గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ [Anne of Green Gables ]

 – లూసీ మాడ్ మాంట్ గోమరీ    [ L.M. Montgomery ]

[ లూసీ మాడ్ మాంట్ గోమరీ[ 1874-1942 ]  ప్రసిద్ధ కెనడియన్ రచయిత్రి. తర్వాతి కాలం లో  9 నుంచి పన్నెండేళ్ళ పిల్లల సాహిత్యంగా గుర్తించబడినా ఆమె రచనలు వయోభేదానికి అతీతంగా అందరూ చదవదగినవి…అందమైన మానవసంబంధాలు , వ్యక్తిగతమైన ఎదుగుదల, ప్రకృతితోనూ  పరిసరాలతోనూ లయ కల్పించుకోవటం – ఆమె కథా వస్తువులు. ఆమె స్వయం గా పుట్టి పెరిగిన Prince Edward Island  చాలా రచనలకు నేపథ్యం .

  Anne of Green Gables 1908 లో రాయబడింది, ఎప్పుడూ out of print  కాలేదు. 20 భాషలలోకి అనువాదమైంది, 50 మిలియన్ లకు పైబడిన కాపీలు అమ్ముడు పోయింది. ప్రపంచమంతా సాహిత్యాధ్యయనం లో భాగమైంది. సినిమాలుగా టివి సీరీస్ లు గా సంగీత రూపకాలుగా ఈ నవల, దాని తరువాయి భాగాలు తయారవుతూనే ఉంటాయి.]

anne1

అవోన్లియా పల్లెటూళ్ళో  ఆ  వీధి మిసెస్ లిండ్ఇంటి  మీదుగా   కాస్త పల్లానికి దిగి   వెళుతుంది.    ఆ పక్కా ఈ పక్కా ఆల్డర్ పూల చెట్లూ ఫ్యూషియా మొక్కలూ . కొండలమీది అడవుల్లో పుట్టిన సెలయేరు ఒకటి  ఆ పక్కగా వస్తుంటుంది.  అంతకుముందరేమైనా  అల్లరిగా  గంతులేసినా   మిసెస్ లిండ్ ఇంటి దగ్గరికి వచ్చెసరికి సెలయేరు కూడా  నెమ్మదిగా, మర్యాదగా ఉండాల్సిందే…కిటికీ పక్కనే కూర్చుని ఆవిడ వచ్చేపోయే వాళ్ళందరి మీదా ఒక కన్ను వేసే ఉంచుతుంది మరి ! ఏది ఏమాత్రం తేడా గా కనిపించినా దాని సంగతంతా మొదలంటా కనుక్కోనిదే ఆవిడ ఊరుకోదు.

ఆ ఊళ్ళో – వాళ్ళ పనులు మానేసుకుని అయినా పక్కవాళ్ళ గొడవలు పట్టించుకోగలవాళ్ళు చాలా మందే ఉన్నారు. మిసెస్ లిండ్ అలా కాదు- ఆవిడ ఎంతో పద్ధతైన ఇల్లాలు , ఏ వంకా లేకుండా పనులు చక్కబెట్టుకుంటుంది. ఆ పైన  కుట్టు తరగతులూ పిల్లలకి ఆదివారం బడీ  చర్చ్ తరపున చేసే దానధర్మాలూ ప్రచారాలూ – ఏవీ ఆవిడ లేకుండా జరగవు.  ఇంత చేసీ వంటింటి కిటికీలో బొంత కుట్టుకుంటూ కూర్చుని ఊరి మంచీ చెడ్డా కనిపెట్టేందుకు ఆవిడకి చాలా  తీరుబడి ఉంటుంది. [  అప్పటికి పదహారు బొంతలు అటువంటివి కుట్టిందనీ ఆ చుట్టుపక్కల ఆ విషయం లో సాటి ఎవరూ లేరనీ చెప్పుకుంటారు  ] . అవోన్లియా  కి రెండు వైపులా సముద్రం , ఒక వైపు కొండ.  ఊరు ఇంచుమించు ముక్కోణపు ఆకారం లో ఉంటుంది.

