత్తు పండగై పోయాడు.

వచ్చి, ఎదురుగా తలొంచుకు నించుంది. మౌనంగా.

‘అమ్ములు నోరు విప్పి ఏమన్నా మాట్లాడితే బావుణ్ననిపించింది. కానీ, ఏమంటుది. పసిది! తనకు ఆమెకూ మధ్యనున్న  అనుబంధానికి పేరేమిటో, ఇంత వయసొచ్చిన తనే  సరిగా నిర్వచించలేకపోతున్నాడు.  ఇక ఆ పసిది, ఏమని వివరణలిస్తుందనీ? ‘ అతడింకా ఆలోచనల్లోంచి తేరుకోకముందే,  గభాల్న అతని పాదాల మీద వొంగింది…ఆ లేత చేతుల స్పర్శ కంటే ముందుగా  వెచ్చటి కనీళ్ళొచ్చి పడ్డాయి. “అమ్ములూ..’  ఆమె రెండు భుజాలు పట్టి పైకి లేపాడు.

‘మావయ్యా..అమ్మ..అ మ్మ..” వెక్కుతోంది.

“పిచ్చి పిల్లా! అమ్మ గురించేనా నీ బెంగ. నేను చూసుకుంటాను రా..నువ్వేం భయపడకు. ..” ఇంకేదో చెప్పబోయాడు. అమ్ముల్ని రెండు చేతుల్లోకి తీసుకుని ఓదార్చాలనిపించింది. గుండెలకు హత్తుకుని, అసలు ..ఏమిటేవిటో చెప్పాలనుంది.. కానీ ఒక్క మాటా  రావడం  లేదు.

‘అమ్ములూ’ అక్క కేక వినిపించడం తో… ‘అమ్మో..అమ్మ!’ అంటూ   వెనక గుమ్మం వైపు పరుగు తీసింది.

అమ్ములు ఎందుకొచ్చింది? ఆ కన్నీళ్ళ భాష కి భాష్య మేమిటీ?  అర్ధమైతే బావుణ్ణు కదూ?

అదిగో! మాంగల్య ధారణ జరిగిపోతోంది. ఒక్కసారిగా బాజాలు మారుమోగిపోతున్నాయి.  గట్టిగా చెవులు మూసుకున్నాడు. విన్లేనివాడిలా.

సూది మొనలా మొదలైన ఒక శూన్యం అంతులేని ఆకాశమై అతన్ని మింగేస్తోంది.   శరీరం నించి జీవాన్ని బలం గా   లాక్కుని పోతున్నప్పుడు కలిగే నరక బాధ ఎలా వుంటుందో ప్రత్యక్షంగా   అనుభవిస్తున్నాడు.

ఇలా ఎందుకౌతోందనేది,  అతనికింకా అర్ధం కావడం లేదు కానీ, ప్రేమంటే అంతేగా! –  దూరాన్ని సహించలేకపోవడం. బాధని ఓపలేని వాడైపోయాడు. కొత్తగా అలవాటు చేసుకున్న ఆల్కహాల్ ని తనివిదీరా తాగి..తాగి..గాఢ నిద్రలోకెళ్ళిపోయాడు.

****

‘శ్రీకాంత్..ఒరేయ్ శ్రీకాంత్..’ తలుపులు పగిలిపోయేలా బాదుతున్నారు.

“ ఊ..ఎవరది?” – మత్తులోనే నత్తి నత్తిగా ఉరిమాడు.

“శ్రీకాంతు. లేవరా. కొంప మునిగింది. పెళ్ళి బస్ కి యాక్సిడెంటైందట్రా..” రావుడు మావయ్య గొంతు వొణుకుతోంది.

వినంగానే,  పక్కలో పిడుగు పడ్డట్టు   ఒక్క ఉదుట్న కదిలి ..తలుపు తీసాడు. “ఇంటి ముందు గుంపు గా జనం. కలకలం గా మాట్లాడుకుంటున్నారు.

