Archives for April 2015

ఆఫ్రికా మహిళలూ కుంకుమ ‘భరిణె’లే!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఆదిమ సమాజాలలో ఋతుస్రావం చుట్టూ అల్లుకున్న ఊహలు, నిషేధాలు, మాంత్రిక చర్యల గురించి రాస్తున్నప్పుడే కాకతాళీయంగా ఒక టీవీ చానెల్ కు చెందిన వెబ్ మేగజైన్ లో ఒక వ్యాసం కనిపించింది. దాని శీర్షిక, ‘Dear Universities, Is Menstruation Unacceptable?’. రచయిత్రి, ఢిల్లీ ఐఐటిలో ప్రొఫెసర్ గా ఉన్న రుక్మిణీ భయా నాయర్.  

సందర్భం ఏమిటంటే, విద్యార్థినుల పట్ల చూపుతున్న వివక్షను నిరసిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థినులు శానిటరీ నేప్ కిన్స్ మీద వివిధ నినాదాలు రాసి శాంతియుత ప్రదర్శన జరిపారు. ఇది కోల్కతా లోని జాదవ్ పూర్ యూనివర్సిటీకి కూడా పాకింది. శానిటరీ నేప్ కిన్స్ ను ప్రదర్శించడాన్ని రెండు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలూ తప్పు పట్టాయి. జామియా మిలియా అయితే విద్యార్థినులకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. “ఇది సామాజిక ఆమోదం కలిగిన నిరసన మార్గం కాదు. దేనిని ప్రదర్శించవచ్చో, దేనిని ప్రదర్శించకూడదో మీరు తెలుసుకోవాలి” అని జాదవ్ పూర్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ అన్నారు. దానిపై, “దేనికి సామాజిక ఆమోదం లేదు? శానిటరీ నేప్ కిన్స్ కా, ఋతుస్రావానికా, లేక మొత్తం స్త్రీలకేనా?” అని ఒక విద్యార్థిని అడిగింది.

“మా నిరసన కేవలం శానిటరీ నేప్ కీన్స్ ను అధికధరకు అమ్మడం మీదా, క్యాంపస్ లో వాటిని అమ్మే దుకాణాలు లేకపోవడం మీదా కాదు. స్త్రీని న్యూనతతో చూసే ఇటువంటి విషయాల చుట్టూ అల్లుకున్న మౌనాన్ని బద్దలు కొట్టడం కోసం” అని ఇంకో విద్యార్థిని అంది.

దీనిపై అందరు బురోక్రాట్లూ చేస్తున్నట్టే వైస్-ఛాన్సలర్ కూడా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకున్నారని వ్యాసరచయిత్రి అంటారు.

ఋతుస్రావం, ఋతుకాలం, ప్రసవకాలాలకు చెందిన తంతులు, నిషేధాలే తదుపరి తంతులకు, నిషేధాలకు మాతృకలనుకుంటే; ఆదిమ కాలం నుంచి నేటి అత్యాధునిక కాలంవరకూ అవి ఎలా నిరంతరాయంగా కొనసాగుతున్నాయో పై ఉదంతం ఆశ్చర్యకరంగా వెల్లడిస్తోంది. మనం ఆధునికతలోకి వచ్చామన్నది కేవలం భ్రమ మాత్రమే, ఇంకా ఆదిమ కాలంలోనే ఉన్నాం.

ఈ వ్యాసంలోనే, మనం నిషేధం అనే అర్థంలో వాడుతున్న ‘టేబూ’(Taboo) అనే మాట గురించి రచయిత్రి కొంత చర్చ చేశారు. ఇది టోగాన్-పొలినేసియన్ పదమనీ, ఇంగ్లీషు దానినే స్వీకరించిందనీ ఆమె అంటారు. రాంభట్ల గారినే ఉటంకించుకుంటే(జనకథ), ‘తప్పు’ అనే తెలుగు మాటే ‘టేబూ’ అయింది. లేదా ‘టేబూ’ అనే మాటే తెలుగులో ‘తప్పు’ అయిందనుకున్నా అనుకోవచ్చు. న్యూజీలాండ్ లోని మావోరీ తెగవారు సరిగ్గా తెలుగు ‘తప్పు’నే, అదే అర్థంలో వాడతారు. పోలినేసియన్లలో హవాయి దీవుల వాళ్ళు ‘తాపు’ అంటారు. మొత్తం మీద మన తెలుగు ‘తప్పు’ అతి పురాతన పదమే కాక, ఒకవిధంగా ప్రపంచభాషాపదం అన్నమాట.

వైరుధ్యం, అంతకన్నా విచిత్రం ఏమిటంటే; ఈ టేబూ అనేది రెండంచుల కత్తిలాంటిది. ఒక అంచు ‘పవిత్రత’కు సూచన, ఇంకొక అంచు ‘అపవిత్రత’కు సూచన. ‘Sacra’ అనే రోమన్ మాటకు కూడా ఇలాగే రెండర్థాలున్నాయని కిందటి వ్యాసంలో అనుకున్నాం. అన్ని మతాలూ స్త్రీలను చూసే చూపులో కూడా ఇదే వైరుధ్యం ఉందని పై వ్యాసరచయిత్రి అంటారు. ఒక పక్క స్త్రీలకు అత్యంత గౌరవం ఇస్తామని చెబుతాం, ‘దేవత’గా భావిస్తాం; మరో పక్క ప్రకృతిధర్మంగా ఆమె శరీరంలో సంభవించే మార్పులను అశుభ్రంగానూ, అపవిత్రంగానూ చూస్తాం. స్త్రీ పట్ల ఉన్న ఈ చులకన భావానికీ, ఈసడింపుకు కొనసాగింపే ఆమెపై జరిపే హింస, అత్యాచారాలంటారు వ్యాస రచయిత్రి.

***

అదలా ఉంచితే, మన జ్ఞానశూన్యతకు ఎల్లలు లేవు. నెల నెలా మూడురోజులపాటు బయట చేరడం అనేది మనలోనే, అందులోనూ ఒకటి, రెండు పై కులాలలలోనే ఉందని అనుకుంటాం. కానీ ఇది దాదాపు ప్రపంచమంతటా అన్ని ఆదిమ సమాజాలలోనూ ఉంది. ఇంకా చెప్పాలంటే, మనకు తెలిసినదానికంటే కూడా కర్కశంగా, పట్టువిడుపులు లేనంతగా ఉండేది. కొన్ని చోట్ల మూడు రోజులు కాక, వారం, నెల, చివరికి ఏళ్ల తరబడి ‘బయట’ ఉంచేవారంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.

సర్ జేమ్స్ ఫ్రేజర్ ‘The Golden Bough’ లో ఈ ఆచారం ఎక్కడెక్కడ ఉందో విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చారు. ఋతుమతులైన అమ్మాయిలు నేలను తాకరాదనీ, సూర్యుణ్ణి చూడరాదనే నిషేధం ప్రపంచంలో అనేక చోట్ల ఉందని ఆయన అంటారు. లొవాంగోలోని నల్ల జాతి అమ్మాయిలను ఋతుమతులు కాగానే విడిగా పూరిళ్లలో ఉంచుతారు. వారి శరీరం నేలకు తాకకూడదు. మన దగ్గర కూడా అమ్మాయిలను తాటాకు చాప మీద కూర్చోబెడతారు. దక్షిణాఫ్రికాలోని జులూ, తదితర తెగల్లో అమ్మాయిలు పగలు పని పాటలు చేసుకుంటున్నప్పుడు మొదటిసారి ఋతుసూచనలు కనిపిస్తే వెంటనే నది వైపో, చెరువు వైపో పరుగెత్తి, మగవాళ్ళ కంటబడకుండా పగలంతా పొదల్లో దాక్కుంటారు. తమపై సూర్యకాంతి పడకుండా శరీరాన్ని దుప్పటితో కప్పుకుంటారు. చీకటి పడిన తర్వాతే ఇంటికి వెళ్ళి వేరుగా కూర్చుంటారు. లేక్ న్యాసా అనే ప్రాంతానికి ఉత్తరం కొసన జీవించే అవాన్ కొండే అనే తెగలో అమ్మాయి ఋతుమతి అయినప్పుడు, మరికొందరు అమ్మాయిలతో కలిపి ఒక చీకటి గుయ్యారంలో, కింద అరిటాకులు పరచి కూర్చోబెడతారు.

న్యూ ఐర్లాండ్ లోని అమ్మాయిల పరిస్థితి నమ్మశక్యం కానంత ఘోరంగా ఉంటుంది. అమ్మాయిలను ఒక వయసు రాగానే పాతిక అడుగులు ఎత్తున వెదురుకర్రల మీద నిర్మించిన ఒక ఇంట్లో, ఒక్కో పంజరంలో ఉంచుతారు. ఆ పంజరం భూమిని తాకకుండా నాలుగు అడుగుల ఎత్తున, శంఖం ఆకారంలో ఉంటుంది. వెలుతురు, గాలి కొంచెమైనా చొరడానికి వీలు లేకుండా దగ్గరగా కుట్టిన దట్టమైన ఆకులతో దానిని నిర్మిస్తారు. అందులో కూర్చోడానికి, ముడుచుకుని పడుకోడానికి మాత్రమే చోటు ఉంటుంది. నేల మీద కాలు మోపకుండా, సూర్యరశ్మి సోకకుండా అమ్మాయిలు అలా రోజులు, వారాలు కాదు; ఏకంగా నాలుగైదేళ్లు గడపాలి! అన్నేళ్లూ వాళ్ళు మగపురుగును కూడా చూడడానికి వీల్లేదు. ఆ పంజరాల దగ్గర ఒక వృద్ధస్త్రీ కాపలా ఉంటుంది. కొస మెరుపు ఏమిటంటే, వేరే ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడికి ఈ వింత ఆచారం మీద ఆసక్తి కలిగి ఆ పంజరాలను, అందులోని అమ్మాయిలను చూడాలనుకున్నాడు. తెగ ముఖ్యుని అడిగితే అది కుదరదన్నాడు. అప్పుడా ఉపాధ్యాయుడు ఆ అమ్మాయిలకు కొన్ని పూసల్ని కానుకగా ఇస్తాననే సరికి మెత్తబడ్డాడు. అతి కష్టం మీద ఆ వృద్ధస్త్రీ ఒప్పుకుని కింద దట్టమైన ఆకులు పరచి ఆ అమ్మాయిలను పంజరాల లోంచి బయటికి రప్పించిందట. అప్పుడా ఉపాధ్యాయుడు పంజరం లోపలికి తొంగి చూసేసరికి లోపల విపరీతమైన వేడిగానూ, ఉక్కపోతగానూ ఉందట. ఈ ఉపాధ్యాయుడే తనకు ఈ వివరాలు చెప్పాడని ఫ్రేజర్ అంటారు.

ఇలాంటి అజ్ఞానానికి అద్దం పట్టే దేశ దేశాల ఉదాహరణలను ఇంకా అనేకం ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు కానీ వాటన్నింటిలోకీ వెళ్లలేం. ఇప్పటి సంగతి ఏమో కానీ నిన్న మొన్నటి వరకూ మనదేశంలో పరిస్థితి ఏమంత భిన్నం కాదు. బాలెంతల విషయమే తీసుకుంటే, వారిని గాలీ, వెలుతురూ చొరని చీకటి కొట్టాలలో ఉంచి పుష్టికరమైన ఆహారం పెట్టకుండా మాడ్చే మూర్ఖత్వాన్ని—నాకు గుర్తున్నంతవరకూ—‘సత్యవతీ చరిత్రము’ అనే రచనలో కందుకూరి వీరేశలింగంగారే వదలగొట్టే ప్రయత్నం చేశారు.  పై ఉదంతంలో పూసల మీద ఆశపడి కట్టుబాటును సడలించినట్టుగా; స్త్రీల చదువూ, ఉద్యోగం, చిన్న కుటుంబాల అవసరం పెరగడంతో చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు కానీ, వెనకటి రోజులే అయితే ఇలాంటి పద్ధతులను మనవాళ్లు ఇప్పటికీ అమలు చేస్తూనే ఉండేవారు.

ఇప్పుడు మళ్ళీ జార్జి థాంప్సన్ దగ్గరికి వస్తే;

ఋతురక్తంలోనూ, ప్రసవరక్తంలోనూ ప్రాణం పోసే గుణం ఉందన్న నమ్మకం ప్రపంచమంతటా ఎంత బలంగా ఉండేదో, వాటి పట్ల భయమూ, వైముఖ్యమూ అంతే బలంగా ఉండేవని ఆయన అంటారు. ఋతుకాలంలోనూ, ప్రసవ కాలంలోనూ ఉన్న స్త్రీని తాకడమంటే శవాన్ని తాకడంతో సమానం. వారిని కచ్చితంగా దూరంగా ఉంచవలసిందే. ఇటువంటి స్థితిలో ఉన్న స్త్రీని చూస్తే మగవాడు చనిపోతాడని నమ్మేవారు. వారి చెయ్యి కానీ, కాలు కానీ తగిలితే పంటలు మాడిపోతాయనీ, పశువులు అంగవైకల్యం చెందుతాయనీ అనుకునేవారు. బాలెంతను ఉంచిన చోటికి మంత్రసాని తప్ప ఇంకెవ్వరూ వెళ్లకూడదు. ఆ బందిఖానా పూర్తి కాగానే బాలెంత దుస్తులు, దుప్పట్లు, ఆమెకు వండి పెట్టడానికి వాడిన పాత్రలు, బొడ్డు తాడు, మాయ(placenta), రక్తపు మరకలతో సహా అన్నింటినీ జాగ్రత్తగా ధ్వంసం చేయడం, తుడిచిపెట్టడం చేయాలి. లేదా ఎవరూ తాకడానికి అవకాశం లేని చోట పారేయాలి. కొంతమంది రోడ్డు మీదో, నాలుగు రోడ్ల కూడలిలోనో పారేస్తారు. బాటసారులు ఆ మైలను మోసుకుపోతారని అందులో ఉద్దేశం. శుద్ధి స్నానమూ, ఆయా తంతులూ జరిగిన తర్వాతే బాలెంత తిరిగి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికీ మనదగ్గర ఇంచుమించు ఇలాంటివే జరుగుతాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

saffrongatherers

మొదటిసారి ఋతుమతి అయినప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు, తంతులు ఉంటాయి. అమ్మాయికి లైంగిక జీవితాన్ని పరిచయం చేయడం కూడా అందులో భాగం. ఉదాహరణకు, దక్షిణాఫ్రికాలోని బంటూ తెగకు చెందిన  అమ్మాయి తను ఋతుమతి అయ్యే సమయం సమీపించినప్పుడు  పొరుగూరికి చెందిన ఒక వివాహితను పెంపుడు తల్లిగా ఎంచుకుంటుంది. ఆ రోజు రాగానే పెంపుడు తల్లి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి ఆమెతో కలసి శోకాలు పెడుతుంది. ఆ అమ్మాయిని  నెలరోజులు దూరంగా ఉంచుతారు. సాధారణంగా ముగ్గురు, నలుగురు అమ్మాయిలను కలిపి ఒక పూరిపాకలో ఉంచుతారు. ప్రతిరోజూ ఉదయమే వారు నదికో, కాలువకో వెళ్లి స్నానం చేస్తారు. వారి వెంట కొంతమంది మహిళలు అశ్లీలమైన పాటలు పాడుతూ వెడతారు.  మగవాళ్ళు ఎదురు పడకుండా అదిలించడానికి వాళ్ళ చేతుల్లో కర్రలు ఉంటాయి. మగవారు కనుక ఆ అమ్మాయిలను చూస్తే అప్పటికప్పుడు అంధులైపోతారని నమ్మకం. ఆ అమ్మాయిలు స్నానం చేసి తడిబట్టలతోనే వణకుతూ తిరిగి రావాల్సిందేకానీ, పొడి బట్టతో తుడుచుకోవడం కానీ, మంట దగ్గర చలి కాచుకోవడం కానీ చేయడానికి వీల్లేదు. వెంట ఉన్న మహిళలు  అశ్లీలగీతాలు పాడుతూ, వారిని రక రకాలుగా అల్లరి పెడుతూ లైంగిక విషయాలలో శిక్షణ ఇస్తారు. ఋతుస్రావం గురించి మగవాడికి తెలియకూడదని ఆదేశిస్తారు. నెల రోజుల తర్వాత అమ్మాయిలు ఇంటికి చేరుకున్నాక తెగలో అందరికీ సమర్త భోజనం పెడతారు. ఋతుమతి అయినప్పుడు మన దగ్గర కూడా అచ్చంగా ఇలాంటిదే కాకపోయినా, పెద్ద తంతే జరుగుతుంది.

ప్రాచీన గ్రీసులో కూడా పురిటి మైలను, బహిష్టు మైలను కచ్చితంగా పాటించేవారు. ఆ స్థితిలో ఉన్న స్త్రీలు దేవాలయానికి వెళ్లకూడదు. నలుగురిలోకీ రాకూడదు. మన దేశంలో ఇప్పటికీ తగుమాత్రం మడీ, ఆచారం పాటించే కుటుంబాలలో ఇలాంటి నిషేధాలే ఉన్నాయి.

ఇదే సమయంలో, ఋతుస్రావానికీ, ప్రసవరక్తానికీ ప్రాణం పోసే లక్షణం ఉందన్న విశ్వాసం ఎలా వ్యక్తమయ్యేదో చెప్పుకుందాం. ఉత్తర అమెరికాలో మొక్కజొన్న పంటకు చీడ ఆశించినప్పుడు, ఋతుకాలంలో ఉన్న స్త్రీలు రాత్రిపూట నగ్నంగా పొలంలో తిరిగేవారు. ఇదే ఆచారం ఇప్పటికీ యూరప్ రైతాంగంలో ఉందని థాంప్సన్ అంటారు. పంటను విషక్రిములు ఆశించినప్పుడు ఋతుకాలంలో ఉన్న మహిళలు జుట్టు విరబోసుకుని, దుస్తులు పైకెత్తుకుని, చెప్పులు లేకుండా పొలంలో తిరగాలని ప్లినీ అంటాడు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఋతుకాలంలో ఉన్న స్త్రీలు చెప్పులు లేకుండా మూడుసార్లు పొలం చుట్టూ తిరగాలని డెమోక్రిటస్ అనే మరో పండితుడు అంటాడు. ఋతుకాలంలో స్త్రీలలో ఉండే ప్రాణశక్తి పంటకు అందుతుందని దీనివెనుక ఉద్దేశం. స్త్రీలు ఋతుకాలంలో ఉన్నా లేకపోయినా వారు నగ్నంగా పొలంలో తిరిగితే పంటలను చీడపీడలు అంటవన్న నమ్మకం దక్షిణాఫ్రికాలోని జులూ తెగవారిలో ఉంది.

***

ఇప్పుడిక పసుపు, కుంకుమల గురించి చూద్దాం. ఇవి మనదగ్గర మంగళ ద్రవ్యాలు. పవిత్రతకు సంకేతాలు. స్త్రీల జీవితంలో విడదీయలేని భాగాలు. పసుపు, కుంకుమల చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్లకు అంతే ఉండదు. వివాహిత అయిన స్త్రీ పసుపు, కుంకుమలతో జీవించడం, ముత్తైదువగా మరణించడాన్నే గొప్ప వరంగా భావిస్తుంది. తన జీవితానికి అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదనుకుంటుంది. పెళ్ళైన అమ్మాయికి పుట్టింటివారు ఇచ్చే తగుమాత్రం ఆస్తిపాస్తులను పసుపు, కుంకుమల కింద ఇచ్చినట్టు చెప్పుకోవడమూ కనిపిస్తుంది. సెంటిమెంటుకు ఇది ఆర్థిక వ్యక్తీకరణ.

అంతేకాదు; పసుపు, కుంకుమలు మన చారిత్రక జ్ఞానశూన్యతకు కూడా గొప్ప వ్యక్తీకరణలే. అవి స్త్రీ జీవితంతో గాఢంగా పెనవేసుకోవడమే కాక; పూజలు, ఇతర శుభకార్యాలలో ముఖ్యమైన సామగ్రి కావడం కేవలం మన మత,సంస్కృతులకే చెందిన విశిష్టతలని అనుకుంటాం. పసుపును అలా ఉంచి, కుంకుమనే తీసుకుంటే ఇదెంత అపోహో అర్థమవుతుంది.

కుంకుమ మంగళ ద్రవ్యం కావడం వెనుక ‘అమంగళ’మైన గతం ఉంది. ఎలాగంటే; ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత గర్భాశయంలో మిగిలిపోయే రక్తం నుంచే పిండం రూపొందుతుందని పురాతన, మధ్యయుగాలకు చెందిన అరిస్టాటిల్, ప్లినీ తదితర నేచురలిస్టులు భావించారని థాంప్సన్ అంటారు. అంటే, అది ప్రాణి పుట్టుకకు కారణమైన రక్తం. ఋతుకాలంలో, ప్రసవ కాలంలో ఉన్న స్త్రీల పట్ల నిషేధాలను అమలు చేయాలంటే; వారు ఆ స్థితిలో ఉన్నట్టు ఇతరులకు తెలియాలి. ఆ అవసరం రీత్యా రక్తాన్నో, లేదా రక్తం రంగులో ఉన్న మరో పదార్థాన్నో నుదుట అలదుకోవడం, ఒంటికి రాసుకోవడం అనే ఆనవాయితీ ప్రారంభమైంది. ఇలా చేయడంలో నిషేధానికి ఉన్న అనుకూల/ప్రతికూల లక్షణాలు రెండూ వ్యక్తమవుతాయని థాంప్సన్ అంటారు. ఎలాగంటే, రక్తధారణ లేదా రక్తం రంగులో ఉండే మరో ద్రవ్యాన్ని ధరించడం అనేవి ఒకవైపు పునరుజ్జీవన శక్తిని సంకేతిస్తూనే, మరోవైపు మైలను, అమంగళతను సంకేతిస్తాయి. ఋతుకాలంలోనో, ప్రసవ కాలంలోనో ఉన్న స్త్రీలు తమ శరీరానికి ఎరుపు రంగు పులుముకోవడం ప్రపంచమంతటా ఉన్న ఆచారం. అది మగవారిని వారినుంచి దూరంగా ఉంచుతూనే, సౌభాగ్యవర్ధనంగానూ ఉంటుంది,

ఈ ఆచారమే క్రమంగా ఇతర నిషేధాలకూ పాకింది. వివాహ సమయాల్లోనూ, వివాహం తర్వాతా వధువు లేదా వివాహిత నుదుట సిందూర ధారణ చేయడం అనేది రెండు సూచనలు చేస్తుందని థాంప్సన్ అంటారు: మొదటిది, ఆమె భర్తకు తప్ప ఇతర మగవాళ్ళకు నిషిద్ధం. రెండోది, ఆమె భర్తకు మాత్రమే సంతానం కంటుంది. ఈ సిందూర ధారణే అలంకరణ ద్రవ్యాలకు మూలం.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, కుంకుమ, తిలకం వగైరాల రూపంలో ఎరుపు రంగును శరీరానికి అలదుకోవడం, నుదుట ధరించడం అనేవి కేవలం మన ప్రత్యేకతలు కాక; విశ్వజనీనం కావడం! మన స్త్రీల దగ్గర బొట్టు పెట్టె, కుంకుమ భరిణె ఉన్నట్టుగా, బంటు తెగకు చెందిన వాలెంగే మహిళల దగ్గర జేగురు రంగు పదార్థం కలిగిన కుండ ఉంటుంది. అది వారికి మంగళద్రవ్యం. ఉత్సవసమయాల్లో దానిని ఒంటికి అలదుకుంటారు. పురిటి మైల అయిన తర్వాత తల్లీ, బిడ్డలకు దానినే అలది స్నానం చేయిస్తారు.  మన దగ్గర కూడా ఇలాంటి తంతులే ఉన్నాయి.

ఇంకా వెనక్కి వెడితే, ఎరుపు రంగు పునరుజ్జీవనానికి సంకేతం అన్న భావన పాతరాతి యుగం నుంచీ ఉంది. అది కొత్త రాతి యుగంలోనూ కొనసాగింది. ఎరుపు రంగు అలదిన ఆ కాలపు ఎముకలు తవ్వకాలలో లభించడమే ఇందుకు నిదర్శనం.

తమాషా ఏమిటంటే, మన స్త్రీల జీవితంతో, మతసంస్కృతులతో గాఢంగా అల్లుకుపోయిన ‘కుంకుమ’ సంస్కృత భాషా పదం కానీ, ఇతర ప్రాంతీయ భాషా పదం కానీ కాదు. పండితుల నిర్ధారణ  ప్రకారం అది అన్యదేశ్యం. ఇంకా చెప్పాలంటే, Merriam-Webster నిఘంటువు ప్రకారం, అది సెమెటిక్ మూలం కలిగిన పదం. హిబ్రూలోని ‘కర్కోమ్’ అనే మాటతో తుల్యమైన మాట ఇది. ఈ మాట కుంకుమ పువ్వు(saffron)ను సూచిస్తుంది. కుంకుమపువ్వునే కొన్ని చోట్ల ‘కేసర్’ అంటున్నారు. కుంకుమపువ్వుకు జన్మస్థానాలు గ్రీసు, టర్కీ, పర్షియా తదితర మధ్యధరాతీరప్రాంతాలు.

మరికొన్ని విశేషాలు తర్వాత… 

 

ఒక కురుక్షేత్ర సైనికుడి డైరీ

 సిద్ధార్థ గౌతమ్

Goutham

నా వయసు ఇరవై ఐదు. ఇది నా మొదటి యుధ్ధం. నేను పాండవ సైన్యం లో ఒకడిని. ఈ యుధ్ధం ముగిసాక బ్రతికి ఉంటానో లేదో తెలియదు. అందుకే ఇక బ్రతికిఉన్నన్నాళ్ళు రోజులో జరిగిన సంఘటనలు, విశేషాలు రాద్దామని నిర్ణయించుకున్నాను. ఇక్కడి వార్తలను నగరానికి మోసుకెళ్ళటానికి ఒక వేగు ఉన్నాడు. రాసిన పత్రాలుఅతనికిచ్చి నా భార్యకివ్వమని పంపుతాను. నాకొక నాలుగేళ్ళ కొడుకు. 

నిన్న ఉదయం చేరాము కురుక్షేత్రానికి. గుడారాలు వేసి, ఆయుధాలన్నీ లెక్క చూసుకుని, భద్రపరిచేసరికి సాయంత్రమయ్యింది. మా సైన్యాధిపతి మమ్మల్ని అంతా ఒకచోట నిలబెట్టి కొన్ని సూచనలు ఇచ్చాడు. మాకన్నా కౌరవ సైన్యం చాలా పెద్దది. నాకు భయం లేదు. మా వైపు కృష్ణుడున్నాడు.

అర్ధరాత్రి దాకా పాండవులు తమ గుడారం లో వ్యూహాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు తోచిన రెండు వ్యూహాలు మా సైన్యాధిపతికి చెప్పాను. ఆయన తనడాలు తో నా నెత్తిన ఒకటి మొట్టాడు.

కురుసైన్యం లో ఉన్న బంధువులనంతా చూసి అర్జునుడు చాలా బాధపడ్డాడు. వాళ్ళతో యుధ్ధం చేయనన్నాడు. నన్ను పిలిచి బట్టలు, ఆయుధాలు సర్దేయమన్నాడు.రథం లో ఉన్న కృష్ణపరమాత్ముడు కిందకి దిగారు. నన్ను అశ్వాలను చూస్తూ ఉండమని చెప్పి, అర్జునుడితో మాట్లాడారు. ఎన్నో మంచి మాటలు చెప్పారు. ధైర్యంగాఉండాలన్నారు. భయము, బాధ వీడమన్నారు. ఆ తరువాత ఏమి జరిగిందో ఏంటో, కొద్ది సేపు నాకు ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. మూర్ఛపోయాననుకుంటా.తెలివి వచ్చేసరికి అర్జునుడు కృష్ణభగవానుడికి దండం పెడుతూ కనబడ్డాడు. మళ్ళీ యుధ్ధానికి సిధ్ధమయ్యారు.

నేను మా  గుడారానికి తిరిగివచ్చాక కృష్ణుడు చెప్పిన మంచి మాటల్లో గుర్తున్నవన్నీ రాసేసాను. గుడారం లో నాతో ఉన్న తోటి సైనికుడిని తనకి గుర్తున్నవిచెప్పమన్నాను. వాడు పాపం చివరి వరుసలో నిలబడటం వల్ల ఏమి వినబడలేదనుకుంటా. తనూ కాస్సేపు మూర్ఛపోయానని మాత్రం చెప్పాడు.

——

ఉదయం ఏమీ తినాలనిపించలేదు. పాలు తాగి బయలుదేరాను. సూర్యోదయానికి కొన్ని ఘడియల ముందు రణభూమికి చేరుకున్నాము.

రణభేరి మోగించటానికి ముందు ధర్మరాజుగారు తన ఆయుధాలన్నీ తీసి నేల మీద పెట్టారు. ఈయనకి కూడా అర్జునుడికి చెప్పిన మాటలు చెప్పాలేమో అని నేను కృష్ణుడివైపు చూసాను. ఆయన రథం మీదినుంచి దిగలేదు. ధర్మరాజు గారు కౌరవ సైన్యం వైపు నడుస్తూ వెళ్ళాడు. ఆయన ఎందుకిలా చేస్తున్నారో ఎవ్వరికీ అర్థమవ్వలేదు.బెదిరించటానికా? సంధి చేసుకోవటానికా? నేను కాస్త ముందుకెళ్ళి మా సైన్యాధికారి వీపు గోకాను.

“అయ్యా..ఇంతకీ యుధ్ధం ఉన్నట్టా లేనట్టా?” అనడిగాను. ఆయనతెలియదన్నట్టు తల అడ్డంగా ఊపి, వెళ్ళి నా స్థానం లో నన్ను నిలబడమన్నారు. ధర్మరాజు భీష్మ పితామహుడికి దండం పెట్టి, తనని ఆశీర్వదించమని ప్రార్థించాడు.భీష్మపితామహులు ఎంతో సంతోషించారు. పక్కనున్న ధుర్యోధనుడు “వద్దు..వద్దు” అని అరుస్తూ ఉంటే..రెండు చేతులతో చెవులు మూసుకుని..”విజయోస్తు” అనిధర్మరాజుని ఆశీర్వదించారు. ధుర్యోధనుడు గద పక్కన పెట్టి, తలపట్టుకు కూర్చున్నాడు. ధర్మరాజు తిరిగి మా వైపు వచ్చి తన ఆయుధాలు చేపట్టారు.

రాత్రంతా మత్తుగా పడుకున్న సూర్యభగవానుడు ఒళ్ళు విరుచుకుని మెల్లగా కళ్ళు తెరిచాడు. తన రాకకోసం ఎదురుచూస్తూ..చేతిలో కత్తులు, విల్లు లు పట్టుకుని యుధ్ధంచేయకుండా నిలబడి ఉన్న పాండవ, కౌరవ సైన్యాన్ని చూసి..గబగబా పైకి లేచాడు. యుధ్ధభేరి మోగింది.

మొదటి రోజు –

భీష్మ పితామహుడు ధర్మరాజుని ఆశీర్వదించినా, మొదటి రోజు మా సైన్యం లో చాలా మందిని చంపేసారు. నేను రోజంతా ఒక కురు సైనికుడితో పోరాడాను. నా చేతికి దెబ్బతగిలింది. నా కత్తి విరిగిపోయింది. నా కుడి పాదరక్ష చిరిగిపోయింది. సూర్యుడు అస్తమించగానే ఈ పూటకి యుధ్ధం ఆపేసాము.  విరాట రాజు పుత్రులిద్దరూ మొదటి రోజేపరమపదించారు. గుడారాలదగ్గరికెళ్ళి లెక్క చూసుకుంటే తేలింది – మొదటి రోజు మా వైపునున్న గొప్ప గొప్ప యోధులు ఎంతో మంది చనిపోయారు.

మాకుభయమేసింది. “అంతిమ విజయం మనదే..భయం వలదు.” అని కృష్ణభగవానుడు ధర్మరాజుతో అన్నారని ఒక సైనికుడు చెప్పాడు. హమ్మయ్య అనుకుని, వెళ్ళి స్నానంచేసి భోంచేసాను. బంగాళాదుంప కూర బాగుంది. పడుకునే ముందు మా సైనికాధికారి దగ్గరకెళ్ళి కొత్త కత్తి, పాదరక్షలు కావాలని చెప్పాను.

ఎందుకు కావాలో వివరంగారాసి ఇవ్వమన్నాడు. చేతికి ఒక పాత కత్తి ఇచ్చి..నాకు సరిపోయే పాదరక్షలు మూడు నుంచి ఐడు రోజుల్లోపు వస్తాయని చెప్పాడు. గాయపడిన ఒక సైనికుడి పాదరక్షలువాడుకొమ్మని చెప్పి నన్ను పంపించేసాడు. అలసిపోయాను. నిద్రొస్తోంది.

రెండవ రోజు –

రెండవ రోజు కాస్త ఆలస్యంగా లేచాను. స్నానం చేసి, ఏమీ తినకుండా రణరంగానికి పరిగెట్టాను. నా వైపు కోపంగా చూసాడు మా సైన్యాధిపతి. కౌరవులు చంపకపోతేఈయనే చంపేసేలా ఉన్నాడు. యుధ్ధభేరి మోగించేవాడు దాన్ని మోగించాడు. అది మోగింది. నేను ఎవరితో యుధ్ధం చేయాలా అని వెదుకుతున్న సమయంలో నాపక్కనుంచి కృష్ణభగవానుడు నడుపుతున్న రథం వాయువేగంతో ముందుకురికింది. అర్జునుడు భీష్మపితామహుడితో తలపడటానికి నిర్ణయించుకున్నట్టున్నాడు.వారిరువురి మధ్యనా హోరాహోరీగా యుధ్ధం జరిగింది. మరో వైపు ద్రోణాచార్యులు, ధృష్టద్యుమ్నుడు పోరాడుతున్నారు. నిన్న నాతో కత్తియుధ్ధం చేసిన వాడు నన్నువెదుక్కుంటూ వచ్చాడు. తుమ్ముతూ ఉన్నాడు. ఏమయ్యిందని అడిగాను. రాత్రి గుడారాల బయట పడుకోవటం వల్ల జలుబు చేసిందన్నాడు.

సూర్యాస్తమయం తరువాత నా దగ్గర ఉన్న ఔషధం ఇస్తానని చెప్పి, నా కత్తితో వాడి కత్తిని బలంగా కొట్టాను. ఇద్దరం యుధ్ధం మొదలుపెట్టాము. కాని మా కళ్ళు, మనసు పెద్ద వాళ్ళ మధ్యజరుగుతున్న పోరు మీదనే ఉన్నాయి. ద్రోణాచార్యుల వారు ధృష్టద్యుమ్నుడిని హతమారుస్తారేమో అనుకుంటున్న తరుణంలో భీమసేనుడు వచ్చి రక్షించాడు. అది చూసినదుర్యోధనుడు భీముడి మీద యుధ్ధం చేయమని కళింగులని పంపాడు. నాకు కోపమొచ్చింది.

నాతో పోరాడుతున్న కౌరవ సైనికుడితో “నువ్వు కాస్సేపలా కూర్చునివిశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి కళింగులని తరిమి కొట్టి వస్తాను..” అని అటు కదిలాను. నాకు ఆ అవకాశం ఇవ్వలేదు భీమసేనుడు. తన మీదకి వచ్చిన కళింగులని మట్టికరిపించాడు. భీష్మ పితామహులు వచ్చి తన శక్తియుక్తులను ఉపయోగించి ఆ మిగిలిన కళింగులని కాపాడారు. భీముడి కి తోడుగా ఉన్న  సాత్యకి భీష్ముడి రథసారధినిచంపేసాడు. సారధి లేని అశ్వాలు భీష్ముడిని యుధ్ధ రంగం వెలుపలకి తీసుకెళ్ళాయి.

రెండవ రోజు ముగిసేసరికి కౌరవ సైన్యం లో చాలా మంది హతులయ్యారు. నాతోయుధ్ధం చేస్తున్నవాడు ఇంకా తుమ్ముతూనే ఉన్నాడు.

రాత్రి అందరూ పడుకున్న తరువాత ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళి ఔషధం ఇచ్చి వచ్చాను. అది ఎక్కువగా తాగితేనిద్ర వస్తుందని హెచ్చరించి వచ్చాను.

(సశేషం)  

చీకటి చీకాకులు

 కర్లపాలెం హనుమంతరావు

 

 

”జీవితం ఏమిటీ? వెలుతురూ.. చీకటీ! హుఁ.. హుఁ.. హుఁ!.. వెలుతురంతా చీకటైతే.. అందులోనే సుఖము ఉన్నదీ!’

‘చీకటీ.. చీకటీ అంటూ ఆ శోకన్నాలేవిట్రా?.. లేచి స్విచ్చి వేసుకుంటే వెలుతురు రాదా!’

‘స్విచ్చి వేసే ఉంది బాబాయ్! వెలుతురే లేదు’

‘అదేంటీ! కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయావా?  కట్టలేకపోయావా?’

‘కట్టలేకపోవడానికి అదేమన్నా కోట్లలో వచ్చిందా ఏమిటీ! వట్టి సర్ ఛార్జీనే కదా! కట్టినా కట్టకున్నా కరెంటు ‘కట్’తప్పదు కదా! మా కాంప్లెక్సులో వెలుతురు మొహం చూసి ఎన్నిరోజులయిందో తెలుసా? కొత్త ఇల్లు కదా.. అని బోలెడంత పోసి ఝిగేల్ ఝిగేల్ మనే ఛాండ్లియర్సుకూడా పెట్టించింది మా శ్రీమతి. విగ్రహం పుష్టి .. నైవేద్యం నష్టి సామెతగా ఉంది మా అపార్టుమెంటు పరిస్థితి. ఎల్ కే జీ చదివే మా సుపుత్రుడు నిన్నేం అడిగాడో తెలుసా బాబాయ్? ఎ ఫర్ ఏపిల్, బి ఫర్ బ్యాట్.. అని చదివేస్తూ  ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ అని రాగానే ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి డాడీ? అని ఆడిగాడు బాబాయ్!

‘అదేదో హైటెక్ సిటీ అనుకుంటున్నాడు కాబోలు పాపం పసివెధవ’

‘అదే మరి! పోనీ ఇదీ అని చూపిద్దామంటే.. ఇల్లు కట్టినప్పట్నుంచీ ఒక్క పూటైనా వచ్చి చస్తేకదా!’

‘అందరి సంబడం అలాగే ఉందిలేరా బాబూ! మా అపార్టుమెంట్లలో ఐతే పూర్తిగా ‘లిఫ్టు’ అనేదే తీసేసారు. ఎవరికి వాళ్లం సొంతంగా బక్కెట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఓపిక ఉన్నవాళ్ళు ఎలాగో మెట్లమీదనుంచే డేక్కొస్తున్నారనుకో!  కంప్లైట్ చేద్దామని కరెంటాఫీసుకు పోతే అక్కడా వాళ్ళు చీకట్లో తడుముకుంటున్నార్రా బాబూ!’

‘చీకట్లో ఇట్లాంటి చిత్రాలు చాలానే జరుగుతున్నాయ్ బాబాయ్! మొన్న గుళ్లో అదేడో సామూహిక వివాహాలు జరిపించారు చూసావా!వందమంది వధూవరులు ఒక్కటవ్వాలని వచ్చారు పాపం. పట్టపగలే కటిక చీకటి! ఏ పెళ్ళికొడుకు ఏ పెళ్ళికూతురు మెళ్ళో తాళి కడుతున్నాడో.. అంతుబట్టక పాపం నిర్వాహకులు ఎంతలా తల్లడిల్లిపోయారో తెలుసా? కరెంటు వాళ్ల నిర్వాకంమీద కంప్లైట్ చేద్దామని పోలీస్ స్టేషనుకు పోతే’

‘అర్థమైందిలే! అక్కడా చీకట్లో ఎవరూ కనిపించలేదనేగా చెప్పబోతున్నావ్? సందు దొఇకింది కదా అని.. సర్కారంటే గిట్టని నీలాంటి వాళ్ళంతా ఇట్లాంటి కట్టుకతలు పుట్టిస్తున్నారుగానీ.. నీళ్ళు పుష్కలంగా ఉంటే గవర్నమెంటు మాత్రం కరెంటెందుకివ్వదురా?’ ఇదివరకటి ప్రభుత్వాలకు ఈ కరెంటు కొట్టిన షాకు ఇప్పటి సర్కారులకు మాత్రం తెలీదనా! పవర్ లేదు పవర్ లేదు అని దొరల పరువుతీయాలని చూస్తున్నారుగానీ.. ఫారడే మహాశయుడు కరెంటు కనిపెట్టకముందుమాత్రం లోకం చల్లంగా సాగిపోలేదా! మన మూరగండడ రాయడు శ్రీక్రుష్ణదేవరాయలు కాగడాల వెలుతురులోనే సువర్ణపాలన సాగించాడు తెలుసా? మా చిన్నతనంలో ఈ కరెంటుగోల ఎక్కడిదీ! మా చదువులన్నీ ఆముదం దీపాల కిందనే  తెల్లారిపోయాయి. విసనకర్రలు, పాత పేపర్లు ఉన్నంతకాలం పంఖాల అవసరం ఏమంత ఉంటుందిరా! కోతల పుణ్యమా అని కరెంటుషాకుల దుర్మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాత్రిళ్ళూ నిశ్చింతగా బట్టలు ఆరేసుకుంటున్నాం కరెంటు తీగలమీద.’

‘అట్లా ఆరేసుకోబట్టే రాత్రిళ్ళు దొంగతనాలు ఎక్కువైపోయాయీ మధ్య మళ్లీ! ఇప్పటివరకు శివార్లవరకే చోరుల సామ్రాజ్యం పరిమితం. ఇప్పుడు నగరం నడిబొడ్డుక్కూడా వాళ్ల హస్తలాఘవం విస్తరిస్తోంది. దొంగలు, దోరవయసులో ఉన్నవాళ్ళూ కరెంటుకోతలకు పండగలు చేసుకుంటున్నారు. సరససల్లాపాలకు  ఎక్కడో  దూరంగా ఉన్న పార్కుల చాటుకోసం  పాకులాడేవాళ్ళు  కోడెవయసుగాళ్ళు. ఇప్పుడంత శ్రమ పడటంలేదు. సర్కారువారి పుణ్యమా అని నగరం నడిబొడ్డులే కోడెకారుకు పడకగదులై పోతున్నాయ్ బాబాయ్!’

‘సర్వే జనా సుఖినోభవన్తు- అనే గదరా ఏ ప్రభువైనా కోరుకొనేది! జనభాలో సగమైనా ఎలాగోలా సుఖపడుతున్నారని సంతోషపడక అలా కుళ్ళుకోవడమేం సబబుగా లేదబ్బీ!ఏం? దొంగలుమాత్రం సుఖంగా బతకద్దా? పని చేసినా చేయకున్నా పగలంతా పెళ్ళివారిల్లులా ఫెళ్ళున వెలిగిపోవాలంటావ్ ప్రభుత్వాఫీసులు? దొంగవెధవలకూ వాళ్ల వృత్తి క్షేమంగా చేసుకునే సావకాశం వద్దంటావ్?! పెద్దవాణ్ణి. అనుభవంతో చెబుతున్నా..విను! చీకటి పడకముందే పిల్లకాయలకి రెండుముద్దలు తినిపించి పక్కలెక్కించెయ్! ఇంచక్కా మీ అమ్మగారు చెప్పే చందమామ కథలన్నీ వింటూ పడుకుంటారు. చక్కటి పాటలూ నేర్చుకుంటారు. పాడు టీవీ నోరు మూతపడీంతరువాత పెద్దవాళ్ళకుమాత్రం ఇంకేం పొద్దుపోతుందీ? తెల్లార్లూ కాలక్షేపంకోసం చిన్నతనంలో నేర్చుకున్న ఆంజనేయ దండకాలూ, అష్టోత్తరాలూ మళ్లీ మళ్ళీ నెమరేసుకుంటారు. బోలెడంత పుణ్యం సంపాదించుకొంటారు. ‘

‘చీకటిమూలకంగా కుటుంబ నియంత్రణ పథకాలు మళ్లీ మొదటికొస్తున్నాయ్ బాబాయ్!’