ఒక జూన్ నెల మధ్యాహ్నం మిసెస్ లిండ్ ఎప్పట్లాగే వంటింటి కిటికీ పక్కన కూర్చుని ఉంది. సూర్యుడు వెచ్చగా వెలుగుతున్నాడు. కొండవాలు మీది తోటలో పువ్వులు లేత గులాబి రంగులో విచ్చుకున్నాయి , తే నెటీగలు  రొద పెడుతున్నాయి.  పొట్టిగా , మెతకగా ఉండే   థామస్ లిండ్ [మిసెస్ లిండ్ భర్త ] పొలం లో టర్నిప్ గింజలు పాతుతున్నాడు. ఆ చివరన గ్రీన్ గేబుల్స్ దగ్గర మాథ్యూ కుత్ బర్ట్  కూడా ఆ పనే చేయాల్సి ఉంది,ఎవరో అడిగితే పొద్దున చెప్పాడటకూడా [ అడగనిదే ఎవరితోనూ ఏమీ చెప్పడు ]…కాని మాథ్యూ  అప్పుడు పొలం లో లేడు. మధ్యాహ్నం మూడున్నరకి , మంచి పనివేళన- మంచి సూట్ వేసుకుని తయారై నిదానం గా గుర్రపు బండి లో బయల్దేరాడు- ఎక్కడికి ? ఎందుకు ?

అది ఇంకెవరైనా అయిఉంటే , మిసెస్ లిండ్ చిలవలూ పలవలూ అల్లి ఉండేది. కాని మాథ్యూ చాలా సిగ్గరి, ఇంట్లోంచి బయటికే వెళ్ళడు. కొత్తవాళ్ళని పలకరించాలంటే ఆమడ దూరం లో ఉంటాడు. అలాంటి మనిషి ఏమిటిలా…మిసెస్ లిండ్ కి బుర్ర తోచలేదు, చేతిలో పని సాగలేదు. ” గ్రీన్ గేబుల్స్ కి వెళ్ళి మెరిల్లా ని అడిగితే సరి. టర్నిప్ గింజల కోసం అయితే ఇలా ముస్తాబు చేసుకుని వెళ్ళడు కదా ? ఏ డాక్టర్ దగ్గరికో అయితే ఇంత నింపాదిగా కదలడు కదా ? ఏదో అయింది, ఏదో జరిగింది- ” …బయల్దేరింది. వీళ్ళ ఇంటికీ గ్రీన్ గేబుల్స్ కీ అర మైలు దూరం కూడా లేదు. గ్రీన్ గేబుల్స్ బాగా పెద్ద ఇల్లు.చుట్టూ పెద్ద తోట. ఆ ఇల్లు  మాథ్యూ నాన్న కట్టినది. ఆయనా కొడుకు లాగే సిగ్గరి. మరీ అడవిలో ఉండలేడు కనుక అందరికీ వీలైనంత దూరంగా , పొలానికి ఆ చివర్న ఇల్లు కట్టుకున్నాడు. చెట్ల చాటునుంచి అది ఒక పట్టాన ఎవరికీ కనబడేలా ఉండదు.

