అమ్మ భక్తుడు ఆదిశంకరుడు 

 కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నాకు తత్వశాస్త్రంతో పరిచయం తక్కువ. ఇతరేతర ఆసక్తులది పై చేయి అవడంవల్ల అందులోకి పెద్దగా తలదూర్చే అవకాశం కలగలేదు. కానీ ఈ వ్యాసాల క్రమంలో రేఖామాత్రంగానైనా తత్వశాస్త్ర అంశాలలోకి వెళ్లవలసిన అవసరం కనిపిస్తూ వచ్చింది. పరిమిత పుస్తకజ్ఞానానికి  అనుభవజ్ఞానాన్ని జోడించి వీలైనంతవరకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా పొరపాట్లు దొర్లే అవకాశాన్ని కాదనలేను. దిద్దుబాటుకు జాగా కల్పించుకుంటూ విషయంలోకి వస్తాను.

మనకిప్పుడు స్థూలంగా రెండురకాల తాత్విక ధోరణులతో పరిచయం ఉంది. సందర్భాన్ని బట్టి వాటిని భౌతిక, భావవాదాలుగానూ; నిరీశ్వర, ఈశ్వరవాదాలుగానూ పిలుచుకుంటున్నాం. సగటు జనంలో ఒక అలవాటు ఉంది.  కాలగతిలో వారు ఎలాంటి గొప్ప నినాదాన్ని అయినా, భావనను అయినా చిలుక పలుకులుగా మార్చివేస్తారు. అవి ఏనుగు మింగిన వెలగ పండులా గుజ్జును కోల్పోయి డొల్లలుగా మారతాయి. ఇదో మానవసహజమైన అలవాటు కనుక తప్పు పట్టడానికి లేదు. తప్పు పట్టి ప్రయోజనమూ లేదు.

అలాగే, నిరీశ్వర, ఈశ్వరవాదాలు కూడా చిలుకపలుకుల్లా మారాయి. ఆ మారడంలో వాటిమధ్య ఉన్న అంతస్సంబంధం   తెగిపోయి అవి రెండూ భిన్నమైన విషయాలుగా పరిణమించాయి. ఒక పోలిక చెప్పాలంటే, మనం రెడీమేడ్ దుకాణానికి వెళ్ళి చొక్కా కొనుక్కోవాలనుకుంటాం.  దుకాణంలో మనకు నచ్చిన రంగులో ఉన్న చొక్కాలు, నచ్చని రంగులో ఉన్న చొక్కాలు ఉంటాయి. ఎంచుకునేటప్పుడు వాటిని వేర్వేరు రంగుల చొక్కాలుగానే చూసి, నచ్చిన రంగులో ఉన్న చొక్కాను కొనుక్కుంటాం. అంతేకానీ, ఆ వేర్వేరు రంగుల చొక్కాలు ఒకే ముడిసరకుతో తయారైనవనీ, వాటిని ఒక దర్జీయే కుట్టి ఉండవచ్చుననే ఊహ రాదు. ఆ క్షణంలో ఆ ఊహ రావాలని కూడా ఆశించలేం. ఒకవేళ ఆ ఊహే కనుక వస్తే, అప్పుడు రంగు చొక్కాల గురించిన మన అవగాహన భిన్నమైన మలుపు తీసుకుంటుంది.

ఇలా రెండు ధోరణుల మధ్య ఉన్న అంతస్సంబందాన్ని తెంచేసి, వాటిని వేర్వేరు రెడీమేడ్ వస్తువులుగా తయారు చేసి సగటు మనిషికి అందించడాన్నే మనం సంప్రదాయం అంటాం. ఆయా కాలాలలో అప్పటి అవసరాలను బట్టి జ్ఞానాన్ని గడ్డకట్టించి, శిలాశాసనాలను తయారు చేయడమే సంప్రదాయం పని.  పై రెండు ధోరణుల అంతస్సంబందాన్ని తెలుసుకోవాలంటే, సంప్రదాయమనే ఇనప తెరలను ఛేదించి లోపలికి తొంగి చూడడమే మార్గం. పురాచరిత్రలోకి వెళ్ళడం కూడా ఆ ఇనపతెరలను ఛేదించే సాధనాలలో ఒకటి.