మరేం ఫర్లేదు. ఏడాదికి మూడొందలరవైయ్యైదు రోజులు  పసుపు కుంకుమలని.. సీమంతంనోములని.. ప్రసవవేదమని,బాలింతలాలింతలని.. ఏవేవో పేర్లతో సర్కార్లు సొంతమనుషులకుమించి ఆదుకుంటూనే ఉన్నవాయె! శబ్దవేధి అని మనకో వేదకాలంనాటి విద్య ఉంది. కటిక చీకట్లో కూడా కంటి సాయం లేకుండా  శబ్దాలను బట్టి వస్తువులజాడను పసిగట్టే గొప్పకళ అది.ఎందుకూ కొరగాని ఇంజనీరింగు చదువులమీద పడి ఆనక  బాధపడే బదులు.. శబ్దవేధిని ఓ కోర్సులా పౌరులందరూ నిర్బంధంగా అభ్యసిస్తే సరి.. ఈ చీకటి పాట్లు, చీకట్లో పాటలు తప్పుతాయి! వేలెడంత లేని బుడతడు కూడా రెండ్రెండ్లెంతరా అని అడిగితే ఠక్కుమని సెల్ తీస్తున్నాడు! కరెంటే లేనప్పుడు ఇంక  చార్జింగేముంటుంది! సెల్లేముంటుంది! ఎందుకైనా మంచిది.. మళ్ళీ పిల్లాడికి నోటిలెక్కలు గట్రా ఇప్పట్నుంచే  గట్టిగా నేర్పించు! మోటార్లమీద ఆధారపడి ఇబ్బందులు పడేబదులు.. పాతకాలంనాటి ఏతాములు మళ్లా బైటికి తీస్తే వ్యవసాయం నిరాటంకంగా సాగిపోదా! బియ్యంమిల్లులు ఆడకపోతేనేం? అత్తాకోడళ్ళు  దంపుడు పాటలు పాడుకొంటూ ఇచక్కా ధాన్యం దంచుకుంటే పోదా?’

‘ ఎందాకా ఇలా చీకట్లో దంచుకోడాలు బాబాయ్?’

‘చెత్తనుంచి కూడా కరెంటు తీయచ్చని అంటున్నారు గదరా ఈ మధ్య! నీళ్ళక్కరువుగానీ, మనదేశంలో చెత్తాచెదారానికి కొదవేముంది? ఆ సాంకేతిక నైపుణ్యం అభివృద్దయ్యేదాకా పోనీ ఓ పని చేయచ్చు! బియ్యంలో రాళ్ళు తింటే పెళ్ళినాడు జడివానలు కురుస్తాయనిగదా పెద్దలు చెబుతారు! పెళ్ళికావాల్సిన కుర్రకారునంతా సేకరించి  కిలోరూపాయిబియ్యం ఓ రెండు కిలోలు బలవంతంగానైనా బొక్కించి పెళ్ళిపీటలమీద కుదేస్తే సరి.. వానలే వానలు. నీళ్ళే నీళ్ళు. కరెంటే కరంటు!.ఇక నీ సెటైర్లుండవు!’

***

ఆలస్యం చేస్తే కథల పిట్టలు ఎగిరిపోతాయి…!

వారణాసి నాగలక్ష్మి 

 

  వందెకరాల్లో వనవాసానికనువైన తాటాకుల కుటీరం తాతగారిది. మైనింగ్ ఇంజనీరైన తాతగారు స్వాతంత్ర్య పోరాటంలో జైలుకెళ్లిన వ్యక్తి. స్వాతంత్ర్యం వచ్చాక చదువుకున్న వాళ్లంతా ఆఫీసుల్లో ఉద్యోగాలకి ప్రయత్నించకుండా సమృధ్ధి గా పంటలు పండించాలని కోరుకుని వందెకరాల అడవి చవగ్గా వస్తుంటే కొనడం, అప్పటికి వ్యవసాయ రంగంలో పట్టా పుచ్చుకున్న నాన్నగారు ఆయనకి  తోడుగా ఆ అడవికి వెళ్లడం జరిగింది. 

 ఆ అడవిలో స్వయంగా ఒక పర్ణశాల నిర్మించి, అక్కడ ఉంటూ, రాళ్ళూ రప్పలూ పొదలూ తుప్పలూ తొలగించి, నూతులు తవ్వి, కొద్ది కొద్దిగా ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా చేస్తూ వచ్చారు నాన్నగారు. వర్షాధారమైన నేలని మామిడి , నిమ్మ, జామ, సపోటా తోటలుగా, వరి పొలంగా మార్చారు. లాండ్ మార్ట్ గేజ్ బాంక్ లో పొలాన్ని కుదువ పెట్టి రకరకాల కూరగాయలు, ఇతర పంటలు పండించేవారు. నలభై సంవత్సరాల నిర్విరామ కృషి ఫలితంగా అక్కడ తయారయిన పచ్చని తోట, పాడి పశువుల సమూహానికి, ఎంత కట్టినా తీరని ‘బాంక్ లోను’ తోడయింది.

నాకు ఊహ తెలిసినప్పటి నించీ ఎటు చూసినా పచ్చని చెట్లూ, పశువులూ , పక్షులూ, వీచే గాలిలో తేలి వచ్చే అడవి పూల వాసనలూ. చూస్తున్నకొద్దీ మనశ్శరీరాల్ని ఆవహించే ప్రకృతి సౌందర్యం.

‘అరణ్యక’ నవల ( సూరంపూడి  సీతారాం గారు తెలుగులోకి  అనువదించిన  ‘ వనవాసి ‘ ) లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ అంటారు- ‘అరణ్య ప్రకృతి నా కళ్ళపై ఏదో మాయ కప్పి వేసింది . .. ఏకాంత స్థలం అంటే, నక్షత్ర మయమైన విశాల వినువీధి అంటే వ్యామోహం. ఇవి నన్నెంత  ప్రబలంగా ఆవహించాయంటే  కొద్దిరోజుల పాటు పాట్నా వెళ్లవలసొస్తే,  అక్కడ తారు వేసి గట్లు పోసిన రోడ్ల పరిధులు దాటి, మళ్ళీ ఎప్పటికి  ‘లవటులియా’ కానన వీధుల్లో పడగలనా అని ప్రాణం కొట్టుకు పోయింది. కప్పు బోర్లించినట్టుండే  నీలాకాశం కింద, మైదానాల తరవాత మైదానాలు, అడవుల పైన అడవులు ఎక్కడుంటాయో, ఎక్కడ మానవ నిర్మితమైన రాజ మార్గాలుండవో, ఎక్కడ ఇటుక గోడలుండవో, ఎక్కడ మోటార్ హారన్ ధ్వనులు వినబడవో, గాఢ రాత్రి నిద్రాభంగమైన సమయంలో దూరాన అంధకార వనంలో కేవలం నక్కల చీకటి ఘోషలు మాత్రమే  ఎక్కడ వినవస్తాయో, ఆ కాననాలకి ఎప్పుడు పోయి వాలుదునా అని మనస్సు కొట్టు మిట్టాడి పోయింది’ …’ దుర్బల చిత్తులైనవారు ఆ సౌందర్యం చూడకపోవడం మంచిదని నా అభిప్రాయం. దీని స్వరూపం సర్వ నాశన కరమైనది. ఈ మాయా మోహంలో పడిన వారు తప్పించుకుని బయటపడడం అసంభవం .. అయితే ఈ మాట కూడా చెప్పాలి. ప్రకృతి ఈ స్వరూపాన్ని చూడగలగడం మహా భాగ్యం. ఈ  ప్రకృతిని, నీరవ నిశీధులలో, వెన్నెలలో, చీకటిలో చూసే అదృష్టం సులభ సాధ్యమే అయితే పృధ్వి అంతా కవులతో పిచ్చివారితో నిండి పోదా?’ అని.

vnl 1

 ‘లవటులియా’ అడవులేమో గాని నేను పెరిగిన పరిసరాల్లో, చుట్టుపక్కల రెండు మైళ్ళ దూరం వరకు ఇంకొక్క ఇల్లుకూడా లేని ఏకాంతం.  పొలంగా రూపుదిద్దుకుంటున్న అడవి మధ్య, ఒంటరి ఇంట్లో, మా కుటుంబ సభ్యుల మధ్య  ఇరవయ్యేళ్ళు వచ్చేవరకు పెరగడం నిజంగా మహా భాగ్యమే. ఆ మాయా మోహం నన్నూ ఆవహించి, ఈనాటికీ వదిలిపెట్టలేదు. (నా కథలన్నీ వర్ణనాత్మకంగా, క్లుప్తతకి కొంత దూరంగా ఉండడానికి నా నేపధ్యం కారణమేమో అనిపిస్తుంది!). గీత రచన పట్ల, చిత్రలేఖనం పట్ల అభిరుచి కలగడానికి కూడా ఈ వాతావరణం దోహదం చేసిందనుకుంటాను. లోపల నిరంతరం కదిలే ప్రకృతి దృశ్యాలు చిత్రాలుగా మారాలని మారాం చేయడం, తీరా ప్రయత్నిస్తే, ఊహలో కనపడ్డ సౌందర్యం కాగితం మీద చేరేసరికి  ఆశాభంగం కలిగి మళ్ళీ కొన్నాళ్ళు కుంచెకి  దూరంగా ఉండడం….  

‘ సుమాల తాకగానే సుగంధాల సవారీ ,

వనాలు చేరగానే వసంతాల కేళీ,

పూల మ్రోల వాలి మధుపాలు మధువు గ్రోలి,

నలుదిశలా ఉల్లాసం ఊయలూగాలి

 

కోకిలమ్మ తీరి, ఆ కొమ్మ చివర చేరి, మురిపాల పూతలేరి చేసింది కచేరీ,

మామిడమ్మ తీరి, కొసరి చిగురులేరి, తేనె జాలువారే  కంఠ మాధురి-

కుసుమాల సొగసు చూసి భ్రమరాల కనులు చెదరి, ఝంకార సంగతులతో వనమెల్ల సందడి,

అందాలు జాలువారే మందార పూల చేరి , భృంగాలు తనివితీర చేసేను అల్లరి’

‘గుబులు నీ గుండెల్లో గూడు కట్టనీయకు ,

చేదు గురుతులేవి నీ మదిని చేరనీయకు

వసంతం రాలేదని వనిని వదలి పోవకు

శిశిరంలో చిగురు కోరి చింతించకు

 

మబ్బులున్న ఆకాశం మరచిందా మందహాసం?

అగ్ని మింగి కడలెపుడూ చూపలేదు నిరుత్సాహం

శీత కాలాన చిరు ఎండకు చలి కాచుకో

శ్రావణాన చినుకుల్లో చేను పండించుకో ’

… ఇలా కేవలం ప్రకృతి సౌందర్యం మీదే ఎన్నో పాటలు అల్లుకుంటూ ఉండేదాన్ని( పై పాటలకి ఇక్కడ ఒక్కొక్క చరణమే ఇచ్చాను).

అడపా దడపా వస్తూ కుదిరినంతకాలం మాతో ఉండిపోతూ ఎందరో బంధు మిత్రులు. వేసవి సెలవుల్లో వచ్చిన  పిల్లలందరితో కలిసి  పెద్ద వానర సైన్యంలా తోటలోకి  పరుగులు తీయడం,  మల్లె తోటల్లో మొగ్గలూ, మామిడి తోపుల్లో పచ్చికాయలు కోసుకుంటూ, ఆటల్లో పాటల్లో మాటల్లో పడి,  కనుచీకటి వేళ  చేల గట్ల వెంట పరుగులు తీస్తూ ఇల్లు చేరడం ఇప్పటికీ కళ్ళ ముందు కదిలే సజీవ చిత్రం.

పిల్లలందరికీ పెద్ద బావిలో ఈతలు నేర్పించి, రాత్రి పూట ఆరుబయట అందర్నీ తన చుట్టూ చేర్చుకుని, ఒంటరి ఇంటి చుట్టూ భయం గొలిపే చీకటిని తన మాటల వెన్నెలతో వెలిగించి, జీవితాన్ని ఎలా ఈదాలో శిక్షణ ఇచ్చే నాన్నగారు అందించిన  ఆశావహ దృక్పథం. (‘ఎంత ఆశావాదమండీ.. ఎలా సాధ్య మైందీ? మాక్కొంత అప్పివ్వరాదూ?’ అనడిగిన ప్రముఖ కథకులకి ఇదే జవాబు )

అంతమందినీ ఆదరించి, ఆర్ధికంగా సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నా తోటలో పండిన వాటితోనే వండి వడ్డించిన అమ్మా, మామ్మా కలలా తోచే వాస్తవం.

 అంతులేని ఆకాశం నీలంగా, ఎగిరే కొంగలూ, ఎండలో మబ్బులూ  తెల్లగా, మెరప చేలూ, కారబ్బంతి తోటలూ ఎర్రగా, వరిపొలాలు లేత పచ్చగా, ఆకు పచ్చగా, పసుపు పచ్చగా … ‘ఎన్నిపూవులెన్నిరంగులెన్ని సొగసులిచ్చా’డో గమనిస్తూ, ఆస్వాదిస్తూ, రైతు జీవితంలోని  వ్యధలూ, వృధా ప్రయాసలూ, ఆశా భంగాలూ, ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలూ అనురాగాలూ స్వార్ధాలూ అపార్ధాలూ అర్ధం చేసుకుందుకు ప్రయత్నిస్తుంటే ఏదైనా రాయాలనే తపన మొదలైంది. ఇంట్లో సాహిత్య వాతావరణం ఎంత మాత్రం లేకపోయినా  నాకన్నా పెద్దవాళ్ళతో విభేదించినపుడు ఎదురుగా చెప్పలేని భావాలని అక్షరాల్లోకి కుదించడం అలవాటైంది. వార పత్రికలు  తప్ప గొప్ప సాహిత్యం ఏదీ అందుబాటులో లేని వాతావరణంవల్ల  నా రాతలకి మెరుగులు దిద్దుకునే వీలుండేది కాదు.

 ఆరు కిలోమీటర్ల దూరంలో నూజివీడు ఊరు. ఏడేళ్ళ ప్రాయంలో తిన్నగా మూడో తరగతిలో కూర్చోపెట్టారు సంవత్సరం మధ్యలో. చదువుకోసం అంతదూరం వెళ్ళాల్సి వచ్చేది. దారంతా నిర్మానుష్యంగా ఉండేది. అన్నలిద్దరి  సైకిళ్ళమీద వెనక కూర్చుని నేనూ మా చెల్లెలు. ఏనాడూ ఏ ఆపదా ఎదుర్కోకుండానే చదువు పూర్తి  చేసి మొదటి సారిగా ఊరు వదిలి  హైదరాబాద్ ప్రయాణం. కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పై చదువు. చిత్ర లేఖనం లో విద్యాభ్యాసం కొనసాగించవచ్చని తెలియక రసాయన శాస్త్రం లోకి   ప్రవేశించాను. చదువు కొనసాగిస్తుంటే తెలిసింది మానవ సంబంధాలకీ, రసాయనిక బంధాలకీ చాలా సారూప్యత ఉందని. 

 పదహారేళ్ళ వయసులో బడికీ, కళాశాలకీ మధ్య కనపడ్డ తేడాని నేపథ్యంగా తీసుకుని ఒక కథ రాసి నూజివీడు సాహితీసమితిలో చదవడం, తెలుగు లెక్చరర్ శ్రీ యమ్వీయల్ గారి ప్రశంస పొందడం, యూనివర్సిటీలో స్నేహితురాలి కబుర్లలో దొర్లిన ఒక సంఘటన ‘మనసు మనసుకీ మధ్య’ కథగా జ్యోతి వారపత్రిక లో అచ్చవడం, దానికి బాపూగారు మధ్య పేజీకి రెండు వైపులా విస్తరించిన బొమ్మ వేయడం యుక్తవయసు జ్ఞాపకాలు.

2 (3)

చెట్టూ పుట్టా పిట్టా ఏది కనిపించినా మనసులో కదిలే పద మాలికలు లలితగీతాలుగా రూపొంది 2003లో ‘వానచినుకులు’ గేయ సంపుటిగా రూపుదిద్దుకున్నాయి. మొదటి పుస్తకం పాటల పుస్తకమే. దాన్ని హిందూ వార్తా పత్రికకి సమీక్ష కోసం పంపితే వాళ్లు అనుకోని విధంగా నన్ను ఇంటర్వ్యూ చేసి, మెట్రో ప్లస్ లో ‘A rain song’  పేర ప్రముఖంగా ప్రచురించడం , ఆ పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం నించి ఇరవై వేల నగదు బహుమతితో ‘సాహితీ పురస్కారం’ లభించడం మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. ఆ ఉత్సాహంలో అప్పటికి రాసిన కథలు రెండు పదులైనా లేకపోయినా వాటన్నిటినీ కలిపి ‘ఆలంబన’  కథా సంపుటిగా వేసుకున్నాను. దానికి ముందుమాట రాసిన ఛాయాదేవిగారికి ఆ కథలు నచ్చి, తన అత్తగారి పేర తానందించే ‘అబ్బూరి రుక్మిణమ్మ పురస్కారా’నికి నన్నెన్నుకోవడంతో ‘నేనూ కథలు రాయగలను’ అనే ధైర్యం కలిగింది.

అప్పట్లో మన దేశంలోకి కొత్తగా వస్తున్న ఇంటర్నెట్ విప్లవం గురించి, అక్కడక్కడ కనిపిస్తున్న నెట్ సెంటర్ల గురించి ఆలోచిస్తుంటే కలిగిన ఆలోచనలనే  ‘ఆసరా’ కథగా మలిచి కౌముది పత్రికకి పంపితే బహుమతి లభించింది. ఆ కథ ప్రచురించ బడ్డ కొద్ది రోజులకే కథలో నేను వర్ణించిన సంఘటన నిజంగా జరగడం, ‘ప్రేమికుల్ని వంచిస్తున్న ఇంటర్నెట్ సీజ్’ పేర ఈనాడులో వార్త రావడం జరిగింది. కథకు లభించిన బహుమతి కన్నా కారా మాస్టారి పలకరింపు, స్వయంగా మా ఇంటికి వచ్చి ఆయన అందించిన ఆత్మీయమైన ఆశీస్సు గొప్ప సంతృప్తినిచ్చాయి. ‘బొమ్మలూ పాటలూ అలా ఉంచి కథ పైన ఎక్కువగా దృష్టి పెట్ట’మని ఆయనన్న  మాటలతో, స్వతహాగా చాలా తక్కువగా కథలు రాసే నేను  ఆ తర్వాత  కొంచెం  వేగం పెంచి ‘ఆసరా’ కథా సంపుటికి సరిపడా కథలు రాసి, పుస్తకాన్ని వెలువరించాను 2010లో. నా పుస్తకాలకి ముఖచిత్రాలూ, లోపల చిన్న చిన్న స్కెచ్ లూ నేనే వేసుకోవడం ఒక అలవాటయింది. కొండవీటి సత్యవతి కోరిక మీద భూమిక స్త్రీవాద పత్రికలో మూడేళ్ల పాటు కథలకి బొమ్మలు వేశాను. కొంతమంది ఇతర రచయితల పుస్తకాలకి కూడా ముఖ చిత్రాలు వేశాను.

మనో వృక్షం పై వాలే పిట్టలు ఆలోచనలు. వాటిని పట్టుకుని కథలుగా మార్చుకోవచ్చు. ఆలస్యం చేస్తే అవి ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోయినవి ఎగిరిపోగా మిగిలిన కాసినీ  దాదాపు అరవై కథలై, నా పేరు కథకుల సరసన నిలబెట్టాయి.

మనో మందిరంలో చెల్లా చెదరుగా కదలాడే ఇతివృత్తాలు, ఆగకుండా రొద పెడుతూంటే శాంతి ఉండదు. వాటిని కథలుగానో, కవితలుగానో,పాటలుగానో మార్చి, వాటి వాటి స్థానాల్లోకి చేర్చేవరకూ ఏదో అవిశ్రాంత స్థితి. పాతవి రూపం దిద్దుకునే సరికి ఏవో కొత్త ఆలోచనల కలరవాలు మళ్ళీ మొదలవుతాయి. సాహితీ సృజన కొద్దో గొప్పో అలవాటైతే ఇక ఆ ‘మనిషికి సుఖము లేదంతే’. మబ్బులై ముసిరే సృజనాత్మక ఆలోచనలతో మనసు బరువెక్కితే అవి సాహిత్యమై కురిశాక కలిగే మనశ్శాంతి అనిర్వచనీయమైనది. ఒకసారి అలవాటైతే అదొక వ్యసనమైపోతుందేమో.

 

 

అన్‌మోల్‌ రిష్తే

 స్కైబాబ

 

స్కైబాబా

పెళ్ళైన కొత్తల్ల ఒకటె ఉబలాటంగుంటది పెళ్ళాం మొగుళ్ళకు- ఒకల ముచ్చట్లు ఒకలకు చెప్పుకోవాల్నని. దాంతో తమ అలవాట్లన్ని తమ ప్రత్యేకతలుగా చెప్పుకుంటుంటరు. కొందరేమొ ‘గొప్పలు’ చెప్పుకుంటుంటరు. నేను ఫలాన కూరగాయలు తినను.. నాకు ఫలానా మాంసం యమ ఇష్టం.. ఇట్ల మొదలైతె- నాకు ఫలానా తీర్గ ఉండేటోల్లంటె అస్సలు నచ్చరు. ఫలానా మస్త్‌ పసంద్‌- దాంక…
అట్లనె జబీన్‌-మహబూబ్‌లు గుడ తమ పెళ్ళైనంక తమ గొప్పలు చెప్పుకున్నరు. ఆ చెప్పుకునుడు ఏడిదాంక పోయిందంటె- మహబూబ్‌ తానొక పిల్లను ప్రేమించి ఉంటినని ఆ పిల్లను అస్సలు మర్షిపోలేనని ఆ కతంత చెప్పుకొచ్చిండు. అంతేగాంక ఆ తరువాత గుడ ఒక పిల్ల తన ఎంట పడేదని గొప్పగ చెప్పిండు. అట్లా పెళ్ళైనప్పటిసంది తన ప్రేమకతలు చెప్పుకుంటనే వస్తున్నడు మహబూబ్‌. జబీన్‌కు తన ప్రేమకత గూడ ఒకటిరెండుసార్లు నోటిదంక వచ్చింది. గని ఉగ్గబట్టుకుంది. ఒకరోజు మాత్రం మహబూబ్‌ తన తొలి ప్రేమ గురించి మహా గొప్పగ చెప్పుకుంటుంటె.. ఇగ ఉండలేకపొయ్యింది. మహబూబ్‌ జర మనసున్నోడే ఉండు, తన ప్రేమ కత చెప్పుకున్నా ఏమనేటట్లులేడులె అనుకున్నది.. ఎనకాముందాడుకుంటనె తన ప్రేమ కత గుడ చెప్పుకున్నది!
తన కత గొప్పగనే చెప్పుకున్న మహబూబ్‌కు పెళ్ళాం ప్రేమ కత చెపుతుంటే మాత్రం మనసుల్నించి ఉక్రోషం తన్నుకొచ్చింది. బైటబడితె ఆయింత చెప్పకుంటనె యాడాపేస్తదోనని ఊకున్నడు. కొద్దిసేపు ఊఁ గొట్టిండు. ఐటెంక ఊఁగొట్టుడు బందైంది. జబీన్‌ను ఒళ్లోకి గట్టిగ పొదువుకొని పండుకున్నోడల్లా పట్టు ఒదిలిండు. ఇదేం సమజ్‌ చేస్కోకుంటనె తన ప్రేమకతంతా చెప్తున్నది జబీన్‌-
తను, పక్కింటి అమీర్‌ ప్రేమించుకున్నమని- అతను షానా మంచోడుండెనని.. తండ్రి సచ్చిపోవడంతోని ఇప్పట్లో షాదీ చేసుకునుడు కుదరదని చెప్పిండని.. తను షానా ఏడ్షిందని.. కొన్నాళ్ళకు వాళ్ళు వేరే పట్నానికి ఎల్లిపోయిన్రనేది ఆ కత. మహబూబ్‌ మొఖం మాడిపొయి షానాసేపయింది. ఆ చీకట్ల అది గమనించే వీలు లేదు జబీన్‌కు. సప్పుడు చెయ్యకుంట జబీన్‌ను వదిలి అటు మల్లి పండుకుండు మహబూబ్‌. పరేషానయింది జబీన్‌. అంతదంక మైమరచి చెప్పుకుంట వచ్చినదల్లా చెప్పి తప్పు చేసిన్నా ఏందని ఒక్కసారిగ మనసుల గుబులు పడ్డది. మహబూబ్‌ మీద చెయ్యి ఏసి ‘ఏమైంది జీ.. నిద్ర వస్తుందా!’ అనడిగింది. ‘ఊఁ’ కొడితే తన అయిష్టత యాడ బైటపడకుం పోతదనుకున్నడో ఏమో ‘నై’ అని జర ఊటగనె అన్నడు. సమజయింది జబీన్‌కు. వెనుక నుంచి మరింత దగ్గరగా జరిగి ‘కోపమొచ్చిందా?’ అని గోముగ అడుగుకుంట గట్టిగ హత్తుకుంది. ‘అదంతా పాత కత. ఇప్పుడు నువ్వే నా పానం’ అని చెవిలో చెప్పింది. మెదలకుండా జవాబేమి ఇవ్వకుంట పండుకుండు మహబూబ్‌.
అప్పుడనుకుంది జబీన్‌- మొగుడు ఎన్ని ప్రేమకతలు చెప్పినా ఇనాలె గని, పెళ్ళాం తన ప్రేమకత మాత్రం అస్సలు చెప్పకూడదని! మహబూబ్‌ చెప్పిన రెండు ప్రేమకతలకు మనసులో ఎక్కణ్నో మంటగ అనిపించింది కని బహుశా తనగ్గూడా ఒక ప్రేమకత ఉండటంతోని అంతగనం కోపం రాలేదు జబీన్‌కు. చెప్పుకున్నందుకు మనసు జర అల్కగయ్యింది.
గని మహబూబ్‌ అలిగేసరికి మనసుల మల్లో గుబులు మొదలైంది, పుసుక్కున ఇది మనసుల పెట్టుకుని సతాయించడు గదా అని. ఇట్ల సోంచాయించుకుంట మహబూబ్‌ను అట్లనే అల్లుకుని ఉండిపొయింది ఆ రాత్రి. ఇద్దరి మనసుల్ల సుడులు తిరుగబట్టినయ్‌ ఒకరికొకరు చెప్పుకున్న ప్రేమకథలు…!
***
ఏండ్లు గడిషిపొయినయి. ఇద్దరు పిల్లలు పుట్టిన్రు. మహబూబ్‌ మంచోడే. జబీన్‌ను మంచిగనే సూసుకుంటున్నడు. కాని అప్పుడప్పుడు ఇద్దరూ కొట్లాడుకున్నప్పుడల్లా ‘నువ్వు సొక్కమా?’ అంటె ‘నువు సొక్కమా?’ అని ఒకరిమీద ఒకరు అర్సుకునేటోల్లు. మంచిగున్నప్పుడు, యాదొచ్చినప్పుడల్లా ఉండబట్టలేక తన తొలి ప్రేయసి గురించి అదొ ఇదొ చెప్తనె ఉండేటోడు మహబూబ్‌. చెప్పుకుంటున్నప్పుడల్లా ఊఁ కొడుతూనే జబీన్‌ ఏదో లోకంలోకి ఎల్లిపోతుండటం గమనించేటోడు. తనకు గుడ అమీర్‌ గుర్తొస్తున్నడేమోనని సోంచాయించేటోడు. జర మనసుల మంటగ ఉండేది. కాని తమాయించుకునేటోడు. ఒక్కోపాలి మెల్లగ అడిగేటోడు, ‘అమీర్‌ గురించేమన్నా తెలిసిందా! ఎట్లున్నడంట?’ అని.
జబీన్‌ మాత్రం గత అనుభవాన్ని మతిల తలుసుకుని ఏం చెప్పకపొయ్యేది. ‘ఏమో తెలియదు. నేనెప్పుడో మర్షిపొయిన కతను నువ్వెందుకు మల్ల గుర్తు చేసుడు’ అని ఊటగ అని, అక్కడ్నించి తొలిగి పనుల్ల పడిపొయ్యేది.
అట్ల అననైతె అనేదిగని పుట్టింటికి పొయినపుడు మాత్రం అమీర్‌ గురించి ఆరా తియ్యకుంట ఉండలేకపొయ్యేది. యాణ్ణో ఒక తాన బతికే ఉన్నడు లెమ్మని నిమ్మలపడేది.
 ఒకపాలి ఊర్లె చుట్టాలింట్ల పెండ్లికి పొయ్‌న మహబూబ్‌కు తన తొలి ప్రేయసి తారసపడింది. గుండె గుబగుబలాడింది. ఎన్నాల్ల నుంచో కలవాల్ననుకుంటున్న తను కనిపించేసరికి పానం లేసొచ్చినట్లయింది. కాకపోతె ఆమె తీరే జర తేడా గొట్టింది. ఆమెను చూసి మహబూబ్‌ ఎంతైతే అలజడికి గురైండో ఆమెలో మాత్రం అలాంటిదేమి కనిపించలేదు మహబూబ్‌కు. పట్టనట్టే తిరగబట్టింది. మనిషి లావయింది. భారీ చీరలో ఒంటినిండ నగలతోని షానా ఫోజు కొట్టబట్టింది. ఉండబట్టలేక జర సందు చూసుకొని మాట్లాడతానికి కోషిష్‌ చేసిండు మహబూబ్‌- ‘జర పక్కకు రారాదు, కాసేపు మాట్లాడుకుందాం’ అని అడిగిండు. ‘హమ్మో! మా ఆయన చూస్తే ఏమైనా ఉందా.. నేను రాను’ అన్నది. ఊర్లెనే ఉన్న తమ ‘యింటికన్న ఒకసారి వచ్చిపోరాద’ని అడిగిండు. ‘వామ్మో! మా అత్తగారికి తెలిస్తే ఏమన్నా ఉందా.. కుదరదు’ అన్నది. తిక్క లేషింది మహబూబ్‌కు. ఇన్నాళ్ళ సంది ఒక్కపాలి ఎదురుపడితే బాగుండునని అంతగనం గోస పడ్డది గిట్లాంటి దాని కోసమా అని ఒకటే ఫీలయిండు. కని ఏం జేస్తడు, పానం కొట్టుకుంటుండె.. తమాయించుకుని మల్ల సందుచూసుకుని అడిగిండు, ‘ఎట్లున్నవ్‌.. అంతా నిమ్మలమేనా?’ అని. ‘నాకేంది, నేను మస్తున్న.. మా ఆయన నన్ను దేవతలెక్క చూసుకుంటడు. నేను లేకుంట ఐదు నిమిషాలు గుడా ఉండలేడు. ఏది కావాలంటె అది కొనిస్తడు…’ అనుకుంట వాళ్ళాయన గురించే గొప్పలు చెప్పబట్టింది. అంతల ఎవడో పోరగాడొచ్చి వాళ్ళ అత్త పిలుస్తున్నదని చెప్పిండు. ‘హమ్మో! నేను పోతున్నా..’ అనుకుంట గబ్బగబ్బ గున్న ఏనుగులెక్క ఎల్లిపొయింది. అట్లనే జరసేపు మొద్దులెక్క నిలబడ్డడు మహబూబ్‌. అప్పట్నించి ఆ పెండ్లి నుంచి ఎల్లొచ్చిందాంక మల్ల ఎదురుపడనే లేదు ఆమె.
ఇంటికొచ్చేసినంక ఆ రాత్రి తన మనసులో సుడి తిరుగుతున్న బాధనంత జబీన్‌కు చెప్పుకుంట చిన్నపిల్లగాని లెక్క బోరున ఏడ్వబట్టిండు మహబూబ్‌. ఒళ్ళోకి తీసుకొని ఓదార్చింది జబీన్‌. జబీన్‌ గుడ మహబూబ్‌ ఏడ్పుల ఏడ్పు కలిపి తనివితీర ఏడ్చింది, అమీర్‌ గుర్తొచ్చి! జబీన్‌ ఒళ్ళోకి ముడుచుకుని అట్లనే నిద్రపొయిండు మహబూబ్‌. ‘అమీర్‌ గుడా తనను మర్చిపోయి ఉండొచ్చా…’ అని సోంచాయిస్తూ సోంచాయిస్తూ ఎప్పటికో నిద్రపొయింది జబీన్‌.
***
అప్పటిసంది జబీన్‌ మీద మరింత ప్రేమ పెరిగింది మహబూబ్‌కు. ఇంకింత మంచిగ చూసుకోబట్టిండు. ఆమె మంచితనం.. ఆమె అందం మస్తు గొప్పగా కనిపించబట్టినయి.. దాంతో ఆమెను అపురూపంగ చూసుకోవటం.. ఏదున్నా తనకు చెప్పి చెయ్యడం చెయ్యబట్టిండు. ఒకపాలి మాటల్ల అమీర్‌ గురించి ప్రస్తావనొచ్చింది-
‘…యాడున్నడో తెల్సుకో జబీనా… ఒకసారి ఇద్దరం కలిసివద్దాం’ అన్నడు మహబూబ్‌.
కలవరపడ్డది జబీన్‌. నమ్మబుద్ది కాక మహబూబ్‌ దిక్కు సూషింది.
‘నిజంగంటున్న జబీనా! తెల్సుకో.. తప్పేముంది.. పలకరింపుగ కలిసివద్దాం! నాగ్గూడా అతన్నొకపాలి సూడాల్నని ఉంది’ అన్నడు.
కండ్లల్ల నీల్లు చిమ్ముతుండేసరికి ఝట్‌న వంటింట్లకు తప్పుకుంది జబీన్‌.
‘నిజంగనే అంటున్న జబీనా.. తెలుసుకో!’ అన్నడు ఊటగ మహబూబ్‌.
‘సూద్దాంలే జీ!’ అన్నది వంటిట్ల నుంచి, లెక్కచెయ్యనట్లు.
ఎప్పుళ్ళేంది ఇట్లంటున్నడేంది అని జర అనుమానమేసింది జబీన్‌కు. కాని తనకు గూడ మనసుల సూడాల్ననే ఉన్నది. ఆ విషయం ఏ మాత్రం బయటపడనీయలేదు.
నిజానికి- తను అంతగనం చెప్పుకున్న తన ప్రేయసి తనంటే ఏమాత్రం పట్టించుకోకపోవడం ఎంతకూ అజం కాలేదు మహబూబ్‌కు. దాంతో జబీన్‌ విషయంలో అమీర్‌ ఎట్ల ఫీలయితడో సూడాల్ననే ఉబలాటం ఎక్కువైంది. అందుకనే అమీర్‌ను కలుద్దామని అనబట్టిండు..
మహబూబ్‌ డ్యూటీకి పోంగనే తమ ఊర్లె ఉన్న చెల్లె ముబీన్‌కు ఫోన్‌ చేసింది జబీన్‌. జరసేపు పలకరింపు లయినంక ‘అమీర్‌ వాళ్ళు ఇప్పుడెక్కడ ఉంటున్నరంటరా?’ అనడిగింది.
‘అయ్యో.. నీకు తెలవదా ఆపా! వాళ్ళిప్పుడు గోల్కొండల్నె ఉంటున్నరంట. అమీర్‌ కారు నడుపుతున్నడంట. గోల్కొండ ఇప్పుడు మీకు దగ్గర్నే కదా!’ అన్నది.
‘అవునా!’ అని ఆశ్చర్యపొయింది జబీన్‌. ఇంకా కొన్ని వివరాలు చెప్పింది ముబీన్‌.
ఇగ అప్పటిసంది మల్ల మహబూబ్‌ ఎప్పుడు అడుగుతడా అని ఎదురుసూడబట్టింది గని తనకు తానైతె ఆ విషయం ఎత్తలే.
కొన్నాల్లకు మల్ల మాటల్ల అడగనే అడిగిండు మహబూబ్‌, ‘అమీర్‌ గురించి తెలుసుకోమంటి గదా!’ అని. అప్పుడు గుడ జర ఎనకాముందాడుకుంటనే- ‘మొన్న ముబీన్‌ చెబుతుండె, వాల్లిప్పుడు గోల్కొండల్నె ఉంటున్నరంట’ అన్నది.
‘అవునా.. మరింకేంది, ఒకరోజు పొయ్యొద్దాం’ అన్నడు మహబూబ్‌.
‘ఎందుకులే జీ! ఐటెంక మీరు ఎప్పుడన్నా ఎత్తిపొడిసినా పొడుస్తరు. ఎందుకొచ్చిన పరేషాని’ అన్నది.
‘ఎహె! అట్లెందుకు జేస్త జబీనా, ఏమనలే! ఒకసారి పొయివద్దాం’ అన్నడు.
‘సరె తీయ్‌.. చెల్లెకు చెప్త అడిగిసూడమని. ఏమంటరో సూద్దాం’ అన్నది.
కొన్నాళ్లకు ముబీన్‌ ఏదొ ఎక్జామ్‌ రాయడానికి హైదరాబాద్‌ వొచ్చింది. మహబూబ్‌ అడగమంటె అమీర్‌ నెంబర్‌ సంపాయించి మాట్లాడింది ముబీన్‌. ఆ ఆదివారం ఎల్లడానికి ఓకే అయింది.
ఆదివారంనాడు పొద్దున అనుకోకుంట హైదరాబాద్‌లనె ఉండే మహబూబ్‌ తమ్ముడు ఒచ్చిండు.. వీళ్ల ప్రోగ్రాం విని పొద్దుగూకాల తన పిల్లలతో సహా తీసుకొస్తనని వీళ్ల పిల్లల్ని తీస్కెల్లిండు. ఇగ పిల్లల గడ్‌బడ్‌ గుడ లేకుండేసరికి తమాషిగ తయారై ముగ్గురు పయనమైన్రు అమీర్‌ వాల్లింటికి.
ముబీన్‌కు ఫోన్‌ల అడ్రస్‌ చెప్పుకుంట రోడ్డు దంక వచ్చి నిలబడ్డడు అమీర్‌. ఇంకొద్దిసేపట్ల ఎదురు పడతడనంగనె జబీన్‌ గుండె ఊటగ కొట్టుకోబట్టింది. ఆటోల నించి అమీర్‌ కనపడంగనె లోకం మర్షినట్లయింది. సంబాళించుకుంది. మహబూబ్‌ ఒకపాలి జబీన్‌ దిక్కు సూషిండు. మహబూబ్‌ తనను గమనిస్తున్నట్లు సమజై అమీర్‌ మీంచి చూపు తిప్పుకుంది. కాని మనసు కల్లోలమైపోయింది. ‘అరె, సందమావ లెక్క ఉండెటోడు వట్టిచేప లెక్క తయారైండేంది’ అని నమ్మలేనట్లుగ ఫీలయింది. అంతదాంక మొఖంల ఎంత దాచుకుందామన్న దాగని కళ మాయమైపొయింది. అతడ్ని చూసిన్నన్న ఖుషి మాయమై దాని తలంల విచారం చోటుచేసుకున్నది. ఈలోపల మల్లొకసారి జబీన్‌ దిక్కు సూషిన మహబూబ్‌కు ఏం సమజ్‌కాలె. రాయిలెక్క కూసున్న జబీన్‌ను ‘జబీనా! ఉత్‌రో’ అంటూ జర కదిలించిండు. చమక్‌ తిన్నట్టు దునియాలోకొచ్చిపడి ఆటో దిగింది జబీన్‌. అప్పటికే దగ్గరకొచ్చిన అమీర్‌ మహబూబ్‌కు సలామ్‌ చేసి చేయి కలిపిండు. ‘వాలేకుం సలామ్‌’ అని చేయి కలుపుకుంట బలవంతంగ నవ్వు మొహం పెట్టిండు మహబూబ్‌. ముందే సలామ్‌ చేసిన ముబీన్‌ ‘కైసే హై అమీర్‌ భాయ్‌?’ అంటూ పలకరించింది. ‘సబ్‌ ఠీక్‌. దువా హై’ అన్నడు.
అమీర్‌కు సలామ్‌ చెప్పుకుంట అట్ల ఒక్క క్షణం కళ్ళెత్తి అతని దిక్కు సూషి కండ్లు దించుకుంది జబీన్‌. తన కండ్లల్ల తడి మెరుపు మహబూబ్‌ కంట్ల పడొద్దని జబీన్‌ కోషిష్‌. ‘వాలేకుమ్‌ సలాం’ చెప్పిండు చేయిలేపుకుంట అమీర్‌, గని గొంతు బైటికి రానేలేదు. సంబాళించుకుని ‘ఆయియే!’ అనుకుంట తమ ఇంటిదిక్కు దారి తీసిండు. అతని ఎనక మహబూబ్‌ ఆ వెనక అక్కచెల్లెళ్ళు నడిషిన్రు. సన్నని గల్లీలకు మల్లిండు అమీర్‌. గొంతు పెగలదేమోనన్న డౌట్‌తోటే ఏం పలకరింపులు లేకుంటనే నడుస్తున్నడు అమీర్‌.
‘కార్‌ చలాతె హై కతెనా ఆప్‌? జాతి? రెంటెండ్‌? (కార్‌ నడుపుతున్నరంట గదా మీరు. సొంతమా? వేరేవాళ్లదా?)’ అడిగిండు మహబూబ్‌.
‘నై.. దూస్‌రోంకి హై! ఓ యహీఁ రహెతే (లేదు.. వేరేవాళ్లది. ఆయన ఇక్కడే ఉంటారు) అన్నడు ఎనక్కి తల తిప్పి అమీర్‌.
‘అచ్ఛా’ అని ‘పంద్రా హజార్‌తోభి మిల్‌తీ తన్‌ఖా? (పదిహేనువేలన్నా దొరుకుతుందా జీతం?)’
‘నై భయ్‌! దస్‌ హజారీచ్‌ మిల్తీ, ఉప్పర్‌ భత్తా మిల్తానా.. (లేదన్నా! పది వేలే ఇస్తరు. పైన బత్తా దొరుకుతది కదా)’
‘అచ్ఛా!’
ఇంతల ఇల్లొచ్చింది. వీల్ల మాటలు వినుకుంట నడుస్తున్నది జబీన్‌. చూపంతా బొక్కలు తేలిన అమీర్‌ మీదనే ఉంది. అతని గొంతుల గుడ గరీబీ మజ్బూరి వింటున్నది జబీన్‌. ఎందుకో.. అస్సలు నమ్మశక్యంగ లేదు జబీన్‌కు. మనిషి గట్టిగ, మాట స్థిరంగ ఉండేది. బహుశా అబ్బాజాన్‌ చనిపోవడంతోటి ఇద్దరు చెల్లెండ్ల షాదీలు.. ఆ అప్పుల భారం కుంగదీసి ఉంటుంది అనుకుంది.
‘ఆయియే!’ అని పర్దా జరిపి లోపలికి పిలుస్తున్నడు అమీర్‌. చెప్పులు బైట ఇడవాల్న లోపల్నా అని మహబూబ్‌ ఎనకాముందాడుతుంటే ‘పర్వా నై.. అందర్‌ ఛోడో’ అంటున్నడు అమీర్‌. బైట మరీ గల్లీలకు తలుపు ఉండేసరికి లోపల్నే తలుపు పక్కకు చెప్పులు ఇడిషిండ్రు ముగ్గురు. కుర్సీలు రెండు వీల్ల కోసమని జరిపి కూసొమన్నడు అమీర్‌. అటుపక్కన గోడకు మసేరి మంచం ఉన్నది. తలుపుకటు పక్కన ఒక పాతబడ్డ పోర్టబుల్‌ టీవీ ఉన్నది. ఇటుదిక్కు ఒక అల్మారి, దాని పక్కన బట్టల దండెం. ఆ దండ్యానికి ముందు కుర్సీల జబీన్‌, అల్మారీ ముందేసిన కుర్సీల మహబూబ్‌, మంచం మీద ముబీన్‌ కూసున్నరు. ఆ చిన్న అర్ర ఔతలి దిక్కున్న తలుపుల్నుంచి లోపలికి పొయిండు అమీర్‌.
అంతల్నె బయటినుంచి పర్దా తోసుకుంట ఒక ఆరేడేళ్ళ పిల్ల, నాలుగేండ్ల పిలగాడు ఉరుకొచ్చిన్రు. ఝట్‌న ఈ ముగ్గురు కొత్తోల్లను సూషి ఆగిపొయిన్రు. తెల్లగ ముద్దుగున్నరు. కని ఇద్దరు గుడ ఎండు చేపల్లెక్కనే ఉన్నరు బక్కగ. ‘అమీర్‌ భాయ్‌ పిల్లలట్టుంది’ అన్నది ముబీన్‌. ‘ఇదర్‌ ఆవో. క్యా నామ్‌ తుమారా?’ అన్నది జబీన్‌ పిల్లల్ని దగ్గరికి పిలుచుకుంట. పెద్ద పిల్ల కదలి జబీన్‌ దగ్గరకు వస్తూ ‘సమీనా’ అన్నది. ఒళ్ళో కూసొబెట్టుకున్నది జబీన్‌. పిలగాడు మాత్రం పర్దా అంచు నోట్లె పెట్టుకుని అటూఇటూ ఊగుకుంట అట్లనే నిలబడ్డడు. అంతల అటునుంచి అమీర్‌ ఒచ్చి ఎనక ఒచ్చిన తన బేగమ్‌ను ములాఖత్‌ చేసిండు, ‘రుబీనా’ అనుకుంట. రుబీనా అందర్కి సలాం చేసింది. వీళ్ళు ప్రతిసలామ్‌ చేస్కుంట వచ్చి కూసొమన్నరు. ‘పర్వా నై’ అనుకుంట రుబీనా గనుమల్నె నిలబడ్డది. అమీర్‌ ఒచ్చి మంచం మీద అటు చివర కూసున్నడు.
కొద్దిసేపు నల్గొండల తమ ఇండ్లు పక్కపక్కన ఉన్నప్పటి సంగతులు యాది తెచ్చుకుంట మహబూబ్‌కు చెప్తున్నట్టుగ ముచ్చట పెట్టిన్రు ముబీన్‌, అమీర్‌, జబీన్‌లు. మహబూబ్‌ చూస్తలేడనుకున్న క్షణం జబీన్‌ని ఓ రెండుసార్లు మాత్రమె సూషిండు అమీర్‌.. ఇద్దరి కండ్లల్ల ఒక దర్ద్‌.. ఒక ఆరాధనా భావం…
‘గోల్కొండ రావడం ఎట్లయింది?’ అని ముబీన్‌ అమీర్‌ను అడిగింది.
‘కార్‌ ఇక్కడిది దొరికింది. ఓనర్‌ జర మంచోడు. ఇగ నౌకరీకి కొన్నాల్లు ధోకాలేదని గోల్కొండకొచ్చినం’ చెప్పిండు అమీర్‌. రుబీనా ఊరేదని కాసేపు ఆమెను పలకరించిన్రు.
అమీర్‌ మాట్లాడుతున్నప్పుడు అందరితో పాటు అతన్ని చూసుకుంట ఉండిపోతున్నది జబీన్‌. ముఖంపై కళ తప్పింది, బొక్కలు తేలినై, బట్టలు గూడా ఉన్నదాంట్ల మంచియి ఏసుకున్నట్లుంది కని అయిగుడ పాతబడ్డయి. పిల్లల బట్టలు గుడ అంత బాగలెవ్‌..
వాళ్ళ హాలతు అంతమంచిగ లేదని వీళ్ళు ముగ్గురికి సమజయింది. రుబీనా అందంగా ఉందిగని తను గుడ బక్కచిక్కి ఉంది. ఉన్నదాంట్ల జర మంచి చీర కట్టుకున్నట్లుంది. తల మీద కొంగు కప్పుకుని నిలబడ్డది. ఎంత కూసొమన్న కదల్లేదు. వాళ్ళ కొడుకు పర్దా వదిలి తల్లి కాడికి ఉరికి అల్లుకుపొయి నిలబడ్డడు. వాని చుట్టూ చేతులేసి ‘బేటా!’ అని పరిచయం చేసింది.
‘ఇదరావ్‌ బాబా!’ అనుకుంట మహబూబ్‌ మల్ల పిలిషిండు. వాడు రాలె. తల్లి కొంగు నోట్లో పెట్టుకోబోతే వారించి ‘జావ్‌’ అన్నది రుబీనా. వాడు కదల్లే. ఈలోపు సమీనా బైటికురకడంతోటి జబీన్‌ చేయిచాపి వాని రెట్ట పట్టుకుని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టుకుంట ఒళ్ళో కూసొబెట్టుకుంది.
‘ఏం చదువుతున్రు పిల్లలు?’ అడిగిండు మహబూబ్‌.
‘సమీనా రెండో తరగతి, వాడు ఇప్పుడిప్పుడే బడికి పోతున్నడు’ చెప్పిండు అమీర్‌, మల్ల తనె, ‘మీ పిల్లలు ఏం చదువుతున్నరు?’ అనడిగిండు.
‘బేటా ఫిఫ్త్‌ క్లాస్‌.. బేటీ థర్డ్‌ క్లాస్‌’ అన్నడు.
టైం రెండు కావడంతోని ‘అన్నం తీస్త’ అని లోపలికి పొయింది రుబీనా. ఎనకనె అమీర్‌ లేషి కాళ్లు చేతులు కడుక్కుందురు లెమ్మన్నడు. ఆడోళ్లిద్దరు లేషి లోపలికి పొయిన్రు. అమీర్‌ ఎనక మహబూబ్‌ కదిలిండు. ఆ అర్ర దాటంగనె చిన్న హమామ్‌. అందుల్నె లెట్రిన్‌ ఉన్నది. దాని ముందు నుంచి లోపలి అర్రలకు దారి ఉంది. లోపలిది వంట అర్ర. అవతలికి కిటికి ఉంది. ఆడోళ్లకు ఆ అర్ర సూపెడుతున్నది రుబీనా.
హమామ్‌లకు పోయి మొఖం కాళ్లు చేతులు కడుక్కొని ఒచ్చిండు మహబూబ్‌. ఆ ఎనక జబీన్‌, ముబీన్‌ గుడ కడుక్కొని ఒచ్చిన్రు. రుబీనా కింద సాప ఏసి దస్తర్‌ఖాన్‌ పరిషింది. చికెన్‌ బిర్యాని, టమాట శేర్వా, పెరుగు చారు తెచ్చి పెట్టింది. కూసొమన్నరు వీళ్లను. సూస్తె మూడు ప్లేట్లే ఉన్నై. ‘మీరు గుడ కూసోరి’ అన్నరు వీల్లు. ‘మేం తర్వాత తింటం. మీరు తినురి’ అన్నడు అమీర్‌. ‘అందరం కల్సి తిందం’ అన్నడు మహబూబ్‌. వాల్లు అస్సలు ఇనలె. సరెనని ఈల్లు ముగ్గురు కూసున్నరు. పిల్లలు ఇటు రాకుంట సూసుకున్నరట్లుంది వాల్లు. పిల్లలు రాలె. ‘మీరు వడ్డించురి’ అని బర్తతో చెప్పి లోపలికి పొయింది రుబీనా. అమీర్‌ ముందుకు రాబోతె మహబూబ్‌ వారించిండు. తాము ఏసుకుంటమని చెప్పి బిర్యాని ఏసుకున్నడు. ముక్కలు షానానే ఉన్నయ్‌. రెండే ఏసుకొని జబీన్‌ దిక్కు బిర్యాని ముష్కాబ్‌ జరిపిండు. ‘ఔర్‌ దాల్లో భాయ్‌!’ అంటున్నడు అమీర్‌. ‘బాద్‌మె దాల్లేంగే’ అన్నడు మహబూబ్‌. జబీన్‌ గూడ రెండు ముక్కలు ఏసుకొని ముష్కాబ్‌ చెల్లె దిక్కు జరిపింది. ముబీన్‌ గుడ అట్లనె చేసింది. అంతల్నె గడపలకు వచ్చిన రుబీనా ‘అరె, వాల్లు సరిగ ఏసుకుంటలేరు, మీరు ఎయ్యిరి’ అన్నది జర ఊటగ. ఇగ వీల్లు వద్దు వద్దంటున్నా అమీర్‌ వంగి బిర్యానిల నుంచి తలా కొన్ని చికెన్‌ ముక్కలు మల్ల ఏషిండు.
బిర్యాని మస్తు మజాగ ఉండటంతోని, ఉండలేక ‘బిర్యాని బహుత్‌ అచ్ఛీ హై.. అచ్ఛా బనాయె’ అన్నడు మహబూబ్‌. ‘హవ్‌! బహుత్‌ మజేదార్‌ హై! ఇత్నా అచ్ఛా బిర్యాని పకానా కాఁ సికే ఆపా?’ అన్నది రుబీనా దిక్కు సూషి ముబీన్‌. రుబీనా నవ్వుకుంట ‘హమారె అమ్మీ కె పాస్‌’ అన్నది.
‘ఇంకా ఏసుకొని తినురి, మీరు షర్మాయిస్తున్నరు’ అని నవ్వుకుంట లేషి లోపలికి పొయిండు అమీర్‌ రుబీనాను లోపలికి రమ్మని సైగ జేస్కుంట. రుబీనా గుడ లోపలికి పొయింది.
‘ముక్కలన్ని మనకే ఏషిన్రు భాయిజాన్‌! వీల్లేం తింటరు?’ అన్నది ముబీన్‌ నవ్వుకుంట.
‘అవును, చేసిన బిర్యాని అంతా మనకే తీసి పెట్టినట్లుంది. పిల్లలు, వీల్లు ఏం తింటరు. మనకు రెండ్రెండు ముక్కలు సాలు కదా.. వాళ్లు రాకముందే ఈ ముక్కలు బిర్యానిల ఏసేద్దామా?’ అన్నడు మహబూబ్‌.
తల ఊపింది జబీన్‌. ఎంటనె మంచి ముక్కలు తీసి ముగ్గురు గుడ జల్ది జల్ది బిర్యానిల ఏషిన్రు. ముబీన్‌ ఎనక్కి ఒకసారి వాల్లు వస్తలేరని సూస్కొని ఆ ముక్కల్ని గంటెతోని కిందికి అని, పైన అన్నం కప్పేసింది.
కాసేపటికి అమీర్‌ ఒచ్చి కుర్సీల కూసున్నడు. వీల్లు ముందు బిర్యాని, ఐటెంక కొద్దికొద్దిగ టమాట షేర్వాతోని తిని పెరుగు ఖట్టా ఏసుకుంటున్నరు. ‘ఇంకొద్దిగ బిర్యాని ఏసుకోన్రి. బిర్యాని ఒడువనె లేదు’ అంటున్నడు అమీర్‌.
‘బస్‌ బస్‌! బహుత్‌ ఖాలియే.. అచ్ఛా బనాయె బిర్యాని.. మస్త్‌ మజా హై’ అనుకుంట లేషిండు మహబూబ్‌..
‘ఆయియే’ అనుకుంట మల్ల లోపలికి దారి తీషిండు అమీర్‌. నీల్ల తొట్టిల జగ్గు ముంచి నీల్లు అందిచ్చిండు. కడుక్కొని లోపలికొచ్చిండు మహబూబ్‌. ఆడోల్లు గుడ కడుక్కొనొచ్చి కూసున్నరు.
రుబీనా ప్లేట్లు తీసుకుంట ‘చాయ్‌ పీతే?’ అని అడిగింది.
‘లేదు, ఇప్పుడేమొద్దు’ అన్నడు మహబూబ్‌. ‘ఆప్‌ భి ఖాలేనా థానా?’ అన్నడు మల్ల.
‘నై, హమ్‌ బాద్‌మె ఖాతె, అందర్‌ బచ్చోంకొ దేతిమ్‌’ అన్నది రుబీనా.
రాయి లెక్క కూసొని ఏందొ సోంచాయిస్తున్న అమీర్‌ను అదొ ఇదొ మాట్లాడిస్తున్నడు మహబూబ్‌. తేరుకొని జవాబ్‌లిస్తున్నడు అమీర్‌. అమీర్‌ను అట్లా చూస్తు ఉండిపొయింది జబీన్‌. అతన్ని చూస్తుంటె మనసంత డోక్కుపోతున్నది జబీన్‌కు. ముబీన్‌ లేషి లోపలికి పొయి రుబీనాతో మాట్లాడుతున్నది. కొద్దిసేపట్కి-
‘ఇగ పోతం’ అని లేషిండు మహబూబ్‌. దాంతొ ఎంటనె లేషింది జబీన్‌. లోపల్నుంచి ముబీన్‌ గుడ ఒచ్చింది. తాము జల్ది ఎల్తె వాల్లు గుడ తింటరనిపించింది ముగ్గురికి.
‘అప్పుడేనా! ఇయాల ఉండురి’ అన్నడు అమీర్‌ లేషి.
‘లేదు, ఎల్లాలె, పని ఉంది’ అన్నడు మహబూబ్‌, అస్సలు కుదరదన్నట్లు.
రెట్టించలేదు అమీర్‌, ‘రుబీనాను పిలుస్త’ అని లోపలికి ఎల్లిండు.
మహబూబ్‌ జల్ది జేబుల్నుంచి పైసలు తీసి ఐదు వందల నోట్లు నాలుగు జబీన్‌ చేతిల పెట్టి ‘రుబీనా చేతిల పెట్టు.. పాపం, షానా పరేషాన్‌ కనబడుతున్నరు’ అన్నడు.
ఇబ్బందిగ అనిపించింది జబీన్‌కు..
రుబీనాను పిలిషి మల్ల ఒచ్చిండు అమీర్‌, ‘ఒస్తున్నది’ అన్నడు.
ఎంటనె లోపల్కి పొయింది జబీన్‌. పిల్లలిద్దరికి అన్నం పెడుతున్నది రుబీనా. జబీన్‌ను చూసి,
‘అయ్యొ! అప్పుడే పోవడమేంది ఆపా! చాయ్‌ గిట్ల తాగి పోదురు ఉండురి’ అన్నది.
ఆమె తనను ‘ఆపా’ అనడంతోని ఆమెకు తమ ప్రేమ గురించి తెలుసని సమజైంది జబీన్‌కు.
‘లేదు, ఎల్తం ఆపా! ఇంటికాడ పిల్లల్ని తీస్కొని మా మర్దివాల్లు ఒస్తరు’ అన్నది తను గుడ ‘ఆపా’ అనే పిలుస్తు.
‘పిల్లల్ని గుడ తీసుకొస్తె మంచిగుండు గదా ఆపా!’ అన్నది రుబీనా.
‘ఇగ ఆల్లు లేకుండె కదా.. అందుకె తేలేదాపా..’ అనుకుంట దగ్గర్కిపొయి చేతిల మడిషి ఉన్న నోట్లు రుబీనా చేతిల పెట్టింది, ‘దేనికన్న పనికొస్తయ్‌, ఉంచురి’ అని ఆత్మీయంగ అనుకుంట.
‘అయ్యొ.. వద్దు.. వద్దాపా! పైసలెందుకు..’ అని తిరిగి ఇచ్చెయ్యబొయింది రుబీనా.
‘ఆపా! రఖియే! పరవానై’ అన్నది రెండు చేతులు పట్టేసి జబీన్‌.
‘అమ్మో.. వద్దాపా! ఆయన కోప్పడతడు. అస్సలొద్దు.. ఆయనకిట్లాంటివి ఇష్టముండవు..’ రుబీనా మొఖంలో నవ్వు మాయమైంది..
జర ఇబ్బందిగ అనిపించినా జబీన్‌ మనసు ఖుష్షయింది. సరే ననుకుంట పైసలు తీసేసుకొని ప్రేమగా అలాయ్‌బలాయ్‌ ఇచ్చింది రుబీనాకు. మల్ల రుబీనా మొఖంల నవ్వు అలుముకుంది.
పైసలు తీసుకోనందుకు జబీన్‌ ఏమన్నా ఫీలయిందేమోనని, ‘మేం గుడ ఒకసారి మీ ఇంటికొస్తంలే ఆపా! ఇక్కడికి దగ్గర్నే అన్నరు గదా!’ అన్నది.
ఏమనాలో తోయలేదు జబీన్‌కు. క్షణాల్ల సోంచాయించింది-
‘లేదు ఆపా! మేం ఇల్లు మారబోతున్నం. ఎటు ఎల్తమో ఏమొ.. మల్ల చెప్తం లే ఆపా..!’ అన్నది, ఇల్లు మారే ఉద్దేశం లేకున్నా!

