ఏమైనా మారిందా?

 krishnudu

ఒక రాత్రి పుచ్చిపోయిన వేళ, ఒక దినం చచ్చిపోయిన రోజు, సూర్యుడు చిరాకు కలిగించిన వేళ, వెన్నెల కిటికీలోంచి రక్తం క్రక్కుకుంటున్న పూట నీపై నీకు అసహ్యం కలిగినప్పుడు నీ వ్రేళ్లు అప్రయత్నంగా వెలిగ్రక్కే ద్వేషమా కవిత్వం?

ఉదయం పూట పేపర్‌ను చూసి ఉండచుట్టి విసిరివేయాలనుకుంటున్నప్పుడు, పదే పదే వినపడే వాడి ఉపన్యాసం శూలంగా గుండెలో గ్రుచ్చుకుంటున్నప్పుడు, మనుషుల్లో శవాలనూ, శవాల్లో మనుషులనూ చూడడం అలవాటై, క్రుళ్లిపోయిన వెలుతురును చూడలేక కళ్లు మూసుకున్నప్పుడు బలవంతంగా బయటకు వచ్చిన కన్నీటి చుక్కా కవిత్వం?

నీవు బతికున్నప్పుడు చస్తావు. చచ్చిపోయినప్పుడు జీవిస్తావు. అదేనా కవిత్వం?

నీవు మారతావు. కవిత్వం మారదు.

నేను ఆకులో ఆకును కాను. ఆకుపై రాలిన కన్నీటి బిందువు స్పృశిస్తున్న మృతదేహాల్ని చూసి ఆక్రోశిస్తాను. నేను పూవులో పూవును కాను. బూట్ల క్రింద నలిగిపోయిన పూలను చూసి విలపిస్తాను. నేను కొమ్మలో కొమ్మను కాను. విరిగిపోయిన కొమ్మల వాడిపోయిన నునులేత రెమ్మల శిథిలాలను చూసి బిక్కుబిక్కుమని ఎగిరిపోయిన పక్షుల్ని చూసి విషాదగీతం రాస్తాను. అదేనా కవిత్వం..

మనిషి పాతబడతాడు. కాని నేను పాతపడని కవిత్వాన్ని చూశాను. సమాజం తిరగబడడాన్ని చూడలేదు. కవిత్వం తిరగబడడాన్ని చూశాను.

ఆకాశం బ్రద్దలై విగతజీవిగా మారడం చూశాను. మేఘాలు తుత్తునియలై నేలరాలడం చూశాను. గాలి కకావికలై ప్రాణాలు కోల్పోయి కనురెప్పల మధ్య చేరడం చూశాను. వాన చినుకు ఛిన్నాభిన్నమై రక్తాశ్రువులతో పాటు ఎండిపోవడం చూశాను. నేల బీటలు వారి తనపై నడుస్తున్న చచ్చిన పాదాలను దిగులుగా చూడడం గమనించాను.

కల ఒక మోసమై ప్రతి రోజూ ఒక పసిగొంతును నులుముతోందా?కవిత్వం మాత్రం నిన్ను మోసం చేయదు.

ఎందుకో నాకిప్పుడు దిగంబర కవిత్వం అధునాతనమనిపిస్తోంది. ‘మీరు జీవిస్తున్నది మీ జీవితం కాదు. జీవితంలో జంతువుల్లా బతికే అధికారం ఎవరికీ లేదు. జీవితం తాటస్య్థాన్ని వరించకూదు. నిరర్థక జీవన విధానంలో మనిషి జీవించలేడు.. నిన్ను నీవు ఒక్కసారి దిగంబరం చేసుకో. దేన్నీ నమ్మకు..’ అని స్పష్టం చేసిన దిగంబర కవిత్వం తొలి తెలుగు అధునాతన రాజకీయ కవిత్వం. ఒక అధ్యాయం అప్పుడే ప్రారంభమైంది.

మహా స్వప్నా ఎక్కడున్నావు? మానవత రెండు కళ్లూ మూసుకుపోయినప్పడు, విప్పుకుంటున్న మూడో కన్నునై, కాలం వాయులీనం మీద కమానువై, చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానువై వస్తానన్నావు కదా.. కడుపు రగిలి, పుడమి పగిలి పుడతానన్నావుకదా.. దిక్కుమాలిన శవం మీద ఆకాశాన్ని కప్పావా?

మనిషీ,ఇంకా నువ్వింకా బానిసవే అని చెప్పిన చెరబండరాజూ.. ఏమైంది? బానిసత్వం తొలగిపోయిందా? చెర వీడిపోయిందా? అడుగు అడుగులో సహారా ఎడారి అదృశ్యమైందా? ప్రపంచంలో ప్రతి ఒక్కడి శిరస్సు మీద ఒక్కొక్క హిమాలయం కరిగిపోయిందా? ఆకాశం ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్నదెందుకు? అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం ఇప్పుడు మరింత నవనవోన్మేషంగా మారిందా? కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలన్నావు కదా?

సూర్యుడికడ్డంగా నించున్న ఆ మబ్బుతునక పేరేమిటి? అని ప్రశ్నించిన నగ్నమునీ, ఆ పేరు తెలిసిందా? అర్థం కాని అనంతశూన్యం అంచుమీదికి ఆకారం లేని కుర్చీనొకటి లాక్కొనిస అర్థవంతమైన బతుకు వెన్నెల చుక్కల్ని కప్పులో ఒంపి ఒక్కొక్క క్షణం పెదవులకు ఆనించి విషాదాన్ని ఇంకా ఆరాధిస్తూ ఉన్నావా? నీ రక్తం నిండా విశ్వరహస్సముద్రాల జంత్రవాద్యాలు ఇంకా ఉన్నాయా? భూగోళం మరణం విని, రోదసిలో తలవంచిన పతాకంలో నీ శవాన్ని దహనం చేశావా? అందాకా నీవు రాసిన గీతాల్ని నీవే భక్షించావా? భూమి ఇప్పుడు ఎట్లున్నది? ఇంకా అమెరికన్ ప్రసిడెంట్ మెదడులా అమానుషంగా ఉన్నదా? డాలర్‌లోని పురుగు ప్రసరిస్తున్న పుర్రెల వెన్నెలతో వెలిగిపోతున్న శ్మశానంలోకి వెళ్లావు కదా.. పురుగును బట్టి నేలరాచావా? కంపుగొడుతున్న జాతి పిరికితనం కాక మరేమైనా కంటుందా?

నా దేశంలో నేను ఏకాకిని అని ప్రకటించిన నిఖిలేశ్వర్, ఇప్పుడు సామూహికమైనావా? మరుభూములపై నిలుచున్న సాయంత్రాల చెట్లను ఇంకా చూస్తూనే ఉన్నావా? బుద్దుడు ఇంకా అనాథుడే కదా? చీకటి చుంబించకుండా శ్మశానం నృత్యం చేస్తుందా?గడ్డకట్టిన సౌందర్యంలో రమిస్తున్న శవభోగులు కనపడడం మానివేశారా? కత్తిమొనపై హఠాత్తుగా మెత్తగా తెగిన వేలులా మృత్యువు భౌతిక సత్యాన్ని ఇంకా మోసుకువెళుతుందా?

జ్వాలా ముఖీ, పునర్ యోనీ ప్రవేశం చేశావా? సత్య సౌందర్యావరణలో శివమై తాదాత్మ్యం చెందావా? దిక్కులేని కుష్టున్యాయం దిక్కుల్ని తడిమి తడిమి గాయపడ్డావా? తూర్పు పేలి పగులుతున్న చప్పుడు దగ్గరలో వినబడుతున్నదన్నావు కదా.. ఇప్పుడు సమీపించిందా? హింస విప్లవానికి మంత్ర సాని అన్నావు కదా.ఎంత మంది మంత్రసానులుమరణించారు?

భైరవయ్యా,. కొండచిలువ మరోసారి ఆవులించడం ఆగిపోయిందా?ఏమైతేనేం, లోకం ఎట్లా ఉంటేనేం, కొత్త నెత్తురుతో గానుగెద్దుని పునరుద్దరించడం ఆగిపోతుందా?కొడిగట్టిన చుట్టనుసిలా, ముసుగేసుకున్న విధవలా వెన్నెల అలుముకోవడం మానిపోతుందా? మనం సాకిన విష నాగుల విషకీలలు మన తలకే కొరివిపెట్టయా?

అవును ఆరుగురు కవుల కవిత్వం ఇంకా  అధునాతనమే. వారి కసి అధునాతనమే. ఏ ఆచ్చాదనకూ తల ఒగ్గని, ఏ భయాలకూ లొంగని నిరంతర సజీవ మానవుడికోసం వారిచ్చిన పిలుపూ అధునాతనమే.

ఏం మారిందని? ప్రజల అవసరాలు పట్టించుకోని రాజకీయాశుద్దంలో పొర్లుతున్న అడ్డగాడిదలు మారారా? ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న పీఠాధిపతులు మారారా? ప్రజలచెమట సొమ్ముతో కళ పేరుతో తోలు వ్యాపారం సాగిస్తున్న వారు మారారా? రాజకీయ పురుగులకీ, సినీ మడత కొజ్జాలకీ ఆంధ్రదేశాన్ని తారుస్తున్న ఈ పత్రికాధిపతులు, సంపాదకులు మారారా? కుష్టువ్యవస్థని, దుర్గంధసంస్కృ­తిని తరతరాలకీ అంటించి ఒదులుతున్న విశ్వవిద్యాలయాలు మారాయా?

నిజాలు చెప్పనివ్వకుండా గొంతులు నొక్కేసే పరిస్థితుల్ని ప్రోత్సహించే, విషవలయాన్ని సృష్టిస్తున్న వీళ్లందర్నీ, వీళ్ల కోసం భారత దేశమంతటా విస్తరిస్తున్న కుష్టువ్యవస్థ ను పోషిస్తున్న వాళ్లనీ, వ్యవస్థనీ సర్వనాశనం చేయడానికి దిగంబర కవులు పూనుకున్న నాటి రోజులు మారాయా?

అమ్మా, భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ? అన్నాడొక దిగంబర కవి,.

ఈ ప్రశ్న ఇంకా విలువైనది. కవిత్వం ఇంకా ఇంకా. ఇంకా అనాచ్ఛాదితం కావాలి.


వేరుపురుగు

Painting: Rafi Haque

Painting: Rafi Haque

 

“ఈలోకంలో ఎంత మంచోడైనా, ఎంత ఎదవైనా కూడ, అప్పుడప్పుడు నోరు మూసుకొని ఏమీ చేతకాని వాడిలాగ కూచోటం తప్పదు. యీ సినీ ఫీల్డ్ లో మరీ తప్పదు”  సుదీర్ఘంగా ఓ పెద్దగుక్క లాగించాక స్థిమితంగా అన్నాడు సీమనాయుడు. సీమనాయుడు అంటే కోనసీమ నాయుడు కాదు, రాయలసీమ నాయుడు. తేడా ఏమంటే యీ నాయుడు రాయలసీమ నాయుడైనా మాట్లాడేది కృష్ణా గుంటూరు జిల్లాల భాషే.  అదేమంటే, అతను పెరిగింది అక్కడే! డిగ్రీ దాకా చదివాడు గానీ, డిగ్రీ పూర్తి చెయ్యలేదు.  సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ‘బాయ్’ గా చేరి, సొంత డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టి తరవాత ప్రొడ్యూసర్ అయ్యాడు. ‘లాభం’ వచ్చే సినిమాలే తీశాడు.  సొంతంగా కొన్ని, పార్ట్‌నర్‌షిప్ తో కొన్ని.

“అదేం?” అని అడిగాడు దాలినాయుడు.

దాలినాయుడుది శ్రీకాకుళం.  నిఖార్సైన మనిషి. మందు కూడా నిఖార్సైనదే తాగుతాడు, తాగిస్తాడు. సినిమాలంటే పిచ్చి. పేకాటంటే ప్రాణమే! బాగా వున్నవాడు గనక ఇస్త్రీ మడత ఏనాడు నలగలేదు.

“ఏం అంటే ఏం జెబుతాం?”  సిగరెట్టు వెలిగించాడు సీమనాయుడు.

“ఆస్కా.. అంటే ఆంధ్రా సోషల్ & కల్చరల్ అసోషియేషన్ . పేరుకి ఆస్కా అయినా అందరూ ఆంధ్రా  క్లబ్ అనే అంటారు, విజయ రాఘవ రోడ్, ఆంధ్రా క్లబ్ టి. నగర్ అంటే తెలీనోడు మద్రాసులోనే వుండడు. అక్కడ ఎలక్షన్లు జరిగితే జాతీయ ఎన్నికల్లానే జరుగుతాయి.

నేను మెంబర్ని కాదు, మెంబర్ని అయ్యేంత స్తోమత  నాకు లేదు. ఒక వేళ మెంబర్ షిప్పు ఇచ్చినా నేను చెయ్యగల పనేమీ లేదు. ఆ ‘వెజ్ ‘ ఫుడ్డు సూపర్ గా వుంటుంది. నాన్ వెజ్ సంగతి నాకు తెలీదు. చిట్టిగారెలు తినాలంటే అక్కడే తినాలి.  పుల్కాలు కూడా సూపర్ గా వుంటాయి. అప్పుడప్పుడు మిత్రులతో కలిసి అక్కడకి వెళ్తుంటాను.  ఆ మిత్రులు మెంబర్స్ గనక, ఓ గంటో,  రెండు గంటలో సరదాగా గడిపి వస్తుంటాను.

 

“మీరేంటి? ఒక గ్లాసుతోటే జన్మంతా గడిపేస్తారా?” చనువుగా అన్నాడు తిరగలినాయుడు. తిరగలినాయుడుది చిత్తూరు. ఇంతకు ముందు కూడా అతని గురించి చెప్పాను.

అటు నెల్లూరు ఇటు చిత్తూరు, ఆ పక్క హోసూరు వరకు తిరగలినాయుడి ఆవకాయ ‘సామగ్రి ‘ కి మంచి పేరుంది. ఫుల్ డిమాండ్. నన్ను క్లబుకి లాక్కొచ్చింది తిరగలినాయుడే.

“వింటున్నాగా… వింటూ.. వింటూ…” నవ్వేశాడు తిరగలినాయుడు.

“రచయితలుగా ఆ మాత్రం జాగ్రత్త వుండాల్లెండి” నవ్వాడు సీమనాయుడు.

“సరే అసలు సంగతి చెప్పనీవయ్యా ప్రొడ్యూసర్ నాయుడు” ఓ గ్లాసు ఎత్తి గటగటా తాగేసి అన్నాడు దాలినాయుడు.

“కుమార్ రాజాగాడి గురించే చెప్పేది. ఆడు ‘వేరు పురుగ ‘ ని మీకు తెల్సు.. నాకూ తెల్సు. కానీ తెలీంది ఆ వెర్రి అఖిలకి. అందుకే ఆడికి ‘చోటు ‘ ఇచ్చింది. బతుక్కే ‘చేటు ‘ తెచ్చుకుంది” మరో పెగ్గు తెప్పించుకుంటూ అన్నాడు సీమనాయుడు.

“అఖిల అంటే వదిన వేషాలు వేసేదీ. ఆవిడేనా? చాలా మంచిదనీ, ఎవరికీ లొంగదని విన్నానే?” ఆశ్చర్యంగా అన్నాడు దాలినాయుడు.

దాలినాయుడికి ‘ఆ పిచ్చి ‘ కాస్త జాస్తి.  సినిమాదైతే చాలు… మహదానందంగా ఖర్చు పెడతాడు.

“విన్న మాటే కాదు… ఉన్న మాటే! నేను తీసిన మూడు సినిమాల్లో అక్క, వదిన వేషాలు వేసినా ఏనాడు ‘లూజ్’ గా ప్రవర్తించలా. నిజం చెబితే నేను కాస్త ‘ఉబలాట’ పడ్డ మాట వాస్తవం. ఉహూ…ఎన్ని ఆశలు చూపినా నవ్వేసి,” మీరు పెద్దవారు, వృక్షం వంటివారు! మేము ఆ కొమ్మల మీద బతికే పిచ్చుకలం… మీరు చల్లగా వుండాలి” అని నా నోరు కట్టేసేది. నిట్టూర్చాడు సీమనాయుడు.

“మరి ఆ కుమార్ రాజాగాడికి ఎలా పడింది?” వెలిగించబోయే సిగరెట్టుని పక్కన పెట్టి అన్నాడు దాలినాయుడు.

“ఖర్మ ‘ అని దాన్నే అంటారు. ఎట్టా పరిచయం అయ్యాడో నాకు తెలీదు. గానీ పరిచయం అయ్యాడు. కేరాఫ్ అడ్రస్ లేని వాడికి అఖిల వుండే ఇల్లే కేరాఫ్ అయ్యింది. అఖిల కూతుర్ని యీడు బాగా పేంపర్ చేశాడని విన్నాను. తండ్రెవరో తెలీని పిల్లాయే. కుమార్ రాజుగాడు ‘నేనే నీ డాడీలాంటోడ్ని” అనేసరికి ఆ పిల్ల మురిసిపోయుండాలి. కూతుర్ని మంచి చేసుకొని అక్కడి నుంచి తల్లిని పట్టాడు. వయస్సులో కూడా యీడు ఐదారేళ్ళు  అఖిల కంటే పెద్దోడేగా. వెర్రి మొహంది నమ్మి మంచలోనే కాదు మంచం మీద కూడా చోటిచ్చింది. ఆ తరువాత వాడికి ఓ ఛాన్స్ ఇచ్చి చూడమని పాపం అందరు ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని ప్రాధేయపడింది” విస్కీలో సోడా పోయిస్తూ అన్నాడు సీమనాయుడు.

“నిన్ను కూడా అడిగిందా?” ఉత్సాహంగా అన్నాడు దాలినాయుడు.

“బావా.. ఆకలి రుచి, నిద్ర సుఖమూ ఎరగనట్టే యీ ప్రేమ కూడా ఉచ్ఛనీచాలు ఎరగదురా! ఎవరి సంగతో ఎందుకూ, నేనూ లం… కొడుకునే. అందుకే అఖిల మానానికీ, కుమార్ రాజాగాడి సినిమా ఛాన్స్ కి ముడి పెట్టాను.” గటగటా తాగేసి అన్నాడు.

“ఏమందీ?” మహా కుతూహలంగా ముందుకు వంగి అన్నాడు దాలినాయుడు.

“ఏటి తిరగలి బావా? నీకేం నచ్చలేదా?” తిరగలినాయుడ్ని అడిగాడు దాలినాయుడు.

సినిమా వాళ్ళకో దురద వుంటుంది. ఏం చెప్పినా కాస్త సస్పెన్స్ జోడించి, స్క్రీన్ ప్లే తో చెబుతారు, ఎదుటి వారు గనక ఉత్సాహం చూపించకపోతే, క్షణంలో జావగారిపోతారు. సీమనాయుడేమీ దానికి ఎక్సెప్షన్  కాదు.

“ఎందుకు నచ్చదు? సీమ బావా.. నేనూ మనిషినే! మామూలుగా వున్నప్పటి సంగతి ఎలా వున్నా మందు కొట్టినప్పుడు మహా ఇంట్రష్టు పుట్టుకొస్తుంది… సినిమా కబుర్లంటే! అయితే నేను ఫీల్డ్ సంగతి తెలిసినోడ్ని కనక కథ ఏ ‘కంచి ‘ కి చేరుతుందో చెప్పేగల్ను. అయినా, అఖిల సంగతి నాకు ఇంతకు ముందు తెలీదు. కనక నువ్వు జబర్దస్త్ గా కథ చెప్పేయచ్చు” సిగరెట్టు వెలిగించి అన్నాడు తిరగలి నాయుడు. నాకు తెలిసినంతవరకు అఖిల సంగతి తిరగలినాయుడికి తెలీకుండా వుండటానికి వీల్లేదు. వాళ్ళిద్దరివీ కొడంబాకం డైరెక్టర్స్ కాలనీ పక్కనున్న సందులో ఎదురుబదురు ఇళ్ళే!

“కథ ఏముందిలే!  పదేళ్ల పిల్ల వున్న ముఫ్పైయేళ్ళ అఖిల ముఫ్పై ఆరేళ్ళ కుమార్ రాజుగాడికి పడింది. మనిషి కొద్దోగొప్పో అందగాడు. దానికి మించి చదూకున్నాడు. ఒకటి మాత్రం నిజం బావా.. అఖిలలాంటి ఆడది దొరికినోడిదే నిజమైన అదృష్టం అంటే!” నిట్టూర్చాడు సీమనాయుడు.

‘ఎట్టా?” మరో పెగ్గు చప్పరించి అన్నాడు దాలినాయుడు.

మనిషి లోపల ఖచ్చితంగా మరో మనిషి వుంటాడు ఆ లోపలి మనిషే అసలైన మనిషి. అఖిల లోపలుండే అఖిల మామూల్ది కాదు. బావా… ఒక్కసారి  ఆ మనిషిలోని మనిషిని చూశాను. అప్పటి నుంచీ మరే మనిషి నా కంటికి ఆనలేదు. నిజం చెప్పొద్దు… నా అంత నికృష్టపు నా కొడుకు ఇంకోడు వుండడు. కానీ బావ అక్కడ మాత్రం నా తల ఎత్తలేను” ఫటాల్న గ్లాసెత్తి మొత్తం లాగించేశాడు సీమనాయుడు.

దాలినాయుడు తిరగలినాయుడు వంక చూశాడు. తిరగలినాయుడు చిన్నగా నవ్వి”బావా! మన బావ మందు మీద వుండి మాటలు కక్కుతున్నాడనుకోకు. సీమనాయుడు ఎంత తాగినా చీమతలంతైనా మాట దొర్లడు  “ అన్నాడు. సీమనాయుడు ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే పార్టీ ముగిసింది. ఒక్కోసారి అంతే! ఎమోషనల్ గా రెచ్చిపోయిన గుండె అగ్నిపర్వతాలు పగిలి నిజం ‘లావా ‘లా ప్రవహించక ముందే ఏ జ్ఞాపకమో ఆ పర్వతాన్ని చల్లబరిచి అది పగలకుండా ఆపుతుంది. మరి ఏ జ్ఞాపకము సీమనాయుడ్ని ఆపిందో అతనికే తెలియాలి.

**********************

 

ఏ పరిశ్రమలోనైనా కొన్ని కామన్ గానే వుంటాయి. అఖిల మీద ఏ ముద్ర పడక ముందు అందరూ గౌరవాన్ని చూపేవారు. సీమనాయుడులాంటి వాళ్ళు ‘బేరాలు’ పెట్టినా అవి బయటకు రావు. ఒక్కసారి ఓ ఆడది ఒకరికి ‘పడింది ‘ అని తెలిస్తే మాత్రం ప్రతీవాడు ఓ ‘పులై ‘ పోతాడు. వలవెయ్యడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ప్రొడక్షన్ కంపెనీల సంగతి వేరు కాదు. ‘పై వాళ్ళ’ కి తెలిసీ తెలీకుండా ‘పైరవీలు ‘ సాగించేవాళ్ళు సాగిస్తూనే వుంటారు.

కొందరికి నగలు ఆభరణాలైతే కొందరికి నవ్వే ఆభరణం. అఖిలకి నవ్వే కాదు నమ్రత కూడా అభరణమే.

“అయ్యా.. మీరన్నది నిజమే నా మనసుకి విలువిచ్చి ఆయనతో జతయ్యాను. ఈ జన్మాంతం మరో జోలికి పోను. మీరు అవకాశం ఇస్తే మహాసంతోషం. లేకపోతే ఎలాగోలా బతకకపోను.” అని వినమ్రంగా చెప్పేది. దాంతో చాలా మంది ఆవిడ మానాన ఆవిడ్ని వొదిలేసిన మాట వాస్తవం.

“అదేంటి గురూగారూ, అదేం ఆడదండీ? ఆ కుమార్ రాజా గాడి కోసం రోజూ ఓ క్వార్టరు రమ్ము తెప్పిస్తుందిట. పెన్నులూ, కాయితాలే కాక సిగరెట్టు పాకెట్లు కూడా తెప్పిస్తుందిట. ఏమైనా చెప్పండి… ఆ నా కొడుకు పెట్టి పుట్టాడు.” ఇదీ ప్రొజక్షన్ రమణ నాతో అన్నమాట.

నాకు కొంచం ఆశ్చర్యం కలిగిన మాట వాస్తవమే కానీ నిర్ఘాంతపోలేదు. కారణం నాకు కొంత తెలుసు. కొంతమందికి ఇవ్వడం మాత్రమే తెలుసు. ఆ ఇచ్చాక కూడా ఏనాడు ‘అవాళ నేను నీకు అది ఇచ్చాను.. నువ్వు నాకేం ఇచ్చావు? ‘ అని ఏనాడు సాధించరు.

శ్రీశ్రీ బహుశా ఆలాంటి వారి కోసమే ‘తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గమూ” అన్న పాట రాసి ఉండాలి. అఖిల కూడా అలాంటి మనిషే అని నాకు ఎప్పుడూ అనిపించేది.

చామనఛాయ, అద్భుతమైన, గుండెలోంచి వచ్చే నవ్వు, ఏ మాత్రం కల్మషం లేని చూపు.. మితమైన మాట… ఏ మగాడికైనా స్త్రీలో ఇంతకు మించిన లక్షణాలు ఇంకేం కోరుకోడానికి వుంటాయి?

తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన పార్టీలు కొన్ని వుంటాయి. వెళ్ళకపోవడం వల్ల తలనొప్పిలు తప్పనిసరి. వెళ్ళడం వలన ఉపయోగాలు ఏమీ వుండవు కానీ, మానవ స్వభావాలు మాత్రం బాగా తెలుస్తాయి.  ‘పాత్ర ‘ ల్ని మలిచేందుకు అవి గొప్పగా ఉపయోగపడతాయి.

ఓ ‘హీరో ‘ గారే ఛాలెంజ్ చేశాడు. ఆ అఖిలని బెడ్ మీదకు తెచ్చి చూపిస్తానని. (కథకి ఈ విషయంతో పని లేదు. అయినా ఎందుకు ఓ వాక్యం వ్రాయాల్సి వచ్చిందంటే, ఆశకి అంతస్థులతో పని లేదని చెప్పడానికి). ఓ డైరెక్టరూ సెకండ్ హీరోయిన్  ఛాన్స్ ఇస్తానని కబురెట్టాడుట. కానీ, సెకండ్ హీరోయిన్ కారెక్టర్ కోసం  ‘ తన కారెక్టర్ ‘ వదులుకోవాలిట.

“అయ్యా.. మీరు హీరోయిన్ గా అవకాశమిచ్చినా నాకొద్దు. నా వయసు, నా స్టక్చర్ దానికి పనికి రాదు. చిన్న వేషం చాలు… అదీ నా కారెక్టర్ ని నిలబెట్టేది.” అన్నదిట. నాతో చెప్పింది రమణే.

 

*********************

 

రమణ ఒక వార్త తెచ్చాడు, కుమార్రాజు కథని ఫలానా ‘టాప్ ‘ డైరెక్టర్ ఓ.కె. చేశాడనీ, ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడనీ. అన్నట్టు చెప్పలేదు కదూ, రమణ ఉండేది మా వీధిలోనే. రమణ, మూర్తి, అనంతరాజ్ ఓ రూం తీసుకొని వుంటున్నారు. ఆ బిల్డింగు లోనే ‘భీశెట్టి లక్ష్మణ రావు” గారు వుంటున్నారు. స్ట్రీట్ పేరు ‘చారీ స్ట్రీట్ ‘.

సంవత్సరం తిరకుండానే కుమార్రాజు పెద్ద రైటర్ అయ్యాడు. ఓ సినిమాలో అతనిది కథ అయితే నాది పాటలు. కానీ మేం కలిసే అవకాశం రాలేదు.

అఖిల జీవితంలో మార్పేదీ లేదు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వస్తున్నారు గనక కుమార్రాజు టి.నగర్ లోనే ఆనందన్ స్ట్రీట్ కి మారాడు అని తెలిసింది. మా వీధి వెనకాల మూడో స్ట్రీట్ అది.

కాలం గడచిపోతోంది. నేను యమా బిజీ. మా అన్నగారి అబ్బాయిని వెస్ట్ మాంబళం  రాజా హాస్పటల్లో చేర్పించాల్సి వచ్చింది. వెళ్ళి చూస్తే అక్కడే కుమార్ రాజు కూడా ఎడ్మిట్ అయ్యి ఉన్నాడు. మా వాడికి నూట ఐదు జ్వరం అయితే అతనికి నూట నాలుగు. జ్వరమే కాదు వాంతులు మోషన్లు కూడా.

నిజమైన ‘సేవ ‘ ఎలా వుంటుందో అఖిలని చూస్తే తెలిసింది. ఆమె చెయ్యని సేవ లేదు. వాంతులు ఎత్తిపోసింది. మిగతా విషయాలు చెప్పక్కర్లేదు.

అయిదు రోజుల తరవాత మా వాడు డిశ్చార్జ్ అయ్యాడు గానీ, కుమార్ రాజు పన్నెండు రోజులు ఆస్పత్రి లోనే వున్నాడుట. అఖిల చేసిన సేవ చూశాక ఆమె అంటే నాకు అమితమైన గౌరవం పెరిగింది.

 

***********

 

మూడేళ్ళ తరవాత సడన్ న్యూస్. కుమార్ రాజుకీ మాజీ నటి మల్లికా నాయర్ కి పెళ్ళయిందని.  నాకు షాక్. ఎన్ని కోట్లైన సంపాయించొచ్చు. కానీ అఖిల లాంటి స్త్రీ ప్రేమ దొరకడం దుర్లభం. అయినా ఇది చిత్ర సీమ. చిత్రాలకి కొదవేముంటుంది? ఇప్పుడతను పేరెన్నిక వున్న రైటరు. జనాలకి కావల్సింది సక్సెస్… కారెక్టర్ కాదు.

సాలిగ్రామంలో ‘ఇల్లు ‘ కొన్నాడని కూడా  తెలిసింది. అంతే కాదూ ఆ ఇంటి గృహప్రవేశానికి నేనూ కూడా వెళ్లాల్సి వచ్చింది. కారణం మేమిద్దరం నాలుగు సినిమాలకి రాస్తున్నాం. పరిచయం మాత్రం మామధ్య అంతంత మాత్రమే. కుమార్ రాజు సంస్కారం లేనివాడు కాదు. మంచీ మర్యాద తెలిసిన వాడే. అఖిలని అతను దూరం పెట్టాడనే ఓ అకారణ కోపం నాలో నాకే తెలియకుండా వుండి, అతనితో పరిచయం పెంచుకోవడానికి అడ్డుపడిందని మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను.

మల్లికా నాయర్ తెలుగులో కూడా ఓ పది సినిమాలు యాక్ట్ చేసింది. కొన్నిటికి నేను పాటలు కూడా రాశాను. మనిషి జోవియల్ గానే వుంటుంది. లోపలి స్వభావం మాత్రం నాకు తెలియదు.

 

*******************

 

అఖిల కూతురు అపర్ణకి ఇప్పుడు పదహారేళ్ళు.

“దాలి బావా.. అఖిల కూతుర్ని హీరోయిన్ గా పెట్టి సినిమా తీద్దామనుకుంటున్నా… కో ప్రొడ్యూసర్ గా వస్తావా?” నా ముందే దాలినాయుడితో అన్నాడు సీమనాయుడు.

మధ్యలో చాలా సార్లు కలిశాం గానీ మళ్ళీ అఖిల ప్రసక్తి రాలేదు. మాతో బాటు తిరగలి నాయుడు కూడా వున్నాడు.

“ఒప్పుకుంటుందా?” అడిగాడు దాలినాయుడు.

“దేని గురించి ఒప్పుకోవాలి బావా?” నవ్వి అన్నాడు తిరగలినాయుడు.

“ఆశ చావదు బావా! అప్పుడెప్పుడో ఆవిడ కారెక్టర్ గురించి విన్నప్పటి నుంచీ ‘ఆ కోరిక ‘ అలాగే వుండిపోయింది.” సిగరెట్టు వెలిగించి అన్నాడు దాలినాయుడు.

” ఆ విషయంలో అయితే చచ్చినా ఒప్పుకోదు. అంతేగాదు, అసలు కూతుర్ని సినిమాల్లోకి రానివ్వదని నా నమ్మకం.” ఖచ్చితంగా అన్నాడు శివరామ్ . శివరామ్ డబ్బింగ్ సినిమాల ప్రొడ్యూసరు. బాగా కలిసొచ్చి, ‘ఖరీదైన ‘ వాళ్లతో తిరుగుతున్నాడు.

“ట్రయల్ ఏమైనా వేశావేంటి? “ పకపకా నవ్వి అన్నాడు సీమనాయుడు.

“అడక్కండి. ఆ పిల్లని విక్టరీ వాళ్ళ సినిమాకి అడిగాను. అందులో నాది పావలా వాటా కదా! పిల్లతో మాట్లాడక ముందే తల్లి ‘నో ‘ అంది. ఇంకేం రానిస్తుందీ?”త్రిబుల్ ఫైవ్ వెలిగించి అన్నాడు శివరాం. తెల్లబట్టలూ, తెల్ల షూసూ, త్రిబుల్ ఫై పాకెట్లు, ఎనిమిది వేళ్లకీ వుంగరాలు, మెళ్ళో చైనూ, చేతికి బ్రాస్లెట్టూ.. ఇవన్నీ ప్రొడ్యూసర్ అలంకారాలు. గది మొత్తం పరిమళించే ‘సెంటు ‘ కూడా తప్పనిసరి.

“ఆవిడ కూతుర్ని హీరోయిన్ చెయ్యాలంటే మన అవసరం ఏముంటుందీ? కుమార్ రాజు గారే ( గాడే కాదు నోట్) టాప్ ప్రొడ్యూసర్లకి చెప్పి ఇంట్రడ్యూస్ చెయ్యగలరు.” యాష్ ట్రే లో సిగరెట్టుని గుచ్చుతూ అన్నాడు తిరగల్నాయుడు.

“ఆ మాటా నిజమే.” నిర్లిప్తంగా మరో పెగ్గు పోసిన బేరర్ కి సోడా ఎంత పొయ్యాలో సైగ చేస్తూ అన్నాడు . స్టాఫ్ మారడం వల్ల కొలతలు తేడా వస్తున్నాయ్. పాతవాళ్లకి తెలుసు… ఎవరు ఏ డ్రింక్ లో సోడా కలుపుతారో వాటర్ కలుపుతారో.

 

*******************

 

“మార్పులు మొదలవ్వాలే గానీ, మహాస్పీడుగా జరిగిపోతై. చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తరలి వెళ్ళిపోయింది. ఆ ‘మార్పు ‘ చాలా సహజంగా జరిగే అవకాశాలున్నా, అత్యంత నాటకీయంగా ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. జోడించడం కష్టం. విడదీయడం క్షణం. సదరు నాయకులకి నష్టం ఏమాత్రమూ వుండదు. వాళ్ళు అక్కడున్నా ఇక్కడున్నా ఎస్టేట్లకి వొచ్చిన ముప్పేమీ వుండదు. దెబ్బ తినేది మాత్రం సాంకేతిక నిపుణులు, చిన్నచిన్న నటులు, నటీమణులు, ఎక్ స్టాలు, ఇతర కార్మికులు.

మద్రాసులో తెలుగువాడి విలువ నిట్ట నిలువునా పడిపోయింది. తమిళ వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. మనవాళ్ళు తమిళ వాడిని నెత్తి మీద పెట్టుకుంటాడు కానీ, వాళ్ళు మాత్రం మనవాడికి అరచి చచ్చినా ఛాన్స్ ఇవ్వరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రైవర్ల దగ్గర నుంచి, లైట్ బాయిస్ దగ్గర నుంచీ, ప్రొడక్షన్ బాయిస్ దాకా తరలిపోయారు. కుమార్ రాజు ముందుగానే ‘ఇల్లు ‘ కొని మరీ హైదరాబాద్ తరలిపోయాడు. అఖిలకీ తప్పలేదు. ‘సంగీతం ‘ కొంతకాలం  చెన్నై లోనే ‘చిరునామాని ‘ నిలుపుకొన్నా, అదీ వెళ్ళిపోక తప్పలేదు. నేను మాత్రం వెళ్ళలేదు. కారణాలు రెండు… ఒకటి.. పాలిటిక్స్.. నాకు పడవు. రెండు.. ‘రాత ‘ ని నమ్ముకొన్నవాడ్ని గనక.

****************

‘ఆస్కా ‘ లో ఉత్సవాలు జరుగుతున్నై. ఏకబిగిని మూడురోజులు. కుమార్ రాజు కూడా వి.ఐ.పి. గా వచ్చి వెళ్ళాడు. స్టేజ్ మీద మేము కలిసినా పెద్దగా మాట్లాడుకునే అవకాశం దొరకలేదు.

గత ఐదేళ్ళలో చాలా చాలా చాలా సార్లు హైదరాబాద్ వెళ్ళాను… పాటలు వ్రాయడానికి.  వాళ్ళ దృష్టిలో మేము ‘చెన్నై ‘ వాళ్ళం. ‘లోకల్ ‘ కాదు గనక దూరం పెట్టచ్చు. అదో చిత్రం. గోడకు ఇవతల ‘ఈశాన్యం ‘ అయితే గోడకు అవతల ‘ఆగ్నేయం ‘ అయినట్టు, పరిశ్రమ చీలిపోగానే అన్నీ చీలిపోతాయి. అంతకు ముందున్న నాయకులందరూ తూఫానుకి ఎండిన తాటాకులు ఎగిరినట్టు ఎగిరిపోయారు. నిజం చెబితే ఏ స్వార్ధం కోసం పరిశ్రమని విడదీశారో ఆ స్వార్ధం ఫలించలేదు. అంతా కొత్తే. కొత్త గ్రూపులు, కొత్త నినాదాలు, కొత్త మొహాలు, మళ్ళీ మరో మలుపు. తెలంగాణా ఉద్యమం. మరోసారి చిత్ర పరీశ్రమ మానసికంగా చీలిపోయిందన్న మాట వాస్తవం. తెల్ల ఏనుగులాంటి పరిశ్రమకి మసి మరకలు అంటాయి. ఏమో, ‘మార్పు’ లో ఇదీ ఓ సహజ ప్రక్రియేమో !

పెద్దపెద్ద ప్రొడక్షన్ కంపనీలు సినిమాలు తీయడం మానేశాయి. కారణం కొత్తగా ఏర్పడ్డ పరిస్థితులకి అలవాటు పడలేకపోవడమే. అంతకుముందు సినిమా ఓ కళాత్మక వ్యాపారం. ఇప్పుడు కేవలం వ్యాపారం మాత్రమే అన్నంతగా మారింది.

ఓ డబ్బింగ్ సినిమా ఆడియో ఫంక్షన్ కి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ‘R ‘ హోటల్లో మమ్మల్ని అంటే, నన్ను, డైరెక్టర్ని, హీరోహీరోయిన్లనీ ప్రొడ్యూసర్ దించాడు.

రూం  రెంటు రోజుకి 26 వేలు. పొద్దున్న దిగాం. మద్యాహ్నం భోజనానికి డైనింగ్ హాల్ కి వెళ్ళాను. ఓ మూల కుమార్ రాజు ఒంటరిగా కనపడ్డాడు. దూరం నుంచే నన్ను చూసి చెయ్యి ఊపితే, మర్యాద కోసం అతని దగ్గరకెళ్ళాను. ఫుల్ మందులో వున్నాడు.

“సార్.. డ్రింక్?” అన్నాడు

“నో సార్.. కేవలం నైట్స్ లోనే తీసుకుంటాను. అదీ మా ఇంటిలోనే” మర్యాదగా తిరస్కరించా. డే టైం తాగను. పార్టీలకి వెళ్ళను. డ్రింక్ అన్నది ఓ చిన్న సంతోషం కోసమని ఏయిర్ ఫోర్స్ లో వున్నప్పుడే నాకు తెలుసు. అందుకే ఏనాడు ‘హద్దు ‘ దాటను.

“ఓ.కె.. ఓ.కె.. మీరు లక్కీ సార్. మద్రాసులోనే వుండిపోయారు. యూ.. నో.. అది నిజంగా స్వర్గం… రియల్ హెవెన్” ఏదో పోగొట్టుకున్న వాడిలా అన్నాడు.

“కాసేపు నాతో కూర్చోగలరా?” అఫ్ కోర్స్ మీకు ఇష్టమైతేనే” అన్నాడు.

“అలాగే” అని కూర్చున్నా.

“మాష్టారు.. పోగొట్టుకునేదాకా పొందినదాని విలువ తెలీదు సార్, ఇది నిజం” రెండు చేతుల మధ్యా తలను ఇరికించుకొని అన్నాడు.

‘ఎందుకు” అని నేను అడగలా.

“స్వర్గం నా చేతిలో నుంచి జారిపోయినప్పుడు తెలీలా… పేరు మత్తులో, పైసల మత్తులో మునిగిపోయా. సార్, యీ క్షణం యీ క్షణంలో మొత్తం ప్రపంచాన్ని నాకు రాసి ఇచ్చినా నాకు అక్కర్లేదు సార్. నా దగ్గర వున్న వన్నీ కూడా వదిలేస్తా. కానీ… పోగొట్టుకున్నది దొరుకుతుందా? యీ జన్మకు దొరకదు. దొరకదు సార్ దొరకదు” కళ్ళ వెంట నీరు కారుతుండగా తలని టేబుల్ మీద వాల్చి అన్నాడు.

నాకో విషయం అర్ధమయ్యింది. అతనికిప్పుడు  ఎవరో ఒకరు మాట్లాడటానికి కావాలి.  ఆ వ్యక్తిని నేనే కావక్కర్లా. ఓ కుక్క పిల్ల అయినా సరే. అతను మాట్లాడుతుంటే వినడానికి చాలు.

నిజం చెబితే అతను ఎవరూ వినాలని కూడా మాట్లాడటంలా. తన మాటలన్నీ తానే వినడానికి మాట్లాడుతున్నాడు. తన మనస్సుని తానే తెలుసుకోడానికి చేసే ప్రయత్నం అది. ఏంటన్ చెకోవ్ వ్రాసిన ‘గ్రీఫ్ ( GRIEF ) కథ గుర్తుకొచ్చింది. ఎంత ధైన్యం. మనిషికి మనిషి తోడు ఏదో ఓ క్షణంలో తప్పదు. అయితే ఆ ‘ క్షణం లో ‘ ఎవరేనా తోడు దొరకడమే అదృష్టం. ఆ అదృష్టం  ఎన్నో వెల మందికి లభించదని నాకు తెలుసు. లభిస్తే ‘ ఆత్మహత్యలు ‘ ఎందుకుంటాయి?

 

***********************

 

“అఖిల చచ్చిపోయింది. ఆ విషయం నిన్ననే అతనికి తెలిసింది. అప్పటి నుంచీ యీ హోటల్లోనే గది తీసుకొని వున్నాడు. తెగతాగి పడుకోవడం.. లేచి మళ్ళీ తాగడం” జాలిగా అన్నాడు రమణ. రమణ కొత్తలోనే హైద్రాబాద్ కి మారాడు.

“నిజమా? ఎలా చనిపోయింది?” షాక్ తిని అన్నాను.

“నిజమే.. కుమార్ రాజుని  ‘వేరుపురుగు ‘ అని అందరూ అంటారు. తల్లి వేరుని కొరికేసే పురుగుని వేరుపురుగు అని అంటారు. అఖిల జీవితమనే తల్లివేరుని  కొరికేసి ఆ వృక్షం కూలిపోడానికి కారణమయ్యాడని అందరూ అంటారు. మనమూ అనుకునే వాళ్ళము. కానీ కాదండీ. కుమార్ రాజుకి అవకాశాలు రాగానే అఖిలే అతనికి స్వేచ్ఛనిచ్చింది. అతను మల్లిక వ్యామోహంలో పడ్డాడని తెలిసి కూడా అతన్ని పెళ్ళి చేసుకోమనే చెప్పింది కానీ అడ్డురాలేదండి. చివరి వరకు అఖిల పవిత్రంగానే వుంది. ఆఖరికి ఆమెకి కాన్సర్ వచ్చినా కుమార్ రాజుకి తెలియనివ్వలేదు. నేను చెబుతానన్నా వద్దని వొట్టు వేయించుకుంది. గురూజీ, అఖిల లాంటి వాళ్ళు కోటికి ఒక్కరు కూడా పుడతారంటే అనుమానమే. ఏనాడు అతన్ని నిందించలేదు సరికదా ఎవరేన్నా అతన్ని నిందిస్తే సహించేది కాదు.” కళ్ళల్లో కన్నీరు ఉబుకుతుండగా అన్నాడు రమణ.

“మరి పాప?” బాధగా అన్నాను నేను. అఖిల నవ్వు అమరం.

 

“అపర్ణ మంచి బిడ్డ. ప్రస్తుతానికి నేనే ఆమెకి డబ్బింగ్ చెప్పే అవకాశాలు కల్పిస్తున్నా. సార్… ఏ జన్మలో పాపం చేశానో నాకు పిల్లలు లేరు. మూడుసార్లు అబార్షన్లు అయ్యి నా భార్య గర్భసంచీ తీసేశారు. అఖిలని నేను అక్కగానే భావించాను. చెన్నైలో ఆమె గొప్పతనం తెలీలేదు. ఇప్పుడు అపర్ణ మాతో బాటే మా ఇంట్లోనే వుంటోంది… నా బిడ్డే!” కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు రమణ.

మంచితనం ఇంకా బ్రతికే వుంది. కానీ ఒక్కటే విచారం… అఖిలది ఓ అన్ టోల్డ్ స్టోరీ. ఇంకా అన్ టోల్డ్ స్టోరీనే. ఎందుకంటే ఆమె  జీవితంలో నాకు తెలిసింది అణువంతే!

 

*

 

ఎందరో అమ్మలు…అందరి కథలివి!

మాతృత్వం స్త్రీ వ్యక్తిత్వానికి, జీవితానికి పరిపూర్ణతని ఇస్తుందని అందువల్ల ప్రతి స్త్రీ తల్లి అయ్యి తన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని భావించే సమాజానికి సవాళ్ళు ఎదురవుతున్న కాలం ఇది.తమ పిల్లల పెంపకంలో తాము చూపగలిగే నైపుణ్యంతో కానీ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చి దిద్దగలిగే నైపుణ్యంతో గానీ సంబంధమే లేకుండా తల్లి కావడం ఒకటే తము సాధించిన గొప్ప విషయంగా భావిస్తూ, ఏ కారణంగా అయినా తల్లి కావడం ఆలస్యం అయిన, అసలు కాలేకపోయిన ఒక స్త్రీని ఇంకా గొడ్రాలు అన్నట్లు చూసే స్త్రీలకు కొదవలేని సమాజం మనది. పెళ్ళి చేసుకోకపోయినా తల్లి కావాలునునే స్త్రీలు, పెళ్ళి చేసుకున్నా తల్లవకూడదని గట్టిగా నిర్ణయించుకున్న స్త్రీలు, తల్లి కావడానికి గర్భాన్ని అద్దెకి తీసుకునే స్త్రీలు సమాజంలో ఇలా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మార్పులన్నిటినీ ఈనాటి పరిస్తితులకీ, అవసరాలకీ స్త్రీలు కోరుకునే స్వేఛ్చకీ సమన్వయ పరుచుకుంటూ మార్పులనీ, స్త్రీల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించే దశలో పూర్తిగా ఇప్పుడు సమాజం లేకున్నా ఎదగక తప్పని పరిస్తితి. ఎన్నో వైరుధ్యాలున్న వ్యక్తుల సహజీవనమే సమాజంలో కొత్త పోకడలనీ మార్పులు వచ్చే వేగాన్నీ నిర్దేశిస్తుంది.
ఇలాంటి నేపధ్యంలో సమ్మెట ఉమాదేవి గారు అమ్మ సెంటిమెంటుని పండిస్తూ రాసిన అమ్మ కధలుకూ చక్కని ఆదరణ ఉందని చెప్పాలి. అమ్మ ప్రేమని పొందటమే కాదు, మాతృత్వం కూడా ఎంత పొందినా తనివితీరని ఒక అనుభవం ఎవరి జీవితంలోనైనా . అందుకే అమ్మ ఇతివృత్తంగా వచ్చే కధలకి లింగ బేధం లేకుండా పాఠకుల ఆదరణ ఉంటుంది. ప్రతి పాఠకుడూ/రాలూ ఈ అమ్మ సెంటిమెంటు తొ రిలేట్ చేసుకోగల్గడమే దీనికి కారణం. ఇక రచయిత్రి కధను నడపడంలో నేర్పరి అయితే వేరే చెప్పేదేముంది? ఆణిముత్యాల్లాంటి కధలున్న ఈ సంకలనం ఆమె తొలి సంకలనం అంటే అభినందించాల్సిన విషయం.
ఇక అమ్మ కధల కొస్తే చక్కని శైలి , తను ఎవరి కధ చెప్తున్నారో, వారి వేష భాషల్ని వారి జీవన విధానాన్నీ, వారి జీవితాల్లోని సంఘటనలని చిత్రించిన తీరు ఎంత సహజంగా వాస్తవికతకి దగ్గరగా ఉంటాయంటే, మనకూ ఆ పాత్రల్లోని కొందరు వ్యక్తులు తారసపడటం గుర్తుకు వస్తుంది. ఎందరో అమ్మలు, ఎన్నో కష్టాల నేపధ్యాలు. అయితే అన్నిటిలోంచీ బురదలోంచి విరిసిన కమలంలా తమ సమస్యల్ని తామే ఒంటరిగా పోరాడి పరిష్కరించుకున్న మహిళలే. ఒక రకంగా ఈ కధలు సమస్యల్లోంచి ఎలా బయటపడచ్చో తెలిపే ప్రేరణాత్మక సందేశాలు. మామూలుగా మనకు తెలిసిన కష్టాలే ఆడవారివి, కానీ అందులో ఎన్నో కొత్త కోణాలు ఆవిష్కరిస్తారు రచయిత్రి. ఆమె ముఖ్య పాత్రలన్నిటి ఆర్ధిక సామాజిక నేపధ్యం ఏమైనా, ఎంతో సంస్కారవంతంగా ప్రవర్తిస్తాయి.సానుభూతే కాదు సహానుభూతీ చూపిస్తాయి.
అమ్మంటే!’ అనే కధలొ కొన్ని వాక్యాలు హృదయాన్ని తాకేలా ఉంటాయి. ఉదాహరణకి ఇది చూడండి. “వెన్నెల్లో నల్ల మారెమ్మ విగ్రహంలా మెరిసిపోతున్న తల్లి వంక అపురూపంగా చూసుకున్నాడు కొమరెల్లి.” మామూలుగా ఇలాంటి ప్రేమ తల్లి మాత్రమే వ్యక్తం చెయ్యగలదు. కానీ యూ ఎస్ లో ఉన్నా తల్లిని చూడటంకోసం తపించిపోయే ఓ కొడుకు, చదువుకుని తనూ తన పిల్లలూ ఎంత నాగరికంగా తయారైనా, పిల్లలు ఎంత నాజూకుగా పెరిగినా కాయ కష్టం చేసి తనకున్న చిన్న భూమి చెక్కలో వ్యవసాయం చేస్తూ ఊరిని వదిలి రాని రైతు స్త్రీ అయిన అమ్మని ఆమె త్యాగాన్నీ మరువలేని కొడుకు కధ.
అమ్మపై ప్రేమకి ఆమె రూపం భాష, అనాగరికత చీర కట్టు ఏదీ అడ్డురాదంటూ ఒక చోట చెప్తారు అమ్మంటే పాలరాతి విగ్రహంలా అపురూపమైన అందం కాదు, ఆదమరుపు ఎరుగని ప్రేమ గని.చాలా మంది దృష్టిలో అమ్మంటే అందమైన రూపంతో, చల్లని చిరునవ్వుతో, అసలు కోపమంటే తెలియకుండా, బిడ్డల కోసం ప్రతీ నిమిషం పరితపించే అనురాగమయి. అమ్మను చూడగానే ఆహ్లాదానికి మారుపేరుగా అనిపిస్తుంటుంది, అనుకుంటారు గాని, నా తల్లి చర్మం వెన్నుకంటుకుపోయిన పొట్టతో, కాయకష్టంతో మొరటు తేలిన శరీరంతో, కాలం పోకడలు తెలియని ఆహార్యంతో, నాగరీకం అంటని నిర్మలత్వంతో, ఈ పల్లెలో మూలన నిలబెట్టిన నిచ్చెనలా నిలిచి పోయింది అనుకున్నాడు చెమరించిన కన్నులతో“.
మనస్విని అనే కధ భర్త పోయిన స్త్రీ గురించి. భర్త పోయాకా స్త్రీ జీవితంలో ఎన్ని మార్పులొస్తాయో,తన సమీప బంధువుల, సమాజం వైఖరి ఆమె పట్ల ఎలా మారతాయో మనకి తెలుసు. ఇవన్నీ ముందే ఊహించిన మృణాలిని ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. చనిపోతాడని తెలిసిన తన భర్త నుంచి విడాకులు కోరి అందరికీ దూరమవుతుంది. ఆఖరికి తన పిల్లలకి కూడా.ఆమె కున్న కారణాలు, మన సమాజంలో పెళ్ళిళ్ళు పండగలూ పబ్బాల్లో స్త్రీలు భర్త బ్రతికున్నాడన్న ఒకే కారణం వల్ల పొందే గౌరవాలతో పోలిస్తే, భర్త మరణించాడన్న కారణంగా ఎదురయ్యే అవమానాలూ, తన పిల్లల పెళ్ళిళ్ళలో కూడా తను కేవలం ఏపనికీ పనికి రాకుండా చూడటానికి మాత్రమే పరిమితం కావడం ఆమెనెంత బాధకి ఆత్మ క్షోభకీ గురిచేస్తాయో తెలుపుతాయి. ఆమె చెప్పుకునే వరకూ ఆమె పిల్లలు కూడా ఆమెనర్ధం చేసుకోలేకపోవడం ఒక బాధించే విషయం.
తల్లి ప్రేమకి దారిద్ర్యం అడ్డురాదు. రెండోసారీ ఆడపిల్లనే కన్న కమిలిని అత్త నానారకాలుగా హింసిస్తుంటుంది. తననెంతో ప్రేమించే భర్త సూర్యా ఉన్నా ఆమెకు బాధలు తప్పవు. తన పిల్లను ఎక్కడ అత్త ఎవరికైనా అమ్మేస్తుందో, లేక చంపేస్తుందోనని అనుక్షణం భయపడుతూ, ఆ విషయాలన్ని తన భర్తకి చెప్పుకోలేక అవస్థ పడుతుంటుంది. పొలంలో చల్లే మందువల్ల స్పృహ కోల్పోయిన కమిలిని చూసి భర్త ఏడుస్తుంటే, అత్త ఇంకో పెళ్ళి గురించి ఆలోచిస్తుంటుంది. రెండో పెళ్ళయినా, పిల్లల తండ్రయినా పిల్లనిచ్చేందుకో తండ్రి కూడా రెడీ అయిపోతాడు. కమిలిని ఆస్పత్రికి తీస్కెళ్ళే ప్రయత్నం చెయ్యాలంటే డబ్బులు లేని పరిస్తితి. ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళాల్సిన పరిస్తితి, మంచం మీద మోసుకెళ్ళడానికి పొలం పనులు వదిలి ఇరుగు పొరుగు రాలేని పరిస్తితి. ఎంత దుర్భరమైన జీవితాలు గిరిజనులవి, కళ్ళముందు పాత్రలు, వారున్న ప్రదేశాలు కదలాడుతుంటాయి. రెండు మూడు రోజుల తరవాత పాకుతూ వచ్చిన పసిపాప తల్లి మొహాన్ని తడుముతుంటే స్పృహలోకి రావడంతో కమిలి కధ సుఖాంతం అవుతుంది. అద్భుతమైన కధ,కధనం.
సహన అనే కధలో ఉద్యోగస్తులైన తల్లితండ్రులు అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలు, .పసిపిల్లగా ఉన్నపుడు ఆడపిల్ల బయటికెళ్ళి వీధికుక్కలు వెంటబడి తరుముతున్నాయని భయపడితే, నిజంగానే పెరిగిపోయిన వీధికుక్కల బాధనుంచి తప్పించుకోవడానికి కాలనీ వాసులు మున్సిపాలిటీనాశ్రయించి ఆ బాధనుంచి గట్టెక్కుతారు. కాని కొద్దిగా పెరిగిన ఆడపిల్ల అందంగా కనపడగానే ప్రేమించకపోతే చంపేస్తామని, ఆసిడ్ పోస్తామని బెదిరించే, వేధించే కుర్రాళ్ళకి వెకిలిచేష్టలు చేసే చుట్టుపక్కల అంకుల్స్ తోడయితే ఈ వీధికుక్కల్ని ఎలా కాలనీ నుంచి తరమడం, తమ ఆడపిల్లల్ని ఎలా రక్షించుకోవడం. ఈ మృగాలకన్నా వీధికుక్కలే నయమనిపిస్తుంది. ఈవిషయం తెలిసిన తల్లికి ఎంత సామాజిక స్పృహ, బాధ్యత ఉండకపోతే ఆమె మొదట తన కొడుకును దారిలో పెట్టుకోవాలని ఆలోచిస్తుంది?
మాన్వి, అమ్మతల్లిఅమ్మ సెంటిమెంటుని అద్భుతంగా పండించిన కధలు. మిస్ కాకుండా చదవాల్సిన కధలు. క్షణికానందం వల్లనో, వికటించిన ప్రేమల వల్లనో కలిగిన సంతానాన్ని సంపన్నురాలైన తల్లి వదిలించుకుంటే, రెక్కాడితే గాని డొక్కాడని ఇద్దరాడపిల్లల తల్లి భర్త వారిస్తున్నా ఇంకో ఆడపిల్లని అక్కున చేర్చుకోవడం ద్వారా అమ్మతనాన్ని బతికిస్తుంది బతుకమ్మ కధలోని లచ్చిమి. పిల్లల్ని కన్నాకా తల్లియినా తండ్రయినా ఆత్మహత్య గురించి ఎందుకు ఆలోచించకూడదో చెప్పే కధ వెన్నెలమ్మ. పసిపిల్లగానే తండ్రిని పోగొట్టుకున్న చిలుకమ్మని ఎన్నో కష్టాలకోర్చి పెంచితే ఆ పిల్లని పెళ్ళికాకుండానే తల్లి చేసిన ఇద్దరు కాంట్రాక్టర్లకు సమయం చూసి వడిసెలతో బుద్ధి చెప్పిన చిలుకమ్మ, కధలో చిలుకమ్మపై మనకేర్పడిన సానుభూతి వల్ల పాఠకుడి కచ్చ తీరుస్తుంది. గూడు కధలో అత్తని కాపాడుకోవడం కోసం భర్త చనిపోయాకా కూడా ఇద్దరు పిల్లల తల్లయ్యుండి, తన గర్భాన్ని అద్దెకిచ్చి ఆ విషయం చెప్పలేక చెప్పినా ఒప్పుకోరనిపించి ఎన్నో అవమానాలను ఆఖరికి ఎంతో ప్రేమించే అత్త దగ్గరనుంచి కూడా సహించి ఓర్చుకున్న సంతోషి కధ. ఎంతో ఉదాత్తంగా చిత్రిస్తారు ఈ రెండు పాత్రల్ని రచయిత్రి.
ఇవే కాదు ఇంకా ఈ పుస్తకంలో ఇంకా ఎన్నో చక్కని కధలున్నాయి. ఒక్కొక్క కధా ముగించిన ప్రతిసారి మీ గుండె గొంతులోకొచ్చినట్టనిపిస్తే నేను మరీ ఎక్కువగా ఏమీ పొగడలేదని తెలుసుకోవడం మీ వంతు. ఏమైనా చదివాకా ఒక మంచి పుస్తకం, ఎన్నో మంచి కధలు చదివామన్న తృప్తి మిగలడం మాత్రం ఖాయం.

xxxx

అక్షరాల్లో బతికిన మాట!

Velturu2

1

1980ల  చివరి రోజులు-

వొక శనివారం  సాయంత్రం పురాణం గారింటి మేడ మీద “సాక్షి క్లబ్” సమావేశం ముగిసింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో  నండూరి గారు నన్ను ఆపారు. “నువ్వు కృష్ణశాస్త్రి కవిత్వం ఎంత చదివావ్?” అని అడిగారు. నిజానికి నేను అప్పటికి కొంత మాత్రమే చదివాను, నా  ప్రాణమంతా  ఇంగ్లీషు కవిత్వంలో  వుంది కాబట్టి! “కొంత కూడా చదవలేదు!” అన్నాను సిగ్గేమీ  పడకుండా! (సిగ్గేలా తెలుగు కవికి?!) “ఇవాళ్టి నించి రెండు నెలలు నీకు కృ.శా. క్రాష్  కోర్సు!” అని అప్పటికప్పుడు ఆయన వాళ్ళింటికి తీసుకువెళ్ళి, కృష్ణశాస్త్రి గారి పుస్తకాలు అరువిచ్చారు. అప్పుడు తన  దగ్గిర వున్న గొప్ప  నిధిని కూడా నాకు చూపించారు. అవి కృష్ణశాస్త్రి గారు మాట పడిపోయాక చేసిన లిఖిత సంభాషణల చీటీలు! మాట పడిపోయినా ఆయన మాట్లాడడం మానుకోలేదు. చిన్ని చిన్ని కాయితాల మీద రాతపూర్వక సంభాషణలు చేసే వారు. నండూరి ఆ చీటీలన్నీ ఎంతో శ్రద్ధగా దాచి పెట్టుకున్నారు. “మాట- విలువ మనకి తెలీదు నోరు పనిచేస్తున్నంత కాలం! కాని, ఆ నోరు పడిపోయినప్పుడు ఎంత వేదన లోపల గూడు కట్టుకొని వుంటుందో కృ.శా. ని చూస్తూ ఎంత బాధపడే వాడినో! ఈ  కాలంలో మనకి నోరుంది కాని మాటల్లేవ్. మాట్లాడాలీ అన్న ఆయన తపన ముందు మూగతనం వోడిపోయింది!” అన్నారొక సారి నండూరి!

నేను పెన్ యూనివర్సిటీకి వచ్చినప్పటి నించి నెలరోజులుగా రోజూ చదువుతున్న కవి – తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ (Tomas Transtromer)! జీవితానికి ఎంత  దయలేదో ఎప్పుడూ అర్థం కాదు. పలికితే ముత్యాలు రాశిపోసినట్టుండే ఈ స్వీడిష్ మహాకవికి కూడా మన కృష్ణశాస్త్రిలాగానే మూగతనం వచ్చేసింది. ఇరవై ఏడేళ్ళ కిందట అంటే తనకి యాభై తొమ్మిదేళ్ళ వయసులో విపరీతమైన ప్రయాణాలూ, వెళ్ళిన చోటల్లా అద్భుతమైన ప్రసంగాలూ చేస్తూ వచ్చిన తోమాస్ కి గుండెపోటు, పక్షవాతం వల్ల నోరు పడిపోయింది. కాని, జీవితం పట్ల ప్రేమా తపనా తోమాస్ ని బతికించింది. కృష్ణశాస్త్రి గారు అన్నట్టు – “ముసలి తనంలో మూగతనం భయంకరం- శిథిల మందిరంలో అంధకారంలాగు!” కాని, ఆ ఇద్దరూ అక్షరాల్లో మాటల్ని వెతుక్కున్నారు. వాళ్ళ సమక్షం ఎవరికీ  మాటల్లేనితనాన్ని గుర్తుచేయలేదు, సంభాషణ ఎప్పటికీ ఆగిపోలేదు!

 

2

తోమాస్ ని ఎందుకు ఇంతగా చదువుకుంటున్నానో నాకు ఇంతదాకా తెలియదు. బహుశా, కొందరు కవులు మనతో పాటే కొంత దూరం నడుస్తారు, మన భుజాల మీద చేతులేసి! ఆ చేతుల స్పర్శలోని భద్రభావమేదో ఆ కవిని మనకి దగ్గిరగా తీసుకొస్తుంది. ఈ కవి  ఈ క్షణంలో నా తోడు నిలవాలి అనిపిస్తుంది. అలాంటి భావనే కావచ్చు!

మాట పడిపోయాక తోమాస్ కూడా కృష్ణశాస్త్రి గారిలాగానే చిన్న చీటీల మీద రాతపూర్వక సంభాషణలు చేసేవాడు. ఆ చీటీల్ని కూడా ఎంత ప్రేమించాడో తోమాస్! అతనికి అవి తన టీనేజ్ లో కాలేజీ పాఠాల మధ్య లెక్చరర్ల కన్నుకప్పి,  స్నేహితులతో పంచుకున్న చీటీల్ని గుర్తుకు తెచ్చాయట! అందుకే వాటికి “Inspired Notes” అని పేరు పెట్టుకున్నాడు తోమాస్!

తోమాస్ తో నా ప్రయాణం ఆ Inspired Notes అనే కవిత్వ పుస్తకంతోనే మొదలయింది. తోమాస్ అంటున్నాడు:

“నా కవితలు సంగమ స్థలాలు. సాంప్రదాయ భాషా, దృష్టీ అంతగా పట్టించుకోని వివిధ వాస్తవాల మధ్య ఆకస్మిక చుట్టరికాలు కలపడం కవిత్వం చేసే పని. వొక లాండ్ స్కేప్ లోని చిన్నా పెద్దా వివరాలన్నీ కలుస్తాయి, భిన్న సంస్కృతులు, మనుషులూ కలుస్తారు. ప్రకృతీ యాంత్రికత కూడా సంగమిస్తాయి. చూడగానే ఇదొక సంఘర్షణ అనిపించేది ప్రతీదీ కవిత్వంలోకి వచ్చేసరికి స్నేహమైపోతుంది!”

కవిత్వం ఎందుకూ అనే ప్రశ్నకి అనేకమంది అనేక సమాధానాలు వెతుక్కున్నారు. దేనితోనూ సమాధానపడకపోవడమే కవిత్వం అనిపిస్తుంది నా మటుకు నాకు! మాటపోయిందని మూగతనంతో సమాధానపడలేదు అప్పటి కృష్ణశాస్త్రి, ఇప్పటి తోమాస్!

The organ stops playing and there is deathly silence in

The church but only for a few seconds- అనుకున్నాడు తోమాస్.

ఇంకో కవితలో అంటున్నాడు:

మాటల్ని నింపుకొచ్చిన వాళ్ళందరితోనూ

విసిగిపోయాను

కేవలం మాటలే కదా, భాషలేని మాటలు!

 మంచు కప్పిన ద్వీపానికి వెళ్లాను

అక్కడ  మాటలేమీ లేవు

కాని,

రాయని పేజీలెన్నో

నల్దిక్కులా పరచుకొని వున్నాయి.

ఆ మంచులోనే

అడివి జింకల అడుగుల్ని దాటుకుంటూ వెళ్లాను

అదంతా భాషే,

మాటల్లేని భాష!

tomas-transtrc3b6merw

 

3

స్టాక్ హోం లో 1931 ఏప్రిల్ పదిహేను పుట్టాడు తోమాస్. తల్లి స్కూల్ టీచర్. తండ్రి విడాకులు ఇవ్వడంతో తోమాస్ తల్లితోనే వుండిపోయాడు. స్టాక్ హోం యూనివర్సిటీలో సైకాలజీ చదువుకున్నాడు. కేవలం పదిహేడు కవితలతో 1954 లో మొదటి పుస్తకంతో మొదలయింది తోమాస్ అక్షరయానం. 2015లో చనిపోయే నాటికి పదిహేను కవిత్వ సంపుటాలు అచ్చయ్యాయి. 2011లో కవిత్వానికి నోబెల్ అందుకున్నాడు.

తోమాస్ పిల్లల జైల్లో సైకాలజిస్ట్ గా పనిచేసే వాడు. కవిత్వం అంటే తోమాస్ కి ఎంత ప్రేమ అంటే- వొక సారి న్యూయార్క్ లో కవిత్వం చదివాక ఇష్టాగోష్టి జరుగుతోంది. “మీ వృత్తి అంటే పిల్లల జైల్లో పని మీ కవిత్వం మీద ప్రభావం చూపించిందా?” అని అడిగారు. దానికి ఆయనేదో సమాధానం చెప్పాడు కాని, ఆ సమాధానాన్ని ముగిస్తూ “ కాని, ఆ ప్రశ్న – మీ కవిత్వం మీ వృత్తి మీద ఏమైనా ప్రభావం చూపించిందా” అని అడిగితే చాలా సంతోషించే వాణ్ని” అన్నాడు. కవిత్వం అనేది దానికదే వొక స్వతంత్ర భావంగా మిగలాలని తోమాస్ చివరిదాకా కోరుకున్నాడు.

నిజానికి తోమాస్ తనదైన కవిత్వ లోకంలోనే బతికాడు. ఎక్కడ ఎలాంటి స్థితిలో వున్నా, కవిత్వమే అతని ఊపిరి. అతని ఆప్త మిత్రుడు, ప్రసిద్ధ అమెరికన్ కవి Robert Bly అన్నట్టు- “తోమాస్ కవితలు వొక రైల్వే స్టేషన్ లాంటివి. బహుదూరం నించి అక్కడికి రైళ్ళు వచ్చి, కాసేపు ఆగి మళ్ళీ వెళ్ళిపోతాయి. వొక రైలు కింద రష్యన్ మంచు కనిపించవచ్చు. ఇంకో రైలు చుట్టూరా  ఎక్కడివో పూల పరిమళాలు ఉండచ్చు. సుదూరం నించి పలకరించే వొక రహస్యమేదో అతని కవిత్వంలో వుంటుంది.”

 

4

నాకు చాలా నచ్చిన వొక కవితతో తోమాస్ నించి సెలవు తీసుకుంటాను ఇక-

 

వొక ఉత్తరానికి జవాబు

~

ఆ సొరుగు అట్టడుగున

వొక వుత్తరం-

ఎప్పుడో ఇరవై ఆరేళ్ళ కిందటిది.

వుద్విగ్నమైన ఉత్తరం

ఇప్పుడు తెరిచినా అది రొప్పుతూనే వుంటుంది.

 

యీ యింటికి అయిదు కిటికీలు

నాలుగు కిటికీల్లోంచి

పగలు మెరుస్తుంది ప్రశాంతంగా-

అయిదోది మటుకు

చీకటి ఆకాశంలోకీ, ఉరుములు మెరుపుల్లోకీ ముఖం తిప్పుకొని వుంటుంది.

 

ఆ ఐదో కిటికీ ముందు

నిలబడి వున్నాను,

అది ఆ ఉత్తరం-

 

అప్పుడప్పుడూ ఓ రెండ్రోజుల మధ్య

అగాధమేదో తెరచుకుంటుంది.

ఆ ఇరవై ఆరేళ్ళూ

జారిపోతాయి వొక్క క్షణంలో-

 

కాలం ముందుకే సాగిపోయే సరళ రేఖ కాదులే!

అదొక రహస్య వలయం.

ఎదో వొక గోడకి వొత్తిగిలి

హడావుడిగా పరిగెత్తే అడుగులూ గొంతుకలూ వింటావ్-

 

అవతలి వైపు నించి నువ్వే

గతంలోకి జారిపోతూ వుండడమూ వింటావ్-

ఆ వుత్తరానికి ఎప్పుడైనా జవాబంటూ వెళ్ళిందా?!

గుర్తు లేదు,

ఎప్పటిదో కదా  ఆ వుత్తరం!

 

ఎన్నో కెరటాలు అటూ ఇటూ తిరుగాడుతూనే వున్నాయి,

తడిసిన నేల మీద గంతులు వేసే కప్పలా-

మనసు

వొక్కో క్షణాన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయింది.

తుఫానుల్ని కనబోతున్న కారుమబ్బుల్లా పేరుకుపోయాయి జవబివ్వని ఉత్తరాలు.