గడ్డి ఒత్తుగా పెరిగిన బాటకి అటూ ఇటూ అడవి గులాబి పొదలు విరబూసి ఉన్నాయి. ఆ ఇల్లు దగ్గర పడే కొద్దీ చడీ చప్పుడూ మాయమవుతాయి . మిసెస్ లిండ్ అనుకుంది – ” ఏమిటో ఈ ఇల్లు..ఎన్ని చెట్లుంటే మాత్రం, అవేమన్నా కబుర్లు చెబుతాయా ? ఎలా ఉంటారో అన్నా చెల్లెలూ ఇక్కడ ! ఏదో సామెత చెప్పినట్లు, దేనికైనా అలవాటు పడిపోవచ్చటలే … నా వల్లయితే కాదబ్బా ! ” పెరటి గుమ్మం లోంచి లోపలికి వెళ్ళింది. అద్దంలా తీర్చిదిద్దినట్లు,  పచ్చగా కళకళలాడుతోంది  పెరడు.  ఒక వైపున భారీగా ఎదిగిన విల్లో వృక్షాలూ ఇంకో వైపున మట్టసం గా లోంబార్డీ చెట్లూ. మెరిల్లా ఇల్లు చిమ్మినంత శ్రద్ధగా చిమ్ముతుందేమో పెరడంతా, నేల  మీద వడ్డించుకుని భోజనం చేసేంత శుభ్రంగా  ఉంటుంది.

తలుపు కొట్టి లోపలికి, వంటింట్లోకి  అడుగు పెట్టింది మిసెస్ లిండ్.   పడమటి  వైపు కిటికీ లోంచి మెత్తటి సూర్యకాంతి కురుస్తోంది. తూర్పు వైపు కిటికీకి ఆకుపసుపు తీగలు అల్లిబిల్లిగా అల్లుకున్నాయి..వాటిలోంచి  లోంచి పూత పట్టిన చెర్రీ చెట్టు ఊగుతూంది, బర్చ్ చెట్లు నాజూగ్గా తలలూపుతున్నాయి. మెరిల్లా కుత్ బర్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుంటుంది [ ఖాళీ గా ఉండటమంటూ ఉంటే ] . అప్పుడూ కూర్చుని ఉంది, పెద్దమనిషి తరహాగా, ఊలు అల్లుకుంటూ. సూర్యకిరణాలు బాధ్యత లేకుండా అలా చిందులేయచ్చా అనుకోగల మనిషి ఆమె,  అంత కట్టుదిట్టమైనది.

మిసెస్ లిండ్ వస్తూనే అంతా గమనించింది. ..ఎదురుగా బల్ల మీద ముగ్గురి కోసం భోజనం వడ్డించి ఉంది.ఎవరో అతిథులు వస్తారు కాబోలు, కాని ప్రత్యేకంగా చేసిన పదార్థాలేవీ లేవు, రోజువారీవే, ఒక్క క్రాబ్ ఆపిల్ కేక్ తప్పించి. మరయితే ఆ మాథ్యూ హడావిడి ఎందుకోసం ? మిసెస్ లిండ్ ప్రాణానికి అదొక గొప్ప రహస్యమనిపించింది.

మిసెస్ లిండ్ ని ఆహ్వానించింది మెరిల్లా  – ” గుడ్ ఈవెనింగ్  రాచెల్. రా, కూర్చో. ఎలా ఉన్నారు అందరూ ? ”

మెరిల్లా కుత్ బర్ట్ కీ రాచెల్ లిండ్ కీ మధ్య ఉన్నదాన్ని స్నేహం అనచ్చో లేదో కాని ఇద్దరూ దగ్గరివాళ్ళు మాత్రం అవును.

మెరిల్లా సన్నగా పొడుగ్గా బద్దలాగా ఉంటుంది. అక్కడక్కడా తెల్లబడ్డ జుట్టుని వెనక్కి లాగి ముడి పెట్టింది. పొడుచుకొచ్చే రెండు చెంప పిన్నులు అటూ ఇటూ దూర్చింది. ఎక్కువ ప్రపంచాన్ని చూడని మనిషి లాగా, పాతకాలం గా , కనిపిస్తుంది. ఆమె పెదవులలో మాత్రం ఎక్కడో లీలగా హాస్య ప్రియత్వం తెలుస్తుంటుంది.