పొరపాటు  

sani

రత్నమాల: ఒక వేశ్య

రత్నాంగి: ఆమె స్నేహితురాలు వేశ్య

మనోహరుడు: రత్నమాలను ప్రేమిస్తున్న విటుడు

 sani

 

రత్నమాల:   మనోహర్, నీతో నేనెంత గౌరవంగా వ్యవహరించానో మరిచిపోయావు. నిన్నెప్పుడూ డబ్బడగలేదు. లోపల వేరే విటుడున్నాడని చెప్పి నిన్ను వాకిట్లో నిలబెట్టలేదు. మిగతా వేశ్యల్లాగా మీ నాన్నను మోసగించో, మీ అమ్మను మభ్యపెట్టో డబ్బు తెచ్చి నాకు బట్టలు కొనమని కానుకలివ్వమని వేధించలేదు. అసలలాంటి పని నా కిష్టముండదు. నీ కోసం ఎంత గొప్ప విటుల్ని వదులుకున్నానో నీకు తెలుసు. ఆ బంగార్రాజు, అతనిప్పుడో పెద్ద వ్యాపారి, మరి బ్రహ్మాచారి, అతనో పెద్ద కంసాలి, ఇక నీ స్వంత మిత్రుడు కైలాసం వాళ్ళ నాన్న కైలాసానికి పోవడంతో ఇప్పుడతనే పెత్తనగాడు. వీళ్ళందరినీ తోసిపుచ్చి నువ్వే నువ్వే ఎప్పటికీ నా మన్మధుడి వనుకున్నాను. నా కళ్ళు నీ మీదే పెట్టుకున్నాను. మనం మొదటిసారి కలిసిన రోజు తర్వాత మరో మనిషిని నా పడకటిల్లు చొరనివ్వలేదు.

ఇంతకీ నేను పిచ్చిదాన్ని. నీ కల్లబొల్లి మాటల్ని నమ్మాను. మా అమ్మ నాకు చివాట్లు పెడుతూనే ఉంది. నా స్నేహితులందరితో మొత్తుకుంటూనే ఉంది. నా తెలివే గడ్డి మేసింది. నువ్వంటే పడి చస్తున్నాను కాబట్టి, పూర్తిగా నీ దాన్ని కాబట్టి నీకు లోకువై పోయాను. అందుకే నువ్విప్పుడు నా కళ్ళ ముందే కుప్పాయి ఒళ్ళు నిమురుతావు, నా పక్కన పడుకొని ఆ సితారు వాయించే చంపకాన్ని పొగుడుతావు. నువ్వు నన్ను బాధిస్తున్నావు. నువ్వు చేసే పనులకు నాకు ఏడుపొస్తోంది. కోపమొస్తోంది. మొన్న నువ్వు రాగిణి తోనూ రంజని తోనూ కలిసి తాగావు. వేణువు వాయించే వర్ధని, నా శత్రువు పంకజం అప్పుడక్కడే ఉన్నారు. రాగిణికి నువ్వు ఐదు ముద్దులు పెట్టావు. నేనేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే దాన్ని ముద్దు పెట్టుకోవడం నీకు అవమానం, నాకు కాదు. కానీ, మధుమతికి నువ్వు పంపిన పాడు సంకేతాల మాటేమిటి? నువ్వు వైను ఒక గుక్క తాగి ఆ గ్లాసును దానికి పంపావు. మధుమతి ఆ గ్లాసు తీసుకోడానికిష్టపడకపోతే, మరెవ్వరికీ ఇవ్వొద్దని గ్లాసందించే పనమ్మాయికి రహస్యంగా చెప్పావు. ఎక్కడో కూర్చొని ఉన్న రంజని చూసేలా యాపిల్ కొరికి, ఆ పండును మధుమతి ఒళ్లో పడేలా విసిరావు. ఆ సిగ్గులేని ముండ ఆ పండును ముద్దాడి జాకెట్లో రెంటి మధ్యా దాచుకుంది.

ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నేనేమన్నా నీపట్ల నిర్లక్ష్యంగా ఉన్నానా? పోనీ వేరే ఎవరినన్నా దొంగచూపులు చూశానా?  నీకోసం కాదా నేను బతుకుతోంది? (ఏడ్చింది) నీకిది న్యాయం కాదు మనోహర్! నిన్ను ప్రేమించటమే నాదురదృష్టమన్నట్టుగా నన్ను హింస పెడుతున్నావు. పైన దేవుడున్నాడు. అంతా చూస్తూనే ఉన్నాడు. ఎందుకూ, తొందర్లోనే నేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను. అప్పుడు నువ్వే ఏడుస్తావు. పెద్ద ఘనకార్యం చేస్తున్నానని మురుసుకోకు.

ఎందుకలా కోపంగా చూస్తూ పళ్ళు నూరతావు? నువ్వేమన్నా తిట్టాలనుకుంటే తిట్టు. రత్నాంగి న్యాయం చెప్తుంది. ఏమంటావ్? (మనోహర్ బైటికి వెళ్ళాడు) ఏంటలా మాట్లాడకుండా వెళ్లిపోతావ్? చూడు రత్నాంగీ ఎంత బాధ పెడుతున్నాడో?

రత్నాంగి:      మూర్ఖుడా, దాని కన్నీళ్ళు నిన్ను కదిలించట్లేదు. నువ్వు మనిషివి కాదు, రాతిబండవి. (రత్నమాలతో) అసలిందులో నీ తప్పు కూడా ఉందిలేవే! నువ్వతన్ని పాడు చేశావు. అతనికివ్వాల్సిన గౌరవానికి మించి ఇచ్చావు. ఊరికే తెలివి తక్కువగా ప్రేమించే ఆడవాళ్లంటే మగాళ్ళకి లెక్కుండదు. ఏడవకు. నామాట విను. అతని ముఖం మీదే తలుపు వేసెయ్యి. రాత్రంతా నీ గుమ్మం బయట బజార్లో జాగారం చేస్తే అప్పుడతనికి నీ మీద మోజు వద్దన్నా పుట్టుకొస్తుంది.

రత్నమాల:   ఇదా నువ్వు చెప్పే సలహా? నేను నా మనోహరుడి పట్ల అంత కఠినంగా ఉండలేను.

మనోహర్:     (లోపలికొస్తూ) ఇదిగో, రత్నాంగీ, నేను నీ స్నేహితురాలి కోసం రాలేదు. దీని మొహం ఇక చూడ దలుచుకోలేదు. నేను నీతో మాట్లాడదామని వచ్చాను. నీకు నాగురించి దురభిప్రాయం ఉండ కూడదు. నేను చెడ్డవాడినని నువ్వనుకోవద్దు.

రత్నాంగి:      ఇప్పుడే అలాంటి మాటేదో అన్నాను.

మనోహర్:     అంటే రత్నమాల వేరే వాళ్ళతో పడుకున్నా నేను నోరుమూసుకొని చూస్తూ ఊరుకోవాలా? మొన్న ఇది ఒక కుర్రాడిని పక్కనేసుకొని పడుకోవడం నేను కళ్ళారా చూశాను.

రత్నాంగి:      మనోహర్, తనొక వేశ్య. మగనాలు కాదు. విటులతో పక్క పంచుకోవడం తన వృత్తి. ఐనా, ఊరికే అడుగు తున్నాను. రత్నమాల పక్కలో కొత్త వ్యక్తిని నువ్వు చూసిందెప్పుడు?

మనోహర్:     దాదాపు ఐదు రోజుల క్రిందట. అవును, ఖచ్చితంగా ఐదు రోజుల క్రిందట. ఇవాళ ఏడో తేదీ, నేను చూసింది రెండో తేదీ నాడు. నేనీ కన్యారత్నాన్ని వలచానని తెలిసి మా నాన్న నన్ను గదిలో పెట్టి తాళం వేశాడు. బయటికి పోకుండా కాపలా పెట్టాడు. నేనొక స్నేహితుడి సాయంతో కిటికీలోంచి సులువుగా బయట పడ్డాను. అదంతా చెప్పి నిన్ను విసిగించను. మొత్తానికి తప్పించుకున్నాను. ఇక్కడికొచ్చాను. తలుపు మూసి ఉంది. నేను వచ్చింది అర్థరాత్రి. తలుపు కొట్టకుండా నిశ్శబ్దంగా గడి పైకెత్తాను. అది నాకలవాటే. చప్పుడు చెయ్య కుండా లోపలికొచ్చాను. చీకట్లో గోడను పట్టుకు నడుస్తూ రత్నమాల పడక మంచం దగ్గరకు చేరాను.

రత్నమాల:   ఏమంటున్నాడు? నాకు గుండె బరువెక్కుతోంది.

మనోహర్:     సరే, ఆమె పక్క దగ్గరకు చేరగానే ఆ చీకట్లో మంచం మీద ఇద్దరు ప్రశాంతంగా ఊపిరి తీస్తున్నట్టు గమ నించాను. ముందు రత్నమాల పక్కనున్నది దాసీ రత్తమ్మనుకున్నాను. చేత్తో తడిమి చూద్దును గదా, అది వృద్ధ స్త్రీ ముఖం కాదు. తలా ముఖమూ నున్నగా క్షౌరం చేయించుకున్న పురుషుడి ముఖం. ఆ కుర్రాడు రత్నమాల కాళ్ళ మధ్యలో సౌకర్యంగా పడక వేసినట్టు కనిపించింది. అసలు రత్నమాలే వాణ్ని కావలించు కొని పడుకొని ఉంది. సమయానికి చేతిలో కత్తి ఉంటే ఆ ఆటని అప్పుడే ముగించేవాడిని. నవ్వుతావెందుకు? నేనన్న దాంట్లో అంత వెటకార మేముంది?

రత్నమాల:   ఇదా నీ మనసును అంతగా గాయ పరచిన విషయం? పిచ్చి మనోహరూ, అప్పుడు నా కౌగిలిలో ఉన్నది ఎవరనుకుంటున్నావ్? రత్నాంగి.

రత్నాంగి:      (సిగ్గుపడుతూ) రత్నమాలా, దయచేసి అదంతా అతనితో చెప్పకు.

రత్నమాల:   ఇంతవరకూ వచ్చాక చెప్పకపోతే ఎలా? మనోహర్, నువ్వు చూసింది రత్నాంగినే! ఆరాత్రి నాతో పడుకోమని తనని నేనే అడిగాను. నువ్వు లేక దిగులుపడి, ఒంటరిగా పడుకోలేకపోయాను.

మనోహర్:     నిజమే అయ్యుండచ్చు. రత్నాంగి గుండుతో ఉన్న యువకుడు కదా! మరి ఐదారు రోజుల్లోనే జుట్టు అంత పొడవున ఎలా పెరిగిందో!

రత్నమాల:   లేదు మనోహర్, రత్నాంగికి ఈ మధ్య జబ్బు చేసి జుట్టు రాలిపోతే, గుండు గీయించుకుంది. రత్నాంగీ, మనోహర్ కి నీ తలకట్టు చూపించు. (రత్నాంగి విగ్గు తీసింది) వీడే నిన్ను అసూయకు గురిచేసిన నవ యువకుడు.

మనోహర్:     మరి నాకు అసూయ ఉండదా రత్నమాలా? అందుకు నన్ను తప్పు పడుతున్నావా? నేనేం చేసేది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆవిడ గుండును తడిమాను.

రత్నమాల:   సరే, ఇప్పుడు నీ సందేహం తీరింది గదా! ఇప్పుడిక కోపం చూపించటం నా వంతు.

మనోహర్:     వద్దు రత్నమాలా, కోపగించుకోకు. మనం అలా బయటికెళ్ళి ఏమైనా తాగొద్దాం పద. రత్నాంగీ, నువ్వు కూడా మాతోరా! మద్యనైవేద్యంలో నువ్వు కూడా ఉంటే బాగుంటుంది.

రత్నమాల:   వస్తుందిలే పద! ఒసే రత్నాంగీ, నవయువకుడా, నీ మూలాన నేనెంత నరకం చూశానే!

రత్నాంగి:      ఇప్పుడంతా సమసిపోయింది గదా! ఇక నామీద కోపం పెట్టుకోకు. అన్నట్టు, నా విగ్గును గురించి ఎవ్వరికీ చెప్పకు.

*

 

 

 

నదిని చేరుకోవాలన్న దాహం

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshమళ్లీ పుట్టడం.
కొత్తగా జన్మించడం ఎంత బావుంటుంది!

అవును.
ఒక్కోసారి రచయిత ఎవరైనాగానీ, తమదైన శైలీ, శిల్పాలకు భిన్నమైన రచన చేస్తున్నప్పుడు కొత్తగా ఉంటుంది. వస్తువును బట్టి అవి మారుతూ ఉన్నప్పుడు ఆ రచన కళ కళం రేపుతుంది.
ముందు తనలో…తర్వాత బయటా.

అయితే, లోవెలుపలా కొన్నికొత్త చిత్రాలు జరుగుతూ ఉంటై.
కొందరు చూపుతారు. కొందరు చూపరు. కానీ. నేను చూపాలనే అనుకున్నాను.
కానీ, భయం.

అవును. భయం ఉంది. భక్తీ ఉంది. పనిమీద.
అందువల్లే చూపి నడవడం.

కదా!

+++

ఎవరికైనా ఒక్కొక్కరికీ ఒక శైలి ఉంటుది.
ఆ శైలి ప్రకారం నడుచుకోవడం మామూలే.
కానీ భయపడాలి. కదా!

నువ్వయినా, నేనయినా, ఎవరయినా సరే.
కదా!

మొదట్లో సాహసంగానే ప్రయాణించవచ్చు. ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదుగానీ, తర్వాత అలవోకగానే ఆ సాహస కృత్యాన్ని నిర్వహిస్తూ ఉంటాం. బహుశా ఎవ్వరికీ చెప్పంగానీ – అంతకు ముందు ఎవరూ నడవని తోవలో నడుస్తున్నప్పుడు కూడా ఒక మేలు జరుగుతుంది. తన నడక వల్ల కూడా ఒక చిన్న పాటి బాట పడనూవచ్చు. ఆ బాట పడుతూ ఉండగా తన అరికాళ్లు కూడా సాపు అవుతూ ఉండవచ్చు. నొప్పి మెలమెల్లగా తగ్గిపోనూ వచ్చు. ఆ పాదాలూ…ఆ అలవాటైన నడకా…హాయిగా ఉంటుంది. అంగీకరించడానికి ఇబ్బంది గానీ ‘పాత ఒక హాయి. కొత్త ఒక భయం’. అందుకే ‘ఆ అలవాటైన నడక’కు ‘అలవాటు’ పడి ఇక కొత్త చూపుకు దూరం అవుతాం. నేర్చుకోవడం ఆగిపోతుంది.

నిజం.
భయం ఉండదు. ఇక భక్తీ ఎక్కడుంటుది?
కదా!

అయినా…ఎంత పెద్ద పెద్ద వాళ్లు ఆగిపోలేదు, తన దారిలో తాను పడి!
కానీ, నేను భయపడతాను. కొత్తగా చిత్రాలు పోతాను.

ఎందుకూ అంటే, శైలి స్వయంకృతం. జీవితం బహుముఖం అని తెలుస్తున్నది గనుక!
కొత్త కొత్తగా కూడా నడుస్తున్నాను, భయపడుతూనే కాబట్టి కూడా.

అవును. బహుముఖ జీవితంలోకి నిర్భయంగా రావాలంటే ఖండఖండాలుగా వేరు పడాలి.
మళ్లీ పుట్టడానికి బయలుదేరాలి. తప్పదు.

కానీ, మళ్లీ పుట్టడం, కొత్తగా జన్మించడం ఎంత బావుంటుందో!
కదా!

ఇక రండి. ఈ చిత్రం వద్దకు.

+++

నిజం.
నా వలెనే లేదా మీ వలెనే ఈ చిత్రంలో ఎన్ని ముఖాలున్నాయో చూడండి.

వ్యక్తులున్నారు, వారి వ్యక్తిత్వాలున్నాయి.
బంధాలున్నాయి, అనుబంధాలూ ఉన్నాయి.
కనబడుతారు. కనబడరు.

అయితే ఇది ఒక సమూహం కాదు, ఒక కుటుంబం.
ఒకే ఒక కుటుంబాన్ని ఒక చ్ఛాయలో సంక్షిప్తం చేసిన సంఘం.

ఒకచోట నిలుచుని, మనసును నిబ్బరం చేసుకుని, అక్కడ కూడిన వారందరినీ చూస్తూ, వారి దృష్టిలో పడకుండా తప్పించుకుంటూ, అభిమానంతో వారందరినీ ఒకే ఫ్రేంలోంచి జారకుండా చూసుకుంటూ చేసిన చిత్రం ఇది. జాగ్రత్త ఇది. కానీ, ఒకరిద్దరు నావైపు చూస్తూనే ఉన్నారు. అందుకే భయపడాలంటాను. ఇంకా కష్టపడాలంటాను. ఇదొక ప్రయత్నం.

చిత్రమేమిటంటే, సహజంగానే బయట మనం చూసే జీవితంలో చాలా నది ఉంటుంది. కానీ, కళగా చేయాలనుకుంటే ఒక మేఘం చాలనుకుంటాం. సంక్షిప్తం చేస్తూ ఉంటాం. కానీ కవులు  కూడా ఒక్కోసారి దీర్ఘ కవిత రాయకపోతే చచ్చిపోతారు. ఆ లెక్కన ఇప్పటిదాకా నేను చేసినవి మేఘాలే అయితే ఇది నది.  లేదా ఇదివరకంతా ఒక చినుకులో మేఘం చూపాలన్న తలంపు అయితే ఇదొక మేఘం. మేఘమాల అనాలి.

కానీ, ఎవరికైనా, నదిని చేరుకోవాలన్న దాహం చినుకుతో మొదలవుతుందా!
ఏమో!

ఏమైనా కానీ…. చూడండి.
ఇదొక క్రిస్ క్రాస్.

కదా!

+++

ఇందులో ఎవరూ ఒకే ధ్యాసలో ఉండరు. ఎవరి లోకంలో వారుంటారు.
ఒకరు కాదు, పదీ కాదు, పదహారుమంది ఉన్నారు, చిన్న బాబుతో కలిపి.
నిజానికి వెనకాల గేటుకున్న దిష్టిబొమ్మతో కలిపితే పదిహేడు.

కానీ, అందరికీ తమదైన ఒక expression ఉంది. energy ఉంది.  అది వ్యక్తమైతున్న తీరు ఈ వారం దృశ్యాదశ్యం. అయితే, దాన్ని ఆస్వాదించాలంటే ఈ ఒక్క ఛాయను చాలా సార్లు చూడాలి. ఒక్కొక్కరినీ ఒకసారైనా చూడాలి. కనీసం పదహేడు సార్లయినా చూడాలి. పదే పదే అక్కర్లేదు. ఒక్కసారి చూడండి. కానీ చూపు ఒక్కొక్కరిపై నిలుపుతూ వెళ్లండి.

నిజం.చినుకులన్నీ కలిస్తే మేఘం అయినట్లు వాళ్లందరిపై మీ చూపులను సారిస్తూ ఈ దృశ్యాదృశ్యంలో నిమగ్నం అవండి. జస్ట్ ఫర్ చేంజ్. ఒక లాంగ్ షాట్. విశాలమైన దృశ్యం.

మరి ఇది మేఘమాల.
నది ఒడిలో!

~

 పది అంకెల ఇంద్రధనస్సు 

రేఖా జ్యోతి 

నీకూ నాకూ మధ్య
చాన్నాళ్ళ విరామం తర్వాత ‘ మొదటి మాట ‘
కాస్త నెమ్మదిగానే మొదలవుతుంది

నిశ్శబ్ధం లో నుంచి శబ్దం ప్రభవించడం
స్పష్టంగా అవగతమవుతుంది

‘ వర్షం మొదలైందా ! ‘ అని చాచిన అరచేతిలో
బరువుగా ఒక చినుకు రాలుతుంది
పొడినేల తడిచిన పరిమళం
ఊపిరిని వెచ్చగా తాకుతుంది

అటునుంచి ఒక పలకరింపు
ఇటు నుంచి ఒక పులకరింపు
చినుకు చినుకూ కలిసి వర్షం పెద్దదవుతుంది
కురిసి కురిసి మమత ప్రవహిస్తుంది

అటుపక్కని కొన్ని పెద్ద పెద్ద తరంగాలు
ఇటువైపు తీరం మీద కట్టిన ఓటు పడవని
ప్రయాణం లోకి మళ్ళిస్తాయి

‘ నిన్న ఏమైందో తెలుసా! ‘
‘ మొన్న ఒక రోజు కూడా ఇలానే …!’
‘ పోయిన యేడు ఇదే రోజు గుర్తుందా …!’
ఒక్కో అడుగూ వెనక్కి వేసి వేసి ఆఖరుగా
చేతిలోని వెన్న చేజారిన చోట సంభాషణ ఆగుతుంది

ఒక్కసారిగా ఒకే జ్ఞాపకం
నాలుగు కళ్ళల్లో సుడులు తిరుగుతుంది

అటువైపు నిశ్శబ్ధం
ఇటువైపూ బలహీన పడిన తుఫాను
ఇప్పుడిక ఎటు తవ్వినా కన్నీరే పడుతుంది

కాసేపు నిశ్శబ్ధమే అటునీ ఇటునీ హత్తుకొని ఓదారుస్తుంది
‘ సరే మరి , ఉండనా !’
తెలుసు అడుగుతున్న ఆ వైపున ఏమవుతోందో!
ఇక ఇటువైపు బదులులో అక్షరమేదీ ఉండదు కాస్త ‘ శబ్దం’ తప్ప!

ఆరుబయట వర్షం వెలసిపోతుంది
ఆకాశం వెలవెలబోతుంది !!
ఎండా వానల ఆశలమీద మెరిసిన
పది అంకెల ఇంద్రధనస్సు మాయమవుతుంది !!

ముజఫర్ నగర్ రావణ కాష్టం ఆరిపోదు !!

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

మునుపెన్నడూ లేని ధోరణులను మన దేశ రాజకీయాల్లో చూస్తున్నాము. ” పబ్లిక్ గా ఏమి చేసినా సరే – అది చట్ట బద్ధంగా ఐనా సరే, చట్ట వ్యతిరేకంగా ఐనా సరే, అక్రమంగా అయినా సరే, అన్యాయంగా అయినా సరే…ఎటొచ్చీ జాగ్రత్తగా , సక్రమంగా, సంబంద్ధంగా తయారు చేసిన ఒక ప్రణాళిక ఉంటే చాలు….ఈ దేశ ప్రధాన మంత్రి అయిపోవచ్చు  ” . ” దేశ పరువు ప్రతిష్ట ” అనే అప్రస్తుతమైన కల్పిత పదాలని కనుగొన్న ” భావ చిత్ర  రాజకీయ ” (image politics) శకం కు  మనమిప్పుడు సాక్షులుగా ఉన్నాము. మీడియా రొదలు, ఆగి ఆగి, గొంతు మార్చి మార్చి వినిపిస్తే నిజమని నమ్మే ధోరణి ఒక సూత్రంగా మారి, మనుగడ సాగించే  ” వ్యక్తి పూజ ” రాజకీయాలను మనమెప్పుడో జీర్ణించేసుకున్నాం.

ఐతే ఈ రోజు రాజకీయల్లో నిజమెంత అని ప్రజలు ఒక అంచనాకు వస్తున్న ప్రయత్నం లో ఉండగా నకుల్ సింగ్ సాహ్ని అనే 32 ఏళ్ళ యువకుడు ” ముజఫర్ నగర్ దాడులు ( అల్లర్లు ?? ) ”  మరియు వాటి రాజకీయత కు సంబంధించిన అల్లికను దులిపి నిర్భీతితో ముసుగు తొలగించే అడుగు వేసాడు.

” ముజఫర్ నగర్ బాకీ హై…..” ( ముజఫర నగర్ సశేషమే ! ) అనే డాక్యుమెంటరీ మత ఛాందస వాదపు గొంతుకను సున్నితంగా , సూక్ష్మంగా తెగ కోసి దాని జిత్తుల పార్శ్వాన్ని ఎండగట్టే కృషి పట్టుదలతో తయారు చేసిన ఒక కళాఖండం. ఎన్నికల సమయంలో, ముందుగానే రచింపబడ్డ వందకు పైగా మరణాలు , ఎన్నో సామూహిక మాంభంగాలు – ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ప్రజలను ఊచ కోత కోసిన ‘ ముజఫర్ నగర్ ‘ మన దేశ సామాజిక చిత్తరువుపై చెరగని నల్లటి మచ్చను వదిలివెళ్ళింది.

ఉత్తర ప్రదేశ్ చరిత్రలో మొట్ట మొదటి సారి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎన్నిక అవ్వని ఒక పరిణామాన్ని కేవలం ఉత్తర ప్రదేశ్ కే కాదు దేశ రాజకీయాలకు రుచి చూపించింది ?!!

అదే నకుల్ గారి యొక్క డాక్యుమెంటరీలో అగుపడే ఒక సాధారణ వ్యక్తి మాటల్లో చెప్పాలంటే –

” దీని బాధ్యత ప్రభుత్వానిదే. అది కాంగ్రెస్ కావచ్చు, ఎస్ పీ కావచ్చు, బీ ఎస్ పీ కావచ్చు. ఎవరి స్వార్థం మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. ఐతే మోదీ విషయం లో – నేను నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పగలను దీనికి ఆయనే కారణం అని. యూ పీ లో మోదీకి ఎప్పుడూ ఉనికి లేదు. గతం లో ఒక భారీ ర్యాలీని తీసిన సమర్థత లేదు ఇక్కడ. మొట్ట మొదటి సారిగా ఇక్కడ ఆయన అడుగు పెట్టాడు. అప్పటి నుండి ఇక్కడ ఈ అస్తవ్యస్థత ఏర్పడింది. ”

ఈ దేశం లో జరిగే పరిణామాలను అర్థం చేసుకోవడానికి మనకు ఎంతో ప్రశంసించబడ్డ మేధావులు , సాంఘిక శాస్త్రవేత్తల సహాయం అవసరం లేదు – ఒక సాధారణ మనిషి కున్న సమాచారం, విశ్లేషణను సరిగ్గా గమనిస్తే చాలు. నకుల్ గారు మనల్ను ఆ దృక్పథం లో క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళి ఎంతో చాతుర్యంగా లింగ సమస్యకు , మత ఛాందస వాద సమస్యకు మరియు కుల సమస్యకు ఉన్న అంతర్లీన బంధనాలను ఎంతో సమర్థవంతంగా ఎండగడతాడు.