సూర్యకిరణాల వేడిని కూడా అవి చిన్నబుచ్చుతున్నాయి.

 

ఎప్పుడో వాటికి

జవాబివ్వాలి నేను!

ఎప్పుడో వొకప్పుడు వెళ్ళిపోతాను కదా

అప్పుడైనా వాటి వైపు కాసింత సేపు చూడాలి.

లేదూ

ఇక్కణ్ణించి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి

నన్ను నేను తవ్వుకోవాలి కనీసం-

 

ఎప్పుడో వాటికి జవాబివ్వాలి నేను

యీ నగరపు తొక్కిసలాటలో నలిగిపోక ముందే –

వేల వుత్తరాల సందోహంలో

ఆ పాత వుత్తరం కనుమరుగు కాకముందే-

*

 

 

 

మనసు గీసిన బొమ్మలు ఈ సినిమాలు!

                     

                               siva1

                               

“ఓ నాటికి ఈ భూమండలం నాగరికతా ముఖ చిత్రాన్ని మార్చివేయగల శక్తివంతమైన నవ కల్పన సినిమా. తుపాకీ తూటా, విద్యుత్ శక్తి, నూతన ఖండాలు కనుగొనటం కన్నా ప్రధానమైన ఆవిష్కరణ సినిమా. ఈ భువిపై మానవాళి ఒకరి నొకరు తెలుసుకోవడానికి, ఒకరి కొకరు చేరువ కావడానికి, ఒకరి నొకరు ప్రేమించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సినిమా. సినిమాకు సముచిత ప్రాధాన్యత నిద్దాం. ప్రేమిద్దాం!గౌరవిద్దాం”-అని అంటారు ముస్తఫా కమాల్ అటాటర్క్.

చలన చిత్రమంటే కదిలే బొమ్మలతో కథ చెప్పేది. తక్కువ మాటలు-ఎక్కువ దృశ్యాలు. కినిమా అంటే పురోగమనమని అర్ధం. దాని సమానార్ధకమే సినిమా! ప్రపంచ సమాజంలో వెల్లి విరిసిన భావ పరంపరల వ్యక్తీకరణ సాహిత్యమైతే దాని విస్తృత దృశ్యీకరణే సినిమా! దృశ్యీకరణ ద్వారా మనిషిని చిరంజీవిని చేసింది సినిమా!

దృశ్యమైతే  జీవితాంతం మనసులో ముద్ర పడి పోతుంది. ఉదాహరణకి కన్యాశుల్కంలో సావిత్రి ఏడు నిమిషాల పాటు న  వ్విన దృశ్యం. ఒకసారి చూసిన వారు ఆ దృశ్యాన్ని మర్చిపోవడం అసంభవం. కొన్ని వందలు, వేలు, లక్షలమంది పుస్తకాలు చదివితే  ఎన్నో కోట్ల మంది  సినిమాలు చూస్తారు.ఏది సాధించాలన్నా ముందుగా ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి.భావవ్యాప్తి లేకుండా ఏదీ సాధ్యం కాదు. మన రాష్ట్రం, మనదేశం అని కాకుండా రచయితలు ప్రపంచానికి చెందినవారనుకుంటే మనం ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ ప్రపంచం వైపుకి దృష్టి సారిస్తే, ప్రతి విషాదాన్నీ మనకంటే ముందు ఎదుర్కొన్నవాళ్ళు ప్రపంచ సినిమాల్లో కనిపిస్తారు.కష్టంలో ఉన్న మనుషులకి గొప్ప దన్నూ, మనం ఒంటరి వాళ్ళం కాదు అనే భరోసా లభిస్తాయి.కనపడని సమాజం, వ్యవస్థలు మనుషుల రూపంలో చేస్తున్న ఆగడాలు తెలిసివస్తాయి.ఎవరు చెప్పినా నమ్మం కనుక మన నరనరాల్లో జీర్ణించుకు పోయిన అమానుషత్వం, అవినీతి, ఉదాసీనత, మూఢవిశ్వాసాలు, అసమర్థత, నిరక్షరాస్యతలను ఎదురుగా పెట్టి కళ్ళకు కట్టినట్లు మన జీవితాలను మనమే చూస్తున్నామా అన్నట్లు చూపిస్తాయి సినిమాలు.

ఏ వ్యక్తైనా అతని జీవితంలో వ్యక్తులనుంచి,వ్యవస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్ళను తట్టుకుని నిలబడి,ప్రశ్నించి, ప్రతి ఘటించి, సామాజిక ఎజెండాను ఎదుర్కొని, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టే ప్రయత్నంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ  చేసే ఏ పనైనా మానవజాతి పురోగమనానికి దోహదపడుతుంది.  ప్రపంచంలోని ఎందరో ప్రతిభావంతులైన రచయితలు,కళాకారులు సినిమా మాధ్యమం ద్వారా మానవాళికి వినోదాన్నందిస్తూనే చైతన్యవంతం చెయ్యడానికి తమ జీవిత కాలమంతా శ్రమించి,పోరాడి,రహస్యంగా పని చేసి,చివరికి ప్రాణత్యాగాలు కూడా చేసి చిరస్మరణీయమైన కృషి చేశారు.

సినిమా మేధావి చాప్లిన్ తన చిత్రాల్లో పాలక సమాజాన్ని తన వ్యాఖ్యానాలతో విమర్శలతో చీల్చిచెండాడాడు.

రష్యాలో మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని “మాంటేజ్” కి అన్వయించి, అద్భుతమైన చిత్రాలు నిర్మించారు సెర్గాయ్ ఐసెన్ స్టీన్,వుడోవ్ కిన్ మొదలైన ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖులు.  ఫుడోవికిన్ గోర్కీ “మదర్”ని చలన చిత్రంగా నిర్మిస్తే, ఐజెన్ స్టీన్   “స్ట్రైక్” లాంటి చిత్రాలను “మాంటేజ్” విధానంలో రూపొందించారు.

లాటిన్ అమెరికా సినిమా రచయితలు. “ప్రతీకారమో, ప్రాణ త్యాగమో” అనే నినాదమిస్తూ జనంలో మమేకమై “విప్లవానికి ప్రేలుడు పదార్ధాల్లా ఉపయోగపడే చిత్రాలు తీస్తున్నాం” అంటూ గెరిల్లా సినిమాకు బాటలు పరిచారు.

జర్మనీ నుంచి పురుషాధిక్య ప్రపంచంలో నిలదొక్కుకుని 56 మంది మహిళల్లో జుట్టా బ్రుకనీర్, మార్గరెట్ వాన్ ట్రోటా, డొరిస్ డెర్రీ, హెల్కే సాండర్స్ వంటివారు ఉత్తమ ప్రపంచ దర్శకులుగా ఘనకీర్తి సాధించారు.

విదేశాల్లో అన్ని రకాల ఇజాల్లో సాహిత్యం వచ్చినట్లే, సినిమాలూ వచ్చాయి.

ఇటలీ నుంచి విట్టోరియా డిసికా తీసిన నియో రియలిస్టు సినిమా బైసికిల్ తీఫ్. సినిమా పూట గడవని మామూలు మనిషిని దోషిగా నిలబెడుతున్న కంటికి కనపడని అసలు దొంగ ఫాసిజం అని తేల్చి చెప్తుంది.1948 లో వచ్చిన సినిమా మన సత్యజిత్ రే కి ప్రేరణ నిచ్చిపథేర్ పాంచాలివాస్తవమైన అద్భుత సృష్టికి  కారణమైంది.

మన దేశం విషయాని కొస్తే సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్, భూపేన్ హజారికా, శాంతారాం, బిమల్ రాయ్, గురుదత్, శ్యాం బెనెగల్, గౌతం ఘోష్ మొదలైన ఎందరో ప్రతిభావంతులు మంచి సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించారు. ఇక మన తెలుగు విషయాని కొస్తే “జాతీయోద్యమ చైతన్య దీపం చాలా చిన్నది”అని  కె.వి.ఆర్. అన్నట్లు ఆ పరిమితుల్లోనే మన సినిమాలొచ్చాయి. జాతీయోద్యమ, సంస్కరణోద్యమ ప్రభావాలతో కొన్ని విలువల్ని ప్రతిబింబించే చిత్రాలు 50,60 దశకాల్లో వచ్చాయి. “సినిమా అన్నది చాలా శక్తివంతమైన సాంస్కృతిక మాధ్యమం. దాన్ని సరిగా ఉపయోగించుకో దగ్గ ప్రతిభావంతులు ఇంకా రావాల్సి ఉంది” అన్నారు సినిమారంగంలో ఎన్నో దశాబ్దాలు గడిపిన శ్రీశ్రీ. మహాకవి అన్నట్లే ఇప్పుడెదుర్కొంటున్న ప్రపంచీకరణ విపత్కర పరిస్థితులకు ఎదురు నిలిచే, చైతన్యాన్నిచ్చే చిత్రాలు మనకి లేవు.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1913 లో ప్రపంచ సినిమా విశ్వవేదిక మీద కొచ్చింది. వెయ్యేళ్ళు గడిచాక ఇప్పుడొస్తున్న సినిమాలను పరిశీలిస్తే స్త్రీల జీవితాలు ఏమాత్రం మెరుగుపడలేదనీ, వారు ఆత్మ గౌర వంతో జీవించే పరిస్థితులు ఏ దేశంలోనూ లేవనీ రుజువైంది. 1913 తర్వాత సరిగ్గా శతాబ్దం తర్వాత అంటే 2013 లో వచ్చి నన్ను అమితంగా దుఖపెట్టి, కదిలించి,  కలవరపెట్టి, మనసులో తిష్ట వేసిన  రెండు సినిమా కథల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

మొదటి సినిమా పేరు ఒసామా”(Osama)

ఇది ఆఫ్గనిస్తాన్ చిత్రం. దర్శకుడు బర్మెక్. 1996 నుండి ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం పూర్తిగా చిత్రనిర్మాణాల్ని నిషేధించింది. ఈ సినిమా ఆఫ్గనిస్తాన్,నెదర్లాండ్స్,జపాన్,ఐర్లాండ్,ఇరాన్ కంపెనీల మధ్య ఒక అంతర్జాతీయ సహ-ఉత్పత్తి వల్ల ప్రపంచం ముందుకొచ్చింది.ఈ సినిమా ఒక నిరాశ, భయంకరమైన లేమి, మరణం, ఒక విషాదం, అన్నీ కల గలిపిన ఒక గొప్ప షాక్! బాలికలు,మహిళలకు సంబంధించి ప్రపంచ దుస్థితినీ, వారి పట్ల వ్యవస్థలు అవలంబించే దుర్మార్గమైన పద్ధతులనూ అద్దంలో పెట్టి చూపించే చిత్రం.

siva2

 

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల ఆంక్షలు, పెత్తనా లుండేవి.ముఖ్యంగా మహిళలపై అణచివేత మరీ దారుణంగా ఉండేది.వారికి సామాజిక జీవితం నిషేధించ బడింది.తాలిబన్లు స్త్రీలను బురఖా ధరించి తీరాలని నిర్భంధిస్తారు.వారిని ఎవరూ చూడ కూడదనుకుంటారు. ఎందుకంటే  మహిళల ముఖం చూడడం వల్ల సమాజం లోని అన్ని రకాల అధోగతులు చుట్టుకుంటాయని, సర్వనాశన మవుతుందని తాలిబన్ల బలమైన విశ్వాసం.పనిహక్కు లేదు. అసలు స్త్రీలు భర్తతో తప్పించి బయట కనపడగూడదు.తప్పనిసరైతే బురఖాలో కాలికున్న చెప్పులు కూడా ఎవరి కళ్ళ బడకుండా ఒబ్బిడిగా వెళ్ళి, ఇంట్లో కొచ్చి పడాలి.యుద్ధాల వల్ల ఆఫ్గనిస్తాన్ లో మహిళలు వారి భర్తలు, తండ్రులు, కొడుకులను భారీ సంఖ్యలో పోగొట్టుకుని,అనాధలవుతారు.

ప్రారంభ సన్నివేశంలో “క్షమించ గలనేమో కానీ మర్చిపోలేను” అనే నెల్సన్  మండేలా సూక్తి తో  సినిమా   మొదలవుతుంది. మొదటి సీన్ లోనే పైనుంచి కిందివరకూ ముఖాలు కూడా కనపడకుండా  నీలి రంగు బుర్ఖాలు  ధరించిన   మహిళలు గుంపులు గుంపులు గా కనిపిస్తారు.

“ఆకలి మా ప్రాణాల్ని తోడేస్తుంది”.

“మేము వితంతువులం”.

“మాకు పని కావాలి”

“మేము రాజకీయం చెయ్యడం లేదు”

అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటారు.

 

చావుకి తెగించి  మనుగడ కోసం పోరాటం చేస్తున్న మహిళల మీద తాలిబాన్ సైనికులు నీటి గొట్టాలను వదలడం, గ్రెనేడ్ లాంచర్లు పేల్చడం లాంటి దృశ్యాలను ఒక పదమూడేళ్ళ బాలిక, మన కథానాయిక తలుపు సందు గుండా చూస్తుంది. ఇది చాలా శక్తివంతమైన  దృశ్యం. తర్వాత  సినిమా మొత్తం దీనీ కొనసాగింపుగా నడుస్తుంది.

ఈ దుర్భర పరిస్థితుల్లో ఒక ఇంట్లో మూడు తరాలకు  ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళలు బాలిక అమ్మమ్మ-అమ్మ-మనవరాలు సాంపాదించే పురుషుడే లేకుండా దిక్కులేని వాళ్ళవుతారు. బాలిక తండ్రి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మరణిస్తే, బాలిక మేనమామ  రష్యన్ యుద్ధంలో మరణిస్తాడు.ఆ ఇంట్లో పోషించే పురుషుడే ఉండడు. వృద్ధురాలైన తల్లినీ, బిడ్డనూ పోషించడం కోసం బాలిక తల్లి ఒక హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తుంటుంది.అమ్మాయి కూడా తల్లికి తోడుగా అదే హాస్పిటల్ లో చిన్న చిన్న పనులు చేస్తూ  అమ్మకు సహాయంగా ఉంటుంది. ఆ సమయంలో స్త్రీలు బయటి కొచ్చి పని చెయ్యకూడదు అనే ఆంక్ష విధిస్తారు తాలిబన్లు. అంతేకాదు. అకస్మాత్తుగా వీళ్లు పని చేస్తున్న హాస్పిటల్ కి నిధులు ఆపేస్తారు. ఆమెకు మూడు నెలల జీతం కూడా రావలసి ఉంటుంది. ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకునే వారెవరూ ఉండరు. పైగా తల్లీ-బిడ్డా ఎవరో పురుషుణ్ణి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుని అతని భార్యా,బిడ్డలుగా బండి మీద వస్తుంటే ఆమె కాళ్ళు బయటికి కనిపిస్తున్నాయని పోలీసు ఆమె కాళ్ళ మీద లాఠీ తో కొడతాడు. నానా కష్టాలూ పడి ఆ పూటకి ఇల్లు చేరడమే గగనమవుతుంది.

ఆకలితో అలమటించి పోతామని భయపడిన తల్లీ-అమ్మమ్మ రోజులు చాలా గడ్డుగా ఉన్నాయనీ,ఏదో ఒకటి చెయ్యకపోతే ప్రాణాలు నిలుపుకోలేమనీ అనుకుంటారు. ఇంకో దారే లేని పరిస్థితుల్లో మనవరాలికి మారువేషం వేసి,అబ్బాయిగా తయారు చేసి ఏదో ఒక పనికి పంపించాలని భావిస్తారు.బాలిక మాత్రం తాలిబన్లు ఈ సంగతి తెలిస్తే తనని చంపేస్తారని భీతిల్లిపోతుంది.నిస్సహాయంగా భయం భయంగా బేల చూపులు చూస్తూనే గత్యంతరం లేని పరిస్థితిలో అమ్మమ్మ-అమ్మ చెప్పినట్లే చెయ్యడానికి సంసిద్ధమౌతుంది.అమ్మమ్మ అమ్మాయి పొడవైన జుట్టంతా జడలుగా అల్లి కత్తిరిస్తుంది.అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న బట్టలు తెచ్చి వేస్తుంది.మొత్తానికి అందమైన సుకుమారమైన అమ్మాయి కాస్తా అచ్చం అబ్బాయిలా తయారవుతుంది.తండ్రి స్నేహితుణ్ణి బతి మాలి అబ్బాయికి చిన్న టీదుకాణంలో పనికి కుదుర్చుకుంటారు.అందరూ మారువేషంలో ఉన్న అమ్మాయిని అబ్బాయనే అనుకుంటారు గానీ తల్లితో పాటు హాస్పిటల్ పనికి వెళ్ళొస్తున్నప్పుడు చూసినఎస్పాండీఅనే బాలుడు మాత్రం ఈ రహస్యాన్ని పసిగట్టేస్తాడు. అతనేఒసామా అని పేరు పెడతాడు. ఒసామా బాలుడు కాదు బాలిక అని మిగిలిన పిల్లలకు అనుమానం వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఎస్పాండీ ఆదుకుంటాడు.నాకు తెలుసు.అతను అబ్బాయే, పేరు ఒసామా” అని చెప్పి రక్షించడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించవు.

 siva3

ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కనాకష్టంగా బతుకీడుస్తున్న వాళ్ళను విధి ఈ రకంగా కూడా బతక నివ్వ దల్చుకోలేదు. గ్రామంలోని బాలుర నందరినీ తాలిబాన్ శిబిరం నిర్వహించే ఒక మతపరమైన పాఠశాలకు తరలిస్తారు. తప్పనిసరిగా ఒసామా కూడా వెళ్ళవలసి వస్తుంది. ఈ పాఠశాలలో మతగురువులు పోరాడే పద్ధతులతో పాటు, భవిష్యత్తులో వివాహాల తర్వాత వారి వారి భార్యలతో ఎలా ప్రవర్తించాలో, భార్యలను కలిసిన తర్వాత స్నానంతో వారి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా నేర్పించే సన్నివేశమొకటి జుగుప్సతో, భయంతో వళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. బాలిక తన రహస్యాన్ని తాలిబన్ల నుంచి కాపాడుకోవడానికి అవయవాలను శుభ్రం చేసుకునే సందర్భంలో తప్పించుకోవడానికి విఫలయత్నాలు చేస్తుంది. తాలిబాన్ ఉపాధ్యాయులు పెట్టే నరకయాతనల పరిక్షల సమయంలోనే రజస్వల కూడా అయినందువల్ల  ఆమె కాళ్ళనుంచి రక్తం కారడం వల్ల, ఆమె ఒక బాలిక అని వాళ్ళకు తెలిసిపోతుంది. హాస్పిటల్ లో అరెస్ట్ చేసిన ఒక జర్ణలిస్ట్ నీ, ఒక విదేశీ వనితతో  పాటు ఆమెను జైలుకి పంపిస్తారు. పెద్ద పంచాయితీ చేసి మిగిలిన ఇద్దరికీ  మరణ శిక్ష విధిస్తారు. ఇంతలో ఒక ముసలి ముల్లా వచ్చి తాను బాలికను వివాహ మాడతానంటాడు. న్యాయ నిర్ణేతను “నన్ను ఈ ముసలివానికివ్వొద్దు. నాకు మా అమ్మ కావాలి.నన్ను అమ్మదగ్గరకు పంపించండి”అని దీనంగా,హృదయ విదారకంగా వేడుకుంటుంది బాలిక. జడ్జి మనసు కరగదు. పదమూడేళ్ళ  పసిపిల్ల పండు ముసలివానికి ఆఖరి భార్య కాక తప్పలేదు! అప్పటికే అతనికి ముగ్గురు భార్యలూ బోలెడంతమంది పిల్లలూ ఉంటారు. అది ఒక శిక్షగా ఆమెను అతని కిచ్చేస్తారు. అతని కౄరత్వం గురించి, అతని వల్ల తమ జీవితాలెలా నాశనమయ్యాయో అతని భార్యలే బాలికకు వివరించి చెప్తారు. సహాయ పడాలని ఉన్నా తాము ఏమీ చేయలేని నిస్సహాయులమని చెప్తారు.  ఇంతకు ముందున్న భార్యలతో పాటు బాలికను కూడా బంధించి, ఒక ఇంటిపై భాగంలో పెట్టి పెద్ద తాళం వేస్తాడు. ప్రతిరోజూ ముసలివాడు  పెట్టే హింస  చిన్నారిని  బాధిస్తూనే  ఉంటుందని  చెప్పకనే చెప్తారు.

ఒక వాస్తవిక కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆఫ్ఘానీ మహిళల దుస్థితిని చాలా  ఆర్ధ్ర్తతతో అద్యయనం చేసిన రచయిత  “సిద్దిక్ బర్మెక్. ఆయనే దర్శకులు, ఎడిటర్, స్క్రిప్ట్ కూడా ఆయనే రాశారు.

మహిళలకు “గౌరవం” సంగతి అటుంచి  అమానుష భౌతిక, మానసిక హింసలు  జీవితకాలమంతా  ఆఫ్గనిస్తాన్ లో  అమలవుతున్నవి. ఒక మహిళను గొంతు వరకూ పాతి పెట్టి ఆ పైన రాళ్ళు రువ్వే దృశ్యం కూడా  ఉందీ సినిమాలో! ఆఫ్ఘానీ మహిళల జీవిత సమస్యలను అర్థం చేసుకుని విశ్లేషించడానికి ఎంతో గుండెనిబ్బరం ఉండాలి. అయినా సరే మొట్టమొడటగా ఇంత ధైర్యం చేసిన బర్మెక్.ను ఎంతప్రశంసించినా తక్కువే!

బూర్జువా ప్రపంచంలో బాల్యాన్ని,యవ్వనాన్ని, జీవితాన్ని పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా మొత్తం దేశాన్ని తద్వారా తాలిబన్ ఇనుప పాలనను గొప్ప స్కోప్ లో బర్మెక్ చూపించారు.

రెండో సినిమా గురించి తర్వాత సంచికలో చెప్పుకుందాం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఒక పరిమళం, ఒక ఊపిరి వెచ్చదనం!

swamyనేల మీద పాదాలు ప్రతిరోజూ నడవనక్కర్లేదు. ఆ నేల నీదైతే చాలు. ఆ నేల నీ పాదాలకోసం ఎదురు చూస్తుంటుంది. నేలకూ పాదాలకూ ఒక విడదీయరాని అనుబంధం ఉన్నది. నీవెక్కడుంటేనేం? అది నీ గుండెలో ఉంటుంది. ఆ నేల తడి కోసం ఎదురు చూస్తుంటుంది. వాన చినుకుకోసం తపించుకుపోతుంది.

నారాయణ స్వామి మనసులో ఒక బీటలు వారిన నేల ఉన్నది. ఆ పగుళ్ల గాయాల మధ్య అతడు నిత్యం ఆక్రందిస్తున్నాడు. ఆ నేలలో నెత్తురు ఇంకిపోయిఉంది. ఆ నేలలో చెట్లు మ్రోడులయ్యాయి. పండుటాకులు ఎన్నడో రాలిపోయాయి. ఆ నేల వైపు మేఘాలు లేని ఆకాశం దీనంగా చూస్తుంటుంది. పక్షులు రెపరెపా కొట్టుకుంటూ ఎక్కడికో పయనమైపోతుంటాయి.

నేలపై పచ్చికబయళ్లు ఏర్పడేటప్పుడు? ఆ పచ్చిక బయళ్లను మంచు బిందువులు ఆలింగనం చేసుకునేది ఎప్పుడు? ఆ మంచుబిందువులను నీ పాదాలు స్ప­ృశించేటప్పుడు? ఆకాశంలో మేఘాలు దట్టమయ్యేదెప్పుడు? అవి దట్టంగా క్ర మ్మి, వాటి గుండెలు బ్రద్దలై అహోరాత్రాలు వర్షించినప్పుడే నేల గుండె శాంతిస్తుంది. నేల పరిమళం నిన్ను ఆవహిస్తుంది.

‘వానొస్తద?’  ఒక అద్భుతమైన ప్రతీకాత్మకమైన కవిత్వం. వాన రావాలన్న కోరిక అందులో ప్రగాఢంగా ఉంది. కాని వాన రావడం లేదన్న బాధ అంతకంటే లోతుగా ఉన్నది. వాన రావడం సహజమైన ప్రక్రియ. అది ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. కనుక ఎప్పుడో ఒకప్పుడు వాన వచ్చి తీరుతుందన్న ఆశాభావం కూడా ఈ కవిత్వంలో ఉన్నది. మన దూప తీర్చేందుకు మనమే జడివాన కావాలన్న ఆశాభావం ఇది.

‘వానొస్తద?’  అన్నది ఒక విమర్శనాత్మకమైన కవిత్వం. వాన యాంత్రికంగా రాదు. వానకోసం ప్రయత్నించే వాళ్లంతా ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. వానొస్తందని నమ్మిన వాళ్లు, వానకోసం సంఘర్షించిన వాళ్లు నేల పగుళ్ల మధ్య సమాధి అయ్యారు. ఎందరి నెత్తురో నేలను తడిపింది కాని వాన నీరు రాలేదు. వాన కోసం ఎదురు చూసే కళ్లు లోతుకుపోయాయి కాని బావుల లోతుల్లో ఊటైనా రాలేదు. కాగితపు పడవలు సిద్దంగా ఉన్నాయి. చిన్న నీటి ప్రవాహం వస్తుందోమో తేలుతూ పసిపిల్లల కళ్లలో ఆనందం చూసేందుకు..

‘వానొస్తద?’  అన్నది ఒక విషాద కవిత్వం. ఒక ఆత్మహత్యకూ, ఒక హత్యకూ అంకితమైన కవిత్వం. కన్నీళ్లతో నేలను తడపాలనే ప్రయత్నించిన కవిత్వం. హత్యలూ, ఆత్మహత్యల మ«ధ్య కాలాన్ని బంధించిన కవిత్వం. అది ఉదయం, సాయంత్రాల మధ్య రెపరెపలాడిన కాలం. విగ్రహాలు పడగొట్టిన వాడు లేడు. వాడు లేడన్న వార్తను జీర్ణించుకోలేని కవిత్వం. ఉరి తాడుకు కలలు ఊగుతూనే ఉంటాయి. ఒకరొక్కరే వెళ్లిపోతున్నారు నిశ్శబ్దంగా బయటకు రాన్ని శోకాన్ని, పుట్టెడు దుఃఖాన్నీ మన గొంతుల్లో మిగిలించి.. ఎంతమందిని ఊరుపేరు లేక మంట్ల గలిపిండ్రు? బిడ్డలారా, మిమ్మల్ని మీరు చంపుకోకుండ్రి.. ఎందర్ని పోగొట్టుకున్నం, ఎన్ని సార్లు కాటగలిసినం.. ఎన్ని కన్నీళ్లు మూటగట్టుకున్నం..

krishnudu

‘వానొస్తద?’  ఒక ఏకాకి వాస్తవ కవిత్వం. కవి ఎప్పటినుంచో ఒంటరి. నిద్రకు వెలిఅయ్యాడు ఒకడు. దినాల్లో కాళ్లీడ్చాడు మరొకడు. గ దిలోపలి చీకటిలో ఒకడు, చీకటిక్షణాల అగాధాల్లో, ఎండిన ఆకుల్లాంటి నదీ తీరాల్లో మరొకడు. వీడిది దొరికినదాన్నే ప్రతిసారీ పోగొట్టుకుంటున్న ప్రయాణం. ఇంతమందీ ఉండి నిర్జనమైన కూడళ్లలో ఒంటరిగా ఆరిపోయిన కొవ్వొత్తుల మధ్య వాడే. సమూహమే ఒంటరైనప్పుడు ఒంటరే సమూహమైన కల ఎక్కడ? జవాబివ్వండి నిరంతర నినాద, అనంత సుదీర్ఘ విప్లవ ఆకాంక్షావాదులారా? స్వాప్నికులారా?

‘వానొస్తద?’  ఒక తప్త హృదయ కవిత్వం. ఎన్ని శతాబ్దాలైంది మనిషిని కౌగలించుకోక? ఎంతకూ కనబడని మొగులు. ఎవరైనా ఇంత మట్టి వాసన చూపిస్తారా? గడ్డకట్టిన సుదీర్ఘ అపరిచయం. కందరీగలా కుట్టే కనికరంలేని ఒంటరి చిన్నతనం. ఒక నిశ్శబ్దాన్ని గుసగుసగా నైనా వినాలన్న తాపత్రయం.

‘వానొస్తద?’ ఒక స్వాప్నిక కవిత్వం. తొలి పొద్దు కర స్పర్శకు రెక్కల్ని విచ్చుకున్న కొత్త రాగాల పాటల్ని ఆలపిస్తుంది.

‘వానొస్తద?’  పుస్తకం పేరులోనే కాదు. పుస్తకం నిండా ప్రశ్నల కవిత్వం. ఎన్ని ప్రశ్నలో.. ఎక్కడైనా ఉన్నామా? అంతా ఆన్‌లైన్ పద్మవ్యూహాల్లో చిక్కుకుపోయామా?. ఎట్ల వొస్తవో? ఏ వెలివాడల్లో వెతకాలి నిన్ను? దారేది అవుతలికి? దొరుకుతద? దొరకని దానికోసమా వెదుకులాట? మళ్ల వస్తవ? బాపూ.. నీ యాది..తొవ్వ తెలుసా? ఎట్టపోతవు ఒక్కనివే. ఈ పట్టపగటి చీకటి పూట? ఆడుకున్న బస్తీ.. చెయ్యి పట్టుకున్న తంగెడుపూలు ఏవీ? వాళ్లెవరో? కాలం కళేబరం ఊరేగింపులో పూలయి గీసుకపోతరు..

వాన బయట కురవడం లేదు. నారాయణ స్వామి మనసులో కురుస్తున్నది. చప్పడు బయటకు వినిపిస్తున్నా, వాన మాత్రం లోపల కురుస్తున్నదని నారాయణ స్వామికి తెలిసిపోయిందని కెఎస్ ఒక్క మాటలో చెప్పాడు.

‘వానొస్తద?’ ఒక పసివాడి కవిత్వం. చిన్నప్పుడు తాగిన పాల తీపినీ, ఆడుకున్న బొమ్మల్నీ, పాత అర్ర వెనుక ఒంటరితనపు దోస్తుల్నీ అన్వేషించే కవిత్వం. ప్రేమ రాహిత్యాన్ని సహించలేని మనస్తత్వం. ప్రేమకాకపోయినా కనీసం ద్వేషాన్నైనా తడి వెచ్చగా తొలకరించమని తపించే కవిత్వం. గమ్యం కనపడని ప్రతిసారీ పుస్తకాల్లో దాచుకున్న బంతిపూల రెక్కల్ని తడిమి చూసుకున్న కవిత్వం.

ఈ పసివాడిని మనం హత్తుకుందాం.. అతడు అనుభవిస్తున్న ప్రేమరాహిత్యాన్ని దూరం చేద్దాం.ఎందుకంటే ఆతడు మనకు దూరంలో లేడు. దూరంగా ఉన్నాననుకుంటున్నాడు. కాని అతడిదీ మనదీ ఒకటే బాధ.. ఇది సామూహిక బాధ. ఇది సామూహిక కవిత్వం.  ‘వానొస్తద?’ మన సంభాషణ, మన సందర్భం. మన కాలం. మన రోదన. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పడనీ..

నారాయణ స్వామి వచ్చాడు.. ‘వానొస్తద?’ మనకు ఇచ్చాడు. నీ రాకని నీ పరిమళం చెప్పనీ.. నీ సమక్షాన్ని నీ ఊపిరి వెచ్చదనం తెలుపనీ. నువ్వులేని తనాన్ని నీ మౌనం పలకనీ.. ‘వానొస్తద?’ ఒక పరిమళం. ఒక ఊపిరి వెచ్చదనం. ఒక మౌనం.

(నారాయణ స్వామి కవిత్వం ‘వానొస్తద?’ సమక్షంలో ) 

ఆ ఆఖ‌రి మ‌నుషుల కోసం… ఆర్తిగా..!

akshara2

‘‘క‌ళ బ‌త‌కాలంటే…ముందు క‌ళాకారుడు బ‌త‌కాలి’’అంటాడు అక్ష‌ర‌కుమార్‌. త‌న‌ది మూడు ప‌దుల వ‌య‌సు. క‌ల్లోలిత క‌రీంన‌గ‌ర్ జిల్లాలో పుట్టిన ఈ కుర్రాడు సినిమా ఇండస్ర్టీలో ప్ర‌స్తుతం త‌న సామర్ధ్యాన్ని, అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ప‌రీక్షించుకుంటున్నాడు. క‌ళ‌కు జీవితాన్ని అంకితం చేయాల‌న్న త‌ప‌న ఉన్నోడు తాను. అంతేకాదు నిత్యం సాహిత్యం చుట్టూ వైఫైలా తిరిగే అక్ష‌ర‌కు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, సినిమా స్ర్కిప్ట్‌లు రాయడం హాబీలు. వీట‌న్నింటికీ తోడు అంత‌రిస్తున్న క‌ళారూపాల‌ను చూసి, ఆవేద‌న చెందుతుంటాడు. అట్లా ప్ర‌స్తుతం కాకిపడిగెల వారి మీద ఏకంగా ఓ ఫిచ‌ర్ ఫిల్మంత డాక్యుమెంట‌రీనీ తీశాడు. అదే కాకి ప‌డిగెల క‌థ‌.

డాక్యుమెంట్ చేయ‌డం వ‌ల్ల ఎప్పుడూ రెండు ప్ర‌యోజ‌నాలుంటాయి. అవి ఒక‌టి వ‌ర్త‌మాన స‌మాజంలో మ‌న చుట్టూ ఉన్న మ‌రో ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేయ‌డం ద్వారా ఆలోచ‌న రేకిత్తించ‌డం. మ‌రొక‌టి భ‌విష్య‌త్ త‌రాల‌కు ఒక క‌ళారూపం యొక్క గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేయ‌డం ప్ర‌స్తుతం గ్లోబ‌లైజేష‌న్ రెండ‌వ ద‌శ‌లో ఉన్నవాళ్ల‌కు ఇవేవి ప‌ట్ట‌ని సంద‌ర్భం ఇది. ఈ స‌మ‌యంలో ఓ కుర్రాడు వేల యేండ్ల చ‌రిత్ర క‌లిగిన  ఓ క‌ళారూపాన్ని బ‌తికించుకోవాల‌నే త‌ప‌న‌తో చేసిన ప‌నే ఈ డాక్యుమెంటరీ.

ముదిరాజుల మిరాశి కులం కాకిప‌డిగెల‌. వీరి జ‌నాభా క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ జిల్లాల్లో నామ మాత్రంగా ఉంది. వీరికి వార‌స‌త్వంగా వ‌స్తున్న క‌ళారూపంతోనే వీరి బ‌తుకు గ‌డుస్తోంది. ప‌ట‌మేసి పాండ‌వుల క‌థ చెప్పే సంప్ర‌దాయం వీరిది. చెట్టుకొక‌రు పుట్ట‌కొక‌రుగా ఉన్న ఈ కుల‌స్తుల కుటుంబాలు ఒక‌టి వ‌రంగ‌ల్లో ఉంటే మ‌రొక‌టి సిద్ధిపేట ప‌రిస‌ర గ్రామాల్లో ఉంది. వంద‌ల యేండ్లుగా కాకిప‌డిగెలు క‌థ చెప్పుకుంటూ బ‌తుకీడుస్తున్నారు. ఇలాంటి వారి ప‌ట్ల అక్ష‌ర‌కు ఎడ‌తెగ‌ని మ‌మ‌కారం. వారి క‌ళ ప‌ట్ల గౌర‌వం ఉంది. వారి చ‌రిత్ర‌ను బ‌తికించాల‌నే తండ్లాట ఉంది. ఆ తండ్లాట‌లోనుండే ఈ డాక్యుమెంట‌రీ రూపొందింది. ఎవ‌డికి ఎవ‌డూ కాని  లోకంలో, ఓ అంత‌రిస్తున్న క‌ళ గురించి,క‌ళాకారుల గురించి ఈ యువ ద‌ర్శ‌కుడు మ‌ధ‌నప‌డుతున్నాడు. క‌ళాకారుల క‌ళ‌నే కాదు, ఆ క‌ళ వెనక  దాగిన క‌న్నీళ్ల‌ను ఒడిసి ప‌ట్టుకుంటున్నాడు. అందుకే జాగ్ర‌త్త‌గా వారి గ‌తాన్ని వ‌ర్త‌మానాన్ని రికార్డు చేస్తున్నాడు.

akshara1

పురాణాలు అంతిమంగా బ్రాహ్మ‌ణిజం చుట్టే తిరుగుతాయి. అవి హిందు దేవ‌త‌ల‌ను కొలిచే ముగింపునే క‌లిగి ఉంటాయి. ఈ పుర‌ణాల మీద ఆధార‌ప‌డి  సృష్టించ‌బ‌డిన క‌ళారూపాలు కూడా ఆ మూస‌లోనే కొన‌సాగుతుంటాయి. అంతమాత్రం చేత వాటినే న‌మ్ముకున్న క‌ళాకారులు అంత‌రించాల‌ని కోరుకోవ‌డం తిరోగ‌మ‌న‌మే అవుతుంది. హిందు కుల వ్య‌వ‌స్థ ఒక్కో కులానికి ఒక్కో ఆశ్రిత కులాన్ని సృష్టించింది. ఈ సంస్కృతి ఆయా కులాల చ‌రిత్ర‌ను గానం చేసే ప్ర‌స్థానంతో మొద‌లై ఉంటుంది. మాదిగ‌ల‌ను కీర్తిస్తూ చిందు,డ‌క్క‌లి, బైండ్ల కులాలు ఇప్ప‌టికీ గ్రామీణ ప్రాంతాల్లో క‌థ‌లు చెబుతుంటాయి. మాదిగ‌లు ఇచ్చే త్యాగం మీదే వీరి జీవితాలు గ‌డుస్తుంటాయి. అలా ముదిరాజు కుల చ‌రిత్ర‌ను గానం చేస్తూ ప‌టం మీద పురాగాథ‌ల్ని పాడే కుల‌మే కాకిప‌డిగెల కులం. ఈ క‌ళాకారులు మిగిలిన ఆశ్రిత కులాల క‌ళాకారుల వ‌లెనె అంప‌శ‌య్య మీద జీవ‌నం సాగిస్తున్నారు.

కాకి ప‌డిగెల సంప‌త్‌! ఈ పేరు ఈ డాక్యుమెంట‌రీ చూసే వ‌ర‌కు నాకైతే తెలియ‌దు. ప్ర‌స్తుతం క‌ళా రంగంలో ఉద్ధండులైన పండితుల‌కు కూడా ఈ పేరు కొత్తే. కాకిప‌డిగెల సంప‌త్ క‌థ చెబితే ప‌ల్లె తెల్ల‌వార్లు మేల్కొని చూడాల్సిందే. క‌థ‌ను త‌న మాట‌ల‌తో ప్ర‌వ‌హింప జేసేవాడు సంప‌త్‌. తాను పురాగాథ‌ల్ని గానం చేస్తుంటే ఒక మ‌హా వాగ్గేయ‌కారుడు మ‌న కండ్ల ముందుకొస్తాడు. అడుగులు క‌దుపుతూ డోల‌క్ ద‌రువుల‌కు, హార్మోనియం రాగాల‌కు గాలిలో తెలియాడుతూ చేసే సంప‌త్ ప్ర‌ద‌ర్శ‌న ఎవ్వ‌రినైనా మంత్ర ముగ్ధుల్ని చేసేది. అందుకే ఢిల్లీ వ‌ర‌కు త‌న ప్ర‌ద‌ర్శ‌న ప‌రంప‌ర కొన‌సాగింది. ఆశ్రిత కులాల క‌ళాకారులు ఎంత గొప్ప ప్ర‌తిభ క‌లిగినా వారికి ద‌క్కేది ఏమీ  ఉండ‌దు. అకాల మ‌ర‌ణాల పాల‌వ్వ‌డ‌మే ఈ వ్య‌వ‌స్థ వారికిస్తున్న బ‌హుమ‌తి. అలా అనారోగ్యంతో సంప‌త్ నేలరాలాడు. ద‌శాబ్దాలుగా కాకిప‌డిగెల క‌ళారూపానికి జీవితాన్ని అంకితం చేస్తే, త‌న భార్యా బిడ్డ‌ల‌కు తాను సంపాదించింది ఏమీ లేదు. మ‌ళ్లీ అదే పూరి గుడిసె, అవే డోల‌క్ తాళాలు. తండ్రి అందించిన క‌ళారూపాన్ని త‌మ ఆస్తిగా భావించారు సంప‌త్ ఇద్ద‌రు కొడుకులు. ఇప్పుడు వారు మ‌ళ్లీ కాకిప‌డిగెల క‌థ చెబుతూ త‌మ తండ్రికి మ‌న‌సులోనే నివాళులు అర్పిస్తున్నారు. గ్లోబ‌లైజేష‌న్ వ‌చ్చి త‌మ పొట్ట‌కొట్టినా తాము ఆక‌లితో అల్లాడిపోతున్నా త‌మ క‌థ ఆగొద్ద‌నేదే వారి భావ‌న‌. అందుకే అన్నీ మ‌రిచిపోయి ఆట‌లోనే శిగ‌మూగుతున్నారు. ఇదీ విషాదం. ఈ విషాదాన్ని ప్రపంచానికి చెప్పేందుకే అక్ష‌ర కుమార్ అంకిత‌మ‌య్యాడు.

ఈ యువ‌ద‌ర్శ‌కుని ప్ర‌తిభ ఇందులో అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. డాక్యుమెంట‌రీలు అన‌గానే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవ‌ర్‌తో ఏదో ఇంట‌ర్ ప్రిటేష‌న్ వ‌స్తుంటుంది. దాన్ని నిర్మిస్తున్న‌వారి ఆబ్జెక్టివ్స్ వారికుంటాయి. కాని, అక్ష‌ర ఈ రొటీన్ వ‌ర్క్ మాడ‌ల్‌ని బ్రేక్ చేశాడు. వారి లైఫ్ స్టైల్, వారి స్ర్ట‌గుల్, వారి లెగ‌సీ, వారి ట్రాజెడీ అన్నీ వారితోనే చెప్పించాడు. ఉన్న‌ది ఉన్న‌ట్లు క‌ళ్ల ముందుంచి, ప్రేక్ష‌కుణ్ణే ఆలోచించ‌మంటాడు. ఇక సినిమా ఇండ‌స్ర్టీ అనుభ‌వాల‌ను కూడా రంగ‌రించాడు అక్ష‌ర‌. డాక్యుమెంట‌రీని ఒక ఆర్ట్ ఫిల్మ్‌లా మ‌లిచేందుకు శ‌త‌థా ప్ర‌య‌త్నించాడు. ఒక దృశ్య‌కావ్యం మ‌న మ‌న‌సుల్ని ఆక‌ట్టుకోవాలంటే అందులో హ్యూమ‌న్ ఎమోష‌న్స్‌ని ప‌లికించాలి. ఇదే అక్ష‌ర ఉద్దేశం కూడా. అందుకే క‌ళ‌ను న‌మ్ముకున్న ఈ ఆఖ‌రి మ‌నుషుల అంత‌రంగాన్ని ఆవిష్క‌రించేట‌పుడు కూడా ఎమోష‌న్స్‌ని వ‌దిలిపెట్ట‌లేదు. ఆక‌లితో అల‌మ‌టిస్తూనే వారి పండించే హాస్యాన్ని కూడా తెర‌కెక్కించాలంటే ద‌మ్ముండాలి. ఆ ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు అక్ష‌ర‌. అందుకే వారి దుఃఖాన్ని ప‌ట్టుకున్నంత సుల‌భంగా వారి ధైర్యాన్ని ఏటికి ఎదురీదేత‌నాన్ని కూడా ప‌ట్టుకున్నాడు.

కులం స‌ర్టిఫికెట్లు జారీచేయ‌డానికి అర్హ‌త క‌లిగిన  6432 కులాల జాబితాలో పేరు లేని కులం ఈ కాకిప‌డిగెల‌. దీంతో వీరికి విద్యా ఉద్యోగం అనేవి ద‌రిచేర‌నివిగానే మిగిలిపోతున్నాయి. కాళ్లావేళ్లా ప‌డితే వీరికి బీసీ-డీ స‌ర్టిఫికెట్ ఇచ్చి చేతులు దుల‌పుకుంటున్న‌ది స‌ర్కార్‌. ఈ విషాదానికి తెర‌ప‌డాల‌న్న‌దే ఈ డాక్యుమెంట‌రీ ఉద్దేశం. తెలంగాణ నూత‌న రాష్ర్టంలో కోల్పోయిన చ‌రిత్ర‌ను పున‌ర్నిర్మాణం చేసుకుంటున్న ద‌శ ఇది. ఈ స‌మ‌యంలో ఈ జాన‌ప‌ద క‌ళాకారుల‌పైన వారి క‌ళారూపాల‌పైన అక్ష‌ర కుమార్‌కు ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. గ్రామాల‌కు వెళ్లిన‌పుడు ఏ క‌ళారూపాన్ని లెక్క‌చేయ‌ని యువ‌త‌, ప‌ట్నానికొస్తే శిల్పారామంలో మాత్రం ఎగ‌బ‌డి డ‌బ్బులు పెట్టి మ‌రీ జాన‌ప‌ద క‌ళారూపాల‌తో, క‌ళాకారుల‌తో సెల్పీలు దిగే వైవిధ్యం నేడున్న‌ది. ఇలాంటి జ‌మానాకు దూరంగా నిజాయితీతో జాన‌ప‌ద క‌ళారూపాల‌ను బ‌తికించాల‌నే ల‌క్ష్యంతో అక్ష‌ర కుమార్ చేసిన ఈ ప్ర‌యత్నం వృథాపోదు. రేప‌టి త‌రాల‌కు కాకిపడిగెల జీవితం దృశ్య రూపంలో అందుతుంది. ఇలాంటి ప‌నిని ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి, చేసిన అక్ష‌ర కుమార్‌కు అభినంద‌న‌లు. అక్ష‌ర‌కుమార్ సంక‌ల్పానికి అండ‌దండ‌గా నిలిచిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు, జాతీయ అవార్డు గ్ర‌హీత మామిడి హ‌రికృష్ణ అభినంద‌నీయులు. తెలంగాణ‌లో ఉన్న డెభ్భైవేల మంది జాన‌ప‌ద క‌ళాకారుల్ని త‌న కుటుంబ స‌భ్యులుగా భావించే మామిడి హ‌రికృష్ణ‌గారి ఔదార్యం గొప్ప‌ది. అక్ష‌ర అండ్ టీం శ్ర‌మ‌కోర్చి నిర్మించిన ఈ దృశ్య‌రూప కావ్యం ఈ నెల 4వ తేది సాయంకాలం ర‌వీంద్ర భార‌తిలో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుంది.

ఆఖ‌రి మ‌నుషుల కోసం అల్లాడిన ఆర్తి ఇది

క‌నుమ‌రుగ‌వుతున్న క‌ళారూపానికి క‌న్నీటి భాష్యం

కాకిప‌డిగెల స‌జీవ దృశ్య‌కావ్యం

గ్లోబ‌ల్ ప‌డ‌గ గాయాల‌ను మాన్పేందుకు.. అక్ష‌ర హృద‌య ఔష‌ధం

రండి అంద‌రం క‌లిసి వీక్షిద్ధాం..

ఆత్మీయ క‌ర‌చాల‌నాల‌తో అభినందిద్ధాం…  

*

ఎన్నెన్నో వర్ణాల పరికిణీ!

parikini600

అవును, అచ్చతెలుగు అమ్మాయి వేసుకొనే  – పరికిణీయే!

భరణి గారి కలంలో ఇన్ని కళలు ఉన్నాయా  ఇన్ని సొగసులు ఉన్నాయా అనిపించే మహత్తర విందు భోజనం ఈ కవితా సంకలనం. ఇవి నిజానికి భరణి అనుభవాల, అనుభూతుల నుండి రాలిన భావోద్వేగాలు. వీటిలో కవిత్వం మాత్రమే కాదు, కసి, కోపం, ద్వేషం, ప్రేమ, అసహనం, ఆప్యాయత, హాస్యం, భయం, వీరం అన్నీ కనిపిస్తాయి.

మరో చిత్రం ఏమంటే ? తెలుగులో ఎన్ని వర్ణాలో అనిపించేలా  వీటిల్లో పదప్రయోగాలు, విరుపులతో పాటు అన్ని యాసలూ కనిపిస్తాయి.  వినిపిస్తాయి.

మద్యతరగతి మనుషుల్లో కనిపించే చిత్రాలు, విచిత్రాలను తనదైన శైలిలో కళ్ళెదుట కనిపించేట్టు చేస్తారు భరణి. ఆయన శైలి మనతో మాట్లాడినట్టో లేదా నిలదీసి అడుగుతున్నట్టో అనిపిస్తుంది. అక్షరాలను ఆయుధాలుగా చేసి బాణాలుగా వదిలిన 26 కవితల ఈ సమాహారంలో ఒక్కో కవిత ఒక్కో సాక్ష్యం అనడం అతిశయోక్తి కాదు.

——-

మనకే సొంతమైన అందమైన పరికిణీని  మిడ్డీలు, చుడీలు మాయం చేస్తున్నాయనే ఆక్రోశం నుండి పుట్టినదే పరికిణీ.

మధ్యతరగతి సంసారంలో కష్టాలను అధిగమించలేక సతిపై తాండవమాడే  – మద్యతరగతి నటరాజు

ఆశల ఆవకాయ జాడీలను కళ్ళలో కలలుగా మార్చుకొని తృప్తిపడే సామాన్యుడి – ఖారం ఖారంగా

అందం, డబ్బులేక పెళ్ళికాని కన్యలతో ఆడుకొనే పెద్దల ఆట, ఆడపిల్లల వేట అయిన పెళ్ళిచూపుల ప్రహసనం

ఉద్యోగం పురుషలక్షణం అన్నారు, ” ఒక్కరోజన్నా ఉద్యోగం చేసి చచ్చిపోవాలి” అని ఆలోచించే అసహాయ  – గ్రాడ్యుయేట్

ఉడికీఉడకని అత్తెసరులాంటి సాహిత్యంతో సరస్వతిని చంపేస్తున్న మేధావుల సాహిత్యపు – మీల్స్ రెడీ

డబ్బే మనిషిని ఆడించే మాయ. ఆమాయలో ఘోరాలు ఎన్నో కదా అనే  – లచ్చింతల్లీ

శుభకార్యాలకు అపశకునంగా, అమంగళానికి అర్ధంలా అనుకొని విలువివ్వని పెద్దల గొప్పధనం చెప్పే –  బామ్మ

అర్ధంకాని అనేక ప్రశ్నలతో దేవుడ్నే అడిగే – చిలకప్రశ్న

వంట తప్ప మరేం రాదు అనుకొనే ఆలి గొప్పతనం అసువుగా చెప్పే – మా ఆవిడకు మంత్రాలొచ్చు

అద్బుతాలు ఆవిష్కరిచే చీర. రూపాలు మార్చుకొనే చీర. ప్రపంచంలో గొప్ప వస్త్రం ఏదయ్యా అంటే –  చీరే

రోబోట్ జీవితం, ఉదయం బ్రతికి రాత్రికి చచ్చే ఒకానొక – గుమాస్తా సూర్యుడు

శశిరేఖ, పార్వతి, మధురవాణి పాత్రేదైనా పలుకేను – సావిత్రి సావిత్రే అని

భువి నరకంలోనుంచి స్వర్గానికి చేరుకోవాలనే కూతురి ఓ లేఖ  – నాన్నకు….

 

ఇలాంటి ఆణిముత్యాలు మరెన్నో-  ప్రతి కవితలో అంతర్లీనంగా ఏదో ఒక సందేశం జతచేస్తూ, ఆలోచింపచేసేవిగా రాయడం ఒకెత్తు అయితే , ఎవరికైనా అర్ధం అయ్యేలా చిన్న పదాలతో భావాన్ని స్పురింపజేయడం మరొకెత్తు. భరణి చూసిన జీవితంలో చిత్రాలను అక్షరాలుగా మలచి అందించిన అందమైన ఈ పుస్తకం కేవలం చదువుకొని భద్రపరచుకోడానికే కాదు ఎవరికైనా ఇవ్వడానికి కూడా గొప్ప బహుమతిగా ఉంటుంది.

 

పుస్తకం – పరికిణీ

రచన- తనికెళ్ళ భరణి

వెల – 60

 

పంటని వాగ్దానం చేసే కవిత్వం ఏదీ?!

Art: Rafi Haque

Art: Rafi Haque

కవిత్వం గాలిలోంచి పుట్టలేదు. ఆకాశం నుండి రాల లేదు. ఏ దేవుడో వరమిస్తే మొలకెత్త లేదు. కవిత్వం ఎలా పుడ్తుంది అని ఒక కవిని నిద్ర తట్టి లేపితే ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే ఆలోచనల వల్ల పుడ్తుంది అంటాడు. ఒకడు విశ్వంతో మమేకమైతే ( అదెలా ఉంటుందో కొంచెం  సంశయాత్మకత   ఉన్నా సరే ) కవిత్వం పుడ్తుంది అంటాడు. ఒకడు ప్రకృతి లో పవళిస్తూ ఉంటే కలిగే ఆలోచనల్లో కవిత్వం పుడ్తుంది అంటాడు. మరొకడు కడుపు కాలితే పుడ్తుంది అంటాడు. ఈ కవిత్వం అన్నది ఎటువంటి బ్రహ్మ పదార్థం ? ఎలా పుడుతుంది ? ఈ  తర్కాన్ని జాగర్తగా అర్థం చేసుకుంటే మనం కవిత్వం గురించి వచ్చే చర్చలను చాలా మట్టుకు అర్థం చేసుకునే ప్రయత్నంలో సఫలం అవ్వచ్చు. లేదా గాలి ఎటు వీస్తే అటు వీచి పోతాము.

అసలు సమాజం ఎలా పరిణామం చెందిందో అందులో భాష ఎలా పుట్టిందో ఏ నియమాలననుసరించి పుట్టిందో తెలుసుకోకుండా కవిత్వం ఎలా పుడ్తుంది అని చర్చించడం అస మగ్రంగా ఉంటుంది.

ఆదిమానవుడి ప్రపంచంలో ప్రకృతి  ప్రధాన పాత్ర పోషించింది. అప్పట్లో ఆదిమానవుడి  పరస్పర సంబంధం ప్రధానంగా ప్రకృతి తోనే నడిచింది. ప్రకృతికి మాటలు రావు , వినిపించవు. చెట్టు ను బతిమాలో బామాలో పళ్ళు సంపాయించుకునే  యాంత్రికవిధానం లేకపోవడంతో మనిషి తన చేతులకు కాళ్ళకు పని చెప్పవలసి వచ్చింది. లేపొతే మనిషి అంతరించాల్సిన ఆగత్యం వస్తుంది. ప్రకృతితో ఉండే  పరస్పర సంబంధం  లో మానవుడు తన అవసరాల దృష్ట్యా తన అవయవాలను భౌతికంగా ఉపయోగించాల్సి వచ్చింది. ఆ క్రమంలో మనిషి చేతులు కాళ్ళు రూపాంతరం చెంది ఒక పరిణామ క్రమంలో మనిషి నాలుగు కాళ్ళ జంతువు నుండి మనిషిగా విభిన్న రూపం దాల్చుకోవాల్సి వచ్చింది. కొద్దిగా  మళ్ళి ఆలోచిస్తే మనిషి మొట్ట మొదటి ఉత్పత్తి పని ముట్టు చేయి. మనిషిలో ఎదుగుదల జరగడానికి కారణం శ్రమ. ఈ పనిముట్టు అనగా చేయి, దానితో పాటు తదితరై అవయవాలలో జరిగిన మార్పు, అందుకు సమన్వయంగా మెదడు అభివృద్ధి చెందడం ఒక మానవ శ్రమ విధాన క్రమంలో అవసరమయ్యింది.  ఇదే పరిణామాన్ని జీవ పరిణామ సిధ్ధాంతాలు మనకు సులువుగా వివరిస్తాయి. ఇక మెదడు అభివృద్ధిచెందిన తర్వాత లేదా చెందుతున్న క్రమంలో తనకు అవసరమైన పనుల గురించి మనిషికి చైతన్యం పెంపొందడం సహజం అయ్యింది. అలా కాకపోయి ఉండి ఉంటే మనిషి  అంతరించిపోయే వాడు.

శ్రమ

Physiological development ——–> pshychological development

 

అంటే మనిషి భౌతిక మానసిక పరిణామ క్రమంలో ప్రకృతి లో మనుగడకు కావాల్సిన  కనీస పరస్పర సంబంధం  ఎంతైతే కావాలో అంత కలిగి ఉన్నాడు. ఆ మాట కొస్తే ప్రతి పక్షికీ ప్రతి జంతువుకు కూడా  స్మృతి చేతన  ఉంటుంది. అప్పుడు భాష అవసరం లేదు ఎందుకంటే – మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా కేవలం భౌతిక అవసరాల కోసం ప్రకృతి తో ఉండే  పరిమిత పరస్పర సంబంధం కు భాష అనవసరం. ఏం మనిషి కూడా అలానే చీమలానో తేనెటీగలానో ఆ మాత్రం  స్మృతి చేతన  తో బతక లేడా ? బతకలేడు. బతికి ఉంటే మనిషి కాకుండా ఏ ఏనుగో, గుర్రమో అయి ఉండేవాడు. ఐతే అతని అవయవాలు అతని భౌతిక అవసరాలు పూరించడానికి అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని గమనించాలి.

ఒక విషయం అర్థం చేసుకుందాము. మానసిక ఎదుగుదల భౌతిక ఎదుగుదల ఒక అనుసంధాన క్రమంలో జరిగింది. అంటే గంట క్రితం ఆలోచించిన విషయానికి ఇప్పుడు మాటలు పుట్టితే ఇక మాటల అవసరం ఏముంది ? లేదా ఇప్పుడు చేసిన పని మన మెదడులో ముద్రించుకోడానికి ఒక రోజు పడితే ఇక పని ఎలా చేయగలం ? కాబట్టి మానసిక ఎదుగుదల అన్నది శారీరక ఎదుగుదలతో పాటు జరగాల్సిన ఒక అనివార్య క్రమంగా మనం చూడొచ్చు.

మెదడు అభివృద్ధి జరిగాక మనిషిలో చైతన్యం అన్నది మొదలయ్యింది. చైతన్యం అంటే The manner in which we interpret, analyse, remember and use the information about the social world . అంటే చుట్టు పక్కల ఉన్న పదార్థాలతో ఉండే ఒక  నిరంతర పరస్పర సంబంధంవలన మనిషికి ఆలోచనలు కలిగాయి . ఎందుకంటే ఈ చైతన్యం వలన మనిషికి  pattern recognition    అర్థం అవుతూ వచ్చింది. ఇదంతా ఒక  ఏక కాల ప్రక్రియ. ఏ ఒక్క గంటలో జరిగిన విధానం కాదిది. కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టింది.

పొద్దున్నే లేచి ఆది మానవుడు లేచి రాతి గొడ్డలితో చెట్టును కొడ్తే ‘ ఠక్ ‘ ‘ఠక్ ‘ అనే చప్పుడే వచ్చేది. అలాకాక ఒక రోజు హఠాత్తుగా ‘ఖణేళ్ ‘ ‘ ఖణేళ్ ‘ అన్నదనుకోండి. వెంటనే అది మొద్దు ఐనా కాకపోయి ఉండాలి లేదా మొద్దుకు ఈ గుణం కొత్తగా ఐనా వచ్చి ఉండాలి అన్న విషయం తర్కించగలడు. అది తేలకపోతే మనిషి మొద్దు మీద ఆధారపడ్డం అన్నా వదులు కోవాలి లేదా ఆ విషయాన్ని శొధించాలి. ( అంటే ఏ ‘X’ మనిషో ‘Y ‘ మనిషో ఐనా మనకెందుకు అని ప్రొసీడ్ అయి ఉండొచ్చు. ఆ   వ్యక్తిగత నడవడిక సామాజిక గతి క్రమాన్ని వివరించదు. పైగా ఈ మార్పు ఒక్క క్షణంలో జరిగింది కాదు ). కాబట్టి జాగర్తగా గమనిస్తే పదార్థం ( అంటే పరిసరాల మొత్తం అని సింపుల్ గా చెప్పొచ్చు ) వలన చైతన్యం కలిగింది. చైతన్యం ఒక రకంగా చూస్తే ఆలోచనల సముదాయము.

పదార్థం ——— > చైతన్యం 

పరిసరాలలో ఉన్న వైరుధ్య భావనల వల్ల ( ‘మొద్దు ‘  గురించి వివరించిన ఉదాహరణలో చూసినట్టు ) క్రమ క్రమంగా ఆలోచనల సమూహం పెంపొందుతూ వచ్చింది. చైతన్యం అన్నది ఒక  శరీర ధార్మిక మార్పు (Physiological change)  దశ నుండి పదార్థం చేత ప్రభావితం చేయబడ్డది. మరింత పరిణతి చెందుతూ వచ్చింది. ఇది జాగర్తగా గమనిస్తే పదార్థం తో జరిగిన ఒక శ్రమ విధానం వలన ఉద్భవించిన విశేషఘటన ( phenomenon)   గా చెప్పొచ్చు.

మనిషి ఈ క్రమంలో పదార్థం పట్ల పెంపొందించుకున్న అవగాహన వలన లోహం కనుక్కోగలిగాడు. దాని వలన ఉండే ఉపయోగాలు గుర్తించగలిగాడు. ఇదే క్రమంలో ఒక ఉత్పత్తి విధానం ఒక పంపిణీ విధానం అమలు లోకి వచ్చాయి. అదే క్రమంలో తనతో పాటు జీవించే తోటి మానవులతో  పరస్పర సంబంధం  మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే మనిషి ప్రకృతి తో పరస్పర ప్రతిస్పందన క్రమంలో ఎదుగుదల చెంది తన చుట్టూ ఉన్న సమాజంతో  కూడా పరస్పర ప్రతిస్పందన ను ఏర్పరుచుకోవడం అవసరం అనే ఒక సందర్భానికి లాగ బడ్డాడు. అంత వరకు సైగలకు పరిమితమైన  సంభాషణ పద్దతికి ఒక భాష అవసరం అయ్యింది. మనం ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటూ వస్తుంటే భౌతిక ఎదుగుదల కు సమన్వయంగా వచ్చిన మానసిక ఎదుగుదల వలన, ఆ మానసిక ఎదుగుదల ఫలితంగా ఏర్పడిన చైతన్యం వలన మరియు ఉత్పత్తి విధానం లో ఒరవడి పెంపొందడం వలన ఆ క్రమంలో మారుతున్న మానవ సంబంధాల వలన ఒక సంస్కృతి  ఏర్పడాల్సిన దిశ అవసరం అని తెలుస్తుంది.

ఇంకా చూద్దాం. సైగలకు పరిమితమైన కమ్యూనికేషన్` పద్దతి క్రమంగా సన్నగిల్లి భాష అవసరం ఏర్పడింది. నాగలి తయారు చేసే దశకు వచ్చే లోపు అనగా సుమారు లోహ పరికరాలు విరివిగా వాడ్డం మొదలు పెట్టడం మొదలు పెట్టాక భాష వచ్చింది అని కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం. ఐతే అంతకు ముందో అంతకు తర్వాతనో మొత్తం మీద భాష మారిన సామాజిక లేదా మానవ సంబంధాలకు అనుగుణంగా అవసరం అయ్యింది. ఆ భాష లేకపోతే పెద్ద మొత్తంలో ఉన్న సాంఘిక అవసరాలు తీరలేవు.

ఇంతవరకు గమినించిందేంటి ? 

  1. మనిషి తన భౌతిక అవసరాల కొరకు శ్రమ చేసే క్రమంలో ఎదుగుతున్నప్పుడు మెదడు a అభివృద్ధి అన్నది శారీరక ఎదుగుదల క్రమంలో అవసరం అయ్యింది.ఆ క్రమంలోనే మనిషి జంతువు నుండి వేరు పడ్డాడు.
  2. మానసిక ఎదుగుదల వలన కలిగిన చైతన్యం వలన ( దీని నిర్వచనం వ్యాసంలో ముందు చూసాము ) పదార్థంతో జరిగే నిరంతర పరస్పర సంబంధం వలన ఉత్పత్తి విధానాని ప్రభావితం చేయగలిగాడు.
  3. ఉత్పత్తి విధానం పెంపొంది సామర్థ్యము పెరుగుతున్నప్పుడు సైగలకు పరిమితమైన సంభాషణ పద్దతి అనివార్యంగా మారాల్సిన పరిస్థితి సమాజంలో ఏర్పడింది
  4. తన చైతన్యంతో కొత్తగ ఏర్పడిన ఉత్పత్తి విధానం పంపిణీ విధానానికి అనుగుణంగా మరియు తన సాంఘిక అవసరాలకు అనుసంధానంగా మనిషి సౄష్టించుకున్న సంభాషణా మాధ్యమం భాష.
  5. పదార్థంతో ఉండే నిరంతర పరస్పర సంబంధం వలన చైతన్యం పెంపొంది ఆలోచన కలుగుతుంది. ఆ చైతన్యం వలననే మనిషి శ్రమ సంబంధాలను మెయింటెయిన్ చేయగలిగాడు. ఇది భాషకు మూలం అయ్యింది.

 

ప్రకృతి సహజంగా అనుసరించే  సహజమైన్ డైయెలిక్టిక్స్   ఉన్నాయి. వాటి ప్రకారమె మనిషి జననం, భాషా జననం జరిగింది. ‘ మనిషికి ఈ పరిణామ క్రమంలో తోక ఎందుకు రాలేదు?’ అని అంటే కోతి ఈ సృష్టిలో ఏర్పడే విధానాన్ని చర్చించినట్టు అవుతుంది తప్ప మనిషి గురించి కాదు. ఇది కేవలం జీవ పరిణామంగా మాత్రమే చూస్తే మనం  జీవ శాస్త్రం  దగ్గర మాత్రమే ముగిస్తాము. డార్విన్` జీవ పరిణామ సిద్ధాంతం సమాజ చలనాన్ని వివరించదు. అది డార్విన్ తప్పు కాదు. దాన్ని  వ్యాఖ్యానించే వాళ్ళది తప్పు. ఆ రకంగా చూస్తే మనకు మన మనుష్య సమాజ పరిణామాన్ని అర్థం చేయించడానికి  ఆంత్రోపాలజీ, ఫిలాసఫీ అవసరం లేదన్నమాట. సాంఘిక చలనాన్ని అర్థం చేసుకోడానికి  డైయెలిక్టిక్స్   అన్వయించడానికి ఆయా విషయాలకు మాత్రమే సంబంధించిన శాస్త్రాన్ని చూస్తే చాలా  పరిమితమైన దృష్టి   అవుతుంది. ఆ క్రమంలో మన ముందు ఉన్న ఒక ప్రాథమిక చట్రాన్ని ఉపేక్షించాల్సి వస్తుంది.

ప్రతి పరిణామము కేవలం సహజమే కాదు. ఆ సహజత్వానికి ఒక నియమం ఉంది. ఒక సహజమైన అవసరం ఉంది. లేపొతే జీవం మనుగడనే సాధ్యం కాదు. భాష పుట్టుక ఎంత చారిత్రక, సాంఘిక అవసరమో మనం గమనించాము. అందుకు చైతన్యం ఎలా దోహద పడిందో ఆ చైతన్యం పదార్థం నుండి ఎలా పుట్టిందో చూసాము.భాష పుట్టుక గమనిస్తే లోహ యుగం ప్రారంభమయ్యాకనే మొదలయ్యింది. ఇదేదో  కేజువల్ గా జరిగిన విషయం లోహం కనుగొనడం మానవ జీవితంలో ఒక విప్లవం. దీనితో ఉత్పత్తి విధానం విపరీతమైన మార్పులకు గురి అయ్యింది. అందుకనుగుణంగానే ఉత్పత్తి సంబంధాలు మారాయి. మారిన మానవ సంబంధాలకనుగుణంగానే సైగలతో ఉన్న  సంభాషణ పద్దతి ప్రతిబంధకమై నిలదొక్కుకోలేక భాష అవసరం వచ్చిపడింది.

ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. తేనె టీగ తన తుట్టెను కట్టుకుంటుంది. దానికుండే ఒక  లిమితెద్  చొన్స్చిఔస్నెస్స్   అది. తేనె టీగకు తుట్టె నిర్మించే ముందు తన తుట్టె ఏ రూపంలో ఉంటుందో ఎంత పొడవుంటుందో ఎంత వెడల్పు ఉంటుందో తెలుస్తుందా ?. అదే మానవుడు తనను ప్రకృతినుండి రక్షించుకునే క్రమంలో తన శ్రమ విధానం లో పెరిగిన  సామర్థ్యము వలన , పదార్థం పట్ల తనకున్న చైతన్యం వలన తాను కట్టుకునే గుడిసె పొడవు, ఎత్తు, వెడల్పు ఎంత ఉంటుందో కట్టక ముందే చెప్పగలడు.మనిషిలో ఉన్న  abstract thinking, logical thinking  వలన (  శరీరానికి మెదడుకు ఉన్న సమన్వయంలో భాగంగానే ఆపై మారిన మానవ సంబంధాల ఫలితంగా ఇలా ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది అని గమనించాము) ఊహించే లక్షణం మనిషి మెదడుకు అబ్బింది.ఈ ఎదుగుదల ఏ ఒక్క క్షణం లోనో ఏదో ఒక్కరి లోనో ఒక్కసారిగా కలిగినది కాదు అని గమనం లో ఉంచుకోవాలి.

సమాజ పరిణామ క్రమంలో సమాజంలో కొన్ని institutions  కూడా ఏర్పడగలిగాయి. పెళ్ళి, కుటుంబము, మతము లాంటి కొత్త  institutions  ఏర్పడ్డం మొదలయ్యింది . ఐతే మనిషి తనకున్న Abstract thinking, logical thinking  వలన కలిగిన పరిజ్ణ్జానాన్ని ఉత్పత్తి , పంపిణీ విధానం ( ఇంకో రకంగా చెప్పాలంటే మొత్తంగా ఉత్పత్తి సంబంధాలు అనవచ్చు) వీటిలో ప్రయోగిస్తూ కొత్తగా ఏర్పడిన  institutions   లో కూడా ఉపయోగించడం మొదలయ్యింది. మనిషి దేహానికి సింహం తల తగిలించడం , లేదా ఏనుగు తల తగిలించడం జరిగింది. ఐతే క్రమ క్రమంగా మనుష్యుల్లో వర్గాలు ఏర్పడ్డంతో సమాజాన్ని నడిపే పగ్గాలు సమిష్టిగా ఉండడం ఆగిపోయింది. ఇదే పరిజ్ణ్జానన్ని తన కట్టుబాట్లలో చూయించాడు. తన అలవాట్లలో చూయించాడు. తన రుచుల్లో చూయించాడు. తనకవసరమైన భాషలో కూడా చూయించాడు. ఆ విధంగా భాష లో ప్రయోగం జరగడం తార్కిక క్రమం లో జరగాల్సిన ప్రక్రియ అయ్యింది. నిజానికి ఈ పరిస్థితి సుమారు 4000 సంవత్సరాల క్రితం మించి ఉండదని కొంత మంది చరిత్ర కారుల అభిప్రాయం. భాష పరిణామం చెందాల్సిన అవసరం చూస్తే మళ్ళీ మనం పదార్థంతో జరుగుతున్న  పరస్పర సంబంధం దగ్గరే ఆగాల్సి వస్తుంది.