“పెళ్ళి బస్సు కి ఆక్సిడెంటైంది… అమ్ములు సంగతి తెలీడం లేదు..” వార్త వింటూనే…కంపించిపోయాడు. మరు క్షణంలో గాలి కంటే వేగం గా కదిలాడు. రెండు నిమిషాల్లో కారు బయల్దేరింది.  శర వేగంతో దూసుకుపోతోంది.

“ ఒరేయి..పెళ్ళికొడుకు పోయాడట్రా…తెలీంగానే మీ అక్క తెలివితప్పి పడిపోయింది…” మావయ్య మాటలు  వినిపిస్తున్నా అతన్లో ఎలాటి మార్పూ లేదు. కంటి రెప్ప కదల్లేదు. కనుబొమ ముడుచుకోనూలేదు.

ఆ క్షణం లో అతనెంత   రాయిలా కనిపిస్తున్నాడంటె..అతన్ని  చలింపచేసే విషయమేదీ ఈ ప్రపంచంలో లేదన్నంత గంభీరం గా వున్నాడు. భయంకరమైన గంభీరం గా వున్నాడు.

కారు చక్రాలు భూమికి  ఆనడం  లేదు. వాహనం గాల్లో తేలుతోందా   అనేంత  వేగం గా డ్రైవ్ చేస్తున్నాడు.

హుటాహుటిన  ప్రమాద స్థలానికి  చేరారు.

అక్కడి బీభత్స దృశ్యాలు చూసి అందరూ.. కళ్ళు మూసుకున్నారు. రోదనలు..శోకాలు..కెవ్వుకెవ్వు కేకలు..రక్తపు మడుగులు ..చెల్లా చెదురుగా పడున్న నిర్జీవ శరీరాలు..అతనికివేమీ కనిపించడం లేదు. అతని కళ్ళు వేగంగా.. అతి వేగం గా కదులుతున్నాయి..’అమ్ములు…అమ్ములు…అమ్ములు…’ఒరేయ్! కనిపించరా…ఈ మావయ్యకొక్కసారి కనిపించరా అమ్ములు.  లోలోన రోదిస్తున్నాడు.

అదిగో..అక్కడ ..దూరంగా..ఆ ముళ్ల కంప పక్కన..బొర్లా పడి..నేలనతుక్కుపోయిన శరీరం. రక్తం తో తడిసిన పూలజడ…చూడంగానే..గుండె కి అప్పుడొచ్చింది స్పర్శ. “అమ్ములూ…’ భూమి దద్దరిల్లేలా కేక పెట్టాడు.

అసుపత్రి కి తరలించే ఏర్పాట్లు వెంటవెంటనే.. చక చకా  జరిగిపోయాయి.

*****

అప్పటికి మూడు నెలలైంది ఆ సంఘటన జరిగి. ఘోర ప్రమాదం నించి అమ్ములు బ్రతకడం ఒక మిరాకిల్ అన్నారు డాక్టర్లు.   అతని శ్వాస ఆమెకి తిరిగి ఆయువు పోసిందేమో! అతని స్పర్శ ఆమెలో చలనాన్ని కలిగించిందేమో. తెలీదు. అమ్ములు  మామూలు మనిషైంది.

ఆసుపత్రి నించి ఇంటికి తీసుకొచ్చేసారు.   బాగా కోలుకుని, ఇప్పుడు కాలేజ్ కి కూడా వెళ్తోంది.

ఎటొచ్చీ..చంద్రమతే..తమ్ముడి కి మొహం చూపించలేకపోతోంది.

కూతురికి ఇష్టం లేకపోయినా పంతం కొద్దీ పెళ్ళి చేసింది. తమ్ముని నిజమైన ప్రేమని దూషించింది. అవమానించింది.   ఏమైంది చివరికి?

సమయానికి వాడే గనక ఆదుకోకుంటే..అమ్ములు తనకు దక్కేదా?