మిసెస్ లిండ్ అంది – ” అందరం బా గా నే ఉన్నాంలే..మీ సంగతేమిటి ? మాథ్యూ అలా వెళ్తున్నాడేమిటీ ? కొంపదీసి డాక్టర్ కోసమైతే కాదుగదా ? ”

మెరిల్లా పెదవులు కొంచెం విచ్చుకున్నాయి. రాచెల్ లిండ్ ఇహనో ఇప్పుడో వచ్చేస్తుందని ఆమె అనుకుంటూనే ఉంది, అంత కుతూహలాన్ని ఆవిడ తట్టుకోలేదని మెరిల్లాకి తెలుసు.

anne3

” అదేమీ లేదు రాచెల్. కాస్త తలనొప్పిగా ఉందిగాని నేను బాగానే ఉన్నాను. నోవా స్కోటియా లో అనాథాశ్రమం ఉంది కదా, అక్కడినుంచి ఒక చిన్న పిల్లాడు   ఇవాళ సాయంత్రం రైల్లో వస్తాడు . పెంచుకుందామని తెచ్చుకుంటున్నాం ” – చెప్పేసింది.

ఆస్ట్రేలియానుంచి వచ్చే ఒక కంగారూని మాథ్యూ కలుసుకునేందుకు వెళ్ళాడని విన్నా రాచెల్ లిండ్ అంత ఆశ్చర్యపడిఉండదు.ఐదారు క్షణాలపాటు మాట కూడా పెగల్లేదు.  మెరిల్లా వేళాకోళం చేసే మనిషి కాదు, కాని అలాగే ఉంది చూడబోతే.

కాస్త తేరుకుని అంది – ” నిజమేనా మెరిల్లా ? ”

” ఆ.నిజమే ” యథాలాపంగా అంది మెరిల్లా… గిరిగీసుకున్నట్లుండే  అవోన్లియా లో అనాథాశ్రమాల్లోంచి అబ్బాయిలని పెంచుకుందుకు తెచ్చుకోవటం చాలా మామూలైన విషయం అన్నట్లు.

మిసెస్ లిండ్ పెద్ద కుదుపు తగిలినదానిలా అయింది. అనాథ పిల్లాడా  ? మెరిల్లా , మాథ్యూలు పెంచుకుంటారా ? ఇదేం విపరీతం ?? ఇహ  మీదట ఎలాంటి  వార్త విన్నా వింత ఉండదని అనుకుంది ఆవిడ.

” మీకసలు అలా ఎందుకనిపించింది మెరిల్లా ? ” నిరసనగా అడిగింది . మిసెస్ లిండ్ సలహా తీసుకుని ఆ పని తలపెట్టలేదు కనుక నిరసన ప్రకటించి తీరాలి ఆవిడ.

” ఒక్కసారిగా కాదులే, చాలా రోజులనుంచీ అనుకుంటున్నాం. మొన్న క్రిస్మస్ కి  మిసెస్ అలెక్జాండర్ స్పెన్సర్ వచ్చింది చూడు, తను చెప్పింది- హోప్ లో అనాథాశ్రమం నుంచి ఒక అమ్మాయిని తెచ్చి పెంచుకుంటున్నానని, ఈ పాటికి తెచ్చుకునే ఉంటుంది. అప్పుడనుకున్నాం, ఒక అబ్బాయిని పెంచుకోవాలని. మాథ్యూ కూడా పెద్దవాడైపోతున్నాడు, అరవై నిండాయి. ఇదివరకట్లా పనిచేయలేకపోతున్నాడు పాపం. కాస్త సాయం చేసి పెట్టేందుకు సరైన మనుషులే దొరకట్లేదు. ఎవరో దొరికి వాళ్ళకి కాస్త పని నేర్పించే లోపు  పట్నాల కి వెళ్ళిపోతున్నారాయె. మిసెస్ స్పెన్సర్ ని , ఆమె వెళ్ళినప్పుడు మాకూ ఒక పది పదకొండేళ్ళ అబ్బాయిని వెతికి పెట్టమన్నాం, కాస్త చురుకైన వాణ్ణి. ఆ వయసైతే కాస్త పని అందుకోగలరు, చెబితే వింటారు. ఇంట్లో పెట్టుకుని , రోజూ బడికి పంపించి చదివిస్తాం వాడిని. మిసెస్ స్పెన్సర్ ఇచ్చిన టెలిగ్రాం నిన్న వచ్చింది, ఇవాళ సాయంత్రం అయిదున్నర కి పిల్లాడిని ఇక్కడ బ్రైట్ రివర్  స్టేషన్ లో దిగబెడుతున్నట్లు ‘’-మెరిల్లా చెప్పుకొచ్చింది.