ఏర్పడిన వర్గాల దౄష్ట్యా , తెగిపోయిన సమిష్టి సంబంధల దౄష్ట్యా ఏదైనా విషయాన్ని సంఘంలో ఆమోదించే క్రమానికి ఒక  ప్రభావశీల భావ వ్యక్తీకరణ  (effective expression)   అవసరం అయ్యింది. ఇదేదో ఒక్క రోజులో ఏర్పడిన ఆలోచన కాదు. అందుకు ఒక విషయాన్ని హత్తుకునేలా అర్థం చేయించడానికి ఆమోదింపజేయడానికి కళలు, సాహిత్యం అవసరమయ్యాయి. ఇందుకోసం సాధారణ వచనాలు సరిపోలేదు. మారిన ఉత్పత్తి సంబంధాలు, ఏర్పడిన వివిధ వర్గ సంస్కౄతులు, మనిషికి ఉన్న భావావేశ వృద్ధి (  emotional development )  ఒక భిన్న భావ వ్యక్తీకరణ జననానికి అవసరాన్ని, అనుకూలతను సూచించాయి ( భాష మొదలు కాక ముందు మానవుడి భావావేశాలకు సంబంధించిన ఎదుగుదల చాలా ప్రాథమిక స్థాయిలోనే ఉండిందని చెప్పుకోవచ్చు. మనకు రాతి యుగం నాటి అవశేషాలు గమనిస్తే మనిషి వేటాడిన జంతువుల బొమ్మలు లాంటివి కనిపిస్తాయి తప్ప ఎక్కడా మనిషి భావావేశాలు ప్రతిబింబించే అవశేషాలు పెద్ద  ప్రాముఖ్యంగా   దొరకవు).

అదే విధంగా సమాజంలో ఏర్పడిన  వైవిధ్య సాంఘిక స్థాయిలలో సమాజం మీద ఆధిపత్యం గురించి, స్వంత ఆస్తి పరిరక్షణ క్రమంలో సాంఘిక అస్తిత్వాన్ని మరింత గట్టి పరుచుకునే క్రమంలో, భిన్న సంస్కృతుల్లో భాగంగా – భాష వివిధ భిన్న రూపాలను ఏక కాలంలో కొనసాగించాల్సి వచ్చింది కూడా. అంటే భాష సమిష్టి ప్రయోజనాల కోసం ఏర్పడి సమాజ పరిణామ క్రమంలో ఆయా సమాజాల్లో ఏర్పడిన  institutions  ను బట్టి, వర్గ సమాజాన్ని బట్టి, సంస్కృతి లో కలిగిన చీలికలను బట్టి ( ఈ మూలకాలన్నిటినీ కలిపి పదార్థం అంటారు అని అనుకున్నాము ) మార్పు చెందుతూ వచ్చింది.

ఏం వర్గ సమాజం ఏర్పడకపోయి ఉండి ఉండొచ్చు కదా? అటువంటి వర్గ సమాజం మాత్రం ఎందుకు అవసరమయ్యింది ? అంటే వర్గ సమాజ జననం స్థూలంగా గమనిస్తే నిజానికి మనుష్య సమాజంలో వెనుకబాటు కాదు. అది ఒక రకంగా అభివౄద్ధి. ఒక తెగ ఇంకొక తెగపై దాడి చేసినప్పుడు గెలిచిన తెగ ఓడిపోయిన తెగను పూర్తిగా నిర్మూలించే వారు. ఐతే ఉత్పత్తి విధానంలో మార్పుల వల్ల వారిని చంపడం కంటే అలా ఓడిపోయిన తెగను తమ ఉత్పత్తి విధానంలో భాగం చేసి వారిని దోచుకుంటూ వారికి బానిస స్థాయిని కల్పించిండంలో ఎక్కువ ప్రయోజనం కనిపించింది. అప్పటి బానిస వ్యవస్థ ఏర్పడ కూడదు అనుకుంటే మొత్తం మనుష్య జాతి అంతా అంతరించి పోయేదేమో !

మన సమాజంలో ఐతే వర్ణ వ్యవస్థ ఏర్పడ్డం వలన ఆధిపత్య వర్గాల ప్రయోజనం కొరకు పాలక వర్గాల భాషనే అధికారిక లేదా అదే సామాజిక భాషగా చెలామణీ అయ్యింది.అదే సంస్కృతమై వెలిసింది.   Known ruling classes  వారి భాషలైన ప్రాగ్ , ద్రవిడ, పాళీ భాషలకు సముచితమైన సాంఘిక స్థాయి కల్పించలేదు. సంస్కృత భాష ప్రాకౄతిక వ్యావహారిక భాషలపై గొడ్డలి పెట్టు అయ్యి ఒక వర్గ ప్రయోజనాలలో భాగమైన మూలకం అయ్యింది. తమ సంస్కృతికి కి  superiority  ని పులిమే క్రమంలో సంస్కృతానికి దైవత్వం ఆపాదింపబడింది ( ఇక మనిషి అంటూ వాడ్డం మానేద్దాం. ఎందుకంటే సమిష్టి ప్రయోజనాల నుండి వ్యక్తిగత లేద వర్గ పరమైన ప్రయోజనాలు ముందుకొస్తున్నప్పుడు సంస్కృతి కూడా చీలి పోయింది మనుష్యులతో పాటు ).

ఇక సాహిత్యం అంత:పుర గోడలకు పరిమితమై పోయింది. సంస్కృత సాహిత్యం మెజారిటీ ప్రజలనుండి విడివడింది. సంస్కృతం అంటే అదో దైవత్వ రూపం కలిగి ఉండాలి అనో, అదో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న వారి సొత్తు అనో, సంస్కృతం మానవాతీత సంస్కృతిలో భాగం అన్నట్టుగానే project  అయ్యింది. అధ్యాత్మికత ముసుగులోనూ దైవత్వం ముసుగులోనూ ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేస్తే , లేదా ఉపాసన చేస్తే కవిత్వం పుడ్తుంది అన్న భావన కలిపింపజేసే ప్రయత్నాలు జరిగి ఇలాంటి అభ్యాసం తుచ్చ మానవులకందరికీ రాదు అన్న విశ్వాసాన్ని పాలక వర్గాలు కల్పించినట్టు మనకు స్పష్టమౌతుంది.

ఇందుకు అప్పటి బ్రాహ్మణీయ హైందవ మత వ్యవస్థ బాగా తోడ్పడింది. ఆ రకంగా చూస్తే  vernacular languages  పుట్టుక సామాజిక సాంస్కృతిక పరిణామంలో ప్రజా సంస్కృతి యొక్క విజయంగా చెప్పొచ్చు. భాష, సాహిత్యము, దానితో పాటు కళలు , సంస్కృతులలో   సమభావము నశించి పాలక వర్గం వేపు ఒక భాగం, ప్రజల వేపు ఒక భాగం అయ్యి చీలిపోయాయి. సమిష్టి ప్రయోజనాలు అన్న భావన నశించాక సాహిత్యంలో ప్రజలకు సంబంధించి ఎన్నో కుట్రలు జరిగాయి. సాహిత్యం ప్రజలకు సంబంధించిన విషయంగా కాక తమ ఆధిపత్యాన్ని నిర్ణయించే మూలకంగా చేయాలని మన సమాజంలో ఎన్నో ఎత్తుగడలే నడిచాయి. ఇందుకు వర్ణ వ్యవస్థ బాగా తోడ్పడింది.సాహిత్యం ఎలా పుడ్తుందో కవిత్వం ఎలా పుడ్తుందో అనే ఒక విశ్వాసాన్ని, పదార్థాన్ని వదిలేసి బ్రహ్మ పదార్థంగా చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయని గమనించవచ్చు.

ఐతే భూస్వామ్య వ్యవస్థ కూలుతున్న క్రమంలో పెట్టుబడి దారి ప్రజాస్వామ్యం ముందుకొస్తున్న తరుణంలో మన దేశంలో  sanskritisation ప్రభావం దాని వెనక ఉన్న శక్తులు అనివార్యంగానే బలహీనపడ్డాయి.  తమ మనుగడను విస్తృతం చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

  1. భాషకే కాదు సంస్కౄతికీ, సాహిత్యానికీ , మూలము పదార్థం . ఆలోచనలు విడిగా ఉండవు. పదార్థంతోనే ముడివడి ఉంటాయి.
  2. మనిషి సమిష్టి ప్రయోజనాల కోసం భాష ఏర్పడింది.ఎదుగుతున్న ఉత్పత్తి సంబంధాలను మనగె చేయాలంటే భాష అనివార్యం అయ్యింది.
  3. మనిషికిదెవెలొప్ ఐన abstract thinking, logical thinking సమాజ పరిణామ క్రమంలో ఏర్పడిన  institutions  లో ఉపయోగించుకోవడం జరిగింది
  4. సమాజం లో వర్గాలు ఏర్పడ్డంతో భాష, సంస్కౄతి సాధారణ ప్రజానీక సంస్కౄతి, భాషలతో విడివడ్డాయి. ఇందుకు మత, వర్ణ వ్యవస్థలు మన సమాజంలో బాగా తోడ్పడ్డాయి.
  5. సంస్కృతం సాధారణ ప్రజల భాషను చావు దెబ్బ తీసి తనకో దైవత్వ రూపాన్ని పులుముకుంది. ఇది వర్ణ వ్యవస్థ పుణ్యమే. ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాలు కాపాడుకునే క్రమంలో జరిగింది.
  6. సాహిత్యం అన్నది ఏ ఒక్క వ్యక్తిగత పరిణ్గానం వలన పుట్టుకు రాలేదు. మనిషి తన సాంఘిక అవసరాల కోసం చేసిన ఎన్నో ప్రయోగాల్లో భాషపై జరిగిన ప్రయోగం ఒకటి. అందులో భాగం సాహిత్యం.
  7. భాషకు దైవత్వం ఆపాదించడం సాహిత్యానికి మానవాతీత రూపాన్ని పులమడం సన్స్క్రితిసతిఒన్ అవుతుంది. దీని వలన ఆధిపత్య సంస్కృతి ఏదైతే చలామణిలో ఉందో అది అభివౄధ్ధి చెందడానికి తోడ్పడింది.

 

సాహిత్యం అన్నది బ్రహ్మ పదార్థం కాదు. మరో సారి అనుకుందాము. సాహిత్యం అన్నది బ్రహ్మ పదార్థం కాదు. ఇది ఏ ఋషి హిమాలయాల్లో ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని పరధ్యాన్నంగా ఉన్నందు వల్ల మాత్రాన పుట్ట లేదు. ఎందుకంటే మనిషి ఆలోచన పదార్థం లేకపోతే లేదు. పదార్థాన్ని వదిలి పెట్టి మనిషి ఆలోచనలు రెక్కలు కట్టుకుని ఎగర లేవు. నీల్స్ బోరు పరమాణు నమూనాను కనుక్కోక పోయి ఉంటే ఇక ప్రపంచంలో ఏ రసాయన మూలకాలు ఉండేవి కావు అన్నది ఎంత తప్పో అలాగే కేవలం వ్యక్తిగత పరిజ్ణ్జానాఇకి, మానవ సమాజ అభివౄద్ధికి ఉపయోగ పడే సాహిత్యానికి లింకు పెట్టడం అంతే తప్పు. ఒకప్పుడు రాజు సింహాసీనుడై మధువు సేవిస్తూ ‘ మేము ఆనంద డోలికల్లో తేలియాడుచున్నాము. ఏది మన రాజ నర్తకి ఊరువుల మీద ఒక బహు సుందరమగు పద్యం వినిపించుము ‘ అన్న ఆదేశంతో సాహిత్యం పుట్టుకొచ్చిన చరిత్ర ఉంది. సాహిత్యం అంతపురానికి పరిమితమై వర్ణ వ్యవస్థ చట్రంలో అగ్ర భాగాన ఉన్న వర్గాల ప్రయోజనాలు వారి విలాసాలు తౄప్తి పరిచే విధంగా ఉపయోగపడింది.

చరిత్ర కారులకు ఉదయ పూర్ రాజుల కోటలో ‘ అనంగరంగం ‘ అనే గ్రంథం లభించింది. అందులో మొదటి  చప్తెర్  ‘ లింగ స్థూలీకరణం ‘. ఒక నాడు సాహిత్యమంటే అదే అన్నట్టు శౄంగారం గొప్పదైన నవరసం అని ( శౄంగార రసం అన్నది విశ్రాంతి అధికంగా ఉన్న వర్గాల వారి విలాస కేళికి సంబంధించిన విషయంగానే పరిమితమయ్యింది. దిగువ వర్ణాలు సమాజానికి తమ శ్రమ నందించి సేవ చేసే విషయంలోనే తమ జీవితాన్ని చూసుకున్నారు ) చలామణీ కూడా చేసారు. అందరూ అదో అద్భుత ప్రక్రియ అని అందులో జరిగిన ప్రయోగాలను నోరు తెరుచుకుని చదివి అసలు సాహిత్య ప్రయోజనాన్ని మనకు కాకుండా చేసారు. శ్లోకాలు ఏ చందస్సును పాటించాయి అని తీక్షణంగా పరీక్షించే ముందు మనం శృంగార రసం పేరుతో రాజుల ‘ లింగ స్థూలీకరణ ‘ గురించి ఆందోళన చెందిన కవి సమూహాన్ని, ఆ సాహిత్య కల్పన తీరు తెన్నులను గమనించడం వదిలేస్తే ఇది సాహితీ కౄరత్వం తప్ప ఏమీ కాదు . సాహిత్యం దేవుడి గొప్ప తనాన్ని ఎంతో ఆధ్యాత్మికంగా వర్ణించడానికి ఉపయోగపడ్డది. ఒక మనిషిని పట్టుకుని ‘ నీవు తక్కువ వాడివి పెద్ద పనికొచ్చే లక్షణాలు ఏమీ లేవు ఉత్పత్తి విధానంలో నీ స్థానం ఇదే ‘ అని బోధించడానికి వాడిని బలవంతంగా ఒప్పించడానికి సాహిత్యం ఉపయోగ పడింది.

‘చాతుర్వర్ణం మయా సౄష్ట్యాం గుణ కర్మ విభాగశ తస్య కర్తార మపిమాం వ్ద్యికర్తార మవ్యయం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం ‘ (క్లుప్తంగా చెప్తే నాలుగు వర్ణాలను నేనే సౄష్టించాను. అందులో శూద్రుని పని మిగతా వర్ణాలకు పరిచర్య చేయడమే ) సాహిత్యం పుట్టుక కొన్ని ప్రయోజనాలను ఆశించి జరిగింది. అది ఖచ్చితంగా ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు మాత్రమే దౄష్టిలో పెట్టుకుని జరిగింది అన్న వాస్తవాన్ని ఇక్కడ గమనించగలరు.

ఐతే సంస్కౄత భాష కాల క్రమేణా బ్రాహ్మణీయ వ్యవస్థ తో పాటు బలహీన పడడంతో వ్యావహారిక భాషలో సాహిత్యం కూడా ఏక కాలంలో అభివౄధ్ధి జరగడం జరిగింది. తెలుగులో గురజాడ, గిడుగు రామ్మూర్తి తదితర కవులు తెలుగు సాహిత్యంలో  sanskritisation   ను కాదని దేశీయ చందస్సులో తెలుగు సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు. ఐతే అప్పటికీ ఇప్పటికీ కవిత్వం అన్నా, సాహిత్యం అన్నా ఒక బ్రహ్మ పదార్థం అదో మానవాతీత రూప ప్రమేయం తోనే పుడ్తుంది అని దాన్ని అడపా దడపా ఆధ్యాత్మికతకు లింకు పెట్టి చూడ్డం జరుగుతుంది.

చరిత్రను గమనిస్తే సాహిత్యం ఎప్పుడైనా ఏదో సామాజిక ప్రయోజనం ఆశించకుండా పుట్టదు. పుట్టలేదు. ఐతే పదార్థం ఎప్పుడూ మార్పులకు గురవుతుంది.అందువల్ల చైతన్యం మార్పులకు గురవుతుంది. తద్వారా సాహిత్యం మార్పులకు లోనవుతుంది అన్న ప్రక్రియను అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయా సమాజ ప్రయోజనాలు ఆయా వర్గ సమాజ లక్షణాలు బట్టి వేరు వేరుగా ఉంటాయి. పైన చూసిన శ్లోకం ఎలా పుట్టుకొచ్చింది ? ఇందులో ఎంత గొప్ప సాహిత్యం ఉన్నది అని లొట్టలు వేసుకుని చర్చించే ముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయం – ఇది రాజులకు పురోహిత వర్గానికి ప్రజలను విధేయులుగా ఉంచే ప్రయత్నంలో భాగంగా, పాలక వర్గల ప్రయోజనాన్ని ఆశించే సౄష్టించ బడినది. అది మరవ రాదు. ఇక ఎంత గొప్ప ప్రయోగం జరిగినా సాహిత్యంలో ఒరిగిందేమిటి ? రాజ్య ప్రయోజనాల కోసం కవిత్వం రాయాలంటే అప్పుడు కవులు ప్రజల నుండి రారు. అది సాధారణ ప్రజలు భాగస్వామ్యం కాలేని సాహిత్యం అవుతుంది. ప్రయోగం మీద ఉన్న మక్కువ ప్రయోజనం మీద చూయించలేదు కవులు. వారి అజెండా  మొత్తం వర్ణ చట్రంలో బిగి వేయబడ్డది.

ఐతే సాంఘిక ప్రయోజనాలు ఆశించి కూడా సాహిత్యంలో ప్రయోగాలు జరిగాయి. సాహిత్య శిల్పాల్లో ప్రయోగాలు జరిగాయి. ఈ విషయాన్ని సింపుల్ గా అర్థం చేసుకోడానికి ఒక ఉదాహరణ చూద్దాం. బాల సాహిత్యం కుచేల కథ, గజేంద్ర మోక్షం , భక్త ప్రహ్లాద లాంటి బ్రాహ్మణీయ సాహిత్యం నుండి విడివడి వ్యావహారిక భాషలోనే ఎదిగే ప్రయత్నం జరుగుతుంది. చిన్న పిల్లలను బుజ్జగించడానికి , పడుకోబెట్టడానికి ఉపయోగపడే సాహిత్యం కావాలి. చిన్న పిల్లలను ప్రజాస్వామికంగా  త్రేత్  చేయడానికి బాల సాహిత్యం కావాలి.ఆ ప్రయోజనాలను దౄష్టిలో పెట్టుకుని వచ్చిన అందరికీ తెలిసిన ఒక తెలుగు  ఋహ్య్మె  చూద్దాము ‘ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోట కెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుక్కుమన్నావా ‘ ఇక్కడ దయ చేసి గమనించండి. సాహిత్యం ఎటువంటి రూపాన్ని మలుచుకుంటుందో.  కొట్టో తిట్టో పిల్లలను మేనేజ్ చేయాలి అన్న వాదన సన్నబడుతుంది. ఈ చైతన్యంతోటే ‘చిట్టి చిలకమ్మ ‘ పుట్టింది. సాహిత్యానికి ఎటువంటి ప్రయోజనాలు లేవు అన్న  హైపో తిసిస్   కు అనంగీకారం తెలిపే మంచి ఉదాహరణ ఇది.

ఆ రకంగా ఇది ఒక మంచి సాహితీ ప్రయోగానికి చిహ్నము. అలాగే ఒక వ్యక్తి భావన, వ్యక్తి ఆలోచన పదార్థం పట్ల ఉన్న అవగాహన ద్వారానే రూపుదిద్దుకుంటుంది.  మీకు కవిత్వం రాయాలంటే నది ఒడ్డు కెళ్ళొచ్చు. కవిత్వం రాయాలంటే ఆదివారం చార్మినారు వద్దకు వెళ్ళొచ్చు. మీ ఇంట్లో నెట్ ముందు కూర్చోవచ్చు. పదార్థంతో వల్ల కలిగిన వైరుధ్య భావనల మధ్య జరిగే సంఘర్షణ మనలో అవగాహనను పెంపొందిస్తుంది. ఐతే పదార్థం పట్ల మీ అవగాహన ఎలా పెంపొందుతుందో దాన్ని బట్టే మీ కవిత్వం వస్తుంది. మీ పక్కనే కూర్చున్న వ్యక్తి కి అదే వాతావరణం , పదార్థం పట్ల వేరు అవగాహన కలిగించవచ్చు. ఏది సరి ఐనది ఏది కాదు అన్నది వ్యక్తులు నిర్ణయించే సమస్య కాదు. కాబట్టి వ్యక్తిలో కవిత పుట్టుక గురించి మనం గెన్రలిసె చేయలేము. ఐతే సాంఘిక వ్యవస్థలో సాహిత్యం ఒక భాగమని మరిచి చేసే ఏ ప్రయోగమైనా – ఒకప్పుడు ప్రాచుర్యం లభించిన హేతుబద్దమైన ఆధారం లేని  ఎంపిరికల్ అప్ప్రోచ్   లేని ‘ ఆయిల్ పుల్లింగ్ ‘ ప్రయోగంలానే – మిగిలి పోతుంది.

ఉదాహరణకు మీరు ఒక పాత దేవాలయంలో మహా నిశ్శబ్దంలో ధ్యానం చేస్తూ కూర్చున్నారనుకోండి. అప్పుడు మోగిన గంట మీకు  Evil dead  సినిమా చూసిన అనుభూతిని గుర్తు చేయొచ్చు. మీ ఆఫీసు రిసెప్షనిస్టు నవ్వు లో ఉన్న అనుభూతి గుర్తు రావొచ్చు. లేదా అదో విప్లవ నినాదంగా అనిపించవచ్చు. మీ సాంస్కౄతిక నేపథ్యాన్ని బట్టి మీకు కలిగే భావనలు వేరు. ఐతే అందువల్లనే కవిత్వం పుడుతుంది అని సూత్రీకరించడం అందులోనే ఒక కవితా రూపం జననం దాగుంది అని సైద్ధాంతీకరించడం పూర్తిగా అశాస్త్రీయం. ఒక రకంగా మోసం చేసే ప్రయత్నం కూడా. ఇది మనలో ఉన్న  మధ్య తరగతి భయాలను  సపోర్ట్    చేస్తుంది తప్ప కవిత్వం పట్ల హేతుబద్దమైన ఆలోచనను పుట్టించలేదు. పైగా అలా ఒక కవితా రూపాన్ని ఊహించి దానికో ఆధ్యాత్మిక రూపాన్ని లేద దైవత్వాన్ని తగిలించడం , సామాన్యులకు సాధ్య మయ్యే విషయం కాదిది అని అన్నట్టు  ప్రొజెక్ట్   చేయడం భాషను, సాహిత్యాన్ని  సన్స్క్రితిసె  చేసే ప్రయత్నం తప్ప ఏమీ కాదు.

అలా ప్రయోగం మేనియాలో పడితే సాహిత్యానికి సమాజానికి వచ్చే ప్రాథమిక ప్రయోజనం ఏమీ లేదు. ఏదో హాబీగా కవిత్వాన్ని చూసుకోడానికి, విశ్రాంతి సమయాన్ని ‘ఖుషీగా’ గడపడానికి, భాష పైన  అచదెమిచ్ ఎక్ష్పెరిమెంత్స్   చెయడానికి ఒకరిద్దరు వ్యక్తులు చేసే ప్రయత్నంగా తప్ప ఇక వేరే విధంగా చూడలేము. ఇది ప్రధానంగా ‘ విశ్రాంతి వర్గాల ‘ ఉల్లాస ప్రక్రియ. మనకు చరిత్ర చెప్పిన సత్యం ఏమంటే ఈ ప్రయోగాలు పుట్టిన మరుక్షణం మరణం తేదీలు లెక్కించేలా ఉంటాయి. ‘ ఆయిల్ పుల్లింగ్ ‘ ప్రయోగాలు ఇవి. ” Literature is not merely a form of language gimmick ‘. భాషలో ప్రయోగం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం.

ప్రయోగం కన్నా ప్రయోజనం ముఖ్యం అని వ్యక్తిగా ఒక్కరు గుండె నిండా నమ్మినా అందులో భాగంగానే ప్రయోగాలు అని అర్థం చేసుకున్నా, ఒకే ఒక్క కవిత రాసినా, ఒకే ఒక్క ప్రయోగం చేసినా ప్రస్తుతానికి అది చాలు. ఆ సమిధ ఆరిపొయేలోపు ఇంకో సమిధ వెలగడం ఖచ్చితం. అదే క్రమంలో వందలు వేలు ‘ చిట్టి చిలకమ్మలూ పుట్టుకొస్తాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ‘ విత్తనం మరణించి పంటను వాగ్దానం చేస్తుంది ‘ (శివ సాగర్ ) అన్న నియమం ప్రకృతికే కాదు సాహిత్యానికీ వర్తిస్తుంది.

నరాలు తెంచే

ఇసుక రాళ్ళ వొత్తిళ్ళు మరిచి

కంఠం పెగల నీయని

ప్రాణ కంటక వలయంలో చిక్కుకున్న

నిలయ విద్వాంసులారా !

పడిపోయిన గాయకులారా !

తడి ఆరిన బతుకుల గాథల్లో

నిప్పులు కురిపించే తప్పుడు నియమాలతో

వాస్తవాల కళ్ళు చిదిమే కల్పనా కథకులారా !

కాల గమనంలో

సముద్ర తరంగాలు తలలు వాల్చినా

కవితా హౄదయం సరికొత్త మార్గాలు తొక్కినా

రూపు మాసిన రాజ సౌధాల్ని కీర్తించే

అంత రంగం ఏ మాత్రం మారని

వంది మాగధ నేపథ్య కవనాలు రచించే

ఆత్మ వంచనకొడిగట్టిన కవులారా !

ఆకాశ హర్మ్యాల రాకాసి ముఖాల్ని వదిలి

ఆనంద నిలయ సోపానాలు కూల్చి రండి !!

( చెరబండ రాజు )

 

 

Bibliography :

  1. Social anthropology – S L Doshi, P C Jain
  2. Social and Cultural Anthropology – Nigel Rapport and Joanna Overling
  3. Marxist – Leninst Philosophy – T Vlasova
  4. సాహిత్యంలో వస్తు శిల్పాలు – త్రిపురనేని మధుసూదన రావు
  5. ౠగ్వేద ఆర్యులు – రాహుల్ సాంకౄత్యయన్

 

( మరింత చర్చకు లేదా క్లారిటీ కోసం రచయిత మెయిల్  pvvkumar@yahoo.co.uk  లేదా ఫేస్ బుక్  ID ” P V Vijay Kumar “ లో కాని కాంటాక్ట్ చేయవచ్చు )

 

 

 

 

ఆ రెండు సినిమాలు- రెండు ఆత్మగౌరవ పతాకలు!

movie-pink

వొకానొక రాత్రి పార్టీలో కలిసిన ముగ్గురు కుర్రాళ్ళతో ఆ ముగ్గురు అమ్మాయిలు, డ్రింక్స్ తీసుకుంటూ, నవ్వుతూ తుళ్ళుతూ వున్నప్పుడు జరుగుతుంది అది. చొరవ తీసుకుని, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి, లొంగదీసుకోవాలనుకుంటారు ఆ కుర్రాళ్ళు.  అమ్మాయిల్లో ధైర్యవంతురాలైన వొక అమ్మాయి, మినాల్, వేరే గత్యంతరంలేక, ప్రతిఘటిస్తున్నా వినిపించుకోని ఆ కుర్రాడిని, చేతికందిన బాటిల్తో ముఖాన కొడుతుంది. కంటి  దగ్గర గాయమై రక్తమోడుతున్న అతన్ని వదిలి, మిగతా స్నేహితురాళ్ళని (ఫలక్, ఆండ్రియా ) తీసుకుని బయట పడుతుంది.

జరిగింది పీడకలగా మరచిపోయి ముందుకు సాగిపోవాలనుకుంటారు.  కాని ఆ కుర్రాళ్ళు, వాళ్ళ మరొక స్నేహితుడు  వదిలిపెడితేగా. ఆ అమ్మాయిలకు వాళ్ళ హద్దు (ఔకాత్ అంటే స్టేటస్) ను గుర్తు  చేయాలనుకుంటారు. వాళ్ళ ఇల్లుగలాయనకు ఫోన్ చేసి వాళ్ళ చేత ఇల్లు ఖాళీ చేయించమని బెదిరిస్తారు. వాళ్ళను కూడా ఫొన్ చేసి బెదిరిస్తారు, వెంబడిస్తారు. మినాల్ నైతే కార్లోకి గబుక్కున లాక్కొని, నడుస్తున్న కారులోనే రేప్ చేసినంత పని చేస్తారు. ఇంత జరుగుతుంటే ఇక ఆ అమ్మాయిలకు ఆ కుర్రాళ్ళ  మీద పోలీసు కేసు పెట్టక తప్పని పరిస్థితి. అక్కడినుంచీ పోలీసు స్టేషన్లలో పని తీరు, వ్యవస్థ ఇవన్నీ ముందుకొస్తాయి. అభియోగి రాజవీర్ వొక రాజకీయ నాయకుడి కొడుకు. ఈ నమోదైన కేసు గురించి ముందు వారికే చెప్తారు, వారు చెప్పినట్టే పాత తేదీతో వొక కేసును ఈ అమ్మాయిల మీద (హత్యా ప్రయత్నం)  నమోదు చేస్తారు.

ఇప్పుడు ఈ విషయాన్ని చర్చకు పెట్టాలంటే కోర్ట్ రూం డ్రామా కంటే సులువు పద్ధతి యేముంది?

అప్పుడు వస్తాడు దీపక్ సెహగల్ (అమితాభ్) అన్న లాయర్. పక్క బిల్డింగులో వుంటాడు. వీళ్ళను గమనిస్తుంటాడు. మినల్ ని వాళ్ళు కారులో యెత్తుకెళ్ళిపోవడం చూస్తాడు. పోలీసుకు ఫొన్ చేసి ఫిర్యాదు చేస్తాడు. ఇప్పుడు కోర్ట్ లో వీళ్ల తరపు లాయర్.

మనకు సమాజంలో కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు బలపడ్డాయి. డ్రింక్స్ తీసుకునే అమ్మాయిలు మంచి కుతుంబంలోంచి వచ్చిన వారు కాదు, సన్స్కారవంతులు కాదు. అలాగే రాత్రి పూటలు  పార్టీలకు వెళ్ళేవారు, మగవాళ్ళతో నవ్వుతూ మాట్లాడే వాళ్ళు, జీన్స్, స్కర్ట్ లు వేసుకునేవాళ్ళు. కోర్ట్ లో గనక ఆ అమ్మాయిలు అలాంటి వారు అని నిరూపించ గలిగితే, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని, డబ్బుల దగ్గర తేడాలొచ్చి వాళ్ళల్లో వొక అమ్మాయి హత్యా ప్రయత్నం చేసిందని నిరూపించడం తేలికవుతుంది.

వొక స్త్రీ ఆమె భార్య కావచ్చు, వ్యభిచారి కావచ్చు, ప్రియురాలు కావచ్చు, యెవరైనా కావచ్చు, ఆమె వద్దన్న తర్వాత ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేదాన్ని అత్యాచారంగానే గుర్తించాలి. ఆమె “వద్దు” (నో) అంటే ఆ మాటకు వొక్కటే అర్థం. అది మగవాళ్ళంతా అర్థం చేసుకోవాలి.

ఇవీ దీపక్ కేసులో తన వాదన ముగించాక చెప్పే చివరి మాటలు.

ఈ సినిమా యే విషయం చెప్పదలచుకుంటున్నది అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా మంచి చిత్రం. అందరి నటనా (ముఖ్యంగా అమ్మాయిలది) చాలా చక్కగా వుంది. అనిరుద్ధ రాయ్ చౌధరి దర్శకత్వం కూడా చెప్పదలచిన విషయం వైపుకు కథను నడిపిస్తుంది. చూసే వారిని కట్టి పడేస్తుంది కథనం. మగవారి ఆలోచనల్లో మార్పు తేగలిగితే సినిమా విజయం సాధించినట్టే.

 

కాని కొన్ని విషయాలు వున్నాయి. దీపక్ వొక bipolar disorder తో బాధపడుతున్న వ్యక్తి. అలాంటి వాళ్ళు శరీరంలో హార్మోన్లు యెక్కువైనా, తక్కువైనా అకారణంగానే చాలా దుక్ఖంలో కూరుకుపోవడమో, కారణంలేకుండానే చాలా ఉత్సాహంగా వుండడమో చేస్తారు. అలాంటి వ్యక్తికే స్పష్టంగా అర్థం అవుతున్న విషయం, ఆరోగ్యంగా వున్న సమాజానికి యెందుకు అర్థం కాదు? వాతావరణ కాలుష్యానికి అలవాటు పడిపోయిన మనుషుల మధ్య దీపక్ మాత్రం మాస్క్ తొడుక్కునే బయటకు వెళ్తాడు. యేదో అనారోగ్యంతో బాధ పడుతున్న భార్యను ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ, వొక బాధ్యతగల భర్తగా సేవలు చేస్తుంటాడు. ఈ సందర్భం వచ్చినప్పుడు ఈ అమ్మాయిలకు న్యాయం జరగాలని వాళ్ళ తరపున కేసు వాదిస్తాడు. పితృస్వామ్యంలో ఆ అమ్మాయిలకు జరిగిన అన్యాయానికి ఇతను పితృ స్థానంలో నిలబడి సరి చేయాలనుకుంటాడు.

సినిమాలో ముగ్గురు అమ్మాయిలూ వొక రకంగా వొంటరే. వాళ్ళ ఇళ్ళ నుంచి ఈ కష్టకాలంలో తోడుగా నిలబడటానికి యెవరూ వుండరు. ఫలక్ ప్రేమిస్తున్న మనిషి కూడా ఆమెకు సపోర్టివ్వడు. తమ పనులేవో చూసుకుంటూ, తమ కాళ్ళ మీద నిలబడ్డ ఈ ముగ్గురు అమ్మాయిలూ చాలా ధైర్యం కనబరుస్తారు. కోర్ట్ లో మాత్రం బేల అయి పోతారు. యెలాంటి ధైర్యవంతులైన స్త్రీలనైనా మెడలు వంచి నిస్సహాయ పరిస్థితుల్లోకి నొక్కేసే బలమూ, తెలివి తేటలూ  వున్న వ్యవస్థ అది.

శత్రువు దుర్మార్గుడే కాదు, తెలివైనవాడు కూడా.  కోర్ట్ సీన్ లో రాజవీర్ తన సహజ స్వభావం బయటపడేలా మాట్లాడటంతో కేసు తేలిపోతుంది. ఎమోషనల్ గా కాకుండా తెలివిగా ప్రవర్తించి వుంటే కేసు ఇంత తేలికగా గెలిచేపనేనా? వాస్తవానికి అత్యాచారాల కేసులలో చాలా మటుకు తగినన్ని సాక్ష్యాధారాలు లేవనో, లేదా వేరే కారణాల వల్లనో కొట్టివేయబడుతున్నాయి.

masaan

యెందుకో 2015లో వచ్చిన సినిమా “మసాన్” గుర్తుకొస్తున్నది.

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్ మిశ్రా నదీ తీరంలో (శ్రాద్ధ కర్మలు అవీ చేసుకునేవాళ్ళకి అవసరమయ్యే సరంజామా అమ్మే) వొక దుకాణం నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్ టైం పని చేస్తుంటుంది. అదే నదీ తీరంలో శవాలను తగలబెట్టే కుటుంబంలో విక్కీ కౌశల్ అనే కుర్రాడు ఎంజినీరింగు చదువుతుంటాడు. ఇంటిదగ్గర వున్నప్పుడు తండ్రికి శవాలు తగలబెట్టే పనిలో సాయ పడుతుంటాడు.

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా వొక అబ్బాయిని ఇష్టపడుతుంది. వొక రోజు వాళ్ళిద్దరూ చాటుగా వొక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న వేళ పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు అమ్మాయి ఫొటొని మొబైల్ లో తీస్తారు. అబ్బాయి మాత్రం గిలగిల లాడి పోతాడు. పరువు పోతుందని బహయం, తండ్రి భయం. వదిలి పెట్టమని ప్రాధేయపడతాడు. యెంతో కొంత తీసుకుని వదిలి వేయ మంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన అబ్బాయి సందు దొరకగానే విడిపించుకొని బాత్రూం లో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతిని మణికట్టు దగ్గర కోసుకుంటాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు గాని బతకడు. అలా ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మయి వొక్కతే బలిపశువు అయ్యింది.

నువ్వు లాడ్జికి యెందుకు వెళ్ళావు అని పోలీసు అడిగితే ఆమె “కుతూహలం” కారణంగా చెబుతుందే తప్ప యెలాంతి సిగ్గు, అపరాధ భావన వ్యక్త పరచదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. abettment to suicide నుంచి ఆమెను తప్పించాలంటే మూడు లక్షలు రెండు నెలల్లో చెల్లించే వొప్పందం ఆ పోలీసు, ఆమె తండ్రి మధ్య. ఫిక్స్ దిపాజిట్ లో  దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు యెలా సమకూరాలా అన్నది వాళ్ళకు పట్టిన శని. ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. “నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం”, అని వేధించే వాళ్ళు. 12000 వచ్చె వుద్యోగం వూడతం, వేరే వుద్యోగంలో కుదురుకుంటే 5500 మాత్రమే రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్ ఘైవాన్ (ఇది ఇతని మొదటి చిత్రం).

మరోపక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన అమ్మాయి శ్వెతా త్రిపాఠి ప్రేమించుకుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే లేచి వస్తానని, పెళ్ళి అయ్యాక పెద్దవాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది. కాని దానికి ముందే ఆమె వొక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది.  ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీ గా, స్వచ్చంగా, అమాయకంగా, నిర్మలంగా వుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఇద్దరూ చాలా ధైర్యన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్ తో (నిటారు గా నిలబడే/కూర్చునే/నదిచే తీరు; సిగ్గు/అపరాధభావనా లేశమాత్రమైనా కనబడని తీక్షణ కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు; తన మీద తనకున్న నమ్మకం). పోతే శ్వేతా త్రిపాఠి కవిత్వన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కాని తమ మధ్య వున్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి, పెద్దవాళ్ళని నెమ్మదిగా వొప్పించవచ్చు.

రోజూ యెన్నో శవాలు తగలబడుతుండే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు. (మసాన్ అంటే స్మశానం).

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఈ స్త్రీల ధైర్య-సాహసాలకి, ఆత్మ విశ్వాసానికి, ఆత్మ గౌరవానికీ.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

యెందుకో 2015లో వచ్చిన సినిమా “మసాన్” గుర్తుకొస్తున్నది.

 

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్ మిశ్రా నదీ తీరంలో (శ్రాద్ధ కర్మలు అవీ చేసుకునేవాళ్ళకి అవసరమయ్యే సరంజామా అమ్మే) వొక దుకాణం నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్ టైం పని చేస్తుంటుంది. అదే నదీ తీరంలో శవాలను తగలబెట్టే కుటుంబంలో విక్కీ కౌశల్ అనే కుర్రాడు ఎంజినీరింగు చదువుతుంటాడు. ఇంటిదగ్గర వున్నప్పుడు తండ్రికి శవాలు తగలబెట్టే పనిలో సాయ పడుతుంటాడు.

 

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా వొక అబ్బాయిని ఇష్టపడుతుంది. వొక రోజు వాళ్ళిద్దరూ చాటుగా వొక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న వేళ పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు అమ్మాయి ఫొటొని మొబైల్ లో తీస్తారు. అబ్బాయి మాత్రం గిలగిల లాడి పోతాడు. పరువు పోతుందని బహయం, తండ్రి భయం. వదిలి పెట్టమని ప్రాధేయపడతాడు. యెంతో కొంత తీసుకుని వదిలి వేయ మంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన అబ్బాయి సందు దొరకగానే విడిపించుకొని బాత్రూం లో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతిని మణికట్టు దగ్గర కోసుకుంటాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు గాని బతకడు. అలా ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మయి వొక్కతే బలిపశువు అయ్యింది.

 

నువ్వు లాడ్జికి యెందుకు వెళ్ళావు అని పోలీసు అడిగితే ఆమె “కుతూహలం” కారణంగా చెబుతుందే తప్ప యెలాంతి సిగ్గు, అపరాధ భావన వ్యక్త పరచదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. abettment to suicide నుంచి ఆమెను తప్పించాలంటే మూడు లక్షలు రెండు నెలల్లో చెల్లించే వొప్పందం ఆ పోలీసు, ఆమె తండ్రి మధ్య. ఫిక్స్ దిపాజిట్ లో  దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు యెలా సమకూరాలా అన్నది వాళ్ళకు పట్టిన శని. ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. “నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం”, అని వేధించే వాళ్ళు. 12000 వచ్చె వుద్యోగం వూడతం, వేరే వుద్యోగంలో కుదురుకుంటే 5500 మాత్రమే రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్ ఘైవాన్ (ఇది ఇతని మొదటి చిత్రం).

 

మరోపక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన అమ్మాయి శ్వెతా త్రిపాఠి ప్రెమించుకుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే లేచి వస్తానని, పెళ్ళి అయ్యాక పెద్దవాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది. కాని దానికి ముందే ఆమె వొక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది.  ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

 

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీ గా, స్వచ్చంగా, అమాయకంగా, నిర్మలంగా వుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఇద్దరూ చాలా ధైర్యన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్ తో (నిటారు గా నిలబడే/కూర్చునే/నదిచే తీరు; సిగ్గు/అపరాధభావనా లేశమాత్రమైనా కనబడని తీక్షణ కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు; తన మీద తనకున్న నమ్మకం). పోతే శ్వేతా త్రిపాఠి కవిత్వన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కాని తమ మధ్య వున్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి, పెద్దవాళ్ళని నెమ్మదిగా వొప్పించవచ్చు.

 

రోజూ యెన్నో శవాలు తగలబడుతుండే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు. (మసాన్ అంటే శ్మసానం).

 

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఈ స్త్రీల ధైర్య-సాహసాలకి, ఆత్మ విస్వాశానికి, ఆత్మ గౌరవానికీ.

 

 

రాలిన ఆకులకు లెక్కలేవీ?

krishnudu

మధ్యలో ఆగిపోయింది కాలమ్ అని చాలా మంది అనుకుంటారు కాని నాకు అనిపిస్తుంది అది కాలమేనని. ఎందుకు ఉన్నట్లుండి కాలం ఆగిపోతుందో, సమయం స్తంభించిపోయినట్లు అనిపిస్తుందో కాని అది ఆగిపోవడమా? లేక నండూరి రాసినట్లు గుండె గొంతుకలో కొట్లాడడమా?

పరిణామక్రమంలో ఏదీ ఆగిపోదేమో, ఏదీ స్తంభించిపోదేమో కాని ఎందుకు ఏదీ మారిపోలేదేమోఅని అనిపిస్తుంది? అవే ప్రశ్నలు, అవే జవాబులు. అవే భావోద్వేగాలు.

తరుచూ నేను మట్టిపై కూర్చుంటాను. ఎందుకంటే నా తాహతు నాకు బాగా అనిపిస్తుంది.. నా శైలి నా ప్రత్యర్థులకు నచ్చదు ఎందుకంటే ఎప్పటినుంచో నేను ప్రేమించడాన్ని మార్చుకోలేదు. స్నేహాన్నీ మార్చుకోలేదు.. అని హరివంశరాయ్ బచ్చన్ ఏనాడు రాశాడో కాని కవిత్వం రాయడానికీ, కవిత్వం గురించి రాయడానికీ పూనుకున్నప్పుడల్లా నిన్ను గురించి నీవు తెలుసుకోవడమే అవుతుంది. మట్టి పరిమళం వీడనట్లనిపిస్తోంది.

ఈ రకంగా నీవు నా జీవితంలో చేరిపోయావు.. ఎక్కడికెళ్లినా నీవు పరివ్యాప్తమయ్యావు. అని నిదాఫాజిలీ రాసిందీ కవిత్వం గురించే అనిపిస్తుంది.

జీవితం సగ కాలం గడిపోయింది అనుకుంటాం. సగం రాత్రి గడిచిపోయింది. సగం పగలూ వెళ్లిపోయింది. కాని నిజంగా అది సగం జీవితమా? రెప్పలు తెరుచుకున్నంత సేపూ మూసుకుంటున్నాయి. దోసిలి లోంచి ఇసుకు జారిపోతోంది. దాహం తీరకముందే నీరు ఇంకిపోతోంది..

ఎప్పుడో కందీళ్ల ముందు తడిమిన అక్షరాలేవీ ఇప్పుడు? చెప్పుల్లేని కాళ్లతో ముళ్లడొంకల్లో సాగిన బుడిబుడి నడకలేవీ? గుడి ముందు లైనులో నిలబడింది భక్తికోసమా? ప్రసాదం కోసమా?

కడుపులో రేగిన బడబానలానికి ఎవరు అర్థం చెప్పారు? రాలిన ఆకులకు లెక్కలేవీ? ఏం చేయాలనుకున్నావు? ఏం చేశావన్నది ప్రశ్న కాదు.

ఏం చేశావు ఇంతకాలం? కలతలు రేపిన కళ్లలోకి చూశావా? పులకింపచేసిన నవ్వుల్లో ఉండిపోయావా? పూలవానసల్లోకి తొంగిచూసే తీరికెక్కడిది? స్పర్శకు ముందే ఆవిరైన ప్రేమ ఏదీ?

నినాదం నిరంతరం ప్రతిధ్వనిస్తుండడమేనా? విముక్తి ఎండమావి కోసం పయనమేనా? వెలుగు చూపాలనుకున్న కాగడాలెక్కడ? రెండడుగుల మధ్య దూరమే జీవితమా?

అవే కౌగిలింతలు. అవే కలహాలు, సంఘర్షణలు.. జేబుల్లో కాగితాలే జీవన సంగీతాలా?

ఈ ప్రయాణానికి ఎక్కడుంది మలుపు? మరిచిపోయిన అధ్యాయాల్ని తెరిచి చూసి చదువుకుంటే జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ అదే కదా..

ఎక్కడున్నాయి సగం వసంతాలు? పక్షులై ఎగిరిపోయాయేమో..

చేతివ్రేళ్లు తగలని పుస్తకంలా కొట్టుకుంటోంది జీవితం. ఇన్నేళ్లు గడిచినా ఒక చిరునవ్వుకోసం, ఒక పలకరింపుకోసం మనసు తన్లాడుతోంది. కాని కరచాలనానికి చేయిజాపే లోపు మనిషే మాయం? ఎక్కడ వాడు?

సమీపంలో ఉన్నదేదీ సన్నిహితం కాదా? ఎదురుగా ఉన్నవాడిని పోల్చుకోవడం ఎంత కష్టం? పక్షులు ఆకాశం కోల్పోయాయా? ఆకాశం పక్షుల్ని కోల్పోయిందా?

అయినా వద్దకున్నా వ్రేళ్లు ఆగవు. అవి నాకు తెలీకుండా చలిస్తూనే ఉంటాయి. రాస్తాను.. అఫ్సర్ కోసమైనా రాస్తాను.. రాయకుండా ఉండలేను.

ఇప్పుడు..

అర్థనిమీలిత నేత్రాల మధ్య ఆకాశం దాచుకున్న రహస్యాల వెనుక తెగిపడుతున్న పక్షుల చప్పుడు వినిపిస్తాను.

కనుగ్రుడ్ల భూగోళాల మధ్య, నేల పొరల్లో దాగిన చరిత్ర పుటల వెనుక నిక్షిప్తమైన అస్తిపంజరాల సంభాషణ వినిపిస్తాను.

కనురెప్పల దొంతరల మధ్య ఎగిసిపడుతున్న కెరటాలు చెప్పలేని అల్లకల్లోల దృశ్యాల పదధ్వనులను వినిపిస్తాను.

కనుబొమల అర్థ చంద్రాకారాల మధ్య భ్రుకుటిలో దాగిన ఆత్మ కన్ను వెనుక రగిలిపడుతున్న జ్వాలామాలికల చిటపటలు వినిపిస్తాను.

నిశ్చలమైన దృక్కుల వెనుక ఆలోచనల్లో దాగిన సాంద్ర నీహారికల్లో తొణికిసలాడుతున్న అశ్రుగీతికలు ఆలపిస్తాను.

ఎందుకంటే అకాల మరణం చెందిన ప్రతి శవమూ నాదే. ఆ రోదనా నాదే. ఆ చితి మంటలూ నావే. ఆ చితా భస్మమూ నాదే. ప్రతి హంతక శరీరం వెనుక నడుస్తున్న నీడా నాదే.

*

అన్నదాత మరణమృదంగ వాయుధ్వని!

1973-2 మనలో ఎంతమందిమి అన్నం తినేటప్పుడు రైతు గురించి ఆలోచిస్తాం? అసలీ వ్యవసాయక దేశంలో ఇంతవరకు ఏ రైతుకూ ఎందుకని భారతరత్న అవార్డు రాలేదు?” ఇవి నటరాజ్ మహర్షి వేసిన ప్రశ్నలు, తనకు తానే వేసుకున్న ప్రశ్నలు. అతనికి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. బహుశ వాటికి జవాబులు దొరక్కపోవచ్చు. కానీ రైతుకి తన రుణం మాత్రం తీర్చుకోవాలనుకున్నాడాయన. ఫలితమే “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” అనే లఘు చిత్రాన్ని నిర్మించారు.

నిజానికి నటరాజ్ కి ఇది మొదటి సినిమా కాదు. ఈ సినిమా కి ముందుగా ఓ ఫిలిం మేకర్ గా ఆయన చేసిన ప్రయాణం వుంది. “న్యూయార్క్ ఫిలిం అకాడెమీ” అనుబంధంతో కాలికట్ లో జరిగిన వర్క్ షాప్ లో శిక్షణ పొందిన నటరాజ్ అక్కడ మెథడ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తరువాత నవ్య యుగపు నవీన భావాల దర్శకులందర్నీ కలుసుకున్నానని చెప్పారు. ఆ తరువాత ముంబైలో సెటిల్ ఐన నటరాజ్ 2014 లో “డ్రాయింగ్ బ్లడ్” అనే ఇంగ్లీష్ సినిమా తీసారు. అది ఒక పెయింటర్ కథ. ఆ తరువాత కెరీర్లో ఎదగటం కోసం తనని తాను కోల్పోయిన ఒక గజల్ గాయని మీద “మేరా ఆలాప్” అనే హిందీ లఘు చిత్రం 2015లో తీసారు. తన అన్ని సినిమాలకీ తనే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, తనే స్క్రిప్ట్ రైటర్, తనే దర్శకుడు. ప్రతి షాట్ ని ఎంతో శ్రద్ధగా చిత్రిస్తారు ఆయన. లైటింగ్, కెమెరా యాంగిల్స్ వంటి అన్ని విషయాల్లో మంచి క్రాఫ్ట్స్ మెన్ షిప్ కనబరుస్తారు. ప్రేక్షకుడి మూడ్ ని ఎలవేట్ చేసే నేపధ్య సంగీతం గురించి, ఎడిటింగ్ గురించి శ్రద్ధ తీసుకుంటారు. నేను ఆయనతో మాట్లాడిన మేరకు ఆయనలో ప్యూరిటానిక్ కళాకారుడు ఉన్నాడు. ఇది ఆయన మొదటి ఫీచర్ సినిమా “డ్రాయింగ్ బ్లడ్” లో కనిపిస్తుంది. జీవిత పరమార్ధం ఆధ్యాత్మిక దృక్పధంలో దొరుకుతుందనే ఆలోచన ఆయనలో వుంది. ఇది ఆయన షార్ట్ ఫిలిం “మేరా ఆలాప్” లొ స్పష్ఠంగా కనబడుతుంది. ఆయన ప్రస్తుతం “ద స్కల్ప్టర్” అనే డాక్యుమెంటరీ నిర్మాణంలో వున్నారు. ఇది కాకుండా “అనోనా” అనే ఫీచర్ ఫిలిం కూడా తీస్తున్నారు. శరవేగంతో షూటింగ్ తీసినా దాని ముందు, తరువాత చాలా పని చేస్తానంటారు నటరాజ్.

“1973” సినిమాలో నటరాజ్ ఏ చెప్పారు? వర్తమాన రైతు సమస్యల మీద, రైతుల ఆత్మహత్యల మీద తీసిన సినిమా కాదిది. తనకేమైన కష్టం వస్తే ఎవరికీ పట్టని రైతు ఒంటరితనం గురించి, నిస్సహాయత గురించి, ఎవరికీ వినిపించని రైతు ఆర్తనాదం గురించి, దుఖం గురించి, అభద్రత గురించి, నిన్నటి దాకా పంటకి నీరు పెట్టిన రైతు హఠత్తుగా కనిపించక పోతే పట్టించుకోని సమాజ నిర్లక్ష్యం గురించి నటరాజ్ చెప్పారు. నీరందని పంటలాగా ఎండిపోతున్న రైతు గురించి చెప్పారు. రైతు భూమిలో వనరుల మీద కన్నేసి అతని భూమిని దక్కించుకోవాలన్న పొలిటీషియన్ స్వార్ధం గురించి, క్రూరత్వం గురించి చెప్పారు. ఎవరూ చెప్పని ఓ రైతు గురించి చెప్పారు. నిస్సహాయంగా గాలిలో కలిసిన అతని ఆక్రందనని మనకు వినిపించారు. అసలు భవిష్యత్తులో రైతనే వాడుండని హెచ్చరించారు.

నిజానికి నటరాజ్ ఏమీ చెప్పలేదు. కేవలం చూపారు. చాలా చూపించారు. దేశం మీద ప్రేమతో జెండా కింద సేద్యం చేసిన రైతు నిబద్ధత గురించి చూపించారు. ఆ రైతు వెక్కిళ్ళు మన దోసిలిలో పోసి చూపించారు. “దాహం వేస్తుంది. నీ భూమిని ఇస్తావా?” అనే రాజకీయ నాయకుడి స్వార్ధం చూపించారు. పెద్దగా డైలాగులు లేని ఓ ఇరవై నిమిషాల లఘు చిత్రంలో ప్రేక్షకుడి మనసుని కదిలించే విధంగా ఆయన ఇవన్నీ చూపించారు. జెండాని సంక్షేమ రాజ్యానికి చిహ్నంగా చూపించి బలవంతుడి దౌష్ట్యం ముందు రాజ్యాంగం పూచీపడే సంక్షేమం ఎంత బలహీనమో చూపించారు. రైతుని కొట్టడానికి జెండా కర్రని వాడుకున్న మంత్రి చివర్లో జెండా విశిష్ఠతని గురించి రేడియోలో ఉపన్యసిస్తాడు. ప్రతీకలు కలిగించే మిధ్యావేశంలో మనం బతికేస్తుంటాం కదా!

1973-3

1973లో ఖమ్మం జిల్లాలో ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టిన నటరాజ్ కి ఆయన తండ్రి అదే సంవత్సరంలో తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రైతుకి జరిగిన అన్యాయాన్ని వివరించి చెప్పారు. ఎవరికీ తెలియకుండా చరిత్ర కాలగర్భం లో కలిసిపోయిన ఆ రైతు కథ ఇప్పుడు నటరాజ్ చేతిలో ఓ సినిమాగా ప్రాణం పోసుకుంది.

“వాయుధ్వని ప్రొడక్షన్స్” సమర్పణలో నటరాజ్ మహర్షి తానే స్వయంగా రాసి, తీసిన “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” ఇప్పటికి 5 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఎంపికైంది. ఆల్ లైట్స్, బెంగళూరు, రుమేనియా, మన్ హట్టన్ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ లో ఈ సినిమా ఎంపికైంది. ఇది ఓ తెలంగాణ యువకుడు సాధించిన ఘనత.

ఈ సెప్టెంబర్ 24 నుండి 27 వరకు రామోజీ ఫిలిం సిటిలో జరగబోయే “ఆల్ లైట్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్”లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. “షార్ట్ ఫిలిం కార్నర్”లో తెలుగు నుండి అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన రెండు సినిమాల్లో ఇదొకటి. కెవీఅర్ మహేంద్ర తీసిన “నిశీధి”మరొకటి. ఇది తెలంగాణ చిన్న సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ విజయం. మొన్నీమధ్యనే 1973 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ని విడుదల చేసారు. ఈ సినిమా చూసి నగ్నముని గారు స్పందించిన వీడియో కూడా యూట్యూబ్ లో లభ్యమౌతుంది.

స్లాప్ స్టిక్ కామెడీ తోనో, చీప్ డైలాగులతోనో నాసిరకపు సాంకేతిక, సంగీత నాణ్యతా విలువలతో కనబడతాయి తెలుగులో షార్ట్ ఫిలింస్ యూ ట్యూబులో. వాటికి భిన్నంగా మంచి అభిరుచితో, బాధ్యతతో సినిమాలు తీసే వృత్తిరీత్యా ఫాషన్ ఫోటోగ్రాఫర్ ఐన నటరాజ్ మహర్షి వంటి ఫిలిం మేకర్స్ ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీదుంది. మనం ప్రోత్సహించాలే కానీ ఆయన దగ్గర చాలా మెటీరియల్ వుంది. ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్!
Official Trailer – 1973 An Untold Story (2016) Short Film

 

హ్యూస్టన్ లో అడుగు పెట్టిన వేళా విశేషం…!

 

గత సెప్టెంబర్ 2-3-4, 2016 తేదీలలో మా హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి 40వ వార్షికోత్సవాలు దిగ్విజయంగా జరిగాయి. కేవలం $350,000 బడ్జెట్ తో మిలియన్లు ఖర్చుపెట్టి జాతీయ సంఘాలు ప్రతీ ఏడూ జరిపే జాతర్ల స్థాయిలో ఈ సంబరాలు జరిగాయి. అంటే సినిమా తారలు, రాజకీయ నాయకులూ, (అప) హాస్య గాళ్లూ, తదితర దిగుమతి చేసుకున్న వారికి పెద్ద పీట వేసినా, స్థానికులకి కూడా చోటు దొరికింది. ఆ  నలభై ఏళ్ల వార్షికోత్సవాల సందర్భంగా టీసీయే పుట్టిన క్షణం నుంచీ ఈ నాటి వరకూ టీసీయే తో నాకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆ తొలి దశకంలో నా జ్ఞాపకాలు కొన్ని పంచుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.  ఇందులో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చును. కొందరు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం మర్చిపోయి ఉండ వచ్చును. ప్రస్తావించిన వారి అందరి కృషీ తగిన స్థాయిలో నేను వ్రాసి ఉండక పోవచ్చును. ఆ నాడు అందరూ సమానులే కానీ ఎవ్వరూ ఎక్కువ సమానులు కాదు. అన్ని తప్పోప్పులకీ నేనే పాపాల భైరవుడిని కాబట్టీ, ఏదీ బుద్ది పూర్వకంగా చేసిన పొరపాటు కాదు కాబట్టీ పెద్ద మనసు తో ఈ చిన్న వాడిని మన్నించమని ముందే మనవి చేసుకుంటున్నాను. అలాగే నా ‘సొంత డబ్బా’ ఎక్కువగా వినపడితే కాస్త వాల్యూమ్ తగ్గించుకోండి.

నా హ్యూస్టన్ ‘‘రంగ ప్రవేశం”

van1అప్పుడు హ్యూస్టన్ మహా నగరంలో ఏ ఒక్క మానవుడి పేరూ తెలియదు. మా తమ్ముడు చికాగోలో ఉండే వాడు కాబట్టి నేను అప్పటికి మూడు నెలల ముందు ఇండియా నుంచి ఆ ఊళ్ళో అడుగుపెట్టాను – జేబులో బొంబాయి లో యు.ఎస్. కాన్సలేట్ వారు నన్ను మెచ్చి ఇచ్చిన గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్, భారత ప్రభుత్వం వారు దయతో మంజూరు చేసిన అక్షరాలా ఎనిమిది డాలర్లు, ఐదారు చొక్కాలు, చెడ్డీలు, పంట్లాలు, నా ఐఐటి డాక్టరేట్ పట్టా తో అన్నీ సద్దుకున్న రేకు పెట్టె…అదీ నా మొత్తం ఆస్తి. చికాగోలో ఆ రెండు నెలలలోనూ ఆర్ధిక మాంద్యంలో ఇరుక్కున్న ఆ ప్రాంతాలలో ఉద్యోగ సద్యోగాలు మనకి దొరకవు అని అర్థం అయిపోయింది. అప్పటికి చికాగోలో నాకు మంచి మిత్రుడు ప్లంజేరి శంకర్ “టెక్సస్ బాగా బూమింగ్ గా ఉంది. అక్కడికి వెళ్లి ట్రై చెయ్యి “ అని సలహా ఇచ్చాడు. ఆ రోజుల్లో అమెరికా చలి ప్రాంతాలు ఆర్ధిక మాంద్యంలో ఉంటే టెక్సస్ లాంటి ఆయిల్ ఎకానమీ రాష్ట్రాల ఎకానమీ పుంజుకునేది. అంచేత నా లాగా నిరుద్యోగులుగా ఉన్న తణుకు తాలూకు ఈమని శాస్త్రి, అతని తమ్ముడు రఘురాం, (వీళ్ళిద్దరూ నాకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో బాగా జూనియర్లే కానీ అక్కడ తెలియదు.) బసంత్ పట్నాయక్ అనే ఒరియా స్నేహితుడు ఆ రోజు సాయంత్రమే ఓ చిన్న కారులో మాకున్న ఆస్తులన్నీ “డిక్కీలో పడుకోబెట్టేసి” ఎక్కడా ఆగకుండా 24 గంటలలో హ్యూస్టన్ వచ్చేశాం. మాలో ఎవరికీ హ్యూస్టన్ మహా నగరంలో ఏ ఒక్క మానవుడి పేరూ తెలియదు. అది 1975 మార్చ్ నెలలో ఓ రోజు -41 సంవత్సరాల క్రితం.

ఆ రాత్రి హిల్ క్రాఫ్ట్ అనే రోడ్డు  -ఇప్పుడు ఆ ప్రాంతం లిటిల్ ఇండియా – మీద ఓ రెండు రోజులు కారులోనే పడుకుని, ఇక లాభం లేదు గురూ అనుకుని ఎవరైనా ఇండియన్ కుర్రాళ్ళు ఉండక పోతారా అని రైస్ యూనివర్సిటీకి వెళ్లి వాకబు చేశాం. అనుకున్నట్టుగానే అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు కనపడగానే పరిచయం చేసేసుకున్నాం. వాళ్ళలో మా దగ్గర బంధువు – కేంపస్ లో ఒకే ఒక్క తెలుగు విద్యార్థి కూడా ఉండడం కేవలం యాదృచ్చికం.

ఆ తరువాత నా వ్యక్తిగత జీవితం ఎన్ని ఒడుదుడుకులని ఎదుర్కొన్నా, అప్పుడు జరిగిన అతి ముఖ్యమైన విషయం తలచుకుంటే ఇప్పటికీ మహానందం వేస్తుంది.  ఓ రోజు సొంతంగా వండుకునే వంట తిన లేక విసుగొచ్చి రైస్ యూనివర్సిటీ లో డాక్టరేట్ చేస్తూ మిత్రులు అయిపోయిన మా బంధువు కుంటముక్కుల మూర్తి, గౌరంగ్ వ్యాస్, పట్నాయక్ కి మిత్రుడు , తోటి భువనేశ్వర్ వాడు అయిన మహంతీ “ఇక్కడే ఉన్న మహారాజా అనే ఇండియన్ రెస్టారెంట్ కి వెడదామా?” అనుకుని…ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్క వేసుకుని మొత్తం పదిహేను డాలర్లు జమ అవగానే “పరవా లేదు. అక్కడ ఇడ్లీకి, కాఫీకీ సరిపోతాయ్ అందరికీ” అని యూనివర్సేటీ దగ్గరే టైమ్స్ బులావార్డ్ మీద ఉన్న మహారాజా రెస్టారెంట్ కి వెళ్ళాం. లోపలకి అడుగుపెట్టగానే ఒకాయన “వెల్ కం” అని మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటే గొప్పగా ఫీల్ అయిపోతూ అతని మొహం చూసి ఆశ్చర్య పోయాను…ఎక్కడో చూశానే..ఎక్కడ చెప్మా అని బుర్ర గోక్కుని “మీ పేరు ఏమిటి సార్” అని ఇంగ్లీషులో అడిగేశాను. “అనిల్ కుమార్” అని వెంటనే అతను కూడా నాకేసి అనుమానంగా చూశాడు. ఇంచు మించు ఇద్దరం ఒకే సారి “గురూ, నువ్వా” అంటే “హారినీ, నువ్వా ఇక్కడేమిటీ ?  అనేసి కావలించుకుని ఒకరినొకరు గుర్తు పట్టేసుకున్నాం.  విషయం ఏమిటంటే ఈ అనిల్ కుమార్ నాకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఏడాది సీనియర్. కాలేజ్ ప్రోగ్రాములలో నిహార్ అనే కాశ్మీరీ కుర్రాడు ఎకార్దియన్ వాయిస్తూ ఉంటే ఇతను డ్రమ్స్, బేంగోస్ లాంటివి వాయించే వాడు. అప్పుడప్పుడు అరుపులూ, పెడ బొబ్బలతో “మోసేసే వాళ్ళం”. ఆ రోజుల్లో ఎక్కువ పరిచయం లేదు కానీ ముఖ పరిచయం బాగానే ఉంది. అందుకే పదేళ్ళయినా ఇప్పుడు ఒకరినొకరు గుర్తు పట్ట్టగలిగాం. ఆ రోజుల్లో యావత్ టెక్సస్ రాష్ట్రం అంతటికీ ఈ మహారాజా ఒక్కటే ఇండియన్ రెస్టారెంట్ అంటే ఈ రోజుల్లో నమ్మ బుద్ది కాదు. అనిల్ తో పాటు దువ్వూరి సూరి, శేష్ బాల, వెంకట్ కలిసి సరదాగా ఈ రెస్టారెంట్ మొదలుపెట్టి ఎవరికీ వ్యాపారానుభావం లేక కొన్నాళ్ళకి మానేశారు. ఇప్పుడు సరిగ్గా అదే చోట “శివ” అనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది.

ఆ విధంగా నాకు హ్యూస్టన్ లో పరిచయం అయిన మొదటి తెలుగు వక్తి అనిల్ కుమార్. అప్పటి నుంచీ గత ఏడాది పరమపదించేదాకా అనిల్ కుమారే నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు.

హ్యూస్టన్ లో తొలి తెలుగు వారు

van2

టెక్సస్ అనగానే గుర్రాలూ, తుపాకులూ , పేద్ద పది గేలన్ల టోపీలూ అనుకుని, ఇవన్నీ మనకెందుకులే అనుకుని భారతీయులు, అందునా తెలుగు వారు అమెరికాలో ఇతర రాష్టాలకి మాత్రమే వలస వరస కట్టిన రోజులలో, విశాఖపట్నానికి చెందిన (స్వర్గీయ) దువ్వూరి అచ్యుత అనంత సత్య నారాయణ రావు గారు , కుటుంబ సమేతంగా , ఆస్ట్రేలియా, కెనడాలలో చదువు తరవాత  హ్యూస్టన్ లోని టెక్సస్ సదర్న్ యూనివర్శిటీలో ఫిజిక్స్ విభాగం ప్రారంభించడానికి 1957 లో హ్యూస్టన్ వచ్చారు. ఆయనే టెక్సస్ కి, అమెరికా లోని ఇతర దక్షిణ రాష్ట్రాలకి వచ్చిన తొలి తెలుగు వారు.

ఆ తరువాత పదేళ్ళలో 1970 నాటికి పట్టిసపు రామజోగి గంగాధరం గారు, పోతు నరసింహారావు గారు మొదలైన కుటుంబీకులూ, అనిల్ కుమార్, మణ్యం మూర్తి, గుంటూరు సీతాపతి రావు, తమ్మారెడ్డి చంద్రశేఖర రావు, చింతపల్లి అశోక్ కుమార్ లాంటి బ్రహ్మచారులూ వెరసి ఇంచుమించు 20  మంది తెలుగు వారు హ్యూస్టన్ లో నివాసం ఏర్పరుచుకున్నారు. అప్పుడు అందరూ ముందు భారతీయులూ, తరవాతే తెలుగు వారు. భారతీయులందరూ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో కలుసుకుని హిందీ సినిమాలు వేసుకునీ, పిక్నిక్స్ జరుపుకునే వారు. తెలుగు పండుగలకీ, తెలుగులో మాట్లాడుకోవడానికీ నారాయణ రావు గారు, నరసింహా రావు గారూ, గంగాధరం గారి ఇళ్ళలో అందరూ కలుసుకునే వారు. వారందరి “లివింగ్ రూము” లే ఆ నాటి తెలుగు సాంస్కృతిక వేదికలు. ఆ నాటి తొలి తెలుగు వారిలో చాలా మంది ఇప్పటికీ హ్యూస్టన్ లోనే ఉండడం, అందులో కొంత మంది ఇంకా ఈ నాటి మన తెలుగు సాంస్కృతిక సమితి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనడం చెప్పుకోదగ్గ విశేషమే!