కళ్ళ నీళ్ళు తుడుచుకుంటున్న అక్క వైపు చూసాడు. ఎలాటి మనిషి ఎలా అయిపోయిందీ!   ఆడ పులిలా వుండేది.  ఇప్పుడేమో..పిచ్చుకలా అయిపోయింది. ఆ ఠీవీ, హుందాతనమెక్కడికి పారిపోయాయో. చెప్పలేని దైన్యం గా  ..దిగులుగా వుంటున్న అక్కని చూడలేకపోతున్నాడు.

“తమ్ముడూ!” పిలిచింది.  ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందని గ్రహించి “చెప్పక్కా..” అన్నాడు.

“అమ్ముల్ని తీసుకుని పట్నం వెళ్ళిపోదామనుకుంటున్నానురా..”  తలొంచుకుని చెప్పింది.

అక్క మనోగతం  అర్ధమైంది అతనికి. లోక నిందకి భయపడి వెళ్ళిపోతానంటోంది. కాదు తన నించి పారిపోతానంటోంది.

లేదు. అలా జరగకూడదు. అందుకే బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అక్కా, అమ్ములు తనకు దూరం కాకుండా వుండాలంటే.. దగ్గరయ్యే మార్గం ఒకటే.

అమ్ముల్ని పెళ్ళి చేసుకోవడం.

హు!తనని పెళ్ళి చేసుకుంటే అమ్ములు కలకాలం పసుపు కుంకాలతో సువాసినిలా వర్ధిల్లదని..అపోహ పడ్డాడు. కానీ ఏం జరిగింది? తన వల్ల ఆమెకి అన్యాయం జరుగుతుందనుకున్నాడే కానీ మరొకరి వల్ల జరగదన్న గారంటీ లేదని ఆ దేవుడు నిరూపించలేదూ? అంతా ఆ పై వాని లీల.

కాకపోతే?- అమ్ముల్ని ఎలా బ్రతికిస్తాడు? తిరిగి దక్కింది అంటే, శాశ్వతం గా  దక్కించుకోడానికే అని అతనికి బలం గా అనిపిస్తోంది. ఇది ఆ దైవాజ్ఞ గా శిరసావహించదలచుకున్నాడు.  అందుకే ధైర్యంగా చంద్రమతిని అడిగాడు. “అక్కా, నీ దీవెన్లతో అమ్ముల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను..ఏమంటావ్?” అని.

వింటొంది తనేనా? అంటోందీ తమ్ముడేనా  అన్నంత ఆశ్చర్యానందాలతో  పట్టలెని ఉద్వేగంతో తమ్ముణ్ణి కౌగిలించుకుని ఏడ్చేసింది.  ‘ఒరేయి నువ్వు దేవుడివిరా..దేవుడివి…’ మరింత గా వెక్కెక్కి పడుతూ చెప్పింది.

చంద్రమతి ని ఓదారుస్తున్న శ్రీకాంత్ కి – అమ్ములు మాటలు మరో సారి మననంలోకొచ్చాయి.

ఆసుపత్రి నించి డిస్చార్జ్ అయి వచ్చేస్తుంటే… అమ్ములు అతని చేయందుకుని అన్న మాటలు.

‘మావయ్యా..నేను అమ్మ దగ్గరకి వెళ్ళను. నీ దగ్గరే వుంటాను. ఎప్పుడూ.. ఎప్పుడూ నీ దగ్గరే వుండాలనుంది మావయ్యా…’ అంటూ గుండెల్లో ముఖం దాచుకున్న అమ్ములు..గుర్తొచ్చి..హాయిగా నవ్వుకున్నాడు.

****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

యంత్రంలోని మనిషితనం వాల్-ఇ

భవాని ఫణి

bhavani-phani.నడిచే అవసరం లేకుడా జీవితాంతం కేవలం పడక కుర్చీల్లో ప్రయాణించగలిగే అవకాశం కలిగితే ? దంతధావనం కూడా యంత్రాలు చేసిపెట్టే సదుపాయం ఉంటే ? ఒక బటన్ నొక్కగానే శరీరంపైనే దుస్తుల రంగు మారిపోయే సౌకర్యం ఏర్పడితే ? అటువంటప్పుడు మానవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని అనుకుంటే వాల్ -ఇ తప్పనిసరిగా చూడాల్సిందే .