నేనిప్పుడు రాంభట్ల కృష్ణమూర్తి గారి ‘సొంతకథ’ నుంచి కొన్ని ఆశ్చర్యకరమైన వాక్యాలను ఉటంకిస్తాను. అవి ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయంటే సాంప్రదాయికమైన ఊహను అవి పూర్తిగా తలకిందులు చేసి, షాకిస్తాయి. తీవ్రవివాదాస్పదంగానూ, చర్చనీయంగానూ కనిపిస్తాయి. ఆయన అంటారు:

“నేను నిరీశ్వరవాదిని, భౌతికవాదిని కూడా. ఈ రెండింటినీ ఒకరి నుంచే నేర్చాను. అతడే శంకరాచార్యుడు. అతడి తత్వం నాలుగు మహావాక్యాల్లో ఉందంటారు పెద్దలు. తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి… ఇవీ ఆ మహావాక్యాలు. ఆయన వాదం నుంచే నేను మరో మహావాక్య చతుష్టయాన్ని ఎంచుకున్నాను. అవి: ఆవిద్య, భ్రాంతి, మాయ, మిథ్య. చారిత్రకంగా చూస్తే మన దేశాన దేవుడు లేడు. క్రీస్తు శకం ప్రథమ సహస్రాబ్దిలోనే మనకు దేశవిజేతల ద్వారా దేవునితో పరిచయం కలిగింది.”

తను శంకరాచార్యుల నుంచే నిరీశ్వరవాదాన్ని, భౌతికవాదాన్ని నేర్చాననడం; శంకరాచార్యులు ఈశ్వరవాది అన్న  సాంప్రదాయిక ఊహను ఒక్కసారిగా తలకిందులు చేయడమే. అంటే, శంకరాచార్యులను నిరీశ్వరవాది అనీ, భౌతికవాది అనీ అనడమే. ‘చారిత్రకంగా చూస్తే మన దేశాన దేవుడు లే’ డనడం కూడా అలాంటిదే.  ఇవి ఏదో అలవోకగా చెప్పుకుని వదిలేయవలసిన విషయాలు కావని తెలిసిపోతూనే ఉంది. నిజానికి చాలాకాలంగా నాలో కుతూహలాన్ని రేపుతున్న రాంభట్లగారి ఈ దృక్కోణం లోకి మరింత తీరుబడిగా, వివరంగా అడుగుపెట్టాలన్న ఉత్సాహం ఈక్షణాన ఉరకలేస్తున్నా;  దానిని మరో సందర్భానికి వాయిదా వేయక తప్పడం లేదు.

ఆయన ఇంకా ఇలా అంటారు:

“శంకరుడు నిర్వచించిన భౌతికవాదం ఏ రూపాన ఉంటుంది? అమ్మ రూపాన ఉంటుంది. లాటిన్లు అమ్మను ‘మాతర్’ అంటారు. ఇంగ్లీషు, జర్మన్ భాషల్లో ‘త’కారం లేదు. అందుకని వారు దాన్ని ‘మేటర్’ అంటారు. ఫారసీ ఆర్యభాషలో కూడా ‘త’కారం లేదు. అందుకని వారు ‘మాదర్’ అంటారు. ఆర్యభాషల్లో ‘మాతర్’ అంటే ‘పదార్థం’ అనే అర్థం ఉంది. అందుకని శంకరుడు దేవుని ‘అవిద్య’ అన్నాడు కానీ, దేవతను అనేకవిధాల స్తుతించాడు. దేవుడు అవిద్య కానీ దేవత  అవిద్య కాదు. అది కంటికి కనిపించే పదార్థం.”