1975 ప్రాంతాలకి హ్యూస్టన్ లో ఇంచుమించు యాభై మంది తెలుగు వారు సమకూడారు. వారిలో నాటకాలూ, శాస్త్రీయ సంగీతమూ, కూచిపూడి నృత్యమూ మొదలైన కళలలో అతున్నతమైన మంచి ప్రావీణ్యం ఉన్న ఐదారుగురు కళాకారులు కూడా ఉండడంతో, అందరూ మామూలుగా కలుసుకోవడం, పండగలు చేసుకోవడమే కాకుండా, ఏదో రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండేవి. అవన్నీ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, టెక్సస్ సదరన్ యూనివర్శిటీ లేదా మెడికల్ సెంటర్ ఉన్న హాళ్ళలో జరిగేవి. అప్పటికే అమెరికా ఇతర పెద్ద నగరాలలో తెలుగు సంఘాలు, వాటితో చిన్న, చిన్న రాజకీయాలు మొదలయ్యాయి. నాకూ బొంబాయి లో ఉన్న అనుభవంతో మనకి ఇక్కడ కూడా ఒక తెలుగు సమితి ఉంటే బావుంటుంది అనే ఆలోచన లేవనెత్తాను. అంతకు ముందు కూడా ఆ ఆలోచనలు వచ్చాయి కానీ, ఒక తెలుగు సంఘం నిజంగా అవసరమా, ఒక వేళ తెలుగు సంఘం పెట్టుకుంటే, రాజకీయాలకి అతీతంగా దాన్ని ఎలా తీర్చిదిద్దాలనీ అని ఒక ఏడాది పాటు రకరకాల చర్చలు జరిగాయి. మొత్తానికి 1976 లో  తెలుగు సాంస్కృతిక సమితి అనే పేరుతో హ్యూస్టన్ లో లాభాపేక్ష లేని సంస్థగా వెలిసింది. ఆ సమితి ఆశయాలనికీ, నిర్మాణ నిబంధనావళి రచించడానికీ దువ్వూరి నారాయణ రావు, పోతు నరసింహా రావు, తమ్మారెడ్డి చంద్రశేఖర రావులతో ఒక కమిటీ చెయ్యబడింది. వారు అందరితో చర్చలు జరిపి, అప్పటికే దేశంలో ఉన్నమూడు, నాలుగు తెలుగు సంస్థల తీరుతెన్నులూ, సమస్యలూ పరిశీలించి తెలుగు సాంస్కృతిక సమితి మొట్టమొదటి “రాజ్యాంగం”…అంటే “ప్రారంభ నిబంధనలు, సూత్రాలు” ..అంటే Constituition ప్రచురించారు. వంగూరి చిట్టెన్ రాజు తెలుగులో  అక్షరరూపం కలిగించి, హ్యూస్టన్ లో ఉన్న తెలుగు వారందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన ఈ  క్రింది తొలి పత్రంలో తెలుగు సాంస్కృతిక సమితి ఆశయాలు:

“తెలుగు భాష మీద తెలుగు సంస్కృతి మీద అభిమానము, అభిరుచి గల వ్యక్తుల సమన్వయమీ తెలుగు సాంస్కృతిక సమితి. లాభాపేక్ష, రాజకీయ విషయములలో జోక్యము చేసుకునే ఆసక్తి లేనిదిది. సభ్యులు తరచు కలుసుకొనుటకు, తెలుగు సంస్కృతికి సంబంధించిన కార్యకలాపములలో పాల్గొనుటకు అవకాశాములను కల్పించుటే ఈ సమితి ప్రధానాశయము. ఈ ప్రాంతములోని తెలుగు వారి సమైక్యతను పెంపొందించి, వారి సంస్కృతికి సంబంధించిన అవసరములు తీర్చుటయే కాక ఆ సంస్కృతిని తెలుసుకోవాలనే ఆపేక్షగల హ్యూస్టన్ మహానగర నివాసుల వాంఛాసాఫల్యమునకు కూడా ఈ సమితి తోడ్పడుతుందని ఆశించవచ్చును”

ఈ కమిటీ వారు మన సాంస్కృతిక సమితికి “అధ్యక్షులు” అనే పదవి అధికారకాంక్షను పెంచే విధంగా ఉండి, రాజకీయాలకు దారి తీస్తుందని భావించి, సమితి  సభ్యులందరూ కలసి ఏడుగురు వ్యక్తులను  నిర్వాహక వర్గం  సభ్యులుగా ఎన్నుకోవాలనీ, ఆ ఏడుగురూ తమలో తామే ఒకరిని “సమన్వయ కర్త” గానూ, మరొకరిని “సహ సమన్వయ కర్త” గానూ నిర్దేశించుకుని, సమితి కార్యకలాపాలన్నింటినీ సమిష్టిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం, 1977 జనవరిలో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి మొట్టమొదటి కార్యనిర్వాహక వర్గానికి  కోనేరు తాతయ్య సమన్వయ కర్త గానూ, వంగూరి చిట్టెన్ రాజు (నేను) సహ సమన్వయ కర్త గానూ, పుచ్చా వసంత లక్ష్మి, పోతు రాజేశ్వరి, తుమ్మల కుటుంబ రావు, పట్టిసపు గంగాధరం, కొడాలి సుబ్బారావు, తమ్మారెడ్డి చంద్ర శేఖర రావు  గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మొదటి ఉగాది: -1977

”కాళయుక్త” నామ సంవత్సర ఉగాది (1977) మన మొట్టమొదటి అధికారిక కార్యక్రమం. యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, స్ట్యూడెంట్ సెంటర్ మూడవ అంతస్తులో ఉన్న హ్యూస్టన్ రూమ్ లో జరిగిన ఆ నాటి తొలి ఉగాది కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులలో కొందరు పొలాని జానకి రామయ్య & శారద, బిలకంటి గంగాధర్, రవి తమిరిశ, కిరణ్ తమిరిశ, పుచ్చా వసంత లక్ష్మి & మల్లిక్, రత్నపాప & అనిల్ కుమార్, వంగూరి చిట్టెన్ రాజు, కామేశ్వరీ గంగాధరం, రూపా కోనేరు, రఘు చక్రవర్తి, చావలి రామసోమయాజులు & బాల, చేగు లలిత,  విజయ మరియు రాధ దేవరకొండ, దువ్వూరి సూరి & హీరా, గొల్లపూడి మణి, రేణుకా రెడ్డి, తోట రాణి & సూర్యారావు, సూర్యకుమారి & మహాబలి రాజా, జానీ బేగమ్ & మస్తాన్ వాలీ, తుమ్మల కుటుంబ రావు & కుసుమ  మొదలైన వారు. ఆ తొలి రోజులలో నాకు జ్ఞాపకం ఉన్న అప్పటి తెలుగు వారు కొడాలి సుబ్బా రావు, అనంతనేని ప్రకాశ రావు, కేశవరావు, గోగినేని రమేష్, కొడాలి సూర్యం, ఏలూరు గోపాల కృష్ణ, రేణుకా రెడ్డి, అడవల్లి జనార్ధన రెడ్డి, గోగినేని సుబ్బారాయుడు మొదలైన వారు. ఎవరి పేర్లు అయినా మర్చిపోతే నన్ను మన్నించాలి. ఆ రోజుల్లో పదేళ్ళ లోపు చిన్న పిల్లలు రాధ తమిరిశ, గిరీష్ పుచ్చా, కల్యాణి పొలాని, హరి రాజా, మాధవి చావలి మొదలైన ఐదారుగురు మాత్రమే.

van3

ఈ కార్యక్రమంలో యావత్ అమెరికాలోనే మొట్ట మొదటి తెలుగు సాంఘిక నాటకం వేశాం. ఆ హాస్య నాటిక  “బామ్మాయణం అను సీతా కల్యాణం “ నేనే అంతకు నాలుగేళ్ల ముందు బొంబాయిలో ఉన్నప్పుడు వ్రాశాను. ఇక్కడ వేసినప్పుడు నేను బామ్మ వేషం, అనిల్ కుమార్, మోహన రావు బ్రహ్మచారులు, దువ్వూరి నారాయణ రావు గారు పరంధామయ్య పాత్ర వేశారు.

ఆ తరువాత మే 28-29, 1977 లో న్యూయార్క్ లో “ప్రప్రధమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం” జరిగింది. దానికి మన సమితి తరఫున రత్న పాప, అనిల్, సూరి, నేనూ వెళ్లాం. ఇక్కడ ఒక తమాషా విషయం చెప్పాలి. అప్పుడే మొదలయిన మన సమితికే కాదు, ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు కాబట్టి ఓ పాట్ లక్ డిన్నర్ పెట్టి, అందరినీ పిలిచి, ప్లేటుకి పాతిక రూపాయలు విరాళం పెడితే  ఓ అరవై మంది వస్తారు కదా…వారి విరాళాలతో అప్పుడు అందరినీ టీసీయే స్పాన్సర్ చెయ్యవచ్చును అనే ఆలోచన వచ్చింది. ఓ క్లబ్ హౌస్ లో ఏర్పాట్లు చేసి అందరినీ పేరు, పేరునా పిలిచాం. దానికి సూర్య కుమారి, దేవరకొండ సుబ్బలక్ష్మి, వసంత, బాల, హీరా, మరో ఇద్దరు ముగ్గురు మొత్తం వంట అంతా చేసి పట్టుకొచ్చారు. తీరా చూస్తే ఆ వంట చేసి పట్టుకొచ్చిన కుటుంబాలు, నా బోటి బ్రహ్మచారులం నలుగురమూ తప్ప పట్టుమని పది మంది కూడా రాలేదు. చచ్చినట్టు మేమే ప్లేటుకి వంద డాలర్ల చొప్పున కొనుక్కుని, ఏడవ లేక జోకులేసుకుంటూ మా టిక్కెట్లు మేమే కొనుక్కున్నాం!

ఆ న్యూయార్క్ సభలలో సూరి, అనిల్, నేనూ బొబ్బిలి యుద్దం బుర్ర వేశాం. నేనే వ్రాశాను. అమెరికాలో ఆ మొట్ట మొదటి బుర్ర కథ. అందులో మా ఒరిజినల్ హాస్యం గురించి అప్పటి వారు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ ఫోటోలు ఇక్కడ జతపరిచాను. న్యూయార్క్ లో మరో విశేషం ఇండియా నుంచి ప్రత్యేకంగా వచ్చిన సీత-అనసూయ పాడుతుండగా వాళ్ళమ్మాయి, మన రత్న పాప “మొక్క జొన్న తోటలో” జానపద నృత్యం అత్యద్భుతంగా చెయ్యడం. మరో విశేషం ఆ సభల లోనే అమెరికా మొత్తానికి ఒక “అంబ్రెల్లా’ సంస్థ ఉండాలని అందరం అందుకుని, దానికి రూప కల్పన చెయ్యడానికి ఏడుగురు సభ్యులతో ఒక గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎన్నుకోవడం. వారిలో నేను ఒకడిని. దాని ఫలితమే తానా సంస్థ ఆవిర్భావం.

తెలుగు డైరెక్టరీ

1979లో అనుకుంటాను. ఇక్కడ తెలుగు వారందరికీ ఉత్తరాలు పంపించి సమాచారం అందించడానికి ఒక డైరెక్టరీ తయారు చేసుకోవలసిన అవసరం వచ్చింది. నేనూ, మల్లిక్, కొడాలి సుబ్బారావూ ఆనాటి టెలిఫోన్ డైరెక్టరీ లో ఒక్కొక్కళ్లూ  సుమారు వంద  పేజీలు చొప్పున  పంచుకుని, వాటిల్లో ఎక్కడైనా రావు, రెడ్డి, శాస్త్రి మొదలైనవే కాక ఏ మాత్రం తెలుగు ఇంటి పేరులా కనపడిన వారందరినీ పిలిచి, అయిన వాళ్లకి తెలుగు సమితిని పరిచయం చేసి, తెలుగేతరుల చేత చివాట్లు తిని, మొత్తానికి ఆరు నెలలలో ఒక సమగ్రమైన డైరెక్టరీ తయారు చేశాం. దాన్ని అశోక్ కుమార్ భార్య మేరీ ఎగ్నెస్ టైప్ చేసి పెటింది. మొత్తం 154 పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామాలతో సహా. ‘మాకు ఇలాంటివి అక్కరలేదు’ అన్న తెలుగు బుద్ధి  వాళ్ళు ఆ రోజుల్లో పదుల సంఖ్యలో ఉంటే ఈ నాడు వేల సంఖ్య లోఉన్నారు.

అప్పట్లో ఇంకా అంత ప్రాముఖ్యం లేని షుగర్ లాండ్ , కేటీ, సైప్రస్, క్లియర్ లేక సిటీలలో తెలుగు వారు లేరు. అందరూ మెడికల్ సెంటర్ చుట్టు పక్కలా, సౌత్ వెస్ట్ లోనూ ఉండేవారు.

మధురవాణి ప్రారంభం:

అప్పట్లో, ఇప్పటిలా తెలుగు సంస్కృతికి సినిమా పర్యాయపదం కాదు. సంస్కృతి అనగానే భాష, సాహిత్మం, నృత్యం, సంగీతం అనే అర్థాలు ఉండేవి. శాస్త్రీయ నృత్యాలకి ..అందునా కూచిపూడి ప్రాభవానికి రత్నపాప 1975 లోనే స్థాపించిన అంజలి సెంటర్ ఫర్ పెఫార్మింగ్ ఆర్ట్స్ ఎలాంటి డాన్స్ లకైనా సరే…కేంద్ర బిందువు. ఆ తరువాత కోసూరి ఉమా భారతి మరింత విస్తరింప చేశారు. సంగీతానికీ, జానపద సంగీతానికీ, మంచి సినిమా పాటలకీ –కెవ్వు కేక బాపతు కానే కాదు- హీరా & సూరి, వసంత, చావలి బాల, సుసర్ల కుమారి, పొలాని జానకి రామయ్య, శారద, బిలగంటి గంగాధర్, తుమ్మల కుటుంబ రావూ, అప్పుడప్పుడు నేనూ పాడేవాళ్ళం. అన్ని కార్యక్రమాలకీ రవి తమిరిశ, రఘు చక్రవర్తి తబలా, మృదంగం వాయించే వారు. 1978 లో సీత -అనసూయ హ్యూస్టన్ వచ్చినప్పుడు వాళ్ళ చేత స్టూడియో లో రికార్డింగ్ చేయించి ఒక 78 RPM గ్రామఫోన్ రికార్డు విడుదల చేశాం. అదే అమెరికాలో మొదటి తెలుగు ఆల్బం. 1980 లలో చంద్ర కాంత డేవిడ్ ల రాక పాటకి పట్టం కట్టింది. మరి కొన్నేళ్ళ తరువాత అనుకుంటాను ఉమా మంత్రవాది, మణి శాస్త్రి మన సమితి సంగీత స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు.

ఇక భాషా సాహిత్యాలకి ఏం చెయ్యాలా అనుకున్నప్పుడు నాకు తట్టిన ఆలోచన ఒక పత్రిక ప్రారంభించడం, వెను వెంటనే ఆ ఆలోచన అందరికీ నచ్చడం, కేవలం సంస్థాగత సమాచారాన్ని అందించే వార్తా పత్రికల కాకుండా దాని సాహిత్య పత్రికగా తీర్చిదిద్డాలి అని “మధుర వాణి” అని నామకరణం చేసి మొదటి సంచిక 1978 ఉగాది ప్రత్యేక సంచికగా వెలువరించాం. సుమారు యాభై పేజీలు  అంతా నా చేతి వ్రాతలోనే.  ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ క్సీరాక్స్ యంత్రాలు ఉండేవి కాదు. ఉన్నా పేజీకి రెండు డాలర్లు ఖరీదు. అంచేత నేను శని, ఆదివారాలు అప్పుడు నేను పనిచేసే పెద్ద కంపెనీ ఆఫీసుకి వెళ్లి పోయి దొంగతనంగా వాళ్ళ పెద్ద క్సీరాక్స్ మీద యాభై కాపీలు తీసేశాను. ఇంచు మించు 1980 దాకా అదే తతంగం. ఆ మొదటి సంచిక నుంచి సుమారు పదేళ్ళు నేనే మధుర వాణి ప్రధాన సంపాదకుడిని. వసంత, హీరా, కలపటపు వేణుగోపాల్, చావలి రామం, శౌరి నందగిరి మొదలైన వారు సంపాదకులు. ముత్యాల సీత ముఖ చిత్రాలు వేసేవారు. ఆనాటి మధురవాణి తొలి సంచికల   ముఖ చిత్రాలు కొన్ని, లోపలి పేజీల నుంచి కొన్నీ ఇందుతో జతపరుస్తున్నాను. 1984 లో వావిలాల కృష్ణ శాస్త్రి మధుర వాణి ని ఇండియాలో టైప్ చేయించి ముద్రించారు. తరువాత, మరో ఐదేళ్లకి చిక్కి శల్యమై, మరో పదేళ్ళకి ఇంటర్నెట్ ప్రభావంలో మదుర వాణి అంతరించింది. కానీ ఇటీవలే హ్యూస్టన్ లో కొందరు ఔత్సాహికులు అదే పేరిట అంతర్జాల సాహిత్య పత్రికని ప్రారంభించి, మళ్ళీ ప్రాణం పొయ్యడం మళ్ళీ పుట్టినంత  సంతోషంగా ఉంది అని వేరే చెప్పక్కర లేదు కదా!

ఆ నాటి తెలుగు నాటకాలు

పైన పేర్కొనట్టు 1977 లో మొదటి తెలుగు నాటకం వేశాక, మరో పది, పదిహేనేళ్ళు ఏడాదికి కనీసం ఒక్కటైనా ఒక మంచి నాటకం ఉగాదికో, దసరా, దీపావళికో వేసే వాళ్ళం. అవి నేను వ్రాసినా, ఎవరు వ్రాసినా, అన్నింటిలోనూ నా పాత్ర ఉండి తీరవలసినదే! 90 శాతం అనిల్ డైరెక్ట్ చేసే వాడు. మా ఇద్దరిదీ నూటికి నూరు పాళ్ళు ఒకే పంథా. రిహార్సల్స్ లో రెచ్చి పోయి ఆనంద పడేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో మేము కొనుక్కోగలిగే అత్యంత చవక రకం ద్రావకం – బక్ హార్న్ అనే బీర్. అది 99 సెంట్ల కి 12 డబ్బాలు. రుచి వర్షం నీళ్ళలో వేప రసం పిండినట్టు ఉండేది. మేము ఎన్ని కౌనుక్కుని తంటాలు పడినా ఆ కంపెనీ దివాళా తియ్యడానికి ఎక్కువ కాలం పట్ట లేదు.

van5

1975-85 కాలంలో అన్నీ జ్ఞాపకం లేవు కానీ మేము వేసిన నాటకాలలో కొన్ని కుక్క పిల్ల దొరికింది (రావు కొండల రావు), వాంటెడ్ ఫాదర్స్ (ఆదివిష్ణు), ఇల్లు అమ్మ బడును (డి.వి. నరసరాజు), గుండెలు మార్చ బడును (జంధ్యాల). నేను వ్రాసినవి “మగ పాత్ర లేని నాటిక”, ఆఠీన్ రాణి”, “యమ సభ” మొదలైనవి. నాటకం వెయ్యని కార్యక్రమంలో నేను ఏదో ఒక ఏక పాత్రాభినయనం చేసే వాడిని. అందులో జ్ఞాపకం ఉన్నవి “గిరీశం”, “ఎస్ట్రోనాట్ ఆర్ముగం”, “ఈ నాటి దుర్యోధనుడు”, “పోలీస్ వెంకట స్వామి”, “నాదెళ్ళ భాస్కర రావు”,  “యమ సభ” మొదలైనవి. వీటన్నిటిలోనూ నటీ నటులు నేనే కాక, అనిల్, వసంత, ముత్యాల సీత, సత్య ప్రభ రెడ్డి, స్వరూప్ రెడ్డి, రఘు చక్రవర్తి, చార్వాక, అశోక్ కుమార్, కోనేరు ఆంజనేయులు, ఎ.వి,ఎన్. రెడ్డి, జగన్నాథ శాస్త్రి, మణి, వెంకట్ ముక్కు, మోహన్ రావు, చివుకుల కృష్ణ, నారాయణ రావు గారు, కంచెర్ల సుభాష్, బాబ్జీ రావు, కనకం బాబు, పొలాని కల్యాణి, హరి రాజా, దేవరకొండ రమేష్, బళ్లారి పావని మొదలైన వారు. ఇవి కాక సుమారు పదేళ్ళ పాటు ప్రతీ ఉగాది కార్యక్రమం నా హాస్య పంచాంగ శ్రవణం తోటే ప్రారంభం అయ్యేది. ఆ మాట కొస్తే మా నాటకాలు, ఏకపాత్రాభినయనాలూ, అన్నీ హాస్య ప్రధానమే! మధ్య మధ్యలో తెలుగు సామెతలకి చిన్న చిన్న నాటికలు రాసుకుని ప్రేక్షకులని ఆ సామెత ఏమిటో చెప్పమని పోటీ పెట్టె వాళ్ళం.

van4

van6

తెలుగు బడి, తెలుగు గ్రంధాలయం

1980 ల నాటికి పిల్లలకి తెలుగు నేర్పాలి అనే తపన మొదలయింది. దాని ఫలితంగా ముత్యాల సీత, చావలి రామ సోమయాజులు, కలపటపు వేణుగోపాల రావు ల ఆధ్వర్యంలో తెలుగు బడి నిర్వహణ మొదలయింది. రెండు ప్రాంతాలలో జరిగేది అని జ్ఞాపకం. ఇండియా నుంచి తెలుగు వాచికాలు తెప్పించుకుని ఇక్క గరాజ్ లలో ప్రతీ వారాంతం లోనూ ఈ తరగతులు నిర్వహించే వారు. భాష నేర్పడంతో బాటు పిల్లలకి నీతి పద్యాలూ, పాటలూ నేర్పేవారు.

అలాగే తెలుగు పుస్తకాలు చదవదల్చున్న వారికి నవలలు, కథ పుస్తకాలూ సేకరించి కలపటపు వేణుగోపాల్ కారులో పెట్టుకుని ప్రతీ కార్యక్రమానికీ తీసు కొచ్చి ఒక సంచలన గ్రంధాలయం నిర్వహించే వారు. ఐదారేళ్ళ తరువాత కాలంలో కమిటీలలో ఈ ఆసక్తి కనపడ లేదు.

ప్రముఖుల సందర్శనం

 

నాకు తెలిసీ 1973 ప్రాంతాలలోనే వాణిశ్రీ,  గుమ్మడి, రాజ్ బాబు మొదలైన వారు హ్యూస్టన్ రావడమే ప్రముఖుల రాకకి తొలి మెట్టు. ఇక్కడ నాకు అశోక్ కుమార్ చెప్పిన జోక్ ఒకటి జ్ఞాపకం వస్తోంది. ఇక్కడికి రాగానే వాణిశ్రీ “అసలు డేటింగ్ అంటే ఏమిటీ, ఎలా ఉంటుందీ?: అని అడిగిందిట అమాయకంగా. అప్పుడు అశోక్ కుమార్ బేచలర్ కాబట్టి అతను వాణిశ్రీ ఒక్క దాన్నీ రెస్టారెంట్ కి డేటింగ్ కి తీసుకెళ్లాడుట. వెనక్కి వచ్చాక “ఓస్ ఇంతేనా డేటింగ్ అంటేనూ? ఇంకా ఏమిటో అనుకున్నాను“ అందిట. ఈ జోక్ కి ఇప్పటికీ నవ్వుకుంటాం మా తరం వాళ్ళం!

 

1975-85 దశకంలో హ్యూస్టన్ వచ్చి, మన ఆతిధ్యం స్వీకరించిన ప్రముఖుల వివరాలు TCA History At a Glance లో చూడ వచ్చును. ప్రత్యేకంగా గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా, ఎంత మంది వచ్చినా అందరికీ ఆతిధ్యం మా ఇళ్ళ లోనే.  వంటలు మావే! హోటళ్ళు, కేట రింగు లాంటి మాటలు ఎప్పుడూ విన లేదు. అందుకే నా బోటి వారికీ వారందరూ వ్యక్తిగతంగా మిత్రులయ్యారు.

వ్యాస విస్తరణ భయం చేత వారి వెనకాల కథలు వ్రాయడం లేదు. వీలుంటే 50వ వార్షికోత్సవ సంచికలో వ్రాస్తాను…

van7

 

ఆ నాటి తెలుగు సినిమా ప్రదర్శనలు

ఆ రోజుల్లో తెలుగు మాట వినడానికి ఎవరో ఒకరికి ఫోన్ చెయ్యడం ఒకే ఒక్క మార్గం. టీవీలలో, రేడియోలలో, సినిమాలలో, పేపర్లలో, బయట నూటికి నూరు పాళ్ళు అమెరికా ఇంగ్లీషు వాతావరణమే. ఆ పరిస్థితులలో ఎలాగైనా, ఎంత చెట్టది అయినా సరే…ఒక్క సారి తెలుగు సినిమా చూడగలిగితే ఎంత బావుంటుందో అని ఆ తరం వారు పడిన తపన, దానికి పడిన కష్టాలు స్మార్ట్ ఫోన్ లో సినిమాలు చూసి స్టెప్పులు వేసే వారు అధిక సంఖ్యాకులలో ఉన్న ఈ తరం వారికి అర్థం కాదు. అప్పుడప్పుడు అమెరికాలో ఎక్కడో అక్కడ తెలుగు సినిమా వేశారూ అంటే ఆ వార్త దావానలంలా వ్యాపించి పోయేది అన్ని ఊళ్లకీ. అది 35 mm సినిమా అయితే ఎంత ఇష్టమో వెయ్యడం అంత కష్టం…ఎందు కంటే ఒకే ఒక్క షో వెయ్యడానికి సినిమా హాలు వాళ్ళు నిరాకరించే వారు. ఇక రెండో మార్గం 16 mm సినిమాలు. ఈ ఫిల్మ్ సైజు లో సినిమాలు ఆ నిర్మాత ప్రత్యేకం విదేశాలకోసం తయ్యారు చేస్తే కానీ దొరకవు. బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు , సినిమా ఇండస్ట్రీ తో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా అమెరికా నుంచి ఇండియా వెళ్లి దొరికిన ప్రింట్స్ వారి స్తోమతకి తగ్గవి కొనుక్కొచ్చి అన్ని నగరాలకీ పంపిణీ చేసేవారు. ఆ ప్రింట్ ఖరీదు ఐదారు వేల డాలర్లు ఉండేది కాబట్టి ఆ పెట్టుబడి వెనక్కి రాబట్టు కోడానికి అవస్త పడే వారు.

కానీ తెలుగు సినిమా మీద అభిమానం కొద్దీ, లాభాలు ఆశించకుండా మాయా బజార్, మిస్సమ్మ లాంటి సినిమాల 16 mm ప్రింట్స్ కొనుక్కొచ్చి న వారిలో గర్వించదగ్గ వ్యక్తి మన హ్యూస్టన్ నివాసి డా. రవి తమిరిశ గారే! ఆ సినిమాలు వెయ్యడానికి కావలసిన 16 mm ప్రొజెక్టర్ మా ఆఫీసు లో ఉండేది. స్పెషల్ పెర్మిషన్ తీసుకుని అది పట్టుకెళ్లే వాడిని. ఏదో ఒక హాలులో గోడ మీద తెల్ల దుప్పటీ కట్టి  అనిల్, నేనూ దాన్ని ఆపరేట్ చేసీ వాళ్ళం. ప్రింట్ క్వాలిటీ ని బట్టి ఆ సినిమా రసపట్టులో ఉండగా..అంటే హీరో, హీరోయిన్లు ఘంటసాల -సుశీల పాట రొమాంటిక్ గా అభినయుస్తూ ఉండగా ఆ ఫిల్మ్ ఠకీ మని తెగిపోయేది. చచ్చినట్టు దాన్ని స్కాచ్ టేపు తో అతికించి మళ్ళీ వేసేటప్పటికి సగం డ్యూయెట్ కట్ అయిపోయేది. ఆ తరువాత రవి గారే ఒక ప్రొజెక్టర్ కొన్నట్టు జ్ఞాపకం.  అంత కన్నా ముఖ్యంగా తెలుగు సాంస్కృతిక సమితి తరఫున చందాలు పోగేసి వెయ్యి డాలర్లు పైగా ఉండే ప్రొజెక్టర్ కొనుక్కున్నాం. అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో?

van8

నాకు గుర్తున్నంత వరకూ హ్యూస్టన్ లో వేసిన మొదటి సినిమా “సుడి గుండాలు”. అది దువ్వూరి నారాయణ రావు గారు టెక్సస్ సదరన్ యూనివర్సిటీ లో ఫిజిక్స్ పాఠాలు చెప్పే గదిలో బ్లాక్ బోర్డ్ మీద తెల్ల దుప్పటీ కట్టి, అందరం క్లాసు బెంచీల మీద కూచుని చూశాం. ఆ తరువాత విశ్వశాంతి నిర్మాత యు. విశ్వేశ్వర రావు గారు తన “తీర్పు: అనే సినిమా ప్రింట్ పట్టుకొచ్చారు. ఆయన సమక్షంలో ఆ సినిమా కూడా  లాగే చూశాం.

అప్పటినుంచి (1976) ఇప్పటి దాకా, అన్ని ఒడుదుడుకులనీ తట్టుకుని, అన్ని సమస్యలనీ సామరస్యంగా పరిష్కరించుకుని, ఉత్తర అమెరికా మొత్తంలో ఒకే తాటిపై నడుస్తున్న ఏకైక అమెరికా తెలుగు సంస్థ అని ప్రపంచవ్యాపంగా అఖండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన తెలుగు సాంస్కృతిక సమితి ఇక ముందు కూడా అదే బాటలో పయనించి, తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలకి మరింత సేవలు అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

*

 

పేదవాళ్ళ పిల్లలు!

225px-robert_w-_service

ఈ దేశంలో పేదవాడికి పిల్లలు మాత్రమే పుడతారు , రిచీ రిచ్లకి మాత్రం వారసులు పుడతారు  అంటుంది ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సీ గ్రేడ్ మూవీగా రేట్  చేయబడిన ఈ మధ్య కాలపు బాలివుడ్  సినిమాలో ఒక క్యారెక్టర్ . నిజానికి అంత ప్రాక్టికల్ డైలాగ్ ఉన్న ఆ సినిమాకి చప్పట్లతో కూడిన గుర్తింపు రావాలి కాని మన దేశపు వాసనలలో అంత తెలివి ఊహించడం కష్టం. సరిగ్గా మనం అంతా ఈ సినిమా ప్రోమోలు కూడా చూడటానికి ఇష్టపడని సమయంలోనే బిగ్ బీ అద్బుతంగా తనదయిన వారసత్వపు షాయరీలకి భిన్నంగా బోలెడంత ఆత్మీయత కుప్పించిన ఉత్తరం సోషల్ మీడియాలో ఉదృతంగా ప్రచారం పొందుతుంది .

మోడరన్ థింకింగ్ అంటే పట్టుచీరలు గోరింటాకులు బదులు డిజైనర్  వేర్ డ్రెస్లు ,మెహందీలు వాడి పెళ్లిళ్ళు సంభరాలు చేసుకోవడం అనుకొనే ఆడపిల్లలకి , అభ్యుదయ వాదం అంటే మంగళ సూత్రాల నుండి పూసల గొలుసులకి ఎదగడం అనుకొనే స్త్రీ మూర్తులకి , వీళ్ళ ఇద్దరి నడుమ ఇంకో రకం ఉంది ,వాళ్ళేలా అంటే  “జియో రిలయన్స్ వాళ్ళ కష్ట ఫలం నీకంతగా నచ్చకపోతే  వాడుకోకు అంతే తప్ప అన్నిటిని విమర్శిస్తే  అసలు సమాజంలో ఉండటానికి నీకే అర్హత లేదనే ” అన్ అఫీషియల్ ఖాప్ చట్టాలు నిర్ణయించే మూకలుగా తయారయి ఆలోచన అంటూ ఉన్నవాడి బుర్ర చచ్చేదాకా చితకకోడతాం అంటూ భర్తలు ఎన్ని వేషాలు  వేసినా వాడు రాసిచ్చే భవంతుల కోసమో, అందించే వడ్డాణాల కోసమో భరించేస్తూ పైగా ఇదంతా పిల్లల  కోసం అన్న సెంటిమెంట్ అడ్డం పెట్టుకొనే న్యూ ఏజ్  మితవాద మతస్తు స్త్రీలు , వీళ్ళకి బుర్రలో కాస్త గుజ్జు ఉన్నవారెవరు ఈ జీవితాన రిలయెన్స్ లాంటి కొన్ని సంస్థల దగ్గర మాత్రమే అంతగా డబ్బు ఎందుకు కూడబడింది అన్న ప్రశ్నకి ,ఆ రాత్రికి రాత్రి పెరిగిన పెట్రోలు ధరలు కామన్ మ్యాన్ నడ్డి డైరెక్ట్గా విరచడం కాకుండా పెరిగిన ద్రవ్యోల్బణం తద్వారా పెరిగే ట్రాన్స్పోర్ట్  రేట్స్ , తడిచి మోపెడయ్యే సరుకుల ధరలు , పెరిగిపోయే ప్రతి ధర వెనక మర్మం వగైరా  ప్రశ్నలకి సమాధానాలు అడిగి తెలుసుకోలేరు, కనీసం తెలిసినా వాళ్లకి వివరించలేరు  .సో పైన రెండు రకాల ఆడవాళ్ళతో పాటు ఈ స్త్రీలు మాత్రమే కాకుండా వీళ్ళందరి వెనక పనిచేసే మనువాద మగ బుర్రలు అందరూ కలిసి అమితాబ్ బచ్చన్ ఇద్దరి  మనవరాళ్ళ పేరిట  రాసిన ఉత్తరానికి ఉబ్బి తబ్బిబ్బయి ఇదీ మన దేశ సంస్కృతీ ,సాంప్రదాయం అని జబ్బలు చరుచుకొని  ఉంటారు .

నిజానికి 21 వ శతాబ్దంలో సైతం వంశాలు, రక్తాలు అని తన  మొదటి లైన్లోనే నంద వంశం , బచ్చన్ వంశం గురించి అతి గొప్పగా రాసుకున్న ఒక వ్యక్తి ఈ దేశానికి ,  ఈ దేశపు సాధారణ ఆలోచనకి  బ్రాండ్  అంబాసిడర్ అంటే దేశం మొత్తం సిగ్గుపడాల్సిన సమయం కదా ఇది . అందునా మళ్ళీ ఈ వంశాలు పితృస్వామ్య వ్యవస్థ మళ్ళీ మళ్ళీ పునాదులతో సహా గట్టి పరుస్తూ తండ్రి తరపునవి మాత్రమే అయి ఉండాలి .ఆ వంశాలలో నుండి వచ్చారు కాబట్టి ఆ పిల్లలలిద్దరు జీవిత కాలం పాటు స్వీయ  నిర్ణయాలు తీసుకొండమ్మా అంటూనే మరోపక్క  పాపం పడక్కుర్చీ తాతగారు ముందు కళ్ళెం గా వేసిన (రాసిన ) వంశ గౌరవం ,లెగసీ అన్న మాటలు నిద్రలో సైతం మర్చిపోకుండా తమ లేత  భుజాల మీద జీవితాంతం మోస్తూనే ఉండాలి . పైగా ఇదంతా ఆడపిల్లలు కాబట్టి పెళ్ళయ్యే  వరకే , మళ్ళీ ఆ తరువాత ఇంకెవడో వంశం చరిత్రలు తవ్వి చదువుకొని అవెంత గొప్పవో , వాటి రక్తంతో కలిపి తామెంత  గొప్ప  వారసులని ఈ దేశానికి కొత్త వారసులుగా అందించగలరో ఇవ్వగలరో అన్న భావన  మొయ్యడంతో పాటు ఆ బ్రతుకే బ్రతకాలి  కూడా . రేపొద్దున వాళ్ళలో ఏ ఒకరికయినా ఏ కార్ డ్రైవర్ మీదో , పేవ్మెంట్ మీద బూరలమ్ముకొనే వ్యక్తితోనే వివాహం అన్న ఊహే రానివ్వని అద్బుతమయిన ప్రయోగం . మీ నిర్ణయాలు  మీరే తీసుకోవాలి అంటూనే ముందరికాళ్ళకి బంధం  వేయడం అన్న సామెతని హిందీ లో బిగ్ బీ గారు బాగా వంట పట్టించుకున్నారులా ఉంది . ఇక్కడ ఇంకో విషయం  హరివంశ్ రాయ్  బచ్చన్  పేరు  రెఫెరెన్స్ తో లిఖించినా ఆ ఉత్తరం వెనక బచ్చన్ లెగసీకి  కారణం ,ఇండస్ట్రీ కథలు కాకరకాయలు క్రియేట్  చేయడానికి, అవి అమ్ముకోవడానికి ఒక యాంగ్రీ యంగ్ మాన్ అవసరంతో పాటు మొత్తం మార్కెట్కి సబ్బులు బ్లేజర్స్ అమ్ముకోవడానికి రాజేష్ ఖన్నా తర్వాత ఒక లెజెండ్ని  సృష్టించాల్సిన  అవసరం ఉన్న కాలం ఒక్కటే కాదు , తన మీద తన వాచ్యం మీద, నటన వెనక  అమిత్ శ్రమ కూడా కాదనలేం . ఆ మాటకొస్తే  నటన విషయంలో అమితాబ్ బచ్చన్కి ఎదురులేదని  షారుక్ కాలపు మాబోటి మూవీ బఫ్స్ సైతం ముక్తకంఠంతో చెప్పగలం. అయినా నిజానికి అమితాబ్కి స్టార్ డం  రావడం వలన హరివంశ్ రాయ్ బచ్చన్ గొప్ప కవిగా మారిపోయారు అన్నవిషయం ,తన సమకాలికులలో తన కంటే అద్బుతంగా రాసిన పేరు రాక, జనం చదవక ఆ బెంగలోనే మరణించిన నిప్పులాంటి  కవి హృదయాలు ఎన్నో ఆ సమయంలో అని ఇక్కడ మనం  మర్చిపోకూడదు .

అసలయినా విషయం ఇదంతా కాదు . అసలు అంతలేసి  లెగసీలు లెజెండ్రీ  వంశాలు మెయిన్ టెయిన్  చేసే ఇంత గొప్ప రక్తాలు  మరి  తమ పిల్లలతో పాటు సమానంగా  మన ఊర్లలో  ఒక దళితవాడ  బిడ్డని  తీసుకెళ్ళి  పెంచి , పోషించి ఆ ఇంటి పేర్లతో సహా సమాజపు గౌరవాన్ని  రాసివొచ్చుగా ? వాళ్ళు చేస్తున్న  చారిటీలు వాళ్ళు సమాజం నుండి సంపాదించిన రూపాయిలో ౦.౦౦౦౦౦1 శాతం  తిరిగి పబ్లిసిటి స్టంట్స్ గా  అక్కడ ఇక్కడ బీద విదార్దులకి పెన్నులు కొని పెట్టి పండగ రోజు  అన్నదానం కింద బువ్వ పెట్టి నటించే నటనల  గురించి  ఇక్కడ  మనం  చర్చించడం  లేదు . అది పూర్తిగా ఇంకో సబ్జెక్ట్ . ఈ విషయం గురించి ఒక బచ్చన్లు ,  అంబానీలు , పాటిళ్ళు , ఇంకా ఇలాంటి ఎందరో సహా గాంధీలు గరికపాటిలు అని గర్వంగా చెప్పుకొనే అందరు లెగసీలనీ అడిగే ఏకైక ప్రశ్న ఏమిటంటే , ఒక్క బిడ్డని  ఒక్కరంటే  ఒక్క దళిత  బిడ్డని లేదా ఒక మైనారిటీ బిడ్డని ( వైస్ వర్సా )  మీ పిల్లలతో సహా  మీ ఇంటి పేరు ఇచ్చి పెంచుకోగలిగే  మానవత్వం  ఉన్నదా మీకు? అనువంశికంగా వచ్చే తెలివితేటలు పక్కన పెడితే వీళ్ళందరి బిడ్డలకి కలిపించే సదుపాయాలు అభిమానాలు ఒక అతి మామూలు  పేవ్మెంట్  పై బిడ్డకి  కలిపిస్తే , ఆ బిడ్డడు ఇంకో రోజున మరో అంభానీ మరో బచ్చన్  లేదా గాంధీ  కాలేడా ?  ఎందుకంటే  అనువంశికంగా వచ్చినా తలలు తీసే లక్షణాలు  సామ్రాజ్యాలని ఏలే శక్తి తర్వాత చాలా మంది వారసులలో హుళక్కి అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం కదా .ఆ లెక్కన కొందరియినా ప్రస్తుత సమాజపు లెక్కల ప్రకారం సామాజిక గౌరవం పొందే స్థితికి చేరలేరా అని .

ఇది మాత్రమే  కాదు ఈ మొత్తం విషయంలో ఇంకో అతి పెద్ద విషాదం ఏమిటి అంటే , అన్ని రకాల ఉద్యమాలలో  ఉన్నవారు సైతం ఎక్కువ శాతం తమ సొంత  రక్తమే  కావాలనుకోవడం భయంకరమయిన నిజం కదా ( కులాలు  మతాలూ ఎలాగు మన దేశంలో ఉద్యమాలని  నిను వీడని నీడలే అన్న విషయం  మనం ఎవరం మర్చిపోలేని  సత్యం ) అన్నిటి కంటే  దళిత కుటుంబాలలో మొదటి తరంలో లేదా రెండో తరంలో ఉద్యోగస్తులయిన వాళ్ళు , ఇప్పటికే కాస్తో  కూస్తో  స్తిరపడిన వాళ్ళు ఒక బిడ్డ తర్వాత అయినా మరో బిడ్డ విషయం ఆలోచించేప్పుడు తమ కులంలో తమ సెక్ట్ లోనో, తమ  సబ్ సెక్ట్ లో పిల్లలనయినా  అడాప్ట్ చేసుకోవడం ఎంత అవసరమో ఎందుకు గుర్తించడం లేదు ? ఎవరో ఎదో చేయడం లేదు అనో  లేక గేటెడ్  కమ్యునిటీస్ లో సెటిల్  అయ్యి  గ్రామాల్లో దళిత బిడ్డలు  మైనార్టీ  కష్టాలు  అంటూ హృదయపూర్వకంగానే అయినా బాధపడే కొందరయినా ఇలాంటి అడాప్షన్లకి  ముందుకు  రావడం  ఇప్పుడు తక్షణావసరం కదా? జరిగే నష్టాలని ఏకపక్షంగా ఆపే  శక్తిలేని  ఉద్యమకారులు మనసున్నవారు సమాజానికి మెరుగయిన  హ్యుమానిటీ అందించడానికి ఇలాంటివి ఒక ఆప్షన్గా ఆలోచించొచ్చు .

robertwservice201755

అదే సమయంలో ,తొందరలో జనాభా విస్పోటనానికి చైనా కష్టాలు మించిపోయే దేశంగా  మారిపోతున్న మనదేశానికి , (చైనా వస్తువులు  మనం చీప్ గా కొనుక్కుంటున్నప్పుడే  మనకి అర్ధం కావాలి కదా , అంత తక్కువ డబ్బు విలువ  చేసే  వస్తువులు తయారు చేసే   కార్మికులకి ఇంకెంత తక్కువ జీతాలు ఉంటాయో బ్రతుకులు ఎంతెంత  భారంగా ఉంటాయో)  మత యుద్ధాల కోసం మాట యుద్ధాలు చెలరేగే  కాలాలలో చావడానికి కనిష్టస్థాయి బంట్లుగా పెరిగే సంతానాల కోసం రెచ్చగొట్టే భగవత్లు ముల్లాలు కాకుండా ఒక ఇంటికి ఒక బిడ్డ మాత్రమే , మరో బిడ్డ కావాలంటే అడాప్టెడ్ మాత్రమే అన్న సామాజికాంశం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది . ఇందులో మళ్ళీ పిల్లలు కలగక  లేదా పిల్లలని కనడం ఇష్టం లేక అడాప్ట్ చేసుకోవడం అనే ఆప్షన్కి వెళ్ళే  జంటలు , అడాప్షన్ అని చెప్పి ఇంట్లో పనిపిల్లలుగా వాడుకోవడం ,ఇవన్నీ కాదంటే అడాప్షన్  పేరు మీద హ్యూమన్ ట్రాఫికింగ్ పెంచే అసహ్యాల వలన ఇప్పటికే బలవుతున్న తండాల  పసిబిడ్డలు లేదా  అనాధశ్రమాల బిడ్డల రైట్స్ గురించి జాగ్రత్త  తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది .

ఇలా ,ఒక మంచి ఆలోచనకి విత్తనం అయినందుకు  అమితాబ్ గారి ఉత్తరానికో థాంక్స్ చెప్పుకుంటూనే , మరి మీ ఇష్టం వచ్చిన  దుస్తులు  వేసుకోండి , మీ  చాయిస్లు మీరు  తీసుకోండి  అని వాళ్ళ ఆరాధ్య దైవం  చెప్పిన మాటలకి మరి మన దేశపు నయా  సతీ సావిత్రులు వారిని తమ బానిస రోబోలుగా మార్చుకున్న సంస్కృతీవాదులు అదే సినిమా  ఫీల్డ్  లో రాఖీ  సావంత్, సన్నీ లియోనీ మొదలైన  వారి విషయంలో అభిప్రాయాలు మార్చుకుంటారా అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ ప్రశ్న!

చివరగా ,చట్ట పరమయిన  అంశాలే కాకుండా సామజికాంశాలు మానసిక వైరుధ్యాలు కలగలిపిన దత్తతలు అంత సులువేం కాదు కాని , చాల మంది మనసున్న వారు రాసిన హృద్యమయిన ఇలాంటి కవితలు ముఖ్యంగా “ A promise made is a debt unpaid “ అని తేల్చేసిన రాబర్ట్  విలియం  రాసినAdoption మాత్రం కుప్పపోసిన మానవత్వాలుగా మనం బ్రతకొచ్చు అనే ఒక నిదర్శనం .

ఈ కవితకి మనకోసం తెలుగులో నాదయిన అనుసృజన

 

Adoption –  Robert William Service

~

తక్కువ స్నేహాలున్న

ఒంటరి మహిళగా

తల్లిదండ్రులెవరో తెలియని

రెండు చిన్న ప్రాణాలని

రాత్రిపూట అవాంఛిత కౌగిలింతలేవో

కాన్వెంట్ తలుపుల దగ్గర వదిలినట్లు

యాచిస్తున్న ఆ చిన్ని చేతుల దురవస్థని

నా సొంతం  చేసుకున్నాను.

 

ఈ పని వారికి నా పేరు ఇచ్చింది

వారే పాడు మురికివాడల నుండి వచ్చారో

ఇహేప్పటికి వారికి తెలియదు

నా సొంతవారిలానే చూడడం

వాంఛ శ్రమల ఇద్దరు అనాధలని

నా ప్రేమ , రక్షణ కాపాడింది

ఇప్పుడిక నా కొడుకు జాన్

తెల్లగా నిండయిన పొడవుతో ,

జోన్ కృష్ణవర్ణంలో మెరుస్తూ .

 

అబ్బాయి బార్ కౌన్సిల్ సభ్యుడు

అమ్మాయి నిర్మలమయిన నర్సు

ఇప్పుడెలా ఉన్నారు , ఎలా ఉండుండేవారు అన్న తలపుకే

క్షణపాటు చెడు విషమేదో మింగినట్లు నరకంగా ఉలిక్కిపడతాను

.

.

బహుశ జాన్ ఒక నేరస్తుడిగా

జోన్ వేశ్యగా స్తిరపడేవారేమో

*

 

 

 

కొత్త మలుపులో మన కథ!

Katha-15 Cover

 

గత పాతికేళ్లుగా ఉత్తమ తెలుగు కథలకు చిరునామాగా నిలిచాయి కథా సాహితీ వెలువరిస్తున్న వార్షిక సంకలనాలు.  వాసిరెడ్డి నవీన్,  పాపినేని శివశంకర్ ల ఆధ్వర్యంలో నిరాటంకంగా సాగుతున్న ఆ కథా యజ్ఞం ఈ ఏడాదితో ఇరవయ్యారో వార్షిక సంకలనానికి చేరుకుంది.  ఆ క్రమంలో కథ- 2015 ఆవిష్కరణ ఇవాళ ( సెప్టెంబర్ 4- 2016 ) కాకినాడలో జరగబోతోంది.

ఆ సందర్బంగా ఆ కథా సంకలనానికి ఎంపికైన రచయితలతో  ముచ్చటించింది సారంగ. ఇవాళ్టి కథా రచయితలు కథా ప్రక్రియను ఎలా చూస్తున్నారు? కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ?? అసలు కథలు ఎందుకు రాస్తున్నారు??? అని అడిగితే ఇలా స్పందించారు. 

 

 

జాన్సన్  చోరగుడి


johnson
కథ నాకు వ్యాసాల రొటీన్ నుంచి అవుటింగ్ లాంటిది. కథలు రాయడం కథలు చదవడంతో మొదలవుతుంది. చదివిన కథ మనలో కొత్త గవాక్షాన్ని తెరుస్తుంది. ఫలితంగా మన మనోఫలకం మీద నూతన ఆవిష్కరణ జరుగుతుంది. అన్నీ సరిగ్గా కుదిరితే మనం రాసింది గొప్ప కథ కూడా కావచ్చు.  నేను చాన్నాళ్లు మంచి కథలు చదివాక, కథలు రాయాలనుకున్నాను.  అది కూడా ఆలస్యంగా కథలు రాయడం మొదలు పెట్టాను. ఇప్పటి దాకా పదిహేను కథలు రాశాను. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ నేను రాయాల్సిన కథలు ఇంకా చాలా ఉన్నాయనిపిస్తుంది.
వ్యాస రచన నా ప్రధాన వ్యాపకం. ఆ రొటీన్ నుంచి బయటపడేందుకు కథలు రాస్తుంటాను. ఈ కథా సంకలనానికి ఎంపికైన …చివరి చర్మకారుడూ లేడు నాకోసం రాసుకున్న కథ. నా వ్యాసాలు అందరికోసం రాస్తే…. ఈ కథ మాత్రం నాకోసం రాసుకున్నాను. కానీ ఈ కథను చాలామంది తమదిగా  చేసుకున్నారు.  ఫోన్లు చేసి స్పందించారు.  అప్పటివరకూ అంతర్లీనంగా వున్న కల్చరల్ ఐడెంటిటీ క్రైసిస్ నుంచి వాళ్లు వెంటిలేట్ కావడాన్ని నేను గమనించాను. అస్తిత్వ ఉద్యమ ఫిలాసఫీ గొప్పతనమది. ఇందులో నేను కేవలం కేటలిస్టును మాత్రమే. తెలిసిన జీవితం కనుక తేలిగ్గా రికార్డు చేయగలిగాను. ఇప్పటిదాకా నాకు కనిపించిన దాని గురించి రాశాను. భవిష్యత్ లో కూడా రాస్తాను.

కే.ఎన్. మల్లీశ్వరి
malliswariఏ కథ ఎందుకు రాశావు అంటే చెప్పడానికి ప్రయత్నించగలనేమో కానీ కథలెందుకు రాస్తారు అంటే మాత్రం తత్తరపాటుగా వుంటుంది. రెడీమేడ్ సమాధానం నా వద్ద లేదు కనుక ఆలోచనలను గాలిపటం వలె ఆకాశంలోకి ఎగరేసి దారపు కొసను పదిలంగా పట్టుకోవడం కథకులకి తెలియాలి అనుకుంటాను. దానిని …శతపత్ర సుందరి కథలో కొంత ప్రాక్టీస్ చేశాను. స్వీయ నియంత్రణ వల్లనే చాలామంది గుర్తించిన
క్లుపత్తని ఆ కథలో సాధించగలిగాను.

అప్పటికి నాలుగేళ్లుగా నేను రాస్తున్న నవలలోని వందలాది ఘటనల్లోంచి రెండింటిని తీసుకుని కథగా మలిచాను. కనుక దాని నేపథ్యం విడిగా చెప్పడం సాధ్యపడదు. వందరేకలుగా వికసించే నవీన మహిళ జీవితంలోనుంచి వొక శకలాన్ని చిత్రించే ప్రయత్నం చేశాను. కథ వచ్చాక జరిగిన చర్చలోంచి గ్రహించగలిచే వొకటి రెండు అంశాలను మౌనంగా స్వీకరించాను. ముగింపు గురించిన ప్రశ్నలనూ అసంతృప్తులనూ గ్రహించాను. ఈ కథ గురించే కాకుండా సాధారణంగా నిశ్చయం, నిర్ణయాలతో కూడిన ముగింపులకి బాగా అలవాటు పడిపోయాం. కానీ జీవితపు నడకలో సందిగ్థస్థితి  ప్రభావమే ఎక్కువ. ఆస్థితిని చెప్పడం కోసమే కథని అట్లా ముగించాను.


విమల

 

విమల

నేను మొదట్లో కవిత్వం రాసేదాన్న.  తర్వాత వొకటి రెండు కథలు రాసిన తర్వాత కొంత విరామం తీసుకున్నాను. కవిత్వంలో చెప్పలేనిది కథ ద్వారా విస్తృతంగా ,  విభిన్నంగా చెప్పగలం. నాలోపల జరిగే ఘర్షణ, నేను నడిచొచ్చిన దారి, నేను చూసిన సమాజం…..నాలో ఆలోచనలను తట్టి లేపాయి. వాటిని సమాజంతో  వివరంగా పంచుకోవాలనిపించింది. ప్రతీ జీవితంలోని రకరకాల ఎత్తు పల్లాలుంటాయి.
వైరుధ్యాలుంటాయి.  నాకు నచ్చేవి, రాయాలనిపించేవి జీవితంలోని అనేక పార్వ్శాలను, మనిషిలోని పొరలను చెప్పగలగిన కథలు. అదే సమయంలో  కథలోపల సున్నితత్వం వుండాలి. జీవితం ఎంత విషాదంగా, దుర్మార్గంగా వున్నా కూడా….. దాంట్లో సౌందర్యం వుటుంది.  చీకట్లోంచి వెలుతురు చూసినట్లు ఆ సౌందర్యాన్ని కథలు చూపగలగాలి. వొక  ఉద్యమకారిణిగా సమాజంలో అనేక పరిణామాల్ని దగ్గర చూస్తుండడం వల్ల…రకరకాల జీవితాల్ని చూశాను. వాటిని కథ ద్వారా చెప్పాలనుకుంటాను.
అదే సమయంలో మన కథల్లో నిజాయతీ వుండాలి. మనం నమ్మని వాటిని రాయకూడదు.  అంటే రాసేదానికి,  జీవించేదానికి మధ్య పెద్ద అంతరం వుండకూడదు అని నేను నమ్ముతాను.   రచయితలుగా మనకు అనేక ప్రతిబంధకాలు వుంటాయి. వాటిని తెంచుకోగలగాలి. అనేక నియంత్రణలుంటాయి. మనం నమ్మింది చెప్పినపుడు సమాజం నుంచి కొంత వ్యతిరేకత రావచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి రచయితలు సదా సిద్ధంగా వుండాలి. అలాగే రాసే విషయం పట్ల చిత్తశుద్ధి వుండాలి. ముఖ్యంగా  చెప్పాల్సింది….ప్రపంచీకరణలో భాగంగా ఇవాళ తెలుగు కథ కూడా మార్కెట్ వస్తువుగా మారుతోంది. సంచలనం కోసం, ప్రచారం కోసం రచయితలు ఆరాటపడుతున్నారు. సేలబిలిటీ…కోసం వెతుకుతున్నారు. ఇదో విషాదకరమైన పరిస్థితి. ఇన్ని ప్రతిబంధకాల మధ్య వీటన్నిటికీ లొంగకుండా నిజాయతీగా కథ
రాయాల్సిన బాధ్యత కథకుల మీద ఉంది.

ఉణుదుర్తి సుధాకర్
Sudhakar_Marine Linkకథా సాహితికి నా కథ ఎంపిక కావడం సంతోషకరం. కథలు చెప్పడం చాలా కష్టం. కవిత్వం రాయడం అందరివల్ల సాధ్యం కాదు. నాకు కథలు రాయడం సాధ్యమనిపించింది. నాకు కొన్ని విషయాల పట్ల..ప్రధానంగా చరిత్ర పట్ల ఆసక్తి వుంది. చరిత్ర లోతుల గురించి ఎక్కువగా తెలుసుకుంటాను. ఆ వెతుకులాటలోనే ఆనందాన్ని వెతుకుుంటాను. ఆ ఆనందాన్ని, నేను తెలుసుకున్న సంగతులను కథ ద్వారా చెప్పాలనుకుంటాను. రచయిత కథ ద్వారా అనేక విషయాలు చెప్పొచ్చు.  కథ చిన్నదైనా దాని ద్వారా చాలా సంగతులు ప్రతిభావంతంగా చెప్పవచ్చు.  ప్రముఖ చరిత్రకారుడు ఇ.ఎచ్.కార్ అన్నట్లు ఎవరి చరిత్రలు వారికుంటాయి. చరిత్ర అంటే ఏక శిలా సదృశ్యంగా వొకటే వుండదు. స్త్రీలకు, దళితులకు, గిరిజనులకు….ఇలా రకరకాలుగా ఎవరి చరిత్ర వారికి వేరుగా వుంటుంది. ఇటువంటి విషయాలన్నీ చర్చించేందుకు నేను కథను రాస్తుంటాను.

చిన్నయ్య
కవిత్వం చెప్పలేని విషయాలు కథలో చెప్పగలం. కథలో జీవితాన్ని, జీవితంలో వస్తున్న మార్పులను వివరించవచ్చు. తద్వారా  సమాజాన్ని చూపే ప్రయత్నం చేస్తాము…ఈ చూపే క్రమంలో ఎవరి దృక్పథాలు వారికి వుండవచ్చు. మన దృక్పథం,  నిజాయతీ, ఆచరణను మన కథలు ప్రతిబింబిస్తాయి. కథ రాయడమంటే నా దృష్టిలో వ్యవసాయం చేసినంత కష్టమైన పని. ప్రతీ కథా ఆరుగాలం సేద్యం లాంటిది. పంట చేతికొచ్చేదాకా….రైతు కంటిమీద కునుకులేనట్లు కథ పూర్తయ్యే దాకా నేను ప్రతీక్షణం ఆరాటపడతాను. ఈ క్రమంలో రకరకాలుగా ఆవేదన చెందుతాను.

కొట్టం రామకృష్ణారెడ్డి
kottamకథ గురించి అనేక ఆలోచనలు , అంతర్మథనం జరిగాక ఇక రాయలేనప్పుడే కాగితం మీద కలం కదులుతుంది. ప్రసవానంతరం బిడ్డని చూసుకున్న తల్లికి  పురిటినొప్పుల బాధ మరిచిపోయేంత అలౌకికానందం కలుగుతుంది. కథ పూర్తి చేశాక రచయితకు కూడా అంతే.   కథ పుట్టాక మాతృత్వపు మాధుర్యం అనుభవంలోకి వస్తుంది. దాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు…?

 

ఎం.ఎస్.కే. కృష్ణజ్యోతి

jyothi

విషయ వ్యక్తీకరణలో కవిత్వం భావకుల సాధనం. వ్యాసం వొకింత మేధావుల ఆయుధం. ఐతే కథ ఈ రెండిటింకి భిన్నంగా వొక అంశాన్ని జన సామాన్యానికి సులువుగా చేరువ చేసే చక్కని మాధ్యమం. అప్పుడప్పుడే ఊహ తెలిసి వస్తున్న పసివానకి అనుభవాలతో తలపండిపోయిన వృద్ధునికి కూడా ఆసక్తి కలిగించేది కథ. ఇతర సారస్వత మాధ్యమాలకి భిన్నంగా కథలో నిజ జీవితంలో లాగానే ఓ సంఘర్షణ వుంటుంది. ఆ సంఘర్షణ కథకుని ఊహలోంచి లేదా అనుభవం లోంచి వస్తుంది. ఆ ఘర్షణ నుండే పాఠకుడు తనను తాను కథతో తాదాత్మ్యం అవుతాడు. ఇలా కథకునికి, ఇతర ప్రపంచానికి వొక లంకె ఏర్పడుతుంది. నేను నివసించే అతి చిన్న ప్రపంచం నుంచి విస్తృత ప్రపంచంతో సంభాషించడానికి నన్ను నేను అనంతంగా వ్యాప్తి చెందిచడానికి నేను కథను ఎంచుకున్నాను.

గుడిపల్లి నిరంజన్
niranjanనేను చూసిన దళిత, అణగారిన వర్గాల, స్త్రీల జీవితాల్ని చెప్పడానికి కథల్ని రాస్తున్నాను. దళితుల చుట్టూ , వాళ్ల జీవితాల చుట్టూ అనేక సమస్యలున్నాయి. వాటిని సమాజానికి తెలియజేయడం నా బాధ్యతగా నేను భావిస్తాను. దాని ద్వారా సమస్య పరిష్కారం కావచ్చు, కాకపోవచ్చు.

కానీ  సమాజానికి చూపడం మాత్రం అవసరం. వ్యక్తులు, కుటుంబాలతో పాటూ పల్లెలు, ప్రకృతి వనరుల విధ్వంసం యధేచ్చగా జరుగుతోంది. ఆ విధ్వంసాన్ని చూపే క్రమంలోనే నేను నా  నీరెటుకాడి కల… కథను రాశాను.

చందు-తులసి
chandu

కథ రాయడానికి ఫలానా కారణమంటూ ఉంటుందా….అని ఆలోచిస్తే, వెంటనే చెప్పలేము.  కానీ బహుశా బయటకి చెప్పలేని అంతర్మథనం, ఆవేదన, ఆర్తి తప్పకుండా వుంటుంది. సమాజంలోని సంఘటనలకు మనుషులు రకరకాలుగా స్పందించవచ్చు.  బహుశా రచయిత  స్పందన కథ రూపం తీసుకుంటుందేమో. ఆ స్పందన వెంటనే బయటకు రాకపోవచ్చు. కానీ ఏదో వొక రోజు తప్పక బయటకు వస్తుంది.  మొత్తంగా గుండె లోతుల్లోని చెప్పుకోలేని బాధ, వలపోత, దుఖ్ఖ సముద్రం… మనకు నచ్చిన వ్యక్తితోనో, సమాజంతోనో పంచుకోవాలి అన్న ఆరాటమే కథ రూపంలో వస్తుంది.  నా మొదటి కథ… ఊడలమర్రి అలా బయటకు వచ్చిందే.

* * *

 