సాధారణ చలనచిత్రాలతో పోలిస్తే యానిమేటెడ్ చలనచిత్రాల నిర్మాణానికి అయ్యే ఖర్చు, శ్రమ రెండూ ఎక్కువే . కానీ ఆ చిత్రాలతో చెయ్యగలిగే చమత్కారాల పరిధి చాలా విస్తృతమైనది . చాలా మటుకు యానిమేటెడ్ చలనచిత్రాల్లో తొణికిసలాడే జీవకళ , సహజత్వం, మానవీయతా విలువలని గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది . అలా  ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం వాల్-ఇ (Wall -E ). ఇది కేవలం పిల్లలు చూడదగ్గ చిత్రమని భావిస్తే అది ఖచ్చితంగా పొరపాటే . ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన ఇంటర్ స్టెల్లార్ చిత్ర దర్శకుడు నోలాన్, 2008లో విడుదలైన ఈ చలన చిత్రాన్ని చూసి ప్రేరణ పొందాడంటే దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు . అవును . వాల్ -ఇ కూడా సైన్స్ ఫిక్షనే. నిజానికి వాల్ -ఇ చిత్రమే ఇంటర్ స్టెల్లార్ కంటే ఎక్కువ భావోద్వేగాన్ని కలిగిస్తుందని చెబితే అతిశయోక్తి కాదు .
ఈ చలన చిత్రం గొప్పతనం ఏమిటంటే మన భూమి ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సమస్యల గురించి , సరళంగా ఆలోచనాత్మకంగా చర్చించడం . వాటిలో ముఖ్యమైనవి రెండు అంశాలు.
1. మనం తయారుచేస్తున్న చెత్త ,మన భూమిపై మనకే స్థానాన్ని మిగల్చదని తెలపడం
2. శరీర భాగాలకి బదులుగా యంత్రాలని వాడితే మానవ జీవ పరిణామక్రమంలో చోటు చేసుకునే మార్పులని ఊహించడం
అంతే కాకుండా ఇది, భూమిపై మనుషులు వదిలి వెళ్ళిన ప్రేమ భావాన్ని ఆకళింపు చేసుకుని వంటబట్టించుకున్న ఒక రోబోట్ కథ కూడా . దర్శకుడు ఆండ్రూ స్టాన్టన్ ,ఈ చలనచిత్ర నేపధ్యాన్ని ‘నిర్హేతుకమైన ప్రేమ, జీవితపు అనుసరణీయతని ఓటమి పాలు చేయగలదని చూపడంగా’ అభివర్ణించాడు.(irrational love defeats life’s programming)
ఇంకా ఈ చలన చిత్రంలో నాస్టాల్జియా(స్వదేశంపై గల వ్యామోహం), మానవ జాతి మనుగడకు వాటిల్లబోయే ముప్పు, కార్పొరేట్ వ్యవస్థ కలిగించే మార్పులు వంటి అంశాలెన్నో అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి .

చిత్ర కథ విషయానికి వస్తే  గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కారణంగా భూమి నివాసానికి అననుకూలంగా మారిపోవడంతో , మనుషులంతా భూమిని వదిలిపెట్టి ఒక అంతరిక్ష నౌక యాగ్జియం(axiom )లో నివసించేందుకు వెళ్ళిపోతారు  . ఇది జరిగిన ఏడువందల సంవత్సరాల తర్వాత కథ మొదలవుతుంది . శుభ్రం చేసే పనిలో భాగంగా భూమి మీద మనుషులు వదిలి పెట్టిన మర యంత్రాలు వాల్-ఇ లు(Wall -E : Waste Allocation Load Lifter –Earth-Class)  . కొన్ని సంవత్సరాల తర్వాత భూమిని శుభ్రపరచడం అసాధ్యంగా భావించి మనుషులు వాటిని కూడా నిలిపివేస్తారు . కానీ ఒకే ఒక వాల్-ఇ మాత్రం ఇన్ని సంవత్సరాల నుండీ భూమిని శుభ్రం చేస్తూ , తనని తానే మరమ్మత్తు చేసుకుంటూ , మానవులు వదిలి వెళ్ళిన చెత్త నుండి తనకి నచ్చిన వస్తువులని భద్ర పరుచుకుంటూ ఒంటరిగా జీవిస్తూ (?) ఉంటుంది . భూమి మొత్తానికి దానికి తోడుగా ఉన్నది అతి మొండి ప్రాణిగా పేరుపడిన ఒక బొద్దింక మాత్రమే.