భౌతికవాదాన్నే పదార్థవాదం అంటారని మనకు తెలుసు. దానినే ఇంగ్లీషులో ‘Materialism’ అంటున్నాం. ‘మాతర్, మాదర్, మేటర్, మదర్, సంస్కృతంలో మాతృ’ అనే పేర్లతో పదార్థాన్ని కూడా సంకేతిస్తున్న అమ్మవారినే శంకరాచార్యులు అనేకవిధాలుగా స్తుతిస్తున్నారు కనుక, ఆయన భౌతికవాది లేదా పదార్థవాది అని సారాంశం. అంటే, భౌతికవాస్తవికతపైనే మాంత్రిక వాస్తవికతను, తద్వారా దైవభావనను ఆపాదిస్తూ రెండింటి మధ్యా ఒక అభేదాన్ని స్థాపిస్తున్న ఆదిమపౌరాణికతకు చెందిన అమ్మతాత్వికతనే శంకరాచార్యులు ప్రతిపాదిస్తున్నారు. అమ్మ తాత్వికతలో భౌతిక, భావ వాదాల మధ్య తేడాలేదు. అవి పరస్పర ఆధారితాలు. రాంభట్లగారి అభిప్రాయాన్నే ప్రామాణికంగా తీసుకుంటే, క్రీస్తుశకం ప్రథమ సహస్రాబ్దిలో దేశవిజేతల ద్వారా మన దేశానికి దేవుని పరిచయం కలిగిన తర్వాత, భౌతిక, భావవాదాలు వేరుపడ్డాయి. అంటే పైన చెప్పుకున్నట్టు వేర్వేరు రంగులు కలిగిన రెండు రెడీమేడ్ చొక్కాలు అయ్యాయి. ఆ రెండింటిలోనూ ఉన్న ముడిసరకు ఒక్కటేననీ, ఆ రెండింటినీ కుట్టిన దర్జీ ఒక్కడే ననీ చెప్పేది ఆదిమ పౌరాణికతకు చెందిన అమ్మతత్వం.

భౌతిక, భావవాదాలను గీత గీసినట్టు సంప్రదాయం ఎంత వేర్వేరు విషయాలుగా చెబుతుందంటే; దాని ప్రకారం రావణుడు భౌతికవాది, రాముడు భావవాది. వారు పరస్పర విరుద్ధ శక్తులు. రావణుడిపై రాముడు విజయం సాధించడం భౌతికవాదంపై భావవాదం విజయం సాధించడమే. ఆవిధంగా సంప్రదాయ బలం వల్ల భౌతికవాదం ఒక తిట్టు పదంగానూ, భావవాదం ఉత్తమగుణంగానూ మారాయి. మళ్ళీ సంప్రదాయం రావణుని నిరీశ్వరవాది అనదు. ఆవిధంగా చూసినప్పుడు భౌతికవాది అయిన రావణుడు ఈశ్వరవాది కూడా కనుక ఆదిమ పౌరాణికతకు దగ్గరగా ఉంటాడు. బహుశా అందుకే అతడు రాక్షసుడు అయ్యాడు. సరే, దీనిని ఇక్కడితో ఆపుదాం.

మళ్ళీ రాంభట్లగారిని పలకరిస్తే, ఆయన భౌతిక, భావవాద (లేదా ఆధ్యాత్మికవాద) చర్చను సాహిత్యంలోకి తీసుకొచ్చి మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు:

“సామాజిక చైతన్యరూపమైన సాహిత్యం ఎవరు సృష్టించినా అందులో మూడు అంశాలు ఉండి తీరుతాయి. అవి, ఒకటి సౌందర్యం. రెండు వాస్తవికత. మూడు తాత్వికత. ఈ మూడూ పాఠకునికి విజ్ఞానదాయకాలు. అందులో సౌందర్యాంశ చదవాలన్న కోరికను కలిగిస్తుంది. వాస్తవికాంశం విజ్ఞానదాయకం. తాత్వికాంశం వివేకదాయకం. అంటే సాహిత్యం వల్ల ఆనందం, విజ్ఞానం, వివేకం కలుగుతుంది.

సంప్రదాయకవులు విజ్ఞాన, వివేకాంశాలను విస్మరించి కవిత్వలక్షణం ఆనందమొక్కటే అన్నారు. కావ్యంలో వాస్తవికతా, తాత్వికతా ఉన్నా వాటిని సంప్రదాయపండితులు గుర్తించలేకపోయారు. ఆలంకారికుల్లో క్షేమేంద్రుడు మాత్రం విజ్ఞానదాయకమైన వాస్తవికతను గుర్తించాడు. దానికి ఆయన ఔచిత్యం అని పేరుపెట్టాడు…సదృశాన్ని చిత్రిస్తే దాన్ని ఔచిత్యమంటారని క్షేమేంద్ర మతం.  వాస్తవమైనప్పుడే సదృశత్వం అలవడుతుంది. ఔచిత్యాన్నే నేను వాస్తవికత అంటాను.”