1424293384-672_Nakul-pic

” షుగర్ బౌల్ ”  గా ప్రసిద్ధి పొందిన ముజఫర నగర్ సెప్టెంబర్ 2013 లో మతతత్వ విషాన్ని వెళ్ళగక్కి దేశ ప్రజాస్వామిక వాదులకు చేదు రుచి చూపించింది.  3.3 లక్షల హెక్టేర్లకు పైగా వ్యవసాయిక భూమిని కలిగి, 10 కి పైగా షుగర్ ఫేక్టరీలు ఉండి మరియు ఎన్నో స్టీల్ మిల్స్ కలిగిన ముజఫర్ నగర్ ఉత్పాదక ఉపాధిని కల్పించే గలిగే సమర్థతో , ఈ దేశం లో జీవించడానికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొనబడవచ్చు. దేశ రాజధానికి కేవలం 120 కి.మీ దూరంగా ఉన్న ఈ ప్రాంతం ఎంతో ప్రణాళికా ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పుకోవచ్చు. దేశం లో మిగతా ప్రదేశాల్లా కాక, మూడో వంతుకు పైగా ముస్లిం జనాభాను కలిగి ఉంది. ముజఫర్ నగర్ జనాభా సాంద్రత 1000/ చ.కి.మీ కి పైగా  ఉంది. ఇది సగటు దేశ జనాభా సాంద్త్రత 382/చ.కి.మీ తో పోలిస్తే చాలా ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతం ఎంత ఉపాధి సౌకర్యాలు కల్పించే ప్రదేశమో తెలుస్తుంది. ఐతే ఇక్కడ సెక్స్ నిష్పత్తి చూస్తే – దేశ సగటు 940 ఉండగా ( ప్రతి వేయి మంది పురుషులకు) – కేవలం 889 గా మాత్రమే ఉంది.

ఈ ప్రదేశం లో మత ఛాందసవాదం ఇంతగా ఎలా పాతుకుపోయిందో ఎంతో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉండగా , డాక్యుమెంటరీలో ఆ ప్రదేశ వికాసమంతా కొన్ని వర్గాల మధ్యనే , ముఖ్యంగా జాట్ల మధ్య, కేంద్రీకృతం అయినట్టు తెలుపుతుంది. ఈ జాట్ సముదాయం ఒక బలవంతమైన శక్తిగా , మత ఛాందస వాదానికి ఒక ప్రధాన చట్రంగా నిలిచింది.

ఈ డాక్యుమెంటరీ అమిత్ షా రెచ్చగొట్టే  ఉపన్యాసాన్ని కూడా మనముందుకు తీసుకు వస్తుంది. ” పశ్చిమ ప్రాంతపు ఉత్తర్ ప్రదేశ్ లో  ఎన్నికలు మన పరువుకు సంబంధించిన వ్యవహారం. మనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన ఎన్నికలు ఇవి. మరియు మనకు అన్యాయం చేసిన వారికి ( ??) ఒక గుణ పాఠం నేర్పించాల్సిన ఎన్నికలివి “. ఈ ఉపన్యాసం ను వీడియో క్లిప్ ద్వారా బయట పెట్టడం వలన ఎన్నికల సంఘం అమిత షా ను ప్రచారంలో నిరోధించాలని కట్టుదిట్టం చేసింది.

muja1

డాక్యుమెంటరీ షూట్ చేసే బృందము  వి ఎచ్ పీ నాయకులను, భారతీయ కిసాన్ సంఘం కార్యకర్తలను, బీ ఎస్ పీ, ఎస్ పీ నాయకులను, దళిత ముస్లిం సెక్షన్ లను మరియు జాట్లను కలిసి, వారి అభ్హిప్రాయాలను, అనుభవాలను సేకరిస్తుంది.

ఈ డాక్యుమెంటరీలో సమయానుకూల బేక్ గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే,  ఎడిటింగ్ చూస్తే  మంచి టెక్నికల్ విలువలు కూడా అగుపిస్తాయి. ఫోటోగ్రఫీ మనల్ను జనాల మధ్య తిప్పుతూ విషయాన్ని ఎంతో సహజంగా అర్థం చేయించే విధంగా ఉంటుంది. సంఘటన విశదీకరణ లో దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. ఎన్నో వదంతులను ఈ డాక్యుమెంటరీ నివృత్తి చేస్తుంది. పాకిస్తాన్ లో తీసిన ఒక వీడియో క్లిప్ ను ప్రాంతీయంగానే జరిగిన ఒక సంఘటనగా మలిచి  హిందూ మత ఛాందస వాదులు ద్వేషాన్ని ప్రబలింపజేస్తూ వదంతులు సృష్టించడానికి ఎలా ఉపయోగించుకున్నారో చూపిస్తుంది. ఈ ముజఫర్ నగర్ సంఘటన లో ఒక విశేషాంశం ఏమంటే హిందూ స్త్రీలపై అత్యాచారాలు అనే విషయాన్ని  ఒక పని ముట్టుగా విరివిగా వాడుకోవడం.

ఇంటర్వ్యూ చేయబడిన ప్రజలు ఎంతో ఆసక్తికరమైన అంశాలు తెలియజేసారు.

” కులం , మతం తో సంబధం లేకుండా మగాళ్ళందరూ ఒకటే. పరువు అనే విషయం కేవలం స్త్రీల భుజ స్ఖందాలపై ఉంచి దాన్ని కాపాడే బాధ్యత కేవలం మహిళలదే అని అనుకుంటారు ”

” దళితులు కూడా మాలాగనే కూలీలు. కానీ కత్తులు కొడవళ్ళు పట్టుకుని మమ్మల్ని వాళ్ళు వెంటాడారు. ఇలా చేయమని వాళ్ళకు ఆదేశాలున్నాయి. లేకపోతే తమ పొలాలలో పనులు దొరకవని భయం పుట్టించారు. బలహీనుడు అంత కన్నా ఏం చేయగలడు ? పరిస్థితుల నుండి పరిగెత్తన్నా వెళ్ళాలి లేదా బానిసలా అణిగి మణిగి ఉండాలి ”

” మాకు అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు. మేము హిందువులం కామని ”

డాక్యుమెంటరీ , భగత్ సింగ పోస్టర్ ఉండగా, సమ సమాజాన్ని ఆకాంక్షిస్తూ, ఒక గీతం తో ముగుస్తుంది. ఒక చోట ఒక చిన్నపిల్లాడు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నప్పుడు , ఈ దేశం లో మైనారిటీల పరిస్థితిని గుండెను తడిమేలా అద్దం పడుతాడు.

” ఇది మా ఇల్లే. పోలీసులు తగల బెట్టారు ”  …..!!!

నిండైన గడ్డం తో , గొప్ప చదువరి చూపులతో కనిపించే ఉత్సాహ వంతమైన యువ మేధావి నకుల్ సింగ్ సాహ్నీ నుండి డాక్యుమెంటరీ  దృక్పథం, ప్రణాళిక విషయాలతో పాటు పెరుగుతున్న మత ఛాందస వాదం మరియు కుల రాజకీయాలు, ముజఫర్ నగర్ ఊచకోత సంఘటన యొక్క ప్రత్యేక స్వరూప లక్షణాలు, భారతీయ కిసాన్ యూనియన్  తిరోగమన పాత్ర, ప్రస్తుత పరిస్థితుల్లో మత ఛాందసవాద వ్యతిరేక పోరాటం లో అంబేద్కర్ ప్రాముఖ్యత, హిందూ ఛాందస వాదానికి వ్యతిరేకంగా పోరాడగలిగే సైద్ధాంతిక ఆలోచన ధోరణి లాంటి విషయాలపై …..                                                        “సారంగ”  ప్రత్యేక ఇంటర్వ్యూ వచ్చే వారం..

 

 

ఆ రెండు పిట్టలు 

దాసరాజు రామారావు 


ఏవో పాత మమకారాల తొణుకులలో పడి
ఆ వూరికి , ఆ ఇంటికి పోయిన –
కిచకిచ లాడుతూ రెండు పిచ్చుకలు
స్వాగతం పలికినయి చిత్రంగా..
విశాల ఆకాశపు అంచులను తాకినా
ఆ ఇంటి లోగిట్లోకి దూసుకురాందే
అవిట్కి మనసన పట్టదేమో
గమనిస్తే,
అవే ఆ ఇంటి రాజ్యమేలుతున్నట్లు…
ఇంటి నిండా మనుషులున్నా
వాటి మీదికే నా ఆశ్చర్యోన్మీలిత దృష్టంతా-

దండెం  మీద అటు ఇటు ఉరుకుతూ
ముక్కులతో గిల్లుకుంటూ
రెక్కలల్లార్చుచూ, రెట్టలు వేస్తూ
క్షణ కాలం కుదురుగా వుండని
బుర్ బుర్ శబ్దాల వింత దృశ్యాల విన్యాసం
ఒక స్వేచ్చా ప్రియత్వ, అ పాత మధుర ప్రపంచాన్ని
పాదుకొల్పుతున్నట్లుగా –

గచ్చు అంచుకు వేలాడదీసిన ఉట్టిలో ఉంచిన
కంచుడులో
వడ్లను ఒలిచే కవితాత్మక నేర్పరులే అవి
ఇత్తడి బకెట్ కొసన నిలబడి ,
నీల్లల్లో తలను ముంచి , పెయ్యంతా చిలుకరించుకునే
చిలిపి పారవశ్యం-
మామూలుగా అనిపించే
సమయాలను, సన్నివేశాలను

Erase  కాని అనుభూతులుగా మలుస్తున్నాయా అవి ..!

మళ్లేదో గుర్తుకోచ్చినట్లు
గోడకున్న అద్దంపై వాలి
తన ప్రతిబింబంతో కరచాలనం చేసుకొంటున్నట్లు
ముక్కుతో టకటక లాడిస్తూ,పద్యం చెబుతున్నట్లు..

అవి రెండే
పిడికిలంతా లేవు
ఇంటినిండా మోయలేని పండగ లాంటి సందడే
ఎవ్వరొచ్చినా ఆపిచ్చుకల ముచ్చటే

తిరుగు ప్రయాణం అన్యమనస్కంగానే –

వస్తూ వస్తూ రెండు ఉట్లు తెచ్చుకున్నా
నా నగర భవంతి ముందర వేలాడదీసేందుకు

కళ్ళు మూస్తే
నా తెల్లకాగితాల నిండా
అవే కదులుతున్నయి రాజసంగా
కళ్ళు తెరిస్తే
ముద్రిత అక్షరాలై ఎగురుతున్నయి

ఆ రెండు పిచ్చుకలకి
గుప్పెడు గింజలు వేయడమంటే
ప్రేమను పంచటానికి
ఒక చిరునామా మిగిలే వుందని తెలుపటానికే ….
—-


నువ్వేనా ?

తిలక్ బొమ్మరాజు

ఓ క్షణం ఆగి చూడు
ఇక్కడేంటి ఇవి ?
నీ ఆనవాళ్ళేనా
ఇలా నువ్విప్పుడు ప్రకృతిలో మరణించడం కొత్తగా వుంది
రాత్రుళ్ళను కౌగిలించుకునే నీ ఆ చేతులేవి
యే మూలన పారేసుకున్నావు
చూడోసారి సరిగ్గా ఇక్కడే ఎక్కడో వదిలి ఉంటావు
ఇవన్నీ నీకేం కొత్త కాదుగా!
శవాల గుట్టలూ
దుమ్ము పట్టిన సమాధులూ
వాటి కింద నువ్వు
ఒక సుఖం అనుభవిస్తూ
మోసి తెగిన భుజాలు
ఇప్పుడు తెగుతూ మోస్తున్న నీ ఆలోచనలూ
ఆ పక్కగా గమనించావా ?
నీలాగే ఇంకో నువ్వు
ముందుకీ వెనక్కీ కళ్ళ చిహ్నాలు
ఇవి కూడా నువ్వేనా
ప్చ్ అసలేంటిది అచ్చు ఇలా ఎలా ఉన్నావు
దిగంబరుడిలా చీకట్లలో తచ్చాడే వెన్నెల బైరాగివి
ఇప్పుడేమిటిలా నిన్ను నువ్వు కోల్పోయావు
ఈ రాతి బండల కిందా
చెరువుగట్టు పక్కన ఉన్న నాచులోనూ
పచ్చగా మెరిసే నీ నవ్వు
స్వచ్ఛత నీదా?
నీ దేహానిదా?
వానపువ్వులను పేర్చుకోకలా
ముసురు ముగియగానే రాలిపోతాయి
మట్టి వాసనై మిగులుతాయి
నిన్న కాంచిన నువ్వు
నీలోని నువ్వు
బయట తడుస్తున్న సముద్రకెరటంలా
లోనుండి విసిరికొట్టే శూన్యంలా
ఇక్కడ యిసుకగూళ్ళు కడుతున్నాయి నీ మునివేళ్ళు
కన్నీళ్ళు  ఊరుతూనే వున్నాయి
నువ్వేనా మళ్ళా…
*
15-tilak

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్-4

 4 వ అధ్యాయం

[ Anne Of Green Gables by L.M.Montgomery ]

ఆన్ లేచేప్పటికి తెల్లగా తెల్లారిపోయింది. కిటికీ లోంచి కురిసే  వెలుతురు పకపకా నవ్వుతోంది. అవతల నీలాకాశం, దాని మీంచి ఊగుతూ  మబ్బుల తెల్లటి రెక్కలు.

ఒక్క క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు.  ముందు ఉత్సాహం పొంగి వచ్చింది, ఆ వెంటనే దిగులు మూసేసింది. తను గ్రీన్ గేబుల్స్ లో ఉంది, కాని వీళ్ళకి తను అక్కర్లేదు , ఆడపిల్ల వద్దట.

ఐనా ఆ ఉదయపు వెలుగుకి  ఉత్సాహం ఆగలేదు .  గబగబా పరిగెత్తి కిటికీ చట్రాన్ని పైకి లేపింది. చాలా రోజులనుంచీ దాన్ని ఎవరూ కదిలించినట్లు లేదు, కిర్రు కిర్రుమని చప్పుడు చేసింది.

ఆన్ మోకాళ్ళ మీద కూలబడి ఆ జూన్ ప్రభాతం లోకి మెరిసే కళ్ళు పెట్టుకుని చూసింది. ఎంత అందమో …ఇక్కడే ఉండిపోతే బావుండును కదా ! పోనీ, ఉండిపోబోతున్నట్లు ఊహించుకుంటే ఏం పోతుంది…ఇక్కడ ఎంత ఊహకైనా చోటుంది.

కిటికీ బయట పెద్ద చెర్రీ చెట్టు , ఇంటికి ఆనుకుని. దాని కొమ్మలు లోపలికి తొంగి చూస్తున్నాయి. ఒక్క ఆకూ కనిపించనంత విరగబూసి ఉంది. ఇంటికి ఆ వైపున ఆపిల్ తోపు, ఈ వైపున చెర్రీ తోపు, అవి కూడా నిండుగా పూలతో. తోపుల్లో గడ్డి పైన డాండీలియాన్ పూలు. ఆ కిందన ఇంటి తోటలో  విచ్చిన ఊదారంగు లిలాక్ లు. వాటి సువాసన మత్తుగా గాలిలో తేలి లోపలికి వస్తోంది.

తోట కి దిగువన పచ్చగా ఒత్తుగా పెరిగిన క్లోవర్ గడ్డి , ఆ వాలు పక్కనే వాగు. తెల్లటి బర్చ్ చెట్లు పొగరుగా తలలెత్తి నిలుచున్నాయి. వాటి అడుగున ఫెర్న్ గుబుర్లు, మాస్ మొక్కలు…ఆ నీడల్లో దాగిఉన్న సంతోషం. వీటన్నిటికీ అవతల ఆ కొండ పైన పల్చగా స్ప్రూ స్, ఫర్ చెట్లు. వాటి మధ్యలోంచి బూడిదరంగులో ఇంటి కప్పు కొనదేలి కనిపిస్తోంది. ‘ ప్రకాశమాన సరోవరం ‘ ఒడ్డున ఆన్ చూసిన ఇల్లు అది.

ఎడమ వైపున పశువుల శాలలు, గడ్డి వాములు. వాటిని దాటి చూస్తే ఆకుపచ్చటి పొలాల అవతల మెరుస్తున్న నీలి రంగు సముద్రం.

may1

సౌందర్య పిపాసి ఐన ఆన్ కళ్ళు   ఆ దృశ్యాలన్నిటినీ ఆత్రంగా కావలించుకున్నాయి. పాపం..ఈ పసి పిల్ల తన చిన్న జీవితం లో అందపు లేమిని చాలా చూసింది. ఇక్కడ మాత్రం ఆమె కలలు కన్న సౌందర్యమంతా ఉంది.

ఆ ఏకాంతం లో మోకరిల్లి అలా ఉండిపోయింది..బుజం మీదొక చెయ్యి పడేవరకూ. మెరిల్లా వచ్చిన అలికిడి ఆన్ కి వినిపించనేలేదు.

” పద. తయారవు ” మెరిల్లా ముక్తసరిగా అంది.

నిజానికి మెరిల్లా కి ఆన్ తో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు, ఆ ఇబ్బందిలోంచి ఆమె మాట తీరు అనుకోకుండానే మొరటుగా, ముభావంగా ధ్వనిస్తోంది.

ఆన్ లేచి నిలబడి గట్టిగా ఊపిరి తీసుకుంది.

” ఇదంతా అద్భుతంగా లేదూ ? ” చెయ్యి తిప్పుతూ మొత్తాన్నీ చూపించింది.

మెరిల్లా అంది – ” ఆ. పెద్ద చెట్టే. బాగా పూస్తుంది కూడా. కాయలే, చిన్నవిగా నాసిగా కాస్తాయి ”

” అంటే, చెట్టొక్కటే కాదు, అంతా ! చెట్లూ తోటా, తోపులూ , వాగూ అడవీ..ఆ ప్రియమైన  ప్రపంచం మొత్తం ! ఇలాంటి ఉదయాల్లో ప్రపంచాన్ని ప్రేమిస్తున్నామనిపించదూ ?  ఆ వాగు నవ్వటం వినిపిస్తోంది నాకు. అసలు ఈ వాగులు మంచి సరదా ఐనవి కదండీ ?  ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి. చలికాలం లో కూడా గడ్డ కట్టిన మంచుకిందనుంచి అవి నవ్వటం వినబడుతూనే ఉంటుంది నాకు. గ్రీన్ గేబుల్స్ పక్కనే వాగు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేనిక్కడెలాగూ ఉండబోవటం లేదు కదా, ఉంటేనేం లేకపోతేనేం అనుకోకండి. ఇక్కడ ఈ వాగు ఉందని నేనెప్పటికీ గుర్తు చేసుకుంటాను, మళ్ళీ దాన్ని చూడలేకపోయినా సరే. నేనివాళేమీ నిరాశ లో కూరుకుపోయి లేనండీ. ఇలాంటి ఉదయం లో నేను అస్సలు అలా ఉండలేను. ఉదయాలనేవి ఉండటం ఎంత గొప్ప సంగతో కదా ? కాని కొంచెం బాధగా మటుకు ఉంది. మీరు కావాలనుకున్నది నన్నేననీ ఇక్కడే ఎప్పటికీ ఉండిపోబోతున్నాననీ ఊహించుకుంటున్నా ఇందాక…ఊహించుకోవటం చాలా బావుంటుంది , అది నిజం కాదని తెలిసేప్పుడే బాధ ‘’

ఈ మాటల ప్రవాహం లో కాస్త సందు దొరకగానే మెరిల్లా అంది – ” నీ ఊహలు సరేగాని, త్వరగా తయారై కిందికి రా . బ్రేక్ ఫాస్ట్ సిద్ధంగా ఉంది. కాస్త మొహం కడుక్కుని తల దువ్వుకో. కిటికీ చట్రం కిందికి దించి దుప్పట్లు మడత పెట్టు. చేతయినంత పద్ధతిగా ఉండు ”

ఆన్ కి కాస్త పద్ధతిగా ఉండటం చేతయినట్లే ఉంది. పది నిమిషాల్లో కిందికి వచ్చేసరికి తల శుభ్రంగా దువ్వుకుని జడలు వేసుకుని ఉంది. మొహం కడుక్కుంది. మెరిల్లా చెప్పినవన్నీ చేసే వచ్చానని అనుకుంటోంది…నిజానికి దుప్పట్లు మడత పెట్టటం మర్చిపోయింది.

మెరిల్లా చూపించిన కుర్చీ లో కూర్చుంటూ ” నాకివాళ బాగా ఆకలేస్తోంది ” –  ప్రకటించింది ఆన్. ” ప్రపంచం రాత్రి అనిపించినంత గందరగోళం గా లేదెందుకో. మంచి ఎండ కాస్తోందిగా, అందుకేనేమో. పొద్దున్నే వాన పడినా నాకు ఇష్టమేననుకోండి.. పొద్దుటిపూట ఎలా ఐనా బావుంటుంది. ఆ రోజు ఏం జరగబోతుందో తెలీదుగా, ఎలా ఐనా ఊహించుకోవచ్చు. కాని ఇవాళ వాన పడకపోవటం మంచిదే ఐంది, నేను బోలెడంత భరించాలిగా, ఎండ కాస్తుంటే దేన్నైనా ఓర్చుకోవటం తేలిక .కష్టాలూ బాధలూ కథల్లో చదవటం బాగానే ఉంటుంది, నిజంగా ఐతే అంత బావుండదు ”

” కాసేపు నోరు మూసుకుంటావా ? చిన్న పిల్లకి ఇన్ని మాటలు !  ” మెరిల్లా కాస్త మెత్తగానే కసిరింది.

MythiliScaled

ఆన్ చాలా బుద్ధిగా  నోరు మూసుకుంది. మరీ  బొత్తిగా మాట్లాడకపోతేనూ  మెరిల్లాకి కంగారే వేసింది, అదేమీ సహజంగా లేదనిపించి. మాథ్యూ కూడా మౌనంగానే ఉన్నాడు, కాకపోతే అతనికి అదే సహజం. మొత్తం మీద ఉదయపు భోజన కార్యక్రమం నిశ్శబ్దంగా సాగింది.

ఆన్ మరీ మరీ పరధ్యానంగా ఐపోయింది. ఒక మరబొమ్మ లాగా తింటోంది అంతే . పెద్ద పెద్ద కళ్ళేసుకుని కిటికీ లోంచి ఆకాశాన్ని చూస్తున్నట్లే ఉందిగాని ఆ చూపు ఎక్కడో ఉంది. మెరిల్లాకి ఇంకా కంగారు గా అనిపించింది. ఈ విడ్డూరపు పిల్ల శరీరం ఇక్కడుందేగాని ఆమె ఆత్మ  ఎక్కడో గంధర్వలోకాల్లో విహరిస్తున్నట్లుంది , ఊహల రెక్కలమీద. ఇలాంటి పిల్లని ఎవరు ఉంచుకుంటారు ???

కాని మాథ్యూ ఆమెని పెంచుకోవాలనుకుంటున్నాడు, మెరిల్లాకి ఆ విషయం అంతు పట్టటం లేదు. రాత్రికీ ఇప్పటికీ అతని నిర్ణయమేమీ మారినట్లు లేదు. మాథ్యూ అం తే, ఒకసారి అతని బుర్రలో ఎదైనా దూరిందా ఇక దాన్నే పట్టుకు వదలడు. మాట్లాడడు దాని గురించి, కాని ఆ మౌనమే పది రెట్లు బలంగా చెబుతుంది అతనేమనుకుంటున్నాడో.

భోజనం అయాక ఆన్ తన పరధ్యానం లోంచి బయటికి వచ్చి, గిన్నెలు కడగటం లో సాయం చెయ్యనా అని అడిగింది .

” నీకు కడగటం వచ్చా ? ” మెరిల్లా అపనమ్మకంగా అడిగింది.

ఆన్ – ” ఓ ! బాగా వచ్చుగా ! చిన్న పిల్లలని కనిపెట్టుకు ఉండటం ఇంకా బాగా వచ్చు. ఇక్కడెవరైనా చిన్న పిల్లలుంటే బావుండేది ”

మెరిల్లా ” ఇప్పుడు వాళ్ళొకరు తక్కువయ్యారు నా ప్రాణానికి  ! నీ సంగతి చూసేసరికే  నానా హైరానా గా ఉంది. నిన్ను ఏం చేయాలో తెలీటం లేదు..మాథ్యూ మరీ బుర్ర తక్కువ మనిషి ”

” ఆయన చా…లా మంచివారు ” –   ఆన్ దృఢంగా చెప్పింది. ” ఏం చెప్పినా ఎంత ఓపిగ్గా వింటారో ! ఎంత సేపు మాట్లాడినా ఏమీ అనరు. ఆయన్ని చూడగానే నాబోటివారేననుకున్నాను  ”

” ఆ. మీరిద్దరూ ఒకలాంటివారేలే, వింత మనుషులు ” మెరిల్లా విసుక్కుంది. ” సరే, గిన్నెలు కడుగు. బాగా వేడిగా ఉన్న నీళ్ళు తీసుకో కడగటానికి, కడిగాక బాగా ఆరబెట్టు. ఇవాళ నాకు చాలా పని ఉంది. వైట్ శాం డ్స్ కి వెళ్ళి  మిసెస్ స్పెన్సర్ దగ్గర నీ సంగతేమిటో తేల్చుకోవాలి. నువ్వూ నాతో రావాలి. ఆ గిన్నెల పని పూర్తవగానే పైకి వెళ్ళి నువ్వు పడుకున్న  పక్క సర్దు.”

ఆన్ మొహం వెలిగిపోయింది. ఉత్సాహంగా తలుపు వైపుకి పరిగెత్తి వెళ్ళి ఆగి, మళ్ళీ వెనక్కి వచ్చేసి బల్ల దగ్గర కుర్చీలో కూర్చుండిపోయింది. మొహం లో సంతోషం ఊదేసినట్లు మాయమైపోయింది.

” మళ్ళీ ఏమైంది నీకు ? ” మెరిల్లా అడిగింది.

” నేను బయటికి రాలేనండీ ” – ఆన్ చెప్పుకుంది, ప్రాపంచిక సుఖాలన్నిటినీ త్యజిస్తున్న పరిత్యాగి లాగా. ” నేను ఇక్కడ ఉండబోవటం లేనప్పుడు గ్రీన్ గేబుల్స్ ని ప్రేమించి ఏం లాభం ? నేను మళ్ళీ ఆ చెట్లనీ పూలనీ వాగునీ చూస్తే వాటిని ప్రేమించకుండా ఉండలేను. ఇప్పటికే నాకు చాలా కష్టంగా ఉంది, ఇంకా పడలేను.  నాకు బయటికి వెళ్ళి తిరగాలని ఉంది- అవన్నీ ” ఆన్ ! ఆన్ ! రా, మా దగ్గరికి వచ్చెయ్యి. ఆడుకుందాం ” అని నన్ను పిలుస్తున్నట్లుంది..కానీ వద్దు, రాను. అన్నిటినీ వదిలేసి వెళ్ళబోతున్నప్పుడు ప్రేమించి ఏం లాభం ? ప్రేమించకుండా ఉండటం ఎంతో కష్టం కదండీ ? అందుకే ఇక్కడికొస్తున్నప్పుడు ఎంతో సంతోషం వేసింది నాకు. ప్రేమించేందుకు ఎన్ని ఉన్నాయో, ఎ వ్వ..రూ వద్దనరు ! కాని ఐపోయింది, ఆ కల కరిగిపోయింది. నా గతి ఇంతే అని నిబ్బరించుకుంటున్నాను, బయటికి వచ్చి అంతా చూస్తే ఆ నిబ్బరం పోతుంది కదా…అవునూ, ఆ కిటికీ లో ఉన్న జేరేనియం పూల మొక్క పేరేమిటండీ  ? ”

మెరిల్లా – ” అదా ! ఆపిల్ వాసన వేసే జెరేనియం అది ”

ఆన్ – ” అది కాదండీ ! అలాంటి పేరు కాదు. మీరు పెట్టిన పేరేమిటీ అని అడుగుతున్నా. ఏ పేరూ పెట్టలేదా ? పోనీ నేను పెట్టచ్చా? ‘ బోనీ ‘ – బావుందా ? ఇక్కడున్నంత సేపూ నన్ను అలా పిలవనివ్వరా ? ” వేడుకుంది.

” నీ తలకాయ ! జేరేనియం కి ఎవరైనా పేరు పెడతారా ? ” – మెరిల్లా .

” ఉండాలి. అన్ని..టికీ పేర్లుండాలి. అప్పుడు అవి మనలానే అనిపిస్తాయి. ఏ పేరూ పెట్టకుండా ఉత్తినే ‘ జేరేనియం ‘ అంటే అది నొచ్చుకోదూ పాపం ? మీకేమీ పేరు లేకుండా ఉత్తినే ‘ ఆవిడ ‘ అంటే మీకు బాధగా ఉండదూ ? నా కిటికీ పక్క చెర్రీ చెట్టుకి పేరు పెట్టాను…’ హిమరాణి ‘ అని…తెల్ల..గా పూసిందిగా ! ఎప్పుడూ పూసే ఉండదనుకోండీ, ఐనా అలా పిలుస్తూ పూసి ఉన్నట్లు ఊహించుకోవచ్చు ”

ఆ తర్వాత బంగాళా దుంపలు తెచ్చేందుకు నేలమాళిగ లోకి వెళ్తూ మెరిల్లా గొణుక్కుంది – ” నా జన్మలో ఇలాంటి పిల్లని చూడలేదు. మాథ్యూ చెప్పినట్లు భలే పిల్ల. తర్వాత ఏం చెప్తుందా అని ఎదురు చూడటం మొదలెడుతున్నానేమిటో ! మాథ్యూ కి వేసినట్లే నాకూ ఏదో మంత్రం వేసింది. మాథ్యూ పొలం వైపు వెళ్తూ నావైపు ఎలా చూశాడనీ…రాత్రి చెప్పిందీ సూచించిందీ అంతా మళ్ళీ ఆ చూపులో ఉంది. అందరు మగవాళ్ళకి మల్లే అతను గట్టిగా  మాట్లాడితే హాయిగా ఉండును..మాటలకైతే జవాబు చెప్పచ్చు, చూపులకి ఏం చెప్పాలి ? ”

may3

నేలమాళిగ సందర్శనం పూర్తయి మెరిల్లా వచ్చేసరికి ఆన్ అక్కడే కూర్చుని ఉంది… అరచేతుల్లో గడ్డం ఆనించుకుని ఆకాశం కేసి చూస్తూ, ఆలోచనలో మునిగి .   మధ్యాహ్నం భోజనానికి వేళయేవరకూ మెరిల్లా ఆమెని అలాగే ఉండనిచ్చింది.

” ఇవాళ బండినీ గుర్రాన్నీ నేను తీసుకెళ్ళచ్చా ? ” మాథ్యూని అడిగింది మెరిల్లా.

మాథ్యూ తలఊపి ఆన్ వైపు జాలిగా చూశాడు. మెరిల్లా పెళుసుగా చెప్పింది.  ” వైట్ శాండ్స్ కి వెళ్ళాలి నేను.  ఆన్ ని కూడా తీసుకుపోతాను. మిసెస్ స్పెన్సర్ తో మాట్లాడి ఈమెని నోవా స్కోటియా కి వెనక్కి పంపించెయ్యాలిగా ! నీకు టీ , ఫలహారం బల్ల మీద పెట్టి వెళ్తాలే. సాయంకాలం ఆవులకి పాలు తీసే వేళకి వచ్చేస్తాను ”

అప్పటికీ మాథ్యూ ఏమీ మాట్లాడలేదు. మెరిల్లాకి చిర్రెత్తుకొచ్చింది. ఊపిరి బిగబట్టి అనేసిన మాటలన్నీ వృధా ఐపోయాయి.

మాథ్యూ నిదానంగా గుర్రాన్నీ బండినీ సిద్ధం చేసి తెచ్చాడు. మెరిల్లా, ఆన్ ఎక్కి బయల్దేరారు. బండి కదిలాక, గేట్ తెరిచి, అప్పుడు- ఎవరికో చెబుతున్నట్లు చెప్పాడు మాథ్యూ- ” పొద్దున్నే జెర్రీ బ్యుయోట్ వచ్చాడు. ఈ వేసంకాలం అతన్ని  పొలం పనికి పెట్టుకుంటానని చెప్పేశాను ”

మెరిల్లా ఏమీ జవాబు చెప్పలేదు. ఒక్కసారి కొరడాతో గుర్రం వీపు మీద చరిచింది. అలాంటి దెబ్బ ఎప్పుడూ పడిఉండని గుర్రం , దౌడు లంకించుకుంది. ఆఘమేఘాలమీద బండి బయల్దేరింది. మలుపు తిరగబోతుంటే మెరిల్లా వెనక్కి చూసింది. మాథ్యూ గేట్ కి ఆనుకుని నిలబడి దిగులు దిగులుగా చూస్తూనే ఉన్నాడు.

[ ఇంకా ఉంది ]

మాటల రంగు వేరు…చేతల రంగు వేరు..!

డా .నీరజ అమరవాది

      neeraja  నీలాకాశంలో నల్లటి మబ్బుల మధ్య నిండు చందమామని చూపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే , నలుపూ , తెలుపుల కలనేత ఎంత బాగుందో అనిపించింది .

          పంతులుగారు నల్లబల్లమీద ముత్యాలలాంటి అక్షరాలతో బోధిస్తుంటే అజ్ఞాన తిమిరాలు తొలగి , విజ్ఞాన కిరణాలు సోకినట్లనిపించింది .

        తెల్లటి కాగితం పై నల్లటి అక్షరాలతో పరీక్ష రాస్తున్నప్పుడు నలుపంటే  విజయం అనుకున్నాను .

గురజాడని చదువుకున్న తర్వాత   మంచి చెడులు రెండె జాతులు ఎంచి చూడగ అని తెలుసుకున్నాను .

     21 వ శతాబ్దంలో నాయకుల అభిలాషలు సాకారం అయి కులాతీత , మతాతీత , వర్ణరహిత అంతర్జాతీయ సమాజంలో నివసిస్తున్నందుకు గర్వపడ్డాను .

        జాతివివక్షలు ఆనాడే తొలగిపోయాయి . నల్లజాతీయులు , తెల్లజాతీయులతో సోదరులలాగా కలసిమెలసి జీవిస్తున్నారని శ్వేతసౌధం సాక్షిగా నమ్మాను . మానవత్వమే నిజమైన జాతి అనుకున్నాను .

        ఐక్యరాజ్యసమితి సైతం అక్షరాస్యత , పేదరిక నిర్మూలనతో పాటు జాతి వివక్ష , జాత్యహంకార భావజాలాన్ని తుదముట్టించేందుకు నడుం బిగించి ఎజెండాలు తయారుచేసింది .

            నిరాడంబరమైన జీవితం , ఉన్నతమైన ఆలోచనలే మనిషిని మనీషి గా చేసే లక్షణం అంటూ జాతిపితలు సెలవిచ్చారు . వారి అడుగుజాడలే శిరోధార్యంగా , గాంధీ జయంతులను జరుపుకుంటూ , అహింసా సిద్ధాంతాలను మననం చేసుకుంటూ , గాంధీ టోపీలను పెట్టుకుంటూ , గాంధీ జోడును , కర్రను  స్వచ్ఛతకు , స్వేచ్ఛకు చిహ్నాలుగా అంతర్జాతీయ సమాజం భావిస్తూ , గౌరవిస్తోంది .

            ఇన్ని భావనల మధ్య పెద్దన్న సమక్షంలో  ఒక నల్ల జాతీయుడిని , శ్వేతజాతి పోలీసులు కేవలం కళ్లల్లో కళ్లు పెట్టి చూసినందుకు , అమానుషంగా , సంకెళ్లు బిగించి రఫ్ రైడ్ లతో పాశవికంగా ఈడ్చుకెళ్లి , వెన్ను విరగ్గొట్టి , ప్రాణాలను హరించి , మృగరాజులా మీసం దువ్వుకున్నారు . అధికారులు వంతపాడారు .

     రక్షకభటుల దుస్తులతో పాటు అంతరంగం కూడా నల్లనిదే అని శ్వేతజాతి పోలీసులు తమ చర్యలతో చెప్పకనే చెప్పినట్లు చూపారు .

        చర్మపు రంగు ఆధారంగా , సాటి సోదరుని పై జాత్యహంకార బలుపును  ప్రదర్శించిన భక్షక భటులను అందరూ ఉలిక్కిపడి చూస్తున్నారు . తమ అస్తిత్వాన్ని ప్రశ్నించుకుంటున్నారు .

            మనిషి ప్రవర్తన , ఆలోచనా విధానం చర్మపురంగుతో ముడిపడి ఉంటుందేమో అని పరిశోధనలు చేయాల్సిన సమయం వచ్చింది .

             మాటలలో ఒక రంగును , చేతలలో మరొక రంగును చూపే నాయకులారా ! ఇది రంగుల ప్రపంచం అని మళ్లీ మళ్లీ నిరూపించబడింది .

                                      *

 

 

ఒకపరి కొకపరి కొయ్యారమై..

అవినేని భాస్కర్ 

Avineni Bhaskarకొన్ని అనుభూతులు అనుభవించినకొద్ది ఆనందాన్నిస్తాయి. భార్య అలమేలుమంగని గుండెలపై పెట్టుకుని తిరుమల కొండపై నెలకొని ఉన్న వెంకన్న దర్శనం అలాంటిదే! మధురానుభూతిని కలిగించే దృశ్యం ఆ సౌందర్య మూర్తుల పొందు. ఎన్ని సార్లు చూసినా తనివి తీరనిది వారి ఒద్దిక. ప్రతిసారీ కొత్తగానూ, కిందటిసారికంటే దివ్యానుభవంగానూ అనిపిస్తుంది. వారి కీర్తినే జీవితకాలం పాడిన కవి అన్నమయ్యకి కొడుకుగా జన్మించిన పెదతిరుమలయ్యకి ఆ దర్శనం కొత్తకాదు. తేజోవంతమైన జేగదేకపతి-జలజముఖి అందాన్ని తన కీర్తనలో పెదతిరుమలయ్య ఎలా వర్ణిస్తున్నాడో వినండి.
అయ్యవారికెన్ని అలంకరణలు చేసినా అందాన్ని ఇచ్చేది మాత్రం ఆమెవల్లేనట! అదే ఈ కీర్తనలో దాగున్న భావం.

పల్లవి :

ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున గళలెల్లా మొలచినట్లుండె


చరణం ౧
జగదేకపతిమేన జల్లిన కర్పూరధూళి

జిగిగొని నలువంక జిందగాను

మొగి జంద్రముఖి నురమున నిలిపెగనక

పొగరువెన్నెల దీగబోసినట్లుండె


చరణం ౨
పొరి మెఱుగు జెక్కుల బూసిన తట్టుపుణుగు

కరగి యిరుదెసల గారగాను

కరిగమన విభుడు గనుక మోహమదము

తొరిగి సామజసిరి దొలికినట్లుండె


చరణం ౩
మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను

తఱచయిన సొమ్ములు ధరియించగా

మెఱుగుబోణి యలమేలుమంగయు దాను

మెఱుపుమేఘము గూడి మెఱసినట్లుండె

 


తాత్పర్యం

కళలన్నీ ముఖములో మొలకలెత్తినట్లు నిత్యం కొత్తకొత్త ఒయ్యారాలతో కనిపిస్తుందట పురుషోత్తముని ముఖం! (కారణమేమిటో చరణాల్లో వివరిస్తున్నారు పెదతిరుమలయ్య!)

అలంకరణకోసం దేవుడి ఒంటిపైన చల్లిన కర్పూరధూళీ కింద రాలుతుందట. ఆ తెల్లటి ధూళి వెలుతురు చిమ్ముతు నలువైపులా రాలుతు ఉందట. తెల్లటి ధూళి చిందితే వెలుతురు రావడం ఏంటా అంటారా? కారణం ఉంది. అమ్మవారు చంద్రముఖికదా? ఆమెను గుండెపైన అయ్యవారు పొదుముకున్నారుకదా? రాలే తెల్లటి కర్పూర ధూళి పొగరువెన్నెలలు కురిసినట్టు కనిపిస్తుందంటే అది ఆ చంద్రముఖి మహిమేనట!

భలేగా మెరిసిపోతున్న ఆయన బుగ్గలకు పూసిన మేలురకం పునుగు చెక్కిళ్ళనుండి కారుతుందట. రెండుపక్కలా కారుతువున్న ఆ పునుగు ఎలా ఉందంటే మదపుటేనుగు చెంపలపైన స్రవించే ద్రవంలా ఉందట. (మగ ఏనుగుకి మదమెక్కిన సమయాల్లో ఒంటిలో టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఎక్కువవ్వడంవల్ల కంటికీ చెవికీ మధ్యభాగంలో నీరు ఊరి స్రవిస్తుంది). మదపుటేనుగుతో పోల్చడం ఏంటి? అమ్మవారిని కరిగమన అని అంటాం కదా? అంటే ఏనుగువంటి ఒయ్యారమైన నడకగలది అని అర్థం. కాబట్టి స్వామివారిని కరిగమన విభుడు అన్నాడు కవి. దేవుడికి దేవిపైనున్న మోహాన్ని మదపుటేనుగు చంపలపైన ఒలికిపోతున్న ద్రవంతో పోల్చాడు కవి.

శ్రీవేంకటేశుడు బోలేడన్ని నగలు ఒంటిపైన ధరించుకుని, మెరిసిపోయే సొగుసుగల పద్మాసనితో(అలర్‌ మేల్‌ మంగై) కలిసి దర్శనమిచ్చే ఆ దృశ్యం ఎలా ఉందీ? మెఱుపు, మేఘము కలిసి మెఱినంత కాంతివంతంగా ఉందిట! (కారు మబ్బాయన రంగు, తళతళలాడే మెఱుపేమో ఆవిడ రంగు!)


ప్రతిపదార్థం :

ఒకపరి = ఒకసారి
ఒయ్యాం = అందం, సౌందర్యం

మేన = ఒంటిమీద
జల్లిన = చల్లిన
జిగికొని = వెలుగుతు, కాంతివంతమై
ఉరమున = గుండెలపైన, వక్షస్థలమున
పొగరు వెన్నెల = పూర్ణకాంతితో వెలుగుతున్న వెన్నెల, తట్టమైన వెన్నెల
దిగబోసినట్లు = కిందకి జారినట్టు, కురిసినట్టు

పొరిమెఱుగు =అత్యంతమెఱుగు
జెక్కుల/చెక్కుల = చెక్కిళ్ళు, బుగ్గలు
తట్టుపుణుగు = పునుగు (అలంకరణ పూసే వాసన ద్రవ్యం)
కరిగమన = ఏనుగులాంటి నడకగల
విభుడు = స్వామి, నాయకుడు

మదము = మదమెక్కిన ఏనుగుకళ్ళలో కారే నీరు
తొరిగి = కారు, స్రవించు
సామజసిరి = ఏనుగు
దొలికినట్లు = కారుతున్నట్టు

తఱచయిన = బోలెడన్ని
మెఱుగుబోణి = మెరిసేసొగసుగల యువతి

కథా ఉత్సవం ..మే 3

అమ్మ భక్తుడు ఆదిశంకరుడు 

 కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నాకు తత్వశాస్త్రంతో పరిచయం తక్కువ. ఇతరేతర ఆసక్తులది పై చేయి అవడంవల్ల అందులోకి పెద్దగా తలదూర్చే అవకాశం కలగలేదు. కానీ ఈ వ్యాసాల క్రమంలో రేఖామాత్రంగానైనా తత్వశాస్త్ర అంశాలలోకి వెళ్లవలసిన అవసరం కనిపిస్తూ వచ్చింది. పరిమిత పుస్తకజ్ఞానానికి  అనుభవజ్ఞానాన్ని జోడించి వీలైనంతవరకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా పొరపాట్లు దొర్లే అవకాశాన్ని కాదనలేను. దిద్దుబాటుకు జాగా కల్పించుకుంటూ విషయంలోకి వస్తాను.