తన పొట్టలోకి చెత్తని వేసుకుని దీర్ఘ ఘనాలుగా నొక్కి వాటిని ఒక దానిపై ఒకటి పేర్చుకుంటూ పోవడం దాని పని . కేవలం చెత్తని ఒక క్రమంలో అమర్చడం కోసం తయారు చేసిన అతి ప్రాథమికమైన రోబోట్ అది . అలా అది అక్కడా ఇక్కడా తిరుగుతుండగా  దానికి ఒక మొక్క కనిపిస్తుంది . భూమిపై పచ్చదనం అంతరించిపోయి చాలా సంవత్సరాలు కావడంతో ఆ మొక్క వాల్-ఇ దృష్టిని ఆకర్షిస్తుంది . దాన్నికూడా తన సేకరణలతో పాటుగా భద్రపరుస్తుంది  .

అండాకారంలో ఉండే తెల్లని అత్యాధునికమైన మరో రకమైన రోబోట్లు ఈవ్(EVE: Extra-Terrestrial Vegetation Evaluator)లు . వాటి పని భూమిపై పచ్చదనాన్ని వెతకడం. ఒకవేళ ఎప్పటికైనా భూమిపై మళ్ళీ మొక్కలు  మొలవడం మొదలైతే , భూమి మళ్ళీ నివాసయోగ్యంగా మారతుందని , అప్పుడు అంతరిక్షాన్ని వదిలి మనుషులు భూమిపై నివసించవచ్చన్న ఆలోచనతో తయారుచేయబడినవి ఈవ్ లు.  అటువంటి ఒక ఈవ్ రోబోట్, అంతరిక్ష నౌకనుండి భూమి పైకి వచ్చినప్పుడు దానికి వాల్-ఇ తో పరిచయం ఏర్పడుతుంది . వాల్-ఇ ,ఈవ్ ని ఇష్టపడుతుంది (పడతాడు) . కానీ తన కర్తవ్య నిర్వహణ నిమిత్తం మొక్కని తీసుకుని ఈవ్ అంతరిక్ష నౌకకి వెళ్ళిపోతుంది .  ఈవ్ కోసం వాల్-ఇ కూడా యాగ్జియంకి చేరుకుంటాడు . ఈవ్ ని కలుసుకుని  భూమి మీదకి తీసుకురావాలని  ప్రయత్నిస్తాడు . ఆ క్రమంలో అనేక అవాంతరాలని ఎదుర్కొని, ఈవ్ తో పాటుగా మనుషుల్ని కూడా తిరిగి భూమికి ఎలా చేరుస్తాడన్నది కథాంశం .

ఈ చలన చిత్రంలో ఎక్కువగా ఆకర్షించే విషయం అంతరిక్ష నౌకలోని మనుషుల శరీరాకృతి . ఏళ్ళ తరబడి అన్ని పనులకీ  యంత్రాల మీదే ఆధారపడుతూ, శరీరానికి కేవలం విశ్రాంతినే ఇవ్వడం వల్ల అక్కడి మనుషుల చేతులు కాళ్ళు చిన్నవిగా మారిపోతాయి. కేవలం పొట్ట మాత్రమే పెరుగుతుంది. ముఖం , మెడ కలిసిపోయి ఉంటాయి . వాళ్ళకి లేచి నిలబడటం కూడా తెలీదు.  ఒక పడక కుర్చీలో కూర్చుని ప్రయాణించడం తప్ప వారికి పనేమీ ఉండదు . పళ్ళు తోమడం , బట్టలు మార్చడం వంటి పనులు కూడా యంత్రాలే చేస్తాయి. మనం ప్రస్తుత  జీవన విధానాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే అటువంటి రోజులు ఎంతో దూరంలో లేవని ఈ చిత్రం తెలియజేస్తుంది .