visvanatha

ఈ సందర్భంలోనే విశ్వనాథవారి ‘వేయి పడగలు’ నవలపై ఆయన ఇలా అంటారు:

“వాస్తవికత అధిభూతం. దాన్ని అనుసరిస్తే కవి ఆధ్యాత్మిక దృష్టికి విరుద్ధంగా తయారవుతుంది కావ్యం. విశ్వనాథ సత్యనారాయణగారు వేయిపడగల్లో వాస్తవికతను అనుసరించారు. ఫలితం వేయిపడగలుగా విస్తరిల్లిన సాంప్రదాయిక కథలో ఒక్కొక్క పడగను పోగొట్టుకుని ధర్మారావు రూపంలో ఆఖరి పడగ ఒక్కటే మిగిలింది. అందుకనే ప్రాచీన కవులు వాస్తవికతను దూరంగా ఉంచుతారు. అభూతవర్ణనలతోనే కాలక్షేపం చేస్తారు కానీ వాస్తవికత జోలికి వెళ్ళే సాహసం చేయరు. వాస్తవికత అధిభూతం. వారి ఆధ్యాత్మికతకు విరుద్ధం. ఆ సంగతి పూర్వులకు తెలుసు.”

ఒకరికి నచ్చడం, నచ్చకపోవడం వేరే విషయం కానీ; సాహిత్య పరిశీలనలో ఇవి ఒక తరహా గీటురాళ్ళు. దానిని అలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, చేతిలో దారాన్ని భద్రంగా పట్టుకుని గాలిపటాన్ని గాల్లోకి ఎగరేయడం భౌతిక, భావవాదాల అభేదాన్ని చెప్పే అమ్మ తాత్వికత. దారాన్ని వదిలేసినప్పుడు, లేదా దానంతట అదే తెగిపోయినప్పుడు గాలిపటం నేలకు పూర్తిగా దూరమైపోయి ఏటెటో కొట్టుకుపోవడం భౌతిక, భావవాదాలను వేర్వేరుగా, పరస్పర విరుద్ధాలుగా చెప్పే తాత్వికత.

***

చెప్పొచ్చేదేమిటంటే, ఆదిమ పౌరాణికతకు చెందిన అమ్మతత్వంలోకి తలదూర్చే ఏ పురా చరిత్రకారుడైనా అందులోని భౌతిక, భావవాదాల అంతస్సంబంధాన్ని గుర్తించక తప్పదు.  పైన చెప్పుకున్న రాంభట్ల గారైనా, జార్జి థాంప్సన్ అయినా, జోసెఫ్ క్యాంప్ బెల్ అయినా చేసింది అదే.

జార్జి థాంప్సన్ తన STUDIES IN ANCIENT GREEK SOCIETY, THE PREHISTORIC AEGEAN లో The Making of a Goddess అనే అధ్యాయాన్ని Childbirth and Menstruation అనే మొదటి ఉపశీర్షికతో ఇలా ప్రారంభిస్తారు:

మానవ సమాజపు తొలి దశలలో ఉమ్మడి శ్రమ అనేది జీవించడానికి ఒక షరతు. ఆహార సేకరణ, వేట అనేవి అప్పటికి ఇంకా అతి తక్కువ సాంకేతిక స్థాయిలో ఉండి, ఎక్కువ చేతులు అవసరమయ్యేవి. జనాభా పెరుగుదల అప్పుడో ప్రమాదకరమైన విషయం కాదు. జనాభా తక్కువైతే మాత్రం చావే.  కనుక ఏదైనా ఒక గుంపులో జనాభాను పెంచుకోవడం, జీవికకు అవసరమైన ఉత్పత్తి సాధనాలను సమకూర్చుకోవడంరెండూ ఒకటే. ఆహారోత్పత్తికి చెందిన సాంకేతికత అస్థిరంగానూ, అభద్రంగానూ ఉండడ మంటే; మనుషుల పునరుత్పత్తి కూడా ఉండడమే. ఆదిమ తెగలలో శిశుమరణాలు విపరీత స్థాయిలో ఉండేవి. ప్రతి చోటా శిశువు పుట్టుక చుట్టూ మాంత్రిక మైన తంతులు అల్లుకుపోవడానికి ఈ భౌతిక అవసరమే మూలం.