తనెప్పుడూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలనని మిసెస్ లిండ్ కి నమ్మకం. కాస్త నిభాయించుకుని తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటించింది .

” అది కాదు మెరిల్లా, ఇదెంత పిచ్చి పనో తెలుస్తోందా మీకు ? సాహసం కూడానూ…ఎవరో దారేపోయేవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా చెప్పు ? వాడెవరో ఏమిటో, వాడి అమ్మా నాన్నా ఎలాంటివాళ్ళో, రాను రాను ఎలా తయారవుతాడో ? నిన్నగాక మొన్న పేపర్ లో చూశాను, ఒక భార్యా భర్తా ఇలాగే ఎవర్నో తెచ్చి పెంచుకుంటుంటే ఆ దరిద్రుడు  అర్థరాత్రి కొంపకి నిప్పెట్టాడట, కావాలనే పెట్టాడు తెలుసా ? ఇద్దరూ మంటల్లో కాలి బుగ్గయిపోయారు పాపం. అంత కాకపోయినా,  ఇంకొక చోట ఇలాంటివాడే దొంగతనాలు మరిగాడట, వాణ్ణి వదిలించుకోలేక పెంచుకునేవాళ్ళకి తల ప్రాణం తోకకొస్తోంది.  నాకొక్క మాటైనా చెప్పలేదు మీరు…తప్పకుండా వద్దని ఉండేదాన్ని ”

ఈ హితబోధ మెరిల్లా మీద ఏమీ పని చేసినట్లు లేదు, ఆమె శాంతంగా ఊలు అల్లుకుంటూ జవాబిచ్చింది.

” నువ్వనేదాంట్లో నిజం ఉందిలే రాచెల్, నాకూ కొంచెం భయం గానే ఉండింది- కాని మాథ్యూ బాగా పట్టుపట్టాడు. నీకు తెలుసుగా, మామూలుగా ఏదీ గట్టిగా అడగడు – అందుకు ఒప్పుకున్నాను. అపాయాలంటావా, ఎక్కడ లేవు చెప్పు ? సొంత పిల్లలైతే మటుకు పెద్దయాక వెధవలు  కారని ఏముంది ? నోవా స్కోటియా మనకి దగ్గరే- ఇంగ్లాండో, అమెరికానో కాదుగా.. వాడూ మనలాంటి వాడే అయిఉంటాడు కదా ? ”

మిసెస్ లిండ్  కొనసాగించింది – ” సరేలే, ఏదో ఒకటి. అంతా బావుంటుందనే అనుకుందాం. వాడు రేపేదైనా అఘాయిత్యం  చేస్తే – నేను చెప్పలేదని మాత్రం అనుకోకు…ఇంటికి నిప్పు పెట్టటమో, బావిలో విషం కలపటమో- అలాంటిదేదో. అక్కడెక్కడో ఇలాగే ఇంటిల్లిపాదీ ఆ నీళ్ళు తాగి మెలికలు తిరిగి చచ్చారట…పెంచుకుంటున్న ఆడ పిల్ల చేసింది ఆ పని. ”

మెరిల్లా అంది ” మేము పెంచుకునేది ఆడపిల్లని కాదు గా ” అని, ఆ బావిలో విషం కలపటమనే పని ఆడపిల్లలే చేస్తారు, మగపిల్లలు చెయ్యలేరన్నట్లు. మళ్ళీ అంది – ” ఆ మిసెస్ స్పెన్సర్ ఆడపిల్లని ఎందుకు పెంచుకుంటోందో నాకు చచ్చినా అర్థం కాదు , విడ్డూరపు మనిషి ”