మనకిప్పుడు స్థూలంగా రెండురకాల తాత్విక ధోరణులతో పరిచయం ఉంది. సందర్భాన్ని బట్టి వాటిని భౌతిక, భావవాదాలుగానూ; నిరీశ్వర, ఈశ్వరవాదాలుగానూ పిలుచుకుంటున్నాం. సగటు జనంలో ఒక అలవాటు ఉంది.  కాలగతిలో వారు ఎలాంటి గొప్ప నినాదాన్ని అయినా, భావనను అయినా చిలుక పలుకులుగా మార్చివేస్తారు. అవి ఏనుగు మింగిన వెలగ పండులా గుజ్జును కోల్పోయి డొల్లలుగా మారతాయి. ఇదో మానవసహజమైన అలవాటు కనుక తప్పు పట్టడానికి లేదు. తప్పు పట్టి ప్రయోజనమూ లేదు.

అలాగే, నిరీశ్వర, ఈశ్వరవాదాలు కూడా చిలుకపలుకుల్లా మారాయి. ఆ మారడంలో వాటిమధ్య ఉన్న అంతస్సంబంధం   తెగిపోయి అవి రెండూ భిన్నమైన విషయాలుగా పరిణమించాయి. ఒక పోలిక చెప్పాలంటే, మనం రెడీమేడ్ దుకాణానికి వెళ్ళి చొక్కా కొనుక్కోవాలనుకుంటాం.  దుకాణంలో మనకు నచ్చిన రంగులో ఉన్న చొక్కాలు, నచ్చని రంగులో ఉన్న చొక్కాలు ఉంటాయి. ఎంచుకునేటప్పుడు వాటిని వేర్వేరు రంగుల చొక్కాలుగానే చూసి, నచ్చిన రంగులో ఉన్న చొక్కాను కొనుక్కుంటాం. అంతేకానీ, ఆ వేర్వేరు రంగుల చొక్కాలు ఒకే ముడిసరకుతో తయారైనవనీ, వాటిని ఒక దర్జీయే కుట్టి ఉండవచ్చుననే ఊహ రాదు. ఆ క్షణంలో ఆ ఊహ రావాలని కూడా ఆశించలేం. ఒకవేళ ఆ ఊహే కనుక వస్తే, అప్పుడు రంగు చొక్కాల గురించిన మన అవగాహన భిన్నమైన మలుపు తీసుకుంటుంది.

ఇలా రెండు ధోరణుల మధ్య ఉన్న అంతస్సంబందాన్ని తెంచేసి, వాటిని వేర్వేరు రెడీమేడ్ వస్తువులుగా తయారు చేసి సగటు మనిషికి అందించడాన్నే మనం సంప్రదాయం అంటాం. ఆయా కాలాలలో అప్పటి అవసరాలను బట్టి జ్ఞానాన్ని గడ్డకట్టించి, శిలాశాసనాలను తయారు చేయడమే సంప్రదాయం పని.  పై రెండు ధోరణుల అంతస్సంబందాన్ని తెలుసుకోవాలంటే, సంప్రదాయమనే ఇనప తెరలను ఛేదించి లోపలికి తొంగి చూడడమే మార్గం. పురాచరిత్రలోకి వెళ్ళడం కూడా ఆ ఇనపతెరలను ఛేదించే సాధనాలలో ఒకటి.

నేనిప్పుడు రాంభట్ల కృష్ణమూర్తి గారి ‘సొంతకథ’ నుంచి కొన్ని ఆశ్చర్యకరమైన వాక్యాలను ఉటంకిస్తాను. అవి ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయంటే సాంప్రదాయికమైన ఊహను అవి పూర్తిగా తలకిందులు చేసి, షాకిస్తాయి. తీవ్రవివాదాస్పదంగానూ, చర్చనీయంగానూ కనిపిస్తాయి. ఆయన అంటారు:

“నేను నిరీశ్వరవాదిని, భౌతికవాదిని కూడా. ఈ రెండింటినీ ఒకరి నుంచే నేర్చాను. అతడే శంకరాచార్యుడు. అతడి తత్వం నాలుగు మహావాక్యాల్లో ఉందంటారు పెద్దలు. తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి… ఇవీ ఆ మహావాక్యాలు. ఆయన వాదం నుంచే నేను మరో మహావాక్య చతుష్టయాన్ని ఎంచుకున్నాను. అవి: ఆవిద్య, భ్రాంతి, మాయ, మిథ్య. చారిత్రకంగా చూస్తే మన దేశాన దేవుడు లేడు. క్రీస్తు శకం ప్రథమ సహస్రాబ్దిలోనే మనకు దేశవిజేతల ద్వారా దేవునితో పరిచయం కలిగింది.”

తను శంకరాచార్యుల నుంచే నిరీశ్వరవాదాన్ని, భౌతికవాదాన్ని నేర్చాననడం; శంకరాచార్యులు ఈశ్వరవాది అన్న  సాంప్రదాయిక ఊహను ఒక్కసారిగా తలకిందులు చేయడమే. అంటే, శంకరాచార్యులను నిరీశ్వరవాది అనీ, భౌతికవాది అనీ అనడమే. ‘చారిత్రకంగా చూస్తే మన దేశాన దేవుడు లే’ డనడం కూడా అలాంటిదే.  ఇవి ఏదో అలవోకగా చెప్పుకుని వదిలేయవలసిన విషయాలు కావని తెలిసిపోతూనే ఉంది. నిజానికి చాలాకాలంగా నాలో కుతూహలాన్ని రేపుతున్న రాంభట్లగారి ఈ దృక్కోణం లోకి మరింత తీరుబడిగా, వివరంగా అడుగుపెట్టాలన్న ఉత్సాహం ఈక్షణాన ఉరకలేస్తున్నా;  దానిని మరో సందర్భానికి వాయిదా వేయక తప్పడం లేదు.

ఆయన ఇంకా ఇలా అంటారు:

“శంకరుడు నిర్వచించిన భౌతికవాదం ఏ రూపాన ఉంటుంది? అమ్మ రూపాన ఉంటుంది. లాటిన్లు అమ్మను ‘మాతర్’ అంటారు. ఇంగ్లీషు, జర్మన్ భాషల్లో ‘త’కారం లేదు. అందుకని వారు దాన్ని ‘మేటర్’ అంటారు. ఫారసీ ఆర్యభాషలో కూడా ‘త’కారం లేదు. అందుకని వారు ‘మాదర్’ అంటారు. ఆర్యభాషల్లో ‘మాతర్’ అంటే ‘పదార్థం’ అనే అర్థం ఉంది. అందుకని శంకరుడు దేవుని ‘అవిద్య’ అన్నాడు కానీ, దేవతను అనేకవిధాల స్తుతించాడు. దేవుడు అవిద్య కానీ దేవత  అవిద్య కాదు. అది కంటికి కనిపించే పదార్థం.”

భౌతికవాదాన్నే పదార్థవాదం అంటారని మనకు తెలుసు. దానినే ఇంగ్లీషులో ‘Materialism’ అంటున్నాం. ‘మాతర్, మాదర్, మేటర్, మదర్, సంస్కృతంలో మాతృ’ అనే పేర్లతో పదార్థాన్ని కూడా సంకేతిస్తున్న అమ్మవారినే శంకరాచార్యులు అనేకవిధాలుగా స్తుతిస్తున్నారు కనుక, ఆయన భౌతికవాది లేదా పదార్థవాది అని సారాంశం. అంటే, భౌతికవాస్తవికతపైనే మాంత్రిక వాస్తవికతను, తద్వారా దైవభావనను ఆపాదిస్తూ రెండింటి మధ్యా ఒక అభేదాన్ని స్థాపిస్తున్న ఆదిమపౌరాణికతకు చెందిన అమ్మతాత్వికతనే శంకరాచార్యులు ప్రతిపాదిస్తున్నారు. అమ్మ తాత్వికతలో భౌతిక, భావ వాదాల మధ్య తేడాలేదు. అవి పరస్పర ఆధారితాలు. రాంభట్లగారి అభిప్రాయాన్నే ప్రామాణికంగా తీసుకుంటే, క్రీస్తుశకం ప్రథమ సహస్రాబ్దిలో దేశవిజేతల ద్వారా మన దేశానికి దేవుని పరిచయం కలిగిన తర్వాత, భౌతిక, భావవాదాలు వేరుపడ్డాయి. అంటే పైన చెప్పుకున్నట్టు వేర్వేరు రంగులు కలిగిన రెండు రెడీమేడ్ చొక్కాలు అయ్యాయి. ఆ రెండింటిలోనూ ఉన్న ముడిసరకు ఒక్కటేననీ, ఆ రెండింటినీ కుట్టిన దర్జీ ఒక్కడే ననీ చెప్పేది ఆదిమ పౌరాణికతకు చెందిన అమ్మతత్వం.

భౌతిక, భావవాదాలను గీత గీసినట్టు సంప్రదాయం ఎంత వేర్వేరు విషయాలుగా చెబుతుందంటే; దాని ప్రకారం రావణుడు భౌతికవాది, రాముడు భావవాది. వారు పరస్పర విరుద్ధ శక్తులు. రావణుడిపై రాముడు విజయం సాధించడం భౌతికవాదంపై భావవాదం విజయం సాధించడమే. ఆవిధంగా సంప్రదాయ బలం వల్ల భౌతికవాదం ఒక తిట్టు పదంగానూ, భావవాదం ఉత్తమగుణంగానూ మారాయి. మళ్ళీ సంప్రదాయం రావణుని నిరీశ్వరవాది అనదు. ఆవిధంగా చూసినప్పుడు భౌతికవాది అయిన రావణుడు ఈశ్వరవాది కూడా కనుక ఆదిమ పౌరాణికతకు దగ్గరగా ఉంటాడు. బహుశా అందుకే అతడు రాక్షసుడు అయ్యాడు. సరే, దీనిని ఇక్కడితో ఆపుదాం.

మళ్ళీ రాంభట్లగారిని పలకరిస్తే, ఆయన భౌతిక, భావవాద (లేదా ఆధ్యాత్మికవాద) చర్చను సాహిత్యంలోకి తీసుకొచ్చి మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు:

“సామాజిక చైతన్యరూపమైన సాహిత్యం ఎవరు సృష్టించినా అందులో మూడు అంశాలు ఉండి తీరుతాయి. అవి, ఒకటి సౌందర్యం. రెండు వాస్తవికత. మూడు తాత్వికత. ఈ మూడూ పాఠకునికి విజ్ఞానదాయకాలు. అందులో సౌందర్యాంశ చదవాలన్న కోరికను కలిగిస్తుంది. వాస్తవికాంశం విజ్ఞానదాయకం. తాత్వికాంశం వివేకదాయకం. అంటే సాహిత్యం వల్ల ఆనందం, విజ్ఞానం, వివేకం కలుగుతుంది.

సంప్రదాయకవులు విజ్ఞాన, వివేకాంశాలను విస్మరించి కవిత్వలక్షణం ఆనందమొక్కటే అన్నారు. కావ్యంలో వాస్తవికతా, తాత్వికతా ఉన్నా వాటిని సంప్రదాయపండితులు గుర్తించలేకపోయారు. ఆలంకారికుల్లో క్షేమేంద్రుడు మాత్రం విజ్ఞానదాయకమైన వాస్తవికతను గుర్తించాడు. దానికి ఆయన ఔచిత్యం అని పేరుపెట్టాడు…సదృశాన్ని చిత్రిస్తే దాన్ని ఔచిత్యమంటారని క్షేమేంద్ర మతం.  వాస్తవమైనప్పుడే సదృశత్వం అలవడుతుంది. ఔచిత్యాన్నే నేను వాస్తవికత అంటాను.”

visvanatha

ఈ సందర్భంలోనే విశ్వనాథవారి ‘వేయి పడగలు’ నవలపై ఆయన ఇలా అంటారు:

“వాస్తవికత అధిభూతం. దాన్ని అనుసరిస్తే కవి ఆధ్యాత్మిక దృష్టికి విరుద్ధంగా తయారవుతుంది కావ్యం. విశ్వనాథ సత్యనారాయణగారు వేయిపడగల్లో వాస్తవికతను అనుసరించారు. ఫలితం వేయిపడగలుగా విస్తరిల్లిన సాంప్రదాయిక కథలో ఒక్కొక్క పడగను పోగొట్టుకుని ధర్మారావు రూపంలో ఆఖరి పడగ ఒక్కటే మిగిలింది. అందుకనే ప్రాచీన కవులు వాస్తవికతను దూరంగా ఉంచుతారు. అభూతవర్ణనలతోనే కాలక్షేపం చేస్తారు కానీ వాస్తవికత జోలికి వెళ్ళే సాహసం చేయరు. వాస్తవికత అధిభూతం. వారి ఆధ్యాత్మికతకు విరుద్ధం. ఆ సంగతి పూర్వులకు తెలుసు.”

ఒకరికి నచ్చడం, నచ్చకపోవడం వేరే విషయం కానీ; సాహిత్య పరిశీలనలో ఇవి ఒక తరహా గీటురాళ్ళు. దానిని అలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, చేతిలో దారాన్ని భద్రంగా పట్టుకుని గాలిపటాన్ని గాల్లోకి ఎగరేయడం భౌతిక, భావవాదాల అభేదాన్ని చెప్పే అమ్మ తాత్వికత. దారాన్ని వదిలేసినప్పుడు, లేదా దానంతట అదే తెగిపోయినప్పుడు గాలిపటం నేలకు పూర్తిగా దూరమైపోయి ఏటెటో కొట్టుకుపోవడం భౌతిక, భావవాదాలను వేర్వేరుగా, పరస్పర విరుద్ధాలుగా చెప్పే తాత్వికత.

***

చెప్పొచ్చేదేమిటంటే, ఆదిమ పౌరాణికతకు చెందిన అమ్మతత్వంలోకి తలదూర్చే ఏ పురా చరిత్రకారుడైనా అందులోని భౌతిక, భావవాదాల అంతస్సంబంధాన్ని గుర్తించక తప్పదు.  పైన చెప్పుకున్న రాంభట్ల గారైనా, జార్జి థాంప్సన్ అయినా, జోసెఫ్ క్యాంప్ బెల్ అయినా చేసింది అదే.

జార్జి థాంప్సన్ తన STUDIES IN ANCIENT GREEK SOCIETY, THE PREHISTORIC AEGEAN లో The Making of a Goddess అనే అధ్యాయాన్ని Childbirth and Menstruation అనే మొదటి ఉపశీర్షికతో ఇలా ప్రారంభిస్తారు:

మానవ సమాజపు తొలి దశలలో ఉమ్మడి శ్రమ అనేది జీవించడానికి ఒక షరతు. ఆహార సేకరణ, వేట అనేవి అప్పటికి ఇంకా అతి తక్కువ సాంకేతిక స్థాయిలో ఉండి, ఎక్కువ చేతులు అవసరమయ్యేవి. జనాభా పెరుగుదల అప్పుడో ప్రమాదకరమైన విషయం కాదు. జనాభా తక్కువైతే మాత్రం చావే.  కనుక ఏదైనా ఒక గుంపులో జనాభాను పెంచుకోవడం, జీవికకు అవసరమైన ఉత్పత్తి సాధనాలను సమకూర్చుకోవడంరెండూ ఒకటే. ఆహారోత్పత్తికి చెందిన సాంకేతికత అస్థిరంగానూ, అభద్రంగానూ ఉండడ మంటే; మనుషుల పునరుత్పత్తి కూడా ఉండడమే. ఆదిమ తెగలలో శిశుమరణాలు విపరీత స్థాయిలో ఉండేవి. ప్రతి చోటా శిశువు పుట్టుక చుట్టూ మాంత్రిక మైన తంతులు అల్లుకుపోవడానికి ఈ భౌతిక అవసరమే మూలం.

ఇలా భౌతిక పరిస్థితులతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించి , మాంత్రిక మైన తంతులకు మూలం భౌతిక అవసరమేనని చెప్పడం ద్వారా ఆదిమ పౌరాణికతలోని భౌతిక, భావ వాదాల అంతస్సంబంధాన్ని వివరించడానికి థాంప్సన్ శ్రుతి చేస్తున్నారు. ఈ తంతులు మనుషుల మనుగడ కోసం ఉద్దేశపూర్వకంగా కల్పించినవి కావనీ, కేవలం అమ్మతనానికి చెందిన స్పందనలకు భావనాత్మక(ideological) వ్యక్తీకరణలని కూడా ఆయన అంటారు.

ఆయన ప్రకారం ఇంకా చెప్పుకోవాలంటే, వ్యవసాయాన్ని కనిపెట్టాక పై పరిస్థితులే మరింత ఉన్నత ప్రమాణంలో పునరావృతమయ్యాయి. ఈ కొత్త సాంకేతికత ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పుడు అడవుల్ని నరికి వ్యవసాయ యోగ్యం చేయడానికి బ్రహ్మాండమైన ప్రయత్నం అవసరమయ్యేది. వ్యవసాయ జనావాసాల చుట్టూ అంటురోగాలు, అడవి జంతువులతో సహా రకరకాల అజ్ఞాత ప్రమాదాలు పొంచి ఉండేవి. వీటిని అన్నింటినీ ఎదుర్కొంటూ వ్యవసాయం చేయడం ఆరోజుల్లో సామాన్య విషయం కాదు. అందుకే జర్మానిక్ భాషల్లోనూ, సెమెటిక్ భాషల్లోనూ కూడా భూమిని దున్నడ మంటే, ఒక పెద్ద నిర్మాణం (to build) చేయడమే. ఎంతో ఆటవికంగా ఎదురు తిరిగే అడవిని లొంగదీసుకోవడం మాటలు కాదు. ఈ పరిస్థితులలో ఏ ఒక్క కుటుంబమో ఒంటరిగా అడవిలో స్థిరపడడం కష్టం. ఎక్కువ జనసంఖ్యలోనే భద్రత. ప్రారంభంలో స్త్రీలే పంటలు పండించడానికి చెమటోడ్చేవారు. పంటల ఉత్పత్తికి, సంతానం కనడానికి వారికి ఒక స్పష్టమైన పోలిక కనిపించేది. పంట పండినా, ఎండినా; కడుపుపంట బతికినా, మరణించినా ప్రసూతి దేవతే కారణమనుకునేవారు.

స్త్రీ ప్రసవం చుట్టూ అల్లుకున్న మాంత్రిక తంతులే అన్ని తంతులకూ మాతృకలైనట్టు కనిపిస్తాయి. అవే వ్యవసాయానికీ విస్తరించాయి. ప్రసవ కాలంలోనూ ఋతుకాలంలోనూ కూడా రక్తస్రావం జరుగుతుంది. ఆదిమ సమాజాల దృష్టిలో అది సాధారణ రక్త స్రావం కాదనీ, మరో జీవికి ప్రాణం పోసే స్త్రీలోని అంతర్గతశక్తికి వ్యక్తీకరణ అనీ థాంప్సన్ అంటారు. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యాపాపం చుట్టుకుంటుందన్న విశ్వాసానికి మూలం ఇక్కడే ఉంది. దీని గురించి ఇంతకుముందు యయాతి-శర్మిష్టల కథలో చెప్పుకున్నాం. ఋతు, లేదా ప్రసవ రక్తం జీవిని పుట్టించే ఒక శక్తి వనరు అయినప్పుడు దానిని సక్రమంగా నియంత్రించడం అవసరం. లేకపోతె అది తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. ఆ నియంత్రణకు ఉద్దేశించినవే మాంత్రికమైన తంతులు.

ఈ మాంత్రికమైన తంతులతోపాటే అన్ని నిషేధాలకు మాతృక అయిన తొలి నిషేధం పుట్టిందని థాంప్సన్ అంటారు. అది, గర్భవతితో లేదా ఋతుకాలంలో ఉన్న స్త్రీతో లైంగిక క్రియ జరపకూడదన్న నిషేధం. అలాగే, కొత్తగా ఋతుమతి అయిన, ఆ తర్వాత నెల నెలా ఋతుకాలాన్ని ఎదుర్కొనే స్త్రీని శుద్ధి అయ్యేవరకూ పురుషుడు చూడకూడదనీ, ఎవరూ తాకకూడదనీ, దూరంగా ఉంచాలనే ఆనవాయితీ వచ్చింది.

విశేషమేమిటంటే, ఋతు సంబంధమైన ఇలాంటి కట్టడుల వెనుక రెండు పరస్పర విరుద్ధమైన దృష్టికోణాలు ఉన్నాయి. మొదటి కోణం ప్రకారం, ఋతు కాలంలో లేదా ప్రసూతి స్థితిలో ఉన్న స్త్రీ ఎవరూ తాకకూడని పవిత్రురాలు. ఎలాగంటే, దక్షిణాఫ్రికాలోని హెరేరే తెగలలో ఒక ఆచారం ఉంది. రోజూ పొద్దుటే పాలు పితికిన తర్వాత వాటిని తీసుకొచ్చి బాలెంతరాలు ముందు పెడతారు. ఆమె వాటిని తన పెదవులతో తాకి పవిత్రం చేస్తుంది. మరోకోణం ప్రకారం ఋతుకాలంలో లేదా ప్రసూతి స్థితిలో ఉన్న స్త్రీ అపవిత్రురాలు. రోమన్ భాషలో sacra అనే పదం ఆమెను పవిత్రురాలిగానూ, అపవిత్రురాలిగానూ కూడా చెబుతుంది. పితృస్వామిక సమాజంలో స్త్రీ మతం మీద ఆధిపత్యాన్ని కోల్పోయాక ఋతుకాలాన్ని, ప్రసవ కాలాన్ని అపవిత్రాలుగా వ్యతిరేక దృష్టితో చూడడం మొదలైందని థాంప్సన్ అంటారు. ఆ అపవిత్ర, వ్యతిరేక భావనలనే స్త్రీత్వానికి ఆపాదించి ఈసడించడమూ మొదలైంది. చెడు అంతటికీ మూలంగా, మంత్రగత్తెగా స్త్రీ పరిగణన పొందుతూ వచ్చింది.

ఇటువంటి భావాలు ఏ ఒక్కచోటో కాదు, ప్రపంచమంతటా పుట్టాయని థాంప్సన్ అనడాన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. ఋతుకాలంలోనూ, ప్రసవ కాలంలోనూ ఉన్న స్త్రీ పట్ల వ్యవహరించే తీరులో ఉన్నంత ఏకీభావం మానవజీవితంలోని మరే ఇతర అంశంలోనూ కనిపించదని కూడా ఆయన అంటారు.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

మణిరత్నం గారి మాంగల్య బలం!

జి ఎస్‌ రామ్మోహన్‌

మణిరత్నం సినిమాల్లో రైలు తరచుగా కనిపిస్తుంది. రైలు మోడర్నిటీకి చిహ్నం. నిజంగా అంతా అలా ఉంటే ఎంత బాగుణ్ణు అనిపించేట్టు ఉంటుంది ఆయన చూపించే నగర జీవితం. మణిరత్నం అంటేనే సోఫిస్టికేషన్‌. వయసు ఎంత పైబడుతున్నా నిరంతరం తన సినిమాలను యవ్వనంతో ఉంచడానికే ప్రయత్నిస్తారు. ఆయన సినిమాల నిండా ప్రేమ కనిపిస్తుంది. మాస్‌ మసాలా సినిమాల్లో మాదిరి విలనీ కనిపించదు. మనుషులంతా ఎంత మంచివాళ్లుగా ఉంటారో చెప్పలేం. ప్రేయసిని అందుకోవడానికి వేరే అమ్మాయి బైకును ఆపితే ఆ అమ్మాయి ఏమీ అనుకోకుండా లిఫ్ట్ ఇస్తుంది. పరిచయం లేని కుర్రాడు భుజం మీద చేయి వేసి కూర్చున్నా చెడుగా అనుకోదు. బ్యాంక్‌ ఉద్యోగంలో రిటైరయిన పెద్దమనిషి లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్న జంటకు ఇంట్లో ఆశ్రయమివ్వడానికి ఒప్పేసుకుంటారు. ఎప్పుడంటే అపుడు ఆఫీసునుంచి బయటకు వచ్చేసి హోటళ్లలో రెస్టారెంట్లలో ఆ జంట చెట్టాపట్టాలు వేసుకుని ఊసులాడుకోవడానికి వారిద్దరు పనిచేస్తున్న ఆఫీసులకు అభ్యంతరమే ఉండదు.

మణిరత్నం మంచి మనసుతో చేస్తున్న పనికి అందరూ సహకరిస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో ప్రేమికులకు ఆర్థిక కష్టాలు ఎప్పుడూ ఉండవు. కోట్లకు కోట్లు డబ్బు మూలుగుతున్నా దాన్ని కాదని కెరీర్‌ కోసం కష్టపడుతున్న బిడ్డ గురించి తల్లి కాస్ట్లీ బాధ తప్పితే ఒకె బంగారంలోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. పాత్రలు, వాతావరణం మాత్రమే కాదు. సబ్జెక్ట్‌, ట్రీట్‌ మెంట్‌ అంతా పూర్తి క్లాస్‌.  ఏక్‌ దమ్‌ ఏ క్లాస్‌. మ..మ..మ్మాస్‌ కాదు. సి క్లాస్‌ సెంటర్స్‌ టార్గెటే కాదు. ఓకె బంగారం ఫక్తు మల్టీ ప్లెక్స్‌ సినిమా. కాకపోతే బి క్లాస్‌ ఎప్పుడూ ఏ క్లాస్‌ జీవనశైలిని ఆరాధనతోనూ, రేపో మాపో తాను అక్కడికి చేరాలనే ఆశతోనూ చూస్తూ  ఉంటుంది. కాబట్టి బి క్లాస్‌కు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదు. క్లాస్‌ యూత్‌ను ఆకట్టుకునే అంశాలన్నీ ఉన్నాయి. వీడియోగేమ్స్‌తో పాటు, సెక్స్‌ని అన్‌ అపాలజిటిక్‌ అంశంగా చూపడం వగైరాలు యూత్‌ని పట్టేస్తాయి. ప్రకాశ్‌రాజ్‌-లీలాశాంసన్‌ జంట, వారి అనుబంధం ఎడ్యుకేటెడ్‌ మిడిల్‌ ఏజ్‌వాళ్లని థియేటర్లకు లాగేస్తుంది. అన్నింటని మించి కేవలం నిత్యామీనన్‌ను చూడడం కోసమైనా థియేటర్‌కు వెళ్లొచ్చు. వెరసి ఇది హిట్టే. మణిరత్నానికి చాలా కాలం తర్వాత కమర్షియల్‌ విజయం లభించినట్టే.

samvedana logo copy(1)

కథ రెండు ట్రాకులుగా నడుస్తూ ఉంటుంది. కెరీర్‌కు కమిట్‌మెంట్లు ఆటంకం అని భావించే ఒక అమ్మాయి-అబ్బాయి పెళ్లి చేసుకోకూడని అనుకుంటారు. అయితే అదే సమయంలో వయసు ముద్దు ముచ్చట్లకు ఆటంకం  ఉండకూడదని కూడా అనుకుంటారు. ఇద్దరూ ఎవరి కెరీర్‌ కోసం వారు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ లోపు ఉన్న ఆరునెలలు ఒకరిలో ఒకరిగా గడపాలని అనుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఆర్నెళ్లు జాలీగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉండాలని అనుకుంటారు. ఇదొక ట్రాక్‌. అల్జీమర్స్‌తో బాధపడే భార్య, బ్యాంక్‌ ఉద్యోగిగా రిటైరై ఇంట్లో వంటా వార్పూ చేస్తూ ఆమెకు  అన్నీ తానై చూసుకునే భర్త – ఈ జంటది మరో ట్రాక్‌.  వీరిద్దరి మధ్య ప్రేమానుబంధం, ఒకరికోసం ఒకరన్నట్టుగా జీవించడంలో ఉండే ఆ అనుబంధం ఆ యువజంట ఆలోచనలపై ఎలాంటి ప్రభావం చూపింది అనేది సినిమా సారాంశం. స్వేచ్ఛతో మొదలై బంధంతో ముగుస్తుంది ఈ సినిమా.

మామూలుగా కమర్షియల్ సినిమాలను చూసే దృష్టితోనే అయితే ఇందులో తప్పు పట్టాల్సింది పెద్దగా ఏమీ లేదు. మామూలు రీవ్యూయర్‌ భాషలో నాలుగు మాటలు మాట్లాడి ముగించుకోవచ్చు. మధ్యలో కాస్త బోర్‌ కొట్టించారు నాలుగైదు రీళ్లు ఎడిట్‌ చేసి ఉండొచ్చు కదా అనొచ్చు. కనీస పక్షం  రెండు పాటలను తీసేసి ఉండొచ్చు… చిన చిన కోరికలే..తప్ప మిగిలిన పాటలన్నీ వృధా. కదా అనొచ్చు. తెలుగు మసాలా సినిమాల్లో ప్రకాశ్‌ రాజ్‌ ఇరగదీశాడు అంటారు, ఇక్కడ అలాంటిదేమీ లేకుండా ఆయన పాత్రలో ఇమిడిపోయారు అనొచ్చు. ఆ మాటకొస్తే హీరో సహా అందరూ ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు అనొచ్చు.

05-1428213938-ok-bangaram-audio-launch-highlights

 

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బోర్‌ కొట్టిన సీన్లలో కూడా ఆ అమ్మాయి నిత్యా మీనన్‌ మెరుపు చూపులు రిలీఫ్‌గా పనిచేశాయి అనొచ్చు. క్రిస్టియానిటీని ఆధునికంగానూ, ఇస్లామిక్‌ ఆర్కిటెక్చర్‌ని గొప్పగా చూపించే పాజిటివ్‌ సింబాలిజమ్‌లో ఉన్న లిబరల్‌ ఎలిమెంట్‌ గురించి ప్రస్తావించుకోవచ్చు. ఇలాంటి మంచి చెడుల గురించి బోలెడు మాట్లాడుకోవచ్చు. కాకపోతే మణిరత్నం రెగ్యులర్‌ మసాలా మాల్‌ కాదు. కమర్షియల్‌కు ఎక్కువ, క్రాస్‌ఓవర్‌కు తక్కువ అనే విమర్శను కాసేపు పక్కనబెడదాం. తాను కోరుకున్న ఫీలింగ్‌ను సమర్థంగా జనంలోకి బట్వాడా చేయగల టెక్నీషియన్‌ అనైతే ఒప్పుకోక తప్పదు. ముఖ్యంగా ఇక వారంలో విడిపోతాం అనే మానసిక సంఘర్షణ ఆ యువజంటలో మొదలయినప్పటినుంచీ సినిమా నడిచే వేగం, అది కలిగించే స్పందన దర్శకుని విజయానికి సంకేతాలు. ఎఆర్‌ రహమాన్‌ తానేంటో ఇక్కడ చూపించారు.

ఓకె, బంగారం. కాకపోతే సినిమాలో వీరు చెప్పదల్చుకున్న విషయం ఏమిటి?

maniratnam-2b-1_1186981158

ఇద్దరూ సహజీవనం మొదలెట్టినపుడు సాగిన చర్చల్లో ఆ పెళ్లొకటి చేసుకుంటే ఆ తాడొకటి వేసుకుంటే అన్నీ చేసేసుకోవచ్చా..దాంతో లైసెన్స్‌ వస్తుందా, లేకపోతే రాదా అనే టోన్‌తో హీరోయిన్‌ మాట్లాడుతుంది. మరి సెక్స్‌కు వర్తించే సూత్రమే అనుబంధానికి కూడా వర్తిస్తుంది కదా! కాగితాల మీద పెళ్లి సంతకాలు చేసుకుంటేనే అనుబంధం నిలుస్తుందా, లేకపోతే ఉండదా. ఆ సంతకాలు లేకుండా కూడా వారు అనుబంధాన్ని కొనసాగించలేరా…ఒకరికొకరుగా ఉండలేరా! సేమ్‌ తర్కం ఇక్కడ ఎందుకు వాడలేకపోయారు? ఆ సంతకాలు లేకపోతే పారిస్‌ వెళ్లిన అమ్మాయి అక్కడ ఇతన్ని మర్చిపోతుందా, అమెరికా వెళ్లిన అబ్బాయి ఆ అమ్మాయిని మర్చిపోతాడా. పెళ్లి సంతకం అనుబంధాన్ని కాపాడే తాలిస్మాన్‌లాగా పనిచేస్తుందా! ఆ సంతకాలు లేకుండా కూడా ఆ వృద్ధదంపతుల్లాగే వారు అనుబంధాన్ని కాపాడుకోవచ్చుకదా! అనుబంధం అనేది మనుషుల అవసరాలు, పరిస్థితులు, స్వభావాల మీద కాకుండా పెళ్లి అనే తంతుమీద ఆధారపడుతుందా!

ఇంటిమసీ విషయంలో రాడికల్‌గా ప్రశ్న వేసిన మణిరత్నం అదే ప్రశ్న అనుబంధం విషయానికీ వర్తిస్తుందని ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకంత స్టేటస్‌ కోయిస్టుగా ఉండిపోయారు అనేది ప్రశ్న. దిల్‌ దే చుకే సనమ్‌, తాళ్‌ అంత నాటుగా ఇది లేకపోవచ్చు. అబ్బాయి నోటినుంచే పెళ్లి ప్రపోజల్‌ పెట్టించడంలోనూ కాస్తంత సోఫిస్టికేషన్‌ చూపించి ఉండొచ్చు. కానీ సోఫిస్టికేషన్‌లో తప్ప సారాంశంలో ఉన్న తేడా ఎంత? పిసి శ్రీరాం అద్భుతమైన ఫ్రేమ్స్‌, పాత్రలు, సంభాషణలు అన్నీ ఫ్రెష్‌గా ఉండి సినిమా ఒక దశలో పొగలు కక్కుతున్న తమిళ సాంబారులాగా ఉంటుంది. ముగింపు వచ్చేసరికి పాచిపోయిన సాంబారులాగా ముక్క వాసన వేస్తుంది.

*

 

 

 

 

అలా వీధిలోకి వెళ్లి వద్దామా?!

కందుకూరి రమేష్ బాబు 

………………

Kandukuri Rameshఒక అలవాటుగా చూసినప్పుడు ఏ విశేషమూ గోచరించదు.
కానీ, తరచి చూసుకుంటే విశేషాలు కానవస్తూ ఉంటై.

ఉదాహరణకు నైటీ.

ఉన్నత వర్గాలా నిమ్నవర్గాలా లేదా వర్గాలెందుకుగానీ…
నగర జీవులా గ్రామీణులా లేదా తేడాలెందుకుగానీ…
అసలు మహిళలైతే చాలు, నైటీలు లేకపోవడం ఉండదిప్పుడు.

అవును.
నైటీలూ అని గనుక మనం అనుకుంటే ఒక ప్రశ్న.
‘నైటీ’ అంటే రాత్రి ధరించేదేనా?

కాదని తెలుస్తూనే ఉంది.
రేయింబవళ్లూ, రాత్రుల్లూ ఇప్పుడు నైటీయే మహిళను ధరిస్తూ ఉంది.
అది గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.

ఎన్ని జీవన వ్యాపకాల్లో చూసినా చీరను దాటేసి నైటీ కానవస్తూనే ఉంది.
ఇప్పుడు చీర నిజానికి ఒక దృశ్యాదృశ్యం.
నైటీ రాత్రల్లే కాదు, దివారాత్రుల దస్తూరీ.ఒక జీవనచ్ఛాయ.
అది తన ధారణను దాటింది. పరిపరివిధాలా ఆవరిస్తూ ఉన్నదని గమనించారా?

ఏదైనా అంతే.
సౌకర్యవంతమైందిగా మారిన తర్వాత దాని విస్త్రృతి పెరుగుతుంది వాడకంలో.
నైటీ అందులో ఒక అందమైన ఉదాహరణ మాత్రమే.

ఈ చిత్రమే చూడండి.
ఆమె తల్లి. ఇద్దరు పిల్లల తల్లి.
నైటిలో వీధిలోకి వస్తుంది.

పిల్లల్ని బడికి తీసుకెళ్లినా నైటీలోనే.
బడినుంచి పిల్లల్ని ఇంటికి తీసుకు రావాలన్నా నైటీలోనే.
లేదా పిల్లలకు ఏదైనా కొనివ్వాలన్నా అట్లా వచ్చేసి ఇట్లా ఇంట్లోకి వెళ్లిపోతుంది, నైటీలోనే.

ఉదయాలూ, మధ్యాహ్నాలూ, సాయంత్రాలూ- నైటీయే.
ఎండపొడలోనైటీయే. వెన్నలరేయిలోనూ నైటీయే.
మనకు కానవచ్చినా కానరాకపోయినా ఉన్నది నైటీలో అన్నది చిత్రం.

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఎవరైనా సరే,
అమ్మా -వదినా …ఆలి- చెల్లీ…ఇలాగే.
ఇరుకిరుకు గల్లీల్లో ఇట్లా మహిళలు నైటీల్లో కనిపిస్తూ ఉండటం నగరజీవితంలోనే కాదు, గ్రామాల్లోనూ మామూలే!  మెడలో బంగారు తాళి, కాళ్లకు వెండి పట్టగొలుసులు. చేతికి గోరింటాకు. ఒంటిపై నైటీ.
అదీ విశేషం. అట్లా అన్నీ ఉంటై.

ఇంట్లోంచి అట్లా వీధిలోకి రావడం అంటే ఆ మహిళ బయటి ప్రపంచంలోకి వెళ్లినట్లేమీ ఉండదు.
అసహజంగా ఏమీ ఉండనే ఉండదు. అందుకు కారణమూ ఉంది. ఒక రకంగా వీధి జీవితంలోని సౌకర్యం ఇది.
అందుకే అనడం వీధి అంటే ఇంటికి ఒక ఎక్స్ టెన్సన్ – అంతే అని!

వీధి అంతానూ ఇల్లూ వాకిలీ అయిన వాళ్లకు నైటీ అన్నది దివారాత్రులతో పనిలేనిదే అనడం.
వీధిలోని మనుషులంతా వావివరసల మాదిరే ఒక అనుబంధాలశాల అయినప్పుడు…మనిషి యధేచ్ఛగా నడవటంలో ఎటువంటి ప్రయాసా లేదని చెప్పడం. యవ్వనవతులైనప్పటికీ కడు వృద్ధులైనప్పటికీనూ మొత్తంగా మహిళలకు పెద్ద పట్టింపూ ఏమీ ఉండని సమయాలే ఇవన్నీ అనీనూ. ఊరికే మర్యాదను పాటిస్తూ, ఇట్లా నైటీ అన్నది చున్నీ ఆధారంగా బయటకు వస్తుంది!

ఇప్పుడు చూడండి.
పిల్లాపాపలతో ఆ తల్లి అట్లా హాయిగా అందంగా, ఆనందంగా నడిచి వెళుతుంది.
కాళ్లకు చెప్పుల్లేకుండా హాయిగా!

వెళుతుంటే ఒక సంగీతం వుంటుంది. నడుస్తుంటే ఒక విలాసం ఉంటుంది.
అదంతానూ- వీధంతానూ తమది అనుకోవడంలో కనిపించే ఒక విశ్వాసం. ఒక ఆత్మీయ సరాగం.
అందుకే street photography అన్నది మెయిన్ రోడ్డుకే పరిమితం అవుతుంటుంది చాలామంది ఫొటోగ్రఫిలో. ఇట్లా లేన్స్ లోకి- వీధుల్లోకి వస్తే గల్లీలోని జీవితం ఒక రకంగా ఇల్లు వాకిలిగా కనిపిస్తుంది.

అందుకే అనడం, ‘గ్రామాల్లోకి తరలండి’ అన్నట్టే వీధుల్లోకి తరలండని!
జీవన విలాసం ఏమిటో చూద్దురు, రండిలా అని!

లెటర్స్

 

prajna“అమ్మా, నేనొచ్చేశా” అని అరుచుకుంటూ చైత్ర ఇంట్లోకి వచ్చి, బాగ్ కుర్చీలోకి విసిరేసింది.

“ఏంటి తొందరగా వచ్చేశావు? రాత్రి టాస్క్ లు ఉన్నాయా, మళ్ళీ పని చేయాలా ఏంటి?” మంచి నీళ్ళు తెచ్చి ఇస్తూ కౌసల్య అడిగింది.

“లేదు లే, మా సర్వర్ లు అన్నీ డౌన్ అయిపోయాయి, ఇంటికెళ్లిపోవచ్చు అన్నారు. మనం ఇలాంటి అవకాశాలని వదులుకోము కదా, వచ్చేశాను” చైత్ర చెప్పులు విప్పుతూ చెప్పింది. కానీ అది నిజం కాదు. నిన్న రాత్రి నుండి తన మనసు మనసులో లేదు. అమ్మ కి ఆ విషయం చెప్పటం ఇష్టం లేక ఆఫీస్ లో ప్రాబ్లం అని అబద్ధం చెప్పింది.

“మంచిది. ఇప్పుడే ‘ద రింగ్’ సినిమా చూద్దామని అనుకుంటున్నాను. హారర్ సినిమాట కదా. నువ్వు కూడా చూద్దువుగాని, కాళ్ళు చేతులు కడుక్కొని రా” అని కౌసల్య అంటూ ‘ఐపాడ్’ ని టీవీకి కనక్ట్ చేసింది.

“ఐపాడ్ లో ఏముంది? ఆన్లైన్ దొరికిందా ప్రింటు? అయినా ఈ హారర్ సినిమాలు ఇష్టం ఏంటమ్మా నీకు? నాకు చాలా భయం” చైత్ర చేతులు తుడుచుకుంటూ అడిగింది.

“నీకు మీ డాడీ పోలికలు వచ్చాయి లే గాని, మైక్రోవేవ్ లో మన ఇద్దరికీ టీ ఉంది. నాకు పొద్దున నుండి ఒంట్లో బాగోలేదు, ఓపిక లేదు. సొ నువ్వే, ఒక నిముషం చాలులే , టీ వేడి చేసుకొని తీసుకురా. సినిమా స్టార్ట్ చేస్తున్నాను”

“ఎంటో, నాకంటే ఎక్కువ టెక్నాలజీని ఫాలో అవుతున్నావుగా అమ్మా అసలు” చైత్ర ఆశ్చర్యంగా “అయినా ఏమైంది? జ్వరమా?” అని అడిగింది.

కౌసల్య టీచర్ గా పనిచేసేది. పెళ్లి చేసుకున్నాక తను చాలా మారిపోయింది. పెళ్లికి ముందు ఉండే ఉత్సాహం, జీవితంలో ఏదో సాధించాలనే ఆశ ఇలాంటివి ఏవీ పెళ్లి అయ్యాక తనలో కనిపించలేదు. కూతురు ఉద్యోగం చేసే వయసుకు వచ్చేసరికి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. కానీ టీవీ సీరియళ్లు చూస్తూ లేదా  వాళ్ళ మీదా వీళ్ళ మీదా నేరాలు చెప్పుకుంటూ, ఏదోలాగా కాలక్షేపం చేయటం ఇష్టం లేక చైత్ర చేత ఐపాడ్ తెప్పించుకొని తనకి అంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుంది. చిన్నప్పుడు కుదరలేదు కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల్లో తనకి ఇష్టమైన కర్నాటిక్ సంగీతం నేర్చుకుంటోంది. అలాగే యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే భర్త, కూతురికోసమని రకరకాల వంటలు చేసి పెడుతూ ఉంటుంది.