అంతేకాక అంతరిక్ష నౌక కెప్టెన్ తను చెందిన భూమి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో మట్టి , భూమి,సముద్రం, నాట్యం వంటి పదాల్ని వెతుకుతూ, వాటికి చెందిన రికార్డెడ్ వీడియోలు చూస్తూ నాస్టాల్జియాకి గురికావడం మనల్ని కూడా గొప్ప భావోద్వేగానికి గురి చేస్తుంది . “మనుషులు మట్టిలో విత్తనాలు వేసి , నీళ్ళు పోసి పిజ్జాల్లాగా ఆహారాన్ని పండించేవారట!” అని అతను తెగ ఆశ్చర్యపోతాడు . అలాగే వాల్ -ఇ, తను చూసిన ఒక పాత సినిమా పాటలోని హీరో హీరోయిన్ల మాదిరిగా ఈవ్ తో చేతులు కలిపి పట్టుకోవాలని  తాపత్రయపడటం ముచ్చట కలిగిస్తుంది . ఇటువంటి సన్నివేశాల ద్వారా మనం చిన్న చిన్న మానవ సంబంధిత ఉద్వేగాలని, భావాల్నికూడా యంత్రాల నుండి నేర్చుకునే దుస్థితికి త్వరలోనే దిగజారిపోతామని  ఈ చలనచిత్రం సూచిస్తుంది .  .

ప్రమాదవశాత్తూ తమ కుర్చీ వాహనాల్లోంచి జారిపడిన అంతరిక్ష నౌకలోని మనుషులు , లేచి నిలబడలేని అశక్తతలో ఒకరి మీద ఒకరు పడి కొట్టుమిట్లాడటం మన స్వయంకృతాపరాధపు భవితవ్యానికి ప్రతీక అయితే  , వారిలోనుండి ఒకరిద్దరు వ్యక్తులు లేచి నిలబడే ప్రయత్నం చేసి మిగిలిన వారికి స్పూర్తిగా నిలవడం , మనిషిలోని ఆశావహదృక్పధానికీ, పట్టుదలకీ ఉదాహరణ .

మొత్తానికి ఈ చిత్రం భవిష్యత్తుపై భయాన్ని కలిగించి , చేస్తున్న పొరపాట్ల గురించి ఆలోచించుకునే దిశగా మనల్ని నడుపుతుంది. మన జీవితాల్లోని యాంత్రికత మనల్ని ఎటువంటి ప్రమాదంలోకి నెడుతుందో సున్నితంగా తెలియజేస్తుంది . అత్యద్భుతమైన యానిమేషన్ సహజమైన వాతావరణాన్ని సృష్టించి ఒక కొత్త కోణంలోమనం సృష్టించుకుంటున్న  అసహజత్వాన్ని మనకి చూపుతుంది. మానవ తప్పిదాల్ని యంత్రాలు సరిదిద్దే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తుంది .

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సందేశాత్మక చిత్రాన్ని సృజనాత్మక మేధకు అత్యుత్తమ నమూనాగా  అభివర్ణించవచ్చు . ఈ చలనచిత్రంలోని మనుషులకి మళ్ళీ తమ జీవితాల్ని మొదటి దశనుండీ నిర్మించుకునే అవకాశం వాల్-ఇ కారణంగా లభించింది . మరి మనకి లభిస్తుందో లేదో! ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ చిత్రాన్ని చాలా మంది చూసే ఉంటారు . ఒకవేళ చూడకపోతే తప్పనిసరిగా చూడండి. పిల్లలకి కూడా చూపించండి.
~