దిల్దార్‌ కథకుడు

Dilavar book 1రచయిత ఏది రాస్తే అది పాఠకుడు చదువుకోవాలె. అది రచయిత  లేదా సృజనకారుడి హక్కు. హక్కుని గౌరవిస్తూనే బాధ్యతను గుర్తు చేసేవాడు విమర్శకుడు. రచయిత ఏమి రాయాలె, ఏమి రాయొద్దు అనే దాంట్లో పాఠకుడి ప్రమేయం ఉండాలా? వద్దా అనేది ఇవ్వాళ సాహిత్య చర్చలో ప్రధానాంశమైంది.   నిజానికి ఏ రచయితైనా తాను చూసిన, అనుభవించిన, దృష్టికి వచ్చిన లేదా తన మనసుకు తట్టి చర్చకు పెట్టాల్సిన/ తెలియజేయాల్సిన విషయాల్నే రాస్తాడు. ఈ రచనలే సామాజిక చైతన్యానికి తోడ్పడతాయి. రచయిత ఏమి రాయాలో పాఠకుడు నిర్ణయించలేడు. పత్రిక, లేదా పాఠకుడి డిమాండ్‌ని బట్టి సాహిత్యం వస్తే/ రాస్తే అది కమర్షియల్‌/ కలుషిత సాహిత్యమే అవుతుంది గానీ కమనీయ సాహిత్యం కాదు. ‘మనీ’ సాహిత్యం ‘మెనీ’ సాహిత్యంగా మారాలె!
ఈ కథ రచయిత దిలావర్‌ ‘మెనీ’ అంటే సమాజంలోని మెజారిటీ జీవితాల్నే చిత్రికగట్టిండు. ఇందులో కథకుడు తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నడు. తాను దగ్గరి నుండి చూసిన పద్మశాలి, మాదిగ, లంబాడీ జీవితాల్లోని దయనీయమైన వ్యధాభరిత గాథల్ని కళ్ళముందుంచిండు. ఒక వైపు నోస్టాల్జియాను చిత్రికగడుతూనే, చిధ్రమవుతున్న రైతుల, స్త్రీ జీవితాల్ని ద్రవించిన హృదయంలోంచి పాఠకుల మెదళ్ళలోకి ఒంపిండు. దిల్‌ని, దిమాక్‌ని కలెగలిపి కమనీయ సాహిత్యాన్ని మనముందుంచిండు. పాత్రలు ఉరి బెట్టుకున్నా కథలకు మాత్రం పాణం బోసిండు. చేదు నిజాల్ని తీపి పూత లేకుండా పాఠకులకు అందించిండు. ‘ఉత్పత్తి’ జీవితా హృదయావిష్కరణ చేసిండు.
నిజానికి ఇవ్వాళ సమాజంలో జరుగుతున్న విషయాలను తీసుకొని వాటిలోతుల్లోకి పోకుండానే కొంతమంది తమది కాని, తమకు తెలియని జీవితాలను ‘డిమాండ్‌’ కథలుగా అల్లుతున్నరు. అట్లా గాకుండా సమాజ హితంగోరే రచయిత, పాఠకుడికి ఇది కావాలి, ఈ విషయం తెలియాలి అని వాటి మూలాల్లోకి వెళ్ళి తనదైన శైలిలో, శిల్పంలో, భాషలో చెబుతాడు. ఆ పని దిలావర్‌ సమర్ధంగా చేసిండు. కథాసృష్టిలో సమస్య ఉండవచ్చు, సంఘటనలూ, పాత్రలు, ఘర్షణ, జీవితమూ ఉండవచ్చు. అయినప్పటికీ ఆధునిక సమాజంలో సమస్యను తార్కికంగా ఆలోచించి మెజారిటీకి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించినప్పుడే సాహిత్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది. కొన్నిసార్లు మెజారిటీ సమాజం తమ సుప్థచేతన వల్ల కొన్ని విషయాను తిరస్కరించవచ్చు. ఆ విషయాల ఆమోదం పట్ల గుంజాటన ఉండొచ్చు. అట్లాంటి సమయంలో సామరస్యంగా, సమన్వయంతో మనసు నొప్పించకుండానే వారిని కన్విన్స్‌ చేయాల్సిన బాధ్యత కూడా రచయితపై ఉంటుంది. అందుకు వాహిక అస్తిత్వవాదమే! ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని పెంపొందించే సాహిత్యమే సమాజానికి ఉపయోగమైంది. అవసరమైంది కూడా!
రచయిత లేదా సృజనకారుడు తనకిష్టంలేని ఏ విషయాన్ని, అంశాన్ని సాహిత్యీకరించబోడు. ఇతివృత్తంపై తాదాత్మ్యత, అవగాహన, పట్టు, లోతైన పరిశీలన, ప్రేమ లేకుండా రాసినట్లయితే అది పేలవంగా, నిస్తేజంగా, నిర్జీవంగా ఉంటుంది. ఆఖరికి రచయితను అభాసుపాల్జేస్తుంది. అందుకే నేటి సమాజంలో ఎట్లా జెప్పిండనే దాని కన్నా ఏమి జెప్పిండనేదే ప్రధానమైంది. ఎందుకు జెప్పిండనేది సామాజిక, రాజకీయాసక్తులపై, వ్యక్తిగత చైతన్యస్థాయిపై ఆధార పడి ఉంటది. వస్తువే అన్నింటికీ మూలం. అస్తిత్వోద్యమాలకు పూర్వం ఈ వస్తువుల ఎంపికలో రచయితలపై అభ్యుదయ, ప్రగతిశీల, విప్లవ భావజాలాల ప్రభావం ప్రస్ఫుటంగా ఉండింది. శైలీ, శిల్పాలు కథలను డామినేట్‌ చేసినవి. ప్రామాణిక భాష పేరిట అజమాయిషీ కొనసాగింది.
తెలుగు సాహిత్యంలో మొదట అగ్రకులస్తులు తమ జీవితంలో భాగమైన ‘సామాజిక సంస్కరణ’ ఇతివృత్తంగా రచనలు చేశారు. దీని లోని డొల్లతనాన్ని ముందు పేజీల్లో తెలుసుకుందాం. అయితే తొలి దశలో అక్షరాస్యులైన బ్రాహ్మణులతో పోలిస్తే వారి ద్వారా, వారి ఆలోచనలు, భావజాలం, ప్రభావాలకు అనివార్యంగా, పూర్తిగా లోబడాల్సి వచ్చిన కింది కులాల వాండ్లు మెల్లమెల్లగా ఒడిదొడుకుల్ని అధిగమించారు. తక్కువగానే అయినా రాజకీయ, ఆర్థిక అంశాలపై రచనలు చేసిండ్రు. తెలంగాణలో గూడూరి సీతారామ్‌, జి.రాము, సీమాంధ్రలో కొలుకలూరి ఇనాక్‌ తదితరులు అట్లాంటి వారికి ప్రతినిధులు. వీళ్ళు బహుజన జీవితాలను చిత్రికగట్టిండ్రు. బ్రాహ్మణాధిపత్య విద్యాబోధన నుంచి బయటపడ్డ వారు తర్వాతి కాలంలో ఆలస్యంగానే అయినా కొత్త విషయాలను కథలుగా మలిచిండ్రు. ఇట్లా రాసిన వారిలో రాయసీమ నుంచి కె.సభా లాంటి దళితులు, ఆంధ్రా నుంచి అందే నారాయణస్వామి లాంటి బహుజనులున్నారు. సాయుధ పోరాటం, నక్సలైట్‌ ఉద్యమ సందర్భంగా కొంత మేరకు కింది కులాల వారి జీవితాలు కథా సాహిత్యంలోకి వచ్చాయి. ఇందుకు ఉదాహరణ ఆవుల పిచ్చయ్య, అల్లం రాజయ్య కథలు. అయితే ఈ ‘పోరాట రచనలు’ అంతిమంగా అగ్రకులాల వారిని హీరోలుగా, రోల్‌ మోడల్స్‌గా, మరీ ముఖ్యంగా బ్రాహ్మణుల్ని ఉన్నతలుగా నిలబెట్టడానికీ, మరింతమంది ‘అమరు’లు కావడానికి మాత్రమే తోడ్పడ్డాయి.
బ్రాహ్మణాధిపత్య సాహిత్యానికి భిన్నంగా గ్లోబలైజేషన్‌ తర్వాత, మండల్‌ కమీషన్‌ అమలు, బాబ్రీమసీదు ‘షాహిద్‌’, కారంచేడు, చుండూరు దాష్టికాల  తర్వాత, మరీ ముఖ్యంగా 1990ల  అనంతరమే అస్తిత్వ సాహిత్యం పాదులూనుకుంది. దానికి పై సంఘటనూ, అవి సమాజంలో తెచ్చిన మార్పు, ఉద్యమాలు, ఉద్యమాలకు ఊతమిచ్చిన పత్రికలూ, వాటికి అక్షరరూపమిచ్చిన జర్నలిస్టు, సాహితీవేత్తల  మూలంగా అస్తిత్వ సాహిత్యానికి స్థిరత్వం ఏర్పడింది. దీన్ని తర్వాతి కాలంలో అన్నికులాల  అకడమిషయన్లు అనివార్యంగా గుర్తించాల్సి వచ్చి సాహిత్యచరిత్రలో భాగం చేశారు. 1980వ దశకం నుంచి విద్యారంగంలోకి   టీచర్లుగా బ్రాహ్మణేతరులు కూడా ఎక్కువగా వచ్చారు. దీనికి కొంత రిజర్వేషన్లు, మరికొంత బహుజన చైతన్యం కారణం. దీంతో అప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న అగ్రకులాల  వాండ్లు, బ్రాహ్మణులు  బహుజనుల  దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళు అప్పటికే అందివచ్చిన ప్రైవేటు, కార్పోరేట్‌ కళాశాలలను ఆశ్రయించారు. గ్లోబలైజేషన్‌ కారణంగా ఈ దశలో ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పోరేట్‌ కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఎక్కువభాగం బోధకు అగ్రకులాల  వాండ్లే కావడం యాధృచ్ఛికం కాదు. ఇవి డాక్టర్లు, ఇంజనీర్లను తయారుచేసే ఫ్యాక్టరీలుగా పనిచేశాయి. ఇట్లా తొలిదశలో ఈ విద్యాసంస్థల్లో అభ్యాసం చేసిందీ, దాని ద్వారా మల్టినేషనల్‌ కొలువులు సంపాదించింది అత్యధిక శాతం కచ్చితంగా అగ్రకులాల  వాండ్లే! నక్సలైట్‌ ఉద్యమం పుణ్యమా అని గ్రామాల నుంచి నగరాల్లోకి మకాం మార్చిన రెడ్లు, వెలమలు, దొరలు, భూస్వాములు, వారికి తోడు అప్పటికే పట్టణ/నగరబాట పట్టిన బ్రాహ్మణులు  తెంగాణలో ఈ అవకాలశాను అందిపుచ్చుకున్నారు. వీరికే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు  తొలిదశలో అందాయి. ఈ తరం పిల్లలు సామాజిక మార్పుకు అనుగుణంగా ప్రజలతో ఎన్నడూ మమేకం కాలేదు. తాము ‘ఎబోవ్‌ ద కట్‌’ అన్న దృక్పథంతోనే వ్యవహరించారు. అదే విషయాలు  సాహిత్యంలోనూ చోటు చేసుకున్నాయి. చేటు చేశాయి.
మొదట చెప్పుకున్నట్టు 1990 కన్నా ముందు ఒకటి రెండు మినహాయింపుతో సాహిత్యమంతా అగ్రకులాధిపత్యాన్ని నిలబెట్టే విధంగానే ఉండింది. (కేవలం  సక్సెస్‌ స్టోరీస్‌ మాత్రమే రాసిన కొలకలూరి ఇనాక్‌ సకల ఆధిపత్యాలను అస్తిత్వ సోయితో ఎదిరించిన వారిలో ఆద్యుడంటే అతిశయోక్తి కాదు) ఈ దశలోని విప్లవ సాహిత్యమూ వర్గ దృక్పథాన్ని మాత్రమే ప్రచారం చేసింది. బహుజనులూ  అదే పంథాను అనుసరించారు. కథా సంకలన కర్తలు, సాహిత్యరంగంలో బ్రాహ్మణాధిపత్య భావజాలం  గల  విమర్శకులు చెప్పిందే తీర్పుగా చలామణి అయింది. వారి ఆలోచన చట్రంలో ఇమడని సాహిత్యాన్ని తూర్పారా పట్టేవారు. చీల్చి చెండాడే వారు. అంతిమంగా అంతో ఇంతో రాయగలిగిన సత్తా వున్న వాళ్ళు సైతం ఈ విమర్శల  మూలంగా అసలే రాయడం మానేసిండ్రు. తప్పు సరిదిద్ది ముందుకు నడిపించేదిగా గాకుండా విమర్శ అనే ఖడ్గంతో కలాలను నరకడమే లక్ష్యంగా పనిచేసిండ్రు. ముఖ్యంగా కింది కులాలవారి అక్షరాలను నరికి కుప్పలు పోసిండ్రు.
kaifiyath
అనాది కాలం  నుంచి దాదాపు గ్లోబలైజేషన్‌ ప్రభావం విస్తృతమయ్యే వరకూ బ్రాహ్మణులు తమ కులంలోని సతీ సహగమనం, వేశ్యాలోలత, వితంతు వివాహం, మధ్యతరగతి ఉద్యోగస్థుల  బాధలు, ప్రేమలు, పెళ్ళి ళ్లు, లైంగిక స్వేచ్ఛ, శృంగారం ప్రధానంగా రచనలు చేసిండ్రు. ఇవే ‘విప్లవ’, ‘అభ్యుదయ’, ‘ప్రగతిశీల’ రచనలుగా చలామణి అయ్యాయి. ఈ సాహిత్యంలో కింది కులాల  జీవితాలుగానీ, ఘర్షణగానీ అతి స్వల్పంగా  రికార్డయింది. నిచ్చెనమెట్ల సమాజాన్ని ఈ సాహిత్యం నిలదీయలేదు. పరిష్కారాలన్నింటినీ వర్గ దృక్పథంతో తాము గిరిగీసుకున్న పరిధిలో, పరిమితిలోనే వెతికారు. 1980వ దశకం నుంచీ పాక్షికంగానే అయినా బెంగాల్‌ బుద్ధిజీవులు ‘సబాల్టర్న్’ జీవితాలను చరిత్రకెక్కించినారు. అయితే వీరికి అక్కడి కానూ సన్యాల్‌ మాత్రమే కనిపించిండు. అణగారిన కులాల వారి బాధలు  వీరి కలాలకు ఆనలేదు.
అందుకే ఇవ్వాళ అస్తిత్వోద్యమ సాహిత్యకారులు ప్రధానంగా సమాంతర సాహిత్యాన్ని సృజిస్తున్నారు. సబాల్టర్న్  దృక్కోణంతో సమాజాన్ని చూస్తున్నరు. ప్రతిమనిషికి సమాన విలువ ఉండే సమ సమాజ నిర్మాణం కోసం సాహిత్యాన్ని వాహికగా ఎంచుకున్నరు. అస్తిత్వ చైతన్యంతో కిందినుండి చరిత్రను నిర్మిస్తూ, తమ సమస్యలకు అదే సోయితో జవాబులు  వెతుకుతున్నారు. ప్రతి సమస్యకూ అస్తిత్వ సోయే సమాధానమిస్తుందని నమ్ముతున్నరు. సృజనకారులతో పాటు విమర్శకులూ  ఇప్పుడు కొత్త తూనికరాళ్ళను తయారు చేసుకున్నరు. మూస పద్దతిలో గాకుండా బహుజన సోయితో వివిధ అంశాలకు, సమస్యలకు సమాధానాలు వెతుకుతున్నరు. కొత్త విషయాల్ని వెలికి తీస్తున్నరు. ఘనతను చాటుతున్నరు. పాఠకుల  తరపున, సమాజం తరపున విమర్శకులు  మాట్లాడుతున్నరు. 1990 నాటి విమర్శకు ఇవ్వాలటి విమర్శకు తేడా ఉంది. అందుకు విప్లవ సంస్థల  నుంచి బయటికి వచ్చిన వారు కొత్తదారులు  వేసిండ్రు. శివసాగర్‌ పయనం అందుకొక ఉదాహరణ. దరకమే లాంటి సంస్థలు  కొత్త ఆలోచనను ప్రోది చేశాయి. దండోరా ఉద్యమం కొత్త వాదనకు వేదిక అయ్యింది. మహాజన, సమాంతర, బహుజన కెరటాలు లాంటి పత్రికలు దారి చూపాయి. ఆనాడు విమర్శ వర్గ దృక్పథంతోనే ఉండింది. ఇవ్వాళటి విమర్శ అస్తిత్వ సోయితోటి, వర్ణ దృక్పథంతోటి ఉన్నది. ఇది రియాలిటీ. ఆనాటిది హైపోథీసిస్‌. అనుభవంలో హైపోథీసిస్‌ తప్పని తేలింది. అనేక చేదు నిజాలు  ముస్లింలు, దళితులు, బహుజనులు తమపై జరిగే దాడుల్ని మరింత బలంగా ఎదుర్కునేందుకు సన్నద్ధం చేస్తోంది.
ఇండియాలో ఇవ్వాళ ప్రధానంగా రెండు అంశాలున్నాయి. ఒకటి కులం. రెండు మతం. అయితే విమర్శకుడు మాత్రం రచయితలకున్న హక్కులకు భంగం కలుగకుండానే ఏది? ఎందుకు? ఎలా? ఎప్పుడు? ఎవరు? రాయలేదు, రాశారు! అని విమర్శించడానికి వీలుంటది.  ఈ విషయాలు చర్చకు పెట్టడం ద్వారా మేలైన సాహిత్యం` మెరుగైన సమాజం కోసం రావడానికి వీలవుతుంది. సమస్యలోతుల్లోకి వెళితే పరిష్కారం దొరుకుతుంది. ఈ రెండు సమస్యల్ని రాజకీయార్థిక కోణాల్లో గాకుండా కులం, మతం దృష్టి కేంద్రంగా చూడాలి. రాజకీయంగా ఎవరి జనాభా నిష్పత్తి మేరకు వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎందుకు లేదో తెలుసుకోవాల్సి ఉంది. అలాగే ఆర్థిక విషయంలో పేదరికానికి నిర్వచనాలు మారుతున్నాయి. పేదరికానికి కులం, మతంలో కారణాలు వెతికినప్పుడు ఆధిపత్యుల దోపిడీ, అణచివేత తెలిసి వస్తుంది. అప్పుడు శత్రువెవరో తేట తెల్లమవుతుంది. పేదరికానికి, కులం మతంతో గ సంబంధాను, కార్య`కారణాను విశ్లేషించుకున్నప్పుడు కచ్చితంగా రచయిత జ్ఞానంలో, తద్వారా అభిప్రాయాల్లో మార్పు ఉంటది. కుంపై, మతాధిపత్యంపై తిరుగుబాటు ఉంటది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో వర్గాధిపత్యం, అగ్రకులాధిపత్యమే సమాజంలో పేదరికానికి కారణమనే అవగాహన ఏర్పడినట్లయితే సమస్యలు  మరింత సుళువుగా పరిష్కరించుకోవడానికి మార్గమమేర్పడుతుంది. ఈ విషయంలో ఆధిపత్యుల  ‘మేధోత్వాన్ని’, కుట్రలను అర్థం చేసుకోవాలి. ఈ కుట్రలను చేధించడానికి ఫూలే, అంబేద్కర్‌ రచనలు, ఆచరణే శరణ్యం.
పూలే సామాజిక ఆధిపత్యాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. అందులో భాగంగా మేలైన మార్పుకోసం విద్యను ఆయుధంగా చేసుకున్నడు. కింది కులాలకు, మహిళలకు చదువు నేర్పడం ద్వారా  సమస్యకు పరిష్కారం చూపించిండు. ‘గులాంగిరీ’ ద్వారా సాహిత్యదారులేసిండు. పూలే చనిపోయిన తర్వాత పుట్టిన అంబేద్కర్‌ తన మేధో సంపత్తితో పూర్తిగా సామాజిక విప్లవానికి కృషి చేసిండు. అంబేద్కర్‌ రచనలు  ఎంత విరివిగా అందుబాటులోకి వస్తున్నాయో అంతే స్థాయిలో బహుజన చైతన్యం పెరిగి గతంలో పాదులూనుకున్న సిద్ధాంతాలను బద్ధలు  కొడుతోంది. తొలితరం అక్షరాస్యు లు ఇవ్వాళ అన్ని ఉద్యమాల్లో ముందున్నరు.
సంస్కరణ పేరిట బ్రాహ్మణీయ సాహిత్యాన్ని ఇంతకాలం  విప్లవ సాహిత్యంగా, అదే సమాజాన్ని మారుస్తుందని అభ్యుదయ వాదులు  తప్పుడు భావనల్ని ప్రచారంలో పెట్టడం జరిగింది. (శ్రీశ్రీ సాహిత్యాన్ని సమగ్రంగా చదివితే ఇది అర్థమైతది) దీని వల్ల  కులానికి వచ్చిన నష్టమేమీ లేదు. దాని స్థానంలో అది ఖాయంగానే ఉంది. ఈ నిచ్చెన మెట్ల సాహిత్యాన్ని తలకిందులుగా చేయాలి. అది సాధ్యం కాని స్థితిలో కనీసం సమాన స్థాయి ఏర్పడే సాహిత్య సృజన జరగాలి. ఆధిపత్యకులాలని తలకిందులు  చేయకుండా నాలుగైదు శాతం మాత్రమే ఉన్న వారి సామాజికాధిపత్యానికి చరమగీతం పాడడం సాధ్యం కాదు. నిజానికి సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చినంతగా సమాజాన్ని మార్చడానికి మార్క్సిజం పనికిరాదు. ‘అంతిమ ఘడియ’ (ఫైనల్‌ డిస్టినేషన్‌) వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మార్క్సిజం చెప్పలేదు. అంతిమఘడియ అంటే విప్లవం వచ్చిన తర్వాత మనిషి పూర్తిగా స్వేచ్ఛా జీవి అవుతాడు. ఏ రకమైన సంకెళ్ళు ఉండవు. సొంత ఆస్తి ఉండదు. ఉదయం వేటాడటం, మధ్యాహ్నం చేపలు  పడుతూ, సాయంత్రం సాహిత్య విమర్శ చేస్తాడు అని మార్క్స్‌ భావన. ఇండియాలో ఈ పనులన్నీ  వేర్వేరు సామాజిక వర్గావారు చేస్తారు. అందుకోసమైనా కులం పోవాలి. అందుకే ఇండియాలో మార్క్సిజం ఆచరణ యోగ్యం కాదు. ఈ విషయాలన్నింటినీ కూలంకషంగా అర్థం చేసుకుంటే గానీ సమాజస్వభావం తెలిసి రాదు. ఇందులో ఆధిపత్యకులాలవారి అజమాయిషీకి ముందుగా తెరదించాలె. ఇది అస్తిత్వ సోయితోనే సాధ్యం. సకల  సమస్యలకు రాజ్యమే కారణం అని ఒక గంపగుత్త సూత్రంతో సామాజిక అంశాల్ని పరిశీలిస్తే సమస్యలకు ఎన్నటికీ పరిష్కారం దొరకదు.
భారతదేశంలో పారిశ్రామికీకరణ జరగకముందే (ప్రిమిటివ్‌స్టేజ్‌) ప్రాథమిక దశలోనే సామాజిక శ్రమ విభజన జరిగిందని మార్క్స్‌ ఇండియా మీద రాస్తూ చెప్పిండు. అంటే మార్క్స్‌ అర్థంలో పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందే క్రమంలో శ్రమ విభజన జరుగుతుందనే అవగాహన ఉంది. కాని భారతదేశంలో దానికన్నా ముందే ఈ విభజన సామాజికంగా జరిగింది అంటే దాని అర్థం కులవిభజనే!
దేశీయ మార్క్సిస్టు ఉద్దేశ్య పూర్వకంగానే కులాన్ని 1990కు ముందు పట్టించుకోలేదు. కారంచేడు, చుండూరు సంఘటనల తర్వాత కొంత మార్పు వచ్చింది. అయినా ఈనాటికీ మార్క్సిస్టులకు, వాటి కుల, ప్రజాసంఘాలకు  పైకి కనిపిస్తున్నట్టుగా కులమనేది ప్రధానమైన అంశం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అంబేద్కర్‌ ‘ఇండియాలో శ్రమవిభజన కాదు. శ్రామిక విభజన ఉంది’ అని వాదించాడు. కుల సమస్యను గుర్తించ నిరాకరిస్తూ, అణగారిన వర్గాలపై అగ్రకులాధిపత్యాన్ని లెఫ్టిస్టు పార్టీలు ఇప్పటికీ స్థిరీకరించుకుంటున్నాయి.
ఇవ్వాళ కమ్యూనిస్టులు, మార్క్సిస్టులూ  రాజకీయ, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత నిస్తూ కులం, మతం వాటి మూల స్వభావాలను విస్మరిస్తున్నారు.  మార్క్సిస్టు భావజాలం  1990లకు ముందు నుంచి రాస్తున్న సృజనకారులను ఆవహించింది. అట్లా అనడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే ప్రభావం చూపిందని చెప్పొచ్చు. కులం, మతంతో సంబంధం లేకుండా చైతన్యవంతులైన అప్పటి సాహితీవేత్తలందరూ తమకు తెలియకుండానే బ్రాహ్మణాధిపత్య భావజాలానికి లోబడి ఉన్నారు. కులాన్ని, మతాన్ని వీళ్ళు ప్రశ్నించలేదు. ఈ బలహీనతకు కారణం మార్క్సిజం.
ఈ కథల రచయిత దిలావర్‌ కూడా ఈ బహీనతల నుంచి బయటపడలేదు. రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యలను సమర్దవంతంగా చిత్రించిండు. అట్లనే ముస్లిం పేదరికాన్ని చిత్రించిండు. దానికి తోడు లంబాడీ దయనీయమైన స్థితిగతుల్ని ఏకరువు బెట్టిండు. కరువు పీడననూ లెక్క గట్టిండు. అత్యాచారాలను ఎమర్జెన్సీ కాలంలోని రమీజాబీ నుంచి ఈనాటి ఆయేషా వరకు గుడ్లనీళ్ళు  తిరిగేలా చెప్పిండు. సరోగసీ లాంటి ఆధునిక అంశాలను అక్షరీకరించిండు. వీటన్నింటినీ ఆయన తనకున్న చైతన్యంతోటి రాజకీయ, ఆర్థిక దృక్కోణంలో రాసిండు. ఈ చైతన్యమంతా లెఫ్టిస్ట్‌ సాంగత్యంతోనే వచ్చింది. ఇది వర్గ దృక్పధాన్నే నేర్పింది గానీ వర్ణ దృక్పథాన్ని, మత దృక్పథాన్ని అలవర్చలేదు. మీదు మిక్కిలి అట్లా చూడడం తప్పని స్థిరీకరించింది. దీని వల్ల  ‘జరీనా’ కథలో లైంగిక హింస, పేదరికం ప్రధాన వస్తువైంది. దాన్ని అస్తిత్వ సోయితో జయించే అవకాశముండింది. ఇట్లా జయించి ఫెయిల్యూర్  స్టోరీని, సక్సెస్‌ స్టోరీగా చెప్పేందుకు అవకాశముండింది. ఇందుకు దిలావర్‌ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అస్తిత్వసోయిని అందుకోకుండా అడ్డుకున్న సిపిఎం కార్యశాలదే ప్రధాన బాధ్యత. అయినప్పటికీ తనలోని కాన్షియస్‌నెస్‌ ఈ విషయాలను మూగగా ఆమోదించడానికి సిద్ధపడలేదు. అందుకే ‘‘ధనిక పేద వర్గాల మధ్య, అగ్ర దళిత వర్ణాల మధ్య, పెత్తందార్లూ పనివాళ్ళ మధ్య ఈ వివక్ష ఇలాగే కొనసాగితే దేశం త్వరలోనే ప్రమాదపుటంచున పడుతుందని కూడా ఎవరైనా ప్రమాద ఘంటికలు  మోగిస్తే బాగుండును’’ అని తన మనసులోని మాటను ‘నగ్నసత్యం’ కథలో చెప్పిండు. ఇప్పుడు అస్తిత్వ సోయితోటి ముస్లింవాదులు, దళిత, బహుజన వాదులు, స్త్రీవాదులూ  ఈ ప్రమాదాలను ప్రచారం చేస్తున్నరు. నిజానికి తెలుగునాట స్త్రీవాదం పుట్టుకొచ్చిందే రమీజా బీ కేసు నుంచి అంటే అతిశయోక్తి కాదు. స్త్రీ వాదం రావడానికి అంతర్జాతీయ, జాతీయంగా అనేక కారణాలున్నప్పటికీ ఇది తక్షణ కారణమైందని చెప్పొచ్చు. దిలావర్‌ సీనియర్‌ రచయిత కావడం మూలంగానే ఎమర్జెన్సీ కాలం నాటి రమీజా బీ కేసును రెండు కథల్లో పేర్కొన్నడు.
1978 మార్చి 29`30 రాత్రి రమీజా బీ తన భర్తతో కలిసి ‘యమగోల’ సినిమా చూసి వస్తూ ఫీవర్‌ హాస్పిటల్‌ దగ్గర తన భర్త మూత్రం పోయడానికి వెళితే వెయిట్‌ చేస్తున్నది. ఈ సమయంలో నల్లకుంట  పోలీసులు  ఆమెను తీసుకెళ్ళి ఎస్సై, కానిస్టేబుల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే అత్యాచారం చేసి ఆమె ప్రాస్టిట్యూట్‌, విటులను ఆకర్షిస్తుండగా పట్టుకున్నామని కేసు పెట్టారు. భర్తని లాకప్‌ డెత్‌ చేసిండ్రు. ఈ కేసు ఆనాడు తెలుగునాట ప్రజాస్వామిక వాదులందరినీ కుల, మతాలకు అతీతంగా కదిలించింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ముఖ్తదర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దోషులను నిర్ధారించింది. ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న వారే తర్వాతి కాలంలో ‘విమెన్స్‌ గ్రూప్‌’గా ఏర్పడ్డారు. రమా మెల్కోటె, వసంత కన్నబీరన్‌, లలిత తదితరులు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈనాటి తరానికి అంతగా తెలియని విషయాన్ని దిలావర్‌ పేర్కొని ఎనుకటి విషయాలను మరొక్కసారి తెరమీదికి తెచ్చిండు. గతాన్ని తోసుకొని వర్తమానంలో విశ్లేషించుకొని భవిష్యత్‌కు దారులు వేయాల్సిన సమయంలో రమీజా బీని గుర్తు చేసినందుకు దిలావర్‌ అభినందనీయుడు.
దిలావర్‌ ఖమ్మం జిల్లా వాడు కావడం, ఆనాదిగా ఆ జిల్లా రాజకీయాలు, ‘చైతన్య’, ‘ప్రగతిశీల’, ‘ప్రభావశీల’ కార్యక్రమాలు, సాహిత్యశాలలు, పుస్తక ప్రచురణలు, సమీక్షలూ  అన్నీ సిపిఎం, సిపిఐ కేంద్రంగా ఆ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ‘విజృంభణ’ ‘తిరుగుబాటు’, ‘న్యూడెమోక్రసీ’, ‘ప్రజాశక్తి’ ఇప్పటి నవ తెలంగాణ అన్నీ ఒకే సామాజిక వర్గం ఆధీనంలో ఉన్నయి. విప్లవ చైతన్యమంతా ఇక్కడే పోగయింది. పోగయింది అనేకంటే పోగు పెట్టబడిందంటే కరెక్టేమో! వీరి ప్రాబల్యం  ఇప్పటికీ అక్కడ కొనసాగుతది. దిలావర్‌ ముఖ్యంగా సిపిఎం పార్టీతో మమేకమై ఉండొచ్చు. శ్రీశ్రీ మొదలు  తెలకపల్లి రవి దాకా అంతా ఆంధ్రత్వమే అక్కడ పరుచుకుపోయి ఉంది. దీంతో తాను ప్రభావితం కావడమే గానీ తాను ప్రభావితం చేసేందుకు అవకాశం దక్కలేదు. వేదిక చిక్కలేదు. ఇది వన్‌వే. లెఫ్ట్‌ పార్టీ నుంచి దళిత, బహుజనులు స్వీకరించడమే గానీ తాను నేర్చుకున్నది అప్పజెప్పడానికి, ప్రభావితం చేయడానికి ఏ సాహిత్యశాలలూ, సాహిత్యకారులూ  అవకాశం కల్పించబోరు. అది వారి ఆచరణకు విరుద్ధం.
ఖమ్మం జిల్లా రాజకీయాలన్నీ ఒకే సామాజికవర్గం ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. పార్టీలు వేరైనా పీడితుల పక్షానా, పీడకుల పక్షానా కూడా వీళ్ళే వకాల్తా పుచ్చుకుంటారు. అందుకే ఇక్కడ అస్తిత్వవాద రాజకీయాలకు, విభిన్న అస్తిత్వాలకు ఆదరువు కరువు. ఉద్యమ కాలంలో తెలంగాణ రచయితల వేదిక అన్ని జిల్లాల్లో మీటింగ్‌లు పెట్టగలిగింది గానీ ఖమ్మం జిల్లాలో ఆ పనిచేయలేక పోయింది. ఖమ్మం జిల్లాలో శీలం సిద్దారెడ్డి, జలగం వెంగళరావు తర్వాత అన్నీ పార్టీల్లోనూ ఏక కులాధిపత్యం నెలకొంది. ఈ కులాధిపత్యం వర్ణ దృక్పథాన్ని తప్పుగా, ద్రోహంగా ప్రచారం చేసి, వర్గ దృక్పథాన్ని ప్రోత్సహించింది. ఈ ప్రోత్సాహ కార్యక్రమాలు క్రమం తప్పకుండా ‘సాహితీ స్రవంతుల’ ద్వారా, పార్టీ పత్రిక ద్వారా, వందిమాగధుల ద్వారా నిరంతరం కొనసాగుతున్నాయి. ఇప్పటికీ తెలంగాణకు అనుకూలంగా ఎక్కడా, ఎప్పుడూ తీర్మానం చేయకబోయినప్పటికీ సిపిఎం పల్లకీని ఇక్కడి బోయీలు మోస్తున్నారు.
ఇవ్వాళ మొత్తం తెలంగాణాలో ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం తెలంగాణలో 31,77,940 మంది (ఆంధ్రాకు పోయిన ఏడు మండలాల జనాభాతో కలిపి) ఆదివాసీలు/ గిరిజనులు అంటే ఎస్టీలున్నారు. మొత్తం ఖమ్మం జిల్లా జనాభా  26,07,066. ఇందులో 25.18 శాతం జనాభా 6,56,577 ఎస్టీలున్నారు. అలాగే 16.84శాతం ఎస్సీలున్నారు. అంటే ఈ జిల్లా మొత్తం జనాభాలో దాదాపు 42 శాతం మంది ఆదివాసీలు, దళితులున్నారు. ఈ 42 శాతంతోపాటు మొత్తం జిల్లా ప్రజలందరి తరపున కేవలం నాలుగు శాతం మాత్రమే అదీ ఒక్క సామాజిక వర్గమే మాట్లాడుతోంది. వాళ్ళు ఎంత చెబితే అంత అన్నట్టుగా ఇవ్వాళ పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపినప్పుడు ఉద్యమం పెద్దగా రూపొందలేదు. ఈ సామాజిక వర్గాల ప్రయోజనాలు ఆంధ్రాతో ముడిపడి ఉండడంతోనే ఉద్యమాలు పెద్దగా రాలేదు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముదిగొండ ఘటనలో దళిత రైతులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటానికి సిపిఎం నేతృత్వం వహించింది. ఈ ఉద్యమంలో రైతుల ప్రాణాలు పోయినాయి తప్ప లభించిన ఫాయిదా ఏమీ లేదు. అంటే ఒక ఉద్యమం చేసి దళిత రైతుల ప్రాణాను బలిగొంటే మరో ఉద్యమం చేయకుండా ఉండి ఆదివాసీల ఉసురు తీసింది. నిజానికి సిపిఎం బలంగా ఉన్న ఈ జిల్లాలో ఆదివాసీలకు అండగా ఉండి చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సింది. సాహిత్యంలో వీటిని ప్రతిఫలింప జేసుండాల్సింది. ఉద్యమాలు లేవు, సాహిత్యంలో చోటూ లేదు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలంగా ఉండీ అంతో ఇంతో ఉద్యమం పట్ల జిల్లాలో సానుభూతి ఉన్నప్పటికీ సభలు నిర్వహించడానికి ఇక్కడి నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు. వ్యక్తులుగా కొంతమంది తెలంగాణ వాదులు ఇక్కడ ఉంటే ఉండొచ్చుగానీ సంస్థలుగా తెలంగాణ వాదానికి మద్ధతు దక్కలేదు. అయితే ముస్లిం అస్తిత్వ వాదానికి వచ్చే సరికి ఖమ్మం జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసబోయిన వారే అండగా నిలిచారు. స్థానికంగా జిల్లాలో ఉన్న వాళ్ళు ముస్లిం వాదంతో పెద్దగా మమేకం కాలేక పోయిండ్రు. నిజానికి అనాది నుంచి ఖమ్మం జిల్లా తెలుగులోరాసే అత్యధిక ముస్లిం కవులను/ రచయితలను కన్నది.
ఈ జిల్లా నుంచి షంషుద్దీన్‌ (కౌముది), దావూద్‌ అలీ, సికిందర్‌ మొహసిన్‌, ఎం.ఎ. రెహమాన్‌, సయ్యద్‌ షఫీ, అఫ్సర్‌, షేక్‌ రఫీ, హనీఫ్‌, షుకూర్‌, షంషాద్‌, షాజహానా, ఇక్బాల్‌ చంద్‌, ఖాజా, అక్బర్‌, ఖమ్రొద్దీన్, జావేద్ ఇట్లా అనేక మంది ముస్లిం కవులు తెలుగులో రాసిండ్రు. అట్లనే ఉర్దూలో ముస్లింలతో పాటుగా కవిరాజమూర్తి, హీరాలాల్‌ మోరియా తదితరులు రాసిండ్రు. వీరిలో యాభై ఏండ్ల సాహితీ జీవితం ఉన్న ఏకైక వ్యక్తి దిలావర్‌ ఒక్కడే అంటే అతిశయోక్తి కాదు. 1974లో  ‘వెలుగు పూలు’ కవిత్వం వెలువరించిన నాటి నుంచీ భారతి పత్రికలో సీరియల్‌ నవలాకారుడిగా, ‘వెన్నెల కుప్పలు’ పోసి ‘జీవన తీరాల’కు చేర్చిండు. ‘కర్బలా’ కవిత్వంతో పాటు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ‘గ్రౌండ్‌ జీరో’ దీర్ఘ కవిత వెలువరించిండు. ఇటీవల తెలుగు యూనివర్సిటీ ‘ప్రతిభా’ పురస్కారం అందుకున్న దిలావర్‌ రచనకు దక్కాల్సినంత గౌరవం దక్కలేదనే చెప్పొచ్చు. పోలవరం, ఆదివాసీ జీవితాన్ని రికార్డు చేస్తూ ‘కొండా కోనల్లో’ పేరిట పుస్తకంగా వెలువరించినా దాన్ని ఏ ‘సాహిత్య శాల’లు గుర్తించలేదు. ఈయన ఎవరితోనైతే ఇన్నేండ్లూ అంటకాగాడో, లేదా కలిసి మెలిసి ఉన్నాడో వాళ్ళు ఆధిపత్య స్వభావంతో మెలగడంతో రాష్ట్ర స్థాయి వ్యక్తిని ఖమ్మం జిల్లాలో కూడా గుర్తించ లేదు. 1972 నుంచి ఇప్పటి  వరకు దాదాపు తన వయసుతో సమానంగా కథలు రాసిండు. అందులో కొన్ని గతంలో ‘మచ్చుబొమ్మ’, ‘కొండా కోనల్లో’ పేరిట పుస్తకాలుగా వెలువడ్డాయి. తన జిల్లా వాడే అయిన జాతీయ కవి ‘దాశరథి కవితా వ్యక్తిత్వ పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా అందుకున్నడు. నిజానికి దిలావర్‌ తన ముస్లిం/ దూదేకుల అస్తిత్వాన్ని త్యాగం చేసి అభ్యుదయ, ప్రగతిశీల సాహిత్యానికి జీవితమంతా ధారపోసిండు. చివరికి ‘అభ్యుదయ’ సాహిత్యం గురించి విమర్శ చేసే వారెవ్వరూ దిలావర్‌ని పేర్కొనరు. ఆకాశంలో గాకుండా నేలమీద నిలబడి ఏ సామాజిక వర్ణాలకు వాళ్ళు ముందుగా తోడ్పడాలి అనే గుణపాఠాన్ని దిలావర్‌ సాహితీ జీవితం నేర్పుతుంది. ముస్లిం సమాజానికీ ఆ మేరకు నష్టం జరిగింది. అది ఇప్పట్లో పూడేది కాదు. అణచివేతకు గురైన దూదేకుల జీవితం దిలావర్‌కు లేకపోయి ఉండొచ్చు గానీ తాత కాలంలో వందెకరాల స్థలం తన కాలానికి రెండు ఎకరాలుగా మారిన విషయాన్ని, అందుకు కారణాలను  ఆయన వెతకాల్సింది. ‘అభ్యుదయం’లో గాకుండా ‘అస్తిత్వం’తోనే ఈ విద్య అలవడుతది.
తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలోనే అత్యల్పంగా ముస్లిములున్నారు. ఈ జిల్లాలో 2001 (2011 లెక్కలు అలభ్యం) లెక్క ప్రకారం 1,37,639 మంది ముస్లిమున్నారు. అయితే తెలుగులో ముస్లింవాద సాహిత్యాన్ని అగ్రభాగంలో నిలబెట్టింది ఖమ్మం జిల్లానే! కవిత్వం, కథలు, నవలల ద్వారా ఈ జిల్లా రచయితలు ముస్లిం జీవితాల ను చిత్రికగట్టిండ్రు. వాదాలను నిలబెట్టేందుకు సాహితీదావాలు ఎదుర్కొన్నరు. ముస్లిం/దూదేకుల స్త్రీల కథలూ, కవిత్వం ఇక్కడి నుంచి వచ్చాయి. దిలావర్‌ తాను స్వయంగా ముస్లిం వాదం గురించి విస్తృతంగా రాయక పోయినప్పటికీ ఆ లోటుని ఆయన కూతురు షాజహానా కథల్లోనూ, కవిత్వంలోనూ, పరిశోధనలోనూ పూరించింది. ఇది ఖమ్మం జిల్లాకు గర్వకారణం కూడా! దేశంలోనే గాకుండా డయోస్పోరా సాహిత్యంలోనూ ఈ జిల్లా ముస్లింలు ముందంజలో ఉన్నారు. అఫ్సర్‌, షంషాద్‌ అందుకుదాహరణ. ముస్లింవాదంతో పాటు తెలంగాణ అస్తిత్వోద్యమంలో కూడా ఇక్కడి వాళ్ళు పాల్గొన్నారు. అయితే వీళ్ళందరూ జిల్లాకు ఆవల ఉన్న వాళ్ళు కావడమే విశేషం.
తన 75 ఏండ్ల జీవితంలో సాహితీ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న దిలావర్‌ ఇప్పటి వరకు ఎనిమిది కవితా సంపుటాలు, నాలుగు నవలలు, రెండు కథా సంపుటాలు వెలువరించాడు. ఇది మూడో కథా సంపుటి. నిజానికి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చాలా సాహిత్య చరిత్ర ఉంది. ఇక్కడే సింగరేణి గనులకు పునాదులేర్పడ్డాయి. 1945 ఆ ప్రాంతంలో జాతీయ గ్రంథాయ మహాసభలు ఇక్కడ జరిగాయి. ఈ మట్టి పునాదుల మీదుగానే తెలంగాణ సాయుధ పోరాట జీవితాన్ని పర్చా దుర్గాప్రసాదరావు కథలుగా మలిచిండు.
మళ్ళీ ఈ పుస్తకం విషయానికి వస్తే ఇది 15 కథల ఈ సంపుటి. ఇందులో దాదాపు పది కథలూ చావులూ, ఆత్మహత్యల చుట్టూ తిరుగుతాయి. రైతు, చేనేత కార్మికుడూ బాధితులు. శవాలు కాస్తున్న చెట్టు, నగ్నసత్యం, ఉరితాళ్ళు ఆత్మహత్యతో ముగిశాయి. క్షతగాత్రుడు, దగ్ధహృదయం, జరీన, నీ పెద్దోడొచ్చిండమ్మా, ఎడారి బతుకు, అమ్మా నన్ను చంపెయ్‌, తీజ్‌ కథల్లో చావు, దాని చుట్టూ ఉన్న వ్యదార్థ జీవితాలు రికార్డు చేసిండు. మరో శాకుంతలం, తీజ్‌లో మోసపోతున్న లంబాడీ స్త్రీల జీవితాలున్నాయి. ఆధునిక ఇతివృత్తంతో పద్మ లేశిపోయింది కథలో ‘సర్రోగసీ’కి ఒప్పుకున్న పేద మహిళ, నోస్టాల్జియాకు సంబంధించి చంద్రుడు గియ్యని బొమ్మలు, మృగణ ఇందులో ఉన్నాయి.
ముందుగా ఆత్మహత్యల విషయానికి వద్దాం. శవాలు కాస్తున్న చెట్లు కథలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఖమ్మం జిల్లా తల్లాడ అడ్డాగా కోట్ల రూపాయల నకిలీ విత్తనాల వ్యాపారం, అధికార్ల అలసత్వం, నకిలీ ఎరువులు,  నకిలీ పురుగు మందులు వెరసి రైతుని ఎట్లా పీల్చి పిప్పి చేస్తున్నాయో చెప్పిండు. దళారీల మోసం ఒక వైపూ, మరోవైపు వానల్లేక, బోర్లు తవ్వి, అప్పుల పాలై, రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడిన రైతు రామయ్య గురించీ, కూలీలు దొరక్క ఇంటిల్లిపాది పనిచేసినా ఫలితం లేక పోవడంతో రైతు చేనుగట్టు మీదున్న చెట్టుకు ఉరేసుకోవడాన్ని హృదయం ద్రవించేలా చెప్పిండు. అట్లాగే ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ‘నగ్నసత్యం’ కథలో ‘మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలోనే కలిసిపోవాన్నంత మమైకత్వంలో నేల తల్లిని నమ్ముకున్న బూమయ్య’ను పరిస్థితులు ఏ విధంగా ఆత్మహత్యకు పురిగొల్పాయో చెప్పిండు. కట్నం డబ్బు కోసం అత్తింటి వేదింపుల నెదుర్కొన్న కూతురు, ఇంజనీరింగ్‌ చదువుకు డబ్బుల్లేక దొంగగా మారిన కొడుకు సంగతి రాసిండు. చేతికొచ్చిన పంట తుపాను కారణంగా వర్షం పాలు కావడంతో ‘హలం పట్టిన ఆ చెయ్యి చీకట్లో హాలాహలం కోసం వెదికింది. పురుగుమందుకు పురుగుల్ని చంపే శక్తే కాదు, కష్టాలను రూపుమాపే శక్తి కూడా వుంది. బూమయ్య లాంటి కష్టజీవులకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే కష్టాల నుండి శాశ్వతంగా దూరం గావడానికి గరళాన్ని గళంలోకి వంపుకున్నాడు’ అని రైతుని చంపేసిండు. ఇవన్నీ భరించలేక పిచ్చివాడిగా మారిన కొడుకు బతుకుని కూడా దిలావర్‌ గుడ్ల్ల నీళ్ళు తిరిగేలా చెప్పిండు. ‘ఉరితాళ్ళు’ కథలో ఇంటిల్లిపాది పనిచేసినా మగ్గం బతుకు ఆకలిని తీర్చలేకపోవడం, సర్కారీ దవాఖానాలో వైద్యం సరిగ్గా దొరక్క, ఇంకా చెప్పాలంటే చికిత్స నిరాకరించడంతో చనిపోయిన గర్భిణీ కూతురు గురించి చెప్పిండు. ‘‘నూలుకట్టలు ఎప్పుడైతే తడిసిపోయాయో అప్పుడే తన బ్రతుకు చీకిపోయింది. మగ్గం ఆడటం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే తన కాళ్ళూ చేతులూ పడిపోయాయి. రాట్నం తిరగడం ఎప్పుడైతే మానివేసిందో అప్పుడే తన జీవిత చక్రం ఆగిపోయింది. టకటకలాడే ఆసు ఎప్పుడైతే నిశ్చలనమైందో అప్పుడే తనలోని చైతన్యం మాయమైంది. ఇక ఇంతకన్నా మరణం అంటూ వేరే ఏముంటుంది’’ అని చంద్రం గోసను చిత్రించిండు. (అన్ని కథల్లోనూ  గ్రౌండ్‌ వర్క్‌ చేసి పదాలను ఉపయోగించిండు. అయితే ఇక్కడ ఆసు బదు నాడె అనే పదం వాడాల్సింది) పాణం తీసుకున్న తీరుని వివరించిండు. వీటికి భిన్నమైన కథ ‘అమ్మానన్ను చంపేసేయ్‌’. ఇందులో స్త్రీ వ్యదార్థ జీవితాలను, పసిపాపనుంచి ముసలి వాళ్ల వరకూ రోజూ అత్యాచారాలకు గురవుతున్న తీరుని గుండె తడయ్యేలా చెప్పిండు. దిమాక్‌ కన్నా ఎక్కువగా ‘దిల్‌’తోటి ఆలోచించిండు కాబట్టే ఇవి పాఠకుడి గుండెల్ని పిండేస్తయి. ‘అమ్మా నన్ను చంపేసెయ్‌’ కథలో నిర్భయ, ఆయేషా, రమీజాబీలను ప్రస్తావించిండు. వివిధ దేశాల్లో స్త్రీలు ఇంటా బయటా ఎట్లా లైంగిక హింసకు గురవుతుండ్రో రాసిండు. అయితే ఇందులో పాజిటివ్‌ అంశమేంటంటే స్త్రీలపైన ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ‘‘ఏది ఏమైనా.. నా చిట్టి తల్లీ..! నిన్ను నేను చంపుకోను… అవసరమైతే మీ నాన్నను.. బామ్మను.. తాతయ్యను.. బాబాయిలను.. అత్తమ్మను.. యీ లోకాన్నైనా ఎదిరించి… నా ప్రాణంలోని ప్రాణమా! నిన్ను బతికించుకుంటాను.. నిన్ను చంపుకోలేను.. నో..నో..నో..’’ అని కరుణతో కరాఖండిగా చెప్పిస్తాడు. చావు కన్నా పాణం విలువ ఎక్కువ అని తేల్చి చెప్పిండు. కథలో భాగంగా చాలా సంగతులు చెప్పుకొచ్చిండు. ఇవన్నీ ఇటీవల జరిగినప్పటికీ సాహిత్యంలో చోటు చేసుకోలేదు. సంఘటనలు సాహిత్యంలో చోటు చేసుకున్నప్పుడే వాటి చారిత్రక విలువ ఇనుమడిస్తది. నోయిడాలో అన్నెం పున్నెం ఎరుగని అమ్మాయి కళేబరాలు, యాసిడ్‌ దాడులు, కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు, ఆఖరికి అంధబాలికపై అత్యాచారాలు జరుగుతున్న తీరుని చెప్పిండు. ఇండ్లల్లో, స్కూళ్ళల్ల్లో, కాలేజిల్లో అమ్మాయిలకు ఎక్కడా భద్రత లేదంటూ, ఆయేషాను ఇబ్రహీంపట్నంలో ఎంత కిరాతకంగా హతమార్చి అనుభవించింది రాసిండు.
ఇక చావుల విషయానికి వస్తే స్త్రీ దృక్కోణంలో దగ్ధహృదయం కథలో  ప్రభుత్వాసుపత్రిలో అవినీతి నిండుగర్భిణిని ఎట్లా పొట్టన పెట్టుకుందో చెప్పిండు. మారుమూల పల్లెల్లో వైద్యసదుపాయం లేని కారణంగా ప్రజలు పడుతున్న ముఖ్యంగా రెక్కాడితేగాని డొక్కాడని రైతు, కూలీ జిందగీని చిత్రించిండు. చావు వాళ్ళ జీవితంలో ఎట్లా భాగమైనాయో రాసిండు. బోర్ల నీళ్ళు సరిగ్గ అందక, కరెంటు కోతకు ఎండిన పంటకు మంట పెట్టిన రైతు ధర్మయ్య గురించీ రాసిండు. ఇక్కడ గర్భిణిని, పొట్టకొచ్చి ఎండిపోతున్న పంటను పోలుస్తూ మనస్తాపానికి గురైన రైతు వ్యథను చిత్రించిండు. తీజ్‌ కథలో సొంత అన్ననే వదినను వశబరుచుకోవడానికి హతమార్చిన లంబాడీ మంగీలాల్‌ దురాగతాన్ని చెప్పిండు. లంబాడీ ఆచార వ్యవహారాలను, వారి భాషను, ఆ స్త్రీ హృదయాలను ఆవిష్కరించిండు. ఎడారి బతుకుల్లో గల్ఫ్‌కుపోయిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో, ఎలాంటి అత్యాచారాలకు గురవుతున్నారో, ఎవరెవరి మోసాలకు గురవుతున్నారో చెప్పిండు.
చావుల్లో కూడా భిన్నమైన కథ ‘క్షతగాత్రుడు’. స్కూలు చదువు రాకున్నా, నల్లగా ఉన్నా శ్రావ్యమైన గొంతుతో, కంఠస్థమైన భాగోత పద్యాలతో అందరి మన్ననలందుకున్న ‘కర్రోడి’ హృదయవిదారకమైన జీవితాన్ని చెప్పిండు. ఇందులో బయటికి మాత్రం స్వగతంలో కథ చెబుతున్న వ్యక్తే హీరోగా కనిపించినప్పటికీ నిజమైన కథానాయకుడు అభిమానంతో, ప్రాణత్యాగం చేసిన కర్రోడే గొప్ప.
‘పద్మ లేశిపోయింది’ కథ సరోగసీ అనే ఆధునిక అంశాన్ని తెరమీదికి తెచ్చింది. పేదరికం, దుబాయి పోయిన ప్లంబర్‌ భర్త, పిల్లలకు కనీస వైద్యసదుపాయం అందించలేని దయనీయమైన స్థితి పద్మని సరోగసీకి ఎలా ఒప్పుకునేలా చేసిందో రాసిండు. అట్లనే సరోగసీకి దాదాపు మూడు లక్షలు అడ్వాన్స్‌గా ముట్టజెప్పిన తీరు, ఆ డబ్బుని తనను కనీసం ఇంట్లకు కూడా రానివ్వని అత్తమామలకు అందేలా కిటికిలోంచి పడేయడాన్ని, దాన్ని అత్త కాలబెట్టానడం, మామ వాడుకోవాలని చూడడాన్ని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా చిత్రించిండు.
మూడుతరాలు కథలో మాదిగోళ్ళ పనిముట్లన్నీ రికార్డు చేసిండు. అంతేగాదు తరాలు మారిన తలరాతలు మారని మాదిగోళ్ళ జీవితాలను హైదరాబాద్‌ వలసొచ్చినా గ్లోబలైజేషన్‌ మూలంగా ఎదుగూబొదుగూ లేని సంసారాన్ని చిత్రికగట్టిండు.
గుండెను తడి చేసుకొని దిలావర్‌ తన కథల్ని రాసిండు. కండ్ల్ల నీళ్ళు నింపుకొని చదువుకునేలా రాసిండు. చావులు, హత్యలు, ఆత్మహత్యలు ఏది రాసినా వాళ్ళ దుఃఖాన్ని ఫీలయి రాసిండు. దేనికదే ఇగ ఇదే ఆఖరు చావు కావాలని ఆరాట పడ్డడు. దిలావర్‌ పూర్తి కాన్షియస్‌గా రాయకపోయినా దూదేకుల జీవితాన్ని చిత్రించిన కథలు కూడా ఇందులో ఉన్నాయి. అందులో చంద్రుడి గియ్యని బొమ్మలు ఒక బుక్కా ఫకీరు ఊరి నుంచి వలసొచ్చి నగరంలో ఇగ ఇంతకన్నా పోయేదేమి లేని జీవితాన్ని, వెన్నెల ఆస్వాదాన్ని, ఆ వెన్నెల అందరికీ ఒకే తీరుగ వెలుగునివ్వడాన్ని కవిత్వ రీతిలో కథ అల్లిండు. ఇందులోని భాష  తెలుగు-ఉర్దూ మిశ్రమాలతో పక్కా హైదరాబాదీ యాసను పట్టిచ్చింది. ఈ పుస్తకంలోని కథలన్నీ ఖమ్మం జిల్లా నానుడులు, సామెతలతో అలంకరించబడ్డాయి. అంతేగాదు జరీన కథలో బురఖాకు తావులేని, కూలీ బతుకును, రోజు రోజుకూ దిగజారుతున్న ముస్లిం/ దూదేకుల స్త్రీల జీవితాలను, లైంగిక దోపిడీని, భర్త, కొడుకూ ఇద్దరూ గుట్కాకు, తాగుడుకు బానిసలై చనిపోవడాన్ని, బతికుండీ శవంలాగా మారిన తాగుబోతు తండ్రినీ ఇందులో చిత్రించిండు.
అంతిమంగా ఇందులోని ఒకటి రెండు మినహా మిగతా అన్ని కథలూ కింది కులాల వారి ఫెయ్యిూర్‌ స్టోరీలను రికార్డు చేసింది. కనీసం తినడానికి తిండి దొరకని స్థితిలో ఒక పద్మశాలి చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని ‘ఉరితాళ్ళు’ కథలో, మరో శాకుంతం, తీజ్‌ కథల్లో లంబాడీ స్త్రీ మోసాలకు, లైంగిక దోపిడీకి, మైదాన ప్రాంతం వారి చేతిలో ఆటవస్తువుగా మారిన తీరుని చెప్పిండు. పద్మ లేశిపోయింది ఒక ప్లంబర్‌ దుబాయి పోయి సచ్చిండో బతికుండో తెలియని స్థితి. ఎడారి బతుకుల్లో కూడా బహుజనుల జీవితాలే రికార్డయ్యాయి. నగ్నసత్యం, దగ్దహృదయం, శవాలు కాస్తున్న చెట్లు, క్షతగాత్రుడులో బహుజన రైతు, కళాకారుడి చావుల్ని చిత్రించిండు. మూడు తరాలు పూర్తిగా మాదిగోళ్ళ కథ. అట్లనే జరీన, చంద్రుడు గియ్యని బొమ్మలు దూదేకుల పేదరికాన్ని పట్టిచ్చే కళాఖండాలు. జ్ఞాపకాల తెరలను చిన్నప్పటి బతుకును మృగణ, నీ పెద్దోడొచ్చిండమ్మా కథల్లో చెప్పిండు.
ఒక ఉపాధ్యాయుడు జీతంతో సంబంధం లేకుండా, అవిశ్రాంతంగా ఐదు దశాబ్దాలు సాహిత్యమే జీవితంగా గడపడమనేది అబ్బుర పరిచే విషయం. ముఖ్యంగా టీచర్లంతా జీతం రాగానే చిట్టీలు, భవిష్యత్తావసరాలు అని పొదుపు చేస్తూ ఉంటారు. అయితే దిలావర్‌ 1974 నుంచి పుస్తకాలు వేయడమే గాకుండా, ఎక్కడ సాహితీ సమావేశం జరిగినా వెళ్ళిండు. ఏ సాహితీవేత్త వచ్చినా తన ఇంట్లో ఇంత జాగా ఇచ్చిండు.  పరిశోధన, సృజనాత్మక రచనా రెండు భిన్నమైన అంశాలు. అయితే ఈ రెండిరటిని సమన్వయం చేసి నడిపించిన మార్గదర్శి దిలావర్‌. సాహిత్యం తనతోనే ఆగి పోకుండా తర్వాతి తరానికి షాజహానా, షంషాద్‌ రూపంలో అందించిన దిలావర్‌కు అభినందనలు.
*

And, life goes on…!

abbas1

And Life Goes on …

ఈ నిజాన్నే, ఈ ప్రకృతి సూత్రాన్నే అనుసరిస్తూ గౌరవిస్తూ సినిమాలు తీశాడు అబ్బాస్ కియరోస్తమీ.

కియరోస్తమీ టెహరాన్ లో 1940 లో పుట్టాడు. సత్యజిత్ రాయ్ లాగే గీతల బొమ్మలు వేశాడు.  ఫోటోగ్రఫీ,  గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేశాడు. పర్షియన్ కవిత్వం చదువుకుని సున్నితత్వాన్ని పెంచుకుని చూపుని విశాలం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసి అకిరా కురసోవా లాంటి మహామహుల్ని ఆకట్టుకున్నాడు.  కియరోస్తమీ సినిమాలు చూస్తూ ఆ ప్రపంచంలో గడిపిన కాసేపూ తనలో క్షాళన జరుగుతుందంటాడు మార్టిన్ స్కోర్సేస్సీ. ఆయన అందించే  కళాత్మక స్ఫూర్తి ప్రపంచాన్ని ఒక కొత్త తాజా చూపుతో ఆశగా చూసేలా చేస్తుందంటాడు స్కోర్సేస్సీ.

తను పుట్టిన నేలమీద ఆడుకునే పిల్లలనీ, వాళ్ళకి సుద్దులు నేర్పే పెద్దలనీ, పనిపాటలు చేసుకునేవాళ్ళనీ అలవోకగా పలకరిస్తూ అతిసాధారణంగా ఒక డాక్యుమెంటరీలా సినిమాని తీసుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తుంది కియరోస్తమీ స్టైల్. కానీ ఆయన సినిమాని చూస్తూ ఉన్న కొద్దీ అందులో ఇంకేదో కూడా ఉందనే విషయం తట్టకుండా పోదు. కియరోస్తమీ సినిమాల్లో మలుపులు తిరిగే కథలుండవు గానీ మలుపుల దారుల్లో, గోధుమరంగు పొలాలమధ్య, మట్టిగోడలమధ్య తిరుగుతూ దేనికోసమో అన్వేషించే మనుషులుంటారు. ఏ బుజ్జి స్నేహితుడి హోంవర్క్ పుస్తకాన్ని తిరిగివ్వటానికో తిరిగే పిల్లలుంటారు.  ఏదో పనిమీద ఎవరినో కలవటానికో, లేదా సింపుల్ గా చచ్చిపోవడానికో ప్రయత్నిస్తూ తిరిగే  పెద్దలూ ఉంటారు. ఏ పనులూ ఎవరి నలుగుళ్ళూ  ఎలావున్నా .. life goes on..

కియరోస్తమీ డాక్యుమెంటరీకి, ఫీచర్ ఫిల్మ్ కీ మధ్యస్తంగా ఉండే పద్ధతిని పట్టుకున్నాడు. కామెరా ఏంగిల్స్ లో సంప్రదాయ పద్ధతులని వదిలేశాడు. దానితోబాటే హంగులని కూడా వదిలేశాడు. పదేపదే  అలికినాక నున్నగా తయారైనట్టున్న చిన్నచిన్న అందమైన మట్టి ఇళ్ళలో, బ్లాక్ టీ కప్పుల్లో, బురఖాలేసుకుని పన్లు చేసుకుంటూ తీరిగ్గా పిల్లల్ని సాకుతూ తిరిగే ఆడవాళ్ళలో, హుక్కాలు పీల్చే మగాళ్ళలో, ఎక్కడో ఉన్న బడికి చేరటానికో లేక అమ్మ పురమాయించే చిన్నచిన్నపనులమీదో పరుగెత్తే మగపిల్లల్లో.. ఇరానీవాళ్ళ బతుకుచిత్రాన్ని మనకి చూపిస్తాడు. సంగీతాన్ని పెద్దగా వాడడు గానీ డాక్యుమెంటరీల్లోలాగా తన సినిమాల్లో మాటలెక్కువ. నిశ్శబ్దంగా ఉండే క్షణాలు తక్కువ.

ప్రతి  సినిమా ఒక ప్రయాణం. ఆయన చూపించే ల్యాండ్ స్కేప్ మనోహరమూ కాదు. అలాగని సాధారణమూ కాదు. అదెలా వుందో అలాగే ఉంటుంది.  కానీ కొండల మలుపుల్లో ఓ క్లాసిక్ ‘Z’ కాంపోజిషన్ లో అమరిన పసుప్పచ్చని గోధుమ పంటల సౌందర్యం, ఎక్కడో ఓ మనిషి మెల్లిగా వల్లించే  పర్షియన్  కవిత్వం, దుమ్ము రేపుకుంటూ పోయే కారు స్ఫురింపజేసే అధునాతనత్వం, కొండల్లోని ఆదమరుపుతనాన్ని చెదుర్చుతూ డొక్కు బైక్ చేసే డబడబ శబ్దం, విసిరేసినట్టు అక్కడోటీ ఇక్కడోటీ ఉన్న గుబురుచెట్లమధ్య దాక్కున్న జామెట్రీని వెదికి పట్టుకునే కామెరా ఏంగిల్..  ఇవి దర్శకుడిగా ఆయన సంతకాన్ని పట్టి చూపిస్తాయి. సాధారణంగా కనిపించే ఆ సంతకంలోని అసాధారణ కోణాలని మనకి చేతనైనట్టు మనల్ని వెదుక్కోమని వదిలేస్తాడు.  ఏదో నెమ్మదైన డాక్యుమెంటరీ సినిమాలా ఉంది కదాని కళ్ళప్పగించి చూడ్డం కాదు. కియరోస్తమీ సినిమాకి మెదడు వాడాల్సిందే.

***

abbas2

చావనేది  తప్పనిదీ బ్రతుకు నిరంతరమైనదీనూ…

ఈ సాధారణమైన నిజాన్ని కథల్లో కవితల్లో సినిమాల్లో ఎంతో మెలోడ్రామానూ ఆశనూ కరుణ భీభత్స రసాలనూ  జోడించి చెప్పొచ్చు. ఉన్నతస్థాయి కళను సృష్టించటంలో ఇంతటి విస్తృతి ఉన్న వస్తువు ఇంకోటి లేదు. ఇరాన్ లో వచ్చిన పెద్ద భూకంపంలో తను చూసిన మృత్యుతాండవం కియరోస్తమీని చాలా కదిలించిందట.  అలాంటి అసాధారణమైన పరిస్థితుల్లో చావుమీద బ్రతుకు చేసే పోరాటాన్ని చాలా నాటకీయంగా తీయవచ్చు. కానీ కియరోస్తమీ Minimalist.. ఉత్పాతాల్లోంచి కాకుండా  రోజువారీ జీవితంలోనుంచీ  చావుబతుకులకి సంబంధించిన లోతైన ప్రశ్నలను కొంత ఆధునికతతో, మరికొంత ఇరానియన్ సంస్కృతితో కలుపుతూ సంధించి వదిలేస్తాడు.

కియరోస్తమీ తీసిన సినిమాల్లో రెండు ముఖ్యమైన సినిమాల గురించి…

కాన్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారం Palme d’or సాధించిన కియరోస్తమీ సినిమా “Taste of Cherry”.

‘బదీ’ ఆత్మహత్య చేసుకోవాలని కొండల్లోకి కార్లో బయలుదేరతాడు. టెహరాన్ నగరం దాటి ఒకచోట తనను పూడ్చటం కోసం గొయ్యి తవ్వి సిద్ధం చేసుకుంటాడు. అక్కడికి వెళ్లి నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనీ, ఆ తరువాత తనని ఎవరైనా పూడ్చిపెట్టాలనీ, మర్నాడు పొద్దునే వచ్చి చూసి ఒకవేళ తను చావకపోతే తనను తిరిగి ఇంటికి తీసుకు రావాలనీ  అతని కోరిక. ఆ ప్రాంతానికి కార్లో వెళ్తూ దారిలో కనబడిన వాళ్ళని ఆపి తనకు సాయం చెయ్యమని కోరతాడు. ఆ పని చేస్తే చాలా పెద్దమొత్తం ఇస్తానని చెప్తాడు.

అతనికి తారసపడిన ఒక సైనికుడు, ఒక మతపెద్ద అతని కోరిక విని ఆశ్చర్యపోయి ఆ పని చెయ్యటానికి నిరాకరిస్తారు.  చివరికి బాఘేరీ అనే ఒక taxidermist అతని మాటలను జాగ్రత్తగా విని,  ‘బదీ’ ని ఆత్మహత్యా ప్రయత్నం నుండి తప్పించాలని చాలా ప్రయత్నిస్తాడు. ఆత్మహత్య చేసుకుందామని అనిపించటం చాలా సాధారణమని చెప్తాడు. తనకీ ఓసారి జీవితాన్ని భరించలేని పరిస్థితి వచ్చి ఉరేసుకుని చనిపోదామని అనుకున్నాడట. తాడు బిగించడానికి మల్బరీచెట్టు ఎక్కాడట.  అంతలోనే చేతికి మెత్తగా తగిలిన మల్బరీ పళ్ళు  కోసుకు తిన్నాడట. ఆ రుచిని అందరికీ పంచకుండా ఉండలేక పోయానని చెప్తాడు.  మల్బరీ పండు తనను  ఆత్మహత్యాప్రయత్నం నుండి తప్పించిందని చెప్తాడు. అంతవరకూ తామిద్దరూ కార్లో తిరిగిన దుమ్ము క్వారీలను దాటించి టెహరాన్ కి వెళ్ళే  చక్కని చెట్లు నిండిన వేరేదారిలోకి కారుని మళ్ళిస్తాడు బాఘేరీ.  పచ్చగా ఉండే బతికేదారిని  వెదుక్కోవచ్చునని మెల్లగా సూచిస్తాడు. జీవితపు చెర్రీ పండు రుచిని కాదనవద్దని హితవు చెప్తాడు.

అన్నీ విన్నాక కూడా అలసట నిండిన మొహంతో బదీ అతన్ని తన కోరిక తీర్చమంటాడు. చేసేదేంలేక అతను సరేనని తనుండే చోట కారుదిగి వెళ్ళిపోతాడు. ‘బదీ’ లో చిన్న ఊగులాట. చావాలన్న నిరాశలోంచి చిన్నగా మొలకెత్తిన జీవితేచ్ఛ. పరుగెత్తుకుంటూ బాఘేరీ ఉండే చోటికి వెళ్లి మర్నాడు పొద్దున్న తప్పనిసరిగా వచ్చి చూసి తను బతికుంటే ఇంటికి తీసుకురమ్మని మళ్ళీ చెప్తాడు. మొదట్నుంచీ చివరిదాకా బదీ అసలు ఎందుకు చావాలని అనుకుంటున్నాడో మనకీ తెలియదు. తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించిన బాఘేరీకీ తెలియదు. ఒక స్థాయిలో తెలియనక్కర్లేదని మనకీ అనిపించేస్తుంది.

సర్దుబాటు, సంతృప్తి, ఆశావాదాలవైపు బాఘేరీ ఉంటే, తీవ్ర నిరాశ, అలసట, చావాలన్న బలమైన కోరికతో బదీ నలుగుతూ ఉంటాడు. కలవని ఈ రెండు పట్టాలమీద నడిచే బండిలా వీళ్ళ ప్రయాణం… రకరకాల వైరుధ్యాల మధ్యే మనుషుల బతుకులు తెల్లారుతుంటాయి. వీటితో ఏ సంబంధం లేకుండా ప్రతిరోజూ తెల్లవారుతూనే ఉంటుంది. ఈ స్పృహని అందిస్తూ ఈ సినిమా సాగుతుంది.

బదీ బ్రతుకుతాడా, చచ్చిపోతాడా అనే ఆత్రుత పెంచి, ఆఖరున  ఒక్కసారిగా ప్రేక్షకులని  సినిమానుంచి బైటకి లాగి నేలమీద నిల్చోబెడతాడు కియరోస్తమీ. And life goes on…

 

“The wind will carry us” — కియరోస్తమీ మనచేత చేయించే మరో ప్రయాణం…  బెహజాద్ మరో ముగ్గురితో కలిసి ఓ మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ మంచంమీదున్న చావ సిద్ధంగా ఉన్న ఓ ముసలమ్మ. ఆవిడ ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ ఊరివాళ్ళు చెయ్యబోయే కర్మకాండల తంతులను రికార్డు చేయటం ఈ నాగరికుల ఉద్దేశ్యం. కానీ ఊళ్ళోవాళ్లకి ఆ విషయం చెప్పకుండా తాము ఇంజనీర్లమని చెప్పుకుని ఊళ్ళో ఉండిపోతారు. ముసలమ్మ ఓ రోజు బాగుండి మరోరోజు బాగుండకా అలాగే గడిపేస్తూ ఉంటుంది. జీప్ లో ఎప్పుడూ పరుగులు తీస్తుండే బెహజాద్ పల్లెటూరి నత్త నడకలకూ  ఊళ్ళోవాళ్ళతో సంభాషించటానికీ  నెమ్మదిగా అలవాటు పడతాడు.

సిటీ నుంచి వొచ్చే ఫోన్ కాల్ కి సిగ్నల్ అందక, మొబైల్ ఫోన్లో  మాట్లాడ్డం కోసం జీప్ లో ఎత్తైన ప్రదేశానికి పరుగెడుతూ ఉంటాడు. ఎదురు చూస్తున్న ముసలమ్మ చావు ఎంతకీ రాదు. రోజూ తవ్వకం పని చేసే పరిచయస్తుడైన ఆ ఊరిమనిషి చావు అంచుకి వెళ్లి వస్తాడు. మొత్తానికి ముసలమ్మ చనిపోతుంది గానీ బెహజాద్ లో చావు బ్రతుకుల మధ్య పెద్దగా తేడా చూడని స్థితప్రజ్ఞత వచ్చి చేరుతుంది. చావుబతుకులను కలబోసుకుంటూ జీవితం ప్రవహిస్తూ ఉంటుంది. And life goes on…

కథ ఏమీలేని ఈ సినిమాని ప్రవహింపజేయటం అసాధారణమైన ఫీట్.  గట్ల మధ్య ఒదిగి పారే నిండైన నదిలా ఉంటుంది ఈ సినిమా.  ఊరికీ నగరానికీ,  బతుక్కీ చావుకీ, సంప్రదాయానికీ ఆధునికతకీ  మధ్య ఉన్న తేడా  ఎంత పెద్దగా కనిపిస్తుందో అంత చిన్నదనే భావన అలుముకుంటుంది.  ఈ వైరుధ్యాల లాగే తేలిగ్గా కనిపించే సంక్లిష్టమైన కథనం కియరోస్తమీ స్టైల్.

 

ఈ రెండు సినిమాల్లో కామెరాను ముఖ్యపాత్ర వరకే చాలావరకూ పరిమితం చేస్తాడు. Protagonist మాట్లాడుతూ ఉంటాడు. అవతల నుండి వొచ్చే సమాధానం ముఖ్యం. ఇచ్చేవాళ్ళు ఎవరన్నది  అప్రధానం.  Protagonist చేస్తున్న అన్వేషణ ముఖ్యం. వెదుకుతున్న దారుల్లో, దొరుకుతున్న సమాధానాలలో ఏముందో మనమే ఊహించుకోవాలి.  ఇరానియన్ న్యూవేవ్ సినిమాలో కిరోస్తమీ కనిపెట్టిన ఈ భాష సగం దృశ్యాలను మన ఊహలకే వదిలేస్తుంది. ఆయన  చూపించే దృశ్యాలతో   మన ఊహల్లోకి వచ్చే దృశ్యాలనూ మనుషులనూ కలిపి చూడగలిగితే కియరోస్తమీ సినిమా విశాలమైన గడ్డిమైదానాల్లో  విహారంలా ఉంటుంది.  అక్కడ సింహాలూ జిరాఫ్ లూ తారసపడవు.  రంగుల గడ్డిపూలూ ఆరుద్రపురుగుల్లాంటి మెత్తటి ప్రాణులే ఎదురౌతాయి. ఆ సూక్ష్మదర్శనం   ఇచ్చే అనుభూతులను అందుకుంటూ పోవటమే.

‘The wind will carry us’ లో బెహజాద్ పాల కోసం ఒక ఇంటికి వెళ్తాడు. చీకటిగా ఉన్న కొట్టంలో ఉన్న పశువు. అస్పష్టంగా ఆ చీకట్లోనే లాంతరు పెట్టుకుని పాలు పిండే అమ్మాయి. పాలపొదుగు, అమ్మాయి చేతివేళ్లు, ఆమె దుస్తులు.. మనకు కనబడేవి ఇంతే.  బెహజాద్ గొంతు మాత్రమే వినిపిస్తుంది. అతను ఆమెకు ఆ చీకట్లో ఇరానీ కవయిత్రి ‘ఫారో ఫరోక్ జాద్’ రాసిన కవిత వినిపిస్తాడు. కియరోస్తమీ దృశ్యంలో సాధించిన సింప్లిసిటీ కి మచ్చుతునక ఈ సీన్.

కియరోస్తమీకి కవిత్వం ఇష్టం. దృశ్యాలను పొదుపు చేసి కవిత్వంమీదే మన దృష్టిని నిలపటం ఇష్టం. కవితతో దృశ్యాన్ని జోడించటం ఇష్టం. దారులిష్టం. ప్రకృతిలో నిశ్శబ్దంగా లీనం కావటం ఇష్టం.

abbas3

(పైవన్నీ కియరోస్తమీ తీసిన ఫోటోలు)

 

“అవసరాల అన్వేషణలో మనిషి ప్రయాణానికి అభివ్యక్తి  ‘దారి ’.

శాంతిలేని ఆత్మకు వ్యాఖ్యానందారి

ఆత్మను ఓ చోటునుండి మరో చోటికి  మోసుకుపోయే శరీరం ఓ గాడిద.

ఈ గాడిదను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా సరే ప్రయాణాన్ని చివరిదాకా సాగించలేరు.

అయితేమాత్రం ?   వాళ్ళు లేకున్నాగానీ  మనిషి ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది.

మన దారులూ మనలాంటివే.

 

ఒకోసారి రాళ్ళూ రప్పలతో నిండి ఉంటాయి.  ఒకోసారి చదును చేసుంటాయి.

ఒకోసారి మెలికలు తిరుగుతాయి. ఒకోసారి తిన్నగా ఉంటాయి.

భూమ్మీద మనం గీసిన దారులు గీరుల్లా ఉంటాయి.

మనలోనూ వేరే  దారులుంటాయి.

 

విషాదపు దారులు, సంతోషపు దారులు, ప్రేమ దారులు, చింతనల దారులు,

పారిపోయే దారులు, ద్వేషపు దారులు, నాశనం చేసే దారులు,

ఎక్కడికీ చేరని దారులు, నిలవనీటి యేరులా ముగింపులేని దారులు…

తప్పించుకు తిరిగే ప్రదేశాల గురించీ, వెళ్తున్న ప్రదేశాల గురించీ మనిషి చేస్తున్న ఒప్పుకోలుదారి’.

 

జీవితమేదారి’. మనిషేదారి’.

ఎంత చిన్నదైనా సరే మనిషి దారి అస్తిత్వపు పుటమీదికి ప్రవహిస్తుంది.

ఒకోసారి ముగింపు ఎరగకుండా

ఒకోసారి విజయవంతంగా..  “                                

 

   —– అబ్బాస్ కియరోస్తమీ.

 

కియరోస్తమీ దారి విజయవంతంగా ప్రవహించి 2016 జూలై నాలుగున గమ్యాన్ని చేరుకుంది.

And Life goes on…

*

 

 

 

  వేల  నక్షత్రాలు నడిచిన గది!

eleanor-farjeon-4

Eleanor Farjeon ప్రధానంగా కవయిత్రి. తర్వాతి రోజుల్లో  బాలసాహిత్యాన్ని సృష్టించారు. సంపూర్ణమైన జీవితాన్ని  పువ్వులతోటీ  మనుషులతోటీ పుస్తకాల తోటీ ప్రేమగా నింపుకుని ఆఘ్రాణించినవారు.

 చిన్నతనం, పుస్తకాల మీది మోహం – రెండూ కలిసి ఉండిపోయాయి నాకు. అర్థ శతాబ్దపు వయసు పూర్తయిన ఈ రోజుకీ ‘ పిల్లల కోసం ‘ రాసిన పుస్తకాలూ romance లూ fairy tales  – బలం గా లాగుతూంటాయి. Ms. Farjeon లో నేనొక  kindred spirit ని కనుగొన్నాను. ఆమె తన పుస్తకానికి తానే రాసుకున్న పరిచయం ఇది. స్నేహితులతో పంచుకోవాలని – ఇలా, ఈ సారికి.

*****

చిన్నప్పుడు మా ఇంట్లో మాకు ‘ బుల్లి పుస్తకాల గది ‘ ఉండేది. అసలైతే ఇంట్లో ప్రతీ గదీ పుస్తకాలదే – మేడ మీద మా పిల్లల గదుల నిండా పుస్తకాలే. కిందని నాన్న చదువుల గది లోనూ అవే. భోజనాల గది గోడల పొడవునా పుస్తకాలే , అవి పొంగి పొర్లి అమ్మ కూర్చుని కుట్టుపని చేసుకునే గదిలోకీ, పడక గదుల్లోకీ ప్రవహిస్తూనే ఉండేవి. దుస్తులు లేకుండా బ్రతకటం సాధ్యమేమో – పుస్తకాలు లేకుండానా ? ఆహారం ఎంత సహజమైన అవసరమో , చదవటమూ అంతే.

మా  బుల్లి పుస్తకాల గది – యథేచ్ఛగా పెరిగేందుకు వదిలేసిన తోట లాంటిది. పువ్వులూ పిచ్చి మొక్కలూ అన్నీ కలగలసిపోయి ఉండేలాగా. అక్కడ ఒక ఎంపిక గానీ పద్ధతి గానీ ఏమీ లేవు. తక్కిన గదులన్నిటినీ శ్రద్ధగా తీర్చి దిద్ది అమర్చేవారు – ఇది  మటుకు ఒక నానా జాతి సమితికి మల్లే ఉండేది. ఎక్కడా ఇమడని, పట్టని – అల్లరి చిల్లరి పుస్తకాలూ ఆకతాయి వీ , టోకున తగ్గింపు ధరల్లో నాన్న కొనుక్కొచ్చి పడేసిన బంగీ లూ- ఇంకా ఏమిటేమిటో. చాలా చెత్త, మరింకా చాలా సంపద . దేశ దిమ్మరులూ మర్యాదస్తులూ కులీనులూ అందరూ ఒక్కచోటే.   ఏ పుస్తకాన్ని ముట్టుకుని తిరగేసేందుకైనా మా ఇంట్లో పిల్లలకి అనుమతి ఉండేది – ఇక తవ్విన కొద్దీ దొరుకుతుండే నిధులూ నిక్షేపాలూ – అంతు లేకుండా.

MythiliScaled

ఆ గది కిటికీ లు మూసి బిగించి ఉండేవి . గాజు అద్దాలలోంచి  పడుతుండే సూర్యకాంతి తడవకొక్క మారుమూలకి వెలుతురు ఇచ్చేది  . పేరుకు పోయి ఉన్న దుమ్ము బంగారపు తునకల్లాగా మిల మిల మనేది.   మంత్రపు గవాక్షాలు నాకు తెరుచుకున్నది అక్కడే – అప్పటివీ అక్కడివీ కాని కాలాల్లోకీ దేశాల్లోకీ వాటిలోంచి తొంగి చూశాను- వచనమూ కవిత్వమూ వాస్తవమూ అద్భుతమూ నిండి ఉన్న లోకాల్లోకి.