తన భర్త విక్రమ్ కూడా పెళ్ళికి ముందు చలాకీగా, కలుపుకోలుగా ఉంటూ ఉండేవాడనీ, పెళ్లి అయ్యాక మరీ మెకానికల్ గా తయారయ్యాడు అని విక్రమ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. కౌసల్యకి, విక్రమ్ కి పెళ్లి అయి పాతిక సంవత్సరాలు అయినా కూడా, వాళ్ళిద్దరి మధ్యా ఎక్కువ మౌనమే ఉండేది. పిల్లల ముందు తల్లిదండ్రులు స్నేహంగా ఉండాలి అని వాళ్ళ నమ్మకం. అందుకే చైత్ర ముందు మామూలుగా ఉంటారు కానీ నిజానికి ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోరు. చైత్ర కోసం చుట్టాల ఇంటికి, లేదా బయట హోటళ్ళకి, సినిమాలకి తీసుకువెళ్ళేవారు. కానీ వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటే వేరేలా ఉండేవారు. ఇది వినటానికి విడ్డూరంగా ఉన్నా చాలామంది ఇళ్ళలో ఉండే వ్యవహారమే. పిల్లలు పుట్టాక భార్యాభర్తలు కొంత దూరమవుతారు. దగ్గర అవటానికి ప్రయత్నించకపోతే ఇంక వాళ్ళిద్దరి మధ్య శూన్యమే మిగులుతుంది.

కానీ కౌసల్య, విక్రమ్ లది వేరే కేసు. పెళ్లి అయినప్పటినుండి వీళ్ళు స్త్రేంజెర్స్ లాగా బ్రతుకుతున్నారు. చైత్ర వీళ్ళ జీవితంలోకి రాక ముందు కేవలం రూమ్ మేట్స్ లాగా ఉండేవారు. కలిసి చేసిన పనులు చాలా తక్కువ. చైత్ర పుట్టాక బాధ్యతలు పంచుకోవడం మాత్రం కలిసి చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరి మధ్య బంధం స్త్రేంజెర్స్ కి ఎక్కువ, స్నేహానికి తక్కువ అని అనటంలో అతిశయోక్తి లేదు. చైత్ర ఇంట్లో ఉన్నంత సేపు వాతావరణం చాలా లైవ్లీ గా ఉంచటానికి విక్రమ్, కౌసల్యలు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. చైత్రకి చిన్నతనంలో ఏమీ తెలిసేది కాదు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ ఇంట్లో పరిస్థితి అర్ధమవుతోంది. అమ్మ, డాడీ మధ్య ఉన్న బంధం అంతంతమాత్రంగానే ఉందని తనలో ఒక చిన్న కన్ఫ్యూజన్ మొదలయ్యింది.  అందులోనూ ఆలోచించగా ఆలోచించగా నిన్న రాత్రి తనుచేసిన పని తప్పుగా అనిపిస్తోంది.

చైత్ర ప్రశ్న కి జవాబు ఇవ్వకుండా“ఏంటి లేటు? తొందరగా రా” కౌసల్య అరుపుకి చైత్ర టీ లేకుండానే దగ్గరకొచ్చి “అమ్మా” అని నెమ్మదిగా పిలిచింది.

చైత్ర ఖాళీ చేతులనీ చూసి, “ఏంటి? టీ ఏది? పోనీ నీకు అంతగా భయమేస్తే వెళ్ళి పడుకో కాసేపు. నేను సినిమా అయిపోయాక లేపుతానులే”అని కౌసల్య చాలా కాజుయల్ గా అంది.

“కాదు అమ్మా. నీకో విషయం చెప్పాలి. నువ్వు ఏమి అనకూడదు, అనుకోకూడదు” చైత్ర ధైర్యంగా చెప్పింది.

“అబ్బో, సినిమా డైలాగ్ ఆ బాగుంది. చెప్పు ఏంటి సంగతి? సస్పెన్స్ వద్దు. అసలే ఇవాళ నాకు బి‌పి ఎక్కువగా ఉంది”

“నిన్న నేను ఆ పాత పెట్టెలో నా సర్టిఫికేట్ వెతుకుతున్నప్పుడు, ఒక బ్లాక్ బాగ్ కనిపిస్తే, తీసి..” ఇంకా తన మాటలు పూర్తి అవకుండానే, కౌసల్య అందుకొని “ఓపెన్ చేశావా?” సీరియస్ గా అడిగింది.

“సారీ అమ్మా, ఒక లెటర్ చదివి ఆపేద్దామనుకున్నాను. బట్..” అని చైత్ర మాట్లాడటం ఆపేసింది.

“సరే. ఇంక ఆ విషయం వదిలేసేయ్”

“ఓకే”

కాసేపు అక్కడ మౌనం రాజ్యమేలింది. ఆ ఇంటికి విక్రమ్, కౌసల్య మధ్య మౌనం అనే ఆట అలవాటే, కానీ ఈ సారి విక్రమ్ బదులు చైత్ర ప్లేయర్.

“ఒకటి చెప్పు. బ్లాక్ బాగ్ లో ఇంకేమైనా చదివావా? అయినా దాని మీద పర్సనల్ అని నా పేరు ఉంది కదా? మ్యానర్స్ లేవా నీకు?” టెన్షన్ పడుతూ కౌసల్య అడిగింది.

“లేదమ్మా. లెటర్స్ తప్ప ఇంకేమీ చదవలేదు. సారీ అమ్మా” ఇంకేం మాట్లాడాలో అర్ధాంకాక చైత్ర వచ్చి కౌసల్య ని హగ్ చేసుకుంది.

“కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి ప్లీజ్” కౌసల్య అనేసి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది.

అమ్మ ఎప్పుడూ ఇలా సీరియస్ అవ్వడం చూడని చైత్ర తను చాలా తప్పు చేసింది అని గ్రహించి ఎలాగయినా అమ్మని మచ్చిక చేసుకోవాలి అని రాత్రి వంట చేద్దామని నిశ్చయించుకుంది. గూగుల్ లో బిర్యానీ ఎలా చేయాలో చూసి, మూడు గంటలు కష్టపడి బిర్యానీ చేసింది.

“డాడీ వచ్చే టైమ్ కూడా అయింది. ఇంక అమ్మని కూడా తినటానికి రమ్మంటాను” అని రూమ్ తలుపు రెండు సార్లు తట్టింది. ఎంతకీ ఓపెన్ చేయకపోయేసరికి, తలుపుని కొంచం తోసి మంచం మీద నిర్జీవంగా ఉన్న కౌసల్య ని చూసింది. పల్స్ చెక్ చేసి వెంటనే ఆంబ్యులెన్స్ కి, విక్రమ్ కి కాల్స్ చేసింది. ఆంబ్యులెన్స్ తో పాటు టైమ్ కూడా పరిగెట్టింది. అప్పటికే చనిపోయిన కౌసల్య ని హాస్పిటల్ లో డాక్టర్ చెక్ చేసి ‘నేచురల్ డెత్’ అని కన్ఫర్మ్ చేశారు.

———————

కౌసల్య గుండెపోటుతో పోయి సరిగ్గా నెల అయింది. రోజూ అమ్మ గుర్తొస్తూ చైత్ర ఏడుస్తోంది. విక్రమ్ కి మాత్రం ఏడుపు రావట్లేదు. ‘ఇంత బండబారిపోయానా’ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉన్నాడు. కానీ జీవితం సాగాలి కాబట్టి రొటీన్ లైఫ్ లో పడిపోయాడు. ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళకి కాఫీ, భోజనాలు చేసి పెట్టడమే తప్ప ఇంక పెద్దగా ఇంట్లో ఏమి జరగట్లేదు. అప్పటిదాకా కౌసల్య గురించి చైత్ర, విక్రమ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఆ రోజు మాత్రం ఎందుకో విక్రమ్ కి కౌసల్య బాగా గుర్తొచ్చింది.

కాలెండర్లో తేదీ చూశాడు. ఫిబ్రవరి 14. మదిలో ఏవేవో జ్ఞాపకాలు మెదిలాయి. ఎంతో బాధగా, దిగులుగా ఉంది. కూతురు అంటే అమితమైన ప్రేమ. చైత్ర మొహం చూస్తే తనకి ఏం కష్టమొచ్చినా  దానిని ఎదురుకునే ధైర్యం వస్తుంది అని అతని నమ్మకం.

“చైతూ” ప్రేమగా పిలిచాడు. డాడీ గొంతు ఏదో వేరేగా వినిపించటంతో పరిగెత్తుకుంటూ వచ్చి “ఏంటి డాడీ?” అని అడిగింది. “సినిమా కి వెళ్దామా?” విక్రమ్ బ్లాంక్ గా అడిగాడు. “సినిమాకా?” అని తటపటాయించి, “ఏం సినిమా?” అని అడిగింది.  పేపర్ తిరగేస్తూ, “ఔయిజా అంట” అని అన్నాడు.

“డాడీ అది హారర్ సినిమా” అని ఒక క్షణం ఆగి, “డాడీ మీకో విషయం చెప్పాలి” అని అనేసి, లోపలకి గబగబా వెళ్ళి, ఒక నల్ల బాగ్ తీసుకొచ్చి విక్రమ్ కి ఇస్తూ, దగ్గరగా కూర్చుని అంది.

“ఏంటిది?” విక్రమ్ నల్ల బాగ్ ఓపెన్ చేస్తూ అడిగాడు.

“అమ్మకి హార్ట్ అట్టాక్ రావటానికి నేనే కారణం. పాపం అమ్మ ఎవరినో ఇష్టపడింది డాడీ. నేనేమో సిగ్గులేకుండా మొత్తం పర్సనల్ లెటర్స్ అన్నీ చదివేశాను. అమ్మ ఆ పాత విషయాలు అన్నీ మర్చిపోయి, మీతోనే ఇంక జీవితం అని ఫిక్స్ అయి, హాపీ గా ఉంటున్న సమయంలో నేనే పిచ్చి దానిలాగా ఈ లెటర్స్ విషయం గుర్తుచేశాను. నేనే అమ్మ మెమరీస్ ని ట్రిగ్గర్ చేశాను అనవసరంగా…” చైత్ర ఏదో చెప్తునే ఉంది, విక్రమ్ మాత్రం వినట్లేదు. ఒకే ఒక్క లెటర్ చూశాడు. చిన్నపిల్లాడిలాగా ఏడవటం మొదలుపెట్టాడు.

“డాడీ ఏమైంది డాడీ?” అంటూ చైత్ర ఖంగారు పడింది.

ఏడుస్తూనే తన చూపుడు వేలితో విక్రమ్  లెటర్ ని, తనని మార్చి మార్చి చూపిస్తున్నాడు. ముందు చైత్ర కి అర్ధంకాలేదు. సడన్ గా ఏదో అర్ధమయినట్లు “ ఏంటి ? ఈ ఉత్తరాలు రాసింది మీరా? అంటే మిమ్మల్నే అమ్మ ఇష్టపడిందా?” అయోమయంగా అడిగింది.

విక్రమ్ ఏడుపు ఆపలేదు. చైత్ర తీసుకొచ్చిన నీళ్ళు తాగి, కొంచం కంట్రోల్ చేసుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు

“నేను ‘విహారి’ అనే కలం పేరుతో నా ఫ్రెండ్స్ కి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని. ఎందరో పెన్ పాల్స్ ఉండేవారు నాకు. అందులో నాకు బాగా ఇష్టమయిన పెన్ ఫ్రెండ్ ‘శివరంజని’. ఆమెకి సంగీతం ఎంతో ఇష్టం. హిచ్ కాక్ సినిమాలు ఇష్టం. మేము ఇద్దరం రెండే రెండు నెలలలో వందలకి పైగా ఉత్తరాలు రాసుకున్నాము. ఈ వంద లెటర్స్ ద్వారానే మేము బాగా క్లోజ్ అయ్యాము.  మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్దాము అనుకున్నాను నేను. ఆమె మాత్రం తన ఫీలింగ్స్ ఎప్పుడూ చెప్పలేదు. కానీ నువ్వు చూశావుగా ఆ లెటర్స్ లో తను రాసిన భావాలు బట్టి నేను కూడా తనకి ఇష్టమే అని నాకు అనిపించింది. ఒక రోజు సడన్ గా“ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి కుదిర్చారు. ఇదే నా ఆఖరి లెటర్” అని లాస్ట్ ఉత్తరం వచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. నాక్కూడా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఆ కోపంలో వచ్చిన మొదటి సంబంధం కి ఓకే చెప్పేశాను. మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిన రోజునే నేను మీ అమ్మకి చెప్పాను, నాకు ఇంటరెస్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నానాని. తను మాత్రం ఏం అనలేదు. పైగా ఇంట్లో వాళ్ళ ముందు మాత్రం హాపీ గా కనిపించాలి అని చెప్పి నాతో కోపెరేట్ చేసింది. నాతో చాలా స్నేహపూర్వంగా ఉండేది. నేనే సరిగ్గా రెస్పోండ్ అయ్యేవాడిని కాదు. పెళ్ళయి ఏడాది అయ్యిందో లేదో ఇంట్లో వాళ్ళు ఒక మనవడినో, మనవరాలినో కనివ్వండి అని మొదలెట్టారు. ఒక రోజు కౌసల్య వచ్చి ‘మనలో ఒకరికి ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని, అందుకే పిల్లలు పుట్టడం కష్టం అని ఇంట్లోవాళ్లకి చెప్పి మనం ఒక అమ్మాయిని దత్తతు చేసుకుందాము’ అనొక ఐడియా ఇచ్చింది. అలా మేనేజ్ చేయటమే మంచిది అని నాక్కూడా అనిపించింది.  అప్పుడు కౌసల్య నా మనస్థితిని అర్ధంచేసుకుంది, ఎంత మంచిదో అని అనుకున్నాను. కానీ ఇలా…”

విక్రమ్ కి దుఃఖం పొంగుకొచ్చింది.

ఎంతో ధీర్గంగా వింటున్న చైత్ర“అంటే, నేను…” అని, బ్లాక్ బాగ్ లో ఒక ఎన్వెలోప్ తీసి ఓపెన్ చేసి చూసింది. సొ అమ్మ ‘ఇంకేమైనా చదివావా, చూశావా’ అని అడిగింది దీని గురించే అన్నమాట.  తన ‘అడాప్షన్ సర్టిఫికేట్’ చూసి, చైత్ర కూడా ఏడవటం మొదలుపెట్టింది.

పాతికేళ్లు దాచి ఉంచిన లెటర్స్ . ఒకరికి తన పుట్టుక గురించిన నిజం తెలియజేప్తే, మరొకరికి తను మిస్ అయిన జీవితం గురించిన నిజం బయటపెట్టాయి. రెండు గంటలు విక్రమ్, చైత్ర ఏడుస్తూనే ఉన్నారు. చైత్ర ముందుగా తేరుకొని “డాడీ” అంది. చైత్ర వైపు చూశాడు విక్రమ్. తనకే కాకుండా చైత్ర కి కూడా లెటర్స్ బాధ కలిగించాయి అని రియలైజ్ అయి  “చెప్పమ్మా” అన్నాడు.

“అమ్మకి విహారి అంటే ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ నువ్వంటే మాత్రం బాగా ఇష్టం. ‘ఏంటమ్మా డాడీ అస్సలు నిన్ను, నీ హెల్త్ ని పట్టించుకోరు’ అని నేను ఎన్ని సార్లు అడిగానో తెలుసా? అప్పుడు నాకు చెప్పేది-‘మీ డాడీ కి మనం ఇద్దరం బాగా ఇష్టం, అందుకే అంత కష్టపడి సంపాదిస్తున్నారు’ అని. అమ్మ ఆ రోజు చాలా బాధ పడినట్లు ఉంది, కానీ నేను ఆ లెటర్స్ చదివినందుకు కాదు డాడీ.. నేను మీ కన్న కూతుర్ని కాదు అన్న నిజం నాకు తెలిసిపోయినందుకు. లేదా ఇన్నాళ్ళు అమ్మ మీ మీద పెంచుకున్న ప్రేమ కంటే తన లెటర్స్లో ఉన్న మనిషి మీద ఇష్టమే ఎక్కువ అని నేను ఎక్కడ అనుకుంటానో అని.   అమ్మ గతం మర్చిపోయి నీతో ఎంత సంతోషంగా ఉండాలి అనుకుందో పాపం, నేను అర్ధం చేసుకోగలను. అయినా అమ్మకి హారర్ సినిమాలు, సంగీతం ఇష్టం అని తెలియదా నీకు? అవి తెలిసుంటే శివరంజని యే అమ్మ అని తెలిసి ఉండేది కదా? మరి అమ్మకి మాత్రం నీ ఇష్టాలు అన్నీ ఎలా తెలుసు డాడీ? అంటే నిజంగానే అమ్మ గురించి నీకు ఏమీ తెలియదన్నమాట. ఎంత పని చేశావు డాడీ, అమ్మని అర్ధం చేసుకోలేదు నువ్వు. తప్పు చేశావు డాడీ, 25 ఏళ్ల నుండి… నీకు ఒక్కసారి కూడా అమ్మ ని అర్ధం చేసుకోవాలని అనిపించలేదా డాడీ?”అని కోపంగా అడిగింది.

దుఃఖాన్ని మింగుతూ “చెప్తున్నాను కదా. పెళ్లి అయిన తరువాత ఇంట్లో నాకు ఒక భార్య ఉంది అని నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు. నేను శివరంజనినే ఇష్టపడ్డాను. తనతోనే జీవితం అనుకున్నాను. నన్ను మోసం చేసింది అని ఇంక నాకు జీవితం మీద విరక్తి వచ్చింది. అలాగ అని చచ్చిపోయే అంత పిరికివాడిని కాను. లైఫ్ షుడ్ మూవ్ ఆన్. అలాగే అనుకోని ఇన్నేళ్లు బ్రతికేసాను. పెళ్లి అయ్యాక నా అభిరుచులు అన్నీ మారిపోయాయి. అందుకే మీ అమ్మకి నేను విహారిగా ఎప్పుడూ అనిపించి ఉండను. నా తలరాత.  నా శివరంజని తోనే ఒకే ఇంట్లో పాతికేళ్లు ఉండి కూడా గుర్తుపట్టలేకపోయాను. నా అంత దురదృష్టవంతుడు ఎవడైనా ఉంటాడా ఈ లోకంలో? నన్ను క్షమించు. నిన్ను ఎప్పుడూ సంతోషపెట్టలేదు. నిన్ను మర్చిపోలేను నేను. నువ్వు లేకపోతే ఏం చేయాలి కౌసల్యా? ఐ యాం సొ సారి కౌసల్యా !  ” అని పైకి చూస్తూ శోకంతో కన్నీరు కార్చాడు.

“ఒకటి మాత్రం నిజం చైతూ. నిన్ను ఎప్పుడూ మేము కన్న తల్లిదండ్రులలాగే యే లోటూ రాకుండా చూసుకున్నాము, ప్రేమగా  పెంచాము. నన్ను అసహ్యించుకోకు ప్లీజ్.  ఐ ఆల్వేస్ లవ్ యు” అని చైత్రని దగ్గరకి తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు.

“ఐ నో డాడీ. అమ్మ కి ఛాన్స్ వచ్చినా నన్ను తిట్టలేదు. ఎప్పుడూ కొట్టలేదు. ఇంత ప్రేమగా యే పేరెంట్స్ ఉండరు కూడా. ఐ లవ్ యు డాడీ” అని కళ్ళు మూసుకొని “ అండ్ ఐ మిస్ యు అమ్మా” అని మనసులో అనుకుంది.

ఒక గంట తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు విక్రమ్ కళ్ళు తుడుచుకుని చైత్రతో “పదా” అన్నాడు.

హఠాత్తుగా  అలా అడిగేసరికి “ఎక్కడికి డాడీ?” ఆశ్చర్యంగా అడిగింది చైత్ర.

“కౌసల్యకి ఇష్టమైన హారర్ సినిమాకి…”

“Letting go means to come to the realization that some people are a part of your history, but not a part of your destiny.”  Steve Maraboli

***

పెళ్లి దడ

sani

 కోకిల, ఒక యువ వేశ్య

కృష్ణుడు, ఆమె ప్రేమికుడు

సత్తి, ఆమె సేవిక

sani

కోకిల:    సేనాపతి కూతురు సువర్ణముఖిని పెళ్ళాడబోతున్నావట కదా! అసలిప్పటికే అయిపోయిందేమో కూడానూ! నువ్వు చేసిన ప్రమాణాలూ, నీ కన్నీళ్ళూ, నీ ఒప్పుకోళ్ళూ అన్నీ గాలిలో కలిసిపోయాయి. నువ్వు కోకిలను మరిచిపోయావు. నిన్ను భర్తగా భావించి సంసారం చేసినందుకు నాకిప్పుడు ఎనిమిదో నెల. నీ ప్రేమకు గుర్తుగా నాకు మిగిలిందిదిగో, ఈ పెద్ద పొట్ట. తొందర్లో నేనొక పసిపిల్లను సాకాల్సి ఉంటుంది. నాలాంటి వేశ్యకు అదొక మంచి కాలక్షేపమే. నీ పుణ్యమాని మగపిల్లాడు పుడితే, వాడికి అశోకుడని పేరుపెట్టి, వాడిలో నిన్ను చూసుకుంటూ ఊరడిల్లుతాను. వాడు పెద్దయ్యాక నీ దగ్గరకొచ్చి తన తల్లిని అనాథను చేసినందుకు నిన్ను నిలదీయకపోడు.

నువ్వు  పెళ్ళాడాలనుకున్న పిల్ల పెద్ద అందగత్తేమీ కాదు. మొన్నీమధ్య సంత రోజు నేనామెను చూశాను. వాళ్ళమ్మతో కలిసొచ్చింది. అట్లాంటి అనాకారి పిల్ల కోసం నువ్వు నన్నొదులుకుంటా వనుకోలేదు. ఆమెని కాస్త దగ్గరగా చూడు. ఆమె ముఖాన్నీ, కళ్ళనూ పరిశీలనగా చూడు. అట్లాంటి చీకిరికళ్ళ పిల్లను చేసుకున్నందుకు తరవాత నువ్వే బాధ పడతావు. నిజం, ఆపిల్లవి చింతాకు కళ్ళు. పిల్లను కాదు, ఆమె తండ్రిని చూసినా చాలు. ఒక్కసారి అతని ముఖం పరిశీలనగా చూడు. ఇక పిల్ల ముఖం చూడక్కర్లేదు.

కృష్ణుడు:            బుద్ధిలేకుండా మాట్లాడకు కోకిలా! సేనాపతి కూతుళ్ళూ, పెళ్ళిళ్ళూ అంటూ నువ్వు వాగే చెత్త వాగుడు ఆపు! ఆ పెళ్లి కూతురుకి చీకి కళ్ళున్నాయో, బుర్రముక్కుందో అసలు అందంగానే ఉందో నాకేం తెలుసు? సేనాపతి అంటే బహుశా నీ ఉద్దేశ్యం ఆ వీరనాయుడనేగా? అతనికో అనాకారి కూతురుందని నాకెలా తెలుస్తుంది? కనీసం అతను మా నాన్న స్నేహితుడైనా కాదు. కాకపోగా మా నాన్నకీ అతనికీ కోర్టులో వివాదం కూడా నడుస్తోంది. అతను మా నాన్న దగ్గర లక్ష రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టాడు. ఆ బాకీ వసూలు కోసం మా నాన్న దావా వేశాడు. ఇప్పటి వరకూ ఆ సేనాపతి మా అప్పు తీర్చనేలేదు.

నేను పెళ్ళే చేసుకోవాలనుకుంటే మన నగర మేయరు రాజమోహనుడి కూతురునే చేసుకొనే వాణ్ని కదా? ఎందుకు వద్దంటాను? పైగా రాజమోహనుడు నాకు స్వయానా మేనమామ. అంత చక్కని పిల్లని కాదనుకొని ఈ సేనాపతి గాడి అనాకారి కూతుర్నా నేను చేసుకొనేది? ఇట్లాంటి చెత్త కబుర్లు ఎక్కడ దొరుకుతాయి నీకు? లేకపోతే అసూయ కొద్దీ నువ్వే ఇలాంటి మాటల్ని సృష్టిస్తున్నావా?

కోకిల:    ఐతే నువ్వు పెళ్లి చేసుకోవడం అంతా ఉత్తిదేనా?

కృష్ణుడు:            నీకేమన్నా పిచ్చా లేకపోతే రాత్రి తాగిందింకా దిగలేదా? అయినా రాత్రి మనమంత ఎక్కువేమీ తాగలేదు కదా!

కోకిల:    (తన సేవకురాలి వంక చూపిస్తూ) ఇదిగో, ఈ సత్తి ముండ ఇలాంటి కబుర్లు మోసుకొచ్చి నా బుర్ర పాడు చేస్తోంది. పొద్దున్న ఊలు సామాను కొనుక్కు రమ్మని దాన్ని బజారుకు పంపాను. అక్కడ దీనికి మంజరి కనబడి….. సత్తీ, అప్పుడేం జరిగిందో నువ్వే చెప్పు. నువ్విదంతా కల్పించి చెప్పలేదు కదా?

సత్తి:      అమ్మా, అబద్ధమాడితే, నా తల నూరు చెక్కలవ్వాల. నేనెప్పుడూ అబద్ధమాడను. నిన్న నేను కచేరీ చావడి దగ్గరకు పోయేసరికి మంజరి నన్నాపి, దొంగనవ్వు నవ్వుతూ “ఏమే సత్తీ, మీ అమ్మగారి ప్రియుడు ఆ సేనాపతి కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడట కదా?” అని అంది. నేను నమ్మకపోయేసరికి “కావాలంటే క్రిష్ణుడుండే వీధికి వెళ్లి చూడు. అతనింటికి కట్టిన తోరణాలు, అక్కడ మోగే సన్నాయి మేళం, పెళ్లి పాటలూ చూస్తే నీకే నిజం తెలుస్తుంది” అంది.

కోకిల:    మరి నువ్వెళ్ళి చూశావా?

సత్తి:      చూశానమ్మగారూ! అక్కడంతా మంజరి చెప్పినట్టే ఉంది.

కృష్ణుడు:            నాకిప్పుడర్థమైంది. ఆ మంజరి నిన్ను ఆట పట్టించిందే సత్తీ! నువ్వు సరిగ్గా చూసుకోకుండా వచ్చి కోకిల బుర్ర పాడు చేశావు. ఇద్దరూ కలిసి ఒట్టి పుణ్యానికి హైరానా పడ్డారు. ఆ పెళ్లి జరుగుతోంది మా ఇంట్లో కాదు. రాత్రి నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక మా అమ్మ ఏమందంటే, “నాయనా కృష్ణా! నీ స్నేహితుడు మన పక్కింటి రాయుడి గారబ్బాయి చంద్రుడు గాలి తిరుగుళ్ళు కట్టిపెట్టి ఒక మంచి పిల్లను చూసి బుద్ధిగా పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వింకా ఎంత కాలం అలా ఆ సిగ్గులేని వేశ్యల కొంపల చుట్టూ తిరుగుతావు?” అని అంది.

మా అమ్మ మాటల్ని నేను పట్టించుకోలేదు. ఈ ముసలోళ్ళకు ఏమీ తెలియదు, గొణగడం తప్ప. నేను వెళ్లి పడు కున్నాను. పొద్దున్నే లేచి ఇంట్లోంచి బయట పడ్డాను. అప్పటికేమీ హడావిడి లేదు. ఈ సత్తి చూసే టప్పటికి అదంతా ఏర్పాటై ఉంటుంది. ఇప్పటికీ నమ్మకం కుదరకపోతే, సత్తీ, మళ్ళీ ఒకసారి మా ఇంటి వేపు వెళ్లి జాగ్రత్తగా చూసిరా! ఊరికే బజార్లోకి చూడటం కాదు, తోరణాలు ఎవరి ఇంటి ముందున్నాయో చూడు.

కోకిల:    బతికించావు కృష్ణా! నే విన్నదే నిజమైతే, ఉరి పోసుకు చచ్చేదాన్ని.

కృష్ణుడు:            అలా ఎప్పటికీ జరగదు. నేనంత అవివేకిని కాదు. నేను నా ప్రియమైన కోకిలను మరిచిపోగలనా, అందులోనూ తన పొట్టలో నా బిడ్డ పెరుగుతున్నప్పుడు? ఇప్పటికిప్పుడు నీతో పడుకోవాలని ఉంది. పెరిగిన పొట్టతో నువ్వు మరింత అందంగా కన్పిస్తున్నావు. పడగ్గదిలోకి పోదాం పద.

కోకిల:    నేను నీదాన్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనందంగా అనుభవించు. కానీ, బరువు పడకుండా చెయ్యి.

*

 

బుక్‌మార్క్

 వాసుదేవ్

 

ఇవన్నీ ఇంతే

అందమైన బుక్‌మార్క్ గా సిధ్ధమే

కన్నీళ్ళకథలు పర్చుకున్న పొడుగాటి పగలూ

అలసిపోయిన ముగ్ధ రాత్రీ

సోక్రటీస్ పెదవుల దగ్గరి హెమ్‌‌లాక్ విషపు గిన్నె

జీవిత గాయాల కథల తిన్నె

సిధ్ధమె!

బుక్మార్క్ గా రూపాంతరానికి సిధ్ధమే

 

ఆరొందలేళ్ళ ఫినిక్స్ పాటలూ

పదిరోజుల పసి ప్రాయపు పలకరింతలూ

హఠాత్తుగా, ఏదో జ్ఞానోదయమైనట్టు

ఎగురుకుంటూ పోయే పక్షులూ

నిక్కచ్చిగా పొడుచుకొచ్చిన గడ్డిమొలకలూ

కాలపు సన్నికాళ్లలో నలిగిపోయి, బతుకుపుస్తకంలో ఇమిడిపోయిన

ఆ అందమైన పువ్వులూ, రావాకులూ,

అపురూపమైన బుక్‌మార్క్ గా సిధ్ధమే!

 

చూరునుంచి బధ్ధకంగా వేళ్లాడుతున్న వర్షపు చుక్కల్లోంచొ

జలతారు పరికిణీ వెన్నెల పరదాల్లోంచో

పాతపుస్తకం లోంచి జారిపడ్డ చాక్లెట్ రేపర్లోంచో

ఖాళీజీవితంనుంచి క్రిందపడ్డ  అపురూప క్షణాల్లోంచో

ఓ బుక్‌మార్క్ సిధ్ధమే!

****

 

అప్పుడెప్పుడో  బతుకు పుస్తకంలో  దాచుకున్న ఆ పాతపువ్వులేమన్నాయి?

 

vasu

 

 

 

 

రాజకీయమా.. నీకెన్ని రూపులో!

భువనచంద్ర

 

bhuvanachandra (5)“శివమూర్తిగారి పరిస్థితి బాగోలేదట.” ప్రొడక్షన్ బాయ్ నారాయణ మేనేజర్ కృష్ణమూర్తిగారితో అన్నాడు. పేరుకి బాయ్ అంటారుగానీ నారాయణకి ఏభై రెండేళ్లు. ‘మంచితనం’ తప్ప చదువు లేదు. ఏ పని వప్పగించినా పెర్‌ఫెక్టుగా చేస్తాడు. భాగాహారాలు, హెచ్చవేతలూ రావుగానీ ,కూడికలూ తీసివేతలూ ‘మనసు’ కాగితం మీదే ఒక్క తప్పు లేకుండా చెయ్యగలడు. అందుకే ఇండస్ట్రీలో నారాయణ అంటే అందరికీ గౌరవమే.

ఈ మధ్యే పాతనీరు కొట్టుకుపోయి కొత్తనీరు వచ్చింది. ఉచ్చనీచాలు మరచిన యువత ఎంటర్ అయింది. వాళ్లకి తెలిసింది కొద్ది…’తెలుసు’ అనుకున్నది హెచ్చు. దాంతో ఎవరన్నా వాళ్లకి లెక్కలేదు, గౌరవమూ లేదు.

“ఒరేయ్ నారాయణా.. కాఫీ తీసుకురారా..” అని పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రడైరెక్టరు నారాయణని పిలిస్తే ప్రొడక్షన్ కుర్రాళ్లంతా చర్రున లేచారు. వాళ్ల నోట్లోంచి మాట రాకముందే నారాయణ చల్లగా నవ్వి  “పిల్లల్లారా! ఆయన ఏరా అన్నాడని మీరు కోప్పడి అరిస్తే షూటింగ్ ఆగిపోద్ది. అవునా? యీ షూటింగ్ కూడా ఎవరిదీ? మన శివమూర్తిగారిది. శివమూర్తిగారు ఎవరూ? మనకే గాదు. కష్టాల్లో వుండే ఏ సినిమావోడికైనా దేవుడు. పిచ్చోళ్ళారా, చిన్నపిల్లలు గుండెమీద గుప్పిళ్ళతో కొడితే తండ్రి సంతోషిస్తాడుగానీ, ఏడుస్తాడట్రా?” అన్నాడు.

పొంగేపాలమీద నీళ్లు జల్లితే పాలు అణిగినట్టు అణిగారు కుర్రాళ్లు. అదీ నారాయణ వ్యక్తిత్వం.

శివమూర్తి నారాయణకి సాక్షాత్తు దేవుడే. అతను కొలిచే శివుడే. మూడేళ్లు పంట నష్టమై . బ్యాంకు వడ్డీలు పెరిగిపోయి కట్టలేక నారాయణ  పురుగులమందు తాగితే, ఆ పురుగుల మందూ ‘కల్తీ’ దవడం వల్ల తీవ్రమైన డయేరియాతో హాస్పిటల్లో పడుంటే ఆ వూరివాడూ, సినీ నిర్మాతా, ఫైనాన్షియరూ అయిన శివమూర్తి, నారాయణ హాస్పిటల్ ఖర్చులన్నీ తనే కట్టి, అతన్ని  బయటికి తీసుకొచ్చి, కుటుంబం నడపడానికి కొంత డబ్బిచ్చి, “ఒరే నారాయణా, మనిద్దరం చిన్ననాటి స్నేహితులం. నా అదృష్టం బావుండి కోటీశ్వరుడ్నయ్యాను. నీ దురదృష్టం నిన్ను వెంటాడి ఆత్మహత్యకి పురికొల్పింది. వద్దురా. ఇకనించీ నువ్వు నాతోటే వుంటావు.” అని నారాయణనీ, అతని చిన్న ‘ఫేమిలీ’నీ మద్రాసు తీసుకొచ్చి, అతనిదే అయిన ఓ పెద్ద ‘అవుట్ హౌస్’లో ఉంచాడు.ఆ కంపెనీలోనే ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉండే కృష్ణమూర్తిగారికి నారాయణను వప్పగించి, “కృష్ణమూర్తిగారూ, వీడు నా చిన్ననాటి స్నేహితుడు. కోట్లు కళ్ల ఎదుట ఉన్నా కక్కుర్తి పడని నిఖార్సైన మనిషి. నేలతల్లిని నమ్ముకున్న భూమి బిడ్డ. వీడ్ని మీ చేతుల్లో పెడుతున్నా.వీడికి చదువు లేదుగానీ, అంతులేని సిన్సియారిటీ వుంది.” జీతం ఎంతా? అనేది ఆలోచన వద్దు. వాడి బాధ్యత మొత్తం నాదే!” అని అన్నాడు.

అప్పటినించీ ఇప్పటిదాకా కృష్ణమూర్తిగారు నారాయణని సొంత తమ్ముడ్లా చూసుకున్నాడు. కారణం నారాయణ నిజాయితీ. ఇడ్లీ ప్లేటు 10 రూ, దోశ 15 రూ, పూరీ 20 రూ, ఇలా ఒరిజినల్ రేట్లు వుంటే, ప్రొడక్షన్ వాళ్ళు హోటల్ వాళ్లతో లాలూచీ పడి ఇడ్లీ ప్లేటు 20, దోశ 25, పూరీ 30 ఇలా రసీదులు, అంటే తప్పుడు రసీదులిచ్చి డబ్బు దోచేస్తారు. అందులోనూ భాగాలు పంచుకునేవాళ్లు వుంటారు. వీళ్లు ఇచ్చేవి తప్పుడు లెక్కలని వాళ్లకే తెలుసు. తప్పుడు లెక్కలు వుంటేనేగా తప్పుడు ఖాతాల్లో డబ్బులు ‘జమ’ అయ్యేదీ…!

నిర్మాతలకి తెలిసినా నోరెత్తరు. కారణం ఏమంటే,  ఫుడ్ డిపార్టుమెంటుతో ఏ మాత్రం గొడవపెట్టుకున్నా షూటింగ్ సజావుగా జరగదు. అందుకే చూసీ చూడనట్టు వదిలేస్తారు. ఎక్కడోగానీ, కృష్ణమూర్తీ, నారాయణలాంటివాళ్లు వుండరు. అవినీతికి వాళ్లు దూరంగా ఉండటమేగాక , అవినీతి కళ్లెదురుగుండా జరుగుతున్నా వాళ్లు నోరు మూసుకుని వుండలేరు. వాళ్లు జీతం తప్ప పైన ఒక్క పైసా కూడా ఎరక్కపోవచ్చు, కానీ అంతులేని గౌరవాన్ని ‘డిపార్ట్‌మెంట్’ నించి సంపాదించారు.

విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్టు,  నీతికి కట్టుబడేవాడు (సినిమాల్లో అప్పుడప్పుడూ ,అంటే ఎల్లప్పుడూ కాకపోయినా) గౌరవించబడతాడు. సినిమా ఫీల్డులో ఇప్పుడు జరుగుతున్నది శివమూర్తిగారి షూటింగే. కొన్ని వందల సినిమాలకి ‘భుజం’ అందించిన శివమూర్తిగారు, పదేళ్ల తరవాత అన్నిటికీ తెగించి తీస్తున్న సినిమా ఇది. మనుషుల్ని నమ్మి పని వొప్పగించడం మాత్రమే ఆయనకి తెలుసు గనక, మిగతా నిర్మాతలలాగా షూటింగ్ స్పాట్‌లో ఆయన వుండరు. ఓడలు బండ్లు అవుతాయంటారు. ఇప్పుడు జరిగింది అదే. చాలామంది దొంగలెక్కలు చూపించి ఎగ్గొట్టారు. మరి కొందరు వాళ్ల సినిమాల్ని వాళ్లే మధ్యలో ఆపేసి, అందినంతా తొక్కేసి, పై పై ఏడుపుల్తో ఆయన్ని చీట్ చేశారు. నోటికి మాటగా అప్పు తీసుకున్నవాళ్లు, ఆనాటి మాటని “నీటి మీద రాతగా మార్చి అసలుకే ఎసరు పెట్టారు. శివమూర్తిగారు కోర్టుకు వెళ్లొచ్చు. వీళ్లందర్నీ కోర్టులకీ  ఈడ్వనూ వచ్చు. కానీ వుపయోగం వుండదు. ఎందుకంటే ఇవాళ ‘వాళ్లంతా’ గొప్పవాళ్లు.

ఒకప్పుడు ఆయన ఆఫీసులో ‘బాయ్’గా పని చేసినవాడు ఇవాళ గో…ప్ప నిర్మాత. ఒకనాడు ఆయన కంటిచూపుకై క్యూలో నిలబడి ఆయన ఆశీస్సులతో దర్శకుడై అతి వినయంగా వున్నవాడు నేడు సూపర్‌హిట్ దర్శకుడు. కానీ, ఆయన ఎదురుపడటం వీళ్లకి నచ్చదు. కారణం ఆ హిమాలయం ముందు ఒకప్పుడు వీళ్లు గులకరాళ్లని వాళ్లకీ తెలుసు. సినిమా జీవితం కూడా సినిమా సెట్టింగులాంటిదే. ఒక ఫ్లోర్‌లో ఇవాళ మహారాజా పాలేస్ సెట్టింగ్ వేస్తే, మరోనాడు అదే ఫ్లోర్‌లో గుడిసెల సెట్టింగు వెయ్యాల్సి రావచ్చు. కట్టె పేళ్ళని చకచకా రాజమహల్ చేసినట్టే, గుడిసెల్నీ వేస్తారు.

శివమూర్తిగారి ‘సెట్టింగ్’ మారింది అంతే.. అందుకే పదేళ్ళ క్రితమే కృష్ణమూర్తిగారికీ, నారాయణకీ చెప్పేశారు. “మూర్తిగారూ, నేను ప్రొడక్షనూ, ఫైనాన్సింగూ అన్నీ మానేసే పరిస్థితిలో వున్నాను. నేను ఆ పని చెయ్యకముందే మీరు మరో కంపెనీలోకి మారిపోండి. నేను మూసేశాక వెడితే మిమ్మల్ని ఎవరూ తీసుకోరు. సెంటీ’మెంటల్’ ఫీల్డు కదా ఇదీ!” అని నవ్వారు. ఆ విషయం కృష్ణమూర్తిగారికి తెలుసు. ఇష్టం లేకపోయినా శివమూర్తిగారి బలవంతం వల్ల మారక తప్పలేదు. నారాయణ ‘ససేమిరా’ అంటే, శివమూర్తిగారు కేకలేసి పంపారు.

పదేళ్ళ తరవాత మళ్లీ శివమూర్తిగారే కృష్ణమూర్తికీ, నారాయణకీ కబురెట్టి “సినిమా తియ్యక తప్పని పరిస్తితి. సక్సెస్ అయితే కోలుకుంటా.. లేదా ఎటూ మునగాల్సిందే!” అన్నారు. పాతవాళ్లని, అంటే ఇప్పటి గ్రేట్స్‌ని సంప్రదిస్తే రకరకాల కారణాల్తో తప్పించుకున్నారు. ఒకరయితే “కృష్ణమూర్తిగారూ, శివమూర్తి డైరెక్టుగా నా ముందుకొచ్చి నన్నడిగితే కాదన్ను. కానీ ఆయన ఆ పని చేయ్యడుగా!” అని వంకరగా నవ్వాడు.

కృష్ణమూర్తికి నవ్వొచ్చింది. కారణం యీ మహాదర్శకుడే ఒకప్పుడు శివమూర్తి క్రీగంట చూపుకోసం పాటుబడి డైరెక్టరయింది. “అయ్యా మహాదర్శకుడుగారూ! శివమూర్తిగారు ఏనాడు ఎవర్నీ సంప్రదించరనీ, అప్పుడూ నన్నే డీల్ చెయ్యమనేవారనీ మీకు తెలుసు. సరే మీ ఇష్టం.. ఆయనతో మీ మాట చెప్పి చూస్తా…” అని వచ్చేశాడు. ‘కృతజ్ఞతకి కొన్ని చోట్ల చోటుండదు. చివరికి ఓ చిన్న సినిమా తీసి పెద్ద హిట్ చేసిన ‘నిరంజన్’ని డైరెక్టరుగా ఫిక్స్ చేశారు కృష్ణమూర్తి. అందరూ కొత్త నటీనటులే..

ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి. ‘ఉప్పు’ తిన్న కృతజ్ఞత టెక్నీషియన్లలో వుంటుంది. ఎందుకంటే , ఎన్ని సూపర్ హిట్స్ ఇచ్చినా వారి రెమ్యూనరేషన్ నటీనటులకీ, దర్శకులకీ పెరిగినట్టు పెరగదు  గనక. అందుకే శివమూర్తిగారి  సినిమా తీస్తున్నారనగానే, మాటల, పాటల రచయితలూ, కెమెరా, సౌండ్ డిపార్టువాళ్లూ, ప్రొడక్షన్ బాయిస్ అందరూ మహదానందంగా కృష్ణమూర్తిగారు ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్‌కే ఒప్పుకున్నారు. కొందరైతే “కృష్ణమూర్తిగారూ, సినిమా పూర్తి కానివ్వండి. అడ్వాసులూ అవీ వొద్దు. హిట్టై శివమూర్తిగారు ఊబిలోనించి బయటపడితే చాలు!!” అని మనస్ఫూర్తిగా అన్నారు.