ఇలా భౌతిక పరిస్థితులతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించి , మాంత్రిక మైన తంతులకు మూలం భౌతిక అవసరమేనని చెప్పడం ద్వారా ఆదిమ పౌరాణికతలోని భౌతిక, భావ వాదాల అంతస్సంబంధాన్ని వివరించడానికి థాంప్సన్ శ్రుతి చేస్తున్నారు. ఈ తంతులు మనుషుల మనుగడ కోసం ఉద్దేశపూర్వకంగా కల్పించినవి కావనీ, కేవలం అమ్మతనానికి చెందిన స్పందనలకు భావనాత్మక(ideological) వ్యక్తీకరణలని కూడా ఆయన అంటారు.

ఆయన ప్రకారం ఇంకా చెప్పుకోవాలంటే, వ్యవసాయాన్ని కనిపెట్టాక పై పరిస్థితులే మరింత ఉన్నత ప్రమాణంలో పునరావృతమయ్యాయి. ఈ కొత్త సాంకేతికత ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పుడు అడవుల్ని నరికి వ్యవసాయ యోగ్యం చేయడానికి బ్రహ్మాండమైన ప్రయత్నం అవసరమయ్యేది. వ్యవసాయ జనావాసాల చుట్టూ అంటురోగాలు, అడవి జంతువులతో సహా రకరకాల అజ్ఞాత ప్రమాదాలు పొంచి ఉండేవి. వీటిని అన్నింటినీ ఎదుర్కొంటూ వ్యవసాయం చేయడం ఆరోజుల్లో సామాన్య విషయం కాదు. అందుకే జర్మానిక్ భాషల్లోనూ, సెమెటిక్ భాషల్లోనూ కూడా భూమిని దున్నడ మంటే, ఒక పెద్ద నిర్మాణం (to build) చేయడమే. ఎంతో ఆటవికంగా ఎదురు తిరిగే అడవిని లొంగదీసుకోవడం మాటలు కాదు. ఈ పరిస్థితులలో ఏ ఒక్క కుటుంబమో ఒంటరిగా అడవిలో స్థిరపడడం కష్టం. ఎక్కువ జనసంఖ్యలోనే భద్రత. ప్రారంభంలో స్త్రీలే పంటలు పండించడానికి చెమటోడ్చేవారు. పంటల ఉత్పత్తికి, సంతానం కనడానికి వారికి ఒక స్పష్టమైన పోలిక కనిపించేది. పంట పండినా, ఎండినా; కడుపుపంట బతికినా, మరణించినా ప్రసూతి దేవతే కారణమనుకునేవారు.

స్త్రీ ప్రసవం చుట్టూ అల్లుకున్న మాంత్రిక తంతులే అన్ని తంతులకూ మాతృకలైనట్టు కనిపిస్తాయి. అవే వ్యవసాయానికీ విస్తరించాయి. ప్రసవ కాలంలోనూ ఋతుకాలంలోనూ కూడా రక్తస్రావం జరుగుతుంది. ఆదిమ సమాజాల దృష్టిలో అది సాధారణ రక్త స్రావం కాదనీ, మరో జీవికి ప్రాణం పోసే స్త్రీలోని అంతర్గతశక్తికి వ్యక్తీకరణ అనీ థాంప్సన్ అంటారు. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యాపాపం చుట్టుకుంటుందన్న విశ్వాసానికి మూలం ఇక్కడే ఉంది. దీని గురించి ఇంతకుముందు యయాతి-శర్మిష్టల కథలో చెప్పుకున్నాం. ఋతు, లేదా ప్రసవ రక్తం జీవిని పుట్టించే ఒక శక్తి వనరు అయినప్పుడు దానిని సక్రమంగా నియంత్రించడం అవసరం. లేకపోతె అది తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. ఆ నియంత్రణకు ఉద్దేశించినవే మాంత్రికమైన తంతులు.