పాత కాలపు నాటకాలుండేవి, చరిత్ర గ్రంథాలుండేవి, ప్రాచీన కాల్పనిక గాథలు…’ నిరాధారపు ‘ విశ్వాసాలూ ఇతిహాసాలూ పుక్కిటి పురాణాలూ – సాహిత్యపు ఉత్కంఠ అంతా రాసులు గా నివసించేది.  నన్ను మోహ పెట్టిన  ‘ Florentine Nights’ , జడిపించిన  ‘The Tales of Hoffman  ‘ అక్కడ ఎదురు పడ్డాయి. ఇంకో పుస్తకం – దాని పేరు ‘The Amber Witch ‘ . మామూలు గా నేను చదువుకునే fairy tales  లో మంత్రగత్తె కీ ఇందులో witch కీ ఏమీ సంబంధం లేదు – చాలా రోజులపాటు ఆమె ని తలచుకుంటే ఒళ్ళు జలదరించేది.

అన్ని రకాల అక్షర  పదార్థాలతో   కిక్కిరిసిన అల్మైరాలు అవి – ఇరుకు ఇరుకుగా గోడల కి సగం ఎత్తు వరకూ. వాటి మీదని అడ్డదిడ్డంగా పేర్చిన కుప్పలు పై కప్పుని తాకుతుండేవి. నేల మీది దొంతరల పైకి ఎక్కి చూడాల్సి వచ్చేది , కిటికీ అంచుకి బోటు పెట్టినవి ముట్టుకుంటే మీద పడేవి. ఒక లావుపాటి బౌండ్ పుస్తకం ఆకర్షించేది, దాన్ని అందుకునేలోపున మరొక వింత కాలికి తగిలేది. ముందే అనుకుని వెతకబోయినా వేరేవే ఒళ్ళో వాలేవి. అక్కడ – ఆ బుల్లి గదిలోనే – ‘ పుస్తకం ‘ అని పిలవదగిన ప్రతిదాన్నీ చదవటం నేర్చాను –  Charles Lamb లాగా.

The Little Bookroom

నేలమీద కూలబడో బీరువాకి ఆనుకునో – మహా అసౌకర్యపు భంగిమలలో స్తంభించిపోయి,  మైమరచి చదువుకుంటూంటే-  ముక్కుల్లోకీ కళ్ళలోకీ దుమ్ము పోయి దురదలు పెట్టేవి . నిజం కన్నా ఎక్కువ నిజమనిపించే ఆ గంధర్వ ప్రపంచాల లోంచి దిగి వచ్చిన తర్వాత గానీ కాళ్ళూ చేతులూ పట్టేయటమూ గాలి అందని ఉక్కిరి బిక్కిరీ తెలిసేవి కావు. తరచూ వచ్చే గొంతు నొప్పులు ఆ దుమ్ము వల్లనేనేమో అని అనుకోబుద్ధేసేది కాదు.

చీపురో పాతబట్టో పట్టుకుని ఆ గదిలోకి ఏ నౌకరూ అడుగు పెట్టిందే లేదు.  అద్దాల మీదా నేల మీదా అది అతి ప్రాచీనమైన ధూళి. అదే లేక పోతే అసలది ఆ గదే కాదు . అది నక్షత్ర ధూళి, సువర్ణ ధూళి, వృక్షాల ధూళి, భూమి అడుగున ధూళి లోకి చేరిపోయే ధూళి[dust to dust ] , తిరిగి భూమి ఒడిలోంచి పుష్పం గా రత్నం గా విరిసే ధూళి, వెలిగే ధూళి. ఆ నిశ్శబ్దపు ధూళి ని అమెరికన్ కవయిత్రి Emily Dickinson వర్ణించారు –

” ఇది, ఈ శాంత  ధూళి – ఇది స్త్రీలూ పురుషులూ అబ్బాయిలూ అమ్మాయిలూ అందరూ.

ఇది నవ్వులు, సామర్థ్యం, నిట్టూర్పులు – అన్నీ. ”

ఇంగ్లీష్ కవయిత్రి –Viola Meynell , ‘ రహస్యంగా ప్రవేశించి  ముంగిట్లో కమ్ముకున్న ‘  ధూళిని శుభ్రం చేస్తూ చేస్తూ – ఒకింత ఆగి అంటారు ఇలా –

” ఈ ధూళి ని తుడిచేస్తూంటే – పువ్వులని తుడిచేస్తున్నా నేమో, చక్రవర్తులని తుడిచేస్తున్నా నేమో – ఆలయాలనూ కవులనూ నగరాలనూ…”

పుస్తకాల గదిలోంచి మంట పెడుతూన్న కళ్ళతో బయటికి వచ్చాక కూడా ఆ చిత్ర వర్ణాల ధూళి మనస్సులో నర్తిస్తుండేది. ఆ సాలెగూడుల వెండి దారాలు బుద్ధికి పట్టుకునే ఉండేవి. అందుకనే – ఎన్నో ఏళ్ళ తర్వాత , సొంతగా నేను రాయటం మొదలెడితే అది – కల్పనా వాస్తవమూ,  సత్యమూ స్వప్నమూ కలిసిపోయి తయారైందంటే ఏం ఆశ్చర్యం ఉందని ? ఒక దాన్నుంచి మరొకదాన్ని విడదీయటం నాకెప్పుడూ పూర్తిగా సాధ్యం కాలేదు – నా కథలలో.  మాయమైన ఆలయాలూ మహారాజులూ , అందగత్తెల గిరజాలూ పువ్వులూ, పిల్లల నవ్వులూ కావ్యకర్తల నిట్టూర్పులూ – వీరందరి దుమ్మునీ – ఏడుగురు అమ్మాయిలు ఏడేసి చీపురులు చేతబట్టి అర్థ శతాబ్దం పాటు చిమ్మినా నా లోపల అది నశించలేదు. అదృష్టవంతులూ కానివారూ అందరూ – ఏదో ఒక బుల్లి పుస్తకాల గదిలోకి చేరి ధూళి గా మణిగేవారే – ఎప్పుడో ఒక్క లిప్త పాటు , కాంతివంతమవుతారేమో – ఏమో !

*

సర్కస్ కాదు, యుద్ధం చేయాలి!

 

  

చిత్వాన్ – అతనొక కథలోని పాత్రే గానీ యిటీవల నన్ను చెప్పలేని కల్లోలానికీ వ్యాకులతకీ గురిచేసిన అత్యాధునిక యువకుడు. దాదాపు వొక సంవత్సర కాలంగా చాలా సార్లు అతను నన్ను నిద్రపోనివ్వ లేదు. ఏ పని చేస్తోన్నా అతను నా ఆలోచనల్లో తారాడుతూనే వున్నాడు. అతని జ్ఞాపకాలు తరచు నన్ను వెంటాడుతున్నాయి . బతుకు పట్ల చావు పట్ల అతని ఫిలాసఫీ నన్ను యేదో తెలీని యిబ్బందికి గురిచేస్తోంది. అతని అకాల మరణం నన్ను పదే పదే  వెంటాడుతోంది. ఇక తప్పించుకొని  పారిపోవడం నా వల్ల కావడం లేదు. ముఖాముఖి యెదుర్కోవడమే యిప్పుడు చేయాల్సింది.

‘యెందుకు జీవితాన్ని చేజేతులా అర్ధాంతరంగా ముగించుకొని చచ్చిపోయావు ?’ యెటువంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగా.

నా ప్రశ్నకి అతనేం తత్తరపడలేదు. నా వైపు నిశితంగా వొక క్షణకాలం చూసి – ‘నువ్వు మాత్రం చావక బతికున్నావా ?’ అని యెదురు ప్రశ్నించాడు. నేను నిరుత్తరుణ్ణయ్యా.

 ‘నాకు పువ్వుల సువాసనలు కావాలి. పులుల తో సావాసమూ కావాలి. రెండింటిలో ఏదో ఒకటే ఇస్తానంటే నేను పువ్వులనొదులుకుని పులుల దగ్గరకే వెళ్లిపోతాను. జీవితమంటే నాకిష్టమే. కానీ జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది. అందుకే నా ప్రాణాన్ని పట్టుకుని వేళ్లాడ్డం అంత ఇష్టం ఉండదు. ఇక చాలనుకున్నప్పుడు ఇక్కడ్నుంచి జంప్ అయిపోవడమే! పవర్ ఆఫ్ బటన్ నొక్కెయ్యడమే! అప్పటివరకూ అంతా నా ఇష్టానుసారమే!’

మనం మనకు నచ్చినట్టు బతకడం లేదని చిత్వాన్ ఆరోపణ. ప్రతిక్షణం అనేక విధాల పరాయీకరణకి లోనై బతికే బతుకు చావుతో సమానమని అతని నిర్ధారణ. అసంబద్ధ బంధాల్లో చిక్కుకొని మనల్ని మనం కోల్పోయి బతికే బతుకూ వొక బతుకేనా అని అతని ప్రశ్న. నిజమే. కానీ ‘జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది.’ అన్న అతని మాటల్ని అర్థం చేసుకోవాలనే తద్వారా అతణ్ణి అర్థం చేసుకోవాలనే నా ప్రయత్నం.

కానీ ‘అన్నింటికీ అర్థాలు వెతకడంలోనే మనిషి తనలోని మ్యాజిక్ ని కోల్పోయాడ’ నే చిత్వాన్ మాటలే మళ్ళీ అతణ్ణి అర్థం చేసుకోడానికి అడ్డుపడుతున్నాయి. అయినా అన్నిటికీ అర్థాలు వెతికే క్రమంలోనే మ్యాజిక్కో  థ్రిల్లో మరేదో వుందని నేను నమ్ముతాను కాబట్టి చిత్వాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నాన్ని నేను మానుకోలేను. చిత్వాన్ ని అర్థం చేసుకోవడమంటే సంక్లిష్టమైన సంక్షుభితమైన సమాజాన్నీ సమాజ చలనాన్నీ అర్థం చేసుకోవడమే. ఇవాళ్టి అత్యాధునిక సందర్భంలో నిర్దిష్ట సామూహిక ధ్యేయాల్లేని యువత  అంతరంగ సంచలనాన్ని  కొలిచే ప్రయత్నం చేయడమే.

ఇంతకీ యెవరీ చిత్వాన్ –  అంటే వెంకట్ సిద్ధారెడ్డి ‘సోల్ సర్కస్’ లోని (సారంగ – జూన్ 11, 2015 ; కథ లింక్ : ) పాత్ర అని వొక్క ముక్కలో చెప్పొచ్చు. కానీ అతణ్ణి అర్థం చేసుకోడానికి యెందుకంత తపన  అంటే మాత్రం అంత తేలిగ్గా చెప్పలేం. కారణం అతను కేవలం కథలో పాత్ర మాత్రమే కాదు అనిపించడం వల్ల కావొచ్చు. రక్త మాంసాలతో వెచ్చని వూపిరితో మన మధ్య జాజ్వల్యమానంగా వెలిగి ఆరిపోయిన మనలోని వ్యక్తే కథలోకి నడిచి వచ్చినట్లు అనిపించడం వల్ల కావొచ్చు. డబల్ పిహెచ్ డి తో తన తెలివి తేటలతో కొత్తతరానికి దారి చూపించగల మేధావికి  తన దారి తానే మూసుకొనే ఆలోచన కలగడంలోని అసంబద్ధత పట్ల అసహనం వల్ల కావొచ్చు. అతణ్ణి బతికించుకోలేని దుస్థితి పట్ల క్రోధంతో కావొచ్చు. మరొకర్ని అతని దారిలో నడవకుండా చేయాలంటే తోటి వ్యక్తులుగా మనమేం చేయాలి అన్న ప్రశ్న తొలవడం వల్ల కావొచ్చు…  యిలా  యెన్నో కారణాలు.

soul

గోపీచంద్ సీతారామారావో రావిశాస్త్రి సుబ్బయ్యో బుచ్చిబాబు దయానిధో కేశవరెడ్డి బక్కిరెడ్డో – యిలా  నవలల్లో పాత్రలు పాఠకుడి మనసు మీద బలంగా ముద్ర వేయడం సాహిత్య ప్రపంచంలో పదికాలాలు నిలబడటం సాధారణంగా జరుగుతుంది కానీ వొక యువ రచయిత రాసిన పది పేజీల కథలోని పాత్ర యింతలా గుర్తుంది అంటే యింతగా వెంటాడుతోంది అంటే కారణం ఆ పాత్రని నిర్మించడంలో లేదా ఆవిష్కరించడంలో అతను చూపిన నేర్పు వొకటే కాదు ;  చిత్వాన్ అతని జీవితంలో భాగం . అందుకే చిత్వాన్ చనిపోతే తన లోపల్లోపల ఏదో ఒక భాగం హఠాత్తుగా  తెలియని లోతుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిట్టు , అంత్యక్రియలు జరగాల్సింది ఒక్క చిత్వాన్ కే కాదు. తన లోపల్లోపల చనిపోయిన ఆ భాగానికి కూడా అని అతనికి అనిపించింది.

నిజానికి చిత్వాన్ రచయితకే కాదు మనకి కూడా లోపల్లోపల వొక భాగమే. అతనిలా మనమూ యే బంధనాల్లేని జీవితాన్నే ఆశిస్తాం . అతనిలా కట్టుబాట్లు లేని స్వేచ్ఛే  కోరుకుంటాం. ఇళ్ళూ వాకిళ్ళూ అర్థంలేని మమకారాలూ అన్నీ తెంచుకొని పోవడం బాగానే వుంటుంది కానీ చిత్వాన్ బుద్ధుడిలా క్షణిక వాది అయ్యాడు గానీ అన్వేషకుడు కాలేకపోయాడు. మానవకోటి దు:ఖానికి కారణం తెలుసుకోవాలనే ప్రయత్నంలో సిద్ధార్థుడు బుద్ధుడైన క్రమాన్ని అతను మర్చిపోయాడు. తనను తాను అన్వేషించుకొనే దారుల్ని వదులుకొన్నాడు. గుర్తు చేసుకొని సంతోషించే మధురమైన గతమూ ఆశావహమైన భవిష్యత్తూ లేకపోవడం వల్ల తానే క్షణికమని నమ్మిన వర్తమానాన్నీ అందు దాగిన దు:ఖాన్నీ యెదుర్కోలేక  మృత్యుద్వారాన్ని తట్టాడు. హంసలా ఆర్నెల్లు బతికితే చాలనుకొన్నాడు. కానీ మనుషులతో జీవించడానికి కావలసిన వనరుల్ని వెతకలేకపోయాడు , పంచలేకపోయాడు. జీవితాన్నే కాదు  ఆఖరికి ప్రేమనీ ప్రేమించినవాళ్ళనీ బంధనంగానే భావించాడు.

ప్రేమంటే ఏంటనుకున్నావు? ప్రేమే మరణం; ప్రేమించడమంటే అత్మహత్య చేసుకోవడం. ప్రేమలో అహం, అవాస్తవాలు మరణిస్తాయి. అని సిద్ధాంతీకరించాడు. ప్రేమలోనూ అతని ఆలోచనలు అసాధారణంగానే వుంటాయి. అతని ప్రేమలో గాఢత వుంది. నిజాయితీ వుంది. ప్రేమించినంతసేపూ తనను తాను మర్చిపోయాడు. బయటి ప్రపంచాన్ని వదిలేశాడు (బయటి ప్రపంచం గురించి అతనికెప్పుడూ పట్టలేదు – అది వేరే విషయం). అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మనసులోని ఫీలింగ్సన్నింటినీ సాధారణీకరించడం అతనికి  నచ్చదు. ఇన్నేళ్ల  జీవితాన్ని ఒక్క క్షణంలో కలిగిన  ఫీలింగ్ కి అంకితం చేయడంలో యేదో తేడా వున్నట్టు భావిస్తాడు. ప్రేమించడమంటే కోల్పోవడం అని అతని నమ్మకం.

నిన్ను నువ్వు కోల్పోకుండా కూడా యెదుటివారిని ప్రేమించవచ్చనీ  లేదా యెదుటివారిని ప్రేమించడంలో నిన్ను నువ్వు కోల్పోడంలో కూడా మాధుర్యం వుంటుందనీ భరోసానిచ్చే వొక వోదార్పు వాక్యం అతనికెవరూ యివ్వలేకపోయారు.

యే బంధనాల్నీ ఇష్టపడని అతని వ్యక్తిత్వమే ప్రేమకీ జీవితానికి కూడా కట్టిపడేయలేకపోయింది. అతని బాల్యం అతణ్ణి ప్రేమ పట్ల కూడా అవిశ్వాసిగా మార్చింది.

చిత్వాన్ అసలు పేరు కృష్ణమూర్తి. అతని మాటల్లోనే చెప్పాలంటే తండ్రి నెల్లూరికి చెందిన వొక డబ్బులబస్తా , వొక ‘రిచ్ బాస్టర్డ్’. వాడు వుద్యోగరీత్యా నేపాల్ వెళ్ళినపుడు అక్కడ ‘ఉంచుకున్న దాని కొడుకు’ చిత్వాన్. అందుకే అతణ్ణి బాబు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు. కానీ  ‘నేపాలీ వాడినైతే మాత్రం మీ బిల్డింగ్ లకు సెక్యూరిటీ గార్డ్ గా మిగిలిపోవాలనుకోలేదు’ అని కొంచెం వయసు రాగానే అమ్మ తరుపున పోరాడాడు. నాన్న అతణ్ణి డబ్బుల్తో కొనేద్దామనుకున్నాడు. కానీ చిత్వాన్ సమురాయ్. పోరాడాడు. నాన్న ఏ ఊరెళ్తే ఆ ఊర్లో.  చివరికి తండ్రి కాళ్ల బేరానికొచ్చాడు. తండ్రినొక  ఏటియం గా మలచుకొన్నాడు.

ఇది ఇలా చెయ్యకూడదంటే అదే చేస్తూ పోయాడు. పోరాడి తన జీవితాన్ని క్లైమ్ చేసుకున్నాడు.

బాబు పోవడంతో ఏటియం పర్మనెంట్ గా ఔట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది.

డబుల్ పిహెచ్ డి తో వుద్యోగం సంపాదించాడు. కానీ అంతా కొత్త. ఒక రోజు దుకాణం మూసేశాడు.  జీతాల జీవితం వొద్దు అనిపించింది. ఎక్కడెక్కడో తిరిగాడు.

రాబందులా జీవితాన్ని వెంటాడే పేదరికంలోనే పుట్టి పెరిగుంటే అన్నీ సాధారణంగానే అనిపించుండేవేమో! పేదరికం అంటే ఇలా ఉంటుందని తెలిసుంటే పస్తులుండి, రోజూ చస్తూనో, చస్తూ బతుకుతూనో, ఎలాగో బతికుండేవాడేమో.  కానీ ఈ పేదరికం అతనికి చాలా కొత్త.  ‘జీవితంలో ఇదో కొత్త అడ్వెంచర్ ఏమో అనుకుని ఎప్పట్లానే రైడ్ ఇట్ ఆర్ డై’  అని ప్రయత్నించాడు.  కానీ వల్ల కాలేదు.

ఎటియం లు వున్నంత కాలం జీవితం గురించి యెన్నో కబుర్లు చెప్పగలిగిన చిత్వాన్ , జీవితాన్ని యిష్టమొచ్చినట్టు గడపాలంటే ఎటియం ల అవసరం తప్పదని గ్రహించాడు.  ‘యెన్ని అవాస్తవాలు మరణించినా ఆకలి అనే వాస్తవం మాత్రం నాకు దూరం కాలేదు’ అని గుర్తించాడు గానీ దాన్ని జయించలేకపోయాడు. అందుకు మనసు చంపుకోలేక ఆత్మని అమ్ముకోలేక చావుని ఆశ్రయించాడు.

అంతా చూస్తే లోపలి మనిషి అస్తిత్వ అన్వేషణ – స్వేచ్ఛ ముసుగులు తగిలించుకొన్న వొక వ్యక్తివాదే చిత్వాన్ లో కనిపిస్తాడు. దీర్ఘకాలిక లక్ష్యాలు లేకపోవడం , భవిష్యత్తు అగమ్య గోచరం కావడం ,  వ్యవస్థాగత నిర్మాణాలు దాని పట్ల భరోసా ఇవ్వలేని పరిస్థితి , సమూహంలో సైతం వొంటరి ద్వీపాలుగా మిగిలి పోయే భద్రతా రాహిత్యం, వొక చట్రంలో యిమడలేని వ్యక్తిత్వం , వ్యక్తిగతమైనదో సామాజికమైనదో వొక గమ్యం లేకపోవడం , జీవితంలో అస్థిరత్వం , అరాచకత్వం  … యివన్నీ చిత్వాన్ చావుకి కారణమేమో అని తోస్తుంది.

మనుషుల్లోని హిపోక్రసీని ద్వేషించి సమాజానికి అతను దూరమయ్యాడు సరే ; సమాజం కూడా అతణ్ణి తనలో యిముడ్చుకోలేకపోయింది. కెరీరజం వూబిలోకి నెట్టి వైయక్తిక ప్రతిభని పై మెట్టు మీద నిలిపే  విశ్వవిద్యాలయాల డొల్ల చదువులు , మనుషులు సామాజిక జీవులుగా గాక వ్యక్తులుగా విడిపోవడమే స్వేచ్ఛకి పరమార్థంగా నిర్వచించే ఆధునికోత్తర ధోరణులు యువతరాన్ని గందరగోళపరుస్తున్నాయి. చిత్వాన్ లోని వైరుధ్యాలకూ ఇంటలెక్చువల్ యారోగెన్స్ కీ పలాయన తత్త్వానికీ వ్యక్తివాదానికీ కారణం యీ వాతావరణమే.

ఈ ఖాళీలని పూరించుకోడానికి  గానీ యీ గందరగోళాన్నుంచి బయటపడటానికి  గానీ  చిత్వాన్ ప్రయత్నం చేయలేదా అంటే – చేశాడు. కానీ అవి బలహీనమైనప్రయత్నాలు. నిలువుటద్దం లాంటి వొక మంచి స్నేహితుడి కోసం వెతుక్కొన్నాడు.

‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నమ్మకమైన ఒక స్నేహితుడి అవసరం ఉంది. వాళ్లతో నీ రహస్యాలు, నీ తలవంపులు, నీ ఉక్రోషాలుఅన్నీ పంచుకోవాలి.  మాస్కులన్నీ తీసేసి, హృదయాంతరాలను మథించి నీలోపలున్న నిన్నులందరినీ వారికి పరిచయం చేయాలి. అటువంటి నమ్మకమైన నిలువుటద్దంలాంటి ఒక స్నేహం కోసమే నా అన్వేషణ.’

చిత్వాన్ రచయితలో అటువంటి స్నేహాన్ని చూశాడు. అనుభవించాడు.ఇతరులకు మంచి చేయడం కర్తవ్యం కాదు. అదొక ఆనందం. అది మన సంతోషాన్నీ ఆరోగ్యాన్నీ పెంచుతుంది’ – అంటూ నెమళ్ళ కొలను (పీకాక్ లేక్ కి చిత్వాన్ పెట్టిన పేరు) దగ్గర చేసుకొన్న తొలి పరిచయం తోభయాలు, బిడియాలు, కాంప్లెక్స్ లు, అలవాట్లు, పొరపాట్లు వీటన్నింటిని ఇనుప చొక్కాలా తొడుక్కుని’  వున్న రచయితని వాటి నుంచీ బయట పడేశాడు.

‘యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఋణం కృత్వా ఘృతం పీబేత్. భస్మీ భూతస్య దేహస్య పునరాగమనం కుత:’ అంటూ చార్వాకుడై కాసేపు , పీత్వా పీత్వా పున: పీత్వా అంటూ ఒమర్ ఖయ్యాంగా కాసేపూ , జరాతుష్ట్రగా కాసేపూ , అదేదో సినిమాలో కళాపోషకుడిగా కాసేపూ … గంటకో కొత్త వేషం వేస్తూ వింత  అనుభవాలు  పరిచయం చేసాడు.  వాదాలూ సిద్ధాంతాలూ ప్రవచించాడు ( ఇవ్వాళ చిత్వాన్ బతికుంటే ‘హాయ్ అయామ్ కన్హయ్య కుమార్ ఫ్రం జెయెన్టీయూ’ అనో ‘రోహిత్ వేముల ఫ్రం నక్షత్ర ధూళి అనో’ తనను తాను  పరిచయం చేసుకొనే వాడేమో!)

భీముని కొలను , శ్రీశైలం టైగర్ రిజర్వ్  ఫారెస్ట్ ,   జమ్ము తావిలో వైష్ణోదేవి గుడి , నాసిక్ త్రయంబకేశ్వరం  , ఎల్లోరా కైలాష గుడి , హంపీ, విరూపాపూర్ గద్దె, మౌళారూజ్ కెఫె … దేశమంతా తిరిగాడు , తిప్పాడు. జీవితమనే ప్రశ్నకు సమాధానాలు వెతకొద్దు. సమాధానం దొరికిందనుకున్న ప్రతి సారీ జీవితం మరో కొత్త ప్రశ్నలా ఉదయిస్తుందని – జీవితంలో అసలు మనమేం చెయ్యాలో కనుక్కునేందుకు, మనల్నేం చెయ్యద్దొంటారో అది చేస్తే మార్గం తెలుస్తుందని చెప్పాడు.

రగిలించి, ఆజ్యం పోసి, అన్వేషించమని అగ్నిగుండంలోకి నడిపించినప్పటికీ , గంటల లెక్కన నిన్ను నువ్వు అమ్ముకోవద్దని వారించి నప్పటికీ – రచయిత పేదరికాన్ని జయించడానికి విదేశానికి యెగిరిపోయినప్పుడు మాత్రం డీలాపడ్డాడు అనిపిస్తుంది.

‘ప్రతి రోజూ, ప్రతి కొత్త పరిచయంలో, ప్రతి కొత్త అనుభవంలో, ప్రతి కొత్త ప్రదేశంలో నువ్వు మళ్లీ కొత్తగా పుడ్తావు. నువ్వు వుంటావు. అప్పుడే కొత్తగా పుట్టిన వాడూ ఉంటాడు. కొన్ని సార్లు కొంతమందిని జ్ఞాపకాల్లాగే వదిలేసి వెళ్లాలి’ – అని తెలిసినప్పటికీ వొంటరివాడయ్యాడు.

హంపిలో  శిధిలాల్లో   జీవితం  అశాశ్వతమన్న ప్రతీకల్ని చూశాడు. ఆ  శిధిలాల్నుంచి  జీవితం  నశ్వరమని నేర్చుకున్నాడు. అక్కడి రాళ్ళతో అతను మాట్లాడాడు. సగం విరిగిపోయిన కోట గోడలు, ఆ గుడి ముందు శిధిల శిల్పం ‘ ఏ దారిలో వెళ్లినా చివరికి శిధిల్లాలోకే దారి తీస్తుందని అతనికి బోధించాయి. వాటి భాష అర్థం చేసుకొన్నాడు.

కానీ పేరడాక్స్ యేమంటే ఆ శిధిలాల్లోనే ప్రేమలో పడ్డాడు. ప్రేమలోని మాధుర్యం అనుభవించాడు. ఆమెను చూస్తున్నంత సేపూ తన  గురించి, ఈ ప్రపంచం గురించి ఏ కంప్లైంట్స్ లేకుండా పోయాయి. ఆమె మాత్రమే కావాలనుకునే వొకే వొక్క ధ్యేయంతో బతికాడు.ఇంకే కోరికలూ, కష్టాలు, కన్నీళ్లు, బాధలు లేవు. ఆమెను చూస్తున్నకొద్దీ, ఆమెను ప్రేమిస్తున్నకొద్దీ  రోజు రోజుకీ కొంచెం కొంచెంగా మరణిస్తున్నట్టనిపించింది అతనికి.

అంతే –  సడెన్ గా పెరుగన్నంలో ఆవకాయ వేసుకు తినాలనిపించి కాళ్ళా వేళ్ళా బడి ఆమె యెంత బతిమాలినా వినిపించుకోకుండా ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యీ లోకం నుంచే వెళ్ళిపోయాడు.

బతికుండడం ముఖ్యం కాదు; బతకడమూ అంత ముఖ్యం కాదు. అసలీ జీవితంలో ఏదీ ముఖ్యం కాదు – అని  చిత్వాన్ భావించడానికి కారణాలేంటి అని కథ చదువుతున్నంతసేపూ వొక ప్రశ్న మనల్ని బాధిస్తుంది.

సమూహం నుంచి దూరమైన వ్యక్తివాదమే చిత్వాన్ ఆత్మ హననానికి కారణమని నాకు బలంగా అనిపిస్తుంది. మార్గదర్శనం చేయించే  సామూహిక సామాజికోద్యమాలు బలహీనం అయిన నేపథ్యంలో యిటువంటి ఫిలాసఫీ ముందుకు వస్తుందేమో అని తోస్తుంది. రోల్ మోడల్స్ లేనితనం నుంచి వొక నిస్పృహ నుంచి యిటువంటి విపరీత మనస్తత్త్వం రూపొందుతుందేమోనని భయమేస్తుంది. ఆదర్శవంతంగా వుండాల్సిన వుద్యమ జీవితాల్లోకి సైతం స్వార్థపు నీడలు వ్యాపించడం , ఆచరణలో బోలుతనం చోటుచేసుకుంటున్న అవిశ్వాస వాతావరణంలో వొక సామూహిక స్వప్నాన్ని అతనికి అందించలేకపోయాం అని కూడా వ్యథ కల్గుతుంది.

రొటీన్ లో కూడా మరణించనీకుండా కాపాడే మ్యాజిక్ యేదో మన జీవితాల్లోనూ మనం జీవిస్తున్న యీ సమాజంలోనూ వుందనీ ఆ యేదోని తెలుసుకోలేకపోవడం వల్లే నువ్వు మరణించావు చిత్వాన్ అని అతనికి చెప్పాలని వుంది.

జీవితం అనశ్వరం కాదు ; అశాశ్వతమే …  కానీ స్వయంగా దాన్ని స్వయంగా అకారణంగా నాశనం చేసుకోవాల్సిన అవసరం సైతం లేదు. చావడానికి ధైర్యం అక్కరలేదు – బతకడానికి కావాలి. నిజానికి ప్రేమించడం చావు గాదు ;  ప్రేమరాహిత్యమే మరణం అని గొంతు చించుకు అరవాలని వుంది. వ్యక్తల్నే కాదు మందిని ప్రేమించు , నూతన మానవావిష్కరణ కోసం సమాజంలో యేదో వొక మూల సమూహాలు చేసే ప్రయత్నాల్ని ప్రేమించు , చీకటిని కాదు వెలుగుని ప్రేమించు అని బుజ్జగించాలని వుంది. కానీ కాంక్రీట్ అడవుల్లోనో , భద్ర లోకాల మూలల్లోనో , మల్టినేషనల్ కంపెనీల అద్దాల మేడల జిలుగు వెలుగులకాంతిలోనో , ఏసి గదుల్లో కుషన్డ్ సీట్లకు వేడి పుట్టించడంలోనో మైమరచిపోయి ప్రియ పచ్చళ్లు, కరాచీ బిస్కెట్లు, తెలుగు సినిమా డివిడిలు దేశం నుంచి దేశానికి మోసుకుంటూ సంసార రంగుల రాట్నంలో   బిజీగా తిరుగుతూ  వున్న రచయితకు లాగానే నాక్కూడా యేదో తెలీని వ్యక్తం చేయలేని గిల్టీ ఫీలింగ్.

దాన్నుంచీ బయట పడటానికే – అపరాధ భావనని కడిగేసుకోడానికే – పేదరికం నుంచి దూరంగా అడుగులు వేస్తున్నాననుకుంటూ  జీవితం నుంచే చాలా దూరంగా వెళ్లిపోయానని తెలియని తనం నుంచీ తనను కాపాడుకోడానికే కథలో తననో పాత్ర చేసుకొని తన కథనీ చిత్వాన్ కథనీ రాయడానికి  పూనుకొన్నాడు రచయిత. రాయడం గురించి చిత్వాన్ చెప్పిన మాటలే అతడికి భయం కల్గించాయి  దారిచూపాయి కూడా.

‘రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.

 ‘లోపల. నీలోపలే అంతా ఉంది. బయటకు నువ్వొత్తి తోలు తిత్తివి. లోపల నువ్వొక విలక్షణాల మేలి కలయికవి. న్యూరాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య జరిగే సర్కస్ మైదానివి. నీ హృదయం నీ రింగ్ మాస్టర్; ఎక్కడో ఎత్తులో రిస్కీ ఫీట్స్ చేసే స్టంట్ మాస్టర్ నీ ఆత్మ. ఆ సర్కస్ గురించి రాయగలిగితేనె అది కథ అవుతుంది. లేకపోతే అది ఆవు వ్యాసమే! ఇప్పటివరకూ వచ్చిన కథలే మళ్లీ వస్తాయి. ఇప్పటివరకూ చెప్పిన నీతే మళ్లీ చెప్తారు. అప్పుడు ఈ భూమ్మీద కొత్త కథంటూ పుట్టదు. గో డూ సమ్ సోల్ సర్కస్ అనేవాడు చిత్వాన్.’

 ఈ మాటలు కథకుడి మీద బలంగా ముద్ర వేశాయి. ‘నన్ను నేను నగ్నంగా నిలబెట్టుకోవడమంటే నాకు సన్నిహితమైన నా ఆత్మీయ స్నేహితుడైన చిత్వాన్ ని నిలబెట్టడమే’ అని నిర్ధారించుకొన్న రచయిత రాయడానికే పూనుకొన్నాడు.

నిజానికి కథలోని పాత్రతో రచయితకు అభేదం పాటించి విశ్లేషించడం ఎంతవరకు సమంజసమో తెలీదు గానీ , సిద్ధారెడ్డి కథ పొడవునా రచయిత పాత్రతో ఐడెంటిఫై అవడం కనిపిస్తుంది. ఆత్మ కథాత్మక కథనంతో విశ్వసనీయత సాధించాడు. అందువల్ల రచయితే కాదు పాఠకులుగా మనం కూడా కథతో కనెక్ట్ అవుతాం. జీవితం పట్ల రచన పట్ల చిత్వాన్ తో యేకీభవిస్తూ విభేదిస్తూ కొట్లాడుతూ రాజీపడుతూ కథలో లీనమవుతాం. ఈ కథ యెందరినో కదిలించిందంటే , దు:ఖ పెట్టిందంటే , చిత్వాన్ పట్ల క్రోధాన్నీ ప్రేమనీ కల్గించిందంటే ,  యేకకాలంలో నచ్చిందీ నచ్చలేదు అన్న ద్వంద్వానికి గురి చేసిందంటే , చదువుతూన్నంత సేపూ తమ లోపలికీ చుట్టూ వున్న యితరుల్లోకీ చూసేలా చేసిందంటే ,   కథా రచనకు  సిద్ధారెడ్డి ఎంచుకొన్న టెక్నిక్కే అందుకు ప్రధాన కారణం.

sidha

అందుకే కథ ఆవు వ్యాసం కాలేదు. మంచి కథ కొత్త కథ చదివామని చాలా మండి పాఠకులు స్పందించారు. కథ యిలా చెప్పడానికి ( రచయిత ఐచ్ఛికంగా యెన్నుకొన్న మౌఖిక శైలి కథకి గొప్ప అందాన్నిచ్చింది) రచయిత దశాబ్దం పైగా స్ట్రగులయ్యాడు. సిద్ధారెడ్డి అంతకు ముందు కథా రచనలో చిన్నా చితకా ప్రయత్నాలు చేసినప్పటికీ సినిమా రంగంలోకి డీవియేట్ అయిన తర్వాత కథా రచయితగా తనను తాను రీడిస్కవర్ చేసుకొనే క్రమంలో రాసిన తొలికథ సోల్ సర్కస్.

రాయడమంటే  నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే అన్న చిత్వాన్ మాటలతోనే కథ ప్రారంభమవుతుంది. ఆ చాలెంజ్ ని రచయిత యెలా  నిర్వహించాడో చూద్దామనే వుత్సుకతతోనే కథ చదవడం మొదలెడతాం. అక్కడ నుంచీ రచయిత పంచుకొనే చిత్వాన్ జ్ఞాపకాలు వూపిరి తీసికోనివ్వవు. జీవితం గురించి చిత్వాన్  ఆలోచనలు మన గుండె లోతుల్ని తడుముతూ వుంటై. అతని మరణానికి కారణం తెలుసుకోడానికి రచయిత వెంట అన్వేషిస్తూ పోతాం.

కథ రచయిత దృష్టి కోణం నుంచీ నడుస్తుంది. కథకుడి దృక్పథం తన సొంత జీవితంపై చిత్వాన్ చూపిన ప్రభావాల గురించి ప్రస్తావించిన సందర్భాల్లో వ్యక్తమౌతుంది. నిజానికి యిద్దరి కథా పక్క పక్కనే కాకుండా జమిలిగా పెనవేసుకొని నడుస్తుంది. అలా నడపడంలోనే వెంకట్ సిద్ధారెడ్డి నేర్పు కనపడుతుంది. నిజానికి కథ అంతా గతమే. కానీ గత వర్తమానాల్లోకి ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. కథ భిన్న స్థల కాలాల్లో జరిగినప్పటికీ అనుభూతి ఐక్యత దెబ్బతినకుండా వుండటమే కథలో బలం. ఆ అనుభూతి పాఠకుల అంతరంగాల్లో విషాదం మిగుల్చుతుంది. ‘నీకు జరిగింది కథ కాదు. నీలో జరిగిందే కథ.’ అని కథకుడి స్థానం నుంచి  రచయిత చేసిన ప్రకటనతో యేకీభవిస్తాం. అందుకే రచయిత లోపలి సంఘర్షణకి కూడా  కథలో సమ ప్రాధాన్యం లభించింది. రచయిత పాత్ర ద్వారా జీవితాన్ని గెలవాలనే ఆరాటంలో మనం కోల్పోతున్నవాటిని గుర్తుచేయడం కూడా వొక కథాంశంగా తయారైంది. రాయడం గురించి రచయిత తనదైన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి కూడా వొక సందర్భాన్ని సృష్టించుకొన్నాడు.  అది చిత్వాన్ అభిప్రాయానికి విరుద్ధం కాదు గానీ మరో చూపు.

రచయిత శిల్ప నైపుణ్యం వల్ల దృక్పథా బలం వల్ల కథ వ్యక్తి తలం నుంచీ సామాజిక తలానికి యెదుగుతుంది.

‘రాయడమంటే నడి రోడ్డు లో నగ్నంగా నిలబడ్డం కాదు, నడిరోడ్డులో నగ్నం గా వర్షంలో తడవడమని, నోస్టాల్జియా ఒక జబ్బు కాదు, అదొక గొప్ప మందనీ, రాయడమంటే అగ్ని పర్వతం బద్దలు కావడం కాదు, నిత్యం రగిలే గుండె మంటలను చల్లార్చుకోవడం అనీ, ది జంగిల్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హార్ట్; ఇట్ ఈజ్ ఇన్ ది హెడ్ అనీఏదో ఒకటి. అది అబద్ధమో, నిజమో, నిజమైన అబద్ధమో, అబద్ధమైన నిజమోఏదో ఒకటి చెప్పి నిన్ను ఆపుండే వాడిని కదరా?అంటూ వర్షంలో విరూపాక్షాలయం ముందు నించుని గుండె పగిలేలా రచయిత రోదించినట్టే మనం కూడా వుద్విగ్నులమౌతాం. చిత్వాన్ లను కాపాడుకొనే దారులు వెతుకుతాం. చిత్వాన్ కథ చెప్పడం ద్వారా రచయిత ఆశించిన ప్రయోజనం అదే అయితే అందులో అతను నూటికి నూరు పాళ్ళు విజయం సాధించాడు.

మరో చిత్వాన్ అకాలంగా  అకారణంగా మన మధ్య నుంచి వెళ్ళిపోకూడదు.

మన మధ్య తిరుగాడే చిత్వాన్ లకీ మన లోపల కదలాడే చిత్వాన్ కీ వొక సామూహిక స్వప్నాన్నిద్దాం ; బతికించుకొందాం. అయితే వొక బృంద గానం ఆలపించిన సామూహిక నినాదమై మోగిన మంది కల గన్న రోహిత్ వేముల కూడా మననుంచి నిష్క్రమించిన విషయాన్ని సైతం మనం మర్చిపోకూడదు. మన స్వప్నాల్ని ధ్వంసం చేసే కుట్రలపట్ల  అప్రమత్తంగా వుండాలి. వాటిని యెదుర్కోడానికి సమాయత్తం కావాలి. అందుకు అవసరమైన శక్తులన్నిటి సమీకరణం యివాళ్టి అవసరం. రోహిత్ ని అయినా చిత్వాన్ ని అయినా మిగుల్చుకోడానికి – అదే యిప్పుడు మనం చేయాల్సిన  సర్కస్ ; కాదు యుద్ధం.

*

ఎల్దమొస్తవా…

 

 

ananya“ఇండియా వెళ్లావట కదా? పదిరోజుల్లో ఏం చేద్దామని వెళ్లావు? ఏం చేశావు? పోనీ చివరి రోజు ఏం చేశావు?” షాపులో కనిపించిన ఒక స్నేహితురాలు గుక్కతిప్పుకోకుండా అడిగేసింది.

సంతోషంగా లిస్ట్ చదవబోయాను, “కన్హయ్య కుమార్ ను కలిసి మా పాప తనకోసం గీసిన బొమ్మ ఇచ్చాను,  ….”

“కన్హయ్య కుమార్ ఎవరు?”

“జె ఎన్ యు లో స్టూడెంట్ లీడర్… పోనీ… రోహిత్ వేముల…”

“….”

“దళిత్…”

“అతనెవరు? ఎవరు వీళ్లంతా?”

ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవడమంటే ….

*

విశాఖ పొలిమేరలు దాటింది కారు. రామకృష్ణ బీచికి వెళ్లకుండా ఈ ముగ్గురు తమిళులతో రావడం సరైందేనా అనుకుంటూనే ఉన్నాను. నాకు తమిళం రాదని, ఇంగ్లీషు వచ్చని తెలిసినా తమిళంలోనే మాట్లాడుకుంటున్న వాళ్లపట్ల కాసింత కోపం కూడా వచ్చేసింది.

నేను పెద్ద మాటకారిని కాదు. అయినా డ్రైవర్ భాస్కర్ ను ఏవో చిన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండిపోయాను. వాళ్ళేనా తెలీని భాష మాట్లాడుకునేది? భాస్కర్ కు ఇంగ్లీషు, తమిళం రెండూ రావు. నా తెలుగు అతనికి, తన తెలుగు నాకు అర్థమవడం కష్టంగా ఉంది. అయినా సరే, తెలుగు తెలుగే. చుట్టుపక్కల ఊర్ల గురించి, కొండల గురించి అతను చెప్పే విశేషాల గురించి నేను వాళ్లకు చెప్పను గాక చెప్పను. వాటి గురించి అతనికే సరిగ్గా తెలీదని నాకు అర్థమయిందన్న విషయం కూడా చెప్పను. ఒక కొండను ఒకసారి ఎర్రకొండ అంటాడు, అహా అది కాదు వేరేది అంటాడు. హోర్నీ. నా కలల విశాఖ ప్రయాణం ఇట్లా ముగియబోతోందా?  కృష్ణ నన్ను వీళ్లతో ఇరికించేశారే. వీళ్లు వెళ్లేచోట రామకృష్ణ బీచి కంటే చూడాల్సిన బీచి మరొకటి ఉందని అన్నారు. అది ఏదో సముద్రం ఒడ్డున ఊరు. న్యూక్లియర్ ప్లాంటు కట్టబోయే చోటు. వీళ్లకు అక్కడేం పనో ఇంకా సరిగ్గా అర్థం కావడం లేదు. ఆ ఊర్లో మమ్మల్ని కలుసుకోబోయే వాళ్లకు ఇంగ్లీషు సరిగ్గా రాకపోవచ్చని, అవసరమైతే సహాయం చెయ్యమని చెప్పారు.

విజయనగరం బోర్డు కనిపించేసరికి “విజయనగరం అంటే శ్రీకృష్ణదేవరాయలి రాజధానే కదూ?” వెనక నుంచి సుందర రాజన్ ఇంగ్లీషులో అడిగిన ప్రశ్నకు తత్తరపడ్డాను. ఒకింత కలవరపాటు కూడా. చరిత్ర పాఠాలు కళ్లముందు గిర్రున తిరిగాయి. అవుననీ, కాదనీ, హంపి కాదూ అనీ మనసంతా ఉక్కిరిబిక్కిరైంది. ఇక ఉండబట్టలేక భాస్కర్ ను అడిగాను. ఔనన్నాడు, వెంటనే కాదన్నాడు. ఆఖరికి ఔననేశాడు. ఒకసారి అతని ముఖంలో చూసి ఇక మాటమార్చడని తేల్చుకుని, నిట్టూర్చి “ఔనట” అని వెనక్కి తిరిగి అన్నాను.

భాస్కర్ వెనక ఉన్న సీట్లో కూర్చున్న అమర్తరాజ్ కొంటె నవ్వు అప్పుడప్పుడే అలవాటౌతోంది. నా వెనక ఉన్న సీట్లో కూర్చున్న సుందర రాజన్ నవ్వుతున్నాడో లేదో కనిపించలేదు. వాళ్లిద్దరి మధ్య కూర్చున్న ఉదయకుమార్ నవ్వుతున్నాడో లేదో అర్థమవడం కష్టం. ఎప్పుడూ ఒక చిర్నవ్వు ప్రశాంతమైన ఆ ముఖంలో వెలుగుతుండడం గమనించాను.

కాసేపాగి, “ఇంతకీ మీరు నిజనిర్ధారణ కమిటీకి చెందిన వాళ్లా?” అని అడిగాను. నవ్వేసి, కాదన్నాడు అమర్తరాజ్.

mamata1

అమ్మన్నాయుడు (CITU – Centre of Indian Trade Unions, a CPI(M)-affiliate), సుందర్ రాజన్, గోవింద రావు (CITU), మమత, కె. రాము (మానవహక్కుల వేదిక), ఉదయకుమార్, థవుడు (ప్రజాశక్తి జర్నలిస్టు), కె.వి. జగనాథ రావు (మానవహక్కుల వేదిక), తేజేశ్వర రావు (CITU).

 

మధ్యలో తెలుగు మిత్రులు కలుసుకున్నారు. పేర్లు చెప్పుకున్నాం. అందరి ముఖాల్లో చిర్నవ్వు. ఎప్పట్నుంచో తెలిసున్నవాళ్లలా పలకరింపులు. ఏ ఊరివాళ్లైతేనేం, ఏ రాష్ట్రం వాళ్లైతేనేం, ఏ దేశం వాళ్లైతేనేం – కలిసి పనిచెయ్యబోతున్నామని తెలిసినప్పుడు అన్ని ఎళ్లలూ చెరిగిపోతాయి.

వెళ్లాల్సిన ఊరు చేరుకోవడానికి వేరే రోడ్డు ఎక్కాలని, వాళ్ల కారు ఫాలో అవమని చెప్పారు. పొదలతో, చెట్లతో, వాటిని కలుపుతూ అల్లుకుపోయిన తీగెలతో పచ్చగా ఉంది అక్కడంతా. మధ్యలో చిన్న చిన్న పంట పొలాలు. వరి నాటుతున్న మహిళలు కనిపించారు. అక్కడక్కడ రెల్లుదబ్బులతో వేసిన గుడిసెలు, ఒక చర్చి కనిపించాయి.

చర్చి గోడమీద ఊరిపేరు, “పాతర్ల పల్లి“.

ఆ ఊరు దాటాక మళ్లీ పచ్చని చెట్లు, చిన్ని చెలకల పొలాలు. ఇంకొక ఊరు కనిపించింది. గుడిసెలు లేవు. అన్నీ పక్కా ఇళ్లే.

బడి గేటు మీద పేరు చదివాను, “పాతర్ల పల్లి“

అరే, ఈ రెండు ఊర్లకు ఒకటే పేరా?

కాదు. ఇవి రెండు ఊర్లు కాదు. ఒకటే ఊరు. ఇందాక చూసింది వెలివాడ.

నేను ఆశ్చర్యపోతుంటే, “అన్ని ఊర్లు ఇట్లనే ఉంటయ్ కద మేడమ్” అన్నాడు భాస్కర్.

“మా వైపు కూడా ఇట్లాగే ఉంటాయి.” అదేం కొత్త విషయం కాదన్నట్లు చెప్పాడు ఉదయకుమార్.

“మా కర్నూల్ వైపు ఇట్లా ఉండవు. అన్ని కులాలు, మతాలు కలగలిసిపోయి ఉండవు కానీ, ఒక వాడ తరువాత ఒకటి, ఆనుకునే ఉంటాయి. మాలమాదిగ వాళ్ల వాడలు కూడా” అనేసి చిన్నప్పుడు, పదేళ్లు, పెరిగిన మా ఊరిని గుర్తు చేసుకున్నాను.

హఠాత్తుగా, రెడ్ల ఇళ్లకు మాల వాడకు మధ్య కల్లాలు గుర్తొచ్చాయి. ఊరిమధ్యలో అవెందుకు అని ఎప్పుడూ అనిపించలేదు. ఎంత దారుణం!! చిన్ననాటి స్నేహితురాలు రంగమ్మ గుర్తొచ్చింది. ఆ కల్లాల్లో తెగ ఆడుకునేవాళ్లం. చీకటవగానే తనొక వైపు, నేనొక వైపు వెళ్లిపోవడం గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ విషయం ఇంతవరకు ఎందుకు తట్టలేదు? తట్టినా ఏం చేసేదాన్ని? నా చేతులతో మంచినీళ్ల గ్లాసెత్తి దోసిట్లోకి నీళ్లు వంపినదాన్నే కాదూ? అదెప్పుడో చిన్నతనంలో ఐతేనేం? ప్రశ్నించలేని అధైర్యాన్ని పక్కన పెడితే, అసలు ప్రశ్నే ఎప్పుడో గాని రాలేదు. ఆ గిల్ట్ ఎప్పటికీ పోనిది.

“న్యూక్లియర్ ప్లాంట్ వస్తే చానా ఉద్యోగాలొస్తయంట కద మేడమ్?” భాస్కర్ అడిగిన ప్రశ్నతో కొంచెం సర్దుకున్నాను.

“వస్తాయి కానీ ఊరివాళ్లకు కూలి పనుల లాంటివే ఉంటాయి. స్వంతంగా వాళ్లు చేసుకుంటున్న పనులు మానుకుని కూలీ పని ఎందుకు చెయ్యాలి? ఆ పనీ అయిపోయాక సిటీలకు వలసపోవాల్సిందే.” అతనికి అర్థమయ్యే విషయాలు చెప్పాను.

మధ్యలో ఒకచోట కార్లు ఆపి న్యూక్లియర్ పవర్ పార్క్ ప్రపోజ్డ్ సైట్ అంటూ చూపించారు శ్రీకాకుళం మిత్రులు. అంత పచ్చదనం, ప్రశాంతత ఇంకెక్కడా ఉండదేమో అన్నట్లుంది ఆ ప్రదేశం. అట్లాంటి చోట పొగలు కక్కే బ్రహ్మాండమైన రియాక్టర్లను ఊహించలేకపోతున్నాను.

“ఈ ప్రదేశం ఏ ఎర్త్ క్వేక్ జోన్ కిందకి వస్తుంది?” తెలుగు మిత్రులను అడిగాడు సుందర రాజన్.

అనుకోని ప్రశ్న ఎదురైనట్లుంది వాళ్లకు. కాసేపు ఆలోచించి, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి, “నాలుగు అనుకుంటా” ఒకరు అన్నారు. కాదనిపిస్తోంది. ఉన్నదే ఐదు జోన్లు. ఎంత దురాశపరులైనా, అలక్ష్యంగా ఉన్నా మరీ నాలుగో జోన్లో ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోరనిపిస్తోంది. ఏమో ఎవరు చెప్పోచ్చారు. రాజధాని, అమరావతి, వెట్ ల్యాండ్స్ మీద కడుతున్నప్పుడు.

కొన్ని నిమిషాలు అక్కడ గడిపి కొవ్వాడలో జనాలతో మాట్లాడదామని బయల్దేరాం. అప్పటిదాకా ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న ముగ్గురు తమిళులు సీరియస్ అయ్యారు.

దార్లో, “ఇక్కడ భూకంపాలు వస్తాయా?” అని భాస్కర్ ను అడిగాను.

“2014 లో భూమి కొంచెం కదిలింది మేడమ్. పెద్దది కాదు. ఏం నష్టం జరగలేదు.” భాస్కర్ చెప్పిన విషయాన్ని వాళ్లకు చెప్పాను.

కొవ్వాడ చేరుకునే ముందే సముద్రం కనిపించింది. బీచ్ ని ఆనుకుని ఊరు. చేపలు పట్టడం వాళ్ల వృత్తి అని విన్నాను. కానీ పడవలేవీ కనిపించలేదు. కొంతమంది ఆడవాళ్లు బీచిలో వలలాంటిది ఏదో తయారు చేస్తున్నారు. ఊరికి, బీచికి మధ్య ఒక అరుగు మీద కొంతమంది యువకులు పేకాట ఆడుకుంటున్నారు.

“పనులేం లేవు. ఇంకేం చేస్తారు?” ఎవరో అన్నారు. పనులు లేకపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు.

నా సందేహం నా ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించినట్లుంది. “వీళ్లు మత్స్యకారులు మేడమ్. ఇప్పుడు చేపలు లేక సముద్రం లోకి వెళ్లటం లేదు.”

“చేపలు లేకపోవడం ఏమిటీ?” చాలా విచిత్రంగా అనిపించింది నాకు.

“చుట్టుపక్కల ఉన్న ఫార్మాసూటికల్ ప్లాంట్ల నుంచి వచ్చే టాక్సిక్ వేస్ట్ అంతా ఇక్కడికే వస్తుంది మేడమ్. కొన్నేళ్ల నుంచి ఈ చుట్టుపక్కల చాలా దూరం వరకు చేపలు లేవు. ఇంతకుముందు చేపలు పట్టలేనోళ్లు, వలలు తయారు చేసుకునేవాళ్లు. ఇప్పుడు హ్యామక్లు ఎక్కువగా తయారు చేస్తున్నారు. అవన్నీ గుజరాత్, మహారాష్టృ లాంటి చోట్ల అమ్ముకుంటారు.”

గొంతులో ఏదో అడ్డంపడ్డట్లైంది. ఇస్మత్ చుగ్తాయ్ ప్రస్తావించే ముళ్ల బంతి!

ఇంతలో అక్కడ కొంతమంది కుర్రవాళ్లు గుమిగూడారు.

“ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని రానిస్తారా?” అని అడగమన్నాడు సుందర రాజన్.

అందరికంటే ముందు నిలబడ్డ ఒక అబ్బాయి, “రానివ్వం!” ధీమాగా, కోపంగా అన్నాడు. ఆ అబ్బాయికి పదహారు, పదిహేడేళ్లు ఉంటాయేమో. తీక్షణమైన ఆ అబ్బాయి చూపు ఇక జీవితాంతం నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది.

మెట్లెక్కి ఆ అరుగుమీద కూర్చున్నాం. మాముందు ఊరి యువకులు. అమర్తరాజ్ మాతో కూర్చోలేదు. కాసేపు అందరి ఫోటోలు తీసి వెళ్లిపోయాడు. భాష రాని చోట ఒక్కడు అట్లా వెళ్లిపోతే ఎట్లా? పోనీ, చిన్నపిల్లవాడా ఏమన్న. సముద్రం ఫోటోలు తీస్తున్నాడేమో.

ఊరి వాళ్లు మాట్లాడేముందు సుందర్ రాజన్ను, ఉదయకుమారన్ను పరిచయం చేసుకోమన్నారు తెలుగు మిత్రుల్లో ఒకరు. ఇంగ్లీషులో అతను చెప్పేది నన్ను తెలుగులో చెప్పమన్నారు. అప్పటికప్పుడు చెప్పే మాటలను తర్జుమా ఎప్పుడూ చెయ్యలేదు. అయినా, ‘సరే’ అనేశాను.

సుందర్ రాజన్, ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ అనే సంస్థ నుంచి వచ్చాడని, అంటే భూమి మిత్రులు అని అర్థమని వివరించాను. న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నాడు. తమిళనాడులోని కూడంకుళం అనే ఊర్లో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ మధ్యే ఫుకొషిమా వెళ్లొచ్చాడు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల ఒరిగే లాభాల కన్నా, జరిగే నష్టలే ఎక్కువ అని, క్యాన్సర్ లాంటి అనారోగ్యాల బారిన పడతారని చెప్పాడు. ప్రభుత్వం ప్రజల తరుపున ఆలోచించడం లేదని చెప్పాడు.

కూడంకుళం అన్న పేరు నోరు తిరగలేదు. కూడబలుక్కుంటూ ఆ ఊరి పేరుని పలికినప్పుడు, సుందర రాజన్ శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని వేరేవాళ్లకు తెలియకపోయినా పక్కనే కూర్చున్న నాకు తెలిసిపోయింది. నేను ఎప్పుడూ వినివుండని ఆ ఊరు అతనకి చాలా ముఖ్యమైందని అర్థమయింది.

ఫుకొషిమాలో, పవర్ ప్లాంటుకు 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్లందరినీ వేరే చోట్లకు వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఒక పాల వ్యాపారి గురించి చెప్పాడు. ఆ వ్యాపారికి సోకిన రేడియేషన్ ను ట్రీట్ చెయ్యగలరు కానీ అతని ఆవులను రక్షించలేమని చెప్పారట. వాటికి రేడియేషన్ సోకడం వలన, అవి ఇచ్చే పాలు ఎవరూ తాగకూడదు. వాటి మాంసం కూడా ఎవరూ తినకూడదు. 75 ఆవులను చంపేసి, ఆ స్థలాన్ని వదిలి వెళ్లిపోవలసి వచ్చిందని చెప్పాడు. భోపాల్ దుర్ఘటను గుర్తు చేసి, కొన్ని వేల మంది మరణించినా, గాయాలపాలైనా సి.యి.వో వారెన్ ఆండెర్సన్ కు ఎలాంటి శిక్ష పడకుండా భారత, అమెరికా ప్రభుత్వాలు అడ్డుకున్నాయని, కొవ్వాడలో ప్రమాదం జరిగితే సామాన్య జనం తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందనే నమ్మకం పెట్టుకోకూడదని చెప్పాడు.

తరువాత ఉదయకుమార్ మాట్లాడాడు. తాము అభివృధికి ఆటంకం కాదని, ఏ విదేశీ సంస్థకు పని చెయ్యటం లేదని, శాంతియుతమార్గాల ద్వారానే పోరాటం చెయ్యాలనుకుంటున్నామని చెప్పాడు. కొవ్వాడ, చుట్టుపక్కల ఊర్లలోని ప్రజలు చేస్తున్న, చెయ్యబోయే పోరాటాలకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని చెప్పాడు. టెస్టు చెయ్యని రియాక్టర్లను కొవ్వాడలో వాడబోతున్నారని, ప్రమాదం జరగడానికి చాల ఎక్కువ అవకాశం ఉందని చెప్పాడు. ఫుకోషిమా ప్రమాదం తరువాత ఎన్నో దేశాలు అణురియాక్టర్లు నిలిపివేయడమో, చాలావాటిని మూసివేయడమో చేశాయని, మరి భారత ప్రభుత్వం కొవ్వాడలో ఎందుకు కొత్తగా అణురియాక్టర్లను నిర్మించాలనుకుంటున్నాయో ప్రశ్నించాలని అన్నాడు. ప్రభుత్వాన్ని గాని, ఏ రాజకీయ పార్టీని గాని నమ్మకుండా ప్రజలు తమ పోరాటం తాము చెయ్యాల్సి ఉంటుందని చెప్పాడు.

పక్కన కొంతమంది విలేఖరులు కూడా ఉన్నారు. ఒకతను తను స్పెషల్ బ్రాంచ్ నుంచి అని అన్నాడు. ఉదయకుమార్ కొంచెం ఆశ్చర్యపోయాడు, “ఓ స్పెషల్ బ్రాంచి నుంచా?” అని చిర్నవ్వు నవ్వాడు. అతనూ నవ్వాడు.

వాళ్లు చెప్పినమాటలైతే ఇంగ్లీషులోంచి తెలుగులో చాలావరకు తర్జుమా చేస్తున్నాను. వాళ్లు చెప్పేవి జీర్ణించుకోలేకపోతున్నాను. ఆలోచనల్లో పడి, అన్ని విషయాలు తిరిగి చెప్పలేకపోతున్నాను. తెలుగు మిత్రులు అందుకుని తర్జుమా చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ మా చుట్టూ ఉన్న జనం మారుతున్నారు. ముందు కూర్చున్న యువకులు మాత్రం కదలటం లేదు. శ్రద్ధగా వింటున్నారు. మధ్య మధ్యలో “మీరేం చేస్తారు?” అని ప్రశ్నిస్తే “ఈ ఊరు నుంచి వెళ్లం. ఇది మా ఊరు. కొట్లాడ్తాం” అని గట్టిగా చెప్తున్నారు.

ఇంతలో పక్కనుంచి ఒక యువకుడు అరిచాడు, “ఎవరెవరో వస్తారు, ఏదో చెప్పి పోతారు. మా నాయకులే ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకే పోరాడుతాం? మా భూమిని ఇచ్చెయ్యక ఏం చేస్తాం?” అతని మాటలను ఇంగ్లీషులోకి తర్జుమా చేశాను.

ఒక పెద్దాయన ప్లాస్టిక్ తాళ్లతో బుట్టల్లాంటివి చేస్తున్నాడు. పళ్లు, కూరగాయలు పెట్టుకోవడానికి అని చెప్పాడు. వలలు చెయ్యడం కాకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారని చెప్పారు గుంపులో ఒకరు. తిండికోసం ఏ తిప్పలైనా పడాలి కదా అని అన్నాడు ఆ పెద్దాయన.

“సరే పవర్ ప్లాంటు వస్తే, ఏదైనా ప్రమాదం జరిగితే మాకేం, రేపో మాపో పోయే ముసలోళ్లకు” అని అనేశాడు.

ఆయన పక్కన ఇంకో పెద్దాయన వళ్లో కూర్చున్న పసిపిల్లవాడు నావైపు అమాయకంగా చూస్తున్నాడు.

“మీ సంగతి సరే, మరి మీ పిల్లల సంగతి? వాళ్ల పిల్లల సంగతి మీకు అఖర్లేదా? ఆ పిల్లాడి సంగతి?” అని అడిగాను. ఆయన క్షణకాలం నా ముఖంలోకి చూశాడు.

ఇక ఒకరి మాటలను ఒకరు మింగేస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు ఊరి వాళ్లు. గొడవగా తయారయ్యింది అక్కడంతా. అంత గడబిడలోనూ ఎవరూ ఇదొక ఆట అన్నట్లో, కాలక్షేపం కోసం అన్నట్లో మాట్లాడటం లేదు. అయినా, ఇట్లా కాదు. ఎవరన్నా మధ్యవర్తిత్వం చేస్తే బాగుండుననిపించింది.

“ఊరి సర్పంచ్ తో మాట్లాడడం కుదరదా?” అని అక్కడున్నవాళ్లను అడిగాను.

“ఊర్లో లేడు. ఉన్నా ఏం లాభం. ఆయన ప్రభుత్వం వైపే ఉన్నాడు. వీళ్లు వస్తున్నారని తెలిసి పక్క ఊరికి వెళ్లిపోయాడు.” నాకు ఆశ్చర్యమేసింది. వీళ్లను చూడగానే తెలుగు కార్యకర్తల ముఖాలు వెలిగిపోవడం హఠాత్తుగా గుర్తొచ్చింది. వాళ్లవైపు చూశాను. ముఖంలో ఏ భావమూ లేకపోయినా ఈ విషయం పట్ల దృఢమైన నిబద్ధతో ఉన్నట్లు తెలిసిపోతోంది. ఈ తమిళులు సామాన్యులు కాదని ఒక్కసారిగా అనిపించింది.

“ఊర్లోకి వెళ్లొద్దాం పదండి” అన్నారెవరో.

బీచికి ఆనుకుని ఉన్న ఇంటివైపు వెళ్లాం. ఒకరిద్దరు ఆడవాళ్లు మాట్లాడారు. వాళ్లకు మావి కొత్తముఖాలే కానీ మాలాంటి వాళ్లను ఇంతకుముందు చూసి, ఆశపడి, నిరాశపడిన అనుభవాలున్నట్లున్నాయి. ఒకింత నిర్లక్ష్యం, ఒకింత ‘మీరేమైనా చెయ్యగలరా’ అనే మిణుకుమనే ఆశ వాళ్ల ముఖాల్లో. ఆ ఇంట్లోనే ఒకతను కొంచెం ఎక్కువ సమాచారం ఇచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు తెలుగుదేశం తమ పోరాటానికి మద్ధతునిచ్చిందని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తమకు వ్యతిరేకంగా, అణురియాక్టర్లను ఇంకా త్వరగా కట్టాలని ప్రయత్నిస్తోందని చెప్పాడు. అతనితో కాసేపు మాట్లాడి వచ్చేశాం. ఇంతవరకు ఒక యువకుడు, ఆ పెద్దాయన తప్ప అందరూ పోరాడుతామనే చెప్తున్నారు.

కొంతమంది విలేఖర్లు ఉదయకుమార్ ను వీడియో స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. కొంచెం దూరంగా నిలబడ్డ నన్ను వీడియోలో వచ్చేట్లో ఉదయకుమార్ పక్కన నిలబడమని చెప్పారు. మధ్యలో నేనేందుకు అనుకుని ‘పర్వాలేదులెండి’ అంటూ దూరంగానే నిలబడ్డాను.

“డోంట్ బి అఫ్రైడ్ మమదా!” అని అన్నాడు ఉదయకుమార్. ఆ పిలుపుకి నాకు నవ్వొచ్చింది. “హౌ క్యూట్!” మనసులోనే అనుకున్నా.

అవునూ ఇంతకీ భయపడొద్దు అంటున్నారెందుకు? ఇక్కడ భయపడాల్సింది ఏముంది? న్యూస్ వీడియోలోకి రావాలంటే భయపడేదానిలా కనిపిస్తున్నానా?

వీళ్ల స్టేట్మేంట్లు తీసుకోవడం, వీళ్లు వస్తారని సర్పంచ్ ఊర్లో లేకపోవడం, ముగ్గురు నలుగురు విలేఖరులు వీళ్ల మాటలను శ్రద్ధగా నోట్ చేసుకోవడం చూస్తుంటే ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. ఇంతకీ భయపడొద్దని ఎందుకు అన్నాడు?

ఎప్పుడు వచ్చాడో అమర్తరాజన్ మా గుంపులో చేరాడు. ఇక అందరం బయల్దేరాం. చిన్న ఊర్లు దాటుకుని ఘాట్ రోడ్డు ఎక్కాం. అందరం అక్కడ టీ తాగి, శ్రీకాకుళం మిత్రుల దగ్గర సెలవు తీసుకుని విశాఖ బయల్దేరాం.

సముద్రం పక్కగా భీమునిపట్నం వైపు కారు పోనిచ్చాడు భాస్కర్.

వెనక కూర్చుని ముగ్గురూ మళ్లీ తమిళంలో మాటలు మొదలు పెట్టారు. పెద్దగా నవ్వులు కూడా.

భాస్కర్ తో ఊరికే మాటలు పెట్టుకోవాలనిపించలేదు. ఏదో ఒకలా వాళ్లనే మాట్లాడించాలనిపించింది.

కాసేపు లాటిన్ అమెరికన్ పోయెట్రీ గురించి, బొలీవియా గురించి మాట్లాడుకున్నాం. కొవ్వాడకు రావడం ఇది మూడోసారి అని చెప్పాడు అమర్తరాజ్. హ్మ్! ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తారాండీ?

మధ్యలో కూర్చున్న ఉదయకుమార్ ను అడిగాను, “మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూశాను. పోయిన ఏడాది డిసెంబర్లో హంపిలో జరిగిన రెవొల్యూషనరీ కల్చరల్ ఫారమ్ కి వచ్చారా? ప్రొఫెసర్ భగవన్ వచ్చారక్కడికి. మనసయ్య గారు కూడా ఉన్నారు. మిమ్మల్ని వాళ్ల పక్కన చూసినట్లు అనిపిస్తోంది.”

“కల్చరల్ ఫారమ్ దగ్గర ఉదయకుమారనా?” అని పెద్దగా నవ్వాడు అమర్తరాజ్. ఇతనికి నవ్వడం, నవ్వించడం, ఫోటోలు తియ్యడం మాత్రమే వచ్చినట్లుంది. ఇంతవరకు ఫోన్తోనే ఫోటోలు తియ్యడం చూశాను. ఆ పెద్ద కెమెరా బ్యాగ్ ఎందుకు మోస్తున్నట్లో.

“ప్రొఫెసర్ భగవన్ తో ఒకసారి స్టేజి షేర్ చేసుకున్నా కానీ హంపిలో కాదు.” వివరించాడు ఉదయకుమార్.

“హ్మ్. మరి ఎక్కడ చూసానో?”

“ఈయన చాలా ఫేమస్. ఈయన మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా?” అమర్తరాజ్ నవ్వుతూ అడిగాడు.

కేసులా? ఇంత ఫ్రీగా, హాయిగా తిరుగుతున్నారు ఈయన మీద కేసులా? టీజ్ చేస్తున్నాడు ఈ అమర్తరాజ్.

“30?” తోచిన నంబరు చెప్పాను.

“హా…” పెదవి విరిచాడు అమర్తరాజ్. ఉదయకుమార్ ఒకటే నవ్వు. (మల్లెపువ్వు నవ్వు. నిజ్జం. మల్లెపువ్వులే! అట్లాంటి నవ్వును ఇంతవరకు ఎవరి ముఖంలోనూ చూడలేదు… నా చిట్టితల్లి ముఖంలో తప్ప.)

మరీ పెద్ద నంబరు చెప్పానేమో? “3?”

“380!” అమర్తరాజ్ సీరియస్ గానే అన్నా అతని ముఖంలో దాగని నవ్వు. ఉదయకుమార్ మళ్లీ గట్టిగా నవ్వాడు.

“వాటిలో 20, సెడిషన్ కేసులు” అమర్తరాజ్ మళ్లీ అన్నాడు, “మాకేమో ఈయన అపర గాంధీ. పోలీసులేమో ఈయన వెనకాలే ఉంటారు.”

“ఈరోజు పోలీసులేం రాలేదు కదా?” వీళ్లు జోకులేస్తున్నారో సీరియస్ గా ఉన్నారో అర్థం కావట్లేదు.

“ఒకతను స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చానన్నాడు కదా?” ఆశ్చర్యంగా అన్నాడు అమర్తరాజ్, “అంటే పోలీసు డిపార్ట్మెంట్ అని తెలీదా?”

“ఓహ్. లేదు. భయపడొద్దని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమయింది. నేను డేంజరస్ మనుషుల్తో ఉన్నానన్నమాట.” నవ్వుతూ అన్నాను.

“ఓహ్ మేం చాలా డేంజరస్” ముగ్గురూ నవ్వారు.

మాటల మధ్యలో అమర్తరాజన్,”మేం మాట్లాడే ఇంగ్లీష్ తెలుగులోకి ఇంటర్ ప్రిట్ చెయ్యడానికి మిమ్మల్ని కృష్ణ అరేంజ్ చేశాడనకున్నాం” అని అన్నాడు.

ఒహ్హో, నేను కూడా వీళ్లకు సర్ప్రైజే అన్నమాట. ఉత్సాహంగా చెప్పాను,“లేదు, లేదు. విశాఖకు వేరే పని మీద వచ్చాను. కృష్ణ, న్యూక్లియర్ ప్లాంట్ గురించి చెప్పి, సుందర రాజన్ కొవ్వాడ వెళ్తున్నారని చెప్పారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. కొంచెం తెలుసుకుందామని మీతో వచ్చాను.”