కృష్ణమూర్తిగారు యీ మాట శివమూర్తిగారికి ఫోన్ చెసి చెబితే ఆయన కళ్లనీళ్లు పెట్టుకుని “చాలు మూర్తిగారూ. అది చాలు. లోకంలో మనిషిని మనిషిని నమ్మొచ్చు అనడానికి” అన్నారు.

సినిమా మూడొంతులు పూర్తయింది. ఇక్కడుండే విచిత్రం ఏమంటే ఎవరి పని వాళ్లు చూసుకోవడం 30% అయితే పక్కోడి పని గమనించడం 70%. అంతేగాదు. మన సినిమా బాగా ఆడాలి.. పక్కోడి సినిమా పోయినా ఫరవాలేదు అనుకోవడం. ఒక పిక్చరు హిట్టయితే, “నా బొంద.. శుక్రవారం రిలీజూ.. కనక ఓపెనింగ్స్ ఉండటం మామూలే.. శనాదివారాలు హాలిడేసు, కనక చచ్చినట్టు ‘కలక్షన్సు’ ఉంటాయి. సోమవారం చూడు.. అప్పుడు చెప్పు.. అది హిట్టో.. ఫట్టో” అని చప్పరిస్తారు. పక్కోడి సినిమా ఫ్లాపైతే ..”అది ఫ్లాపవుద్దని నాకు ముందే తెల్సు. ఆడికి ముందే జెప్పా…’ఒరే… కాస్త జోరు తగ్గించుకో, బడ్జెట్టు అదుపులో పెట్టుకో’ అని.. వింటేగా..!” అని ముక్కూ మూతీ విరుస్తారు. ఇది సినీ నైజం.

మ్యూజిక్ డైరెక్టర్ మంచివాడు. అతనికి మొట్టమొదటి చాన్సు ఇచ్చింది శివమూర్తిగారే. అందుకే “శివమూర్తిగారూ, ఎడిట్ అయిన భాగాన్ని ఎప్పటికప్పుడు నాకు పంపేయండి. ఒకటికి పదిసార్లు చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా.. వీలయినప్పుడల్లా నా స్టూడియోలోనే కీబోర్డు, రిధిమ్ సెక్షనూ మిక్స్  చేస్తా.అందువల్ల ఖర్చూ శ్రమా రెండూ తగ్గుతాయి” అన్నాడు.

ఇక్కడో ప్లస్సు ఉంది. మైనస్సూ వుంది. వాయించిన ‘మ్యుజీషియన్స్’ ఎమోషన్స్‌ని దాచుకోలేరు.

ఎందుకంటే సంగీతం భగవంతుడి భాష. Music is the Language of God. ఆ భాష తెలిసినవారు అబద్ధాలు అంత తొందరగా ఆడలేరు.

ఏమాత్రం ‘సీను’ నచ్చినా అద్భుతం అని పొగిడేస్తారు. నచ్చకపోతే… ‘అదా’ అని చిన్నగా పెదవి విరుస్తారు.

పిక్చర్ ‘సత్తా’ ఏమిటో రీరికార్డింగ్‌లో తెలిసిపోతుంది. కొన్ని రీళ్లు అలా మిక్సయ్యేసరికి పిక్చర్‌కి ‘అద్భుతం’ అన్న టాగ్ ఇచ్చేశారు మ్యూజిషియన్స్. దాంతో పెద్దలకి కలవరం.

డాక్టరు కొడుకు డాక్టరైనప్పుడు యాక్టర్ కొడుకు యాక్టరెందుకు కాకూడదూ? ఖచ్చితంగా కావొచ్చు. కానీ, డాక్టర్ కొడుకు డాక్టరైనా అతని అదృష్టం ‘హస్తవాసి’ మీదే ఆధారపడి వుంటుంది.  యాక్టర్ కొడుక్కి అలా కాదు. ఫస్టు సినిమా ‘ఫేన్స్’ మోసేస్తే, రెండో సినిమాని నిర్మాత ‘మోయిస్తాడు’. ధర్డ్ సినిమా ‘మోయించాలంటే’ రాజకీయాలే గతి. (అప్పటికీ  సదరూ ‘నటకుమారుడు’ సత్తా నిరూపించుకోలేకపోతే)

రాబోయేది సంక్రాంతి సీజను. ఇద్దరు ‘నటకుమారు’ల సినిమాలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. పెద్ద పెద్ద, కొత్త కొత్త థియేటర్లన్నీ సదరు ‘నటకుమారు’ల కోసం ముందే బుక్ చేసేసి పెట్టేశారు.

శివమూర్తిగారి సినిమా నాలుగో ‘అంకం’లోకి అడుగుపెట్టకముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ‘మరో చరిత్ర’ని మించిన హిట్ అవుతుందని ఒకరూ.’మాయాబజార్’లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మరికొందరూ ‘టాక్’ని బయట పెట్టడంలో సదరు ‘నటతండ్రులు’ గబగబా సంయుక్తంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తమతమ ‘దర్శక ఐరావతా’ల తోటీ, నిర్మాత ‘దిక్పాలకు’లతోటీ మీటింగ్ పెట్టుకున్నారు.

‘ఎదుటి’వాడ్ని నిలబెట్టాలీ అనుకున్నప్పుడు ఎవడూ  తక్షణమే స్పందించడు. ‘ఎలా నిలబెట్టాలి’ అన్న ఆలోచనలు ఓ పట్టాన తేలవు. అదే ‘ఎదుటివాడ్ని పడగొట్టాలీ అన్నప్పుడు మాత్రం క్షణాల మీద అయిడియాలు పుట్టుకొస్తాయి. ఎంత ఫాస్టుగా అంటే అరగంటలో మీటింగ్ పూర్తి చేసేసుకుని, ఆరుగంటలపాటు ఆనందంగా మందుపార్టీ చేసుకునేంత.

రెండు రోజుల్లో రెండు ప్రెస్ మీట్లు జరిగాయి. ‘నిరంజన్’ని అన్‌లిమిటెడ్ బడ్జెట్‌తో డైరెక్టరుగా ఎనౌన్సు చేస్తూ….! అది ‘టాక్ ఆఫ్ ద టౌన్’ అయింది. కారణం దిగ్గజాల్లాంటి ఇద్దరు మహానటులు నిరంజన్‌ని తమ వారసులకి డైరెక్టరుగా పెట్టుకోవడమే..!

అప్పటిదాకా చిన్న సినిమాలు చేస్తున్న కెమేరామెన్‌ని ఓ నిర్మాతగారు ప్రత్యేకంగా పిలిపించి ‘డైరెక్టర్’ ఆఫర్ ఇచ్చారు. (నిర్మాత ఎవరో చెప్పక్కర్లేదుగా..)

నిరంజన్‌ని డైరెక్టరుగా పెట్టుకున్న నటదిగ్గజాలు ఓ కండీషన్ మాత్రం పెట్టారు. ఏమంటే వారిద్దరి చిత్రాలకీ సంక్రాంతి రోజునే లాంచనంగా షూటింగ్ ప్రారంభం చెయ్యాలని.

పరుగుపందెంలో పరిగెత్తేవాడెప్పుడూ పక్కచూపు చూడకూడదు. చూసిన క్షణం తెలియకుండానే వేగం తగ్గుతుంది. చెవులు రిక్కించవచ్చు తప్ప కళ్లు తిప్పకూడదు.

ఇప్పుడు జరిగింది అదే. ఇద్దరు మహానటుల వారసులతో ఒకేరోజు సినిమా ఓపెనింగ్ అనేసరికి నిరంజన్ బుర్రలో ఓ తూఫాను మొదలైంది. చేస్తున్న సినిమా మీద కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గి, అర్జంటుగా అద్భుతమైన 2 సీన్లు రాసుకోవడం మీద కాన్సంట్రేషన్ పెరిగింది.

కెమేరామెన్ గాల్లో తేలుతున్నాడు. మంచి థియేటర్లు అన్నీ ముందే బుక్ చేసేయడంతో ‘చెత్త’వి మాత్రం మిగిలాయి. సంక్రాంతికి రావల్సిన పిక్చర్‌ని  ‘పోస్ట్‌పోన్’ చెయ్యక తప్పని పరిస్థితి. అప్పటిదాకా శివమూర్తిగారిమీది గౌరవంతో ముందుకొచ్చిన బయ్యర్లు సడన్‌గా వెనక్కు తగ్గటంతో డబ్బుకి కటకట. ‘టిఫెన్లు’ కూడా అప్పు మీద తేవాల్సిన పరిస్థితికి కంపెనీ దిగజారింది.’కనీస కృతజ్ఞత’  మీద నమ్మకం పెట్టుకున్న శివమూర్తిగారి గుండెకి హార్ట్ ఎటాక్ వచ్చింది.

“ఆయనది ఎప్పుడూ విశాల హృదయమే.. ఇప్పుడు ఆ విశాల హృదయానికి ‘అటాక్’ తోడయింది” అని ఓ దౌర్భాగ్య రచయిత వెకిలినవ్వు నవ్వుతూ చమత్కరించాడు కూడా. ఆ నికృష్టుడికి ‘రచయిత’ స్థానం ఇప్పించిందీ శివమూర్తిగారే. సదరు రచయితగారి దగ్గర పదిమంది ‘ఘోస్టు’లున్నారిప్పుడు. అందుకే ఆనోటి దూల.

కర్ణుడి చావుకి కోటి కారణాలంటారు. ఇప్పుడా సామెత ‘శివమూర్తి పిక్చరుకి శతగండాలు’గా మారింది. ఒక్కటి మాత్రం చెప్పుకోక తప్పదు.

కృష్ణమూర్తిగారు నటీనటుల్నీ, సాంకేతిక నిపుణుల్నీ, ఆఫీసువాళ్లనీ, ప్రొడక్షన్ బాయిస్‌నీ, కెమేరా వాళ్లని అందర్నీ పిలిపించి ఓ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరించినప్పుడు..

“అయ్యా… పిక్చరు ఆగకూడదు. మా టిఫిన్లూ, భోజనాలూ మేమే తెచ్చుకుంటాం. మా రవాణా ఖర్చు మేమే పెట్టుకుంటాం. మీరు మాకు ఇచ్చిన అడ్వాన్సు కూడా వెనక్కి ఇచ్చేస్తాం కానీ పిక్చరు మాత్రం ఆపకండి”

అని అందరూ ఎలుగెత్తి ఘోషించడం మాత్రం చలనచిత్ర పరిశ్రమలో (అది ఎక్కడైనా) ఏనాడూ జరగలేదు. అదో అద్భుతం !అంతే …!

సంక్రాంతి సినిమాల రష్ అయ్యాకే సినిమా విడుదల చేయ్యడానికి నిర్ణయించడమైంది.

 

_________________

 

“నారాయణా.. బయల్దేరు.. శివమూర్తిగారి పరిస్థితి నిజంగా బాగోలేదని సుశీలమ్మగారు ఫోన్ చేశారు” కళ్లు తుడుచుకుంటూ అన్నారు కృష్ణమూర్తి.

విజయవాడలోని ఓ సామన్యమైన హాస్పిటల్లో నిస్తేజంగా పడి వున్నారు శివమూర్తిగారు. ఒకప్పటి ఆయన ‘వైభవం’ తెలీని చీఫ్ డాక్టర్ ‘డబ్బులు’ కట్టగలరా లేరా అని అసహనంగా వున్నాడు. శివమూర్తిగారికి పిల్లలు లేరు.

“పిక్చరు అమ్మేసి అయినా అందరి బాకీలూ తీర్చండి మూర్తిగారూ. ఒక్క పైసా కూడా తగ్గించవద్దు. సుశీలకిక మీరే దారి చూపించాలి. ఒరే నారాయణా.. నువ్వేరా నాకు మిగిలినవాడివి. నేను వెళ్లిపోతే తలకొరివి పెట్టే బాధ్యత నీదే” అన్నారు శివమూర్తిగారు నారాయణ వంక చూసి.

చిత్రం ఏమంటే.. అవే ఆయన చివరి మాటలు. బ్రతికుండగా ‘అమ్మ’కి అన్నం పెట్టని మహానుభావులు చచ్చాక “ఊరి విందు” చేశారన్న సామెత ప్రకారం మహానటులిద్దరూ కడవలతో కన్నీళ్లు కార్చి శివమూర్తిగారు తమకెంత సహాయం చేశారో, వారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఏడ్చి ఏడ్చి చెబితే…

దిగ్దర్శకులు పొర్లిపొర్లి ఏడుస్తూ తమ ప్రగాఢ సంతాప సందేశాల్ని  తెలియజేస్తూ ‘శివమూర్తిగారు లేని లోటు’ సినిమా పరిశ్రమని కనీసం శతాబ్దం పాటు పీడిస్తుందని బల్లగుద్ది చెప్పారు.

రాత్రికి రాత్రే ఇద్దరు మహానటులూ కుమ్మక్కై శివమూర్తిగారి పిక్చర్‌ని అర్జంటుగా, అయిన ఖర్చులకి కొంత జత చేసి ఇచ్చి సుశీలమ్మగారి దగ్గర ‘హక్కులు’ కొనేశారు.

అందరి బాకీలూ తీర్చి ఆవిడ నిర్వికారంగా నిలబడితే…

“అమ్మా నాకు తోబుట్టువులు లేరు. నువ్వే నా తోబుట్టువువు. మా శ్వాస ఆడేంతకాలం నీకు కష్టం కలగనివ్వం” అని కృష్ణమూర్తిగారూ, నారాయణా తోడు నిలబడ్డారు.

పిక్చర్ రిలీజైంది. అదీ ‘నటకుమారుల’ కోసం సిద్ధం చేసిన సూపర్ డీలక్సు థియేటర్లలో.

పిక్చర్ సూపర్ డూపర్ హిట్. కోట్లు కురిశాయి. పది రోజులు ఆడితే ‘శభాష్’ అనుకునే రోజుల్లో రెండు వందల రోజులు , రోజుకి నాలుగు షోల వంతున ఆడింది.

చిత్రం ఏమంటే.. సినిమా అయ్యాక ‘నిరంజన్’ని పట్టించుకున్నవాడు లేడు. కెమేరామెన్ పరిస్థితీ అంతే.. ఇప్పుడా ఇద్దరూ తెలుగు పరిశ్రమకి గుమ్మడికాయ కొట్టేసి ‘భోజపురీ’ సినిమా తీసే ప్రయత్నంలో కొట్టుమిట్టాడుతున్నరని లేటెస్టు వార్త..

రాజకీయమా.. నీకెన్ని రూపులో!

*

ఆమె కవిత

శ్రీకాంత్ కాంటేకర్

తను చెప్తూ ఉంటుంది
నా చెవిలో ఒక గౌర పెట్టి
మాటల ధారను గుండెలోకి ఒంపుతూ
ఈ గొంతు జీరబోతుంది
బరవెక్కుతుంది
తరతరాల మూలాల నుంచి
గట్టిగా బిగించిన గొలుసులు
పట్టి లాగుతున్నప్పుడు
ఆ యెదతడి నన్ను తాకుతూ ఉంటుంది
ఆమె ప్రతిస్పందనైన భాష కూడా పవిత్రమవుతుంది
విపరీతాలు, విరుద్ధాలు చవిచూస్తున్న ప్రకృతి కూడా
ఒకానొక ఉదయం పూట కొండ నుంచి జాలువారు
జలపాతంలోకి దూకి తేటగా గుండెగీతాన్నెదో
సంగీతంలోకి ఒంపుతున్నట్టు ఆమె కవిత్వ సందర్భమవుతుంది
ఆమెదంతా స్వచ్ఛమైన మార్మికత
కానీ, ఎవరికర్థమవుతుంది
తను పాడుతున్న పాటలో
ఏ రహస్య రాగధ్వనులు లేవని
ఏ ముసుగు లేని నీలిరంగు ఆకాశం పాట
తను కండ్ల నుంచి స్రవిస్తున్నదని..!
2
అయినా నేను ద్రవించను
సహానుభూతి చేత
కండ్లలో ఉబికిన కన్నీళ్ల చేత
దుఃఖ తదాత్మ్యంలో
తను చెప్తూ ఉంటే
నేను దారి తప్పిపోతాను
చరిత్ర పురాస్మృతుల్లోకి
తను వేసిన అడుగులు
నా గుండె ముండ్లపై కస్సున దిగుతాయి
ఆ రక్తం నా కండ్లలోంచి ఒలుకుతుంది
తన మాటల లోతుల లోయల్లో
ఈ ఆధారం అందక గత మూలాల్లోకి విసిరేయబడతాను
“నేనిక్కడ రాయిగా మారానని చెప్తావు
నేనిక్కడ ఈ గీత ఇవతలే
ఎవరి పరిహాసానికి కారణం కాదంటావు
నేనిక్కడ ఈ జూదానికి
నిండుకొలువులో సాక్షిని కాదంటావు”
నిన్ను తాకి ఆడది చేసిన
బండరాతి ముద్రలు ఇవేనని
దుఃఖంలో నదిగా చీలి
ఆ బండరాయి చుట్టూ ప్రవహిస్తావు
గుండెలపై దొర్లిన ద్రోహదృశ్యమేదో..!
నువ్ బడిపిల్లలా అమాయకంగా
ప్యాడు, పెన్ను పట్టుకొని
నిత్యం అగ్నిపరీక్ష సిద్ధమవుతూ కనిపిస్తావు
ఎముక ములుగులో పదిలంగా బిగించిన సంకెళ్లు
తెంపలేక నువ్ గిలగిల కొట్టుకుంటావ్
” ఆ ఊచల నుంచి బైటకురాలేక
నిస్సహాయ రక్తకన్నీటి దృశ్యమొక్కటి..”
నువ్ కవిత చదవడం అయిపోతుంది
నెత్తురంటిన చేతులతో నే కరచాలనం చేస్తాను అభినందనగా-
srikanth kantekar

అతడు

సి.వి. శారద

 

అక్కడ నింగికి పొద్దులు తెలియవు
సూరీడు వంగి సలాం కొడుతుంటాడు
నెలవంక నిగ్గి సంగీతం వింటుంది
అతని భుజంమీంచి పేజీల్లోకి
చుక్కలూ తొంగి చూస్తుంటాయి

అక్కడ గోడలపైన చరిత్రకారులు
కొక్కేనికి ఊయలూగుతూ వాద్యాలూ
స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటాయి
అతని ఇంట్లో అనంతమైన ఙానం
హాయిగా తలదాచుకుంటుంది

ఆ మధుశాలా మత్తులు
సృజించిన చైతన్యంలో
సిగరెట్ చురక్కి బాటిల్లో చుక్కకి
నషా ఎక్కుతూనే ఉంటుంది
నషానే అతనికి లాలీ, ఆకలీ..!

దిక్కులకి చిక్కనిది కాలానికి తెలియనిది
రహస్యమేదో ఆ ఇంట్లో ఒకటుంది
చీకటిని కమ్ముకున్న ఎల్ఈడీ వెలుగులో
అతను తన ఉనికిని కోల్పోయి
అక్కడ కవితాపానం చేస్తుంటాడు.

*

sarada

ఈ కథల మేజిక్ అనుభవించి పలవరించాల్సిందే…

                                                                              కృష్ణమోహన్ బాబు

 

krishna mohan babu“బాబూ గిఖోర్ , నీకు కొన్ని విష యాలు చెప్పవలసివుంది.  ఇక్కడ పరిస్థితులు చాలా క్లిష్టంగా వున్నాయి.  పన్నుల కోసం మమ్మల్ని వత్తిడి చేస్తున్నారు.  మా దగ్గర డబ్బు లేదు.  మీ అమ్మకి , జాన్నీకి వేసుకోవడానికి బట్టలు లేవు.  నిజానికి బనీను గుడ్డల్లాంటివి వేసుకుని బతుకుతున్నాం.  మాకు కొంచెం డబ్బు పంపించు బాబూ.  నీ క్షేమం గురించి ఒక వుత్తరం కూడా రాయి.  ఆవు చచ్చిపోయింది.  మీ అమ్మకి, జాన్నీకి ఒళ్ళు కప్పుకోవడానికి ఏమీ లేదు.”

గిఖోర్ అనే కుర్రవాడికి  వూరి వాళ్ళ ద్వారా వాళ్ళ నాన్న పంపిన వుత్తరం యిది.  హువనేస్ తుమన్యాన్ “కథలు – గాథలు” అనే పుస్తకం లో ‘గిఖోర్ ‘ అనే కథ లోది. ఆర్మేనియన్ సాహితీ చరిత్రలో పెద్ద దిక్కుగా పేరు తెచ్చుకొన్న తుమన్యాన్.

ఫిబ్రవరి 19, 1869లో పుట్టాడు .  అప్పుడు  ఆర్మేనీయా రష్యన్ రాజారికం లో భాగం .  తుమన్యాన్ ని ఆర్మేనీయన్ జాతి సంపదగా కొల్చుకుంటారు.  ప్రతి యేడు ఏప్రిల్ లో అతనిని   గుర్తు చేసుకుంటారు .  ఇతను  తల్లి నుంచి కథలు చెప్పడం నేర్చు కున్నాడు.  12 యేళ్ళ కి మొదటి  కవిత్వం రాశాడు .  కవిత్వం, కథలు, జానపద కథలు, గాథలు అలా అన్ని రకాల ప్రక్రియల్లో పేరు సంపాదించాడు .  1923, మార్చ్ 23 న చనిపోయాడు.  ఈ పుస్తకం లో 6 కథలు, 9 జానపద గాథలు వున్నాయి.  ఈ పుస్తకం 40 యేళ్ళ క్రితం ఒకసారి సోవియట్ అనుబంధ సంస్థ  ‘ప్రగతి ప్రచురణాలయం’  వారు వేశారు.  దీనిని పి. చిరంజీవినీ కుమారి గారు తెలుగు లోనికి తీసుకు వచ్చారు. నవచేతన్ పబ్లిషింగ్ హౌస్, హైదారాబాద్ వారు ఈ మధ్యనే ఈ పుస్తకాన్ని మళ్ళీ అచ్చువేశారు.

ఇందు లో మొదటి కథ ‘గిఖోర్ ‘.  ఒక బీద రైతు, తన 12 యేళ్ళ కుర్రాణ్ని, బతుకు తెరువు తెలుస్తుంది, పని నేర్చు కుంటాడనుకొని, పట్నం లో షావుకారు దగ్గర జీతభత్యాలు లేని పనివాడుగా పెడతాడు.  ‘ముక్కుపచ్చలారని బిడ్డని నీతి, న్యాయం లేని ఈ ప్రపంచం లోనికి తోసేయడానికి వీలులేదని’ వాళ్ళ అమ్మ ఏడుస్తుంది.  తన పరిస్థితి ఎలాగూ దుర్భరంగా వుంది.  కనీసం కొడుకైనా ఏదో

ఒక పని నేర్చుకుని కుటుంబాన్ని ఆదుకోపోతాడా అన్నది రైతు ఆశ.    ఈసడింపులు, తిట్లు, చివాట్లు మధ్య అతి హీనమైన పరిస్థితులలో ఆ కుర్రాడు షావుకారు దగ్గర వుంటాడు.  వెనక్కి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితులు.   తన వాళ్ళెవరినీ తిరిగి చూడకుండానే కొద్ది కాలంలోనే  ఆ కుర్రాడి జీవితం కడతేరిపోతుంది.  చెల్లెలి కోసం పోగు చేసిన మెరుస్తున్న బొత్తాలు, రంగురంగు కాగితం ముక్కలు, పిన్ను సూదులు, బట్టల తాన్ల పీలికలు మిగులుతాయి.  1894 లో వచ్చిన ఈ కథ తర్వాత రష్యన్ సినిమాగా కూడా వచ్చింది.  ఇది ‘యూ ట్యూబ్ ‘ లో కూడా వుంది.   ఇది ఈ రోజుకీ నడుస్తున్న కథే.   ఇప్పటికీ ఒక్కసారి బయటికి తొంగి చూడండి.  పిల్లల్ల్ని మోస్తూనో, నౌకర్లు గానో, కాఫీ హోటళ్ళలో బల్లలు తుడుస్తూనో, నాశనమవుతున్న పల్లె జీవితాల నుంచి పట్టణకీకారణ్యంలో  పడ్డ గిఖోర్లు అన్ని చోట్లా  కనబడుతూనే వుంటారు.

రెండో కథ ‘నా నేస్తం  – నెస్సో.’   చిన్నతనంలో ఏ తారతమ్యాలు లేకుండా ఆడుకోవడమే జీవిత లక్ష్యంగా ప్రాణానికి ప్రాణంగా పల్లెటూరిలో పెరిగిన ఒక కుర్రాళ్ళ గుంపు.  ఆ గుంపులో నెస్సో ఒకడు.  వేసవి వెన్నెలలో నెస్సో మిగతా

కుర్రాళ్ళకి ఎన్నెన్నో కథలు చెప్పేవాడు.  అప్సరసల గురించి , రత్నాల పక్షి గురించి, గుడ్డి రాజు గురించి. మిగతా కుర్రాళ్ళంతా వాడి కథల కోసం ఆత్రుతగా ఎదురు చూసేవారు.  కాలప్రవాహంలో డబ్బులున్న పిల్లలు చదువులతో ముందుకెళ్ళి నాగరికంగా తయారయితే, దారిద్రంలో జీవిస్తున్న నెస్సో సామాజిక పరిస్థితుల వల్ల దొంగగా మారతాడు.  ఎంత నాగరికంగా మారినా, వెన్నెల రాత్రి నెస్సో చెప్పిన కథలు తీయని జ్ఞ్యాపకాలుగా వెంటాడుతూనే వుంటాయి.

“నెస్సో దరిద్రుడు, నెస్సో అజ్ఞ్యాని.  దౌర్భాగ్యం బీదరైతులకి ప్రసాదించే కష్టాలలో నెస్సో నలిగిపోయాడు.  వాడికే చదువుంటే, వాడికే భవిష్యత్తు మీద భరోసా వుంటే, వాడూ మంచి వాడయ్యే వాడే.  నా కంటే కూడా గుణవంతుడు అయ్యేవాడు—-” నెస్సో మిత్రుడు నెస్సోని తలచుకుని అనుకున్న మాటలు.  వెనక్కి తిరిగి చూసుకుంటే మనలో చాలా మందికి యిలాంటి తడి జ్ఞ్యాపకాలు వుండే వుంటాయి.

పారిశ్రామిక ప్రగతి జీవితాలలో ప్రవేశించినపుడు మనుషుల విలువల్లో వచ్చే మార్పుని సూచిస్తుంది ‘రైల్వే లైను నిర్మాణం’ కథ.

మూడో కథ ‘పందెం’.  ఆర్మేనియన్లని టర్కీ దేశస్తుల్ని విడదీశే కొండల మధ్య వున్న ‘మూతు  జోర’  అనే లోయలో జరిగిన కథ.  ఒక టర్కిష్ బందిపోటు, ఛాతి అనే ఆర్మేనియన్ పశువుల కాపర్ని చంపుతానని పందెం కాసి ఆ కుర్రాడి చేతిలో తనే ప్రాణాలు పోగొట్టు కున్న కథ.  అయితే ఆ బందిపోటు తండ్రి తన కొడుకు చేసిన దుర్మార్గాన్ని ఖండించి వాడి తలపాగా, కత్తి, డాలు  ఇచ్చేయమని అర్థించి యిలా అంటాడు “వాడి తల్లి మాత్రం ఏం చేయగలదు.  ఎంతయినా తల్లి కదా!  గుండె చెరువయ్యేలా ఏడుస్తోంది.   వాడి బట్టలు యిచ్చేస్తే, ఆమె దగ్గరికి తీసుకుపోతాను.  కరువుతీరా ఏడుస్తుంది.  అప్పటికైనా ఆమె దుఖ్ఖమ్ తీరి మనసు కొంచం కుదుట పడుతుంది.”

తాము అనుకున్న పని జరుగకపోతే ఎంత దగ్గిర వాళ్ళయినా నీచంగా చిత్రించే మనిషి నైజాన్ని చెప్పే కథ, ‘ఖేచన్ మామయ్య.’

యిక చివరి కథ ‘లేడి,’  మనిషి కంటే క్రూర జంతువు మరొకటి లేదనిపించే కథ.  తుపాకి పట్టి ఒక మృగాన్ని చంపిన తర్వాత దాని తల్లి దీనంగా దిక్కులు చూస్తూ ఆ పిల్ల కోసం, అది పడే తపన, మన యిళ్ళల్లో పి‌ల్లో పిల్లవాడో చావుబతుకుల్లో వున్నప్పుడు ఆ తల్లి పడే బాధ లాంటిదే.  అందుకే తోటమాలి ‘ఓవంకి ‘ అంటాడు “ మనకీ, ఈ కొండల్లో లేళ్ళకి తేడా ఏంటి?  ఏమీ లేదు.  మనసు మనసే.  బాధ బాధే.”

యింకా గాథలలో  వున్న 9 కథలు చాలా చమత్కారంగా, నవ్విస్తూ కొన్ని సందేశాలను కూడా చెబుతాయి.  ‘తోక తెగిన నక్క’  అనే కథ  రాజుగారు – ఏడు చేపల కథను గుర్తు చేస్తుంది.  మనం ఎవరికైనా ‘ మేలు చేస్తే దాన్ని సముద్రంలో పారేసినా మళ్ళీ నీ వద్దకు ఒకనాడు తిరిగి వస్తుంది’  అన్న ఆర్మేనియన్ సామెతని పిల్లలకి ‘మాట్లాడే చేప’  కథ ద్వారా చెబుతారు.  మన ‘శ్రావణ, భాద్రపద’  కథ లాంటిదే ‘తీర్ధం’  కథ.  తెలివి తేటలతో కష్టాల్నించి ఎలా గట్టెక్కచ్చో చెబుతుంది ‘యజమాని – పనివాడు’  కథ.  వీటన్నిటినీ మించిన తమాషా కథ, ‘వేటగాడి కోతలు .’  ఇది ఒక మ్యాజిక్ రియలిజం లాంటి కథ.

ఈ కథ చదువుతూ వుంటే దక్షిణ అమెరికా కథను దేన్నో చదువు తున్నట్లు వుంటుంది.    ఇవి ముఖ్యంగా పిల్లల్ని వుద్దేశించి, వాళ్ళకి లోకరీతిని నేర్పించేవి.  అందుకనే ఆ కథలు చెప్పే తీరు చదివి అనుభవించాల్సినదే గాని, మాటల్లో చెప్పేవి కాదు.

 వందేళ్ళ నుంచి ఈ కథలు జనం చదువుతూనే వున్నారు.  మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుంటూనే వున్నారు.  తెలిసిన విషయాలే అయినా ఇంత కాలం మన మధ్య ఈ కథలు బతికి వుండడం కథకుడిగా తుమన్యాన్ మ్యాజిక్.  రచయితలు అనుకుంటున్న వాళ్ళు,  తమ రచనలు జనాల మధ్య పది కాలాలపాటు వుండాలనుకునే వాళ్ళు ఈ కథల్లోకి తొంగి చూడండి.  ఆ మ్యాజిక్ ని పట్టుకోండి.  మిమ్మల్ని మీరు బతికించుకోండి.

*

 

 

 

 

గజేంద్ర సింగ్! మమ్మల్ని క్షమించు..

వైవీ రమణ

రమణఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గజేంద్ర సింగ్ అనే రాజస్థాన్‌కి చెందిన రైతు చెట్టుకి ఉరేసుకుని చనిపొయ్యాడు. గజేంద్ర సింగ్ చెట్టుమీద కూర్చునున్న వీడియో క్లిప్పింగ్ చూశాను. ఆ తరవాత అతను శవమై చెట్టుకు వెళ్ళాడుతున్న ఫోటో చూశాను. మనసంతా దిగాలుగా అయిపోయింది. 

ఢిల్లీ దేశరాజధాని కాబట్టి, ఈ రైతు మరణానికి మీడియా కవరేజ్ లభించింది గానీ – రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణా.. రాష్ట్రం ఏదైతేనేం రైతులు ఆత్మహత్య చేసుకోని రోజంటూ లేదు. కొన్నేళ్ళుగా మధ్యతరగతి బుద్ధిజీవులు రైతుల మరణాన్ని ఒక విశేషంగా భావించట్లేదు. ఆసక్తి కలిగించిన ఈ ‘అప్రధాన’ వార్తల్ని మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. 

ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, వడదెబ్బ తగిలి కొందరు చస్తారు. రేపు వర్షాకాలంలో రోగాలొచ్చి ఇంకొందరు చస్తారు. ఎల్లుండి చలికాలంలో చలికి నీలుక్కుపొయ్యి మరికొందరు చస్తారు. ‘మరణిస్తారు’ అని గౌరవంగా రాయకుండా ‘చస్తారు’ అని రాస్తున్నదుకు నన్ను మన్నించండి. వారి చావులు ఈ సభ్య సమాజాన్ని కనీసంగా కూడా కదిలించలేనప్పుడు భాష ఏదైతేనేం?

నరాలు మొద్దుబారి చర్మం స్పర్శ కోల్పోతే ‘న్యూరోపతీ’ అంటారు, ఇదో రోగం. నిస్సహాయులైనవారు – తమని ఇముడ్చుకోలేని ఈ సమాజం పట్ల విరక్తి చెంది.. కోపంతో, అసహ్యంతో ఆత్మహత్య చేసుకుంటారు. ఇంతకన్నా బలంగా తెలిపే నిరసన ప్రకటన ఇంకేదీ లేదు. అట్లాంటి ‘చావు ప్రకటన’ని కూడా కాజువల్‌గా తీసుకునే ఈ సమాజపు ‘ఎపతీ’ని ఏ రోగం పేరుతో పిలవాలి?

మన దేశం జీడీపి పెరుగుతుంది అంటారు, ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుంది అంటారు, స్టాక్ మార్కెట్లు పైపైకి దూసుకుపొతున్నయ్ అంటారు. ఇవన్నీ గొప్పగా వున్నాయి కాబట్టి విదేశీ పెట్టుబడులు దేశంలోకి లావాలాగా పొంగి ప్రవహిస్తున్నాయి అంటారు. మంచిది, దేశం అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషం. మరి రైతులు ఎందుకు చనిపోతున్నారు? పెరుగుతున్న సంపదలో రైతులకి వాటా లేదా? రైతులకి వాటా లేని అభివృద్ధి అభివృద్ధేనా?

22-1429701205-farmer-attemts-suicide-during-aam-aadmi-party-aaps-rally4

మన రాజకీయ పార్టీలు సామాన్యుణ్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాయి. ఈ విషయం చెప్పుకోడానికి అవి సిగ్గు పడుతున్నాయి గానీ, కొద్దిపాటిగా ఆలోచించేవాడికైనా విషయం అర్ధమైపోతుంది. అందుకే ప్రభుత్వాలిప్పుడు వాగాడంబరం, మాటల పటోటాపం, పదాల జిమ్మిక్కుల్ని ఆశ్రయిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బున్నవాడికే టిక్కెట్లివ్వడం, కొంతమంది పెద్దలకి లాభించే పనులు చేసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పి పెట్టుకోడానికి మీడియాని మేనేజ్ చేసుకోవడం.. ఇదంతా చాలా ఆర్గనైజ్‌డ్‌గా, ప్రొఫెషనల్‌గా, వెల్ ఆయిల్డ్ మెషీన్లా స్మూత్‌గా సాగిపోతుంది.

రాజకీయ పార్టీల పెద్దలకో విజ్ఞప్తి! అయ్యా! మీరు మాకేం చెయ్యరని తెలుసు, చెయ్యకపోయినా పర్లేదు. కానీ – నిస్సహాయుల మరణం పట్ల మినిమం డీసెన్సీతో స్పందించడం నేర్చుకోండి. ఈ మరణాలకి సిగ్గుతో తల దించుకుని మీకింకా ఎంతోకొంత సభ్యత, మానవత్వం మిగిలుందని మాబోటి అజ్ఞానులకి తెలియజెయ్యండి.

ఇది రాస్తుంటే – నాకు నేనే ఒక ఈడియాటిక్ అశావాదిలా అనిపిస్తున్నాను. వేలమంది ఊచకోతకి గురైనా – ఆ చంపిందెవరో ఇప్పటిదాకా మనకి తెలీదు! ఇకముందైనా తెలుస్తుందనే ఆశ లేదు. మరప్పుడు ఆఫ్టరాల్ ఒక అల్పజీవి మరణం వార్తా పత్రికల్లో ఒకరోజు హెడ్లైన్‌కి తప్ప ఇంకెందుకు పనికొస్తుంది?

ఈ చావుని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటాయి. ఇలా ‘లబ్ది’ పొందడం రాజకీయ పార్టీలకి ‘వృత్తిధర్మం’ అయిపోయింది. గజేంద్ర సింగ్ ముగ్గురు బిడ్డలు దిక్కులేని వాళ్లైపొయ్యారే అని దిగులు చెందుతుంటే, ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ చికాకు పెడుతుంది. స్వతంత్ర భారతంలో ఇదో విషాదం.

గజేంద్ర సింగ్! మమ్మల్ని క్షమించు. నువ్వు బ్రతికున్నప్పుడు ఏం చెయ్యాలో మాకు తెలీలేదు. చనిపొయినప్పుడూ ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు…

*

  వసంత ఋతువు అక్కడే కనబడింది! 

శివరామకృష్ణ

sivaramakrishna    ఎన్నో యేళ్ళనించీ వాయిదా పడుతున్న గురువాయూరు యాత్ర మా పిల్లల చొరవ వల్ల ఇటీవల సాధ్యపడింది.  ఎప్పుడో, నేను ఉద్యోగంలో చేరినప్పుడు కొన్నాళ్ళు మంగళూరులో పనిచేశాను. అప్పుడు కేరళ రాష్ట్రాన్నీ, పశ్చిమ కన్నడ ప్రదేశాన్నీ చక్కగా చూశాను. ఇదిగో మళ్ళీ ఇప్పుడు.

అసలు కేరళ అంటేనే నాకు పూనకం వస్తుంది. ఎందుకంటే అది దేవభూమి. God’s own country అంటారు కదా దీన్ని! పరశురాముడు ఈ సీమని సముద్రంలోంచి తన గండ్రగొడ్డలితో బయటికి లాగాడట.  చాలా కాలం అక్కడే ఉన్నాట్ట కూడా! దట్టమైన అరణ్యాలూ, చిన్న చిన్న నదులూ, ఆ నదులనే తలపిస్తూ సముద్రం వరకూ సాగే కాలువలూ, ఉప్పునీటి కయ్యలూ, మన కోనసీమ తలదన్నే విస్తారమైన కొబ్బరితోటలూ, ఎక్కడ చూసినా విరగకాచి ఉన్న పొడవైన పనస, మామిడి చెట్లూ (వాటి కాలం లో నన్నమాట), మండువేసవిలో కూడా చలిపుట్టించే కొండవసతులూ(hill resorts), అందమైన సాగరతీరం అన్నీ ఈ రాష్ట్రపు ప్రత్యేకతలు. ఇవేకాక, కొండవాలుల్లో పరచుకొని ఉన్న టీ తోటలూ, సుగంధద్రవ్యాల చెట్లూ కేరళ స్వంతం. గురువాయూరులోని శ్రీకృష్ణ దేవాలయం, తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి మందిరం, అయ్యప్ప వెలసిన శబరిమల, అనేక పెద్దపెద్ద చెర్చిలు, మశీదులూ ఉన్న ప్రదేశం కూడానూ కేరళ.

హైదరాబాదు నించి కొచ్చిన్‌ చేరి, అక్కడి నించి రోడ్డు మార్గం ద్వారా గురువాయూరు చేరాము. దారి పొడుగునా కన్నులవిందైన ప్రకృతి! పచ్చటి చెట్లూ, కొబ్బరితోటలూ, కాలువలూ మైమరపిస్తాయి.  రైల్లో ఐతే త్రిచూర్లో దిగి అక్కడినించి 30 కి. మీ. బస్సులోకాని, టాక్సీలో కాని వెళ్ళొచ్చు. గురువాయూరులో చిన్న రైల్వే స్టేషన్‌ కూడా ఉంది.

Sri Krishna the Lord of Guruvayoor (1)

ఇక్కడి దైవం నారాయణుడు. ఆయన్నే బాలకృష్ణుడుగా భావించి కొలుస్తారు. ఎందుకంటే దేవకీవసుదేవులకు శ్రీకృష్ణావతార సమయంలో నారాయణుడు దర్శనమిచ్చిన చతుర్భుజ స్వరూపం లోనే ఇక్కడి విగ్రహం ఉంటుంది. మూడడుగుల ఎత్తుకూడా ఉండదేమో ఆ మూర్తి. కానీ లోకోత్తరమైన ఆ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేము. నాలుగుచేతుల ఆ నల్లనయ్యను వెనుకచేతులు కనబడకుండా పూలమాలలు అమర్చి, ఒక చేత వెన్నముద్ద, మరోచేత వేణువు పట్టిన బాలకృష్ణుడిగా అలంకరించి చూపిస్తారు సాధారణం గా! ఊదయాన్నే ఉష:కాలపూజా సమయం లో అసలు రూపాన్ని చూడవచ్చు. భక్తసులభుడనీ, సంతానప్రదాత అనీ ఆయనకు పేరుంది. ఆయన లీలలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి.  ఈ ఆలయం లో దర్శనానికి అందరికీ ఒకటే క్యూ! మన రాష్ట్రంలోలాగా వీఐపీలు, వీవీఐపీలూ అంటూ తేడాలు లేవు ఈ స్వామికి. అందరికీ ఉచితం గా కన్నులవిందైన దర్శనం దొరుకుతుంది. సాయంకాలం సూర్యాస్తమయం అవగానే ఆలయ ప్రాంగణం అంతా నూనె దీపాలతో దివ్యకాంతులతో వెలిగిపోతుంది.  ప్రమిదల్లో వెలిగే నూనె దీపాల కాంతికి ఒక అనంతత్వం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ అనంతత్వం లోనే ఏకాకృతిగా వెలిగే దైవత్వం గోచరిస్తుంది. అందుకేనేమో ‘ దీపం జ్యోతి: పరబ్రహ్మ ‘ అన్నారు.

 

గురువాయూరులో ఉండడానికి మంచి హోటెళ్ళు ఉన్నాయి, ఇవేగాక దేవస్థానం వారి సత్రాలు కూడా ఉన్నాయి.  మేము దిగిన హోటల్ కి ఎదురుగా కొన్ని ఇళ్ళున్నాయి. ముందుభాగమంతా చక్కటి గార్డెన్లు పెంచుకున్నారు. లోపలెక్కడో ఇళ్ళున్నాయి. పనస, మామిడి, అరటి, కొబ్బరి, పోక చెట్లూ, మధమధ్య పూలమొక్కలూ, ఉదయాన్నే ఆ చెట్లమీద నించి మేలుకొలుపు పాటల్లాంటి కోయిలమ్మల స్వరసమ్మేళనాలూను! మన ప్రాంతాల్లో కనపడకుండా పోయిన వసంతశోభ అంతా ఇక్కడ కనపడింది! ఆ ఇళ్ళ యజమానులు ఉన్నారో లేరో కాని, చెట్లనిండా గుత్తులు గుత్తులుగా మామిడికాయలూ, పనసపళ్ళూను! చిలకలు కొరికిన మామిడికాయలు-అప్పుడే పళ్ళుగా మారుతున్నవి-రాలిపడుతూనే ఉన్నాయి. అడగకుండానే అమృతఫలాలిచ్చే చెట్ల జన్మలు ఎంత  ధన్యమైనవి!