మాథ్యూ ఆ పిల్లాడిని వెంటబెట్టుకొచ్చే వరకూ ఉందామనే మిసెస్ లిండ్ అనుకుంది, కాని అందుకు కనీసం ఇంకొక రెండు గంటలు పడుతుంది. ఈ లోపు అలా బయటికి వెళ్ళి ఎవరో ఒకరి చెవిలో ఈ మాట వేయచ్చు, మంచి హడావిడయిపోతుంది. అటువంటి అలజళ్ళు సృష్టించటమంటే మిసెస్ లిండ్ కి ఎంతో ప్రీతి…మెల్లిగా జారుకుంది. మెరిల్లా ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది..మి సెస్ లిండ్ ఉన్నంతసేపూ మెరిల్లా  భయాలూ అనుమానాలూ ఎక్కువైపోతూనే ఉన్నాయి.

దారి వెంట పోతూ మిసెస్ లిండ్ పైకే అనేసుకుంది – ” ఏమన్నా నమ్మేటట్లుందా  ఇది ?   ఆ పిల్లాడెవరో గానీ , వాడి పనైపోతుంది ఇంక – మెరిల్లాకీ మాథ్యూ కీ పిల్లల్ని పెంచటం ఒక్క రవ్వైనా తెలుసా అని ! ఆ చిన్న వెధవ , వాడి తాతయ్య అంత కుదురుగా తెలివిగా ఉండాలనుకుంటారు వీళ్ళు – పాపం వాడికసలు తాతయ్య ఉన్నాడో లేదో. అసలా గ్రీన్ గేబుల్స్ లో చిన్న పిల్లాడిని ఊహించుకుందుకే కష్టంగా ఉంది. ఆ ఇల్లు కట్టే నాటికే మాథ్యూ మెరిల్లా ఎదిగిపోయారు. వాళ్ళ మొహాలు చూస్తే అసలొకనాడు వాళ్ళూ పిల్లలేనని అనిపించదు కదా . ఆ పిల్లాడెలా నెగ్గుకొస్తాడో ఏమిటో ”

బ్రైట్ రివర్ స్టేషన్ లో దిగి మాథ్యూ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్న ఆ చిన్న శాల్తీని గాని మిసెస్ లిండ్ అప్పుడు చూసి ఉంటే ఇంకెంత జాలిపడేదో !!!

                                           [ఇంకా ఉంది]

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. కధ లోని నలుగురు వ్యక్తులు , వారి పరిసరాలు , మనస్తత్వాలు కొన్ని వాక్యాలతో వేసిన పెయింటింగ్ లాగా అద్భుతంగా ఉంది . ఎప్పటిలా అందమైన ముగింపు కోసం వెదికిన మాకు ‘ప్రియమైన సశేషం ‘ ఇంకా బావుంది . Waiting to meet the other characters of the beautiful story Mam! TQ

  2. నాకు ఎంతో బాగా నచ్చిన రచయిత్రి లూసీ మాడ్ మాంట్ గోమరీ. ఆ మద్య ఎమిలీ అఫ్ న్యూ మూన్ సిరీస్ చదివేపుడు.. ఎంత ఆత్రుతగా రాత్రంతా కూర్చొని చదివేసానో!! ఈ వారం గాజు కెరటాలలో ఆమెని (లూసీ మాడ్ మాంట్ గోమరీ) చూడగానే భలే సంతోషం అనిపించింది. ఆమె సిరీస్ తెలుగులో ఎవరు రాస్తే బాగుణ్ణు అనుకొంటానో, వారే రాస్తున్నారు. ఇంకేం, పండగే కదా!!

  3. Mythili abbaraju says:

    థాంక్ యూ సురేష్ !

మీ మాటలు

*