“గుడ్” అంటూ చిర్నవ్వుతో తలపంకించాడు అమర్తరాజన్.

భీముని పట్టణం బీచి దగ్గర కాసేపు ఆగాం. మిరపకాయ బజ్జీలు అందరి కోసం కొన్నాడు సుందర రాజన్.

ఒక ఊర కుక్క అక్కడే తచ్చాడుతోంది. అందరూ దాన్ని అదిలిస్తూ ఉన్నారు. ఉదయకుమార్ తన వంతు బజ్జీలో కొంత పిండి భాగం మాత్రం చిన్ని చిన్ని ముక్కలు చేసి చిన్న పేపర్లో పెట్టి దాని ముందు పెట్టాడు, “సాపడీ, సాపడీ” అంటూ. ఏమనుకుందో, ఎంత ఆకలి మీద ఉందో ఒక్క క్షణంలో తినేసిందది.

అక్కడ్నుంచి రామకృష్ణ బీచికి బయల్దేరాం. రామకృష్ణ బీచి చూడాలన్నది హెచ్చార్కె(నాన్న) జ్ఞాపకాల్లోంచి జాలువారిన నా చిన్నినాటి కల. తీరా అక్కడికి వెళ్లాక ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. గుండె నిండా ఏదో వెళితి. హెచ్చార్కె చెప్పినట్లు లేదన్నది ఒకటైతే, గడిచిన ఆ మూడు గంటలు నన్ను నిలవనీయడం లేదు. నాకు నేను అందని దూరాలకు ఎక్కడికో కొట్టుకుపోయానని ఏదో కంగారు. ఇంటికి వెళ్దామని చెప్పాను. వాళ్లేం అనలేదు. వెంటనే బయల్దేరారు.

అప్పటికే కృష్ణ మాకోసం ఎదురు చూస్తున్నారు. కాసేపు కూర్చున్న తరువాత వేరే చోటికి వెళ్లడానికి వాళ్లదగ్గర సెలవు తీసుకున్నాను.

ఉదయకుమార్ అమెరికాలో చదువుకున్నారని, ప్రొఫెసర్ గా కూడా పని చేశారని మాటల మధ్య చెప్పడం గుర్తొచ్చింది.

“ఎప్పుడైనా న్యూ జెర్సీ వస్తే మా ఇంటికి రండి.” అని అన్నాను.

“ప్రభుత్వం తన పాస్ పోర్ట్ ను తిరిగి ఇచ్చినప్పుడు వస్తాడు.” అమర్త రాజన్ అన్నాడు.

“పీ ఎమ్ అయిపోండి, పాస్పోర్ట్ మాత్రమే ఎందుకు? వీసా ఇచ్చేస్తారు” అన్నాను. నవ్వులతోనే వీడ్కోల్లు చెప్పుకున్నాం.

వీడ్కోలైతే తీసుకున్నాను కానీ, మల్లెపువ్వుల వాన కురుస్తూనే ఉంది – వాళ్లెవరో సరిగ్గా తెలీకపోయిన ఆరోజు నించి, ఎంతో తెలుసుకున్న ఈరోజూ, ఇక ఎప్పటికీ.

mamata2

ఇంతకీ వాళ్లెవరు?

అమర్తరాజ్ స్టీఫెన్ – ఇండిపెండెంట్ ఫొటొగ్రాఫర్. ఫోటొగ్రఫీలో ఎన్నో అవార్డులు గెల్చుకున్నాడు. మచ్చుకి, కూడంకుళం పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తీసిన ఫోటోలకు క్యాచ్ లైట్స్ ఆక్టివిస్ట్ అవార్డ్ (Catchlight’s Activist Award(2014)) వచ్చింది. కూడంకుళంలో పోరాటంలో పాల్గొన్నాడు. సామాజిక కార్యకర్తగా తను రాసిన ఫోటో-వ్యాసాలు దేశ విదేశాల్లోని పత్రికలలో అచ్చవుతుంటాయి.

సుందర రాజన్ – ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ సంస్థ నుంచి. జపాన్ ఫుకొషిమా కి వెళ్లివచ్చినవారిలో ఇతనూ ఉన్నాడు. కూడంకుళంలో జరిగిన పోరాటంలో పాల్గొన్నాడు. న్యూక్లియర్ పవర్ కు వ్యతిరేకంగా పని చేస్తున్న కార్యకర్తల్లో మొదటిశ్రేణిలో ఉంటాడు.

ఎస్ పి ఉదయకుమార్ – 1980 ల్లోనే Group for Peaceful Indian Ocean అనే సంస్థను ప్రారంభించాడు. అమెరికాలో పొలిటికల్ సైన్స్ లో పి. హెచ్ డి చేసి, మాన్ మత్ యూనివర్సిటీలో(Monmouth university) ప్రొఫెసరుగా పని చేసి, 2001 లో భారత దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. South Asian Community Center for Education and Research (SACCER) అనే విద్యాసంస్థను, భార్య మీరాతో కలిసి  స్థాపించాడు. People’s Movement Against Nuclear Energy (PMNAE) అనే సంస్థకు కన్వీనర్. ఈ సంస్థ తరపున, కూడంకుళం లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు. కూడంకుళం పోరాటం గురించి తమిళనాడు బయట ప్రపంచానికి తెలియజేయడమనే ముఖ్య ఉద్దేశంతో, 2014 లో పార్లమెంటరీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేశాడు. చివరికి ఆ పార్టీ కూడంకుళం పోరాటాన్ని పట్టించుకోకుండా మధ్యతరగతి ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి “పచ్చై తమిళగం” (పచ్చని తమిళనాడు) అనే పార్టీని స్థాపించాడు.  ఏ ఎన్నికలలోనూ గెలవకపోతేనేం – అసలుసిసలు ప్రజల మనిషి. కూడంకుళం పోరాటాన్ని నీరుగార్చేందుకు ఉదయకుమార్ ను ప్రభుత్వం ఎంతో వేధించింది. ఎన్నో కేసులు బనాయించింది. విదేశీ నిధులు ఉన్నాయనే నెపం మీద ఆయన ఇంటిమీద, విద్యాసంస్థ మీద రైడ్ చేసింది హోం మంత్రిత్వ శాఖ. ఆయన తన ఆస్థుల వివరాలన్నీ బయటపెట్టి, శాంతియుతంగా చేసే పోరాటాలకు, హంగర్ స్ట్రైకులు చెయ్యడానికి నిధులు అవసరం లేదని చెప్పాడు.

న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల జరిగే నష్టాలు ఫుకొషిమా దుర్ఘటన తరువాత ప్రపంచానికి తేటతెల్లమయ్యేనాటికే కూడంకుళంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొదలయ్యింది. దాన్ని ఆపటానికి చేసిన పోరాటం ఆలస్యంగా మొదలయ్యింది. పోరాటం అక్కడ ఇంకా కొనసాగుతున్నా, ఆ అనుభవాన్ని కొవ్వాడను, శ్రీకాకుళాన్ని కాపాడుకోవడానికి వినియోగించాలని కొవ్వాడకు వచ్చారు అలుపెరుగని యోధులు – మల్లెపువ్వుల నవ్వులు తోడుగా.

*

వీళ్లను కలిసేదాక కూడంకుళంలో జరిగిన పోరాటం గురించి ఏమాత్రం ఎరుక లేదు. మహా అయితే కొన్నాళ్ల తరువాత కొవ్వాడలో న్యూక్లియర్ పవర్ ప్లాంటును ఆడంబరంగా విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారని ఏ ఫేస్ బుక్కు ద్వారానో తెలిసేదేమో.

దళిత్ అంటే ఎవరని అమాయకంగా అడిగిన నా స్నేహితురాలికి నాకూ తేడా ఏమీ లేదు. ఇంటి దగ్గరి పోరాటాల గురించి మాకేం తెలీదు. మేం ఇంటినుంచి చాలా దూరం వెళ్లిపోయాం.

నాకు ఇంటికి వెళ్లాలనుంది…

(ఫోటోలు: అమర్తరాజ్ స్టీఫెన్)

*

అన్నం పెడితే చాలు… ఎంతసేపైనా!

 

 

 

చిత్రం: రాజశేఖర్ చంద్రం

చిత్రం: రాజశేఖర్ చంద్రం

*

 

వలసరవాక్కం మెయిన్ రోడ్డు నుంచి శ్రీదేవి కుప్పానికి దారి వుంది. ఆ శ్రీదేవి కుప్పం చాలా ఫేమస్. ఒకటి సినీ జనాల వల్ల, రెండు వేంకటేశ్వర స్వామి ఆలయం వల్ల. ప్రసిద్ధ గాయకుడు మనో ( మన నాగూరు బాబే) , విలక్షణ రచయిత బహుభాషా కోవిదుడు సాహితి, ఏ తెలుగు ఫన్షన్ జరిగినా నోరారా అందరినీ పలుకరిస్తూ తలలో నాలుకగా మెలిగే డా! శివకుమారీ, అంతే కాదు .. ఆ శ్రీదేవి కుప్పం మెయిన్ రోడ్డుని ఆనుకొని వున్న కనకతారానగర్ లో ఒకప్పుడుండే వేలుగారు, ముత్యాల సుబ్బయ్యగారు ( మా మంచి మనిషి.. దర్శకులు) , శ్రీలక్ష్మి, పి.జె. శర్మగారు, ఆంజనేయులుగారు, భీమనేని శ్రీనివాసరావుగారు, ఇప్పుడు వుంటున్న నిర్మాతలు శివరాజుగారు, వెంకటరాజుగారు, వందేమాతరం శ్రీనివాస్ గారు ( ఇప్పటికీ ఇల్లు అలానే వుంది.. ఆయనదే) వీరందరితోనూ కళకళాడుతూ వుండేది. ఇక హాస్య నటులు కారెక్టర్ ఆర్టిస్టులూ, మ్యుజీషియన్లు లెక్కకి మించి వుండేవారు.

గతాన్నంతా స్మరించుకుంటూ అటువైపే వాకింగ్ కి వెళ్ళాను. ఇప్పటికీ  ప్రొడక్షన్ మేనేజర్   సర్వేపల్లి బ్రహ్మయ్య , ప్రొడక్షన్ మేనేజర్ రాజు అక్కడే వున్నారు.

ఆ మెయిన్ రోడ్డు మీదే ‘సినిమా నాగే౦ద్రుడి “గుడి వుంది. అదీ కె.ఆర్.విజయ గార్డెన్స్ కి ఎదురుగా.  సినిమా నాగేంద్రుడని ఎందుకన్నారంటే పుట్ట బ్రహాండంగా ఆరేడు అడుగులకి పైగా వుంటుంది. లోపల నాగుపామే వుండదు. ( అని అందరికీ తెలుసు). గుడి మాత్రం కట్టుదిట్టంగా వుండి చాలా డీప్ ఎఫెక్ట్ ని కలిగిస్తుంది. ఇంతా చూస్తే ఆ ‘ప్రాపర్టీ “ప్రైవేట్ వారిది. షూటింగు చెయ్యాలంటే వాళ్లకి డబ్బులు చెల్లించాల్సిందే.

సరిగ్గా ఆ గుడి దాటాక వచ్చే రోడ్డే కనకతారానగర్ కి వెళ్ళే రోడ్డు. అక్కడే కలిశాడు నటరాజన్.

తెలుగులో ‘శీనులు “’రాజులు “ఎట్టాగో తమిళ్ లో “నటరాజన్ “లు ‘వాసు”లు అట్లాగ. నటరాజన్ కూడా ఒకప్పుడు పెద్దపెద్ద తమిళ్ సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్ గా చెయ్యడమే కాకుండా , తమిళ్ టూ తెలుగు డబ్బింగ్ రైట్స్ బ్రోకర్ గా పని చేసి చాలా సంపాదించాడు. ఎంతా అంటే శ్రీదేవి కుప్పంలోనూ , చుట్టుపక్కల ఏరియాల్లోనూ మూడు షూటింగ్ లకి పనికొచ్చే బంగళాలు, తోటలు కట్టేంత.

“ఏమీ సార్ మీ వీధి వదిలి మా ఏరియాకి వచ్చుండారు? లాంగ్ వాకా? ఏమైనా రొంబ హాపీ!”ఆగి మర్యాదగా పలుకరించాడు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే వుండటం తమిళ్ వాడి లక్షణం. ఎ.వి.యం శరవణన్ గారి లాంటి గ్రేట్  ప్రొడ్యూసర్లు కూడా ఎవరు ఆఫీసులోకి అడుగు పెట్టినా లేచి, చేతులు జోడించి నమస్కరించి ఆహ్వానిస్తారు.  మన వాళ్ళ సంగతి అడక్కండి. అలా అని మనవాళ్ళని తక్కువ చేయడం లేదు. హీరో నుంచి బాయ్ దాకా అద్భుతమైన భోజనాలు పెట్టడం ఒక్క తెలుగు నిర్మాతకే సాధ్యం. తమిళ్ వాళ్ళు సాంబారు సాదం పొట్లం , తైరు సాదం పొట్లంతో సరిపెడితే , మనవాళ్ళు మాత్రం విందు భోజనాలే పెడతారు.

సరే…..’’హాపీ…నటరాజన్ సారు.. ఏమిటి విశేషాలు? “గుడి పక్కనే ఆగి అన్నాను. “ఏమైనా మీ లకలక సాంగ్  మాత్రం అదిరిపోయింది… అన్నట్టు ఫ్రీ గా వుంటే ఒక చోటకి పోద్దాం”అన్నాడు.

నేను దాదాపు 200 సినిమాల్లో ( డబ్బింగ్) పాటలు వ్రాయడం వల్ల తమిళ్ ఫీల్డ్ లో వారు చాలామంది తెలుసు. మ్యూజిక్ సిట్టింగ్స్ గట్రా  ఏర్పాటు చేసేది ప్రొడక్షన్ మేనేజర్లేగా, అందుకే నటరాజన్ బాగా తెలుసు.

“ఎక్కడకీ? “అన్నాను. టైం చూసుకొని ఏడున్నర అయ్యింది. నేను బ్రేక్ ఫాస్ట్ చేసేది పదింటికి గనక తొమ్మిదింటికి ఇల్లు చేరితే చాలు. స్నానం, పూజా పూర్తవ్వడానికి.

“దగ్గరలోనే… పది నిమిషాల నడక “బుగ్గ గోక్కుంటూ అన్నాడు.

“సరే పదండి..”అన్నాను నడుస్తూ..

“న్యాయంగా మిమల్ని తీసుకెళ్ళకూడదు , మీ ‘కవింజర్లు (కవులు ) రొంబ సెన్సిటివ్. కానీ, ఆమె మీకు నిండా తెలిసిన మనిషి “మనో ఇంటి వైపు వున్న రోడ్డులో ఎంటర్ అయ్యి అన్నాడు.

“ఎవరూ? “అని అడిగాను

“కోడంబాకంలో మీ తెలుగు ప్రొడ్యూసర్ వుంచుకున్నాడే , కుముదం .. ఆమె దగ్గరకి “చిన్నగా నవ్వి అన్నాడు.

ఇండస్ట్రీ హైద్రాబాద్ కి మారాక కోడంబాకంలో తెలుగు సినిమా వాళ్ళు ఎవరు మిగిలారూ? శ్రీ చంద్రమోహన్ గారు, జలంధర్ గారూ, మరి కొంతమంది, విశ్వనాథ్ గారు కూడా హైద్రాబాద్ కి వెళ్ళిపోయారు. ఉన్నవాళ్లని వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు.

“గుర్తురావడం లేదు “అన్నాను.

“ఆయన రెండు తమిళ్  సినిమాలు కూడా తీసి వుండాడు. బాగా వున్నోడు “అన్నాడు. అయినా పేరు గుర్తురావడం లేదు. అసలు కోడంబాకం సినిమా పని మీద వెళ్ళే దశాబ్దం దాటింది.

“సరే ఆ యమ్మని చూస్తే గుర్తుపడతారేమో చూద్దం “అన్నాడు.

సినిమా జనాలకి ఓ తెగులుంది. ఉన్నదిఉన్నట్టు చెప్పరు. బోలెడంత సస్పెన్సు మెయిన్ టైన్ చేస్తారు.  నటరాజన్ ఆ సిస్టంకి విరుద్ధమేమీ కాదు.  ప్రొడ్యూసర్ పేరు తెలిసినా ప్రస్తుతానికి చెప్పడని నాకు అర్ధమయ్యింది.

“ఇంతకీ ఆవిడని నేనెందుకు చూడాలి? “ఆగి అన్నాను.

“మీరు మంచివాండు గనక. కళ్ళలో నీళ్ళు తిరిగితే జేబులో నోటు తీసిస్తురు గనకా. అన్నిటికీ మించి ‘కుముదం “అని తమిళ్ నాట పెరిగినా ఆయమ్మ తెలుగే గనక “అన్నాడు

తమిళ్ వాళ్లని నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళు చేసే సహాయం చేసి వూరుకోరు. వీలున్నంతగా ఎదుటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అయితే ఎదటి వాళ్ళు చేసి౦దంతా కూడా ‘తామే “చేశామని అనుకోవడమే కాదు , పబ్లిసిటీ కూడా ఇచ్చుకుంటారు. ఇవ్వాళ నేనేదో తమిళ్ సోదర్లని ‘ఏకి “పెడుతున్నానని అనుకోకండి స్నేహితులారా! ఎందరో మహానుభావులున్నారు. వారందరికీ వందనాలు. కొందరున్నారు , వాళ్ళని గౌరవించడం ఏ తెలుగువాడి వల్లా కాదు. తమిళ్ భాషకి ప్రాచీన హోదా దక్కిందని ఏ తెలుగు వాడు బాధపడలేదు. నిజం చెబితే సంతోషించాము కూడా.

అదే హోదాని కేంద్రప్రభుత్వం తెలుగు భాషకిచ్చినప్పుడు ‘ఎందుకివ్వాలి? ఏ బేసిస్ మీద ఇచ్చారు? “అంటూ కోర్టుకెళ్ళారు. తెలుగుభాషకి ప్రాచీన హోదా దక్కితే వాడికి పోయిందేమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అది రావణ కాష్టంలా రగిలీరగిలీ ఇవ్వాళ మళ్ళీ తెలుగు వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందనుకోండి.

సరే నడిచీ నడిచీ 20 నిమిషాలు నడిచాక ఓ చిన్న సందు వచ్చింది. లోపలికెళ్ళాం. సందు చివర్న కొబ్బరాకుల్తో కుట్టిన చిన్న చిన్న పాకలు, గుడెసెలు. ఓ పాక ముందు ఆగాడు, నేనూ ఆగాను. ‘పొన్నాంబళం “అంటూ అరిచాడు నటరాజన్. నాకూ మీకూ తెలిసిన ‘పొన్నాంబళం “భారీ వ్యక్తి, విలన్. (ముత్తు సినిమాలో చూడండి). అతనిక్కడ వుండటం ఇంపాజిబుల్.

సన్నగా, రివట్లా వుండే ‘పొన్నాంబళం “బయటకు వచ్చాడు. “వాంగ…వాంగ “అతి వినయంతో లోపలకి ఆహ్వానించాడు. నటరాజన్ కదలకుండా , “అందమ్మా ఏమిసేస్తా వుండాది “అని చెన్నై తెలుగులో అడిగాడు.

“పడుకోని వుండాది”గుసగుసగా అన్నాడు. “సరే “వెనక్కి తిరిగాడు నటరాజన్.

“చూడాలన్నారుగా”అడిగాను నేను. ఇంతదూరం నడిపించి ఇప్పుడు వెనక్కి తిరిగితే అసలు తీసుకురావడం ఎందుకట?

“లేపితే బేజారు”అన్నాడు పొన్నాంబళం. అతనా మాట పూర్తి చేసేలోగానే ఓ నడివయసావిడ “హా.. ళ్ “అనే ఒక వికృతమైన అరుపుతో పాకలోనుంచి బయటకు పరిగెత్తుకొచ్చింది. పొన్నాంబళం ఠక్కున ఆమెని పట్టుకున్నాడు.

“వాంగ సారు… వాంగ… అన్నం పెడితే చాలు ఎంతసేపైనా.. ఎలాగైనా… రా.. ఇదిగో రా.. “అంటూ జాకెట్టు చింపుకొని రొమ్ము చూపిస్తూ అరచింది. ఒళ్ళంతా మట్టిగొట్టుకుపోయి వున్నా, చీర చిరుగులు పట్టి వున్నా, వదనం  మాత్రం మారలేదు. ఆమె.. అవును.. ఆమెని ప్రొడ్యూసర్ (so and so) ఇంట్లోనే చూశా.

“వాంగ సారు.. వా.. అన్నం పెడితే చాలు ఎంతసేపైనా .. వూ? రావూ? రారా నా కొడకా “అంటూ నటరాజన్ మీదకి వురికింది. ఒక్క గంతులో తప్పుకున్నాడు. యీలోగా పొన్నాంబళం లాగి ఆమె చెంప మీద కొట్టి, గట్టిగా పట్టుకొని పాకలోకి తీసుకెళ్ళి పాక తలుపుకి తాళం వేశాడు. లోపల నుంచి అదే అరుపు “అన్నం పెడితే చాలు రా “అంటూ

“మీరుండండి.. నేనొచ్చేదాక.. డాక్టర్ని తీసుకొస్తా “అని గబగబా అన్నాడు పొన్నాంబలం.

“ఏమయ్యిందండి? “బాధగా అడిగాను.

ఆ ప్రొడ్యూసర్ ది రాయలసీమ. భార్యబిడ్డలు అనంతపురంలోనో ధర్మవరంలోనో మరో ఊళ్లోనో వుంటారని జనాలు చెప్పుకునేవాళ్ళు. మనిషి మాత్రం ‘జమ్ .”చెప్పిన అమౌంట్ ని ఠంచన్ గా ఇచ్చేవాడు. ఆయన తీసిన ఓ డబ్బింగ్ సినిమాకి నేను రెండు పాటలు వ్రాశాను. అప్పుడు చూశాను యీవిడని. ఖరీదైన పట్టుచీరా, ఒంటి నిండా నగలూ, ఓ..హ్… మహా రాజసంగా ఆజ్ఞ ఇవ్వడం.   మహా గయ్యాళి అనేవాళ్ళు డ్రైవర్లు, నౌకర్లు.

అందంతా నీకెలా తెలుసంటే , వాళ్ళింట్లో పని చేసే ‘తిలగమే “తరవాత మా ఇంట్లోకి పనిమనిషిగా చేరింది.

“ఏవన్నా చెప్పండి అప్పా, ఆయమ్మకి నిండా తిమురు”అనేది… యీవిడ ప్రసక్తి వచ్చినప్పుడల్లా. అయితే మాకు తెలిసిన యీవిడ పేరు మహేశ్వరి.  పాండీబజార్లో నేను       ‘మలర్ కోడి మేన్షన్”లో వుండేటప్పుడు యీవిడ బ్రిలియంట్ టుటోరియల్స్ కి అవతల  వున్న వీధిలో వుండేది. మహాచలాకీ మనిషి. క్షణంలో మాటలు కలిపేది. “సినిమాని నమ్ముకొని వచ్చానండి, చిన్న వేషం ఇప్పించినా మీకు కృతజ్ఞురాలిగా వుంటా !”అని అనేది. నేనూ కొత్తే. ఆ మాట అడిగితే చెప్పాను “అమ్మా.. నేనూ కొత్తవాడ్నే “అని “మగాళ్ళకేం సార్ క్షణాలలో ఎదిగిపోతారు “అన్నది. ఆ మాట నాకూ ఇప్పటికీ గుర్తే.

సడన్ గా ఆవిడని ‘ఇలా “చూడటం నాకు డైజెస్ట్ కాలేదు. “నటరాజ్ గారు.. అసలు జరిగింది ఏమిటి? “అడిగాను. లోపలి నుంచి అవే అరుపులు వినిపిస్తుంటే మనసుకి దుర్భరం అనిపించింది.

“ఈ ‘కుముదం “తెలుగు పిల్ల. ఎట్టా చేరిందో మద్రాసుకి చేరింది. సెంట్రల్ బాచ్ వాళ్ళ గురించి విన్నారుగా ! పాపం వాళ్ళ చేతులో పడింది. “ఓ క్షణం ఆగాడు నటరాజన్.

సెంట్రల్ బాచ్ అంటే సినిమా మోజులో అనేక రాష్ట్రాల నుంచీ , పల్లెటూర్ల నుంచీ మద్రాసు కొచ్చే ఆడపిల్లల్ని ట్రాప్ చేసి , వాళ్ళకి బోలెడు ఆశలు కల్పించి ‘వృత్తి “లోకి దించుతారు. లొంగని వాళ్ళని ఏ బాంబే కో, కలకత్తాకో, ఎగుమతి చేస్తారు. అదో పెద్ద సాలెగూడులాంటిది.

“మరి “షాక్ తో అన్నాను…

“యీ పొన్నాంబళం గాడు కూడా ఆ బాచ్ వాడే. అయితే సినిమా వాళ్ళ దగ్గర డ్రైవర్ గా పని చేస్తూ వుండేవాడు. ఆ పిల్లని చూడగానే వీడికి బ్రహ్మాడంగా  ప్రేమ పుట్టుకొచ్చి, విడిగా తన దగ్గర పెట్టుకున్నాడు. సినిమా ఛాన్సులు కూడా ఇప్పించే ప్రయత్నం చేశాడు. కొన్ని సినిమాలలో ‘గుంపులో గోవిందం”లా కూడా కనిపించింది. ఆ తరవాత యీ పిల్ల ‘లక్ “ తిరిగింది. అలాంటి ఓ గుంపులో యీమెని చూసి మా బండరాక్షసుడిలాంటి కమేడియన్ … అదేనండీ… తెలీదా… నల్లగా.. లావుగా.. ఆ.. ఆయనే యీవిడకో చిన్న యిల్లు ఏర్పాటు చేశాడు. ఆ కమేడియన్ భార్య ఓ కొరకంచు. ఎట్టా తెలుసుకుందో ఏమో ఆర్నెల్లు

గడవకుండానే ఓ పొలిటికల్ గ్యాంగ్ కి చెప్పి యీవిడ్ని ఇల్లు ఖాళీ చేయించడమే కాక వార్నింగ్ కూడా ఇప్పించింది. ఆ గొడవతోనే సదరు కమేడియన్, భార్య విడిపోయేంతవరకు వస్తే ‘పెద్దాయన’  సంధి కుదిర్చి ఫామిలీ సేవ్ చేశాడు.“ఆగాడు నటరాజన్.

ఆ విషయం నాకూ గుర్తుంది. తమిళ్ నాడులో సినిమాకి, రాజకీయానికి అవినాభావ సంబంధం ఏదో వుంది.   అంతేకాదూ, రాజకీయనాయకుల్లో 90 మంది తెలుగు జాతి ‘వేర్లు  “ వున్నవారైనా , తెలుగుని విమర్శించడం, విస్మరించడం నిజంగా మనకు విస్మయం కలిగిస్తుంది.

“తరవాత “అడిగాను

“నేను చెబుతాను సామీ “అన్నాడు డాక్టర్ని తీసుకొచ్చిన పొన్నాంబళం. ఆ డాక్టర్ గారు నాకూ తెలుసు. శ్రీదేవి కుప్పం మెయిన్ రోడ్డు లో వుండే ఎం.బి.బి.ఎస్. డాక్టర్. హస్తవాసి చాలా మంచిది. కానీ ఆయన ఇలా హోం విజిట్ చేయరు. మరి ఇక్కడికెలా వచ్చారో? అదే ఆయనతో అంటే “యీ పేషంటు నాకు కొత్త కాదు సార్, ఈవిడ అక్కడికి వచ్చేకంటే, నేను ఇక్కడకి రావడమే ఉత్తమం. అదీగాక అప్పుడప్పుడైనా వృత్తికి సంబంధించిన తృప్తి వుండాలి కదా సార్! “అని చిన్నగా నవ్వారు.

డాక్టర్ వెళ్ళిపోయాక మాతో పాటు పొన్నాంబళం కూడా నడుస్తూ వచ్చాడు.. ఇంటి తాళం వేసి. “మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, కొన్ని గంటల పాటు పర్లేదు. “ముక్తసరిగా అని “కథ నేను చెబుతానన్నాను కద సార్, తమిళ్ కమేడియన్ భార్య ఈవిడ్ని వెళ్ళకొట్టాక యీమెకి మళ్ళీ నేనే దిక్కయ్యాను. మనిషి చాలా మంచిది. అయినా ‘పాదరసం “లాంటిది. రెండు నెలలలోనే దుఖం నుంచి పుంజుకుంది.

మళ్ళీ ఓ నాడు షూటింగ్ దగ్గరే మీ తెలుగు ప్రొడ్యుసర్ గారి కంట పడింది. ఆయన పోయేంతవరకు అధారిటీ ఈవిడదే. అంత బలంగా ఆయన్ని అల్లుకుపోయింది. నేనూ అక్కడే ఆయన దగ్గరే డ్రైవర్ గా చేరాను. ఎంతలా ఈవిడ వుండేదంటే , నా మొహమే తెలీనట్టు ప్రవర్తించేది. డ్రైవర్ గానే చూసేది. కానీ సార్, నాకెందుకో యీమంటే ప్రాణం. కారణం నేను నిజంగా ప్రేమించిన అమ్మాయిలా వుండటమే. “ఓ క్షణం ఆగి, “నవ్వకండి సార్.. ఆఫ్ట్రాల్ డ్రైవర్ గాడికి ప్రేమేమిటి అనుకోకండి. లోకంలో అందరికీ ఎవరో ఒకరి మీద ప్రేమ వుంటుంది. ఎవరో ఒకరి మీద సాఫ్ట్ కార్నర్ వుంటుంది. నేనూ ఆర్టిస్టు కాదలచుకునే మద్రాసొచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువు ఆగిపోయింది. నేను ప్రేమించిన పిల్ల నాకు షాక్ ఇస్తే, ఆ షాకులో స్త్రీలనే అసహించుకుంటూ చేయరాని పనులు చేశా. సినిమాల్లో అవకాశాలు రాలేదనే ఫ్రస్ట్రేషన్ మరో వైపు పీడిస్తుంటే , దయా ధర్మం జాలీ కృపా లేని సెంట్రల్ బాచ్ లో చేరాను. మళ్ళీ యీ మనిషిని చూశాక ఎందుకో ‘మనిషి “ నయ్యా. మీ తెలుగు ప్రొడ్యూసర్ అర్ధాంతరంగా పోయాక, యీవిడ చేతులు మారింది , పొట్ట గడవడం కోసం చివరికి ‘ఫలాన “వాళ్ళ చేతుల్లో పడింది. మొదటి నుంచీ నేను ఆమెని ఎంత ప్రేమించినా , నా ప్రేమ విషయం ఎన్ని సార్లు చెప్పినా తను మాత్రం లెక్క చేసేది కాదు. సెంట్రల్ బాచ్ నుంచి తప్పించాను కానీ “ఫలాన “బాచ్ నుంచి మాత్రం తప్పించలేకపోయాను. వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఫుల్ గా వుంటుంది. ఎంత క్రూరత్వానికైనా పాల్పడుతారు. నాకు తెలిసిన యీవిడ ఏ పనైనా ఇష్టపడితేనే చేస్తుంది గానీ, బలవంతపెడితే లొంగదు. మరి లొంగదీసుకోడానికి వాళ్ళు ఏమేం చేశారో మన వూహలకి అందదు. ఆరునెలల పాటు పిచ్చిగా వెతికినా ఆవిడ నా కంట పడలేదు. చివరికి ఓ నాడు అంటే మూడు నెలల క్రితం “ఇప్పటిలాగానే , “అన్నం పెడితే చాలు.. ఆ తరవాత నీ ఇష్టం “ అని అరుస్తూ సినిమా నాగేంద్రుడి గుడి దగ్గర కనిపించింది. బట్టలన్నీ చీలికపీలికగా వున్నాయి.

నా గుండె ఒక్కసారి ఘొల్లుమంది. నా కారు… అదే, నేను నడిపే టాక్సీ లో తీసుకొచ్చి యీ పాకలో పెట్టాను. అప్పుడే యీ నటరాజన్ గారు చూసి మంచి మనసుతో కొంత డబ్బిచ్చారు. ఆమెకి ట్రీట్ మెంట్ చేయించాలంటే ఎంతవుతుందో తెలీదు. అదీగాక  ఎలా బయటపడాలో కూడా తెలీదు. పాపం ఆ డాక్టర్ గారికే నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఆయనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మూడు నెలల క్రితం ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా ఉండేది. ఇప్పుడు పరవాలేదు. పదిహేనురోజులకో ఇరవైరోజులకో యీ మాదిరిగా అరుస్తూ వుంటుంది. ఓ రెండుమూడు ఇంజక్షన్ల తరవాత మౌనంగా పడుకొని వుంటుంది.  ”సైలెంటయ్యాడు పొన్నాంబళం.

ఎందుకో అతని చెయ్యి అందుకోవాలని అందుకున్నాను. మనం మనిషిని చూడగానే ఏవేవో అంచనాలు వేస్తాం. కానీ మనిషిలోని ‘అసలు మనిషిని “అర్ధం చేసుకోవాలంటే యీ బతుకు చాలదు.

“కనీసం నిన్నైనా గుర్తుపడుతుందా? “అడిగాను.

మెల్లగా నవ్వాడు “పడుతోందని నాకు తెలుసు సార్… కానీ గుర్తుపట్టనట్టే వుంటుంది. ఏమో గుర్తు కూడా లేనేమో. కానీ, అందరిలో వైల్డ్ గా ప్రవర్తించే ఆమె, నాతో మాత్రం వైల్డ్ గా ప్రవర్తించదు. పైపెచ్చు తలవొంచుకుంటుంది. ఆ తల వొంచుకుని కూర్చున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది సార్! మీ తెలుగు ప్రొడ్యూసరింట్లో రాణివాసం నెరిపింది. కానీ ఇప్పుడు , ఇంత దయనీయంగా .. “సైలెంటు అయిపోయాడు.

“ఆమెని నువ్వు.. “ఆగాను. “ప్రేమిస్తానా లేదా అనా? లేక ఆమెని నేను వాడుకున్నా లేనా అనా? ప్రేమిస్తాననే చెబుతా. నిజం చెబితే నేను ప్రేమించేది యీమెని కాదు, యీమె పోలికలున్న నా ‘కుముదా “న్ని. యీమెకి ఆ పేరు పెట్టింది నేనే. ఈవిడ అసలు పేరు ఏమిటో కూడా నాకు గుర్తులేదు. ఇహ వాడుకోవడం గురించా? లేదు సార్. ఒకప్పుడు నేను పచ్చి రౌడీని, తిరుగుబోతుని. ఇప్పుడు ఆ ఆలోచన వస్తేనే పొడుచుకొని చచ్చిపోవాలనిపిస్తుంది.

ఎందుకంటే, ఆవిడ అరుపులు విన్నారు కదా సార్… “అన్నం పెడితే చాలు … రారా “అని. నాలాంటి పాషాణంగాడే యీవిడ్ని అంత నీచానికి దిగజార్చి వుండాలి. ఏముండాది సార్? ఎముకలు చర్మం.. అక్కడక్కడా కొండలూ లోయలూ.. ఏముండాది సార్ యీ శరీరంలో. నేనిప్పుడు దీని గురించే ఆలోచించట్లేదు సార్. ఈమె బాగుపడాల. అంతే నేను చేసిన పాపంలో కొంతైనా యీమె బాగుపడితే , కరిగిపోయిందనుకుంటాను.

ముగ్గురం మౌనంగా నడుస్తూ నడుస్తూ సినిమా నాగేంద్రుడి గుడి దాకా వచ్చాం. మౌనంగానే సెలవు తీసుకొని కనకతారా నగర్ వైపెళ్లాడు నటరాజన్. నమస్కారం చేసి వెనక్కి తిరిగాడు పొన్నాంబళం. నేను నడుస్తూనే వున్నాను. ఆలోచిస్తూనే వున్నాను. సినిమా వ్యామోహంలో ఎందరు బంగారు తల్లులు ఇలా పరమనీచుల చేతుల్లో చిక్కారో! ఎందరి మానాలు టైర్ల కింద పువ్వుల్లా నలిగిపొయాయో! ఎందరు ఆకలి కోరలకి బలై ఇలా ఆక్రోశిస్తున్నారో!

మెరిసే తారల్నే కాదు… రాలిపోయిన, రాలిపోతున్న నక్షత్రాలని మాత్రం ఎవరు లెక్కించగలరూ?

PS  : నటరాజన్ చెప్పిన కథనే (కొంత) పొన్నాంబళం చెప్పినా, రిపీట్ చెయ్యడం ఎందుకని పొన్నాంబళంతో కథని కంటిన్యూ చేశా. కథనం సాఫీగా వుండటం కోసం. వాళ్ళు మాట్లాడింది మూడు వంతులు తమిళం ఒక వంతు చెన్నై తెలుగు , అయినా నేను వీలున్నంత వరకు తెలుగులోనే చెప్పాను.

*

ఆకాశానికి అంకెల నిచ్చెన!

ramanujan1

గణితమంటే అతనికి అంకెలతో ఉప్పొంగే అనంత ప్రవాహం . అందరూ చూడలేని  విచిత్రమైన రంగుల్ని నింపుకున్న వింత వర్ణచిత్రం, ఇసుక రేణువులన్ని రహస్యాల్ని గర్భాన దాచుకున్న సాగర తీరం. గణితం అతనికి జీవం, జీవన వేదం. గణితం అతని దైవం. అసలతనికి గణితమే జీవితం. ఇంతకీ అతని పేరు శ్రీనివాస రామానుజన్. అంకెల్తో ఎటువంటి ఆటైనా  అడగలిగేటంతటి మేధస్సును కలిగి ఉన్నప్పటికీ వాటిని దైవ సమానంగా పూజించగలిగేటంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన  గొప్ప వ్యక్తి శ్రీనివాస రామానుజన్.

రాబర్ట్ కనిగల్ రచించిన రామానుజన్ జీవిత చరిత్ర  ఆధారంగా, అదే పేరుతో 2015లో నిర్మింపబడిన చలన చిత్రం The Man Who Knew Infinity.

భారతీయ గణిత శాస్త్రవేత్తగా, అత్యున్నతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తిగా శ్రీనివాస రామానుజన్ పేరు వినని వారెవరూ ఉండరు. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1887 నవంబర్ 22న జన్మించిన రామానుజన్ ని ముఖ్యంగా గణిత శాస్త్రం రంగంలో అత్యంత మేధావిగా పేర్కొనవచ్చు. కానీ అతని జీవితం నల్లేరు మీద నడకేమీ కాదు.

ఈ సినిమా అతని చిన్నతనాన్నీ, చదువుకున్న రోజుల్నీ ప్రస్తావించకుండా యవ్వన దశలో దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తూ ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న పరిస్థితులతో మొదలవుతుంది. మెల్లగా చిన్న ఉద్యోగం సంపాదించుకున్న కొద్ది రోజులకే ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్ కి వెళ్లే అవకాశం అతనికి లభిస్తుంది. ఆ రోజుల్లో సముద్రయానం నిషిద్ధం కావడం వల్ల కొన్ని సందేహాలతో, మరి కొన్ని సంశయాలతోనే అతను కేంబ్రిడ్జికి వెళ్తాడు.

అతను ఇంగ్లాండ్ రావడానికి కారకుడైన సీనియర్ గణిత శాస్త్రవేత్త సి.హెచ్. హార్డీతో కలిసి ఐదు సంవత్సరాల పాటు తాను రాసిన గణిత సిద్ధాంతాలపై సాధన చేస్తాడు. పరస్పర వ్యతిరేక వైఖరులు కలిగిన ఆ ఇద్దరు మేధావుల మధ్య  ఏర్పడే ఘర్షణ, అనుబంధం, అక్కడ రామానుజన్ గడిపిన జీవితం ఈ చలనచిత్రంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. నిజానికి ఆ రోజులే రామానుజన్ కి అత్యంత ఆనందాన్నీ, కష్టాన్నీ కూడా కలిగించిన రోజులు.

ramanujan2

అంకెల్ని అక్షరాలుగా భావిస్తే, రామానుజన్ ని అతి విశిష్టమైన కవిగా పేర్కొనవచ్చు. కవికి హఠాత్తుగా కలిగే సృజనాత్మకమైన ఊహల్లా ఇతని ఆలోచనల్లోకి ఉన్నట్టుండి సరికొత్త సమీకరణాలు ప్రవేశించేవి. కవి వాస్తవాన్నీ, కల్పననీ పద చిత్రాలతో పెనవేసినట్టు, అసంకల్పితంగా ఇతను రాసిన సిద్ధాంతాలన్నీ నిదర్శనాలతో సహా నిజాలుగా నిరూపితమయ్యాయి. ఇసుక రేణువుల్లోనూ, నీటి ప్రతిబింబంలోనూ, కాంతి రంగుల్లోనూ ఇలా ప్రకృతికి చెందిన ప్రతీ చిత్రంలోనూ విచిత్రమైన అంకెల క్రమాన్నీ, అందాన్నీ చూడగలిగిన సౌందర్య పిపాసి రామానుజన్.

ఆటోడిడక్ట్ అయిన రామానుజన్ గణిత శాస్త్రంలో అప్పటివరకూ సాంప్రదాయబద్ధంగా ఉపయోగిస్తున్న పద్ధతులేవీ తెలుసుకోకుండానే ఆ శాస్త్రానికి చెందిన ఎన్నో కొత్త విషయాల్ని వెలికి తీసి తనకో ప్రత్యేకమైన శైలినీ, మార్గాన్నీ ఏర్పరుచుకున్నాడు. తీవ్రమైన ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఈ మేధావి, తన ప్రతిభను తమ ఆరాధ్య దేవత నామగిరి అమ్మవారి అనుగ్రహంగా అభివర్ణించాడు. ‘దేవుడి ఆలోచనను ప్రతిబింబించనప్పుడు ఏ సమీకరణమైనా తనకి  అర్థవంతం కాదన్న’ అభిప్రాయాన్ని అతను వ్యక్తపరిచాడు. మేథమెటికల్ ఎనాలసిస్, నెంబర్ థియరీ వంటి గణిత శాస్త్ర రంగాల అభివృద్ధిలో ఇతని పాత్ర అమూల్యమైనది. రామానుజన్ వ్యక్తిత్వంలోని ఈ విభిన్నమైన

కోణాలన్నిటినీ నటుడు దేవ్ పటేల్ అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. హార్డీగా నటించిన జెర్మీ ఐరన్స్  నటన కూడా చెప్పుకోదగ్గది.

అతని జీవితాల్లోని కొంత భాగానికే అధికమైన ప్రాధాన్యతను ఇచ్చి, నటీనటుల నటనా చాతుర్యంపై ఎక్కువగా ఆధారపడిపోవటం వల్ల ఈ చలన చిత్రం అసంపూర్ణంగా అనిపించినప్పటికీ రామానుజన్ వ్యక్తిత్వాన్నీ, మేధా శక్తినీ ప్రతిఫలించడంలో  మాత్రం సంపూర్ణంగానే  సఫలమైంది. పరిసరాలపై తక్కువా, వ్యక్తుల భావాలపై ఎక్కువా శ్రద్ధ పెట్టడం వలన కెమెరా కన్ను వంద శాంతం పనితీరును ప్రదర్శించలేకపోయినప్పటికీ అసంతృప్తిని మాత్రం మిగల్చలేదు. పూర్తి సాంప్రదాయ పద్ధతిలో చలన చిత్రాన్ని నడిపించినా  దర్శకుడు మాథ్యూ బ్రౌన్ కృషి, ప్రయత్నం అభినందనీయమైనవి.

‘మనుషులకంటే మీరు అంకెలనే అధికంగా ప్రేమిస్తారటగా’ అని అతని భార్య  జానకి దెప్పి పొడిచినప్పుడు అతను సంతోషంగా అంగీకరిస్తాడు గానీ భార్యనీ, బాధ్యతనీ కూడా అతను అమితంగానే ప్రేమిస్తాడు, ఇంగ్లాండ్ లో ఉన్న రోజుల్లో ఆమె కోసం తీవ్రంగా పరితపిస్తాడు. సనాతన వాది కావడం వలన అక్కడి ఆహారానికి అలవాటుపడలేక, పర దేశపు వాతావరణంలోని మార్పులకి సర్దుబాటు చేసుకోలేక అనారోగ్యం పాలవుతాడు. టీబీ వ్యాధి బారిన పడి శారీరకంగా నరకాన్ని అనుభవిస్తున్నా తన పనికి మాత్రం ఆటంకం కలగనివ్వడు. ఒక భారతీయుడిగా వివక్షకి గురికావడం వలన కొంత  ఆలస్యమైనప్పటికీ చివరికి హార్డీ కృషి ఫలితంగా తన సిద్ధాంతాలని ప్రచురించుకుని, అరుదైన పురస్కారమైన రాయల్ సొసైటీ ఫెలోషిప్ ని పొందుతాడు. ఇక ఇంటికి వెళ్లాలన్న కోరికతో ఇండియాకి తిరిగొచ్చి దారిలో మళ్ళీ  తిరగబెట్టిన అనారోగ్యం కారణంగా, జన్మభూమిని చేరుకున్న సంవత్సరానికే 1920 లో తన 32 వ ఏట తుది శ్వాసని విడుస్తాడు ఈ అపర బ్రహ్మ.

మరణం కంటే బాధాకరమైన విషయం మరింకేముంటుంది. మరణమంటే నాశనం కావడమేగా. మరణించిన వారు, జీవించి ఉన్న కాలంలో చేసిన గొప్ప పనులు, లోకం వారిని పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా  చెయ్యవచ్చు . కానీ వారి అనుభూతులు, అనుభవాలు ముఖ్యంగా వారి  విజ్ఞానం వారితో పాటుగా అంతం కావాల్సిందేగా. అటువంటిది, ఒక మేధావి అంత చిన్న వయసులో మరణించడం జాతికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందన్న భావన మనల్ని దుఃఖానికి గురిచెయ్యకమానదు.

అయితేనేం? అతనికి అనంతమైన అంకెల గమనం తెలుసు. అత్యల్పమైన జీవితకాలంలోనే అంతులేనన్ని అద్భుతాలని సృష్టించడమూ తెలుసు. అందుకే అతను విశ్వమంత విశాలమైన ప్రపంచ చరిత్రలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మిగిలిపోయాడు.

                              ***

 

హృదయము సుమ్మీ!  

myspace

ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది, దీపమందు మా
హృదయము సుమ్మి! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో

చిక్కటి చీకటిలో కలిసిపోయిన కొత్త సమాధి. దాని మీద దాదాపు ఆరిపోడానికి సిద్ధంగా వున్న ఆముదపు దీపం వెలుగు పడుతోంది. నూనె పూర్తిగా అయిపోయినా కూడా మిణుగురు పురుగులాగా వెలుగుతూ ఆరుతూ వుంది. దానిని దీపమమని ఎలా అంటాం?
మరి, శ్మశానంలో పెనుచీకట్లలో చిక్కుకుని వెలుగుతున్నది ఏమిటి?

అది, పుట్టిన కొద్ది రోజులకే గిట్టిన బిడ్డను చూసి గుండెచెదిరిన ఓ దిక్కులేని తల్లిది. ఆ చిట్టి సమాధి చెంతనే హృదయం వదిలి పెట్టిపోయింది. ఆమె ప్రాణం అక్కడే కొట్టుమిట్టాడూతూ వుంది. బహుశా, కన్నపేగుకోసం అల్లాడి పోతూ కొడిగట్టుతోంది.

***

ఇది గుర్రం జాషువ గారి ‘శ్మశాన వాటి’ పద్య ఖండిక లోనిది. ఇందులో కేవలం తొమ్మిది పద్యాల్లో ఇదొకటి. ఈ తొమ్మిదిలో కనీసం రెండు (ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….) వినని గ్రామస్తులెవరూ వుండరు. బహుశా , కొన్ని లక్షలమందికి ఈ పద్యాలు కంఠతా ఉంటాయి.

***

ఎంత గొప్పటి పద్యం! తన బాణానికి ఒరిగిన పక్షి పక్కన రోధించిన సహచరుని బాధను వాల్మీకి పట్టుకున్నట్టు , జాషువ పట్టుకున్నాడు. బిడ్డల్ని కోల్పోయిన తల్లుల వేదనని ఎంత గొప్పగా చెప్పేడు! ఎంత సహానుభూతి చెందక పొతే  అంత గొప్పటి expression వస్తుంది!

ఈమధ్య ఈ ‘కాటిసీను’ పద్యాలున్న యూట్యూబ్ లింక్ ని మిత్రుడు పల్లంరాజు గారు షేర్ చేస్తే విన్నాను ఎన్నో ఏళ్ల తర్వాత.

అరుణోదయ రామారావు ఎక్కడ, ఎప్పుడు కనబడినా పద్యాలు పాడించుకోవడం అలవాటైనా అయినా అప్పటి ఆర్టిస్ట్ పాడగా వినడం ఎన్నో ఏళ్లయింది. ఓ నెల రోజులుగా ఈ లింక్ లోని పద్యాలు మళ్ళీ మళ్ళీ వింటున్నా. కాకతాళీయంగా జాషువ గారి రచనల్ని మళ్ళీ చదువుతుండటం వల్ల ఈ పద్యాల్లో కొత్త అర్ధాలు స్ఫురిస్తున్నాయి. జాషువ శైలి, వస్తు వైశాల్యం, సూక్ష్మ దృష్టి అచ్చెరువు కలిగిస్తున్నాయి.

ఈ పద్యాల్ని కొన్ని వందల సార్లు వింటూ పెరిగిన తరానికి చెందినవాడిని. పండుగలప్పుడు, ముఖ్యంగా శివరాత్రికి, అమ్మ తల్లుల పండగలకి — సత్య హరిశ్చంద్ర నాటకం తప్పని సరి. నాటకం వేయించకపోతే ఊరికి పరువుతక్కువ. కాబట్టి ఎలాగో ఒకలా డబ్బులు వసూలు చేసి వేయించేవారు.

అన్ని గ్రామాల్లో వలెనే  హీరమండలం (శ్రీకాకుళం జిల్లా)లో కూడా వేసేవారు – సంవత్సరానికి ఒకటీ లేదా రెండుసార్లు. దీంతో   పాటు రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం లాటివి వేసినా ‘హరిశ్చంద్ర ‘ నాటకం, అందులోనూ ‘కాటి సీను’ చాలా పాపులర్. హరిశ్చంద్ర లోని మిగతా ఘట్టాలు బలిజేపల్లి వారివి అయినా, ఏ నాటక కంపెనీ అయినా కాటి సీను లో మాత్రం  జాషువ పద్యాలు ఉండాల్సిందే . ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….ఈ పద్యాలు రెండు మూడుసార్లు పడాల్సిందే.

రిహార్సలప్పుడూ , నాటకం వేస్తున్నపుడూ రాత్రంతా పొలం గట్ల మీద కూచుని ఈ నాటకం చూడడం, చాంతాడంత రాగాలు తీస్తూ పద్యాలు పాడడం ఇంకా జ్ఞాపకాల్లో తాజాగా వున్నాయి. నాటకంలో సందర్భం బట్టి , మూడ్ బట్టి రాగం పొడవు , కంఠ స్వరం ఆరోహణావరోహణలు ఉండేవి. కోపాన్ని, కరుణని, ప్రేమని , దర్పాన్ని — అన్ని భావనలని రాగాలతోనూ , పద్యాల్లోని పదాలను పలకడం ద్వారానూ చాలా గొప్పగా పలికించేవారు.

ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప ట్రాజెడీ, హరిశ్చంద్ర. సత్యంకోసం మనుషులు ఎన్ని కష్టాలు భరించి నిలబడతారో చూపిస్తుంది. కాటి సీనులో నాటకం లోని సంఘటనలు పతాక స్థాయికి వస్తాయి. కీలకమైన ఘట్టానికి జాషువ రాసిన పద్యాలు గొప్ప బలాన్ని తీసుకువచ్చాయి . బహుశ , జాషువ తప్ప ఇంకెవ్వరూ అంత బాగా రాయగలిగి ఉండేవారు .

తొమ్మిది పద్యాల్లోనే పేద-ధనిక బేధాలు, అసహజ మరణాలు కలిగించే వేదనలు, కాటిని కూడా వదలని చట్టాలు — ఎన్నో విషయాల్ని తీసుకువస్తారు. బిడ్డలకోసం ఎన్ని వేలమంది తల్లులు “అల్లాడి, అల్లాడి” పోయారో అని అంటాడు. ఎంత వేదన పడిఉంటారంటే , వాళ్ళ రోధన విని కన్నీళ్ళలో రాళ్లు కూడా కరిగిపోయాయంటాడు.

దిక్కూ మొక్కూ లేని వాళ్ళకోసం ఏడ్చే వాళ్ళు సమాజంలో ఎవరూ లేరని విమర్శిస్తాడు. అందుకే, అర్ధరాత్రి పూట ఎవరితోడూ లేకుండా నిస్సహాయురాలై వచ్చిన హంసనారి (చంద్రమతి) దైన్యాన్ని చూసి కరిగిపోతాడు. ఎందుకట్లా ఏడ్చి ఏడ్చి బాధపడతావు, కొంచెం తెరిపినపడు అని ఓదారుస్తాడు.

అప్పుడు, రాస్తాడు ‘ముదురు తమస్సులో …’ పద్యాన్ని. పసిపాపని కోల్పోయిన తల్లి వేదనని చెప్పడం మాత్రమే కాదు, నాటకంలో కొద్ది సేపట్లో తాను, తన  సహచరి ఎదుర్కోబోయే విపత్తును సూచన ప్రాయంగా చెప్పడానికి ఒక సాకు. లోహితాస్యుడి మరణాన్ని, అది విని చంద్రమతి ఎంతగా దుఃఖిస్తుందో చెప్పడం జాషువ ఉద్దేశం.
ఆసక్తి వున్నవాళ్లు ఆ పద్యాలు ఇక్కడ వినొచ్ఛు.

ఈ పద్యంలోని ఉదహరించినట్టు, సమాధులమీద దివ్వెలుగా వెలుగుతున్నహృదయాలు హంసనారిదో,  చంద్రమతిదో, Alan Kurdi తల్లిదో, మాయమైన కొడుకు గురించి అల్లాడిన ‘హజార్ చౌరాషిర్ మా’ దో. లేక ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న యుద్ధరంగాల్లో ఒరుగుతున్న వేలమంది పిల్లల తల్లులవో.
అది, అలాటి వ్యధలననుభవిస్తున్న తల్లుల వేదన పట్ల సహానుభూతి చెందిన జాషువాది.

అది హృదయమ్ము సుమ్మీ!

 

 

జ్యోతిలక్ష్మికి చీర కడితే!

samvedana logo copy(1)

jyothi-lakshmi-18045జ్యోతి లక్ష్మి పోయారు. కొందరు మిత్రుల పోస్టులు చూశాక ఏవో ఆలోచనలు.

జ్యోతి లక్ష్మి కేవలం ఐటెం గర్ల్‌ కాదు. ఆమె సంప్రదాయ నృత్య కళాకారిణి అని చెప్పాలనే ప్రయత్నం అందులో కనిపించింది. కేవలం సమాచారం ఇవ్వడం కాకుండా విలువల పరమైన విషయమేదో అంతర్లీనంగా ఉంది. ఇంత చెత్త డాన్సులే కాదు, కూసింత మంచి డాన్సులు కూడా చేసింది అని గుర్తించండి అని చెప్పడం ఉంది. అది నిజమేనా! అంతకుముందు రాజాస్థానంలో చేసిన నృత్యాల్లోనూ- పాటల్లోనూ ఉన్నది ఏమిటి? అభిరుచుల విషయంలో మన అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నదేమిటి? సినిమా పరంగా బూతు చుట్టూ అల్లుకున్న భావనల్లో ఉన్న మతలబు ఏమిటి అనేది చూడాల్సి ఉంది.

క్లబ్‌డాన్సర్‌ అనే బదులు ఇటెం గర్ల్‌అనే పదం పొరబాటున వాడుతున్నారు. కొత్త పరిభాష అలవాటైపోయాక పాత పదం మర్చిపోయి కొత్తదే వాడేస్తూ ఉంటాం. ఈ ఐటెం అనే పరిభాష 90ల తర్వాతది. రాంగోపాల్‌వర్మ శిష్యుడు నివాస్‌తీసిన శూల్‌లో చోలీకీ పీచే క్యాహై అంటూ మాధురీ దీక్షిత్‌ చిందులేసే దాకా  ఐటెంసాంగ్‌ అనే పదం మన పదకోశంలోకి రాలేదు. తెలుగులో  వర్మ మరో శిష్యులు పూరీ జగన్నాధ్‌ తన మ్యూజ్‌ ముమైత్‌ఖాన్‌తో మరో దశకు తీసికెళ్లారు.

ఇటెం, మాల్‌, చీజ్‌ అనేవి బాంబేలో ప్రబలంగా వినిపించే మాటలు. అమ్మాయిలను సెక్స్‌ఆబ్జెక్ట్స్‌గా చూసే లంపెనైజ్డ్‌ మార్కెట్‌ పరిభాష.  జ్యోతి లక్ష్మియుగానికి వాళ్లు క్లబ్‌డాన్సర్లే. అవి బీడీ కీ జలైలే, చింకీ చమేలీ రోజులు కావు. అవి డిటెక్లివ్‌లు, పోర్నో పుస్తకాలు చిన్నచిన్న దుకాణాల ముందు తీగలపై వేలాడుతున్న రోజులు. పోర్నో ప్రతి మనిషికి అందుబాటులోకి రాని రోజులు. ల్యాండ్‌లైన్‌రాజ్యమేలుతున్న రోజులు. ప్రైవసీకి కష్టపడాల్సి వచ్చే రోజులు.  యాస్పిరేషనల్‌ మిడిల్‌క్లాస్‌ఇంత పెరగలేదు కాబట్టి విలాసం అనేది నెగెటివ్ అర్థంలో స్థిరపడిపోయి ఉండేది. అప్పుడు కారు అనేది అరుదైన వ్యవహారం కాబట్టి కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడిదానా అనేది విలాసాన్ని దెప్పిపొడవడానికి సరిపోయింది. ఇవాళ ఆ పాటను అదే అర్థంలో సమాజం స్వీకరించలేదు. వర్గ రాజకీయాలను అంత కుదించి మాట్లాడడం ఇవాళ కుదరదు. అప్పటికి రిసార్టులు ఇంత లేవు కాబట్టి క్లబ్‌ విలాసానికి చిరునామాగా ఉండేది. సినిమాల్లో అలాగే చూపించేవారు. అందువల్ల క్లబ్తో ముడివేసి క్లబ్‌డాన్సర్‌ అనే పేరు పెట్టారు. లేదా క్యాబరే అన్నారు. కేవలం క్లబ్బుల్లో తాగుబోతుల మధ్య డాన్స్ వేసే వారు అని నైఘంటికార్థం తీయకూడదు.

పల్లెటూరి ప్రేక్షకుడితో పాటు పట్నపు ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకోవాల్సిన మార్కెట్‌అవసరం ఏర్పడిన సంధికాలంలో తెలుగు సినిమాలో ఆ సంధి ప్రేలాపన చాలా కనిపిస్తుంది. ఆ సంధికాలపు తొలిదశలో దాసరి ఉంటే దాని ఉచ్చదశకు ప్రతినిధిగా రాఘవేంద్రరావు కనిపిస్తారు. తెలుగు సినిమాల్లో కత్తులు కటార్లు తగ్గిపోయి దొరలు-భూస్వాములు వాళ్ల పంచెకట్లు తగ్గిపోయి గన్స్‌-పాంట్స్‌తో విలన్లు వస్తున్న కాలంలో వచ్చిన ట్రెండ్‌ ఈ క్లబ్‌డాన్సర్లు. అంతకుముందు పూర్తిగా గ్రామీణ ప్రేక్షకులే ఎక్కువగా మార్కెట్‌లో ఉన్నరోజున రాజుగారి లేదా జమీందారుగారి సంస్థానంలో పాటలను చూపించేవారు. స్త్రీని విలాసవస్తువుగాచూపే విషయంలో అవేమీ తక్కువ కాదు. ఇపుడు మిత్రులు జ్యోతిలక్ష్మి మీద గౌరవం పెంచడానికి పంచుతున్న త్యాగయ్య పాటే తీసుకున్నా అందులో ఆడువారు యమున కాడ క్రిష్ణుని గూడి..అందరు చూడగ.. ఏమేమి చేయుచున్నారో ఉంది. అలా క్రిష్ణుని గూడి చేసినా ఆధునిక హీరోను కూడి చేసినా చేసేది ఒకటే. చెప్పేది ఒకటే.అలాగే ఆ గీతంలో జ్యోతి లక్ష్మి వస్త్రధారణ కూడా భిన్నంగా ఏమీ లేదు. జ్యోతిలక్ష్మి రెండు పాటల్లోనూ తన పాత్రేదో తాను పోషించింది. ఒకదాని కొకటి తక్కువా కాదు. ఎక్కువా కాదు.

సెక్స్‌సంబంధమైన పరిభాషను నిత్యజీవితంలో సామాన్యులు వాడే పదజాలంనుంచి విడదీసి గంభీరంగా సంస్కృతంలో మాట్లాడుకుంటే అదేదో సున్నితం అనిపిస్తుంది.నేనెక్కడో దాచాను బంగినపల్లి అంటే బూతుగా కనిపించి ఆ త్యాగయ్య చిత్రం పాటలోని పాలిండ్లు కదల, కుటిలోలకములు మెదల అంటే బూతుగా అనిపించదు. అంతెందుకు మన సాహిత్యంలో కూడా అవసరమైన చోట రతి ప్రక్రియ అనో ఇంకోటో వాడగలం కానీ తెలుగుపదం వాడలేము. శిశ్నము, భగము అంటే అంత బూతుగా కనిపించదు, తెలుగు వాడితేనా, అమ్మో! ఇదంతా ఒక సంస్కృతి మన మెదళ్లపై చేసిన పెత్తనం ఫలితం. ఇపుడు ఇంగ్లిష్‌కి వద్దాం. ఫక్ అనేమాట యథాలాపంగా వాడేస్తుంటారు. షిట్‌ అనే మాటని డైనింగ్‌టేబుల్‌మీద కూడా యథాలాపంగా విసిరేస్తుంటారు. కానీ తెలుగులో వాడమనండి, ఎంత అసహ్యంగా మొకం పెడతారో అందరూ! ఇవేమో ఆ పదాలతో ముడిపడిన ఆంగ్ల సంస్కృతిలో ఉన్న పారదర్శక స్వభావానికి సంబంధించిన అంశం. అంతకంటే ముఖ్యంగా మార్కెట్‌కు సంబంధించిన అంశం. అంటే కాస్త వెనక్కు పోతేనేమో కొందరికి మాత్రమే పరిమితమైన వ్యవహారం. గాంభీర్యం లేదా లాలిత్యం అనిపిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకో భాషలోనేమో ఆ భాషలో అది కామన్‌ కాబట్టి మనకు ఏమీ అనిపించదు.

actress-jyothi-lakshmi-passes-away-63

ఒకటి ఫ్యూడల్‌ మాయాజాలం. ఇంకోటి మార్కెట్‌ మాయాజాలం.ఇక్కడ బూతు అనేది ఆ భాషతోనూ ఆ భాషతో ముడిపడిన సమాజముతోనూ ముడిపడి ఉన్నది. భాషతో పాటు అనేకానేక ఇతర అంశాలు కూడా పనిచేస్తాయి. విచ్చిన పూరేకు పచ్చల పిడిబాకు, గుచ్చుకుంటే తెలుస్తుందిరా అంటే కనిపించని బూతు వేటకత్తి ఒంట్లో దూసి సిగ్గు గుత్తి తెంచేశారు అంటే కనిపిస్తుంది. రెండూ ఒకటే . వాస్తవానికి మొదటిది రెండో దానికి ఇన్‌‌స్పిరేషన్‌కావచ్చు కూడా. పిక్చరైజేషన్‌ అప్పటి వాతావరణం అనేకం పనిచేస్తాయి. అక్కడ ఆ పాత పాటలోనైనా రాక్షసి పాత్ర కాబట్టి ఆ మాత్రం తెలుగు వాడేశారు.దేవతల ఆస్థానమైతే పెట్టేవారు కాదు.దేవతల సెక్స్‌ కూడా సంస్కృతంలోనే ఉంటుంది మరి! అంతకంటే ముఖ్యంగా అప్పటి మార్కెట్‌కి అది బాహాటంగా ఉండడం అవసరం కాదు.ఇపుడు ప్రేక్షకుడి తొడనిమిరి అరే అబ్బాయి్‌ఇది ఇందుకోసమే పొరబడనక్కర్లేదు ఇందుకోసమే అని చెప్పే మార్కెట్‌. ముసుగులు అక్కర్లేని కాలం. ఇదంతా ఎందుకంటే జ్యోతిలక్ష్మి త్యాగయ్యలో పాడిన పాటైనా, లేలేలే నారాజా పాట అయినా ఒకటే. రెండూ టిటిలేటింగ్‌ ఎఫెక్ట్‌కోసమే. ఒకప్పుడు ఏదైనా ముసుగులో మాత్రమే చెప్పాల్సిన టైం కాబట్టి ఆస్థాన నర్తకిగానూ, మేజువాణీగానూ మేలిముసుగుల్లో ఆడాల్సి వచ్చేది. పట్టణ మార్కెట్‌పెరిగే కొద్దీ కొత్త తరం ప్రేక్షకుల్లో టిటిలేటింగ్‌ఎఫెక్ట్‌కోసం వేరే రూపం తీసుకోవాల్సి వచ్చింది. అపుడైనా ఇపుడైనా మార్కెటే ప్రధాన నిర్దేశకురాలు. అపుడైనా ఇపుడైనా అనేకమంది మగవాళ్ల ముందు ఒక స్త్రీ  తనను తాను ప్రదర్శించుకోవడమే. ఆ మగవాళ్లు ఇంద్ర దర్బారులోని దేవుళ్లా, ఆధునిక పబ్బులోని మగవాళ్లా అనేదే తేడా కానీ విషయంలో తేడా లేదు.

సినిమాల్లో ఏదో చేసేద్దామని దాన్ని సామాజిక సాధనంగా భావించి కొందరు చేసిన ప్రయోగాలను మినహాయిస్తే ఇతరత్రా విషయాల్లో పాత సినిమాలు సెన్సిబిల్‌అయిపోయి కొత్త సినిమాలు ఇన్‌సెన్సిబిల్‌ అయిపోవు. స్ర్తీ శరీరాన్ని వంకర్లు తిప్పుతూ మగవారి ఆనందం కోసము చిందులేయించడం అనే విషయంలో మూడు దశలు ప్రధానంగా కనిపిస్తాయి. తొలి దశ ఆస్థాన నర్తకి లేదా మేజువాణి దశ. రెండో దశ క్యాబరే డాన్సర్‌లేదా క్లబ్బు సాంగులు అనే దశ. మూడో దశ ఇటెం సాంగ్స్. ఈ మూడు పదాలకు మూడు మార్కెట్‌దశలతో సంబంధం ఉంది. గ్రామీణ ప్రేక్షకులే ప్రధానమైపోయిన దశ ఒకటి. గ్రామాలనుంచి పట్టణాలకు వలస ప్రధాన లక్షణంగా కలిగిన దశ ఒకటి. పట్టణ ప్రేక్షకులే ప్రధాన ప్రేక్షకులుగా మారిన దశ ఒకటి. స్థూలంగా అరవైల దాకా మొదటి దశ అనుకుంటే అరవైల నుంచి 90ల దాకా రెండో దశ. ఆ తర్వాత మూడో దశ అనుకోవచ్చు.దానికి సంబంధించిన ఇతర సెన్సిబిలిటీస్ అన్నీ ఆ సినిమాల్లో ప్రతిఫలిస్తాయి. తెలుగు సినిమాల్లో విలన్‌ఎలా మారుతూ వచ్చాడో చూస్తే తెలుగు సినిమా ప్రయాణం తెలిసిపోతుంది. వైరుధ్యమే కదా మూలం దేనికైనా!లేట్‌ సిక్సిటీస్‌నుంచి 90ల దాకా నడిచిన కాలం తెలుగు సినిమాకు అటూ ఇటూ కాని నాశినపు కాలం అనిపిస్తుంది. ఆ దశలో సినిమా తనకిచ్చిన పాత్రను పోషించిన నటి జ్యోతిలక్ష్మి. సమర్థురాలు కాబట్టి ముద్ర వేయగలిగింది. తర్వాతి కాలంలో సెక్స్ చుట్టూ ఉన్న ముసుగులు తొలగిపోయి శరీరానికి కూడా ప్రదర్శనా వస్తువుగా లెజ్టిమసీ వచ్చాక హీరోయిన్లే ఆ పాత్ర పోషించడం మొదలెట్టారు. టాప్‌ హీరోయిన్లు పోటీపడుతున్నారు కూడా. నాట్యంలో వేగం వల్ల ఒకరిద్దరు స్పెషలిస్టులు మిగిలి ఉన్నారు తప్పితే సాధారణంగా ఆ ట్రైబ్‌ మాయమైపోయింది. వారి ఉపాధి పోయింది.

ఫ్యూడల్‌ సమాజపు సినిమాల్లోనైనా పూర్తిగా మార్కెట్‌ మయమైన నేటి కాలంలోనైనా స్త్రీ పాత్రల్లో చైతన్యం పరంగా మౌలికమైన తేడా అట్టే లేదు. అబరేషన్స్‌ సంగతి పక్కనబెడదాం. జేబు ఇంకా ప్రధానంగా పురుషుడికే  ఉంది కాబట్టి బహిరంగ స్థలాల్లో బహిరంగ సంచారంలో పురుషుడే ఎక్కువ కనిపిస్తాడు కాబట్టి ప్రేక్షక ప్రపచంలో అతన్ని ప్రధానంగా టార్గెట్‌ చేయడం ఒక విధిగా సినిమా వాళ్లు భావిస్తారు. దానికి తగిన ఏర్పాట్లేవో చేస్తారు. పురుషుడితో పాటు స్ర్తీ కూడా ఎంతో కొంత ఆర్థిక స్వాతంత్రం  స్వేచ్ఛ చైతన్యం పెంచుకుంటున్నదని భావించే మెట్రో అర్బన్‌ సెక్షన్‌ కోసం మల్టీ ప్లెక్స్‌లు రాబట్టి కూసింత సెన్సిబిల్‌ సినిమాలు కూడా చూడగలుగుతున్నాం. గతానికి వర్తమానానికి తేడా రూపంలోనే, సారంలో కాదు. ఫ్యూడల్‌ సమాజమే ముసుగు సమాజం కాబట్టి స్ర్తీ మరీ బహిరంగంగా బయటపడకూడదు. సిగ్గుల మొగ్గగానే ఉండాలి. సున్నితంగా చెప్పినట్టు ఉండాలి. భలే భావుకత అండీ అన్నట్టుండాలి. విద్యాగంధం కొందరిదే కాబట్టి వారు చెప్పిందే వేదం. వేదమైనా భావుకత అయినా సంస్కృతమే మరి! ఆ సినిమాల్లో అదంతా కనిపిస్తుంది. అంతకంటే ముందునుంచి వచ్చిన వారసత్వం అది.

వచ్చినవాడు వామనుడు కాదయ్యా, వాడు విష్ణుమూర్తి  అని శుక్రాచార్యుడు హెచ్చరిస్తే బలి చక్రవర్తి ఏమంటాడు?

“ఆదిన్‌శ్రీ సతి కొప్పుపై తనువుపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు కిందగుట, మీదై నాకరంబు మేల్గాదే, రాజ్యమున్‌గీజ్యమున్‌సతతమే, కాయంబు నాపాయమే’’ అన్నాడు.