రెండురోజులు గురువాయూరులో గడిపి అక్కడినించి మున్నార్ బయలుదేరాం.  మున్నార్ చాలా అందమైన వేసవి విడిది.  మండువేసవిలో కూడా చాలా చల్లగా ఉండేప్రదేశం. తేయాకుతోటలకు ప్రసిధ్ధి. ఈ ప్రయాణం లోనే నాకు అనుకోకుండా దొరికిన భాగ్యం కాలడి సందర్శనం.  హైందవధర్మానికి జయకేతనాన్నెగురవేసిన  ఆదిశంకరుల జన్మస్థలం.  కొచ్చిన్‌ విమానాశ్రయానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం లోనే ఉంది కాలడి.  ఈ విషయం నాకు అంతవరకూ తెలియదు! కాలడిలో శృంగేరి శంకరమఠం వారు ఆదిశంకరులకూ, శారదామాతకూ ఆలయం నిర్మించారు.  ఆదిశంకరుల మాతృమూర్తి ఆర్యాంబగారి సమాధి కూడా అక్కడే చూడవచ్చు.  శంకరులు సన్యసించడానికి నిమిత్తమాత్రమైన మొసలి, ఆయన కాలిని పట్టుకున్న ప్రదేశాన్ని కూడా పూర్ణానది ఒడ్డున గుర్తించవచ్చు.  ఈ పూర్ణానదినే ఇప్పుడు పెరియార్ నది అని పిలుస్తున్నారు. ఈ నదిని కేరళ రాష్ట్రానికి ఆనందదాయిని అంటారు. దీనిపై ఎన్నో ప్రోజెక్టులు కట్టారు. పక్కనేఉన్న తమిళనాడుకీ కేరళకీ నడుమ ఈ ప్రోజెక్టులపైనే వివాదాలున్నాయి.

 

Munnar

కాలడి నించి మళ్ళీ బయలుదేరి దారిలోనున్న అందమైన ప్రకృతినిని తనివితీరా చూస్తూ, రోడ్డుకి ఆనుకొని ప్రతీ రెండు మూడు కిలోమీటర్లకీ ఒకటిగా ఉన్న గ్రామాలను దాటుకొని కొత్తమంగళం అనే చిన్న పట్టణాన్ని చేరాం. ఈ వూరి వింత అక్కడున్న ఫర్నిచరు దుకాణాలు. ఊరి పొడుగు సుమారు రెండు కిలోమీటరులుంటే, ఆ రెండు కిలోమీటర్లూ రోడ్డుకి రెండువైపులా ఈ దుకాణాలే! ఊరు మాత్రం ఈ రోడ్డు పొడుగంతే ఉంది. భలే కొత్తకొత్త డిజైన్లలో ఆని రకాల ఫర్నిచరు సామాన్లూ ఉన్నాయి. మా డ్రైవరు ప్రదీప్   కేరళ రాష్ట్రం అన్నిప్రాంతాలనించీ వచ్చి ఇక్కడ ఫర్నిచర్ కొనుక్కుంటారని చెప్పాడు.  చుట్టుపక్కలి అడవుల్లో దొరికే మంచి కలపతో వీటిని చేస్తారట. తరువాత ఆడిమలి అనేచోట మధ్యాహ్న భోజనాలు కానిచ్చి మున్నారుకు చేరువయ్యాం. ఆడిమలి దాటాకా రోడ్డుకి ఇరువైపులా స్పైస్ గార్డెన్‌లు కనబడ్డాయి. వాటిని చూడ్డానికి మనిషికి వంద రూపాయలు టిక్కెట్టు. మనం రోజూ వాడే సుగంధ ద్రవ్యాల  మొక్కలూ, చెట్లూ అన్నీ అక్కడున్నాయి. లవంగం, యాలకులు, జాజికాయ-జాపత్రి, దాల్చినచెక్క (దీని ఆకులే బిర్యానీలో వాడే ఆకులు) మొదలైనవన్నీ ఉన్నాయి. ఇంకా కాఫీ, రబ్బరు చెట్ల వంటివీ ఉన్నాయి. స్ట్రాబెర్రీలు, కోకో కూడా పండిస్తున్నారక్కడ.   మాకు వీటిని చూపించిన గైడు ఆశా మీనన్‌ అనే మళయాళీ అమ్మాయి గడగడా తెలుగు – మళయాళీయాసలో – మట్లాడేస్తుంటే ముచ్చటేసింది. గైడువృత్తికాబట్టి, అన్ని భాషలవారికీ అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి నేర్చుకున్నానంది.

ఇక అక్కడినించి బయలుదేరాకా ప్రకృతి సౌందర్యంవిశ్వరూపంచూపడంమొదలయింది. కొండలూ, వాటి లోయలూ, లోయల అడుగున మైదానాలూ, వాటిలో ఏవేవో చిన్న చిన్న గ్రామాలూ, అక్కడక్కడ సెలయేళ్ళూ, ఇవన్నీ చాలవన్నట్టు కొండవాలుల్లో టీ తోటలూ!  కొన్ని చోట్ల అసలు కొండే కనబడకుండా పచ్చటి టీ మొక్కలు వరసలు వరసలుగా పెంచారు-ఆకుపచ్చటి తివాచీలు పరిచినట్టు! మధ్య మధ్యలో పాపం పిల్లమొక్కలకి ఎండసోకకుండా మేమున్నాం అన్నట్టున్న వెండిగొడుల్లాంటి సిల్వర్ ఓక్ చెట్లు! ఈ సిల్వర్ ఓక్ లను రోడ్డు మీదనించి చూస్తూ ఉంటే కొండవాలుల్లో అంతా తెల్లటి పొగమేఘాలు కమ్ముకున్నాయా అన్నట్టున్నాయి. సిల్వర్ ఓక్ కలపతో ఫర్నిచర్ తయారు చేస్తారు.  ఒక చోట ఒక పుష్పవనం ఉంది. రకరకాల పూలమొక్కలు పెంచారు.  దాని అందం చూడవలసిందే!  వసంతవాటిక లంటే ఇవేకదా అనిపించింది. గులాబీలు, రంగురంగుల మందారాలూ, డైసీలూ, చామంతులూ , వయొలెట్లూ, ఐరిస్ జాతులూ అన్నీ ఉన్నాయి అక్కడ. Land lotus పేరు విన్నాను కాని ఇక్కడ చూసాను దాన్ని.

Land lotus

అక్కడినించి బయలుదేరి మున్నారు చేరాము.  హోటల్ రూము లో సామాన్లు పెట్టుకుని, రెఫ్రెష్ అయి, అక్కడికి సమీపం లో ఉన్న ఏనుగుల పార్కుకి వెళ్ళాము.  వంద రూపాయలిస్తే గజారోహణం చేయిస్తున్నారు.  ఇదివరలో మహానుభావులను గజారోహణ సన్మానం తో గౌరవించేవారు. ఇప్పుడు వందరూపాయలకే స్వీయసన్మానం చేసుకోవచ్చన్నమాట! అక్కడి పార్కులు వగైరాలు చూసుకొని చీకటిపడ్డాక రూముకి చేరాం.  చలి కొరికేస్తోంది.  రూములో ఏసీ ఉందేమో, ఆపేద్దామని చూస్తే కనబడలేదు. ఓహో, హిల్ స్టేషన్‌ కదా, ఇక్కడ అవి ఉండవని గుర్తుతెచ్చుకున్నాం.  కాలు కిందపెడితే జివ్వుమనేలా ఉంది. అందుకే రూమంతా తివాచీ పరచి ఉంది.

మరునాడు ఉదయమే లేచి చూసేసరికి కిటికీ అద్దాలన్నీ మంచుతో నిండిపోయిఉన్నాయి. మళ్ళీ బయలుదేరి టీతోటలన్నీ తిరిగి చూసాం.  మున్నార్ కి సమీపం లో ‘మట్టుపెట్టి’ డాము ఉంది.  మేము దాన్ని ‘మట్టుపట్టి’ అని అంటువుంటే మా డ్రైవరు మట్టుపెట్టి అనాలి, మళయాళం లో పట్టి అంటే కుక్క అన్నాడు.  మట్టుపెట్టి అంటే మా తెలుగులో అర్థం భయంకరంగా ఉంటుంది లేవయ్యా అన్నాను. పేరెలాఉన్నా, అది చాలా అందమైన ప్రదేశం. దానికి దగ్గరలోనే Echo Point అని ఒకటిఉంది. అక్కడి నది ఒడ్డున నిలబడి అరిచినా, చప్పట్లుకొట్టినా ఆ శబ్దం చుట్టూఉన్న కొండల్లో ప్రతిధ్వనించి మనకు వినబడుతుంది.  అరవడానికి ఐదు రూపాయలు టిక్కెట్టు కూడా ఉంది! ఆ నదిలో నౌకావిహారానికి కూడా ఏర్పాటు ఉంది-పెడల్ బోట్లున్నాయి. అక్కడి నించి బయలుదేరి కానన్‌దేవి హిల్స్ మీదుగా ప్రకృతిసౌందర్యాలను ఆస్వాదిస్తూ కొత్తమంగళం మీదుగా తిరిగి కాలడి వీధుల్లో ప్రయాణించి కొచ్చిన్‌ చేరుకున్నాము. అక్కడినించి మళ్ళీ హైదరాబాద్‌ షంషాబాదు!  చూసి, ఆస్వాదించిన సౌందర్యమంతా ఇంకా స్మృతిపథంలోనే విహరిస్తోంది.  ఈ అందాన్ని మించిన గురువాయూరు కృష్ణుడి అందం స్థిరంగా హృదయం లో నాటుకుపోయింది!

Silver oak

అసలు కేరళరాష్ట్రమంతా ప్రకృతిసౌందర్యాలకు ఆలవాలమే! కుమరకోమ్‌ (కుమరగొమ్‌ అంటారు స్థానికులు) లో నౌకాగృహాల్లో ఉప్పునీటికాలువల్లో (backwaters) విహారం, కొచ్చిన్‌ నగరంలో మరైన్‌డ్రైవ్‌, హార్బరు, బేకాల్‌, కోవలం, త్రిచూర్ సమీపం లోని చవక్కాడ్‌ బీచిలూ, తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి ఆలయం, శబరిమల అన్నీ అద్భుతమైనవే! అష్టముడి లో పడవల పోటీలు జగద్విఖ్యాతిమైనవి. ఇక్కడ చెప్పుకోదగ్గది ప్రజల మతసహనం. హిందువులూ, మహమ్మదీయులూ, క్రైస్తవులూ అందరూ సమపాళ్ళలోనే ఉన్నట్టుంది ఇక్కడ. ఎప్పుడూ ఎలాంటి మతకలహాలూ జరిగినట్టు వినలేదు.  మన ఆలయాలను మించిపోయేలా ఉన్నాయి ఇక్కడి చర్చిలు. ఇక్కడి చర్చిల్లో చాలావాటిలో మన ఆలయాల్లోలాగే ధ్వజస్థంభాలుండడం విచిత్రంగా తోచింది నాకు.

కష్టపడి పనిచెయ్యడం ఎలాగో తెలిసిన వారు కేరళీయులు. మనదేశంలోనే కాదు, ప్రపంచం లో ఏ మూల చూసినా కనీసం ఒక్కడైనా ఈ ప్రదేశానికి చెందిన వ్యక్తి ఉంటాడు.  నేను చూసిన దాన్నిబట్టి చెప్పాలంటే, ఇక్కడి ప్రజలు అత్యధికభాగం ధనసంపన్నులు. కుటుంబానికి ఒకరైనా విదేశాల్లో ఉండి సంపాదించేవారే! ఎక్కువమంది మధ్యప్రాచ్య దేశాల్లో (Gulf countries) ఉన్నారు.  అందుకే అక్కడి గ్రామాలూ పట్టణాలూ చక్కటి ఇళ్ళతోనూ, విశాలమైన రోడ్లతోనూ చూడముచ్చటగా ఉన్నాయి. విద్యావంతులు అత్యధికంగా ఉన్నరాష్ట్రం కాబట్టి సంపాదించిన ధనాన్ని తమ ఇళ్ళనూ, ఊళ్ళనూ, రాష్ట్రాన్నీ అభివృధ్ధిపథం లో నడుపుకోడానికి సక్రమ పధ్ధతిలో ఉపయోగించుకుంటున్నారు.

***

రేల పూల గుండె ఘోష..

        సమ్మెట ఉమాదేవి

 

అమ్మ కథలు తరువాత నేను వెలువరిస్తున్న ఈ రేలపూలు నా రెండవ కధల సంపుటి. దాదాపు ఇందులోని కథాంశాలన్నీ యధార్థాలే. ఇందులోని కమ్లి.. చాంది.. అమ్రు.. కేస్లా..సాల్కీ.. చేర్యా.. తావుర్యా.. దివిలి.. జాలా ఇలా అందరూ వేరెే పేర్లతో నాకు ఏదో ఒక సమయంలో తటస్థపడిన వారే..

చిన్ననాట నాన్న ఉద్యోగరీత్యా..  నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో కొన్ని ప్రాంతాలలో నివాసమున్నాం.  ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా అడవుల్లో ప్రధమ స్థానంలో వున్న ఖమ్మంజిల్లాలోని చాలా మండలాలు తిరిగాను. నా ఉద్యోగ జీవితం నాకు ఎన్నో అనుభవాలను, అనుభూతులనూ ఇచ్చింది. పిల్లలను వదిలి బడివున్న ప్రాంతంలో వుండడంవల్ల.. బడిపిల్ల్లలు నా పిల్లలు అయ్యారు. వంటరిగా మైళ్ళ కొద్దీ నడిచిన వేళ.. ప్రకృతి నా నేస్తమయ్యింది. ఆకులో ఆకునై అని పాడుకుంటూ సాగిన నా ప్రయాణంలో.. నేను ఎదుర్కున్న ఆటు పోట్లు ఎన్నో.. నేను చూసిన బతుకు పాట్లు ఎన్నెన్నో..

ప్రస్థుతం నేను పని చేస్తున్న టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు, ఆ పరిసర ప్రాంతాలు చాలా అభివృద్ది చెందినవిగానే పరిగణించవచ్చు. కాని మారు మూల ప్రాంతాల్లో  గిరిజనులు నివాసముంటున్న తండా ప్రాంతాల్లో.. అర కొర సౌకర్యాల నడుమ చాలీ చాలీ చాలని ఆదాయంతో కాలం వెళ్ళదీసే వెతల బతుకులను ప్రత్యక్షంగా చూసాను. వాటినన్నింటినీ అక్షరబద్ధం చేయాలనుకున్న నా ప్రయత్నం ఇంత కాలానికి నెరవేరింది.

లాక్షణీకులు చేప్పే ప్రమాణాలలో నా కథలు వుండవచ్చు.. వుండక పోవచ్చు.. ఈ సంపుటిలో తండావాసుల సంస్కృతీ సంప్రదాయాలు, జీవనవిధానం అన్నీ కాచి వడబోసాను అని చెప్పడం లేదు. నా అనుభవంలోకి వచ్చిన సంఘటనలను, నన్ను కదిలించి, నా మనసును తొలిచేసి, నన్ను నన్నుగా నిలువనీయని అంశాలను, నాకు అనువైన పద్దతిలో కథలుగా మలుచుకున్నాను.  ఈ క్రమంలో అవి డాక్యుమెంటరీ రూపాన్ని సంతరించుకున్నవని ఎవరైనా అభిప్రాయ పడితే.. నేను బాధపడను. తండా వాసుల గాధలన్నీఏదో ఒక రూపాన అందరికీ చేరాలన్నదే నా ఉద్దేశ్యం.

uma

కారా మాస్టారితో…సమ్మెట ఉమాదేవి

 

నీవు ఎవరి గురించి రాస్తున్నావో వారు ఆ కథలు చదవరు. ఇంక ఎందుకు నీవు ఈ కథలు రాయడం..? ఇంత ఖర్చు పెట్టుకుని ఈ పుస్తకం వేయడం అన్న వారూ చాలా మంది వున్నారు. సమకాలీన పరిస్థితులను అక్షరబద్దం చేసి నిక్షిప్తపరచడం రచయిత విద్యుక్త ధర్మం. నేనూ, నాలాంటి వారెందలో అనునిత్యం విన్న.. కన్న.. అనుభూతించిన విషయాలను మిగతా ప్రపంచానికి తెలియాలంటే.. అవి కథలుగా మలచబడాలి అనుకున్నాను. మనం ఎవరి గురించి రాస్తున్నామో వాళ్ళు ఇవి చదవక పోవచ్చు.. కానీ ఈ సమాజంలో సాటి పౌరులుగా వున్న వారి గురించి తెలుసుకోవాల్సిన, పట్టించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా వున్నదని నేను నమ్ముతున్నాను.

అలాగని తండావాసుల రాజకీయ, సామాజిక జీవనాల్లో అకస్మాత్తుగా వచ్చిన పెను మార్పుల గురించో.. రావలిసిన విప్లవాల గురించో నేను రాయలేదు. నాది కేవలం ఉపరితల పరిశీలన అయివుండవచ్చు. అందుకే దీని పేరు అగ్నిపూలనో.. మోదుగ  పూలనో కాకుండా రేలపూలని పెట్టుకున్నాను. ప్రకృతిలో అత్యంత అందమైన పూలు.. రేలపూలు. ఇంగ్లీష్‌లో గోల్డెన్‌ షవర్‌, కాసియా ఫిస్టుల్లా అంటారు. వన దేవతకు కాసులపేరు వేస్తున్నట్లు రహదారిన.. పూలజల్లులు చల్లుతున్నట్లు వున్న ఈ రేలపూలు అడవికే అంకితమై పోతున్నాయి. జనం వాటిని పెంచి పోషించాలని, వాటిని కాపాడుకోవాలని నా తాపత్రయం.

ఈ కధలు.. మీలో తండావాసుల గురించిన ఆలోచనలకు తావిస్తే..మీ  మనసు పొరలను కాస్త కదిలించగలిగితే ..  మీ మదిని ఒకింత అలరించితే…నా ప్రయత్నం ఫలించినట్టే..

(ఈ నెల 25 న హైదరాబాద్ లో “రేలపూలు” ఆవిష్కరణ)

 

ధర్మగ్రహానికి భాష్యం!

 

పతంజలి కథల గురించి ఏం రాస్తాం? రాయటం అంటే, మళ్ళీ మనల్ని, మన బలహీనతల్నీ, బోలుతనాల్నీ, ఇంకెన్ని పరమ అధర్మాలూ ఘోరాలూ, చేయగలమో, అలాంటివాటిని, పాస్సీసాలో కొస్సారాలా చదువుకోవటమే. అయినా ఇక్కడ రెండు కథలు, నాకిష్టమైన రెండు కథల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

చూపున్న పాట :

ఇదొక మార్మిక కధనం. వొక గుడ్డివాడి పాట విన్న, వొక పోలీసు వాడి అసహనం..ఎందుకంటె, గుడ్డి లంజాకొడుకు పాడుతున్నది గద్దరు పాట.. అది చెప్తూ పతంజలి ఇలా అంటారు- “గుడ్డి వాడి పాటలు గరికపూలై ఆ రోడ్డునిండా గుట్టలు గుట్టలైతే విశ్వనాధం వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. గుడ్డివాడి పాటలు సీతాకోక చిలుకలై మబ్బుల్లాగా వీధినంతా ఆవరిస్తే విశ్వనాదం వాటిని చీల్చుకొని వెళ్ళిపోతాడు”

ఇంతకంటే, ఒక వాక్యంలో  విశ్వనాధం పాత్ర పరిచయం అవసరం కూడా లేదు. గుడ్డివాడు, ఏ దేవుడి పాటలో పాడాలి గానీ, ఈ గద్దర్ పాటలేంటి, పోలీసు బెదిరిస్తే, “గుడ్డికళ్ళ గుహల నుండి చీకటి చిమ్ముకొచ్చింది” అంటారు పతంజలి ..ఇంతకంటే వొక వల్నరబిలిటీని హృద్యంగా చెప్పటం కూడా ఆయనకే చెల్లింది.

దేవుడి పాటలు పాడితే భత్యం ఇప్పిస్తానన్న పోలీసు మాటకి.. మురళి వాయించే గుడ్డివాడి సమాధానం “..నేర్పిస్తే రాదండీ పాట.. మనం ఇనీసరికీ పాట మనల్ని తగులుకోవాలండీ .. అదండీ పాటంటే..”

గాయపడినా, రక్తం స్రవిస్తున్నా, వేణువు అణువణువునా కన్నాలైనా .. ఇష్టమైన పాట, వొక అస్తిత్వ వేదంలా, అదుముతున్న దాష్టీకాన్ని అడ్డుకోనేలా, పాట స్రవిస్తూనే ఉంటుంది.. పాట ఎన్నో అణచివేతల్నీ, వెతల్నీ ప్రశ్నిస్తూనే ఉంటుంది.. అధర్మాన్ని పాట భయపెట్టినంతగా మరేదీ భయపెట్టదు.

పతంజలి ధార్మిక ఆవేశం, ఈ కథలో మనల్ని మార్మికంగా కమ్ముకుంటుంది. నిస్సహాయత్వం తిరగబడితే, ఆ గాయం ఎంత భయపెట్టేదిగా ఉంటుందో చెప్పకనే చెప్తుంది ..!

 

మోటు మనిషి:

One of the easiest ways to Analyse a Peson is to Pre-judge him or her from the Apearance..! ఆ మాట ఎంత నిజం అనిపిస్తుంది , ఈ కథ చదివితే, ఇది ఎక్కువమంది చదివారో లేదో నాకు తెలీదు. వేట కథల చప్పుళ్ళలో ఇలాంటి కొన్ని మంచి కథలు పతంజలి గారివి మరుగున పడ్డాయి అన్న మాట మాత్రం నిజం.

సోడారం బస్సు ఎక్కినవాళ్లకి ఎలా ఉందో లేదో తెలీదు గానీ, ఇజీనారం పెజల్లో వొకదానిగా ..సోడారం బస్సు వాసన గుమ్మని తగిలీసినట్టుగా రాస్సీరు పతంజలి గోరు ఈ కతని. వొకానొక మోటుమనిషి, ఆ మనిషిని కించపరుస్తూ, చూసే మరో చదువుకున్న జీనియస్సు (అతని మాట్లల్లోనే ) .. అలాంటి మోటుమనిషి పక్కన కూర్చున్న జీనియస్సు మనస్సు ఎలా ఉంటుంది .. పెళ్లికెళ్ళి జోడు పోగొట్టుకున్నవాడిలాగ ఉంటుంది ( ఇవి కూడా రాజు గోరి మాటలే సుమండీ )

శుభ్రంగా భోంచేసి బస్సెక్కిన ఈ జీనియస్సు గారి భళ్ళున కక్కితే .. పతంజలి మాటల్లో చెప్పాలంటే  “.. నా తలని, గడ్డి తవ్వటానికీ, కట్టెలు చీల్చటానికీ, వేరు శెనగ మోటుగా వోలవటానికీ పుట్టాయనుకున్న మోటు చేతులే జాలిపడి ఆప్యాయంగా పట్టుకొని, దుమ్ముపట్టిన, తెగ మాసిన, అసహ్యకరమైన వొడిలోనే పడుకో బెట్టుకున్నాయి.”

సమాజంలో వైకల్యం అనాలో, నపుంసకత్వం అనాలో, లేదా ఇంకేం అనాలో తెలీని జాడ్యాల్ని, ఇంత నిండైన ధార్మిక ఆవేశంతో కడిగేయటం రావి శాస్త్రి తర్వాత పతంజలి గారి సొంతం అనాలి.

ఇది కేవలం వ్యంగ్యం మాత్రమే అనటం, వొక పవర్ఫుల్ సోషల్ స్నోబరీ ని .. డైవర్ట్ చేయటమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది ..!

ధర్మాగ్రహాన్ని, నిస్సహాయుల పట్ల కరుణనీ.. అంతే బాలన్సుడ్ గా చెప్పిన పతంజలిగారి ఋణం తెలుగు భాష, తెలుగు చదువరులు ఎప్పటికీ తీర్చుకోలేరు..!

అంతటి గొప్ప మనసుకి..ఆ అక్షరాల అనంత శక్తికీ..

వినమ్రతతో,

సాయి పద్మ

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్- 3

                       [ Anne of Green Gables by Lucy Maud Montgomery ]

 మాథ్యూ తలుపు తెరవగానే మెరిల్లా చర చరా నడుస్తూ ఎదురొచ్చింది. ఎర్రటి పొడుగాటి జడలతో, మిలమిలమంటున్న కళ్ళతో బిగుతైన గౌను లో ప్రత్యక్షమైన  ఆ వింత శాల్తీని చూసి నిర్ఘాంతపోయింది.

” మాథ్యూ కుత్ బర్ట్ , ఎవరిది ? పిల్లాడేడీ ? ”

” పిల్లాడెవడూ లేడు, ఉన్నది ఈమే   ” మాథ్యూ మొహం వేలాడేసుకుని పిల్లవైపు చూపించాడు…ఆమె పేరు కూడా కనుక్కోలేదని అప్పటికి తట్టింది అతనికి.

” ఏమిటీ …అబ్బాయి లేడా ? మనం  అబ్బాయిని కదా పంపమన్నాం ? ”

” ఏమో మరి. మిసెస్ స్పెన్సర్ ఈమెనే రైల్లోంచి దింపి  స్టేషన్ మాస్టర్ కి అప్పజెప్పిందట. అక్కడ వదిలేసి రాలేను గా, అది ఎవరి పొరబాటైనా ..”

” బాగానే ఉంది సంబడం ” మెరిల్లా చిరాకు పడింది.

పిల్ల , గుడ్లప్పగించి ఇద్దరి మొహాలూ మార్చి మార్చి చూస్తూ ఉంది…ఆమె మొహం మెల్లి మెల్లిగా వాడిపోయింది. ఒక్క పెట్టున అంతా అర్థమైపోయింది. సంచీ ని కిందికి వదిలేసి ఒక అడుగు ముందుకు వేసి కూలబడిపోయింది.

” నేను మీకు అక్కర్లేదా…! నేను మగపిల్లాడిని కాదు కాబట్టి ?నేనెప్పుడూ ఎవరికీ అక్కర్లేదు…నాకు ముందే  తెలియాల్సింది…ఇదంతా అంత బావుంది, ఎంతోసేపు ఉండదని ! నన్నెవరూ కావాలనుకోరు..ఏం చెయ్యను, ఏడుపొస్తోంది నాకు..”

బావురుమంది. చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మాథ్యూ , మెరిల్లా ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకుంటూ అయోమయంగా ఉండిపోయారు. కాసేపటికి మెరిల్లా అంది …

” లేదులే.  ఊరుకో .అంత ఏడవాల్సిన పనేముంది ?”

 

పిల్ల చప్పున తలెత్తింది…కన్నీళ్ళతో మొహం తడిసి పోయింది, పెదాలు వణుకుతున్నాయి . ” ఏడవాల్సినపని లేదా..ఎందుకు లేదూ ? మీరైనా ఇలాగే ఏడుస్తారు… మీరొక అనాథ అయిఉండి, ఒక ఇల్లు దొరికిందనుకున్నాక మీరు అబ్బాయి కాదు గనుక మిమ్మల్ని వద్దంటే. దేవుడా ! ఇంతకు మించిన బాధని  నా జన్మలో ఎరగను ! ” రోషంగా అంది.

మెరిల్లా కొంచెం అయిష్టంగా నవ్వింది. ఆ నవ్వు వాడక తుప్పు పట్టినదానిలా ఉంది.

” సరేలే. ఇంక ఏడవకు. ఇప్పటికిప్పుడు నిన్నేం గెంటెయ్యట్లేదుగా. రేపు పొద్దున్నే సంగతేమిటో కనుక్కుంటాం…ఇంతకీ నీ పేరేమిటి ? ”

పిల్ల కొంచెం తటపటాయించింది.

” ఏమనుకోకపోతే నన్ను కార్డీలియా అని పిలుస్తారా ? ”

” నిన్ను కార్డీలియా అని పిలవాలా ? నీ పేరు అదేనా ? ”

” కాదుగానీ…నన్ను అలా పిలిస్తే నాకు ఇష్టం. చాలా చక్కటి పేరు అది ! ”

” నువ్వనే దేమిటో నాకర్థం కావట్లేదు..నీ పేరు కార్డీలియా కాకపోతే , ఏమిటసలు ? ”

” ఆన్ షిర్లే ” ఆ పేరుకి సొంతదారు తడబడింది. ” నన్ను కార్డీలియా అనచ్చు కదా ? నేనిక్కడ కొంచెం సేపే కదా ఉంటాను..ఏ పోతుంది ? ఆన్ అంటే ఏబ్రాసి పేరులా ఉంటుంది ”

” ఏబ్రాసి పేరూ కాదు, ఏ మీ కాదు- ఆన్ శుభ్రమైన పేరు. నువ్వేం సిగ్గు పడక్కర్లేదు ఆ పేరున్నందుకు ” -మెరిల్లా కస్సుమంది.

” నేనేం సిగ్గు పడట్లేదు , కార్డీలియా అంటే బావుంటుందంటున్నానంతే. నేనెప్పుడూ….ఈ మధ్యైతే, నా పేరు అదేనని ఊహించుకుంటున్నాను. చిన్నప్పుడైతే గెరాల్డిన్ అనుకునేదాన్ని గాని, కార్డీలియా ఇంకా బావుంది కదా. నన్ను ఆన్ అని పిలిస్తే మాత్రం చివర ‘ ఇ ‘ తో స్పెల్ చేయ్యండీ ”

” స్పెల్లింగ్ ఎలా ఉంటే ఏమిటి ? ఏమిటి తేడా ? ” మెరిల్లా మళ్ళీ కొంచెం నవ్వుతూ అడిగింది.

” తేడా ఎందుకు లేదూ, బోలెడుంది. ఏదన్నా పేరు పిలుస్తుంటే  ఆ అక్షరాలు బుర్రలో అచ్చు వేసినట్లు కనిపించవూ మీకు ? ఎ-ఎన్- ఎన్..ఆన్ అంటే చెత్తలా ఉంటుంది. ఎ-ఎన్-ఎన్-ఇ ..ఆన్ అంటే  దర్జాగా ఉంటుంది. అలా ఐతే నన్ను ఆన్ అని పిలిచినా సర్దుకుంటా ” పిల్ల హామీ ఇచ్చింది.

” సరే ఐతే. ‘ ఇ ‘ అక్షరం ఉన్న ఆన్, ఇలా ఎందుకైందో చెప్పు. మేము అబ్బాయిని కదా పంపమన్నది ? అక్కడ అనాథాశ్రమం లో అబ్బాయిలెవరూ లేరా ? ” మెరిల్లా అడిగింది.

” ఎందుకు లేరూ..బోలెడు మంది ఉన్నారుగా ! మిసెస్ స్పెన్సర్ పదకొండేళ్ళ అమ్మాయి కావాలనే అడిగారట మరి , మాట్రన్ నేను సరి పోతానన్నారు. అబ్బ ! ఎంత సంతోషమేసిందో తెలుసాండీ ? రాత్రంతా నిద్రే పట్టలేదు. ”..ఆన్ , మాథ్యూ వైపుకి తిరిగి అంది -” ఇలా అని మీరు స్టేషన్ లోనే  ఎందుకు చెప్పలేదండీ ? నన్ను అక్కడే వదిలేసి ఉండాల్సింది మీరు…ఆహ్లాద శ్వేతమార్గాన్నీ ప్రకాశమాన సరోవరాన్నీ చూసి ఉండకపోతే ఇక్కడినుంచి వెళ్ళిపోవటం ఇంత కష్టంగా ఉండేది కాదు ”

” ఏమిటి అంటోంది ఈ పిల్ల ? ” మాథ్యూ ని నిలదీసింది మెరిల్లా.

” అబ్బే, ఏం లేదులే. దార్లో ఏవో మాట్లాడుకున్నాం ” మాథ్యూ బెరుగ్గా జవాబు చెప్పాడు..” నేను గుర్రాన్ని కట్టేసి వస్తాగానీ కాస్త టీ పెడతావా ? ”

అతను వెళ్ళిపోయాక మెరిల్లా కొనసాగించింది ” నిన్ను గాక మిసెస్ స్పెన్సర్ ఇంకెవర్నైనా తీసుకొచ్చిందా ? ”

” లిల్లీ జోన్స్ ని తెచ్చుకున్నారు, ఆవిడ కోసం. లిల్లీ కి ఐదేళ్ళే.. బ్రౌన్ రంగు జుట్టుతో చాలా ముద్దుగా ఉంటుంది. నాక్కూడా ఆ రంగు జుట్టుండి నేను కూడా ముద్దుగా ఉండిఉంటే నన్ను మీరు అట్టిపెట్టుకునేవారేనా ? ” ఆన్ ప్రశ్నించింది.

” లేదు, మాకు అబ్బాయే కావాలి. మాథ్యూ కి పొలం లో సాయం చెయ్యాలి. సర్లే, నీ టోపీ తీసి ఇవ్వు, నీ సంచీ తో బాటు హాల్లో బల్ల మీద పెడతాను ” – మెరిల్లా.

ఆన్ మెదలకుండా టోపీ తీసి ఇచ్చింది. మాథ్యూ వచ్చేశాడు. ముగ్గురూ భోజనానికి కూర్చున్నారు. కాని ఆన్ ఏమీ తినలేకపోయింది. బ్రెడ్ కొద్ది కొద్దిగా కొరుకుతూ వెన్ననీ ఆపిల్ జాం నీ కొంచెం నంజుతూ ఉండిపోయింది. ఏమీ ఎక్కట్లేదు ఆన్ కి.

” నువ్వేమీ తినట్లేదు ” అదొక పెద్ద లోపం లాగా అంది మెరిల్లా.

ఆన్ నిట్టూర్చింది. ” తినలేనండీ. నిరాశ లో కూరుకుపోయి ఉన్నాను కదా .నిరాశ లో కూరుకుపోతే ఎవరైనా తినగలరా చెప్పండి ? ”

” ఏమో. నాకేం తెలుసు ! నేనెప్పుడూ అలా కూరుకుపోలేదు మరి ”

” ఎప్పుడూ లేదా ? పోనీ అలా ఉన్నట్లు ఊహించుకున్నారా ? ”

”లేదు ”

book

” ఐతే మీకసలు అర్థం కాదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా తినబోతే గొంతుకేదో అడ్డం పడ్డట్లుంటుంది. దేన్నీ మింగలేం..చాకొలెట్ కారమెల్ నైనా సరే. ఒక్కసారి తిన్నాను చాకొలెట్ కారమెల్, రెండేళ్ళ కిందట..ఎంత బావుందో అది. బోలెడన్ని  తింటున్నట్లు కలలొస్తుంటాయి..సరిగ్గా నోట్లో పెట్టుకోబోతుంటే మెలకువొచ్చేస్తుందండీ. నేనేమీ తిననందుకు ఏం అనుకోకండేం. అన్నీ చాలా చాలా బావున్నాయి, కాని కష్టం, తినలేను ”

అప్పటివరకూ మాట్లాడని మాథ్యూ అన్నాడు ” బాగా అలిసిపోయినట్లుంది మెరిల్లా. పడుకోబెట్టరాదూ ? ”

మెరిల్లా ఆ పాటికే ఆ లోచిస్తోంది ఆన్ ని ఎక్కడ పడుకోబెట్టాలా అని. ఎవరో అబ్బాయి వస్తాడని వంటింట్లో  చిన్న మంచం, పక్క వేసి ఉంచింది. అది శుభ్రంగానే ఉందనిపించినా ఎందుకనో అక్కడొక ఆడపిల్ల పడుకోకూడదేమోననిపించింది. ఎవరైనా అతిథులు వస్తే వాడే గదిలో ఈ దారే పోయే పిల్లని ఉంచటం మెరిల్లాకి నచ్చలేదు. ఇక మిగిలింది మేడ మీది  తూర్పు వైపు గది. మెరిల్లా ఒక కొవ్వొత్తి వెలిగించి పట్టుకుని ఆన్ ని తనతో రమ్మంది.  తన టోపీ, సంచీ తీసుకుని ఆన్ నీరసంగా బయల్దేరింది. హాల్ అంతా మరీ శుభ్రంగా ఉంది, ఆన్ కి కాస్త భయమేసింది. తూర్పు వైపు గది ఇంకా శుభ్రంగా ఉన్నట్లుంది.

మెరిల్లా కొవ్వొత్తిని అక్కడున్న ముక్కాలిపీట మీద  పెట్టి దుప్పట్లు సరిచేసింది.

” నైట్ గౌన్ ఉందా నీకు ? ” ఆన్ ని అడిగింది.

” ఆ.రెండున్నాయి. మాట్రన్ కుట్టించారు. బాగా పొట్టిగా ఉంటాయి. అక్కడ అన్నీ అలా చాలీ చాలకుండానే ఉంటాయనుకోండీ. నాకీ నైట్ గౌన్ లు చాలా చిరాకు, ఐతే అవి వేసుకున్నప్పుడు కుచ్చులు కుచ్చులుగా జీరాడే సిల్క్ నైట్ గౌన్ లు వేసుకున్నట్లు ఊహించుకుంటాను, అప్పుడు కొంచెం పర్వాలేదు. ”

” ఊ.ఐతే త్వరగా బట్టలు మార్చుకో.కాసేపట్లో  వచ్చి కొవ్వొత్తి తీసుకువెళతాను. నీ దగ్గర వదిల్తే దేనికైనా అంటించెయ్యగలవు ”

మెరిల్లా వెళ్ళగానే ఆన్ దిగులుగా చుట్టూ చూసింది. తెల్లగా సున్నం వేసిన గోడలు బోసిగా ఉన్నాయి, వాటి బోసితనానికి వాటికే బాధగా ఉందేమోననుకుంది ఆన్. నేల కూడా బోసి గానే ఉంది, మధ్యలో ఒక చాప తప్ప. ఒక పక్కన ఎత్తుగా పాతకాలపు పందిరి మంచం. ఇంకోపక్కన గోడకి ఆరూ ఇంటూ ఎనిమిది కొలతతో అద్దం. దాని పక్కనే వాష్ స్టాండ్. ఆన్ కి అటూ ఇటూ కదల్లేనట్లూ ఊపిరాడనట్లూ అనిపించిందెందుకో. ఏడుపు తన్నుకొచ్చింది. ఎక్కిళ్ళు దిగమింగి బట్టలు మార్చుకుని పక్క మీదికి ఎక్కి దుప్పటి తలదాకా లాగి ముసుగు పెట్టుకుంది. కాసేపటికి మెరిల్లా ఆ గదిలోకి వచ్చినప్పుడు చెల్లా చెదురుగా పడేసి ఉన్న చిన్ని చిన్ని బట్టలూ మెల్లిగా ఊపిరి తీసుకు వదులుతున్న శబ్దమూ తప్ప అక్కడ మరో మనిషి ఉన్న జాడే లేదు.

ఆ బట్టలన్నీ ఒక్కొక్కటీ తీసి మడత పెట్టి పసుపురంగు వేసిన కుర్చీ మీద పెట్టింది మెరిల్లా. పక్క దగ్గరికి వెళ్ళి , ” గుడ్ నైట్ ” అంది. కొంచెం ఇబ్బంది పడుతూ , కాని మెత్తగానే అంది.

దుప్పటి పైనుంచి పాలిపోయిన ఆన్ మొహం, ఉలిక్కిపడిన కళ్ళతో  తొంగి చూసింది.

” గుడ్ నైట్ అని ఎలా అంటారండీ ? నాకిది చాలా చాలా చెడ్డ రాత్రి ” ఆన్ నిరసనగా అంది.

అని మళ్ళీ దుప్పట్లోకి మాయమైంది.

unmade_bed-copy (1)

మెరిల్లా చిన్నగా వంటింట్లోకి వెళ్ళి గిన్నెలు కడగటం మొదలెట్టింది. మాథ్యూ పైప్  వెలిగించాడు, అంటే ఆందోళనగా ఉన్నాడని అర్థం. అతనికి పొగ తాగటం అలవాటు కాదు, మెరిల్లాకి నచ్చదు- కాని ఇలాంటప్పుడు తప్పదు. మెరిల్లా కూడా చూసీ చూడనట్టు ఊరుకుంటుంది, మగవాడు  కదా అతను , పాపం –  ఏ ఉద్వేగాన్నీ బయటపెట్టుకోలేడు.

మెరిల్లా అంది- ” బాగా ఇరుకున పడ్డాం కదా…మన పని మనం చక్కబెట్టుకోకుండా ఎవరి చేతనో కబురు పెడితే ఇలాగే ఉంటుంది. ఆ రిచర్డ్ స్పెన్సర్ వాళ్ళు అంతా మార్చేశారు. రేపు వెళ్ళి తేల్చుకోవాలి, పిల్లని వెనక్కి పంపించెయ్యాలి ”

” ఆ. అంతేనేమో  ” అన్నాడు మాథ్యూ  ఆ మాటలేమంత నచ్చనట్లుగా.

” ఏ- మో- నా ? ” మెరిల్లా రెట్టించింది… ” నీకు తెలీదా ? ”

మాథ్యూ అన్నాడు – ” ఏం లేదూ, పాపం బుజ్జి పిల్ల ముచ్చటగా లేదూ ? ఇక్కడే ఉండిపోదామని వచ్చిందే,  మనం వెనక్కి పంపించటం బావుంటుందా అని ”

” మాథ్యూ కుత్ బర్ట్ , ఏమిటి నువ్వనేది ? పిల్లని మనం ఉంచేసుకోవాలనా ? ” మెరిల్లా విస్తుపోయింది…మాథ్యూ తల కిందులుగా నడవబోతున్నానని చెప్పి ఉన్నా అంత ఆశ్చర పడి ఉండదేమో.

” అబ్బే, అలా అనేం కాదూ ” చెల్లెలు పసిగట్టేసినందుకు మాథ్యూ తబ్బిబ్బయ్యాడు…” ఎలా ఉంచేసుకుంటాం లే, ఐనా ” అన్నాడు.

మెరిల్లా- ” అవును, ఎలా ఉంచుకుంటాం ? మనకేం ఒరుగుతుంది  ? ”

మాథ్యూ ” తనకి ఒరుగుతుందేమో , మననుంచి ” అనేసి నాలిక కరుచుకున్నాడు.

” మాథ్యూ కుత్ బర్ట్ , ఈ పిల్లేదో మంత్రం వేసింది నీకు…నీకు ఉంచేసుకోవాలని ఉందని నాకు చక్కగా తెలిసిపోతోంది ”

marilla-cuthbert-is-surprised (2)

మాథ్యూ ” ఊ. భలే పిల్ల తను…దార్లో ఎన్ని కబుర్లు చెప్పిందో..నువ్వు విని ఉండాల్సింది ”

” ఆ. చక చకానే చెబుతోందిలే, కబుర్లకేమీ ! అదేం మంచి లక్షణం కాదు. చిన్న పిల్లకి అన్ని మాటలెందుకసలు ? నాకు అ నాథ పిల్ల వద్దు, అందులోనూ ఇలాంటి పిల్ల వద్దే వద్దు.  రేపు తిరుగు టపాలో పంపించెయ్యాల్సిందే ”

మాథ్యూ నచ్చజెప్పబోయాడు – ” పొలం పనికి నేనెవరన్నా కుర్రాడిని కుదుర్చుకుంటాలే మెరిల్లా,  నీకు తోడుగా ఉంటుంది…”

” నాకు ఏ- తో- డూ   అక్కర్లేదు, ఈ పిల్లని నేను ఉంచుకోబోవటం లేదు ” మెరిల్లా రుస రుసలాడింది.

” సరే, నీ ఇష్టం. ” పైప్ పక్కన పెట్టి అన్నాడు మాథ్యూ..” నేను వెళ్ళి నిద్రపోతాను ”

మాథ్యూ నిద్రపోయాడు. మొహం చిట్లించుకుని, గిన్నెలు అలాగే వదిలేసి , బిగువుగా వెళ్ళి మెరిల్లా నిద్రపోయింది. మేడ మీద తూర్పు వైపు గదిలో  ప్రేమకి మొహం వాచి ఉన్న ఆ ఒంటరి ప్రాణి ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది.

                                                                                    [ ఇంకా ఉంది ]