ఈ మాంత్రికమైన తంతులతోపాటే అన్ని నిషేధాలకు మాతృక అయిన తొలి నిషేధం పుట్టిందని థాంప్సన్ అంటారు. అది, గర్భవతితో లేదా ఋతుకాలంలో ఉన్న స్త్రీతో లైంగిక క్రియ జరపకూడదన్న నిషేధం. అలాగే, కొత్తగా ఋతుమతి అయిన, ఆ తర్వాత నెల నెలా ఋతుకాలాన్ని ఎదుర్కొనే స్త్రీని శుద్ధి అయ్యేవరకూ పురుషుడు చూడకూడదనీ, ఎవరూ తాకకూడదనీ, దూరంగా ఉంచాలనే ఆనవాయితీ వచ్చింది.

విశేషమేమిటంటే, ఋతు సంబంధమైన ఇలాంటి కట్టడుల వెనుక రెండు పరస్పర విరుద్ధమైన దృష్టికోణాలు ఉన్నాయి. మొదటి కోణం ప్రకారం, ఋతు కాలంలో లేదా ప్రసూతి స్థితిలో ఉన్న స్త్రీ ఎవరూ తాకకూడని పవిత్రురాలు. ఎలాగంటే, దక్షిణాఫ్రికాలోని హెరేరే తెగలలో ఒక ఆచారం ఉంది. రోజూ పొద్దుటే పాలు పితికిన తర్వాత వాటిని తీసుకొచ్చి బాలెంతరాలు ముందు పెడతారు. ఆమె వాటిని తన పెదవులతో తాకి పవిత్రం చేస్తుంది. మరోకోణం ప్రకారం ఋతుకాలంలో లేదా ప్రసూతి స్థితిలో ఉన్న స్త్రీ అపవిత్రురాలు. రోమన్ భాషలో sacra అనే పదం ఆమెను పవిత్రురాలిగానూ, అపవిత్రురాలిగానూ కూడా చెబుతుంది. పితృస్వామిక సమాజంలో స్త్రీ మతం మీద ఆధిపత్యాన్ని కోల్పోయాక ఋతుకాలాన్ని, ప్రసవ కాలాన్ని అపవిత్రాలుగా వ్యతిరేక దృష్టితో చూడడం మొదలైందని థాంప్సన్ అంటారు. ఆ అపవిత్ర, వ్యతిరేక భావనలనే స్త్రీత్వానికి ఆపాదించి ఈసడించడమూ మొదలైంది. చెడు అంతటికీ మూలంగా, మంత్రగత్తెగా స్త్రీ పరిగణన పొందుతూ వచ్చింది.

ఇటువంటి భావాలు ఏ ఒక్కచోటో కాదు, ప్రపంచమంతటా పుట్టాయని థాంప్సన్ అనడాన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. ఋతుకాలంలోనూ, ప్రసవ కాలంలోనూ ఉన్న స్త్రీ పట్ల వ్యవహరించే తీరులో ఉన్నంత ఏకీభావం మానవజీవితంలోని మరే ఇతర అంశంలోనూ కనిపించదని కూడా ఆయన అంటారు.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

మీ మాటలు

  1. ch.venkateswarlu. says:

    bhaskaram garu!
    meericchina santaanotpatti aasamayamlo maantrika charyalu, vaidya sadupaayalu lekapovadam veeti madhya sambandham nijame.

  2. Dr. Vijaya Babu,Koganti says:

    1. “భౌతికవాదాన్నే పదార్థవాదం అంటారని మనకు తెలుసు. దానినే ఇంగ్లీషులో ‘Materialism’ అంటున్నాం. ‘మాతర్, మాదర్, మేటర్, మదర్, సంస్కృతంలో మాతృ’ అనే పేర్లతో పదార్థాన్ని కూడా సంకేతిస్తున్న అమ్మవారినే శంకరాచార్యులు అనేకవిధాలుగా స్తుతిస్తున్నారు కనుక, ఆయన భౌతికవాది లేదా పదార్థవాది అని సారాంశం.”

    భాస్కరం గారూ, ఎప్పటిలాగే ఆసక్తికరంగా ఉంది. ‘మాతృ’ నుంచీ మేటర్( మదర్), అలానే ‘పితృ’ నుంచీ పేటర్ ( ఫాదర్) పదాల ఉత్పన్నం వ్యవహారంలో ఉన్నదే. అయితే మెటీరియలిజం ‘matter ‘ నుండి కదా ! అలాంటప్పుడు ‘మాతృ’ అనే పదానికి ఆపాదిస్తూ శంకరుని భౌతిక వాది అనగలమా?

