అలా వీధిలోకి వెళ్లి వద్దామా?!

కందుకూరి రమేష్ బాబు 

………………

Kandukuri Rameshఒక అలవాటుగా చూసినప్పుడు ఏ విశేషమూ గోచరించదు.
కానీ, తరచి చూసుకుంటే విశేషాలు కానవస్తూ ఉంటై.

ఉదాహరణకు నైటీ.

ఉన్నత వర్గాలా నిమ్నవర్గాలా లేదా వర్గాలెందుకుగానీ…
నగర జీవులా గ్రామీణులా లేదా తేడాలెందుకుగానీ…
అసలు మహిళలైతే చాలు, నైటీలు లేకపోవడం ఉండదిప్పుడు.

అవును.
నైటీలూ అని గనుక మనం అనుకుంటే ఒక ప్రశ్న.
‘నైటీ’ అంటే రాత్రి ధరించేదేనా?

కాదని తెలుస్తూనే ఉంది.
రేయింబవళ్లూ, రాత్రుల్లూ ఇప్పుడు నైటీయే మహిళను ధరిస్తూ ఉంది.
అది గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.

ఎన్ని జీవన వ్యాపకాల్లో చూసినా చీరను దాటేసి నైటీ కానవస్తూనే ఉంది.
ఇప్పుడు చీర నిజానికి ఒక దృశ్యాదృశ్యం.
నైటీ రాత్రల్లే కాదు, దివారాత్రుల దస్తూరీ.ఒక జీవనచ్ఛాయ.
అది తన ధారణను దాటింది. పరిపరివిధాలా ఆవరిస్తూ ఉన్నదని గమనించారా?

ఏదైనా అంతే.
సౌకర్యవంతమైందిగా మారిన తర్వాత దాని విస్త్రృతి పెరుగుతుంది వాడకంలో.
నైటీ అందులో ఒక అందమైన ఉదాహరణ మాత్రమే.

ఈ చిత్రమే చూడండి.
ఆమె తల్లి. ఇద్దరు పిల్లల తల్లి.
నైటిలో వీధిలోకి వస్తుంది.

పిల్లల్ని బడికి తీసుకెళ్లినా నైటీలోనే.
బడినుంచి పిల్లల్ని ఇంటికి తీసుకు రావాలన్నా నైటీలోనే.
లేదా పిల్లలకు ఏదైనా కొనివ్వాలన్నా అట్లా వచ్చేసి ఇట్లా ఇంట్లోకి వెళ్లిపోతుంది, నైటీలోనే.

ఉదయాలూ, మధ్యాహ్నాలూ, సాయంత్రాలూ- నైటీయే.
ఎండపొడలోనైటీయే. వెన్నలరేయిలోనూ నైటీయే.
మనకు కానవచ్చినా కానరాకపోయినా ఉన్నది నైటీలో అన్నది చిత్రం.

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఎవరైనా సరే,
అమ్మా -వదినా …ఆలి- చెల్లీ…ఇలాగే.
ఇరుకిరుకు గల్లీల్లో ఇట్లా మహిళలు నైటీల్లో కనిపిస్తూ ఉండటం నగరజీవితంలోనే కాదు, గ్రామాల్లోనూ మామూలే!  మెడలో బంగారు తాళి, కాళ్లకు వెండి పట్టగొలుసులు. చేతికి గోరింటాకు. ఒంటిపై నైటీ.
అదీ విశేషం. అట్లా అన్నీ ఉంటై.

ఇంట్లోంచి అట్లా వీధిలోకి రావడం అంటే ఆ మహిళ బయటి ప్రపంచంలోకి వెళ్లినట్లేమీ ఉండదు.
అసహజంగా ఏమీ ఉండనే ఉండదు. అందుకు కారణమూ ఉంది. ఒక రకంగా వీధి జీవితంలోని సౌకర్యం ఇది.
అందుకే అనడం వీధి అంటే ఇంటికి ఒక ఎక్స్ టెన్సన్ – అంతే అని!

వీధి అంతానూ ఇల్లూ వాకిలీ అయిన వాళ్లకు నైటీ అన్నది దివారాత్రులతో పనిలేనిదే అనడం.
వీధిలోని మనుషులంతా వావివరసల మాదిరే ఒక అనుబంధాలశాల అయినప్పుడు…మనిషి యధేచ్ఛగా నడవటంలో ఎటువంటి ప్రయాసా లేదని చెప్పడం. యవ్వనవతులైనప్పటికీ కడు వృద్ధులైనప్పటికీనూ మొత్తంగా మహిళలకు పెద్ద పట్టింపూ ఏమీ ఉండని సమయాలే ఇవన్నీ అనీనూ. ఊరికే మర్యాదను పాటిస్తూ, ఇట్లా నైటీ అన్నది చున్నీ ఆధారంగా బయటకు వస్తుంది!

ఇప్పుడు చూడండి.
పిల్లాపాపలతో ఆ తల్లి అట్లా హాయిగా అందంగా, ఆనందంగా నడిచి వెళుతుంది.
కాళ్లకు చెప్పుల్లేకుండా హాయిగా!

వెళుతుంటే ఒక సంగీతం వుంటుంది. నడుస్తుంటే ఒక విలాసం ఉంటుంది.
అదంతానూ- వీధంతానూ తమది అనుకోవడంలో కనిపించే ఒక విశ్వాసం. ఒక ఆత్మీయ సరాగం.
అందుకే street photography అన్నది మెయిన్ రోడ్డుకే పరిమితం అవుతుంటుంది చాలామంది ఫొటోగ్రఫిలో. ఇట్లా లేన్స్ లోకి- వీధుల్లోకి వస్తే గల్లీలోని జీవితం ఒక రకంగా ఇల్లు వాకిలిగా కనిపిస్తుంది.

అందుకే అనడం, ‘గ్రామాల్లోకి తరలండి’ అన్నట్టే వీధుల్లోకి తరలండని!
జీవన విలాసం ఏమిటో చూద్దురు, రండిలా అని!

మీ మాటలు

  1. Prabhakar Mandaara says:

    మీ ఫోటోలు,
    వాటి కింది వ్యాఖానాలు …
    ఫోటోలు ఎలా ‘తీయాలో’ చెబుతున్నయ్
    ఫోటోలను ఎలా ‘చూడాలో’ చెబుతున్నయ్
    ‘కాదేది ఫోటోగ్రఫీకి అనర్హం’ అని చాటుతున్నయ్
    ఈ ఫోటోలో మరో విశేషం వుంది …
    అవసరాలు, సౌకర్యాలు ఎంత ఆధునికీకరణకు బాటలు వేస్తున్నా
    ఆ మహిళ
    కాళ్ళకు పట్టగొలుసులు,
    చేతులకు గాజులు,
    మెడలో మంగళసూత్రం …
    సంస్కృతీ సంప్రదాయాలు మాత్రం చెక్కు చెదరలేదు !

  2. kandukuri ramesh babu says:

    ప్రభాకర్ మందార గారు.
    చాలా థాంక్స్. సామాన్యతను దర్శించి కూడా అబినందిస్తున్నారు మీరు. నిజంగా థాంక్స్.

మీ మాటలు

*