అంతటి విష్ణుమూర్తి నా ముందు చేయి చాచడం కంటే ఇంకేమి కావాలి అని చెప్పడానికి ఏ ఘనత తీసుకున్నాడు? లక్ష్మీ దేవి ఒంటి మీద పాలిండ్లమీద పారాడే చేయి మన చేయికంటే కింద ఉందంటే ఇంకే కావాలి, ఎపుడైనా పోవాల్సిన ఈ దేహానిదేముంది అన్నాడు. అంటే ఏమిటిట? అంతరార్థం ఏమిటి? ఆయన దృష్టి అంతా ఎక్కడుంది? వివరించి చెబితే భక్తులు గింజుకుంటారు కాబట్టి ఇక్కడ వదిలేస్తా. అదే కాదు, కమలాకుచ చూచుక కుంకుమతో…అని పొద్దుపొద్దునే కాలర్‌ట్యూన్‌పెట్టుకుని మరీ వింటాం కదా! అంటే అర్థాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పిన ఒక భావనకు మెజారిటీ సమూహం తలవంచి ఆరాధించేలా చేయగలిగింది ఒక పర్టిక్యులర్‌  సమూహం. మళ్లీ చెప్పొచ్చేదేంటే అయ్యలారా, అమ్మలారా! ప్రతి దానికి స్త్రీ శరీరాన్ని అడ్డుపెట్టి అవమానించడం ఆధునిక నేరం కాదు, చాలా చాలా పాత నేరం. ఇంకా చెప్పాలంటే ఆధునిక కాలమే ఎంతో కొంత మెరుగు.

త్యాగయ్య జ్యోతిలక్ష్మికి ప్రేమ్‌నగర్‌జ్యోతిలక్ష్మికి ప్రేక్షక మార్కెట్‌లో వచ్చిన తేడా తప్ప విలువల పరమైన తేడా లేదు. సింబాలిజం తేడా ఉంటుంది. పళ్లూ, పూలూ కరవాలాలూ, బాకులు, మొగ్గలు, రేకులు ఇవన్నీ సున్నితమైన భావనలుగా ప్రచారంలో పెట్టి అట్లా అప్పట్లో లాక్కొచ్చారు. మధ్యరకం క్లబ్‌డాన్సర్ల టైం వచ్చేసరికి అరకోడి, చిల్లిగారె లాంటి సింబాలిజమ్ యాడ్‌అయ్యింది. ఆ తర్వాత పిడతకింద పప్పు లాంటి మరీ నాటు కూడా కలిసిపోయింది. అక్కడ ఉత్తరాదినా అంతే. ఏ మేరా దిల్‌-యార్‌కా దివానా నుంచి షీలా కీ జవానీ దాకా జరిగిన ప్రయాణం తెలుగు సినిమాల కంటే భిన్నమైన దేమీ కాదు. ఇక్కడ జ్యోతిలక్ష్మి-జయమాలిని అక్కడ హెలెన్‌-ఇరానీ. ఇక్కడ రాఘవేంద్రరావు-అక్కడ డేవిడ్‌ధావన్‌. రాజమౌలి-పూరీ జగన్నాధ్‌ టైం వచ్చేసిరికి టెన్నిస్ బంతుల పాపా, నీ బంతులకింతటి ఊపా అని మార్కెట్‌సింబల్స్‌పచ్చిగా ప్రవేశించాయి. లేటెస్ట్‌గా సాల్టెడ్‌ బటర్‌, క్రీమ్, వంటి ఆంగ్ల శృంగార ఇమేజరీ మన తెలుగు సినిమా సారస్వతంలోకి కూడా బట్వాడా అవుతున్నది. తెలుగులో పచ్చి వెన్న లాంటివి ఆల్‌రెడీ వచ్చి ఉన్నాయి. అయితే ఈ పచ్చితనం మాత్రమే బూతు అయిపోయి గతంలోది సున్నితమైన భావుకత్వం అనుకుంటే మనం ఫ్యూడల్ విలువలను మోస్తున్నట్టే అర్థం. మార్కెట్‌కు వెలుపల ఆలోచిస్తే సినిమాను అభిరుచుల వ్యవహారంగా మార్చే ప్రమాదం ఉంటుంది.

కాలంతో పాటే సింబాలిజం కూడా పాతబడుతుంది. మార్కెట్‌తో పాటు కొత్త సింబాలిజం యాడ్ అవుతూ ఉంటుంది. వర్తమానం బాగోలేదు నిజమే కానీ దానికి సమాధానం వెనక్కు పోవడంలో లేదు. ఇంతకంటే ఆరోగ్యకరంగా ముందుకెళ్లడంలో ఉంది. దానికోసం ప్రయత్నించడంలో ఉంది. టెక్నాలజీ మార్పుల వల్ల సినిమా ప్రొడక్షన్‌ ఎంతో కొంత ప్రజాస్వామికమయ్యింది. మార్కెటింగ్లో ప్రధానమైన డిస్ర్టిబ్యూషన్‌ ఇంకా ఫ్యూడల్‌ కంపు కొడుతోంది. అక్కడ ఎవరైనా మార్పు తేగలిగితే సెన్సిబిల్‌ సినిమాకు దారి వైశాల్యం పెరుగుతుంది. ఇతర రంగాల్లో మార్కెట్‌ వల్ల అది తెచ్చిన టెక్నాలజీ వల్ల కొన్ని సమూహాల గుత్తాధిపత్యానికి కొంతవరకు గండి పడింది. సినిమా రంగంలో ఆ లోటు మిగిలే ఉంది.

*

 

 

 

 

 

 

మనందరి కథ!

manam1
‘మనమంతా’ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెలుగులోనే కాకుండా, తమిళం మరియు మళయాలంలోకి డబ్ చేయబడింది. ప్రేమం, దృశ్యం లాంటి చిత్రాలను మన తెలుగు వారు అప్రీషియేట్ చేయడమే కాకుండా ఈ సారి ఇతర భాషల సినీ ప్రేమికులు మన తెలుగు వాడి గురించి చెప్పుకునే విధంగా, మనం కూడా తలెత్తుకొనే విధంగా తీయబడ్డ సినిమా ‘మనమంతా’.
 M1
సాయిరాం అనే అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ తను మేనేజర్ కావడానికి చేసిన ప్రయత్నం ఎలా మలుపు తిరిగింది అనేది ఒక కథ, మహిత అనే అమ్మాయి తమ ఇంటి పక్క గుడిసెలో ఉన్న చిన్న పిల్లవాడికి చదువు చెప్పించాలనే కోరిక… తర్వాత ఆ పిల్లవాడు తప్పిపోయి వాడిని వెతుకుతూ వెళ్లే దారి మరో కథ, ఓ కుర్రాడు తను ఎంతో ప్రేమతో చూసుకునే లాప్ టాప్ అమ్మి ఓ అమ్మాయి ప్రేమ కోసం తను నమ్మిన విలువలను ఒక్కోటీ ఎలా కోల్పోయి హుస్సేన్ సాగర్లో తన ఐడెంటిటినీ మళ్ళీ ఎలా తిరిగి తెచ్చుకొన్నాడో చెప్పే కథ, గాయత్రి అనే మధ్యతరగతి గృహిణి తన కుటుంబం కోసం సింగపూరు బయలుదేరి చివర్లో తన గమ్యం చేరే కథ…ఈ నాలుగు కథల్ని ఒడుపుగా ఒకదానిలోంచి మరోటి పాయలుగా సాగి ఒక నదిలా ఉరకలెత్తి, సంద్రంలా మనల్ని ఓ భావావేశంలో ముంచెత్తుతుంది. ఈ సినిమాకు ఇరవై నిమిషాల క్లైమాక్స్ ఆయువుపట్టు. అలా అని క్లైమాక్స్ ఒక్కటే బావుందని కాదు. అనుకోకుండానే ఓ చిన్న కన్నీటి పొర, మీ గుండె చిక్కబడేలా చేస్తుంది. ఒక కథని ఎంత చిక్కగా చెప్పవచ్చో దర్శకుడు నిరూపించాడు.
yeleti
ఇరువర్/ ఇద్దరులో తన నటనతో సంభ్రమంలో ముంచెత్తిన నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో సటిల్ గా నటిస్తూ చివరికొచ్చే సరికి తనేంటో మరోసారి తెలియపరుస్తాడు. గౌతమి కూడా చాలా చక్కగా చేస్తూ చివరి ఇరవై నిముషాల్లో తన ప్రతిభ ఏంటో గుర్తు చేస్తుంది. వీరిద్దరినీ మరిపిస్తూ ఓ పదేళ్ల పాప ‘రైనా రావు మహిత పాత్రలో మనల్ని లీనం చేసుకుంటుంది. తను నవ్వితే మనం నవ్వుతాం, తను ఏడిస్తే మనం కూడా కళ్ల నీళ్లు పెట్టుకుంటాం. అంతగా ఆ అమ్మాయి మనల్ని కదిలిస్తుంది. విష్వాంత్ అనీషా ఆంబ్రోస్ హర్ష వర్ధన్, గొల్లపూడి, ఊర్వశి, అయ్యప్ప శర్మ, వెన్నెల కిషోర్, ధన్ రాజ్ వారి పాత్రల కు పూర్తి న్యాయం చేసారు.మొత్తం మీద ఇది ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమా. ‘వారాహీ చలనచిత్రం సాయి కొర్రపాటి నిర్మాణం: ‘మనమంతా’ Rating 4****/5

ఎవర్ని ప్రశ్నించాలి?!

 

ప్రజలు అనేమాట నాకు చాలా ఇష్టమైన పదం ఎప్పటికీ.

స్వేచ్ఛ అనేమాట ఒకప్పుడు అంటే యవ్వనంలో నాకు చాలా ఇష్టంగా వుండేది. కానీ కాలం గడిచేకొద్దీ ఆపదం ప్రచారం కావడం వెనక వున్న విస్తృతి అర్ధం అయ్యేకొద్దీ, పరిణామాలు చూసేకొద్దీ ఆమాటపై మోజు తగ్గిపోసాగింది. సరే, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ తాలూకు పరిణామాలకి వారే బాధ్యులుగనక ఆవిషయం పక్కన పెడితే; సాహిత్యకారులు, రచయితలు మానవ సమాజాన్ని వ్యక్తీకరించడంలో, విశ్లేషించడంలో తమకున్న స్వేచ్ఛని జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి అవసరం రాను రాను పెరిగిపోతున్న దశలో మనం ఉన్నామన్నది నా నిశ్చితమైన అభిప్రాయం.
లాజికల్ గా సరైనవి అనిపిస్తున్న విషయాలు అన్నీ సామాజికంగా సరైనవి అనడానికి లేదు.  ప్రతి అస్థిత్వ ఉద్యమమూ మనకి ఈవిషయాన్ని అనేక ప్రశ్నలతో, అనేక రుజువులతో బయటపెట్టాయి, నిరూపించాయి.  అయినాగానీ, సామాజిక పరిణామాలతో సంబంధం లేకుండా,  సామాజికాంశాలని లాజికల్ గా విశ్లేషించ బూనడం, వ్యాఖ్యానించడం కొందరు రచయితలు తరచూ  చేస్తుంటారు. వారు సమాజంలోని
అన్యాయాలకి, వ్యత్యాసాలకి, అపభ్రంశాలకీ  కారణాలను వ్యవస్థీకృతమైన చోట్ల కాకుండా అసంఘటితమైన, అమాయకమైన, అపరిపక్వమైన చోట్ల కారణాలను వెతుకుతుంటారు. అలాంటి వారు తమ వ్యాఖ్యానాలతో ప్రజలని తప్పుపట్టడం తరచూ చూస్తూ వుంటాం.  వారు అలా వ్యాఖ్యానించే స్వేచ్ఛని కాదనలేం గాని, అలాంటివారు విధిగా గ్రహించవలసిన విషయాలని తెలియ జెప్పడమే ఈ వ్యాసం యొక్క
సారాంశం.

*       *       *       *

ఇప్పటి సమాజం ఇలా వుండడానికి అంటే మనం తరచూ ఒక నిస్పృహతో భావిస్తున్నట్టు   కుళ్లిపోయినట్టు వుండటానికి ప్రభుత్వాలు, రాజకీయ
నాయకులే కారణమా? మనం (అంటే ప్రజలు) కారణం కాదా? అని తరచూ కొందరు ప్రశ్నించడాన్ని మనం చూస్తూవుంటాం.  కొందరినుండి వచ్చే ఇలాంటి ప్రశ్నలు లాజికల్ గా వినడానికి బాగుంటాయి గాని, అలాంటి ప్రశ్నలు సామాజిక బాధ్యతతో అడిగిన ప్రశ్నలు  ఎన్నటికీ కాలేవు.

ప్రజలు అనేపదం ఒక సమూహానికి పర్యాయంగా మనం వాడుతాము. ఆ సమూహంలో దొంగలు మొదలుకుని మేధావులు, సైంటిస్టులు, బాలురు, స్త్రీలు, వ్యాపారులు, ఉద్యోగులు, బిచ్చగాళ్ల వరకు… ఇలా అన్ని విభాగాలలోని వ్యక్తులందరినీ కలిపి ప్రజలు అని మనం పిలుచుకుంటాం.  ఈప్రజలని సాధారణంగా విడివిడిగా కొన్ని సాంప్రదాయ నియమాలతోబాటు వారి బుద్ది మరియు హృదయం నడిపిస్తు
ఉంటాయి.  ఇంకా వారి కుటుబ సభ్యులతో వున్న మానవ సంబంధాలు కూడా నడిపిస్తుంటాయి.  దైనందిన జీవితంలో వారి ప్రవర్తనలకి, ఎమోషన్లకి నియంత్రణ కలిగించే విషయాలు అనేకం వుంటాయి.  ఆర్ధిక స్థితి,  కులం, బంధుత్వాలు, సాంప్రదాయాలు వంటివి ఎన్నో విషయాలు  వారి ప్రవర్తనలని నిర్దేశిస్తుంటాయి. మీరు ఇలా ఇన్నిగంటలు ఈపని చెయ్యాలనే రూల్స్ ఏవీ ప్రజలపై వుండవు.

ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అనేది దానిని  సక్రమంగా నడపడానికి అవసరమైన ట్రైనింగ్ తీసుకుని, ఆపని చేస్తున్నందుకు జీతం పొందే వారితో ప్రభుత్వం నిర్వహించబడుతుంది.  ప్రతి అధికారికీ, ప్రభుత్వోద్యోగికీ జిల్లా కలెక్టర్ తో సహా తామెలా పనిచెయ్యాలో ఒక మాన్యువల్ వుంటుంది. అలా చేసినందుకు ప్రభుత్వం వారికి జీతంతోపాటు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అందులో గృహవసతి, ఆరోగ్య సౌకర్యం, ప్రయాణ సౌకర్యం, పెన్షను, లోన్లు వంటివి ఎన్నో కల్పించి వారికి ఒక భద్ర జీవితాన్ని, వారి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తునీ కల్పిస్తుంది ప్రభుత్వం.  వీరి పని ఏమంటే ప్రభుత్వం నిర్వహించే వ్యవస్థలు సక్రమంగా నడిచేలా బాధ్యతతో, నిజాయితీతో,  పైన చెప్పుకున్న ప్రజలకి ప్రజా సౌకర్యాలకీ మేలు కలిగించే పని చెయ్యడం.
ఇప్పుడు విషయానికి వద్దాం.  ఈ ప్రభుత్వోద్యోగులు ఒకసారి ఉద్యోగం వచ్చాక తమని 60 యేళ్లవరకు కదిలించే వాళ్లు లేరనే ధీమాతో ఉండడం జగమెరిగిన సత్యం. ఈ ధీమాతో ఒక నిర్లక్ష్యం, దానివెంట ఒక ఉదాశీనతా వచ్చి చేరుతాయి. వీటివెనక వున్న  కారణం  ఏమిటంటే వారివెనక ఉద్యోగ సంఘాలు, కోర్టులు వుండడమే! తిరిగి ఈఉద్యోగ సంఘాలు, కోర్టులు ప్రభుత్వం కనుసన్నలలో నడిచే వ్యవస్థలే.  ఉదాహరణకి ఒక ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఏనాడైనా తమబిడ్డలు కార్పొరేట్ స్కూళ్లలో చదవడానికి ఈపిల్లలే కారణం అని
ఆలోచించగలడా? అలా ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఈనాటి మూతబడవలసిన దుస్థితిలో వుంటాయా? ఇది ఒక్కటీచర్లపై  విమర్శ మాత్రమే కాదు. అన్ని ప్రభుత్వ వ్యస్థలలోని నిరాశాజనక స్థితికి ఉదాహరణ.  ఇలా కావడానికి వారే చెప్పే కారణం  ఉద్యోగుల ఉద్యోగం, వారి పిల్లల భవిష్యత్తు “ట్రాన్స్ఫర్స్” అనే పేరుతో రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడం.

ఇకపోతే ప్రభుత్వాలని ఏలే పార్టీలు, రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడుకుందాం. రాజ్యాంగం ప్రకారం చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులు అనేవాళ్లని ప్రజలు తమ సంక్షేమం కోసం ఎన్నుకుని అసెంబ్లీ, పార్లమెంట్స్ కి ఎన్నిక చేసి పంపుతారు. కానీ కరెప్ట్ అయిన అధికార వ్యవస్థలన్నీ కూడబలుక్కుని లేదా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనై ఎన్నికల భారతం ఒక తంతుగా మారిపోయింది. ఈక్రమంలో ఎన్నికలప్పుడు కార్పొరేట్ సెక్టార్ తమకి 5 యేళ్లపాటు అనుకూలంగా వుండటానికి సమకూర్చిన  నిథులతో డబ్బు, మద్యం పంపిణీ
చేసి, మీడియాని కొని, కోట్ల రూపాయల పబ్లిసిటీల ఖర్చుతో నాయకులు పుట్టుకొస్తున్న కాలం ఇది.  ఎన్నికల్లో గెలిచాక మళ్లీ ఈ నాయకులు కూడా
భారీగానే చట్టబద్దంగా జీతాలు తీసుకుంటారు. ఇక పోతే గెలిచాక మన ప్రభుత్వాలు, వాటి నాయకులు ఏమేం చేస్తున్నారనేది ఏరోజు ఏపేపర్ చూసినా ఏదోరకంగా క్లూ దొరికిపోతుంది.

ఇక్కడ మళ్లీ కొందరు  లాజికల్ గా, అమాయకంగా ఒక ప్రశ్న వేస్తారు. “ఎన్నికల్లో డబ్బు తీసుకోవడం తప్పుగదా? డబ్బు తీసుకుని వాళ్లకి ఓట్లేసి
వాళ్లని గెలిపించేది మనమే ( అంటే ప్రజలే) కదా?” అని. ఇదెలా వుంటుందంటే, బస్సులోనో బజారు సెంటర్లోనో ప్రతి రోజూ ఒకమ్మాయి ఒళ్లంతా కామంతో చూసేవాడు; “నువ్వు చూడకపోతే నేను చూసినట్టు నీకెలా తెలుసు?” అని వాదించినట్టు వుంటుంది.

rafi1

ఎన్నికల్లో రాజకీయ నాయకులు డబ్బు పంచకుండా ఉండడానికి భారత దేశంలోని సకల అధికార యంత్రాంగాము ఉండికూడా దేశంలో వందల  కోట్లకొద్దీ డబ్బు పట్టుబడుతూనే వుంది. పట్టుబడ్డదే ఇంతింత వుంటే పంచుతున్నదెంత? ఎన్నికలంటే ఇన్ని దశాబ్దాలుగా నడుపుతున్న వారికెంత నిర్లక్ష్యమో అర్ధం అవుతుందిగదా!  పోనీ, ఎన్నికల సమయంలో  పదిమంది నాయకులు గుంపులు
గుంపులుగాగా ఇంటికొచ్చి నవ్వుతూ నమస్కారం పెట్టిపోయి, ఆరాత్రికి వాళ్ల అనుయూయులతో మనిషికి ఇంతని లెక్కవేసి రెండువేలో మూడువేలో కుటుంబపెద్ద  చేతిలో పెడితే తిరస్కరించ గలిగే ధైర్యం సగటు మనిషికి ఉంటుందా? ఈ విషయాలన్నీ  ఆలోచించకుండా “డబ్బు తీసుకుని ఓట్లేయడం తప్పుకదా?” అని ప్రశ్నించడం వాస్తవం పట్ల అవగాహన లేకపోవడమే అవుతుంది. రేపు ఆనాయకుడు గెలిస్తే మనకి ఏదైనా  పనిబడితే పొయ్యి పలకరించాల కదా? ఇక పోతే రెండవ విషయం సగటు ప్రజలు ఆర్ధిక దారిద్ర్యం వల్ల కూడా 500/1000 కాగితానికి
ప్రలోభ పడతారు. ఆ రంగురంగుల కాగితం అప్పుడు తప్ప చూడలేని వాళ్లు కోట్ల మంది.  నిజానికి నాయకుల  డబ్బు పంపకం కార్యక్రమం  అంతా  ఆర్ధికావసరాలు చుట్టు ముడుతున్న స్లంస్ మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది.  ధనవంతుడు కట్టిన 33 అంకణాల్లో మూడో నాలుగో ఓట్లుంటే, అదే 33అంకణాల స్లం ఏరియాలో 30- 40 ఓట్లుంటాయి.

ఇప్పుడు ఈమూడు వర్గాల మధ్య వ్యత్యాసం గమనిస్తే…. ప్రజలేమీ నాయకులలాగా, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల మాదిరి జీతం తీసుకోరు.
రెండుపూటలు తింటారో, ఒక పూట తింటారో, తాగతారో, తలకి పోసుకుంటారో, వీథుల్లో తన్నుకుంటారో గాని  ప్రభుత్వం నడవడానికి మాత్రం పన్నులు కడతారు. అంతకు మించి వ్యవస్థని, ప్రభుత్వాన్నీ నడిపించడంలో వారి పాత్ర శూన్యం. “అది చేస్తాం, ఇది చేస్తాం అని నమ్మించి గద్దెనెక్కిన వారినీ, జాబ్ మేన్యువల్ ప్రకారం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సిన ప్రభుత్వ అధికారులనీ వదిలేసి ”  ప్రజలని తప్పు పట్టడం  సామాజిక క్రమం అంతటిపట్లా అవగాహన ఉన్నవారు చెయ్యలేరు.

ప్రజలకి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికీ; వారికి విద్య, జ్ఞానం, వైద్యం, భృతి, ఇవ్వడానికే, మంచి పౌరులుగా ఆత్మాభిమానంతో బతకడానికీ, చైతన్యవంతంగా సమాజాన్ని బాగు చెయ్యడానికీ  (ఎన్నికల ముందు చెప్తారు) నాయకులు గెలిచి జీతం తీసుకుని పని చేస్తున్నారు.  అందుకనే నాయకులు మెరికల్లాంటి IAS అధికార్లని తమ పియ్యేలుగా నియమించుకుంటున్నారు.  కానీ నిజానికి చేస్తున్నదేమిటి? ఈదేశంలోని మానవ వనరులు, భౌగోళిక వనరులు చూపి లక్షల కోట్ల అప్పులు తెచ్చి, వాటిలో కమీషన్లు మింగి, అవి కట్టలేక అప్పిచ్చిన వాడు విధించిన షరతులతో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా తిరిగి పెరుక్కుంటున్నారు. మరి అలాంటప్పుడు  వీళ్ల అసమర్ధతకి, వీళ్ల
అవినీతి అక్రమాలకీ ప్రజలని ఎలా తప్పు పట్టగలం? ప్రజలు ఏం చేశారని తప్పు పట్టగలం?  అసలు నోరెలా వస్తుంది?  అందుకే పైన చెప్పిన మాటని మళ్లీ ఇక్కడ రాస్తాను.

రచయితలకి  సమాజం యొక్క వర్తమాన  పరిణామ క్రమాలపై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. మనకి రాయడానికి, ప్రశ్నించడానికీ అందిన స్వేచ్ఛని  మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకుని, వ్యాఖ్యానిద్దాం. మనకున్న ప్రశ్నించే స్వేచ్చని రచయితలుగా మనం దుర్వినియోగ పరచకుండా జాగ్రత్త పడదాం! ప్రశ్నించ వలసిన వారినే ప్రశ్నిద్దాం!

ఇప్పుడిక నా వ్యాసాన్ని ప్రముఖ రచయిత చెప్పిన ఆణి ముత్యాల్లాంటి రెండు మాటలతో ముగిస్తాను.

“రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” – రావిశాస్త్రి.

*       *       *       *

మిథ్యా జీవన రథ్యలలో…

MythiliScaled

 

” నమ్మటం సహజం. నమ్మకపోవటాన్ని సాధన చేసి నేర్చుకోవాలి ”

వింతగా అనిపిస్తున్నా మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇది నిజమట. పసిపిల్లలు కనబడేదాన్నంతా , వింటున్నదాన్నంతా నమ్ముతారు , మనకి తెలుసు. ‘ ఎదిగే ‘  కొద్దీ పెంపకం వాళ్ళకి అపనమ్మకాన్ని నేర్పుతుంది . ప్రపంచపు అనేకానేకమైన సంక్లిష్టతలలో బతికి బట్టకట్టేందుకు ఆ అవిశ్వాసం అవసరమే – కాని , దాన్ని కొన్నేసి సార్లు పక్కనపెట్టుకోవటమూ కావాలి.

ఎందుకంటే ప్రపంచం , అందులో వస్తువులూ విషయాలూ మనకి పూర్తిగా అలవాటైపోతాయి.  దాన్నంతా పూర్తిగా అర్థం చేసేసుకుంటామని కాదు – కొన్ని అనుభవాల వల్ల మొత్తం తెలిసిపోయిందనీ మరిక కొత్తదేమీ ఉండదనీ అనేసుకుంటాము. దీనికి – చుట్టూ ఉన్న సమాజపు తీర్మానాలు చాలావరకూ కారణం [cognitive bias ] . అయితే – ఆ తీర్మానాలకి పరిమితులు ఉంటాయి. అవి కొత్తగా వచ్చిన పరిమితులేమీ కాదు .  ఒకరి  నిజం మరొకరికి  అబద్ధం. ఒక చోట సహజమైనది మరొకచోట అసభ్యం. ఒక కాలపు న్యాయం మరొక యుగం లో అన్యాయం. అర్థసత్యాలను కూడా కలిపితే ఈ జాబితాకి అంతు ఉండదు.

దీన్ని సాగదీసి  – అసలు సత్యం అనేదేమీ లేదనీ ఒక hyper reality  లో మనం వేలాడుతున్నామనీ Jean Baudrillard వంటి  postmodernist లు తేల్చేయాలని ప్రయత్నించారు.

అవునా ?  ఒప్పుకుని ఏమని బతకాలి – కనీసం మనలో కొంతమంది ?

అక్కర్లేదు.

ఆ ముడినో వంతెననో వేసేందుకు ఆధ్యాత్మికత ఆ వైపు ఉండనే ఉంది . ప్రస్తుతం నేను వెళ్ళదలచుకున్నది అటు కాదు.

ఈ వైపున ఉన్న జలతారు పందిరి కిందకి – అది కళ.

భారతీయులమైన మనకి , సంప్రదాయాన్ని అనుసరిస్తూ వెనక్కి వెళితే – ఉత్తమమైన కళావిష్కరణ కూ ఆధ్యాత్మికానందానికీ ఖచ్చితం గా పోలికలు కనిపిస్తాయి. వాటి రెంటికీ స్థాయిల్లో మాత్రమే తేడా అనేంతవరకూ మనకి వాదనలు ఉన్నాయి. మరింకొకలాగా రసానందానికి అవధి గా మానుషానందం , దాన్ని ఎన్నో రెట్లు హెచ్చవేస్తే రాగల బ్రహ్మానందం – ఇలాంటి లెక్కలు  ఉన్నాయి.

 

కళాస్వాదన ని బుద్ధి తో గాక హృదయం తో , లేదా అంతకు తక్కువదైన మనస్సుతో చేస్తుండటం ఇక్కడ జరిగిన మేలు.   హేతువాదమో [తక్షణ ] ప్రయోజనాత్మక  దృక్పథమో  అడ్డు రావటం మనకి ఆ మధ్యన మొదలైందే.

పడమటి దేశాల్లో ఆ నీరసం 18 వ శతాబ్ది అంతానికే వచ్చేసింది. వారి ఆధునిక విద్య పాత నమ్మకాలని బద్దలుకొట్టి తీరాలని పట్టుబట్టుకు కూర్చుంది – ఆత్మల దినాలనీ హాలోవీన్ లనీ అనుమతించుకుంటూ వచ్చిన క్రైస్తవపు సహనమూ అప్పటికి అంతరించింది. మంత్రగత్తెలని వేటాడి తగలబెట్టటం [witch hunt ] 1750 కి దాదాపు గా పూర్తయిపోయింది. Folk tales, fairy tales మౌఖికం గా ఎప్పటినుంచో వ్యాపిస్తూ వచ్చాయి. ఆ కాలం లోనూ వాటిని  ఉద్ధరించినవారున్నా , ఆ సాహిత్యాన్ని ప్రధాన స్రవంతి లోకి రానీయక పోవటం మొదలైంది . బాలసాహిత్యం గా ముద్ర వేసి ఒక పక్కన పెట్టేశారు. [ 1930 లలో Tolkien వచ్చేవరకూ ఆ కథలు చిన్నపిల్లలకే పరిమితం ]

0415-william-wordsworth-daffodils

1798 లో Lyrical ballads  సంపుటం ప్రచురించబడింది. William Wordsworth, Samuel Taylor Coleridge ల సంయుక్త కృషి గా చెప్పబడిన అందులోWordsworth  ఇలా అంటారు.

” వీటిలో చాలా పద్యాలు ప్రయోగాత్మకం గా రాయబడినాయి. మధ్య, దిగువ తరగతి ప్రజలు మాట్లాడే భాష కవిత్వానికి ఎంత మేరకు తగుతుందో నిర్ధారించుకోవాలని ”

1802 లో , ఆ సంపుటాన్ని తిరిగి ముద్రించినప్పుడు Wordsworth ముందు మాట ని ఇంకాస్త పెద్దది చేశారు. అనుకుని అన్నారో అలా ధ్వనించిందో తెలియదు గాని , ‘ వాస్తవాధీనం ‘ కాని కవిత్వాన్ని ఆయన తిరస్కరిస్తున్నట్లుగా అర్థమైంది. అంతకుముందు వరకూ పాతపద్ధతులలో రాసిననదంతా కృత్రిమం అనేస్తే తిరగబడి  వెక్కిరించినవారు చాలా మందే ఉన్నారు. కాని – Wordsworth కవిత్వం లోని వైశాల్యం, సౌందర్యం, ప్రవహించే గుణం – దాన్ని కాపాడుకొచ్చింది. రాను రాను ఆయనను అతి ఎక్కువ భావోద్వేగాలతో [religious fervor ] ఆరాధించేవారు బయలుదేరిపోయారు.

అవును, Wordsworth ఒక path breaker  . అది ఒక కొత్త మతం కింద పరిణమించింది కొన్నేళ్ళ పాటు.

Coleridge 1817  లో నోరు విప్పారు. మొదట్లో వారిద్దరూ సంకల్పించుకున్నది అంతకన్న విస్తృతమైనదని తన Biographia Literaria లో బయటపెట్టారు.

” రెండు విధాలైన కవిత్వసృష్టి గురించి మేము మాట్లాడుకునేవాళ్ళం. ప్రకృతి సత్యాలను విశ్వసించటం ద్వారా  చదువరి సహానుభూతిని మేల్కొలపటం ఒక పద్ధతి. ఊహలకి రంగులు వేసి వినూత్నమైన ఆసక్తిని కల్పించటం రెండవది.

వెలుగునీడలు ఆడుకునేప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా  , చిరపరిచితమైన చోటంతా – ఆ చంద్రకాంతి లోనో సంజ వెలుగు లోనో కొత్త గా మోహపెట్టగలగటం …అటువంటిది మేము తలచుకున్న రెండు పద్ధతులూ మేళవించేందుకు వీలు ఇవ్వగలది. నిజానికి మేము కలిసి చెప్పదలచుకున్నది అదే ”

Coleridge , ఇంకా విశదం గా అంటారు – ”  మానవాతీతమైనవో , కనీసం అద్భుతమైనవో అయిన వ్యక్తుల గురించీ శక్తుల గురించీ నేను రాయాలని అనుకున్నాను .  ఆ ఊహల ఛాయలలో సత్యం వంటి మరొక సత్యాన్ని   ఆవిష్కరించాలనే ప్రయత్నం.   అప్పటికి, ఆ సందర్భం వరకూ – అపనమ్మకాన్ని కావాలని అణచిపెట్టటం ద్వారా[ Willing suspension of disbelief ]  , ఆ ‘ కవిత్వ సత్యా ‘ న్ని[ poetic truth ]  చదువరులు , తమ లోలోపల – తెలుసుకోవాలని. Wordsworth  – రోజూ కనబడేవాటినే కొత్త గా దర్శించగలగటం గురించి రాద్దామనుకున్నారు.  ప్రకృతి అందానికీ ఆకర్షణకీ కళ్ళు తెరవటం వల్ల ఆత్మ లోపలి బద్ధకం వదిలిపోతుందని . ఈ రెండు మార్గాలూ ఒకే లక్ష్యం లోకి పర్యవసిస్తాయని మేము నిశ్చయించుకున్నాము ”

కారణాలు ఏవైతేనేమి, Coleridge వి సంపుటం లో కొన్ని పద్యాలే ఉండినాయి. The Rime of the ancient mariner, Christabel, Kubla Khan వంటి ప్రముఖ కృతులని  తాను అనుకున్న పద్ధతిలోనే రాశారు.

ఆయన మొదట వాడిన ఆ పదబంధానికి,  కాలాంతరాలలో – చాలా విస్తృతమైన అన్వయమూ ప్రచారమూ జరిగాయి.

ఈ willing suspension of disbelief ని అన్నిందాలా చూడచ్చు మన  సంస్కృతి లో . కేవలం చెవుల ద్వారా మహా ఇతిహాసాలన్నిటినీ వంటబట్టించుకున్నాం. జంతువుల కథలతో నీతిచంద్రికలని వెలిగించుకున్నాం.

యుద్ధపర్వాలను పురాణం చెప్పే ముందు కోటలో ఆయుధాలన్నిటినీ గదిలో పెట్టి తాళం వేయించమని అన్న పౌరాణికులు ఉన్నారు. అయినా పురాణం విని ఒట్టి చేతులతోనే ఒకరి మీదికొకరు లంఘించిన సభికులు  ఉన్నారు వారికి. హరి కథ లు కార్పించిన కన్నీరు, బుర్ర కథలు ఎక్కించిన శివాలు – నమ్మకపోవటం అన్నదే లేదు. నమ్మను అన్న స్త్రీ కి  ప్రత్యక్షపురాణం చెబుతూ  లంకిణి ని లాగా మర్దించి బోధించిన వికటకవులున్నారు.

ప్రతీకాత్మకమైన భారతీయ శిల్పం, చిత్రకళ – నిజాన్ని ప్రతిబింబించాలనే ఉద్దేశాన్ని పెట్టుకున్నవి కావు.   పాశ్చాత్య చిత్రాలలో వాస్తవిక చిత్రకళ అత్యుత్తమమైన స్థాయికి వెళ్ళింది  . వాటిని నమ్మేందుకు శ్రమ అక్కర్లేదు. పారిశ్రామికవిప్లవం  తర్వాత ఫోటోగ్రఫీ అభివృద్ధి చెందినాక – impressionism  మొదలైందట. ఉన్నదాన్ని ఉన్నట్లు కాక , దాన్ని విడగొట్టి వెనక్కి తీసుకుపోయి చూసేవారి లో ఆ భావాన్ని ముద్రించేందుకు చేసిన ప్రయత్నమని impressionism ను నిర్వచించటం ఒక తీరు. ఇక్కడా suspension of disbelief  తిరిగి అవసరమైంది. ఫలితం గా మళ్ళీ గొప్ప సౌందర్య సృష్టి కూడా జరిగింది.

[  పిడివాదం ఏ ప్రక్రియనైనా ఎలా భ్రష్టు పట్టించగలదో ఇక్కడ మరొక ఉదాహరణ. ఆ కాలం లో వాస్తవిక చిత్రాలను వేసిన William – Adolphe Bouguereau వంటి దిగ్దంతుడిని నానా మాటలూ అన్నారు. 1974 వరకూ ఆయనను పట్టించుకున్నవారు లేరు, ఆ తర్వాత ఆయనకు తిరుగూ లేదు – అది వేరే కథ ] . ఈ ‘ విడగొట్టటం ‘ లోంచి జరిగిన వక్రీభవనం లోంచే Cubism, Dadaism  పుట్టాయి- వాటి సౌందర్యం తెలిసినవారికి తెలియగలది

ఒక జంతువు ని చెప్పేందుకు కొన్ని అక్షరాలతో ఒక పదాన్ని రాస్తున్నాం. ఆ అక్షరాలకూ జంతువుకూ ఉన్న సంబంధం మనం కల్పించుకున్నదే – ‘ వాస్తవం ‘ కాదు. ఆ భాష రానివారికి ఆ సంబంధమూ లేదు. ఇలాగ – భాషా పరిణామం లో , అపనమ్మకాన్ని అణచుకోవటం అనేది చాలా ముఖ్యమైన సంగతి.

దీన్ని కాస్త పొడిగిస్తే – షేక్ స్పియర్ పాత్రలు – డెన్మార్క్ యువరాజు హామ్ లెట్, వెనిస్ లో పుట్టిన పోర్షియో – ఇంగ్లీష్ మాట్లాడి ఉంటారా ? మన పౌరాణిక నాటకాలలో రాముడూ కృష్ణుడూ తెలుగు మాట్లాడి ఉంటారా ?

20, 21 వ శతాబ్దపు కామిక్ లూ  విడియో గేమ్ లూ  సినిమా లూ  ఈ ప్రక్రియ ని అతి పుష్కలం గా ఉపయోగించుకున్నాయి. Color blindness ఉన్న వారికి  తప్పితే తెలుపు నలుపు చిత్రాలలో లాగా మనుషులు కనిపిస్తారా ఎవరికైనా ?ఒక నాయకుడు వంద మందిని కొట్టటం దగ్గర నుంచి గాల్లో ఎగిరే సూపర్ మాన్, బాట్ మాన్ దాకా అసాధ్యమైన విషయాలను చూస్తూనే ఉన్నాం.

ఎందుకు ఇదంతా అవసరమైంది ?

నిజ జీవితపు పరిస్థితులను విస్తరించటమూ , కేంద్రీకరించటమూ – రెండూ కళారూపాలలో జరుగుతాయి. విస్తరించటం వల్ల ఒక సాధారణీకరణ [generalization ] జరిగి ఊరట వస్తుంది. కేంద్రీకరించటం వల్ల , ఆ ఒక్క చోటా జరిగే న్యాయం మనమే గెలిచిన భావాన్ని ఇస్తుంది.  ఇది సవ్యం గా జరగటానికి , ఆ కథ లోనో సినిమా లోనో – వాస్తవానికి అతీతమైనదైనా సరే, ఒక ‘ అంతర్గత తర్కం ‘[inner logic ] ఉండాలి.  ” అబ్బే, ఇదంతా ఉత్తినే ” అని రచయితో దర్శకుడో చెప్పేయటమూ జరగకూడదు.  ప్రేక్షకులూ చదువరులూ వారి వంతు కృషి చేసి కళ లో లీనమవుతారు.

అప్పుడొస్తుంది ఆనందం. ” కొండెక్కినంత సంబరం ” అంటారు కదా, అది. పడ్డ కష్టం ఫలించి Endorphin లు విడుదలయి జీవితాన్ని ఇంకొంత బాగా లాగేందుకు ఓపిక వస్తుంది.

*****

John Ronald Reuel Tolkien ( 1892 - 1973) the South African-born philologist and author of 'The Hobbit' and 'The Lord Of The Rings'. Original Publication: Picture Post - 8464 - Professor J R R Tolkien - unpub. Original Publication: People Disc - HM0232 (Photo by Haywood Magee/Getty Images)

1939 లో JRR Tolkien  , తన ‘ On Faeries ‘లో – suspension of disbelief ని తిరస్కరిస్తారు. అది అపనమ్మకాన్ని అణచటం కాదు  కాదు, మరొక నమ్మకాన్ని [ secondary belief ] సృష్టించుకోవటం  అని.

గంధర్వగాథలు [fairy tales ] చిన్న పిల్లల కోసమేననే వాదాన్ని ఆయన కొట్టి పారేస్తారు. పెద్దవాళ్ళు ఆ కథలకి దగ్గరవటం కేవలం పరిశోధన కోసమో సేకరణ కోసమో అవనక్కర్లేదని  బల్ల గుద్ది చెప్పారు. ” పిల్లలు ఎదుగుతూంటారు, వారి బుర్రలకి చక్కగా ఆకలి వేస్తుంటుంది – అందుకని అవి వాళ్ళకి చక్కగా అరుగుతాయి – ఆ లక్షణాలు పోని పెద్దవాళ్ళూ వాటిని అంత బాగానూ హరాయించుకోగలరు . Fantasy ఊహాశక్తి కి పరాకాష్ట . అందులోని వ్యక్తులూ సంఘటన లూ వాస్తవ ప్రపంచం లో ఉండవు అని ఒప్పుకుంటాను – అయితే నా దృష్టిలో అది దోషం కాదు, గుణం. ఆ రకం గా ఒక కళా రూపం గా fantasy ఎక్కువైనదీ మరింత స్వచ్ఛమైనదీ – ఫలితం గా ఎక్కువ శక్తివంతమైనది. అటువంటి సమాంతర ప్రపంచాన్ని మొదటి నుంచీ మొదలెట్టి సృజించటానికి ఎంత నేర్పైనా  కావలసి వస్తుంది.

వాస్తవ వాద సాహిత్యం లో లాగా కాదు – చెడు అంతమయేదాకా, సత్యదర్శనం జరిగే దాకా fantasy నడుస్తూనే ఉంటుంది. అది వాస్తవాన్ని గుర్తిస్తుంది, కాని దానికి దాస్యం చేయదు, పోరాడుతుంది.  ఒకవేళ సత్యమే అక్కర్లేని దశ కి మానవాళి చేరుకుంటే – అప్పుడు, అప్పుడు మాత్రమే, దాని అవసరం అంతమవుతుంది. ”

Fantasy ఏం చేయగలదు ? కోలుకునేలా  చేస్తుందని సమాధానం. ”  దృష్టి ని స్పష్టం చేస్తుంది. మన కిటికీ ల అద్దాలని శుభ్రం చేస్తుంది. వస్తువులని ‘ ఉన్నవాటిని ఉన్నట్లుగా ‘ కాక ‘ ఎలా చూడవలసి ఉందో అలా ‘ చూడటాన్ని నేర్పుతుంది. అతి పరిచయం వల్ల వచ్చిన చులకనను తీసేస్తుంది. సొంతం కావటం వల్ల వచ్చిన నిర్లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. ఒకప్పుడు చూసి, తాకి, విని – అనుభవించి , దాచేసుకున్న  వాటికేసి మళ్ళీ చూపును తిప్పిస్తుంది ”

పలాయనం అన్న మాటను Tolkien ఒప్పుకోరు. దాన్ని విడుదల అంటారు. మనం తప్పించుకుని వీలైనంత మందిని మనతోబాటు తీసుకుపోవాలని బోధిస్తారు.

శత్రు నిర్బంధం లో ఉన్నాం మనం – ఈ ఇరుకు, చిరాకు , చీదర –  మన స్వస్థానమా  ?

కాదు, ఆనందం [glory of joy ] మనిషి సొంత స్థితి అనీ, దానికి fantasy లోంచి [ కూడా ] దారి ఉందనీ – అటువంటి మాటలు విడ్డూరం గా తోచగల పడమటి వైపున, యుద్ధ బీభత్సాల మధ్యన – Tolkien  ప్రకటించారు.

కనిపిస్తున్న  వాస్తవం ఎప్పుడూ సాపేక్షమే.

“Imagination is everything. It is the preview of life’s coming attractions.”
― Albert Einstein

Sources : Notes on Willing Suspension Of Disbelief [ Greg Martin ], Tales of middle earth [ JRR Tolkien ], Biographia Literatia chapter 15 [Samuel Taylor Coleridge ] , Some articles from wikipedia

 

కబాలి గురించి ఎందుకు మాట్లాడాలంటే….

 myspace
    ఇప్పుడే ఓ మిత్రుడు ఫోన్ చేసేడు, “కమర్షియల్” సినిమా గురించి నువ్వు రాయడాన్ని (నా బ్లాగ్ పోస్టు చూసి) ఎవరో తప్పు పట్టేరని చెప్పేడు.
  నేను చెప్పేను, నా ఫ్రెండ్ కి, కబాలి గురించి ఎందుకు రాసేనో. సినిమా చూసివచ్చిన వెంటనే నా అభిప్రాయం చెప్పాలనిపించి అక్కడ కొంచెమే రాసేను. ఇంకొంచెం వివరంగా ఇక్కడ.
  దాదాపు పదేళ్ళ క్రితం నేను మలేసియా వెళ్ళేను, ఆఫీసు పనిమీద. కౌలాలంపూర్, పెనాంగ్ ప్రాంతాల్లో తిరిగేను వార్తల కోసం. మిత్రులతో కలిసి ఈ రెండు ప్రాంతాల్లోని తమిళులను కూడా కలిసేను. హోటళ్లలో, చిన్న చిన్న షాపుల్లో, కొన్ని బస్తీల్లో వున్న ఇండియన్లతో (అంటే, ప్రధానంగా తమిళులతో) మాట్లాడేను.
   మొట్టమొదటి సారిగా కబాలీశ్వరన్ గురించి నేను విన్నది అప్పుడే. అక్కడ వున్న తమిళులకు ఆయన ఒక ఫోక్ హీరో అని అర్ధం అయింది. వందల ఏళ్ల క్రితం అక్కడికి వెళ్లి సెటిలై, ఆ దేశవాసులైన తమిళులకు ఆయన ఓ ముఖ్యమైన నాయకుడు. అంతకంటే ఆ తర్వాత ఆయన గురించి విన్నాలేదు. ఆయన రాజకీయాలు, నడిపిన మాఫియాల గురించి తెలీదు. తెలుసుకోవాలని ప్రయ్నత్నించిందీ లేదు.
   అప్పటికే కమర్షియల్ హీరోగా పేరు సంపాదించిన రజనీకాంత్ సినిమా ‘శివాజీ’ కూడా అప్పుడే రిలీజ్ అయింది. ఆ సినిమా చూడడం కోసం అక్కడ బారులుతీరిన జనాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.   ఆయన ప్రధానంగా, తమిళనాడు నుంచి ఉద్యోగాలకోసం, చిరుద్యోగాలకోసం 1947 తర్వాత వలస వెళ్లిన వాళ్లకు (సినీ) హీరో.
   రజనీకాంత్ కబాలీశ్వరన్ పాత్ర చేస్తున్నాడంటే నాకు అందుకే పెద్ద ఆశ్చర్యం కలగలేదు. కబాలీశ్వరన్, రజనీకాంత్ — ఇద్దరూ అక్కడ పాపులరే.  రెండు పాపులర్ ఇమేజెస్ కలిస్తే హిట్టవుతుందనేది నిర్మాతల లెక్క.
  రజనీకాంత్ కి కబాలి మార్కెట్ విలువ తెలుసు. అటు డయాస్పోరా మార్కెట్, ఇటు దేశంలో అసలు మార్కెట్. దళితుడైన పా. రంజిత్ కు రజనీకాంత్ లాటి కమర్షియల్ హీరో, దేశం కాని దేశంలో అణచివేతకు గురైన తమిళులవైపు నిలుచున్న కబాలి పాత్ర వేస్తే విషయం నలుగురికీ చెప్పవచ్చుకున్నాడు.
  కబాలి గురించి రంజిత్ పరిశోధన బాగా చేసేడు. ఇది నేను చెప్పిన మాట కాదు. కబాలి సినిమా గురించి మలేసియా తమిళుల వైపునుంచి ‘కౌలాలంపూర్ పోస్ట్ లో విశ్లేషించిన విసిత్ర మాణికం రాసేరు. కబాలి సినిమా గురించి మనకి ఎందుకు అని అనేవాళ్ళందరూ తప్పక చదవాల్సిన వ్యాసమిది.
సినిమా చూసేముందు — ముఖ్యంగా మలేసియాకి బయట వున్నవాళ్లు — చదివితీరాలని ఆమె అంటుంది. ఈవ్యాసం చదవక ముందొక సారి (తెలుగు వెర్షన్), చదివిన తర్వాత ఒకసారి (తమిళ వెర్షన్) చూసిన కొలీగ్ చెప్తోంది — ఎంతగా కెనెక్ట్ అయిందో.
  కబాలి పాత్రని అడ్డం పెట్టుకుని పా. రంజిత్ ఎంత గొప్పగా మలేసియా తమిళుల (ముఖ్యంగా మలేసియా దేశ వాసులైపోయిన తమిళుల) జీవితాన్ని చిత్రీకరించాడో ఆమె చెప్తుంది. ఉద్యోగాల్లో, సమాజంలో మైనారిటీలైన తమిళులు అనుభవించిన, అనుభవిస్తున్న వివక్షని దర్శకుడు గొప్పగా పెట్టుకున్నాడని చెప్తుంది.
 ఓ వంద, రెండొందల సంవత్సరాల తమిళుల వ్యథాభరిత జీవితంలోని కొన్ని భాగాల్ని తీసుకుని కథ రాసుకున్నాడని ఆమె అంటుంది. సరిగ్గా ఇంతే కాలంలో దళితులు అనుభవించిన అవమానాలపై, దాష్టీకాలపై సత్యనారాయణ గారు రాసిన ‘మా నాన్న బాలయ్య’ పుస్తకంతో రంజిత్ అందుకే కనెక్ట్ అయ్యాడు.
     ఆఖరికి, సినిమా ముగిసేక కబాలీని కాల్చడానికి వఛ్చిన ‘టైగర్’ కూడా ఎంత రియలిస్టిక్ పాత్రో ఆమె రాస్తుంది.
   మలేసియా జనాభాలో ఏడు శాతం మాత్రం వున్న, అట్టడుగున వున్న ప్రజల (పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చేవాళ్లు కాదు) గురించిన కథ ఇది. స్కోప్ చిన్నదే కావచ్చు. కానీ, ఇది మెయిన్ స్ట్రీమ్ సినిమా కథా వస్తువు కావడం, కథకు ప్రొటాగనిస్ట్ రజనీకాంత్ కావడం విశేషం.
  రజనీకాంత్ సినిమా ఇలా ఎందుకుంది, దీనికన్నా బ్రహ్మోత్సవం బెటర్ అని, బోయపాటి శ్రీను, వినాయక్  లాటి వాళ్ళు రజనీకాంత్ కి ఓ గొప్పహిట్ ఇచ్చి ఉండేవారని రాసేవాళ్ళు తప్పక చదవాల్సిన వ్యాసమిది. (బోయపాటి, వినాయక్ ఎలా తీసి వుండేవాళ్ళు? కబాలీలో ‘కెవ్వుకేక’ లాటి పాట పెట్టివుండేవాళ్ళు. ఓ అరవై సుమోల్ని ఎగిరించి పేలించి వుండేవాళ్ళు.)
 పా. రంజిత్ కాని, రజనీకాంత్ కాని — They are limited by the character. ఈ సంగతి అర్ధం చేసుకోకపోతే ఈ సినిమా ఓ ‘రోబో’ లాగో, ‘శివాజీ’లాగో, లేకపోతే ‘బాషా’లాటి ఓ గాంగ్ స్టర్ సినిమాలా లేదని అనిపిస్తుంది.
  ఆ మూసలోకి వెళ్లకుండా పా. రంజిత్ ఎంత కష్టపడ్డాడో సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. సూపర్ మేన్, బేట్  మేన్, స్పైడర్ మేన్, టార్జాన్ – అన్ని సూపర్ హీరోల కంటే ఎక్కువ శక్తివంతుడైన రజనీకాంత్ కాదు ఈ సినిమాలో వున్నది. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర అంతకంటే ఎక్కువ నిడివివున్న, లోతువున్న రక్తమాంసాలతో ప్రజలమధ్య తిరిగిన ఓ నాయకుడు, ఓ డాన్. అందుకే, రజనీ గిమ్మిక్కులకు ఈ సినిమాలో చోటులేదు. ఆ సంగతి రంజిత్ ముందుగానే చెప్పేడు.
  పా. రంజిత్ ట్విట్టర్ id @beemji . ఇది సరిపోతుంది, ఆయన కబాలి పాత్రని ఎలా చూపించదలుచుకున్నాడో. అందుకే, ‘కబాలి’ మా నాన్న బాలయ్య’ పుస్తకం పట్టుకుంటాడు. నల్ల రంగు మీద వున్న వివక్షగురించి మాట్లాడగలుగుతాడు.సూటు, బూటు ఎందుకువేసుకోవాలో మాట్లాడతాడు. వ్యవస్థీకృతమైన హింసని, అందులో భాగమై, అలాటి పరికరాలతోనే ఎదిరించాలనుకున్నాడు కబాలి. ఇది సరైన పరిష్కారం కాదని, ఈ పోరాటాలకి శాస్త్రీయమైన రాజకీయ దృక్పథం తోడవకపోతే అవి నిలవవన్నది వేరే చర్చ. కానీ, ఈ సినిమా కథ ప్రధానంగా కబాలి జీవితంనుంచి తీసుకున్నది. అది దాని పరిమితి.
  ఈ నేపథ్యంతో చూడకకుండా, బాషాలాగా, సుల్తాన్ లాగా, లేకపోతే ఇంకో బ్లాక్ బస్టర్ సినిమాలాగా, లేకపోతే వాటికి మించిన సినిమాలాగా ఉంటుందని ఊహించుకుని, అలా లేదని సినిమాని write off చెయ్యడం ఏం న్యాయం.
  సినిమాలో ‘మాయానది’ పాట, దాన్ని చిత్రీకరించిన విధానం గొప్పగా వుంది. రాధికా ఆప్టే హుందా నటన చాలా బాగుంది.
   అందరికీ సినిమా నచ్చాలనేం లేదు. ఇంకా బాగా తీసివుండొచ్చని కూడా అనొచ్చు.  కానీ, బయో పిక్ లను చూసే విధానం ఇది కాదేమో?
(కబాలి సినిమా చూసొచ్చేక రాసిన చిన్న బ్లాగ్ పీస్: http://kv-kurmanath.blogspot.in/2016/07/blog-post.html)
*

ఎదురు చూడని కల “మంచు పల్లకీ”

vamsy1

లోగో: భవాని ఫణి

 

ఐతే, నేను అసిస్టెంట్ గా పనిచేసే సినిమా ఆఫీసు, లేకపోతే జ్యోతి మంత్లీ ఆఫీసు, అదీ గాకపోతే ఏడిద నాగేశ్వరరావు గారిల్లు, ఒకోసారి జ్యోతి ఎడిటర్ వేమూరి సత్యనారాయణ గారిల్లు… ఇవీ ఆనాడు మద్రాసులో నేను కలతిరిగిన ప్రదేశాలు.

సీతాకోకచిలుక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాకా చాన్నాళ్ళు పనిలేకండా పోయింది నాకు. సరిగ్గా ఆ టైములోనే జ్యోతిలో మానేసి ఇంట్లో ఉంటున్న వేమూరి సత్యంగార్ని రెగ్యులర్ గా కలుస్తుండే వాడ్ని. సరిగ్గా అదే టైములో రాజమండ్రి నించి వచ్చిన ఎం ఆర్ ప్రసాదరావు గారు సినిమా తీస్తానంటే దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుదిరారు సత్యం గారు.

కమలహాసన్ కి అన్నయ్య, సుహాసినికి తండ్రి అయిన చారుహాసన్ గారు ఒక కథకి స్క్రీన్ ప్లే రాస్తే, వాళ్ళ దగ్గర మేనేజర్ గా పనిచేసిన వడివేల్ అనే ఆతను సుహాసిన్ని హీరొయిన్ గా పెట్టి సినిమా తీశాడు.పేరు ‘’పాలయ వన్న సోలై’’. హిట్ అయింది.

ఆ సినిమాని  తెలుగులో తియ్యడానికి రైట్స్ కొన్న ప్రసాదరావు, ప్రొడక్షన్ ఆఫీసు ఓపెన్ చెయ్యడం కోసం ఇల్లు కోసం తిరుగుతున్నారు.

ట్రస్ట్ పురంలో నేను ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఏడిద నాగేశ్వరరావు గారుండే వారు. శంకరాభరణం తర్వాత కామదార్ నగర్లో బాలసుబ్రహ్మణ్యం గారింటి అవతల ఇల్లు కొనుక్కుని అక్కడిడికి షిప్ట్ అవడంతో ఈ ఇల్లు ఖాళీ గావుంది .

కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్న ఈ బాచ్ తో తిరుగుతున్న నేను ఖాళీ అయిన ఈ ఇంటిగురించి చెప్పేటప్పటికి వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి ఇందులోకి దిగిపోయేరు.

vamsy

డైరెక్టర్ బాపూ గారయితే బాగుంటుందని వెళ్లి వార్ని కలిశారు.కానీ, వేమూరి సత్యనారాయణ గారన్న ఒక మాటకి హర్ట్ అయిన బాపుగారు ఆ సినిమా చెయ్యనన్నారు.తర్వాత జంధ్యాల దగ్గర కెళ్ళారు. మీరు కొత్తవాళ్ళు డబ్బుసంచి పట్టుకుని నా వెనకాల తిరిగితే చాలు సినిమా తీసి పెడతాను లాగేదో జంధ్యాలగారు అనేటప్పటికి ,సినిమా మేకింగ్ లో మా ఇన్వాల్వ్ మెంటు కూడా ఉంటుంది. అనుకున్న వీళ్ళు ఆయన్నొద్దను కున్నారు. వేజెళ్ళ సత్యన్నారాయణని కలిస్తే లక్ష రూపాయిలడిగేరు. వీళ్ళు వేసుకున్న బడ్జెట్ కి చాలా ఎక్కువ ఎమౌంట్ అది. దాంతో ఆయన్నీ వద్దనుకున్నారు.

‘’డైరెక్ట్ చేసే ఆయనెవరా’’ అని తెగ ఆపసోపాలు పడిపోతుంటే ‘’నాలాగ ఎందరో’’…..కుక్క కాటుకి చెప్పుదెబ్బ ‘’చూసేను.బాగున్నాయి  నాకు వాటి డైరెక్టర్ ఈరంకి శర్మ. మనకాయన బాగుంటారు అనిపిస్తుంది” అన్నాను .

భళే చెప్పేడే అని నన్ను తెగ మెచ్చుకుని, తెల్లరేకా మైలాపూర్ లో ఉన్న ఆ శర్మ గారింటికెళ్ళి పరిచయం చేసుకున్నాకా, వచ్చిన పనేంటో చెప్పారు.

Manchupallki_001 copy

విన్న శర్మ గారు ‘’నాకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ….ఇవ్వాళ మంగళవారం ….రేపు మాటాడుకుందాము’’ అని ఆఫీస్ అడ్రస్ అడిగితే చెప్పి బయల్దేరేరీళ్ళు.

వీళ్ళకి శ్రేయోభిలాషి అయిన ఒక ప్రొడ్యూసర్ గారికి, వీళ్ళా ఈరంకి శర్మ గారి ఇంటికెళ్ళిన విషయం తెలిసి పోయింది .కారేసుకుని ఆఫీసు కొచ్చేసినాయన ” అసలా శర్మ గారిని పెట్టమని సలహా ఇచ్చిన చెత్త నా కొడుకు ఎవరు” అంటా చాలా అల్లరి చేసేటప్పటికి ,చాలా డల్లయిపోయిన నిర్మాతలు ,మర్నాడు బుధవారం నాడు ఆ శర్మ గారింటికెళ్ళలేదు.సరిగదా ,ఆఫీసు తాళాలేసుకుని బయటికెళ్ళి పోయేరు.

వస్తానన్న వీళ్ళకోసం ఎదురు చూసి చూసిన ఆ ఈరంకి శర్మ గారు, ఆటో వేసుకుని ట్రస్ట్ పురంలో ఉన్న ఆఫీసు కొచ్చేసి ,తాళం కప్ప వేసి ఉండటంతో చాలా సేపు వెయిట్ చేసి ,చేసి వెళ్లిపోయేరు.

డైరెక్టర్ ఫైనలైజవ్వడం లేదని తెగ ఇదయ్యిపోతున్న ప్రసాదరావుగారు ప్రోబ్లం ని ,నాతోకూడా పాలుపంచు కుంటా “ఎవరన్నా డైరెక్టర్ పేరు చెప్పవయ్యా” అన్నారు. మొన్న అనుభవానికి చాలా ఇన్సల్ట్ అయిపోయిన నేను ఇంక చెప్పనన్నాను.

ఒక రోజు పొద్దుటి పూట మేం అద్దె కుంటున్న ఒకే గది కటకటాలింటి కొచ్చిన సత్యం గారు ‘’డైరెక్టర్ ఫైనలైజయి పోయేడు వంశీ’’అన్నారు .

‘’అనుకున్నాను …ఈ చిరాకులో ఎవడో ఒకడ్ని చేసి పారేస్తారని ఎవరు ?’’అన్నాను.

నవ్వేసిన సత్యంగారు ‘’నువ్వే’’అన్నారు.

‘’భళే వోరే …. ముప్పై ఏళ్ళు వచ్చేదాకా నేను డైరెక్టర్ అవ్వను.’’అన్నాను .

‘’ఇప్పుడు ….నీ వయసెంత ?’’ అడిగేరు సత్యం గారు .

‘’ఇరవై రెండు ‘’చెప్పేను.

‘’ముప్పై ఏళ్ల దాకా ఎందుకు?’’

‘’ నా దృష్టిలో సినిమా డైరెక్టర్ అంటే మాటలు కాదండి …..చాలా నేర్చు కోవాలి ,చాలా సబ్జెక్ట్స్ మీద చాలా అవగాహన కావాలి …….వరల్డ్ ఫిల్మ్ గురించి ……..’’

‘’నేర్చుకున్నది చాల్లే గానీ ఆఫీసుకి పద చెప్తాను’’అంటా లాక్కెళ్ళి పోయేరు నన్ను.

మూడు రోజుల పాటు రాత్రి పగలు ఆలోచించిన నేను ‘’సరేనండి …. ఒక రోజు షూటింగ్ కి కావలసినవన్నీ ఎరేంజ్ చెయ్యండి….అది నాకు రిహార్సలు ‘’అన్నాను.

నేను చెప్పినవన్నీ చేసిన సత్యం గారు, నాకు అసిస్ట్ చెయ్యడానికి ఒక సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ ని కూడా పెట్టారు.

ఆఫీసు లోనే షూట్ .

Manchupallki_002 copy

హాఫ్ డే పాటు షూట్ చేశాక పాజిటివ్ ప్రింట్ చేయించి ,కోడంబాక్కంలో లిబర్టీ దియేటర్ ఎదురుగావున్న అప్సర  లాడ్జిలో చిన్న ప్రివ్యూ ధియేటర్ ఉంటే అందులో చూసుకున్నాను .నాతోపాటు చూసినోళ్ళంతా ….బాగుందన్నారు.

మర్నాడు ఆఫీసు కెళ్ళిన నేను ‘’సరే మీ సినిమా డైరెక్ట్ చేస్తాను గానీ ,ఆ సీనియర్ అసోసియేట్ డిరెక్టర్ని పనిలోంచి తీసెయ్యండి ముందు ‘’అని మొన్న సీతాకోకచిలుక సినిమాకి నాతోపాటు అసిస్టెంట్ గా చేసిన ముడుచూరి దొరసామి రెడ్డిని ,వైజాగ్ మిత్రుడు (ఇప్పుడు హీరోలకి ట్రైనింగ్ ఇస్తున్న ) ఎల్ .సత్యానంద్ నీ అసిస్టెంట్స్ గా పెట్టుకుని సిన్మా డైరెక్ట్ చెయ్యడం మొదలెట్టిన నాకు నెల జీతం 6.50 రూపాయిలు.

మాటల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారూ,నేనూ ఆ సాయంత్రం మా ఆఫీసు ఎదురుగుండా ఉన్న వీధిలో ఉన్న స్వర్గీయ కొడవటిగంటి కుటుంబరావు గారింటి  ముందు నుంచి వాకింగ్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు ‘’ఈ సినిమాకి నీ మొదటి నవల టైటిలే పెడితే బాగుంటుంది గదా ?’’ అన్నారు.

ఈ ఐడియా అందరికీ నచ్చడం తో అదే పెట్టాం ‘’మంచుపల్లకీ’’.

ఒరిజినల్ వెర్షన్లో హీరోయిన్ గా చేసిన సుహాసిన్నే దీంట్లో కూడా పెట్టాం. అప్పటికే హీరోగా బిజీగా ఉన్న చిరంజీవి గారి డేట్లు 13 రోజులు మాత్రం ఖాళీగా ఉన్నాయి .తక్కినవి ఎలాగోలా సర్దొచ్చులే  సిన్మా చేద్దాం’’ అన్నారు అరవింద్ గారు.

హైదరాబాద్ వచ్చేం.

Manchupallki_003 copy

సంజీవరెడ్డి నగర్లో (ఎస్.ఆర్ .నగర్ ) పిట్ట గోడల మీద షూటింగ్. యాక్ట్ చేస్తున్న ఆర్టిస్టులకి నా మీద నమ్మకం చాలా తక్కువగా ఉంది.వాళ్ళలా ఫీలవ్వడంలో తప్పులేదు.ఎందుకంటే ,సిన్మా డైరెక్ట్ చెయ్యడానికి నాకున్న అనుభవం ఏమాత్రం చాలదు.

ఫస్ట్ షెడ్యూల్ల్లో చేసింది ఎడిట్ చేసి సారధి స్టూడియోలో డబ్ చేస్తుంటే స్కీన్మీద చూసిన నటీ నటులు నమ్మడం వల్ల,మిగతాది షూట్ చేస్తున్నప్పుడు అసలు మాటాడలేదు. ఫైనల్ ప్రోడక్ట్ చూసిన చారుహాసన్  సిగరెట్ కాలుస్తా దియేటర్లోనుంచి బయటి కొచ్చి ఎవరితోనూ మాటాడకుండా కారెక్కి వెళ్లి పోయేరు.

ఈ రీమేక్ సినిమాలతో ప్రోబ్లం ఏమిటంటే ఎవరికైనా సరే ఒరిజినల్ వెర్షనే బాగుంటుంది .తర్వాత ఎన్ని వెర్షన్స్ ఎంత బాగా తీసినా ఒప్పించలే౦. ఒరిజినల్ అంత బాగా లేదనేస్తారు. చారుహాసన్ గారి విషయానికొస్తే………. సినిమాల మీద చాలా అవగాహన ఉన్న మేధావి ,పైగా ఒరిజినల్ వెర్షన్ స్కీన్ ప్లే రైటర్ .ఈ తెలుగు వెర్షన్ ఆయనకి నచ్చదు ఎందుకంటే నేనిందులో చాలా మార్చేసేను..

Manchupallki_004 copy

కానీ,

ఇక్కడ కొంచెం రివర్స్ అయ్యింది.మర్నాడు పొద్దుట నిర్మాతలకి ఫోన్ చేసిన చారుహాసన్ ‘’మీ సినిమా నెల్లూరు జిల్లా నేను కొనుక్కుంటున్నాను’’ అని రేటు మాటాడి ఫైనలైజ్ చేసుకున్నారు.

మద్రాసు లక్ష్మి కాలనీలో ఈ సినిమా షో వేస్తే సుహాసినితో పాటు వచ్చిన వాణి గణపతి (కమలహాసన్ మొదటి భార్య )లాస్ట్ లో సుహాసిని మీద పడి ఏడుస్తా ‘’నువ్వూ, ఆ హీరో చిరంజీవీ చివర్లో పెళ్లి చేసుకునే ఇంకొకటి సినిమా చూసేదాకా నా మనసు శాంతిoచదు’’అంటా కారెక్కి వెళ్లి పోయింది.

సురేష్ మహల్లో ప్రివ్యూ చూసిన మా గురువు శ్రీ కె .విశ్వనాద్ గారు నన్ను ఆశీర్వదించిన క్షణాలు మర్చిపోలేను.

అందరికంటే ,అన్నింటికంటే మా గొప్పగా గుర్తుంచు కోవాల్సిన మహానుభావులు లక్ష్మి ఫిలిమ్స్ లింగమూర్తిగారు.శ్రీ కె.ఎస్.రామారావు గారు చెపితే వచ్చి ఈ సినిమా చూసినాయన చాలా ఇష్టపడతా రిలీజ్ చేసారు .

కానీ ,

పేరయితే వచ్చింది గానీ ,తమిళ్లో అంత బాగా తెలుగులో ఆడలేదు. ఇక్కడ సక్సెస్ ప్రధానం అని తెలిసిన నాకు ,ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా బాగా తెలిసింది .

దాంతో ,

నిద్ర పట్టేది కాదు.తెలుగులో నా గురువుల్తో పాటు బిమల్ రాయ్,రిత్విక్ ఘటక్ ,అకిరాకురసోవా, జోల్డాన్ ఫాబ్రి లాంటి గొప్పగొప్ప దర్శకులు గుర్తుకొచ్చేవారు. అసలు ఫిల్మ్ డిరెక్టర్ అంటే మాటలా ……..అసలెందుకు దిగేను? ఎంత తప్పు చేసేను?….

Manchupallki_005 copy

మళ్ళి అసిస్టెంటుగా చేసి ,చాలా చూసి,చాలా చదివి ,చాలా టెక్నాలజీని ఔపోసన పట్టి ,తోక్కేసిన వాకిట్లో పండగ ముగ్గుని సరిదిద్దే వాడినేమో కానీ ,

నేను రాసిన ‘’మహల్లో కోకిల ‘’నవలని ‘’సితార’’ సినిమాగా తియ్యడానికి. ఆ సాయంత్రం పూట ఏడిద నాగేశ్వరరావు గారి దగ్గర్నుంచి కబురొచ్చింది.

 

*

 

 

 

 

 

 

 

 

 

వచ్చే వారం నుంచి …”కథ కానిది”

 

 

ప్రియమైన సారంగ వార పత్రిక పాఠకులకు,

నమస్తే!

‘కథ కానిది…’ –  అనే శీర్షిక కింద  వరసగా కథలు రాయాలనే ప్రయత్నాన్ని తలపెట్టాను.

కథలంటే ఊహా జనితాలు కాదు. పోని, ఉత్త నిజాలూ కాదు.

ఈ రోజుల్లో వార్త కూడా కథ లా వుంటే నే చదవడానికి బావుంటోంది. కాదా చెప్పండి?

అందుకే, కొన్ని నిజాల్ని మూలాధారం గా చేసుకుని, కథలు రాయాలని నిర్ణయించుకున్నాను.

ఈ విశాల జగతిలో మనిషి నడిచే ప్రతి  అడుగులోనూ కథ వుంది. విని స్పందించే హృదయముంటే!

జీవితానికి మించిన సస్పెన్స్, థ్రిల్లింగ్, హారర్, ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటూ వేరే ఏదీ వుండదని గాఢం గా నమ్మే వారిలో నేనూ ఒకర్ని.

నే – కనీ, వినీ, ఎరిగిన, జరిగిన విషయాలనే కథ గా రాస్తానని, అదే ఈ శీర్షిక ప్రధానోద్దేశమని  సవినయం గా తెలియచేసుకుంటున్నాను.

రచన చదివి, ఎప్పటిలా మీ ప్రోత్సాహాన్ని నాకందచేస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ..

ఈ అవకాశాన్ని కలగ చేసిన పత్రికా సంపాదకులు  అఫ్సర్,  కల్పన గారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ,

నమస్సులతో..

-ఆర్.దమయంతి.