    2. “ఏనుగు మింగిన వెలగ పండులా గుజ్జును కోల్పోయి డొల్లలుగా మారతాయి”
    ఏనుగు దేన్నైనా పగలకొట్టి మాత్రమే తింటుంది. చాలా మంది ‘ కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ’ అనేవాక్యాన్ని ‘కరి ‘ అంటే ఏనుగు అనే అర్ధంలో తప్పుగా వాడుతున్నారు. ‘ కరి’ అంటే’ బూజు’ అనేఅర్ధం లో వెలగపండు కు లోపల ఫంగస్ పట్టినప్పుడు పైకి బాగానే ఉన్నట్టున్నా డొల్లాగా అయిపోతుంది. కరి మ్రింగిన వెలగ పండు అంటే పైకిబాగున్నా లోన ఖాళీ అని నేను చదివిన గుర్తు.
    మొదటిది సందేహం. రెండవది మీతో పంచుకోవడం.
    ధన్యవాదములు.

  3. కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు విజయబాబుగారూ…

    1. “‘మాతృ’ నుంచీ మేటర్( మదర్), అలానే ‘పితృ’ నుంచీ పేటర్ ( ఫాదర్) పదాల ఉత్పన్నం వ్యవహారంలో ఉన్నదే. అయితే మెటీరియలిజం ‘matter ‘ నుండి కదా ! అలాంటప్పుడు ‘మాతృ’ అనే పదానికి ఆపాదిస్తూ శంకరుని భౌతిక వాది అనగలమా?”
    –‘మాతృ’ అనే పదానికి, ‘matter’ నుంచి వచ్చిన మెటీరియలిజం అనే మాటను ఆపాదించి శంకరుని భౌతికవాది అనగలమా అన్నది మీ ప్రశ్నగా అర్థమైంది, పైన రాంభట్ల గారినుంచి ఉటంకించిన పేరాలోని ఆయా ఇండో-యూరోపియన్ భాషల్లో మాటర్-మాతర్(మాతృ) అనే మాటలు ఉన్నాయి కనుక మేటర్ నుంచి వచ్చిన మెటీరియలిజం అనే మాటను అమ్మ ఆరాధకుడైన శంకరాచార్యులకు ఆపాదించి ఆయనను భౌతికవాది అని రాంభట్ల అన్నట్టు కనిపిస్తుంది. అలాగని ఆయన భావవాది కారని కాదు. నా వివరణ ప్రకారం, అమ్మ భక్తుడిగా ఆయన భౌతిక, భావవాదాలు కలసిపోయిన తాత్వికతకు చెందినవారు. కనుక ఆయనను భౌతికవాదిగా భౌతికవాదులు, భావవాదిగా భావవాదులూ తీసుకోవచ్చు. నిజానికి రాంభట్లగారు తన జనకథలో ‘ఆద్వయవాదం’, ‘సాంఖ్యదర్శనం’ అనే రెండు వ్యాసాలు రాశారు. పై వ్యాఖ్య సందర్భంలో అవి కూడా చదవవలసిన వ్యాసాలు.

    2. ‘కరి మింగిన వెలగపండు’ గురించి: మీరు రాసింది చూసిన తర్వాత నాకు కూడా సందేహం కలిగి గూగుల్ సెర్చి లోకి వెడితే రవీంద్రనాథ్ ముత్తేవి గారి ఈ వ్యాసం లింకు దొరికింది. దాని ప్రకారం కరి అంటే ఇక్కడ ఏనుగే. చూడగలరు.
    https://groups.google.com/forum/#!topic/sahitibandhu/IOvN84_qCpM

  4. Dr. Vijaya Babu, Koganti says:

    భాస్కరం గారూ అనేక ధన్యవాదాలు. వివరణ అర్ధమయేలా ఉంది. వెలగపండు విషయంలో మీరు పంచుకున్న వ్యాసం చాలా ఉపయుక్తం గాను కళ్ళు తెరిపించే విధంగా శాస్త్రీయం గా ఉంది.

    “మాటర్-మాతర్(మాతృ) అనే మాటలు ఉన్నాయి కనుక మేటర్ నుంచి వచ్చిన మెటీరియలిజం అనే మాటను అమ్మ ఆరాధకుడైన శంకరాచార్యులకు ఆపాదించి ఆయనను భౌతికవాది అని రాంభట్ల అన్నట్టు కనిపిస్తుంది.”

    అయితే శ్రీ రాంభట్ల గారు mater – matter లలో ఎ మేటర్ ను వాదనకు స్వికరించారనెది కొంచెం బోధ పడలేదు. మీరు అన్యధా భావిమ్చకుంటె వారి వ్యాసాలు ఎక్కడ లభిస్తాయో, లేక లింకులు ఉంటే తెలుపగలరు.
    మీ విలువైన సమయం కేటాయించినందుకు ధన్యవాదములు.

  5. కల్లూరి భాస్కరం says:

    ‘పదార్థం’ అనే అర్థం కలిగిన matter నే రాంభట్లగారు ఆధారం చేసుకున్నారు విజయబాబుగారూ…

    రాంభట్లగారి వ్యాసాల లభ్యత గురించి:– నాకు తెలిసినంతవరకు ఆయన పుస్తకాలలో ‘సొంతకథ’ తప్ప మిగిలినవి అందుబాటులో లేవు. వాటి పిడిఎఫ్ వెర్షన్లు కూడా నెట్ లో ఉంచినట్టు లేదు. కనుక లింకులు దొరకవు. విశాలాంధ్ర(ఇప్పుడు పేరు మారింది) వారికి రాంభట్లగారి రచనల్ని పునర్ముద్రించాలనే ఆలోచన ఉంది. ‘సాంఖ్యదర్శనం’ వ్యాసం గురించి మాత్రం క్లుప్తంగా ‘ఆమె మెచ్చినదే అందం’ అనే ‘పురా’గమన వ్యాసంలో ఇచ్చాను. చూడగలరు.

  6. Dr.Vijaya Babu, Koganti says:

    ధన్య వాదాలు భాస్కరంగారూ.

  7. సుందరం says:

    శ్రీ కల్లూరి భాస్కరం గారికి,
    మీ ‘పురా’గమనం క్రమం తప్పకుండా చదివే అనేకుల్లో నేనూ ఒకడ్ని. మీరు వ్రాస్తున్న విషయాలు మాకు అనేక చారిత్రక గాధలు, వివిధ దేశాల/ప్రాంతాల నమ్మకాలలోని సారూప్యతలను తెలపటంతో పాటు మీ శైలి చాలా సరళంగా ఉండటం, మీరు వాడే అచ్చ తెనుగు పదాలు మరింత విజ్ఞానదాయకం గా ఉన్నాయి.
    మీరు అనేక ప్రపంచ భాషల, చారిత్రక గాధలు చదివారుకదా, నాకో చిన్న సందేహం, మన “మహాభారతం” లోని అనేక పాత్రలు, వాటి మధ్య ఉన్న సంబంధం, అలాగే ప్రతీ పాత్రకూ ఉన్న విశిష్టత, ప్రాముఖ్యం లేదా వాటిని అన్నింటినీ ‘సూత్రీకరించి’ చివరకు ప్రతీ సంఘటనా కూడా ఒక కర్తవ్యనిర్వహణతోనే జరిగాయన్నట్లుంటాయి కదా. దీనికి కాస్త వివరణ ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

    సుందరం

    • కల్లూరి భాస్కరం says:

      ఈ వ్యాసాలపై మీరు చూపుతున్న ఆసక్తికి ధన్యవాదాలు సుందరంగారూ…మహాభారత పాత్రలపై ప్రత్యేకంగా మాట్లాడడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్నీ కలిగించే అంశం. అయితే, ఈ స్పేస్ లో వాటి గురించి మాట్లాడడం కష్టం. ఈ వ్యాసాలలోనే అక్కడక్కడ కొన్ని పాత్రల గురించి రాశాను. చూడగలరు.

  8. సుందరం says:

    ధన్య వాదాలు భాస్కరంగారూ.

మీ మాటలు

*